CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:485

XIII. మను - ఇక్ష్వాకు సంవాదము

(నే నెవరు!)

1ఈ కనిపించేదంతా ఏమిటి!

శ్రీవసిష్ఠ మహార్షి : ఇక్ష్వాకు వంశజుడవగు ఓ రామచంద్రా! మీ వంశమునకు ఆదిపురుషుడైన ఇక్ష్వాకు చక్రవర్తి ఏ విధంగా ముక్తుడైనాడో …ఆ వృత్తాంతం చెబుతాను. విను.

ఈ అయోధ్యా నగరాన్ని చాలా కాలం క్రితం ఇక్ష్వాకు చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలాకాలం రాజ్యం ఏలిన తరువాత ఒకసారి ఈ రాజ్యాదులందు విరక్తుడైనాడు. ఒక ఏకాంత ప్రదేశం చేరి మనస్సులో ఇట్లు చింతించసాగాడు.

ఇక్ష్వాకు చక్రవర్తి: (మనస్సులో) : ఈ దృశ్య ప్రపంచమంతా జన్మ - - వార్ధక్యము- మరణము - -

సంక్షోభము - దుఃఖము మొదలైన అనేక భ్రమలకు స్థానభూతమై ఉన్నది కదా! ఇట్టి ఈ దృశ్య ప్రపంచమునకు అసలైన కారణమేమిటి!

అతడు చాలా రోజులు అలోచిస్తూనే ఉన్నాడు కాని, కారణం అతనికి తెలియరాలేదు. అప్పుడు, "లాభం లేదు! ఎంత యోచించినా నా బుద్ధికి తోచటమే లేదు. మరి ఈ దృశ్య ప్రపంచమునకు కారణమేమైయున్నదో తప్పక తెలుసు కోవలసినదే”… అని నిశ్చయించుకున్నాడు.

అతని పంట పండి ఒక రోజు భగవంతుడగు మనుప్రజాపతి అనుకోకుండా సభకు రావటం జరిగింది. కుశల ప్రశ్నానంతరం ఇక్ష్వాకువు ఇట్లు ప్రశ్నించాడు.

ఇక్ష్వాకువు: హే మనుప్రజాపతి! అనేక జన్మలలో చేసిన పుణ్యంచే ఈ రోజు మీ దర్శనం లభించింది. బ్రహ్మలోకం నుంచి మీ రాకచే మేమంతా పరమ పవిత్రులమైనాం. మహాత్మా! కొంతకాలంగా కొన్ని సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. అటువంటి కష్టసమయంలో లోకపాలకులు లోకగురువులగు మీరు దర్శనమిచ్చారు. మిమ్ములను కొన్ని సందేహాలు అడిగి తెలుసుకోవటానికి అనుజ్ఞ ఇవ్వండి. మనుప్రజాపతి : సందేహములా! ఊఁ! అడుగు.

ఇక్ష్వాకువు : స్వామి! సవినయుడనై నా సందేహాలు మీ ముందు ఉంచుతున్నానుఈ సృష్టంతా ఎక్కడినుండి ఇక్కడికి వచ్చింది? దీని బాహ్య స్వరూపమిట్లుండగా ఇద్దాని అసలు స్వరూపం వేరే ఏదన్నా అయి ఉన్నదా? ఉంటే దీని అసలు స్వరూపమేమిటి? దీని సంఖ్య ఎంత? పరిణామమెంత? ఇందులోని జీవులెంతమంది? దీనిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారు?

Page:486

విశాలమైన వలలో ఒక పక్షి చిక్కుకుని గిలగిలలాడే విధంగా, నేను కూడా ఈ సువిశాల సంసారంలో ఎప్పుడో ఎందుకో చిక్కుకుని ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ భయంకరమైన సంసార విభ్రమమునుండి నేను విముక్తుడను అయ్యేదెట్లా?

మను ప్రజాపతి: ఇక్ష్వాకా! ఇప్పుడు నీ ప్రశ్నలు, వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది! జన్మ ఎత్తినందుకు ఏది సారభూతమై ఉన్నదో, ఏ ప్రశ్నలకు సమాధానం గొప్ప అనర్థములన్నీ ఛేదించి వేయగలదో… అటువంటి ప్రశ్నలను వివేకం యొక్క ఉత్కృష్టత చేతనే సమీపించగలిగావు.

నీ ప్రశ్నలకు సూటి అయిన సమాధానం చెబుతాను. ఉద్వేగరహిత ప్రశాంత చిత్తంతో విను. మేము మా అనుభవాలు రంగరించి ఈ సమాధానాలను నీ ముందు ఉంచుచున్నాం -

యదిదం దృశ్యతే కించిత్ నాస్తినృప, కించన యథా గంధర్వనగరం | యథా వారి మరుస్తలే యత్త నో దృశ్యతే కించిత్ తన్ నకించిదివ స్థితమ్ ॥

ఏ దృశ్యమైతే నీకు ఎదురుగా కనబడుతూ “దీనిని అధిగమించటం నా వలన అవుతుందా?”… అనే గొప్ప సమస్యను ఉదయింపజేస్తోందో, అటువంటి ఈ దృశ్యం యథార్థానికి ఏమాత్రం లేదు. కొంచెం కూడా లేదు. “మరి, నాకు కనబడుతోంది కదా?” అని అంటావా? ఎండమావులలో (మృగ తృష్ణలో) రకరకాల ఆకారాలు గల తరంగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మాయా సంబంధమైన గంధర్వ నగరంలో సుందరమైన వస్తువులు, కన్యలు కనిపిస్తారు. అవన్నీ యథార్థమా? అవెంత వాస్తవమో, ఈ కనబడేవీ అంతే!

ఇక్ష్వాకువు : మరి ఇక్కడ యథార్థమైనదంటూ ఏమైనా ఉన్నదా?

మను ప్రజాపతి : ఏది పంచేంద్రియముల కంటే మనస్సు కంటే కూడా అతీతమైయున్నదో, దేని గురించైతే సంభావన మహత్తర ప్రయోజనకారకమై ఉన్నదో, ఏది నాశరహితమై ఉన్నదో, అది మాత్రమే ఇక్కడ ఉన్నది. అదియే "సద్రూపమగు ఆత్మ అని చెప్పబడుతోంది. ఒక పెద్ద అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా అసంఖ్యాక దృశ్యములచే పూర్ణమై ఉన్న ఈ సృష్టిపరంపర చిదాత్మయందలి ప్రతిబింబం మాత్రమే. ఆ పరమాత్మ నుండి స్వభావంగా కొన్ని స్ఫురణ శక్తులు బయల్వెడలుచున్నాయి. అవి చిదాభాసాలు” అని పిలువబడుచున్నాయి. ఆ స్ఫురణశక్తులే బ్రహ్మాండ రూపాన్ని పొందుచు న్నాయి. వాటిలో మరికొన్ని శక్తులు భూమ్యాకాశాది పంచభూత రూపత్వం పొందుచున్నాయి. తక్కినవి తక్కిన చతుర్విధ ప్రాణుల రూపము పొందినాయి.

ఇదియే జగత్తు యొక్క స్థితి ఇంతకు మించి ఇక్కడ బంధము లేదు, మోక్షమూ లేదు. న బంధోస్తి నమోక్షో స్తి, బ్రహ్మైవాస్తి నిరామయమ్ |

నైక్యమస్తి న చ ద్విత్వం సంవిత్సారం విజృంభతే॥

ఓ ప్రియా ఇక్ష్వాకూ! ఇక్కడ బంధం గాని, మోక్షం గాని, ఎవరికీ లేదు. నిర్వికారమగు బ్రహ్మం మాత్రమే కలదు. ఇందులో ఏకత్వమూ లేదు, ద్వైతమూ లేదు. చిదాత్మయే సంవిత్ సారంగా విజృంభిస్తోంది.

Page:487

జలమంతా ఒక్కటే అయినప్పటికీ అనేక తరంగ భేదములచే విజృంభిస్తోంది కదా! ఒక తరంగానికి మరొక తరంగానికి ఉన్న భేదమేమిటి? రెండూ జలమే కదా! అయితే ఏం? జలం జలంగా ఉంటూ ఉండగానే అనేక తరంగాలుగా కనిపిస్తున్నది.

అట్లాగే ఒకే బ్రహ్మము అనేక జగత్ భేదములుగా కనిపిస్తోంది. ఏ భేదం కనిపిస్తోందో అది అవాస్తవం. కనుక దానిని ’మాయ (యా మా, ఏదీ స్వతఃగా లేదో!)… అని పిలువబడుతోంది. మాయామాత్రములే అగుటచే జీవునికి జీవునికి, నీకు, నాకు, ఆత్మకు భేదములు లేనివే అగుచున్నాయి. కాబట్టి నాయనా! నీవు ముందుగా బంధమోక్షములకు సంబంధించిన ఆశలను, భయమును దూరంగా త్యజించు.

సంసారభయ రహితుడవై ఉండుము. అభయ సారభూతమగు బ్రహ్మరూపుడవై ఉండు.

  1. కొంగు క్రింద బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికొచ్చినట్లు!

మను ప్రజాపతి : జలం తరంగాల రూపం పొందుతోంది చూచావా? చిన్మాత్ర సంవిత్తు స్వతహాగా విషయరహితమైనది. అయితే అది స్వయంగా ఎందుకో ఆయా సంస్కారాలచే అతి విచిత్రమై ఉన్న అవిద్య యందు ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబిత సంవిత్తు సంకల్పాల వైపుగా ఎందుకో ఉన్ముఖ మౌతోంది. ఫలితం ఈ జీవభావమును పొందుతోంది. అట్టి కారణ స్వరూపులగు ఈ జీవులు ఇతః పూర్వమే ఆవిర్భూతమైన సృష్టియందు తిరుగాడుచున్నారు. సృష్టి-దృశ్యము అనబడేవి ఇది ఇట్లుండగా వాస్తవానికి “జీవులు - వారి సుఖదుఃఖ దశలు” అనే మోహం మనస్సునందే ఉన్నదిగాని, ఆత్మయందు కాదు. నిర్మలజలంలో దృశ్యం ప్రతిబింబించినంత మాత్రంచేత దృశ్యం జలంలో ఉన్నట్లైతుందా? కాదు.

అయితే… రాహువు అదృశ్యరూపుడైనప్పటికీ, ఒకానొక నీడ మాత్రమే అయినప్పటికీ చంద్రుని యందు కనబడే ‘గ్రహణం’చే రాహువు అదృశ్యరూపం కనిపిస్తోంది కదా! అట్లాగే ఆత్మ అదృశ్యరూపం, అనుభవమాత్రం అయి ఉన్నది. అట్టి ఆత్మ దర్శనమవటం ఎట్లా? ఎట్లా అంటే … ఆత్మ సాక్షాత్కారం ఒనర్చుటయందు అభిముఖమైన అంతఃకరణంచే మాత్రమే అది అనుభవైక వేద్యం అగుచున్నది. ఇక్ష్వాకువు : అయితే నిర్మలాంతఃకరణులగు తమవంటి గురువులు అట్టి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించ గలరని లోకప్రతీతి కదా! స్వామి! మహానుభావా! నన్ను రక్షించి, నాకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించండి. మను ప్రజాపతి : తప్పకుండా ప్రసాదించేవాడినే! అయితే ఇందులో ఒక చిక్కు ఉన్నది.

నశాస్త్రైః, నా౧పిగురుణా దృశ్యతే పరమేశ్వరః,

దృశ్యతే స్వాత్మనైవ ఆత్మా స్వయా సత్వస్థయా ధియా॥

ఆ పరమేశ్వరుడు (లేక ‘స్వాత్మ’) శాస్త్రములచే గాని, గురువులచే గాని కనిపించేవాడు కాదు. మరి? అహంకార - మమకారరహితమగు బుద్ధిచే తనచేతనే తాను కనిపిస్తున్నాడు. నీవు

Page:488

పరమాత్మను దర్శించదలిచావా? అయితే త్రోవలో నడుస్తూ ఉండగా తారసపడే అపరిచిత బాటసారులను రాగద్వేష రహితబుద్ధితో చూస్తున్నట్లు ఈ ఇంద్రియాలను ఈ ఇంద్రియ విషయ ప్రపంచాన్ని కూడా చూడు. బుద్ధిమంతుడైనవాడు ఈ ఇంద్రియాలను గాని, వీటి విషయాలను గాని ఆదరించడు, అనాదరించడు. ప్రాప్తించిన పదార్థములతో కూడినవై ఈ దేహేంద్రియాలు సుఖంగానే ఉండుగాక! లేదూ ప్రాప్తించని పదార్థములచే పేదరికం పొందుగాక! ఓ మానవా! నీవు మాత్రం బుద్ధితో పదార్థమాత్రాలు అగు ఈ దేహాదులను మానసికంగా దూరంగా త్యజించు. పూర్ణ శీతలాంతఃకరుణుడవై ఉండు. నిత్యం ఆత్మమయుడవై ఉండు.

‘దేహో హమ్’ ఇతియా బుద్ధిః, సా సంసార నిబంధనీ,

న కదాచిత్ ఇయం బుద్ధిరాదేయా హి ముముక్షుభిః||

‘నేను దేహమును’ అని ఏ బుద్ధి యొక్క విభాగం ఈ జీవుని సంసారమునందు బంధిస్తోందో గమనించబడు గాక. ముముక్షువైనవాడు అట్టి బుద్ధిని గ్రహించనే కూడదు. ‘నేను సూక్ష్మమైన ఆకారం కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మమైన చిన్మాత్రంనే గాని, మరింకేమీ కాదు’… అను బుద్ధి జీవుని సంసారం నుండి విముక్తుని చేస్తోంది. అట్టి ‘నిరంతరం - అచ్యుతం’ అయిన బుద్ధిని నీవు సంపాదించుకో. అట్టి బుద్ధిబలంతో మాత్రమే నీవు సంసార బంధం నుండి విడివడగలవు.

నిర్మల జలం యొక్క లోపల, వెలుపల అంతటా సూర్యకాంతి ప్రసరించి ఉంటున్నట్లు, ఆత్మ సర్వ వస్తువుల యొక్క బాహ్య అభ్యంతరములందు నిండి ఉన్నది. ఆయా ఆభరణములు రూపముల దృష్ట్యా వేరు వేరుగా ఉంటున్నప్పటికీ, ఆభరణములన్నిటిలో ఒకే బంగారము ఉండి ఉన్నది కదా! ఇక వివిధత్వమనేది కేవలం ఆకార వైచిత్ర్యము తప్పితే మరింకేమీ కాదు. అట్లాగే ఈ సర్వ జగత్ పదార్థములందంతటా ఆత్మయే ఉన్నది. మాయా రచనాచమత్కారంచేత ఒక్కటే అయినప్పటికీ అసంఖ్యాక తరంగాలు తమంతట తామే ఎక్కడో పుట్టి మరెక్కడో లయిస్తున్నాయి. తరంగాలు కనబడుచున్నంత సేపు ’ఇది పెద్ద తరంగం ’అది చిన్నది, ఇవి తరంగం - తరంగం ఢీకొనుటచే ఏర్పడే జలకణములు’… మొదలైన వర్ణనలకు సముద్రం అర్హమగుచున్నది. ఎన్ని అసంఖ్యాక తరంగాలు ఒకచోట లేస్తున్నా, ఆ తరంగాలు ఎన్నిచోట్ల కనిపిస్తున్నా, తిరిగి ఆ తరంగాలు ఎక్కడ లయిస్తున్నా, అన్ని తరంగాలలోనూ ఉన్నది - వాస్తమైనది జలమే కదా!

కామము అనే ఈ సంసార మహా సముద్రంలో ‘ప్రాణికోట్లు’ అనే అసంఖ్యాక తరంగాలు అటూ - - ఇటూ వర్తిస్తున్నాయి. ‘జగత్సమూహాములు’ అనే నదులు ఈ సంసార మహాసముద్రంలో నిరంతరం ప్రవేశిస్తున్నాయి.

ఈ జీవులు ‘వినాశనము’ అనే బడబాగ్నిలో ప్రవేశించి జగత్తునుంచి నిష్క్రమిస్తున్నారు. మరల మరొకవైపు నుండి - నిరంతరం ప్రవేశిస్తున్నారు.

అగస్త్య మహాముని సముద్ర జలాన్నంతా త్రాగి కూడా ఇంకా తృప్తి చెందనట్లు, ’కాలము’ అనే మహత్తరతత్త్వము ఈ జగత్తులను అసంఖ్యాకంగా తనయందు లయం చేసుకుంటూ కూడా

Page:489

ఏమాత్రం తృప్తి పొందటంలేదు. ఏ ఆత్మయందైతే అట్టి మహత్తర మహాకాలము కేవలము ప్రతిబింబితమాత్రమై ఉన్నదో అట్టి ఆత్మను నీవు నిరంతరం భావన చేయి. అంతేగాని అనాత్మభూతమగు ఈ దేహము మొదలైన దృశ్యజాలమును వందల - వేల జన్మలుగా భావన చేస్తూ పోతున్నా కలిగే ప్రయోజనం? ప్రవాహపతితములగు జన్మ - కర్మపరంపరలే తప్పించి మరింకేమీ కాదు. కనుక నీవు ‘నిర్వాసనా భావన’ యందు ఆరూఢుడవగుము. గూఢరూపమగు ఆత్మభావనను ఆశ్రయించి సుఖపూర్వకంగా ఉండు.

ఇక్ష్వాకువు : అట్టి ఆత్మను ఆశ్రయించటం, ఆత్మానుభవంలో ఆరూఢత పొందటం ఎట్లా? అందుకు మార్గాలేమిటి? ఎంతకాలం ఎట్లు శ్రమిస్తే నిర్వాసనాభావప్రాప్తి, ఆత్మానుభూతి కలుగుతాయి? అసలు ఆత్మ లభిస్తుందా? మిమ్ములను అట్టి ఆత్మానుభవం ప్రసాదించవలసినదిగా నా విన్నపం! మను ప్రజాపతి: వెనుకటికి ఒక గొప్ప తెలివిగల స్త్రీ "అయ్యో ! నా బిడ్డ ఎక్కడ?” అని గాభరా

పడసాగిందట.

కుచకోటర సంసుప్తం విస్మృత్య జననీ సుతం ॥

యధారోదిత పుత్రార్థం తథాత్మార్ధమ్ అయం జనః॥

ఆవిడ పసిపిల్లవాడికి పైట క్రింద పాలిస్తూ ప్రక్కింటావిడతో ఆకశ- పోకశ కబుర్లు చెబుతోంది. ఈలోగా ఇంటాయన వచ్చి “ఏమే! పిల్లవాడేడీ? నిద్రపోతున్నాడా?”అన్నాడు. ఆ మహాతల్లి, “అవునండీ నిద్రపోతున్నాడు!“ అని చెప్పి ఉబుసుపోక కబుర్లు కొనసాగిస్తోంది. ఈలోగా ఇంటాయన ఇంట్లో పిల్లవాడి కోసం చూస్తే కనబడలేదు. “ఏమే పిల్లవాడేడీ? ఇక్కడ లేడే?” అని గావుకేక వేశాడు. ఇక ఆ స్త్రీ ప్రాణాలు ఝల్లుమన్నాయి. “నెలల బాలుడు కదా! నా బిడ్డ ఎటూ వెళ్ళలేడే! మరెవరైనా ఎత్తుకుపోలేదు కదా?” అని అనుకొన్నది. ఆ ఆలోచన రాగానే ఇక పెద్ద పెట్టున ఏడవటం ప్రారంభించింది. ఇంటాయన ఇంట్లో చిందులేస్తున్నాడు. ఈ తతంగమంతా చూచిన ప్రక్కింటావిడ “ఏమిటి ఒదినగారూ?” అన్నది. అప్పుడా ఇల్లాలు “ఇంకా ఏమిటంటారేమిటండీ! నా కొంప మునిగింది. పసిపిల్లవాడు కనిపించటం లేదు. ఇక నేనేం చెయ్యాలి బాబోయ్? నా పిల్లవాడు ఎక్కడున్నాడు నాయనోయ్? ఏం పోయే కాలం వచ్చి ఇక్కడ పెత్తనాలు నేను చేస్తున్నానో? ఏమిటి నా గతి? ఎక్కడని వెతకాలి?”… అని భోరున ఏడవసాగింది.

ఈ జీవుడు కూడా ఆ మహాతల్లి లాగానే ఆత్మ కొరకే ఏడ్చుచున్నాడు. ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. ఎందుచేత? అంతఃకరణమునందే నిత్యలబ్ధమైయున్న ఆత్మను ఏమరుచుటచేతనే! కనుక అతని దుఃఖం భ్రాంతిచే ఏర్పడినది మాత్రమే. పైట క్రింద గల పిల్లవాడిని తల్లి ఏమరచినట్లు తన అఖండ-అప్రమేయ స్వభావమగు ఆత్మను ఏమరచిన ఈ జీవునికి గుర్తు చేయటానికే శాస్త్రములు పరికల్పించబడ్డాయి.

అజరామరమ్ ఆత్మానమ్ అబుద్ధ్వా పరిరోదితి । |

హా హతో హమ్! అనాధో హమ్! నష్టోస్మి ఇతి వపుర్వ్యయే ॥

Page:490

స్వస్వరూపమగు ఆత్మ సర్వదా జరామరణ రహితమైనది. ఇది ఏమరచిన ఈ జీవుడు దేహమును మాత్రమే చూస్తూ “నేను ముసలివాడనయ్యాను. నా పని అయిపోయింది. అయ్యో! నేను చచ్చుచున్నాను! నాకు దిక్కెవరూ లేరు, నేను అనాథుడను”… ఇటువంటి బాల్య చాపల్యమువంటి ప్రేలాపనలు చేస్తూ నిష్కారణంగా దుఃఖిస్తున్నాడు. కనుక ఓ ఇక్ష్వాకా! ఆత్మ లభించటమేమిటి? దానిని మరొకరు నీ కివ్వటమేమిటి? అది సర్వదా నీ రూపమే అయి, నీచే పొందబడియే ఉన్నది. ప్రతి జీవుడు అదియే అయి ఉన్నాడు. ఇక, వివిధ కార్యరూపములతో కూడిన ఈ జగత్తేమి టంటావా…? జలము తన యొక్క చలనము వలననే తరంగములు మొదలైన అనేక రూపములుగా కనిపిస్తున్నట్లు, సంకల్పవశంచేత చిద్రహ్మమే వివిధ కార్యపరంపరా రూపంగా వృద్ధి చెందుతోంది.

ఓ కుమారా! ముందుగా నీ చిత్తమునందలి సంకల్ప వ్యవహారమును శమింపజేయి. సంకల్పాలు లయించగా, అప్పుడు శేషించి ఉన్న కళంకరహిత చిత్రాన్ని ఆత్మయందు సంస్థాపన మొనర్చివేయి. ఇక ఈ లౌకికమైన రాజ్యాది వ్యవహారములంటావా? వ్యవహారార్థం ఈ శరీరాదులతో ఆయా క్రియలు ఆచరించుచున్నప్పటికీ వీటినన్నిటినీ అభాస మాత్రంగా చూడు. అభాసమాత్రమే అయిన ఈ కర్మలు ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మచే ఏదీ ఆచరించనివాడవై (నిష్క్రియుడవై), స్వస్థుడవై, సుఖివై … ఇక ప్రాప్తించిన ఆయా ధర్మములను నిశ్చింతగా, నిర్వికారంగా నిర్వర్తించు.

  1. జగత్తు చిత్ దర్పణంలోని ప్రతిబింబము మాత్రమే

మను ప్రజాపతి : ఓ ఇక్ష్వాకు మహారాజు! ఒక బాలుడు అనేక కల్పనలతో కూడిన ఆటలను ఆశ్రయించి ఆడుకుంటూ ఉంటాడు చూచావా? పరమాత్మ అస్పష్టరూపమగు తన “అవిద్యాశక్తి”చే ఆయా సృష్టి రూప క్రియలను ఆశ్రయించుచూ చిన్నపిల్లవాడివలే స్వయముగా క్రీడించుచున్నాడు. ఆటలు ఆడుకొంటున్న బాలుడు కొద్దిసేపైన తరువాత ఆ ఆటను, అందలి కల్పిత విశేషములను త్యజించి ఇంట్లోకి వెళ్ళిపోతున్నట్లు ఆ పరమాత్మ మరొక తరుణంలో తన జ్ఞాన దృష్టిచే ‘విద్య’ అను సంహారకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. అట్టి సంహారశక్తిచే సర్వమును ఉపసంహరించి స్వాత్మయందు పునఃప్రవేశం చేస్తున్నాడు. తన నిర్మల - - అప్రమేయ - నిస్సంగ - - అఖండ స్వరూప - ఔన్నత్యమును సంతరించుకుంటున్నాడు.

ఇక్ష్వాకు చక్రవర్తి: ఈ జీవుడు దేనిచే బంధింపబడుచున్నాడో….. అట్టి శక్తి ఎక్కడి నుండి ఏర్పడుతోంది? మను ప్రజాపతి :

స్వయమస్య తథాశక్తిర్ ఉదేత్యాం బధ్యతే యయా |

స్వయమస్య తథాశక్తిర్ ఉదేత్యున్ముచ్యతే యయా |

దేనిచే ఆత్మయే వాస్తవ స్వరూపంగా గల ఈ జీవుడు బంధింప బడుచున్నాడో… అట్టి శక్తి

Page:491

ఆతనియందే స్వయంగా ఉదయిస్తోంది. అంతే కాదు. ఏ శక్తిచే ఆతడు ముక్తుడగుచున్నాడో, అది కూడా వానియందే స్వయంగా ఆవిర్భవిస్తోంది. అనగా ఆత్మనుండే బంధనశక్తి ఒకప్పుడు బయల్వెడలి, మరొకప్పుడు లయిస్తోంది.

చంద్ర, సూర్య, అగ్ని, కాల్చబడిన ఇనుపచువ్వ - వీటన్నిటి నుండి ఎట్లా ప్రకాశము వేరుగా ఏర్పడుతుందో, ఎట్లా వృక్షం నుండి ఆకులు వేరుగా ఏర్పడుచున్నాయో, సెలయేరు నుండి జలకణాలు ఎట్లా బయల్వెడలుచున్నాయో… అట్లాగే విశాలమగు బ్రహ్మమునందు బుద్ధి - జగత్తు మొదలైనవి వేరుగా కల్పనచే ఏర్పడుచున్నాయి. బ్రహ్మమునందు కల్పనచే దర్శించబడేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. అందుచేత జ్ఞానులకు ఈ జగత్తంతా ఆనందమయ బ్రహ్మముగానే అనుభవమౌతోంది. అజ్ఞానులకో ఇది బ్రహ్మమునకు వేరుగా తోచుచుండుటచే దుఃఖ ప్రదమౌతోంది. ఆహాఁ! ఈ జగత్తునంతా మోహింపజేస్తున్న ఈ మాయ ఎంతటి విచిత్రమైనది! సర్వాంగములను లోపల బయట ఆక్రమించియున్న ఆత్మను ఈ మాయ కనబడకుండా ఉంచగలుగుతోందే! ఈ జీవుడు మాయను చూస్తున్నాడు గాని ఆత్మను చూడటమే లేదు. శాస్త్రములు మాయ గురించి బోధిస్తూ ఆత్మతత్త్వమును చూపుతూ - సుస్పష్టం చేస్తున్నాయి.

“చిదాదర్శమయం సర్వం జగత్" ఇత్యేవ భావయన్ I యస్తిష్ఠతి ఉపశాంతేచ్ఛం స బ్రహ్మకవచః సుఖి |

“ఈ జగత్తంతా చిత్ అనే దర్పణం నందు వ్యాపించి ఉన్నది. ఎందుకంటే ఇదంతా ప్రతిబింబి స్తున్నది చిత్తోనే కదా!” అని భావన చేస్తూ ఎవడు సమస్త కోర్కెలు త్యజించి ఉంటాడో… అట్టి వానిని అజ్ఞాన బాణములు ఏమీ చేయలేవు. ‘బ్రహ్మము’ అను కవచమును ఆతడు ధరించి ఉంటే చాలు, ఇక అతడు మహాసుఖవంతుడు.

ఓ ఇక్ష్వాకూ! నీవు అహంకారరహితుడవై ఉండు. దుఃఖం ఉన్నదీ అంటే… అక్కడ అహంకార

- - మమకారములు ఉన్నట్లే. నీవు అభావరూపభావనతో సర్వవస్తువులు దర్శించు. అనగా “అంతయూ కూడా శూన్యమై నిరాలంబమైనట్టి చిద్రూప బ్రహ్మమే అయి ఉన్నది” అని భావన చేయి. "ఇది రమ్యమైనది, అది రమ్యమైనది కాదు. ఇది ఉచితము, అది అనుచితం. ఇది సానుకూలం, అది ప్రతికూలం”…ఇటువంటి వైషమ్యముతో కూడిన కల్పనయే నీ దుఃఖములన్నిటికి అసలైన బీజమై ఉన్నదని గ్రహించు.

ఇదం రమ్యం ఇదంనేతి, బీజం తే దుఃఖసంతతేః |

తస్మిన్ సామ్యాగ్నినా దగ్ధా దుఃఖస్యావసరః కుతః ॥

ఎప్పుడైతే నీవు ‘సమత్వము’ అనే అగ్నిని ప్రజల్వింపజేస్తావో …ఇక సర్వ వైషమ్య కల్పనా బీజములు దహించబడతాయి. ఆపై దుఃఖానికి చోటెక్కడిది చెప్పు? కనుక ‘సమాధి’ అనే అభ్యాసానికి ఉపక్రమించు. ‘సర్వ దృశ్య విస్మృతి’ అనే మహాస్త్రాన్ని చేకూర్చుకో. పురుష ప్రయత్నబలంతో ‘రమ్య అరమ్య విభాగ కల్పన’ లను అతి త్వరగా ఛేదించివేయి.

Page:492

అభావనచే భావనను లయం చేయి. సర్వ దృశ్య విస్మృతిచే దృశ్య స్మరణను నిరోధించు. ‘కర్మ’ అనే అరణ్యాన్ని ‘ఆసక్తి రాహిత్యము’ అనే ఖడ్గంతో త్రెంచివేయి.

అట్టి నిజ ప్రయత్నంతో ఆకాశముకంటే కూడా అతి సూక్ష్మమైన బ్రహ్మమును పొంది దుఃఖరహితుడవగుము.

మొట్టమొదట మన ఈ సంవాదము యొక్క ప్రయోజనంగా వివేకమును సంపాదించు. ఇక ‘సమాధి’ అను అభ్యాసముచే ‘బాహ్య కల్పనా అభాస’ను సన్నగిల చేయి. సత్య దృష్టితో చూడగల ‘పవిత్రదృష్టి’ని నిదుర లేపు.

క్రమంగా పూర్ణాత్మానుభూతిచే జగమంతా వ్యాపించి ఉండు. జగమంతా వ్యాపించిన శరీరం కలవాడై, విభాగ రహితుడవై పరమానందం పొంది ఉండు. శాశ్వతంగా సంసారరోగ వర్జితుడవగుము. శాంతమై, సమమై, ఏకరసమై, స్వచ్ఛమైనట్టి చిన్మాత్ర దేహము కలవాడవై… సంసారభయ రహితుడవై

ఉండుము.

  1. ‘అహమ్’ నుండి ‘అనహమ్’

మను ప్రజాపతి : బిడ్డా! ‘సర్వాత్మకత్వము’ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభవస్థితి. అది సాధ్యము, లక్ష్యము అయి ఉండగా అందుకు సాధనములను, మధ్యే మార్గమగు వేరు వేరు అనుభవ స్థితులను శాస్త్రకారులు ప్రవచిస్తున్నారు.

అనుభవమాత్రము, ‘జ్ఞేయము’ అగు సర్వాత్మకత్వము వాస్తవానికి మనోవాక్కులకు లభించేది కాదు. అయితే అందుకు తరుణోపాయములను, ఆయా అవస్థలను శాస్త్రకారులు ఎట్లా ప్రవచిస్తున్నారో

చెబుతాను. వినుప్రజ్ఞాశ్రయము విచారణ అమ విలాపినీ శుద్ధ సంవిన్మయానందము నిరతి శయానందము పరమ యోగి / పరమ హంస / తురీయవస్థ.

మొట్టమొదట ’నేనీ పరిమిత పరిజ్ఞానంతో జీవితమంతా వెచ్చించటమనేది అర్థంలేని పని”…. అని ఈ జీవుడు ఎప్పుడో గ్రహిస్తున్నాడు. అట్టి వేదన ఉత్పన్నమైన మరుక్షణం ఆతని ప్రయత్నమునకు సహకరించటానికి శాస్త్రములు, అనుభవజ్ఞులు సిద్ధంగా ఉన్నారు. ’శాస్త్రాభ్యాసము - సజ్జన సహవాసము…‘ఈ రెండింటిచే ప్రజ్ఞను వృద్ధి పరచుకోవాలి. ఇది ప్రజ్ఞాశ్రయం అనబడేది యోగి యొక్క మొదటి భూమిక. ఇక మనస్సు నిర్మలమగుచుండగా ఆ యోగి ‘విచారణ’ అనబడే రెండవ భూమికలో క్రమంగా ప్రవేశిస్తున్నాడు. "ఇది అల్ప కాలికం గతించిపోయేది…” అని క్రమంగా ఈ దృశ్యం విషయమై గ్రహిస్తున్నాడు. ఏది కాలబద్ధము, భ్రమతో కూడినది అయున్నదో, అట్టి విభాగాన్ని వేరు చేసి ‘అసంగము’ అను మూడవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. క్రమంగా సాధన కొనసాగిస్తూ

Page:493

ఉండగా వాసనలకు ఆశ్రయభూతమైన అవిద్య సన్నగిల్లుతూ ఉండగా ఆ యోగి (లేక, సాధకుడు) ’విలాపనీ’ అనే నాలుగవ భూమిక (లేక, నాలుగవ అవస్థలో ప్రవేశిస్తున్నాడు. ఆ విధంగా విలాపనీ యందు సాధన కొనసాగుచుండగా కొంతకాలానికి ‘శుద్ధ సంవిన్మయానందము’ అను 5వ భూమికలో ప్రవేశిస్తున్నాడు. ఈ ఐదవ భూమిక శుద్ధ సంవిత్తుచే పూర్ణమై ఉంటుంది. ఆనందరూపమైన ఈ భూమికలో ప్రవేశించిన యోగిని ‘జీవన్ముక్తుడు’ అని అనవచ్చు. ఈ భూమికలో ఆతడు అర్ధ నిద్రితుడు గాను, అర్ధ జాగృతుని వలెను ఉంటాడు.

అట్టి ఐదవ భూమికలో కొంత కాలమున్న తరువాత యోగి ’స్వభావనిరతిశయానందము’ అను ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. ఈ భూమిక (లేక అవస్థ) బ్రహ్మకారము అను అనుభవవృత్తి రూపంగానూ, స్వభావంగానే నిరతిశయానందరూపంగానూ ఉంటుంది. లౌకిక జగత్తు దృష్ట్యా ఇది సుషుప్తి రూపము వంటిది. ఇందులో ఏర్పడి ఉండే కించిత్ వృత్తి కూడా లయించుచుండగా ఆ ‘పరమయోగి’ (లేక, పరమహంస) కేవలముక్తి రూపమై, సౌమ్యమైనట్టి ‘తురీయాతీతావస్థ’ అనే ఏడవ భూమికలో ప్రవేశిస్తున్నాడు.

ఇట్టి ‘తురీయాతీతావస్థ’ అనే ఏడవ భూమిక పరా నిర్వాణరూపమైనది. ఈ సప్తమ భూమిక మిక్కిలి ప్రౌఢమైతే ‘విదేహముక్తి’ లభిస్తుంది. అట్టి ఏడవ భూమికకు అతీతమైన స్థితి కేవలానుభవమే తప్పించి సదేహుల సంభాషణకు అందేది కాదు. అయితే ఆ విదేహముక్తి అనుభవానికి లభ్యమే సుమా!

తురీయాతీతము -

  1. తురీయాతీతము : స్వయంప్రకాశ రూపం, మనోవాక్కులకు అగోచరం

  2. స్వభావ నిరతిశయానందము : కేవల స్వరూప మాత్ర - తురీయావస్థ

  3. శుద్ధ సంవిన్మయానందం : సుషుప్తరూపం

  4. విలాపనీ : స్వప్నరూపం

  5. అసంగము

  6. విచారణ జాగ్రదావస్థలు ఈ మూడు

జాగ్రదవస్థలు

  1. ప్రజ్ఞాశ్రయం-శాస్త్రాశయం

మనోవాక్కులకు అగోచరం, కేవలానుభవమాత్రం.

‘సప్తమ భూమికామహాసమత్వము’ అనబడే 7వ భూమికలో అంతరంగమునందు సమస్తమూ లయించి పోతాయి. విషయములు భావించవు. ఇట్టి యోగి ‘ముక్తుడు’ అని కూడా పిలువబడుచున్నాడు. 7వ భూమికలో ప్రవేశించిన వాని బుద్ధి సుఖములచే గాని, దుఃఖములచే గాని కొంచెం కూడా స్పృశించబడదు. ‘ఈ శరీరం ఉన్నా ఒక్కటే! లేకున్నా ఒక్కటే’ అను మహత్తర భావమును ఆతడు కలిగి ఉంటాడు. ‘నేను మరణించటం లేదు. జీవించటం లేదు. నేను సత్తును గాను. అసత్తును గాను’ అని గ్రహించి కేవలం ఆత్మారాముడై ఉంటాడు కాబట్టి ఈతనిని మనం ‘జీవన్ముక్తుడు’ అను శబ్దానికి సరితూగే అర్థంగా చెప్పుకుంటాం.

Page:494

వ్యవహార్యుపశాన్తోవా, గృగ్గోవా అధ వైకకః, అహం న కించిత్ చిదితి, మత్వా జీవో న శోచతి||

అలేపకో హమ్, అజరో, నీరాగః, శాంతవాసనః నిర్మలో2స్మి చిదాకాశ ఇతి మత్వా న శోచతి॥ అహమ్ అన్తాది రహితః శుద్ధోబుద్ధో అజరామరః శాన్తః సమసమాభాస ఇతి మత్వా న శోచతి|

తృణాగ్రేషు అంబరే భానౌ నర నాగ అమరేషుచ, యత్తదస్తి తదేవ ఇతి మత్వా భూయో నశోచతి|| ‘సంసారము - అనబడే దానిచే నేను లిప్తుడను అయ్యేవాడిని కాను. దేహధర్మములైన వార్ధక్యాదులు నా స్వస్వరూపమునకు లేవు. రాగద్వేషములు నా నిర్మల స్వస్వరూపమునకు లేవు. నేను వాసనా శూన్యుడను. నిర్మల చిదాకాశమాత్రుడను’ అని ఎరిగియే ఉండటంచేత సుఖ-దుఃఖ ద్వంద్వములు అతనిని సమీపించనైనా లేవు.

“నేను వ్యవహారస్థుడనై ఉండవచ్చు. లేదా వ్యవహారములు లేనివాడనై ఉండవచ్చు. గృహస్థుడనైనా, సన్యాసిని అయినా సరే … ఏది ఏమైనా, ఎట్లున్నా, నేను చిన్మాత్రుడను”అని విశ్వసించే యోగి ఇక దుఃఖము పొందే ప్రసక్తే ఉండదు.

“నేను ఆద్యంతాలు లేని వాడను. శుద్ధుడను. బుద్ధుడను. వార్ధక్యాదులు నాకు లేవు. అమరుడను. శాంతుడను. సర్వత్రా-సమంగా భాసించేవాడను” అని ఎరిగిన తర్వాత ఇక ఆ యోగిని శోకమోహాలు సమీపించటానికి సాహసించలేవు. ‘ఒక గడ్డి పరక చివరి కొసభాగంలోను, ఆకాశమందు, సూర్యుని యందు, మనుష్యులందు, పాములందు, దేవతలందు ఏ సన్మాత్రము ఉండి ఉన్నదో, ఆ ప్రత్యేక చిన్మాత్రమే నేను’… అని ఈ విధంగా అఖండ వాక్యార్థం ఎరిగిన తరువాత దుఃఖించుటకు కారణమే కనిపించదు. “చిద్రూపుడనగు నా యొక్క మహిమయే సర్వజంతువులలోను, ఇటు భూమియందు, అటు ఆకాశమునందు అంతటా వ్యాపించియున్నది”… ఇట్లు అనంత విలాసయుక్తునిగా తనను తాను గ్రహించి తీర్చిదిద్దుకునే ఆ మహాత్ముని మరణాది దుఃఖములు ఎట్లా అడ్డుకుంటాయి?

ఓ ఇక్ష్వాకూ! ఈ కనబడే వస్తువులలో సాంసారిక జీవుడు ఏదో సుఖాశతో వెతకుచున్నాడు. అయితే సుఖము ఎక్కడ లభిస్తుంది? వాసనలతో కూడిన అజ్ఞానికి ఏఏ పదార్థములు ఇప్పుడు సుఖములు కలిగిస్తున్నాయని నమ్ముకొని ఉంటున్నాడో, అవన్నీ కూడా ఒకప్పటికి కాలక్రమేణా నశించేవే! కనుక నశించేటప్పుడు అవి అతి శీఘ్రంగా దుఃఖమును కలిగించబోతున్నాయి.

“మాకున్నవన్నీ ఇట్లాగే ఉంటాయి? ఈయన ఏమిటి, ఇట్లా అంటాడు?”…అని ఎవరైనా అనదలిస్తే … వారికి - "భౌతికానుభవములకు ఉపకరణమైన దేహమే కాలక్రమేణా నశించబోతోంది కదా”…అని గుర్తు చేస్తున్నాం. అందుచేత, “ఏఏ వస్తువులు వాసనారహితమైన మనస్సుచే అనుభవించ

Page:495

బడతాయో, అవి మాత్రమే దుఃఖరహితమైన సుఖమును అందించగలుగుతాయి’… అని జనులందరికీ నా మనవి.

అవినాభావ నిష్ఠత్వం ప్రసిద్ధం సుఖ-దుఃఖయోః, తనువాసన మర్ధో యః సేవ్యతే వా వివాసనమ్,

నాసౌ సుఖాయతే, నాసౌ నాశకాలేన దుఃఖ దః ॥

ఈ సుఖ-దుఃఖాలనేవి ఒకదానితో మరొకటి ‘అవినాభావ సంబంధం’ కలిగి ఉన్నాయి. ‘ఇది సుఖం’ అన్నచోట ‘మరొకటి దుఃఖం’ అని అనుకున్నట్లే అవుతుంది. వాసనారాహిత్యంచే ఏది అనుభ వించబడుతుందో అది సుఖం కలిగించజాలదు. అది తొలగినప్పుడు దుఃఖం కూడా కలిగించజాలదు.

ఎవడు వాసనలు నశించిన బుద్ధితో ఏది చేస్తాడో, అది దగ్ధమైన బీజంలాగా మరల అంకురించ జాలదు. అట్టివాని కర్మలన్నీ దేహేంద్రియముల చేతనే నిర్వర్తించబడుచుండగా, మనస్సు అకర్తృత్వము వహించి ఉండే సామర్థ్యము కలిగి ఉంటుంది. వాసనలు కలిగి ఉండే మనస్సు అకర్తృత్వమును వహించాలని అనుకున్నా కూడా … వల్ల కాదు.

=

ఇంద్రియ సమూహములన్నిటియందు ఏకస్థమైయున్న శుద్ధ చైతన్యము ఇంద్రియ వ్యవహారానికి కర్తగాని, భోక్తగాని ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఈ ఇంద్రియములకు, ’అహం’ భావనకు కూడా శుద్ధ చైతన్యం వేరుగా ఉంటోంది. అయితే ఆ శుద్ధ చైతన్యం జడమగు ఇంద్రియ అహంకారాదు లకు ప్రవర్తనశక్తిని ప్రసాదిస్తోంది. ఆ చైతన్యతత్త్వమే ఇంద్రియాలను వెలిగిస్తోంది గాని, ఇంద్రియాలు అద్దానిని ప్రకాశింపజేయటం లేదని గ్రహించు. అయ్యది పూర్ణచంద్రదీప్తి వలె పూర్ణ ప్రకాశమానమై ఉన్నది. అదొక్కటే స్వయం ప్రకాశకమని, తక్కినదంతా అద్దాని ప్రభావ వీచికలు మాత్రమేనని ఎరిగి ఉండు. ఇక ఈ దేహం విషయం అంటావా! ఈ దేహము, దేహమునకు సంబంధించిన భావన, దేహముచే నిర్వర్తించబడే ఆయా క్రియలు … ఇవన్నీ కూడా ‘జ్ఞానము’ అనే వాయువు గట్టిగా వీచినప్పుడు (ఇవి) నిర్విషయమై ఎటో కొట్టుకుపోతాయి.

నీవు శాశ్వతం - నిర్మలం అగు చైతన్యస్ఫూర్తి అయి ఉన్నాయి. ఇక ఈ దేహమో? ఈ మధ్య కాలంలో వచ్చినది. మధ్యలోనే పోతోంది. ఈ దేహకళలు నీ చైతన్య కళలను కప్పి ఉంచగలవా? లేదు. మరి చైతన్య కళలను చూచి ఆనందించక … ఈ దేహ కళలను చూచి దుఃఖించవలసిన పనేమిటి?

సర్వైవ హి కలా జంతోః అనభ్యాసేన నశ్యతి, ఏషా జ్ఞాన కలాత్యన్తః సకృష్ణాతా దినేదినే, వృద్ధిమేతి బలాదేవ సుక్షేత్ర వ్యుప్తశాలివత్ ॥

దేహ సంబంధితమైన ఏ కళంకాలు ఉన్నాయో, అవన్నీ అనభ్యాసం వల్ల నశించిపోతాయి. అయితే స్వస్వరూప చైతన్యమునకు సంబంధించిన జ్ఞానకళ అట్టిది కాదు. ఆత్మజ్ఞానము జనించిందా,

Page:496

అట్టి కళ తదితర దేహ సంబంధిత విషయముల వలె కాలబద్ధంకాదు. కాబట్టి మంచి ప్రదేశంలోని పూలమొక్కవలె దినదినం వృద్ధి చెందగలదు. అందుచేత నీవు దేహకళలను ఆశ్రయించటం తగ్గించి జ్ఞానకళను ఆశ్రయించు.

ఓ కుమారా! ఇక్ష్వాకా! సమస్త తటాక - నదీ - సముద్రములందునూ ఒకే స్వచ్ఛమైన జలం ఏర్పడి ఉన్నట్లు – ఒకే ‘విశ్వరూప - సన్మాత్రము’అగు ఆత్మ ఈ సమస్త పదార్థములందును సర్వదా స్ఫురిస్తోంది. కనుక ఈ జగత్తంతా కూడా సమస్త విచిత్ర కల్పనా రహితమైయున్నదని, ఏకసత్తాంశమాత్రమని గ్రహించి ఉండు. వ్యక్తిగతమైనది ఎచ్చటైతే ఏమాత్రం లేదో, అట్టి జగదహంకారాదులు దాని గురించి లెక్కలు కట్టుకుందో దుఃఖించవలసిన పని నీకేమున్నది?

  1. సచ్చిదానందమును సంతరించుకో

ఇక్ష్వాకు చక్రవర్తి : హే ప్రజాపతీ! ఈ ఆత్మకు జీవత్వమనేది ఎంతవరకు అనివార్యమై ఉంటుంది? మను ప్రజాపతి : ప్రియకుమారా! ఎంతవరకైతే విషయ భోగేచ్ఛల గురించి ‘ఆశ’ అనేది అంతర్గతంగా కలిగి ఉంటుందో అంతవరకు ఆత్మకు ‘నేను జీవుడను’ అనే దశ ఉండియే తీరుతుంది. మరి విషయ భోగాశ ఎక్కడి నుండి వస్తోంది? అది ‘అజ్ఞానము’ అనే వీచికయేగాని, అవివేకముచే సంప్రాప్తిస్తున్నదే గాని వాస్తవమైనది కాదు.

వివేకము బలం పుంజుకుంటూ ఉంటే భోగాశ తనంతట తానే క్షయిస్తూ ఉంటుంది. విషయ భోగాశ క్షీణించగానే అప్పుడు ఆత్మ జీవదశను త్యజించి స్వభావసిద్ధము, అనామయము అగు ’బ్రహ్మరూపత్వం’ పొందుతోంది. అప్పుడు దేహము ఉన్నా, ఉండకపోయినా బ్రహ్మానుభవం ఏర్పడియే ఉండగలదు.

బొక్కెన త్రాడుచే కట్టబడి క్రిందినుంచి పైకి, పైనుండి క్రిందకు బలవంతంగా తిరుగాడుతున్నట్లు, ‘భోగవాంఛ’ అనే అవివేక స్వభావం (చింతన) అనే త్రాడుచే కట్టబడి ఈ సంసార కూపం (నుయ్యి)లో తిరుగాడుతోంది. అట్టి చింతన అనే త్రాడుచే భోగవాంఛస్వభావుడవై బంధించ బడబోకు.

ఈ భోగవాంఛ అనేది చాలా చమత్కారంగా జీవుని ఆవరించి ఉంటోంది. దాని రూపమేమిటో

చెబుతాను విను.

“ఇది నాది -నేను దీనికి చెందినవాడను?" - ‘ఇది నాది, నేను దీనికి చెందిన వాడిని’… అని ఘనీభూతమైన వ్యవహార భ్రమను ఎవరైతే మోహవశంచేత ఆశ్రయించి ఉంటారో … అట్టి మూర్ఖులు ఇంకా క్రిందకు, అక్కడి నుండి ఇంకా ఇంకా క్రిందకు పడిపోతూనే ఉంటారు. నేను వీనికి చెందిన వాడిని. ఇతను నా వాడు. ఈ దేహం నేను …ఈ ప్రకారంగా మోహమును ఆశ్రయిస్తూ ఎవరు జ్ఞానానికి దూరమౌతూ ఉంటారో వారిని ఎవరు ఎట్లా కాపాడగలరు? అట్టి మోహమును పరిత్యజిస్తూ ఉండేవారో … క్రమక్రమంగా ఉన్నతిని సంపాదించుకోగలరు.

Page:497

కనుక ఓ రాజా! ఇప్పుడు నీవు చెయ్యవలసినదేమిటో చెబుతాను. స్వయం ప్రకాశరూపమగు నీ యొక్క ఆత్మను అవలంబించు. అట్టి సంపూర్ణభావనచే ఈ జగత్తులన్నిటినీ నింపివేయి. జగత్తు లన్నిటా పూర్ణమొనర్చి వ్యాపించియున్న ’చిదాకాశము’నే గాంచుము. ఎప్పుడైతే అఖండ-అప్రమేయ -నిర్మల చిద్రూపమును సర్వే సర్వత్రా దర్శిస్తావో అప్పుడు నీవీ సంసార సాగరమును అధిగమించి పరమేశ్వరత్వం పొందుతావు. ఉత్తమ భావన చేయి. ఉత్తముడవౌతావు.

ఇక్ష్వాకువు :‘ఉత్తమభావన’ అంటే తమ ఉద్దేశం చెప్పండి.

మను ప్రజాపతి : ’బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, వరుణుడు, ఈశ్వరుడు మొదలైన వారంతా ఏదేది చేయటానికి ఉద్యమిస్తున్నారో … అదంతా కూడా చిత్ శరీరినగు నేనే చేయుచున్నాను’… అని భావన చేయి. ‘చిత్’యొక్క విలాసము నిరంకుశము కాబట్టి ఏదేది ఎట్లు భావన చేస్తే అదియే క్రమంగా సిద్ధించగలదు. ఏ భావన యొక్క ఉత్కృష్టత త్రిమూర్తులలో ఉన్నదో అది కూడా నీవే అగుచున్నావు. అట్టి ‘ఆత్మా హం’ భావనచే దృశ్యము వైపుగా ఎక్కుబెట్టబడి ఉన్న చిత్తం ఉపశమించి బ్రహ్మాకారం పొందుతోంది. చిత్తం శమించగా, మృత్యువును అధిగమించి చిన్మాత్రత్వం (నేను శుద్ధ చితు - అనే ఆరూఢత్వం) పొందిన వారికి ఏ పరమానందం లభిస్తోందో అది దేనితో పోల్చగలం?

ఇక ఈ జగత్తు విషయంలో ఎట్టి భావన కలిగి ఉండాలో …చెబుతాను విను. “ఈ జగత్తు శూన్యం కాదు. అశూన్యమూ కాదు. చిద్రూపం కాదు. అచిద్రూపమూ కాదు. ఆత్మరూపం కాదు. అనాత్మ రూపం కాదు. ఇది భావన అను ప్రక్రియపై ఆధారపడి ఉన్నది…”” అని గమనిస్తూ జగద్భావనను అధిగమించి ఆత్మను మాత్రమే ఆశ్రయించి ఉండు.

‘ఆత్మ సాక్షాత్కారం’ అనే సాక్షాత్ పారిమార్థిక స్వరూపం ప్రాప్తిస్తూ ఉండగా ఈ ప్రకృతి తనకు తానే స్వయంగా తొలగిపోగలదు.

ఏతత్ స్వరూపమాసాద్య ప్రకృతిః పరిశామ్యతి |

న దేశో మోక్షనామాస్తి న కాలో నేల తరా స్థితః ||

“మోక్షం అని పిలుబడే స్థితి ఎప్పటికో, ఎంతోకాలానికి గాని రాదు. ఎక్కడో మరొకచోటు అది. మోక్షస్థితిలో మనం ఇట్లా ఉండం. మరొక స్థితిలో మరొకటేదో రూపంలో ఉంటాం”… అని లోక రీతిగా అనుకుంటూ ఉంటారు. అదంతా వాస్తవంకాదు. మోక్షమనేది ఎక్కడికో వెళ్ళిన తరువాతనో, ఏ మరొక స్థితి పొందిన తరువాతనో, ఏ కొంత కాలమో జరిగిన తరువాతనో వచ్చి కూర్చునేది కాదని గ్రహించు. మరి?

వ్యక్తిగతమైన అహంకారం (లేక) దేహగతమైన ‘అహంకార - మమకారములు’ అనే మోహం క్షయిస్తూండగా, ఆ ద్రష్ట అంతరంగంలో ఈ ప్రకృతి యొక్క ప్రభావం పరిశ్యామం పొందుతూంటుంది. అప్పుడా ద్రష్టకు "నేనే ఆత్మను. ఆత్మ గురించి చెప్పబడిన అఖండ అప్రమేయాది లక్షణములన్నీ నా స్వరూప వర్ణనలే”…అని సుస్పష్టమౌతుంది. అనుభవైక వేద్యమౌతుంది. అట్టి అవగాహన యొక్క వాక్మనో అతీతమైన వైభవం - అనుభవాల ఔన్నత్యస్థితినే ‘మోక్షం’ అని పిలుస్తారు.

Page:498

అనేక శాస్త్రముల అనేక కథా - - సోదాహరణములు, విభాగ సిద్ధాంతములు, విధి విధానాదులు చెప్పుకుపోతున్నాయి. మా ఉద్దేశంలో అవన్నీ కూడా ‘నేను నిత్యసత్యమగు నిర్మలాత్మను’… అని నిరూపించుటకొరకై (మధ్యే మార్గ ప్రతిపాద్యములై) ఉన్నాయి. అందుచేత వివిధ శాస్త్రముల గూర్చిన ’జిజ్ఞాస’ అనే చపలత్వం కూడా శమించవలసిన వాటిలో ఒకటియే అయున్నది. అట్టి ‘శాస్త్రార్థజిజ్ఞాస’ అనే చపలత్వం కూడా శమించినవాడు, అనేక విధములగు కావ్య - నాటక కౌతుకములు కూడా లేనివాడు, సమస్త వికల్ప - ఉపద్రవములు తొలగినవాడు, సమరూపమగు జీవన్ముక్తత్వము సంపాదించుకొన్న మనిషి శాశ్వతమైన సచ్చిదానందముతో సుఖ పూర్వకంగా ఏర్పడి, ఈ ప్రపంచమున ఉండగలడు.

ఓ ఇక్ష్వాకూ! నీవు కూడా అట్టి సచ్చిదానందత్వము అనువర్తించుకో. సంతరించుకో. ఇక ఏది ఎట్లు ఉచితమో అట్లే అగుగాక!

  1. జీవన్ముక్త మాహాత్యం

ఇక్ష్వాకు చక్రవర్తి : ప్రభో! పవిత్రమగు జీవన్ముక్తత్వము సంతరించుకున్న మహనీయుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వారిలో ప్రత్యేకమైన లక్షణాలేమైనా కనిపిస్తాయా? వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండటం మావంటి వారికి అనుచితం? అసలు వాళ్ళు ఎక్కడెక్కడుంటారు?

మను ప్రజాపతి : జీవన్ముక్తునికి ‘ఇక్కడే ఉండాలి - అక్కడ ఉండకూడడు’ అనే సాంఘిక - లౌకిక సిద్ధాంతాలు వర్తించవు. ఎక్కడైనా ఏదో తింటూ, ఎవరో ఏ వస్త్రమో కప్పితే కూడా తన ఇచ్ఛానుసారం ఉండగలడు. వర్ణాశ్రమ ధర్మాలనుండి, శాస్త్రరూప యంత్రము నుండి అంతర్గతంగా విడువబడినవాడై ఉంటాడు. బాహ్యానికి ఏది ఎట్లు ఎంతవరకు లోకానుకూలంగా అవుతుందో, అది అట్లే అనుసరిస్తాడు. ’జీవన్ముక్తుడు’ బోను నుండి సింహం లాగా ఈ జగజ్జాలము నుండి బయల్వెడలుచున్నాడు. వాక్కుచే అందనట్టి నిరతిశయానందము పొంది ఉంటాడు. విషయదశల నుండి విడివడినవాడగు ఆ యతివర్యుడు శరద్రుతువులోని మేఘరహిత నిర్మలాకాశంలాగా ఒకానొక అనిర్వచనీయ శోభను పొందుచున్నాడు. పర్వతముపైన గల ఒక పెద్ద మడుగులాగా గంభీరుడై, నిర్మలుడై ఒప్పుతూ ఉంటాడు. ‘ఆత్మానంద రసాస్వాదము’ నుండి చ్యుతుడు కావటానికి ఆతనికి కారణమే కనిపించదు. సదా, సర్వదా, సర్వ అవస్థలలోనూ ఆత్మయందే క్రీడిస్తూ ఉంటాడు.

సర్వకర్మఫలత్యాగీ, నిత్యతృప్తో, నిరాశ్రయః, న పుణ్యేన, న పాపేన లిప్యతే నేతరేణచ ॥

సమస్త కర్మల ఫలములను మొదలే త్యజించివేసి ఉంటాడు. నిత్యతృప్తుడై, నిరాశ్రయుడై ఈ మాయామేయ జగత్తు యొక్క నిత్యానిత్య రహస్యములను ఎఱిగి ఉంటాడు. పుణ్యపాపములుగాని, తదితరములైన హర్ష - శోకములు గాని ఆతనిని అంటజాలవు.

Page:499

స్ఫటికః ప్రతిబింబేన యథాయాతి న రంజనమ్ తత్అః కర్మఫలేనాన్తస్తథా నా యాతి రంజనమ్||

ఒక స్పటికమును ఒకచోట ఉంచామనుకో. అందులో ఎదురుగా ఉన్న ఎరుపు రంగు వస్త్రం ప్రతిబింబించటం చేత స్ఫటికము ఎఱుపుగా కనిపిస్తుంది. అంతమాత్రం చేత “స్ఫటికం రూపాంతరం పొందింది”…అని అనగలమా? స్ఫటికం ఇతఃపూర్వపు నిర్మలత్వం కోల్పోతుందా? ప్రతిబింబిత వస్తువును ప్రక్కకి పెట్టగానే స్ఫటికం యథాతథమౌతుంది కదా! అట్లాగే ప్రారబ్ధ కర్మ ఫలరూపములగు ఇక్కడి సుఖ - దుఃఖాదులచేత ఆ జీవన్ముక్తుడు ఆత్మ స్వభావము నుండి ఏమాత్రం చ్యుతుడు కాడు. ఒక ప్రక్క జన సమూహం మధ్య విహరిస్తూనే, స్వతంత్ర బుద్ధితో ఆత్మారాధన చేస్తూనే ఉంటాడు. అద్దము తనలో ప్రతిబింబించే దృశ్యము వృద్ధిచెందినా ఖండింపబడినా భేదము పొందదు కదా! దేహము పూజించబడుచున్నప్పుడు, ఖండించబడుచున్నప్పుడు కూడా - అద్దంలో ప్రతిబింబించే దేహము మోహముగాని, గర్వముగాని, దుఃఖం గాని పొందనట్లు ఆతడు దేనికీ భేద, దుఃఖ, మోహ, గర్వాదులు పొందడు. పూజింపబడనప్పుడు కూడా స్తుతి శూన్యుడై ఉంటాడు. పూజితుడు కాకున్నప్పటికీ వికార రహితుడై ఉంటాడు. ఒకప్పుడు ఆచారనియమములు పాటిస్తున్నప్పుడు, మరొక్పుడు పాటించని తరుణంలోను కూడా ఆతని ఆత్మావగాహన ఒకే తీరుగా ఉంటుంది. ఆ ఉభయములు ఆతనికి ఒక్కటే అవుతాయి.

తస్మాన్ నో ద్విజతే లోకో, లోకాన్నోద్విజతే చ సః రాగద్వేషభయానంన్టైః త్యజ్యతే ..పి చ యుజ్యతే॥

ఆతనిని చూచి లోకము, భయం పొందదు. లోకమును చూచి ఆతడు భీతుడు కాడు. ఒకప్పుడు రాగ-ద్వేష-భయ-ఆనందాలు త్యజించి ఉంటాడు. మరొకప్పుడు లీలామాత్రంగా కూడి ఉంటాడు. అవి ఉన్నా, లేకున్నా ఆతని ఆత్మానుభూతికి కొఱత ఉండదు. ఇక ఆతని తత్త్వజ్ఞానానుభవం యొక్క లోతును ఎన్నో లౌకిక తెలివి తేటలు కలవాడు కూడా కనుగొనలేడు. అయితే వ్యవహారానికి వస్తే శుద్ధచిత్తుడైన ఒక చిన్నపిల్లవాడికి కూడా ఆతను ఇట్టే వశమై ఉంటాడు.

తనుం తయుతు వా తీర్థీ శ్వపచస్య గృహే2పి వా మా కదాచన వా రాజన్ వర్తమానే పి వా క్షణే||

ఒక పవిత్ర క్షేత్రంలో దేహం విడచుచుండవచ్చు గాక. లేదా, మరెక్కడో అపవిత్రమైన పరిస రాలలో విడుచుచుండవచ్చు. ఈ శరీరమును సుదీర్ఘ కాలం కలిగి ఉండవచ్చు. అల్పకాలంలోనో, లేక మరికొద్ది క్షణములలోనో త్యజించవలసి ఉండవచ్చు. ఈ అన్ని సందర్భములలోనూ ఆతనికి ఏ ప్రత్యేకతా కనిపించదు. దేహ గ్రాహ్యంలోగాని, దేహ త్యాజ్యంలోగాని ఆతనికి విశేషమేదీ కనిపించదు. ఆతనియందు కోర్కెలేవీ ఉండనందువల్ల జ్ఞాన ప్రాప్తిపొందిన సమయంలోనే ముక్తిని పొంది ఉంటాడు. పఠన శ్రవణాదుల ద్వారా జ్ఞాన విషయములు పొంది ఆత్మానుభవి అయి శేషిస్తాడు గాని, “ఈ ఈ క్రియల తరువాతనే ముక్తి"… అనే వ్యవహారం యొక్క అగత్యం ఆతనికి ఉండదు.

Page:500

ఈ ప్రపంచంలో జీవునికి ప్రతిబంధకమగుచున్నది అహంకారమే కదా! జీవన్ముక్తునిలో ‘అహంకారభ్రాంతి’ అనే బంధనం ఉండదు. జ్ఞానముచే అది స్వతఃసిద్ధంగానే రహితమైపోయి ఉంటుంది. ఆ జీవన్ముక్తుడే మోక్ష స్వరూపుడు. అంతేగాని ఆతని పట్ల మోక్షమనేది ఎక్కడినుండో వచ్చేది కాదు.

ఓ ఇక్ష్వాకు చక్రవర్తీ! అటువంటి మహనీయులు ఈ భూమిపై ఉన్నారు. వారు పూజనీయులు. వారిని పూజించినవారు, నమస్కరించినవారు కూడా పవిత్రులు, జ్ఞానైశ్వర్యులు కాగలరు. అందుచేత ప్రయత్నపూర్వకంగా అట్టి వారిని దర్శించాలి. నమస్కరించాలి, స్తుతించాలి. అభివందనలు సమర్పించాలి. ఎందుకంటే వారు ఇక్కడి సంసారరోగమును తమ చూపుచే, వాక్కుచే, స్పర్శచే శమింపజేయగలరు.

ఓ జనులారా! ఆత్మవేత్తలపట్ల మీరు భక్తి ప్రపత్తులు కలిగి ఉండండి. ధర్మపరిరక్షణకు, సంసారమందు చిక్కుకున్న ఈ మనస్సును ఎప్పటికైనా ఇవతలకు లాగి ‘మోక్షమార్గము’ అను పవిత్ర ప్రదేశములో నిలిపి ఉంచటానికి ఈ లోకమునకు వారే దిక్కు. వారే ప్రవక్తలై ధర్మ సంరక్షణార్థం జన్మించి పెడత్రోవనపోతున్న ఈ జన స్రవంతిని దుఃఖముల నుండి కాపాడి లోకముకు మహోపకారం చేస్తూ ఉంటారు. ఆత్మవేత్తలను దర్శించటం, వారితో సంభాషించి ఆత్మజ్ఞానోన్నతిని సంపాదించటం వలన కలిగే పవిత్ర ఫలము యజ్ఞ -తీర్థ తపో దానాదులచే కూడా లభించజాలదు. ముముక్షువులగు జనులు తమ ప్రయత్నసౌలభ్యం కోసం జీవన్ముక్తులు, జ్ఞానులు అగు వారికొరకు వెతుకుతూ ఉండటం, వారు తారసబడినప్పుడు వినమ్రులై అనుద్వేగకరములైన ప్రశ్నలచే సంభాషించి తద్ద్వారా ఆత్మజ్ఞాన వివేకమును పెంపొందించుకోవటం అవశ్య కర్తవ్యమై ఉన్నది.

ఓ ఇక్ష్వాకా! ఇక నీకు శుభమగుగాక! లోకములందు ఆత్మ వివేకము పరిఢవిల్లి, నా బిడ్డలగు ఈ జనులంతా దుఃఖరహితులగు గాక!

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇట్లు దీవించి భగవంతుడగు ఆ మనుప్రజాపతి శీఘ్రంగా బ్రహ్మలోకమునకు జేరుటకై అంతర్థానమైనాడు. మహనీయుడగు మను ప్రజాపతి చెప్పిన ప్రతివాక్యమును వివేకముతో విశ్లేషించి, ఆత్మదృష్టిని దృఢంగా అవలంబించిన మీ వంశజుడగు ఆ ఇక్ష్వాకువు స్థిరచిత్తుడైనాడు.

  1. జీవన్ముక్తుడు - సామ్యస్థితి

శ్రీరాముడు : ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ వసిష్ఠమహర్షీ! మనం ఇన్ని రోజులుగా అనేక సందర్భములలో జీవన్ముక్తుని గురించి చెప్పుకున్నాం. అయినా కూడా మా పూర్వీకులైన ఇక్ష్వాకు చక్రవర్తి మను ప్రజాపతిని అడిగినట్లే నాకు కూడా మిమ్ములను అడగాలనిపిస్తోంది. జీవన్ముక్తులగు

Page:501

మహనీయులు ఉన్నారని, వారిని సేవ - స్తోత్రాదులచే సంతసింపజేయటం విధ్యుక్తధర్మమై ఉన్నదని మనుప్రజాపతి చెప్పారు. సన్మతి అయిన జీవన్ముక్తుని వెతికి పట్టుకోవటం ఎట్లా? ఆతనిలో ఏ ప్రత్యేకతలు ఉంటాయి? సాంసారిక జనులలో ఉండనిది, జీవన్ముక్తులలో కనిపించేవి ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వారియందు ఏవైనా ఉత్తమ శక్తులు గాని, మరింకేమైనా గాని-మనం గుర్తించటానికి వీలుగా ఉంటాయా?

శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞానికి జ్ఞానమే అతిశయం. అజ్ఞానికి అజ్ఞానమే అతిశయం. ఇక సాంసారిక సిద్ధులంటావా? మనం చూడాలోపాఖ్యానంలోను, అంతకు ముందే మరికొన్ని సందర్భములలోను జ్ఞానము-భౌతికసిద్ధులు ఈ రెండు ఒకదాని ననుసరించి మరొకటి తప్పక ఉండాలనే నియమమేదీ లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మరికొంత విశ్లేషణం చేసుకుందాం.

జ్ఞానికి, (లేక) జీవన్ముక్తునికి సాంసారిక సిద్ధుల విషయమై కొంచెము కూడా అతిశయముతో కూడిన పట్టుదల ఉండదు. ఎందుకంటే ఆతడు సర్వదా నిత్యతృప్తుడై, శాంతచిత్తుడై ఆత్మయందే

నెలకొని ఉంటాడు.

జనులు ఎంతో తపస్సు చేసి, మంత్ర - తంత్రములను దీర్ఘకాలం ఆశ్రయించి, అప్పుడు ఆకాశగమనము మొదలైన భౌతికశక్తులు సంపాదిస్తున్నారు. జ్ఞాని ఆ మంత్రవేత్తను, అతని భౌతిక శక్తులను కూడా తన రూపంగానే దర్శిస్తూ ఉంటాడు. అందుచేత వాటి ప్రాప్తియందు ఆతనికి అపూర్వమైనదేదీ కనిపించదు. అనేక మంత్ర - తంత్రాదులను నిర్వర్తించుటలో అణిమ - గరిమ

ఏష ఏవ విశేషో అస్య న సమో మూఢబుద్ధిభిః సర్వత్రా స్థాపరిత్యాగాన్నీ రాగమమలం మనౄ భావేత్తస్య మహాబుద్ధేర్నాసౌ వస్తుషు మజ్జతి ॥

‘ఆత్మజ్ఞాని మూఢబుద్దులతో సమానంగా ఉండడు. ’ రాగ-ద్వేషాదులు పొందడు. ఆత్మనిశ్చయం వదలడు. ఇదియే వాని యందలి విశేషం. అంతటా అనురాగం త్యజించివేసి ఉంటాడు. రాగ రహితుడైన ఆ మహాబుద్ధిమంత మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అట్టివాడు పదార్థము లందు నిమగ్నం కాడు. ఓ రామచంద్రా! ఆతడు చిహ్నరహితుడు, శాంతచిత్తుడు, చిరకాల సంసారభ్రమ తొలగినవాడై ఉంటాడు. ఇక ఆతనిని గుర్తించటానికి చిహ్నమేమంటావా?

Page:502

తజ్ఞస్య యత్ మదన - - కోప - విషాద ▬మోహ

లోభ-ఆపదాం అనుదినం నిపుణం తనుత్వమ్

…ఆతనిలో కామ-క్రోధ-లోభ-మోహ-శోకాల వల్ల కలిగే ఆపదలు మొదలైనవి రోజురోజుకు ఆత్మానుభవ నిపుణతచే క్షయం పొందుతూ ఉంటాయి. వాటి రాహిత్యమే ఆతని చిహ్నం.

  1. మూడు అవస్థలు - తురీయం

శ్రీవసిష్ఠ మహర్షి : నిర్మలుడు, సర్వాంతర్యామియగు ఈశ్వరుడే ఈ జీవుడుగా కూడా పరిణమిస్తున్నాడు. ఒకానొక బ్రాహ్మణుడు తుచ్ఛమైన కోరికచే ఒక శూద్రస్త్రీయందు ఆసక్తుడై నిర్మల - సాత్విక సమన్వితమగు బ్రాహ్మణ ధర్మమును మెల్లమెల్లగా త్యజించి చివరికి శూద్రత్వమును ఆశ్రయిస్తూ ఉన్నట్లు … ఈశ్వరుడు కూడా తన నిత్య పూర్ణానంద స్వభావమును త్యజించి బుద్ధి మొదలైనవాటితో కూడినవాడై ‘జీవత్వము’ అనబడుదానిని ఆశ్రయించి జీవుడు పరిణమించుచున్నాడు.

నిర్మల నిర్విషయమగు ఈశ్వరతత్త్వమునందు మొట్టమొదటగా జనించే ’భోక్తృత్వ - భోగ్యములు’ అనే మహా ప్రారంభ కెరటాన్నీ "హిరణ్యగర్భాత్మకం” లేక “సమష్టి సృష్టి సంకల్పం” అని పిలుస్తూ ఉంటారు. హిరణ్యగర్భాత్మకమగు స్పందముచే జనించే ఈ 1.భోక్తృత్వము, 2.భోగ్యము … అనే చమత్కారమైన ద్వంద్వములు ప్రతి సృష్టిలోను ఏ కారణము లేకయే స్ఫురిస్తున్నాయి.

ఈ జీవులంతా ప్రప్రథమంగా ఈశ్వరునినుండే వస్తున్నారు. ఆ తరువాత ఈ జీవులంతా వారి వారిచే మరల మరల కావించబడే కర్మల తరువాత అనేక శుభ-అశుభములగు జన్మ - జన్మాంతరములను అనుభవించుచున్నారు.

సమస్త జీవులు మొట్టమొదటగా నిష్కారణంగానే పరమపదము నుండియే బయల్వెడలు చున్నారు. అందుచేత, ఇక్కడి జీవుల జన్మ-కర్మలకు సంబంధించిన కార్య - కారణ భవము కూడా ఈ విధంగా నిష్కారణమే అగుచున్నది. ఏది ఏమైతేనేం? తరువాత తరువాత మాత్రం స్వస్వరూపమును ఏమఱచిన ఈ జీవులు నిర్వర్తించే కర్మలే వారి సుఖదుఃఖములకు కారణములగుచున్నాయి.

మరి కర్మలకు కారణమేమిటి? “దేహాత్మ జ్ఞానము”చే (నేను దేహ సంబంధితుడను అను అనుభవముచే) ఉత్పన్నమగుచున్న సంకల్పమే కర్మలకు కారణమగుచున్నది.

సంకల్పిత్వం హి బంధస్యకారణం, తత్పరిత్యజమ్ | మోక్షస్తు, నిః సంకల్పిత్వం తదభ్యాసపరో భవ ॥

ఓ రామచంద్రా! సంకల్పములతో కూడి ఉండుటయే బంధమునకు కారణము, సంకల్పములు లేక ఉండుటయే మోక్షం. అందుచేత నీవు ‘సంకల్పము లేక ఉండటం’ అనే అభ్యాసము నందు తత్పరుడవై ఉండు. సంకల్ప దశలను నిరంతరం మెల్లమెల్లగా త్యజిస్తూ ఉండు.

Page:503

నీవు వ్యవహారరీత్యా అవశ్యం గ్రహించు విషయములను భావించవద్దు. అనగా భావాతీతుడవై నిర్వర్తించవలసిన దానిని యథారీతి నిర్వర్తించు. అంతేగాని గ్రాహ్య భావకుడవు (భావములను గ్రహించువాడివి) కావద్దు. అట్లాగే గ్రాహ్య భావకుడవు (భావించువానిని భావించువాడివి) కూడా కావద్దు. ఈ ఇంద్రియ సమూహములు ఆయా పదార్థములందు (లేక), విషయములందు కలిగియుండే “రాగము" వలననే ఈ జీవుడు బంధింపబడుచున్నాడు. రాగరహితుడై ఉన్నప్పుడు ఈతడు ముక్తుడే అగుచున్నాడు.

కించిత్ యత్ రోచతే తుభ్యం తద్భద్ధోసి భవస్థితౌ |

న కించిత్ రోచతే చిత్తే, తన్ముక్తోసి భవస్థితౌ॥

ఓ రామా! ఏ వస్తువైనా నీకు రుచించుచున్నదా, అద్దానియందు రాగము ఏర్పడినప్పుడు ఏర్పడే స్థితిని ‘సంసారము’ అంటున్నాం. రాగము చేతనే జీవుడు సంసార స్థితియందు బద్ధుడగు చున్నాడు. చిత్తము నందు ఏ వస్తువు రుచించకపోతే … ఇక అట్టి సంసారస్థితిలో ఉన్నప్పటికీ నీవు ముక్తుడవే అవుతావు. అందుచేత ఒక తృణము మొదలుకొని బ్రహ్మదేవుని శరీరము వరకు స్థావర జంగమమగు సమస్త పదార్థ సమూహమునందు నీకు కొంచెము కూడా రుచి ఏర్పడకుండుగాక! యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి, దదాసి యత్ |

న కర్తాసి, న భోక్తాసి తత్రముక్తమతిః, శమీ |

నీవు ఏది చేస్తున్నా, ఏది తింటున్నా, ఏది హోమ దానాలు చేస్తున్నా ’ఆయా క్రియలన్నిటికీ నేను కర్తను కాదు. భోక్తను కాదు’… అను భావనతో అభిమానరహితుడవై, ఆత్మనిష్ఠుడవై ఉండు.

సన్తో అతీతం న శోచన్తి భవిష్యత్ చింతయంతి నో I

వర్తమానం చ గృష్ణాన్తి కర్మ ప్రాప్తమఖండితమ్ II

జ్ఞానులగు మహాత్ములు గడిచిపోయిన దాని గురించి శోకించరు. గడపవలసియున్న భవిష్యత్తు గూర్చి చింతించరు. ప్రారబ్ధకర్మల ననుసరించి సంప్రాప్తిస్తున్న వర్తమానమును మాత్రం అఖండ స్వభావము కలిగి ఉంటూనే నిర్వర్తిస్తూ ఉంటారు. అంగీకరిస్తూ ఉంటారు. ఆస్వాదిస్తూ ఉంటారు.

ఈ ‘తృష్ణ, మోహము, మదము’… మొదలైన వికారాలన్నీ మనస్సులోనే కాపురముంటున్నాయి. కాబట్టి విజ్ఞుడైనవారు మనస్సుతోనే మనస్సులో అంతర్గతమైన వికారాలన్నీ ఛేదించివేయాలి. ముల్లును ముల్లుతోనే తీస్తాం. ఇనుముతోనే ఇనుమును ఛేదిస్తాం కదా! మనస్సులోని భ్రమ నశించటానికి నిర్మల మనస్సే ఉపకరణం. యుక్తమగు మనస్సుతో - అయుక్తమగు మనస్సును జయించు. మురికిని క్షారం మొదలైన మురికి వస్తువులతోనే తోమి, అప్పుడు, ఆ పాత్రను నిర్మల జలంతో పరిశుభ్రపరుస్తారు కదా! విషమును విషంతోనే నివారిస్తారు. అట్లాగే మనస్సును మనస్సుతోనే నిరోధించాలి.

జీవుని రూపం ఈ బాహ్యమైన కాళ్ళు, చేతులు, ముఖం మాత్రమే కాదు. ప్రతి ఒక్క జీవునికి మొత్తం మూడు రూపాలున్నాయి.

Page:504

  1. స్థూలరూపం : ఇది కాళ్ళు - చేతులతో కనబడే పాంచభౌతిక సమన్వయం. ఇది జీవుని భోగములకు ఉపకరించే ఉపకరణం. ఇది మాత్రమే కళ్ళకు కనబడుతోంది.

  2. సూక్ష్మరూపం : దీనిని ‘అతివాహికం’ ‘చిత్తము’ అని కూడా పిలుస్తున్నాం. దేనియొక్క స్వసంకల్పానుసారంగా ఈ ప్రపంచములన్నీ కలుగుచున్నాయో అద్దానికే ‘అతివాహికం’ అనే పేరుపెట్టారు. జీవుని గుణములు - స్వభావములు ఆశలు భావాభావములు మానావమానములు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నది ఈ అతివాహికంలోనే! దీనిని భౌతికమైన కళ్ళతో చూడలేం కనుక ‘సూక్ష్మం’ అంటారు.

  3. పరరూపం : : ఈ మూడవ రూపం స్థూల - సూక్ష్మముల కంటే విభిన్నమైనది. జీవునియొక్క ఈ రూపం విశ్వమంతా వ్యాపించి ఉండటం చేత దీనిని ‘విశ్వరూపం’ అని కూడా అంటారు. ఇది ఆద్యంతరహితమైనది. సత్యమైనది. చిన్మాత్రమైనది, నిర్వికల్పమైనది. (ఇందులో వికల్పములనేవే ఉండవు. ప్రపంచమునకు ‘సత్త’ ప్రసాదించేది ఈ పరరూపమే.

ఓ రామచంద్రా! ఇప్పుడు నీవేం చేయాలి? మొదటి రెండు రూపములైన స్థూల - సూక్ష్మములను వదలిపెట్టి మూడవదైన ‘పరరూపము’ లేక ’చిత్పదము’ను ఆశ్రయించాలి. ఎన్ని రోజులుగా ఎన్ని చమత్కార వాక్యాలతో తత్త్వవిచారణ చేసినా …దీని సారమంతా ఒక్క విషయమే. అదేమిటంటే… స్థూల - సూక్ష్మములందు ఆత్మబుద్ధిని విరమింపజేసి, చిత్ పదము (లేక) తురీయపదమును (లేక) పరరూపమును ఆశ్రయించి ఉండటం.

ఈ ఒక్క విషయం ఆరూఢపరచుకొంటే చాలు, ఇక మరింకేమీ అక్కర్లేదు. మనం చెప్పుకున్న మిగతాదంతా కూడా అట్టి ఆరూఢత యొక్క యుక్తియుక్తత గురించే సుమా!

తురీయం - నిర్వచనం :

శ్రీరాముడు : హే మునీశ్వరా! మీరు చెప్పే ‘తురీయ పదమునందు, (పరదేహం నందు) మాత్రమే ఆత్మబుద్ధి కలిగి ఉండటం’… అత్యంత ముఖ్యమైన పాఠ్యసారం కదా! జాగ్రత్-స్వప్న సుషుప్తులనే మూడిటికి పరమితమౌతున్న ఈ జీవునకు ఆ మూడిటికి అలక్షితమైన ’పరదేహానుభవం, చేతికందటమే లేదు. అందుచేత తురీయరూపమైనట్టి ఆ పరదేహానుభవ నిశ్చలత గురించి చెప్పమని నా ప్రార్థన. శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఏదైతే ’అహమ్-అనహమ్, సత్-అసత్’లకు అతీతమై, దేనియందూ ఏమాత్రం సక్తముకాక, స్వచ్ఛమై-సమరూపమై ఉంటోందో అద్దానినే ’శుద్ధచైతన్యము’ అని ‘తుర్యము’ అని, ’పరదేహము’ అని అంటున్నాం. ఇదియే జీవన్ముక్తుల వ్యవహారమందలి సాక్ష్యావస్థ. ఈ పర దేహావస్థలో సంకల్పములు సంభవించవు. కాబట్టి… ఇది జాగ్రత్తు కాదు. స్నప్నం కాదు. ఇందులో జడత్వం ఉండదు కనుక ఇది ’సుషుప్తి’ కూడా కాదు. అందుకే దీనికి ‘అవస్థాత్రయసాక్షి’ అని కూడా పేరు ఉన్నది. ఈ జగతిస్థితి ఏ జ్ఞానిలో సంపూర్తిగా విలీనమైపోతుందో, అట్టి ’అప్పటికీ శేషించి ఉండే’ స్థితియే ఆ తురీయం. జ్ఞానులకు ఆ తురీయ స్థితి అత్యంత సుస్థిరమై అనుభవమగుచుండగా, అజ్ఞానులకు ఈ క్షణికమాత్ర జగత్తు స్థిరముగా అనుభవమవటమే జ్ఞానాజ్ఞానుల దృష్టి భేదం.

Page:505

అహంకారం త్యజించబడుచుండగా … సమత్వము ఉత్పన్నమగుచుండగా … చిత్తము ప్రశమనము పొందుచుండగా …ఆ ‘తురీయావస్థ’చేకూరుతూ ఉంటుంది.

నీవు ప్రబుద్ధుడవై, మరింత అధిక బోధను పొందాలనే ఉద్దేశంతో ఈ సందర్భంలో ఒక చిన్న దృష్టాంతం చెబుతాను విను.

888

ఒకానొక అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశంలో ఒక ముని చిన్న ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఆయన ఆశ్రమం యొక్క ఆవరణలో గల రావిచెట్టు క్రింద ఆసనం వేసుకుని మహామౌనము అనుభవిస్తున్నారు. ఒక బోయవాడు బాణములు ధరించి పరుగు పరుగున అక్కడి త్రోవలో వస్తూ మునిని చూచి ఆగాడు.

అయ్యా! మునీశ్వరా! నేను ఒక లేడిని బాణంతో కొట్టాను. ఆ లేడి గాయపడి పరుగు లంకించుకుని ఇటువైపే వచ్చింది. అది ఎటువైపు వెళ్ళిందో చెప్పగలరా? అని అడిగాడు.

దానికి ఆయన సమాధానం విను.

మునీశ్వరుడు: నాయనా ! మేము వనవాసులగు మునులం కదా! అందుచేత సమశీలురమై ఉంటాం. లోక వ్యవహారాలు తెలుసుకోవాలంటే అహంకారం ఉండాలి. వ్యవహారములకు సమర్థమైన అహం కారం నాయందు లేదు. అహంకారాదులన్నీ ఎందులో ఉన్నాయో అద్దానిని ఆశ్రయించి నేను ఉన్నాను. బోయవాడు : అయ్యా! నేనడిగింది గాయపడిన లేడి గురించి. మీరేదో ’అహంకారం అదీ … ఇదీ’ అంటారేం? మీరు లేడిని చూచారా? అది చెప్పండి. చూడలేదా… చూడలేదని చెప్పండి. మునీశ్వరుడు: మిత్రమా! నేను చెప్పేది కూడా నీవు అడిగినదానిగురించేనయ్యా! ఈ కళ్ళు - కాళ్ళు మొదలైన ఇంద్రియాలు స్వయంగా పనిచేస్తాయా చెప్పు? లేదు కదా! ఈ కళ్ళను పనిచేయించేదేమిటి! బోయవాడు : …?

మునీశ్వరుడు: చెప్పవయ్యా మరి? మనస్సు కదా!

బోయవాడు : మనస్సా? అది సరేలెండి

మునీశ్వరుడు: అవునా? అటువంటి అహంకారమయమగు నా మనస్సు ఎల్లప్పుడు నిజంగా ప్రశమించి ఉంటోందయ్యా! మనస్సుకు అతీతమైనదానిని ఆశ్రయించి ఉన్న నాకు, మనస్సుకు మాత్రమే విషయమైనది ఎట్లా అగుపిస్తుంది చెప్పు?

బోయవాడు : అది సరే అయ్యగారూ ! నా లేడి …?

మునీశ్వరుడు: ఎప్పుడైతే మనస్సు శమిస్తోందో, ఇక నాకు జాగ్రత్గాని, స్వప్నంగాని, నిద్రావస్థగాని తెలియటమే లేదు. ప్రియమిత్రమా! ఏ మహత్తర తత్త్వమైతే జాగ్రత్లోంచి స్వప్నంలోకి, స్వప్నంలోంచి సుషుప్తిలోకి, సుషుప్తిలోంచి మరల జాగ్రత్లోకి పయనిస్తూ ఉంటుందో, అట్టి అప్రమేయమైన దాని గురించి ఇప్పుడు నేను మననం చేస్తున్నానయ్యా!

Page:506

ఎద్దానిలో అయితే ‘దృశ్యము’ అనబడే దానికి స్థానమే లేదో … అట్టి ‘తురీయావస్థ’ యందు నేను నెలకొని ఉన్నాను. ఇక నీ లేడి గురించి ఏం చెప్పమంటావ్? అట్టి నా మననమునకు ఈవలగాని, ఆవలగాని మరింకేదీ నాకు అగుపడడమే లేదు.

బోయవాడు : అయ్యగారూ! మీరు ఏదేదో చెప్పి బుఱ్ఱతినకండి. ఇంతకీ గాయపడిన లేడి ఎటు పోయిందో తెలుసునో, తెలియదో చెప్పవచ్చుగదండీ? అది చెప్పడేమిటిరా బాబు!

ఇట్లా పలికి ఆ బోయవాడు ‘ఈయనకేం తెలియదు, ఏదో మాట్లాడుతాడు. భలేవాడు దొరి కాడురా నాయనా!’ అనుకుంటూ లేడిని వెతకటానికి ఎటో బయలుదేరాడు. ఇక ఆ ముని “పాపం

తన ‘నిత్యసాక్షిత్వం’ వదలి ఈ జీవుడు ఇంద్రియముల వెంట, లేళ్ళ వెంట పరుగులు తీస్తున్నాడు. కదా! ఇతనికి ఈతని గురించే తెలియదాయె!” అని అనుకుంటూ తన మహామౌనాన్ని కొనసాగించాడు.

చూచావా రామా! "తురీయదశయందు మరింకొక అవస్థ ఏదీ ఉండదు’… అని చెప్పటానికే ఇక్కడ ఈ దృష్టాంతాన్ని చెప్పాను. పరదేహాన్ని ఆశ్రయించిన వాడు ద్రష్టత్వము కంటే ముందుగానే ఏర్పడి ఉంటాడు కనుక ఆతడు జాగ్రత్ష్ట కాడు. స్వప్నద్రష్ట కాడు, సుషుప్త ద్రష్టకాడు. ఈ మూడు తురీయానికి ఈవల ఉన్నవానికే విశేషాలుగాని జ్ఞానముచే ఆవల ఉన్నవానికి అవి విశేషమే కాదు.

వికల్పరహితమగు శుద్ధ చైతన్యమే తురీయం. వాస్తవానికి ఇక్కడ ఆ శుద్ధ-బుద్ధ చైతన్యమే ఉన్నది గాని, తదితరమైనదేదీ లేదు, ఉండజాలదు కూడా. ఇక ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులంటావా? ఇవి చిత్తం యొక్క మూడు రూపాలు మాత్రమే. అందుచేత చిత్తం వలే అవి కూడా మిథ్య మాత్రమే. ఈ చిత్తము మూడు రూపములలో స్థితి కలిగి ఉంటోందిఘోరము (జాగ్రన్మయం); శాంతము (స్వప్నమయం); మూఢము (సుషుప్తిమయం)… ఈ మూడు రూపములు లేనిదానిని ’మృతచిత్తం’ అంటూ ఉంటారు.

అట్టి ’మృత చిత్తము’నందు ఏకమై, సమమైనట్టి ‘సత్వము’ నెలకొని ఉంటుంది. యోగులు దానిని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుంటున్నారు. ఓ రామచంద్రా! సమస్త సంకల్పములు రహితమగుచున్న ’తురీయపదము’నందు నిరామయమగు ఆత్మస్వరూపుడవై నీవు స్థితిని కలిగి ఉండెదవుగాక! సాధువులగు మహనీయులంతా అట్టి నిర్విషయ చిదానంద స్వస్వరూపమును దర్శిస్తూ తదితరమైనదంతా ‘అతీతత్వము’ అను యుక్తిచే త్యజించి ఉంటున్నారు.

  1. తురీయమునకు ఉపాయం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఆధ్యాత్మ శాస్త్రము యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమై ఉన్నది?”… అని మనం పరిశీలిస్తే, ‘ఈ సమస్త దృశ్య వ్యవహారము లేదు’ అని నిరూపించటమే అయి ఉన్నది. ఇక్కడ అవిద్య లేదు, మాయ లేదు. మాయ - అనగా యా మా…“ఏది లేదో” … అని శబ్దార్థమే

Page:507

కదా! ఇక్కడ వాక్కు మొదలైన వాటికి అగోచరమైనట్టి శాంతమగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఆ బ్రహ్మము పూర్ణమై, చిదాభాస ప్రతిబింబమునకు బింబరూపమై, స్వచ్ఛమై, సర్వాత్మకమై, సమమై, సమస్త కళలచే పరిపూర్ణమై ఉంటోంది. అట్టి ‘బ్రహ్మము’ అను పేరుగల వస్తువు గురించి జనులు వారి వారి బుద్ధిని అనుసరించి అనేక రూపములైన సిద్ధాంతములను కల్పించుకొనుచున్నారు. కొందరు ‘అది శూన్యము’ అని, మరికొందరు ‘విజ్ఞానమాత్రము’ అని, ఇంకొందరు ’అది ఈశ్వర రూపము’ అని పరస్పర వాదోపవాదములు చేసుకుంటున్నారు. ఓ రామచంద్రా! నీవు మాత్రం అత్యంత త్వరితగతిని సమస్త వాదములను పరిత్యజించు. దృశ్యమునంతటినీ అంతరంగమునందు త్యజించివేసి ఉండు. మనోవర్జితుడవై ఉండు. శాంతచిత్తుడవై, నిర్వాణయుక్తుడవై, ప్రశాంతమైన బుద్ధిని సంపాదించుకున్న వాడవై మహామౌనివై ఆత్మయందే స్థితి కలిగియుండుము.

ఆత్మన్యేవా స్స్వ శాంతాత్మా, మూక-అంధ-బధిరోపమః,

నిత్యమ్ అంతర్ముఖో భూత్వా స్వాత్మనాన్తః ప్రపూర్ణ ధీః||

ఒక మూగవానిలాగా, గ్రుడ్డివానిని బోలి, చెవిటి వాని చందంగా దృశ్యసంపర్కం లేనివాడవై ఉండు. నిత్యం అంతర్ముఖుడవై, శాంతస్వభావుడవై, పూర్ణబుద్ధితో, ఆత్మలోనే ఎల్లప్పుడూ నెలకొని ఉండు.

జాగ్రత్యేవ సుషుప్తస్తః కురు కర్మాణి రాఘవ ।

అన్తః సర్వపరిత్యాగీ బహిః కురు యథాం గతం II

ఓ రాఘవా! జాగ్రత్తులో ఉన్నప్పుడు సుషుప్తియందు వలె కర్మలచే అస్పర్శత్వము వహిస్తూనే ఆయా విధ్యుక్తమైన కర్మలను నిర్విర్తించు. అనగా, అంతరంగమున సమస్తము త్యజించియే ఉండు. బాహ్యమున మాత్రం యథాప్రాప్తములైన కర్మలను ఆచరించు.

చిత్తము యొక్క ఉనికియే పరమ దుఃఖం. చిత్తము లేకపోవటమే పరమసుఖం. ఉన్న విషయం ఇది. కాబట్టి చిదేకాత్మ స్వరూపుడవై, ప్రియ - అప్రియములను ఏమాత్రం చింతించక క్రమక్రమంగా చిత్తమును క్షయింపజేస్తూ ఉండు.

దృష్ట్వా రమ్యమ్, అరమ్యంవా స్టేయం పాషాణవత్ సమమ్, ఏతావతాత్మయత్నేన జితా భవతి సంసృతిః ॥

ఒక చిన్న ఉపాయం విను. ఈ ప్రపంచంలోని కొన్ని వస్తువులు రమ్యంగా ఉంటాయి. మరికొన్ని అరమ్యంగా అనిపిస్తూ ఉంటాయి. అట్టి రమ్య - - అరమ్య వస్తువులను చూస్తున్నప్పుడు నీవు ఏతత్-పూర్వమువలె సమముగా ఉండటం అభ్యాసం చేయి. ఇంత మాత్రమైన నీ స్వప్రయత్నం తోనే ఈ సంసారం జయించివేయబడగలదు.

నవేదనీయం, న సుఖం, నా సుఖం, న చ మధ్యమం, ఏతావత్ ఆత్మయత్నేన దుఃఖాంతో అనన్త ఆప్య తే॥

సుఖ దుఃఖములను గురించి గాని, వాటికి సంబంధించిన సాధనల గురించి గాని కొంచెం

కూడా చింతించకూడదు. ఎవరికి వారే ఇంత మాత్రపు స్వప్రయాత్నానికి ఉపక్రమిస్తే చాలు,

Page:508

అనంతానందము సంప్రాప్తించగలదు. జ్ఞాని ఈ ముల్లోకాలలోని సమస్త పదార్థముల సారాసారం లేమిటో గ్రహించి ఉంటున్నాడు. సర్వత్రా ప్రకాశముచే శోభాయమానమైన ’నిరతిశయ బ్రహ్మానంద అమృతము’చే పరిపూర్ణుడగుచున్నాడు. బుద్ధియందు పరిపుష్ఠుడై, ‘జీవన్ముక్తి’ అనే సుఖమును పొంది ఉంటున్నాడు. అతను బాహ్యమున సమస్తమైన కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అభ్యంతరమున మాత్రం ఏమీ చేయనివాడే అగుచున్నాడు.

  1. భూమికా ప్రవేశం

శ్రీరాముడు : స్వామీ! మీరు సప్త భూమికల గురించి, వాటి అభ్యాసకుల గురించి రెండు మూడు చోట్ల అనేక విషయాలు చెప్పారు. అయితే ఈ నిర్వాణ ప్రకరణము పూర్వార్థము చివరికొస్తున్న సమయంలో సప్తభూమికాసాధనల గురించి మరొక్కసారి సవివరంగా చెప్పుకోవటం ఉచితమని నా అభిప్రాయం. సప్తభూమికాభ్యాసం ఎట్లా గావించబడుతోంది? ఆయా భూమికలందున్న యోగులు ఎట్టి చిహ్నములు కలిగి ఉంటారు? దయతో మీరుకూడా సందర్భోచితమనే అనుకుంటే, చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : యోగుల తాత్త్వికోన్నతిని విశదపరచే శాస్త్రప్రవచితమైన సప్తభూమికల గురించి, అంతిమ సాక్షాత్కారమైనట్టి భావాతీతత్వము గురించి ఇక్కడ పురశ్చరణ పూర్వకంగా చెప్పుకోవటం సముచితమే అవుతుంది. కనుక సప్త భూమికల గురించి మరికొన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం.

వేద వ్యతిరిక్త మార్గాలు అనుసరించేవారు తమ మూఢత్వమునకు తామే కారణమగుచు ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఉపాధి నుండి మరొక ఉపాధికి అంతులేకుండా ప్రయాణిస్తున్నారు. పుట్టటం - పెరగట చావటం మరల మరొక ఉపాధిని ఆశ్రయించటం (మరల పుట్టటం)

ఇట్లా చర్విత చరణంగా జరిగిపోతోంది. వారికి ఇంద్రియానుభవముల నుండి ధ్యాస మరలటం లేదు. కాల ప్రవాహంలో పడి వాళ్ళు స్థావర జంగమ దేహములను నమ్ముకుని ఉంటూ తమ దుః ఖములకు కారణమేమిటో ఆరా తీయటం లేదు. వారికి ఎవరేం చెప్పగలరు?

వేద అనుకూల మార్గానుయాయుల విషయానికి వద్దాం. వీరిని రెండు విధాల విభజించవచ్చు.

  1. ప్రవృత్తిమార్గం : “భోగములను సంపాదించి అనుభవించటమే ఉత్తమంగాని, వీటిని వదలి ఉండటమనేది అర్థరహితం. కనుక ఉత్తమ లోకాలు పొందాలి. అక్కడి సౌఖ్యములను పొందాలి…” అని అందుకు సాధనగా వేద ప్రవచిత మార్గాలలో ఉపక్రమించే వారే ఈ ప్రవృత్తిమార్గ బాటసారులు. “విషయ రహితమగు నిర్వాణం ఎవడికి కావాలి? భోగముల చేతనే నాకు శాంతి” అని తలచి వేద విహితములైన యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తించే వారు ఈ కోవకు చెందుతారు. తాబేలు తన అవయవములను బయటకు రానివ్వటం, ఇంతలోనే ఏదైనా ఎదురు రాగానే లోపలికి తీసుకోవటం చేస్తుంది చూచావా? ఈ జీవుని మనస్సు కూడా ఒక దేహంలో ప్రవేశించటం, ఇంతలోనే మృత్యువు

Page:509

ముఖంలో ప్రవేశించటం - ఇట్లా జన్మ - మృత్యువుల ప్రయాణాలు కొనసాగిస్తున్నది. వాస్తవమైన వివేకం ఉదయించనంత కాలం ఇది ఇట్లాగే చర్వితచరణంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో శ్రమతో బాటు పునరావృత్తి తప్పదు. అనేకసార్లు బలవంతంగా మృత్యుముఖమున ప్రవేశించి ఈ జీవుడు ఎప్పుడో ‘ఈ అవివేకమంతా ఏమిటి?’ అనే ప్రశ్నకు వస్తున్నాడు. "ఈ దేహమేమిటి? ఈ దేహ సంబంధమేమిటి? మరల మరల ఈ దుఃఖాలు ఎందుకొస్తున్నాయి? ఈ సంసారం యొక్క వ్యవస్థ అంతా అపారమైనది కదా! దీని వలన నాకు కలిగే ప్రయోజనం కొంచెమైనా కనబడటం లేదే? అనుచితమైన పరిణామాలు గల కర్మ వ్యవహారాలచే నేను రోజులు ఎందుకు గడుపుతున్నాను? ఇంతకీ నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? నా వాస్తవ స్వరూపం ఏమిటి?”…అనే యోచన ఆతనికి వస్తోంది. ‘అసలు నాకు నిజమైన విశ్రాంతి లభించే దెక్కడ?’ …అనే ప్రశ్నకు వస్తున్నాడు. ఇటువంటి ప్రశ్నలు ప్రారంభమవగానే ప్రవృత్తి తిరోగమించటం ప్రారంభించి, అతని స్వభావం నివృత్తి వైపుగా వెనుకకు మరలుతోంది.

  1. నివృత్తి మార్గం : ఎప్పుడైతే ఈ జీవుడు సద్బుద్ధితో కూడుకున్నవాడై ’వైరాగ్యవంతుడనై నేను ఈ అపార సంసార సాగరమునుండి తరించేది ఎట్లా?"… అను విచారణ యందు తత్పరుడగుచున్నాడో ఇక ఇక్కడి నుండి సప్తభూమికా ప్రవేశం చేస్తున్నాడు.

జాగ్రత్ భూమికలు - ఆతనికి భోగములందు, వాటికి సంబంధించిన సాధనములందు చింతన క్రమక్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అనగా ఆతనిలో వైరాగ్యం (రాగరాహిత్యం) ఉదయించి, దిన దిన ప్రవర్ధమానమౌతూ ఉంటుంది. ఇక చిత్తశుద్ధికి కారణం కాగల జపం - ఈశ్వరారాధన మొదలైన క్రియలందు తత్పరుడౌతూ ఉంటాడు. అనుదినం తృష్ణను క్షయించుచుండగా ఆతనికి ప్రసన్నత అభ్యాసమౌతూ ఉంటుంది. ధనం-ప్రతిష్ఠ మొదలైన జడ క్రియలందు అరుచి పెంపొందు చుండగా అతని యందు ‘ఇతరుల దోషముల గురించి ఊరకే సంభాషించటం’ ఇటువంటి నిరర్థక కాలయాపనలు ఉపశమిస్తూ ఉంటాయి ‘పుణ్యకార్యములు నిర్వర్తించాలి’ అనే ఉత్సాహం పెల్లుబుకుతూ ఉంటుంది. ఇక ఇతరులకు గాని, తనకు గాని మనస్సునకు కష్టం కలిగించే ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉంటాడు. పాపము పట్ల భయము కలిగి ఉంటాడు. భోగములను వాంఛించడు. స్నేహ, ప్రీతి, కోమల, ఉచిత, దేశకాల యోగ్యములైన మాటలను, భావములను, ప్రవర్తనను అలవరచుకుంటాడు.

ఇట్టి మార్గమును ఆశ్రయిస్తున్నవాడు ‘శుభేచ్ఛ’ అనే మొట్టమొదటి భూమికలో ప్రవేశించిన వాడగుచున్నాడు. ఈ భూమికలో కొనసాగుచున్న ఆ జీవుడు మనోవాక్కాయ కర్మలచే పవిత్రతను ఆశ్రయించడం, సజ్జనులను సేవించడం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడినుండో జ్ఞాన వర్ధకములైన పుస్తకముల (శాస్త్రములను), వాక్యములను తీసుకువచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆతడు క్రమంగా ‘విచారణ’ అనే రెండవ భూమికలో ప్రవేశిస్తాడు.

ఈ ‘విచారణ’ భూమికలో ప్రవేశించేవాడే ఉన్నతికి అర్హుడని, విచారణ లేనంతకాలం ఈ జీవుడు భ్రమార్థ సాధకునిగానే మ్రగ్గుతూ ఉంటాడని గ్రహించు. విచారణ అనబడే రెండవ భూమికలో

Page:510

ధ్యానకర్మానుష్ఠానులగు మహనీయులను సంప్రదిస్తూ వివేకమును పరిపుష్టం చేసుకుంటూ ఉంటాడు. స్వయంగా శబ్దశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము పఠనం చేస్తూ ఆ ప్రయత్నముచే లోక ప్రసిద్ధములైన వేదాంత శాస్త్రముల పరిశీలనచేస్తూ, పద - పదార్థముల విభాగం ఎరుగుతూ ఉంటాడు. గురుముఖతః శ్రవణం చేస్తూ అర్థసారాన్ని మననం చేస్తూ ఉంటాడు. ఇంటి యజమాని ఒక రోజు కుంచె చీపురును తీసుకొని తలకు గుడ్డ కట్టుకుని ఋజు ఊడ్వటం, ఇంటిని పరిశుభ్రం చేయడం ప్రారంభించినట్లు ఆ సాధకుడు మనస్సులో గల అకార్యములను గుర్తించి విడిచిపెట్టుచూ, సకార్యములను ఆశ్రయించే సప్రయత్నంలో ఉంటాడు. లోకమర్యాదను అనుసరించి బాహ్యానికి అభిమానము మొదలైనవాటిని కొంచెం ఆశ్రయించినప్పటికీ, ఆతను పాము తన కుబుసమును విడచునట్లు క్రమంగా మదము, అభిమానము, మాత్సర్యము, లోభము, మోహము, మొదలైన వాటిని త్యజించివేస్తూ ఉంటాడు. ఆతనియందు శాస్త్ర-సజ్జన సేవ పెంపొందుచుండగా … క్రమంగా శాస్త్రముల రహస్యమును యథార్థంగా, సంపూర్ణంగా ఎఱుగుతూ ఉంటాడు.

ఆ విధంగా ఆ సాధకుడు తన సాధన కొనసాగిస్తూ ప్రియుడు తన ప్రియురాలి ప్రక్కకు చేరునట్లు, “అసంగము” అని పిలువబడే మూడవ భూమికలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ జీవుడు [“అహం బ్రహ్మాస్మి” (నేను బ్రహ్మమునే అయి ఉన్నాను), “తత్త్వమసి” (నా ఎదురుగా భౌతికంగా కనిపించే నీవు స్వయంగా బ్రహ్మమే అయివున్నావు), “నే హనానాస్తి కించన” (ఇక్కడ నానాత్వమనేది కించిత్తు కూడా లేదు), “ఏకోసత్, విప్రా బహుధా వదంతి” (సత్ వస్తువగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఇక బుద్ధి, మనస్సు, దేహం, దృశ్యం అనునవన్నీ కల్పితమాత్రాలే)…] ఇటువంటి వేదాంత వాక్యములకు ఉన్న అర్థమేమిటో గ్రహిస్తూ ఉంటాడు. బుద్ధి నిశ్చలం అవుతూ ఉంటుంది. హృదయాన్ని క్రమంగా తీర్చిదిద్దుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మిక శాస్త్రాధ్యయనాల ద్వారా సంసారాన్ని మనోవాక్కులచే దూరం చేసివేస్తూ ఉంటాడు. వైరాగ్య సాధన క్రమాలను అవలంబించడం ద్వారా జీవితమును ఉత్తేజమయం గాను, విస్తారం గాను చేసివేసుకుంటూ ఉంటాడు.

ఈ విధంగా సచ్ఛాస్త్రముల అభ్యాసం చేతను, పుణ్య కార్యములను ఆచరించటం చేతను జీవునికి ఆత్మదృష్టి ప్రసన్నమౌతూ ఉంటుంది. ఈ మూడవ భూమికను సంపాదించుకున్న బుద్ధిమంతుడు రెండు విధములైన అసంగములను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ రెండు విధములైన అసంగముల గురించి, వాటి భేదం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను. విను.

  1. సామాన్యాసంగం

నా హం కర్తా, న భోక్తాచ, న బాధ్యో, న చ బాధకః ఇత్యసంజనమర్ధేషు సామాన్యాసంగనామకమ్ ॥

“నేను దేనికీ కర్తను కాదు. భోక్తను కాదు. బాధ్యుడను కాదు. బాధకుడను కాను” … ఇటువంటి నిశ్చయంతో పదార్థములందు సంసక్తం కాకపోవటాన్ని ‘సామాన్యాసంగం’ అని అంటారు.

Page:511

‘అంతా కూడా పూర్వకర్మ నిర్మితమయి ఉన్నది. లేక, ఈశ్వరాధీనమై ఉన్నది. కనుక సుఖంలో గాని, దుఃఖంలో గాని నాకు ఏమాత్రం కర్తృత్వం లేదు. ఈ భోగాలను చూచి నేను మురియవలసిన పని లేదు. వాస్తవానికి భోగాలలో తగుల్కొనటమే మహారోగం. సంపదలన్నీ ఆపదామయాలే కదా! సంయోగాలన్నీ వియోగం కొరకే అయి ఉన్నాయి. మనస్సులో ఏ ఏ చింతలు కలుగుచున్నాయో, అవన్నీ కూడా బుద్ధి యొక్క వ్యాధి రూపాలు మాత్రమే. కాలం ఎల్లప్పుడు సమస్త పదార్థములన్నిటినీ మ్రింగివేయటానికి సంసిద్ధమై వేచి ఉంది కదా! ఇక నాకు దేని గురించి ఆశ? దేని గురించి దిగులు?’

ఇట్టి వాక్యార్థములందు ఆతని మనస్సు లగ్నమై ఉంటుంది. అనాసక్తి యొక్క బలంచేత ఆతనియందు పదార్థములు అభావం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. దీనికే శాస్త్రకారులు ‘సామాన్యాసంగం’ అనే పేరు పెట్టారు.

  1. శ్రేష్ఠాసంగం - క్రమంగా కొంతకాలానికి సామాన్యాసంగం శ్రేష్టాసంగంగా రూపుదిద్దు కుంటోంది. మహాత్ముల సాంగత్యం చేతను; దుష్టమైన అల్పమైన - - సంకుచితమైన అభిప్రాయాదులు కలవారితో స్నేహ సంబంధములు తగ్గించుకొనటం చేతను; శ్రవణము, మననము మొదలైన వాటి అభ్యాస కౌశలం చేతను నిరంతరమైన అభ్యాసంతో కూడిన పురుష ప్రయత్నము చేతను… శ్రేష్ఠాసంగం అలవడుతోంది.

అట్టివారికి క్రమంగా, ‘సంసారసముద్రము యొక్క ఆవలి ఒడ్డు - సమస్తమునకు సారము - కారణములకెల్ల కారణం’ అయినట్టి ఆత్మవస్తువు అరచేతిలో ఉసిరికాయలాగా ప్రత్యక్షమౌతోంది. ఇట్టివాడు ‘నేను కర్తను కాదు, ఈశ్వరుడే అన్నిటికీ కర్త’… ఇట్టి శబ్దార్థ భావన కూడా త్యజిస్తున్నాడు. ‘పూర్వకర్మ లేదు. వర్తమాన కర్మ కూడా లేదు’ అని గ్రహిస్తూ క్రమంగా ఇటువంటి మాటలను కూడా అధిగమిస్తున్నాడు. శాంతం, మౌనం వహిస్తున్నాడు. అట్టి స్థితి ‘శ్రేష్టాసంగం’ అని చెప్పబడుతోంది. ఆతనికి పూర్వ-వర్తమాన భవిష్యత్ జన్మలు వేరువేరు కథాపుస్తకములను ఉబుసుపోకగా చదవటం

వంటిదౌతూ ఉంటుంది.

ఏది లోన-వెలుపల, పైన-క్రింద, దిక్కులందు-ఆకాశమునందు, పదార్థమందు అపదార్థ మందు, జడమునందు-చిదాభాసునియందు …స్థితి కలిగి ఉండదో; …ఏది ‘స్వప్రకాశ చిత్’ రూపమై పరమశాంతమై, వేరొక ప్రకాశకమైనదేదీ లేనిదై పదార్థరహిత ఆకాశం వంటిదై, జన్మ గాని-ఆదిగాని-అంతముగాని లేనిదై, ఏర్పడి ఉంటోందో …అదే శ్రేష్ఠసంగం అంటే !

ఎక్కడైతే … ‘సంతోషం’ అనే సుగంధంతో ‘నిష్కామ సత్కార్యాలు’ అనే నును రెక్కలతో, ’చిత్తం’ అనే తూడు యొక్క చివర సంలీనమై ఉన్నదో …అదే శ్రేష్ఠాసంగపద్మం. ఆ పద్మం చుట్టు విఘ్నరూఎ "కంటకాలు (ముళ్ళు) ఉండుగాక! అయితే ఏం? “అంతర్ విచారణ” అనే సూర్యుని నుండి కిరణ పుంజములు పొంది ఎప్పుడూ వికసించియే ఉండగలదు.

ఏ హృదయంలో ఈ ‘శ్రేష్ఠసంగం’ అనే పద్మం వికసించి ఉంటుందో …ఆ మహనీయుడు ‘అసంసంగము’ అనే మూడవ భూమికలో ప్రవేశించినట్లు చెబుతారు.

Page:512

చూచావా రామా! ఈ జాగ్రత్ భూమికలను మరల సమీక్షిస్తున్నాను …విను.

మొట్టమొదటిది “శుభేచ్ఛ” కదా. అది ఎట్లా ఏర్పడుతోంది? శుద్ధాంతఃకరణులగు మహాత్ములను ఈ జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి. వారిని సేవించి, సుముఖులను చేసుకొని వారి అభిప్రాయములను, అనుభవములను, ప్రవచనములను సంపాదించాలి. మహానీయులగు ఆత్మజ్ఞులు లౌకిక సంపద కలవారివలె ప్రదర్శితులు కాకపోవచ్చు. వారు అనేకచోట్ల నివురుగప్పిన నిప్పువలె ఉంటారు. వారిని గుర్తించటమెట్లా? ఉత్తముల అభిప్రాయములే అందుకు శరణ్యం. వివేకులగు మహనీయులను ఆ సర్వేశ్వరుడు సాధకజనులపై గల ప్రేమచే సర్వకాలలో ఈ భూమిపై ప్రసాదిస్తూనే ఉంటాడు. అయితే “ఈయన ఆత్మజ్ఞుడు. నిత్యానిత్య వివేకి. ఉత్తమ సమాచార సమన్వితుడు”… అని తెలిసి ఉండి కూడా, అట్టి వారిని ప్రయత్నపూర్వకంగా శరణువేడక ఊరకే తాత్సారం చేసేవారిని ఏమనాలి? అమృత కలశాలను సమీపంలో సిద్ధంగా ఉంచుకొని అల్పమైన తృణములవంటి ఇంద్రియ విషయాలపై ధ్యాసను, శ్రద్ధను చూపేవారిని బ్రహ్మ, విష్ణువులంతటి వారు కూడా కాపాడలేరు. ఓ జనులారా! మీరు శుద్ధాంతఃకరణులు, ఆత్మజ్ఞులు, వివేకులు అగువారి కొరకు వెతకండి. వారిని శరణు వేడండి. "ఆ! ఏముంది? ఎవరిని నమ్మగలం? ఇట్లాగే కానిద్దాం. చూద్దాంలే! ఇప్పుడు లాభం లేదు”… ఇటువంటి అల్ప - అశ్రద్ధపూర్వక - నిరుత్సాహ - బద్ధక వాక్యాలకు చోటిచ్చారా… గొప్ప అవకాశములను కోల్పోతున్నందుకు తరువాత విచారించక తప్పదు.

పుణ్యకార్యములచే మనస్సు పవిత్రం కాగా, ఉత్తమ వాక్యముల అర్థము పొందటానికి ఈ జీవునికి అర్హత ఏర్పడుతోంది. సాత్వికమైన గుణ సంపద పెంపొందించుకొనువారికి మహాత్ములు స్వయంగా తమ జ్ఞాన సంపదను అందిస్తూ ఉంటారు. ఈ విధంగా శుద్ధాంతఃకరణులగు మహాత్ముల సాంగత్యము చేతను, అనేక జన్మార్జితములగు పుణ్యముల సంచయముచేతను, కాకతాళీయ యోగం చేతను ‘శుభేచ్ఛ’ అనే మొట్టమొదటి భూమిక ఉదయిస్తోంది, బలవత్తరమగుచున్నది.

విత్తనం మొలకెత్తగానే రైతు ఏం చేస్తాడు? అది వాడిపోకుండా ముందుగా నీళ్ళు పోస్తాడు. అది ప్రవర్థమానమైయ్యేరీతిగా తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. అట్లాగే ప్రథమభూమిక ఉదయించ గానే ఆ జీవుడు వివేకంచే ప్రయత్నపూర్వకంగా దానిని కాపాడుకోవాలి, పాలించుకోవాలి, పెంపొందించు కోవాలి. సాధనచతుష్టయం (శమం, విచారణ, సత్సంగం, సంతోషం)తో కూడిన వైరాగ్యాది అంశమే శుభేచ్ఛకు అంకురం. అట్టి అంకురాన్ని విచారణను కొనసాగించుటచే అభివృద్ధి పరచుకోవాలి. ప్రతిరోజు రక్షించుకోవాలి. శుభేచ్ఛ అంతఃకరణంలో రూఢిపడిందా, ఇక అట్టి అంతఃకరణం ఇతర భూమికలన్నిటి యొక్క ఉత్పత్తికి స్వయంగా అతిత్వరలో స్థానం కాగలదు. దీని నుండే సాధకుడు సర్వాత్మత్వము వరకు పయనించగలడు.

ఓ రామచంద్రా! ఈ విధంగా "అసంగసంగం” వరకు మూడు జాగ్రత్ భూమికల గురించి వర్ణించి చెప్పాను. 3వ భూమికలో స్థితి పొందినవాడు సమస్త సంకల్ప కల్పనలను అతి తేలికగా పారత్రోలగలుగుతాడు.

Page:513

  1. జన్మ - జన్మాంతర ప్రయత్నం

శ్రీరాముడు : మహర్షీ! ఇప్పుడు ఈ సందర్భంలో రెండు సందేహాలను మీముందు ఉంచాలని అనుకుంటున్నాను1. ఒక జీవుడు మూఢత్వం తాండవించే పరిసరాలలో జన్మించాడనుకుందాం. భోగరాగాదులలో ప్రవృత్తుడై అధమత్వముతో జీవితం గడుపుచున్నాడనుకోండి. ఆతనికి యోగుల సాంగత్యం లభించకపోతే ఇక ఆతడు ఉద్ధరించబడేది ఎట్లా? ఇక ఆతని గతి అంతేనా? ఆతను మోహరాగాలలో మునిగితేలుతూ అధమ స్థితులకు దిగజారవలసిందేనా? ఆతడు ఎట్లా బాగుపడేది?

  1. ఒకడు ‘శుభేచ్ఛ’ అనే మొదటి భూమికలోనో లేక రెండవ భూమికలోనో ప్రవేశించియుండగా ఆయుష్షు తీరిపోయిందనుకోండి. ఇప్పుడాతనికి ఎటువంటి గతి లభించబోతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓ రామచంద్రా! సాధకజనులపై గల అవ్యాజమైన ప్రేమచే అవతారమూర్తివగు నీవు ఈ ప్రశ్నలను ఈ సందర్భంలో అడుగుచున్నావన్న సంగతి నేను గమనిస్తు న్నాను. మంచిది. అయితే ఈ విషయం ఇతఃపూర్వం మనం ఈ సంవాదంలో సంభాషించుకున్నదే. ఈ సందర్భమునకు ఉచితంగా మరికొన్ని విశేషాలతో ప్రస్తావిస్తాను.

ఒకడు మూఢుడై అనేక దోషములను ఆశ్రయిస్తూ జీవితమును గడిపివేస్తున్నాడనుకో. అతడు ఎప్పటికైనా “నా ఈ మార్గం కుయుక్తమైనది. దోషభరితమైనది. దుఃఖభరితమైన యోనులకు దారి తీయగలదు”…అనే వివేకం పొందాలి. అట్టి వివేకం (లేక) వైరాగ్యం పొందనంతవరకు ఆతడు ఈ విశాల సంసారంలో ఉండియే తీరుతాడు. “ఇప్పుడు ఉపాయం ఏమిటి?”… అనే ప్రశ్నకు అతను రావాలి. అప్పుడు స్వవిచారణచేతనో, కాకతాళీయంగానో, (లేక) సాధుజన సాంగత్యం చేతనో ఉద్ధరించబడతాడు.

వైరాగ్యే అభ్యుదితే జంతోః, అవశ్యం భూమికోదయః తతో నశ్యతి సంసార, ఇతి శాస్త్రార్థసంగ్రహః ॥

అట్టి జీవునిలో ‘వైరాగ్యం’ ఉదయించాలి. వైరాగ్యం ఉదయించిన తరువాత, తప్పకుండా త్వరలోనే ’భూమిక’ అనేది ఉదయిస్తుంది. తద్వారా సంసారము నశిస్తుంది. ఇది శాస్త్ర సిద్ధాంతము. వైరాగ్యము ఉదయించగానే అతనికి సహకరించటానికి సాధన-జ్ఞానపాఠముల రూపములో శాస్త్రములు సిద్ధంగా ఉన్నాయి.

అట్లా కాకుండా “నేను కుమార్గాన్ని దోషస్వభావాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. మీకు చేతనైతే నన్ను ఉద్ధరించండి”… అని పలికేవారికి పదార్థములు ఎదురుగా ఉన్నా… తిననివానికి ఆకలి తీరనట్లు … శుభేచ్ఛ ప్రవృత్తం కాదు. సంసారం బంధశృంఖలాలను తగిలించి ఆతనిని తన వెంట త్రిప్పుకుంటూనే ఉంటుంది. అప్పుడు గురువులు చేయగలిగేదేమిటి చెప్పు? ప్రయత్నశీలుడైన జీవుడు పరిసరముల ప్రభావమును అధిగమించగలడు.

Page:514

ఇక నీ రెండవ ప్రశ్నకు వద్దాం - ‘దేహపతనం’ అనేది - - భూమికల దృష్ట్యా చూస్తే - ఒకడు నిద్రకుపక్రమించి, గాఢ నిద్ర తరువాత నిదురవలేవటం వంటిది. ఒకడు ఏ విషయపరిజ్ఞానంతో, సమాచారంతో ఉండి గాఢనిద్రకు ఉపక్రమిస్తాడో… ఆతడు నిదురలేచిన తరువాత అదే పరిజ్ఞానం, అదే సమాచారం తిరిగి కొనసాగిస్తాడు కదా! అట్లాగే, ఒకడు ప్రథమభూమికయందో, లేక ద్వితీయ - తృతీయ - భూమికలయందో ఆరూఢుడై ఉండగా ఆతని ఈ భౌతికదేహం పతనమైనదనుకో. ఆయా భూమికల ననుసరించి పూర్వ దుష్కృతాలన్నీ సంక్షయించి ఉంటాయికదా. అందుచే అట్టి జీవుడు దేవతానగరములందో, లోకపాలకుల నగరములందో ప్రవేశించి క్రీడించగలడు. ఆ తరువాత పూర్వకాలకృతమైన పుణ్యసమూహం, దుష్కృతములు క్షయించిన తరువాత భూలోకంలో యోగి అయి జన్మిస్తాడు. శుద్ధులు, శ్రీమంతులు, గుణవంతులు, సజ్జనులు అగువారి ఇళ్ళలో పుడతాడు. అప్పుడిక పూర్వకాలికమైన వాసనలచే మరల యోగమును సేవిస్తాడు. ఆ బుద్ధిమంతుడు పూర్వాభ్యాసవశం చేత మరల యోగభూమికాక్రమమును గుర్తుకు తెచ్చుకోవటం జరుగుతుంది. మరల ఉత్తరోత్తర భూమికలను అధిరోహిస్తూ ముందుకు పోతూ ఉంటాడు.

  1. ఉత్తరోత్తర భూమికా సంప్రయాణం

శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పటిదాకా ఈ సందర్భంలో చెప్పుకున్న 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. అసంగం… అనే మూడు భూమికలు జాగ్రత్తుకు సంబంధించినవి. ఎందుకంటే ఇవి యథాప్రకారంగా జాగ్రత్తు లాగానే భేదబుద్ధిచేతనే ఏర్పడతాయి.

ఈ భూమికలలో ఉన్న ఉత్తరోత్తర యోగయుక్తులచే ‘ఆర్యత్వం’ ఉదయిస్తుంది. అనగా వీరు తదితరులచే, ఆరాధించబడుటకు అర్హులౌతారు. సద్గుణాధిక్యతచేత వారు పూజార్హులు, మార్గదర్శకులు అవుతారు. వీరిని చూచుటచే, పూజించుటచే మూఢజనులకు కూడా మోక్షంపట్ల అపేక్ష పుడుతుంది. ‘ఆర్యుడు’ అనగా ఎవరో … ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఆర్యుడు -

కర్తవ్యమాచరన్, కామమకర్తవ్యమనాచరన్,

తిష్ఠతి ప్రాకృతాచారో యః స ‘ఆర్య’ ఇతి స్మృతః |

ఎవడైతే నిత్య – నైమిత్తకమైన కర్తవ్యములను ఆచరిస్తూ, కర్తవ్యములు కాని వానిని కామ్యకర్మలను ఆచరించక ప్రస్థుతమైన ఆచారమునందు స్థితి కలిగి ఉంటాడో అట్టి వానిని ’ఆర్యుడు’ అంటాం. ఈతడు సాంఘిక - లోక ప్రసిద్ధ ఆచారములకు అనుకూలంగా ఉంటాడు. శాస్త్రోక్తములైన వాటిని, చిత్తమునకు సౌమ్యము కలిగించగల వ్యవహారములను గ్రహిస్తూ ఉంటాడు. యోగికి ఈ ‘ఆర్యత్వము’ అనేది ప్రథమ భూమికలో అంకురిస్తుంది. ద్వితీయ భూమికలో వికసిస్తుంది. 3వ భూమికలో ఫలీభూతమౌతూ ఉంటుంది. ఇట్టి ఆర్యత్వ దశలో దేహపతనమైన యోగి శుభ సంకల్పములకు సంబంధించిన భోగములను చిరకాలం పొంది మరల యోగి అయి జన్మిస్తాడు.

Page:515

ఈ మూడు భూమికల అభ్యాసంచే క్రమక్రమంగా అజ్ఞానమంతా నశిస్తుంది. ‘సమ్యక్జ్ఞానం’ ఉదయిస్తుంది. చిత్తము పూర్ణచంద్రునివలె శాంతి పొందుతూ ఉంటుంది.

నాలుగవ భూమిక ద్వైత శమము - స్వప్నసాదృశ్యభూమిక - ఇక నాలుగో భూమికలో ఆ సాధకుడు ప్రవేశిస్తాడు. ఈ భూమికలో ప్రవేశించిన యుక్తచిత్తులగు యోగులు జగత్తునంతటినీ విభాగరహితమైన దానిగానూ, అనాది-అనంతమైనట్టిదిగానూ, ఆనందరసైక స్వరూపంగానూ వీక్షిస్తూ ఉంటారు. ద్వైతము సర్వదా శమిస్తూ ఉంటుంది. ఈ 4వ భూమికలోని యోగులు ఈ జగత్తునంతటినీ ఒక స్వప్నమువంటిదిగా చూస్తూ ఉంటారు. అందుచేత దీనిని ‘స్వప్నాసాదృశ్యభూమిక’ అని అంటూ ఉంటారు. మొదటి మూడు భూమికలు జాగ్రత్ సంబంధములైతే, ఈ నాలుగవది స్వప్న సదృశ్యమైనది.

ఐదవ భూమిక అద్వైత బ్రహ్మస్థితము - - సుషుప్తు ఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు - ఇక ఐదవది సుషుప్త సాదృశ భూమిక. ఇందులో యోగి కేవలం సత్తా మాత్రంగా సంభాషించి ఉంటాడు. ఈతనిలో ద్వైతభావం (లేక) స్ఫురణ అనేది మచ్చుకైనా ఉండదు. కనుక అతి ప్రసన్నుడై ఉంటాడు. ఈతడు అసంగమగు తన స్వరూపము (లేక) ఆత్మస్వరూపము ఎరిగి ఉండటం చేత అద్వైత బ్రహ్మమునందే సదా స్థితి కలిగి ఉంటాడు. తోటి వారికి తన సర్వతత్త్వాత్మకం గురించి చెప్పుకోవటానికి మాటలు చాలవు. మూగవాడు తన ప్రియురాలిపై గల ప్రేమాధిక్యత చెప్పుకోజాలనట్లు ఈతడు తన సర్వాంతర్గతమైన ప్రేమాస్పద స్వరూపం ఇట్లని చెప్పజాలడు. తదితరులనందరినీ తన ఆత్మయొక్క విన్యాస ప్రకటనము వలె దర్శిస్తాడు. ఈ 5వ భూమిక సంపాదించిన యోగి బాహ్య వ్యాపార తత్పరుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా ఘనీభూతమైన నిర్విషయత్వమును దాల్చి ఉంటాడు. ఆతని ఆనంద సాగరమునకు అవధులు ఉండవు. ఎవరూ అవధులు కల్పించజాలరు. తోటివారితో మాట్లాడుచున్నప్పుడు అంతా తెలిసి కూడా ఏమీ చెప్పజాలనట్లు ఉంటాడు. ఈతనిని సుషుప్తఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు.. అని కూడా పిలుస్తున్నారు. ఈ 5వ భూమికను అభ్యాసం చేస్తూ వాసనారహితుడైన పూర్ణశాంతుడై ఉండటం చూసి ‘ఈతడు నదరు - బెదరు లేని మొద్దురా’… అని కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ “గొప్ప విలువైనవి” అనుకునేవాటిపట్ల ఈతడు నిద్రాళువువలే ఉంటాడు.

అరవ భూమిక - తురీయము- ఉక్త సమయంలో, ఉక్త ప్రకారంగా 5వ భూమికను అభ్యసించే యోగి ఎప్పుడో ‘తురీయం’ అనబడే ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. అచ్చట సత్తుగాని, అసత్తుగాని, అహంకారముగాని, అనహంకారముగాని భాసించదు. ఆ యోగి మనన వర్జితుడై ఉంటాడు. ద్వైత-అద్వైత వితర్కరహితుడై ఉంటాడు. గ్రంథి శూన్యుడై, సందేహములనేవేవీ లేనివాడై ఉంటాడు. భావనలకన్నిటికీ ఆవల నెలకొని ఉంటాడు. అట్టివాడు ‘జీవించుట’ అనబడు కార్యక్రమముచే స్పర్శించబడక ఉంటాడు. అతీత స్వభావము అలవరచుకొనటంచేత ‘ఆత్మవంతుడై ఉండటం’ అను విశేషంతో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వదా నిగృహీతత్వం (Non-taking) అలవరచుకొని ఉంటాడు. కర్మలచే నిబద్ధించబడక పోవటం చేత శాస్త్రములు ఈతనిని ‘జీవన్ముక్తుడు’… అని పిలుస్తున్నాయి.

Page:516

ఈ జీవన్ముక్తుడు శరీరము ధరించి ఉన్నప్పటికీ ముక్త రూపుడే. శరీరము ఉండి కూడా జగత్స్వభావరహితుడై ఉంటాడు. చిత్రపటంలోని దీపం గాలి వీచికలకు రెపరెపలాడుతుందా? లేదుకదా! అట్లాగే ఆతని బుద్ధి సర్వదా నిశ్చలత్వమును వీడదు. ఖాళీగా ఉన్న కుండకు లోపల - బయట కూడా శూన్యాకాశమే ఉన్నట్లు ఆతడు లోపల - బయట విషయాతీతమైన నిర్వికారవైనము కలిగి భాసిల్లుతూ ఉంటాడు.

అన్తః పూర్ణా బహిః పూర్ణకుంభ ఇవ ఆర్ణవే కించిదేవైష సంపన్నస్త్వథవైష న కించన II

సముద్రంలో ఒక ఘటం (పాత్ర) ముంచబడిందనుకో. అప్పుడా పాత్ర యొక్క బయట లోపల కూడా జలమే ఉన్నది కదా! అరవవ భూమికలో ఉన్న నిత్య నిరతిశయానందరూపుడగు ఈ యోగి బాహ్య - అభ్యంతరములందు పరిపూర్ణుడై, పరమాశ్చర్యరూపమును పొందినవాడై ఉంటాడు. తన యొక్క పరిపూర్ణ స్వభావముచే అన్నీ పొందినవాడై ఉంటాడు. ‘ఇంకా ఈ లోకం పొందాలి! ఆ రూపం కావాలి. అచ్చటికి వెళ్ళాలి. ఇది ఇంకా ఏర్పడాలి’… అనే అసంపూర్ణ భావాలు ఆతనికి ఉండవు. ఓ రామా! ఈ నిత్యసిద్ధుని ముందు భౌతికసిద్ధులు సూర్యునికి చూపే దివిటీ వంటివి. నిత్యసిద్ధుడై ఉండికూడా ఏమీ పొందనివాడై ఉంటాడు.

ఇట్లా 6వ భూమిక యందున్నవాడై క్రమంగా ఆ యోగి ఏడవ భూమికను పొందుచున్నాడు. ఏడవ భూమిక విదేహముక్తిత్వం - - ఈ 7వ భూమికను ‘విదేహముక్తిత్వం’ అని వర్ణిస్తున్నారు. ప్రాపంచిక భూమికలన్నిటికీ ఇది ఎల్ల. ఈ భూమిక వాక్కుకు అగోచరం అనబడుచున్నది.

కొందరు దీనిని శివం అంటున్నారు. మరికొందరు బ్రహ్మము అని పిలుస్తున్నారు. ఇంకొందరు ప్రకృతి-పురుషుల ఐక్యము యొక్క వివేకము అని భావిస్తున్నారు. కొందరైతే, “తాను చూస్తున్నదంతా తానే అయిఉండటం” అని అభివర్ణిస్తున్నారు. ఇంకా కొన్ని సైద్ధాంతిక విభాగాలలో దీనినే వాసుదేవత్వం - స్వర్గం - మహేశ్వరత్వం ఇట్లా నిజకల్పిత విభేదాలచే పలు విధాలుగా వర్ణించటం జరుగుతోంది.

అయితే రామచంద్రా! అది వచించటానికి అలవికానిమాట నిజమే కాని … ఏదో విధంగా అద్దాని గురించి వర్ణించడం ఉపదేశించటం జరుగుతూనే ఉన్నది. అద్దాని భోగ-త్యాగ అధోగత్యాగ లక్షణాలు - ఉపదేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిదే ! చివరికి మాత్రం అది అనిర్వచనీయమైన అనుభవం మాత్రమే.

ఓ రామచంద్రా ఈ విధంగా సప్త భూమికల గురించి ఇక్కడ చెప్పాను. ఈ సప్తభూమికలు జీవుని స్థితిని నిర్ణయిస్తాయి కదా! అందుచేత మనం ఇతఃపూర్వమే (స్థితి ప్రకరణంలో) సవిస్తారంగా చెప్పుకున్నాం. అక్కడ 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. తనుమానస, 4.సత్వాపత్తి, 5. అసంసక్తి, 6. పదార్థాభావన, 7. తుర్యగము - అని వర్ణించాం. వేరు వేరు ఋషులు వేరు వేరు కాలాలలో ప్రవచించిన ఈ భూమికా సిద్ధాంతానికి కొంచెం పేర్ల భేదం ఉంటే ఉండవచ్చుగాని, సిద్ధాంతపరంగా సామ్యత్వమే కలిగి ఉందని గ్రహించు.

Page:517

భూమికా యోగం గురించి మరి, ఈ వర్తమాన పరిశీలనను ముగించేముందు ఒక్క వాక్యం చెబుతాను - అసాం అభ్యాసయోగేన న దుఃఖమనుభూయతే ॥

ఈ సప్త భూమికలు అభ్యాసవశం చేతనే సంప్రాప్తిస్తాయి. అంతేకాని, ఓ జనులారా! అవి ఏవో ఉదాహరణపరిమితములనుకొని, మహనీయులెవరికో మాత్రమే సాధ్యమనుకుని విని ఊరకోకూడదు. అభ్యాసము కొరకే ఇవి చెప్పబడ్డాయి. శుభేచ్ఛలో ప్రవేశించే జీవుడు అభ్యాసవశంగా క్రమంగా ఉత్తరోత్తర భూమికలను అధిరోహించగలడు. ఈ భూమికల అభ్యాసయోగం చేత దుః ఖానుభవాలన్నీ త్వరితరీతిగా తొలగుతాయి. క్రమంగా దుఃఖం యొక్క అనుభవలేశంకూడా ఉండదు. కనుక ఏఏ భూమికలో ఏఏ లక్షణాలు చెప్పబడ్డాయో అవి ప్రయత్నపూర్వకంగా అలవరచుకోండి.

  1. ఇచ్ఛను అధిగమించాలి

శ్రీరాముడు: మహాత్మా! మీరు అత్యద్భుతంగా వర్ణించి చెప్పిన ‘ఆ సప్తభూమికలలో ప్రవేశించటం, ఈ సంసారమును జయించి వేయటం’ అనే ఉభయ విషయములను దృష్టిలో పెట్టుకొని ఏవైనా ఉపాయాలుగాని, దృష్టాంతోపమానాలు గాని ఉపదేశించి ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జీవునికి సంబంధించిన ఒక గొప్ప యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో విజయం పొందాలి. పొందితేగాని సప్త భూమికలలో జీవుడు ప్రవేశించలేడు. అయితే యుద్ధభూమిలో ఒక గొప్ప ఆడఏనుగు శత్రుపక్షంలో ఉండి ఈ జీవుని గెలుపును నిరోధిస్తోంది. మందగమనము కలది, మహా - గర్వితమైనది, యుద్ధంలో మహా - ఉత్సాహము - నేర్పరితనము కలది అగు ఆ ఆడ ఏనుగును నిరోధించడం గురించి జనులంతా యోచించెదరు గాక! యుద్ధభూమిలో కలియతిరుగుచున్న ఆ ఆడఏనుగుకు గొప్ప భయమును గొలిపే దంతాలున్నాయి. అది ఘీంకరిస్తూ ఆ యుద్ధభూమిలో అటూ - ఇటూ సంచరిస్తూ ఉంటే చెప్పరాని అనర్థాలన్నీ వచ్చిపడుతున్నాయి. ఇప్పుడా ఏనుగును పట్టుకుని చంపాలి. లేకపోతే సప్తభూమికా ప్రదేశమును పొందగలిగే ప్రసక్తే లేదు. ఆ ఏనుగు యుద్ధభూమిలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉన్నంతవరకూ ఎవడైనా సరే సప్త భూమికా ప్రవేశం చేయగల సామర్థ్యం పొందలేడు.

శ్రీరాముడు: మహర్షీ! ఆ ఏనుగు ఏది? ఆ ఆ యుద్ధ భూములెక్కడున్నాయి? దానిని సంహరించటం ఎట్లా? చాలా కాలంగా అది ఎక్కడ క్రీడిస్తోంది? మాపై కరుణతో ఈ విషయాలు విశదీకరించండి. శ్రీవసిష్ఠ మహర్షి: ’నాకు ఏదో ఈ దృశ్యములో లభించాలి’ అనే కోరికయే ఆ ఆడ ఏనుగు. ఈ ‘దేహం’ అనే అరణ్యంలో అది చాలా ఉల్లాసంగా పచార్లు చేస్తోంది. మదించిన ఇంద్రియాలే దాని శిశువులగు గున్న ఏనుగులు. ‘మనస్సు’ అనే కారడవిలో దాగి ఉండి అది తెలియకుండా వచ్చి పడుతోంది. ‘శుభాశుభకర్మలు’ దాని యొక్క రెండు దంతాలు. నలువైపులా విస్తరించి ఉన్న వాసనా సమూహములే దాని మదము. సంసార దృష్టులే ఆ యుద్ధభూమి.

Page:518

‘ఇచ్ఛ’ అనబడే ఆ ఏనుగు అల్పజ్ఞులగు జీవులను అతి తేలికగా చుట్టచుట్టి గాలిలోకి విసరివేస్తోంది. ఇక ఆ జీవులు అనేక ఉపాధుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. ‘వాసనా - చేష్ట - మనస్సు – చిత్తము - సంకల్పము - భావన - స్పృహ…’ ఇవన్నీ కూడా చిత్తకోశములోగల ఇచ్ఛ యొక్క వివిధ నామములు.

‘మహా ధైర్యము’ అనే అస్త్రం చేబూని “నిరాదరణము” అను బలంతో సర్వ పదార్థ రూపములలో అన్ని వైపులా వ్యాపించియున్న ఈ ఇచ్చ అనే ఆడ ఏనుగును సర్వవిధాలా జయించాలి. ఎందుకంటావా? ఈ ఇచ్ఛ ఎంతెంతవరకు సమస్త వస్తు రూపమయి విజృంభిస్తూ ఉంటుందో …అంతవరకూ మహా - భయంకరమైన ‘దుష్ట సంసారము’ అనే విష విషూచి ఉండియే తీరుతుంది.

ఏతావానేవ సంసారః ఇదమస్త్వితి యన్మనః,

అస్య తు ఉపశమో మోక్షః! ఇత్యేవం జ్ఞాన సంగ్రహః||

‘ఏదేదో నాకు లభించాలి…’ అనురూపం గల మనస్సేదైతే ఉన్నదో … అద్దానినే మనం ’సంసారం’ అని అంటున్నాం. అట్టి దాహస్వభావం శమించిందా …అదియే మోక్షం. సమస్త జ్ఞానసారం ఇదే. తెల్లటి పరిశుభ్రమైన వస్త్రంపై రంగు చక్కగా అంటుతుంది. అద్దముపై నూనెచుక్క ఇంకకుండా యథాతథంగా ఉంటుంది కదా! ఎవడైతే ఇచ్ఛారహితుడై నిర్మలాకారయుక్తుడై ఉంటాడో …అట్టివాని హృదయంలో 1. ఉపదేశవాణి 2. అనుభవ ప్రకాశము. ఈ రెండూ వికసిస్తాయి.

అయితే, ఇచ్ఛ రహితమైయ్యేదెట్లా? విషయములు స్మరించకపోయినంతమాత్రం చేతనే సంసారమునకు అంకురమైనట్టి ఇచ్ఛ ఉపశమించగలదు. ఇచ్ఛ అనేది కొంచెం ఉదయించినా సరే, అది అనర్థకారిణి కాగలదు. అందుచేత ‘విషయములను విస్మరించటం’ అనే శస్త్రంతో ఇచ్ఛ అనే అంకురం ఏర్పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి.

ఇచ్ఛచే వ్యాపించిన హృదయం గల జీవుడు జీవస్వభావానికి అతీతుడు కాలేకపోతున్నాడు. “విషయేచ్ఛా విస్మరణ” అనబడే ప్రత్యాహార రూపమగు యత్నమున తత్పరుడగువాడు అత్యంత సులభంగా ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఈ ‘ప్రత్యాహారం’ అనే దానికి రెండు దశలు ఉన్నాయి.

  1. ప్రత్యాహార అభ్యాసదశ: "విషయముల పట్ల విస్మరణము” అనేది మొట్టమొదట సాధిస్తూ రావాలి. క్రమక్రమమైన ప్రయత్నము చేతనే ఇది సాధ్యం. క్రమంగా ధ్యాస - అభినివేశములను విషయముల నుండి విరమింపజేయాలి. శాస్త్రములు - శాస్త్రజ్ఞులు దైవారాధన - యోగాభ్యాసము వంటి అనేక ఉపాయములను అందించటంలో అంతర్లీనోద్దేశం ప్రత్యాహారమే అయి ఉన్నది.

  2. ప్రత్యాహార పరిపక్వదశ: పరిపక్వదశయందు ఇక ప్రత్యాహారమునకు ప్రత్యేకమైన అవధానం అవసరం ఉండదు. నిద్ర మొదలైనవి స్వతఃసిద్ధంగా ఏర్పడునట్లే, ప్రత్యాహారం స్వతఃసిద్ధమగుచున్నది.

కల్పన - ‘ఇది నాకు కలుగుగాక’… అనబడే తీవ్రేచ్ఛను విజ్ఞులు ‘కల్పన’ అని కూడా పిలుస్తున్నారు. ‘పదార్థముల విస్మరణ’ అనే ప్రత్యాహార ఫలం ‘కల్పనాత్యాగం’ అయి ఉన్నది. స్మృతి విషయాల గురించి స్మరణ లేకపోవటాన్ని ‘శివరూపం’ …అని పిలుస్తున్నారు.

Page:519

సంకల్పదశలో ఇతఃపూర్వం అనుభవించినవి, అనుభవించనివి కూడా పాల్గొనుచున్నాయి. అందుచేత రాఘవా! అనుభవించినవాటి గురించిగాని, అనుభవించనివాటి గురించి గాని ఏర్పడే ’స్మృతి’ని ఒక కాష్ఠం (కొయ్య) వలె శ్రీఘ్రంగా విస్మరించి ఉండు. ఆ రెండింటి చేత స్పర్శించబడని ఒకానొక రహస్యమైన రూపమును ధరించినవాడవై ఉండు.

అసంకల్పమే శ్రేయం -

ఊర్ధ్వ బాహుర్విరౌమ్యేష, న చ కశ్చిత్ శృణోతి తత్!

“అసంకల్పః పరం శ్రేయం!” స కిమ్ అంతర్ న భావ్యతే?

ఓ జనులారా! ‘సంకల్ప రహితుడై ఉండటమే పరమ శ్రేయం….’ అని నేను రెండు చేతులు పైకెత్తి, ఎలుగెత్తి ప్రకటిస్తూనే ఉన్నాను కదా! అయినా అనేక మంది నా ఈ మాటలు వినిపించు కోవటమే లేదు. సంకల్పములలో ప్రవేశించి అందులో తారసపడే సుఖదుఃఖానుభవములను గొప్పగా నమ్ముకుని ఉంటున్నారు. అసంకల్ప స్థితియొక్క మహిమను ఈ జనులు ఎందుకో పట్టించుకోవటం లేదు. అసంకల్పత్వమును అంతఃకరణంలో ప్రతిక్షేపించుకోవటానికి యత్నించరేం?

నాయనలారా! సమస్త ఇంద్రియ - - మనో వ్యాపారములను రహితం చేసి కేవలం ‘తూష్టీం’ స్థితి యందు ఉండటం అభ్యసిస్తూ ఉన్నంతమాత్రం చేతనే … అప్పుడు బ్రహ్మదేవుని మహా సామ్రాజ్య సుఖం కూడా ఒక గడ్డిపరకవలె స్వల్పమైనదిగా, తుచ్ఛమైనదిగా భాసించగలదు. ఇక ఈ ప్రాపంచిక సౌఖ్యాల గురించి వేరే చెప్పేదేమున్నది? అట్టి సంకల్పరాహిత్యస్థితే భౌమానందమైయుండగా మీరు ‘అబ్బ! ఎప్పటికో ఆ స్థితి! అది మనకు లభ్యపడుతుందా? లేదు. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే’ అని ఎందుకు వేదన చెందుతున్నారో చెప్పండి?

శ్రీరాముడు: మహర్షీ! సంకల్పములన్నిటికీ ముందే సత్ స్వరూపమున ఏర్పడియున్న స్వయమాత్మ స్వరూపులై ఉండి కూడా జనులలో అనేకులు ‘అవశ్యం నిర్వర్తించవలసిన అనేక కార్యక్రమములు ఉండి ఉండగా అసంకల్పత్వం ఎలా సాధ్యం …’ అనే అభిప్రాయం కలిగి ఉండటం జరుగుతోంది. ఈ విషయమై తమ వ్యాఖ్యానం ప్రసాదించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి:

గమ్యతి ఏకైక నిష్ఠస్య యథా పాంధస్య పాదయోః,

స్పన్తో విగత సంకల్పస్తథా స్పన్దః స్వకర్మసు ॥

ఒకడు ఒక ముఖ్యమైన పని మీద ఒకానొక చోటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తూ బయలుదేరాడనుకో ….! అప్పుడా బాటసారి ’ఈ అడుగు ఇటు వేయాలి, ఆ అడుగు అటు’… అనే ప్రయత్నపూర్వకమైన సంకల్పము లేకుండానే బాటలో సాగిపోతూ గమ్యానికి చేరుతాడు చూచావా? యోగి కూడా అసంకల్ప పూర్వకంగా స్వకర్మలందు ప్రవర్తించుచున్నాడు. ఎక్కడ, సుఖదుః ఖమానావమానాది భావావేశాలు జత చేరి ఉంటాయో అక్కడ మాత్రమే సంకల్పం సంకల్పంగా

Page:520

కొనసాగుతుంది. లేదా, ఆ సంకల్పత్వమును నిర్వరించవలసినది నిర్వర్తించగానే మటుమాయ మౌతుంది. ప్రతి జీవుడు తన దినచర్యలో అనేక సంకల్పాలు అసంకల్పంగా పరిణమింపజేయు చున్నాడు. ఒక తల్లి తన పిల్లవాడిపై చూపే కోపం కోపసంస్కారంగా రూపుదిద్దుకుంటుందా?… లేదు. పిల్లవాడు అల్లరి ఆపగానే ఆ కోప సంకల్పం అసంకల్పమైపోతోంది కదా! అట్లాగే సర్వ సంకల్పములను వ్యవహారము కొరకు మాత్రమే ధరించిన మరుక్షణం ఎందుకు అసంకల్పంగా చేసి వేయరాదు చెప్పు? తప్పకుండా ప్రయత్నంచేత సుసాధ్యమేనని సకల జనులకు నా మనవి.

ఈ విధంగా … ఎక్కువగా చెప్పవలసిన పనేమున్నది? సంక్షేపంగా ఒక్కమాట మరల మరొక్కసారి ప్రకటిస్తున్నాను విను- సంకల్పం పరోబంధః, తదభావో విముక్తతా ॥ సంకల్పమే పరమబంధం, సంకల్పములు లేకుండటమే మోక్షం.

ఓ రామచంద్రా! ఈ సమస్త ప్రపంచమును ‘అజము - శాంతము - అనంతము

ధ్రువము - అవ్యయము నిత్య సిద్ధము’ అయినట్టి ’పరమార్థ చిద్రూపం’గా చూస్తూవుండు.

యథాసుఖంగా ఉండి ఉండు.

సమస్త దృశ్యమును మఱిచి, ’అక్షయము - శాంతము’ అయిన రూపమును అవధరించి ఉండటమే యోగం అను శబ్దముచే ఉద్దేశించబడింది. కాబట్టి నీవు వాసనారహితుడవై యోగమునందు ’స్థితి’ కలిగియుండి ఇక ఆపై యథాప్రాప్తములైన కర్మలను నిర్వర్తించు. లేదూ, కర్మలు త్యజించదలచావా…సమాధిపరుడవై కర్మలు చేయకుండుము.

“అహం…మమ…నేను… నాది” అనే అధ్యాసయొక్క త్యాజ్యమే చిత్తక్షయం. సమస్త దృశ్యం యొక్క అకృత్రిమం, స్వాభావికం అగు చిత్తరాహిత్యం. అదియే ‘జీవబ్రహ్మముల యోగం’ కూడా. అదే సంకల్ప త్యాగం అని కూడా చెప్పబడుతోంది. కాబట్టి నీవు ఆత్మమయుడవై, ఆత్మకు చెప్పబడిన అప్రమేయ - - అసంగాది స్వభావమును సంతరించుకున్న వాడివై ప్రశాంతుడవై ఉండుము. పరమాత్మ సర్వదా శివమై, సర్వవ్యాపకమై, శాంతమై, బోధరూపమై, అజమై, శుభప్రదమైయున్నది. అట్టి పరమాత్మతోటి ఏకత్వభావనయే సర్వత్యాగం. అట్టి సర్వత్యాగ భావనను నీ అంతఃకరణమందు నిరంతరం చేస్తూ ఉండి, ఇక ఆపై కర్తవ్యములైన కార్యములను బాగుగా ఆచరించు.

ఓ సర్వజనులారా! నా ఈ మాటలు శ్రద్ధగా వినండి.

1.“నేను - నాది - అహం - - మమ”… మొదలైన భావనలు ఉన్నంతవరకూ ఈ ఈ జీవుడు ఎన్నటికీ దుఃఖముల నుండి విముక్తుడు కానేరడు.

2.అహం - మమలను త్యజించటం చేత విముక్తుడౌతాడు.

ఈ రెండు విషయాలూ ఎఱిగినవారై, ఇక ఆపై మీరు కర్మలను నిర్వర్తించటమో త్యజించటమో మీ ఇష్టం … ఏది ఎట్లైనా ఫరవాలేదు … అట్లే నిర్వర్తించండి.