Page:521
XIV. శ్రీ వాల్మీకి మహర్షి ప్రవచనం
భరద్వాజుడు : మహాత్మా! వాల్మీకి మహర్షీ! ఇంద్రభగవానుని కరుణచే, మీ పాదాలు నేటికి జేరగలిగాను. మీ యొక్క కథా సంవిధాన చమత్కారముచే శ్రీ వసిష్ఠ రామ సంవాదమును వింటున్నాను. వినడం చేత నేను మహత్తరమైన ప్రయోజనం పొందుచున్నాను. అనేక జన్మల తపస్సు ఫలీకరించుటచేతనే దేవదూత నన్ను మీ సమ్ముఖమునకు తీసుకురావడం, మీరు నాపై కరుణతో ఈ సంవాదమును వర్ణించి చెప్పటం జరుగుతోంది.
ఇప్పుడు చెప్పండి మహాత్మా ! శ్రీ వసిష్ఠ మహర్షి చెప్పిన జ్ఞానసారాన్ని వినిన శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆ ఉపదేశమాత్రంచేత సందేహరహితుడై పరమ సుఖమును పొందాడా? పూర్ణ బోధమయుడైనాడా? ఇంకా ఏమైనా ప్రశ్నించాడా?
స ఖలు పరమయోగీ విశ్వవన్యః సురేశో, జనన మరణహీనః, శుద్ధబోధ స్వభావః, సకలగుణ నిధానం, సంనిధానం రమాయాః,
త్రిజగత్ ఉదయ రక్షా-అనుగ్రహాణమ్ అధీశః ॥
ఆ శ్రీరామచంద్రుడు స్వయంగా మహాయోగి. జగత్తుకు పూజార్హుడు. దేవతలకే దేవేశుడు. జనన మరణరహితుడు. శుద్ధబోధ స్వరూపుడు. సకల గుణనిధి. లక్ష్మీపతి. ఈ మూడులోకముల ఉత్పత్తి - స్థితి - రక్షణలకు కారణకారణుడై ఉన్నాడు. అట్టి రామచంద్రుడు నావంటి భక్తజనులను, ఆర్తులను దృష్టిలో పెట్టుకొని మహర్షిచే నిండు సభలో మహత్తరమైన జ్ఞానము ప్రవచింపజేశారు. ఎంతటి ఆశ్చర్యం! అప్పుడింకా ఏం జరిగిందో … అది కూడా చెప్పండి.
శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! వేదాంత సంగ్రహరూపమైనట్టి శ్రీ వసిష్ఠ మహర్షి చెప్పిన ఆ వాక్యాలన్నీ శ్రీరామచంద్రుడు విన్నాడు.
సమస్త జ్ఞానం యొక్క పరాకాష్ఠను చవి చూచాడు. ఆతని చిత్తవృత్తియందు అఖండాకారవాక్య ప్రభావంచే ఒకానొక అనిర్వచనీయ నిరతిశయానందం తాండవించింది. ’ఆనందం యొక్క నిర్మల చిదనం’ యొక్క చిహ్నములు ఆతని కమల నేత్రములలో ప్రకాశించాయి. అతడు చైన్యానందసాగర మగు స్వస్వరూపమునందు జాగృతుడైనాడు. ఇక ప్రశ్న-సమాధానం అనే వృత్తి భేదం స్వస్వరూపంలో విలీనమైనది. ఈ వర్తమాన క్షణంలో ‘ఇది యుక్తం, అది అయుక్తం’ అనే విభేదం, వివేచన ఆతనికి లేవు. ఎందుకంటే ఆతడు, మనో-బుద్ధి-ఇంద్రియ వ్యాపారశూన్యుడైనాడు. ‘ఆత్మానందం’ అనే అమృతంచే పూర్ణుడగుట చేత పులకిత శరీరుడైనాడు.
Page:522
మహాసామాన్య రూపత్వాత్ చిద్వ్యాపకతయా స్థితః నిత్యమ్ అష్టగుణైశ్వర్య తృణప్రాయ మనోరధః II
అతను ‘మహాసామాన్య రూపము’ అని, ‘సర్వాధిష్ఠాన సన్మాత్ర’ అని పిలువబడి సర్వాత్మకత్వం సంతరించుకున్నాడు. అంతటా ప్రసరితుడై ఉన్నాడు. అనగా, చిద్వ్యాపకత్వంచేత అంతటా స్థితి పొందినవాడై ఉన్నాడు. స్వయంగా ఉపాధికి అసంబంధితమైన అష్టగుణైశ్వరములను కూడి ఉండటం చేత భౌతిక పరిభాషితమగు సమస్త మనోరథములు ఆతనికి తృణప్రాయంగాను, తుచ్ఛంగాను గోచరిస్తున్నాయి. ఆ పిల్లవాడు నిరతిశయానందమగు బ్రహ్మముతో ఏకత్వం పొందియుండటం చేత ఏమియు చెప్పజాలక ఊరుకొని ఉన్నాడు.
భరద్వాజుడు: ఆహాఁ! మహాత్మా! నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. శ్రీరామచంద్రుడు వాక్యములకు అందజాలని మహత్పదమును పొందినాడు కదా!
హే వాల్మీకి మహర్షీ! అటువంటి ఆత్మపదం మాకు కూడా ప్రాప్తించటమెట్లాగో చెప్పండి! మేం మూర్ఖులమై స్తబ్ధులమై, కించిజ్ఞులమై, పామరులమై ఈ సంసార మరుభూమిలో కాళ్ళు అరిగేటట్లు సంచరిస్తున్నాం. అటువంటి మేమెచట? బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా ప్రార్థనీయము, దుర్లభము అయినట్టి ఆ శ్రీరామచంద్రుని ఉత్తమస్థితి ఎచట? హై గురువర్యా! మునీశ్వరా! నాకు శ్రీరాముని లాగానే విశ్రాంతి ఎట్లా లభిస్తుంది? దుస్తరమగు ఈ సంసారమును దాటగలగటం నా వల్ల అయ్యే పనేనా? చెప్పండి.
శ్రీవాల్మీకి మహర్షి : ప్రియ భరద్వాజా! ఇప్పటి దాకా వసిష్ఠ మునీంద్రులు రామచంద్రుల మధ్య జరిగిన సంవాదమంతా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాను కదా! దీనినంతా నీవు స్వబుద్ధితో విచారించు. పరాపరవిమర్శ చేయి. అందులో వివిధ కోణాల నుండి చెప్పుచున్న ఆత్మజ్ఞాన సమాచార సారాన్ని నీ అనుభవంగా ఆరూఢం చేసుకో. అప్పుడు శ్రీరామచంద్రునిలాగానే విశ్రాంతి లభించకపోతే నన్నడుగు.
ఓ భరద్వాజా! నీ నిరంజన - - నిరాకార - శుద్ధతత్త్వము అనుభవం కావటానికి వీలుగా నేను కూడా నా అనుభవమంతా రంగరించి అవస్థాత్రయ సాక్షిత్వం మొదలైన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.
మొట్టమొదట ఒక నగ్న సత్యం ప్రతిపాదిస్తున్నాను.
అవిద్యాయాః ప్రపంచో యం నాస్తి సత్యమిహాణ్వపి వివేచయంతి విబుధా, వివదన్తి అవివేకినః ॥
ఈ జగత్తంగా కూడా ‘అవిద్య’ చేతనే పరికల్పితమై ఉన్నది. ఇందులో అణువంత కూడా (కొంచెమైనా) సత్యం లేదు. అయితే వివేకులు దీనిని వివేచనతో పరిశీలిస్తున్నారు. అవివేకులో, వివాదాలలో ప్రవేశించి దృశ్యవశులగుచున్నారు.
Page:523
ఓ ప్రియ భరద్వాజా! ఇక్కడ చైతన్యమునకు భిన్నమైనదంటూ ఏదీ కొంచెం కూడా లేదు. ఉండజాలదు. నీవు ప్రణవము - మహావాక్యముల అర్థరహస్యాన్ని ఎఱిగి అభ్యసించు. అభ్యాసముచే శుద్ధచిత్తుడవు కమ్ము.
ఈ జీవునకు ప్రపంచ విషయాల పట్ల యావృత్తి ఉంటోంది కదా! ఈ యావృత్తిని ఆత్మానుభవం దృష్ట్యాం ‘జాగ్రత్ నిద్ర…’ అని పిలుస్తున్నారు. అట్టి జాగ్రత్ నిద్ర యొక్క అంతరమున నిరంజనమైనట్టి చైతన్య ప్రదీపము జాగృతమై ఉన్నది. చైతన్యం జాగ్రత్-స్వప్న సుషుప్తులకు సాక్షీ భూతంగా దర్శిస్తోంది. అట్టి సాక్షి చైతన్యం వైపుగా నీ బుద్ధిని ప్రసరింపజేయటం అభ్యాసం చేయి.
ఇక ఈ ప్రపంచమంటావా? విను చెబుతాను. శూన్యమూలః ప్రపంచోలియం శూన్యతా శిఖరః, సఖే!, సారశూన్య తయామధ్యే అపి అనాస్థా సన్మనీషిణామ్ ||
ఓ సఖుడా! ఈ ప్రపంచానికి మొదలుగాని, మధ్యగాని, చివరగానీ లేదు. ఎందుకంటే ఇది స్వయంగా శూన్యమూలమైనది. “ఇది ఎందుకు, ఎట్లా ఏర్పడుతోంది?….” అన్న ప్రశ్నకు నా నిర్మొహమాటమైన సమాధానం “అజ్ఞానము చేతనే”…. అని సుమా! అందుచేత సజ్జనులగు బుద్ధిమంతులకు దీనిపట్ల అపేక్షయే ఏర్పడదు.
అనేక భ్రమలను కలుగజేయుచున్నట్టి ఈ దృశ్య ప్రపంచం స్వతహాగా అసత్తే అయి ఉన్నది. “అట్లా అంటారేమండీ! మాకు ఈ దృశ్యజగత్తు కనిపిస్తోంది కదా?” - అని ఎవరైనా అంటారేమో? ఓ స్వయమాత్మ స్వరూపులగు ప్రియజనులారా! అంతరంగంలో ఉండే వాసనాదోషం చేతనే గంధర్వ నగరంలాగా మాయాకల్పిమై లేనిది ఉన్నట్లుగా ఇక్కడ గోచరించటం జరుగుతోంది. ఆ అంతరంగానికి ఆవల జగత్ సాక్షియగు స్వస్వరూపము ప్రతి జీవునిలోనూ జాజ్వల్యమానంగా వెలుగుతోంది. ఇప్పుడు నీకు, నాకు ప్రతిజీవునికి ఎదురుగా రెండు మార్గాలు వున్నాయి.
అనేక జన్మల వాసనల నుండి ఇంద్రియములను ఉపయోగించుచుండగా అనుభవమయ్యే ఈ దృశ్య జగత్.
సర్వమునకు సాక్షియగు నిర్వికార - నిరాకార - నిరంజన - అప్రమేయ - నిరాశ్రయ స్వస్వరూపం.
త్వమ్ అనభ్యస్య కల్యాణీం చైతన్యామృత కన్దలీమ్,
సంముహ్యసి కిమధ్యాస్య వాసనా విషవీరుధః?
ఓ భరద్వాజా! ఇప్పుడు చెప్పవయ్యా! శుభప్రదమగు అమృత కదలీ (అరటి) వృక్షమును ఆశ్రయించటం ఉచితమా? ‘వాసన’ అనే విషలతను ఆశ్రయించి విమోహితులం కావటం మంచిదా?
సమాధానం అక్కర్లేదనే అనుకుంటున్నాను. తత్త్వ దర్శనంచే నిరాలంబమైన నీ యందలి ఆత్మను పరిగ్రహించు. అప్పుడు పూర్వకాలికమైన అజ్ఞానావస్థలో కనిపించే జాగ్రత్ ప్రపంచం ఇక కనిపించదు. ఇదంతా కూడా ఆత్మస్వరూపంగానే కనిపిస్తుంది.
Page:524
జాగ్రత్-స్వప్న-సుషుప్తులందు సర్వదా అస్పృశ్యమై విభేదరహితమై ఏర్పడియున్న సాక్షితత్వము యొక్క అనుభవము పొందియున్న మహనీయులెందరో ఉన్నారు. వీళ్ళని శాస్త్రకారులు ’తురీయ సంస్థితులు’ అని పిలుస్తున్నారు. అట్టి వారి సమక్షంలో ఇదే ఘనీభూత సాంసారిక దృశ్యం ఒక కల్పితకథా సంఘటనలాగా అర్థరహితమై ఉంటోంది. అట్టి వానికి ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలు ఉండవు. అతడిక తనకు తానే సర్వదా ఏర్పడి ఉన్నవాడగుచున్నాడు. విజ్ఞుడైనా, అజ్ఞుడైనా ప్రతి జీవుని వాస్తవ సత్యమిది. ఇక నీ ఇష్టం. దేన్ని ఏ ఉద్దేశంతో ఆశ్రయించటం ఉచితమో వివేచనచే గ్రహించు. అంతేగాని గుడ్డెద్దు చేనులో పడినట్లు ఈ దృశ్యాన్ని అనుకరించి ఉండకు.
అమృత రూపమగు సత్ప్రవాహముతో కూడిన ఆ మహాచైతన్య సాగరమే నీవు. అంతేగాని, ఈ దేహ - జగత్ - - భావాదులు నీవు కానే కావు. ఈ విషయం నీవు బుద్ధితో గ్రహించి ఉండు. బుద్ధిని ఆత్మమయం చేయనంతవరకు ఈ జగద్రూపతరంగాలు కనిపిస్తూనే ఉంటాయి. జ్ఞానకాలంలో ఆత్మగా భాసించేదే …అజ్ఞానకాలంలో జగత్తుగా భాసిస్తోంది.
ప్రాక్ నాస్తి, చరమే నాస్తి వస్తుసర్వమిదం, సఖే | విద్ధి మధ్యేపి తన్నాస్తి స్వప్నవృత్తమిదం జగత్ ॥
మిత్రమా! ఏ జగత్తెతే ఘనీభూతమై ఉన్నదని, సంసారరూపంగా ఏర్పడి దాటుటకు అశక్య మౌతోందని అనుకుంటున్నావో …అట్టి ఈ దృశ్యం ఒకప్పుడు నీ పట్ల లేదు. ఇది ఇంకొకప్పుడు ఉండ కుండా పోతోంది. జాగ్రత్లో స్వప్నం అవాస్తవం. స్వప్నంలో జాగ్రత్ అవాస్తవం. ’స్వప్నం’ విషయంలో "అంతకు ముందు ఏమై ఉన్నది. ఆ తరువాత ఏమికానున్నది?…” అని మనం ప్రశ్నిస్తున్నామా! ఈ దృశ్యము కూడా అట్టిదే!
ఏదైతే ఆది-అంతాలలో లేదో… అది మధ్యలో కూడా లేనిదే అగుచున్నది. అందుచేత ఈ జగత్తు స్వప్నతుల్యంగానే ఎఱిగి ఉండు. ఈ సమస్త పదార్థ భేదం కూడా జలంలో బుద్బుదాల లాగా అవిద్యచేతనే ఉత్పన్నమౌతోంది. నీటిలో లేచిన బుడగ మరెప్పుడో నీటిలోనే లయం కావలసిందే కదా! సర్వ పదార్థ భేదమంతా భావనారూపంలో పైకి లేచి, కొద్ది క్షణాలుండి మరల జ్ఞాన సముద్రంలో విలీనమగుచున్నది. మధ్యలో కనిపించే తరంగం మధ్యలోనే లయమౌతోంది. సముద్రం మాత్రం సర్వదా యథాతథంగా ఉంటోంది. ప్రతి జీవుడు జ్ఞాన సముద్ర స్వరూపుడే. అయితే ఆతనిలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్త్యాది భావానుభవమంతా ఎప్పుడో జనించి మరెప్పుడో అతని యందే లీనమౌతోంది. మధ్యలో ఏర్పడిన భావనానుగత బుద్బుదములను అనుసరించి “ఈతడు జీవుడు. ఆతడు బద్ధుడు. ఆ ప్రక్కాయన ముక్తుడు” ఇత్యాది … శబ్ద ప్రయోగాలు శాస్త్రాలు చేస్తున్నాయి. మధ్యలో వచ్చిందంతా మధ్యలోనే పోక తప్పదు. అందుచేత ‘నేను చైతన్య సాగరాన్ని’… అనే నీవు మననం చేయి గాని, “నేనీ దేహంలో చిక్కుకున్న పక్షి వంటివాడను" అని అల్పయోచనకు తావియ్యనే వద్దు. అత్యంత ప్రశాంతమగు ఆత్మ గురించి తెలుసుకో. ఆ ఆత్మసాగరంలో స్నానం చేయి. అప్పుడీ క్లేశ దాయకమైన ‘బాహ్యభ్రాంతి’ అనే మనోదేహ సంబంధమైన అపరిశుభ్రత తనకు తానే తొలగి
పోతుంది.
Page:525
ఈ జగత్తు అనే సముద్రం ‘అజ్ఞానము’ అనే గొప్ప ఉప్పురసంతో వ్యాపించియున్నది. అందులో ‘అహంకారం’ అనేది ప్రప్రథమ తరంగం. ఆ తరంగం అవిద్య అనే వాయువుచే ఉత్పన్నమై అన్ని వైపులా ప్రవహిస్తోంది. చిత్తము యొక్క అనేక విషయముల పట్ల ఏర్పడే ప్రవృత్తులున్నాయి చూచావు? అవియే రాగరూపంగా కనబడే చిన్న చిన్న తరంగాలు. “నాది, మమత్వం" అనే సుడి ఇక్కడ యథేచ్ఛగా ప్రవర్తిస్తోంది. ఈ సాగరంలో ‘రాగము, ద్వేషము’ అనే రెండు పెద్ద మొసలి జాతులు విహరిస్తున్నాయి. అవి కనుక పట్టుకున్నాయా …ఇక ఈ జీవుడు ‘అనర్థము’ అనే పాతాళానికి చేరవలసిందే. మృత్యుముఖము వంటి అభినివేశములో ప్రవేశించాడా …ఈ జీవుని ఎవరూ కాపాడలేరు. కనుక జాగ్రత్త!
“సముద్రస్నానం చేయాలి…” ” అని నీకు అభిలాష ఉన్నదా? అయితే ఈ దృశ్య సంసార సముద్రంలో ఎందుకు స్నానం చేయటం? ప్రశాంతము, అమృతమయ తరంగములచే అత్యంత శోభితము, అద్వైతరూపము …అయినట్టి ఆత్మానంద సాగరంలోనే స్నానం చేయి. అంతేగాని ద్వైతరూప ఉప్పు సముద్రంలో ఎందుకు మునుగుచున్నావో చెప్పు?
ఓ భరద్వాజా! ’అయ్యో! శ్రీరామచంద్రుని ప్రపంచం జ్ఞానముచే తొలగిపోయింది. నా ప్రపంచమో, ఇంకా మిగిలియే ఉన్నది…’అని అంటున్నావు కదా.
కస్తిష్ఠతి? గతః కోవా? కస్య కేన కిమాగతం?
కిం ను మజ్జసి మాయాయాం? పత మా త్వమతశ్రితః II
అసలు ఉన్నదేది? పోయేదేది? ఎవనికి ఏమి వస్తోంది? ఏమి పోతోంది? ఏమిటయ్యా, ఇంకా మాయయందే నిమగ్నమౌతున్నావ్? నాయనా! ఇన్ని రోజులుగా శ్రీ వసిష్ఠ - శ్రీరామ సంవాదం విన్నాం కదా! ఇకలే. జాగరూకుడవు కమ్ము. వివేకివగుము. అంతేకాని, ఈ మాయలో పడవలసిన అగత్యమేమున్నదో చెప్పు? వద్దు. పడనే వద్దు.
భరద్వాజుడు: హే వాల్మీకి మహర్షీ! నాదొక చిన్న సందేహం. అసలు నిర్విషయము, నిత్య నిర్మలము అగు బ్రహ్మము జగదాకారంగా ఎందుకు వివర్తం పొందుతోంది.
శ్రీవాల్మీకి మహర్షి: “బ్రహ్మము జగత్తుగా వివర్తం పొందుతోంది…” ఇటువంటి వాక్యాలన్నీ చిన్న పిల్లలతో హాస్య సంభాషణ చేయటానికి కల్పించబడ్డాయి. బ్రహ్మము సర్వదా నిర్విషయంగా, నిత్య నిర్మలంగా ఉన్నది. నీవు జ్ఞాని వగుచున్న కొలదీ అపరివర్తనశీలమగు ఆనంద బ్రహ్మను దర్శిస్తావు. అందులోనే స్థితి పొంది ఉంటావు. ఆ బ్రహ్మమే నీవు. నీవు సదాశివస్వరూపుడవు, సదా బ్రహ్మానంద స్వరూపుడవు సుమా!
అవివేకియగు జీవుడు ఒకప్పుడు “అబ్బో! నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని " అని
హర్షం పొందుతాడు. ఇంకొకప్పుడేమో “ఇదేంటిరా, ఇది ఇట్లా ఉన్నది…” అని దుఃఖిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా హర్షం, అకస్మాత్తుగా శోకం! ఇదీ అతని పని. తత్త్వవేత్తయో? ఆతడు ఎల్లప్పుడూ
Page:526
ప్రసన్నంగానే ఉంటాడు. ఒకవేళ అతను కొంచెం బాహ్యానికి శోకం ప్రదర్శిస్తున్నాడూ అంటే .. అది అజ్ఞానులతో సహజీవనం కొరకు మాత్రమేగాని, తన స్వరూపం ఎట్టిదో తెలియక కాదు. అజ్ఞానులగు జీవులు జలమునందు స్థలభ్రాంతిని, స్థలమునందు జలభ్రాంతిని (ఎండమావులను) పొందుచున్నారు. సూక్ష్మమగు ఆత్మతత్త్వమును ‘అవిద్య’ అనే దర్పణంలోంచి చూస్తున్నారు. అందుచేత అవిద్యాచ్ఛాదితమైన ‘అనాత్మ’ యందు ఆత్మభ్రాంతి కలుగుతోంది. నీవు అవివేకివి కాదలచుకుంటే మనం ఎన్ని రోజులు సంభాషిస్తే ఏం ప్రయోజనం? అందుచేత వివేకివి అవటానికి ప్రయత్నించు. అంతేగాని, అవివేకి ఈ జగత్తును ఎట్లా చూస్తున్నాడో సమీకరించి, దానిని పట్టుకుని వ్రేలాడకు.
ఈ ప్రపంచంలో అనేక వస్తు సముదాయం కంటికి కనిపిస్తోంది కదా? ఇవన్నీ పరమాణువల కలయికయే కదా! అట్టి పరమాణువుల సంయోగ-వియోగములచే ఏర్పడే ఈ పాదార్థిక జగత్తు గురించి దుఃఖించవలసిన పనేమిటి? ఈ దేహం కూడా పరమాణువుల సంయోగంచే ఏర్పడి, వియోగముచే నశించినదగుచున్నది. నీవుగాని, నేనుగాని, మరెవరైనా గాని … మనమంతా చిత్ స్వరూపులం. ‘ఎరుగుట’ అనునది మన స్వరూపం. పరమాణువుల సంయోగ - - వియోగముచే పరమాణువుల కంటే అత్యంత సూక్ష్మమగు మన చిత్ స్వరూపం ఎట్లా స్పర్శించబడగలదు? అది మనలను దుఃఖింప జేయటమేమిటి? అది ఎలా సాధ్యం? కనుక దుఃఖానికి కారణం మన ప్రత్యక్ స్వరూపము యొక్క ఏమరుపేనని సిద్ధాంతీకరించబడుచున్నది.
అసతః సంభవోనాస్తి, నాస్తి అభావః సతః సఖే అవిర్భావ-తిరోభావాః సంస్థానానామమి పరమ్||
ఓ స్నేహితుడా! ‘అసత్’ పదార్థానికి ఉత్పత్తియే లేదు. ‘సత్’ పదార్థానికి వినాశనమనేదే లేదు. ఇక్కడల్లా … కేవలం మాయారూపములైనట్టి ఈ ’దేహము’ మొదలైన ఆయా పదార్థములు - ‘పరమాణువుల కలయిక - విడిపోవడం’ అనే ప్రక్రియచే - వాటివాటి ఆవిర్భావ - తిరోభావములు సంభవించటం జరుగుతోంది.
అయితే … దృశ్యము ఈ విధంగా ఉండగా, ఇక దృక్ స్వరూపుడగు జీవుని విషయమేమిటి? భరద్వాజుడు: అవును మహర్షీ! ఈ పదార్థిక జగత్తంతా పరమాణువుల సంయోగ-వియోగరూపములే, అయితే వీటి యొక్క అనుభవం పొందే ఈ జీవుడు అనబడు దృక్ స్వరూపుడు (లేక) ద్రష్ట, (లేక) అనుభవజ్ఞుడు ఎక్కడి నుండి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళుచున్నాడు. ఈ విషయాలు శ్రీ వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని సమక్షంలో ప్రవచించారు. అయినా సరే, ఈ ‘నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం’ సమీక్షిస్తున్న ఈ సందర్భంలో మరొక్కసారి మీ అనుభవ - అభిప్రాయములను ప్రవచన రూపంగా విశదీకరించండి.
శ్రీవాల్మీకి మహర్షి : పంచభూతములలో ఒకటి అయిన ‘ఆకాశము’ తదితర భూతముల కంటే సూక్ష్మమైనది కదా! అట్టి ఆకాశపు అంతర్గతమైన ఒక విభాగాన్ని ఉద్దేశించి ‘ఇది ఇక్కడి నుండి అక్కడికి వెళుతోంది. అది అక్కడి నుండి ఇక్కడికి వస్తోంది’ అనే వాక్యాలు చెల్లుతాయా? ఆకాశము
Page:527
ఒకచోట నుండి ఇంకొక చోటికి పోవటం - - రావటం ఉండదు కదా! ఇక, ఆకాశము కంటే కూడా
సూక్ష్మాతి సూక్ష్మము, ఈ జీవుని స్వస్వరూపము అయిన ఆత్మ అన్నిటా, అంతటా నిండి ఉంటోంది. అది తనయందు తానే నెలకొని ఉన్నది. అద్దాని రాకపోకలెక్కడుంటాయ్?
అయితే,పూర్వ సంచితములైన అనేక పుణ్యపాపములను హేతువులుగా చేసుకొని ఈ దేహాదులు విషయతుల్యమైన ‘మరణము’ మొదలైన అనర్థాలను పొందటం జరుగుతోంది. దేహాదులపై భ్రాంతిని పెంచుకున్న ఈ జీవుడు అనుక్షణికంగా దుఃఖితుడు అగుచున్నాడు. “ఆ దుఃఖం తొలగేది ఎట్లా?”…. అనేది గొప్ప అవశ్యమైన ప్రశ్న. అందుకు మా సమాధానం ఒక్కటే! ఓ సర్వజనులారా! అట్టి సర్వ అనర్థాలు మీ పట్ల తొలగాలంటే జగద్గురువగు ఆ పరమేశ్వరుని మనసా, వాచా, కర్మణా శరణు వేడండి. ఉపాసించండి. ఓ భరద్వాజా! నీవు అన్నిటినీ త్యజించి గొప్ప తపస్సు చేశావు. నిర్మలమైన మనస్సును సంపాదించుకున్నావు. తపో ప్రభావం చేత అంతరంగమును పరిశుద్ధపరచుకొని తద్వారా ‘వివేకత్యాగి’గా రూపుదిద్దుకున్నావు. అందుచేత నీ అంతరంగంలోని పుణ్యపాపాలన్నీ నిశ్చయంగా సంక్షయించాయి. ‘ఆ పశుపతి యొక్క పాశాలు అనగా ప్రాణుల శుభాశుభకర్మలే! - అని శ్రుతి ప్రసిద్ధం. కనుక, ఇంక ఆగకు. నీ చిత్తము మరింత పరిశుద్ధమయ్యే వరకు ఆ భగవంతుని సాకార రూపం ధ్యానించు. భజించు. అట్లా ధ్యానిస్తూ ఉండగా ఉచితకాలంలో నిరాకారమగు బ్రహ్మమున నీకు స్వాభావికమైన స్థితి లభిస్తుంది. అనగా, సగుణేశ్వరోపాసన వలన హృదయం పరిశుద్ధమౌతుంది. అట్టి ‘శుద్ధసత్వము’యొక్క బలం చేత ప్రచండమగు (ఇప్పుడు శేషించియున్న) అజ్ఞాన వ్యామోహాన్ని జయిస్తావు. నాయనా! అప్పుడు శాస్త్ర - గురువాక్యాలపైన నీకు గురి కుదురుతుంది. అట్టి విశ్వాసము యొక్క బలంచే ‘ఇంద్రియాతీత మనో విభాగంచే ఇంద్రియ సహిత మనస్సును జయించటం…’ లేక ‘యమము’ అను మార్గాన్ని నీవు అనుసరిస్తూ ఉండు. రోజూ కొద్ది క్షణాలైనా మనస్సును సమాధానపరచి ఉంచి “మనో సమాధానము”అనే సమాధిని ఆశ్రయించు.
‘ప్రత్యగాత్మ’…అని పిలువబడే సాక్షి చైతన్యమును ఆశ్రయించు. అప్పుడు తమో రజో గుణాచ్ఛాదన తప్పక తొలగుతుంది.
ఓ సర్వ ముముక్షువులారా! మీరంతా ఆ సర్వేశ్వరుని ప్రేమించండి. ప్రేమయే భక్తి. భక్తి రహితమగు కేవల పురుష ప్రయత్నముచే, కేవల కర్మానుష్ఠానంచే ఏం ప్రయోజనం? ఆ సర్వేశ్వరుని మహిమ చేతనే ఈ జీవుడు ఉత్కృష్టతను, వాంఛిత ఫలమును పొందుచున్నాడు.
నాభిజాత్యం, న చారిత్రం, న నయో న చ విక్రమః, బలవన్తి పురాణాని సఖే, కర్మాణి కేవలమ్॥
ప్రియమిత్రమా! ఒకడు ఎంతో గొప్ప జాతిలో పుట్టి ఉండవచ్చు. లేదా, ఆతనికి గొప్ప చరిత్ర ఉండవచ్చుగాక! సదాచారం, తపస్సు, పరాక్రమం మొదలైనవి ఎన్నో ఉండవచ్చు గాక! అంత మాత్రం చేత ఆతడు ఆత్మానుభవం పొందలేడు.
Page:528
భరద్వాజుడు : అదేమిటి స్వామీ …?
శ్రీవాల్మీకి మహర్షి: అవును. ఎందుకంటే ఈ జీవుని పూర్వ సంచిత కర్మలు అంతులేనివై ఉన్నాయి. వాటిని జయించాలంటే తపస్సులు, సదాచారాలు ఏ మూలకి?
భరద్వాజుడు : మరెట్లా స్వామి?
శ్రీవాల్మీకి మహర్షి : అయితే, ఎవ్వరూ ఏమీ నిరుత్సాహపడవద్దు. సర్వేశ్వరుని పట్ల ప్రేమను పెంపొందిం చుకోండి. ఈశ్వరభక్తి యొక్క సహాయం లేకపోతే ఆత్మానుభవం లభించదు. భక్తి పరిపక్వమగుచుండగా జ్ఞానం వికసిస్తుంది. అట్టి సమూలాజ్ఞాన నాశనమగు జ్ఞానబలంతో ఆత్మానుభవంలో ప్రవేశించగలరు. కేవలం ఉపాసనకు పరిమితమైతే ఈశ్వరుడు కూడా నొసటన వ్రాయబడిన ‘అజ్ఞానము’ అనే అక్షరములను తొలగించలేడని కూడా గ్రహించు. కాబట్టి ఉపాసనతో బాటు యమనియమాదుల ద్వారా జ్ఞానం కూడా సంపాదించుకోవాలి.
ఈ లోకంలో గురువు చక్కగా బోధిస్తున్నాడు. శిష్యుడు ఆత్మ సమాచారాన్ని వింటున్నాడు. మంచిదే. ఇదంతా అవసరమే. అయితే మనోవాక్కులకు అగోచరమైన ఆ చిద్రహ్మమును బోధమాత్రంచే ఎరుక పరచగల గురువెక్కడ? వినుటలో మనోవాక్కులకు పరిమితమైతే, ఆ శిష్యుడు ఆ గురువుచే బోధించబడినంత మాత్రంచేత మోహలత ఉపశమిస్తుందా? లేదు.
ఎద్దానిచే ఈ గురు, శిష్య, శమ, దమ, ఉపాసనాది సామాగ్రి అంతా పరస్పరం కలుస్తుందో, అట్టి ఈశ్వరనియతి అనిర్వచనీయమైనది.
ఓ భరద్వాజా! ఏది ఎటైనా ఉండుగాక, ఈ జీవుడు ఈశ్వర స్వరూపుడేగాని … ఏదో పరమాణువుల కలయిక అగు ఈ భౌతిక దేహమో, లేక వాసనల రూపమగు భావనల సంకలనమో కాదు. ఏ జీవుడు దేనిని ఎట్లు గ్రహించినా సరే… ఉన్న సత్యం మాత్రం ఇది. ఇది మా తపో-ధ్యానాదుల బలంతో గ్రహించాం. అందరికీ చెప్పుచున్నాం. ఇందుకు వేరుగా ఏ జీవునికి అనిపిస్తుందో ఆతడు ఉపాసన-భక్తి-వైరాగ్యాదుల సాధనలచే మనస్సును నిర్మలం చేసుకోవటానికి వెంటనే ఉపక్రమించాలి. “రేపు - మాపు" అనుకుంటూ తాత్సారం చేయరాదు సుమా! నాయనా! వివేకముచే మోహమును మొదలంటా పెకలించివేసే ప్రయత్నమునకు సన్నద్ధుడవు కమ్ము.
ఒక మహారాజు ఉన్నాడు. ఆయన శాంతిసమయంలో మహాశయంతో ధనము, సేన సమకూర్చుకున్నాడు. ఇంకేం? ఇంక ఆయనకు దిగులు లేదు. అనుకోకుండా యుద్ధం చేయవలసి వచ్చినా, ఏదైనా సాధించవలసిన అగత్యం ఏర్పడినా … ఆతడు సర్వ సమృద్ధితో సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కోగలడు. అంతేకాదు దుష్ట జనులను నిగ్రహించి చక్కగా ప్రజాపాలన చేయగలడు.
ఇంకొక రాజు ఉన్నాడు. ఈతడు ధనము - సైనిక బలము సమకూర్చుకోకుండా ఊరకే ఆట
Page:529
వారు చెప్పే పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బవుతూ బలమును సమకూర్చుకోకుండా అంతఃపురంలో కూర్చుని ఆకస - పోకస కబుర్లు మాత్రం చెప్పుచున్నాడు. ఈతని గతి ఏమిటి? చిన్న సామంతరాజు ఎదురు తిరిగితే గుండె గుభేలుమంటుంది. మంత్రులకు, సేనానాయకులకు సర్ది చెప్పలేడు, శాసించలేడు. ప్రజాహిత కార్యక్రమాలు నిర్వర్తించే సరంజామా గాని, శ్రద్ధగాని లేదు. అప్పుడు ఆతని ప్రజలే ఆతనిని దుయ్యబట్టుచున్నారు.
నీవు మొదటి రాజులాగా తపస్సు - - భక్తి - ఉపాసన పెంపొందించుకుంటూ విషయములపై ప్రవేశించే మనస్సును ఆక్రమించివేయగల, జయించగల నిర్మల మనస్సును పెంపొందించుకోవాలి. అంతేగాని ‘అది ఆయనకంటే లభించింది. మనకెట్లా?’ అని తలచుచూ, కాలమును దిగులుతో వృథా చేసుకోవటం విజ్ఞుల లక్షణమే కాదు.
‘ఆత్మానుభూతి’ అను ప్రయోజనముగా గల బోధ స్వరూపం. ఈశ్వరోపాసన మొదలైన అనేక పుణ్యకార్యములకు అధీనమై ఉంటోంది. అనేక జన్మల ప్రయోజనంగా ప్రకటితమౌతోంది. జీవన్ముక్తుల అనుభవములకు సంబంధించిన అభిప్రాయములు పుణ్యవంతులగు ధీరులను మాత్రమే సమీపిస్తున్నాయి.
ద్విషద్భూతేన యేనైవ కర్మణా బంధ ఈదృశః సుహృద్భూతేన తేనైవ మోక్షమాప్స్యసి, పుత్రక!
బిడ్డా! ఏ కర్మ అయినా సరే, … రాగముతో కూడుకొన్న వాడవై నిర్వర్తించావా … అది నీకు ఒకనాటికి బంధమే కానున్నది. అట్లా కాకుండా రాగహితంగా సుహృద్భావ సమన్వితుడవై కర్మలు నిర్వర్తిస్తే, అవే కర్మలు నీ మోక్ష మార్గానికి దోహదపడతాయి. సజ్జనుల రాగరహితమగు సత్కర్మలన్నీ పూర్వసంచితమైన పాపకర్మలను నశింపజేస్తున్నాయి. వర్షం పడితే దావానలం ఉపశమిస్తున్నట్లు రాగరహిత పుణ్యకర్మలు ఈ జీవుల త్రివిధ తాపములను చల్లార్చుచున్నాయి. ఇక్కడ ’సంసారము’ అనే పెద్ద మహాచక్రం తిరుగాడుతోంది. అందులో ఈ జీవుడు చిక్కుకుని చెప్పనలవిగాని మానసిక తాపాలు అనుభవిస్తున్నాడు. తన బిడ్డలు దుఃఖస్థితులను గమనించిన ఆ సర్వేశ్వరుడు ఆధ్యాత్మ శాస్త్రమును ప్రకటించే ఉపనిషత్తులను, ఈ యోగవాసిష్ఠం వంటి గ్రంథాలను, ఆత్మతత్త్వాన్ని ప్రకటించే గురువులను ప్రసాదించారు. బ్రహ్మమునందు ఆసక్తిగలవారికి శాస్త్రములు - గురువుల సేవలు సిద్ధంగా ఉన్నాయి. కుమారా! ఈ ’సంసార చక్రము’ అనే ఆవర్తము యొక్క భ్రమ నుండి నీవు బయల్వెడలదలచుకున్నావా? అయితే సత్వరంగా సమస్త కర్మలను కర్మఫలత్యాగ బలంతో, (లేక) సమర్పణ భావంతో వదలి, ’బ్రహ్మము’నందు అసక్తుడవై ఉండుము.
సముద్రం సంక్షోభంతో కూడి ఉన్నంతవరకు దానియందు చంచలత్వం ఉండనే ఉంటుంది. ఎప్పుడైతే జలము నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు ఆ సముద్రంలో తరంగాలన్నీ లయించి నిశ్చల - శాంతిజలము మాత్రమే ఉంటుంది. అట్లాగే బాహ్య విషయములందు చిత్తము చంచలంగా ఉన్నంతవరకు ఆ చిత్తంలో ‘జగత్తులు’ అనే వికల్పాలు లేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క చిత్తంలో ఎన్నెన్ని జగత్తులు సంస్కారరూపంలో దాగి, సమయంకోసం వేచి ఉన్నాయో… చెప్పనలవికాదు.
Page:530
వివేకదృష్టిని ఆచ్ఛాదించే ‘శోకము’ అను దానిని నీవెందుకు అవలంబిస్తావు చెప్పు? శోకాంధకారము అలముకుంటున్నప్పుడు ‘అకుంఠిత ప్రజ్ఞ’ అనే చేతి కఱ్ఱతో, ‘వివేకము’ అనే దీపంతో ముందుకు సాగాలిగాని, అంధకారంలో చతికిలబడి కూర్చోకూడదు. అనేక మంది జీవులు ‘హర్ష - శోకములు’ అనే శుభాశుభ తరంగాలచే గడ్డిపరకలవలె ఎచటెచటికో కొట్టుకుపోబడుచున్నారు. మహాత్ముల మార్గం అదెన్నటికీ కాదు. నీవు మహాశయముతో మహాత్మత్వమును సంతరించుకోవటానికే ప్రయత్నించాలి. అంతేగాని అల్పాశయములతో అల్ప విషయములచే ఎందుకు ప్రభావితుడవై ఉండటం? బాలుర వంటి అనేకమంది సాంసారిక జీవులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే - ఆరు ఊర్ములు (కాళ్ళు) గల ఊయలలో హర్ష కోశాల మధ్య ఊయలలూగుచున్నారు. క్రీడా కుతూహలయగు ‘కాలము’ అనే ఆమె ఆయా జీవులను సృష్టించి పాలించి సంహరించి… తద్వారా ఆటాడుకుంటోంది.
కాలసర్పం ఈ జీవులను ఆక్రమించి ఈ అసంఖ్యాక భౌతిక దేహములను తనకు భక్ష్యంగా, మధుర ఉపాహారంగా చేసి వేసుకుంటోంది. ఆహారము కావటానికై పెంచే పక్షులవలె ఈ జీవులకు కొన్ని కాలగత హర్ష-శోకాదులను అందించి ఎప్పుడో సంహరించి దిగమ్రింగి వేస్తోంది. అటువంటి ఈ దృశ్య ప్రపంచంలో విశేష దృష్టిని, విశేష ధర్మము గాని, విశేష ధర్మిగాని లేదు. సర్వ జీవులను సమాన రూపంగానే ఆ కాలస్వరూపిణి భక్షించటం జరుగుతోంది. అల్పకాలస్థములగు మనుజదేహాల గురించి వేరే చెప్పేదేమున్నది? దీర్ఘ కాలస్థములగు దేవతల దేహములనే అది భక్షిస్తోంది కదా!
మరొక్క విషయం. ఈ దేహము - ఈ దేహంలో ప్రవర్తించే ఇంద్రియాలు తమ తమ విశేష ధర్మములతో, ఇంద్రియ విషయాలతో సహా కాలముచే ఎటుతిరిగీ మ్రింగబడబోతున్నాయి. మరి విపత్తియందు వ్యాకులమైన మనోభావాలు ఉండవలసిన అవసరమేమిటి? ఈ కాలక్రమంలో ఏర్పడే విషయాల పట్ల ప్రీతి కలిగియుండి సంసారనాట్యశాలలో వాటికి అనుకూలంగా నీవు ఇంద్రియ విషయ సమాచారములతో కూడి నృత్యం చేయవలసిన పనేమిటి? అందుచేత ఓ భరద్వాజా! నీవు క్షణకాలం ఆత్మస్వరూపమునందు నిశ్చలంగా ఉన్నవాడవై, అప్పుడీ సంసారనాటకమును చూడు. అదియే మరల మరల అభ్యాసం చేయి. క్రమక్రమంగా అదియే అనునిత్యత్వంగా
సంతరించుకొనుగాక!
అస్యానేక తరంగస్య జగతః క్షణభంగినః
న విషీదతి మనస్వీ భరద్వాజ! మనాగపి ॥
ఓ భరద్వాజా! క్షణభంగురమైన అనేక తరంగములో కూడిన ఈ జగత్తును గూర్చి వివేకియగు జీవుడు కొంచెం కూడా దుఃఖించడు.
త్యజ శోకం అమంగల్యం, మంగలాని విచిన్తయ | చిదానందఘనం, స్వచ్ఛం ఆత్మానం చ విభావయ ॥
Page:531
కనుక నీవు అమంగళమైనట్టి శోకమును త్యజించు. ఆత్మదర్శనసాధనములైన మంగళములను బాగుగా చింతన చేయి. చిదానందఘనము, స్వచ్ఛము అయినట్టి ఆత్మస్వరూపం గురించి బాగా విచారణ చేయి, దేవతల, బ్రహ్మాభ్యాసపరుల, గురువాక్యముల పట్ల శ్రద్ధచే పరిపూర్ణమైన చిత్తము కలవారు, వేద ప్రవచనములు ప్రమాణంగా కలవారు అగు మనుజులకు ఆ మహేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతోంది.
భరద్వాజుడు :
జ్ఞాతం తవ ప్రసాదేన సర్వమేతత్ అశేషతః
న వైరాగ్యాత్ పరో బంధుర్, న సంసారాత్ పరో రిపుః ॥
హే మహాత్మా! తమ అనుగ్రహం చేత నా అజ్ఞానం దేనిపట్ల ఎట్లా ఏర్పడియున్నదో గ్రహిస్తున్నాను. “వైరాగ్యాన్ని మించిన బంధువు లేడు. సంసారాన్ని మించిన శత్రువు లేడు" అని గ్రహిస్తున్నాను. మునీంద్రా! శ్రీ వసిష్ఠ మహర్షి ఇప్పటిదాకా చెప్పిన జ్ఞానసారాన్ని ఒక్కసారి సమీక్షించి చెప్పవలసినదిగా నా ప్రార్థన.
శ్రీవాల్మీకి మహర్షి : ‘ముక్తిదాయకమ్, మహాజ్ఞానమ్’ అని చెప్పబడుదాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. విను. సంహృతిస్థితి సంభూతి భేదైరో కథా స్థితః, ఏకో పిసన్, నమస్తస్మై సచ్చిదానందమూర్తయే!
ఏ పరమాత్మ సర్వదా ఒక్కడే అయినప్పటికీ సృష్టి - - స్థితి సంహార భేదం చేత అనేక రూపములుగా ఉండి ఉన్నాడో అట్టి సచ్చిదానందమూర్తికి ఇవే నమోవాక్కులు.
ఈ కనబడే ప్రపంచమును తన కారణమునందు లయమొనర్చటంచేత ఏ విధంగా ఆత్మతత్త్వము ప్రకాశించగలదో … అట్టి ఉపాయరూపమైన - ఇప్పటి వరకు జరిగిన సంవాదమును సంక్షేపంగా చెప్పుచున్నాను వినుఈ జీవుడు ‘అహంకారము’ అను ఒక కల్పితమును ఆశ్రయించుటచే ఆతని పూర్వాపర విచారయోగ్యమైన ఆత్మకు సంబంధించిన ‘స్మృతి’ ఆత్మయందు అప్రత్యక్షమై, దృశ్యమునందు ప్రవేశించి ప్రవర్తిస్తోంది.
అట్టి ‘స్మృతి’ యొక్క నిర్మలత్వము చేతనే సమస్తము స్వయంగా కరతలామలకమై గోచరించ గలదు. దేనిని పొందటం చేత ఈ జీవుడు మరల శోకించడో… అట్టి వస్తువు లభించేది ఎక్కడ? ఎక్కడో కాదు. స్వచిత్తమునందే, స్వయంగా విచారణ చేయటంచేత మాత్రమే లభించగలదు.
వైరాగ్యముతో కూడిన మనిషి ఈ క్రింది మార్గములలో ఆత్మతత్త్వమును ఎంత అధికంగా సాధ్యమైతే అంతగా విచారణ - విమర్శలు చేయవలసి ఉన్నది. 1. సత్సంగం, 2. సచ్ఛాస్త్రం, 3. స్వవివేకం.
Page:532
శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఈ జీవుడు మొట్టమొదట “అజ్ఞానపూరితములు, పరమ దుః ఖ పూరితములు అగు విషయేంద్రియముల మధ్య దేహధారినై చిక్కుకున్నాను” - అని గుర్తించాలి. నేనెవరు? ఈ ఈ జగత్తంతా ఏమిటి? ఈ జన్మ - మృత్యు - జరా - వ్యాధి - దుఃఖములన్నీ ఎక్కడి నుండి వచ్చిపడుచున్నాయి? - అనే ప్రశ్నలకు రావాలి. ’నా దృష్టి అపవిత్రమై ఉండుటచేతనే నాకు ఈ దుఃఖాదులు దాపురిస్తున్నాయి. “ఇప్పుడు ఇద్దానిని పవిత్రపరచి జ్ఞాన విశేషాలతో నింపివేయాలి.” అని మహత్తర కార్యక్రమమునకు సంసిద్ధుడు కావాలి.
ఇంద్రియ విషయములకై అఱ్ఱులు చాచే మనస్సును కించిత్తు శాంతపరచాలి. ఇంద్రియాలను విషయాల నుండి మరల్చటానికై వాటిని దమింపజేయాలి. శమము, దమము మొదలైన శాస్త్ర విహిత ఉపరతి కార్యక్రమాలు చేపట్టాలి. నిషిద్ధ కామ్యకర్మల నుండి, విషయేంద్రియ సంయోగంచే కలిగే సుఖాభాస నుండి విరతుడై స్వస్వరూపాత్మ వైపుగా దృష్టి సారించాలి.
శ్రద్ధావంతుడై మృదువైన ఆసనమును ఆశ్రయించాలి. ఇంద్రియములను జయిస్తూ ఈ మనస్సు ప్రసన్నమయ్యేంత వరకు ’ఓం’కారమును ఉచ్చరించాలి. అట్లాగే అంతఃకరణ శుద్ధికొరకై ప్రాణాయామము మొదలైనవి ఆచరించాలి. క్రమంగా మెల్ల మెల్లగా ఇంద్రియములను విషయములనుండి తొలగించాలి.
దేహము - ఇంద్రియములు - మనస్సు - బుద్ది - జీవుడు వీటన్నిటి యొక్క చమత్కారమంతా దేనినుండి కలుగుతోందో అట్టి అధిష్ఠానమగు ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆ ఆత్మయందు తదితరమైనదంతా లయం చేస్తూ రావాలి.
విరాజి ప్రథమం స్థిత్వా తత్రాత్మని తతః పరం అవ్యాకృతే స్థితః పశ్చాత్, స్థితః పరమకారణే॥
అ : మొట్టమొదట ‘అ’ కారవాక్యమైనట్టి ‘స్థూలభూత సమష్టి రూపమైన విరాట్టును నేనే’ అనగా, ‘ఈ స్థూలరూప బ్రహ్మాండముల ఉనికికి కారణకారణం నా అంతర్యామి స్వరూపమే’ అని భావన చేయాలి.
ఉ : ఆ తరువాత ఆ ’విరాట్టు అహంభావన’ను ’ఉ’ కారవాచ్యమగు ’సూక్ష్మభూత సమష్టిరూపము’ అయిన హిరణ్యగర్భ జ్ఞానమునందు లయం చేయాలి. అనగా ‘అట్టి సూక్ష్మభూత సమష్టి రూపహిరణ్యగర్భుడగు జ్ఞానిని నేనే’ అను అహంభావనను ఆశ్రయించాలి.
మ : అప్పుడిక ఆ సమష్టి మనోరూపమును అద్దానికి కారణమైయున్న ‘మ’ కార్యవాచ్యమైనట్టి ‘వ్యాకృతము’ నందు లయం చేయాలి. అనగా, ’స్థూల సూక్ష్మముల ఉభయములకు ఆశ్రయమైయున్న సాక్షితత్త్వమే నేను’….. అను రూపమైన అహంభావనను ఆశ్రయించాలి. అనంతరం ఆ మాయా
Page:533
వ్యాకృతము కూడా అర్ధమాత్ర వాచ్యము - - పరమకారణము అయిన శుద్ధబ్రహ్మమునందు లయం చేసి … ఇక ఆపై ఆ శుద్ధ బ్రహ్మమునందే స్థితి కలిగి ఉండాలి.
ఏది ఎందులోంచి వస్తే చివరికి అది అందులో లయం కావలసిందే కదా….అందుచేత ఉత్కృష్టులగు ఉద్దాలకుడు వంటి నిర్వాణయోగుల సంయోగసాధన గురించి విను.
ఈ దేహము యొక్క ‘మాంసము’ మొదలైన పృథివీ సంబంధ (పార్థివ సంబంధ) విభాగములను పృథివీతత్వంలో లయం చేయాలి. అనగా, దేహమును తదితర విరాట్ పృథివీతత్వంలోని ఒక చిన్న విభాగంగా దర్శించాలి. ఈ దేహమును తదితర బ్రహ్మాండముల వలెనే తనకు బాహ్యమైన ఒక భౌతిక పదార్థంగా దర్శించాలి.
అట్లాగే .జల సంబంధమైన రక్తాదులను జలతత్వంలో, తేజోసంబంధమైన విభాగమును తేజోతత్త్వంలో, వాయుసంబంధ విభాగమును వాయువులో, ఆకాశసంబంధమైన విభాగమును ఆకాశంలో లయం చేయాలి. అనగా, అవన్నీ వాటివాటి తత్త్వములుగా చూడసాగాలి.
అదే విధంగా ఘ్రాణము, కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియములను తమ తమ కారణములగు దేవతోపాధిభూత సూక్ష్మతత్త్వములందు లయం చేసివేయాలి. వీటినన్నిటినీ ఆయా అధిదేవత సొత్తుగా, ప్రదర్శనగా గాంచాలి. అనగా … అన్నిటికీ కర్త అయిన ఈ జీవుని యొక్క చెవులు, కళ్ళు, ముక్కు మొదలైన ఇంద్రియములలో ఆయా దేవతలు అధివసిస్తున్నారు కదా! కనుక ఇంద్రియ భావములన్నీ ఆయా అధిదేవతలకు సమర్పణ చేయాలి.
ఎట్లా అంటే …
శ్రోతేంద్రియము (చెవులు)ను దిగ్దేవతలయందు (దిగ్దేవతల ప్రదర్శనా చమత్కారంగా) త్వక్ఇంద్రియాన్ని (చర్మం, స్పర్శను) విద్యుత్ తేజోశక్తియందు,
నేత్రేంద్రియమును (కళ్ళు) సూర్య బింబమునందు,
జిహ్వేంద్రియమును వరుణుని యందు,
ప్రాణమును వాయువునందు,
వాక్కును అగ్నియందు
హస్తేంద్రియము (చేతులను) ఇంద్రునియందు
పాదేంద్రియమును (కాళ్ళను) విష్ణువునందు,
గుదేంద్రియమును మిత్రునియందు
ఉపస్థేంద్రియమును కశ్యపునియందు,
మనస్సును … చంద్రునియందు
బుద్ధిని బ్రహ్మదేవునియందు
…లయింపజేయాలి. వీటన్నిటినీ ఆయా అధిదేవతల సొత్తుగా, సమర్పిత భావనతో దర్శనం
చేయాలి.
Page:534
ఓ భరద్వాజా! వాస్తవానికి ‘ఇంద్రియములు”… అనబడే వేఱు వస్తువులేవీ లేవు. ఆ దేవతలే ఈ దేహంలో ‘ఇంద్రియములు’ అనే మిషచే స్థితినొందియున్నారు. ఈ వాక్యాలు నేను శ్రుతి వాక్యములను అనుసరించే చెప్పుచున్నాను గాని, ఏదో స్వకపోలకల్పితం కాదు.
ఈ విధంగా మనుజుడు ఈ తన దేహమును అద్దాని కారణమున లయింపజేసి "నేను విరాట్ పురుషుడను”….. అని భావనచేయాలి. నాయనా! ఈ సమస్త భూతములకు ఆధారం, కారణం కూడా సర్వ బ్రహ్మాండములకు ప్రభువైనవాడు, అర్ధనారీశ్వర స్వరూపుడు అగు ఆ ఈశ్వరుడే సుమా! ఇదంతా ఆయనదే అయి ఉన్నది. కనుక ఆయనకు సమర్పించడంలో కష్టమేమున్నది? ఆతడే తన యజ్ఞసృష్టి రూపములలో ఈ జగద్వ్యవహారమునందు అంతటా స్థితి కలిగియున్నాడు. ఇక్కడ కొన్ని శ్రుతి ప్రతిపాదిత సృష్టి చమత్కారాలు పురశ్చరణ చేద్దాం!
ఈ బ్రహ్మాండమునకు బాహ్యమున దీనికి రెండింతలు పృథివీతత్వమున్నది. అట్టి పృథివికి ఆవల, దానికి రెండింతలు జలతత్త్వమున్నది. జలమునకు ఆవల రెండింతలు తేజము ఉన్నది. తేజమునకు ఆవల రెండింతలు వాయువు ఉన్నది. వాయువుకు ఆవల రెండింతలు ఆకాశము ఉన్నది… ఈ విధంగా ఉత్తరోత్తరక్రమముచే ఒకదానికంటే మరొకటి ద్విగుణీకృతమై ఉంటోంది.
ఈ ప్రపంచమంతా కూడా 1. పంచీకృతము, 2. అపంచీకృతము అగు భూతములచే నిండి ఉంటోంది. అందుచేత ఆత్మతత్వమును ఆశ్రయించాలనుకునే యోగి పృథివిని దానికి కారణమైన జలమునందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును సమస్తోత్పత్తికి కారణమగు హిరణ్యగర్భాశయమునందు లయమొనర్చి వేయాలి.
లింగ శరీరం - 1. వాసనలు, 2. సూక్ష్మభూతములు, 3. కర్మ, 4. అవిద్య, 5. దశేంద్రియములు, 6. మనస్సు, 7. బుద్ధి … ఇవన్నీ చేరినదానినే పండితులు ‘లింగశరీరం’ అని పిలుస్తున్నారు.
ఈ విధంగా స్థూలోపాధియొక్క భావనావిలయముచే ఆ యోగి అర్థరూపము పొందినవానివలె ఉంటున్నాడు. ఆ తరువాత ’బ్రహ్మాండాభిమానత్యాగముచే ఆతడు ఈ బ్రహ్మాండ వ్యవహారము నుండి బహిర్భూతుడౌతున్నాడు. అప్పుడు సూక్ష్మభూతాత్మకమైన సమష్టిలింగదేహమున ‘నేను సర్వమునకు అధిష్ఠానమగు హిరణ్యగర్భుడనే’…. అని భావన (లేక) చింతన చేయాలి.
ఈ సమష్టి భూతాభిమానియే ప్రప్రథమంగా ‘చతుర్ముఖ బ్రహ్మ…’ అను రూపమున వ్యవస్థితుడై ఉన్నాడు. అట్టి లింగశరీరాన్ని కూడా …దానికంటే కూడా సూక్ష్మమై అద్దానికి కారణభూతమైయున్నట్టి ‘అవ్యాకృతము …అని చెప్పబడుదానిలో ఆ బుద్ధిమంతుడు లయం చేయుగాక!
అవ్యాకృతం - దేనియందైతే ఈ సమస్తమైన జగత్తు కలదో … అట్టి అవ్యాకృతం, లేక అవ్యక్తము నామరూపరహితమైనది. దానినే కొందరు ‘ప్రకృతి’ అని, మరికొందరు ‘మాయ’ అని ఇంకొందరు ‘పరమాణుతత్త్వము’ అని చెప్పుచున్నారు. అట్లాగే ఇంకాకొందరు తార్కికులు (బౌద్ధులు మొదలైనవారు) ఆయా తర్కములచే ఏర్పరచుకున్నవారే అదే ’సంవృతరూపము’ అని, అవిద్య అని
Page:535
ప్రతిపాదిస్తున్నారు. ప్రళయకాలంలో అద్దానియందే సమస్త పదార్థభావములు లయించి అవ్యక్తరూపంలో ఉంటున్నాయి. మరల సృష్టి ప్రారంభమయ్యే వరకు అవి అవ్యక్తమునందే పరస్పర సంబంధరహితములై ఉంటున్నాయి.
అనగా … జగత్ సంబంధిత భావనలన్నీ తమ తమ భోగ్యత్వరూపాన్ని కోల్పోయి చిత్ స్వరూపం సంతరించుకుంటున్నాయి. మరల సృష్టి ప్రారంభంలో చిత్ నుండే ఉత్పన్నమౌతున్నాయి. అధ్యారోప (లేక, అనులోమ) క్రమం చేత అవ్యక్తం నుండి అవి సృష్టిగా అగుచున్నాయి. అపవాద (లేక, ప్రతిలోమ) క్రమముచే సమస్తము అద్దానియందే లయిస్తున్నాయి. స్థానత్రయాతీతమైన తురీయపద ధ్యానం
{ 1. స్థూలం 2. సూక్ష్మం 3. కారణం }
{ 1. జాగ్రత్ 2. స్వప్నం 3. సుషుప్తం }
ఈ త్రిపుటీ సమూహములను జయించి నీవు నాశరహితమగు తురీయ పదమును ధ్యానించాలి. అట్టి తురీయపద ప్రాప్తి కొరకై ’చరమ సాక్షాత్కార వృత్తి’చే లింగ దేహమును కూడా వలయమొనర్చాలి. అనగా ’ధ్యాన - కర్మ - కరణ’వృత్తి రూపమగు లింగ దేహమును కూడా ’మూలాజ్ఞాన త్యాజ్యము’ అను సాక్షాత్కారవృత్తిచే శుద్ధబ్రహ్మమునందు విలయమొనర్చాలి. కుండ పగిలితే కుండలోని ఆకాశం మహాకాశంలో విలీనమౌతుంది చూచావా? అట్లాగే నీవు నిరతిశయానందరూపమగు పరబ్రహ్మమున ప్రవేశించెదవు గాక.
పంచభూతములు - మనస్సు, బుద్ధి, వాసన, కర్మ, ప్రాణవాయువులు… వీటన్నిటి యొక్క ప్రతిష్ఠ అజ్ఞానమే అయి ఉన్నది. శుద్ధ బ్రహ్మమున అజ్ఞాన రూపావరణ ఏర్పడుచటే అది తనకు తానే మొట్టమొదట అవ్యాకృతంగాను, ఆ తరువాతనే సూక్ష్మభూతలము ద్వారా లింగ శరీరంగాను జనిస్తున్నది. కనుక లింగ శరీరమునకు అజ్ఞానమే మూల ప్రతిష్ఠ. అజ్ఞాన నివృత్తిచే లింగ శరీరం అనే విశృంఖలములు తప్పకుండా స్వయంగా విచ్ఛిన్నమగుచున్నాయి.
భరద్వాజ మహర్షి : హే మహర్షీ ! యొక్క చెప్పే మహత్తరమైన అవ్యాకృతాతీత తురీయస్థితి గురించిన విశ్లేషణా ప్రభావం చేత నేనిప్పుడు లింగ శరీర విశృంఖలముల నుండి సర్వదా విముక్తుడనైనాను. చిద్రూపసాగరమున ప్రవేశించిన వాడనైనాను. అట్టి చిద్రూపసాగరంలో ‘అభేదం’ పొందటం చేత సర్వోపాధివర్జితుడనగు పరమాత్మయే అయి ఉన్నాను. ఇట్టి "ఐక్యకూటస్థాత్మ” గురించి ఇతఃపూర్వం శ్రుతులు చెప్పగా విన్నాను. ఇప్పుడు మీ కృపచే తదనుభవజ్ఞుడనగుచున్నాను. అగ్నిలో వేయబడిన అగ్ని ఆ అగ్నితో ఐక్యం పొందినప్పుడు తన్మయత్వముచే ’అగ్ని’ అనే పేరుతోనే చెప్పబడుతుంది కదా! అట్లాగే నా విశేషరూపం మరింకే పేరుతోనూ చెప్పబడటం లేదు. అది
Page:536
‘పరమాత్మయే’ అనబడుతోంది. లవణ సముద్రంలో పడిన తృణ - కాష్ఠాదులు (గడ్డిపరక కట్టె మొదలైనవి) లవణ మయమే అవుతాయి కదా! అట్లాగే అచేతనమగు ఈ జగత్తు చైతన్యమునందు లయమొనర్చబడిప్పుడు ఇది కూడా చైతన్యమే అగుచున్నది.
ఒక సైంధవ లవణపు బొమ్మ (ఉప్పుబొమ్మ) ఉన్నది. అది సముద్రపు లోతు ఎంతో కొలవటానికి బయలుదేరి, సముద్రంలో ప్రవేశించింది. అప్పుడేమౌతుంది. ఆ ఉప్పుబొమ్మ జలంలో ప్రవేశించగానే జలరూపంగా అయి తన నామరూపములు కోల్పోతుంది. పాల సముద్రంలో పోయబడిన పాలు ఇక క్షీరంగానే మారుతుంది. కడివెడి నేతిలో కలుపబడిన నేతిబొట్లు నేతిరూపమే అగుచున్నాయి. ఈ జలాదుల ఉపాధులన్నీ (మంచుగడ్డలన్నీ) జలంలో ప్రవేశిస్తే జలమే అవుతున్నాయి. అట్లాగే నేను కూడా సత్స్వరూపమగు చైతన్యమున ప్రవేశించి, చైతన్యరూపుడనై వెలయుచున్నాను.
నిత్యానందే సమస్తజ్ఞేష పఠే, పరమకారణే,
నిత్యం, సర్వగతం, శాంతం, నిరవద్యం నిరంజనమ్ || నిష్కలం, నిష్క్రియం, శుద్ధం, తద్భహ్మాస్మి పరం పరమ్|| హేయోపాదేయ నిర్ముక్తం, సత్యరూపం, నిరింద్రియం|| కేవలం సత్య సంకల్పం శుద్ధం బ్రహ్మాస్మ్యహం పరమ్, పుణ్యపాప వినిర్ముక్తం కారణం జగతః పరం॥ అద్వితీయం పరంజ్యోతిర్ బ్రహ్మస్మ్యానన్దమవయం, ఏవమ్ ఆది గుణైర్యుక్తం సత్వాది గుణవర్జితమ్, ప్రవిష్ఠం సకలం బ్రహ్మ సదాధ్యాయేత్స్వకర్మకృత్॥
నిత్యానందరూపమై, సర్వజ్ఞమై, సర్వసాక్షియై పరమ కారణమైనట్టి పరబ్రహ్మమునందు నేను. నిత్యమై, సర్వ వ్యాపకమై, శాంతమై, దోషరహితమై, నిరంజనమైనట్టి బ్రహ్మరూపుడనై ఉన్నాను. నిష్కళమై, నిష్క్రియమై, హేయ ఉపాధేయ రహితమై, సత్యరూపమై, ఇంద్రియరహితమైనట్టి శుద్ధబ్రహ్మమే నేను. నా స్వరూపం కేవలమై సత్య సంకల్పయుతమై, పుణ్య-పాప వర్జితమై, జగత్తు యొక్క పరమకారణమై, శుద్ధమైనట్టి పరబ్రహ్మమే అయి ఉన్నది. నేను అద్వితీయమై, నాశనరహితమై, పరమప్రకాశమైనట్టి అవ్యయానంద బ్రహ్మమునే అని అనటంలో నాకు సందేహమే లేదు. నా స్వరూపం సత్య సంకల్పాది సౌరభ్యంతో కూడి ఉన్నది. మాయికములైనట్టి సత్వ-రజో-తమో గుణములు లేవు. సర్వ రూపమైనట్టి బ్రహ్మమగు నా స్వరూపమే సాధకులందరికి శ్రవణ-మననాది స్వకర్మలచే ఆరాధనార్హమైయున్నది.
ఈ విధంగా నేను బ్రహ్మమును ధ్యానించటం, అభ్యసించుట చేత నా మనస్సు ఆ బ్రహ్మమునందే లయం పొందుతోంది. మనస్సు లయించగానే నేను స్వయాత్మ స్వరూపుడనై అన్ని వైపులా ప్రకాశిస్తు న్నాను. ఆనందరూపమగు ఆత్మ ప్రకాశిస్తూ ఉండగా ఇక సమస్త దుఃఖాలు అనే క్రీనీడలు స్వయంగా తొలగిపోతున్నాయి. అప్పుడు ఆత్మ సహజసిద్ధమగు తన ఆనందరూపమును పొందుతోంది.
Page:537
ఓ గురువర్యా! నా కంటే వేరైన సచ్చిదానందమయుడగు ప్రభువు మరొకడెవడూ లేడు. ‘నేనొకడనే పరబ్రహ్మమును’ అని నా సర్వరూపాత్మ లోలోన అనుభవించుచున్నది. ఎందుకంటే, తదితరులంతా నా స్వరూపులే!
శ్రీవాల్మీకి మహర్షి :
సఖే! సంన్యస్య కర్మాణి బ్రహ్మణః ప్రణయీ భవ నేష్యేసే యది సంసారచక్రావర్త భ్రమః శమమ్||
ఓ సఖుడా! నీ స్వస్వరూపము అంతటిదే! ఇందులో సందేహమే లేదు. సర్వ కర్మలు పరిత్యజించినవాడవై, బ్రహ్మప్రాప్తియందే ఏర్పడి ఉండుము. ఈ ‘సంసారచక్రము’అనే పెద్ద ఆవర్తము భ్రమవంటిది మాత్రమే. ఇందులో ఏదో పొందవలసియున్నది…’ అని అల్పభ్రమను ఆశ్రయించకుండా ఉన్నావా…నీ బ్రాహ్మీస్థితికి రాగల లోటేమీ ఉండదు.
భరద్వాజుడు : గురుదేవా! తాము వచించిన జ్ఞానమంతా తమ కృపారసం చేత నేను గ్రహించాను. తమ అనుగ్రహంచేతనే నా బుద్ధి నిర్మలమైనది. ఇక ఈ ‘సంసారభ్రమ’ గురించి తెలుసుకొని ఉండటంలో ఏమాత్రం జంకుగాని, అనుమానం గాని, ఆలస్యంగాని నాకు లేవు. అయినా కూడా ’జ్ఞాని’ యొక్క కర్మ విశేషములు ఎట్లా ఉంటూ ఉంటాయో మరల మీ నుండి వినాలని అభిలాష మాత్రం ఉన్నది. ప్రభూ! ఆతని కర్మ ప్రవృత్తి రూపంలో ఉంటుందా? లేక నివృత్తి రూపంలో ఉంటుందా? లేక ఆతనికి కర్తవ్యమంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదా? ఈ విషయంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి నాకు తెలియజేయండి.
శ్రీవాల్మీకి మహర్షి :
తస్మాత్ యన్నకృతే దోషః తత్కర్తవ్యం ముముక్షుభిః, కామ్యం కర్మ నిషిద్ధిం చ న కర్తవ్యం విశేషతః |
ఓ భరద్వాజా! సమస్తము త్యజించి బ్రహ్మము గురించి మాత్రమే అభ్యాసపరుడవై ఉంటే కాలక్రమంగా సంసారమును జయిస్తావు. “సంసారభ్రమ నివర్తకం" అనేది లభించాలంటే సమస్తం త్యజించి బ్రహ్మమును గూర్చిన అభ్యాసమునే ఆశ్రయించాలి. అందుచేత ఏ కర్మలు ఆచరిస్తే దోషమేదీఉండదో…అవియే ముముక్షువులు ఆచరించతగినవై ఉంటాయి. ఇంతకు మించిన కామ్య - - నిషిద్ధ కర్మలు ముముక్షువులు విశేషంగా ఆచరించవలసిన పని లేదు. దేహమునకు, మనస్సుకు బ్రహ్మమునకు వేరువేరైన చమత్కార ధర్మములు ఏర్పడి ఉన్నాయి.
దేహ గుణములు (లేక) దేహ ధర్మములు : ఈ దేహము ప్రకృతిచే నిర్మించబడి ప్రకృతి చేతనే ఉపసంహరించబడుతోంది. దీనికి బాల్యయౌవన వార్ధక్యాలున్నాయి. అనుక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. పరమాణువుల సంయోగ వియోగాలచే ఇది వృద్ధి, క్షయాలు పొందుతోంది.
మనో గుణములు (లేక) మనో ధర్మములు : ఇది ఏది ఎట్లు ఎంతకాలం ఏ రీతిలో ఆశ్రయిస్తే అద్దానిని అట్లే అంతకాలం ఆ రీతిలోనే పొందుతూ ఉంటుంది. అల్పకాలిక విషయములను
Page:538
ఆశ్రయిస్తే అల్పత్వం పొందుతోంది. గుప్తము - శాశ్వతము అగు ఆత్మను ఆశ్రయిస్తే ఆత్మత్త్వము సంతరించుకుంటోంది.
ఈ జీవుడు ఎప్పుడైతే దేహం యొక్క మనస్సు యొక్క గుణాలను వదలి బ్రహ్మం యొక్క ‘సత్-చిత్-ఆనందం’ అనబడే గుణములతో కూడుకొని ఉంటాడో… అప్పుడు సమస్త ఇంద్రియములు కర్మల పట్ల నిరంజనం, నిరాకారత్వం, నిర్వికారత్వం వహించి ఉంటాయి. ఆ జీవుడి పట్ల ఇంద్రియత్వం శమించటం చేత, ఇక ఆతడు సర్వవ్యాపియగు ప్రభువై ఉంటాడు. అట్టి వానిని ఆతని కర్మలు అంటవు. అవి అతనిని నిర్వచించలేవు.
జీవుడు - విముక్తుడు : ఎప్పుడీ జీవుడు విముక్తుడు (లేక) విముచ్యుడు అయి ఉంటాడో అదిప్పుడు చెప్పుచున్నాను విను.
దేహేంద్రియమనోబుద్ధేః పరస్తస్మాచ్చ యః పరః,
సో హమస్మి యదా ధ్యాయేత్ తదా జీవో విముచ్యతే॥ కర్తృత్వ=భోక్రాది నిర్ముక్తః సర్వోపాధి వివర్జితః, సుఖదుఃఖ వినిర్ముక్తస్తదానీం విప్రముచ్యతే॥ సర్వభూతేషుచ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, యదా పశ్యతి అభేదేన తథా జీవో విముచ్యతే॥
జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్యాం హిత్వాస్థానత్రయం యదా
విశేత్ తురీయమానందం తదా జీవో విముచ్యతే॥॥
’ఈ దేహ -ఇంద్రియ మనో - - బుద్ధుల కంటే పరమై, అన్నమయ - ప్రాణమయ -
మనోమయ - - విజ్ఞానమయ కోశములకంటే విశిష్టమైన ఆనందమయకోశం’ ఉన్నది. ఆ ఆనందమయ కోశమునకు కూడా పరమై “బ్రహ్మము” ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను … అను ధ్యానం చేత అతడు విముక్తుడౌతాడు.
ఎప్పుడైతే "నేను కర్తృత్వ - - భోక్తృత్వ రహితుడను. సర్వ ఉపాధులలో ఉండికూడా, సర్వ ఉపాధులను త్యజించినదై, సర్వదా వాటినన్నిటికీ అతీతమై ఏ బ్రహ్మమున్నదో … అదే నేను…” అని గ్రహిస్తూ ఉంటాడో అప్పుడు సుఖ దుఃఖముల నుండి విడివడినవాడై విముచ్యుడౌతాడు.
"ఈ సమస్త జీవజాలాలో నేనున్నాను. ఇవన్నీ నా ఆత్మయందే, ఆత్మగానే ఉన్నాయి. అందుచేత ఒక జీవునికి మరొక జీవునికి భేదమే లేదు. నాతో సహా ప్రతి ఒక్క జీవి స్వయంగా ఆత్మయే అయి ఉండగా…ఇక ఇక్కడ అభేదమే సిద్ధిస్తోంది గాని భేదము కాదు…” అను అనుభవాన్ని ఆశ్రయించి ఉన్నవాడు సంసార విముక్తుడు స్వభావ సిద్ధంగా అగుచున్నాడు.
Page:539
ఏ జీవుడైతే “నేను జాగ్రత్ సంవిత్తు కాదు. స్వప్న సంవిత్తు కాదు. సుషుప్త సంవిత్తు కూడా కాదు. అందుచేత ఈ మూడు అవస్థలను ఇక్కడే ఉండనిచ్చి, ఈ మూడింటికి ఆవల ఉన్న తురీయమునందు ఏర్పడి ఉంటున్నాను” అను నిత్య సంస్థితానుభవమును సంతరించుకుంటున్నాడో, ఆతడు మాయ నుండి ఇట్టే విడివడుచున్నాడు. అట్టి తురీయమే ఈ జీవుని యొక్క పరమాత్మయందలి స్థితి. అద్దానిలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్త బీజవాసనలు లేవు. ఎందుకంటే అది స్వతః నిర్మలమైనది, స్వయంప్రకాశమైనది, సర్వమును వెలిగించునది కూడా. అది ‘నిద్రాణవిరహితం’ అని విజ్ఞులు ఎఱుగుచున్నారు. కర్మ-అజ్ఞానము మొదలైనవి అందులేవు. అది సుషుప్తికంటే కూడా పరమైనది. చైతన్య సుఖ సమన్వితమైయున్నది.
ఆ మహత్తర సుఖానుభవమే భక్తియొక్క యోగము యొక్క విచార మాత్రజనితమైన సాక్షాత్కారము యొక్క పరాకాష్ఠ.
ఏ జీవునికైనా సరే, ఆ తురీయ సంస్థితమునందు మాత్రమే వాస్తవమైన సుఖవిశ్రాంతులు లభిస్తున్నాయని కర్మ-భక్తి-యోగ-జ్ఞాన సాధకులందరు ముందుగానే గ్రహించి ఉండెదరు గాక! తరంగములు శమిస్తే ఇక సముద్రమంతా నిండి ఉండేది జలమే కదా! ఆత్మామృత సముద్రంలో మనస్సు లయించగా, అట్టి మనుజునికి ఆత్మ తప్ప మరింకేదీ గోచరించదు. అట్టి వానినే ‘ఆత్మజ్ఞుడు. ఆత్మను మాత్రమే ఎరుగుచున్నవాడు’ లేక ‘ఆత్మ సంవిత్తు’ అని పిలుస్తున్నాం.
ఓ భరద్వాజా! మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అట్టి ఆత్మ రూపమహాసముద్రంలోనే నీవు స్నానమాడాలి. అంతేగాని ద్వైతరూప ఉప్పు సముద్ర తరంగాలలో దూకవలసిన పనేమిటి చెప్పు? భరద్వాజుడు : అట్టి జ్ఞానస్థితి నాకు సులభతరమయ్యేదెట్లా? శ్రీవాల్మీకి మహర్షి :
మజ్జమజ్జసి కిం ద్వైతగ్రహక్షారాబ్ది వీచిషు
భజ సంభరితాభోగం పరమేశం జగద్గురుమ్॥
ఆ జగద్గురువగు పరమేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించుట కొరకై ‘అర్ధనారీశ్వరుడు’ మొదలైన ఆయా రూపములను ధరించి భక్త జనులకు జ్ఞానము ప్రసాదిస్తున్నాడు. అట్టి సర్వాత్మకుని ఆయా అనుకూలరూపంతో జ్ఞాన సిద్ధి కొరకై భజించు, అర్చించు. అర్చనాదులచే భక్తి ప్రవృద్ధమగుచుండగా జ్ఞానము వికసించి జ్ఞానసిద్ధిచే చిదానందమగు తురీయమునుండి ఏర్పడి ఉండగలుగుతావు. అంతేని, ఈ ద్వైతరూప క్షార సముద్రంలో మునుగవలసిన పనేమిటి?
పుత్రకా! భరద్వాజా! ఈ విధంగా శ్రీవసిష్ఠ మహర్షి విశ్వామిత్ర - నారదాది మహర్షులు, సిద్ధులు, తదితర మహనీయులు వేంచేసియున్న ఆ దశరథ మహారాజు యొక్క నిండు సభలో శ్రీరామచంద్రునికి ఇప్పటివరకూ చెప్పియున్న ఉపదేశమంతా పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చాను. దీనినంతా నీవు జ్ఞానమార్గంచేత, యోగమార్గం చేత చక్కగా నిశ్చయరూపంగా ఎఱుగుము.
Page:540
ఎందుకంటే శాస్త్ర విచారణ చేతను, గురువాక్యముల అర్థము ఎఱుగుట చేతను, అభ్యాస యోగము చేతను సమస్త జ్ఞానము యొక్క సిద్ధి లభించగలదు.
తస్మాత్ త్వమ్ సర్వముత్సృజ్య కుర్వభ్యాసే స్థిరం మనః ॥
కాబట్టి నీవు సర్వమును త్యజించి అభ్యాసయోగం చేత మనస్సును స్థిరపరచుకో. అప్పుడు తా నీకు స్వయంగానే అత్యంత సులభంగా కరతలామలకమవగలదు.
భరద్వాజుడు : ఓ మునీశ్వరా! ఆ శ్రీరామచంద్రుడు శ్రీ వసిష్ఠ మహర్షి బోధించిన జ్ఞానయోగములను ఆలకించినవాడై సమాధిలో ప్రవేశించి ఈ ఉపాధి మొదలుగా గలవాటికి పరమైనట్టి బ్రహ్మముతో ఏకత్వము అనుభవిస్తు ఉపాధితో అసంబధిత్వము దర్శిస్తున్నాడు కదా! అట్టి రామచంద్రుని వసిష్ఠమహర్షి మరల ఏ విధంగా వ్యవహారపరునిగా తీర్చిదిద్దారు? ఈ విషయం చెప్పండి. ఈ విషయం ఎఱిగి నేను కూడా శ్రీరామచంద్రుని వలెనే బ్రహ్మాభ్యాసిని, దేహవ్యవహార నిర్వహణవర్తిని కూడా అయి ఉంటాను. 1. సమాధి 2. సమాధి యొక్క వ్యుత్థాన కాలము … ఈ రెండింటినీ చక్కగా నా పట్ల సమన్వయించుకోగలుగుతాను.
శ్రీవాల్మీకి మహర్షి : అవును. ఆ విషయం ఇప్పుడు సుసందర్భమైన విషయం. విను. చెపుతాను.
మహామనస్వి, అపరిచ్ఛిన్న బ్రహ్మాకార చిత్తుడు, శుభాచరణశీలుడు అగు ఆ శ్రీరామచంద్రుడు అఖండ-అప్రమేయ-నిర్వికల్ప స్వరూపమునందు పరిణతి చెందియున్నాడు కదా! అప్పుడు ఋషిసత్తముడైన శ్రీవసిష్ఠ మహర్షితో శ్రీవిశ్వామిత్ర మహర్షి ఇట్లా పలికాడు.
శ్రీవిశ్వామిత్ర మహర్షి : హే మహాభాగా! బ్రహ్మపుత్రా! శ్రీ వసిష్ఠ మునీంద్రా! తమ అనుగ్రహదృష్టిమాత్రం చేత మీరు మీ ప్రియ శిష్యుడగు ఈ శ్రీరామచంద్రునియందు బ్రహ్మజ్ఞాన శక్తిని కలుగజేసి మీ గురుత్వ మహనీయత్వమును ఇప్పుడిక్కడే నిరూపించుకున్నారు.
దర్శనాత్ స్పర్శనాత్ శబ్దాః కృపయా శిష్యదేహ కే,
జనయేద్యః సమావేశం శాంభవం స హి దేశికః ॥
ఎవరైతే తన దర్శనం చేత స్పర్శనంచేత, శబ్ద ప్రయోగం చేత, కృపాకటాక్షవీక్షణచేత శిష్యుని దేహమందు ‘శివరూపమగు పరమాత్మ’ యొక్క సమావేశమును కలుగజేయగలరో … వారే గురువు. వారే సద్గురువు. మీ శిష్యుడగు ఈ శ్రీరామచంద్రుడు స్వయంగా విశుద్ధాత్ముడై, ఈ సంసారవ్యవహారం పట్ల విరక్తుడై, కేవలం ఆత్మయందు విశ్రాంతిని కోరిన వాడై ఈ సంవాద ప్రారంభంలో మహత్తరంగా వైరాగ్యమును ప్రవచించాడు. ప్రయోజనంగా ఈ సంవాదము అనే రూపంలో సర్వ ముముక్షువులపై
Page:541
జ్ఞానామృతవర్షం మీరు కురిపిస్తున్నారు. అయితే మీరు సిద్ధాంతీకరించినట్లు ’శిష్య ప్రక్షైవకారణం…’ అనేది కూడా సముచితమే!
శిష్య ప్రజ్ఞవ బోధస్య కారణం గురువాక్యతః మలత్రయమపక్వంచేత్ కథం బుద్ధ్యతి పకవత్?
గురువాక్యములు శిష్యునితో మహత్తరమైన ‘ఆత్మానుభవం’ జనింపజేయటానికి శిష్యుడిలోని ప్రజ్ఞయే కారణమని మనం ఎఱిగినదే. ఎందుకంటే ఎవనిలో అయితే శారీరక-వాచిక-మానసిక దోషములు, దేహ-మనో-బుద్ధి మాలిన్యములు, కామ-కర్మ వాసనలు తొలగవో అట్టి శిష్యుడు గురుబోధ యొక్క ఔన్నత్య సారాంశము గ్రహించలేడు కదా! ఈ రామచంద్రుడు ఆశ్చర్య జనితమైన బుద్ధికుశలత కలవాడు.
మీరీ రోజులుగా ఏదేది బోధించి అనేకమందిలో ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలిగిస్తున్నారో …అదే గురుశిష్యుల సమావేశ ప్రయోజనమై ఉన్నది. గురు శిష్యులు ఇద్దరూ యోగ్యులైన వారైతే ఆ శిష్యుడు, అనేకమంది తదితరులు కూడా ఇటువంటి కైవల్య లక్షణమునకు పాత్రులు కాగలరు. అందుచేత మహాసమర్థులగు మీ గురు-శిష్య సమావేశం లోకకళ్యాణార్థమే అయి ఉన్నది.
ఇప్పుడు మీకొక విన్నపం చేస్తున్నాను. మాపై దయతో శ్రీరామచంద్రుని సమాధి నుండి మేలుకొలుపవలసినదిగా నా ప్రార్థన. హే వసిష్ఠ మహర్షీ ! మీరైతే ’పరమపదము’నందు పరిణతి చేత కృతకృత్యులై ఉన్నారు. మా సంగతి ఆ విధంగా లేదు. మేము ఇంకాకూడా లోకకార్యములందు ప్రవేశించియే ఉన్నాము. ప్రభూ ! నేను ఏ లోకకళ్యాణ కార్యక్రమమును ఉద్దేశించి ఈ అయోధ్యకు వచ్చానో, దేనికొరకై ఈ మహారాజు దశరథుని అతికష్టంగా స్వయంగా ప్రార్థించానో, దానిని ఒక్కసారి స్మరించండి. ఈ శ్రీరామచంద్రుని మీరే సమాధినుండి లేపవలసినదిగా మిమ్ములను అర్థిస్తున్నాను. మీరు సర్వజ్ఞులు. భూత భవిష్యత్ వర్తమానములు ఎఱిగినవారు. రాగరహితులు. సర్వదా ఆత్మానుభవం సంతరించుకున్న మహనీయులు. మీకు కొత్తగా విన్నవించుకోవలసిన పనేమున్నది? ఈ శ్రీరామచంద్రుడు సమాధి నుండి లేచిన తరువాత ఈ అవతార ప్రయోజనమైన దేవకార్యము లోకములకు మనం సంపాదించి పెట్టవలసి ఉన్నది.
ఈ వసిష్ఠ-రామ సంవాదము ముగించిన తరువాత నేను ఈ ఈ రామచంద్రుని నా సిద్ధాశ్రమానికి తీసుకు వెళ్ళటం జరుగుతుంది. ‘నేను ఉద్దేశించిన యాగమును సంరక్షించటం’ అనే మిషతో ఈతడు అనేక మంది లోకకంటకులగు దుష్టరాక్షసులను సంహరించనున్నాడు. ఆ తరువాత పరమ పవిత్రమగు తన పాదధూళి యొక్క స్పర్శచే అహల్యకు శాపవిమోచనం ప్రసాదిస్తాడు. ఆ తరవాత జనకుని సభలో ఇంద్రుని వలె ప్రవేశించి శివధనుస్సును విఱిచి సీతాదేవిని పరిణయమాడుతాడు. ఆ సీతారామ కళ్యాణం మనం చూచి తరించవలసిందే కదా!
ఆ తరువాత ఈతడు జమదగ్ని కుమారుడగు పరశురాముని ఎదుర్కొని ఆతని గతిని భంగం చేయగలడు. ఆ తరువాత పితృ పితామహప్రసాదితమైన ఈ అయోధ్యను పాలించటానికి అన్ని
Page:542
విధాలా అర్హత ఆర్జించుకుని ఉంటాడు. అప్పుడొక చమత్కారమైన మిషచే తండ్రి ఇచ్చిన మాటకోసం వనవాసం ఆశ్రయిస్తాడు. భార్య-సోదర సమేతుడై దండకారణ్యంలో ప్రవేశిస్తాడు. అక్కడ తనను శరణువేడవచ్చిన సజ్జనులను సంతోషపరిచే నిమిత్తం దుర్మార్గవృత్తులను ఆశ్రియించే అనేకమంది రాక్షస జనాన్ని సంహరిస్తాడు. అనేక ఆశ్రమములను, ఋషులను, మునులను, తీర్థాలను దర్శిస్తూ అనేక మంది జీవులకు తన దర్శనముచే ఆనందం కలిగిస్తాడు. అక్కడ మోక్షార్హులగు అనేక మంది భక్తజనులు ఈ శ్రీరాముని దర్శనం కొరకై సుదీర్ఘకాలంగా వేచియున్నారు కదా! ఆ తరువాత సీతాదేవి అపహరణం జరుగుతుంది. అట్టి సీతా వియోగ దుఃఖమును ప్రదర్శించి ఈ అవతార పురుషుడు ‘తన్నివారణము’ అనే మిషచే లోకబాధకుడగు రావణాసురుని బంధు-మిత్ర పరివార సమేతంగా హతం చేయనున్నాడు. ‘పరస్త్రీ వ్యామోహము కలవానికి వినాశనము తప్పదు’ దుష్టసంగము యొక్క దురవస్థను లోకములకు ప్రదర్శించనున్నాడు. అనంతరం ఇంద్రుని వరదానముచే యుద్ధంలో మృతి చెందినన వానరులు పునర్జీవులౌతారు. ఆ తరువాత సీతయొక్క అగ్ని ప్రవేశముచే విశుద్ధిని కోరినవాడై … శిష్టజనులందు తన ఉత్తమ చరిత్ర యొక్క మాననీయత్వము ప్రకటించగలడు. అప్పుడు అయోధ్యా రాజ్యాభిషిక్తుడౌతాడు. జీవన్ముక్తుడై, నిస్పృహుడై కూడా క్రియాకాండ పారాయణుడై ఈ అయోధ్యారాజ్యం ఏలగలడు. అనేక యజ్ఞయాగములను నిర్వర్తించి జ్ఞానము-కర్మల ఉభయముల సముచ్ఛయ రూపమగు గతిని లోకములకు ఆదర్శప్రాయమై ప్రదర్శించగలడు.
యైర్ ద్రష్టో, యైః స్మృతోవాపి, యైః శ్రుతో, బోధితస్తుయైః
సర్వావస్థాగతానాం తు జీవన్ముక్తిం ప్రదాస్యతి ॥
ఎవరీ రామచంద్రుని దర్శిస్తారో, ఎవరీతని చరిత్రను స్మరిస్తారో, వింటారో, ఎవరీతని చరిత్రను తదితరులకు బోధిస్తారో అట్టి భక్తజనులందరికీ ఈతడు వారి సర్వావస్థలయందునూ జీవన్ముక్తిని ప్రసాదించగలడు.
ఈ విధంగా ఈ అవతారమూర్తి శ్రీరామచంద్రుని వలన ఈ ముల్లోకముల యొక్క నా యొక్క కార్యము సంపూర్ణంగా నెరవేరగలదు.
నమోస్మై జితమేవైతే కో ప్యేవం చిరమేధతాం!
ఓ సర్వ సభికులారా! మీరంతా కూడా ఈ శ్రీరామచంద్రునికి నమస్కరించి తరించండి. ఈతని నమస్కరించినంత మాత్రం చేత మీరు ఈ సమస్త సంసారసాగరమును జయించి వేసినవారు కాగలరు. పురుషార్థములన్నీ వాటికవే సిద్ధించగలవు.
అంతేకాదు. మీలోని శ్రేష్ఠులగు వారు ఈ శ్రీరామచంద్రుని వలెనే చిరకాలం నిర్వికల్పసమాధి యందు ఆత్యంతికమైన విశ్రాంతిని, సుఖమును బడయగలరు. కనుక సమస్తజనులు ఈ శ్రీరామచంద్రుని ఆరాధించి మోక్షసుఖమును పొందెదరు గాక!
శ్రీవిశ్వామిత్రుని పరతత్త్వార్థ వాక్యములు వినిన ఆ సభలోని సిద్ధులు, వసిష్ఠుడు మొదలైన శ్రేష్ఠ యోగీంద్రులు … అందరూ కూడా శ్రీరామచంద్రుని కరచరణముల ధూళిని ఆదరంగా స్మరించారు.
Page:543
ఋషిగణం శ్రీరామచంద్రుని కథాక్రమమంతా తమ హృదయంతో దర్శించి, ఆతని గుణగుణములను పరవశించి తృప్తి పొందారు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రా! "ఈ శ్రీరామచంద్రుడు ఈ జన్మకు ముందు దేవుడా? మనుజుడా?” అనే విషయం శ్రోతలమగు మేమంతా చక్కగా గ్రహించే నిమిత్తం వచించండి. శ్రీవిశ్వామిత్ర మహర్షి :
అత్రైవ కురు విశ్వాసమ్ అయమ్ స పురుషః పరః విశ్వార్ధమ్ అధిత అంబోధిః గంభీరాగమ్ గోచరః
ఓ సభికులారా! మీరంతా ఈ శ్రీరామచంద్రునియందు ’ఈతడు సాక్షాత్ భగవంతుడే’… అని నిస్సంకోచంగా విశ్వాసం కలిగి ఉండండి.
ఎప్పుడైతే ఈ విశ్వం కొరకై పాల సముద్రాన్ని మథించాడో, ఎవని గురించి శ్రుతులన్నీ ఒక్క చోటికిజేరి ప్రతిపాదిస్తూ గానం చేస్తున్నాయో, అట్టి పరమపురుషుడగు సాక్షాత్ వాసుదేవుడే ఈతడు.
పరిపూర్ణపరానందః సమః శ్రీ వత్సలాంఛనః
సర్వేషాం ప్రాణినాం రామః ప్రదాతా సుప్రసాదితః ||
పరిపూర్ణ పరానంద స్వరూపుడు, సర్వసముడు, ‘శ్రీవత్సమణి’ మొదలైన మహత్తర చిహ్నములతో శోభితుడు, అగు ఈ శ్రీరామచంద్రుని ఎవరైతే తమతమ భక్తి-కర్మ-యోగ-జ్ఞానములచే ప్రసన్నం చేస్తారో, అట్టి ప్రాణులందరికీ ఈతడు పురుషార్థములన్నీ ప్రసాదిస్తున్నాడు.
అయం నిహన్తి కుపితః, సృజత్య అయమ్ అసత్సకాన్ విశ్వాదిర్, విశ్వజనకో, ధాతా, భర్తా, మహాసఖః ॥
ఈ రామచంద్రుడే క్రుద్ధుడైనప్పుడు సమస్తమును సంహరిస్తున్నాడు. మరల ఎప్పుడో ఎందుకో మిథ్యా పదార్థములచే ఈతడే ఇదంతా సృజిస్తున్నాడు. విశ్వమంతటికీ ఆది, జనకుడు, ధాత (ధరించువాడు) పాలకుడు, మహాసఖుడు ఈతడే!
నిర్మలమగు చిత్తము గలవారై ఎవరు ఆత్మానాత్మ విచారణచే నిస్సారము - అల్పము అగు ఈ సంసారముయొక్క కార్య కారణ సంబంధములు జయించి వేస్తున్నారో … అట్టి సంసారమును జయించిన వీతరాగులగు మహాత్ములు ప్రవేశించే విశాలానందసముద్రమే శ్రీరాముని స్వరూపం. ఈ రామానందసాగరమే సర్వసాధనముల అంతిమ ప్రయోజన ఫలం.
క్వచిన్ ముక్తఇవాత్మస్థః, క్వచిత్ తుర్యపదాభిదః, క్వచిత్ ప్రణీత ప్రకృతిః, క్వచిత్తస్ధః పుమానయమ్||
ఈతడే ఒకచోట పరజ్ఞాన సంయుక్తుడై ఆత్మస్థితిచే ముక్తుడై ఉంటున్నాడు. మరొకచోట చిదానంద ఘన స్వభావుడై ప్రకాశిస్తున్నాడు. ‘తురీయపదము’ అనబడు మహోన్నతమగు సర్వమును ఆక్రమించియున్నట్టి రూపమును అవధరిస్తున్నాడు. ఒకచోట అప్రమేయుడు, నిర్గుణుడు, అసంగుడు అయి ఉంటున్నాడు. ఇంతలోనే కావాలని మాయయొక్క నియంత అగుచున్నాడు.
Page:544
ఇంకా చమత్కారమేమంటే… ఒకచోట నిర్విషయుడుగా, మరొకచోట ఈ మాయకే రచయితగా, ఇంకొకచోట ఈ మాయకు బద్ధుడుగా అగుపిస్తున్నాడు.
అయం త్రయీమయో దేవః త్రైగుణ్య గహనాతిగః ! జయత్యంగేరయం షడ్భిః, వేదాత్మా, పురుషో అద్భుతః !
ఈతడే మూడు వేదములను ఆక్రమించియున్న మహత్పురుషుడగు భగవానుడు. ఈ విశ్వమంతా త్రిగుణముల వివిధ పాళ్ళ కలయిక మాత్రమే అయి ఉండగా, త్రిగుణములకు ఆవల ఏర్పడియున్న వేదాంత స్వరూపుడు ఈతడే. సృష్టి - స్థితి - లయ - శిక్ష - స్మృతి - కల్పములనబడే షడంగములతో శోభిల్లే నిత్యోదిత చైతన్య స్వరూపుడు. వేదాత్మ స్వరూపుడు, పారమార్థిక స్వరూపుడు, వేదప్రతిపాదిత స్వరూపుడు ఈ అద్భుత పురుషుడే.
అయం చతుర్భాహుః, అయం విశ్వస్రష్టా చతుర్ముఖః, అయిమేవ మహాదేవః, సంహూర్తా చ త్రిలోచనః ॥
చతుర్భాహువులతో ఈ ప్రపంచ మంతటినీ పరిపాలించే విష్ణుభగవాను డీతడే. ఈ ప్రపంచమునంతటినీ సృష్టించే చతుర్ముఖబ్రహ్మ కూడా ఈయనే! అంతేకాదు. ఈతడే త్రినేత్రుడగు మహేశ్వరుడై ఈ సృష్టి యొక్క సంహారం కూడా నిర్వర్తిస్తున్నాడు.
అజోయం జాయతే యోగాత్ జాగరూకః సదా మహాన్
భిభర్తి భగవానేతత్, విరూపో, విశ్వరూపవాన్॥
స్వతహాగా చూస్తే ఈయనకు జన్మాదులు లేవు. అయితే ఏం? తనయొక్క యోగమాయాశక్తి సంబంధంచేత జన్మించినవానివలె అవతరిస్తున్నాడు. ఈయనకు ’మోహనిద్ర’అనే ఆవరణ లేదు. అందుచేత ‘నిత్యజాగరూకుడు’ అనబడుచున్నారు. ఈయన వాస్తవానికి నామరూపరహితుడు. కానీ విశ్వరూపుడై సమస్తము యొక్క భారము వహిస్తున్నారు.
విజయో విక్రమేణేవ, సుపర్ణే ప్రకాశ ఇవ తేజసా, ప్రజ్ఞోత్కర్షః శ్రుతేనేవ సుపఠే నాయముహ్యతే ॥
వాక్ - మనస్సులకు ఈతడు అందనివాడు. మరి? ఈతడు ఆనందస్వరూపం అనుభవైకవేద్యమే. దృష్టాంతానికి …“ఈతడు పరాక్రమవంతుడురా!” అంటాం. కానీ పరాక్రమమును కళ్ళతో చూడగలమా? లేదు. సాధించిన విజయములను చూచి పరాక్రమం ఊహించుకుంటాం. అట్లాగే ప్రజ్ఞను చూడగలమా? లేదు. కానీ, ఒకని శాస్త్ర పఠనాదులను చూచి "ఈతడు ప్రజ్ఞావంతుడురా!” అని గుర్తించగలం.
అట్లాగే సమస్త విషములందలి ఉత్తమత్వమే ఈయన రూపం. అందుచేత ‘శ్రేష్ఠ పురుషుడు’ అని వేదజ్ఞులు దర్శనం చేస్తున్నారు.
అయం దశరధో ధన్యః సుతోయస్య పఠః పుమాన్ ! ధన్యః స దశకంఠోపి చిన్యశ్చిత్తేన యోమునా !
Page:545
ఇట్టి సాక్షాత్ పరమపురుషుని ఎవడైతే తన కుమారునిగా సంపాదించుకున్నాడో అట్టి ఈ దశరథ మహారాజు ధన్యుడు. అంతేకాదు. ఎవ్వడైతే ఈతనిని ‘ఈతడే నా శత్రువు’ అని తన చిత్తంలో అహర్నిశలూ చింతన చేయబోతున్నాడో… అట్టి దశకంఠుడగు రావణాసురుడు కూడా ధన్యుడే.
హాఁ! స్వర్గమమునా శూన్యం, హా పాతాలాది హాగతః !
తస్యాగమాత్ అయం లోకో మధ్యమః శ్రేష్ఠతాం గతః ॥
ఆహా! మధ్యదగు ఈ భూలోకంలో ఈ శ్రీరామచంద్రమూర్తి అవతరించటం చేత ఈ భూలోకమంతా శ్రేష్ఠత్వం సంతరించుకోగా… స్వర్గ, పాతాళ లోకాలు వెలవెలపోతున్నాయి కదా!
రామ ఇత్యవతీర్ణోయమ్ అర్ణవాన్తిశయః పుమాన్,
చిదానందఘనో రామః పరమాత్మాయమవ్యయః II
క్షీర సముద్రంలో (సత్యసాగరంలో) శయనించియుండే ఆ విష్ణు భగవానుడే ఇక్కడ దశరథుని కుమారుడగు శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. ఈయనే చిదానందఘనుడు, నాశనరహితుడు అగు పరమాత్మ అయి ఉన్నాడు.
నిగృహీతేన్టియగ్రామా రామం జానన్తి యోగినః
వయం త్వవరమేవాస్య రూపం రూపయితుం క్షమాః ||
ఇంద్రియసమూహములను జయించిన యోగులు మాత్రమే ఈ శ్రీరామచంద్రుని యథార్థరూపం ఎఱుగగలుగుతారు. ఓ వసిష్ఠ మహర్షీ! ఈతని ఇతఃపూర్వరూపం ఏమిటో మీరు, నేను ఎఱిగియే ఉన్నాం కదా! అందుచే నిరూపించుటకు సమర్థులమైయున్నాం.
హే వసిష్ఠ మహర్షీ! భగవంతుడగు ఆ మహావిష్ణువు రఘువంశంలో జన్మించి రఘువంశమును, సర్వలోకములను పావనం చేయబోతున్నాడని మనిద్దరం పెద్దలు చెప్పుకోగా వినియే ఉన్నాము కదా! కనుక ఈతనిని ఇప్పుడు వ్యవహారపరునిగా చేయవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.
శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ విధంగా లోకహితైషుడగు విశ్వామిత్ర మహర్షి రామతత్త్వ మాహాత్మ్యాన్ని గానం చేసి, శ్రీరామచంద్రుని పునర్వ్యవహారపరునిగా చేయమని వసిష్ఠ మునీంద్రులను అభ్యర్థించి మౌనం వహించారు. అప్పుడు శ్రీ వసిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ప్రేమాస్పదమైన చూపులతో అభినందించి రామచంద్రునివైపు చూచారు.
శ్రీవసిష్ఠ మహర్షి :
రామ! రామ! మహాబాహో! మహా పురుషా! చిన్మయా! నాయం విశ్రాంతి కాలోహి, లోకానందకరో భవ ॥
Page:546
ఓ రామచంద్రా! రామయ్యా! హే మహాబాహో! చిన్మయ స్వరూపుడగు ఓ మహాపురుషా! ఇది లోకములను మరచి ఆత్మయందు విశ్రాంతి తీసుకుని ఉండే సమయం కాదయ్యా! ఈ లోకాలన్నీ తమ బాధనుండి విముక్తి పొందటానికి నిన్ను శరణువేడుచున్నాయి. లే! లేచి లోకము లన్నిటికీ ఆనందకారకుడవు, “రమయతేతి రామా” అయ్యే సమయమిది. ఈ లోకముల క్షేమం కొరకే గదా, నీవు అవతరించావు! ఈ లోకములకు సంబంధించిన సాత్విక సంసారము ఇంకా మిగిలి ఉన్న యోగులకు స్థిరసమాధి సమయోచితం కాదు. కాబట్టి నశ్వరములగు (కాలముచే రహితం కాబోయే) ఈ రాజ్యాది వ్యవహారములు నీవింకా కొంతకాలం నిర్వర్తించవలసియున్నది. దైవ కార్యము కొరకై అవతరించిన నీవు బాగుగా దైవకార్యము నిర్వర్తించి, ఆ తరువాత సమాధిని ఆశ్రయించి సుఖుడవై ఉండవచ్చునని నా ఈ ప్రార్థన.
శ్రీవసిష్ఠ మునీంద్రుని ఈ పలుకులు రామచంద్రుని చెవులలో ప్రవేశించనే లేదు. అతడు అట్లే నిర్వికల్పసమాధియందు బ్రహ్మముతోటి ఏకత్వము కొనసాగిస్తూ బదులు పలకలేదు. అప్పుడు వసిష్ఠ మహర్షి కనులు మూసుకొని మనోయోగ వైభవంచేత రామచంద్రుని సుషుమ్నానాడిలో ప్రవేశించారు. సుషుమ్నానాడి ద్వారా మెల్లమెల్లగా శ్రీరామచంద్రుని హృదయంలో సమీపించి అక్కడ తన జాగృత బోధనను కొనసాగించారు. అప్పటికి రామచంద్రుని హృదయాంతరంగము యొక్క అభ్యంతర విభాగం సద్గురువగు శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క మేలుకొలుపుకు స్పందించింది. మొట్టమొదట క్రమరీతిగా ప్రాణ - మనస్సులు ఆ ప్రాణాదుల బీజరూపమైనట్టి ’ఆధారశక్తి’యందు ఆవిర్భావమైనాయి. క్రమక్రమంగా ప్రకాశరూపుడగు ‘జీవుడు’ రూపుదిద్దుకున్నాడు. అతడు ’అహం’ అను వాహనం ద్వారా ప్రాణముల సహాయంతో సమస్త నాడీ మండలములలో ప్రవేశమునకు ఉపక్రమించాడు. నెమ్మది నెమ్మదిగా అట్లు ప్రవేశించుచుండగా జ్ఞాన కర్మేంద్రియములు క్రమరీతిలో పరిపోషించబడ్డాయి.
కొద్ది క్షణములిట్లు జరిగిన తరువాత శ్రీరాముడు మెలమెల్లగా కనులు తెరిచాడు. వసిష్ఠుడు మొదలైన ముఖ్య విద్వాంసుల వైపు చూచాడు. సర్వ అభిలాషలు వర్ణించియున్నవాడై, కృతకృత్యముల గురించి (నిర్వర్తించియున్న నిర్వర్తించబోయే ఆయా కృత్యముల గురించి) కించిత్ కూడా విచారవృత్తి లేనివాడై మహర్షి వాక్యములు వినటానికి సంసిద్ధుడైనాడు. అప్పుడు ‘రామచంద్రా! రామయ్యా! మహాబాహూ!’ -అని వసిష్ఠ మహర్షి కొద్ది క్షణముల క్రితం పలికిన వాక్యాలన్నీ ఒక్కటొక్కటిగా అతని చెవులకు సోకాయి. “అవును. గురువాక్యములు అనుల్లంఘనీయములు కదా!” అని అనుకున్నాడు. అప్పుడు తండ్రి, బంధువులు పలుకుచున్న అభ్యర్థన వాక్యాలు కూడా విన్నాడు.
శ్రీరాముడు :
న విధేః, న నిషేధస్య త్వత్ప్రసాదాత్ అయం ప్రభుః ! తథాపి తవవాక్యం తు కరణీయం హి సర్వదా॥
Page:547
హే మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! మీ అనుగ్రహం చేత ఈ ‘రాముడు’ అని పిలువబడే జీవుడు ఎట్టి విధి - నిషేధములకు అందనివాడై స్వయంగా సాక్షాత్ ప్రభురూపుడైనాడు. అయినప్పటికీ తమ వాక్యము ఎప్పటికీ అనుసరణీయమే!
వేదాగమపురాణేషు స్మృతిష్వపి మహామునే,
గురువాక్యం విధిః ప్రోక్తో నిషేధస్తద్విపర్యయః ॥ ||
జీవుని క్షేమం కోరి ఏర్పడియున్న వేద శాస్త్ర-పురాణ- స్మృత్యాదులచే ‘గురువాక్యములు’ పాలించటమే విధి. గురువు యొక్క అనుజ్ఞలను అతిక్రమించటం నిషేధం…’ అని చెప్పుచున్నాయి కదా! కనుక మీ ఆజ్ఞ నాకు సర్వదా శిరోధార్యం.
ఇట్లు పలికి సర్వాత్మకుడు, కృపానిధి అగు ఆ శ్రీరామచంద్రుడు లేచి నిలుచున్నాడు. శ్రీ వసిష్ఠ మహర్షిని సమీపించాడు. ఆయన కరచరణములను తన నుదుటితో స్పృశిస్తూ సాష్టాంగదండ ప్రణామం సమర్పించాడు. ఆ తరువాత ఒక్కసారి సభనంతా అమృత దృక్కులతో చూచాడు. శ్రీరాముడు :
సర్వే శృణుత భద్రం వో నిశ్చయం, నః సునిశ్చితం! ఆత్మజ్ఞానాత్ పరం నాస్తి! గురోరపి చ తద్విదః !
ఓ సర్వ సభికులారా! మీ కందరికీ శుభమగుగాక! సర్వ నిశ్చయములలో అత్యంత సునిశ్చయమైన ఒకానొక వాక్యం చెప్పుచున్నాను. వినండి. ఆత్మజ్ఞానము కంటే, దానిని ఎఱిగిన సద్గురువు కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఉండబోదు.
అప్పుడు సభలో వేంచేసియున్న సిద్ధులంతా ఒక్కసారి నిలబడి శ్రీరామచంద్రుని మహిమను
గానం చేశారు.
సిద్ధులు : ఓ వసిష్ఠ రామచంద్రులారా! మీ అనుగ్రహంచేత ఈ సభలో పాల్గొన్న మేమంతా ‘ఆత్మభావన’ అను మహత్తర స్థితిని పొందాం. తమ సంవాదం కొనసాగుచుండగా అది వాక్కుతో ప్రకటించలేనంతగా దృఢత్వం పొందింది. ఓ రామచంద్రా! మీ ఈ అవతారము అనేకమంది భక్తజనులకు మోక్షమార్గమై వెలుగొందుగాక! మీకు సర్వదా శుభమగుగాక! మీ కర-చరణ స్మరణము యుగయుగాలుగా భక్త జనులకు కొంగు బంగారమై, మోక్షమార్గ సౌలభ్యమై, ధైర్య స్థైర్య ప్రసాదితమై తేజరిల్లునుగాక! క్రూరస్వభావులగు అనేకమంది రాక్షస జనులు తమ క్రౌర్యమును రామబాణమునకు సమర్పించి పవిత్రులగుదురుగాక!
ఇట్లు అనేక స్తోత్రములు చేస్తూ రామచంద్రునిపై, సద్గురువగు వసిష్ఠునిపై పూలవర్షం
కురిపించారు.
❖
ఓ భరద్వాజా! ఈ విధంగా నిర్వాణ ప్రకరణ పూర్వార్ధ కథనమంతా నీకు తెలియజేశాను.
Page:548
శ్రీరామచంద్రుని ఉద్దేశించిన సిద్ధమునియగు వసిష్ఠ మహర్షి ప్రవచితమైన వచనసమూహమగు రత్నమాల విచిత్రమైన ప్రభావం కలిగియున్నది. ఇది సమస్త కవికులమునకు, యోగులకు సేవించుటకు యోగ్యమైయున్నది.
పరమ గురువు యొక్క కటాక్షం చేత ఇది పఠించువానికి సులభమైన మోక్షమార్గమై పరిఢవిల్లుగాక!
య ఇమం శృణుయాత్ నిత్యం విధిం రామవసిష్ఠయోః సర్వావస్థోపి శ్రవణాన్ ముచ్యతే, బ్రహ్మ గచ్ఛతి॥
ఎవరీ, ’శ్రీ వసిష్ఠ శ్రీరామచంద్రుల సంవాదము’ను ప్రతిదినం శ్రవణం చేస్తారో, శ్రవణమాత్రంచేత అట్టివారి రాగాది సర్వదోషములు అతి సులభంగా తొలగుతాయి. ఎట్టివారైనా, ఏ తరగతి వారైనా సరే, సర్వ దోషములనుండి విడివడి శాంతి మొదలైన ఉత్తమ గుణములు ప్రాప్తించుకున్నవారై బ్రహ్మమే తమ స్వరూపంగా దర్శనానుభవం పొందగలరు.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ||
శ్రీ వసిష్ఠ - విశ్వామిత్ర - వాల్మీకి - నారదాది మహర్షయో, మహానుభావో న తామః ||