Page:467
XI. మిథ్యా పురుషుడు
శ్రీరాముడు : మునీంద్రా! ఒక చాతక పక్షి చాలాకాలంగా వర్షపు జలం కోసం ఎదురుచూస్తూ ఉండగా, ఒక రోజు అనుకోకుండా దైవవశంగా కుంభపోతవర్షం పడితే ఎంత ఆనందిస్తుంది? మీరు కురిపించే జ్ఞానామృతంచే జ్ఞానామృతంచే నా అంతరంగం అంతటి తృప్తిని శీతలత్వమును అనుభవిస్తోంది. సమస్త - అసమాన సంపదలకు ఆవల నేనిప్పుడు స్థితి కలిగియున్నాను.
అయితే, బాగా దాహంగా ఉన్న ఒక చకోరపక్షి ఎంతగా చంద్రకిరణాలు గ్రోలినా తృప్తి పొందనట్లు మీ వాక్యాలు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది. ‘చాలు’ అను తృప్తి కలగటమే లేదు.
మీ వాక్యములచే తృప్తుడనైనప్పటికీ మిమ్ములను మరల అడుగుచున్నాను. ఎంత తృప్తిచెందినా అమృతాన్ని వద్దు అని ఎవడూ అనడు గదా!
ఇప్పుడు మీరు “మిథ్యా పురుషుడు” అనువాని గురించి ప్రస్తావించారు. అవస్తువగు ఈ జగత్తును వస్తురూపంలో ప్రదర్శించే ఆ మిథ్యా పురుషుడెవడు? ఆతని కథ ఏమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : హాస్య సన్నివేశం వంటి ఆ మిథ్యా పురుషుని గురించి చెబుతాను విను.
అందరికీ తెలిసియే ఉన్న ఒకానొక పురుషుడున్నాడు. ఆతను మాయాయంత్ర మయుడు. చిన్న పిల్లవాడిలాగా అల్పమైన బుద్ధిగలవాడు. మూఢత్వంలోను, మూర్ఖత్వంలోను ఆతనికి ఆతడే సాటి. ఆతడు ఒకానొక ప్రదేశంలో నివసిస్తున్నాడు. బాగానే ఉన్నదా…?
అయితే, అతడు పుట్టింది, పెరిగింది ఒక ఏకాంత ప్రదేశంలో. ఇప్పటికీ ఆతడు ఆ ఏకాంత ప్రదేశంలోనే ఉన్నాడు. అక్కడ ఆ మిథ్యా పురుషుడు తప్పితే మరింకెవరూ లేరు. ఆ ప్రదేశంలో ఏదేది ఉన్నదో అదంతా ఆతడి విన్యాసమే. అనేక దర్పణాలలో ఒకే మనిషి అనేక కోణాలలో ప్రతిబింబిస్తాడు, చూచావా? ఆ మిథ్యా పురుషుడే అనేక విశేషాలుగా అక్కడ (ఆతడు ఉన్న ప్రదేశంలో) ప్రతిబింబిస్తున్నాడు. ఆతనికి అనుభవమయ్యేదంతా ఆతని ఆభాస మాత్రమే!
అయితే ఏం ? ‘ఇన్నిట్లో నేనే ఈ వివిధ రూపాలుగా ప్రతిబింబిస్తున్నాను’… అనే విషయం ఆ దుర్బుద్దికి తెలియటం లేదు.
ఆతడు ఈ విధంగా ఆ ఏకాంత ప్రదేశంలో ఎదుగుచూ ఉండగా ఏం జరిగిందో విను. ఒక రోజు “నేనెవరినబ్బా?” అనే ప్రశ్న వచ్చింది. ’నేను నా చుట్టుప్రక్కల ఉండే ప్రదేశ ఆకాశమునకు చెందిన వాడను. అసలు నేను ఆకాశమునే. కాబట్టి నా ఈ ప్రదేశమును సర్వదా రక్షించుకోవటమే నా పని. - అనే సంకల్పం ఆతనిలో పుట్టింది.
Page:468
మరి ఈ ప్రదేశాకాశమును రక్షించటానికి ఏం చేయాలి? "ఇది ఎటూ పోకుండా గోడలతో ఇల్లు కట్టిస్తే పోలా?” అని అనుకున్నాడు. ఇంకేముంది? తానున్న ఆ ప్రదేశంలో చుట్టూ ఓ పెద్ద ప్రహరీ గోడ కట్టి, దాన్ని పెద్ద గృహంగా తీర్చిదిద్దాడు. “తనది. తన రూపమే” అని అనుకున్న ఆ ప్రదేశాకాశాన్ని గృహాకాశంగా మార్చివేశాడు. ఆ గృహము యొక్క అంతర్భాగాకాశంలో కూర్చుని ‘ఇక నాకేమి ఫరవాలేదు. ఈ నాలుగు గోడల మధ్య నేను రక్షించబడినట్లే. దీనిని ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండటమే నా పని. ఇక నాకేం అవసరం లేదు’… అని అనుకుంటూ సంతుష్టుడైనాడు.
రోజులు దొర్లుతున్నాయి. మాసాలు, ఋతువులు గడచి పోతున్నాయి. ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షం వస్తున్నాయి. గతిస్తున్నాయి. ఏదైనా సరే, కాలగతికి హరించవలసినదే కదా! ఆ ఇల్లు కాస్తా, కాలగతిచే శిథిలమైపోయింది. గోడలు నేలకూలాయి. అప్పుడా మిథ్యా పురుషుడు ఇట్లా అనుకున్నాడు.
"అయ్య బాబోయ్! కొంపమునిగింది. ఈ గోడలు కాస్తా నేలకూలాయ్! ఓ గృహాకాశమా! నీవు నశించిపోయావా? అయ్యో! కొద్ది రోజులలో అంతు దొరక్కుండా పోయావే? ఇప్పుడేమిటి చేయాలి?”… అని దుఃఖించసాగాడు. తనదనుకున్న గృహాకాశాన్ని రక్షించటానికి అక్కడే ఒక నుయ్యి ఒకటి త్రవ్వుకున్నాడు. ’నా ఆకాశాన్ని ఈ నుయ్యిలో జాగ్రత్తగా పదిలపరచుకుంటాను’ అని అనుకున్నాడు. ఇక ఆ కూపాకాశాన్ని రక్షించుకుంటూ రోజులు గడుపుచున్నాడు.
ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ‘ఈ నుయ్యి నాది’ అని అనుకుంటూ ఉన్నంత మాత్రంచేత కాలగతి ఊరకుంటుందా? కాలక్రమంగా కొన్నాళ్లికి గాలి - ధూళి ఏకమై ఆ నూతిని క్రమక్రమంగా పూడ్చి వేయసాగాయి. అట్లా ఆ కూపమంతా పూడిపోయేసరికి ఆ మిథ్యా పురుషునికి ఎక్కడ లేని దుఃఖాలన్నీ మళ్ళీ వచ్చిపడ్డాయి. ’అయ్యో! నేను నా ఆకాశమును తీసుకువచ్చి ఈ నుయ్యిలో కూపాకాశంగా మార్చి దాచుకున్నానా! ఈ పాడు ధూళి గాలికి లేచి నూతిలోకి పడటంతో ఈ నుయ్యి కాస్తా పూడుకుపోయింది. ఇప్పుడు నా ఈ ఆకాశాన్ని ఎక్కడ దాచుకోవాలి? సరే ఇక్కడ మట్టితో ఒకపెద్ద కుంభమును తయారుచేసి ఆ కుంభము (కుండ) ఆకాశాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను”… అని అనుకున్నాడు.
క్రిందా - మీదా పడి ఒక కుంభాన్ని తయారు చేసుకున్నాడు. కుపాకాశాన్ని కుంభాకాశముగా మలచుకొన్న అనుభూతితో సంతోషం పొందాడు. ’అమ్మయ్య! ఇక ఫరవాలేదు. ఈ కుంభములో నా ఆకాశాన్ని కాపాడుకుంటాను. ఇంతే! ఇక ఎంతకాలమైనా కానీ!” … అని సంతోషించాడు. అట్లా ఆ కుంభమును, అందులోని ఆకాశాన్ని చూచుకుంటూ కొద్ది నెలలు గడిపాడు. కొంతకాలానికి ఈ కుంభముకాస్తా చెత్త, మట్టి కూరుకుపోయి క్రమంగా ఎప్పుడో నామరూపాలు కనబడకుండా పోయింది. ‘ఇదేంటిరా నాయనా! కుంభము కాస్తా నశించిపోయింది ? ఇప్పుడేం చేయాలి?’ అని కొంతకాలం దుఃఖించాడు.
సరే! అప్పుడు అక్కడా-ఇక్కడా తిరిగి కొన్ని వాసాలు, రెల్లుగడ్డి, తాటాకులు సంపాదించి ఒక
Page:469
పాకను నిర్మించాడు. ఈ పాకలో నాలుగు గదులున్నాయి. ఆ గొప్ప పాకశాలపై ఎంతో ఆసక్తి కలవాడై, తన్మయుడై తన ఆకాశాన్ని ప్రతిక్షేపించుకున్నాడు. మరికొంత కాలం తరువాత ఆ పాక కూడా నేలకూలింది. ఆకులు, రెల్లుగడ్డి ఎండి నశించిపోయాయి. మన మిథ్యా పురుషుని దుఃఖ స్థితి మరల పునరావృతమైనది. ఆ నాలుగు గదుల పాకశాల గురించి ఏడ్చి, ఏడ్చి కొన్నాళ్ళైన తరువాత గోగు పుల్లలు తెచ్చి ఒక ధాన్యపు కొట్టు (కుసూలము) నిర్మించాడు. అతి కొద్ది కాలంలో ఆ కుసూలము కూడా నేలమట్టమై హరించుకుపోయింది. అది నశించినప్పుడు అతని దుఃఖం వర్ణనాతీతం.
ఓ రామచంద్రా! ఈ విధంగా ఆతడు ఇల్లు, నుయ్యి, కుండ, పాకశాల, ధాన్యపు కొట్టు మొదలైనవి నిర్మించుకోవటం… అవి కాస్తా నశించటం - ఈ విధంగా అనంతకాలం గడచిపోతోంది. అతను ఎంతో అభిమానంతో ఏదో ఒకటి నిర్మించుకోవటం, అది కాస్తా కాల ప్రవాహముచే నశించటం, అది నశించినప్పుడల్లా ఆ మిథ్యా పురుషుడు గొప్ప దుఃఖం పొందుతూ కొంతకాలం గడపటం-ఈ తతంగం సాగిపోతూనే ఉన్నది. అట్లా వేల కొలది రచనలు చేసుకుంటూనే ఉన్నాడు. అవన్నీ మరికొంత కాలానికి నశించటం జరుగుచూనే ఉన్నది.
ఇక ఆ మిథ్యా పురుషుడు ఒకప్పుడు ’నేను సుఖంగా ఉన్నాను. ఎందుకంటే నీ ఆకాశం ఇక్కడ పదిలపరచాను కదా!”…అనుకోవటం, ఆ నిర్మించుకున్నది శిథిలం కాగానే భోరున ఏడవటం… ఇదంతా చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. కానీ ఏం చేయాలి? మేము చెప్పుచున్న దేమో అతడు వినడాయె!
శ్రీరాముడు : స్వామీ! మీరు ఇంతవరకు వర్ణించి చెప్పిన ఆ మిథ్యా పురుషుడెవడు? ఆతడు ఆకాశ సంరక్షణ చేసుకొంటున్న తాపత్రయమంతా ఏమై ఉన్నది? ఆ మాయా పురుషుడు తను పుట్టిన తనదనుకొన్న స్థానమును (స్థలమును) కాపాడుకోవటానికి గృహాదులను నిర్మించుకోవటంలోను అవి నశిస్తున్నప్పుడు భోరున ఏడవటంలోను తాత్పర్యమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ మాయా యంత్రమయుడగు పురుషుని గురించి మనం చెప్పుకున్న విశేషాలకు సంబంధించిన తాత్త్వికార్థం ఏమిటో చెపుతాను విను.
అతడు మరెవరో కాదు. ఆతడు శూన్యాకాశమునుండి ఆవిర్భవించిన ఈ ‘అహంకారము’ అనునదే! ఏ ఆకాశకోశమునందైతే ఈ జగత్తంతా అనంతమై భాసిస్తోందో… అదియే అహంకారము. అయితే అట్టి అహంకారం సృష్టికి పూర్వం స్వయంగా అసత్తై, శూన్యమాత్రమై ఉన్నది. ఏ మాయాకాశం
Page:470
నుండి అహంకారమనునది ఉత్పన్నమౌతోందో అట్టి ఆ మాయాకాశము యొక్క ఉనికి - - అధిష్ఠాన రూపముచే బ్రహ్మమునందే ఉండి ఉన్నది. అనగా, చిదాకాశమునందు ఆధ్యస్తమైన మాయాకాశము నుండి ‘అహంకారము’ అనేది ఉదయిస్తోంది సుమా!
అనాత్మయే అయినప్పటికీ ‘ఆత్మత్వం’ పొందిన ఈ అహంకారం మాయాకాశముననే (తాను జన్మించిన స్థానమునందే) వృద్ధి పొందుతోంది. అక్కడే ’ఇదిగో, ఇది నాకు ఇష్టం. అది ఇష్టం ఉండదు’ …మొదలైన అనేక రకములైన కల్పనలన్నీ కల్పించుకుంటోంది. ఇక ఆ అహంకారం ఇష్టమైన వాటిని సంపాదించుకోవటం కోసం, అయిష్టమైన వాటిని తొలగించుకోవటం కోసం సుదీర్ఘ కాలంగా మహాప్రయత్నముల సంరంభంలో మునిగి ఉంటోంది. అనాత్మయగు ఈ పాంచ భౌతికమైన దేహ పంజరమును అద్దాని సంబంధమైన ఆశావిశేషాలను చూచుకుని ‘ఇదే నా సర్వస్వం. ఇదే నా స్వరూపం. ఇంత మాత్రమే నేను’ అని అనుకుని దేహాన్ని ఆశలను రక్షించుకోవటానికి ప్రవృత్తమౌతోంది. అట్టి ఈ పాంచభౌతిక దేహం కాలంచే నిర్మించబడింది కనుక తప్పకుండా అయితే, కాలము చేత పొందబడేదంతా హరించబడవలసినదే కదా!
ఈ దేహం ఆయా అవస్థలలో కృంగిపోతూ ఉంటే ఇక ఆ అహంకారం ‘గోవిందా! ఇక నా పని అయిపోతోంది. ఇక గతి లేదు. చేయగలిగినది లేదు’… అంటూ వాపోతున్నది. దేహమును ఆశ్రయించినంత కాలం దేహరంధ్రముల వంటి ఇంద్రియములకు విషయములగుచున్నవాటి పట్ల ప్రీతి-అప్రీతులను కల్పించుకొని ఉంటోంది. ఇక దేహము శిథిలమగుచున్నప్పుడు ’నా సర్వస్వము పోతుంది నేను ఇట్లా శిథిలమౌతున్నాను… అని గావుకేకలు పెట్టుచున్నది. ఆ విధంగా పూర్వ దేహములు నశించుచుండగా క్రొత్త క్రొత్తవగు ఉత్తరోత్తర దేహములను సృష్టించుకుంటోంది.
ఈ అహంకారమే మాయాపురుషుడు అదియే మిథ్యా పురుషుడు స్వతహాగా అసత్తే అయినప్పటికీ ఈ అహంకారము (నేను-నాది అను ఆవేశం) మాయచే వ్యర్థంగా ఉదయిస్తోంది. ఈ భూచర-జలచర ఆకాశచరాది అనేక దేహములను ఇష్టానిష్టముల కారణంగా ఆశ్రయిస్తోంది. ఎప్పుడు ఏ దేహమును ఆశ్రయించటం జరిగితే అదే తన పరిమితము, అవధులు అని సంకుచితత్వము సంతరించుకుంటోంది ‘ఈ దేహాన్ని నేను ఏం చేసి రక్షించుకోవాలి?’ అని అగచాట్లన్నీ తెచ్చిపెట్టుకుంటోంది.
అయితే ఏఏ జగదాకార విభ్రమములు అహంకారమును మోహింపజేస్తున్నాయో చెబుతాను విను- 1. జీవుడు 2. బుద్ధి 3. మనస్సు 4. చిత్తము 5. మాయ
ఇటువంటి పేర్లన్నీ అహంకారము ఆశ్రయించే మోహ వేషములే! ఇటువంటి అనేక నామరూపములచే అనేకత్వము పొంది, వేలకొలది రూపములు ధరించి, తనచే కల్పించబడిన పదార్థములచే తానే విజృంభిస్తోంది.
అనగా, ‘పూర్ణబ్రహ్మము’ న ‘అహంకారము’ అనే మిథ్యాపురుషుడు భ్రమ (లేక మాయ, కల్పన)… అనతగిన కారణంగా ఉదయిస్తున్నాడు. అతడు భూతాకాశము యొక్క కల్పన కావించుకొనుచున్నాడు. మట్టి రాయి లేని గోడలాగా ఈ జగత్తు యొక్క రచనాచమత్కృతిని
Page:471
నిశ్చయిస్తున్నాడు. తనంతట తానే జగజ్జలంలో కష్టాలను, చెప్పలేనన్ని చిక్కులను, దుఃఖములను, సుదీర్ఘకాలగతిని పొందుచున్నాడు.
ఓ రామచంద్రా! ఆ మిథ్యా పురుషుడు ఘటాకాశములను “తనది తన స్వరూపము” అను శంకతో ప్రవర్తిస్తున్నట్లుగా నీవు మాత్రం అట్టి క్లేశావస్థలకు చోటు ఇవ్వవద్దు. వాస్తవానికి నీ స్వరూపం. నా స్వరూపం. తదితరులందరి స్వరూపం ఆత్మయే కదా! ఆకాశము కంటే విస్తృతమై, శుద్ధమై, శివమై, శుభమైనట్టి ఆత్మను స్వీకరించటమేమిటి? రక్షించటమేమిటి ఎక్కడో ఏ దేహాదులందో ఉంచి కాపాడటమేమిటి? సర్వవ్యాపక మగు స్వస్వరూపమును ఈ దేహాదులచే కాపాడుచున్నామనుకొనేవారు కేవలం భ్రమ చేత, అవగాహనారాహిత్యం చేత అట్లా పలుకుచున్నారని గ్రహించు. ఈ శరీరము స్వభావవశం చేత నశిస్తే ఆత్మయే నశిస్తోందనే శంకచే కొందరు జనులు నిష్కారణంగా, వ్యర్థంగా దుఃఖిస్తున్నారు. అది వాస్తవం కాదు. కుండ పగిలితే లోన ఉన్న ఆకాశం నశిస్తుందా?… లేదు.
అట్లాగే… దేహములు నశించనప్పటికీ దేహి నశించడు. ఆ దేహినే మనం ‘ఆత్మ’ అని అంటున్నాం. ఏ జీవుడైనా ’దేహి’యే స్వరూపంగా కలిగి ఉన్నాడు గాని, ఈ దేహము అతని స్వరూపమే కాదు. ఆత్మయగు దేహి నిత్యమై, నిశ్లేషమై అవినాశి అయి వెలుగొందుచున్నాడు.
ఓ రామచంద్రా! ఆత్మ సర్వదా శుద్ధ చిన్మాత్రమై, ఆకాశము కంటేకూడా అత్యంత సూక్ష్మమై, స్వానుభవమాత్రమై ఉన్నది. ఆకాశంలాగానే ఆత్మ కూడా ఏ సమయమందును నశించటం లేదు. న జాయతే న మ్రియతే క్వచిత్ కించిత్ కదాచన జగద్వివర్తరూపేణ కేవలం బ్రహ్మ జృంభతే || ॥
ఆత్మ ఎప్పుడూ, ఎక్కడా ఉత్పన్నం కాదు నశించదు. అయితే. ఈ ‘జగత్తు’ అను వివర్త రూపంగా ప్రదర్శితమయ్యేదంతా ఆత్మయే గాని మరింకేదీ కాదు.
సత్యమ్, ఏకమ్ పదమ్, శాంతం, ఆదిమధ్యాన్త వర్జితమ్ | భావాభావవినిర్ముక్తమ్ - ఇతి మత్వా సుఖీభవ ॥
ఓ రాఘవా ! ఆ ఆత్మపదము సత్యమై, ఏకమై, శాంతమై, ఆదిమధ్యాంతరహితమై, భావ - అభావ వినిర్ముక్తమై ఉన్నదయ్యా ! ఇది సర్వదా గ్రహించి సుఖవంతుడవు కమ్ము.
ఇక అజ్ఞానమంటావా?… అది సమస్త ఆపదలకు స్థానం. అద్దానిలో ధ్రువము అంటూ ఏదీ లేదు. పైగా, అది జీవునిపట్ల అస్వాతత్ర జనకమైనది. జీవుని వివేకమునకు అది శత్రువు వంటిది. మిథ్యమైనది. అందులో అంతర్గతమై ఉన్న విశేషాలన్నీ అజ్ఞానసమన్వితమగు దేహాభిమానమునకు సంబంధించినవి మాత్రమే! అటువంటి ‘అహంకారము’ అనే భూతాన్ని వదించుకోవాలంటే జ్ఞానమే శరణ్యం. నీవు సర్వదా జ్ఞానమును ఆశ్రయించి, ఆపై, అజ్ఞానమగు అహంకారమును త్యజించగా శేషించియున్న ఆత్మ పదమున దృఢంగా స్థితి కలిగిఉండెదవు గాక!
Page:472
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ సృష్టికి ముందే పరబ్రహ్మమునందు మొట్టమొదట ‘మనస్సు’ అనేది బయల్వెడలుతోంది. దాని రూపము మననమే గాని మరింకేదో కాదు. ఈ మననమే సువిశాలమగు జగద్రచనగా అనుభవమౌతోంది. అది ఇప్పటికీ పరమాత్మయందే ఉన్నది. పరమాత్మయందు ఉంటూనే తదితర కల్పనలన్నిటికీ హేతువుగాకూడా అయి ఉంటోంది. తరంగాలు ఎక్కడున్నాయి? సముద్రంలోనే కదా! కిరణ సమూహాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయ్? సూర్య బింబము నుండే కదా! సువాసన ఎక్కడి నుండి వస్తోంది? పుష్పకోశము నుండే కదా! అట్లాగే మనస్సు కూడా బ్రహ్మమునందే ఉండి, బ్రహ్మము నందే వర్తిస్తోంది. అయితే చమత్కారం చూస్తున్నావా? ఈ మనస్సు అదృశ్యమగు ఆత్మను ఏమరచి జగత్తు యొక్క కల్పనలందు ఉపక్రమిస్తోంది. క్రమంగా దృశ్యజగత్తును తనయందు గాంచుచున్నది.
ఒకడు ఒక త్రాడును చూచి ‘పాము ’ అని బెంబేలెత్తుచున్నాడనుకో. ‘పాము’ అనేది ఎక్కడినుండి వచ్చింది? త్రాడును చూచినప్పుడే కదా! కనుక పాము త్రాడులోంచే వచ్చినట్టు కదా! అట్లాగే అత్మయందు మనస్సు బహిర్గతమౌతోంది. వాస్తవానికి త్రాడులో పామూలేదు. ఆత్మయందు మనోఅహంకారాలు లేవు.
శ్రీరాముడు : నిర్లిప్తము, నిర్విషయము అగు అత్మ నుండి విషయరూపమగు మనస్సు ఉద్భవించటం చమత్కారమే కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : ఎవడైతే ‘సూర్య కిరణములు సూర్యుని కంటే వేరు’… అని అనుకుంటాడో, వానికి ఆ సూర్య కిరణములు అన్యమైనట్లే భాసిస్తాయి. ‘బంగారము కంటే ఆభరణములు వేరైనవి’… అనుకునే వాని అనుభవం అట్లే (వేరైనట్లుగానే) ఉంటుంది గాని, అది ‘బంగారం కదా’ అని అతను అనుకోవటం లేదు. కానీ, ‘సూర్యబింబము నుంచే బయలుదేరిన కిరణములు సూర్యునికి వేరైనవి ఎట్లా అవుతాయి? బంగారము కంటే ఆభరణం వేరైనదని అనటం ఎట్లా?’… అని భావించావనుకో? అప్పుడు మొదటి వానికంటే వ్యతిరిక్తమైన అనుభవమే ఉంటుంది.
తరంగములు చూచేవానికి తరంగబుద్ధియే ఉంటుందిగాని, జలబుద్ధి ఉండదు. “తరంగములు జలము కంటే వేరు కాదు” అని తలచేవాడికో? ఇతనికి జలబుద్ధియే ఉంటుంది గాని, తరంగ బుద్ధి ఉండదు. “బంగారము యొక్క ఆకారములైన ఆభరణములందు కూడా ఉన్నది బంగారమే”… గ్రహించేవాడు మహాబుద్ధిమంతుడై ఉంటాడు. అట్టివాడు “నిర్వికల్పుడు” అని చెప్పబడతాడు. ”త్రిగుణాత్మకమైన కనిపించే ఈ దృశ్యాంతర్గత జీవులంతా త్రిగుణాతీతమగు పరమాత్మ యొక్క సంప్రదర్శనా విన్యాసమే” - అని గమనించడాన్నే ‘నిర్వికల్పము’ అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.
“అగ్ని జ్వాలలు అగ్ని కంటే వేరు” అని భావించేవానికి అగ్నిబుద్ధి నశించి జ్వాలాబుద్ధియే ఉంటుంది. “ఈ జ్వాలలు ఆకారసమన్వితాలు” అని కల్పన చేస్తే, అవి అట్లే గోచరిస్తాయి.
Page:473
ఆకాశంలో పొగపంక్తిపోతుంటే “ఇవి మేఘములే” అని అనుకుంటాడేగాని, “ఇవి బయలు దేరినవి అగ్నిలోంచే" అనేది దృష్టికి రాదు. జ్వాలల యొక్క ఊర్ధ్వ వక్ర గమనములను మేఘముల లాగానే చూస్తాడు. ‘అగ్నిజ్వాల అగ్ని కంటే వేరు కాదు’ అనే బుద్ధి (లేక, భావన) కలవానికి అగ్నిబుద్దియే సర్వదా కొనసాగుతుంది.
అంతయూ ఆత్మగా దర్శించువాడు వికల్పరహితుడని చెప్పబడుచున్నాడు. అట్టి వికల్పరహితుడైనవాడు ‘మహాపురుషుడు’ అనిపించుకుంటాడు. ఎవరికి సర్వసంశయములు సంక్షయించి ఉంటాయో… అతడే మహామతి. అట్టివాడు ఏది పొందాలో, అది పొందినట్లే. ఇక అతడు కల్పిత వస్తువులను, విషయములను, వ్యవహారములను చూచి కలత చెందడు. ఎందుకంటే అతడు సర్వదా సత్యత్వబుద్ది చేతనే నిమగ్నుడై ఉంటాడు కదా!
ఓ రామచంద్రా! నీవు “ఇది మనస్సు - ఇది చిత్తము - ఇది బుద్ధి" … ఇటువంటి అనేకత్వమంతా ఈ క్షణమే త్యజించు. 1. సంవేద్యరహితమై 2. శుద్ధచిన్మాత్రమై, 3. సాక్షి రూపమై, 4. అభ్యంతరవస్తువు మొదలుగా గల మహత్తర స్వభావయుక్తమై ఆత్మయందు స్థిరుడవై ఉండుము.
ఒక చిన్న దృష్టాంతం చెబుతాను విను. వాయువు ఉన్నది. అది అంతటా ఏర్పడి వ్యాపించి ఉన్నది. అట్టి వాయువు నందు ఒకానొక చలనశక్తి (ప్రసరించు స్వభావము) ఉన్నది. ఫలితంగా వాయుతరంగాలు ఏర్పడుచున్నాయి. వాయువుయొక్క తరంగత్వము అకారణమనే చెప్పాలి. అయితే ఆ తరంగత్వము "జీవులను జీవింపజేయుట” మొదలుగా గల అనేక వ్యవహారములకు కారణ మగుచు, తాను మాత్రం నిష్కారణమై ఉంటోంది. అట్లాగే ఆత్మ కూడా స్వయంగా అకారణమైనప్పటికీ తనయందు సంకల్పాత్మక శక్తి కలిగి ఉంటోంది. అట్టి స్వయంకృతమగు సంకల్పాత్మకత్వం చేత ‘జగత్తు’ అను అనుభవమును తాను పొందుతూ, ఇద్దానికి కారణమగుచున్నది. అట్టి సంకల్ప వ్యవహార సందర్భంగా అది తననుండి ఏర్పడిన మనస్సును. అందలి భావాలను, ఆ భావాలకు విషయమగుచున్న ఈ సర్వమును అనుభవరూపంగా పొందుతోంది. సంకల్పకల్పనామయమై, ప్రపంచరూపమైనట్టి ఆ మనస్సు తన ఆకృతిని తానే భావన చేయుచు స్వయముగా ఉత్పన్న మగుచున్నది. సంకల్పాత్మకమైన సమష్టి చిత్తము సమస్త ప్రపంచమును గూర్చి సంకల్పించుచుండగా, ఈ సమస్త ప్రపంచరూపము పరికల్పించబడుతోంది. అది ఎట్లు దేనిని సంకల్పిస్తుంటే ୧୨
సంకల్పములను అనుసరించి - క్షణకాలంలో అట్లే అగుచున్నది. ఆ సమష్టి చిత్తమే ఒక కీటకంగాను, బ్రహ్మదేవునిగాను, మేరు పర్వతంగాను, మనస్సు - - జీవుడు - అహంకారం - చిత్తము మొదలైన వ్యవహారములుగాను స్వసంకల్పముచే ధరిస్తోంది.
ఈ చిత్తము ‘సంకల్పము’ అను మూల పదార్థముచే నిర్మించబడినదై, ద్వైత ఏకత్వరూపమగు జగతిస్థితిని పొందుతోంది. ఇక ఆ తరువాత ఇద్దానియందు తనకు తానే స్వయంగా అనేకత్వమును సుదీర్ఘకాలం అనుభవిస్తోంది.
+
Page:474
కనుక రామా! సంకల్పముచేతనే ఈ విశాల జగత్తు కన్పిస్తోంది. ఈ కారణం చేత ఇది సత్యం కాదు. ఎందుకంటే, ఏదీ ఎట్లు అనుభవమౌతోందో… అదంతాకూడా సంకల్పమాత్రం మరియు సంకల్ప నిర్మితమే కదా!
ఈ జగత్తు మిథ్య కూడా కాదు. స్వప్నజాలము వలె ఇది అనిర్వచనీయమై ఉన్నది. స్వప్నము అసత్యమందామా… ‘అనుభవం’ అనేది ఉన్నది కదా! కాదు, సత్యమందామా?
స్వప్నం కల్పనామాత్రమే కదా! నిద్రకొనసాగిస్తున్నంతవరకు స్వప్నం సర్వ వికారములు కలిగిస్తూ, ఒక సందర్భ- అసందర్భ సంఘటనల కలయిక వలె కొనసాగుతూనే ఉంటుంది. సుఖదుఃఖాది రసాభావములు గాలి కెరటముల వలె ఉంటాయి. స్వప్న సంఘటనకు ఆ స్వప్న సమయంలో దుఃఖం ఉంటుంది కనుక వాస్తవముగా అది ఉన్నట్లే కదా! ఆ ప్రాణి నిదుర లేవగానే స్వప్నం లేదు. స్వప్న సంఘటనలు లేవు. అట్లాగే ఈ జాగ్రదనుభవం కూడా! నిద్రపోయినవాని జాగ్రదనుభవం నిద్రలేవగానే కొనసాగుచున్నట్లు, దేహము పోయిన తరువాత మౌనం వహించే జాగ్రదనుభవపరంపరలు మరల దేహము ప్రాప్తించగానే సంస్కార రూపములతో కొనసాగుచూనే ఉన్నాయి. అయితే ఆత్మస్వభావం జ్ఞానపూర్వకంగా సంతరించుకున్న మరుక్షణం ఈ దృశ్యము పట్ల - దేహదుల పట్ల ఏర్పడియున్న సర్వ సందేహాలు తొలగుతాయి.
ఈ జీవుని మనోరాజ్యం ’ప్రేమ - ద్వేషము - అభిమానము - ఆశ - నిరాశ - - అజ్ఞానము
- విజ్ఞానసాధనలు’… మొదలైన వాటితో కూడినదై వివిధ కార్యకలాపములతో భాసిస్తోంది కదా!
అట్లాగే బ్రహ్మదేవుని [సమష్టితత్త్వము యొక్క (లేక) హిరణ్యగర్భుని] సువిశాల - సుదీర్ఘ మనోరాజ్యం కూడా ‘కల్పితము - భావనామాత్రము’ అగు చమత్కారములతో భాసిస్తోంది.
యధా భూతార్ధభావిత్వాత్ తదేవత్ ప్రవిలీయతే॥ పరమార్ధన దృష్టంచేత్ తదిదం నైవ కించన ॥
యథార్థరూపంలో భావించేవానికి దీని మాయారూపమంతా లయించిపోతోంది. ఎందుకంటే బ్రహ్మరూపముగా భావించే వానికి ఇక్కడ మాయారూపమైనదేదీ ఉండియే ఉండదు.
దృశ్యంత్వ పరమార్ధన ప్రయాతి శతశాఖతామ్ | జలమ్ ఊర్మి–తరంగాది కలనార్హం పరిస్ఫురన్ II
‘సముద్రం’ అంటే ఏమిటి? జలం మాత్రమే కదా! అయితే అందులో తరంగాలు, ఆవృత్తాలు, నురుగు మొదలైనవన్నీ వివిధ కల్పనా రూపాలుగా స్ఫురిస్తున్నాయి. జలదృష్టిచే అవన్నీ జలమే కదా! పరమార్థమగు ఆత్మతత్త్వమే అపరమార్థ దృష్టిచే ఈ వందలాది సృష్టిశాఖల రూపంలో స్ఫురిస్తోంది.
సముద్రం తరంగములు మొదలైన రూపములన్నీ ధరిస్తున్నప్పటికీ సముద్రం సర్వదా జలమాత్రంగానే ఉంటోంది కదా! అట్లాగే ఈ జీవుడు ‘దేహభావన’ అను వ్యవహారమును ఆశ్రయించి వేలకొలది కర్మలు ఆచరించుచుండవచ్చు గాక! అనేక దేహములు పొంది ఉండవచ్చు, పొందబోవవచ్చుగాక! అదంతా కూడా ’మనస్సు యొక్క చలనము’ మాత్రమే. ’కూటస్థమగు
Page:475
చైతన్యము’ అను ఆ జీవుని వాస్తవ స్వరూపమునందు అపూర్వమగు వికారమేదీ కించిత్తు కూడా కలగటం లేదు. కలుగదు. అందుచేత రామా! నీవు తుచ్ఛములగు సర్వభేదములను త్యజించు. ఇక నీవు నడుస్తున్నప్పుడైనా, వింటున్నప్పుడైనా, తాకుచున్నప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, నిద్రిస్తున్నప్పుడైనా, వ్యవహరిస్తున్నప్పుడైనా ‘నా ఆత్మ స్వరూపమునందు అపూర్వమైనదీ ఎక్కడా ఉండజాలదు’ అని గ్రహించియే ఉండు. ఏ నీ వాస్తవ స్వరూపము అఖండమై, నిర్మలమై, అప్రమేయమై, సత్యమైయున్నదో, అద్దానినే భావన చేయుచూ ఇక ఏది ఎట్లో అట్లే నిర్వర్తించు. నీవు ఏది చేసినా, చూచినా, అదంతా కూడా నిర్మలమై, వ్యాపకమైనట్టి చిన్మాత్రమేనని’ ఎఱుగుము. ఈ సర్వజీవుల, సర్వ పదార్థముల నిజస్థితి సారభూతమగు సత్చిత్ స్వరూపమే అయి ఉన్నది. ఆ ’సత్చిత్’ కు అన్యంగా ఎక్కడా ఏదీ లేదు.
ఈ విశాల రూపంగా భాసించేదంతా బ్రహ్మము మాత్రమే ఈ జగత్తంతా సంవితామాత్రమే! ఇక్కడ మరొక కల్పన లేనే లేదు. సంవిత్ యొక్క స్ఫురణ మాత్రమైన ‘జగజ్జాలము’ అను పేరుగల ఇద్దానిలో ‘అది వేరు - ఇది వేరు’ అనేది. ఎట్లా ఏర్పడగలదు చెప్పు? సత్లో మిథ్యాగ్రహణం భ్రమమాత్రమే. మరియు… అంతటా ఒకే ’సంవిత్తు అను చైతన్యమై ఉండియున్నది కనుక, ఇక సంవేద్యము (తెలియబడునది) అను దాని యొక్క తెలుసుకొనుదానికంటే వేరైన) ఉనికి ఎక్కడున్నది? దేనికైతే ఉనికియే లేదో అది ఉనికిగలదానిని ఎట్లా బంధించిగలదో చెప్పు? ‘స్వప్నం ఎక్కడి నుండో బయలుదేరివచ్చి స్వప్నద్రష్టను బంధించి ఉంచుతోంది’ అనేది అర్థరహిత వాక్యంగాక మరేమిటి? స్వప్నం స్వప్నద్రష్టలోంచే బయల్వెడలుతోంది కదా! కాబట్టి ‘ఉనికి-ఎరుక’ అను స్వరూపముగల నీకు నీ కల్పనచే ఎరుగబడే ఈ జగత్తు వలన బంధమోక్షములు ఏర్పడుతాయని ఎవరైనా అంటే అది పరిహాసవాక్యం మాత్రమే.
కనుక రామా!
మోక్షోయమేష ఖల బంధ ఇతి ప్రసహ్య చిన్తాం నిరస్య సకలాం విఫలాభిమానాం మౌని, వశీ, విగతమానమదో, మహాత్మా! కుర్వన్స్వకార్యమనహంకృతిరేవ తిష్ఠ॥
ఓ రామచంద్రా! "ఇది బంధము, ఇది మోక్షము” అనబడే వ్యర్థాభిమానము గురించిన చింతను సర్వప్రయత్నములచే వదిలివేయి. ఈ వాక్కు మొదలైన సర్వ ఇంద్రియములను అధిగమించివేయి. నీకు ప్రవాహపతితంగా ప్రాప్తమైన ఈ రాజ్యపాలనము మొదలైన ఆయా కార్యక్రమములను ఉచితరీతిగా నిర్వర్తించు. అట్లు నిర్వర్తిస్తూనే మౌనివై, సంయమివై అభిమానమదాదులు లేనివాడవై, అహంకార - మమకార వర్జితుడవై వెలయుము.
సంశయములన్నీ పారత్రోలి నిర్భయుడవై ఉండు. శాశ్వతమైనట్టి కూటస్తభావనను అవలంబించి ఉండు. మహాకర్తవు, మహాభోక్తవు, మహాత్యాగివి కమ్ము.