Page:552
XI. బ్రహ్మగీత (బ్రహ్మాండోపాఖ్యానం)
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే కదా! అట్టి ఈతనికి మరి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడినుండి, ఎట్లా, ఎవరి వలన వచ్చిపడుచున్నాయి? ఎందుకంటే, దేహికి ఈ దేహమే ఐహికభ్రాంతి కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను భ్రాంతియే! అయితే ఈ దేహవీ, దృశ్యవీ మొదలైనవి ఇప్పుడు ఉండవచ్చు మరొకప్పుడు ఉండకపోవచ్చు. అయినా కూడా దేహి సర్వదా చిదాకాశ స్వరూపుడేనని మనం నిర్ద్వంద్వంగా ఇప్పటిదాకా యుక్తియుక్తంగా నిరూపించుకున్నాం కదా! ఆద్యస్వరూపమగు చిదాకాశవీచి… స్వకల్పితమైనట్టి అవిద్యచే… స్వప్నసదృశంగా “నేను జీవరూపము ధరించాను” అని తలచి ఈ సంసారమున తిరుగాడుచూ… “నేను దేవతను. నేను మానవుడను” …అని ఈ ప్రకారంగా ఆయా దేహములతోటి “దేహాత్మాధ్యాస" కలిగి ఉంటోంది. అట్టి “అధ్యాసచే కలిగియుండే కామ, కర్మ, వాసన మొదలైనవే ఆయా దేహములకు కారణమగుచున్నాయి. అయితే అట్టి దేహత్వమనేది స్వప్నాంతర్గత విశేషములవలె భ్రాంతియే! అయితే ఈ జీవనోపాధికి పూర్వం ఈ జీవుడు మహాప్రళయమున చిదాకాశ రూపుడే! అనగా ఈ సృష్టి-స్థితి-ప్రళయములు, ఇహపర లోకాలు ఆతని దేహము అవుతాయిగాని, కేవలం ఈ కాళ్ళు, చేతులు మాత్రమే ఆతని దేహం ఎట్లా అవుతుంది? ఈ జీవుని స్వస్వరూపమగు చిదాకాశము నందు దృశ్యరూప భేదం అత్యంత అసంభవం. మరప్పుడు ఈ సృష్టి రూపమగు దృశ్యము అట్టి చిదాకాశమునకు దేహమెట్లా అవుతుంది? ఇక దృశ్యమానమగు సృష్టి, పరలోకాదులన్నీ కూడా స్వప్న సంవిద్రూ కల్పనల చేతనే సిద్ధిస్తోంది. అంతేగాని స్వకీయ స్వల్పకల్పనకు నేరుగా సృష్టికి ఏ కారణం లేదు. స్వప్నంలో స్త్రీ సంగమంలాగా ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అయితే కేవలమూ అనుభవరూపం, శాంతం అయినట్టి చిదాకాశమే స్వమాయాశక్తిచే ఈ ప్రకారంగా అసత్తైన జగద్రూపంగా భాసిస్తోంది. ఏదైతే తాను శుద్ధ రూపమైనప్పటికీ, దృశ్యశూన్యమైనప్పటికీ ఈ రీతిగా జగద్రూపంగా భాసిస్తోందో… అది ఆద్యంత రహితం, నిర్మలం అయినట్టి చైతన్య వస్తువే అయివున్నది సుమా! తెలియబడనంతవరకూ ఆ పరమాత్మయే ఈ ఈ జగతూప అవిద్యగా భాసించటం కొనసాగుచూనే ఉండగలదు. అవిద్య చేతనే “నేను వేరు - ఈ దృశ్యం వేరు - ఆ పరమాత్మ వేరు” …అని అనుకుంటూ అజ్ఞాన ద్రష్ట అవిద్యయందు తిరుగాడుచూనే ఉంటున్నాడు. తెలియబడిన తరువాత “నేను, దృశ్యం, పరమాత్మ” అను మూడు ఏకత్వం చెందుచున్నాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం, దృశ్యం కూడా నిర్మల పరబ్రహ్మంగానే కానవచ్చుచున్నాయి. మేల్కొనిన తరువాత స్వప్న దృశ్యం పటాపంచలైపోతున్నట్లుగా
Page:553
.ఇక ఆద్యంత రహితమగు చిదాకాశమే తనయందు తదితరులయందు ఈ సమగ్ర దృశ్యమునందు - ఇహ పరలోకములయందు ఆక్రమించినదై అగుపిస్తుంది. అట్టి చిదాకాశ దృష్టి అనుభూతమైన తరువాత ఇక అవిద్య ఎక్కడిది?
కాబట్టి రామచంద్రా! పరమాత్మ యొక్క దృశ్యచమత్కారముతో కూడిన అనుభవమే ఈ జగత్తు. ఇక ఈ పృథివి మొదలైనవి కారణము లేకపోవుటచే, పరమాత్మయందు ఇవి జనించనే లేదు. చిదాకాశము యొక్క ‘స్ఫురణ’యే ఈ పృథివి మొదలైన భౌతికములను, మనో - బుద్ధి ఆదిగాగల సూక్ష్మ తత్త్వములను చిదాకాశమునందు పరికల్పించి పొందుచున్నది. జలంలో తరంగాలలాగా, వాయువులో చలనరూప తరంగాలలాగా అబుద్ధిపూర్వకమైన అసంకల్పిత స్వభావ రూపమైన - నిష్కారణమైనట్టి స్ఫురణ ఉదయించి జగత్తుగా అగుచున్నది.
ఆ విధంగా ఆకస్మికంగా జగత్తు భాసించిన తరువాత ఆ ఆ స్ఫురణయే జీవరూపముతో పరమాత్మయందు ప్రవేశించి “నేను సృష్టి కర్తయగు బ్రహ్మదేవుడను”… ఇత్యాది ఐశ్వర్యమును ప్రకటించుచున్నది. ఆపై ఇక స్వయముగా బుద్ధి - మనస్సు - పృథివి మొదలైన సదసన్మయ -
మూర్తామూర్త మయములతో కూడిన ఈ ప్రపంచమును కల్పన కావించుకొనుచున్నది. నిర్మలాకాశం కంటే కూడా లక్షలాది రెట్లు అత్యంత నిర్మలమైన ఆ మహాచైతన్యము నిజమాయాశక్తిచే స్వయంగా జగద్రూపంగా భాసిస్తోంది. కాబట్టే చిదాకాశమే జగత్తుగాను, జగత్తే చిదాకాశముగాను సిద్ధాంతీకరించబడుతోంది. జగత్తు - చిదాకాశము వేరు వేరు కాదు.
ప్రియ రామచంద్రా! ఈ ప్రకారంగా విచారణ దృష్టితో చూచినప్పుడు చైతన్యమునకు అన్యంగా ఏదీ భాసించటమే లేదు.
అద్వయ చిన్మాత్రమే ఈ జగత్తు వాస్తవ రూపం. తన స్వరూపముచే తాను పూర్ణమైయున్న చిదాకాశమే తన సచ్చిదానంద చిదాకాశమునందు యథాతథంగా ఉంటూనే చిత్తముగాను, ఆ చిత్తమునందు దృశ్యరూపముగాను స్వయంగా భాసిస్తోంది. నిద్రపోయేటప్పుడు నీవు నీవుగానే ఉంటూనే స్వప్న చిత్తముగాను, స్వప్నరూపంగాను భాసిస్తున్నావు కదా! ఇది కూడా అట్టిదే! ఇంతకు మించి సృష్ట్యాదియందు సృష్టికి వేరు కారణం లేదు.
చిదాకాశము చిత్తము రూపంలో భాసించటమంతా మాయారూపమే! కేవల లీలా - క్రీడా వైచిత్రమే! స్వప్నంలో కనిపించే స్వప్న దృశ్యానికి, జాగ్రత్లో కనిపించే ఈ జాగ్రత్ దృశ్యానికి భేదమే లేదు. అందుచేత ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశమువలె పదార్థ శూన్యమైనట్టి చిదాకాశమే సుమా! స్వరూపరహితమైనట్టి పరబ్రహ్మము సర్వదా తనయొక్క సచ్చిదానంద అద్వయ రూపముతోటియే స్థితినొంది ఉన్నది. అట్లు ఉన్నప్పటికీ నిజ మాయాశక్తిచేత ఇట్లు సర్వ జగద్రూపంగా కూడా వర్తించుచున్నది.
చిద్రూపం - సమష్టి మనోరూపం - జగత్ూపం - ఓ రామచంద్రా! ప్రతిజీవుడు ప్రతిరోజు స్వప్న జీవితమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా! అట్లు స్వప్నరూపంగా భాసించేది ఆత్మయే కదా!
Page:554
అట్టి స్వప్నాంతర్గత జగదనుభవాన్ని దృష్టాంతంగా తీసుకొని… “ఏకము - నిర్మలము - జ్ఞానమాత్ర స్వరూపము అయినట్టి పరబ్రహ్మమే ఇట్లు నానా ప్రకారాలుగా జగత్ రూపంచే కనబడుతోంది.” …అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. బ్రహ్మమే ఎరుక రూపంగా చిద్రూపం అయివున్నది.
చిద్రూపము ఎరుగునది, ఎరుగబడుచున్నది కూడా! ఆ బ్రహ్మం తనయందు జీవత్వమును కల్పించుచున్న దానివలె ఉన్నదై, తన నిర్మల స్వభావమును కించిత్ కూడా త్యజించకుండానే -
మనోరూపమును పొందిన దానివలె అగుచున్నది.
కనుక… పరబ్రహ్మమే చిద్రూపముగా, మనస్సు రూపంగా కనబడుతోంది. పరబ్రహ్మమునకు వేరైన చిద్రూపం లేదు. మనోరూపం లేదు. ఆ చిదాకాశమే సమష్టి మనోరూపముచే ఈ ’జగత్తు’ అనబడు రూపమును విస్తరింపజేయుచున్న దానివలె అగుచున్నది. తాను సర్వదా నిర్వికారరూపమే అయినప్పటికీ వికారివలె అగుపించుచున్నది.
జలమునకు ఆకారం ఉన్నదా? లేదు. మరి తరంగమునకో… ఉన్నది. తరంగమునకు ఎక్కడి నుండి ఆకారం వచ్చింది?
జలము నిరాకారమే అయినప్పటికీ తరంగమువలె ఆకారము పొందినదానివలె కనిపిస్తోంది కదా! అట్లాగే - విషయరహితము అగు పరబ్రహ్మము చిద్రూపము, మనోరూపము, సమష్టి మనోరూపము, వ్యష్టి మనోరూపము వలె, వికారివలె - (అజ్ఞాన దృష్టికి) అగుపిస్తోంది.
సమష్టి మనస్సే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే సృష్టి యొక్క హృదయం. ఆతడు సమస్త సృష్టిని స్వయంగా రచించుచు, స్వయంగా ఉపసంహరించుచున్నాడు. శ్రీరాముడు : స్వామీ! సమష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు నిరాకారుడా? సాకారుడా? నిరాకారుడైతే ఆతని నుండి సాకార జగత్తు ఎట్లా వచ్చింది? సాకారుడైతే ఆతని సాకారమును సృష్టించినవాడెవడు? ఆ బ్రహ్మదేవుని సృష్టించినవాడు సాకారుడే అవుతాడా? నిరాకారుడౌతాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : (పకాపకా నవ్వి) స్వప్న ద్రష్ట నిరాకారుడా? సాకారుడా? దేహానికి ఆకారం ఉన్నది గాని… చిత్ స్వరూపుడగు స్వప్న ద్రష్టకు ఆకారం ఎక్కడున్నది? జీవుడు అనగా దేహి, దేహం కదా! దేహమునకైతే ఆకారమున్నది గాని, మరి దేహికి ఆకారమేది? ఒక ఆలోచన వచ్చి నీవు ఒక పని చేశావనుకో. నీవు చేస్తున్న పని తదితరులకు కనిపించవచ్చుగాని, నీ ఆలోచనకు ఆకారమేది? అది ఎవరికి కనిపిస్తుంది?
నిరాకారమగు ఆత్మయే స్వప్నంలో స్వప్న పదార్థముల రూపంగా భాసిస్తోంది కదా! అట్లాగే … “పృథివి మొదలైనవి లేనివాడు - - సమష్టి మనోరూపమే తన రూపంగా కలవాడు" అగు బ్రహ్మ దేవుడు అవయవ రహితమగు స్వహృదయమున స్థితినొంది ఉన్నవాడై… అద్దానికి వేరుకానట్టి ఈ త్రిలోకములుగా భాసిస్తున్నాడు. ఆ స్వప్న హృదయరూపమే చిదాత్మ. ప్రతిజీవుడు నిరాకారుడై చిదాత్మయగు స్వప్న హృదయం నందు చిత్ స్వరూపమగు జగత్తుగా భాసిస్తూ తనకన్నా వేరుగా ఉన్న దానివలె జగత్తును పొందుచున్నాడు.
❖
Page:555
ఓ రామచంద్రా! సమష్టి మనోరూపుడగు బ్రహ్మదేవుడు వాస్తవానికి సర్వదా అద్వితీయుడు. అనగా… తనకు వేరైనదంటూ ఏదీ ఎక్కడా లేనివాడు. నిరాకారుడు. (అన్ని ఆకారాలు తనవే అయినవాడు). పరిపూర్ణ చైతన్య స్వరూపుడు. అయినప్పటికీ కూడా, ఆ సమష్టి మనోరూపుడు తన అవిద్యచే తన పూర్ణ చిత్ స్వభావము నుండి చ్యుతి పొందినవానివలె అగుచున్నాడు. (వాస్తవానికి చ్యుతియే పొందటం లేదు). అయితే… తనకు అనన్యమగు అహంకార రూపముతో గూడి… ఈ జగద్రూపములచే అనంతరూపుడై… ఈ జడ చేతనాత్మక జగత్తుగా (భ్రమచే) అగుపిస్తున్నాడు. కాని వాస్తవానికి ఇక్కడ ఈ భూమి, ఆకాశం, పదార్థాలు, దేహములు… ఇవన్నీ చైతన్యరూపములే! చైతన్యము కంటే వేరుగా ఏ దృశ్యమూ ఎక్కడా లేదు. చిదాకాశమే కల్పిత మనోరూపమై, ఈ రీతిగా (క్రమంగా) కల్పిత జగత్ రూపంగా స్ఫురిస్తోంది.
విచార్య దృష్యై తదపి న కించదపి విద్యతే కేవలం భాతి చిన్మాత్రమాత్మనాత్మని నిర్ఘనమ్ ॥
ప్రియ రామచంద్రా! విచార దృష్టితో చూస్తే… ఈ కల్పిత జగత్తుకు కొంచెం కొంచెం కూడా ఉనికి లేదు. కేవలం ఆనందమయమగు చిన్మాత్రమే తనయందు తాను ఇట్లు భాసిస్తోంది.
యతో వాచో నివర్తన్తె, తూప్లీంభావో అవశిష్యతే
వ్యవహార్యసి ఖాత్మైవ తద్వత్ తిష్ఠతి మూకవత్ II
అట్టి ఈ జగత్తు ఎక్కడ దాకా కనిపిస్తుంది? వాక్-మనస్సులకు అగోచరమైనట్టి, నిరతిశయానంద రూపమై ఆత్మను గమనించనంతవరకే! ఆత్మ గమనించబడిందా, ఇక ఇది దృశ్యముగా గాని, జగత్తుగా గాని గోచరించదు. ఆత్మగానే గోచరిస్తుంది. ఇదంతా కేవలం మౌన స్వరూపంగా శేషిస్తోంది. ఓ రామచంద్రా! "నేను - ’ నాకు కనబడే జగత్తు శుద్ధ సచ్చిదాత్మ స్వరూపమే!”…. అని అనుభూత మొనర్చుకొన్న తత్త్వజ్ఞాని, ఇక ఆపై ప్రాపంచిక వ్యవహారములందు ముగ్ధుడు కాడు. సర్వవేళలా నిజ చిత్స్వరూపమునందే ఎప్పటియట్లు మౌన స్వరూపుడై ఉంటున్నాడు. తన యొక్క అట్టి నిశ్చలత్వమును ఈషణ్మాత్రం కూడా కోల్పోవటమే లేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆత్మ స్వరూపంలో ప్రబుద్ధుడైనపుడు ఈ జీవుడే పురుషోత్తముడు అగుచున్నాడు. నిశ్చల ఆత్మరూపత్వముచే కేవలం మౌనస్వరూపముగా శేషించుచున్నాడు. అనంతము, అపారము, చిన్మాత్ర రూపము, పరమ ప్రేమాస్పదము అయినట్టి "నిరతిశయానంద ఘనత్వము” ను స్వయముగా అవధరించుచున్నాడు. జలము నందలి ద్రవత్వం చేత ఆవర్త - తరంగాదులు కల్పనచే కనిపిస్తున్నట్లు… బ్రహ్మము యొక్క అవిద్యా చమత్కారంలో చిత్తము, బుద్ధి, జగత్తుల - కల్పన స్వయంగా ప్రదర్శితమౌతోంది. ఆ ఆ ప్రబుద్ధుడు తనయొక్క, సర్వుల యొక్క చిత్త -బుద్ధి-జగత్తులను ఆత్మస్వరూప చమత్కారంగా ఆస్వాదిస్తున్నాడు.
Page:556
వాయువులో వాయుతరంగాలు అబుద్ధిపూర్వకంగా స్పందన ప్రభావంచేత కనిపిస్తున్నాయి. కానీ, వాయు తరంగాలుగా అనిపించేది వాయువే కదా! అవిద్యావృతుడగు పరమాత్మచే తనకంటే వేరుకానట్టి ఈ బుద్ధి చిత్తము-జగత్తుల కల్పన కావించబడుతోంది. వేలాది వాయుతరంగాలు వాయువుకంటే వేరుకానట్లే… చిదాభాస రూపులగు ఈ జీవులు “సాక్షి” యగు పరమాత్మకంటే ఏమాత్రం వేరు కానేకాదు.
అందుచేత… మహాప్రజ్ఞావంతుడగు ఓ రామచంద్రా! “చిదాకాశం-బ్రహ్మము చిన్మాత్రముజీవచైతన్యము-మహాచిద్రూపము-పరమాత్మ” ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెప్పే పర్యాయపదాలే! కంటిరెప్పలు మూసుకోవటం, తెరుచుకోవటం నిర్వర్తిస్తున్నట్లుగా …. అవిద్యావృతమగు బ్రహ్మము యొక్క భావనా వ్యాకోచముచే సృష్టి, భావనాసంకోచముచే ప్రళయం సంభవిస్తున్నాయి. వాయువు చలనముచే తరంగాలు, చలనరాహిత్యంచే తరంగ రాహిత్యం ప్రదర్శిస్తున్నట్లే బ్రహ్మమునందు సృష్టి - ప్రళయాలు ఉంటున్నాయి.
పరమాత్మయొక్క మహామనోవికాసమే దృశ్యము. భావన సంకోచమే… భావనా దృశ్యము యొక్క అభావం. కళ్ళు తెరవటం, మూయటం ఒకే కంటి రెప్పల చర్యయే కదా! రెప్పలు తెరిస్తే దృశ్యం. మూస్తే దృశ్యరాహిత్యం. అట్లాగే సృష్టి, ప్రళయాలు ఒకే చిన్మాత్రం యొక్క మాయా వ్యాకోచ-సంకోచాలు మాత్రమే! ఆ ఉభయాలు చిన్మాత్ర స్వరూపాలే! కాబట్టి దృశ్యం యొక్క భావ - అభావాలు రెండూ కూడా చైతన్యం నుండే స్ఫురిస్తున్నాయి.
ఈ దృశ్యము సత్తు-అసత్తు కూడా! చైతన్యమో… సర్వదా “అనునిత్యసత్త” స్వరూపమై ఉన్నది. నేత్రము యొక్క కదలికలే నేత్ర సంకోచ-వికాసాలు కదా! అందుచేత వికాసము సంకోచంకంటే వేరుకాదు. సంకోచము వికాసము కంటే వేరుకాదు. అట్లాగే సృష్టి - ప్రళయములు ఒకదానికంటే మరొకటి అభిన్నములు.
అందుచేత ఓ రామచంద్రా! ఈ సమస్త జగత్తునూ - "జన్మజరావర్జితము, సౌమ్యము, శాంతము, సృష్టి ప్రలయములందు సమరూపము” - అగు చిదాకాశముగానే దర్శించు. ఆకాశము తనయందు కల్పితమైన నీలం రంగు కలిగివున్నట్లు… చైతన్యం కూడా అచేతనమగు జగద్రూపంగా స్ఫురిస్తోంది. ఏదైతే భాసిస్తోందో… అది “జగత్ స్వరూపధారియగు చిన్మాత్రమే” అయివున్నది.
ఈ దృశ్యం వాస్తవానికి ఉత్పన్నమవటమూ లేదు. నశించటమూ లేదు. ఎవరిచేతా అనుభవించబడటమూ లేదు. కేవలం అత్యంత నిర్మలమగు చైతన్యమే తనయందు జగత్ రూపమగు చమత్కారమును భావించుచున్నది. అట్టి ఈ దృశ్యం “మహా చిదాకాశం” అనే మణియొక్క కాంతి కిరణరూపమే! సూర్యకిరణం కంటే ‘కాంతి’ వేరుకాదు కదా! ఈ జగత్తు తన ఉత్పత్తి స్థానమగు ‘చిద్రూపమణి’ కంటే వేరుకాదు. సుషుప్తియే స్వప్నంగా భాసిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మమే సృష్టిగా భాసిస్తోంది. ఈ జగత్తు నానా రూపాలుగా కనబడవచ్చు గాక! కానీ, ఈ జగత్తంతా కూడా వాస్తవానికి ఏకము, శాంతము, శివరూపము, అద్వైత రూపము అగు బ్రహ్మమే! ఇక ఈ దృశ్య
Page:557
వ్యవహారమంటావా? ఇది సత్తు గావచ్చు. అసత్తు గావచ్చు. చైతన్యము దేనిని ఎట్లు (సత్తుగా - లేక అసత్తుగా) భావిస్తే అది అట్లే (చైతన్యముచే) పొందబడుతోంది.
ఓ రామచంద్రా! ఒకవేళ ఎవరైనా ఈ కనబడే జగత్తుకు పరమాత్మ కంటే వేరుగా - ప్రధాన అప్రధాన విభాగములనో, (లేక) పరమాణు నిర్మితమనో, మరింకేదైనా అన్యకారణంగానో కల్పించ యత్నిస్తే… అదంతా స్వప్న పదార్థాల గురించి చర్చలాగా యుక్తియుక్తం కాదు. స్వప్నంలో కనబడే గృహ గ్రామాలకు కారణం ఏమున్నది… ఆత్మ ఆయారూపాలు ధరించటం తప్పించి? కనుక బ్రహ్మముయొక్క స్వకీయ భావనా విశ్వాసమే ఈ జగత్తు! ప్రమాణాలకు అతీతమై, అనిర్వ చనీయమై ఉన్నదని, వాస్తవానికి ఈ జాగ్రత్ దృశ్యము ఏ సమయమందును స్వతహాగా ఉదయించనే లేదని నిరూపించబడుతోంది.
శ్రీరాముడు : కానీ స్వామీ! ఏ జగత్తు స్వతహాగా లేనేలేదని మీరు సిద్ధాంతీకరిస్తున్నారో… అట్టి ఈ జగత్తు అనేక సంఘటనలతోను, వస్తు-విశ్వాసములతోను కూడినదై ఈ జీవులందరికీ పరిపరి విధాలుగా ఎదురుగా ఘనీభూతానుభవంగా ఉంటోంది కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఎవని చిత్తము దేనియందు ఆసక్తమై ఉంటోందో… ఆతడు అద్దానినే అనుభవిస్తున్నాడు. అట్లాగే, ఎవని మనస్సు బ్రహ్మమునందే అనురక్తమై ఉంటోందో… అట్టి ద్రష్టకు ఈ జగత్తు జగత్తుగా కాకుండా బ్రహ్మము రూపంగానే గోచరిస్తోంది. అందుచేత ఓ జనులారా! ఈ జగత్తును మీ ఇష్టదైవంగా సర్వవేళలా సందర్శించటం అభ్యసించండి. ఎవని చిత్తము - ప్రాణము దేనియందు అనురక్తమై ఉంటే, అది సత్యజ్ఞాతమై అనుభూతమవటం ఈ సృష్టి యొక్క లక్షణమే సుమా! అంతేకాదు. బ్రహ్మమునందు అనురక్తి గలవానికి క్షణంలో ఇదంతా బ్రహ్మమైపోతోంది. దృఢ నిశ్చయమే అనుభవరూపం దాల్చుచున్నది. ("అనురక్తోహి జగత్ దృశ్యమ్”).
శ్రీరాముడు : మహర్షీ! కొందరు బ్రహ్మవేత్తలగు మహనీయులు కూడా శాస్త్ర ప్రవచితములైన యజ్ఞ యాగాదులు నిర్వర్తించటం మా వంశ పూర్వీకులగు దిలీపుడు కుకుత్సుడు మొదలైన వారిలో - మనం గమనిస్తూ ఉన్నాం కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మవేత్తలు స్వనిశ్చితమగు "సర్వము సర్వదా బ్రహ్మమే!” అని దర్శిస్తూనే, అట్టి సునిశ్చిత వస్తువుకంటే అన్యములైనట్టి శాస్త్ర మర్యాదలను అనుసరించి యజ్ఞ యాగ - దానాదులు, సదాచారం కొరకు, తదితరుల శ్రేయస్సు కొరకు స్వభావసిద్ధంగాను, అనాసక్తి పూర్వకం గానూ నిర్వర్తిస్తూ ఉంటారు. వారి పవిత్రమైన ఆశయంచేత అదంతా ఆత్మోపాసనయే అగుచున్నది.
ఓ ప్రియజనులారా! “నా ప్రియ పరమాత్మయే ఈ ఈ రూపాలుగా ప్రదర్శితులగుచున్నారు. నా యందు నా సర్వస్వం ఆయనయే! ఆయనకు అన్యంగా, భిన్నంగా నేనుగాని, నాకు కనబడే జగత్తుగాని లేవు” అను సర్వసమర్పణ బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం నిర్వర్తించే మహనీయులు ఎందరో ఈ భూమిపై వెలసియే ఉన్నారు.
నేను చెప్పుచున్న ఈ ఉపాయం ద్వారా ఈ జగత్తంతా కూడా సత్తా మాత్రంగానూ, దృక్ రూపమగు పరబ్రహ్మముగాను అతి సులభంగా అభ్యాసముచే అనుభూతమవగలదు.
Page:558
ఎందుకంటే… ఇక్కడ వాస్తవానికి ద్వైత - ఏకత్వ కల్పనయే ఎప్పుడూ కూడా లేనేలేదు. దృశ్య రహితమగు బ్రహ్మమే “సత్-అసత్”“మూర్త-అమూర్త’ రూపమగు దృశ్యజగత్ ఆకారము ధరించుచున్నదను కృతనిశ్చయం గలవారికి ఇక ఆపై ఇక్కడ ’కర్త’గాని, ’భోక్త’గాని, “జీవుడు ఉన్నాడు-లేడు” … మొదలైనవి గాని భాసించవు. ఎందుకంటే వారికిక్కడ సర్వము సర్వమయంగా, బ్రహ్మమాత్రంగా, బ్రహ్మమునకు అభిన్నంగా దర్శనమగుచున్నది.
వాస్తవానికి కేవల చిదన బ్రహ్మము జగత్తు యొక్క పర్యాయరూపమై, ఆద్యంతరహితమై, మహాశాంతమై అక్కడ - ఇక్కడ, అప్పుడు - ఇప్పుడు వెలయుచున్నది. మార్గమధ్యంలో గల ఒక విగ్రహం దొంగవలె కనిపించి భయం కలిగించునట్లు, ఈ జగత్తు బ్రహ్మమే అయివుండి, అజ్ఞులకు భయోద్వేగాలు స్వకీయ కల్పనచే కలుగటానికి అవిచారణమే కారణమగుచున్నది.
శ్రీ వసిష్ఠ మహర్షి :
యదేవ బ్రహ్మ బుద్ధ్యాది తదేవైతన్నిరజ్ఞనమ్ । |
యదేవ గగనం శాస్త్రం శూన్యం విద్ధి తదేవతత్ ॥
ఓ రామచంద్రా! ఏది శాంతమైనట్టి ఆకాశమో అదియే ‘శూన్యం’ కూడా కదా! అంతేగాని, ఆకాశం వేరు, శూన్యం వేరు కాదుకదా! అట్లాగే ఏది నిరంజనము, దోషరహితము అగు బ్రహ్మమో… అదియే ఈ “బుద్ధి, మనస్సు, ఆలోచనలు, జగత్తు" మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యం అయి ఉన్నదని గ్రహించు. ఒకనికి కంటి దోషం చేత ఆకాశంలో వెంట్రుకాకారాలు కనిపిస్తున్నాయనుకో. అవి ఉన్నాయా? కంటి దోషం లేనివానికి అవి లేవు. అగుపించవు. కంటిదోషం కలవానికో, - కనిపిస్తున్నాయి కాబట్టి… అవి ఆతనికి ఉన్నాయి. ఆ కనబడేవన్నీ ఆకాశమునకు అభిన్నమైనట్లు …ఈ జగత్తు పరమాత్మకు అభిన్నం. పరమాత్మయందు అనంతరూప సంఖ్యలో బుద్ధులు, దేహాలు, మనస్సులు, అనుభవాలు - అనేకములుగాను, భిన్నములుగాను భాసించుచున్నప్పటికీ కూడా వేర్వేరు వస్తువులను ప్రకాశింపజేసే ఒకే సూర్యుని అనేక కిరణాలులాగా - వాస్తవానికి అవన్నీ కూడా బ్రహ్మమునకు అభిన్నములై ఉండి వర్తిస్తున్నాయి. సుషుప్తి నుండి స్వప్నంలోకి వచ్చినప్పుడు స్వప్నంలో కనిపించే అనేక రూపములన్నీ ఏకమగు సుషుప్తి రూపములేకదా! ప్రళయము నుండి సృష్టి రూపంగా ప్రవేశించి, ఈ సృష్టిగా కనబడుచున్నట్టి బ్రహ్మమునకు ద్వైత - అద్వైతాలు లేవు.
ఓ ప్రియ సర్వజనులారా! నేను చెప్పినదే చెప్పుచున్నప్పటికీ, ఇదంతా కూడా… మీకందరికీ పరమ సత్యమును మరల మరల సుబోధకం చేయటానికే సుమా!
Page:559
చిదాకాశమున చిదాకాశమే ఉన్నది. తన యొక్క శుద్ధ చిదాకాశ స్వరూపము కొనసాగిస్తూనే స్వప్నంలోలాగా ఆ చిదాకాశము దృశ్య జగత్తుగా భాసిస్తోంది.
సద్వస్తువు కంటే వేరుగా మరి ఏ వస్తువు లేదు. ఉన్నదని ఎవరైనా అంటే అద్దానికి కారణమే లేదు. బాహ్యకారణమే లేనప్పుడు ఇక భిన్నమైనదెక్కడున్నది?
నిరాకారమగు చిదాకాశమే సృష్ట్యాది యందు జగదాకారంగా భాసిస్తోంది. అయితే అట్టి భావన స్వప్నంలోలాగా, సంకల్పంలోలాగా… మిథ్యాజ్ఞానమువలె సర్వదా భ్రమరూపమే అయివున్నది.
ఈ దృశ్యం స్వప్నం వలె సర్వవస్తుధర్మశూన్యమగు చిదాకాశమే అయివున్నది. చిదాకాశానికి జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. అవిద్యామలము చేత మాత్రమే చిదాకాశము ఇట్లు వికారవంతముగాను, వస్తుధర్మ సహితంగాను ప్రతీత మగుచున్నది.
స్వప్నాకారమగు ఈ జగత్తు చూడటానికి వస్తుధర్మసహితంగా కనబడుచున్నప్పటికీ… వాస్తవానికి సర్వధర్మరహితమై ఉన్నది. అధిష్ఠానమగు సన్మాత్ర బ్రహ్మము కంటే ఇది వేరేమీ కాదు. అజ్ఞానుల దృష్టియందు మాత్రమే ఇదంతా బ్రహ్మమునకు వేరుగా జగదాకారంగా స్థితినొందియున్నది.
కలలో కనిపించే పెద్దకొండ అసలైన రూపమేమిటైయున్నది? స్వప్నాధిష్ఠానమగు స్వప్న చైతన్యరూపమే కదా! అట్లాగే అధిష్ఠానమగు జాగ్రత్ చైతన్యమునకు, ఈ కనబడే జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. ఇదంతా చిదాకాశంలాగా అతి సూక్ష్మరూపంగానే సిద్ధిస్తోంది. సర్వరూప బ్రహ్మమే సృష్టిరూపంగా స్థితినొంది ఉంటోంది.
ఇప్పుడు నీకు ఈ అయోధ్య మొదలైన నగరాలన్నీ భాసిస్తున్నాయి కదా! అయితే… స్వప్నంలోని నగరాల రూపంలో ఆత్మయే భాసిస్తున్నట్లుగా ఈ ఈ నగరాదుల మన అనుభవమంతా మన ఆత్మ స్వరూప చమత్కారానుభవమే! స్వప్నంలో హృదయ కంఠ నాడీరంధ్ర ప్రదేశాలలో గృహములు - గ్రామములు – మిద్దెలు - జనులు ఉంటారా? ఉండరు కదా! కానీ వాటి యొక్క 1. ప్రత్యభిజ్ఞానము 2. సంస్కారము 3. స్మృతి స్వప్నంలో సంభవములు అగుచున్నాయి కదా! ఆ మూడూ ప్రక్కన పెట్టామనుకో….! అప్పుడు బ్రహ్మ సంవిత్తే నిద్రాదోషముచే ఆ విధంగా భాసించుచున్న దగుచున్నది కదా! స్వప్నంలో ’ఊహ’చే కనిపించిన వాటిని జగత్తులో కనిపించే పదార్థముల సాదృశ్యము వలన ‘స్మృతి’ యొక్క సాదృశ్యం కల్పించుకొని ఆ స్వప్న ద్రష్ట “నాకు కలలో అది కనిపించింది. ఇతను కనిపించాడు” అని స్మృత్యత్వం ఊహించుచున్నాడు. ఈ జాగ్రత్ కూడా అట్టిదే! అనేక దేహములకు సంబంధించిన ప్రత్యభిజ్ఞానము, సంస్కారములు, స్మృతి క్రోడీకరించుకొని, ఇప్పటి ఈ దృశ్యమునకు ఏదో అర్థమును ఊహించుకొని, “నేను అది చేస్తున్నాను … ఇది చూస్తున్నాను” అని అనుకుంటున్నాడు.
ప్రత్యభిజ్ఞానం - “అప్పటి అదియే ఇది" అని తలచటం (తత్రైవ ఇతి)
సంస్కారములు - అనేకసార్లు నిర్వర్తించిన ఒక భావన అభ్యాసమై స్వభావంగా మారటం. ‘అభిప్రాయం’ అనే స్వభావం ఘనీభూతం కావటం.
Page:560
స్మృతి - కొన్ని జ్ఞాపకముంటాయి. కొన్ని మరచిపోబడతాయి. జ్ఞాపకమున్నవి వర్తమాన అనుభవమునకు ఇచ్చే అర్థాన్ని ప్రభావితం చేయటం.
వాస్తవానికి బ్రహ్మమునందు అనేక భిన్న జగత్తులు ఎప్పటికప్పుడు మరల మరల స్ఫురిస్తూ ఉండగా… ఈ జీవుడు, ప్రత్యభిజ్ఞానము (అదియే ఇది) అనే భ్రాంతి జ్ఞానమును కలిగివుంటున్నాడు. అయితే ఆయా భిన్న జగత్తులన్నీ కూడా అధిష్ఠాన చిదాకాశము కంటే ఏమాత్రం వేరు కాదు.
ఈ కనబడే నేల, ఆకాశం - ఇవన్నీ పరమాత్మయందు ఓత-ప్రోతములై ఉన్నాయి. అందుచేత ఇక్కడ అనేకత్వం ఏమాత్రం లేదు (నేది హ నానాస్తి కించన). ఇక్కడి విధి - నిషేధాలన్నీ విభక్తములై, మిళితములై… అధిష్ఠాన దృష్టిచే బ్రహ్మమునందే విద్యమానములై ఉంటున్నాయి. ఇక ఆరోపిత దృష్టితో చూస్తే ఇవేవీ మొదలే లేవు.
ఇక్కడ సంభవిస్తున్న అనేకానేక విషయాలు : “తస్మాత్ సత్బ్రహ్మ సర్వాత్మకమివాత్ర న విద్యతే!” ఈ లోకంలో అనేక వ్యక్తిగత, సాంఘిక, సైద్ధాంతిక, వ్యావహారిక, సంఘటనపరమైన అనేక సంబంధాలు, అనుభూతులు, బాంధవ్యాలు, ప్రేమాస్పద స్పందనలు, అనుబంధాలు ఏర్పడుచున్నాయి. తొలగిపోతున్నాయి. ఎందుచేతనంటావా? సద్రూపమగు ఆ బ్రహ్మము సర్వాత్మకం కదా! అందుచేత అయ్యది తన నిజమాయాశక్తి చమత్కారంచేత ఇక్కడ సంఘటితం కానిదేమున్నది? ఆ బ్రహ్మ సత్తయే సర్వుల రూపమై వెలయుచున్నది. అందుచేత ఈ సమస్త జగత్తు బ్రహ్మరూపమై, సద్రూపమై ఒప్పుచున్నది.
“పరమాత్మ - జీవుడు” గురించి వివిధ వాదముల చమత్కారం - బ్రహ్మసత్త… సర్వాత్మకమని మనం చెప్పుకున్నాం కదా! కాబట్టే బ్రహ్మసత్త యందు వివిధ వాదుల యొక్క సమస్త కల్పనలకు ఇక్కడ అనవరోధపూర్వకంగా “నిజమే” అనే అనుభవత్వం సిద్ధిస్తోంది. సర్వకల్పనలను త్యజించినవానికి మోక్షం కూడా అట్లే సిద్ధిస్తోంది. ఎట్లా అంటావా? ఏదో ఆటలాగా ఒక బాలుడు తనచుట్టూ తాను కాసేపు తిరుగాడాడనుకో! ఆ ప్రక్కనేగల మరొక బాలుడు చూస్తూ నిలబడ్డాడనుకో! మొదటి బాలునికి తాను నిలబడిన నేల గిర్రున తిరుగుచున్నట్లు అనిపిస్తుంది. అది ఆతనికి సత్యం. ఆ
రెండవ బాలునకో… అంతా ఏదీ కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఈతనికి సత్యం.
అజ్ఞానుల దృష్టిలో అజ్ఞాన భ్రమ ఉన్నది. వారికి ఈ దృశ్యము స్థిరంగా ఉన్నట్లుగా అగుపిస్తోంది. అది వారికి సత్యమే! “అయ్యో! వాళ్ళు నన్ను అంతమాట అన్నారే… ఇంత సహాయం నేను వాళ్ళకు చేసియున్నప్పటికీ కూడా?” అనునది ఆ ద్రష్టకు సత్యం. కానీ, - జ్ఞానికి ఈ వర్తమాన జగత్తు స్వప్న సదృశంగాను, మొదలే అవాస్తవంగాను అగుపిస్తోంది. అజ్ఞాని ఎంతగా సత్యమనుకుంటున్నాడో… జ్ఞాని అంతగానూ ఇది కేవలం భ్రమగా గమనిస్తూ చిరునవ్వుతో దర్శిస్తున్నాడు.
మోక్షోపాయం - ఏది ఏమైతే ఏం? ఒకడు జ్ఞాని అయినా, లేక అజ్ఞాని అయినా… ఆత్మ స్వరూపమునందలి స్థిరత్వం (నేను సర్వదా అఖండము - అప్రమేయము - నిత్యము -నిత్యసత్యము - సర్వము అగు ‘ఆత్మనే’ అనే స్థిరభావం) అనే అభ్యాసం లేకపోతే ఈ దృశ్యము శమించటం కల్ల.
Page:561
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ దృశ్యము పట్ల ఏర్పడే అనుబంధకమునకు సంబంధించిన (ఇది సత్యమే అనే రూపంలో ఉండే) సంసారదోషం తొలగితేగాని దుఃఖం ఉపశమించదు కదా! అట్టి ఈ సంసారదోషం ఈ జీవునకు మొదలంటా తొలగేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవును. అట్టి సంసారదోషం తేలికగా పోయేది కాదు. మరి అది జన్మ జన్మార్చితం కదా! ఎట్లా పోతుంది? అయితే అందుకు ఉపాయం లేకపోలేదు సుమా! సాధక జనులు నిరుత్సాహపడవలసిన పనేమీలేదు. ఓ ప్రియ జనులారా! అట్టి మోక్షమును కరతలామలకం చేసుకొన్న మహనీయులు భూమిపై సర్వజీవజాతులలోను ఉన్నారు. ఈ వర్తమాన ‘యోగవాసిష్ఠం’ అని ప్రసిద్ధికి ఎక్కబోయే శాస్త్రం యొక్క శ్రవణ - మననాలు మోక్షము ఎంత సులభమో చెప్పటానికే ఉద్దేశించబడింది. అంతేగాని, “అది చాలా కష్టం” అని చెప్పి ముగించటానికి కాదు సుమా! ముందుగా విజ్ఞులగు సద్గురువులను గుర్తించండి, వారిని మీ సేవలచే మెప్పించి "మేము మోక్షశాస్త్రం వినాలని, గ్రహించాలని మీ పాదారవిందములు ఆశ్రయిస్తున్నాం. అందుకు పట్టుదల కలిగి ఉన్నాం” అని సుస్పష్టపరచండి. అప్పుడు మోక్షోపాయమైన ఇట్టి శాస్త్ర బోధ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఆ తరువాత నిధి ధ్యాసనముల ద్వారా ఆ పాఠ్యాంశములను హృదయస్థం చేసుకోండి. “ఈ దృశ్యము బ్రహ్మమే! ఆత్మరూపమే! నా రూపమే”… అనే పరమ సత్యం సుస్పష్టంగా, సంశయరహితంగా అనుభూతమవటానికి అనుభవజ్ఞుల వాక్యప్రవాహం తప్పితే వేరే ఉపాయమే మున్నది? ఉండలేదు. ఉండబోదు.
న జీవన్, న మృతం చిత్తం రోధమాయాతి సంస్కృతేః
అవినాభావిదేహత్వాత్ బోధాత్వేతన్నపశ్యతి I
ఓ ప్రియ సభికులారా! ఈ చిత్తము, సంసారము అనబడే రెండూ అవినాభావమైనట్టి ఒకానొక సంబంధం కలిగి ఉంటున్నాయి. ఒకటి ఉంటే రెండవది ఉంటోంది. అయితే ఈ చిత్తము యొక్క పరిస్థితి ఏమిటి? జాగ్రత్-స్వప్నములలో గంతులు వేస్తోంది. సుషుప్తికి వచ్చేసరికి లయించి పోతోంది. జాగ్రత్-స్వప్నములలో మాత్రం అది "యోగాభ్యాసం, తీర్థాలు సేవించటం, క్రతువులు నిర్వర్తించటం” ….మొదలైన ప్రయత్నములచే నిరోధించబడినప్పటికీ, మరల “తగుదునమ్మా!” అని ఎప్పుడో బయల్వెడలి కుప్పిగంతులు ప్రారంభిస్తోంది.
అయితే… మోక్ష శాస్త్రము యొక్క అభ్యాసము చేత జనించే జ్ఞానముచే ఈ ’సంసారము’ అనబడేది మొదలంటా శమించినదై, ఇక మరల చిగురించటం లేదు. (జ్ఞానేదైవ తు కైవల్యమ్). కాబట్టి ఈ శాస్త్రము యొక్క అభ్యాసం చిత్త నిరోధమునకు ఉపాయమే అయివున్నది.
ఈ చిత్తము సంసారముతో అవినాభావ సంబంధం కలిగియున్నదని చెప్పుకున్నాం కదా! అట్లాగే… ఈ చిత్త, సంసారములు శరీరముతో అవినాభావం కలిగి ఉంటున్నాయి. ఈ శాస్త్రాభ్యాసం చేత “దేహినైన నేను సర్వదా దేహము కంటే వేరై, సమున్నతుడనై, నిర్మలుడనై, అప్రతిహతమైన సర్వాత్మకమైన-సువిశాల స్వరూపుడనై ఉన్నాను” … అని ఆ అభ్యాసకుడు గ్రహిస్తున్నాడు. అభ్యాసకుడు
Page:562
ఎవరైనా యోగవాసిష్ఠ మోక్షశాస్త్ర కథన ప్రభావంచేత ఇప్పటికిప్పుడే, ఈ జన్మయందే తత్త్వబోధచే చిత్తమును సంసార దృష్టి నుండి నివర్తింపజేసుకుంటున్నాడు. లేదా… ఆతని ప్రతిబంధకములు ఒకవేళ బహుళంగా ఉంటే మరుజన్మలో తప్పక (ఈ గ్రంథం అందించే జ్ఞాన బలంచేత) చిత్త శమనమును పొందుచున్నాడు.
వాయుచలనముచే దూదిపింజములవలె ఆకాశంలో ఎగిరే మేఘపుంజములు గాలి వీచికలు శమిస్తే ఆకాశంలో కదలక ఉంటాయి కదా! జ్ఞానముచే అవిద్యకు కారణములు శమిస్తూ వస్తాయి. ఇక ఆపై ఈ చిత్త దృశ్య శరీర భావములు కారణరహితమై పోతాయి. ఈ మూడు శమిస్తే ఇక శేషించేది ఆత్మతత్త్వమే! ఎందుకంటే చిత్త - దృశ్య - శరీరమేవాహంకారాలకు అజ్ఞానమే కారణం! అట్టి అజ్ఞానమో… ఒకింత సంస్కరించబడిన బుద్ధి గలవాడు ఈ శాస్త్రమును అధ్యయనం చేస్తే తప్పక శమించగలదు.
ఈ గ్రంథం పూర్వ విభాగంలో విషయాలన్నీ చర్చించబడియే ఉన్నాయి. అప్పటికీ ఏమేమి బోధపడలేదో అవన్నీ ఈ ఉత్తరార్ధం చదవటంచేత తప్పక సుబోధపడగలదు. పదపదార్థ జ్ఞానం కూడా చక్కగా అలవడగలదు. ఈ గ్రంథం తదితర గ్రంథాల కంటే కొంత విలక్షణమై ఉన్నది. సంసార భ్రమ వినాశమునకై ఉత్తమ ఉపాయం. అందుచేత పూర్వార్ధ ఉత్తరార్ధములలో ఒక విభాగంగాని, రెండూగాని చక్కగా పఠించి విచారించండి. దీనిచే సర్వదుఃఖాలు తప్పక తొలగుతాయి.
ఒకవేళ ఎవరైనా, “ఈ శాస్త్రము వేద విభాగం కాదు కదా! వేదసారములైన ఉపనిషత్తులే మాకు రుచిస్తాయి” …అని అంటారా! సరే, మంచిదే! ఉపనిషత్తులలో చెప్పినదే ఈ శాస్త్రంలో యుక్తి యుక్తంగా చెప్పబడింది కదా! వేదముల విభాగమైన ఉపనిషత్ సారమే ఇందులో పాఠకులకు వినపడగలదు. కాబట్టి ఉపనిషత్తులు పఠిస్తామని అన్నా కూడా మాకేమీ అభ్యంతరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక్క విషయం నేను ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. ఓ సర్వజనులారా! ఆత్మజ్ఞానమును ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము - అశ్రద్ధ కలిగి ఉండకండి. మీరు ఆత్మజ్ఞానం పొందుటకు మానవజన్మ అత్యంత దుర్లభమైన - ఉత్తమమైన అవకాశం అయివున్నది నాయనలారా!
అనర్థేన అవిచారేణ వయః కుర్యాత్ న భస్మసాత్ |
బోధేన జ్ఞానసారేణ దృశ్యం కర్తవ్యమాత్మసాత్ ॥
అవిచారణ అనే అనర్థమును ఆశ్రయించి మహదవకాశమైనట్టి ఆయుష్షును బూడిదపాలు చేసుకోకూడదు సుమా! శ్రవణ-మనన-నిధి-ధ్యాసాది ఉపాయములచే తత్త్వజ్ఞానం (తత్ - త్వమ్ - నాకు ఎదురుగా కనిపించే నీవు ఆ పరమాత్మ స్వరూపమే. నా స్వరూపం కూడా పరమాత్మయే! కనుక నీవు నా స్వరూపుడవే… అనే జ్ఞానం) చేత ఈ దృశ్యమును ఆత్మయందు లయింజేసి ఇదంతా ఆత్మరూపంగా చేసివేయండి.
ఆయుషః క్షణ ఏకోపి సర్వరత్నైః న లభ్యతే | నీయతే తద్మృథా యేన ప్రమాదః సుమహానహో ||
Page:563
ఓ ప్రియ జనులారా! "ఆ! ఇవన్నీ తెలుసుకోవటానికి మాకు చాలా సమయం ఉన్నదిలెండి. అప్పుడే ఇవన్నీ దేనికి?” అని ఆత్మజ్ఞాన సముపార్జనం విషయంలో అనేకులు అశ్రద్ధయే కలిగి ఉంటున్నారే! ఇది ఉచితం కాదు. ఆయుస్సు యొక్క ఒక్క క్షణం వ్యర్థంగా గడచిపోయినప్పటికీ, ఆ ఒక్క క్షణమును సమస్త రత్నములు ఇచ్చి కూడా సంపాదించుకోలేరని తాత్సారం చేసే వారందరికీ మా హెచ్చరిక! ఆత్మ విచారణ లేకుండా ఆయుస్సు గడపివేయటం సర్వ అనర్థములకు మూలమని, మహాప్రమాదకరమైన విషయమని మీరంతా గుర్తుపెట్టుకొని ఉండండి.
అనుభూతమపిచ నో దృశ్యమిదం ద్రష్ట సహితమపి |
స్వప్న నిజమరణ బాంధవరోదనమివ, సదివ కచితమపి ॥
ఓ రామచంద్రా! ఒకానొకడు నిద్ర నుండి లేచి తన మనుమడి దగ్గరికి వెళ్ళి గాభరాగా… “ఓరే! మనవడా! ఇప్పుడు నాకు ఒక భయంకరమైన స్వప్నం వచ్చిందిరా!” అన్నాడు. “తాతా, కలయా? ఏమని?” అని ఆ మనుమడు ప్రశ్నించాడు. అప్పుడా ముసలాయన, “నాయనా! నేను మరణించాను. అప్పుడు నా చుట్టూ చేరి నీవు, మీ నాన్న, మీ అమ్మ, మీ బామ్మ, మీ బాబాయి… అందరూ ఎలుగెత్తి దుఃఖిస్తున్నారు”… అని చెప్పసాగాడు.
అపుడా మనుమడు “తాతా! ఆగాగు! నీవు మరణించావు కదా! మరి ఆ స్వప్నంలో మా ఏడ్పులు నీకెట్లా వినిపించాయి?” అని ప్రశ్నించాడు. ఆ తాతకు సమాధానం దొరకలేదు. “అవును. అదంతా మిథ్యయే కదా!” అని సమీక్షించక తప్పలేదు.
‘స్వప్నంలో తాను మరణించటం’ అనేది, చుట్టూ బంధువులు రోదించటమనేది ఆ స్వప్న కాలంలో సత్యముగా భాసించవచ్చుగాక! వాస్తవానికి అదంతా మిథ్యయేనని జాగ్రత్ సమయంలో ఆ జాగ్రత్ ద్రష్ట ఒప్పుకోక తప్పలేదు కదా! అట్లాగే ఈ దృశ్యము ప్రత్యక్షంగా అనుభూతమవచ్చు గాక! అంతఃకరణోపహితమగు జీవుడు ద్రష్టత్వముతో కూడి ఉండవచ్చుగాక! అయినప్పటికీ “జ్ఞానదృష్టిచే” ఇదంతా మిథ్యయే అని సుస్పష్టమగుచున్నది.
శ్రీరాముడు : హే మహర్షీ! జగత్తు మిథ్య అని, జగత్తు లేదని, జగత్తు ఆత్మ రూపమేనని… ఇంకా ఆయా జగత్ను దర్శించే అనేక ఉపాయాలు చెప్పారు, మంచిదే! జగత్తు ఎట్టిదో అనేక కోణాల నుండి మీరు సుదీర్ఘంగా మహాశవోపాఖ్యానంలో కూడా ఉపన్యసించారు.
కానీ స్వామీ! అనేక అసంఖ్యాక జగత్ సమూహాలెన్నో గడచిపోయాయి. మరి ఇంకెన్నో జగత్తులు ముందు ముందు రానున్నాయి. ఈ ‘జగత్తు లేదు’ అను ప్రసంగము ద్వారా బంధము యొక్క అభావం సుస్పష్ట పరచుకోవటం ఎట్లా?
“పూర్వ జగత్తు లేదు. రాబోయే జగత్తులు లేవు” అని మీరు యుక్తియుక్తంగా చెప్పుకుంటూ
Page:564
వస్తున్నారు. అయితే, పూర్వ జగత్తులు గడచిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనం చర్చించవలసిన పనిలేదు.
రాబోయే జగత్తులు ఇప్పటికి మనకు బంధం కాదు. భూత భవిష్యత్ జగత్తుల ‘బంధము లేదు’ అనునది స్వతహాగానే సిద్దించుచున్నది. ఇప్పటి ఈ జగత్తే కదా, బంధం! కాబట్టి వర్తమాన జగత్తు మా పట్ల ఎట్లా తొలగుతుందో… అద్దాని గురించి బోధింపమని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మోక్షశాస్త్ర శ్రవణానికి నీవు అధికారివి (అర్హుడవు) అయి ఉన్నావు. అట్టి నీవు ‘జగత్తు’ అనబడు దాని యొక్క శబ్ద-అర్థములు, అద్దానితో జీవునికి గల సంబంధం చక్కగా ఎరిగివుంటే చాలు. ఇక మన భూత - భవిష్యత్ బ్రహ్మాండముల కథనం వ్యర్థం అవదు. ఎందుకంటే, భూత భవిష్యత్ బ్రహ్మాండముల వంటిదే వర్తమాన బ్రహ్మాండము కూడా!
భూతకాలిక - భవిష్యత్ కాలిక బ్రహ్మాండముల గురించి (మహాశవోపాఖ్యానంలో) విచారణ చేయటంలో ఒకానొక ముఖ్యోద్దేశం ఉన్నది. అది ఏమంటే… జీవుని యొక్క ఈ వర్తమాన పదార్థ సంబంధం, భూతకాలిక వ్యవహారముతోనే ముడిపడి ఉన్నది. భూత - భవిష్యత్తుల రెండింటినీ వచించకపోతే అధ్యాత్మ శాస్త్రము నందు ప్రవృత్తి సంభవించదు.
ఒకనికి ఒక అత్యాశ్చర్యం, అత్యావశ్యకం అయిన విశేషం గురించి చెప్పదలచుకున్నామనుకో! అప్పుడు ఆ వినేవానికి ఆతనికి తెలిసిన శబ్దాలు ఉపయోగించి చెప్పితేనే ఆతడు సులభంగా ఆ విషయం గ్రహించి అవగాహన చేసుకోవటానికి, ఆనందించటానికి వీలుంటుంది కదా! కాబట్టి అధ్యాత్మ బోధలో భూతకాలిక బ్రహ్మాండ వ్యవహారాల గురించి చెప్పటంలో ఉద్దేశం అట్టిదే! ఓ రామచంద్రా! ముందుగా మరొక విషయం ప్రస్తావిస్తాను. నీవు జ్ఞేయమగు పరమాత్మను ఎరిగినావనుకో. (విదితవేద్యుడవయ్యావనుకో)… అప్పుడు త్రికాలములలో సమరూపమైయున్న నీ స్వరూపమును ఎరుగగలుగుతావు కదా! “సర్వదా సమము” అయివున్న నీ స్వరూపం గురించి బోధించటానికి భూత-భవిష్యత్ వర్తమాన జగత్తులలో ఏది తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఏముంది? వాటి అన్నిటికీ అప్రమేయమైన నీ స్వస్వరూపమగు ఆత్మ గురించిన జ్ఞానము దృష్ట్యా ఆ మూడు స్వప్నతుల్యమేనని ప్రత్యక్షంగా గ్రహించటమే ఇక్కడి ఉద్దేశము సమస్తమునకు “ఆది” అగు చిన్మాత్రమే స్వయంగా స్వప్నంలో జగత్తు రూపంలో భాసిస్తోంది! భూత-వర్తమాన-భవిష్యత్ సమస్త సృష్టులకు మునుముందుగానే స్వస్వరూపమగు చిన్మాత్ర బ్రహ్మమే ఉండివున్నది. అదియే సర్వకాల జగత్తులుగా భాసిస్తోందాయే! అట్టి చిన్మాత్రమునకు అన్యమైనదంటూ ఎప్పుడూ లేదు!
ఓ రామచంద్రా! ఇక ఈ వర్తమాన జగత్ విషయానికి వచ్చాం అనుకో! ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిచే ఒక్కొక్క అణువునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండాలు వర్తించుచున్నాయి. అట్టి అసంఖ్యాక బ్రహ్మాండాలు లెక్కపెట్టడం ఎవరి తరం? “అణువణువులో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి” అనే విషయం పూర్వం ఒకసారి మా తండ్రి, సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఒకానొక విశేషపూర్వకమైన వివరణతో నాకు బోధించటం జరిగింది. ఆ విశేషం ఇప్పుడు వివరిస్తాను.
HH
Page:565
ఒకసారి నా తండ్రి శ్రీ బ్రహ్మదేవులు పద్మమునందు జగన్మాత సరస్వతీదేవితో కూడుకొని సుఖాసీనులైన తరుణంలో, వారిని సమీపించి మాతా పితల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణమములు సమర్పించి నేను ఇట్లా ప్రశ్నించాను:
నేను : హే మహాత్మా! ఈ జగత్ సమూహములు దశదిశలా వ్యాప్తమై కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎంత విస్తీర్ణంగా వ్యాపించి ఉన్నాయి? ఇవి అసలు ఎచ్చట భాసిస్తున్నాయి?
బ్రహ్మదేవుడు : ఓ ప్రియపుత్రకా! బ్రహ్మమే ఈ సర్వజగత్ రూపములుగా భాసిస్తోందయ్యా! అయితే ఇక్కడ ఒక విశేషం నీవు గమనించు. బ్రహ్మమును ఎరిగిన తత్త్వజ్ఞానులకు ఈ జగత్తులన్నీ బ్రహ్మ సత్తారూపంగానే భాసిస్తున్నాయి. అజ్ఞానులకో… ఇవి జగద్రూపములుగా కనిపిస్తున్నాయి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్లా చెప్పి ఆయన ఈ వ్యష్టి - సమష్టి యొక్క సృష్టి విశేషం ఏ విధంగా ఏర్పడు తోందో చెప్పారు. చెవులకు ఇంపైనట్టి అట్టి “బ్రహ్మాండాఖ్యాయిక” అని, “బ్రహ్మాండపిండాఖ్యానము” అని చెప్పబడే ఆ విశేషాలు విను.
#
బ్రహ్మాండాఖ్యాయిక - - బ్రహ్మాండపిండాఖ్యానము -
బ్రహ్మదేవుడు : మొట్టమొదట నిష్ప్రంచకమగు చిదాకాశ పరమాణువు మాత్రమే ఉన్నది. అది సర్వదా సర్వత్రా తనకంటే వేరైనదంటూ ఏదీ లేకయే వర్తిస్తోంది.
స్వప్నానికి దృశ్యంలాగా, ఆకాశానికి శూన్యంలాగా, వాయువుకు స్పందనలాగా ఆ చిదాకాశ పరమాణువు తనయందు ’సమష్టి జీవత్వము’ను గాంచుచున్నది. అయితే ఆకాశ సదృశమగు అట్టి సమష్టి జీవత్వము గాంచుచున్నప్పుడు తన నిర్వికార - అసంగ - పరిపూర్ణ - సూక్ష్మ చిద్రూపమును ఏమాత్రం త్యజించటమే లేదు. అట్టి ఆకాశ సదృశ సమష్టిరూప అహంకారం తనయందు ‘బుద్ధి’ అను దానిని గాంచుచున్నది. అట్టి బుద్ధి ’నిశ్చయము’చే నిర్మితమై ఉన్నది. అది అసత్ పదార్థముల గురించిన భ్రమ కలిగి ఉండటం జరుగుతోంది. అందుచేత అట్టి బుద్ధి మాయ యొక్క అనురూపంగా చెప్పబడుతోంది.
ఆ బుద్ధి వికల్పరహితమగు తనను వికల్ప భాసముల యొక్క ఆరోపణములచే తనే స్వయంగా క్రిందికి నెట్టుకొనుచూ, క్రమంగా స్వప్నంలోలాగా… మనస్సును గాంచుచున్నది.
ఆ మనస్సు తన దేహమునందు అసన్మయము అగు ‘మనస్సు’ను గాంచుచున్నది. ఇక ఆపై ఈ త్రిలోకముల వ్యవహారమంతా అనేక అనుభూతములచేతను, స్థావర - జంగమరూపులగు అనేక ప్రాణికోట్లచేతను వ్యాప్తమై ఉన్నట్లుగా దర్శిస్తోంది. ఇక ఇందులో ‘కాలము’ యొక్క కల్పన, పదార్థముల పరస్పర సంగమం, కల్పించబడుతోంది.
స్వప్నంలో లాగా… త్రిలోకాలలో ప్రతి వ్యష్టి జీవుడు తనకు ప్రత్యేకంగా 1. ద్రష్ట-దర్శన -దృశ్యములు 2. భోక్తృ-భోగ-భోగ్యములు 3. కర్త-క్రియా-కార్యములు అను ’త్రిపుటిత్రయం’ (3×3=9) రంగుటద్దం లోంచి ఈ త్రిలోకములను గాంచుచున్నాడు.
Page:566
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్లా అనేక విశేషాలు వారు చెప్పారు. ఆ రోజు సంభాషణ సారాంశం నా మాటలలో చెప్పుచున్నాను. సభికులంతా వినండి.
ఓ రామచంద్రా! నీకు స్వప్నంలో పదిమంది మిత్రులు, నీ సోదరులు ముగ్గురు కనిపిస్తు న్నారనుకో, వారందరు ఎవరికి వారుగా వేరువేరుగా కనిపిస్తారు కదా! అదే రీతిగా ఈ జాగ్రత్తునందు కూడా ప్రతివ్యష్టి జీవుడూ తన హృదయంలో ద్రష్ట - దర్శన - దశ్య, భోక్తృ - భోగ - భోగ్య, కర్తృ - - క్రియా కార్యములు అనే త్రిపుటీత్రయ (9) దర్పణమును హృదయాకాశంలో నిర్మించుకుంటున్నాడు. ఆ దర్పణంలో స్వర్గ - మర్త్య - పాతాళలోకములను కల్పించుకొని అనుభవ పరంపరలను కొనసాగిస్తున్నాడు.
చూచావా రామచంద్రా! ఈ విధంగా చిదాకాశ పరమాణువు తన యొక్క అతి సూక్ష్మమైన ఉదరమునందు ప్రత్యేక జీవభేదములచే విభిన్నమైనట్టి (ఇందాక చెప్పుకున్న) అనేక కల్పిత విశాల మహాజగములు కలిగి ఉంటోంది. అయితే ఏ వ్యష్టి సహిత అసంఖ్యాక మహాజగత్తులు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పుకుంటున్నామో… అదంతా కూడా అవిద్యయే అయివున్నది.
ఇక అవిద్య అనగా? స్వాత్మ తత్త్వమును గూర్చిన అజ్ఞానము యొక్క రూపమే సుమా! అట్టి అవిద్య అనంతమై, అనుక్షణికమై ఒప్పుచున్నది. కానీ… ఆత్మజ్ఞానము అనే దీపకాంతిని ప్రసరింపజేసి చూస్తేనో… అంతా నిర్మల పరబ్రహ్మముగానే అగుచున్నది, కానవచ్చుచున్నది. ఈ విధంగా "ఈ కనబడే సమస్తం బ్రహ్మమే” అనబడు ‘బ్రహ్మీదృష్టి’ సముపార్జించుకొన్న వానిని ‘తత్త్వవేత్త’ అని, ‘విదిత వేత్త’ అని, ‘బ్రహ్మయశస్వి’ అని, ‘జీవన్ముక్తుడు’ అని, ‘వేదవేద్యుడు’ (తెలుసుకొనవలసిన దానిని తెలుసుకున్నవాడు) అని, ‘ఆత్మజ్ఞాని’ అని, ‘పండితుడు’ అని శాస్త్రకారులు పిలుస్తున్నారు. అట్టి తత్త్వవేత్తకు ఇదంతా స్వప్నముతో సమానమైనదే అగుచున్నది. అనుభవ స్వరూపుడగు ద్రష్టయే స్వప్న తుల్యమగుచుండగా… ఇక ద్రష్టకు సంబంధించిన దృశ్యము గురించి వేరే చెప్పేదేమున్నది?
సర్వము బ్రహ్మరూపమై, ద్రష్ట - దృశ్యములే లేవని నిర్ధారించబడుచుండగా… ఇక ద్వైతమెచట? దానికి కారణమెచట?
కాబట్టి రామచంద్రా! “కేవలము మహాశాంతము - భేదరహితము - నిర్మలము - ఆద్యంత పరివర్జితము”… అయినట్టి చిదాకాశరూపమగు బ్రహ్మమే తనయందు ఇట్లు సమస్త జగద్రూపంగా స్థితినొందియున్నదగుచున్నది. సముద్రంలో ‘తరంగ వేగము’ అనే కారణంచేత చంచలమై ఉంటున్న జలంలో అసంఖ్యాక పరమాణు సమూహములు వర్తిస్తున్నాయి కదా! అట్లాగే అజ్ఞానము ఉన్నంతవరకు పరమాత్మ యందు లక్షల - కోట్ల కొలది బ్రహ్మాండములు మనం చెప్పుకుంటున్న రీతిగా ఒకదానికొకటి (బ్రహ్మము రూపముచే) అభిన్నమైనప్పటికీ భిన్నమైనవాటివలె భాసిస్తున్నాయి.
అజ్ఞాన దృష్టిచే ఇట్టి ఈ జగత్తులకు అంతంలేదు. జ్ఞానదృష్టిచే జగత్తులు ఇప్పుడు లేవు. ఇతఃపూర్వం లేవు. ఇక ముందు ఉండబోవు,
Page:567
తత్త్వవేత్తల దృష్టిలో ఈ అసంఖ్యాక జగత్ సమూహాలన్నీ స్వస్వరూప చిదాత్మరూపమే అయివున్నాయి. ఇక అట్టి జగత్తులకు భూతకాలమని - వర్తమానకాలమని - భవిష్యత్ జగత్తు అని చెప్పుకోవలసినది ఏమున్నది? ఉన్నదానికైతే కాలమానం. లేనిదానికి కాలమానమేమిటి? కథలో కల్పించబడిన అనగా అనగా ఒక రాజు, - “ఇప్పుడున్నాడా?"…. అను చర్చకు ఉపక్రమించలేం కదా! కథ విని ఊరకుంటాం. ఈ జగత్తు కూడా అంతమాత్రమే!
శ్రీరాముడు : మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! ఈ జగత్తులు యథార్థ దృష్టిచే కారణ రహితమని మీరు ప్రవచిస్తున్నారు కదా! ఇదంతా కూడా స్వప్నంలోలాగా, సంకల్పంలో (ఊహలో) లాగా… కారణ రహితంగా బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నదని కదా సిద్ధాంతం! అప్పుడు ఈ జీవుడు ఏఏ వస్తువులను కోరుకొంటే ఆయా వస్తువులు తమంతట తామే అప్పటికప్పుడే కారణరహితంగా సంభవించాలి కదా! అట్లా జరగటం లేదేం? ఉదాహరణకు ఒక రైతు అత్యధికంగా ధాన్యం పండించాలనుకున్నాడనుకోండి. ఆ రైతు కార్య రూపమగు కృషి - సకాలంగా వర్షం కురియటం
ఇవన్నీ ఒనగూడితేనే సాధ్యపడుతోంది. ఈ జగత్తులో కొంచెం కూడా కారణం లేకుండా ఏదీ సంభవించటం లేదు కదా! అకారణంగా బ్రహ్మము నుండి జనించిన ఈ జగత్తులలో అనివార్యమగు కార్య-కారణ వ్యవహారం ఎట్లా ఏర్పడుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని గురించి రెండు విభాగములుగా బోధ కొరకై విభజించి చెప్పబడుతోంది. 1. నిర్మల చిదాత్మ, 2. అద్దాని భావనా వైశిష్ట్యము… ఈ విధంగా ద్రష్టాహంకారము - వ్యవహార దశ అనే రెండూ స్వప్నతుల్యంగా ఏర్పడి ఉంటున్నాయి.
వ్యవహార దశ - - ఈ వ్యవహార దశయందు ఎవడు దృఢమైన అభ్యాసంచే… దేనిని ఎట్లు భావిస్తాడో, కల్పిస్తాడో… అద్దానిని అట్లే కల్పితమైన కార్యనియమబద్ధంగా గాంచుచూ ఉంటాడు. ఎవనికి వ్యావహారిక నియమము దృష్టియందు ఉండదో… ఆతనికి కల్పనయే ఉండజాలదు. కనుక “కల్పనామయమగు ఈ దృశ్యము ఇట్లు అనిపించటానికి కారణం దృక్ స్వరూపుడగు ద్రష్ట స్వయంకృత కల్పనా విశేషమే”…. అని చెప్పబడుతోంది.
యథేదం కల్పితం దృశ్యం మనసా యేన తత్తథా | వేత్త్యసౌ యాదృక్ అన్యేన కల్పితం, వేత్త్యసౌ తథా ||
ఎవడు తన మనస్సుతో ఏ విధంగా, కల్పించుకుంటాడో… దానిని ఆతడు ఆ విధంగానే పొందుచున్నాడు. అద్దానినే మరొకడు నిజకల్పనా భేదంచే మరొక విధంగా అనుభవిస్తూ ఉంటాడు.
ఉదాహరణకు… ఒకడు "అయ్యా! నేను పడే అన్ని కష్టాలు ఎవ్వడూ పడటంలేదు”… అను కల్పనను మనస్సుచే ఆశ్రయిస్తే … ఆతనికి నిజంగానే అన్నీ భరించలేని కష్టాలుగా కనిపిస్తాయి.
Page:568
మరొకాయన అవే కష్టాలుపడుతూ, “ప్రపంచంలో అందరికీ ఏవో కొన్ని కష్టాలు ఉంటాయి. నాకు కూడా అట్లాగే ఈ ఈ కష్టాలు ఉన్నాయి"… అని మనస్సుచే అనుకుంటే… ఆతనికి ఆయా కష్ట సంఘటనలు తనకు - తదితరులకు సర్వులకు సామాన్య విషయములవలె గోచరిస్తాయి.
ఇంకొకడు “నా ఇష్టదైవం నాకు ఈ దేహం ప్రేమతో ప్రసాదిస్తున్నట్లే… ఈ ఈ కష్టాలన్నీ నా అభ్యున్నతి కొరకై పాఠ్యాంశాల రూపంలో ప్రసాదిస్తున్నారు. ఇవన్నీ నాకు అవసరమే! లేకుంటే పరమాత్మ ఎందుకిస్తారు?”… అని మనస్సుతో భావన చేస్తే … ఆతనికి అవి కష్టాలుగా కాకుండా బోధసాధనలైపోతాయి. బాధలన్నీ బోధలైపోతాయి.
వేరొకడు… “ఈ దేహాదులు నావి కావు. దేహాన్ని బట్టి ఇవి ఉంటాయి. కనుక ఈ కష్టాలు నాకు సంబంధించినవి కావు. నేను అప్రమేయమగు ఆత్మను కదా?” … అని అనుకుంటే… సర్వ ప్రాపంచిక వ్యవహారాలు ఆతనికి ప్రక్క గ్రామంలో అపరిచితుల గృహంలో జరిగే వివాహ సందర్భపు మేళతాళాలవలె తనకు సంబంధించనివై ఉంటాయి.
ఈ కష్టాలు ఇతఃపూర్వపు నా తప్పుల ప్రక్షాళనము కొరకే” … అని మనస్సులో భావించేవారికి అవన్నీ దేహమును పరిశుభ్రం చేసే జలంలాగా ప్రియమైనవై పోతాయి. మనస్సును పరిశుద్ధపరిచేవిగా కనిపిస్తాయి.
అయితే రామచంద్రా! "కల్పన, అకల్పన”… ఈ రెండూ కూడా ఏకమగు బ్రహ్మము యొక్క స్వభావ చమత్కారం వల్లే ఏర్పడుచున్నవగుచున్నాయి. ఇందులో… చిదంశము (అకల్పనారూపం); అచిదంశము (కల్పనారూపం)… రెండూ ఉంటున్నాయి.
ఎట్లాగంటే మనుష్యుడు చేతనాస్వరూపుడే అయినప్పటికీ… ఆతని జుట్టు, గోళ్ళు, బొమికలు మొదలైనవి అచేతనములుగాను - ఆతడు చేతన రూపుడుగాను ఉంటున్నారు కదా! ఈ దేహము చేతన, అచేతనముల కలగలపుగా ఉన్నట్లే… ఈ జగత్తు కూడా కల్పన + అకల్పన ఉభయ రూపములతోకూడి ఉంటోంది. పదార్థములన్నీ కూడా… పరమార్థ దృష్టిచే - అకారణములుగాను, కల్పనా దృష్టిచే - సకారణములుగాను… అయి వుంటున్నాయి.
బ్రహ్మము నందు ఈ రెండు ధర్మాలు అవిరోధపూర్వకంగా వర్తిస్తున్నాయి. ఎట్లా అంటావా? …మరి… బ్రహ్మము సర్వశక్తిమంతమై అలరారుచున్నది కదా! పూర్ణజ్ఞానుల దృష్టిలో బ్రహ్మము కంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. స్వప్నంలో స్వప్న ద్రష్ట యొక్క చైతన్యమునకు భిన్నంగా ఏదైనా ఉన్నదా? ‘ఊహ’ అనునది స్వప్న చైతన్యము నుండి జనించిన స్ఫురణయే కదా! ఆ స్ఫురణయే ఆయా ‘ఇల్లు - వీథి - గ్రామము - - నగరం - మిత్రులు - సంఘటనలు’ మొదలైనవాటి రూపంగా వర్తిస్తోంది కదా! ద్రష్ట యొక్క స్వస్వరూపమునకు అనన్యమైనట్టి జాగ్రత్ చైతన్య స్ఫురణయే జాగ్రత్ జగత్తు రూపంగా అనుభవమౌతోందని వారు గ్రహించియే ఉంటున్నారు. “నిర్మల జ్ఞాన దృష్టిచే జగత్ రూప అనుభవాలన్నీ స్వస్వరూప విస్తరణా చమత్కారం” అని, “అట్టి స్వస్వరూపం త్రికాలాలలో
Page:569
వాస్తవానికి యథాతథం” …అని వారు సర్వదా గ్రహించియే ఈ జగత్తులో మనందరి మధ్య బాహ్యానికి మామూలుగానే అనువర్తిస్తున్నారు.
ఇక అజ్ఞానుల దృష్టిచే బ్రహ్మము కంటే భిన్నంగా ఎచటైనా ఎపుడైనా ఏదైనా ’ప్రతీతి’ ఉంటుంటే, అది కారణము యొక్క ‘వికల్పన’ కలిగి ఉంటోంది. “నా తమ్ముడైయుండి, అంతమాట అంటాడా? ఎవరు దీనికి కారణం?” …. అనే విషయం, ప్రశ్న, సమాధానం మొదలైనవి కారణరూప ప్రతీతిని కలిగియున్నప్పటికీ “సర్వమూ బ్రహ్మమే అయిఉండగా… ఈ ‘తమ్ముడు’ అనబడేవాడు ఎక్కడి నుండి వస్తాడు? ఎక్కడ ఉంటాడు?" … అనే జ్ఞానదృష్టి కలవానికి, ఇక అంతా కూడా చిరునవ్వుకు మాత్రమే అర్హమౌతుంది కదా!
కాబట్టి సర్వప్రియ జనులారా! మీ యొక్క సమస్త జాగ్రత్ - స్వప్న జగదనుభవములన్నీ కూడా బ్రహ్మముతో సంయోగపరచటమే సంసారమును దాటివేయటానికి ఉపాయం. అంతేగాని, కార్య - కారణముల చర్చచే… ఇది ముడిపడేది కాదు. కాదూ… ఈ కారణ వ్యవహారమే పరిశీలించుచూ పోయినా… అది అజ్ఞాన సోపాన పరంపరయే అవుతుంది. అనగా ఎక్కడో అక్కడ “అజ్ఞానమే (లేక) కల్పనయే (కాక) ఆత్మజ్ఞాన రాహిత్యమే - ఇట్టి వ్యవహారానికి మూలం”… అని చర్చ ముగించక తప్పదు.
నేహ ప్రవర్తతే కించిత్, న చ నామ నివర్తతే ॥
స్థితమ్ ఏకమ్ - - అనాద్యంతం, బ్రహ్మైవ బ్రహ్మఖాత్మకమ్ ||
కిం కస్య కారణం, కేన, కిమర్ధం, భవతు క్వ వా ?
కిం కస్య కారణం, కేన, కిమర్ధం, మా స్తువా క్వచిత్?
ఓ రామచంద్రా! ఈ ప్రపంచము వాస్తవానికి కొంచెం కూడా ఉత్పన్నమవటం లేదు. నశించటమూ లేదు. పరబ్రహ్మమే సర్వదా “ఏకము - ఆద్యంతరహితము - చిదాకాశ రూపము” … అయి ఉండి ఇట్లు ఈ జగత్ రూపంగాకూడా స్థితినొంది యున్నది. పరబ్రహ్మమునకు అన్యంగా ఇక్కడ గాని, మరొకచోట గాని… ఎక్కడా ఏదీ లేదు. ఎక్కడైతే పరమార్థంగా అంతా అకారణమే అయివున్నదో… ఇక ‘కారణత్వం’ అనేది కేవలం కల్పన మాత్రమే అయివున్నదో… అప్పుడిక ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం చెప్పు? ఏది ఎచ్చట ఎందుకొరకు దేనికి కారణం కాకూడదో చెప్పు? ఎందుకంటే కల్పితమైన “కార్యము యొక్క ఉత్పత్తి”, “కార్యము యొక్క అనుత్పత్తి”… అనే రెండూ సమానములై, అవిరుద్ధములై ఉంటున్నాయి. ఉదాహరణకు ”ఈ దేహం కనబడుతోంది. కాబట్టి ఈ జీవుడు ఫలానప్పుడు పుట్టాడు“ అనునది సకారణరూపంగా అగుచున్నది. ”ఈ దేహి దేహమును కదల్చుచున్నవాడై దేహానికి ముందే ఉన్నాడు. అట్టి దేహి పుట్టుకకు ముందే ఉన్నప్పుడు పుట్టటమెక్కడ?”… అనేదీ యుక్తియుక్తమే అవుతోంది.
బ్రహ్మమునందు జగత్తు శూన్యత్వముగా లేదు. అశూన్యత్వముగా లేదు. ఎందుకంటే అశూన్యత్వము అనేది ‘శూన్యత్వము’ అనే దృష్టిలోనుంచే వస్తోంది. ‘శూన్యత్వము’ అనేది అశూన్యత్వం
Page:570
దృష్ట్యానే చర్చనీయాంశం అవుతోంది. అట్లే బ్రహ్మము నందు సత్తుగాని, అసత్తుగాని, సదసత్తుగాని లేదు (అందు ఉన్నది గాని, లేనిదిగాని, కొంత ఒకానొక దృష్టిచే ఉండి - కొంత లేక గాని లేదు). అట్టి “పదార్థరహిత + సహిత” చిదాకాశమునందు “ఇది అవును, అది కాదు”… అనునది కూడా
ఏదీ లేదు.
ఓ రామచంద్రా! సమస్తమూ దృశ్యరూపంగా ఏదీ కాదు. అధిష్ఠాన రూపముచే సద్రూపమే! ఇది దృశ్యరూపంగా చూస్తే లేదు. అధిష్ఠాన రూపంగా ఇదంతా ఉన్నది. ఎందుకంటే అధ్యారోప దృష్టిచే బ్రహ్మమే ఇదంతా! అపవాద దృష్టిచే బ్రహ్మము ఆకారరహితం. వస్తురహితం. విషయరహితం.
ఉదాహరణకు, నీ చేతికి ధరించిన బంగారు కంకణం తీసుకుందాం. బంగారం అనే ఖనిజమే ఆ కంకణమంతా అయివున్నది కదా! కంకణంగా కనిపించేది బంగారమే కదా! బంగారం దృష్ట్యా ఆ కంకణం ఉన్నది. గుండ్రటి ఆకారం ఎక్కడున్నది? ఆ బంగారం కరిగిస్తే గొలుసుగా తయారయినప్పుడు ఆ ఆకారం ఏమైనది? ఆకారంగా కనిపించేదంతా బంగారమే! బంగారానికి ఆకారం లేదు. బంగారం లేకపోతే ఆకారమే లేదు. బంగారానికి ఏదో ఒక ఆకారం ఉంటూనే
ఉంటుంది. కాని “ఇది మాత్రమే” అనబడే ఏ ఆకారమూ లేదు. ”ఆత్మ జగత్ సహితం. జగత్ రహితం” అనునది బంగారము యొక్క “ఆకారం ఆకారరాహిత్యం” వంటిదే!
జగత్తు కార్య - కారణ రహితం
శ్రీరామచంద్రుడు : హే మహర్షీ! మీరు మా అజ్ఞానుల బోధ కొరకై 1. అధ్యారోపవాదం, 2. అపవాదం స్వీకరిస్తూనే వస్తున్నారు కదా!…
అధ్యారోపవాదం = ఈ జగత్తుగా బ్రహ్మమునందే ఉన్నది. అపవాదం = జగత్తంగా కనిపించేదంతా బ్రహ్మమే!
ఈ విధంగా ఈ జగత్తూ ఉన్నదని, బ్రహ్మమూ ఉన్నదని చెప్పుతూ కూడా వస్తున్నారు కదా! మరిక ఈ క్రింది వాదములు ఎందుకు మన పరిగణనలోకి తీసుకొని ఒప్పుకోకూడదు?
ప్రధాన వాదం - ఆత్మయే అన్నిటికన్నా ప్రధానం. అద్దాని నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలము నుండి పృథ్వి జనిస్తున్నాయి. ఈ విధంగా అవన్నీ ఒకదానికి మరొకటి కారణం.
పరమాణువాదం పరమాణువుల సంయోగ వియోగం చేతనే జగత్తు యొక్క నిర్మాణం, వినాశనం జరుగుచున్నాయి. కనుక జగత్తుకు ప్రళయ - మహాప్రళయాలు ఉన్నాయి. జగత్తుకు కారణం పరమాణువులగుచున్నాయి.
ఈ ప్రపంచంలో అనేక పదార్థములున్నాయి. అవన్నీ పంచభూత నిర్మితములు. ఆయా వివిధ పదార్థములు రకరకాల కలయికలచే రకరకాల వేర్వేరు ధర్మములు, గుణములు ఏర్పడు
Page:571
చున్నాయి. ఉదాహరణకు మద్యము సేవించినవాడు ‘మత్తు’ అనే ఒక వేరైన గుణములు పొందుచున్నాడు. సాత్వికమైన ఆహారం సేవించటం చేత మరొకడు సాత్విక గుణములు కలిగివుంటున్నాడు.
ఇదంతా ఈ జగత్తులో ఇట్లా ఒక్కొక్క పదార్థం మరొకదానికి కారణమగుచూ ఉండటం మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఈ జగత్తులో ప్రతిదానికి ఒక కారణం ఉండనే ఉంటోంది. ఏదీ కూడా, కారణరహితమైనది ఈ జగత్తులో ఎక్కడా కనిపించదు. మరి “సృష్ట్యాదిలో జగత్తుకు కారణమే లేదు. కనుక జగత్తు మొదలేలేదు. జగత్తుగా కనిపించేది బ్రహ్మమే!” - ఇట్టి ”అద్వితీయ బ్రహ్మమాత్ర శేష్య సిద్ధాంతం“ ఎట్లా ఒనగూడుతుంది? శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వి) “ఈ జగత్తు కార్యకారణాలు కలిగి ఉన్నది”… అని చెప్పటానికి ”మా అజ్ఞానుల బోధ కొరకై…” అని నీవు మొదలే సమాధాన రూపంలో ఒప్పుకున్నావు. అందుకే నాకు ఇంత నవ్వు వచ్చింది. “మొట్టమొదట పరమాత్మయే ఉన్నాడు. అయితే, అజ్ఞానుల కొరకై బ్రహ్మదేవుడు ఈ కార్యకారణ వ్యవస్థతో కూడిన జగత్తును సృష్టించాడు” … అని కొందరు గురువులు తమ శిష్యులకు బోధించు సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నమాట నిజమే! ఎందుకంటే…”ఈ జగత్తులో కనిపించే కార్యకారణ వ్యవస్థ ఎవడో మానవుడు కల్పించింది కాదు కదా! ఈ జగత్తులో ఎవరు ఈ కార్యకారణ వ్యవస్థ కల్పించారో… వారు ఎందుకు కల్పించారు?”… అనే ప్రశ్నకు సమాధానంగా ఆయా గురువులు "అజ్ఞానుల కొరకై”… అని సమాధానం చెప్పుచున్నారు.
అయితే "ఈ అజ్ఞానులు అనబడేవారు ఎక్కడి నుండి వచ్చారు?”… అని అప్పుడు మరొక ప్రశ్న బయలుదేరుతుంది. సృష్టికి ముందే ‘అజ్ఞానులు’ అని, ‘జ్ఞానులు’ అని రెండు తెగలవారు న్నారా? అజ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు? అందుకే ఈ మన చర్చనీయాంశానికి సమాధానంగా వేదాంత సార శాస్త్రజ్ఞులు మొట్టమొదటగా సర్వమత సిద్ధాంతా లను రెండు విధాలుగా విభజిస్తున్నారు.
I II
మొట్టమొదట పరమాత్మయే పరమాత్మ అనబడేవాడెవడూ లేడు ఉన్నారు. ఆయన అటుతరువాత ఈ ఇక ఈ కార్య-కారణాలు జగత్తును సృష్టించారు? ఆతడే కార్య స్వభావసిద్ధం. పరమాత్మ ఉంటే కారణాల రచయిత! ఎందుకు….? కనబడాలిగా? ఇదంతా స్వభావమే అజ్ఞానుల కొరకు! గాని ఎవరి అధీనం కాదు.
మొదటి సిద్ధాంతముల వ్యవస్థలో మొట్టమొదట జగత్తు లేదని, అజ్ఞానుల కొరకై పరమాత్మ ఇది రచించారని చెప్పబడుతోంది. అంటే జగత్తు లేనప్పుడు అజ్ఞానులు ఉన్నారని చెప్పటమే ఇక్కడ కనబడుతోంది కదా!
Page:572
ఇక రెండవ సిద్ధాంతాన్ని అనుసరించి, ఈ జగత్తుకు రచయిత అంటూ లేడని, ఇక్కడి కార్యకారణ వ్యవస్థ దానంతట అదే జనించి కొనసాగుతోందని చెప్పబడుతోంది. ఇప్పుడు సర్వ ప్రమాణములగు వేదములలోని మహావాక్యములు ప్రమాణంగా తీసుకొని చెప్పుకుందాం.
సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ॥ నే హనానాస్తి కించన॥ సోహమ్ ॥ అయమాత్మా బ్రహ్మ|| తత్త్వమసి|| బ్రహ్మమేవ ఇదమగ్ర ఆసీత్॥ జీవో బ్రహ్మేతి నా పరః॥ … మొదలైన వేదసారమగు (వేదములకు తలమానికం వంటి ఉపనిషత్తుల) మహా వాక్యములుగాని, (మత్తః పరతరమ్ నాన్యత్ కించిదస్తి, త్వమేవాహమ్) ఆప్త మహావాక్యములు గాని… మనం ప్రమాణంగా తీసుకొని పరిశీలిస్తే… ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మమే (లేక, పరమాత్మయే) కలదు… అని చెప్పబడుచున్నట్లే అవుతోంది కదా! అట్టి శ్రుతి వాక్యములను అనుసరించి సృష్టి యొక్క ’ఆది’ యందు అజ్ఞానియే లేడు. ఇక “అజ్ఞాని కొరకు ఈ కార్య కారణ రూప జగత్తును సృష్టించడం”… అనే వ్యవహారం ఎక్కడ నుండి వస్తోంది? కాబట్టి రామచంద్రా! నీవు చెప్పిన అధ్యారోపవాదం - అపవాదం మొదలైనవన్నీ బ్రహ్మమును బోధించటానికి కల్పించబడ్డాయేగాని… “బ్రహ్మము జగత్తుకు కారణం”… అని అంతిమంగా సిద్ధాంతీకరించటానికి కాదు. ఇక ఇక్కడ కనబడే పరమాణు కార్య కారణత్వం దృష్టి యొక్క పరిమితత్వపు స్థితికి ఉపాహారాలు అవుతున్నాయి. అద్వైత బోధమయులు - శాంత విజ్ఞాన ఘనరూపులు అగు జ్ఞానుల దృష్టి - ఈ కనబడే పదార్థ ధర్మాలను జీవుల పరస్పర సంబంధ బాంధవ్యాలను దాటివేసి ఉంటోంది. అందుచేత వారి పరిశీలనలో ఇవి అల్పవివరాలే అవుతున్నాయి గాని… సిద్ధాంతపరమైన ఆవశ్యకతకు అర్హమగుట లేదు. వారికి ఈ పరమాణు - వస్తు ధర్మాలకు సంబంధించిన కార్య కారణములకు బ్రహ్మమునకు అభేదమే ప్రస్ఫుటం అవుతోంది. ఎవరి దృష్టిలో ఏది విశేషమైన విషయమో… అదియే వారికి ఇక్కడ విషయమైన రూపంగా కనిపిస్తుంది సుమా! ఒక రూపమైన “నిద్ర’కు స్వప్న - సుషుప్తులు రెండు అవయవముల వంటివి కదా! ఆ రెండింటి యొక్క రూపం నిద్రయే కదా! అంతేగాని, ”స్వప్నం నిద్ర కాదు. ఏవో దృశ్యాలు”… అని ఎవరూ అనలేరు కదా! నిద్రయే స్వప్న సుషుప్తుల రూపంలో ఉంటున్నట్లు, బోధమయము - - అధిష్ఠాన రూపము అగు పరబ్రహ్మము నందే జ్ఞాన - అజ్ఞానములు రెండూ వెలయుచున్నాయి. అనగా… అజ్ఞత్వమునకు ’నేను అజ్ఞానిని’ అనే అనుభవం అద్దానియొక్క అంగమై భాసిస్తోంది. కాబట్టి అజ్ఞానము కూడా పరబ్రహ్మము కంటే వేరు కాదు. అజ్ఞానము అజ్ఞాన దృష్టి - అజ్ఞాన దృష్టికి కనిపించే సమస్త జగత్తు - - అధిష్ఠాన బ్రహ్మము… ఇట్లా ఇదంతా అజ్ఞానుల యొక్క బోధనార్థం వారి బుద్ధిని అనుసరించి శుద్ధ బ్రహ్మమును బోధించే నిమిత్తం మాత్రమే చెప్పబడటం జరుగుతోంది. అంతేగాని… బ్రహ్మము స్వరూపతః నిత్య - శుద్ధ - నిర్వికార పరమానంద సత్యమే అయివున్నది. అయివుండబోతోంది కూడా!
ఇక ఈ జగత్పదార్థాలకు వద్దాం. ఇవన్నీ కూడా (ఈ కనబడే దృశ్యమంతా కూడా) కల్పనానుసారంగా కారణ రహితములు కారణ సహితములు కూడా అయివున్నాయి. ఉదాహరణకు… “అగ్నిచే కాల్చబడటంచేత ద్రవం వాయువుగా మారగలదు” అని ద్రవం
Page:573
వాయువుగా మారటానికి కారణం మనం చెప్పుకోవచ్చు. “అగ్నికి వస్తువులను దహించే శక్తి ఎక్కడి నుండి వచ్చింది?” …అని ప్రశ్నిస్తేనో?… సమాధానమేమున్నది? ఈ ధర్మము ఏర్పడటానికి కారణం ఎవరు చెప్పగలరు? ఒకవేళ "ప్రకృతియే ఇదంతా నిర్వర్తిస్తోంది”… అని అంటే… ప్రకృతి ఎందుకు ఎవరి ఆజ్ఞకు లోబడి ఇట్లు ఈ ఈ ధర్మాలన్నీ కలిగి ఉంటోంది?… ఈ విధంగా ఈ సర్వం అకారణం. అయితే, ప్రతిదీ ఇట్లు ఉండటానికి ఏదో కారణం చెప్పవచ్చు కూడా! ఈ విధంగా సకారణంగాగాని, అకారణంగా గాని కల్పనను అనుసరించే ఈ జగత్తు ఉంటోంది. ఎందుకంటే ఈ బుద్ధిరూప సంవిత్తు ఎట్లు కల్పనచేస్తే… దానిని అట్లే నిజానుభవంగా పొందగలదు. ఒక జీవుని బుద్ధిరూప సంవిత్తు… “ఇదంతా నా ఇష్టదైవం యొక్క స్వరూపమే”… అని భావన చేస్తే, అంతాకూడా అట్లే అనుభూతవిషయమై గోచరిస్తుంది. అందుచేతనే అజ్ఞానులకు ఇదంతా స్వకీయ భావనానుసారంగా అన్యంగా అనుభూతమౌతుంటే అట్టి భావనను అనుసరించని (ఆత్మసాక్షాత్కారం పొందిన ఆత్మజ్ఞులకు ఇదంతా స్వస్వరూపమునకు అనన్యంగా అనుభూత మౌతోంది. “దృష్టియే సృష్టి. ద్రష్ట దృష్టికి కేవల సాక్షి - అతీతుడు కూడా!”… అని గమనించి, వారు సర్వదా సాపేక్షత్వము నుండి కేవలత్వం వైపుగా అడుగులు వేస్తున్నారు.
ఓ రామచంద్రా! అవిద్యయే ఈ సమస్త జగత్తుకు కారణభూతమై ఉన్నది. అట్టి అవిద్య జ్ఞానాభ్యాసముచే నశించినప్పుడు… అట్టి అనుభవశీలురగు తత్త్వవేత్తల దృష్టిలో ’సృష్టి’ అనే దానికి కారణమంటూ ఏదీ లేకుండానే పోతోంది. కాబట్టి వాస్తవానికి ఈ సృష్టి కారణరహితమై ఉన్నది. శ్రీరాముడు : మహర్షీ! మహాత్మా! "ఈ జగత్తు అకారణం. అందుచేత వాస్తవానికి లేదు. భావనానుసారమే అనుభూతమౌతోంది. ఆత్మజ్ఞానము అనుభూతమొనర్చుకొన్న వారి దృష్టిలో ఇదంతా ఆత్మకు అనన్యం. ఆత్మకు వేరైనదిగా ఉండటానికి కారణమేలేదు. కాబట్టి ఇది స్వతహాగా లేదు. కల్పనచే అనుభూతమౌతోంది.”… అనునది అప్రతిహతమైన, అత్యంత యుక్తియుక్తమైన మహావాక్యసారమే! ఇట్టి మహత్తరమైన ’గుర్తు’ను ప్రసాదిస్తున్న ఋషీశ్వరులగు మీకు సాష్టాంగ దండ ప్రణామములు. వేర్వేరు జీవులు వేర్వేరు అనుభవములు ఒకే విషయం గురించి కలిగి ఉండటం, ఒకే వ్యక్తి వివిధ సందర్భములలో వివిధ రీతులుగా ఈ జగత్ దృశ్య సంఘటనాదులు చూస్తూ ఉండటం “లోక విదితాయ విషయః” కదా!
ఇవన్నీ యుక్తి యుక్తమని నేను ఒప్పుకుంటున్నాను. అయితే… (“సృష్టికర్త స ఈశ్వరః” “ప్రత్యేకం తమ్ ఈశ్వరమ్”“మాయాంతు ప్రకృతిం విద్ది. మాయినంతు మహేశ్వరః” ఇత్యాది వేద పురాణ ఇతిహాస వాక్యాలచే) ఈ మాయోపహిత బ్రహ్మం కంటే వేరుగా తటస్థేశ్వరుడు ఒకరున్నారని, కొందరు అభిప్రాయం ప్రకటిస్తున్నారు. “ఈశ్వరుడు ప్రధానుడు. ఇది అప్రధానం” అని వారు అంటున్నారనుకోండి. మరికొందరు గురువులు “ఇది పరమాణువుల ప్రయోగంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ జగత్తు లేకుండా ఎందుకు పోతుంది?” అని ప్రశ్నిస్తూ తమ శిష్యులకు ప్రబోధిస్తున్నారు. మరి ఈ జగత్ - శరీరాలు లేవని నిర్ణయించటమెట్లా?
Page:574
శ్రీ వసిష్ఠ మహర్షి : “సంకల్పానుసారమే జగదనుభవం ఉంటోంది కాబట్టి, జగత్తుకు మూలం సంకల్పమే” అనునది విద్వజ్ఞుల ప్రత్యక్ష - శ్రుతి - స్వానుభవసారమై ఉన్నది. ఈ జగత్తు ఎట్లా నిర్మించబడినా, ఎవరు నిర్మించినా… ద్రష్ట మాత్రం తన దృష్టి ననుసరించి, దృష్టిలోంచి చూస్తున్నాడు కదా! ద్రష్ట సర్వ దృశ్యమునకు వేరై (స్వప్నద్రష్ట స్వప్నం కంటే వేరు అయినట్లుగా) లేడని, “కేవల తటస్థ - ప్రత్యేక రూపుడు కాదని ఎవరైనా నిరూపించగలరా? తత్త్వజ్ఞులకు “ఈ సృష్టి ఉన్నది. దీనికి ఎవరో కారణమైయున్నది”… ఇటువంటి వాక్యాలు అజ్ఞుల బోధ వాక్యాలవలె, ఆత్యంతికమైన సత్యము కావు అని సుస్పష్టంగా తెలియవచ్చుచున్నది.
అందుచేత రామచంద్రా! "ప్రకృతి వేరు - పురుషుడు వేరు, ద్రష్ట వేరు - దృశ్యము వేరు. ఈశ్వరుడు వేరు - జీవుడు వేరు”… ఇటువంటి మాటలన్నీ జ్ఞానము యొక్క పరాకాష్ఠ సమక్షంలో “వ్యర్థవాగ్జాలమేవతత్” …వ్యర్థ వాక్ ప్రవాహమేనని మేం అనుభవపూర్వకంగా ప్రకటన చేస్తున్నాం. అది తత్త్వజ్ఞుల హృదయానుకూలం కాదయ్యా! ఏ దృశ్యం ఘనీభూతంగా కనిపిస్తోందో…. అదంతా కూడా స్వప్నము వంటి కల్పన మాతమ్రే. బాల్యంలో చూచిన గ్రామము - సహబాలుర ఆకారాలు ఒక తాతగారికి జ్ఞాపకముండవచ్చు గాక! అవి నిత్య సత్యమగుచున్నాయా? కనుక ఈ ప్రదర్శన మయ్యేదంతా స్వప్నము వంటి కల్పన మాత్రమే. అంతేగాని… ఇక్కడ స్థూలాకారమైన దృశ్య కల్పన ఏదీ లేదు. అట్టిదాని కొరకై కారణ కల్పన యొక్క అవకాశమే లేదు. అయినా రామా! “స్వప్నంలో ఆ గోడ కనిపించింది కదా! దానిని ఎవరు కట్టి ఉంటారు?”… అని మెలకువ వచ్చిన తరువాత ఎవరైనా తర్క-వితర్కములు చేస్తున్నారా? ఎందుచేత చేయటం లేదు? “స్వప్నంలో నాకు కనిపించిన ఆ భవనం నా ఊహాకల్పితమే కదా!”… అని జాగ్రత్ సమయంలో ఎరిగి ఉండటం చేత. అట్లాగే ఆత్మజ్ఞానం పరిపుష్టి పొందనంతవరకు గురువులు శిష్యులకు అనేక కథనముల కల్పన చెప్పవలసి వస్తోంది. స్వప్నంలో కనిపించిన అరణ్యాలు, గృహాలు, ఆరామాలు, వ్యక్తులు - ఇవన్నీ చిత్స్వభావం కంటే వేరు కాదు కదా! ద్రష్ట యొక్క నిర్మల చిత్స్వభావం కంటే వేరైతే… అప్పుడు “ఆ స్వప్న పదార్థాలు ఎట్టివో, ఎవరిచే కల్పించబడినవో, ఎందుకు కల్పించబడినవో”… ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అయితే స్వప్న పదార్థాలు “మిథ్యారూపమే కదా” అని తెలియబడనంత వరకు అవన్నీ మహామోహాన్ని కలుగజేస్తున్నాయి. “మిథ్యా రూపమే!” అని ఎరుగబడిన తరువాత ఇక దుఃఖం ఉండదు. దుఃఖాన్ని అధిగమించటానికి ఇంతకు మించి ఉత్తమమైన ఉపాయం మాకు ఇంకేమీ కనబడటం లేదు. శుష్కతర్క హఠావేశాత్ యద్వాపి అనుభవవోజ్ఝతమ్ ।|
కల్ప్యతే కారణం కించిత్సా మౌర్యాభినివేశితా ॥
“స్వప్న దృష్టాంతం మేం ఒప్పుకోం. అయినా, స్వప్నం సంకల్పమయమే కావచ్చు గాక! స్పష్టంగా కనబడే ఈ జాగ్రత్ భ్రమ ఎట్లా అవుతుందిట? కాబట్టి ఈ సృష్టికి కర్త ఉన్నాడు. ద్రష్ట ప్రమేయం ఏమీ లేదు”… అందుచేత జగదనుభవానికి సంబంధించి ద్రష్ట సంకల్పిత దృష్టిని మేము పరిశీలించం - అని ఎవరైనా అంటారా? శుష్కతర్కమును గూర్చిన హఠము యొక్క ఆవేశంతో …
స్వప్నము, ఊహ, భావన మొదలైన మూలానుభవమును ఒప్పుకోక, “ఈ జగత్తు ఒకాయన
Page:575
కల్పించారు! పరమాణువుల సంయోగమే దీనికి కారణం. కాబట్టి ఇదంతా సకారణయుతమే గానీ, అకారణము కాదు”…అని అనటం మా ఉద్దేశంలో మూర్ఖత్వంతో కూడిన పట్టుదలలే అవుతుంది.
ఒకవేళ ఏదైనా “కారణం ఏదో ఉండాలి, చెప్పండి" అని అంటే… అగ్నికి ఉష్ణత్వం కారణమైనట్లు, జలమునకు ద్రవత్వం కారణమైనట్లు, సమస్త తేజస్సులకు ప్రకాశము కారణమైనట్లు… సర్వ పదార్థములకు కూడా, అజ్ఞానోపహితమగు ‘బ్రహ్మము’ యొక్క ’స్వభావం’ తప్ప మరింకేమి
కారణం కాగలదు?
మనోరథ కల్పన (ఊహా కల్పన)లో పురాణ కథ పాత్రలు పురాణోపాసకునికి కనిపిస్తాయి చూచావా? అట్లాగే ధ్యాత కల్పనా భేదం చేతనే ధ్యేయము అగు ఈ జగత్తు ఆకార భేదం సంభవిస్తోంది. మరప్పుడు ఈ జగత్తుకంతటికీ ఏదో ఒకటే కారణమని చెప్పటం ఎట్లా కుదురుతుంది? కుదరదు. అనేక ధ్యాతల అనేక ధ్యేయములకు ఒకే కారణం ఎట్లా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే… గంధర్వ నగరంలో (మనోకల్పిత లోకం గంధర్వలోకం) కనబడే మేడకు కారణం ఏది ఉంటుంది?
ఇప్పుడు కొందరి సిద్ధాంతాలను మన చర్చ - అవగాహనల కొరకై ఇక్కడ ప్రస్తావించుదాం. కర్మమీమాంసకులు: వీరు “ఈ దేహం రావటానికి పూర్వకర్మలే కారణం" … అని ఈ దేహానికి కారణం చెప్పుచున్నారు. అట్టి కర్మమీమాంసకుల యొక్క కర్మలు, కర్మఫలాలు, తద్వారా ఈ శరీరం” …అను శాస్త్ర కల్పన సంపూర్ణమైనది కాదు. ఎందుకంటావా? పరలోకమందలి ధర్మ అధర్మములు అమూర్తములు (నిరాకారాలు) కదా! మరి ఈ దేహాదులేమో… సాకారములయ్యే! అమూర్తములగు ఇతఃపూర్వపు ధర్మాధర్మములు ఈ దేహాదులకు ఉపాదాన కారణం కావటం ఎట్లా కుదురుతుంది? దేహమునకే అవి కారణం కానప్పుడు… ఇక సువిశాలాకారయుక్తమైన సృష్టి
- - దృశ్యములకు కారణమెట్లా అవుతుంది? కనుక “ఈ సృష్టికి జీవుల పూర్వపూర్వ కర్మలే కారణం”… అని అనటం యుక్తియుక్తంగా లేదు. కనుక "కర్మలు, కర్మఫలాలు” అను కర్మమీమాంసకుల సిద్ధాంతం ఈ దృశ్యం/ జగత్తు యొక్క ఉత్పత్తి - ఉనికిల గురించి సమగ్రంగా నిర్వచించటం లేదని మేము భావిస్తున్నాం.
క్షణికవాదులు : ( వీరు విజ్ఞానవాదులలో ఒక తెగవారు). వీరు మరొక తీరైన అవగాహన ప్రతిపాదిస్తున్న వారు. “ఈ జగత్తులో ప్రతిదీ ఇతఃపూర్వం ఒక తీరుగా ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఉన్నది. ముందు ముందు మరొక తీరుగా ఉండబోతోంది. మహాప్రవాహం ఒకసారి ఒక క్షణంలో ఒక ఆకారాదులతో కనిపించి, మరుక్షణం మరొక ఆకారం పొందుచున్నట్లే ఈ జగత్తులో ప్రతిది క్షణికం. క్షణికం కానిదంటూ ఏదీ లేదు. జీవులు, వీరి మనోభావాలు ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు పొందుతూనే పోతూవుంటాయి. కనుక జగత్తు క్షణికం.”
వారి దృష్టిలో ఈ జగత్తు నిరాకారం, క్షణికం. ఇక్కడ సర్వము సర్వదా నశించటం, పునరుత్పత్తి పొందటం అనంతకాలంగా ఇట్లే జరుగుతూ పోతోందని వారి అభిప్రాయం. అయితే ఇది ఇట్లు కొనసాగటానికి ఉపాదాన కారణం ఏది? అది వారి సిద్ధాంతము చర్చించటం లేదు. కనుక క్షణికవాదుల జగత్ నిర్వచనం అసమగ్రమైనదే అగుచున్నది.
Page:576
చార్వాకులు : వీరు… అంతా తనంతట తానే జరుగుతోందని, దీనికి వెనుక ‘పరమాత్మ’ అనబడే వారెవరూ లేరని చెప్పుచున్నారు. “వానకురిస్తే వస్త్రం తడుస్తోంది. విత్తనం మొలకెత్తే స్వభావం కలిగియున్నది. ఆయా వస్తువులు వస్తు స్వభావం కలిగియున్నాయి” అని వారు ప్రతిపాదిస్తున్నారు. ఇది ఈ దృశ్య నిర్వచనమునకు సరిపోదు. ఎందుకంటే…
బీజము స్వభావం = అనగా = బీజము యొక్క స్వభావం
ఇట్లా పదప్రయోగం చేయటంలోనే… షష్ఠీ తత్పురుష అగు “యొక్క” అనే పద ప్రయోగం చేస్తున్నారు కదా! వస్తువు వేరు - స్వభావం వేరని, వస్తువు స్వభావం కంటే ఉన్నతమైనదని చెప్పినట్లే కదా! "కాబట్టి స్వభావమే జగత్తుకు కారణం ఆ స్వభావం ఎవ్వరిదీ కాదు”… అనే నిర్వచనం జగత్తును అర్థం చేసుకోవటానికి సరిపోదు.
కాబట్టి రామచంద్రా! ఈ సమస్త పదార్ధములు, వాటి వాటికి మూలమైనట్టి పంచభూతములు .. ఇవన్నీ కారణరహితం. అయితే, అజ్ఞానదృష్టిచేత (లేక పరిమితమైన పరిశీలనచేత) కారణ సహితమైన వాటివలె భ్రాంతిచే భాసిస్తున్నాయి. జ్ఞాని దృష్టియందో… సర్వకార్యములు చిద్రూపములే అయివున్నాయి. ఎందుకంటే సర్వ పదార్థములు, ఆ పదార్థములను విషయములుగా గలిగియున్నట్టి సర్వభావాలు… అన్నీ కూడా చైతన్యమునందే, చైతన్య చమత్కారం చేత చైతన్యమునకు అనన్యంగా ఆవిర్భవించి తిరిగి చైతన్యమునందే తిరోభావం చెందుచున్నాయి. స్వప్నంలో కనిపించిన దొంగలు స్వప్నంలో చేసిన హంగామా, స్వప్నంలో బాధించటం-బాదటం-భయపెట్టటం మొదలైనవి స్వప్న సమయంలో బాధిస్తాయేమో గాని, మెలకువ రాగానే? అవి దుఃఖ కారణాలు కాదు కదా! జన్మ మృత్యువుల మధ్యగల దేహము యొక్క శబ్ద-స్పర్శ - రూప - - రస - గంధ మాత్రములే అయినట్టి ముల్లోక విశేషాలు ద్రష్టయొక్క వాస్తవ చిద్రూపము ఎరిగినప్పుడు ఏ మాత్రం భేద-మోదాలు కలిగించవు. వాస్తవానికి ఈ దృశ్యము సృష్ట్యాదియందే ఉత్పన్నమై ఉండలేదు. చిదాకాశమే స్వప్నంలోలాగా ఇట్లు పదార్థ రూపంగా కూడా భాసిస్తోంది. చిదాకాశము కంటే వేరుగా ఇక్కడ
ఏదీ ఏ సమయమందుకూడా లేనేలేదు.
ఇట్టి " చిదాకాశ జగత్ న్యాయం” కంటే వేరుగా మరొక కల్పనాయుక్తి ఏదీ ఇక్కడ కనబడటం లేదు. కాబట్టి, జగత్ కల్పన బ్రహ్మానుభవమాత్రమే అయివున్నది. అదియే బ్రహ్మీదృష్టి, బ్రహ్మానందం, ఆత్మసాక్షాత్కారం, మోక్షము మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుతోంది. “ఈ జగత్తంతా బ్రహ్మ స్వరూపమే”… అనే వాక్యం మాకు (తత్త్వజ్ఞులకు) వేద వేదాంత మహావాక్యార్థంగాను, స్వానుభవం గాను ఉభయత్రా సుస్పష్టమవుతోందని సర్వలోకులకు ఎలుగెత్తి గానం చేస్తున్నాం.
శుద్ధ జలంలో తరంగాలు - ఆవృత్తములు సాకారంగా కనిపిస్తున్నట్లు మాకు బ్రహ్మమునందు ఈ జాగ్రత్-స్వప్న జగత్తులన్నీ నిర్దుష్టంగా, సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మమునందు బ్రహ్మరూపంగా ఈ సృష్టి భాసిస్తోంది. బ్రహ్మము, సృష్టి… ఈ రెండూ పర్యాయపదాలే!
Page:577
నిర్మల వాయువునందు వాయుతరంగాలు, ఆవర్త - వివర్తాదులవలె (అవన్నీ వాయువే
ఆయా తత్త్వములుగా అయివున్నట్లు)… ‘బ్రహ్మము’ అనే వాయువు నందు ఈ “సృష్టి" అనే
“స్పందము” ప్రకటితమౌతోంది.
మహాకాశమునందు… 1. అనంతత్వము, 2. ఛిద్రత్వము, 3. శూన్యత్వము… ఈ మూడు ఎట్లా ప్రదర్శితమగుచున్నాయో… అట్లాగే సద్రూపమగు చిదాకాశమున బోధాత్మకమై పరాపర రూపంగా “అనంతము - ఛిద్రత్వము - శూన్యము” అగు ఈ జగత్తు వర్తించుచున్నది. స్వప్నంలోను, ఊహ (సంకల్పం)లోను ఎట్లాగైతే అసన్మయమైన పదార్థాలు చిద్రూపములుగా (స్పష్టంగా తెలియవచ్చే ఉనికి గల పదార్థాలుగా) స్పష్టంగా ఎరుగబడుచున్నాయో… అట్లాగే ఈ జాగ్రత్లో ఇవన్నీ తెలియ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సత్చిత్ రూపమగు పరబ్రహ్మము కంటే ఏమాత్రం వేరుకాదు.
శుద్ధమైన గాఢనిద్ర యందు - స్వప్నము, సుషుప్తి ఎట్లా వర్తిస్తున్నాయో… అదేవిధంగా ఆత్మరూపమగు పరబ్రహ్మమందు - - సృష్టి, ప్రళయములు …వర్తిస్తున్నాయి.
ఒకడు నిద్రలో ఒక స్వప్నము నుండి… అనేక స్వప్నాంతరములు పొందుచున్నాడు చూచావా? అట్లా జన్మాదులు కించిత్ కూడా లేనట్టి పరమాత్మయే స్వసత్తయందు ఒక సృష్టి. ఆ సృష్టికి అన్యములగు అనేక సృష్టులు పొందుచూ… ఆయా సర్వ సృష్టి రూపములుగా వర్తిస్తున్నాడు.
నిర్వికారమగు బ్రహ్మాకారంలో వాస్తవానికి పృథివి మొదలైన ఆయా వస్తుజాలమంతా లేనే లేదు. కానీ… ’స్వప్నానుభవం’గా ఈ ఈ పృథివి మొదలైన వాటితో కూడినదై, (స్వప్నములోలాగా) పొందుచున్నది.
ఈ కనబడే సృష్టి పరమాత్మయందు పరమాత్మకు అనన్యమైయున్నది. అట్లాగే ఇతఃపూర్వపు సృష్టులు, ఇక ముందు ముందు సృష్టులు పరమాత్మ రూపములే! ఆ పరమాత్మకు అభిన్నం! కాబట్టి రామా!… సృష్టి, బ్రహ్మం… ఈ రెండు శబ్దాలు ఒకటి మరొకటికి అర్థముగా అయి ఉన్నాయి.
ఇక “బ్రహ్మమునందు సృష్టి”… అనే మాట ఎక్కడిది? అది కల్పిత కథా శ్రవణం కాక మరి ఇంకేమిటి? సమస్త శబ్దాలు, ఆ శబ్దాలకు అర్థాలైన దృశ్యాంతర్గత విశేషాలూ… బ్రహ్మమే! అంతా బ్రహ్మమే (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అయివుండగా ఇక శాస్త్రాలు శాసించేదెక్కడ? దేనిని? వేరుగా “మోక్షఫలం” అనేదెక్కడ? అప్పుడిక "ప్రాపంచిక బంధములు” ఎక్కడుంటాయి? శాస్త్రములు, అందలి కథా విచారములచే ప్రయోజనం ఏముంటుంది? (శాస్త్రానపి సంత్యజ్యతి)
వాసనా రహితమగు “దృష్టి"యే మోక్షం - అట్టి మనుజునకు ఈ జగత్తులో సిద్ధించవలసిన దేముంటుంది? భావాతీతమైన స్థితిలో సృష్టులే లేవు. ఈ ప్రపంచంగా కనిపించేదంతా భావాతీత చిదాకాశతత్త్వమే!
ఓ రామచంద్రా! ప్రపంచం పట్ల కలిగి ఉన్న వాసనలే స్వప్నంలో నగరాలు, తదితర దృశ్యాలుగా భాసిస్తున్నాయి కదా! అట్లాగే జగత్తులో జగత్తుగా కనిపించేదంతా ద్రష్ట యొక్క దృశ్య వాసనారూపమే!
Page:578
వాసనల చేతనే బోధసత్తా స్వరూపమగు దృశ్యము పరిపరి విధములుగా అనుభూతమౌతోంది. వాసనలు లేకపోయినప్పుడు ఇదంతా కూడా చిత్ సత్తా స్వరూపమగు స్వస్వరూపాత్మయే!
ఐందవోపాఖ్యాన బ్రహ్మగీత సప్రతిఘ - అప్రతిఘాన్యాయం
శ్రీరాముడు : మహర్షీ! నాకు ఈ సందర్భంలో “సప్రతిఘ - అప్రతిఘ” అనే ఇతఃపూర్వం నేను వినియున్న ఒకానొక విశేషం గురించి అడగాలని అనిపిస్తోంది.
హే మహాత్మా! ఈ మూడు లోకాలలోని విశేషాలన్నీ క్రోడీకరించి రెండు విభాగాలుగా విభజించవచ్చు - 1.మూర్తములు (లేక) సాకారములు (సప్రతిఘములు). 2. అమూర్తములు (లేక) నిరాకారములు (అప్రతిఘములు). వీటిలో కొన్ని ఒక దానిని మరొకటి తాకుచున్నాయి. అనగా అవి ఒకదానితో మరొకటి కూడి ఉంటున్నాయి. ఇక మరికొన్నియో… ఒకదానితో మరొకటి ఉండటమే లేదు.
ఏదైతే మరొక దానిని చలింపజేస్తోందో… అవి సప్రతిఘములని, ఏది మరొక దానిని స్పృశించటం గాని - చలింపజేయటం గాని చేయటం లేదో… అవి అప్రతిఘములని చెప్ప బడుచున్నాయి.ఈ ప్రపంచంలో సప్రతిఘ పదార్థములగు భౌతిక పదార్థములు పరస్పరం కూడి ఉండటం, చలింపజేయటం చూస్తున్నాం. అప్రతిఘములైనవి (నిరాకారాలైనవి) సాకారాలను చలింపజేయటం గాని, సాకారములతో కూడి ఉండటంగాని జరగటం లేదు. ఉదాహరణకు అగ్ని గడ్డిపరకను తగలబెట్టగలదు గాని, ఆకాశమును తగలబెట్టలేదు కదా! ఈ పాత్రను చేత్తో అక్కడ పెట్టవచ్చు గాని… ఒక ఆలోచనతో ఈ పాత్ర అక్కడికి వెళ్ళదు కదా!
స్వామీ! ఇక క్రమంగా నా అసలు సందేహమేమిటో చెప్పటం ప్రారంభిస్తున్నాను… వినండి. ప్రతి జీవునిలోను “సంవేదం" అని చెప్పబడే అనుభవరూపమైన (లేక) వృత్తిరూపమైన జ్ఞానం ఉన్నది. అట్టి వృత్తి జ్ఞానంతో ఒకడు ఆకాశంలో చంద్రబింబాన్ని ఇక్కడి నుండి చూస్తున్నప్పుడు… నేత్రజ్యోతిని అనుసరించు చిత్తముతో సహా బయలుదేరిన చైతన్య వృత్తులతో చంద్రబింబాన్ని చూస్తున్నాడు. అట్టి ’జ్ఞానము’నకు రూపంలేదు (అమూర్తం). ఆ చైతన్య వృత్తులు నిరాకారమై… సాకారమగు చంద్రబింబంలో సంవేదనం పొంది “ఇది చంద్రబింబ రూపం”… అనే అనుభవానికి కారణమౌతున్నాయి.
జ్ఞానమునకు రూపం లేదు. కానీ, చూపును నడిపించేది జ్ఞానం కదా! ఆ చూపులు రూపంగల చంద్రబింబం చూపగలుగుచున్నాయి. ఇది అందరి అనుభవమే కదా!
ఈ "చూపు ఒకచోట నుండి బయల్వెడలి చంద్రబింబం చేరే ప్రయత్నంలో… మొదటి వస్తువును వదలిన తరువాత… చంద్రుని ఇంకా చేరకముందు గల నిర్విషయ దృష్టి సత్తాయే ఆత్మ” అని మీరు ఇతఃపూర్వమే చెప్పారనుకోండి. ఆ విషయం కాసేపు ప్రక్కకు పెడదాం. ఎందుకంటే
Page:579
కేవలం ప్రబుద్ధుని దృష్టిని అనుసరించిగాని, లేక కేవలం అప్రబుద్ధుని దృష్టినిగాని అనుసరించి ఇప్పుడు నేను చెప్పటం లేదు. ఒక అర్ధ ప్రబుద్ధుని దృష్టిలోంచి ఈ విషయం విశ్లేషిస్తున్నాను. అట్టి అర్ధ ప్రబుద్ధుని సంకల్ప - వికల్ప రూపమైన “ఈ జగత్తు ఉన్నది”… అని అనుకుని ఈ ప్రశ్న అడుగుచున్నాను. అంతేగాని, జ్ఞాని దృష్టి చిన్మాత్రానుభవం నుండి కాదు.
హే ప్రభూ! ప్రతి జీవునిలోను హృదయమున ఒకానొక తత్త్వము (లేక, శక్తి) ఉండి, అంతటా వెలసియున్న ప్రాణ వాయువును క్షోభితం చేసి… ఆ ప్రాణవాయువులను ముక్కు రంధ్రం నుండి లోపలికి - బయటకు చాలనం చేయిస్తోంది. అట్టి హృదయాంతర్గతమైన ప్రాణవాయు చలనం నిర్వర్తించే తత్త్వం కేవల జ్ఞాన స్వరూపమే కదా!
వింటున్నారా స్వామీ! - ఒక వ్యక్తి తన భుజముపై బియ్యపు మూటను మోస్తున్నట్లు రూప రహితమగు ఆ జ్ఞాన తత్త్వము రూప సహితమగు ఈ ప్రాణవాయువులు చాలనం చేయటం, దేహమును క్షణక్షణం రక్షించటం ఎట్లా చేస్తోంది? నిరాకారమగు జ్ఞానము సాకారమగు ప్రాణములను చలింపజేయటం ఎట్లా జరుగుతోందో… నాకు ప్రశ్నార్థకమై ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ మనందరి హృదయములోని జ్ఞానశక్తి మహత్తరమైన మాహాత్మ్యము కలిగివున్నదని అంటారా? అప్పుడు ఈ మనుజుని సంకల్పం “ఆ చెట్టు కొమ్మపై గల రంగురంగుల పక్షి నా భుజంపై వచ్చి వ్రాలాలి”… అని అనుకోగానే జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ పక్షి వచ్చి భుజంపై వ్రాలాలి కదా! మరి అట్లా జరగడం లేదు కదా! ఎందుచేత?
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఈ నీ ప్రశ్న ఈ సందర్భంలో నాకు కూడా చమత్కారంగానే కనిపిస్తోందయ్యా! సరే! విను. కమ్మరివాని కొలిమి తిత్తిలోకి అంతటా ఉన్న వాయువులోని కొంచెము విభాగం వేగంగా ప్రవేశించి… మరల ఆ కమ్మరివాని చేతుల స్పర్శ సంవేగానికి కొలిమి తిత్తిలోంచి బయల్వెడలుతుంది చూచావా? అట్లాగే ఈ వాయువు హృదయములోకి రాక-పోకలు సలుపుతోంది. ఎప్పుడైతే హృదయ ప్రదేశంలోగల నాడి సంకోచం - వికాసం పొందుచున్నదో. అప్పుడు ముక్కుపుటముల ద్వారా వాయువు హృదయంలోంచి బయల్వెడలటం - - హృదయంలోకి ప్రవేశించటం జరుగుతోంది.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ కొలిమితిత్తి విషయంలో అయితే,… చేతన రూపుడగు కమ్మరివాడు కొలిమితిత్తులకు చేతుల తాడనంతో వాయువు యొక్క సంకోచ వ్యాకోచములు జరగటానికి కారణమగు చున్నాడు. మరి గుండెలో ఏ కమ్మరి ప్రవేశించి… గుండెలను అరచేతులతో మర్దించి ప్రాణవాయువులు ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తించేటట్లు చేస్తున్నాడు?
హే మహాత్మా! మీరు ఆశ్రమంలో ఈ దేహ స్వరూప - స్వభావాల గురించి మాకందరికీ బోధించియున్నారు. (“శతంచఏకాచ- హృదయస్య నాడ్యః” - - అను శ్రుతి వాక్యాలు సూచిస్తున్న ట్లుగా) హృదయ ప్రదేశంలో 101 నాడులు ఉన్నాయి. అందులో ప్రతి నాడి నుండి చెట్ల శాఖల వలె మొత్తం 72000 ఉపనాడులు బయల్వెడలినవై ఉంటున్నాయి. ముక్కుపుటాల నుండి హృదయం
Page:580
లోకి ప్రవేశించిన వాయువు ఆ 101 నాడులలోకి, అక్కడి నుండి 72000 ఉప నాడులలోకి -
గుండ్రటి రాయిపై పడ్డ కడివెడు జలంవలె ప్రసరిస్తోంది. కాబట్టే ఆ నాడులచే ఈ దేహము యొక్క సర్వాంగములు సంచలనం పొందగలుగుచున్నాయి. అంతేకాని, ఒక్కొక్క అంగము తనంతటతానే కదలగలగటం లేదుకదా! ఒక్కొక్క అంగమును కదలటానికి, ప్రవర్తించటానికి, ఈ జీవుడు తలచినట్లు ఉపయోగించటానికి ఈ వాయువు యొక్క నాడి - ఉపనాడులలో ప్రవేశ నిష్క్రమణము అను విశేషమే కారణం.
కొన్ని నాడులు ఒక అంగము కదలటానికి కారణమౌతున్నాయి. అన్ని అంగములు చలనం పొందాలంటే దేహములోని అనేక నాడి ఉపనాడులు కదలవలసి వస్తోంది. అవి కదలాలంటే ప్రాణ వాయువుల సంచలనం అవసరం.
నాడి ఉపనాడులలో
హృదయంలోని వాయు వాయువు యొక్క అంగముల
జ్ఞానం సంచలనం ప్రసరణ - నిష్క్రమణం సంచలనం
(A B
ఇక…
జ్ఞానం నాడుల సంచలనం
A B
నిరాకారం సాకారం
ఒకవేళ… నిరాకారమగు చైతన్యము యొక్క పాత్ర లేకుండానే వాయువు యొక్క ప్రసరణము చేతనే నాడులు సంచలనం పొందుతున్నాయని అందామా? మరి అదే వాయువు యొక్క స్పందముచే రాయి - కట్టెలోకూడా సంచలనం కనిపించాలి కదా? మరి మనిషియొక్క ఇంద్రియ సంచలనంలాగా రాయి - కొయ్యలో జరగటం లేదే? అవి అచేనతములై ఎందుకుంటున్నాయి?
కమ్మరి ఊది తిత్తిని పనిచేయిస్తున్నట్లు, అదే వాయువుచే స్పర్శించబడే రాయి మొదలైన అచేతనములు ఎందుకు చలించటం లేదు! జంగము అగు ఈ దేహాలు మాత్రమే వాయు సంచలనంచే చలనం పొందుచున్నాయేం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవ చైతన్యమే ఇక్కడి కమ్మరివాడు. అదియే వాస్తవానికి కార్యకారణములను అనుశాసించే ప్రభువు. సర్వ కార్యకారణములకు భోక్త కూడా అదియే!
అట్టి జీవచైతన్యము తనయొక్క కార్య - కారణముల యజమాన్యము - - భోక్తృత్వము ఏమరచి… అనాదికాలంగా ప్రవాహ పతితములైనట్టి - కామ్య, కర్మ, వాసన… ఈ మూడింటికీ దాసోహమ్ అగుచున్నది. ప్రాణవాయువుతో తాదాత్మ్యం అయి “ధ్యాస” పొందుచున్నదై ఉంటున్నది.
ఆ విధంగా ప్రాణవాయువుతో అభేదాభిమానము పెంపొందించుకొని ఉన్న ఆ యొక్క అభ్యంతర జీవచైతన్యము స్వతంత్రంగా… ప్రాణవాయువుల సంచలనమును, అభ్యంతర నాడీ సమూహమును, తద్వారా ఈ దేహమును, ఈ దేహం ద్వారా బాహ్య ప్రదేశమును… (కమ్మరివాడు
Page:581
కొలిమి తిత్తిని చలింప జేయుచున్నట్లు) చలింపజేయుచున్నది. కనుక ఇక్కడి హృదయము యొక్క ప్రాణ వాయువు యొక్క ఆగమన - నిష్క్రమణములను - ఒకడు ఈ రెండు చేతులను కదల్చుచున్నట్లు అనునిత్యంగా - అసంకల్పిత - సంకల్పిత రూపంగా జీవ చైతన్యము అనుసంధానం నిర్వర్తిస్తూ ఉన్నది. తదనుసారంగానే ఈ ప్రపంచమున సర్వులు బాహ్యమున వ్యవహరించుచున్నారు. కనుక ఈ బాహ్య జగదనుభవములకు కూడా అనుసంధాన కర్త జీవ చైతన్యమే! శ్రీరాముడు : స్వామీ! అదియే నా ప్రశ్న.
ఈ దేహమునందలి వాయువులు, నాడులు… సాకారములు కదా! ఇక జీవచైతన్యమేమో …నిరాకారం! నిరాకార జీవచైతన్యం సాకార ప్రాణనాడులను ఎట్లా చలింపజేయటం జరుగుతోంది? అంతేకాదు! అదే జీవ చైతన్యము ఒక వైపు ప్రాణ - నాడి - ఉపనాడులను - కదుల్చుచున్నప్పటికీ కూడా… “నాకు దాహం వేస్తోంది. కనుక… అక్కడ దూరంగా బల్లపై ఉన్న గ్లాసు ఆ బిందెలో మునిగి ఆ గ్లాసుడు నీళ్ళు నా సమీపానికి వచ్చుగాక!” అని అనుకుంటే … అట్లా జరగటం లేదు. మరి ఎందుకు అట్లా జరగటం లేదు?
కాదూ! “సాకార – నిరాకార పదార్థముల యొక్క పరస్పర సంబంధం సంభవిస్తూనే ఉంటుంది” అని అంటారా? అట్లా అయితే అప్పుడు ఆ జీవచైతన్యము తనకు తానే మాట్లాడటం - గ్రహించటం - విహరించటం మొదలైన సర్వ కార్యములకు కర్త అయి ఉండి …. తానే నిర్వర్తించవచ్చు కదా! ఇక ఈ ఇంద్రియములు ఉండవలసిన పనేమున్నది? వాటి వలన ప్రయోజనమేమున్నది? కానీ … ఇంద్రియాలు ఉంటేగాని, మాట్లాడటం - గ్రహించటం - విహరించటం జరగటం లేదు కదా!
హే మహర్షీ! ఈ బాహ్యమున ఎట్లాగైతే సాకార - నిరాకార పదార్థముల పరస్పర సంబంధం ఉండటం లేదో… అట్లాగే అభ్యంతరంలో కూడా ఈ నిరాకార - సాకార పరస్పర సంబంధం ఏర్పడటం జరగదనే నా అభిప్రాయం. అందుచేత స్వామీ! ఇంకేదైనా యుక్తి ద్వారా ఈ నిరాకారమగు జ్ఞానము సాకారమగు కార్యక్రమాలకు ఎట్లా కారణమో (లేక) ఈ సాకారములగు ప్రాణవాయువు దేహ సంచలనాలకు, జడవస్తువులను కదిలించటానికి మరింకేదైనా విశేషమున్నదేమో చెప్పండి.
లేదా? …నా ప్రశ్న మరొక వైపునుండి అడుగుతాను. మీరు ‘యోగిరాట్’ కదా! అట్టి తమరు తమ అంతఃకరణంలో సాకార - నిరాకారములు పరస్పర సంబంధాన్ని మీ యోగబలంతో… ఏ ఉపాయం ద్వారా… మీరు అనుభవిస్తున్నారో… అది చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వసందేహములను తొలగించగల “ఏకమేవా ద్వితీయం బ్రహ్మ” అనబడు “సమస్తము యొక్క ఏకత్వము” …యొక్క అనుభవమే నీ ఈ సుదీర్ఘమైన ప్రశ్నకు సమాధానమై ఉన్నది. తత్త్వసాక్షాత్కారం యొక్క “సమస్తము యొక్క ఏకత్వానుభావం”… గురించి ఇక్కడ ప్రసంగిస్తున్నాను… విను.
నే హకించిన్న నామాస్తి వస్తు “సప్రతిఘం” క్వచిత్ | సర్వదా సర్వమేవేదం “శాంతమప్రతిఘం” తతమ్ ||
Page:582
ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో ‘సప్రతిఘం’ అని నీ పదజాలంచే చెప్పబడే ‘సాకారం’ అనేదేదీ లేనేలేదు. ఈ కనబడేదంతా కూడా సర్వవేళలా సర్వదా శాంతము, సర్వ వ్యాపకము, నిరాకారము - అగు బ్రహ్మమే అయివున్నది. స్వప్నంలో అనేక పదార్థజాలం కనిపించవచ్చుగాక! అదంతా సాకారమా? కాదు. నిరాకారమే (అప్రతిఘమే) కదా! ఒకడు తన సంకల్పంతో దర్శించే జగదృశ్యం ఆ చూచే వానికి చూచేటప్పుడు సాకారంగా కనిపించవచ్చుగాని, వాస్తవానికి
సంకల్పము నిరాకారమే కదా! అట్లాగే… ఈ కనబడే సర్వదృశ్యము… ఈ మట్టి రాయి, నేల,ఆకాశం, ఇళ్ళు, వాకిళ్ళు, దేహాలు, భావాలు, అనుభవాలు… ఇవన్నీ నిరాకారము, శాంతము, శుద్ధజ్ఞాన మయము - అయినట్టి బ్రహ్మమే! (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ). అట్టి నిరాకార శుద్ధ బ్రహ్మంలో… సాకారం (సప్రతిఘం) అయినట్టి జగత్తు ఉత్పన్నమవటానికి కారణమే లేదు. ఈ జగత్తుకు కారణమే లేదు. కాబట్టి… ఇద్దానికి ఆద్యంతములు లేకయే ఉన్నాయి. అంతేకాదు. జగత్తుగా కనిపించే ఆకాశం భూమితో కూడిన దృశ్యము భ్రాంతి రూపమే అయివున్నది. స్వప్నంలో స్వప్నద్రష్ట చైతన్యమే భాసిస్తున్నట్లుగా… ఈ సమస్త రూపముగా అప్రతిఘమగు (నిరాకారమగు) చైతన్యమే భాసిస్తోంది.
“ఈ జగత్తు నాకు ఇట్లా ఎందుకు పదార్థ రూపంగా, సాకారంగా భాసిస్తోంది?”… అని అడుగు తావా? ఇదంతా ‘సాకారంగా చూడటం’ అనే అభ్యాసం చేత వాసనారూపం పొంది ఈ రూపంగా అనుభవమౌతోంది. (లేక) సాకారంగా అనిపిస్తోంది. అందుకే, తత్త్వమును శ్రవణం చేసిన తత్త్వజ్ఞులగు వారు ఇది సాకారమా? నిరాకారమా? అనే చర్చను ప్రక్కకు పెట్టి మునుముందుగా "వివేక, వైరాగ్య, త్యాగ, శ్రవణ, మనన, నిధిధ్యాసన” మొదలైన ఆయా సర్వ ప్రయత్నాలను నిర్వర్తించి నిర్మలమైన, జ్ఞాన పరిపుష్టమైన దృష్టికై ప్రయత్నశీలురై ఉంటున్నారు. అట్టి సాధనముల ద్వారా… సాకారంగా అనిపిస్తున్న దృశ్యము పట్ల వాసనా సహితంగా తుడిచి వేయబడిన ’దృష్టి’ని పెంపొందించు కుంటున్నారు. ఇకప్పుడు ఈ అంతరిక్షం, నేల, వాయువు, ఆకాశం, పర్వతాలు, నది, సముద్రాలు, వాయుచలనాలు, దేహాంతర్భాగాలు… ఇవన్నీ “నిరాకారబోధ స్వరూపాలు”గా ఎరుగుచున్నారు.
ఓ రామచంద్రా! ఈ సందర్భంలో “ఐందవ బ్రహ్మాండములు” గురించి చెపుతాను. విను. ఇంతకు ముందు ఉత్పత్తి ప్రకరణంలో “ఐందవ జగత్తులు“ గురించి ఐందవోపాఖ్యానంలో… ”జగత్తు మనోమయం. ఇదంతా క్షణోత్పత్తి ప్రదర్శనం” అని నిరూపించటానికి చెప్పటం జరిగింది. ఆ ఐందవోపాఖ్యాన విశేషాలే ఇప్పుడు కించిత్ కథా పరిచయంతో “ఈ జగత్తుగా కనిపించేదంతా నిరాకారమగు చిన్మాత్రమే”…అని చూపటానికి, నిరూపించటానికి మరల ఉదహరిస్తాను. “నిరాకార మగు చైతన్యం (అప్రతిఘం) సాకారమగు ఈ శరీరాదులను (సప్రతిఘములను) ఎట్లా చలింప జేస్తోంది?” …అనే నీ ప్రశ్నకు సమాధానంగా ఈ ఐందవోపాఖ్యాన సోదాహరణమును ఇచ్చట ఉపయోగిస్తున్నాను. ఇది వింటే “ఈ నదీ - పర్వత-భూమ్యాది సహితంగా ఇదంతా ఈ దేహదేహాంతర్భాగములతో సహా చిన్మాత్రమే!” …అనే విషయం అనుభూతం కాగలదు.
Page:583
ఈ అనంత జగత్ సమూహ-సహిత-సదృశ బ్రహ్మాండాలలో కనిపించే ఒకానొక బ్రహ్మాండం లోని ఒకానొక జగత్తులో “ఇందువు” అనబడే శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తపస్సు, వేదాధ్యయనము, వేదోక్తములైన కర్మానుష్ఠానములకు అందరికి ఆదర్శప్రాయుడై ఉండేవాడు. ఆయనకు కాలక్రమేణా పదిమంది పుత్రులు కలిగారు. ఆ పదిమంది కుమారులు మహాశయులై (ఉత్తమమైన ఆశయాలు కలవారై) మహాత్ముల, మహనీయుల, సజ్జనుల పట్ల సేవానిరతులై ఉత్తమమైన కర్మానుష్ఠానంతో తమ తండ్రివలె లోకప్రసిద్ధి పొందుతూ పెరిగారు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ‘కాలం’ ఏదీ పట్టించుకోకుండా మౌనంగా తన పనిని తాను చేసుకుంటూనే పోతుంది కదా! ఒకనాడు ఆ ఇందువు దేహం త్యజించాడు. ఆయన భార్య వైధవ్య భీతితో భర్తతో పాటే అనుగమించింది. అప్పుడు ఆ 10 మంది కుమారులు తమ మాతాపితరులకు ఊర్ధ్వదైహిక క్రియలను ఆచరించారు. ఆ తరువాత తల్లిదండ్రుల వియోగ దుఃఖంచేత వారి మనస్సు వేదన పొందింది. అందుచేత వారున్న ఆశ్రమాన్ని, ఆ వాతావరణాన్ని వదలి దూరంగా గల ఒక పర్వత ప్రదేశంజేరారు. అక్కడ గల ఒక ఏకాంతమైన గుహలో ప్రవేశించి ఒక చోట సమావేశమై చుట్టూ ఆసీనులైనారు.
“ఏదైనా సాధించాలంటే ‘ధారణ’ కావాలి. అయితే ‘ధారణ’ కుదరాలంటే… చక్కటి ఆశయం కావాలి. లేకుంటే ధారణ దానంతట అదే కుదరేది కాదు. అందుచేత ఏ ఉత్తమమైన ‘సిద్ధి’ కొరకై మనం ధారణకు ఉపక్రమిద్దాం?”… అని మొట్టమొదటగా ఆ సోదరులు చర్చించటం ప్రారంభించారు.
“ఏ ధారణ యందు తన్మయులమైతే మనందరం అత్యంత ఉన్నతస్థితి పొందగలం?” అనే విషయం తర్క - వితర్కించుకోసాగారు. చివరికి ”సృష్టిలో ఈ సృష్టి యొక్క కర్తయగు బ్రహ్మదేవుని స్థితియే అత్యున్నతమైనది. అందుచేత మనమందరం సృష్టికి కర్తృత్వం వహించగల ’ధారణ’కు ఉపక్రమించి, తద్వారా బ్రహ్మదేవులుగా అవుదాం“ … అనే తర్క వితర్కానంతర సుస్థిర నిర్ణయానికి ఆ 10 మంది వచ్చారు. ఇహనేం! వారు అప్పటికప్పుడే హింసక జీవులు ప్రవేశించజాలని ఒకానొక ఏకాంత ప్రదేశమును ఆ కొండ గుహలోనే ఎన్నుకొన్నారు. ఇక పద్మాసనాసీనులై ధారణకు ఉపక్రమించారు. నేత్రములు మూసుకున్నారు. నిశ్చల ధ్యానం ప్రారంభించారు. “చతుర్ముఖ బ్రహ్మచే అధిష్ఠితమైయున్న ఈ సమస్త బ్రహ్మాండము నేనే! సృష్టంతా నా స్వరూపమే! నా సంకల్పమే ఈ సర్వసృష్టి” … అనే ధారణకు ఉపక్రమించారు. అట్టి బలవత్తరమైన ధ్యాసచే వారు, “ఈ శరీరము నాది! దీని సంరక్షణయే నా కార్యక్రమం! ఇది లేకుంటే నేను లేను” అన్నట్టి దేహధ్యాసను మొదలంటా క్రమంగా త్యజించివేశారు. అట్టి ధారణతో 18 నెలలు స్థూలశరీరం ఉన్నంత వరకు ‘చ్యుతి’ పొందకుండా ఉండిపోయారు. క్రమక్రమంగా వారి భౌతిక దేహాలు శుష్కించసాగాయి. అవి ప్రేతములచే భక్షించబడి అస్తిపంజరాలుగా అయిపోయాయి. ఆ విధంగా సూర్యరశ్మిచే ఛాయా విభాగం తొలగిపోయినట్లు భౌతిక దేహాలు నశించాయి. అయితే
"నేనే సృష్టికర్త యగు బ్రహ్మదేవుడను. సృష్టి అనే సమస్త కథా సంవిధానము నా యొక్క యోచన చేతనే రూపం పొందుచున్నది. అష్ట దిక్పాలకులు, నవగ్రహములు, సప్తఋషులు, పాపపుణ్యలోకానుభవాలు, విహిత కర్మలు, వేద శాస్త్రములు… అంతా నా సంకల్పాకాశం నుండే
Page:584
బయల్వెడలుచున్నాయి”… అనే రూపంగా ఆ 10 మంది ధ్యానమును సుదీర్ఘకాలం అక్కడే కొన సాగించారు. క్రమక్రమంగా వారి శరీర శూన్యములగు 10 చిత్తములు వారి వారి ధ్యానపరిపాకముచే వేరు వేరుగా 10 బ్రహ్మాండములైనాయి. వారు 10 బ్రహ్మాండ శరీరధారులుగా (బ్రహ్మదేవులుగా) అయ్యారు.
చూచావా, రామచంద్రా! ఆ ప్రకారంగా "అత్యంత నిర్మలము - నిరాకారము” అయినట్టి ఆ 10 మంది ఐందవుల చైతన్యమూ ఇచ్ఛారూపమై… సమస్త బ్రహ్మాండ స్వరూపములుగా అవటం అక్కడ జరిగింది. కనుక వారి చిత్త నిర్మితమైన సమస్త బ్రహ్మాండములు చిన్మయ రూపములే కదా!
అట్లాగే “ఈ భూమి - - పర్వతం - - ఆకాశం - ఇవన్నీ కూడా చిద్రూపమే!” అని గ్రహించు. అట్లా కాదనుకుంటే … ఆ ఐందవుల యొక్క 10 విధములైన త్రైలోక్య సమన్విత బ్రహ్మాండములకు మరింకే రూపం కలదో చెప్పు? కాబట్టి అంతాకూడా చిదాకాశ మాత్రమేగాని…. అందుకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు.
విద్యతేన యథా కించిత్ తరంగః సలిలాదృతే |
సంవిత్ తత్త్వాదృతే, తద్వత్ విద్యతే చలనాదికమ్ ||
జలంకంటే తరంగం-తరంగ కదలికలు ఎక్కడైనా వేరుగా ఉన్నాయా? ఉండవే! అట్లాగే చైతన్యము కంటే చలనాదులు వేరుగావు. ఆ ఐందవ కల్పిత 10 బ్రహ్మాండములు ఎట్లాగైతే చిన్మయరూపములే అయివున్నాయో,…. అట్లాగే ఈ జగత్తులో కూడా కాష్ఠము, లోష్ఠము, శిల … ఇవన్నీ చిన్మయ రూపములే! ప్రజ్ఞా రూపములే! భావనారూపములే! ఆలోచనారూపములే! సంకల్పరూపములే! ఐందవుల ఆ సంకల్పముచే జగత్ రూపం పొందినట్లే… “బ్రహ్మదేవుని సంకల్పమే” అయివున్నట్టి చమత్కారమే ఈ మనకు కనబడే జగద్రూపంగా కూడా ఉన్నది. అందుచేత ఈ పర్వత - వృక్ష - మేఘ - మహా భూతములన్నీ కూడా సర్వవ్యాపకమగు చిన్మాత్రమే అయివున్నాయి.
వృక్షాలన్నీ చిద్రూపమే! ఈ భూమి అంతా చిద్రూపమే! రాళ్ళు - రప్పలు కూడా చిద్రూపమే! అంతరిక్షం కూడా చిద్రూపమే! ఆకాశం, పర్వతాలు చిత్స్వరూపములే! ఈ దేహము – ఈ దేహంలోని రక్త, మాంస, అస్థి, క్రొవ్వు… మొదలైనవాటితో సహా చిద్రూపమే అయి ఉన్నాయి!
అంతెందుకు! ఇక్కడ చైతన్యము కానిదంటూ ఏదీ లేదు.
చిన్మాత్రాకాశమున చిన్మాత్రకులాలుడు (కుమ్మరి) స్వశరీరమైనట్టి ‘చిద్రూపం’ అనే చంచల చక్రంపై ‘స్వచిత్ శరీరం’ అనే చిత్ - మృత్తిక (మట్టి)తో ఈ సృష్టిని నిరంతరం సృష్టిస్తూనే ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ ఏదీ సృష్టింపబడటమే లేదు. ఎందుకంటే చిన్మాత్రం సర్వదా యథాతథం.
ఓ రామచంద్రా! “ఐందవ బ్రహ్మాండములు” అనే కథనాన్ని ”ఈ దృశ్య జగత్తు కేవలం కల్ప నిర్మితమే!” అని చెప్పటానికి పునరుద్ఘాటించాను. ఇక … సంకల్పనిర్మితమైన ఈ సృష్టియందు శిలలు చేతనములు కాకపోతే… మరింకే మౌతాయి? ఏది ‘జడము’ అని అనిపిస్తోందో….. అది
Page:585
ఆ ద్రష్టయొక్క అనుభవము, స్మృతి, సంస్కారము, ఇచ్ఛల సంయోగఫలమే అయివున్నది. నిరాకారమగు జలమునకు అనేక ఆకారములు కూడా (తరంగాదులందు) కనిపిస్తోంది చూచావా? అట్లాగే… అనుభవము, స్మృతి, సంస్కారము, ఇచ్ఛ ఇవన్నీ కూడా చైతన్యం … యొక్క ఆకార విశేషములే అయివున్నాయి. ఇవన్నీ తనయందు చిత్స్వరూపమునే ధరిస్తున్నాయి. అంతేగాని జడస్వరూపమును కాదు! కాబట్టి అవి చిద్రూపములే అయివున్నాయి! అర్థ శూన్యులగు అజ్ఞానులకు “ఇవి జడం - ఇవి చేతనం”… అని అనిపిస్తే అనిపించవచ్చుగాక! "తత్త్వావగాహన” కలిగినట్టి కుశలురగు విజ్ఞుల దృష్టికి సర్వత్రా చిన్మాత్రము మాత్రమే అగుపిస్తోంది. ఈ విధంగా జడ చేతనాలను చక్కగా మేము విమర్శించి “చైతన్యమే ఇదంతా”… అని నిర్దుష్టంగా, సుస్పష్టంగా నిర్ణయించాం.
దృష్టిని బట్టే ఇది. దృష్టి చైతన్యరూపమే కాబట్టి… ఇదంతా చేతనమే! పరమ చైతన్య ధామమగు బ్రహ్మమే సమష్టి-వ్యష్టి చిత్తముల రూపంగా దేదీప్యమానంగా వెలుగొందుచూ… ఒకచోట కాష్ఠ పర్వతాది రూపములుగా ఉదయిస్తోంది. మరొకచోట కదిలే దేహాలుగా వెలుగొందుతోంది. సూర్యుని కాంతి సూర్యునికంటే వేరా? కాదు కదా! అట్లాగే… ఎక్కడా కూడా ఈ తృణము, కాష్ఠము, కొండ, రాయి, రప్ప, కదిలే దేహాలు మొదలైన పదార్థాలన్నీ కూడా కార్య కారణ రహితమగు బ్రహ్మము కంటే వేరు కించిత్ కూడా కానే కాదు! సూర్యుని కాంతి సూర్యుని స్వభావమే గాని… సూర్యునికి అన్యం కాదు కదా! సూర్యుడు అప్రకాశకుడై ఉండే ప్రసక్తి ఎక్కడిది? అట్లాగే … ఈ పదార్థ జాలము - అంతా కూడా బ్రహ్మము యొక్క స్వభావమే అయి ఉన్నది. అంతేగాని, బ్రహ్మమునకు భిన్నమై జడము లేదు. చేతనము లేదు. కనుక “ఈ సమస్తము బ్రహ్మమే” అనునది వేద - ఉపనిషత్ - - శాస్త్ర - విజ్ఞుల అనుభవం… క్రోడీకరించగా… మా దృష్టికి సుస్పష్టం అగుచుండగా… “సునిశ్చితం” అని మేము ఎలుగెత్తి గానం చేస్తున్నాం. జలం పల్లం వైపుగా ప్రవహిస్తూ ఉంటే… ఆ జలంలో ఏ కారణం లేకుండానే, ఏ స్వప్రయత్నమూ లేకుండానే స్వయంగా ఆవర్తము - తరంగము మొదలైన రూపములు ఏర్పడి, ఇక జలం అతి తీవ్రంగా ప్రవహిస్తూ ఉండటం సహజమే కదా! అట్లాగే చైతన్యము కూడా స్వభావ సిద్ధంగాను, సహజంగాను జగద్రూపంగా ప్రవృత్తమగుచున్నదగుచున్నది.
ఓ రామచంద్రా! పద్మకల్పమున విష్ణు భగవానుని నాభి కమలము యొక్క లీలయే బ్రహ్మదేవుని రూపంగా అగుచున్నది కదా! ఆ లీలయే బ్రహ్మదేవుని సంకల్ప రూపంగా విలసిల్లి జగత్తుగా ప్రదర్శితమౌతోంది.విష్ణు భగవానుని కంటే ఈ జగత్తు అన్యం కాదు (విశ్వమ్ విష్ణుః). అదే రీతిగా చిన్మాత్ర బ్రహ్మము వలననే ఈ జగత్తు భాసిస్తోంది. అట్లు భాసించే ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరుకాదు. చిదాకాశ రూపము పరమ శాంతము భావాభావ రహితము జన్మరహితము
- - సన్మాత్రము - చిత్ ప్రకాశ మాత్రము అయినట్టి బ్రహ్మమే - ఈ జగత్తు రూపంగా కనిపిస్తోంది.
సంకల్పమే ఈ జగత్తు యొక్క మూలపదార్థం. సంకల్ప విరచితమగు ఈ జగత్తులో ఈ పర్వతాలు, తృణములు - కొయ్య - రాయి మొదలైనవి చైతన్య రహితమని అజ్ఞాని అనుకోవచ్చు
Page:586
గాక! ఆత్మతత్త్వము గ్రహించిన జ్ఞాని మాత్రం ఆ అభిప్రాయం విని నవ్వుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తులన్నీ స్వసంకల్పమయములుగానే స్వయముగా ఎరుగుచున్నాడు. ఇదంతా ఆతని సంకల్పము చేతనే ఉత్పన్నమై ఉండటంచే… ఇదంతా కూడా మనోరాజ్యంవలె చిదాకాశరూపమే అయివున్నది.
ఓ ప్రియ సభికులారా! ఇక్కడ ఈ సందర్భంగా ఒకానొక అతి ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను.
యావత్ యావత్ ఇయం దృష్టిః శీఘ్రం శీఘ్రం విలోక్యతే,
తావత్ తావత్ ఇదం దుఃఖం శీఘ్రం శీఘ్రం విలీయతే ॥
ఎంతెంత శీఘ్రంగా దృష్టి పవిత్రమై ఇదంతా చైతన్య స్వరూపమే అని చూడటం జరుగుతుందో, … అంతంత శీఘ్రంగా సప్రతిఘరూపమగు సాకారదృష్టి విలీనమైపోతోంది. (యావత్ దృష్టిః విలోక్యతే తావత్ దుఃఖం విలీయతే)
యావత్ యావత్ ఇయం దృష్టిః ప్రేక్ష్యతే నాచ్చిరాచ్చితా
తావత్ తావత్ ఇదం దుఃఖం భవేత్ ప్రతిఘనం ఘనమ్ ॥
ఎ ంతెంత వరకైతే దృఢమగు చైతన్య దృష్టితో (వాస్తవానికి చిత్ స్వరూప మాత్రమగు) ఈ జగత్తు చూడబడదో… అంతంత వరకు జడదృష్టి కొనసాగటం చేత ఈ సంసార దుఃఖం ఘనీభూతమై ఉండియే తీరుతోంది. కాబట్టి “ఇదంతా చిత్ చైతన్య స్వరూపమే”… అన్న సమున్నత దృష్టియే ఇక్కడి సర్వ దుఃఖములకు ఉపశమనం. ఓ ప్రియజనులారా!
దీర్ఘ దుష్కృత మూఢానాం ఇమాం దృష్టిమ్ అపస్యతామ్ సంసృతిః వజ్ర సారేయం న కదాచిత్ ప్రశామ్యతి ॥
ఎవరైతే దోషదృష్టిచే మూఢులై ఈ జగత్తును జడదృష్టితో, ఇక్కడి వస్తు జాతమును భౌతిక దృష్టితో, దేహములను రక్త మాంస దృష్టితో, తదితర జనులను వర్ణాది దృష్టితో చూడటం కొనసాగిస్తూ… ఇదంతా చైతన్య దృష్టితో వీక్షించరో… అట్టి వారి సంసారము వజ్రమువలె దృఢపడియే ఉంటుంది. అది ఎన్నటికీ శమించదు. “ఇదంతా పరమాత్మరూపమే! పరమాత్మ చైతన్యమే జగత్తులోని సర్వ రూపములుగా, సర్వ తత్త్వములుగా, సర్వ స్వభావములుగా, సర్వ దృశ్య చమత్కారములుగా అయి ఉన్నది. కానీ, నా జడదృష్టికి జడమువలె అగుపిస్తోంది"… అని గమనించి ఎవరైతే చైతన్య దృష్టిని అభ్యసిస్తూ… అట్టి చైతన్య దృష్టిని పరిపుష్టి చేసుకుంటూ వస్తారో… అట్టివారి సంస్కృతి (సంసారము) తనంతట తానే ఎప్పుడో తుర్రుమని తొలగిపోగలదు.
నేహ ఆకృతిః న చ భవాభవ జన్మనాశాః సత్తా నచైవ న చ నామ తథాస్థి అసత్తా శాంతం పరం కచతి కేవలమాత్మ నీతం బ్రహ్మాథవా కచన మపి అలమ్ అత్ర నాస్తి ! ఓ రామచంద్రా! వాస్తవానికి ఇక్కడ ఆకారాదులు లేవు. భవము-అభవములు (ఉన్నవి - లేనివి) గాని లేవు. జన్మ-వినాశనాలూ లేవు. సత్త-అసత్తలూ లేవు. మరి?… శాంతమగు పరబ్రహ్మం తనయందు తానే ఇట్లు ఈ సర్వముగా ప్రకాశించుచున్నది. (లేక) పరబ్రహ్మం కంటే వేరుగా “ప్రపంచ రూపంగా ప్రకాశించటం” అనేది కొంచెంకూడా ఎక్కడా ఎప్పుడూ లేనేలేదు.
Page:587
ఓ ప్రియ సభికులారా! స్ఫటికంలో స్ఫటికమే జలాకారరూపంగా కనిపిస్తుంది చూచారా? బ్రహ్మమే తనయందు సృష్టిరూప ప్రతిసమూహముచే పూర్ణమైయున్నట్లు కనిపించవచ్చుగాక! స్ఫటికంలో జలం ఉన్నదా? లేదు. స్ఫటికము సర్వదా అంతటా స్ఫటికమే! అట్లాగే జగత్తులు, వాని విభాగములు, జీవులు, లోకములు, జ్ఞాన జ్ఞానములు మొదలైన చమత్కారములన్నీ కలిగి ఉంటూనే ….ఆద్యంత రహితమగు పరబ్రహ్మము అతి స్వచ్ఛంగాను, జన్మకర్మరహితంగాను, చిదానంద ఘనైక రూపంగాను, కైవల్య రూపంగాను నిత్యము సర్వదా యథాతథంగాను స్థితినొందియే ఉన్నది.
మనమంతా అట్టి నిర్మల పరబ్రహ్మ స్వరూపులమే! ఏకమగు నిర్మల పరబ్రహ్మమే… ఇటు ముక్త - - అటు అముక్త రూపములను స్వయంగా… లీలామాత్రంగా అవధరిస్తోంది. అట్టి పరబ్రహ్మము యొక్క చమత్కారమైన అముక్త రూపం జగత్ రూపముగాను - జగత్ జీవుల రూపంగాను, అసంఖ్యాక శిరములు, హస్తములు, కళ్ళు, కాళ్ళు రూపంగాను, చెవులు, కంఠములుగాను కలిగి ఉన్నదై ఒప్పుచున్నది. ఇక ముక్తి స్వరూపమో… ఆత్మాకాశరూపమై, ఉత్తమ స్తంభం వలె దృఢమైనట్టి ’సన్మాత్ర’ రూపమై జన్మాది వర్జితమై, సర్వదా యథాతథమై, మౌన స్వరూపమై… వర్ధిల్లుతోంది.
అట్టి సన్మాత్ర పరబ్రహ్మరూపమే నేను అయి ఉన్నాను. ఇక తదితర వికల్పాలతో నాకేమిపని?*
శ్రీ వసిష్ఠ మహర్షి : చూచావా రామచంద్రా! ఈ విధంగా ఈ త్రిజగత్తులు కూడా ‘ఏకము’ అయినట్టి సచ్చిన్మాత్రమగు పరబ్రహ్మమేనయ్యా! ఇక అజ్ఞానదృష్టిచే కనిపించే సాకార భూజగత్తులేవీ ఇక్కడ సంభవమే అగుటలేదు. సాకారమైనదంటూ ఏదీ లేనే లేదు. ఇక ఈ సాకారమగు శరీరము మొదలైన పదార్థములెచట? ఈ కనిపించేదంతా కూడా…. నిరాకారమగు బ్రహ్మమే ఈ ఈ రూపములుగా వ్యాపించి ఉన్నది.
చిదాకాశమున చిదాకాశమే, శాంత రూపమున శాంతరూపమే…. సర్వవైషమ్య రహితంగా ఇట్లు స్థితినొంది ఉన్నది. ఆకాశమున ఆకాశమే, జ్ఞానమున - జ్ఞానమే… ఈ ప్రకారంగా విజృంభించుచున్నది.
’అంతా రామమయం ఈ జగమంతా రామమయం ॥ అండాండంబులు పిండాండంబులు,
బ్రహ్మాండంబులు - బ్రహ్మలు మొదలుగ అంతా రామమయం ॥
అష్టదిక్కులును - ఆదిశేషుడును అనంతరూపులై వింతలు సలుపగ … అంతా రామమయం ||
నదులు వనంబులు, నానా మృగములు,
విహిత ధర్మములు - వేద శాస్త్రములు …. అంతా రామమయం ॥
ధీరుడు భద్రాచల రామదాసుకు కోరికలొసగే …. తారకరాముడు
అంతా రామమయం ….. ఈ జగమంతా రామమయం ॥ - భక్త రామదాసు
Page:588
సర్వం సంవిన్మయం శాస్త్రం సత్స్వప్నఇవ జాగ్రతి, స్థితమ్ అప్రతిఘాకారం, క్వా సౌ సప్రతిఘా స్థితిః?
స్వప్నంలో లాగానే ఈ జాగ్రత్తులో కూడా సమస్తము “నిరాకారము, చిన్మయము, శాంతము” అగు బ్రహ్మమే అయివుండగా… ఇక సాకార జగత్తు ఉన్నదెక్కడ?
క్వ దేహావయవాః? క్వ అస్త్రవేష్టనీ? క్వ అస్థి పంజరమ్? వ్యోమేవాప్రతిఘం విద్ధి దేహం సప్రతిఘోపమమ్ ॥
ఓ రామచంద్రా! అంతా చిన్మాత్రమే అయివుండగా… ఇక దేహం యొక్క అవయవములెచట? ప్రేగులను చుట్టి ఉండే నాడులు ఎచట? అస్థిపంజరం ఎచట?
స్వప్నతుల్యమగు ఈ దేహము నిరాకారమే!- రెండు చేతులూ చిద్రూపమే! ఈ శిరస్సు చిద్రూపమే! ఇంద్రియ సమూహాలు చిద్రూపమే! ఇన్ని మాటలెందుకు? ఈ సమస్త జగత్తు "శాంతము, నిరాకారము” …అగు చిన్మాత్రమే అయివున్నది. దేహంలోగాని, ఈ బాహ్యానగాని సాకారమైనదంటూ ఏదీ లేనే లేదు. చిదాకాశమగు బ్రహ్మము యొక్క స్వప్నరూపస్వభావమే ఈ జగత్ స్థితికి మూలం!
కాబట్టి ఈ సమస్తమూ కూడా ప్రత్యక్షము, ప్రమాణములకు సిద్ధమైయున్నప్పటికీ… ఇద్దాని ‘ఆది’ యందు ప్రమాణరహితమే! సకారణమైనప్పటికీ అకారణమే! ఇందుకు (నే హనానాస్తికించన …మొదలైన) శ్రుతి వాక్యాలు, విజ్ఞుల అనుభవాలు మనకు ప్రమాణం! శ్రుతి ఈ సాకారత్వమును నిషేధిస్తూనే వస్తోంది.
బ్రహ్మము నిర్వికారమై, అద్వయమై ఉండటం చేత… ఈ ‘జగత్తు’ అనబడేది ఉత్పన్నమవటానికి వేరే కారణమంటూ ఏదీ లేకపోవటం చేత… ఈ జగత్తు తత్త్వ దృష్టిచే "ఉత్పన్నమే కాలేదు” అనునది తగియే ఉన్నది.
భ్రాంతి దృష్టి చేతనో… ఈ జగత్తు ‘కార్యకారణ సంభవము’ అగుటచేతను బ్రహ్మమే జగత్ దృష్టికి అప్రసిద్ధమగుట చేతను ఇది "ఉత్పత్తి పొందియున్నది” అని అనిపించటం అజ్ఞానదృష్టికి సహజమే కూడా! అయితే… ఇక్కడ ఒక పరమసత్యం కూడా గమనించక తప్పదు. ఏది ఎవనిచే ఎట్లు నిర్ణయించబడుచున్నదో అది వానిచే అట్లే గాంచబడుచున్నదది. భ్రాంతి దృష్టియందు కార్యకారణములు రెండూ కూడా వారి వారి నిశ్చయమును అనుసరించి తగియే ఉంటున్నాయి.
ఇక యుక్తి దృష్టిచేతనో… ఈ జగత్తు కారణము లేకయే ఉత్పన్నమైనది. ఇది సంవిద్రూపమే! (విత్ = తెలుసుకొనుట. తెలుసుకొనే రీతిని అనుసరించే తెలియబడుతోంది).
కాబట్టి… ఈ జగత్తు అత్యంత సత్తు కాదు. అత్యంత అసత్తు కాదు. “ఉన్నదాని వలె అగుపి స్తోంది”… అని అనవచ్చు. సంవిత్తు దేనిని ఎట్లు భావించుచున్నదో… అది అట్లే సత్యంగా పొందటం మాత్రం జరుగుతోంది. “నా స్వప్నంలో ఆ పట్టణం, ఆ పట్టణంలో ఆ కొండశిల, ఆ కొండశిలపై ఆ అంతఃపురం ఎందుకు కనిపించాయి?”… అని ఒక స్వప్న ద్రష్ట తన స్వప్న విశేషం గురించి మనలను ప్రశ్నించాడనుకో! అప్పుడేం చెప్పాలి? స్వప్న చిత్ స్వరూపతత్త్వము యొక్క “చిన్మయము సర్వరూపత్వము” అనే లక్షణ విశేషములచేత సర్వదా సర్వత్రా సర్వము సంభవమే” … అని
Page:589
అనక తప్పదు. అట్లాగే ఈ జాగ్రత్తులో కూడా ఆత్మయొక్క చిన్మయత్వ - సర్వరూపత్వ విశేషముల చేతనే సమస్తము సంభవిస్తున్నాయి. ’మాయ’తో సమన్వితమైయున్న సర్వాత్మరూప బ్రహ్మపదమున పదార్థముల సత్త ఏకము - అనేకముగా కూడా స్థితి పొంది ఉండగలడు. కల్పితదృష్టియందు కార్యసత్త కారణజన్యమై ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా… పరమార్థ దృష్టియందు మాత్రం సర్వము కారణరహితమే అయి ఉన్నది.
శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తులు వేరువేరైన అసంఖ్యాక బుద్ధులు - దృష్టులు - - అనుభవములు - ఉద్దేశములు - ఆశయములు మొదలైనవి వేరువేరు దేహుల పట్ల కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ వేరువేరా! ఒక్కటే అవుతాయా? ఒక్కటే ఎట్లా అవుతాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : "ఏకః సహస్రంభవతి” అని అన్నట్లుగా ఒకే చైతన్యము అసంఖ్యాక రూపములుగా అగుచున్నది. ఐందవుల సంకల్పరహిత బ్రహ్మాండములలో ఆ ఒక్కొక్క ఐందవుని చైతన్యమే ఆ ఒక్కొక్క బ్రహ్మాండములో అసంఖ్యాక జీవుల రూపంగా అగుచున్నది కదా! ఐందవ చైతన్యం కాకుండా వారి బ్రహ్మాండంలోకి మరొకటేదీ అసంఖ్యాక రూపములు దాల్చటం లేదే! సహస్రమ్ ఏకం భవతి సంవిదాంచ తథా హి యత్ |
సాయుజ్యే చక్రపాణ్యాదేః సర్గెరేకం భవేత్ వపుః ॥
జలంలో వేలాది తరంగాలు ఏమౌతున్నాయి? అవన్నీ జలమే అయి, జలంలోనే ఉంటూ జలంలోనే ఉత్పత్తి అయి, జలంలోనే నిరాకారం పొందుచున్నాయి కదా! ఈ అసంఖ్యాక ’జీవులు’ అనబడే సంవిత్ తరంగాలు సంవిత్ మహా సముద్రములోని సంవిత్ స్వరూపాలే గాని, దేహ స్వరూపాలు కాదు.
వందల కొలది నదులన్నీ కలిసి చివరికి ఒకే సముద్ర జలంగా అగుచున్నది కదా! అనేక ఋతువులు - సంవత్సరాలు… అన్నీ కలిసి ఒకే కాలము యొక్క స్వరూపమే అగుచున్నది కదా!
ఒకే స్వప్నద్రష్ట యొక్క సంవిత్తు స్వప్నంలో అనేక కదిలే - కదలని జీవ - వస్తు రూపములుగా -
అగుచున్నది కదా! అట్లాగే… ఒకే చిదాకాశం భ్రాంతిచే ఈ దేహాది నానా రూపత్వము పొందినదాని వలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తోంది. అందరికీ దైనందిన అనుభవమయ్యే స్వప్నం సాకారమా?
నిరాకారమా?
స్వప్నంలో మిత్రులు – బంధువులు - గృహములు మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి సాకారమే కదా! కానీ, స్వప్న ద్రష్ట యొక్క ఊహాకల్పితమే స్వప్నాంతర్గత విశేషాలు కదా!ఊహకు రూపమెక్కడున్నది? కాబట్టి స్వప్నం నిరాకారమే కదా!
అట్లాగే ఈ దృష్టాంతాన్ని అనుసరించి ఈ దృశ్య జగత్తు సాకారంగా కనిపిస్తున్నప్పటికీ కూడా… ఇది నిరాకారమే! అట్టి చిదాకాశ స్వరూపం వాస్తవానికి అందరికీ స్వానుభవ రూపమే అయినప్పటికీ… ‘దర్శన - ద్రష్ట - దృశ్య”… ఆదిగా గల భ్రాంతి విభాగ దృష్టిచేత ‘అననుభవ రూపం’గా ఇట్లు భాసిస్తోంది.
Page:590
కాబట్టి వాస్తవానికి ఈ జగత్తంతా కూడా “ఏకము” అయినట్టి చిదాకాశమే అయివున్నది. నిద్ర అనేది ఒక్కతీరైనదే… అయినప్పటికి స్వప్నంలో పదార్థజ్ఞాన రూపంగాను, గాఢనిద్రా సమయంలో ఏమీ తెలియని స్థితిగాను… ఈ విధంగా రెండు విధాలుగా భాసించవచ్చు గాక! కానీ …. నిద్ర ఎల్లప్పుడూ (ఉభయ సందర్భములలోనూ)… ఏకరూపమే కదా! వాయువు తరంగముల రూపములో స్పందిస్తున్నప్పుడు… స్పందరహితమై నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా వాయువు వాయువే కదా!
చిదాకాశము - - జగత్తు ఈ రెండూ ఏకరూపములే అయి ఉన్నాయి - స్వప్నంలో పరమార్థ చిదాకాశం పదార్థ శూన్యమై ఉండి కూడా… ద్రష్ట-దర్శన-దృశ్యములుగా భాసిస్తున్నట్లే, అదే పరమార్థ చిదాకాశము జగత్ శూన్యమై ఉండి కూడా… ఇక్కడ జాగ్రత్లో ద్రష్ట దర్శన దృశ్యములుగా భాసిస్తూ, వీటన్నిటికీ కూడా సర్వదా “ప్రత్యేకము” అయి కొనసాగుతూనే ఉన్నది. ఆదిసృష్టి యందు ఈ జగత్తు అసద్రూపం. ఇప్పుడు కూడా అంతే! స్వప్నంలో కనిపించిన పులిని చూచి భయం పోవాలంటే… మెలకువ వస్తే అంతా హుళక్కి అయి, ఆ భయం అర్థాన్ని కోల్పోతోంది కదా! అట్లాగే “ఈ జగత్తంతా సర్వదా ఆత్మస్వరూపమే”… అని ఎరుగబడినట్టి ఆత్మసాక్షాత్కార సిద్ధి సముపార్జించు కున్నవానికి ఇక్కడ నామరూపత్వం ఇక శేషించదు.
స్వప్నంలో ఒకే సంవిత్తు అనేక రూపములుగా భాసిస్తున్నట్లు… సృష్ట్యాది యందు ఒకే చిదాకాశ సంవిత్తు… ఈ ఏకానేక రూపాలుగా భాసించటం జరుగుతోంది.
ఒకే దీపము (అగ్ని) అనేక గృహాలలో దీపశిఖ అయి దీపకాంతి వెదజల్లుచున్నట్లుగా… సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని ఒకే శక్తి అనేక రూపములుగా ప్రకాశిస్తోంది.
ఆకాశంలో భ్రాంతిచే చక్రాకారాలు కనిపించుచున్నట్లు… జగత్తులో పదార్థముల నామ రూపాలు, దృశ్యాలు, సంఘటనలు, సంబంధాలు, బాంధవ్యాలు ఆత్మాకాశంలో అగుపిస్తున్నాయి.
సముద్రజలంలో అనేక వింత ఆకారాలు కనిపిస్తున్నప్పటికీ… అంతా సముద్ర జలమే కదా! ఆత్మయందు ఈ వృక్ష - జంతు - మానవ దేహాలు స్ఫురిస్తున్నాయి. బ్రహ్మమహాసముద్రంలో అగుపించే ఈ సృష్టి జలకణ సహస్రాలు బ్రహ్మము కంటే కొంచెం కూడా భిన్నం కానేకాదు.