CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:461

X. బృహస్పతి - కచ సంవాదం

  1. సర్వ త్యాగం అంటే ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ విధంగా శిఖిధ్వజుని మోక్ష కథను విన్నావు కదా! అందులో చెప్పబడిన మార్గంలో పయనిస్తే నీవు ఎన్నటికీ ఖిన్నుడవు కావు. అందులో అంతర్లీనంగా ప్రకటించ బడిన రాగద్వేషవినాశకారకమగు దృష్టిని అవలంబించి పూర్ణానందపథమున సుదృఢముగా నెలకొని ఉండు. శిఖిధ్వజుని లాగానే నీవు కూడా వ్యవహారం ఆచరిస్తూనే భోగమోక్షాలచే పూర్ణుడవై ఉండు.

ఆ శిఖిధ్వజుని లాగానే “పూర్వం ఒకప్పుడు బృహస్పతి కుమారుడైన కచుడు జ్ఞానిగా తీర్చిదిద్ద బడటం” అనే ఒక దృశ్యం నా మస్తిష్కంలో మెరుస్తోంది. సందర్భానుచితం కనుక ఆ సంఘటనను కూడా ఇక్కడ ప్రస్తావించుకుందాం.

#

శ్రీమంతుడు, మహాజ్ఞాని, దేవ గురువు అగు బృహస్పతి గురించి నీవు వినే ఉన్నావు కదా! ఆయన కుమారుడు కచుడు. ఆతడు బాల్యంలోనే సర్వవిద్యా పారంగతుడైనాడు. యౌవనం ప్రవేశించే సరికి అఖండాత్మానుభవమునకు అనేక అర్హతలు సంపాదించుకున్నాడు. ఒక రోజు తండ్రి బృహస్పతి ప్రశాంతంగాను, ఆహ్లాదంగాను ఉన్న సమయంలో కచుడు సమీపించి ఒక ప్రశ్న అడిగాడు. కచుడు : పితృదేవుల వారికి సాష్టాంగదండ ప్రణామములు.

బృహస్పతి : పుత్రా! పూర్ణజ్ఞానివయ్యెదవు గాక! ఏమిటి విశేషం? ఏదో అడగాలని వచ్చినట్లున్నావు! నిస్సంకోచంగా నీ సందేహమేమిటో చెప్పు.

కచుడు : తండ్రీ! ఈ జీవుడు ఎప్పుడూ సంసారపంజరంలో చిక్కుకుని నానా అగచాట్లు పడుచున్నాడే! అట్టి బంధనం నుండి విముక్తుడు కావటం ఎట్లా?

బృహస్పతి : కుమారా! అనేక మొసళ్ళకు ఆలవాలమైన ఈ సంసారసాగరం అతి దుర్భరమైనదే. అయితే ’సర్వత్యాగము’ అను బలం నీకు ఉంటే ఆ మొసళ్ళు నిన్ను ఏమీ చేయలేవు. అప్పుడు నీవు నిర్భయంగా సంసారమును దాటి వేయవచ్చు.

కచుడు : అయితే నేను సర్వమును త్యజించి ఎటకో వెళ్ళిపోతాను. బృహస్పతి : …

బృహస్పతి మౌనం వహించాడు. ‘అవును-కాదు’ అనలేదు. ‘సర్వత్యాగము’ అను శబ్దమునకు కచుడు గ్రహించిన అర్థం అత్యంత అసంపూర్ణమైనదైనప్పటికీ అప్పటికి మాత్రం ఇంకేమీ పలుకలేదు. పుత్రుడు ఎటకో వెళ్ళుచున్నప్పటికీ బృహస్పతికి దుఃఖమేమి కలుగలేదు. మహాత్ములు సంయోగ వియోగములందు మేరుపర్వతంలాగా స్థిరబుద్ధి కలిగి ఉంటారు కదా!

Page:462

కచుడు అక్కడి నుండి బయలుదేరాడు. ఇల్లు-వాకిలి విడిచి మహారణ్యాలలో ప్రవేశించాడు. ఆ విధంగా 8 సంవత్సరాలు గడచిపోయాయి. ఒక రోజు ఒక మహారణ్యంలో ఒకచోట కాకతాళీయంగా కచుడు తండ్రిని కలుసుకున్నాడు. ప్రణామములు అర్పించాడు.

బృహస్పతి : పుత్రా! క్షేమమే కదా?

కచుడు : తండ్రీ! మీరు నన్ను సర్వత్యాగం చేయమన్నారు కదా! ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచాయి. బృహస్పతి : ఊ!

కచుడు : సర్వత్యాగం చేసి ఇన్నాళ్ళైనా నేనింకా అనిందితమైన విశ్రాంతిని పొందనే లేదు. ఎందుచేత? నన్నిప్పుడు ఏం చేయమన్నారు? అతిదీనుడనై మిమ్ములను వేడుకుంటున్నాను, చెప్పండి. బృహస్పతి : చెప్పాను కదా! కొంత త్యజించి, కొంతపట్టుకుని ఉంటే సరిపోదు. సమస్తము త్యజించు. అప్పుడు విశ్రాంతి దానంతట అదే లభిస్తుంది.

ఇట్లా అని బృహస్పతి ఇంకేమీ మాట్లాడకుండా అంతర్ధానమై నిజమార్గంగా వెళ్ళిపోయాడు.

తండ్రి అంతర్ధానమైన తరువాత కచుడు కొంచం సేపు యోచించాడు. ’ఏమిటి? నాన్నగారు సమస్తం త్యజించమంటున్నారు! అన్నీ వదిలాను కదా! అన్నీ వదలిన తరువాత ఇంకేమి త్యజించాలి?… అని ఆలోచించగా, అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. "ఓహో! అదా! ఈ వస్త్రములు, బొంత, చేతికఱ్ఱ ఇవి కూడా త్యజించమని ఆయన ఉద్దేశం కదా! మంచిదే. వీటిని కూడా ఇప్పుడే త్యజిస్తాను”– అని అనుకున్నాడు. శరత్కాలాకాశం మేఘములను త్యజించునట్లు అతను తన వస్త్రములను, బొంతను, చేతి కఱ్ఱను అక్కడే వదిలేసి దిగంబరుడై బయలుదేరాడు. 3 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు అతను ఒక కొండగుహలో దిగంబరుడై ఉండగా తండ్రి, గురువు అయిన బృహస్పతి మరల తారసపడటం జరిగింది. భక్తితో తండ్రిని పూజించాడు. చాలా రోజులైన తరువాత చూడటం చేత బృహస్పతి ప్రేమగా అతనిని కౌగలించుకున్నాడు.

కొద్ది క్షణములైన తరువాత భేదచిత్తుడైన కచుడు గద్గదస్వరంతో ఇట్లా పలికాడు.

కచుడు : నేను బొంత, దండం, వస్త్రం అన్నీ త్యజించాను. సమస్తం త్యజించమని మూడు సంవత్సరాల క్రితం మీరు అన్నారు. అట్లాగే చేశాను. అయినప్పటికీ ఆత్మపదంలో విశ్రాంతి లభించనే లేదు. బృహస్పతి : ’సమస్తం’ అనగా ఏమిటి? వస్త్రాలా? కాదే. ఈ సమస్తం చిత్తమే అయి ఉన్నదని నీవు శాస్త్రకారులు వాక్యములు వినియే ఉన్నావు కదా! కనుక చిత్తమును త్యజించినప్పుడే సమస్తం త్యజించినట్లాతుంది. చిత్తము ఉన్నంతవరకూ ఏదీ త్యజించనట్లే.

ఇట్లు పలికి బృహస్పతి వేగంగా ఆకాశమునకు ఎగిరి మరల ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు కచుడు భేదరహితమైన బుద్ధితో మరికొంత యోచించసాగాడు.

“అవును ! నా తండ్రి అన్నది నిజమే. ఈ వస్తువులను ధరిస్తున్నది చిత్తం చేతనే కదా! చిత్తాన్నే త్యజించాలి. అయితే చిత్తమును త్యజించటమంటే ఏమిటి? ఎట్లా?” - అని తీవ్రంగా చింతన

Page:463

చేయసాగాడు. “ఒక వస్తువునైతే త్యజించవచ్చు. మరి, చిత్తమును ఎట్లా త్యజించటం?” అని చాలాసేపు యోచించాడు. అతనికి ఆ వాక్యములోని అర్థము గాని, ఉద్దేశము గాని ఏమాత్రం అవగాహనకు రాలేదు. ’పోనీ, ఈ దేహమును త్యజిద్దామా? ఇదొక్కటేగా నాకు మిగిలి ఉన్నది!’ అని యోచించసాగాడు. ’లాభం లేదు. పదార్థమయమగు ఈ దేహం చిత్తం యెట్లా అవుతుంది? స్వయం ప్రతిపత్తి లేని దేహాన్ని త్యజించినంత మాత్రంచేత పితృదేవులు ఉద్దేశించిన చిత్తం యొక్క త్యాజ్యం అవదు’… అనుకున్నాడు.

మరిప్పుడేం చేయాలి? “ఎందుకు? మహాశత్రువగు చిత్తం గురించి నాన్నగారినే ప్రశ్నిస్తే పోతుంది కదా!” అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఏమాత్రం తాత్సారం చేయలేదు. తండ్రిని దర్శించ టానికి బయలుదేరాడు. దేవలోకంలో ఒకానొక ఏకాంత ప్రదేశంలో బృహస్పతి ఆసీనులై ఉన్నాడు.

కచుడు : మహాత్మ ! పితృదేవా! మీరు చిత్తమును త్యజించమని ఆజ్ఞాపించారు. నేను ఈ దేవలోకాన్ని త్యజించాను. చివరికి వస్త్రాలు కూడా త్యజించాను. అంతేకాదు ఈ పాంచభౌతికదేహం త్యజించటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అయితే చిత్తమును త్యజించటం ఎట్లాగో నేను గ్రహించలేకపోతున్నాను. అది ఒక వస్తువా? దాని స్వరూపమేమిటో, ఎక్కడుంటుందో, ఎలా త్యజించాలో చెప్పండి. అది విని మీరు చెప్పినట్లే చిత్తమును త్యజించివేస్తాను.

బృహస్పతి : కుమారా! ‘మనుజునికి గల అహంకారమే చిత్తము’ అని చిత్తము గురించి ఎరిగిన విజ్ఞులు చెప్పుతూ ఉంటారు. ఈ జీవుని అంతరంలో ఏ అహంకారమేదై ఉన్నదో… అదే చిత్తము. కచుడు : 33 కోట్ల దేవతలకు గురువగు ఓ బృహస్పతి గురువర్యా! ’అహంభావం’ అనేది చిత్తము ఎట్లా అవుతుంది. అది అట్లా ఉంచి, నా దృష్టిలో అహంకారం త్యజించటమనేది దుష్కరమైన విషయమనిపిస్తోంది. అట్టి త్యాగం నేను ఎంత ప్రయత్నించినా కూడా సిద్ధించటమే లేదు. కాబట్టి ఈ అహంకారం ఎట్లా త్యజించాలో తెలుప ప్రార్థన.

బృహస్పతి : ఈ అహంకారం త్యజించటం కష్టతరమైన విషయమే. అయితే దీనికొక ఉపాయం ఉన్నది. ఆ ఉపాయాన్ని ఆశ్రయించావా, అహంకారాన్ని త్యజించటం పూవును నలిపినంత తేలిక అవుతుంది.

ఆ అహంకారమునకు ఏదైతే ‘నిత్య - నిర్లిప్తసాక్షి’ అయున్నదో… అట్టి సాక్షిమాత్రమును ఆశ్రయించావా అప్పుడు కనులు మూయుటకంటే కూడా అహంకారమును త్యజించటం సులభమని నీవు గ్రహించగలవు. ఇందులో అనుమానమే లేదు.

ఈ అహంకారం ఎట్లా పుడుతోందో ముందుగా గ్రహించు. అది ఎట్లాగో చెబుతాను, వినుసాక్షియగు ఆత్మ యొక్క స్వరూప స్వభావములు ఏమరచుటచేతనే, లేక ఆత్మ గురించి అజ్ఞానమాత్రం చేత అహంకారము అనబడే భ్రమ వస్తువు సిద్ధిస్తోంది. కనుక అహంకారము ఆత్మజ్ఞానముచే తప్పకుండా నశిస్తుంది.

Page:464

మిథ్య అయి కూడా భ్రమచే ఉన్నట్లు తోచుటచేత ’అహంకారము’ అనబడేది యథార్థానికి లేదు. యథార్థానికి లేకపోయినా ఉన్నట్లు అనిపించటానికి ఈ ప్రపంచంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఒక పిల్లవాడి బుద్దిలో భూతమునకు సంబంధించిన సమాచారం ఏర్పడి ఉండటం చేత, ఆ బాలునికి మసక చీకట్లో భూతము ఉన్నట్లే కనిపిస్తుంది.

మిథ్యాజ్ఞానానుభవం -

  1. “ఏమిరా అబ్బాయ్! నీకు భూతం కనిపిస్తోందా?” అంటే, ఆ పిల్లవాడు ”ఆహాఁ! ఉన్నది. చూచాను” అంటాడు. “ఎట్లా ఉంటుంది, నీవు చూచిన భూతం?” అని అడిగితే ’కొమ్ములు పిల్లికళ్ళు చారెడు ముక్కు - బారెడు నోరు" … అని తాను ఎవరి దగ్గరో విన్న వర్ణనలన్నీ చెపుతాడు. అతను చూస్తున్న భూతం ఆతని బుద్ధిలోనే ఉన్నది కాని, బాహ్యమున కాదు కదా!

  2. ఒకాయన ఏదో మసక చీకట్లో ఒక పెద్ద త్రాడును చూచి, ’నీకేం తెలుసు! ఆ పాము చుట్టలు చుట్టుకుని బారెడంత ఉన్నది. అది కాటువేసిందా, చచ్చామే ! ఆ మధ్య ఎవరినో ఇట్లాగే పాము కరచి వాడు చచ్చాడట కూడా! దానికి నోరు తెరచినప్పుడు మిరమిర మెరిసే కోరలు ఉంటాయి. అది ఊదిందా, ఆ విషం శరీరానికి తగిలి, ఇక మనం పుళ్ళు వచ్చి చావవలసిందే’ …ఇలా చెప్పుకుంటూ పోతాడు. ఆ పాముకు సంబంధించిన అనుభవ జ్ఞానమంతా ఉన్నదెక్కడ? ఆ భ్రమించేవాని బుఱ్ఱలోనే కదా! అది పాము కాకపోయినా, పాముకు సంబంధించిన వికారాలన్నీ ఆతని ఆలోచనలను కలచివేస్తూ ఉంటాయి.

  3. ఎండమావులలో తరంగాలు చూచి "అదిగో! అక్కడ నీళ్ళు మిలమిల మెరుస్తుంటే నీళ్ళులేవని అంటారేం?” అని ఒక బాటసారి తోటివారిపై మండిపడతాడు. అక్కడ నీళ్ళు లేవు. అయినా ఆ బాటసారి బుద్ధిలో గల నీళ్ళకు సంబంధించిన సమాచారమంతా ఏకమై జలమునకు సంబంధించిన భ్రమను బలపరుస్తోంది కదా!

  4. ఒక మెల్లకన్ను వానికి నిజంగానే రెండవ చంద్రబింబం కనిపిస్తుంది. ’అరేఁ! నాకు రెండవ చంద్రుడు స్పష్టంగా కనిపిస్తుంటే వీడెవడో రెండవ చంద్రుడు ఉండడమే అసంభవమని దబాయిస్తాడేమిటి?’… అని కొఱకొఱ చూస్తాడు.

ఈ నాలుగు దృష్టాంతాలులాగానే అహంకారం మిథ్యయే అయి ఉండి కూడా స్ఫురిస్తోంది. అజ్ఞానముచే అవన్నీ ఎట్లా కనబడుచున్నాయో, సత్తుగాని, అసత్తుగాని కానట్టి అహంకారము కూడా అట్లాగే ఉన్నట్లే అనిపిస్తోంది.

వాస్తవానికి ఆత్మ అంశరహితమైనది. అది సంకల్ప వర్జితమైనది. అంతేకాదు. ఈ సమస్తము సర్వదా అదే అయి ఉన్నది. సర్వవ్యాపకమగు అయ్యది పరమాణువు కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. అట్టి చిన్మాత్రము అగు ఆత్మ ఒక్కటే సత్యమై వెలయుచున్నది.

సర్వత్ర, సర్వదా, సర్వప్రకాశం, సర్వజన్తుషు | తదేవైకం కచత్యమ్చు విలోలా స్వబ్ది వీచిషు ॥

Page:465

సముద్రంలో అనేక తరంగాలున్నాయి. నిరంతరం ఎన్నో లయిస్తున్నాయి. మరికొన్ని పుట్టుకొస్తున్నాయి. అయితే తరంగాలన్నిటిలోనూ ఉన్నది ఒకే జలం కదా! సర్వదా, సర్వత్రా సర్వజీవుల రూపంగా - సర్వ జీవులందూ ఆ ఆత్మ ఒక్కటే ప్రకాశరూపమై స్ఫురిస్తోంది. అటువంటి ఆత్మయందు అహంభావం అనునది ఏ రూపంలో ఎట్లా ఉత్పన్నమౌతుంది చెప్పు? దీపంలో ఉండే నీలఛాయా విభాగం జలమంటే మనం ఒప్పుకుంటామా? అట్లాగే జలంలో చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయా? ఆత్మయందు అహంకారమనునది ఉండజాలదు. కాబట్టి కుమారా, కచుడా! నీకు వ్యర్థముగా అనుభవమగుచున్న ‘నేను-వాడు-నీవు’ అను పరిమితాహంకార స్వరూపములపై నీవు విశ్వాసమును తొలగించుకో. ఎందుకంటావా? నీవు ఆత్మవు మాత్రమే. అట్టి ఆత్మయందు దేశ-కాల పరిచ్ఛేదములు ఎట్లా ఏర్పడతాయి? అది సర్వదా స్వచ్ఛమై నిత్యోదిత తత్త్వమై సర్వవ్యాపకమై సమస్తమునకు అధిష్ఠానమై ఉన్నది. సమస్త బ్రహ్మాండములకు ఆధారము, సారము కూడా ! అట్టి నిర్మలము, నిత్యము, అనంతరము, నిత్యానంద స్వరూపమే నీవు కూడా!

అఖండము, అద్వయము, సన్మాత్ర రూపము అయినట్టి నీ యందు ఇక పరిచ్ఛిన్నమగు “నేను” “నీవు” అను వాటికి ఉనికి ఉండటమే కుదరదు. ఒకే రసము వనమంతా విస్తరించి ఫలములుగాను, పుష్పములుగాను, ఆకులుగాను అగుచున్నది చూచావా! నీవే నీకు దర్శనమగు ఈ చరాచర జగద్విషయములుగా విస్తరిస్తున్నావు. ఇది గమనించి, స్వస్వరూప ఔన్నత్యమును గ్రహించి స్వస్థుడివి కమ్ము.

శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా రామా! ఈ విధంగా ‘ప్రత్యగాత్మ-పరమాత్మ’ ఈ ఇరువురి ‘ఐక్యము’ అనే పరమయోగమును దేవగురువగు బృహస్పతి తన కుమారుడగు కచునకు ఉపదేశించాడు. అది విని, మరల మరల తాను అంతకు ముందే వినిన యుక్తుల చేత, స్వకీయ విచక్షణ చేత విచారణ చేసిన వాడై, ఆ కచుడు క్రమంగా ’లేనివస్తువే’ అయిన అహంకారమును రహితం చేసుకున్నాడు. హృదయగ్రంథులు ఛిన్నమొనర్చుకుని, ప్రశాంత బుద్ధికలవాడై, ఏ వికారములు లేనివాడై స్వయంప్రకాశకమగు మణివలె వెలుగొందాడు. నీవు కూడా అట్లే స్వయమాత్మజ్యోతి స్వరూపుడవై వెలుగొందుము.

అహంకారమును అసత్తుగా ఎరుగుము

అహంకారమ్ అసత్ విద్ధి, ఏన మా ఆశ్రయ మాత్యజ । అసతః శశ్వ శృంగస్య కిలత్యాగ గ్రహౌ కుతః ॥

“ఈయనేమో కుందేటికొమ్మును ఆశ్రయిస్తున్నాడు. ఆయనేమో త్యజిస్తున్నాడు"…అనే వాక్యానికి అర్థమేమన్నా ఉన్నదా? కుందేలుకు కొమ్మే ఉండదు కదా! అట్లాగే ‘అహంకారము అనేది మిథ్య’ అని తెలుసుకొని ఉండు. ఇక నీవు దానిని ఆశ్రయించనూ వద్దు, త్యజించనూ వద్దు. మిథ్య అయిన దానిని పట్టుకోవటం గాని, వదలటం గాని ఉంటాయా?

Page:466

అసంభవత్యహంకారే, క్వతే మరణ-జన్మనీ ।

నభః క్షేత్రే తథా వ్యుప్తం కేన సంగృహ్యతే ఫలమ్ II

“ఒకాయనకు ఆకాశంలో గొప్ప పొలం ఉన్నది. ఆ పొలంలో మామిడి వృక్షాలు ఉన్నాయి ఆ మామిడి వృక్షాలకు కాచినవే ఈ ఫలములు" … అనే వాక్యం ఒప్పుకుంటామా? ఆకాశంలో పొలం ఎట్లా ఉంటుంది? అహంకారమే అసంభవమైనప్పుడు ఇక అహంకారం పుట్టటం చావటం అనేది ఎవరికి? ఎచ్చట?

నిరంశం శాంతసంకల్పం, సర్వభావాత్మకమ్ తతమ్ |

పరమాదప్యణోః సూక్ష్మం చిన్మాత్రం, త్వమ్ అమనోమయమ్ ||

సర్వ అంశలకు అతీతమై, శాంతమై సర్వభావాత్మకమై, పరమాణువు కంటే కూడా సూక్ష్మమై మనోరహితమై ఏ చిన్మాత్రము సర్వదా ఉండి ఉన్నదో…. ఓ రామా! అదియే నీవు.

యథా అంబస తరంగాది, యధా హేమే అంగదాది చ |

తదేవ తదివా భాసం తథా అహంభావ భావితః ॥

ఒకడు సముద్రం ఒడ్డున కూర్చుని ‘ఇది చిన్నతరంగం, అది పెద్ద తరంగం’… అని అనుకుంటున్నాడు గాని, తరంగాలన్నిటిలోనూ ఉన్నది ఒకే జలం అని ఏమరచుచున్నాడు. ‘ఇది ఉంగరం, అది గాజు, ఆ ప్రక్కది వడ్డాణం’… అని అనుకుంటున్నాడు గాని ‘ఇదంతా ఒకే బంగారం’ …అని ఏమరచుచున్నాడు చాచావా ? అట్లాగే చిన్మాత్రుడైన ఈ జీవుడు ’అహంభావమును భావించ బడుచున్నాడు. ఓ రామా! మాయామమయమగు ఈ జగత్తంతా కూడా అజ్ఞానము చేతనే స్థితి పొందియున్నది. అయితే జ్ఞానముచే ఇదంతా కూడా బ్రహ్మరూపంగా అనుభవం కాగలదు. కనుక నీవు ద్వైత ఏకత్వబుద్ధిని త్యజించు. అప్పటికీ శేషించియుండే దానియందు సుఖంగా స్థితి కలిగియుండు. అంతేగాని మిథ్యాపురుషుని వలె వ్యర్థంగా దుఃఖితుడవు కావద్దని నా మనవి.

ఈ సంసారము మహాసాగరమువలె దాటుటకు అత్యంత దుర్భరంగా అనిపించవచ్చు గాక! అయితే ఏం? ఎండకు మంచుకరిగిపోవునట్లు, జ్ఞానముచే ఇది పటాపంచలు కాగలదు.