CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:190

V. శ్రీకృష్ణార్జున సంవాదం

1 అనాసక్తి యోగం

శ్రీరాముడు: హే సద్గురూ! మీరు ఈ జాగ్రత్ను స్వప్నం వంటిది మాత్రమేనని సిద్ధాంతీకరిస్తున్నారు కదా! స్వప్నం విషయానికి వస్తే ప్రతి ఒక్క జీవుని స్వప్నం ప్రత్యేకమై, ప్రక్కన ఉన్నవానికి సంబంధించనిదై ఉంటోంది. జాగ్రత్ అట్లా ఉండటం లేదు. ఒక గోడ - కొండలవలెనే ప్రాప్తిస్తోంది. అనేకులందరికీ ఒకే విధంగా ఉంటున్న ఈ జాగ్రదావస్థ స్పప్నం వంటిదని అనటం ఎంతవరకు కుదురుతుంది?

ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇతఃపూర్వపు ప్రకరణంలో ప్రవచించటం జరిగింది. అయితే ఈ నిర్వాణ ప్రకరణం సందర్భంలో ఈ విషయమై మీ విశ్లేషణ, ప్రవచనాలను వినాలని ఉంది. శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ‘ఈ జాగ్రత్ సమష్టి జీవుని స్వప్నము మాత్రమే’ అని వేదాంత వాఙ్మయం ప్రకటిస్తోంది. ఇదంతా కల్పిత సంసారం. ఇది సత్యం కాదు. అసత్యం కాదు. సమష్టిజీవుని స్వప్నం ఈ వ్యష్టి జీవుని స్వప్నం కంటే విశిష్టమైనది. అయితే ప్రతి ఒక్క జీవుని జాగ్రత్ భావాలు ఆ జీవుని ‘జాగ్రత్స్వప్నం’ మాత్రమే! ఒక జీవుని నిద్రా సంబంధమైన స్వప్నం ఊహాసంబంధమై కొన్ని క్షణాలలో పుట్టి, కొద్ది క్షణాలలోనే నశిస్తోంది. సమష్టిజీవుని స్వప్నం కూడా "అసత్యము, అవస్తువు” అయి ఉన్నది. అయితే, కాలమానం దృష్ట్యా కొంత సుదీర్ఘకాలం వెలయుచున్నది. అట్లాగే, ఈ జాగ్రత్ స్వప్నం కంటే మరికొంత అధికంగా సత్యము వలె తోచుచున్నది. అయినా రెండూ సత్యం కాదు.

ఈ జీవుడు ఒక స్వప్నం గాంచిన తరువాత అందుకు భిన్నమైన మరొక స్వప్నం గాంచుచున్నాడు కదా! అట్లాగే సమష్టి జీవుని కల్పనలో ఈ వ్యక్తిగత జీవుడు ప్రవేశించి ఒక్కొక్క ఉపాధితో ఒక్కొక్క విభిన్నమైన స్వప్నకాలిక సుదీర్ఘానుభవం పొందుతున్నాడు. ప్రతి ఒక్కని ప్రతిఒక్క జాగ్రత్ అనుభవంలో స్వప్న సదృశ్యమైన అసత్యం రాజ్యం ఏలుతోంది. సమష్టి జీవుని (హిరణ్యగర్భుని) కల్పనామహిమ ఇట్టిది మరి!

ఈ జీవుని పట్ల, “ఒక దేహం, తదనంతరం మరొక దేహం” అను రూపంగా కనిపించే ప్రహసనం కూడా, “ఒక స్వప్నం, మరునాడు కనిపించే మరొక స్వప్నం” - - అను వ్యవహారం వంటిదే!

అజడమైనట్టి బ్రహ్మవస్తువు… సమష్టి జీవుని ‘అంశ’ అయినట్టి ఈ వ్యక్తిగత జీవుని మోహవశమై జడంగా గాంచబడుచున్నది. స్వయంజ్యోతి అయిన ఆత్మప్రకాశం ఈ సమష్టి-వ్యష్టి కల్పనల రూపంలో ‘స్వప్నభ్రమ’ అనే జగన్నాటకం ప్రదర్శిస్తోంది. ఆత్మ ప్రకాశమే లేకపోతే సమష్టి జీవుడు లేడు… వ్యక్తిగత జీవుడు ఉండడు …జగత్తు ఉండజాలదు. స్వప్న ద్రష్ట లేకపోతే స్వప్నం ఎవరికి?

అయితే, ఆత్మ యథాతథం. ఈ జగత్తు ఆత్మ యొక్క భావనా చమత్కారం మాత్రమే! ఇక దేని గురించైనా దిగులుదేనికి? వేదన ఎందుకు?

Page:191

సూర్యుని వలన ప్రకాశించే ఈ త్రిజగత్తులలోనికి జీవులు పరస్పర భేదకల్పనలు ఒనర్చుకొని భ్రమిస్తున్నారు. ఈ వ్యక్తిగత భ్రమలకు మూలకారణమైన సమష్టి జీవుడు అనంతుడు. ఆత్మ సర్వగతం అవటం చేత అది ఎక్కడ ఏ కల్పనకు ఉపక్రమిస్తే అక్కడ ఆ కల్పన అట్లే పరిఢవిల్లుతోంది. ఇటువంటి మాయా కల్పితమైన దృశ్యమునందు ఏర్పడి ఉన్న కల్పనపట్ల ఆసక్తి అనవసరం. ఆసక్తియే బంధము. అనాసక్తియే ముక్తి. రాబోయే ద్వాపర యుగంలో మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించినప్పుడు ఈ అనాసక్తియోగం గురించి ఆయన అర్జునునకు ఉపదేశించటం జరుగుతుంది. పాండునందనుడగు అర్జునుడు యుద్ధమునకు ఉపక్రమించే ముందు శ్రీకృష్ణభగవానుడు ప్రవచించబోయే "దృశ్య అనాసక్తి, యోగాభ్యాసంచే పెంపొందగల ఆత్మయోగం” విని తరిస్తాడు.

శ్రీరాముడు: స్వామి! రాబోయే యుగంలో జరగబోయే మహత్తరమగు ఆ శ్రీకృష్ణార్జున సంవాదంలోని కొన్ని ముఖ్య విశేషాలు విశదీకరించమని ప్రార్థిస్తున్నాను. శ్రీవసిష్ఠ మహర్షి : విను …చెపుతాను.

2 ఆత్మకు జననమరణాలు లేవు

ఆకాశమును ఆశ్రయించుకొని ఆకాశము వెలయుచున్నట్లు… కేవల ఆత్మను ఆశ్రయించుకుని ఆద్యంతరహితమైన అస్తి - సన్మాత్రము అనునది ఆత్మచే పరికల్పించబడి అనంతమై వెలయుచున్నది.

నిర్వికారమగు ఆత్మయందు వికారరూపమగు ఈ సంసారభ్రమ అంతా గాంచబడుచున్నది. బంగారంలోనే రకరకాల ఆభరణాలు, జలంలోనే రకరకాల తరంగాలు ఉంటున్నాయి కదా! ఆత్మ యందే ఈ 14 విధములైన జీవజాలాలు (చతుర్దశభువనాలు) వలలో చిక్కుకున్న పక్షులలాగా చిక్కి ఉంటున్నాయి. ఇక శ్రుతి, స్మృతులలో వర్ణించబడిన యమ, ఇంద్ర, చంద్ర, సూర్యాది లోక పాలకులు ఈ భూత పంచకంతో కూడిన సంసారానికీ, ఇందలి లోకాలకూ నాయకత్వం వహిస్తూ ఉంటున్నారు. ఆ లోకపాలకులు ధర్మాధర్మములను, సుకృత దుష్కృతాలను అనుసరించి జీవులకు శుభాశుభప్రదాతలై లోకాలు పాలిస్తున్నారు.

లోకపాలకులలో ఒకడైన యమభగవానుడు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ కర్మఫల ప్రదాతగా నిగ్రహ-అనుగ్రహముల రూపంలో ధర్మాధర్మప్రవృత్తులను అనుసరించి జీవులకు అధమ ఉత్తమ ఉపాధులు ప్రసాదిస్తూ ఉంటున్నారు. తాను మాత్రం స్థిరచిత్తుడై ఆత్మానుభవి అయి, నిశ్చలుడై తన నియమిత విధులను నిర్వర్తిస్తున్నాడు.

ఆ యముడు ప్రాణులను హింసించుట వలన కలిగే వికలములను తొలగించుకొనుటకు ప్రతి ద్వాపర యుగాంతంలోనూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన ఒకప్పుడు 8 ఏళ్ళు, మరొకప్పుడు 10 ఏళ్ళు, ఇంకొకప్పుడు 12–14 సంవత్సరాలు … తపస్సు చేస్తూ ఉంటారు. అట్లా తపోనియమితులై ఔదార్యం వహించి ఉన్నప్పుడు మృత్యువు ఈ జగత్తునందలి ఏ ప్రాణినీ స్వయంగా హింసించదు.

Page:192

నిదురిస్తున్న మదపుటేనుగును వేలాది దోమలు ఆశ్రయిస్తున్నట్లు ఆ సమయంలో ఈ భూమండలం అనేక విధములైన జీవులతో నిండి ఉంటుంది. అప్పుడు విచిత్రజీవులతో నిండిన ఈ భూదేవత యొక్క భారాన్ని తగ్గించటానికి దేవతలు అనేక ఉపాయాలతో సంహారకార్యం నిర్వర్తిస్తారు. ఈ విధంగా భూభారం తగ్గించటం కొన్ని వేలసార్లు జరిగింది.

రాబోయే ద్వాపరయుగంలో కూడా సూర్యపుత్రుడు, పితృ నాయకుడు అగు యముడు ప్రాణి హింస వలన కలిగిన సంతాపం పోగొట్టుకోవటానికి 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అప్పుడీలోకంలో మృత్యువు అనేదే ఉండదు. భూమి అంతా చెట్టు, పుట్టలతో నిండి భారవంతం అవుతుంది. అప్పుడు భూమాత భూభారం సహించలేక డస్సిపోతుంది. పరాభూత అయి, దీన అయి తనపతి అగు శ్రీహరిని శరణువేడుతుంది. అప్పుడు శ్రీహరి దేవతల అంశను పరిగ్రహించి నర - -

నారాయణులు అను రెండు రూపాలతో అవతరిస్తాడు. ఆ నర-నారాయణులలో నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడు గాను, నారాయణుడు దేవకీ వసుదేవుల సుతుడు శ్రీకృష్ణుడుగాను భూమిపై అవతరిస్తారు.

పాండవులు పాండురాజు కుమారులు. అందులో పెద్దవాడైన ధర్మనందనుడు యుధిష్ఠిరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఆతడు సముద్రము వంటి రాజ్యమునకు చక్రవర్తి అయి ధర్మవేత్తగా ఖ్యాతి గడిస్తాడు.

‘దుర్యోధనుడు’ అనునాతడు పాండవుల పెదతండ్రి అయిన దృతరాష్ట్రుని కుమారుడు. ఆ దుర్యోధనుడు పాండవులలో ద్వితీయుడైన భీమసేనునితో బద్ధవైరం కలిగి ఉంటాడు. కాలక్రమేణా ధృతరాష్ట్రుని నూర్గురు కుమారులు, అతని తమ్ములు పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు భూమండలం కొరకై 18 అక్షౌహిణీల సైన్యం సమకూర్చుకుని యుద్ధానికి సమాయత్తమౌతారు.

యుద్ధం ప్రారంభించే సమయంలో విష్ణు భగవానుని ’అర్జున’శరీరం ’యుద్ధం - జననాశనం’ విషయంలో తర్జన భర్జన పడుతుంది. ప్రాకృతభావం పొందటం చేత హర్షామర్గాన్వితమై అజ్ఞాన యుక్తం అవుతుంది. “బంధువులను సంహరించడం ఉచితమా? యుద్ధము చేయకుండా ఊరుకోవడం ఉచితమా?”– అనే ధర్మసందేహం అతని అంతరంగాన్ని కలచివేస్తుంది. ఇక మహావీరుడగు అర్జునుడు ఇరువైపులా ఉన్న రక్త సంబంధీకులగు బంధువులను గాంచి ’అయ్యో! నా బంధువులను నేను వధించట మేమిటి?” అని తలచి అత్యంత విషాదం పొందుతాడు. అతని మనోదౌర్బల్యమును గమనించిన శ్రీకృష్ణ భగవానుడు ఉభయసేనల మధ్య రథంలో ఈ విధంగా అర్జునునకు బోధిస్తారు.

శ్రీకృష్ణ భగవానుడు: ఓ అర్జునా! ఏమిటి నీ మీమాంస? నీ బంధుజనులు మరణిస్తారేమోననా? “ఇది ధర్మమా? కాదా?” అనునది నీకు పరిశీలనాయోగ్యం కావాలే తప్ప, జనన-మరణములను, బంధు-అబంధుత్వాలను బట్టి కర్తవ్య-అకర్తవ్యములను నిర్ణయించటం ఉచితమనిపించుకోదు సుమా! ఇక్కడ చంపే వారెవ్వరు? చచ్చే వారెవరు? నీవు గాని, నీ బంధువులు గాని, తదితరులు గాని

Page:193

ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు. అంతేగాని, ఈ ఎదురుగా కనిపిస్తున్న పాంచభౌతికదేహములు మనందరి అసలు స్వరూపం కాదు.

ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడే గాని, భౌతికదేహ పరిమితుడు కానే కాదు. ఆత్మకు జనన మరణాలు లేవు. ఈ దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారా లనే ఆరు రకాల భావాలు ఆత్మ యందు లేవు. ఆత్మ అనునది ఇప్పుడు గాని, ఇతఃపూర్వం గాని, ఇకముందు గాని జన్మ పొందటం లేదు. మరణించటం లేదు. అది నిత్యమై, వాస్తవమై, పురాతనమై - సదా వెలుగొందుచున్నది. శరీరాలు రావచ్చు, పోవచ్చు… ఆత్మకు ఏమీ అవదు. ఆత్మను చంపుచున్నామని గాని, తామే చచ్చుచున్నామని గాని తలచేవారు నిర్వికారమగు ఆత్మతత్త్వమేమిటో ఎరుగనివారు మాత్రమే! ఆత్మ ఎవరినీ చంపదు, తాను చావదు. అనంతము, ఏకరూపము, సత్స్వరూపము, ఆకాశము కంటే సూక్ష్మము, సర్వదా అప్రమేయము అగు ఆత్మను ఎవరేం చేయగలరు?

కాబట్టి అర్జునా! నీవు ఆత్మను అఖండముగా, అనంతముగా, ఆదిమధ్యాంత రహితముగా గ్రహించు. నీవు ఎవరనుకుంటున్నావ్? అపరిచ్ఛిన్నము, దోషరహితము, చైతన్యస్వరూపము అగు ఆత్మవే నీవు! అందుచేత, ఇక్కడ పాంచభౌతిక విషయమైన బంధు సంయోగ-వియోగములకు సంబంధించిన సుఖదుఃఖములు నిన్ను ఎట్లా అంటగలవు చెప్పు?

3 కర్మ రహస్యం

శ్రీకృష్ణ భగవానుడు:

అర్జున! త్వం నహన్తా! త్వమ్ అభిమానమలం త్యజ జరామరణనిర్ముక్తః స్వయమాత్మాసి శాశ్వతః ||

ఓ అర్జునా! శాశ్వతము, జరా-మరణములు ఉండనిది అగు ఆత్మవే నీవు. కనుక “నేను చంపబోవువాడను కదా”! మొదలైన స్వల్ప అభిమానములను పరిత్యజించు.

యస్య నాహంకృతో భావో, బుద్ధిర్యస్య న లిప్యతే | హత్వాపి స ఇమాంల్లోకాన్ నహన్తి న నిబధ్యతే ॥

ఎవనికి "నేను దీనికి కర్తను అను” అహంకారం కించిత్ కూడా ఉండదో, ఎవరి బుద్ధి అయితే దోషరహితమై ఉంటుందో… అట్టివాడు ఆయా క్రియలచే బంధింపబడుటలేదు. ఎవడైనా సరే, తన లోపల ఎట్టి జ్ఞానం కలిగి ఉంటాడో, బాహ్యమున అట్టి అనుభవమే పొందుతూ ఉంటాడు. కాబట్టి దేహాభిమానాన్ని త్యజించు. అప్పుడు దేహాలచే స్పర్శించబడనట్టి దేహిని నీవు దర్శించగలుగుతావు. అర్జునుడు: హే కృష్ణా! ఈ బంధువధను తలచుకున్నప్పుడు నేను పరితాపం పొందుచున్నాను. ఇది ఎట్లా తొలిగేది?

Page:194

శ్రీకృష్ణ భగవానుడు: నీ పరితాపమునకు కారణమేమిటి? చెపుతాను… విను. "నేను వీరిని చంపు వాడను” అను హంతకత్వపు అభిమానం నిన్ను ఆవరించింది. ధర్మాధర్మముల విచక్షణను వదలి పాపాదులను స్మరించి సుఖదుఃఖములకు లోను అగుచున్నావు. నిజానికి ఈ ప్రపంచంలో ఆత్మను ఆవరించి ఉన్నట్లు కనిపించే సత్వరజస్తమో గుణములే ఆయా కర్మలను ఆచరిస్తున్నాయి. అది అట్లు జరుగుచుండగా అహంకారముచే విమూఢుడగు ఈ జీవుడు ‘ఇదంతా నేనే చేస్తున్నాను’ అని అనుకుని భ్రమ పొందుచున్నాడు. అట్టి ‘అహంకర్తాస్మి’ అనే కర్తృత్వ భావనతో గర్వించుటయో, వాపోవుటయో చేస్తున్నాడు. తాను కర్తృత్వ భోక్తృత్వరహితమగు ఆత్మననే విషయం ఏమరుస్తున్నాడు.

చక్షుః పశ్యతు కర్ణశ్చ శృణోతు, త్వక్ స్పృత్విశదమ్ |

రసనాచ రసం యాతు కాంత కోహమితి స్థితిః? ॥

మహాత్ముల దృష్టి ఇంకోరకంగా ఉన్నది. ’కన్నులు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి. చర్మం స్పర్శించుచున్నది. నాలుక రుచి చూస్తోంది. వీటితో నాకేమి సంబంధం?” అని వారు భావన చేస్తున్నారు. అంతఃకరణమునకు బహిర్ ఇంద్రియములకు వేరైన విశిష్టమైన ఆత్మస్వరూపులమని, ఆత్మ దేనికి సంబంధించినది కాదని (అప్రమేయమని గ్రహించి ఉంటున్నారు. కాబట్టి "వీరు కష్టం పొందుచున్నారే!’ అనువారి ఆత్మకు ఆ కష్టాలతో ఏమి సంబంధం? అర్జునా! అనేక విశేషాలు ఒకచోట ఒనగూడుటచే జరిగే ఒకానొక కార్యమును చూచి ఈ జీవుడు ‘ఇదంతా నా వలననే జరుగుచున్నది’ అని అనుకోవటం ఎంతటి హాస్యాస్పదం? అది దురభిమానం కాక మరేమిటి?

కర్మలు అందరూ చేస్తున్నారు. అయితే…

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి | యోగినః కర్మ కుర్వన్తి సంగం త్వక్త్వా “ఆత్మశుద్ధయే” ||

యుక్తాయుక్త వివేకులగు యోగులు కూడా కర్మలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ మనో-బుద్ధి -ఇంద్రియ-శరీరములను ఆయా కార్యములందు నియమించి ‘సంగము’ అనేది లేకుండా, కేవలం ఆత్మశుద్ధి కొరకు ఆయా నియమిత శాస్త్ర ప్రవచిత కర్మలు లోక కళ్యాణమును, లోకానుకూలతను దృష్టిలో పెట్టుకొని సేవాభావంగా స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎవరి శరీరమందైతే అహంకారం అనే దుర్గంధం అలముకొని ఉండదో… ఎవ్వరు రాగద్వేష రహితులై ఉంటారో… అట్టివారు ఈ లోక వ్యవహారములు ఆచరిస్తున్నప్పటికీ భోగించని వారే! దుశ్శీలుడైన మానవుడు తెలివి కలవాడైనా, పండితుడైనా శోభించడు కదా! అట్లాగే మమకారం అనేది ఉన్నచోట ఆత్మత్వం భాసించదు.

నిర్మమో, నిరహంకారః, సమదుఃఖసుఖః క్షమి, యః స కార్యమకార్యం వా, కుర్వన్నపి న లిప్యతే ||

అహంకార, మమకారాలు లేనివాడు, సుఖదుఃఖాలను సమంగా గాంచువాడు, క్షమాశీలుడైన వాడు ఆయా కార్యాలను నెరవేరుస్తున్నప్పటికీ లిప్తుడు కాడు. ఓ పాండుసుతా! ఈ క్షాత్రవ కర్మయే ఇప్పటి నీ స్వధర్మమైయున్నది. స్వకర్మ అనునది ఎటువంటిదైనా సరే… అది తప్పక శుభం చేకూరు స్తుంది. ఈ యుద్ధం చేయుట అనే కర్మ కుత్సితం మొదలైన ఆయా దోషాలతో కూడుకుని ఉండవచ్చు

Page:195

గాక. అయినప్పటికీ నీ యొక్క ధర్మ నిర్వహణార్థం నీకు నియమించబడినది. నీవు నిర్వర్తించవలసిందే. అయితే, నీ ఈ శాస్త్రవిహిత స్వధర్మమును సర్వాత్మకుడగు పరమాత్మకు సమర్పిస్తూ ఆరాధనాపూర్వకంగా నిర్వర్తించావా… నీ స్వధర్మం నిన్ను అమృతతుల్యునిగా చేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక మూర్ఖునకు కూడా స్వధర్మమే శ్రేయోదాయకం అవుతోంది. ఇక ధర్మరక్షణ కంకణధారివైన నీవంటి బుద్ధిమంతునకు వేరే చెప్పేదేమున్నది?… అహంకార రాహిత్యుని జయాపజయములు లిప్తం చేయలేవు.

యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయా!

నిః సంగస్త్వం యథాప్రాప్త కర్మన్న నిబధ్యతే ॥

ఓ ధనంజయా! నీవు బ్రహ్మ పరిపూర్ణమగు బుద్ధితో ఆసక్తిని పరిత్యజించి కర్మలను నిర్వర్తించు. నిస్సంగివై యథాప్రాప్తములైన కర్మలను నిర్వర్తించు. సంగరహితుడవై స్వధర్మ నిరతిపూర్వకంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే, అప్పుడు ఆ కర్మలు నిన్ను బద్ధునిగా చేయజాలవు. కాబట్టి ఆయా సర్వ సందర్భములలో శాంతమగు బ్రహ్మభావముతో కూడుకొని ఉండు. ఉద్వేగరహితుడవై ‘ఈ కర్మలన్నీ బ్రహ్మమయములే’ అను ఎరుకతో ఆచరించు.

బ్రహ్మపూర్ణమగు ఆచరణ కలవాడు తత్-క్షణంలో బ్రహ్మమే అగుచున్నాడు.

ఒకవేళ ‘బ్రహ్మము’ అనబడే సత్ చిత్ ను స్వభావసిద్ధంగా ఆశ్రయించి ఉండటం కష్టమనిపి స్తోందా? నీవు చేస్తున్న సర్వ కర్మలు సమర్పణ చేసి ఆ కర్మలు నిర్వర్తించే నీవు మాత్రం ఈశ్వరాత్ముడవై నిరామయుడవై ఉండుము. “ఈశ్వరుడు సర్వజీవులయందు సమస్థితుడై ఒకే రీతిగా వెలయుచున్నాడు” అని గ్రహించి ఉండటమే ఈశ్వరాత్మత్వం. అట్టి అవగాహనచే నీవు ఈ భూమండలమునకే ఒక అలంకారమై ఉంటావు. క్రమంగా సంకల్పములన్నిటినీ సంపూర్ణంగా త్యజించివేయి. శాంతచిత్తుడవు, సమదర్శివి కమ్ము. అట్టి అభ్యాసం చేత ముక్తి లభించగలదు.

మోహం తొలగాలంటే సత్సాంగత్యము, ఈశ్వరార్పణపూర్వకమైన కర్మనిరతి, బ్రహ్మార్పణము, జ్ఞానయోగము అనునవే మార్గములు.

అర్జునుడు: హే కృష్ణా! నా అజ్ఞాన మోహం తొలగడానికి గాను - 1. సత్సాంగత్యం, 2. ఈశ్వరార్పణం, 3. జ్ఞానయోగం, 4. బ్రహ్మార్పణం - వీటి గురించి సవివరంగా చెప్పండి.

శ్రీకృష్ణు భగవానుడు: … విను.

  1. సత్సాంగత్యము - ‘సత్’ స్వభావమునకు సంబంధించిన శ్రవణమననాదులు, జ్ఞానులతో స్నేహం, సంభాషణ, శ్రవణం.

  2. ఈశ్వరార్పణము - సహజీవులను ఈశ్వరరూపంగా దర్శించటం. ఈశ్వర సేవాభావంతో ప్రేమ, కరుణ మొ॥న సాత్విక గుణములను ప్రవృద్దపరచుకోవటం

  3. జ్ఞాన యోగము - - ఉత్తమ బుద్ధిని సంపాదించుకునే ప్రయత్నములే ‘జ్ఞానయోగ స్థితి’ కి త్రోవ తీస్తున్నాయి.

  4. బ్రహ్మార్పణం - “నేను, జగత్తు" మొదలైన వాటి యందు ఏర్పడే అహంభావాన్ని బ్రహ్మానికి సమర్పించటం. అంటే ’అధ్యాస’ను అధిష్టానమైన బ్రహ్మానికి అభిముఖం చేయటం. సర్వం బ్రహ్మమునకు చెందినవిగా భావన కలిగిఉండటం.

Page:196

ఓ అర్జునా! బ్రహ్మం అంతర్శూన్యమై, బహిర్ూన్యమై పాషాణం వలె చిదనమై, పరమశాంతమై, ఆకాశకోశము వలె స్వచ్ఛమై వెలయుచున్నది. అయ్యది ఈ దృశ్యం కంటే, ఈ దృశ్యాన్ని పరికించే ద్రష్ట కంటే కూడా అత్యంత సూక్ష్మము. అయితే ఏం? అట్టి బ్రహ్మము నుండి ఈ స్థూల జగత్తుల అనుభవం ఉత్పన్నమౌతోంది. అట్లు జగత్తుగా తోచుచున్నదంతా స్వప్నసదృశమే!

బ్రహ్మమునందు జగత్తులు ఆరోపించబడుచున్నాయి. అనగా… బ్రహ్మము యొక్క స్వల్పాంశము లోని అత్యంత స్వల్ప విభాగమునందు ‘జీవుడు’ అనునది భ్రమచే ఆరోపించబడుతోంది.

అట్టి భ్రమయందు (బ్రహ్మము వేరు, ఈ జీవుడు వేరు అను అల్పదృష్టులందు) నీవు మాత్రం చిక్కుకోవద్దు. నిజానికి ఏ వస్తువునందైతే పరిచ్ఛేదము ఏర్పడటానికి ఏమాత్రం వీలే లేదో… అట్టి అపరిచ్ఛేద వస్తువునందు పరిచ్ఛేదము స్వీయ అజ్ఞానముచే దర్శించబడుతోంది. ఏది ఎట్లు ఉన్నప్పటికీ, బ్రహ్మము నందు పరిచ్ఛేద, అపరిచ్ఛేద సంబంధమైన అహంభావం యుక్తియుక్తమే కాదు. అఖండమైన వస్తువునందు అనేకత్వ భావనను ముందు వదలివేయటం అభ్యసించు. ‘అహంకారము అనబడేది కూడా బ్రహ్మము నుండి వేరైనది కాదు’ అను అవగాహనను పెంపొందించుకో. జలమయమగు సముద్రంలో జలరూపములగు తరంగాలు కనబడుచున్నట్లు బ్రహ్మమునందు అహంకార మమకార, తరంగ-ఉపతరంగాలు స్ఫురిస్తున్నాయి. ఇక దేనిని చూచైనా ఎందుకు దుఃఖించటం చెప్పు? విచిత్రము లైన ‘భిన్న భావాలు’ అనే వైచిత్ర్యాలు జ్ఞానమయమైన ఆత్మయందు భ్రమచే స్ఫురిస్తున్నాయి. ఎందులో అయితే ఈ నానాత్వము, తదితర భావపరంపరలూ స్ఫురిస్తున్నాయో, అది సత్యవస్తువగు ఆత్మయే అయి ఉన్నది. అట్టి ఏకత్వము నందు నీ బుద్ధిని ఎందుకు నిలపరాదో చెప్పు?

ఈ విధంగా ఉత్తమబుద్ధితో విమర్శించి సారాసారములను గ్రహించిన పురుషుని యందు క్రమంగా “అహం-నాది” అనునవి ఉపశమిస్తున్నాయి. అప్పుడు అకృత్రిమమైన కర్మఫలత్యాగం సిద్ధించ గలదు. అట్టి అకృత్రిమ ఫలత్యాగమును సన్యాసము అని పిలువబడుచున్నది.

కర్మఫలత్యాగ పూర్వకమైన సన్న్యాసము వలన సంకల్పత్యాగం అనే అసంగస్థితి నీకు సుసాధ్య మౌతుంది. తద్వారా కర్మల పట్ల ఈశ్వరార్పిత బుద్ధి జనించి, సుదృఢమౌతుంది. కల్పన లన్నీ ఈశ్వరుని యందు ఏకీభూతమొనర్చి, ద్వైతబుద్ధిని విలీనమొనర్చుటే ఈశ్వరార్పణం.

అర్జునుడు: ఈ భేద భావాలన్నీ ఎందుకు ఏర్పడుచున్నాయి?

శ్రీకృష్ణ భగవానుడు: అనేకం అనేది అజ్ఞానం వలన ఏకైక చిదాత్మయందే కల్పించబడుచున్నదని చెప్పాను కదా! జ్ఞానికి బ్రహ్మము, జగత్తు వేరువేరైనవి కావు.

ఓ విజయా! ఈ దిక్కులు, ఈ జగత్తు, ఈ ద్వైతాద్వైతములు, ఇక్కడి కర్మలు, అట్టి కర్మలను ఆశ్రయించి ఉన్న యోచనలు, కాలం, వస్తు సంబంధమైన భ్రాంతులు - ఇవన్నీ నేనే. అందుచేత నాయందు మనస్సు ఉంచుము. నా భక్తుడవు కమ్ము. అప్పుడు నన్నే పొందుతావు.

Page:197

  1. పరాపరములు

అర్జునుడు:

ద్వే రూపే తవ, దేవేశ! పరంచ, అపరమేవచ |

కీదృశం తత్కదారూపం తిష్ఠామి ఆశ్రిత్య సిద్ధయే I

హే దేవేశా! మీకు పరము, అపరము అను రెండు రూపములు ఉన్నాయని చెప్పగా విన్నాను. ఆ రెండు ఎట్టివి? ఆ రెండిటిలో దేనిని ఆశ్రయిస్తే త్వరగా సిద్ధిని పొందవచ్చు? శ్రీకృష్ణ భగవానుడు: అవును. నాకు రెండు రూపాలున్నాయి.

  1. సామాన్య రూపము - ఈ కాళ్ళుచేతులతో, శంఖచక్రగదాది ఆయుధాలతో కనిపించే రూపం. నీవు ప్రబోధితుడవు కానంత వరకు వేదవిధిని అనుసరించి ఈ సామాన్య (నామ రూపాదులతో కూడిన రూపాన్ని పూజించు.

  2. పరరూపం - అది ఆద్యంతరహితమైనది. దీనిని బ్రహ్మం, ఆత్మ, పరమాత్మ మొదలైన శబ్దాలతో వేదోపనిషత్తులు పేర్కొంటున్నాయి. నీవు ప్రబోధితుడవు కానంత వరకూ సామాన్య రూపాన్ని దాటి చూడలేవు. ప్రబోధితుడవైన మరుక్షణం నా పరరూపాన్ని గ్రహిస్తావు. ఆద్యంతరహితమగు నా పర రూపమును గ్రహించావా… ఇక నీవు మరల జన్మించవు. చిత్తశుద్ధిని పొందితే గ్రహించ వలసిన దానిని గ్రహించ గలుగుతావు.

కాబట్టి నీవు సాధన సమయంలో ఈ నా సామాన్య రూపాన్ని (సాకారోపాసన) గ్రహించు. అయితే, సాధన కొనసాగుచుండగా అతిత్వరలో ’విజ్ఞానైక స్వభావమగు బ్రహ్మం సర్వదా విశుద్ధం’ అను వినూత్నమైన అవగాహన పెంపొందుగాక. క్రమంగా విజ్ఞాన దృష్టిచే ‘జీవుడనగా ఎవరు? ఈశ్వరుడు అనగా ఎవరు?’ అను పరిశీలన నిర్వర్తించు. జీవేశ్వరులను వేదాంత పరిభాషలో త్వమ్, తత్ అను శబ్దాలచే ఉద్దేశిస్తున్నాయి. ఆ రెండిటిని శోధించుచూ పోవుచుండగా ఏకమగు అఖండాత్మ ప్రస్ఫుటం కాగలదు. అదియే నా నిజస్వరూపమని గ్రహించు.

ఇదంచా_హమ్ ఇదం చాహమ్ ఇతి యత్ ప్రవదామ్యహమ్ I

తదేతత్ ఆత్మతత్త్వం తు తుభ్యం హి ఉపదిశామ్యహమ్ ॥

అయితే, ’ఇది నేను, ఇది నేను’ అని నాచే ప్రవచించబడే దానియొక్క ఉద్దేశము ప్రతి ఒక్క జీవుని స్వస్వరూపమగు ఆత్మతత్వమే, అనగా అధిష్ఠానము, సాధకుని స్వస్వరూపమగు ఆత్మతత్త్వాన్నే సూచిస్తున్నాయని సాధకులు మరువకూడదు సుమా! కనుక శంకలన్నీ పరిత్యజించి సర్వదా సత్యమగు ఏకాత్మయందు ప్రకాశించుము.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని |

పశ్య త్వం యోగయుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః ॥

నీవు యోగయుక్తాత్ముడవగుము. సర్వభూతాలలో గల ఆత్మనే దర్శించు. సర్వభూతములను ఆత్మయందే దర్శించు. సర్వత్రా సమదర్శివై ప్రకాశించు!

Page:198

సర్వభూతస్థమాత్మానం, భజత్యేకత్వమాత్మనః | సర్వథా వర్తమానోపి, న స భూ యో భిజాయతే ॥

ఏది ఎట్లు నిర్వర్తిస్తున్నప్పటికీ నీవు ఆత్మైకత్వ దృష్టిని ఆశ్రయించే ఉండు! సర్వభూతములందు ఏకరీతిగా వెలయుచున్న ఆత్మనే గాంచుచున్నచో… ఇక నీవు సర్వవిధ కార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ, నిన్నవి అంటవు. నీవు అందులో మరల తగుల్కొనవు.

సర్వజీవుల, సర్వశబ్దముల అసలైన అర్థం ఏకత్వమే అయి ఉన్నది. అందరి, అన్నిటి, ఏకశబ్దార్థం ఏదైతే ఉన్నదో, అదే ఆత్మ. అయితే, అట్టి ఆత్మ ఇక్కడ కళ్ళకు కనబడే స్థూల భూతములు కాదు. కళ్ళకు కనబడని సూక్ష్మభూతములు కాదు. కళ్ళకు, మనస్సుకు విషయము కాకపోయినప్పటికీ అది క్షణంలో అనుభవమునకు లభ్యం కాగలదు. ఎందుకంటే, మనందరిలో ఉండి సర్వమును పొందుచున్నది అదే సుమా! ఈ ముల్లోకములలో గల చిత్తములన్నిటి లోపల వెలయుచు, ఆ చిత్తములన్నిటినీ ప్రకాశింప జేయుచూ, “నేను” - అను అనుభూతికి కారణమగుచున్నది ఆ ఆత్మయే.

ఈ ముల్లోకాలలో ఆయా పదార్థాలు చూస్తున్నప్పుడు ఇది ఆవు, ఇది కొండ అని తెలుసు కొంటున్న రసానుభవ జ్ఞానమే ఆత్మ. అది సర్వశరీరములలోనూ అనుభవ రూపమై ఉండి కూడా, అది అందరికీ అనుభవవిషయంగా లభ్యమవటం లేదు. సత్-అసత్ వివేకులగు వారికి అది అత్యంత సుస్పష్టంగా ఘనీభూతమై గోచరిస్తోంది.

సమగ్ర పయసామ్ అంతః యథామృతమివ స్థితమ్ |

తథా సర్వపదార్థానాం దేహానాం సంస్థితః పరః ॥

పాలలో అంతటా నెయ్యి ఉన్నది. అయితే అది పాలు తోడేసి చిలికితేనే లభిస్తుంది. అట్లాగే సర్వ శరీరాలలో, సర్వ పదార్థాలలో పరమాత్మ సర్వదా వేంచేసి ఉన్నారు. నిర్మలబుద్ధి సంపాదించుకున్న వారికి అది అత్యంత స్వభావసిద్ధంగా ఇక్కడే, ఇప్పుడే అనుక్షణికమై సర్వే, సర్వత్రా అనుభవమౌతోంది.

రత్నములలోని అంతస్థితమైన కాంతియే ఆ రత్నముల బహిఃప్రకాశము, కాంతి పుంజములుగా వెలయుచున్నది కదా! ఈ సర్వ శరీరములందు అంతర్గతమై ఉన్న ఆత్మయే ‘చిత్’ అను బహిః ప్రకాశమునకు కారణమగుచున్నది.

ఒకచోట కొన్ని కుండలు పేర్చబడ్డాయనుకో… ఆ కుండలన్నిటి లోపల, వెలుపల ఆకాశం ఏర్పడి ఉన్నది కదా! ఈ ముల్లోకములలోని శరీరములన్నిటిలో ‘అహం’ రూపమున ఆత్మయే వెలయు చున్నది. అయితే సాంసారిక దృష్టి గలవారికి అది అగుపించటం లేదు. ముత్యాలు గ్రుచ్చబడిన దారం కనిపించక పోయినప్పటికీ… దారమే లేకపోతే ముత్యాలు ఒక వరుసలో నిలువవు కదా! ఈ శరీర సమూహము లన్నిటిలోనూ ఆత్మ అలక్షితమై వెలయుచున్నది.

ఆ బ్రహ్మదేవుని మొదలు ఒక గడ్డిపరక వరకు గల సర్వపదార్థములు ఆత్మయందే అధ్యస్తమై వెలయుచున్నాయి. అట్టి ఆత్మను జన్మరహితమైన దానిగా, విపరిణామ రహితమైన దానిగా జ్ఞానులు

Page:199

ఎరుగుచునే ఉన్నారు. అట్టి ఆత్మయొక్క అధ్యాస యే అహంకారము - జగత్తు మొదలైన భ్రమలు ఏర్పడి ఉండటానికి కారణమైయున్నది. అయినా కూడా ఆత్మ స్వస్వరూపము కోల్పోక సర్వదా యథాతథంగా అఖండమై విషయాతీతమై, నిర్వికల్పమై ఉండనే ఉంటోంది.

ఆత్మైవ ఇదం జగద్రూపం, హన్యతే హన్తివా అత్రకిమ్? I శుభాశుభైః జగదుః ఖైః కిమస్య అర్జున! లిప్యతే? II

ఓ అర్జునా! ఈ జగత్తు యొక్క వికారములన్నీ ఆత్మయే. వంకరటింకర తరంగాలన్నీ జలమే కదా! అట్టి ఏకము, సర్వము అగు ఆత్మ ఎవరిని చంపుతుంది? ఎవరి చేత చస్తుంది చెప్పు? ఇక శుభాశుభములగు ఈ జాగృతిక దుఃఖములచే నీవు దుఃఖితుడవు కావలసిన పనేమున్నది? అనేక వస్తువులను తనయందు ప్రతిబింబించే అద్దమునకు, ఆ వస్తువుల రాకపోకలకు సంబంధమేమైనా ఉన్నదా? వస్తుసంబంధమైన శుభాశుభాలను ఆ దర్పణం పొందుతోందా? లేదు కదా! ఆత్మ సర్వదా సాక్షి అయి ప్రకాశిస్తూ, ఈ నశించు శరీరములందు స్వతహాగా అవినాశి అయి వెలయుచున్నది. అట్టి ఆత్మను దర్శించువాడే యథార్థదర్శి.

“ఈ సర్వము నేనే” అయితే, “ఈ శరీరాలన్నిటిలో ప్రతిబింబించే ‘అహం’ అను చిదంశయే ‘నేను’. అంతే గాని జడంశములగు, ప్రతిబింబిత చిదంశములగు ఈ శరీరాదులు నేను కాదు.”

“దర్పణంలో ప్రతిబింబించే ప్రతిబింబాలను నిషేధించి దర్పణమును నిరూపిస్తున్నట్లు ఈ సర్వమూ నా యందు ప్రతిబింబించవచ్చు గాక!… అయినా, ఈ అహంకారాదులు నా స్వరూపం కాదు”

అనే నా ఉభయవాక్యాలనూ సూక్ష్మబుద్ధితో అర్థం చేసుకో. దర్పణము వలె స్వచ్ఛస్వభావుడను, పదార్థములకు అసంబంధితుడను అద్వయుడను సర్వాత్మకుడను అగు నన్ను ఎరిగినప్పుడు నీవు సర్వ దుఃఖములు అధిగమించగలవు.

  1. నేను సర్వదా అకర్తను

ఓ అర్జునా! సముద్రంలో నీరు కదులుచున్నట్లు చిత్తమునందు అభిమానవృత్తులు ప్రవర్తిస్తు న్నాయి. అట్టి అభిమానవృత్తుల ప్రభావం చేతనే ఈ సృష్టి ప్రళయ వికారములన్నీ కలుగుచున్నాయి. వాస్తవానికి నీకు కనబడే ఎత్తైన పర్వతములన్నీ శిలామయమే కదా! వృక్షములన్నీ కొయ్యయే కదా! తరంగములన్నీ జలమే కదా! అలాగే పదార్థములన్నీ ఆత్మయే అయి ఉన్నది.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని |

యఃపశ్యతి తథాత్మానం, అకర్తారం, సపశ్యతి ||

సర్వజీవుల యందు ఆత్మను, సర్వజీవులను ఆత్మయందు గాంచుట అభ్యసిస్తున్నవాడు ఆత్మను దర్పణమువలె అకర్త అని గ్రహించగలుగుతాడు. "నేను ఈ సర్వజీవుల యందు వెలుగొందుచున్నాను. ప్రత్యక్షమై ఉన్నాను. ఈ సర్వజీవులు నాయందే వెలుగొందుచున్నారు. ప్రత్యక్షమై ఉన్నారు. అయితే,

Page:200

అట్టి నేను నిర్విషయుడిని అకర్తను అభోక్తను" - అని ఎవ్వరు స్వస్వరూపము విషయమై ఎరుగుచున్నారో, …వీరే సత్యమును దర్శించుచున్నవారు… సత్యద్రష్టలు. ఓ పార్థా! మరల చెప్పుచున్నాను –

నానాకార వికారేషు తరంగేషు యథాపయః |

కటకాదిషు వా హేమ, భూతేషు తథా, అర్జున II

నానావిధ ఆకృతులలో కనిపించే తరంగములన్నీ జలం కాక మరింకేమిటి? ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలన్నీ బంగారమే కదా!

అంతయూ ఆత్మయే అయున్నది. ఇందులో నీవు సందేహించవలసినదేమీ లేదు. ఆత్మయే భూతములన్నిటా వెలయుచున్నది. సామాన్యములైన ఈ పదార్థములు, ఈ జీవులు, మహత్తరమగు ఆ బ్రహ్మము ఒక్కటే అని గ్రహించు. వీటికి ఒకదానితో మరొకదానికి భేదమే లేదు. నిర్వికారమగు బ్రహ్మమొక్కటే అన్నివైపులా వెలయుచుండగా ఇక జగత్తు - ఆ జగత్తులోని భావవికారాలకు చోటు ఎక్కడిది చెప్పు? జగత్తు అనేదే బ్రహ్మమునకు వేరుగా లేనప్పుడు, అట్టి జగత్తులో ‘బంధువధ’ అనునదెక్కడ? వృథాగా మోహం చెందవద్దు సుమా! అందుచేత ముందుగా బ్రహ్మం గురించి విను. విని, మననం చేయి. చేసి, చక్కగా బ్రహ్మమును అనుభవమునకు తెచ్చుకో. తెచ్చుకుని సమరసతత్త్వాన్ని ఆనుక్షణికంగా ఆశ్రయించు. అట్లు ఆశ్రయించి అనేకమంది సాధుపురుషులగు జీవన్ముక్తులు ఈ లోకంలో నిశ్చింతులై విహరిస్తున్నారు. వారు మానమోహముల నుండి విడివడుచు న్నారు. సంగ దోషాన్ని జయించి అసంగస్థితిని సంపాదించుకుంటున్నారు. సుఖదుఃఖములనబడే స్వకీయ భ్రమాత్మక నిర్వచనాల నుండి ముక్తిని బడయుచున్నారు. అవ్యయమగు పరమపదాన్ని అధిరోహించుచున్నారు. వారి మార్గమే నీకు శిరోధార్యం. కనుక కర్మలలో నిస్సంగుడవై సర్వసమత్వాన్ని అధిరోహించు.

  1. ఆత్మార్పణం

శ్రీకృష్ణ పరమాత్మ : హే మహాబాహో! అర్జునా! నీకు ప్రీతి, హితము చేకూర్చాలనేదే నా ఉద్దేశం. అందుచేత పరమశ్రేయోదాయకము, ఉత్తమము అగు విషయాలు మరికొన్ని చెప్పుచున్నాను. శ్రద్ధగా విను -

ఈ భౌతిక శరీరాంతార్భాగమై ఉంటున్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు బాహ్య విషయాలను స్పర్శిస్తున్నప్పుడు ’ఇది సుఖము కనుక కావాలి. అది అసుఖం. కనుక వద్దు’ - అనే భావాలు కలుగజేస్తున్నాయి, సుఖ భావంగాని దుఃఖ భావంగాని స్థిరంగా ఉండవు. సుఖ దుఃఖ భావాలన్నీ వచ్చిపోయే స్వభావం కలిగినవి. ఒకప్పుడు సుఖకరమని అనిపించినది మరొకప్పుడు, “ఎందుకొచ్చిన కర్మరా?”…అనురూపంగా దుఃఖదాయకమౌతోంది. అందుచేత వాటియందు నమ్మకం ఉంచవద్దు. వాటిని సహించగలిగే శక్తిని పెంపొందించుకో. వాటిని ఎదుర్కోవాలంటే సహనానికి మించి వేరే ఉపాయం లేదు.

Page:201

నీవు వాస్తవానికి స్వతఃగా అద్వయ పరిపూర్ణానంద స్వభావుడవు. ఈ తన్మాత్రస్పర్శలు లేవు. సుఖదుఃఖములు లేవు. ఇవన్నీ నీ భావాభావాంతర్గతములు. నీవో? భావాతీతుడవు. నిత్యనిర్మలుడవు. ఆద్యంతరహితుడవు. నిరవయుడవు. పరిపూర్ణుడవు. అట్టి నీకు ఈ బంధుమిత్రుల సంయోగ -

వియోగ - - దుఃఖములు ఎట్లా కలుగుతాయో చెప్పు?

నీ సంపూర్ణత్వమగు స్వస్వరూపమును ఏమరచుటచేతనే ఇదంతా కూడా సంభవిస్తోంది. లేక, ఈ రీతిగా అనుభవమౌతోంది. కాబట్టి ‘విషయేంద్రియ సంయోగం’ అను భ్రమను నశింపజేయి. ధీరుడవై సుఖదుఃఖములందు సమభావమును కలిగి ఉండుము. అప్పుడే నీవు అమృతత్వానికి అర్హుడవౌతావు. అట్టి అమృతత్వమే నీ సత్యరూపం.

అర్జునుడు: నిజమే. అయినా ఈ సుఖదుఃఖములను సహించటం సులభమా? ఎట్లా?

శ్రీకృష్ణ భగవానుడు: అసద్వస్తువులగు ఈ సుఖదుఃఖాలన్నీ కూడా ఆత్మయందే పరికల్పితాలై వెలయు చున్నాయి. నీవు సర్వదా ఆత్మ స్వరూపుడవే గాని మరేదీ కాదు. వాస్తవానికి ఆత్మలో సుఖదుఃఖ లేశమనునది ఉండజాలదు. అట్టి ఆత్మతత్త్వమొక్కటే సర్వత్రా సమమై అంతయూ వెలయుచుండగా ఇక అనాత్మ అనునది ఎక్కడ ఉండగలుగుతుంది?

నాసతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః ।

నాస్త్యేవ సుఖదుఃఖాదిః, పరమాత్మాస్త్రి “సర్వగః” ||

ఈ బంధుమిత్రాది సంబంధములు అనే అసత్తుకు అసలు స్వకీయమైన ఉనికియే లేదు. కల్పనచే అవి ఏర్పడి, కల్పనచే అనుభవమౌతున్నాయి. మరొక కల్పనచే లయమైపోతున్నాయి. ఇక మనందరి స్వరూపమగు సత్తకు ‘లేకపోవటం’ అనే వినాశనమే ఉండదు. అందుచేత అసత్యములగు సుఖదుఃఖములనేవి స్వతఃగా ఉన్నవి కావు. అది అట్లు పరికల్పించబడటం చేత మాత్రమే ఆయా రీతిగా తోచుచున్నాయి.

అంతటా సర్వవ్యాపియగు పరమాత్మ ఒక్కటే వెలయుచున్నది.

జగత్తు ఉన్నది - లేదు… జగత్తు - ఇచ్చటి సంబంధాదులు… జగత్తు - ఆత్మ…. జగత్తు - ఆత్మల మధ్య ఏర్పడియున్న మనస్సు… మొదలైన విశేషాలన్నీ అధిగమించు. అప్పటికీ నీ యందు శేషించి ఉండు చిత్స్వరూపమునందు ప్రతిష్ఠితుడవై ఉండుము. ఓ విజయా! ఆత్మ చేతనమైనది. ద్రష్టత్వము అను క్రియా విశేషమును ఆశ్రయించి… ఈ దేహము నందు వెలయుచున్నా కూడా సుఖమును హర్పించదు. దుఃఖమునకు క్రుంగదు. ఆత్మ సర్వదా సర్వత్రాయథాతథం.

మరి దుఃఖములను పొందుచున్నదేది?… జడరూపమగు చిత్తమే వాస్తవానికి దేహరూపం పొందుతోంది. అదియే తనకు తాను సుఖదుఃఖములను తయారు (కల్పించుకుని) చేసుకుని అనుభవిస్తోంది.

ఈ శరీరము ఉప్పొంగవచ్చు. క్షీణించవచ్చు. ఆత్మకు ఎట్టి మార్పుచేర్పులు ఉండవు. ఇక ఈ అనుభవములు సంగతేమిటంటావా? ఇక్కడ తారసపడే అల్ప సామాన్య, ఆశ్చర్యకర, సుఖదుఃఖ

Page:202

అనుభవములన్నీ ఆ ఆ అనుభవములను పొందే మనస్సుతో సహా - - మాయ నుండి భ్రమచేత ఏర్పడి ఉంటున్నాయి. భ్రమ అనునది అజ్ఞానము నుండి బయల్వెడలుతోంది. ఈ శరీరము, ఇంద్రియములు, సుఖ దుఃఖములు మొదలైనవన్నీ ద్రష్టయొక్క కల్పనయే గాని, అవి వేరుగా (స్వయంగా) లేనే లేవు. అసలు ఆత్మకంటే వేరైనదానిని ఎవ్వరు ఎక్కడ కల్పించగలరు చెప

బంధువులను, తదితర సంఘటనలను చూస్తున్నప్పుడు నీకు కలిగే సుఖ-దుఃఖ భ్రాంతి అజ్ఞానం వలననే సంభవిస్తోంది. అజ్ఞానం చేత ఏది సంభవిస్తుందో… అదంతా జ్ఞానంచే మాత్రమే… నశించగలదు. అందుచేత అభ్యాసపూర్వకంగా సమ్యక్బోధను సంపాదించుకో.

అర్జునుడు: జ్ఞానం, అజ్ఞానం, సమ్యక్బోధ - అను వాటి గురించి మరికొంత వివరించి చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు: చెపుతాను… విను.

ఒకడు చీకటి సమయంలో అత్యవసరమైన పనికొరకై బాటలో వస్తూ వస్తూ ఎదురుగా అంత దూరంగా మెలికలుగా పడి ఉన్న దానిని చూచి "అయ్యబాబోయ్! త్రాచుపాము!” - అని పెద్దగా అరిచాడు. వళ్ళు వణకటం ప్రారంభించింది. ముందుకు వెళ్ళక తప్పదు. వెళ్ళాలంటే ఆ పాము బుస్సున మీదికి వస్తుందేమో? ఇప్పుడు ఏం చేయాలి? - అని ఆ బాటసారి భయంతో పరితపిస్తున్నాడు. పాము కాటు వేసినప్పుడు నురుగు కక్కుకోవటం, యమయాతన అనుభవించటం, విషప్రభావం చేత ఒళ్ళు నీలం కావటం, చావటం మొదలైన వినిన, చూచిన వార్తలతో అతని మనస్సంతా నిండిపోయాయి.

ఇంతలో ఆ ప్రక్కగుడిసెలలో ఉండే ఒక అవ్వ ఆ కేకలు విని ఒక దీపం చేతపట్టుకుని అక్కడ కొచ్చింది. దీపపు కాంతి అటువైపు చూపి “ఒరే అబ్బాయ్! ఇక్కడ పాము లేదు, గీము లేదు. అది త్రాడు మాత్రమే. కావాలంటే కొంచెం చూడు నీకే తెలుస్తుంది“ అని చెప్పింది. ఆ దీపపు కాంతిలో తాను కూడా కళ్ళు తెరచి బాటసారి చూచాడు. అరె! అది పాము కాదు. “ఏదో చాంతాడు ముక్క. అనవసరంగా భయపడ్డాను” అని గ్రహించాడు. అంతే, … మరుక్షణం అతని భయాలు, కేకలు అన్నీ ఉపశమించాయి. అట్లాగే, అజ్ఞానజనుల దుఃఖభ్రాంతులు, శరీరతదాప్య భ్రమలు - ఇవన్నీ కూడా, “శాస్త్రములు, జ్ఞానులు" - అందించే సమాచారముచే నశించగలవు.

ఈ శరీరమును అవధరిస్తున్న ’శరీరీ’యొక్క వాస్తవ స్వరూపం బ్రహ్మమే.

విష్వగ్విశ్వమజం బ్రహ్మ న నశ్యతి న జాయతే |

ఇతి సత్యం పరం విద్ధి బోధః పరమ ఏష సః ॥ (శ్లో 15, సర్గ 54)

ఈ విశ్వమంతయు పూర్ణబ్రహ్మమే. బ్రహ్మము జనించుట లేదు, నశించుట లేదు. ఇదియే పరమసత్యము. ఇదియే జ్ఞానము.

బ్రహ్మ మహాసముద్రమునందు ‘సంకల్పములు’ అనే తరంగాలు ఎప్పుడో లేచి, మరెప్పుడో ఆ బ్రహ్మ మహాసముద్రమునందే లయమౌతున్నాయి. జ్ఞానోదయ కాలమందు అవన్నీ కూడా బ్రహ్మమే అగుచున్నాయి. స్వస్వరూపమగు బ్రహ్మము యొక్క వాస్తవ స్వభావమును సంతరించుకున్న వానికి

Page:203

ఈ దేశ-కాల-క్రియలు, నీవు-నేను అనే ఈ భావవికారములు మొదలైనవన్నీ కూడా బ్రహ్మముగానే తెలియవస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ అనుభవమయ్యే భేదాభేదములు బ్రహ్మమునందు లేవు అనే నిర్మలమైన అవగాహన పరిఢవిల్లుతోంది. స్వస్వరూపమును ఏమరచినప్పటి ఈ దేశ కాల దేహ క్రియాదుల కల్పితానుభవ పరంపరలే అజ్ఞానము యొక్క స్వరూపం.

కాబట్టి, అర్జునా! నీవు ఇప్పటికిప్పుడు సకల భయశోకాలను, మానమదాలను, సుఖదుఃఖ నిర్వచనములను, సర్వ కోర్కెలను వదలి ఉండుట అభ్యాసం చేయి… అసద్రూపమగు ద్వైతభావమును పరిత్యజించే ప్రయత్నం చేయి. సద్రూపుడవు కమ్ము. నీవు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నీ సర్వ కర్మలను, భావములను బ్రహ్మముతోడ నింపివేయి. నీ యొక్క సుఖ, దుఃఖములను, లాభాలాభాలను, జయాపజయములను శుద్ధబ్రహ్మముతో ఐక్యమొనర్చివేయి. నీవు బ్రహ్మసముద్రుడవే గాని, ఒక తరంగమో, బుడగయో కాదు. హీనములైన ‘నేను ఒక జీవుడను’ మొదలైన భావములకు తావీయవద్దు, తత్త్వనిశ్చయము చేసుకుని, గుహలోని వాయువువలె నిశ్చలత్వము వహించి, అటుతరువాత ప్రకృత కార్యమగు ఈ యుద్ధమును ఆచరింపుము. "నేను ఆచరించేది, భుజించేది, ఇచ్చేది, వ్రేల్చేది… అంతయూ ఆత్మయే” అను స్థిర నిశ్చయము కలిగియుండుటయే సమ్యకో బోధ. అదియే ఆత్మార్పణము అని కూడా చెప్పబడుతోంది.

ఎవడు తనయందు ఏ భావాన్ని ఆశ్రయించి ఎట్లు నిశ్చయుడై ఉంటాడో… అతడు దానినే పొందటం జరుగుతుంది. అందుచేత సత్యమగు బ్రహ్మమును పొందుటకుగాను నీవు బ్రహ్మాకార స్థిర చిత్తుడవు కమ్ము. అప్పుడు నీవు కార్య కారణాతీతమగు బ్రహ్మమే కాగలవు. ఇందులో సందేహం లేదు.

బ్రహ్మజ్ఞుడైనవాడు కర్మఫలాలను ఆశింపక, ఈ సర్వకర్మలు-పూర్వాపరాలతో సహా బ్రహ్మమే”… అను భావనతో యథాప్రాప్తములైన కర్మలను ఆచరించుచున్నాడు. అందుకు ప్రయోజనంగా బ్రహ్మమే అగుచున్నాడు. ఏ మనుష్యుడైతే సర్వకర్మలయందు నిష్క్రియమగు బ్రహ్మమును, బ్రహ్మమునందే సర్వకర్మలను గాంచుచున్నాడో… అతడే అందరిలోకి బుద్ధిమంతుడు. అతడే పరిపూర్ణకర్మి అని కూడా చెప్పబడుచున్నాడు.

  1. అకామకామి

ఓ ధనంజయా! నీవు లాభ - అలాభాదులకు, లభ్య-అలభ్యాదులకు వశీభూతుడవు కావద్దు. యథాప్రాప్తాలైన కర్మలను నిర్వర్తించటమే ఉచితం. అయితే అట్లు నిర్వర్తించే సమయంలో అనాసక్తుడవై ఉండుము. ఆసక్తిని సమూలంగా త్యజించి యోగస్థుడవై కర్మలు ఆచరించుము.

అజ్ఞానము ఆశ్రయించక…. కర్మలయందు ఆసక్తి లేక కర్మల సహిత - రహితత్వములకు అతీతుడవై సర్వదా సముడవై వెలయుము.

Page:204

కర్మ ఫలాసక్తిని విడచి నిత్యతృప్తుడవై - నిరాశ్రయుడవై యథాప్రాప్తములైన కర్మలు ఆచరిస్తూ ఉంటే, అప్పుడాకర్మలు నీపట్ల లేనివే అవుతాయి. ’నేను ఇది చేయుచున్నాను….. అను కర్తృత్వబుద్ధియే ఆసక్తి, అకర్తృత్వ బుద్ధియే అనాసక్తి. మనస్సు అజ్ఞానావృతమైనప్పుడే ఆసక్తి ప్రబలుతుంది. అట్టి కర్తృత్వబుద్ధి విభాగమునకు సంబంధించిన మనస్సును వెంటనే పరిత్యజించుము. పరతత్త్వమును సుస్పష్టముగా ఆకళింపు చేసుకుని అనాసక్తబుద్ధితో స్వధర్మములైన కర్మలను ఒనర్చుచున్న మహాత్మునికి మరింకెన్నడూ కర్తృత్వబుద్ధి కలగదు.

అకర్తృత్వాత్ “అభోక్తృత్వమ్”, అభోక్తృత్వాత్ సమై |

సమైకత్వాత్ “అనంతత్వమ్”, తతో “బ్రహ్మత్వమ్” ఆతతమ్ ||

‘నేను దేనికీ కర్తను కాదు’ అను అభ్యాస యోగముచే ’నేను దేనికీ భోక్తను కూడా కాదు’ అను అవగాహన బలం పుంజుకుంటుంది. అభోక్తృత్వము వలన సమత్వము లభ్యపడుతుంది. సమత్వము నుండి అనంతత్వము, అనంతత్వము వలన బ్రహ్మత్వము సిద్ధించగలవు. ఎట్లాగైనా సరే, నీవు ఇక్కడ నానాత్వమును పరిత్యజించు. పరబ్రహ్మైక్యము పొందు లక్ష్యం గల ఆచరణలను ఆశ్రయించు. అప్పుడు విధ్యుక్తములైనప్పటికీ నీవు ఆ ఈకర్మలకు కర్తవు కావు. ఎవని కార్యములు కామసంకల్ప వర్జితములో అవి ప్రారంభమునందే జ్ఞానాగ్నిచే దగ్ధం కాబడినాయో అట్టి వానిని శాస్త్రములు ‘పండితుడు’ అని పిలుస్తున్నాయి. సముడు, సౌమ్యుడు, స్థిరుడు, స్వస్థుడు, శాంతుడు, విషయనిస్పృహుడు అగువాడు కర్మలు ఆచరించుచున్నప్పటికీ నైష్కర్మియే అగుచున్నాడు.

అందుచేత కిరీటీ! నీవు ద్వంద్వ రహితుడవై ఆత్మవంతుడవై యథాప్రాప్తములైన స్వధర్మానుకూల మగు కర్మలు ఆచరించుచూ, ఈ భూమండలమును అలంకరించుము. ఏ మూఢుడైతే కర్మేంద్రియాలను మాత్రం నిరోధించి ఆయా విషయానుభవములను మనస్సునందు స్మరించుచున్నాడో అట్టివాడు “మిథ్యాచారి” అని పిలవబడుచున్నాడు. ఎవరైతే ఇంద్రియములను ఆయాకర్మలందు నియమించే టప్పుడు మొదలే సంగరహితుడై కేవలం కర్మలను కర్మేంద్రియాల సహాయంతో నిర్వర్తిస్తున్నాడో… అట్టి అనాసక్త కర్మయోగం అత్యంత ప్రాశస్త్యమైనది సుమా!

నదులు సముద్రంలో ప్రవేశించగానే అవి తమ ప్రవాహత్వాన్ని సముద్రజలంతో ఏకం చేసి ఆ సముద్రజలంలో ఉపశమిస్తాయి చూచావా?… ఎవనియందు దృశ్యాదులు ప్రకాశించగానే అవన్నీ నిర్వికారమగు బ్రహ్మమునందు లయమైపోతాయో… అట్టి పురుషుడు పరమశాంతిని పొందుచున్నాడు.

అంతే గాని కోర్కెలు కోరుకొంటూ రోజులు గడుపుచున్నవాడు, ఉపాధులు ధరిస్తున్నవాడు ఎప్పటికీ శాంతిని పొందుటయే లేదు.

Page:205

  1. దేహి - దేహము - వాసనలు

శ్రీకృష్ణ భగవానుడు: ఓ పార్థా! ఇక్కడ ఇంద్రియములకు తారసబడే ఆయా భోగములపై నమ్మిక కలిగి ఉండవద్దు. అయితే, యథాప్రాప్తములైన కర్మలను మాత్రం సమత్వ - నిర్వికారబుద్ధితో నిర్వర్తిస్తూ ఉండు. ఇక ఈ దేహములంటావా? ఇవి జన్మ - జరా - మరణాది స్వభావయుక్తమై అనాత్మ అయిఉంటున్నాయి.

అనాత్మన్ ఆత్మతాం దేహే మా భావయ భవాత్మని ఆత్మన్యేవాత్మాతం సత్యే భావయా అభవరూపిణి ॥

అనాత్మభూతములగు ఈ శరీరాదులందు ఆత్మభావం కలిగి ఉండకుము. వికార రహితమగు సత్య వస్తువునందే ఆత్మభావము కలిగి ఉండుము.

దేహనాశే, మహాబాహో! న కించిదపి నశ్యతి! |

ఆత్మనాశోహి నాశఃస్యాత్ ! నచాత్మానశ్యతి ధ్రువః ॥

గొప్ప బాహువులు గల ఓ అర్జునా! ఈ శరీరం నశించినంత మాత్రం చేత ఇక్కడేమీ నశించటమే లేదు. ఆత్మ నశించినప్పుడే అది నాశం అని అనిపించుకుంటుంది. అయితే… ఆత్మకు నాశనమనునదే లేదు. ఇది సత్యం. చిత్తం కంటే కూడా అత్యంత సూక్ష్మమైన ఆత్మ జీర్ణమొనర్చ బడజాలదు. కనుక ఆత్మను చిత్తమునుండి వేరు చేసి కర్మలను నిర్వర్తించిన, ఏమియు నిర్వర్తించనివాడవే అగుచున్నావు.

‘కర్తృత్వం’ అంటే ఏమిటి? ఆసక్తియే కదా!… ఇప్పటికిప్పుడే నీవు ‘అజ్ఞానం’ అను మూర్ఖత్వాన్ని పరిత్యజించు. అందుకుగాను జ్ఞానులను ఆశ్రయించు. అనాసక్తమతి అయిన మహాత్ముడు కర్తృత్వ అహంకారం పొందనే పొందడు.

ఆత్మ అవినాశి అని, ఆద్యంతరహితమని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. ఆత్మ నశించుచున్నదను భ్రమ నీకు అర్హమే కాదు. అట్టి భ్రమయే అన్ని దుఃఖాలకు మూలకారణం. ఆత్మజ్ఞులు ఆత్మను నశించు దానిగా ఎంచరు. వారు తమయందే ఆత్మను ప్రత్యక్షం చేసుకుని ఉంటారు. ఇక ఈ శరీరాదులందు ఆత్మబుద్ధిని కలిగి ఉండరు.

అర్జునుడు : ఓ జగన్నాథా! శ్రీ కృష్ణా! అట్లా అయితే అజ్ఞానులు శరీరము నశించినప్పటికీ కూడా దాని వలన వారికి కలిగే నష్టమేమీ లేదు కదా?

శ్రీకృష్ణ భగవానుడు : అవును. అజ్ఞానుల విషయమైనా సరే, ఈ దేహం నశించినంతమాత్రంచేత ఎక్కడా నశిస్తున్నదేదీ లేదు. అవినాశియగు ఆత్మ ఒక్కటే సర్వే- సర్వత్రా వెలయుచుండగా ఇక ఈ దేహములు నశించినంత మాత్రంచేత ఎవరికి మాత్రం ఏమి నష్టం?

మోహము వలననే ‘ఇది లభించింది - ఇది వినష్టమైనది’ అనునదంతా తోచుచున్నది. గొడ్రాలి రెండవ కుమారుడు ఎక్కడైనా తారసపడతాడా? అట్లాగే పరిశీలన సహాయంతో భ్రమను

Page:206

త్యజించిన వానికి ఈ శరీరాలు వాటి వినాశనములు అసలు కనిపించనే కనిపించవు. అసత్తగు “నా దేహము - వారి దేహము” మొదలగు భావములన్నిటికీ స్వతః అయిన ఉనికియే లేదు. సర్వభావములు ఎందులో కలుగుచున్నాయో… అట్టి సమరస వస్తువుకు వినాశనముగాని, అభావము గాని లేవు. జ్ఞానులు సత్ - - అసత్తుల విభాగము విషయంలో నిర్ణయం చేసుకునే వర్తిస్తున్నారు.

అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |

వినాశం అవ్యయస్యఅస్య! న కశ్చిత్ కర్తుమర్హతి ॥

అర్జునా! సర్వవ్యాపియగు ఆత్మ అవినాశి అని గ్రహించు. అవ్యయమగు ఆత్మను ఎవ్వరూ వినాశనం కావించలేరు.

అన్తవన్త ఇమే దేహా, నిత్యస్యోక్తాః శరీరిణః | |

అనాశినో, అప్రమేయస్య! తస్మాత్ ఉద్యస్వభారత! ॥

నీకు కనబడుచున్న ఈ శరీరాలన్నీ ఒకనాటికి నశించవలసిందే. అయితే ఏం? ఈ శరీరాలను ధరిస్తున్న శరీరి నాశరహితమైనది. అద్దానికి ఈ దేహాదులతో ఏమాత్రం ప్రమేయం లేదు. ఆత్మ (దేహి) యొక్క ఉనికి దేహాదులతో వచ్చేది కాదు, దేహాదులతో పోయేది కాదు. అందుచేత ఈ దేహాదులను దృష్టిలో పెట్టుకుని, వీరంతా నశిస్తారేమోననే శంకతో నీ స్వధర్మమైన యుద్ధం మానవలసిన అవసరం లేదు. అఖండము, సర్వగమము అగు ఆత్మ ఒక్కటే వెలయుచుండగా ఇక అసత్తెనదంతా ఎక్కడ ఎట్లు ఏర్పడగలదో చెప్పు? అవినాశి, అనంతము, సత్స్వరూపము అగు ఆత్మను గురించి ఎవరైనా దుఃఖించవలసినపనేమున్నది?

కారణం, దానికి సంబంధించిన కార్యం, అద్దానిచే కనబడే అనేకత్వం - ఇవన్నీ పరిత్యజించ బడగా అప్పుడు ఆ ఏకత్వ - అనేకత్వముల మధ్య శాంత పరమపద స్వస్వరూప మొక్కటే వాస్తవమైన ఉనికిని కలిగి ఉన్నది. తక్కినదంతా భ్రమయే!

అర్జునుడు: అయితే భగవాన్! నాదొక చిన్న సందేహం. ఆత్మకు ‘మరణం’ అనే ధర్మమే లేదు కదా! అట్టి ఆత్మ “అయ్యో నేను మరణించబోవుచున్నాను” అని ఎందుకు అనుకుంటోంది? మరొక ప్రశ్న కూడా వినండి. ఈ మానవుల యొక్క ఈ లోకాల యొక్క స్వర్గ, నరకాదుల యొక్క స్థితి గతు లన్నిటికీ కారణం ఏమిటి?

శ్రీకృష్ణ భగవానుడు: బ్రహ్మమే తన యొక్క ‘అధ్యాస’ అను చమత్కారమును ప్రకటించుచు శరీరము లందు వెలయుచున్నది. “ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, మనస్సు, బుద్ధి” అను తన్మాత్రలతో కూడి జీవుడుగా అగుచున్నది. ఆవుదూడ త్రాడుచే లాగబడునట్లు, పక్షిపిల్ల పంజరంలో చిక్కునట్లు ఈ జీవుడు తనకుతానుగా శరీర బద్ధుడగుచున్నాడు. వాసనానుసారంగా దేహమును ధరిస్తున్నాడు. ప్రస్తుత దేహం శిథిలమైనప్పుడు వాసనలను కొనసాగించిన కారణంగా మరొక దేహం పొంది వేరైన దేశకాలములను గాంచుచున్నాడు. వాయువు ఒక పుష్పముపై ప్రసరించి అక్కడి గంధమును తనవెంట గొనిపోవునట్లు ఈ జీవుడు ఒక దేహము నుండి వాసనలను గొనిపోయి

Page:207

మరొక దేహంతో కొనసాగిస్తున్నాడు. చక్షురాది ఆయా ఇంద్రియముల సంస్కారమును వెంటబెట్టుకుని దేహ-తదనంతర దేహములను పొందుచూ తనయందు తానే సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు.

ఈ శరీరముతో ఏర్పడే సంబంధమంతా కేవలం వాసనలచేతనే ఏర్పడుతోంది. వాసనలే రహితమైతే ఇక అట్టి జీవునకు “నేను ఈ దేహమునకు సంబంధించిన వాడను" …అను భావన, అనుభవములు ఉండవు. అప్పుడు శేషించేది పరమపదమే అయి ఉంటుంది.

వాసనాయుక్తుడగు జీవుడు అన్న - పాన - మైథునములచే ధ్యాసయుక్తుడగుచు నానావిధ యోనులందు తిరుగాడుచున్నాడు. ’‘భ్రమ’ అను భారమును మోయుచు ఇంద్రియ ధర్మములందు ఆసక్తి కలవాడై తనస్వరూప మెట్టిదో పూర్తిగా ఏమరచుచున్నాడు.

దేహో నిస్పన్దతామేతి, జీవే కౌత్తేయ! నిర్గతే | నిస్పన్దావయవా భోగః శాంతవాతి ఇవ ద్రుమః ॥

ఎప్పుడైతే జీవుడు అను చైతన్యసత్త స్వరూపుడు ప్రాణసంచలనముతో సహా దేహము నుండి బయల్వెడలుతాడో… అప్పుడు ఈ దేహం చలనరహితమౌతోంది. గాలి ఆగిపోతే లత యొక్క కదలిక ఆగిపోతుంది చూచావా? అట్లా దేహి దేహము నుండి బయలు వెడలినప్పుడు ఈ దేహం నిస్పందం (స్పందరహితం) అవుతోంది. అప్పుడు, ‘ఈతడు మరణించాడు’ అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ దేహి, దేహమును త్యజించాడు. అంతమాత్రమే ఇక్కడి విశేషం.

ఈ జీవుడు శరీరం నుండి బయల్వెడలిన తరువాత అక్కడ ఉన్న ఆకాశమునందు తన వాసనా బలం చేత తన వాసనలన్నీ రూపుదాల్చినట్లు గాంచుచున్నాడు. వాసనల "తీవ్రత దిశ - క్రమము” లను అనుసరించి మరల పాంచ భౌతిక సమ్మేళనములను ఆశ్రయించి ఇతఃపూర్వమునకు వేరైన దేశ కాలాలను గాంచుచున్నాడు. ఈ మహా ప్రయాణం అనంత కాలంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒక శరీరనాశనము-నూతన శరీర ఆవిర్భావం కూడా స్వప్నానుభవం వంటివే. అయితే ఏం? శరీరముతో కూడిన విషయములు సంబంధములన్నీ కూడా ఎప్పటికప్పుడు వాస్తవమైనట్లు అజ్ఞానవశం చేత పరికించుచున్నాడు. నిద్రలో కలకంటున్న వానివలె నీవు ఇదంతా చూచి భ్రమించవలదు.

  1. వాసనాక్షయం - - ఆత్మానుభవం

ఏ వస్తువు ఏ రీతిగా ఏర్పడుచున్నదో… దాని వినాశనము కూడా అట్లే జరుగుతోంది. సృష్టి ప్రారంభంలో ఈ సమష్టి సృష్టికర్త (హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు) తన యొక్క పూర్వ కల్ప వాసన లను అనుసరించి గుఱ్ఱము, ఆవు మొదలైన జీవజాతములను కేవలం కల్పన సహాయంతో సృష్టిస్తు న్నాడు. అందుచేత ఇక్కడ దృశ్యజగత్తు, ఇందలి జీవన్-మృత్యువులతో సహా సర్వం కల్పన మాత్రమే.

కుమ్మరివాని రకరకాల కుండలలాగా ఈ వివిధ జీవ జంతు జాతులు కల్పించబడుచున్నాయి. కుమ్మరివానికైతే మట్టిని కుండలుగా మలచటానికి ’సారె’ మొదలైన ఉపకరణాలు కావలసి ఉంటుంది. మరి ఈ దృశ్య జగత్తు విషయమో? సమష్టి సృష్టికర్తకు ఎట్టి ఉపకరణాలు అక్కర్లేదు. ఎందుకంటే

Page:208

ఇదంతా మనోకల్పితమే కదా! ఒక కథారచనవలె కల్పన కల్పనలోనే ఉదయిస్తోంది. కల్పనలోనే కొనసాగుతోంది. కల్పనలోనే లయిస్తోంది. కల్పనయందే ఉపశమిస్తోంది.

జీవునికి-జగత్తుకు గల సంబంధం కథారచయితకు-కథారచనకు గల సంబంధం వంటిదే! ఈ జగత్తు మొదలు –- చివర కూడా కల్పనయే కాబట్టి ఇది వర్తమానంలో కూడా మిథ్యయే. కల్పనతో కూడినది వాస్తవమెట్లా అవుతుంది? జీవుని స్వరూపం జ్ఞానశక్తియే. అట్టి జ్ఞానశక్తి చేతనే పదార్థాల ఉనికి అనుభవమౌతోంది. ఆ అనుభవం యొక్క రూపం కల్పన చేతనే నిర్మించ బడుతోంది. కనుక ఈ జగత్తు ఆరోపితమైన భ్రమతో కూడిన దృష్టి కారణంగా ఘనీభూతమైన సంసార సాగరంగా (ఆత్మానుభవ - - వ్యతిరేకమైనదిగా) తోచుచున్నది.

ఈ జగత్తు ద్రష్ట యొక్క వాసనలను అనుసరించి అనేకానేక విధములుగా స్ఫురించుచున్నది. ఆ వాసనలు ఇతఃపూర్వపు కర్మ, భావనల పరంపరావిశేషము చేతనే ఆయా వర్తమాన రూపములు కలిగి ఉన్నాయి. ఇతఃపూర్వపు పురుషకారముచే ఏర్పడిన వాసనలు వర్తమాన పురుషకారం యొక్క ఉచ్ఛ-నీచములను అనుసరించి ఇక ముందు బలహీనపడటమో, బలపడటమో జరుగుతోంది. నిన్న సంపాదించుకున్న ధనం ఈ రోజు చేసే వినియోగ - సముపార్జనలను అనుసరించి తరగటమో, పెరగటమో జరుగుతుంది కదా! నిన్న తిన్న ఆహారమువలన కలిగిన అజీర్ణమువంటి ఏదైనా అనారోగ్యం ఈ రోజు సేవించే ఔషధంచేత తొలగించబడుతోంది చూచావా! అట్లాగే, వర్తమానంలో నిర్వర్తించే తపస్సు, దానం, ధ్యానం, కర్మఫల సమర్పణ - వంటి ఉత్తమ కర్మలు ఔషధరూపంలో ఇతఃపూర్వపు వాసనలను తగ్గించగలవు. తొలగించగలవు. జీవుడు వాసనలను తొలగించుకొన్నప్పుడు అతని యందు ఆత్మస్వభావం స్వయంసిద్ధంగా ప్రకాశించగలదు. అందుచేత అర్జునా! నీవు ఎంత శ్రమించి అయినా సరే, శాస్త్రవిహిత ధ్యానాది కార్యక్రమములను, నీకు విధించిన కర్మల ఫలసమర్పణను ఏక సమయంలో అత్యంత శ్రద్ధతో నిర్వర్తించు. అంతే గాని, ఇంద్రియాల వెంట మనస్సుతో పరుగు లిడి వెనుక - - ముందు చూచుకోకుండా వాసనలను మరింత మూటగట్టుకోకు. అప్పుడు మానవజన్మ అను అవకాశమును దుర్వినియోగపరచినవాడవే అవుతావు.

ఈ జీవునికి ఎదురుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధములైన పురుషార్ధములు ఉన్నాయి. అయితే ఈతడు దేనిని గ్రహించి విశేషంగా ప్రయత్నించటం జరిగితే… ఆ ప్రయత్న ప్రాబల్యముల ననుసరించి ఆ ఆ పురుషార్థమే సిద్ధించగలదు. ఇది గ్రహించి ఉండుట చేతనే వింధ్యపర్వతం పగులునంతటి ప్రళయవాయువులు వీచుచున్నప్పుడు కూడా ధీమంతులైనవారు తమ యొక్క శాస్త్రవిహిత పురుషకారాన్ని వదలిపెట్టరు.

అర్జునుడు: హే జగత్పతీ! ఈ జగత్ స్థితికి, స్వర్గ నరకములు, సృష్టి మొదలైన కల్పనలకు అసలు కారణమేమిటో చెప్పండి.

శ్రీకృష్ణ భగవానుడు: అర్జునా! అజ్ఞానావృతుడైన జీవుడు తనయొక్క అభ్యాసబలం చేత చిరకాలం నుండి ఈ స్వర్గ నరకాదులను గాంచుచున్నాడు. స్వర్గ నరకాది సంసార సంభ్రమానికంతటికీ కారణం

Page:209

వాసనలే. కాబట్టి వాసనాక్షయం వలననే నీకు నిత్య శ్రేయస్సు సమకూరుతుంది. వాసనలు రహితమైతే ‘జీవుడు’ అనబడునదే ఉండదు. అనగా, ఇదే జీవుడు స్వయముగా శివస్వరూపమై ప్రకాశించగలడు. అర్జునుడు: దేవదేవా! వాసనలు దేనివలన కలుగుచున్నాయి? అవి సమూలంగా నశించేది ఎట్లా? శ్రీకృష్ణ భగవానుడు: అజ్ఞాన భ్రమ నుండి వాసనలు లేచి… అనాత్మ యందు ఆత్మభావాన్ని కలిగిస్తు న్నాయి. ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటేనే అజ్ఞానం నశించి వాసనలు విలీనం కాగలవు. ఓ కౌంతేయా! నీవు ఆత్మ గురించి విన్నావు, విచారించావు, గ్రహించావు. ఇక ‘ఇది, నేను, నాది, నా వారు’ అను రూపంలో గల వాసనలను త్యజించటంలో జాప్యం ఎందుకు? అభ్యంతరమేమిటి? అర్జునుడు: హే శ్రీ కృష్ణా! నాదొక సందేహం. ఏది దేనిని ఆశ్రయించి ఉంటుందో, అది నశించినప్పుడు ఆ ఆశ్రయించబడేది కూడా నిరాశ్రయమౌతుంది కదా! మీరు వాసనలు రహితమైతే జీవుడనబడేవాడే ఉండడని ప్రవచించారు. జీవుడే లేకపోయినప్పుడు ఇక ఇటు అనర్ధదాయకమగు సంసారాదులు, అటు పరమానందావిర్భావమగు ఆత్మసాక్షాత్కారమును అనుభవించే వాడెవడు?

శ్రీకృష్ణ భగవానుడు: ఓ మహామతీ! వాస్తవానికి ఆత్మయే ఉన్నది. జీవుడనబడే వాడు ఆత్మకు వేరుగా లేడు. ఆత్మసర్వదా అఖండమే గాని అది ఎన్నడూ ఈ ఈ జీవులుగా ఖండితమగుటలేదు. ఆత్మయే వాసనత్వం వహిస్తోంది. అట్టి ఆత్మజ్ఞానం సముపార్జించుకొనుచున్నప్పుడు అకృత్రిమంగా అజ్ఞానాన్ని విసర్జించటం జరుగగలదు. వాసనల నుండి విడివడినప్పుడు ఇంకనూ ఈ జీవుని యొక్క ఏ స్థితి శేషించి ఉంటోందో అద్దానిదే ఆత్మస్థితి అని, మోక్షం అని పిలవటం జరుగుతోంది. ఏ ద్రష్ట అయితే అజ్ఞానదశలో "నేనొక అల్పజీవుడను. ఈ జగత్తు నిండా కష్టాలే! ఇక్కడ దుఃఖములే నా గతి”… అని తలచుచున్నాడో అదే ద్రష్ట (జీవుడు) సర్వ వాసనలూ నశించనప్పుడు ‘నేను ఈ సర్వ ఉపాధులకు అతీతమైనట్టి - మునుముందే ఉన్నట్టి నిర్వికార - · ఆత్మ చైతన్యమును’ అని అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నాడు. ‘నేను ఉపాధిని ఉపయోగించే ప్రజ్ఞను’ అని తననుతాను ఎరుగువాడు ఇక ‘ఉపాధి’ - (లేక) ‘జీవుడు’ అని ఎట్లా అనిపించుకుంటాడు చెప్పు?

ఓ పార్థా! నీవు జీవన్ముక్తుడవగుము. యథార్థమగు ఆత్మతత్త్వమును దర్శించుము. వాసనా జాలం నుండి విడివడినవాడు మాత్రమే ‘ముక్తుడు’ అని అనిపించుకుంటున్నాడు. వాసనాక్షయం కానంత వరకు ఎంతటి శాస్త్రకోవిదుడు అయినప్పటికీ పంజరమున చిక్కిన పక్షిలాగా బద్ధుడే సుమా!

ఎంతగా బోధించినా మాయయందు కాపురముండే వానికి ఆత్మ దుర్దర్శనము. ఇంద్రజాలంలో కనిపించే భ్రమ విశేషాల వంటి ఈ జగత్ సంబంధాలను నమ్ముకుని కూర్చున్నవానికి ఆత్మ యొక్క దేహాతీతత్వం - అఖండత్వాల గురించి ఎంత చెప్పితే ఏమున్నది?

అందుచేత… శాస్త్రాలలో ప్రవచించబడిన విధివిధానాలను శ్రద్ధగా అనువర్తించు. సాధనాదు లను ప్రవృద్ధం చేసుకో. తద్వారా, వాసనలను నశింపజేసుకో. అప్పుడు నీవు తప్పక ముక్తుడవౌతావు. మరొక్కసారి ప్రకటిస్తున్నాను- వాసనాక్షయమే మోక్షం… వాసనలు కలిగియుండటమే బంధం.

Page:210

  1. స్వధర్మ నిరతి

శ్రీకృష్ణ భగవానుడు : ఓ కిరీటీ! ‘వాసనారాహిత్యం’ అనేది అమోఘమైన ప్రయోజనం కలిగి ఉంది. వాసనలు రహితమైనప్పుడు నీవు జీవన్ముక్తము, అత్యంత సుఖప్రదము అగు మనశ్శాంతిని పొంద గలుగుతావు. వాసనల ప్రభావంచేతనే ‘నేను నా బంధువులను చంపుచున్నానే?’… అనే దుఃఖం నీలో ప్రవేశించి నీ యొక్క స్వధర్మనిరతిని, ధర్మాధర్మ విచక్షణను కించిత్ కప్పిచేసింది. కనుక నీవు ‘ఈ బంధువులు నావారు’ అనే దుఃఖమాలిన్యమును త్యజించు. జరామరణముల శంక విడిచిపెట్టు. ఆకాశము వలె విశాల హృదయము సంపాదించుకో. ‘ఇష్టము - అయిష్టము’ … అను సంకల్పములను దరిజేరనీయ వద్దు. ‘ఇది నా అభిలాష కనుక ఇది ఇట్లే ఉండాలి’ అను రూపమును దాల్చుచున్న

కామమును వదులము.

ప్రవాహపతితం కార్యమిదం కించిద్యథాగతమ్ |

కురు కార్యాణి కర్మాణి! న కించిదిహ నశ్యతి |

నీకు విధించబడిన ‘యుద్ధం చేయుట’ అను ధర్మమును శుభాశుభఫలత్యాగబుద్ధితో నిర్వర్తించుటే ఉచితం. స్వధర్మనిరతి నిష్కామబుద్ధితో నిర్వర్తిస్తున్నప్పుడు అది నీ నీ తత్త్వబోధకు దోహదమే అవుతుంది కాని అంతరాయం కాజాలదని గ్రహించు. ఇక్కడ వాస్తవానికి ఏదీ జనించేది లేదు. నశించేది లేదు.

పారంపర్యంగా, శాస్త్రానుసరణంగా, సంఘనియమానుసారంగా, ప్రవాహపతితంగా వస్తున్న విహిత కర్మలను ఆచరించటమే జీవన్ముక్తుల స్వభావమై ఉంటోంది. ఎవరైనాసరే, విధి - - విహితములైన స్వకర్మలను యోగబుద్ధితో ఆచరించి ఆ సర్వాత్మకునకు సమర్పణ చేయుట చేతనే ’జీవన్ముక్తి’ అనబడు సముద్ధరణ సులభరీతిగా పొందగలడు. అంతేగాని కేవలం కర్మలు త్యజించి ఊరుకున్నంత మాత్రం చేత ఎవరికీ ముక్తి లభించదు.

“ఇదం కర్మ త్యజామి, ఇదం ఆశ్రయామి”—ఇతి నిర్ణయః I మూఢస్య మానసోరూపం! జ్ఞానినస్థు సమాస్థితిః ॥

‘అయ్యో ఈ కర్మ చేయవలసి వస్తోందే? ఆ కర్మ చేస్తే బాగుండునే?’ అనే రూపంగల నిర్ణయాలు, భావాలన్నీ అజ్ఞానులందలి మానసిక వికారములు మాత్రమే. జ్ఞానులు సర్వ సమయములందూ సమస్థితియందే వెలయుచున్నారు.

ప్రవాహపతితం కర్మ కుర్వన్తః శాంత చేతసః ।|

జీవన్ముక్తాః సుషుప్తస్థాః స్ఫురన్తి అత్ర సుషుప్తవత్॥

వారు యథాప్రాప్తములై నిర్జీవమైయున్న కర్మలను శాంతచిత్తులై సంకల్పరహితులై, నిద్రించుచున్న వారి యందుండు ‘ప్రజ్ఞ’ వలె మౌనం వహించి స్వయంజ్యోతి స్వభావులై నిర్వర్తిస్తున్నారు. వారి మనన శక్తి స్వాభావికంగానే తాబేలు అంగముల వలె ఇంద్రియ విషయాల నుండి మరలి హృదయం నందు ఏకీకృతమును పొంది శాంతైశ్వర్యమగు స్వస్వరూపము వైపుగా ఎక్కుబెట్టి ఉంటోంది. అట్టి జీవన్ముక్తులైన మహనీయులు పరమాత్మయందే నిత్యము స్థైర్యం పొంది ఉంటున్నారు.

Page:211

ఆహా! ‘చిత్తము’ అనే శిల్పి తనయొక్క అధిష్ఠానమగు పరమాత్మయందు మూలమంటూ ఏదీ లేనట్టి ఈ ’త్రిజగత్తులు’ అనే శిల్పచాతుర్యమును ప్రకటించుచున్నాడు కదా! అందుచేత పరమాత్మ విషయవిశేష రహితమైనప్పటికీ ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమై, పరమాత్మయందే ఉన్నది. అయితే పరిమిత దృష్టి గలవారు శిల్పమునే చూస్తారు గాని, శిలను చూడజాలరు చూచావా? అట్లాగే ఈ త్రిజగత్ ఆకారాది విశేషములన్నీ (అజ్ఞానావగాహనచే) పరిమితజ్ఞాన దృష్టికి పరమాత్మ స్వరూపంగా కానవచ్చుట లేదు. ఇవన్నీ అజ్ఞానాకాశంలో - అంతఃకరణవృత్తులు అనే కుంచెచే చిత్రించబడి అద్భుతంగా విస్తరించి ఉన్నాయి. సమష్టిమనః స్వరూపుడగు హిరణ్యగర్భుడు తన యొక్క సత్యసంకల్ప ప్రభావంచే ఈ త్రిజగత్తులను, వీటికి ఆధారమైన సూక్ష్మాకాశమును పరికల్పన చేస్తున్నాడు. అట్టి ఈ సమష్టి భ్రమ అనాది అయినది. ఇది గడ్డిపరకలచే నిర్మించబడిన గోడ వలె సారశూన్యము. ఇదంతా ‘మాయ’ లేక ‘భ్రమ’ అను మూలపదార్థముచే నిర్మించబడుతోంది. దీనిని మూఢులు సత్యమైనదానివలె గాంచుచున్నారు. విజ్ఞులు ఇందలి సారాసారములను ఎరిగి, తమ వివేకమును సర్వదా కాపాడుకుని ఉంటున్నారు. నాటకంలోని సంఘటనలలో తన్మయమై రసానుభవం పొంది అమిత దుఃఖము పొందే ప్రేక్షకునిలాగా ఈ జీవులు తమ విస్తార స్వస్వరూపమును ఏమరచుచున్నారు. రంగుల చిత్రం - రంగులు ఒక్కటే అయినట్లు… ‘ఈ జగత్తు - దానిని దర్శించే మనస్సు - - ఈ జగత్తును దర్శించే కర్త’ ఈ మూడిటికీ కనిపించే భేదం వాస్తవమైనది కాదు. ఆ మూడిటి ఏకతపిమే (లేక) జగత్తు-మనస్సు-ద్రష్టల సంయోగమే జగదనుభవానికి అసలు కారణం.

  1. మనోకల్పన

ఓ పార్థా! మనస్సు చేసే ‘త్రిజగత్తులు’ అనే చిత్రరచనంతా ఆకాశమువలె అత్యంతశూన్యమైనది. స్వప్నంలో ఉన్నప్పుడు క్షణంలో త్రిజగత్తులను అనుభవించే ఆ మనస్సే జాగ్రత్లో కూడా అనేకానేక కల్పనలను అనుభవిస్తోంది.

కథయే ఒక కల్పన. ఇక అందలి పాత్రలు స్వభావాల గురించి వేరే చెప్పాలా? అట్లాగే, మనస్సే ఒక కల్పన. ఇక దాని సృష్టులమాట వేరే చెప్పేదేముంది? అయితే అట్టి కల్పనలను చిరాభ్యాస వశం చేత జనులు సత్యమని తలుస్తున్నారు. ఈ జగత్ృశ్యం ఏమాత్రం యథార్థం కాదని మరల గుర్తు చేస్తున్నాను. భ్రమయందు సత్యమైనదేమి ఉంటుంది? కానీ ఈ విషయం తత్త్వబోధ సముపార్జించిన వారికి మాత్రమే అవగతమౌతోంది. ఒక సమయంలో సత్యమైనట్లు తోచుచున్న ఈ జగత్తు తత్త్వజ్ఞానము పొందినవారికి - చీకటి తొలగిన తరువాత సుస్పష్టమయ్యే వస్తుజాలంలాగా - కల్పిత మాత్రంగా తెలిసిపోతోంది. జగదృష్టులన్నీ ద్రష్టలో లీనమై రహితమైపోతున్నాయి. అప్పుడు చిత్తశిల్పిచే నిర్మించబడిన భావాభావములన్నీ రూపరహితమై ఆత్మతత్త్వమును సంతరించుకుంటున్నాయి. వాస్తవానికి…

ఈ జగత్తు నీయందు లేదు… నీవు ఈ జగత్తునందు లేవు… నీకు వేరుగా జగత్తు లేదు.

Page:212

ఇప్పుడు చెప్పు! ఎవరి వలన ఎవరు చంపబడుచున్నారు?

రోధ్యరోధక సంమోహం త్యక్త్యా భే విమలోభవః ప్రవృత్తిరేవ న వ్యోమ్నః ప్రవృత్తిశ్చైవ ఖాత్మికా ॥

‘ఈ చచ్చువాడు చంపువాడు’ అను వ్యర్థమైన ప్రేలాపనలన్నీ త్యజించు. పవిత్ర భావ సమన్వితుడవై బ్రహ్మాకాశమున వెలయుము.

బ్రహ్మమునకు ఎట్టి ప్రవృత్తి లేదు! ప్రవృత్తి వలె తోచుచున్నదంతా బ్రహ్మమే. అందుచేత కాలము, క్రియలు, వాటి భేదాభేదములు ఇవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే. మనస్సు నందు ఊహచే కల్పించబడే ఊహాప్రపంచం ఏ విధంగా రసానుభూతి కలిగించ గలుగుతోందో… అట్లాగే అదే రీతిగా శూన్యమాత్రమగు ఈ పాదార్థిక జగత్తుకూడా ఊహతో కూడినదై రసానుభూతి కలిగిస్తోంది. స్వతఃగా ఇది శూన్యమాత్రమే!

ఓ అర్జునా! చిత్తములోనే జగత్తుల ఉదయాస్తమయములు జరుగుచున్నాయి. నిర్మాణము క్షయము - - జన్మ - మృత్యువు మొదలైనవన్నీ క్షణిక విషయములై ఉంటున్నాయని గ్రహించు. నీవు కొంచెం మోహం ఆశ్రయించి మోహగ్రస్తుడవై నీ మనోరాజ్యమున ’వీరు నావారు - వీరు చచ్చుచున్నారు’ అనే వ్యధ - ఆఘాతములను గాంచుచున్నావు.

అట్టి అసంగత కల్పనలన్నీ ఉపదేశవశం చేత క్షీణించగలవు సుమా!

ఈ మనస్సు ఆత్మయొక్క సంకల్పమే అవటం చేత ఇది మహత్తరమైన శక్తిని పొంది ఉంటోంది. అది క్షణంలో సువిశాల మనోరాజ్యమును కల్పించగల నిపుణత కలిగి ఉన్నది. దాని శక్తి వలననే మిథ్యయగు ఈ సంసారము ‘అనాది - అనంతము’ వలె భ్రమింపజేస్తోంది. ఒక్క క్షణాన్ని యుగంగా కల్పన చేయగల ఈ మనస్సే సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా చేయగలదు. భ్రాంతిచే చిత్రవిచిత్రములగు జగత్సమూహములను దర్శిస్తోంది. ఇట్టి ఈ కల్పన నిత్యముక్తమగు ఆత్మయందే అధ్యస్తమైయున్నదని గ్రహించు. స్వతఃగా తుచ్ఛమై, క్షణికమై, కల్పనామాత్రమైన ఈ జగత్తుపట్ల జన్మజన్మల జాడ్యమును ఆశ్రయించిన జీవులు అజ్ఞానముచే గొప్పనమ్మకము కలిగి ఉంటున్నారు. భ్రమయగు ఇదంతా భ్రమ తొలగుటచే తొలగిపోగలదు. కానీ భ్రమచే “అయ్యో! దీనిని ఎట్లా దాటటం?” అని జనులు తలచుచున్నారు. ఇదంతా స్వయంకల్పిత గుణసమన్విత ఊహాప్రదర్శనా చమత్కారమేనని గమనించటం లేదు!… ఎంత ఆశ్చర్యం!

ఓ అర్జునా! మరల ప్రకటిస్తున్నాను. ఆత్మయందు ప్రతిభాసగా కల్పించబడు అజ్ఞాన తత్త్వమగు ప్రవృత్తిగాని, నివృత్తిగాని ఎన్నటికీ వాస్తవం కాదు. చిత్త శిల్పి లేడు. చిత్తం లేదు. ఉన్నట్లు కనబడుచున్న దంతా ప్రతిబింబం మాత్రమే. జలానికి, జలంలో ప్రతిబింబించే దృశ్యానికి ఏమి సంబంధం? ఆహా! ఏమి చిత్రం? ఆధారమే లేని చిత్రం ఉజ్జ్వలమై, భ్రమాసక్తులను కలుగజేస్తూ తాండవిస్తోంది కదా!

Page:213

ఇదంతా కూడా ఒక గొప్ప చిత్రకారునిచేత చిత్రించబడిన కళాఖండంలాగా సంసారజీవుల దృష్టిని చిత్రంగా ఆకర్షిస్తోంది. ‘కటిక చీకటి నుండి తేజోమయమైన సూర్యచంద్ర నక్షత్రాలు బయల్వెడలుతాయి’ అను చమత్కారవాక్యంలాగా, ‘భేదదృష్టులు’ అనే విలాసంతో ‘నానాత్వము’ అను విస్తారముతో వెలయుచున్నది.

‘జగత్రయం’ అనే దేవనటి (Damsel) బ్రహ్మాకాశమున పరికల్పితమై ఉంటోంది. బుద్ధి ఆ దేవనటి నృత్యం చేసే నాట్యశాల. ఏది ఎచ్చట ఎట్లా గ్రహించబడినప్పటికీ అదంతా బుద్ధి వృత్తుల చమత్కారమే కదా. బుద్ధి యొక్క హావ భావ విలాసములే జగత్ నిర్మాణము యొక్క మూలపదార్థమని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. బుద్ధి యొక్క చపలత్వము ననుసరించి ఆ బుద్ధిని మరింత తనవైపుగా ఆకర్షించటానికి ఎవరో కాముకుడు ఇదంతా పరికల్పిస్తున్నాడు. ధర్మ, అర్థ, కామములను నిర్వచించే ప్రవృత్తి-నివృత్తులు ఆ దేవనటి యొక్క అంగవస్త్రములు.

నానావిధ విలాపములతో గూడిన ఈ త్రిలోకములను మనస్సు అనే కల్పనా చాతుర్యం గల చిత్రకారుడే రచిస్తున్నాడు. మనస్సు యొక్క మూలం కల్పనయే కదా! ఇకమనస్సుతో మనస్సులో పొందబడే ఈ దృశ్యము కూడా కల్పనయే! కనుక అర్జునా! ఇదంతా చూచి నీవు మోహము చెంద వలసిన పనేమీ లేదు. ఇదంతా శూన్యమాత్రము… స్వయం కల్పితమైన భ్రమ మాత్రమే.

  1. అసాధ్యం కాదు సుసాధ్యమే

శ్రీకృష్ణ భగవానుడు: ఈ దృశ్య కళాఖండానికి రంగులతో గోడపై నిర్మించిన కళాఖండానికి ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. రంగుల చిత్రంకన్నా ముందు గోడ ఉండాలి కదా! కానీ ఈ మహాశ్చర్యం చూడు! ఈ దృశ్య కళాఖండం విషయంలో మొదట చిత్రము, ఆ తరువాత దానికి ఆధారం నిర్మించ బడుచున్నాయి.

జగత్తు అనబడే నిరర్థకమైన వ్యవహారంలోనికి జీవుడు అనువాడు ప్రవేశించి జగత్తునకు అర్థమును కల్పన చేసి అనుభవిస్తున్నాడు. మొట్టమొదట నిరాధారమగు జగత్తు… ఆ తరువాత జగదనుభవమునకు ఆధారమగు కల్పన ఒనగూడుతున్నాయి. ఆహా! మాయ ఎంత చిత్రమైనది. ‘జలంలో సొరకాయ మునుగుతోంది. బండరాయి తేలుతోంది" అన్న వాక్యంలాగా జీవుడు వచ్చి ఇక్కడ అర్థములను కల్పించి భావాభావములను పరంపరగా పొందుచున్నాడు.

ఓ ఫల్గుణా! నీవు బ్రహ్మజ్ఞానము పొందియే ఉన్నావు కదా! మనోరాజ్యమును బోలు ఈ దేహాది శూన్య పదార్థములపట్ల నీకు ఆసక్తి ఎందుకో చెప్పు? స్వతహాగా శూన్యమగు ఈ జగత్తునందు ‘ఇది నాది, వీరు నావారు’ అను అనర్థములకు అర్థమేమున్నది?

అంతాకూడా ’ఆకాశమునందు ఆకాశము ఏర్పడి ఆకాశమునందు విలీనమగుచున్నది. ఆకాశము ఆకాశముచే విభాగించబడుచున్నది. (తూర్పు ఆకాశం - పడమర ఆకాశం లాగా?)

Page:214

ఆకాశం ఆకాశము చేతనే ఆవరించబడుతోంది’. అను విచిత్ర వ్యవహారంలా ఇక్కడ ఏర్పడి ఉంటోంది సుమా!.

ఓ అర్జునా! ఈ జగత్తునంతా అనంతము - విస్తృతము అయిన వాసన ఒకానొక చాంతాడువలె చుట్టుకొని ఉన్నది. అనంతమగు ఆకాశమును అల్పమగు మేఘము ఆవరించి ఉన్నట్లు చిదాకాశమును వాసనామేఘము ఆవరించి ఉంటోంది. అద్దంలో దృశ్యం ప్రతిబింబిస్తోంది చూచావా! అట్లా బ్రహ్మం నందు ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది. బ్రహ్మమే ఈ జగత్తుకు అధిష్ఠానం. అందుచేత జగతాడ్యం వదలాలంటే బ్రహ్మజ్ఞానము కాక మరింకే ఉపాయంలేదు. ఇదంతా కూడా బ్రహ్మమునకు అనన్యమై ఉన్నది. ఇక్కడా - అక్కడా కూడా బ్రహ్మమే ప్రకాశిస్తోంది. కాబట్టి ఇక ఇక్కడ ఎవరు ఎవరివలన వినాశనము పొందగలరు చెప్పు?

88

A యొక్క ముఖ్యోద్దేశం… నీవు వాసనారహితుడవగుటకు యత్నించాలనేదే సుమా! ‘వాసనారాహిత్యం’ ఎవడు సంపాదించుకోడో అట్టివాడు సర్వ శాస్త్రకోవిదుడైనప్పటికీ, గొప్ప కార్యదక్షుడు అయినప్పటికీ ఏం లాభం? అతడు పంజరంలోని చిలకలాగా వాసనాపంజరంలో బద్ధుడై ఉంటున్నాడు. చిత్తం అనే భూమిపై స్వల్ప వాసనలు మిగిలి ఉన్నప్పటికీ వాటి వల్ల మరల సంసారారణ్యం విశాలమై విస్తృతి పొందటం జరిగే ప్రమాదమున్నది.

అర్జునుడు : మరి అనేక వాసనలు సంక్షిప్తమైయున్న మనస్సు గల నావంటి వారికి సంసారమును అతిక్రమించటం దుర్లభమే కదా!

శ్రీకృష్ణ భగవానుడు: ఓ అర్జునా! నీవు నిరుత్సాహ పడవద్దు. నీవు మహావీరుడివి కదా! అభ్యాసమును ఆశ్రయించు. అభ్యాసబలం చేత హృదయంలో ‘సత్యజ్ఞానం’ అనే అగ్నిచే వాసనాబీజాన్ని సంపూర్ణంగా దగ్ధం చేయి. అప్పుడు నీ మనస్సు ఈ సుఖదుఃఖాలు అందించే వస్తుజాలంలో చిక్కుకోదు. సర్వుల స్వరూపం ఆత్మయే అయి ఉండగా ఆత్మను ఆశ్రయించటం అసాధ్యమెట్లా అవుతుంది? సర్వ ఆశలను ఇప్పటికిప్పుడే మొదలంట విడిచివేయి. ప్రతిఒక్కరికీ ఆత్మస్వభావమగు అసంగ - అప్రమేయాదులు సంతరించుకోవటం సుసాధ్యమేనని సిద్ధాంతీకరిస్తున్నాను.

శాన్తాత్మా విగతభయోజ్ఞితామితాశో నిర్వాణో గలితమహామనోవిమోహః |

సమ్యక్త్వం శ్రుతమవగమ్య పావనం తత్తిష్ఠాత్మన్యపహతి రేకశాన్తిరూపః ॥ (శ్లో 12, సర్గ 58)

అందుచేత నీవు శాంతాత్ముడవై, మోహశూన్యుడవై, ప్రశాంతమనస్కుడవై నీకు విధించబడిన ధర్మమును నిశ్చింతగా నిర్వర్తించు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు - లేనప్పుడు కూడా సర్వదా ఆత్మయందు నిర్వికల్ప స్వభావమును అవధరించి ఉండు.

Page:215

  1. నేర్చుతో కూడిన ప్రయత్నము

అర్జునుడు :

నష్టో మోహః స్మృతిః లబ్దా త్వత్ప్రసాదాత్ మయా, అచ్యుతా! । స్థితోస్మి గతసందేహః॥ కరిష్యే వచనం తవ ॥

ఓ అచ్యుతా! నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది. ‘స్వతః సిద్ధమగు ఆత్మతత్త్వము యొక్క స్మృతి’ - అనే బ్రహ్మసాక్షాత్కారం లభించింది. నా సందేహాలన్నీ తొలగినాయి. నీ ఉపదేశాలను అనుసరించి ఇప్పుడు నేను యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నీ వాక్యముల సమీక్ష మరొక్కసారి వినాలని నా కుతూహలం.

శ్రీకృష్ణ భగవానుడు : నాయనా! అర్జునా! నీకు విస్తారంగా చెప్పవలసిన పనేమున్నది? చిత్తము ఉపశమించుట చేతనే జన్మసార్థకమౌతుంది. కామాది వృత్తులు నశిస్తేనే చిత్తం ఉపశమిస్తుంది. వృత్తులన్నిటికీ మూలం వాసనలే. వాసనలు తమ తమ వృత్తులతో సహా రహితం కావాలంటే అభ్యాసం ఒక్కటే ఉపాయం. ఏదైతే వ్యావహారిక సహిత స్థితిలో ’ప్రత్యక్ చేతనము’ అని అనిపించు కుంటుందో… అదియే వాసనారహిత స్థితి సంపాదించుకున్నప్పుడు ఈ ఉపాధికి అతీతమగు - -

సర్వమునకు కేవల నిర్మల సాక్షీభూతమగు బ్రహ్మమే అగుచున్నది. ఆ నిర్మల బ్రహ్మమే సర్వులయందు సర్వత్రా సర్వ వేళలా వ్యాపించి ఉన్నదను దృష్టియే ఉత్తమ దృష్టి.

అయితే… ఎక్కడో ఆకాశములో సుదూరంగా విహరిస్తున్న పక్షిని ఈ కళ్ళు చూడలేవు కదా! అట్లాగే “స్వప్నజాగ్రత్” అనుభవమునకు మాత్రమే పరిమితమైన ఈ భౌతికమైన ఇంద్రియములకు ఆ ఆత్మపదము అవస్తువే అయి ఉంటోంది. చైతన్యమే ఈ ఇంద్రియములన్నిటికీ ఉత్తేజ - విషయ పరిజ్ఞానముల సామర్థ్యము ప్రసాదిస్తున్నది. అయితే ఏం? ఇంద్రియములు ఆత్మను సమీపించలేవు. నిర్వచించలేవు.

అత్యంత శుద్ధము, సర్వసంకల్పవర్జితము అగు ప్రత్యక్చేతనమే ఈ కనబడే వివిధ వస్తువులను ప్రకాశింపజేస్తున్నది. ఆ ప్రత్యక్ చేతనం మాత్రం ఒక వస్తువు వలె కనబడేది కాదు. అతి సూక్ష్మ గ్రాహ్యమైనది. అందుచేత శ్రవణము, మననము మొదలైన శుద్ధవాసనలు లేకపోతే మలినవాసనలు తొలగవు. మహత్తరమైన ప్రయత్నం ఉంటేనే సూక్ష్మతరమగు ఆత్మను గాంచగలవు. ఆత్మజ్ఞానానుభవము పొందబడినప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క ఆభాస నశిస్తోంది.

వాసనా లయం ఆత్మ దర్శనానికి కారణమౌతోంది… ఆత్మ దర్శనం వాసనా లయానికి కారణ మౌతోంది.

ఓ అర్జునా! “అయ్యో ఈ వాసనలు ఎలా తొలగుతాయ్?”… అని అనుకుంటూ మననం చేస్తూ దిగాలుబడి కూర్చుంటే ఏం లాభం? నీవు ప్రయత్నశీలుడవు కావాలి. అగ్నిపర్వతంపై మంచు బిందువులు కురిస్తే ఏమౌతాయి? క్షణంలో రూపుమాసిపోతాయి. అట్లాగే శుద్ధమగు ఆత్మ యొక్క అనుభవం పొందిన తరువాత అవిద్య సమీపించిందా… అది మౌనంగా విలీనం కావలసిందే.

Page:216

అయినా… తుచ్ఛము, భోగధూళి సమన్వితము, అల్పదృష్టి ప్రదాత, బంధప్రదాత - అగు వాసన ఎచ్చట? జగత్తులన్నీ వ్యాపించియున్న చైతన్యమెచట? వాసనలు చైతన్యమును బంధించటమేమిటి?

నాయనా! నీవు బ్రహ్మభావమును శరణువేడు. “కాల బద్ధం కాని బ్రహ్మమును నేనే” అను అనుభూతిని సుస్థిరీకరించుకో. వాసనల గురించిన వేదనను ధ్యాసలను వదిలివేయి.

ఆత్మ వలననే పరిపూర్ణము - శుద్ధము అగు ఆత్మ ఎరుగబడుతోంది! నానావిధ వికారములగు ఈ దృశ్యములన్నీ రాజుగారి ముందు నర్తకి నృత్యంలాగా ఆత్మ సమక్షంలో స్ఫురించి విలీనమవు తున్నాయి. అయినప్పటికీ ఆత్మ ఆకాశమువలె అప్రమేయ తేజోవిరాజితమై వెలుగొందుచున్నది. పూర్ణము - జగద్వివర్జితము - - వాక్కుకు అతీతము అగు ఆ పరవస్తువుతో పోల్చతగినది ఎక్కడా ఏదీ లేదు. కనుక ఫల్గుణా! నీవు సర్వదా హృదయంలోని వాసనల నివృత్తికొరకై నేర్పుతో కూడిన ప్రయత్నంలో ఉండు. క్రమంగా సంసార భయరహితుడవై, భగవంతుడవై ప్రకాశించగలవు.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా త్రిలోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించటం ముగించి మౌనం వహిస్తారు.

సూర్యభగవానుని స్పర్శచే కమలములు వికసించినట్లు అర్జునుని హృదయపద్మం శ్రీ కృష్ణుని జ్ఞాన స్పర్శచే వికసిస్తుంది. ఆతడు శోకరహితుడౌతాడు. గాండీవధారి అయి తన విధ్యుక్తమైన యుద్ధమును నిర్వర్తిస్తాడు.

  1. ఆత్మయొక్క కృతనిశ్చయం

శ్రీవసిష్ఠ మహర్షి : రాబోయే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అర్జునుని ఎదుట ప్రవచించబోయే నిర్మలాత్మ దృష్టిని నీవుకూడా అవలంబించు. ఈ నామరూపాత్మకమగు జగత్తునంతటినీ బ్రహ్మముతో ఐక్యమొనర్చి నిస్సంగమగు సన్న్యాసమునందు సర్వదా వెలయుము. అసంయోగమే సులభశరణ్యం.

‘పరమాత్మ’ అనగా ఎవరు? - పరమాత్మ త్రికాలములందు సత్యము. సర్వదా ప్రకాశించునది. ప్రపంచాతీతం కనుక అత్యంత దూరస్థమైనది. సర్వవ్యాపి అవటం చేత అత్యంత సామీప్యమైనది. అద్దాని యొక్క విశిష్టత ఏమిటంటే…. నీవు అద్దానియందు ప్రతిష్ఠితుడవైన మరుక్షణం నీవే ఆ వస్తువవుతావు. ఇక నీకు అద్దానినుండి భిన్నమైన ఉనికియే సంభవించదు. అదియే చిత్తవృత్తు లన్నిటియందు ప్రతిబింబిస్తోంది. ఈ జ్ఞాతృ - జ్ఞాన - జ్ఞేయములు తమ భేదములు కోల్పోయిన మరుక్షణం ఇక శేషించేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మతత్త్వంలో ఏకత్వమే పరమోత్తమపదమని గ్రహించు. అదియే ఆనందం యొక్క అవధి. అది దృక్కులనన్నిటి కంటే పరమదృక్ (the perceiver of all perceivers). మహత్ విశేషము లన్నిటి కంటే పరమశ్రేష్ఠము. గౌరవనీయము లన్నిటికంటే కూడా గౌరవనీయమైనది.

Page:217

అయితే… విషయములన్నిటికీ అతీతమైనదైనప్పటికీ, ఆత్మ సంవిత్స్వరూపమైనది. (lt has the form of Existence and Knowledge) అది శూన్యం అని మాత్రం అనుకోకు. ఎందుకంటే అది జ్ఞానమయం. మంగళప్రదము. శ్రేయములన్నిటి కంటే శ్రేయోదాయకం కూడా! అద్దాని యందే సర్వదేహములలోని సర్వ అనుభవములు ఉనికి కలిగి ఉన్నాయి. ఇక్కడ నీకు కనబడేదంతా సత్స్వ రూపంగా తోచటానికి కారణం ఆ బ్రహ్మవస్తువు యొక్క ప్రభావమే. ‘జగత్’ అనే నువ్వులలో నూనె, జగత్ వృక్షము నందలి రసము, జగత్ పశువునకు పాలకుడు అదియే. ’ప్రాణులు’ అనే ముత్యములందు సూత్రమువలె వ్యాపించి ఉన్నది ఆ ఆత్మయే! అదియే ‘పంచభూతములు’ అను మిరియపు గింజలందు

కారం.

పదార్థములందలి పదార్థత్వము… సద్వస్తువులందు గల సత్త… అసద్వస్తువుల యొక్క మిథ్యాత్వము… ఇవన్నీ కూడా ఆ పరమోత్తమ తత్త్వమేనయ్యా! ఇదంతా ఇట్లా ఉండగా, ఇక్కడ కనబడే జగత్ భావములన్నీ అజ్ఞానము వలననే ప్రకాశిస్తున్నాయి. అయితే ఆత్మతత్త్వము జ్ఞానదార్ధ్యము వలననే ప్రకాశించగలదు.

శ్రీరాముడు: ఈ ఇంద్రియములకు విషయములగు పదార్థములన్నీ ఆత్మజ్ఞానమును మరుగు పరచుచున్నాయి కదా! ఈ అడ్డు జీవునికి తొలిగేది ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి: ఇక్కడి ఇంద్రియ భావనలన్నీ ‘విచారణ’ అను వాయువీచికా ప్రభావంచే నశించ గలవు. అహంకారం మొదలుకొని ఇంద్రియాలకు గోచరించే ఒక చిన్న వస్తువు వరకు అన్నీ కూడా ఆత్మయందు పరికల్పించబడిన భ్రమలే కానీ మరింకేమీ కాదు. ఎవరికైతే ఈ కల్పిత పదార్థ - విషయాదులందు నమ్మకం ఏర్పడి ఉంటుందో… వారు మాత్రమే ఇక్కడ బద్ధులగుచున్నారు. ఈ జగత్తు యొక్క మొదలు-చివర కూడా అహంకారము యొక్క పర్యవసానం మాత్రమే.

ఆద్యంతరహితమగు ఆ బ్రహ్మాకాశమును ఎవరు ‘ఇట్టిది’ అని నిర్వచించగలరు?

ఓ రామచంద్రా! ఆత్మయొక్క కృతనిశ్చయము పొందినవారు కర్మలన్నిటినీ ఆచరించిన వారే అగుచున్నారు. అట్టి సమస్థితిని సంపాదించిన వారి మనస్సు ఇక ఎక్కడా ఎట్టి ఉదయాస్తమయములు పొందటమే లేదు. జగత్ రహితమైనట్టి బ్రహ్మమయ శరీరమును సంపాదించుకున్నవాడు ఒకానొక అనిర్వచనీయమగు అద్వైతభావమును అధిరోహించి ఉంటున్నాడు. నిద్రాసమయంలోని మనస్సువలె నిర్వికారుడై ఉంటున్నాడు. ఒకవేళ వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతడు ఏ సమయంలోనూ ఎట్టి క్షోభ పొందటం లేదు. అతని హృదయం కించిత్ చలనమునకు కూడా లోను కావటం లేదు. అద్దంలో ఏఏ దృశ్యములు ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ అద్దం ఏమన్నా మార్పు చేర్పులు పొందుతోందా? అట్లాగే ఆత్మానుభవజ్ఞుడు ఈ జగత్తుల అనుభవం పొందుచున్నప్పటికీ అదంతా తన స్వస్వరూపమునకు మార్పు చేర్పులు ఏర్పరచలేవని సుస్పష్టంగా గ్రహించియే ఉంటున్నాడు.

ఆ నిశ్చలమగు ఆత్మయే నీ స్వరూపం. తదితరమైనదంతా ప్రతిబింబం మాత్రమే!

Page:218

వాస్తవానికి ఇక్కడగాని, మరెక్కడ గాని ‘చిత్’ తప్పితే మరింకేదీ లేదు. ఇక ఈ ఏకము అనేకము గురువు - శిష్యుడు ఉపదేశము మొదలైనవన్నీ ఆ ‘చిత్’ యొక్క ఉపాంగములు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే శాంతమగు ఆత్మ - 1. తన యందు తానే జగత్తుగా వివర్తం పొందటం, 2. జగత్ అతిక్రమించి సర్వశేష్యముగా అనుగమించటం - - అను ఉభయ చిద్విలాసము లను ప్రకటించుచున్నది.

వివర్తము ఉపశమిస్తే జగత్తు కూడా ఉపశమిస్తుంది. ఎందుకంటే, చిత్ యొక్క వివర్తమే ఈ జగత్తు. అట్లు వివర్తం పొందకపోవటమే పరమపదము.

జగత్తు యొక్క ఉపశాంతి - వాసనాక్షయం అనునవి అవిభాజ్యములని గ్రహించు. ఆత్మయొక్క ఈ జగత్ స్పందనమంతా కల్పితం మాత్రమే! అందుకనే… ’అజడమగు స్పంద శూన్యత్వమే బ్రహ్మము’ అని విజ్ఞులు చెప్పుచూ ఉంటారు.

అట్టి బ్రహ్మ స్వభావమే నీవై ఉండగా ఇక కల్పనామాత్రమైన ఈ జగత్తు గురించి నీకు దుః ఖం గాని మోహం గాని ఏర్పడవలసిన అగత్యమేమున్నదో చెప్పు? ఈ జగత్తంతా జడాకృతియే కదా! ఇది ‘అనాత్మదర్శన ప్రభావం’ తప్పితే మరింకేమీ కాదు. ఈ జగత్ కల్పనము ‘సత్యమే’ అని నమ్మిన వారికి ఇది అట్లే సత్యం వలె తోచుచున్నది. “కల్పన నుండి అనుభవం. అనుభవమే జగత్తు. కనుక కల్పన సత్యమెట్లా అవుతుంది?” అను అవగాహన ద్వారా జగత్భావన లయం చేస్తున్న వారికి ఇదంతా సారశూన్యమగుచున్నది. సర్వభావములు చైతన్యములో లయం చేసిన మరుక్షణం చైతన్యమొక్కటే మిగులుతుంది.

చైతన్య వివర్తమే (చైతన్యముయొక్క స్వస్వరూపమునకు సంబంధించిన ఏమరుపే) సంసారభ్రమ అని మనం చెప్పుకున్నాం కదా! ఇంతకు మించి ఇక్కడ మరింకే విశేషం లేదు. “ఇది జ్ఞానుల శాస్త్రముల తుది నిర్ణయం. దృఢనిశ్చయం,” - అని మరొక్కసారి ప్రకటిస్తున్నాను.

శ్రీరాముడు: హే మహర్షీ! ఈ కార్య - - కారణ - - కర్తృత్వాలు ఎదురుగా ఉండగా భావనను లయం చేయటం, ఇద్దాని నుండి బ్రహ్మమును వేరు చేసి ఆశ్రయించటం ఎంతో దుర్లభమైన ప్రక్రియ అని, సులభ సాధ్యం కాదని కొందరి అభిప్రాయం.

శ్రీవసిష్ఠ మహర్షి : ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలు బంగారం కంటే వేరైనవా? కాదు కదా! ఈ కార్య-కారణ-కర్తృత్వాలనేవి బ్రహ్మము నుండి వేరుగా లేవు. చిత్ యొక్క స్పందనయే "సంకల్పించుట, భ్రమించుట…” మొదలైనవన్నీ కూడా. అట్టి చిత్ యొక్క స్పందనమునే మనం ‘చిత్తము’ అని అంటున్నాం. ‘తరంగము అనబడేది జలమే. అట్లాగే, చిత్తము దాని సర్వచర్యలతో సహా చితే’… అని తెలియకపోవటమే అజ్ఞానం. అజ్ఞాన కారణంగా బ్రహ్మము నుండి జగత్తు వేరైనదైనట్లు అనిపించటం జరుగుతోంది. అజ్ఞానము వలన ఏది ఏర్పడుతుందో అది తొలిగేది ఎట్లా? జ్ఞానము చేతనే. జ్ఞానముచే అజ్ఞానం జ్ఞానమునందు లయం అవగలదు. జ్ఞాన ప్రకాశముచే చిత్తము తొలగి ఆ స్థానంలో ‘చిత్’ ప్రకాశించగలదు.

Page:219

ఆత్మతత్త్వము గ్రహించిన తరువాత ఇక భోగవాసనలు కూడా స్వయంగా క్షీణిస్తున్నాయి. భోగవాసనల చింతారాహిత్యమే జీవన్ముక్త లక్షణము. జీవన్ముక్తుడు భోగవాసనలను చింతించక పోవటానికి కారణం… ఆ భోగవాసనల కంటే కూడా అత్యంత ప్రియమైన ఆత్మ యొక్క అనుభూతి లభించటమే! తృప్తిగా భుజించినవాడు చిరుతిళ్ళు కోరుకుంటాడా? జీవన్ముక్తుడు అత్యంత స్వాభావికంగా ఇక్కడి భోగవస్తువులు నిస్సారమని, అర్ధరహితమని, అల్పవిషయమని గ్రహిస్తున్నాడు.

  1. జీవన్ముక్తుని పరమ లక్షణములు

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! ఇప్పుడు నీకు జీవన్ముక్తుని పరమ లక్షణములు ఎట్లా ఉంటాయో మరొక్కసారి ఇప్పటి సందర్భానుచితంగా చెబుతాను విను.

జీవన్ముక్తుడు స్వాభావికంగానే భోగములను వాంఛించడని అనుకున్నాం కదా! ఆత్మ ఒక్కటే ఈ భోగ్యభోక్తృత్వములు మొదలైన నానావిధ రూపాలుగా ఉన్నదను నిశ్చయజ్ఞానం అతని యందు సర్వదా ఏర్పడి ఉంటోంది. అట్టి నిశ్చయమును అభ్యాసవశంగా అలవర్చుకొనువాడే జీవన్ముక్త శబ్దమునకు అర్హుడగుచున్నాడు. అట్టి బుద్ధిమంతుడు ఆయా యథాప్రాప్తాలైన భోగాలను అనుభవించ వలసివస్తున్నప్పటికీ అనుభవించనివాడుగానే అగుచున్నాడు. ఆకాశాన్ని పిడికిలితో గుద్దితే ఆకాశానికి ఏమౌతుంది? జీవన్ముక్తుని క్రియలు లోకానుకూలత అను ఉద్దేశమును మాత్రమే కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ సంగమునకు ఏమాత్రం కారణం కా కాజాలవు. అతడు కృత్రిమమైన వ్యవహార బుద్ధి కలిగియుండి, "ఈ కృత్రిమ వ్యవహారబుద్ధి కూడా భ్రాంతి రూపమే” అని గ్రహించియే ఉంటాడు. ఇక్కడ ఏది భ్రమమాత్రమో, ఏది భ్రమరహిత త్రికాలాబాధ్యసత్యమో విభాగయోగముచే గ్రహించని వారికి నిరతిశయానందరూపమైన ఆత్మతత్త్వప్రాప్తి లభించటమనేది దుర్లభము.

ఈ కనబడే పదార్థాలన్నీ జీవన్ముక్తుడు ఆత్మతత్త్వానుభవమునందు విలీనం చేసివేస్తున్నాడు. దృష్టి యొక్క సమున్నతిని సాధించటం మాని ఒకడు ఈ భౌతిక దేహాన్ని శుష్కించుకుని ఏం ప్రయోజనం? ఖండించుకుని ఏం లాభం? భ్రమ ఆమాత్రానికి తొలగుతుందా? అజ్ఞానం సమూలంగా తొలగనంత వరకూ ఆ అజ్ఞాన రూపమగు స్పందన కలుగుచూనే ఉంటుంది. పరిపూర్ణజ్ఞానం కలిగిన క్షణంలో ఆరి, దుఃఖం, భ్రమ, ప్రలోభం - వంటి సర్వవికారాలూ వాటంతట అవే తొలగుతాయి. దీపం కొండెక్కగానే దాని ఉష్ణం, ఆకారం, కాంతులు - తమంతట తామే తొలగుతాయి కదా!

అయితే… ‘ప్రశాంత దీపికను బోలిన చిత్తునందు స్పందాస్పందనములు లేవు’… అనునది ఉత్తమ సత్యము, సిద్ధాంతము కూడా!

Page:220

ప్రాణవాయువు స్పందనరహితమైనప్పుడు దానికి ’ఉన్నది - లేదు’ మొదలైనవి ఆపాదించలేం. అలాగే చిత్తము స్పందనరహితమైనప్పుడు ‘చిత్’ నందు చిత్తం ఉన్నదని గాని, లేదని గాని చెప్పలేం. శుద్ధ చిత్తము కేవల ఆత్మ స్వరూపమే అయి ఉన్నది. చిత్తము చిత్తో ఏకమై ఉన్నప్పుడు బంధ - మోక్షము లనేవి ఆపాదించలేం. అసలీ చిత్ వ్యర్థమగు ఆకృతుల పట్ల గ్రాహ్యత్యాజ్యములు త్యజిస్తే ఇక బంధమోక్షములనబడేవే ఉండేవికావు. కనుక ‘నాకు మోక్షం కావాలి’ అను ఆవేదన కూడా అంతఃపూర్ణానుభవమునకు హాని కలిగిస్తోందని చెప్పవలసివస్తోంది. ‘ఆ మోక్షం నాకు వలదు’ అను భావనను ఆశ్రయించినా కూడా అది బంధముగానే ఉండి ఉంటోంది.

అందుచేత బంధమోక్షములు రెండూ స్మరించకుండుటచేత నీకు పరమశ్రేయస్సు లభిస్తుంది.

‘పరమ పదము’ అంటే ఏమిటి? - స్వయం ప్రకాశమై, చైతన్య స్వరూపమై, సర్వాశ్రయమై, విషయవర్జితమైనదే పరమపదము. అది భావనకు ఆవల ఉన్నది. భావనకు ఈవల మాత్రమే ఈ దేహాదులు ఉన్నాయి. సర్వ సంకల్పములు అందులోంచే బయలుదేరుతున్నాయి. మరి సంకల్పములు అద్దానిని బంధించటమేమిటి? కనుక ‘బంధము’ అనబడేదానికి అర్థం, ఆస్కారం కూడా లేవు. శ్రీరాముడు: మరి బంధమోక్షము లెవరికి?

శ్రీవసిష్ఠ మహర్షి: మహాచైతన్యము యొక్క స్పందనము ఏదైతే ఉన్నదో…. అద్దానికే బంధమోక్షములు ఆపాదించబడుతున్నాయి. అయితే ‘ఇదంతా కూడా ఆత్మయొక్క స్పందనము మాత్రమే’ అని గ్రహించ బడిన తరువాత ఇక బంధమోక్షములు లేవని స్వభావసిద్ధంగానే తెలియవస్తోంది. ఈ విధంగా ఎరిగినంత మాత్రం చేతనే అహంకారాదులన్నీ శమించి ఆశ్రయరహితమగుచుండగా… ఇక ఎవడు దేనిచేత, ఎక్కడ ఎట్లు బంధితుడౌతాడు చెప్పు?

ఇంద్రియ పరిమితసంబంధమే బంధము… ఇంద్రియములకు సాక్షియగు ఆత్మతోటి ఏకత్వ సిద్ధియే బంధరాహిత్యము.

వివేకి అయినవాడు ‘ఇది నా సంకల్ప విభాగం. ఇది సంకల్పముల నుండి వివర్తమగుచున్న అనుభవం. ఇది సంకల్పాలకు ముందే ఉన్న నా చిత్చైతన్య స్వరూపం’… అని విభాగించి గాంచ గలుగుచున్నాడు. అట్టి స్వనిర్మిత సంకల్ప విభాగమునంతటినీ మిథ్యగా గాంచగలుగుచున్నాడు. ఇకప్పుడు క్రియాత్మక సంకల్పములు ఉండిఉంటున్నప్పటికీ సర్వమును స్పందాతీతమైన తత్త్వముగా గమనించుచున్నాడు. ప్రబుద్ధమైన చైతన్యసమన్వితుడై ఈ దృశ్యప్రపంచమును అదృశ్యమునందు విలీనమొనర్చుచున్నాడు.

చిర్ఘనమగు ఆత్మ సర్వదా స్పందానాతీతమైన స్థితి అవధరించియే ఉన్నది. అద్దాని రూపమే స్పందనారూపమగుచున్నది. ఇట్టి బోధ దృఢపడిన జీవన్ముక్తుడు ఈ జగత్తులను ఆత్మయొక్క ‘నిర్వృత్త తేజము’గా అనుభూతిని పొందుచున్నాడు.

ఓ రామచంద్రా! తదితర సర్వము ముక్షువులారా! ఈ నా వర్తమానం జాగ్రత్తగా వినండి.

Page:221

“చైతన్యము యొక్క ప్రకాశమే చిత్ స్పందనము. ఆ ప్రకాశము యొక్క ఒకానొక కిరణమే ఈ జగత్తు" అను అవగాహనచే మరిక్కడ చైతన్యప్రకాశము తప్పితే ఏదీ ఉండదు. అనేకమంది దేహులు ఇక్కడ సుదీర్ఘమైన ఇంద్రియస్వప్నమును గాంచుచుండగా… ఒక్క జ్ఞాని మాత్రం అందుకు భిన్నమైన దర్శనమును కలిగి ఉంటున్నాడు సుమా! అతడు తన నిజస్వరూపమగు ఆత్మను సర్వవ్యాపిగా, సర్వాంతర్యామిగా, సర్వరసస్వరూపంగా, నామరూపాతీతంగా గాంచగలుగుచున్నాడు. తనకు ఆద్యంతాలు లేవని ఎరిగి ఉంటున్నాడు.

యత్రోదేతి ప్రసభమనిశం సర్వసంవిత్తి సత్తా । యస్మిన్నేతే సకలకలనాకార పంకా గలన్తి |ఉద్యన్యేతే స్వదనుసుభగం యత్ర సర్వోపలమా | ధ్యానేనైవం తమవగమయ ప్రత్యగాత్మానమన్తః |

ఓ ప్రియరామచంద్రా! ఏ పరమాత్మయందు నిరంతరము జగదాకారప్రాప్తి, అద్దానినుండి ప్రీతిపూర్వకమగు విషయానుభవం కూడా అనుభవమౌతోందో, ఎవనిలో సమస్త సృష్టి సమూహాల సత్త జనిస్తోందో అట్టి సాక్షిరూపమగు నీ స్వస్వరూపపరమాత్మను నీ అంతఃకరణంలోనే వీక్షించు.

నీ సాక్షి రూపమే ఆ పరమాత్మ. ఇక కల్పిత జగత్తు నందలి సత్యాసత్యాల గురించి దుఃఖిం చుట మూర్ఖత్వమే అవుతుంది… ఇదియే ఈ బోధ సారం.

  1. స్వకంఠాభరణం

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రఘురామా! ఈ ప్రకారంగా ఆత్మపదమే సమస్తమునకు ఆది. బ్రహ్మ - విష్ణు మహేశ్వరాది మహత్స్వరూపులు ఆ పరమపదమునందే నెలకొనియుండి ఈ ముల్లోకములను పరిపాలిస్తూ లోకపూజ్యులై ఉంటున్నారు. స్వర్గవాసులలో కొందరు జ్ఞానులై ఆకాశగమనాది క్రీడలచే స్వర్గమున క్రీడిస్తున్నారు. అదేవిధంగా ఈ మనుష్య, దేవ, గంధర్వ, తిర్యగాది - జాతులలో కూడా కొందరు జీవులు ఆత్మతత్త్వమును ఎరిగినవారై బ్రహ్మానందపూర్వకంగా ఈ లోకంలో విహరిస్తున్నారు. మనుష్యానందము నుండి బ్రహ్మదేవుని ఆనందము వరకు పరికించి చూస్తే, సర్వానందముల కంటే ఆత్మానందమే (లేక) బ్రహ్మానందమే పరాకాష్ఠ. అట్టి బ్రహ్మైక్యానందమును పొందిన జీవుడు ఇక మరణ-జననాది దుఃఖములను పొందడు. అందరూ ప్రాణాధారములనుకొనే విషయాలచే ఆతడు నిరోధించబడజాలడు. ఏ జీవుడైనా సరే, ఆ పరమాత్మ యొక్క ’సర్వవ్యాపక చిన్మాత్రము’ (లేక) ’ఆత్మయొక్క సత్తా సామాన్య రూపము’ను ఏ కొంచెం ఎరిగినప్పటికీ ఆతడు ధన్యుడే. ఒక్క నిమిషం కాలం స్వస్వరూపం అవధరించినప్పటికీ, అట్టివాడు యుక్తచిత్తుడేనని చెప్పబడుచున్నాడు. అతనికిక జన్మమృత్యుజరావ్యాధులుండవు. ఆతడు ఈ దేహము నుండి తన స్వరూపమును విభేదపరచి గాంచగలడు. ఆయా అనివార్య యథాప్రాప్త కార్యక్రమములు అతనిని సంతాపమొనర్చజాలవు.

Page:222

శ్రీరాముడు: మహర్షీ! మీరు ‘సత్తా సామాన్యము’ గురించి చెబుతూ వస్తున్నారు కదా! అట్టి సత్తా సామాన్యము… 1. ఈ మనస్సు, బుద్ధి, అహంకారాది సమస్తము లీనమైనట్టి నిర్విశేష రూపమని మీ ఉద్దేశమా?… లేక, 2. మనోబుద్ధ్యహంకారాలు ఉండియే ఉన్నట్టి సవిశేషరూపమా?

ఎందుకంటే… మనోబుద్ధ్యహంకారాలు లేకపోతే దానిని వర్ణించటమెట్లా? నిర్ణయించటమెట్లా? మనోబుద్ధ్యహంకారాలు ఉన్నంత వరకు దుఃఖం తొలగదు కదా! అవే కదా సంసారానికి మూలం? శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం అనేక విశేషాలు చర్చించుకున్న తరువాత మరల ఈ ప్రశ్నకు వచ్చామేమిటి?

అయినా కూడా …ప్రశ్న ఉచితమే. చెబుతాను. విను.

ఏది సమస్త జీవులందూ, ఈశ్వర భావమునందు, ముక్తియందు కూడా అనుగతమై వ్యాపించి ఉన్నదో… ఏదైతే సమస్త దేహములలోనూ తినుట, త్రాగుట, గ్రహించుట మొదలగు సమస్త వ్యవహారములను కావించుచున్నదో… ఏదైతే సుషుప్తి - ప్రళయములందు సమస్తమును తనయందే లయం చేసుకుంటోందో… ఏది తురీయపదమునందు సమస్త విషయములను త్యజించినదై సర్వమునకు అతీతమై ప్రకాశించుచున్నదో… ఏది నీ యొక్క నాయొక్క, సర్వుల యొక్క వాస్తవ స్వస్వరూపమేఅయిన్నదో…

… అద్దానిని ‘బ్రహ్మము, సత్తాసామాన్యము’ అని కూడా అంటున్నాం. మన ఈ సంవాదము యొక్క ఉపలక్షితము, చర్చనీయాంశము అదే.

అది సర్వవ్యాపి. ఆద్యంతరహితము. ఒక స్త్రీ కంఠాభరణం తన మెడలోనే ఉంచుకొని ఆ విషయం మరచి తన కంఠం తప్ప మిగతా చోట్లంతా ఆ ఆభరణంకోసం వెతుకుచున్నట్లు ఈ జీవుడు ఆ ఆనందమయతత్త్వమును తనయందే ఉంచుకొని ఆ విషయం తెలియక ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. ’అది నీయందే నీ స్వరూపంగా ఇక్కడే ఉన్నదయ్యా’ అని శాస్త్రకారులు గుర్తు చేస్తు న్నారు. వేదాంత వాఙ్మయమంతా జీవునకు ఆతని "అప్రమేయ, అనంత, నిర్వికల్ప, అఖండ, వాస్తవ స్వభావ, తత్త్వములను” నిరూపిస్తూ చూపటానికే ఇంతటి విస్తారంగా రచించబడినదై ఉంటోంది.

అట్టి వాస్తవ స్వస్వరూపమే కారణ కారణం అయినప్పటికీ అక్కడ ’సవిశేషమా? నిర్విశేషమా?’ అనే మీమాంస ఉండదు. ఈ విశేషములు ఇట్లే ఉండగా అది అట్లే ఉంటోంది. కాబట్టి ఒకటి తరువాత మరొకటి, ఒకటి లేనప్పుడు మరొకటి… అను భ్రమ త్యజించు.

‘ఆ ఆత్మవస్తువు ఇట్టిది’ అని నిర్ణయించటానికి ఈ మాటలు, సంజ్ఞలు సరిపోవు. అయినా శిష్యునికి అది చూపుచూ మేం మా పరిమితమగు ప్రవచనాశైలితో వర్ణించి చెప్పుచున్నాం.

ఆత్మస్తోత్రం - ఆ అనంతాత్మ…

ఆకాశమునందు ఆకాశముగాను, శబ్దము నందు శబ్దరూపంగాను, చర్మేంద్రియమునందు స్పర్శరూపంగాను, ఘ్రాణేంద్రియమునందు గంధ రూపంగాను …ప్రకటి తమౌతోంది.

Page:223

ఆ ఆత్మయే శరీరమునందు శరీరత్వంగా భూమియందు భూసారత్వంగాను, జలమందు రసత్వంగాను, వాయువు నందు వాయుత్వంగాను, తేజము నందు తేజో రూపంగాను, బుద్ధియందు బుద్ధి రూపంగాను, మనస్సునందు మనో రూపంగాను, అహంకారమునందు అహంకార రూపంగాను, సంవిత్ నందు సంవిద్రూపంగాను, చిత్తము నందు చిత్త రూపంగాను, చతుర్విధ ప్రాణులందు చేతన రూపంగాను, దేవతలందు దేవతా రూపంగాను, మనుష్యులందు మనుష్య రూపంగాను, క్రిమికీటకాదులందు కీటక రూపంగాను, యుగ-సంవత్సరములందు కాల రూపంగాను, క్రియాదులందు క్రియా రూపంగాను, నియతి యందు నియమిత రూపంగాను, స్థితియందు స్థిర రూపంగాను, నశించే వస్తువులందు నాశన రూపంగానూ… ప్రకటి తమౌతోంది

బాల్యంలో బాల్యరూపంగాను, యౌవనంలో యౌవనరూపంగాను, వార్ధక్యంలో వృద్ధ రూపంగాను, మరణమునందు మృత్యు రూపంగాను… ఆ పరమాత్మయే స్థితి కలిగి ఉన్నాడు.

సముద్రంలోని తరంగాలు జలముకంటే వేరా? ఈ సమస్త పదార్థములు ఆ పరమేశ్వరునికి భిన్నమైనవి కావు. అయితే, ఈ పదార్దములలో ఏ అనేకత్వము గోచరిస్తోందో… అదంతా అసత్యమే అయున్నది. దృష్టాంతానికి ఒక్కొక్కడు చూచేది ఒక్కొక్క విశేషం అయినప్పటికీ, అందరిలోని ‘చూపు’ ఒక్కటేకదా! చూపు - స్పర్శ - రుచి మొదలైనవి వేరువేరైనప్పటికీ అనుభవములన్నిటి యొక్క అర్థప్రదాత అనుభవస్వరూపుడు అగు దేహి ఒక్కడే కదా!

పిల్లవాడు కొరివిదయ్యమును కల్పన చేసుకుంటున్నట్లు సత్యమగు చిత్స్వభావమే ఈ జగత్తుయొక్క కల్పన గావించుచున్నది.

మహాత్ముడగు ఓ రామచంద్రా! ‘ఈ అనుభవమయ్యేదంతా చిద్రూపుడనగు నేనే. నేనే లీలా మాత్రంగా ఇదంతా వ్యాపించి ఉన్నాను’… అను నిశ్చయముతో కూడుకున్నవాడవై ఉండుము. శాంత చిత్తుడవగుము. స్వమహిమయందు వర్తించుము. నీ స్వసంకల్పమహిమవలననే ఏదేది ఎట్లెట్లు తోచుచున్నదో… అట్లట్లు నీయొక్క సత్త ప్రకటనమగుచున్నదని గ్రహించు.

సాయం సమయమైనది. 15వ రోజు సంవాదము ముగించబడింది. శాంతి ప్రవచనములు ప్రవచించబడ్డాయి. సభికులంతా తమ యొక్క నిత్య - అనిత్య కల్పిత వాస్తవ స్వరూప విభాగములను వివేకదృష్టిచే పరికించటం గురించి చింతన చేస్తూ గృహోన్ముఖులయ్యారు.

దశరథుడు, రామచంద్రుడు, మంత్రివరేణ్యులు, తదితర రాజ పరివారం ఆ సంవాద శ్రవణము నకు వేంచేసిన ముఖ్యులందరి వసతి - అతిథి మర్యాదలను పర్యవేక్షించటంలో నిమగ్నులయ్యారు.

అయోధ్యా ప్రజలు తమ ప్రియరాజకుమారుడు రామచంద్రుని నిమిత్తంగా తమకు లభించిన జన్మజన్మల ప్రయోజనమైన శ్రీ వసిష్ఠ - శ్రీరామ సంవాదము గురించి చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. ఆ మరునాడు (16వ రోజు) జరుగబోయే చర్చనీయాంశముల గురించి తమకు తోచిన విధంగా

Page:224

సంభాషించుకోసాగారు. సుదీర్ఘకాలం వర్షాలు లేక నిస్సత్తువగా ఆకాశంవైపు దృష్టి సారించుచూ ఎదురు చూచే వన్యజీవులు ఒక్కసారి తొలకరి వాన కురియగానే ఎంతటి సంరంభంగా ఉంటాయి? అయోధ్యారాజ్యంలోని ప్రజలు అంతటి సందడిగా కన్పట్టసాగారు.

(పదిహేనవ రోజు విచారణ పూర్తి అయింది)