CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:272

VII. బేతాళ ప్రశ్నలు

  1. ఆరు ప్రశ్నలు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! తత్త్వ విచారణచే జ్ఞానసముపార్జన అత్యంతావశ్యకం. జ్ఞానోత్పత్తి అయిన తరువాత ’ఇది జీవుడు - ఇది చిత్తము’ అను కల్పనలు ఇక మిగలవు.

విచారణ చేయటమే అవిద్యోపశమనమునకు ఉపాయం. ఎందుకంటే అవిద్యకు మూలం అవిచారణయే కదా! అందుచేత ముముక్షువు జ్ఞానోదయ పర్యంతమూ విచారణ చేస్తూనే ఉండాలి. జ్ఞానోదయమునే ‘మోక్షము’ అనికూడా అంటున్నాం.

‘మనస్సు - అహంకారము’ మొదలైనవాటికి ఎండమావులలోని జలంలాగా అసలు ఉనికియే లేదు. అవి ఉన్నట్లు అనిపించటమంతా భ్రమచేతనే సుమా! కొంచెం విచారణకు ఉపక్రమించటం జరిగినా సరే …అవి లయం పొందుతాయే! ఇక తాత్సారం ఎందుకు? వేదన చెందవలసిన పనేముంది?

ఈ ‘సంసారస్వప్న విభ్రమము’ గురించి ఒక సందర్భంలో ఒక బేతాళుడు కొన్ని ప్రశ్నలు ప్రతిపాదించటం జరిగింది. ప్రసంగవశంగా అవిప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి. శుభకరములగు ఆ ప్రశ్నలేమిటో …విను.

*

వింధ్య పర్వత ప్రాంతంలో అనేక జనపదాలు, మహారణ్యాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో గల ఒకానొక దట్టమైన అడవిలో భీకరమైన శరీరం గల ఒక బేతాళుడు ఉండేవాడు. ఆతనికి జ్ఞాను లంటే మహాయిష్టం, అజ్ఞానులంటే మహాతిరస్కార భావం ఉండేది. ఒకసారి ‘అజ్ఞానులను’ మాత్రమే నేను భక్షిస్తాను… అనే నిర్ణయం తీసుకున్నాడు.

అతడు ఒక కిరాతరాజ్యం ప్రవేశించాడు. మంత్రతంత్రాలపై అత్యంత ప్రవేశము, అభిరుచిగల ఆ కిరాతరాజ్యపు ప్రజలు ఆతనికి బలులు ఇచ్చి సంతోషపెట్టేవారు. ఆతడు కిరాతరాజ్యంలో అడవిలో గల ఒక మఱిచెట్టును నివాసంగా ఏర్పరచుకొని తనకు ఇవ్వబడే బలులను స్వీకరిస్తూ అక్కడి ప్రజలకు రోగవిముక్తి మొదలైన సుఖములను ప్రసాదిస్తూ ఉండేవాడు. తాను మాత్రం జ్ఞాన బలంతో నిత్యతృప్తుడై నిశ్చలమగు సమాధియందు కాలం గడుపుతూ ఉండేవాడు.

ఆతడు ఆకలైనప్పుడు ఆ బాటలో వచ్చే బాటసారులను చంపి స్వాహా చేసేవాడు. అయితే, తాను జ్ఞాని అయి ఉండడంచేత, ఆకలిగా ఉన్నాసరే … నిష్కారణంగా సుజనులను చంపేవాడు కాదు. దుష్ట - దుర్మార్గ - దురాచారులను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. క్రమంగా బేతాళుని

Page:273

విషయం తెలిసిన అక్కడి ప్రజలు సత్ప్రవర్తనులై భక్తి -జ్ఞానములు పెంపొందించుకున్నారు. అందుచేత ఆతనికి అక్కడ భక్షించుటకు తగినవారే దొరుకుట లేదు. ఆకలిచే ప్రేరితుడై ఆహారమగుటకు అర్హులగు వారికోసం వెతుకుతూ కిరాతరాజ్యానికి దగ్గరలో ఉండే ఒక నగరంలో ప్రవేశించాడు. అర్ధరాత్రి అయింది. అక్కడి రాజు నగరపరిసర ప్రాంతంలోగల దొంగలను, దుష్టులను, దారిదోపిడీ చేసేవారిని పట్టుకోవటానికి బయలుదేరి యాదృచ్ఛికంగా బేతాళునకు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ రాజును చూచిన బేతాళుడు ‘ఆహా! ఈ రోజు నా పంట పండింది. మంచి కండపుష్టి గల ఈ మనుజుడెవ్వడో ఇటువైపే వస్తున్నాడు. ఈ రోజు ఈతడే నాకు ఆహారం’ అని అనుకున్నాడు. రాజు వస్తున్న మార్గంలో ఎదురుపడి తన భయంకరరూపం ప్రదర్శించాడు.

బేతాళుడు : ఓయీ! బాటసారీ! నేనెవరో తెలుసా! దిక్కులు పిక్కటిల్లచేసే శక్తిగల బేతాళుడను. ఈ రోజు నీవు నాకు ఆహారమవటానికే ఇటు వచ్చావు. ఇక తప్పించుకోలేవు. నాకు భోజనం కమ్ము. రాజు : ఏం బేతాళా! బాగానే ఉన్నది గాని, మరి నెనెవ్వరో తెలుసా? ఈ దేశపు రాజును. న్యాయ పూర్వకమగు ‘క్రూరమృగ వధ’ - అనే నా విధ్యుక్తధర్మమును నిర్వర్తించటానికి ఈ నిర్జన ప్రదేశానికి వచ్చాను. నేను నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించ లేదే! అన్యాయంగా నన్ను బలవంతంగా భక్షించటానికి ప్రయత్నించావా?…ఈ ఆయుధాలతో నీ తల వేయిప్రక్కలు చేసివేయగలను. బేతాళుడు : ఓ రాజా! నేనెవరినీ అన్యాయంగా భక్షించనను వ్రతం గలవాడిని. అయితే నిన్ను భక్షించటం న్యాయమో, అన్యాయమో తెలియాలి కదా?

మరొక విషయం. నీవు ఈ దేశపు రాజువు కదా! ధర్మశాస్త్రానుసారం నీ రాజ్యంలో ప్రవేశించి ఉన్న నాకు ఆకలి దప్పికలు తీర్చటం నీ కర్తవ్యమే! నీవు వధించటానికి అర్హుడవైతే మాత్రం నిన్ను ఈ రోజు వదలిపెట్టేది లేదు. వ్యర్థంగా విజ్ఞులను వధించటం నా ప్రవృత్తియే కాదు. అజ్ఞులను వదలిపెట్టే ప్రసక్తి లేదు.

ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీవు సమాధానం చెప్పు. నీ సమాధానమును బట్టి నీ యొక్క జ్ఞానాజ్ఞానాలు గ్రహించి, నీవు నాకు ఆహారమవకుండటానికి తగినవాడవో, కాదో నేను నిర్ణయిస్తాను.

రాజు : నీవు మనుష్యులను భక్షించే ముందు వారు వివేకులో, అవివేకులో … జ్ఞానులో, అజ్ఞానులో పరిశీలించి అజ్ఞానులను మాత్రమే భక్షిస్తూ ఉంటావా?… చాలా ఆశ్చర్యంగా ఉన్నదే! నీ వంటి బేతాళులకు కూడా సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయా?

బేతాళుడు : (బిగ్గరగా పకపకా నవ్వి) ఇప్పుడు నిన్ను నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. ఆ ప్రశ్నలకు నీ సమాధానమేమిటో చెప్పు. ఆ సమాధానాలను అనుసరించి నిన్ను భక్షించవచ్చునో, లేక నమస్కరించి శరణువేడాలో నేను గ్రహిస్తాను.

Page:274

బేతాళ ప్రశ్నలు -

  1. ఈ సృష్టిలో అసంఖ్యాక బ్రహ్మాండములున్నాయి కదా! ఇవన్నీ కూడా ఏ సూర్యుని యొక్క సూర్యరశ్మిలోని, సూక్ష్మపరమాణువులు, లేక, త్రసరేణువులు అయి ఉన్నాయి?

  2. ఆ బ్రహ్మాండ త్రసరేణువులు ఏ మహాకాశవాయువులో స్ఫురించుచున్నాయి?

  3. ఒకాయన ఉన్నాడు. ఆయన అనేక స్వప్నములను నిష్కారణంగా గనుచున్నాడు. ఆ అనేక స్వప్నములలోని ప్రతి ఒక్క స్వప్నములో మరల ఇంకెన్నెన్నో ఉపస్వప్నములను కూడా గనుచు న్నాడు. ఒక స్వప్నం వదలి వెంటనే మరల ఇంకొక స్వప్నంలోకి వెనువెంటనే ప్రవేశిస్తున్నాడు. ఆతడు ఎన్ని స్వప్నాలు కనుచున్నప్పటికీ తన స్వరూపం మాత్రం త్రికాలములలో యథాతథంగానే కలిగి ఉంటున్నాడు. ఆయనను నీవెక్కడైనా చూచావా? ఎవ్వరాయన?

  4. అరటి పట్టలను విప్పుకుంటూపోతూ ఉంటే చివరికి బయటనున్న ఆకాశమే లోన కూడా శేషించి ఉంటుంది. అట్లాగే ఈ స్వప్నస్వప్నాంతరములలో బయట-లోపలకూడా అవిచ్ఛిన్నంగా అఖండంగా వెల్లివిరిసి సదా ఉన్నది ఏమిటి? ఎవరు?

  5. మనకెదురుగా ఈ దృశ్యప్రపంచం ఉన్నది. దీనిలో విశాల ఆకాశము, భూత సముదాయం, సూర్యమండలము, మేరు పర్వతం … ఇవన్నీ ఘనీభూతమై ఎదురుగా ఉన్నాయి. ఇవి అత్యంత మహత్వముతో ప్రవర్తిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒకానొకని అణుఅంశమునందు ఒక పరమాణు పరిమాణమై ఇమిడి ఉన్నాయి? ఆతడెవడు? ఆతడెక్కడ ఉంటున్నాడు.

  6. అవయవరహితుడగు ఒకానొక పురుషుడున్నాడు. ‘ఆకారము’ అనే వికారము ఆతనియందు లేదు. అయితే ఏం? ఆయనయొక్క ఒక స్వల్పాంశ ఈ రాళ్ళు-మట్టి-పర్వతము-దేహములతో కూడిన పాదార్థిక జగత్తుకు అస్థిత్వం కల్పిస్తోంది. అట్టి అస్థిత్వము కల్పిస్తున్నదెవరు? ఆయనను నీవెక్కడైనా చూచావా?

ఓ రాజా! ఇప్పుడు నిన్నొక ఆరు ప్రశ్నలు అడిగాను. వీటికి నీకు సమాధానం తెలియకపోతే ’ఆత్మద్రోహి’వి అవుతావు. దేహబుద్ధి పరిమితుడవు అవుతావు. యముడు లోకములను మ్రింగుచు న్నాడు చూచావా? నీవు సమాధానాలు చెప్పకపోయావో …నేను కూడా నిన్ను, నీ ప్రజలను చప్పరించి మ్రింగివేస్తాను. ఇక నీ ఇష్టం.

రాజు ఆ ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆతని పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇక ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వనారంభించాడు :

ఒకటవ ప్రశ్న - ఈ బ్రహ్మాండములు ఏ సూర్యరశ్మిలోని త్రసరేణువులు?

ఒకచోట ఒక ఫలం వ్రేలాడుతూ ఉన్నది. ఆ ఫలమే ఈ బ్రహ్మాండము. ఆ ఫలం (ఈ బ్రహ్మాండము) నీకూ, నాకూ, తదితర అసంఖ్యాక జీవులకు ఆశ్రయభూతమై ఘనము - ద్రవము ఉష్ణము - - వాయువు వాయువు - ఆకాశము అను, పంచభూతములను ఆవరణగా కలిగియున్నది. అది జ్ఞానులకు అత్యంత చంచలంగానూ, అజ్ఞానులకు ఘనీభూతంగానూ, స్థిరంగానూ అగుపిస్తోంది.

Page:275

జీవుల ఆశ - - తృష్ణలు ఆ ఫలమును అనంతరీతులుగా ద్యోతకమయ్యేటట్లు చేస్తున్నాయి. (కనుక

ఆశ - - తృష్ణలే ఆ బ్రహ్మాండము యొక్క నిజాకారం).

అట్టి వేలాది ఫలాలతో కూడిన ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మ కదలుచున్న అనేక చిగుళ్ళు కలిగి ఉంది. ఆ కొమ్మ ఎంతో ఎత్తుగా ఉండి ప్రకాశిస్తోంది. జీవుల భావపరంపరలు, కల్పనయే ఆ కొమ్మ యొక్క వాస్తవాకారం.

అట్టి వేలాది కొమ్మలు కలిగిన ఒక మహావృక్షం ఉన్నది. ఆ మహావృక్షం ఎంతో విశాలంగా వ్యాపించి దుర్నిరీక్ష్యమై ఒప్పుచున్నది. అట్టివేయగు వేలాది వృక్షములు గల ఒక మహారణ్యం ఉన్నది. ఆ మహారణ్యం వృక్షములతోనే కాకుండా ఎత్తైన పొదలతో దట్టంగా వ్యాపించి చొరరాకున్నది.

అట్టివేయగు అనేక మహారణ్యసమూహములతో కూడిన మహోన్నతమగు ఒక పర్వతం ఉన్నది. అట్టి అనేక పర్వతపంక్తులకు ఆకరమైన ఒక సువిస్తార ‘దేశం’ ఉన్నది. ఆ దేశము ఊహకందనంత సువిస్తారంగా ఏర్పడి ఉన్నది.

అట్టి దేశములు అనేకం గల మహాద్వీపమొకటి ఉన్నది. ఆ ద్వీపమునందు చిత్రవిచిత్రమైన అనేక నదులు-సరస్సులు ఉన్నాయి. ఆ నదీ-సరస్సులు నిరంతరం రకరకాల ఆకారములతో కూడిన పుట్టిన-పుట్టబోవు అనేక ప్రవాహపరంపరలతో ఒప్పుచున్నాయి.

అట్టివేయగు అనేక మహాద్వీపములు తనయందు కలిగియున్న ఒక మహాపీఠం ఉన్నది. ఆ మహాపీఠం అతిచిత్రవిచిత్ర రచనా సమన్వితమై ఉన్నది. అట్టి అనేక మహా పీఠములతో సమన్వితమై ఉన్న ఒక మహాలోకం ఒకటి ఉన్నది.

అట్టి వేలాది లోకములతో గూడిన భయమును గొల్పు ఒక మహాండకోశము ఉన్నది. అట్టి వేలాది మహాండకోశములకు ఆధారమైయున్న ఒక మహాసాగరం ఉన్నది. ఆ మహాసాగరం స్పందనారహితమై విపుల బ్రహ్మాండకోశజలరాశికి నిలయమైయున్నది.

ఓ బేతాళా ! అంతేకాదు. ఆత్మ విలాసమైన ‘మహార్ణవం’ ఒకటున్నది. మనం చెప్పుకున్న మహాసాగర సమూహములు ఆ మహార్ణవంలో చిన్న చిన్న తరంగముల వలె ఒప్పుచున్నాయి.

అట్టి మహార్ణవములు అనేకం తన ఉదరమున కలిగియున్న మహాపురుషుడొకడున్నాడు. ఆతడు సర్వవ్యాపి అయి మహోన్నతుడై, ‘విష్ణువు’ అను పురాణ నామముతో కూడా వెలయుచున్నాడు. అట్టి వేలకొలది మహాపురుషుల మాలను తన వక్షస్థలమున ధరించిన పరమపురుషుడొకడున్నాడు. ఆతనిని రుద్రుడు అనే పురాణనామంతో కూడా పిలుస్తూ ఉంటారు.

అట్టివే వేలకొలది పరమపురుషులగు రుద్రులు రోమముల వలె అనాయాసముగా వెలువడు చున్నారో …అట్టి మహాసూర్యుడొకడు కలడు. సర్వప్రాణులకూ ప్రత్యక్షములగుచున్న ఈ బ్రహ్మాండ

- - రుద్రాది కల్పనలన్నీ మహామండల రూపుడగు ఆ మహాసూర్యుని దీప్తులయి ఉన్నాయి. ఎదురుగా దృశ్యమానమగుచున్న ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ మహాసూర్యకాంతిలో కనిపించే అసంఖ్యాక త్రసరేణువులలో ఒకానొకటి మాత్రమే. చిదాత్మయే ఆ మహా సూర్యుడు.

Page:276

చిదాత్మయే ఈ జగత్తంతటికీ ‘తెలియుట, తెలియబడుట’ అను వెలుగు, వేడిమిలను ప్రసాదించు చున్నాడు. ప్రతిజీవుని స్వస్వరూపము అట్టి చిదాత్మయే! ఇదే నీ మొదటి ప్రశ్నకు సమాధానంఆ చిదాత్మసూర్యుని రశ్మిలోని సూక్ష్మ పరమాణువులే ఈ బ్రహ్మాండములన్నీ కూడా! విజ్ఞానమే ఈ చిదానంద సూర్యుని ఆత్మ! ఈ జగత్తును ప్రకాశింపజేయటమే ఆయన చేస్తున్న మహత్తర కార్యక్రమం. ఈ విశాలమగు బ్రహ్మాండములన్నీ ఆయన కాంతిపుంజములే!

భౌతికమగు ఆకాశాన కనిపించే సూర్యునిచే ఈ జగత్తంతా శోభిల్లుతోంది చూచావా? అట్లాగే ఆ విజ్ఞాన సూర్యుని చిత్-కాంతుల వలన ఈ జగత్తులు సత్త పొందుచూ, శోభతో ప్రకాశిస్తున్నాయి. ఓయీ! బేతాళుడా! ఆ మహాచిత్ సూర్యునే ‘భగవంతుడు’ అని, ‘పరమాత్మ’ అని ‘బ్రహ్మము’ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఈ త్రిలోకములు ఆ బ్రహ్మము అనే మణికాంతులలో ప్రకాశిస్తాయి. ఉత్తమాధికారులగు ఆ మహాసూర్యుని పారమార్థికతత్త్వమగు ఆత్మ అఖండాకారమున అన్ని స్థితులందు ప్రత్యక్షమగుచునే ఉన్నది. అనధికారులకో, అది తెలియరావటం లేదు. అగ్నియందు విస్ఫులింగములు వేరువేరు వలె బయల్వెడలుచున్నాయి చూచావా? అలాగే ఆ ప్రత్యగాత్మయందు జీవజగత్తులు వేరువేరుగా తోచుచు, కర్తృత్వం - భోక్తృత్వం మొదలైన అనేక విభ్రమములు కలుగజేస్తున్నాయి.

ఓ బేతాళ మహాశయా! పారమార్థిక దృష్టితో చూస్తే అవేవీ కూడా ఒకింతైనా లేవు. చిదాత్మ ఒక్కటే సర్వదా సర్వత్రా సర్వాత్మకమై ప్రకాశిస్తోంది. అందుచేత నీ ప్రశ్నాడంబరమంతా వదలిపెట్టి సుశాంతుడవు కమ్ము.

రెండవ ప్రశ్న ఈ బ్రహ్మాండములు, ఈ భావాభావములు ఏ మహాగగన వాయువునందు ధూళిరేణువులై స్ఫురిస్తున్నాయి? అని కదా…?

ఒకానొక చోట ధూళి ఉన్నది. ఆ ధూళి కోట్లాదిమైళ్ళ విస్తారం విస్తరించి అత్యంత లోతుగా ఆక్రమించి ఉన్నది. ఆ ధూళిలో రకరకాల రంగుల ధూళికణములు కలిసిపోయి ఉన్నాయి. 1. కాలసత్త (కాలము అనురూపం గల మాయా సత్త).

  1. స్పందనసత్త (క్రియాశక్తి ప్రధానమైన సత్త)

  2. చిన్మయసత్త (ఎరుగుట అనునది ప్రధానముగాగల సత్త)

  3. చిదాభాససత్త (విషయములందు ప్రతిబింబించే చమత్కారం)

ఇవన్నీ అత్యంత సూక్ష్మ పదార్థములవటం చేత వాటిని ‘ధూళికణములు’ అని వేదములు అభివర్ణిస్తున్నాయి. అట్టి రేణువులన్నీ ‘పరమాత్మ’ అనే వాయువునందు లేచుచు వివిధ ఆకారములు కల్పించుకొనుచున్నాయి.

పరమాత్మే అన్నిటా వెలుగు సత్త. ఆయన యందే కాలం మొదలైన సత్తలు ప్రతిబింబిస్తున్నాయి. ఆయన నిర్మలుడు, నిర్విషయుడు కదా! ఆయనలో ఆధార, ఆధేయాలు, వ్యపదేశాలు (Misinter pretation) ఎక్కడి నుండి వచ్చాయి? …అనే సందేహమే అక్కర్లేదు. ఒక పుష్పాంతర్గత రసమే తనలో 1. పుష్పశరీరం, 2. సువాసన … అనేవి కల్పించుకుని గంధానికి ఆధేయమై వెలయుచున్నది కదా!

Page:277

పరమార్థసత్తయే కాలసత్త మొదలైన భేదములన్నీ తనయందు కల్పించుకుని వాటన్నిటికీ తానే ఒకవైపు ఆధారమై మరొక వైపు అనుభవమునకు కారణభూతమై (ఆధేయమై) వెలయుచున్నది.

ఈ “కాలము-క్రియ -ఎరుక-విషయాస్వాదన" అను వేరు వేరు రంగుల ఇసుకరేణువులను ఒకదానితో మరొకటి అనంతకోట్ల దేహోపాధి పరంపరలను ఆటబొమ్మలవలె పరమాత్మతత్వమే నిర్మించుకుంటోంది. ప్రతి ఆటబొమ్మను ఆశ్రయించి నీవు-నేను-ఇది-అది-అక్కడ-ఇక్కడ-ఇప్పుడుఅప్పుడు-ఏకానేక ఆంతరంగిక స్ఫురణలను జతజేరుస్తోంది. ఇంతలోనే ఆ ఆటబొమ్మలను నిర్మించుకొని ఆటలాడుకొంటోంది. ఆ విధంగా స్ఫురించే అనంతకోటి చమత్కారాలలో నీ దేహం ఒకటి. నా దేహం మరొకటి. ఆత్మతత్వమే అంతటా సత్యం మిగిలినదంతా కల్పన మాత్రమే!

మూడవ ప్రశ్న- ఒక స్వప్నంలో మరొక స్వప్నం, స్వప్నం తరువాత మరొక స్వప్నం ఈ విధంగా స్వప్నాలు, స్వప్నాంతర స్వప్నాలు, స్వప్న తదనంతర స్వప్నాలు గనుచున్నప్పటికీ ఆ స్వప్న స్వప్నాంతరాలతో సంబంధం లేక, తన నిర్మల స్వభావాన్ని ఏ కాలమందూ త్యజించనట్టి ఆ

స్వప్నద్రష్ట స్వరూపుడెవడు?… అని కదా, నీ ప్రశ్న?

నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్కరి వాస్తవ స్వస్వరూపమే ఆ పరమాత్మ. అట్టి పరమాత్మ లేక, బ్రహ్మమే ఈ ‘జగత్తు’ అను మహాస్వప్నమును, ఆ జగత్స్వప్నంలో ‘నేను దేహమును’ అను మరొక స్వప్నమును, ఆ దేహతాదాత్మ్య స్వప్నంలో ’జాతి, దేశము, మతము, అయినవారు, కానివారు…” మొదలైన ఇంకెన్నో ఉపస్వప్నములను కల్పించుకొని పొందటం జరుగుతోంది. అయితే అట్టి స్వప్నములు పొందుచున్నప్పుడు, ఆ స్వప్నములలో విస్తరించి ఉన్నది తానే అయినప్పటికీ, తనయొక్క నిజరూపం కోల్పోవటం లేదు. స్వప్నదోషములు స్వప్న ద్రష్టను కళంకితం చేయగలవా? వస్తువుల సంయోగ వియోగములు ఆకాశమును మరొకరీతిగా మలచగలవా?… లేనేలేదు!

ఆత్మ ఆయా స్వప్నముల లోపలా-వెలుపలా విస్తరించి ఉన్నప్పటికీ, ఈ స్వప్న జాగ్రత్ విషయ సముదాయాలు ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని దిగజార్చలేవు. ఆత్మసర్వదా, అన్నిటా నిస్సంగమున, జ్యోతిరూపమున వెలుగుచూనే ఉన్నది. అట్టి శాంతం, మహదానందం, సర్వశక్తిమంతం - అగు ఆత్మను ఏమరచి ఈ జనులు నశ్వరములగు పదార్థముల సమ్మేళన-విభజనములను చూచి ఎందుకో వ్యధలు చెందుచున్నారు. సంసారమంతా స్వప్నతుల్యమే! స్వస్వరూపమే పరమసత్యము! పరమసత్యము మాత్రమే నిత్యము! అనునిత్యము!

నాలుగవ ప్రశ్న - అరటి చెట్టు కాండములో గల అరటిపట్టలను విప్పుచూ పోగా … లోపల ఇక చిట్టచివరగా ‘ఆకాశము’ కాక మరింకేమీ మిగలదు. ఈ స్వప్న - స్వప్నాంతరములలో ఉన్నదంతా కల్పనను తొలగిస్తూ తరచి చూస్తే ఇక శేషించేదేమిటి?

స్వప్న ద్రష్టయొక్క స్వస్వరూపమే! ద్రష్ట యొక్క స్వరూపమే స్వప్నములో కల్పిత రూపంగా ప్రవేశించి ఉన్నది. కనుక స్వప్నము యొక్క వెలుపల - లోపల ఉన్నది ద్రష్టయే. ఈ విశ్వం యొక్క అంతరాంతరము లందు బ్రహ్మమే వివర్తితమై ఏర్పడి ఉంటోంది. బ్రహ్మము యొక్క అణువులే

Page:278

అంతటా వెలయుచున్నాయి. వివర్తితం అగుచున్న ఈ ’జగతి విస్తృతి’కి ఆ బ్రహ్మమే సత్తయి ఉన్నది. అట్టి స్వస్వరూపమునకు నామరూపములు లేవు!

కాని సర్వజగత్ భావ- అనుభవములకు అది ఆలవాలం కనుక …దానిని ‘ఆత్మ’ అను పేరుతో పిలుస్తున్నారు. ‘సత్బ్రహ్మం’ అని కూడా అది అందుకే పిలువబడుతోంది.

అద్దాని గురించి ‘అట్టిది’ అని ఎవరమూ చెప్పలేము. ఆ బ్రహ్మము సర్వధర్మ శూన్యము. అందుకని పదార్థ వ్యవహారముల దృష్ట్యా అది శూన్యం అని కూడా వర్ణింపబడుతోంది.

ఈ బుద్ధికి కనబడే వస్తువులలో అది ఏదీ కాదు. ఎందుచేతనంటే బుద్ధిని కూడా గ్రహించునది అదే! దానియందు ఏవీ లేవు. అయినా కూడా, అది తప్పితే ఇక్కడ మరొక్కటేదీ లేదు. మనోబుద్ధులకు అదియే సత్త ప్రసాదిస్తోంది. గుణములు కలవాడు లేకపోతే గుణములు ఉంటాయా? అట్లాగే అదే లేకపోతే జగత్తు లేదు, దాని అనుభవం లేదు. స్వప్నము, స్వప్నకారణము, స్వప్నమునకు ముందు వెనుకల ఉన్నది స్వప్నకర్తయే కదా! జగత్తు విషయములో కూడా …జగత్తు, జగత్ కారణము, జగత్తుకు ముందు వెనుకల ఉన్నది జగత్ ద్రష్టయే.

వస్త్రమునందలి వస్త్రసత్త దారములోనూ ఉన్నది

దారములోని దారసత్త దూదిలో ఉన్నది

దూదిలోని దూది ప్రత్తికాయయందు ఉన్నది

ప్రత్తికాయలోని ప్రత్తిసత్త ప్రత్తివృక్షమునందున్నది ప్రత్తివృక్షములోని ప్రత్తివృక్షసత్త ప్రత్తి బీజమునందున్నది బీజములోని బీజసత్త మట్టి-జలమునందున్నది

ఈ విధంగా, ఒక విధమైన సత్త మరొకవిధమైన సత్తగా పర్యవసించటం జరుగుతోంది. ఇట్టి సత్తయొక్క క్రమమును పరిశీలించిన విజ్ఞులు… ఇట్లు సిద్ధాంతీకరిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఏఏ క్రమముచే ఏఏ సత్త భావించబడుచున్నదో… అదంతా కాలానుగతంగా ఆయా భావాకృతులను వీడి, అనుభవజ్ఞరూపమగు ’చిన్మాత్రము’ గానే పరవశించుచున్నది. అట్టి నిర్మల మగు చిద్వస్తువే ఈ జగద్రూపముగా వ్యాపించి ఉన్నదని జనులు గ్రహించెదరు గాక !” బేతాళుడు : ఓహో ! అద్భుతం చాలా బాగా సమాధానం చెప్పావు.

రాజు : …. ఐదవ ప్రశ్న - ఈ విశాలమగు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత సముదాయమునకు ఈ బ్రహ్మాండమండలమే ఆధారమై ఉన్నది కదా! ఈ బ్రహ్మాండ మండలం, సూర్యమండలం, మేరు పర్వతము … ఇట్టి అత్యంత విస్తార పదార్థములన్నీ ఏ అణువు నందు పరమాణురూపంగా ఉన్నాయి? …అని కదా, నీ ప్రశ్న?

ఆ పరమాత్మ సూక్ష్మాతిసూక్ష్మము, ఇంద్రియాలకు అలభ్యము అవటం చేత ‘ఆతడు పరమాణు స్వరూపుడు; అణోరణీయాన్’ అని వేదములు ప్రవచిస్తున్నాయి. అనంతగుణవిశిష్టుడు అవటం చేత మేరు పర్వతమునకూ ఆతడే ఆధారుడు కూడా! ఆతడు లింగ స్వరూపభేదములకు సంబంధించని

Page:279

వాడు. కనుక, సులభసాధ్యుడు కాదని కొందరి అభిప్రాయం. అయితే, జ్ఞానుల అనుభవమునకు అత్యంత సులభ ప్రాప్యుడు అగుచున్నాడు. అనేక బ్రహ్మాండములతో కూడిన ఈ జగత్తంతా కూడా ఆత్మదేవుని ఒకానొక అణువు యొక్క ఒకానొక అంశ మాత్రమే.

ఈ కనబడే బ్రహ్మాండములన్నీ సూక్ష్మతరములగు చిత్కణములచే పరిచ్ఛిన్నమై ఇట్లు దృష్టికి ప్రాప్తిస్తోంది. అందుచేత “ఆత్మదేవునియందు పరిచ్ఛిన్నమై ఉంటోంది” అను పాఠ్యాంశములన్నీ మిథ్యా పాఠములే. స్వప్నంలో చూచే వస్తువులన్నీ స్వరూపహీనములే అయినట్లు, ఈ జాగ్రత్ బ్రహ్మాండాదులన్నీ స్వతఃగా చూస్తే (అణువుల సముదాయమే కాబట్టి, భావానుగతమే కాబట్టి) స్వరూపహీనములేనని చెప్పక తప్పదు. కనుక ఆత్మదేవునియందు ఇది ఒక అణువువలె పరిచ్ఛిన్నము… అనునదంతా మిథ్యయే. ఇవన్నీ సూక్ష్మనాడులందు స్వప్నసమయంలో తోచే కల్పిత పదార్థ పరమాణువుల వంటివే. వీటన్నిటి యొక్క అంతిమ స్వభావం ‘బ్రహ్మమే’ అని జ్ఞానులు దర్శిస్తున్నారు.

కాబట్టి ఆత్మయందే ఈ పంచభూతములు, బ్రహ్మాండములు ఒక స్వల్ప విభాగమునందు అనుభూతమవుతున్నాయి. కాని ఆత్మకు విభాగమూ లేదు. అణువూ లేదు. పరమాణువూ లేదు. ఇదే నీ ఐదవ ప్రశ్నకు సమాధానం

బేతాళుడు: ఓ రాజా! నీ సమాధానం యుక్తియుక్తమే. నీవు పరమసత్యమును ప్రకటించుచున్నావని నాకు స్పష్టంగా తెలియవస్తోంది. నా 6వ ప్రశ్న మరొక్కసారి విన్నవిస్తాను.

శిలలన్నీ ఒకచోట కూడితే పర్వతం అవుతుంది. కనుక శిలలే పర్వతానికి అస్థిత్వం కల్పిస్తున్నా యని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకానొక నిరవయవ పురుషుడు శిలలకు, తదితర సర్వమునకు తానే ఉనికి అయి అస్థిత్వమును ప్రసాదిస్తున్నాడు. అట్టి రాజాధిరాజైన మహత్పురుషుడు ఎవడు? అతనిని నీ వెప్పుడైనా చూచావా?

రాజు : ఓc! చూచాను, చూస్తున్నాను ! అయితే ఈ భౌతికమైన కళ్ళతో కాదు. మనం ఇంతవరకూ వివరించి చెప్పుకున్న ఆ బ్రహ్మమే కళ్ళు-చెవులు మొదలైన వాటికి అగోచరం కాబట్టి ’ఆతడు పరమాణువుకే పరమాణువు’అని మనం ఈ సంభాషణలో గ్రహించియే ఉన్నాం కదా! ఆతడు సర్వ వ్యాపి అవటం చేత ‘స్థూలమగు మహాపర్వతము వంటివాడు’ అని కూడా విజ్ఞులు అంటున్నారు. అధ్యారోపదృష్టికి అదియే ఆకార అనాకారములన్నిటికీ అవయవము. అపవాద దృష్టికి అది సర్వదా నిరవయవము.

ఆతడే సర్వవ్యాపకుడై నెగడుచున్నాడు. ఓ సాధూ! ఈ జగత్రయం ఆ విజ్ఞాన స్వరూపుని సారమై, ఆతనియందే వెలయుచున్నది. అట్టి స్వస్వరూపుని సామవేదం ’మహత్పురుషుడు’గా గానం చేస్తోంది.

ఓ బేతాళా ! ఈ జగత్రయమును ఆత్మవిజ్ఞాన స్వరూపంగా గ్రహించు. ఆ విజ్ఞానాత్మ దేవుడే నీవు, నేను కూడా! అట్టి నన్ను వినష్ట మొనర్చగలిగిన వారెవరు? నిన్ను స్వస్వరూపందృష్ట్యా వినష్టమొనర్చగలిగినది కూడా ఏదీ లేనేలేదు. కాబట్టి నీవు నా ఈ సమాధానమును అనుసరించి త్వరగా అనుభవపదమును అధిరోహించుము.

Page:280

అట్లు అధిరోహించి సర్వ గర్వాలను విడనాడినవాడిపై స్వస్వరూపమున అనంత శాంత అనుభవుడవు కమ్ము.

  1. సర్వసమత్వము

శ్రీవసిష్ఠ మహర్షి : రాజు ఇచ్చిన సమాధానాలు విని బేతాళుడు “ఈతడు తత్త్వజ్ఞుడు” అని గ్రహించాడు. ఆతని సమాధానాలు బేతాళుని మనస్సుకు శాంతిని ప్రసాదించాయి. ఆతడు రాజుకు సాష్టాంగదండప్రణామం చేశాడు. శాంతచిత్తుడై పరమానందవస్తువును మననం చేసుకోవటం చేత, ఆ బేతాళుడు ఆకలిని కూడా మరచి సమాధిని పొందాడు.

ఓ రామచంద్రా ! ఆ రాజు చెప్పినట్లు ఈ జగత్తంతా చిద్రూపపరమాణువు నందే ఉన్నదని గ్రహించు. చిన్నపిల్లవాడు ఒకచోట కూర్చుని "నేనిప్పుడు మా చుట్టాల ఊరు వెళ్ళాను. అక్కడ అక్క-బావ-చెల్లి-అన్న తదితర తోటివారితో ఆడుకుంటున్నాను” ఇటువంటి ఊహలలోకి వెళ్ళుతూ ఉంటాడు. ఇంతలో “ఒరే ఎక్కడున్నావురా? రా ఇంట్లోకి!” అని తండ్రి పిలుపు వినబడగానే ఆ ఊహ నుండి బయల్వెడలి (లేక) ఆ ఊహను వదలి “ఏమిటి నాన్నా”? అంటూ ఇంట్లోకి వస్తాడు. దీనిని ‘బాలభ్రాంతి’ అంటాం.

ఈ విశ్వమంతా ‘బాలభ్రాంతి’లాగా జ్ఞానవిచారముచే తప్పక ద్రష్టయందు విలీనమైపోతోంది. చివరకు పరమపదమే శేషిస్తోంది. కనుక ఇక నీవు నీ మనస్సును ఈ విషయములనుండి - దృశ్య సమూహముల నుండి త్వరగా వెనుకకు మరల్చుము. నిశ్చలాత్మకమగు ఆత్మబుద్ధిని ఆశ్రయించు. అట్లా ఉంటూనే స్వాభావికంగా నిన్ను సమీపించే కర్మలను వ్యవహారములను నిర్లిప్తుడవై ఆచరించు.

ఓ మననశీలా! మనస్సుచే మనస్సును ఆకాశమువలె నిర్మలం చేయి. ఏకైక వస్తువు అయున్న ఆత్మయందు వృత్తులన్నీ లయం చేసి ‘ప్రశాంతచిత్తము’ ను సంపాదించుకో. అట్టి ప్రశాంత చిత్తముచే నీవు సర్వత్రా బ్రహ్మభావమును దర్శించి, తద్వారా సమదర్శివి కమ్ము. మోహశూన్యుడవగుము.

యథాప్రాప్తములగు విషయములను నిర్లేపబుద్ధితో అనుసరించువారు భగీరథుని వలె అసాధ్యమగు దానిని కూడా తప్పక సాధించి తీరుతారు.

ఎవడైతే పూర్ణముగా శాంతచిత్తుడై, పరితృప్తాంతఃకరణుడై, ఆత్మయందు ఆత్మచే నిత్యతృప్తుడై వెలయుచున్నాడో …ఆతనికి అత్యంత దుర్లభమైన అభీష్టములు కూడా సిద్ధించగలవు. గంగావతరణలో భగీరథుడు, సగరుడు మొదలగు వారి చరిత్రలే అందుకు దృష్టాంతం.

కాబట్టి రామా! నిర్విచారుడవై, ఇక ఆపై సర్వక్రియాశీలుడవగుచుండుము. సర్వసమత్వమును అధిరోహించి, యథారీతిగా సర్వకార్యములు నిర్వర్తించుము.