Page:281
VIII. భగీరథ యత్నం
శ్రీరాముడు: మహాత్మా! మీరు ప్రసంగవశంగా భగీరధ చక్రవర్తి పేరు చెప్పటం జరిగింది. భగీరథ చక్రవర్తి గురించి మీరు కొన్ని విషయాలు మాకు ఆశ్రమంలో బోధించియే ఉన్నారు. ఆ భగీరథుడు చిత్తపరిపక్వత ఎట్లా సంపాదించాడో చెప్పవలసిందిగా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి: విను …చెబుతాను.
భగీరథుడు కోసలవంశ తిలకుడై జన్మించి యౌవన ప్రాంగణంలో ప్రవేశించగానే అతి విశాల సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆతడు చిన్నప్పటి నుండే పరమధార్మికుడు. ఆయనను సమీపించిన ప్రజలు ప్రార్థన అను పరిశ్రమ లేకుండానే తమ అభీప్సితములు పొందేవారు. ఆతని ముఖమండలం ఎల్లప్పుడూ చంద్రమండలంలాగా అతి ప్రసన్నమై ఉండేది. ఆతడు ఒక్క క్షణంలో పాత్రాపాత్రము ఎరిగి సజ్జనులకు ధనములను ఇస్తూ న్యాయమగు దానిని తృణమైనా వదలక తన ప్రజల సుఖశాంతులను దృష్టిలో పెట్టుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. వజ్రవేధ మణి వజ్రమునకు రంధ్రం చేసి ఆ వజ్రమునకు శోభ చేకూరుస్తుంది చూచావా? ఆతడు తన శత్రువులను, దొంగలను, దురాశాపరులను బంధించి వారిని అనేక ఉపాయములచే సచ్చరిత్రులుగా, సద్గుణసమన్వితులుగా తీర్చిదిద్దేవాడు. ప్రజల మధ్య రహస్యంగా సంచరిస్తూ వారిలోని అధర్మప్రవృత్తి గమనించి వారిలోని కార్యవిరతిని, దుష్టాచారములను, ప్రలోభప్రవృత్తులను పోగొట్టుతూ ఉండేవాడు. తన పరాక్రమముచే శత్రురాజులకు సింహస్వప్నమై ఉండేవాడు. బ్రహ్మవేత్తల వద్ద ఆర్దాన్తఃకరణుడై ఎంతో అణకువతో
మెలగేవాడు.
ఆతడొకప్పుడు కపిల ముని శాపంచేత పాతాళగర్భమున చిక్కిన తన పూర్వీకులను ఉద్ధరించదలిచాడు. ఎడతెగని తపః క్లేశములచే బ్రహ్మదేవుని, శంకరుని, జహ్నుమునిని మెప్పించి భూపాతాళములకు గంగాజలము ప్రవహింపజేశాడు.
ఓ రామచంద్రా! ఇక ఆ భగీరథుని యౌవనంలో జరిగిన కొన్ని విశేషాలు ఇచ్చట ముచ్చటించు కుందాం. భగీరథునికి నీలాగే యౌవనంలోనే సంసారాన్ని గూర్చిన ’విచారణ’తో గూడిన చమత్కార బుద్ధి కలిగింది. యౌవ్వనంలోనే అట్టి సమబుద్ధి కలగటం ఈ లోకంంలో కొంత దుర్లభమైన విషయమే. ఆతడొకసారి ఒక ఒంటరి ప్రదేశంలో ఆసీనుడై ఇట్లు చింతించసాగాడు.
భగీరథుడు : (తనలో) ఆహా! ఈ జగత్యాత్ర ఎంత అసమంజసమైనది? ఎంతటి ఉద్వేగములతో కూడి ఉన్నది? తెల్లవారుతోంది. ప్రొద్దుగ్రుంకుతోంది. రాబోయే కాలం రానే వస్తోంది. వర్తమానం ‘గతం’ అనే అగాధంలో పడి మటుమాయమౌతోంది. ఇక దినచర్యలన్నీ నిన్నటి లాగానే ఈ రోజు,
Page:282
రేపు కూడా ఉంటున్నాయి. ఈ కర్మలు, వాటి ఫలములు … వీటిలో ఏం ప్రత్యేకత ఉన్నది? తిన్నదే మరల తింటున్నాం. ఈ రాజ్య - గృహ - జన వ్యవహారములలో అపూర్వమైనది ఏమున్నది? ఏది పొందితే అన్నీ పొందినట్లే అవుతుందో … అట్టి దేదైనా పొందాలిగాని, అల్ప విషయాలు ఆశ్రయిస్తూ ఎందుకీ జీవితం? నాకు తారసపడుచున్న ఈ వస్తుసముదాయమంతా నిస్సారమని, అర్థరహితమని, చివరకు దుఃఖకరములేనని తెలిసిపోతోంది. పుట్టుక-చావుల మధ్య గల జీవితం అను అవకాశాన్ని అర్థంపర్థం లేని పనులకు వెచ్చించి ఏం ప్రయోజనం? చర్వితచర్వణంగా, గానుగ ఎద్దులా నిర్వర్తించే ఈ తినటం, త్రాగటం, వాగటం - వంటి నిరర్థక క్రియలలో కాలమంతా వెచ్చించుచున్నందుకు నాకు సిగ్గనిపించటం లేదేం? అల్పప్రతిఫలాలు-దుఃఖ ప్రయోజనాలు అగు విషయేంద్రియ కార్యక్రమాలతో సంతోషించి రోజులు గడపటమనేది కుక్క బొమికను నోటకరచుకొని గొప్ప వస్తువుగా తలచి వీథులందు సగర్వంగా పరుగెత్తటం వంటిది కాక మరేమిటి?
ఇట్లు ఆలోచిస్తూ ఆ భగీరథుడు సంసార వ్యవహారమంతా పరికించి చూశాడు. అజ్ఞానాంధకార పర్యవసానాలను, సంసారం యొక్క విన్యాసాన్ని చూచి మిక్కిలి భీతిచెంది, తన కులగురువగు త్రితల మహర్షి ఆశ్రమానికి అప్పటికప్పుడు బయలుదేరాడు. ఆయనను సమీపించి సాష్టాంగ నమస్కారం సమర్పించాడు.
భగీరధుడు : తండ్రీ! సద్గురూ! మా సంగతి గమనిస్తూనే ఉన్నారు కదా? సారశూన్యమగు ఈ సంసార మహారణ్యంలో చిక్కుకుని మేము బక్కచిక్కిన ఎద్దులాగా అలమటిస్తున్నాం. అంతులేని ‘ఆశలు’ అనే ముళ్ళపొదలలో ఎప్పుడో చిక్కుకున్నాం. అనేక సుఖదుఃఖాల రాకపోకలు మమ్ము అనుక్షణం పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇక్కడ కనిపించే తుచ్ఛ - అల్పకాలిక విషయాల పట్ల మాకు క్షణక్షణం ఏర్పడు చున్న రాగ-ద్వేషాలు కాలమేఘంలా క్రమ్ముకుని మమ్ములను అజ్ఞానంలో కప్పి ఉంచి ఆట ఆడిస్తు న్నాయి. అనేక కర్మలందు ఆసక్తి గలవారమై మేము మా ఉత్తరోత్తర గతులేమిటో గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ గ్రహించినా, మా బుద్ధి మాకు వ్యతిరేకమై ఉండటం చేత నిస్సహాయులమైన కాలయాపనాన్ని, కాల దుర్వినియోగాన్ని నిరోధించలేకపోతున్నాం. ఊరకుక్క నిస్సారంగా వీథివీథికి, ఇంటింటికి తిరిగి, మరల మురికి గుంటకు చేరుతుంది చూచారా? మేము కూడా మతితప్పి స్వర్గ - నరక - మనుష్య లోకాలలో తచ్చాడి తిరిగి అంధకారమయమగు అజ్ఞాన స్థానాలలో చేరుకుంటున్నాం?
హే కరుణా సముద్రా! నా పుణ్యవశం చేత ఈ రోజు మిమ్ములను సమీపించాలని, శరణు వేడాలని బుద్ధి పుట్టింది. ‘జరామరణ మోహాలు’ అనే ఆకృతి ధరించిన ఈ దుఃఖాలు ఉపశమించేది ఎట్లా? సంసారహేతువుల నుండి నన్ను నేను ఎట్లా రక్షించుకోవాలి? సెలవివ్వండి.
త్రితల మహర్షి : నాయనా ! ఎందుకీ దిగులు? నీవు నిరుత్సాహపడటమేమిటి? మహాప్రయత్న శీలుడవగు నీవు ‘దుర్లభం - నిస్సహాయం - దుస్సాధ్యం’ అంటూ అల్ప శబ్దములు పలుకుచున్నావేం?
Page:283
వీటిని అవలంబించు. క్రమంగా వైషమ్యరహితుడవు కమ్ము. సామ్యస్థితి సంపాదించుకో. అనాది సిద్ధమైన బ్రహ్మరూపమున ఆవిర్భవించు.
జ్ఞేయం అయినట్టి ప్రత్యక్త్త్వాన్ని గ్రహించటానికి నీకున్న అన్ని మార్గాలను, అవకాశాలను, సాధనలను ఉపయోగించుకో. అప్పుడు తత్త్వజ్ఞానము నందు తప్పకుండా పరిపూర్ణత పొందుతావు. నిర్మలస్వరూపుడా! తత్త్వజ్ఞానివైన మరుక్షణం ఆ దుఃఖాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఇక సంశయాలూ ఉండవు. సంసారగ్రంథులూ ఉండవు.
భగీరథుడు :‘జ్ఞేయం’ అంటే ఏమిటి?
త్రితల మహర్షి : ’తెలుసుకోవలసినది తెలుసుకోవటం’ … అనే అర్థాన్ని ఉద్దేశించి శాస్త్రకారులు జ్ఞేయం అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నారు. పరమపవిత్రం, సర్వగతం, నిత్యం, జ్ఞాపకములన్నిటికీ ఆధారం - స్థానము అయిన జ్ఞప్తి రూపమగు ఆత్మయే జ్ఞేయము.
‘ఆత్మ’ అనగా ఏది? ఎక్కడున్నది? నీ యొక్క స్వస్వరూపమే ఆత్మ కదా! అనగా జ్ఞేయము నీ యొక్క వాస్తవ స్వరూపమే! అట్టి ఆత్మకు మాయాబంధం లేదు. దుఃఖం లేదు. అలసత్వం లేదు. భగీరథుడు : మునీశ్వరా ! తమరు ఒకప్పుడు తాత్త్విక విషయాలు బోధిస్తూ రెండు గొప్ప విషయాలు నాకు చెప్పారు1. ఆత్మ నిర్గుణము, నిర్మలము, శాంతము చ్యుతిరహితము.
త్రితల మహర్షి : … ఊఁ! ఇంకొంత స్పష్టంగా నీ సందేహమేమిటో చెప్పు.
భగీరథుడు : మహర్షీ! అఖండాకారము, శాంతము, నిర్మలము అని మీచే వర్ణించబడిన ఆత్మ నాకు అనుభూతమగుటలేదు. ఎందుచేత?
త్రితల మహర్షి : ఎందుచేతనంటే… 1. ఈ రాజ్యం పట్ల అభిమానం, 2. అట్టి సంసర్గం వలన ప్రాప్తించే అనేక విషయాలలో నీ చిత్తం తగుల్కోవటం… ఈ రెండు కారణాల వల్ల నీకు ఆత్మ స్పష్టంగా అనుభూతమగుట లేదు.
నీ హృదయాకాశమున అమానిత్వం (గర్వం రహితమై పోవటం) ఉదయించిందా, అప్పుడు నీ యందు ‘అభిమానం’ అనే జాడ్యం తొలగిపోతుంది. అభిమానవిరహితమైన చిత్తం మాత్రమే
Page:284
జ్ఞేయమును గ్రహించగలదు. అనగా …జ్ఞేయానికి - నీకు మధ్య ‘అభిమానం’ అనే తెర అడ్డుగా ఉంటోంది. జ్ఞేయమును గ్రహించినప్పుడు నీ చిత్తం ఆ జ్ఞేయమునందు నెలకొని, ఇక తన చిత్తత్వం త్యజించివేయగలదు. అప్పుడు నీవు పూర్ణ స్వభావాన్ని బడయగలవు. ఇక ఆ తరువాత తత్స్వభావం నుండి చ్యుతి ఉండదు. ‘ఈ దేహంచే నేను జన్మిస్తున్నాను. దీనితో మరణిస్తున్నాను. మరొక దేహంతో పునర్జన్మ పొందుచున్నాను’ … అను పునర్జన్మ స్వభావం పొందవు.
ఓ భగీరథా ! ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో ముందుగా తెలుసుకో. భగీరధుడు: ‘జ్ఞానము’ అనుదానికి సవివరమైన నిర్వచనం ప్రసాదించ ప్రార్థన. త్రితల మహర్షి :
అసక్తిం, అనభిష్వంగః పుత్ర-దార గృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్ట-అనిప్టోపపత్తిషు ||
ఆత్మనో అనన్యయోగేన తద్భావనమ్ అనారతమ్ | వివిక్తదేశ సేవిత్వమ్ అరతిః జనసంసది ||
అధ్యాత్మజ్ఞాన నిత్యత్వమ్ తత్త్వ జ్ఞానార్ధదర్శనమ్ | ఏత జ్ఞానమితి ప్రోక్తమ్, అజ్ఞానం తదతో అన్యథా||
‘జ్ఞానము’ అనగా మా ఉద్దేశంలో ఏమిటో విను1. భార్య, పుత్రులు, గృహములు మొదలైన దృశ్య సంబంధమైన విషయముల పట్ల ఆసక్తిగాని, ‘అవి నావి’ అను మమకారము గాని ఉండకపోవటం.
2.నీ ఇంద్రియములకు ఇక్కడ ఇష్ట అయిష్టములు తారసపడుతూ ఉంటాయి కదా! అట్టి
ఉభయ విషయముల పట్ల సమచిత్తుడవై ఉండటం
అనన్యమగు ఆత్మ వస్తువును అన్ని వేళలా భావన చేస్తూ ఉండటం.
జనులతో ఏర్పడే సంబంధ వ్యవహారములతో అభిరుచి పొందక ఏకాంత స్థానమును సేవిస్తూ ఉండటం.
జ్ఞాన విషయమై శ్రవణ మననముల నిరంతరాభ్యాసం.
తత్త్వార్థమైన ఆ అఖండ - నిర్మల - నిత్య పరమాత్మ స్థానమును - ఎక్కడికి నీ చూపు వెళ్ళితే అక్కడ - దర్శిస్తూ ఉండటం.
ఇవి ‘జ్ఞానం’ అని అంటున్నాం. వీటికి సానుకూలం కానివన్నీ ‘అజ్ఞానం’ అని మా ఉద్దేశం. నాయనా! అహంభావమును ఉపశమింపజేసి, నీ చిత్తం నుండి రాగద్వేషములను వెడలగొట్టావా… మరుక్షణం సంసారమనే వ్యాధికి దివ్యౌషధమైనట్టి జ్ఞానం నీకు తప్పక లభిస్తుంది. శాస్త్రాదులచే, మా వంటి గురువులచే ప్రతిపాదించబడే సర్వసాధనాల ముఖ్యఫలం అనహంకారమేనని గ్రహించు. నీలో అహంకారం ఉన్నంత వరకూ ‘అమాన్వితం’ మొదలైన దైవీసంపత్తికి చోటెక్కడిది? భగీరథుడు: గురువర్యా! వృక్షము పర్వతముపై అధిరోహించి తిష్టవేసుకుని కూర్చుంటుంది చూచారా?
Page:285
అట్లా అహంభావము నా ఈ శరీరము నందు దృఢంగా పాతుకుపోయి ఉన్నది. దయచేసి, అది ఎట్లా తొలగుతుందో చెప్పండి.
త్రితల మహర్షి : వత్సా ! అందుకు ఉపాయం ఊసురోమంటూ, దుఃఖిస్తూ కూర్చోవటం మాత్రం కానే కాదు. విషయ భోగముల పట్ల ’అభిలాష’ అప్రయత్నశీలునియందు జన్మ-జన్మకూ పేరుకుపోతూ ఉన్నది. అట్టి అభిలాష వ్యసనమై ’వాసనలు’గా అంతరంగమునందు వ్యాపించి ఉంటున్నది. ఆ వాసనలు ఆత్మను ఆవరించి ఉండటంచేతనే పరమానందమయమగు నీ స్వస్వరూపము నీ కనుభవం కావటం లేదు. ఇప్పుడేం చేయాలి? దిగాలుపడి కూర్చుంటే ఎట్లా? లే! లేచి పురుషప్రయత్నమును ఆశ్రయించు. అట్టి పురుషప్రయత్న బలంచే నీ యందు పేరుకొనియున్న భోగవాసనలను పరిత్యజించు. భోగాల గురించి చింతించటం మానివేయి. అప్పుడు అహంకారం కూడా వినాశనం కాక తప్పదు.
అయ్యో! ఈ నా రాజ్యం పోతుందేమో?… కొంతకాలం తరువాత ఏ కారణం చేతైనా ఇప్పట ºవలె నన్నెవరూ గౌరవించరేమో?… అందరూ నన్ను యాచిస్తూ ఉండగా వారికి వీరికి దానధర్మాలు చేస్తున్నాను, అట్టి నేను భిక్షుకుడనై ఇంకొకరిని ఏదైనా యాచించే సమయం రాదుకదా?… నేను గొప్పవాడి నని చాలామంది అనుకుంటున్నారు కదా! రేపు అనేకమంది ప్రజలు, ఆ శత్రురాజులు నన్ను ఎగతాళి చేయరుకదా! నా పట్ల ఏదైనా అసమర్థత వచ్చిపడుతుందా?… ఈ రోజు బాగానే ఉన్నది. మరి రేపు సరి అయిన అన్నపానములు, గృహాదులు ఉండకపోతే రేపు నా గతి ఏమిటి?… నేను వీరి కొరకై ఏదైనా చేస్తే బాగుండు !…
…ఇటువంటి రూపంలో ఉండే అనేకానేక చింతల వల్ల నీకు లజ్జాభిమానాలు కలుగుచున్నాయి. ఇటువంటి చింతలు నీ కొరకై గృహాభిమాన రూపంలో ఒక గొప్ప పంజరం తయారుచేసిపెట్టాయి. అట్టి పంజరమే నీ నిరుత్సాహ - దిగుళ్ళకు కారణమై ఉంటోంది. అట్టి విషయ పంజరం సంపూర్ణంగా భగ్నం కానంత వరకూ నీలో అహంకారం కాపురం చేస్తూనే ఉంటుంది. అహంకారం నీ చిత్తంలో భయాన్ని గొలిపేటట్లు తాండవం చేస్తుంటే నీకు శాంతి ఎక్కడిదయ్యా? వాస్తవానికి ‘నావి’ అనుకునే ఏవీ నీవి కావు. ’నావి’ అను రూపం గల ఆవేశమే నీ వివేక బుద్ధి వికసించకుండా అడ్డుకుంటోంది.
ఓ రాజా! నీవిప్పుడు ‘వివేకబుద్ధి’ అనే స్నేహితుని సహాయం ఆశ్రయించు. నీకిప్పుడు చెప్పిన అజ్ఞాన విషయాలన్నీ పరిత్యజించు. నిశ్చలతను అలవర్చుకో. అప్పుడా ఆత్మపదం నీకు కరతలామలకం అవుతుంది. ‘నాది’ అనునది అహంకార - మమకారముల జాడ్యంచేతనే నిన్ను పట్టి పీడిస్తోంది. కాబట్టి అహంకార మమకారాలు వదిలేదెట్లాగో యోచించు.
ఇక, అహంకారత్యాగం కొరకై ఏమి చేయాలో చెప్పమంటావా?… నీవిగా నీవు భావిస్తూవస్తున్న రాజోపయుక్తమైన ఛత్ర - చామరాది చిహ్నములను అన్నిటినీ పరిత్యజించు.
ఈ రాజ్యలక్ష్మిని ఎవరికైనా సమర్పించివేయి. శరీరాభిమానం ప్రారత్రోలి, ఎవ్వరికంటే నీవు ఉన్నతుడవని అనుకుంటున్నావో … వారివారి దగ్గరకు వెళ్ళి భిక్ష ఎత్తు. తద్వారా “నేనే అంతటి వాడినీ - ఇంతటివాడిని” - అనే భ్రమను వదిలించుకో!
Page:286
ఇచ్ఛారాహిత్యం అలవరచుకో! అనగా, సర్వ ఇచ్ఛలను ఆ ఇచ్చలకు సంబంధించిన ప్రయత్నములను వదలివేయి.
’జీవాత్మ ఎవరు? సంసారమేమిటి? మోక్షం ఎప్పుడు వస్తుంది? … అనే ప్రశ్నలను పరిత్యజించు. “ఇదంతా… నాతో-నీతో సహా… పరమాత్మ విన్యాసమే” - అనే అవగాహనను, అనుభూతిని నిరంతర భావన ద్వారా ఆశ్రయించు.
అట్టి ప్రశ్నలకు అనేక వివరములను ఇస్తున్న నీ గురువైన నన్ను కూడా త్యజించివేయి.
అంతా వదలిన తరువాత ఇకప్పుడు ముముక్షువులకుండవలసిన ఉత్తమగుణములందు మాత్రమే దృష్టిసారించు. భోగ-త్యాగములను జగన్నాటకములోని క్రీడా వినోదములుగా గమనిస్తూ పరిత్యజించు.
జగత్తులో ఉంటూ జగత్తులో లేనివాడగుము. సర్వత్యాగివైన మరుక్షణం నీవు మోక్షస్వరూపుడవే! అప్పుడు సర్వోత్కృష్టమగు బ్రహ్మభావమును పొందగలవు. సంసారభ్రాంతికి నీయందు కొంచెం చోటు కూడా ఇక దొరకదు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా భగీరథుడు కులగురువైన త్రితల మహర్షిచే బోధించ బడ్డాడు. ఆశ్రమం నుండి బయలుదేరి అంతఃపురం చేరాడు. గురువు చెప్పిన విషయాలన్నీ ఒకటి తరువాత మరొకటిగా చాలాసార్లు మననం చేసుకున్నాడు. ప్రతివాక్యాన్ని స్వబుద్ధితో బాగా విచారణ చేశాడు. ఇక తన తరువాత కర్తవ్యమేమిటో దృఢంగా నిశ్చయించుకుని స్థిరసంకల్పుడయ్యాడు.
కొద్దిరోజులు మౌనంగా గడిచిపోయాయి. ‘సర్వత్యాగము’ అను సంకల్పబలం సిద్ధించాలనే ఉద్దేశంతో సోమయాగము నుండి విశ్వజిత్ యాగము వరకు గల అనేక యజ్ఞములను నిర్వర్తించాడు. అవన్నీ ముగియగానే ఇక తాత్సారం చేయలేదు. పాత్రాపాత్రముల విచారణ చేయకుండా బ్రాహ్మణులకు, బంధువులకు, తదితరులకు అనేక గోవులను అశ్వములను భూమిని, బంగారమును అమితంగా ఇచ్చివేశాడు. అంతఃపురంలోని అమూల్య వస్తువులను అక్కడి పరిచారికలకు, పేదవారికీ
వేయగా, ఇక ఆతడు కట్టుబట్టలతో మిగిలాడు. రాజు చేస్తున్న దానాలన్నీ చూచి "ఏమిటి? ఈతనికి ఏమన్నా పిచ్చి పట్టలేదు కదా?” అని మంత్రులందరు గుసగుసలాడసాగారు.
ఒక రోజు రాజసభ అనేక సంరంభములతో జరుగుచుండగా, భగీరథుడు లేచి నిలుచున్నాడు. “ఓ కోసలదేశ ప్రజలారా! మంత్రులారా! మీ అనుజ్ఞతో నేనీ రాజ సింహాసనాన్ని పరిత్యజించదలిచాను. మీరు ఎరిగియే ఉన్నారు. ఆతడు రాజుగా మీకు సేవలందించుగాక!” అని అభిప్రాయం వెలిబుచ్చి, సభ నుండి వెనువెంటనే బయల్వెడలి అంతఃపురం జేరాడు.
నాలుగు రోజులు పోయిన తరువాత ఒక రోజు ఒక ఆంతరంగికుని పిలిచి ఆ కోసల
రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలంగా కలలు కంటున్న శత్రురాజుకు కబురుపెట్టి, తన రాజ
Page:287
సింహాసనాన్ని ఆ శత్రురాజుకు సమర్పించివేశాడు. ఆ ఆ శత్రురాజు ఎంతో సంతోషంగా కోసల రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు.
ఇక భగీరథుడు ఒక గోచీ మాత్రం ధరించి అక్కడి వారందరి కన్నులు కప్పి ఎక్కడో తనకే అప్పటికి తెలియని సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు.
ఆ భగీరథుడు తన పేరు ఊరు తెలియని సుదూర గ్రామములందు, అరణ్యములందు ఓపికతో వసించసాగాడు. ఇలా ఆతని జీవితం గడచుచుండగా కొంతకాలానికి ఆతని చిత్తంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. అచిరకాలంలోనే పరమశాంతి లభించగా, ఆత్మయందు విశ్రాంతి పొందాడు.
అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలమున గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒక రోజు సుదీర్ఘ ప్రయాణవశంగా తాను ఇతఃపూర్వం రాజ్యమేలిన కోసల రాజ్యంలో ప్రవేశించాడు.
‘ఇది ఒకప్పుడు నా రాజ్యం, నా నగరం’ అనే సంస్కారం లేకుండానే ప్రధాననగరాన్ని (ముఖ్యపట్టణం) యాదృచ్ఛికంగా చేరాడు. అక్కడ వీథులందు తిరుగుతూ పౌరుల వద్ద మంత్రుల వద్ద భిక్ష యాచిస్తూ ఉండేవాడు.
కొందరు పౌరులు, కొందరు మంత్రులు ఆతనిని గుర్తించటం జరిగింది. అయితే ఆతడు అదేమీ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆతనిని చూచిన కొద్దిమంది మంత్రులు పౌరులు భేదచిత్తు లయ్యారు. ‘ఆహా ! ఎంతటి మహారాజు! అంతటివాడు ఈ రోజు ఇక్కడ భిక్షాటనం చేయటమా? మనలను తన కన్న బిడ్డల వలె చూచిన ఈ భగీరథ చక్రవర్తి మనలను యాచించటమా? అరుగులపై, చెట్టు నీడలలో నిద్రించటమా? ఇది అసమంజసం’…అని తలచిన కొందరు పౌరులు ఆతనికి మధురపానీయములు, ఆహారం తెచ్చి ఇవ్వటం ప్రారంభించాడు. ఆతడు తనకు ఆకలి తీరువరకు మాత్రమే ఎవరిచ్చినా ఏమీ అనకుండా స్వీకరించి ‘శుభం’ పలికి ఊరుకునేవాడు. కొందరు ఆయనను తమ గృహములకు ఆహ్వానించారు. ’లేదు. నాకు ఎక్కడున్నా ఒక్కటే. నాకేమీ కష్టమనిపించనప్పుడు మీకెందుకు తాపత్రయం? మీరు యథా విధంగా మీమీ పనులు చూచుకోండి"… అని చెప్పి మరొక వీథికి వెళ్ళిపోతూ ఉండే వాడు, ఆ చక్రవర్తి !
4,5 రోజులు గడిచేటప్పటికి భగీరథుని రాక గురించి కోసల రాజ సింహాసనం అనుభవిస్తున్న రాజుకు ఎవరో చెప్పటం చేత తెలిసింది. ఎవరినో సేవకులను పంపించి భగీరథుని అంతఃపురానికి ఆహ్వానించాడు. కానీ భగీరథుడు ఆ ఆహ్వానం స్వీకరించలేదు.
అప్పుడా శత్రురాజే భగీరథుడున్న ప్రదేశానికి వచ్చి "హే భగీరథ చక్రవర్తీ! మీరు మహత్తర ఉదార స్వభావులు. ప్రజలకు మీరంటే ప్రాణం. మీ పరిపాలనను ఇప్పటికీ వారు మధుర స్వప్నం వలె భావించటం నేను గమనించాను. పరిపాలనాదక్షులగు మీ ముందు నేనెందుకూ కొరగానని గ్రహించాను. రాజులమైనందుకు మనం కోరుకునేది ప్రజల క్షేమమే కదా! నాకు కుమారులు లేరు. మిమ్మల్నే నా కుమారుడుగా తలుస్తాను. దయచేసి మీ సింహాసనం మీరు అలంకరించి ప్రజలకు,
Page:288
నాకు ఆనందం చేకూర్చండి. నేను మీ రాజ్యం మీకు సమర్పించి మీకు భృత్యుడనై ఉండటానికి సంసిద్ధుడను… అని అనేక విధాల బ్రతిమలాడాడు. నచ్చచెప్పజూచాడు. లాభం లేకపోయింది. ఆ రాజు ప్రేమతో ఇచ్చిన ఒక పండు తప్పితే భగీరథుడు ఇంకేమీ ముట్టుకోలేదు. రాజ్యం విషయంగాని, రాజకీయ విషయాలుగాని, బంధువుల విషయంగాని, మరింకెవ్వరి గురించిగాని భగీరథుడు సంభాషించనైనా లేదు. ఏదైనా ఆ శత్రురాజు చెప్పవస్తే వినలేదు కూడా!
మరొక నాలుగు రోజుల తరువాత భగీరథుడు ఆ నగరం నుండి కాలినడకన బయలుదేరాడు. త్రోవలో కోసలదేశ గ్రామాలూ, పట్టణాలూ ఉన్నాయి. అక్కడక్కడి ప్రజలు భగీరథుని గుర్తుపట్టి గౌరవ - ఆశ్చర్య - దుఖాదులు ప్రదర్శించటం చూచి వాటన్నిటికీ చిరునవ్వుతో సమాధానం ఇస్తూ తన ప్రయాణం కొనసాగించి, క్రమంగా త్రితల మహర్షి ఆశ్రమం చేరాడు. ఆయన భగీరథుని సాదరంగా ఆహ్వానించారు. భగీరథుడు మాత్రం తదితర శిష్యుల లాగానే గురుశుశ్రూష చేస్తూ ఆశ్రమంలోనే కొన్ని రోజులు గడిపాడు. అట్లా కొంతకాలం గడిచింది.
త్రితలుడు శిష్యుడగు భగీరథుని త్యాగబలం, ఆత్మావలోకనాభిలాష చూచి ఆశ్చర్యచకితుడైనాడు. ఒక రోజు శిష్యులందరినీ, భగీరథునితో సహా, సమావేశపరిచాడు.
"ఓ ప్రియశిష్యులారా! ‘సర్వము త్యజించు’ - - అని ఈ భగీరథునికి బోధించాను. ఈతడు సర్వమును త్యజించి గురువగు నాకన్నా కూడా సమున్నతమోక్షస్థానంలో సంస్థితుడైనాడు. ఈ రోజు నుండి ఈతడు నాకు శిష్యుడు కాడు. ఈతనికే నేను శిష్యుడను. ఈతనిని సేవిస్తూ నేను అనుసరించ దలిచాను. మీరందరూ మీమీ ఇచ్ఛానుసారం మరొక గురువును ఆశ్రయించవచ్చు” అని ప్రకటించాడు.
ఆ తరువాత గురుశిష్యులగు త్రితలమౌని భగీరథులు కలసి పాదచారులై అక్కడి నుండి ఏ నిమిత్తం లేకుండానే బయలుదేరారు. వనములందు, గ్రామములందు, పర్వత ప్రాంతములందు, పట్టణములందు సంచరిస్తూ అక్కడక్కడా కొంతకాలం గడిపారు.
వారిరువురు ఈ దేహసంబంధమైన, గ్రహణ - త్యాజ్యముల రెండింటికీ అతీతమగు మానసిక స్వస్థితితో సామ్యభావము పొంది, ఆత్మసుఖ విశ్రాంతి అనుభవిస్తూ ఉండేవారు. అకృత్రిమమగు సుఖ విశ్రాంతిని పొందుతూ ఉండేవారు. ఒక రాజు వెన్నెలకాంతిలో తన ఉద్యానవనంలో సంచరిస్తున్నట్లు వారు నిశ్చింతులై శోక - భయ ఉద్వేగరహితులై, సుఖదుఃఖ ప్రసంగము లేనివారై అనేక ప్రదేశములలో సంచరిస్తూ ఉండేవారు.
ఎద్దాని సమ్ముఖంలో విషయానందములు అర్థరహితములగుచున్నాయో, ఏదైతే సుఖస్ఫురణ గాని, దుఃఖస్ఫురణగాని, మధ్యస్థమైనదిగానీ కాదో … అట్టి నిర్విషయ పరమానందమును వారు అనునిత్యం అనుభవిస్తూ బాలురు సంచరించే ఆటస్థలంలాగా ఈ భూమిపై గల అనేక ప్రాంతాలలో ప్రవేశించారు. ఈ జన - ధన - - తదితర వైభవములు, బ్రహ్మలోకవాసులవరకూ గల అణిమాదిసిద్ధులు వారి దృష్టికి రహదారి ప్రక్కగా ఉన్న ఎండుగడ్డిపరక వలె స్వల్పమైనవిగా తోచేవి. వారిద్దరూ మనుష్య భోగముల నుండి దివ్యభోగముల వరకు పరమవైరాగ్యము కలిగి ఉండేవారు.
Page:289
ఓ రామచంద్రా! ప్రారబ్ధకర్మ వల్ల ఈ శరీరం లభిస్తోంది. మరల కర్మల చేతనే ఇది క్షీణించ బోతోంది. అయితే ఎవరు ఆత్మయందు అనుక్షణికమైన ధారణ కలిగి ఉంటారో …అట్టి వారికి ఈ ప్రారబ్ధ - - ఆగామి ఆగామి - - సంచిత క్రమములన్నీ వర్తించవు. ఈ శరీరాలు, తత్సంబంధిత వ్యవహారాలు చిన్న పిల్లల ఆటలుగా తోచేవారికి, స్వస్వరూప అనుభూతియందు, నిశ్చలులై ఉన్నవారికి ఇక ప్రారబ్దం లేదు. ఆగామీ లేదు. అనగా అవన్నీ వారి దృష్టిలో విషయరాహిత్యం సంతరించుకుంటాయి. సర్వస్థితులందు సమవర్తియగు ఆత్మను సర్వదా సందర్శించేవారికి సంసారమెక్కడిది? సంసారమే లేనివారికి కర్మలు-ఫలాలు ఏమి ఉంటాయి?
❖
ఆ మునులిద్దరూ పూర్వ కర్మల వలన లభించే సుఖ-దుఃఖముల రెండిటినీ ఆనందంగానే చూడసాగారు. వారి స్వస్వరూపమే ఆనందమయమయినప్పుడు ఇంక లోటేమున్నది? ఇచ్ఛను పూర్తిగా వదలి ఉండుటచే వారిద్దరికీ స్వాభావికంగానే పరమశాంతి లభించింది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా ! ఆ విధంగా ఆ త్రితల - భగీరథులు శాంతైశ్వర్య మనస్కులై ఒక సారి అయోధ్య రాజ్యం చేరుకున్నారు. ఆ రాజ్యం ఏలే మహారాజు అప్పటికి కొద్దిరోజుల క్రితమే మరణించి ఉండటం జరిగింది. ఆ మహారాజుకు సంతానం లేదు. అక్కడి ప్రజలు ఖిన్నులై తమకు ప్రాప్తించిన అరాజకత్వము పోగొట్టుకోవటానికి ఉత్తమార్హత గల వ్యక్తి కొరకై వెతకుచున్నారు.
అక్కడ వేదజ్ఞులు కొందరు దైవేచ్ఛానుసారం ఆకస్మికంగా భగీరథుని చూడటం జరిగింది. చక్రవర్తికి ఉండే రేఖలు, ముఖవర్చస్సు వారికి భగీరథునిలో కనిపించాయి. వెంటనే వేదపండితుల నిర్ణయం అక్కడి మంత్రులకు చేరవేయబడింది. వారు కలిసికట్టుగా వచ్చి తమకు రాజు కావలసినదిగా భగీరధుని ప్రార్థించారు. హర్షవైషమ్యాలు లేకయే సర్వుల సంక్షేమ సంతోషాలు కోరటం మహనీయుల నైజం. త్రితల మహర్షి అభిప్రాయం కూడా అదే అవడం చేత భగీరథుడు అందుకు కాదనలేదు. అక్కడి సైనికులు అప్పటికప్పుడు భగీరథుని పేరు అడిగి తెలుసుకొని “భగీరథ మహారాజుకు జై” అను నినాదాలు పలికారు. పట్టపు ఏనుగు తేబడింది. ఆ భగీరథుడు భిక్షుకుని రూపంతోనే ఏనుగును అధిరోహించాడు. ఆ రోజు మొదలుకొని కొన్ని రోజులుగా గొప్ప ఆడంబరములతో పట్టాభిషేక మహోత్సవం జరిగింది.
❖
ఆ సమయంలోనే కోసల మహారాజు మరణించియున్నాడు. తమ భగీరథ చక్రవర్తే అయోధ్యకు రాజయ్యాడని కోసలరాజ్యమంత్రి వర్యులకు ప్రజలకు తెలిసింది. వెంటనే సభాప్రముఖులు అయోధ్యకు వెళ్ళి భగీరథుని కలిశారు.
Page:290
"హే మహారాజా! తామే కదా మా ప్రభువులు. పెద్ద చేపవచ్చి చిన్న చేపను గుటుక్కున మ్రింగినట్లు మీరు రాజ్యం ధారబోసిన రాజు మృత్యువుచే మ్రింగివేయబడ్డాడు. ఆతనికి సంతానం లేరు. అందుచేత, మీరు ఈ అయోధ్యతో బాటు కోసల రాజ్యమును కూడా మహాచక్రవర్తి అయి పరిపాలించండి. తమరు యోగులే! ఇందులో సందేహం లేదు. అయితే, యోగులు కూడా తాము కోరకుండా ప్రాప్తించిన ప్రవాహపతితములగు కార్యములను ధర్మబుద్ధితో నిర్వర్తిస్తారు కదా! మన ప్రజల కోరిక మన్నించండి.” అని వేడుకున్నారు. భగీరథుడు చిరునవ్వుతో వారి కోరికను
అంగీకరించాడు.
ఆ విధంగా భగీరథుడు మరల సప్తసాగర చిహ్నితమైన భూమండలమునకు చక్రవర్తి అయ్యాడు. ఆతడిప్పుడు బ్రహ్మజ్ఞానము పొందియున్నాడు కదా! అందుచేత అజ్ఞాని వలె కాక … సమదర్శి అయి, శాంతమనస్కుడై వీతరాగుడై, మాత్సర్య - విస్మయములు లేనివాడై యథాప్రాప్తములైన కార్యములందు నియమితుడైనాడు.
ఒకప్పుడు ఆ భగీరథుని ముత్తాతలు సగరులు గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞములో నియోగించబడిన యజ్ఞాశ్వం కనబడ లేదు. వారు భూమండలమంతా యజ్ఞాశ్వం కోసం సగరులు వెతికారు. అది పాతాళం జేరినట్లు తెలియరావటంతో, వారు భూమిని త్రవ్వటం ప్రారంభించారు. ఫలితంగా సాగరాలు ఏర్పడ్డాయి. ఆ సగరులు పాతాళం జేరారు. అక్కడ యజ్ఞాశ్వం కోసం వెతక సాగారు. అక్కడ వాళ్ళు కపిలముని ఆశ్రమం ప్రవేశించి ఆయన కోపకారణంగా శపించబడి భస్మీభూతులయ్యారు. వారిని పునీతులను చేయాలి.
ఈ విషయం గరుడుడు చెప్పగా కోసల రాజ్యంలోని కొందలు ప్రజలు విన్నారు.
ఆ వార్త మన భగీరథుని చెవినబడింది. ‘మా ముత్తాతలను పునీతులుగా చేయడం ఎట్లా’? అను విషయం ఆతడు విజ్ఞులతో సంప్రదించాడు. శాస్త్రకారులు ’అయ్యా ! అందుకు ఒక్క ఉపాయం ఉన్నది. స్వర్గలోకంలోని మందాకినీ నదిని పాతాళం వరకు తీసుకుపోగలిగితే ఆ నదీజలస్పర్శచే నీ వంశీకులు పవిత్రులౌతారు. అయితే అది అత్యంత దుస్సాధ్యమైన విషయం’… అని రాజుకు తెలియజేశారు.
అప్పటికి ఇంకా గంగానది భూమిపై ప్రవహించ లేదు. అప్పుడు భగీరథుడు తన వంశీయుల సూక్ష్మదేహములను పునీత మొనర్చాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుని కరుణకై గొప్ప తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు.
బ్రహ్మదేవుడు : బిడ్డా! భగీరథా! నీ సుదీర్ఘ తీవ్ర తపస్సుకు మెచ్చాను. నీకు ఏమి కావాలో కోరుకో. భగీరథుడు : తండ్రీ! బ్రహ్మదేవా! మేమంతా మీ భావనాస్వరూపులమే కదా! నా అంతరంగమేమిటో మీకు తెలియదా? స్వర్గంలోని మందాకినీ నదిని పాతాళం వరకు జేర్చి ఆ పవిత్రజలంతో మా ముత్తాతలగు సగరుల సూక్ష్మదేహాలను పునీతం చేయాలనునది నా ఉద్దేశం.
Page:291
బ్రహ్మదేవుడు : నాయనా! నీవు చేపట్టినది పవిత్రము, మహత్తరము అగు లక్ష్యము. కానీ అదంత సులభం కాదు.
భగీరథుడు : కాకపోవచ్చు. కానీ పరమాత్మ స్వరూపులగు మీ దర్శనమైన తరువాత ఇక దుస్సాధ్యాలేమి ఉంటాయి? కనుక నాకు మార్గం ఉపదేశించి ఉద్ధరించండి.
ఆ తరువాత బ్రహ్మదేవుని ఉపదేశానుసారం భగీరథుడు అనేకసార్లు తపస్సు - శ్రమలకు ఓర్చి ప్రయత్నించాడు. ఈశ్వరుని, జహ్నుమునిని తపస్సుచే సంతోషింపజేసి మందాకిని భూమిపై గంగానదిగా అవతరించటానికి కారకుడయ్యాడు. ఆకాశము నుండి జగత్పతియగు చంద్రశేఖరుని శిరముపై ఆకాశగంగ ఒప్పారుటచే సాంబశివుడు గంగాధరుడైనారు. స్వర్గమున ఉండే పవిత్ర మందాకిని భూమిపై గంగగాను, పాతాళంలో భోగవతిగాను అవతరించి త్రిపథగామి అయింది. ఆ నదీజలం యొక్క స్పర్శచే సగరులు పవిత్రులైనారు.
అజ్ఞానమును తొలగించి ధర్మప్రబోధి అయిన గంగామాత తనయొక్క పుణ్యజలముతో, అనంతకాలం ఈ భూమిని, ఆశ్రితులను పవిత్రం చేస్తూనే ఉండగలదు.
చూచావా రామా ! సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు మొదలైన పరాక్రమవంతులకు కూడా దుర్లభమైన గంగావతరణం ఆ వంశమున జన్మించిన భగీరథుడు తన శాంతి-తృప్తిసమదర్శనాది గుణముల బలంతో సాధించాడు. ఆ గంగయే సగర పుత్రులకు, సముద్రమునకు కూడా సంజీవని అయింది.
ఎవరైతే పూర్ణశాంతచిత్తులై ఉంటారో, ఆత్మ తత్త్వమును అలవరచుకుంటారో… అట్టివారికి అసాధ్యములైనవి సుసాధ్యములౌతాయి.