రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
వసిష్ఠ - రామ సంవాదము
నిర్వాణ ప్రకరణం (ఉత్తరార్ధం)
Page:551
1. ఉత్తరార్ధ ప్రథమ విభాగ ప్రకరణ పరిచయము
శ్రీరాముడు : హే వసిష్ఠ మహర్షీ ! ముముక్షువ్యవహార - స్థితి - ఉపశమన - నిర్వాణ (పుర్వార్ధం) ప్రకరణాల వరకు మీరు మహత్తరమైన ఆత్మనిర్వచన సంబంధమైన అనేక విశేషాలు మాకు ప్రబోధించారు. మీ ప్రవచనం మహాద్భుతమైనదనటంలో సందేహమే లేదు.
మీ అమృతవాక్కులు ఇంకా ఆస్వాదించాలని, మోక్షసాధకులగు మహనీయులు మరికొన్ని కథన విశేషాలు వినాలని మా ఉత్సుకత మరింతగా కొనసాగుచూనే ఉన్నది. మన ఈ సంవాదము మరిన్ని తాత్త్విక విశేషాలు లోకములకు ప్రకటించటానికి వీలుగా కొన్ని ప్రశ్నలతో ప్రారంభించితే
బాగుంటుందని నా మనవి.
శ్రీ వసిష్ఠ మహర్షి : మంచిది. అట్లే అగుగాక !
శ్రీరాముడు: ఈ జీవుడు బ్రహ్మానందానుభూతికి అర్హత సంపాదించుకోవటానికిగాను రెండు అతి ముఖ్యమైన సందేశాలు మాకు గతానుగతంగా ప్రసాదిస్తూ వచ్చారు- 1. నైష్కర్మ్య సిద్ధి; 2. అహంకార కల్పనా త్యాజ్యం…
అయితే మహర్షీ! “నైష్కర్మ్యము (Non Activity)” చేతను, దేహాదులందు ఏర్పడే అహంకార కల్పనను త్యజించటంచేతను ఈ దేహం శీఘ్రంగా నేలవ్రాలే అవకాశం లేదంటారా? అట్లా అయితే జీవించటం అనునది ఎట్లా సిద్ధిస్తుంది? అట్టి సిద్ధి- త్యాజ్యము ఆశ్రయించినవాడు అనివార్యమగు లోకవ్యవహారములు నిర్వర్తించటం ఎట్లా? జీవిస్తూ ఉండగా వ్యవహార త్యాజ్యం - కల్పనాత్యాగం అనేది కుదురుతాయా? కుదిరినప్పటికీ లోకవ్యవహారం దృష్ట్యా అది ఉచితమే నంటారా? కల్పనాత్యాగికి జీవితం దుర్భరం కాదా?
శ్రీ వసిష్ఠ మహార్షి : ఓ రామచంద్రా ! జీవించే వానికే కల్పనలు అనేది ఉంటుంది. జీవించనివానికి కల్పనలనేది ఏం ఉంటుంది? కాబట్టి జీవించువానికే కల్పనాత్యాగం అనేది తగుతుంది.
అయితే… అ అహంభావ కల్పన గురించి మున్ముందుగా ప్రస్తావించుకుందాం, విను.
పరిచ్ఛిన్నమైన ఈ దేహదులపట్ల “ఈ శరీరమే నా స్వరూపం“ అను అభిప్రాయం కలిగి ఉండడం “అహంభావన” అని చెప్పబడుతూ ఉంటోంది. ఒకడు తనపట్ల తదితరులపట్ల కూడా అపరిచ్ఛిన్నమగు బ్రహ్మ భావన నిర్వర్తిస్తూ ఉంటే అది “కల్పనాత్యాగం” అని అంటున్నారు. అదియే, “నిరహంకారం” కూడా! కల్పన గురించి పరిశోధించియున్న విజ్ఞులు “పరిచ్ఛిన్నమైనట్లు కనిపిస్తున్న
Page:552
ఈ వేరువేరు దేహులను చూస్తున్నప్పుడు - నేను వేరు, అతను వేరు, నీవు వేరు - అను రూపంలో ఉండే పరిచ్ఛిన్న భావనను ఆశ్రయించటమే అహంకారం. అంతటా ఏకమైయున్న బ్రహ్మాకాశము యొక్క సత్తాను భావించుటను “కల్పనాత్యాగం” అని అంటున్నారు.
సంకల్పము అంటే దేహము మొదలైన పరిచ్ఛిన్నమైన దృశ్యవస్తువులను చూస్తున్నప్పుడు “ఈ కనబడే రీతిగా ఇవన్నీ సత్యమే” అను రూపమైన అభిమానము.
సంకల్పత్యాగం అంటే ఈ కనబడే వస్తువులు, దేహాలు పంచభూతాల వికారమేకదా? కాబట్టి వేరు - వేరు అనబడేదంతా సత్యం కాదు. సమస్తము బ్రహ్మాకాశమాత్రమే … అనే ఎఱుక కలిగి ఉండటం. ఇంకొక విధంగా చెప్పాలంటే… పదార్థాల పట్ల ఏర్పడే అనురాగపూర్వకమైన స్మరణయే సంకల్పము. అట్టి స్మరణ (లేక, విషయ చింతన) లేనప్పుడు, ఆ స్థితిని “మోక్షం” అని పిలుస్తున్నారు.
ఈ ’స్మరణ’ అనేది ఇతఃపూర్వం చూచిన-చూడని, అనుభవించిన-అనుభవించని విషయాల పట్ల కూడా ఏర్పడి ఉండటం జరుగుతోంది. అట్లా అనుభవించిన అనుభవించని… ఉభయ విషయాలను అటుండనిచ్చి, బ్రహ్మం కంటే అన్యమైన సమస్త వృత్తులను శీఘ్రంగా విస్మరించి, బ్రహ్మంనందే లీనుడై ఉండేవాడు ‘మోక్ష స్వరూపుడు’ అగుచున్నాడు. కనుక ఓ రామచంద్రా! అంతరంగంలో సర్వదృశ్యవ్యవహారములూ, వాటి వాటి ఏక అనేకత్వాదులు విస్మరించి ఉండు. అయితే ఇక ఈ అవశ్యం నిర్వర్తించివలసి ఉన్న కార్యక్రమాల విషయ మంటావా? సగం నిద్రిస్తున్న బాలునివలె బ్రహ్మమునకు అనన్యమగు భావనతో అంతర్వృత్తులను ఆయా పనులలో ఉపయోగించే ఉపకరణములవలె గమనిస్తూ ఉండు. నీవు దేనికీ కారణం కాకుండానే, ఆయా వృత్తులే నిర్వర్తించ బడే క్రియాదులకు కారణమై ఉండుగాక! నీవు వాటికి కారణం కావద్దు. సంస్కారములకు కూడా ఆవల గల నీ స్వస్వరూపం అవధరించి ఉండటం అభ్యసిస్తూ ఉండు. కుమ్మరివాని చక్రం ఎట్లా తిరుగుతుందో అట్లే సంస్కారాలు జగత్రియలను నిర్వర్తించునుగాక! నీవు ఆ సర్వక్రియలకు సర్వదా అతీత్వం వహించి ఉండు. వాసనారహితుడవై నిర్మల చిత్తమును సంతరించుకున్నవాడవై, ఆ నీ చిత్తం యొక్క ఒక అల్ప విభాగమును ఒక పరికరమాత్రంగా గ్రహించి ప్రవాహ పతితములగు ఆయా కార్యాలను నిర్వర్తించు. ఎచ్చటైతే సమస్త బ్రహ్మాండం యొక్క ఆధిపత్యం కూడా తృణ ప్రాయంగా (గడ్డిపరకతో సమానంగా) గోచరిస్తుందో… అట్టి పరమపదం సంకల్పరహితుడవై ఉన్నంత మాత్రంచేతనే లభించగలదని గుర్తు చేస్తున్నాను.
“సంకల్పరహితుడనై ఉంటే ఈ ప్రపంచంలో ఆయా క్రియలు నిర్వర్తించటమెట్లా?”…అని ఎవరైనా అనుకుంటారేమో! ఓ జనులారా! ఒక బాటసారి కాళ్ళు ప్రత్యేకమైన సంకల్పం లేకుండానే వెళ్ళాలనుకున్న చోటువైపుగా బాటలో అడుగులు వేయటం లేదా? అట్లాగే ఎవరైనా సరే… ప్రవాహ పతితములగు ఈ జగద్వ్యవహారాలన్నీ కూడా సంకల్పరహితంగానే నిర్వర్తించవచ్చునని నా మనవి.
జాగ్రత్తులో కొంతవరకు సంకల్పితంగా ఊపిరి పీలుస్తున్నావు. మరి స్వప్న దశలోనో?… అసంకల్పితంగా ఊపిరి పీలుస్తున్నావు కదా! "అట్లాగే నా ఇచ్ఛచే నేను జీవిస్తున్నాను. ఇచ్చచే
Page:553
కర్మలు నిర్వర్తిస్తున్నాను” …అనే ధ్యాసను శాంతమునందు లయం చేసివేయి. అసంకల్పితంగా కల్పనారూపమగు ఈ దృశ్య జగత్తు నందు క్రీడగా - లీలగా విహరించు.
ఒక గడ్డిమొక్క ఉన్నది. అది స్వతహాగా ఎట్టి సంకల్పము లేకుండానే గాలివాటుకు కదలి ప్రక్కమొక్కలతో సంయోగ వియోగ చేష్టలు నిర్వర్తిస్తోంది కదా! అట్లాగే రామచంద్రా! నీవు కూడా సంకల్పరహితుడవై, సుఖ దుఃఖములకు సంబంధించిన ఎట్టి భావన చేయకుండానే ప్రవాహపతిత కార్యములను నిర్వర్తించమని మరల గుర్తుచేస్తున్నాను. తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు తమయందు ఎట్టి రస వికారాలు లేకుండానే ప్రేక్షకులకు మాత్రం శృంగారం మొదలైన భావనలను కలుగజేస్తున్నాయి చూచావా? అట్లాగే ఈ అవశ్య కర్తవ్యాల పట్ల - అంతరంగంలో శృంగార సుఖ -దుఃఖాది రసభావనలు పెంపొందించుకోకుండానే లోకానుకూలంగా, సందర్భానుకూలంగా వ్యవహరించు. ఈ జగత్తును ఒక గొప్ప, సుదీర్ఘ నాటక సన్నివేశంగా ఆస్వాదించు.
ఊర్ధ్వబాహుః విరౌమ్యేష! న చ కశ్చిత్ శృణోతి మే । అసంకల్పః పరంశ్రేయః! స కిమ్ అంతర్ న భావ్యతే ||
నేను చేతులెత్తి ఊర్ధ్వ స్వరంతో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఈ జనులు నా ఈ వాక్యాలు ఎందుకో తగినంతగా వినిపించుకోవటమే లేదే! ఎట్టి సంకల్పములు ప్రవేశించనీయకుండా అంతరంగమున మౌనం వహించి ఉండటమే పరమశ్రేయోదాయకమగు స్థితి. అట్టి సంకల్పరాహిత్యాన్ని అంతరంలో ఎందుకు భావన చేయరాదు చెప్పు? ఆహా! ఈ మోహం యొక్క గొప్పతనం ఏమని చెప్పాలి? సర్వ దుఃఖాలను హరించగలిగినట్టి ఆత్మ విచారణ అను చింతామణిని ప్రతి ఒక్కరు తమలోనే ఉంచుకొని అద్దానిని వదలి ఈ జనులు సంకల్పాలలో ప్రవేశించి అనేక ఉపాధులతో గొప్ప సంచారం చేస్తున్నారే!
దృశ్య-దర్శన రహితమగు ఆత్మతత్త్వమే ’అసంకల్పం’ అను దాని రూపం. అట్టి సంకల్ప రహితమగు స్వస్వరూపంతో తన్మయులై ఉండటం మాత్రంచేత పరమశ్రేయస్సు లభించగలదని ప్రకటిస్తున్నాను. అట్టి ఆత్మీస్థితి ఎవరికి వారే సముపార్జించుకోవాలి గాని, ఆ అనుభవం ఒకరికి మరొకరు ఎట్లా అందించగలరు? శాస్త్రములు - గురుస్థానమున గల మేము అట్టి అంతర అసంకల్ప సామ్రాజ్యమును గుర్తుచేస్తున్నాము. అంతవరకే మా పాత్ర!
అందుచేత రామా! నిద్రిస్తున్నవానికి జగత్ లేనట్లు సర్వకర్మఫలముల పట్ల పూర్ణమగు ఉదాసీనతను అంతరంగంలో వహించి అటుపై ఆయా ప్రవాహపతిత కార్యములను నిర్వర్తించేవానికి ఈ 14 లోకాలు ఆటవస్తువు వంటివి అవుతాయి. ఓ రామచంద్రా! సమస్త ఇంద్రియ విషయాలు నీకు రసరహితంగా కన్పట్టుగాక! హేమంత ఋతువులో పూతీగ ఉంటుంది గాని పూలు పూయవు చూచావా? అట్లా ఇవన్నీ ఆకార మాత్రాలేనని నీచే గ్రహించబడుగాక! నీవు జ్ఞాన సూర్యుని ఆశ్రయించి జ్ఞాన రసం మాత్రను ఆస్వాదించు. ఇక ఈ నీ యొక్క - తదితరుల యొక్క శరీరాల విషయమేమిటంటావా? యంత్రపుబొమ్మలు భావాభావాలు లేకుండా కదులుతాయి. చూచావా? ఈ దేహాలు కూడా ఆయా వివిధ భావాభావ-గుణ-నిర్గుణ” మిశ్రమాలచే తయారుచేయ బడుచున్నాయి.
Page:554
పంచకోశాలలో (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) ప్రతిబింబించే చిదాభాసుడు,
పంచప్రాణములు - మనస్సు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన - సప్రాణములు), 3. జ్ఞానేంద్రియ వర్గము (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు),
కర్మేంద్రియ వర్గము (చెవులు, చర్మము, కళ్ళు, నోరు, ముక్కు),
అంతఃకరణచతుష్టయం (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము),
శరీర వర్గము (స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు)…
ఈ ఆరు మిశ్రమాలతో తయారయిన సమ్మిళిత వస్తువే ఈ దేహము.
ఈ ఇంద్రియాలు స్వభావసిద్ధంగా బాహ్యరసాస్వాదనమునందు ప్రవృత్తములై ఉంటున్నాయి కదా! వీటిని జీవుని యొక్క ఉనికికే కారణమై ఉన్న భూమానందరూప చైతన్యరసంచే నింపి ఉంచాలి. బ్రహ్మానందమే ఈ సర్వరూప దృశ్య ప్రదర్శనంగా అనుక్షణికంగా ఆస్వాదించాలి. శ్రీరాముడు: మహార్షీ! ఈ ఇంద్రియాలు స్వభావ సిద్ధంగా ఆయా విషయాలందు ప్రవేశిస్తూనే ఉంటాయి. కదా! కనులు చూస్తునే ఉంటాయి. చెవులు వింటూనే ఉంటాయి. విషయభోగాలు కూడా ఈ జీవుని ఏదో రూపంలో తప్పక సమీపిస్తునే ఉంటాయి. మరి విషయ రాహిత్యమనేది జీవించి ఉన్నంత వరకూ ఎట్లా కుదురుతుంది ?
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును. దేహమంటేనే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు. అయితే “ఇంద్రియాలను స్వయత్నం చేత ఇంద్రియవిషయాల నుండి నివారించటం” అనగా ఏమో వివరిస్తాను. సూక్ష్మగ్రాహివై వినుఇంద్రియములను ఇంద్రియ విషయములపై వినియోగించు సందర్భంలో ’ఇష్టం - - అయిష్టం’ అనే రూపంలో ఒకానొక ‘వృత్తి’ అంతరంగంలో ఏర్పడుతుంది. ఆ వృత్తియే క్రమంగా (అనేకసార్లు ఇష్టం కలిగి ఉండటంచేత) ‘యా వృత్తి’ (Habituated Avocation) గాను, సంస్కారాలుగాను, చిత్త ప్రవృత్తిగాను రూపుదిద్దుకొంటోంది. కనుక ఇంద్రియ జన్యమైన విషయరసమునందు నీవు ‘వృత్తి’ (లేక) ‘అనురాగం’ కలిగి ఉండకపోతే… ఇకప్పుడు నీవు విషయభోగం పొందినా, పొందకున్నా సంసారం యొక్క అనర్థం నీ పట్ల శమించియే ఉంటుంది. వృత్తి యొక్క ఉత్పత్తి స్థానం ‘సంకల్పం’ అయి ఉన్నది. కనుక సంకల్పరహితుడవై, ప్రసరిస్తున్నప్పుడు తారసపడే వస్తువుల పట్ల వాయువు ఎట్టి భావన పొందనట్లు, దహిస్తున్నప్పుడు అగ్ని ఎట్టి ఇష్టాయిష్టములు పొందనట్లు, యంత్రం పని చేస్తున్నప్పుడు లాభాలాభాల ప్రవృత్తి కలిగి ఉండనట్లు, జలం ఎట్టి భావవికారాలు పొందనట్లు, నీవు కూడా ఉండు. ఈ జీవుడు ప్రవాహపతిత కర్మలందు అధ్యస్తమై ఉన్నప్పుడు “నేనే వీటికి కర్తను” అను రూపంలో ఉండే కర్తృత్వ వాసన లేకపోవటమే ‘జన్మ’ అనే జ్వరానికి గొప్ప నివారణోపాయమై ఉన్నది. “నేను జన్మించువాడను” అను భ్రమ తొలగాలంటే జన్మలకు అతీతం - అప్రమేయం అగు స్వస్వరూపం ఆస్వాదించాలంటే “కర్తృత్వభ్రమ” ముందుగా తొలగాలి.
Page:555
ఓ ప్రియ జనులారా! మీలో ప్రతి ఒక్కరు “విషయరస - అనురాగ నివృత్తస్థితికి సర్వదా అర్హులే! వాసనారహితులై సంకల్పవర్జితులై ఒక చక్రం వలె భ్రమణం పొందుతూ ఆయా వస్తువులను తాకుచున్నట్లు నిజకర్మలందు చేష్టలను సల్పుచూనే మెల్లమెల్లగా కర్మఫలం నందు గాని, కర్మఫల త్యాగం నందు గాని ఆసక్తి ఉండకుండు గాక. కర్మలను త్యజించండి, లేక ఆశ్రయించండి. అయితే ఆసక్తిని త్యజించండి. కర్మఫలాసక్తి లేనప్పుడు కర్మలను త్యజించినా, ఆశ్రయించినా అందులో మీ పట్ల విశేషమేమీ ఉండదని గ్రహించండి.
బహునాత్ర కిముక్తేన, సంక్షేపాత్ ఇదమ్ ఉచ్యతే | సంకల్పనం మనోబంధః! తదభావో విముక్తతా ॥
ఈ విషయమై మనము పెద్దగా చెప్పుకోవాల్సిన పనేమీలేదు. సంక్షిప్తంగా ఒక్కమాట చెప్పుచున్నాను, విను- సంకల్పమే మనస్సు యొక్క బంధం. అట్టి సంకల్పం లేకపోవటమే ముక్తి. నేహకార్యం, న వా అకార్యమస్తి కించిన్, న కుత్రచిత్
సర్వం శివమ్, అజమ్, శాంతం, అనంతం ప్రాగ్వదాస్యతామ్ ||
ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా “చేయతగినది - చేయతగనిది"… అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఈ సమస్తం శివమై - అజమై - - శాంతమై - అనంతరూపమైనట్టి బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా! కాబట్టి ఓ రామచంద్రా! ఈ జగత్తు నీ పట్ల ఏర్పడక ముందే ఏ విధంగా ఆత్మ స్వరూపుడవై ఉన్నావో ఇప్పుడు కూడా అట్లే ఆత్మారాముడనై నిరభ్యంతరంగా సర్వత్రా స్థితి కలిగి ఉండు. సమస్త కర్మలందును నిష్క్రియమగు బ్రహ్మతత్త్వమును గాంచు. నిష్క్రియమగు బ్రహ్మము నందే ఈ అవశ్యకర్తవ్యములన్నిటినీ గాంచుచుండు. యథార్థచిద్రూపుడవై శాంతముగను, శివ రూపముగాను సుఖస్వరూపుడవుగాను సర్వత్రా ఏర్పడి ఉండు.
2. ‘యోగం’ అంటే ఏమిటి ?
దృశ్య-దర్శనాతీతమగు ఆత్మతత్త్వమును అనుసంధానం చేయటమే ‘యోగము’ అను శబ్దము ఉద్దేశిస్తున్నదని గ్రహించు. అదియే ‘స్వాభావికం - అకృత్రిమం’ అగు చిత్తక్షయం కూడా! కాబట్టి ఆత్మయందు ఎప్పటియట్లే తన్మయుడవై ఆత్మారాముడవై వెలయుము. ప్రతిఒక్క జీవుని ఆత్మరూపం సమమై, శాంతమై, శివమై, సూక్ష్మమై, ద్వైతైక్య వర్ణితమై, సర్వవ్యాపకమై అనంతమై, సమస్తమై, సమస్తానికి పరమై పరమశుద్ధమైయున్నది. అట్టి ఆత్మరూపమునకు ఎవడు, ఎచ్చట, ఎట్లా భేదాన్ని ఆపాదించగలడు? ఓ రామచంద్రా! ఎడారి ఇసుకలో గడ్డి మొలుస్తుందా? అట్లాగే నీ నిర్మల ఆత్మ స్వభావంలో ‘సంకల్పం’ అనునది ఉదయించదు. ఒకవేళ ఉదయించినా అది లీలా (క్రీడా) మాత్రమే.
‘ఇచ్ఛ’ (అభినివేశం) ఉన్నప్పుడే సంకల్పం ఉన్నట్లని గ్రహించు. సంకల్పరహితుడగు శాంత పురుషుడు తాను జీవించుచుండటంచేతగాని, జీవించకుండుటచేతగాని, ఈ ప్రపంచంలో ఏదైనా
Page:556
కార్యం నిర్వర్తించుట చేతగాని, నిర్వర్తించకుండుట చేతగాని ఎట్టి ప్రయోజన - నిష్ప్రయోజనాలనూ గాంచడు. నీ అంతఃకరణము “ఇది కర్మ - అది అకర్మ" అనే ఉభయభావాలు శమించి ఉండును గాక! అనివార్యములగుచున్న ఉభయ స్థితుల పట్ల నిరంతరం ‘ఆత్మానుభవము’ అనే అభేదస్థితిని నీ అంతరంగము సంతరించుకొనుగాక! ఆత్మారాముడవగు నీకు కర్మ - కర్తృత్వము - భోక్తృత్వము అకర్మ …ఇవేవీ ఆపాదించబడజాలకుండును గాక !
ఓ రామచంద్రా! ఎవరికైనా సరే, ఈ దేహాదులందు “అహం - మమ " అనే అభిమానం ఉన్నదా… ఇక ఆ జీవుని దుఃఖాదులు తొలగే అవకాశమే లేదు. దేహాదులందు ఆత్మాభిమానం లేని వాడు ముక్తికి అత్యంత వేగంగా అర్హుడగుచున్నాడు.
ఓ సర్వజనులారా! ఇట్లు 1. దేహాభిమానం, 2. దేహాభిమానరాహిత్యం… అను ఈ రెండిటిలో మీకు ఏది శ్రేయోదాయకమో పరిశీలించి ఆపై అద్దానిని ఆశ్రయించవలసినదిగా నా మనవి. అసలు ఈ అహం, మమ అనేవి మొదలే లేవని గ్రహించండి. లేని దానిని పట్టుకుని వ్రేలాడడం అనుచితం కాక మరేమిటి? ఏదైతే ఉన్నదో… అది కేవలం పరమశివ రూపమై ఉంది. ఎందు కంటారా… ఆనందఘనమైనట్టి శివరూపమగు పరమాత్మ కంటే భిన్నంగా ఏదైనా దృశ్యం కనిపిస్తుంటే అదంతా అవస్తువే సుమా! ఆభరణం కంటే బంగారం వేరా? ఈ కనబడే జగత్తంతా కూడా ఆత్మకు భిన్నమైన అనుభవం పొందకపోవడమే దీని యొక్క నాశనం (లేక) ఉపశమనం. అట్లు జగత్తు (దృష్టి యందు) రహితమైనప్పుడు శేషించేదేదైతే ఉన్నదో… అదియే పరమార్థమగు సత్య స్వరూపమై ఉన్నది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ద్వైత - ఏకత్వ రహితం, మనన వర్జితం, పరమ శాంతం… అయినట్టి ఆత్మయే ఈ జగద్రూపంగా నెలకొని ఉన్నది. మట్టి బొమ్మలన్నీ తయారయినది మట్టితోనే కదా! అట్లాగే ఈ జగత్తంతా శివమయమే అయి ఉన్నది. ఈ కాల ఆకార-క్రియ శబ్ద శక్తి సందర్భ సహితమగు మనో బుద్ధి చిత్త అహంకారాలుగా కనబడేదంతా కూడా చిన్మయమే అయి ఉన్నది.
శివపంకమయా ఏవ రూపాలోక మనః క్రమాః |
తన్మయత్వాత్ అనంతత్వాత్, అతః కిం కేన చేత్యతే ॥
బొమ్మలన్నీ ఒకే మట్టిచే తయారుచేయబడి ఉండగా, ఇక ఆ బొమ్మలలో - శత్రు సైన్యం, మిత్ర సైన్యం, రాజు, మంత్రి, ఆయుధం, ఏనుగు… ఈ భేదాలన్నీ ఎక్కడున్నాయి ? ఈ కనబడే దంతా శివం అనే ఒకే మట్టితో తయారుచేయబడింది. ఇదంతా కూడా శివమయమై అనంత చిద్రూపమై వెలయుచుండగా, ఇక ఇందులో రూపం, ఆ రూపం యొక్క ఆలోకనం (చూడబడేది, చూచేది) ఆలోకనం చేయు మనస్సు… ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏది దేనిని ఎట్లా చూస్తుంది? ఓ
Page:557
రామా? ప్రమాత ప్రమేయము, ప్రమాణము 1. తెలుసుకునే ఆయన, 2.తెలియబడేది, 3. దేనిచేత తెలియుచున్నదో, అయ్యది… ఈ మూడు కూడా శివపంకమయములే. (పంకము అంటే మట్టి, మూల పదార్థం). అంతే కాదు. ఈ కనబడే దేశ కాలాలు, దిక్కులు, ఇక్కడి భావ-అభావ వివర్తాదులు… ఇవన్నీ శివతన్మయములేనయ్యా! అందుచేత ఇక్కడ గాని, మరెక్కడ గాని సారభూత మైనది పరమేశ్వరుడు (శివం, లేక ఆత్మతత్త్వం) మాత్రమే!
అహం మమేత్యతః సారాన్నే తరత్ పరమేశ్వరాత్ । అసంసక్తమతిస్తిష్ఠ హా, శిలోదరమౌనవత్ II
అందుచేత ప్రియ రామచంద్రా సారభూతమైన పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. అతనికి భిన్నంగా “నేను - నీవు” మొదలైన వివర్తములేవీ లేనే లేవు. అందుచేత నీవు వీటన్నిటి పట్ల అసంసక్తమగు బుద్ధిని పెంపొందించుకొని, అటుపై శిలయొక్క అంతరాంతర విభాగం వలె పరమ మౌనం వహించి ఉండు. అంతేగాని, స్వతఃగా లేనివానిని పట్టుకొని వ్రేలాడనే వద్దు.
శ్రీరాముడు:
అహం-మమ ఇతి అసద్రూపం జ్ఞాస్యా భావయతః, ప్రభో |
అశుభం కర్మణాం త్యాగాత్, అనుష్ఠానాచ్చ కిం శుభమ్ ||
హే ప్రభూ! జ్ఞాని అనగా ఎవరు? ఏది ఉచితమో ఏది అనుచితమో ఏది నిర్వర్తించాలో, ఏది నిర్వర్తించకూడదో తెలిసియున్నవాడు కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఊ !
శ్రీరాముడు: “ఈ అహం - - మమ (నేను - నాది) ఇత్యాది దృశ్య సమూహాలన్నీ అసద్రూపమే అని ఎఱిగిన జ్ఞానికి త్యజించవలసిన అశుభ కర్మలేమి ఉంటాయి? నిర్వర్తించవలసిన శుభకర్మలేమి ఉంటాయి? ఎందుకంటే “నేను - నావి అనేవే లేవు"… అని కదా అతని అవగాహన? మీ ఉద్దేశంలో శుభకర్మలు, అశుభ కర్మలు లేవనా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! "ఉచిత-అనుచిత కర్మలు ఉన్నాయా, లేవా?” అనా నీ ప్రశ్న? అయితే నిన్ను కర్మల విషయమై కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీ అనుభవాన్ని, అవగాహనను దృష్టిలో ఉంచుకొని నీవు ఏమని అనుకుంటున్నావో అది సమాధానంగా నీకు ఏమి అనిపిస్తే అది చెప్పు.
1. ’కర్మ’ అంటే ఏమిటి? 2.కర్మ అనునది ఎంతవరకు విస్తరించియున్నది? 3. కర్మ అనబడేదాని మూలమేమిటి? 4. కర్మ అనబడుదాని యొక్క ఏ విభాగము నిపుణతతో నశింపజేయవలసియున్నది? 5. అట్టి నశింపజేయవలసిన అంశమేదైతే ఉన్నదో… అద్దానిని నశింపజేయటానికి నీ ఉద్దేశంలో ఉపాయాలేమిటి ?
శ్రీరాముడు: వైద్యుడు అడిగే ప్రశ్నలన్నిటికి రోగి తన అనుభవములన్నీ సత్యముగా చెప్పితేనే ఉత్తమ ప్రయోజనం కదా! మీ రడిగిన ప్రశ్నలకు నాకు ఏమని తెలియవస్తోందో… అది సమాధానంగా చెపుతాను, వినండి.
Page:558
ఏదైతే (ఏ కర్మ వ్యవహార విభాగమైతే) నిపుణతతో నశింపజేయవలసియున్నదో అద్దానిని మూలఛేదంగా నశింపజేయాలేగాని, కొమ్మలు మాత్రమే నరికితే ఏం ప్రయోజనం? మరల అది ఎప్పుడో చిగురుస్తుంది కదా!
బుద్ధిమంతుడైనవాడు తన యొక్క శుభ అశుభ కర్మల రెండిటినీ (ద్వంద్వమును) నశింపజేసుకోవలసియున్నదని నా అభిప్రాయం. అసలీ కర్మలయొక్క మూలమెక్కడ ఉన్నదో కనిపెట్టి ఆ మూలమునే నశింపజేయాలి. అయితే, దేని యొక్క ఏ మూలమును ఛేదించుటచే ఈ కర్మ వృక్షము మరల చిగురించదో…. అట్టి కర్మమూల వ్యవహారము గురించి చెప్పుచున్నాను. వినండి.
ఈ దేహమే ’కర్మవృక్షం’గా ప్రకటితమైయున్నది. కాళ్ళు, చేతులు మొదలైన ఆయా అంగాలు అనే లతలతో ఇది శోభిస్తుంది. ఈ దేహం సంసారం అనే ఒక మహారణ్యంలో చిక్కుకుని ఉన్నది. ఈ దేహం వల్లనే జీవునకు సుఖదుఃఖాలన్నీ కలుగుచున్నాయి. ఈ దేహ వృక్షమునకు కర్మయే బీజం. ఈ దేహవృక్షం యొక్క ఫలములే సుఖ-దుఃఖములు. ఇది క్షణికమగు యౌవనంతో భాసిస్తూ చివరికి ‘ముసలితనం’ అనే నిస్సహాయ భూములకు నడిపిస్తోంది.
కోతి చెట్టు ఎక్కి ఆ వృక్ష సౌందర్యమునంతా నాశనం చేస్తుంది చూచారా? అతి భయంకర మైన ‘కాలం’ అను రూపం గల మర్కటం ఈ దేహవృక్షాన్ని ఆశ్రయించి దీని ఈకృతిని నిమిష నిమిషానికి ధ్వంసం చేస్తుంది. ఆలోచనలే ఈ దేహవృక్షపు చిగుళ్లు. నిద్ర, ఆ నిద్రలో కలలు గనటం… ఇవి కూడా ఈ దేహవృక్షమునకు ఆకులు వంటివే!
ఈ దేహము ‘జగత్తు’ అనే ఒక మహారణ్యంలో జన్మించింది. “భార్య భర్త-కొడుకులుతదితరులగు అయినవాళ్లు కానివాళ్ళు”… అనబడే సంబంధాలే ఈ దేహవృక్షం ప్రక్కన మొలచిన గడ్డి మొక్కలు. అట్టి ఈ దేహవృక్షము ‘ముసలితనం’ అనే శిశిర ఋతువులో తన ఆకులతో సహా నేలకూలుతోంది. ఈ కాళ్ళు చేతులు దీని పల్లవాలు. లోనగల నాడులు-ప్రేగులు-ఎముకలురక్తం… ఇవన్నీ వృక్షం యొక్క వ్రేళ్ళు మొదలైన అంతర్విభాగాల వంటివి. ఈ గోళ్ళు-జట్టు మొదలైనవన్నీ కోసినప్పటికీ మరల చిగురించే వృక్షపు లేపూత వంటిది.
కర్మప్రవాహ పరంపరయే ఈ దేహరూపంలో వికసితమగుచున్నది. కర్మేంద్రియాలే ఈ దేహ వృక్షపు మూలాలు. ఆ కర్మేంద్రియాలు దేహంలో ప్రవేశించే అన్నరసం చేత ప్రవృద్ధమవుతున్నాయి.
అయితే ఈ కర్మేంద్రియాలకు మూలం జ్ఞానేంద్రియములై ఉన్నాయి. వృక్షపు వేళ్ళు ఎంతో దూరం విస్తరించి ఉంటాయి చూచారా? ఈ దేహంలో గల జ్ఞానేంద్రియాలు కూడా నిజ విషయ రూపమున ఈ దృశ్య జగత్తులోనికి, సుదూరంగా విస్తరించి ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఒక వైపు ఈ కళ్ళు - ముక్కు - చెవులు - నోరు మొదలైన పంచేంద్రియ స్థానమును, మరొకవైపు ఈ జగద్విషయ సమూహమును ఆశ్రయించి ఉన్నాయి.
కర్మేంద్రియములకు (చెవులు, చర్మం, కళ్లు, నోరు, ముక్కు) జ్ఞానేంద్రియాలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) మూలం కదా! ఇక ఆ జ్ఞానేంద్రియాలకో ? మనస్సు మూలం. ఈ మనస్సు
Page:559
చేతనే ఈ జీవుడనబడేవాడు చేత్యముల వైపుగా (విషయాల వైపుగా) ఉన్ముఖుడై ఉండటం జరుగుతోంది. మరి, “అట్టి ఈ మనస్సుకు మూలస్థానం ఏమిటి?" అని పరిశీలిస్తే “చిదాభాసుడు అనతగ్గ ఈ జీవుడే మనస్సుకు మూలస్థానం”… అని తెలియవస్తోంది. మరి, చేత్యాంశమును ప్రదర్శించే ఈ ‘జీవుడు’ అనబడేవానికి మూలమేమిటంటారా?
ఈ చిదాభాసాంశమునకు మూలము సర్వమూలములకు ఏకైక కారణమైనట్టి బ్రహ్మమే అయి ఉన్నది. ఆ బ్రహ్మము మనోవాక్కులకు అవిషయమైయున్నది. అనంతము, శుద్ధము, సత్యము అయి ఉన్న ఆ బ్రహ్మమునకు మరొక మూలమంటూ ఏదీ లేదు.
కనుక మహర్షీ! చైతన్యము విషయోన్ముఖమైనప్పుడు ఆ విషయోన్ముఖ చైతన్యమే సమస్త కర్మలకు మూలమైయున్నది. ఆ చైతన్యం తన నుండి బయల్వెడలిన అహంకారంతో తాదాత్మ్యం పొందినదైనప్పుడు క్రియారూపమగు స్పందము బయల్వెడలుతోంది. ఆ విధంగా కర్మలు - కర్మ ఫలములు - - కర్మ ఫలజనిత తదనంతర కర్మలు… ఒక దాని ననుసరించి మరొకటి గొలుసులోని కొక్కెం వలే ఏర్పడి ఉంటున్నాయి.
ఓ మునీంద్రా! సమస్త కర్మలకు ఆదియగు బీజము జీవచైతన్యమే అయి ఉన్నది. ఎందుకంటే జీవచైతన్యం ఉంటే కదా ఈ దేహం ఉండేది! దేహం ఉంటే కదా కర్మలు ఉండేవి! అట్టి ఈ జీవచైతన్యము అహంకారాదులతో కూడి "నేను ఈ కర్మలకు కర్తయగు చైతన్యమును”… అను భావంతో కూడి ఉన్నప్పుడు, అట్టి కూటమియే కర్మలకు బీజమగుచున్నది. జీవ చైతన్యం అకర్తృత్వం వహించి ఉన్నప్పుడో, అదియే పరమపదరూపమగు ‘సత్తు’ అయి ఉన్నది. అనగా….
జీవచైతన్యము ‘అహంకారము’ మొదలైన భావనలతో కూడుకొని ఉన్నప్పుడు అది కర్మ వ్యవహారములన్నిటికీ తానే బీజమై ఉంటోంది.
జీవచైతన్యము అహంకారాదులన్నిటికీ విభిన్న మైన “శుద్ధ చిద్రూప భావన” కలిగి ఉన్నప్పుడు అదియే ‘పరమపదరూపము’ లేక ‘బ్రహ్మము’ అయి ఉంటోంది.
కాబట్టి ఈ దేహాదులకు సంబంధించిన ’అహంభావం’ యొక్క భావనయే కర్మలకు బీజ కారణమై ఉన్నదని నా ఉద్దేశం.
స్వామీ! ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ మీరు ఇతఃపూర్వమే చెప్పియున్నారు. మీ బోధను అనుసరించే నా బుద్ధికి కూడా ‘అవును కదా’ అని తోచుటచే మీ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు చెప్పటం జరిగిందని నా మనవి.
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! నీవు చెప్పినదంతా దృష్టిలో పెట్టుకొని ఈ కర్మబీజము విషయమై మరికొంత పరిశీలిద్దాం.
ఎంతవరకైతే ఈ ఉపాధి ఉంటుందో… అంతవరకు జీవ చైతన్యమునకు అహంకారము, ఆ అహంకారమును ఆశ్రయించి కర్మ వ్యవహారం ఉంటాయి కదా? కనుక దేహమున్నంత వరకు ‘కర్మలు’ అనేవి ఉంటూనే ఉంటాయి.
Page:560
నీవు చెప్పినట్లు ఈ జీవచైతన్యం ఏ దృశ్యం వైపుగా ఎట్లు ఉన్ముఖమౌతున్నతో అది అద్దానిని అట్లే పొందుతోంది. “ఆ దృశ్యం సత్యమా, అసత్యమా? అది బాహ్యమా, అంతరమా?”అనేది ఇక్కడ ప్రశ్న కాదు. జీవచైతన్యం ఏ రూపంగా ఉన్ముఖం అయితే ఆ రీతిగా అనుభవం పొందుతోంది. దేనిని ఎట్లా భావన చేస్తే అట్లా అది పొందుతోంది, అనుభవిస్తోంది కదా! అట్టి ఈ జీవచైతన్యం దృశ్యం వైపుగా ఉన్ముఖమే కాలేదనుకో? అప్పుడు? అది సంసారం నుండి విడివడిపోవుచున్నది. ఇక “సంసారం భ్రమా? సత్యమా?” అనేది అప్రస్తుతమే అవుతుంది. అటువంటి విచారణతో పనేంటి?
కాబట్టి ఈ జీవనచైతన్యమే వాసన, ఇచ్ఛ, మనస్సు, కర్మ, సంకల్పము… మొదలైన ఆయా రూపాలలో తనను తానే ప్రదర్శించుకుంటోంది. అది స్వయంగా భ్రమలను ఆశ్రయించి ఈ సంసారం యొక్క రూపమును వికసింపజేస్తోంది.
ఒకడు జ్ఞాని అయి ఉన్నా కూడా, అతనికి ఎంతవరకైతే ఈ దేహం ఉంటుందో అంతవరకు ఈ దేహగృహంలో అతనికి ‘చిత్తం’ అనేది ఉండియే ఉంటోంది. జీవించి ఉన్నంత వరకు చిత్తమును త్యజించుట ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు. అయితే జ్ఞాని యొక్క జీవచైతన్యం “నేను అసంగమైన అద్వితీయమైన, కూటస్థమైనట్టి స్వరూపమును”… అను ఎఱుకను, అనుభూతిని, అనుభవమును
సంతరించుకుని ఉంటోంది.
“సర్వకర్మలకు ఆవల, కర్మలన్నిటికీ సంబంధించనివాడనై శుద్ధ చిద్రూపుడనైన నేను ఏర్పడియున్నాను. అందుచేత కర్మాకర్మలతో నాకు ప్రమేయం లేదు. “నా హంకర్తా! నైవ కించిత్ కరోమి! నేనేమీ చేయటం లేదు”… అని ఈ విధంగా నిష్క్రియమైన ఆత్మస్వభావ స్థితిచే ఈ చిత్తమును ఆక్రమించివేసి ఉంటున్నాడు. తదితర జీవులవలెనే ఆయా కర్మలు ఈ దేహముచే నిర్వర్తిస్తున్నప్పటికీ స్వస్వరూపమునందు అతనికి కర్మ యొక్క భావనయే జనించదు. అతడు కర్మ - అకర్మల వికల్పం త్యజించివేసి ఉంటాడు. అట్టి జీవచైతన్యం స్వయంగా అజమైనట్టి బ్రహ్మరూపంగా అయి, తదనుకూల అనుభవమును అనిర్వచనీయంగా పొందుతూ ఉంటుంది.
కర్మ-అకర్మల వ్యవహారం త్యజించకుండా, ఆ ఉభయాలకూ అతీతత్త్వం సంతరించుకోకుండా, ఒకడు “ఈ శరీరమే కదా కర్మలకు మూలం! అందుకనే ఈ శరీరాన్ని నిష్క్రియంగా ఉంచుతాను”… అని తలచి శరీరముచే మాత్రమే విహితకర్మలను త్యజించేవాడు ఎన్నటికీ “కర్మత్యాగి” కాలేడని జనులందరికీ గుర్తు చేస్తున్నాను.
జ్ఞాన బలం చేత ఈ దృశ్య ప్రతిభాస స్వయంగా లయించగలదు. అప్పుడు “ఈ జగత్తు అనబడేది భావనామాత్రమే గాని స్వయంగా లేదు”… అనురూపంగా ఉండే జగత్తు యొక్క అత్యంత - అభావం సిద్దించగలదు. అట్టి జగత్ అభావన, మరియు అప్రమేయ అఖండ ఆత్మభావనయే త్యాగం, అసంగం, మోక్షం అను శబ్దములచే ఉద్దేశించబడుతున్నది సుమా! సందర్భానుచితంగా ఇక్కడ వేద్య (తెలుసుకొనబడుచున్న విషయం) - వేదనముల (తెలుసుకొనుచున్న తత్త్వం (లేదా) చిదాభాసరూప చైతన్యం) గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకుందాం.
Page:561
“వేదనము” ఉన్నప్పుడే (తెలుసుకొనుచున్నది ఉన్నప్పుడే) “తెలియబడే విషయాలు” అనేది ఉంటుంది. ఆ తెలుసుకొనుచున్న విభాగం ఎందులోంచి బయలుదేరుతుందో… (లేక) తెలుసుకొను చున్న విభాగమునకు ముందే ఉన్నదేమిటో… అది వేద్య దృష్టి కంటే కూడా సూక్ష్మమై, కారణ కారణమై ఉన్నది.
అట్టి మున్ముందుగా ఉన్న తత్త్వమును ఆశ్రయించడమే "వేద్య దృష్టిని అధిగమించి తత్త్వదృష్టిని ఆశ్రయించటం”… అని గ్రహించు.
ఏ తత్త్వ దృష్టి యొక్క పరిపుష్టి చేత “వేద్య దృష్టి యొక్క ఉత్పన్నమే లేదు”… అని గ్రహించ బడుతుందో అట్టి తత్త్వానుభవాన్ని సంతరించుకొన్న వానికి ఇక "తెలియబడే విషయాలు వేదనము” అనునది ఎక్కడుంటుంది ? అనగా, వేద్యదృష్టి - వేదనము కూడా స్వతహాగా లేవని గ్రహించినచోట జగదృష్టి యొక్క అతీతత్వం రూపుదిద్దుకుంటుంది. దృశ్యం ద్రష్ట యొక్క అవగాహన - అభిప్రాయం - భావనలను అనుసరించే ఉంటోంది సుమా!
‘జ్ఞానదృష్టి’ (ఆత్మ దృష్టి) యొక్క పరిపుష్టి చేత ఒకడు వేద్యోన్ముఖత్వమును (విషయముల పట్ల గల మూలాధ్యాసను) త్యజించినాడనుకో, అనగా వేద్య దృష్టి ఉత్పన్నముకానప్పటి వేదనము యొక్క స్వరూపమేమికలదో… అద్దానిని ఏమని పిలవాలి?
అది ‘వేదనం’ కాదు. ఎందుకంటే తెలుసుకోవటం అను కార్యక్రమం కన్నా అది ముందే ఉన్నది కదా! అది కర్మ (లేక, క్రియారూపం) కాదు. ఎందుకంటే సర్వక్రియలకు అది ముందే ఏర్పడి ఉన్నది కదా! అందుకే అది “నిష్క్రియం” అని కూడా వర్ణించబడింది మరి! అది స్వతహాగా శాంతమగు బ్రహ్మమే అయి ఉన్నది.
ఆకాశంలో ఉండే మేఘాలు జలాదులందు ప్రతిబింబిస్తున్నట్లు, బుద్ధ్యాదులందు (ఆ బుద్ధికి అనుగుణంగా) ఈ దృశ్యం ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబాన్ని ఎఱుగుచున్న చైతన్య విభాగం “చిదాభాస చైతన్యం” అను పేరుతో ఉద్దేశించబడుతోంది. అట్టి చిదాభాస చైతన్యం క్రియారూపంగా ఈ జగత్తులో ప్రదర్శితమౌతోంది. “ఏ జీవుడైనా చిదాభాస - శూన్యత్వమును అవధరించి ఉంటే అట్టి అతని పరిశేష్యమును… ‘మోక్షం’ అని పిలుస్తున్నారు. అట్టి వారు ఈ లోకానికి ఉపదేశిస్తున్న దంతా శిష్యుని వాస్తవ స్వరూపం గురించే.
కాబట్టి రామా! దేహం ఎంతవరకు ఉంటుందో, అంతవరకు కర్మలయొక్క ’త్యాగం’ అనేది సంభవించదు. కర్మలను ఆశ్రయిస్తున్నంత కాలం, ఆ కర్మలకు మూలమైన (వాసనాసంబంధమైన, మనో సంబంధమైన) చిదాభాసరూపసంవిత్తు ప్రవర్తిస్తున్నట్లే అవుతోంది. ఆ చిదాభాస సంవిత్తును అధిగమించి పరిశీలిస్తే ‘శుద్ధసంవిత్తు’ మనకు ద్యోతకమౌతుంది. అట్టి అధిగమనం జ్ఞానబలిమిచే సుసాధ్యం. శుద్ధ సంవిత్తు సర్వదా యథాతథంగా ఉండగానే అద్దాని ‘చిత్కళ’ అనతగిన చిదాభాస సంవిత్తు అంతఃకరణమునందు వాసనలను కలిగి ఉంటోంది. అట్టి వాసనారూపసంవిత్తు కర్మలకు కర్తృత్వాదులకు కారణత్వము వహించి ఉంటోంది.
Page:562
ఎవడైతే చిదాభాసరూప సంవిత్తును అద్దాని మూలాజ్ఞానముతో సహా ’ఆత్మవిచారణ’ అను స్వప్రయత్నముచే యథార్థముగా ఎఱుగుచున్నాడో… అట్టి వాడు ఆ చిదాభాస స్వరూపమును అధిగమించి శుద్ధ చిద్రూపమును ఎఱుగుచున్నాడు. “చిదాభాససంవిత్తును అనుసంధానం కావించకపోవటం”… అను అభ్యాసముచే మాత్రమే చిదాభాససంవిత్తు అధిగమించబడుతున్నది.
తేన సంసృతి వృక్షస్యం | మూలకాషో వితన్యతే ||
అతడే ఈ సంసార వృక్షమును మూలాఛేదం కావించినవాడగుచున్నాడు. కనుక అవేదత్వమే మోక్షం (ఆవేదన విదుర్ మోక్షం)!
ఓ రాఘవా! ఇక్కడేగాని, మరెక్కడైనాగాని బ్రహ్మమొక్కటే ఉన్నది. అది చిదాభాసవర్జితమై మేఘవిభాగ రహిత ఆకాశము వలె ఉన్నది. సజాతీయ - - విజాతీయ, స్వగతాది భేదములు అద్దానికి లేవు.
“చిదాకాశరూపమై నిరామయమైనట్టి ఆ బ్రహ్మమే సమస్త చేతనములయొక్క సారం”… అని బ్రహ్మవేత్తలు ఎలుగెత్తి పలుకుచున్నారు. ముముక్షువులంతా అది శ్రద్ధగా విని, అందు సూచించే అర్ధసారాన్ని గ్రహించి తమ చిదాభాసాతీతమైన చిదాకాశత్వాన్ని గ్రహించి, అనువర్తించెదరు గాక!
శ్రీరాముడు : మునీంద్రా! “అవేదనమే మోక్షం“ (ఈ తెలియబడేదంతా తెలియకుండా ఉండటమే మోక్షం) అనే అర్థం మీరు సూచిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. “సర్వజ్ఞానాలకు పరాకాష్ఠ అయిన మోక్షం ఆత్మజ్ఞానం అనే ఎఱుక కూడా రహితమైన స్థితి” అని మీ ఉద్దేశమా? ఎందుకంటే, ఆత్మ జ్ఞానం కూడా తెలియబడే విషయాంతర్గత విభాగమే కదా! "అసత్తుకు ఉనికి లేదు. సత్తుకు లేమి లేదు… అని కదా శాస్త్ర సిద్ధాంతం? జ్ఞాన స్వరూపమగు సత్తు తెలియబడనిది” అనే నాకు వినిపిస్తున్న మీ అభిప్రాయం నేను సమన్వయించుకోలేకపోతున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : మొట్టమొదట ఆత్మ నిత్యోదిత చైతన్యస్వరూపమై ఉన్నది. ఇది సత్తు. మిగిలినదంతా అసత్తుగా (లేక) కల్పనగా ఏర్పడుతోంది. నిర్విషయ - అఖండ - అప్రమేయమగు ఆత్మ నుండి స్వయంకల్పితంగా ద్రష్టత్వం (లేక) అనుభవత్వం బయల్వెడలుతోంది. అదియే ‘జీవుడు’ అని ’చిదాభాసుడు’ అని అంటున్నాం. ఈతనినే ‘దృశ్యద్రష్ట’ అని గమనించు. ఆ దృశ్యద్రష్ట స్వయంభావనచే పొందుచున్నదే ఈ దృశ్యము (లేక) వేదనము.
నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః |
యదా తదైవ సుకరం వేదనావేదనం స్వయమ్ ॥
ఓ రామచంద్రా! ఎప్పుడైతే "అసత్తుకు ఉనికి లేదు. సత్తుకు లేమి లేదు” అనేది సిద్ధాంతమై ఉన్నదో… అప్పుడు “వేదనం (దృశ్యమును ఎఱుగుచున్న విభాగం) అవేదనమగుట”… అని నేను ప్రతిపాదించే మోక్ష సిద్ధాంతం మరింత సుకరం అవుతోంది.
Page:563
ఇప్పుడు మనం “వేద్యము (తెలియబడుచున్నది)” అనే శబ్దం ఉపయోగించాం కదా! అయితే అట్టి వేదనము అనబడు శబ్దము, దాని అర్థము కూడా ”త్రాడునందు చూచే పాము” వలె “ఎండమావులలో కనిపించే జలతరంగాల" వలె భ్రమయుక్తములు మాత్రమేనని గ్రహించు. వేదనము అసత్యంగానే ఉదయించినదగుచున్నది. అందుచేత ఆ వేదన - వేద్యములు (ద్రష్టత్వ -
దృశ్యములు) “వేదనము” (తెలియబడేది) అనబడే శబ్దార్థములను రెండిటి యొక్క విస్మరణయే పరమశ్రేయస్సును కలుగజేయగలదు సుమా!
ఎందుకంటావా? "తెలియబడేది”… అనుదాని చేతనే కదా, ఈ జీవునకు దుఃఖములన్నీ కలుగుచున్నవి! తెలియబడేదానికి మున్ముందుగానే “తెలుసుకుంటున్నది”… అనునది ఉండనే ఉంటోంది. ఆ “తెలుసుకుంటున్నది” అనబడేదే ఈ జీవుని వాస్తవ స్వరూపం.
కంసా
తెలుసుకొనే
విభాగము
తనయందు | తెలుసుకునేది తెలియబడేది
కలిగియున్న (వేదనము) వేద్యము గ
స్వస్వరూపము
దృశ్యము
Self Knower
ఆత్మ జీవుడు
అట్టి “తెలుసుకునుచున్నది” అనబడేది తెలియబడేదానిచే ఎట్లా తెలియబడుతుంది చెప్పు? అందుచేత ఓ రామచంద్రా! నీవు ’తెలుకొనుచున్నది (ద్రష్ట - జీవుడు) అను ఒకానొక చమత్కారం తనయందు ప్రదర్శించే స్వస్వరూపమగు ఆత్మనే ఎఱుగుము. అంతేగాని ఈ చిదాభాసుని (ఆత్మ నుండి బయల్వెడలుచున్న ద్రష్ట - జీవుడు) గురించి ఎంతగా విచక్షణ చేసి ఏమి ప్రయోజనం?
మరొకసారి చెప్పుచున్నాను. వేదనము (తెలియబడేది - దృశ్యం) అను దానిలో చిక్కుకొనటం చేతనే వాస్తవానికి సత్-చిత్-ఆనందస్వరూపుడగు ఈ జీవుడు (చిక్కుకున్నట్లుగా ఏర్పడుచున్న భ్రమచేతనే) సర్వ దుఃఖములు, సర్వ అనర్థములు తెచ్చి పెట్టుకుంటున్నాడు. అందుచేత ఈ తెలియబడుచున్న దానికి సంబంధించిన ‘జ్ఞప్తి’ యొక్క శబ్దార్థములు రెండింటినీ త్యజించి సుఖస్వరూపుడవై ఉండు.
ఓ రామచంద్రా! 1. ద్రష్ట-దర్శనము-దృశ్యము… అనబడే త్రిపుటీ బోధ లక్షణము అయి ఉన్న ఈ వ్యవహారశీలత్వము; 2. వ్యావహారిక సంబంధమైన ‘జ్ఞప్తి’ లక్షణము; 3. సర్వార్థసారమైన పరమకూటస్థ చిన్మాత్రము… ఈ మూడింటిలోను మొదటి రెండు అధిగమించి అటుపై సర్వశబ్దపరం - మూడవది అయినట్టి ‘ఓం’ కారమును అన్వయించుకొని ఉండు. అట్టి పారవశ్యంనందు అనుభవ మయ్యే శుద్ధాత్మయే నిర్వాణోదయం సుమా! (అదియే ఈ వర్తమాన నిర్వాణ ప్రకరణసారం). అట్టి నిత్యోదిత శుద్ధాత్మయందు ఎట్టి విక్షేపము లేకుండా వ్యవహరించుము.
Page:564
కర్మ, కర్మ త్యాగము -
శుభాశుభాత్మకర్మ స్వం నాశనీయం వివేకినా | తన్నాస్త్రీత్యవబోధేన, తత్త్వజ్ఞానేన సిద్ధ్యతి ||
వివేకి అయినవాడు తన యొక్క శుభ - అశుభ కర్మల రెండింటినీ దాటివేసి ఉంటాడు. “అవి వాస్తవానికి లేవు”… అను బోధ చేతను, ఆ రెండింటిచేత స్పృశింపబడనట్టి ‘తత్త్వం’ యొక్క జ్ఞానం చేతను వాటి ’రాహిత్యం’ లేక అతీతత్వం సిద్ధింపజేసుకోగలడు.
కర్మమూల నికాషేణ, సంసారః పరిశామ్యతి |
సువిచారితమన్విష్టం యావత్ కర్మ న విద్యతే ॥
కర్మ యొక్క ఏ మూలమైతే ఉన్నదో… అదే చిత్ యొక్క “అభాసరూప సంవిత్తు” అని వర్ణించబడింది. అట్టి కర్మల యొక్క మూలాన్ని ఛేదించుటచేతనే సంసారం శమిస్తోంది. “మూల, ఫల, పుష్ప, శాఖ - ఉపశాఖసహితమగు కర్మ వృక్షమే మొదలే లేదు”… అనే పర్యవసానం, ప్రయోజనం కలిగి ఉండే “పూర్ణ విచారణ” చేతనే ఈ వృక్షం నశించగలదు. అనగా ఈ జీవుని పట్ల కర్మవృక్షం అప్రభావితమై ఉండాలంటే అది విచారణ శాస్త్రాణ్వేషణలచే (కర్మ రాహిత్యత్వం . కర్మాతీతత్వం) తప్పక లభించగలదని నా మనవి.
శ్రీరాముడు : స్వామీ! ‘చిత్తము’ అనబడేదాని అసలైన రూపమేమిటి ?
శ్రీ వసిష్ఠ మహర్షి : బిల్వ వృక్షములోని మజ్జలో గల బీజతత్త్వమే బీజముగా బయల్వెడలుతోంది కదా! బిల్వబీజం బిల్వవృక్షం కంటే వేరా? ఎట్లా అవుతుంది? రెండింటిలోని ‘సత్త’ (జీవ తత్త్వం) అనేది ఒక్కటే. అట్లాగే ‘చిద్రూపం’ అనే బిల్వవృక్షం నుండి బయల్వెడలిన ‘చిత్తం’ అనబడు క్రియాకారాది త్రిపుటి ఆ చిద్రూపం కంటే లేశం కూడా వేరైనది కాదు. ఈ భూలోకంలో ఉండే ఒక ప్రదేశం భూలోకం కంటే వేరైనది కాదుకదా! అట్లాగే ఈ అవకాశం, ఆకాశమున అంతర్గతమై ఉంటున్న భూతజాలం, భవనాది వస్తుజాలం - ఇవన్నీ కూడా సన్మాత్రమగు పరమాత్మ కంటే వేరైనవి కానేకావు. " జలమందలి తరంగత్వము జలం కంటే వేరు”… అని ఎవరైనా అనగలరా? చిత్తం కూడా చిద్రూపమే అయి ఉన్నది. చిత్తం చిత్తే! చిత్తు చైతన్యమే! జలంలో ద్రవత్వం, అగ్నిలో ప్రకాశం ఉన్నట్లే బ్రహ్మం నందు గ్రాహకత్వం (గ్రహించటం) అనే స్వభావం, స్మృత్యత్వం (స్మృతి అనే చమత్కారం)… అను వ్యవహారాల కంటే సూక్ష్మమైన చిత్తం ఉండి ఉన్నది.
అయితే “చేతనము”…అనే శబ్దం యొక్క అర్థం “క్రియాత్మకము” అని కదా! అయితే సర్వ క్రియలకూ ముందే ఏర్పడి ఉన్న నిష్క్రియ కూటస్థ చైతన్యం నందు యక్షుని భ్రమలాగా క్రియాత్మక చైతన్యం ప్రజ్వరిల్లుతోంది. అది స్వతహాగా అకారణం కనుక ‘క్రియాత్మకం’ అనబడేదంతా వాస్తవానికి “ఉదయించనిది, లేనిది” - అయి ఉన్నది. వాయువు - వాయు చలనము వేరు వేరా? శ్రీరాముడు : కాదు. వాయువు వాయు చలనము వేరు వేరుగా ఉండజాలవు.
శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగే, చేతనము - - దాని యొక్క అభివ్యక్తరూపం అగు క్రియ అభిన్నములై
Page:565
ఉన్నాయి. ఈ సిద్ధాంతమును అనుసరించి ఇక్కడి బాహ్య అభ్యంతర రూపములగు, జాగ్రత్ -
స్వప్న - సుషుప్తులందలి - పదార్థబుద్ధి కూడా ఆత్మరూపమే గాని… మరింకేదో మరొకటి కాదు. విస్తారః కర్మణాం దేహః, సో హంతాత్మా, స సంసృతిః | అచేతనాన్ అనహర్త్వేన శామ్యతి అస్య స్పన్దవాతవత్ II
ఓ రాఘవా! కర్మల యొక్క విస్తారమే ఈ దేహం. అదియే అహంకారం, అదే సంసారం కూడా! కనుక నీవు చిదాభాసత్యాగ పూర్వకమైన “అనహం” భావన అనే గొడ్డలిచే ఈ సంసారంఈ దేహాహంకారాలను శమింపజేయి. అప్పుడు నిశ్చలస్థితిలోని వాయువు వలె సర్వాతీతమైన నీ వాస్తవ స్వభావం తేటతెల్లమవగలదు. ఆ విధంగా చిదాభాసుని త్యజించు. అనంతాత్ముడవగుము. చిద్రూపుడవై ఒక శిలవలె నిశ్చలత్వమును అవధరించి ఉండు. అట్టి నిశ్చలాత్మకత్వ బలిమిచే వరాహం రెల్లుగడ్డిని తొలచునట్లు, ఈ సంసార మూలమును (ఈ జన్మ కర్మ వ్యవహారత్వమును) ఛేదనమొనర్చివేయుము. ఈ మార్గంలో మాత్రమే ఈ కర్మబీజము యొక్క కోశము త్యజించ బడుతుంది. ఇక వేరే మార్గం లేదు.
ఈ ప్రకారంగా కర్మబీజకళ త్యజించబడుగాక! అప్పుడు క్రమంగా బ్రహ్మం కంటే భిన్నమైనది. కనిపించటానికి కారణమగుచున్న “చిదాభాసుడు“, ఆ చిదాభాసునికి కనిపించే దృశ్యప్రపంచం జీవునకు మిథ్యగా తేలిపోవుచున్నది. ఇక అతడు వేద్యమగు పరబ్రహ్మమును స్వతఃసిద్ధంగానే ఎఱుగుచున్నాడు. ఇక పరమశాంతస్వరూపుడగు అట్టి మహాత్ముడు దేనినీ త్యజించడు. గ్రహించడు. అనగా అతడు “గ్రహణము - - త్యాజ్యము” లకు సంబంధించిన అనుభవమే కలిగి ఉండడు. సర్వ ప్రాపంచిక వ్యవహారములకు నిమిత్తమాత్రుడై, శాంతచిత్తుడై ఉంటాడు. ఆకాశమువలె విశదమై దృశ్యరహితమైనట్టి తన ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి ఉంటాడు. అంతేకాదు. అతడు ఆయా ప్రవాహపతితములగు కార్యములు చేయుచున్నప్పటికీ నిర్వర్తించనివాడుగానే ఉంటాడు. నదీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న చెక్క - కొమ్మ మొదలైన వాటిని చూచి నదీ జలం చలిస్తుందా? అట్లాగే తత్త్వజ్ఞుడు తన “జీవుడు - అనబడు ద్రష్టత్వమును - కర్మేంద్రియ మనోవికారములను తన స్వరూపముపై (ఆత్మస్వరూపముపై) ఆపాదించుకోడు. అయితే సగం నిదిస్తున్న బాలునిలాగా ఆయా చేష్టలను మాత్రం సల్పుతూ ఉంటాడు. నిర్విషయమగు నిరతిశయానందం (బ్రహ్మం) లభించటం చేత అతని ఇంద్రియాలు ఆయా ఇంద్రియ విషయాల పట్ల రాగరహితమై ఉంటాయి. అవి అంతరమున గాని, బాహ్యమున గాని ఎట్టి ఉనికిని కలిగియే ఉండవు సుమా!
ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఆత్మతోటి ఏకత్వానుభవమే (నేను శాశ్వతం - అప్రమేయం అగు ఆత్మను… అను అనుభవమే) ‘కర్మత్యాగం’ అను శబ్దంచే ఉద్దేశించబడుతోందని మరల ప్రకటిస్తున్నాను. అట్టి జ్ఞానం ఆత్మ ప్రబోధం వలననే సిద్ధిస్తోంది.
కర్మణో వేదనం త్యాగః స చ సిద్ధః ప్రబోధతః ॥ అవస్తు నేత రేణార్ధః కింకృతేన అకృతేనవా ॥ ||
Page:566
కర్మలతో ’రాహిత్యము’ సంతరించుకోవటమే కర్మత్యాగం. ఇక ఈ దేహ - ఇంద్రియాదులతో జరిగే చేష్టలంటావా? అవన్నీ మిథ్యారూపాలని గ్రహించు. అవి ఒనర్చినా, ఒనర్చకున్నా… అందులో విశేషమేమీ లేదు. ఆత్మభావంతో (ఆత్మసాక్షాత్కార బుద్ధితో) ఈ దృశ్య - జగత్తులో చరిస్తున్న తన ‘జీవుడు’ అను పాత్రను తదితర దేహులను చూస్తున్న విధంగానే చూచేవానికి ఇక బంధమెక్కడిది?
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. ఈ జీవుడు ఎట్లాగైనా సరే, తనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకుని ఆత్మస్థితిని సంపాదించుకోవాలి, అనగా… “నా యొక్క వాస్తవ తత్త్వం చిదాభాసవర్జితం - విషయజ్ఞాం కంటే ముందే ఏర్పడి ఉన్నది. కనుక… అది విషయజ్ఞాన వర్జితం.
అది పరమ శాంతస్వరూపము, సర్వదా సమస్వరూపము, అది సర్వవేళలా కృత - అకృత ప్రతిసంధానరహిత స్వరూపము, అది వాసనారహితము, పరమ శుద్ధము” … ఇటువంటి అవగాహన ఎవరు సంతరించుకుంటారో, అట్టి వారే “కర్మ త్యాగి” అని చెప్పబడుతారు.
అయినా…. ఒక్క విషయం. “సంసార బద్ధుడు” అని చెప్పబడే జీవుడు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక రోజు నిర్వర్తించిన కర్మలేమిటో చెప్పమంటే చెప్పలేడు కదా! కానీ ఆతడు 1.ఇప్పటికి ఇది చేశాను, 2. అప్పటికి అది చేయవలసి ఉన్నది, 3. ఆ, ఇంత చేశానే! నాకేం వచ్చింది? 4. అయ్యో! ఇది ఎందుకో చేయలేకపోయాను… అనే ఈ నాలుగు రకాల కర్మ సంగమమును వర్తమానంలో కలిగి ఉంటున్నాడు. ఇక ‘ముక్తుడు’ అనువాడో, వర్తమానంలోనే సర్వ కర్మలు, సర్వదృశ్యములు విస్మరించి ఉండగలుగుచున్నాడు. అట్టి సునిశ్చితము, సునిశ్చలము అగు ఆత్మస్థితికి శాస్త్రములు ‘కర్మత్యాగము’ అని పేరు పెట్టాయి.
శ్రీరాముడు : అయితే ‘కర్మత్యాగము’ అనేది కర్మలను నిర్వర్తించటం మానివేయటం చేత వచ్చే స్థితి కాదని మీ ఉద్దేశమా!
శ్రీ వసిష్ఠ మహర్షి : కర్మరహిత స్థితియే మోక్షరూపమగు కర్మత్యాగస్థితి అయి ఉంటే జడరూపమగు గాఢ నిద్రాస్థితియే మోక్ష స్థితి అయి ఉండేది. కర్మలను మానివేసి ఒకచోట ఊరకే కూర్చుని ఉండటం ’కర్మత్యాగం’ అనిపించుకోజాలదని మరల మరల ప్రకటిస్తూనే ఉన్నాను సుమా! అసలు మూలము అయినట్టి చిదాభాసుని త్యజించకుండా (దృశ్య జగత్తులో చరించే ద్రష్టత్వము జీవత్వములకు అతీతత్వం పుణికి పుచ్చుకోకుండా కేవలం కర్మేంద్రియాలను గాలికి వదిలినంత "మాత్రం చేత కర్మత్యాగం అని అనిపించుకోదని చేతులెత్తి మరల ప్రకటిస్తున్నాను. అట్టి వ్యర్థమైన అవగాహనతో కూడినవారిని ‘మాంద్యము’ అనే పిశాచము గుటుక్కున మ్రింగటానికి సిద్ధంగా ఉన్నదని గుర్తు చేస్తున్నాను. అట్లా అయితే మత్తుగా త్రాగి మొద్దుగా నిదురించేవాడు మోక్ష స్వరూపుడౌతాడు. అది అట్లు కాదు కదా!
ఇక ‘సమూల కర్మ త్యాగము’ సంతరించుకుని ఎవరైతే ప్రశాంతముగా ఉంటారో…. అట్టి వారికి ఈ ప్రపంచం విషయంలో కర్మలు నిర్వర్తించినా, నిర్వర్తించకున్నా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వివేకి అయినవాడు 1.“నేను కర్మలు నిర్వర్తించాలి; 2. ఎందుకు నిర్వర్తించాలి?”…
Page:567
ఇటువంటి ఉభయ కర్మబీజకళలను సమూలంగా త్యజించి ఏకంగా ఆత్మయందే నిత్యసమాహితుడై వెలయుచున్నాడు. అనగా……
ప్రవాహపతితే కార్యే ఈషత్ స్పన్దా అతన్మయాః ఫర్ణమానాఇవ క్షీబాయంత్ర సంచారితా ఇవ మోక్షలక్ష్య్మా విలాసిన్యా వ్యసనోపహతా ఇవ
అర్థసుప్త ప్రబుద్ధాభాః కామప్యవనిమాగతాః |
వివేకులు ఒకవైపేమో పూర్ణ అనాసక్తులై, అభిమానాది ఎట్టి వికారాలు లేని వారై ఆయా ప్రవాహపతితమైన కార్యాలను (ఆయా నియమిత క్రియాదులను ఉత్సాహంగా నిర్వర్తిస్తూనే… మరొకవైపు మదిరోన్మత్తుని వలె, యంత్రాలచే చలింపబడే ఆట బొమ్మలాగా నిస్పృహులై ఉంటారు. ’మోక్ష లక్ష్మి’ పట్ల మాత్రమే అత్యాసక్తియుతులై, ఈ దేహదులతో ఏమాత్రం సంబంధం లేనివారై ఉంటారు. సగం నిద్రలో ఉండే బాలునివలె ఉత్తమ భూమికలను అవధరించి ఉంటారు.
ఒక చెట్టును మొదలంట (వేళ్ళతో సహా) పెకలించిస్తేనే అది తొలగించబడినది అవుతుంది గాని కొమ్మలు నరికినంత మాత్రంచేత చెట్టును నశింపజేయటం అవుతుందా? లేదు కదా! “నేను కర్మ వ్యవహారములకు అప్రమేయుడను, అసంబంధితుడను, అతీతుడను”… అని గ్రహించటమే కర్మత్యాజ్యం గాని “నేను కర్మలు నిర్వర్తించను” అనేది కర్మత్యాజ్యం కాదు. జీవించటమనేది కూడా ఒక కర్మయే కదా! ”నేను జీవన్ పరిమితుడను కాను"… అని గ్రహించటం చేతనే దేహాదులు జయించబడినవి అవుతున్నాయి. మూలాఛేదనం చేయకపోవటం చేతనే ఈ కర్మ వృక్షం మరల మరల చిగురించి, శాఖోపశాఖలై జీవుని దుఃఖమును వర్ధింపజేయుచున్నదని సాధకులు గ్రహించవలసినదిగా నా మనవి.
ఓ జనులారా! చిదాభాసుని ఛేదనం చేసినప్పుడు మాత్రమే (నేను జీవ - - దేహ పరిమితుడను అను భ్రమను వదలినప్పుడు మాత్రమే) ‘కర్మత్యాగం’… అనేది సిద్ధిస్తోంది. ఇది గ్రహించి మీమీ సాధనలు కొనసాగించండి. ఇతర వ్యవహార పరంపరలతో, క్రియా క్రమములతో ఏమి పని?
ఎవరైతే ఈ ’కర్మత్యాగం’ను ఆచరించకుండా హఠాదులచే కేవలం కర్మేంద్రియాలను మాత్రం సంయమనం చేస్తారో… అదియే ‘త్యాగము’ అని తలుస్తూ ఉంటారో… అది వ్యర్థ ప్రయత్నమని చెప్పక తప్పదు. అది ఆకాశమును చేత్తో బాది వశం చేసుకోవాలని అనుకోవటం వంటిది. శ్రీరాముడు : మహాత్మా! మీరు చెప్పే కర్మత్యాజ్యం సిద్ధింపజేసుకునేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మజ్ఞానం సంపాదించుకోవటంచేతనే కర్మత్యాగం స్వయంగా సిద్ధించగలదు. వేయించబడిన విత్తనం మరల మొలకెత్తదు కదా! వాసనావర్జితులు, ఇచ్ఛారహితులు అయిన జీవన్ముక్తులు నిర్వర్తించే క్రియలన్నీ అక్రియలే అవుతాయని గ్రహించు. నాయనలారా! మీరంతా కూడా “కర్మ ఎప్పుడు, ఎందుచేత ఫలోన్ముఖమగుచున్నది? అది ఎప్పుడు ఫలరహితం, బంధనా రహితం కాగలదు?”… అనే విషయాన్ని జాగరూకులై గ్రహించాలి. బుద్ధి సహితమగు ఇంద్రియాల
Page:568
చేత “భోగాసక్తి – రసభావన" కలిగి ఉండి కర్మలు నిర్వర్తిస్తేనే అవి ఫలోన్ముఖములై బంధహేతువులు అగుచున్నాయి. వాసనారహితమగు చేష్టలు ఎన్నటికీ కర్మసంగమునకు దారితీయజాలవు సుమా! పులుసులో ప్రవేశింపజేయబడిన గరిటకు పులుసులోని రుచులతో సంబంధమే లేదు కదా!
అందుచేత “జ్ఞానంచే కర్మలను త్యజించి ఉండేదెట్లా?”… అనే మార్గాన్ని మీరంతా ఆశ్రయిం చండి. వాసనారహితుడగు జీవన్ముక్తుడు ఇంట్లో ఉన్నా, లేక, అరణ్యంలో ఉన్నా, ధనాది సంపదలతో కూడుకొని ఉన్నా, నిరుపేదగా ఉన్నా… ఆయా సందర్భములచే అతడు స్మృశించబడటం లేదు. అవన్నీ అతనికి సమానమే! జ్ఞానముచే ప్రశాంతి పొందిన మనుజునికి గృహమే నిర్జనారణ్యమై ఉండగలదు. ఇక అజ్ఞానముచే అశాంతి కలిగియున్నవాని సంగతో?… అతనికి జనశూన్యమైన మహారణ్యం కూడా అనేక రకాలైన జనులు సమావేశమై ఉన్న పట్టణం వలె ప్రాప్తిస్తోంది. ప్రశాంత బుద్ధి సమన్వితుడగు జ్ఞానికి కలలో కూడా జనసంసర్గము ఉండటం లేదు. అతని హృదయం నిర్మలమై, విశాలమై, అత్యంత రమణీయమై విరాజిల్లుతోంది. అందుచేత జ్ఞానాగ్ని చేత ఈ ‘దృశ్యము’ అనబడే ఎండుటాకుల ప్రోగును దహింపజేయండి. జ్ఞానాగ్నిచే శ్రమించిన దృశ్యముగల జ్ఞానికి ఈ జగత్తు, ఇందలి పదార్థముల సంచలనము శూన్యమయమై గోచరిస్తాయి. సమస్త విశేషములు శమించినప్పటి మహారణ్యంలాగా ఇదంతా అతనికి గోచరించగలదు.
అజ్ఞాని హృదయం - అజ్ఞాని తన హృదయంలో అనేక సంకల్పపరంపరలు కలిగి ఉన్నవాడై తన హృదయం నందే ‘జగత్తు’ అనబడునది ధరిస్తున్నాడని గ్రహించబడు గాక! అజ్ఞానికి తన హృదయంలోనే ఈ సప్త సముద్రాలతో కూడిన పృథివి విద్యమానమగుచున్నదయ్యా! అతనికి ఇదంతా కూడా నానావిధ సుఖదుఃఖాది ద్వంద్వ సంకటాలతో వ్యాప్తమై అనేక కార్యారంభాలతో ఉన్నదై…. తన యొక్క హృదయం నందే ఏర్పడి ఉన్నదగుచున్నదని విజ్ఞులు ఎఱిగియే ఉన్నారు.
అద్దంలో అంతా ప్రతిబింబిస్తున్నట్లు మలిన హృదయంలో - "ధనం లభించితేనే శాంతి. ఈ ఈ వస్తువులు, ఈ ఈ స్నేహములు, ఈ ఈ విధంగా ఉంటేనే సంతోషంగా ఉండటం సాధ్యం. ఏదో పొందితేగాని ఇప్పటి ఈ అసంతృప్తి పోవటానికి అవకాశం లేదు”… ఇటువంటి వీచికలు వీస్తుండగా మోహ-శోక-భయాది ధూళికణ సమూహాలు తిష్ట వేసుకొని ఉంటున్నాయి. అటువంటి హృదయమునందు మాత్రమే దేశ దేశాంతరాదులు, జీవ-జీవేతరులు, నేను-నీవు మొదలైనవి ప్రతిబింబస్తున్నాయి సుమా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! తైలము తరిగిపోతూ ఉంటే దీపం కూడా క్షయిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఈ అహం మమ రూపంలో ఉండే జగద్భావన తొలగుతూ ఉండగా సంసారము క్షీణిస్తూ ఉంటుంది. సంసారము తొలగుచూ ఉండగా, ఆత్మజ్ఞాన రూపమగు చిత్కళ
Page:569
ప్రవృద్ధమౌతూ ఉంటుంది. సంసారము తొలగాలనుకుంటే ఆత్మజ్ఞానరూపమగు చైతన్యాశ్రయం కాక మరింకే ఉపాయమూ లేదు. దృశ్యమును వదలి “దృక్”ను ఆశ్రయించి ఉండటమే మోక్షం. అంతేగాని, మోక్షమనగా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళి మరింకేదో అవటం కాదని సర్వజనులకు గుర్తుచేస్తున్నాను.
న త్యాగః కర్మ సంత్యాగో, బోధః త్యాగ స్మృతః అజగత్ ప్రతిభైకాత్మా యే అనహన్తాదిరవ్యయః ||
కర్మత్యాగం ‘త్యాగం’ కాదు. సర్వదృశ్యగరూపమగు ఆత్మస్థితిని ‘బోధ’ అంటారు. అట్టి బోధయే త్యాగము అని చెప్పబడుతోంది. ఓ సర్వ సహోదరులారా! మీరంతా జగత్ప్రతిభ అంటూ లేనిది… సర్వదా ఏకమే అయినది, (ఏనాడూ అనేకం కానిది)… నాశనరహితమైనది, అహంత్వం చేత పరిమితం కానిది అయినట్టి మీ స్వస్వరూపమగు ఆత్మను ఆశ్రయించి ఉండండి.
అట్టి ఆత్మను ఆశ్రయించి ఉండటమే సర్వత్యాగరూపమగు మోక్షము.
“ఈ శరీరమే నేను. ఈ బంధువులు గృహాదులు నావి” - ఈ రూపంగా దృశ్య తాదాత్మ్యం ఏర్పడి ఉంటోంది. అట్టి దృశ్య తదాత్మ్య భావన ఎవని పట్ల శమిస్తుందో అతడే త్యాగి. అట్లు శమించ నంతకాలం జ్ఞానం గాని, త్యాగం గాని ఉండుటకు అవకాశమే లేదు. దేహభావం - మమకారం అను రూపంలో ప్రదర్శితమవుతున్న ఆవేశం శమిస్తేనే… అప్పుడు బోధరూపమై, శివరూపమై, సర్వదా శాంతరూపమైనట్టి ఆత్మ శేషిస్తుంది. ఆత్మకు అన్యమైనది. ఎక్కడా ఏమీ లేదని సర్వజనులు గమనించెదరు గాక! తత్త్వబోధ (సర్వం ఆత్మస్వరూపమే) అనునది సమాశ్రయిస్తేనే దేహాభిమాన రూపమైన ‘అహం’ క్షయించగలదు.
అహం క్షయిస్తే మమత్వరూపమైన (నాది-నాది అను రూపముతో కూడిన) ఈ జగత్తంతా కూడా క్షయించిపోతుంది. యథార్థానికి ఏదీ క్షయించదు. మరి? "సర్వత్రా ఆత్మయే ఆక్రమించుకొని ఉన్నది”… అనే సమరసభావనచే జగత్తు స్థానంలో స్వస్వరూపం ప్రదర్శితమౌతుంది. ఏ జీవుడైతే వర్తమానంలో (బద్ధుడై ఉన్నప్పుడు, “నేను బంధమునందు ఉన్నాను” అనుకొనుచున్నప్పుడు) అహంభావంతో కూడుకొని ఉన్నాడో… అట్టి అహంభావన ‘అనహం’ (నేను అహం - మమ భావనలకన్నా ఉత్కృష్టుడను)… అను భావనా మాత్రంచేత నిర్విఘ్నంగా శాంతిని పొందగలడు. ‘అనహం’ (ఇవి ఏమీ నేను కాదు) అనబడు ఇంతమాత్రపు సాధనచే ముక్తి సిద్ధించుచుండగా ఇక అన్య సాధనాల గురించి వాద-వివాదాలు ఎందుకు?
శ్రీరాముడు : “అనహం” భావన గురించి మరికొంత వివరించమని నా ప్రార్థన. ప్రభూ! “నేను దేహాదులు కాను”… అనేది కూడా ఒక భావనయే కదా! అప్పుడు కూడా అట్టివాడు భావనలయందే ఉన్నట్లే గాని భావాతీతుడు కాలేడు కదా! ఆత్మానుభవం భావాతీతమైనది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “నేను దేహాదులు కాను. శుద్ధ చిన్మాత్రుడను” అను అనహం బుద్ధి ద్వైతం వలె ప్రారంభంలో అనిపించవచ్చు గాక! కాని ధూళి చిల్లగింజను ఆశ్రయించగా
Page:570
జలం పరిశుద్ధమైపోవునట్లు… అనహంబుద్ధి చైతన్యమును నిర్మలమొనర్చి చైతన్యమునందు విలీనమై పోగలదు. కాబట్టి ‘అనహం’ చైతన్యం కంటే భిన్నం కాదు. అయినా, నాదొక ప్రశ్న! చిత్స్యరూపం వాస్తవానికి ఆకాశం వలె స్వచ్ఛమై ఉండగా, నిర్లేపమై ఉండగా… అందు జగద్ర్భాంతికి తావెక్కడిది? న భ్రమో భ్రమణంనైవ, న భ్రాంతిర్ భ్రామకోస్తివా,
అనాలోకనమే వేదమ్, ఆలోకాన్నేదమస్తి తే ॥
వాస్తవానికి భ్రమ లేదు. భ్రమింపజేసేదీ లేదు. భ్రాంతి లేదు. భ్రాంతికి కారణమూ లేదు. మరి? అవన్నీ అజ్ఞానముచేత మాత్రమే సిద్ధిస్తున్నాయి. జ్ఞానముచే నివృత్తిస్తున్నాయి. లేక, ‘లేనివి’గా అగుచున్నాయి. అంతే!
ఓ రామచంద్రా! ఈ కనబడేదంతా కూడా “చిన్మాత్రమే, అసద్రూపమును బోలి ఈ రీతిగా వ్యాపించి ఉన్నది"… అని ఎఱుగుము. ఈ సమస్తము నిర్వాణ రూపమగు “ఆత్మ మాత్రము”గా గ్రహించినవాడవై మౌనము వహించి ఉండుము.
ఏ క్షణమందైతే ఈ జీవునకు శరీరాదుల పట్ల ‘అనహంబుద్ధి’ ఏర్పడుతుందో… అప్పుడు ఆ అనహందేహ భావనాపటిమచే సర్వదుఃఖాలు వాటంతట అవే తొలగుతాయి. అందుచేత నిరంతరం ‘అనహం’ భావన యొక్క అభ్యాసం చేత ‘అహం’ అనుదానిని ‘ఆకాశపుష్పం’ వలె మిథ్యగా చేసి వేయాలి. నీవు ధనుస్సు నుండి విడివడిన బాణంవలె సదా అంతర్ముఖుడవై ఉండు. శీఘ్రంగా, దృఢంగా ‘బ్రహ్మపథము’ను అవలంబించి శాశ్వత-తత్వమును సంతరించుకొని వెలయుము. సర్వ భావముల చేతను అప్రాప్యమై ఉన్న (భావాతీతమై ఉన్న) ఆత్మపదాన్ని పొంది ఈ సంసార సాగరాన్ని దాటినవాడవు కమ్ము. స్వాభావికమై ఉంటున్న ఈ అహంకార మాత్రమును జయించటానికి ఎవనికి వీర్యత్వము లేదో… అట్టివానికి ఇక బ్రహ్మపద ప్రాప్తి యొక్క మాట ఎక్కడిది చెప్పు?
షడ్వర్గో నిర్జితఃపూర్వం యేనోత్తమవిదా స్వతః భాజనం స మహార్ణానాం నే తరో నరగర్దభః ॥ ||
ఓ సర్వ జీవులారా! మీమీ శత్రువులు ఎక్కడో బాహ్యాన కాదు ఉన్నది. “కామ క్రోధ-లోభమద-మాత్సర్యం”…అనే ఆరు శత్రువులు అంతరంగంలోనే తిష్ట వేసుకుని ఉన్నారు. ఎవడైతే తన అంతఃకరణంలో ప్రవేశిస్తున్న ఈ ఆరుగురు శత్రువులను గుర్తించి, వారిపై యుద్ధం ప్రకటించి, వాటిని జయిస్తాడో… అట్టివాడు మాత్రమే ‘ముక్తి’ అనబడే మహత్ పదార్థానికి అర్హత సంపాదించు కుంటున్నాడు. ఇక తదితరుల జీవితాలు గాడిదల జీవితాల వంటివే అగుచున్నాయి. ఎవని అంతః కరణంలో మనోవృత్తి జయింపబడుచున్నదో… అతడే వివేకానికి అర్హుడగుచున్నాడు. ఓ రామా! సముద్రంలో కొన్ని శిలలను పడవేశామనుకో. ఆ రాళ్ళు సముద్రంతో సంబంధం లేకుండా ఉంటు నట్లు నీవు కూడా నీకు సంప్రాప్తించే ప్రవాహపతిత క్రియలను "ఈ దేహాదులు నేను కాదు. నేను సర్వదా అసంగమగు ఆత్మనే”… అను అనహం భావన కలిగి ఉండియే నిర్వర్తించు. సర్వదా సర్వం పట్ల నిర్లిప్తం వహించియే అన్నిటినీ నిర్వహించు. మనం ఇన్ని రోజులుగా చెప్పుకొనే సంవాదం యొక్క ప్రభావం చేత “నీవు సర్వదా - ఆత్మ స్వభావుడవే గాని, దేహ స్వభావుడవు కాదు” అని
Page:571
క్రొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కదా! ఇక ఎవరైనా సరే, అజ్ఞునివలె ఈ దృశ్యం పట్ల మోహం చెందవలసిన పనేమున్నది?
బంగారం గురించి తెలుసుకున్న తరువాత ఇక ఆభరణం గురించి కొత్తగా తెలుసుకోవలసిన దేముంది? అట్లాగే “సర్వకారణ కారణం" అనతగిన ఆత్మ గురించి ఎఱిగిన తరువాత ఇక దానికి అన్యమైన ఏ పదార్థం గురించి కారణతః ఎఱుగవలసి ఉన్నది చెప్పు? నామ రూపాత్మక సమస్తం కేవలం భ్రాంతిమాత్రమే అయి ఉంది. అట్టి భ్రాంతి శమించాలంటే ఆత్మజ్ఞాన మొక్కటే ఔషధం.
ఓ ముముక్షు మిత్ర జనులారా! వాయువు నందు చలనంలాగా అంతఃకరణంలో ‘వృత్తులు’ అనే వీచికలు వీస్తున్నాయి. చిదాకారవృత్తి (నేను చిదానందమగు ఆత్మను అను భావన) చే ఆ తదితర వృత్తులన్నిటినీ త్రోసిరాజనవలె! అనగా “ఈ తదితర వృత్తులు నా స్వరూపం కాదు” అను సునిశ్చయమును ప్రవృద్ధపరచుకోవాలి. తద్వారా ఆ తదితర వృత్తులన్నీ క్రమంగా నిరాధార మవుతాయి. అనహం భావనచే ఎవరైతే క్రోధ-లోభ-లజ్జ-మద-మోహాలను జయించటానికి ప్రయత్నంచరో… అట్టి వారికి ఎంత అధ్యాత్మ జ్ఞానం బోధిస్తే మాత్రం ఏం ప్రయోజనం?… ఈ అధ్యాత్మ శాస్త్రం ప్రతిపాదించేది అతనికి వక్రగతిగానే అగబడుచున్నది. వాయువు కంటే చలనము వేఱుకానట్లు… నీ స్వరూపము కంటే పరమాత్మ వేఱు కాదు సుమా!
ఒకాయన పూలమాల ధరించి అనాలోచితంగా రహదారిలో నడుస్తూ వెళ్ళుచున్నాడు. ఇంతలో ఒక పోకిరి పిల్లవాడు “ఏమయ్యోయ్! నీ మెడలో ఆడత్రాచు పామును ధరించావేమిటి?” అని కేకవేశాడు. వెంటనే ఆ బాటసారి ఒళ్ళు ఝల్లుమన్నది. ”అరె! ఈ త్రాచుపాము నా మెడలోకి ఎలా వచ్చి జేరిందిరా బాబు? నేను పూలమాలనుకొని చూచుకోకుండా ధరించానా ఎమిటి? ఇది పొరపాటున కరిచిందా నా పని ఆఖరు? ఏం చెయ్యాలి?” …అని నిలబడి బిగ్గరగా విలపించ సాగాడు. ఇంతలో మరొక బాటసారి ఆ మార్గంలో వస్తూ “అయ్యా! ఎందుకు విలపిస్తున్నారు? మీ మెడలో ఆ పూలహారం ఎంత ముచ్చటగా ఉన్నది?”… అన్నాడు. వెంటనే మొదటి ఆయన “మెడలో పాము! మెడలో పాము! తీయండి! తీయండి!” … అని కలవరించసాగాడు. అప్పుడా రెండవ బాటసారి దగ్గరగా వచ్చి పరిశీలనగా చూచి ”అదేమిటండీ బాబు! ఇంత మంచి పూలహారం ధరించి ‘పాము, పాము’ అని అరుస్తారేం?”… అని అనునయంగా పలికాడు. అప్పుడా మొదటి బాటసారి మెడలోని హారంతీసి చూచుకొని "ఓస్! ఆ పోకిరీవాడెవడో పాము అనేసరికి నేనెంత
భయపడ్డాను!" అని మరల హారమును ధరించి శాంతచిత్తుడై నడక కొనసాగించాడు.
ఈ సంఘటనలో లాగానే జీవుడు కూడా కూటస్థమగు అద్వయచిన్మాత్రం యొక్క జ్ఞానముచే పరమాత్మయందు విలీనమై తానే తద్రూపమై శోభించుచున్నాడు. యథార్థానికి పరమాత్మ ఉదయిం చటం లేదు. అస్తమించటం లేదు. అయ్యది సత్యసిద్ధమైయున్నది. కల్పిత వస్తువులైన “నేను - నీవు” మొదలైన వాటిచే అది బాధింపబడటమే లేదు. అంతేకాదు, పరమాత్మ కంటే అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు. ఇక ఈ భావాభావముల గురించి వేరుగా చెప్పవలసినదేమున్నది?
Page:572
“పరం పఠే, పూర్ణం పూర్ణే, శాంతం శాంతే శివం శివే” ఇత్యేవమాత్రం వితతం నా హం, న చ జగత్, న ధీః ||
ఓ రామచంద్రా! ఇక్కడ జీవుడు లేడు. మరొకడూ లేడు. మరి ఇదంతా ఏమిటంటావా? నీకు జీవుడుగా ఏదైతే కనబడుతోందో… ఆ కనబడేదంతా కూడా… “పరమై, పూర్ణమై, శాంతమై, శివమైనట్టి పరమాత్మ… పరమై-పూర్ణమై-శాంతమై-శివవమైనట్టి పరమాత్మయందు అట్లు స్థితి కలిగియున్నది”… అని గ్రహించు.
అనగా… నీవు ఏ జీవుని చూస్తున్నప్పుడైనా సరే, “ఈతడు పరమై-పూర్ణమై-శాంతమై శివ మైనట్టి పరమాత్మ స్వరూపుడే కదా! మరి నేనూ? నేనూ అదే స్వరూపుడను”… అనే అవగాహనను ప్రవృద్ధపరచుకోవటమే సరి అయిన మార్గం. అదియే తత్త్వమార్గం. ఇక అహంకారం గాని, బుద్ధిగాని, జగత్తు గాని ఎక్కడున్నాయి… ఉన్నదంతా ఆత్మయే అయినప్పుడు?
అనిర్వాణే వినిర్వాణం, శాంతం శాంతే, శివే శివమ్ | నిర్వాణమప్య నిర్వాణం స నభోర్ధం న వాపి తత్ II
మరల చెప్పుచున్నాను. నాశనరహితమై, శాంతమై, శివమైనట్టి బ్రహ్మం నందు… నాశ రహితమై - - శాంతమై - శివమైనట్టి (జీవుడుగా అనుకుంటున్న) బ్రహ్మమే స్థితినొంది ఉన్నది. త్రాడులో కల్పించబడిన పాము - త్రాడుగా తెలుసుకొన్న తర్వాత త్రాడునందే శమనం పొందుతుంది చూచావా? అట్లాగే, నామరూపాత్మకమైన కల్పిత జగత్తు బ్రహ్మమునందే శమించగలదు. వాస్తవానికి బ్రహ్మం ఆకాశాది ఆయా పదార్థములుగా ఎన్నడూ అవటమే లేదు. అవబోదు. బ్రహ్మం బ్రహ్మం గానే ఉంటోంది. ఇక ఒకప్పుడు కల్పన ప్రదర్శితమౌతోంది. ఆత్మజ్ఞానముచే అది మరొకప్పుడు శమిస్తోంది. బ్రహ్మం దృష్ట్యా చూస్తే ఏదీ క్రొత్తగా ఉదయించడం లేదు, శమించడం లేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనుజుడు ఒక్కొక్క సందర్భంలో అనేక గాయములను, వ్యాధులను, మానసిక బాధలను ఓర్చుకుంటున్నాడు. తట్టుకుంటున్నాడు. మరి “ఈ శరీరాదులు నేను కాదు”… అను అనహంభావనను ఓర్పుగా ఎందుకు ఆశ్రయించి ధరించలేడు చెప్పు? ప్రతి ఒక్కరికి అట్టి అనహంభావన సాధ్యమే. వాస్తవానికి ఈ దేహాదులందు అహంభావన ఏర్పర్చుకో వటమే శ్రమతో కూడిన పని. ఎందుకంటే ‘అనహం’ అనునదే ప్రతి ఒక్క జీవుని స్వభావమే అయి ఉన్నది కదా! అహంభావన ఆపాదిత స్వభావమైయున్నది. జగత్తునందలి సమస్త పదార్థ సమూహాలకు దేహాదులందలి అహంభావనయే అక్షయమైన, అంకురమై ఉన్నదని జనులంతా గమనించెదరు గాక! ఆత్మ బోధచే అట్టి జగత్తు అనబడేది నిర్మూలనమగుచున్నది.
వాయు ఉపమానం - పరమాత్మ “వాయువు” అని అనుకుంటే అందు వాయు తరంగం వంటిది ఈ అహంకారం. వాయువు సంచలనం శమిస్తే (వాయు తరంగాలు ఉండవు కదా!
Page:573
అట్లాగే అహంకారం శమిస్తే) అప్పుడిక జగద్దర్శనమంతా తనకు తానుగానే శమిస్తుంది. అప్పుడు ‘అనిర్దేశం, చిదాభాసరహితం, అనంతం, అజం, అవ్యయం” అయినట్టి స్వస్వరూప చిదాకాశం మాత్రమే శేషించగలదు.
దర్పణ ఉపమానం - పరమాత్మ అనే స్వచ్ఛమైన అద్దముపై ‘అహంకారము’ అనే జలతుంపర మాలిన్య సహితంగా గోచరిస్తుంది. ఆ ‘అహంకారము’ అనే జలబిందు సమన్విత ధూళి కణములను తొలగించామా, అప్పుడు ఆత్మ యొక్క నిర్మలత్వం గోచరించగలదు. అహంకారమే ఎదుట ఉండే పదార్థములను చైతన్యం నందు వికారసమన్వితంగా ప్రతిబింబింపజేస్తోంది. అహంకారం శమిస్తే, చైతన్యం అభాసరహితమౌతుంది. అనంతమై, అజమై, అవ్యయమైన పరమాత్మ రూపాన్ని సంతరించు
కుంటుంది.
మేఘ ఉపమానం - ఆకాశము మేఘావృతమైనప్పుడు సూర్యకాంతి ప్రసరించదు. ఎప్పుడైతే మేఘములు తొలగుతాయో… ఇక క్రొత్తగా ఎట్టి ప్రయత్నం లేకుండానే ఆకాశం సూర్య తేజస్సుతో ప్రకాశమానమౌతుంది. అట్లాగే అహంకారమేఘం తొలగగానే ఆత్మసూర్యప్రకాశం అంతటా అన్నిటా విరాజమానమై ప్రస్ఫుటం కాగలదు.
రాగితో కూడిన బంగారు ఉపమానం - చిరకాలంగా రాగితో కలిసి ఉన్న బంగారం తన స్వచ్ఛతను కోల్పోయి అల్పకాంతితో కనిపించవచ్చు గాక! ఆ బంగారాన్ని పుటం వేసి రాగిని తొలగిస్తే… బంగారం మరల ధగధగ ఛాయతో వెలుగొందుచున్నది కదా! చైతన్యం చిరకాలంగా అహంకారంతో కూడుకొని ఉండటం చేత ‘జీవుడు’ అనబడు రూపంలో కనబడుతోంది. ఎప్పుడైతే శ్రవణ, మననాది ఉపాయాలచే బ్రహ్మమును ఆవరించిన అహంకార దోషం తొలగుతుందో… ఆ మరుక్షణం బ్రహ్మము బ్రహ్మ రూపత్వముచే విరాజమానం కాగలదు.
సముద్రం చేరిన ఉప్పు… ఉపమానం- సముద్ర జలంలోంచి ఉప్పు బయల్వెడలుతోంది. అయితే, సముద్రంలో వేయబడిన ఉప్పు గడ్డ తన నామరూపాలు కోల్పోయి సముద్రజలంలో విలీనమైపోతుంది, చూచావా? అట్లాగే… అహంకారం బ్రహ్మమునందు ప్రవేశించగానే తన యొక్క జగదత్వమును కోల్పోయి బ్రహ్మముగానే పరిణమిస్తోంది.
వాస్తవానికి బ్రహ్మము సద్రూపమై, శాంతమై, నిత్య ప్రకాశమానమై అనిర్దేశ్యమై, అవాఙ్మనస గోచరమైయున్నది. అయితే (బ్రహ్మం, గుణాదుల కంటే అతీతమైనదైనప్పటికీ) అల్ప విషయాలైన అహంత్వం మొదలైనవాటికంటే బ్రహ్మం యొక్క ఔన్నత్యాన్ని నిరూపించటానికి అద్దానికి బృహదత్వం మొదలైన లక్షణాలు శాస్త్రములచే కల్పించబడ్డాయి. వాస్తవానికి అహంత్వ రూపంగా స్థితి కలిగి ఉన్నది కూడా బ్రహ్మమే! అహంకారాన్ని కూడా బ్రహ్మంగా దర్శించటమే అహంకారాన్ని అధిగమించటం (లేదా) జయించటం అనునదే శాస్త్రములు ముఖ్యోద్దేశము.
జగత్తు జగద్భావనచేతనే సిద్ధిస్తోంది. భావనచే సిద్ధించేది అభావనచే తొలగిపోక ఏం చేస్తుంది? అభావనచే (భావనామూలమగు అజ్ఞాన నాశనం) జగత్తుకు బీజమైన అహం పదార్థం స్వయంగా శమిస్తోంది. అప్పుడిక ‘అహంత్వం-జగత్తు-బంధం’… ఇటువంటి కల్పనలకు తావేది?
Page:574
సత్ప్రృహ్మ శివమాత్మేతి పరే నామ కలంకితా ఉదేత్య హన్తా కుంభత్వాదివ మృద్ధాతు విస్మృతిః ॥
ఆకారసమన్వితమైన కుండను చూస్తుండగా ఆకారాదులు వర్తించనట్టి మృత్తిక (మట్టి)ని ఏమరుస్తూ ఉంటారే! అట్లాగే ఎదురుగా కనబడే ఈ పాంచభౌతిక దేహం, గుణములు, మనస్సుబుద్ది-అహంకారము మొదలైన పరిమిత-కల్పనారూప విషయములను చూస్తూ స్వభావతః అపరిమితము, శుద్ధము, పరిపూర్ణము అగు (సత్తు-బ్రహ్మము-శివము అనబడే) ఆత్మను ఏమరచటం జరుగుచున్నప్పుడే ’జీవుడు’ అనబడేది దర్శనమగుచున్నది. అనగా,…. ఆత్మ అనబడే “అపరోక్ష చిదేక రసము” నందు - అజ్ఞానముచేత మాత్రమే “ఆత్మకు అస్వభావమైనది, సంకోచరూపమైనది, నామాదులచే కళంకితమైనది, నేను నీవు-మొదలైన పరిమిత దృష్టులను సంతరించుకున్నది” అయినట్టి అహంత్వము భ్రమచే స్ఫురిస్తోంది.
‘అహ’మనే బీజం నుండి “దృశ్యసత్త” అనే ప్రతిబింబితమంతా గోచరిస్తోంది. ఈ ’దృశ్య సత్త’లో అనంత సంఖ్యలో “జగత్తులు” అనే ఫలాలు ఉత్పన్నమౌతున్నాయి. నశిస్తున్నాయి కూడా!
‘అహంకారం’ అనే చిన్న మిరియపు గింజలో ఈ పర్వత - సముద్ర - - నది - భూమి సహిత బ్రహ్మాండం, రూపాలను సందర్శించే ఇంద్రియ స్వభావం, మనస్సు, ఆ మనస్సుకు గోచరించే కామ సంకల్పాది ఇంద్రియ వృత్తులు ఇవన్నీ చమత్కారంగా ఉదయిస్తున్నాయి. నీకు బాహ్యం వలె కనిపించే ఈ అంతరిక్షం, భూమి, వాయువు, ఆకాశం, దిక్కులు - ఇవన్నీ “అహంకారం” అను వికసించిన పుష్పం యొక్క సుగంధాలు మాత్రమే! తెల్లవారగానే వస్తువుల రూపాలు కనిపించటం ప్రారంభించినట్లు, ఆత్మయందు అహంకారం ఉదయించగానే జగత్తు ప్రకటితమౌతోంది. అనగా… అహంకారం భావనా మాత్రంచేత క్షణకాలంలో అసత్తగు ఈ జగత్తును నిర్మించుచున్నది. జలంలో చిన్న రాయి పడగానే ఆవృత్తాలు బయల్వెడలే విధంగా, నిశ్చల బ్రహ్మంలో ‘అహంకారం’ అనే గులకరాయి పడగానే, “ప్రవృత్తి” అనే ఆవృత్తం బయలుదేరి - - అదికాస్తా ముల్లోకాల అనుభవానికి కారణభూతమగుచున్నది. కళ్ళుమూసుకుంటే ఏదీ కనిపించదు. కళ్ళు తెరిచిన మరుక్షణం అనేక వస్తువులు కనిపిస్తాయి. ఆ కళ్ళకు అసత్యాలైన ఆకారాలు సత్యం వలే అగుపిస్తాయి. అట్లాగే రెప్ప పాటు కాలంలో ’అహంత్వం’ ఆత్మయందు ఉద్భవించి అదే అనేక జగత్తులను అనుభవిస్తోంది. ఎంత ఆశ్చర్యం! అట్టి అహంకారం రహితమవగానే ‘జగదనుభవం’ అనే బంధం ముడి వీడుతుంది. శ్రీరాముడు : అహంకారమును మేము రహితం చేసుకొని ఆత్మస్వరూపులమై ప్రకాశించేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : అహంకారము ఆత్మస్వరూపమే! ఆత్మ యొక్క విన్యాసమే! నిరంతరమైన పరమాత్మ జ్ఞానముచే అహంకారము నిశ్శేషముగా నశించగలదు. అప్పుడు సంసారము అనే మృగతృష్ణ పూర్ణంగా శమించిపోగలదు. ఓ రామచంద్రా! ఈ జగత్తు జీవునికి ఎట్లా లభ్యమౌతోంది? శ్రీరాముడు : “జగత్తు” అనగా అనుభవముయొక్క రూపమే కదా! అనుభవము “భావనచేయటం” అనే రజోగుణం నుండి బయల్వెడలుతోంది. కనుక జగత్తు భావననుండే పరిలక్ష్యం అగుచున్నది.
Page:575
శ్రీ వసిష్ఠ మహర్షి : భేష్! సరిగ్గా చెప్పావు. కనుక… స్వతఃసిద్ధమగు ఆత్మ ’చిన్మాత్రము యొక్క భావన’ అను చిన్న అభ్యాసం చేత సుసాధ్యమగుచున్నది. అట్టి ఆత్మానుభవి ఇక ఇక్కడ భ్రమనుగాని, భేదమునుగాని పొందనే పొందడు.
స్వయత్నమాత్ర సంసాద్యాదసహాయాది సాధనాత్
“అనహమ్ వేదనాన్ న అన్యత్ శ్రేయః” పస్యామి తే, అనఘ!
“ఈ దేహ-జగదాదులు నేను కాదు” అను భావనను ఈ జీవుడు ఎందుకు ఆశ్రయించ రాదు? అట్టి ‘అనహం’ అను భావనకు శ్రమ ఏమున్నది? అందుకు బాహ్యమైన ఎట్టి సాధనలు అవసరం లేదు కదా! అంతటి సులభ సాధ్యమైన ‘అనహం’ అను దానినిమించి శ్రేయమైనదేదీ లేనే లేదని నా అభిప్రాయం. కనుక - రామచంద్రా! నీవు ‘అనహం’ భావనను ఆశ్రయించు. శ్రీరాముడు : మహర్షీ! అట్టి ”అనహం" భావనను అతి త్వరగా సుస్థిరీకరించుకోవటానికి వీలుగా ఏదైనా సులువైన క్రమమార్గాన్ని ఈ సందర్భంలో ఉపదేశించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి :
2. “ఈ నలువైపులా విస్తరించియున్న జీవ - పర్వత-అంతరిక్ష - పృథివి-సముద్రవాయువులన్నీ నా స్వరూపము వంటివే”… అనే సమష్టి అహంకారమును ఆశ్రయించు.
క్రమంగా "ఈ పర్వతాదులు ఎందులో సమాగతమై ఉంటున్నాయో… అట్టి ఆకాశ స్వరూపుడను”… అను భావనను సమీపించి అభ్యసించు.
అట్లు ఆకాశస్వరూపమును అనుగతం చేసుకున్న తరువాత క్రమంగా నీ స్వరూపముతో ఈ విశ్వమంతటినీ పూరించివేయి. అట్లా సర్వమును పరిపూరితం చేసి దశదిశలా వ్యాపించిన విభవము కలవాడవగుము.
ఆ తరువాత "ఈ చరాచర జగత్తంతా నిష్ప్రపంచరూపమగు బ్రహ్మమే కదా”… అను అవగాహనను పెంపొందించుకో. ఆ విధంగా ఈ ప్రపంచమంతటినీ నిషేధము గావించివేయి.
ఆ తరువాత ఇక చెప్పవలసినదేమున్నది? ఆ నిష్ప్రపంచరూపమగు ఆత్మయే నీవు కదా! అదే ప్రతి జీవుడు కదా! కనుక స్వస్థుడవై, శాంతుడవై, దుఃఖరహితుడవై ఇంద్రియ దోషముచే స్పృశించబడనివాడవై కళాకళలు లేనివాడవై ఉండు. నిర్మలాత్ముడవై వెలయుము.
ఎందుకంటే… అధ్యారోపము, అపవాదము - అను రెండు సిద్ధాంతాలూ చివరికి నిష్ప్రపంచ రూపమగు శుద్ధాత్మనే ఉద్దేశిస్తున్నాయని మా అభిప్రాయం. అనగా….నిష్ప్రపంచమైనట్టి శుద్ధాత్మయే సర్వ వేదాంత సిద్ధాంత సారమైయున్నది.