Page:262
VIII. అవిద్య - అనంత జగత్తు విపశ్చిత్ ఉపాఖ్యానం
ఈ దృశ్యరూప జగత్తు ఎప్పటికి నశిస్తుంది. ఇది అజ్ఞానానికి ఎంతకాలం విషయమై కొనసాగుతూ పోతుంది? ఇది ఏ రూపంగా వర్తిస్తోంది? ఈ అవిద్యా దృశ్య జగత్తు యొక్క విస్తారం ఎంతవరకు? పరిమితి ఏమిటి? అంతు ఎక్కడ?… ఈ విషయాలు తెలియజేయండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవిద్య ఉన్నంత వరకు ఈ ఆకాశము - భూమి మొదలైన వాటితో కూడుకొని కనిపించే దృశ్యరూప ప్రాప్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇక దేశతః - కాలతః చూస్తే బ్రహ్మము వలెనే ఈ దృశ్యము కూడా అనాది, అనంతము కూడా! ఈ ’దృశ్యము అనంతము’ అని వేదాంత వాఙ్మయం ప్రకటిస్తోంది. ఇది నిరూపిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే విపశ్చిత్ మహారాజు చరిత్రను శ్రద్ధగా ఆలకించు.
అనంత చిదాకాశము యొక్క ఒకానొక కోణంలో ఎక్కడో ఒదిగివున్న ఒకానొక వస్తువులో గల ఒక ప్రదేశంలో స్వర్గ-భూ-పాతాళాలతో కూడిన ఒక బ్రహ్మాండ జగత్తు ఉంది. మన త్రైలోక్యం లాగానే ఆ త్రైలోక్యంలో అనేక రాజ్యాలు, వ్యవస్థలు పరిఢవిల్లుతున్నాయి. ఆ జగత్తులో ఒకచోట గల ఒక భూప్రదేశంలో ‘తతమితి’ అనే ఒక సుప్రసిద్ధ నగరం విరాజిల్లుతోంది. ఆ నగరాన్ని, అది ఉన్న రాజ్యాన్ని ‘విపశ్చిత్’ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ విపశ్చిత్తు మహారాజు రాజులలో గొప్ప ఖ్యాతి పొంది ఉన్నాడు. అనేక శాస్త్రములలో పారంగతుడు. ఆయన సభలో గొప్ప పండితులు, కళాకారులు, విజ్ఞులు ఉన్నారని లోకవిఖ్యాతి. సరోవరంలో రాజహంస వలె ఆతడు స్వయంగా సాహిత్య, గానాదుల యందు ప్రావీణ్యుడై ఆ సభాసదనానకే ఒక మణిభూషణమై ఉంటాడని అక్కడి ప్రజలు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. అనేక మంది కవులు ఆయన గుణసంపత్తిని గ్రంథాల రూపంగా రచించారు. తనను ఆశ్రయించిన వారిని ఆనందింపజేసి పంపించటం ఆయనకు దైనందిన అలవాటు. ఆ విపశ్చిత్ మహారాజు యొక్క సంపద ఆతని ప్రతాపసామర్థ్యముల ప్రాభవంచే ఎప్పుడూ ప్రవృద్ధి పొందుతూ ఉండేది.
Page:263
ఆతనికి బ్రాహ్మణుల పట్ల భక్తి - - ప్రపత్తులు ఉండేవి. బ్రాహ్మణ రూపుడగు అగ్నిదేవుడు ఆయనకు ఇష్టదైవం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయన అగ్నిదేవుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు. అగ్నిదేవుడు తప్ప ఆతనికి మరొక దైవం తెలియదు.
ఆతని రాజ్యపు నాలుగువైపులా నలుగురు మంత్రులు సముద్రం వంటి సేనా సమూహంతో విపశ్చిత్ రాజ్యమును కాపాడుతూ ఉండేవారు. ఆ రాజు ఎంతో నిశ్చింతంగా ప్రజలకు సర్వవిధాలా సానుకూల్యంగా రాజ్యపాలన కొనసాగిస్తూ ఉండగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒకానొకరోజు రాజమందిరంలో దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ ఆ విపశ్చిత్తు పరమశాంతంగా పరిపాలనా వ్యవహారం నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇంతలో ఉత్తరదిక్కు నుండి వచ్చిన ఒక సైనికుడు రాజ మందిరంలో ప్రవేశించి రాజుగారికి ప్రణామంచేసి రాజాజ్ఞ తీసుకొని ఇట్లు చెప్ప ప్రారంభించాడు: ఉత్తరదిక్కు నుండి వచ్చిన దూత : హే మహారాజా! మీకు సర్వదా దిగ్విజయమగు గాక! ఉత్తర దిక్కు సైనిక సమూహమునకు వార్తాహరుడిగా సేవలందించే నేను మీ సంతోషమును అనుకూలం కానట్టి వార్తలను మీ సమక్షంలో చెప్పటానికి అనుజ్ఞ ఇవ్వండి.
మీచే నియమితులై సర్వదా రాజభక్తితో మిమ్ములను సేవిస్తూ మీచే మెప్పుపొందుచూ, మిమ్ములను దైవసమానంగా ఆరాధించే మన రాజ్య ఉత్తర దిక్కు సేన యొక్క సేనానాయకుడు, మాకు ప్రియతమ నాయకుడు అయిన సామంతులవారికి అకస్మాత్తుగా విషజ్వరం సోకింది.
ఉత్తర దిక్కు రాజవైద్యులు వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయింది. విషజ్వరం తాకిన కొద్ది గంటలలో “రాజుగారి ఆజ్ఞానుసారం యమపురిపై దండయాత్రకు వెళ్ళారా!”… అన్నట్లు దేహ రాజ్యాన్ని త్యజించారు.
ఉత్తర దిక్కుకు పెట్టనికోటగా తన పరాక్రమ - యుక్తులతో మనదేశపు ఉత్తర దిక్కును రక్షిస్తున్న సామంతులవారు మరణించారని తెలియగానే దీర్ఘకాలంగా సమయం కోసం వేచియున్న ఉత్తర సరిహద్దు శత్రు రాజ్యసేన అతికొద్ది సమయంలో యుద్ధ సన్నిద్ధమై దండయాత్రకు వచ్చింది.
అసలే నాయకుని హఠాన్మరణ సంఘటనను జీర్ణించుకోలేక విషాదగ్రస్తులై ఉన్న సైనిక పటాలాలకు అకస్మాత్తుగా యుద్ధ భేరీ నినాదాలు వినిపించాయి. ఈ వార్త మీకు జేరవేర్చే సమయం కూడా లేకుండాపోయింది. ఊహించటానికి కొంచెం ముందుగా సూచన కూడా ఇవ్వని శత్రు సైనికుల యుద్ధ సంరంభాన్ని మన సైనికులు ఎదుర్కోలేకపోయారు. ఎందరో సైనికులు మరణించారు.
ఇదంతా దక్షిణ దిక్కు సామంత రాజుకు తెలియవచ్చే సరికి కొంచెం కాలయాపన జరిగి పోయింది. ఆతడు యుద్ధ సన్నద్ధుడై వచ్చే ప్రయత్నంలో ఉండగా, దక్షిణ దిక్కు శత్రు రాజ్యసైన్యం హఠాత్తుగా దండయాత్ర చేయటం జరిగింది. అప్పుడు మన దక్షిణ దిక్కు సైన్యానికి అక్కడి శత్రు సైన్యానికి జరిగిన యుద్ధంలో అక్కడి మన సామంతరాజు వీరస్వర్గం పొందాడు.
పశ్చిమ దిక్కు సేనానాయకుడు ఇది తెలిసి బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో దక్షిణ దిక్కు శత్రురాజుల సేనను ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పుడు జరిగిన యుద్ధంలో పశ్చిమ దిక్కును రక్షించే మన సేనానాయకుడు కూడా వీరమరణం పొందారు.
Page:264
ఇట్లు పలికి ఆ వార్తాహరుడు మౌనం వహించాడు. ఇంతలో అంతఃపుర దూత రాజు సమక్షానికి వచ్చి ఇట్ల పలికాడు.
అంతఃపుర దూత : మహారాజులకు విజయమగుగాక! తూర్పు దిక్కున గల మన సైన్యం శత్రువులచే బాధింపబడినవారై తెగిన ఆనకట్ట నుండి వచ్చే జల ప్రవాహంలాగా ఇటువైపుకే వస్తున్నారు.
ఆ మాటలు వినగానే విపశ్చిత్ మహారాజు సింహాసనం నుండి గబుక్కున లేచి నిలుచున్నాడు. ఇక ఒక్కక్షణం కూడా వృథా చేయటం కుదరదని గమనించాడు. అప్పటికప్పుడు ఇట్లా ఆజ్ఞలిచ్చాడు. విపశ్చిత్ మహారాజు : ఓ మంత్రివర్యులారా! ఈ వార్తాహరుల మాటలు విన్నారు కదా! వెంటనే యుద్ధమునకు సన్నద్ధులుకండి. సైన్యాగారం తెరచి సైనికులకు ఆయుధాలు, కవచాలు ఇవ్వండి. పదాతి సైనికులను ఎక్కడెక్కడ నియమించాలో వెంటనే నియమించండి.
ఇంతలో తూర్పు దిక్కు ఉపసేనానాయకుడు ద్వారము వద్ద వేచివున్నట్లు వార్త వచ్చింది. తీసుకొని ఆతడు రాజుగారి మందిరంలో ప్రవేశించాడు. ఆతడి అంగాంగాలు గాయములతో నెత్తురోడుచున్నాయి. బలహీనంగా శ్వాస తీసుకొంటూ ఇట్లా పలికాడు.
తూర్పుదిక్కు ఉపసేనానాయకుడు: మహారాజా! దక్షిణ-పశ్చిమ-తూర్పుదిక్కు సైనికాధికారులు తమ దేహాలను యుద్ధయజ్ఞంలో సమర్పించి మీ సేవలో ధన్యులయ్యారు. ఇప్పుడు మన రాజ్యానికి అన్ని వైపులా శత్రు రాజ్యముల నుండి అకస్మాత్తుగా యుద్ధ విపత్తు వచ్చిపడింది. ఈ శత్రురాజు లందరినీ మీరు ఇతఃపూర్వం జయించి పాదాక్రాంతం చేసుకొన్నవారే కదా! తమకు దుర్జయమైనదేది ఉంటుంది? ఇంతలో ఇంకొక రాజసేవకుడు మందిరంలో ప్రవేశించి వగరుస్తూ ఇట్లా అన్నాడు.
రాజ సేవకుడు : మహారాజా! అనేక మంది శత్రు సైనికులు నగరంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నగర రక్షణకు మీచే నియమించబడిన మహాసేనామాత్యులవారు వారిని నిరోధించటానికి అతికుశలురైన అనేక సైనికులతో వెళ్ళుచూ తమకు ఆ వార్త అందించమని నన్ను ఆజ్ఞాపించారు.
ఇంతలో మంత్రులు, రాజాంతఃపురవాసులు అంతఃపుర సేవక జనులు, తదితర నగర వాసులు అక్కడికి వచ్చారు. అట్లే ఆయుధములు ధరించిన అనేక మంది సైనికులు కూడా అంతఃపురం సమీపించి రాజుగారి ఆజ్ఞానువర్తులు కాసాగారు. జనుల ప్రవాహంచే ఆ రాజాంతఃపురం ప్రాంతమంతా కప్పివేయబడినట్లు అయింది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇంతలో మంత్రులందరు మహారాజు సమక్షంలో సమావేశమైనారు. మంత్రులు : మహారాజా! ఇక ఉపేక్షించి లాభం లేదు. ఈ సరిహద్దు రాజులందరు ఆరు నెలల క్రితమే మీ పరాక్రమమును చవిచూచి వెన్నుచూపిన విషయం మరచి ఉంటారు. వారు మీకు
Page:265
శరణాగతులైనప్పుడు మీరు వారిపై సోదర వాత్సల్యం కురిపిస్తూ… "వీరందరు శరణువేడారు కాబట్టి నాకు మిత్రరాజులే” అని సభలో ప్రకటించి వారితో కరచాలనం చేసి వారికి వారివారి రాజ్యములను తిరిగి ప్రసాదించిన విషయం మరచి ఈ రోజు మనపైనే దండయాత్ర చేయటం వారి కృతఘ్నతకు తార్కాణం. అట్టి వారిని ఇక ఉపేక్షించి లాభంలేదు. వారికి వారే మీ తపోశక్తి తెలియక మనపై దండయాత్ర చేశారు. అందుచేత వారిని అంతమొందించటం ఇప్పటి మన ధర్మబద్ధమైన ప్రతిక్రియ. అందుచేత యుద్ధ సన్నాహాలకు అనుజ్ఞ ఇవ్వండి.
వీరులకు ఆజ్ఞ ఇవ్వబడునుగాక! సామంతులందరికీ కబుర్లు పంపుదాం. మీ ధనుష్టంకారాలు విని చెవులు చిల్లులు పడుతూంటేగాని వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసిరాదు. అందుచేత మేము యుద్ధంలో ముందుగా ప్రవేశించటానికి అనుజ్ఞ ఇవ్వండి. ఆ సరిహద్దు శత్రురాజుల తలకాయలు తెచ్చి మీ పాదాల ముందు ఉంచటమే ఇప్పటి మా తక్షణ కర్తవ్యం.
విపశ్చిత్ మహారాజు : ఓ మంత్రులారా! మీ ధైర్య సాహసాలు ఎంతటివో మాకు తెలుసు. మీరు యుద్ధ భూమిలో ప్రవేశించి వారిని కొద్ది సమయం నిరోధించండి. కొంతసేపటిలో నేను నలువైపులా యుద్ధంలో ప్రవేశిస్తాను. శత్రురాజుల శిరస్సులను మన సింహద్వారానికి తోరణాలుగా తగిలిద్దాం. ముందుగా నేను స్నానం చేసి అగ్నిదేవుని పూజించి నలుదిక్కులా యుద్ధరంగంలో ప్రవేశిస్తాను.
మంత్రులు వెంటనే ఆయుధాలు ధరించి అక్కడి నుండి బయలుదేరారు. సైన్యమును నలు దిక్కులకు విభాగించి యుద్ధానికి ఉపక్రమించారు. మహారాజు అక్కడి నుండి అభ్యంతర మందిరంలో ప్రవేశించి అగ్నిగుండం రగిలించి మంత్రముగ్ధంగా అగ్నిదేవుని ఆహ్వానించి సశాస్త్రీయంగా ఆదరం గాను, శక్తిశ్రద్ధలతోను పూజించాడు. అగ్ని భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి పూజా క్రమం పూర్తి చేశాడు. ఆ తరువాత మోకాళ్ళపై యోగాసనపూర్వకంగా నిలబడి అగ్ని భగవానుని ఇట్లు ప్రార్థించాడు.
విపశ్చిత్ మహారాజు : హే అగ్నిదేవా! త్రికరణ శుద్ధిగా నా ఇష్టదైవమైనట్టి మీకు అనేక ప్రణామాలు. స్వామీ! మీకు భక్తుడనైనంతమాత్రం చేతనే నా జన్మ తరించింది. మీ కరుణా కటాక్ష వీక్షణముల ప్రభావం చేత నేను అనాయాసంగా అనేక విలాస వైభవములు అనుభవిస్తూ ఇప్పటిదాకా మీచే ప్రసాదించబడిన జీవితంతో ఆయుస్సు గడిపాను. మీరు ప్రసాదించిన బల - ఐశ్వర్యములచే అనేక మంది రాజులను పాదాక్రాంతం చేసుకొని పది దిక్కులలోను ఈ రాజ్యమును విస్తరింపజేశాను. అనేక యుద్ధయాత్రలు ప్రారంభించి మీ పూజా ప్రభావం చేత దిగ్విజయుడనయ్యాను. ఈ భూమండలం అంతా ఈ రాజ్య పతాకాన్ని ఎగురవేశాను. సుదీర్ఘకాలం ఈ రాజ్యం ప్రజారంజకంగా పాలించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాను. భూనభోంతరాలలో కీర్తి ప్రసరించింది. యుద్ధంలో విజయుడనై సంపాదించిన అపార ధనరాసులతో పూజ్యులగు బ్రాహ్మణుల, మిత్రుల, సుహృతనుల, రాజ్య ప్రజల ఇళ్ళు నింపివేశాను. "ఆ రాజ్యంపై దండయాత్ర చేయాలి”… అని సభలో నిర్ణయించిన కొద్దిసేపటికే ఆ వార్త విన్న అనేకమంది రాజులు తమను తాము మా రాజ్య
Page:266
సింహాసనమునకు సామంతులుగా ప్రకటించుకొని వచ్చి కప్పం కట్టిన సందర్భాలు అనేకం. అదంతా మీ చలవేగాని నా గొప్పతనం కాదు. మీ దయచే ఇంతకాలం ధర్మ-అర్థ-కామములను ఒకదానితో మరొకటి విరుద్ధం కాకుండా సంపాదించి అనుభవించాను. ఆశ్రితులకు పంచిపెట్టాను. బాల్య - యౌవనాలు తీయటి కలలుగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆకు చివర వ్రేలాడే ఒక మంచుబిందువు వలె “ఎప్పుడు నేల రాలుదామా!” అను భావనచే పూత వేయబడే వార్ధక్యం ఈ దేహమునకు రానే వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఈ మనస్సు విశ్రాంతిని పొందుతూ అంతఃపురంలో ప్రశాంతంగా గడపవలసిన సమయంలో యుద్ధ నినాదాలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఇంతకాలం నా బల పరాక్రమాలను చవిచూచి మా రాజ్య పతాకానికి తలవంచి, నా సుహృత్ భావంచే దేహాలు దక్కించుకున్న నలువైపుల గల సరిహద్దు రాజులు ఒక్కసారిగా కూడబలుక్కుని మా రాజ్యంపై అకస్మాత్తుగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. మేము ప్రమత్తులుగా ఉన్న సమయం ఎన్నుకొని అన్ని వైపుల నుండి దండయాత్ర సాగిస్తున్నారు. ఆ నలుగురు రాజులు నాలుగు దిక్కుల నుండి ఒక్కటై వచ్చారంటే ఇకవారు మాకంటే బలవంతులు, భయంకరులు, క్రూరమైన ఉద్దేశము కలవారు అయివుంటారు కదా! కనుక మాకు మాకున్న బలంతో విజయం సాధించటమనేది దుర్లభం, అసాధ్యం అని మాకు అనిపిస్తోంది. మా రాజ్యమును ఆక్రమించి మా ప్రజలపై వారికి గల పగ తీర్చుకోవటం ప్రారంభించారంటే, ఇక మా ప్రజల కష్టాలు ఎట్లా ఉంటాయో మాటలతో చెప్పలేం, ఊహాతీతం కూడా!
ఒకవేళ ఈ యుద్ధంచేసి మేము గెలిచినా కూడా ఎంతో జననష్టం ఇటు మాకు అట సరిహద్దు రాజ్యాలకు అనివార్యం. అతికొద్ది కాలంలో ప్రకృతి సిద్ధంగా ఈ వార్ధక్యం ముగిసి, దేహపతనం జరుగక తప్పని ఈ తరుణంలో నేను రాజుగా కొనసాగే ఏకైక ఉద్దేశము కొరకు ఇంతటి జననష్టం, ఆ తరువాతి దుర్భర పరిణామాలు నా రాజ్య ప్రజలు పొందటమెందుకు?
అందుచేత సర్వాత్మకుడవు, పవిత్రమూర్తివి, నిత్య నిర్మలుడవు, నా ఆరాధ్య దైవమగు ఓ అగ్ని దేవా! ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితులలో నాకొక గొప్ప ఉపాయం తోచుచున్నది. ఈ మనుష్యులకు - దేవతలకే కాకుండా అందరికీ విజయ ప్రదాతవు, లోకాల ఉనికికి ఆధారభూతుడవు అయి అందరికీ అన్నీ ప్రసాదించే పరదైవమైన నీకు భక్తి ప్రేమపూర్వకంగా నా ఈ శిరస్సును సమర్పిస్తాను.
పూర్వం యజ్ఞంలో పురోడాశం (మేక తలకాయ మొదలైనవి) సమర్పించినట్లు ఈ రోజు ఈ నా శిరస్సును మీకు సమర్పిస్తాను. హే మహాత్మా! మీరు గనుక నా “స్వశిర సమర్పణ” అనే భక్తి పూర్వక కర్మచే సంతుష్టులైనారా… అప్పుడు మీ ప్రసాదముచే ఈ నా రెండు కోర్కెలు నెఱవేరుగాక!
Page:267
అలా కాదా …ఈ శిరస్సును స్వీకరించి నన్ను, నా ఉత్తర జన్మలను పునీతం చేయండి.
ఓ అగ్నిదేవా! ఇదిగో! నా శిరస్సు ప్రీతి పూర్వకంగా ఇవ్వబడుతోంది. స్వీకరించి కరుణించండి. ఇట్లా పలికి ఆ విపశ్చిత్ మహారాజు తటాలున లేచి నిలబడ్డాడు. అగ్నికుండం సమీపించి ఒక్కసారి గాలిలోకి ఎగిరాడు. దేహము గాలిలో ఉండగానే చేత ధరించిన ఖడ్గంతో శిరస్సును - బాలుడు కమలమును త్రుంచినట్లు - త్రుంచివేసి తెగిన శిరస్సుతో సహా దేహమును అగ్ని గుండంలోనికి సమర్పించివేశాడు. అప్పుడు అగ్నిదేవుడు శిరస్సును - మొండెమును హవిస్సువలె స్వీకరించినవాడై సంతుష్టుడైనాడు. మహాత్ములకు సమర్పించినదేదైనా ఒకటికి నాలుగింతలు అవటంలో ఆశ్చర్యమే ముంటుంది? కొద్ది క్షణాలలో ఆ అగ్నిగుండంలోనుంచి చతుర్భుజములు, శస్త్రాస్త్రధారణతో కూడినవి, మహత్తరమైన తేజస్సు పుణికి పుచ్చుకున్నవి అయినట్టి నాలుగు శరీరాలు బయల్వెడలాయి. ఆ నాలుగు శరీరాలు సమానమైన రూపముతో ప్రకాశిస్తున్నాయి. ఆ నాలుగు దేహాలు ఒకే విధమైన కవచ-కుండలాలతో, భూషణములతో ప్రకాశిస్తూ ఒకే ఆశయము కలిగినవై ఉన్నాయి. గొప్ప తెలివితేటలు, సమాన గుణములు కలిగి ఒకే రూపముగల నాలుగు ధనుస్సులతో ఆ నాలుగు శరీరాలు విరాజిల్లుతున్నాయి. ఆ శరీరాలు నాలుగూ శత్రువుల గద శస్త్ర-అస్త్రాదులచే ఏమాత్రం స్పృశింపబడజాలనంత ప్రభావీచికలతో ప్రకాశిస్తున్నాయి.
ఆ విధంగా నాలుగు వేదములవలె నాలుగు శరీరములు ఒకే జీవుడైన విపశ్చిత్ మహారాజు సంపాదించుకున్నాడు. దేహాలు నాలుగు అయినప్పటికీ వాటిని నడిపే జీవుడు ఒక్కడే … అయ్యాడు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విధంగా అగ్నికుండం నుండి అగ్నిదేవుని కరుణచే సంపాదించిన నాలుగు దేహములతోటీ ఆ విపశ్చిత్ మహారాజు అగ్ని భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి “తన్నో అగ్నిః ప్రచోదయాత్" … అని గానం చేస్తూ అక్కడి నుండి బయల్వెడలాడు. ఒక్కొక్క దిక్కు వైపుగా నడిపాడు. ప్రతి దిక్కులోని సైనికులంతా, “ఆహా! మహారాజే స్వయంగా మన దిక్కుకు నాయకత్వం వహిస్తూ ఉంటే ఇక లోటేమిటి?”… అని తలచుచూ యుద్ధ మహోత్సాహులై శత్రుసైన్యంపై విఱుచుకుపడటం ప్రారంభించారు. నాలుగు దిక్కులలోను భీకరయుద్ధం ఆరంభ మైనది. జన్మార్జితంగా ఆర్జించిన తమ తమ శక్తియుక్తులన్నీ పణంగా పెట్టి అనేక మంది వీరులు తమ రాజభక్తికి, దేశభక్తికి చిహ్నంగా యుద్ధం చేసి దేహాలు తృణ ప్రాయంగా సమర్పించారు. ఆ నలు దిక్కులలో సైనికుల మస్తకాలు మందార పూబంతులవలె గాలిలోకి ఎగిశాయి. యుద్ధంకంటే జీవితమే ప్రియంగా తలచిన కొందరు సైనికులు ఆ ఘోరయుద్ధాన్ని చూడటానికి కూడా జంకుచూ వెనకడుగువేస్తూ వెనుకకు పరుగులు తీయటం ఇరు సైన్యముల వైపు కనబడనారంభించింది.
Page:268
విపశ్చిత్ మహారాజు తమ సైన్యం బలహీనపడుచుండటం, ఉత్సాహం కోల్పోవటం గమనించి ఇక తాత్సారం చేయకుండా అగ్నిదేవునిచే ప్రసాదించిన నాలుగు ధనుస్సులను ఉపయోగించి నాలుగు వైపుల నాలుగు ఉపాధులతో శత్రుసైన్యంపై బాణవర్షం కురిపించి శత్రు సైనికులను చీల్చి చండాడటం ప్రారంభించాడు.
విపశ్చిత యొక్క ధనుస్సుల నుండి వెలువడిన మహాక్రేంకార చతుష్టయమువలన ఆకాశంలోని మేఘాలలో ఘీంకారనినాదాలు, దీర్ఘంగా మెఱుపులు ఉద్భవించాయి. శత్రురాజుల గుండెలు ‘ఝల్’ అనసాగాయి. మహారాజు ధనుస్సుల నుండి బాణవర్షం కురిసింది. చేది దేశపు శత్రు సైన్యం ఆ బాణ వర్షానికి తాళలేక ఛిన్నాభిన్నమై పోయింది. మంత్రించి వదలిన మోహనాస్త్ర ప్రభావం చేత పారశీకదేశపు యుద్ధవీరులు కళ్ళు కనిపించక తమలోతామే ఒకరినొకరు ఖండించుకోసాగారు. దరద దేశపు సైనికులు ఆ శస్త్రాస్త్ర ప్రహారానికి తట్టుకోలేక దుర్దర పర్వత శ్రేణులలోగల గుహలలోకి పరుగులు తీసి దాక్కున్నారు. వారి రక్షణాకవచములు చూర్ణమైనాయి. విపశ్చిత్ రాజు అప్పుడు ప్రయోగించిన వాయువ్యాస్త్ర ప్రభావంచే జనించిన వాయు వీచికలకు శత్రు సైనికులు దూదిపింజాల వలె గాలిలోకి ఎగిరి నేలకూలసాగారు. దశార్ణ దేశ భటుల శిరస్సులు బంతులవలె ఆకాశంలో ఎగిశాయి. శకదేశపు యోధులు రాజు ధనుస్సు నుండి వెలువడిన నల్లని ఇనుప బాణ ప్రవాహం చేత క్రూరంగా హింసించబడి యుద్ధభూమి నుండి పారిపోసాగారు. రమఠ దేశీయులు దిక్కుతోచక దిక్కుదిక్కులకు పరిగెత్తసాగారు. తంగణ దేశసైన్యం శవముల గుట్టలుగా పరిణమించసాగింది. గాంధార, హోది, చీన, కిరాత, కుమారీగణ సైనికులు విపశ్చిత్ రాజుచే విడువబడిన చక్రాయుధ వర్షముచే విచ్ఛిన్నులై తలకో త్రోవగా వెనుతిరిగి పరుగులు తీయనారంభించారు. మహావీరులని పేరుగాంచిన నిలీపదేశపు భిండాజాతి వీరులు అప్పటి శస్త్ర ప్రయోగానికి తాళలేక ఒకరినొకరు త్రోసుకుంటూ వెనుకకు పరుగులు తీయసాగారు. ఈ విధంగా విపశ్చిత్తు యొక్క దాడులచే హూణ, శక, దశార్ణవ, అంగ, తంగణ, సాల్వ దేశ యుద్ధ భటులు శస్త్రాస్త్ర ఘాతాలకు పిచ్చివారివలె గంతులు వేస్తూ వెనుకకు పరుగులు తీయసాగారు.
ఓ రామచంద్రా! ఆ విధంగా ఆ నాలుగు విపశ్చిత్తులు శత్రుసైన్యము వెంటబడి తరుముతూ చాలాదూరం ప్రయాణించారు. ఆ నాలుగు దేహాలు కూడా సమానమైన రూపాలు, అభిప్రాయాలు కలిగి ఉన్నారు. సర్వశక్తియుతుడు, నాలుగు దేహములందు సమానమైన రూపం వహించి ఉన్నవాడు, చైతన్య స్వరూపుడు అగు విపశ్చిత్ జీవుని ‘ప్రేరణ’ పొంది నలుగురు యుద్ధంలో నలుదిక్కుల శత్రుసైన్యంపై విజయం సాధించారు.
అట్లు జీవాత్మ ఒక్కడే అయివుండి, ఆ విపశ్చిత్ మహారాజు నాలుగు దేహాలు చేతివ్రేళ్ళవలె నడుపుతూ పరాజితులై పారిపోవుచున్న శత్రురాజుల సైనిక పటాలాలను వెంబడించాడు. ఆతని వెంట మంత్రులు కొందరు, మరికొందరు సైనికులు పరుగుతీస్తూ శత్రు సైనికులను వెంబడించసాగారు. అట్లా చాలాదూరం వెంబడించగా ఇంతలో విపశ్చిత్తు నాలుగు దేహాలతోను, మంత్రులతోను,
Page:269
సైనికులతోను నాలుగు దిక్కుల చివరిగా గల నాలుగు మహాసముద్రములను సమీపించారు. అనేకులు మరణించగా కొద్దిమంది శత్రు సైనికులు విపశ్చిత్తు దేహములచే సంధించబడిన విల్లంబులకు భయపడి ఎక్కడెక్కడో దాగుకొన్నారు. ఇట్లా విపశ్చిత్తు నాలుగు దేహములు నాలుగు సముద్రపు తీరాలను చేరుకోగానే ఆతడు యుద్ధంలో దిగ్విజయుడైనట్లయినది. అగ్నిదేవుని ఆజ్ఞానుసారం తమ విధిని నిర్వర్తించి విపశ్చిత్తు మహారాజుకు విజయము చేకూర్చటం పూర్తి అయింది కనుక ఆతని శస్త్రాస్త్రములు ఉపసంహారము పొందినవై శమించినవై అంతర్థానమైనాయి. అగ్నిదేవ ప్రసాదితమైన రథ-అశ్వ గజ బలగమంతా అగ్నిదేవుని సంకల్పానుసారం నిజస్థానమగు ప్రకృతిలో లీనమైపోయాయి. మరికొన్ని చేష్టారహితమైపోయాయి. అయితే నాలుగు దేహాలు మాత్రం నాలుగు సముద్రముల తీరాల విజయానందముతో నిలబడివున్నాయి.
అప్పుడు ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు సముద్రాల తీరాలను ఉన్నవారై ఎదురుగా నలుదిక్కులా విస్తరించివున్న మహాసముద్రాలను చూచారు. ఆ మహాసముద్ర తరంగాలు ఆకాశాన్ని అంటుతూ భీకర ఓంకార నినాదాలు చెయ్యటం వారు గాంచారు. అక్కడ కనిపించే వనములను, పర్వత ప్రదేశములను, ప్రకృతి సౌందర్యమును చూపుచూ మంత్రులు, సామంతులు మహారాజుకు అనేక విశేషములు వర్ణించి చెప్పసాగారు.
❖
తూర్పు దిక్కు మంత్రులు చూడండి మహారాజా! ఈ మహాసముద్రపు ఉన్నత తరంగాలు ఎంత వేగంగా ఆ పర్వతప్రదేశాలను తాకుతూ ఝంకార శబ్దాలు చేస్తున్నాయో! ఆ చంద్రబింబం సముద్ర దేవత ధరించిన చూడామణిలా ప్రకాశిస్తోంది. అక్కడి ద్వీపములో సముద్ర జీవులు చంద్రకిరణాలు ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా నేలపై దొర్లుచున్నాయి. ఈ కనబడే దృశ్యం - దృష్టికంటే వేరుగా లేకున్నప్పటికీ ఉన్నట్లే ప్రవర్తించునట్లు - సముద్ర జలంకంటే వేరుగాని సముద్ర కెరటాలు సముద్ర జలమును ఎంతగా సంక్షోభింపజేస్తున్నాయి.
గుహా “గులుగులు” ఆవర్త నిరోషాశనిభీషణాన్ |
భృశం భావయతో గ్రస్తాన్ అగస్త్యార్వా అనిలానివ ॥
కొండ గుహలలోకి ప్రవేశించే సముద్ర జల ఘోష, సముద్రజలాన్ని అగస్త్య మహర్షి ఆపోశన పట్టే సమయంలో జనించిన తరంగ ఘోషను తలపిస్తోంది కదా!
అత్రోప శైలవన వీథిషు పుష్పశయ్యా విద్యాధరీ విరచితాః పరివర్ణయన్తి ॥ పార్శ్వద్వయస్థ పరివృత్త పదాత్ సముద్రాత్ వ్యావృత్త ముగ్ధ వనితా పురుషాయితాని || అదిగో, అటుచూడండి. అక్కడ పుష్పశయ్యలను విద్యాధరులు తమ ’రతి క్రీడ’ కొరకై నిర్మించారు కాబోలు. గండశిలలపై కనిపించే ఆ పుష్పశయ్యలు, అక్కడి మిలమిల మెరిసే విద్యాధరుల పాద చిహ్నములు చూస్తుంటే “రతిలో పురుషుడు శ్రమ పొంది ఉండగా, అది గమనించిన ముగ్ధవనిత అధో ప్రదేశం నుండి ఊర్ధ్వపు ప్రదేశానికి వచ్చి రతిక్రీడను కొనసాగిస్తున్నట్లు” కనబడటం లేదూ!
Page:270
మరొక సామంతుడు (పడమర సముద్రపు ఒడ్డుజేరిన విపశ్చిత్తుతో) : మహారాజా! అటు చూడండి. శృంగార క్రీడలందు ఆసక్తులైన కిన్నెరులు శృంగారరస ప్రభావంచే పరిసరాలు మరచి మధురగీతాలు ఆలాపిస్తున్నారు. ఆహా! ఈ సముద్రం ఎంత విస్తారమైనది! ఒకవైపు మహావిష్ణువు, మరొకవైపు పక్షుల సమూహం, ఇంకొక వైపు పుష్కరావర్త మేఘాలు ఆక్రమించుకున్నాయి కదా!
ఇంకొక దిక్కు సామంతుడు (ఉత్తర దిక్కు సముద్రం సమీపించిన విపశ్చిత్తుతో) : అదిగో! ఆ కనబడే మేరు పర్వత శిఖరాలలో దేవతాలోకాలున్నాయి. మనుష్యులు అటు వెళ్ళజాలరు కదా! కనుక ఉత్తర దిక్కుగా భూమి ఉన్నంత వరకు మీరు జయించినవారయ్యారు.
వేరొక సామంతుడు (దక్షిణ దిక్కు సముద్రం సమీపించిన విపశ్చిత్తుతో) : మహారాజా! మనం భూమి యొక్క దక్షిణ దిక్కు అంచువరకు శత్రురాజులను దునిమి మరల మన రాజ్య స్థాపన చేశాం. వెన్నముద్దవలె శరీరం కలిగిన చంద్రుడు నక్షత్ర కాంతలతో క్షీర సముద్రంలో జలకాలాడుచున్నట్లు న్నాడు. ఇక్కడి మలయమారుతం అనేక పుష్ప సుగంధాన్ని వెంట నిడుకుని మన ముక్కు పుటాలను సుఖశ్వాసమయం చేస్తూ మనకు అతిథి మర్యాద చేస్తున్నదికదా! అటు చూడండి. ఆ శబరి స్త్రీ మంచేಲಜ್ విహీన అయి ఆ పురుషుని పదే పదే ఆలింగనం చేసుకొను చున్నది. మనను ఎంత గానో అలరించే మలయమారుతం ఆ విరహిణికి వేడిగాలుల వలె అగుచుండటం చేత ఆమె బుగ్గల నుండి నునువెచ్చని శ్వేద బిందువులు జాలువ్రాలుచున్నాయి. ఇక్కడి జనుల అనాగరకత గమనిస్తే ‘నాగరకత’ ఉన్నంత వరకూ మన రాజ్యం మీ బలపరాక్రమాల ప్రభావంచే విస్తరిల్లినది అగుచున్నది. “అయ్యో! తెల్లవారబోవుచున్నదే! ఈ నా ప్రియునితో సంభోగానికి విఘాతం కలుగనున్నదే” … అనే ఆక్రోశం, ఆతురత ఆ శబర స్త్రీలలో కనపట్టుచున్నదే! వారికి జాతిరీత్యా ప్రియునితో సంభోగం నాగరకుల వలె రహస్యమైన విషయమే కాదు కాబోలు! ఈ పర్వత గుహలు బ్రహ్మదేవుని విశ్రాంతి కొరకై నిర్మించబడిన అమృత పూర్ణములగు మండపములవలె విరాజిల్లుచున్నాయి కదా! అటు ఆకాశంలోకి చూడండి. యుద్ధంలో వీరమరణం పొందిన మన యొక్క - మన శత్రురాజుల యొక్క యుద్ధ వీరులను అప్సరసలు ఆకాశమార్గంలో వీరస్వర్గానికి గొనిపోవుచున్నట్లుగా ఉన్నది.
ఇంకా ఆ నలుగురు విపశ్చిత్తులతోను తూర్పు పడమర-దక్షిణ-ఉత్తర దిక్కుల అంచులకు వేరువేరుగా అనుసరించిన ఉపనాయకులు, సామంతులు ఇట్లా సంభాషించుచున్నారు.
విజిగీషోః పునఃప్రాప్తే సంకటే ప్రకటే రణే॥
ధర్మ్యం విరాజతే యుద్ధం యౌవనే సురతే యథా ॥
హే చక్రవర్తీ! విపశ్చిత్తు మహారాజా ! మాకిప్పుడు ఎంతగానో సంతోషంగా ఉన్నది. మన మహారాజ్యానికి అకస్మాత్తుగా ఒక్కసారిగా నాలుగువైపులా సరిహద్దు దేశముల నుండి యుద్ధ ఉపద్రవం ముంచుకొచ్చింది. అయినా కూడా మీ తపోశక్తి ప్రభావం చేత, బల పరాక్రమముల ప్రాభవం చేత మనం ధర్మయుద్ధం చేశాం. యౌవనంలో రతి ఎంతగా శోభిస్తుందో… ధర్మయుక్తంగా ఇటువంటి పరిస్థితులలో యుద్ధం చేసి విజయం సాధించటం అంతటి శోభాయమానంగా ఉంటుంది.
Page:271
లోకైః అనిందితా లక్ష్మీః ఆరోగ్యం శ్రీసమన్వితమ్ | ధర్మ్యం యుద్ధం పరార్థేన జీవితస్య ఉత్తమమ్ ఫలమ్ II
వ్యోమాద్యపి ప్రకృతి - వికృతిం నామ నాయాత్య సంభ్యైః | అన్తః సారాశయ గుణవతాం లక్ష్యతే నో మహిమ్నః ॥
మేఘ సమూహాలు, ప్రళయాగ్నులు, పర్వతాల రెక్కల విన్యాసాలు, నక్షత్ర గణాల సంఘర్షణలు, సురాసురుల యుద్ధ భేరీలు … ఇటువంటి అనేక సంక్షుబ్ధములు జరుగుచున్నా ఆకాశం సర్వదా ప్రశాంతంగానే ఉన్నది కదా! ఉత్తమ గుణశీలురగు మహాత్ముల మహిమ ఈ సంసార సంరంభమును పొందుచున్నప్పుడు కూడా అంతటి ప్రశాంత శీలత్వం వహించి ఉంటుందని మన శాస్త్రములు అభివర్ణిస్తూ ఉంటాయి కదా! లోన మాలిన్యం లేనప్పుడు బయట మాలిన్యం ఏమీ చేయజాలదనటానికి ఈ ఆకాశమే దృష్టాంతం. జ్ఞాని సర్వదా సుఖవంతుడే అయివుంటాడు. ఈ సంసార పటాటోపం ఆతని అంతరాన్ని స్పృశించనైనా లేదు. ఓ ఆకాశమా! పగలు ప్రకాశమానంగాను, సాయంకాలం ఎఱుపుగాను, రాత్రియందు నల్లగానూ కనబడే నీవు ఏ సద్వస్తువు ధరించిన దానివి అయివున్నావు? నీ యొక్క రంగు, తత్త్వజ్ఞాని యొక్క చేష్ట ఎవరు అర్థం చేసుకోగలరు? హే సూర్యభగవాన్!
న తృణ సలిలం నైవగ్రామో న నామచ పత్తనం న చ దలభర స్నిగ్ధ ఛాయాతరుః న చ సత్ప్రపా తదపి గగనా ధ్వానం సూర్యః ప్రయాతి దినేదినే విషమమపి యత్రారబ్ధం తత్ త్యజంతి న సాత్వికాః ॥
త్రోవలో విశ్రాంతి కొరకై పచ్చగడ్డి గల ప్రదేశంగాని, జలంగాని, గ్రామంగాని, నగరంగాని, ఫలవృక్షాలుగాని, చలివేంద్రాలుగాని, పానీయశాలలుగాని లేకపోయినప్పటికీ ఆ సూర్యుడు తన అనుదిన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు కదా! సత్త్వశీలురగు మహనీయులు ఇతరులకు కష్టమైన పనీ అని తెలిసి కూడా - తమకు ఇవ్వబడిన కార్యక్రమాన్ని ‘అవి లేవు, ఇవి లేవు’ అని ఎవరినీ, దేనినీ నిందించకుండా కొనసాగిస్తూనే ఉంటారు.
ఆహా! ‘కాలం - - క్రియ’ అనే దంపతులు ఈ త్రిలోకాలను పరిపాలిస్తూ ఉండగా … ఇక్కడ అనుక్షణం ప్రతిది మార్పు చేర్పు పొందుచూనే ఉన్నప్పటికీ జగత్తుగా ఎల్లప్పటికీ ఉండియే ఉంటోంది.
లక్షల కొలది బ్రహ్మాండములను ధరించుచున్న ఈ ఆకాశం శూన్యమని ఎవరంటారో, ఆ పండితులు ఏమీ గమనించనివారే అవుతారు. ఈ ఆకాశంలోనే సర్వజగత్తులు ఉదయించి, ప్రవర్తించి
Page:272
లయిస్తున్నాయి కదా! ఈ విధంగా ఈశ్వరుని మహదాదిలక్షణాలు గమనించాలంటే ఈ ఆకాశమునే
గమనించాలి.
ఈశ్వరుడు నిర్లిప్తుడు కదా! ఆతనిలోనుంచి బ్రహ్మాండాలు ఎట్లా వస్తున్నాయి? కాదు చిదాకాశ రూపుడనగు నానుండే భూతాకాశం జనిస్తోంది. అట్టి భూతాకాశము నుండి నిప్పురవ్వల వలె … బ్రహ్మాండాలు ఉద్భవించి లయిస్తున్నాయి. చిదాకాశంలో ఎన్నెన్ని చమత్కారాలు సంభవిస్తున్నాయి! ఆశ్చర్యమే! నేనే చిదాకాశ స్వరూపుడను!
ఆధార మాయతతరం త్రిజగత్ మణీనామ్ అంగే విభర్త్యమితమ్ అన్తర శేషవస్తు వ్యోమైన చిద్వపురహమ్ పరమేవ మన్యే
యత్ర ఉదయ - అస్తమయమేతి జగత్ప్రమో_యమ్ ||
“ఏది అనంతరూపమై, త్రైలోక్యమణులకు ఆధారమై, జగద్రూప పరంపరలకు ఉత్పత్తి లయస్థానమైవున్నదో… అట్టి చిదాకాశరూపమగు పరబ్రహ్మమే నేను”… అని ఈ విస్తీర్ణాకాశాన్ని చూస్తున్న మనకు సుస్పష్టం - నిర్దుష్టం అగుచున్నది.
మహారాజా! ఆ శునకములను గమనించారా!
నైరృణ్యమ్ అస్థైర్యమ్ అథా అశుచిత్వమ్ రథ్యాచరత్వం పరికుత్సితత్వమ్ శ్వభ్యో గృహీతం కిము నామ మూర్ఖః మూరేభ్య ఏవ అథ శునకా న జానే ॥ నిర్దయత్వం, చంచలత్వం, అపవిత్రత్వం, నిష్కారణంగా రహదారులలో అటూ ఇటూ తిరగటం, నీచమైన అలవాట్లు, నికృష్టమైన గుణములు - - వీటిని మూర్ఖుల నుండి కుక్కలు నేర్చుకున్నాయో, కుక్కల నుండి మూర్ఖులు నేర్చుకున్నారో మనం చెప్పలేం కదా!… అయితే కుక్కలలో ఉండే శౌర్యత్వం, అల్ప సంతోషం, విశ్వాసం మనిషి చూచి నేర్చుకోవలసిందే!
ఆ తుచ్ఛమైన గడ్డిపరకను చూడండి. ఓ అల్పతృణ (గడ్డి) విభాగమా! ఆహా! లోకంలో ‘స్వల్ప మైనది’ అని చెప్పటానికి నిన్నే కదా… దృష్టాంతంగా కవులు తీసుకుంటారు! అయితే, దృష్టాంతంగా ఎంతగానో సారస్వతంగా ఉపయోగపడుచుండగా నీవు ఇక తుచ్ఛం ఎట్లా అవుతావు? భోగ పరంపరలందు ఎంతో ఆసక్తి, నమ్మకం కలిగి ఉండి విషయలంపటులై, ప్రమత్తులై, ఉన్మత్తులై, పరులను పరుషంగా నిందించు స్వభావులై - సంసారారణ్యంలో పచార్లు చేసే కొందరు మాయాతన్మయ సోదరులారా! తత్త్వజ్ఞానముచే “దేహా హమ్” స్వభావమును అధిగమించి “నేను బ్రహ్మమును” అను సర్వోత్కృష్ణానుభవమును సంతరించుకొని, ఇచ్ఛారహితులై సాంసారిక ఆశయములను అధిగమించిన మహనీయులు మీకు తృణప్రాయులు (ఈ గడ్డిపరకతో సమానంగా)గా కనిపిస్తున్నారా? మీరు ఎంతటి మూర్ఖులు! విషయలంపటముతో కూడిన ఇచ్ఛ సత్యమా? గొప్పయా? ప్రాపంచిక సుఖలను సత్యమని అనుకుంటే మీరు కుక్క కంటే ఏం గొప్ప? గొప్ప అని అనుకుంటే అట్టి విషయ లంపట దోషాధిక్యతచే మహనీయులగు ఆత్మానుభవుల సమక్షంలో మీరే తృణప్రాయులు కదా!
Page:273
ఇంకా అటు చూడండి చక్రవర్తీ! ఆ పూపొదకు ఆవల ఒక సింహం గంభీరంగా - - ప్రశాంతంగా కూర్చుని ఉన్నది. ఇటువైపు ఈ కుక్కలు మేఘ గర్జనలు విని ’భౌభౌ’ అని అరుస్తున్నాయి. సింహము - కుక్క - ఈ రెండూ తిర్యక్ జంతువులే. మేఘాల నుండి వచ్చే కోలాహల శబ్దాలు ఆ రెండింటికీ
సమానమే! కానీ ….
కోలాహలః సమానే_పి తిర్యక్వే క్షుబ్దమానసైః
అన్యథా సహ్యతే సింహైః, మీలితైరన్యథా శ్వభిః ||
మేఘ గర్జనలు వింటూ కూడా సింహం వాటిని సహిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండగా, ఆ కుక్క క్షోభపొంది భయంతో ఎగిరెగిరి పడుతోంది. జ్ఞాని ఈ సంసార సంరంభమును ప్రశాంత - మౌన చిత్తముతో చిద్విలాసంగా చూస్తూ ఉంటే, ఆశాదులచే కలుషితమైన బుద్ధిగల సంసార జీవులు ఎంతో క్షోభ చెందటం ఇటువంటిదే కదా! ఈ కుక్కకు ఈ క్షోభను పొందటం ఏ మూర్ఖ సంసార జీవుడు నేర్పాడో మరి !
హే విపశ్చిత్తు మహారాజా! ఆ ఊరకుక్కను చూచారా? అది నోరుతెరచి - మూస్తూ …. “ఓ యీ మానవుడా! నీకంటే అధముడెవడయ్యా?” …అని మూర్ఖులను చూచి నవ్వుకుంటున్నట్లున్నది. “త్వత్తః కో ౨ధమ? ఇతి ఉదీరితవతే, శ్వోవాచ హాసాన్వితం,
మత్తో · - మౌర్యమ్ - అమేధ్యమ్ - మాంద్యమ్ - అశుభం యః సేవతే సోధికః?
–
శౌర్యం - - భక్తిః అకృత్రిమా ధృతిః - ఇతి శ్రీమాన్ గుణోయో అస్తి మే
మూర్ఖదేశ గుణః ప్రయత్న నిచయైరన్విష్య నో లభ్యతే ॥
ఆ ఊరకుక్క నవ్వుతూ ఏమంటోందో చూచారా? "ఓ మానవులారా! ’సరమయి’ అనే దేవతా స్త్రీ శునక సంతతియగు మమ్ములను చూచి నవ్వుచున్నారా? ఇక ఆపండి. మీ మానవులలో కొందరు అజ్ఞానం, అపవిత్రత, దేహాభిమానం - - విచారణారాహిత్యం అశుభ ఉద్దేశములు కలిగివుండి ఈ భూమిపై సంచరిస్తున్నారు కదా! వారికంటే అధములెవరు? శౌర్యము - సహజమగు స్వామిభక్తి - అల్ప సంతోషము మొదలైన మా ఉత్తమ గుణములు ఎందరు మానవులకు ఉన్నాయి చెప్పండి?”
మహారాజా! ఆ మహావృక్షము మొదలులోగల శివలింగముపై వ్రాలి ఆ కాకి పూజాక్షతలను ఏరుకుతింటూ “కావు కావ్" … అని అరుస్తూ ఉండటం గమనిస్తున్నారా?
లింగస్య ఊర్థ్యం రటత్ కాక, “ఆత్మానం దర్శయత్యయమ్ సర్వాధః పాతక ఉత్తుంగ గతిం పశ్యతి మామ్” ఇతి ||
ఓ మానవులారా! ఇదిగో నన్ను చూస్తున్నారా! ఈ “శివనిర్మాల్య భక్షణం” అనే అధోగతికి నేనెందుకు పాలయ్యాను? క్రితం జన్మలలో పుణ్యకార్యాలు మానివేసి పాపకార్యాలకు ఉపక్రమించటం చేతనే కదా! మరి మీరు పాపకార్యములు కొనసాగించి నావలె తుచ్ఛజన్మ పొందటానికి ఉపక్రమిస్తు న్నారా? సిగ్గు సిగ్గు! జాగరూకులై పాపకార్యములను విరమించి పుణ్యకార్యముల కొరకై సంసిద్ధులు కండి” …అని “కావ్ - కావ్” (కాకండి - - కాకండి) అనే ఉద్దేశంగా మా మా కనిపిస్తోంది. Page:274
ఓ కాకమా ! ఆ ప్రక్కనే మృదుమధురంగా ఉండే లేత నూతన తామర తూడులను వదిలివేసి క్రుళ్ళిపోయిన ఈ నిర్మాల్యం భుజిస్తున్నావేం? ఓహో! మేము జ్ఞాన విశేషాదులను - భక్తి ప్రపత్తులను వదలి కామ-క్రోధములను ఆశ్రయించటం ఇట్టిది - అని మాకు గుర్తు చేస్తున్నావా? శహభాష్!
తెల్లటి పూసజ్జలో నుంచి వస్తుంటే ఆ తెల్లపక్షిని చూచి “ఇది రాజహంస కాబోలు” అని అనుకున్నాం. తీరా అది కాస్తా వచ్చి నేలపై పురుగులను ముక్కుతో భక్షిస్తూవుంటే “ఇది రాజహంస కాదు. తెల్లకాకి” …అని మేము గుర్తించాం. మానవులలో కొందరు పైకి పవిత్ర భావాలు కలుగజేసే వస్త్రాలు ధరించి, లోన దుష్ట సంస్కారాలు కలిగివుండటం ఇట్టిదే కాబోలు!
కోయిల సమూహంతో కలిసి కాకి కోయిలలా అనిపిస్తుంది. అది గొంతువిప్పి ‘కావ్-కావ్’ అని అరవటం ప్రారంభించగానే “ఇది కోయిల కాదురా బాబూ! కాకి!” …అని తెలిసిపోతుంది. మహనీయుల సమావేశంలో మూర్ఖుడు ఇట్లా బయటపడిపోతాడు.
స్వామీ! ఆ చిటారుకొమ్మపై కాకి నిలబడి అరవటం దేవాలయ ప్రాంగణంలోగల మహావృక్షాన్ని అధిరోహించిన దొంగ ఊరంతా కలియజూస్తున్నట్లు లేదూ!
ఓ కాకమా! “ఇది కాకుల విభాగం. కాకులే తినాలి” అని మిగతా కాకులను “కావ్ కావ్” అని పిలుస్తున్నావా? మా మానవుల జాత్యహంకారం ఇటువంటిదే కదా! నీకటు శబ్దరూపమైన అరుపులు ఈ వనంలోని సుశబ్దములను వినిపించకుండా చేస్తున్నాయి! అవునులే! “వాడు అటువంటి వాడు, వీడి సంగతి చూద్దాం” … అనే మాటలు “తత్త్వమసి” వంటి ఉపనిషత్ సంభాషణలను (మా అజ్ఞానం చేత) మాకు వినపడకుండా చేస్తుంటే మేము ఊరకొని ఉండటంలేదా? ఇదీ అట్టిదే రాజా! ఆ కోకిలను చూడండి. దంపతుల రతికలహమునకు సంధి కుదిర్చే ఆ ఆ కోయిల గీతం విననీయకుండా ఈ కాకుల క్రూరమైన కావ్ కావ్ నినాదం ఎంతబిగ్గరగా వినబడుచున్నదో!
ఓ మధురగాయని అగు కోకిలా! చూచావా! ఇక్కడ నీ మధురగానం వినే శ్రోత ఏడీ! ఇక్కడి వారికి కాకుల శబ్దాలే ప్రియంగా ఉన్నాయి. "ఈ కోయిలను మేమే పెంచాం! లేకపోతే బ్రతికేదే కాదు” …అని నీ శ్రోతలకు ఈ కాకులు తమ గొప్పతనం చెప్పుకుంటూ నీ గానాన్ని విననీయకుండా చేస్తుంటే, ఈ కాకుల గుంపుగల ప్రదేశంలో నీ గీతం వినిపించి ఏం ప్రయోజనం?
ఓ కోకిలా! “తవ కుహూ - తవ కుహూ” అనే శబ్దం పలుకుచూ… “ఓ జనులారా! మీ సంసారం మీరే కల్పించుకొని ఉంటున్నారు. అట్టి మీ కల్పనా పరంపరలు ఇక ఆపండి. లోక వ్యవహారములు అనే కాకి కూతలు వినటం మాని మహనీయులగు ఆత్మానంద తత్పరులు వినిపించే ఆత్మానంద గానం వినండి” …అని మాకందరికీ గుర్తు చేస్తున్నావా? భేష్! మూర్ఖజనుల మధ్య ఉన్నప్పటికీ బ్రహ్మజ్ఞాని వేరుగానే కనిపించునట్లు కాకుల మధ్య కాకి రంగు రూపుతో ఉన్న కోయిల కాకులకంటే వేరుగా ప్రకాశమానంగా కనిపిస్తోంది. ఆహా!
కోకిల శిశువును వదలి తల్లి కోకిల ఎటో పోవటం, తల్లి కాకి కోకిల శిశువును తెచ్చి పిల్లకాకి అనుకొని పెంచటం, కొంతకాలం జరిగిపోయిన తరువాత “ఇది కోకిలగాని కాకి కాదు”
Page:275
అని గుర్తించి తల్లికాకి కౌమార కోకిలను పొడిచి హింసించటం… ఇంత జరిగినా కోకిల తన గాన మాధుర్యాన్ని కించిత్ కూడా కోల్పోనేలేదు. మహనీయులు ఈ సంసార జీవుల మధ్య ఉండి అనేక హింసలపాలైనా కూడా తమ మహనీయత్వము కోల్పోరు కదా!
ఆ హంస సరోవరంలోని తామర తూడులను ముక్కున కరచుకొని తన బిడ్డల కొరకై తీసుకొనిపోవుచూ కూడా ఎంత గంభీరంగా కదలివెళ్ళుచున్నది! మహనీయులగు పరమహంసలు జగత్ కార్యక్రమము నిర్వర్తిస్తూ కూడా అంతరంగమున ఆత్మజ్ఞానగాంభీర్యులై ఉంటారనటానికి ఇదే దృష్టాంతం. ఇటు చూడండి. ఈ సరస్సు బ్రహ్మ సాక్షాత్కారముతో గూడిన మహాత్ముల మనస్సువలె ఎంత నిర్మలంగా శోభిస్తోంది. అయితే సరోవరజలం, నదీజలం, కూప జలం (నూతి నీరు) మనం దేనిని ఏ పేరుతో పెట్టి పిలిచినా జలమంతా ఒక్కటే కదా! అట్లాగే స్త్రీ - పురుషాది భేదములతో శరీరాలు వేరువేరుగా కనిపించినా ఆత్మ సర్వదా ఒక్కటే కదా!
ఈ సరస్సులో ఎన్నెన్ని కమలములున్నాయో కదా! అనేక జన్మలలో అనేక సంస్కారముల పరంపరలను నింపుకొనివున్న ఈ సంసారజీవుని భోగోత్సాహ మనస్సువలె ఈ సరస్సులోని కమలములను లెక్కించటం ఎవరి తరం?
అటువైపుగా చూస్తే పైకి ముళ్ళపొదలను, అంతరమున పుష్పములను ఆ సరోవర విభాగం కలిగివున్నది. అంతరమున ఆత్మ అనే మధుర పానీయమును దాచుకొని పైకి దృశ్య సంసారము వహిస్తున్న జీవుని మనోఫలకమువలె అది కనిపించుచున్నది కదా! ఓ మానవులారా! "అస్థిరం, జడం, ఛిద్ర సహిత, నిస్సారం అగు పైపై ప్రయోజనములను వదలి …సారయుక్తమగు ఆత్మనే గ్రహించండి, దర్శించండి… మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి” అని మనకు శాస్త్రములు బోధిస్తున్న రీతిగా ఉన్నది. ఏ కమలమైతే లక్ష్మీదేవి హస్తమును అలంకరించి విష్ణు భగవానుని హృదయంలో స్థానం పొందిందో అట్టి ఈ కమలము యొక్క సౌకుమార్యం, ఔన్నత్యం ఏ కవి సంపూర్తిగా వర్ణించగలడు?
ఆ తెల్లటి కమలం, నీలి కమలం చూడండి. ఆకారం చేత ఒక్కటే అయినప్పటికీ సాత్వికుని మనస్సు - మూర్ఖుని మనస్సులాగా అవి ఎంతటి భేదం కలిగి ఉన్నాయి! ఈ మామిడి వృక్షమునకు విరగకాచి పసుపుపచ్చగా పండివున్న మామిడి పళ్ళరసమును గ్రోలుచు తుమ్మెదలు - కోయిలలు ఆనందపడుచున్నప్పుడు ఈ ప్రకృతి రచయిత అగు బ్రహ్మదేవుడు తన రచనను చూచుకొని తానే ఎంత ఆనందపడుచున్నాడో?
ఓ తుమ్మెదా! నీవు ఎన్నో స్థానములలో రసమును గ్రోలికూడా ఇంకా సంతుష్టి పడకపోవట మనేది సంసారజీవుల నిత్య అసంతృప్తికి సోదాహరణమే అగుచున్నది.
ఓ రాజహంసా! నీవు చేసే మధుర “హ- హు-హూ” నాదం కొంగకు వెయ్యి జన్మలకైనా వస్తుందా? రాదు. అయితే నీవు హంసి (ఆడు హంస) వెంట పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకోవటం మాలోని కొందరు స్త్రీ వ్యసనంచే జీవితం సర్వనాశనం చేసుకోవటం గుర్తుచేస్తోంది. నీవు కొంగలు
- - నీటి కాకులు మొదలైన హింసక పక్షులు నివసించే ఈ సరస్సుల్లో ఉంటున్నావెందుకు చెప్పు?
Page:276
ఓ నీటి కాకీ! నీవు కూడా మా జనులలో కొందరివలె పరాన్నభుక్కువై పరులను ఇతరులను బాధించటమే వృత్తిగా కలిగి ఉన్నావే!
ఏవం విహన్యతే లోకః స్వార్టేనేతి ప్రదర్శయన్
మద్గురుం మద్గురుతాం యాత ఇత్యేవం స్తోతి దుర్జనః ||
"ఈ నీటికాకివలె మేమూ ఇతరులను బాధించటం, ఇతరుల ఆర్జనములను దొగిలించటం కొనసాగిస్తూ ఉంటాం! ఇందుకు ఈ నీటికాకియే మా గురువు!” … అని దుర్జనులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేగా మరి!
అయితే, కొంగలు, నీటికాకులు, రాబందులు, రాజహంసలు ఒకే సరస్సులో, ఒకేచోట ఉండి జీవిస్తున్నప్పటికీ ఒకరి లక్షణాలు మరొకరికి అబ్బుతున్నాయా? లేదు. అట్లాగే మూర్ఖులు, నీచబుద్ధి కలవారు, హింసయే స్వభావముగా గలవారు - సర్వం పట్ల సమత్వ బుద్ధి సముపార్జించుకొన్న మహనీయులు ఒకే ఆశ్రమంలో కలిసివుండవచ్చుగాక! ఒకరి బుద్ధి మరొకరికి అలవడేది కాదు.
అదిగో, ఆ కొంగను చూస్తున్నారా? ఒక చేపను ముక్కున కరచుకొన్నది. ఆ చేప ఒక్కసారి తన బలమంతా ఉపయోగించి ఆ కొంగ ముక్కు నుంచి విడివడి నీళ్ళలోకి దుమికింది. కాని భయం చేత గుండె ఆగి ప్రాణాలు పోగొట్టుకొని నీటిలో తేలియాడుతోంది. అవునుకదా! ప్రపంచంలో మహావిపత్తు సంభవించినప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవటమే అధిక సౌఖ్యప్రదం అని కొందరు భ్రమిస్తు న్నారు మరి! అదిగో, అదిగో…! అటుచూడండి. ఆ బాటసారి లేళ్ళ కళ్ళను చూచి తన ప్రేయసినేత్రాలు గుర్తుకు వచ్చి కాబోలు, నిశ్చేష్టుడై నిలుచున్నాడు. అటు ఆ నెమలిని చూస్తున్నారా! అది నేలపై నీళ్ళను ముట్టకుండా ఇంద్రుని ప్రార్థించి, ఇంద్ర ప్రసాదితమైన మేఘజలం ఆస్వాదిస్తోంది. ఇంకా దాని పోకడ చూడండి. అది నేలపై నీటిని ముట్టటం లేదు. బాగుంది కానీ, నేలపై గల పాములను మాత్రం భక్షిస్తోంది. ఔన్నత్యం సంపాదించుకుని కూడా నీచత్వం వదలలేని వారికి ఇదే తార్కాణం!
ఆ వెదుళ్ళు చేసే శబ్దం ఎంత సంగీతభరితంగా ఉన్నదో చూచారా? అవి ఏ విద్వాంసులు సేవచే అంతటి గానకౌశలాన్ని నేర్చుకున్నాయో కదా!
రాజా! ఈ ఎత్తైన తాటిచెట్టును చూస్తున్నారా? అది చాలా ఎత్తుగా ఉండటం చేత వాటిని ఎవరూ కోరరూ, కోసుకోరు. మూర్ఖుల లోభగుణం ఇట్టిదే కాబోలు.
దీయన్తాం మణలానాం దిశిదిశి చ యథా శాస్త్రమస్త్రాణ్య వన్యా రక్షాయై క్షాన్తిపూర్వం చిరమ్ అతులబలం శాన్తయా శాసనాని ॥
మీ యొక్క నాలుగు ఉపాధుల బలపరాక్రమాల ప్రభావంచేత మనం దశదిశలలో సుదీర్ఘ ప్రదేశాలన్నీ జయించాం. ఇక రాజనీతిని అనుసరించి శాంతబుద్ధితో సమాధానపూర్వకంగా చిరకాల రక్షణ కొరకై రాజశాసనాలు, కప్పములు నియమిస్తూ అధికారము యొక్క గుర్తులను స్థాపించండి.
Page:277
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అప్పుడు ఆ నలుగురు విపశ్చిత్ రాజులు నాలుగు సముద్ర తీరాలలో గల నాలుగు వేరైన ప్రదేశాలలో సమావేశమైనారు. మంత్రులు ఆయా రాజ్యాంగ విశేషాలు నివేదిస్తూ ఉండగా ఆయా సామంతరాజ్య చట్టాలను, ప్రణాళికలను అప్పటికప్పుడు తయారు చేసి తుదిమెరుగులు దిద్దారు. ఇంతలో సాయంకాలం అయింది. సూర్య భగవానుడు అస్తమాద్రి చేరాడు. ఆ నలుగురు తమ సాయం సంధ్యలను ముగించుకొని నాలుగు సముద్రముల తీరాన తమతమ శయనములపై విశ్రాంతి తీసుకోనారంభించారు. ఆ నలుగురు నాలుగు వేరువేరైన సుదూర స్థానములలో శయనములపై పరుండి ఆశ్చర్యముతో కూడిన చిత్తము కలవారై తమ తమ మనస్సులలో ఇట్లు చింతించనారంభించారు.
నలుగురు విపశ్చిత్తులు (తమ మనస్సులో) : “ఆహా! శత్రు రాజ్య సైన్యమును పారద్రోలుతూ అతి దూరంగా ప్రయాణించి ఇప్పుడు సముద్రల తీరాలకు చేరాం. దేవదేవుడగు అగ్నిదేవుని ప్రభావం చేత ఆయన మనకు ప్రసాదించిన దివ్య వాహనముల ప్రభావంచేత కదా, ఇంతదూరం రాగలిగాం! ఇప్పటిదాకా బాగానే ఉన్నది! ఈ సువిశాల దృశ్యము ఎంతవరకు వ్యాపించి ఉన్నది?…
ఈ జంబూద్వీపానికి ఆవల లవణ సముద్రం ఉన్నది. లవణ సముద్రానికి ఆవల రెండింతలు ఇక్షు సముద్రం (తీపి నీరు) ఉన్నది. దాని కావలి కుశద్వీపం ఉన్నది. దానికి ఇంకా ఆవల సురోద సముద్రం ఉన్నది. ఇట్లా శాస్త్రాలలో మనం చదివాం. అయితే సప్తద్వీప - సముద్రములకు ఆవల ఇంకా ఏం ఉంది? ఈ చేత్య (దృశ్య) రూపిణి యొక్క ‘మాయ’ ఎంతవరకు విస్తరించి ఉన్నది. ఈ వస్తు వైచిత్ర్యము యొక్క అసలైన రూపమెట్టిది?
ఈ విషయాలు తెలియాలంటే మన వల్ల కాదు. అయితే మన ఇష్టదైవమైనట్టి అగ్నిదేవుని కరుణచే మాత్రమే సాధ్యం. అందుచేత ఆయనను ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకొని నాలుగు దిక్కులలో ఈ సప్తసముద్రములకు ఆవల గల విశేషములను దుఃఖరహితులమై సందర్శించి వద్దాం.”
ఇట్లా నాలుగు సముద్ర తీరాలలో కూర్చుని ఆ నలుగురు విపశ్చిత్తులు ఏకకాలమున అగ్ని దేవునికి ప్రార్థనలు సమర్పించారు. ఆ నలుగురికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇట్లు పలికాడు. అగ్నిదేవుడు : పుత్రులారా! మీ ప్రార్థనకు మెచ్చాను. ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నాను. మీ అభిలాష ఏమిటో చెప్పండి? పసిపిల్లల కోరిక తీర్చటమే తండ్రికి ఆనందం కదా!
నలుగురు విపశ్చిత్తులు :
పంచభూతాత్మకస్యాస్య దృశ్యస్య అంతం, సురేశ్వర! దేహేన, మంత్ర దేహేన, తదనే మనసాపి చ, యావత్ సంవేదనం, యావత్ సంభవం, యావదాత్మకమ్ పశ్యేమ ఇతి నో దేవ! దీయతామ్ ఉత్తమో వరః ॥
Page:278
ఓ దేవేశ్వరా! మీ దర్శనంచే పునీతులమై సాష్టాంగ దండప్రణామములు సమర్పిస్తున్నాం. మా కోరిక ఏమిటో వివరిస్తాం. వినండి1. పంచభూతమయమగు ఈ దృశ్యం యొక్క అంతం ఎక్కడో… అక్కడి వరకు ఈ దేహంతో
చూచెదము గాక!
ఆ తరువాత వైదిక మంత్ర ప్రభావంచే ఏర్పడే సంస్కార దేహంతో ఎంతవరకు పయనించ గలమో అంతవరకు వెళ్లెదము గాక!
ఇక ఆపై మనస్సుతో ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి చూడగలిగినంత చూచి వస్తాము గాక!
ఇట్లు… 1.ప్రత్యక్షం, 2. అనుమానం, 3. శుతి… మొదలైన అన్ని విధాలా ఈ దృశ్య జగత్తు ఎంతవరకు విస్తరించి ఉన్నదో అంతవరకు చూచిరాగల వరం ప్రసాదించండి. అనగా…
ఆ విధంగా అగ్నిదేవుడు అంతర్థానమైన తరువాత ఆ రాత్రి గడిచింది. ఆ మరునాడు ఉదయమే ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు సముద్రాలను దాటి ఆవల ఉన్న ప్రదేశాలు, విశేషాలు సందర్శించి రావటానికి ఉద్యుక్తులయ్యారు.
మంత్రులు, “మహారాజా! మీరు రాజ్య సంరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు అత్యంత ముఖ్యులు. యుద్ధం ఇప్పుడే కదా ముగిసింది! అనేక విషయాలు అస్తవ్యస్తంగా ఉండి ఉంటాయి. అతి ముఖ్యమైన వ్యవహారాలు రాజనిర్ణయాలకై వేచి ఉన్నాయి. ఇప్పుడు మీరు లేకపోతే మన రాజ్యానికి అది తీరని లోటు. అందుచేత సముద్రంలో ప్రవేశించవద్దని మా మనవి” … అని సవినయంగా ప్రార్థించసాగారు.
అయితే ఆ విపశ్చిత్తులు ఆ మాటలన్నీ వినిపించుకోనేలేదు. అప్పటికప్పుడే తమ తమ మనస్సులలో గల పుత్ర, మిత్ర, కళత్ర, జాతి, రాజ్య, రాజాంతఃపురములపై గల అభిమానము, యుద్ధము, అధికారము మొదలైన వాటి వలన రూపుదిద్దుకుని ఉన్న మాత్సర్యం, కిరీటం, రాజ సింహాసనం, అంతఃపుర శయనాభిలాష, సేవకజనం, రాజవస్త్రములు, వస్తు వాహనాలకు సంబంధిం చిన లోభం, శత్రు పరాభవం, రాజ్యపాలన, ఆజ్ఞలు పురమాయించటం, ఆయా అధికారులను గదమాయించటం… మొదలైన వాటికి సంబంధించిన అభిలాష మొదలుగా గల కర్మ - దృశ్య సంబంధమైన దోషములను ఒక్కటొక్కటిగా త్యజించారు. ఇక, సుదీర్ఘ ప్రయాణమునకు ఉద్యుక్తులై, …నాలుగు సముద్రముల ఒడ్డు వరకు తమను అనుసరించి వచ్చిన ఆయా మంత్రులను పేరుపేరునా ఇట్లా సంబోధించారు.
Page:279
“ఓ రాజాజ్ఞ పరాయణులు, దేశభక్తులు అగు మంత్రులారా! సైనికాధ్యక్షా! ప్రియ సైనికులారా! మేము ఈ సముద్రమును దాటి ఆవలగల సృష్టి విభాగమును కలియచూచి, అక్కడి విశేషాలన్నీ గమనించి తిరిగివస్తాము. మీరు త్రోవలలో గల మన సామంత రాజ్యములు సందర్శిస్తూ, అక్కడ మన రాజ్య చట్టములు, కప్పములు, దేశాభివృద్ధి ప్రణాళికలను నిర్దేశిస్తూ, అమలుపరుస్తూ, మన రాజధాని అగు తతమితి నగరం జేరండి. ప్రధాన మంత్రులవారు రాజ్యసభ యథారీతిగా నిర్వహిం చెదరు గాక! రాజధాని చేరగానే విజయోత్సవాలు నిర్వహించండి. మన సైనికులకు, మరణించిన సైనికుల కుటుంబాలకు కానుకలు, నష్టపరిహారాలు గాయపడిన మన సైనికుల - మనపై దండెత్తిన సరిహద్దు దేశాల సైనికులకు అవసరమైన వైద్యచికిత్సలు ప్రేమతో అందించగల వైద్యులను నియమించి, అవసరమైన ధనాది సదుపాయములను అందించండి. చెల్లించండి. మేము త్వరలో తిరిగివస్తామని ప్రజలకు విన్నవించండి. ఇక సెలవు."
ఈ విధంగా పలికి ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు దిక్కుల చివరన గల సముద్రపు ఒడ్డున పరివారాన్ని వదలి నాలుగు దిక్కులుగా దృఢ నిశ్చయంతో పాదచారులై ప్రయాణించసాగారు. తమ యొక్క మంత్రశక్తిచే “జయము” అను సిద్ధిని పొంది ఉన్న ఆ నలుగురు సముద్రజల తరంగాలపై నేలపై నడిచినట్లే అడుగులు వేసుకొంటూ నడక సాగించారు. మావటివాడు ప్రేరేపిస్తూ ఉండగా త్రాళ్ళకు కట్టిన దుంగలను లాగుచూ వెళ్ళే ఏనుగు వలె వారు ముందుకు అధిరోహిస్తూ, దిగుతూ, మరికొన్ని చిన్నతరంగములపై నాచు-జలవృక్షముల మధ్యగా అడుగులు వేస్తూ, చాలాకాలం అటు-ఇటు తిరుగుతూనే ఉన్నారు. మంత్ర విద్యాబలప్రభావం చేత అతితేజో సంపన్నులైన వారు దుర్జయులై సంచరించసాగారు. ఒక్కొక్కచోట మదించిన మొసళ్ళచే మ్రింగబడి అక్కడ అగ్నిదేవుని ప్రభావం చేత జీర్ణం అవక మరల ఉదరంలో నుంచి బయల్వెడలారు. ఒక్కొక్కసారి జలతరంగాలపై విశ్రమించి ఆ జల తరంగాలచేత వేలాది యోజనాలు నిదురలో ఉండగానే తీసుకొని పోబడేవారు. తమ రాజధానిలో ఏనుగులను అధిరోహించినట్లు వాళ్ళు నలుగురు నాలుగు సముద్ర తరంగాలను అధిరోహించి సుదూరం ప్రయాణించేవారు. ఆ తరంగాలు సముద్ర మధ్యంలో గండ శిలలను సమీపిస్తున్నప్పుడు దెబ్బ తగలకుండా లాఘవంగా తప్పించుకునేవారు. క్షణంలో సముద్రపు అడుగు భాగం జేరేవారు. ఆ సముద్రపు అంతరమున కూడా సంచరిస్తూ మొసళ్ళతోను, ఎండ్రకాయలతోను, తదితర సముద్ర జీవులతోను పరిహాసపూర్వకంగా అంగవిన్యాసములతో సంభాషిస్తూ సహవాసం చేస్తూ సంచరించసాగారు.
ఓ రామచంద్రా! ఆ ప్రకారంగా ఆ నలుగురు సముద్రమును, ద్వీపములను దాటివేయుచు “ఈ పాంచభౌతిక అవిద్యా జగత్తు ఎంత దాకా విస్తరించి ఉన్నది? అవిద్య యొక్క చివర ఎక్కడ”? అనే విచారణ యందు ప్రవృత్తులై ప్రవర్తించసాగారు. మధ్య మధ్యలో వనములు, పర్వతములు ఏవేవో జనరహిత ప్రదేశములు తారసపడసాగాయి. ఇంతలోనే అనేకానేక సంఘటనలను ఆ నలుగురు విపశ్చిత్తులు చవిచూశారు.
Page:280
పశ్చిమ దిక్కు విపశ్చిత్తు మత్స్యావతారుడగు విష్ణు భగవానుని కులంలో జన్మించిన ఒక పెద్ద చేప చేత మ్రిగబడ్డాడు. అది క్షీర సముద్రంలో ప్రవేశించి "ఈ దేహమును నేను జీర్ణం చేసుకోలేను” …అని గ్రహించినదై క్షీరసాగర మధ్యంలో క్రక్కివేసింది. అప్పుడు లేచి నడకసాగిస్తూ ఆ పశ్చిమ దిక్కు విపశ్చిత్తు క్షీర సాగరంలో అతిదూరం వెళ్ళటం జరిగింది.
దక్షిణ దిక్కు విపశ్చిత్తు ఇక్షు సముద్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇంతలో సముద్ర మధ్యలోగల ఒకానొక యక్ష నగరంలో అనుకోకుండా ప్రవేశించాడు. అక్కడ ఒక యక్షిణి ఆతనిని చూచి తన వశీకరణ విద్య చేత కాముకుడగు భర్తగా తన వశం చేసివేసుకొన్నది.
తూర్పు దిక్కు విపశ్చిత్తు ఒక చోట సముద్రంలో గంగానదీ ప్రవేశమును గమనిస్తూ ఉండగా ఒక పెద్ద తిమింగలం మ్రింగబోవగా, దానిని గంగానదీ ప్రవాహంలోకి ఊడ్చుకు వచ్చి శస్త్రాస్త్రాలను ప్రయోగించి చీల్చి వేశాడు. ఆ ప్రయత్నంలో తీవ్ర వేగంతో ప్రవహించే గంగానదీ ప్రవాహం ఆతనిని ‘కన్యాకుబ్జ’ అని పిలవబడే ఒక ప్రాంతానికి త్రోసుకుపోయింది.
ఉత్తర దిగంతము చూడటానికి వెళ్ళిన విపశ్చిత్తు ‘ఉత్తరకురు’ అనే దేశంలో ప్రవేశించి అక్కడ దేవీసహితుడైన శివభగవానుని ఆరాధించి అణిమ - గరిమ మొదలైన ఆయా సిద్ధులు/ఐశ్వర్యములు సముపార్జించాడు. ఆ సిద్దుల ప్రభావం చేత అతనికి ‘గాయము మరణము’ లకు సంబంధించిన భయం లేకుండాపోయింది. ఆతడు ఆయా త్రోవలలో జలచరాల చేత మ్రింగబడి కూడా అణిమాది సిద్ధులచే క్షేమంగా బయల్వెడలి, క్రమంగా ద్వీపాంతరాలు దాటి, కుల పర్వతాలు కూడా దాటివేశాడు.
పశ్చిమ దిక్కు విపశ్చిత్తు హేమచూడ పక్షి (గరుడపక్షి) యొక్క వీపును అధిరోహించి గరుత్మంతుని ఆరాధిస్తూ క్రమంగా అనేక ద్వీప - ద్వీపాంతరాలు దాటి వెళ్ళాడు.
తూర్పు దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు క్రౌంచద్వీపం ప్రవేశించాడు. అక్కడ గల వర్షసీమా పర్వతాన్ని అధిరోహిస్తూవుండగా ఒక రాక్షసి ఆతనిని మ్రిగింవేసింది. కాని కొద్దిసేపట్లో ఆతడు ఆ రాక్షసి ప్రేగులు చీల్చి హృదయమును భేదనం చేసి బయల్వెడలాడు.
దక్షిణ దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు దక్ష ప్రజాపతి నగరం ప్రవేశించాడు. అనుమతి, విన్నపము లేకుండా ప్రవేశించినట్లు తెలిసి ఆ దక్ష ప్రజాపతి "నీవు యక్షుడుగా అయ్యెదవు గాక” అని శపించాడు. అట్లు యక్షుడుగా (సూక్ష్మదేహ మాత్రమైన సత్త కలవానిగా) రూపొందిన ఆ విపశ్చిత్తు శాకద్వీపం ప్రవేశించాడు. అక్కడ ఒక ఏకాంత స్థానం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేసి శాప
విమోచనం పొందాడు.
ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్న విపశ్చిత్తు, తాను సంపాదించిన సిద్ధులను వెంట నిడుకొని వేగం గలవి - చిన్నవి అగు అనేక సముద్రాలు దాటివేశాడు. ఒక సువర్ణమయ ద్వీపంలో ప్రవేశించాడు. అక్కడ గల ఒకానొక సిద్ధునకు కొంత చికాకు కలిగించాడు. ఆ సిద్ధుడు కోపగించి “నీవు శిలవైపోయెదవు గాక!”… అని శాపం ఇవ్వటం జరిగింది. ఆతడు ఆ ప్రదేశంలో ఒక శిలగా మారి నూరు సంవత్సరాలు గడిపాడు. అప్పుడు అగ్నిదేవుడు అనుగ్రహించటం చేత శపించిన ఆ
Page:281
సిద్ధుడే ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తుకు శాప విమోచనం ప్రసాదించాడు. మనఃప్రీతిని పొందిన ఉత్తర దిక్కు విపశ్చిత్తు ఇంక అక్కడి నుండి బయల్వెడలాడు.
తూర్పు దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు ‘కన్యాకుబ్జ’ అనే పేరు గల నగరంలో ప్రవేశించి అద్దానికి ఉత్తరంగా అనేక వందల యోజనాలు ప్రయాణించాడు. ‘నాలికేరం’ అనే దేశంలో ప్రవేశించి అక్కడ కొంతకాలం నివసించసాగాడు. తన పూర్వ వృత్తాంతం మరిచాడు. క్రమంగా అక్కడి రాజ్యానికి రాజయి ప్రజారంజకంగా ఎనిమిదేళ్ళు రాజ్యపాలన చేశాడు. అతిధర్మాత్ముడై ఎన్నో ప్రజారంజకమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఇంతలో ఏదో సందర్భంలో ఎందుకో తన పూర్వవృత్తాంతం గుర్తుకు వచ్చింది. “అయ్యో! నేను ఇక్కడ ఉండిపోతే ఎట్లా? ఆపదలచే స్పృశించబడని నేను ఈ సృష్టి అంతు ఏమిటో-ఎక్కడో చూచి రావాలి కదా!" … అని తలచి ఇక అక్కడి నుండి అక్కడివారికి చెప్పాపెట్టకుండా బయలుదేరాడు.
ఉత్తర దిక్కున వెళ్ళిన విపశ్చిత్తు ఒక ద్వీపాన్ని చేరాడు. అక్కడ ఎక్కడబడితే అక్కడ కొబ్బరిచెట్లు మాత్రమే ఉన్నాయి. అతనికి ఆకలి వేసినప్పుడల్లా కొబ్బరి, కొబ్బరినీరు త్రాగుతూ ఆ ప్రదేశమును సందర్శిస్తూ కొంతకాలం గడిపాడు. అట్లా సంచరిస్తూ మేరు పర్వతమును సమీపించాడు. అక్కడ గల ఒక కల్పవృక్షం క్రింద విశ్రమించి “ఆహా! ఇప్పుడు నాకు ఒక అప్సరస సేవలు లభిస్తే ఎంత బాగు?” అని తలచాడు. అంతే! కళ్ళు జిగేలుమనిపిస్తూ ప్రపంచంలోని సౌందర్యమునంతటినీ పుణికిపుచ్చుకున్న ఒక అందాలరాశి అయిన అస్పరస అక్కడ ప్రత్యక్షమైంది. క్రమంగా ఆమెతో మాటలు కలిపి ఆమె సాంగత్యం పొందాడు. ఆమెతో సరస సల్లాపాలు, వన విహారాలు చేయ నారంభించాడు. క్రమంగా ఆమె సాంగత్యంలో పది సంవత్సరాలు గడిపిన తరువాత గాని, తానెందుకు బయలుదేరాడో …(ఈ భౌతిక సృష్టి ఎంతవరకు విస్తరించి ఉన్నదో చూచి తిరిగి తతమితి నగరం తిరిగి వెళ్ళాలనే ప్రణాళిక), అది గుర్తుకు వచ్చి ఇక అక్కడి నుండి ఏదో సాకుతో బయల్వెడలాడు.
పశ్చిమ దిక్కుగా సంచరిస్తున్న విపశ్చిత్తు ‘శాల్మలి’ అనే ద్వీపం చేరాడు. ఆతడు తన “పక్షుల వశీకరణ విద్య" ప్రదర్శిస్తూ రకరకాల పక్షులను ఆకర్షించి వినోదిస్తూ ఉండేవాడు. ఇంతలో ఒక సుందరమైన ఆడు నెమలి యొక్క కులుకులకు ఆకర్షితుడై పురుషనెమలిగా దేహం ధరించి పది సంవత్సరాలు గడిపాడు. మరల ఒక రోజు ఆడు నెమలిని అక్కడే వదలి, ఇక అక్కడి నుండి బయలుదేరి మంధరపర్వతం జేరి అక్కడ గల ఒక కిన్నెర స్త్రీతో మరికొంత కాలం గడిపాడు.
తూర్పు వైపు వెళ్ళిన విపశ్చిత్తు నారికేళవనంలో నుంచి క్షీరసాగరం ప్రవేశించాడు. ఆ క్షీర సాగరంలో గల కల్పవృక్ష సమూహంలో నందనవన దేవతలతో అనేక కామములచే వ్యాకులుడై డెబ్భై సంవత్సరాలు గడిపాడు.
Page:282
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ ! ఆ విపశ్చిత్తు ఒకే జీవాత్మ కదా! మరి నాలుగు దేహములతో వేరువేరైన ప్రదేశములలో, వేరువేరైన కోరికలు, పరిచయములు, అనుబంధములు మొదలైనవి ఒకే సమయంలో ఎలా నిర్వర్తించాడు? విపశ్చిత్తు మొట్టమొదట… ఒకే సాక్షి చూతన్యముచే పరిపూర్ణుడై, ఒక జీవుడై, ఒక దేహము కలవాడై, ఒక విధమైన ధ్యాన - ప్రియ - -
వ్యవహారాది క్రియలు కలిగి ఉండేవాడు కదా! ఇప్పుడు నాలుగు దేహములు…! నాలుగు విధాలైన దృష్టులు…! నాలుగు చోట్ల నాలుగు విధాలైన అనుబంధ - బాంధవ్య - వ్యవహారాదులు కలిగి ఉండట మనేది ఎట్లా యుక్తియుక్తం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనస్సు చిరకాలంగా ఏది ఎట్లు ‘సత్యమే’ అని భావించి అభ్యసిస్తూ ఉంటుందో… అది అట్లే మనస్సుకు ఘనీభూతమై అనుభవమౌతుందని మనం ఇప్పటివరకు అనేక చరిత్రలలో చెప్పుకున్నాం కదా! అట్లాగే ఈ వ్యష్టిజీవుల మనస్సు,
“ఈ ఒకేఒక దేహమే నేను. ఇదియే నా ఉనికి. ఇది భౌతికంగా ఎక్కడ ఉంటే నా పరిమితి అంతవరకే” …అని అనేక దేహపరంపరలుగా చిరకాలాభ్యాసం నిర్వర్తించినదై ఉంటోంది. అందుచేతనే, ఈ జీవుడు “ఇదే నా రూపం, నామం, పరిమితి, ఆశయం, వ్యవహారం, చలనం” …అని భావిస్తూ ఉన్నాడు.
ఒకే జీవుడు అనేక దేహములలో ఉండి, ఒక దేహంతో మరొక దేహానికి సంబంధంలేనట్టి - అనుభూతులు, సంబంధ బాంధవ్యములు, వ్యవహారములు, భావనలు, నమ్మికలు కలిగి వ్యవహరించటమనే చమత్కారం శ్రోతలకు యుక్తియుక్తంగా గ్రహించటానికి గాను, ఇప్పుడు స్వప్నమును దృష్టాంతంగా తీసుకొని విశదీకరిస్తున్నాను. విను.
ఒకానొక జీవుడు స్వప్నంలో అనేకమంది తదితర జీవులతో వ్యవహరించటమనేది ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన అనుభవమే కదా!
ఇప్పుడు… నీకు నీ స్వప్నంలో కనిపించే వివిధ అభిలాషలు, ఆశయాలు, అనుభవాలు గల తదితర జీవుల అసలు రూపం ఏమిటి? నీ స్వప్న సత్తయే వారి రూపాలు గాను, ఆయా వివిధాలైన వివిధ వ్యక్తిత్వములుగాను ప్రదర్శిస్తోంది కదా! అంతేగాని ఆ స్వప్నంలో మరొకరెవరో ప్రవేశించి వ్యవహరించటం లేదే! అనగా… నీకు కనిపించిన మిత్రులు, పురప్రజలు, బంధువులు, శత్రువులు, పిచ్చి పిచ్చి ప్రవర్తన కలిగి ఉన్నవారు మొదలైన వారంతా స్వప్న ద్రష్టయగు నీయొక్క స్వప్న సత్తా రూపులే కదా! అనగా నీవు దాల్చిన వేఱువేఱు రూపములే కదా! ఎందుకంటే నీవు సత్తా స్వరూపుడివే గాని, దేహరూపుడవు కాదు సుమా!
స్వప్నానుభవంలో జరుగుచున్నదేమిటి?… స్వప్న ద్రష్ట స్వప్నంలో వేరువేరైన స్వభావాలు, ఆశయాలు, గుణాలు వ్యక్తిత్వము గల రూపాలను తనకు తెలియకుండానే తాను దాల్చి, “ఈ
Page:283
రూపాలన్నీ నాకు వేరైనవే!” …అను అనుభవముతో వ్యవహరిస్తున్నాడు. అవిద్యచే వివిధ దేహాదుల కల్పన, ఆ తదితర దేహములలోని వారంతా తనకు శత్రు మిత్రులుగా వ్యవహరించటం జరగుచు న్నట్లే ఈ జాగ్రత్ జగత్తులో మాత్రం ఎందుకు జరుగకూడదు? జాగ్రత్ సత్త జాగ్రత్లో, “వీరు బంధువులు, వీరు శత్రువులు, వీరు పురజనులు" …అని పొందబడుచుండుటయే ఈ సంసారం యొక్క చమత్కారం! వాస్తవానికి… “చిద్ధనాకాశమై, అవిభక్తమై, ఏకమై, సర్వ వ్యాపకమైనట్టి బ్రహ్మం మాత్రమే ఉన్నది. ఇక తదితరంగా కనిపించేదంతా కూడా అట్టి అఖండ బ్రహ్మమే ఆరోపిత దృష్టికి ఆ విధంగా కనిపిస్తోంది” …అనునది అధ్యాత్మ శాస్త్రము యొక్క మొట్టమొదటి పాఠ్యాంశమే కదా! అవిద్యా ప్రభావం చేత ద్రష్టచే తన ‘జాగ్రత్ సత్త’యే ఈ దృశ్యము యొక్క కల్పిత రూపాలుగా గాంచబడుతోంది. బ్రాహ్మీ దృష్టి సంతరించుకున్నప్పుడు “ఈ ఉన్నవన్నీ, కదలేవన్నీ నా యొక్క వివిధ ఆరోపిత రూపాలే” అని గమనించబడగలదు. (“మమాత్మా సర్వభూతాత్మా’ మొదలైన) వేద ప్రతిపాదిత మహావాక్యములు ఈ అనునిత్య సత్యమును నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాయి కదా!
నిర్మల దర్పణంలో గృహ, ఆకాశ, పర్వతాదులు ప్రతిబింబిస్తున్నాయి. అట్లాగే “నిర్మల చైతన్య ఘనము" అనే దర్పణంలో ఈ నేను, నీవు, దృశ్యము మొదలైనవన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఏదేది దర్పణంలో ప్రతిబింబించినా కూడా, దర్పణానికి వాటితో సంబంధం ఉన్నదా? లేదుకదా! దర్పణం సర్వదా యథాతథమై ఉంటున్నట్లే …మన స్వస్వరూపమగు చిదాకాశ ఘనంలో ప్రతిబింబించే దృశ్యాదులకు, ఘనచిదాకాశ స్వరూపానికి సంబంధం లేదు. అనగా దృశ్యం యొక్క ఉనికిచే గాని, లేమిచే గాని మన చిదాకాశ ఘన స్వరూపం మార్పు చేర్పులు పొందేదికాదు. అయితే ఇది జనులు గమనించటం లేదు. అంతే !
శ్రీరాముడు : హే మహర్షీ! మనందరి స్వరూపమూ చిదాకాశ ఘనమే కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. సర్వదేహుల వాస్తవ - ఆత్యంతిక స్వస్వరూపము చిదాకాశ ఘనమే గాని మరి ఇంకొకటేదీ కాదు.
శ్రీరాముడు : అటువంటప్పుడు మనమంతా ఒకరికొకరం వివిధ రీతులుగా (నేను - నీవు - నీవారు, నా వారు, జ్ఞానులు, అజ్ఞానులు, సుజ్ఞానులు, దురజ్ఞానులు, ఈ విధంగా జ్ఞానభేదాలతోను, గుణభేదాలతోను ఒకరికొకరం ఎందుకు అగుపిస్తున్నాం?
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! కొన్ని దర్పణములు తెచ్చి ఇక్కడ చతురస్రంగా అమర్చామనుకో, ఆ దర్పణాలన్నీ ఒకే లోహంతో తయారయినప్పటికీ, అవన్నీ ఒకదానియందు మరొకటి ఆయా వివిధ ఆకారములతోటి ప్రతిబింబిస్తున్నాయి కదా! మనమందరము సర్వకాలములందునూ చిద్రూపములమే! అయినప్పటికీ ఈ సమస్త పదార్థములు మాయాశక్తిచే వివిధ రూపములవలె మన చిత్తంలో ప్రతిబింబిస్తున్నా. ఒకరికొకరు మాయతోకూడి అనుభూతులమగుచున్నాం.
మనయందు మన స్వస్వరూపంగా అధ్యస్థమైయున్న చిదనబ్రహ్మమే ఈ భోగ్య జగదాకారంగా వివర్తితమై, ఇంద్రియ సామీప్యము పొందిన ఆయా వస్తువులను భోగార్థంగా పొందుచున్నది.
Page:284
ఇత్యనేనైవ నానేదం నానానానా చ వస్తుతః |
నచ నానా నచా నానా నానానానాత్మకం తతః ||
ఈ విధంగా… బ్రహ్మము ఒక్కటే! ఒక్కటే అయివుండి అనేక రూపములుగా భాసిస్తోంది.
వాస్తవానికి బ్రహ్మమునందు ‘ఏక - - అనేకములు’ అనే రెండూ లేవు. మాయా ప్రభావం చేతనే ఈ విధంగా ఈ ఈ ఏక - అనేక రూపములుగా భాసిస్తోంది. ఏకైక స్వప్నద్రష్టా చైతన్యమే స్వప్నంలో ఏక - అనేకములుగా భాసించుటయే అందుకు దృష్టాంతము.
ఇప్పుడు మనం విపశ్చిత్తు విషయానికి వస్తే… విపశ్చిత్తు అగ్నిదేవుని వరం చేత నాలుగు దేహాలు పొంది ఒకే జీవాత్మ అయివుండి నాలుగు చోట్ల నాలుగు విధాలైన కర్మ పరిపాక విశేషాలు పొందుచున్నాడు. ఇది ఒకే వ్యక్తి నలుగురితో నాలుగు రీతులుగా (ఒక మిత్రునితో, ఒక శిష్యునితో, ఒక ఆస్తి సంబంధిత వ్యవహారంతో, ఒక కుటుంబ సభ్యునితో ఒకే సమయంలో నాలుగు రకాలైన స్వభావాలు ప్రదర్శిస్తూ సంభాసించునట్లు) … వ్యవహరించు రీతిగా కొనసాగుచున్నది. ఆ విపశ్చిత్తు ఎక్కడ ఏ వస్తువు ప్రాప్తిస్తుంటే అక్కడ ఆ వస్తువుతో తన్మయుడై, వివశుడై ఆ చోట అట్లు వ్యవహరిస్తు న్నాడు. ప్రతి జీవుడు దృశ్య పదార్థముల పట్ల అట్లే ఎదురుగా ఏది వుంటే అద్దాని అననుసరించి ప్రవర్తనను సంతరించుకోవటం చూస్తున్నాం కదా! ఇదీ అట్టిదే.
ఇక … “నాలుగు దేహాలతో నాలుగు చోట్ల ఆ ఎదురుగాగల విషయాలలో తన్మయానుభవం ఎట్లా పొందుచున్నాడు?” అనే విషయానికి వస్తే … యోగులు ఒకే కాలంలో వివిధ ప్రదేశములలోను, త్రికాలములలోను ప్రత్యక్షమై వివిధ కార్యములు నిర్వర్తించటం గురించి నీకు అనేక విశేషాలు ఆశ్రమ విద్యా సమయంలో చెప్పియే ఉన్నాను కదా! యోగబలంచేత అనేక రూపములతో వివిధ ప్రదేశములలో వేరువేరు కార్యములు యోగులు నిర్వర్తిస్తూ ఉండగా… ఇక మన విపశ్చిత్తు వేరు వేరు చోట్ల వేరు వేరు దేహములతో వ్యవహరించటంలో ఆశ్చర్యమేమున్నది? అటు ఆకాశంలో మేఘాలను చూడు. అవి ఉష్ణముచే తపించే జనులను ఆహ్లాద పరుస్తున్నాయి కదా! అయితే, మేఘములన్నీ ఒక్కటే అయినప్పటికీ అవి అనేక ప్రదేశాలలో వ్యాపించి… ఒక చోట క్షాళనం (Cleaning) చేస్తున్నాయి; మరొకచోట భేదనం (Dividing) చేస్తున్నాయి; ఇంకొకచోట తటాకాలను నింపుతున్నాయి; వేరొకచోట సస్యపోషణం చేస్తున్నాయి.
ఆ మేఘాభిమానియగు జీవుడు (ఈ మేఘాలే నా శరీరం అని భావన చేస్తున్న జీవుడు) “నేను వేరు వేరుచోట్ల ప్రవేశించి వేరు వేరు వ్యవహారాలు నిర్వర్తిస్తున్నాను కదా!”… అనే అనుభవాన్ని పొందుచున్నాడు. అట్లాగే విపశ్చిత్తు కూడా “నేను వేరు వేరు చోట్ల వేరు వేరైన అనుభవాలు పొందుచున్నాను”… అను రూపంగా అవన్నీ అనుభవిస్తున్నాడు.
ఇంకా ఈ సృష్టిలో అనేక వింతవింతలైన చమత్కారములు జరుగుచున్నాయి. దేహాభిమాని అయిన సంసారబద్ధ జీవుడు, “నా పరిమితి ఈ దేహమే”… అనుకొని దేహ పరిమితత్వాన్ని అనుభవించటం కొనసాగిస్తున్నాడు.
Page:285
అయితే… అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా, వసిత్వ -
అనబడే అష్ట సిద్ధులను యోగాభ్యాసంచే సముపార్జించుకొన్న ఈశ్వర సదృశులగు యోగులు ఏక కాలంలో వివిధ దేహాలతో అసంఖ్యాకములగు కర్మ పరంపరా వ్యవహారములను, తత్ సంబంధిత జగత్ రచనా వ్యవహారములను రచించుచూ ఏకకాలంలో అవన్నీ అనుభవిస్తూపోతున్నారు.
ఒకే విష్ణు భగవానుడు నాలుగు భుజాల చేతను, వివిధ మాయా దేహాల చేతనూ… ఒక చోట యోగనిద్రలో ఉంటున్నాడు. (నిర్విషయుడై కేవలం చిద్విలాసానుభవంలో తన్మయుడై ఉంటున్నాడు). మరొక చోట గొప్ప తపస్సు కొనసాగిస్తున్నాడు. ఇంకొక చోట ఇంద్రుని సోదరుడై ఆతని కార్యక్రమములకు సహకారాలు అందిస్తున్నాడు. వైకుంఠంలో భోగములు అనుభవిస్తున్నాడు. అవతార మూర్తియై ముల్లోకములలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుపుచున్నాడు. వైకుంఠాంతః పురంలో లక్ష్మీదేవితో సరససల్లాపములతో క్రీడిస్తున్నాడు. భక్తులకు తోడు నీడ అయి వారి లౌకిక - పారలౌకిక వ్యవహారములలో పాల్గొనుచున్నాడు. అనేక మంది భక్తుల హృదయాలలో రమిస్తు న్నాడు. అనేక బాహువులు గల విష్ణువు రెండు ప్రయోజనములు తటస్థించినప్పుడు రెండు బాహువులతో ఆ రెండు కార్యములు నిర్వర్తిస్తున్నాడు. అనేక వ్యవహారములు తటస్థించినపుడు - అనేక బాహువులతో అనేక కార్యములు నిర్వర్తిస్తూ ఈ లోకములన్నీ పరిపాలిస్తున్నాడు.
అట్లాగే మన విపశ్చిత్తు ఒకే సంవిత్తుచే ‘విపశ్చిత్తుగా’ పరిపూర్ణుడై ఉండి ఇప్పుడు (ఈ కథా సమయంలో) నాలుగు దిక్కులలో నాలుగు దేహములతో అక్కడక్కడ ప్రాప్తములగుచున్న దృశ్య వ్యవహారములలో పాల్గొనుచూ, అక్కడక్కడి సుఖ దుఃఖములన్నీ తనవిగా అనుభూతి పొందుచున్నాడు.
ఆ నలుగురు విపశ్చిత్తులు వేరువేరు దేహములలో వేరువేరు చోట్ల భూమిపై శయనించుచున్నారు. వేరువేరు ద్వీపములలో లభించిన వస్తువులను అనుభవించుచున్నారు. వన పంక్తులలో వ్యవహరి స్తున్నారు. పర్వత పంక్తుల మధ్యగా వ్యవహరిస్తున్నారు. సముద్రములలో పరిభ్రమిస్తున్నారు. ద్వీప సమూహములలో విశ్రమిస్తున్నారు. సముద్ర తీరములలోను, నగరములలోను క్రీడించుచున్నారు. పర్వత శిఖరములలో దాగుకొంటున్నారు. కొన్నిచోట్ల కొన్ని సంవత్సరముల కాలం గృహసంబంధము లైన - భార్యపిల్లలు, బంధువులు, తదితరులు - ఇత్యాది భావోద్రేకములు కలిగి ఉంటున్నారు. బంధువులతో వినోదిస్తున్నారు… ఇట్లా ఉన్నది, ఆ నలుగురు విపశ్చిత్తుల వ్యవహారమంతా!
తూర్పు దిక్కుగా వెళ్ళి సంచారం చేస్తున్న విపశ్చిత్తు శాకద్వీపంలో ప్రవేశించాడు. ఆ ద్వీపంలో ప్రసిద్ధి అయిన ఉదయాచల పర్వతంపై ఒకానొక చోట స్నుహీ (జముడు) వృక్షములతో కూడిన ఒక భయంకరారణ్యంలో సంచరించ నారంభించాడు. అక్కడ ఆ కీకారణ్యంలోగల ఒక యక్షుడు తన మాయతో తూర్పు దిక్కు విపశ్చిత్తును తన అనేక మాయారచనలతో సమ్మోహంలో ముంచివేశాడు. అట్టి సమ్మోహంలో ఏడు సంవత్సరాలు ఆతడు నిదురించాడు. అక్కడి నుండి ఎట్లాగో బయలుదేరి ఒక విచిత్రమైన జలాశయం జేరాడు. ఆ విచిత్ర జలాశయంలో నీరు త్రాగినవారు ఏడు
Page:286
సంవత్సరములు శిలారూపంగా ఎటూ కదలలేక ఉండిపోతారు. మన తూర్పు దిక్కు విపశ్చిత్తు తెలియక ఆ నీరు త్రాగి ఏడు సంవత్సరాలు ఆ తటాక సమీపంలో శిలారూపంలో ఉండిపోయాడు.
పశ్చిమ దిక్కు విపశ్చిత్తు కూడా శాకాద్వీపంలోని గల అస్తాచల పర్వతముపై గల పిశాచముల మాయకు లోబడి నెలరోజులు ఆ కామపిశాచముల మాయలో నానా అగచాట్లు అనుభవించాడు.
ఒకసారి తూర్పు దిక్కు విపశ్చిత్తు శాకాద్వీపంలో సంచరిస్తూ ఒక ముని యొక్క శిష్యులను తన యోగశక్తుల గర్వంతో బాధించనారంభించారు. అక్కడి ముని ఆశ్రమ జనాన్ని బాధిస్తున్న తూర్పు దిక్కు విపశ్చిత్తును గమనించిన ఆ ముని ఆతనిని చూచి, "ఓయీ! అగ్నిదేవుడు నీపై దయతో నీకు ప్రసాదించిన యోగశక్తులను సౌమ్యులగు ముని జనమును బాధించటానికి ఉపయోగిస్తు న్నావా? సాత్వికులను బాధించిన దోషం నిన్ను కట్టికుడుపక మానదు కదా! కనుక నీవు ఈ అరణ్యంలో ముళ్ళ చెట్టువై ఉండెదవు గాక” అని శపించాడు. ఇక ఆ తూర్పు దిక్కు విపశ్చిత్తు అక్కడే ముళ్ళపొదగా మారిపోయి నేలలోని జలం ఆహారంగా స్వీకరిస్తూ చలనం కోల్పోయి అనేక వేదనలు అనుభవిస్తూ ఉండిపోయాడు. తూర్పుదిక్కు విపశ్చిత్తుకు వచ్చిన ఆపద, ఆతని వేదన పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు తెలియవచ్చింది. ఆతడు శాకద్వీపంలోనే సంచరిస్తున్నాడు కదా! విషయం తెలియగానే ఆతడు ముని ఆశ్రమాన్ని సమీపించి ఆ మునిని స్తోత్ర-సేవాదులచే సంతోషింపజేశాడు.
ముని : ఓ పశ్చిమ విపశ్చిత్తూ! అనేక రోజులుగా నీవు ప్రదర్శిస్తున్న సేవానిరతికి నేను ఎంతగానో సంతోషించాను. ఈ ఆశ్రమ వాసులు నీ సాత్విక భావాలను ఎంతగానో అభినందిస్తున్నారు. నీకు ఏ వరం కావాలో కోరుకో?
పశ్చిమ విపశ్చిత్తు : స్వామీ! మునీంద్రా! నా ఆత్మీయుడగు తూర్పుదిక్కు విపశ్చిత్తు మీ ఆశ్రమ జనాన్ని బాధించి మీకు కోపం కలిగించి మీ శాపంచే కంటక వృక్షంగా (ముళ్ళ చెట్టుగా) అయి అనేక మానసిక వేదనలచే దుఃఖితుడై ఉన్నాడు. ఆతనిని క్షమించి ఆతనికి శాప విమోచనం ప్రసాదించండి. ముని : అట్లే అగుగాక! ఇప్పుడు నీకొక దోష నివారణ మంత్రం ఉపదేశిస్తాను. మంత్ర దేవతను ఉపాసించి మంత్రోచ్చారణ చేస్తూ ఆ కంటక వృక్షాన్ని ఈ అంపంతో ఖండించు. అప్పుడు నీ మిత్రునకు శుభం కలుగుతుంది.
ఆ విధంగా ముని వాక్యాలు విన్నాడు. ముని వద్ద మంత్రోపదేశం పొందాడు. మంత్రోచ్చారణ చేస్తూ తూర్పుదిక్కు విపశ్చిత్తుకు శాపవిమోచనం కలిగించి ఆపై తన సంచారం తన మార్గంలో
కొనసాగించసాగాడు.
పశ్చిమ విపశ్చిత్తు మరొక సమయంలో ‘శిశిరం’ అనే ప్రదేశంలో ప్రవేశించి అక్కడి మధుర మైన ఫలాలను ఆస్వాదిస్తూ అక్కడి పూసజ్జలను ఖండించి గృహంగా నిర్మించి, అక్కడ నివసిస్తూ అక్కడి వన వృక్షాలను ఖండించసాగాడు. ఇది అక్కడి పిశాచ రాజుకు చాలా కోపం తెప్పించింది. అప్పుడు ఆ పిశాచపతి "ఓ ఈ మానవుడా! ఇక్కడ మా పిశాచ రాజ్యంలో ప్రవేశించి మా పిశాచ జనుల గృహములైన వృక్షములను ఖండిస్తున్నావే! ఇందుకు శిక్షగా నీవు శిలగా అయ్యెదవుగాక”
Page:287
.. అని శపించాడు. అంతే! ఆ పశ్చిమదిక్కు విపశ్చిత్తు అక్కడే శిలగా మారిపోయాడు. “అయ్యో!” అని మౌనంగా శోకించసాగాడు. ఆతని శోకం దక్షిణ దిక్కు విపశ్చిత్తుకు స్ఫురించింది. వెంటనే ఆతడు ఆ పిశాచ రాజ్యారణ్యంలో ప్రవేశించి గోమాంసాదులు సమర్పించి ఆ పిశాచపతిని సంతోష పరచి పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు శాపం నుండి విమోచనం కలిగించాడు.
అట్లాగే మరొకసారి అస్తాచల సమీపంలోగల ఒక గోరూపధారియగు పిశాచి పశ్చిమదిక్కు విపశ్చిత్తును ఎద్దుగా మార్చి ఒక సంవత్సరం తన వెంట త్రిప్పుతుండగా దక్షిణదిక్కు విపశ్చిత్తు ఆ గోరూప పిశాచి చర్యను గమనించి తన ప్రతిమంత్రశక్తిచే పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు ఎద్దు రూపం నుండి విముక్తి కలిగించాడు.
మరొక సందర్భంలో పశ్చిమదిక్కు విపశ్చిత్తు “క్షేమకము” అని పిలువబడే ప్రదేశంలో సంచరిస్తూ అక్కడ గల “అంబికేయము” అనే పర్వత శ్రేణులలో ప్రవేశించి అక్కడి పిశాచాలతో తానూ ఒక్కడిగా రూపం సంతరించుకున్నాడు. కొంత కాలానికి దక్షిణ దిక్కు విపశ్చిత్తు ఆ ప్రదేశంలో ప్రవేశించటం జరిగింది. అప్పుడు అక్కడ ఒక మఱిచెట్టుపై దక్షిణ దిక్కు విపశ్చిత్తు మంత్రముగ్ధంగా ఆ పిశాచపతిని ఆహ్వానించి ప్రసన్నుణ్ణి చేసుకొని పశ్చిమ విపశ్చిత్తుకు పిశాచత్వం నుండి విడుదల గావింపచేశాడు.
శ్రీరాముడు :
ఏక దేశగతా విష్వక్ వ్యాప్య కర్మాణి కుర్వతే
యోగినౌ త్రిషుకాలేషు సర్వాణి, భగవన్ ! కథమ్ ?
హే భగవాన్! వశిష్ఠ మహర్షీ! యోగులు భౌతికంగా ఒక ప్రదేశంలో ఉండికూడా, సర్వత్రా వ్యాపించి ఆయా వేఱువేఱు ప్రదేశములలో గల శిష్యుల ప్రార్థన, విన్నపములను స్వీకరించి త్రికాలాల లోను “అనుగ్రహించటం, రక్షించటం, మార్గం చూపటం” …వంటి వివిధ కార్యములను ఎట్లా నిర్విర్తిస్తున్నారో ప్రవచించమని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు అడిగిన విశేషం గురించి :
1.“మా గురువు (దైవం) గొప్ప మహిమాన్వితుడు. అది ఆయనకే సాధ్యం. మరెవరూ అట్లా అనేక చోట్ల ఉండి అనుగ్రహించలేరు.”; 2.“ఆ! అదంతా నిజం కాదు.”
…ఇట్లా అసంపూర్ణ జ్ఞానులు - అజ్ఞానులు పరిపరి అభిప్రాయాలు కలిగివుంటున్నారు. మనం అజ్ఞానుల అభిప్రాయమును ప్రమాణంగా తీసుకోము కదా! కనుక వారివారి వేరు వేరు అభిప్రాయముల గురించి మనం ఇక్కడ చర్చించుకోవటంలేదు.
Page:288
ఇక తత్త్వవేత్తల దృష్టిని ప్రమాణంగా తీసుకొని చెప్పుకుందాం. “సత్తా సామాన్యమగు చిన్మాత్రము” కంటే వేరైన రూపమేదీ ఈ జగత్తుకు లేదు. ఎందుకంటే…
నిర్మలమైన ఆత్మజ్ఞానం కర్మ-భక్తి యోగాలు సమాశ్రయంచే క్రమక్రమంగా ప్రవృద్ధమౌతోంది. 2. అట్లు ఆత్మజ్ఞానంచే పరితప్తమైన నిర్మల బుద్ధి కలవారికి క్రమ క్రమంగా ఈ దృశ్యం యొక్క “అత్యంత అభావము“ అను బోధ ఉద్భవిస్తోంది. అనగా, దృశ్యం వారి దృష్టిలో అదృశ్యమై ఇద్దానికి ఏది ఆధారమో … అది దర్శించబడుతోంది. స్వప్నంలో స్వప్న ద్రష్టచైతన్యముచే దర్శించబడే సర్వవిషయములకు రూపము, ఆధారము స్వప్నద్రష్టాచైతన్యమే కదా! అట్లాగే ఈ దృశ్యం ఎద్దాని రూపమైయున్నదో, ఏది ఈ దృశ్యమునకు ఆధారమైయున్నదో, ఎద్దానియందు ఈ దృశ్యం అంతర్గతమై ఉన్నదో …అట్టి “స్వస్వరూపాత్మ” అనబడే బోధ రూపము గోచరిస్తోంది.
క్రమక్రమంగా ఈ సృష్టియొక్క - అద్దాని భావాభావముల యొక్క దృష్టి శమించి, “ఇదంతా అస్మత్ ఆత్మరూపమే” …అనబడే, దివ్యదృష్టి రూపుదిద్దుకుంటోంది.
అప్పుడిక క్రమంగా సర్వ ఆధిభౌతిక దృష్టులు మొదలంట శమించుచుండగా, ఆ మహనీయుడు చిన్మాత్రమగు సత్తా సామాన్యమున విశ్రమించే సర్వేశ్వర స్వరూపుడు అగుచున్నాడు.
౨
అట్టి స్థితిలో సర్వము ఆత్మమయయై ఉండగా ఇక ఆపై ఏది దేనిచే నిరోధించబడగలదో చెప్పు?… (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి) ఇంతవరకు ’సాధన’లో ఉన్న ఆ మహనీయునికి ‘బ్రహ్మము’ అనబడే శాస్త్ర ప్రతిపాదిత ఆత్యంతిక పరమసత్యమునకు …ఇక భేదమే ఉండదు.
భావించటం, భాసించటం - సర్వ వ్యాపకము, సర్వరూపము అయినట్టి ఆత్మ ఏది ఎచ్చట ఎట్లు భావిస్తుందో… అది అట్లాగే భాసిస్తూ ఉంటుంది. సర్వస్వరూపుడు, ఆత్మానుభవి అగు ఆ చిద్రూపుడు ఇక ఆపై భూత-వర్తమాన భవిష్యత్తులలో ఏదీ తాను కాకయే ఉంటాడు. అంతేకాదు. అంతా తానే అయి ఉంటాడు కూడా! అట్టి నిర్మలమైన భావనను సంతరించుకున్నట్టి చిద్రూపమగు ఆత్మ తనయొక్క వాస్తవ స్వరూపమును త్యజించకుండానే… ఈ దూర, సమీప, నిమేష, కల్ప, భూత, భవిష్యత్, వర్తమాన, స్థూల, సూక్ష్మ - రూపములన్నీ తన సత్తా సామాన్య రూపమును సర్వవేళలా అవధరిస్తోంది.
సర్వాత్మని స్థితాన్యేవ పశ్యమాయా విజృంభితమ్ అజాతమ్ అనిరుద్ధం చ యథాస్థితమ్ అవస్థితమ్ … ॥
ఆహా! రామచంద్రా! ఈ మాయ ఎంతటి చిత్రమైనదో గమనించావా! సర్వరూపమగు ఆత్మయందే భూత - భవిష్యత్ - వర్తమానములకు సంబంధించిన సర్వ స్థూల రూపములు - సూక్ష్మతత్త్వములు అన్నీ కూడా స్థితి కలిగివున్నాయి. ఈ జగత్తులన్నీ కూడా ఉత్పన్నము అవకుండానే, నాశనమనేది లేకుండానే ఆత్మయందు ఆత్మకు అభిన్నంగా యథాస్థితిగా నెలకొని ఉన్నాయి. కాబట్టి :
Page:289
1.ఈ మూడు లోకాలలో కనిపించేదంతా కూడ విజ్ఞానఘన మగు ఆత్మరూపమే!
మాయతో కూడుకొనివున్న పరమాత్మ తనయొక్క ద్రష్ట - దృశ్యత్వముల కించిత్ అభ్యాసమే ఈ జగత్తు. అనగా, ఈ ‘జగత్తు’ అనేది స్వకీయాభ్యాసవశంగా ఉదయించుచున్నది మాత్రమే! అట్టి జగదాత్మయగు పరమేశ్వరుని యొక్క “దృక్ రూపము” నకు మార్పుచేర్పులు ఎక్కడున్నాయి? అది దేనిచేత ఎట్లు మార్పు చెందించబడగలదు? లేనేలేదు!
"దృకూపశుద్ధచిత్యే నేను” అని జగదతీతత్వం అవధరించి, సర్వరూపములు తానే అయి, సాధ్యాసాధ్యముల రెండింటినీ కూడా ధరించుచున్న మాయకు కూడా “ఆది” అయిన పరమాత్మకు అసాధ్యమేమి ఉంటుంది? ఆ శుద్ధ జగదాత్మయే అన్ని రూపములుగా తానే అయి వ్యవహరిస్తోంది కదా! అందుచేతనే ఆత్మసాక్షాత్కారం సంతరించుకున్న జగద్గురువులు శిష్యుల ఆరాధనకు ప్రతిస్పందించగలుగుచున్నారు.
ఇక విపశ్చితంవిత్తు కూడా శుద్ధ చిత్- దృక్ రూపమే కదా! కనుక ‘విపశ్చిత్’ అను పేరుతో పిలువబడే సంవిత్తు ఒక్కటే అయివుండి నాలుగు ఉపాధుల ద్వారా నాలుగు చోట్ల నాలుగు విధములైన దృశ్య వ్యవహారములను అనుభవించటం జరుగుతోంది.
ఓ రామచంద్రా! ‘విపశ్చిత్’ అనబడే చైతన్యాంశము యొక్క వర్తమాన ధర్మ-జ్ఞాన స్థితిని ఇక్కడ వివరిస్తున్నాను. విను.
చైతన్యాంశయే “నేను విపశ్చిత్తును" అను జీవాహంకారమును పొందియున్నది.
క్రమంగా పరిమితాహంకారము నుండి ప్రబోధం పొందుతోంది.
అయితే ఇంకా కూడా, విపశ్చిత్తు యొక్క మనోరూప చైతన్యము పరమసత్యమగు పరమాత్మ పదమును (సర్వ జగత్తులు నా యందే ఉన్నాయి… అను జగదహంకారమునకు కూడా సాక్షి అయిన స్థానమును) పొంది ఉండలేదు.
ఆ విపశ్చిత్ రాజయొక్క సంవిత్తు అగ్నిదేవుని ఆరాధించి ఆయన అనుగ్రహంచేత నాలుగు ఉపాధులను ధరించి వ్యవహరింపజేసే యోగశక్తిని మాత్రం ఇప్పటికి సంపాదించుకొనియున్నది. ఈ విధంగా విపశ్చిత్తు నాలుగు దేహములతో వ్యవహరిస్తూ ఉండటం యుక్తియుక్తమే అవుతుంది.
బోధరూపమగు ఈశ్వర మాయతో కూడికొనియున్న పరమాత్మయందు అసాధ్యమేముంటుంది? పరమాత్మార్థ బోధ పొందనంతవరకు పదార్థత్వము ఉచితమే కదా! ఒక్క దేహమైనా నాలుగు దేహములైనా - అది పదార్థత్వమే కదా!
ఈ విధంగా, కొంచెము బోధను సముపార్జించియున్న ఆ విపశ్చిత్తు నాలుగు దేహములు సిద్ధింపజేసుకోవటం ఉచితమే (యుక్తమే) అవుతోంది.
Page:290
ఓ రామచంద్రా! ఈ రీతిగా నాలుగు దిక్కులందు ఉన్నట్టి ఆ విపశ్చిత్తులు పరస్పరము ఒకరికొకరు చూచుకోవటం, ఒకరితో మరొకరు సంభాషించుకోవటం, సహకరించుకోవటం, ఒకరి కష్టాలలో మరొకరు తోడుకావటం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అచ్యుతమగు చిదాకాశము తన అప్రమేయ - అఖండ స్వరూపము నుండి చ్యుతి నొందకయే కించిత్ చ్యుతి పొందినదానివలె అయి నిజస్వరూపమునకు అభిన్నమైన మనస్సును, ఆ మనస్సుచేత తనకు వేరుగా కానట్టి (కాని, అనిపించే) జగత్తును దర్శించటం వంటిదే! ఆ విపశ్చిత్తు యొక్క నాలుగు దేహముల ఏక సమయ వ్యవహారం కూడా చైతన్యము యొక్క ఒకానొక మాయా విశేషమే!
ఒక జీవుడు తన వ్యష్టిచైతన్యమును ప్రేరేపించి అనేక దేహముల ద్వారా అనేక వ్యవహారసరళులను అనేకచోట్ల నిర్వర్తించటం అనేది యోగశాస్త్రవేత్తల పాఠ్యాంశములలో నిర్వచించబడి - విశదీకరించబడిన విషయమే! అంతేగాని, ఇప్పుడు నేను క్రొత్తగా లోకమునకు ప్రతిపాదిస్తున్న విషయమేమీ కాదు!
శ్రీరాముడు : ఆ విపశ్చిత్తు జ్ఞాని అయివుండి కూడా నాలుగు దిక్కులలోను సింహం, శిల, వృక్షం మొదలైన ఆయా ఉపాధులు ఎందుకు పొందవలసి వచ్చింది? ఈ విషయం విశదీకరించండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ప్రబుద్ధులగు యోగులు ఒక ప్రదేశంలో ఉండియే అనేకచోట్ల అర్హులైన శిష్యులకు బోధించటం, ఆశ్రితులగు దీనజనుల కష్టాలు పోగొట్టటానికి ఆయా కార్యములు నిర్వర్తించటం, ఆర్తితో కూడిన పిలుపుకు బదులు పలకటం నిర్వర్తిస్తున్నారు కదా! …అని నేను ప్రసంగవశం చేత చెప్పానేగాని ఆ ఒకానొక జీవుడగు విపశ్చిత్తుగాని, ఆ నలుగురు ఉపాధి విపశ్చిత్తులుగాని పరిపూర్ణజ్ఞానులు అయినారని నేను అనలేదు.
ఆ విపశ్చిత్తులలో నలుగురు జ్ఞాన అజ్ఞాన రూపములైనట్టి 1.మోక్ష చిహ్నము, 2. బంధ చిహ్నము - రెండు కనిపిస్తున్నాయి. వారు అగ్నిదేవుని కృపచే ధారణమాత్రం చేత నాలుగు దేహాలతో సంచరించ గలుగుచున్న ధారణాయోగులు మాత్రమే. అంతేగాని ఆత్మజ్ఞానులు కాదు.
ధారణా యోగినస్తే హి, ధారణా ప్రాప్త సిద్ధయుః
యే పరంబోధమ్ ఆయాతా యేషు అవిద్యా న విద్యతే॥
హృదయంలో అగ్నిదేవుని యందు చిత్తమును నిలిపి ఆ అగ్నిదేవుని అనుగ్రహం చేతనే కదా, వారు సిద్దులు పొందారు? వారు ‘ధారుణా యోగులు’ అనిపించుకుంటారుగాని, ‘పూర్ణజ్ఞానులు’ అనిపించుకోరు. ఎందుకంటే పరమబోధను పొందినవారిలో దృశ్యము విషయమై “ఇది కావాలి” …అని గాని “అది వద్దు" …అనిగాని ఈ జగద్విషయమై ఎట్టి పట్టుదల ఉండదు. విపశ్చిత్ విషయం అట్లా లేదు కదా!
Page:291
కిమ్ అవిద్యామ్ అవేక్షన్తో తే, తామరసలోచనా! ధారణా యోగినో హి ఏతే వరేణ ప్రాప్త సిద్ధయః అవిద్యా విద్యతే తేషాం తేన తేలి తద్విచారిణః?
"మేము అవిద్యను పరికించి చూడాలి” … అనే అభిలాష గలవారు అవిద్యాదృష్టి కలవారే అవుతారు. పూర్ణజ్ఞానులకు అవిద్యపట్ల ఎట్టి పరిశోధనాభావం ఉండదు. భ్రమచే కనిపించేదని తెలిసిన తరువాత పరిశీలన ఆవశ్యకం ఏముంటుంది? “స్వప్నంలో కనిపించిన ఇల్లు స్వప్నకల్పనా భావ చమత్కారమే!” …అని తెలిసిన తరువాత “ఆ కలలో అటువంటి గృహాలు ఇంకా ఎన్ని ఉన్నాయి?” …అని పరిశీలించాలని ఎందుకనిపిస్తుంది? ఆ విపశ్చిత్తునందు “నాలుగు దేహాలతో ఈ సృష్టి ఎంతవరకు ఏఏ రూపములుగా విస్తరించివున్నదో… పరిశీలిస్తాను” … అను రూపంగా అవిద్య ఉండనే ఉన్నది. అవిద్య పరిపాకమై ఉండగా ఆత్మజ్ఞానము పరిపుష్టి పొందదు.
ఓ రామచంద్రా! జీవన్ముక్తులు తమయొక్క జగత్విభాగంచే జగత్తులో సంచరిస్తూనే సమా విభాగమును యథాతథంగా పరిపోషించుకుంటూ ఉంటారు. అంతేగాని, జగత్తు యొక్క వ్యవహారము ఒక మామూలు విషయం అగుచుండగా, “ఈ జగత్తు ఏమిటి? అవిద్య ఎంతటిది?” …అని పరిశీలనకు బయలుదేరవలసిన అగత్యం వారికుండదు.
శ్రీరాముడు : మహర్షీ! “దేహమున్నంత వరకు బంధం తప్పదు. దేహము దేహికి ఐహిక మొహము. ముక్తికి దేహమే అడ్డుగా కూడా ఉంటోంది" … అని కొందరు గురువులు దేహతత్త్వాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇట్టి “దేహమును దాటివేస్తేనే ముక్తి” … అనే సిద్ధాంతం విషయంలో మీ అభిప్రాయం సోదాహరణపూర్వకంగా, సవివరంగా ప్రసంగించవలసినదిగా నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి :“ఆలోచన“ అనగా… ”ఇష్టము, అయిష్టము, గౌరవభావం, అగౌరవ భావం, భయం, ఆశ్చర్యం, అనురక్తి, విరక్తి" …ఇవన్నీ కూడా దేహధర్మాలా? మనోధర్మాలా?
శ్రీరాముడు : స్వామీ! అవన్నీ మనోధర్మాలుగాని దేహధర్మాలు కాదని, మనోధర్మాలు ప్రకటించటానికి ఈ దేహము ఉపకరించే ఉపకరణం మాత్రమేనని మీరు బోధించియే ఉన్నారు. మీరు బోధించినది పరమసత్యమే.
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును కదా! అట్లాగే ‘మోక్షం’ అనేది చిత్తం యొక్క ధర్మమేగాని దేహం యొక్క ధర్మం కాదు. “చొక్కా ధరించేవారు జ్ఞానులు కాలేరు. చొక్కా లేనప్పుడే జ్ఞాని” అని ఎవరమైనా అన గలమా? జ్ఞానులు ఈ రంగు చొక్కాని ధరించి ఉండగలరని ఎవరు సిద్ధాంతీకరించగలరు చెప్పు?
మోక్షోపి చేతసోధర్మః, చేతస్యేవ స తిష్ఠతి
న దేహే దేహధర్మస్తు, న దేహాత్ వినివర్తతే ॥
మోక్షము చిత్తము యొక్క ధర్మము మాత్రమేనని మరల ప్రకటిస్తున్నాను. ‘మోక్షము’ అనేది ఏకాగ్రమైన చిత్తమునందు మాత్రమే నెలకొని ఉంటోంది. కనుక బంధింపడేది చిత్తమేగాని ఆత్మ కాదు. కనుక జీవన్ముక్తునకు ఏవేవో ప్రత్యేకమైన దేహధర్మాలు ఆపాదించటానికి వీలవదు.
Page:292
న కదాచన నిర్ముక్తం చేతో భూయో నిబధ్యతే, యత్నేనాపి పునర్ బద్ధం కేనవృన్తచ్యుతం ఫలమ్?
తొడిమ నుండి విడివడిన దోసకాయ తిరిగి తొడిమచే బంధించబడగలదా? లేదు కదా! అట్లాగే ముక్తత్వం సంతరించుకున్న తరువాత ఇక అట్టి చిత్తం మరల ఈ సంసారంచే స్పశించబడజాలదు.
దేహస్తు దేహధర్మేణ, జీవన్ముక్తి మతామసి
గృహత్యే తద్గతం తేషాం చేతస్తు అచలమేవ తత్ II
జీవన్ముక్తులకు కూడా దేహం దేహధర్మమే కలిగివుంటుంది. కానీ బద్ధజీవులు చిత్తము నిత్య చంచలంగా ఉంటూ ఉంటోంది. ఇక జీవన్ముక్తుల చిత్తమో… “ఇదంతా పరమాత్మ శోభయే కదా” అను రూపంగా అతినిశ్చలంగా ఉంటోంది. జీవన్ముక్తుల నిశ్చలత్వం జీవన్ముక్తులకే ఎఱుక అవుతుంది. అది ఎట్టిదో చంచల చిత్తులకు తెలియబడటం లేదు. ఇక ధారణ కలిగిన యోగుల విషయమంటావా? వారు “ఈ ఈ ధారణ కలిగివున్నారు“ …అని ఇతరులు తెలుసుకోగలుగుతారు. మోక్ష ధారణ కలిగి ఉన్నవారి చిత్తానుభవం ఎట్టిదో… అది లౌకిక దృష్టికి అందేది కాదు. ఒకడు ఒక అత్యంత మధురమైన పదార్థాన్ని ఆస్వాదించాడనుకో. “అద్దాని రుచి ఇట్టిది” అని ఎంతగా చెప్పినా కూడా అది తినని వారికి పూర్తిగా తెలియవచ్చేది కాదు కదా! ఆ వింటున్న ఆయన “ఇంతెందుకు? నేను కూడా తింటాను”…అని ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తే ఇక ఆతనికి ఆ రుచి గురించి మరొకరు చెప్పవలసినదేముంటుంది? జీవన్ముక్తుల మోక్షానుభవం అట్టిది. అందుకే అద్దానిని “స్వాత్మానుభవైక వేద్యము” …అని విజ్ఞులు అభివర్ణిస్తున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ప్రతిజీవుడు ఆత్మస్వరూపుడేగాని ఈ దేహ స్వరూపుడు కాదు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఇక ఇందులో సందేహమేమున్నది?
శ్రీరాముడు : ఆత్మ సర్వదా అప్రమేయ నిర్హేతుక - - నిత్యముక్త ఆనంద స్వరూపమే కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. మన ఈ సంవాదము ప్రతిపాదించే ఆత్యంతిక సత్యం అదియే కదా! శ్రీరాముడు : మరి ఆత్మస్వరూపుడగు జీవునికి సుఖదుఃఖాలు ఎందుకు వచ్చి పడుచున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : సుఖదుఃఖాలు మనస్సు యొక్క ధర్మాలు, జీవన్-మృత్యువులో …దేహం యొక్క ధర్మాలు. అట్టి సుఖ-దుఃఖ, జీవన్-మృత్యు ధర్మాలు తన స్వరూపమగు ఆత్మపై ఆపాదించుకొనటం చేతనే ఆత్మ “నేను బద్ధుడను“ అను రూపంలో బంధానుభవం - అనుబంధానుభవం పొందుతోంది. మనస్సు ”దృశ్యతాదాత్మ్యము, దృశ్యముపై నమ్మిక కలిగి ఉండటం" అనే సుదీర్ఘవ్యాధి నుండి ఉపశమనం పొందినప్పుడు, “ఈతడు ముక్తి పొందాడురా” అని ఆత్మకు ముక్తి శబ్దం ఆపాదించబడుతోంది. అంతేగాని… ఆత్మకు ముక్తి ఇప్పుడు క్రొత్తగా వచ్చింది కాదు. సర్వజీవుల ఆత్మ నిత్యముక్తమైయున్నది.
అభ్యంతరమున సర్వవిషయ విశేషముల పట్ల శీతలము (శాంతి) వహించిన చిత్తమే ముక్తి. చిత్తము అనేక జగత్ విషయముల పట్ల సంతప్తమై ఉండటమే బంధము.
కనుక బంధం, మోక్షం అనబడేవి చిత్తము యొక్క అధీనంలో ఉన్నవేగాని… అవి దేహాధీనాలు కావు. బంధ - - మోక్షములనే రెండూ దేహంలో లేవు. జీవన్ముక్తుడు సర్వ విషయ - విశేషముల
Page:293
పట్ల ఒకానొక అనిర్దేశ్యమగు అతీతత్వము సంతరించుకుని ఉంటాడు. అట్టి అతీతత్వము ఈ దేహం యొక్క భోగములను అనుభవిస్తున్నప్పుడుగాని, లేక ఈ దేహం ఖండఖండములగు చున్నప్పుడు గాని, అనేక లోకసంబంధమైన పరిస్థితులు ఎదురగుచున్నప్పుడు గాని, నవ్వుచున్నప్పుడు గాని, దుఃఖించుచున్నప్పుడుగాని, మరింకేవైనా పొందుచున్నప్పుడుగాని, కోల్పోవుచున్నప్పుడుగాని ఏమాత్రం చెక్కుచెదరదు.
“దేహం పని దేహం చేసుకుంటోంది. మనస్సు పని మనస్సు చేసుకుపోతోంది. నేను సర్వదా యథాతథం! తదితరులుగా కనిపించేదంతా కూడా నా అవ్యక్త స్వరూపాన్ని ఆధారంగా కలిగి ఉంది. న దుఃఖం న సుఖం కించిత్ అంతర్భవతి తత్ స్థితమ్ ॥
బహిరంగంలో ఏది ఎట్లా ఉన్నా కూడా, అంతరంగంలో నేను కించిత్ కూడా సుఖంగాని, దుఃఖంగాని లేనివాడనై సదా నిర్వికారుడనై ఉన్నాను కదా!”…అని ఆత్మజ్ఞాని తన ఆత్మరూపమును గమనిస్తున్నాడు.
ఈ సుఖ దుఃఖాదులు దేహముచే దేహమునందు పొందుచున్నప్పటికీ “నేను సుఖిని - నేను దుఃఖిని” అని ఆత్మకు సుఖ దుఃఖాదులు అజ్ఞాని ఆపాదిస్తున్నాడు. సుజ్ఞాని “ఇవన్నీ ఆత్మకు లేవు. ఆత్మస్వరూపుడనయి ఉండటం చేత నాకు సుఖదుఃఖాలు లేవు” … అని గ్రహించి నిశ్చలభావుడై ఉంటున్నాడు. “ఈ దేహమే నీవు" … అని బోధించేవారు (చార్వాక -నైయాయిక వాదులు) దుఃఖా లకు నిర్వచనం గాని, ఉపశాంతినిగాని అందించలేకపోతున్నారని నా మనవి. దేహాత్మవాదం పదే ఓడిపోతోంది. ఆత్మశాస్త్రం ఒక్కటే చివరికి దిగ్విజయమొందుచున్నదని పరిశీలకులకు నా మనవి.
జీవన్ముక్తులు నిత్యము, అశరీరము అగు ఆత్మస్వభావమును సుస్పష్టపరచుకొని, సంతరించుకుని ఉంటారు. వారు ఈ దేహాదుల భావన ఎప్పుడూ కలిగివుండరు. కాబట్టే… వారు జన్మిస్తూ జన్మ రహితులై ఉంటారు. జీవిస్తూ జీవాదులకు సంబంధించని వారై ఉంటారు. మరణిస్తూ మరణించనివారై ఉంటున్నారు. అనగా వారు జన్మిస్తూ - జీవిస్తూ మరణిస్తూ తమను తాము జన్మ - - జీవన్ మరణములకు అతీతమైన కేవలాత్మ స్వరూపంగా దర్శిస్తున్నారు.
దేహాది జీవన్ముక్తానాం స్వభావాత్ న కదాచన మృతో2పి నైవమ్రియతే, రుదన్నపి న రోదతి విహసన్ న హసత్త్యేవ జీవన్ముక్తో మహోదయః! వీతరాగాః సరాగాభా అకోపాః కోపసంయుతాః
ఆ జీవన్ముక్తులు… దేహధారులై ఉంటూనే దేహరహితులై ఉంటారు. వారి దృష్టిలో వారు దేహమాత్రులు కాదు. దేహధర్మాలైనట్టి “జన్మ-జరా మరణ శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ స్మరణ-విస్మరణ” మొదలైనవన్నీ కలిగివుంటూనే, కలిగివుండనివారై ఉంటారు.
మరణము ఆసన్నమైనప్పుడు “ఇది దేహధర్మము. నా స్వస్వరూపం సర్వదా ఈ వ్యవహారానికి సంబంధించినదే కాదు. కనుక దేహం మరణించవచ్చు గాక! నేను జీవించినవాడనూ కాదు,
Page:294
మరణించిన వాడనూ కాదు” … అనే అప్రమేయానుభవం ఇప్పటికిప్పుడే కలిగివుంటారు. సర్వదా మహోదయులై ఉంటారు.
“సూర్యోదయం - సూర్యాస్తమయం” అనేవి భూప్రదేశం దృష్ట్యా ఉండి ఉంటున్నాయి కాని… సూర్యబింబానికి ఉదయాస్తమయములు ఎక్కడుంటాయి? అది స్వప్రకాశము అన్యప్రకాశకం కాదు! అట్లే ఆత్మను ఎఱిగిన జీవన్ముక్తుడు నిత్యోదయుడై ఉంటాడు.
ఆతడు నవ్వుతూ ఉన్నప్పటికీ నవ్వనివాడై ఉంటాడు. ఏడ్చుచున్నప్పటికీ, ఏడ్వనివాడై ఉంటాడు. కోపం చూపిస్తూ, కోపం లేనివాడై ఉంటాడు. రాగసహితుడై ఉంటూ, రాగాదులు లేనివాడై ఉంటాడు.
అమోహా మోహవలితా దృశ్యన్తో తత్త్వదర్శినః
‘ఇదమ్ సుఖమ్ - ఇదమ్ దుఃఖమ్’ ఇత్యాది కలనాస్తుతాః
అలం దూరగతాః తేషాం అంకురా నభపో యథా ॥
మోహం చుట్టూ ఆవరించవచ్చుగాక! తత్త్వజ్ఞులు మోహరహితులై ఉంటారు. ఎట్లా అంటావా? “ఇది సుఖం, ఇది దుఃఖం“ … అన్న వ్యవహారమంతా వారి దృష్టిలో ”స్వప్నంలోని మంచివారు - స్వప్నంలోని చెడువారు” వలె కల్పనామాత్రమై ఉంటుంది. ఆత్మజ్ఞుడగు జీవన్ముక్తుని దృష్టిలో ఈ జగత్తుకు ఒక స్వరూపమంటూ ఏదీ కనిపించదు. "ఆకాశం ఇక్కడ ప్రారంభించింది” … అని అన గలమా? అట్లాగే వారికి ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ మొదలు - - చివరలేని కథాకల్పనా వ్యవహారంగా అగుపిస్తాయి. ఎవని దృష్టిలో ఈ జగత్తుగాని, అజ్ఞానం అనేదిగాని లేకున్నాయో, ఎవని అనుభూతిలో ఈ కనిపించే సర్వమూ ఆత్మస్వరూపమే అయివున్నదో - అట్టివానికి ఒకవేళ లౌకిక సుఖ-దుఃఖాలు సమీపిస్తేమాత్రం, వాటికి అర్థం ఏం ఉన్నది? జీవన్ముక్తులు శోకమోహాలన్నీ జయించి ఉండడం చేత శోకిస్తూ కూడా శోకరహితులై ఉండగలుగుచున్నారు.
తత్త్వజ్ఞులు ఈ శరీరాదులు ఛేదింపబడుచున్న సందర్భంలో కూడా "నిత్యుడగు నాకు ఈ దేహాదుల వలన పాతది పోయేదేమిటి? క్రొత్తది వచ్చేదేమిటి?” … అని తలచుచు సర్వదా ఆత్మత్వమును అవధరించి ఉండగలుగుచున్నారు. స్వస్వరూపమే అయున్న ఆత్మ సర్వదా అఖండము, అప్రమేయము కదా! మహనీయులు “ఈ దేహం నిర్మించబడుచున్నప్పుడు గాని, ఛేదించబడుచున్నప్పుడు గాని తాము నిర్మించబడటం లేదు. ఛేదించబటం లేదు అని గ్రహించినవారై… సర్వదా నిర్విషయులై, నిర్వికారులై, అప్రమేయులై, అతీతులై ఉంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెపుతాను విను. బ్రహ్మదేవుడు : ఒకానొకసారి విధివశాత్తుగా సామగానం చేస్తున్న బ్రహ్మదేవుని నాల్గవ శిరస్సును తన కొనగోటితో కోమల పుష్పాన్ని త్రుంచినట్లు హరుడు (శివభగవానుడు) త్రుంచాడు కదా! ఆతడు శిరస్సును మరల మొలిపించగల శక్తి కలిగి ఉండి కూడా బ్రహ్మదేవుడు నిర్లిప్తుడై నిర్వికారుడై ఎట్లా ఉన్నాడు? తన స్వస్వరూపము ఈ దేహాదులకు సంబంధించినది కాదని గ్రహించి ఉండటంచేతనే సుమా! చిదాకాశముతో సమత్వము అవధరించియున్న ఆ బ్రహ్మదేవునకు వ్యర్థము - మిథ్యాభూతము అగు ఆ శిరస్సు మొదలైన అవయవములతో క్రొత్తగా ఒనగూడేదేమున్నది? అది ఖండించగా
Page:295
పోయినదేమున్నది? వేదగానం చేసే వేదజ్ఞుడగు బ్రహ్మదేవుడు తనకు నాలుగు ముఖాలున్నా ఒక్కటే, లేక మూడు ముఖాలున్నా ఒక్కటేనని గ్రహించి ఉన్నాడు. "ప్రాణులకు కర్మవశం చేత ఏది ప్రాప్తిస్తుందో అదియే ప్రాప్తించు గాక! ఏదీ ప్రాప్తించకుండానూ పోవుగాక! ఇందులో ప్రత్యేకమైన విశేషమేమున్నది?” అనే అత్యున్నత భావసమాధిలో ఆత్మజ్ఞానతత్పరులు సర్వదా తేలియాడుతూంటారు.
మన్మథుడు - ఇంకా విను. మన్మథుని అక్షయ బాణతూణీరములచే స్పృశించబడిన శివుడు తన అర్ధభాగ శరీరం క్షణంలో పార్వతికి సమర్పించాడు. ఇక, ఆ శివుని మూడవకన్ను యొక్క అగ్నిజ్వాలలకు దేహమును సమర్పించి కూడా మన్మథుడు సదా ఆత్మతత్త్వానుభవి కనుక దేహరహితుడై దేహసహితునివలె యథాతథంగా ఉండి వ్యవహరించుచున్నాడు.
పరమశివుడు - పరమశివుడు వాస్తవానికి రాగరహితుడే అయినప్పటికీ …మన్మథుని బాణాలు స్పృశించినప్పుడు మన్మథుని దహించటం - పార్వతీదేవిని గ్రహించటం అనే ఉభయ కార్యాలను నిర్వర్తించుచూ రాగాన్ని కలిగియే ఉన్నాడు. ఆయనకు ఈ ప్రపంచంలో ఏదైనా కార్యం నిర్వర్తించటం చేతగాని, లేక …నిర్వర్తించకుండటం చేతగాని పొందే ప్రయోజనమంటూ ఏముంటుంది?
నైవ తస్య కృతనార్థో నాకృత నేహ కశ్చన
నచ్నా స్య సర్వభూతేషు కశ్చిదరవ్యపాశ్రయః ॥
సమస్త లోకములకు అతీత స్వరూపుడు, అతీత స్వభావుడు అగు ఆ పరమశివ భగవానుడు సర్వభూతజాలాల పట్ల ప్రయోజన నిమిత్తమై ఆశ్రయించవలసిన పదార్థమేదీ లేకపోయినప్పటికీ, ఆయన రాగం కలిగియే ఉండి వ్యవహరిస్తున్నాడు. అనగా వారికి రాగం కలిగి ఉండటం, కలిగి ఉండకపోవటం రెండూ ఒక్కటే అగుచున్నది. ఏది ఎట్లు ఉన్నదో అది అట్లు ఉండుగాక! ఆత్మను ఎఱిగిన మహనీయుడు కాబట్టియే, రాగమును వదలనూ లేదు. విరాగి అయి శ్మశాన సంచారం మాననూ లేదు.
శ్రీమన్నారాయణుడు - - శ్రీ విష్ణు భగవానుడు జగత్తులో ప్రవేశిస్తూ అనేక కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాడు.
కరోతి కారయశ్యు ఉచ్చైః మ్రియతే మార్యతేపి చ జాయతే వర్ధతే జస్రం జీవన్ముక్తో జనార్దనః ॥
జీవనుక్తుడైన ఆ జనార్దనుడు… రాక్షసుల కులాంతకుడై, వారిని సంహరిస్తున్నాడు. ఇంద్రుడు మొదలైన వారిచే రాక్షసులను సంహరింపజేయిస్తున్నాడు. అనేకచోట్ల దేహములను ఆశ్రయించి ‘జన్మించటం’ అనే దేహచమత్కారమును నిర్వర్తిస్తున్నాడు. ధ్రువతార సమాప్తియందు మరణమును అంగీకరిస్తున్నాడు. లుబ్ధకుడు మొదలైన వారిచే సంహరించబడుచున్నాడు. అనేకచోట్ల అవతరించి భక్తులకు దిక్కె, కొంగు బంగారమై వారిని కంటిపాపవలె రక్షిస్తున్నాడు…
ఈ విధంగా అనేక కార్యములను నిర్వర్తిస్తూనే వైకుంఠంలో ప్రశాంతచిత్తుడై లక్ష్మీదేవితో ప్రణయములు ఆడుచున్నాడు. చూచావా? వారికి ప్రణయము, ప్రళయము ఒక్క తీరుగానే అగు
Page:296
చున్నది. సమర్థుడే అయినప్పటికీ ప్రాణుల కర్మపరంగా సంప్రాప్తించే వ్యవహార వ్యగ్రత్వమంతా తానుకూడా స్వీకరించి వర్తిస్తున్నాడు. ఎందుచేత? వారికి ఆయా వ్యవహారములు త్యజించటం చేతగాని, నిర్వర్తించటం చేతగాని ఏ ప్రయోజనమూ లేదు. ఆత్మత్త్వమునందు విలీనుడై ఉండియే, “ఈ ప్రపంచమున ఏది ఎట్లు ఉన్నదో … అది అట్లే ఉండుగాక” … అని తలచి ఆయా కార్యములను సానుకూలంగా, లోకవ్యవహారములన్నీ నడిపిస్తున్నారు. నడిపిస్తూనే ఆయన సర్వదా వాసనారహితుడై, ఏ కోర్కెలు లేనివాడై, శుద్ధ చిన్మాత్రరూపధారి అయి ఉంటున్నాడు.
సూర్యభగవానుడు - అటు ఆ సూర్యభగవానుని చూడు. ఆయన ఈ ‘జగత్తు’ అనే మహత్తర వ్యవహారం చుట్టూ బంతిలాగా ప్రదక్షిణాలు చేస్తూ ‘కాలము’ అనే వ్యవహార కల్పనకు కారకుడై, అన్నీ కాలబద్ధంగా జరిగిపోతూ ఉంటే, తాను మాత్రం నిర్లిప్తంగా, కేవల సాక్షిగా సర్వమును గాంచుచూ ఉన్నాడు.
నచ రోధయితుం దేహం! న, సమర్థి దినేశ్వరః
నిరిచ్ఛ ఏవ నిర్వాణః తథాప్యాస్తే యథా స్థితమ్ ॥
సర్వసమర్థుడు అయిఉండి కూడా దినపతియగు ఆ సూర్య భగవానుడు ఈ ‘దినచర్య’ నుండి తన దేహమును నిరోధించకయే ఉన్నాడు. సర్వదా జీవన్ముక్తుడై ఉండటం చేత తనకంటూ ఏ ఇచ్ఛ లేకుండానే యథారీతిగా ఆకాశంలో వర్తిస్తున్నాడు. విహరిస్తున్నాడు.
చంద్రుడు - అట్లాగే చంద్రుడు స్వతహాగా జీవన్ముక్తుడై ఉండి కల్పాంతము వరకు ప్రతి నెలలోను వృద్ధి - క్షయములు అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఇచ్ఛారహితుడు. అందుచేత ఈ దేహ హాని - వృద్ధులు ఆయనకు సుఖ - దుఃఖాలను కలిగించటం లేదు.
అగ్నిదేవుడు - ఇక, పరమాత్మయగు అగ్నిదేవుడు కూడా! ఒకప్పుడు ‘మరుత్తు’ అనే ఆయన పన్నెండు సంవత్సరాలు యజ్ఞం చేస్తూ నిరంతరం ఏనుగు తొండమంత పరిమాణం కలిగిన ఘృత (నేయి) ధారను అగ్నికి సమర్పిస్తున్నప్పుడు, మరొక సందర్భంలో శివుడు పార్వతితో పొందిన సమాగమ సమయంలో దేవతల వలన కలిగిన విఘ్నం కారణంగా స్థలించిన శివతేజో వీర్యమును బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం త్రాగుటచే ఏర్పడిన దాహబాధ చేత, దేవతలకు నిరంతరం సమర్పించబడే యజ్ఞ హవ్యములను తనయందు ధరించటంచేత… ఇటువంటి ఆయా సందర్భాలలో దుఃఖాదులు ఏర్పడినప్పటికీ తాను జీవన్ముక్తుడు కాబట్టి సమస్థితిచే అవన్నీ వహిస్తూ యథారీతిగా వెలయుచున్నాడు.
బృహస్పతి, శుక్రాచార్యులు - అదే విధంగా దేవతల గురువు బృహస్పతి - - దానవుల గురువు శుక్రాచార్యులు స్వతహాగా జీవన్ముక్తులు. అయితే ఏం? వారిద్దరు తమతమ ఆశ్రితుల దిగ్విజయముల కొరకై ఒకరిని మించి మరొకరు, సామాన్య మానవులు తగాదాలు పడుచున్నట్లుగా, ఎత్తుకు - పై ఎత్తు వేస్తూనే ఉంటున్నారు. అట్టి అభిలాషలు నిర్వహిస్తూనే అంతరంగమున లోక వ్యవహారములన్నిటికీ అస్పృశ్యులై, అతీతులై, నిర్విషయ సుఖానందమును కొనసాగిస్తూనే ఉంటున్నారు.
Page:297
జనకాది జీవన్ముక్తులు - జీవన్ముక్త మానసులైన జనకమహారాజు అనేక భయంకర యుద్ధములలో పాల్గొనుచూ ఈ జగద్విషయాలన్నీ కథా సంఘటనల వలె దర్శిస్తూ తన జీవన్ముక్తస్థితిని కొనసాగిస్తూనే ఉన్నారు. అట్లాగే జీవన్ముక్తులైన నలుడు, మాంధాత, సగరుడు, దిలీపుడు, నహుషుడు, హరిశ్చంద్రుడు మొదలైనవారు జీవితంలో అనేక దుర్భర సంఘటనలను ఎదుర్కొంటూ సుదీర్ఘకాలం రాజ్యాలు ఏలారు. వారి జీవితాలలో అందరిలాగానే అనేక కష్టాలు మొదలైనవి వచ్చి పోతున్నప్పటికీ, సర్వదా జీవన్ముక్తత్వం అనుభూతమొనర్చుకొనియే జీవితములను కొనసాగించారు.
శ్రీరాముడు : మహర్షీ! మరి జీవన్ముక్తునికీ, అజ్ఞానికీ గల భేదమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
వ్యవహరేయథైవ అజ్ఞః తథైవ ఖలు పండితః ॥
వాసన - - అవాసనే ఏవ కారణం భంధ-మోక్షయోః ॥
జ్ఞాని, అజ్ఞాని కూడా వ్యవహార రీత్యా చూస్తే ఒకే రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంక తేడా ఏమిటంటావా?
జ్ఞానికి (లేక జీవన్ముక్తునికి) దృశ్య వాసన ఉండదు. అజ్ఞాని, అనేక వాసనలు కలిగి ఉంటాడు. అనగా… వాసన, వాసనా రాహిత్యములే క్రమంగా బంధ మోక్షములకు కారణములు అగుచున్నాయని ఇక్కడ గ్రహించు.
ఇంకా విను! జీవన్ముక్తుడు, రాగవర్జితుడు అయినట్టి బలిచక్రవర్తి మూడడుగులు దానం చేస్తే బాలక బ్రహ్మచారిగా వచ్చిన విష్ణు భగవానుడు పాతాళానికి తనను అణగత్రొక్కగలడని గురువు శుక్రాచార్యులు హెచ్చరించినా, తనకు తెలిసి ఉన్నా కూడా, “కారే రాజులు, రాజ్యముల్ కలుగవే! వారేరీ?” …అని చక్రవర్తి పదవిని తృణప్రాయంగా సమర్పించివేశాడు. అట్లాగే ప్రహ్లాదుడు, నముచి, వృత్రుడు, మురుడు, అంధకాది రాక్షసులు పైకి రాగయుక్తుల వలె జాత్యహంకారుల వలె వ్యవహరిస్తూ ఈ ప్రపంచంలో స్థితి కలిగి ఉండి, అంతఃకరణంలో, “సర్వం సర్వదా భగవదర్పితమే”
…అని గ్రహించి చరించారు.
కాబట్టి ఓ రామచంద్రా! చిదాకాశ స్వరూపము సంతరించుకొని ఉన్న మహనీయులు తాము రాగ - ద్వేషములు ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ, వారికి సచ్చరిత్రలు - దుశ్చరిత్రలు ఉండి ఉంటున్నప్పటికీ వారి మోక్ష స్థితికి వచ్చే లోటేమీ ఉండటం లేదు. చిదాకాశ స్థితికి - ఈ ప్రపంచంలో వ్యవహారాలకు సంబంధం ఉండటం లేదని గమనిస్తున్నావు కదా! ఎందుకంటావా?
జీవన్ముక్తులు పరిపూర్ణ స్వయమాత్మ స్వరూపులై ఉంటారు. చిదాకాశం వలె “శుద్ధం” అయినట్టి అంతిమ సాక్షాత్కార వృత్తి రూపమగు జ్ఞానం అవధరించి ఉంటారు. అట్టి శుద్ధ జ్ఞానంతో ఈ దేహ-మనో-ఇంద్రియ ప్రాణ ధర్మములను ఆద్యమగు పరబ్రహ్మ భావనతో దర్శిస్తూ ఉంటారు. “ఇవన్నీ కూడా, వీటిచే గాంచబడే విషయాదులతో సహా సర్వము బ్రహ్మమే కదా!” అను ఎఱుకను
Page:298
దృఢపరచుకొని ఉంటారు. కనుక ఇక అట్టి జీవన్ముక్తులకు “ఇది స్వకీయం - ఇది పరకీయం” … -
అనే భేదం మొదలే నశించి ఉంటుంది. ఇక వారి దృష్టికి ఈ కనబడే జగత్తంతా కూడా “మేఘము తలపై సూర్యకిరణములు ప్రసరించినప్పుడు వివిధ వర్ణములతో కనబడే ఇంద్రధనుస్సు భ్రమ సూత్రమేగాని అక్కడ ఇంద్రుడు వచ్చి ధనుస్సును స్థాపించలేదు కదా! అట్లాగే ఈ దృశ్య ప్రదర్శనమంతా అభాస మాత్రమే!” అని అత్యంత నిర్దుష్టంగా గమనించి ఉంటారు. “ఇంద్రధనుస్సు” సూర్యకిరణములు మేఘములను తాకుటచే ఏర్పడి కనబడుచున్నప్పటికీ శూన్యమాత్రమే కదా! ఈ బ్రహ్మాండములో కనిపించే పరమాణువుల సముదాయమై కనిపించే జగత్ వస్తువులన్నీ శూన్యమాత్రమే …అని సుస్పష్టం చేసుకొని ఉంటారు. ఆకాశంలో మేఘ సముదాయంలో కనిపించే కొండ శిఖరాకారాలు ఉద్యానవనాలు, దూదిపింజాలు … ఇవన్నీ పుట్టినదెప్పుడు? నశించేదెప్పుడు? నశించనిదెప్పుడు? అవన్నీ మేఘపుంజాల మధ్యగా ద్రష్ట స్వయంకృతమైన ఊహాకల్పనచే కనిపించేవే కదా! స్వప్నంలో కనిపించిన జనులు పుట్టినదెప్పుడు? చచ్చినదెప్పుడు? తొలగినదెప్పుడు?
ఇదం జగత్ అసత్భాతి సదివ వ్యక్తిమాగతమ్
అజాతం అనిరుద్ధం చ యథా శూన్యత్వమ్ అంబరే ||
స్వప్నంలో కనిపించిన మిత్రుడు పుట్టనూలేదు, చావబోవటమూ లేదు కదా! ఊహలో కనిపించే ఒక నగర సింహద్వారానికి ఎవరు నగిషీ చెక్కారంటే ఏం చెపుతాం? అట్లాగే ఈ “జగత్తు” అనబడేది ఎన్నడూ పుట్టటమూ లేదు. ఇది నశించటమూ లేదు. అసత్తే అయినప్పటికీ స్వప్నంలో భవనం స్వప్న సమయంలో వాస్తవంగానే అనుభవమౌతోంది చూచావా? అట్లాగే ఈ జగత్తుకూడా అసత్తే అయినప్పటికీ అజ్ఞానమున్నంత కాలం సత్తువలె భాసిస్తోంది.
సాద్యంతమపి అనాద్యంతమ్, అశూన్యమపి శూన్యకమ్ జగత్ జాతం తథా అజాతమరుద్ధమ్ రుద్ధమేవ చ ॥
ఈ “జగత్తు” (లేక) “దృశ్యం" అను దానికి ఎక్కడో మొదలు - చివర ఉన్నట్లే అనిపిస్తున్నప్పటికీ -
ఇది వాస్తవానికి ఆద్యంతరహితం. ఇది అనాది, అనంతము కూడా! ఇదంతా పదార్థ సహితంగా కనిపిస్తున్నప్పటికీ శూన్యం మాత్రమే. ఇదంతా ఎప్పుడో ఉత్పన్నమైనట్లు కనిపిస్తున్నా కూడా, అనుత్పన్నం. ఇది నశిస్తున్నప్పటికీ నాశనరహితం. ఒక పెద్ద కొయ్య స్తంభము అంతటా కొయ్య మాత్రమే అయి ఉన్నప్పుడు అందులో మధ్యగా చెక్కబడిన ప్రతిమ కూడా కొయ్యయే కదా! అట్లాగే బ్రహ్మమునందు కనిపించే ఈ జగత్ దృశ్యము బ్రహ్మమే అయి ఉన్నది. కల్పనచే భాసించే జగదృశ్యం చిదాకాశమే!
ఓ రామచంద్రా! ఒకడు తన ఆలోచనలన్నీ త్యజించి నిద్రారహితమైన సమాధిని అవధరించా డనుకో! అట్టి సర్వకల్పనా వర్జితము, సర్వత్రా ఏకరసము అయిన ’కేవల చిదాకాశము”నందే ఈ ‘జగత్తు’ వెలయుచున్నదని గ్రహించి ఉండు.
ఒకని బుద్ధివృత్తి నేత్రేంద్రియము ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుచు న్నప్పుడు… ఆ రెండు విషయముల మధ్యగల “నిర్విషయ సంవిత్తు” నందే ఈ జగత్తు విలసిల్లి
Page:299
ఉంటోంది. మనమందరమూ చిదాకాశ స్వరూపులమే! అట్టి “చిదాత్మయందు ఏ ద్వైత - అద్వైతములు భాసిస్తున్నాయో అట్టి ద్వైత-అద్వైతములు వాస్తవానికి లేవు” …అనునదే మా అనుభవపూర్వక నిర్ణయం. అట్టి పూర్ణానందైక స్వరూపమునందు ‘శూన్యము’ అనేది కూడా లేదు. నీటితో నిండిన కుండ - ఖాళీ కుండలవలె శూన్యత్వ - పూర్ణత్వ శబ్దాలు సాపేక్షకం మాత్రమే! ’ద్వైతము, అద్వైతము’ అనే శబ్దాలు సాపేక్షచే సంభవించేవే. ’ఆత్మ’యందు ఏకత్వము లేదు. అనేకత్వము లేదు. ఇక ఈ జగత్తుగా కనిపించేదంటావా? ఒకడు ఒక ఖాళీ స్థలంలో భవిష్యత్తులో కట్టబోయే ఇంటిని ఊహించి “ఇది వంటగది. ఇది పూజామందిరం, ఇది పడక గది. ఇది అందరం కూర్చుని కబుర్లు చెప్పుకొనే విశాల విభాగం. ఇక్కడ కుర్చీలు ఉంటాయి”… అని చెప్పుతూ ఉంటాడు చూచావా! అట్లాగే ఈ జగత్తు కూడా భవిష్యత్ భవనంలాగా దేశ-కాలాదులతో కూడినదై కనిపిస్తోంది. వాస్తవానికి ఇదంతా ‘ఆత్మయే!’ (“సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ” - వేదవాక్యం లాగా) ఇదంతా సర్వదా చిదాకాశ రూపమగు బ్రహ్మమే అయివున్నది. ఎట్లా అంటావా? స్వప్న ద్రష్ట యొక్క చైతన్యం స్వప్నంలో తన స్వరూపమునే వివిధ జనులవలె, నగరాదుల వలె దర్శిస్తోంది చూచావా? అట్లాగే ఈ జాగ్రత్ ద్రష్టయొక్క చైతన్యమే జాగ్రత్ష్ట జగత్తుగా కనిపిస్తోందని విజ్ఞులు ఎరిగియే ఉంటున్నారు.
ద్రష్ట యొక్క స్వయం స్వరూపమగు చైతన్యమే ఆ ద్రష్టకు అజ్ఞాన ప్రభావం చేత (స్వస్వరూపమును ఏమఱచుట చేత) జగత్తుగా ఇక్కడ అగుపిస్తోంది.
ఓ మహత్తరమైన ఆశయం గల మహాశయా! రామచంద్రా! ఈ దృశ్యం సర్వదా శిలాఘనం వలె మౌనంగా ఉన్నట్టి బ్రహ్మం యొక్క రూపమే! అయితే స్వాత్మయే తాను ప్రసరించి ఉన్నట్టి తన స్వస్వరూపాన్ని ‘జగత్తు’ అనే దానిగా దర్శిస్తోంది. ఈ దృశ్య జగత్తుకు ఇంతకుమించిన వేరే అర్థం లేదు.
శ్రీరాముడు : ఓ మునీంద్రా! ఇప్పటి వరకు ఒకే జీవాత్మయగు విపశ్చిత్తు నలుగురు విపశ్చిత్తులుగా అయి, ద్వీప, సముద్ర, పర్వతాదులందు సంచరిస్తూ, “ఈ పాంచభౌతిక - - మనోమయ దృశ్యజగత్తు యొక్క అంతు ఎక్కడ?” …అను ఉత్సుకతతో ప్రమాణం కొనసాగిస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా! ఆ నలుగురు విపశ్చిత్తుల గురించిన తదనంతర విశేషాలేమిటో వివరించ ప్రార్థన! శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లే అగుగాక!
విపశ్చిత్తులో ఒకడు ఒకనాడు క్రౌంచ ద్వీపంలో గల ’వర్షసీమ’ అనే పేరుతో పిలువబడే పర్వతశ్రేణుల మధ్యగల ఒక గండశిలపై దీర్ఘ ప్రయాణపు బడలికచే ఆదమరచి నిద్రిస్తున్నాడు. ఇంతలో ఒక మదపుటేనుగు తన పాదఘట్టనతో ఆతని దేహమును పువ్వును నలిపినట్లు నలిపివేసింది.
రెండవ విపశ్చిత్తు ఒక కీకారణ్యంలో సంచరిస్తున్నాడు. ఇంతలో మహాబలవంతుడగు రాక్షసు డొకడు తారసపడ్డాడు. వారిద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసునిదే పై
Page:300
చేయి అయింది. కొంత సమయం తరువాత రెండవ విపశ్చిత్తు దేహం నిర్జీవం అయింది. విజేతయగు రాక్షసుడు కోపం ఆపుకోలేక మృతుడైన రెండవ విపశ్చిత్తు దేహమును భుజంపై పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరి దూరంగాగల సముద్ర మధ్యంలోగల బడబాగ్నిలో పడవేశాడు. ఆ అగ్నిలో పడిన రెండవ విపశ్చిత్తు దేహం భస్మంగా మారిపోయింది.
ఇక మూడవ విపశ్చిత్తు ఒక విద్యాధరునితో స్నేహం చేసి ఆతనికి అత్యంత ప్రియుడైనాడు. ఒకనాడు ఆ విద్యాధరుడు మూడవ విపశ్చిత్తు యొక్క అభ్యర్థనను కాదనలేక తనవెంట స్వర్గలోకం తీసుకువెళ్ళాడు. ఆ ఇద్దరు ఇంద్రసభలో ప్రవేశించారు. ఇంద్రుడు సభలో వినోదిస్తూ ఉండగా ఆ ఇంద్రుని దృష్టి మూడవ విపశ్చిత్తుపై పడింది. తటాలున సింహాసనం మీద నుండి లేచి “అనర్హుడైన ఈ మానవుడు ఇక్కడికి రావటమా?” …అని హూంకరిస్తూ ”ఓయీ! నీవు ఈ క్షణమే భస్మమై పోయెదవుగాక” …అని శపించాడు. మరుక్షణం ఆ మూడవ విపశ్చిత్తు దేహం ఆసనం మీదనే ఒక గుప్పెడు భస్మంగా అయిపోయింది.
నాలుగవ విపశ్చిత్తు “కుశ” అనే ద్వీపంలో ప్రవేశించాడు. అక్కడ ఆతనికి ఒక గొప్ప సరస్సు కనిపించింది. వెంటనే ఆ సరస్సులో జలకాలాడటం ప్రారంభించాడు. ఇంతలో సరోవర గర్భంలో నుంచి ఒక మొసలి అకస్మాత్తుగా ఆ నాలుగవ విపశ్చిత్తు దేహంపైకి దూకి ఆతని దేహాన్ని ఖండ ఖండాలుగా త్రుంచివేసింది.
ఆ విధంగా నాలుగు దేహాలు నశించగా… వారి సంవిత్తు ఆకాశరూపం పొందింది. ఆ ఆకాశం లోనే వారి వారి పూర్వ సంస్కారాలచే సంప్రాప్తమైన ప్రాపంచిక దృష్టుల ప్రభావంచేత నాలుగు రకాలైన ప్రపంచాలను (ఆకాశంలోనే) గాంచసాగారు. నలుగురు నాలుగు దేహాలను ధరించారు. సృష్ట్యారంభంలో మొట్టమొదటగా సృష్టించబడిన ప్రజాపతులు తమ దేహాలను, ఆ దేహాల ద్వారా అనే సృష్టులను దర్శించునట్లే… ఆ నలుగురు విపశ్చిత్తుల సంవిత్తు మరల నాలుగు దేహాలను, ఆ దేహాలతో వస్తు విషయ పరిజ్ఞానంతో కూడిన జగదనుభవాలను పొందనారంభించారు. వారి వారి మనో ప్రతిభాస మాత్రం అగు అతివాహిక దేహం (సూక్ష్మదేహం. నేను అను భావన, నావి అను అనుభూతి)ను, స్థూల దేహమును, ఆ రెండింటికీ విషయాలైన స్థూల - జడ పదార్థాదులను గాంచసాగారు. ఆకార రహితమగు జలంలో ఆకారరూపమగు తరంగాలు పరిఢవిల్లునట్లుగా ఆకాశ రహితమగు చిదాత్మలో వారు ఆకాశమాత్ర రూపులై ప్రదర్శితులై ప్రవర్తించసాగారు. అట్లా వారు నలుగురు పాంచ భౌతిక దేహాలు అవధరించగానే “ఈ పృథివి యొక్క పరిమాణం ఎంతటిదో నేను తెలుసుకోవాలి”… అనే రూపంగల ఇతఃపూర్వపు సంస్కారాలు ఆ నలుగురి మనస్సులను ఆశ్రయించాయి. ఆ నల్గురు మరల పూర్వ సంస్కార బలంచేత “భూమియొక్క విస్తీర్ణం ఎంతవరకో తెలుసుకోవాలి” …అనే కుతూహలం కొనసాగించటానికి అనువైన భౌతిక దేహాలు పొంది పరిభ్రమణం కొనసాగించసాగారు. అవిద్య యొక్క పరిమాణం ఎంతో తెలుసుకొనే ఉద్దేశంతో ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి ప్రయాణాలు చేయసాగారు.
❖
Page:301
పశ్చిమదిక్ విపశ్చిత్ - - మోక్షసన్యాస యోగం - పశ్చిమదిక్కు విపశ్చిత్తు ఆ విధంగా సంచారం కొనసాగిస్తూ ఒకప్పటికి సప్త సముద్రాలతో కూడిన సప్తద్వీపములను దాటివేశాడు. స్వర్ణమయమగు ఒకానొక విస్తీర్ణ ప్రదేశంలో ప్రవేశించాడు. సౌభాగ్యవశంగా ఆ ప్రదేశంలో క్రీడిస్తున్న విష్ణు భగవానుని దర్శించాడు. స్తుతించి శరణువేడాడు. స్తుతి, విన్నపం, శరణాగతులచే సంతుష్టుడైన విష్ణు భగవానుడు పశ్చిమ దిక్కు విపశ్చిత్తుకు ఆత్మజ్ఞాన బోధ ప్రసాదించారు. అది విని అనునయించుకున్న ఆ విపశ్చిత్తు క్రమంగా సమాధినిష్ఠుడై ఆ ఆకాశగర్భ ప్రదేశంలో ఐదు సంవత్సరాలు గడిపివేశాడు. ఆ తరువాత దేహము త్యజించాడు. దేహభావము మొదలంటా సమసిపోగా కేవలం చిత్తస్వరూపుడైనాడు. అట్టి స్థితిలో చిత్తము సత్వస్థితి సముపార్జించుకోగా… ఆతడు ’విదేహముక్తి’ని పొందాడు. ఇక అంతవరకు అనేక ఉపాధుల సంచలన రూప కార్యక్రమంలో అంటిపెట్టుకొని ఉన్న ఆతని ప్రాణములు ఆకాశ రూపమును పొందినవై అనంత వాయువులలో విలీనమై ప్రకాశించాయి.
తూర్పుదిక్ విపశ్చిత్ - - చంద్రలోక స్థానం - తూర్పు దిశకు వెళ్ళిన విపశ్చిత్తు సుదీర్ఘంగా ఆకాశంలో ప్రయాణిస్తూ పూర్ణ చంద్రుని సమీపించాడు. ఆతడు క్రమంగా చంద్రబింబపు అమృత కిరణములచే ఆకర్షితుడై తన శరీరమును “శుద్ధ చంద్రరూపము”గా భావన చేయసాగాడు. అట్లా చిరకాలంగా “నా నుంచి అమృత కిరణములు ప్రసరిస్తూ భూమిలో ఔషధ శక్తిని పెంపొందిస్తూ తదితర జీవుల ందరినీ సమాహ్లాదపరచును గాక" …అని అవిచ్ఛిన్నంగా భావన కొనసాగింది. చాలా కాలమైన తరువాత ఆతనికి శరీర భావనతో పాటు పాంచ భౌతిక దేహత్వము నశించిపోయింది. ఇక అటుపై ఆతడు చంద్రలోకంలో సంచరిస్తూ స్థితి కలిగినవాడై ఉండటం జరిగింది.
శ్రీరాముడు : స్వామీ! ఏమి ఆశ్చర్యం! ఒకే జీవుని భావనా రూపంగా ప్రదర్శితమైన నాలుగు విపశ్చిత్తు దేహాలలో ఒకటి విదేహముక్తి పొందటం, రెండవది చంద్రలోక నిత్యనివాసం పొందటం జరిగిందా? మరిక మరొక ఇద్దరు విపశ్చిత్తుల సంగతేమిటి? వారింకా రెండు వేరు వేరు భౌతిక దేహములు కొనసాగిస్తూనే ఉన్నారా? లేక, వారి దేహములకు కూడా ఏమైనా విశేషం జరిగిందా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విషయాలకూ వస్తున్నాను విను.
దక్షిణదిక్ విపశ్చిత్ - సాంసారికతన్మయత్వం - దక్షిణ దిక్కు విపశ్చిత్తు అనేక ప్రదేశాలు సందర్శిస్తూ శాల్మలీద్వీపం జేరాడు. అక్కడి రాజ్య విశేషాలు, ధనాదిసంపత్తులు, వాహన - ఉద్యానవనాదులు చూచి “ఇవన్నీ సొంతం చేసుకొని, నేనే రాజునై ఎందుకు అనుభవించరాదు?” … అనే కుతూహలం కలిగింది. అక్కడికక్కడే తన ఇష్టదైవమైన అగ్ని భగవానుని ఆరాధించి తన బలపరాక్రమాలు గుర్తు చేసుకున్నాడు. క్రమంగా కొద్దిమంది సైనికులను సమీకరించుకొని అక్కడి రాజుపై యుద్ధం ప్రకటించి, ఆతనిని యుద్ధంలో జయించి ఆ శాల్మలీ ద్వీపంలో చక్రవర్తి అయి రాజసింహాసనం అధిష్ఠించాడు. ఆతడు ఇప్పటికీ అక్కడ రాజ్యం పరిపాలిస్తూ అనేక వినోదాలతో కాలం గడుపుతూ సుదీర్ఘ కాలంగా ఉంటున్నాడు. "ప్రేమ, రాజ్యపాలన, అధికారం, శత్రు రాజులపై రాజకీయాలు” … ఇటువంటి సామాన్యుల అల్పభావ పరంపరలలో మునిగి తేలుతూ అతిదీర్ఘకాలం రాజ్యం ఏలుతూనే ఉన్నాడు. “నేను విపశ్చిత్తు నామధేయుణ్ణి కదా! ఈ భూమి యొక్క మాయ యొక్క
Page:302
విస్తారం చూడటానికి బయలుదేరాను కదా!” … అనే ఆలోచన ఆతడు ఎప్పుడో మరచిపోయాడు. ఆతనిలో తత్త్వజ్ఞానం లేకపోవటంచేత ప్రస్తుతానికి ఎదురుగా వున్న రాజ్యపాలనాది విశేషాలలో తన్మయుడై ఉంటున్నాడు.
శ్రీరాముడు : మహర్షీ! ఇదంతా చమత్కారంగా ఉన్నది. ఒకే జీవాత్మ యొక్క సంకల్ప, ఉద్దేశ, సంభావన, ఆశయాల నుండి బయలుదేరిన నాలుగు ఉపాధులలో ఒకరు విదేహముక్తి పొందటం, రెండవ వారు ఉత్తమ లోక ప్రాప్తి పొంది ఉండటం, మూడవవారు సంసార విశేషాలలో తన్మయులై కాలం గడుపుతూ ఉండటం …ఎంతటి ఆశ్చర్యం! సరే… ఇక ఉత్తరదిక్కు విపశ్చిత్తు ఏమేమి చేస్తూ ఉన్నాడో అది కూడా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఇక ఆ విశేషం కూడా చెపుతాను విను.
ఉత్తరదిక్ విపశ్చిత్ : ఉత్తర దిక్కు విపశ్చిత్తు అనేక ప్రదేశాలు సంచారం చేస్తూ కొంతకాలం గడిచి పోయిన తరువాత అతిచంచల సంయుక్తమైన (సప్తమ) స్వాదూద మహాసముద్రం చేరాడు. అక్కడ జల స్తంభన విద్యను ఉపాసించి సముద్ర గర్భంలో సంచరించసాగాడు. అలా సంచరిస్తూ ఉండగా ఒకనాడు ప్రమాదవశాత్తు ఒక తిమింగలం కళ్ళబడ్డాడు. ఆ తిమింగలం ఆతని వెంటబడి చివరకు ఎక్కడో పట్టుకుని ఆతనిని గుటుక్కున మ్రింగివేసింది. ఆ విధంగా ఆ పెద్ద తిమింగలం పొట్టలో ఒక చోట చిక్కి ఆ తిమింగలం మాంసం భుజిస్తూ, అక్కడే నిదురిస్తూ ఒక వెయ్యి సంవత్సరాలు గడిపాడు. ఆ తరువాత ఆ తిమింగలం మరణించినప్పుడు పొట్టలోంచి ఒక పురుగులాగా బయల్వె డలాడు. ఆపై స్వాదూద మహాసముద్రంలో 50,000 యోజనాలు (1యోజనం = సుమారు నాలుగు మైళ్ళు) ప్రయాణించి ఒకానొకప్పటికి దేవతలు సంచరించే సువర్ణమయమైన ఒక భూప్రదేశం చేరాడు. కాలమహిమ మహత్తరమైనది కదా! అక్కడ కొంతకాలం తరువాత దేహశైథిల్య కారణంగా మరణం పొందాడు. ఎండు కట్టెపుల్ల అగ్నియొక్క స్పర్శచే అగ్నికణంగా మారునట్లుగా ఆతడు అక్కడ దేవతారూపం పొందాడు. ఆ విధంగా ప్రధాన దేవతారూపుడై కొంతకాలం గడిపిన తరువాత ఆతనిలో “లోక సంచారం చేసి ఈ సృష్టియొక్క అంతు తెలుసుకోవాలి” … అనే ఇతఃపూర్వపు జన్మ యొక్క ఉత్సుకత బలోపేతంగా బయల్వెడల సాగింది. అట్టి ఇతఃపూర్వపు జన్మ జన్మార్జిత సంస్కారంచేత… ఇక… ఆ సువర్ణ భూప్రదేశంలో ఉండలేకపోయాడు. అక్కడి నుండి బయలుదేరి నలుబదివేల (40,000) యోజనముల ఎత్తుగా ఉండే లోకాలోక పర్వతం జేరాడు. ఆ లోకాలోక పర్వతం యొక్క ప్రథమ భాగం సూర్యకాంతితో విరాజిల్లుతూ జీవసంచారానికి యోగ్యమై ఉంటోంది. తతిమ్మా మూడు భాగములు అంధకారమయమై జీవులు ప్రవేశించటానికి వీలుగాలేదు. మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు ఆ లోకాలోక పర్వతముయొక్క అత్యున్నత శిఖరం చేరాడు. అక్కడి నుండి తదితర భూప్రాంతాలు మొదలైనవి - మనకు నక్షత్రాలు ఎక్కడో సుదూరంగా ఆకాశంలో కనిపిస్తున్నట్లు… ఆతనికి కనిపించసాగాయి. ఆ లోకాలోక పర్వతము యొక్క ఆవలి ప్రదేశం అంధకారమయమై నలువైపులా అతి విశాలంగా విస్తరించి ఉన్నది. అక్కడికి వర్తులాకారపు భూమండలం సమాప్తమై పోతోంది. ఆవల కేవలం అంధకారమయమైన గొప్ప కందకం మాత్రం
Page:303
ఉన్నది. ఆ అంధకారంలో భూమిగాని, జంగమ జీవులుగాని, ఏ ఆశ్రయంగాని లేవు. అచ్చట ఏ వస్తువు ఉండజాలదని గ్రహించు.
శ్రీరాముడు : హే భగవాన్! మహర్షీ! నిరాధారమగు ఆకాశంలో ఈ భూగోళం (పడిపోకుండా) ఎట్లా స్థితి కలిగివుంటోంది? నక్షత్ర మండలం దేనికీ ముడిపెట్టబడకపోయినా కూడా… ఆకాశంలో నిరాధారంగా, నియమిత స్థానంలో, నక్షత్రాలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టుకోకుండా ఎట్లా ఉంటున్నాయి? ఈ రచనా చమత్కారం వెనుక ఉన్న ధారణాశక్తి ఎవరిది? ఎట్లాంటిది? “లోకాలోక పర్వతం” అని మీరు చెప్పేదానికి ”లోకము, అలోకము” అనే పరస్పర వ్యతిరిక్త ద్వంద్వ సమాసశబ్దం ఎట్లా వచ్చింది? ఈ భూగోళానికి సూర్యగోళం ఆధారమనుకుంటే… సూర్యగోళానికి ఏది ఆధారం? ఈ బ్రహ్మాండ సృష్టి స్థితులు ఎట్టివో విశదీకరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! "ఈ బ్రహ్మాండంలోని భూ-సూర్య-నక్షత్ర మండలాదులు నిర్నిరోధకమైన ఆకాశంలో ఎట్లా, ఏ ఆధారంతో స్థితి కలిగి ఉన్నాయి?” . అనే ప్రశ్నకు ‘సూటి’ అయిన సమాధానం చెప్పుచున్నాను. విను.
ఒక బాలుడు పగలంతా ఆడివచ్చి, శుభ్రంగా స్నానం చేసి, భోజనం చేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడనుకో, ఆతనికి ‘సంకల్ప రచన’ (లేక) ‘ఊహాలోకం’లో ఒక బంతి చేతిలో కనిపించిం దనుకో. ఆ బంతి (కందుకం) ఎక్కడ, ఎట్లా స్థితి కలిగి ఉన్నదో… అట్లాగే… హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు)” అని పురాణ ద్రష్టలచే పిలువబడే సమష్టి సంకల్పుని సంకల్ప నగరంలో కల్పితమై ఈ భూమి, సూర్యుడు, నక్షత్ర మండలాలు వగైరా, సంకల్పానుసారంగా స్థితి కలిగి ఉన్నాయి. బాలుని ఊహలో కనిపించిన బంతిని గుండ్రంగా తయారుచేసినది ఎవరు? అదంతా బాలుని ఊహయే కదా! ఈ మన కళ్లకు కనిపించే ఖగోళ పదార్థాలు కూడా చిన్మాత్ర బాలకుడుగా హిరణ్యగర్భుని ఊహాలోకంలో కనిపించే ఊహాకల్పిత ప్రసిద్ధ పదార్థాలు మాత్రమే! “ఊహచే కల్పించబడినవి. వాస్తవంగా ఎందుకు కనిపిస్తున్నాయి?” అని ప్రశ్నిస్తే, అందుకు సమాధానం …“మన ఊహతో జతజేర్చి, వాటిని అట్లా అట్లా దర్శించటం చేతనే” … అని అనక తప్పదు.
ఒకాయనకు ఆకాశంలో అనేక వెంట్రుకలు - నలుగురు చంద్రులు కనిపిస్తున్నాయనుకో. ఆయన “నాకు నలుగురు చంద్రులు కనిపిస్తున్నారు. వెంట్రుకాకారాలు కనిపిస్తున్నాయి. కనుక అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరో అక్కడ ఉంచి ఉంటారు”… అని నమ్ముతాడు. ఆయనను కంటి వైద్యునికి చూపిస్తే "ఇతని కంటికి తిమిరరోగం ఉన్నది. అందుచేత ఈతనికి ఈతడు చెప్పేవన్నీ కనిపిస్తున్నాయి”…అని రోగ నిర్ణయం చేస్తాడు. అట్లాగే… అవిద్యచేత (ద్రష్ట ఆత్మజ్ఞానం కలిగి ఉండకపోవటం చేత) చిదాకాశమే సర్వదా అంతటా ఏర్పడి ఉండగా… అట్టి చిదాకాశము నందు ఈ పృథివి - నక్షత్రాలు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
Page:304
అయితే… ఒకడు సంకల్ప నగరం (లేక ఊహా ప్రపంచం)లో ధరించిన (దర్శించే) వ్యక్తులు వస్తువులు, విషయాలు, సంఘటనలు ‘ఊహ’ కంటే భిన్నంకావు కదా! ఊహ (సంకల్పం) సంకల్పించు వాని కంటే భిన్నం కాదు. కాని, ఆ ఊహా సమయంలో ఊహాద్రష్టకు తనకంటే వేరైన వాటివలె అనుభూతి కలుగుతోంది. 1. సంకల్పం (ఊహాలోకం)లో కనిపించేవి, 2.తత్ సంకల్పం (ఊహ) - ఈ రెండూ మిథ్యయే కదా! చైతన్యం యొక్క 1. హిరణ్యగర్భ రచనా చమత్కృతి అయిన ఈ జగత్ పదార్థములు, వాటి వాటి ఆయా ధర్మాలు; 2. సంకల్ప పురుషుడగు హిరణ్యగర్భుడు - ఈ రెండూ అనుభవములను అట్టి కల్పన- అను అవగాహనతోనే దర్శించటమే ఉచితం సుమా!
చైతన్యము చిత్ అనే ఒకానొక స్వభావం కలిగి ఉంటోంది. అట్టి నిజ చిత్ స్వభావముచే చైతన్యము ఎచటెచట దేనిదేనిని ఎట్లెట్లు భావన చేస్తుందో, అదంతా అట్లట్లే అంతకాలం భాసిస్తూ ఉంటుంది. తిమిరరోగం కలవానికి (కనుగుడ్లు నిరంతరం చలించే దోషం కలవానికి) ఆయా వస్తువులు రెండు - రెండుగా కనిపిస్తున్నట్లు, అవిద్యచే చిదాత్మ ఏ భూగోళాదులను సంభావన చేస్తోందో అదంతా అట్లట్లే అనుభూతి పొందుతోంది. చైతన్యము “నీరు పల్లం వైపుగా ప్రవహించుగాక! అగ్ని ఊర్ధ్వంగా ప్రజ్వలించునుగాక!”… అని సంకల్పిస్తూ ఉండటంచేత అది అట్లే జరుగుచున్నది. అట్లాకాకుండా చిదాత్మ “నీరు పైకి ప్రవహించునుగాక! అగ్ని అధోభాగంగా జ్వలించునుగాక!” …అని సంకల్పించి ఉంటే… అది అట్లే ఉండేదికాని, అన్యంగా ఉండేది కాదు!
+
కాబట్టి ఆయా వాదుల బుద్ధిని అనుసరించి "ఈ భూగోళం, వస్తువులు, జనులు, నక్షత్రాదులు మొదలైనవి ఉన్నాయి”… అనేది తదనుకూలంగా (భావానుకూలంగా) అనుభవమౌతోంది. అట్లా కాకుండా “వాయువే అగ్ని అవుతోంది. అగ్నియే ద్రవంగా అవుతోంది. ద్రవమే ఘనంగా అవుతోంది. వస్తువు యొక్క వర్తమానపు నామ రూపాలు ఆ వస్తువు యొక్క ఒకానొక స్థితియేగాని, వస్తువు యొక్క వాస్తవ రూపం కాదు. అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించే సర్వ వస్తుజాలం కూడా! నక్షత్రాలు - భూగోళం - తదితర పదార్థాలు అట్టివే! లోకాలు, దేహాలు కూడా అట్టివే!”… అని ఎవరైనా భావిస్తే ఇది అట్లే అనుభూతమౌతుంది. ఎవరి అనుభవం వారికి సత్యమే!
ఉదాహరణకు …ఈ భూగోళం… కొందరికి నిశ్చలమైన సుదీర్ఘ ఖండంలా అనిపిస్తోంది. మరికొందరికి అనేక దృశ్య విశేషాలతో అగుపిస్తోంది. శాస్త్రార్థములు హృదయస్థం చేసుకొన్న ఆత్మజ్ఞానికి ఇదంతా తన రూపమమేనని అనిపిస్తోంది. ఎవరు దేనిని ఏ దృష్టితో చూస్తే వారికి అది అట్లే సత్యముగా అనుభవమౌతోంది.
కాబట్టి రామచంద్రా! ఈ నక్షత్ర మండలము - భూగోళము - మనం చెప్పుకునే లోకాలోక పర్వతము … ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించే కొండరాళ్ళవలె అసద్రూపమే అయినప్పటికీ… చైతన్యము యొక్క భావనను అనుసరించి "భూ మండలం - నక్షత్ర మండలం - వస్తుజాలం - జలాదులు” సదా భాసిస్తున్నాయి. కనుక మనం చెప్పుకునే ఆయా వస్తు సంబంధ విశేషాలన్నీ
Page:305
మనకు సత్యమని అనిపించటం మనయొక్క భావనారూప దృష్టి చేతనే. దృష్టియే సృష్టిరూపంగా అనుభూతమౌతోంది.
ఇక బ్రహ్మకల్పితమైన బ్రహ్మాండము యొక్క విశేషాలు కొన్ని ఇక్కడ తెలియజేస్తాను.
ఈ భూమి అతి విస్తారమై లోకాలోక పర్వతం వరకు విస్తరించి ఉన్నది. అటుపై వలయ ఆకారంగా ఉండే ఒక పెద్ద కందకం “0” ఆకారంలో ఉన్నది. ఆ కందకమంతా లోన మహాసముద్రం లాగా అంధకారం వ్యాపించి ఉన్నది. ఆ పర్వతశిఖరం మధ్యలో కొంచెం సూర్యకాంతి ప్రసరిస్తోంది.
ఆ మహా పర్వతం అత్యంత ఎత్తైనది. ఇక నక్షత్ర మండలం అద్దానికి ఉపరి భాగంలో సుదూరంగా ఉన్నది. అందుచేత అక్కడ కొంత ప్రదేశం అంధకారబంధురం, మరికొంత విభాగం ప్రకాశయుక్తమైనది. అందుకే అయ్యది “లోకాలోక పర్వతం” … అనే పేరుతో ప్రసిద్ధమైయున్నది.
ఆ పర్వతం చివర ఆకాశమండలంలో పది దిక్కులలోను నక్షత్ర చక్రం తిరుగుతోంది. ఒక్క ధ్రువ నక్షత్రం తప్ప మిగతా నక్షత్రాలన్నీ ఆ లోకాలోక పర్వతం చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. భూలోకానికి ఆకాశం రెండింతలుగా ఉంటే, నక్షత్ర మండలం నాలుగింతలు కనిపిస్తుంది.
ఓ రామచంద్రా! మాయతోకూడిన బ్రహ్మము యొక్క సత్య సంకల్పరూపమగు స్ఫురణయే బ్రహ్మాండరూప జగత్తు అయివున్నదని గ్రహించు. ఆ నక్షత్రములకు ఆవల మరికొంత ఆకాశం ఉన్నది. ఆ ఆకాశము యొక్క చివర క్రిందగా బ్రహ్మాండ కపాలము నూరుకోట్ల యోజనములు విస్తరించియున్నది. ఆకాశమునకు ఈ చివర - ఆ చివర బ్రహ్మాండ కపాలాలు ఉన్నాయి. వాటి యొక్క అంచులలో అంధకార కంధరాలు ఉన్నాయి. మధ్యలో కూడా ఆకాశం ఉన్నది. శ్రీరాముడు : మహాత్మా! ఈ బ్రహ్మాండ కపాలాలలో మొట్టమొదటిది ఏది? చిట్టచివరిది ఏది? ఆకాశ విభాగానికి అంతు ఎక్కడ?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మహాభూగోళాకారమగు ఆకాశంలో సూర్య చంద్రాదులతో కూడిన జ్యోతిశ్చక్రాలు అన్ని దిక్కులలోను స్థితిపొంది ఉన్నాయి. అట్టి అసంఖ్యాక జ్యోతిశ్చక్రాలలో ఒకనొక బ్రహ్మాండంలో ఈ భూమండలం ఒకానొక చిన్న విభాగంగా అమరి ఉన్నది. శూన్యాకారమగు ఆకాశంలో ఊర్ధ్వం ఎక్కడ? అధోభాగం ఎక్కడ? ఒకవేళ అవి ఉంటే… అన్నీ ఊర్ధ్వమే! అన్నీ అధోభాగమే!
ఈ పృథివి మొదలైన వాటి యొక్క ఉత్పత్తి, భ్రమణం, స్థితి వ్యవహారాలన్నీ కూడా చైతన్యము యొక్క ప్రతిభా మాత్రములేనయ్యా! అనగా… వాస్తవానికి ఉత్పత్తి - స్థితి - - పతనము - గమనాగమనములు… ఇవన్నీ వాస్తవానికి లేవు. అద్వయమగు స్వస్వరూప చిదాకాశము మాత్రమే సర్వదా సర్వత్రా సర్వాతీతమై ఏర్పడి ఉన్నది.
Page:306
శ్రీరాముడు : హే వసిష్ఠ మహర్షీ! మీరు వర్ణిస్తున్న బ్రహ్మాండ కపాలం, జ్యోతిశ్చక్రం, లోకాలోక పర్వతం ఆ పైగల అంధకార బంధురం మొదలైనవన్నీ మీరు భౌతికంగా ప్రత్యక్షంగా, చూచారా? లేక అనుశ్రుతంగా విజ్ఞుల గ్రంథాదులనుండి విని ఉన్నారా? లేక అవన్నీ మరొకరి అనుభవాలా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవన్నీ మేము ప్రత్యక్షంగా చూచినవే! అనుమానం మాత్రం కాదు. అయితే అవన్నీ స్థూల దేహంతో చూచినవి కావు.
శ్రీరాముడు : స్వామీ! వాటిని స్థూలదేహంతో చూడలేదంటున్నారు. ఇంతలోనే వాటిని స్వయంగా ప్రత్యక్షంగా చూచినవేగాని ఆ నోట - ఈ నోట విన్నవి కాదని కూడా చెప్పుచున్నారు. ఈ స్థూల దేహంతో కాకపోతే, మరి మీరెట్లా వాటిని చూచారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నేను చెప్పిన జ్యోతిశ్చక్రం - బ్రహ్మాండ కపాలం మొదలైనవన్నీ ఈ జగత్ స్వప్నంలోనే ప్రసిద్ధమై ఉన్నాయి. వాటిని మా వంటి ప్రతివాహక ధారణ యోగులు (మానసిక శరీరం ధరించి సంచరించగలిగే యోగులు) ప్రత్యక్షంగా గాంచగలిగేవే! అట్టి సందర్శనం చేసియున్న స్థూలదేహధారణాయోగులు అనేకమంది మన ఈ సభలో ఉన్నారు. వారందరికీ కూడా అనుభవైక వేద్యమే! ఇంకా అనేక బ్రహ్మాండాలు ఇటువంటి లక్షణాలతోను, మరికొన్ని ఇందుకు వేరైన లక్షణాలతోను ఉన్నాయనునది మా యొక్క దైనందిన అనుభవమే సుమా!
అయితే… ఈ జగత్ స్వప్నంలోని తదితర బ్రహ్మాండముల గురించి చెప్పుకొంటూ పోతూ ఉంటే ప్రయోజనమేమున్నది? బుద్ధిమంతులు ఆత్మజ్ఞానము గురించి మాత్రమే ఆకర్షితులౌతారు గాని… ఆయా జ్యోతిశ్చక్రాది విశేషాల గురించి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వరు. స్వప్నంలో విశేషాల గురించి (అది స్వప్న మాత్రమేనని గ్రహించిన తరువాత) ఎవరూ సుదీర్ఘంగా విచారణ చెయ్యరు కదా! ఇది కూడా అట్టిదే!
ఈ బ్రహ్మాండమునకు ఉత్తరంలో మేరు పర్వతం దక్షిణమున లోకాలోక పర్వతం… ఇటువంటి చర్చనీయాంశములు… ఎవరికైతే ఈ సమస్త భూత సముదాయము పట్ల జిజ్ఞాస ఉంటుందో… వారే దానిని పరిశీలించనీ. అట్లా పరిశీలించే వారికి అవన్నీ గోచరమౌతాయి కూడా!
అయితే…ఈ బ్రహ్మాండము బాహ్యమునకు వెళ్ళి దర్శించగలిగినవారికి అవన్నీ పెద్ద విషయములు విశేషములు కావు.
❖
ఇక మనం విచారిస్తూ ఉన్న ప్రస్తుతాంశమునకు వద్దాం. ఏ బ్రహ్మాండ కపాలం గురించి మనం చెప్పుకుంటున్నామో… అద్దానికి ఆవల పదిరెట్లు జలవిభాగం ఉన్నది. ఆ జలవిభాగాన్ని పార్థివ విభాగం తన యొక్క ఆకర్షణ శక్తిచేత ధరిస్తోంది. అనగా… జల విభాగాన్ని పార్థివ విభాగం తన వైపు ఆకర్షిస్తోంది.
Page:307
ఆ జల విభాగమునకు ఆవల ఇంధన రహితమైన అగ్నివలె తేజోవిభాగం విస్తరించి ఉన్నది. ఆ తేజమునకు ఆవల అందుకు పదిరెట్లు వాయువిభాగం ఉన్నది. దాని కావల ఆకాశ విభాగం ఉన్నది. ఆ ఆకాశ విభాగమునకు ఆవల శాంతము, అనంతము అయినట్టి బ్రహ్మాకాశము ఉన్నది. ఆ బ్రహ్మాకాశము ప్రకాశము కాదు. అంధకారము కాదు. "అది నాశరహితమైన మహా చిదన రూపం”… అని కవులు వర్ణిస్తున్నారు.
ఓ రామచంద్రా! బ్రహ్మాకాశము ఆద్యంతరహితమైనది. సర్వాత్మ స్వరూపమైనది. నిర్వాణ ఘనరూపమైనది. అటువంటి బ్రహ్మాకాశంలో మనం చెప్పుకుంటున్న - చూస్తున్న బ్రహ్మాండాలు లక్షలు లక్షలుగా మరల మరల ఉత్పన్నములై పరస్పరం సంయోగ - వియోగాలు పొందుతూ, నశిస్తూ వర్తిస్తున్నాయి.
శ్రీరాముడు : మహాత్మా! సమము, స్వయంప్రకాశ రూపము అయినట్టి బ్రహ్మాకాశంలో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నం అవటానికి కారణం ఏమిటి? ఎవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బ్రహ్మాకాశంలో కనిపించే బ్రహ్మాండాలు బ్రహ్మాకాశరూపమే అయివున్నాయి. సముద్రంలో కనిపించే తరంగాలన్నీ వస్తుతః సముద్రజలమే కదా! తరంగాలకు ఆకారం ఉండవచ్చు. జలానికి ఆకారమంటూ ఏదీ లేకపోవచ్చు. అంతమాత్రం చేత తరంగాలన్నీ జలంగాక మరింకేమిటి? “సముద్ర జలంలో తరంగాలున్నాయి…. అనేది అర్థరహితం కాదా? ఎందుకంటే, సముద్ర జలమే తరంగాలుగా కనిపిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మాకాశమే బ్రహ్మాండా లుగా కనిపిస్తోంది. కాబట్టి బ్రహ్మాండలుగా కనిపించేదంతా బ్రహ్మమే! దృష్టి యొక్క నిర్మలతచే “బ్రహ్మాండాలుగా కనిపించేదంతా బ్రహ్మమయములే! బ్రహ్మ స్వరూపములే! సర్వము బ్రహ్మము నందే స్థితి కలిగి ఉన్నది” అని గ్రహించబడగలదు.
ఓ రామచంద్రా! ఈ విధంగా దృశ్యానుభవము యొక్క క్రమమంతా సందార్భనుసారంగా ఉన్నది ఉన్నట్లుగా వివరించాను. ఇక మన విపశ్చిత్ రాజు కథా విశేషాలు కొనసాగిద్దాం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ ఉత్తరదిక్కు విపశ్చిత్తు ఇతఃపూర్వపు "దృశ్యము యొక్క విస్తారం ఎంతవరకో తెలుసుకోవాలి” అనే అభ్యాసం చేత ప్రేరితుడై లోకాలోక పర్వత శిఖరాగ్రం జేరాడని అనుకున్నాం కదా! ఇక అటుపై ఆ శిఖరమునకు ఆవల గల అంధకారమయమైన గర్తములో కుతూహలంతో ప్రవేశించాడు. అట్లా ప్రవేశించగానే ఆ అంధకారంలో సంచరించే భయంకరమైన పరిమాణంలో ఉండే గుడ్లగూబలు ఆతని భౌతిక దేహంపై దండయాత్ర చేసి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. ఆ విపశ్చిత్తు మరణించినది అతి పవిత్రమైన ప్రదేశం అయిఉండటంచేత, ఆతని అంతః కరణం నిర్మలత్వం సంతరించుకొన్నది. ఒక ప్రదేశం అక్కడి మహనీయుల సంచార ప్రభావంచేత
Page:308
పవిత్రత సంతరించుకోవటం లోకప్రసిద్ధ విషయమే కదా! ఆ విపశ్చిత్తు, “భౌతిక దేహం లేకున్నప్పటికీ నా యొక్క మనోదేహంతో [సూక్ష్మ దేహంతో (లేక) ఆలోచనామయ దేహంతో] సృష్టి యొక్క అంతు ఎక్కడో జిజ్ఞాసపూర్వకంగా సంచారం - పరిశీలన కొనసాగించగలను” అని భావించటం చేత ఇక ఇతఃపూర్వంలాగా మరొక భౌతికదేహం గురించి స్మరించనే లేదు. అనగా… ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు స్థూల దేహమునకు పరమైనట్టి సూక్ష్మదేహము పట్ల ఆత్మబుద్ధి (నేను అది …అను బుద్ధి) సంపాదించుకోగలిగాడు గాని, "స్థూల సూక్ష్మకారణ దేహములకు పరమైనట్టి శుద్ధ చిన్మాత్రమే నేను” …అనే స్వస్వరూపాత్మ బుద్ధి ఇంకా సంపాదించుకోలేదు. అందుకే సూక్ష్మ (మానసిక) దేహంతో దృశ్యవిస్తార పరిశీలన కొనసాగించాలనే కార్యక్రమం కొనసాగించసాగాడు. ఆతని ఇతఃపూర్వపు దృశ్య జిజ్ఞాస (లేక) సంస్కారం చేత ఆతడు దృశ్య విస్తారం మరల జిజ్ఞాసా పూర్వకంగా సందర్శించసాగాడు.
శ్రీరాముడు : మహర్షీ! స్థూల దేహం లేకుండానే సూక్ష్మదేహం ప్రయాణించటం - పరిశీలించటం - సంచరించటం …మొదలైన కార్యక్రమములను కొనసాగించగలదంటారా? మీరు చెప్పినట్లు స్థూల దేహం లేకుండానే మనోదేహం కౌతుకాదులతో సంచారం చేయగలిగినప్పుడు, ఇక సూక్ష్మ దేహం స్థూలదేహం కంటే విశేషమైనది ఎట్లా అవుతుంది? సూక్ష్మదేహం అధికమైన విశేషమైనది కాకపోతే “స్థూల దేహమునకు పరమైన మనోదేహం సంతరించుకొన్నాడు”… అని మీరు ఎందుకు అంటున్నట్లు?
శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃపురంలోని పడకగదిలో శయనించే రాజకుమారునికి మనస్సు (లేక ఆలోచనలు) ఒక గ్రామంలో తాను చూచిన సుందర స్త్రీ యొక్క గృహం వైపుగా మరలుచూ, ఆమె సుందరమైన ముఖమును దర్శించు రీతిగా… మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు యొక్క మనోదేహం దిక్-దిగంతర దర్శనంలో నిమగ్నమై ప్రవృత్తమయింది. ఎద్దానిలో అయితే "ఊహ, భ్రమ, స్వప్నం, మనోరాజ్యం” …అనేవి ప్రవర్తిస్తున్నాయో… అదే సూక్ష్మదేహం కదా! అట్టి సూక్ష్మదేహం స్థూల విశేషాలు మననం చేయటం చేత కాలక్రమేణా సూక్ష్మదేహ విస్మరణచే అద్దాని యందు స్థూలదేహ బుద్ధి ఉదయిస్తోంది. పాము యొక్క సంస్కార బలంచేత చీకటిలో త్రాడు పాముగా అనిపించి భ్రమింప జేయుచున్నట్లు… సూక్ష్మ దేహానికి స్థూల వస్తు-దృశ్య అనుభవం వచ్చి పడుతోంది. “ఇది త్రాడే”… అని తెలియగానే పాముకు సంబంధించిన చికాకులు, వికారములు తొలగునట్లు స్థూలదేహభ్రమ తొలగితే అప్పుడు సూక్ష్మదేహ రూపం శేషించగలదు.
ఆతివాహిక ఏషో అంగ నిపుణం ప్రవిచార్యతామ్
చిన్మాత్ర వ్యతిరేకేణ యావత్ అత్ర అస్యత్ అస్తి నో ॥
అట్టి సూక్ష్మ దేహంయొక్క స్వరూప స్వభావాలేమిటో… అతి నిపుణతతో విచారణ చేయాలి సుమా! ఎందుకంటే, ఈ మనోదేహం కూడా భౌతిక దేహంలాగానే మిథ్య మాత్రమే! చిన్మాత్రము కంటే అన్యంగా ‘సూక్ష్మదేహం’ అనుబడేదేదీ కించిత్ కూడా లేదు.
Page:309
శ్రీరాముడు : మహర్షీ! స్థూల సూక్ష్మ దేహాలు రెండూ భ్రమయేనని, వాస్తవానికి కించిత్ కూడా లేవని సిద్ధాంతీకరించుచున్నారు కదా! మరి మనందరి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఈ స్థూల - సూక్ష్మ దేహాలు ఎందుకు కనిపిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : కనులు తెరిచి చూచినవానికి దృశ్యం కనిపిస్తుంది. కనులు మూసుకొని ఉన్నవానికి దృశ్యమే ఉండదు కదా! అట్లాగే… అజ్ఞానికి కనిపించే స్థూల సూక్ష్మ దేహాలు ఆత్మజ్ఞానము ఎఱిగిన తత్త్వవేత్తకు ఆత్మకు అన్యంగా కనిపిస్తున్నాయి.
ప్రతిజీవుడు సంవిత్ స్వరూపుడే! సంవిత్తును ఎట్లా సందర్శించటం? దేశాత్ దేశాంతర ప్రాప్తా యన్మధ్యే సంవిదో వపుః
చిన్మాత్రస్య అస్య తద్రూపమ్ అనంతస్య ఏకరూపిణః ॥
చిన్మాత్రము దేహరూపమూ కాదు. మనోరూపమూ కాదు. ఇక అద్దాని రూపము ఎట్టిది? ఈ ప్రశ్నకు చిన్మాత్ర దర్శనం చేసే మహనీయుల అనుభవపూర్వక సమాధానం విను.
ఈ బుద్ధి వృత్తి ఇంద్రియముల ద్వారా ప్రసరించి ఇంద్రియానుభవములను పొందుతోంది కదా! అట్టి ఇంద్రియానుభవమే ఆ బుద్ధి వృత్తికి ‘జగత్తు’ అనబడుదానిగా ప్రసిద్ధమగుచున్నది.
అనగా ‘జగత్తు’ అనబడేది “బుద్ధివృత్తి” యొక్క ఇంద్రియానుభవములు మాత్రమే! బుద్ధి అట్టి శబ్ద-స్పర్శాది ఇంద్రియానుభవములను జాగ్రత్తులోను, స్వప్నంలోను కూడా ఒకదాని తరువాత మరొకటి అనుక్షణికంగా పొందుతోంది.
అనగా ఈ జీవుడు ఒక అనుభవము తరువాత వెనువెంటనే మరొక అనుభము… ఒక ఆలోచన తరువాత వెనువెంటనే మరొక ఆలోచన… ఇట్లు
ఒక ఆలోచన - మరొక ఆలోచన; సంవిత్తు ఒక భావన - మరొక భావన; ఒకఅనుభవం - - మరొక అనుభవం… రెండింటి మధ్యగా నిర్విషయ సంవిత్తు ఉన్నది కదా! ఆ సంవిత్స్వరూపమే ‘పరమాత్మ’ లేక ’చిన్మాత్రము’ యొక్క నిజస్వరూపం. ఇంకొక విధంగా చెప్పాలంటే…
ఈ రెండింటి మధ్యలో గల సంవిత్స్వరూపం (సత్+విత్ స్వరూపం)
ఒకడు ఒకానొక దృశ్యమును చూస్తూ, ఒక్కక్షణాల్పవిభాగంలో …మరొక దృశ్యము వైపుగా చూపును మరల్చాడనుకో. ఒకవైపు చూడటానికీ … మరొకవైపు చూడటానికీ, ఒక దృశ్యం చూడటానికీ, …మరొక దృశ్యం చూడటానికీ… ఈ రెండు చూపుల మధ్యగా ఒకానొక నిర్విషయ స్వస్వరూపం ఉన్నది. అద్దానికి “నిర్విషయ సంవిత్తు" అని పేరుపెట్టారు.
సత్ … ఉనికి, విత్… ఎఱుక … అట్టి విషయ రహిత సంవిత్ అనునదే చిదాత్మ శరీరం. అదియే అందరి యొక్క ఆత్మదేహం. అది విషయాలు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉన్నది. అనగా ఒక విషయం (’చూపు’తో ప్రారంభం కావటం లేదు. అంతకుముందే అది ఉన్నది. విషయం
Page:310
(ఆ చూచే చూపు) అంతమైతే సంవిత్ అంతం కావటం లేదు. అందుచేత అది అనంతం. తెలుసుకునే విషయాలు వేరు వేరు జీవులలో వేరువేరుగా ఉండవచ్చుగాక! తెలివి, ఉనికి రూపంలో అది అంతటా సమంగా ఉన్నది. అది సర్వదా ఏకమేగాని అనేకం కాదు. అదియే సర్వ సాధనాల పరాకాష్ఠ, శ్రీరాముడు : అట్టి చిన్మాత్రం అనేక చిన్మాత్ర దేహాలుగా (జీవుల రూపంలో) అవుతోందా? లేక అది సర్వదా ద్వితీయమనేది లేకుండా ఏకంగా ఉంటోందా? ఏకమా? అనేకమా? ద్వైతమా? అద్వైతమా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
క్వం ద్వైతం? క్వచ వా ద్వేషః? క్వ రాగాది తు కథ్యతామ్? సర్వం శివమ్ అనాద్యన్తం పరోబోధ ఇతి స్మృతః II
ఓ రామచంద్రా! సమస్తము పరమాత్మ రూపమే! ఈ కనబడేదంతా ఆద్యంతరహితము, శివరూపము, పరమబోధ స్వరూపము అయినట్టి సర్వాత్ముడగు చిదానంద తత్త్వమే అయి ఉండగా ఇక ద్వైతం ఎక్కడ? అద్వైతమెక్కడ? రాగమెక్కడ? ద్వేషమెక్కడ?
నిర్మనో మననం శాస్తమ్ ఆసితమ్ బోధ ఉత్తమః ఆతివాహిక దేహస్థో, న తం బోధమ్ ఉపాగతః ||
మనస్సు యొక్క మననం ఉపశమించినట్టి శాంతస్థితియే ఉత్తమమగు బోధరూపం. అదియే ఆత్మానుభవం.
+
మన ఉత్తరదిక్కు విపశ్చిత్తు “నేను భౌతిక దేహమాత్రుడను కాదు. భౌతిక దేహం లేకపోయినా నాకు ఉనికి ఉన్నది” …. అని గ్రహించి సూక్ష్మ దేహ మాత్రుడైనాడు. అయినప్పటికి ఇంకా కేవల బోధస్వరూపం (ఆత్మామ్ అనుస్థితి) సంపాదించుకోనేలేదు. అందుచేత అతడు “ఈ సూక్ష్మదేహమే నేను” అను సూక్ష్మ దేహాత్మబోధ కలిగి ఉన్నవాడై ప్రసరణశీలమగు మనస్సుతో లోకాలోక పర్వతమునకు ఆవలగల అంధకార కర్పరంలో ప్రయాణం కొనసాగించాడు.
అట్లా ఆ అంధకార కర్పరంలో సుదీర్ఘంగా ప్రయాణిస్తూ ఉండగా ఆ చివరగా ఆతనికి ఒకానొక భూవిభాగం కనిపించింది. ఆ భూవిభాగం వజ్రంవలె దృఢంగాను, సువర్ణ ఛాయలోను, కోటి యోజనాల విస్తీర్ణంగా ఒప్పుచున్నది. దానికి ఆవల ఎనిమిది రెట్ల విస్తీర్ణంలో జలవిభాగం కనిపించింది. అది కూడా దాటి దానికి ఆవల గల తేజో విభాగంలో ప్రవేశించాడు. ఆ తేజో విభాగంలో తన మానవ భావంతో కూడిన సూక్ష్మదేహంతో ప్రయాణిస్తూ క్రమంగా దాని కావల ఉన్న వాయువుల యొక్క ఆవరణను దర్శించసాగాడు.
అట్లా దర్శిస్తూ ఉండగా… “ఆహా! నాకిప్పుడు భౌతిక దేహం లేదు. కేవలం చిత్తశరీరం మాత్రమే ఉన్నది. చిత్తమాత్రుడనై ఎంతదూరం వ్యవహరించి ఏం ప్రయోజనం? ఈ భూ ఆవరణ, జలావరణ, తేజో ఆవరణ, వాయు ఆవరణల అనుభవం స్వప్నంలోని సంఘటనల దర్శనం వంటిదే కదా!”
Page:311
… అని అనుకోసాగాడు. ఇట్లా అనుకుంటూనే వాయు ఆవరణ కూడా దాటి ఆ వాయు ఆవరణకు పదిరెట్లు విశాలంగా ఉన్నట్టి ’ఆకాశం’లో ప్రవేశించాడు. “అయినా సరే! ఈ ఆకాశం ఎక్కడ మొదలౌతుందో… అద్దానిని ఈ సూక్ష్మ దేహంతోనే పరిశీలించెదనుగాక!” … అని తలచి తన సూక్ష్మదేహంతో ఇంకా ప్రయాణం కొనసాగించసాగాడు.
ఆతడు క్రమంగా …ఏదైతే ఆకాశమునకు ఆవల ఉన్నదో… దేనియందైతే ఈ సమస్తము ఆకాశాదులతో సహా ఏర్పడి ఉన్నదో… దేనియందు మహాపంచభూతాలు ఆవిర్భవిస్తున్నాయో… ఏది ‘దృశ్యం’ కాకపోయినప్పటికీ సమస్త దృశ్యము తానే అయి ఉన్నదో… అట్టి మాయా సమన్వితమైన బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు.
ఆతడు ఆ అనంత బ్రహ్మాకాశంలో మనస్సుతో సుదీర్ఘ సంచారం చేయసాగాడు. అయితే తన పూర్వ సంస్కారాల కారణంగా మరల మరల పృథివి, జల, తేజ, వాయు ఆవరణములను వాటి సంయోగ రూపములగు అనేక జగత్తులను మనోదేహంతో సందర్శించాడు. మరల మరల సృష్టులు, ప్రపంచరచనలు, దిశలు, పర్వతాలు, ఆకాశం, దేవతలు, మనుష్యులు ఆ బ్రహ్మాకాశంలో అనేక చోట్ల అనంత సంఖ్యలో కనిపించాయి. అట్టి సంచార సమయంలో పంచభూతముల చివర ఒకానొకచోట బ్రహ్మదేవుడు నిశ్చల స్థితిలో కనిపించాడు. మరల అచ్చట బ్రహ్మాండాలు, సృష్టులు, దిక్కులు, దేవ-భూలోకాలు కనిపించాయి. వాటిలో సంచరిస్తూ మరల బ్రహ్మాకాశం పొందాడు.
బ్రహ్మాకాశంలో మరల సృష్టులు, సృష్టుల కావల బ్రహ్మాకాశం… ఇట్లా చూస్తూనే… చిరకాలాభ్యాసమైనట్టి “సృష్టిక్రమం పరిశీలించాలి. వీటి అంతు ఏమిటో చూడాలి”… అనే ఉత్సుకత కొనసాగుచుండటంచేత, ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు సూక్ష్మదేహంతో బ్రహ్మాకాశం - సృష్టులు సందర్శించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎంతగా వాటినన్నిటినీ దర్శించినప్పటికీ వాటిపట్ల అతనికి ఇంకా ఉత్సుకత కొనసాగుతూనే ఉన్నది కాని ఆతడు ఇప్పటికీ వైరాగ్యం పొందటమే లేదు.
ఇక్కడ ఒక పాఠ్యాంశం సభికులందరికీ మనవి చేస్తాను. ఈ జగద్రూప అవిద్యకు అంతమే లేదు. అట్టి జగత్తులలోని విశేషాలను చక్కగా మొదలంటా విచారణ చేశామా… “ఉన్నదంతా, ఉన్నదని అనిపించేదంతా బ్రహ్మమే”… అని తెలియగలదు.
వాస్తవానికి బ్రహ్మము వికల్పరహితం. అట్టి నిత్య నిర్మల బ్రహ్మమునందు “అవిద్య” అనబడేదే లేదు. ఈ దృశ్యం రూపంలోను, అవిద్య రూపంగాను స్ఫురిస్తున్నది బ్రహ్మమే! ఒకనికి ఏవేవి పదార్థ రూపంగా జాగ్రత్ - స్వప్నాలలో కనిపిస్తుందో అదంతా అట్లా కనిపించేది ఆతనియొక్క వాసనానుసారమే!
ఇతఃపూర్వం ఒకనికి కనిపించేది, ఇప్పుడు కనిపిస్తున్నది, ఇకముందు కనిపించబోయేది అంతా కూడా “బ్రహ్మమే వాసనా ప్రభావంచేత అట్లట్లు అనుభవమవటం” … జరుగుతోంది. ఈ భూత-వర్తమాన-భవిష్యత్తు క్రమయుక్తమై ఏ జగత్తు నీకు భాసిస్తోందో… అది నీయొక్క (లేక బ్రహ్మము యొక్క) అవిద్యావిభాగమాత్రమే అయివున్నది.
Page:312
కళ్ళు మూసుకుంటే కారుచీకటి కనిపిస్తున్నట్లు (యథార్థానికి ఉన్నది వెలుతురులో అయినప్పటికీ, కళ్ళు మూసుకోవటం చేత కారుచీకటి కనిపిస్తున్నట్లు)… ‘ఆత్మ సుజ్ఞాన నేత్రం’ మూసుకొని ఉన్న మాయాజీవుని అజ్ఞాన నేత్రాలకు (ఏది మొదలంట లేదో … మాయా) … అట్టి ఈ మాయా పార్థివ జగత్తు అగుపిస్తోంది.
పరమగు చిన్మాత్ర దృష్టిచే… ఈ జగత్తు “సత్తు” కాదు. ప్రతిభాసాత్మరూప దృష్టిచే (అజ్ఞానుల దృష్టిచే) ఈ జగత్తు “అసత్తు" కాదు. ఈ జగత్తు అనబడేది సత్-అసత్ విలక్షణమై అనిర్వచనీయమగు రూపము కలిగి ఉన్నది. స్వకీయమగు “భావన” ను ఆధారంగా కలిగియున్నది. ఆత్మస్వరూపుడగు ఈ జీవునికి స్వకీయమగు భావనంతా అలంకారప్రాయము మాత్రమే!
కనుక రామచంద్రా! బ్రహ్మాకాశంలో సంచరించుచున్న ఆ ఉత్తరదిక్కు విపశ్చిత్తు తాను ఇతః పూర్వం గాంచినవి, వాటికి తదితరములూ అయినట్టి అనేక దృశ్య పరంపరలను వాసనానుసారంగా దర్శించటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. మహారణ్యంలో సంచరించే జింకలాగా ఆతడు స్వవాసనల యొక్క ఔన్నత్యానుసారం అనేక జగత్తులను దర్శిస్తూ మధ్యమధ్యలో తన్మయుడగుచు, ఇంతలోనే బ్రహ్మాండముల అంతును చూడాలని తిరిగి బయల్వెడలుచూ …ఇట్లా సుదీర్ఘ సందర్శనము ‘విసుగు’ అనేది లేకుండా నిర్వర్తిస్తూనే ఉన్నాడు.
శ్రీరాముడు : హే మహర్షీ! ఆ విపశ్చిత్ మహారాజు అగ్ని భగవానుని వరప్రసాదంగా సంపాదించుకున్న నాలుగు దేహ విపశ్చిత్తులలో… ఒక విపశ్చిత్తు విష్ణు భగవానుని కృపకు పాత్రుడై ‘ముక్తుడు’ అయ్యాడు. ఇంకొక విపశ్చిత్తు బ్రహ్మాకాశంలో సూక్ష్మదేహంతో ప్రవేశించి ఇప్పటికీ అనేక మాయాజగత్తులలో సంచరిస్తూ ‘అవిద్య’ యందే తిరుగాడుచున్నాడు.
ఇంకా …తూర్పు దిక్కు విపశ్చిత్తు చంద్రలోకంలో ప్రవేశించినంత వరకు చెప్పారు. దక్షిణదిక్కు విపశ్చిత్తేమో శాల్మలీ ద్వీపరాజ్యంలో రాజ్యం ఏలుచున్నంత వరకు చెప్పారు. వారిద్దరి తదనంతర విహారాదుల గురించి చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి :
దక్షిణదిక్కు విపశ్చిత్తు - ఈతడు శాల్మలీద్వీపంలో రాజ్యం ఏలాడు. అయితే, అక్కడి రాజ భోగాలు. సేవకుల స్తోత్ర - వినమ్రవచనాలు రాణి వాసపు సుఖ-సరసాదులు ఒకానొక సమయంలో విసుగు కలిగించాయి. సద్వర్తునికి తుచ్ఛ నారీజన సమాగంలాగా - అవి అరుచి కలిగించనారంభిం చాయి. ప్రతి జీవుడు ఎందుకు ఏ భావావేశంతో పుట్టాడో… ఆ మార్గమే అభిరుచిగా ఉంటుంది గాని… అన్య విశేషాలన్నీ కొంతకాలం అలరించినప్పటికీ, ఎప్పటికో అప్పటికి వాటిపై విముఖత
Page:313
కలుగకతప్పదు. మన దక్షిణ దిక్కు విపశ్చిత్తు కొంతకాలం తరువాత రాజ్యమును, సుందర స్త్రీలను పరిత్యజించి అక్కడి నుండి బయల్వెడలాడు. "ఈ సృష్టి ఎంతవరకు విస్తరించియున్నది?”… అనే జిజ్ఞాసచే ఆవేశం పొందినవాడై సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాడు. ఆతడు కూడా సప్తసముద్రా లను, లోకాలోక పర్వత శిఖరాలను అధిగమించి ఒకానొక చోట స్థూల దేహము త్యజించి సూక్ష్మ దేహంతో బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు. ఆతడు కూడా ఉత్తర విపశ్చిత్తు లాగానే బ్రహ్మాకాశంలో అనేక బ్రహ్మాండాలను సందర్శిస్తూ సూక్ష్మదేహంతో ‘అంతు’ అనేది లేకుండా ఇప్పటికీ సంచారం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆతనికి ‘అవిద్య’ తనయందే గలదని గమనించకుండా … ఈ “జగద్విద్య” అనే మాయాపటాటోపంలో ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ అనేక అనుభవములను, అనుభూతులను పొందుతూ, త్యజిస్తూ సుదీర్ఘసంచారం (ఉత్తరదిక్కు విపశ్చిత్తులాగానే) ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.
తూర్పుదిక్కువిపశ్చిత్తు - ఈతడు చంద్రమండలం ఆశ్రయించాడు కదా! చంద్రునిలోగల మృగముతో ప్రియత్వము కలవాడై … అట్టి అధికాధికమైన స్నేహాభ్యాసం చేత అద్దానికి వశం అయినాడు. ప్రతి మాసము చంద్రునితో బాటుగా పరిభ్రమించే అనేక దేహాలు ధరించటం, త్యజించటం నిర్వర్తించాడు. కాలక్రమేణా, మృగయావినోదం చేత ఆతడు మృగమునకు సంబంధించిన సంస్కారములచే ప్రేరితుడై, … ఒకానొకప్పుడు ఒక ‘లేడి’ దేహము ధరించి ఒక పర్వతముపై స్థితి - సంచారాలు పొందినవాడైనాడు. శ్రీరాముడు : ప్రభూ! ఆ నలుగురు విపశ్చిత్తులు "ఈ అవిద్యా జగత్తు యొక్క అంతు ఎచట” … అనే రూపంలో ఉండే పరిశీలనా సంస్కారం మొట్టమొదట కలిగి ఉన్నారు కదా! ఇప్పుడేమో వారికి భిన్న భిన్న మార్గములు - ఫలములు వచ్చి పడుచున్నాయేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవుడు అనేక విధములైన వాసనలు కలిగి ఉండవచ్చుగాక! అయితే బాగుగా అభ్యసించబడిన ’వాసన’లలో ఏది అల్పదృఢత్వం కలిగి ఉంటుందో, అట్టిది దేశకాల క్రియావశంగా మరొక వాసనచేత త్రోసివేయబడుతూ ఉంటుంది. వాసనల దొంతర ఏది ముందుకు వస్తుందో …ఏది వెనకబడుతుందో… ఆ వాసనల సొంతదారు అయిన జీవునకు కూడా తెలిసేది కాదుకదా! భావాలు, అభిప్రాయాలు, అనుబంధాలు, ఆధార, నిరాధారాలు, ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు… ఇవన్నీ మారిపోతూ ఉండటం, ఒకటి ముందుకు వచ్చి మరొక దానిని వెనుకకు త్రోయటం ప్రతిజీవుని యొక్క కొద్ది సంవత్సరముల జీవితకాలంలో అందరూ గమనిస్తున్న విషయాలే కదా! అన్నిటికీ అభ్యాసమే మూలకారణం.
భోగ్య ఫలానుకూలమైన దేశ కాల-క్రియా యత్నములనే సామాగ్రి యొక్క ఏకత్వం చేత భిన్న వాసనల యొక్క ఏకత్వం సంభవిస్తోంది. అట్టి దేశ - - కాల క్రియా యత్నములు మరొక రీతిగా భిన్న భిన్నమగుచుండగా …ఏక రూపములైన వాసనలు భిన్నత్వం పొందుతూ ఉంటాయి.
ఒకనిలో ఒక సమయంలో రెండు మూడు వాసనలు ప్రదర్శితమగుచున్నప్పుడు వాటిలో ఏది సమయానుగతంగా ప్రబలమై ఉంటుందో… అది రెండవ దానిని వర్తమానంలో బలహీనపరుస్తూ
Page:314
ఉంటుంది. ఒకప్పుడు బలహీనమైన వాసన మరొకప్పుడు ప్రబలమై… ఇతఃపూర్వపు బలవత్తరమైన వాసనను బలహీనపరచటమో… దిగజార్చటమో జరుగుతూ ఉంటుంది.
ఆ నలుగురు విపశ్చిత్తులు ఏకకాలంలో ఒకే వాసన (లేక) సంస్కారం (లేక) స్వభావంతో ఒక్క ద్రష్ట నుండి ఉత్పన్నులయినప్పటికీ… విరుద్ధములైన దేశ కాలాదులలో అభిలాషతో భోగప్రాప్తి పొందటంచేత వివిధ వాసనాయుక్తులైనారు. భిన్న భిన్న ప్రయత్నములు, ప్రవర్తనములు వాటి వాటి ప్రయోజనములను పొందారు. అందులో ఒకడు నిర్వికల్ప ఆత్మతత్వంలో లయం పొందాడు. ఇద్దరు బ్రహ్మాకాశంలో దృశ్యములందు తత్పరులై దృశ్యము యొక్క ఆద్యంతములను పరిశీలించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. నాలుగవవాడు ఒక ‘లేడి’ దేహము ధరించినవాడైనాడు. ఒక కొండ యొక్క ఎత్తైన శిఖరాగ్ర ప్రదేశంలో పచ్చికమేస్తూ తిరుగుచున్నాడు.
శ్రీరాముడు : స్వామీ! ఆ ముగ్గురు విపశ్చిత్తులు ఈ అవిద్యాజగత్తు యొక్క అంతమును ఎప్పటికి చేరగలుగుతారు? అసలీ దృశ్య జగత్తు ఎక్కడైనా అంతము కలిగియున్నదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలంటే ముందుగా నిన్ను మరొక ప్రశ్న అడగవలసి వస్తుంది. అవిద్య అనేది దృశ్యములో ఉన్నాదా? ద్రష్ట యొక్క బుద్ధిలో ఉన్నదా?
శ్రీరాముడు :‘అజ్ఞానము’ లేక ‘అవిద్య’ అనేది బుద్ధిలోనే ఉన్నది. దృశ్యములో కాదు. బ్రాహ్మీ దృష్టి కలవారికి దృశ్యము బ్రహ్మముగానే దర్శనమవగలదు. ఎవరు ఏ దృష్టితో ఈ ప్రపంచం దర్శిస్తారో వారికి అట్లే ఇది అనుభవమౌతోంది. ఈ జగత్తును దర్శించేవారు… వేఱు వేఱుగా సమన్వయించుకోవటం జరుగుతోంది.
“ఇదంతా ఇంతవరకు నాది. అంతవరకు నాది కాదు. ఇది నా అజ్ఞానము తొలగే నిమిత్తం పరమాత్మచే కల్పించబడిన పాఠ్యాంశం. ఇది కేవలం కల్పితం. ఇది అనేక సుఖములకు ఆలవాలం. ఇదంతా నా ప్రియమైన పరమాత్మయొక్క స్వరూపం. ఆయన దేహం. ఇదంతా ఆ పరమాత్మయే! ఇదంతా ఎవరికీ అర్థంగాని ఏదో వింత మాయాజాలం.” … ఈ విధంగా ఎవరు ఏ బుద్ధితో చూస్తారో… వారికి ఆ విధంగా అనుభూతమౌతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : చాలా బాగా చెప్పావు. కనుక భ్రాంతితో కూడిన బుద్ధిగల ఆ ముగ్గురు విపశ్చిత్తులకు భ్రాంతి ఉన్నంతవరకు అవిద్యాజగత్తు అనంతరూపముగా ఏర్పడి ఉండియే తీరుతుంది. భ్రాంతిని త్యజించనంతవరకు జన్మ-మృత్యు జరా - - దృశ్య - - అదృశ్య విషయములతో కూడిన ఈ అవిద్యా జగత్తుకు అంతు అనేది లేదు, ఉండదు, కనబడదు.
కనుక… అంతం కావలసింది జగత్తు కాదు. మరి ఏది?… బుద్ధిలో దాగి ఉన్న అవిద్య (లేక) భ్రాంతి.
క్షిప్రేణ శాంతా భవతి విజ్ఞానాలోక ఆగతే ॥ ఆమూలమేవ గలతి తిమిర శ్రీరివోదయే ॥ II
Page:315
ఒకడు కటిక చీకటిలో సంచరిస్తున్నాడనుకో. ఆ అంధకారానికి అంతు ఎక్కడ? సూర్యుడు ఉదయించేవరకు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే చీకటి క్షణంలో తొలగిపోతుంది కదా! అట్లాగే “విజ్ఞానము” అనే ప్రకాశము యొక్క రాక వలన అజ్ఞానంచే ఏర్పడిన అవిద్య అతిశీఘ్రంగా నశించిపోగలదు. కాబట్టి ఓ సభికులారా! వాల్మీకి మహర్షి విరచితంగా వసిష్ఠ-రామ సంవాద (యోగవాసిష్ఠ) భవిష్యత్ పాఠకులారా! అజ్ఞానము (లేక) అవిద్య తొలగటానికిగాను మీరంతా మీయందుగల విజ్ఞాన దీపకాంతిని ప్రవృద్ధ పరచుకోండి. దృశ్యము అధిగమించటానికి ఇంతకుమించి ఉపాయం లేదు. అట్లా కాకుండా…. పాంచభౌతిక జగత్తులో ఎంతగా జిజ్ఞాసతో వెతికినా…. అవిద్యకు అంతు ఉండదు.
శ్రీరాముడు : మహాత్మా! పశ్చిమదిక్కు విపశ్చిత్తు విదేహముక్తి సముపార్జించుకున్నాడు కదా! ఆతడు దృశ్యమండలము నుండి విముక్తుడు ఎట్లా కాగలిగాడు? విష్ణువుచే బోధించబడటానికి అర్హుడెట్లా అయినాడు? ఇది మరల ఒకసారి క్లుప్తంగా సమీకరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : పశ్చిమదిక్కు విపశ్చిత్తు ఈ మన సంసార భ్రమకు సంబంధించిన అన్యబ్రహ్మాండము నందు గల స్వాదూద సముద్రము యొక్క ఆవలి భాగంలో గల సువర్ణమయ భూమిలో ప్రవేశించటం జరిగింది కదా! అయితే, ఆ పశ్చిమ దిక్కు విపశ్చిత్తుకు దృశ్యరూపంగా సంప్రాప్తించినది… (అట్లాగే) ఏ జీవుడికైనా ఎక్కడైనా దృశ్యరూపంగా సంప్రాప్తిస్తున్నది, (అనగా), … ఈ దృశ్యమానమయ్యేదంతా కూడా మహాబ్రహ్మాకాశమున బ్రహ్మము రూపమే అయి ఉండి ప్రాప్తిస్తోంది. ఆ పశ్చిమ విపశ్చిత్తు ఆ సువర్ణ మండలంలో సంచరిస్తూ ఒకానొక చోట శమము, దమము, భగవత్ భక్తి… ఇత్యాది శుభగుణాలు కలిగి ఉండి జీవన్ముక్తులగు మహాత్ములు నివసించే ప్రదేశంలో ప్రవేశించి వారితో సంసర్గం పొందటం జరిగింది. వారితో పెంపొందించుకొన్న స్నేహసేవాదుల ప్రభావం చేత ఆ జీవన్ముక్తుల బోధకు అర్హతపొందాడు. వారి వల్ల దృశ్యతత్త్వం పూర్తిగా ఎఱిగినవాడైనాడు. విష్ణు భక్తుడై తద్వారా విష్ణు దర్శనం పొంది ఆ భగవానుని కరుణకు పాత్రుడై నిర్మలబ్రహ్మరూపత్వం పొందాడు. ఆతని యందలి ‘కామం’ అను రూపంగా సుదీర్ఘకాలం ప్రకటిత మైన ఇతఃపూర్వపు అవిద్య, ‘దేహమే నేను’ అనే దేహాత్మ భావం బ్రహ్మజ్ఞాన విభాగప్రభావం చేత మృగతృష్ణాజలంలాగా శమించిపోయాయి. (మృగతృష్ణలో జలమే ఉండదని గ్రహించబడినట్లు గమనించబడినదైనది).
“నేను ఈ దేహమాత్రుడను. నాకు ఏదో కావాలి”… అనే అవిద్య యొక్క రెండు చక్రాలు తొలగిపోవటంతో అవిద్య బుద్ధిని మోహభూములలోకి మోసుకుపోవటం సమసిపోనారంభించగా …ఇక బుద్ధి విజ్ఞాన భూములలో వికసించింది. అందుచేత ఆతడు దేహ-కామ జాడ్యం మొదలంటా త్యజించినవాడై నారాయణ నామస్మరణాప్రభావంచేత ఆత్మజ్ఞానం పొంది దృశ్య వ్యవహారమంతటికీ అతీతత్వము సముపార్జించుకున్నాడు.
Page:316
ఓ రామచంద్రా! ఈ విధంగా ఆ నలుగురు విపశ్చిత్తుల యొక్క అవిద్యా దర్శన కుతూహలముతో కూడిన చరిత్ర నీకు విశదీకరించాను.
కార్యరూపమైన అవిద్య యొక్క అంతము ఆ ముగ్గురు విపశ్చిత్తులు దర్శించ జాలకున్నారు. కాబట్టి ఈ కార్యరూప అవిద్య కూడా కారణరూప బ్రహ్మమువలె ‘అనంతమే’ అయి ఉన్నదని గ్రహించావు కదా! కారణ రూప బ్రహ్మముచే పరిపూర్ణమై ఉండటంచే ఈ దృశ్య జగత్తు కూడా
అనంతమని గమనించు.
లక్షల లక్షల సంవత్సరాల క్రియా వ్యవహారాలు ఎక్కడ మనం గమనిస్తామో… అదంతా కూడా కారణ రూప బ్రహ్మము యొక్క అతి స్వల్ప విభాగం కూడా ఆక్రమించజాలదు. బ్రహ్మము ఎఱుగబడనప్పుడు ఆ బ్రహ్మమే… అవిద్య, మిథ్య, జగత్తు - మొదలైన పేర్లతో అవిజ్ఞులకు అనిపించటం జరుగుతోంది. ఎఱుగబడినప్పుడు ఈ దృశ్య వ్యవహారమంతా పరమశాంతమై ‘బ్రహ్మము’గా అనుభూతం అవుతోంది.
ఇదే మనం ఈ విపశ్చిత్ ఉపాఖ్యానంలో గమనించవలసినది సుమా!
దృశ్యము, బ్రహ్మము - ఓ ప్రియ సభికులారా! ఈ రెండింటికీ ఏ భేదము మీకు భాసిస్తోందో… అది స్వబుద్ధి యొక్క కల్పనా చాతుర్యమేగాని… వాస్తవమైన భేదం కాదు. ఎందుకంటే ఆ భేదంగా కనిపించేదంతా అవిద్యామయమే అయివున్నది. అవిద్యయో… బ్రహ్మం యొక్క రూపమే అయివున్నది. అవిద్యగా కనిపించేది చిదాభాసమే కాబట్టి ఆ భేదము ఒక లీల క్రీడ వలె చిద్రూపమగు బ్రహ్మం కంటే వేఱుకాదు. జ్ఞానం సముపార్జించుకోకపోవటమే అవిద్య యొక్క అనుభవానికి మూలకారణం. మన ఉత్తరదిక్కు విపశ్చిత్తు వందలకొలది యుగాలు సంచరించినప్పటికీ బ్రహ్మాండ మండప రూపమగు దృశ్యం యొక్క అంతం పొందక పోవుచుండటమే ఇందుకు మనకు దృష్టాంతము.
శ్రీరాముడు : వక్తలలో శ్రేష్ఠుడగు ఓ మునీంద్రా! తూర్పుదిక్కు విపశ్చిత్తు తదితర ఇద్దరు విపశ్చిత్తులలాగా బ్రహ్మాండ కవాటంలో ప్రవేశించకుండా, భూమండల భూములలో ఎందుకు
ఉండిపోయాడు?
బ్రహ్మాండం, బ్రహ్మాండ కవాటం… ఈ రెండింటి భేదమేమిటో మీరు ప్రసంగంలో ప్రస్తావించ లేదు. ఈ రెండూ ఎట్లా సృజించబడ్డాయో, వాటి భేదమేమిటో విశదీకరించమని నా విన్నపం. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! పూర్వం బ్రహ్మదేవుడు జనించినప్పుడు బ్రహ్మాండములను తన యొక్క రెండు భుజాలతో రెండు విభాగాలుగా పైకి - - క్రిందికి చీల్చివేశాడు. అప్పుడు… పైభాగం… పైకి, క్రింది భాగం… క్రిందకు అతిదూరంగా జరిగాయి. జలావరణ, అగ్ని ఆవరణ ఆకాశ ఆవరణ మొదలైనవన్నీ పై-క్రింది భాగాలను ఆశ్రయించాయి. ఆ విధంగా ఉభయ కపాలములను
Page:317
ఆ ఆవరణలు అంటిపెట్టుకొని ఉన్నాయి. మనకు అపారంగా కనిపించే నీలవర్ణమే రెండు ఊర్ధ్వ అధోకవాటముల మధ్య ఉన్నది. అది ‘ఆకాశము’ అని చెప్పబడుతోంది.
అయితే… జలాది ఆవరణములు ఆకాశములో సంలగ్నమై ఉండనూలేదు. పరమార్థమున అవి విద్యమానములై లేవు. వాస్తవానికి ఆకాశం ప్రళయకాల పర్యంతము నిర్మలమై అత్యంత శూన్యమై, కానీ ఇతర భూములకు ఆధారమై ఒప్పుచున్నది.
ఈ ఆకాశాదులు, నక్షత్రాదులు మొదలైనవన్నీ అవిద్య యొక్క పరీక్షార్థమై దీక్ష తీసుకొని ఉన్నాయా? …అన్నట్లుగా ఏర్పడినవై ఉంటున్నాయి. అవిద్య కూడా బ్రహ్మమయమే కాబట్టి… అదికూడా బ్రహ్మమువలె అనంతమే! బ్రహ్మమును ఎఱిగిన వానిపట్ల అవి స్థితి కలిగి ఉండవు.
ఎఱిగినప్పుడు అవిద్య లేనే లేదు. ఎఱుగనప్పుడు అవిద్య పొందజాలబడకయే ఉన్నది. తెలియబడనిదై ఉన్నది.
ఆ విపశ్చిత్తులు ఏదైతే ఎఱుగబడినప్పుడు ఉనికియే ఉండదో… అట్టి వాటిని ఎఱుగుటకై సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఆ విధమైన అవిద్యా అధ్యయనం కొరకై… (ఏదైతే ఎఱుగబడినప్పుడు ఉనికియే కోల్పోతుందో… ఎఱుగబడనంతవరకు తెలియకయే పోతుందో) ఆ విపశ్చిత్తులు నలుగురు వెతుకుతూ పయనిస్తూ… ఒకడు ముక్తుడైనాడు. మరొకడు మృగరూపం (లేడి రూపం) పొందాడు. ఇద్దరు పూర్వపు మహాసంస్కారాలకు వశీభూతులై పరిభ్రమిస్తున్నారు. శ్రీరాముడు : స్వామీ! పై చెప్పిన వారిలో చివరి ఇద్దరు విపశ్చిత్తులు తమ సూక్ష్మ దేహాలతో అనేక బ్రహ్మాండాలు సంచరిస్తున్నారు కదా! వారు జననములు పొందుచున్న బ్రహ్మాండాలు మన ఈ బ్రహ్మాండానికి ఎంత దూరంలో ఉన్నాయి? ఏ మార్గంలో ఉన్నాయి? మనం అక్కడకు వెళ్ళవచ్చునా? లేక మీవంటి యోగులు మాత్రమే వెళ్ళగలరా? ఎందుకంటే మీరు చెప్పే వృత్తాంతమంతా అత్యంత ఆశ్చర్యకంగా ఉన్నది. అట్లాగే మృగరూపంలో ఉన్న విపశ్చిత్తు వృత్తాంతమేమిటో తెలియజేయండి. శ్రీ వసిష్ఠ మహర్షి : (కొంచెంసేపు మౌనం. ఆ తరువాత) ఆ అవిద్యా పారదర్శకులగు ఇద్దరు విపశ్చిత్తులు ఏఏ జగత్తులలో తమ సూక్ష్మ దేహయానం కొనసాగిస్తున్నారో, ఏమేమి అనుభవములు పొందుచున్నారో… అది ఎంతగా పరిశీలించినా కూడా, నా బుద్ధికి గోచరించటం లేదు.
ఇక మృగరూపం ధరించిన విపశ్చిత్తు ఏ బ్రహ్మాండంలో ఉన్నాడో… ఆ బ్రహ్మాండము, తదంతర్గతమైన జగత్తు కూడా నా బుద్ధికి సుస్పష్టంగా గోచరం అవుతోంది. శ్రీరాముడు : హే మహాధీమంతుడవగు ఓ మునీంద్రా! మృగరూపం పొందిన ఆ నాలుగవ విపశ్చిత్తు ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నాడు? ఆ ప్రపంచం ఇక్కడికి ఎంతదూరంలో ఉన్నది? ఆ ప్రపంచములోని మృగమును (లేడి రూపం దాల్చిన విపశ్చిత్తును) మేము చూడగలమా? మీరు మాకు ఆ లేడిని చూపించవచ్చునా?… మీ కథనంలోని మరికొంత నిరూపణకొరకై నేను ఈ అభ్యర్థన చేస్తున్నాను. మా అర్హతను అనుసరించి ఈ విషయాలు చెప్పవలసినదిగా నా విన్నపం. శ్రీ వసిష్ఠ మహర్షి : (కొంచెంసేపు కనులు మూసుకొని ధ్యాననిష్ఠలో గడిపినవాడై … చిరునవ్వుతో కనులు మెల్లగా తెరచి… రామచంద్రా! మృగరూపం (లేడి రూపం దాల్చిన ఆ నాలుగవ
Page:318
తూర్పుదిక్ విపశ్చిత్తు ఇప్పుడెక్కడున్నాడో… అతి స్పష్టంగా గమనించాను. ఆతడు ఈ మన త్రైలోక్య జగత్తులోనే ఉన్నాడు. ఆతడు విపశ్చిత్తుగా జన్మించిన స్థానం ఇక్కడి నుండి అత్యంత సుదూరంగా ఉన్నది. అనగా, ఆతడు లేడిగా సంచరిస్తున్న ఆ పరబ్రహ్మాకాశము ఇదే!
శ్రీరాముడు : స్మామీ! మీరు చెప్పేది నాకు మరికొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ విపశ్చిత్తు వేరొక జగత్తులో నుండి కదా… దిగంత దర్శనం కొరకై బయలుదేరాడు? బయలుదేరి సప్తసముద్రాలు, దిక్కులు, బ్రహ్మాండాలు దాటిపోయాడని చెప్పియున్నారు కదా! ఇప్పుడు ఆతడు ఈ మన జగత్తులోనే మృగరూపంగా ఉండటమనేది ఎట్లా సమంజసం? ఏదో మరొక అత్యంత సుదూరంగా ప్రయాణిం చిన ఒక బాటసారి ఇప్పుడు ఈ జగత్తు - ప్రదేశంలోనే ఉన్నాడనటం ఎట్లా కుదురుతుంది? శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు ‘అతి దూరం’ … ‘అతి దగ్గర’ అనే శబ్దాలు ఉపయోగిస్తున్నావు. అయితే, ఈ ‘దూరం దగ్గర’ అనే అనుభవం పరిచ్ఛిన్నాత్మదర్శులకే ఉంటుంది గాని… అపరిచ్ఛిన్నాత్మ దర్శులకు ఏ మాత్రం ఉండదని గ్రహించు.
ఉదాహరణకు… ఈ చూపుడు వేలు గోరుకు ఈ కాలి చిటికిన వేలుకు చాలా దూరం ఉండవచ్చుగాక! అవి రెండూ నా అనుభవం దృష్ట్యా నాకు దూరమైనవిగాని, దగ్గరైనవిగాని అనలేం కదా!… అట్లాగే నేను బ్రహ్మరూపమగు నా ఆత్మయందు సమస్త బ్రహ్మాండములు ఒక్కచోట నాయందే ఉన్నట్లుగా గాంచుచున్నాను. ఒకే వస్త్రానికి అనేక రంగు దారములున్నట్లు నా ఆత్మ అనేక బ్రహ్మాండములను అలంకారముగా కలిగినదై ఉన్నది. కనుక ఈ సర్వబ్రహ్మాండములన్నీ స్వస్వరూపంగా నేను వీక్షిస్తున్నాను. కనుక రామచంద్రా! ఆత్మదృష్టి సంపాదించుకున్నప్పుడు, ఆపై ఇక “వారు నాకు దూరస్థులు, వీరు నాకు దగ్గర వారు” … అనేవన్నీ మౌనం వహిస్తాయి. మొదలంట రహితమై పోతాయి. ఒకే పూదండకు అనేక పుష్పములు గ్రుచ్చబడి కనిపిస్తున్నట్లు, నాకు భూత - -
వర్తమాన - - భవిష్యత్ బ్రహ్మాండాలు నాయందే నాచే ధరించిన పూదండవలె అగుపిస్తున్నాయి.
ఆ మన తూర్పుదిక్కు విపశ్చిత్తు భేదబుద్ధితో అనేక బ్రహ్మాండాలలో సంచరించి, ఇప్పుడు కాకతాళీయంగా మన ఈ బ్రహ్మాండములోని ఈ జగత్తులోనే ‘లేడి’ అయి సంచరిస్తున్నాడు. శ్రీరాముడు : అట్లా అయితే స్వామీ! ఆ పూర్వదిక్ సంచారకుడగు విపశ్చిత్ మహారాజు ‘లేడి’ దేహము దాల్చి ఈ మన జగత్తులో ఏ కొండపై పచార్లు చేస్తున్నాడో… ఏఏ సస్యసంపన్నమైన వనములలో గడ్డితుంపరలను మేస్తూ శిథిల జ్ఞానయుక్తుడై సంచరిస్తున్నాడో… ఆతడు ఎప్పటికి తన యొక్క పూర్వజ్ఞానస్థితిని సంస్మరించనున్నాడో… ఆ విషయములను వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! కొద్దికాలం క్రితం నీ పుట్టినరోజు నవమినాడు త్రిగర్త భూపతి నీకు కానుకగా ఒక సుందరమైన ’లేడి’ని బహూకరించాడు కదా!
శ్రీరాముడు : అవును. ఆ మృగము అంతఃపురంలో నా దగ్గరే పెరుగుతోంది. నేను ఆ లేడితో కూడి మా ఉద్యానవనంలో అప్పుడప్పుడూ విహరిస్తూ అద్దాని అమాయకపు బెదురుచూపులు చూచి హాస్యంగా లాలిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ లేడి మా అంతఃపురంలోనే ఉన్నది.
Page:319
శ్రీ వసిష్ఠ మహర్షి : అవునా! ఆ ‘లేడి’యే మనం కథారూపంగా చెప్పుకున్న తూర్పు దిక్కు విపశ్చిత్తు అయి ఉన్నాడు.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ మాటలు విని మన రామచంద్రమూర్తి అందమైన కళ్ళు ఆశ్చర్యంతో మిలమిలా మెఱిశాయి. వెంటనే దగ్గరగా ఉన్న కొందరు బాల స్నేహితులతో ఆ ‘లేడి’ని సభకు తీసుకురావలసినదిగా అప్పటికప్పుడే పలికాడు. వెంటనే సహబాలకులు వెళ్ళి ఒక ముగ్ద మృగమును (లేడిని) సభా మధ్యంలోకి తీసుకువచ్చారు. ఆ లేడి భయపడుచున్న చూపులతో చేయి విదుల్చుకొని అటూ - ఇటూ పరుగులు తీస్తూ ఇంతలోనే అక్కడి పచ్చల సింహాసనములను గడ్డి
పరకలనుకొని ఆశపడుతూ గెంతసాగింది.
ఆ లేడిని చూచిన అక్కడి మునులు, తదితర సభికులు ఇట్లా అనుకోసాగారు. "ఆహా! పరమేశ్వరుని మాయ ఎటువంటిది! భీకర సమరంలో తూర్పు దిక్కులోని రాజాధిరాజులను, మహారథులను నిరుత్తరులను చేసివేసిన ఆ విపశ్చిత్తురాజుయొక్క నాలుగవ రూపము అయినట్టి ఈ మహనీయుడు “ఈ పాంచభౌతిక సృష్టి ఎంతవరకు విస్తరించి ఉన్నది”… అనే చిత్త భ్రమావేశంతో బయలుదేరాడు. అగ్నిదేవుని వరప్రసాదంచేత అనేక దుర్భర స్థానాలలో నిర్భయంగా ప్రయాణించి… అగ్ని-జల-వాయు ఆవరణలలో అప్రతిహతంగా సంచరించి… చివరికి తన యొక్క మనస్సుచే మోసగించబడ్డాడు. ఆ చంద్రలోక ప్రవేశం సంపాదించుకుని కూడా, చివరికి శించి కూడా అక్కడి హరిణము (లేడి)చే ఆకర్షితుడై అట్టి సుదీర్ఘ సంస్కారం కారణంగా లేడి ఉపాధిని పొందారే! ఇంత అజ్ఞాని అయి తన ఆశయములన్నీ ఏమరచినారే! మనోదురభ్యాసం ఎంతటి ప్రమాదకరం! మరి ఈ జీవులు తమ మననాభ్యాసం యొక్క తదనంతర విపత్కర పరిణామాల గురించి కొంచెం కూడా శ్రద్ధ చూపకుండా గుడ్డిఎద్దు చేనులో పడినట్లు జీవిస్తున్నారు. ‘అజ్ఞానంచే పొందబోయే అగచాట్లు అతిదుర్భరమైనవి. అంతులేనివి’… అని ఈ ప్రియ వసిష్ఠ మహర్షి సంవాద సమయంలో అనేక సందర్భాలలో మనలను హెచ్చరించినదానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం కాబోలు!”
ఇట్లా… సంభాషించుకోసాగారు. ఆ సభలోని అందరి కళ్ళు ఆ లేడిపైనే ప్రసరించి ఉన్నాయి. అది ఒకానొక బలిష్ఠుడైన రాజసేవకుని చేతులచే పట్టుకోబడి భయముతో కాళ్ళు చేతులు కదులుస్తూ, బిత్తర చూపులు చూస్తోంది. ఇక సభికులంతా… “ఆహా! ‘ఇక మనం జ్ఞానులమైనాం లే!’ అని మురిసిపోయి, మనస్సు యొక్క దృశ్య సంబంధమైనట్టి సుదీర్ఘ మననాన్ని పట్టించుకోకపోయామా… ఇక మన తదనంతర ఉపాధుల గతి ఈ విధంగానే దుర్గతి పట్టనున్నది కదా! మనకు ఆత్మజ్ఞాన సమాచారం ఎంత ఆవశ్యకం!” అని అనుకోసాగారు. మరల మరల శ్రీ మహర్షి వసిష్ఠుల యొక్క విశ్వామిత్రుల యొక్క పాదార విందములను మననము చేస్తూ, సద్గురువులై ఆత్మ జ్ఞానమును ప్రసాదిస్తున్న ఆ ఇరువురికి అంతరంగంలో కృతజ్ఞతలు చెప్పుకోసాగారు.
Page:320
ఆ నాలుగవ విపశ్చిత్తును చూస్తూ ఉన్న రామచంద్రుడు కాసేపు బుగ్గలపై చూపుడు వేలు ఉంచుకొని యోచనాముద్రలో గడిపాడు.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరామచంద్రుడు అత్యంత ఆశ్చర్యంతో "ఆహా! మహావీరుడు, అగ్నిదేవుని ఆరాధకుడు, దృశ్యజగత్తులోగల అనేక సంక్లిష్ట ప్రదేశాలలో కూడా సంచరించగల శక్తి యుక్తులు కలవాడు, దృశ్యము యొక్క విస్తారం ఎంతవరకో దర్శించాలనే కుతూహలం కలవాడు అగు విపశ్చిత్తు ఇప్పుడు ఈ లేడి దేహంతో తన్మయుడై ఉండటం ఎంత ఆశ్చర్యం! మాయయొక్క పర్యవసానం ఎంతటి చమత్కారమైనది!” …అని తలచసాగాడు.
అటు తరువాత లోక గురువగు శ్రీవసిష్ఠ మహర్షి వైపు చూచి వినమ్రతతోను, సంభ్రమ ఆశ్చర్యాలతోను రామచంద్రుడు ఇట్లు పలుకసాగాడు.
శ్రీరాముడు : ఓ మునీశ్వరా! మహనీయుడు, అసామాన్యమైన ఆశయశీలి అగు నాలుగవ విపశ్చిత్తు తన ఆశయమును, విజ్ఞానమును, ఉపాసనలను ఏమఱచి ఈ విధంగా లేడి దేహంతో తన్మయుడై దేహాత్మబుద్ధిచే పీడితుడగుచుండటం నాకు దుఃఖాన్ని కలుగజేస్తోంది. మృగదేహధారియగు విపశ్చిత్తు తిరిగి తన తపో శరీరం పొందటానికి ఏదైనా ఉపాయం ఉన్నదా? ఆత్మజ్ఞానము కలుగనంతవరకు జీవుడికి దుఃఖ రాహిత్యం కలుగదు కదా! నేను ప్రియంగా ఆడుకుంటూ ఉండే లేడి మృగానికి దేహతాదాత్మ్య దుఃఖం తొలిగే మార్గం చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవడు ఏ ఉపాసనా మార్గంలో ప్రయాణిస్తున్నాడో… ఏ ఉపాసన ద్వారా అభిలషితమైనది సిద్ధించుకున్నాడో… ఆ ఉపాసనా దైవం యొక్క కృపచేతనే మరల తదనంతర అభిలషితం కూడా నెరవేరుతూ ఉంటుంది. మరొక్క విషయం! ఈ దృశ్య సంబంధమైనవేవీ జీవునికి తృప్తి - శోభ - సుఖము కలిగించలేవు. ఈతడు ఇతఃపూర్వం అగ్నిదేవుని ఉపాసించి, దిగంతమూ దర్శించాలనే అభిలాషతో ఆయన కరుణచే దివ్యశరీరం పొందాడు. అట్టి జగత్ ఆసాంత దర్శనం పూర్తి కాకుండానే స్వకీయమైన మనోభ్రమచే పరాజితుడై ఇప్పుడు “ఈ లేడి దేహమే నేను” అనే దేహాత్మ భావనలో చిక్కుకుని పరవశిస్తున్నాడు.
అందుచేత ఈతడు ఆ అగ్నిదేవుని యొక్క దర్శన ప్రవేశములచే తన ఇతఃపూర్వపు విపశ్చిత్ దేహం పొందగలుగుతాడు. కనుక ఇప్పుడు నేను అగ్నిదేవుని ఆరాధించి ఆహ్వానిస్తాను. ఆయనలో ఈతడు దేహ ప్రవేశం పొందితే తిరిగి ఆ అగ్నిదేవుని ప్రేమాస్పదమైన స్పర్శచేత పూర్వ దేహం పొందుతాడు. ఇదంతా ఇక్కడే నేను ప్రియ శిష్యుడవగు నీ అభీష్టం నెరవేర్చటానికి సిద్ధింపజేస్తాను
చూడు.
❖
Page:321
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! బ్రహ్మర్షియగు ఆ వసిష్ఠుడు ఇట్లా పలికి కమండలంలోని పవిత్ర జలంతో అప్పటికప్పుడే ఆచమనం చేసి, అంగన్యాస, కరన్యాసాలతో అగ్నిదేవుని భక్తితో ఉపాసించాడు. సృష్టి అంతా ప్రసరించి ఉన్న ఆ అగ్ని భగవానునికి మనోకరాలతో ధ్యాన, ఆవాహ నాది షోడశోపచారాలు సమర్పించాడు. ఆ భక్తి ధ్యానాదులకు సంతసించిన అగ్ని భగవానుడు ఇంధన రహితుడైన (కట్టెలు మొదలైన ఉపకరణాలు లేనట్టి) జ్యోతి స్వరూపుడై అగ్ని జ్వాలాస్వరూపుడై ధగద్ధగాయమానంగా స్వచ్ఛ స్వరూపంతో సభామధ్యంలో ప్రత్యక్షమైనాడు. జ్యోతిస్వరూపుడగు అగ్ని దేవుని సభామధ్యంలో దర్శించి సభికులందరు అగ్నిదేవునికి ప్రణామాలు సమర్పించారు.
అక్కడగల హరిణం (లేడి) ఆ అగ్నిదేవుని దర్శించింది. మరుక్షణం ఇతఃపూర్వపు భక్తి ప్రపత్తులు ప్రవృత్తమైనాయి. అగ్నిదేవతా దర్శనముచే పాపం నశించిన ఆ మృగరూపిణి అగ్నిదేవునికి ప్రణమిల్లుతూ, తన ఇష్టదైవమైన అగ్ని భగవానుని పాదాలు స్పృశించాలనే ఇచ్ఛ పొందింది. అంతే! గబుక్కున రాజసేవకునిచేతిలోనుండి సింహంలాగా ఉరికి, ఒకదాటున ఆ అగ్ని జ్వాలలో ప్రవేశించింది. అది గమనిస్తున్న సద్గురువగు వసిష్ఠ మునీంద్రుడు తన దివ్యమైన దృష్టులచే ఆ మృగాన్ని మరింతగా పావనం చేస్తూ (పాపరహితం చేస్తూ), అగ్నిదేవుని ఉద్దేశించి ఇట్లు పలికారు. శ్రీ వసిష్ఠ మహర్షి : (లేచి నిలుచుని, సాష్టాంగ ప్రణామం సమర్పించి) ఓ హవ్యవాహనా! దేవాది దేవా! అగ్నిదేవా! మా ఆహ్వానం మన్నించి ఇంధన రహిత జ్వాలారూపుడవై ఈ సభా మధ్యానికి వేంచేసిన మీకు హృదయపూర్వక ప్రణామములు. స్వామీ! ఈ హరిణం ఇతఃపూర్వపు విపశ్చిత్తు ఉపాధిలో మిమ్ములను ఆరాధించి సేవించింది. ఇప్పుడు దేహతాదాత్మ్యముతో అనేక క్లేశములు అనుభవిస్తోంది. కరుణా సముద్రులగు మీరు ప్రేమతో ఈ జీవుని సముద్దరించి పూర్వ సంస్కారాలతో కూడిన విపశ్చిత్ దేహం ప్రసాదించమని మిమ్ములను వేడుకుంటున్నాను.
శ్రీ అగ్ని భగవానుడు : మహర్షుల వాక్యము సిద్ధించునుగాక! నన్ను సుదీర్ఘకాలం విపశ్చిత్ దేహంతో ఉపాసించి ఇప్పుడు ఈ హరిణదేహం నాకు సమర్పిస్తున్న ఈ నా భక్తుడు తన యొక్క ఇతఃపూర్వపు సంస్కారములు - తదనంతర జ్ఞాపకములతో సహా విపశ్చిత్ దేహధారి అగునుగాక! మీ జ్ఞాన యజ్ఞములోని పాఠ్యాంశములు నిరూపణలు పొందుచున్నవై ఈ సభికులకు, భవిష్యత్ జనులకు బ్రహ్మజ్ఞాన ప్రదమై పరిఢవిల్లును గాక!
ఇదంతా సభికులంతా తన్మయులై చూస్తున్నారు. క్రమంగా ’కాష్ఠరహిత జ్వాలాగ్ని’లో ప్రవేశించిన ఆ హరిణం రామచంద్రుని అభిలాషానుసారం సద్గురువు వసిష్ఠుని చల్లటిచూపులకు పాత్రతపొంది, అగ్నిదేవుని వరప్రసాదముచే ఆ జ్వాలా గర్భంలో హరిణ దేహం త్యజించింది. ఆ అగ్నిజ్వాలలలో నుండి సుందర ఆకారయుక్తుడు, ఆజానుబాహువు, ప్రకాశవంతమైన కనులు -
అవయవములు గల వాడు అగు ఒక సుందర పురుషుడు రూపు దిద్దుకున్నాడు. సూర్యమండలంలోని సూర్యునిలాగా, చంద్రమండలంలోని చంద్రునిలాగా ఆతడు ఆ అగ్నిజ్వాలలో నుండి బయల్వెడల సాగాడు. “అగ్ని అనే ఆధారం కలిగిన శక్తియే ఆ పురుషాకృతి దాల్చుచున్నదా?” … అని అక్కడి సభికులకు ఆ దృశ్యం తలపింపజేసింది.
Page:322
ఇంతలో అక్కడి ఇంధనరహిత అగ్నిజ్వాల అంతర్ధానం కాసాగింది. అట్లా అగ్నిదేవుడు అంతర్ధానం కాగానే ఆ సభా మధ్యలో - దేవాలయంలోని దేవతా ప్రతిమలాగా, తెరనుండి వెలువడిన నాయక పాత్రలాగా - ఆ మహాపురుషుడు ప్రత్యక్షమైనాడు. ఆతడు రుద్రాక్ష మాలలు ధరించి, బంగారు యజ్ఞోపవీతము కలిగి, పవిత్రమైన తెల్లటి వస్త్రధారుడై దేవతాపురుషునివలె వెలుగొందుచూ ఉన్నాడు. సభాసదులు ఆతనిని చూచి, “ఆహాఁ! ఏమి ఈతని తేజస్సు! మహా ప్రకాశమానుడగుట చేత ఈయన ‘భాసుడు’ అని పిలుపుకు అర్హుడు” … అని భాస నామధేయంతో పిలువసాగారు. ఇంతలో ఆతడు తాను ప్రకటనమైనచోటే పద్మాసనంతో ఆసీనుడైనాడు. సభికులంతా …“ఆహా! భాసుని తేజో పుంజములతో సభాప్రాంగణమంతా వెలుగొందుచున్నది కదా!” అని పలుకసాగారు.
ఒక ముహూర్తకాలం ఆ విధంగా గడిచిపోయింది. సభాసదులచే ‘భాసుడు’ అనే పేరుచే పిలువబడుచున్న ఆ నాలుగవ విపశ్చిత్తు అట్లా ధ్యానంలో కొంతసేపు గడపిన తరువాత… తన పూర్వ వృత్తాంతం స్మరించి, ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో కనులు తెఱచి, లేచి నిలుచున్నాడు. నిలబడి యథాక్రమంగా ముని-రాజు-సామంతాదులతో కూడుకొనియున్న ఆ సభనంతా కలియచూచాడు. ఎదురుగా పూర్ణ చంద్రునిలాగా ప్రశాంతమైన రూపు - చూపులతో ప్రకాశిస్తూ, వసిష్ఠ మహర్షి ఎత్తుగా ఉన్న సద్గురు పీఠంపై ఆశీనులై ఉండటం గమనించి, చిన్నగా ఆయన వద్దకు అడుగులు వేయసాగాడు.
భాసుడు : సద్గురుస్థానం అలంకరిస్తూ, జ్ఞాన సూర్యునివలె ప్రకాశిస్తూ, సూర్యభగవానుడు లోకములకు ప్రాణధారం అయినట్లు నావంటి అజ్ఞాన జీవులకు జ్ఞాన - త్రాణలను ప్రసాదించే ఓ మహాత్మా! మీకు సాష్టాంగ దండ ప్రణామములు.
శ్రీ వసిష్ఠ మహర్షి : (ఆ భాసుని శిరస్సును వాత్సల్యపూర్వకంగా చేతి వ్రేళ్ళతో స్పృశిస్తూ) … ఓ భాసనామధేయా! “జనవాక్యంతు కర్తవ్యమ్" …అనునట్లుగా తేజో రూపుడవగు నీకు “భాసుడు” అని ఈ సభికులు పేరు పెట్టటం సముచితమే! నన్ను “వసిష్ఠుడు” అని పిలుస్తారు. నీవు అయోధ్యానగరం రాజసభామధ్యంలో అగ్నిదేవుని కృపచే ఇతఃపూర్వపు విపశ్చిత్ దేహం పొందినవాడవై భాసిస్తున్నావు. నీకు సుస్వాగతం. నీవు సమర్పించిన భక్తిపూర్వకమైన నమస్కారమును స్వీకరిస్తూ “అతి దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న అజ్ఞానం తొలగుగాక!” అని ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో … ఈతడే అవతారమూర్తియగు శ్రీరామచంద్రుడు. లోక కళ్యాణార్థమై ఆశ్రితులను రక్షించి, దుష్ట శిక్షణ నిర్వర్తించే ఆశయంతో అవతరించిన ఈ పరమ పావనమూర్తి నా ప్రియశిష్యుడు, ఇక్కడి రాజకుమారుడు కూడా! అదిగో… ఆ రాజ సింహాసనంపై బ్రహ్మదేవునివలె అధిష్ఠించియున్నది సూర్యవంశ జాతకుడైన శ్రీ దశరథ మహారాజు ఈ అయోధ్యకు చక్రవర్తి.
ఇదిగో, ఈయనే బ్రహ్మర్షి - అసమాన ప్రజ్ఞా ధురంధరుడు, ఆశ్రితవత్సలుడు, ప్రేమస్వరూపుడు, లోకకళ్యాణమూర్తియగు విశ్వామిత్ర భగవానుడు. ఈయన ప్రోత్సాహంచేతనే ఇరవైరోజులుగా ఈ
Page:323
అయోధ్యా సభలో, నారదాది అనేకమంది మహనీయుల సమక్షంలో ‘మోక్షశాస్త్రం’ ఉపాసించ బడుతోంది. మీరు కూడా సుఖాసీనులు కండి. ఆయా మోక్షశాస్త్ర సిద్ధాంతముల నిరూపన నిమిత్తమై స్వానుభవ పూర్వకమైన మీ మధుర వాక్కులు వినాలని మేమంతా ఉవ్విళ్ళూరుచున్నాం.
శ్రీ భాసుడు : ఓ రామచంద్రా! వసిష్ఠ మహర్షి ప్రియశిష్యా! నీ అవతార సంపదకు సర్వదా జయమగుగాక! శ్రీ దశరథ మహారాజా! నమస్కారం! మీ కుమారుడైన ఈ రామచంద్రమూర్తిని దర్శించి నేను పునీతుణ్ణి అగుచున్నాను.
శ్రీ దశరథుడు :
స్వాగతం తే అస్తు భో రాజన్! ఇదమ్ ఆసనమ్ ఆస్యతామ్ | అనేక భవ సంభార భ్రాన్త విశ్రమ్యతామ్ ఇహ ॥
ఓ విపశ్చిత్ చక్రవర్తీ! భాసబిరుదాంకితా! మీకు సుస్వాగతం! రండి! దయచేయండి. ఈ సింహాసనంపై సుఖాసీనులవండి. అనేక జన్మలందలి సంసార భ్రమచే మీరు అలసిపోయి ఉన్నారు. ఈ ఆసనంపై విశ్రాంతి తీసుకొనెదరుగాక!
ఓ సభికులారా! సద్గురువగు వసిష్ఠ మహర్షి ఈ రోజు “అవిద్య అంతరంగంలో ఉన్నంతవరకు అవిద్యా జగత్తులకు అంతము ఉండదు” … అని నిరూపించటానికి ఈ విపశ్చిత్ మహారాజును ప్రత్యక్షంగా మన కళ్ళముందు చూపించటం వర్తమానపు పాఠ్యాంశానికి నిరూపణమే అవుతోంది. కట్టుకొయ్యకు కంబమునకు బలమైన త్రాడుచే బంధించబడిన మదగజంలాగా ఈ విపశ్చిత్ మహారాజు అవిద్యచే చిరకాలం దృశ్యబద్ధులవడం జరిగింది. అనేక పాంచభౌతిక దేహపురాలలోను, బాహ్య పురములలోను ప్రవేశ - నిష్క్రమణములను కొనసాగించి ఉన్నారు.
ఆహా! ‘సమ్యక్ జ్ఞానం’ లేకపోవటమే అవిద్య. అట్టి అవిద్యారూపమగు అల్పదృష్టి యొక్క గతి అతిభయంకరమైనది కదా! ఈ అవిద్య ‘చిదాకాశము’ నందు అనేక సృష్టుల ఆడంబరమును దర్శించేట్లు చేయుచున్నది. అజ్ఞాన జీవబాటసారులవంటి మనలో అనేకుల సుదీర్ఘ దేహ-దేహాంతర ప్రయాణాలు ఇట్టివే కాబోలు!
ఆహా! ఈ భాసుడు సర్వవ్యాపకము - స్వస్వరూపము కూడా అయి ఉన్న నిర్మలాత్మ యందు అనేక జగదాడంబరములను సందర్శించియున్నాడు. వాస్తవానికి చిదాత్మ జగత్ రహితం. అయితే ఏం? ‘మాయ’ యొక్క స్వభావం ఇట్టిదే కదా! పరమాత్మఘనమగు చిదాకాశము వాస్తవానికి శూన్యమే (జగత్తు మొదలైనవి లేనట్టిది) అయినప్పటికీ… అది అజ్ఞాన దృష్టికి అనేక జగత్తులు ధరించియున్న దానివలె భాసిస్తోందే! ఏమి ఆశ్చర్యం!
‘ఈ విపశ్చిత్తు చూచిన అనేక జగత్తుల సంరంభము, ఆతడు ఆ ప్రయత్నంలో పొందిన అనేక క్లేశములు… అవన్నీ ఆత్మజ్ఞాన రాహిత్యముచే ప్రాప్తించినవి. భ్రాంతి రూపము, వ్యర్థము అయినవి’ అని నేను సద్గురు శ్రీ వసిష్ఠ మహర్షి వాక్యముల ద్వారా గ్రహించుచున్నాను. ’ఈ పాంచభౌతిక సృష్టి యొక్క అంతు చూడాలి”… అనే కుతూహలం (లేక కౌతుకం) చివరికి అనేక క్లేశములకే దారి
Page:324
తీయగలదని నేను ఈ ‘సంవాద విభాగము’ నుండి గ్రహిస్తున్నాను. ‘ఆత్మజ్ఞానం’ అనే ఔషధం మనం సేవించకపోతే మన ఈ వర్తమాన ఉపాధి వరకు కొనసాగిన ప్రయాణం కూడా ముందు ముందు ఇట్టిదే అత్యంత సుదీర్ఘం, అపారం, అంతులేనిది కాగలదని మనమంతా గ్రహించెదముగాక!
శ్రీ వాల్మీకి : ఓ భరద్వాజా! దశరథ మహారాజు అట్లా చెప్పగా, విని ఆ ప్రక్కనే ఆసీనులై ఉన్న విశ్వామిత్ర మహర్షి ప్రసంగవశంగా ఈ విధంగా పలికాడు.
శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ దశరథ మహారాజా! మీరు చెప్పింది పరమసత్యం. ఎవరు “ఆత్మజ్ఞానం” అనే ప్రజ్ఞను మానవ ఉపాధి చేజారకముందే తగినంతగా పెంపొందించుకోరో, సుదృఢపరచుకోరో, అట్టి వారు ముందుముందు పొందబోయే దేహ పరంపరలు ఈ రీతిగానే (ఈ మన ఈ విపశ్చిత్తు చక్రవర్తి పొందిన ‘దేహ పరంరలు’ అనే దౌర్భాగ్యంలాగానే) అనివార్యమై ఉండబోతున్నాయి. వాస్తవానికి అనేక మంది జీవులు ఈ ప్రకారంగానే తమ తమ వాసనలచే పరాభవించబడుచూ -
భ్రాంతి రూపములైన అసంఖ్యాక జగత్తులు సందర్శిస్తూ ఉండటం మేము సర్వదా గమనిస్తున్న దైనందిన విషయమే! ప్రజ్ఞాధురంధరుడై కూడా, ఈ విపశ్చిత్తు "ఈ అవిద్యా జగత్తు యొక్క విస్తారం తెలుసుకోవాలి” అనే మొండి పట్టుదలతో అంతులేకుండా ప్రయాణిస్తూ, తత్ఫలితంగా అనేక దుర్భర స్థితులన్నీ తెచ్చిపెట్టుకొని అనుభవించినట్లే… అనేక మంది జీవులు సంసార బద్ధులై సంచరిస్తు న్నారు. అట్టి ఉపాధి పరంపరా ప్రాప్తినే ‘సంసారము’ అనే పేరుతో శాస్త్రాలు పిలుస్తున్నాయి.
అసలు ఈ జగత్తులు, ఈ ఉపాధి పరంపరలు పొందటానికి మూడు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి.
"ఏదో పొందాలి! అనుభవించాలి” అనే కామబుద్ధి
"వీరు నా వారు. అవి నావి. వీరితో మరి కొంత అనుభవం కలిగి ఉండాలి” …అనే భ్రమతో కూడిన మనో బాంధవ్యాలు.
3. “ఇదంతా ఏమి చమత్కారమో - ఎందుకో - ఎంతవరకో ఇంకా మనం తెలుసుకోవాలి” అనే మూర్ఖత్వముతో కూడిన కౌతుకము.
నాకు “వటధానులు” అనే పేరుగల ముగ్గురు రాజపుత్రులు తెలుసు. వారు కూడా "ఈ భూమి యొక్క అంతమును మేము చూడాలి” అనే మూర్ఖ కౌతుకమును ఆశ్రయించినవారై గత పదిహేడు లక్షల సంవత్సరాలుగా ఈ భూతలముపై తిరుగాడుచూనే ఉన్నారు. అనేక ఉపాధులలో ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు. జన్మ - జరా - మరణ పరంపరలు పొందుచూనే ఉన్నారు. ఏం లాభం? వారికి ఈ భూమి యొక్క అంతు కనిపించటం లేదు. వారిలో ఆ కౌతుకం తరగటం లేదు.
Page:325
"అసలీ సృష్టి యొక్క (దృశ్యం యొక్క “వాస్తవ రూపం ఏమిటి?” …అని మనం ప్రశ్నిస్తే వచ్చే
సమాధానం వినండి.
ఈ భూలోకం, భువర్లోకం మొదలైన చతుర్దశ భువనాల (14 లోకాలు) తో కూడిన మహత్తరమైన బ్రహ్మాండము వర్తులాకారంగా ఉన్నది. పైగా ఇదంతా కూడా "హిరణ్యగర్భుడు” అనే అల్లరి పిల్లవాని “ఊహలు | సంకల్పములు” అనే భావనాపరంపరలచే నిర్మితమైయున్నది. ఆతని సంకల్పములకు వేరైన రూపమేదీ ఈ బ్రహ్మాండమునకు లేనేలేదు. ఈ జీవుడు తన సంకల్ప పరంపరలచే ఆ మహాసంకల్ప పరంపరలందు ప్రవేశించి తిరుగాడుచున్నాడు.
ఓ సభికులారా! తేనె పూసిన బంతిని ఒకచోట ఉంచినపుడు పది వైపుల నుండి గండు చీమలు చుట్టుముట్టుతాయి చూచారా! అట్లాగే ఆకాశమునందు బ్రహ్మదేవునిచే ఊహానిర్మితమైన ఈ బ్రహ్మాండము అనే కందుకము (బంతి)ను ఆధారంగా చేసుకొని పది దిక్కులలోను జీవులు తిరుగాడుచున్నారు. ఇంద్రియములను వ్యామోహపరచే శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలే ఇక్కడి బ్రహ్మాండమునకు పూయబడిన తేనె.
ఈ భూలోకానికి ఊర్ధ్వ భాగంలో అనేక లోకాలు ఉన్నాయి. అధో భాగంలో మరికొన్ని లోకాలు ఉన్నాయి. అవన్నీ దశదిశలా విస్తరించి ఉన్నాయి. అవన్నీ ఈ బ్రహ్మాండము యొక్క దేహ విభాగాలని అనవచ్చు. అట్టి లోక పరంపరల యొక్క చివర ఎక్కడున్నదో చూడాలని ప్రయాణిస్తున్న వటధాన రాజకుమారులు ఇప్పటికీ ఊర్ధ్వ, అధో - పార్శ్వలోకాలలో సంచారం కొనసాగిస్తున్నారేగాని, వారికి ఈ బ్రహ్మాండము యొక్క అంతు కనబడటమే లేదు. ఈ లోకాలలోని జీవులందరు ఇట్టి స్థితినే కలిగి ఉండి అటు ఇటూ సంచరిస్తున్నారు.
అటు ఆకాశం జ్యోతిశ్చక్ర సహితంగా భూమిని గొడుగువలె ఆవరించి ఉన్నది. అంతరిక్షమునకు దశదిశలా ఊర్ధ్వ - అధోభాగాలు ఉన్నాయి. భూమికి పైన ఆకాశంలో పక్షులు ఎగురుచున్నాయి. భూమిపై అనేక లక్షల జీవ జాతులున్నాయి. భూమి యొక్క అధోభాగంలో అనేక కీటకాలు మనుగడ సాగిస్తున్నాయి.
అట్టి ఆయా అనేక లోకాలలో రకరకాల ఉపాధులు ధరిస్తూ, త్యజిస్తూ వటధానులనే ముగ్గురు రాజకుమారులు నాకు అక్కడా - ఇక్కడా తారసపడుతూనే ఉంటున్నారు. నా ఆప్తవాక్యాలు వింటూనే ఇంతలోనే యుద్ధ పిపాసులవలె కౌతుకం చంపుకోలేక ఈ మాయా జగత్తులో మరల మరల ప్రవేశిస్తున్నారు.
"ఏమయ్యా! ఎందుకీ భ్రమతో కూడిన సంచారం?”…అని ప్రశ్నిస్తే …“ఈ సృష్టి యొక్క అంతు చూడగలిగేంత వరకు మేము ఇకపై కూడా ఇట్లాగే సంచరిస్తాం” … అని పలుకుచున్నారేగాని, నా ఆప్త (జ్ఞాన) వాక్యములు విని కూడా పరమార్థం గ్రహించటం లేదు. నన్ను అప్పుడప్పుడూ ఆశ్రయిస్తున్నప్పటికీ వారి హృదయములో నా జ్ఞానబోధ తగినంతగా ప్రవేశించటం లేదు.
ఓ సభికులారా! "బ్రహ్మదేవుని సంకల్ప మాత్రం - అనేక ఆడంబరములతో కూడినది” అగు ఈ మిథ్యారూప జగత్తు స్వప్న దృశ్యము వంటిది. ఇదంతా సంకల్ప జనిత అజ్ఞానం చేత అనంత
Page:326
రూపంగా శోభిస్తోంది. అయితే… అట్టి ఈ కల్పనా జగత్తు చైతన్యమే అధిష్ఠానంగా కలిగి ఉన్నది. అందు ఈ ‘జగత్తు’ అనబడేది కూడా చిద్రూపమే అయి ఉన్నది. జలమునకు - జలతరంగాలకు, వాయువుకు - వాయువీచికలకు భేదమేమున్నది? ఆకాశమునకు - శూన్యమునకు భేదమేమున్నది? అట్లాగే చిద్రూపమునకు జగత్తుకు… తెలివి - తెలియబడేది అనే రూపంచేత ఒకదానికి మరొకటి అభేదమే సుమా! చిన్మాత్రము యొక్క ఏ స్ఫురణ జగత్తుగా భాసిస్తోందో… అదంతా కూడా చిన్మాత్రము యొక్క అంగమే కాబట్టి చిన్మాత్రమునకు వేఱుకాదు. ఈ ఈ విధంగా “ఈ కనబడే జగత్తు పరమాత్మ యొక్క దేహమే కాబట్టి పరమాత్మకు వేఱుకాదు”… అనే అవగాహనను సభికులంతా పెంపొందించుకొనెదరుగాక! ఈ సృష్టియొక్క ‘ఆది’ యందు ఈ జగత్తు అభావ రూపంలో ఉన్నది. ఈ జగత్తు ఇపుడు కూడా శూన్యరూపమే!
చిదాకాశమొక్కటే ఉన్నది. ఆ పరబ్రహ్మరూపమగు చిదాకాశమే ఇప్పుడు స్వయంగా ఇట్లు జగత్ రూపంగా భాసిస్తోంది. వాస్తవానికి సృష్టిగాని, అద్దాని స్థితిగాని, ప్రళయంగాని చిదాకాశము కంటే ఏమాత్రం వేఱుకాదు.
అట్టి చిద్రూపము ప్రాణుల కామ - కర్మ - వాసనానుసారం ఎట్లెట్లు కల్పన చేయబడుచున్నదో, …అట్లట్లు అనుభూతమౌతూ ఉంటోంది. వాసనానుసారం జగత్తుగా బ్రహ్మమునందు అధ్యస్థమై అనుభవమౌతోంది. “అన్యోన్యతాదాత్మ్యము” చే ఏర్పడే దృష్ట - అదృష్టములు (కనబడే జగత్తు · చూచే ద్రష్ట), జడ - చిద్రూపములు …అనువాటితో కూడిన జగత్తు మొట్టమొదట (జగత్తు ఉదయించినప్పుడు) ఎట్లా ఉన్నదో… ఇప్పటికీ అట్లే ఉన్నది. ఇక ఎప్పటికీ ఇట్లే ఉండి తీరుతుంది.
"చిద్రూపమగు జీవుని అంగమే ఆతనిచే దర్శించబడే జగత్తు. నాచే దర్శించబడే జగత్తు నా యొక్క దేహాంగమే”… అని మీరంతా గ్రహించండి. ఈ విషయం ఈ మహనీయులగు వసిష్ఠ మహర్షి యొక్క బోధ వాక్యములు మనందరిని తట్టి లేపి బోధించుచుండటం ఇన్ని రోజులుగా గమనిస్తున్నాం కదా! ఈ శ్రీ వసిష్ఠ మహర్షి - - ఈయన ప్రవచనాలు మనకు కరుణామూర్తియగు పరమాత్మయొక్క వాత్సల్యరూపంగా మనందరికీ లభిస్తున్నాయి ఇదంతా మనందరి యొక్క జన్మజన్మార్జిత పుణ్యఫలంగా మనకు లభిస్తోంది.
‘జగత్ దర్శనం’ అనే సంఘటనలో రెండు పాత్రలు పాల్గొంటున్నాయి- 1. నాశనశీలమగు దృశ్యరూపం; 2. నాశనరహితమగు చిద్రూపం.
జనన మరణ రహితమగు పరమాత్మయే స్వయముగా ఇట్లు జగద్రూపంగా భాసిస్తున్నారు. వాస్తవానికి ఆతడు ఏ రూపంగానూ భాసించటంలేదు. పర్వతంలో శిలగా, బంగారంలో ఆభరణంలాగా, ఆకాశంలో నిర్మల ఆకాశాణువులలాగా… చిద్రూపమగు పరమాత్మ యందు జగదనుభవరూప పరమాణువులు స్థితి కలిగి ఉన్నాయి.
మాయావరణమును ఆభరణముగా ధరించిన పరమాత్మయందు అట్టి స్వభావముతోనే కూడిన ఈ సమస్త జగత్తులు వెలయుచున్నాయి.
Page:327
మాయా శూన్యము - శుద్ధ చైతన్య రూపము అగు అట్టి పరమాత్మయందు జగత్తులనబడేవేవీ ఏ క్షణంలో కూడా లేవు.
తదేవ ‘జగత్’ ఇత్యుక్తం బ్రహ్మ భారూపమాతతమ్ |
పూర్వా - పర పరామర్శాత్ నిపుణం నిపుణాశయాః॥
నిపుణతతో కూడిన విచారయుక్తులగు ఓ సభికులారా! "బ్రహ్మ ప్రకాశరూపముచే వ్యాప్తమైనట్టి ఆ పరమాత్మయే (ఆభరణానికి బంగారంలాగా) అధిష్ఠాన దృష్టికి (ఆభరణదృష్టికి) సృష్టిలాగా (జగత్తువలె) కనిపిస్తున్నారు”… అని మేము పూర్వాపర విమర్శ చేసిన తరువాత స్వానుభవమును రంగరించి చెప్పుచున్నాం.
ఈ జగత్తు యొక్క రూపం పరమాత్మయే! పరమాత్మయే ’నేను’గా ప్రదర్శితమగుచున్నాడు. జగత్తులో ‘పరమాత్మ’ తప్ప మరింకేమీ లేదు. పరమాత్మ సర్వదా యథాతథమేగాని ‘జగత్తులు’ అనబడే దోషమేదీ ఆయనయందు లేదు. పరమాత్మయే మనలో ప్రతిఒక్కరి స్వరూపం నిత్యసత్యం.
అత్యాశ్చర్యమ్! అనష్టాం యమ్ పరమాత్ సదనాత్ స్వయమ్ | నానాత్వ బుద్ధ్యా నానైవ “జీవో2 హమ్” ఇతి తామ్యతి ॥
ఆహా! ఈ జీవుని నిజస్వరూపం పరబ్రహ్మమే! అది సర్వదా పరమాత్మతో ఐక్యము కలిగియే ఉన్నది. కానీ, ఈ జీవుడు నానాత్వ బుద్దిచే "నేను అల్పజ్ఞుడగు జీవుడను” …అని తలచి దైన్యము పొంది దుఃఖించుచున్నాడే! ఇది ఏమి ఆశ్చర్యం!
‘భాసుడు’ అని ఈ సభికులచే నామకరణం చేయబడిన ఓ విపశ్చిత్ మహారాజా! మీ చరిత్ర ఏమిటో, అనుభవములు అనుభూతులూ ఏమిటో ఏఏ దృశ్యములు చూచారో, ఎచటెచట ఎంతెంతగా సందర్శించారో, ఆయా వృత్తాంతములలో ముఖ్యమైన విశేషాలు సంక్షిప్తంగా వివరించండి. ఇప్పటి వరకు బ్రహ్మర్షియగు ఈ శ్రీ వసిష్ఠులవారు మీ యొక్క అగ్నిదేవ ప్రసాదితమైన నాలుగు దేహాల ధారణ, అవిద్యాంతమును దర్శించే ఉబలాట-కుతూహలాలు, మీ దేహములలో ఒకటి దృశ్య విముక్తి పొందటం, రెండవ - - మూడవ సూక్ష్మదేహములతో బ్రహ్మాండ కపాలముల దర్శనం ఇప్పటికీ కొనసాగించటం, నాలుగవది చంద్రమండలములో ప్రవేశించి కాలక్రమేణా ఉబలాటముల కారణంగా ‘లేడి’ మృగదేహం పొందటం - - ఈ వివరాలన్నీ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు శ్రీ వసిష్ఠ - రామ సంవాదం రూపంలో ఆత్మశాస్త్రం శ్రీవసిష్ఠులవారిచే ప్రవచించబడుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అనుభవములను సభికులకు, ఆత్మజ్ఞాన నిరూపణా సంబంధంగా వివరించండి.
శ్రీ భాసుడు : ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకు మరొక్కసారి పాదాభివందనం సమర్పిస్తున్నాను. ఓ వసిష్ఠ మహర్షీ! వినమ్రుడనై నేను సమర్పిస్తున్న సాష్టాంగ దండ ప్రణామములను కరుణతో స్వీకరించండి. ఓ దశరథ మహారాజా! మీకు, మీ అయోధ్యా రాజ్య ప్రజలకు అగ్నిదేవుని కరుణచే శుభ శాంతి - ఐశ్వర్య - ఆనందములు సర్వదా కలుగుగాక! ఓ రామచంద్రా! నీ అవతారము లోకములకు వర్తమాన - భవిష్యత్తులందు అత్యంత శుభప్రదమగు గాక! శ్రీరామ నామం ’సంసార
Page:328
జాడ్యము’ అనే మనో నైర్మల్యమును తొలగించి మమ్ములను పరిశుభ్ర పరచునుగాక! ఓ సభికులారా! మీరు నాకు ప్రతిపాదించిన ‘భాసుడు’ అనే నామధేయమును వినమ్రుడనై స్వీకరిస్తున్నాను. ఈ వసిష్ఠ మునీంద్రుని ప్రవచనములు మీ హృదయములలో ప్రవేశించి పరిఢవిల్లును గాక! ఓ ప్రియ అగ్నిదేవా! నేను మిమ్ములను స్వల్పముగా మాత్రమే ఆరాధించియున్నాను. అయినప్పటికీ భక్త వాత్సల్యంతో నన్ను ఈ సభకు జేర్చినందుకు హృదయపూర్వకంగా హస్తద్వయంతో హృదయమును తాకుతూ నా ప్రియ ఇష్టదైవమైన మీకు నమస్కరిస్తున్నాను.
ఓ సభికులారా! ఇక వినండి. అవును. ఈ విశ్వామిత్రులవారు చెప్పినట్లుగా నేను ఈ అవ్యాకృతాకాశంలో సుదీర్ఘంగా ఎంతో దూరం ప్రయాణించాను. అనేక దేహాలు ఆశ్రయించి అసంఖ్యాకంగా సుఖదుఃఖాలు చిరకాలం అనుభవించాను. అగ్నిదేవుడు ప్రసాదించిన వరప్రభావం చేత దిగంత దర్శనం చేయాలనే దృఢనిశ్చయంతో ఈ దృశ్య జగత్తులో సుదీర్ఘ సంచారం చేస్తూ సముద్ర తరంగాలవంటి అనేక దృశ్యాలు చూచాను. ప్రవేశించిన ప్రతి బ్రహ్మాండంలోను అనేక ప్రకారములైన దేహములను ధరించి సంచరించాను. ఒక్కొక్క దేహంతో తత్సంబంధమైన వ్యవహారములందు కొంచెము సేపు తన్మయుడను అయినప్పటికీ,…. ఇంతలోనే ఇతఃపూర్వపు (దిగంతం దర్శించాలనే) ఉబలాటపు సంస్కారాలు నన్ను మరల నిదురలేపటం, నేను మరల ప్రయాణం కొనసాగించటం నిర్వర్తించాను. మరల అద్దానియందు వేగంగా మహాప్రయత్న యుక్తుడనైనాను. అట్టి సుదీర్ఘ ప్రయాణంలోని పాఠ్యాంశోపకరణమైన, సందర్భోచితమైన, సాధకజనోపయోగమైన కొన్ని విశేషాలు మాత్రం ఈ సందర్భంలో మీకు విన్నవిస్తాను.
ఒకానొక ఉపాధితో మరణము పొందుచున్న సమయంలో తమోగుణ స్థితియందుండి, ఒక సుందరవృక్షాన్ని తదేకమైన చూపుతో చూస్తూ మరణించాను. నా చిత్తము యొక్క వృక్ష దర్శన వృత్తి ప్రభావం చేత, ఆ వృక్షం గురించిన సంస్కార ఫలితంగా, ‘దేహమును పొందాలి’ అనే రాగవృత్తి ప్రకోపించటంచేత, స్వయంకృతమైన సుకృత - దుష్కృత ఫలితంగా ఒక వృక్షంగా జన్మించాను. మహావృక్షంగా ఎదిగి వేయి సంవత్సరాల వరకు వృక్షము రూపంలోనే ఉన్నాను. ఆ వృక్ష రూపంలో ఉన్నప్పుడు నాకు బాహ్య వృత్తికి సంబంధించిన ప్రాణ చేష్టలు ఉండేవి కావు. అందుచేత అంతర్ముఖమైన వృత్తులను అనుభవిస్తూ “ఈ వృక్షమే నా దేహము” అనే వృక్ష దేహాభిమానంతో అనేక పగళ్ళు అనేక రాత్రులు గడిపాను. ఆ వృక్ష దేహంతోనే ప్రకృతి స్పర్శలచే అనేక సుఖదుఃఖాలు అనుభవించాను. వ్రేళ్ళకు నీళ్లు లభించినప్పుడు సుఖముగా పరిపుష్టి పొంది, అవి లభించని వేసవి కాటక సమయాలలో శుష్కించిపోతూ దుఃఖములను అనుభవించాను. కాలానికి వశుడనై పత్ర-పుష్ప-ఫలాదులను ఉత్పన్నం చేయటమొక్కటే అప్పుడు నేను నిర్వర్తిస్తున్న ప్రాపంచిక వ్యవహారం అయి ఉండేది.
ఆ వృక్ష దేహము నశించగా, అంతరంగములోని సంస్కారముల ప్రభావం చేత కాబోలు… ‘లేడి’ ఉపాధి పొంది ఆ అల్ప దేహంతో తృణములు భక్షిస్తూ మేరు పర్వత ప్రాంతంలో గల పచ్చిక బయలు ప్రాంతంలో సంచరించాను. “వృక్షముగా ఉన్నప్పుడు ఆ పరిసరములలోని పరమాత్మగానం
Page:329
యొక్క శ్రవణం చేత ఆ తదనంతరపు లేడి రూపం" అనే ఉన్నతి పొందాను. ఇక అప్పుడు “తృణభక్షణ - దేహరక్షణ” - అనే రెండూ మహత్తర కార్యక్రమములుగా అనిపించేవి.
ఆ తరువాత ఒక అడవిదున్న దేహము ధరించి క్రౌంచ పర్వత గుహలలో నివసించాను. గడ్డి మేస్తూ గేదెల గుంపుపై దృష్టులను సారిస్తూ దేహయాత్ర సాగించాను. అటు పిమ్మట విద్యాధరుడనై విద్యాధర స్త్రీలతో స్నేహపరవశుడనై వారి కళా సౌందర్యమును ఉపాసించాను.
బ్రహ్మదేవుని హంసకు పుత్రుడనై మందాకినీ నదీజలంలో క్రీడిస్తూ ఉండగా 1500 సంవత్సరాలు గడచిపోయాయి. తరువాత మరొకసారి ‘కాలంజరము’ అనే పర్వతముపై నక్కగా పుట్టాను. అప్పుడొక ఏనుగు నన్ను మర్దించి చంపింది. సగం చచ్చిన స్థితిలో ఒక సింహపు పంజా దెబ్బకు ఆ ఏనుగు మరణించటం చూచి చచ్చాను.
సహ్యపర్వత శిఖరంపై మానవ ఉపాధితో ఉండగా ఒక సిద్ధుని శాపం చేత నీటిలో చేపగా సంచరించాను. ఆ తరువాత దేవతా స్త్రీనై కృతయుగపు సగభాగం గడిపాను. ఒకసారి ఒక గన్నేరు చెట్టుపై వల్మీక పక్షి (క్రౌంచపక్షి) రూపంతో నూరు సంవత్సరాలు గడిపాను.
ఆ తరువాత ఒక సిద్ధుడు ప్రసాదించిన వరప్రభావం చేత, సిద్ధుడనైనాను. ఆ తరువాత “అవిద్య యొక్క అంతు ఎక్కడో చూడాలి"… అనే కుతూహలం మరల నా యందు యథాతథంగా ప్రకోపించింది. అయితే అప్పటికే శారీరకంగాను, మానసికంగాను ఎంతగానో అలసిపోయి ఉన్నాను. అందుచేత వైరాగ్యము పొందినవాడనై ఒక కొండపై ప్రవహించే సెలయేటి ఒడ్డున తాపసుడనై అనేక రోజులు గడిపాను.
ఈ సందర్భంలో నేను కొన్ని అత్యాశ్చర్యకరమైన విషయాలు చూచాను. ఓ సర్వ సభికులారా! అవేమిటో చెబుతాను, వినండి.
అనేక కోటి బ్రహ్మాండ జననీ! దివ్యవిగ్రహా! - తపస్సును అనుష్ఠించుచున్న సమయంలో ఒకసారి ఒకచోట ఆశ్చర్యము గొలిపే ఆకృతిగల ఒక స్త్రీని చూచాను. ఆమె శరీరంలో అనేక బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో అసంఖ్యాక జీవులు కనిపించాయి. ఆమె శరీరం నిండా అనేక లోకాలు, జల, వాయు, భూచర జనుల ఉనికిని చూచి నేను ఆశ్చర్యం పొందాను. “ఆమె దేహం పంచభూతాలతోనే తయారయిందా? లేక మరింకేదైనానా?” …అని నాకు అనిపించింది. అద్దంలో ప్రతిబింబాల లాగా…ఆమె శరీరంలో అనేక దృశ్య విశేషాలు కనిపించాయి. అప్పుడు నేను ఇట్లా ప్రశ్నించాను. నేను (భాసుడు) : ఉత్తమమైన దేహంతో కనిపించే ఓ భగవతీ! మీరెవరు? ఈ మీ దేహంలో అనేక జగత్తులు నాకు ఎందుచేత కనిపిస్తున్నాయి? నేనేమైనా భ్రమిస్తున్నానా? లేక, వాస్తవంగానే ఈ బ్రహ్మాండ సమూహములు మీ దేహాంతర్విభాగములేనా?
ఆ స్త్రీ : ఓ ప్రియతమా! సమస్త జీవులకు స్వస్వరూపమైన స్వప్రకాశకమైనట్టి శుద్ధ చైతన్యమే నేను. నాకు అందరూ ప్రియులే! అంతా ప్రియమే! ఈ కనబడే సమస్త మహాజగత్తులు నా యొక్క శరీరమే
Page:330
అయి ఉన్నది. నీకు నేను అనేక జగత్తులు గల శరీరముతో ఆశ్చర్యం గొలుపుచున్నాను కదా! అట్లాగే జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఆశ్చర్యయుక్తం కాదా? అయితే అవివేకులు ప్రతి వస్తువునందు ఉన్నట్టి ‘శుద్ధ చిత్స్వభావం’ గమనించక వస్తు దృష్టితో చూస్తున్నారు. కాబట్టి వారికి ఆశ్చర్యం గొలపటం లేదు. ఎప్పుడైతే వారికి నీవలెనే ‘చిత్స్వభావము’ నందు దృఢత్వం కలుగుతుందో అప్పుడు వారు కూడా నీవలెనే సర్వజగత్తులు దేహముగా ఉన్నట్టి నన్ను దర్శించగలుగుతారు. నీ వంటి తపస్యులు బాహ్యజగత్తులో వినబడే ఆయా విషయాలకంటే వేరుగా అంతరము నుండి (“ఇది చేయి. ఇది చేయవద్దు" అనే సూచనలను సుస్పష్టంగా వింటున్నారు కదా! అదియే అంతరంగ జగత్తు యొక్క ఉనికికి నిరూపణ.
బాహ్య జగత్తు - బాహ్యరంగ వేదనము; అంతర జగత్తు వేదనము… ఈ - - అంతరంగ రెండూ శుద్ధ చిత్ స్వరూపములే!
సమస్త పదార్థాలలో ఏ ‘సత్తా’ అనుగతమైయున్నదో …అది సర్వ జగత్ సహిత సత్తా సామాన్య స్వభావమే సుమా! అనగా… సమస్త జగత్తులో అంతరంగమై ఉన్న సత్తాయే ఒకానొక పదార్థంలో కూడా ఉన్నది. ఒకానొక పదార్థంలో ఉన్న సత్తాయే, సమస్త జగత్తులను ధరించుచున్నదై ఉన్నది. ప్రతి అణువులోను సమస్త బ్రహ్మాండాలుగా ఉన్నది. భౌతిక దృష్టికి కనిపించేదంతా అణువణువూ బ్రహ్మ సత్తాచే పూరితమయ్యే ఉన్నది. అట్లాగే స్వప్నంలో కనిపించే ప్రపంచంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి.
అందుచేత ఈ కనిపించే ఒక స్తంభము జడము కదా… అని భ్రమించరాదు. సుమా! అత్యంత జడరూపంగా కనిపించే స్తంభము నందు చేతనత్వము (వస్తు దృష్టి కలవారికి) అగుపించటంలేదు. కానీ నా దేహంలో స్తంభము - - పర్వతములు కూడా సంభాషణ నిర్వర్తిస్తూ “మేమూ చేతనులమే” అని చెప్పుకుంటున్నాయి కదా! ఒకానొక పరాశక్తి చేతనేకదా, అనేక అణువులు కలసివుండి, స్తంభము-పర్వతముగా రూపమును దినదినం కొనసాగిస్తున్నాయి!
అట్లాగే చేతనమగు దేహంలో గల ఆనేక జగత్తులు (అజ్ఞాన దృష్టి) అగుపించటం లేదు. కాని ప్రతి దేహంలోను అనేక జగత్తులు ఉన్నాయి! ఈ అణువుల అంతర్గత - - బహిర్గత ఆధారరూపమగు పరాశక్తినే నేను!
ఈ విధంగా ఆ స్త్రీ తన నిజస్వరూపమును నిర్వచించి అంతర్ధానం అయింది.
ఓ మహాత్ములారా! అట్లాగే మరొక సందర్భంలో మరొక ఆశ్చర్యకరమైన విషయమును అవలోకించాను. అది ఏమిటంటే… నేను సందర్శించిన ఒకానొక ప్రపంచంలో స్త్రీలు లేరు. కామ రహితులగు పురుష ప్రాణులు మాత్రమే ఉన్నారు. అక్కడ జీవులు పృథివి గాలి మొదలైన పంచభూతాల నుండి జనించి, మరల మరొకప్పుడు పంచభూతములలో లయమైపోతున్నారు.
ఒక లోకంలో జనులు మేఘాలలో జనించే మెఱుపులను (ఇంద్రధనుస్సు - - మేఘ ఖండములు మొదలైన వాటిని) ఆయుధాలుగా చేపట్టుచున్నారు.
Page:331
ఇంకొకచోట కొన్ని ఊళ్ళ- ఊళ్ళే గాలిలోకి లేచి ఏదో అంధకారంలోకి ప్రవేశించుచు ఉండటం, ఇంతలో మరికొన్ని ఆ అంధకారంలోంచి బయటకు వస్తూ ఉండటం, ఇంకొన్ని ఊళ్ళు మీ అయోధ్యవంటి పట్టణంలాగానే ఇళ్ళు, వీథులు, సభాప్రదేశం, అంతఃపురాలు - మొదలైనవి యథాతథంగా ఉండటం నాకు జ్ఞప్తికి వస్తోంది.
కొన్ని లోకాలలో ఒకే ఒక్క జాతి జీవులు ఉన్నారు. అక్కడ ఒక మనుష్య - దేవతా - నాగ మొదలైన జాతిభేదం లేకుండా ఉన్నది.
ఒకానొక లోకంలో సూర్య - చంద్ర - నక్షత్రాదులు లేవు. భూమి స్వయంప్రకాశమై ఉన్నది. అందుచేత అక్కడ సర్వదా పగలే, రాత్రి అనేదే లేదు.
ఇంకా ఇంకా ఎన్నో లోకాలు చూచాను. అనేక వింత వింత విశేషాలు గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైతే ఏమున్నది? మన యొక్క విమర్శచే “అనుభవమాత్ర రూపమగు సర్వసాక్షి” లోనే ఈ జగత్తులన్నీ ఉన్నాయిగాని… మరింకెక్కడో కాదు.
జగత్తులన్నీ మన స్వస్వరూప -కేవల సాక్షి యొక్క కల్పనానుసారమే అనుభూతమౌతున్నాయి.
ఓ విశ్వామిత్ర మహర్షీ! పూజనీయులగు మహనీయులారా! ఇంకా నేను అనుభవించి ఉన్న మరికొన్ని విశేషాలు చెప్పుతాను వినండి.
ఒకసారి ఒక ప్రదేశంలో ఒక అప్సరస కౌగిలిలో ఆనందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక నదీ ప్రవాహం వచ్చి మమ్ములను ఇద్దరినీ ఈడ్చుకు పోసాగింది. “ఓ అప్సరసా! ఇదేమిటి? మనం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం?” … అని ప్రశ్నించాను. “అవును స్వామీ! ఇక్కడ నది పగలు జలరహితంగాను, రాత్రిపూట ప్రవాహ సహితంగాను ఉంటుంది. ఇది నేను మీపైగల వ్యామోహ ప్రభావంచేత ఏమరచాను” …. అని చెప్పుచూ నన్ను రివ్వున ఆకాశంలోకి తీసుకుపోయింది. మేమిద్దరం ఆకాశంలోనే ఏడు సంవత్సరాలు విహరించాం.
ఇంకోసారి ‘అమరసౌముడు’ అనే పేరుగల విద్యాధరుడుగా జన్మించి 1400 సంవత్సరాలుగా గడిపాను. మరొకసారి మేఘ శరీరధారినై అనేక ప్రదేశాలు సందర్శించి అలసిపోయి నిదురించాను. ఆ నిదురలో ఇంకెన్నో లోకాలు సందర్శించాను. అనగా, నా యందే నాకు అసంఖ్యాక లోకాలు
కనిపించాయి.
Page:332
అనేకసార్లు ఈ సృష్టి నా దృష్టికి కనబడనంత దూరం పోవటం, “ఇక ఇదే కదా, దృశ్యము యొక్క చివర!” …. అనుకొనే లోపల మరొక సృష్టిలో ప్రవేశించటం ఈ విధంగా జాగ్రత్ - స్వప్నాలలో అనేక దృశ్య పరంపరలు దర్శిస్తూ అనేక సంవత్సర సమూహాలు గడచిపోయాయి. కానీ ఏం లాభం? పిశాచానికి వశీభూతుడైన బాలకునిలాగా, నా హృదయమందే ఆరూఢమైయున్న ఈ ‘దృశ్యము’ అనే పేరుగల అవిద్యకు అంతు ఎక్కడో, ఏమిటో నేను పొందనే లేకపోయాను. ఒక ప్రక్క “ఇది అసత్యం, భ్రమ“ …అని విచారణచే అనిపిస్తూనే ఉన్నది. “నేదం నేదం సత్” ఇత్యేవ విచారానుభవే స్థితమ్
తథాపి ఇదమిదమ్ చేతి దురదృష్టిః న నివర్తతే!
“ఇదంతా సత్యమే కాదు” … అని తెలుస్తూనే ఉన్నది. ఇంతలోనే, “ఇది సత్యమ్! నిజం! నిజమే!” …అనే చిరకాలాభ్యాస ప్రభావానికి ప్రతిసారి లోను అవుతూనే వచ్చాను. ’విచారణ’ను తిరస్కరించి అనేక దేహాలు అనుభవించాను. అయితే కలకాలం ఏదీ కలిగి ఉండలేదు. ద్వైత సంస్కారం యొక్క ప్రాబల్యం చేత ఏర్పడిన “దృశ్య వస్తువుల పట్ల ఇష్టపడటం”… అనే జాడ్యం నాకు తొలగటమే లేదు. విచారణ - వివేకములను తిరస్కరించటం చేత ప్రతి క్షణం ప్రాప్తిస్తున్న సుఖదుఃఖాలచేత, ఇష్టానిష్ట జనులతో సమాగమంచేత దేశకాలాదులు భేదంగా అనేక సంసార దృష్టులు నాపట్ల రావటం - పోవటం జరుగుచునే ఉన్నది.
ఇదంతా ఇట్లా ఉండగా, ఈ విశ్వమంతా ఎద్దానిలో ఉన్నదో… అట్టి ఒక మహా పర్వతాన్ని చూచాను. ఈ విశ్వమంతా తనయందు ధరించియున్న ఆ పర్వత శిఖరంపై గల ఒకానొక ప్రదేశం తత్త్వవేత్తలకు ఆలవాలమై ఉన్నది. ఆ ప్రదేశం స్వతంత్రమై, ఏకమై, పరిమితి లేనిదై, దేశ-కాలవస్తువులచే పరిచ్ఛిన్నం కానిదై ఉన్నది. ఆ ప్రదేశంలో తత్త్వవేత్తలు సమావేశమై ఉండడం చేత అక్కడ లభించిన దివ్యానందము ముందు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు పొందే ఆనందం కూడా తృణప్రాయమే!