Page:576
II. శ్రీ భుశుండ - విద్యాధర సంవాదము
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధ పరిచయ వాక్యాలలో ఈ జీవుడు “వ్యష్టిఅహంకారభావన” నుండి “నేను నిష్ప్రపంచకరూపమగు బ్రహ్మాన్ని” - అనే సమున్నత స్థితిని సముపార్జించటమే వేదాంత సిద్ధాంతసారం అని అనుకున్నాం కదా!… అది సాధించడమెలా?
ఈ జీవుని స్వభావం అనిత్యమగు దేహము-ఇంద్రియ విషయములలో ప్రవేశించి ఉన్నది. అదియే పరిమితత్వమునకు, జడాజడములగు ఉపాధుల రాకపోకలకు కారణమగుచున్నది. కనుక, “అపరిమితమైన ఆత్మకు దుఃఖం ఎందుకు తారసపడుతోంది?" అను ప్రశ్నకు సమాధానం “అపరిమిత స్వభావుడగు ఈ జీవుడు పరిమిత వస్తువుల పట్ల నమ్మకం-ప్రీతి-అభ్యాసం కలిగించుకొని ఉండటమే”… అని చెప్పబడుతోంది.
కనుక ఓ జనులారా! “ఈ మనస్సు ఇంద్రియముల వైపుగా పరిగెడుచున్నది” అనే విషయం గమనించండి. అట్టి మనస్సహితమైన సర్వేంద్రియ విషయ స్వభావాన్ని మొదట జయించాలి సుమా! ఆ తరువాత “వివేకము” మొదలైన సాధనములను ఆశ్రయిస్తే సర్వము అతిశీఘ్రంగా సిద్ధించగలదు.
స్వభావమాత్రం యేన అన్తర్ నజితం దగ్ధబుద్దినా
తస్య ఉత్తమపదప్రాప్తిః సికతా తైలదుర్లభా ॥
ఎక్కడైనా ఇసుకను ఎంతగా పిండినప్పటికీ తైలం లభిస్తుందా? ఎవడైతే ఇంద్రియ విషయ లోలత్వ స్వభావంతో కూడిన అంతఃకరణాన్ని ముందుగా జయించడో… అట్టివానికి ఉత్తమ పద ప్రాప్తి ఎట్లా అభిస్తుంది?… అందుకే శాస్త్రాలు సాధనాలను మొట్టమొదటగా ప్రతిపాదిస్తున్నాయి.
తెల్లటి గుడ్డపై కొంచెం రంగైనప్పటికీ చక్కగా అంటుతుంది చూచావా? అట్లాగే శుద్ధమైన చిత్తంలో కొంచెం ఉపదేశం కూడా చక్కగా ప్రవేశించి బ్రహ్మానుభవం అనుభూత మొనర్చగలదు. సాధనచతుష్టయం లేని చిత్తమునకు ఎంత ఉపదేశించినా కూడా కంఠశోషయే మిగులుతుంది.
ఈ విషయం గురించి ఒకప్పుడు ఒక మహానుభావుడు నాకు చెప్పిన కొన్ని విశేషాలు గుర్తుకు వస్తున్నాయి అది వివరిస్తాను. విను.
పూర్వం ఒకప్పుడు నేను భుశుండ వాయసము వారిని (భుశుండుడు అనే కాకి స్వరూప మహాత్ముని) సందర్శించటం జరిగిందని చెప్పి ఉన్నాను కదా! ఆయన మేరుపర్వతం యొక్క శిఖరాగ్రంపై ఒక గుహలో ఏకాంత స్థానంలో విరాజమానుడై ఉన్నారు. అప్పుడు నేను ఆయన్ను ఇట్లా ప్రశ్నించాను.
Page:577
ఓ భుశుండ మహాశయా! మీకు అనేకమంది జ్ఞానులు, అజ్ఞానులు తారసపడి ఉంటారు కదా! ఇంద్రియములను జయించనట్టి మందబుద్ధి ఆత్మజ్ఞానరహితంగా దీర్ఘకాలం జీవించిన ఎవ్వరైనా ప్రాణి గురించి చెప్పండి. తద్వారా మన ఈ అధ్యాత్మకథా ప్రసంగం రసవత్తరంగా ఉంటుందని నా అభిప్రాయం…
అప్పుడు భుశుండుడు చెప్పిన వృత్తాంతమేమిటో విను.
శ్రీ భుశుండుడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! మీరు అడిగిన దానికి అనుకూలంగా ఒక సంఘటనను వివరిస్తాను, వినండి. పూర్వం ఒకానొక విద్యాధరుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు. చక్కటి విచారవంతుడు. కానీ అతడు ఇంద్రియయలోలుడు. అనగా ఇంద్రియ విషయాలలో తగినంత నిగ్రహం లేనివాడు. అయితే తపస్సు మొదలైనవి బాగా చేసి చేసి, దేహం శుష్కింప జేసుకున్నాడు. ఆత్మజ్ఞానం సముపార్జించకపోవటం చేత అతని ఇంద్రియాలే అతనికి క్రమేణా ఎంతో భేదాన్ని కలుగజేయసాగాయి. అతడు కూడా దీర్ఘమైన ఆయువుపొందాడు. నాలుగు కల్పాలు ఆ విధంగా ఆత్మజ్ఞాన రహితమైన కేవల తపో-యమ-నియమాలు నిర్వర్తించాడు. చేయగా చేయగా, నాలుగవ కల్పం ఆఖరులో అతని యందు వివేకం జనించింది.
విద్యాధరుడు : "ఏమిటిది? ఈ జీవునికి మరల జన్మ - మరల మృత్యువు - మరల వార్ధక్యము”… ఇట్లా కలుగుతూనే పోతున్నాయి కదా! ఇదంతా ఎంత సిగ్గుపడవలసిన విషయం! ఇటువంటి జన్మ - కర్మల వలన లాభమేమిటి? ఏదైతే సుస్థిరమైనదో… అట్టి వస్తువును ఆశ్రయించటం ఉచితం. అయితే అటువంటి స్థిరమైన వస్తువు ఏదైనా ఉన్నదా?”
ఇట్లా వివేకముతో యోచించసాగాడు. ఆతడు అప్పటికే 18 వస్తువులతో కూడిన మోత బరువును (పంచప్రాణాలు, దశ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్థూలదేహాలతో కూడిన ఈ ఉపాధిని) అతి దీర్ఘకాలం ధరించి ఉన్నాడు కదా! అందుచేత వాటన్నిటి మూలంగా ఎంతగానో అలసిపోయాడు. ఈ సంసారం పట్ల విసుగు, విరక్తి జనించింది. ఆయా జ్ఞానులను సంప్రదించి వారి సలహాను అనుసరించి ఆ విద్యాధరుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి ఆదరపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు స్వాగతమర్యాదలతో అభ్యాగతి పూజ సమర్పించి, ఇక ఆ తరువాత, "ఏమి విద్యాధరా! ఇటు వచ్చావు?” అని ప్రశ్నించాను.
విద్యాధరుడు : మహాత్మా! భుశుండా! నేను అనేక కల్పాలు ఈ దేహంతో ఎన్నో యమ - నియమాలు నిర్వర్తించాను. సుదీర్ఘకాలం కాయక తపస్సు చేశాను. ఈ ఇంద్రియ విషయాలను నేను ఇప్పటికీ జయించలేకపోయాను. ఈ నా ఇంద్రియాలను చూస్తున్నారు కదా! ఇవి విషయాలలో ప్రవేశించటంలో అతి ప్రావీణ్యం చూపుచున్నాయి. ఆ విషయాల నుండి ఎన్నో ప్రియాప్రియరూప బంధాలు ఏర్పడుచున్నాయి. ఈ నా ఇంద్రియాలు విషయాల నుండి తొలగటమే లేదాయె! మీదకు దూసుకువచ్చే సునిశితమైన బాణాల కన్నా ఈ ఇంద్రియ విషయాలు మరింత ప్రమాదకరమై ఉంటున్నాయని నేను గమనించాను.
Page:578
ఇవి హృదయంలో అంధకారం వలె అలముకొని ఉన్నాయి. ఇక హృదయం తమోమయమై ఉంటోంది. ‘కామం’అనే మర్కటం హృదయాన్ని అనుక్షణం వ్యాకులపరుస్తోంది. నేను ఇంద్రియాలను జయించనే లేదని, అవియే నన్ను జయించి నా హృదయమును ఆక్రమించుకుని ఉన్నాయని నేను గమనిస్తున్నాను. వీటిని జయించకపోతే నేనేమాత్రం సుఖవంతుడను కాలేనని తెలుసుకున్నాను. విద్యాధర ఉపాధికి అనేక భోగాలు లభించే మాట నిజమే! ఆ భోగాలన్నీ మానసిక మహారోగాలేనని, వాటిని ఎంతగా అనుభవించినా తనివి తీరదని, ప్రతిభోగం కలిగించేది స్పర్దయే గాని శాంతి కాదని నేను గ్రహించాను. వాటిపట్ల విరక్తుడనైనాను. మహనీయుల ఉపదేశాన్ని అనుసరించి “మహత్ భాగ్యమే”… అన్నట్లుగా ఈనాటికి మీ దర్శనం చేసుకోవాలని, శరణు వేడాలని, మీ బోధ వాక్యాలు వినాలని బుద్ధి పుట్టింది.
శ్రీ భుశుండవాయస మహాయోగి : ఓ విద్యాధరా! ముందుగా మీ అనుభవ అవగాహనలను విశదీకరించండి.
విద్యాధరుడు : మహాత్మా! భుశుండమహాశయా!
యత్ ఉదారమ్ అనాయాసమ్ క్షయ - అతిశయ వర్జితమ్
పదం పావనమ్ ఆద్యంతరహితం తత్ వదాశు మే ||
ఈ విద్యాధర ఉపాధితో అనేక కల్పములు వివిధ భోగములు రుచి చూచాను. కాని ఏం లాభం? ఇందులో దుఃఖరహితమైనది. శాశ్వతమైనది అయిన సుఖమేదీ అగుపించటమే లేదు.
ఏ స్థానమైతే ఉదారమై ఎట్టి దుఃఖాలకు కారణం లేనిదై, ప్రయాసరహితమై, సహజానంద రూపమై, క్షయం గాని - - అతిశయం గాని లేనట్టినదై, పరమ పవిత్రమై, ఆది-అంతం లేనిదై ఉన్నదో… అద్దానిని గురించి విశదీకరించగల సమర్థులని చెప్పగా చెప్పగా విని, మిమ్ములను శరణు వేడుచున్నాను.
ఓ మునీంద్రా! ఇంతకాలం నేను జడాత్మకంగా (విషయాలలో) నిదురిస్తున్నానని నాకు తెలిసిపోయింది. చాలాకాలం తరువాత మనస్సు తీవ్ర వైరాగ్యంచే జాగృతమగుచున్నది.
కామము - మహాత్మా! ఏది ఎచ్చట ఎంతగా పొందినా కూడా… ఈ మనస్సు “ఇంకా ఏవేవో కావాలి” అను రూపంలో ఉండే కామంచే సంతప్తమగుచున్నది. ఆ కామం నుండి అజ్ఞానవృత్తులన్నీ ఒకదాని వెంట మరొకటి బయలుదేరి నింద్యముగ మహాక్షోభను కలుగజేస్తున్నాయి. ఫలితం? ఇక నేను దుశ్ఛేద్యములైన అనేక సాంసారిక క్రియాపరంపరలలో ఇరుక్కుపోతున్నాను. ఇంకేమున్నది? అనాత్మయందు ఆత్మాభిమానం ఏర్పడి, మోహం గుట్టలుగా ప్రోగగుచున్నది. ఇట్టి మోహం నుండి నన్ను సముద్ధరించండి.
Page:579
దోషభూములు - విద్యాధరునిగా అనేక ఐశ్వర్యములు ఉండవచ్చు గాక! గుణ సంపద కూడా ఉండవచ్చు గాక! సుందరమైన ఆయా శాస్త్ర ప్రవచిత అభ్యాసాలు నిర్వహిస్తూనే ఉన్నాను కూడా, కాని ఏం లాభం? ఇప్పటికి కూడా ఈ ఇంద్రియాల ప్రబలత్వమును జయించలేకపోయానే! ఆత్మ జ్ఞాన రహితుడవై తదితర విద్యాధరులపై కామ క్రోధాలు వదలలేకపోయాను. క్రోధ, భయ, దుః ఖ, కార్పణ్యాది ఆయా దోషాలు అసంఖ్యాకంగా నా హృదయ ప్రాంగణంలోకి వచ్చి పడుచూనే ఉన్నాయి. ఈ విద్యాధరాది దేవయోనులు కూడా ఆత్మజ్ఞానం లేనంతవరకు కమలాపై వ్రాలే దోమల వలె తుచ్ఛమైనవే కదా! జన్మ, మృత్యవులు విద్యాధరులకు కూడా తప్పేవి కావు కదా మరి!
ఈ శబ్దస్పర్శాది విషయాలన్నీ కూడా పూర్వం అనేకసార్లు అనుభవించినవే. అవియే మరల మరల అనుభవించటం జరుగుతోంది. అవి ఇచ్చేవన్నీ తుచ్ఛమైన అల్ప సుఖాలు మాత్రమే. ఈ విషయేంద్రియ స్పర్శలన్నీ వంచనోపాయాల ద్వారా మమ్ము అనేకసార్లు మోసం చేస్తున్నాయి. దాని ఫలితంగా దీర్ఘకాలంగా నేను ఖిన్నుడనై వీటి పాల పడి ఉన్నాను. మనస్సుకు విశ్రాంతియే లేదు. క్షణ భంగురాలైన అనేక విశేషాలతో కూడిన ఈ సంసారానికి అటు స్థిరత్వమూ లేదు. ఇటు అంతూ లేదు. ఆపాతమధురారంభా, భంగురా, భవహేతవః,
అచిరేణ వికారిణ్యో భీషణా భోగ భూమయః ॥
సంసార దుఃఖాలకు హేతభూతాలైన భోగాలన్నీ ప్రారంభంలో మాత్రం కొద్దిసేపు రమణీ యంగా తోచుచున్నాయి. అవన్నీ క్షణభంగురాలే కదా! అందుచేత అతి శీఘ్రంగా అవన్నీ కూడా వికారయుక్తములై భయాన్ని గొలుపుచున్నాయి. ఈ విద్యాధర సంబంధమైన సంపదలు నమ్మ దగినవి ఎట్లా అవుతాయి? వాస్తవానికి ఈ సంపదలన్నీ అనేక మానావమానాలకు కారణమై ఉంటున్నాయి. దుష్టమగు అహంకారం ప్రవృద్ధమగుటకు ఇవియే ఆజ్యం. ఇవి ‘వివేకం’ అనుదానికి సుతరామూ వ్యతిరేకమై ఉంటున్నాయి. ఓ భుశుండ మహాశయా! అనేక మధుర ఆఘ్రాణాలకు ఆలవాలమైన సుందర నందనవనాలలో సంచరించాను. కల్పవృక్షం ప్రసాదించగల భోగాలన్నీ అనుభవించాను. అనేక విషయానందాలు చవిచూచాను. సుందర విద్యాధర స్త్రీలతో అనేకచోట్ల విహరించాను. క్రొత్తగా ప్రారంభమయ్యేదంతా మొదట ఒక వింతగా ఉండి, అతిత్వరలో రోతగా పరిణమిస్తుంది. కాలక్రమేణా ఇవన్నీ అయోగ్యమైనవేనని, స్వభావసిద్ధమగు సుఖాన్ని ప్రసాదించ జాలవని నేను గమనించాను. పైగా మానసిక వ్యధ నన్ను ఏమాత్రం వదలటం లేదని, ఆయా భోగాలన్నీ మానసిక వ్యధను కొద్ది సమయం దాచిపెట్టటానికి మాత్రమే కారణమగుచూ, చివరికి చూచుకుంటే… ఆ వ్యధను ఇనుమడింపజేస్తున్నాయని తెలిసిపోతోంది.
Page:580
న్నాయి కూడా! ఎందుకంటే ఇవి వివేకం లేకుండా బాహ్యరూపాలను చూచి ఆకర్షించబడి పరుగులు తీస్తున్నాయి గాని, ఆయా వస్తువుల ప్రక్కనే చాటుమాటుగా ఉన్న తుచ్ఛత్వమును గమనించటమే లేదు. స్త్రీల రంగు రంగు వస్త్రములు, కులుకు, బెళుకులను చూచి చంచలమగుచున్నాయి. అంతే గాని “ఈ జంతు, మనుష్య దేహాలన్నీ రక్త మాంస మయాలే కదా!” అనే విషయం చూరగొనటమే లేదు. చిత్తం చంచలమై ఉండగా, అది నానావిధ బంధాలను కలుగజేసే కర్మలందు తత్పరమై ఉండగా, నరకం మొదలైన అనేక అనర్థములను కలిగించగల దుర్వ్యసనాలలో ఆసక్తి కలిగి ఉండగా… ఈ నేత్రేంద్రియానికి విశ్రాంతి ఎక్కడ ఎట్లా లభిస్తుంది? చిత్తం ఉపశమించే వరకు ఈ నేత్రేంద్రియం యొక్క గతి ఇట్లే అతి చంచలమై అలసిపోతూ ఉండక తప్పదు కదా!
ఘ్రాణేంద్రియము - అక్కడ ఇక్కడ ప్రత్యక్షమై ఉన్న ఆయా అనర్థాల వైపుకే పరుగులు తీస్తూ ఉంటే, పెంకి గుఱ్ఱములతో పోల్చతగిన ఈ ఘ్రాణేంద్రియాన్ని నేను నివారించలేక పోతున్నాను. అతి క్రూరుడగు మాంత్రికుడు తన మంత్రబలం చేత ఒక అమాయకుని బలవంతంగా తన వశం చేసుకొని దుర్గంధయుతమైన ప్రదేశాలలో నియమిస్తున్నట్లు ఈ ఘ్రాణేంద్రియం తనయందు శ్లేష్మాది దుర్గంధములతో కూడినదై ఉండి నన్ను మాత్రం ఆఘ్రాణిత వస్తువుల వైపు తరలించి బలంగా ఆ స్థానములందు బంధం కలుగజేస్తోంది!
జిహ్వేంద్రియము - “ఇది పొట్టకు మంచిది. ఇది కాదు. ఇది క్షేమకరం. ఇది అనారోగ్య కరం” అనే విచక్షణ లేకుండా ఈ నాలుక ఆయా రుచులందు ఆకర్షిత అయి ప్రవర్తిస్తోంది. ఆహా! మహత్తర సచ్చిదానంద స్వరూపుడగు ఈ జీవుడు పశువు, క్రిమికీటకాలు మొదలైన అవివేకపూరిత ఉపాధుల పరంపరలు సంపాదించుకుంటున్నాడంటే కారణం?… ఈ జిహ్వేంద్రియానికి దాసుడు అగుటచేతనే కదా!
త్వక్ ఇంద్రియం (స్పర్శేంద్రియం) - ఆహా! ఏమి ఈ చర్మేంద్రియం యొక్క స్పర్శలోలుత్వం! వేసవి కాలంలో ఎండవేడిమిని నిరోధించలేకపోతున్నట్లు, ఈ చర్మేంద్రియం యొక్క స్పర్శాశయాన్ని నిరోధించలేకపోతున్నానే!
శ్రవణేంద్రియం - ఈ శ్రవణేంద్రియం (చెవులు) శబ్దతరంగాల యొక్క ఆస్వాదమునందు అనురాగం కలిగి ఉన్నది. కోమలమైన గడ్డిపరకలను అభిలషించిన జింక భయంకర మృగములున్న స్థానములలో ప్రవేశించునట్లు… ఈ శ్రవణేంద్రియం నన్ను అవివేకపూరితమైన స్థానములకు చేరుస్తోంది. దూషణ - భూషణ - - తిరస్కార - పురస్కారములు కేవలం భాషాప్రయోగ మాత్రమే అయినప్పటికీ, శ్రవణేంద్రియం అందుకు కుస్పందనను ఆశ్రయించి ఒక్క క్షణంలో బుద్ధితత్త్వము వరకు ప్రకంపనలను కలుగజేస్తోంది. ప్రియ వాక్యములు పలికేవారు, వందనాలు సమర్పించేవారు, వినమ్రులైన భృత్యులు, స్తోత్రాలు ఉచ్చరించే వందిమాగధులు, వీళ్ళంతా పలికే అనేక శుభ శబ్దముల వైభవమును ఈ చెవులు విని ఉన్నాయి. కించిత్ సుఖమును, ఇంతలోనే దూషణ తిరస్కార శబ్దములు వినటంచే అవి కలిగించే దుర్భర దుఃఖములకు తీవ్రస్థాయిలో పొందుతూ పోతున్నాయి.
Page:581
మునీంద్రా! ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విశేషము లనేకములు అనేకసార్లు అనుభవించాను. కాని అవన్నీ ’అత్యంత శుష్కప్రాయాలు” అని ఇప్పుడు తెలిసిపోయింది. భుక్త్వా వర్ష సహప్రాణి దుర్భోగపటలీమ్ ఇమామ్ । ఆబ్రహ్మస్తంభపర్యంతం న తృప్తిః ఉపజాయతే ॥
బ్రహ్మలోకం నుండి ఒక గడ్డిపరక వరకు గల ఈ భోగసమూహాలను వేల సంవత్సరాలు అనుభవించినప్పటికీ తృప్తి కలుగనే కలుగదు. ఒకడు విస్తారమైన సామ్రాజ్యానికి మహాచక్రవర్తిగా సుదీర్ఘకాలం ఉండవచ్చు గాక! అనేక మంది సుందరస్త్రీలను లాలించి ఉండవచ్చు గాక! అనేక శత్రు రాజ్యాలను హస్తగతం చేసుకొని ఉండవచ్చు గాక! అందులో “దేహము-ఇంద్రియములుఇంద్రియ విషయములు” అను పరిధిని మించి అపూర్వమైన విషయాలు గాని, పదార్థాలు గాని ఏమున్నాయి? ఎవరైతే ”ఈ మూడు లోకాలలో నా పరాక్రమానికి ఎదురే లేదు కదా! నన్ను ఎవరూ ఏమీ చేయలేరు”… అని అనుకుంటూ విఱ్ఱవీగారో… వారంతా అతిత్వరలో కాలప్రభావం చేత గుప్పెడు బూడిదగా మిగిలిపోయారు! ఆ రాజ్యాలు, ఆ బల పరాక్రమాలు వారిని మృత్యువు నుండి కాపాడాయా? లేదు. మూడు లోకాలలోని అనేక పదార్థములను పొందినప్పటికీ, “నేను పొందవలసినదంతా పొందాను. ఒక పొందవలసినది లేదు" అని ఒక్క రోజన్నా అనుకోగలిగారా? …లేదు. వాస్తవానికి అవన్నీ వారు తపస్సు వంటి అనేక కష్టతర కార్యక్రములచే ఎంతో శ్రమించి సంపాదించుకున్నవే! వారికి తృప్తి అనేది ఎందుకు కలగలేదు?
ప్రాప్తేన యేన నో భూయః ప్రాప్తవ్యమ్ అవశిష్యతే,
తత్ ప్రాప్తో యత్నమాతిష్టేత్ కష్టయాపి హి చేష్టయా ॥ II
దేనినైతే పొందిన తరువాత ఇక పొందవలసిదంటూ ఏమీ ఉండదో… అద్దాన్ని ప్రాప్తి కొరకై ఎంత కష్టపడైనా ప్రయత్నించాలి. కాలంతో వచ్చి, కాలంతో పోయేది పొందిమాత్రం ఏం లాభం? కాలముచే బద్దము కానిది పొందితేనే ప్రయోజనం.
ఎవడైతే చిరకాలం ధన-నారీ తదితర విషయభోగాలను పొందాడో… ఆ తరువాత అతని శిరస్సుపై ఏమైనా కల్పవృక్షం మొలిచిందా? అతనికి క్రొత్తగా ఏదైనా శాశ్వత వస్తువు ప్రాప్తించిందా? లేనే లేదు. ఓ భుశుండమహాశయా! దురంతమైన (అంతు అనేదే లేని) ‘విషయాలు’ అనే మహారణ్యంలో సంచరించిన నేను - సౌమ్య బాలుడు అల్లరి బాలురచే వంచించబడినట్లు - అవే విషయాలచే వంచించబడ్డాను. ఈ ఇంద్రియాలు ఇంతకాలం నన్ను మోసం చేసి అవాస్తవ సుఖాలు, దుఃఖసమ్మిళిత పదార్థజాలాల వైపుగా తరలించాయి. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ
Page:582
- ఉప విషయాలన్నీ బయలుదేరింది మనస్సులోంచే కదా! అనగా నా మనస్సులోంచే ఈ విషయ శత్రువులు బయలుదేరి, నా మనస్సును తమ వైపుగా ఆకట్టుకొని నన్ను నిర్వీర్యునిగా, అర్థరహితునిగా చేసి ఉంచాయి. ఇంతకాలానికి “ఈ విషయాలే నా శత్రువులు”… అని తెలుసుకున్నాను. బోయ వాళ్లు జింకను వేటాడుచున్నట్లు ఈ విషయశత్రువులు నన్ను వేటాడుచున్నాయి.
ఆహా! అతి భయంకరమైన ఈ ఇంద్రియ విషయశత్రువులకు పట్టుబడనివారు ఈ భూతలముపై అతి కొద్దిమంది ఉంటారు. ఇక నావంటి మిగతావారి సంగతంటారా! ఈ దేహము అనే నగరం “విషయాలు” అనే శత్రుసేనచే ఆక్రమించబడటం జరుగుతోంది. ఇక్కడి భోగాలే ఆ విషయశత్రువుల భయంకరమైన గజబలగం. తృష్ణ వాళ్ళ పాశాలు. లోభం వారి ఖడ్గం. క్రోధం వారి ఈటెలు. శీతోష్ణాది ద్వంద్వాలు వారి రథబలం. అహంకారం వారి సేనాపతి. దుష్ట ఇంద్రియాలే వారి పతాకం. అటువంటి విషయ శత్రుసైన్యమును జయించుటకు సన్నద్ధుడైనవాడే వీరుడు గాని… ఈ రాజ్యాలు జయించేవారు నిజమైన వీరులు కానే కారు.
ఒక మదించిన ఏనుగు కుంభస్థలమును చీల్చటం సులభమేమో గాని, కుమార్గాలలో ఎప్పటి కప్పుడు ప్రవృత్తమగుచున్న ఈ ఇంద్రియాలను నిగ్రహించటం మాత్రం అంత సులభమైన పని కాదు. ఓ సాధూ! ఒకనికి అనేక తాత్త్విక విషయాలు తెలిసి ఉండవచ్చు గాక. గొప్ప పౌరుషం, మహత్తు, మహాధైర్యం కలిగి ఉండవచ్చు గాక! చివరికి వారంతా ఈ ఇంద్రియ శత్రువులతో పోరాడి జయిస్తేనే విశ్రాంతి. కుత్సితమైన ఈ ఇంద్రియాలను ఎవడు జయిస్తాడో అతడు దేవతలకు కూడా పూజార్హుడు అవుతాడు. జితేంద్రియులగు మహాత్ములు మాత్రమే ‘మనుజుడు’ అని అనిపించుకోవటానికి అర్హుడు. ఇక ఇంద్రియాలను జయించనివారు కేవలం మాంసపు ముద్దలతో సమానమే గాని ‘మనుజుడు’ అను పేరుకు అర్హులు కారు. అయితే ఈ పంచేంద్రియాలను జయించటం ఎట్లా? వీటికి సేనాపతి మనస్సు. కాబట్టి మనస్సును జయిస్తే ఈ ఇంద్రియాలు తమంతట తామే వశమౌతాయి.
అయితే, ఈ మనస్సును ఎట్లా వశం చేసుకోవాలో అర్థం కాక… ఈ రోజు మీ పాద పద్మములను ఆశ్రయిస్తున్నాను.
ఇంద్రియోత్తమ రోగాణాం భోగాశావర్జనాదృతే
నౌషధాని, న తీర్థాని, న చ మక్తాశ్చ శాంతయే ॥
ఈ ఇంద్రియములు నన్ను భయంకర రోగముల వలె పట్టుకున్నాయి. భోగములను గురించిన ఆశ చావదే! ఆశను త్యజించటమే ముఖ్యమైన ఔషధం. అంతేగాని తీర్థములు, మంత్రములు ఎన్ని సేవించినా లాభం లేదనే నిశ్చయానికి వచ్చాను.
ఈ ఇంద్రియములు ఎటువంటివి?
నీతోస్మి పరమం భేదమభిధావర్భిః ఇంద్రియైః ఏక ఏవ మహారణ్యే, తస్కరైః పథికో యథా ॥
మహారణ్యంలో ఒంటరిగా ఉన్న బాటసారి “ఎప్పుడు దొంగలు వచ్చి పడతారో?”….అని భయపడునట్లు నేను ఈ ఇంద్రియ విషయముల మధ్య చిక్కి భేదంతో పరుగులు తీస్తున్నాను. ఈ
Page:583
ఇంద్రియసమూహమును “బురదతోకూడి, అతిమలినమై, అత్యంత దౌర్భాగ్యంతో కూడినదై, దుర్గంధ భూయిష్ఠమై నాచువంటి తుచ్ఛములచే ఆక్రమించబడిన అల్పాశయము (మురుగు గుంట)తో పోల్చవచ్చు. దట్టంగా భయమును గొలిపే అరణ్యముతో పోల్చవచ్చు. బురదలో పుట్టి, అనేక తంతువులు కలిగిన తామరతూండ్ల వంటివి ఇవి. మొసళ్ళతో కూడిన ఉప్పునీరు వంటివి.
బాంధవోద్వేగదాయీని, దేహాన్తరకరాణిచ, కరుణాక్రందకారీణి, మరణానీన్డ్రియానిచ
మృత్యువు 1. బంధువులకు ఉద్వేగము కలిగించునది, 2. మరొక దేహమునకు కారణభూతమైనది, 3.కరుణచే రోదనము కలిగించేది… అను మూడు లక్షణాలు కలిగి ఉన్నట్లే ఈ ఇంద్రియాలు కూడా ఆ మూడు (ఉద్వేగం, పునర్జన్మ, రోదనం అనే) లక్షణాలు కలిగియే ఉన్నాయి. అవివేకిషు అమిత్రాణి, మిత్రాణి చ వివేకిషు,
గహనాంతర శూన్యాని, కాననాని ఇంద్రియాణి చ ||
ఒకడు ఒక అరణ్యం మధ్యలో ఉన్నాడనుకోండి. అతనికి ఆ అరణ్యం గురించి చక్కగా తెలిసి ఉంటే అది స్నేహితుని వంటిది. తెలియకపోతే శత్రువు వంటిది. ఈ ఇంద్రియారణ్యం కూడా అట్టిదే! ఇంద్రియాలు అవివేకికి శత్రువులు. వివేకికి మిత్రులు. వివేకసూర్యుణ్ణి కప్పి ఉంచటంచేత ఇవి మేఘాలతో కూడా పోల్చవచ్చు. మహాత్ములు వీటిని మొదలంట జయిస్తున్నారు. తుచ్ఛ సుఖాలలో ఆసక్తి గల ప్రాణులకు ఈ ఇంద్రియాలు గొప్పవిగా అగుపిస్తున్నాయి. వాటి నిండా రజో-తమో గుణాలు వ్యాపించి ఉన్నాయి. కనుక ఇవి మురికిగుంటల వంటివి. జీవుని క్రిందకు త్రోయటంలో ఈ ఇంద్రియాలకు అతి నైపుణ్యం ఉంది. లోపల విషం ఉండటంచేత అవి పాములతో సమానం. లోపల శిథిలత్వం జడత్వం కలిగి ఉండటంచేత కట్టెపుల్లలతో సమానం. ఇవి చోరత్వం, జూదం, కలహం మొదలైన దుర్వ్యసనాలు కలిగి ఉన్నాయి. శిథిలమైన నూతులు ఈ ఇంద్రియాలు ఒక్కటే.
మహాత్మా! ఈ ఇంద్రియాలు జనింపజేయు ‘ఆపదలు’ అనే మహాసముద్రంలో నేను మునిగి ఉన్నాను. ఇప్పుడు సమస్తము త్యజించి మిమ్ములను సమీపించాను. ఈ దీనుని తత్త్వోపదేశంతో ఉద్ధరించండి. తత్త్వజ్ఞులగు మహాత్ములతో సాంగత్యమే సర్వదుఃఖములకు పరిహారమని శాస్త్రజ్ఞులు ప్రవచిస్తున్నారు కదా! స్వామీ! జ్ఞాన - యోగానంద స్వరూపులగు మిమ్ములను మనసా వాచా
కర్మణా - శరణు వేడుచున్నాను.
దృశ్యమును వదలాలి - దృకన్ను పట్టుకోవాలి
శ్రీ భుశుండుడు : ఓ వసిష్ఠ మహర్షీ! ఆ విధంగా సుదీర్ఘమైన ఆయుష్షును అనుభవించియున్న ఆ విద్యాధరుడు నాతో తన అంతరంగమథనాన్ని ప్రకటించాడు. అప్పుడు నేను ఇట్లు పలికాను.
శ్రీ భుశుండుడు : (విద్యాధరునితో) ఓ విద్యాధరచక్రవర్తీ! నీవు చెప్పే మాటలు నాకు ఆనందాన్ని కలుగజేస్తున్నాయయ్యా! ఎందుకంటే నీవు ఇంతకాలానికి ‘ఆత్మజ్ఞానము’ అనే సౌభాగ్యం కొరకై
Page:584
జాగృతుడవైనావు. చాలా మంచిది. సంసారము అనే అంధకూపం నుండి నీవు వెలువడినవాడ వయ్యావు! అగ్ని చేత వ్యాప్తమైన బంగారములాగా నీ బుద్ధి వివేకముచే పూర్ణమైయున్నది. కాబట్టి ఇప్పుడు నీ బుద్ధి నా ఉపదేశవాక్యము యొక్క సూక్ష్మార్థమును పెద్ద ప్రయత్నం అవసరం లేకుండానే గ్రహించగలుగుతుంది. నిర్మలమైన అద్దంలో దృశ్యము స్పష్టంగా ప్రతిబింబిస్తుంది కదా!
ఇప్పుడు నేను కొన్ని విశేషాలు చెప్పబోవుచున్నాను. నేనిప్పుడు చెప్పేదంతా ఇప్పటికి మాత్రం కొంత అంగీకారబుద్ధితో విను. తర్వాత నీకే అంతా సుబోధమౌతుంది. ఎందుకంటే మేము చాలా కాలంగా అనేక సందర్భాలలో సుదీర్ఘ విచారణ చేసి ఇప్పుడు ప్రతిపాదించబోతున్న నిర్ణయాలకు వచ్చాం. కనుక మేము చెప్పబోయే వాటి పట్ల అనుమానం అక్కర్లేదు. ఇదంతా మా స్వానుభవం. మొట్టమొదటగా నీవు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టు - “అజ్ఞానాన్ని త్యజించటం!” శ్రీ విద్యాధరుడు : స్వామీ! అజ్ఞానాన్ని త్యజించుటమంటే ఏమిటి? నేను దేనిని వదలాలి?
శ్రీ భుశుండుడు : అహంకారం మొదలుగా గల ఏ దృశ్య ప్రపంచం నీకు అంతరంగంలో అనుభూత మగుచున్నదో… “అదంతా నేను కాదు. నాకు సంబంధించినది కూడా కాదు, ఈ దృశ్యానికి సంబంధించిన వాడను కాను”… అని గ్రహించటమే అజ్ఞానమును త్యజించటం. ఎందుకంటే ఈ దృశ్య ప్రపంచంలో ఎంతకాలం నీ స్వరూపం కొరకై వెతకి వేసారినా… నీ రూపం ఈ దృశ్య ప్రపంచంలో లభించేది కాదు. ఈ దృశ్యాన్ని దాటివేసే ప్రయత్నానికి ఉపక్రమించు.
“ఆత్మ గురించి తెలుసుకో!” దృశ్యమాత్ర రూపమైనట్టి అజ్ఞానాన్ని వదలిపెట్టి ఆ దృశ్యమునకు ‘సాక్షి’ అయిన ఆత్మ గురించి నీవు ఎఱుగు. “ఈ దృశ్యాన్ని, ఈ అహంకారాన్ని త్యజిస్తే ఏదేదో కోల్పోతామేమో?”… అని కొందరు జనులు సందేహిస్తూ ఉంటారు. కాని అది వాస్తవం కాదు. “న అహమ్ - త్వమ్ అస్తి, న జగత్” ఇతి నిశ్చయినస్తవ |
సర్వమస్తి శివం, తుచ్ఛ న దుఃఖాయ, సుఖాయ తే ॥
“నేను గాని, నీవు గాని, జగత్తుగాని లేవు. అంతా కూడా బ్రహ్మమయమైయున్నది”… అనే సుస్థిర నిశ్చయమే ఈ జీవునికి నిజమైన సుఖం కలిగిస్తుంది. అది దుఃఖం కలిగించదు సుమా! ”అది కోల్పోవటం కాదు. సంపాదించవలసినది సంపాదించటం”… అని నిశ్చయించుకొని ఉండు.
“అజ్ఞానం యొక్క ఆను-పానులు కనిపెట్టు!’‘అజ్ఞానం’ గురించి విచారణ చేయాలి. అయితే “ఎట్లా ఎక్కడ విచారణ చేయాలి?”… అనేది ఇప్పటి మన ప్రశ్న కదా?
శ్రీ విద్యాధరుడు : అవును స్వామీ! నా అజ్ఞానం ఎప్పుడు ప్రారంభమైనది ఎట్లా ప్రారంభమైనది? శ్రీభుశుండుడు : 1.భావన నుండి జగత్తు పుడుతోందా?… లేక, జగత్తు నుండి భావన పుడుతోందా? 2. ‘సుషుప్తి’ అనే ప్రసిద్ధమైన అజ్ఞానం నుండి జాగ్రత్-స్వప్న రూప ఈ జగత్తు పుడుతోందా?… … లేక, జాగ్రత్ నుండి స్వప్న సుషుప్తులు పుడుతున్నాయా?
Page:585
ముందు? ఏది వెనుక?…
ఈ విధంగా ప్రశ్నలు తయారుచేసుకొని… ఆ ప్రశ్నలకు సమాధానం కొరకై ఎన్ని జన్మలుగా వెతకినా ప్రయోజనం ఉండదు, సమాధానం లభించదు. అనగా, వాటి యొక్క కార్య కారణ భావనా వ్యవస్థ గురించి ఏమాత్రం ఎఱుగజాలం. కాబట్టి… “కాఠిన్యత్వం - ద్రవత్వం ఈ రెండూ ఒకే ఘృతము (నేయి) యొక్క లక్షణాలు”… అని మనం గమనిస్తున్నట్లు జాగ్రత్-స్వప్న సుషుప్తులు మూడూ అజ్ఞాన వ్యవస్థలే కనుక… వాటి గురించిన విచారణ వ్యర్థమే అవుతుంది. ఆ మూడు వ్యవస్థలకు సంబంధించక, వాటిలో ఆయా సమయాలలో ప్రవేశ - నిష్క్రమణలను నిర్వర్తిస్తున్న సత్ - చిత్ తత్త్వం గురించే మనం విచారణ చేయటం అవసరం సుమా!
అజ్ఞానాన్ని ప్రక్కకుపెట్టి, జ్ఞానం కోసం అన్వేషించు. మృగతృష్ణాంబువత్ విశ్వమ్, అవస్తుత్వాత్ సదప్యసత్ యచ్చేదం భాతి తద్భహ్మ న కించత్కించిదేవ వా॥
ఎండమావులలో ఎన్ని తరంగాలున్నాయి? ఎందుకున్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? అని తర్కించి ఏం లాభం? ఎండమావులలో జలం కనిపిస్తున్నప్పటికీ అది భ్రాంతిచేత మాత్రమే కదా! అట్లాగే ఈ జగత్తంతా “వాస్తవంగా, సత్తుగా” కనిపిస్తున్నప్పటికీ ఇది అసత్తే సుమా! అయితే ఈ భాసిస్తున్నదంతా అధిష్ఠాన రూపంచే బ్రహ్మమే అయి ఉన్నది. కాని ‘జగత్తు’గా (బ్రహ్మం కానట్లుగా) అనిపించుచున్నది. “మృగతృష్ణలో జలం నాకు కనిపిస్తోంది. కనుక, లేదు అనే మాట నేను ఒప్పు కోను”… అని వాదించే వానితో మనమేం చెప్పగలం? అతని దృష్టికి అది ఉన్నట్లే అగుచున్నది. అట్లాగే ఈ జగత్తుకు ‘నాస్థిత్వం-అస్థిత్వం’ రెండూ లేవు. అభావాన్ని సిద్ధించుకున్న వానికి ‘ప్రతిభాస’ అనునది కూడా లేదు. (యథాదృష్టం - - తథా స్థితర) ఇది అనిర్వచనీయమని చెప్పబడుతోంది.
కాబట్టి ఈ సమస్తము శివరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.
ఈ జగత్తంతా కూడా "మృగతృష్ణలోని జలం” లాగా అవస్తువు మాత్రమే! ఇది ‘సత్తు’ వలె భావిస్తున్నప్పటికీ అసత్తు మాత్రమే! ఇక్కడ భాసిస్తున్నదంతా అధిష్ఠానరూపం చేత బ్రహ్మమే అయి ఉన్నది. కాని జగద్రూపం చేత ఇది అవాస్తవం కనుక బ్రహ్మం కాదు. మృగతృష్ణలో (ఎండమావులలో) జలం ఉన్నదా?
“లేదు” అందామా… ఒక ద్రష్ట (అవిజ్ఞాత)కు జలం, జల తరంగాలు కనబడుచున్నాయి, అనుభవమగుచున్నాయి. కదా! అతడు ఆ జలం కొరకు పరుగులు తీస్తూ “నన్ను ఆపకండి. అక్కడ జలం ఉన్నది. నాకు అక్కడ తరంగాలు కనబడుతున్నాయి”… అని పల్కుచున్నాడు.
“గాలి తరంగాలు కాంతి కిరణాల సంయోగం చేత జలం యొక్క భ్రమ మాత్రమే కలిగి స్తుంది. అంతేగాని అక్కడ జలం ఉండటానికి అవకాశమే లేదు”… అని (మృగతృష్ణగా) గ్రహించిన వారికి అక్కడ జలభావం కలుగదు.
Page:586
అభావ బలం చేత ఇక్కడ ప్రతిభాస కూడా లేకుండా పోతుంది. కాబట్టి సమస్తము శివ రూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.
ఓ విద్యాధరా! మనం పైన చెప్పుకున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ జగత్తునకు మూలం అహంకారమే అని గ్రహించు. అట్టి అహంకారం నుండే దిక్కులు, పృథివి, ఆకాశం, సముద్రాలు, పర్వతాదులతో కూడిన ‘ఈ జగత్తు’ అనే పురాతన వృక్షం బయలుదేరింది.
సూక్ష్మాహంకారం నుండి స్థూల జగత్ వృక్షం - సూక్ష్మమైనట్టి ‘అహంకారం’ అనే బీజం నుండి జగత్తు అనబడే ఈ స్థూల వృక్షం బయలుదేరింది. “ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి" అనే రసం ఆ వృక్షమంతటా నిండి ఉన్నది. “అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు” అను పేర్లతో చెప్పబడే అధోలోకాలు ఆ వృక్షం యొక్క మూలాలు. నక్షత్ర మండలాలు ఆ వృక్షం యొక్క మొగ్గలు. వాసనలు దాని పూగుత్తులు. స్వర్గం మొదలైన లోకాలు దీని కొమ్మలు. కాల ప్రవాహమే ఈ వృక్షమును తొలచుచున్న పురుగు.
అసలు ఈ వృక్షం ఏ ప్రదేశంలో ఉత్పత్తి అయింది? ‘అజ్ఞానము’ అనే చోట! ఈ అసంఖ్యాక దేహపరంపరలు ఈ వృక్షముపై వ్రాలే పక్షులు. భ్రాంతి ఈ వృక్షము యొక్క కాండము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియ విషయాల యొక్క విషయ సాక్షాత్కారాలు; మనస్సు యొక్క సంకల్ప-వికల్పములు… ఇవి ఈ వృక్షము యొక్క గంధము.
హాస్య-విషాదాది రస ప్రకటనయే ఈ వృక్షం యొక్క చర్మం (డొల్ల). ఋతువులు దాని విచిత్రములైన ఉపశాఖలు. దశ దిక్కులు అద్దాని ప్రసరణ ప్రదేశాలు. ఆత్మసంవిత్తు దీని జీవన హేతువైన రసప్రవాహము. అవ్యాకృతాకాశము ఈ వృక్షము ఉన్న వనప్రదేశము. రాత్రింబవళ్ళు దీనిపై వ్రాలే తుమ్మెదల భ్రమణము.
ఈ విధంగా ఈ సంసారవృక్షము తన మూలముచే పాతాళమున, మధ్యభాగముచే ఈ దిక్సమూహమున, అగ్రభాగముచే అంతరిక్షమున వ్యాపించి ఉన్నది. అయితే ఈ సంసారవృక్షము వాస్తవానికి అసత్తే! అయితే ఏం? అది భ్రాంతిచేత సత్తువలె గోచరించటం జరుగుతోంది. విద్యాధరుడు: అటువంటి మహాభయంకరం, సువిస్తీర్ణం, మహాదీర్ఘం అయిన సంసారవృక్షమును ఈ మా అంతరంగం నుండి మొదలంటా తొలగించటం మాకు సాధ్యమేనంటారా?
శ్రీ భుశుండుడు : ఓ! తప్పకుండా సాధ్యమే. ఎంతటి వృక్షాన్నైనా అగ్ని దహించివేయ గలదుకదా! ఆత్మజ్ఞానరూపమైన ’అనహం అనే అగ్నిచే ‘అహంకారం’ అను బాహ్యాడంబర సమన్వితమైన సంసార విషవృక్షం దహించివేయబడగలదు. ఆపై "జన్మజన్మాంతర పరంపరలు”… అనే బీజరూప పునరుత్పత్తి స్వభావం కోల్పోయి ఈ వృక్షం నశించగలదు.
కనుక ఆత్మజ్ఞానాగ్నిని ఆశ్రయించి ఈ ఆగామి - ప్రారబ్ధ - - సంచిత రూపమగు సంసారరూప వృక్షమును మొదలంటా నశింపజేసుకొనినప్పుడే సర్వదుఃఖములు శమించగలవు సుమా!
Page:587
నేను - నీవు మొదలైనవి ఉండజాలవు!
శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ సంసారవృక్షం ఉత్పన్నమైనది ‘అహంకారం’ అనే బీజం నుండే! జ్ఞానాగ్నిచే అహంకార బీజాన్ని దహింపజేశామా… ఇక మరల సంసారవృక్ష సంబంధమైన పునరుత్పత్తికి హేతువు ఉండదు.
అందుకే వివేకం కలవాడు మునుముందుగా "ఈ ప్రపంచం యొక్క అసలైన రూపమేమిటి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం సముపార్జించుకోవాలి. తత్త్వదృష్టిచే విచారణ చేయాలి. “ఈ సమస్తం బ్రహ్మమే” అనే నిశ్చయం సుదృఢమగుచుండగా… ఇక అహంకారం యొక్క ఛాయ కూడా ఉండ జాలదు. ఇంతమాత్రపు అవగాహన చేత అహంకారం దహించబడు చుండగా, ఇక దిగులెందుకు?
అహంత్వభావాచ్ఛ ‘అహం - త్వమ్ అస్థి’ సంసారబీజకమ్ |
నాహంత్వభావాన్ ‘నాహం - - త్వమ్ అస్థి’ ఇతిజ్ఞానముత్తమమ్ ||
ఈ దేహాదులందు ‘అహం’ భావన ఏర్పరచుకొని ఉండటం చేతనే నేను వేరు - నీవు వేరు అనునది మొదలై అదికాస్తా సంసారమునకు బీజమగుచున్నది. "నేను గాని, ఇంకొకరు గాని ఈ దేహాదులు కాదు. కనిపించే ఈ దేహములను ఏ కనిపించని చిత్ చైతన్యము కదలిస్తోందో అదియే నేను-నీవు కూడా” అను ఇంతమాత్రపు జ్ఞానంచే అహంకారము తప్పక దహించివేయబడగలదు. సృష్టికి ముందు ఉన్నదేది? స్వస్వరూప చైతన్యమే కదా! అట్టి చితనందు అహంభావంగాని, నేనునీవు అనునవి గాని ద్వైత ఏకత్వ భ్రమలుగాని ఉండజాలవు. ఆ చైతన్యం సృష్టిని సిద్ధింపచేయ వచ్చుగాక! అంతమాత్రం చేత తన అనంత అప్రమేయ చిదానంద ఘనత్వము కోల్పోవుచున్నదా? లేదు. మరి ఈ దుఃఖాదులు ఎందుకు? ఎవరికి?
ఎవరైతే “నీవు సృష్టి కంటే ముందే ఏర్పడి ఉన్న నిర్విషయ చైతన్యమువు. ఇప్పటికీ మరెప్పటికీ యథాతథంగా అఖండ చైతన్యస్వరూపుడవే. ఈ సంసారాదులకు నీవు సంబంధితుడవు కాదు”… అను గురువాక్యం శ్రద్ధతో విని, తదనుసరణంగా సంకల్పాన్ని సమూలంగా త్యజించుటకై స్వయంగా యత్నం చేస్తారో… వారే ఈ సంసారాన్ని జయిస్తారు. జయించి నిస్సంకల్పమగు ఆత్మపద ప్రాప్తి యందు సఫలీకృతులౌతారు. అట్లా కాకుండా గురువాక్యాలను విని ఊరకుంటే లాభమేముంటుంది? ఒకాయన “వంట చేయటమెట్లా?” అనే విషయం బాగా పఠనం చేశాడు. అది తెలిసిన వాని వద్దకు వెళ్ళి “పదార్థాలు, వాటి పాళ్ళు, ఎప్పుడు ఎట్లా కలపాలి…” ఇవన్నీ నేర్చుకున్నాడు. అంత మాత్రం చేత సరిపోతుందా? ఆ నేర్చుకున్న విశేషాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇక వంట చేయటం ప్రారంభించాలి. వంట తయారుచేసి ఆ పదార్థం చక్కగా భుజించాలి. అప్పుడు కదా ఆహార ఆస్వాదనానందం! అట్లాగే వివేకవంతుడు ముందుగా గురువు వద్ద శ్రవణం చేయాలి. అంతటితో ఊరకుంటే సరిపోతుందా? లేదు. ఆ శ్రవణం చేసిన దానిని స్వప్రయత్నంతో, సత్-భావనతో కూడిన సాధన చేయాలి. అప్పుడే ఈ జీవుడు సంసారానికి ఆవలి ఒడ్డు చేరగలుగుతాడు. సంసారం
Page:588
హృదయంలో ఏర్పడి ఉన్నంత వరకు శ్రవణం, సాధన వదలకూడదు సుమా! “ఈ కనబడే శత్రు - మిత్రాది సమస్తమూ బ్రహ్మమే - అని అనుకోవటం” సాధన. “సమస్తము బ్రహ్మమే - అని అనిపించటం” అంతిమ లక్ష్యం.
ఓ ప్రియ విద్యాధరా! నీకు “నేను-నీవు” మొదలైనవాటితో కూడిన ఏ ఈ జగత్తు కనిపిస్తోందో …అదంతా చిత్ (చైతన్యం) యొక్క చమత్కారమనియే గ్రహించు. అందుచేతనే “చైతన్యమునకు అన్యమైనది ఎక్కడా ఏదీ లేదు” అని సిద్ధాంతీకరించబడుతోంది. ఒక చిత్రకారుడు ఆయా రంగులు మేళవించి ఒక గొప్ప ప్రకృతి దృశ్యమును చిత్రీకరించాడనుకో… ఆ చిత్రం యొక్క రూప విశేషా లన్నీ చిత్రకారుని సంకల్ప విశేషం నుండే రంగుల మేళవింపుచే బయల్వెడలినాయి. కదా! ఈ జగద్రూప చిత్రమంతా స్వ-సంకల్పం యొక్క ఆవిర్భావ విశేషం చేతనే కనిపిస్తోంది. సంకల్పం యొక్క అభావముచే జగద్భావన లయించగా, జగత్తు కూడా లేనిదిగా అగుచున్నది. ఈ లోకాలు, ఈ వెలుగు చీకట్లు, ఈ స్త్రీ-బాల-వృద్ధాది అనుభూతులు, ఈ కల్ప-కల్పాంతాలు చిరకాల సంకల్ప భావన యొక్క బాహ్య స్వరూపాలు మాత్రమే! అంతఃకరణంలో చిరకాలం దృశ్యం యొక్క భావనను నిర్వర్తించి ఉన్న తరువాతే అట్టి చిత్ లోంచి బయల్వెడలిన భావనారూప చిత్తమునకు ఈ బాహ్య మంతా గోచరించటం జరుగుతోంది.
చిత్రకారుని చిత్తములోని చిత్రము వలె ఈ జగద్రూప చిత్రం సంకల్పం యొక్క ఆవిర్భావం చేతనే కనిపిస్తూ… సంకల్పము యొక్క అభావముచే లయించటం జరుగుతోంది. మాంత్రికుడు మాయచే లేనివి ఉన్నట్లుగా కల్పించి చూపుచున్నట్లు - ప్రతిభాస చేత మాత్రమే సత్యమై, (కానీ వాస్తవానికి అసత్యమై) ఈ జగత్తు స్ఫురిస్తోంది. సువర్ణం సువర్ణంగా ఉంటూనే ఆభరణములుగా ప్రదర్శితమగుచున్నట్లు చిత్తు… చిత్తుగా ఉంటూనే చమత్కారంగా సంకల్ప-వికల్పాలను నిర్వర్తిస్తూ ఈ జగత్తును సముపార్జించుకుంటోంది.
అందుచేత ఓ విద్యాధరా! ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశనములు ఈ మనుజుని యొక్క అధీనంలోనే ఉన్నాయని గ్రహించు. ఎట్లా అంటావా? జగత్ అనేది సంకల్పంలో జనిస్తూ సంకల్పాలు ఉపశమించగా తాను కూడా లయించేది కదా! మరి సంకల్పాన్ని ఆశ్రయించడం, త్యజించటం జీవుని చేతిలోనే ఉన్నాయి గాని, మరెవరి చేతులోనో కాదు కదా! కనుక సంసారమును కల్పించుకునేదీ ఈ జీవుడే, ఆ కల్పనలను త్యజించేదీ ఈ జీవుడే సుమా! ఇది గ్రహించి ఆపై నీకు ఏది ఎట్లు ఉచితమనిపిస్తే అది అట్లే నిర్వర్తించు. ఒక్క ముఖ్య విషయం మాత్రం గుర్తుచేస్తున్నాను.
అత్యంతమేవ స్వాయత్తో యథేచ్ఛసి తథాకురు యశ్చ అన్న-పానదానాదానావనాదరము పేయివామ్ తస్యేదం పశ్చిమం జన్మ న సకర్మ మముజ్ఝతి | ||
ఎవడైతే అన్నపానాది ఐహిక భోగముల యొక్క దాన యజ్ఞాది ఆముష్మిక భోగముల యొక్క సర్వఫలములను కోరుకోక ఉంటాడో… అట్టి వానికి ఇదే ఆఖరి జన్మ కాగలదు. "నేను
Page:589
జన్మ - - కర్మ రహితుడను” అని అతిత్వరగా గ్రహించగలుగుతాడు. అట్టివాడు (తన అవగాహనను సుస్పష్టంగా, సునిర్మలంగా తీర్చిదిద్దుకున్న తరువాత) కర్మలను నిష్కామంగా ఆచరించగలుగుతాడు.
శుద్ధ బుద్ధివగు ఓ విద్యాధరా! నీవు ఇప్పటికే పతనహేతువగు అవివేకమును ఉల్లంఘించావు. కాబట్టే జ్ఞానార్థిపై నా దగ్గరకు వచ్చావు. ముల్లోకములను పునీతం చేయగలిగినట్టి అతి పవిత్రమైన వివేకమును సంపాదించుకున్నావు. అట్టి వివేకయుక్తమైన నిర్మల మనస్సు సంపాదించుకున్న నీకు ‘సంసారము’ అనే పతనము ఉండజాలదని నా అభిప్రాయం.
కాబట్టి నీవు మనోవాక్కులకు పరమై, చిన్మాత్రమైనట్టి నిర్మల ఆత్మపదమును మాత్రమే అవలంబించు. మనస్సు ఇత్యాది దృశ్యసమూహములను సర్వదా త్యజించి ఉండు.
శ్రీ విద్యాధరుడు : ఓ భుశుండమహాశయా! మీ ప్రవచనం అత్యంత శిరోధార్యం. అయితే, ఈ మనస్సు మొదలైనవి నా పట్ల నిర్విషయమాత్రం అవటానికి గాను నేను చేయవలసినదేమిటి? శ్రీ భుశుండుడు : సూర్య కిరణం నిర్మల జలంలో ప్రవేశించినప్పుడు తాపరహితమై, ప్రకాశమాత్రమై ఉంటుంది కదా! నీవు కూడా… “ఏ చిదాభాసుడైతే విషయాలలో, వాటి క్రియా-గుణ దోషాలలో, వాటిని ప్రకాశింపజేయటలో ప్రవేశిస్తున్నాడో… అట్టి చిదాభాసుని ఏ మాత్రం స్మరించనే వద్దు. పరమశాంతుడవై చిదనమాత్రుడవై కేవల చైతన్యమును ఆశ్రయించి అప్రమేయుడవై ఏర్పడి ఉండు. శ్రీ విద్యాధరుడు: స్వామీ! మేము తమ వలె ఈ జగత్తును జయించి, కారణకారణమగు కేవల చైతన్యమును ఆశ్రయించు శక్తిని సంపాదించకపోవటం చేత కాబోలు… ఈ సంసారభ్రమ శేషించియే ఉంటోంది?
శ్రీ భుశుండుడు : నాయనా! విద్యాధరా! ఈ జగత్తు అనబడేది అజ్ఞాన జీవుని పట్ల అచేతనమై, జడమై, దుఃఖాది రూపంగా, చైతన్యంతో అసాదృశ్యంగా అనిపిస్తూ ఉండవచ్చు గాక! వాస్తవానికి ఈ జగత్తు చైతన్యం యొక్క చమత్కారమే కాబట్టి, ఇది కూడా బ్రహ్మమే! సముద్ర మధ్యంలో అగ్ని ఉంటున్నట్లు ఇదంతా చైతన్య సదృశమై చైతన్యమునందే వెలయుచున్నది సుమా! అంతేగాని, చైతన్యమునకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు. అగ్ని పుట్టటానికి, అగ్ని ఆరటానికి కూడా వాయువే కారణమౌతోంది చూచావా? (గాలి లేనిచోట అగ్ని వెలగదు. గాలి యొక్క తీవ్రతచే అగ్ని ఆరిపోతుంది.) అట్లాగే చిత్తు తన చైతన్య శక్తిచే తనలోనే ఇదంతా గాంచుచున్నది. తానే ఈ సర్వ చేతనాచేతన పదార్థములకు కారణమైయున్నది.
నా హమస్తీతి చిద్రూపం చితి విశ్రాన్తిరస్తు తే తతో యథా యాదృశేన భూయతే, తాదృశో భవ ॥
Page:590
“నేను సంసారబద్ధుడను. అల్ప స్వభావుడను. అర్హతలు లేని వాడను”… ఇటువంటి సాంసారిక మైన అభిప్రాయాలను వెంటనే త్యజించు. “నా హమస్థితి చిద్రూపం… నేను ఆత్మ రూపుడనుకాను” …అనే జాడ్యాన్ని వదిలించుకో. “జీవుడుగా నేను ఒక కీటకం కంటే కూడా అధికం కాదు. ఆత్మగా ఈ 14 లోకాలకు అధిష్ఠానమై ఉన్నాను… నేను సర్వదా కేవల చిద్రూపుడనే” అను నిర్మలమైన సదవగాహనను సుస్థిరపరచుకొని అట్టి చిద్రూపంలో విశ్రాంతి కలిగి ఉండు. దేహా హంభావన సంపూర్ణంగా నశించగా, అప్పుడు ఏ (చిన్మాత) స్వరూపం నీకు అనుభవం అవుతుందో… అట్టి చిన్మాత్ర స్వరూపుడవై ఉండు.
చిద్రూపః సర్వ భావానామ్ అన్తర్ బహిరపి స్థితః ప్రసన్నాంబుభరస్య అన్తర్-బహిశ్చైవ యథా పయః
నదీజలం యొక్క అంతరమున, పైపైన ఉన్నది జలమే కదా! సర్వభావముల యొక్క అంతరమున, బాహ్యమున కూడా చిద్రూపమే స్థితి కలిగి ఉన్నది.
కాబట్టి “నేను ఒక అల్పుడను. చిద్రూపుడను కాను"… అనే వాక్యాలు కట్టిపెట్టు. దేహమనో సంబంధమైన అహంకారము చేత మాత్రమే ఆ విధంగా అనిపిస్తోంది అని గమనించు. అట్టి అహంకారమును త్యజించి, నీవు అఖండమగు చిద్రూపమునందే సంలగ్నుడవై ఉండు. అట్టి నీ చిద్రూపము స్వయంప్రకాశకమేగాని, మరింకేదానిచేతను అది ప్రకాశించటం లేదు సుమా!
యథా రంగమయం కుడ్యే జగత్ మౌనమివ స్థితిమ్
తథా చిచ్ఛిత్ర కచితం ఖే కుడ్యే చ ఆత్మసంస్థితమ్ ॥ ||
తెల్లటి గోడపై రంగులతో కూడిన యుద్ధ దృశ్యం చిత్రీకరించబడినట్లు మౌన స్వరూపమగు చిదాకాశంపై ఈ అనేక సంరంభాలతో కూడిన త్రిలోక సమన్వితమైన జగత్తు చిత్రించబడుతోంది. వాస్తవానికి ఈ జగత్తంతా నిర్వికార అద్వయరూపమగు ఆత్మయే గాని మరింకేదీ కాదు. ఓ విద్యాధరా! ఏ చైతన్యమగు స్వతః విశేషముచే ఇటు అచేతనమగు జగత్తుగా, అటు చేతనమగు బ్రహ్మంగా ప్రకటనమగుచున్నదో అట్లే ఆయా విశేషాల అనుభవంగా కూడా చిత్తు పొందుతోంది. కాబట్టి “నేను సర్వదా నిర్వికార చైతన్యమునే”… అని గ్రహించి ఉంటూనే ఏది నీకు ఇష్టమైతే అద్దానినే (ఇటు జగత్తునుగాని, అటు బ్రహ్మమును గాని) ఆదరిస్తూ ఉండు. ఈ జగత్తు చేత నీ స్వస్వభావం కుంటువడుతోందనే భ్రమకు ఏమాత్రం తావు ఇయ్యవద్దు సుమా! "ఎండమావులలో నీరు ఉండదు”… అని ఎఱిగి ఉన్న తరువాత అందలి భ్రమాత్మకమగు జలతరంగ దృశ్యమును చూస్తూ ఉన్నా, చూడకుండినా - అందులో విశేషమేమీ ఉండదు కదా! అట్లాగే తత్త్వవేత్తలు ఈ జగద్రూప చమత్కారముల మధ్యగా ఉంటూనే పూర్ణావగాహనపరులై కూడా ఉంటున్నారు. ఈ జగత్తు ఉనికి వారి అఖండాత్మానుభవమును నిరోధించజాలదు!
తిమిర దోషం గల కలవానికి ఆకాశమంతా కేశమయంగా కనిపిస్తుంది చూచావా? అనాత్మ భావనలో ఉన్నవానికి మాత్రమే ఈ జగత్తు ఆత్మకంటే అన్యమైనదిగా గోచరించటం జరుగుతోంది.
Page:591
ఈ విధంగా ఈ జగత్తంతా బోధరూపమగు ఆత్మయేనయ్యా! ఇది అభాసరూపమై అజ్ఞుల దృష్టికి ఉదయించినట్లు ఉండవచ్చుగాక. కానీ, తత్త్వజ్ఞుల దృష్టికి మాత్రం ఈ జగత్తనేది ఎప్పుడూ ఉదయించనిదే అయి ఉంటోంది. ఆకాశంలో మేఘాలను చూచి) కొండలు ఉన్నట్లు అనిపిస్తు న్నట్లు… లేని జగత్తు అజ్ఞాన దృష్టికి ఉన్నట్లే ఘనీభూతమై అనుభవమౌతోంది. ఈ జగత్తు యొక్క విశేషము ఇంతమాత్రమే.
శ్రీ భుశుండుడు : విద్యాధరా! “ఈ జగత్తు అనబడేది ఏ సమయమందునూ లేదు“ అని గ్రహించు. విద్యాధరుడు : మహాత్మా! మీ వాక్యాలు శిరోధార్యమే. కానీ ఎదురుగా ఈ జగత్తు కనిపించటం, ఇది ఇంద్రియ-మనస్సులకు విషయమయి ఉండటం, ఘనీభూతమైన ఈ జగత్తు దాటరానిదిగా అనిపించటం మాత్రం మాపట్ల జరుగుతోంది. ఇట్టి ఘనీభూతానుభవమును తిరస్కరించి ”ఇది లేదు” అని అనటం ఎట్లా?
శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ జగత్తు నీయందలి ఒకానొక ’స్ఫురణ’గా కదా, బాసిస్తున్నది? ఈ జగత్తును వదిలి నీ యందలి ఆ స్ఫురణను ఆశ్రయించు. ఆ స్ఫురణ చైతన్యమే కనుక ఆ స్ఫురణకు భాసించేది కూడా చైతన్యమే అనే నిశ్చయాన్ని కలిగి ఉండు. చైతన్యం నందలి స్ఫురణ చైతన్యమునకు వేరైనది కానేకాదు. దృష్టాంతానికి… జలంలో దీపపు కాంతి ప్రతిబింబిస్తోందనుకో… ఆ జలంలో ప్రతిబింబించే దీపం జలం కంటే వేఱు కాదు కదా! చిత్తు - ఆ చిత్తు యొక్క స్ఫురణచే తోచుచున్న జగత్తులోని దృశ్యత్వము వేఱు వేఱు కాదు.
ఇట్లు జ్ఞానాజ్ఞానముల అభేదమే సిద్ధించగలదు. అట్లు సిద్ధించుకుని, పరిచ్ఛేద రహితుడవై ఉండు. ఒక చిత్రకారుని చిత్రములోని చిత్రత్వము, ఆ చిత్రమునకు సంబంధించిన చిత్తములోని జ్ఞానము ఒక్కటే కదా! అట్లాగే చైతన్యములోని జగత్ సంబంధమైన స్ఫురణ స్వభావము, జగత్తుకు సంబంధించిన జ్ఞానము ఒక్కటే. ఈ సిద్ధాంతమును అనుసరించి ఈ జగత్తు చైతన్యమేగాని మరింకొకటేదీ కాదు. ఇది గ్రహించి ఊహాజనితమైన గంధర్వనగరముయొక్క అధిష్ఠానమైన ఆకాశము యొక్క మధ్య భాగం వలె సర్వదా స్వస్థుడవై ఉండు. ఈ జగత్తు సృష్టికాలంలో ఉంటోంది. సృష్టికి ముందు, ప్రళయానంతరం లేకుండా పోతోంది. చైతన్యం మాత్రం కాలాతీతమై, సృష్ట్యాతీతమై సర్వదా యథాతథంగా ఉంటోంది. అట్టి నిర్మల-నిర్విషయ చైతన్యమే నీవు. ఇది గ్రహించి ప్రశాంత చిత్తుడవై మౌనస్వరూపం వహించి ఉండు. ఇక ఏది ఎట్లా ఉండాలో అట్లే ఉండుగాక! నీ యథాతథ స్థితికి వచ్చే లోటేమున్నది?
విద్యాధరుడు : హే సద్గురూ! నాదొక చిన్న సందేహం. సృష్టికి ముందు ప్రళయమునకు తదనంతరం ఈ జగత్తు అనబడేది ఉండటం లేదని అన్నారు. కదా! మరి సృష్ట్యాదియందు, ప్రళయానంతరం ఈ జగత్తు ఏ రూపంగా ఎచ్చట దాగి ఉంటోంది?
Page:592
శ్రీ భుశుండుడు : ఒకచోట నిర్మలజలం ఉన్నదననుకో… ఆ జలంలో భావికాలపు నుఱుగు, బుడగలు ఏ రూపంగా, ఎచ్చట దాగి ఉంటున్నాయి? ఏం చెపుతాం? ఒక చిత్రకళాకారుని అద్భుత చిత్రకళా విన్యాసం ఆతని మునివ్రేళ్ళలోను ఆ మునివ్రేళ్ళు ధరించే రంగులకుంచెలోను ఎట్లా ఒదిగి ఉన్నది? ఒక వాహన చోదకుని చోదకకళ ఆతనిలో ఏ రూపంగా దాగినదై ఉన్నది? అట్లాగే బ్రహ్మము అనంతశక్తియుతమైయున్న కారణంగా అద్దాని మాయా విభాగమునందు ఈ జగత్తు సూక్ష్మరూపమున మహాప్రళయసమయంలో దాగి ఉంటోంది. గాఢ నిద్రలో ఉన్న జీవుడు కేవల నిర్విషయుడై ఉండి కూడా తనయందు జగత్ జ్ఞాపకములన్నీ, కోప - - ద్వేష - - ప్రేమ - త్యాగాది భావావేశములన్నీ అప్రకటిత సూక్ష్మరూపంలో కలిగి ఉండటమే ఇందుకు మనకు దృష్టాంతం.
జలంలోనుంచే జలరూపమైన బుద్బుదములు అకారణంగా (జలము మరొకటిగా అగుటకు ఏ కారణం లేకుండానే) ప్రకటితమౌతున్నాయి. అట్లాగే బ్రహ్మము నుండి ఎట్టి కారణము లేకుండానే ఈ సృష్ట్యాదులు కూడా ఉద్భవించినట్లు కనిపిస్తున్నాయి. స్వయంగా అకారణమై ఉన్న బ్రహ్మము నందు సృష్టి రచనకు కారణమేదీ ఉండజాలదు. కనుక ఈ జగత్తులనబడేవేవీ ఉత్పత్తి కాజాలవు, నశించజాలవు. కారణము యొక్క అభావముచే… ఈ జగత్తు లేశమైనా ఉద్భవించటంలేదు సుమా! ఎండమావులలో జలము ఉద్భవించటానికి కారణం లేకపోయినా, జలం కనిపిస్తున్నట్లు… ఈ జగత్తు అజ్ఞానముచే అనుభూతమౌతోంది. కనుక… "బ్రహ్మము బ్రహ్మముగానే బ్రహ్మమునందు సృష్టి - స్థితి - లయ విన్యాససమన్వితమై ఉంటోంది” అని; “నేను నేనుగానే నాయందు ఈ సృష్టి. స్థితి, లయ ప్రదర్శిత రూపుడనై క్రీడగా, లీలగా, సరదాగా విన్యాసములు సలుపుచున్నాను” - అని గమనించు, గ్రహించు.
కాబట్టి ఏ ‘సృష్టి’ అనబడేది నీకు ఉన్నట్లుగా అనిపిస్తోందో… అదంతా ’అజమై (జన్మ రహితమై), శాంతమై, అనంతమై, అఖండమైనట్టి బ్రహ్మమే, నని గ్రహించి ఉండు. నీవు బ్రహ్మ స్వరూపుడవే! ఇది గ్రహించి శిలామధ్యభాగ కోశమువలె ప్రశాంతుడవై జన్మకర్మాది రహితుడవై, అవయవరహితుడవై చెన్నొందుము.
పరమాత్మ జన్మాది రహితుడు. స్వాభావిక నిత్యానందస్వరూపుడు. అందుచేత అతనికి కార్య నిమిత్తమైన ఎట్టి ప్రయోజనం యొక్క అపేక్ష ఉండదు. అందుచేత ఆయనయందు సృష్ట్యాది కార్యాలు అసంభవాలు. ఏదేది అతనియందు దీపించుచున్నదో… అదంతా అజమగు శివరూపమే అయి ఉంది. అప్రబుద్ధుల దృష్టిలో ఏ శివం, అజం, చిద్రూపం అగు బ్రహ్మం ఏమరపాటు పొందుతోందో …అట్టి మూర్ఖ విలాస దృష్టికి కనబడే సృష్టి యొక్క నాశోత్పత్తులతో నీకు భావావేశాలతో కూడిన సంబంధం అవసరమే లేదు సుమా! ఆత్మజ్ఞుల అనుభవం అట్లాగే ఉంటోంది. ఇక అజ్ఞుల అనుభవం నీకెందుకు? ఆత్మజ్ఞుల అనుభవము మాత్రమే నీకు అనుసరణీయం కదా!
అప్రబుద్ధులు బ్రహ్మమును ఏమరిచి దృశ్యమును మాత్రమే చూస్తున్నారు. ఇక అర్ధప్రబుద్ధులు "ఎక్కడెక్కడ బ్రహ్మము ఉంటే అక్కడక్కడ జగత్తు (దృశ్యము) కూడా ఉండనే ఉంటోంది”… అను
Page:593
విచారణను ప్రకటిస్తున్నారు. ఈ రెండూ అవగాహనలు అసంపూర్ణములే గాని, పూర్ణార్థములు కావు. ఎందుకంటే “బ్రహ్మము వేఱు-దృశ్యము వేఱు”… అనే అభిప్రాయం ఇక్కడ వినబడుతోంది కదా! అయితే, ఈ కనబడే తృణం (గడ్డి), కాష్ఠం (కట్టె), జలం, కుడ్యం (గోడ) మొదలైనవాటి నన్నిటా పరబ్రహ్మమే స్థితినొందియున్నది. ఈ సృష్టి సమూహములన్నీ పరబ్రహ్మమునందే పరస్పరం గ్రుచ్చబడి ఉన్నాయి. ఇక్కడొక్క విషయం! అయితే…
బ్రహ్మణః కః స్వభావో అసావితి వక్తుం న యుజ్యతే అనంతే పరమే తత్త్వే స్వత్వాస్వత్వాత్య అసంభవాత్||
“ఇదియే బ్రహ్మము యొక్క స్వభావం” అని నిర్ణయించి చెప్పటానికి వీలేలేదు. ఎందుచేత నంటావా? అనంతమై, అద్వయమైనట్టి పరబ్రహ్మమునందు ’నిజస్వభావము - - పరస్వభావము’ మొదలైనవన్నీ అత్యంత అసంభవములైనవై ఉన్నాయి. అయ్యది అభావము అని అందామా? అప్పుడు “భావము అది కాదు”… అని అనవలసి వస్తుంది. పోనీ “అది భావనామాత్రము” అందామా… నిర్మల పరమాత్మ భావాభావముల దోషముచే పరిమితమైనదగుచున్నది. కనుక పరమాత్మయందు “స్వభావము” మొదలైన దుష్ట (పరిమిత) వచనములకు చోటు లభించదు. ఓ సాధూ! కాస్త విచారణ చేసి చూస్తే ”బ్రహ్మమునందు అహమ్ - త్వమ్ మొదలైనవి సంభవించనేరవు”… అని సుస్పష్టం కాగలదు. పరబ్రహ్మము నిత్యమైనది. అనంతమైనది. సర్వస్వరూపమైనది. అందులో నేను, నీవు, వారు అనబడునదంతా ఎట్లా ఉంటుంది? వాయువులో - “నీ వాయువు, నా వాయువు, వారి వాయువు”, అగ్నిలో - “నీ అగ్ని, మా అగ్ని, వారి అగ్ని”, భూమిలో - ”నీ భూమి, నా నా భూమి, వారి భూమి" … ఉంటాయా? వ్యవహారరీత్యా ఉన్నప్పటికీ, వాటి మొదలు-చివరలలో భ్రమయే దాగి ఉన్నది కదా!
అట్లాగే అద్దాని వ్యావర్తక పదార్థమనతగిన స్వ-త్వ (Sense of self) భావన కూడా ఉండ జాలదు. కనుక పరబ్రహ్మముపట్ల “స్వభావవచనము" కూడా సిద్ధించజాలదని, సంభవించనేరదని చెప్పటమైనది. ఏ ఏ “అహం త్వమ్ సః” భావనలు (ఈ జీవునకు) అనుభవమౌతున్నాయో అవన్నీ బాలుడు చీకటిలో చూచే బేతాళునివలె భ్రమచేతనే అనుభవమౌతున్నాయి. అట్టి అల్పానుభవం శాస్త్రాచార్యుల అనుభవంతో పరీక్షించి తత్త్వదృష్టితో చూస్తే తప్పక నశించిపోతుంది.
జగత్తు బ్రహ్మము వేఱు వేఱు కాదు! జగత్తు - బ్రహ్మము అను శబ్దముల భేదమేదైతే ఉన్నదో… అది వాస్తవానికి అభేదమే అయి ఉన్నది. ఈ రెండూ పర్యాయపదములే. ఆభరణం - బంగారం, బంగారు ఆభరణం అను అభేద రూప శబ్దములవంటివే అవి. “రాహువు యొక్క శిరస్సు" అనునది (గ్రహణకాలంలో భూ - - చంద్ర - సూర్యుల చలన సమయంలో సంభవించే) క్రీనీడమాత్రమేగాని, నిజమైన శిరస్సు కాదు కదా! అట్లాగే జగత్తు బ్రహ్మముల భేదం వికల్పము మాత్రమేనని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు.
Page:594
శ్రీ విద్యాధరుడు : ఓ భుశుండ మహాశయా! మీరు చెప్పే జగత్ -బ్రహ్మముల పర్యాయపదత్వం యుక్తియుక్తమే.. అయితే మా సాంసారిక దృష్టికి ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మముగా ప్రాప్తించటం లేదు.
శ్రీ భుశుండుడు : ఔను! అభ్యాసవశంచేతనే అట్టి దర్శనము సంభవం. జితేంద్రియుడైనవాడే ఈ జగత్తు యొక్క బ్రహ్మముతోటి అభేదమును దర్శించగలడు. ఇంద్రియ విషయములచే చంచల మనస్కుడైనవాడు సంసారబద్ధుడై జన్మ-జరా-సుఖ-దుఃఖాది అనుభవ పరంపరలనే పొందుచున్నాడే గాని, ఇద్దానిని నిష్కళంక బ్రహ్మముగా గాంచలేకపోతున్నాడు. ఎవడైతే 1. స్త్రీ యొక్క వస్త్రరహితమైన కోమల అవయవాలు తనను తాకుచున్నప్పుడు, 2. శస్త్రములు తనను తాకుచు న్నప్పుడు… ఆ ఉభయ అనుభవములలోను వికారరహితుడై సమముగా ఉంటున్నాడో… అట్టి జితేంద్రియుడే జగత్తు యొక్క బ్రహ్మత్వమును దర్శించగల పరమపదము నందు నెలకొని ఉండగలుగుచున్నాడు.
కనుక ఓ విద్యాధరా! శస్త్రముల ఆఘాతములుగాని, స్త్రీల యొక్క అవయవములు గాని ఈ దేహమునకు సోకినప్పుడు “వీటితో అనివార్యంగా సంబంధం కలుగుచున్నప్పటికీ ఈ సంబంధము వస్తుతః మిథ్యయే. లేక ఇది విరసమే”… అని ఎఱిగి జాగ్రత్తునందే సుషుప్త మౌనస్థితిని సంపాదించుకో. అట్టి ఘనీభూతమైన సర్వ సమస్థితి అనబడే సుషుప్త మౌనం అలవడేవరకూ పురుషప్రయత్నముచేతను, ధైర్యం చేతను ఇంద్రియ జయమును అభ్యసించు. నీవు సంసారములోనే ఉండవచ్చు గాక! ఈ సంసారము నీయందు ఉండవలసిన అగత్యమేమున్నదో చెప్పు?
యథా భూతార్ధ తత్త్వజ్ఞ మాధయో అగ్రగతా అపి |
న మనాగపి లింపన్తి పయాంసీవ సరోరుహమ్ ॥
కమలము జలంలో ఉన్నప్పటికీ ఆ జలం కమలమును స్పృశించలేకపోతోంది కదా! యథార్థమగు తత్త్వజ్ఞానము ఎఱిగిన జ్ఞానిని తీవ్ర మానసిక వ్యధలు కూడా లవలేశమైనా స్పృశించజాలవు. ఓ ప్రియ విద్యాధరా! అందుచేత మరల చెప్పుచున్నాను విను. స్త్రీ కోమల అవయవాలుగాని, శస్త్రముల ఆఘాతము (బాణపు దెబ్బలు) గాని తన శరీరమును తాకుచున్నప్పటికీ వికారరహితుడై, అతీతత్వము వహించిన వాడై ‘ఆకాశము’ వలె తాకబడజాలక ఎవడైతే ఉంటాడో… అట్టి శాంతుడగు మహాత్ముడే ఈ దృశ్య జగత్తు యొక్క వాస్తవతత్త్వమును దర్శించగలుగుచున్నాడు.
మట్టి మట్టిగా ఉంటూనే ఘటరూపంగా తయారగుచున్నది కదా! ఆ ఘటం (కుండ) మట్టి కన్నా వేఱుకాదు కదా! అట్లాగే ఆత్మ కూడా ఆత్మగా ఉంటూనే ఈ ‘జీవుడు’ అను రూపాన్ని దాల్చుతోంది. ఆత్మను గురించిన జ్ఞానంచే జీవరూపత్వం నశిస్తోంది. ఒక నటుడు తన వ్యక్తిత్వం కోల్పోకుండానే… నాటకంలో తాను నటిస్తున్న పాత్రయొక్క లక్షణాలు ధరించి నటిస్తున్నాడు కదా!
ఈ సుదీర్ఘ వేదాంత ప్రవచనం యొక్క సారమంతా ఇంతే. విషమును గుళికగా తయారు చేశామనుకో. ఆ గుళిక ఒకానొక ఆకారము పొందినప్పటికీ తనయొక్క “దేహమును చంపుట”
Page:595
అను విషస్వభావమును విడచుటలేదు కదా! చిద్రూపమగు బ్రహ్మము కూడా తన స్వభావమును విడువకయే ఈ జడ-అజడమగు జీవరూపమును ధరిస్తోంది. ఓ స్వభావ మాధుర్యమగు ఆత్మ స్వరూపుడవగు విద్యాధరా! నీవు బ్రహ్మమువేగాని జీవుడుగా పరిణమించటం లేదని గ్రహించు.
ఈ సృష్టి ఏ క్షణమందు కూడా బ్రహ్మం నుండి వేఱు కాదు. వేఱు కానప్పటికీ వేఱుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదంతా వాస్తవానికి బ్రహ్మమునందే ఉన్నది. బ్రహ్మంగానే ఉన్నది. బ్రహ్మమే జీవుడు రూపంగా పొందుచున్నది. జనన మరణ రహితమగు బ్రహ్మమే జనన-మరణాల మధ్యగా ఉన్నట్లు అనిపించే ఈ జీవుడు సుమా! ఇది అనుభవమయ్యేది ఎట్లా? అందుకు ఉపాయం ఒక్కటే! ఈ దేహేంద్రియములందు తద్విషయములైన శబ్ద, స్పర్శ, రూపాదులందు అహంకార మమత్వ రూపమైన ఆసక్తిని జయించాలి. గురుశుశ్రూష, శ్రవణ, మననాది సాధనాలు చేపట్టాలి. స్వప్రయత్నం చేత మాత్రమే ఈ సంసారసాగరం గోష్పాద జలం వలె దాటబడుచున్నది. అంతేగాని ఏదో దైవం (అదృష్టం) చేత కాదు. స్వప్రయత్నం, వివేక దృష్టిని వీడి “ఎవరో నన్ను తరింప జేస్తారులే”… అని అనుకుంటూ ఊరకొని ఉండటం ఉచితమే కాదు.
ఓ బిడ్డా! ఈ దృశ్యజగత్తులో ఇంద్రియాలకు ప్రియాలుగా అనిపిస్తున్న కొన్ని వస్తువులు తారసపడవచ్చు గాక! సర్వ సాంసారిక సుఖములకంటే, సమస్త ప్రియతమ పదార్థములకంటే ఆత్మ సుఖమే అత్యుత్తమమైనది. అది నీయందే సర్వదా వేంచేసి వేచియే ఉన్నది. ఎప్పుడైతే అంతః కరణంలో ఆత్మసుఖరూపమైన శీతలత్వం ఉదయిస్తుందో… అప్పుడా జీవుడు పరమ దరిద్రుడై ఉండి కూడా పూర్ణమగు ఆత్మ విశ్రాంతిని బడయగలడు. ఎప్పుడైతే ఈ మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైనవన్నీ సమస్తము యొక్క ‘సత్తాసన్మాత్రము’ అగు బ్రహ్మమునందు లయిస్తాయో… ఇక అట్టి నిర్మలబ్రాహ్మీస్థితి యందు కళంకమెచ్చట? కనుక ఓ విద్యాధరా! ఈ జగత్పదార్థములను తటస్థ భావంతో దర్శించటం అభ్యసించు.
తటస్థ భావన - ఈ జగత్తులో అనేక వస్తువులను తటస్థభావంగా చూడటం ఈ జీవునకు క్రొత్తేమీ కాదు. అపరిచితులను, అసంబంధితమైన ప్రాపంచిక వస్తువులను, నూతన ప్రదేశములను ఇంకా ఎన్నిటినో తటస్థభావంతో చూస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే ‘అహంత్వం’ అను దానిని అతిక్రమించి ఉండు. ఈ శరీరమును, మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహం అను దానిని కూడా తటస్థభావంతో గాంచుచూ ఉండు.
సాక్షి స్వరూపం - అటు తరువాత క్రమంగా సర్వసాక్షీస్వరూపము సంతరించుకో. సర్వసాక్షి -
స్వరూపుడవై ఇటు బాహ్య జగత్ పదార్థాల, అటు అభ్యంతరాలగు మనోబుద్ద్యాదుల అనుభవాన్ని పొందవద్దు. అనగా, అంతరంగంలో వాటికి స్థానం కేటాయించనే వద్దు. ఆ అనుభవాలకు ఆవల సాక్షీమాత్రుడవై ఉండు. అనగా స్వాభావిక ‘చిత్’ యందు స్థితి కలిగి ఉండు. అట్టి జ్ఞానస్థితిని సుస్థిరీకరించుకున్న తరువాత ఇక ఈ సుఖ దుఃఖాదుల మధ్య నీవు ఉన్నా, ఉండకున్నా ఒక్కటే. ఎందుకంటే అవి నిన్ను తాకజాలవు కదా! అట్టి శుద్ధాత్మస్థితియందు కర్తృత్వ - భోక్తృత్వములు
Page:596
ఉండజాలవు. అట్టి స్థితిని నీకుగా నీవే సముపార్జించుకోవాలి సుమా! అయితే శాస్త్రములు, గురువాక్యములు నీకు సహకరించుట కొరకై ఉన్నాయి.
శ్రీ విద్యాధరుడు : అయితే, ’అహంభావన’ అనునదంతా కేవలం కల్పితమాత్రమేనంటారా? శ్రీ భుశుండుడు : అవును. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక దృష్టాంతం చెబుతాను. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా! అందులో "తూర్పువైపు ఆకాశం - పశ్చిమ దిక్కున గల ఆకాశం - పైనున్న ఆకాశం - క్రింద ఉన్న ఆకాశం - - కుండలో గల ఆకాశం… మొదలైనవన్నీ ఆకాశమునందు ఒనర్చబడే ద్వితీయాకాశకల్పనయే కదా! ఇంటికి లోపలి ఆకాశం - ఇంటికి బాహ్యమున గల ఆకాశం”… అనేదంతా కల్పన గాక మరేమిటి? అట్లాగే ఈ అహం - త్వమ్ సః మొదలైనవన్నీ కూడా! అవన్నీ ఆత్మయందు భ్రాంతిచే కల్పించబడినవి మాత్రమే. “మహాకాశంలో ఈపైన కనబడే ఆకాశం కల్పించబడునది” అను దృష్టిగల ద్రష్టయొక్క అనుభవము ఎట్టిది? భ్రమయే కదా! అట్లాగే ఆత్మపట్ల అవిద్యచే కల్పన చేస్తున్న ద్రష్ట, ఆతని తదితరమైన దర్శనము…. ఇదంతా ఆత్మయేనని గ్రహించు. కల్పకుని చిద్రూపమే తనయొక్క సంకల్పాత్మక దేహమును ’జగత్తు’గాను, ’అహం’గాను తదితర ‘త్వం’ ఇత్యాది రూపములుగాను దర్శిస్తోంది. కాబట్టి ‘నేను’ అనే అహంకారంగాని, ఈ జగత్తుగాని అవిద్యయే తప్ప మరింకేమీ కాదు.
పంచభూతములన్నిటిలో కెల్లా ఆకాశము అతి సూక్ష్మమైనది. అయితే పరమసూక్ష్మమైనది - సమస్త స్థూల కల్పనలకు అధిష్టానమైనది అగు బ్రహ్మమునకు ఎదురుగా ఈ ఆకాశము అత్యంత స్థూలమైనదిగా గ్రహించు. అట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమొక్కటే ఉనికిని కలిగి ఉంది. ఆ చిత్తు యొక్క కల్పనయే ఈ జగత్తంతా కూడా! అట్టి ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైన చైతన్యం అహం, ఇదం (నేను, ఇది) అను రూపవాసనలను ఆశ్రయించి ఉత్తరోత్తరా ఈ దేహ, దృశ్య, జడ దాదులు పొందుతోంది. తనయందు స్వభావమును కల్పన చేసుకొని ఆ తదనంతరం ’తదితరమైనది’ అను రూపంగా తనకు అన్యముగాని ఈ జగత్తును దర్శిస్తోంది.
చిత్తు యొక్క కల్పనయే ఈ సృష్టి - - జలము ఆవర్తము, తరంగము, సుడిగుండము మొదలైనవి ప్రదర్శిస్తున్నప్పటికీ జలం జలంగానే ఉంటోంది కదా! చైతన్యము యథాతథంగా ఉంటూనే చమత్కారంగా జగత్తుగా అగుచు, తజగత్తును పొందుచున్నది. ఆత్మచైతన్యము ‘అహం’ అనబడు వివర్తము పొంది, ఈ విస్తార జగదనుభవమునకు తానే కారణకారణమై ఉంటోంది.
ప్రళయం - - చిత్తు వివర్తరూపంగా (జగత్తుగా) విస్తారమొందుచున్నదని అనుకున్నాం కదా! ఒకానొకప్పుడు జగద్భావనను తనయందే ఉపశమింపజేసుకుంటోంది. తరంగాలన్నీ ప్రశాంత జలంలో లయమగుచున్నట్లు అది జగద్భావనను తనయందు లయింపజేసినప్పటి స్థితే ‘జగత్ప్రళయం’ అను పేరుతో చెప్పబడుతోంది.
Page:597
ఈ ప్రకారంగా ఈ దేశకాలాదులన్నిటియందు చిత్తు యొక్క ప్రసరణ (వ్యాప్తియే సిద్ధించి
ఉన్నది. చిత్తు యొక్క ఉనికిచేతనే దేశ - - కాలములు, ఆకాశము, జలము, స్థలము, స్వప్నము, జాగ్రత్తు, జాగ్రత్తులోని మనోరాజ్యము… ఇవన్నీ అనుభవం కాగలుగుచున్నాయి. జగదనుభవ మంతా చిత్తుదే… చిత్తుకే! అందుచేత అది “ఒకచోటి నుండి మరొకచోటికి పోవటం”… అనే వికారము పొందటం లేదు. అద్దానికి విస్తరణముగాని, సంకోచముగాని అసంభవం.
కాబట్టి ఈ జగత్తుయొక్క ఉత్పత్తిగాని, వినాశనముగాని కేవలం అజ్ఞాన సిద్ధములే గాని… వాస్తవములైనవి కావు. ఇద్దరు కూర్చుని చెప్పుకునే ‘కథ’ లోని కథాసంఘటనల వంటివి. ఆకాశము ఒకచోట నిర్మలంగాను మరొకచోట కాంతిసమన్వితమైన వస్తువులతోను, ఇంకొకచోట చీకటి మయంగాను ఉంటున్నట్లే, చిదాకాశం ఒకచోట జ్ఞానమయంగాను, మరొకచోట అజ్ఞానమయం గాను ఉండటమే ఇక్కడి చమత్కారం.
ఈ దృశ్యము, ఈ జగత్తు, ఈ సుఖ దుఃఖములు మొదలైనవన్నీ మనస్సుకు సంబంధించిన వికారాలు మాత్రమే గాని… ఆత్మ ధర్మములు కావు. ఆత్మ సర్వదా జ్ఞానయుతమైయున్నది.
జ్ఞశ్చేతతి న భోగాది, న చైవ ఆత్మన్ అన్యసావహమ్ । ద్రవత్వమ్ అంభసీవ అంతర్ అద్వితీయ పరే స్థితః ॥
జ్ఞానమాత్రమగు ఆత్మ విషయజనితములగు భోగ దుఃఖాదులతో చిక్కుకునేది కానేకాదు. అంతేకాదు అద్దానియందు “నేను-నీవు-మేము-మీరు”… మొదలైన వ్యవహారములు ఉండవు. జలంలో ద్రవత్వం స్వభావసిద్ధమై ఉన్నట్లుగా… ఆత్మ సర్వదా తన కూటస్థ స్వభావముననే ఏర్పడి ఉంటోంది. ఆత్మ సంకల్పములకు ఆవల ఏర్పడి ఉన్నదని గ్రహించు. సంకల్పములకు ఈవల మాత్రమే చింత, లజ్జ, హర్షము, భయము, స్మృతి, కీర్తి, ఇచ్ఛ మొదలైన మనోవృత్తులు సంకల్ప రూపమున ఉంటున్నాయి. కనుక ఆత్మ మనోవృత్తి సంబంధితమైనది కాదు సుమా! బ్రహ్మము చంద్రబింబము వంటిది అగుచుండగా… ఆ చంద్రబింబము ప్రతిబింబిస్తున్న జలమువంటిది ఈ
సృష్టి. ఈ నేత్రాదులకు కనబడే జ్ఞానం చంద్రకిరణముల వంటిది. బ్రహ్మము ఈ సృష్టి - దేశ - కాలములచే స్పృశించబడేది కాదు. జలంలో చంద్రప్రతిబింబం కనబడుచున్నంతమాత్రంచేత ఆకాశములోని బింబచంద్రుడు జలతరంగములచే స్పృశించబడటం లేదు కదా! పరమాత్మ సర్వదా తనయందు తానే తన నిజస్వరూపమునకు వేఱుకానట్టి జగదాకారంగా తనయొక్క సర్వసమాన్య సచ్చిదానంద రూపముచే స్ఫురిస్తున్నారు. అయితే “దేహములు” అనబడు ఒకానొకచోట విశేషాభిమానంచే జీవులు మానసిక చింతాయుతులై ఉంటున్నారు. ’అహంకారాత్మ’గా తమ స్వరూపమే వేఱుపడినట్లు స్ఫురిస్తున్నారు. అది జలమందు ప్రతిబింబించే ఆకాశాదులవంటివి మాత్రమే. ఈ సమస్త జీవ - బంధ - - మోక్షాదులతో కూడిన జగద్రూపమంతా ఆత్మయందు కల్పితమై, భ్రాంతి దృష్టికి కనిపించేదేగాని ఆత్మయందు అవి లేవు. ఆత్మ వాటియందు లేదు. కథ అనునది కవియొక్క కల్పనయే అయినప్పటికీ,… కవిని కథలో వెతకి పట్టుకోగలమా?
Page:598
ఈ ‘సృష్టి’ అనే సరోవరము మజ్జన-ఉన్మజ్జనము (మునగటం, తేలటం) వంటి అనేక శబనీఖిములతోను, భావాభావతరంగములతోను కన్పట్టవచ్చుగాక. ఇదంతా ఎండమావులలో కనిపించే భ్రమపూర్వక జలతరంగములు మాత్రమే.
శ్రీ విద్యాధరుడు : మరి ఆ జగత్ భ్రమ దృష్టి తొలిగేది ఎట్లా?
శ్రీ భుశుండుడు : ఆత్మసాక్షాత్కారముచే అవన్నీ ఇట్టే మటుమాయమౌతాయి. ఆత్మకు సంబంధించిన అవగాహనాబలం చేత ఇక ఈ చూచేవాడు, కనబడేదీ, ఉభయము బ్రహ్మముగానే తెలియవస్తాయి. జలమే తరంగములుగా కనిపిస్తున్నట్లు పొగయే మేఘరూపంగా భాసిస్తున్నట్లు - బ్రహ్మమే మనస్సుగాను, జగత్తుగాను (జడ- అజడ రూపములై) భాసిస్తోందనునది అనుభవమౌతుంది. అంపమును కొయ్యపై అదిమినప్పుడు ఏర్పడే ఆవర్తనములు (గీతలు) ఆ కొయ్యకు వేఱుగాను, వేతైనవి కానివిగానూ కూడా కనిపిస్తున్నాయి చూచావా? అట్లాగే దేశకాలముల వర్జితమైన పరమాత్మయందు ఈ సృష్టికూడా జడ అజడ రూపములుగా భాసిస్తోంది.
ఆ అజ్ఞాన దృష్టికి కనిపించే సృష్టి మిథ్యమాత్రమే! జ్ఞానదృష్టితో చూచినంతమాత్రంచేతనే ఇది రహితమై పోతోంది. కనుక “ఇది అతి కోమలము”… అనతగినది. అయితే ఇదంతా బ్రహ్మమే కనుక, బ్రహ్మము సర్వదా సత్యమే కనుక ఈ జగత్తు శిలవలె ఘనీభూతమైనదని కూడా అనవచ్చు. స్ఫటిక శిలలో ప్రతిబింబించే అరటి చెట్టు ఎటువంటిదో, ఈ జగత్తు కూడా (జగత్తు అనగా ఆత్మ యందు భావనానుసారం కనబడే ప్రతిబింబమే కాబట్టి) ప్రతిబింబమాత్రమేనని కూడా చెప్పవచ్చు.
ఈ కనబడే వేలకొలది తలలు, కాళ్ళు, నేత్రములు… వాటి వాటి చేష్టలు ఇందులో కనిపించే తర్కవితర్కములు, ఇంకా ఈ దృశ్యంలో విద్యమానమయ్యే దిక్కులు, పర్వతములు, ప్రాణులు, నదులు మొదలైన వాటితో కూడిన ఈ జగత్తంతా అనంతస్వరూపుడగు పరమాత్మ యొక్క అంగుష్ట మాత్రమైన ఒకానొక పరిచ్ఛిన్న విభాగము అని కూడా అనవచ్చు సుమా!
అనగా… ఓ విద్యాధరా! ఏ ఈ జగత్తు నీకు అనుభూతమౌతుందో… ఇదంతా కలిపితే నీ యొక్క అనంత స్వరూపముయొక్క ఒకానొక అంగుష్టమాత్ర పరిచ్ఛిన్న విభాగము మాత్రమే! ప్రతి ఒక్క జీవుని విషయంకూడా ఇట్టిదే! - అని వివేక దృష్టితో గ్రహించు.
శ్రీ విద్యాధరుడు : స్వామీ! ఈ జగదత్వమంతా కలిపి నా ఆత్మ అనబడు అనంత స్వరూపం యొక్క ఒకానొక పరిచ్ఛిన్న విభాగంగా, అంగుష్ఠమాత్రంగా నిరూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదంతా ఆత్మయేనని తెలుపుటచే మీరు నాకు సద్గురువులయ్యారు. అనంతస్వరూపమగు ఆకాశాన్ని పరిమిత స్వరూపాలగు మేఘాలు కప్పి ఉంచినట్లుగా భ్రమింపజేసినట్లు ఈ జగదత్వం నా అప్రమేయ -నిర్వికల్ప స్వరూపాన్ని కప్పి ఉంచుతోందే! ఏమీ ఆశ్చర్యం! ఈ ప్రతిబంధకం తొలిగేది ఎట్లా? శ్రీ భుశుండుడు : (చిరునవ్వు చిందిస్తూ) బిడ్డా! ఈ జగత్తు అసారమైనది. పైకి అనేక ప్రకారములైన కామాదులతో రంజితమై పటాటోపంగా కనిపిస్తోంది. లోనంతా శూన్యము (మిథ్య) మాత్రమే. అటువంటి ఈ జగత్తు కేవలము తీవ్రవైరాగ్యముచేత మాత్రమే తుడిచివేయబడగలదు.
Page:599
శ్రీభుశుండుడు: ఓ విద్యాధరా! ఈ జగత్తంతా సుర అసుర గంధర్వ-విద్యాధర-మహోరగాది సహితంగా అనేక సంరంభాలతో కనబడుతోంది కదా! అయితే ఇదంతా కూడా జడమైన వాయువు చేతనూ, సూత్రాత్మచేతనూ సంచలనశీలమై ఉంటోంది. అట్టి జగత్తంతా ద్రష్టయొక్క చైతన్యం చేతనే ప్రకాశితమౌతోంది. అట్టి ద్రష్ట చైతన్యమే పరమాత్మ చైతన్యమని గ్రహించు. ఒక చమత్కారమైన చిత్రకారుడు ఒక వస్త్రముపై “రాజసౌధం, తటాకాదులు, వీధులు” మొదలైనవాటితో కూడిన నగర సౌందర్యాన్ని చిత్రించాడనుకో… అదంతా వస్త్రముపై తాకించిన రంగుల మేళవమే కదా! అయితే చూచేవానికి అనేక వికల్పములతో బహురమణీయంగా అనేక విశేషములతో స్ఫురించవచ్చు గాక! పరిశీలనాత్మక దృష్టి కలవానికి అది వస్త్రము - రంగుల మేళవింపుకాక మరింకేమీ కాదు. అట్లాగే అనేక వికల్పాలతో కూడి ‘మనస్సు’ అను వస్త్రంపై చిత్రీకరించబడిన ‘జగత్తు’ అనబడే ఈ చిత్రం ఆత్మ విచారణచే తన వికల్పత్వం కోల్పోతుంది. అనేక వికల్పాలు జగత్తులో లేవు. మరి? ద్రష్ట యొక్క మనస్సులోనే ఉన్నాయి! జలంలో పడిన నూనెచుక్క జలం యొక్క కదలికచే నలువైపులా విస్తరిస్తోంది చూచావా? మనస్సు చంచలమై బ్రాహ్మీస్వరూపమగు జగత్తు ఆ మనస్సు నందు ప్రతిబింబించు నప్పుడు అనేక సరస - - విరసానుభూతులను కలుగజేస్తోంది. అట్టి దర్శనమే సంసారము.
ఈ సంసారము హృదయమునకు గొప్ప క్షోభ కలుగజేస్తోంది. మనస్సంతా నామ, రూప, గుణ వాసనామయమై ఉండగా హృదయం దృశ్యానికి బంధితమౌతోంది. స్త్రీ, పుత్ర, ధనాది వ్యవహారాల పట్ల ఏర్పడే రాగమే ఈ సంసారానికి జీవుని కట్టి ఉంచు కట్టుత్రాళ్ళు. “అట్టి ఈ సంసారం మిథ్యయే”… అని ఆత్మజ్ఞాని మాత్రమే ఎఱుగుచున్నాడు. ఇది శబ్దస్పర్శాదుల ఆస్వాదనచే సుదీర్ఘంగా విస్తరించి ఉన్నది. మనం చెప్పుకున్నట్లు, వస్త్రముపై చిత్రమువలె ఇది హృదయముననే తిష్టవేసుకొని ఉన్నది. ఈ విధంగా అది చైతన్యం ”అహంభావం” మొదలుగా గల వికల్పాలను ఆశ్రయిస్తోంది. ఆశ్రయించి బహిర్ముఖమౌతోంది. బహిర్ముఖమై జీవత్మం పొందుతోంది. అయినా కూడా చైతన్యం సర్వదా చైతన్యముగానే ఉంటోంది. జలం తరంగాలుగా అయినా కూడా జలం జలంగానే ఉంటోంది. కదా! మట్టి బొమ్మగా అయినా కూడా మట్టి మట్టిగానే ఉంటోంది కదా!
వాస్తవానికి పరమాత్మకంటే వేరైనది ఎక్కడా ఏదీ లేదు. ‘చైతన్యం’ అనే సూర్యుడే ఈ ఉపాధి యందు ప్రవేశించి తద్వారా ‘అహం’ మొదలైన పేర్లను సంపాదించుకున్నవాడై ఇక ఈ సృష్టిగా అగుచున్నాడు. యథార్థానికి చైతన్యమునకు అన్యంగా స్రష్టలేడు, సృష్టిలేదు.
జలం తరంగత్వం వహిస్తున్నప్పుడుకూడా జలంగానే ఉంటోంది. తరంగాలు మాత్రం కదలుచున్నాయి. తరంగానికి ఆకారం ఉన్నప్పటికీ, జలం సర్వదా ఆకార రహితమే! జలము యథాతథంగా ఉంటూనే ఎట్లా చలనరూపసత్తయందు చలనరహితంగా ఉంటోందో… అట్లాగే ఆకాశము మొదలైన వాటితో కూడిన ఈ ప్రపంచమును రచిస్తూనే, చిదాత్మ ఈ ఆకాశాదుల
Page:600
రూపంలో లేదు. కథారచయిత పాత్రల కల్పనకు కారకుడై ఉంటూనే, ఆ పాత్రలన్నిటికంటే విభిన్నుడై ఉన్నట్లు, చిదాత్మ జగత్తుకంటే విశిష్టరూపమై ఉన్నది. అంతేకాదు! పాఠకుల అభిరుచికొరకై కదా, కథారచయిత కథ, పాత్రలు రచించేది! అభిరుచిని అనుసరించి సాహిత్యం ఉంటోంది. ఈ జగద్రచన కూడా జీవుల అభిరుచిని అనుసరించే రచించబడుతోందని గ్రహించు. అందుచేత జగత్తు భ్రాంతి మాత్రమే.
మరొక రహస్యం. ఈ జగత్తుకు చిదాత్మ కర్త కూడా కాదు. అది వానిని ఎఱుగుటయులేదు. జలమునకు తరంగకర్తృత్వం ఆపాదితం అయినట్లు జగత్తుయొక్క కర్తృత్వం చిదాత్మకు ఆపాదించబడుతోంది.
శ్రీ విద్యాధరుడు : మహాశయా! మరి ఈ మనస్సు మొదలైనవాటికి సంబంధించిన వర్తమానానుభవమును ఏ విధంగా అన్వయించుకోవాలి?
శ్రీ భుశుండుడు : ఈ మనస్సు, అహంభావము, బుద్ధి మొదలైనవన్నీ “అవిద్య” చేతనే ఏర్పడినవై ఉంటున్నాయి. పురుష ప్రయత్నబలంచేత అవి తప్పక నశిస్తాయి. ఆత్మకు అన్యమైనది లేదు అని గురు వాక్యం. కాబట్టి వాటిని ఆత్మ స్వరూపములే అని భావిస్తూ ఉండు.
పురుష ప్రయత్నం అంటే - 1. శాస్త్రములలో చెప్పిన విధి విధానములను నిర్వర్తించటం, 2. శాస్త్రార్థములను వివేకముతో విచారణ చేయటం, 3. పుత్ర, దార, ధనాదులందు మమకారం (ఇవి నావి, నాకు చెందినవనే భ్రమ) తొలగించుకోవటం, 4. మనస్సును చంచలత్వము నుండి ఉపశమింపజేయటం.
ఇట్టి పురుష ప్రయత్నబలంచే క్రమంగాగాని, అప్పటికప్పుడే గాని ఆత్మానుభవం పరిఢవిల్ల గలదు. అవిద్య యొక్క అర్ధభాగం తత్త్వవేత్తలతో సంభాషించుచుండగా తొలగగలదు. మిగతా సగభాగం ఆత్మ విచారణచేత, ఆత్మ సాక్షాత్కారంచేత నశించగలదు. భ్రమలన్నీ తొలగితే శేషించేదే సన్మాత్రమగు ఆత్మ.
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! అవిద్య యొక్క అర్ధభాగం తత్త్వవేత్తలను ప్రసన్నం చేసుకొని, వారితో సంభాషించటం చేతను, మిగతా అర్ధభాగం శాస్త్రవిభాగముచేతను ఆత్మ సాక్షాత్కారం చేతను… ఎట్లా తొలగుచున్నదో సవివరంగా చెప్పమని నా ప్రార్థన.
అట్లాగే “అవిద్య అప్పటికప్పుడేగాని, క్రమక్రమంగా గాని తొలగగలదు”… అని కూడా అన్నారు. ఇది కూడా విశదపరచమని విన్నపం. “సమకాలముగా గాని, క్రమక్రమంగా గాని”… అనే మాటలకు అర్థమేమిటి?
“అవిద్య తొలగితే నామరూపరహితమగు సన్మయం శేషించగలదు”… అని అన్నారు కదా! ‘సత్’ అనగా బ్రహ్మము. ఇక ‘మయము’ అనగా ‘నిండి ఉన్నది’ అని అర్థం. మయము -
అసత్నే సూచిస్తోంది. కనుక “సన్మయము” అనుదానిలో సత్ - అసత్ అంశం లేవేవి ఉన్నాయో
అవి విశదీకరించండి.
Page:601
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సుజనేన విరక్తేన సంసారోత్తరణార్థినా |
సహచాపి ఆత్మవిదుషామ్ స్రసృతిం ప్రవిచారయేత్॥
ఈ సంసారమును దాటివేయాలనుకున్నవాడు ముందుగా ఈ జగద్విషయాల పట్ల విరక్తిని సంపాదించుకోవాలి. అనగా జన్మ జన్మాంతరార్జితమైన అనురక్తిని ఉపశమింపజేసుకోవాలి. అప్పుడు తదితర ముముక్షువులతో కలిసి “ఈ సంసారము ఎట్టిది? ఎక్కడి నుంచి వస్తోంది? దీని మూల మేమిటి? పరిణామమేమిటి? దీని సారమేమిటి? మనుజుడు ఇద్దాని నుండి తరించేది ఎట్లా?” అనే ప్రశ్నల గురించి విచారణ చేయాలి. ఎడారిలో ఒయాసిస్సులు ఉన్నట్లు ఈ సంసార మహారణ్యంలో ఆత్మజ్ఞులగు సజ్జనులు కూడా ఉన్నారు. అట్టి బుద్ధిమంతుడు, విరక్తుడు, మాత్సర్యరహితుడు అగు మహనీయుని ఎట్లాగైనా సరే, ఎంత ప్రయత్నించైనా సరే… వెదకి సేవాదులచే ఆయన కృపకు పాత్రులు కావాలి. ఆ విధంగా “శుభేచ్ఛ” అను ప్రథమ భూమికను ఉదయింపజేసుకోవాలి. అప్పుడు తప్పకుండా అవిద్య తిరోగమించనారంభిస్తుంది. అవిద్యయొక్క అర్థభాగం సజ్జనసాంగత్యం చేత తొలగుతుంది. ఇక నాలుగవభాగం శాస్త్రవిభవాలచే - స్వకీయమైన సునిశితావగాహనచే తోక ముడుస్తుంది. మిగతా భాగం ఆత్మసాక్షాత్కారరూపమైన స్వప్రయత్నముచే వైతొలగగలదు.
ఇన్ని మాటలెందుకయ్యా? కేవలం "మోక్షమును నేను సంపాదించాలి?”… అనే తీవ్రేచ్ఛ ముందుగా హృదయంలో జనిస్తే చాలు. అట్టి అభిలాషయే వైరాగ్యాది సంపత్తిని ప్రవృద్ధపరచి ఈ జీవుని సంసారము నుండి, భోగాభిలాషల నుండి బయటకు తీసుకురాగలదు. భోగాభ్యాసం నశిస్తూ ఉండగా స్వప్రయత్నము యొక్క తీవ్రత్వమును అనుసరించి ఈ అవిద్య తొలగగలదు.
1.సాధుజనసాంగత్యము, 2. శాస్త్రవిచారము, 3. స్వప్రయత్నము… ఈ మూడూ ఒకేసారి ఒనగూడితే ఈ అవిద్య ఒక్కసారిగా తొలగిపోతోంది. ఇవి క్రమ క్రమముగా ప్రాపిస్తూ ఉంటే అవిద్య కూడా క్రమక్రమంగానే తొలగుతుంది. అట్లు అవిద్య తొలగగా, ఇక శేషించుచున్న దేమిటో… అదియే ‘పరమాత్మ’ అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.
ఆత్మ అనబడేది దృశ్యమా?… కాదు. ఎందుకంటే అది దృశ్యమంతటి కంటే పరమ విశిష్ట మైనది. పోనీ అది ద్రష్టయా? దృశ్యం లేనప్పుడు ద్రష్ట కూడా ఉండడు కదా! కనుక అది దృశ్యం గాని, ద్రష్ట గాని కాదు. అయితే…? ద్రష్టగా ఏర్పడియున్నదంతా ఆత్మయే! అదే సమయంలో, దృశ్యమంతా కూడా అదియే! అది నీ యొక్క స్వస్వరూపమే అయి ఉంది (తత్త్వమసి). ఆ పరమాత్మ నామరూప రహితమైనది. అదియే సత్తు. అదియే అసత్తు కూడా!
శ్రీరాముడు : “సత్తు - అసత్తు కూడా అదియే” అనేది యుక్తియుక్తంగా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మ అర్థ-క్రియా వ్యవహారానికి విషయం కాదు కాబట్టి (లోకంలో కనిపించే ఒక వస్తువు కాదు కాబట్టి) ‘అసత్తు’ అనవచ్చు. అదియే అబాధ్యమైన (అది విభాగంగా అవదు కాబట్టి) పరమ పురుషార్థమై ఉన్నది కనుక… అది సద్రూపమే.
Page:602
ఓ రామచంద్రా! ఈ విధంగా సర్వదృశ్య వ్యవహారాలు తిరస్కరించబడగా అప్పుడు శేషించేదే ఆత్మ. అట్టి మన వాస్తవస్వరూపాన్ని మనం గాని, మరొకరు గాని తిరస్కరించటానికి కుదిరేది కాదు. ఆ ఆత్మ వస్తువు ఆనంద ఘనమైనది. అనంతమైనది. జన్మ జరామరణాది వికారాలు అద్దానికి లేవు. అది సర్వదా ఏకమే గాని… అనేకం కాదు. అద్దాని సమక్షంలో ఈ జీవ జనన-మరణ జగద్రూపా లన్నీ సంకల్ప స్ఫురణా మాత్రాలేనని గ్రహించు. కనుక ఇవన్నీ కూడా అసత్తుల్యాలు మాత్రమే.
ఓ రామచంద్రా! అట్టి ఆత్మతత్త్వాన్ని ఎఱుగుము. ప్రమాణ, ప్రమాతృ, ప్రమేయాది త్రిపుటీ వ్యవహారమంతా పారత్రోలివేయి. నీవే ఆ బ్రహ్మంగా, పరమాత్మగా అగుము. (అహమ్ బ్రహ్మాస్మి) నిరతిశయరూపం చేత అంతటా వ్యాపించి విహరించు. అంతేగాని, ’ఇది దుఃఖం, అది సుఖం’ అనుకుంటూ అప్రమేయ స్వస్వరూపానంద స్థితి నుండి దిగజారనేవద్దు. (బ్రహ్మైవ న బ్రహ్మవిత్) సరే! ఇక మనం శ్రీ భుశుండ - విద్యాధర సంవాదమును కొనసాగిద్దామా?
శ్రీ విద్యాధరుడు : హే మహర్షీ! ఈ జీవుడు ఎక్కడినుండో వచ్చి ఇక్కడి దేశ కాలాలలో ప్రత్యక్షమగు చున్నాడు. ఇక్కడ ఈ జీవుడు దేహధారణ చేయకముందే దేశకాలాలు ఉండి ఉన్నాయి. కదా! ఈ దేశకాలాలను జీవునికొరకై కల్పించినదెవరు? ఎందుకు కల్పించి ఉంటారు? ఏమి ప్రయోజనాన్ని ఉద్దేశించి దేశకాలాలు కల్పన చేస్తున్నారు? ఆ కల్పన చేసినవారికి, ఇందులో ప్రవేశించిన జీవునికి గల సంబంధమేమిటి? ఆ సంబంధాన్ని కల్పించినది ఎవరు? ఎందుకు? దేశ కాలాలే లేకపోతే జీవుడి ప్రవేశం గాని, జన్మ కర్మలు గాని ఉండేవే కావు కదా! అసలీ జీవుడు ఎందు నిమిత్తం ఈ దేశకాలాలలో ప్రవేశిస్తున్నాడు? ఈ నా సందేహాన్ని సర్వజ్ఞులగు మీరే తొలగించ సమర్థులు.
శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఒకచోట ఒక స్తంభము ఉన్నది. అది… “ఆకాశమంతటా ఏర్పడి ఉన్న ఈ వెలుగును నాయందు దాచుకుంటాను. ఎవరికీ దక్కన్విను"… అని అనుకున్నదట? ఆ స్తంభం అంతటా నిండి ఉన్న వెలుగును మ్రింగి తనయందు దాచుకోగలదా?
విద్యాధరుడు : (నవ్వుతూ) స్తంభమునకు అంతా ఏర్పడి ఉన్న వెలుగును తనయందు దాచిపెట్టుకో గలటం ఎట్లా కుదురుతుంది?
శ్రీ భుశుండుడు : అట్లాగే… ఈ మాయా జగత్తు యొక్క విస్తారమును దేశ కాలాలు తమయందు దాచిపెట్టుకోలేవు. అసలీ ‘జగత్తు’ అనబడేది బాహ్యమున ఉన్నదని అనుకుంటున్నావా?… లేదు! దృశ్యమంతా ఉన్నది ద్రష్టలోనే!
ఈ ఇంద్రియ లక్ష్యమగుచున్న ‘జగత్తు’ అనేది ఆత్మయందు గల మనస్సు యొక్క కాల్పనిక రచన మాత్రమే. వాయువు నందు సుగంధం కళ్ళకు కనబడకుండా దాగి ఉన్నట్లు ఈ ‘జగత్తు’ అనే రూపంగా అనుభవమయ్యేదంతా అతి సూక్ష్మరూపంగా ద్రష్టయొక్క ‘ద్రష్టత్వం’ అను స్వకీయమైన
Page:603
ఆరోపిత స్వభావం నందే దాగి ఉన్నదని గ్రహించు. ఈ దర్శనమంతా కూడా చైతన్యం యొక్క చమత్కారమైన ఒకానొక చిత్కళా విభాగం అని అనవచ్చు.
ద్రష్టచేతనే ఈ జగత్తు పరికల్పించబడి, అనుభవించబడుతోంది. అనగా, ఇదంతా మరెవరో ఎవరికొరకో కల్పిస్తున్నది కాదు.
విద్యాధరుడు : "జగత్తుకు కర్త జీవుడే” అను వాక్యం యొక్క సూక్ష్మార్థాన్ని నేను గ్రహించలేక పోతున్నాను.
జగత్తు యొక్క కర్త జీవుడేనా! - -
శ్రీ భుశుండుడు : రెండు దృష్టాంతాల ద్వారా "ద్రష్టయే దృశ్య జగత్తు యొక్క రచయిత” అనే విషయం విశదపరుస్తాను.
ఇట్టి ఊహాలోక విహారం జీవులందరికి దైనందినానుభవమే కదా! ఆ మనోరాజ్యంలో అతనికి తారసపడే తదితర బాలురను రచించిందెవరు? బయటి నుండి మరెవ్వరోనా? కాదే!… ఆ బాలుని మనస్సే కదా!… ఊహకు సాక్షి అయిన ఆ బాలుడే ఊహలోని పాత్రలకు, సంఘటనలకు రచయిత అయినట్లు… ఈ జగత్తు కూడా ద్రష్ట ఊహను అనుసరించే ఆతనికి అనుభవమవుతూ పోతోంది.
ఇప్పుడు చెప్పు… స్వప్నద్రష్టకు ఆ కలలో కనిపించిన ఆ తదితర జనులంతా ఎవరు? ఎవరి చేత కల్పించబడ్డారు? బయటనుండి ఎవరైనా ఆ స్వప్నములోని పాత్రలను పంపించారా? లేక ఇంకెవరో జనులు ఆతని స్వప్నములో ప్రవేశించారా?
విద్యాధరుడు : (కొంచెం సేపు ఆలోచించి) లేదు. ఆ స్వప్నంలో కనిపించినవారంతా స్వప్న ద్రష్ట యొక్క ఊహాకల్పిత రూపాలే.
శ్రీ భుశుండుడు : సాక్షియగు ఆ ద్రష్టయే మనోరాజ్యంలోని వస్తువులను-మనుష్యులను, స్వప్న ద్రష్టయే స్వప్నంలో కనిపించే వస్తువులను, మనుష్యులను కల్పన చేసి పొందుచున్నారు కదా! అట్లాగే ఈ జీవునికి కనిపించే జగత్తంతా ఆ దర్శనక్రియ నిర్వర్తించే జీవుని స్వయంకల్పిత ఊహా పరంపరలే సుమా!
విద్యాధరుడు : మీరు చెప్పినట్లు 1. మనోరాజ్యములోని, 2. స్వప్న జగత్తులోని సర్వరూపములు, సంఘటనలు, వ్యవహారాలు ద్రష్టచే స్వయంకల్పితంగా పరికించబడినవేనని నేనూ ఒప్పుకుంటు
Page:604
న్నాను. అయితే జాగ్రత్ విషయంలో “ఇదంతా ద్రష్టయొక్క ఊహాసదృశమైన అనుభవం మాత్రమే. కనుక ఈ కనబడే జగత్తు యొక్క నిర్మాత ద్రష్టయే”… అనే మీ అభిప్రాయం నాకు పూర్ణానుభవం కావటం లేదు.
శ్రీ భుశుండుడు : "దృశ్య జగత్తు యొక్క రచయిత ద్రష్టయే”… అని నిరూపించటానికి ఇతఃపూర్వం జరిగిన ఒకానొక యథార్థ సంఘటనను నీకు విశదపరుస్తాను, విను.
ఇంద్ర - త్రసరేణు న్యాయం
శ్రీ భుశుండుడు : ఒకానొకప్పుడు ఒక కల్ప వృక్షం యొక్క ఒక యుగ-సంధి రూపమగు ఒకానొక శాఖయందు ఒక ‘జగత్తు’ అనే మేడిపండు కాచింది. ఆ జగత్తు అనే ఫలం దేవతలు-దానవులు మొదలుగా అనేక ప్రాణి సమూహాలతోను, స్వర్గ-భూ-పాతాళాది లోకాలతోను, నదీపర్వతాదులతోను పరివేష్టించబడి ఉన్నది. ఆయా జీవుల వాసనా ప్రదర్శనలతోను, ఆ వాసనా సమూహాలతో పరికల్పించబడే అనేక సూక్ష్మ జగత్ సమూహాలతోను నిండి ఉంది. చిత్ చమత్కృతిచే అలరారుతూ ’మోక్షం’ అనే బహిర్ద్వారంతో శోభిల్లుతూ, అంతరాన పంచతన్మాత్రలచే అలంకరించబడి ఉంది. ఆ బ్రహ్మమహావృక్షమునకు కాచిన జగత్తు అనే ఫలం కల్పాంతమున పండి రాలటానికి సిద్ధంగా ఉన్న స్వభావం కనబరుస్తోంది. ‘అవివేకులు’ అనే కాకులచే, ‘వివేకులు’ అను కోయిలచే పరస్పర వ్యతిరిక్త దృష్టులచే ఆ జగత్తు చూపబడుచూ ఉన్నది. ఆ జగత్తు ఎప్పుడో పరిపక్వమై పండి, ‘శాంతి’ అనే బ్రహ్మభావం పొందటానికి సంసిద్ధమగుచున్నట్లున్నది.
ఆ జగత్తులోగల ముల్లోకాలకు ప్రభువై, దేవతలందరికీ కూడా నాయకుడై ఒకానొక పవిత్ర జీవుడు ఇంద్రుడుగా విరాజిల్లుచున్నాడు. ఆ ఇంద్రుడు గొప్ప జ్ఞానబలం కలవాడు. గురూపదేశ బలం చేత జగత్తు యొక్క పూర్వాపరాలన్నీ ఎఱిగి ఉన్నాడు. సంకల్పాలన్నీ త్యజించి శుద్ధాంతః కరణుడై ఉన్నాడు. ఆ విధంగా ప్రశాంతమైన అంతఃకరణంలో, జ్ఞానదృష్టితో ముల్లోకాలను పాలిస్తూ కాలం వెళ్ళబుచ్చుచున్నాడు. అట్లా సుదీర్ఘమైన కాలం గడచిపోతోంది. రోజులన్నీ ఒకే రకంగా ఉండకపోవటమే ఈ కాలగతి యొక్క చమత్కారం కదా! "మాకేం! హాయిగా ఉన్నాం” అని అనుకుంటూ ఉండగానే, ఎక్కడి నుండో ఏవేవో కష్టాలు వచ్చి పడుతుంటాయి. అట్లాగే ఆ ఇంద్రునికి కూడా కొన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి.
అప్పుడొక సయయంలో త్రిలోకరక్షకుడగు శ్రీహరి క్షీరసాగరంలో శయనించి ఉన్నాడు. ఒక అదను చూచుకొని అసురులు దేవలోకంపై దండెత్తారు. అప్పుడు దేవతలకు, అసురులకు మధ్య గొప్ప సంగ్రామం జరిగింది. విధివశాత్తూ ఆ యుద్ధంలో అసురులదే పై చేయి అయింది. ఆ దేవతాసైన్యం, ఇంద్రుడు కూడా తలకొక దిక్కుగా పలాయనం చిత్తగించక తప్పలేదు. క్రూరులగు అసురనాయకులు ఇంద్రుని వెంబడించారు. ఇంద్రుడు ఎక్కడా కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి కూడా అవకాశం దొరకక పరుగులు తీస్తూనే ఉండవలసి వచ్చింది.
Page:605
అప్పుడు ఇంద్రుడు బాగా అలసిపోయాడు. ఎట్లాగైనా సరే కొంతకాలం అసురుల కళ్ళు కప్పి ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవలసినంతగా అగత్యం వచ్చింది. ఒకచోట ఒక్క క్షణం ఆగి కళ్ళతో విశ్రాంతి స్థానం కొరకై పరికించి చూచాడు. ఎదురుగా సూర్యకిరణాలు ప్రసరిస్తూ కనిపించాయి. ఆ సూర్య కిరణాలలో త్రసరేణువులు (ధూళికణాలు) అనంత సంఖ్యలో ఉండటం కనిపించింది.
ఒక గొప్ప ఆలోచన వచ్చింది. “ఈ త్రసరేణువులలోని ఒకానొక రేణువులో నేను దాగి ఉంటే ఈ దుష్ట దానవ సైనికనాయకులు నన్ను కనిపెట్టలేరు కదా!" - అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అట్టి కార్యక్రమం కొరకై ఉపక్రమించాడు.
తన శరీరం యొక్క స్థూలాకార సంకల్పాలను తన అంతఃకరణంలోని సూక్ష్మభూతాలలో లయం చేశాడు. స్థూలత్వమంతా త్యజించి అత్యంత సూక్ష్మ రూపం సంతరించుకున్నాడు. సూక్ష్మ భూతరూపుడై బాహ్యప్రదేశంలో గల త్రసరేణువులలోని ఒకానొక త్రసరేణువులో ప్రవేశించాడు. "అమ్మయ్య! ఇక ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను”… అని అనుకొని ఆ త్రసరేణువులో విశ్రమించాడు. అసుర నాయకులు కొంతకాలం అతని కొరకు వెతికి వెతికి కూడా ఆ ఇంద్రుడు దాగి ఉన్నచోటు కనిపెట్టలేక పోయారు. అతడు కనబడకపోవటం చేత వెనుకకు మరలారు.
చాలాకాలం తరువాత ఇంద్రునికి తాను దాగి ఉన్న త్రసరేణువులో భౌతికమైన విశ్రాంతి లభించింది. ఇక కాలక్రమంగా యుద్ధం మొదలైనవన్నీ మఱచాడు. ఆ చోటును విడచి బయల్వెడలకుండా అచ్చటనే ప్రశాంత నిద్రా విశ్రాంతిని పొందాడు. అసురులు సంగతి కాస్త ఏమరచినప్పటికీ ఇంద్ర పదవికి సంబంధించిన సంస్కారాలు అతనిలో మేలుకొనియే ఉన్నాయి.
కొంతకాలం గడచిపోయింది. ఆ త్రసరేణువులోనే ఉండి ఎప్పుడో ఒక మనః స్వభావమును ఆశ్రయించసాగాడు. “ఇప్పుడు ఇంద్ర - రాజగృహంలో నేను ఉన్నాను”… అని అనుకోసాగాడు. అతడు అక్కడే ఒక గృహంలో ఉండటం జరిగింది. ఆ గృహంలో ఒకచోట పద్మాసనం వేసుకుని "స్వర్గలోకం, అమరావతి, దేవసభ, ఇక్కడ నా సింహాసనం, ఇప్పుడు నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాను, దిక్పాలకాది దేవతలు నన్ను పర్యవేష్టించి ఉన్నారు, ఈ స్వర్గానికి క్రిందగా భూలోకం ఉన్నది, దానికి కూడా నేనే అధిపతిని”… ఇట్టి రూపంతో కూడిన మనోకల్పనను పొందసాగాడు. ఇక ఆతని కల్పనలోని మూడు లోకాలకు అధిపతి అయి, ఇంద్రపదవి యొక్క కార్యక్రమమంతా నిర్వర్తించసాగాడు.
ఇంద్రభవనం నుండి బయల్వెడలి అమరావతి నగరమును, ఆ నగరం యొక్క చివరికి పోయి భూలోకాన్ని దర్శించాడు. అక్కడి పర్వత, నదీ, నదములు సక్రమగతిలో ఉన్నాయో, లేవో నని అంతా త్రిలోకపాలకునిగా పర్యవేక్షించాడు. భూమి అంతా ఆయా రాజ్యాలతో, రాజ్యపు సరిహద్దులతో ఉండునట్లుగా ప్రకృతి కాలాలను సరిపోల్చి ఉంచాడు. క్రియా కలాపాలతో భూమి సక్రమంగా ఉన్నదని అనుకున్న తర్వాత ఇక పాతాళంలో ప్రవేశించాడు. అక్కడ కూడా రాజ్యాలు-రాజులు–ప్రజలు-విధి విధానాలు-యజ్ఞయాగాది వ్యవహారాలు పర్యవేక్షించాడు. ఏ దిక్పాలకులకు ఏ నిర్ణయాలు తెలియజేయాలో… అవన్నీ నిర్వర్తించి మరల స్వర్గలోకం జేరాడు.
Page:606
ఇక ఇతఃపూర్వం లాగానే యథావిధిగా త్రిలోక పాలన చేస్తూ అష్టశ్వర్యాలు అనుభవించసాగాడు. దేవతలకు ప్రభువై విరాజిల్లాడు.
ఆ విధంగా చాలా కాలం గడిచింది. ఆ తరువాత అతనికి మహాపరాక్రమశాలి అయిన పుత్రుడు జన్మించాడు.
విద్యాధరుడు : భుశుండ మహాశయా! మీ మాటకు అడ్డువస్తున్నాని అనుకోకండేం. ఆ ఇంద్రుడు మొట్టమొదట అసురులు తరుముచుండగా ఒక త్రసరేణువులో ప్రవేశించాడు కదా! ఆ
త్రసరేణువులోనే ముల్లోకాలు ఏర్పాటు చేయబడ్డాయా?
శ్రీ భుశుండుడు : (చిరునవ్వుతో) ముల్లోకాలు త్రసరేణువులో లేవు. అవన్నీ సూక్ష్మాతిసూక్ష్మదేహం అవధరించిన ఇంద్రుని మనస్సులోనే ఉన్నాయి. అనగా అవన్నీ అతని మనస్సు చేతనే కల్పించబడి అనుభవింపబడుచున్నాయి. ఇక ఆ త్రసరేణువు గతి ఏమిటంటావా? అది తదితర త్రసరేణువుల లాగానే యథామార్గంలో ఎటో వెళ్ళిపడింది.
ఇక మనం ఆ ఇంద్రుని చరిత్ర కొనసాగిద్దాం. ఈ విధంగా మరికొంత కాలం గడిచి పోయింది. ఆ ఇంద్రుని కుమారునికి యుక్త వయస్సు రాగానే తదనంతర ఇంద్రుడుగా పట్టాభిషిక్తు డైనాడు. ముల్లోకాలను తన మనో వీథిలో సృష్టించిన మొట్ట మొదటి ఇంద్రుడు తన స్థూల సూక్ష్మ దేహములను కాలక్రమంగా త్యజించి ‘నిర్వాణము’ అనే మోక్ష స్థితిని పొందాడు. అతని కుమారుడైన ‘కుందుడు’ అనువాడు కూడా ఇంద్ర పదవిని అధిష్ఠించి చాలాకాలం ముల్లోకములను పాలించి ఆ తరువాత తన కుమారునికి పట్టంగట్టి ఆతడు కూడా పరమపదమును పొందాడు.
ఈ విధంగా మన కథానాయకుడగు మొట్టమొదటి ఇంద్రుని తరువాత వందలకొలది పుత్ర - పౌత్రులు గడచిపోయారు. ఇప్పుడు అతని వందలాది వంశజుల పరంపరానంతరం వర్తమానంలో ’అంశకుడు’ అను పేరుగలాయన ఇంద్రపదవిని అలంకరించి ఉన్నాడు.
చూచావా విద్యాధరా! మొట్టమొదటగా ఇంద్రుడు ప్రవేశించిన త్రసరేణువు ఎచ్చటనో విలీనమై, క్షయించి, నాశనం పొందింది. అయితే ఆ త్రసరేణువులో ప్రవేశించి విశ్రాంతికై ఉపక్రమించి, ఆ తరువాత తనయొక్క వాసనలచే ఆ ఇంద్రుడు దర్శించనారంభించిన త్రిలోక రాజ్యం మాత్రం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.
శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ సందర్భంలో మరో చమత్కారమైన విశేషం ప్రస్తావిస్తాను, విను. ఇప్పుడిక ఆ ఇంద్రుని వంశంలో జన్మించి, దేవరాజు అయినట్టి ఒకానొకని గురించి మనం చెప్పుకుందాం. అతడు ఇంద్రవంశంలో జన్మించాడు. ఉత్తమ గుణాలచే పరిపూర్ణుడు. ఆ దేవరాజు శ్రీమంతుడు, వైరాగ్యాది సంపదలతో కూడుకొని ఉన్నవాడు. మోక్షార్హతచేత అతనికి అదియే అంతిమ శరీరధారణం కూడా! యౌవనంలోనే దేవగురువు బృహస్పతుల వారిచే బోధించబడి అతడు
Page:607
ఆత్మజ్ఞాని అయ్యాడు. వేద్య వస్తువైన ఆత్మ గురించి అనుభవ సమన్వితంగా ఎఱిగి కూడా యథా విథంగా త్రిలోక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. యథాప్రాప్తాలైన కర్మలన్నీ నిర్వర్తిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి అసురులతో గొప్ప యుద్ధం చేసి, వారినందరినీ జయించాడు. ఆతడు అజ్ఞానాన్ని దాటినట్టి విశుద్ధమైన మనస్సుతోనే వంశాచారానుసారం నూఱు అశ్వమేధయాగాలను నిర్వర్తించి ఉన్నాడు.
ఆతడు ఒకసారి ఏదో కార్యవశంగా ఒకానొక ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో సుందరమైన మానస సరస్సు కనిపించింది. ఆ సరస్సులో బహుసౌకుమార్యమైన కమలాలు కనిపించాయి. అక్కడి ప్రశాంతమైన వాతావరణమును గమనించి, అనేక యుద్ధ సంరంభముల చేతను, అశ్వమేధాది యాగాల కార్యక్రమాల చేతను ఎంతగానో అలసిపోయిన ఆతని మనస్సుకు కించితు, విశ్రాంతి పొందాలనిపించింది. ఆలోచన వచ్చినదే తడవుగా ఇక విశ్రాంతి కొరకై ఉపక్రమించాడు. ఆ కమల నాడులలోని ఒకానొక అతి సౌరభమైన దానిని ఎన్నుకొని ఆ కమలము యొక్క ఒక ‘తూడు’(సన్నని కాండం)లో సూక్ష్మదేహి అయి ప్రవేశించాడు. అక్కడ అతడు ఒక ప్రక్క దేహ పరంగా విశ్రాంతి పొందుతూనే మనస్సు పరంగా ఊహాపథంలో విహరించసాగాడు. మనస్సు తోనే రాజ్య ఏలటం, యుద్ధాలు చేయటం, ఆ యుద్ధాలలో గెలుపు - ఓటములు చవిచూడటం… ఇవన్నీ అనుభవించసాగాడు. ఇట్లా కొంతసేపు గడిచింది.
అతడు బృహస్పతిచే ఎంతగానో బోధించబడిన సుజ్ఞాని కదా! అందుచేత ఒక రోజు ఇట్లా అనుకున్నాడు. "ఇంతకాలం నేను మాయలో ఉన్నాను. ఇప్పుడిక ఈ మాయ నుండి బయటకు వచ్చి మాయకు సాక్షిగా ఉండి మాయను దర్శించెదను గాక! ఇక నేను బ్రహ్మతత్త్వాన్ని, ఆ బ్రహ్మం మాయతో కూడుకొని ఉన్న చమత్కారాన్ని దర్శించటానికి ఈ నా మనస్సును వినియోగిస్తాను గాక”!
తన మనస్సును రాజ్యం మొదలైన వాటి నుండి మరల్చి ఇక ‘బ్రహ్మం - మాయ’ అనే రెండిటినీ పరిశీలించే క్రమంలో నియమించినాడు. ధ్యాననిమగ్నుడైనాడు. బాహ్య-అభ్యంతరాలైన విక్షేపాలన్నీ త్యజించాడు. శాంతబుద్ధి కలవాడైనాడు. ఏకాంతస్థితుడైనాడు. ఇక ధ్యానం ద్వారా సర్వశక్తియుతం - సర్వ వస్తుమయం - సర్వ వ్యాపకం - సర్వదా సర్వవిధ స్వరూపం - సర్వత్రం సర్వగామి… అయినట్టి పరబ్రహ్మమును వీక్షించసాగాడు.
పరబ్రహ్మము యొక్క వర్ణన (గానం) -
సర్వతః పాణిపాదంతం, సర్వతోక్షి శిరోముఖమ్ | సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య సంస్థితమ్ ॥ ||
సర్వేంద్రియగుణైర్ముక్తం, సర్వేంద్రియ గుణాన్వితమ్ । అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృచ ॥ ||
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ | సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అన్తికేచతత్ ||
Page:608
సర్వత్ర చంద్రార్కమయం, సర్వతైవ ధరామయమ్ | సర్వత్రపర్వతమయం, సర్వత్రిస్ధిమయం తథా ॥
సర్వత్ర సార గురుకం సర్వత్రైవ నభోభయమ్ | సర్వత్ర సంసృతిమయం, సర్వతైవ జగన్మయమ్ ॥
సర్వత్రైవ చ మోక్షాత్మ, సర్వతైవాద్య చిన్మయమ్ । సర్వత్ర సర్వార్థమయం, సర్వత్ర సర్వ వర్జితమ్ ॥
ఘటే పటే వటే కుడ్యే శకటే వానరే తథా | ధామ్ని వ్యోమ్నితరావద్రావనిలే, సలిలే అనలే ॥
అత్యంతాశ్చర్యంగా పరబ్రహ్మం అతనికి కనిపించింది. ఆ పరబ్రహ్మం అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, ముఖాలు, చెవులు కలదై ఉన్నది. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్నది. సర్వ ఇంద్రియ-గుణాలకు సంబంధించనిదై (వివర్జితమై) ఉంది. అయితే సర్వేంద్రియ - గుణాన్వితమై ఉన్నది. పరమార్థంగా చూస్తే అద్దానికి దేనితోనూ సక్తత (Allotment) లేదు. అనగా సర్వత్రా అసక్తమై ఉన్నది. వ్యవహారరీత్యా అన్నిటినీ భరిస్తున్నది అదే! అన్నిటి యొక్క భారం వహిస్తున్నప్పటికీ దాని స్వభావం గుణములు కాదు. అది నిర్గుణం. అది సమస్త భూతాల యొక్క (పంచభూతాల జీవుల) బాహ్య - అభ్యంతరాలలో ఏర్పడి ఉంది. తాను ఎట్టి కదలికా పొందనప్పటికీ కదలికలన్నీ దానివే. అది అత్యంత సూక్ష్మమై ఉండటం చేత అజ్ఞాతస్థూల దృష్టికి అది కనబడటమే లేదు. సూక్ష్మ దృష్టికి మాత్రం అత్యంత స్పష్టంగా కనబడుతోంది. అనుభూతమౌతోంది. అది సర్వత్రా చంద్ర-సూర్య-పృథివి-పర్వత-సముద్ర-ఆకాశమయమై, సర్వత్రా చిత్సార - గురురూపమై, సర్వత్రా సృష్టి పూర్ణమై - జగన్మయమై ఉన్నది. సర్వత్రా మోక్షరూపమై, ఆద్యచిన్మయమై, సర్వత్రా సర్వపదార్థమయమై ఉన్నది. సర్వత్రా సర్వవర్జితమై ఉన్నది. అయినా కూడా, ఘట-వస్త్ర-వృక్షశకట-గృహ-మందిర-ఆకాశ-పర్వత-వాయు-జల-అగ్న్యాది సమస్త పదార్థములందున్నదై నర - వానరాది సర్వజీవులుగా తానే అయి అన్ని వైపులా వెలయుచుండుటను ఆతడు చూచాడు. ఈ ముల్లోకాలు అనేక ఆచార విచారాలతో వివిధ కార్య సంరంభాలతో కూడుకొని ఉండవచ్చు గాక, ఇట్టి త్రైలోక్యం ఆ పరబ్రహ్మం నందు ఒకానొక స్వల్ప అంశమాత్రంగా ఆ దేవరాజు వీక్షించాడు.
మిరియంలో కారం ఉన్నట్లు, ఆకాశంలో శూన్యత్వం ఉన్నట్లు ఆ కాలాత్ముడగు చిన్మయ పరమాత్మలో ఇట్టి అసంఖ్యాక ముల్లోకాల యొక్క ఆవిర్భావతిరోభావాలు ఏర్పడి ఉంటున్నాయి.
ఈ విధంగా జీవభావవర్జితుడై, శుద్ధజ్ఞానంచే ఆ ఇంద్ర శరీరంతో పరబ్రహ్మాన్ని గాంచుచూ క్రమంగా పూర్ణాత్మధ్యానవంతుడైనాడు. ఆ పరబ్రహ్మం యొక్క మాయావిభాగం నందు అనేక బ్రహ్మాండాలను గాంచసాగాడు. అట్లాగే ఈ మనం ఉన్న బ్రహ్మండాన్ని కూడా వీక్షించటం జరిగింది.
ఆ తరువాత ఆతడు ఈ బ్రహ్మాండమంతా మనస్సుతో సంచరించుచూ, ఈ బ్రహ్మాండములోని ఇంద్రలోకంలో ప్రవేశించాడు. తానే ఇంద్రుడై ఇంద్రత్వమును మనస్సుతో అవధరించాడు… ఆ
Page:609
ఇంద్ర పదవిచే అనేక లోకాలు పరిపాలించాడు. ఇప్పటికి ఈయన ఈ బ్రహ్మాండమును పరిపాలిస్తూనే ఉన్నాడు. చూచావా విద్యాధర నృపాలా! ఈ ప్రకారంగా మొట్టమొదటి త్రసరేణువు లో ప్రవేశించి ముల్లోకముల భావనా మాత్ర సృష్టికి కారణమైన ఇంద్రుని వంశానుగతంగా ఆతని వంశంలోని ఒకానొక దేవరాజే ఈ మన వర్తమాన బ్రహ్మాండంలోని ఇంద్రుడై ఉన్నాడు సుమా!
ఈ లోకమందలి ఇంద్ర పదవిని అవధరించిన తరువాత త్రసరేణు ప్రవేశితుడగు ఇంద్రుడు తనయందు సంస్కారరూపమున ఎక్కడో అంతరాంతరాళాలలో దాగి ఉన్న పూర్వపు జ్ఞానయోగ అభ్యాసం చేత అతడు తాను కమలనాళ సూత్రంలో ప్రవేశించటం, నివసించటం స్మరించాడు. పరబ్రహ్మం యొక్క నిర్వికల్ప - సవికల్పరూపాలను గ్రహించి బ్రహ్మానందం అనుభవిస్తూనే ఇంద్రుడుగా బ్రహ్మండానికి సంబంధించిన పరిపాలనను కొనసాగించటం జరిగింది. ఆతని వంశజుడు ఈ బ్రహ్మాండంలో ఇంద్రత్వాన్ని ఈ వర్తమానంలో అవధరిస్తున్నాడు.
ఓ విధ్యాధరా! మనం కమలనాళ తంతువులలో ప్రవేశించిన ఒకానొక ఇంద్రుని కథాక్రమ మెట్టిదో చెప్పుకున్నాం. ఇటువంటి ఇంద్రులు చిదాకాశంలో అక్కడ, ఇక్కడా, మరింకా ఎన్నోచోట్ల లక్షల కొలదిగా ఉండి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. చిదాకాశంలో ఇటువంటి వ్యవహారా లెన్నో అసంఖ్యాకంగా గడిచిపోయాయి. గడుస్తున్నాయి.
విద్యాధరుడు : స్వామీ! ఇదంతా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ద్రష్ట యొక్క దృశ్యపరంపరలు అనంతమని అనిపిస్తోంది. ఈ దృశ్యములకు అంతు లేదా? ఇవి ఎప్పటికీ ఉపశమించవా?
శ్రీ భుశుండుడు : ఆత్మసాక్షాత్కారం కానంత వరకు ఈ మహాప్రబలమైన ‘దృశ్యము’ అనునది ఇట్లా త్రెంపు లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది.
జీవుడు మాయలోనే ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు ఆ ఉపాధి విశేషములే తన మొత్తం స్వరూపమని అనుకుంటూ ఉపాధిపరంపరలు పొందుతూనే ఉంటాడు.
అతడు పరబ్రహ్మము గురించి బ్రహ్మజ్ఞులచే విని సగము పరబ్రహ్మమున సగము మాయయందు ఆరూఢుడైనాడా… “ఇదియే సుదీర్ఘమైన మాయ”… అని గమనించగలుగుతాడు. అనగా బ్రహ్మమును, మాయను వేఱువేఱుగా దర్శించగలుగుతాడు.
సత్యమగు పరమాత్మ యొక్క సాక్షాత్కారమాత్రంచే ఈ అనుభవమయ్యే మాయ పూర్ణంగా విలయమొందగలదు. అనగా మాయను కూడా ఆత్మవిన్యాస చమత్కారంగా దర్శించగలడు. విద్యాధరుడు : స్వామీ! భుశుండ మహాశయా! మీరు చెప్పిన అనేక విశేషాల ప్రభావం చేత ఆ మాయ యొక్క అనేక చమత్కారాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నాదొక ప్రశ్న. మనం అందరం చిదాకాశ (లేక) పరబ్రహ్మ స్వరూపులమే కదా! అట్టి మనకు ‘మాయ’ అనే అనుభవం ఎందుకు, ఎక్కడి నుండి, ఏ విధంగా సంప్రాప్తించి మభ్యపెడుతోంది?
శ్రీ భుశుండుడు : పాపరహితుడగు ఓ విద్యాధరా! ఈ మాయ ఎట్లాగో, ఎచ్చట నుంచో, ఏ విధం గానో వచ్చిపడి అనుభవమౌతోంది. ఎక్కడి నుండి వస్తే ఏం? మొత్తం మీద నీకు మాయ అనుభవ మవుతోంది కదా! ఇప్పుడిక మాయ అంటే ఏమిటో గ్రహించడానికి ఉపక్రమించు.
Page:610
‘మాయ’ అంటే ఏమిటి? ‘యామా’… "ఏదైతే స్వయంగా (వాస్తవానికి) లేదో” అని కదా, అర్థం? లేనిది ఎందుకోస్తే ఏం? దృష్టాంతానికి… అక్కడ దయ్యం లేదు. కానీ ఏదో రూపం చూచి “ఇది దయ్యం” అనే భ్రాంతి కలిగింది. “భ్రాంతి ఎందుకు కలిగింది?”… అనే ప్రశ్న ముఖ్యమా? ఆ భ్రాంతిని తొలగించుకోవటం ముఖ్యమా?
విద్యాధరుడు : భ్రాంతిని తొలగించుకోవటమే ముఖ్యం.
శ్రీ భుశుండుడు : అదీ సంగతి. అది మాయయే కాబట్టి, భ్రమ కల్పితమే కాబట్టి దీని హేతుభూతము లందు గల విశేషములను సుదీర్ఘంగా వాదోపవాదాలకు ఉపక్రమించటం ఉచితం కాదని విజ్ఞుల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా.
“మాయ ఎట్లా వచ్చింది?”… అనే చర్చ వృథా కాలయాపనయేనని చెప్పబడుతోంది. “మాయ ఎట్లా తొలగుతుంది? అనేదే ఇక్కడ మనకు ముఖ్యం. ఆచరణయోగ్యం. స్వప్నంలో సంఘటనలకు కారణాలు వెతికి లాభమేమిటి? ఆ కారణాలు కూడా స్వప్నతుల్యమే కదా!
మేఘం లోంచి వర్షం పడుతోంది చూచావా? అట్లాగే ‘అహంభావం’ అను ఒక చమత్కారం నుండి ఈ మాయ వర్షిస్తోంది. అట్టి అహంభావం ఆత్మదర్శన మాత్రంచేత తొలగగలదు. అందుచేత ఆత్మను దర్శించు. తద్వారా అహంకారం దానంతట అదే తొలగగలదు. అంతే!
‘జగత్తు’ అనునది భావనల సమూహమే కదా! భావనాప్రకటలన్నీ భావికుని ప్రకటనా చమత్కారమే! భావికుడు భావనల కంటే ముందే చిదానంద ఘనస్వరూపుడుగా ఉండనే ఉన్నాడు. (భావనలు చేయువాడు ఆ భావనల కంటే ముందే ఉండాలి కదా!) కనుక చిత్చైతన్యమే భావనలు గాను, జగత్తు గాను వెల్లివిరిస్తున్నదని గ్రహించు. ఈ విధంగా ఈ జగత్తు పరమార్థమున బ్రహ్మస్వరూపమై, సర్వవికల్పరహితమై ఉన్నది.
మరొక విధంగా చెప్పాలంటే… జగత్తు భావనల కంటే వేఱు కాదు. భావనలు భావికుని కంటే వేరు కాదు. భావికుడు బ్రహ్మం కంటే వేఱు కాదు. ఇట్లు జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది.
అహంకారవశంగా విస్తృతమగు మానసిక వికల్పములు తోచవచ్చుగాక! ఆ పరబ్రహ్మం నందు ఇంద్రియ జనితమైన వికల్పాలు లేవు, జాగ్రత్ మొదలైన అవస్థలు లేవు. అది వాసనా మయమగు సర్వస్వప్నపదార్థ రహితం అకాశం వలె సర్వదా పరిపూర్ణం. అట్టి చిద్రూపమగు ఆత్మయే నేను, నీవు, తదితరులతో కూడిన మనమంతా కూడా!
విద్యాధరుడు మహాత్మా! "ఇంద్రుడు త్రసరేణువునందు ఇంద్రలోక దర్శనం”… అనే ఒక చమత్కారమైన వృత్తాంతం చెప్పారు. ఈ వృత్తాంతంలోని ముఖ్యోద్దేశం మరొక్కసారి సమీక్షించ వలసినదిగా నా విన్నపం.
Page:611
శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఆ ఇంద్రుడు సర్వమును త్యజించి సూక్ష్మ రూపి అయి ఒక త్రసరేణువులో ప్రవేశించి విశ్రమించాడు. అయితే జరిగినదేమిటి? ఆ త్రసరేణువునందు విశ్రమిస్తూ ఉండగానే అతని మనస్సు త్రిలోకములను అక్కడికక్కడే కల్పించింది. అతని దర్శనమంతా మన ఈ భౌతిక ప్రపంచంలాగానే ఘనీభూతంగా అనుభవమయింది.
దీని అర్థమేమిటి?…ఎచ్చట అహంభావం ఉంటుందో అచ్చట త్రసరేణువులోని (త్రసరేణువు = ముప్పది పరమాణువులు కలది) ఇంద్రరాజ్యంలాగా ‘జగత్తు’ అనబడునది - తగుదునమ్మా అని • వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఈ ‘జగత్తు’ అని అనబడేదానికి అహంకారమే ఆదిమూలంగా చెప్పబడుతోంది. అహంకారి (లేక అభిమానించువాని) రూపమగు అహంకారమే ఈ జగత్తు.
బ్రహ్మం అనే మహాపర్వతం. అద్దానిపై ‘భ్రమ’ అనే మహారణ్యం. ఆ భ్రమ మహారణ్యంలో ’అహంకారం’ అనే బీజం. ఆ అహంకార బీజం ‘వాసనలు’ అనే జలంచే తడుపబడి మొలకెత్తి ప్రవృద్ధమవటం. అట్టి అహంకార బీజమే ఈ ‘త్రిలోకాలు’ అనే మహావృక్షంగా పరిణతి పొందటం …ఇదియే "ఇంద్ర - త్రసరేణు న్యాయం” యొక్క ముఖ్యపాఠ్యాంశం. దుష్టవాసనలచే విస్తృతమైన ఈ త్రైలోక్యం ‘అహంత్వం’ అను జలం యొక్క సంచలనవిలాసమే నని గ్రహించు.
జన్మ-మరణ-పురోగమన-తిరోగమన-ఆవిర్భావ-తిరోభావ పరంపరలతోను, శరీరాదుల ఉత్పత్తి, వినాశనాలతోను, అహంభావ జనిత త్రైలోక్య జగత్తు బహుచమత్కారమై వెలయుచున్నది. అట్టి ఈ జగత్తు అహంత్వవాయువు యొక్క చలనమని, అహంత్వ కమలాల యొక్క సుగంధమని విజ్ఞులు ఎఱిగియే ఉన్నారు.
వాయువు, వాయు చలనాలు వేఱు వేలా?.. కావు. జలం, ద్రవత్వం- భిన్నాలా? …కానే కాదు. అగ్ని, ఉష్ణత్వము… రెండు వేఱు వేఱు విశేషాలా? కావు. కావు. అట్లాగే… అహంత్వము, జగత్తు - ఈ రెండూ సర్వదా అభిన్నరూపములేనని గ్రహించు.
ఈ జగత్తు అహంకారమునందే ఉన్నది, అహంకారం ఈ జగత్తునందే ఉన్నది… ఈ రెండూ ఒకదాని చేత మరొకటి ఉత్పన్నం కావించబడుచున్నాయి. పరస్పరం ఒకదాని ఆధీనంలో రెండవది స్థితి కలిగి ఉన్నది.
విద్యాధరుడు : అహంభావమును తొలగిస్తే జగత్తు కూడా ‘లేనిదే’ అగుచున్నది కదా! మరి అహంభావమును తొలగించటమెట్లా?
శ్రీ భుశుండుడు : ఈ జగత్తుకు ఏదైతే బీజమగుచున్నదో అట్టి అహంభావము (లేక, అహంకారము) ‘అనహంభావము’ అను రూపమగు జ్ఞానబలిమిచే మొదలంట్ల తొలగించవేయబడగలదు. కనుక జ్ఞానము అనే జలముచే ‘అహంభావము’ అనే మాలిన్యమును పూర్ణముగా కడిగివేయాలి సుమా! అహన్త్వం నామ తత్కించిత్, విద్యాధర! నవిద్యతే | అకారణమవస్తుత్వాచ్ఛ శ్వశ్వశృంగమివ ఉదితమ్ ||
ఓ విద్యాధరా! "కుందేటి కొమ్ములు” అనే శబ్దానికి అర్థం ఏమిటి? కుందేలుకు కొమ్ములు
Page:612
అసలు ఉండవు కదా! కుందేటికి కొమ్ములు మొలచినదెప్పుడు? తొలగినదెప్పుడు? కుందేలు పరుగులు తీస్తూ ఉంటే అది చెవులు రిక్కపొడుచుకొని ఉండటం చేత కొమ్ముల వలె కనిపిస్తాయి. అట్లాగే యథార్థానికి ‘అహంభావం’ అనునదేదీ లేదు. ఆకాశంలో నీలత్వం కనబడుతోంది. అక్కడ నీలిరంగు గల ఏదైనా పదార్థం ఉదా? లేదు. శూన్యమగు ఆకాశం కంటి భ్రమచే నీలి రంగుగా కనబడటం జరుగుచున్నట్లు, వాస్తవానికి ఉనికియే లేని ‘అహంత్వము’ ఉన్నట్లే భ్రమింపజేస్తోంది.
ఎట్లా అంటావా?… సర్వస్వరూపమగు పరబ్రహ్మం మనస్సు కంటే, ఇంద్రియాదుల కంటే పరమై ఉన్నది. అది స్వతహాగానే అనంతం. ఆకాశం ఎల్లప్పుడు అఖండమే అయినట్లు పరబ్రహ్మం కూడా ఎల్లప్పుడు అఖండమే. అట్టి పరబ్రహ్మమునందు ‘అహంత్వం’ అనే ఖండత్వము ఏర్పడటానికి కారణం ఏముంటుంది? ఉండదు. లేనేలేదు. కారణ రాహిత్యంచే ‘అహంత్వం’ అనేది అసత్తే గాని సత్తు కాదు. అనగా… అద్దానికి స్వయంకృతమైన ఉనికి లేదు.
వస్తువులైతే ఖండత్వం అనేది ఉన్నది. పరబ్రహ్మం అన్నిటినీ ధరిస్తున్న అవస్తువు. అవస్తువు నందు మార్పుగాని, చేర్పుగాని సంభవింపజేయగల కారణం ఉండజాలదు. అద్దానియందు “సృష్టి” అనేది జనింపజేయగల కారణమేమున్నది? లేదు. కనుక "గొడ్రాలి యొక్క రెండవ కుమారుడు” అనే మాటవలె అహంభావాదులు (నీవు - నేను మొదలైనవి) ఎక్కడా లేనివే అగుచున్నాయి.
‘అహంకారం’ అనే బీజమే లేనప్పుడు అద్దాని కార్యము అనతగినట్టి జగత్తు కూడా ‘లేనిదే’ అగుచున్నది కదా! కాబట్టి ఓ విద్యాధరా! "ఈ జగత్తు జీవుడు మొదలైనవన్నీ వాస్తవానికి లేవు” అను సూక్ష్మం - పరమవాస్తవం అగు ’జగల్జీవ– అభావన’ను అవధరించు. ఆ విధంగా జగత్తు
– జీవుడు అభావించకబడగా అప్పుడు శేషించునట్టి చిద్రూపమైన ‘నిర్వాణం’ నందు శాంతంగాను, సుఖస్వరూపంగాను ఉండు. ఈ విధంగా జగత్తు - అహంభావాల అభావనచే, ఆ తదనంతరం కూడా ఏ నీ స్వస్వరూపం శేషించియున్నదో… అద్దాని యొక్క రూపమే ఈ బాహ్య పాదార్థిక జగత్తని, అభ్యంతరమగు మానసికాది జగత్తు కూడానని గ్రహించు. అంతేగాని నీకు అన్యమైనదేదీ లేదు. ఇదియే ‘అనన్య స్థితి’ అని చెప్పబడుతోంది. ’నీవు - నేను’ మొదలైనవిగా కనిపించేదంతా నీయొక్క పరమాత్మతత్త్వమేనని గ్రహించి శాంతం వహించి ఉండు.
యన్నాస్తి, తత్తు నాస్త్యేవ! శేషం శాస్త్రమసి ధ్రువమ్ |
సంప్రబుద్ధో సి మా భూయో, నిర్మూలాం భ్రాంతిమాహర ॥
ఓ విద్యాధరా! ఏదైతే (నేను - నీవు - - అయినవాళ్ళు - కానివాళ్ళు - ఇష్టులు - అయిష్టులు
Page:613
ఆ భావన చేయు నీవు ఉండనే ఉన్నావు. అట్టి ‘నేను’ అను భావన (అహంభావన) కు ముందే గల ఏ నీ శాంత-బుద్ధ రూపమున్నదో… అదియే బ్రహ్మం. ఓ విద్యాధరా! నీవిప్పుడు ప్రబుద్ధుడవైనావు. అనేక సాధనల ప్రయోజనంగా సర్వభ్రమలను నిర్మూలన మొనర్చుకొనియే ఉన్నావు. ఇంక మరల భ్రమను ధరించవలసిన పని లేదు.
వ్యపగత కలనా కలంక శుద్ధః, శివమ్మ సి, శాస్త్రమసి, ఈశ్వరోసి నిత్యః ఖమపి భవతి పర్వతోపమానం, జగదపి వా పరమాణురూపమేవ॥
ఓ విద్యాధరా! నీవు పరబ్రహ్మమే స్వరూపంగా కలవాడవు. ‘బాహ్య-అభ్యంతరాలు’ అనే కళంకాలు నీయందు లేవు. పరమశుద్ధుడవు. శివరూపుగవు. శాంతుడవు. ఎల్లప్పుడు ఏర్పడి ఉన్నట్టి నిత్యస్వరూపుడవు. అత్యంత సూక్ష్మమైన ఈ ఆకాశం నీ స్వస్వరూపం ముందు పర్వతమంత స్థూలం. అనేక బ్రహ్మాండాలతో కూడిన ఈ మహత్తర జగత్తు నీ పరబ్రహ్మస్వరూపం ముందు ఒక అణువు ప్రమాణం కలది. సంసారం ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గాని, మరొకప్పుడు గాని నీ స్వస్వరూపం నిర్విషయ - నిష్ప్రపంచ - అఖండ - అప్రమేయ - కాలాతీత - గుణాతీత పరబ్రహ్మమే అయి ఉన్నది.
నాటకంలోని పాత్రచే ఆ పాత్రధారి పరిమితుడా? కాదుకదా! అట్లాగే, నీవు దృశ్యత్వము చేతగాని, ద్రష్టత్వముచేతగాని పరిమితుడవు కావు.
నీవు అపరిమిత, అప్రమేయానంద స్వరూపుడవు. ఇదియే నీ స్వరూపానికి సంబంధించిన పరమ సత్యం. ఓ సహజీవులారా! మీ అందరి స్వరూపం అట్టి పరబ్రహ్మమేనని గ్రహిస్తారు గాక!
శ్రీ భుశుండుడు : ఓ వసిష్ఠ మునీంద్రా! వింటున్నారు కదా! నేను ఆ విధంగా చెప్పుచుండగానే ఆ విద్యాధరుని దృశ్యవృత్తులన్నీ శమించాయి. అతడు సమాధినిష్ఠుడైనాడు. అప్పుడు నేను నా వాక్రవాహమును ఆపి ఆతనిని సమీపించి మరల మరల అటు - - ఇటు కదల్చి మేల్కొల్పటానికి ప్రయత్నించాను. పరమ నిర్వాణ దశను పొందిన ఆతడు మరల శబ్దది విషయములవైపుగా మరలనే లేదు. ఆతడు అప్పటికి పూర్వమే నిర్మలమైన అంతఃకరణము సంపాదించుకొని ఉండటం వలన కాబోలు, అంతమాత్రపు ఉపదేశంచేతనే, ఆ నిర్వాణమగు పరమపదము, (లేక) బ్రాహ్మీస్థితి సంతరించుకున్నాడు. ఎంతో శ్రవణ మనన - - నిధిధ్యాస మొదలైన అనేక ప్రయత్నములచే కూడా లభించనిది ఆ నా కొద్ది వాక్యములు విన్నంతనే కలిగినదంటే, ఆతని హృదయ నైర్మల్యము అంతటిది! అందుకే జలంలో పడ్డ నూనెబిందువు వలె శుద్దచిత్తమునందు కొద్ది ఉపదేశము కూడా మహాత్తరమై వ్యాపించగలదని ముందే చెప్పాను కదా!
❖
Page:614
శ్రీ వసిష్ఠ మహర్షి కనుక ఓ రామచంద్రా!
నా హమ్ ఇత్యస్తి తేనానర్మైనం భావయ శాంతయే, ఏతావత్ ఉపదేశోక్తిః పరమా నే. తరాస్తి హి ॥
నీవు చిదేకరసస్వరూపుడవు, అట్టి నీ ప్రత్యగాత్మయందు ’అహంకారము’ అనునది వాస్తవానికి ఉండజాలదు. ఇక అసత్యమగు అహంకారమును భావించనే వద్దు. ప్రశాంతచిత్తుడవై పరమాత్మ స్వభావమున వెల్లివిరియము. నా ఇంతటి ఉపదేశముయొక్క సారము ఇదే!
“నాయందు అహంకారం (అహంభావన)కు చోటే లేదు. అహంభావన (నేను అనే భావన)కు ముందే సర్వదా అంతటా ఏర్పడి ఉన్నట్టి పరమాత్మతత్త్వమేవ అస్మత్ స్వభావమ్” అనేదే సారాంశం.
అవిచారులు / సంసారాసక్తులు - ఋషులమగు మేము ఈ పరమతత్వమును ప్రవచిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉంచిన ముత్యం అటువైపుగా త్రిపిపెట్టి ఉన్న అద్దంలో ప్రతిబింబించదు కదా! అట్లాగే అవిచారపరులు సంసారాసక్తులు అగు మనుజుల మనస్సులలో మా ఈ బోధ ప్రవేశించినప్పటికీ అది ప్రతిఫలించక అప్రభావితంగానూ, నిష్ప్రయోజనంగానూ ఉండిపోతున్నది!
విచారపరులు / సంసార అనాసక్తులు - విచారశీలమై, భవ్యము-శాంతము అయినట్టి మనస్సులో మా ఈ బోధ (ఉపదేశం) ప్రవేశించిందా… ఇక అది వృద్ధియే పొందుతుంది గాని, చ్యుతి పొందదు. అంతేకాదు. ఇటువైపు త్రిప్పి ఉన్న అద్దంలో ప్రతిబింబించే ముత్యం నూతన తేజః పుంజాలను ప్రదర్శించుచున్నట్లుగా సువిచారపరుల (సంసార అనాసక్తుల) హృదయంలో ప్రవేశించిన మా ఈ వాక్యాలు తిరిగి మహారణ్యాన్ని భస్మీభూతం చేయగల మహత్తర ప్రదర్శనంతో బయల్వెడలుతాయి. అందుకే అవతారమూర్తివగు నీ ముందు మేము గ్రహించిన పరమసత్యమును సుదీర్ఘంగా విశదీకరిస్తున్నాం. ఈ మా సందేశసారం అవతారమూర్తివగు నీ ద్వారా తరతరాలా విస్తరించి లోకకళ్యాణ దాయకమగు గాక! మరల భుశుండినితో నాకు కొనసాగిన సంవాదం కొనసాగిస్తాను, విను.
❖
శ్రీ భుశుండుడు : ఈ సంసారం దుఃఖరూపమైనదని ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమే! అయితే ఇది బయల్వెడలేది ఎక్కడి నుండి? అహంభావము నుండే సుమా!
‘అహంభావము మమత్వ భావము "ఇదం’ భావము
‘నేను’ అను ‘నాది’ అను ‘దృశ్యము’ అను
ఖండభావన ఉపభావము. జగదనుభవం,
‘ఇచ్ఛ’ అనే శాఖలు … బయల్వెడలుచున్నాయి.
Page:615
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! జ్ఞానబలం చేతను, అహంకార రాహిత్యముచేతనే మీరు దీర్ఘాయుష్కులై ఉంటున్నారు కదా!
శ్రీ భుశుండుడు : ఓ ప్రియుడగు మునిశ్రేష్ఠా! విషయలంపటులగు మూఢులు కూడా ఒక్కొక్కసారి సుదీర్ఘమైన ఆయుష్షు కలిగి ఉండవచ్చు. "జ్ఞానులకే దీర్ఘాయువు ఉంటుంది. ఇతరులకుండదు”… మొదలైన నియమాలేవీ లేవు. అభ్యాసం ముఖ్యం. నిర్మలమైన హృదయం సంపాదించుకోవటం ముఖ్యం. అంతేగాని సుదీర్ఘమైన ఆయుష్షు ముఖ్యం కాదు.
అంతః శుద్ధమనస్కాయే సుచిరాయాభయప్రదమ్ । మనాగపి ఉపదిష్టాస్తే ప్రాప్నువంతి పరం పదమ్ ||
చిరకాలాభ్యాసంచేత ఎవరి అంతఃకరణం శుద్ధమై ఉంటుందో… అట్టివారు స్వల్పమైన ఉపదేశము చేతనే ఆత్మసాక్షాత్కారం పొందుచున్నారు. ఇక దేహధారణ - - దేహవిసర్జన అంటావా, అదంతా వస్త్రధారణ - వస్త్ర విసర్జన వంటిది మాత్రమే కదా!
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా మేరు పర్వత శిఖరంపై అధివసించే పక్షిరాజగు భుశుండమహాశయుడు నాకు చెప్పి అటుపై ఆ ముక్తాత్ముడు మౌనం వహించాడు.
ఆ తరువాత కొంతసేపైన తరువాత నేను అక్కడినుండి బయలుదేరాను. ఆ విద్యాధరుడు నివసించే ప్రదేశం సందర్శించాను. మహనీయుడైనట్టి ఆ విద్యాధరునితో కూడా సంభాషించి అటు తరువాత నిజాశ్రమమైనట్టి సప్తర్షిమండలం జేరాను.
ఆ విధంగా స్వల్ప సందేశం చేతనే విద్యాధరుడు ముక్తస్వరూపుడై ప్రకాశించాడు. ఈ విషయమై నేను ఆ భుశుండమహాశయునితో సంభాషించి ఇప్పటికి అనగా ఈ కల్ప ప్రారంభానికి ముందే 11 మహాయుగాలు గడచిపోయాయి.
శ్రీరాముడు : మహర్షీ! హృదయాంతరాళాలలో ఎక్కడనో ‘ఇచ్ఛ’ అనే జాడ్యం జనించి అహంకారాన్ని పరిపోషించి ఈ జీవునకు భ్రమపూర్వకము - దుఃఖమయము అగు ‘సంసారము’ అనే సంకటమును తెచ్చిపెడుతోంది కదా! అనహంభావనాభ్యాసం చేత ఈ అహంకారము ఎటుపోతోంది? ఆ తరువాత అప్పటి వరకు హృదయంలో రాజ్యమేలినట్టి అహంభావనకు ఏమి కానున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ‘అనహమ్’ భావనాప్రభావంచేత సంసారరూపము, శుభాశుభ ఫలప్రదాతయగు ఇచ్ఛ అంతఃకరణమున ఉపశమించగలదు. అట్టి అనహంభావనాభ్యాసబలంచేత మనుజుడు సువర్ణమును - మట్టిని కూడా సమముగా గాంచగలుగుతాడు. అతని సంసారమంతా ఉపశమించుటచే ఇక దుఃఖము ఆతనిని సమీపించజాలదు.
Page:616
న జానే క్వాశు గచ్ఛతి! - - ఈ జీవుడు కనుక శ్రవణ మననాది అభ్యాసమును ఆశ్రయించితే కాలక్రమంగా ఆతని స్వస్వరూపమునందు బ్రహ్మజ్ఞానము అనే జ్యోతివీచిక ఉద్భవిస్తుంది. అట్టి శక్తిచే ఈ ‘అహంభావము’ అనే శిల దూరంగా విసిరివేయబడగా - అది ఎక్కడికి పోయి పడగలదో ఏం చెప్పను? బ్రహ్మసాక్షాత్కారరూపుడగు వీరునిచే అహంభావనయే కాదు, ఈ "నేను దేహమును - దేహపరిమితుడను”… అను దేహాహంకారము తదితర జగద్వికారములతో సహా కూడగట్టుకొని ఈ సంసార వ్యవహారమంతా సుదూరంగా విసిరివేయబడగలదు.
ఓ రామచంద్రా! ఈ జీవుడు తనయొక్క జడదాతీత - దృశ్యాతీత - మనోబుద్ధ్యాతీతమగు స్వస్వరూపము యొక్క ఆత్మతత్త్వమును ఎఱిగినప్పుడే దృశ్యజాడ్యం తొలగుతుంది. తత్త్వజ్ఞానం లేకపోయిందా…. ఈ జీవుడు స్థూలదేహంలో ఉన్నా, స్థూలదేహరహితుడై ఉన్నా, శయ్యపై ఉన్నా, వృక్షముపై దాగినా, పర్వతములపై ఉన్నా, గృహంలో ఉన్నా, ఆకాశమందు ఉన్నా, స్థలమందు ఉన్నా, స్థూలంగా ఉన్నా, సూక్ష్మంగా ఉన్నా, సాకారంగా ఉన్నా, నిరాకారంగా ఉన్నా, రూపాంతరం పొందినా, ఎచ్చటెచ్చట ఉన్నా, నిదురించినా, మేలుకున్నా, అగ్నిలో దూకి భస్మీభూతమైనా, కమలంలో దాగినా, త్రసరేణువులో దాగినా, ఏదైనా ధరించినా, త్యజించినా, ఎందులోనో నిమగ్నమై ఉన్నా, అన్నిటినుండి దూరంగా పోయినా, దేనికైనా దగ్గిరగాజేరినా, ఎట్టి పరిస్థితులలో ఉన్నా కూడా…. అహంకారముయొక్క నూతనాంకురత్వం ఉండియే ఉంటుంది. కాస్త ఇచ్ఛతో కూడి ఆ అహంకారము యొక్క నూతనావతారం విస్తారమైన సంసారమును అక్కడికక్కడే కల్పించుకొని దర్శించగలదు. అహంకారము ఉన్నచోట ఇచ్చ, ఆ రెండిటి మేళవింపుచేత మనస్సు. ఆ మనస్సు యొక్క విస్తారము చేత జగత్ పరంపరలు ఒకదానివెంబడే మరొకటి తక్షణం బయల్వెడలగలవు. కాబట్టి ఇంతటికీ ఔషధం ఆత్మజ్ఞానమే!
ఒక చిన్న బీజములోనుంచి కాలక్రమంగా పెద్ద మహావృక్షం బయలుదేరుతోంది చూచావా? ఇక వృక్షముయొక్క ఘనమైన కాండము, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, పూలు, పళ్ళు. లేచిగుళ్ళు… విస్తారమగుచున్నాయి! అట్లాగే ‘అహంకారము’ అనే సూక్ష్మబీజంలో అనేక దృశ్యవృత్తులతో కూడి దేహపరంపరలు ఏర్పడటం వివేకులు సూక్ష్మదృష్టిచే గాంచగలుగుచున్నారు.
“ఈ దేహాదులు వాస్తవానికి ఏమై ఉన్నాయి? ఈ ‘అహంత్వము’ అనుదానియొక్క అసలైన స్వరూపమేమిటి?” …ఇట్టివాటి యొక్క విచారణచే నిత్యనిరతిశయానందమగు ఆత్మయొక్క జ్ఞానం పరిఢవిల్లుతోంది. అట్టి జ్ఞానాగ్నిచే ఈ అహంత్వబీజమనే కోశము దగ్ధమైపోతోంది.
దగ్ధమైన బీజం పైకి మామూలుగా ఉన్నప్పటికీ ఇక మొలకెత్తదు కదా! అంతరమున జ్ఞానాగ్నిచే దగ్ధమైన అహంకారము ఇక ఈ సంసారక్షేత్రంలో మరల మొలకెత్తదు. ఈ జీవులు ఇది ఎఱిగి “జీవితము” అనే పుణ్యకాలమును సద్వినియోగ పరచుకొనెదరు గాక!
Page:617
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! కాలముచే పుట్టుచున్న ఈ దేహములు కాలము చేతనే మ్రింగివేయబడవచ్చుగాక! అంతమాత్రంచేత ఈ జీవుడు మరణించుట లేదు. జనించుటలేదు. శ్రీరాముడు : అది ఎట్లా మహర్షీ?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. దేహము నశించినంతమాత్రంచేత జీవుడు సర్వనాశనమగుటలేదు. మరణం సర్వనాశాత్మ న కదాచన విద్యతే | స్వసంకల్పాంతర స్థైర్యం మృతిరిత్యభిధీయతే ॥
జీవుని దేహం నాశనమైనంతమాత్రంచేత ఆతని మనోబుద్ధ్యంహకారాలు నశిస్తాయా? లేదు. అవి ఉండనే ఉంటాయి. అవి ఉంటాయి కాబట్టి ఆ జీవునికి నాశనరూపమగు మరణం కలగనట్లే కదా! ‘జీవుడు’ అనగా ఆతని అనుభూతులు - అనుభవాలేగాని ఈ ఈ భౌతికదేహం కాదుకదా! జీవుడు ‘మరణించాలి’ అంటే ఆతని మనోబుద్ధ్యహంకారాలు నశించాలి. అవి నశించటమనేది జ్ఞానబలంచేతనే సాధ్యం. ఈ దేహం పోవటం నిజమైన మరణం కాదు.
మరి? ఆత్మ జ్ఞానముచే తన యొక్క సమస్త కర్మల-సంకల్పముల అభావం ఏర్పడగలదు. అట్టి అభావమే జీవుని మరణం గాని, దేహం నశించటం మరణం కాదు. అయితే, అట్టి అభావనచే సర్వభావములకు ముందుగానే సర్వదా ఏర్పడి ఉన్న భావాతీత, గుణాతీత, అఖండ, అప్రమేయ చిదాకాశంగా ఈ జీవుడు పరిణమించగలడు. భావముల మధ్యనున్న ఈ సాంసారిక జీవుడు భావములకు ‘ఆది’ అయిన స్వస్వరూపమును సంతరించుకొనుటచే పరమాత్మగానే పరిణమిస్తు న్నాడు. ఆతని పట్ల భావ జగదాదులు క్రీడామాత్రంగా మాత్రమే చోటు కలిగి ఉంటాయి.
గాలిలో ఎగురుచున్న జగత్భాండములు, మృతజన మానసిక జగత్తులు - ఓ రాఘవా! అదిగో అటు ఆకాశంలోకి చూడు! అనేక సంకల్ప పరంపరలు అనే ధూళికణములచే నిర్మించబడిన అసంఖ్యాక జగత్తులు గాలిచే ఎగురవేయబడి ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకుపోబడటం కనిపిస్తోంది కదా! అయాజీవుల సంకల్పములచే కల్పితములైన మేరు - మందరములవంటి లక్షల
కోట్లాది సంకల్పపర్వతములు నాలుగు దిక్కులలోను ఎలా గాలిలో ఎగురుచున్నాయో చూడు! అరటి స్తంభముల పట్టలవలె ఒకదానిపై మరొకటి - ఒకదానియందు ఇంకొకటి ఉండి ఉన్నట్లు… ఆ జగత్సమూహములు పరస్పరం కూడియున్నాయి. కాని విడివిడిగా కూడా ఉన్నాయి. చూడు! అదంతా ఎంత చమత్కారమో!
శ్రీరాముడు : మునీంద్రా! మేరు పర్వతములతో పోల్చతగిన అనేక జగత్ భాండములు గాలిచే ఆకాశంలో కొట్టుకుపోతున్నాయని, నన్నుకూడా చూడమని అంటున్నారు.! ఈ మీ వాక్యము యొక్క అసలైన ఉద్దేశమేమిటో నేను కొంచెం కూడా గ్రహించలేకపోతున్నాను. ’జగత్సమూహాలు’ అంటేనూ, అవి గాలిచే కొట్టుకుపోవటమంటేనూ మీ ఉద్దేశమేమిటో విశదపరచవలసినదిగా నా విన్నపం.
Page:618
ఎందుకంటే ఆకాశంలోకి చూచినా కూడా మీరు వర్ణించి చెప్పే జగత్భాండములు నాకేమీ కనిపించటం లేదే?
శ్రీవసిష్ఠ మహర్షి :“ఆ జగత్భాండములు - అవి గాలిలో కొట్టుకుపోతూ ఉండటం, వాటిని నిన్ను చూడమనటం”…. అను నా వాక్యముల యొక్క ఉద్దేశార్థమేమిటో చెబుతాను విను.
ఓ రామచంద్రా! ప్రతిరోజూ అనేక దేహాలు మరణిస్తున్నాయి. ఆ మరణించినవారి ప్రాణాలు ఆకాశంలోకి ఎగిరిపోవుచున్నాయి. అట్టి ప్రతి ప్రాణి యొక్క ప్రాణాలలో అంతర్గతంగా ఒక చిత్రం - (బీజంలో మహావృక్షం ఉన్నట్లు) ఉన్నది. అట్టి ప్రతి చిత్తంలో వివిధ ఆకారాలతో కూడిన జగత్తు కలదు. అటువంటి జగత్తులు అసంఖ్యాకంగా ఆకాశ వాయువులలో కొట్టుకుపోతున్నాయి.
ద్రవస్వభావం కలిగి ఉన్న నదీజలం ద్రవస్వభావ సమన్వితమైన సారగజలంలో కలుస్తున్నట్లు ఈ జీవుడు మృతి చెందిన తరువాత ఈతని ప్రాణవాయువులు ఆకాశవాయువులలో కలుస్తున్నాయి. ఆకాశవాయువుచే మరికొంత ప్రేరణ పొందిన ఆ ప్రాణవాయువులందు గల సంకల్పరూప జగత్తులు అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. అట్టి సంకల్ప జగత్ సమేతమైన ప్రాణవాయువులు నలుదిక్కులలో నిండి ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. నీవు కూడా గమనిస్తున్నావా? నా ఎదురుగా గాలిలో ఎగురుతూ కనిపించే ఈ జగత్ సమూహాలు నీకూ కనిపిస్తున్నాయి కదా! బుద్ధిని ఉపయోగించి చూస్తే అవి కనిపిస్తాయి సుమా!
ఈ ఆకాశంలో వాయువునందు మృతి చెందిన వారి ప్రాణాలు ఉన్నాయి. ప్రాణాలలో వారి మనస్సు, ఆ మనస్సులో జగత్తు ఉన్నది. ఆకాశమునకు వాయువు, ఆ వాయువునకు ఈ చనిపోయిన వారి ప్రాణములు, ఆ ప్రాణములకు ఆ జీవుల మనస్సులు… ఆ మనస్సులకు వారి ఊహా మాత్ర జగత్తులు ఆధారభూతమై ఎగురుచూ కనిపిస్తున్నాయి.
పూల నుంచి వాసన గాలిలోకి ప్రవహించి పరిభ్రమిస్తూ ఉంటే భౌతిక దృష్టికి కనిపించదు కదా! అట్లాగే ఈ గాలిలో ఎగురుచున్న ప్రాణ-మనో అంతర్గత జగత్తులు భౌతికమైన కళ్ళకు కనిపించవు. అయితే వాటిని సుతీక్షమైన బుద్ధితో గాంచవచ్చు.
శ్రీరాముడు : మహర్షీ! మీరు చెప్పేదంతా చాలా చమత్కారంగా ఉన్నది. అయితే యుక్తియుక్తమే నని కూడా ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పే మృతజనమానసిక జగత్తులతో ఒక్కొక్కదానిలో మరల త్రిలోకములు ఉంటాయికదా! అట్టి ఈ మృతుల జగత్తులు తదనంతరం ఏమి కానున్నవి? అవి ఆకాశంలో ఒకానొక విభాగంగా ఉంటాయా ఏమిటి? లేక, అవన్నీ వాయువిభాగమూ? శ్రీవసిష్ఠ మహర్షి : ఆ జగత్తులు సంకల్పజనితములు కదా! అనగా మనోకల్పితాలే కదా! కనుక అవి ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనవి. పైగా అవి కల్పనామాత్రాలే కనుక ఆ జగత్తులు వాస్తవానికి లేవు కూడా! ఒకని స్వప్నంలో కనిపించిన బంగారుకొండ గురించి విని ఆతని స్నేహితుడు అద్దాని ఆనుపానులకై వెతుకుతాడా? …వెతకడు కదా!
అయితే, చిదంశమే సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా! అందుచేత ఆయా మృత జీవులు తమ తమ భోగ్య వస్తువులైనట్టి స్వర్గ నరక భూమ్యాదులను దృఢభావనతోనే గాంచుచున్నారు. ఆ స్వయం
Page:619
సంకల్పమయ జగత్తులు ఆయా ద్రష్టలకు సుఖము, దుఃఖము మొదలైనవి కలుగజేస్తూనే ఉన్నాయి. నీవు నాకు ఎదురుగా ఎంతటి వాస్తవంగా కనిపించటం జరుగుతోందో ఆ మరణించిన జీవులకు కూడా వారివారి జగత్ కల్పనలు అంతటి వాస్తవంగానూ తోచుచున్నాయి. ఈ విధంగా ప్రాణరూప నదీజలంలో ప్రతిబింబిత నగరముల వలె ఈ జీవుల కల్పనాజగత్తులు ఆవిర్భవించి వాసనా మాత్రముచే ప్రభవిస్తూ ఎటో కొట్టుకుపోతున్నాయి.
కానీ, జగత్తులు లేవు. కొట్టుకుపోవటమూ లేదు. అవన్నీ ఊహాసమూహ సంపుటాలే కదా! ఒకచోట ఒక కుండ ఉన్నదనుకో, దాన్ని అక్కడి నుండి తీసి ఎవరైనా దూరంగా ఏదో ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఉంచారనుకో. ఆ కుండలోని ఆకాశంలో భేదమేమైనా ఉంటుందా?… ఉండదు కదా! అట్లాగే ఈ చిత్తం, అట్టి ఈ చిత్రంలో అంతర్గతమై ఉన్న జగత్తులు పరిభ్రమణం పొందితే పొందవచ్చు గాక! ఆత్మకు మాత్రం ఎట్టి పరిభ్రమణమూ లేదు, ఉండదు. ఆత్మయందు ఎట్టి భేదం గాని, మోదం గాని జనించదని ఎఱుగుటయే ఆత్మజ్ఞానము. శ్రీరాముడు : మృతి చెందినవారి ప్రాణములందు గల జగత్తుల యొక్క వాస్తవమైన రూపమేమిటి? శ్రీవసిష్ఠమహర్షి : చెప్పాను కదా! అదంతా సంకల్పమయమే కనుక కల్పనా మాత్రమే. అదంతా సప్న జగదృశ్యము వంటిదే!
శ్రీరాముడు : అట్టి మృతించినవారు మనోసంకల్పంతో గాంచుచున్న జగత్తుకు, మనం ఈ కళ్ళతో చూస్తున్న పాంచభౌతిక జగత్తుకు సంబంధమేమైనా ఉన్నదా? సారూప్యం - అనుభవం దృష్ట్యా ఒకే తీరువా, వేఱు-వేతైనవా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒకానొక సామ్యత తప్పకుండా ఉన్నది. మృతించినవారి జగత్తు ఏ విధంగా భ్రాంతిమయమో, కల్పనామాత్రమో… అట్లాగే ఈ జీవించి ఉన్నవాని జగత్తు కూడా భ్రాంతి మయమై, అసత్యముగానే ఉదయించినదగుచున్నది.
యథార్థానికి భ్రాంతి కూడా ఉదయించటం లేదు. నశించటం లేదు. భ్రాంతి కూడా తత్త్వ దృష్టిచే బ్రహ్మమే అయి ఉన్నది. ఒకవేళ వ్యవహార దశయందు ఈ పృథివి ఉదయించినదే కదా…
అని అంటావేమో?
నౌకలో జనులకు నౌక యథారీతిగా (కదలకుండా ఉన్నట్లు, ఒడ్డున ఉన్న చెట్లు కదులుతు న్నట్లు కనిపిస్తాయి చూచావా? అట్లాగే వాయుప్రేరితమైన చలనం పొందుచున్నప్పటికీ ఈ భూమి ఎప్పటియట్లే కదలకుండా ఉన్నట్లు - భ్రమచేతమాత్రమే అనిపిస్తోంది. పృథివియందు ఉన్న ఈ జనులకు పృథివి యొక్క అనుక్షణికచలనం ఏమాత్రం గోచరించటమే లేదు. అలాగే ఈ దేహం కూడా. ఈ దేహం ఎప్పటికప్పుడు మార్పుచెందుతూనే ఉండగా ఈ జీవుడు “నా దేహం ఎప్పట “ లాగానే యథాతథంగానే ఉన్నది”… అని ప్రతి ఉదయం లేచి అనుకుంటున్నాడు.
ఒక చిత్రకారుడు అతి విస్తారమైన ప్రదేశమును చిన్నవిస్తీర్ణము కలిగిన కిత్తనార గుడ్డపై చిత్రీకరించున్నాడు కదా! అట్లాగే, ఒక పరమాణువునందు కూడా ఈ మనస్సు విస్తారమైన జగత్తును కల్పన చేసుకుంటోంది. అనుభవిస్తోంది.
Page:620
ఈ జీవులు జీవించి ఉన్నంతకాలం అల్ప లక్ష్యాల పట్ల తమ ధ్యాసను పరిమితం చేసుకొని, అనేక వ్యాకులతలతో కాలం గడిపివేస్తున్నారు. జీవించినంత కాలం మరికొన్ని ప్రాపంచిక భ్రమలను ప్రోగుచేసుకొని వాటిని ‘మనస్సు’ అనే సంచిలో నింపుకొని ప్రాణములతో వాటిని మోసుకొంటూ దేహాలు త్యజిస్తున్నారు. నీకు నేను వాయువులో చూపిస్తున్న జగత్తులు అవే సుమా! ఒక ఎలుక ఒక రోజు ధనాగారం ప్రవేశించింది. అది రత్నములన్నీ వదిలి అక్కడ గల దోసిలి మాత్రపు అన్నాన్ని మహత్తరంగా భావిస్తుంది కదా! అట్లాగే ఈ జీవులు జ్ఞానమును సముపార్జించ టానికి అర్హమైన ‘మానవుడు’ వంటి ఉత్తమ జన్మలలో ప్రవేశించికూడా మహత్తరమగు ఆత్మజ్ఞాన విశేషాలను, అనుభవాలను వదిలి మరిన్ని ప్రాపంచిక వాసనలను ప్రోగుచేసుకోవటమే జరుగుతోంది. పసిబాలుడు అమూల్యమగు ఆభరణాను ప్రక్కకు పారవేసి మట్టి ముద్దను అధికమైనదిగా భావించు నట్లు ఈ జీవుడు చైతన్యతత్త్వమును వదలి పరమాణు నిర్మిత వస్తు సముదాయాలగు ఈ దేహం, గృహం మొ॥ వాటిని మహత్తరమని ఎంచి ఈ పాంచభౌతిక జగత్తులలో తారట్లాడు చున్నాడు.
ఓ రామా! నీవు "సజీవుని ఇహలోక జగత్తు - మరణించినవాని యొక్క పరలోక జగత్తు”ల సామ్యం గురించి అడిగావు కదా! ఈ చైతన్యము అజ్ఞానముచే ఆవరించబడి ఉన్నంతకాలం…. ఈ సజీవుడు చూస్తున్న ఈ పదార్థ రూప ఇహలోక జగత్తు, మృతునికి అనుభవమౌతున్న భావనామాత్ర (లేక, ఊహామాత్ర పరలోక) జగత్తు…. ఈ ఉభయము “వృద్ధి చెందిన చిత్తముముయొక్క సంకల్ప రూప భావనయే”నని గ్రహించు. ఇక్కడి అక్కడి సుఖదుఃఖములు, ధర్మాధర్మ భావనలు…. అంతా కూడా చిత్తము యొక్క విన్యాసమే!
“ఇది త్యజింపతగినది. ఇది గ్రహింపవలసినది” అను రూపంలో ఎవనిలో ఉన్నదో… అదే మమత్వభావనయొక్క రూపం. ఎవని అంతఃకరణంలో అట్టి గ్రాహ్య - త్యాజ్య భావన ఉన్నదో… అదియే అజ్ఞానం యొక్క రూపం సుమా! ఎందుకంటే, సర్వజ్ఞుడైన జ్ఞాని ప్రారబ్ధక్షయ పర్యంతరము వ్యవహార నిమిత్తం కార్యసంరంభమునకు సంబంధించిన వ్యవహారత్వము వహించియే ఉంటాడు.
చైతన్య సహితుడగు ఈ జీవుడు ఈ హస్త-పాదాది ఆయా అవయవాలను తన మనస్సునందే మనస్సుచేతనే అనుభవిస్తున్నాడు. అట్లాగే హిరణ్యగర్భుడు కూడా! సమిష్టి జీవుడు తన మనస్సునందే ఈ త్రిలోకాలను తన అంతఃకరణం యొక్క వ్యాప్తిచే తనే అనుభవించుచున్నాడు. ఓరామా! ఈశ్వరుడు వాస్తవానికి చైతన్యస్వరూపుడై, చిదాకాశరూపుడై, అవ్యయుడై, జన్మాదులు లేనివాడై అనంతరూపుడై ఉన్నాడు. ఇక ఈ జగత్తుల విషయానికి వస్తే, ఇది ఆ ఈశ్వరుడు తన అవయవంగా దర్శించడం జరుగుతోంది. అనగా ఈ జీవుడు ఈశ్వరస్వరూపుడైకూడా తన ఈశ్వరత్వమును ఏమరచి ఈ ఇహ పర దేహాలను అవిశ్రాంతంగా గాంచుచున్నాడు. ఇనుపగుండు అగ్ని యొక్క సహకారంచే కత్తి, సూది వంటి తన భావికాలపు వికారాలను గాంచుచున్నట్లు ఈశ్వరస్వరూప జీవుడు ప్రళయకాలానంతరం తనయందు ఈ ముల్లోకాల భ్రమను గాంచుచున్నాడు. అధిష్ఠానమగు మృత్తిక (మట్టి) తనయందు గల కుండను తన రూపంగా గాంచుచున్నట్లు ఈశ్వరుడు తన యొక్క
Page:621
మాయచే జగత్తును తన అంగంగా గాంచుచున్నాడు. విత్తులో గల అంకురరూప సత్త కాలక్రమంగా వృక్షత్వభావనచే వృక్షమును తన అవయవముగా తలచుచున్నట్లు బ్రహ్మం తనయందు స్వీయ మాయచే ఈ త్రిలోకాల దర్శనం చేస్తోంది.
నిజరూపం దృష్ట్యా జడమాత్రమగు అద్దం తనయందు ప్రతిబింబించే నగరంలో ఆయా కార్యకలాపాలు చూపరులకు చూపుచున్నట్లు బ్రహ్మము నిర్విషయ - నిర్మలతత్త్వమై ఉండి కూడా జీవేశ్వర ఉపాధిసంబంధిత దృష్టిచే తనయందు ఈ త్రిలోకాలను దర్శించి అనుభవించుతోంది. శుద్ధ దృష్టిచే తనయందు తానే సర్వదా ఏర్పడి ఉంటోంది.
దేశ కాల క్రియా ద్రవ్య మాత్రమేవ జగత్రయమ్ । |
అహంత్వ జగతోస్తేన భేదో నాస్త్యేతదాత్మనోః
ఇక్కడ కనబడే ముల్లోకాలు దేశ-కాల-క్రియ-ద్రవ్యమాత్రాలే అయి ఉన్నాయి కదా! అట్టి దేశ-కాల-క్రియా-ద్రవ్యాల పట్ల అభిమానం గల అహంకారం వాటితో తాదాత్మ్యం చెంది ఉండటం చేత వాటితో ‘తత్సమానవస్వభావం’ కలిగి ఉండటం జరుగుతోంది. కాబట్టి అహంకారానికి జగత్తుకు భేదం లేదు.
ఓ రామచంద్రా! శ్రుతులు గాని, నేను గాని ‘లోహం - మట్టి’ మొదలైనవి దృష్టాంతాలుగా తీసుకుంటున్నప్పుడు కేవలం బోధ సూచకమైన ఒకానొక విశేషాన్ని ఉపమాన సామ్యంగా గ్రహించాలని ఉద్దేశిస్తున్నాం సుమా! అది గమనించవలసినదిగా శ్రోతలకు నా విన్నపం.
ఈ స్థూలంగా కనిపిస్తున్న స్థావర జంగమ జగత్తంతా ఏమై ఉన్నది? తన సూక్ష్మ బ్రహ్మ భావాన్ని ఏమాత్రం త్యజించనట్టి చైతన్యం యొక్క వివర్తమాత్ర (Deduced) శరీరమే అయి ఉన్నది సుమా! నీవు జ్ఞానదృష్టితో దర్శించావా… ఈ వివర్తమంతా తొలగి శుద్ధము - పూర్ణము - సర్వత్రా వ్యాప్తము అయినట్టి నిస్సంగమగు ఆత్మయే కనబడుతోంది. అప్పుడిక జీవ - జగత్ భేదం కొంచెం కూడా కనిపించదు. ఒకడు తన యొక్క అజ్ఞానముచే ఏఏ వివర్తము చూస్తున్నాడో అదంతా ఆతని అజ్ఞానాంశము చేతనే అట్లగుపిస్తోందని గ్రహించు. ఎవరు ఏది ఎట్లు చూడటానికి సంకల్పిస్తే అది అట్లే అనుభూతమవటం చైతన్యముయొక్క విశేషము. అట్టి చైతన్యము యొక్క దర్శనమునే “చైతన్యాంశ వివర్తము” అని మనం పిలుస్తున్నాం.
ఈ సర్వము చైతన్యమే అయి ఉన్నది. చైతన్యముయొక్క సమక్షము చేతనే మనస్సు, ఆ మనస్సునందు సంకల్పములు ఉంటున్నాయి. చైతన్యము లేనిచోట సంకల్పములు ఉండజాలవు.
చైతన్య ప్రభావము చేతనే చిత్తము ఉంటోంది… చిత్తము యొక్క సంకల్పపరంపరలే జగత్తు యొక్క రూపం… కాబట్టి ‘ఈ జగత్తు చైతన్యమే’ అని శాస్త్ర నిర్ణయం. చిదాకాశము సర్వవ్యాపకము, అనంతము కదా! అందుచేత చైతన్యమే తన స్వరూపంగా గలిగి ఉన్న ద్రష్ట యొక్క జగద్దర్శనమంతా చిదాకాశమే అయి ఉన్నదనటంలో కించిత్ సందేహం కూడా ఉండనక్కర్లేదు. జ్ఞాని విషయానికి వస్తే… అతని అంతఃకరణమునకు ఏ వికల్ప సముదాయం ఉదయిస్తోందో, అదంతా ఆతని
Page:622
(జ్ఞాన) దృష్టికి ఏమాత్రం ఉదయించనిదే అగుచున్నది. ఎందుకంటే… ఆ కనబడే జగద్విశేషమంతా ఆతడు మిథ్యగానే ఎఱుగుచున్నాడు కాబట్టి!
శ్రీరాముడు : మహాత్మా! ఈ జగత్తంతా బాలునికైనా, వృద్ధునికైనా సత్యం వలే అనిపిస్తోంది కదా? శ్రీవసిష్ఠ మహర్షి : "బాలునికి వృద్ధునికి జగత్తు సత్యము వలె అనిపిస్తోంది కాబట్టి ఇది సత్యమే కదా”… అని కాసేపు మాటవరుసకు అనుకుందాం. మరి ఒకడు తన స్వప్నంలో వస్తు — వాహన
బంధువులను, వస్తువులను వాస్తవమనియే ఆ కాసేపు తలచుచున్నాడు కదా! కాబట్టి స్వప్నంలో కనిపించిన బంధువులు, వస్తు - గృహ - వాహనాదులు వాస్తవమని అందామా? కాదు. మెళుకువ వచ్చేసరికి అవన్నీ లభించటం లేదు. కనుక అవి అవాస్తవమే కదా! అట్లాగే, ఈ చంచల జాగ్రత్తులో అజ్ఞానికి కనిపించే జగదంతర్గత సంబంధ బాంధవ్యములన్నీ జ్ఞానము పొందిన తరువాత “అవి భ్రమయే” అని తప్పక గ్రహిస్తున్నాడు. కనుక జగద్దర్శనమంతా భ్రమయేనని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ! స్వప్నమును ఈ జీవునికి కల్పిస్తున్నదెవరు? ఎవరి ఉద్దేశమును అనుసరించి ఒక జీవునికి స్వప్నంలో తదంతర్గత విశేషాలు అగుపిస్తున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు చూచే స్వప్నం మరొకరెవరో బయట నుండి నిర్మిస్తున్నారనునది హాస్యపు మాట. ఆ స్వప్నద్రష్ట యొక్క కూటస్థ చైతన్యమే తన స్వప్న ఫలకమునందు స్వప్న దృశ్యమును సంకల్ప పూర్వకంగా రచించి - - అంతర్గత సంస్కారముల ప్రభావం చేత దర్శిస్తోంది. ఆ కూటస్థ చైతన్యమే “జాగ్రత్, స్వప్నములు” అనే సంకల్పమునందు, ‘సుషుప్తి’ అను వాసనయందు భోక్తగా ప్రతిబింబిస్తోంది. అనగా ఈ సంసారం అనేది కూటస్థ చైతన్యం తన ‘స్వరూపం’ అను కాగితంపై చిత్రించిన చిత్రీకరణమే గాని మరొకటేదీ కాదు. అనగా, చైతన్యం స్వప్న సమయంలో తాను రచించిన దానిని తానే వాస్తవమైనట్లు భావించి అనుభవిస్తోంది. “స్వప్న సదృశ జాగ్రత్ - జాగ్రత్ సదృశస్వప్నము” - ఈ ఉభయం సత్యంగా తోచుచున్నప్పటికీ సత్యం కాదు. కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబంతో పోల్చతగిన ఈ జీవునకు అనుభూతమయ్యేదంతా ఒక నాటకంలోని పాత్ర యొక్క గుణాదుల వలె మొదలే అసత్యం.
కూటస్థ స్వరూపం దృష్ట్యా ఈ జీవుడు నిత్యసత్యం. గుణ - - కర్మాదుల దృష్ట్యా మొదలే అసత్యం.
నిత్యముక్తుడు, సత్యస్వరూపుడు అగు పరమాత్మయే అసత్యరూపమైన ఈ జగత్తును ధరిస్తు న్నాడు. ఇది ఎట్లా అంటావా? జ్ఞానము ద్వారా ఈ జీవుడు ఈ “సూక్ష్మ శరీర సహిత అజ్ఞానము”ను సంక్షయింపజేసుకున్నప్పుడు ఈతడు శివస్వరూపుడే అగుచున్నాడని శాస్త్రవాక్యం కదా! [జీవశ్శివో శివోజీవః జీవో బ్రహ్మేతినాపరః | పాశబద్ధః తథాజీవో పాశముక్తః సదాశివః ॥]
కాబట్టి రామచంద్రా! “దూది పుంజములలాగా ఆకాశంలో ప్రాణవాయువులచే జగత్తులు కొట్టుకుపోబడుచున్నాయి”… అని చెప్పాను చూచావా? అటువంటి వాక్యాలన్నీ అజ్ఞానుల కొరకే
Page:623
వారి జ్ఞానాభివృద్ధిని ఉద్దేశించి నేను కల్పితపాఠ్యాంశంగా చెప్పాను. వాస్తవానికి అంతా కల్పనా మాత్రమే కనుక జగత్తులు లేవు, అవి కొట్టుకుపోవటం లేదు, అవి విద్యమానమవటమూ లేదు. “నాకు కనబడుచున్నాయి” అని చెప్పినవన్నీ ద్రష్టల స్వయంకృత కల్పనావిశేషాలే - అని గ్రహించు.
ఈ విధంగా చిదాకాశం సమస్త పదార్థసమూహాల కోశరూపమై సర్వత్రా వ్యాప్తమై ఉన్నది. ఆ చిదాకాశము అజ్ఞాన కారణం చేతనే అనేక బ్రహ్మాండాలు, వాటిలో కొన్ని ఒకదానితో మరొకటి కలియటం, మరికొన్ని వేఱు వేలై ఉండటం - - ఈ చమత్కారమంతా జరుగుతోంది. పరబ్రహ్మం సర్వశక్తిమంతమైనది. తత్కారణంగా ఈ బ్రహ్మండాలన్నీ అనంతరూపాలై అనేక కార్యారంభాలతో కూడుకొన్నవై ఉంటున్నాయి. అందులోని ఈ బ్రహ్మాండాలు అనేకమంది జీవులతో పూర్ణమై, చంచల మేఘాలలోని నగర ప్రతిబింబాల వలె ఉంటున్నాయి. గంధర్వ నగరాలలాగా మాంత్రికునిచే కల్పించబడి కనిపింపజేసే మాయా వస్తువుల వలె ప్రవర్తిస్తున్నాయి. ఈ జగత్తులలోని దేహములు, పదార్థములు మొదలైనవి పైకి స్థిరంగా ఉంటున్నట్లు భ్రమింపజేస్తున్నప్పటికీ లోన అచంచల శీలమై ఉంటున్నాయి. జల తరంగాల వలె చిద్రూపమహాసముద్ర తరంగాలుగా ఈ బ్రహ్మండాలు ఏర్పడి, కనబడి, ఉండి - - ఇంతలోనే కాలగర్భంలోకి జారుకుంటున్నాయి. ఏది ఏమైనా ఆత్మ సర్వదా నిశ్చలంగానే ఉన్నది.
ఇక జీవునికి ’నిశ్చలత్వము’నకు సంబంధించిన భావన కలగటానికి కారణం స్వరూపతః ఆత్మయే కాబట్టి!
సమష్టి రూప విరాట్ పురుషుడు - వ్యష్టి
శ్రీరాముడు : మహర్షీ! ఈ జీవునకు రెండు విధాలైన రూపములున్నాయి. కదా!… 1. ఆకృతరూపం (శాస్త్రీయ, వ్యవహారయుక్తమైన రూపం), 2. అవ్యాకృతరూపం (పారమార్థిక రూపం)… ఇప్పుడు నా ప్రశ్నలు విన్న విస్తాను1.జీవునికి వ్యవహారకారణమయ్యే ఈ స్థూలదేహం స్వీకరించటమనేది ఎట్లా సంభవించింది. 2.ఈ భౌతిక - వ్యావహారిక రూపాన్ని అతిక్రమించి పారమార్థిక స్వరూపాన్ని అతడు ఎట్లా సంతరించుకో గలుగుతాడు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! విను, చెపుతాను.
చిదాకాశము సర్వదా అనంతమైనది. అట్టి చిదాకాశబ్రహ్మము స్వ (తన యొక్క) సంకల్ప చమత్కారంచే మనోబుద్ధ్యహంకార రూపమగు సూక్ష్మోపాధియందు ప్రవేశిస్తోంది. అట్లు ప్రవేశించి ఈ నేత్రాలు మొదలైన ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తోంది. అట్టి అనుభవాన్ని అవధరించటం అను చర్యను దృష్టిలో పెట్టుకొని అది ‘చేతనం’ అని పిలువబడుతోంది. అయ్యది ప్రాణాలను అవధరించటంచేత ‘జీవుడు’ అను నామం చేత చెప్పబడుతోంది.
Page:624
కాబట్టి… ఈ జీవుని రూపము సూక్ష్మమూ కాదు, స్థూలమూ కాదు, శూన్యమూ కాదు, ఒకానొక వస్తు రూపము కాదు, మరి?… అయ్యది సర్వత్రా వ్యాప్తమై, అంతటా ఉత్తేజతత్వమైనట్టి స్వానుభవమే అయి ఉన్నది. చిన్మాత్రమే ‘జీవుడు’ అను శబ్దముచే చెప్పబడుతోంది.
“జీవుని రూపం అణువువంటి సూక్ష్మపదార్థాల కంటే అత్యంత సూక్ష్మం. స్థూల పదార్థాలన్నిటి కంటే అత్యంత స్థూలం. అది ఇదేదీ కాదు కానీ, ఇదంతా అదే. బ్రహ్మమే ఈ జీవుని వాస్తవరూపం” …అని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు. ఏ ఏ పదార్థములకు ఏఏ జాతి-గుణాది అసాధారణ విశేషాలు అగుపిస్తున్నాయో… ఆయా రూపంచే జీవచైతన్యమే స్థితి కలిగి ఉందని గ్రహించు. ఎందుకంటా వేమో? ఆ చైతన్యమే చిత్తవృత్తి ద్వారా ఆయా అనుభవమగుచున్న పదార్థంగా భాసించుచున్నది.
స్వస్వరూపం నుండి బయల్వెడలుచున్నట్టి సమష్టి జీవుడు (బ్రహ్మ, సృష్టికర, విరాట్ పురుషుడు) ఎప్పుడు ఎచ్చట ఏ అనుభవాన్ని ఆశ్రయిస్తాడో… అప్పుడు అచ్చట అట్లే శీఘ్రంగా అగుచున్నాడని సూక్ష్మదృష్టితో గ్రహించు. వాయువుకు చలనం స్వభావంగా అగుచున్నది చూచావా? సమష్టి జీవునికి ఈ సృష్టి తన యొక్క స్వభావమే అయి ఉంది. అంతేగాని ఇది - బాలునికి బేతాళుని భ్రాంతి వలె ఎవరో ఏదో చెప్పితే కలిగినది కాదు. జీవునకు ఎవరో చెప్పితే దర్శన ప్రతిభ కలిగినది కాదు. ఇది స్వభావమే అయి ఉన్నది. అయితే ఈ విషయం స్వ విజ్ఞాన మాత్రంచే నిర్ణయించ వలసినదే! ఒకరు బోధిస్తే మరొకరు పొందేది కాదు.
గాలి సంచలనం కలిగి ఉండటంచే దాని స్వర్శ తెలుస్తోంది. సంచలనం లేకపోతే? వాయువు ఉన్నప్పటికీ స్పర్శాస్పర్శలు ఉండవు. అట్లాగే ఈ జగత్తు ఇందలి పదార్థ విశేషాలు ఎదురుగా ఉంటున్నప్పటికీ ఎవరికైతే ఇవన్నీ అర్థరహితాలనీ, నిర్విషయాలనీ తెలియవస్తుందో (అనుభవ మౌతుందో… అనగా, ఈ జగత్పదార్థాలన్నీ పరిగణార్హత కోల్పోతున్నాయో) అప్పుడు ఆతనికి బ్రహ్మభావం విద్యమానమౌతోంది. జగత్ భావన తొలగిపోతోంది.
జీవుడు స్వయంగా చిదనరూపుడే. అందుచేత అతని ‘స్పురణ’ అగు ‘అహం’ అను రూపంలో గల అహంకారం ఈ “దేశ కాల క్రియ-ద్రవ్య”… మొదలైన శక్తులను ఆవిర్భవింపజేసి వెలయు చున్నది. అట్టి అహం నుంచి చిత్తం యొక్క కల్పన కావించబడుతోంది. చిత్తం యొక్క రూపమేమిటి? 1. దేశకాలక్రియాదుల రూపమున తన సూక్ష్మసంస్కార చమత్కారంచే కించిత్ ఆవిర్భవించిన చిత్తు యొక్క చమత్కారమే చిత్తము.
సూక్ష్మత్వము నుంచి స్థూలమును సంతరించుకోవటమే చిత్తము.
అసత్యమైనప్పటికీ ఈ దృశ్యమును సత్యమువలె భాసింపజేయునదే చిత్తము.
జగదనుభవమే చిత్తము యొక్క రూపం. అంతకుమించే వేతే ఏ రూపమూ లేదు.
చిత్తముయొక్క ఆకారము ఆ చిత్తమునకు అనుభవమయ్యే జగత్తు… రెండూ అవాస్తవాలే! 7. ఈ చిత్తము అతి సూక్ష్మమగుటచేత దాని వికారాలు సూక్ష్మ తరంగాలుగా హృదయంలో ప్రవహిస్తున్నాయి. అవియే జగత్తును నింపి ఉంచుతున్నాయి.
Page:625
ఈ చిత్తం స్వప్నంలో కల్పిత పరంపరల వలే తన అభిలషిత పాంచభౌతిక శరీరాన్ని కల్పిత మాత్రంగా గాంచుచున్నది. స్వప్నంలో ఒకనికి తాను మరణించినట్లు, బంధువులు దుఃఖిస్తున్నట్లు సంఘటనలు ప్రాప్తమగుచున్నట్లే జీవునికి ఈ జాగ్రత్ శరీర పరంపరలు వస్తున్నాయి, పోతున్నాయి.
స్వప్నంలో కనిపించే ఆయా జనులు స్వప్నద్రష్ట యొక్క స్వప్న శరీర విభాగములే కదా! అయినా, స్వప్నద్రష్ట స్వప్నంలో తారసపడిన రూపాలు తనకు వేరైనట్లుగా భ్రమిస్తున్నాడు చూచావా?
ఈ జీవుడు స్వతహాగా బ్రహ్మానందమయుడు, అఖండ నిత్యత్వ సంపన్నుడు అయి ఉండి కూడా “వీరు - వారు-నా వారు-నీ వారు- స్వజనులు-పరజనులు” ఇత్యాది విశేషాలతో కూడిన పరిచ్ఛిన్న జగద్రూపాన్ని (తన స్వరూపానికి అన్యమైనట్లు) గాంచుచున్నాడు. ఇట్టి “అహం - - చిత్తం ఇంద్రియ జగత్” వరుస క్రమంలోనే సమష్టిజీవుడు చింతిస్తూ సమష్టి స్థూల రూపమగు ఈ విరాడ్రూపాన్ని (పాంచభౌతిక సమష్టి జగత్తును) పొందుచున్నాడు. అంతేకాదు. ఆతడు తన ఆత్మ యందే సమష్టి మనస్సును నీళ్ళలో ప్రతిబింబించే చంద్రబింబంలా గాంచుచున్నాడు. ఇదియే సమష్టి జీవుని హిరణ్యగర్భరూపం. ఆ తరువాత ఈ తన సమష్టి యుక్తమైన హిరణ్యగర్భరూపాన్ని కాకతాళీయ న్యాయంచే తనకు భిన్నమైనదానిగా పంచజ్ఞానేంద్రియాల ద్వారా గాంచుచున్నాడు. ఆ పంచజ్ఞానేంద్రియాల ఛిద్రసహిత స్థానాలైన ఇంద్రియ ద్వారాలను (కర్మేంద్రియాలను) చింతిస్తూ, ఆయా విషయానుభవాలను పొందుచూ విరాట్పురుషుడై శోభిస్తున్నాడు.
ఈ విధంగా “అవ్యక్తరూపుడు-నిరామయుడు-అనంతాకార జ్ఞానయుతుడు-పరమేశ్వర స్వరూపుడు” అయినట్టి ఈ జీవుడు అనబడువాడు పంచేంద్రియములు అవయవములుగా గలవాడై విరాజిల్లుచూ, ఆయా విషయములను (శబ, స్పర్శ, రూపాదులను) అనుభవిస్తూ పోతున్నాడు.
అనగా… మనస్సు ప్రప్రథమంగా పరబ్రహ్మం నుండి ఆవిర్భవించి అనేక దేహపరంపరలను అనుభవించటంలో నిమగ్నమై, తన ఉత్పత్తి స్థానమును తానే ఎఱుగక తబ్బిబ్బగుచున్నది.
ఈ జీవుడు వాస్తవానికి పంచభూత పరిమితుడు కాదు. కాని పంచభూత పరిమితునివలె తోచుచున్నాడు. కారణం? కదిలే దానిని చూస్తూ కదిలించేదానిని ఏమఱచుచుండటం చేతనే. ఏది ఏమైనా ఈ జీవుడు తన యొక్క అప్రమేయ - అనంతాది విశేష సంపన్నమైన చైతన్యనమునకే ‘ఆది’ అయిన చిదానంద ఘనముగాక, పరమాత్మగాక మరొకటేదో కానే కాడు. పరమాత్మస్వరూపుడుగా ఈతడు సర్వశక్తి సంపన్నుడేగాని ఏదో చావు పుట్టుకుల మధ్య చిక్కుకున్న పిట్టవంటి వాడు కాదు. ఈతడు తనకు తానే స్వయంగా ఆవిర్భవిస్తున్నాడు, స్వయంగానే సంచాలనం నిర్వర్తిన్నాడు. స్వయంగానే లయం అగుచున్నాడు. ఈతడు స్వసంకల్పవశం చేత కల్పసమూహాలలోను, క్షణకాలములందు ప్రవేశించి మరల భావనను ఉపశమింపజేస్తూ శమించుచున్నాడు. ఈ జీవుడు దేహధారిగా కనిపించినా, సూక్ష్మదృష్టికి ఈతడు కేవల మనోమాత్రధారిగా తెలియవస్తున్నాడు.
మనస్సే శరీరములలో ప్రవేశించి, ఇంతలోనే నిష్క్రమిస్తోంది. ఏ చైతన్యాత్మ సమష్టి రచనా సంవిధానంలో ప్రవేశించి ఈ విరాడ్రూప విశ్వంగా ప్రకటనమగుచున్నాడో… ఆతడే వ్యక్తి జీవుల
Page:626
యొక్క పుర్యష్టకంలో (పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాసనలు, అవ్యక్తం) ప్రతిబింబిస్తున్నాడు.
సూక్ష్మః స్థూలో అంబరాత్మైష వ్యక్తి అవ్యక్తోంతవర్జితః సర్వస్య బహిరన్తశ్చ న కించిత్ కించిదేవ చ॥
అవ్యక్త అనంతాకాశ రూపుడగు ఆ పరమాత్మయే సూక్ష్మ శరీరాలలో… సూక్ష్మంగా, స్థూల శరీరాలలో… స్థూలంగా - సమస్త పదార్థముల బాహ్య అభ్యంతరాలలో వెలయుచున్నాడు. పరమార్థమున ఈతడు సర్వదా అపరిచ్ఛిన్నుడే అయినా కూడా వ్యవహారమునకు వచ్చే సరికి పరిచ్చిన్నుని లాగా ఒప్పుచున్నాడు.
పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, వీటన్నిటినీ ఆక్రమించి ఉన్న భావాభావాలతో కూడిన అహంకారం - ఇవన్నీ కలిసిన రూపమే జీవుడు.
ఈ జీవులలో ప్రకాశిస్తున్న ఆత్మయే చతుర్ముఖుడగు బ్రహ్మదేవునియందు కూడా ఉండినదై శబ్దార్థ కల్పనా సహితమైన నాలుగు వేదాలను గానం చేయుచున్నది. ఆ బ్రహ్మదేవుడే నేటి వరకు వ్యవస్థితమై ఉనట్టి నియతిని (శాస్త్రీయ, అశాస్త్రీయ సంచారాలను, విహిత, అవిహిత కర్మలను, కర్మల ఫలాదులను) స్థాపించినాడు. అతనినే “విరాట్పురుషుడు” అని కూడా అంటారు.
స్వర్గలోకం ఆ విరాట్ పురుషుని శిరస్సు, పృథివి ఆతని పాదం. మధ్యగా ఉన్న ఆకారం ఆతని ఉదరం. ఈ బ్రహ్మాండమండపం ఆతని శరీరం. అనంతమైన ఇతర లోకాలు ఆతని ప్రక్క అవయవవాలు. జలం ఆతని రక్తం. పర్వతాలు ఆతని మాంస పిండం. నిరంతర ప్రవాహ శీలాలగు నదులు ఆతని నాలుకలు. సముద్రాలు ఆతని రక్త సంచయస్థానాలు. సప్త ద్వీపాలు ఆతని ప్రేగులు. విశాలమగు దిక్కులు ఆతని బాహువులు. నక్షత్రాలు ఆతని రోమసమూహాలు. వాయువులు ఆతని ప్రాణవాయువులు. సూర్యమండలం ఆతని నేత్రం. చంద్రుడు ఆతని మనస్సు. ఆ మనస్సే ఈ శరీర వృక్షములకు బీజం. ఆ చంద్రమండలమే అన్నాదులకు హేతువు. మనస్సే ఈ జీవుడు.
చంద్ర రూపుడగు విరాట్ - - జీవుని వలననే ఈ మూడు లోకములందలి సమస్త జీవులు, వారి మనస్సులు, కర్మలు సుఖములు, మోక్షములు - ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి.
చంద్రరూప విరాట్ పురుషుని సంకల్ప రూపులే బ్రహ్మ - విష్ణు - - మహేశ్వరులు కూడా! అంతేకాదు. సురులు, అసురులు, మానవులు, జంతువులు, పక్షులు - ఇవన్నీ ఆ సమష్టిచిత్తం యొక్క చమత్కారము మాత్రమే!
ఈ విధంగా సృష్టికర్తలోని చిత్తు, జీవునిలోని చిత్తు ఒక్కటేగాని వేఱువేరైనవి కావు. వాస్తవానికి నిర్విషయము, అనంతయుతము అగు చిత్ త్రికాలాభాద్యసత్యము. అందులోంచి ‘స్వభావము’ అనే చమత్కారం స్వయంకృతంగా అయి బయల్వెడలుతోంది. ఆ చిత్ స్వభావమే సూక్ష్మమగు అమృతకళకు సాక్షిగా దర్శించుటకు ఉపక్రమించి చంద్రునికి "కార్యం, కారణంగా” అగుచున్నది. ఆ చిత్కళ ఎప్పుడు ఏ ‘దేవత, ప్రజాపతి’ మొదలైన ఆకారాన్ని సంకల్పించుచున్నదో… అప్పుడు
Page:627
అక్కడ అట్లా ఆ దేవత, ప్రజాపతి, మానవుడు, పురుగు మున్నగు రూపాలతో వెలయుచున్నది. అమృతకళతో కూడిన ఈ భౌతిక చంద్రుని ప్రభావం చేతనే భూమిపై ఓషధులు, పదార్థ - శరీర సృష్టి ఏర్పడుచుండుట చేతనే “జాగ్రద్దశగా అందరికీ అనుభూతమగుచున్న ఈ చంద్ర (విరాట్) మండలమే సమష్టి జీవుడగు విరాట్ పురుషుని శరీరం అపంచీకృత పంచభూతాలే అతని అవయవాలు"… అని శాస్త్రకారులు (సామవేదం మొ॥) ప్రవచిస్తున్నారు.
చంద్రరూపుడగు ఆ విరాట్ (సమష్టి) జీవుని నుండి చల్లటి కిరణ ప్రసరణ ద్వారా ఓషధుల రూపమున ఆ విరాట్తత్త్వరసతత్వము భూమిపై ప్రసరించి వ్యష్టి జీవులయొక్క ఆహారము-తదితర జీవశక్తులు-జీవనాడులుగా విస్తరించుచున్నది.
అనగా… విరాట్ పురుషుని నుండి బయలుదేరిన జీవ రసస్రవంతి చంద్రుని ద్వారా అమృత కళను సంతరించుకొని, అన్నరసరూపంగా భూమిపై ప్రసరించి ప్రాణధారణ ఒనర్చి, జీవుల దేహా లలో ‘జీవం’ అను రూపంగా ప్రవర్తిల్లుచున్నది. ఆ విరాట్ పురుష చైతన్య స్రవంతియే మనస్సు - జన్మ - కర్మలన్నిటికీ ముఖ్య కారణమై పరుగుచు, సర్వచేష్టలను ఒనర్చుచున్నది. ఇటువంటి విరాట్ పురుష శరీరాలు అసంఖ్యాకంగా ఒక్కొక్క కల్పంలో ఉన్నాయి. అటువంటి అసంఖ్యాక కల్పములు ఎన్నో గతించాయి. మరెన్నో గతించబోతున్నాయి. అయితే… ఇదంతా మాయా చమత్కారమే! ఎందుకంటే నిర్మల - నిర్విషయ - నిశ్చల బ్రహ్మం నుండి బయలుదేరిన ఈ విరాట్ పురుషుడు (సమష్టి జీవుడు) బ్రహ్మానికి వేఱు కాదు. కనుకనే ఆతడు అనంతుడై, అనుభవరూపుడుగా ఉంటున్నాడు. ఈ వ్యష్టి-సమష్టి సంబంధితమైన అధిష్ఠాన సత్తతో కూడుకొనినవాడుగా ఉంటున్నాడు.
సర్వ దేశ కాలాలో ఆ విరాట్రూపుడు బ్రహ్మం యొక్క మాయావిభాగం నందే స్థితి కలిగి ఉంటున్నాడు. అందుచేతనే "అంతయు బ్రహ్మమయమే” అని సిద్ధాంతీకరించబడుతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నిర్విషయ ఓంకార ప్రవచిత శుద్ధ - బుద్ధ పరతత్త్వమునుండి విరాట్ పురుషుడు స్వయంసంకల్ప ప్రభావంచే ఆవిర్భవిస్తున్నాడు. ఆ విరాట్ పురుషుడు సత్యసంకల్పుడై (దేనిని ఎట్లు సంకల్పిస్తే అది అట్లే ఏర్పడగల ప్రభావసంపన్నుడై) ఆ తదనంతరం పంచభూతాత్మకుడు అగుచున్నాడు. ఆ విరాట్ పురుషుడు ఏ వస్తువును ఎట్లెట్లు సంకల్పిస్తే అది ఆ విధంగానే స్వయంగా అగుచున్నది.
అనగా, చిదాకాశమగు బ్రహ్మమే ఈ జగత్తులోని ఆయా అనేక విశేషములుగా వివర్తము పొందుచున్నది. అందుచేతనే “ఈ జగత్సమూహమంతా విరాట్పురుషుని సంకల్పరూపము మాత్రమే” అని విజ్ఞులు నిర్వచిస్తున్నారు. ఎందుకంటే…
Page:628
ఈ విధంగా సమస్త జగత్ పదార్థముల సమూహం యొక్క మూలకారణం విరాట్ పురుషుడే అయి ఉన్నాడు. ఇక ఈ జగత్-జీవ రూపాలగు కార్యాలన్నీ కూడా అట్టి మూలకారణమగు విరాట్ పురుషసంకల్పమును ఆశ్రయించి, అనుసరించి ఉన్నాయని విశదీకరించబడుతోంది. ఇందులో సందేహం లేదు కూడా!
ఇక వ్యష్టి జీవుని విషయానికి వద్దాం. ఈతడు కూడా “పరమాత్మతత్త్వము” అను ముడి పదార్థంతో తయారు చేయబడినవాడే కనుక ప్రతిఒక్క వ్యష్టిజీవుడు కూడా తనయందు తాను సర్వ సృష్టి సమర్థుడయ్యే ఉన్నాడు. ఏ విధంగా అయితే సమష్టి జీవుడు తనయందలి దివ్యచైతన్యశక్తిని ఆసరాగా తీసుకొని ఈ మహాభూతాత్మిక సృష్టిని సంకల్పిస్తున్నాడో… అట్లాగే దివ్య చైతన్యమే స్వరూపంగా గల ఈ వ్యష్టి జీవుడు కూడా, నిజమనోవృత్యానుసారం స్వానుభవజ్ఞానాన్ని ప్రసరింప జేసి ఆయా పదార్థముల జ్ఞానానుభవాలను పొందుచునే ఉన్నాడు. అనగా… ప్రతి వ్యష్టిజీవుడు ఏ ఏ జగద్విశేషాలు అనుభవిస్తున్నాడో అట్టి జగద్విశేషమంతా నిజమనో వృత్యానుసారమైన జ్ఞాన విశేషమే గాని మరొకరెవరో అద్దానికి కారణం కాదు. ఈ జీవుని జగత్ మనో వ్యాపారమంతా తన స్వరూపము నుండి స్వయంకల్పితంగా ప్రవహిస్తున్న జగత్లహరి మాత్రమే !
ఒక క్రిమి నుండి రుద్రుని వరకు జగదనుభవమంతా ఈ ప్రకారంగానే స్వస్వరూపమునుండి జగదాకారభ్రమరూపంగా ఉదయించటం జరుగుతోందని గ్రహించు. ఇదియే సృష్టి.
ఒక బీజంలో మహావృక్షం సంస్కారరూపంలో దాగి ఉండే విధంగా, ఒక అణువులో కూడా సముద్ర-పర్వతాది వస్తు పరంపరలచే విస్తారమైన అనేక జగత్తులు ఉంటున్నాయి. ప్రవర్తిస్తున్నాయి
కూడా!
అయితే “ఒక పరమాణువునందు కూడా అనంతాత్మ కలదు" - అనే విషయం జ్ఞానం చేతనే తెలియవస్తోంది గాని, అజ్ఞానం చేత కాదు. ఒక కీటకం - దోమ మొదలుగా రుద్రుని వరకు గల ప్రత్యగాత్మ యందు (ప్రతి ప్రత్యేక ఆత్మయందు) విరాట్ సృష్టి ఉండియే ఉన్నది.
ఈ విధంగా “వ్యష్టి - సమష్టి ఉభయం ఒక్కటే” అనే ఒక మహాత్తరమైన సిద్ధాంతం మనకు ఇక్కడ సిద్ధిస్తోందని గమనించు. విరాడాత్మ యందు ఏ విధంగా ఈ సమస్తమైన జగత్తు యొక్క విస్తారము సిద్ధిస్తోందో, అట్లాగే అణుమాత్రమైన ఒక దోమ జీవునియందు కూడా విరాడాత్మ సంబంధమైన విస్తార జగత్తు సంభవించియే ఉంటోంది.
ప్రతిజీవుని విషయంలో ఈ సిద్ధాంతం వర్తిస్తున్నదని గ్రహించబడు గాక! ఇక ఆత్మ ఎటువంటిది?… అది పరమార్థమున స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పరిచ్ఛిన్నమూ కాదు. అయితే అది తన యొక్క భ్రాంతి విభాగంచే ఎచ్చట ఎట్లు విస్తరించుచున్నదో, అచ్చట అట్లే శీఘ్రంగా అనుభవించబడుచున్నది. ఆత్మచేతనే ఆత్మ అనుభవించబడుతోంది సుమా!
Page:629
లేక… చంద్రుని నుండి మనస్సు, మనస్సు నుండి చంద్రుడు… ఉత్పన్నమగుచున్నాయి చూచావా? (చంద్రమా మనసోజాతో); అట్లాగే ఆత్మయందు జీవుని నుండి ఆత్మయే అగు దృశ్యము కల్పితచమత్కారంచే ఉత్పన్నమౌతోంది. జలం, ద్రవత్వం… ఈ రెండూ వేరు వేరా? శ్రీరాముడు కావు.
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లాగే సమష్టి - వ్యష్టి అనబడే రెండూ కూడా ఒకే ‘సత్త’ కలిగి ఉన్నాయి. శ్రీరాముడు : “ఈ జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం. కనుక పరమాత్మయే జీవసంవిత్తు యొక్క కారణం. పరమాత్మ యొక్క కార్యం ఈ జీవుడు”… అను ఒకానొక కార్యకారణ సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుచున్నది కదా! అట్టి "పరమాత్మ కార్య - జీవ కారణ” సిద్ధాంతము గురించి మీ అభిప్రాయం వినాలని ఉన్నది.
శ్రీవసిష్ఠ మహర్షి
శుక్రసారం విదుర్జీవం ప్రాలేయ కణ సంనిభమ్ ఆనన్డో అచలసందోహస్తత ఏవ ప్రవర్తతే॥ తం చేతతి తదాభాసం పూర్ణమాత్మస్థమాత్మనా తత్ర తన్మయతాం ధత్తే తేన తన్మయరూపిణీ||
“మంచుకణమును పోలినదగు వీర్యమే జీవునియొక్క సారం”… అని అంటూ ఉంటారు. మాతాపితరుల సమాగమ కాలమున చిత్తైకాగ్రతచే ’భోగాకారవృత్తి’ యందు నిశ్చలమగు బ్రహ్మం యొక్క ప్రతిబింబం పడుచున్నది. అట్టి వీర్యమునుండి ఉపహితుడైన జీవుని నుండి అభాసరూపమగు ‘ఆనందాతిశయం’ ప్రవర్తిస్తోంది. అప్పుడు ఆ వీర్యోపహితమైన జీవచైతన్యం తనయందున్న వీర్య స్వభావంచే బ్రహ్మం యొక్క అభాసరూపమైన ఆనందాన్ని అనుభవిస్తోంది. ఇక ఆపై “ఈ నా అనుభవమైన వీర్య రూపమే ఆనందం, నేను ఇద్దాని చేత ప్రియతముడనగుచున్నాను” అని అనుకుంటూ, క్రమంగా వీర్యోపహితమైన స్థితిచే తాదాత్మ్యం పొందుచూ తన్మయమై వర్తిస్తోంది.
…ఇంకా ఆ తరువాత ఆ జీవ సంవిత్తు (లేక) గర్భస్థమైన వీర్యోపహిత చైతన్యం తదందర్గతమైన దేహరూపాన్ని ‘తదాత్మ్యం’ అనే చమత్కారంచే పొందుతోంది.
కాబట్టి… అట్టి ‘దేహోత్పత్తి’ అనే చమత్కారమునందు విరాట్టు-వ్యష్టి, కారణము-కార్యము అనునవి ఏమీ లేవు.
శ్రీరాముడు : ఈ సమష్టి - వ్యష్టి దేహసృష్టికంతటికి "పరబ్రహ్మం యొక్క స్వభావమే కారణం. తదితరమైనది కార్యం”… అని నిర్ణయించటం యుక్తియుక్తమేనా? కాదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లా యుక్తి యుక్తం కాదు. ఎందుకంటావేమో? శుద్ధ బ్రహ్మం నందు ’స్వ’ శబ్దం వాచకం కానేరదు. అనగా శుద్ధబ్రహ్మానికి “స్వ-పర” శబ్దమునకు సంబంధించిన వాచకాలను ఆపాదించలేం, ప్రతిపాదించలేం. ‘స్వ - పర’ అను విభేదం బ్రహ్మమునకు అనువర్తించలేనప్పుడు
Page:630
ఇక ‘వ్యష్టి – సమష్టి’ అను వ్యవహారం ఎట్లా ఒనగూడుతాయి? కనుక ఆ స్వ - పర మొదలైనవన్నిటికీ బ్రహ్మం కారణమని గాని, కార్యమని గాని ప్రతిపాదించటం భ్రమాత్మకమైన దర్శనపటాటోపం మాత్రమే. బ్రహ్మమునందు 1. ప్రతియోగి, 2. వ్యవఛేదము, 3. విరోధి - అనే విశేషములే లేవు. అట్లాగే బ్రహ్మమునందు ‘స్వభావం’ అనబడే బాహ్య-ఆంతరిక ఆవరణమేదీ లేదు. ఉంటే ’ఏకోసత్’ అను ప్రమాణవాక్యం సిద్ధించదు కదా!
శ్రీరాముడు : మహర్షీ! "ఈ జీవుడు అనగా ‘స్వ’, ‘స్వభావం’ అను రెండింటి సంయోగం”… అనే ఒకానొక సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం చెప్పమని నా ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పుడు నేను మరొక ప్రశ్నను ప్రతిపాదిస్తున్నాను.
జీవుడు అనగా… ‘స్వ’ అనబడు వాడా? లేక, దేహ, గుణములా? (అంటే స్వభావమా? లేక
రెండూ కలసియా?
‘స్వ’యే ఉపహితుడగు జీవుడని మనం అనుకుంటే, ఇక స్వభావం అనేది ఆతనిలో ఒక విభాగమనటానికి కుదరదు. ఆతనికి స్వభావం బాహ్యమైనదీ కాదు. వాయువు యొక్క బాహ్య అభ్యంతరాలలో వాయువే ఉన్నట్లు, జీవుని బాహ్య - అభ్యంతరాలలో స్వస్వరూపుడైన జీవుడే ఏర్పడి ఉన్నాడు. కనుక జీవత్వం - జీవుడు అనునది స్వతహాగా ఒక్కటే గాని వేరు వేరైనవి కాదు.
అట్టి ఈ జీవుడు ప్రాణం, ఇంద్రియాలు మొదలైన జడవస్తువులతో, “ఇవియే నేను. వీటిచే నేను పరిమితుడను”… అను రూపంతో తాదాత్మ్యం చెందుచున్నాడు. తద్వారా సంకుచితుడై, దృశ్యవిషయ-వస్తు పరాయణుడై జన్మాంధుని వలె ఉంటున్నాడు. అవిద్యాంశ పట్ల ధ్యాసచే ఆ అవిద్యా దశలో తన నిజమార్గమును (స్వస్వరూపమగు బ్రహ్మమును) గాంచటమే లేదు. తన నిశ్చల విభాగాన్ని ఏమరచి, చంచల విభాగాన్ని మాత్రమే నిరంతరం దర్శిస్తున్నాడు. ’చలనశక్తి’చే వాయువు కప్పబడినట్లు ఈ జీవుడు (నిశ్చల స్వరూపుడై ఉండి కూడా) జగదాకారంగా విజృంభిస్తున్న మాయాశక్తిచే కప్పబడి ఉంటున్నాడు. తన యొక్క ఏకత్వ రూపమునందు "ద్రష్ట - దృశ్యం” అను విభేదం గల ద్వైతరూపం కల్పన చేసుకుంటున్నాడు. అట్టి చంచలత్వమును అధిరోహించి తన శుద్ధ, సుస్థిరరూపమును గమనించలేకపోతున్నాడు.
ఏదైతే మిథ్యారూపమై, దృశ్యాత్మకమై, వాస్తవానికి అసత్తె ఉన్నదో… అదే అజ్ఞానం! జ్ఞానంచే అట్టి అజ్ఞాన మహాగ్రంధి భేదనమే మోక్షం. “ద్రష్టత్వమంతటి కంటే మున్ముందుగా ఉన్న నా స్వరూపం సర్వదా యథాతథంగా ఉంది”… అనే అనుభవమే ‘మోక్షం’ అను పరిభాషగా చెప్పబడుతోంది.
అందుచేత, ఓ రామచంద్రా! నీవు అజ్ఞానమేఘం తొలగినప్పటి చిత్ప్రకాశమాత్రుడవై ఉండు. అసలీ అహంకారమనబడేది లేనే లేదని గ్రహించు. మూర్త - అమూర్త వివర్జితమై, అజ్ఞానశూన్యమై, నిత్యోదితమైనట్టి చైతన్యఘనమును పొందినవాడవై, పరిపూర్ణుడవై, ఆనందపూర్వకంగా ప్రకాశిస్తావు
గాక!
Page:631
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనుజుడు జ్ఞానబంధువైతే సరిపోదు. జ్ఞానియే కావాలి. ఎందుకంటే, ఒక్కోసారి జ్ఞానబంధువు కంటే అజ్ఞానియే మెఱుగేమో నని కూడా అనిపించవచ్చు. శ్రీ రాముడు :
కిముచ్యతే జ్ఞానబంధుః? జ్ఞానీచైవ కి ముచ్యతే?
కిం ఫలం జ్ఞానబంధుత్వే? జ్ఞానిత్వే పి చ కిం ఫలం?
మునీంద్రా! జ్ఞానబంధువు అంటే ఎవరు? జ్ఞాని అనగా ఎవరు? ఉభయముల ప్రయోజనాలు ఎట్లా ఉంటాయి?
శ్రీవసిష్ఠ మహర్షి :
వ్యాచష్టే యః పఠతి చ శాస్త్రం భోగాయ శిల్పివత్ | యతతే నతు అనుష్ఠానే “జ్ఞానబంధుః” స ఉచ్యతే॥
శిల్పి శిల్పమును చెక్కుతాడు. ఉత్తమ భక్తుడు (లేక) ఉపాసకుడు ఆ శిల్పంలో ఇష్టదైవం యొక్క స్ఫూర్తిని దర్శించి తరించగలుగుతాడు. శిల్పి “ముక్కు-నోరు బాగున్నాయా? లేదా?”… అని మాత్రమే గమనించగలడు. అట్లాగే ఎవరైతే శాస్త్రమును భోగం కొరకో (లేక) చిలకపలుకులు పలుకుట కొరకు మాత్రమే పఠిస్తాడో… అంతేగాని మనస్సుతో అనుష్ఠించ ప్రయత్నించడో అట్టివాడు ‘జ్ఞాన బంధువు’ అని పిలువబడతాడు.
అనగా, ఎవనికి శాస్త్రాభ్యాసం చేత లభించినట్టి శబ్దబోధ ఆతని దైనందిన జీవితావగాహనగా వ్యవహారాలలో ప్రస్ఫుటం కాదో, వైరాగ్యం హృదయస్థం కాదో, ఎవడు తత్త్వబోధను కథలుగా మాత్రమే వల్లిస్తాడో… ఆతడు జ్ఞానబంధువు మాత్రమే! ఎవడు శాస్త్రపఠనాన్ని కేవలం భుక్తి కొరకై వల్లిస్తాడో ఆతడూ జ్ఞానబంధువు. ’అగ్నిహోత్రం’ మొదలైన ప్రవృత్తి రూపధర్మాలలో నిష్కాముడై ప్రవర్తించక, కేవలం డాంబికంగా నిర్వర్తిస్తూ ఆయా ప్రవృత్తి ధర్మాలను ఆత్మజ్ఞానం వైపుగాను, మనస్సు యొక్క పవిత్రత కొఱకై మలచుకోకపోతే ఆతడు జ్ఞానబంధువౌతాడే గాని, జ్ఞాని కాదు.
జ్ఞానం, జ్ఞానాభాస - ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ‘జ్ఞానం’ అని అంటారు. ఇక తక్కిన వివరణవిశ్లేషణ-పదార్థ సంబంధ జ్ఞానమంటావా? అవన్నీ కూడా ‘జగత్తు-జీవుడు’ ఈ రెండిటికీ అధిష్టాన మైనట్టి బ్రహ్మం గురించి బోధించజాలవు. అందుచేత అవన్నీ జ్ఞానాభాసలు మాత్రమే!
‘ఆత్మజ్ఞానం’ గురించి యత్నించకుండా తదితర సాధనా విశేషాలను ఆశ్రయించి స్వర్గాది ఫలప్రాప్తికై ప్రయత్నించేవారిని ‘అల్పశుభ జ్ఞానబంధువులు’… అని పిలుస్తూ ఉంటారు.
Page:632
·భాషాపూర్వకంగా ఇవన్నీ కూడా జ్ఞానమే. అయితే ఇవి అసలైన జ్ఞానం కాదు సుమా! ముముక్షువు అయినవాడు నిరతిశయానంద స్వరూపమగు బ్రహ్మముతోటి ఏకత్వం సంపాదించు కునే వరకు ఆగకూడదు. తృప్తి పొందరాదు. ఓ ప్రియ సభికులారా! మీరంతా జ్ఞానబంధువులై రోగరూపాలగు ఈ సంసార భోగాలందు రమిస్తూ కాలమును, అవకాశములను అల్ప వినియోగం చేయకుండెదరు గాక!
అత్రాహారార్థం కర్మకుర్యాత్ అనింద్యమ్, కుర్యాత్ ఆహారం ప్రాణసంధారణార్థమ్ | ప్రాణాః సంధార్యాత్ తత్త్వజిజ్ఞాసనార్థం, తత్త్వం జిజ్ఞాస్యం యేన భూయో నదుఃఖమ్ || ఈ ‘మానవజన్మ’ అనే అవకాశం వచ్చినందుకు ముముక్షువు చేయవలసినదేమిటి? 1. సహజీవులను బాధించనట్టి, సానుకూలమైన అనింద్యమైన కర్మలు మాత్రమే నిర్వర్తించాలి. 2. అట్టి కర్మలు కూడా ఆహారం సంపాదించుకోవటానికి మాత్రమే పరిమితం చేయబడాలి.
మరి ఆహారం ఎందుకు? జిహ్వాచాపల్యము కొరకై కాకూడదు. కేవలం ఈ ప్రాణాలు నిలబెట్టు కోవాలి కాబట్టి అంతవరకే ఆహార సముపార్జన ఉద్దేశించబడాలి.
ఆపై ప్రాణాలు నిలబెట్టుకోవటం అనేది తత్త్వజిజ్ఞాస కొఱకే అయి ఉండాలి.
ఇక తత్త్వజ్ఞానం మరల దుఃఖరహిత స్థితి సంపాదించుకోవటానికి సద్వినియోగపడాలి. …ఇట్లు జీవుడు జనన మరణ చక్రం నుండి తరించటానికే సర్వదా ప్రయత్నించటం ఉచితం.
జ్ఞానియొక్క నిర్వచనం
శ్రీరామచంద్రుడు : స్వామీ! ‘జ్ఞానబంధువు’ గురించి, ’జ్ఞానాభాస’ గురించి విశదపరిచారు. సాధకులగు, మేమంతా కృతజ్ఞులం. అట్లాగే జ్ఞాని - జ్ఞాన దర్శనం గురించి మరికొన్ని విశేషాలు విశదపరచవలసినదిగా నా ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క నిర్వచనం విను.
ఆతడు తనయొక్క జ్ఞానప్రవృద్ధముచే జ్ఞేయమగు ఆత్మ గురించి నిష్ఠ పెంపొందించుకుంటూ ఉంటాడు. అట్టి చిన్మాత్ర బ్రహ్మమునందు నిష్ఠచే క్రమంగా శబ్దస్పర్శాది విషయసమూహమును, కర్మ ఫలాలను, “ఇవన్నీ బయటగా లేవు. నా చిత్తముయొక్క లక్షణవిశేషమే ఇదంతా”… అని గ్రహిస్తూ అవన్నీ అసత్యాలుగా గమనిస్తూ ఉంటాడు. ఈ కళ్ళు మొదలైన ఇంద్రియాలకు తారసపడే దృశ్యాదులను ప్రక్కకుపెట్టి, అట్టి కళ్ళలోను, తదితర ఇంద్రియములలోను, అంతఃకరణంలోను ఏ సాక్షితత్త్వమైతే ప్రత్యక్షమై ఉంటోందో… అట్టి చితత్త్వమును గుర్తిస్తాడు. అట్టి సాక్షిగా ఉన్నట్టి చిన్మాత్రమగు పరమాత్మను బాగుగా ఎఱిగినవాడై ఈ దృశ్యమును అంతఃకరణం యొక్క వాసనా మాత్రంగా కూడా శేషించియే లేనట్లు గాంచుచూ ఉంటాడు.
ఇప్పుడు ’జ్ఞాని’ యొక్క నిర్వచనం వినుPage:633
అన్తః శీతలతేహాసు ప్రాజెర్యస్యావలోక్యతే | |
అకృత్రిమైక శాన్తస్య స జ్ఞానీత్యభిధియతే …
ప్రతి జీవుడు ’ఆత్మ’ అను ఏకైక లాభమును సర్వదా అవధరించియే ఉన్నాడు. ఎవనియందైతే అట్టి ఆత్మైక్య లాభముచే సంతుష్టి, శాంతము, వ్యవహారములందు అంతఃకరణ శీతలత్వము మనకు కనిపిస్తాయో, అట్టివాడు, ‘జ్ఞాని’ అని మనం గుర్తించవచ్చు. ఏ సమాచార ప్రసాదితమైన అవగాహన చేత అజ్ఞాన మూలము తొలగుచుండగా పునర్జన్మత్వము (నాకు జన్మ-మృత్యువులు ఉన్నాయి అనే భ్రమ) సమూలంగా కడిగివేయబడుతుందో అట్టి బోధయే జ్ఞానము. ఇక తక్కిన శబ్దజ్ఞాన చాతుర్యము శిల్పియొక్క శిల్పకళలాగా వస్త్రభోజనాదులు కొరకే గాని అనుభవము కొరకై కాదు.
పండితుడు :
ప్రవాహపతితే కార్యే కామసంకల్పవర్జితః |
తిష్టత్యాకాశహృదయో యః స పండిత ఉచ్యతే |
ఎవడైతే యథాప్రాప్తములైనట్టి ఆయా కార్యాలలో కామసంకల్పవర్జితుడై నిర్మలాకాశమువలె హృదయము కలిగి ఉన్న వాడై ప్రవర్తిస్తూ ఉంటాడో… అట్టి వానిని ’పండితుడు’ అని పిలుస్తారు.
ఓ రామచంద్రా! ఈ జగత్తు, అహంకారం మొదలైనవి లేవు. కాని ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఎందుచేత? దానికి కారణం లేదు. అభిలాష, అభిరుచులకు కారణం లేనట్లే, జగత్, అహంకారాలకు కూడా కారణం లేదు. అకారణంగా అనిపించేవన్నీ అకారణాలే. కారణం లేకయే ఉత్పన్నమైనాయి. కాబట్టి అవి వాస్తవానికి ఉత్పన్నము కానివే అగుచున్నాయి.
శ్రీరాముడు : “ఉత్పత్తియే కాలేదు. కానీ ఉన్నట్లుగా అనిపిస్తోంది" అను పరస్పర వ్యతిరిక్త వాక్యం ఎట్లా యుక్తియుక్తం స్వామీ?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో వాస్తవానికి లేకపోయినా కూడా ఉన్నట్లు అనిపించే అనేక దృష్టాంతాలు ఉన్నాయి.
కనిపిస్తుండటం.
కుందేటికి కొమ్ము ఎందుకు కనిపించింది? భ్రమచేతనే కదా! మృగతృష్ణలో జలం ఎందుకు కనిపించింది? భ్రమ చేతనే! భ్రమ చేత అనిపించేవన్నీ అవాస్తవాలే కాబట్టి అవి అకారణాలే గాని, సకారణాలు కావు. లేదా, అవిచారణతో ఉన్న అజ్ఞానావేశమే అందుకు కారణమని అనక తప్పదు.
అట్టివే ఈ సోదర-మిత్ర-శత్రు తదితర సర్వ సంబంధములు కూడా! అంతేకాదు. ఈ సర్వ జగత్తు అట్టి జగత్తులో జన్మాదిగా సంచరించే ఈ దేహము కూడా భ్రమయే కాబట్టి అవాస్తవము,
Page:634
అకారణం కూడా! “కుందేటికి కొమ్ము ఎందుకు కనిపించింది?”… అనే ప్రశ్నకు “అసత్తైన ఈ దేహ-పుత్ర-తదితర దృశ్యవ్యవహారం సత్తు వలె ఎందుకున్నాయి” అనే ప్రశ్నకు సమాధానం ఎంత వెతికి ఏం ప్రయోజనం?… సత్తు సత్తుగా, అసత్తు అసత్తుగా గ్రహించటమే ఇక్కడ సముపార్జించు కోవాలి. అట్లా కాకుండా ”ఈ దృశ్య సంబంధం ఎప్పటి నుండి ఎందుకు ఎట్లా ప్రాప్తించింది?”… అనే విషయంగా కార్య - - కారణాలు వెతుకుతూ పోవటం “గొడ్రాలి యొక్క కుమారుని, మనుమని భుజాలపై కూర్చుని ఊరంతా చుట్టి రావడం ఎట్లా?” అనే వాక్యంలాగా నిరర్థకం.
ఆజ్ఞానమే అసదనుభవమునకు కారణం! అసత్తైనవి, అసద్రూపమైనవి అగు విశేషములగు పదార్థములకు కారణం అజ్ఞానమే అయి ఉన్నది. అజ్ఞానమునకు రూపమేమిటి? జ్ఞానం యొక్క అప్రకాశమే, (లేక) ఏమరుపే!
అజ్ఞానము యొక్క ఆశ్రయముచే జ్ఞానము ఆవరించబడి ఉంటోంది. జ్ఞానము యొక్క అప్రకాశమే అజ్ఞానం. జ్ఞానము యొక్క ప్రకాశముచే అజ్ఞానము తొలగుతోంది.
జీవుడు పరమాత్మ
నాటకంలో కనిపిస్తున్న పాత్ర పాత్రధారి ఒక్కరే కదా!… అదేవిధంగా వాస్తవానికి ఈ జీవాత్మయే పరమాత్మ. అట్లాగే ఆ పరమాత్మయే ఈ జీవాత్మ.
అయితే, ఈ జీవుడు (జీవాత్మ) “నేనే పరమాత్మను"… అనే పరమసత్యమును సంతరించు కోవటం, (లేక) అనుభవైక వేద్యం చేసుకోవటం ఎట్లా?… అనే ప్రశ్నకు సమాధానమే ఈ మన
సంవాదసారము.
శ్రీరాముడు : మహర్షీ! "నేను జీవాత్మను” అను భావమునందు, అటు తరువాత భ్రమపూర్వక - కల్పిత అనుభవపరంపరలందు తననుతానే ఏర్పరచుకొనియున్న ఈ జీవుడు తనయొక్క సత్స్వరూపమగు పరమాత్మత్త్వము సంతరించుకొనేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి :
పరమాత్మాయతే జీవో బుధ్యమానస్త్వచేతనమ్ |
చేతనం బుధ్యమానస్తు జీవఏవావ తిష్ఠతే॥
“ఈ అహంకారము - దేహము అనునవి స్వయంప్రతిపత్తిగలవి కావు. చేతనములు కావు. ఇవి జడాలు. వీటిని ప్రవర్తింపజేసే (వీటికి వేరై ఉన్న) ఆత్మ మాత్రమే చేతనం”… అని ఏ జీవుడు గ్రహిస్తున్నాడో, ఆ జీవుడు పరమాత్మయే అగుచున్నాడు. అట్లా కాకుండా ఎవరైతే ఈ దేహఅహంకారాలను చేతనాలుగా ఆత్మగా భావన చేస్తున్నవాడో, అట్టివాడు జీవభావ పరిమితుడై
Page:635
ఉంటున్నాడు. హేమంత ఋతువులో మామిడి వృక్షం తనంతట తానే చిగురుస్తుంది చూచావా? అట్లాగే “ఈ దేహం - అహంకారం - మనస్సు అనేవన్నీ స్వయంగా చూస్తే అచేతనాలు. వీటిని ప్రవర్తింపజేసే నేను చేతన స్వరూపుడను”… అని గ్రహించిన మరుక్షణం ఆ జీవుడు పరమాత్మ అయి ప్రకాశిస్తాడు.
అనగా, అహంకారం, దేహం మొదలైనవాటిని గాంచుచున్నప్పుడు “ఇవి చేతనాలు” అని అనుకుంటూ ఉండటం చేత ఈ జీవుడు జీవరూపంగానే ఉండిపోతున్నాడు. తత్ఫలితంగా అనేక యోనులలో ప్రవేశిస్తూ శిథిలీభూతుడగుచున్నాడు.
అందుచేత ఈ జీవుడు బ్రాహ్మీదృష్టిని అలవరచుకోవాలి. "కదిలే ఈ దేహం, ఈ అహంకారం చేతనం కాదు. వీటిని కదిలించే ఆత్మయే చేతనం. అట్టి అఖండ - అద్వితీయ - నిత్యపక్రాశక చైతన్యమే నేను”… అను జ్ఞానమే ఆత్మజ్ఞానం.
యే పరాం దృష్టిమ్ ఆయాతా విద్ధి తేషామ్ అపామివ | ఆరూపాలోకమననం స్పన్ధమస్పర్ధనం సదా॥
ఎవరైతే అట్టి బ్రాహ్మీదృష్టిని సంపాదించుకుంటున్నారో… అట్టివారి రూప-సంకల్పక్రియాదులన్నీ అరూప-అసంకల్ప-అక్రియలు గానే ఉంటాయి. అభిమానరాహిత్యం చేత అవన్నీ ప్రవర్తించనివిగానే అవుతాయి. జలం తరంగంగా కనబడినంతమాత్రంచేత ఆ జలం తన స్వరూపం కోల్పోతుందా? లేదుకదా! దేహం, సంకల్పం మొదలైనవి ఆత్మీదృష్టిని మరల్చజాలవు. దృశ్యమును అధిగమించి ఆ దృశ్యమునకు కేవల సాక్షియగు ‘దృక్’ రూపాన్ని సంతరించుకొని ఉన్నవారు బ్రాహ్మీదృష్టిని సంపాదించుకున్నవారు అగుచున్నారు. అట్టి బ్రాహ్మీదృష్టి (కేవల దృకిస్థితి) సంతరించు కున్నవారు ఈ దృశ్యాన్ని చూస్తున్నా, లేక ఇందులో పాల్గొనుచున్నా కూడా ఇక్కడ వారికి ద్వైతదర్శనం ఉండదు. వారికి ఇక్కడ సర్వదా అంతటా బ్రహ్మమే దర్శనమౌతూ ఉంటుంది. వారి సమస్త క్రియలు కర్తృత్వ అభిమాన రహితాలై ఉంటాయి. ప్రవాహపతితంగా, ప్రారబ్ధానుసారం ఏదేది నిర్వర్తించ వలసి వచ్చుచున్నప్పటికీ వారు దృశ్యరహితులుగానే ఉండగలరు. అట్టి జ్ఞానుల సమస్త క్రియలు అక్రియలే అగుచున్నాయి. వారు బంధనం త్రెంచుకొనిన ఎద్దులాగా రూపాదులచే నిబద్ధులు కారు. వాయువు వృక్షంపై, ఆకులపై, పూలపై, పిందెలపై ప్రసరిస్తూ తాను యథాతథంగానే ఉంటున్నట్లు… ఆత్మీదృష్టి సముపార్జితులు ఈ దృశ్యంలో ఉంటూకూడా ఇక్కడి రూప-నామక్రియాదులచే స్పర్శించబడరు. నిబద్ధితులు కారు.
గంగానది ఒడ్డున నివసించేవారు ఎక్కడో కూపజలాన్ని ప్రశంసించరు కదా! అట్లాగే బ్రాహ్మీ దృష్టిని పొందినవారు ఇక్కడి సంసార విశేషాలను ప్రశంసించరు, నిరశించరు. ఓ రామా! వాసనలచే బద్ధులైన మూఢులే కర్మలను ప్రశంసిస్తూ తత్త్వజ్ఞానం యొక్క అభావంచే ఆ కర్మల ఫలాలను పొందుచున్నారు. ఆత్మదర్శులు కర్మలను నిర్వర్తించినా ఆ కర్మల యొక్క ఫలాలతో వారికి ఏ ప్రయోజనమూ కనిపించదు. కనుక వారు కర్మ ఫలాలను పొందనివారే అగుచున్నారు.
Page:636
ఓ జనులారా! ఎక్కడో ఆకాశంలో ఎగిరే గ్రద్ద దృష్టి అంతా నేలపై కనిపించే మాంసపు ముక్కలపై ఉన్నట్లు ఈ ఇంద్రియములు జగత్ విషయములవైపుగానే ఆకర్షితమై ఉంటున్నాయి. కనుక జాగరూకత వహించాలి సుమా! ఎందుకంటే అట్టి ఇంద్రియ విషయ సేవనాభ్యాసముచేతనే ఈ జీవుడు తన శివత్వము గాంచలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియములను ఉపయోగించే టప్పుడు బుద్ధిమంతుడైనవాడు “కర్మలు-ప్రయోజనాలు” అనే దృష్టి నుండి మరల్చి వీటిని ఉపయోగి స్తున్న మనస్సును ఆత్మార్పణ చేయాలి సుమా! ఆత్మానుభవామృతం గ్రోలినవాడికి ఈ ఇంద్రియ విషయాలు ఆకర్షణ విషయాలై ఉండజాలవు.
శ్రీరాముడు : ఈ జీవుడు ఎదురుగా ఉన్న సృష్టిని త్యజించి ఆత్మను ఆశ్రయించాలి. కానీ అది సులభ సాధ్యమగుట లేదు.
శ్రీవసిష్ఠమహర్షి : ఆకారం లేని సువర్ణం ఉంటుందా? ముద్దగానో, ఆభరణంగానో… ఏదో ఆకారం కలిగియే ఉంటుంది కదా! అట్లాగే బ్రహ్మం-సృష్టి అనునవి స్వభావసిద్ధం, అయితే ఈ సృష్టి పట్ల జ్ఞాని యొక్క దృష్టి, అజ్ఞాని యొక్క దృష్టి వేరు వేరుగా ఉంటున్నాయి. వీటినే 1.ఆత్మదృష్టి, 2. సంసారదృష్టి అనే పేర్లతో చెప్పుకుంటున్నాం. దగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం, అదగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం ఒకే తీరుగా ఉన్నా కూడా ఆ రెండింటికి సంబంధమెక్కడిది? జ్ఞానికి ఈ సృష్టి కేవల శివరూపం గానే అనుభవమౌతోంది. ఇక అజ్ఞానికో… ఇదే సృష్టి అనేక సంసార జన్మ - కర్మ - వ్యవహారభరితంగా అత్యంత భయంకరమై తోచుచున్నది. కనుక ఈ జీవుడు పవిత్రమైన దృష్టిని అలవరచుకోవాలే గాని, ఈ సృష్టిని వదిలి ఎక్కడికో పరుగులు తీయాలని మా బోధసారం కాదు. ఈ సృష్టి కల్పాంతంలో బ్రహ్మం యొక్క మాయా విభాగమునందు ఏ విధంగా నిర్విభాగమై, నిరాభాసమై జగత్ శబ్దార్థరహితమై ఉంటోందో… అట్లాగే వివేకవంతుని అవగాహనలో ఈ సృష్టి ఈ వర్తమానంలోనే నిర్విభాగమై, నిరాభాసమై, జగత్ శబ్దార్థరహితమై అగుపిస్తోంది.
ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. అవి చమత్కారంగా ‘కొండలు-వృక్షం-గోపురం-గుహ’ వంటి ఆకారాలు కనిపిస్తాయి. మరల ఆ మేఘాలు అటూ ఇటూ కదులుచూ ఉండగా ఆ కనబడే దృశ్యవిశేషచమత్కారం మటుమాయమౌతూ ఉంటుంది. గుహలా కనిపించే మేఘపంక్తి గుహను స్ఫురింపజేస్తోంది. మరల ఆ గుహ ఏమౌతోంది? మేఘాల కదలికచే మటుమాయ మవుతోంది. అట్లాగే అనేక విరుద్ధ ధర్మములచే కనిపించే ఈ జగత్తు మరల ఈశ్వరుని యందు విలీనమౌతోంది.
ఈ జగత్తు ఉపాధి. ఈశ్వరుడు ఔపాధికుడు. భావనయే జగత్తు. అజ్ఞానం చేత ఒకరీతిగా తోచే ఈ జగత్తు సుజ్ఞానం చేత శివంగా తెలియవస్తోంది. వస్తు దృష్టితో మేఘాలను చూస్తున్నప్పుడు కొండ-గోపురం మొదలైనవి కనిపించవచ్చుగాక! అంతా మేఘములే కదా! జలంలో అనేక తరంగాలు కనిపిస్తాయి. తరంగాలు శాంతించినప్పుడు ఆ శాంతజలంలోనే తరంగాలన్నీ లయిస్తు న్నాయి కదా! అసలు జలానికి - తరంగానికి భేదమెక్కడున్నది? తరంగానికి జలమునకు వేరైన ఉనికి (స్థితిత్వం-సత్త) ఉన్నదా?
Page:637
బ్రహ్మానికి - బ్రహ్మం యొక్క చిదాభాసులగు ఈ జీవులకు బేధమెక్కడిది? …లేదు. బ్రహ్మంలో కనిపించే భేదం అనిర్వచనీయం, ఆత్మదృష్టిచే అంతా బ్రహ్మంగా అనుభవం కాగలదు. అనగా “ఆత్మ స్వరూపుడగు ఈ ద్రష్ట తనయందు దర్శిస్తున్న భావతరంగాలే ఈ జగత్తు" గా వివేక దృష్టి కలవాడు గ్రహిస్తున్నాడు.
మనకు ఎదురుగా ఈ దిక్కులు ఉన్నాయి కదా! “ఇదిగో, ఇది తూర్పు, అది పడమర. అటు ఉత్తరం, ఇటు ఊర్ధ్వం” … ఈ విధంగా దశదిశలు కనిపిస్తున్నాయి. అయితే ‘ఆకాశం’ అనే దానిలో దిక్కులు అనేవి ఉన్నాయా? “సూర్యోదయం-మనం నిలుచున్న స్థానం" - ఈ రెండిటిచేత మాత్రమే ’దిక్కులు’ అనునవి మనం చెప్పుకుంటున్నాం కదా! కనుక… 1. ఆకాశంలో దిక్కులు లేని మాట నిజమే! 2.మనకు ఇది తూర్పు, అది పడమర అనేది నిజమే!
అట్లాగే బ్రహ్మము అకారణం. అది మరిదేనికి కారణం కాదు. కాని అన్నిటికి అధిష్ఠానం అదే! అట్లాగే ఈ జీవుడు - జగత్తు మొదలైనవన్నీ బ్రహ్మము కాక మరింకేమీ కాదు.
అనగా బ్రహ్మములోనే ఇవన్నీ ఉండి ఉండగా, బ్రహ్మము సర్వదా నిర్విషయమై ఉన్నది. ఈ విధంగా ద్వైత-అద్వైతములు బ్రహ్మమునకు సిద్ధిస్తున్నాయి. దిక్హితమగు ఆకాశమే సర్వదిక్కులను ధరిస్తున్నట్లే నిరవయవమగు పరబ్రహ్మమే ఈ జీవ జగత్ ఆదిగా గల ఈ సర్వరూపాత్మక సృష్టిని అవధరిస్తోంది.
అహంకారం ఉన్నప్పుడే జగత్తు. అహంకారం లేకుంటే జగత్తు లేదు.
జగత్తులో అహంకారం, అహంకారంలో జగత్తు. ఈ విధంగా ఈ రెండు అరటిపట్టలవలె ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉన్నాయి.
సృష్టి అనబడేది జీవునియందే ఉన్నది. హిమాలయపర్వతం తన నుండి జాలువారిన జలమునే తనకు బాహ్యమైన మానససరోవరంగా గాంచుచున్నది చూచావా? అట్లాగే ఈ జీవుడు కూడా తన యందు గల సృష్టినే ఇంద్రియ - మనస్సులందు గల వృత్తి చమత్కారం చేత ఇట్లా బాహ్యజగత్తుగా గాంచుచున్నాడు. బంగారంలో నుంచే ఉంగరము, ప్రక్కపిన్ను మొదలైన ఆయా భవిష్యత్ ఆభరణ ఆకారాలన్నీ బయల్వెడలుచున్నట్లుగా ఈ జీవుడు కూడా తన స్వరూపమునే అకారణంగా ఈ జగత్తు రూపముగా దర్శిస్తున్నాడు.
ఇక ఈ సంసారము యొక్క ఆవలి తీరమును దర్శించిన పవిత్రాత్ముల జీవనము - దర్శనము మరొక విధంగా ఉన్నది.
జీవన్తో అపి న జీవన్తి, మ్రియంతే న మృతా అపి,
సన్తోపి చ న సన్తీవ, పారావారవిదః శుభాః॥
అట్టి మహనీయులు ప్రాణములు ధరిస్తూకూడా ధరించనివారుగానే ఉన్నారు. శరీరము, ప్రాణములు ధరిస్తున్నప్పటికీ దేహ-ప్రాణాతీతులై ప్రకాశిస్తున్నారు.
Page:638
ప్రబుద్ధః సర్వకర్మాణి కుర్వన్నపి న పశ్యతి, గృహకర్మాణి గేహస్థో గోష్ఠభాండమనా ఇవ
ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు తన దృష్టి అంతా ఆకాశంలోనే ఉంచుకుని ఇంటిలోని ఆయా దైనందిన కర్మలు ఆచరించునట్లు, బ్రహ్మమునందు మాత్రమే ఆసక్తిగల జ్ఞాని ఈ శరీరయాత్రాది ఆయా కర్మలను నిర్వర్తిస్తూనే సర్వదా నిర్వర్తించనివాడుగానే ఉంటాడు. తన ధ్యాసనంతా “ఇదంతా ఆత్మగా దర్శించటం” - అను సాధన కార్యక్రమంలో వినియోగిస్తూ జీవితమంతా గడపుచున్నాడు.
ఈ విరాట్ నందు చంద్రుడు ఉండి అంతటా తన అమృత కిరణాలతో ప్రసరిస్తున్నాడు చూచావా? అట్లాగే ప్రతి వ్యష్టిశరీరమునందు మంచుబిందువు వంటి ఆకృతి గల జీవుడు ఇటు స్థూలంలో సూక్ష్మం గాను, అటు సూక్ష్మంలో సర్వత్వం గానూ అంతటా ప్రసరించి ఉంటున్నాడు.
అహంకారాత్మ - దేహాత్మ
శ్రీరాముడు : మహాత్మా! ఈ అహంకారం అనే చమత్కారం నిర్విషయమగు ఆత్మయందు ఎప్పుడు ఎందుకు ఎట్లా ప్రవృత్తమౌతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఆత్మ అంతటా, అన్నిటా, అన్ని వేళలా ఏర్పడియే ఉన్నది. అట్టి ఆత్మ నుండి ప్రవృత్తి అనే ఒకానొక చిత్ వృత్తి (సముద్ర జలంలో తరంగం వలె) స్వయంగా బయలుదేరి క్రమంగా దేహాత్మగా ప్రవృద్ధం అవుతోంది. ప్రవృత్తి స్వరూపుడగు అహం స్వరూపాత్మ ధ్యానము నందు ప్రవేశించి, అక్కడి నుండి దేహమును ఆశ్రయిస్తున్నాడు.
దేహారంభం -
అహమాత్మా త్రికోణత్వమ్ ఉపగచ్ఛతి కల్పనమ్ | అసదేవ సదాభాసం మన్యతే చేతనాద్వపుః ॥
కర్మకోశే త్రికోణే చ శుక్రసారే అవతిష్ఠతే |
దేహే జీవో 2 హమిత్యాత్మా స్వామోదః కుసుమే యథా ॥
తండ్రి దేహం నుండి అహంకారత్ముడగు జీవుడు వీర్యరూపంలో తల్లి యొక్క త్రికోణాకారమగు యోని యందు పరిచ్చిన్న రూపమున కల్పన పొందుచున్నాడు. క్రమంగా అక్కడి రక్తాదులు పొంది బుద్బుద-పిండాది క్రమంగా దేహాశ్రయుడగుచున్నాడు. ఇక అక్కడి నుండి, అసత్తగు "శరీరమే నేను” అనే భ్రమకు లోనగుచున్నాడు. ఈ జడ దేహమును సత్తుగాను, చేతనముగాను గాంచుచు అందు “అహం” అను అభిమానమును గాంచుచున్నాడు.
ఆహా! ఏమి ఆశ్చర్యం! స్వయంగా పరమానందమైన అఖండ చిదాకాశ స్వరూపుడు అయి ఉండి కూడా… అట్టి నిరంకుశ సత్యమును ఏమరచి ఈ జీవుడు స్వకర్మ నిర్మితమై, సంకుచితము
Page:639
పరిమితం అయిన దేహ పంజరంలో చిక్కుకున్నాడు. త్రికోణాకారమగు మాతృ గర్భాన నిర్మితమైన వీర్యమే సారంగా గలిగిన ఈ పంచభౌతాత్మిక దేహంపై అభిమానమును కల్పించుకొని ఇక పుష్పంలో సుగంధం ఉన్నట్లు ఈ దేహంలో అనుభవజ్ఞుడై పరిమితత్త్వం వహించి ఉండటం ప్రారంభిస్తున్నాడు.
చంద్రబింబం నుండి బయల్వెడలిన అమృత కిరణ సమన్వితమగు చంద్రిక బ్రహ్మాండమంతా విస్తరించి ప్రవహిస్తోంది చూచావా?
అట్లాగే… వీర్యమందు ఉన్నట్టి చంద్రకళా రూపమగు సంవిత్తు (జ్ఞాన స్ఫూర్తి) ఈ దేహామంతా కూడా ఆపాదమస్తకం వ్యాపించి ఉంటోంది. పొగ ఆకాశమంతా మేఘ రూపంగా వ్యాపించి ఉంటోందే! అట్లా అంతరం నుండి బాహ్యానికి ఇంద్రియాల ద్వారా ప్రసరితమగుచున్న జ్ఞాన స్ఫూర్తి ముల్లోకాలోకి (పాతాళ భూ-స్వర్గములలో) వ్యాపించుచున్నది. ఈ సమస్త శరీరమునకు బాహ్య అభ్యంతరమున ఈ అహంకార రూప జ్ఞానం విస్తరించి (వ్యాపించి) ఉన్నప్పటికీ అది హృదయంలో గల వీర్య విశేషంలో ఘనవాసనారూపంపై అధికమైన అభిమానం ఏర్పరచుకొని ఉంది.
ఈ విధంగా ఈ అహంకార రూప జ్ఞానం హృదయమున అధికమైన అభిమాన సమన్వితమై ఉండటం చేత… అట్టి హృదయమున ఆ జీవుడు ఏదేది ఎట్లు సంకల్పిస్తున్నాడో, ఆ రూపంలో అట్లే బాహ్యంలో కూడా స్థితి కలిగి ఉంటున్నాడు. అనగా తత్సంకల్ప పూర్వకంగానే బాహ్యంలో కూడా వ్యవహరిస్తున్నాడు. చూచావా రామా! అయితే, అట్టి అహంకారాభిమానం కేవలం భ్రమ మాత్రమే!
అహంకారాభిమానం -
శ్రీరాముడు : జీవునికి ఏర్పడిన ఈ అహంకార రూప అభిమానమే అన్ని తదితర సాంసారిక దృష్టులకు కారణం కదా! అట్టి దురభిమానపూర్వక అహంకార భ్రమ తొలిగేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని స్వభావసిద్ధమైన స్వరూపం దివ్య ఆత్మ చైతన్యం (ఆత్మ తేజం) అంతేగాని, ఈ అహంకార-దేహ దృశ్యత్వాలు కావు. ఎందుకంటే అవన్నీ కూడా భేద రూపమైనవి. ఆత్మ చైతన్యమో… అభేదరూపమైనది.
కాబట్టి ఈ జీవుడు అస్వభావం నుండి స్వభావానికి ప్రయాణిస్తేనే ప్రశాంతత. కానీ ఈ అహంకార భ్రమ బలీయమైనది. అనేక జన్మ-కర్మల సముదాయం చేత ఉపార్జించుకున్నది కదా! అందుచేత చిన్నచిన్న ఔషధాలు, ఉపాయాలు సరిపోవు మరి? స్వభావసిద్ధమైన, చిత్త వర్జితమైన బ్రహ్మంతో అభేద జ్ఞానరూపమగు స్థితిని సంపాదించుకుంటే తప్ప తమరింకే ఉపాయం చేత కూడా అహంకార భ్రమ శమించదు. ఓ రామా! నీవు శ్రవణ మనన నిధిధ్యాసలచే బ్రహ్మం గురించి చింతన చేయి.
అంతటితో తృప్తి చెందకు. వాటినన్నిటినీ అనుభవైకవేద్యము వైపుగా తరలించు. సమాధి యొక్క అభ్యాసం చేత మౌనస్వరూపమై ఆకాశాన్ని బోలి నిశ్చలమైనట్టి చరమ భూమికను (సప్తమ భూమికను) సముపార్జించుకో. ’ఆత్మ స్థితి’ సంపాదించుకునే వరకూ సాధకుడు ఎక్కడా ఆగకూడదు. జ్ఞానులు అందరిలాగే ఆయా ప్రవాహపతిత కర్మలు నిర్వర్తిస్తూ కూడా మానసికమైన సర్వ బాహ్య
Page:640
అభ్యంతర దృశ్య- దర్శనాభిమానరహితులై ఉంటున్నారు. బాహ్య భావనా వర్జితులై ఉంటున్నారు. చెక్కతో తయారు చేయబడిన మనుజుని వలె ఈ భౌతిక ప్రపంచంలో దిగులు-ఇష్టం-మమత్వంఅయిష్టం మొదలైనవి లేకుండా సంచరిస్తున్నారు.
అప్రమేయత్వం - సదా బ్రహ్మ భావన ఉండే వారు ఈ దేహాదులతో కూడి జీవిస్తూ ఉన్నప్పటికీ ఆకాశం వలె నిర్మలులై, వాస్తవానికి ఎట్టి బంధాలూ లేని వారై, ముక్తులై ఉంటున్నారు.
సూర్యప్రకాశం బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నట్లు వీర్యమునందున్న జీవ సంవిత్తే ఈ దేహామునందు అంతటా ఆపాదమస్తకం అహంభావ రూపంలో వ్యాపించి ఉంటోందని అనుకున్నాం కదా! ఆ వీర్య సంవిత్తు కళ్లు-నాలుక చెవులు చర్మము మొదలైన అన్ని ఇంద్రియాలలోనూ ప్రవేశించి వాటి నన్నిటినీ అహంభావబద్ధంగా చేస్తోంది. అక్కడి నుండి దర్శన-స్పర్శన-శ్రవణాదు లందు నిమగ్నమై ఆయా విషయాలను కూడా అహంభావరసంతో ముంచెత్తుతోంది. భూమి యందంతటా ఉన్న రసం విత్తనంలో అంకుర రూపంలో ఉదయించి వృక్ష విభాగాలుగా ప్రదర్శిత మౌతోందే! అట్లా అజ్ఞానం చేత ఆవరించబడిన సందర్భములో చైతన్యం సర్వత్రా ఉండి కూడా… ప్రప్రథమంగా మనస్సుగా అయి, ఆ తరువాత అహంభావ రూపం సంతరించుకుని దేహంలో ప్రవేశించి ఆయా ఇంద్రియాల రూపంగా ఉదయిస్తోంది.
జగత్తు లేదు : బ్రహ్మమే ఉన్నది - శ్రుతులు (“నేల తి, నేలతి, నేహ నానాస్తి కించన” మొదలైన శ్రుతివాక్యాల ద్వారా) జగత్ నాస్తిత్వం ప్రతిపాదిస్తున్నాయి కదా! ఎవడైతే ఈ జగత్తులో ఆరూఢమై ఉన్న మనోహంకార దేహాదులకు అభావనను ఆశ్రయిస్తూ తద్వారా అతీత్వం వహిస్తాడో అతనికే బ్రహ్మం అనుభవమౌతోంది. ఎవడు అభావన ద్వారా ఈ దేహ - మనో - అహంకారాలకు అతీతత్వ భావన సంతరించుకోవటానికి ప్రయత్నించడో… అట్టి ప్రయత్నరహిత మనుజునికి అనంతమైన సంసార దుఃఖం ఎన్నటికీ శమించదు. జ్ఞానామృతముచే తృప్తుడైన మనుజుడు ఏది ఎట్లు ఉన్నా, ఏది ఎట్లైనా దుఃఖించడు. సుఖించడు. తాను ఏది ధరించినా, ఏది భుజించినా, ఎచ్చట పరుండినా సర్వదా సర్వోత్తమమైన ఆత్మసుఖమునే అనుభవిస్తూ చక్రవర్తి వలె శోభిస్తూ ఉంటాడు.
అతడు అనేక వాసనలతో కూడి ఉండినప్పటికీ తాను దగ్ధమైన వస్త్రాకారములాగా వాటిచే స్పర్శించబడకయే ఉంటాడు. అంతరాంతరమున సాంసారిక వృత్తులేవీ లేనివాడై, అశూన్యమగు చిన్మాత్ర రూపుడే అగుచు - - ఆకాశం ప్రాణవాయువులను ధరించి ఉన్నట్లు ఈ మనో దేహ అహంకారాదులను… అసంబంధితుడై ఉండియే… ధరిస్తూ ఉంటాడు.
ఆసనే శయనే యానే స్థితో యత్నైర్నబోధ్యతే నిద్రాలురిన నిర్వాణ మనో మనన నిర్వృతః॥
అట్టి జ్ఞాని ఆసన శయన ప్రయాణ సమయాల్లో ఆరూఢమై ఉన్నప్పుడు కూడా నిర్వాణ దశను అవధరించి నిద్రాళువు వలె అతీతత్వం సిద్ధింపజేసుకొనియే ఉంటాడు. సంచిత్ స్వరూపుడగు పురుషుడు సర్వవ్యాపి అయికూడా శరీరంలో సారభూతమైనట్టి విభాగంలో స్థితి కలిగి ఉంటున్నాడు.
Page:641
ఈ జీవుడు వాస్తవానికి సంవిన్మాత్రుడే (లేక) జ్ఞాన మాత్రుడే సుమా! ఆతని యొక్క విస్తారమే ఈ జగత్తు. అతడు జగత్తు పట్ల అభిమానం ఉన్నప్పుడు జగత్తును అనుభవిస్తున్నాడు. జగత్ రహితు డుగా ఉన్నప్పుడు పరమాత్మత్వము అనుభవిస్తున్నాడు. ఉపదేశసారమంతా ఇంత మాత్రమే సుమా!
కనుక జగత్తు ఉండవచ్చు గాక, ఉండకపోవచ్చుగాక! నీవు మాత్రం జగదతీత్వము వహించిన వాడవై ఉండు. ఈ సమస్త సాంసారిక పదార్థములందు, స్థితియందు విభవములందు, దారిద్ర్యము లందు పొంగని - - క్రుంగని స్థితి కలిగి ఉండు. సర్వదా విరాగివై హృదయమును శిలవలె ఇచ్ఛా రహితంగా చేసేవేసి ‘జ్ఞానము’ అనే ఐశ్వర్యమునుకు పొందటానికి సర్వదా సంసిద్ధుడవై ఉండు.
జడమగు ఒక శిల యొక్క అంతర్భాగం ఛిద్రరహితమై మౌనము వహించి ఒప్పుచున్నది కదా! చిదాకాశరూపమగు నీ హృదయము కూడా అంతరమున ఛిద్రరహితమై ‘జగత్తు’ అను భూతాదులకు స్థానము పొందనిదై ఒప్పుగాక! కేవల చైతన్య సమన్వితమైన ప్రకాశించుగాక! హృదయమునందు సాంసారిక వాసనలకు స్థానమే లభించకుండు గాక! చైతన్యపూరిత హృదయాకాశమున కేవల చైతన్యమునే దర్శిస్తూ పరమానందము పొందుచుండెదవు గాక!
జ్ఞాని - అజ్ఞాని - వారి వ్యవహార విశేషాలు
ఓ రామచంద్రా! జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడి సమస్త భావ-అభావాల విషయంలోను, కర్మలు నిర్వర్తించే పద్ధతియందు పెద్ద తేడా ఉండదు. వారిద్దరిలోనూ ఉండే భేదమంతా ఒక్కటే!
జ్ఞాని ఆ ఆ పదార్థములందు, సంఘటనల యందు, కర్మల యందు, తదితర విశేషములందు వాసనారహితుడై ఉంటాడు. వాటియందు అతనికి సత్యత్వ బుద్ది ఉండదు.
అజ్ఞాని వాటన్నిటి పట్ల వాసనా సహితుడై ఉంటాడు. వాటి పట్ల సత్యత్త్వ బుద్ధి కలిగి ఉంటాడు. వారిరువురిలో భేదమంతే!
చైతన్య వాసనలచే స్ఫురించుటచే ఈ జగద్రూపంగా అవుతోంది.
సత్తయే వాసనల అభావముచే ఈ జగద్రూపం శమించి అపరిచ్ఛిన్నము నామరూపరహితము అగు మోక్ష స్వరూపమే అగుచున్నది.
ఇంత మాత్రమే జ్ఞానమంతా! ఇక ఈ ‘దృశ్యం’ అంటావా? దృశ్యం వినశ్యతి అఖిలమ్, వినష్టం జాయతే పునః | యన్ననష్టం న చ ఉత్పన్నం! యత్ సత్ భవతి తత్ భవాన్ II
ఈ దృశ్య జగత్తంతా ఒకప్పుడు నశిస్తోంది. నశించినదంతా మరల మరొకప్పుడు ఉత్పన్న మౌతోంది. అయితే… ఏదైతే నశించుటయే లేదో, నశించడం లేదు కాబట్టి ‘ఉత్పన్నం’ అనేది కూడా లేదో … అదియే సత్తు.
Page:642
“ఆ సత్తయే నీవు” ఇట్టి బోధచే అజ్ఞాన మూలము నశించుచున్నది.
అజ్ఞాన మూలము నశించిన తరువాత ‘జగత్య్రాంతి’ అనేది ఇక ఎంత వెతికినా కనిపించదు. "మృగతృష్ణలో భ్రమచేతనే జల తరంగాలు కనిపిస్తున్నాయి కదా!”… అని తెలిసే వరకే కదా, మృగతృష్ణ వైపుగా పరుగులు! అట్లాగే, “జగత్ దర్శనమంతా భ్రమ చేతనే ఏర్పడుతోంది” అని గ్రహించబడిన తరువాత ఇక “ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? దీని మొదలేమిటి? చివర ఏమిటి?”… అనే ప్రశ్నలకు తావు ఎక్కడిది?
ఏ ‘అహంకారము’ అను దాని గురించైతే ’ఇదేమిటిరా బాబు? ఇది ఎక్కడి నుండి వచ్చింది?” అని సాధకులంతా తర్జన భర్జనలు చేసుకుంటున్నారో… ఆత్మ దర్శనమైన తరువాత ఇట్టి అహంభావన గురించిన ఊసైనా ఉండదు.
ఆత్మజ్ఞానికి అంతఃకరణము ఉపకరణమే అవుతుంది. కాని అది సంసారమును కలుగజేయ జాలదు. దగ్ధమైన బీజము మరల మొలకెత్తదు కదా! వీత రాగుడు (రాగములను జయించినవాడు), మనోవికార రహితుడు అయిన జ్ఞాని కర్మలు చేయుచుండవచ్చు. లేక చేయకుండవచ్చు గాక! అతడు సదా అమనస్కుడై, నిత్యనిర్వాణ రూపుడై … ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు.
ఎవరైతే ఈ తమ చిత్తమును సశాంతింపజేసుకుంటారో …వారే శాంతియుతులై ఉండ గలుగుతారు. భోగ వాసనలు కలవారికి మాత్రమే భోగముల ఉనికి - లేములు బంధించడం, బాధించడం చేస్తున్నాయి. భోగాశ ఉన్నచోట మాత్రమే చిత్తమనేది ఏర్పడుతుంది. అట్టి వారికి శాంతి లేదు. ఎవరైతే సర్వాశలు సర్వదా త్యజించియే ఆయా ప్రవాహపతిత విధి విధానములను నిర్వర్తిస్తూ ఉంటారో …వారికి చిత్తము లేనట్లే అవుతుంది. ఆ విధంగా చిత్త - దేహాదులుగా ఘనీభూతం కాని వాడు (వాటిపట్ల అహంకార బుద్ధి ఉంచనివాడు), కేవల చిన్మాత్ర రూపుడగు పరమాత్మయే! అహంభావముతో కూడి ఉండేవాడు ఇసుకపై నిలుచుని మధ్యాహ్న సూర్యుని తాపము అనుభవించువాడే అగుచున్నాడు.
శ్రీరాముడు: చిత్త రహితుడు పరమాత్మయే అగుచున్నాడని అనుచున్నారు కదా! అట్టి చిత్త రహిత పరమాత్మ స్వరూపము ఎట్టిదో ఏదైనా దృష్టాంతపూర్వకంగా చెప్పమని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి
ఏకదేశ స్థితాత్ పుంసో దూరాయాతస్య చేతనః । |
యద్రూపం సకలం మధ్యే తద్రూపం పరమాత్మనః ॥
ఒకడు ఒక ప్రదేశంలో నిలుచున్నాడనుకో. అతని చిత్తము (ధ్యాస) దూరంగా ఉన్న సూర్య చంద్ర మండలమునకో వెళ్లినదనుకుందాం. ఆ మనుజుని చిత్తము అతడు నిలుచున్న చోటు నుండి బయలుదేరిన తరువాత, ఇంకా సూర్య మండలము చేరక ముందు ఆ మధ్య ప్రదేశములో ఏ చైతన్య స్ఫురణ కలదో అదియే ‘పరమాత్మ’ యొక్క రూపం. అనగా……
Page:643
ఈ జీవ సంవిత్తు విషయములను పట్టుకొంటోంది కదా! ఇది ఒక విషయమును ఆశ్రయించి ఇంతలోనే ఏదో కారణం చేత ఆ విషయమును త్యజించి మరొక విషయమును ఆశ్రయిస్తోంది. ఇట్లు అవిశ్రాంతంగా విషయ పరంపరలను ఆశ్రయించి స్వభావమే ‘చిత్తము’ అనబడుతోంది.
ఒక మరొక ఇంకొక
ధ్యాస
విషయం విషయం విషయం
విషయము విషయముల మధ్య గల విషయ రహిత విరామం
చిత్త స్వభావమును ఆశ్రయించి విషయపరంపరలను అనుభవిస్తున్న జీవసంపత్తు విషయము - విషయముల మధ్య గల ’నిర్విషయ విరామము’ను గమనించటమే లేదు.
ఒక విషయము - - మరొక విషయముల మధ్య ఈ జీవ సంవిత్తు యొక్క ఏ చైతన్య స్ఫురణ నిర్విషయమై ఉన్నదో అదియే ‘పరమాత్మ’ యొక్క స్వరూపం.
ఇక ఈ జగత్తంటావా? మనోహరమైన అనంత చిదాకాశము తాను స్వయంగా ఏ చమత్కారమైతే గావించుచున్నదో… అట్టి చమత్కారము యొక్క వ్యక్తీకరణ రూపమే ఈ జగత్తు. కనుక జ్ఞానులకు ఈ జగత్తు భ్రమ రహితమై, ప్రకాశశీలమై (కాంతి వంటి), నిర్వాణ రూపమై, అక్షయపరబ్రహ్మముగానే భాసిస్తోంది. ఇక అజ్ఞానులకో?… ఇదంతా నిరంతరమైన ఈశ్వరనియతి గాను, అనేక వ్యవస్థ వ్యవహారములతో కూడుకొనియున్నదిగాను, అప్రతిహతమైనది గాను, అనేక భోగాదులతో కూడుకొని ఉన్నదిగాను గోచరిస్తుంది. ఇదంతా కూడా వాస్తవానికి పరమార్థమున వెలయుచున్నప్పటికీ, అజ్ఞానులకు మాత్రం అసద్రూపంగానే అనుభవమౌతోంది. కాబట్టి జ్ఞానము సంపాదించి అప్పుడు ఈ జగత్తు వైపుగా దృష్టి సారించమని సర్వ జీవులకు నా మనవి.