CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:225

VI. జీవుడు - స్వప్నపరంపరలు

1 స్వషసదృశ సిద్ధాంతం

శ్రీరాముడు: మునీంద్రా! ఈ పాంచభౌతిక సృష్టి అతి చమత్కారంగా తాండవిస్తోంది. ఇదంతా ఒకానొక మహత్తర సంకల్పము అని అనక తప్పదు. అట్టి చమత్కార సృష్టి రచనా వ్యవహారంలో రెండు రకాల సంకల్పాలు గోచరిస్తున్నాయి.

  1. వ్యష్టి సంకల్పం - ఇందు ‘జీవులు’ అనబడు వ్యష్టి సంకల్పులు ఉపాధి సహితులై ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు.

  2. సమష్టి సంకల్పం - ఒకానొక సమష్టితత్త్వము ఇక్కడ ఏర్పడి ఉండి, జీవుల ఉపాధులకు ప్రేరణ, సంరక్షణ, సంచారం, కాలం, ఆహారం, సంక్షయం - వంటి కార్యక్రమములకు కారణమగుచూ వ్యవహరిస్తోంది. అట్టి సమష్టితత్త్వమునకు రచయిత అయిన సమష్టి జీవుని ’హిరణ్యగర్భుడు’ అని కొన్ని శాస్త్రములు వర్ణిస్తున్నాయి.

‘సమష్టి జీవుడగు హిరణ్యగర్భుని స్వప్నమే ఇదంతా!’ - అని ప్రతిపాదించే శాస్త్రాల విషయమై మీ అభిప్రాయములు తెలియజేయ ప్రార్థన. వేదాంత వాఙ్మయంలో ప్రసిద్ధమైయున్న ‘స్వప్నసదృశ సిద్ధాంతం’ గురించి వివరించమనవి.

శ్రీవసిష్ఠ మహర్షి: “పూర్వకల్పంలో సమష్టి సంకల్పుడగు హిరణ్యగర్భుని స్వప్నమే ఈ వర్తమాన జగత్తు. అతని వాసనల ప్రకటనమే ఈ ప్రపంచం” అనే ఒకానొక సిద్ధాంతం లోక ప్రచారమైయున్నది. ఈ సిద్ధాంతము ననుసరించి "ఆ హిరణ్యగర్భుడు (సమష్టి స్వప్నమాత్ర జగత్తుకు కర్త) అజ్ఞానదశ యందు ఉన్నప్పుడు ఈ జగత్ రచన నిర్వర్తించినాడు. సమష్టి స్వప్నకర్త ఆ స్వప్నమునుండి ముక్తి నొందినాడు. అందుచేత ఈ జగత్తు వాస్తవానికి లేదు” అని సిద్ధాంతీకరించబడుతోంది. దీనిననుసరించి ’ఈ జగత్తు స్పప్నసదృశం మాత్రమే. సమష్టి జీవుడగు హిరణ్యగర్భుని స్వప్నంలో తదనుకూలమైన భ్రమ సమన్వితులగు జీవులు స్వప్న సదృశంగా ఇందులో ప్రవేశించి, సంచరించి, మరొకప్పుడు బహిర్గతులగుచున్నారు. - అని సిద్ధాంతీకరించబడుతోంది. ఆ సిద్ధాంతమును అనుసరించి కూడా ‘ఈ జగత్తు వాస్తవానికి లేదు’ అనియే నిరూపించబడుతోంది కదా!

చైతన్యము సర్వవ్యాపకమైనది. అట్లా అయి కూడా అయ్యది ఇట్లు సమష్టి జీవునిగా, అటు వ్యష్టి జీవునిగా వ్యవహారము రచించుకుంటోంది. తాను వ్యాపించి, అట్లు వ్యాపించినచోట దృశ్యమును

Page:226

పరికల్పించుకుని తన చుట్టూ ఈ దీర్ఘ సంసారమును అనుభవిస్తోంది. ఈ సంసారము "సమ్యక్ దర్శనము” అను దివ్యౌషధముచే మాత్రమే తొలగగలదు. అజ్ఞాన కారణంగా ఏర్పడిన అసమ్యక్ దర్శనం, లేక సంసారం, విజ్ఞాన కారణంగా తప్పక తొలగగలదు. “ఇక్కడెక్కడా అనేకమనేది లేదు. ఏకత్వమే ఇందలి సత్యం” అను జ్ఞాన ప్రాప్తిచే నిద్రలేచిన వాని స్వప్నంలాగా ‘సంసారము’ అనబడు దృశ్యపరిమితానుభవం తనంతట తానే పలాయనం చిత్తగిస్తుంది.

“సమష్టి సంకల్పస్వరూపుడు తత్త్వజ్ఞానలాభం పొంది ఉండటం చేత ఈ ప్రపంచం గడచిపోయిన స్వప్నం వంటిది” - అనునది స్వప్నసదృశ సిద్ధాంత సారం.

అందుచేత ఈ జగత్తు ఇప్పటికే గడచిపోయిన ఒక స్వప్న కథనం వలె, ఊహాకల్పిత భావావేశంతో కూడిన సంఘటనానుభవం వలె ద్రష్ట యొక్క స్వయంకల్పితానుభవం. నాశనమాత్రం, సారహీనం అని గ్రహించు. ఇది దర్పణాంతర్గతమైన ప్రతిబింబంలాగా వ్యష్టి - సమష్టి జీవుల సత్స్వరూపం నందు ప్రతిబింబిస్తోంది.

జరిగిపోయిన స్వప్నం - ‘ఇదంతా సమష్టి జీవుని గతించిపోయిన స్వప్నం మాత్రమే’ అనునది ఒక సిద్ధాంతమని అనుకున్నాం కదా! అట్టి స్వప్నం నుండి సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు

- - సమష్టి ఇచ్ఛకు ప్రదాత) సృష్టి స్వప్నం నుండి నిదుర లేచినప్పటికీ, అజ్ఞానముచే ఉదయించిన వ్యక్తిగతాభిమాన రూపమైన “అహం” ఇందు ప్రవేశించి ఇక్కడ కల్పనను కొనసాగిస్తోంది. చమత్కారంగా ఇదంతా స్వప్న సదృశంగా కాకుండా దృఢమైన సత్యం వలె పొందటం జరుగుతోంది. కనుక దృశ్య ప్రపంచం యొక్క నిర్వచనం ’ద్రష్ట యొక్క అజ్ఞాన కారణమైన అపరిపక్వ, పరిమిత దృష్టియే.’ శ్రీరాముడు: మహర్షీ! ఈ జగత్తు ‘హిరణ్యగర్భుడు’ అనబడే సమష్టి ఇచ్ఛారచయిత యొక్క స్వప్నం మాత్రమేనని సెలవిచ్చారు. అట్టి సమష్టి సంకల్పుడు అజ్ఞానమనే స్వప్నం నుండి ఇతఃపూర్వమే నిదుర లేచాడని కూడా చెప్పారు.

ఒకడు నిదురలో స్వప్నం గాంచుచున్నాడనుకోండి. అతడు నిదుర లేవగానే ఆ స్వప్నం కూడా ముగించబడుతుంది. ఒకని యొక్క గతించిన స్వప్నంలో మరొకరు ప్రవేశించటమనేది, దానిని కొనసాగించటమనేది చాలా ఊహాతీత విషయాలు. యుక్తియుక్తం అని అనిపించదు. హిరణ్యగర్భుని అజ్ఞానం తొలగగానే అతని స్వప్నమాత్రమైన ఈ సమష్టి జగత్తు కూడా వైదొలగాలి గదా! ఇది ఎందుకు వినాశనమొందటం లేదు?

శ్రీవసిష్ఠ మహర్షి: స్వప్నము అత్యంత క్షణికమైనది. అయితే ఆ స్వప్న ద్రష్ట యొక్క భోగదృష్టిని అనుసరించి అది ఆ స్వప్న ద్రష్టకు సుదీర్ఘంగా అనుభవమౌతోంది.

ఈ సమష్టి సృష్టి కూడా ‘భోగము’ అనే వ్యసనం లేక ప్రతిబంధకాన్ని ఆధారంగా చేసుకుని కొనసాగుతోంది. సర్వేసర్వత్రా ప్రసరించుచున్న చైతన్యం సమష్టి జీవునిగా ఒక వైపు కల్పనను ప్రారంభించి వ్యష్టి జీవునిగా మరొకవైపు అనుభవపరంపరను కొనసాగిస్తోంది. ప్రతిభాసవంటి సమష్టి జీవుని జగత్స్వప్నమున జీవజగత్తులు తోచుచు అనంత ప్రవాహరూపమున వెలయుచున్నాయి.

Page:227

ఒకనికి కలలో కనిపించేవన్నీ అంతర్గత భావతరంగాలే కదా! భోగాభిలాషతో కూడిన అంతర్గత భావతరంగాలే జగత్తు యొక్క అనుభవముల రూపమున సమష్టి - వ్యష్టి ద్రష్టలకు ఇద్దరికీ ఘనీభూతమై ఇట్లు ప్రాప్తిస్తున్నాయి.

బీజం ఎటువంటిదైతే చెట్టుకూడా అట్టిదే అవుతుంది కదా! స్వప్న పురుషుని వంటి హిరణ్యగర్భుని (ప్రజాపతి) యొక్క స్వప్నమాత్రమైన ఈ జగత్తు కూడా స్వప్నము వంటిదే. అసత్యమగు మనః సంకల్పము ద్వారా గాంచబడేదంతా అసత్యమే అవుతుంది కదా! ఈ ప్రపంచానుభవం అసత్యమైనదే! ఇక్కడ కల్పన అను ఊహా సంబంధమైన మనో వికారం నిశ్చల స్వస్వరూపం నుండే నిశ్చలజలంలో ఆవిర్భవిస్తోంది. ఇది నిశ్చల నిరాకారజలంలో చిన్న గులకరాయిని వదలినప్పుడు ఏర్పడే చంచల ఆవృత్తముల వంటిది. అదియే జగత్తు యొక్క ఉత్పత్తి. అంతేగానీ కేవలం పంచభూతాల కలయిక మొదలైనవి జగదుత్పత్తి కాదు. ఆ విధంగా ఏర్పడిన కల్పన జన్మ జన్మాంతరాలుగా, స్వర్గ నరకాదులుగా విస్తారం పొందుతోంది. అట్టి దృశ్య వ్యవహారం నందు సత్యత్వబుద్ధి ఉంచవలసిన అవసరమే లేదు.

ఎవరికైనా సరే, ఈ జగత్తు పట్ల పాతుకుపోయి ఉన్న ‘ఇది సత్యమే’ అను రూపంలో ఏర్పడిన బుద్ధి (లేక) అవగాహన అయుక్తం మాత్రమే. అట్టి భ్రమాత్మకమైన నమ్మికను ఎంత త్వరగా త్యజిస్తే

అంత మంచిది.

కల్పము - సమష్టి జీవుడగు ప్రజాపతి ఒక్క నిమిషంలో గాంచిన త్రిజగత్ స్వప్నం అత్యంత దీర్ఘమై ’కల్పము’ అను శాస్త్రీయనామంచే చెప్పబడుతోంది. ఈ జీవులంతా చూచుచున్నది ‘సృష్టి’ అనబడు ఆ క్షణకాల స్వప్నాన్నే! చిత్ యొక్క కల్పనలగు ఈ దృశ్య సమూహాలు నీటి యందు అలల లాగా అనుక్షణం లేచి, లయమౌతున్నాయి. ఈ ‘కల్పములు - సృష్టులు - స్వర్గములు’ అను పేర్లతో చెప్పబడే దృశ్యపరంపరా వ్యవహారములు సత్యము కానే కాదని గుర్తు చేస్తున్నాను.

ఈ దృశ్య ప్రపంచం మిథ్యయేనని గ్రహించు. ఈ జీవులు తమయొక్క సంకల్పముల ద్వారా (లేదా) ‘అంతరంగం నందు కల్పించుకొనిన సమాలోచనలు / భావనాతరంగాలు’ అను వాహనం అధిరోహించి ఇద్దాని యందు ప్రవేశించి ఇదంతా వాస్తవమేనని, ఇక్కడ సుఖదుఃఖాలు కలవని ఎంతో నమ్మకం పెంపొందించుకుని వ్యవహరిస్తున్నారు. స్వర్గ నరకాదుల అనుభవం పొందుచున్నారు. క్షణక్షణం మారిపోతూ ఉండే ఈ జగత్తు ’ఇది శాశ్వతం - విస్తారం - సత్యం - అనుసరణీయం - దాటుటకు అశక్యం …అని గమ్మత్తుగా అనిపించటమే ఇక్కడి చమత్కారం. ఒక స్వప్నం తరువాత మరొక స్వప్నం ఏర్పడుతూ ఉన్నప్పటికీ స్వప్న ద్రష్ట ప్రతిస్వప్నమునూ తనయొక్క పరిమితముగా, అది మాత్రమే వాస్తవమైనట్లు గాంచుతూ ఉంటాడు కదా! ఈ జీవుని బాల్య - యౌవన వార్ధక్యదశలు, సుఖ-దుఃఖ సంఘటనలు, జన్మ-మృత్యు-జన్మాంతరములు ఎప్పటికప్పుడు క్షణికమే అయినప్పటికీ

“నేను బాలుడను - - నేను యువకుణ్ణి - నేను ముసలివాడను - - నేను సుఖిని - నేను దుఃఖిని -

నేను పుట్టుచున్నాను - - నేను చచ్చుచున్నాను” అను ఎంతో ఘనీభూతమైన వర్తమానానుభవ భ్రమకు

Page:228

లోను అవుచున్నాడు. ఈ జగద్విషయములన్నీ కాల ప్రవాహంచే ఎటకో అనుక్షణం కొట్టుకుపోబడు చున్నాయని ఎవరికి తెలియదు? అయినా కూడా ఈ జీవుల సుఖదుఃఖములకు అంతు కనబడుతోందా? ఇక్కడ హిరణ్యగర్భుని స్వప్నం, జీవుని వ్యక్తిగతమైన స్వప్నం - - ఒకచోటికి వచ్చి కాపురం చేస్తున్నాయి. ఇక చూడు, చమత్కారం! ఇదంతా సంసారసాగరం - అనంత దుఃఖమయం - విధి వైపరీత్యం విధి చిద్విలాసం - అధిగమించుటకు అసాధ్యం అను రూపం గల అనేక సమ్మిళితాలతో కూడి అనుభవ పరంపరలు ఎదురుగా ఏర్పడి ఉంటున్నాయి.

శ్రీరాముడు: ఎందుచేత అట్లా ఏర్పడుతోంది?

శ్రీవసిష్ఠ మహర్షి: ఎందుచేత అని ఏమున్నది? ఏది ఎట్లా గాంచబడితే అది అట్లే ఉండటం అనేది ఆత్మకు గల ఒకానొక శక్తి. అట్టి శక్తి భ్రమతో కూడి ప్రవర్తిస్తున్నప్పుడు సృష్టి సంభవిస్తోంది. భ్రమ వల్ల సంభవం కానిదేమున్నది? అయితే… స్వప్నంలో అప్పటి భ్రమ అప్పటికి సత్యమే అయినప్పటికీ ఆ స్వప్నం మెళుకువ వచ్చిన తరువాత వ్యవహారయోగ్యం కాగలదా? భ్రమలకు చెందిన జీవుడు వాటితో కూడా తమకము పొందుచున్నాడు. అట్లే ఈ జగత్తు కూడా!

ఈ సృష్టి, దీని కర్తయగు ప్రజాపతితో కూడా… ప్రళయం పొందిన మరుక్షణం… ఆత్మవస్తువు ఒక్కటే శేషించి ఉంటుంది. దృష్టి లయమొందినప్పుడు ఇక శేషించేది ద్రష్ట మాత్రమే కదా! విషయ రహితమగు ద్రష్టయే సత్ - చిత్ - ఆనందస్వరూపుడగు పరమాత్మయొక్క నిర్వచనం. ఆత్మస్వరూపుడగు పరమాత్మ ప్రతిఒక్క జీవుని స్వస్వరూపుడై ఎట్టఎదుట నిలచియే ఉండగా అజ్ఞాన జీవులు ఎక్కడెక్కడో వెతకుచున్నారు.

అజ్ఞానము వలననే భూత భవిష్యత్ వర్తమానములందు త్రిలోకములలో చిత్రవిచిత్రాలైనవన్నీ తోచుచున్నాయి. చైతన్యము వాస్తవానికి నిర్విషయమైనది. నిర్విషయము - సర్వము అగు ద్రష్టయందు ఎందుకో ఆశ్చర్యంగా ఈ త్రికాల, త్రిజగద్విషయాలు ప్రదర్శనమగుచున్నాయి. ఈ ప్రపంచంలోనూ, ఈ మనస్సులోనూ చమత్కారాలకు లోటు ఏమున్నది? అయితే నీటిలో నిప్పు ఉంటుందా? శ్రీరాముడు: ఉండదు కదా!

శ్రీవసిష్ఠ మహర్షి: అయితే ఏం? సముద్ర జలంలోంచి బడబాగ్ని బయలుదేరుతోంది. శూన్యంగా మానవులకు కనబడే ఆకాశంలో విమాన విహారులగు దేవతలకు ఆశ్రయమైన స్వర్గ - మహర్ మొదలైన లోకాలు విస్తరించి ఉన్నాయి. మృత్తికారహితమైన (మట్టి ఏమాత్రం లేనట్టి) కొండ శిఖరంపై మహావృక్షాలు వెల్లివిరుస్తున్నాయి. నిస్సారమగు ఒక గండశిల దేవతా విగ్రహంగా మలచబడగా, ఆ విగ్రహం భక్తులచే పూజింపబడి మహత్తరమైన ప్రయోజనాలు ప్రసాదిస్తోంది. శిలలో ప్రాణులు జీవిస్తున్నాయి. రాతిలో కప్ప బ్రతుకుతోంది కదా! ఒక శిలనుండి నీరు ప్రవహించి అది పొడవైన జీవనదిగా పరిణమిస్తోంది. కొద్ది నిమిషముల నిద్రాసమయంలో సుదీర్ఘమైన కాల

వ్యవహారం స్వప్న ద్రష్ట పొందుచున్నాడు. కల్ప వృక్షం - మణి వంటి జడవస్తువులు ఆరాధకులకు పుంఖానుపుంఖములైన ప్రయోజనములను వరంగా ప్రసాదిస్తున్నాయి. ఒకడు స్వప్నంలో తాను

Page:229

చచ్చినట్లు, తన బంధువుల రోదనను వినుచున్నట్లు పరస్పర వ్యతిరిక్త విషయములను గాంచుచున్నాడు. ఆకస్మికంగా గంగ ఉద్భవించి పాతాళం జేరటం లేదా? జీవుని ప్రయత్నం లేకుండానే ఆ జీవుని పొట్టలో ప్రవేశించిన ఆహారం పచనమై శక్తిరూపం దాలుస్తోంది. పెద్ద పర్వతములు జడమై ఉండి కూడా రెక్కలు దాల్చి గాలిలో లేచి జనావాసంపై వ్రాలి సర్వనాశనం చేస్తున్నాయి. చింతించుచూ ఉండగా కొన్ని కోరికలు ఫలిస్తున్నాయి. మరికొన్ని కోరికలు ఎంత చింతిస్తున్నా ఫలించటమే లేదు. ‘నా బాల్యం, నా యౌవనం ఇట్లాగే ఉండుగాక!" అని కోరుకుంటే అది ఫలిస్తోందా! లేదు. యంత్ర నిర్మితమగు జడవస్తువులు స్వయంనిర్ణయాధికారంతో కర్మలు నిర్వర్విస్తున్నాయి. అతి పెద్దవగు గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు భూమిమీద నుండి చూస్తున్నప్పుడు మిళుకుమిళుకుమంటా అతి చిన్నవై కనిపిస్తున్నాయి. ఇంద్రజాల - గంధర్వ విద్య ప్రదర్శనం చూస్తున్నప్పుడు అదంతా నిజమేనని భ్రమ కలిగి అనుభూతులన్నీ ఏర్పడుచున్నాయి. కల్పితమగు ఆకాశమున విస్తార జీవ - జగత్ అనుభవాలు కనిపిస్తున్నాయి. యంత్ర-ఓషధాల ప్రయోగాల వల్ల ఆశ్చర్యకర ప్రయోజనాలు కలుగు చున్నాయి. భయము నుండి మదము ఉద్భవిస్తోంది.

ఈ విధంగా ఈ జగత్తులో చిత్ర విచిత్రములకు లోటేమున్నది? అందుకే భ్రమలో సంభవం కానిదేమున్నదని మనం అనుకున్నాం కదా! (అఘటనా ఘటనాపటీయసీ మాయా - అని అంటారు కదా!) ఈ జగత్తు గురించి “దీని నుండి నేను తప్పించుకోలేను” అని ఒక సమయంలో అనిపిస్తున్నప్పటికీ జ్ఞానం లభించినప్పుడు ’ఇది అర్థరహితం. కనుక ప్రతిబంధకమయ్యే శక్తి దీనికి లేదు’… అనునది కూడా అనుభవం కాగలదు. అప్పుడీ జీవునికి స్వస్వరూపము నందు పరమవిశ్రాంతి లభించగలదు. ఇక ఈ ఉపాధులంటావా… జ్ఞానుల దృష్టిలో వీటి రాకపోకలు, తదితర వ్యవహారాలు తాము గాంచే ప్రశాంత స్థితికి ప్రతిబంధకమే కాదు.

రసావేశం దృష్ట్యా ఈ జగత్తు భ్రమ మాత్రమే. బ్రహ్మ రూపం దృష్ట్యా ఇక్కడ అసత్యమేదీ లేదు. జగత్ రూపంలో వీక్షిస్తే ఇక్కడ సత్యమేదీ లేదు.

ఈ విధంగా ఈ సృష్టి స్వప్నమున అన్నియు, అంతటా సంభవములే అయి, అట్లట్లు గాంచ బడుచున్నాయి. సృష్టిస్వప్నమునందు ముగ్ధుడగుచున్న జీవుడు ఇదంతా యథార్థమని, ఇది ఇట్లే ఉండబోతోందని భావించుచున్నాడు. ఒక భ్రమ తరువాత వెనువెంటనే మరొక భ్రమ చోటు చేసు కోవటం జరుగుతోంది. ‘ఇదంతా అత్యంత స్థిరం’ అను స్థిరబుద్ధిని ఆశ్రయించుట చేతనే జీవుడు మోహం చెందుచున్నాడు. లేడి పచ్చిక మేసే ప్రయత్నంలో ఒక గోతిలోంచి బయటబడి మరోగోతిలో పడుచున్నట్లు ఈ జీవుడు సంసారము మీద గల నమ్మికతో ఒక దేహంలోంచి మరొక దేహంలో ప్రవేశిస్తూ దేశ ద్రిమ్మరిలా సంచరిస్తున్నాడు.

Page:230

2. స్వప్నంలో ఇంకొక స్వప్నం

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జీవుడు ఒకటి తరువాత మరొకటిగా అనేక స్వప్నములను గాంచుచున్నాడు. అనేకచోట్ల వేర్వేరు భ్రమలను ఒకేసారి కూడా పొందుచున్నాడు. “స్వప్నంలో ఇంకొక స్వప్నం, ఆ స్వప్నంలో మరొక స్వప్నం” - ఈ విధంగా స్వప్న-స్వపాంతర్గత పరంపరలను గాంచు చున్నాడు. ఈ విషయం నిరూపిస్తూ… ‘జీవట స్వప్నదేహపరంపరలు’ అని పేరుతోనూ, ’శతరుద్రీయం’ అనే ఒకానొక విశేషం నా దృష్టిపథంలో మెరుస్తోంది. ఆ వృత్తాంతం ఇప్పుడు చెబుతాను… విను.

ఒకానొక సుదూర ప్రాంతంలో ‘జీవటుడు’ అనే పేరుగల గొప్ప సాధకుడొకడు ఉన్నాడు. అతడు జన్మతః గొప్ప విజ్ఞాని. బాల్యంలోనే గృహమును త్యజించి సన్న్యాసాశ్రమం స్వీకరించాడు. భిక్షాటనంతో దేశసంచారం చేస్తూ ఉండేవాడు. ఆ పరివ్రాజకుడు ఒక ప్రక్క దేశాటనం చేస్తూనే తన తీవ్రమైన సాధన కొనసాగిస్తూ ఉండేవాడు. క్రమంగా శాంతి, ఓర్పు, వైరాగ్యం, తపస్సు, శాస్త్ర పరిజ్ఞానం అతనిని ఆశ్రయించాయి. ఆత్మజ్ఞానంతో ఆతని స్వరూప స్వభావాలు పరమప్రశాంతత్వము సంతరించుకున్నాయి.

అతడు ఒకసారి తనను ఆశ్రయించిన కొద్దిమంది శిష్యులతో ఒక గ్రామప్రాంతం చేరాడు. అక్కడి ప్రశాంత వాతావరణం అతనికి ఎంతో నచ్చింది. ఆ గ్రామంలోని నివాసిత ప్రాంతానికి కొంత దూరంలో ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది. ఒకటి రెండు రోజులలో శిష్యుల సహాయంతో దానిని ఒక ఆశ్రమంగా తీర్చిదిద్దాడు. అక్కడే కొన్ని రోజులు నిరంతర సమాధిని అభ్యసించాడు. క్రమంగా అతని యందు సాంసారిక వాసనలన్నీ వైదొలగాయి. చిత్తము శుద్ధము అతి పవిత్రము అయింది. సత్య సంకల్ప సమన్వితం అయింది. అనగా, చిత్తము పరిశుద్ధం పొంది, తద్వారా ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే సంభవమవగల సంకల్ప సిద్ధిత్వం పొందింది. ఇక అతని చిత్తము మౌనము సర్వత్వము - చంచలరాహిత్యము - - గుణాతీతత్వము వహించి ఉంటోంది.

ఒకరోజు అతడు యథారీతిగా ఆసనము ధరించి సమాధిని అభ్యసిస్తున్నాడు. ప్రశాంతజలంలో తరంగం ఉద్భవించినట్లు అతని అంతరంగంలో “నిర్విషయమగు ఆత్మయందు ఈ ఈ కార్యకారణవ్యవస్థ యొక్క చమత్కారమంతా ఏమిటి?” అను రూపంలో ఒక జిజ్ఞాస ఉద్భవించింది. “ఈ జగత్తంతా ఒక లీలయే కదా! కేవలం వినోదార్థం అధ్యాత్మశాస్త్రజ్ఞులు కూడా కలిగియుండే ఒకానొక చిత్తవృత్తిని అవలంబించి కొద్దిసేపు ఈ జగత్ చమత్కారం చూచి రావాలి”… అని అనుకున్నాడు. అట్టి సంకల్పం ఉత్పత్తి అయి రూపం దిద్దుకుని, బలపడగానే ఆతడు కనులు మూసుకున్నాడు. ఇంతవరకూ అతనికి అనుభవమగుచున్న ఆత్మధర్మమును కొంచెం ఏమరచి చిత్తధర్మమును ఆశ్రయించాడు. అంతవరకూ ఒక క్రమముగా పారుచున్న జలం తన క్రమము కోల్పోయి అకస్మాత్తుగా సుడులు పొందుతుంది చూచావా? అట్లా ఇంతవరకూ నామ రూప- గుణ అతీతత్వమును వహించిన అతని మనస్సు

Page:231

నామ-రూప-గుణ సహితత్వమును ఆశ్రయించింది. అంతే! ఇక యతిధర్మమును కోల్పోయి, ధర్మరహితుడగు ఒక అజ్ఞాని యొక్క స్వభావ - సంకల్పములను లీలగా అవధరించాడు.

‘నేను’ జీవటుడు అనే పేరుగల ఒక మానవుణ్ణి కదా! - అని అనుకోసాగాడు. నిరవయవము అపరిమితము అగు స్వభావము నుండి చ్యుతుడై కేళీవినోదంగా హస్త పాద పరిమితమైన దేహస్వభావం ఆశ్రయించాడు. భిక్షకుని రూపంలో అతని భౌతికదేహము - సమాధి యథాతథంగా ఉండగానే అతని చిత్తము మరొక జీవ-పాంచభౌతిక దేహం కల్పించుకుని అక్కడి నుండి బయలుదేరింది.

‘ఊళ్ళో విశేషాలేమిటో చూచివద్దాం’ అని తలచిన అతని చిత్తము నూతన జీవట ద్వితీయ దేహంతో ఊరిలో ప్రవేశించింది. ఆ ద్వితీయ జీవటుడు వీథులలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక చెట్టు తొఱ్ఱలో ఒక తేనెతుట్టె కనిపించింది. ఒడుపుగా ఆ చెట్టు ఎక్కి తేనెతుట్టెను నేలకు దించాడు. ఆ తేనెపట్టులో గల తేనెను శుభ్రంగా త్రాగాడు. ఇక అక్కడి నుండి బయలుదేరాడు. అక్కడి వీధులలో సంచరించే జనులను ఆశ్రయించి కొన్ని డబ్బులు సంపాదించాడు. ఆ సమీపంలో గల ఒక కల్లు దుకాణంలో ప్రవేశించాడు. అక్కడి వారితో సరసాలు ఆడుతూ అర్ధరాత్రి వరకూ మత్తుగా త్రాగాడు. ఒక తాగుబోతు పాడుచున్న తత్త్వపు పాటలు విన్నాడు. అర్ధరాత్రి ఇక అక్కడి నుండి బయలు దేరి తూగుతూ ఒక ఇంటి అరుగుపై నిద్రకు ఉపక్రమించాడు. ఆ నిద్రలో అతను ఒక కలలో ప్రవేశించాడు. తనను ఒక పాఠ్య - అధ్యయనములతో కూడిన సత్కర్మపరుడగు బ్రాహ్మణ బాలకునిగా

గాంచసాగాడు.

ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రాహ్మణగృహంలో ఉంటూ, తండ్రి దగ్గర సంధ్యావందనం, వేదాలు నేర్చుకుంటున్నాడు. చాలాకాలం తదితర విద్యార్థులతో కూడి అనేక శాస్త్ర విషయాలు నేర్చుకుంటు న్నాడు. క్రమంగా యుక్త వయస్సు వచ్చింది. వివాహం చేసుకుని పిల్లలను కన్నాడు. వారి కోసం అనేక శ్రమలకు ఓర్చి, ధనం సంపాదిస్తూ ఉండేవాడు. చాలా రోజులు గడిచాయి. ఒక రోజు నిత్య నైమిత్తిక కర్మలను విశేషపూజలను అర్ధరాత్రి వరకు ఇంటివద్దే నిర్వర్తించాడు. రాత్రి పొద్దుపోయింది. రోజంతా అలసి ఉన్న ఆ బ్రాహ్మణునికి ఆ రాత్రి రాజాశ్రయం గురించి యోచిస్తూ నడుం వాల్చగానే నిద్రపట్టింది. ఆ నిద్రలో తానొక సామంత రాజకుమారుడైనట్లు కలగాంచాడు.

ఆ సామంతరాజ కుమారుడు బాల్యం నుండే ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అతనికి చెందవలసిన సింహాసనం ఆక్రమించటానికి అతని దాయాదులు ఎన్నో కుట్రలు పన్నారు. రాజభక్తులగు కొద్దిమంది మంత్రుల సమాలోచనల సహాయంతో అతడా కుయుక్తులన్నీ పటాపంచలు చేసి సింహాసనం అధిష్ఠించాడు. కొన్ని సంవత్సరాలు రాజ్యం ఏలాడు కూడా!

ఒక రోజు ఆ సామంతరాజు రోజూలాగానే రాచ కార్యములన్నీ ముగించుకుని అంతః పురంలో ప్రవేశించాడు. ఆ మరునాడు తాను వరించిన చక్రవర్తి యొక్క రాజకుమార్తె స్వయంవరానికి వెళ్ళవలసి ఉన్నది. ఆ విషయమై మరునాటి ప్రయాణ సన్నాహాలకు ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి

Page:232

అంతఃపురంలో తీయటి ఆలోచనలలో నిమగ్నమయ్యాడు. అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో అతడు ఒక చక్రవర్తి అయినట్లు కలగాంచాడు.

శ్రీరాముడు: ఆ జీవట భిక్షువు పరివ్రాజకుడై ఆ గృహంలోనే త్రాగుబోతుగా… త్రాగుబోతుగా ఉంటూనే జీవట బ్రాహ్మణుడుగా… జీవట బ్రాహ్మణుడుగా ఉంటూనే ఒక సామంతరాజుగా… సామంతరాజుగా ఉంటూనే ఒక చక్రవర్తిగా… కొనసాగుచున్నాడా? ఇదంతా ఎట్లా జరుగుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి: అవును. భిక్షకుడుగా ఆ గృహంలో ఉండియే త్రాగుబోతుగాను, తదితరులు గాను కొనసాగుచున్నాడు. ఎక్కడికక్కడ నిద్రకు ఉపక్రమించినప్పుడు మరొక నూతన స్వప్నంలో ప్రవేశించి కల్పిత ఉపాధులను అనుభవించుచున్నాడు. “ఇది ఎట్లా?” - అనే విషయాన్ని కొద్దిసేపు తరువాత చర్చిద్దాం. ఇప్పుడు చక్రవర్తి దాకా వచ్చాడు కదా!

ఆ చక్రవర్తి చాలాకాలం నానావిధ భోగములు అనుభవించాడు. అనేక రాచకార్యములు చక్కబెట్టుచూ ఉన్నాడు. శత్రు - - మిత్రులకు సముచితరీతిగా దండన - - సత్కారములను నిర్వర్తించాడు. పట్టపురాణులతో విహరిస్తూ, సామంతరాజులను పరిపాలిస్తూ, మహాసామ్రాజ్యం ఏలాడు. అందమైన రాజపుత్రికలను నయానా, భయానా, తన సొంతం చేసుకొనే వాడు. ఒకసారి ఒక రాజపుత్రిక అతనిని వివాహం చేసుకోవటానికి తిరస్కరించింది. అతనిలో పట్టుదల ఎక్కువైంది. అక్కడి రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని, రాజపుత్రికను కబళించాలని పన్నాగం పన్నసాగాడు. మంత్రులతో, సైనికాధికారు లతో రాజకీయ ఎత్తుగడలు, యుద్ధవ్యూహ రచనలతో 15 రోజులు అవిశ్రాంతంగా గడిపాడు. ఒక రోజు దండయాత్రకు బయలుదేరి త్రోవలో సైనికశిబిరం నిర్మించాడు. ఆ రోజు మంత్రులతో చాలా సేపు సమాలోచనలు చేశాడు. ఆ తరువాత నృత్యవినోదాలతో చాలా రాత్రి గడచిపోయింది. మర్నాడు చాలా కార్యక్రమములు, రాజకీయపు ఎత్తుగడలు నిర్వర్తించవలసి ఉన్నదికదా! ఆ రాత్రి పొద్దుపోయిన తరువాత కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, ప్రియురాలి పట్ల అతని ఆలోచనలను మరుగు చేస్తూ నిద్ర అతనిని ఆక్రమించింది. ఆ నిద్రలో తానొక అప్సర (దేవతాస్త్రీ) అయినట్లు కలగన్నాడు.

ఆ అప్సరస తన ప్రియాతి ప్రియుడగు ఒక దేవతా పురుషునితో కూడి ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉండేది. ఆ దేవతా పురుషుడు తన పట్ల ధ్యాస మరల్చకూడదనే పట్టుదలతో అనేక కుయుక్తులు పన్నుతూండేది. ఒకసారి ఆ దేవతా పురుషుడు తనపై విరక్తి కలిగియుండటం అప్సరస గమనించింది. ఎంతో దుఃఖితురాలైనది. ఏకాంతంలో దుఃఖిస్తూ, కుత్సిత భావాలతో నిండిన మనస్సుతో, రతిక్రీడ యందు డస్సినదై నిదురకు ఉపక్రమించింది. ఆ నిద్రలో తాను ఒక లేడిగా వనంలో సంచరిస్తున్నట్లు కలగన్నది.

88

ఆ లేడి పచ్చికను, చిగురుటాకును నమలుతూ ఒక అడవిలో సంచరించేది. ఒక రోజు ఒక పులిని దూరం నుండి చూచి ఎంతో భయంతో ఒక పొదలో దూరింది. ఆ పొదలో కొన్ని పూతీగలు

Page:233

ఆ లేడి కాళ్ళకు చుట్టుకున్నాయి. ఆ తీగలను విదిలించుకోవటానికి ఎంతో ప్రయత్నించి విఫలమైనది. చివరికి సొలసి అక్కడే కించిత్ నిద్రకు ఉపక్రమించింది. ఆ నిద్రలో తన భయం యొక్క పరిణామంగా ఒక పూల తీగగా అయినట్లు కలగన్నది.

శ్రీరాముడు: అదేమిటి స్వామి! పూర్ణ - శుద్ధ - చైతన్య సమన్వితుడగు ఆ జీవట భిక్షువు ఎక్కడ? ఆతడు అర్ధజడమగు పూతీగగా పరిణమించటమేమిటి? ఆశ్చర్యంగా ఉన్నదే!

శ్రీవసిష్ఠ మహర్షి: ఇందులో ఆశ్చర్యం ఏమున్నది?

తిర్యజ్చో: ప్రహ్యాన్తి స్వప్నం చిత్తస్వభావతః | దృష్టానాం చ శ్రుతానాంచ చేతః స్మరణమక్షతమ్ ||

దేవతలు కావచ్చు. మానవులు కావచ్చు. జంతువులు, వృక్షములు, పూతీగలు కావచ్చు… ఆయా జీవులందరూ తమతమ చిత్తముల స్వభావమును అనుసరించే స్వప్నసదృశ జగత్తులను గాంచుచున్నారు. అఖండము, అప్రమేయమూ, అనిర్దేశము అగు ఆత్మతత్త్వానుభవం తప్ప తదితరమైనదంతా స్వప్నసదృశ్యం కాదా? మరింకేమిటి? ప్రతిఒక్కజీవుని అంతరంగ సంస్కారములే అతడు చూచే, వినే, పొందే - దృశ్య శబ్దార్థ అనుభవములకు అవగాహనలకు ముఖ్య కారణములై ఉంటున్నాయి. జీవునిలో పేరుకునియున్న సంస్కారముల ప్రదర్శనయే వారి వారి జగదనుభవములై ఉన్నాయి. సంస్కారములు, అవగాహనలు ఈ రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావితమవుతూ ఉంటున్నాయని జనులు గమనించెదరు గాక!

శ్రీరాముడు: ఆ పరివ్రాజకుడు పూతీగగా స్వప్నానుభవం పొందుతూ ఇంకా ఏం చేశాడు?

శ్రీవసిష్ఠ మహర్షి: ఆ పూతీగ కొంతకాలానికి పత్ర - పుష్ప - ఫలములతో ఒక పెద్ద లతాగృహంగా విస్తరించింది. ఆ లతా గృహంపై అనేక తుమ్మెదలు ఝంకారం చేస్తూ వ్రాలుతూ ఉండేవి. కొంతకాలం తరువాత ఆ లతలోని సాక్షి చైతన్యం గాఢనిద్రకు ఉపక్రమించింది. ఆ పూలతలోని భావికాలపు అంకుర బుద్ధి మరల స్వప్నోన్ముఖమైనది. సంసారానుగతంగా తాను ఒక తుమ్మెద అయినట్లు కలగాంచింది.

ఆ తుమ్మెద అనేక రకాల పుష్పాలపై వ్రాలుచూ అనేక ప్రదేశాలలో తన సుందరమైన రెక్కలతో విహరిస్తూ ఉండేది. ఒకసారి అది ఒక తామర పుష్పంలో ప్రవేశించింది. పుష్పరసాన్ని గ్రోలింది. అక్కడ మత్తును పొంది మోహవశంగా తామరతూడులో ప్రవేశించి అక్కడ చిక్కుకున్నది. ఈ జడమగు మనస్సు మోహవశం చేత పొందని కష్టాలు, చేరని దుష్ట ప్రదేశాలు ఉంటాయా? తామర తూడులో చిక్కుకున్న ఆ తుమ్మెద ఇట్లా ఆలోచించసాగింది.

అరె! ఈ తామరతూడులో చిక్కుకుని కదలలేని పరిస్థితిలో ఉండిపోయానే? ఇప్పుడేం చేయటం? అయినా ఫరవాలేదులే! తెల్లవారుతుంది. ఈ తామర రెక్కలు విచ్చుకుంటాయి. నేను బయటపడతాను. ఇంకా అనేక పూవులలోని మధువును గ్రోలుతూ హాయిగా ఉంటాను…

Page:234

అని అనుకుంటూ వేచి ఉన్నది. ఇంతలో ఒక మదపుటేనుగు ఆ కొలనులో ప్రవేశించి అల్లకల్లోలం చేసింది. తన మొరటు పాదాలతో సుతిమెత్తని తామరపూలన్నిటినీ నిష్కర్షగా త్రొక్కివేసింది. మూర్ఖులు రమ్యమైన వస్తువులను పాడుచేయటంలో సిద్ధహస్తులై ఉంటారు కదా! అప్పుడా ఏనుగు దంతము యొక్క ఒరిపిడికి తామరపూవు నలిగి ఒడ్డున విసిరి వేయబడింది. తూడులో వున్న తుమ్మెదకు గాయాలై మూర్ఛిల్లింది. అట్లు మూర్చిల్లే ముందు ఏనుగుకు సంబంధించి భయాందోళనలకు సంబంధించిన చాంచల్యమును అనుసరించి తానొక మదపుటేనుగు అయినట్లు స్వప్నం పొందింది.

ఆ మదపుటేనుగు రాజఠీవితో విశాలమైన అరణ్యంలో చాలాకాలం సంచరించింది. ఒక రోజు ఏమరుపాటు చేత రాజభటులు దానిని బంధించటానికి నిర్మించిన ఒక పెద్ద గోతిలో చిక్కుకుంది. రాజభటులు ఆ ఏనుగును బంధించి తమ రాజు దగ్గరకు తీసుకుపోయారు. ఆ రాజు ఏనుగును అనేక యుద్ధాలలో వినియోగిస్తూ ఉండేవాడు. అది దీర్ఘమైన తొండంతో శత్రుసైనికుల దేహాలను ఒడపుగా చుట్టుచుట్టి నేలకేసి బాదటంలో ఎంతో ప్రావీణ్యత కనబరచేది. అందుచేత అక్కడి సేనాపతికి ఆ ఏనుగంటే ఎంతో ఇష్టం. కొంతకాలానికి ఆ ఏనుగు ముసలిది అయింది.

ఒకసారి ఆ రాజ్యమును కబళించటానికి శత్రురాజులు చుట్టుముట్టారు. ఆ యుద్ధంలో ఎంతో మంది శత్రుసైనికులను ఆ ఏనుగు తన పాదఘట్టనలతో నలిపివేసింది. చివరకు కొందరు సైనికులు ఆ ఏనుగును శూలములతో గండస్థలంపై పొడిచారు. అది నేలకూలి మూర్ఛిల్లింది. ఆ ఏనుగు జీవిత కాలమంతా తన గండస్థలంపై వ్రాలే దోమలను త్రోలే ధ్యాస కలిగి ఉండటం చేత, తత్సంబంధమైన సంస్కార ప్రాభవానికి లోనై ఒక దోమ అయినట్లు కల గాంచింది.

ఆ దోమ ఒక కొలనులో అటూ ఇటూ తిరుగుతుండేది. ఆ కొలనులో కొన్ని హంసలు ఉన్నాయి. ఆ హంసలపై వ్రాలే నిరంతర ధ్యాస చేత అది ఒక హంస శరీరంపై నిదురిస్తూ తానొక హంస అయినట్లు మనఃప్రవేశం చేసింది.

హంసగా పరిణమించిన ఆ జీవుడు ఆ తరువాత దీర్ఘకాలం విభిన్నమైన యోనులలో ప్రవేశ నిష్క్రమణములచే పరిభ్రమిస్తూ మరికొన్ని జన్మలు గడిపాడు. ఆ తరువాత ఉపాధిక్రమంగా మరల హంస అయినాడు. ఆ హంస బ్రహ్మదేవుని వాహనమగు రాజహంస గురించి విని ‘నేను కూడా బ్రహ్మదేవుని వాహనమగు రాజహంస అయితే ఎంత బాగుంటుంది’… అని నిరంతరం చింతిస్తూ ఉండేది. బ్రహ్మదేవోపాసన నిర్వర్తిస్తూ ఉండేది. కొంతకాలానికి ఒక విషపురుగు కాటుకు గురి అయి ఆ దేహం నిర్వీర్యమైనది. పూర్వవాసనా ప్రభావం చేత బ్రహ్మదేవుని వాహనమగు రాజహంసగా జన్మించింది. జీవట భిక్షువు నుండి చూస్తే అది 99వ జన్మ.

ఆ రాజహంస అత్యంత వినయముతో, శ్రద్ధగా, భక్తి పూర్వకంగా పరతత్త్వ స్వరూపుడగు బ్రహ్మదేవుని సేవిస్తూ ఉండేది. అట్టి సేవాప్రభావంగానూ, తన యొక్క వినయ - విధేయతలకు

Page:235

ప్రతిఫలంగానూ ‘వివేకం’ పొందింది. భగవానుడగు బ్రహ్మదేవుడు తనను ఆశ్రయించ వచ్చిన దేవ-ముని-ఋషిపుంగవులకు బోధించే బ్రహ్మతత్త్వమును తాను కూడా వినేది. ఆ రాజహంస తన వివేక - వైరాగ్యముల బలం చేత లౌకిక భోగములను ఇంద్రియార్థములను సారశూన్యమని గ్రహించి, లౌకికమైన వస్తుదృష్టిని అధిగమించింది. జీవన్ముక్తి పొందింది. బ్రహ్మదేవునితో సమానంగా ‘తదనంతర విదేహ ముక్తి’కి అన్ని విధముల అర్హత సంపాదించుకున్నది.

  1. రాజహంస - - రుద్రుడు

శ్రీవసిష్ఠ మహర్షి: సన్న్యాసి, భిక్షుడు అగు జీవటుడు ఇప్పుడు జీన్ముక్తత్వము అవధరించి హంస అయి భగవంతుడగు బ్రహ్మదేవుని సేవలో నిమగ్నుడై ఉన్నాడని అనుకున్నాం కదా! బ్రహ్మదేవునితో లోకసంచారం చేయగలిగే అవకాశం పొంది ఉండటం చేత ఆ హంస యొక్క పవిత్ర జ్ఞానదృష్టి మరింత ఉత్కృష్టత పొందింది. ఒకసారి బ్రహ్మదేవునితో రుద్రలోకం వెళ్ళటం జరిగింది. రుద్రుని దర్శనం చేసుకుని అర్చించింది.

‘రుద్రుని అర్చించుటచే నేనిప్పుడు రుద్రుడను’ అని భావన చేసింది. (నారుద్రో రుద్ర మర్చతి) మరుక్షణం ఆ జీవటుడు అద్దంలో ప్రతిబింబము ప్రవేశించినట్లు యోగజ్ఞానయుక్తమగు రుద్రరూపం దాల్చింది.

శ్రీరాముడు: మహర్షీ! జీవటుడు జీవన్ముక్తుడయ్యాడు కదా! మరల రుద్రుడుగా ఎట్లా జన్మించాడు? అప్పుడాతడు జీవటుడుగా విదేహముక్తి సమన్వితుడని కూడా మీరు చెప్పారు కదా?

శ్రీవసిష్ఠ మహర్షి: సంసార జీవులు ఇంద్రియానుభవములకు సంబంధించిన సంస్కారం కలిగి ఉంటారు. అందుచేత వారు ఒక ఉపాధిని త్యజించినప్పుడు తమ యొక్క అంతర్గతమై ఉన్న సాంసారిక సంస్కారాలచే ప్రభావితులై, తదనుభవానికి అనుకూలమైన ఉపాధి పరంపరలను పొందుతూ ఈ సంసారారణ్యంలో సంచరిస్తున్నారు. వారియందు ‘పునరావృత్తి’ అను దోషం ఉండి ఉంటోంది. అట్టి పునరావృత్తి దోషం చేత జన్మ - జన్మాంతరములు ఒక పరంపరగా వచ్చిపడుచున్నాయి.

అయితే, జీవటుని వ్యవహారం వేరు. ఆతడు జీవన్ముక్తుడు అవటంచేత ‘జీవన్మరణములు’ అను జాడ్యం అతనికి లేదు. అతడు సారూప్యముక్తి అనుభవిస్తున్నాడు. ఒకడు ఒక సమయంలో ఒక ఆలోచనను ఆశ్రయించి కొద్దిసేపయిన తరువాత ఆ ఆలోచనను త్యజించి మరొక ఆలోచనను స్వీకరిస్తాడు చూచావా? ఆలోచన - ఆలోచనల మధ్య తన స్వస్వరూపం త్యజించటం లేదు కదా! జీవటుడు కూడా హంస యొక్క అనుభవమును త్యజించి రుద్రుని యొక్క అనుభవం స్వీకరించాడు. ‘నేను ఉపాధులకు జన్మ జన్మాంతరాలకు సంబంధించిన వాడను కాను’ అను అకృత్రిమ స్వభావంతో కూడిన యోగజ్ఞానములు సంపాదించి ఉండుటచే అతనికి 1. సత్యసంకల్పబలం (సంకల్పించింది సత్యమయి ప్రాప్తించటం) 2. సంకల్పాతీతత్వం రెండూ కూడా ఒనగూడుచున్నాయి.

Page:236

గంధము వాయువును అనుసరిస్తూ తన స్వరూప స్వభావములను త్యజించినట్లు అతడు హంస శరీరం త్యజించటం, రుద్ర శరీరం స్వీకరించటం జరుగుతోంది. యోగులు ప్రారబ్ధశేషానుభవం కొరకై పూర్వ శరీరములను విడవటం, నూతన శరీరం స్వీకరించటం లీలగా నిర్వర్తిస్తారు. తదితర సంసార జీవులు వేదన-ఆవేశములతో కూడిన కౌతుకంచేత ఉపాధులను పొందుచూ, దేహ పరిమితులై అల్పయోచనాపరులై, దృశ్యమునకు దాసులై సంచరిస్తూ ఉంటారు.

ముక్త జీవునకు బద్ధజీవునకు మధ్య ఉన్న భేదం అవగాహనకు సంబంధించినది మాత్రమే.

జీవటుడు రుద్రత్వం స్వీకరించి, రుద్రుడై ప్రధానమైన గణపతిత్వం పొందాడు. శివలోకంలో ఉచితములను, ఆచారములను నిర్వర్తిస్తూ రుద్రపురియందు యథేచ్ఛగా విహరించసాగాడు. అట్లా రుద్రుడుగా ఉండగా ఒక రోజు తన జ్ఞానైశ్వర్య ప్రభావం చేత ఒక్కసారి తనయొక్క సుదీర్ఘమైన పూర్వజన్మలన్నీ అవలోకించసాగాడు. ఆతడప్పుడు ఆవరణశూన్యమైన జ్ఞానశరీరమున వెలయు చున్నాడు. అట్టి జ్ఞానావరణ నుండి తను జీవట ఉపాధికి ముందు - వెనుక ఎత్తిన అనేక పూర్వ జన్మలవైపు ఒక్కసారి దృష్టి సారించి, ఇట్లు తలపోయసాగాడు.

జీవటరుద్రుడు: ఆహా! ‘చిత్తవృత్తులను అవలంబించాలి’ అని అనుకుని ఎన్ని దేహములలో ప్రయాణించి వచ్చాను. ఈ మాయ ఎంత చిత్రమైనది? జ్ఞానానందమయ స్వరూపుడగు నాకు జన్మ ఏమిటి? మృత్యువేమిటి? ఎండమావులలో జలం ఉండునట్లు ఈ మాయకు వాస్తవమైన ఉనికియే లేదు. కాని, అత్యంత ఘనీభూతమై ఉన్నట్లు అనుభూతిని కలిగించగల శక్తి ఈ మాయ కలిగియున్నది. అట్టి శక్తి ద్వారా ఈ విశ్వమునంతటినీ మోహింపజేయగలుగుతోంది. ‘పారమార్థిక చిత్’ స్వరూపుడగు నాకు అనేకసార్లు అనేక సంకల్పసమూహములు ఉదయించాయి. ఆ సంకల్పములు ఆయా పంచభూత సముదాయములను నిర్మించుకుంటూ త్యజిస్తూ ఈ సంసారవనంలో పచార్లు చేసి ఇక్కడికి వచ్చాయి. సర్వశక్తిమంతుడనగు నా యొక్క చిదంశము ఒకవైపు చెక్కుచెదరక ఉన్నది. మరొక వైపు నా జడంశమునకు ఈ ఆకాశాది విభాగములు ఒనర్చబడుచున్నాయి. నేను స్వీయస్వేచ్ఛాఉపక్రమమును ఆశ్రయించి చిదాభాసుడనై ఈ స్థూల - సూక్ష్మదేహములలో సమష్టి - వ్యష్టితత్త్వములుగా వెలయటం జరిగింది. నా యొక్క జడంశము సూక్ష్మ - స్థూలములగు తన్మాత్ర విభాగములుగా పరిణామం పొందింది. ఆయా దేహముల వాసనావైచిత్ర్యములను అనుసరించి రంగుల మేళవంలాగా హావ భావ -రూప-గుణ వైచిత్ర్యములను ప్రదర్శించింది. నేను జ్ఞానినై ఉండి కూడా ఆయా సమయ సందర్భాలలో ఆయా ఉపాధి సంబంధితమైన తాదాత్మ్యము ప్రకటించాను. దేహభావమును స్వీకరించిన సమయంలో నా యొక్క అనంత స్వరూపమును కించిత్ ఏమరచినవాడనై ఆయా ఉపాధులలో కునుకులు తీశాను. ప్రతి ఒక్క ఉపాధీ తన చుట్టూ ఒక్కొక్క ప్రత్యేకమైన సృష్టిని పొందింది. కొన్ని కొన్ని సంబంధ-బాంధవ్యములను ఆస్వాదించింది. ఇట్లా అనేక సృష్టులలో ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ నా వెంట ‘విషయములు’ అనే అభ్యాసమును తెచ్చిపెట్టుకున్నాను. అయితే కొన్ని కొన్ని సృష్టులలో

Page:237

(జన్మలలో) నిర్వర్తించిన శమదమాది సాధన సంపత్తి కూడా నా వెంటనంటి వచ్చింది. ఇప్పుడు నేను విషయరహితుడను కావాలి కదా! అందుచేత నా వెంటనంటి ఉన్న సాధన సంపత్తికి తోడుగా మరికొంత సాధనధనాన్ని సంపాదించి తద్వారా మరికొంతగా విషయములను అధిగమిస్తాను.

రుద్రత్వ సంకల్పావరణను ఆశ్రయించి ఉన్న ఆ పరివ్రాజకుడు ఒకచోట పద్మాసనాశీనుడైనాడు. గతించిన ఆవరణలను విజ్ఞానబలంచే పఠించి మహత్తరమైన అవగాహనను పొంది మహాస్థైర్యం పొందాడు. ‘ఇక త్యజింవలసినది త్యజిస్తాను’ అను నిమగ్నములో ప్రవేశించాడు.

మొట్టమొదట స్థూలదేహావయవములైన ఈ కాళ్ళు, చేతులు మొదలైన వాటిని ’వీటితో నాకు సంబంధమే లేదు’ అను అప్రమేయత్వాన్ని స్వీకరించాడు. ఆ తరువాత సూక్ష్మదేహావయవములైన మనో - ప్రాణాదులను కూడా అధిగమించాడు. బహిరంగ విషయములగు బాహ్యవిషయాలాపన మొదలైన బాహ్య సంసక్తిక స్వభావమును దాటివేశాడు. "అంతర్యామియగు తత్త్వాన్ని ఆరాధిస్తున్నాను” అనురూపంలో ఉండే తత్త్వ - ఆరాధనలను కూడా అధిగమించాడు.

తానే సర్వాత్మకుడయ్యాడు. తక్కిన స్వభావములన్నిటికీ అసంబంధితుడైనాడు.

శ్రీరాముడు: అట్టి విషయత్యాజ్య - అనుభవగ్రాహ్యాలను ఎట్టి మంత్ర తంత్ర - - ఉపాసన -

సాధనలను ఆశ్రయించకుండానే ఆ పరివ్రాజకుడు సంపాదించాడా?

శ్రీవసిష్ఠ మహర్షి: ఈ చిత్తమునకు ఒక లక్షణమున్నది. అది ఎప్పుడు దేనిని దృఢంగా భావన చేస్తే అప్పుడు అట్లే పరిణమిస్తుంది. భావానుగత అనుభవములుగా నూతన భావనలో ప్రవేశిస్తూ క్షణంలో క్రితం భావనను తనయందు విలీనం చేసుకోగలదు. చిత్తంలో ఆ మహత్తర శక్తి పొందుపరచబడి ఉన్నది.

శ్రీరాముడు: ప్రతి ఒక్కరి చిత్తమునకు మీరు చెప్పిన మహత్తర శక్తి ఉన్నది కదా?

శ్రీవసిష్ఠ మహర్షి: అవును ఉన్నది. అయితే అనేక ఇంద్రియ - దృశ్య - భావవిషయాలను ఆశ్రయించే వారి చిత్తము అతిచంచలమై ఉండటంచేత తాను ఉద్దేశించినట్లుగా ఎక్కడా ఏదీ పొందటానికి అశక్తత చెందుతోంది. అందుచేత సాధకులు చిత్తమునకు ఏకాగ్రత అభ్యసింపజేస్తేగాని సంసారమును జయించలేరు. ఈ జీవుడు సాధనచే తన భావాలు తనకు శ్రేయోదాయకులగు సేవకులుగా ప్రవర్తింపజేయగలడు. సాధన కొరవడినప్పుడో, ఈ జీవుడు తానే తన భావాలకు సేవకుడగుచున్నాడు.

చిత్తము యొక్క దేహము చింతనయే కదా! ఒకడు పరస్పర భావములలో ఏది ఎక్కువగా చింతన చేస్తే అదియే ఆ చిత్తమునకు సంప్రాప్తిస్తూ ఉంటోంది.

ఆ జీవటరుద్రుడు ఆత్మసిద్ధిని పొందికూడా కించిత్ శాస్త్ర విరుద్ధమైన లౌకిక వాసన శేషించటం చేత తన గతించిన దేహములందు క్రీడలాగా, లీలాగా మరల పరిభ్రమించాడు.

Page:238

భక్తి సాధనములు, శాస్త్ర అధ్యయనములు నిర్వర్తించే బ్రాహ్మణ దేహమునందు, సామంతరాజ దేహమునందు, అప్సరస, లేడి, తుమ్మెద, ఏనుగు దేహ భావములందు, అట్లాగే తదితర ఉపాధులందు, …ప్రవేశించటం, అప్పటి వాసనలను ప్రదర్శించటం, బయల్వెడటం… మొదలైనవి క్రీడించాడు. జీవట రుద్రుడు: ఆహా! సత్యము వలె భాసించే ఈ సంసారారణ్యంలో అనేక మానసిక సృష్టులలో ప్రవేశించి అనేక దశలను అనుభవించాను. నా యొక్క బ్రహ్మస్వరూపం నుండి చ్యుతుడనై వేలాది సంవత్సరాలు, వందలాది చాతుర్యుగాలు గడిపాను. భిక్షుకుని ఉపాధి ధరించి ఉండగా బ్రహ్మజ్ఞానానికి కొంచెం అర్హత సంపాదించుకున్నాను. మరల, అక్కడి నుండి కూడా సంసారం మీద ఉత్సుకతచే ప్రమాదవశంగా భావనాసముద్ర తరంగాలలో అనేక జన్మపరంపరలు గడిపాను. రాజహంస - మానసిక జగత్తులో ప్రవేశించినప్పుడు భగవంతుడగు బ్రహ్మదేవునితో ఏర్పడిన సత్సాంగత్యం చేత ఆత్మస్వరూప జ్ఞానం వికసించింది కదా! పూర్వాభ్యాసాలన్నీ జ్ఞానయోగంచే ఫలించగా ఇట్లు రుద్రుడ నయ్యాను. జీవటుడుగా అత్యంత దృఢమైన శాస్త్రీయ సాధనాభ్యాసం నిర్వర్తించాను. అయినా కూడా ఒకింత ‘మాయపట్ల అభిలాష’ అను చ్యుతి ఘటిల్లినందుకు ఫలితంగా ఇట్లు అత్యంత వివశములైన, విరసములైన యోనులలో పరిభ్రమించవలసి వచ్చింది. ఏదిఏమైనా కూడా శాస్త్ర ప్రవచితాభ్యాసమే జీవుని యందు విజయముగా మార్గప్రదమౌతుంది. ‘సత్యమేవ జయతే’ అని శాస్త్రకారులు చెప్పియే ఉన్నారు కదా! సత్యము మాత్రమే జీవుని కాపాడగలదు. కాకతాళీయన్యాయం చేత ఈ జీవునకు సాధుజన సంగం లభిస్తోంది. అట్టి సాధుజన సంగం సద్వినియోగ పరచుకున్న జీవుడు దృశ్యాతీతత్వం సాధించగలుగుచున్నాడు. దృశ్యాతీతం యొక్క అభ్యాసబలం చేత వాసనలు జయించబడుచున్నాయి. ఏ అశుభవాసనలైతే ఈ జీవుల అంతరంగంలో దాగి ఉన్నాయో, అవి ప్రయత్నపరుల యందు మాత్రమే క్షీణిస్తున్నాయి. అందుచేత పురుషప్రయత్నమే శ్రేయోదాయకం.

పూర్వ - తత్పూర్వ జన్మలలో ఏదేది నిరంతరంగా అభ్యసించబడుతోందో… అదియే దృష్టికి సత్యముగా తోచటం జరుగుతోంది. శుభచింతనాభ్యాసం వలన అశుభచింతనలు తొలగుతాయి.

ఏదేది జాగ్రత్ - స్వప్నములందు సుదృఢంగా భావిస్తామో అదియే సత్యముగా అనుభూత మవుతోంది. అంతేగాని, ఇందులో మరొకరెవరిదో పాత్ర లేదు. “నన్ను ఎవరో భ్రమింపజేస్తున్నారు” అని అనుకుంటే అది భ్రమ మాత్రమే. తత్త్వ చింతనచేతనే నాకు ఈ పరిశీలనా సామర్థ్యం లభించింది. కల్పితమైన దేవార్చన మొదలైనవే ఫలప్రదాతలగుచుండగా తత్త్వచింతన శుభప్రదం కాకుండా పోతుందా? అయి తీరుతుంది.

నా యొక్క చ్యుతికి కారణమేమిటి? ఆత్మతత్త్వవిచారణను ఏమరచి శాస్త్రములలోని అనాత్మ విభాగపు విషయములకు గ్రుడ్డిగా పరిమితుడనగుట చేతనే. ఫలితంగా, సుఖ - - దుఃఖమిశ్రితములగు ప్రయోజనములచే పరిమితుడనయ్యాను. వాటి వలన అవిచ్ఛిన్నమగు ప్రయోజనం కలుగలేదు.

అసలీ సంసారము యొక్క చింతన - భావనలు కొంచెం ఆశ్రయించినంత మాత్రం చేతనే సుదీర్ఘ ఉపాధిపరంపరా ప్రహసనమంతా వచ్చి పడుతోంది. భావన - చింతన త్యజించటం చేత

Page:239

అనర్థములన్నీ జయించబడుచున్నాయి. భావన - చింతన ఉన్నంత వరకూ దేవతా ఉపాధులు కూడా ఉత్కృష్టతను ప్రసాదించలేవని తేలిపోయింది.

ఎంత ఆశ్చర్యం! తన స్వరూప స్వభావములను ఏమరచిన ఈ జీవుడు ‘ఈ శరీరమే నా స్వభావం’ అని నమ్ముకుని ఉండటం సంభవిస్తోంది. అసత్యభావములను ఆశ్రయించటంచేత ఆత్మ స్వరూపుడగు ఈ జీవుడు తనను తాను అనేక నీచస్థితులకు, తుచ్ఛ ఉపాధులకు దుఃఖ పరంపరలకు మోసుకెళ్ళుచున్నాడు. తత్త్వదృష్టితో చూస్తే… ఉపాధులూ లేవు, జన్మమృత్యువులూ లేవు. ఈ ఉపాధులు, వాటి సంబంధిత వ్యవహారాదులు మధ్యలో వస్తున్నాయి. మధ్యలోనే పోతున్నాయి. భూత - -

భవిష్యత్ - వర్తమానములచే స్పృశించబడనిదేదైనా ఉంటే అది నా స్వస్వరూపమగు ఆత్మ ఒక్కటే. సత్ - చిత్ స్వరూపుడనగు నాకు ఇట్టి అసత్ అగు ఉపాధులతో సంపర్కం కలగటమేమిటి? నేను ఈ దృశ్య జగత్తుతో అనుబంధం కలిగి ఉండటమేమిటి? ఆకాశంలోని నీలపువర్ణం భ్రమమాత్రమే అయినట్లు… జగత్మ అజ్ఞాన కారణంగానే ఉదయిస్తోంది.

కనుక ‘సాధన’ అనేది ఆత్మను పొందటానికి అవసరం లేదు. అనాత్మ విషయములందు అభిలాష తొలగటానికి మాత్రమే సాధన యొక్క అవసరం.

ఈ జగత్తు యొక్క వాస్తవరూపం బ్రహ్మమే. ఇద్దాని అసన్మయసత్త పరబ్రహ్మమునందే అకారణంగా బహుశః వినోదార్థమై ఏర్పడి ఉంటోంది. కనుక ఈ కల్పనలు బ్రహ్మమే స్వరూపముగా గల నన్నేం చేస్తాయి? ఇప్పుడు నేను చూచిన (నిద్రకుపక్రమించినప్పటి ) దేహములన్నీ వినోదార్థమై ఏర్పడి సమ్యక్ జ్ఞానప్రకాశము వలన నా స్వరూపమునందే ఏకీకృతం కాగలవు.

శ్రీవసిష్ఠ మహర్షి: ఈ విధంగా చింతిస్తూ ఆ భిక్షుకుడు “కల్పనారాజ్యము” అనతగిన - తాను నిద్రపొందిన - అనేక ఉపాధులలో మరొకసారి పచార్లు చేసివచ్చి తిరిగి రుద్ర ఉపాధిలో ప్రవేశిం చాడు. అతడు సత్యసంకల్పుడవటం చేత అతని క్రితం 99 జన్మలలోని స్వప్నతుల్య సత్తు ఒక్కసారి అనువృత్తమయింది. అతను జ్ఞానలాభం పొంది ఉండుటచేత తన యొక్క రుద్రత్వం, జీవజటాడి పూర్వదేహములు ఒకేసారి వీక్షించగలిగాడు.

  1. వివిధ ఉపాధుల సమావేశం

శ్రీవసిష్ఠ మహర్షి: ఇప్పుడు ‘రుద్రుడు’ అను ఉపాధి - అనుభవములలో సన్న్యాసి భిక్షువు ఉన్నాడు కదా! అట్టి ఉపాధితో మరల రుద్రలోకమునుండి బయలుదేరాడు. తన యొక్క తాత్వికబలం చేత జీవటుడు ఉన్న బ్రహ్మాండంలో ప్రవేశించాడు. జీవటుడు ఉన్న ప్రదేశం చేరాడు. జీవట భిక్షువును సమాధి నుంచి ఉత్థానపరిచాడు. ఆ ఇద్దరు కలసి త్రాగుబోతును సమీపించారు. జీవట త్రాగుబోతు ఆ సమయంలో సుష్టుగా తేనె, మద్యం త్రాగి నిదురిస్తున్నాడు కదా! రుద్రుడు జీవటభిక్షువు ఆ

Page:240

జీవట త్రాగుబోతును నిదురలేపాడు. ఆ ముగ్గురి చైతన్యం ఒక్కటే అయినప్పటికీ మాయ యొక్క భావావేశం చేత అది ముగ్గురు వ్యక్తులైనట్లుగా ప్రకటన - ప్రవర్తనలు కలిగి ఉన్నది.

భిక్షువు, త్రాగుబోతు, రుద్రుడు - ఒకరితో ఒకరు కొద్దిసేపు సంభాషించుకుని ఇక అక్కడి నుండి బయలుదేరారు. ఆ ముగ్గురూ చిదాకాశమునందు గల మరొక పాంచభౌతిక బ్రహ్మాండంలో ప్రవేశించారు. బ్రాహ్మణ యువకుని సమీపించారు.

ఆ విప్రుడు కూడా జీవటుని మనస్సు యొక్క పరిణామమేకదా! ఆ విప్రుడు ఉన్న ప్రదేశం అనేక ప్రాణుల శబ్దములతో నిండియున్నది. ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఏకశయ్యపై నిదురించి ఉన్నాడు. ఆ విప్రుని భార్య ‘ఈ నా భర్త నా బహిర్ ప్రాణం’ అను భావనతో, నిదురపోతూనే, తన భర్త యొక్క కంఠమును ఆలింగనమొనర్చుకుని ఉన్నది. రుద్ర, జీవట, భిక్షువులు తమ యొక్క చైతన్యత్వమును ఉపయోగించి ఆ విప్రుని ప్రబుద్ధుని చేశారు. అప్పుడా విప్రుడు ముగ్గురినీ చూచి తనను చూచుకొని కించిత్ విస్మయ పరవశుడైనాడు. రుద్రునితో బోధింపబడి, విషయమంతా గ్రహించి ఉద్వేగరహితుడైనాడు.

ఆ తరువాత ఆ రుద్ర - జీవట - ద్రిమ్మర - విప్రులు నలుగురు అక్కడి నుండి బయలుదేరారు. ’చిదాకాశము యొక్క చిత్త వికృతి’ అనతగ్గ మరొక బ్రహ్మాండలో ప్రవేశించారు. అక్కడ గల సామంత రాజు నిద్రించి ఉన్న ద్వీపంలో ప్రవేశించారు. బంగారు ఛాయతో అంతఃపురంలో నిద్రిస్తున్న ఆ సామంతరాజును తమ యొక్క చిత్తచైతన్యం సహాయంతో ప్రబుద్ధుని చేశారు. ఇప్పుడా ఐదుగురు ఐదుగురైనప్పటికీ ఏకభావముననే వెలయుచున్నారు. అదే విధంగా ఆ ఐదుగురు సామ్రాట్టును సమీపించి అతనిని నిదురలేపారు.

అట్లే వారు తమ సూక్ష్మ శరీరంతో తక్కిన ప్రపంచములందు తిరుగుతూ అక్కడక్కడ నిద్రించియున్న తదితర జీవట చైతన్య ఛాయలనన్నిటినీ ప్రబుద్ధం చేశారు. మృతులైన వారిని, నిద్రించే వారిని కూడా మేల్కొలిపారు. వారందరి చిత్తమంతా ’బ్రహ్మహంస’గా పరిణామం పొంది రుద్రభాసమును పొందారు. రుద్రుని చిత్త-చేతనాంశాలు వారి చిత్రాలను చేతనమొనర్చాయి కదా! వారి దేహాలన్నీ జ్ఞానైశ్వర్యంచే ఆశ్రయించబడ్డాయి. వారంతా శతసంఖ్యాక రుద్రులై విరాజిల్లారు.

శ్రీరాముడు : స్వామీ! ‘జీవటుడు’ అనుపేరుగల జీవుడు ఒక్కడే అయిఉండి వంద ఉపాధులు వేరు వేరుగా ఎట్లా కలిగి ఉన్నాడు. ఒకే సమయంలో ఆ వంద ఉపాధులు వేరు వేరుగా ఎట్లా ఉద్బోధ పొందగలిగాయి? ఇది విచిత్రంగా ఉన్నదే!

శ్రీవసిష్ఠ మహర్షి: చైతన్యము అనంత శక్తియుతము. ఈ ‘శతరుద్రీయకథనం’ అనబడే జీవటుని చైతన్యము యొక్క శతాది ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం, ఉపక్రమించి ఆ సమయంలో మరొక ఉపాధిని ఉత్తేజపరచటం… ఇదంతా చైతన్యమునందు సాధ్యమే.

పరమేశ్వరుని ఐశ్వర్యము ఇట్టిదే సుమా! అతడు ఏకమే అయి ఉండి అనేకములందు వివిధ రీతులుగా ప్రతిబింబిస్తున్నాడు. ‘జ్ఞానము’ అనునది ఒక్కటే అయినప్పటికీ అది వివిధ శరీరములందు

Page:241

ఉండి వేరు వేరు జ్ఞేయములను ఆస్వాదిస్తోంది. సూర్యుని ప్రకాశము ఒక్కటే అయినప్పటికీ అందులోంచి బయలుదేరిన వేరువేరు కిరణములు వేరు వేరు వస్తువులపై ప్రసరించి ప్రకాశింపజేస్తున్నాయి. జలం ఒక్కటే అయినా అసంఖ్యాక తరంగాలుగా ప్రకటితమౌతోంది. అగ్ని ‘ఒక్కటే’ అయిఉండికూడా, అనేకచోట్ల వేరువేరు దీపములను వెలిగించుచు వేరువేరు దృశ్యవిషయములపై కాంతిని ప్రసరింపజేస్తోంది కదా! అట్టి "ఏకము నుండి అనేకము” అను చమత్కారం విశదీకరించటానికే మనం ఇక్కడ ఈ శతరుద్రీయం చెప్పుకుంటున్నాం.

మనం చెప్పుకుంటున్న ఆ శతరుద్రీయమూర్తి ఆవరణ శూన్యమగు చిన్మయ స్వరూపమున విరాజిల్లుచున్నాడు. ఆతడు పరిశుద్ధ స్వరూపమును ఆశ్రయించుట ద్వారా ఈ జగత్తులో అంతర్యామి అయ్యాడు. ఈ ప్రాతిభాసిక జగత్తుకు ఆధారుడయ్యాడు. ఓ రామచంద్రా! ఈ విధంగా చిదాకాశంలో వందలకొలది శతరుద్రమూర్తులు వెలయుచున్నారు. నీకు - నాకు ఇప్పుడు ఇక్కడ అనుభూతమయ్యే ఈ వర్తమాన జగత్తు భిక్ష - రుద్రకల్పితమైన జగత్శతములలో పదకొండవది.

శ్రీరాముడు: మహర్షీ! ఆ జీవటుడు ఏ విధంగా వందలకొలది ఉపాధులలో ప్రవేశించాడో అదే విధంగా ప్రతిజీవుడు తన సుదీర్ఘ సంచారంలో అనేక ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం చేస్తున్నాడు కదా! అంటే అతనిలో కూడా జీవటుని లాగానే వివిధ అంతర్గత జీవులు వ్యక్తిగతమైన వివిధ ప్రపంచములను దర్శించటం జరుగుచున్నది కదా! ఆ వివిధ జీవులు అంతర్గత జీవులు ఒకరితో మరొకరు కలవటం ఎప్పుడైనా జరుగగలదా?

శ్రీవసిష్ఠ మహర్షి: సంసార జీవుడు తానున్న దానిలో భ్రాంతిచే బద్దుడై ఉంటున్నాడు. అందుచేత తన స్వరూపాలైన తదితర జీవులను కలియలేకపోతున్నాడు. ఈ జీవుడెప్పుడు జ్ఞానంచే ప్రబుద్ధు డవుతాడో, అప్పుడు “నేను ఇన్ని రూపములుగా ఉంటున్నాను’ అను నూతనానుభవంలో ప్రవేశించ గలడు. ఈ వేరు వేరుగా కనిపించే జీవులన్నీ జ్ఞానియందే ఉంటాయి. వాటన్నిటిలో తానే ఉంటాడు. జ్ఞాని కానంత వరకు అట్టి అనుభవం దుర్లభం. మనం చెప్పుకున్న ఆ భిక్షుకుడు ప్రబుద్ధుడైనాడు. ఎవ్వరిలో తత్త్వజ్ఞానం ఉదయిస్తుందో అట్టివారు ‘సముద్రములోని వేలాది తరంగాలలోని ఒకే జలం’ ..లాగా సర్వజీవులలోని ఏకాకారమును అనునిత్యం వీక్షించగలుగుచున్నారు. ఇక అప్రబుద్ధులైన వారంటావా… వారు ఈ దృశ్యములో గల స్థూల విషయములకు బద్ధులై గ్రహించుచు, ‘ఆత్మ యొక్క ఏకాకృతిని’ గ్రహించలేకపోతున్నారు.

జలం యొక్క ద్రవత్వం చేత ఒక తరంగం, మరొక తరంగంతో పూర్ణంగా కలిసే విధంగా, స్థూలబుద్ధి తొలగుటచే ఇతఃపూర్వపు ఉపాధుల పరస్పర సమ్మేళనం సంభవిస్తోంది. ప్రబుద్ధ జీవులు తమ యొక్క చిన్మాత్రసమైక్యతా స్వభావంచే తదితర జీవులతో పరస్పరత్వం పూర్ణంగా పొందగలుగు చున్నారు.

ఈ ‘సంసృతి’యందు మనకు కనబడుచున్న నానావిధ జీవజాతమంతా నిజానికి కల్పితము, అసత్యం అయి ఉన్నాయి. ఈ జీవులంతా సర్వవ్యాపియగు చితశక్తియందే ఉండి ఉన్నారు. అందుచేత

Page:242

చితశక్తి వలెనే ఇవి కూడా సత్యమువలె తోచుచున్నాయి. ఎప్పుడైతే ఈ జీవుడు సర్వజీవుల తత్త్వమైన ఆ పరబ్రహ్మముతో ఐక్యమొందుతాడో… అప్పుడు, ‘బ్రహ్మము తప్పితే మరింకేమీ లేదు. తదితరంగా అగుపించేదంతా స్వయంకల్పితమైన భ్రమమాత్రమే’ అని గ్రహిస్తాడు. అప్పుడట్టి విజ్ఞానం సముపార్జిం చిన ద్రష్టకు తదితర జీవులతో ఒకానొక అంతర్గతమైన పరస్పర సమ్మేళనం లభిస్తోంది. భూమిని ఎక్కడ త్రవ్వితే అక్కడ సర్వవ్యాపకమగు ఆకాశం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా! స్వయమాత్మానుభవులకు సర్వవైపులా స్వస్వరూపమే తాండవిస్తూ ఉంటుంది.

ఓ రామా! సర్వవ్యాపకము, సత్యము అయినట్టి చైతన్యము యొక్క అభ్యాసబలంచే తత్త్వ దర్శనముచే తదితరమైనదంతా లయిస్తుంది. ఏ మనోబుద్ధి - చిత్త - అహంకారములు నిరోధించాలని జనులు అనుకుంటున్నారో, అదంతా కూడా నిర్మల హృదయులగు సర్వజ్ఞులకు చిన్మాత్రము (లేక) నిర్మల చైతన్యముగానే అనుభవమౌతోంది. అనేక బంతులలో నిండి ఉన్న గాలి ఒకే గాలి కదా! వివిధ నదులలో లభించే జలం వాస్తవానికి జలం దృష్ట్యా ఒక్కటే కదా! వేరు వేరు వస్తువులు వేరు వేరు చోట్ల తగలబడుచుండవచ్చు గాక! ‘అగ్ని’ సర్వదా ఒక్కటే కదా! వివిధ ప్రదేశములలో వివిధ ధర్మములు గల పదార్థజాలం ఉండవచ్చు గాక! కానీ, ఆకాశం ఒక్కటే కదా!

అట్లాగే సర్వభూతములందలి ఆత్మసత్త ఒక్కటే. ఒకే ’ఆత్మసత్తా చైతన్యతత్త్వం’ సర్వత్రా వెలయుచున్నదని అనుభూతమొనర్చుకో.

శిల ఒక్కటే అయినప్పటికీ ఒక శిల్పి అనేక ఆకారాలుగా మలచి చిత్ర విచిత్ర శిల్పాలుగా తయారుచేసి మన ముందు ఉంచుతున్నాడు. మనం వాటినన్నిటినీ చూచి ’ఆహా! గొప్ప కళాకారుడే!’ అని సంతోషిస్తున్నాం. అట్లాగే ఏకైక చిద్రూపమే ఈ విస్తార జగత్తుగా వెలయుచున్నది. శ్రీరాముడు: మహర్షీ! ఈ జగత్తు వస్తుతః ఏమై ఉన్నది?

శ్రీవసిష్ఠ మహర్షి: ’ఇంద్రియాదులకు విషయమే కానట్టి, శుద్ధమైన - - చిదేకరసమైన పరబ్రహ్మమునందు మనస్సుననుసరించి స్ఫురించే విషయరూపమైన అన్యధాజ్ఞానమే జగత్తు’… అనునదే ఈ జగత్తుకు నిర్వచనం. ఈ జగదాకార మనోజడత్వమంతా కారణమంటూ లేనిదే అగుచూ ’ఆకాశము నందు శూన్యము’ అను చమత్కారంలాగా వర్తించుచున్నది. చూచువానిలో కలుగు మిథ్యాజ్ఞానం కాకుండా ఈ జగత్తుకు వేరే కారణమంటూ ఏదీ లేదు.

  1. దృశ్య వృత్తి - దృశ్య నిర్వృత్తి

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఇప్పుడు ఒక పరమ సత్యమును ప్రతిపాదిస్తున్నాను…. విను.

ఈ దృశ్యమును గూర్చిన వృత్తియే బంధము. దృశ్యజ్ఞాననిర్వృత్తియే మోక్షము. అంటే… ‘ఈ దృశ్యములో నేను ఒకానొక వస్తువును గాని, విషయమును గాని కాను. ఈ దృశ్యము నా యందు విషయము కాదు’ అను సర్వ సంబంధాతీతమైన జ్ఞానమునే మోక్షజ్ఞానం అని పిలుస్తున్నారు.

Page:243

  1. ఇవేమి నేను కాదు, 2. ఇదంతా నేనే ఈ రెండిటిలో నీకు ఏది నచ్చితే అద్దానిని శీఘ్రంగా దృఢతరం చేసుకో.

అంతేకాదు… సృష్టి-అసృష్టి, బంధం-మోక్షం, జ్ఞానం - జ్ఞానం యొక్క అభావం… ఇవన్నీ కూడా సాక్షి యొక్క జ్ఞానస్వభావాలు మాత్రమే కనుక అవి సాక్షికి అభిన్నాలే. ద్రష్టను బట్టే దృశ్యాలు ఉంటున్నాయి. ద్రష్ట కంటే అవి వేరుగా ఉన్నాయని ఎవరూ నిరూపించలేరు. ఇది స్పష్టంగా తెలుసుకున్నవాడవై ఆ తరువాత ఇక నీ ఇచ్ఛ వచ్చినట్లు ఈ జగత్తులో సంచరించు.

ఈ జగత్తు అనబడేది చూడనంతమాత్రం చేత లేకుండా పోగలదు. అట్టి దీని గురించి ప్రయాస ఎందుకో చెప్పు? ఈ జగత్తును త్యజించినప్పటికీ ఏ స్వసత్త శేషించియే ఉంటోందో… అది ఎప్పటికీ, ఎల్లస్థానము లందూ లభించియే ఉన్నదని గ్రహించు.

ఈ జగత్తు అనేది దీనిని స్మరించుట చేతనే కనబడుతోంది… స్మరించబడనప్పుడు లేకుండా పోతోంది.

ఈ జగత్తుకు సాక్షియగు నీ స్వస్వరూపుడు అట్టి సంస్మరణ - - విస్మరణలకు కర్త అయి కర్తృత్వ - అకర్తృత్వ స్వభావుడై ఉన్నాడు. అతడు జగత్తు ఉన్నప్పుడూ ఉన్నాడు. జగత్తు లేనప్పుడూ ఉన్నాడు. అతనిని స్పష్టీకరించుకున్నవాడవై ఆ తరువాత ఈ జగత్తునందు నీ ఇష్టమైనదానిని ఆశ్రయించు.

తరంగము నీటి యొక్క స్పందమే కదా! ఈ జగత్తు కూడా నీ స్వస్వరూపమగు ‘చిత్తు’ యొక్క హృదయ స్పందన మాత్రమే. స్వస్వరూపభావము నుండి ఏర్పడిన కించిత్ ’చ్యుతి’ మాత్రమే! జల - - తరంగములకు గల భేదమే బ్రహ్మము - జగత్తులకు ఉన్నది.

అనగా, ఏమిటి?… ఈ జగత్తుకు, బ్రహ్మమునకు సత్యదృష్టిలో అసలు భేదమే ఉండి ఉండలేదు. నీటియందు మొట్టమొదట ‘తరంగములు’ అనేవి లేవు. ఆ తరువాత కూడా లేవు. చూచువాడు నీటి యొక్క చలనవ్యవస్థకు ‘తరంగములు’ అను పేరు పెట్టి పిలుచుచున్నాడు. ’తరంగములన్నీ జలం మాత్రమే’… అను విషయం మరచుచున్నాడు. అలాగే, బ్రహ్మమునందు మొట్టమొదట ఈ జగత్తు లేదు. ఇప్పుడూ లేదు. తరువాత కూడా లేదు. కానీ అజ్ఞానదృష్టి కలిగియున్న వాడు మాత్రం తన యొక్క ఆరోపణ దృష్టి చే ఈ కార్యభూతమగు జగత్తును పరిగణించుచున్నాడు. కనుక ఈ జగత్తు ‘వేదన’ వలన లభిస్తోందని, ‘వేదనాక్షయం’ చేత ఇక్కడేమీ లేదని తత్ప్రయత్నపరులు ఎరిగియే ఉన్నారు. ఈ సభలోని అనేకమంది విజ్ఞులు ఈ విషయం తెలుసుకొనియే ఉన్నారు.

కాబట్టి "స్వయం ప్రకాశ ఆత్మరూపము - చైతన్యమాత్రము అగు బ్రహ్మమే అవిద్యావరణము స్వస్వరూపమును ఏమరచి జగత్తు స్వరూపంగా కల్పించుకొనుచున్నది”… అనునదే ఇక్కడ సిద్దాంతము. ‘చిత్’ రూపమగు పరమాత్మయొక్క పారమార్థిక స్వరూపం జ్ఞానమయమేగాని, జడం కాదు. ఇక ఈ జగత్తు అంటావా?… ఇదంతా ద్రష్ట యొక్క భేదభావము వలన కల్పించబడినది మాత్రమే!

Page:244

ఓ రామచంద్రా! అట్టి భేదభావమును శ్రుతులు చెప్పుచున్న ఉపాయములను అనుసరించి క్రమక్రమంగా ఉపసంహరించుకో. అప్పుడు ’ఈ జగత్తు కేవలం నామమాత్రం’… అని గ్రహించ గలవు. అట్టి నామమాత్రమైనది కూడా బ్రహ్మమున లేదు. అది సర్వదా ప్రశాంతము, శివస్వరూపము, నిష్కళంకము అయి ఉన్నదని గ్రహించు.

ఈ జగత్తంతా సర్వదా ఆత్మచైతన్యమే ఉన్నది. ’జగత్తు యొక్క శబ్ద - అర్థములు బ్రహ్మము కంటే వేరైనదేదో కాదు’… అని మరొక్కసారి ప్రకటిస్తున్నాను. జగత్తు - బ్రహ్మము అనబడే రెండు వస్తువులు ఏనాడూ లేవు. తరంగ జలము లనబడే రెండు వస్తువులు ఏనాడైనా ఉన్నాయా? శ్రీరాముడు: అవట్లా జీవునకు ఎందుకు స్ఫురిస్తున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి: చెప్పాను కదా! కేవలం అజ్ఞానమే అందుకు కారణం. అజ్ఞానమనేది సత్యమును పరిశీలించక పోవటం చేతనే కలుగుతోంది. పరిశీలించక పోవటమనేది ప్రయత్నలోపం వలన, విషయములందు చిక్కిన మనస్సు ప్రబుద్ధం కాకపోవటం చేత సంభవిస్తోంది. అజ్ఞానావస్థలో కనిపించే ద్వైతము జ్ఞానము వికసించగానే తొలగిపోవుచుండగా… ఇక జగత్ - బ్రహ్మములకు ద్వైతము ఎట్లా ఆపాదించగలవు చెప్పు? కాబట్టి జగద్భమ తొలగటం, సంసారమును దాటటం, మోక్షమును పొందటం… ఇవన్నీ శిష్యునిలో సత్యదృష్టిని నిదురలేవటానికే చెప్పుచున్నాం. అంతేగాని, అవన్నీ వాస్తవానికి అసంగతములే.

  1. గణపతిత్వం

శ్రీరాముడు: మునీశ్వరా! మనం జీవట భిక్షుకుని స్వప్నోపాధుల గురించి ప్రస్తావించుకుంటున్నాం కదా! ఆతని జీవట - భిక్షు - బ్రాహ్మణ - హంసాది శరీరములకు ఆ తరువాత ఏమి సంభవించింది? శ్రీవసిష్ఠ మహర్షి: రుద్రుని ప్రేరేపణచే నిదురలేచిన జీవట-భిక్షు బ్రాహ్మణ-హంసాదులు రుద్రుని అనుసరించారు కదా! వారంతా పరస్పరములకు సంబంధించిన భూత భవిష్యత్ వర్తమాన వ్యాపారములను వీక్షించి కృతకృత్యులైనారు. నిర్వేదనచే సుఖవంతులైనారు.

అప్పుడు రుద్రుడు ‘నేను కొంతసేపు నిదురించెదను గాక!’ అనుకున్నాడు. స్వాంశసంభూతులగు ఆ జీవటుడు, బ్రాహ్మణ యువకుడు, సామంతరాజు మొదలైనవారిని చూచి ఇట్లు ఆజ్ఞాపించాడు. శ్రీరుద్రుడు: ఓ జీవటాదులారా! మీరు మీమీ తావులకు వెళ్ళండి. అక్కడి మీ భార్య - పుత్రాది సహజీవులతో కొంతకాలం ఉండండి. మీ భోగవాసనలు తృప్తి పొందిన తరువాత తిరిగి నా దగ్గిరకు రండి. ఆ తరువాత మీరంతా నా అంశమున రుద్రనగరంలో రుద్రగణరూపాన్ని ధరించెదరు గాక! మహాప్రళయంలో ఈ జగత్తంతా క్షయం కాగానే మనమంతా కలిసి పరమపదమున ప్రవేశిద్దాం.

HH

Page:245

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! భగవంతుడగు రుద్రుడు వారందరినీ అట్లు ఆజ్ఞాపించి అంతర్ధాన మైనాడు. ఇక వారంతా అంతరమున రుద్రగణములుగా వెలయుచు, బాహ్యమునమాత్రం సంసార దర్శనమును చేయు సాక్షి రూపమును ధరించారు. తమ తమ సంసారములలో ప్రవేశించారు. అక్కడక్కడ గాఢనిద్రలో ఉన్న భౌతిక ఉపాధులను నిదురలేపారు. మరల యథాతథంగా ‘భార్య ఆహారము - రాజ్యము - అను బంధములు’ మొదలైన అనేక విషయములతో కూడిన సంసారమును అనుభవించసాగారు. ఇదీ, ఇప్పటి పరిస్థితి. వారంతా మరికొంతకాలం భోగములను అనుభవించ గలరు. ఆ తరువాత తమ శరీరానంతరం రుద్రలోకం పొందగలరు. ప్రమథగణంలో చేరి రుద్రభక్తులకు సుఖ-శాంతి-ఐశ్వర్యములు కలిగిస్తూ కొన్నాళ్ళు గణత్వము పొందుతారు. ఆకాశంలో దర్శనమిచ్చే నక్షత్ర మండలంలాగా వారు అప్పుడప్పుడూ లోకంలో అక్కడక్కడా భౌతిక రూపమున వెలయుచూ లోక కళ్యాణకారకులై జనులకు సాధన రూపంగా ప్రాప్తించగలరు.

  1. సంకల్పిత దేహములు

శ్రీరాముడు: హే గురువర్యా! తమరు చెప్పిన జీవటరుద్రుని కథనం నాకు చాలా ఆశ్చర్యం గొలుపు తోంది. నాకు కొన్ని సందేహాలు కూడా కలుగుచున్నాయి. జీవట - బ్రాహ్మణ -— సామంతరాజాదులన్నీ ఆ భిక్షుకుని నిద్రకుపక్రమించినప్పటి స్వప్నతుల్యమైన సంకల్ప రూపములే కదా! అట్టి సంకల్ప రూపములు సత్యమై ఎట్లా భాసించాయి? సంకల్పము భౌతికంగా ఏర్పడటం, ఆయా బ్రహ్మాండముల లోని సంసారంలో తదితర జీవులతో సంయోగాదులు ఎలా ఒనగూడాయి?

శ్రీవసిష్ఠ మహర్షి: సర్వమునూ సర్వదా ఆక్రమించి ఉన్న (అధిష్ఠానమగు) చిత్ అంశము నందు ఈ భౌతిక-మానసిక జగత్తులు సత్యంవలె భాసిస్తున్నాయి. ఆద్యంత విద్వత్ దృష్టిచే చూస్తే ఈ సత్-అసత్ యుక్తములగు సంకల్పవిషయములకు స్వయంగా అస్థిత్వం లేదు. వాటికి అస్థిత్వం ఉన్నట్లు తోచటానికి కారణం ఏమిటంటావా? అవన్నీ దేనిపై ఆరోపించబడుచున్నాయో… అది నిత్యసత్యమగు బ్రహ్మం అగుట చేతనే!

ఆ సర్వము ఆత్మయే - అయితే జీవుల భోగదృష్టిని అనుసరించి ఈ సంకల్పిత విషయాలు క్రియాసామర్థ్యముతో అగుపడుచున్నాయి. ఈ సంకల్ప మాత్ర విషయములను నీవు వివేక బలంతో పరిత్యజించవలసి ఉన్నదని గ్రహించు.

స్వప్నంలో కనబడేవన్నీ కేవలం మానసిక సంకల్ప తరంగములు మాత్రమే కదా! సర్వకాలము లందూ అధిష్ఠానుభూతము అగు సత్చిత్ స్వరూపం స్వతఃగా స్వచ్ఛమై ఉండికూడా… ఈ దేశ - దేశాంతర ఆగమన - - నిష్క్రమణాది క్రియా వ్యవహారాలన్నీ తోపింపజేస్తోంది. అయితే అట్టి ఆరోపిత సమయంలో కూడా అయ్యది అధిష్ఠానముగానే వెలయుచున్నది సుమా! ’దేశము - దేశాంతరము’ అనబడేవి 1. ఇంద్రియపాటవము, 2. కాలము, 3. మార్గాణ్వేషి అనే మూడు ఒనగూడినప్పుడు మాత్రమే సంభవిస్తాయి కదా! అలాగే చిత్వస్తువు లేకపోతే స్వప్న - జాగ్రత్ సుషుప్తులు సంభవించవు.

Page:246

శ్రీరాముడు: ఓ మహర్షీ! ముక్కుకు సూటిగా అడుగుచున్నాను. ఈ దృశ్యరూపంగా పరిణమించేదంతా ఎట్లు, ఏ ప్రభావం చేత పరిఢవిల్లుతోంది?

శ్రీవసిష్ఠ మహర్షి: బ్రహ్మం సర్వాత్మకమైనది. తత్కారణంగా బ్రహ్మమే స్వరూపంగా గల ఈ అనుభవ స్వరూపుడగు జీవుని సంకల్పములను అనుసరించి పూర్వవాసనానుగతంగా ‘చిత్తము’ అనబడేది రూపుదిద్దుకుంటోంది. అట్టి చిత్తమునకు ఏదేది ఎప్పుడెప్పుడు పర్యాలోచితం అవుతుందో… అప్పుడప్పుడు అదంతా దృశ్యరూపముగా పొందబడుతోంది.

శ్రీరాముడు: ఒకడు ఏది సంకల్పిస్తే అది అట్లే దృశ్యరూపంగా పరిణమించగలదని మీ ఉద్దేశమా? శ్రీవసిష్ఠ మహర్షి: అవును. సంకల్పము ననుసరించే దృశ్యము ఉంటోంది, ఉండగలదు.

శ్రీరాముడు: అయితే, ఒకడు ‘ఇది ఇట్లు ఉండుగాక’ అని సంకల్పించాడనుకోండి. ఉదాహరణకు ఒకడు ఒక కొండను చూచి ‘ఇది పిండి అగు గాక’ అని సంకల్పించినంత మాత్రంచేత అది పిండి అయిపోవటంలేదు కదా?

శ్రీవసిష్ఠ మహర్షి: ఎంత సంకల్పించినప్పటికీ అనేకులకు భౌతికమైన విషయములు సంకల్పానుసారం పరిణమించటం లేదు. ఉత్తమమైన అభ్యాసయోగం లేకపోతే పదార్థజాలం సంకల్పానుసారం ఉనికిని పొందజాలదు. యోగ, విజ్ఞానదృష్టి పొందినవారు సర్వత్రా తమ యొక్క సంకల్పానుగతంగా పదార్థాలను నిర్దేశించగలుగుచున్నారు. అదియే ‘యోగబలం’ అని పిలువబడుతోంది. యోగబలం అనేది ఏకాగ్రత యొక్క సాధనానంతర ప్రయోజనమేనని గ్రహించు. ఏకాగ్రత యొక్క సాధనబలం లేకపోతే ఎవ్వరికైనాసరే, సంకల్పసిద్ధి’ అనే ఫలం లభించదు.

అభినివేశము + ధ్యాస —-> చిత్తము.

అట్టి ఈ చిత్తము ఉద్వేగసహితమైన ఒక విషయాన్ని సంస్మరణ పూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఇంతలోనే అతిత్వరలో ఆ విషయాన్ని వదలి మరొక విషయాన్ని స్మరిస్తోంది. ఈ విధంగా అది అనుక్షణం ఉభయభ్రష్టుత్వం పొందుతోంది. చిత్తము యొక్క చాంచల్యం కారణంగా సంకల్పములు బలహీనమై సిద్ధిని కలుగజేయలేక పోతున్నాయి. ఏకనిష్ఠుడగువాని కార్యములు నెరవేరటం లోకవిదితమే కదా! దక్షిణ దిక్కుగా ప్రయాణించేవారు పడమర దిక్కునగల గ్రామములు చేరజాలనట్లు సంకల్పార్ధనిష్ఠులు మాత్రమే సంకల్పిత విషయాలు పొందగలుగుచున్నారు. సంకల్పము యొక్క ఏకాగ్రత - ప్రయోజనం గురించి ఇదివరకే అనేక విషయాలు ప్రస్తావించుకున్నాం కదా!

జనులు ఎట్టెదుటగా ఉన్న విషయములందు మాత్రమే బుద్ధిని నిలిపి, అంతవరకు మాత్రమే పరిమితమైన వివేచననే గ్రహిస్తున్నారు. వారు సంకల్పిత వస్తువును పొందగోరికూడా ఏకనిష్ఠులు కాకపోవటం చేత, ఏకాగ్రత పొందలేకపోతున్నారు. వారు వాస్తవానికి సంకల్పిత వాంఛితములను గాని, ఎదురుగానున్న వస్తువులనుగాని అసంపూర్ణంగా మాత్రమే పొందటం జరుగుతోంది.

అయితే ఆ భిక్షువు ఏకనిష్ఠుడవటం చేత రుద్రత్వం, సర్వాత్మకత్వం, రుద్ర సంబంధమైన సర్వజ్ఞత్వం పొందగలిగాడు. ఏకాగ్రత యొక్క ప్రయోజనంగానే అతనికి ‘స్థితి’ అనే పరమోన్నత అనుభవం కలిగింది. ఏకాగ్రతే లేకపోతే అనేక మందిలాగానే అతనికీ భావించినది లభించేది

Page:247

కాదు. అంతరాళ వాసులగు జీవటుడు - బ్రాహ్మణుడు సామంతరాజు - చక్రవర్తి మొదలైన

వారు ఆ భిక్షుకుని సంకల్పఫలములగు జీవులే అయినప్పటికీ వారందరు వేరు వేరు లోకములలో ఉన్నప్పుడు ఒకరి గురించిన అనుభవం మరొకరికి కలుగుటలేదు. రుద్ర చైతన్యం యొక్క సమావేశేచ్ఛ వలననే ఆ వివిధ ఉపాధుల ప్రజ్ఞలు ఒకటితో మరొకటి ఒకచోట సమావేశమైనాయి.

శ్రీరాముడు: చైతన్యము దృష్ట్యా భిక్షుకుని మొదలు రుద్రుని వరకు ఒక్కటే అయి ఉన్నది కదా!

ఒకరికి మరొకరు తెలిసి ఉండకపోవటం ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి: మాయ యొక్క వైచిత్ర్యం ఏమని చెప్పమంటావ్? ఈ జీవునికి ఈ ఉపాధికి ముందు విషయాలతో సంబంధమే ఉండటం లేదు కదా! నీవు ఒక స్వప్నాన్ని గాంచుచున్నావనుకో… అప్పుడు జాగ్రత్కు సంబంధించిన విషయముతో గాని, క్రితం రోజు స్వప్నాలతోగాని సంబంధం ఉంటోందా? లేదు. అట్లాగే ఇది కూడా!

ఆ పరమాత్మ యొక్క సంకల్పబలం చేతనే ఈ జీవసృష్టులు, వీటిలో భేదాజ్ఞానయుతులు అప్రబుద్ధులగు జీవులు… మొదలైన వారంతా ఉత్పన్నమవటం జరుగుతోంది. అట్టి ఏక - - అనేక శక్తి యొక్క ప్రకటన చేతనే రుద్రుడు - భిక్షువు మొదలైన వివిధ రూపములు ఏర్పడ్డాయి. అవన్నీ ‘సంకల్పము, నిష్ఠ, ధ్యానము’ అను త్రివిధత్వము యొక్క చమత్కారమేనని గ్రహించు.

ఈ కనబడు జీవులంతా భిక్షుకుని స్పప్నసదృశ వివిధ జీవుల వంటివారే సుమా! ఈ జీవుడు తన ధ్యానచింతాబలమును అనుసరించి ఏకత్వం, బహుత్వం, విజ్ఞత్వం, మూర్ఖత్వం, పాండిత్యం, నరత్వం, దేవత్వం మొదలైనవన్నీ పొందుచున్నాడు. ఆ వివిధ పరస్పర వ్యతిరిక్త ధ్యానములను… ఒక్కసారి అనేక ధ్యానములను, అనేకసార్లు ఒక్కొక్క ధ్యానమును పొందటం జరుగుతోంది.

ధ్యానమును బట్టి నైజము ఉంటోంది. నైజము (స్వభావము)ను బట్టి ఉపాధులు ఉంటున్నాయి. పరిమిత - అపరిమిత నైజముల నుండి భావనలు, భావనల నుండి నైజము ఏర్పడుచున్నాయి. అయితే ఈ జీవుడు పారమార్థికంగా బ్రహ్మ స్వరూపుడే.

బ్రహ్మస్వరూపుడగు ఈ జీవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు కూడా అయి ఉన్నాడు. అట్లయి కూడా ఒకే శరీరమున అభిమానము వహించి ఉన్నప్పుడు ఒక్క శరీరవ్యవహారమునకు మాత్రమే పరిమితుడై ఉంటున్నాడు. ఆతడు స్వతహాగా అపరిచ్ఛిన్నుడై ఉండటం చేత ఒక్కసారే అనేక శరీరములను ఆశ్రయించ గల అంతర్గతశక్తి ఉన్నవాడేనని యోగులు ఎరిగియే ఉన్నారు. అనేక శరీరములను ఆశ్రయించినప్పుడు ఆ వివిధ వ్యవహారములు ఒక్కసారే నిర్వర్తించగల ‘చితశక్తి’ ప్రతీజీవుని యందు దాగియే ఉన్నది సుమా! అట్టి అనేక శరీరముల ప్రకటనను అవతార పురుషులలోను, మహాయోగులగు లోకగురువులందు, మంత్రతంత్ర సమన్వితులగు రావణాది కొందరు అసురులందు కూడా మనం గాంచుచూనే ఉన్నాం.

ప్రాణుల యొక్క కర్మలను అనుసరించే సర్వేశ్వరునియందు ఈ పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉపాధులు, ‘భూ-స్వర్గ-నరక-పాతాళాది లోకాలు’ అనబడే ఈ సృష్టి అంతా వికసిస్తోంది. వాస్తవానికి

Page:248

పరమేశ్వరుని యందు ఈ హింసాజనిత వైషమ్యాలుగానీ, కష్టసుఖాలు, సుఖదుఃఖాలు’ మొదలైనవి గానీ లేవు. జీవులు ఏది కోరుకుంటున్నారో… అదే చిదాత్మయందు స్పందించి స్వయంగా సుసంపన్నం అవుతున్నది. స్వయంగా ఆపాదించుకున్న దేశ కాల-క్రియా క్రమాలను ఈ జీవులు మోహం జోడించుకొని పొందుచున్నారు. ఇక్కడ ‘ఏకాగ్రత - అనేకాగ్రత’ అనే రెండు దృష్టులు పోటీపడి, జీవుని అభిలాష, అభ్యాసము, శ్రద్ధ, అవగాహలను అనుసరించి ఒకటి రెండవదానిని ఆక్రమించివేసి ఉండటం జరుగుతోంది. ఏకము, అనేకము మొదలైన అనుభవములన్నీ కూడా జీవుని నుండే బయలుదేరుచున్నాయి.

"ఈ దృశ్యమునకు వేరె, కేవల సాక్షియై, భావ నియామకుడనై ఉన్నాను… అను రూపంగా ఉండే భావౌన్నత్యమును సాధించిన యోగులు తమ ఇచ్ఛానుసారం శరీరములను ధరించగలుగు చున్నారు. యోగౌన్నత్యము లేని జీవులు కర్మల - ఇచ్ఛ - ఉద్వేగములననుసరించి ప్రవాహపతితులై, అస్వతంత్రులై విధివశంగా ఉపాధులను పొందుచున్నారు. సాధన, జ్ఞానములను అనుసరించే జీవునిలో యోగశక్తి రూపుదిద్దుకుంటోంది.

యోగశక్తి యొక్క పాటవమును అనుసరించి యోగి - యోగినులు తమ గృహమునందుగాని, వేరువేరు చోట్లగాని, వేరు వేరు లోకములందుగాని ఒకేసారి ఒకటి - రెండు - - అనేక దేహములను ధరించు శక్తి కలిగి ఉంటున్నారు. అదంతా ధ్యాన - ధారణాఫలితంగా సుసాధ్యమేనని గ్రహించు. అలాగే మరికొందరు యోగులు నిగ్రహ-అనుగ్రహ సమర్థములగు అధికార దేహాలను ధరించి ధర్మ, శాస్త్ర, విధాన సంరక్షణములు నిర్వర్తిస్తున్నారు. ఇంకా కొందరు యోగులు ప్రారబ్ధమును త్వరితంగా పూర్తి చేయటానికి ఇహ పరలోకములలో విభిన్న దేహములను అనుభవించటం కూడా ప్రసిద్ధమే.

ఇక మరికొందరు యోగులు ఉన్న చోట ఉండియే జగత్తులో అనేక చోట్ల అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి తన గృహంలో ఉంటూనే జగత్తులోని అనేక మూలల గల తదితర రాజులను గడగడలాడిస్తూ శాసిస్తూ ఉండేవాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. విష్ణుభగవానుడు లక్ష్మీసమేతుడై క్షీరసాగరంలో ఉండియే, ఇట్లు ఈ పృథివిపై ధర్మరక్షణార్థం అనేకసార్లు అనేక భూచర జలచర అవతారాలు ఎత్తుతున్నాడు. అట్లాగే యోగినులు సువర్లోకంలో యోగిణీగణం మధ్యలో ఉంటూనే ఈ భూలోకంలో అనేకచోట్ల తమకు సమర్పించబడుచున్న బలులను గ్రహిస్తున్నారు. ఇంద్రుడు స్వర్గ సింహాసనమున ఉండి అదే తరుణంలో భూలోకంలోని యజ్ఞశాలలో యజ్ఞభోక్తగా సాక్షాత్కారమౌతున్నాడు. శ్రీమన్నారాయణ అవతారమగు ‘శ్రీరామచంద్రుడు’ అను ఆరాధ్య స్వరూపుడవగు నీవు ఈ అవతారంలోనే ఒకానొక సందర్భంలో 14,000 రూపములు ధరించి 14,000 మంది రాక్షసులతో ఒకేసారి పోరాడి సంహరించి మరుక్షణం మరల ఒకే రూపం పొందటం చేస్తావు. ఈ మానవ రూపంతో అనేకమంది భక్తులకు ఆరాధ్యదైవమై యుగ-యుగాంతరములందు రామభక్తుల ప్రణామాలు స్వీకరించి వారిని అనుగ్రహిస్తూ ఉంటావు. శ్రీరామావతారమగు ఆ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి దుర్యోధనుని

Page:249

సభలోను, యుద్ధరంగంలో అర్జునుని విషాదం పోగొట్టి అనుగ్రహించటానికి శతసహస్ర విశ్వరూపధారి అయి భక్తులకు ప్రత్యక్షమౌతాడు. మళ్ళీ తన విశ్వరూపాన్ని ఉపసంహరించి మానుషరూపం ప్రకటించి, ఆ తరువాత అనంతకాలం ఆశ్రితవాత్సల్యంతో భక్తులముందు మానవరూపంలో ప్రత్యక్షమై ఉండగలడు.

‘నిమి’ అనే పేరు గల ఒక రాజర్షి విదేహముక్తిని సంపాదించాడు. అట్టి విదేహముక్తి సమన్వితుడై సమస్త దేహాల నేత్రాలతో దర్శన ప్రక్రియారూపంతో వసించుచున్నాడు. ఒకే సమయంలో ఈ భూత-భవిష్యత్-వర్తమాన దేహాల కళ్ళలో ప్రవేశించి ఉంటున్నాడు. భగవంతుడు సర్వదా ఒక్కడే అయినప్పటికీ అసంఖ్యాక అవతారాలతో ఆయా భక్తుల ముందు ప్రత్యక్షమగుచున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణభగవానుడు పదహారువేల రూపములు ధరించి పదహారు వేలమంది గోపికలతో ఒకేసారి క్రీడించగలడు.

ఇట్టి చమత్కారమును అనుసరించే ఆ భిక్షువు జీవటుడు, రాజు, చక్రవర్తి మొదలైన అనేక ఉపాధులను వేరు వేరు జగత్తులలో దాల్చాడు. రుద్రశక్తిచే ఉపాధులను ఒకచోట సమాయత్తపరచాడు కూడా. మరల ఆ ఉపాధులు తమతమ లోకములలో ప్రవర్తించేటట్లు సంకల్పించాడు. వారందరూ తిరిగి రుద్రుని చేరగలరు. వారంతా భూ - - స్వర్గ - - బ్రహ్మ - - - విష్ణు - మహేశ్వర లోకములలో పూజార్హులు కాబోవుచున్నారు కూడా!

  1. మోహవశాత్తుగా సుదీర్ఘ పయనం

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఆ భిక్షుకుడు ఒకచోట ఆసీనుడై కొంచెం చింతన చేసి తనయందుతానే తన పూర్వ ప్రారబ్ధమును వేరువేరుగా ఆయా… ఉపాధుల రూపంలో వేరువేరు దేశ-కాలములలో గాంచటం జరుగుతోంది. వాస్తవానికి “అతనికి అనుభవయ్యేది ఆతడు” ఈ రెండూ… కూడా ఆత్మయే కాక మరింకేదీ కాదు.

ఈ జీవులందరి విషయం కూడా ఇట్టిదేనని గ్రహించు. మరణ కాలమున సారభూతమైన స్వకర్మయే ఉత్తరోత్తర జన్మలకు కారణమగుచున్నది. స్వప్నసదృశమైన ఇట్టి జన్మపరంపరలు మోక్షస్థితివరకు భాసిస్తూనే ఉంటాయి. అయినా కూడా ఇదంతా చిదాకాశముకంటే వేరే మరొకటేదీ కాదు. ఆత్మయే ఈ సంసార విభాగములన్నీ తననుండి వేరు చేసుకుని “అనుభవము” అను పరిజ్ఞానం ద్వారా తనయందే ఇదంతా పొందుతోంది. ఇక ఈ వర్తమాన జన్మ విషయానికి వస్తే ఇది ఇతఃపూర్వము మృతించిన జీవుడు పొందుచున్న మరొక స్వప్నం అనికూడా అనవచ్చు. ఓ రఘురామా! ఈ విధంగా స్వతఃగా అపరిచ్ఛిన్నుడగు ఈ జీవుడు పరిచ్ఛిన్నుడై దేహాదులను ఎట్లు పొందుచున్నాడో తెలియజేయటమే ఈ భిక్షుకోపాఖ్యానం యొక్క ఉద్దేశం. ఆ భిక్షుకుడే కాదు ఆత్మ నుండి విచ్యుతులైనట్టి ఈ జీవులందరూ కూడా పైనచెప్పిన విధంగా ఒక మోహమునుండి మరొక మోహం పొందుచున్నారు. ఇదంతా కూడా ప్రతిరోజూ ఒకడు ఒక స్వప్నంలో ప్రవేశించి, ఆ తరువాత ఆ మరునాడు మరొక స్వప్నంలో ప్రవేశించటం వంటిదేనని గ్రహించు.

Page:250

పర్వతాగ్ర పరిభ్రష్టోహ్యధో అధ ఉపలోయధా ॥ పరమాత్మ పరిభ్రష్టో జీవః స్వప్నమిమందృఢమ్ ||

పర్వతశిఖరం పైనున్న ఒక శిల విభాగం క్రిందకు జారి అధఃపతనం అవుతూ ఎక్కడో లోయ లోకి పడిపోతోంది చూచావా? పరమాత్మ నుంచి చ్యుతి పొందిన ఈ జీవుడు ‘దేహపరంపరలు’ అనే అధఃపతనాన్ని గాంచుచున్నాడు. తన అభ్యంతరమున ఉన్న మాయ వలన శైథిల్యం పొంది ‘నేనీ అల్ప శరీరాన్ని’ అని భ్రమిస్తున్నాడు. “దేహాల రాక పోకలకు ఆవల అప్రమేయమై వెలుగొందే ఆత్మయే నా స్వరూపం"… అను ఆస్వాదన పెంపొందనంత వరకు ఈ ప్రయాణం ఇట్లే కొనసాగుతోంది. అతనెప్పుడో యథార్థం తెలుసుకుని, అప్పుడు తక్షణం ఈ శరీరములతో భ్రమచే ఏర్పడే సంబంధములను గుర్తెరిగి ఆత్మ యొక్క అనుభవమును పొందగలడు.

శ్రీరాముడు: ఆహా! మునీంద్రా! ఈ జీవుని పట్ల ‘విషయము’ అనే మోహం ఎన్నెన్ని చిత్రములకు దారి తీస్తోంది! ఈ జీవుడు తానెవరో తన నిజస్వరూపము ఏమిటో గ్రహించకుండా, ఈ విషయ స్వప్నమునందు నిదురిస్తున్నాడు కదా! నానావికారములతో కూడిన తన మనస్సుచే ‘మిథ్యాజ్ఞానం’ అనే రాత్రియందు సకల భేదదృష్టులతో కూడిన ఈ దృశ్య సమూహములను తనయందు తానే పొందుచున్నాడు. ఇట్టి మాయా జగత్తునందు అన్నియూ సంభవమేనని నేను ఒప్పుకుంటున్నాను. మీరు సంభవయోగ్యమేనని చెప్పినది తప్పక అనుభవసిద్ధమే.

ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న - మీరు చెప్పిన మహాత్ముడగు ఆ భిక్షుకుడు నిజంగా ఉన్నాడా? లేక మా మీద దయతో బోధ కొరకు ‘భిక్షుకుడు’ అనువాని గురించి, ఆతని ఉపాధి పరంపరల గురించి కల్పించి చెప్పారా? ఈ విషయం తెలియజేయవలసినదిగా నా విన్నపం.

శ్రీవసిష్ఠ మహర్షి: ఇప్పుడు నేను చెప్పిన భిక్షుకుని వృత్తాంతమంతా నేను భౌతికంగా చూచి చెప్పినది కాదు. అదంతా నా అంతర్దృష్టిచే ఈ బోధరూపంగా ఈ సందర్భంలో స్ఫురించింది. అయినా కూడా “అది యాదృచ్ఛికం, అయథార్థం కాజాలదు” అని అనుకుంటున్నాను. నా దివ్యదృష్టి యొక్క బలంతోనే కదా, నేనిదంతా చెప్పుచున్నది!

నీవిప్పుడు అడిగావు కనుక నేను ఈ రోజు రాత్రి సమాధిని అవలంబించి ఈ ముల్లోకాలు సంచరించి వస్తాను. ఆ భిక్షుకుడు నిజంగా ఉన్నదీ, లేనిదీ నీకు రేపు ఉదయం బోధలో వివరిస్తాను.

రాజులు, పౌరులు, తదిర సభికులు శ్రీ వసిష్ఠమహర్షిని సమీపించి ఆయనకు పాదాభి వందనములు సమర్పించారు. సభికులంతా ఆహా! మేము ఈ జన్మ - మృత్యువుల మధ్య పరిమితులమై ఉన్నామని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. మమ్ములను రోదింపజేయుచున్న ఈ మాయ కేవలం స్వకీయమైనదే కదా! ఇంతకీ ఆ భిక్షుకుడు వసిష్ఠ మహర్షికి తారసపడతాడా? ఏమో? రేపు ఆయన ప్రవచించే విశేషాలు వినవలసిందే! అని చెప్పుకుంటూ గృహోన్ముఖులయ్యారు

(పదహారవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:251

పదిహేడవ రోజు

  1. సూక్ష్మదేహంతో అన్వేషణ

శ్రీవాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! వింటున్నావుగా! మరునాడు 17వ రోజు సభ పునః ప్రారంభమైంది. ఆకాశంలో నక్షత్రాల లాగా శ్రీరామలక్ష్మణాదులతో, తదితర మహనీయులతో ఆ అయోధ్యలోని సభ ప్రకాశకాంతులు విరజిమ్ముచున్నది. సభికులంతా వసిష్ఠ మహర్షి కనుగొనినదేమిటో వినాలని ఉత్సాహపడుచున్నారు. దయాశాలురగు సాధుపుంగవులు ఈ సంసారజనుల పాట్లు చూచి, వారికి బలవంతంగానైనా సరే బోధ చేస్తూనే ఉంటారు. అట్లాగే శ్రీ వసిష్ఠ మహర్షి ఎవరి ప్రశ్నకై వేచి ఉండకుండానే ఇట్లు బోధ కొనసాగించారు.

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ సభికులారా! నిన్నటి రోజు చిట్టచివర ఈ రామచంద్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో జరిగిపోయిన రాత్రి నేను సమాధిని ఆశ్రయించాను. సూక్ష్మశరీర ధారినై జ్ఞాననేత్రంతో మూడు లోకాలూ అన్వేషించాను. ఆ భిక్షుకుని కొరకై వెదుకుచూ సప్తద్వీప - సప్తకుల సమన్వితమగు ఈ పృథివిపై అంతటా ధ్యానమార్గంలో పరిభ్రమించాను.

మనోరాజ్యం బయట దొరికేది కాదు కదా! ఆ భిక్షుకుడు కనబడనంత వరకూ నేను అట్లే మారుమూలలా తిరుగాడుచూనే ఉన్నాను.

రాత్రి మూడవ జామున గాలిచే కొట్టబడిన ఒక పెద్ద సముద్రతరంగంవలె నేను ఉత్తరదిక్కుగా వెళ్ళటం జరిగింది. అక్కడ ‘వల్మీకం’ అనే పేరుతో ప్రసిద్ధి కెక్కిన ఒక ప్రాంతం ఉన్నది. ఆ జనపథం దాటగానే ’జిన’ అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ‘విహారం’ అనే పేరు గల ఒక జనసమ్మర్దమైన స్థానం ఉన్నది. అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళకు కొంచెం దూరంగా ‘దీర్ఘదృశుడు’ అను పేరుతో జనులు పిలిచే ఒక భిక్షుకుడు ఉన్నాడు. ఆతడున్నది పాడుబడిన ఒక కుటీరంలో. సామాన్యంగా ఆతడు ఆ కుటీరం వదలి బయటకు రాడు. అతడు అక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడో అక్కడివారి కెవ్వరికీ తెలియదు. అక్కడివారెవ్వరూ అతనిని అంతగా ఏమీ పట్టించుకోరు. అక్కడి పెద్దలు మాత్రం అతనిని ‘దీర్ఘదృశుడు’ అని పిలుస్తూ ఉంటారు. అతనికి కొద్దిమంది శిష్యులు మాత్రం ఉన్నారు. వారిని గురించిన వివరాలు అక్కడి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ భిక్షుకుడెప్పుడన్నా రాత్రి కొంత పొద్దుపోయిన తరువాత తన భిక్షుపాత్ర పుచ్చుకొని కొన్ని ఇళ్ళకు వెళ్ళుచూ ఉండేవాడు. మౌనంగా నిలబడే ఆతనికి వాళ్ళు కొంచెం ఆహారం ఇవ్వగానే ఊరి చివరి కుటీరం వైపు మౌనంగా నడచి వెళ్ళిపోతూ ఉండేవాడు.

Page:252

ఒక రోజు అతడు ఆ కుటీరానికి గల తలుపు మూసి ధ్యాననిమగ్నుడైనాడు. ధ్యానమునకు ఉపక్రమించే ముందే తన శిష్యులను ఒక నెల వరకూ తన సమాధిని భంగపరచవద్దని ఆజ్ఞాపించాడు. ఇప్పటికి ఆతడు 21రోజులు సమాధిలో ఉన్నాడు. నేను సూక్ష్మదేహినై ఆ కుటీరంలో ప్రవేశించాను. ఆతని ప్రియశిష్యులు తమ గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి బయటనే ఉన్నారు. వారలు ఆ కుటీరంలో ప్రవేశించకపోవటం గమనించాను.

ఆతడు సమాధిలో ఉండి వేలాది సూర్యుల కాంతితో ఒప్పారుచున్నాడు. దీర్ఘ సమాధిలో ఉన్న ఆతనితో సంభాషించటానికి నేను సాహసించనైనా సాహసించ లేకపోయాను. ఆతని శిరోజములు కపిలవర్ణం సంతరించుకున్నాయి. ప్రాణములు నిరుద్ధమై ఉన్నాయి.

ఒక్కసారి అక్కడి నుండి నేను భూత - భవిష్యత్లలోకి తొంగిచూశాను. ఆతడు ధ్యాననిష్ఠలో ఉన్నది 21 రోజుల క్రితమే అయినప్పటికీ, తన చిత్తంతో వేలాది సంవత్సరాలు అనుభవించాడు. ఆతడు ఈ రోజే శరీరమును వదలి విదేహకైవల్యము పొందబోవుచున్నాడు.

ఓ రామచంద్రా! ఆతని విదేహ కైవల్య చమత్కారమంతా గమనించి నేను ఆతనికి నా అతివాహిక దేహంతో సాష్టాంగనమస్కారం సమర్పించి వెనుకకు మరలాను. అప్పుడు నీ ప్రశ్నకు ఉచిత సమాధానం ఇచ్చే ఉద్దేశంతో ‘ఇతః పూర్వకల్పంలో కూడా ఇట్టి చరిత్ర-ధారణ-విదేహముక్తి కలిగి ఉన్న భిక్షుకుడెవరైనా ఉన్నాడా? లేడా? గ్రహించాలి’ అని అనుకున్నాను. నేనిప్పుడు చూచి వచ్చినది రెండవ భిక్షుకుడని, ఇంతకు ముందు కల్పంలో కూడా ఇట్టి చరిత్ర గల భిక్షుకుడున్నాడని గమనించాను. అప్పుడు నేను ఇంకా ముందు కల్పములు కూడా తరచిచూశాను. ఎంతో చతురతతో అంతకు ముందటి కొన్ని కల్పముల వరకూ వెదకినా కూడా మరి మూడవ భిక్షుకుడు అంతకు క్రిందటి ఆ కల్పములలో నాకు తారసపడలేదు.

తిరిగి ఆశ్రమం ప్రవేశించిన నేను అట్టి భిక్షుకుని వృత్తాంతం గల వారెవరైనా ఇంకా ఉన్నారేమో గ్రహించటానికి మరికొంత ప్రయత్నించాలని అనుకున్నాను. అప్పుడు మరల సూక్ష్మదేహినై ఈ సృష్టి నుండి బయలుదేరి మరొక భవిష్యత్ సృష్టిలో ప్రవేశించాను. చిదాకాశమున వెలయుచున్న ఆ భవిష్యత్ సృష్టిలో 3వ భిక్షుకుడు ఉండి ఉండటం గమనించాను. బ్రహ్మ నిర్మితమైన ఆ సృష్టిలో కూడా మన ఈ వర్తమాన సృష్టి లాగానే అనేక జగత్తులు ఉన్నాయి.

శ్రీరాముడు: మీరు భవిష్యత్తులో ఉండబోయే ఆ సృష్టిలో ఇప్పుడే ఎలా ప్రవేశించగలిగారు? అందులో కూడా ఈ మన సృష్టిలాగానే పదార్థములు మొదలైనవి ఉన్నాయా?

శ్రీవసిష్ఠ మహర్షి: యోగబలంచేతనే నా మనస్సుకు అది సుసాధ్యమయింది. ఆ భవిష్యత్ సృష్టిలో కూడా ఇక్కడ తారసపడే పదార్థములను, ఆకారములను చూశాను. ఇటువంటివే అనేక జగత్తులు ఆ సృష్టిలో కూడా ఉన్నాయి.

Page:253

ఈ సృష్టిలో ఆ భిక్షుకుడు, బ్రాహ్మణుడు, రాజు మొదలైనవి ఉన్నట్లే ఆ భవిష్యత్ సృష్టిలో కూడా అప్పటి భిక్షుకునకు ఆయా ఉపాధి పరంపరలు కల్పితమై ఉండగలవు.

ఓ రామచంద్రా! ఒక్క విషయం ఇక్కడ ప్రకటించదలచుచున్నాను. ఆ భిక్షుకునికి సంభవించినట్లే నాకు, నీకు, ఈ సభికులకు, తదితర జీవులందరికీ ఇట్టివి, ఇందుకు భిన్నమైనవి అయిన అనేక పూర్వ, తత్పూర్వ… భవిష్యత్, తత్భవిష్యత్ వృత్తాంతాలతో కూడిన అనేక కథనాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఆ రాబోయే సృష్టిలో ఈ నారదమహర్షి ఇట్లే ఉండబోవుచున్నారు. ఈ సభలోని కొందరి కొందరి జ్ఞాన చరిత్రలు ఇట్లే ఉండబోవుచున్నాయి. ఈ సభలోని కొందరు ఆ రాబోవు సృష్టిలో అత్యున్నత జ్ఞానులై, మరికొందరు అల్పజ్ఞానులై ఉండబోవుచున్నారు.

ఇదంతా కూడా ఈ మాయ ఉన్నంతవరకూ… ఇలా ఒకసారి కాదు… అనేకసార్లు సంభవించ గలదు. ఇట్లు పూర్వం కూడా సంభవించింది. మరల భవిష్యత్లో సంభవించబోతోంది. సముద్ర తరంగాలను చూచావు కదా? అవి ఒకసారి విస్తరిస్తున్నాయి. మరొకసారి ఉపశమిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒకే తీరైన తరంగాలు మరల మరల వెలువడుచున్నాయి. ఇంతలోనే మరికొంతసేపు వేరు వేరు ఆకారం గల తరంగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. అట్లాగే సృష్టి పరంపరలు మాటిమాటికీ విస్తరిస్తున్నాయి. మరల ఉపశమిస్తున్నాయి. కొన్ని సృష్టులు ఒకదానిలో మరొకటి అత్యంత సాదృశం కలిగి ఉంటున్నాయి. కొన్నిటికి అసలు పోలికయే ఉండటం లేదు. ఆహా! ఈ మాయ ఇట్లు విస్తరించి మహాత్ములగు వారిని కూడా మోహమున ముంచెత్తుతోందే!

శ్రీరాముడు: ఈ మాయ ఎట్లా కల్పించబడుతోంది? మానసిక చింతన చేతనా? లేక ఇదంతా శారీరక యత్నము చేతనేనని అనవచ్చునా?

శ్రీవసిష్ఠ మహర్షి: ఇదంతా ప్రతిభాస చేతనే ఉత్పన్నమౌతోంది. శారీరక - - మానసిక యత్నములు లేకుండానే మాయ పరిఢవిల్లగలదు. మాయయే ఆ భిక్షుకుని విషయంలో 21 రాత్రులు అనేక యుగ - మన్వంతరముల అనుభవం కల్పించటం జరుగుతోంది. ఆయా సమయములందు ఆయా ఆకారములన్నీ దీర్ఘప్రయాణీకుడగు ఈ జీవునిచే మాయయే అనుభవింపజేస్తోంది. స్వస్వరూపసత్యం కించిత్ ఏమరచటమే మాయయొక్క చమత్కార విన్యాసానికి ’నాంది’.

మనస్సు యొక్క గతి ఎంతటి భయంకరమైనదో… గమనిస్తున్నావా?

అంతటికీ కారణం ప్రతిభాసయేనని మరొకసారి ప్రకటిస్తున్నాను. మనస్సు యొక్క అలజడియే ఈ భూత - వర్తమాన వర్తమాన - భవిష్యత్ సృష్టులన్నిటికీ మూలపదార్థం సుమా! కదలుచున్న జలంలో అస్తవ్యస్తంగా బింబం ప్రతిబింబిస్తున్నట్లు, చంచలమగు మనస్సునందు ఆత్మస్వరూపమాత్రమగు ఈ దృశ్యం అస్తవ్యస్తంగా ప్రతిభాసిస్తోంది. ప్రతిభాసఖండములగు ఈ జగత్తులు, అట్టి ప్రతిభాస మాత్రమగు ఈ జగత్తులలోని ఈ జీవులు, వీరి వ్యవహారపరంపరలు - ఇవన్నీ కూడా మాయ యొ కార్యములే అయినప్పటికీ వీటికి వ్యవహార సత్త, కార్య-కారణ వైచిత్ర్యము, ఘనీభూతమైన సుఖ-దుఃఖ అనుభవాలు ఏర్పడి ఉంటున్నాయి. ఇదంతా సర్వవ్యాపకము, సర్వాత్మకము, చిదేకరసము

Page:254

అగు బ్రహ్మమే అయినప్పటికీ మాయా దృష్టి ఉన్నంత వరకు ఇదంతా ఇట్లే ఉంటోంది. ఉండబోతోంది. తత్త్వబోధచే మాయ తొలగిందా… ఇక ఈ సృష్ట్యాదుల భ్రమ దానంతట అదే తొలగగలుదు.

  1. బ్రహ్మైక్య ప్రతిపాదన

దశరథ మహారాజు: ఓ మహర్షీ! మీరు ఆ భిక్షుకుని గురించి చెప్పిన విశేషాలన్నీ చాలా చమత్కారంగా ఉన్నాయి. నాదొక చిన్న విన్నపం. ఇది సముచితమేనని మీరు అనుకుంటే మీరు ఆ భిక్షుకుడు ఉన్నచోటికి సూక్ష్మశరీరధారులై సమీపించి అతనిని సమాధి నుండి లేపండి. మనం భటులను, మంత్రులను పంపి ఆయనను ఆ కుటీరం నుండి ఇక్కడికి సాదరంగా ఆహ్వానిద్దాం. ఆతని అంతరంగ వాణి ఏమిటో మేము మరింతగా గ్రహించవచ్చునేమోనని నా ఉద్దేశం.

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ మహారాజా! ఆ మహాభిక్షుకుని శరీరం ఇప్పుడు ప్రాణరహితమై ఉన్నది. నేడే ఆతడు ఆ భౌతికదేహం త్యజించవలసి ఉండుట దైవనియతి. ఈ విషయం నేనిదివరకే చెప్పాను కదా!

ప్రాణచలనమునకు ఆధారమైన అన్నరసం ఆతని దేహమునందు పూర్తిగా శుష్కించి ఉన్నదని ఆతనిని చూడగానే నేను గమనించాను. ఇప్పుడాతడు జీవితుడుగా లేడు. ఎందుచేతనంటావా? ఆ దేహమును అనుభవించుటకు కావలసియున్న ప్రారబ్ధం ఆతని యందు ఏమాత్రం శేషించి ఉండలేదు. అట్టి ప్రారబ్ధం ఏమాత్రమైనా మిగిలి ఉంటే నేనే ఆతనిని సమీపించినప్పుడు పునరుజ్జీవితుని చేసి ఉండేవాడిని. ఆ శరీరమునందలి జీవుడు జీవన్ముక్తుడై, బ్రహ్మహంస అయి వెలయుచున్నాడు. ఆతడీ దృశ్య ప్రపంచ విశేషమునకు తిరిగివచ్చి, దేహముచే ఈ భౌతికలోకంలో మనబోటి వారితో ప్రవర్తించుటకు సిద్ధపడే సూచనలు కనిపించుటలేదు.

శ్రీరాముడు: మహాత్మా! ఆతని పాంచభౌతిక దేహమునకు ఏమి కానున్నది?

శ్రీవసిష్ఠ మహర్షి: ఆ భిక్షుకుడు తన శిష్యులకు వీడ్కోలు పలికేటప్పుడు ‘ఒక మాసం వరకు ఈ గది తలుపులు తెరువవద్దు’ అని నిర్దేశించి ఉన్నాడు కదా! ఆతని భృత్యులు ఆతని దర్శనము కొరకై బయటయే నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు మీ భటులను పంపినప్పటికి ఆ శిష్యులు వారిని లోన ప్రవేశించనివ్వరు.

గురు ఆజ్ఞను అనుసరించి నెలరోజులూ గడచిన తరువాత వాళ్ళు ఆ గది తలుపులు తెరుస్తారు. ప్రియాతిప్రియుడగు తమ గురువు ఆ దేహమును త్యజించినట్లు కనుగొంటారు. ఆ భౌతిక దేహమును శుభ్రపరచి నదీజలంలో వదులుతారు. ఆ తరువాత ఆ సమాధిని ఆశ్రయించినచోట ఒక పూజా మందిరం నిర్మించగలరు. పూజ - భక్తి వ్యవహారార్థమై అక్కడ ఆ భిక్షుకుని ప్రతిమను నెలకొల్పుతారు. ఆ ప్రతిమ ఆ భిక్షుకుని భక్తులందరికీ ప్రియదేవతామూర్తిగా, ఉపాస్యదైవంగా ఆరాధించబడనున్నది. దృఢమనఃకల్పితమగు సర్వాత్మ-పరబ్రహ్మము యొక్క సంజ్ఞారూపంగా వారికి-వారివారి శిష్య పరంపరలకు సాక్షాత్కరిస్తూ మార్గదర్శకమై సుదీర్ఘకాలం పూజింపబడగలదు. కాలక్రమేణా అనేకచోట్ల

Page:255

ఆ ప్రతిమవంటివే అనేకం నిర్మించబడి అనేకమంది సాధకజనులచే జగద్గురుభావంతో ఆరాధించ బడబోతోంది.

ఇట్లు నేను ఆతనిని సమీపించిన క్షణంలో ఆతడు ఆ దేహమునందే ముక్తుడై వెలయుచున్నాడు. ఆతని దేహం వినష్టమైపోయింది. కాబట్టి నాయొక్క పునఃప్రాణస్పందనయత్నం ఆతని పట్ల సఫలం కాలేదు.

ఓ రామచంద్రా!

ఏషా గుణమయి మాయా దుర్బోధేన, దురత్యయా నిత్యం సత్యావబోధేన సుఖేనైవాతివాహ్యతే ॥

త్రిగుణమయమగు ఈ మాయ జీవుని జ్ఞానము వలననే తన యొక్క విక్షేపశక్తిచే అనేక భ్రాంతిపరంపరలను విస్తరింపజేస్తోంది.

అయితే… జ్ఞానం వల్ల ఈ సర్వము ఆకృతిని కోల్పోగలదని గ్రహించు. ఈ మాయ అసత్యమే. అయితే ఏం? ఇది ఈ జగత్తులను ప్రదర్శించుచున్నది. ఆభరణంలో బంగారం దృష్టిన పడకుండా - ఆకారం దృష్టిని ఆకర్షిస్తున్నట్లు ఈ మాయ కూడా సత్యవస్తువును అన్యవిధంగా అనిపించేటట్లు చేస్తోంది. “జలమందు తరంగంలాగా పరమాత్మ యందు ఈ సృష్టులు అవాస్తమైనవి మాత్రమే” అని శ్రుతులు చేతులెత్తి ప్రకటిస్తున్నాయి. ఒక్కసారి మొదలంటా ఈ సర్వమును మాయగా వీక్షించావా… సర్వభ్రమలు మరుక్షణం తొలగిపోతాయి.

ఆ పరమాత్మయే స్వయంకల్పితమైన అవివేకం చేత జీవత్వమును పొంది క్రీడగా స్వప్న. స్వప్నాంతరములను , జన్మ జన్మాంతరాలను పొందుచున్నాడు. ఓ రామచంద్రా! నీవు ఈ సర్వమును ఆత్మగానే అవలోకించు. అప్పుడు ‘చిన్మాత్రం’ మాత్రమే అన్ని వైపులా శేషించగలదు. ‘బోధ’ యొక్క బలం చేత ఏదైతే సర్వమూ ఆత్మగా తెలియవస్తోందో… అదియే అజ్ఞాన సమయంలో ముళ్ళపొదల వలె ’సంసారమండలం’గా ఉదయించి, ఏర్పడి ఉంటోంది. ఆ భిక్షుకుడు గాంచినవన్నీ మనఃతరంగ మాత్రములు, స్వప్నతుల్యములు మాత్రమే.

సమష్టి జీవుడగు హిణ్యగర్భుని మనోసంకల్పనిర్మాణమగు ఈ సృష్టి స్వప్నతుల్యం మాత్రమే. కాబట్టి వ్యష్టిజీవుడు చూచుచున్నది కూడా స్వప్నమే అయి ఉన్నది. ఇదంతా అశుద్ధచిత్తమున ఉదయించి అట్టి చిత్తదోష బలం చేతనే సత్యమైన దానివలె వెలయుచున్నది. చిత్తశుద్ధిని పొందినప్పుడు మాత్రమే ఇదంతా స్వప్నవిలాసము వలె అసత్యమని, అసత్తుల్యమని బోధపడగలదు. అప్పుడు “ఈ ప్రత్యేక జీవుడే కోటానుకోట్లుగా వెలయు బ్రహ్మాండ రూపుడు కూడా!" అని గ్రహించగలుగుతావు. ఈ జీవుడు వ్యష్టి-సమష్టిగా, లేక సాధారణ-అసాధారణ ప్రపంచరూపంగా స్ఫురించుచున్నాడు. ఏది ఎట్లా స్ఫురించినా, స్ఫురించకపోయినా… ఆతడు అదంతా తన హృదయమున ఏర్పడే ప్రతిభాసకు అను రూపములగు విషయములే పొందుచున్నాడు.

Page:256

అనగా ఈ ’జీవుడు’ అనబడే ద్రష్ట తననుతానే తన ఆత్మను జగత్తు రూపంగా - దృశ్యం రూపంగా స్వప్నమునందువలె - దర్శిస్తున్నాడు.

ఆ అనురూపములన్నీ ఒక్కొక్కసారి సుదీర్ఘంగా గాంచుచున్నాడు. అదంతా భ్రమయే కనుక స్వప్నమువలె మిథ్యయే అయున్నది. ఈ జీవుడు ‘తత్త్వచ్యుతుడు’ అయి చిత్తసత్తను ఆశ్రయించి క్రమక్రమంగా ఈ దేవ, నర, జంతు మొదలైన యోనులలోని ఒకానొకదాని యందు పడి జరామరణ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. దేహములను సమాశ్రయిస్తున్న ఆ చైతన్యము చిత్తస్పందనము వల్ల జగత్ స్వప్నములను గాంచుచున్నది. ఆయా స్వప్నాలలో పాతాళ లోకాన్నో, లేక బ్రహ్మ లోకాన్నో కల్పించుకుని ఆయా భోగాదులచే తన్మయం పొందుచూ వెలయుచున్నది.

ఆ బ్రహ్మ చైతన్యమే ప్రాణకల్పనను ఒనర్చుకొని, ఆ ప్రాణవశమున ఉండు స్పందనరూపమును గ్రహించుచున్నది. అందుకు ఫలితంగా ‘జీవుడు’ అను పేరును బడయుచున్నది. తద్వారా ’నేను దేహమును’ అనే భ్రమకు వశమగుచున్నది. ఆ దేహం నుండి పంచేంద్రియాల ద్వారా బయటకు వెడలి విషయాకారాన్ని పొంది విషయజ్ఞాన తదాత్మ్యము పొందుతోంది. ఇక ఏం చెప్పాలి? అనేక సంభ్రమములలో పడి పొరలుచున్నది.

ఏది ఎట్లైతే ఏం? ఈ జీవుని వాస్తవరూపం ప్రత్యగాత్మయే కదా! ’చిత్త ఉపాధి’ అనే భ్రాంతి గొనినంత మాత్రం చేత బ్రహ్మం యొక్క స్వభావం మరొకటిగా మారగలదా? మారదు. దర్పణంపై నీటిచుక్కలు పడటంచేత ప్రతిబింబం అస్తవ్యస్తంగా కనబడవచ్చు. అంత మాత్రంచేత నీ ముఖం అస్తవ్యస్తం అవుతుందా? కాదుకదా! బ్రహ్మము ఎల్లప్పుడూ బ్రహ్మముగానే ఉన్నది. బ్రహ్మమునందు గల ఉపాధియోగం చేతనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఉపాధి ఉండుట చేత గాని, లేక… లేకపోవుట చేత గాని పరమాత్మయందు కలిగే మార్పు చేర్పులేమీ ఉండవు. "బ్రహ్మము మునుపటి యోగ్యత పోగొట్టుకొంటోంది” అను వాక్యం ఏ సమయమునందునూ యుక్తియుక్తం కాదు. వేలకొలది అధ్యాసలు ఉండవచ్చు గాక! అధిష్ఠానం స్వస్వరూపాన్ని విడువదు. విడువజాలదు. ఎన్ని భావోద్రేకాలు ఏర్పడినా ఒకడు తన ‘నేను’ను విడచి ఉండకపోవటమే అందుకు తార్కాణం. అందుచేత జీవబ్రహ్మైక్యం చేకూరుటకు ఎట్టి ఆటంకము లేదు. ఇదియే పరమపురుషార్థము.

శుద్ధ ఆకాశము ఆకాశముననే వెలయుచున్నది కదా! జలము జలముననే వెలయుచున్నది. ‘తరంగములు పొందుచున్నది కాబట్టి జలం జలత్వం నుండి బయల్వెడలింది.’ … అని ఎవరైనా సిద్ధాంతీకరిస్తారా? లేదు కదా! అట్లాగే వ్యావహారిక దృష్టితో చూచినా సరే, ఈ జగత్తు బ్రహ్మముననే వెలయుచున్నదని గ్రహించు. ఇక పరమార్థ దృష్టితో చూస్తే, వేరుగా చెప్పవలసిన పనేమున్నది?

దర్పణం - ప్రతిబింబం - - బింబం - ఒకింత వేరువేరని తోచవచ్చునేమో. కానీ, ఈ జీవలోకం బ్రహ్మమునకు వేరుగా ప్రతిష్ఠ కలిగి ఉండలేదు. బాలురు అద్దంలో తమ ప్రతిబింబం చూచి భయం, ఉత్సాహం, ఉద్రేకం, ఆవేదన - పొందునట్లు అభయ బ్రహ్మమున వెలయుచున్న తమను

Page:257

తామే చూచుకుని ఈ జీవులు భ్రమచెందుచున్నారు. తమ భావోద్రేకములే తదితరమంతా ప్రవేశించి ఇష్టము, అయిష్టము, కోపము, నిర్లిప్తము - మొదలైనవన్నీ అనుభవరూపాలుగా పరిణమింప జేస్తున్నాయని గమనించలేక పోతున్నారు.

  1. పరమ నిశ్శంక స్థితి

శ్రీరాముడు: అట్టి ‘అన్యధా’ అను బోధ ఎట్లా ఆత్మయందు ఉత్పత్తి అవుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి: (చిరునవ్వు నవ్వుతూ)

స్పందే స్పందీకృతేచ ఇహ స్వతః సంజ్ఞా విలీయతే | సాప్యలం పరిణామేన లీలయే అగ్నౌఘృతం యథా॥ చిత్స్పన్ద ఏవ చిత్స్పన్దే సర్వాత్మని విజృమ్భితః I

స్పన్దాస్పన్హౌ జృంభణాది కల్పితం! నాత్ర వాస్తవం ॥

ఈ ద్వైతభావనకు, ఈ ‘అన్యధా’ భావనకు కారణం ‘బుద్ధి యొక్క స్పందన’ మనే చెప్పాలి. సమాధిని అభ్యసించటం ద్వారా ఈ బుద్ధి యొక్క స్పందనను నిలిపివేయటం జరిగితే అప్పుడు మిగిలి ఉండే స్థిరబుద్ధిని ‘చరమసాక్షాత్కారం’ అని పిలుస్తారు. అగ్నియందు నేయిని వ్రేల్చినట్లు అప్పటి చరమసాక్షాత్కార స్థిరబుద్ధిని కూడా బ్రహ్మమునందు వ్రేల్చితే అది విలీనమై ఆత్మ యొక్క అఖండ - అప్రమేయాది సంపదతో ఈ జీవుడు ప్రకాశించగలడు.

చిత్ స్పందనరూపమగు పరమాత్మయందే చిత్ స్పందనరూపమగు ఈ జగత్తు ప్రకాశించు చున్నది. కానీ, నిజానికి స్పందనము, అస్పందనము, జృంభణము మొదలైనవన్నీ చిదాత్మ పట్ల కల్పిత విషయములే అగుచున్నాయి.

ఓ రామా! ఈ జగదనుభవం వెయ్యి గొడ్డళ్ల వ్రేటులకైనా తెగదేమోనని అనిపించవచ్చు గాక! ఇదంతా కల్పనామాత్రమే కనుక, ఇదంతా కల్పనాత్యాగముచే నశించగలదు. అనగా, ఇప్పుడు ’దాట రానిది’గా అనిపించేదంతా కల్పనలన్నీ నశించినప్పటి దృష్టికి ఇది ఏదీ కాదు.

అందుచేత ఈ జగత్తు ఏదీ కాదు. శుద్ధచిన్మాత్రమగు స్వస్వరూపబ్రహ్మం ఒక్కటే ఒకే రీతిగా వెలయుచుండగా, ఇద్దానిని తత్త్వదృష్టితో పరికించకపోవటం చేత ఇందు “స్పందం, అస్పందం, ఏకం, అనేకం”… మొదలగు భావావేశాలు స్ఫురిస్తున్నాయి. ఇదంతా ’ఏదీ కాని ఒక శిలయందు కల్పించుకున్న ఏవేవో “శిల్ప శిలా సంబంధ ప్రియాప్రియములు” వంటివి మాత్రమే. అందుచేత ఈ జగత్తు కల్పితం మాత్రమేనని గ్రహించు.

శ్రీరాముడు: 1. ‘ఈ సర్వము బ్రహ్మమే’, 2. ‘సర్వమునకు అతీతమైనది బ్రహ్మము’… ఈ రెండు వాక్యములలోని సముచితార్థం విశదపరచమని ప్రార్థన.

Page:258

శ్రీవసిష్ఠ మహర్షి:

సారేణ తు విచారేణ “సర్వ” శబ్దార్థ యోః సమే చిన్మాత్రమేవ జ్ఞాతేయం నాస్తీత్యపి నవిద్యతే॥॥

‘సర్వ’ శబ్దము యొక్కయు, దాని అర్థము యొక్కయు ఏకస్వభావం విచారణచే తెలియవస్తుంది. అప్పుడు చిన్మాత్రవస్తువు సర్వదా ఒక్కటేనని నీవే గ్రహిస్తావు. ఆ సమయంలో భావాభావరూపము మాత్రమే అగు ఈ ప్రపంచం నీ యొక్క నిర్మలావగాహనచే లేకుండా పోగలదు. ఓ సర్వసభికులారా! ప్రియ ప్రవచన శ్రోతలారా! నా ఈ మాటలు విశ్వసించండి. ఈ ప్రపంచం ఏనాడు మీ కల్పనలకు వేరుగా లేనే లేదు. అవిచారణ యొక్క విస్తృతి చేతనే ప్రకృతికి చిహ్నమగు ఈ భేదమంతా ఉదయి స్తోంది. ఈ కనబడే భేదములన్నీ విలీనమైనప్పుడు ఆ పరవస్తువు ఒక్కటే మిగులుతోంది. మనం ఈ విషయమై అనేక రీతులలో అనేక కోణాలనుండి చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పుకోబోతున్నాం. ఏది ఏమైనా ఉన్న యథార్థ స్థితి ఇది. దీనిని మరెవ్వరూ మరొక విధంగా ఒనర్చజాలరు. అజ్ఞానం (లేక) అబోధ వలన నానాత్వదర్శనమంతా సంభవిస్తోంది. జ్ఞానం వల్ల నానాత్వదర్శనమంతా తొలగి పోగలదు. అప్పుడీ జీవుడు స్వయంగా పూర్ణచిద్రూపుడై ప్రకాశించుచున్నాడు. ఇదియే పరమార్థము.

అట్టి ‘పరమ నిశ్శంక స్థితి’ యందు సుస్థిరులై ఉన్న మహనీయులెందరో ఈ సభకు వేంచేసి మన ఈ సంవాదమునకు సాక్షులై దీనిని పరమపావనము, లోకకల్యాణపూరితము చేస్తున్నారు. వారంతా ఇప్పటికే ఆశ్రయించి ఉన్న అట్టి నిశ్శంకస్థితి (సందేహ రాహిత్య స్థితి) మరియు అభయస్థితి యొక్క బలం చేత మాత్రమే బంధమోక్షాల కల్పనలు, జాగ్రత్-స్వప్న సుషుప్తాది ఆయా సంక్షుభావస్థలు ఈ జీవులు అధిగమించగలరు. అప్పుడు మాత్రమే ద్వైతభ్రాంతి సంపూర్ణంగా తొలగిపోగలదు.

అజ్ఞానం వల్లే ద్రష్ట, దర్శనం, దృశ్యం - అను త్రిపుటిజ్ఞానంతో కూడిన ఈ జగత్తు అనబడేది ఉపలభ్యమౌతోందని పదే పదే ప్రకటిస్తున్నాను. ఏది అజ్ఞానంచే పొందబడుతోందో… అదంతా అసత్ లేక అసత్యమే సుమా! అట్టి అసత్కు నివృత్తి, లేక శమనం ఏమిటి? ’బ్రహ్మం మాత్రమే సత్యం (బ్రహ్మ సత్యం జగన్మిథ్యా) అనునదే జ్ఞానం! అట్టి శుద్ధాత్మస్వరూపమగు శాంతియే (ఆత్మయే) సర్వే సర్వత్రా వ్యాపించియున్నది. అది అట్లుండగా ఇక అందులో త్రిపుటికి చోటెక్కడిది?

సంకల్పం వలననే చిత్తం, ప్రాణం మొదలైనవన్నీ స్పందించుచున్నాయి. జ్ఞానోదయం అయిన ప్పుడు సర్వ సంకల్పాలు జ్ఞానవస్తువగు స్వస్వరూపమునందు లయించగలవు. సంకల్పాలు తొలగి పోయినప్పుడు స్పందనం అస్పందనమౌతుంది. చైతన్యం సంకల్పాలను వీడిన మరుక్షణం స్పందఅస్పందాలు అనే భేదభావాలు తొలగిపోతాయి. మేఘాల వెనుక ఉన్న సూర్యుడు సర్వదా స్వయం ప్రకాశకుడే అయున్నట్లు సంకల్పాలకు ఆవల ఉన్న చిత్ సర్వదా స్వయంప్రకాశకమే! వాస్తవానికి స్వయంజ్యోతి, స్వయం చైతన్య, స్వయమాత్మ స్వరూపుడగు ఈ జీవుని స్వస్వరూపాన్ని దురవగాహన అనే మేఘాలు ఆవరించి ఉన్నాయి. అట్టి అల్ప-సంకుచిత-పరిమిత భావనా మేఘతరంగాలు అధిగమిస్తేనే చిదన బ్రహ్మము అనుభూతమవగలదు.

Page:259

ఓ రాఘవా! నీవు విశాలమగు చిదనబ్రహ్మపదమును అధిష్ఠించుము. “నేను సర్వదా పూర్ణుడనే” అను భావమునందు వెలయుము. నీవు చేయు సంకల్పాలన్నీ కూడా చిదనబ్రహ్మంతో ఏకరస స్వరూపము పొందియుండు గాక! ‘ఇదివేరు… వారువేరు’ అను పృథక్భావాన్ని త్యజించి ఉండు. ఓ సర్వజనులారా! ‘మోక్షం’ అనగా ఎన్నటికో, ఎక్కడో లభించేది కాదని మీరంతా గ్రహించి ఆత్మైక రసమును సంపాదించెదరు గాక! నిర్దోషమగు బోధసారమును గ్రహించెదరుగాక! భావాభావములు తమ యందు లయం చేసి వర్తించు మహనీయులు స్పర్శించు పదార్థములన్నీ అమృతమయం అవుతాయి. సత్యము యొక్క మహిమ అట్టిది సుమా!

భావాభావముల కల్పనకు ఏది కారణమై ఉన్నదో … అద్దానిని నీవు నీ బుద్ధితో గమనించు. అట్టి కారణాత్మక చైతన్యం నందు సుస్థిరుడవై, ఈ బాహ్య విషయ జగత్తుకు అతీతుడవై చిద్ర్బహ్మం నందు విశ్రాంతి సుఖాన్ని అనుభవించు. పూర్ణాపూర్ణ దశలన్నీ ఏకీకృతమగునది ఏదైతే కలదో …అదియే నీ స్వస్వరూపం. అంతేగాని, అది ఏదో తొలగిన తరువాత ఎప్పటికో ప్రాప్తించబోయేది కాదు సుమా! అట్టి బాల్యక్రీడలకు తావిచ్చి అజ్ఞుడవు కావద్దు.

  1. మౌన ధారణ

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీవు చిత్తము యొక్క స్వాభావికమైన ప్రవృత్తులను అనుసరించటం వదిలివేయి. ‘సుషుప్తమౌనము’ ను ఆశ్రయించుము. కల్పనా మాలిన్యములన్నిటి నుండి విడివడుము. ఆ పరమపదం మాత్రమే అనుసరణీయం. ఆ పరమపదం నందు ఏది కలదో … అదే నీవగుము. అదే నీ సత్య స్వరూపమై ఉండటంచేత అక్కడొక్కచోట మాత్రమే అకృత్రిమమైన శాంతి లభిస్తుంది. మరెక్కడా కాదు. అట్టి ఆత్మైక్యస్వరూపం నుండి చ్యుతిపొందకుండా దేదీప్యమానంగా వెలుగొందు! శ్రీరాముడు: మౌనీశా! వాక్ సంయమ రూపమైనట్టి ‘వాక్ మౌనం’, ఇంద్రియాల సంయమ రూపమైనట్టి ‘ఇంద్రియమౌనం’ ఈ దేహాన్ని క్రియారహితం చేసే ’కాష్ఠమౌనం’ల గురించి నేను విని ఉన్నాను. మీరిప్పుడు ‘సుషుప్తమౌనం అవధరించు’ అని ఆజ్ఞాపించారు కదా! అదేమో దయచేసి వివరించండి. శ్రీవసిష్ఠ మహర్షి: శాస్త్రకారులు సాధనపరులగు మునులను రెండు తరగతులుగా విభజించి చెప్పుచున్నారు.

1.కాష్ఠతాపస్యులు: వీరు బ్రహ్మవస్తువును భావన చేయక కేవలశుష్క క్రియలు చాంద్రాయనం, ఇంద్రియ హఠం మొదలైనవి నిర్వర్తించేవారు.

  1. జీవన్ముక్తులు : వీరు యథాభూతమగు బ్రహాన్ని వహించి ఉన్నవారు. తమ స్వస్వరూపమును అఖండమైనదిగా, అప్రమేయమైనదిగా, నిత్యమైనదిగా నిర్మలమైనదిగా, సత్యమైనదిగా సర్వమైనదిగా ధారణ వహించి ఉండేవారు. వీరు ఆత్మను ఆత్మయందు భావనాభ్యాసం చేస్తూ ఉంటారు. వీరు తదితరుల వలెనే (లేక) తదితర తపస్యుల వలెనే బాహ్యమున వ్యవహరిస్తూ ఉండవచ్చు గాక! అభ్యంతరమున మాత్రం నిరతిశయానందమును గ్రోలుచూ తృప్తిని వహించి ఉంటారు.

Page:260

శ్రీరాముడు : ’మహామౌనము’ అనగా నేమి? అది ఎవరికి లభ్యపడుతోంది?

శ్రీవసిష్ఠ మహర్షి: శాంతిభావమును పొందిన చిత్తనిశ్చయమునే ‘మౌనం’ అని అంటారు. మౌన విదులగు శాస్త్రకారులు ’ప్రథమ మౌనం నాలుగు రకాలుగా విభజించి చెప్పుచున్నారు.

  1. వాక్ మౌనము : వాక్కును నిరోధించటం.

ఈ మూడూ

  1. అక్షమౌనము : బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించి ‘కాష్ఠ మౌనం’ అనే ఉంచటం. ఇదే ఇంద్రియ మౌనం అని కూడా అంటారు. అంటారు. కాష్ఠతపస్వియే 3. కాష్ఠ మౌనము : సర్వదేహ ప్రయత్నాలను విడిచిపెట్టి ఉండటం.. వీటిని అవలంబిస్తున్నాడు.

  2. సౌషుప్త మౌనము : ఇంద్రియ-మనస్సులకు అతీతము ఇది కాష్ఠమౌనంలోని వహించి విషయ రాహిత్యస్థితిని అభ్యసించటం. వీరు ఈ ఉత్తరోత్తర స్తితి. భౌతిక జగత్తును తిరస్కరించి ఏకాంతులై గాఢనిద్రతో జీవన్ముక్త లక్షణం.

పోల్చదగిన సమాధిని సాధన చేస్తూ ఉంటారు.

ఇక ఐదవది ఒకటుంది. అది మహామనో మౌనం. మనస్సు సంచలనరహితమగు స్థితి అది. ఇది సామాన్యజనులకు మూర్చ, గాఢ నిద్రలందు మాత్రమే ఏర్పడుతుంది. ఇది కాష్ఠ తపస్యులకు సాధ్యకాలంలో ఏకాగ్రత యొక్క తీవ్రతను అనుసరించి కలుగుచున్నది. అందుచేత మనోమౌనమును కాష్ఠమౌనంగానే పరిగణిస్తారు. అయితే, ఒక విధంగా చూస్తే, ఇది నాలుగిటిలోనూ పాల్గొనుచునే ఉన్నది కనుక ఐదవదిగా చెప్పరు.

జీవన్ముక్తులు ఆత్మతత్త్వమును అనుభవించుచున్నప్పుడు ఈ సర్వదృశ్యములలో ఉంటూ కూడా వాటి పట్ల ఒకానొక అతీతస్వభావమున సుస్థిరులై ఉంటారు. అందుచేత వారు మౌనాన్ని ’సుషుప్త మౌనం’ అని పిలుస్తారు. కాష్ఠ తపస్వి మూడు విధములైన మనో, ఇంద్రియ, కాష్ఠమౌనాలను సాధనా పరిణామంగా అనుభవిస్తున్నాడు. సుషుప్తమౌన స్థితియందు ‘తురీయావస్థ’ అంతర్గతమై ఉంది. అయితే అది జీవన్ముక్తస్థితిలో మాత్రమే కాష్ఠమౌనసాధకులకు అనుభవయోగ్యమౌతుంది. అనగా, అభ్యాసబలం చేత కాలక్రమంగా సౌషుప్తమౌనం లేక జీవన్ముకస్థితి సాధకునకు లభిస్తోంది.

శ్రీరాముడు : మహాత్మా ! మోక్ష సాధకజనులకు వాక్ - అక్ష - - కాష్ఠ మౌనముల అభ్యాసం నిర్వర్తించటం తప్పనిసరి అని మీ ఉద్దేశమా?

శ్రీవసిష్ఠ మహర్షి: జ్ఞాన సముపార్జనమే అన్నిటికంటే పరాకాష్ఠ. వాక్ - అక్ష - కాష్ఠ మౌనములు అభ్యాసపరంగా మౌనములే అయినప్పటికీ, అవి అశుద్ధ చిత్తం యొక్క దృఢనిశ్చయాలే అగుచున్నాయని గ్రహించు. అందుచేత అట్టి నిశ్చయములు జీవునకు జ్ఞానము లక్ష్యమయి ఉండకపోతే బంధమునే కలిగిస్తున్నాయి. జ్ఞాన బలం తోడైతే తప్పక ఉపకరిస్తాయి.

Page:261

కాష్ఠమౌని బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించుచున్నాడు కదా! తద్వారా జరుగుచున్న దేమిటి? లోపల అహంభావము యొక్క స్మృతిని వెలుపల ఆ దృశ్యప్రపంచమును, వాఙ్మయ ప్రపంచముల సంపర్కములను త్యజించటానికి శ్రమతో ప్రయత్నిస్తున్నాడు. అతడు నిరోధ ప్రయత్న శీలుడై ఉంటున్నాడు. నిద్రపోవువాడు కూడా ఈ జాగ్రత్ జగత్ను తిరస్కరించి మౌన - - జడస్థితిని ఆశ్రయించి ఉంటున్నాడు. అది ఈ దేహారోగ్యానికి ఉపయోగిస్తూందేమో గాని, ఈ మాయాజగత్ను అధిగమించటానికి ఉపయోగించదు కదా! అట్లాగే కాష్ఠమౌని జ్ఞానదృష్టిని స్వీకరించకపోతే, సర్వేసర్వత్రా అజ్ఞానముతో కూడి ఆవరించియున్న పరిశుద్ధాత్మత్త్వమును దర్శించజాలడని నా అభిప్రాయం. అయితే జ్ఞానముతో కూడిన సాధన జీవుని జీవన్ముక్తునిగా తీర్చిదిద్దగలదు.“అందుకు ఇది మాత్రమే మార్గం” అని ఏ ఒక్క సాధన విషయంలో కూడా ఎవరమూ నిర్దేశింపజాలమని గ్రహించు.

జీవన్ముక్తుని ఆత్మదృష్టి అనునిత్యం వికల్పరహితమై ఉంటోంది. అతడు నివురుగప్పిన నిప్పు వలె ఆత్మచైతన్య ప్రకాశభావమును అంతటా గాంచుచునే ఉంటాడు. ఇక నిరోధయత్నమునందు నిమగ్నమైయున్న కాష్ఠమౌని, అట్టియత్నమునందు మనసా - కర్మణా నియమితుడై ఉండటం చేత అతని పూర్ణానుభవమునకు ‘ప్రయత్నము’ అనే ఒక తెర అడ్డుగా ఉండటం గమనార్హం. వాక్ - -

ఇంద్రియ - కాష్ఠములకు సంబంధించిన త్రివిధ మౌనములను ఆశ్రయించినవారు సమాధినుండి లేచినప్పుడు, వారి చిత్తము తగినంతగా నిర్మలం అయి ఉండకపోతే… మరల అది చంచలత్వం పొందుతోంది. ఇక తత్త్వజ్ఞుడై సుషుప్తమౌనము ఆశ్రయించినవాని చిత్తము మొదలంట జయించివేయ బడగలదు. చిత్తమే నశిస్తుంది. కనుక ఇక అట్టి వానిపట్ల చంచలత్వము పొసగదు. అనగా ‘అంతయూ ఆత్మయే’ అను దృష్టిని సుస్థిరపరచుకుంటూ కాష్ఠమౌనమును అభ్యసించేవారు క్రమేపీ కృతకృత్యులై జీవన్ముక్తులై వెలయగలరు.

సుషుప్తమౌనులు జ్ఞానసమన్వితులైనప్పుడు స్వయంగా పూర్ణాత్మయందు వెలయుచున్నారు. అట్టి ఆత్మానుభవస్థితియందు వారు రెండు విధములైన నిర్ణయములు ఆశ్రయించి ఉండటం జరుగుతోంది.

  1. కర్మసన్యాసం:“వాక్ - ఇంద్రియ - కాష్ఠ (దేహము)లు బంధములే కనుక వీటి పట్ల పరిత్యాజ్య భావముతో ఉంటాను.” (లేక)

  2. కర్మయోగం: “ఈ వాక్-ఇంద్రియ-దేహములు కూడా సచ్చిదానందము యొక్క విలాసములే కదా! అందుచేత అవి వాటి ధర్మములను లోకానుకూలంగా నిర్వర్తించు గాక! కర్మయోగం సమర్పిత భావంతో ప్రవాహపతితమైనదంతా నిర్వర్తిస్తాను.”

ఏది ఎట్లైననూ వారికి ’ఈ ఉభయంలో ఇది మంచిది- అది కాదు, వీళ్ళు గొప్ప వాళ్ళు -

వాళ్ళు కాదు… ఇటువంటి ఉపాధేయబుద్ధి ఉండదు. అట్టి ఉపాధేయాతీత అనుభవం గల యోగులకు సుషుప్తమౌని, జీవన్ముక్తుడు… మొదలైన పేర్లు శాస్త్రకారులు ఇచ్చారు. అట్టి మౌనం ‘నా స్వరూపానికి పునర్జన్మ గాని, ఈ జన్మ గాని లేదు. కనుక నేను సర్వదా జన్మరహితుడను’… అను అవగాహన

Page:262

పెంపొందించుకొన్న వారికి సులభ సాధ్యమౌతుంది సుమా! ‘సుషుప్తమౌనం’ జీవన్ముక్తులలో జన్మ కర్మలచే స్పృశించబడక నిశ్చలమై, స్వభావసిద్ధియై ఉంటుంది.

శ్రీరాముడు : : ‘సుషుప్త మౌనము’ అనునది జీవన్ముక్తులకు స్వభావసిద్ధమై అంతర్గతంగా ఉంటుందని సెలవిచ్చారు కదా! అట్టి సుషుప్తమౌనము గురించి మరికొన్ని విశేషాలు వినాలని నా అభిలాష. శ్రీవసిష్ఠ మహర్షి: ఆత్మదర్శనం అయితే సుషుప్తమౌనం అత్యంత సహజమై సిద్ధించగలదు. తదితర వాక్-ఇంద్రియ-కాష్ఠ మౌనాల వలె ఇది సిద్ధించటానికి కొత్తగా పడవలసిన కష్టమేమీ ఉండదు. “నేను సత్యమును, సర్వుల స్వరూపుడను" అను ఆత్మానుభూతి పొందుచుండగా ఇక సుషుప్తమౌనం కొరకై ప్రాణనిరోధంతో గాని, పూరక - కుంభక-రేచకములతో గాని పని లేదు. అది సిద్ధించిందా… ఇక విషయాలు లభించుటచే హర్షంతో ఉప్పొంగటం గాని, అవి లభించనప్పుడు కృంగటం గాని ఉండదు. ఆ స్థితియందు నానాత్వ కల్పన ఉదయించదు, శాంతించదు. సుషుప్తమౌని ఈ జగత్ విచిత్ర కల్పనల మధ్య ఉండవలసి వచ్చినపుడు కూడా ‘అవన్నీ భ్రమలేకదా’… అని గ్రహించియే ఉంటాడు. ఆత్మజ్ఞాన బలం చేత సుషుప్తమౌనం అకృత్రిమం అవుతుంది.

సాధనా బలిమిచే ఉచిత కాలంలో చిత్తం తన యొక్క చిత్తత్త్వం కోల్పోయి ఆత్మత్వం సంతరించు కుని ఉంటుంది. అనగా చిత్తం చిత్తంగా ఉండక ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అతనికి ‘నేను మనస్సును త్యజించాలి. నిరోధించాలి’ అనే విభ్రాంతితో అవసరముండదు. అతని మనస్సునందు కర్తృత్వ

భోక్తృత్వాది అభిమానాలు గాని, సత్తు-అసత్తు మొదలైన విభేదాలు గాని ఉండవు. ఆ సుషుప్త మౌనంలో విభాగించునది, విభాగించబడునది - అనేవేవీ స్ఫురించవు. అతని యందు సర్వప్రయత్నాలు విలీనమౌతాయి. ఇచ్చట గాని, మరెచ్చటగాని ఆత్మతత్త్వము గాక మరింకేమి కలదో చెప్పు?

“ధ్యానక్రియ ఉన్నప్పటికీ… లేనట్టి త్రిపుటీ శూన్యస్థితియే అది” అని విజ్ఞులు ప్రకటిస్తున్నారు. ‘నానాత్వభ్రమపూర్ణమగు ఈ జగత్తు ఆత్మతత్త్వముననే వెలయుచున్నది’… అను దృష్టితో కూడిన అభేద నిస్సందేహ స్థితియే సుషుప్తమౌనం అని అనిపించుకుంటోంది. నానాత్వజ్ఞానమునకు ఆశ్రయమైన ఆ పరమ శివమునందే సర్వము వెలయుచున్నాయను అనుభవం సుషుప్తమౌనికి అత్యంత సులభంగా కరతలామలకమౌతుంది.

ఆ తత్త్వానుభవం సర్వవ్యాపకము అయి ఉండుటచే ఆకాశమువంటిది. కాని అది శూన్యము కాదు కాబట్టి, ఆకాశం కానిది. సకలుర స్వస్వరూపి కాబట్టి మిథ్యకానిది, పరతత్త్వాన్ని గ్రహించుటచే చిత్తము ఎవరికి ప్రశమనము పొందుతుందో అట్టివాడే సుషుప్తమౌన సంజ్ఞకు అర్హత పొందుచున్నాడు. అచ్చట సర్వవికల్పములు శూన్యమై, బహిర్విషయజ్ఞానాతీతమై సర్వోపశమన జ్ఞానయుక్తమై, సత్-అసత్ అతిరిక్తమై ఉండగల ‘ఉత్తమమౌనస్థితియే’ అయిఉంటుంది. భావాభావదశలు ఏర్పడుచున్నప్పుడుకూడా అజ్ఞానము ఏర్పడక, ఆత్మానుభవస్థితి నుండి వివర్తమనునది లేకుండా ఉండుటయే సుషుప్తమౌనం

అనిపించుకుంటుంది.

Page:263

చిత్తవృత్తులు ఉపశమిస్తే వాటి వ్యాపారములగు ఈ జగత్ భేద భావాలు కూడా ఉపశమిస్తాయి. ఆ క్షణమే చిత్తము సమత్వం పొందుతుంది. ఇకప్పుడు జగతు, నీవు, నేను, వారు, మనస్సు - వంటి మనో కల్పనలు ఉండవు. “ఈ జగత్తంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఇక “శబ్దార్థమాత్రమంతా నిర్వికారమగు సత్తాసామాన్యమే” అను అవగాహన అతడు సుస్పష్టంగా కలిగి ఉంటాడు. విషయభావముచే పరిమితుడు కాకపోవుటచే అతడు అపరిమితుడై ఉంటాడు. సుషుప్తమౌనమే తక్కిన మౌనములన్నిటి యొక్క ఆశయసిద్ధి.

అనంతమగు ఆ సుషుప్తమౌనం ప్రబోధము మాత్రమే. ఆ ప్రబోధమే అవిద్యను లేకుండా చేయు తురీయస్థితి. ’అవిద్యను తొలగించుచున్నాను’ అను రూపంలో ఉండే వృత్తులు కూడా అక్కడ లేకుండా పోతాయి కాబట్టి అద్దానిని ‘తురీయాతీతస్థితి’ అని కూడా అంటున్నారు.

  1. సుషుప్తరూపసమాధి, 2. తురీయసమాధి, 3. తురీయాతీతసమాధి…ఈ మూడు పేర్లతో చెప్పబడుచున్న ఏకైక ఆత్మస్థితి జ్ఞానికి జాగ్రత్నందు, స్వప్నమునందు కూడా అనుక్షణికమై అనుభూతం కాగలదు.

నాయనా! రామచంద్రా! నీవు బ్రహ్మభూతుడవైతివి. ఇక ఈ భౌతిక దేహమును ఉపయోగించి సర్వత్రా నైపుణ్యముతో ఇక్కడి వ్యవహారార్థమును అనుసరించుము. నీవు ఇప్పటికే జీవన్ముక్తస్థితి పొంది ఉన్నావు. ఆకాశమువలె అత్యంత నిర్మలుడవు, శాంతి మొదలైన పవిత్రవృత్తులచే అలంకృతుడవు అయున్నావు. తురీయమునందే ఈ దేహస్థితిని పొంది ఉన్నావు. స్థూల సూక్ష్మములను పరిత్యజించి ఆకాశమువలె శూన్యుడు కాగలవానికే అట్టి సుషుప్తమౌనం లేక జీవన్ముక్తి ఏర్పడి ఉంటోంది. నీయందు అట్టి లక్షణములు స్వతఃసిద్ధంగా ఉండనే ఉన్నాయి. కాబట్టి నిస్సంశయుడవై, నిర్వికారుడవై, నిర్విచారముగా ప్రకాశించుము. ‘ఓం’ అను సంజ్ఞచే చెప్పబడిన శబ్దార్థమును గ్రహించినవాడవై సంసారవాసనాశూన్యుడవై తురీయపదమునే అధిష్ఠించి ఉండుము. లీలామాత్రంగా నీవు నిర్వహించ వలసి వస్తున్నవాటియందు పాల్గొనుము. ‘ఈ దృశ్యము ఇట్లున్నదేమిటి?’ అనునదంతా కూడా కేవలం అంతరానుభూతమగు స్వప్నమువంటిది. ఈ సత్యమును గ్రహించి చిదాకాశకళ యందు చ్యుతిరహితుడవై వెలయుము.

  1. ప్రాణ-మనోసంయోగం

శ్రీరాముడు: గురువర్యా! మీరు భిక్షుకోపాఖ్యానం ప్రవచించేటప్పుడు శతరుద్రీయం (100 మంది రుద్రులు) అనుదానిలో నూరవవాడు రుద్రుడు అగుచున్నాడా? లేక గణముల కంటే వేరుగా రుద్రుడు ఒకడు ఉన్నాడా? అనగా రుద్రుడు తదితర జన్మలన్నిటికీ యజమాని, లేక, అధిపతా? లేక అతడు కూడా వంద జన్మలలోని ఒకడా? ఎందుకంటే మీరు ఒకచోట రుద్రుడు - రుద్రగణం అని అన్నారు. మరొకచోట ఆ ‘వందమంది రుద్రులు’… అని ప్రయోగించారు.

Page:264

శ్రీవసిష్ఠ మహర్షి: భిక్షుకుడు గాంచిన నూఱు స్వప్నములే నూఱు విధములైన శరీరములు గ్రహించటం జరిగిందని చెప్పుకున్నాం కదా! ఆ స్వప్నశతమూర్తులే… ఈశ్వరుని (ముఖ్యరుద్రుని) పరిచారకులు అని చెప్పునపుడు ‘గణములు’ అని అనబడినది. ఐశ్వర్య-సామ్యములను పరిగణించినప్పుడు ’శత రుద్రులు’ అని చెప్పబడినది.

‘శతరుద్రులు’ అని చెప్పబడినది - - రుద్రుని యందు, రుద్రగణం నందు (లేక) శతరుద్రులందు ఆ భిక్షుకుని చైతన్యమే సమముగా విస్తరించి ఉండటం చేతనే.

శ్రీరాముడు: తండ్రీ! ఒక దీపం నుండి అనేక దీపములు వెలిగించినట్లుగా ఆ భిక్షుకుని చిత్తం 100 చిత్తములను కల్పించిందా? ఒకే చిత్తము నుండి అనేక చిత్తములు ఎట్లా కల్పించబడినాయి? శ్రీవసిష్ఠ మహర్షి: ఆ భిక్షుకుడు మాయావరణము లేనివాడు. జ్ఞాని. జ్ఞానైశ్వర్యం కలిగి, మాయావరణం లేనట్టి మహనీయులు ఒకానొక ప్రతిభాసాసంపద కలిగి ఉంటారు. వారు ఏ కల్పన చేయాలను కుంటారో అట్టిది మాయ యందు ప్రతిబింబితమై, అది తదితర జగత్ కల్పన లాగానే వ్యవహార యోగ్యమై భాసిస్తుంది.

ఎందుచేతనంటావా? వారు జ్ఞానబలం చేత “సర్వాత్మకత్వం, సర్వవ్యాపకత్వం” అవధరించి ఉంటారు కాదా ! అందుచేత ఈ బ్రహ్మానుభవులు - సర్వజ్ఞమగు బుద్ధిచే ఏది భావన చేస్తే అది ఈ తీరుగానే ఏర్పడుచూ ప్రాప్తిస్తూ, పరిఢవిస్తూ ఉంటుంది.

శ్రీరాముడు: మహార్షీ! అట్టి జ్ఞానైశ్వర్యము, సత్యసంకల్పము, సర్వాత్మకత్వము అవధరించిన ఆ రుద్రభగవానుడు (కపాలియగు శివుడు) మెడలో కపాలమాలిక ధరించి, ఒళ్ళంతా బూడిద పూసుకుని దిగంబరుడై, శ్మశానవాసి అయి, కాముకుడై ఎందుకు ఉంటున్నాడు. అతడు జ్ఞానైశ్వర్యం కలిగి ఉండి, మాయావరణారహితుడై ఉండి కూడా అట్లు ప్రవర్తిస్తున్నాడేమిటి? మరొక ప్రశ్న. అట్టి జ్ఞానైశ్వర్య పరిపూర్ణులు శాస్త్రాలు వచించే నియమ-నిష్ఠల పట్ల ఎట్టి ఉద్దేశం - ప్రతిస్పందన కలిగి ఉంటారు? శ్రీవసిష్ఠ మహర్షి: సిద్ధిని పొంది, జీవన్ముక్తులై, పరమైశ్వర్యము పొందియున్న మహనీయులు తమ దేహములను శాస్త్రీయ క్రియలందు గాని, భౌతికభోగ ఐశ్వర్యములందు సామాన్యంగా సానుకూల్యత వహించి ఉంటారు. అయితే, వారు "సాంఘికమైన తదితరమైన నియమనిబంధనలకు బద్దులై ఉంటేనే జాన సిద్ధిని పొందినట్లు అని వ్యాఖ్యానించటానికికూడా కుదురునది కదా!

వారు వేదవిధులకు దాసులు కారు. శాస్త్రములు అజ్ఞానులను ఉద్ధరించటానికే విధి విధానాలు ప్రతిపాదిస్తున్నాయి. సుజ్ఞానికి శాస్త్రములు క్రొత్తగా నియమించి చెప్పవలసినదేదీ ఉండదు. అందుచేత అజ్ఞానులకు శుభకరాలుగా తోచే శాస్త్రీయ - లౌకిక కామ్యకర్మాదులు ఆత్మజ్ఞులగు జ్ఞానశీలురకు ఆవశ్యకమని గాని-అనావశ్యకమని గాని అనిపించకపోవచ్చు. ఎందుకంటే వారికి ప్రారబ్ధం యొక్క ఉనికియే ఉండదు. కనుక సామాన్యులకు దుఃఖకరాలుగా తోచే విషయాలు విజ్ఞానులకు అత్యంత సామాన్యమైన విషయాలుగా ఉంటాయి.

క్రియ - నియమము మొదలైనవన్నీ అజ్ఞానుల కొరకే కల్పించబడ్డాయి. ఎందుచేత వారి చిత్తము రాగద్వేషములతో కూడిన వేలాది విషయములతో అనుసంధానమై, ఖండఖండములుగా

Page:265

ఉండి ఉంటుంది కనుక. అంతేకాదు. ఈ సంసారజీవులలో అనేకులు ‘పెద్ద చేప చిన్న చేపను హింసించటం సమంజసమే’ అను మత్స్యన్యాయముతో కూడిన కుత్సిత - పాపదృష్టులు కలిగి ఉంటున్నారు. వారికి సమరసమగు ఆత్మ యొక్క సమాచారమే తెలియదు. కనుక క్రియ - నియమాలు, చెయ్యవలసినవి - చెయ్యకూడనివి, సవ్య - అపసవ్యముల నిర్దేశము ఎంతో ఆవశ్యకము.

‘ఇవి చేస్తే శుభప్రదం. అవి చేయకుంటే అశుభం. ఇవి చేశారో దుఃఖితులౌతారు’ అని ప్రవచిస్తూ సంసారజీవుల ఇష్టానిష్టములను శాస్త్రకారులు నియమం చేస్తున్నారు. అదంతా అత్యంత అవసరం. అయితే, జీవన్ముక్తులగు ప్రాజ్ఞులు ఇష్ట - అయిష్ట విషయములందు చిక్కుకొని ఉండరు. వారు జితేంద్రియులై వాసనాపథమును అతిక్రమించి ఉంటారు. అందుచేత వారు ‘ఇది ఇట్లా ఉండాలి… అది అట్లు ఉండకూడదు’ అని కోరుకోకుండానే ప్రవాహపతితమై సందర్భమౌతున్న కార్యములను కాకతాళీయ న్యాయమును అనుసరించి ఆచరించుచున్నారు.

కాకతాళీయవద్రూఢాం క్రియాం కుర్వన్తి తే సదా

న కుర్తస్త్వపి వై కించిన్నైషాం క్వచిదపి గ్రహః ॥

క్రియలు నిర్వర్తించినా, లేక నిర్వర్తించకపోయినా వాటన్నింటి యందు వారికి కించిత్ కూడా ఆసక్తి ఉండదు. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు కూడా ఇట్లాగే కాకతాళీయ న్యాయమును అనుసరించి మనుష్యాది జన్మలు స్వీకరించి కార్యములను ఆచరించుచున్నారు.

న నిన్ద్యమస్తి నానిన్ద్యమ్, నోపాదేయమ్, న హేయతా,

న చ ఆత్మీయం, న చ పరం, కర్మ జ్ఞవిషయం క్వచిత్ II

జీవన్ముక్తులగు ఆయా సిద్ధ పురుషులకు నింద్య - అనింద్యములు గాని, గ్రాహ్య - త్యాజ్యములు గాని, స్వ - పర భేదములు గాని ఉండవు. వారిని బంధించగలిగిన కర్మ ఈ భూనభోంతరాలలో ఏదీ లేదు. సృష్టి యొక్క ప్రారంభం నుండి అగ్నికి ఉష్ణము, జలమునకు రుచి - ప్రవాహ స్వభావం మొదలైనవి ఏర్పడియే ఉంటున్నట్లు ఆ ఈశ్వరేచ్ఛను అనుసరించి హరి-హరాది క్రియలు, బ్రాహ్మణ -క్షత్రియాది ధర్మములు లోకంలో వెల్లివిరుస్తున్నాయి.

శ్రీరాముడు: అయితే మహర్షీ! అగ్నికి ఉష్ణము స్వభావసిద్ధమే అయినట్లు అజ్ఞానులకు అజ్ఞానం కూడా స్వభావసిద్ధమేనని అనవచ్చునా ? వారి ఆచరణలు కూడా ఈశ్వరేచ్చేనని తలచవచ్చునా ? శ్రీవసిష్ఠ మహర్షి : కాదు. ఈ అజ్ఞానం సృష్ట్యాది నుండి అభివ్యక్తమైనది కాదు. ఈ జీవుడు అజ్ఞానవిభాగ సంకేతములను అనుసరించి ఐహిక - - పారలౌకిక సుఖ దుఃఖములను కలిగించు స్త్రీ-ధన-జన వ్యవహారములను అన్వయించుకొని అనుసరిస్తున్నాడు. అనగా తన సుఖ దుఃఖములు తానే నిర్వచించుకుంటున్నాడు. అట్టి నిర్వచనముల వెనుక ఉన్న అభ్యాసపూర్వకమైన అజ్ఞానమును తొలగించటానికి ధ్యాన, దాన, పూజాది కార్యక్రమములతో కూడిన విధివిధానములను శాస్త్రములు జనులకు ప్రతిపాదిస్తున్నాయి. సాధనాక్రమము ననుసరించి మనస్సు శుద్ధమగుచుండగా ఈ జీవుడు పవిత్రుడు కాగలడు. ఆత్మత్వమే ఈ జీవుని స్వతః సిద్ధస్వభావంగాని విషయత్వం కాదు. విధ్యుక్తము

Page:266

- - ప్రవాహపతితము అగుచున్నదంతా ఈశ్వరేచ్ఛ అని, ఆసక్త-అనాసక్త, సుఖ-దుఃఖ, హేయఉపాధేయ భావనలంతా అజ్ఞాన కల్పితములని ఎఱుగువాడు సులభంగా ముక్తుడగుచున్నాడు.

  1. విదేహముక్తి - మౌనము

శ్రీరాముడు : మహాత్మా ! శరీరియగు జీవుని యందు ప్రసిద్ధమై ఉండే 4 విధాలైన మౌనాల గురించి వివరించి చెప్పారు. అట్లాగే ’విదేహముక్తి - మౌనము” ల గురించి కూడా చెప్పమని అర్థిస్తున్నాను. శ్రీవసిష్ఠ మహర్షి: ‘విదేహముక్తి’ అనునది ఆకాశం కంటే కూడా అత్యంత నిర్మలమైన చిన్మయాత్మాకాశం. “దేహాదులచే గాని, అహంకారాదులచే గాని పరిమితం కాబడనట్టి దృశ్యస్వరూపుడను నేను” … అని స్వస్వరూపావగాహనకు సంబంధించినది అది. అదియే పరమశ్రేయం, పరం, మోక్షం కూడా. అద్దాని గురించి కూడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. విను.

విచ్ఛిన్న రహితము - విషయరహితము అగు సమాధి యొక్క అభ్యాసం వలనను, వివేక విచారణలతో కూడిన జ్ఞానయోగముననూ “సంపూర్ణ జ్ఞానము” పొందినవారున్నారు. వారిని ‘సాంఖ్య యోగులు’ అని శాస్త్రకారులు పిలుస్తున్నారు.

మనం ఇతఃపూర్వం చెప్పుకున్న ‘హఠయోగం’ అభ్యసిస్తూ, తద్వారా ప్రాణాదులను నిరోధించి క్రమంగా అనామయము, ఆద్యంతరహితము అగు పదమును అధిరోహించేవారు కూడా ఉన్నారు. వారిని “హఠయోగయోగులు’ అని పిలుస్తారు. సర్వ కర్మ ఫల సమర్పణ చేయువారు “కర్మయోగులు”. ఈ సాంఖ్యయోగులు, యోగయోగులు… ఇద్దరూ కూడా యోగసాధన ద్వారా పొందాలనుకోతగినది శాంతము-అకృత్రిమము అగు పరమపదమే ! కొందరు కేవలం వివేక - విచారణములతో కూడిన ‘సాంఖ్యము’ ద్వారా మరికొందరు ‘సర్వకర్మఫలత్యాగం’ అను కర్మయోగము వలన, ఇంకొందరు క్రియాయోగ-ధ్యానాల సమాయంచే ఈ జన్మయందే ఆ పరమపదం పొందుచున్నారు. వారు తమ మనోబుద్ధులను సర్వ నియామకుడగు ఆ పరమేశ్వరునికి సాంగపూర్వకంగా సమర్చించి తాము సర్వరహితత్వము సంపాదించుకుంటున్నారు.

అయితే సాంఖ్యము - యోగము ఒక్కటే. ఆ ఆ రెండిటిలోనూ అంతర్లీనమై అనుస్యూతంగా ఉన్నది ‘సర్వత్యాగ ఋద్ధియే’… అని ఎవరు గ్రహిస్తారో వారే తత్వాన్ని ఎరిగినవారు ఎందుకంటే సాంఖ్యులు తమ వివేక-విచారణ ద్వారా, యోగులు తమ కర్మఫల సమర్పణ ద్వారా చేరే ఆద్యస్థానం ఒక్కటే. ఎక్కడ ప్రాణము యొక్క వృత్తులు కూడా విషయమే కావో, ఎక్కడ వాసనాజాలం - జన్మకర్మలు అతిక్రమించబడియున్నవో… అట్టి అనుభవైకవేద్య స్థానమే ‘పరమపదము’ అని గ్రహించు.

నాయనా! వాసనలనే చిత్తము అని అంటాం. అదియే ఈ సంసారమునకు మూల కారణం. ఈ సంసారమునకు వాసనలకు వేరైన మరొక కారణమేదీ లేదు. వాసనలే సంకల్ప పరంపరలను

Page:267

ఉత్పత్తి చేస్తోంది. సంకల్పాలు ఏదో విధంగా సన్నగిల్లితే వాసనలూ సన్నగిల్లుతాయి. దానితో పాటు ఈ సంసారం సన్నగిల్లుతుంది. అట్టి వాసనలు నే చెప్పిన సాంఖ్యం-యోగం రెండిటిలోనూ విలయం పొందుతాయి. రెండిటిలో గల ప్రయత్నం తత్త్వజ్ఞానానుభవ రూపంగా మార్చబడుచుండగా ఇక ఈ సంసారం తన యొక్క కారణత్వం కోల్పోతుంది.

బాలుడు ’బేతాళం (దయ్యం) అను దానిని కల్పించుకుని చూస్తూ ఉంటాడు చూచావా? ఈ మనస్సే శరీరాన్ని ఆత్మగా గాంచుచున్నది. ఇట్లా గాంచుటయే సంసారం కనుక సంసారానికి కారణం మనస్సే. ఎప్పుడైతే ఈ మనస్సు ఆత్మజ్ఞానంచే నింపబడి పునీతమౌతుందో… మరుక్షణం దీనికి శరీరమే కనిపించదు. మనస్సు శాంతించిందా, సంసారం స్వభావ సిద్ధంగానే ఉపశమిస్తోంది. దేహాలు నిర్విషయమై ఉండటమే విదేహముక్తి లక్షణం.

మనస్సు శాంతించాలంటే ఆత్మదర్శనం తప్పితే వేరే ఉపాయం లేదు. నిద్రించే వానికే స్వప్నం. అసత్యమైన స్వప్నంలో "నేను మరణించాను” అను స్వప్న రూపమైన స్వమరణం కలగటం కూడా జరుగునట్లు ఆత్మదర్శనం ఒనర్చనివానికే మనస్సు ఉత్పన్నమౌతోంది. స్వప్నంలో చూచిన స్వమరణం నిదుర లేవగానే ఉండదు కదా ! ఆత్మ దర్శనమైన తరువాత ఆ మనస్సుకు ఏమౌతుందో ఏమీ చెప్పలేం సంసారదృష్టిని కలుగజేస్తున్న మనస్సు జ్ఞానంచే చంచలరహితం అగుచుండగా అప్పుడు మాత్రమే నేను చేస్తున్న ఈ ఆత్మబోధ హృదయంలో ప్రవేశించగలుగుతుంది అప్పుడిక బంధ-మోక్షముల ఛాయలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి.

సాధనాత్రయం -

  1. దృఢమగు ఏకత్వము యొక్క అభ్యాసం. (భిన్నత్వంలో ఏకత్వం సందర్శించటం.) 2. ప్రాణనిరోధం (రేచక-కుంభక-పూరకములవంటి ప్రాణయోగోపాసనలను అభ్యసించటం) 3. మనోనిగ్రహం (ఇంద్రియ విషయాలను మననం చేయక, వాటికి అతీతత్వం వహించటం

అభ్యసించటం

…ఈ మూడిటినీ మోక్ష కారణమగు ’ సాధనాత్రయం’ అని అంటూ ఉంటారు. ఇదియే సర్వ శాస్త్రముల తాత్పర్యం.

880

శ్రీరాముడు : మునీంద్రా! మధ్యమాధికారి అనుసరిస్తూ ఉండే ప్రాణవిలయం మోక్షమునకు కారణం అగుచున్నదని అంటున్నారు కదా ! మరణ సమయంలో కూడా ఈ జీవుని విషయంలో ప్రాణాలు నిరోధించబడుచున్నాయి. మరి, అందుచేత మృతి అనునది కూడా మోక్షార్హత కలిగించగలదని అనవచ్చునా?

శ్రీవసిష్ఠ మహర్షి: 1. ప్రాణ నిరోధము, 2. సాంఖ్యము, 3. కర్మయోగము… ఈ మూడు ఉపాయాలు పరిలక్షితమైనది మనోనిరోధం వైపునకే. మనో నిరోధమే శ్రేష్టాతిశ్రేష్ఠం. అది ఏ ఉపాయం చేతనైనా సరే… ఎంత త్వరితంగా లభిస్తే అంతమంచిది.

Page:268

ఇక మరణం విషయానికి వద్దాం. ఒకడు మరణించినంత మాత్రం చేత అతని మనః ప్రాణములు ఆతనిని విడచివేయవు.

దృష్టాంతానికి ఒకడు మూర్ఛిల్లినాడనుకో, లేక గాఢంగా నిద్రిస్తున్నాడనుకో. అంతమాత్రం చేత ఆతని కోరికలు, ఆశలు, శంకలు, వృత్తులు నశించుచున్నాయా?… లేదు. అవి నీటియందు కరిగిన ఉప్పు వలె వాసనా రూపమున వెలయుచున్నాయి. అట్లాగే ఒకడి ఈ భౌతిక శరీరం మరణించినంత మాత్రంచేత మనోలయం గాని, వాసనావిలయం గాని జరుగుటలేదు. ఆ దేహి మరల మరొక దేహంతో ప్రత్యక్షమైన (లేక) ఆవిర్భవించిన మరుక్షణం ఆ వాసనలు మరల ప్రకోపిస్తు న్నాయి. మరణకాలంలో ప్రాణాలు ఈ భౌతిక దేహాన్ని త్యజిస్తున్నాయి. ఇంతలోనే వాసన - - కామ్య కర్మలచే ఉపస్థాపితమైన భవిష్యత్ దేహాకారమును అనుభూత మొనర్చుకొనుచున్నాయి. బాహ్యాకాశంలో తదనుకూలమైన తన్మాత్ర సమన్వితమైన అనుభూతులను ఆశ్రయించి అనుభవమును కొనసాగిస్తున్నాయి

ఈ భూతతన్మాత్రలు వాసనాత్మకములే గాని మరింకేమీ కాదని గ్రహించు. ఈ వాసనలు తదనుకూలమైన మనోప్రాణములనే ఆశ్రయించుకొని ఉంటాయి. తదితరమైన మనోప్రాణాలను ఈ భూతతన్మాత్రలు తాకజాలవు. ఈ విషయములు వేదములచే చెప్పబడి ఉండటమే కాదు… యుక్తి చేత కూడా గ్రహించవచ్చు. ఈ జీవుని విషయంలో ప్రాణములు భవిష్యత్ దేహవాసనలతో కూడియే పూర్వదేహమును పరిత్యజించుచున్నాయి. అందుచేత తరువాతి దేహముకూడా వాసనల వలననే ఉత్పన్నమగుచున్నది. ‘వాసనలు’ అనగా సంకల్ప పరంపరల ఉత్పత్తి స్థానమే కదా!

పుష్పములలోని సుగంధమే నువ్వులలో ప్రవేశిస్తోంది. ఆ నువ్వులు గానుగయందు నలుపబడుట అను క్లేశము ననుభవించి నూనెగా పరిణమిస్తోంది. అట్లాగే శరీరమునందున్న హృదయాకాశము తోడను, తదంతర్గతమగు ప్రసరణ స్వభావం గల వాయువుల తోడను కలసి ఈ మనస్సు క్లేశములు పొందుచున్నది. అందుచేత ‘మృతి చెందిన వెంటనే ప్రాణములు నిరోధం పొందుతాయి’… అని నీవు అన్నది యుక్తియుక్తం కాదు. జలముతో నిండిన ఒక కుండను తటాకంలో ముంచినంత మాత్రంచేత ఆ కుండలో జలం నశించిందని అనటానికి వీలు లేదు కదా! వాసనాసమన్వితమైన ఈ మనస్సు కూడా అదృశ్యమైపోయేది కాదు. మరణమాత్రం చేత మనస్సు నశించదు. ప్రాణములు నశించవు. ప్రాణములు వర్తమాన భౌతిక దేహమును మాత్రం త్యజిస్తున్నాయి. కిరణరహితుడైన సూర్యుడు ఉండజాలడు కదా! అట్లాగే మనోరహితమైన ప్రాణాలు ఉండజాలవు. అంతేకాదు. తిత్తిరిపక్షి నోట కరచిన గడ్డిపరకను ఉచితాహారం కనబడేవరకు పట్టుకునే ఉంటుంది. మనస్సునందు జ్ఞానోదయం అయిందా, ఇక ఆ మనస్సు వాసనాశూన్యమై తనకు కారణమైయున్న స్వస్వరూపమునందు విలయం పొందుచున్నది. అప్పుడిక మనస్సు, ప్రాణం స్పందనాభావం పొందకుండా ఉంటాయి. అట్లు మనస్సు స్పందనాభావం మానివేస్తే ఇక మిగిలేదేమిటి? కేవలం అఖండశాంతియే. కాబట్టి రామా! జ్ఞానం యొక్క శక్తి వలననే నీ దృష్టిలో ఈ పదార్థముల యొక్క అస్థిత్వం తొలగిపోవుచున్నది. అప్పుడు ప్రాణం - చిత్తం కూడా ప్రశాంతిస్తున్నాయి. ప్రశాంతి పొందిన మనస్సు దేహభావాన్ని ధరింపదు.

Page:269

ఏ వాసనలైతే నాశనం కాగా, పరమపదము లభిస్తుందో … అట్టి వాసనలనే మనం ‘మనస్సు’ అని వర్తమానంలో అంటున్నాం. వాసనలే చిత్తము కూడా. అవి లేకుండుటే పరమపదము. జ్ఞానం ఉదయిస్తే అప్పుడు అది వాసనతో కూడిన అన్నిటినీ తిరస్కరించి వేస్తుంది. ఆ జ్ఞానమే ఆత్మతత్త్వముగా పరిణతి పొందుతోంది. ఆత్మతత్త్వము విక్షేపరహిత అనుభవ స్వరూపంగా వెలయుచున్నది. ఈ విషయమునే అనుభవిష్ణులగువారు వేద - ఉపనిషత్ల రూపమున, మరెన్నో శాస్త్ర సిద్ధాంతముల రూపమున స్వస్వరూపాత్మజ్ఞానమును లోకమునకు చాటుచున్నారు.

త్రాడును చూచి ‘పాము’ అని భ్రమించువాడు ‘అది త్రాడే’ అని తెలియగానే సర్వవికారములు త్యజించివేస్తాడు కదా! ఈ దృశ్య జగత్పట్ల ఈ జీవునకు ఏర్పడి ఉంటున్న ఆశ - ఆవేశరూపములైన సంసారము వివేకము చేతనే స్వయంగా నశించగలదు. 1. ఏకత్వాభ్యాసము 2. ప్రాణ నిరోధము 3.మనోలయములలో… ఏ ఒక్కటి సిద్ధించినా సరే, తక్కినవన్నీ స్వాభావికంగానే సిద్ధించగలవు. విసనకఱ్ఱ వీచటం ఆగిపోతే, అట్టి వీచుట వలన కలిగే వస్తువుల కదలికలు కూడా ఆగిపోతాయి కదా! ప్రాణవాయుస్పందన నిర్వృత్తం కాగా మనస్సుచే పొందబడే విషయాలు కూడా సశాంతిస్తాయి.

‘మృత్యువు’ విషయమై మనం కొన్ని విషయాలు ఇక్కడ మననం చేసుకుందాం. ఈ దేహి దేహమును వహించటం మనందరి పట్లా చూస్తున్నాం కదా! అన్నపానాదులచే ప్రవృద్ధమగుచున్న ఈ దేహం వ్యాధుల ప్రబలత్వం చేతనో, వార్ధక్యం చేతనో, యుద్ధము నందు ఖండింపబడటంచేతనో, ఏవైనా ఆకస్మిక సంఘటనల వలననో ఒక రోజున నిరుపయోగ స్థితి పొందుతోంది. శరీరం పతనం కాగానే ఇంతకాలం ఈ శరీరమును ఉత్తేజపరుస్తూ కార్యోన్ముఖం చేస్తున్న ప్రాణవాయువులు ఈ శరీరమును విడచి బాహ్యాకాశమునందలి వాయువుతో లీనమగుచున్నాయి. మనస్సు ప్రాణములను అనుసరిస్తున్నది. నేలకూలి నిరుపయోగమై ఉన్న ఆ జీవుని భౌతిక దేహాన్ని బంధువులు త్యజిస్తున్నారు. ఆతని బంధువులకు తదితరులకు ఆతడు జ్ఞాపకమాత్రుడు అగుచున్నాడు.

ఇక, ఆ మరణించిన జీవుని విషయానికి వద్దాం. ఆతని ఒక విభాగమగు పాంచభౌతిక దేహం నేలకూలింది కదా! ఇంకా ఆతనికి రెండు దేహాలు ఉన్నాయి.

  1. మానసిక దేహం (సూక్ష్మదేహం, ఆతివాహికదేహం); 2. చిత్ దేహం (కారణదేహం) ఈ భౌతికదేహం త్యజించిన ఆ జీవుడు అప్పుడే, అచ్చటే తన వాసనలను అనుసరించి స్వకీయ కల్పనారూపమైన సమస్త ప్రపంచాన్ని గాంచుచున్నాడు. ప్రతిజీవుని యొక్క వర్తమాన దృశ్య ప్రపంచ దర్శనం కూడా అటువంటిదే!

మొదటి ఉపాయం : ప్రాణ, మనోనిశ్చలాభ్యాసం - ఇక ప్రాణవాయువుల విషయమంటావా? ఈ జీవులందరి ప్రాణవాయువులు కర్మల చేత శరీరములను విడిచి, మరల కర్మల చేతనే ఆకాశమున ఉద్భవిస్తున్నాయి. ఈ విధంగా జీవులకు ప్రాణవాయువులతో సంయోగ - వియోగములు నిరంతరం ఏర్పడుచున్నాయి. ఈ జీవులు వాసనామయాలై శరీరం ఉన్నప్పుడు - శరీరం లేనప్పుడు కూడా వాసనామయమగు సుర నర పశ్వాది దేహాలను గాంచుచున్నారు. ఈ జీవుడు అతను ఆశ్రయించే ఉపాధిని అనుసరించే ఆచార - వ్యవహారములు పరిరక్షించుకొనుచున్నాడు.

Page:270

గాలివీచటం ఆగిపోయినప్పుడు పుష్పములందు గల సుగంధం కట్టుబడిపోతుంది కదా! అట్లాగే మనస్సు యొక్క స్పందనము శాంతిస్తే ప్రాణవాయువుల చలనము కూడా కట్టుబడిపోతుంది.

ఈ జీవుని ప్రాణం - చిత్తం … ఇవి వేరుగా ఉండజాలవు. నువ్వులు - - నూనె, పుష్పములు - సువాసన, ప్రాణము మనస్సు …ఇవి కలిసియే ఉంటాయి కదా!

మనస్సు యొక్క స్పందనయే ప్రాణము… ప్రాణము యొక్క స్పందనయే మనస్సు.

ఇవి రెండూ రథికుడు - - సారథివలె కలిసియే విహరిస్తున్నాయి. అగ్నికి ఉష్ణమునకు పరస్పరం ఆధార ఆధేయ సంబంధం ఉంటోంది కదా! అట్లాగే, మనస్సు - ప్రాణములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ప్రదర్శితమగుచున్నాయి. అవి పరస్పరం లయం పొందినప్పుడు మోక్షము అను ఉత్తమ కార్యమును (నిశ్చలస్థితిని - స్థానమును) సంపాదించుకుంటున్నాయి.

ఏకతత్త్వ ఘనాభ్యాసాచ్ఛానం శామ్యత్యలం మనః తల్లీనత్వాత్ స్వభావస్య, తేన ప్రాణో పి శామ్యతి ॥

మనస్సు పూర్ణంగా శమించటం అనేది ఏకత్వం యొక్క దృఢాభ్యాసం వల్ల సుసాధ్యపడుతుంది. అప్పుడు మనస్సు యొక్క అంతర్గతమైన ప్రాణాలు కూడా మనస్సుతో పాటే శమించుచున్నాయి. అంతేగాని శరీరం నిరుపయోగమైనంత మాత్రంచేత (దేహం మరణించినంత మాత్రంచేత) ప్రాణాలు శమించటం లేదని గుర్తు చేస్తున్నాను.

విచార్యయత్ అనన్తాత్మతత్త్వం, తన్మయతాం నయ మనస్తత స్తల్లయేన తదేవ భవతి స్థిరమ్ ॥

ఓ రామచంద్రా! నీవు తత్త్వ విచారణను ఆశ్రయించు. అనంతమగు ఆత్మతత్త్వమునందు నీ మనస్సు తన్మయమయేట్లు చేయి. ఆత్మతత్త్వమునందు లయమొందిన మనస్సు ఆత్మయే అవుతుంది. అప్పుడది తన చంచలత్వం త్యజించి అకృత్రిమమైన స్థిరత్వం పొందుతుంది. అప్పుడు ప్రాణాలతో బంధం సంశాంతిస్తుంది. లేదా…

యదేవాతితరాం శ్రేయో, అనుపలమ్భో, ఉపలమ్భయోః, ద్వయోరప్యసతోస్తత్ర శేషేవాపి స్థిరోభవ I

రెండవ ఉపాయము - ఉపలంభము (perception) అనుపలంభము (Non-perception) అను రెండింటి పట్ల కూడా ఏది నిర్వికారమై సర్వ విషయాతీతమై ఉన్నదో, అట్టి శ్రేయోదాయకమునందు ప్రాణమనస్సులను ధారణమొనర్చి నీవు స్థిరుడవు కమ్ము. ఈ విధంగా తత్త్వభావనావృత్తి కూడా చరమ సాక్షాత్కారము వలన వినష్టమై ఆభావత్వము పొందనంత వరకు నీవు నీ అభ్యాసమును కొనసాగిస్తూనే ఉండు. “నాతో సహా ఈ సర్వము ఆత్మ యొక్క సంప్రదర్శనమే! విన్యాసమే!”… అనునదే తత్వభావనావృత్తి.

ఆహారం లేకపోతే ఈ శరీరం క్షీణిస్తూ ఉంటుంది కదా! అట్లాగే విషయములకు సంబంధించిన సంచయము సన్నగిల్లుతూ ఉంటే మనస్సు సన్నగిల్లుతూ ఉంటుంది. అట్టి మనోరాహిత్యం అత్యంత

Page:271

శుభప్రదం. ప్రత్యాహారపరాయణులు క్రమక్రమంగా నిర్వికల్ప సమాధియందు తమ మనః ప్రాణాలను విలయం చేస్తున్నారు. అప్పుడిక పరమవస్తువు ఒక్కటే శేషిస్తుంది. ధారణాదుల వలన మనస్సు ఏకాగ్రమగుచుండగా ఇక అది బాహ్యవికారములను వీడి ధ్యానలక్ష్యమగు ఏకత్వం సంతరించుకో గలదు. అభ్యాసవశం చేత సర్వత్రా సమదర్శనం సుసాధ్యమేనని నేను అందరికీ మనవి చేస్తున్నాను. అందుచేత ఏకత్వము అను లక్ష్యశుద్ధితో సాధన కొనసాగించవలసినదిగా సాధకులకు నా విన్నపం.

ఓ రామా! అవిద్య యొక్క రూపమే ద్వైతం. అవిద్య అనునది లేని వస్తువై ఉన్నది. నీ స్వరూపమే అగు పరతత్త్వం ఆత్మజ్ఞానం వలననే సంప్రాప్తిస్తోంది. కనుక శాస్త్రీయ యుక్తియుక్తములను గ్రహించిన బుద్ధితో ధారణ - ధ్యానాల ద్వారా జ్ఞానాన్ని జనులు అభ్యసించెదరు గాక! శరత్కాల మేఘం తొలగగానే, ఆ మేఘం నుండి కురుస్తున్న మంచు కూడా తొలగిపోతుంది కదా! సూర్యప్రకాశం అధికమగుచుండగా ‘చలి’ క్రమంగా దానంతట అదే తొలగుచున్నది. మనస్సు శాంతిస్తూ ఉంటే అద్దాని ‘వికార మృగతృష్ణ’ యగు ఈ సంసారచపలత్వం దానంతట అదే ఉపశమిస్తుంది.

చిత్తమే అవిద్య అని అనుకున్నాం కదా! … అందుచేత నీవు తత్త్వ విచారణను ఎల్లప్పుడూ ఆశ్రయించు. మనస్సును బ్రహ్మాంకితం చేయి. పరిణతి పొందిన మనోవిభాగం మాత్రమే చంచల విభాగమైన మనస్సును నిరోధించగలుగుతుంది. మనస్సు కొద్ది క్షణములైనా పరమపదము నందు విశ్రాంతి పొందుతూ ఉండటం అభ్యసిస్తూ ఉంటే, క్రమంగా బ్రహ్మాకార నిరతి తప్పక లభించగలదు. నిరతిశయమగు ఆనందరసాస్వాదనం పొందుచున్న మనస్సు విషయములను ఇచ్చగించమన్నా ఇచ్ఛగించదు. నీవు సాంఖ్యం ఆశ్రయిస్తావా? లేక, యోగం ఆశ్రయిస్తావా? కాక, ఆ రెండూ ఆశ్రయిస్తావా? అది నీ ఇష్టం. మొత్తం మీద మనస్సు బ్రహ్మాకారం పొందాలనే పరిలక్ష్యమును కలిగి ఉండు. అద్దానిని ఏమరవకు. మంచినీటి సరస్సులో స్నానం చేసి వచ్చేవాడు దోవలో కనబడే మురికిగుంటను చూచి ఆకర్షితుడౌతాడా? బ్రహ్మాభ్యాసం చేసేవానికి ఇక మనస్సు ఆత్మతత్త్వమే పొందుతుంది కాని విషయత్వం కాదు.

ఏ చిత్తంలో అవిద్య తొలగుతుందో, దానినే జ్ఞానులు సత్వము అని పిలుస్తున్నారు. ఆ సత్వం సంసారబీజాన్ని దగ్ధం చేసి, ఇక ఆ బీజం యొక్క పునరుత్పాదన స్వభావాన్ని వినష్టం చేసివేయగలదు. అట్టి సత్వం ఉదయించిందా, …ఇక బ్రహ్మభావం నుండి చ్యుతి ఉండదు. ఆతనిలో అవిద్య, వాసనా బీజం స్వయంగా విచ్ఛిన్నములగుచున్నాయి. అట్టిది అజ్ఞులకు అసంభవమేమో అని అనిపిస్తోంది. కాని సాధన - ప్రయత్నం ఉన్నవారికి మార్గం - లక్ష్యం సులభసాధ్యమేనని ప్రకటిస్తున్నాను. నేను చెప్పిన త్రివిధ ఉపాయాలు ఆశ్రయించుటచే పొందబడు జీవన్ముక్తి స్థితియందు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనబడే మూడు అవస్థలు, భ్రాంతి, ఆ భ్రాంతి యొక్క బీజాలు, మనస్సు కూడా లయించగలవు. అప్పుడు దగ్ధమైన వస్త్రంలాగా సత్వము మాత్రమే మిగులుతుంది. ఇక అద్దానియందు సంసారకారణములైన రాగద్వేషములు ఏర్పడజాలవు. అట్టి సత్వమాత్రశేష్యమే విదేహముక్తి.