Page:648
XIII. రామ పరిప్రశ్న
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తును విజ్ఞులు రెండు భాగాలుగా విభజించారు. అట్లా విభాగించి దర్శించటమే “యోగం” గాను, జగత్తును బ్రహ్మ రూపంగా గాంచగలుగు ఉపాయం గాను చెప్పబడుతోంది. 1. తెలుసుకుంటున్నది (జ్ఞానము), 2. తెలియబడుచున్నది (జ్ఞేయము)… ఈ రెండింటి యొక్క అవినాభావ సంబంధమే జగత్తు. అట్టి ఈ జగత్తు భ్రమయే అయివున్నది. అట్టి జగత్ భ్రమ తొలగటమే దివ్యౌషధ రూపమైన ఉపాయం.
జ్ఞానము యొక్క ’జ్ఞేయ రూపత్వ ప్రాప్తి’యే బంధం! (జ్ఞేయము- జగద్ విషయాలు) అట్టి జ్ఞేయ రూపత్వం (జగత్ విషయాల) సశాంతించటమే … “కేవల జ్ఞాన రూపస్థితి" - అయివున్నది. అట్టి కేవల జ్ఞానరూపస్థితియే ‘మోక్షము’ - అని చెప్పబడుతోంది. ఇంతకు మించి ‘మోక్షము’ అనబడేదానికి వేరే ఏ అర్థమూ లేదు.
శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానం యొక్క విషయ రూపత్వమే జ్ఞేయం కదా! అట్టి “విషయ రూపత్వం” అనే దోషం తొలగేది ఎట్లా? ఎందుకంటే జ్ఞేయత్వం అనేది దృఢంగా అభ్యస్తమై ఉన్నది కదా! “విషయత్వ బుద్ధి” అనేది ‘తొలగవయ్యా బాబూ’ అంటే కూడా తొలగటం లేదే! అది నివర్తించేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : అట్టి ”విషయరూపత్వ భ్రాంతి“ తొలగాలంటే సమ్యక్ జ్ఞాన ప్రబోధమే ఉపాయం. “నాకు వేర్వేరుగా కనిపిస్తున్నదంతా అనేక బొమ్మలలోని మట్టిలాగా, అనేక ఆకారములైన ఆభరణములలోని బంగారంలాగా ఏకమేగాని, అనేకం కాదు. అనన్యమై ఉన్న పరమాత్మ రూపమే ఇది. ఈ జగత్తుకు ఆధారము - - ఆధేయము కూడా అదియే”… అను దర్శనమే సమ్యక్ జ్ఞాన ప్రబోధం. అయితే అట్టి ప్రబోధం కలగాలంటే… శమము, దమము, ఈశ్వర ప్రణిధానము, భక్తి మొదలైన సాధనలు తీవ్రంగా అభ్యసించాలి. సశాస్త్రీయంగా అట్లా అభ్యసిస్తూ ఉండగా అట్టి శాస్త్ర గురుబోధిత సాధనముల క్రమము చేత సమ్యక్ జ్ఞాన ప్రబోధం కలుగుతోంది. అప్పుడు ఈ విషయరూపత్వ భ్రాంతి స్వయంగా వైదొలగుతోంది. భ్రాంతి నశించడంచేత, ఇకప్పుడు నిరాకారము, సత్యము, శాంతము అయినట్టి “ఆత్మస్వరూప ప్రాప్తి” అనబడే ముక్తి స్వయంగా ప్రవర్తించుచున్నది. “అంతా - అన్నిటా నేనే - నాయందే” అనే అనుభూతి - సమ్యక్ జ్ఞానం స్వయంగా సిద్ధిస్తోంది. శ్రీరాముడు : మహర్షీ! దేనిచే ఈ జీవుడు ఇక సర్వదా బంధవిముక్తుడు అవుతాడో… అట్టి నిర్మల బోధస్వరూపమగు ”సమ్యక్ జ్ఞానసిద్ధి"… అనగా ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : "సమ్యక్ జ్ఞానం” అనగా అభ్యంతరమందలి ఒకానొక సునిశ్చితరూపమే సుమా!
Page:649
జ్ఞానము అనబడు నిర్మల స్వస్వరూప సంస్థానమునకు విషయత్వ రూపమైన జ్ఞేయము (తెలియబడేది) అనబడే దోషమే లేదు. జ్ఞాన స్వరూపుడను నేను. (తెలుసుకొనుటయే స్వరూపముగా కలవాడను).‘తెలుసుకొనుట’ అనే విశేషముగా గల నా యొక్క జ్ఞానరూపమునకు తెలియబడేది ఎట్లా దోషపూరితం చేయగలుగుతుంది? సూర్య కిరణం ఏదైనా వస్తువుపై ప్రసరించినంత మాత్రం చేత సూర్య కిరణానికి ఆ వస్తుదోషాలు అంటవు కదా! సూర్యుడు సూర్యకిరణ స్వరూపుడు కదా! జ్ఞాన కిరణ స్వరూపుడనగు నాకు తెలియబడే విషయముల దోషము అంటగలిగే ప్రసక్తే లేదు.
తెలియబడేది ఎట్లా అయినా ఉండవచ్చు. లేదా, అసలు ఉండకయే పోవచ్చుగాక! నేను సర్వదా నిర్మల జ్ఞాన (తెలివి) స్వరూపుడనే! నాతో సహా ఈ సర్వద్రష్టలు నిర్మల (జ్ఞేయరహిత) జ్ఞాన స్వరూపులే! ఈ ప్రకారమైన అభ్యంతర దృఢనిశ్చయమే “సమ్యక్ జ్ఞానం”… అని చెప్పబడుతోంది. శ్రీరాముడు : మునీంద్రా! చిదేకరసము - కేవల జ్ఞాన స్వరూపము అగు ఆత్మయందు అందుకు భిన్నమైన ఈ "జ్ఞేయము (తెలియబడేది)” అనబడేది ఎట్లా, ఎక్కడి నుండి వచ్చింది?
జ్ఞానస్య జ్ఞేయతా భిన్నత్వన్తః కేతి, మునే! వద!
ఉత్పాద్యో జ్ఞాన శబ్దశ్చ భావే వా కరణేథ కిమ్?
జ్ఞానము అనే శబ్దము యొక్క వ్యుత్పత్తి “జ్ఞప్తి”. అనగా “జ్ఞప్తి మాత్రమగు చైతన్యమే జ్ఞానము” …అని కదా! జ్ఞప్తి మాత్ర చైతన్యమే జ్ఞానమా? లేక, దేనిచే ఎరుగబడుచున్నదో… అది జ్ఞానమా? (జ్ఞాయతే అనే నేతి జ్ఞానమ్) ఓ మహర్షీ! జ్ఞానమంటే జ్ఞప్తియా? దేనిచే తదితరమైనదంతా తెలుస్తోందో… అట్టి తెలివియా?
శ్రీ వసిష్ఠ మహర్షి : "జ్ఞానము” అనే శబ్దము యొక్క వ్యుత్పత్తి గురించి విను. భావము సాధనముగా అయినప్పటి బోధ రూపమే ‘జ్ఞానం’. ఇక “తెలియబడేది” అనబడునది కూడా భావసాధకమే (భావనచే పొందబడేదే) కదా! ఈ దృశ్యం యొక్క రూపము జ్ఞానము యొక్క మాయచే వికల్పమైనదే! కాబట్టి వాస్తవానికి జ్ఞానము (తెలుసుకోవటం) - జ్ఞేయము (తెలియబడేది) అనే రెండు శబ్దములకు భేదమేమీ లేనేలేదు. జ్ఞానమునకు వేరుగా జ్ఞేయం లేనే లేదు.
శ్రీరాముడు : మహాత్మా! సరే! "జ్ఞేయరూపమగు ఈ దృశ్యము వాస్తవానికి మొదలే లేదు” కొంతసేపు అనుకుందాం. అయితే కుందేటి కొమ్ములాగా ఈ దృశ్యము, ఈ రూప భ్రమ అసలు ఎట్లా సిద్ధించింది? పైగా, ఇదంతా ప్రత్యక్ష ప్రమాణములచేత, భూత - వర్తమాన వర్తమాన - భవిష్యత్ విభాగముల చేత … అత్యంత నిర్దుష్టంగా వ్యవహార సమర్థమై ఎట్లా ఇక్కడ కనబడుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : (పక పకా నవ్వుచూ) ఓ రామచంద్రా! దృష్టి యొక్క బాహ్య వ్యవహార భ్రాంతిని అనుసరించే ఇక్కడ విషయాకార బుద్ధి రూపంగా ఇదంతా ఇట్లు (నామరూపాత్మకంగా అనిపిస్తోంది. దృష్టికి దృశ్యం నామరూపాత్మకంగా అభ్యాసవశం చేత అనిపించటమే ‘జగత్తు’. అదే ‘సంసారము’. అట్లా అనిపించటానికి వేరుగా జగత్తు ఎక్కడా లేదు. ఎందుకంటావా? వాస్తవానికి బాహ్యమునగాని, అభ్యంతరమున గాని ఆత్మకంటే భిన్నంగా ఏ పదార్థమూ ఎక్కడా సంభవించజాలదు.
Page:650
శ్రీరాముడు : మునీంద్రా! ఈ ఎదురుగా ‘నీవు-నేను’ మొదలైనవి కనబడుచున్నాయి. జీవుడు, శరీరము, భూమి, ఆకాశం, పుట్టుక, చావు, బాల్యము, యౌవనము, వార్ధక్యము, కొండలు, సముద్రాలు మొదలైనవన్నీ ఎదురుగుండా ప్రత్యక్షంగా అనుభవమగుచుండగా… “ఈ జగత్తు లేదు” - అనునది ఎట్లా యుక్తియుక్తం? ప్రత్యక్షము - అనుభవ సిద్దము అగుదాని పట్ల “ఇవి లేవు” అనే సిద్ధాంతం ఎట్లా కుదురుతుందో చెప్పండి? ఎదురుగా కనబడేవాటిని ‘లేవు’ అనుకుంటే
మాత్రం ఏం ప్రయోజనం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మొట్టమొదట ఆత్మయే కలదు. అట్టి కేవలాత్మలో విరాడ్రూపం మొదలుగా గల పదార్థములేవీ మొదలే ఉత్పన్నములయి ఉండలేదు. అట్లాగే ఇప్పుడు కూడా ఏ పదార్ధము ఉత్పన్నమయి, (వాస్తవానికి) లేవు. కాబట్టి “జ్ఞేయము” (తెలియబడేది) అనే దృశ్య జగత్తు ఏమాత్రం సంభవించదు. దృష్టాంతంగా… ఒక చోట మూడు కుందేళ్ళు వేటగాడిని చూచి పరుగు లంకించుకున్నాయి. అవి అల్లంత దూరంగా పరుగులు తీస్తూ ఉండగా వెనుక నుండి పరిగెత్తే ఆ వేటగానికి ఆ 3 కుందేళ్ళ చెవులు నిక్కబొడుచుకొని కొమ్ములవలె కనిపించాయి. ఆ వేటగాడు తన ప్రక్కనున్న సేవకునితో “ఆ ముందు పరిగెత్తే కుందేటికి ఆ కొమ్ములు పొడుగ్గా, నిటారుగా ఉన్నాయేం? ఆ రెండవ కుందేలుకు కొమ్ములు కొంచెం సన్నగా ప్రక్కవైపుగా ఒదిగి కనిపిస్తున్నాయేం? మూడవ కుందేలుకు కొమ్ములు పొట్టిగా లావుగా కనిపిస్తున్నాయేం? ఎందుచేత?” అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా “అయ్యగారూ! కుందేటికి కొమ్ములుండవు కదా! మనం కొన్ని వేల సంఖ్యలో కుందేళ్ళను వేటాడాం?” అన్నాడు. అప్పుడా వేటగాడు, “కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా! నా ప్రశ్నకు సమాధానం… ఆ కుందేటి కొమ్ములు తేడాగా ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పు! అది చెప్పకుండా… కుందేటికి కొమ్ములు ఉంటాయా?… అని అడుగుతావేం?” అని కసురుకున్నాడు. కుందేటికి కొమ్ములు ఉండవన్నమాట పచ్చినిజం. అది వదలి, చెవులు నిక్కంచుకుంటే ”కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా!”… అని నిర్ణయించి, “ఇక మరి ఎందుకు తేడాలుగా ఉన్నాయి?"… అని ఎరుగుటకు యత్నించటం తెలివితక్కువే కదా!
“కుందేటికి కొమ్ములు కనిపిస్తున్నప్పటికి, ఉండటానికీ వీలుకాదు” అనునది ఎంతగా సత్యమో, “ఇక్కడ మొదలే జ్ఞేయము లేనే లేదు” అనునది అంతగానూ సత్యమే! లౌకిక దృష్టిచే ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది కదా అంటావా? (నేహ నానాస్తి కించన… ఇక్కడ కించిత్ కూడా అనేకత్వమనేది లేనే లేదు మొదలుగా గల) శ్రుతి యుక్తులను అనుసరించి ఇక్కడ దృశ్యము లేనే లేదు. ఇదంతా స్వప్నంలోలాగా భ్రమాత్మకమే! “స్వప్నమే భ్రమ అయినప్పుడు ఇక అందులో ’మంచివారు ఎందుకున్నారు? చెడ్డవారు ఎందుకున్నారు? ఆ భవనం అంత ఎత్తుగా కట్టారేం? ఈ గుడిసె ఊరికి ఇంత దూరంగా ఉన్నదేం” అనే ప్రశ్న - సమాధానం కూడా భ్రమయే కదా! మృగతృష్ణలో మొదటి తరంగం రెండవ తరంగం తేడాగా కనిపిస్తున్నాయేం?” అనేది (మృగతృష్ణయే భ్రమ కాబట్టి) ఆ సమాధానం కూడా భ్రమయే కదా! ఆకాశంలో కేశాలు కొన్ని పొడవుగా - కొన్ని గుండ్రంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆకాశంలో కేశములే ఉండవు. ఉన్నట్లుగా కనిపించటం దృష్టి దోషమే
Page:651
కదా! అట్లాగే జాగ్రత్ - స్వప్నములలో కనిపించే ‘నీవు- నేను’ మొదలైనవి వాస్తవానికి ఉత్పన్నము కాకపోయినప్పటికీ భాసిస్తున్నాయి. తత్త్వజ్ఞానముచే అవన్నీ నివారితమై పోగలవు.
శ్రీరాముడు : స్వామీ! ఈ ‘నేను-నీవు’ మొదలైనవి అసలే లేవు అని, ఈ జగత్తు మొదలే జనించలేదని, కనుక అవన్నీ ఇప్పుడూ లేవని మేం నిరూపణ పొందటమెట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అందుకు అధ్యాత్మశాస్త్రం మనకు కార్య కారణ సిద్ధాంతం ప్రతిపాదిస్తోంది. కారణము నుండియే… కార్యము జనిస్తోంది. అంతేగాని కార్యము కారణము కంటే వేరైనదై ఉండజాలదు. సృష్ట్యాది యందు సర్వ కారణాలు శమించియే ఉంటాయి కదా! మరి సృష్టి జనించటానికి కారణం ఎక్కడినుండి వస్తుంది? కారణమే లేనప్పుడు ‘సృష్టి’ అనే కార్యము ఎక్కడిది? కారణమే లేదు కనుక ఈ జగత్తు సృష్ట్యాదిలో జనించనే లేదు. సృష్ట్యాదిలో లేనిది ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? కనుక, ఈ జగత్తు స్వప్న సదృశమే గాని వాస్తవం కాదు. శ్రీరాముడు : హే మునీంద్రా! ‘మహా ప్రళయం’ సంభవించిన తరువాత ఇక ఆపై జన్మ రహితము అవ్యయము అగు బ్రహ్మమే శేషిస్తుంది కదా! “అట్టి బ్రహ్మమే సృష్టికి కారణం” అని ఎందుకు అనకూడదు? ఈ సృష్టి ‘కారణరహితం’ అనే బదులు బ్రహ్మము దీనికి కారణమనవచ్చును కదా! శ్రీ వసిష్ఠ మహర్షి :‘కారణము’ నందు ఏ కార్యము అయితే ఉంటుందో… అదియే కార్యరూపంగా ఉత్పన్నం అవుతుంది గాని, కారణములో లేనిది కార్యరూపంగా రాదు కదా? ఘటంలోంచి వస్త్రం రాదు కదా! బ్రహ్మము చిదేక రసమై, కేవలం జ్ఞానరూపమై ఒప్పుచుండగా… అద్దాని యందు జ్ఞేయరూపమగు దృశ్యం ఎక్కడున్నది? బ్రహ్మము నిర్విషయం. కనుక అద్దాని నుండి విషయ రూపజగత్తు ఉద్భవించజాలదు. మేఘాలలో కొండలేదు. మరి మేఘాలలో ఆ పెద్ద కొండ - - ఈ చిన్న కొండ ఎట్లా వచ్చాయి?… అంటే అది దృష్టి భేదమే గాని, వాస్తవం కాదు కదా? శ్రీరాముడు : ఈ జగత్తు సూక్ష్మరూపంలో బ్రహ్మమునందే ఉంటోంది కదా! కనుక “ఈ జగత్తు తిరిగి బ్రహ్మము నుండియే బయల్వెడలుతోంది” అని అనటం ఎందుకు సరికాదు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహాబుద్ధీ! రామచంద్రా! మహాప్రళయంలో సృష్టి యొక్క బీజ సత్త చూస్తున్నవాడెవడు? చూస్తున్నవాడు ఉంటే సృష్టి ఉన్నట్లే కదా? కాబట్టి మహాప్రళయంలో చూచువాడు లేడు కనుక సృష్టియే లేదు. ఈ విధంగా సృష్టికి ముందు (సృష్టి ఏర్పడటానికి కారణములైన) సాధకాలు లేవు. బాధకములు లేవు. “మొట్టమొదట ఈ సృష్టి లేదు. బ్రహ్మము మాత్రమే ఉన్నది” అనేది ఆయా పరిభాషలలో అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్న విషయమే! అట్టి నిర్విషయ బ్రహ్మములో సృష్టి యొక్క బీజ సత్త ఎక్కడిది? మరొకటి ఏదైనా జగత్ బీజ సత్తను ప్రవేశింపజేస్తోందని అందామా? అప్పుడు… బ్రహ్మమునకు వేరుగా మరొకటి ఉన్నట్లైతుంది. అప్పుడు “బ్రహ్మము ఏకము అద్వితీయము (- బ్రహ్మమేవ ఇదమగ్ర ఆసీత్ - ఏకమేవా ద్వితీయం బ్రహ్మ”… మొదలైన) వేద - వేదాంత మూల వాక్యాలకు తిరస్కారం జరుగుతుంది కదా! అందుచేత మొట్టమొదట “సృష్టి - దర్శకుడు - దర్శనము - నేను - నీవు” మొదలైనవి జనించటానికి కారణమే లేదు. ఇప్పుడు కూడా
Page:652
“నేను-నీవు-జగత్తు” జనించటానికి కారణం లేదు. కనుక ఈ సృష్టి దృష్టియే కాని, వాస్తవం కాదు. అంతేగానీ, బ్రహ్మము నందు ఉండే జగత్-బీజసత్తలు ఎట్లాంటివి? ఎట్లా ఉంటాయి… చెప్పు? శ్రీరాముడు : మహర్షీ! బ్రహ్మమునందు బ్రహ్మవేత్తలచే జగత్ రహిత స్థితిలో జ్ఞప్తి రూపమగు సత్తయే అనుభవమౌతుందని నా అభిప్రాయం. కాబట్టి ‘జ్ఞప్తి’ అనే సూక్ష్మతత్త్వం స్వప్రకాశ చిద్రూపమునకు అభిన్నంగా మహా ప్రళయంలో ఉంటుంది. అప్పటి “జ్ఞప్తి రూప సత్త” ఈ మాయాకాశ రూపము వంటిది కాదు. మాయాకాశ రూపము అసత్స్వరూపం అవటం చేత …. అసత్స్వరూపమైన మాయాకాశం నుండి సద్రూపంగా సృష్టి ఆవిర్భవించటమనేది అసంగతవాక్యం అవుతుంది. ఈ విధంగా చిద్రూపమగు బ్రహ్మమే జగత్తు యొక్క బీజసత్తా కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : కేవల చిద్రూపము (ఎరుగుట అనే విషయాలకు ముందే ఉన్నట్టి”…. స్వసత్తా స్వరూపం) అగు బ్రహ్మమే ఈ జగత్తు యొక్క బీజ సత్త అనీ, అది జ్ఞప్తి మాత్ర రూపంగా స్వసత్తయందు మహాప్రళయ సమయంలో ఉన్నదని కాసేపు అనుకుందాం. అప్పుడు ఈ ముల్లోకములు కూడా జ్ఞప్తి రూపమే అవుతాయి కదా! ఎందుకంటే "విశుద్ధ జ్ఞాన స్వరూపుడు - సచ్చిదానంద ఘనము” …అగు ఆత్మకు జనన మరణాలు ఎట్లా ఉంటాయి? లేవు కదా!
జగత్తుగా కనిపించేది ఆత్మ యొక్క జ్ఞప్తి రూపమే! ఆ జ్ఞప్తికి మునుముందే కేవల జ్ఞాన స్వరూపుడగు జగత్ ద్రష్ట జగత్ రహితుడై ఉండనే ఉన్నాడు. ఆతని స్వప్న సందర్శన చమత్కారమే ఈ త్రిలోక జగత్తు. ఆతడు తనను తాను ఎరిగినపుడు ఈ ముల్లోక జగత్తు లేదు. లేక, ఇది “నిర్మల స్వకీయ జ్ఞప్తి రూపం” మాత్రమే!
శ్రీరాముడు : మహాత్మా! "సృష్టి మొట్టమొదటి నుండి ఉన్నది కాదు. మొట్టమొదట కేవల బ్రహ్మము మాత్రమే ఉన్నది!” అనేది మనం సిద్ధాంతీకరించుకున్నా మనుకుందాం సరే! ఈ జగత్తు మీరు చెప్పి నట్లు భ్రాంతి రూపమే అయివుండవచ్చు గాక! అయితే అట్టి జగత్ భ్రాంతి ఎక్కడి నుండి వచ్చింది? భ్రాంతి ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే … అది తొలగించుకోవటం సులభం అవుతుంది కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : వాయువులో తరంగాలు, ఆ తరంగాలన్నీ వేరువేరుగాను, ఒక్కొక్క తరంగానికి ఒక్కొక్క ప్రాకృత ధర్మాలు ఉంటే ఉండవచ్చు. వాయుతరంగం వాయువు కానిదెప్పుడు? బ్రహ్మము సర్వదా బ్రహ్మమే! అందులో సృష్టి లేదు. ప్రళయము లేదు. ఇక ఈ జగదృశ్యానికి వస్తే…
ఏది ఎరుగబడుచున్నదో… ఎవనిచే ఎరుగబడుచున్నదో… ఏమని ఎరుగబడుచున్నదో అట్టి జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ రూపమగు ఈ త్రిపుటి … ఇదంతా కూడా స్వాత్మయగు బ్రహ్మమే! అయిఉన్నది. శ్రీరాముడు : మహర్షీ! ఒక యంత్రము జడమే అయినప్పటికీ… అద్దాని అంతర్గతంగా గల యంత్రశక్తిచే చేతనమువలె చలిస్తూ ఉంటుంది చూచారా? అట్లాగే ఈ జడమాత్ర శరీరం ఇందలి కార్య-కారణ సంఘాత శక్తిచే ఆయా విశేషాలు ఎరుగుచుండుటమేమిటి? సర్వద్రష్ట అయిన ఈశ్వరుడు ఈ జడమగు దృశ్య రూపత్వం పొందటమేమిటి? రెండు ఆశ్చర్యకరమే! "కట్టెపుల్ల అటూ ఇటూ తిరుగుతూ త్రోవలో అగ్ని కనబడగానే ఆ కట్టెపుల్ల ఆ అగ్నిని తగలబెట్టింది”… అనే
Page:653
వాక్యం ఎంతటి విపరీతము - - అర్థరహితమైన వాక్యమో, “సర్వద్రష్ట అయిన ఈశ్వరుడే ఈ జడ జ్ఞేయ స్వరూపంగా అయ్యాడు” … అనేది అంతటి అర్థరహితం కాదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! నీ దృష్టాంతం ఆశ్చర్యమును గొలుపగలదు. అయితే దృశ్యము మొదలే అసంభవము. అట్టి మొదలంట అసంభవమైన దృశ్య రూపములను ఆ ఆత్మ సంతరించుకోవటమనే ప్రసక్తి ఎక్కడిది? అయితే ఒకవేళ ‘దృశ్యము’ వేరుగా కనబడుచున్నదంటావా… “దృక్ మాత్రము - చిర్ఘనాకారము - సర్వాత్మకము” … అయినట్టి చిదాత్మయే “ద్రష్ట, దర్శనము, దృశ్యము” అనబడే త్రిపుటీ రూపంతో నిజమాయాశక్తిచే భాసించుచున్నదగుచున్నది.
శ్రీరాముడు : హే మహాశయా! “అనాది - అనంతము” అగు శుద్ధ చిదాత్మయే జగత్తును కల్పించటం వలన ఈ జగత్తు భాసిస్తోంది. అంతేకాని, మరింకేదీ ఈ జగత్తుకు కారణంగా లేదు”… అనేది ఒప్పుకుంటున్నాను. అయితే, అట్టి ‘సృష్ట్యాది’ సమయంలో ఇచ్చట చిద్రూప బ్రహ్మమునందు చేత్యము (దృశ్యము - అనేది ఎట్లా సంభవించింది?
శ్రీ వసిష్ఠ మహర్షి : శుద్ధ చిద్రూపము నందు ‘దృశ్యము’ అనబడునది ఏర్పడటానికి కారణమే లేదని నీవు ఒప్పుకున్నావు కదా! అందుచేత ‘కారణము యొక్క అభావము’ చేత చేత్యము అనబడే దృశ్య జగత్తు ఒకింతకూడా సంభవించదు. శుద్ధ చిదాకాశానికి వేఱుగా ఇంకేదీ కారణరూపంగా ఉండజాలదు. ఈ విధంగా చైతన్యమునకు (బ్రహ్మమునకు) వేఱుగా దృశ్యము లేదని తేలిపోతుంది కదా! కాబట్టి చైతన్యమునకు రెండు లక్షణాలు ఇక్కడ నిరూపించబడుచున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! మీరు “ఆత్మ సర్వదా ముక్తమే అయివున్నది. అది దేనికీ పట్టుబడేది కాదు” అని సిద్ధాంతీకరించుచున్నారు. అది బాగానే ఉన్నది. అయితే, ఆత్మ ‘నిత్యముక్తము’ అయి ఉన్నప్పుడు మరి ఈ అహంకారము మొదలుగా గల రూపమగు ఈ జగత్తు ఎలా ఉదయించింది? ఎచట నుండి ఉత్పన్నమయింది? అట్టి జగత్తులో ప్రవేశించి జీవుని యొక్క “ఊపిరి పీల్చుకోవడం” అనే ‘స్పందము’ నుండి, ఆయా ‘సర్వ విషయముల జ్ఞానం’ ఎట్లా కలుగుతోంది? “ఆత్మ సర్వదా ‘నిత్యముక్తము’, ’చేత్యమునకు (దృశ్యమునకు)’ అతీతము” అయినప్పుడు ఇక గురువులు, శాస్త్రములు, సాధనములు, నియమములు, మహదాశయములు, జీవితం, దీనిని సద్వినియోగ పరచుకోవటం… ఇటువంటి విషయాలతో పనేమున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : శాస్త్రముల ఉద్దేశసారము “ఆత్మ నిత్యముక్తము” అని నిరూపించటమే! "ఓయీ జీవుడా! నీ దృశ్యాతీత స్వస్వరూపమే ఆత్మ! అది సర్వదా సర్వమునకు అతీతమై కేవల సాక్షిగా ఉండి ఉండగా దుఃఖం ఎందుకు?” (తత్త్వమసి - - జీవో బ్రహ్మేతినా పరః - - సోహమ్ - విశ్వమ్ విష్ణుః - అశోచ్వానవ్య శోచస్త్వమ్ మొదలుగా గల) అనేక సూచన వాక్యములను శాస్త్రాలు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూనే ఉన్నాయి కదా! ఆత్మకు ’జగత్తు, దృశ్యము, చేత్యము’ … అను పర్యాయ పదములతో
Page:654
చెప్పబడే ‘అన్యము’ ఏర్పడటానికి మొదలే కారణం లేదు. అనగా ఆత్మకు ఇది అనన్యం. ఆత్మకు అన్యమైన కారణమేదీ లేదు. కాబట్టి సృష్ట్యాది యందు ఈ జగత్తు కించిత్ కూడా ఉత్పన్నమగుటయే లేదు. ఇకప్పుడు ‘దృశ్యము’ అనబడేది (ఆత్మకు అన్యమైనది) ఎక్కడిది?
ద్రష్ట - దృశ్యము - దర్శనము; దృశ్యమునకు ఈవల - ఆవల; సృష్ట్యాది యందు - సృష్టి మధ్యలో - - సృష్ట్యాంతము నందు… సర్వము - సర్వదా - సర్వత్రా శాంతమగు పరబ్రహ్మమే అయివున్నది.
ఇక ఆత్మకు అనన్యంగా కాకుండా, ఏదైనా దృశ్యము - జగత్తు కనిపిస్తూ ఉంటే… అట్టి సృష్టి కేవలము భ్రమ మాత్రమే! అట్టి కేవల స్వకీయ భ్రమయే - కలలో స్వకీయ కల్పితమైన పులివలె - బంధము కల్పిస్తోంది. అనగా ద్రష్ట ఏ దృష్టితో ఈ జగత్తు పట్ల దర్శనము చేస్తున్నాడో… అద్దాని యందు చోటు చేసుకొన్న భ్రమయే ఇక్కడి బంధము! స్వప్నంలో పులికి స్వప్న ద్రష్ట అతీతుడే కదా! అయితే… అలా చెప్పటంలో “స్వప్నంలోని స్వప్నద్రష్ట పులికంటే బలవంతుడు”… అని చెప్పటం ఉద్దేశం కాదు. స్వప్నంలో ద్రష్ట ఉన్నాడనునదే భ్రమ. పులితో సహా స్వప్నమంతా స్వప్న ద్రష్ట తనకు తాను కల్పించుకొన్న భ్రమ.
అందుచేత స్వప్నద్రష్ట స్వప్నాంతర్గత విషయములచే బద్ధుడెట్లా అవుతాడు? అట్లాగే జాగ్రత్ కూడా జాగ్రత్ ద్రష్ట యొక్క జాగ్రత్ కల్పనయే! కానీ ఆ ద్రష్ట (ఈ జీవుడు) "నేను బద్ధుడను” అని వేదన చెందుచున్నాడు. ఆ వేదనను తొలగించి ఆతనిచే ఆతని ప్రశాంత - నిర్మల - ఆత్మానంద రూపం అనునిత్యంగా అనుభవింపజేయటమే శాస్త్రముల, సాధనముల మహోద్దేశం. అదే గురువుల ప్రయత్నమంతా! జగత్ భ్రమ తొలగటమే గురు - - శాస్త్రాదుల ప్రయోజము.
శ్రీరాముడు : హే మహాత్మా! మనమందరం సర్వదా ఏ స్వరూపమై ఉన్నామో… అట్టి నిర్మల పర బ్రహ్మమునకు చలనాదులు లేవు. వాక్కుకు, మనస్సుకు ఆవల ఉన్నది. మనోవాక్కులకు అవిషయమై ఉన్నది. సదా స్వప్రకాశ రూపమై ఉన్నది. నిర్మలము, నిత్యముక్తము అయివున్నది - అని మీరు సశాస్త్రీయంగా ప్రకటిస్తున్న సత్యమునకు మేము సదాంగీకారపూర్వకంగా జేజేలు పలుకుచున్నాం.
ఈ జగత్తు ఆ పరబ్రహ్మమునందే అనన్యంగా - కానీ భ్రమరూపంగా అనుభవమగుచున్నది కదా! బ్రహ్మమునందు ద్వైతమే లేనప్పటికీ… ఈ ‘భ్రమ’ అనే ద్వైతం - ఏ కారణం చేత, ఎవనికి, ఎందుకు కలుగుతోంది? ఈ విషయం చెప్పమని నా ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! బుద్ధి దోషయుక్తంగా ఉన్నప్పుడు దృష్టిలోని ద్వైతమే జగత్ - దర్శన రూపంగా ప్రదర్శితమౌతోంది. శాస్త్రములు చెప్పిన సాధనలచే బుద్ధి నిర్మలమవగా అప్పుడు గురువాక్యాలు ఆ బుద్ధిలో సారూపత్వం పొందగలవు. అట్టి బుద్ధి యొక్క వికాసముచే బ్రహ్మతత్త్వము పొందినవాని దృష్టి యందు బ్రహ్మమునకు వేరైన కారణమే రహితమై పోతోంది. అట్టి - నిర్మల - శాస్త్ర విజ్ఞాన పరిపుష్ట - గురువాక్యమనన శీలక - “బుద్ధి” యొక్క దృష్టిలో ఈ జగత్తు మొదలే ఉత్పన్నము కానిదిగా అగుచున్నది. మొదలే లేనిది, ఉత్పన్నము కానిది ఇక
Page:655
తొలగవలసి రావటమెక్కడున్నది? కాబట్టి జగత్ భ్రమయే మొదలంటా తొలగగా… ఇదంతా (జగత్తంతా, దృశ్యమంతా) బ్రహ్మముగానే (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అనుభవమౌతోంది. కాబట్టి రామా! ఈ “నేను-నీవు దృశ్యము”లతో కూడిన జగత్తంతా కూడా "శాంతము - నిర్వికారము - ఏకము” అగు ఆత్మయే అయివున్నది. ఎండమావులలో “జలమే ఉండదు” అని గ్రహించిన తరువాత ఇక “ఎండమావులతో జలం ఎందుచేత కనిపించింది?” అనే ప్రశ్న యొక్క అగత్యం ఏమున్నది?
శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! అప్పుడు రామచంద్రుడు ప్రశ్నలు అడగటం మానివేసి, మౌనంగా, ఏదో యోచన చేస్తూ కనిపించాడు. అప్పుడు సభలో నిశ్శబ్దం తాండవిస్తోంది. శ్రీరాముడు ప్రశ్నించటం మానివేసి యోచనాపూర్వకమైన మౌనము వహించటం శ్రీ వసిష్ఠ మహర్షి గమనించి, కించిత్ ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో రాముని వైపు చూచారు. అది గమనించిన రాముడు ఇట్లా అంటున్నాడు.
శ్రీరాముడు :
బ్రహ్మన్! భ్రమమివాపన్నః స్రష్టుం! జానామి నా ధికమ్ | నాత్యస్తం చ ప్రబుద్ధాస్మి! పృచ్ఛామి కిమిహాధునా ॥
హే బ్రహ్మర్షీ! ఇప్పుడు నేను “ఏదో భ్రమను పొంది ఇట్లా అడుగుచున్నానా?”… అని అనిపిస్తోంది. ఇక ఎంతగా ప్రశ్నించినా ఎందుకో ఏదో భ్రమ ఇంకా తొలగటం లేదేమో? నేను మీవలె అత్యంత ప్రబుద్ధుడను కాను. ఇంకా ఇంకా ప్రశ్నిస్తే మాత్రం "ఈ దృశ్యము ఎట్లా ఏర్పడుతోంది?”… అనే నా భ్రమపూర్వకమైన ప్రశ్న నన్ను విడచి వెళ్ళటంలేదు. ఇక ఏం ప్రశ్నించను? శ్రీ వసిష్ఠ మహర్షి : సమాధానం నీకు అందక నిరుత్తరుడవుగా అగుచున్నప్పటికీ, ప్రశ్నించటం నుండి విరమించవద్దు. ప్రశ్నకు కారణం సంశయం కలిగి ఉండటమే కదా! ఒరిపిడి రాయితో మెరుపును పరీక్షించి మరల అగ్నిని పుట్టించటానికై ఒరిపిడి కొనసాగిస్తాం చూచావా? అట్లాగే ప్రశ్నకు కారణమైయున్న ‘సంశయము’ సారాసారత్వ పరీక్షకు లోను అగుచున్నప్పటికీ, అవిద్య క్షయించే వరకు నిరాటంకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి.
ప్రశ్నకు కారణం - - సంశయం. సంశయమునకు కారణం - అవిద్య. ప్రశ్నలచే క్రమంగా అవిద్య క్షయిస్తూ చివరికి అది తప్పక మటుమాయమౌతుంది. అవిద్య పూర్తిగా క్షయించిన తరువాత స్వభావ సిద్ధంగానే వాక్కుకు అతీతమైనది (వాక్కుతో చెప్పనలవి కానిది) - సర్వోత్తమ స్వభావము అగు ఆత్మయందు స్వయంగా విశ్రాంతిని పొందగలవు.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! అప్పుడు రామచంద్రుడు తనలో, “అవును! నాలో సందేహం ఆమూలాగ్రం తొలగి ఆత్మయే, ఈ దృశ్యం" అని బుద్ధి అనుభూత పరచుకునే వరకు ప్రశ్నించాల్సిందే కదా! పైగా బ్రహ్మర్షి శ్రీ వసిష్ఠులవారు నాకు ఎదురుగా జ్ఞానాగ్ని రూపంలో సర్వ సందేహాలు
Page:656
మొదలంటా భస్మం చేసే ఉద్యమంలో ఉన్నారాయె! ఇక ఈ సమయ – సందర్భాలను సద్వినియోగం చేసుకోవటమే ఉచితం కదా!” … అని తలచి, తలపైకెత్తి ఇట్లు మరల సంభాషించసాగాడు.
శ్రీరాముడు : మహాత్మా! ఆత్మయందు మొట్టమొదట - ఆత్మకు వేరైన కారణమే లేదు కాబట్టి . సృష్ట్యాది యందు ఈ సృష్టి ఉత్పన్నమే కాకయున్నదనే సిద్ధాంతం నేను గ్రహించాను. కానీ “చైత్య -
- చేతన విభ్రమం (ద్రష్ట - - దృశ్యముల భ్రమ) కలుగుచున్నదెవరికి? ఎందుకు? ఎట్లు“ అనే సంశయం ఇంకా పూర్తిగా తొలగటం లేదు. అందుచేతనే నేను కొంచెంసేపు ఊరకొని ఉండిపోయాను. దయయుంచి చెప్పండి. ఈ సంశయ విభ్రమం తొలగేది ఎట్లా? ద్రష్టత్వం పొందుచున్నదెవరు? ఆత్మయా? జీవుడా? ఆత్మ నిత్యనిర్మలం కాబట్టి అద్దానికి దృశ్యత్వము ఉండదు కదా! ఇక “జీవుడు దృశ్యమును పొందుచున్నాడు” … అని అంటే ఆత్మకు వేరుగా ‘జీవుడు’ అనబడే దృశ్యద్రష్ట ఉన్నాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ”ఈ దృశ్యము మొదలే ఉత్పన్నమయి ఉండలేదు“ అని నేను సిద్ధాంతీకరించినది గ్రహించానని అన్నావు కదా! అంటే… మొదలే ఆత్మయందుగాని, ఆత్మకుగాని ‘జగత్తు’ అనబడేది జనించటానికి కారణమే లేనట్లు కదా! కారణమే లేదు కాబట్టి… ఈ జగత్తు ఎప్పుడూ లేనిదే! సర్వత్రా ప్రశాంతమగు పరమాత్మయే సర్వముగా ఏర్పడియున్నది. ఇక భ్రాంతి అంటవా… భ్రాంతి కూడా లేనిదే అయివున్నది. ఏది ‘భ్రాంతి’ అని, భ్రాంతి ఉన్నదని నీకు అనిపిస్తోందో … అది “శుద్ధ పరమాత్మ సర్వత్రా సర్వముగా కలదు” … అనే అభ్యాసం లోపించటం చేత మాత్రమే అట్లా అనిపిస్తోంది. అట్టి దృఢజ్ఞానం నీకు ఇంకా కలగకపోవటం చేతనే “ఆత్మ వేరు - దృశ్యము వేరు”… అని అనుకొంటున్నావు. దశ్యమే లేనప్పుడు ద్రష్ట ఆత్మకు వేరుగా లేడని వేరే చెప్పాలా? “దీపం లేకపోవటం చేతనే చీకటిగా ఉన్నది”… అని చెప్పిన తరువాత “దీపం ఉంటే చీకటి ఉండదు”… అని వేరుగా చెప్పనక్కరలేదు కదా! ”అంతా ఆత్మ స్వరూపమే”… అని గ్రహించి తద్రూపంగా పరిశుద్ధ దర్శన శీలత్వంతో దృష్టి పరిపుష్టి పొందనంతవరకు విశ్రాంతి లభించదు. అట్టి అవిశ్రాంతియే వ్యర్థంగా నానా సంశయములను కలిగించటం జరుగుతోంది. శ్రీరాముడు : స్వామీ! “అభ్యాసము లేకపోవటం చేత” అని అంటున్నారు కదా! జగద్ధాంతికి కారణమే లేనప్పుడు ఇక అభ్యాసము - అనభ్యాసం అనేవి ఎక్కడి నుండి సంభవిస్తాయి? అసలీ అభ్యాసము యొక్క అవసరము కలిగిస్తున్న భ్రాంతి ఎట్లా సంభవించింది? ’నేను-నీవు-ఈ దృశ్యము’ - అనే భ్రాంతి (ఇవన్నీ ఆత్మయే అయివుండికూడా,) తత్వ్యతిరిక్తంగా మాకు ఎందుకు అనిపిస్తోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఏ భ్రాంతి లేదు. ఆత్మకు వ్యతిరిక్తమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. పరమాత్మ అనంతరూపుడవటం చేత నిజమాయచే ఇట్లు అనంతంగా భాసించుచున్నాడు. జీవన్ముక్తుని దృష్టికి సర్వదా సర్వత్రా సర్వరూపములుగా పరబ్రహ్మమే తాండవిస్తున్నట్లు అనుభూతమగుచూ ఉండగానే… ఇక ఆపై సమస్త జీవులతోటి యథాతథంగా అందరిలాగానే ప్రవృత్తి కలిగి ఉంటున్నారు. చిదనము, నాశరహితము అగు పరమాత్మయే ’నేను-నీవు జగత్తు’లుగా భాసిస్తున్నదని ఎరిగి ఉండి వ్యవహారములలో పాల్గొనుచున్నాడు. మీ వంశమునకు ఆది పురుషుడగు రఘువు, (అట్లాగే)
Page:657
జనక మహారాజు మొదలైన వారెందరో… (అట్లాగే) సభయందు పాల్గొనుచు మన ఈ సంవాదమును ఆలకిస్తున్న అనేకమంది జీవన్ముక్తులు వ్యవహారరీత్యా జగద్విషయములందు పాల్గొంటూనే “భ్రాంతి బ్రహ్మము యొక్క చమత్కారమే! అంతా పరబ్రహ్మమే!” అని నిర్దుష్టంగా, సుస్పష్టంగా నిర్మల దర్శనము కలిగియే ఉంటున్నారు. “సమస్తము పరమార్ధమున చిదనమే” అని ఎరిగియే సమస్త వ్యవహారములందు జీవన్ముక్త ప్రవృత్తిని నీవుకూడా కలిగియుండెదవు గాక!
శ్రీరాముడు : స్వామీ! వాస్తవానికి భ్రాంతి అనబడునదే లేదని అంటున్నారు కదా! అట్లా అయితే, మీరేమో జీవన్ముక్తులై జగత్ భ్రమ శమించగా, ఇప్పుడు ఈ అధ్యాత్మ రూప శబ్ద సంపత్తిచే మాకు, ప్రసాదిస్తున్నారు. తెలిసీ - తెలియని మేము మీ యొక్క ఉపదేశమునకు అర్హత పొందినవారమై మీ ఉపదేశ మహాప్రసాదమును పొందుచున్నాం.
అనగా ఈ జగత్తునందు తమవంటి భ్రాంతి రహితులగు జీవన్ముక్తులు - మావంటి అల్ప అభ్యాసపరులగు భ్రాంతి దృష్టి కలవారు ఉన్నట్లే కదా! మరి, భ్రాంతియే లేదని అనటం ఎట్లా? భ్రాంతియే లేకపోయి ఉంటే, ఉపదేశము చేయటానికి, "భ్రాంతిని తొలగించటం” కాకుండా మరింకే కారణం లేదు కదా? కనుక భ్రాంతి ఉన్నట్లే కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవన్ముక్తుల దృష్టిలో ఉపదేశించువాడు - ఉపదేశించబడువాడు … ఇరువురు, అట్లాగే తదితరము అంతాకూడా - ఈ సమస్తముకూడా - బ్రహ్మమే అయివున్నది. ఇదంతా బ్రహ్మమునందే నెలకొనియున్నది. బోధస్వరూపమగు పరమాత్మయందు బంధ - - మోక్షములు ఎట్లా ఉంటాయి? ‘ఉండవు’ అనునది సునిశ్చిత విషయమే అయివున్నది.
శ్రీరాముడు : మహాత్మా! ఆత్మయందు ఆత్మకు వేరుగా సర్వ పదార్థములు అసంభవమై ఉన్నాయి కదా! మరి అజ్ఞానుల దృష్టియందు ఇక ఈ దేశ కాల-క్రియ-ద్రవ్య భేదములతో కూడిన ఈ జగత్సత్త అంతా కూడా ఎట్లా స్థితినొందియున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వుచూ) రామయ్యా! “అజ్ఞానుల దృష్టి యందు” - అని అంటున్నావు కదా! నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే ఉన్నదయ్యా!
దేశకాల క్రియాద్రవ్య భేద వేదన చేతసామ్ అజ్ఞానమాత్రాదితరాసత్తా నా న్యాస్తి నో పురా!
దేశ-కాల-క్రియ-ద్రవ్యాదిగా గల భేదమును చూచుచున్న అజ్ఞానుల దృష్టి యందు జగత్ సత్త స్థితి పొంది ఉండటానికి కారణం అజ్ఞానం తప్ప మరింకేమీ కాదు.
శ్రీరాముడు : మహాత్మా! తత్త్వదృష్టిచే “ఆత్మయందు జగత్తు ఏర్పడటానికి కారణమే లేదు”… అనే సిద్ధాంతమును అనుసరించి ఇక్కడ ద్వైత - ఏకత్వములు రెండూ అసంభవం కాబట్టి ”బోధింపబడునది - బోధింపబడువాడు - బోధించువాడు” … అనే మూడింటికీ అభావమే సిద్ధిస్తుంది కదా! అభావం సంభవిస్తే శాస్త్రములు బోధించటమెట్లా? అనగా “దృశ్యమునకు అతీతమైన బోధత్వము”… “నిర్మల బోధ స్వరూపమే ఆత్మ” … అను శాస్త్ర పాఠ్యాంశాలు సమకూరటం మొదలైనవి ఎట్లా సంభవం?
Page:658
“ఈ జీవుడు అకర్మకమగు బోధ రూపమును సంతరించుకోవటమే మోక్షం”… మొదలైన నిర్వచనాలు అర్థరహితమంటారా? “అజ్ఞాని - జ్ఞానమును సంతరించుకోవటం”… లేవంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
బోధేన బోధతామేతి బోధ శబ్దస్తు బోధ్యతామ్ భవద్విషయమేవాయమ్ ఉచితో! న అస్మదాదిషు ॥
అజ్ఞాతమగు బ్రహ్మము “నేను అజ్ఞానిని”… అని తలచిన సందర్భంలో అట్టి "అజ్ఞానము యొక్క క్షయము”… అనే ఫలమును ఆశ్రయిస్తోంది. అట్టి బోధ కర్మత్వమును పొందుచున్నది. అప్పుడు ఆ ‘బోధ’ అనే శబ్దం ఫలరూపమగు సకర్మత్వము పొందుతోంది. అయినాకూడా, “జ్ఞాతము అజ్ఞాతము” - ఈ ఉభయములు బ్రహ్మమేగాని మరి ఏదీకాదు.
అయితే బోధసాధనలు బోధత్వం సాధనానంతరం పొందటం… ఇవన్నీ కూడా అజ్ఞాన యుక్తులగు వారి కొరకు మాత్రమే! అజ్ఞానము క్షయించినట్టి మా వంటి వారి యందు బోధ సాధనములు - బోధరూపము పొందటం … ఇవన్నీ ఆత్మకు భిన్నమై లేవు. జగత్తులో పదార్థములన్నీ బ్రహ్మముగా కనిపిస్తున్నట్లే మాకు ఆయా బోధ సాధనలు, సాధనానుసారం బోధ స్వరూపం సంతరించుకోవటం… ఇవన్నీ బ్రహ్మమునందే బ్రహ్మము రూపంగానే అగుపిస్తున్నాయి. బ్రహ్మమునకు భిన్నమై ఎప్పుడూ ఏదీ లేదు.
శ్రీరాముడు : హే మహర్షీ! ఇప్పుడు మీరు జీవన్ముక్తుల దృష్టిని ఉద్దేశించి “మా వంటి వారి యందు ఆత్మకు భిన్నమై ఎక్కడా ఏదీ ఉండదు”… అని అంటున్నారు కదా! ఇట్టి "మావంటివారియందు” అని పదప్రయోగం చేస్తున్నారు కనుక… జీవన్ముక్తులలో కూడా ‘అస్మత్’ (నాకు సంబంధించినది) …అనే ప్రవృత్తికి నిమిత్త భూతము అగు అహంత్వము మీచే గమనించబడుచున్నది కదా! అనగా… ఇక్కడ 3 విశేషాలు కనబడుచున్నాయి.
1.జీవన్ముక్తులలో అజ్ఞానం ఉండదు. (తదితరులలో ఉన్న అజ్ఞానదృష్టి జీవన్ముక్తులకు ఉండదు). 2.అయితే జీవన్ముక్తులలో “నేను” అనే మూలపదార్థంతో తయారైన “అహంత్వం” ఉంటుంది. 3. జీవన్ముక్తులు జ్ఞానులై ఉన్నారు. అందుచేత ఈ అహంత్వము (నాకు సంబంధించినది - అనబడేది) అజ్ఞాన కార్యము కాదు. అది అజ్ఞాన కార్యమే అయివుంటే… అది జీవన్ముక్తులలో ఉండేది కాదు కదా?
4.“బోధ” లేక “శుద్ధజ్ఞానం” తానే ఈ అహంత్వము రూపంగా పరిణామం పొందుచున్న దగుచున్నది.
ఇంతవరకూ బాగానే ఉన్నది. అట్టి ‘బోధ’ (నిర్మల బోధసత్త) నుండి ఉత్పత్తి అయివున్న ‘అహంత్వం’ - బోధరూపం కంటే భిన్నమైన రూపం కలిగి ఉండటమే ఇక్కడ మాకు దుర్భరంగా అనిపిస్తోంది. స్వామీ! ‘అహంత్వము’ అనగా? ఈ జీవుని రూపము అహంత్వమే కదా!
మీరు జీవన్ముక్తులై "పరము - - అనంతము - భూత్ భవిష్యత్ వర్తమానములలో యథాతథము - జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే త్రివిధములైన పరిచ్ఛేదములు లేనిది - అతినిర్మలము” అయినట్టి
Page:659
శుద్ధ చిన్మాత్ర స్వరూపము ధరించినవారై ఉన్నారు కదా! అట్టి చినాత్ర స్వరూపులగు తమయందు ’అహంత్వము’ అనేది ఉండటం ఎట్లా కుదురుతుంది? జాగ్రత్లో ఉన్నవానికి స్వప్నం ఉండదు కదా? సూర్యకాంతిలో చీకటి ఎక్కడుంటుంది? అట్లాగే జీవన్ముక్తులగు మహనీయులలో అహంత్వము ఉండటానికి వీలేలేదు కదా? శుద్ధ చిన్మాత్ర స్వరూపం ధరించిన తరువాత కూడా ‘మా వంటివారు’ అనే రూపంలో ప్రదర్శితమయ్యే అహంత్వము ఎట్లా ఉండగలదు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వాయువే వాయు స్పందరూపమగు వాయు తరంగాలుగా అగుచున్నది కదా! జలమే జలతరంగములుగా కనిపిస్తోంది కదా! అట్లాగే ’బోధ’ యొక్క ఏ బోధరూపము కలదో… అదియే ‘అహంత్వము’ అనే పేరుతో కూడా చెప్పబడుచున్నది. కాబట్టి మాకు అనుభవమగుచున్న “నేను-అహమ్” అనునది ’ఆత్మకంటే భిన్నం కాదు.
బోధ, మరియూ బోధరూపత్వములే… జీవన్ముక్తులలో ఉండే అహంత్వము. అహంత్వము, మరియు, అభిమానములే అజ్ఞానుల అహంత్వము.
ఈ విధంగా జగత్తుకు సంబంధించిన అభిమానరహితమైన అహంత్వము బోధరూపమే అయివుండి, జీవన్ముక్తులలో కనబడుతోంది. అజ్ఞానులలో అహంత్వం దృశ్యమునకు సంబంధించిన అభిమానముతో కూడుకొని కనిపిస్తోంది. ఇంతకుమించి ఈ అహంత్వమునకు భిన్నత్వమేదీ జీవన్ముక్తులకు కనిపించటం లేదు. దృశ్యమునకు సంబంధించిన అభిమానము కూడా బ్రహ్మమునకు అభిన్నమైనదిగా మాకు అనుభూతమౌతోంది. కనుక ‘జీవన్ముక్తులు’ అని చెప్పబడుచున్నాం. శ్రీరాముడు : స్వామీ! శాంతి రూపమగు సముద్రజలమే తరంగముల రూపం ధరిస్తున్నట్లుగా… జీవన్ముక్తుల దృష్టిలో చిన్మాత్ర స్వరూపమగు ఆత్మయే అహంత్వము, జగత్తు : తెలుసుకొనువాడు (బోధ్య-బోధం-బోధ) అనే త్రిపుటి… అయినట్టి ఈ రూపాలుగా ధరిస్తున్నదని తేలిపోతోంది కదా? శ్రీ వసిష్ఠ మహర్షి : బాగా చెప్పావు. కాబట్టి “అనంతము - శాంతము - ఏకము - పరిపూర్ణము” …అయినట్టి కేవల పరబ్రహ్మమే సర్వదా పరమపదము అయి ఉండి… సర్వరూపంగా స్థితినొంది ఉన్నదగుచున్నది కదా! అనగా …జగత్తుగా ఏది కనిపిస్తోందో… అది పరబ్రహ్మమే అయివున్నట్లే కదా! అప్పుడిక జగత్తు - అహంకారాలను గురించిన అద్వైత హానిదోషం ఇంకెక్కడిది? ”అహం - - జగత్తుల వాస్తవ రూపం సర్వదా నిర్మల పరబ్రహ్మమే”… అనే నా సిద్ధాంతం దిగ్విజయంగా -
నిర్ద్వంద్వంగా జయప్రదమైనట్లే కదా!
శ్రీరాముడు : హే మహాత్మా! మీరు చెప్పుచున్నట్లు శుద్ధ - అద్వైత పక్షమే సరి అయినప్పుడు… మరి, దేనిమూలంగా ఈ అనంత సంసార భ్రమ విజృంభిస్తోందో… అట్టి "అహంత్వము అనే వికల్పమును కల్పిస్తున్నదెవరు? ఆ కల్పించిన వ్యవహారమును అనుభవిస్తున్న “అనుభవి” అనబడే
ఆ రెండవవారు ఎవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి :
జ్ఞేయ సత్త అవబోధే హి బంధనమ్ సచ్చ నాస్త్యలమ్ జ్ఞప్తేః సర్వార్థరూపత్వాత్, బంధమోక్షావతః కుతః?
Page:660
ఓ రామచంద్రా! "పరబ్రహ్మము కంటే భిన్నంగా దృశ్య పదార్థములు అనబడే జ్ఞేయ శక్తి ఉన్నది” అను రూపముగల అభినివేశము చేతనే “బంధము’ అనేది కలుగుతోంది. తత్త్వవేత్తలలో ఇటువంటి (దృశ్యము ఆత్మకు వేరుగా ఉన్నది - అను రూపంలో ఉండే) అభినివేశం ఏమాత్రం కించిత్ కూడా ఉండటం లేదు. వారికి జ్ఞాన స్వరూపమగు పరమాత్మయే తనతోసహా సర్వ పదార్థాకారములుగా, సర్వ పదార్థ ధర్మములుగా భాసిస్తున్నట్లు అగుపిస్తోంది.
జ్ఞానమే … జ్ఞేయము, తెలుసుకుంటున్నదే … తెలియబడురూపంగా ఏర్పడి ఉన్నది.
అందుచేత తత్త్వవేత్తల దృష్టిలో బంధ మోక్షముల కల్పనయే ఉండటం లేదు. అంతా యథా తథంగా ఆత్మగా అనిపించటమే సర్వశాస్త్ర సాధనముల అంతిమ ప్రయోజనం. అట్టి ప్రయోజనం సిద్ధించుకున్న తరువాత “జ్ఞానమునకు భిన్నంగా జ్ఞేయం లేదు” అని స్వభావ సిద్ధంగా సుస్పష్టమౌతుంది.
“జ్ఞాని - అజ్ఞాని కూడా ఆత్మస్వరూపుడే! జ్ఞానాజ్ఞానములు ఆత్మయొక్క లీలావినోదం మాత్రమే. దృశ్యము, ఆ దృశ్యమును దర్శిస్తున్న అహంప్రత్యయము, ఆ అహంప్రత్యయమునకు సాక్షి అయినట్టి ‘ఆత్మ’ - ఈ మూడు వేరు కాదు. ఆత్మయే అహంస్వరూపమై వెల్లివిరుస్తోంది. అహంప్రత్యయమే దృశ్యముగా తనను తాను విస్తరింపజేసుకొని ఆస్వాదిస్తోంది.” అనునదే అద్వైతసిద్ధి! శ్రీరాముడు : స్వామీ! ఇక్కడ మీరు చెప్పే ఒక్క విషయం నేను కించిత్ ఇంకా ఒప్పుకోలేకపోతు న్నాను. ప్రకాశరూపుడగు సూర్యుడు ఎప్పుడైనా తాను ప్రకాశింపజేసే వస్తువుల రూపం అవుతాడా? దీపం వస్తువులను - రూపములను ప్రకాశింపజేస్తుంది. అంతేగాని ఆ దీప కాంతి తానే వస్తురూపంగానూ, ఆకారాదులుగానూ ఎక్కడైనా అవుతుందా?… లేదే! అట్లాగే జ్ఞానరూపమగు జ్ఞప్తి ఈ సర్వ పదార్థరూపంగా ఎట్లా అవుతుంది? అవకూడదు కదా!
జ్ఞాన స్వరూపమగు పరమాత్మ యొక్క ‘సత్త’ చేతనే ఈ బాహ్యమున ఉన్న సర్వ పదార్థాలు స్థితిని పొందుచున్నాయని నేనూ, ఒప్పుకుంటున్నాను. అయితే, తెలుసుకొను తత్త్వ స్వరూపమగు జ్ఞానమే తెలియబడే ఇదమ్ స్వరూపమగు జ్ఞేయము (దృశ్యము)గా అగుచున్నదనునది ఎట్లా యుక్తియుక్తం? చూచే నేను - చూడబడే ఈ దృశ్యము అత్యంత నిర్దుష్టంగా వేరువేరుగా వెలయుచు, సిద్ధించుచుండగా “నేనే బాహ్య పదార్థ రూపుడనై ఉన్నాను” అని, “ద్రష్టయే దృశ్యరూపుడు కూడా” …అనే సిద్ధాంతం ఈ వర్తమానానుభవం దృష్ట్యా ఎట్లా పొసగుతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “శుద్ధ జ్ఞాన స్వరూపమగు పరమాత్మ సత్త చేతనే ఈ సర్వ దృశ్య వస్తువులు ‘సత్తా’ పొందుచున్నప్పటికీ… జ్ఞాన స్వరూపమగు ద్రష్ట వేరు - జ్ఞేయ స్వరూపమగు దృశ్యము వేరు. ద్రష్ట దృశ్యరూపుడు కాజాలడు. ప్రత్యక్షానుభవమే ఇందుకు తార్కాణం” …అని నీవు అంటున్నావు కదా! అయితే, "ఈ గొడ్రాలి (వంధ్యా) రెండవ పుత్రుడు ఏ దారి నుండి మన
Page:661
ఊరికి వచ్చాడు?” అనే ప్రశ్నలో “గొడ్రాలికి పుత్రుడెట్లా ఉంటాడు?” అనే మీమాంస చేత ఆ ప్రశ్న మొదలే శూన్యస్వరూపమగుచున్నది కదా! ఆకాశం మొదలైన ఈ సర్వ బాహ్య పదార్థాలు అగుపిస్తున్నాయే… అవన్నీ కారణ శూన్యములు. సర్వదా ఆత్మ ఒక్కటే అంతటా ఉండి ఉండగా …అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? అందుచేత ఇవన్నీ కూడా వంధ్యా పుత్ర సదృశములే (గొడ్రాలి రెండవ కుమారుని వంటివే అయివున్నాయి. ఇక “ఇవి ఘనీభూత సత్యముగా భాసిస్తున్నాయి కదా!” … అని అంటావా? ముత్యపుచిప్పలో వెండి యొక్క ప్రకాశము కనబడవచ్చుగాక! ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా? లేదు కదా! ’శుక్తి రజతన్యాయం’గా ముత్యపు చిప్పలో వెండి ఉండటం ఎంతగా సత్యమో… ఈ దృశ్యము అంతే సత్యము. ఈ భూమి, ఆకాశం, దేహాలు, వస్తు సముదాయం… ఇవన్నీ కేవలం భావనారూప భ్రాంతి మాత్రమే అయి ఉన్నాయి. అంతేగాని, సత్యము గాదు. ఎవరైనా… “ఇవన్నీ ఈ ఈ రూపాలుగా సత్యమే!”… అనుకోదలిస్తే అనుకోనీ! అది సత్య దృష్టిచే, జ్ఞానదృష్టిచే (లేక) పరిపక్వ దృష్టిచే అనుభూతము అవగల “ఆత్మజ్ఞాన వికాసము” చే క్రమంగా తొలగగలదని మాత్రం ఇక్కడ మనవి చేయగలను. ఇందులో సందేహమే లేదు. శ్రీరాముడు : హే మహర్షీ! జీవన్ముక్తులు, కార్యకారణ తత్త్వవేత్తలు అగు మీ దృష్టిలో ఈ దృశ్యమంతా గొడ్రాలి రెండవ కుమారునివలె, ముత్యపు చిప్పలో వెండిలాగా అసత్యమే అయివుండవచ్చు. మరొక ‘అపరిపక్వ దృష్టి’ తో కూడిన ద్రష్టకు ఇదంతా సుస్పష్టమైన సత్యంగా అనిపించవచ్చుగాక! ఏది ఎట్లైతేనేం? ఈ దృశ్యము దుఃఖమును మాత్రం కలుగజేస్తోంది కదా! “స్వప్నము సత్యమా? అసత్యమా?”…అనునది వేరే విషయం. ముందు… అది దుఃఖాన్ని కలుగజేస్తోంది కదా! అట్లాగే ఈ జగద్ర్భాంతి కూడా అనేక దుఃఖాలను కలుగజేస్తోందే! ఇది సత్యమనండి, అసత్యమనండి. ముందుగా, ఈ దుఃఖాలకు నివారణోపాయం ఏమిటో… అది చెప్పమని నా ప్రార్ధన. ఈ జగత్ప్రమ తొలగేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : (పకపకా నవ్వుతూ) నీ ప్రశ్న చమత్కారంగా ఉన్నదయ్యా!
ఏవం తావత్ యథాస్వప్నః తథేయం చేత్ జగస్థితిః |
తత్ పిండగ్రహతార్ధానాం సర్వైవ భ్రాన్తితోదితా! ॥
ఎప్పుడైతే "ఈ జగత్తు స్థితి స్వప్నము వంటిది”… అని నీవు ఒప్పుకుంటావో, ఇక ఆపై పెద్దగా చెప్పవలసినదేమున్నది? “జగత్ భ్రమ : జగత్ భ్రాంతి”… అని నీవే అంటున్నావు కదా! స్వప్నంలో స్వప్న ద్రష్టను బాధిస్తున్న పదార్థాలు, సంఘటనలు, సందర్భాలు మెళుకువ రాగానే ఏమౌతున్నాయి? క్షణంలో అవన్నీ శూన్యరూపమైపోవటం లేదా? అప్పుడిక స్వప్నంలో కలిగిన దుఃఖం ఏమాత్రం (మెళుకువ తరువాత) ఉండటం లేదు కదా! అట్లాగే ఈ జాగ్రత్లో జగత్ ద్రష్ట జగత్తు యొక్క పిండత్వము చేత (సాకారత్వం - నామ రూపాత్మకత్వంచే) బాధింపబడవచ్చు గాక! ఆత్మజ్ఞానముచే ఈ సమస్త జగత్ పిండత్వము అద్దాని యొక్క నామరూపాత్మకత్వం కోల్పోతోంది. అప్పుడు అంతకుముందటి సమస్త దుఃఖములు సమసిపోతున్నాయి. శమించిపోతున్నాయి.
Page:662
ఓ రామచంద్రా! స్వప్నంలో లాగానే… ఈ జాగ్రత్లో కూడా… సమస్త పదార్థముల యొక్క సత్యత్వము భ్రాంతి చేతనే ఉదయించినదగుచున్నది. భ్రాంతి తొలగిన మరుక్షణం ఇక దుఃఖమునకు విషయమే ఉండదు. కాబట్టి స్వస్వభావమగు ’ఆనందము’నకు తలుపులు తెరుచుకుంటాయి. కనుక ‘భ్రాంతి’ ని ముందుగా తొలగించుకోవాలి. అందుకు ఔషధమే ఆత్మజ్ఞానం. శ్రీరాముడు : మీరు చెప్పేది వినటానికి చాలా బాగున్నది. కానీ మహాత్మా!
కిమ్ ఏతావతి సంపన్నే సంపన్నం భవతి ప్రియమ్?
కథంచ శామ్యతి అర్థానాం స్వప్నాదౌ పిండరూపతా?
ఒక నిరుపేదవాడు “నాకు చాలా డబ్బు ఉన్నదిలే” అని అనుకుంటే ధనికుడైపోతాడా? “ఈ జగత్తు మిథ్య మాత్రమే”… అని అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? అంత మాత్రం చేత ఆనందం కలుగుతుందా? "దృవ్యము కేవలం మిథ్యయే” అనే జ్ఞానమాత్రం చేత స్వప్న -
జాగ్రత్తులలోని పదార్థముల స్థూలరూపత్వం ఎట్లా శమిస్తుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అధ్యాత్మ శాస్త్ర పరిశీలన ద్వారా పూర్వాపర విచారణచే ‘జ్ఞానము’ ఉదయించగలదు. అట్టి జ్ఞానాగ్నిచే ఇక్కడ కనిపించే స్థూలత్వం భస్మీభూతమై నివర్తించగలదు. ఎట్లా అంటే, స్వప్నంలోంచి మేల్కొనగానే స్వప్నంలో కలిగిన స్థూలభావన, ’అవన్నీ సత్యమే’ అనే బుద్ధి నివర్తితం కావటం లేదా? ఇదీ అంతే!
శ్రీరాముడు : హే గురుదేవా! ఎవనికైతే పూర్వ - పర విచారణచే ఈ జగత్తు యొక్క స్థూలత్వము సన్నగిల్లుచున్నదో… ఆతడు జీవన్ముక్తుడు కదా! అట్టి జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును ఏ ప్రకారంగా చూస్తున్నారు? ఆతనిపట్ల ఈ సంసార కూపరూపమగు భ్రమ ఎట్లా శమిస్తోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : వాసనారహితుడగు జీవన్ముక్తుడు ఈ ప్రపంచమును సర్వదా నశించినదాని వలె, అసత్తుగాను, గంధర్వ నగరంలాగా కల్పనామాత్రంగాను, వర్షముచే తుడిచివేయబడబోవుచున్న చిత్రలేఖనం వంటిదిగాను చూస్తున్నాడు.
శ్రీరాముడు : వాసనలు నశించగా, స్వప్నము వంటి ఈ జగత్తు యొక్క పదార్థములందు స్థూలత్వబుద్ధి శమిస్తోంది. అటు తరువాత ఆ మనుజునకు ఏమి కలుగుతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : సంకల్పరూపమగు ఈ జగత్తును గూర్చిన స్థూలబుద్ధి నశించగా… అప్పుడు బుద్ధి సూక్ష్మరూపం పొందుతోంది. అట్టి వానికి ఉత్తరోత్తర భూమికా పరిపాకము చేత క్రమంగా సూక్ష్మ వాసనలు కూడా నశిస్తూ వస్తున్నాయి. అట్లు సర్వవాసనా రహితుడగు జీవుడు ‘ఆత్మానుభవం’ పొందుచున్నాడు. అట్టి వాసనారాహిత్యముచే రూపుదిద్దుకున్న ఆత్మానుభవంచే ఆతడు పరమశాంతిని పొందుచున్నాడు.
శ్రీరాముడు : అయితే మహర్షీ! ఈ జగత్తు స్థూల దర్శనమునకు వాసనలే కారణమై ఉన్నాయి. ఈ వాసనలు అనేక జన్మలందు బాగా దృఢపడి ఉన్నాయి కదా! దృఢమైన మూలము - విస్తృతమైన శాఖలు ఈ వాసనావృక్షం కలిగియున్నది.
Page:663
అనేక జన్మ సంరూఢా శాఖా ప్రసవశాలినీ, భవ బంధకరీ ఘోరా, కథం శామ్యతి వాసనా?
అట్టి వాసనలే ఘోరమైన సంసార బంధములన్నీ కలుగజేస్తున్నాయి. అట్టి అతి భయంకరమై ఒప్పుచున్న ఈ వాసనలు తొలిగేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భ్రాంతిమాత్రమగు ఈ దృశ్యం ‘ఆత్మ జ్ఞానం’ అనే పవిత్రమైన అవగాహనచే మాత్రమే స్థూలరాహిత్యం పొందగలదు. అట్టి జ్ఞానంచే స్థూలత్వం తరుగుచూ ఉండగా …అప్పుడు వాసనాక్షయం కూడా క్రమంగా దానంతట అదే, స్వయంకృతంగా కలుగగలదు. శ్రీరాముడు : ఓ మునీశ్వరా! జగతృశ్యచక్రము క్రమంగా స్థూలత్వరహితం కాగా… అప్పుడు ప్రాప్తించేదేమిటి? అట్టి వానికి పూర్ణశాంతి ఎట్లా లభిస్తుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎప్పుడైతే జగత్తుయొక్క స్థూలత్వమును గురించిన భ్రమ క్రమంగా ఉపశమిస్తూ వస్తుందో… అప్పుడిక దృశ్యమంతా కూడా చిత్త మాత్ర స్వరూపం పొందుతోంది. ఈ జగత్తు నిరోధ భార రహితమౌతోంది. అంతా కూడా అతి సూక్ష్మత్వం సంతరించుకుంటోంది. అప్పుడా మనుజునకు సర్వ భోగాలలో ఆసక్తి శమిస్తోంది. ఆతడు స్వభావ సిద్ధంగానే పరమవైరాగ్యవంతుడు అగుచున్నాడు. శ్రీరాముడు : హే మహర్షీ! ఒక బాలుడు అతికోమలుడు, ప్రకాశశీలుడు అయివుండి కూడా ఇంత లోనే ఆయా కనబడే వస్తు - - విషయాదులపట్ల ఏర్పడుచున్న సంకల్పముల పరంపరల చేత అనేక దుఃఖాదులు కొనితెచ్చుకుంటున్నాడు. అట్లాగే ఒక యువకుడు కూడా తెలివికలవాడై కూడా దృశ్యమునకు సంబంధించిన అనేక సంకల్ప - వికల్పాలు తనయందు పెంపొందించుకుని తద్వారా అనేక ఆవేదనలను దుఃఖాలను కొనితెచ్చుకుంటున్నాడు. అట్టి సంకల్ప పరంపరల వలన పుట్టుకొస్తున్న దుఃఖాదులకు తరుణోపాయం ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఈ జగత్తు సంకల్పమాత్రమే!” అని గ్రహించిన తరువాత, ఇక ఆపై దుఃఖం దేనికి? అవిచారణచే “ఈ జగత్తు నా ఊహా సంకల్పచమత్కారం మాత్రమే”… అని గ్రహించకపోవటం చేతనే బాలునికి (ఇదంతా స్థూలంగా నమ్మడం వల్ల) దుఃఖం కలుగుతోంది. మరి నీవో! మన ఈ చర్చనీయాంశం యొక్క సారమును గ్రహించి ఉండటంచేత “ఇదంతా సంకల్పమాత్రమే” అని గమనించియే ఉంటావు కదా! అట్టి సంకల్పము చేతనే జగత్తు అనుభూత మౌతోందని గ్రహించినప్పుడు, ఇక ఆపై (ఈ జగత్తు నశిస్తున్నప్పుడు కూడా) ఏమాత్రం దుఃఖం కలుగదు. ఈ విషయమై నీవు “ 66 చిత్తము ఎట్టిది?” అనే విషయం పదేపదే విచారణ చేస్తూ ఉండాలి. శ్రీరాముడు : మహర్షీ! ఈ చిత్తము యొక్క స్వరూపము ఎటువంటిది? అద్దాని గురించి విచారణ చేయటం ఎట్లా? అద్దాని గురించి బాగుగా విచారణ చేస్తే అప్పుడు లభించేదేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
చితః చేతో ఉన్ముఖత్వం యత్త్ “చిత్తమ్” ఇతి కథ్యతే | విచారణ ఏష ఏవాస్య వాసనానేన శామ్యతి ॥
Page:664
చిత్తము యొక్క స్వరూపము - - చైతన్యము విషయముల వైపుగా అభిముఖం కావటం. అట్టి విషయాభిముఖత్వం తప్పించి చిత్తమునకు వేరు రూపమూ లేదు, అంతకు వేరుగా చిత్తమూ లేదు. మన ఈ “వసిష్ఠ-రామ సంవాదం (యోగ వాసిష్ఠం)” రూపంలో ఏ మహారామాయణం శ్రవణం చేస్తున్నామో… ఇదంతా కూడా చిత్తము యొక్క విచారణయే అయివున్నది సుమా! ఇటువంటి విచారణ చేత వాసనలు తప్పక క్షయిస్తాయి.
శ్రీరాముడు : ఒక ప్రక్క ఈ చిత్తము విద్యమానమై ఏదో రకంగా విషయోన్ముఖత్వం అవుతూనే ఉన్నదే! ఏదో కొద్ది సమయం నిరోధించినా కూడా, మరల ఎప్పుడో మాకు తెలియకుండానే మమ్ము లను మరపించి విషయాల వైపుకు పరుగులు తీస్తోంది! ఏమిటి చేయటం? మరి ఇది విషయాలను పొందకుండా ఎంతవరకు ఊరకుంటుంది? అట్టి చిత్తం యొక్క అచిత్తత్వ స్థితి ఉదయించటమెట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : వాస్తవానికి ఈ దృశ్యమే అసంభవమై ఉన్నది. మొదలే లేని దానిని చిత్తము ప్రకాశింపజేయటమనే మాట ఎక్కడిది? కనుక, “దృశ్యమే లేదు. కనుక ఇద్దానిని ధరించే చిత్తము మొదలే లేదు” అని భావించటం చేత చిత్తము లేకయేపోతుంది. దృశ్యము లేదని అభ్యాసం నిర్వర్తించటమే చిత్త వినాశనమునకు ఉపాయం.
శ్రీరాముడు : మహాత్మా! ప్రత్యక్షంగా అందరిచేతా అన్ని సమయములలోను అనుభవించబడుచున్నట్టి దృశ్యజగత్తు “లేనిదే” ఎట్లా అవుతుంది? స్వామీ! ప్రత్యక్షంగా అందరికీ అనుభవమగుచున్నదానిని మీరు ఎట్లు నిషేధిస్తున్నారో ముందుగా నాకు చెప్పండి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇక్కడ ఏ సాకార జగత్తు అయితే అజ్ఞానులకు అనుభమౌతుందో …అది సత్యము కాదు. ఇక జ్ఞానులకు ఏది అనుభూతమౌతోందో… అది వాక్కుకు అతీతము - అద్వయము - పరమ సత్యము అగు పరబ్రహ్మమే అయివున్నది.
శ్రీరాముడు : మహర్షీ! 1. అజ్ఞానులకు ఈ త్రైలోక్య జగత్తు ఎట్లు భాసిస్తోంది?2.అది సత్యము ఎందుకు కాదు? 3.జ్ఞానులకు ఈ జగత్తు ఎట్లు భాసిస్తోందో, అది చెప్పటానికే ఎందుకు వీలుకాదు? ఎందుకు వారి అనుభవం వాక్కుకు విషయం కాదు?
శ్రీ వసిష్ఠ మహర్షి : అజ్ఞానులకు ఈ జగత్తు… ఆద్యంత సహితంగాను, దేశ కాల వస్తు పరిచ్ఛేదయుక్తంగాను, ద్వైతరూపంగాను భాసిస్తోంది (అనిపిస్తోంది). ఇక జ్ఞానులకు ఆ రూపంగా ఇది భాసించటం లేదు. వారికి ఇదంతా కూడా… ఆరంభం నుండి ఎప్పుడూ కూడా ఉత్పన్నము కానిదియే గాను, గొడ్రాలి రెండవ కుమారుని గుణగణములవలె ఏ కాలమందునూ అసలు సంభవించనిదానివలె, అసద్రూపంగాను భాసిస్తోంది (అనిపిస్తోంది.
శ్రీరాముడు : హే బ్రహ్మన్! ఏ జగత్తెతే ప్రారంభం నుండి ఉత్పన్నమే అయివుండలేదో, ఎప్పుడూ కూడా ఏమాత్రం సంభవించనిదై ఉన్నదో, అసద్రూపం మాత్రమే అయివున్నదో, మొదలే భాసించనిదై ఉన్నదో… అట్టి ఈ జగత్తు సర్వులకు అర్ధక్రియా సమర్థముగా ఎట్లా అనుభూతమౌతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కారణ శూన్యము
Page:665
ఉత్పత్తి రహితము అసద్రూపమే అయివున్నాయి కదా! అయినప్పటికీ కనబడటం, అర్ధక్రియా సమన్వితంగా అనిపించటం జరగటం లేదా? అట్లాగే… ఈ జగత్తు కూడా స్వప్నమువలె ఉద్భవించినదై… అర్ధ క్రియా సమర్థంగా అనుభూతమౌతోంది.
శ్రీరాముడు: స్వామీ! స్వప్నంలోను, మనోరాజ్య కల్పనయందు ఏ దృశ్యం అనుభవించబడుచున్నదో, …అదంతా కూడా జాగ్రత్ వ్యవహారము యొక్క అనుష్ఠాన - అనుభవములచే కలిగిన సంస్కారము వలన అనుభవించబడుచున్నదే గాని, మరింకేమీ కాదు కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓ రామచంద్రా! అయితే నా ప్రశ్నకు మొట్టమొదట సమాధానం చెప్పు. స్వప్నంలోను, సంకల్పములోను, మనోరాజ్యములోను ఏఏ పదార్థములు అనుభవించబడు చున్నాయో… అవి ఈ జగత్తులో ప్రసిద్ధమై కనిపించే పదార్థములేనా? (లేక) వేరే అన్యమైనవా? శ్రీరాముడు : మహర్షీ! స్వప్నంలోను, కల్పనాదులందు, మనోరాజ్యంలోను ఏఏ పదార్థాలు భాసించుచున్నాయో… అవన్నీ కూడా - జగత్ ప్రసిద్ధములైన పదార్థములే స్వప్నంలో భాసిస్తున్నాయి - అని నా అభిప్రాయం.
శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగా? సరే! ఒకవేళ నీవు చెప్పినట్లు జాగ్రత్ పదార్థములే స్వప్నంలో భాసిస్తు న్నాయనే అనుకుందాం. మరి రాత్రి స్వప్నంలో ఒక భవనం నేలమట్టం అయినట్లుగా కల వచ్చిన ప్పటికీ, తెల్లవారి లేచేసరికి ఆ భవనం నేలమట్టం కాకుండా యథాతథంగానే ఎందుకుంటోంది? శ్రీరాముడు : మహాత్మా! మీరు చెప్పింది నిజమే! స్వప్నంలోను, సంకల్పాదులందు… ఏ జగత్తు భాసిస్తోందో… అది ఈ జాగ్రత్ జగత్తు కాదు. బ్రహ్మమే అక్కడ స్వప్నంలోను సంకల్ప నగరం (ఊహారాజ్యం) లోను ఆయా విధాలుగా పదార్థరూపంగా భాసించుచున్న దగుచున్నదని మీ అభిప్రాయం నేను గమనిస్తున్నాను. కానీ, ఆ బ్రహ్మము అపూర్వమైన (ఇంతకు ముందు లేనట్టి) జగత్తు వలె ఎందుకు భాసిస్తోందో చెప్పండి?
శ్రీ వసిష్ఠ మహర్షి : జగత్తులో చిత్తముచే అనుభవించబడే పదార్థాలన్నీ కూడా… కొన్ని పూర్వము అనుభవించబడియో, సందర్భపడియో ఉండటంచేత అపూర్వములు కాకయే ఉంటున్నాయి. మరి కొన్ని పూర్వం అనుభవించబడకయే, పరిచయం లేనివే అవటం చేత అపూర్వములై ఉంటున్నాయి.
అయితే అవన్నీ కూడా దృష్టి యొక్క ఆది-అంతము-మధ్యలలో ఏ ఆకారములుగా అభ్యసిస్తే ఆయా ఆకారములుగానే భాసిస్తున్నాయి. కాబట్టి అభ్యాసమును అనుసరించే అనుభవం ఉంటోంది. “ఇవన్నీ బ్రహ్మాకారమే”… అని బాగుగా అభ్యసిస్తే బ్రహ్మముగానే భాసిస్తున్నాయి. ద్రష్ట యొక్క అభ్యాసమునకు వేరుగా ఈ జగత్తుకు ఏ ఆకారమూ లేదు. ఎవరికీ ఏ ఆకారం ఎచ్చట అనుభవమగు చున్నదో అది అట్టి సుదీర్ఘమైన అభ్యాసం చేతనే ఆ విధంగానే సిద్ధించినదగుచున్నది. శ్రీరాముడు : మహాత్మా! మీరు ఈ విధంగా బోధిస్తూ ఉండగా, మీ పరమోత్కృష్టమైన బోధనా ప్రభావంచే బోధితుడను అగుచున్నాను. "ఈ జాగ్రత్ జగత్ కూడా పూర్వాపూర్వముల కలయికచే స్వప్నం వలె మిథ్యగానే భాసిస్తోంది” అనే విషయం ఇప్పుడు నేను మరింత నిర్దుష్టంగా ఎరుగున్నాను.
Page:666
కాని “గ్రహం పట్టిందా?”… అన్నట్లుగా ’సంసార స్వప్నము’ అనే పిశాచం నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నది. దీనికి చికిత్స ఏమిటో… అది చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ "సంసార స్వప్నము” అనే కార్యమునకు కారణం ఏమిటో మొట్టమొదట విచారణ చేయి. కారణము యొక్క నాశనముచే కార్య రూపమగు ఈ సంసార భ్రమ తనంతటతానే తొలగిపోగలదు.
శ్రీరాముడు : స్వప్న రూపములగు ఈ జగత్ పదార్థములకు హేతువు (కారణం) ఈ చిత్తమేనని నాకు అనిపిస్తోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : కాబట్టి అనుభవమగుచున్న సర్వ జగత్ పదార్థములు చిత్తము యొక్క రూపములే! అందుచేత అసారమగు ఈ ప్రపంచము వాస్తవానికి “ఆద్యంతరహితము నిర్వికారము” అగు బ్రహ్మమే అయివున్నది.
చిత్తము చిత్ రూపమే! దృశ్యము చిత్త రూపమే! కనుక, దృశ్యము చిత్ రూపమే!
అందుచే స్వప్నం - జాగ్రత్తు మొదలైనవి బ్రహ్మము కంటే భిన్నంగా కొంచెము కూడా లేవు. శ్రీరాముడు : మహాత్మా! ఈ జగత్తు బ్రహ్మము ఒక్కటేనని మీరు అంటున్నారు కదా! అయితే… అవయవియగు వృక్షము అవయవములగు కొమ్మలు ఒక్కటేగానూ అయి, వేరు వేరుగానూ అయి ఉంటున్నాయి కదా! అట్లే బ్రహ్మము - జగత్తులు అవయవి - అవయవములవలె ఏకభావంగాను, వేరువేరుగా కూడా ఉన్నాయని ఎందుకు అనుకోరాదు? "జగత్తు యొక్క ఆది సమష్టి చిత్తము. ఆ సమష్టి చిత్తము చిత్తుకు అవయవమువంటిది” అయివుండవచ్చా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అటువంటి కల్పన సంభవించునదే కాదు. ఎందుచేతంటావా? జగత్తు ప్రారంభం నుండే ఉత్పన్నమయి ఉండలేదు. మొదలే లేనట్టి ఈ ఈ కల్పనామాత్ర జగత్తుకు బ్రహ్మముతో భేదాభేద సంబంధంగాని, అవయవ - అవయవీ సంబంధంగాని ఏమాత్రం సంభవించదు. కాబట్టి జగత్తంతా కూడా "శాంతము, జన్మజరా వర్జితము, అఖండము” అగు పరబ్రహ్మమే అయివున్నది. శ్రీరాముడు :
కాకతాలీయవత్ మన్యే సర్గాద్యన్తాదయో భ్రమాః
భ్రాంతిః ద్రష్టుత్వ - - బోక్తృత్వసహితాః పరమే పదే |
ఓ మహాత్మా! మహర్షీ! ఇప్పుడు నాకు ఏమి అనిపిస్తోందంటే… ఈ ద్రష్టత్వము భోక్త ృత్వము
భ్రాంతి మాత్రమే. అట్టి ద్రష్టత్వ - భోక్తృత్వ సహితంగా ఈ సృష్టి యొక్క ఆది - మధ్య - అంతము అనే భ్రమలు కాకతాళీయంగా, అకస్మాత్తుగా పరబ్రహ్మము నందే స్థితి కలిగియున్నాయి.
“అయితే, బ్రహ్మమునకు వేరుగా ఈ జగత్తు అనబడే దంతా ఉండటానికే ఏమాత్రం వీలు లేదు” సమా!
Page:667
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో 3 విధములైన దృష్టులు ప్రసిద్ధములై ఉన్నాయి.
పామర దృష్టి / భౌతిక దృష్టి : వర్తమానంలో కనిపించే ఈ ఈ వస్తు ఆకారాలు - నేను - నీవు అనునవి ఈ ఈ రూపంగానే - సత్యమై ఉన్నాయని దర్శించే దృష్టి.
యౌక్తిక దృష్టి (యుక్తితో కూడినది)/ తార్కిక దృష్టి : ఈ జగత్ కార్యమునకు (దృశ్యానుభవమునకు) ఏ ‘చిత్తము’ అనబడే సూక్ష్మ సత్త కారణరూపంగా ఉన్నదో అద్దానిని గమనించే “దృష్టి”.
తాత్త్విక దృష్టి సశాస్త్రీయ గురుబోధచే ఈ నేను, నీవు, దృశ్యము, జగత్తు, సర్వదా నిర్మలము, అఖండము, అప్రమేయము, కాలాతీత సత్యము అగు బ్రహ్మమే సర్వదా అయివున్నదను “ఆత్మసాక్షాత్కార దృష్టి”.
ఈ 3 దృష్టులలో మొదటిది రెండవ దృష్టి చేత, రెండవది మూడవ దృష్టి చేత నిరాకరించబడుతోంది. నేను ఇంతవరకు సారాసార విచారులు ఉత్తమ దృష్టి యందు బహు సమర్థులు, ప్రమాణ ప్రమేయముల తత్త్వమును పరిశీలించిన వారు, పండితులు అగువారి దృఢవ్యాపార రూపమైన యౌక్తిక దృష్టిని అవలంబించి అనేక విశేషాలు చెప్పాను. అట్లాగే అధ్యాత్మ శాస్త్రముల శ్రవణ - మనన నిధిధ్యాసచే సిద్ధించే పరతత్త్వమును, ఆ పరతత్త్వము యొక్క అపరోక్ష స్ఫురణము, ఆ అపరోక్ష స్ఫురణము యొక్క చరమ సాక్షాత్కార వృత్తి యందు కనిపించే జీవన్ముక్తులలో ప్రసిద్ధమైయున్న తత్త్వదృష్టిని అనుసరించి కూడా అనేక విషయాలు చెప్పాను. ఈ తత్త్వదృష్టిచే ఈ ద్రష్టలు, దృష్టులు, జీవులు, త్రికాలములు చైతన్యాత్మ రూపమే అయివున్నాయో…. వివరించాను. నిత్య-అపరోక్ష-బ్రహ్మాత్మైక్య వస్తు స్థితి వరకు, ఈ జగత్తు ఏ విధంగా వస్తురూపం గాని, శూన్యరూపంగాని కాదో… అవన్నీ వివరించి చెప్పాను. “నీ ఆత్మరూపమే నీకు తదితర జగత్తుగా కనిపిస్తోంది" అని గమనించటమే నా ఉపదేశసారం.
శ్రీరాముడు : అవును స్వామీ! కాబట్టి ఈ జగత్తంతా కూడా పరమార్థ భూతమగు బ్రహ్మము యొక్క వివర్తమే అవుతుంది. ఇక సదా స్వస్వరూపమై, సర్వ స్వరూపమై వెలయుచున్న బ్రహ్మము ఏ సమయమందూ ఉదయించటం లేదు. అస్తమించటం లేదు. తార్కిక దృష్టిచే (యౌక్తిక దృష్టిచే) . భ్రాంతియే ఇట్లు జగత్తు రూపంగా భాసిస్తోంది… అని తెలుస్తోంది. అనగా అవిద్య చేతనే ఈ దృశ్యము బ్రహ్మముగా కాకుండా, అనేక విశేషములతో కూడిన జగత్తుగా అనిపించటం జరుగుతోంది. తత్త్వదృష్టితో చూస్తే ఆ భ్రాంతి కూడా లేదు. కేవలం “బ్రహ్మసత్త” మాత్రమే కలదు! శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! చాలా చక్కగా చెప్పావు. బ్రహ్మము స్వయంగా తన యందు కాకతాళీయ న్యాయంచే ఏ రూపంగా (అవిద్యచే) భాసించుచున్నదో… అదియే జీవభూతము అయి, స్వయంగా ’జగత్తు’ అనబడు దానిని ఎఱుగుచున్నది.
Page:668
శ్రీరాముడు : ఓ మునీంద్రా! ఇదంతా చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. అయితే బ్రహ్మము నిత్యప్రకాశము కదా! త్రికాలములందు యథాతథము కదా! మరి… మహాప్రళయంలోను, సృష్టి ఇంకా ప్రారంభమే కానప్పుడు (సృష్ట్యాదియందు), మోక్షదశ యందు ఆకాశము - ఈ భూమి - ఈ దిక్కులు ఇవన్నీ ఉండవు కదా! మరి ఇవన్నీ లేనప్పుడు అపరిచ్ఛిన్నమైన చిత్రకాశము ఎట్లా ప్రకాశించగలుగుతుంది? ఎందుకంటే, గోడ మొదలైన ఏవైనా వస్తువులు అవలంబనం ఉంటేనే దీపకాంతి ప్రకాశిస్తుంది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును! పరమాత్మ యొక్క వస్తు - - విషయ రహిత ప్రకాశ స్వరూపం అత్యంతాశ్చర్యకరమైనదే! అయితే అది నీకు నీవే నీ విచారణ దృష్టితో దర్శించు. సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువు లన్నిటినీ ప్రకాశింపజేసేది చిత్ప్రకాశమే! కాబట్టి అది అంధకారమును కూడా ప్రకాశింపజేస్తోంది. అందుకే అది సర్వప్రకాశ్యకం. (తమేవభాన్తమ్ అనుభాతి సర్వమ్! తస్యభాసా సర్వమిదం విభాతి!)… అని శ్రుతులు ఆ విషయం గానం చేస్తూనే ఉన్నాయి కదా!
సూర్యకాంతి గోడయొక్క అపేక్ష లేకయే అద్దానియందు ప్రవేశిస్తోంది. అంతేగాని గోడ ఉండటం చేత సూర్యకాంతి జనించటం లేదు కదా! పైగా… గోడ - - అద్దానిని ప్రకాశింపజేసేది రెండూ కూడా ఆత్మ ప్రకాశము చేతనే సిద్ధిస్తున్నాయి. అంతేకాదు. గోడను ఇంకా స్పృశించనప్పటికీ ఆకాశంలో కాంతి ఉన్నది కదా! అట్లాగే సృష్ట్యాది యందు, ప్రళయము నందు, మోక్ష దశయందు, వక్త - శ్రోత స్వరూపమగు ఆత్మ విషయరహితమై ప్రకాశించుచున్నది. అయితే అద్దాని “విషయరహిత స్వయం ప్రకాశకత్వం” గురించి నేను చెప్పగలిగేది కాదు. ఆ విషయం స్వయంగా ఎవరికి వారే గమనించవలసినది. కనుక నీకు నీవే విషయరహిత అహం త్వమ్ రహిత చిత్ప్రకాశమును నీకుగా దర్శించు. అద్దాని గురించిన సూచనఅంతా మన ఈ సంవాదము నందు తప్పక లభిస్తూఉంటుందని గుర్తు చేస్తున్నాను.
అందుచేత రామచంద్రా! ఈ ద్రష్ట - దర్శన - దృశ్యములనబడే త్రిపుటి కొంచెం కూడా వాస్తవానికి లేదు. సృష్ట్యాదియందు చిత్రకాశమే స్వయంగా ప్రకాశించునదిగా - ప్రకాశింపజేసేదిగా అగుచున్నది. దృష్టాంతానికి స్వప్న చైతన్యమే స్వప్నంలో స్వప్న ద్రష్ట - స్వప్న దర్శనము - స్వప్న దృశ్యము అగుచుండటం ప్రతి జీవునికి అనుభవైకవేద్యమే కదా! అట్లాగే ఇక్కడ కూడా ఒకే చైతన్యం ద్రష్ట - దృశ్యములుగా కూడా ప్రకాశిస్తోంది. ఈ విధంగా ప్రకాశింపజేసేది - ప్రకాశించునది - ప్రకాశము…ఈ మూడూ చిత్ప్రకాశమే అయివున్నది. ఇక సృష్ట్యాది యందు 1.ద్రష్ట, 2. దర్శనము, 3.దృశ్యము అనే మూడు రూపాలుగా అయి సృష్టివలె భాసిస్తోంది సుమా! ఈ విధంగా ప్రకాశమానమై “జగత్తు (దృశ్యము)” రూపంగా ప్రకాశించటమనేది ఆ చైతన్యం యొక్క మాయాశక్తి ప్రధానమగు స్వభావమే అయివున్నది.
అన్నిటికీ మును-ముందే సత్స్వరూపమైయున్న చిత్రకాశమే దృశ్యరూపంగా కనబడటం స్వప్నంలోను, సంకల్ప నగరంలోను అందరికీ అనుభూతమగుచున్న విషయమే కదా!
Page:669
ఆద్యంతరహితమైనట్టి చిదాకాశమే చిదాకాశమున… జగత్తు (దృశ్య) రూపంగా భాసిస్తోంది. చిదాకాశము యొక్క సృష్టి రూపంగా భాసించే చమత్కామే ఈ సృష్టి స్వరూపం.
ఈ జగత్తు అజ్ఞానులకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు గాక! (శుద్ధజ్ఞానులమగు) మాకు ఆశ్చర్యమేమీ లేదు. మాకు ఇదంతా బ్రహ్మము యొక్క స్వభావంగానే అగుపిస్తోంది. మాకు ఎప్పుడైనా కాకతాళీయంగా త్రిపుటిజ్ఞానం (ద్రష్ట - దర్శనము - దృశ్యము వేరువేరుగా) స్ఫురించినప్పటికీ… మా యొక్క తత్త్వానుసంధానం చేత ఆ త్రిపుటి (చూచువాడు వేరు. చూడటం వేరు - చూడబడేది వేరు అని అనిపించటం) వెనువెంటనే మటుమాయమై పోతోంది.
అందుచేత…“సృష్టికి పూర్వం త్రిపుటి లేదు. ప్రకాశ్యము లేదు. ప్రకాశ్యకము లేదు. ఆ తరువాత మిథ్యాజ్ఞానవశం చేతనే పరమాత్మ యందు ఈ జగత్తు (నా దృష్టి దోషంచే) ఉదయించింది. అక్కడ ఉన్న మోడు (కొమ్మలు లేని ఎండిపోయిన వృక్షము) అయినప్పటికీ పసిపిల్లవానికి చీకట్లో ఎవరో మనిషి ఉన్నట్లు అనిపిస్తుంది కదా! అట్లా నాకు “నేను - నీవు - దృశ్యము”లతో కూడిన జగత్తు భ్రమచే అనిపిస్తోంది” - అని తత్త్వజ్ఞులు అనుసంధానం చేస్తున్నారు. అదియే తత్త్వానుసంధానం.
ఆత్మయందు ‘ద్వైతము’ యొక్క భాసనము వాస్తవానికి లేనేలేదు. మరి? ఈ ద్వైతము చిత్తమునందు మాత్రమే భాసించటం జరుగుతోంది. సృష్ట్యాది యందు ఈ ప్రకాశించబడే (ప్రకాశ్యకమగు) జగత్తు లేదు. కానీ చిదాత్మమాత్రం అవశ్యం ఉన్నది. చిదాత్మ ద్వైతంగా భాసించటానికి బాహ్యమైన హేతువు (కారణం) లేదు. కనుక, చిదాత్మయే ద్వైతరూపంగా భాసించుచున్నదగుచున్నది. కాబట్టి ఈ జగత్తంతా కూడా చిదాకాశ రూపమే! అట్లా కాకుండా శుద్ధ చైతన్యమున సృష్ట్యాది యందు ఏ కారణం (హేతువు) చేత జగత్తు ఉత్పన్నం కాగలదో చెప్పు?
ఎప్పుడైతే ఎవరైనా సరే… పవిత్రమైన ఆత్మదృష్టితో పదార్థముల యొక్క అభావము సముపార్జించుకుంటారో… వారికి “చైతన్యమే జగదాకారంగా భాసిస్తోంది”… అనునది క్షణంలో సుస్పష్టమైపోతోంది. అందుచేత ఈ జగత్తంతా కూడా జాగ్రత్ - స్వప్న - సుషుప్తి రహితమగు తురీయ బ్రహ్మ స్వరూపమే అయివున్నది.
స్వప్న రూపమగు ఈ దృశ్యము వాస్తవానికి సంభవించజాలదు. కేవలము బ్రహ్మమే దృశ్యముగా భాసిస్తోంది. సృష్ట్యాది యందు కూడా చిన్మాత్రాకాశమే ఇట్లు జగద్రూపంగా స్ఫురిస్తోంది. జగద్రహిత మగు చిన్మాత్రాకాశము నిజస్వరూపముననే జగత్తుగా ఎరుగుచున్నది. తాను ఎరుగు జగత్తుగా తానే అగుచున్నది. ప్రకాశ రూపమగు పరబ్రహ్మమే ఈ జగత్తు! ఆకాశమునకు - శూన్యత్వమునకు భేదమేమున్నది? అట్లాగే ఈ జగత్తుకు బ్రహ్మమునకు ఏమాత్రం భేదం లేదు.
ఓ రామచంద్రా! ఇదియే నాచే ఇన్ని రోజులుగా సుదీర్ఘంగా చెప్పబడుచున్న తత్త్వానుసంధానం. అట్టి తత్త్వానుసంధానంచే ఆత్మతత్త్వమును ఎరుగుచూ ఉండు. సప్త భూమికలలో ఒక్కొక్కటి అధిగమిస్తూ ఉండు. స్వానుభవం దృఢపడే వరకు తత్త్వాను సంధానమును ఆశ్రయిస్తూనే ఉండు,
Page:670
క్రమంగా వికల్పరహితుడవై, వాక్ - ఇంద్రియ వ్యాపార నిరోధము ద్వారా శిలవలె మౌనమును ధరించినవాడవగుము. నిర్వికల్ప సమాధి యందు స్థితిని సముపార్జించుకో! అజ్ఞాన దశయందు నీ చేత - తదితరులగు జీవులచేత అనాదిగా ఈ సంసారము మరల మరల అనుభవించబడియే ఉన్నది. క్రమంగా వైరాగ్య బలంతో బాహ్య విషయములన్నీ ఆత్మానుసంధానముచే లయింపజేయి. అప్పుడు “బాహ్య విషయములు పొందుము" … అని అజ్ఞులు ఎలుగెత్తి చెప్పుచున్నా సరే… మరల ఈ జగత్తును దృశ్యరూపంగా గ్రహించవద్దు. ఈ కనబడే విషయ సుఖములవైపుగా నీ దృష్టిని సారించనే వద్దు. ఎందుకంటే విషయ సుఖము సమాధికి విఘాతం కలిగిస్తూ ఉంటుంది. అయినా కూడా ఈ జగత్తులో తిను - - త్రాగు - - మాట్లాడు - పలకరించు - - వ్యవహరించు. తదితరులవలెనే సర్వము నిర్వర్తించు.
"నేను - నీవు - దృశ్యము … అంతా బ్రహ్మమే”… అను ఆత్మానుసంధానమే సంసారమునకు దివ్యౌషధం. అట్టి ఆత్మానుసంధానమును అనుక్షణికంగా, అప్రతిహతంగా కొనసాగిస్తూ ఉండు!