CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:176

VI. పాషాణోపాఖ్యాన తాత్పర్యం

  1. చైతన్యమునకు వేఱుగా జీవుడు - జగత్తులు లేవు శ్రీవసిష్ఠ మహర్షి : శ్రీ రామచంద్రమూర్తికీ, సభికులందరికీ ఈ 18వ రోజు సంవాదమునకు సుస్వాగతం పలుకుచున్నాను. నిన్నటి రోజున మనం ‘పాషాణోపాఖ్యానం’ పేరుతో నా స్వానుభవమైన ఒకానొక విశేషాన్ని చెప్పుకున్నాం. అట్టి పాషాణోఖ్యానము యొక్క తాత్పర్యం చెప్పుకొని ఆ పై

ముందుకు సాగుదాం.

ఈ పాషాణోపాఖ్యానం ద్వారా “చిన్మాత్రపూర్ణ దృష్టిచే జగత్తులు అనబడేవన్నీ (సృష్టులు అని చెప్పబడేవన్నీ) చిదాకాశమున చిదాకాశరూపంగానే నెలకొని ఉన్నాయి” అని నిరూపించుకోవటమే మన ఉద్దేశం.

న చ స్థితం కించనాపి క్వచనాపి కదాచన ।

స్థితం బ్రహ్మఘనే బ్రహ్మ యథాస్థితమ్ “అఖండితమ్” ||

ఈ జగత్తు అనబడేది కొంచమైనా ఎక్కడా కూడా, ఎప్పుడూ కూడా ఉండనేలేదు. చిదనమైనట్టి బ్రహ్మమే బ్రహ్మమునందు అఖండరూపమున యాథారీతిగా స్థితి కలిగి ఉన్నది. ఒకనికి స్వప్నంలో కనిపించే నగరాలు ‘నిజచిద్రూపం’ కంటే వేరు కాదు కదా ! అవన్నీ నిజచిద్రూపములే కదా ! అట్లాగే ఈ జగత్తు అనబడేది కూడా బ్రహ్మచిన్మాత్రమేనని గ్రహించు. బ్రహ్మదేవుని చిద్రూపముతో ఈ స్థూల - సూక్ష్మ రూపమగు ‘జగత్తు’ అనే దృశ్యము యొక్క వ్యవస్థితి ఏర్పడినప్పటికీ కూడా - జన్మరహితమగు చిదాకాశము తన యొక్క చిత్స్వరూపమును త్యజించకయే ఉంటోంది. పరమార్థమున బ్రహ్మదేవుడుగాని, జగత్తు గాని స్వప్ననగరాలు గాని లేవు. చైతన్య మహాదృష్టిచే ’చిన్మాత్రము’ ఒక్కటే కలదు. స్వప్నంలో స్ఫురించే నగరం స్వప్నానంతరం స్వపద్రష్టలోనే (స్వాత్మయందే) లయం అగుచున్నది కదా ! అట్లాగే … సృష్ట్యాది నుండి ప్రళయ పర్యంతము అనుభవించబడుతున్న సమస్త జగత్తు ద్రష్టయందే లయించుచున్నది. కనుక అదంతా కూడా ద్రష్ట వలెనే బ్రహ్మరూపమే అయి ఉన్నది.

బంగారమునకు - బంగారపు ముద్దకు తేడా ఎక్కడిది? అట్లాగే చైతన్యమునకు - స్వప్న పురమునకు, చైతన్యమునకు - సృష్టికి కూడా ఒకింత కూడా భేదం సంభవించజాలదు. సువర్ణపు ముద్దయందు సువర్ణమే ఉన్నది గాని ‘ముద్దత్వము’ (Solidity) అనేది ఎక్కడున్నది? ఆ విధంగా కేవలము చైతన్యమే ఉన్నది. సృష్టి లేదు. స్వప్నపురంలో స్వప్నచైతన్యమే ఉన్నది గాని స్వప్న పర్వతం

Page:177

- స్వప్ననగరం ఇవన్నీ లేవు. నిర్వికారమగు చైతన్యమే స్వప్నకల్పనలో నగరంలా భాసిస్తోంది. నిర్వికారమగు బ్రహ్మమే ఇక్కడ ’సృష్టి’వలె భాసిస్తోంది. అంతకు వేరుగా ఏదీ లేదు. ఈ సృష్టి అంతా కూడా “నిర్మలము - సర్వ వ్యాపకము-నిర్లేపము-అజము - అవ్యయము-అనంతము” అగు చిన్మాత్రము మాత్రమే ! వేలకొలది మహాకల్పములందు కూడా ఆ చిన్మాత్రము ఉదయించదు, అస్తమించదు. అది సర్వదా ఏకరసమయ్యే ఉంటుంది.

ఓ రామచంద్రా ! ఈ జీవుడు నీవు-నేను-ముల్లోకములు అంతా కూడా అజము-అమరము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నాము. చిదాకాశమే లేకపోతే ఈ శరీరము కర్తృత్వరాహిత్యముచే నిర్జీవమౌతుంది. అట్టి చిదాకాశము దేనిచేతా ఛేదించబడదు, దహించబడదు. అది ఎన్నడూ శమించునదీ కాదు. కాబట్టి ఇక్కడ ఎదీ జనించటం లేదు, మరణించటం లేదు. చైతన్యము యొక్క స్ఫురణయే జగద్రూపంగా అనుభూతమౌతోంది. ఒకవేళ చిన్మాత్ర స్వరూపమే “మరణము” అనే రహితత్వము పొందవలసి వస్తే… ఆ చైతన్యము స్వరూపముగా గల పుత్రుడు కూడా (ఆత్మావై పుత్రనామాసి ఆత్మయే పుత్రుని రూపంగా అగుచున్నది… అను సిద్ధాంతము ననుసరించి) తండ్రితో బాటే నశించాలి. “ఒకే ఆత్మ సర్వజీవులలోనూ ఉన్నది" అను సిద్ధాంతమును అనుసరించి ఒక జీవుడు మరణిస్తే తదితర జీవులంతా మరణించాలి. అప్పుడీ జగత్తు సర్వదా ప్రాణికోటి శూన్యమైపోయేది. కాబట్టి ఈ ‘జీవుడు’ అనబడేవాడు శరీరము త్యజించినంత మాత్రంచేత మరణించటం లేదు. (లేక) లేకపోవటం లేదు” అని చెప్పటానికి ఈ విధంగా వివరించాను.

కాబట్టి రామచంద్రా! నేటి వరకు ఎవరి చిన్మాత్రస్వరూపము మరణించియుండలేదు. ఈ జగత్తు ఎప్పుడూ ప్రాణిశూన్యమగుటలేదు. చిన్మాత్రుడగు జీవుడు సదా నాశరహితుడు.

ఏకం చిన్మాత్రమేవాహం,న శరీరాదయో మమ । ఇతి సత్య అనుసంధానే, క్వ జన్మ - మరణాదయః ||

“అద్వితీయము అగు చిన్మాత్రమే నేను. నాకు ఈ శరీరాదులు లేవు" … అని ఇట్లు విచారణచే

గ్రహించినవానికి ఇక జనన- మరణాలు ఎచట?

అహం ‘చిన్మాత్రమమలమ్’ ఇత్యాత్మానుభవం స్వయం |

అపహన్తి ఆత్మహంతారో, నిమజ్జన్తి, ఆపదార్ణవే ॥

"నిర్మలము - ఏకము అయినట్టి చిన్మాత్రమే నేను” అనునట్టి ఆత్మానుభవమును ఎవరు స్వయముగా కుతర్కములచే ఖండిస్తారో… వారు ఆత్మద్రోహము చేసుకొన్నవారే అగుచున్నారని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వారు ‘ఆపదలు’ అనే సముద్రంలో మునుగుచున్నట్లు మా విజ్ఞాన దృష్టికి కనబడుతోంది.

“నేను ఆకాశముకంటే స్వచ్ఛము నిత్యము, అనంతము, నిర్వికారము అగు చైతన్యమును. నాకు వాస్తవానికి జీవితము లేదు, మరణము లేదు. చిదాకాశరూపమగు చైతన్యమే నేనై ఉండగా ఇక నాకు శరీరాదులు ఎక్కడున్నాయి?"…అని తత్త్వజ్ఞులు అనుభూతపరచుకొని ఉంటున్నారు.

Page:178

అట్టి ఆత్మజ్ఞుల అనుభవాన్ని ఎవరు తిరస్కరిస్తారో అట్టి ఆత్మ హంతకులకు ధిక్కారమగుగాక! “నేను సర్వదా నిర్మలమగు చిదాకాశాన్ని“ అను ఇట్టి ప్రత్యాక్షానుభవం సముపార్జించే ప్రయత్నంలో ఉండడో, అట్టి వారి జీవితం సద్వినియోగం కానట్లేనని, వారు జీవించియు మరణించిన వారితో సమానమే అగుదురని తత్త్వజ్ఞుల అభిప్రాయం. ”నేను చిన్మాత్ర స్వరూపుడను. నాకు దేహేంద్రియాలు కూడా లేవు”… అను బోధచే ఆత్మ స్వరూపమును అనుభూతమొనర్చుకొనిన వానికి ‘అవిద్య’ ఇత్యాది మాలిన్యము నశించిపోతుంది. కనుక అట్టి నిర్మల స్వరూపుని జనన-మరణాలు ఏమాత్రం స్పృశించలేవు, ఛేదించలేవు. గొప్ప గండశిలను బాణములు ఛేదించలేవు కదా ! అట్లాగే చిన్మాత్రము - శుద్ధము అగు ఆత్మను అవలంబించినవాని సమీపమును మానసిక వ్యధలు సమీపించజాలవు. తన యొక్క ‘చిత్స్వరూపము’ను మఱచి ఎవడు శరీరాదులందు ఆసక్తి కలిగి ఉంటాడో… అట్టివాడు వాస్తవానికి మట్టిలో వెతకి-వెతకి చివరికి సువర్ణ ఖండమును అక్కడే వదలి గులకరాయిని ఇంటికి చేర్చుకున్నవాడు అగుచున్నాడు. ‘నేను దేహాన్ని’ అనే రూపం గల భావనచే బుద్ధి-తేజం సన్నగిల్లు తాయి. మరి “నేను చైతన్యమును”అనే భావన చేతనో… బుద్ధి-తేజములు వర్ధిల్లుతాయి సుమా. “నేను శుద్ధ చిదాకాశమగు ఆత్మను. అట్టి నా స్వస్వరూపానికి జనన-మరణాలు లేవు” అని తలచి అట్టి స్థితిలో ఉన్న వానికి లోభ-మోహ-మదములు ఎట్లా సమీపించగలవు ? సమీపించలేవు.

చిదాకాశాన్ని వదలి “ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే ఆత్మ” అనే బుద్ధితో ఎవడు జగత్తును గాంచుచుండునో, అతని కొఱకే ఈ జగత్తులో క్షోభ-లోభ-మోహములు రచించబడినాయి. “నేను దేని చేతనూ ఛేదించబడేవానిని దహించబడేవాడిని కాను. వజ్రము వలె దృఢమైనట్టి చైతన్యమే నేను. అంతేగాని ఈ దేహమాత్రుడను ఎన్నటికీ కాదు” అను ఇట్టి నిశ్చయము ఎవఱికి ఉంటుందో …ఆతనికి మృత్యువు కూడా తృణప్రాయమే (గడ్డిపరక వంటిది) అవుతుంది. ఆహా(! శాస్త్రజ్ఞానులగు పండితులలోకూడా ఎంతటి వ్యామోహం కనిపిస్తోంది! జడమైన ఈ దేహశకలము నశిస్తూ ఉంటే “అయ్యబాబోయ్ ! మేము నశించుచున్నాం” అని భీతిల్లుచున్నారే! మాయ యొక్క ప్రభావము ఎంతటిది? ”నేను చిదాకాశమునే” అను సత్యభావన బాగుగా స్థిరపడిందా, … ఇక వజ్రపాతము వంటి ప్రళయాగ్ని జ్వాలలు కూడా పుష్పవృష్టివలె ఉంటాయి. “జనన మరణ రహితమైన చిన్మాత్రమును నేను కాదు. కాబట్టి నేను నశించబోవుచున్నాను" అని ఇట్లు తలచి (వాస్తవానికి ఆత్మ నశించనప్పటికీ) ఎవడు ఏడ్చుచున్నాడో… అతని వచనములు - క్రియలు క్రియలు - భావములు అన్నీ కూడా వివేకుల దృష్టియందు పరిహాసాస్పదము - హాస్యాయుక్తము అగుచున్నాయి. “నిత్యమై, అపరోక్షమైనట్టి చిన్మాత్రమే నేను. ఈ దేహమనోబుద్ధ్యాదులు నేను కాదు” అని ఇట్లు అంతః కరణంలో ఎవడైతే సునిశ్చయం చేసుకొని ఉంటాడో అతడెన్నడూ మోహమును చెందడు.

ఓ సర్వజనులారా!… 1. నేను చిదాకాశమాత్రుడను, 2. నాకు ఎన్నటికీ నాశనము లేదు, 3.ఈ జగత్తంతా చైతన్యము చేతనే పూర్ణమైయున్నది, 4.ఈ దేహ-మనో-బుద్ధి-అహంకారములచే నేను పరిమితుడను గాను… అను ఈ నాలుగు విషయములలో మీకున్న సందేహమేమిటో నాకు చెప్పండి, వింటాను.

Page:179

“మేము చైతన్యం కంటే వేరైనవారం” అని అనదలచుకున్నారా! ఓ పసిబిడ్డలవంటి ప్రియ సోదరులారా! "మేము వేరైనవారం” అను అనుభవమునకు హేతువు ఏదో అద్దానిని గమనించండి. ఆ అనుభవమునకు కూడా హేతువగు మీ ఆత్మనే మీరు ఎందుకు ‘లేదు’ అనుచున్నారు ? మీరు చైతన్యమే కాబట్టి మీకెవరికీ మరణము లేదు.

“మేము చైతన్య రూపులమే అయినప్పటికీ మాకు మరణం ఉన్నది”… అని వాదిస్తారా? చైతన్యమే మరణిస్తే ఒకడు మరణించగానే… చైతన్యమే స్వరూపముగా గల తదితర జనులందరు ఆ క్షణంలోనే మరణించాలి కదా! “అందరిలోని చైతన్యము ఒక్కటే! అయినా మాకు మరణం తప్పదు” అంటారా? చైతన్యము ఒక్కటే అయితే ఒకడు మరణిస్తే కూడా జగత్తు కొనసాగుతోంది కాబట్టి స్వస్వరూప చైతన్యమునకు జనన - మరణ సంబంధం లేనట్లే కదా !

తస్మాత్ న మ్రియతే కించిత్, న చ జీవతి కించన |

’జీవామీ’ ఇతి ‘మృతోస్మీ’ ఇతి చిచ్చేతతి న నశ్యతి ||

కాబట్టి ఏదీ మరణించటం లేదు. ఏదీ జీవించటం లేదు కూడా! “నేను జీవిస్తున్నాను. నేను మరణిస్తున్నాను” అనే భ్రాంతి చైతన్యం అనుభవిస్తోంది. అంతేగాని చైతన్యం ఏ సమయమందును జీవించదు, మరణించదు.

“ఎవడు దేనిని ఎట్లు ఎఱుగుచున్నాడో ఆతడు అది అట్లే పొందుచున్నాడు” -అనే విషయం ఆబాలగోపాలానికి విదితమే కదా! అట్లాగే చైతన్యము కూడా దేనిని ఎట్లు ఎఱుగుచున్నదో… అద్దానిని అట్లే పొందుచున్నది. వాస్తవానికి ఈ జీవుని వాస్తవ స్వరూపమగు చైతన్యము ఎచ్చటా ఎన్నడూ నశింపకయే ఉన్నది.

పరిపశ్యతి సంసారం, పరిపశ్యతి ముక్తతామ్ |

సుఖదుఃఖాని జానాతి స్వరూపాత్ తత్ న భిద్యతే ॥

ఆ చైతన్యము ఒకప్పుడు సంసారమును-మరొక్కప్పుడు ముక్తిని గాంచుచున్నది. అట్లే సుఖదుఃఖము లను ఎఱుగుచున్నది. ఆ రెండింటినీ ఏది గాంచుచున్నదో-ఎఱుగుచున్నదో, అదియే శుద్ధ చైతన్యము కదా! కనుక ఆయా భిన్న దశలందు అది తన స్వరూపము నుండి వేఱుకాకయే ఉన్నది. చైతన్యము నిజస్వరూపమును ఎఱుగకపోవుటచే (ఏమఱచుటచే) ‘బంధము’ అనే సంజ్ఞను, నిజస్వరూపమును ఎఱుగుటచే ‘మోక్షము’ అను సంజ్ఞను స్వయముగా ధరించుచున్నది. నటుడు నటనలో జీవిస్తూనే పాత్రను వేరైన వ్యక్తిగాను, వ్యక్తిగతమునకు వేరైన పాత్రలోను ఉండి ఉంటున్నాడు కదా! సర్వదా అప్రమేయమగు చైతన్యము ఒకప్పుడు ‘బద్ధజీవుడు’ అను పాత్రలో లీనమై నాటకమునకు వేరైన తన చిన్మయ స్వరూపమును ఏమఱచుచున్నది.

సమస్తము నిర్మలమైన చిదాకాశమే అయి ఉన్నది. కాబట్టి ఎచట కూడా ఏదీ ఉత్పన్నమవటం లేదు, నశించటమూ లేదు.

Page:180

నతత్ అస్తి న యత్ సత్యం, న తత్ అస్తి న యన్మృషా | యత్ యథా యేన నిర్ణీతం తత్ తథా తం ప్రతి స్థితమ్ ॥

ఈ ప్రపంచంలో సర్వ పదార్థములలో కూడా "సత్యము కానిది” గాని, “మిథ్యకానిది” గానీ ఏదీ లేదు. ఏట్లా అంటావా?… ఏది ఎట్లు ఎవడు నిర్ణయిస్తే అది అట్లే సత్యముగానో, మిథ్యాగానో తెలియవస్తోంది. ఇంతకుమించి ఈ జగత్తులో సత్యమైనదిగాని, మిథ్య అయినది గాని ఏదీ లేదు.

ఓ రామచంద్రా! ఈ చైతన్యాత్మ ప్రపంచమున ఏఏ పదార్దమును ఏఏ రీతిగా ఎఱుగు చున్నదో, ఆయా రీతిగా అద్దానిని అనుభవించుచున్నది. అట్లు చైతన్యాత్మచే అనుభవించబడుచున్నదే ‘జగత్తు’ అనే పేరుతో జనులలో వాడుకలో ఉంటోంది.

ఇందుకు దృష్టాంతం అంటావా?… ఒకే పదార్థం (లేక) ఒకే సంఘటన దేశకాల భేదాన్నిబట్టి ఒకచోట ఇష్టమైనదిగాను, మరొక చోట కష్టమైనదిగాను ఉండటం లేదా? ఒకనికే బాల్య మిత్రుడు బాల్యంలో ప్రియంగాను, ఆ తరువాత ఎప్పుడో తారసపడినప్పుడు ’అనవసరమైన అభ్యాగతి’ గాను అనిపించటం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం కదా! తనకు ఇష్టమని వివాహం చేసుకున్న స్త్రీ మరొక దేశకాలాలలో అయిష్టమై కనిపించటం కొద్దిమంది విషయంలో జరుగుట లేదా?

కాబట్టి “సమస్త పదార్థములు చైతన్యము యొక్క అనుభవానుసారమే స్థితి కలిగి ఉన్నది” అనునది ప్రసిద్ధమైన విషయమే!

శ్రీరాముడు మహర్షీ! కొందరేమో “ఈ జగత్తు సంసారసాగరము. అనేక బాధలతోను, కష్టములతోను కూడుకొని ఉన్నది. ఇదంతా దుఃఖమయం. ఇంతకు మించి ఇందులో సారమేమీ లేదు” అనే అభిప్రాయం కలిగి ఉంటున్నారు. మరికొందరేమో “ఈ జగత్తు బ్రహ్మమయమే! కనులు తెరచి చూస్తే ఇదంతా బ్రహ్మానందమయం!” అని సిద్ధాంతీకరిస్తున్నారు.

ఇంకొందరు “ఈ జగత్తు ఈశ్వర కల్పితం" అంటున్నారు. మరికొందరు “సృష్టి ఈ కనబడే రూపం కాదు” అని సిద్ధాంతీకరిస్తున్నారు… ఇన్నిన్ని సిద్ధాంతాలు ఎందుకున్నాయి? అసలు ఇక్కడి వాస్తవతత్త్వ మేమిటి? గురువులు తమ శిష్యులకు వేఱువేరైన, పరస్పర వ్యతిరిక్తమైన సిద్ధాంతఉపసిద్ధాంతాలను ఎందుకు బోధించటం జరుగుతోంది. వీటిలో సత్యాసత్యాలు ఏమిటి?… ఈ వివరాలు వివరించవలసినదిగా ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! చాలా పెద్ద ప్రశ్నయే! ఈ చెప్పబోవు సమాధానం విను

  1. బ్రహ్మ సత్యమ్ జగత్ మిథ్యావాదులు (“జగత్తు బ్రహ్మ రూపమే”) - ఈ జగత్తు పరమాత్మ యొక్క స్వప్నభూతమే కదా! పైగా సమస్తము బ్రహ్మాకాశరూపమే అయి ఉన్నదని మనం ఇప్పటి వరకు వర్ణించుకొంటున్నాం. కనుక “ఈ జగత్తంతా మాకు బ్రహ్మరూపంగానే అనుభూతమౌతోంది”… అని ప్రకటించటం ఉచితము, సత్యమే కదా!

  2. జగత్ సత్యమ్ - బ్రహ్మ మిథ్యావాదులు (ఈ జగత్తే మాకు సత్యమని అనిపిస్తోంది) - జగత్తు యొక్క రూపం ఎదురుగా కళ్ళకు కనిపిస్తోంది. ఇద్దానికి అధిష్ఠానము అని చెప్పబడే మహాచైతన్యము

Page:181

కళ్ళకు కనిపించటం లేదు. ‘మదశక్తి’ (Lust) కళ్ళకు కనిపించదుగాని దాని చర్యలు కారణరూపంగా కళ్ళకు కనిపిస్తాయి. అట్లాగే చిదాత్మ అదృశ్యరూపమై ఉంటోంది. అయ్యది దృశ్యభ్రమ హేతువగు కార్య రూపముచే స్వసత్తను ఈ జగత్తుగా ప్రదర్శించుకొనుచున్నది. కనుక ‘ఈ జగత్తు మాకు సత్యమనియే అనిపిస్తోంది’… అని ప్రకటించేవారికి అట్లు కనిపించటం సత్యత్వమునకు తగియే ఉన్నది కదా! (ఎందుకంటే అట్లా అనిపించటంలో ఆశ్చర్యం లేదు కదా !)

  1. జగతూన్యవాదులు (ఈ జగత్తంతా శూన్యమని మాకు అనిపిస్తోంది)- ఈ జీవుడు ‘బంధము’ను అనుభవిస్తున్న సమయంలో దృశ్యమే బంధముగా అగుచున్నది. ఆ సమయంలో “దృశ్యము ఉపశమించినట్టి మోక్షస్థితి” ఎట్టిదో తెలియవచ్చుట లేదు.

‘మోక్షము’ యొక్క స్థితి అనుభవమైతే గాని మహాచైతన్యము అనుభూతికి లభించదు. అట్టి ముక్తి స్థితిలో ప్రమాత (జీవుడు) అభావస్వరూపుడు అగుచున్నాడు. అనగా ఆతడు లేనివాడే అగుచున్నాడు. కనుక “పరమార్థ వస్తువునందు జగత్తు శూన్యస్వరూపమై ఉన్నది”… అనే సంజ్ఞ సత్యమనియే అనిపించుకుంటోంది.

  1. పురుష-ప్రకృతి వాదులు (అవ్యక్తరూప ప్రకృతిలోంచి ఈ వ్యక్తజగత్తు ఉత్పన్నమౌతోంది) - ఇక ఇంకొందరు (సాంఖ్యావాదులు) ఇట్లా అంటున్నారు. చిన్మాత్రుడగు పురుషుడే అన్నింటికీ కర్త. ఆయన యొక్క సత్త వలన ఆయన నుండి ’అవ్యక్తము’ ఉత్పన్నమౌతుంది. అదియే ప్రకృతి. ఆ అవ్యక్తము (లేక) ఆ ప్రకృతి త్రిగుణముల యొక్క సామ్యావస్థారూపము అయి ఉన్నది.

అట్టి అవ్యక్తములోనుంచి త్రిగుణాత్మకమగు ఈ జగత్తు ఉత్పన్నమౌతోంది. బ్రహ్మమే తనకు అద్వితీయమగు జగత్తుగా ప్రదర్శితమౌతోంది, కనబడుతోంది - అని నేనూ సిద్ధాంతీకరించాను కదా! కనుక ‘పురుషుడు’ అవ్యక్తము! ఆతని అభివ్యక్తీకరణమే ప్రకృతి “జగత్తు” అను వారి సిద్ధాంతమూ యుక్తియుక్తమే కదా!

  1. బ్రహ్మ వివర్తవాదులు / వేదాంతవాదులు (జగత్తులోని సర్వ పదార్థముల స్వరూపం బ్రహ్మ వివర్తమే) - ఈ జగత్తులో అనేక స్వభావాలు, ఆకారాలు గల పదార్థములు ఉండవచ్చుగాక! కాని “కఃత్వమ్– కోహమ్,నాయితి” ఇత్యాది మార్గంలో విచారణ చేస్తూ పోతే “సమస్త పదార్థముల స్వరూపము బ్రహ్మము యొక్క వివర్తమే, మట్టియే అనేక బొమ్మలుగా అగుచున్నట్లుగా!” అని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. “ఈ కనబడే జగత్తంతా బ్రహ్మము యొక్క వివర్తమే" అను ఆ వేదాంతవాదుల సిద్ధాంతమూ యుక్తియుక్తమే కదా!

  2. పరమాణువాదులు (ఈ జగత్తు పరమాణువుల కలయిక మాత్రమే. అవి విడిపోతే జగత్తు లేదు) - ఈ మతమును అనుసరించి (ఉదాహరణ : కణాదులు, గౌతములు, సౌత్రాంతికులు, వైభాషికులు, అర్హతులు– ఆయా మత గురువుల ప్రతిపాదనను అనుసరించి) … “ఈ ’జగత్తు’గా కనిపించేదంతా పరమాణు సమూహము మాత్రమే! వారి కల్పనయు వారి అనుభవమును బట్టి సత్యమే అయి

ఉన్నది. ఎందుకంటే…

Page:182

  1. ప్రతి వస్తువు పరమాణువుల కలయికయే అయి ఉన్నది. 2. "ఏది ఏ విధంగా ఎవరిచే ఎఱుగుబడుచున్నదో అది ఆ విధంగానే వారికి అనుభూతమగుచున్నది”… అని మనం ముందరే సిద్ధాంతీకరించుకున్నాం కదా!

భావనావాదులు, మనోకల్పనా రూప జగత్వాదులు, దృష్టి-సృష్టివాదులు పై సిద్ధాంతం బలపరుస్తున్నారు. “యత్ భావం తత్ భవతి. ఈ జగత్తు ఎట్లు భావన చేస్తే అట్లే అనుభూత మౌతోంది" అనునది కూడా యుక్తియుక్తమే కదా!

  1. దృష్టి - సృష్టి వాదులు - “ఇహలోకంలోగాని, పరలోకంలోగాని ఏది ఏ విధంగా చూడబడు చున్నదో… అది ఆ విధంగానే ఉంటోంది. ఏది ఎట్లు చూడబడదో …అది అట్లు ఉండదు. కనుక ఈ జగత్తు సత్యము కాదు. ఇదంతా అనిర్వచనీయం. అనగా "ఈ జగత్తులో ఇది ఇట్టిది మాత్రమే” అని దేనిని ఎవరూ సిద్ధాంతీకరించలేం. ఈ జగత్తుగా కనిపించేదంతా మనోకల్పనారూపము మాత్రమే. ఇట్టి దృష్టి-సృష్టివాదుల మాట కూడా కాదనటానికి వీలులేదు.

  2. అనాత్మవాదులు (బాహ్యమున గల ఈ జగత్తు మాత్రమే ఉన్నది. అంతరంగమున ఆత్మ అనబడేదేది లేదు!) - ఇక, వీరు అంటున్నారు కదా “బాహ్యమున కంటికి కనబడే ఈ నేల-నీరు-అగ్ని-

వాయువు అనబడే భూత చతుష్టయం మాత్రమే ఉన్నది. దీనికి అతీతంగా అంతరంగమున ‘ఆత్మ’ అనేది లేదు” అను (చార్వాకుల) మతం కూడా వారి దృష్టిని బట్టి సత్యమే అయి ఉన్నది. ఎందుకంటే ఈ ఇంద్రియములకు పరమైనట్టి (వేరైనట్టి) ఆత్మ అనబడేది ఎదురుగా కనిపించడం లేదు కదా!

  1. క్షణిక వాదులు (అనుక్షణం ప్రతిది మారుతూనేవున్నది. కనుక ఈ జగత్తు క్షణికం) - ఇక వీరి అభిప్రాయం ప్రకారం… "ప్రతి క్షణం సర్వపదార్థములు ఒక స్థితి నుండి మరొక స్థితికి ప్రవాహ తరంగంలాగా పరివర్తనం చెందుచూనే ఉన్నాయి. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరివర్తనశీలమే! కనుక ఈ జగత్తు క్షణభంగురం.” ఇట్లా జగత్తు గురించి నిర్వచించే క్షణికవాదుల మతము కూడా వారి అనుభవమునుబట్టి సత్యమే అయివున్నది. ఈ దృశ్య ప్రపంచంలో మార్పు చెందనిదేమున్నది?

ఆద్యమగు బ్రహ్మపదము సర్వశక్తియుక్తమై వెలయున్నది కదా! అద్దాని భావనా ప్రయోజనం చేత వారికి అది అట్లేనని అనిపించడంలో ఆశ్చర్యపడవలసిన పనేమున్నది?

  1. కలవింక ఘట న్యాయవాదులు (ఈ జీవుడు శరీరము అనే పంజరంలో చిక్కుకున్న పక్షివంటివాడు) ‘కలవింక-ఘటన్యాయం’“కలవింక పక్షి (ఊరపిచ్చుక) కుండలో చిక్కుకుంది. ఆ కుండ యొక్క ముఖమును తొణిచామా… ఆ ఊరపిచ్చుక తుఱ్ఱున గాలిలోకి ఎగిరిపోతుంది. అట్లాగే ’పరిచ్ఛిన్న పరిమాణంగా’ ఈ జీవుడు కర్మబంధం చేత దేహాలలో ఇరుక్కొని ఉన్నాడు. కర్మ క్షయం కాగానే పరలోకానికి ఎగిఱిపోతాడు. (ఇది అర్హతలు అనే మతస్థుల జగత్ నిర్వచనం). ఈ ఈ

జీవన-మరణములను చూచి వారు అట్లు సిద్ధాంతీకరించడం వారికి సత్యమనియే అనిపిస్తోంది.

  1. మరణానంతర దేహాత్మవాదులు (జీవుడు మరణించినా దేహము వెంటే ఉంటాడు) - మరొక మతగురువుల (మ్లేచ్ఛావాదుల) సిద్ధాంతం ఎట్లా ఉన్నదో చూడు! ఈ దైహాకారుడగు జీవుడు

Page:183

ఈశ్వరునిచే ఉత్పన్నము కావించబడినాడు. ఈశ్వర నిశ్చయాను సారం ఈ దేహం ఒకప్పుడు శిథిలమైపోతుంది. మరణం సంభవిస్తోంది. మరణానంతరం ఆ దేహసంబంధీకుడగు జీవుడు దేహము పాతిపెట్టబడిన చోటే ఉంటాడు. ఆ తరువాత కాలానంతరం ఈశ్వరునిచే విచారించబడినవాడై ఆ ఈశ్వరుని ఇచ్ఛను అనుసరించి శాశ్వతంగా స్వర్గమునందో, నరకమునందో ఉంచబడుతాడు. వారి అనుభవాన్ని అనుసరించి అదీ దూషితం కాకయే ఉన్నది.

  1. స్వభావ వాదులు - - నిరీశ్వరవాదులు (ఈ జగత్తు స్వభావముచే ఉత్పన్నమై - నశిస్తోంది) - ఈ స్వభావవాదము ప్రతిపాదించే మతగురువుల అభిప్రాయం విను. ఈ జగత్తంతా కూడా స్వయంగా స్వభావముగానే ఉత్పన్నం అవుతోంది. స్వభావంగానే మటొక్కప్పుడు నశిస్తోంది. దీనికి కర్తగాని, ‘ఈశ్వరుడు’ అనబడేవాడు గాని ఎవడూ లేడు. ప్రతి జీవుడు స్వభావాలు అనుసరించే జనిస్తూ, జీవిస్తూ, అనుభవిస్తూ, మరణిస్తున్నాడు. వీరు ఇట్లు ’నిరీశ్వరవాదం’ ప్రతిపాదిస్తున్నారు. వారివారి దృష్టి కోణం నుండి ఇది వారికి సత్యమే అయివున్నది. ఎందుకంటావా?… ఎంత అన్వేషించినప్పటికీ వర్షము-వాయువు-నక్షత్రములు-సూర్యుడు-చంద్రుడు-భూమి ఇత్యాదులన్నింటి విషయంలో “దీనికి కర్త ఎవడు?” అను ప్రశ్నకు వారికి సమాధానం లభించడం లేదు కదా!

  2. ఈశ్వరవాదులు (ఏకేశ్వరుడే ఇదంతా ప్రసాదిస్తున్నాడు) - వీరి మతాచార్యులు సిద్ధాంతం ప్రకారం … సర్వత్రా కర్త ఒక్క ఈశ్వరుడే. ఆయనే ఇవన్నీ ప్రేమతో ప్రసాదిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞులమై ఉండడానికి ప్రతిజీవుడు యత్నించాలి. కృతఘ్నుడు కాకూడదు. ఈశ్వరార్పిత చిత్తంలో సర్వదా ఉపాసకులై ఉండాలి. వీరు తమయందు తమ ఉపాశ్యమగు ఈశ్వరుని పొందుచునే ఉన్నారు. కాబట్టి వీరికి పై నిర్వీశ్వర – వాదుల వలె “ఈశ్వరుడు లేడు”… అని అనిపించడం లేదు.

  3. ఇహ - - పరలోక వాదులు (ఇహంలో పుణ్యకార్యాల వలన పరంలో సుఖం లభిస్తుంది) - వీరి దృష్టిలో ఇహము-పరము రెండూ సత్యమే! కాబట్టి ఈ మతగురువులు తీర్థ స్నాన పుణ్యక్షేత్ర దర్శన-అగ్నిహోత్రాదులు మొదలైన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇహంలో శ్రమయే అయినా పరంలో సుఖలోకప్రాప్తి కలిగిస్తాయి. ఆ అనుయాయులు అట్టి తీర్థ-క్షేత్ర-అగ్నిహోత్రాదుల శ్రమ నుండి సుఖమును తృప్తిని పొందుచూనే ఉన్నారు. కాబట్టి అవి సత్యములు కావని ఎవరనగలను? సత్యమేనని ఒప్పుకోక తప్పదు.

  4. జగత్ శూన్యవాదులు (“ఈ జగత్తంతా శూన్యమే!”) - అని (బౌద్ధులు మొదలైన) కొందరు మతగురువులు బోధిస్తున్నారు. వారి వారి అనుయాయుల భావనకు అనుభవమునకు అది సత్యమే అగుచున్నది. వారి విచారణకు ‘శూన్యము’ తప్ప మరింకేమీ ఇక్కడ అగుపించటం లేదు.

చూచావా రామచంద్రా! ఈ విధంగా అనేక మతగురువులు అనేక సిద్ధాంతములను వారి వారి శిష్యులకు, అనుయాయులకు బోధించటం, ఆ అనుయాయులు అది ఆ రీతిగానే అనుభవంగా పొందడం అనంతకాలంగా జరుగుతూనే ఉన్నది. ఇంకా అనేకమంది మతగురువులు ముందు

Page:184

ముందు కూడా రానున్నారు. అందులో కొందరు మతగురువులు పరస్పర వ్యతిరిక్తమైన సిద్ధాంతములను ప్రతిపాదించడం జరిగింది. జరుగబోతోంది.

మఱికొందరు ఇప్పటివరకూ వచ్చిన సిద్ధాంతాలను ఖండిస్తూ చెబుతున్నారే గాని “ఇది సత్యము” అని తమకుగా ఏమీ ప్రతిపాదించడం లేదు. ఇంకొందరు మతగురువులు ఇదివరకు చెప్పినదే భాషాపరంగానూ, సాధనా ద్రవ్యపరం గానూ మరొక తీరుగా ప్రతిపాదిస్తూనే "ఇతః పూర్వం ప్రతిపాదించిన సిద్ధాంతం అనుసరణీయం కాదు. ఇదియే అనుసరించండి” …అని తమ శిష్యులకు, అనుయాయులకు బోధిస్తున్నారు.

కొన్ని కొన్ని చోట్ల గురువులు చెప్పిన సిద్ధాంతమునకు రెండు మూడు రకాలైన భాష్యములను శిష్యులు ప్రతిపాదిస్తూ ప్రతిక్షేపిస్తూ క్రమంగా ఆ శిష్యులు వేరు వేరు పేర్లు గల శాఖలుగా విడిపోతున్నారు. అట్లా విడిపోయి వారిలో వారు కలహించుకోవడం, హింసించుకోవడం కూడా కొన్నిచోట్ల జరుగుతూ వస్తోంది. ఒక్కొక్కసారి గుఱువు దైవస్వరూపుడని కొందరు,… “గుఱువు కేవలం సిద్ధాంతకర్త / ప్రవక్త" అని మరికొందరు ప్రతిపాదిస్తూ ఇట్టి స్వల్ప వాగ్వివాదములతో ఒకే మతాచార్యుల శిష్యపరంపరలో శాఖలు ఉపశాఖలుగా విడిపోవడం కూడా జరుగుతోంది.

ఇదంతా అతి దీర్ఘ కాలంగా జరుగుచున్న విశేషాలే! ముందు ముందు కూడా ఇట్లా జరుగుచూనే ఉంటుంది.

శ్రీరాముడు : స్వామీ! ఈ విధంగా పరస్పర వ్యతిరిక్త అనుకూలములైన వేఱు వేఱు సిద్దాంతములు, వారి అనుయాయులు సంఘర్షించుకోవడం ఇదంతా ఎందుకు జరుగుతోంది? "అవన్నీ సత్యములే అయి పరిఢవిల్లుతున్నాయి”… అని మీరు చెప్పడంలో ఉద్దేశమేమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ‘చింతామణి’ గురించి విన్నావు కదా! అది ఎదురుగా కలిగి ఉన్న వారు దేనిని చింతన చేస్తే అది అట్లే పొందుతారు. కల్ప వృక్షము క్రింద ఏది కోఱుకుంటే అది కల్పనా చమత్కారంగా లభిస్తుంది. అట్లాగే చిదాకాశమగు చైతన్యము కూడా జీవులు దేనిని అభిలషిస్తే ఆయా అభిలాషలను శ్రీఘ్రముగా వారియందు అట్లే సిద్ధింపజేయున్నది. అందుకే ’ఈ జగత్తు శూన్యం’ అను వారికి అంతా శూన్యంగా అగుపిస్తోంది. “ఇదంతా అశూన్యమగు భగవంతుని చేత నిండి ఉన్నది” అనుకున్న వారికి అది అట్లా అనుభవమౌతోంది. “ఈ జగత్తు శూన్యము కాదుఅశూన్యము కాదు. ఇది అనిర్వచనీయం”… అని తలచువారికి వారియొక్క భావనచే ఇదంతా అనిర్వచనీయంగా ఒప్పుచున్నది.

ఎందుకంటావా?… సర్వశక్తిమంతమగు బ్రహ్మము యొక్క మాయా శక్తి శూన్యము కాదు. అశూన్యము కాదు. ఈ రెండింటికీ విలక్షణమై, అనిర్వచనీయమై ఒప్పుచున్నది.

కాబట్టియే ఇక్కడ ఒకానొక చమత్కారం సిద్ధిస్తోంది. ఎవడు ఏ నిశ్చయమును కలిగి ఉంటాడో, ఆతడు కొంత పట్టుదలతో, మూర్ఖత్వంతో దాని నుండి తొలగని పక్షంలో అతడు ఆ నిశ్చయఫలమును తప్పక బడయగలడు.

Page:185

ఆత్మజ్ఞానం పొందనంతవరకే ఆయా సిద్ధాంతములన్నీ సత్యములుగానే అనుభవమౌతాయి. ఆత్మజ్ఞానం పొందిన తరువాత ఇక ఆ జీవుడు ’ఆత్మయే సత్యము’ అను అన్ని సిద్ధాంతముల ఆవల తీరం చేరి ‘కేవలస్వానుభవి’ అవుతాడు. అనేక మతముల సిద్ధాంతముల సారమేమిటో, పరిమితి ఏమిటో ఆతడు కరతలామలకంగా గ్రహిస్తాడు.

అందుచేత రామచంద్రా! బుద్ధిమంతుడైనవాడు వాదోపవాదములలోకి, ఖండన-రక్షణ వ్యవహారములలోకి దిగడు. ఆతడు అనేక మతముల ‘కారణము’ను పండితులతో బాగుగా విచారించి క్రమంగా శ్రేష్ఠమగు ‘ఆత్మవస్తువు’ నందే సుదృఢమైన నిశ్చయమును పెంపొందించు కుంటాడు. ఇక దేనికీ బద్దుడు పరిమితుడు కాడు.

శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానసారమగు దృథాత్మనిశ్చయము సాధకులకు కలిగేది ఎట్లా? శ్రీవసిష్ఠమహర్షి : రామచంద్రా! శాస్త్రాధ్యయనమునందు, ఉత్తమార్థమును సేకరించి స్వీకరించ టంలోను, అల్ప విశేషములను ఉపేక్షించటంలోను, బహుకుశలురైనట్టి వారికి సర్వాత్మకమగు స్వస్వరూపాత్మానుభవం సుసాధ్యమే! అట్టి మహనీయులు ఉన్నారు. ఉత్తమ సాధకుడైనవాడు వారికొరకై వెతికి అట్టి మహానుభావులను ఆశ్రయించాలి. తమ సంశయములను అణకువతో తెలియబరిచి సంశయవిభేదము గావించుకోవాలి.

శ్రీరాముడు : ఆశ్రయమునకు అర్హుడగు గురువులు ఎట్టి సద్గుణములు కలిగి ఉంటారు? శ్రీవసిష్ఠమహర్షి : మహాత్ములగు జ్ఞాన గురువులు ఈ 5 లక్షణములు కలిగి ఉంటారని చెప్పబడుతోంది.

  1. సచ్ఛాస్త్రములను అనుసరించి వ్యవహరిస్తూ ఉంటారు.

  2. పరస్పరము విచారణ సలుపుతూ ఉంటారు.

  3. జనులకు ఆహ్లాదము గొలుపుచూ సచ్ఛాస్త్రముల పట్ల ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటారు. 4.“నీవు సాక్షాత్ ఆత్మవే (తత్వమసి” అను పరమసత్యవాక్యము వైపుగా బుద్దిని కుశలము చేస్తూ ఉంటారు.

  4. నిషిద్ధములైన ఆచారములు లేనివారై ఉంటారు.

ఓ రామచంద్రా! నీరు పల్లమువైపుకే ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది చూచావా? అట్లే జీవులంతా తమకు అభిలషితములయిన వాటివైపుకే బలవంతంగా పరుగులు తీస్తున్నారు. అయితే ‘జీవితము’ అనేది ఒక మహత్తరమైన అవకాశమని జనులు గ్రహించెదరు గాక! “నేను స్వీకరించాలినిర్వర్తించాలి” అనుకునే వాటిలో “నన్ను పురుషార్థమునకు జేర్చగలిగేదేది?” అని విచారించి, అందుకు మార్గం చూపే సామర్థ్యము గల సచ్ఛాస్త్ర-సద్గురువులను వెతికి వెతికి పట్టుకొని సమాశ్రయించాలి. ఓ జనులారా! తృణము యొక్క చివరి భాగంలో సంలగ్నమైన జలబిందువు ఏ క్షణంలోనైనా నేల కూలటానికి సిద్ధమై ఉన్నది కదా! ఈ జీవితము అట్టిది. ఈ సంసారసాగరమున ”అది పొందాలి! ఇది సంపాదించుకోవాలి! ఏదో కావాలి!" మొదలైన మనోరథములతోను,

Page:186

“వారెంతటివారు? వీరి సంగతి చూద్దాం!" ఇత్యాది పిచ్చి ప్రేలాపములతోను రోజులు గబగబా గడిచిపోతున్నాయి. సమయమంతా అజ్ఞాన వ్యవహారంతో వృథా అగుచున్నది. మీనమేషాలు లెక్కకట్టుచూ కూర్చుంటే ఏమాత్రం లాభం లేదు. అతి త్వరగా సద్గురువును ఆశ్రయించడం, శాస్త్ర సారాన్ని గ్రహించడం అత్యంత ఆవశ్యకము-అవశ్యము కూడా!

  1. జీవన్ముక్తులను ఆశ్రయించకుంటే జీవితం వృథా! శ్రీరాముడు : హే మహానుభావా! శ్రీవసిష్ఠ మహర్షీ! ఈ ప్రాణుల యొక్క భోగతృష్ణ శాఖోపశాఖలే అనేక జగద్రూపములుగా విస్తరించి ఉండడం (చిదాకాశమునందు) గమనిస్తున్నాం కదా! ఇందులో

  2. జగత్ స్వరూప ‘అనర్థము’ యొక్క పూర్వ-పర విచారణ చేసి ఉన్నవారు… 2. సారాసార వివేకము చేత పరమార్థమును దర్శించినట్టి శ్రేష్ఠులగు మహాత్ములు… ఎక్కడ లభిస్తారు. “వారికై వెతకాలి! ఆశ్రయించాలి! ఇంతకుమించిన ఉపాయం (ఆత్మోద్ధరణకై) లేదు”… అని మీరు ఆజ్ఞాపిస్తున్నారు, సరే! కాని అనేక ప్రాపంచిక వ్యవహారములు అనివార్యమగుచుండగా సామాన్యులమగు మేము వారి కొరకై ఎక్కడ వెతకాలి? ఇదంతా దుర్లభం కాదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును! నీవు చెప్పినట్లు ఆత్మ జ్ఞానాన్ని చక్కగా ఎఱిగి పరమ సత్యాన్ని ఆత్యంతికంగా –నిర్దుష్టంగా ప్రకటించగలుగుచున్న జీవన్ముక్తులు ఈ లోకాలలో లభించడం కొంచెం కష్టతరమైన విషయమే! అయినా కూడా అట్టి మహనీయులు మనుష్య-దేవతాది జాతులలో కనబడుచూనే ఉంటారు. స్వయం ప్రకాశకుడగు సూర్యునికి చీకటి రాత్రి ఉండనట్లుగా ఆ మహనీయులకు రోజులన్నీ జ్ఞానప్రకాశమునందే గడచి పోతాయి. దుర్లభులే అయినప్పటికీ అట్టివారు ఆ పరమాత్మ యొక్క కరుణచే సృష్టియందు ఉన్నారు. సాధకులకు మార్గదర్శకులై లభిస్తున్నారు. కనుక అట్టి వారి దర్శనము కొఱకై ప్రయత్న పూర్వకంగా వెతకాలి సుమా! ఇక తదితర జీవుల సంగతి చూస్తున్నావు కదా! మూఢులగు తక్కినవారంతా మోహరూపమగు ఈ సంసార సాగరమునందు అటూ ఇటూ సంచరిస్తున్నారు. భోగతృష్ణలచే క్రింది లోకములలోకి - పై లోకములలోకి దొర్లించబడుతూ అనంతకాలం ఈ సంసారమునందే తేలియాడుచున్నారు.

ఆత్మజ్ఞాన సిద్ధిచే జీవన్ముక్తత్వము సంపాదించుకొనని ఆయా జీవజాతుల స్థితి గతులు ఎట్లా ఉన్నాయో చెపుతాను… విను. దేవతలు స్వర్గభోగములలో నిమగ్నులై ఆత్మసిద్ధి గురించి ఏమఱచినవారై అట్టి ‘భోగములు’ అనే అగ్నిచే లెస్సగా దహించబడుచూ ఆత్మజ్ఞానానికి ఇంకా ఇంకా సుదూరులే అవుతున్నారుగాని స్వస్వరూప దర్శన కాంక్షను కలిగి ఉండడమే లేదు.

ఇక దానవులు మదోన్మత్తులై “ఈ దేవతలే మా శత్రువులు. మామా శక్తులను వృద్ధి చేసుకొని వీరి సంపదలు ఆక్రమించబోతున్నాం”…. అని తలచుచూ మదపుటేనుగులవలె అటూ ఇటూ సంచరిస్తున్నారు. ‘ఆత్మజ్ఞానము’ గురించి వారికి జ్ఞాపకమే వచ్చుట లేదు. చివరకి మదపుటేనుగులు

Page:187

గర్తము (గోతులో)లో పడునట్లు వారు దేవతా రక్షకుడగు నారాయణుని చేతిలో నాశనము కొనితెచ్చుకొనుటకే తమ జీవితములను వెచ్చిస్తున్నారు.

ఇక గంధర్వులు అందామా… వారు “ కేతము” అనే మద్యమును త్రాగి ఊహాలోకంలో కల్పిత భోగములు అనుభవిస్తూ చివరికి జింక బోయవానికి చిక్కినట్లు మృత్యుముఖులు అవుతున్నారుగాని వివేక జనితమగు ఆత్మజ్ఞానమును లేశమైనా ఎఱుగుటయే లేదు.

మరి విద్యాధరులందామా… వారు తమ విద్యలను చూచుకొని మురిసిపోతూ… ఆ మోహ పరవశంలో ఆయుష్షును గడిపేస్తున్నారే గాని బ్రహ్మవిద్యాబలంచే ప్రకాశించే ఉదారశీలురగు వివేకులను ఆదరించటమే లేదు. ఇక ఎక్కడి బ్రహ్మజ్ఞానం? ఎక్కడ బ్రహ్మజ్ఞానులను ఆశ్రయించడం?

యక్షులో… జనుల నివాసములలో ప్రవేశించి భయ-జ్వర ఉన్మాదాది దోషములను జనింప జేస్తూ జనులను క్షోభపెట్టడంలో నిమగ్నులై ఉంటున్నారు. ‘ఆహా! ఈ మా దేహములే స్థిరములు గదా!’… అని నమ్ముతూ అసహాయులై వర్తిస్తున్నారు. మణి మంత్రబల శూన్యులైనట్టి బాలురందు, వృద్ధులందు, అశక్తులందు తమ దక్షత్వము చూపుచూ “మేం ఎంతటి ప్రభావం కలవారం!" అని మురిసిపోతూ ఈ సంసారంలో సంచరిస్తున్నారే గాని… “ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మ జ్ఞానులను ఆశ్రయించి వారి బోధను వినాలి”… అనే ప్రయత్నం గురించి యోచించటమే లేదు.

రాక్షసులందామా… “మామాట వినకపోతే మేం ఊరుకోం-ఎంతటి వారినైనా హింసించ గలం” అని తలచుచు స్వబలం–సంఘబలం చూచుకొని మురిసిపోవుచూ సుజనుల పట్ల శత్రుత్వం వహించి ఉంటున్నారు. ఇక వారికి మహాత్ముల కరుణ ఎట్లా లభించేది? చివరికి వారు విష్ణుమూర్తి చేతులలో హతులౌతున్నారు. ముందు అట్టి అనేకమంది రాక్షసులను నీవు సంహరించనున్నావు.

ఇక పిశాచజీవులందామా… వారు ప్రాణుల దేహములలో ప్రవేశించి రక్త-మాంసములను భక్షించాలనే యోచనలో మునిగి తేలుచున్నారేగాని ‘ఆత్మజ్ఞానము’ వైపు బుద్ధిసారించడమే లేదు. అంతరమున గల అగ్నిచే దినదినం దహింపబడే మహావృక్షంలాగా వారు ప్రాణులను భుజించాలనే చింతనచే చివరకు తమను తామే దహించుకొంటున్నారు. ఇక ఆత్మజ్ఞానమనే ఊసు ఎక్కడిది?

నాగులో… అజ్ఞులై జడ స్వరూపులై పాతాళమున వివేకశూన్యంగా రోజులు గడుపుతూ చివరికి ఒకనాడు మృత్యువును సమీపిస్తున్నారు. “నేనెవరు?” అనే ప్రశ్న వారి జడస్వభావమునకు క్రిందగా ఎక్కడో ఉండిపోతోంది గాని, ఆది బయల్వెడలటమే లేదు.

అసురులా… కీటకములలాగా భూతలమున గల శూన్యస్థానములను ఆశ్రయించి దీర్ఘకాలం గడిపివేస్తున్నారే గాని "వివేకము” అనే ప్రసంగమే ప్రారంభించడం లేదు.

ఈ మనుష్యులో… చీమల వలె అల్పమాత్రమైన విషయకణముల గురించిన లోభముచే ప్రతిరోజు తెల్లవారుతోంది-ప్రొద్దుగ్రుంకుతోంది. "వివేకులెక్కడ?” అనే ప్రయత్నమే వారిలో కనిపిం చడం లేదు. ఇక వివేకము వారిలో జనించేది ఎప్పటికో, ఎట్లో మేము గ్రహించలేకపోతున్నాం.

+

Page:188

“రామచంద్రా! ఈ అనేక భూత జాతుల యొక్క దినముల వ్యర్థములైన మహాదుష్టచేష్టలచే వ్యాకులమై గడిచిపోతున్నాయి. మత్తుగా త్రాగి బాట ప్రక్కన పరుండిన వాని పట్ల కాలం నిస్తేజంగా గడిచిపోతోంది చూచావా? అట్లా ఈ జనుల జీవితాలు వివేకరహితంగా, నిరర్థకంగా గడిచి పోతున్నాయి. అగాధంలో మునుగు వానికి వాచక శబ్దములు వినిపించజాలవు కదా! అట్లాగే సంసారమున మునుగు ఉత్సాహమును వృద్ధి చేసుకొంటున్న జనుల పట్ల వివేకుల వాక్యాలు వ్యర్థమై పోతున్నాయి. ఆ జనుల హృదయమును ఆత్మజ్ఞాన వాక్యాలు స్పృశించడమే లేదు. చేటలతో తూర్పారపట్టుచుండగా పొల్లంతా గాలికి కొట్టుకుపోతుంది చూశావా? “ఈ దేహాదుల పట్ల అభిమానము” అనే వాయువుచే జల్లింపబడినవారై ఈ జనులు ఎటో కొట్టుకుపోబడుచున్నారు. ఈ జీవులలో కొందరు అనేక తపస్సులు చేసి, ఎంతో కష్టించి మంత్రాదులను ఉపాశించికూడా చివరకు అట్టి శక్తియుక్తులను ఆత్మజ్ఞానవివేకము వైపుకు మరల్చలేకున్నారు. యోగి గణముల వంటివారు కూడా (ఒకానొక స్త్రీ దేవతా- సమూహం) సుర రక్త · పాన - మాంసాది భోజనములందు అభిలాషను ఏర్పరచుకొన్నవారై తామసఫల భోగాలలో ఆసక్తి కలిగి, దుర్గంధములైన మడుగులలో నికృష్టములగు కీటకములవలె పడివుండగా… ఇంకేం చెప్పాలి!

అయితే రామచంద్రా! పైన మనం ఉదాహరించినట్టి, తదితరములైన ప్రతి జీవజాతిలోను అక్కడక్కడ మహనీయులు-ఆత్మజ్ఞానులు అగు మహావివేకులు ఉన్నారు. అయితే వారు ఇక్కడే ఉంటారు-అక్కడ ఉండరు” అని మనం నిర్వచించలేం. కొన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం ఇక్కడ చెప్పుకోగలం. దేవతలందు… యమ-ఇంద్ర-చంద్ర-సూర్య-వరుణ-వాయు-బ్రహ్మవిష్ణు-బృహస్పతి-శుక్రాచార్య-అగ్ని మొదలైనవారు.

ప్రజ్ఞాపతులందు… దక్షుడు, కశ్యపుడు మొదలైనవారు; దేవర్షులందరు… నారదుడు మొదలైనవారు; దేవపుత్రులందు… కుమారుడు, సనక సనందులు మొదలైనవారు; దానవులలో

హిరణ్యాక్షుడు, బలి, ప్రహ్లాదుడు, శంబరుడు, మయుడు, వృత్రుడు, అంధకుడు, నముచి, కాశీపుత్రుడు, మురుడు మొదలైనవారు; రాక్షసులందు విభీషణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు మొదలైనవారు; నాగులందు… తక్షకుడు, కర్కోటకుడు, మహాపద్ముడు మొదలైనవారు…

ఇట్లా ప్రతి జీవజాతిలోను జీవన్ముక్తులు ఆత్మజ్ఞాన సంపన్నులు అయిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఇట్లాగే బ్రహ్మ-విష్ణు-ఇంద్రలోకములలోను, సిద్ధ-సాధ్యులలోను మానవులలోను ముక్తస్వభావులగువారు అక్కడక్కడా తప్పక ఉన్నారు. మనుష్యులలో కొందరు రాజులు, మునులు, బ్రాహ్మణోత్తములు, తదితరులు ఆయా వివిధ మతవాదులలో కొందరు కొందరు జీవన్ముక్తులై వెలుగొందుచున్నవారు ఉన్నారు.

ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఇక్కడ ఒక విషయం గమనించబడుగాక! ఎవరు ఏ సిద్ధాంతాన్ని నమ్మినవారై ఉంటారో, అది వారికి అట్లే సత్యమై ఉంటుంది. ఉదాహరణకు "మరణిం చిన తరువాత దేహమును ఆశ్రయించుకునే ఉంటారు” అని నమ్మిన వారు మరణానంతరం దేహ

Page:189

సమీప్యమునే అనుభవిస్తూ ఉంటారు. కనుక విజ్ఞుడైనవాడు అన్ని సిద్ధాంతాలను విశ్లేషించి ఉత్తమ మైనది ఆశ్రయించడం ఉచితం. “నేను సర్వాత్మకుడను. దేహమనోతీతుడను. సర్వులలో ఏది సాక్షి మాత్రమై ఉన్నదో అదియే నా స్వరూపం. ఈ సర్వదా సహజీవుల స్వరూపం కూడా సర్వదా అదే” …అను అవగాహనయే ఉత్తమోత్తమగు ఆత్మజ్ఞానమని మేము గ్రహిస్తున్నాం. ప్రకటిస్తున్నాం!

ఫలవృక్షాలు అనేకచోట్ల ఉంటాయి. కాని కల్పవృక్షాలు సృష్టిలో కొలదిగానే ఉంటాయి కదా! అట్లాగే దశదిశలా ప్రాణికోట్లు ఉన్నాయి. వారిలో జీవన్ముక్తులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, అఖండమగు ఆత్మతత్త్వమును అనుభవిస్తూ ఉండేవారు కొలదిగానే ఉంటున్నారు.

  1. సాధువులతో సమాగమం

శ్రీరాముడు : మహర్షీ! మహానీయులతో సమాగమం అధ్యాత్మయానంలో అత్యావశ్యకమని మీరు సిద్ధాంతీకరించారు. అయితే వివేకులైన ఆత్మజ్ఞుల లక్షణములు ఎట్టివి? వారు ఏ సాంఘిక-లౌకిక -ఆచరణ లక్షణములతో, ఏఏ ఆచరణ-అనుష్ఠానములతో ఉంటారు? వారిని సమీపించటం ఎట్లా? వారి నుండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మా అర్హతలు ఎట్లా ఉండాలి? మేము వారి కరుణామృతానికి పాత్రులమయ్యేది ఎట్లా? ఈ ఈ విషయాలు మాపై గల కరుణతో వివరించమని నా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును! సాధువులతో బ్రహ్మజ్ఞులతో సమాగమం అమోఘమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. అట్టి అవకాశం పట్ల అశ్రద్ధ-ఉదాశీనత ఉండకూడదు. నేనీ విషయాలు ఇతః పూర్వమే కొన్ని చెప్పి ఉన్నప్పటికీ… ఇప్పుడు కూడా సందర్భోచితం కాబట్టి మరికొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. మహనీయుల గురించి సంభాషించుకోవటమే మహత్తరమైన జ్ఞాన యజ్ఞం!

వివేకులు-విరక్తులు-పరమాత్మయందు విశ్రమించినవారు అగు మహనీయులు లోభ-మోహ రహితులై ఉంటారు. యుద్ధ యోధుడు శత్రు సైనికులను జయించి ఆధిపత్యం ప్రకటించునట్లు వారు లోభ-మోహ-కామ క్రోధ-మద మాత్సర్యాలను జయించి ఆధిపత్యము వహించినవారై ఉంటారు. వారు అధికముగా ప్రసన్నులు కారు. వారికి ఎవరిపైనా ఏమాత్రం కోపం ఉండదు. వారు దేనిపట్లా ఆసక్తి కలిగి ఉండరు. భోగ్య పదార్థముల పట్ల అభినివేశము, జనుల వలన ఉద్వేగము పొందరు. తదితర జనులను ఉద్వేగింపజేయరు.

నాస్తికత్వముతో గూడి దురాచారములు చేయరు. ఆస్తికత్వముతో గూడి అతికేశకరములగు కర్మానుష్ఠానమునందు తత్పరులు కారు. మనోహరమైన, మధురమైన ఆచరణ కలిగి ఉంటారు. ప్రియముగాను-కోమలముగాను మాట్లాడుతూ ఉంటారు. వారు తమ సాంగత్యముచే జనులకు ఆహ్లాదము కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో లౌకిక-వైదిక కర్మలకు పరస్పర విరోధం

Page:190

కలుగగల సందర్భాలు ఉంటాయి చూచావా? అప్పుడు వారు ఆ ఉభయుల మధ్య సంకటమును నివారించి, జనుల సందేహాలను క్షణంలో తొలగించి అనుష్ఠానమును లోక కళ్యాణ పూర్వకంగా, సౌలభ్య సమనిత్వంగా అవగాహన- ఔన్నత్యములతో తీర్చిదిద్దగలరు. క్షణంలో ఉత్తమ కర్తవ్యమును నిర్ణయించగలరు.

అనుద్వేగకరాచారా బాంధవా నాగరా ఇవా

బహిః సర్వ సమాచారా అన్తః సర్వార్ధ శీతలాః ॥

ప్రియమైన శ్రేయోభిలాషులైన బంధువుల వలె ఉద్వేగరహితులై ఉంటారు. వారి ఆచారము లన్నీ సర్వులకు క్షేమము కలుగజేసే ఉద్దేశముతో రూపొంది ఉంటాయి. బాహ్యమున అందరిలోనూ సమముగా సామాన్యాచరణ కలిగి ఉంటూనే… అంతరంగంలో సమస్త కార్యములలో ప్రశాంతంగా ఉంటారు. ఇంకా… వారు శాస్త్రార్థ రసికులై ఉంటారు. జగత్తు యొక్క పూర్వ-పరతత్త్వమును ఎఱిగినవారై ఉంటారు. ఆత్మజ్ఞులై ఉంటారు. ‘ఏది గ్రహించాలి - ఏది త్యజించాలి’… అనేది బాగుగా ఎఱిగినవారై, వాటి పట్ల జ్ఞానయుక్తులై ఉండి, యథాప్రాప్తములైన ఆయా ధర్మ-కర్మములను నిర్విర్తిస్తూ ఉంటారు. శాస్త్ర-లోక విరుద్ధములైన కార్యముల పట్ల విరక్తి కలవారై ఉంటారు. సదాచారముల పట్ల ప్రీతిమానసులై ఉంటారు. వారి యొక్క హృదయము అనే పుష్పం ‘జ్ఞానోదయం కావించగల ఉపదేశములు’ అనే కమ్మటి సువాసన సదా వెదజల్లుతూ ఉంటుంది. వారికి అతిథులై వచ్చినవారికి "వీరికి ఆశ్రయదానము-సుఖదాయకమగు భోజనము-సత్కారము ఇంతవరకే చేయగలిగానే” అనే అణకువ కలిగి ఉంటారు. స్వగృహమునకు ఏతెంచిన అతిథులతో వారికి సర్వ ప్రదాతయగు తమ ఇష్టదైవం ద్యోతకమౌతాడు. సర్వుల పాప దృష్టులను వారు క్షణంలో ‘పవిత్రత’ వైపుగా మరల్చగలుగుతూ ఉంటారు. తమ ఉత్తమ గుణములచే సత్పురుషుల మనస్సును హరించు సామర్థ్యం స్వభావసిద్ధంగా కలిగి ఉంటారు. జన క్షోభను తమ తపఃప్రభావం చేత, సత్కర్మానుష్ఠానం చేత నివారించి, సంకల్పమాత్రంచే జనులను సముత్సాహపరుస్తూ ఉంటారు. సంపదలలో సహ జనులను సుఖపెట్టువారై వర్తిస్తూ ఉంటారు. వారి శీతల హృదయంలో అమ్మ ప్రేమ మనకు కనిపి స్తుంది. వారున్న చోట సాత్విక భావాలు నలువైపులా వెదజల్లబడుతూ ఉంటాయి. వారు భావికాలపు సత్ఫలితాలకు హేతుభూతులై భాసిల్లుతూ ఉంటారు. మధురభాషులై అందరికి ఉల్లాసం కలిగిస్తూ ఉంటారు. అనేక మనోరథములచేత, శోకమోహములచేత, చంచల ప్రవృత్తుల చేత కలుషితమైన హృదయములకు ఆ సాధుపురుషుల వివేకోపన్యాసమే పరిశుద్ధ పరచగల అభ్యంగన స్నానం.

కాబట్టి రామచంద్రా! ఆపద సమయములందు, జరా-మృత్యు-శోక-మోహాది వ్యాకుల స్థితులయందు తదితర సంకట స్థితులందు తత్త్వజ్ఞుడగు జ్ఞాని యొక్క యోచనలు-బోధలుఅభిప్రాయములే శరణ్యమని సర్వ జనులకు గుర్తు చేస్తున్నాను.

నాయనా! రామా! ఇట్టివియు, తదితరములు అగు చిహ్నములచే విశాల హృదయములగు మహనీయులు ఎక్కడెక్కడున్నారో గుర్తించాలి. సంసార మార్గములో శ్రమగొనియున్నవాడు

Page:191

అద్వయమగు బ్రహ్మమునందు విశ్రాంతిని సంపాదించుకోవటానికై అట్టి మహితాత్ములను ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ సంసారసాగరం సర్పము వలె అతి భయంకరమైనది సుమా! వినా ’సత్సంగమ్’ అన్వేన పోతకేన న తీర్యతే

అట్టి ఈ సంసార సాగరము ‘సత్సంగము’ అనే పడవచే తప్ప మరి దేనిచే దాటబడగలదు? అస్తాం కిం మే విచారేణ? యత్ భవేత్ అస్తు తత్ మమ!

ఇత్యస్తః కల్కమ్ ఆసాద్య న స్టేయం గర్త కీటవత్

"ఆ! విచారణ వలన మాకేం ప్రయోజనం? ఏది ఏమైయున్నదో అదే అట్లే మనకగు గాక! అయినా ఎవరిని నమ్మగలం? ఈ చెప్పే వారిలో తప్పులుండవా? చెప్పటం ఎవడైనా చెప్పగలడు. ఇవన్నీ మాకు తెలియవా ఏమి? ఆ! మేము చాలామందిని చూచాం. నేను ఇటువంటి వారిని అటువంటి వారిని నమ్మను”… అనే ఏవేవో అలసత్వపు స్వభావంతో ఈ జనులు రోజులు గడిపేస్తు న్నారే గాని… “ఈ జీవితాన్ని, ఈ ఈ సందర్భాలను, అవకాశాలను సద్వినియోగ పరచుకోవటమెలా?” అని సమాలోచనకు సిద్ధమే కావటం లేదు. ఓ ప్రియ జనులారా! అట్టి అలసత్వం అంతఃకరణంలో ధరించి గుంటలోని కీటకం వలె రోజులు గడపడం శ్రేయం కాదని ముందుగా హెచ్చరిస్తున్నాను. శ్రద్ధ-ఉత్సాహం-అన్వేషణలతో సత్పురుషులను గుర్తించి, సమీపించే ఉద్యమంలో ఉండటమేశ్రేయం.

ఒకవేళ పైన చెప్పిన ఉత్తమ గుణాలన్నీ ఒకనియందే లేవనుకో! అప్పుడు ఆ ఉత్తమ గుణాలలో ఒక్కటి అయినా ఎవనియందైనా ఉన్నదని ఎఱిగినప్పుడు ఆ ఒక్క గుణం కొఱకై - మిగిలిన పనులన్నీ ప్రక్కకుపెట్టి ఆతని అన్య దోషాలను అనాదరిస్తూ (లక్ష్యపెట్టక) ఆతనిని ఆశ్రయించాలి.

బాల్యం నుండి “నా గుణ దోషములు ఏమేమి?” అని తెలిసుకోవటానికి సత్సంగముశాస్త్రాభ్యాసం ఈ రెండింటిని సద్వినియోగపరచుకోవాలి. చిన్నచిన్న దోషములను కూడా ప్రయత్నంతో తొలిగించుకొనే ఉద్యమంలో ఉండాలి. అందుకుగాను నిత్యము సజ్జనులతో పరిచయమును, సహవానమును ప్రవృద్ధం చేసుకొంటూ ఉండాలి. ఒకవైపు సజ్జన సహవాసం పెంపొందించుకుంటూ, మరొకవైపు స్థూలదృష్టి దోషములుగల జనులతో గల సంబంధమును క్రమంగా తగ్గించుకుంటూ ఉండాలి. దుస్సాంగత్యము సాధువులో కూడా అసాధుత్వమును ఉత్పత్తి చేయగలదని నా అభిప్రాయం. లోకంలో అట్లా చూస్తున్నాం కదా! సాధువు దుష్టత్వం పొందటం జగత్తులో అశుభ సూచకం. అందుకే ఇంత సూటిగా చెప్పుచున్నాను. దేశ కాలవశంగా పాపకార్యములచే లోకంలో గొప్ప అరిష్టాలు సంభవించటం గాంచబడుచున్నది. అందుచేత అన్ని కార్యక్రమములు త్యజించి అయినా సరే,… సజ్జన సాంగత్యమును ఆచరించాలని బాలురకు, తదితరులకు కూడా నా విన్నపం. "సజ్జనులతో సాంగత్యమే ఇహ పర శ్రేయోదాయకమైన గొప్ప సాధన” … అని మేము తలచుచున్నాము.

ఓ రామచంద్రా! సజ్జనుల నుండి ఎప్పుడూ కూడా మనుజుడు దూరం కారాదు. మరొక విషయం. సాధువులను సమీపించునప్పుడు నమత్ర కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానులు అర్హమైన వారి

Page:192

ముందు మాత్రమే వివేక ప్రవచనములు చేస్తారు. సమీప ప్రాంతంలో సాధువు, ఆత్మజ్ఞాని ఉన్నాడని తెలియగానే వారిని ఆశ్రయించే యత్నంలో ఉండాలి. సాధు పురుషుల సమీపంలో ఉన్నంత మాత్రం చేత వారి సద్గుణ పుష్ప రేణువుల స్పర్శ తదితరులకు కూడా లభించగలదు.

  1. పక్షి-క్రిమి-కీటక జీవుల అనుభవం ఎటువంటిది?

శ్రీరాముడు : స్వామీ ! వసిష్ఠ మహర్షీ! పక్షి-క్రిమి కీటక దేహములను పొంది కొందరు దేహధారులు ఈ జగత్తులో సంచరించటం జరుగుతోంది కదా! అట్టి జీవుల విషయమై ‘వారి దుః ఖముల విషయమేమిటి?’ అనే ప్రశ్న నా హృదయంలో ఏర్పడుతోంది. ఎందుకుంటారా?

సన్తి దుఃఖక్షయే అస్మాకం శాస్త్ర-సత్సంగ యుక్తయః

మంత్ర-ఔషధి-తపో-దాన-తీర్థ -పుణ్య అశ్రమాశ్రయాః ॥

మహాత్మా! మా మనుజుల వంటి వారికైతే ఈ సంసారం కలిగించ గల దుఃఖాలను తొలగించు కొనుటకై తమవంటి మహామహితాత్ములచే చెప్పబడిన శాస్త్రాదులు ఉన్నాయి. శాస్త్రాభ్యాసం, సత్సంగం, మంత్రం, ఔషధం, తపస్సు, దానం, తీర్థం, పుణ్యాశ్రమ సేవ మొదలైన ఉపాయాలు మా అజ్ఞాన దుఃఖాన్ని తొలగించుకోవటానికై ఉన్నాయి. తమ వంటి సద్గురువులు ఉన్నారు.

మరి క్రిమి కీటకాల మాట ఏమిటి? ఈ క్రిమి కీటక-పతంగ-తిర్యక్-స్థావరాది జాతులలో దేహాలు పొందిన జీవులు ఎటువంటి మోక్షోపాయములు ఎఱుగకయే ఉన్నాయి కదా! మఱప్పుడు అవి ఎట్లా జీవిస్తున్నాయి? ఏఏ కార్యములు ఒనర్చుచున్నాయి? వాటికి దుఃఖం క్షయించేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : (లోకో రమయతేతి రామా!) సర్వ జీవుల పట్ల అవ్యాజమైన ప్రేమను కురిపించే ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఇప్పుడు పక్షి-క్రిమి కీటక-తిర్యక్-స్థావర జీవుల అనుభవ విశేషాలేమిటో చెప్పుతాను. విను.

సమస్త స్థావర-జంగమ ప్రాణులు కూడా వాటి వాటికి యోగ్యములైనట్టి భోగముల ‘సుఖసత్త’ యందు స్థితిని కలిగి ఉన్నాయి. కొన్నిటిని ‘ఇవి పొంది మేము సుఖిస్తాం’ అనుకొని వాటిని అట్లే పొంది సుఖిస్తున్నాయి. అంతే కాకుండా ఏదేది ఏ జన్మయందున్నదో… అది ఆ జన్మకు తగినట్టి విషయముల యొక్క ప్రాప్తియే “మహాపురుషార్థం” అని ఎంచుచున్నది. అట్టి అల్ప ప్రాణులకు కూడా మనకు లాగానే జన్మోచితమైన ‘సుఖభోగేచ్ఛ’ కలదు.

అయితే, వాటికి ఏవి గొప్ప భోగములుగా కనిపిస్తున్నాయో మానవులకు అట్టి భోగముల పట్ల అల్పమైన విశ్వాసం ఉంటుంది. అందుచేత మనకు కొద్ది విఘ్నములే ఉంటున్నాయి. వాటికో? కామ-క్రోధాదుల ప్రాబల్యం చేతనూ, వివేకము లేనందుచేతనూ ఆయా అల్ప భోగములపై అధిక విశ్వాసం ఉంటోంది. అందుచేత పర్వతం వలె గొప్పవి అయిన అనేక విఘ్నములు కలుగు చున్నాయి. ఉదాహరణకు “ఆ పండును నేను ఆరగించాలి” అని నీవు అనుకుంటావనుకో. అది

Page:193

లభించకపోతే? అది పెద్ద విషయంగా చూడవు కాబట్టి నీకు అది అల్పమైన విఘ్నమే అయి ఉంటుంది. అదే ఒక కీటకమైతే, ఆ పండును భక్షించాలని తలచి, అది లభించనందుకు తీవ్రమైన విఘ్నత్వం అనుభవిస్తుంది. ఈమాత్రం తేడా తప్పించి సుఖ దుఃఖములు క్రిమి కీటకాదిజాతులకు, మానవులకు ఒక్క తీరైనవే!

బ్రహ్మాండ శరీరుడగు విరాట్ పురుషుడు (విరించి, బ్రహ్మదేవుడు, సమష్టి జీవుడు) ఏ విధంగా అయితే స్వభోగము కొఱకై ప్రయత్నించుచున్నాడో… ఆ విధంగానే వెంట్రుక చివర సంచరించు చున్న ‘పేను’ కూడా “ఈ స్థానమే నా గృహం" అనుకుంటూ అక్కడయే ఆయా భోగానుభవముల కొరకై ప్రయత్నము సలుపుచున్నది.

ఆహా! అహంకారము యొక్క ప్రతాపం ఎంతటిదో చూచావా? ఈ జీవులందరూ శాంతమగు ఆత్మ స్వరూపులే అయివుండికూడా శాంతి కొఱకై ఎక్కడెక్కడో బాహ్యమున వెతుకుచున్నారు కదా!

జాయనేచ మ్రియంతేచ నిరాధారే అంబరే ఖగా :

శూన్యైక విషయాస్తేషాం ! స్వాస్థ్యం న భవతి క్షణమ్ !

పక్షులు కేవలం శూన్య విషయాలలో అభిలాష కలిగి ఉన్నవై నిరాధారమగు ఆకాశంలో జన్మించి, మరణిస్తున్నాయి. వాటికి క్షణమైనా శాంతి లభించటమే లేదు. ఇక చీమలు మొదలైనవి ధాన్యము మొదలైన పదార్థకణములను సంపాదించుకోవడంలోను, కుటుంబము యొక్క పోషణపాలనకు సంబంధించిన క్రియలలోను సుదీర్ఘమైన రోజును క్షణంలాగా గడిపివేస్తున్నాయి. గరుత్మంతుని గమనమునందు ఏ వ్యగ్రత్వం కనిపిస్తోందో…. త్రసరేణువుల వలె (సూర్య కిరణాలలో కనిపించే సూక్ష్మరేణువువలె) అతి సూక్ష్మమగు ఆకారం గల ‘తిమి’ అను అతిసూక్ష్మమైన జీవి యొక్క గమనంలో కూడా అంతటి వ్యగ్రత్వం కనిపిస్తోంది. మానవులలో ఏ విధంగా “వీడువాడు-నేను-నీది-నాది -నా ఇల్లు-నా ధనం” ఇత్యాది కల్పనా పరంపరలు, భావావేశాలు, గుణాతిశయాలు వృద్ధిపొంది ఉన్నాయో, అట్లాగే క్రిమికీటకాలలో అవన్నీ ప్రసిద్ధిపొంది ఉన్నాయి.

దేశ కాల క్రియా ద్రవ్య వ్యగ్రయా జర్జరీకృతమ్, క్షీయతే వ్రణకీటానామ్ అస్మాకమివ జీవితమ్ |

దేశ-కాల-క్రియా-ద్రవ్యాది విషయములు గూర్చిన చింతనచే మన జీవితం ఏ విధంగా క్షీణిస్తుందో…. అట్లాగే “వ్రణం (పుండు)” నందలి కీటకం యొక్క జీవితమూ క్షీణిస్తోంది. శిలలు ఘోరనిద్రయందున్నాయి. వృక్షములు కొంచెము జాగరూకములై ఉన్నాయి. క్రిమి-కీటకాదులు మన మనుజుల వలెనే కొంత జాగరూకముగాను, కొంత నిద్రాశీలముగాను ఉన్నాయి.

శరీరనాశ ఏవైషాం సుఖం సంప్రతి దుఃఖ కృత్ అస్మాకమివ తేషాం తజ్జీవితం తు సుఖాయతే ॥

ఏ విధంగా మనకు జీవించడం సుఖంగాను, మరణించడం దుఃఖంగాను ఉన్నదో… అట్లాగే క్రిమి-కీటకాలకు కూడా ‘జీవించడం’ అనేది సుఖప్రదంగాను, ‘మరణించడం’ అనేది దుఃఖ

Page:194

ప్రదంగాను అనిపిస్తూ ఉంటోంది. క్రొత్త చోటికి వెళ్ళిన మనుజునకు అక్కడ గల పదార్థాలన్నీ క్రొత్తక్రొత్తవిగా అనిపిస్తున్నట్లే పశు-మృగాదులు కూడా ఈ పదార్థ సమూహములను కొన్నిటిని ఉద్వేగంతోను, మరికొన్నింటిని ఉదాసీనంగాను గాంచుచున్నాయి. మనకు వలెనే తిర్యక్ జీవులకు కూడా (పశు-పక్షి మొదలైనవాటికి కూడా ఈ ప్రపంచం సుఖ-దుఃఖప్రదమై గోచరిస్తోంది. అయితే మానవులేమో గుణ-క్రియలను బుద్ధితో విశ్లేషించి పదార్థముల సంయోగ-విశ్లేషణాదులచే మరి కొంత విశ్లేషించి మరీ విషయాలను పొందుతూ వస్తున్నారు. తిర్యజాతి జీవులేమో ప్రకృతిలో లభించేదానిని యథాతథంగా అనుభవిస్తున్నాయి. ఇంతకుమించి తేడా ఏమీ లేదు. అజ్ఞానులకు పామరజనులు ‘ఆత్మజ్ఞానము’ నకు సంబంధించిన యోచన-ప్రయత్నము లేకుండా ఆయా ఇచ్ఛా- - ద్వేషములనే త్రాళ్ళచే బద్ధులై ఒక సమయంలో సానుకూల్యమును, మరొక సమయంలో ప్రాతికూల్యమును పొందుచూ జీవితములను గడిపివేస్తున్నారు. ఇక పశువులు మొదలైనవి ముక్కు త్రాళ్ళచే బంధించబడి…. ఆహారాదులచే సంతోషిస్తూ, అవి లభించనప్పుడు దుఃఖిస్తూ జీవిస్తు న్నాయి. ఇటు మానవులు - అటు పశువులు కూడా అంతఃకరణంలో అనేక వేదనలు, సుఖదుఃఖ అనుభూతులు కలిగియే చరిస్తున్నారు. కనుక ఉభయుల జీవితంలో భేదమేమున్నది? మానవులుజంతువులు-కీటకాలు ఈ అందరు దేహులు కూడా ఒకప్పుడు ఈ దేహాలు పొందుచున్నారు. బాల్య-యౌవన-వార్ధక్యములు అనుభవిస్తున్నారు. కాలక్రమేణా ఆయా దేహాలను మరణంలో కోల్పోవుచున్నారు. ఇందులో విశేషమైన భేదం ఏమున్నది?

సుకుమారమైన చర్మం కలిగిన మానవులకు సుఖనిద్రా సమయంలో శీతోష్ణముల వల్ల దోమలు మొదలైన వాటి వలన దుఃఖం కలుగుచున్నట్లే, వృక్షాదులకు కూడా క్రిమికీటకాదులచే గావించబడే ’దంశం (కాటు వల్ల దుఃఖ వేదనలు కలుగుచూనే ఉన్నాయి. కనుక ఉభయుల సుఖ-నిద్ర-దుఃఖ-వేదనలలో మాకు భేదమేమీ కనిపించడం లేదు. దేశక్షోభ ఏర్పడగా మనం పరుగులు తీస్తున్నప్పుడు ఏ విధంగా మార్గంలోని రాళ్ళు ముళ్ళు తగిలి మరింత క్షోభను కలుగ జేస్తాయో, అట్లాగే పక్షులకు, సర్పములకు, తదితర తిర్యక్ జంతువులకు శత్రువుల వలన ప్రకృతి యొక్క వైపరీత్యము వలన క్షోభ-దుఃఖము కలుగుతూ ఉంటాయి. విక్షేపానుభవం తొలగినప్పుడు మనుష్యులకు ఆనందం కలుగుచున్నట్లే జంతువులకు కూడా విక్షోభం తొలగగానే ఆనందం కలుగుతోంది. ఆహార-నిద్ర-మైథున-విశ్రాంతి సమయాలలో ఇంద్రునికి కలిగే ప్రసన్నత ఎట్టిదో, ఒక దోమకు ఈగకు-పేనుకు కలిగే ప్రసన్నత కూడా అట్టిదే! ఆ ఇరువురు కూడా విక్షేపమును ఒక్కొక్కసారి అధిగమించలేక నిస్సహాయతను అనుభవిస్తూ ఉండడం కూడా సమానమైనదే! రాగద్వేష-భయ-ఆహార-నిద్ర మైధున జనితములైన సుఖదుఃఖాలు, జనన-మరణ సమయాలలో ఏర్పడే భేదాల విషయంలో ఇంద్రునికి, కీటకానికి కూడా భేదమేమీ లేదు. ఇక భేదమేమిటంటావా?

మానవులకు శాస్త్రములు, అవి నిర్దేశించే పుణ్య-పాప - బ్రహ్మతత్త్వాదుల సంబంధమైన జ్ఞానం, భూత భవిష్యత్ పదార్థముల జ్ఞానమూ ఉంటున్నాయి. ముంగిస-నక్క-పాము-ఏనుగుఆవు మొదలైన జంతువులకు అవి అంతగా ఉండడం లేదు. ఇక మిగతా అన్ని విషయాలలో (చావు

Page:195

జీవులు - నిద్ర - స్వప్నం -అపోహఆశ నిరాశ దురాశ - ప్రేమ - - క్రోధం వంటి విషయాలన్నిటిలో మానవులకు, ఆ జంతువులకు భేదమేమీ లేదు. ఇక వృక్షాదులు నిద్రాగ్రస్తములై గాఢమైన అజ్ఞానముతో కూడి ఉంటున్నాయి. పర్వతములు-కొండలు కూడా అదే స్థితిని అనుభవిస్తున్నాయి. కాని హిమాలయము, మేరు పర్వతము మొదలైన కొన్ని పర్వతములు మాత్రం తత్వజ్ఞ సంబంధమైన అఖండ చిదాకాశమును అనుభవిస్తున్నాయి. వృక్షాదులేమో గాఢనిద్రను అనుభవిస్తున్నాయి. పర్వతాదులు అజ్ఞానయుక్తమగు స్వసత్త యందు ఉంటున్నాయని అనుకున్నాం కదా! జంగమజాతులలో అనేక జీవులు స్వప్న స్థితిలో అర్ధవికాసముతోను, జగత్తునందు పూర్ణవికాసముతోను ఉంటున్నారు. కొందరు జంగమ జీవులు మాత్రం చిదాకాశమాత్ర స్వరూపానుభవులై ఉంటున్నారు. ఏ జీవునికి ఎట్లు అనుభవమైవుంటున్నా కూడా అది ‘ఎరుక’ అను మూలతత్త్వమును ఆశ్రయించే ఉంటోంది. అద్దానిని ఎవరు ఏ రీతిగా ఎఱుగుచున్నారో, వారికి ఆ రీతిగా అప్పుడే అనుభవమగుచున్నది.

కనుక జ్ఞానికైనా అజ్ఞానికైనా చిడాకాశమే ఆయా రీతులుగా అనుభవమగుచున్నదని విజ్ఞుల అభిప్రాయం. 1.హిమాలయాది పర్వతాదుల అఖండ సత్త; 2.వృక్షాదుల నిద్రాసత్త ఈ రెండింటిలోను ద్వైతానుభవం (రెండవది అనే అనుభవం) ఉండడం లేదు. కాబట్టి ఆ రెండింటి యొక్క దృష్టికి ఈ జగత్తంతా కూడా ఏకమే అయినట్టి అజ్ఞానోపహిత చిదాకాశమే ఆయా రీతులుగా

కనబడుతోంది.

ఓ రామచంద్రా! ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ జీవుని దృష్టిలో జగత్తు ఉంటూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడో… ఇక ఆ ఆ పై ఈ జగత్తుగాని, నీవు-నేను మొదలైనవిగాని, భూత-భవిష్యత్-వర్త మానములు గాని సర్వదా లేనివే అయివుంటాయి. వాస్తవానికి ఏ చిదాకాశ మైతే “అనాది-అనంతము-అపరిచ్ఛిన్నము-అజ్ఞాన నిద్రారహితము-మౌనసదృశము-శిలవలె చిదనము-సర్వదా యథాస్థతము” అయివున్నదో అట్టి చిదాకాశమే ఈ జగత్తు యొక్క వాస్తవరూపం. స్వప్నద్రష్టకు స్వకల్పితంగా స్వప్నం అగుపిస్తున్నట్లు, అజ్ఞాని యొక్క దృష్టికి నిజస్వరూపము చేతనే ఈ జగత్ వైచిత్ర్యమంతా కల్పించబడినదై అనుభవమగుచున్నది. పరమార్థంగా చూస్తే ఈ సృష్టి పూర్వం ఎట్లా ఉన్నదో… ఇప్పుడూ అట్లాగే సమముగానూ, ఏకరూపముగానూ ఉన్నది. ఇక ముందు కూడా అనంతకాలం ఇట్లే ఉండబోతోంది. ఎటొచ్చీ… అజ్ఞానికి అది నేను-నీవు మొదలైన వాటితో కూడిన అనేక రూపాలుగా అగుపిస్తోంది.

జ్ఞాని ఇదంతా ఏకం అఖండం అగు ఆత్మతత్త్వంగా సుస్పష్టంగా చూస్తున్నాడు. అట్టి శుద్ధ చిన్మాత్రమునకు “ఆకాశం-పర్వతం-ప్రపంచత్వం-శూన్యత్వం-మౌనత్వం-మౌనిత్వం” మొదలైన శబ్దార్థాలు ఆపాదించడానికి కుదరనే కుదరదు సుమా!

ఓ రామచంద్రా! నీవు-నేను ఈ సమస్తము కూడా యథాస్థితమగు బ్రహ్మమే అయివున్నాం. బ్రహ్మమునకు వేఱుగా నేను-నీవు తదితరులు అనునవేవీ లేవు.

Page:196

స్వప్ననగరంలో స్వప్న కల్పనారూపమగు పరమాకాశము తప్ప మరింకేమున్నది చెప్పు? అట్లాగే ఏదైతే కలదో… అది శాంతం-నిర్మలం-నిర్వికారం అగు చిదాకాశమే అయివున్నది. అంతటా చిదాకాశమే ఉండి ఉండగా… అందులో సుఖ దుఃఖాదులు ఎక్కడుంటాయి చెప్పు? స్వప్నంలో వస్తువులు మెలకువ వచ్చేవరకే కనిపిస్తాయి కదా! ఆ తరువాత స్వప్నంలో వస్తువులు ఏమవు తున్నాయి? ఆ ప్రశ్నే ఉచితం కాదు. ఎందుకంటే, స్వప్నంలో వాస్తవానికి వస్తువులు ఉంటే కదా… అవి పోవడం అనేమాట? అట్లాగే జ్ఞానము కలిగిన తరువాత “నీవు-నేను జగత్తు-అహంకారము” మొదలైనవి మొదలే కనిపించవు. “అట్లా ఎప్పుడైనా నాకు కనిపించి ఉంటే, అది అజ్ఞానము చేతనే”… అని జ్ఞాని గమనిస్తున్నాడు. ‘జగత్తు’ అనే స్వప్నం ’జ్ఞానము’ అనే మెలకువచే ఎఱుగబడినదై “అంతయూ బ్రహ్మమే” అనునది కరతలామలకమైపోతోంది. అట్టి ఈ జగత్తు “అజ్ఞానపూర్వకమైన స్వప్నం వంటిది”… అని ఎఱుగబడిన తరువాత ఇక ఇందులో ఆసక్తి ఉండ వలసిన పనేముం టుంది? “గొడ్రాలి రెండవ కుమారుని రూపు రేఖలేమిటి?”…అనే విషయంలో ఆసక్తి ఎవరికీ ఉండదు కదా! ప్రతి పరమాణువునందునూ అసంఖ్యాక జగత్తులు స్వప్నమాత్రంగా ప్రాప్తించ గలుగుచుండగా ఇక అట్టి ఈ భ్రమ ఎందుకు? ”గొడ్రాలి రెండవ కుమారుని ముక్కు ఎంత వెడల్పు? ఎందుచేత?” అనే అల్పచర్చలు త్యజించి ఆత్మజ్ఞానము కొఱకై సర్వ అవకాశములను

ఎందుకు వినియోగించరాదు?

ఏది అప్రబోధకాలంలో ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ ప్రబోధకాలంలో ఉండదో… అది ఉన్నది ఎట్లా అవుతుంది? భ్రమచే ఎండమావులలో జలతరంగాలు కనిపిస్తూ ఉంటే, (భ్రమ తొలగగానే అక్కడ జలమేలేదని తెలియవస్తూవుండగా… ఇక ఉన్నట్లైతుందా? ఈ జగత్తు మొదలైనవి అట్టివే సుమా! ఈ భూత భవిష్యత్ కాలములు, జ్ఞాన-అజ్ఞానములు మొదలైనవి కూడా యథార్థానికి లేనివే! అంతాకూడా శివరూపము పరమశాంతము అగు పరమాత్మ చేతనే ఆవరించబడివున్నది. ఇక ఈ ‘చచ్చుట-చంపుట’ అనబడు విశేషాల గురించి అంటావా?…

యథా ఊర్మిణో ఊర్మౌనిహతే న కాచిత్ పయసాం క్షతిః

తథా దేహేన నిహతే దేహే, నాస్తి చితేః క్షతిః ||

ఒక తరంగం వెళ్ళి మరొక తరంగమును ఢీకొని ఖండములుగా చేసిందనుకో!… అప్పుడు జలానికి వచ్చే నష్టమేమున్నది? అట్లాగే ఒక దేహముచే మరొక దేహము నశింపజేయబడినప్పటికీ కూడా ఆత్మకు ఏ హానీ లేదు. ఆకాశరూపమగు చైతన్యమునందే “నేను దేహమును” అనే భ్రాంతిజ్ఞానం ఉత్పన్నం అవుతోంది. కాబట్టి అట్టి భ్రాంతిజ్ఞానరూపమగు దేహము నశించనంత మాత్రంచేత చైతన్యము నశిస్తుందా! లేదు. చైతన్యమునకు (ఆత్మకు) వచ్చే నష్టమేమి లేదు.

“జగత్తు” ప్రబుద్ధమగు చిదాకాశము యొక్క "స్వప్నం’ -

ప్రబుద్ధస్యైవ “చిద్వ్యోమ్నః స్వప్నో” జగత్ ఇతి స్థితమ్ | పృథ్వ్యాది రహితం యస్మాత్, తస్మాత్ స్వప్నాత్మకం జగత్ ॥

Page:197

అట్టి ప్రబుద్ధ చిదాకాశము యొక్క స్వప్నమే జగత్తుగా స్థితినొంది ఉన్నది. అనగా జగత్తు అనబడేది దానిలో ‘పృథ్వి - నీవు-నేను’ అనేవేవీ వాస్తవానికి లేవు. ఉన్నట్లుగా ఏది కనబడుచున్నదో… అది స్వప్నాంతర్గత విశేషములు వంటివి మాత్రమే! ఎందుకంటే ఏది ఎట్లు భావించబడుచున్నదో… అది అట్లే అనుభూతమ గుచున్నదని ఇక్కడ గ్రహించబడుగాక! పూర్వపూర్వ సంస్కారములచే ‘సృష్ట్యాది’ యందు పృథ్వి మొదలైనవాటియందు వస్తు బుద్ధి ఏర్పడి ఉంటోంది. స్వప్న సమయంలో స్వప్న వస్తువులు ‘ఇవి వాస్తవమే’ అని అనుభవించవచ్చుగాక! అయినా కూడా స్వప్న పదార్థము లందలి సత్యత్వమును గూర్చిన భ్రాంతి కల్పనా మాత్రమే కదా! జగదనుభవం కూడా కల్పనా మాత్రమే!

ఈ ప్రకారంగా జగత్తు అనునది “అనాది ప్రవాహరూపమగు స్వప్నం యొక్క అవయవ రూపము” అగుచున్నది. ఇట్లు అసత్యమైనట్టి “జగతిస్థితి” యందు ఈ పృథ్వి మొదలైనవి సత్యములే అయినట్లు ఈ మూఢబుద్ధి ఒకానొక కల్పనను ఆశ్రయించుకొని ఉంటోంది. చీకట్లో ‘మోడువారిన చెట్టు బేతాళము’ అనేది అసత్యమే అయినప్పటికీ భ్రాంతిచే బాలుని దృష్టికి దృఢపడి ఉంటోంది చూచావా? అట్లాగే అభ్యాసవశంచే భ్రాంతి సత్యమువలె దృఢపడి కనబడుతోంది. అయితే దేనియందైతే ఇదంతా కల్పించబడి ఉన్నదో… అట్టి పరమార్థ సత్యమగు బ్రహ్మతత్త్వము మాత్రము సర్వదా అత్యంత నిర్మలమై వెలయుచున్నది. వాస్తవానికి ఈ పృథ్వి మొదలైనవి ఇతఃపూర్వం కూడా స్థితినొంది ఉండలేదు. యథారీతిగా “చిద్రూపమగు బ్రహ్మమే” అంతటా వ్యాపించిఉన్నది. మరిక పృథ్వి మొదలైనవి ”స్మరించువాడు-విస్మరించువాడు”…. అనునవి మాత్రం ఎట్లా ఉంటాయి?

చిన్మాత్రము యొక్క అజ్ఞానమే జగత్తు యొక్క సత్యత్వముగా భ్రమింపజేయుచున్నది. చిన్మాత్రము యొక్క అపరిజ్ఞానమే జగత్ భ్రాంతి రూప కవాటమును తెరచుచున్నది. కార్యసహితమగు అజ్ఞానం అధిగమించబడిన మరుక్షణం ఇక శేషించునదేదియో… అదియే చిన్మాత్రము. అట్లు పరిశేషించుదానిలో పృథ్వి మొదలైనవి సంభవించవు. ఈ విధంగా… ఏది ద్రష్టయో, ఏది దృశ్యమో ఈ రెండూ కూడా శివస్వరూపమగు చిన్మాత్రమే అయి ఉన్నాయి.

అద్దములో ప్రతిబింబము వలె చిన్మాత్రమునందు ఈ జగత్తు భాసిస్తోంది. అయితే అద్దము చిన్మాత్రములో ఒక భేదమున్నది. అద్దములో బాహ్య బింబము ప్రతిబింబముగా భాసిస్తోంది. చిదాకాశమునందు బాహ్యబింబము లేకుండానే జగత్తు స్వయంగా చిదాకాశమునకు అద్వితీయమై బాసిస్తోంది. అద్దంలో వస్తుజాలమంటూ (కనబడుచున్నప్పటికీ) ఏదీ లేదు కదా! అట్లాగే చిదాకాశమునందు ‘జగత్తు’ అనబడునదేదీ ఎప్పుడూ ఎక్కడా లేనేలేదు.

ఏ పదార్థమైతే ప్రమాణసహితమై ఉన్నచో, అది మాత్రమే విచారణచే లభించగలుగుతుంది. విచారణచే లభించేది మాత్రమే ‘పరమార్థ సత్యం’ అవుతుంది. ఇక ప్రమాణ రహితమైనది కేవలం సాపేక్ష స్థితిలో ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ అదంతా ప్రతిభాసమాత్రం అవుతుంది. అటువంటిది త్రికాలలోనూ సత్యమే కాదు. ఒక భావనచే ఉన్నట్లు కనిపిస్తూ మరొక భావన-అభిప్రాయములచే

Page:198

లేదు అని తెలియవస్తూ ఉండగా… అది ఉన్నది ఎట్లా అవుతుంది?… అయితే ఎవరైనా “ఈ జగత్తు మా దృష్టికి ప్రాప్తిస్తూ ఉండగా ఇది లేదనే సిద్ధాంతం మేము ఎట్లా అంగీకరిస్తాం?” అని అంటారేమో?

భవేత్ భ్రమాత్మకమపి కించిత్ అర్థ - క్రియాకరమ్ |

స్వప్నాంగనాపి కురుతే సత్యామర్ధక్రియాం నృణామ్ ॥

స్వప్నంలో కనిపించిన ‘సుందర స్త్రీ’ భ్రమయే అయినప్పటికీ జనులకు వీర్యపాతము జరుగుచుండడం ఉంటోంది కదా! అట్లాగే భ్రమమయమే అయినప్పటికీ ఈ జగత్ క్రియా పదార్థములు అర్థ క్రియా సామర్థ్యములు అగుచున్నాయి. ఈ జగత్తు యొక్క ‘భావన’ అను ప్రకాశము-సత్తయే చిదాకాశము యొక్క ప్రకాశము అయి ఉన్నది. కాబట్టి ఇక నేనెచట? నీవెచట? దృశ్య దృష్టి ఎచట? మహా సముద్రంలో జలమే ఉన్నదిగాని… అనేక తరంగాలు లేనట్లు చిదానందసాగరంలో ఈ నేను-నీవు అనునవన్నీ భ్రమ మాత్రమే! ఒకవేళ ఉండి ఉంటే అవన్నీ కూడా (సముద్ర తరంగాలన్నీ జలమే అయినట్లు) చిదాకాశ స్వరూపమే గాని మరింకేమీ కాదు. మృత్వా పునర్భవనమస్తి కిం అంగనష్టం? మృత్వానచేత్ భవనమస్తి తథాపి శాన్తిః |

విజ్ఞాన దృష్టి వశతో అస్త్యథచేద్విమోక్షః తన్నేహ కించిదపి దుఃఖమ్, ఉదారబుద్ధేః || ప్రియ రామచంద్రా! విజ్ఞాన దృష్టిని అనుసరించి ఆత్మ ఉత్పత్తి నాశరహితమైనదని ఉదార బుద్ధివగు నీకు సుస్పష్టమే అయి ఉన్నది కదా! ఇక “పునర్జన్మ ఉన్నదా? లేదా?” అనే మీమాంసతో పనేమున్నది చెప్పు? ఎందుకంటావా? విను. “మరణానంతరం మరల దేహం ఉత్పన్నమౌతోంది కదా! కనుక పునర్జన్మ ఉన్నది" అంటారా! ఈ దేహం పోవడం వలన గాని, మరొక దేహం రావడం వలన గాని ఆత్మకు హాని ఏమున్నది? మార్పు చేర్పు లేమున్నాయి?

"ఒకవేళ మరణానంతరం మరొక దేహం లేదు” అనదలచుకుంటే అది జగత్హితమగు మోక్ష-శాంత స్థితియే కదా! సర్వ ప్రపంచ లయానంతర శాంత స్థితియే అది కాబట్టి ఇక ఆత్మకు హాని ఏమున్నది?

కాబట్టి ఏ విధంగా చూచినాసరే… ఇక్కడ ఒకింత కూడా దుఃఖం లేకయే ఉన్నది. మూర్ఖునకు ఏ జనన-మరణములు అనుభవములగుచున్నాయో…. అది ఆత్మజ్ఞునకు తెలియడంలేదు. "ఈ మృగతృష్ణా జలంలో నేను చేపనై ఈదుచున్నాను” అనేది మృగతృష్ణ జలభ్రమ లేని వాడికి

అంగీకారం అవదు కదా!

ఓ రామచంద్రా! మనోరాజ్యమున ద్రష్ట స్వరూపమగు ఆత్మయే అనేక రూపములుగా ప్రదర్శితమౌతోంది. అట్లాగే తత్త్వజ్ఞాని యొక్క దృష్టిలో చిదాకాశ స్ఫూర్తియే బాహ్యఅభ్యంతరములలో ‘నీవు-నేను’ ఇత్యాది సర్వజగద్రూపంగా తనయందు తానే స్వప్న సదృశంగా పొందుతోంది అనేది సుస్పష్టమౌతూనే ఉన్నది.

Page:199

  1. వివిధ సిద్ధాంతములు - వాదోపవాదములు

శ్రీరాముడు : మహాత్మా! “ఒకే జలం అనేక తరంగాలుగా కన్పిస్తున్నది! ఇదంతా చిదాత్మ తప్పితే మరింకేమీ కాదు. తదితరమైనదంతా భ్రమయే! భ్రమ తొలగితే అంతా చిదాత్మగానే అగుపించ గలదు”… అని మీరు సిద్ధాంతీకరిస్తూండగా అద్దానిలో సందేహం నాకేమీ అగుపించడంలేదు. అయితే ఇక్కడ వేర్వేరు గురువులు వేర్వేరు సిద్ధాంతాలు ప్రతిపాదించడం, వారి అనుయాయులు ఆ సిద్ధాంతములను ప్రచారం చేస్తూ వాటిని పూర్తిగా నమ్మి ఉండడం ప్రపంచంలో చూస్తున్నాం. కొందరి సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది.

యావజ్జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యురగోచరః ॥ భస్మీభూతస్య శాస్తస్య పునరాగమనం కుతః? I

“ఎంత వరకు జీవితం ఉంటుందో… అంతవరకు సుఖంగా ఉండడమే మన పని. ఒక రోజు చావు రానేవస్తుంది కదా! ఈ దేహం భస్మీభూతమైన తర్వాత మరల రాక ఎచట?" స్వామీ! ఇటువంటి సిద్ధాంతమును నమ్మి అనేక దుఃఖములపాలగుచున్న వారి దుఃఖం శమించేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సంవిత్తు (లేక, ఈ జీవుని ప్రప్రథమ స్వరూపమగు ఆత్మ) తనయందు ఏ నిశ్చయమును ఎట్లు పూర్ణంగా ధరిస్తోందో… ఆయా స్వయం నిర్మిత నిశ్చయమును అట్లే అనుభవించడం జరుగుతోంది. ఏది ఏ భావనచే దర్శిస్తూ ఉంటే అది ప్రాప్తించడం (యత్ భావమ్ తత్ భవతి) అనునది లోకవిదితమైన విషయమే కదా! చిదాకాశము ఆకాశమువలె సర్వవ్యాపకమై శాంతమై ఉన్నది.

  1. జీవుడు వేరు-దేవుడు వేరు, జీవుడూ-జీవుడూ వేరు, మానవజాతి-తదితర జాతులు వేర్వేరు… ఇటువంటి ద్వైతమూ

  2. “జీవుడు దేహంతో పుడతాడు-దేహంతో ఉంటాడు-దేహంతో అంతం. అంతకుముందూ ఏమీలేదు. ఆ తర్వాత ఏమీ లేదు” అనే (చార్వాకుల మత) అభిప్రాయం.

  3. వేదాంతవాదుల యొక్క అనుభవమునకు సుస్పష్టమగుచున్న అద్వైతానుభూతి.

… ఇదంతా కూడా చిదాకాశమే అయివున్నది. చిదాకాశ జగన్నాటక చమత్కారమే!

సృష్టికి పూర్వం మహాప్రళయ స్థితిలో బ్రహ్మమునకు వేరుగా ఏదీ ఎక్కడా లేదు. అట్టి బ్రహ్మమునకు మరొక కారణమూ లేదు. కాబట్టి అకారణమగు బ్రహ్మమే అన్ని రూపాలుగాను, అన్ని భావనలుగాను వ్యాపించి ఉన్నది. ‘మహా ప్రళయం’ అనగా ’సమస్త భావనలు లయించి ఉన్నప్పటి స్వస్వరూప స్థితి”… అని గ్రహించు. అట్టి ఆదిశేష్యమగు స్వస్వరూపాన్ని తిరస్కరించువారు తమ స్వస్వరూపమును తామే ఖండించుకొనువారు అగుచున్నారు.

సమస్తవేద శాస్త్రార్థం యే మహాప్రలయాది చ |

న ఇచ్ఛన్తి తే మహామూఢాః నిఃశాస్త్రా నో మృతా ఇవ ||

Page:200

సమస్త వేద-శాస్త్రముల యొక్క తాత్పర్యమైనట్టి బ్రహ్మమును, సర్వ ఆలోచనలకు ముందే సర్వదా ఏర్పడివున్న ‘మహా ప్రళయానంతర స్వస్వరూప ఆత్మ’ ను, సర్వజగత్ వ్యవహారానుభవాలకు ఆత్యంతికమైన ‘మోక్షము’ అను స్థితిని తిరస్కరిస్తూ, తత్సాధనములను మొదలే పెడచెవిన పెట్టేవారు తత్త్వోపదేశానికి అర్హులే కాదు. అట్టి శాస్త్ర శూన్యులగు మూఢులు యోగిదృష్టిలో జీవన్మృతులే సుమా! ఈ జనులను 3 రకాలుగా విభజించవచ్చు

  1. మూర్ఖులు: వీరు జగత్తునే (దృశ్యమనే) నమ్మి ఉంటున్నారు. “ఈ దేహాదుల పతనానంతరం నా స్థితి-స్వరూపము ఏమిటి?’… అను ప్రశ్నకే రావడం లేదు.

  2. భోగవాదులు :“ఇదిగో! ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి! ఆ తర్వాత ఏమైతేనేం? అప్పుడు చూచుకుందాంలే!” అని తాత్సారం చేస్తూ వీరు ఆత్మ జ్ఞానమునకు సిద్ధమే కావడంలేదు. ఇట్టివారిలో కొందరు “ఆ తర్వాత ఏమీ ఉండదు. శరీరంలో అణువుల కలయిక వలన ‘నేను’ అనునది కనిపి స్తోంది. ఆ అణువులు విడిపోతే ‘నేను’ అనేది ఎక్కడా ఏదీ ఉండదు. ఇంతకు మించి ఏమీ లేదు”… అని (చార్వాకులు) నమ్మి ఉంటున్నారు. ఇక మరికొందరు “దేహం ఉంది కనుక అనుభవిద్దాం. ఆ తర్వాత అంటారా?… అది తెలియదు. తెలుసుకోలేం. కనుక ఎవరూ ఆ ఊసు ఎత్తకండి”… అని నిర్ణయిస్తున్నారు. అట్టి వారిని శాస్త్రములు ‘దేహాత్మ బుద్ధి పరిమితులు’ అని అంటున్నాయి. వారు అట్లు నమ్మి ఉండగా వారికి “దేహమేమిటి? నెనెవరు?” అనే ప్రశ్నయే ఉదయించుట లేదు. కనుక వారికి ఉపదేశించటం కుదరదు. శాస్త్రోపదేశములు అట్టివారి కొరకు కాదు.

  3. జ్ఞాన సిద్ధులు : వీరు నిత్య సత్యమగు ఆత్మను అనుభూతపరచుకొని ఉంటున్నారు! ‘ఈ దేహమును, ఇంద్రియములను ప్రవర్తింపజేసే ప్రత్యగాత్మ చైతన్యము, మనస్సు మొదలైనవన్నీ ‘బ్రహ్మమే’ అనునదే శాస్త్రముల ముఖ్యోద్దేశం’… అని గ్రహించి ఉంటున్నారు. నేను ఈ కనబడే వారు అంతా బ్రహ్మమే అను అనుభూతి కలిగి ఉంటున్నారు. ఉపదేశ క్రమము పై ఇరువురికి ఉద్దేశించబడలేదని గ్రహించు. ఎందుకంటే… మొదటివారు జగత్తును నమ్మి ఉంటున్నారు. రెండవ వారు సర్వము ఎఱిగి ఉంటున్నారు.

మరి ఉపదేశ క్రమము ఎవరికి? ఎవరైతే “నేనెవరు? ఈ దేహమేమిటి? ఈ జగత్తు ఎట్టిది? సత్యమేమిటి? ’నేను… అనుభవము… అనుభవించబడేది’ ఈ మూడు దేనిపై ఆధారపడి వర్తిస్తు న్నాయి?” ఈ రూపమైన అనుమానములు ఉదయించి యున్నాయో అట్టి సత్యాన్వేషకుల కొరకే శాస్త్ర బోధితమైన ఉపదేశ క్రమమంతా ఉద్దేశించబడి ఉంటోంది.

శ్రీరాముడు : వసిష్ఠ మహర్షీ! సర్వులూ సంవిత్ స్వరూపులే కదా! అయితే ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క తీరైన నమ్మిక-భావన-అనుభవముతో ఉంటున్నాడు. ఇదంతా ఎట్లా ఎందుకు జరుగుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :

నిత్యా నిరన్తరోదేతి యాదృశీ సంవిత్ ఆశయే |

భూయతే తన్మయేనైవ పుంసా దేహో-స్తు, మా అధవా ॥

Page:201

‘నిత్యము నిరంజనము’ అయిన సంవిత్తు అంతఃకరణమున ఏ విధంగా (ఏ భావన కలిగి) ఉదయిస్తుందో… అది ఆ విధంగానే అక్కడ అనుభవిస్తోంది. అట్టి అనుభవము ఈ దేహము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అట్లే అంతఃకరణానుసారమే ఉంటోంది. ప్రతి జీవుడు మూడు స్వరూపాలు సర్వదా కలిగియే ఉన్నాడు.

1.ఈ దేహ స్వరూపం; 2. అంతఃకరణ స్వరూపం; 3. ఆత్మ స్వరూపము… ఈ మూడు స్వరూపాలలో మొదటి రెండూ కూడా అపాదితము, భ్రమాత్మకము, అసత్యము, ఏ ఇద్దరి జీవులలో అయినా మనకు కనిపించే భేదమంతా దేహ (మరియు) అంతఃకర సంబంధమైనది, అపాదితం, ఆత్మకు అసంబంధితమైనది కూడా! ఈ బంగారు గొలుసు ఎవరిది - అనే ప్రశ్నకు ఆ సమాధానము నకు బంగారంతో ఏమి సంబంధం? ఇక ఆత్మ స్వరూపమో…

అందరి జీవులలోనూ ఏకరూపమైనది కాబట్టి ‘ఏకము’. సర్వదా ఏర్పడి ఉండేది కనుక… ‘నిత్యము’. ప్రత్యక్షం-పరోక్షం కాదు కాబట్టి ‘అపరోక్షం’. దేహం-అంతఃకరణాల ఉనికి లేములచే మార్పు - చేర్పులు పొందదు కాబట్టి ‘అప్రమేయం’. పరిమితులు లేవు కాబట్టి… ‘అనంతం’. తన సంకల్పముచే ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే పొందుచున్నది కాబట్టి… ‘సత్య సంకల్పి’. దేహమనో బుద్ధులకు సంబంధించిన సర్వ విషయములచే సర్వదా స్పృశించబడకయే ఉంటుంది. కనుక అద్దానికి సుఖ-దుఃఖ ప్రభావం ఉండదు. కనుక ‘నిరతిశయమైన ఆనందము’.

ఈ విధంగా ప్రతి జీవుడు దేహ-మనో-ఆత్మరూపుడై ఉన్నాడు. దేహ-మనోరూపములు గౌణమైనవి. అది సందర్భోచితమైన కాలబద్ధమైన సత్యమేగాని, నిత్యసత్యం కాదు. లోహమునకు నామరూపముల వంటివి. బంగారు అభరణంలో ఆభరణరూపము-ఆభరణ నామము ఆపాదితములే కదా! అందలి బంగారు లోహత్వము మాత్రం నిత్యమైనది. అట్లాగే ప్రతి ఒక్కనిలోనూ ఆత్మత్వము అనునిత్యమై ఉండగా… ఇక దేహ-అంతఃకరణాదులు అపాదితములైనవి.

ఏ జీవుడైతే ఆనందస్వరూపమగు ఆత్మకు విరుద్ధంగా అంతఃకరణ వృత్తిచే “నేను దుఃఖిని” అని ధృఢముగా నిశ్చయించుకొని ఉంటాడో… అతడు అట్టి భావముతోటే తన్మయుడై, ఆవశ్యం దుఃఖము మొదలైనవి అనుభవించుచూ, ఆత్మయొక్క ప్రతిభను ఏమరచుచున్నాడు.

“ఈ జగత్తు చిదాకాశము యొక్క స్ఫురణము మాత్రమే” అని గ్రహించి, నిశ్చయించుకొన్న వారికి ‘కూటస్థము-అద్వయము” అగు అట్టి చిదాకాశము వలన దుఃఖానుభవం ఎట్లా కలుగుతుంది చెప్పు? ధూళి ఆకాశమును అంటుతుందా? స్వప్నాంతర్గత విశేషాలు స్వప్నద్రష్టను స్పృశించగలవా? అట్లాగే జాగ్రత్ అంతర్గత విశేషాలు జ్ఞానిని స్పృశించలేవు. “సత్తు-అసత్తు" అనబడే సత్పదార్థఅసత్ పదార్థములు ఆబాలగోపాలం విదితమైనదే!

“సంవిత్తు సత్యమా? అసత్యమా?”… అని కొందరు మీమాంస చేసుకొంటున్నారు. కొందరు (దేహాత్మవాదులు) “దేహమే సత్యం. ఆ తర్వాత అంతకు ముందు ఇంక ఏ సత్యమూ లేదు” అని బోధిస్తున్నారు.

Page:202

మరికొందరు (సాంఖ్యులు) :“పురుషుడే (పరమాత్మయే) సత్యం. జీవుడు (జీవాత్మ) సత్యం కాదు" - అంటున్నారు.

ఇంకొందరు (మీమాంసకులు): “ఈ జీవుడే సత్యం మరింకేమీ ఎక్కడా లేదు” అంటున్నారు. ఎవరు ఎల్లా ప్రతిపాదించినా… అందరి వాదుల యొక్క అభీష్టము నిర్మల స్వరూపమగు ఆత్మయేనని మాచే గమనించబడుచున్నది. ఆ సంవిత్తు ఎట్లు ఎఱుగుచున్నదో… అట్లే సంవిత్స్వరూపుడగు జీవుడు జగత్తు యొక్క అనుభవము పొందుచున్నాడు. సంవిత్తు సత్యమని అనినా, అసత్యమని అనినా… మొత్తం మీద సంవిత్ యొక్క స్వకల్పనామాత్రం చేతనే ఈ భూ-పాతాళ-స్వర్గ-నరకాది దేహాదులన్నీ అనుభవానికి వస్తున్నాయి. ఆత్మ దేనిని ఎట్లు నిశ్చయిస్తే అది అట్లే అనుభవానికి సత్యమై ప్రాప్తిస్తోంది. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్ట యొక్క నిశ్చయము నుండి బయల్వెడలిన అనుభవపరంపరయే అవటమే ఇక్కడ మనకు దృష్టాంతము. అయినా ఆ స్వప్నద్రష్ట ఆ స్వప్న దృశ్యము ఎక్కడి నుండో వచ్చి అక్కడ కనిపిస్తోందని అనుకుంటున్నాడే గాని “ఈ స్వప్న దృశ్యము నా అంతఃకరణ కల్పనా విభాగంలోనుంచి వచ్చిన స్పురణ మాత్రమే" అని అనుకోవడం లేదు కదా! అట్లాగే జాగ్రత్గా పొందబడేదేంతా జాగ్రత్ ద్రష్ట తన అంతఃకరణము యొక్క జాగ్రత్ కల్పనా విభాగంలోనుంచే బయల్వెడలిన స్ఫురణ మాత్రమే అని గమనించడం లేదు. జ్ఞానదృష్టిచే అది సుస్పష్టమై ఉంటోంది. జ్ఞాన అజ్ఞానములు ఇంత మాత్రమే!

  1. ఆత్మజ్ఞాన ఔషధం

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో (ద్వైతం అద్వైతం-విశిష్టాద్వైతం-నాస్తికత్వం – దేహాత్మవాదం మొదలైన) అనేక సిద్ధాంతాలు, అవి ప్రబోధించే గురువులు ఉన్నారు కదా! అయితే ఆ వివిధ శాస్త్రముల ప్రామాణ్యాలన్నీ సంవిత్తు వలననే ప్రతిష్ఠితం అగుచున్నాయి. సంవిత్తే సర్వులకు పురుషార్థ హేతువు అయివున్నదని గమనించబడుతోంది. అందుచేత సంవిత్తే సర్వవాదుల సిద్ధాంతములను ఉపజీవింపజేస్తోంది. అట్టి సంవిత్తు యొక్క అద్వైత వాద సిద్ధాంతమే సర్వ సిద్ధాంతముల యొక్క ’శిరోమణి’ అని మా ఉద్దేశం. (సంవిత్తు = జీవుడు, అతని అభిరుచి; సత్=ఉనికి; విత్=ఎరుక )

ఇక తదితర సిద్ధాంతములంటావా? ఏ అవిద్య స్వస్వరూపాన్ని ఏమఱింపజేస్తోందో, ఆ అవిద్యయే సర్వ వాదుల సంకల్పాలకు అనుకూలంగా పరిణామం పొందినదగుచున్నది. క్రమంగా వారివారి అనుభవం వారివారి నిశ్చయానుసారం ‘అర్థక్రియ’ యందు ప్రవృత్తమగుచున్నది. అదియే మరొకప్పుడు బోధితమై నిష్కళంకమైన చిదాకాశమును సంతరించుకొని ‘మోక్షభాగిని’ అగుచున్నది.

వేదములు ప్రతిపాదిస్తున్న (తత్త్వమ్ - సో హమ్ - జీవోబ్రహ్మేతినాపరః - శివోహమ్ ఇత్యాది) మహావాక్యములే ఈ మన ఇన్ని రోజుల సంవాదమునకు ప్రమాణం. శ్రీరాముడు : ఈ అవిద్య ఎట్లా పరిణమిస్తోంది? అద్దానికి అంతు ఉండదా?

Page:203

శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్య గాని, అద్దాని ప్రయుక్తం (Appointer) అయినట్టి విక్షేప సంవిత్తుగాని తనంతట తానుగా తొలిగేదేమీ కాదు. అది స్వర్గ-పశు-పుత్రాదులకు సంబంధించిన ఇచ్ఛలు నెరవేరినంత మాత్రంచేత తరిగేది కాదు. రసాయన-మంత్ర- ఔషధాలు మొదలైన ద్రవ్యముల సముపార్జనచే ఉపశమించదు. పవిత్ర దేశ- కాలాదులందలి స్నానాదులచే గాని, ఆయా తదితర తీర్థయాత్రాది కార్యక్రమములచే కూడా తొలగదు. మరి? “ఆత్మజ్ఞానం” చేత మాత్రమే అ విద్య తొలగగలదు. ఆత్మ జ్ఞానముచే అ విద్య సంపూర్ణంగా నశించగలదు. ఇక ఆపై ఇది మరెన్నడూ ఉదయించదు. ఒకవేళ అది ఉదయించినా, మరల అది తొలగడానికి జ్ఞానమే శరణ్యమైయున్నది.

సంవిత్తే ఈ సర్వ దేహులలోని జీవుడు అయి ఉన్నది. అట్టి ఈ జీవుడు ఏ ప్రకారంగా దృఢంగా భావిస్తున్నాడో… ఆ ప్రకారంగా సుఖవంతుడుగా గాని, దుఃఖవంతుడుగా గాని అగుచు న్నాడు. అట్టి జీవుని రూపంగా కనిపిస్తున్న సంవిత్తు యొక్క యథార్థమగు ప్రత్యగాత్మ స్వరూపం ఎఱుగబడటం చేత మాత్రమే సంసారబంధనం మొదలంట ఛేదించబడగలదు. కాబట్టి అట్టి ప్రత్యగాత్మయే ముముక్షువులందరికీ శరణ్యం. అదియే లేకపోతే ఈ జగత్తునందు శిల వలె మూకత్వం, అంధకారం (జడత్వం) మాత్రమే శేషిస్తుంది. మనుజుడు గాఢ నిద్ర వలన జడత్వం పొందుచున్నాడు చూచావా? అట్లే “స్వభావసిద్ధం-స్వప్రకాశం” అయివుండి కూడా జ్ఞప్తి రూపమగు ప్రత్యగాత్మ సంవిత్తు స్వకీయ-అజ్ఞానం చేతనే ఈ దృశ్య ప్రపంచాన్ని పొందుచున్నది. అందుచేత సంవిత్తే లేకపోతే “అనుభవం పొందునది” అనునది ఉండదు కాబట్టి ‘జగత్తు’ అనబడేది ఎవరికి? శ్రీరాముడు : మహాత్మా! కొందరు ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. “ఈ ప్రపంచం దశ దిశలలోనూ అంతం లేదు. ప్రారంభం లేదు. ముగింపు లేదు. కాబట్టి ఈ జగత్తు నాశరహిత మైనది. దీనికి ముందు ఎట్టి భావన మొదలైనవి ఏవీ లేవు. ఈ జగత్తుకు ముందు ఏమి లేదు. ఆ తర్వాత ఏమీ ఉండదు.

దీని తర్వాత ఎటువంటి భావనా ఉండదు. ఈ జగత్తు యొక్క “అత్యంత-అభావన” అనబడు మోక్షము మొదలైనవేవీ లేవు. ఈ జగత్తు వేరుగా ఎక్కడా ఏదీ మరొక సత్యము లేదు. "జీవుడు జగత్తులో జలబుద్భదము వలె జనించి నశిస్తున్నాడు. జగత్తుకు ఆవల జీవునికి ఉనికి లేదు?”

అటువంటి నమ్మిక కలిగివున్న మనుజుని సంసారరోగము శమించడానికి ఎటువంటి యుక్తి అవసరమో అద్దానిని మా జ్ఞానాభివృద్ధి కొరకై ప్రవచించండి.

శ్రీవసిష్ఠ మహర్షి : నీ ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇంతకుముందే చెప్పియున్నాను. “వేదము” తెలియబడుదాని గురించి చెప్పేది! వేదాంత విభాగం? తెలుసుకునేవాని గురించి తెలిపేది.

ప్రతి దేహంలోనూ దేహిగా ఉంటున్నట్టి "తెలుసుకొనుచున్నవాడు” గురించి చెప్పేదే వేదాంత శాస్త్రం కదా! అదియే ‘అధ్యాత్మ శాస్త్రం’ అని, ‘భౌమా విద్య’ అని, ‘ఆత్మ విద్య’ అని శాస్త్ర ప్రతీతి కలదు. శాస్త్రంపై విశ్వాసముంటేనే ఏ శాస్త్రమైనా ఎవరికైనా బోధించగలం. శాస్త్రంపైగాని, తనపై గాని విశ్వాసం లేనివారికి శాస్త్రం బోధించలేదు. అట్లాగే ఆత్మవిద్య (లేక) ’వేదాంతశాస్త్రం’పై విశ్వాసం లేకుంటే బోధించడం కుదిరేది కాదు.

Page:204

నీవు అడిగినట్లు ఆయావాదుల దుఃఖోపశమనం గురించి ఇక్కడ చెప్పుకుందాం. నీవు చెప్పిన వివిధ భావములు గలవారి గురించి కొంత విభజనచేసి కొన్ని విషయాలు చెప్పుకుందాం. వివిధ భావికులు -

  1. దేహాత్ అతిరిక్త చేతనాత్మవాది: కదిలించేది చైతన్యం, కదిలించబడేది దేహం - ఈ

దేహం జడం - - దీనికి వేరైన చైతన్యం ఉన్నది. అట్టి చైతన్యం అనుభవించబడానికి, గ్రహించడానికి ఈ దేహమే ‘అడ్డు’ అగుచున్నది.

  1. నిత్య సూక్ష్మ దేహాత్మవాది : ఈ జీవుని దేహరూపం వాస్తవం కాదు. ఈతనికి మరొక దేహం ఉన్నది. అదియే ‘సూక్ష్మదేహం’. సూక్ష్మదేహం నిత్యమైనది. ఈ భౌతిక దేహం అనిత్యమైనది. అనిత్యమైన భౌతికదేహం (స్థూల దేహ భావనను) అధిగమించి నిత్యమైన సూక్ష్మదేహ భావన’నను సంతరించుకోవడమే జీవిత లక్ష్యం”.

  2. స్థూల దేహాత్మవాది : “కనబడే ’స్థూలదేహం’ వదలి (‘లేదు’ అని చెప్పి) ఎవరికీ కనబడని సూక్ష్మ దేహమేదో ఉందని అనడం తప్పు. ‘జీవుడు’ అనగా దేహమే! దేహం తర్వాత దేహీ లేడు, ఇంకేమీ లేదు”.

  3. శుద్ధ సంవిదాత్మవాది: “ప్రతిజీవుడు శుద్ధ సంవిత్ ఆత్మస్వరూపుడే”… అను నిశ్చయమును పెంపొందించుకోవడమే జన్మాదుల సార్థక్యం. (సత్ = ఉనికి - - నేను ఉన్నాను కదా!’అనే అనుభూతి, విత్ = ఎఱుక, ఆత్మ : = స్వస్వరూపము - దేహి) 5. అజ్ఞానావృత సంవిదాత్మవాది : శాస్త్రములు చెప్పే విధి-విధానములు, సద్గుణాశ్రయము మొదలైనవి జీవుని తన యొక్క శుద్ధ సంవిత్ ఆత్మ స్వరూపాన్ని సుస్పష్టపరచుకోవడానికి ఉపకరించే సహకారిక ఉపాయములు అని ఈ సాధకుడు ఉద్దేశించి ఉండాలి. "అజ్ఞానం తొలగాలి. అది తొలగితేనే జీవునికి తన శుద్ధ సంవిత్ ఆత్మ స్వరూపం సుస్పష్ట మౌతుంది”… అను ప్రయత్నంలో ఈతడు సంశుద్ధి పొంది అజ్ఞానం తొలగించుకుంటున్నాడు.

  4. సంవిత్ అపలాపి : "సంవిత్ అనేదేదీ లేదు. అటువంటిది ఒకటి ఉన్నది -

తలచడమే భ్రమ.”

ఇట్లా ఆయా వాదములు చేయువారు ఉన్నారు. దేహాత్ అతిరిక్త చేతనాత్మవాది క్రమంగా మరికొంత విచారణాదులచే ఆత్మతత్త్వమును తప్పక అనుభూతపరచుకోగలడు. ఎందుకంటే ఈ దేహాది ఆకారరూపమగు ఉపాధి యొక్క భావనావిలయముచే క్రమక్రమంగా అతడు పరమాత్మతోటి “ఏకీభవము”ను పొందుతాడు. ఇందులో సంశయం లేదు.

ఇక నిత్య సూక్ష్మ దేహవాది అంటావా? నాశనవంతమగు స్థూల దేహమును (అన్నమయ దేహమును) నమ్మి “ఇదియే నేను” అని అనుకొంటే దుఃఖంగాని “నాశన రహితమగు సూక్ష్మదేహమే నేను” అని తలచుచున్నప్పుడు ఇక దుఃఖ మేమున్నది? కాబట్టి క్రమక్రమంగా అతడు కూడా మరికొంత ప్రబోధితుడై వాస్తవమగు ఆత్మతత్త్వమును అతిత్వరగా పుణికిపుచ్చుకోగలడు. ఇక "స్థూల

Page:205

దేహాత్మవాది” అంటావా? ఆయన “అవయవ సహితమగు పదార్థం నశిస్తుంది“ అనే న్యాయమును ఇంకా విచారణ చేయలేదు. అవయవముల కంటే ముందే ఉండి ఉండి, అవయవములను నియామకం చేసే తన యొక్క స్వరూప విభాగమును ఇంకనూ తగినంతగా పరిశీలించలేదు. కానీ కాలక్రమంగా అతడు కూడా ఎప్పుడో “అవయవి-అవయవములు-అవయవవినాశనం-అవయవ ఉత్పన్నం” అనే విశేషాలు విచారణ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా సత్యము సర్వమునూ జయిస్తుంది కదా! ‘దేహ వినాశనము’ అనే మార్గంలో విచారణ కావించుచూ ఉండగా… అతనికి కూడా “దేహమునకు భిన్నంగా ‘దేహి’ అనే ఆత్మ ఉన్నది” అనే చైతన్యాత్మ బుద్ధి జనించగలదు. కాబట్టి "అతడు చెడిపోవుచున్నాడే!”… అనే నిరుత్సాహంగాని, అతని పట్ల అయిష్టతగాని ఉండవలసిన అవసరమేదీ జ్ఞానికి అగుపించదు.

“శుద్ధ సంవిదాత్మవాది” విషయానికి వస్తే "ఈ కనబడే ప్రతిజీవుడు వాస్తవానికి శుద్ధ సంవిత్స్వరూపుడే - అనే విషయం ఎఱిగియున్న వాడు జ్ఞాని. ఇంకనూ నిర్మల బుద్ధి సంపాదించి ఉండకపోవడం చేత అట్లు ఎఱుగనివాడు అజ్ఞాని.

జ్ఞాని-అజ్ఞాని కూడా సర్వదా నిర్మలాత్మ స్వరూపులేగాని మరింకేమీ కాదు”… అని నిర్ణయించుకొని ఉన్నవాడు. సర్వదా సర్వత్రా ఈ జగత్తును ఒక ’లీల’గా గాంచుచూ ఉంటాడు. ఆ తర్వాత క్రమంగా “మమాత్మా సర్వభూతాత్మా”… నా స్వరూపమే తదితర సర్వజగత్ జీవాదులు”… అను సర్వాత్మత్వం సంతరించుకొని అనిర్వచనీయాత్మానందం అనుభవించగలడు.

ఇక “అజ్ఞానావృత సంవిదాత్మ“ అంటావా? అతని “సంవిత్తు” (ప్రజ్ఞ) ఇంకా “తత్త్వజ్ఞానం” చే తగినంతగా శుద్ధము చేయబడలేదు. ఇంకనూ కలుషితమయ్యే ఉన్నది. అందుచేత దేహం ఉన్న ప్పుడు, లేనప్పుడు కూడా అతని పట్ల సంసారము ఆవశ్యము కొనసాగుచునూ ఉంటోంది. అయినా ఫరవాలేదు. ఒక్కొక్క జన్మలో ఆయా సాధనల ద్వారా సంవిత్తు శుద్ధమగుచుండగా క్రమ క్రమంగానో, కాకతాళీయంగానో అత్యున్నతమైన పరమార్థజ్ఞానం వికసించగలదు. కనుక అతడు ఒకప్పుడు శ్రేయమును గాంచుచున్నాడు. బుఱ్ఱ పదును పెడుచున్న కొలదీ అందరిదీ సద్గతియే కానున్నది. శ్రీరాముడు : మమాత్మా! ”మరణానంతరం ఇక ఏమీ ఉండదు. ‘ఆత్మ’ అనిగాని ‘సంవిత్తు’ అనబడునది గానీ ఏమీ ఉండదు. “ఈ జీవుడు మరణం తర్వాత ఏ రూపంగానూ ఉండడు" - అను నిశ్చయము కలిగి ఉన్నవాడు మరణానంతరం ఎట్టి స్థితిని పొందనున్నాడు.

శ్రీ వసిష్ఠ మహర్షి :“ఏది ఎట్లు భావన చేస్తే అది అట్లే సిద్ధిస్తుంది. (యత్ భావమ్ తత్ భవతి)” అనునది ఈ మనస్సు యొక్క స్వభావము అయివున్నది. కనుక “మరణానంతరం ఆత్మగాని, ఏమీగానీ ఉండదు. తదనంతరమైన ‘సంవిత్తు’ అనే ఉనికిగాని, స్థితిగాని ఉండదు” అనే దృఢాభిప్రాయం పెంపొందించుకొన్న జీవుడు అట్టి బోధ యొక్క ప్రభావం చేత దేహపతనానంతరం చిరకాలం విషయజ్ఞానరహితుడై, జడప్రాయుడై ఉండడం జరుగుతోంది. జీవిత పర్యంతం దృఢపడినట్టి అట్టి ”నేను లేను” అను ఆత్మ తిరస్కారపూర్వకమైన జడాత్మకజ్ఞానంచే “గాఢసుషుప్తి

Page:206

సదృశమైన ఆ మృత్యుస్థితినే మోక్షముగా గాంచుచూ ఉంటాడు. కొందరి సిద్ధాంతము ప్రకారం (నైయాయికులు) ‘ముక్తి’ అనగా అట్టి విషయరహితమగు గాఢ సుషుప్తావస్థ మాత్రమే! అయితే నిరతిశయానందానుభవరూపమగు శ్రేయమును వారు గమనించటంలేదని మేం భావిస్తున్నాం. మరికొందరు “శుద్ధ సంవిత్ రూపమగు ఆత్మ అనేది అసంభవం అటువంటి దేదీ లేదు. ఉండ జాలదు”… అనే శూన్యవాదులు కూడా దేహపతనానంతరం జడ స్వరూపులై మహా తపస్సుచే ఆవరించబడినవారై దుర్భేద్యమైన అంధకార బంధురత్వం పొందుచున్నారు. అయితే సత్యమే అంతటా జయించనున్నది. కాబట్టి (సత్యమేవ జయతే) సత్యానుభూతి పర్యంతము పునఃపరిశీలన వారికి అనివార్యమగుచున్నది.

క్షణికవాదులు :“ఈ జగత్తు క్షణికం, స్వప్నపురం వంటిది” అని నమ్ముతూ, అంతకుమించి ఏమీ లేదని, ఏమీ ఆలోచించవద్దని బోధిస్తున్నారు. అట్టి పరిమిత దృష్టిని నమ్మువారి సమస్త వ్యవహారాలు సుఖ దుఃఖ మిశ్రితంగా కొనసాగుచూనే ఉంటున్నాయి. క్షణికమైనవాటికి ఆధారంగా సర్వదా వేంచేసి ఉన్నట్టి అనుక్షణికమగు "స్వస్వరూపాత్మ” కు సంబంధించిన సమాచారం పరిశీలించి, అప్పుడు నిర్ణయించుకోవలసినదిగా వారికి మా మనవి.

స్థైర్యవాదులు : ఈ జగత్తు శాశ్వతం-మనం అశాశ్వతం" అని బోధిస్తున్నారు. క్షణికవాదుల యొక్క స్థైర్యవాదుల యొక్క, సుఖదుఃఖములు సమానంగానే ఉంటున్నాయి. ఎందుకంటే… ఉభయులకు జగత్ వ్యవహారబుద్ధి ఉన్నంతవరకూ పదార్థములు స్థిరం అనుకొంటే ఏమున్నది? అస్థిరం అనుకుంటే ఏమున్నది? రెండూ ఒక్కటే అగుచున్నది. “స్వస్వరూపం యొక్క స్థిరత్వం గమనించండి”… అని వారికి గుర్తు చేస్తున్నాం.

శ్రీరాముడు : మహర్షీ! జ్ఞానుల దృష్టిలో ఈ పృథ్వి మొదలైన పంచభూతాత్మకమైన స్థూల పదార్థములు, సూక్ష్మ పంచమహాభూతములు స్థిరములైనవా? క్షణికములైనవా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ పృథ్వి మొదలైన స్థూల పదార్థములుగాని, సూక్ష్మ పంచభూతములు గాని స్థిరములైనా, అస్థిరములైనా జ్ఞానులకు ఆ విషయంలో విశేషమైన పట్టుదల ఉండదు. ఎందుకంటే, అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో… అంత వరకు ముత్యపు చిప్పలో వెండి కనబడునట్లు ఈ అధ్యస్తమయిన జగత్తు కనబడుచూనే ఉంటుంది. "ఈ ముత్యపు చిప్పలో వెండి ఎప్పుడు బయలుదేరింది? ఏ మార్గంలో వచ్చి ఇక్కడున్నది”… అనే వాగ్వివాదాలన్నీ ముత్యపు చిప్పలో వెండి ఏదో ఉన్నదని నమ్మువారికే ఉంటాయి. “ముత్యపు చిప్పలో వెండి ఉండజాలదు. వెండి వలె కనిపించేది వెండి కాదు”… అని గ్రహించిన తర్వాత ఇక, “ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది?” అనే వాదోపవాదాలు ఏమి ఉంటాయి? జ్ఞానులకు ఈ సమస్తం కూడా అధిష్ఠానమగు చైతన్యం యొక్క ప్రకాశమే అయివున్నది.

సంవిత్తు ఏ క్షణంలోనూ క్షణికం కాదు. ఈ కాల రూప అసత్తుయగు ‘క్షణికం’ అనబడేది, దేశరూప అసత్తుయగు ‘జడత్వం’ అనబడేది సంవిత్తు (ఆత్మ) యొక్క అనుభవములోని ఒకానొక

Page:207

విభాగము మాత్రమే! అందుచేత కాలమును దేశమును అంగీకరించి "అవి క్షణికమా? అనుక్షణి కమా?” అని వాదోపవాదములు చేసే వారితో ఆత్మజ్ఞులకు సంభాషణ కుదిరేది కాదు.

వేదాంత ప్రవచనం :“చైతన్యము యథాతథంగా ఉంటూ ఉండగా, అద్దాని యొక్క వివర్త రూపమే ఈ జగత్తు" అని ఎంచువారు పురుషులలో ఉత్తములు, వందనీయులు కూడా! అట్లా కాకుండా “శరీరాదుల నుండి అట్టి శరీరాదులు వికారంచే చైతన్యం ఏర్పడుతోంది” అని తలచువారి (చార్వాకుల)తో వాదోపవాదములు చేసి కాలం వృథా చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? చిద్రూపో జీవబీజౌఘ ఆకాశ కృమిజాలవత్ |

ఊర్థ్వమ్ తిర్యక్ అధో యాతి పూర్యమాణఇవ స్వయమ్ II

చిద్రూపుడు, సర్వజీవుల బీజభూతుడు అయిన హిరణగర్భుడు ‘జీవుల గుంపుల’ వలె ఒప్పు చున్న ఈ సర్వజీవరాశుల రూపమును స్వయంగా ధరిస్తున్నాడు. నీళ్ళతో నిండుగా ఉన్న పాత్రలో గల క్రిమి జీవులు అటూ ఇటూ పరిభ్రమిస్తాయి చూచావా? అట్లాగే ఆ చిద్రూపుడగు హిరణ్య గర్భుడు ‘సృష్టి’ అనే పాత్రజలంలో అనేకరూపాలు ధరించి పైకి-క్రింది -ప్రక్కలకు పరిభ్రమిస్తున్నాడు.

అనగా… “హిరణ్యగర్భుడు అనబడే చిదాభానునిచే ఈ ’వివిధ జీవుల సమష్టి రూప కర్తృత్వం’ అనబడేదంతా తనలో ఈ ‘సృష్టి’ రూపంగా ఎఱుగబడుచున్నది. ఈ ఈ వివిధ కర్తృత్వ రూపాలన్నీ అతడు తనలో స్వయంగా అనుభవించుచూ ఈ విధంగా సంసారమున తిరుగాడుచున్నాడు.

ఈ జీవుడు చిద్రూపుడే! హిరణ్యగర్భుడూ చిద్రూపుడే!

“ఎవడు ఏ విధంగా దేనిని ఎఱుగుచున్నాడో… అతడు అద్దానిని ఆ విధంగానే పొందుచు న్నాడు” అనేది ఆబాలగోపాలానికి విదితమే కదా! ఉదాహరణకు "ఈ క్రియా వ్యవహారములన్నీ నేను నిర్వర్తించిరావడం నేను చేసిన పాపం”… అనుకుంటే అట్లే అది శిక్షానుభవంగా అనిపిస్తూ, పరిణమిస్తుంది. ఈ “నిర్వర్తించే క్రియలన్నీ పరమాత్మ సేవయే”… అనుకుంటేనో? సాధనరూప సేవ అగుచున్నది. “ఇది పీడ” అనుకొంటే అట్లే పీడగానే అనుభవం అగుచున్నది. క్రీడ అనుకుంటే క్రీడయే అగుచున్నది.

అట్లాగే… చిద్రూపుడగు ఈ జీవుడు దేనిని ఏ విధంగా ఎఱుగుచున్నాడో… అది ఆ విధం గానే శీఘ్రంగా పొందబడుచున్నది. ‘ఇట్లు ప్రాప్తించడం’ అనబడేది ఈ జీవునికి, ఆ హిరణ్యగర్భునికి ఒక్క తీరుగానే అగుచున్నదని గ్రహించు. ఆకాశంలో పొగ రకరకాల ఆకారాలుగా, రూపాలుగా అగుచూ కనిపిస్తుంది చూచావా? మహా సముద్రంలోని జలం అనేక రూపాలైన తరంగాలుగా, ఆవర్తవృత్తులుగా అగుపిస్తోంది కదా! అదే విధంగా చిదాకాశమునందు సంసారం యొక్క వివిధ వైచిత్రమంతా సంభవిస్తోంది. స్వప్నమున సంవిత్తే (చిదాకాశమే) స్వప్న ద్రష్టకు మహానగరంగా కనిపిస్తోందే! అట్లాగే చిదాకాశమే సృష్ట్యాది నుండి ఇప్పటివరకూ జగద్రూపంగా స్థితినొంది ఉంటోంది. ఇక ఈ సృష్టికి సహకారి కారణాలు ఏమిటంటావా? స్వప్నంలో ఎటువంటి సహకారి కారణాలు లేకుండానే స్వప్న జగత్తంతా సంభవిస్తోంది కదా! అట్లాగే, సృష్ట్యాది యందలి జగతిస్థితిలో

Page:208

ఈ పృథ్వి మొదలైన పంచభూతాలన్నీ ఎటువంటి సహకారి కారణాలు లేకుండానే సంభవిస్తు న్నాయి. స్వప్నంలో ఇల్లు, వాకిలి, సంఘటనలు మొదలైనవన్నీ అనుభవమగుచున్నట్లే ఈ ‘జగత్తు’ అనే స్వప్న నగరంలో ఇవన్నీ పరిపుష్టమై పొందబడుచున్నాయి.

వాస్తవానికి నీవు నేను, ఈ తదితర సర్వజనులు అందరూ కూడా ద్వైత ఏకత్వ వర్ణితమైన చిదాకాశ రూపములే అయివున్నాయి. అట్టి చిదాకాశమునకు మరొక దోషము, దోషాపహరణము మొదలైనవి ఎక్క డుంటాయి? ఏదేది భావిస్తోందో, భావించబడుతుందో… అదంతా చిదాకాశమే అయివున్నది. మనమంతా ఏది అయివున్నామో అట్టి చిదాకాశము త్రివిధతాప రహితమై, ఆహ్లాదభరితమై, అంతటా నలువైపులా పూరించి ఉన్నది. అట్టి చిదాకాశ ప్రకాశము యొక్క ఒకానొక స్పురణయే ఈ జగత్తు.

సృష్టికి పూర్వం చిదాకాశమే ఉన్నది. ప్రళయానంతరం కూడా చిదాకాశమే ఉండటం జరుగుతోంది. మధ్యలో కనిపించే ఈ సృష్టి చిదాకాశమే అయివున్నది. బ్రహ్మమే ఇట్లు నిజచైతన్యము యొక్క ‘పరిచ్ఛిన్న-అపరిచ్ఛిన్న’ రూపములచే, వికాస సంకోచముల ద్వారా స్వయముగా స్వప్నమువలె ఈ జగద్రూపంగా ఉదయించడం, అస్తమించడం నిర్వర్తిస్తోంది.

అందుచేత… బ్రహ్మపదమును పొందిన మహాత్ములు ‘శరత్కాలాకాశం’ లాగా నిర్మల చైతన్య రూపమును సంత రించుకొనియే వర్తిస్తూ ఉంటారు. అందుకు భిన్నమైన దృశ్యరూపమును పొందకయే క్రీడిస్తూ ఉంటారు.

నిర్ మానమోహా, జిత సంగ దోషాః, ప్రవాహ సంప్రాప్త నిజార్థభాజః |

తిష్ఠన్తి కార్య వ్యవహార దృష్టా, నిరామయ యస్త్రమయా ఇవైతే” ॥

ఓ రామచంద్రా! ఎవరైతే అభిమాన మోహాదులను, సంగదోషములను జయించివేసి ప్రవాహ పతితమైన ఆయా కార్య-వ్యవహారాలను వ్యథారహితులై నిర్వర్తిస్తూ ఉంటారో… అట్టి మహానీయులు క్రమక్రమంగా జీవన్ముక్తత్వము సంతరించుకొనగలరు. ఇక వారు ఇతరుల కార్యవ్యవహార దృష్టియందు పురుష ప్రతిమ (పురుషాకారశిల్పం) వలె నిర్వికారులై వెలయుచూ ఉంటారు. అట్టి మహానీయుల దర్శనమే మహాద్భాగ్య ప్రదమైనది.

  1. సర్వత్రా సమదర్శన ప్రయోజనం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “సర్వత్రా చిన్మాత్రమే ఆవరించి ఉన్నది”… అని మనం ఇప్పటికే అనేకసార్లు సిద్ధాంతీకరించుకొనివున్నాం కదా! ఈ పురుషుడు స్వయంగా చిన్మాత్రమే అయి ఉన్నాడు. అట్టి చిన్మాత్రమే నానా విధ కల్పితములగు సుదీర్ఘ-క్షణిక రూపముగాను, భయశోకాది రూపాలుగా కూడా స్థితి నొందివుంటోంది. చిన్మాత్రము తప్ప అన్యంగా ఎక్కడా ఏదీ లేదు, ఉండజాలదు. సర్వ భావ- అభావాలు శుద్ధ చిన్మాత్రం యొక్క విభూతులే సుమా!

Page:209

అట్టి చిన్మాత్ర చైతన్యము ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఇక ’ద్రష్టదృశ్యము’ మొదలైనవన్నీ అద్దానిని యొక్క వివర్తరూపములు మాత్రమే! మరిక "గ్రహణముతాజ్యము” …అనే బుద్ధి వ్యవహారమంతా ఎక్కడున్నది?

వేర్వేరు సిద్ధాంతములు - “అసంగము”

క్షణిక జ్ఞానవాదులు : వీరి సిద్ధాంతం ప్రకారం, “ఈ జగత్తు క్షణక్షణం ఏదో మార్పు చెందుతూనే ఉన్నది. కనుక అనుక్షణిక పరిణామ స్వరూపి అయిన ఈ జగత్తును ఎవరూ ఇది ఇట్టిది మాత్రమే అని చెప్పటానికి వీలే లేదు.”

వీరి సిద్ధాంతము ప్రకారం మనం చూచినా కూడా, ఈ జగత్తు సర్వదా క్షణక్షణం నిర్విషయమే అయి వున్నది కదా! కాబట్టి ఇక రాగద్వేషములకు తావు ఎక్కడిది? వారు “సంవిత్తు (ఆత్మ) నిత్యము" అని ఒప్పుకోవడం లేదు. కనుక (బృహస్పతి మతాచార్యుల సిద్ధాంతమైన) క్షణికవాదం ప్రకారం కూడా అసంగమే ప్రబోధించబడుతోంది కదా!

జగత్ స్వప్న సిద్ధాంతము - ‘స్వప్నము’ అనేది ఆ స్వప్న ద్రష్ట యొక్క వివర్త రూపమే కదా! అట్లాగే “చిదాకాశము యొక్క వివర్తరూపమే ఈ జగత్తు“ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా “చిదాకాశ స్వప్న సదృశజగత్తు” అనే అభిప్రాయం అనుసరించి కూడా ఈ జగత్తులో ఇష్టా ఇష్టములు ఉండవలసిన పనేమి? స్వప్నంలో కనిపించే వస్తువులు స్వప్నాంతంలో మటుమాయ మవుతాయి కదా! తప్పకుండా మటు మాయమయ్యే వస్తువుల గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? కనుక ఈ సిద్ధాంతమును అనుసరించి కూడా ఈ జగత్తుపట్ల అసంగమే ఉచితం.

అణు సంయోగ వియోగమాత్ర జగత్ ఇదే విధంగా “జగత్తు అణువుల కలయిక మాత్రమే” అని నమ్మేవారు కూడా, అణువుల సంయోగ, వియోగమగు ఈ జగత్తు యొక్క ఉనికి లేములపట్ల ‘అసంగమే ఉచితం’ అని ఉద్దేశిస్తున్నట్లు మాకు కనిపిస్తోంది.

ఏ విధంగా చూచినా ఈ జగత్తు పట్ల అసంగమే ఉచితం ’ఇది త్యజించ తగినది. ఇది గ్రహించవలసినది“ అనే రూపంగాగల ఏ వికల్పధ్యాస కనిపిస్తోందో, అది కూడా ”చిదాకాశమును చిదాకాశమే ఆ విధంగా గాంచుచున్నది”…. అనునదే మా ఉద్దేశం. అవగాహన కూడా!

అనగా… నిర్మలమగు చిదాకాశమునందు ఈ జగత్తు నిర్మల చిదాకాశముగానే భాసిస్తోంది. కాబట్టి ఇక “ఇది మాకు ఇష్టం అది మాత్రం మాకు ఇష్టం కాదు”అను దృష్టి ఎక్కడ? ఎందుకు? ఈ మనుష్యులు, ఈ దేవతలు, ఈ నాగులు, ఈ స్థావర జంగమములు-ఇవన్నీ కూడా “పరమాత్మ” అనబడు సంవిత్ మహా సముద్ర జలంలోని తరంగరూపాలే అయి ఉన్నాయి. ఆ సంవిద్రూప మహాసముద్ర తరంగాల యొక్క ఆవర్త వృత్తులే ఇక్కడి జనన-మరణాలు కూడా! ఓ రామచంద్రా! నేను, నీవు, సమస్తజీవులు సంవిదాకాశ రూపులమే అయి ఉన్నాం. మనం ఎవరం కూడా ఎప్పటికీ మరణించని వారమే అయివున్నాము. చిదాత్మకు మరణమెక్కడ ఉంటుంది. చెప్పు?

అంతేకాదు… సర్వము సంవితమయమే కాబట్టి సంవిత్తు దేనికీ జ్ఞేయం (తెలియబడునది)… అవదు. అది ‘తెలియుట’ అనే సంవేద్యత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ అద్దానిలో ద్విత్వ - ఏకత్వములు

Page:210

ఎట్లా ఉండగలవు? ఓ రామచంద్రా! సంవిత్తు (లేక) చిదాత్మకు వేరుగా మరి ఏ సద్వస్తువు ఉన్నదో చెప్పు? ఒకవేళ సంవిత్తే మరణిస్తుందని అనుకుంటే మరి నీవు-నేను ఎలా జీవిస్తున్నాం?

సౌగతవాదులు :“పరమాత్మ ఎక్కడో ఉన్నారు" అని చెప్పువారు.

లోకాయతవాదులు “ఈ లోకమే ఉన్నది ఇందుకు వేరైన పరమాత్మ ఎక్కడా లేడు” అని

చెప్పేవారు.

ఇటువంటి సర్వుల అభిప్రాయము సంవిత్ గురించే! అంతకుమించి వారు దేనిని నమ్ము చున్నారు? చిదాకాశమే వారి వారి అభిమతానుసారంగా ఆయా విధాలుగా అనుభవగతమౌతోందని

గమనించు.

అట్టి సంవిద్రూపాకాశమునే కొందరు ‘బ్రహ్మం’ అంటున్నారు. మరికొందరు ‘విజ్ఞానము’ అని పిలుస్తున్నారు. ఇంకొందరు ‘శూన్యము’ అని, ఇంకా కొందరు ‘కల్పన లేక మత్తు శక్తి వలె సృష్టిలోని అంతర్లీన శక్తి" అని, పరిణతి చెందిన పంచభూతముల “ధర్మము” అని, ఇంకా… పురుషుడు అని, ’చిదాకాశము’ అని, ‘శివుడు’ అని ‘ఆత్మ’ అని చెప్పుచున్నారు. ఈ విధంగా ఆయా వాదులచే అనేక ప్రకారములైన వికల్పములు చెప్పబడినప్పటికీ… ఆ చిన్మాత్రము మరొక రూపమేదీ పొందకయే ఉంటోంది. ఆ సర్వ వికల్పములకు, తన ఆయా కల్పిత రూపములకు తానే సాక్షి అయి, స్వయంగా తానే వాటి నన్నిటినీ ఆయారీతులుగా ఎఱుగుచున్నది. తాను సర్వదా నిర్వికల్పమే అయివున్నది. ఓ రామచంద్రా! ఈ నా అవయవాలు చూర్ణమై పోవుగాక! లేదా… మేఱుపర్వతము వలె సువిశాలముగా అగుగాక! చిన్మాత్రమే శరీరముగా గల నాకు హానిగాని, వృద్ధిగాని లేదు. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు మొదలైనవారు మరణించి ఉండవచ్చుగాక! కానీ, వారి ఆత్మ రూపమగు చైతన్యము మాత్రం మరణించడం లేదు. చైతన్యమునకే మరణం ఉంటే అది మరల పునఃజన్మ పొందేదికాదు. మన ఈ దేహములు మరణించిన తర్వాత కూడా మన ఆత్మ చైతన్య

రూపం నశించదు.

“దేహం రావడం, దేహం పోవడం” ఇవి దేహ ధర్మాలు గాని, ఆత్మ ధర్మాలు కాదు. ఎక్కడన్నా “ఆకాశం నశిస్తుంది అనేది కుదురుతుందా? కుదరదు. ఇక ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనట్టి ఆత్మ చైతన్యానికి మరణం ఎక్కడిది?

న జాయతే, న మ్రియతే సంవిదాకాశమక్షయమ్

భవేత్ కథం కథయ కిం కిలాకాశస్య సంక్షయః?

ఆకాశం ఎప్పుడూ నాశరహితమే! దానికి జన్మమేమిటి? మరణమేమిటి? అట్లే చిదాకాశము సర్వదా నాశరహితమే! దానికి జన్మించడం, మరణించడం ఉండదు. ఈ విధంగా చైతన్యమునకు ‘నాశనం’ అనేది అసంభవం. ఈ జగత్తు అంటావా? ఈ జగద్రూపస్పురణ కూడా చిదాకాశమే! ఉదయాస్తమయ రహితమై, నాశనరహితమై చిదాకాశమే తనయందు తాను ఈ జగద్రూపమున స్థితి నొందియున్నది. ఆదిమధ్యాంత రహితమైన చిదాకాశము స్ఫటికంలో పర్వతంలాగా ఈ

Page:211

జగత్తును తనయందు ఒకప్పుడు ధరించి ఉంటోంది. మరల మరొకప్పుడు “నిజతత్త్వ సాక్షాత్కారం”చే దగ్ధం చేసి, నిర్మలమగు తన స్వరూపమందు తానే వెలయుచున్నది. రాత్రియందు ఏర్పడిన అంధకారం సూర్యోదయం కాగానే క్రమంగా నశిస్తుంది చూచావా? "నేను జీవుడను, బద్ధుడను” అనబడే అజ్ఞానాంధకారం ఆత్మజ్ఞాన ప్రకాశము యొక్క ప్రవృద్ధిచే క్రమక్రమంగా తొలగిపోతూ వస్తుంది.

సముద్రం స్వయంగా తనయందు “ప్రవాహం-తరంగం-ఫేనము (నుఱుగు) - బుద్బుదము(బుడగ) -ఆవర్తము” కలిగివుంటుంది చూచావా! అలాగే చిదాకాశము తనయందు జగత్ భావన అనే అవయవమును ధరించి ఉంటోంది. ఈ పురుషుడు (లేక జీవుడు) చిన్మాత్రమే అయివున్నాడు. అతడు ఆకాశమువలె సదా, సర్వదా నశించకయే ఉన్నాడు. కాబట్టి "నేను నశించుచున్నాను” అని తలచి దుఃఖించటమనేది వ్యర్థమైన పని మాత్రమే!

శ్రీరాముడు : ఈ జనులకు మరి శోకము ఉండకుండేది ఎట్లా? మృత్యుభీతి తొలిగేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ జనులారా! ఈ నా మాటలు శ్రద్ధగా వినండి.

దేహాత్ దేహాంతర ప్రాప్తో నవయేవ మహోత్సవః మరణాత్మని కిం మూఢా, హర్షస్థానే విషీదథ?

నాయనలారా! ‘మరణము’ అనేది శిథిల దేహం త్యజించడానికి, నూతన దేహం ధరించడానికి కారణభూతం అవుతోంది కదా! అందుచేత మరణము నూతనమైన ఉత్సవమే అవుతుంది. మరింక మూఢత్వం చేత కాకపోతే… శిథిల దేహం తొలగుచున్నప్పుడు సంతోషించాలిగాని, ఈ జనులు దుఃఖిస్తున్నారేమిటి?

మృత శ్చేత్ న భవేత్ భూయః, సో అత్రాపి ఉపచయో మహాన్,

భావ - అభావ గ్రహోత్ సర్గః జ్వరః ప్రశమమ్ ఆగతః!

“ఈ దేహం పోతే మరల దేహం రాదేమో? అందుకని దుఃఖిస్తున్నాం”… అని ఎవరైనా అంటారా? ఒకవేళ మరణానంతరం మరల జన్మయే లేదంటే, అది ఇంకా మంచిది. అప్పుడు మహత్తరమైన పురుషార్థం చేకూరినట్లే అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ “ఉత్పత్తి నాశనభావ-అభావ-గ్రహణ-త్యాగ” మొదలైన రూపములుగా ఉండే ‘సంసారము’ అనే రోగము ఉపశమించినట్లే కదా! కాబట్టి ”మరణానంతరం దేహం వస్తుంది" అన్నా, లేక “ఇక దేహమే సంభవించదు” అని తలచినా… ఉభయత్రా దుఃఖమునకు కారణమే లేదు.

మరణం జీవితం తస్మాత్, న దుఃఖ న సుఖం యతః

నాస్త్యేవై తత్ చిదాకాశః కిలేత్థమభిజృంభతే I

ఈ విధంగా "ఈ జనన మరణములు సత్యమే”…. అనుకున్నప్పుడు కూడా అది దుః ఖించడానికి విషయమే కాకుండా ఉంటోంది. ఎందుకంటే నూతన దేహం రావడం మంచిదే! లేక అసలు దేహమే ఉండకపోవడమూ మంచిదే. ఇక ఈ దేహ సంబంధమైన అల్పార్థమును ప్రక్కకు

Page:212

పెట్టి పరమార్ధమునకు వస్తే… ఈ జీవుడు “దేహి” గా జీవితము పొందడం లేదు. మరణము పొందడం లేదు. దేహం వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు కూడా అతడు దేహిగా యథాతథంగానే ఉంటున్నాడు. కనుక పరమార్థమున చూస్తే సుఖమూ లేదు. దుఃఖమూ లేదు. చిదాకాశమే ఈ అన్నిటి రూపంగానూ విజృంభిస్తోంది సుమా!

ఓ రామచంద్రా! ఇప్పుడు మనం జీవన్-మరణముల గురించి చెప్పుకున్నది మరొకసారి సమీక్షించి చెప్పుతాను… విను.

మృతస్య దేహలాభ శ్చేత్,… నవేఏవ తత్ ఉత్సవః మృతిః నాశోహి దేహస్య, సామృతిః పరమం సుఖమ్ ॥

మరణించిన తర్వాత మళ్ళీ దేహం లభిస్తుందని అనుకుంటే అది నూతనోత్సాహమే అవుతుంది. ఎందుకంటే శిథిలమైన దేహము నశించడమే మరణం కాబట్టి అది పరమసుఖమే కదా!

మృతిః అత్యంత నాశశ్చేత్ - తత్ భవామయ సంక్షయః

భూయః శరీరలాభశ్చేత్ నవేవ తత్ ఉత్సవః

"అత్యంత నాశనమే మరణము. ఆ తర్వాత దేహం లేదు. (పునర్జన్మ లేదు” అని అనుకుంటే అప్పుడు ఎటువంటి పరిశ్రమ లేకుండానే సంసారరోగము ఉపశమించినదే అగుచున్నది. శరీరం నశిస్తే మరల శరీరం కలగకపోతే సంసారమే తొలగినదగుచున్నది. కాబట్టి ఎంతో సంతోషించ వలసిన విషయమే!

"కాదండీ! మాకు మరల శరీరం వస్తుందేమో?”… అని అనుకుంటే… అది నూతన దేహం కాబట్టి అదికూడా ఉత్సవంతో సమానమే! ఏ రకంగా చూచినా మరణము దుఃఖార్హం కాదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పింది యుక్తియుక్తమే! అయితే, “మేము ఏవేవో పొరపాట్లు చేశాం. అందుచేత మాకు నరకం ప్రాప్తిస్తుందేమో?” అని కొందరు జనులు మృత్యువు పట్ల భయం కలిగి ఉంటున్నారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓహో! అట్లాగా? దుష్కర్మలచే మరణానంతరం నరకాదులు ప్రాప్తిస్తాయనే ఏ భయం కలదో… అటువంటి భయం జీవించి ఉన్నప్పుడు కూడా రాజదండన మొదలైన వాటి వల్ల ప్రాప్తిస్తూనే ఉన్నది కదా! అందుచేత ఓ జనులారా! ఇహ - పర శ్రేయస్సును సిద్ధింప జేసుకోవాలనుకుంటే, దుష్కర్మలను ఆచరించకుండా ఉండండి. దుష్కర్మల ఫలితం జీవించి ఉన్నా, మరణించినా అద్దాని అనుభవం అనివార్యం. జీవించివున్నందుకు ప్రయోజనంగా ఉత్తమ కర్మలు ఆచరించండి. అంతేగాని మరణం గురించి భయపడవలసినదేమున్నది?

మరిష్యామి! మరిష్యామి! మరిష్యామీతి భాషసే?

భవిష్యామి! భవిష్యామి! భవిష్యామితి నేక్షసే?

ఓయి! జీవుడా! “నేను చస్తాను, చచ్చిపోతాను, ఇక చావు తప్పదు”…. అని పలుకుతావేమయ్యా? "చిదాకాశస్వరూపుడగు నేను ఈ దేహ పతనానంతరం కూడా ఉండియే

Page:213

ఉంటాను, ఉండియే తీరుతాను. ఎల్లప్పటికీ ఉంటాను”…. అని ఎందుకు అనుకోవయ్యా? పరమార్ధమున నీకు జనన మరణాలు కాని, ఉత్పత్తి - నాశనములుగాని స్వస్వరూపం దృష్ట్యా లేనేలేవు. అంతా కూడా సర్వదా చిదాకాశమే అయివున్నది. ఆ చిదాకాశము తనయందు తానే జగత్తు రూపంగానూ, జన్మ-జీవన -మృత్యు పునఃజన్మల రూపంగానూ వివర్తభావమును ఇక్కడ క్రీడవలె పొందడం జరుగుతోంది.

సంవిదాకాశమాత్రాత్మా పిబ భుంక్ష్వాస్వ నిర్మమః ఆకాశకోశకాన్తస్య కుత ఇచ్ఛోదయస్తవ?

ఓ రామచంద్రా! నీవు చిదాకాశమాత్రుడవే గాని ఈ దేహమూ కాదు! మరొక దేహమూ కాదు! అట్లే తదితర సర్వజీవులూ కూడా! ఇదియే ఆత్మజ్ఞానము. ఆ విధంగా ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఇక అటుపై మమకారరహితుడవై తిను, త్రాగు, ప్రపంచ వ్యవహారాలేవైతే ఉన్నాయో… అవి నీవు అనుకున్నట్లే నిర్వర్తించు.

ఆకాశ కోశము వలె నిర్మలమైన చిదాత్మయే స్వరూపముగా గల నీయందు ఇచ్ఛాదులకు చోటు ఎక్కడిదయ్యా? వాస్తవానికి భవ్యుడు - నిర్భయుడు అగు ఆత్మజ్ఞాని కాకతాళీయంగా వాటంతట అవిగా వచ్చిపడే దేశకాలానుగతమైన ఆయా శబ్ద స్పర్శాది లోకవ్యవహారములను నిర్లిప్తంగా ప్రశాంతంగా నిర్వికారంగా ఉంటూ అనుభవిస్తున్నాడు. మధ్యమధ్యలో దేశ కాలానుగతంగా వచ్చే దుర్భిక్షము-క్షోభ మొదలైన ఈ ప్రాపంచిక దోషములను క్రీడలో సానుకూల - ప్రతికూల సందర్భములవలె దర్శిస్తున్నాడు. వికల్పములు లేనట్టి సమాధిని అవధరించిన బుద్ధికలవాడై, ఈ జగద్విషయములన్నిటినీ అంతరంగమున అధిగమించియున్నవాడై ఉత్తమ బుద్ధితో నిశ్చితంగా ఈ లోకంలో సంచరిస్తున్నాడు.

న దుఃఖమేతి మరణాత్, సుఖమేతి న జీవితాత్, నాభివాంఛతి నద్వేష్టి స తదా అస్తే వివాసనః II

అట్టి తత్త్వజ్ఞుడు మరణముచే దుఃఖము పొందడు. జీవితముచే సుఖమును పొందడు. దేనినీ వాంఛించడు. ద్వేషించడు. సర్వదా వాసనారహితుడై ఉంటున్నాడు.

ఓ రామచంద్రా! జీవన్ముక్తుడు ఇదే ప్రపంచంలో ఇచ్ఛారహితుడై ఉంటున్నాడు. వాసనావర్జితుడై ఉంటున్నాడు. ఇక్కడి జనన-మరణాది సర్వ సంఘటనలను శిథిలమైన గడ్డిపరకతో సమానంగా చూస్తున్నాడు.

ఆ “విదిత వేద్యుడు” (తెలుసుకొనవలసినది తెలుసుకొనివున్నవాడు) భయరహితుడై ఒక పర్వతం లాగా ఈ ప్రపంచమున నిశ్చలంగా వసిస్తున్నాడు.