CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:476

XII. శ్రీ శివ - భృంగీశ్వర సంవాదం

(మహాకర్త - మహాభోక్త మహాత్యాగి)

  1. జీవన్ముక్త లక్షణములు

శ్రీరాముడు : హే మహర్షీ! ‘మహాకర్త’ ‘మహాభోక్త’ ‘మహాత్యాగి’ అను మూడు మహావ్రతాలు వేదాంత వాఙ్మయంలో ప్రసిద్ధమై ఉన్నాయి కదా! ఆ మూడిటి గురించి మీ ప్రవచనాన్ని వినాలని నా అభిలాష! శ్రీవసిష్ఠ మహర్షి : ఓ! తప్పకుండా. ఒకప్పుడు ఈ మహాకర్తది మూడు వ్రతముల గురించి భృంగీశ్వరునకు జగత్ప్రభువగు శివభగవానుడు ఒక సందర్భంలో బోధించటం జరిగింది. ఆ బోధను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.

ఒకసారి లోకపావనుడగు శివభగవానుడు ఏదో సందర్భంలో పరివార సమేతంగా మేరు శిఖరం యొక్క ఉత్తర భాగంలోని ఒక ప్రదేశంలో విడిది చేయడం జరిగింది. ఆ విడిది చేసియున్న రోజులలో ఒక సమయంలో మహా తేజస్వియగు భృంగీశుడు తనకు గల జీవన్ముక్తికి సంబంధించిన కొన్ని సందేహాలు నివారించుకోవటానికి భక్తజన వాత్సల్యుడగు స్వామిని సమీపించాడు. భృంగీశుడు : హే భగవాన్! దేవ దేవేశా! సర్వజ్ఞా! పరమేశ్వరా! జీవన్ముక్తి విషయమై నా సందేహనివృత్తి కొరకు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలని ఉంది. నా పై దయతో నన్ను అనుగ్రహించండి. ఈశ్వరుడు : రా నాయనా! ఇటొచ్చి కూర్చో. అడుగు ఏమిటి నీ సందేహం!

భృంగీశుడు : స్వామి! అంతరంగ స్వామి అయిన మీకు నా గురించి అన్నీ తెలుసు. అయినా వైద్యుని దగ్గిరకు భవరోగమునకు గొప్ప వైద్యులు కదా! ఇక వినండి.

సంసార రచనాం, నాధ! తరంగ తరలామిమామ్ । అవలోక్య విముహ్యామి, తత్త్వ విశ్రాంతి వర్జితః ॥

మహాత్మా! నా ఎదురుగా ఏర్పడి ఉన్న ఈ చంచల సంసార రచనను చూస్తూంటే నాకు భయమేస్తోంది. నేను అనుక్షణం విమోహితుణ్ణి అవుతున్నానే గాని, ఆత్మతత్త్వంలో విశ్రాంతి మాత్రం పొందలేకపోతున్నాను. అప్పుడు నా కనిపించింది, నేను అపరిపక్వమైన నిర్ణయాలు కలిగియుండుట చేతనే సంసారసాగరంలో కొట్టుకుపోతున్నానేమో? అందుకే సద్గురువులు, సర్వ సాక్షిస్వరూపులు, పుత్రవాత్సల్య సమన్వితులగు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను.

ఇప్పుడు నేను ఎటువంటి నిశ్చయం కలిగి ఉంటే ఈ జగద్రూప జీర్ణ గృహంలో దుఃఖ రహితుడనై ఉంటానో అట్టి ఉత్తమ - - ప్రియవిషయమును నాకు బోధించండి.

Page:477

ఈశ్వరుడు : పుత్రా! భృంగీశా! ఈ సంసారము గురించి నీకెందుకయ్యా భయం? సంశయములన్నీ వదిలిపెట్టి, నిర్భయమైన శాశ్వతమైన ’కూటస్థాత్మ’ను అవలంబించు. మహాకర్తవు… మహాభోక్తవు… మహాత్యాగివి కమ్ము.

భృంగీశుడు : అయ్యా! ‘మహాకర్త’ ‘మహాభోక్త’ ‘మహాత్యాగి’ అవటమంటే మీ ఉద్దేశ మేమిటో సవివరంగా దయచేసి చెప్పండి.

ఈశ్వరుడు : వత్సా! ఆ మూడింటిని నిర్వచిస్తూ చెబుతాను. విను.

  1. మహాకర్త

ఈశ్వరుడు : మహాకర్త అయినవాడు ఎట్లా ఉంటాడో ముందుగా వివరిస్తాను.

  1. అసంశయుడు - (ధర్మాధర్మౌ శంకా విరహితాక్షయః, యః కరోతి యధా ప్రాప్తా) ‘ఆత్మయందు కర్తృత్వం - అనే ధర్మమే లేదు’ అను నిశ్చయం కలిగి ఉంటాడు. ఇక యథా ప్రాప్తాలైన ధర్మాధర్మాలను, ‘ఇది చెయ్యవచ్చా? అది చేయవలసియున్నదేమో?’ అనే సంశయములను మొదలే విడిచిపెట్టి ఉంటాడు. అనివార్యమగు ఆయా కర్మవ్యాసంగముల పట్ల నేను చేయవలసి ఉన్నదే ఇదంతా. చెయ్యవలసింది చేయవలసిందే! సందేహించవలసినది లేదు …అను అవగాహన కలిగి ఉంటాడు.

  2. అపేక్షారహితుడు - (రాగ-ద్వేషౌ, సుఖం-దుఃఖం, ధర్మ-అధర్మౌ, ఫలా-అఫలే అనపేక్షణమ్ యః కరోతి) అతనికి రాగద్వేషాలు ఉండవు. “దీని వలన సుఖం రావాలే! అది దుఃఖం కదా! ఇదే నేనెందుకు చేయాలి? అది వాడెందుకు చేయకూడదు? ఇది చేస్తే ప్రయోజనం దానివలన ఏం లాభం?”…ఇటువంటి అపేక్షతో కూడిన భావాలు కలిగి ఉండడు. ఇక ఆతని రాగద్వేష - సుఖ దుఃఖ ధర్మాధర్మ - ఫలాఫల కార్యాలన్నీ లోకానుకూలత కొరకు మాత్రమే ఉద్దేశించబడి ఉంటాయి గాని తన యొక్క అభిప్రాయం కొరకో, అపేక్ష, కొరకో కాదు.

  3. ఉద్వేగ రహితుడు - (మౌనవన్, నిరహంభావో, నిర్మలో, ముక్తమత్సరఃగతోద్వేగం యః కరోతి) “ఏం, నేను ఎందుకు చేయాలట?… నేనింత చేస్తున్నానే! మరి జనం చూస్తున్నారా?… నీ తోటి వారు చేసేదంతా తప్పే!… నేను కాకపోతే ఇంకెవ్వడయ్యా చేయగలిగేది?… అసలు వీళ్ళందరి సంగతి చూడాలి!” … ఇటువంటి ఉద్వేగ భావాలు ఆ మహాకర్తకు ఉండవు. సాంసారికమైన భావావేశాల పట్ల అంతరంగంలో మౌనం వహించి ఉంటాడు. కొండపైన చెట్టు కదులుతుందేగాని కొండ కదలదుకదా! “నేను అంతటివాడిని. ఈ పని ఇంతటిది”… అనే అహంకారం వహించడు. నిరహంకారం అభ్యసిస్తూ ఉంటాడు. ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టే దోషము ఆశ్రయించకుండా నిర్మలుడై ఉంటాడు. మాత్సర్యం దరిజేరనివ్వడు. సర్వ ఉద్వేగములను జయించినవాడై విధివశాత్తు తాను చేయవలసినది నిర్వర్తిస్తాడు.

Page:478

  1. శంకారహితుడు - (శుభాశుభేషు కార్యేషు ధర్మాధర్మైః యస్యమనః కుశంకయా న లిప్యతే) ఆయా శుభ-అశుభ కార్యవ్యవహారములందు ఎవని బుద్ధి అయితే అనుమానాలతో దోషభూయిష్ఠం కాదో, అతడే మహాకర్త. బుద్ధి నిశ్చలత కలవాడై ఎప్పటికి ఏది ప్రస్తుతమైనదో అద్దానిని ధర్మనిరతుడై నిర్వర్తిస్తూ ఉంటాడు.

  2. నిర్ ఇచ్ఛిన్నుడు - (యః సర్వత్ర విగత స్నేహో, సాక్షివత్ స్థితః - కార్యే నిరిచ్చం వర్తతే) అతనికి ‘ఇది నాకు ఇష్టం. అది నాకు ఇష్టం కాదు’ అనబడేదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే అతడు సర్వత్రా రాగరహితుడై ఉంటాడు. సర్వమునకు సాక్షిమాత్రుడై ఉంటాడు. ఇచ్ఛారహితుడై నిజాశ్రమధర్మములను నిర్వర్తిస్తూ ఉంటాడు.

  3. ఆవేశ - ఆనందరహితుడు - - (ఉద్వేగానంద రహితః, సమయా, స్వచ్ఛయా, ధియా, యో న శోచతో, యో నోదేతి) దేనికీ ఉద్వేగంగాని, ఆనందంగాని చెందడు. సమమైన - స్వచ్ఛమైన బుద్ధిని కలిగి ఉంటాడు. ఈ సుఖదుఃఖాలన్నిటికీ అతీతుడై నిర్మలమైన హృదయంతో ఈ ‘జీవితం’ అనుదానిని తన అనంత స్వరూపమునందలి ఒకానొక చిన్నచమత్కారముగా, ఒక కళగా గాంచుతూ ఉంటాడు.

  4. అసంసక్త మనస్కుడు - (యః యధార్థకాలే మతిమానః, అసంసక్తమనాః, మునిః, కార్యానురూపవృత్తస్తో) అతడు ఆయా కాలాలో సంప్రాప్తించే విధి విధానాలను అసంసక్తంగా నిర్వర్తిస్తూ ఉంటాడు.కార్యానుకూలంగా ప్రవర్తిస్తూనే మహాబుద్ధిమంతుడై నిత్యానిత్యవివేకి అయి ఉంటాడు.

  5. సమదర్శి - (యః కర్తృతాం చ, కర్మ - అకర్మాచరంశ్చ ఉదాశీనః, యః అంతరః అత్యంతమ్ సమం యాతి) ఉదాసీనుడై ఉంటూనే దైవికంగా ప్రాప్తించే విహితి-అవిహిత కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు. అయినా కూడా కర్తృత్వము లేనివాడై ఉంటాడు. “ఇక్కడ తోచే కర్తృత్వమంతా అన్యప్రేరితమే కదా” అని ఎరిగియే ఉంటాడు. అత్యంత సమభావంతో ప్రకాశిస్తూ అందరితో వ్యవహరిస్తూ ఉంటాడు.

  6. స్వభావశాంతుడు - (యః స్వభావేనైవ శాంతః, యః హి శుభాశుభం ఆచరన్యో సమతాం వై నజహాతి) స్వభావంగానే శాంతి స్వరూపుడై ఉంటాడు. ప్రాప్తించే ఆయా శుభాశుభ కర్మలు ఆచరిస్తూనే సమత్వమును, అంతరంగశాంతిని ఏమాత్రం వదులుకోడు.

  7. సర్వదా సమమనస్కుడు - (యస్య మనః జన్మస్థితి వినాశేషు, ఇదమ్ దేహాది ఉదయాస్తమయేషు చ సమమేవ యాతి) ఈ శరీరం యొక్క పంచ వికారములయినట్టి జన్మ - స్థితి - వృద్ధి - క్షయ - వినాశన సమయములందు కూడా ఎవని మనస్సు సమత్వం కోల్పోదో… అతడే మహాకర్త.

భృంగీశుడు : ప్రభూ! కర్మలను నిర్వర్తించేటప్పుడు ఎట్లు మహాకర్తృత్వం వహించి ఉండాలో 10 విశేషణములతో వివరించారు. అద్భుతం. ఇప్పుడు కర్మ యొక్క ఫల భోక్తా సమయంలో మహాభోక్తృత్వం వహించి ఉండడమంటే ఏమిటో సవివరంగా చెప్పండి.

Page:479

  1. మహాభోక్త

ఈశ్వరుడు అట్లాగే, ‘మహాభోక్త’ గురించి చెబుతాను విను1. ద్వేష - కాంక్షారహితుడు - (యః ప్రకృతం సర్వమ్ భుంక్తేచ, నకించిన ద్వేష్టి, తధా, నకించిత్ అభికాంక్షతి) యథా ప్రాప్తములైన సమస్తమూ అనుభవిస్తున్నప్పుడు అతడు ఎవరినీ ద్వేషించడు. ఎవరి మీదా ఎట్టి కోపం అంతరంగంలో కలిగి ఉండడు. ‘ఇది నేను ఎప్పటికి పొందుతానో?’… అని దేనినీ కాంక్షించడు.

  1. పొందుతూ కూడా పొందని వాడు - (యః ఆదదానశ్చపి చ నాదత్తే, ఆచరన్నపి చ నాచరత్యాత్, భుంజానోపి చ న భుక్తే) ఈ ఇంద్రియాలు విషయాలను గ్రహిస్తూ ఉండవచ్చు గాక. అతను అసంగమగు ఆత్మను గురించిన బుద్ధిచే ఏదీ గ్రహింపనివాడుగానే ఉంటాడు. కాళ్ళు-చేతులతో అనుభవములందు ఆచరణ కలిగియున్నప్పటికీ నిష్క్రియమగు ఆత్మబుద్ధినే ఆశ్రయించుకొని ఉంటాడు. సమస్తమును అనుభవిస్తున్నప్పటికీ నిత్యతృప్తమగు ఆత్మబుద్ధి యొక్క బలంతో ఏదీ అనుభవించని వాడుగానే ఉంటాడు.

  2. అనుభవములన్నిటికీ సాక్షిమాత్రుడు - (యః అభిన్నఃత ధీః యో సకలం సాక్షివత్ పశ్యతి, అవగతేచ్చతి) కేవలం సాక్షిమాత్రుడై సర్వ అనుభవములను దర్శిస్తూ ఉంటాడు. ఇచ్ఛారహితుడై భిన్నము లేనట్టి బుద్ధితో లోక వ్యవహారములన్నీ గాంచుతూ ఉంటాడు.

4.విక్షేపరహితుడు, భ్రమరహితుడు - (యస్య మతిః సుభైః దుఃఖైః క్రియాయోగైః భ్రమప్రదైః భావాభావైః నోత్రామతి) ఇక్కడి సుఖ - దుఃఖములను, సంయోగ - వియోగ సమన్వితములగు కార్య వ్యవహారములను, భ్రమదాయకములగు లాభ - వ్యయాది విషయములను పొందుచున్నప్పుడు ఎవని బుద్ధి విక్షేపము పొందదో, ఆయా సర్వస్థితి - - గతులందు మేధావి అయి ఉత్తమ అవగాహనను వీడడో… అప్పుడు అతడు మహాభోక్త అనిపించుకుంటాడు.

5.బ్రాహ్మీదృష్టి సమన్వితుడు - (యో జరామరణమ్, ఆపదః రాజ్యం, దారిద్ర్యమేవచరమ్యమిత్యేవ వేత్తి) ఆ మహాభోక్తకు వార్ధక్యము, మరణము, ఆపదలు, రాజ్యం దారిద్య్రం ఇటువంటివన్నీ కూడా రమణీయంగానే ఉంటాయి గాని, దుఃఖదాయకం కాదు. ఎవడు ఈ సంసారరూప ప్రపంచం పై నమ్మిక, ప్రియత్వం ఏర్పరచుకుని ఉంటాడో… అట్టి వానికి మాత్రమే వార్ధక్యమరణాదులు దుఃఖ కారకములై ఉంటాయి. ఈ సంసారమునకు ఎట్టి స్థానం ఇవ్వాలో అట్టి స్థానమే ఇస్తే ఇక ఇవన్నీ అట్టివానిని చలింపజేయలేవు సుమా!

  1. సర్వ సమబుద్ధిమంతుడు - (యః మహాన్తి సుఖదుఃఖాని సమం పయాంసీవ సాగరః సముపగృష్ణాతి) మహాసముద్రం ఉన్నది. అందులోని జలంలో చిన్న పెద్ద కెరటాలు ఏర్పడుచున్నాయి. కెరటాల అల్పాధిక్యములవలన మహాసముద్రమునకు అల్పాధిక్యములు ఏర్పడగలవా? అట్లాగే, సూర్యకిరణములచే నీరు ఆవిరి అవుతోంది. సముద్రజలం తరిగిపోతోందా? నదుల ద్వారా నీరు

Page:480

వచ్చి చేరుతోంది. సముద్రం ఉప్పొంగి పోతోందా? లేదు కదా ! మహాభోక్త కూడా మహాసముద్రం లాగా మహాశుభములు గాని, మహాదుఃఖములు గాని, వచ్చి పోతున్నప్పుడు పొంగడు, క్రుంగడు. వాటినన్నిటినీ సమబుద్ధితోనే గ్రహిస్తూ ఉంటాడు. అవన్నీ జీవతః ఆస్వాదిస్తూనే పరతః ఆస్వాదించని వాడై, స్పర్శించబడనివాడై ఉంటాడు.

  1. సహజ సాత్వికగుణస్వభావుడు - (యస్మాత్ అహింసా, సమత, తుష్టి, ఉపయాతి చ నో - పయాతిః) చంద్రబింబము నుంచి సహజంగానే చల్లని కిరణాలు బయలుదేరుచున్నాయి కదా! అట్లాగే ఆ మహాభోక్త నుండి అత్యంత స్వభావ సిద్ధంగా అహింస, సమత్వము, సంతుష్టి మొదలైన ఉత్తమగుణములు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే సహజ సాత్విక గుణములు అకృత్రిమమై ఉండటంచేత అవన్నీ, బయల్వెడలనట్లే అతడా అనుభవం పొందుతూ ఉంటాడు. అనగా అవి సహజసిద్ధము, అప్రయత్నపూర్వకము అయి ఉంటాయి.

  2. సామ్యబుద్ధి సమన్వితుడు - (యో కరుః, ఆమ్లమ్, లవణమ్, తిక్తం, అమృష్టమ్, ఉత్తమమ్ మృష్టిమ్, అధమమ్ సామ్యేన వేత్తి) అతను కారం, పులుపు ఉప్పదనం, చేదు, అరుచికరమైనవి, రుచికరమైనవి, నికృష్టమైనవి - అన్ని పదార్థాలను సమబుద్ధితో చూడగలడు. స్వీకరించగలడుకూడా. రసములచే అతడు సంబంధితుడు, బంధితుడు కాడు. రసములను జయించి వాటికి అతీత స్థానమున నెలకొని ఉండుటచే అతడు వాటి పట్ల ఆశ - - నిరాశలను కలిగి ఉండడు. జీవించుటకై తింటాడుగాని, తినటానికి జీవించడు. ఏది ఎట్లున్నా అతని సామ్యబుద్ధి చలించదు.

  3. సమ - - సౌమ్యద్రష్ట - (యః సరసం, నీరసం, సురతం, విరతం, సౌమ్యౌ సమం, పశ్యతి) రస సమన్వితమైనవి, రసవిహీనమైనవి. సుఖ ప్రదమైనవి, సుఖ విఘాతమైనవి… ఇటువంటి పరస్పరానుకూల - ప్రతికూల వ్యవహారాలు తారసపడుచున్నప్పుడు వాటినన్నిటినీ అతడు సమదృష్టితో, సౌమ్యదృష్టితో చూడగల శక్తి కలిగి ఉంటాడు. అతని సౌమ్య స్థితి వాటిచే చంచలం పొందదు. అతని సమదృష్టి ముందు అవన్నీ స్వల్ప విషయాలై ఉంటాయి.

  4. సమత సుస్థిర సమన్వితుడు - (యస్య మనః క్షారేచ, ఖండప్రకారేచ, శుభేచ, అశుభేచ సమతా సుస్థిరా భవతి) “ఇదా, కారంగా ఉన్నది అది తియ్యగా ఉన్నది. ఇది శుభప్రదం. అది అశుభప్రదం - ఇటువంటి స్పర్ధభావాలు అతనికి ఉండవు. మనస్సు సమతాభావంతో సుస్థిరమై ఉంటుంది. “ఒకనికి ఒకటి శుభప్రదంగాను, అదే మరొకటి అశుభప్రదంగాను ఉండటం సృష్టి చమత్కారమైయున్నది” అని అతడు గ్రహించియుండుటచే వాటిని అనుభవించవలసి వస్తున్నప్పుడు అతనికి స్పర్ధ ఉండదు.

  5. అభిలాషారహితుడు - (యో భుంక్తే అభిలాషమ్ త్యక్త్వా, ఇదం భోజ్యం, ఇదం అభోజ్యమితి ఏవం వికల్పితమ్ త్యక్త్వా గతాభిలాషం భవతి) “నా మటుకు నాకు ఇవి అనుభవించవలసినవి, అవి అనుభవించకూడనివి, కనుక ఇవి లభించాలి. అవి తొలగాలి"… ఇటువంటి అభిలాషలన్నీ, వికల్పములన్నీ దరికి రానీయడు. అభిలాష చేతనే ఈ జీవుడు నిబద్ధుడౌతున్నాడు. లేకపోతే … సత్

Page:481

స్వరూపుడగు ఇతడు అసత్తగు ఈ దేహ - - ఇంద్రియ - విషయములచే నిబద్ధుడు అవటమేమిటి? ఏది ఎక్కడ- ఎట్లు పొందవలసివచ్చినా కూడా, అవన్నీ వికల్పములే కాబట్టి, మహాభోక్తకు అవి అభ్యంతర- నిరభ్యంతరములు కాజాలవు.

  1. సర్వసమస్వీకారుడు - (యో బుద్ద్యాభుక్తే ఆపదం, సంపందం, మోహమ్, ఆనందం, అపరమ్, ఇత్యాదినమయా యాతి) ఒక రోజు సంపద - - మరొక రోజు ఆపద, ఒక సమయంలో ఆనందం - మరొక సమయంలో దుఃఖమోహాలు- , కొన్ని రోజులు ఉత్కృష్టత - - మరికొన్ని రోజులు నికృష్టత …జీవితమంతా ఇంతేకదా! చిన్న పిల్లల వంటి ఈ జీవులు వీటిని చూచి కేరింతలు కొట్టటమో, కెవ్వున ఏడ్వటమో చేస్తున్నారు. మహాభోక్తకు వాటి రాకపోకల చమత్కారం తెలుసు కనుక సమబుద్ధితో చూస్తూ ఉండగలడు. అతడే మహాభోక్త.

  2. మహాత్యాగి

  3. ధియాసంత్యక్తుడు:బుద్ధితో సర్వము బాగుగా త్యజించినవాడు - (యేనేతి ధర్మాధర్మౌ, సుఖం దుఃఖం, మరణ-జన్మని ఇత్యాది ధియా సంత్యక్తం) ఉత్తమమైన బుద్ధి (లేక) తెలివితేటలు సంపాదించుకొని ఉంటాడు. అట్టి ఉత్తమ బుద్ధిచే ధర్మాధర్మములను, సుఖ - దుఃఖములను, జన్మ

- - మరణములను స్వతఃగా మొదలంట త్యజించివేసినవాడై ఉంటాడు. “ 66 ఆయా విశేషములచే నేను బద్ధుడనైనాను”.. అను మీమాంస ఆ మహాత్యాగికి ఉండదు.

  1. ఇచ్ఛ - - శంక - వ్యవహార - నిశ్చయ పరిత్యక్తుడు - (యేన ధియా సర్వేచ్ఛా: సకలాః శంకాః సర్వేహాః, సర్వనిశ్చయాః, పరిత్యక్తా) ఈ ఇంద్రియములు, వాటి విషయములు ఎట్టివో, స్వభావమేమిటో ఎరిగి ఉంటాడు. అందుచేత సర్వ ఇచ్ఛలు త్యజించియే ఉంటాడు, “దీనివలన ఏది పొందుతామో? మళ్ళా అ తరువాత ఏమి కానున్నదో?”… ఇటువంటి అనుమానాలకు చోటివ్వడు. సమస్త శారీరక, వాచిక, మానసిక చేష్టలను దూరస్తమగు అసంబంధిత విషయాలుగా గాంచుతూ ఉంటాడు. సమస్త నిశ్చయములచేతను కట్టుబడక పూర్ణాత్మ స్వరూపమునందు స్వభావమును అనుభవమును ఏర్పరచుకుని ఉంటాడు.

  2. దేహేంద్రియసత్తత్యాగి - (దేహస్య, మనసః ఇంద్రియాణాంహి - తత్ుఃఖత్యాగి, తత్ సత్తత్యాగి) ఈ దేహ, ఇంద్రియ, మనస్సుల సత్తను వాటి వాటి దుఃఖ స్వభావంతో సహా మొదలే త్యజించి వేసి ఉంటాడు. ఏది త్యజించబడినదో అది దుఃఖమును కలిగింపజాలదు. తాను శుద్ధచైతన్య స్వరూపుడై ఉండగా ఈ దేహేంద్రియ మనస్సులు ఎట్లా పరిమితం చేస్తాయి? ఎట్లా బంధితుణ్ణి చేయగలవు చెప్పు?

  3. నదేహ - - నజన్మ - నకర్మ నిశ్చయుడు - (న మే దేహో, న జన్మాసి, న యుక్తే, అయుక్తే కర్మణి - ఇతి అంతర్ నిశ్చయవాన్ :) “ఈ దేహం నేను ఉపయోగించే ఒక బాహ్యవస్తువు, అంతేగాని ఇది

Page:482

నేను కాదు, దీనికంటే ముందే ఉన్న నేను దేహంతో జన్మించేవాడిని కాదు. దేహంతో మరణించేవాడిని కాదు. ఏది నేనై ఉన్నానో అద్దానికి జనన - మరణ ధర్మాలు లేవు. ఒక ఉపకరణ మాత్రమగు ఈ దేహము యొక్క చేష్టలు దేహ ధర్మములే గాని నా ధర్మములు కావు. నాకు వాస్తవానికి దేహములేదు. విహిత - నిషిద్ధకర్మలులేవు. ఇష్టానిష్ట చేష్టలు లేవు”.. ఇట్టి అంతఃకరణ నిశ్చయమును ఆ మహాత్యాగి కలిగి ఉంటాడు. ‘ఇట్టి త్యజించియుండుట’ అను స్వస్వరూప ధర్మమును సర్వదా వహించి ఉండుటచే అవన్నీ అతనికి అసంబంధిత విషయములే అవుతాయి.

  1. మనో మనన పరిత్యక్తుడు - (యేన ధర్మాధర్మమ్ మనో మననవిహితమ్ సర్వమ్ అస్తః పరిత్యక్తం) అతడు శారీరకమైన ధర్మాధర్మములను, మనస్సు యొక్క మానసిక చేష్టలను, వాక్కు మొదలైన క్రియలను అంతరంగంలో పరిత్యజించి ఉంటాడు. సత్-చిత్- ఆనందమనబడు స్వభావమొక్కటే అతని పట్ల ఏర్పడి ఉండి ఉంటుంది. అట్టి అనుభవము ద్వారా సర్వమునకు అందజాలని అప్రమేయ స్వరూపస్వస్థుడై ఉంటాడు. సర్వధర్మములు, సర్వ చేష్టలు త్యజించివేసి ఉంటాడు. ఆయా దేహ మనోధర్మాలచే ఎవరూ ఆతనిని సంకుచితపరచలేదు. అతడు ఎవరినీ దేహ మనోధర్మా ధర్మ బద్ధునిగా గాంచడు. సదా అప్రమేయమగు ఆత్మగానే దర్శిస్తాడు.

  2. సమ్యక్ దర్శి : ( సాయేన యావతీ దృశ్యకలనా సకలేయం సుషుట సంతక్తా విలోక్యతే) ఈ కనిపించే దృశ్య కల్పననంతటినీ అతడు ‘సమ్యక్ దర్శనము’ అనే పవిత్ర దృష్టిచే, “మిథ్యయే కదా!”… అని ఎఱిగి, సర్వమును త్యజించివేసి ఉంటాడు.

నాయనా! భృంగీశా! ఈ విధంగా త్రయీవ్రతము అవలంబించు.

కర్మనిర్వర్తిస్తున్నప్పుడు: 1.అసంశయుడవు, 2.అపేక్షారహితుడవు, 3. ఉద్వేగరహితుడవు, 4. శంకా రహితుడవు, 5. ఇచ్ఛారహితుడవు, 6. ఆవేశ ఆనందరహితుడవు, 7. అసంసక్త మనస్కుడవు, 8. సమదర్శివి, 9. స్వభావ శాంతుడవు, 10. సర్వదా సమమనస్కుడవు …అయి ఉండు.

కర్మల భోక్తవైయున్నప్పుడు : 1.ద్వేష కాంక్షారహితుడవు, 2. పొందుతూ కూడా పొందనివాడవు, 3. అనుభవములన్నిటికి సాక్షి మాత్రుడవు, 4. విక్షేపరహితుడవు, 5. బ్రాహ్మీదృష్టి సమన్వితుడవు. 6.సర్వ సమబుద్ధిమంతుడవు, 7. సహజ సాత్విక గుణ స్వభావుడవు, 8. సామ్యబుద్ధి సమన్వితుడవు. 9. సమ - సౌమ్యద్రష్టవు, 10. సమత - సుస్థిర సమన్వితుడవు, 11. అభిలాషారహితుడవు, 12. సమస్వీకారుడవు కమ్ము.

ఈ జగత్తులో ఏర్పడే సంబంధముల విషయంలో : 1.ధియా సంత్యక్తుడవు, 2. ఇచ్ఛ - శంక - వ్యవహార- నిశ్చయ పరిరత్యక్తుడవు, 3. దేహేంద్రియ సత్తత్యాగివి, 4. నాకు దేహ జన్మకర్మలు ఉండ జాలవు అను నిశ్చయం కలవాడవు, 5. మనోమనన పరిత్యక్తుడవు, 6. సమ్యక్ దర్శివి … అయి ఉండు.

త్యజించుటచే త్యాగివవుతావు. ఎవరు ఏది త్యజించరో అది మాత్రమే వారిని దుఃఖింప జేయ గలదు. అది మాత్రమే అతనికి సంసార విభాగమగుచున్నది,. ఏది త్యజించబడదగినదో

Page:483

అది జయించబడినట్లే. కనుక భృంగీశా! నీవు మనం వివరించి చెప్పుకున్నట్లు మహాకర్తవు మహాభోక్తవు మహాత్యాగివి అగుచూ ఈ భూమిపై నిశ్చింతగా సంచరించు. ఇక ఈ సంసార దుఃఖాదులు నిన్ను సమీపించనైనా లేవు.

#

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భక్తజన సులభుడగు సాంబశివునికి భృంగీశునికి మధ్య జరిగిన సంవాదము విన్నావు కదా! ఆ పరమశివుడు బోధించియున్న దృష్టిని నీవు కూడా అవలంబించు. అన్నమయ - - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - - ఆనందమయములనబడే పంచకోశములకు అతీతమైయున్న నీ స్వస్వరూపమును ఆశ్రయించు. అది జాగ్రత్ - స్వప్న -

సుషుప్తములనబడే అవస్థాత్రయరహితమై ఉన్నదని గ్రహించియుండు.

ఏ ఆత్మ అయితే నిరంజనమై (దోషరహితమై) నిత్యోదితమై, విమలరూపమై, అనంతమై, ఆద్యమైయున్నదో..అట్టి బ్రహ్మమే నేను - అను నిశ్చయముతో సమస్త కల్పనారూపములను శమింపజేసినవాడవై, నిర్వాణ పదమును పొందియుండు. సమస్తకల్పములందు ప్రసిద్ధములైయున్న కార్యములన్నిటి యొక్క బీజభూతము, నిరామయము - - పరమాత్మ రూపమగు బ్రహ్మమే అయి ఉన్నదని విజ్ఞులు ఎరిగియే ఉంటున్నారు. విశాల సృష్టి భేదంతో వృద్ధి చెంది భాసిస్తున్న ఈ కనబడేదంతా చిదాకాశమే అయి ఉన్నది.

ఓ రామా! “బ్రహ్మము కంటే భిన్నంగా సత్తుగాని అసత్తు గాని ఎక్కడాకూడా కొంచమైనా సంభవించజాలదు” అని అంతఃకరణంలో దృఢనిశ్చయము కలిగియుండుము. సంశయములన్నీ త్యజించి సుఖముగా నిశ్చింతగా ఉండు.

అంతర్ముఖః సన్సతతం సమస్తం, కుర్వన్ బహిష్ఠం ఖలు కార్యజాతమ్. నభేద మాయాసి కదాచిదేవ, నిరాకృతాహంకృతితాము పైషి॥

ఓ ప్రియ రామచంద్రా! నీవు అంతర్ముఖుడవై ‘నిరహంకృతి’ పొందావా… అప్పుడిక బహిర్ముఖములగు ఈ సమస్త కార్యములు నెరవేరుస్తున్నప్పటికీ, ఎన్నటికీ భేదం పొందవు. భేదముల ఛాయ కూడా నిన్ను ఆవరించజాలదు.

  1. చిత్త శామ్య స్థితి

శ్రీరాముడు: హే భగవాన్! హే సర్వధర్మజ్ఞా! అహంకారము అనే పేరు కూడా కలిగి ఉన్న ఈ చిత్తం ఎప్పుడు ఏ పరిస్థితులలో శమిస్తుంది? లేక శమించనారంభిస్తుంది? వాసనారహితమగు చిత్తం ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటుంది?

శ్రీవసిష్ఠ మహర్షి : బలాత్కారంగా జలం పద్మదళములను తాకినప్పటికీ జలబిందువులు పద్మదళములో ప్రవేశించలేవు కదా? ఎప్పుడైతే అహంకారమయమగు చిత్తము ప్రశమిస్తూ ఉంటుందో. ఎప్పుడైతే

Page:484

జ్ఞానాగ్నిచే పాప సంకల్పాదులు ఉపశమిస్తూ ఉంటాయో అప్పుడు బలాత్కారముగా సమీపించే లోభమోహాలు కూడా శుద్ధచిత్తమును స్పృశించజాలవు. అట్టి వాని ముఖంలో అకృత్రిమమైన ప్రసన్నత, మైత్రి, కరుణ మొదలైన ఉత్తమగుణాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. చిత్తము శమిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాసనాగ్రంథులు ఛిన్నాభిన్నమై పోతూ ఉంటాయి. కోపము సన్నగిల్లుతూ ఉంటుంది. ఇంద్రియముల ప్రబలత్వం అల్పమౌతుంది. అట్టివానిని క్రమక్రమంగా దుఃఖము - భేదము దరిజేరలేకపోతాయి. అనగా అతని దుఃఖములు వృద్ధి చెందుటకు కారణమును కోల్పోతాయి. సుఖములు అభిమానమును కల్పించలేకపోతాయి. హృదయమునందు సర్వత్రా (ఆధి భౌతిక - ఆధిదైవిక - ఆధ్యాత్మిక) తాపత్రయ నివారకమగు సమత్వము ఉదయిస్తూ ఉంటుంది. ఒకవేళ ముఖంలో సుఖ-దుఃఖాదుల చిహ్నములు ఎప్పుడైనా కనిపించినా. ఎండలోని జలకణంలా అవి అల్పకాలం మాత్రమే ఉంటాయి. ఆ తరువాత ’ఇవి మిథ్యయే కదా” అను బుద్ధి కలుగుటచే అవి మనస్సును స్పృశించలేవు.

చిత్తము శమించినప్పుడు, అట్టి మనుజుడు దేవతాగణమునకుకూడా వాంఛనీయుడౌతాడు. ఆ సమయంలో ‘సర్వసత్వము’ అనే శీతల చంద్రిక వాని యందు ఉదయించి ఉంటుంది. అతడు స్వభావ సిద్ధంగా శాంతము - ప్రియము - - సేవాతత్వము - అవిరోధి - నమ్రత - —- తేజోయుక్తముస్వచ్ఛము అయినట్టి మహత్తర స్వరూపమును, స్వభావమును సంతరించుకొని ఉంటాడు.

ఈ సంసారభ్రమ జనుల విషయంలో విభవ - దారిద్ర్యములచే విచిత్రము, అవగాహనకు అందనిది. దుర్భరము అయి ఉంటోంది కదా! అహంకారరహితులగు మహాత్ములకు అది దుఃఖమును గాని,

ఆనందమును గాని కలిగించజాలదు.

ఎవడైతే “బుద్ధి యొక్క ప్రకాశమాత్రము - సమస్త ఆపదలను నశింపజేయునది” అగు అత్మజ్ఞానమును మోహవశంచే అశ్రయించటానికి సిద్ధపడడో, అతడు నరులలో అధమతరగతికి చెందినవాడగుచున్నాడని శాస్త్రజ్ఞులు ప్రవచిస్తున్నారు. అనేక దుఃఖములకు నెలవై, జనన - మరణ రూపముతో ఏర్పడియున్న సంసారసాగరమును దాటాలనుకునే పురుషుడు నిరతిశయానందమగు ఆత్మ విశ్రాంతి పొందుటకు ప్రయత్నించుటే ఉపాయం. అట్టి విశ్రాంతి లభించాలంటే "నేనెవరు! ఈ ప్రపంచమేమిటి! అత్మతత్త్వమనగా ఎట్టిది! తుచ్ఛభోగములతో ప్రయోజనమేమిటి!?”…ఈ విధంగా అభ్యసిస్తూ క్రమంగా విచార - వైరాగ్య సమన్వితమైన బుద్ధిని సంపాదించుకోవటమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపాయం.