Page:671
XIV. శ్రీరామ ప్రవచనం (శ్రీరామ హృదయం)
అహోను సుచిరం కాలం సంభ్రాంతా వయమన్తరే |
అపరిజ్ఞాత మాత్రేణ సంసారపరమాంబరే ||
సంసార రూపమగు ఈ అనంతాకాశములో గల ఈ చిన్న బ్రహ్మాండమందలి ఈ అతిచిన్న ప్రదేశంలో… ఆత్మతత్త్వము యొక్క అపరిజ్ఞానమాత్రంచేత మేమందరమూ చిరకాలంగా ఈ విధంగా పరిభ్రమిస్తున్నాం! ఇది ఆశ్చర్యమే మరి! మీ బోధచే ఆత్మతత్త్వము బాగుగా బోధపడగా… “ఈ జగత్తు అనేది భ్రమ మాత్రమే! ఇది కించిత్ కూడా పూర్వము ఉండి ఉండలేదు. ఇప్పుడూ లేదు. ఇకముందు ఉండబోవటమూ లేదు”… అని మేము తెలుసుకున్నాం.
సర్వం శాంతం నిరాలంబం విజ్ఞానం కేవలం స్థితమ్, అనంతం చిల్డ్రనం వ్యోమ నీరాగమపకల్పనమ్!
ఈ జగత్తంతా కూడా… “శాంతమై, నిరాలంబమైనట్టి (ఆలంబనమంటూ ఏదీ లేనిదై) కల్పనా రహితమైనట్టి రాగ వర్జితం అయినట్టి కేవల పరబ్రహ్మముగానే సర్వదా స్థితినొంది ఉన్నది. ఇదంతా ఎంత ఆశ్చర్యం! ఎందుకంటారా?… పరమ చిదాకాశమే అజ్ఞాన మాత్రం చేత జగద్రూపం పొందినట్లుగా మాకు భాసించటం ఆశ్చర్యమే కదా! పరమ నిర్మలమగు చిదాకాశమే మలినరూపం పొందిన దానివలె ఉన్నదై… ఈ విధంగా ద్వైతరూపంగా లోకాలు, పర్వతాలు కలిగి ఉన్నట్లు అగుపిస్తోంది!
అవును! మీరు చెప్పినట్లు సృష్ట్యాదియందు, ఈ లోకమునందు, పరలోకమునందు, స్వప్నం లోను, మనోరాజ్య కల్పనయందు కూడా చిద్రూపమగు పరమాత్మయే దృశ్యరూపంగా భాసిస్తోంది. కాబట్టి ఇక చైతన్యమునకు వేరుగా దృశ్యం ఎక్కడిది? చైతన్యమునకు వేరుగా ఏదైనా కనిపిస్తే… అది అట్లా అనిపించటమే భ్రాంతి. “నేను ఇప్పుడు స్వర్గం చేరాను. నేనిప్పుడు నరకానికి పోతున్నాను”… అని ఏ విభ్రాంతి కలిగియుంటామో… అదే నరకప్రాయం. ఈ దృశ్యమంతా వాస్తవానికి సర్వదా, సర్వవేళలా, అంతటా చిన్మయ స్వరూపమే అయివున్నది. కాని, మృణ్మయ స్వరూపం కానే కాదు. నే౨ దం దృశ్యంచ, ద్రష్టా న సర్గో న జగన్నచిత్ న జాగ్రత్ స్వప్న సిద్ధాది, కిమపీదం తదప్యసత్ ॥
Page:672
వాస్తవానికి ఈ దృశ్యముగాని, ద్రష్టగాని, సృష్టిగాని, చిదాభాసుడు గాని (జీవుడుగాని) జాగ్రత్తుగాని, స్వప్నంగాని లేవు. అనిర్వచనీయం అయినట్టి ఈ అవిద్యంతా కూడా అసత్తే అయివున్నది.
ఓ మునీంద్రా! “ఈ భ్రాంతి ఎక్కడి నుండి ఉత్పన్నమైనది?” అనేది - విచారణకు కూడా అయోగ్యమై ఉన్నది. వెలుతురు లేకపోవటమే చీకటి కదా! ఇక “ఈ చీకటి ఎక్కడి నుండి వచ్చింది?” అనే ప్రశ్న ఎక్కడిది? భ్రాంతి అసద్రూపమే కదా! ఇక “ఎట్లా వచ్చింది? ఎక్కడి నుండి?" - అని చింతన చేయటం అప్రస్తుతం, అసందర్భం కూడా! అది వ్యర్థమైన పనే! “నిర్వికారము - తత్త్వజ్ఞాన స్వరూపము”… అయిన ఆత్మయందు భ్రాంతి సంభవించజాలదు. పైగా… అట్టి భ్రాంతి జ్ఞానం కూడా చిత్స్వరూపమగు పరమాత్మయే గాని అన్యమైనదేదీ కాదు. స్వప్నదర్శనం స్వప్నద్రష్ట యొక్క స్వీయకల్పనా చమత్కారమే అయివుండగా, ఇక స్వప్నంలోని విశేషాలకు కార్య కారణాలు ఎక్కడుంటాయి? అంతరాళమనేదే లేని స్ఫటిక శిలా గర్భంలోనూ, ఆద్యంత రహితమైన ఆకాశంలోను, తత్త్వజ్ఞాన ప్రదమైనట్టి ఆత్మ యందు ద్వైత భేద కల్పన చేయువాడెవడుంటాడు?
మిథ్యైవ అనుభవో భ్రాంతేః స్వప్నే స్వమరణోపమః యదనాలోకనం నామ శామ్యతీదం విలోకనాత్ II
విచారణ చేసియుండకపోవటం చేతనే ‘భ్రాంతి’ అనేది ఉండి ఉండవచ్చుగాక! స్వప్నంలో ఒకనికి "నేను మరణించాను”… అని కల వచ్చినట్లుగా… భ్రాంతి మిథ్యయే అయివున్నది. కాబట్టే అది విచారణచే నశించుచున్నది. మృగతృష్ణలో జలం, రెండవ చంద్రుని రూపం… వీటిని గురించి ఎంతగా విచారిస్తే మాత్రం లభిస్తాయా? అవి భ్రమయే కదా! అట్లాగే జ్ఞానము యొక్క ప్రాప్తి తరువాత అవిద్యాభ్రమ ఎటో మటుమాయమైపోతోంది. ఇక దాని గురించి వెతకటమెందుకు?
బాలునికి చీకట్లో బేతాళము కనిపిస్తున్నట్లుగా ఈ భ్రాంతి జాగ్రత్తులో ప్రత్యక్షంగా కనిపిస్తు న్నప్పటికీ… ఇది (జగత్తుగా) యథార్థం కాదు. ఈ భ్రాంతి… అవిచారణచే వర్ధిల్లుతూ దృఢమవుతోంది. విచారణ చేత నశించిపోతోంది.
ఓ మునీంద్రా! ఇక “భ్రాంతి ఏ కారణం చేత కలిగినది? అనే ప్రశ్నయే శోభించదని గ్రహించాను. ఎందుచేతనంటారా? ‘సత్తు’ యొక్క విచారణ చేతనే మనకు లాభముంటుంది. గాని… అసత్తు గురించి ఎంత విచారణ చేసి ఏం లాభం? ఈ భ్రాంతి యొక్క మూలం అజ్ఞానమే కదా! అజ్ఞానం అసత్తే అయి ఉండటంచే అది విచారణకు యోగ్యమే కాదు. ఏ వస్తువైతే ప్రామాణిక మైన విచారణచే లభించదో… అది అసత్తే అయి ఉన్నది. ”ఆ కథలో ఆతడు అట్లా ఎందుకు మాట్లాడాడు?” అనేది విచారణ చేయటం అసంతగతమైన పనియే కదా! కథ మొదలే కల్పన కదా! అట్లాగే ఈ జగత్తు యొక్క మూలము అజ్ఞానమే అయివున్నది. అది అనుభవముచే భ్రమ రూపమేనని తెలియవచ్చుచుండగా… ఇక అద్దాని గురించి విచారణ చేసి ఏం ప్రయోజనం?
శ్రుతి ప్రమాణముచే బాగుగా విచారించిచూడగా ఈ జగత్తు లేకయే ఉన్నది. కాబట్టే పరిచ్ఛిన్నరూపమై వర్ధిల్లుతోంది. ఆకాశంలో ఆకాశపుష్పం కోసము, కుందేలు యొక్క కొమ్ముల
Page:673
కోసం వెతికితే దొరకుతాయా? అసద్వస్తువగు ఈ జగత్తును ఎంత పరిశీలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇద్దాని నుండి సద్వస్తువు ఎట్లా లభిస్తుంది? ఏదైతే అంతటా ఎంతగా చూచినప్పటికీ ప్రమాణములచేతగాని, కారణముల చేతగాని లభించుటయే లేదో, అట్టి దాని సత్త ఎటువంటిదని చెప్పాలి? గొడ్రాలి కుమారుల గుణగణముల గురించి వివరాలు అడగటం వల్ల ఏం ప్రయోజనం?
భ్రాంతి అనబడేది ఏదీ లభించనిదే అయి ఉన్నది. ఇక్కడ భ్రాంతి లేదు. జగత్తు లేదు. దృశ్యం లేదు. నిరావరణ విజ్ఞాన ఘనరూపమగు ఆత్మయే ఈ సమస్త జగద్రూపంగా వ్యాపించి ఉన్నది. ఏ జగత్తెతే ఇక్కడ ఇట్లా భాసిస్తోందో… అది పరబ్రహ్మ రూపమే అయివున్నది.
నిరతిశయానందముచే పరిపూర్ణమగు బ్రహ్మ స్వరూపమున, అపూర్ణమగు బ్రహ్మమే, ఈ విధంగా స్వమహిమయందు స్థితి కలిగియున్నది. ’జగత్తు’గా అజ్ఞులకు, ’కేవల పరబ్రహ్మమే’గా విజ్ఞులకు అనుభూతమౌతోంది. ఇక్కడ ‘జగత్తు’ అనబడునదేదీ ఒకింత కూడా ఏ సమయమందునూ భాసించటమే లేదు. భాసించకపోవటమూ లేదు. నిర్మలము - శాంతము అయినట్టి పరబ్రహ్మమే ఇట్లు జగద్రూపంగా వెలయుచున్నది.
మహాత్మా! వసిష్ఠ మహర్షీ! ఆ పరబ్రహ్మమే ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది. అట్టి పరబ్రహ్మము ఇట్లు జగత్తుగా భాసిస్తున్నప్పటికి కూడా… పరబ్రహ్మము… సదా నిత్యనిర్మలమై ఉన్నది. జరామరణ రహితమై ఉన్నది. అది ఎవరిచేతా అపహరించబడజాలదు. ఉత్తములచే గౌరవింపబడేది అదియే! వికార రహితము - - నిరామయము అయివున్నది. సర్వత్రా సర్వదా పరిపూర్ణమై ఉన్నది. అహంభావ బోధచే నిరహంభావమై ఉదయిస్తోంది. సర్వవ్యాపకము - పరిశుద్ధ ప్రభువు అయివున్నది. అనేక రూపములై ఉండి కూడా సర్వదా ఏకరూపమే అయివున్నది. ఆవరణ రహితము అయివుండటం చేత సర్వత్రా ప్రకాశించుచునే ఉన్నది. ఆ పరబ్రహ్మమే నేను! అట్టి రామ బ్రహ్మ స్వరూపమే జగత్తు! మీ అందరి స్వరూపుడను నేనే! నామ -రూప- ఆవరణ రహితుడనగు నేనే సర్వదా - సర్వత్రా సర్వముగా ఉదయిస్తూ ఉదయాస్తమములు లేనివాడనై సర్వదా యథాతథంగా ప్రకాశిస్తున్నాను. మీ అందరియొక్క స్వస్వరూపమే నేను. సర్వమునందు సర్వదా ప్రమేయ - అప్రమేయ స్వరూపమగు ఆత్మారామమే అయివున్నాను.
శ్రీరాముడు : ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! కర్మోపాసనాసిద్ధులగు దేవతలు గాని, తపఃసిద్ధులగు మునులుగాని ఏ ఆదిమధ్యాంత రహితమగు పరబ్రహ్మమును ఎరిగే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారో… అట్టి పరబ్రహ్మమే జగద్రూపంగా భాసిస్తోంది. కాబట్టి అద్దానికి వేరుగా జగత్తు ఎక్కడ? దృశ్యమెక్కడ? ఇక, “ఇదంతా ద్వైతమా? అద్వైతమా? ఈ జగత్తు సాకారమా? నిరాకారమా!’… ఇటువంటి చర్చల అనుసంధానం చేతను, వాటిచే మనస్సులో ఉత్పన్నమవ గల
Page:674
భేదభావాలతో కూడిన సందేహములతోను మాకు ఏ పనీ లేదు. అటువంటి విభ్రమములను స్వీకరించవలసిన అవసరమే ఇప్పుడు మాకు కనపించటం లేదు. హే మహర్షీ! ఆద్య స్వరూపమై, సృష్టికి పూర్వమే ప్రసిద్ధమై, సర్వదా శాంతము - - నిర్వికారము అయినట్టి ఏ బ్రహ్మము కలదో, అదియే ఇప్పుడు కూడా మనందరి నిత్య స్వరూపమై ఉన్నది. మనందరి రూపంగా భాసిస్తున్న ఆ బ్రహ్మమే ఈ దృశ్య - సృష్టి రూపంగా కూడా భాసిస్తోంది. ఆకాశమున నీలత్వము - కేశత్వము (వెంట్రుక ఆకారాలు కనిపించటం) - అనంతత్వము ఏ విధంగా అభేద రూపమే అయివున్నాయో, … అట్లాగే చిదాకాశమున ఈ త్రైలోక్య జగత్తు అభిన్నరూపంగా ఉన్నది. మట్టికి బొమ్మ ఆకారం కల్పించటం చేత ఆ ఆకారము మట్టిని మరొక తీరుగా చెయ్యదు కదా! నిరాకారమైన మట్టియే సాకారమైన మట్టి బొమ్మ ఆకారంలో ఉన్నది. అంత మాత్రానికి ఆ ఆకారము మట్టియొక్క స్వస్వభావాన్ని మారుస్తోందా? లేదే! ఇదివరకు మేము దృశ్యముతో తదాత్మ్యము పొంది ఉండవచ్చుగాక! అంత మాత్రం చేత మా ఆత్మ స్వరూపానికి వచ్చిన లోటేమీ (అప్పుడుగాని, ఇప్పుడుగాని, మరొకప్పుడుగాని) లేనేలేదు.
ఆకాశమున ఆకాశతత్వము (శూన్యత్వము) లాగా, శిలయొక్క ఘనత్వంలాగా, మట్టి యొక్క దేవతాకారంలాగా, జలం యొక్క జలత్వంలాగా… చిదన బ్రహ్మమునందు ఈ ప్రపంచం వర్ధిల్లు చున్నది! అట్టి ఈ ప్రపపంచము ఎక్కడి నుంచీ రావటంలేదు. ఎటువైపుకీ పోబోవటం లేదు. బ్రహ్మమే అభ్యాసవశం చేత జగత్తుగా కనిపిస్తోంది. మీ వాక్య ప్రభావం చేత మేము కొంచెం కొంచెంగా “ఇది బ్రహ్మమే కదా”… అని అభ్యసిస్తూ వస్తే అంతా సర్వదా బ్రహ్మమేగా అనుభూత మౌతోంది. ఈ ‘నేను-నీవు’ మొదలైన అహంత్వాది సహితంగా ఈ దృశ్య జగత్తు ఆకాశమునందు దిక్కులందు ప్రసరించి అతి విశాలమై ఉంటే ఉండవచ్చుగాక! అయినప్పటికీ ఇదంతా పరమ శాంతము - పదార్థ శూన్యము అగు చిదాకాశమే అయివున్నది. అట్టి మహాచిదాకాశము సర్వదా అపరిచ్ఛిన్నమే! ఎవనికైనాసరే… ఈ జగత్తు అఖండ పరబ్రహ్మముగా బోధపడిందా… ఆ మాత్రపు ఆత్మ సాక్షాత్కారం చేత ఈ సంసార పిశాచము మరుక్షణం అనుక్షణికంగా శమించినదే అవుతోంది. ఈ జాగ్రత్ృశ్యం ఉండటం చేతగాని, ఇది తొలగి స్వప్నదృశ్యరూపు దిద్దుకోవటం చేతగాని, అది కూడా తొలగి నిర్విషయ సుషుప్తి అనుభవగతమవటం చేతగాని… ఆత్మత్వమునకు వచ్చే హాని, మార్పులు చేర్పులు లేవు. ఏ ఆత్మ వస్తువునందు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కల్పిత రూపంగా వచ్చి - పోతున్నాయో… అట్టి నిర్మల - నిర్విషయ - అప్రమేయ చిదాత్మయే మనందరి రూపమై ఉన్నది. ఆత్మ విచారణచే మూఢునికి కూడా ఈ “సంసార పిశాచము” శమించిపోగలదు. ఇక సాధనపరుల విషయం వేరుగా చెప్పనక్కర్లేదు కదా! చిద్రూపమును సంతరించుకొనియున్న జ్ఞాని ఆయా వ్యవహారములందు ఎంతగానో తత్పరుడై ఉన్నప్పటికీ, తరంగానికి - తరంగానికి జలం దృష్ట్యా భేదమే లేనట్లుగా, ఆతనిపట్ల సర్వ భేదములు సమసిపోతున్నాయి. చీకటి తొలగినప్పుడు అంతా విదితమైపోతుంది. చూచారా? అట్లా "ఆత్మసాక్షాత్కార దృష్టిచే అన్ని భేదాలు ఎటు వెళ్ళిపోతు న్నాయో కూడా చెప్పజాలకున్నాను. ‘అజ్ఞానము’ అనే మండుటెండ అతి భీకరంగా కార్చిచ్చులాగా
Page:675
సెగలు కొల్పుచుండగా వచ్చే బాధలన్నీ… భ్రమ అనే సూర్యుడు అస్తమించగానే సమసిపోతున్నాయి. “ఆధిభౌతికము - ఆధిదైవికము ఆధిదైవికము - ఆధి ఆత్మికము” అనే త్రివిధతాపములు తొలగిపోగా… ఇక విషయ తృష్ణ నశించి పోతుంది. “ఏదో పొందాలి! లేకుంటే నా గతి ఇంత మాత్రమే”… అనే భ్రమ, “జ్ఞానము” అనే చంద్రోదయంచే ప్రశాంతపడుచున్నది. “సంసార సత్త” అనే పగలు అస్తమించగా, ఇక ‘మోక్ష సుఖము’ అనే అతి ప్రశాంత సమయమగు రాత్రి వచ్చి ఆహ్లాదపరుస్తోంది.
ఓ మహర్షీ! ఈ ఉత్పత్తి - వినాశనములు, కార్యాకార్యములు, జన్మ - జరా - మరణములు వ్యవహార విక్షేపము కలిగించవచ్చు గాక! ఇవన్నీ పొందుచూ కూడా జ్ఞాని ఏదీ పొందనివాడై ఉంటున్నాడు. జ్ఞాని వాటియందు వర్తించనివాడే అగుచున్నాడు. అన్నిటా అన్నివేళలా స్వస్వరూపాత్మ జ్ఞానియే నిశ్చితంగా ఈ సంసారమును నందనవనము వలె అత్యంత ప్రశాంతముగా దర్శించగలుగు చున్నాడు. మిగతావన్నీ ఏదీ ఎట్లున్నా, అవన్నీ దుఃఖమును తొలగించజాలవని నేనిప్పుడు అత్యంత ప్రత్యక్షంగా గమనించగలుగుచున్నాను.
ఓ మునీశ్వరా! వాస్తవానికి ఇక్కడ సుఖం లేదు. దుఃఖం లేదు. అవిద్య లేదు. విద్య అవిద్యలు, ఈ సుఖ దుఃఖాలు… ఇవన్నీ బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాయి. ఎరుగబడినదా, …ఇదంతా నిర్మల పరబ్రహ్మ స్వరూపమే! ఇక్కడ బ్రహ్మమునకు వేరుగా తెలియందిగాని, తెలియవలసింది గాని ఏమీ లేదు. బ్రహ్మమునకు తన స్వరూపము కానిదంటూ ఇక్కడ ఏదీ లేదు. హే మహర్షీ! మీ ప్రవచనము అనే పవిత్ర గంగాజలంలో స్నానంచేసిన ప్రభావం చేత నేనిప్పుడు ప్రబద్ధుడను అయ్యాను.
ప్రబుద్దోస్మి ప్రశాంతా మే సర్వ ఏవ కుదృష్టయః,
శాంతం సమమ్ సో హమ్ ఇదం ఖం పశ్యామి జగత్తయమ్ ॥
నా సర్వ కుదృష్టులు, సమస్త భ్రాంతులు బాగుగా శమించాయి. ఇప్పుడు ఈ త్రిలోకములు ‘ద్వైతము’ అనే విషమత్వము త్యజించినవై, పరమశాంతరూపంగా నాకు కనిపిస్తున్నాయి. ఈ సమస్త జగత్తులు నా స్వస్వరూపమే! ఇదంతా చిదాకాశముగా గాంచుచున్నాను!
బాగుగా ఎరుగబడినదా… ఈ జగత్తంతా కూడా కేవలం పరబ్రహ్మమే అగుచున్నది. స్వామీ! ఇదిరవకు అజ్ఞాత స్థితిలో ఒక రూపంగాను, ఈ సమయంలో మరొక రూపంగాను ఉన్నానని, ఇప్పుడు నేను అనుకోవడం లేదు. ఆత్మ - అప్రాప్త స్థితిలో - - అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. నేను సర్వదా ఆత్మారాముడనే గాని, దేహ - మనో - బుద్ధి రూపుడను కాను. ఎటొచ్చీ, అప్పుడు నేను ఆత్మస్వరూపుడనని గమనించి ఉండకపోవచ్చు! ఇప్పుడు మీ ‘బోధ’ అనే మాధుర్య ప్రభావం చేత (నేను సర్వదా సర్వస్వరూపమగు ఆత్మయేనని గమనిస్తున్నాను. ఏ బ్రహ్మము ఇతఃపూర్వం నా యందు తన ఆత్మను ఎరుగక ఉండటం జరిగిందో… ఆ బ్రహ్మమే ఇప్పుడు తన ఆత్మను ఎరిగినదై స్వస్వరూపమున నెలకొనియున్నది.
Page:676
హే మహర్షీ! ఒకే ఆకాశము శూన్యత్వంగాను, నీలత్వంతోను, ఏకత్వంగాను… ఒకే సమయం లోను, సర్వవేళలందు కూడా నెలకొనియున్నది కదా! అట్లాగే బ్రహ్మము తనకంటే భిన్నమైన అజ్ఞాన - జ్ఞానములు లేనిదై ఉన్నది. జన్మ - - జరామరణ వర్జితమైయున్నది. జ్ఞాత - - అజ్ఞాత రూపమంతా బ్రహ్మమే! ఓ సభికులారా! మీరు నా పరంగా చూస్తున్నదంతా మీ ఆత్మ స్వరూపమే అయివున్నది! నా రూపమున మీరు, మీ రూపమున నేను ఆత్మయందే… ఆత్మగానే వెలయుచున్నాము.
ఓ మునీశ్వరా! ఇట్టి జ్ఞానోదయంచేత నేను పునీతుడనయ్యాను. నిర్వాణరూపుడనయ్యాను. అజ్ఞానము యొక్క రూపమును తెలుసుకొని జ్ఞానిని అయ్యాను. ఇప్పుడు నాకు ఎటువంటి సందేహాలూ లేవు. ఇక ఈ దృశ్యము ఎట్లా ఉండాలంటే అట్లే ఉండుగాక! నాకిప్పుడు ఏ కోరిక కూడా లేదు! కోరికలు తొలగాలనే విక్షేపమూ లేదు. విక్షేపరహితమగు ఆత్మ సుఖమందు నెలకొనియున్నాను. వేద-వేదాంగములు “యథాస్థితం - నిత్యం - అనంతం - సర్వమ్ - అధికస్య అధికం అల్పస్య అల్పం” …అని అనేక విశేషములు చెప్పే ఆ ఆత్మ నేనే! నేనే ఆత్మారాముణ్ణి! మీలోను - నాలోను - ఆకాశంలోను భూమిలోను - నా రూపమే సర్వదా నెలకొనియున్నది. మీ వాక్రవాహ మహిమచే అజ్ఞానం ఎప్పుడైతే తొలగిందో … అప్పుడిక నా స్వరూపమగు బ్రహ్మమునందు ఈ సర్వము నెలకొనియుండకేం చేస్తుంది? బ్రహ్మమే నా స్వస్వభావం కదా! అది క్రొత్తగా వచ్చింది కాదు. ఇతఃపూర్వం ఎప్పుడూ నేను అదే కదా! కాబట్టి “ఇతఃపూర్వం లేనిది ఇప్పుడు వచ్చింది”… అని ఏదో సంతోషించవలసిన అవసరం గాని, ”ఇతరులకు లేనిది ఇప్పుడు నాకే లభించింది”… అనే న్యూనాధిక భావాలు పొందే సందర్భంగాని లేదు. ఎందుకంటే తెలియని వారు - తెలిసినవారు …అంతా ఆత్మ స్వరూపులే కదా!
సర్వం సదైవాహం అనంతమేకమ్ న కించిదేవాపి అధవాతిశాంతః ॥
సర్వం న కించచ్చ సదేకమస్మి నచాస్మి చేతీయమహో ను శాంతిః ॥
నేనే సర్వదా సర్వరూపమైయున్నాను. అనంతము, ఏకము అని శాస్త్రములు బ్రహ్మము గురించి చెప్పేది నా గురించే! అంతే కాకుండా… సర్వ ఉపద్రవ రహితుడనై, కొంచెము కూడా పదార్థ రూపము కానివాడనై, సర్వమునకు ఆధారమై అద్వితీయమైనట్టి ’సద్రూపం’గా సర్వదా వెలయుచున్నాను! ఈ సభలోని సభికులందరి రూపము నా రూపమే! బ్రహ్మాండాకార రహితుడనగు నేను సర్వ బ్రహ్మాండ రూపుడనై రామబ్రహ్మమునై వెలయుచున్నాను.
దేశ - కాల - ఆధార - అధేయములు లేనివాడనై ఉండటంచేత వాస్తవానికి నేను ఎచటనూ లేనేలేను. అంతా నేనే! కాబట్టి అంతటా ఉన్నది నేనే! నేను ఏదీ కాదు. అంతయూ నేనే! ఆహా! గురుసత్తమా! ఇట్టి నిర్వాణము పరమశాంత రూపమై, పూర్వానుభవముల దృష్ట్యా పరమాశ్చర్యకరము అయివున్నది.
అధిగతమధిగమ్యం ప్రాప్తమప్రాప్తమన్యైః గతమిద మలమస్తం వస్తుజాతం సమస్తమ్
ఉదితముదిత బోధం తాదృశం యత్ర భూయోః అస్తమయ సముదయానాం నామ నామాపి నాస్తి
Page:677
హే మునీంద్రా! హే మహానుభావా! ఇప్పుడు నేను పరమ పురుషార్థరూపమగు బ్రహ్మ తత్త్వమును తెలుసుకున్నాను. అజ్ఞానమునకు సుదూరమైయున్న మోక్ష సుఖమును పొందాను. ఇక ఈ సంసారానర్థరూపమగు వస్తు సమూహమంతా కూడా నాకు పూర్ణముగా నశించినదైపోయింది.
ఎచ్చటైతే మరల మరణం, దుఃఖం ఇటువంటి అనర్థముల ఊసు కూడా ఉండదో… అట్టి చరమ సాక్షాత్కారం నుండి ఉదితమైన ప్రబోధ రూపమే నా పట్ల ఉదయించినదగుచున్నది. నా ఈ ఇతఃపూర్వపు, ఇక ముందటి దేహాలన్నీ నా స్వస్వరూప మహాసముద్రంలోని పిల్లతరంగాలు మాత్రమే!
శ్రీరాముడు : హే మహాత్మా! ఆ స్వయంప్రకాశమగు చిదాత్మ ఈ సమస్త జీవులపట్ల ఏ ఏ జీవుని మనోవృత్తులందు ఎప్పుడెప్పుడు ఏ ఏ భోగాభిలాషచే వివర్తభావము పొందుచున్నదో, … అప్పుడప్పుడు ఆయా ప్రకారంగానే అద్దానికంతటికీ "భోక్త - భోగము - భోగ్యము అను త్రిపుటీ రూపంగా (ఆత్మయే స్వయముగా రూపం) దాల్చుచున్నది.
కొన్ని రత్నాలు ఒకచోట ఒక గదిలో ప్రోగుచేసి ఉంచామనుకోండి! ఇప్పుడు ఆ వివిధ రత్నముల కాంతి పుంజములు సమ్మిళితంగాను అసమ్మిళితంగాను ఆ గదిలో కనిపిస్తాయి చూచారా? అట్లాగే “ఏకము, అవయవరహితము, పరమ సూక్ష్మము”… అగు పరబ్రహ్మమునందు ఒకే అధ్యాస ఒకే సమయంలో అనంత సృష్టుల సమ్మిళితమై ఉంటోంది. అయినప్పటికీ కూడా … ప్రత్యేక జీవునకు ప్రత్యేక బ్రహ్మాండ… భువనాదులు అతి విస్తీర్ణము కలవై అనుభూతమౌతున్నాయి. అట్టి దృష్టులన్నీ ప్రత్యేకంగా ఉన్నట్లుండి సమ్మిళితములు అగుచున్నాయి.
ఈ సృష్టులు బ్రహ్మమునందు తాదాత్మ్య ధ్యాస చేతనే మనుగడ సాగిస్తున్నాయి. స్వాత్మయందు దేనికీ అవరోధం లేదు. అవకాశమూ లేదు! స్వాత్మ యొక్క స్వరూపమునకు వాటితో ప్రమేయమూ లేదు! విశాలమగు ‘పరబ్రహ్మము’ అనే రత్నము నుండి ఈ కంటికి కనబడే - కంటికి కనబడని అనేక జగత్ సృష్టులు రత్నము యొక్క కిరణ పుంజముల వలె పరస్పరము సంబంధ అసంబంధపూర్వకంగా వస్తున్నాయి - పోతున్నాయి.
ఒక గదిలో ఒకే సమయంలో అనేక దీపాలు వెలుగుచుండగా… సమాన నేత్రేంద్రియములు గల జీవులందరికీ ఒకే తీరుగా పరస్పరము అనుభవమగుచున్నట్లు…. సమాన కర్మ - వాసనలచే అధ్యస్తులైన అనేకమంది జీవులకు పరస్పరము సృష్టుల అనుభవం కలుగుతోంది. వేరువేరు కర్మ - -
వాసనలు గల జీవులకు వేరు వేరు సృష్టుల అనుభవం కలుగుతోంది. ఇంతకు మించి జీవులకు వేరుగా సృష్టులు లేవు. జగత్తులూ లేవు.
అనేక తరంగములతో కూడుకొన్న సముద్రజాలంలోని ప్రతి నీటి బొట్టునందలి లవణ సంబంధమైన రసం ఉన్నది కదా! అట్లా సృష్టియొక్క ప్రతి అణువునందు అనేక బ్రహ్మాండాలు
Page:678
ఉన్నాయి. ఆ ప్రతి బ్రహ్మాండములోను అసంఖ్యాకంగా అణువులున్నాయి. ఆ అణువులలోని ప్రతి ఒక్క అణువులోను అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి. అయితే ఆత్మయొక్క పరమార్ధము దృష్ట్యా ఆ అణువుల క్రమమూ లేదు. ఆ బ్రహ్మాండములూ లేవు.
సర్వత్ర సర్వతోనిత్యం చిల్డ్రనస్యాంబు వేదనమ్ సంఖ్యాతుం కేన శక్యంతే సర్గాధార పరంపరాః?
సముద్రమునందలి జల పరమాణువుల యందలి రసమువలె చిదన పరమాత్మయే సర్వత్రా వెలయుచున్నది. సర్వవ్యాపకము, నిత్యము అగు ఆ చిదన పరమాత్మ యందు వర్తించుచున్న సృష్టి పరంపరలను లెక్కించటం ఎవరి తరం అవుతుంది?
అవయవి యొక్క వేరువేరు అవయవాలు పేరుకు వేరువేరు కావచ్చుగాక! కాని అన్నిటియందు (కళ్ళయందు, చెవుల యందు, చర్మమునందు వగైరా)… ఒకే అవయవి ప్రసరించి ఉన్నాడు కదా! అట్లాగే ఒకే పరమాత్మ సర్వసృష్టులందు, మనందరి యందు సృష్టి శరీరుడై (జగత్ శరీరుడై) ప్రసరించి ఉన్నారు. ఆతడు ‘ఏకం’ అయివుండి కూడా మాయచే అనేక, అనంతరూపుడై ఒప్పుచున్నారు.
ఆత్మ స్వభావంగానే ‘ఏకము’ అయినప్పటికీ… స్వభావ సిద్ధంగానే ‘అనేక - అనంత’ రూపమై ఒప్పుచున్నది. అద్దాని జగదత్వము అద్దాని స్వభావమే గాని, అందుకు మరొక కారణమేదీ లేదు. అందుచేత ఈ జగత్తు వాస్తవానికి ఉదయించటమూ లేదు. అస్తమించటమూ లేదు. ఈ జగత్తంతా కూడా ఆత్మరూపమే అయి వెలయుచున్నది. సూర్యకిరణములు “మేమే వస్తువులను ప్రకాశమానం చేస్తున్నాం” అని అనుకోకుండానే, (ఎటువంటి కర్తృత్వము వహించకుండానే)… ఈ జగత్ పదార్థములను ప్రకాశమానం చేస్తున్నాయి కదా! అట్లాగే ఆత్మకు భిన్నం కానట్టి అఖండ రూపమగు జ్ఞప్తియే తాను స్వయం ప్రకాశమానంగా స్వయంగా ప్రకాశిస్తూ… తన యొక్క జ్ఞేయ రూపంగా (తెలివియే తెలియబడే రూపంగా)… ఈ సర్వ దృశ్యమును ప్రకాశింపజేస్తోంది.
చూచారా స్వామీ! మీరు ఈ 21 రోజులుగా మావంటి అజ్ఞానులకు అందించిన జ్ఞాన సుధారసం చేత ఈ దృశ్యమంతా ఇప్పుడు బహుమాధుర్యంగా, ఆత్మకు అనన్యంగా అగుపిస్తోంది. ఆత్మతత్త్వజ్ఞానము యొక్క మాహాత్మ్యం చేత ఇదంతా పదార్థ రూపంగా కాకుండా…. స్వయమాత్మ రూపంగా అనుభవమౌతోంది. ఈ విధంగా “జ్ఞానమే జ్ఞేయరూపం”… అను మీ మహావాక్యాలు మాకు ప్రస్ఫుటం అవుచున్నాయి. మాకు ఇతఃపూర్వం జాడ్య రూపంగా అభ్యాసమైన ’తృష్ణ’ తొలగిపోవటం చేత “నేను - నీవు - అంతా ఆత్మ రూపమే”… అను దర్శనం స్వభావసిద్ధమగుచున్నది.
స్వామీ! ప్రతి జీవుడు రెండు విభాగములుగా స్వరూపము (లేక) స్వభావము కలిగియున్నాడు. శశ్వరమ్ - మార్పు చేర్పులు లేనట్టి స్వరూపం / (సత్చిత్ ఆనందం)
నశ్వరము - అనుక్షణికంగా మార్పు చేర్పులు చెందుచున్నట్టి స్వరూపం (ఈ దేహ మనోబుద్ధుల అంతర్గత విశేషాలు)
ఈ విధంగా ఈ జీవునికి సంబంధించినవై, స్థిరము - చంచలము… ఈ రెండు కలిసివుంటున్నాయి. మీ బోధచే మాకందరికీ నశ్వర పదార్థముల “తాదాత్మ్యాధ్యాస" సన్నగిల్లినదగుచున్నది. క్రమక్రమంగా
Page:679
మా అక్షయ స్వరూపం జ్ఞాపకానికి వస్తోంది. ఇంతవరకూ క్షయ స్వరూపములగు విషయములే మా స్వరూపమని భ్రమించాం. కాదు. మేము అక్షయము - అఖండము అగు ఆత్మయే స్వరూపంగా కలిగివున్నాం! ఏ మా అక్షయస్వరూపం మా యొక్క సర్వ శ్రేష్ఠ స్వభావమే అయి ఉన్నదో… అదే సర్వ విక్షేప శూన్యమగు “సమాధానము”. అద్దాని నిత్యానుభవమే సమాధి. అదే సంసృతి (సంసారము) యొక్క ‘ఆవలివొడ్డు’ అయినట్టి నిరంకృతి (శాంతి) స్వరూపం. అదియే నిర్వాణం.
సమస్త అధ్యాసపరంపల యొక్క ‘సమాప్తి’ చే శేషించే నిర్వాణ స్థితియే ఆ “పరమ పురుషార్థం”. అట్టి పరమ పురుషార్థమగు “అఖండాత్మాహమ్” అనునది బుద్దిచే అనుభూతమవటమే నిర్వాణ స్థితి. అట్టి స్థితికి మేము ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. ఏదో క్రొత్తగా సంపాదంచుకోవలసినదీ కాదు. అయితే “అట్టి పరమ పురుషార్థమగు నిర్వాణస్థితి (లేక) మాయొక్క ఈ దృశ్యమంతా ఏ ఆత్మ స్వరూపమయి ఉన్నదో… అట్టి మా శాశ్వతాత్మానందాత్మ స్వరూపం ఇప్పుడు ఈ బుద్ధితోనే అనుభవిస్తున్నాం. కనుక ఈ బుద్ధియే “పరమ పురుషార్థ ప్రయోజనం”. అయితే, “చరమ సాక్షాత్కారబుద్ధి ముక్త స్థితియందు ఆవశ్యకము” అని ఎవరైనా అంటారేమో! అది కూడా సరికాదు. ఎందుకంటారా?… ఈ ‘బుద్ధి’ అనునది కూడా జడమే!
న బుద్ధ్యాబుద్ధ్యతే బోధో, బోధా బుద్ధేర బోధ్యతే
న బుద్ధ్యతేవా తేనాపి, బోధ్యో బోధః కథం భవేత్?
ఈ బుద్ధి జడమే! కాబట్టి ఇది “పరమ పురుసార్థము బోధరూపము-” అగు ఆత్మను ఎరుగజాలదు. (ఇక్కడ బౌద్ధుల “బుద్ధియే ఆత్మ” అనునది కూడా దాటివేయబడుచున్నది. మా యొక్క సర్వాత్మ స్వరూపం బుద్ధికి కూడా అవిషయమే! బుద్ధిని ఈ దేహమువలె ‘నాది’ అనవచ్చు గాక! అది నేను కాదు. కొందరు - "నిద్రిస్తున్న రాజును వైతాళికులు (వందిమాగధులు) నిదుర లేపుచున్నట్లుగా బోధరూపమగు పరమాత్మ స్వరూపం బుద్ధిచే మేల్కొలుపబడుచున్నది”… అని అనుకుంటే అనుకోనీయండి. ఎందుకంటే, నిదురిస్తున్న రాజును (బుద్ది అనే వైతాళికుడు మేలుకొలు పుటకు ప్రవర్తిస్తున్నప్పటికీ… ‘మెలుకువ’ అనబడేది వందిమాగధుల రూపం కాదు కదా!
ఈ బుద్ధి బోధరూపం, సర్వాత్మకం, అనునిత్యము అగు నా ఆత్మ స్వరూపమును ఎరుగజాలదు. తానే ఎరుగని నా యొక్క బుద్ధి నా “బోధ” రూపమును నాకు ఎట్లా తెలియజేస్తుంది? మరి?… బోధ చేతనే బోధ ఎరుగబడుతోంది. ఆత్మ చేతనే ఆత్మ అనుభూతమౌతోంది.
వాస్తవానికి ఆత్మచేత ఆత్మ తెలియబడటం కూడా… అంతిమ సత్యం కాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియం కదా! ఆత్మ నిర్వికారము నిష్క్రియము అయివుండగా… అద్దాని యందు బోధించటమనే కర్తృత్వ భోక్త ృత్వాలు ఎక్కడుంటాయి?
అందుచేత హే మహర్షీ! ఆత్మ సర్వదా స్వయంప్రకాశమే! అది ఎల్లప్పుడు స్వప్రకాశత్వముచే ప్రబుద్ధమే అయి, సర్వదా బోధరూపమే అయి ఉన్నది. మేఘములు ఆవరించటం చేత సూర్యుడు
Page:680
కనబడకుండా ఉంటారు చూచారా? మేఘాలు తొలగితే… సూర్యుడు ఆకాశంలో జాజ్వల్య ప్రకాశమానుడై కనిపిస్తాడు. మేఘాలు ఆవరించి ఉన్నప్పుడు సూర్యుడు స్వయంప్రకాశస్వరూపుడు కాకుండా పోయినాడా? లేదే! అట్లాగే అజ్ఞానావరణచే మా ఆత్మయొక్క స్వయంప్రకాశత్వము మేము గమనించక ‘సంసారము’ అనే జాడ్యం పొందాం! మీరు ఝంఝామారుతంగా జ్ఞాన వీచికలు మీ ప్రవచన రూపంగా ప్రసరింపజేయటంచేత అజ్ఞాన మేఘాలు ఎటో పరుగులు తీశాయి. ఫలితంగా మా జ్యోతిస్వరూప ఆత్మ ప్రకాశం అంతటా ప్రసరిస్తూ కనిపిస్తోంది.
మహాత్మా! ఇంకా నాకు ఏమి అవగతమైనదో చెప్పుచున్నాను. వినండి.
సర్వకర్మ వితృష్ణానాం శాక్తేచ్ఛానాం ప్రబోధతః సతామనిచ్ఛతామేవ నిర్వాణం సంప్రవర్తతే ॥
సర్వ కర్మలందు (వాటియొక్క ఐహిక పారలౌకిక ఫలాలపై)… అపేక్ష త్యజిస్తూ ఉన్నవారు, సకల కోర్కెలు నశింపజేసుకొనుచున్నవారు, వాసనలు సన్నగిల్ల జేసుకొంటున్నవారు… సజ్జనుల బోధచే తాము ప్రత్యేకంగా కోరుకోకపోయినప్పటికీ… నిర్వాణ స్థితిని సులభంగా పొందుచున్నారు.
‘మోహము’ అనే నిద్ర నుంచి మేల్కొన్నవాడు, చిదాత్మ స్వరూపమును సుస్పష్టపరచుకొనే ధ్యాననిష్ఠను ఆశ్రయించినవాడు, కేవల చిత్స్వభావమున వర్తించువాడు అగు మహాత్ముడు… ఈ దృశ్యము విషయంలో ఏదీ గ్రహించడు. దేనినీ త్యజించడు. అట్టివాడు ఆయా వ్యవహారములందు తత్పరుడై ఉండవచ్చుగాక! మనస్సుతో లోక వ్యవహారములను మననము చేయవలసినప్పటికీ… అంతరంగమున విషయములందు ఆసక్తి ఉండదు. కనుక ఆతడు అమనస్కుడే! దీపం వెలుగుచూ అంతా చూస్తున్నప్పటికీ… ఏదీ చూడనిదై ఉంటోంది కదా! ప్రకాశించుచు - - ప్రకాశింపజేస్తున్న దీపం అక్రియమై ఉంటున్నట్లే… ఆత్మజ్ఞుడు క్రియావంతుడైనప్పటికీ, నిష్క్రియుడై ఉంటున్నాడు.
వ్యుత్థాన కాలంలో (సాధి నిర్విషయ ధ్యానము నుండి లేచిన తరువాత) ఆతనికి ఈ సృష్టి కనిపించవచ్చుగాక! ఆతనికి ఇదంతా బ్రహ్మముగాను, అసృష్టిరూపంగాను, సత్యస్వరూపమగు చిన్మాత్రముగాను సర్వత్రా భాసిస్తోంది.
ఎవడైతే, సమాధియందలి “కేవల బోధ”యే ఉత్థాన కాలంలో దృశ్యరూపంగా కనిపిస్తోందని గమనిస్తూ, “బోధ సద్రూప” స్వరూపానుభవమునందే స్థితి కొనసాగిస్తూ ఈ ప్రపంచమున ఉదాసీనవృత్తితో వీక్షిస్తూ ఉంటాడో… ఆతడు సర్వ సంసార విక్షేపములను జయించినవాడే అవుతాడు.
సమాధి - వ్యుత్థానములలో సమాన బోధ సంతరించుకొని ఉండటమే ఇక్కడి ఉపాయం. అట్టి బోధయే స్వభావమైనవాడు సంసార పరిశ్రమలనుండి విముక్తుడైనవాడగుచున్నాడు. శూన్యత్వము ఆకాశము కంటే భిన్నమైనదా? కాదు. అట్లాగే ఈ జగత్ పదార్థ సమూహమంతా కూడా “ఆత్మ” కంటే వేరుకాదు. ఆత్మ యొక్క బోధరూపమే జగద్రూపంగా
Page:681
కనిపిస్తోంది. అందుచేతనే మహాత్ములు"సాక్షి చిన్మాత్ర సాక్షాత్కార రూపము”ను సంతరించు కొనియే ఈ జగత్తులో వర్తిస్తూ ఉంటారు. అనంతబోధ రూపమగు కేవలాత్మ స్వరూపులై ’తత్సత్త’ అను సమస్వరూపం సర్వదా సంతరించుకొని ఉంటారు. అఖండార్థ వాక్యముల (తత్త్వమ్ - సో2 హమ్ - అహమ్ సర్వస్య ప్రభవో, జీవో శివః శివో జీవః - సర్వమ ఖల్విదమ్ బ్రహ్మ… ఇటువంటి మహావాక్యముల) అర్థమే తాము అగుచున్నారు. వారు తమ స్వరూపమును బ్రహ్మ సన్మాత్రముగాను, సర్వ జీవుల రూపంగా (మమాత్మా సర్వభూతాత్మా) దర్శిస్తున్నారు. ఓ సద్గురూ! నా ఆత్మయే ఈ సర్వసభికుల స్వరూపం! వీరందరి యొక్క స్వస్వరూపమే నేను! అట్టి సర్వాత్మ స్వరూపం వాక్కుతోను, సంజ్ఞలతోను నేను ప్రకటించజాలను. కేవలం అనుభవమే అగుచున్నది. అట్టి అనుభవమును వ్యక్తీకరించటానికి వాక్కు సరిపోదు.
“నా స్వస్వరూపము సర్వదా సర్వుల అనంత రూపమునకు సమర్పించబడియే ఉన్నది.” అట్టి బ్రహ్మభావముతో స్థితి పొందినట్టి అనుభూతియే ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞానముచే అపూర్వమైన పరమాత్మ సత్తాగా శేషిస్తున్నాను. అట్టి సర్వాత్మ స్థితిగా, నేను శేషించి ఉంటున్నానా? నేను శేషించకయే ఉంటున్నానా? చెప్పనలవికాదు. అది వాక్కుకు అవిషయమని ముందే చెప్పాను కదా! పరబ్రహ్మము వాక్కుకు అతీతము కావచ్చుగాని… అది అనుభవైకవేద్యమే! ఆ కనబడే గోడకంటే కూడా నా పరబ్రహ్మ స్వరూపమే నాకు మరెంతెంతగానో సుస్పష్టమైయున్నది.
శ్రీరాముడు : హే మహాత్మా! మీ ప్రవచనమంతా వినుచుండగా… నాకు నా స్వరూపం పట్ల - ఈ దృశ్యము పట్ల ఏ అభిప్రాయం దృఢపడిందో… అది మీ ముందు విద్యార్థినై విశదీకరిస్తున్నాను. మీ అనుజ్ఞచే నా అనుభవాన్ని పరిమిత సాధనమైన వాక్కులో ప్రకటిస్తున్నాను. మరికొంత వినండి.
‘తత్’ అని పిలువబడే ఆ పరమాత్మ సర్వుల సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ మీ పాదపద్మములను స్పృశిస్తూ ఆ రామానంద తత్ స్వరూపమే … ఈ పలుకులు పలుకుచున్నది.
ఏ సత్తా సామాన్యము యొక్క స్వరూపము ఏ ‘తత్ పదార్థము’ అయిన ఆత్మ అయివున్నదో…
ఆ సత్తాసామాన్యమే ఈ ’త్వమ్’ - - ‘అహమ్’ కూడా అయివున్నది. నాకు కనబడే త్వమ్ (నీవు - -
మధ్యమ పురుష) ఇత్యాది వ్యవహారమంతా నా స్వరూపమే! ఈ ఆకాశము - - భూమి - సూర్యచంద్రులు మొదలైన జాగృత్ - ఊహారూపమైన స్వప్నము - - నిర్లిప్త స్వరూపమైన సుషుప్తి… ఇదంతా నా నుండే, నా రూపంగానే బయల్వెడలుచున్నాయి. జగత్తంతా అస్తి - భాతి - ప్రియ రూపమగు అనుభవమే కదా! నా అనుభవమే ఈ దృశ్యము. నా అనుభవం నా స్వరూపమే కదా! కనుక ఈ “శోధితత్వమ్” అనబడే దృశ్యము నేనే! ఇదంతా నా సద్రూపమే!
Page:682
సమస్తము కూడా శాంతము - - నాశరహితము అగు ఆత్మరూపమే! ఇదంతా కూడా నిర్వాణ రూపమే! అనగా… ఈ దృశ్య సత్తా, నిర్వాణరూపము, తృష్ణారహితము, అత్యంత స్వచ్ఛము, పరమశీతల సుఖ స్వరూపము - పరమ ప్రేమాస్పదము అయినట్టి - ఆత్మసత్తయేగాని, మరింకొకటేదీ కాదు! సర్వము ఆత్మ స్వరూపంగా, ఆత్మబోధమాత్రంగా దర్శించుటకై బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు కూడా వాంఛిస్తూ ఉంటారు. వారికి సర్వదా - “శుద్ధము - స్వప్రకాశరూపము - - సర్వులకు సదా ప్రేమాస్పదము” – అగు చైతన్యమే అనుభవైక విషయమగుచున్నది. అట్టి శుద్ధ చైతన్యమే సర్వపదార్థ రూపంగా కూడా ఉదయిస్తోంది.
చైతన్యమే ద్రష్ట రూపం! చైతన్యమే దృశ్య రూపం! దృశ్యము చైతన్యరూపమే కాబట్టి "దృశ్యము నశించటం”… అనునదేదీ లేదు. దృశ్యమును దృశ్యరూపంగా దర్శిస్తే… అదియే సంసారము. దృశ్యము సంసారరూపంగా దర్శిస్తే… ఇదంతా దుఃఖప్రదమే! దీనిని నిర్వాణరూపంగా, (లేక) బోధరూపంగా (లేక) ఆత్మరూపంగా దర్శిస్తే… ఇదంతా నిరతిశయ పరమానందరూపమే! అట్టి నిర్వాణరూపమే (ఆత్మరూపమే) అంతటా దృశ్యరూపంగా కూడా ఉన్నది. సంసారము కల్పితమే కాబట్టి… లేనేలేదు!
ఒక శిల్పి తన బుద్ధి (లేక) యోచనను అనుసరించియే శిల్పమును చెక్కుచున్నాడు కదా! శిల్పియందు శిల్పరూపం బుద్ధియందు ఉన్నట్లే, అఖండ పరిపూర్ణ బ్రహ్మము నందు జగత్తంతా కూడా ఉండి ఉన్నది. జలాశయంలోని శాంత జలం నుండే తరంగ సమూహములు స్ఫురిస్తున్నాయి! ఏ తరంగమైనా కూడా తనయొక్క జలత్వము కోల్పోయినదెప్పుడు? కోల్పోనే లేదు కదా! ఆ తరంగాలన్నిటిలో జలమే ఆకాశాదులుగా ఏర్పడి ఉన్నది కదా! నాశరహితమగు మహాచైతన్యమే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశములలో… ఆయా పంచకోశములుగా స్ఫురిస్తూ దృశ్యరూపముగా కూడా అనుభూతమౌతోంది.
వాస్తవానికి చిదాకాశము అవిభక్తము అయివున్నది. అట్లు అవిభక్తం అయివుండి కూడా … అజ్ఞానావృతము - జడప్రాయము అయినట్టి అనేక కృత్రిమ వేషములను ధరిస్తోంది. చిదాకాశము విభక్తమైనదానివలె భ్రమచే అగుపిస్తోంది. అది ఏ ఏ జీవులచే ఏ ఏ ప్రకారంగా చిరకాలం భావించబడుచున్నదో, వారి వారికి ఆయా ప్రకారములుగానే - భోగ - మోక్షరూపమై ప్రాదుర్భవిస్తోంది.
మృతేవాపి అమృతేబస్ధా, స్వప్నే స్వప్న విబోధినః
న యథోదేతి సత్యాఖ్యా, తథా దృశ్యషు తద్విదః ॥
ఒకనికి స్వప్నంలో తన బంధువు చచ్చిపోయినట్లు కల వస్తూ ఉన్నదనుకోండి. ఆ స్వప్న ద్రష్ట దృష్టిలో స్వప్న సమయంలో ఆ బంధువు చనిపోయినప్పటికీ… వాస్తవానికి ఆ బంధువు మరణించనేలేదు కదా! స్వప్న సమయంలో “ఈ స్వప్నంలో కనిపించిన బంధువు చావు నిజమైన చావు కాదు”… అని గ్రహించకుండానే బంధు మరణం అనుభవిస్తున్నాడు. అట్లాగే అజ్ఞానికి "ఈ
Page:683
దృశ్యము ఈ ఈ రూపములు వాస్తవమే”… అని అనుకుంటున్నాడు కాబట్టి, “దుఃఖములకు అర్హుడను” అని అనుకుంటున్నాడు. ఇక తత్త్వవేత్తకో… దృశ్యముపట్ల సత్యత్వబుద్ధి ఉదయించటమే లేదు. అందుచేత ఆతనికి హర్షంగాని, శోకంగాని కలగటమే లేదు! ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా కూడా “శాంతం - శివం" అగు పరబ్రహ్మ స్వరూపమే అయివున్నదో - అట్టి భావన అత్యంత దృఢ తరంగా అగుచున్నదో… అట్టి వానికి ఇక ’భ్రాంతి’ అనేది ఎక్కడుంటుంది? ఎక్కడినుండి పుడుతుంది?
ఒకనికి రాత్రి స్వప్నంలో ఒక తాటి ఫలవృక్షం కనిపించింది. ఆ పళ్ళు కోసుకొని తినాలని ప్రయత్నించసాగాడు. కాని తాడిచెట్టు ఎక్కలేక, ఆ తాటి పళ్ళు కోసుకోలేక, వాటిని వదలలేక ఎంతో ప్రయాసపడుచున్నాడు. ఇంతలో ఆతనికి మెలుకువ వచ్చింది. “అయ్యో! ఆ తాటిపళ్ళు కోసుకొని రుచి చూడనేలేదే ఈలోగా, ఏమిటో, ఈ పాడు మెలుకువ రానేవచ్చింది?”… అని ఆతడు దుఃఖాన్ని పగలంతా కొనసాగిస్తున్నాడా? లేదే! అట్లాగే ”అఖండము - అప్రమేయము అగు ఆత్మయే నేను”… అను రూపంలో పూర్వజ్ఞానం ఉదయించిన తరువాత ఇక ఆపై దేహ సంబంధములైన భోగాలో, వాటికి సంబంధించిన ఉపాయాలలో ‘తృష్ణారాహిత్యం’ జనించటమనేది స్వభావ సిద్ధమే! తృష్ణారాహిత్యం చేత ఆత్మజ్ఞానం వర్ధిల్లుతోంది. ఆత్మజ్ఞానముచే తృష్ణ వైతొలగుతోంది. వైతృష్ణాత్ వర్ధతే బోధో, బోధాత్ వైతృష్ణ్య వర్ధనమ్,
పరస్పరేణ ప్రకటే, ఏతే కుడ్య ప్రకాశవత్
వెలుతురు వల్ల గోడ కనిపిస్తుంది. గోడ ఉండటం వలన దిశ యొక్క వెలుతురు కనిపిస్తుంది. అట్లాగే ఆత్మజ్ఞానం - తృష్ణరాహిత్యం ఒకదానివలన మరొకటి వర్ధిల్లుచున్నాయి. ఎక్కడ తృష్ణారాహిత్యం వృద్ధి చెందుచూ వస్తుందో అక్కడ జడదృష్టి యొక్క అభావం పెంపొందుతూ వస్తుంది. ఎంతెంతగా జడత్వం తొలగుతూ ఉంటే,… ఇదంతా అంతంతగా “ఆత్మ చైతన్యరూపంగా” ఈ దృశ్యము ప్రస్ఫుటమవుతూ వస్తోంది. అంతే కాకుండా… ఎక్కడ ధన - దార - పుత్రాదులయందు తృష్ణ వృద్ధి చెందుతూ వస్తుందో… అచ్చట అదేరీతిగా జడదృష్టి ప్రవృద్ధమై, అంతంతవరకు బోధ దృష్టి (ఇది బోధరూపమే… అనుభవజ్ఞుని స్వకీయమైన అనుభవ రూపమే … అనే దృష్టి) సన్నగిల్లుతూ వస్తోంది. “బోధ” యొక్క “బోధత్వము”… అనే పాండిత్యము తృష్ణారాహిత్యమే అయివున్నది. ఇక మూర్ఖత్వము యొక్క స్వరూపమో… తృష్ణ కలిగియుండటమే అయివున్నది.
ఓ సభికులారా! “1. తృష్ణా రాహిత్యం (వాసనాక్షయం), 2. బోధయొక్క ఆధిక్యత . ఇవి రెండూ పరస్పరం వృద్ధి చెందుచున్నప్పటికీ… ఇవి రెండూ దృశ్య సంబంధమైనవే కదా! ఆత్మ యొక్క అదృశ్య స్వరూపం వల్ల మాకు ఆత్మానుభవం లభిస్తుందా?”… అని మీమాంస పొందకండి. ఆత్మత్వము పొందటానికి మరెక్కడో వెతకకండి. దృశ్య సంబంధమైన కోరికలు తగ్గించుకొనే ప్రయత్నంలో ఉంటే చాలు… ఆత్మానుభూతి దానంతట అదే మీ గుమ్మం తొక్కుతుంది. అంతేగాని దృశ్య సంబంధమైన కోరికలను కొనసాగిస్తూ "మాకు అఖండాత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం లభించదే?”… అని అనుకుంటూ ఉంటే… లాభమేమున్నది?
Page:684
పరమాబోధ వైతృష్ణ్య సంపత్తి : ‘మోక్ష’ ఉచ్యతే తత్రానస్తే పదే శాంతే వసతా చ న శోచ్యతే ॥
ఎందుకంటారా? ఆత్మజ్ఞాన సమాచారం తృష్ణా రాహిత్యానికి సహకరిస్తోంది. తృష్ణ వలననే సర్వ దుఃఖాలు వచ్చిపడుచున్నాయి. తృష్ణా రాహిత్యమే స్వయంగా దుఃఖ క్షయ స్వరూపం. తృష్ణా రాహిత్యమే మహనీయుల దృష్టిలో ఉత్తమోత్తమ సంపద. కనుక ‘తృష్ణారాహిత్యం’ అనే ఔషధం అత్యవసరం అయివున్నది. అనంతము - పరమశాంతము అగు మోక్షపదము అధిరోహించిన జీవునకు ఇక శోకమంటే ఏమిటో కూడా తెలియదు!
హే మహర్షీ! ఇప్పుడు నాకు మీరు - - మా తండ్రిగారు - సభికులు - భూత భవిష్యత్ సర్వ జీవరాసులు - నేను …. అంతా బ్రహ్మము రూపంగా భాసిస్తున్నారు.
గతం గమ్యం, కృతం కార్యం, దృష్టం దృశ్యమశేషతః
యావత్ సర్వ శివం శాంతం ఏకమ్ ఆద్యమ్ అనామయమ్ ॥
బోధ (నిర్మల ప్రజ్ఞా) స్వరూపుడనగు నేను ఈ బోధ్యరూపంగా (తెలియబడే ఈ సర్వముగా) వెల్లివిరిసి ఉన్నాను. ఆహా! ఏదైతే పొందతగినదో అది పొందినవాడనయ్యాను. చూడవలసినది పరిపూర్ణంగా చూస్తున్నవాడనై ఉన్నాను. ఈ సమస్తమూ కూడా ఇప్పుడు నాకు శివరూపమై, శాంతమై, ఏకమై, ఆద్యమై, నిర్వికారమైనట్టి బ్రహ్మముగానే భాసిస్తోంది. ఇప్పుడు నేను ఆత్మారాముడను, అధ్యాత్మరాముడను అయ్యాను! పరమశాంతమును పుణికి పుచ్చుకున్నాను. తృష్ణా రహితుడను, అహంకార వర్జితుడను అయ్యాను! ఇప్పటికి నా అంతరంగం సంకల్ప రహితమై, ఆకాశమువలె అతి నిర్మలమైయున్నది.
❖
మహాత్మా! ఎందుకో ఈ జీవులలో అనేకులు ఆత్మజ్ఞానం విషయంలో అశ్రద్ధ గలవారై అనేక దుఃఖములకు అనవసరంగా ఎర అగుచున్నారే! ఏమి ఆశ్చర్యం! ఈ ఇంద్రియ విషయాలలో వారు ఏవేవో వెతుకుచూ మోసపోవుచూ… అవకాశములను వృథా చేసుకుంటున్నారు. తెలుసుకోవలసినది తెలుసుకోకుండా… అందుకు వేరైన దృశ్య విశేషాలు ఎన్ని తెలుసుకొని ఏం ప్రయోజనం? సహస్రేభ్యః సహస్రేభ్య కశ్చిత్ ఉత్థాయ వీర్యవాన్ |
భినత్తి వాసనా జాలం పంజరం కేసరీ యథా ||
చాలామంది ఈ దృశ్య సంస్కారాలను జయించే ప్రయత్నమే చేయటం లేదు. ’కృష్ణ’ను ఆశ్రయించి, అనేక జన్మలుగా… ఈ ఈ దృశ్యంలో ఏదో పొంది, ఎప్పటికో ఆనందించాలని అనుకుంటూ పరుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి దుఃఖాలు తొలగటమే మన ఈ సంవాదం ప్రయోజనం కదా!
అట్లా విషయ తృష్ణలను జయించాలని కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నించే వారిలో కొద్దిమంది మాత్రమే విషయతృష్ణను జయించి వీర్యవంతులనిపించుకుంటున్నారు.
Page:685
అట్టి వీర్యవంతులు పంజరమును ఛేదించిన సింహంలాగా వాసనా జాలమును ఛేదించి “ఆత్మానందము” అనే సువిశాల భూమిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు. మన ఈ సంవాదము అనేకులకు వాసన ఛేదమునకు మార్గదర్శకమగుగాక!
ఆ విధంగా శుద్ధ బోధయుక్తుడు, వాసనాక్షయం సముపార్జించుకున్నవాడు, అభ్యంతరమున పరమ ప్రకాశయుక్తుడు, ఆత్మజ్యోతిని సముపార్జించుకున్నవాడు స్వయంగా పరమశాంతిని పొందుచున్నాడు. జ్ఞేయమగు ఆత్మను ఎరిగినవాడై, ఆతడు సంకల్పములకు ముందే ఉన్న తన స్వరూపమును అంతటా అన్నిటా దర్శిస్తున్నాడు.
సర్వ సంకల్పములను అతిక్రమించిన ఆశయము కలవాడై ఉంటున్నాడు… ఇక ఆపై వాయువు ఉద్దేశరహితంగానే దేహములలో ప్రవేశించి ఉజ్జీవింపచేయటం, చెట్ల ఆకులను కదల్చటం… ఇవన్నీ నిర్వర్తిస్తుంది చూచారా! ఆ విధంగా వాసన వర్జితుడై, ఈ జగత్తులో చేష్టలను సలుపుచూ ఉంటున్నాడు. సమస్త పదార్థముల పట్ల తత్త్వమననం (‘తత్ త్వమ్ అసి’ - అని మరల మరల సంభావించటం) చేస్తూ ఉంటాడు కదా! అందుచేత, ఆత్మకు వేరుగా ఎప్పుడైనా అనిపిస్తే … అది భ్రమయేనని గమనించియే ఉంటాడు. “సమస్త పదార్థములు ఆత్మ స్వరూపమే! కేవల చైతన్యమాత్రమే” …అను నిర్మల దృశ్యరహిత భావనయే “వాసనారహిత స్థితి” అయివున్నది.
అట్లాగే, వాసనారహిత భావన ఉదయించినప్పుడు సర్వము పరబ్రహ్మ స్వరూపంగా అనిపించటం అత్యంత స్వభావసిద్ధమైయున్నది. ఆతనికి “ఈ సర్వము బ్రహ్మమే” అని అనిపించటమే ముక్తి! అదియే స్థిర నిర్వాణ పదము. అట్టివాని పట్ల సర్వ సంసార ప్రశమనము స్వయంగా ప్రకటితమౌతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు ప్రబుద్ధుడవు అయ్యావయ్యా! నీవిప్పుడు చెప్పిన వాక్యాలు అజ్ఞానుల పామరదృష్టులను హరించేవై ఉన్నాయి. అనుభవసిద్ధములు, యుక్తియుక్తములు కూడా! అందుచేత జ్ఞానులకు ఆనందమును గొలుపుచున్నాయి. నీవు చెప్పినదంతా పరమ సత్యమే! ఈ దృశ్య జగత్తు అసత్తే అయినప్పటికీ… సంకల్పముల కారణంగానే ఈ ఈ రూపములుగా భాసించుచున్నదగుచున్నది. నిస్సంకల్పము చేతనో… ఇదంతా సర్వదా మొదలంట శమించినదే అగుచున్నదది. ఆత్మగా అనిపించటమే దృశ్యము యొక్క శమనము. ఆత్మగా అనిపించగానే సర్వము సశాంతి పొందుచున్నది. అదియే పరమార్థము. నీవు చెప్పినట్లుగా… “చలనము - చలన రహిత స్థితి" ఈ రెండూ కూడా వాయువు యొక్క రూపములే అయి ఉన్నాయి కదా! అట్లాగే… కల్పనా రూపమగు బంధము, అకల్పనా రూపమగు మోక్షము… ఈ రెండూ కూడా పరబ్రహ్మము యొక్క రూపములే అయివున్నాయి. అంతేగాని అవి మరొక రూపం కాదు. పరబ్రహ్మమునందు ఏకత్వము
Page:686
లేదు. ద్వైతమూ లేదు. ప్రబుద్ధుడైన మనుజుడు ’సమాధి - వ్యవహారము’ - - ఈ ఉభయ సందర్భాలలోనూ ఒకానొక అనిర్వచనీయమైన శిలాగర్భము వంటి నిశ్చలస్థితి వహించి ఉంటున్నాడు. అట్టి నిర్వాణ పదమునందు నిశ్చల స్థితి కలిగి ఉండి జీవన్ముక్తులు వ్యవహారములోను - సమాధి యందు కూడా సమాన రూపంగా వర్తిస్తున్నారు. అట్లాగే ప్రబుద్ధులగు బ్రహ్మ - విష్ణు – మహేశ్వరులు, తదితర జీవన్ముక్తులు కూడా ఇటు వ్యవహారమునందు - - అటు సమాధి యందు నిత్య చిదన పదమునందు సదా వెలయుచున్నారు. నీవు కూడా మావలెనే చిన్మయ పదమును సముపార్జించుకుని జీవన్ముక్తుడవై ఉండెదవుగాక!
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు బ్రహ్మమునందు బ్రహ్మమే అయి, - - అసద్రూపంగాను, ఉత్పత్తి రహితంగాను, అప్రకాశరూపంగానూ, ఆరంభమే లేనిదానిగానూ, ఆకార శూన్యంగానూ మిథ్యగానూ భాసిస్తోంది. మృగతృష్ణలో జలం, ఆ జలంలో ఆవర్తములు కనిపిస్తాయి చూచారా? బంగారంలో ఆభరణం కనిపిస్తోంది కదా! స్వప్న - సంకల్పములలో పర్వతములు, ఇళ్ళు, వాకిళ్ళు ఎప్పుడో చూచిన, ఎప్పుడూ చూడని నగర వీథులు అగుపిస్తాయే! అట్లాగే పరబ్రహ్మమునందు ఈ జగత్తు భాసిస్తోంది!
శ్రీ వసిష్ఠ మహర్షి : బిడ్డా! రామచంద్రా! నీ వాక్యాలు మృధుమధురములు. పరమ సత్యములు. అయితే నోటితో చెప్పగలగటం వేరు, అనుభూతి / అనుభవం వేరుకదా! అందుచేత నీ బోధాభివృద్ధి కొరకు, (అంతే కాకుండా) మన ఈ సంవాదము మరికొన్ని విశేషాలు ముముక్షువులకు అందించటానికి వీలుగాను, శిష్య పరీక్షార్థము కొన్ని ప్రశ్నలడుగుతాను. సర్వ సభికులకు నీ సమాధానాలు సంశయములన్నిటినీ తొలగించటమే నా ఉద్దేశం.
ఈ దృశ్యము అందరికీ ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణములచే దృఢీకరించబడినదై, అర్ధక్రియా సామర్థ్యంతో కూడినదై ఉంటోంది కదా! నెత్తి మీద కూర్చుని ఉన్నదానివలె అగుపిస్తోంది. అట్లు మహాప్రకాశశీలమై ఉన్నప్పటికీ… ఈ ‘జగత్తు’ అనే అభాస లేకపోయేవున్నదని ఎట్లా చెప్పగలవు? శ్రీరాముడు : మహాత్మా! సర్వ జగదనుభవములకు ముందుగా అనుభవజ్ఞుడు ఉండాలి కదా! అనుభవజ్ఞుడు (అనుభవాలు ఎరుగువాడు) ముందుగానే ఉండి ఉండకపోతే అనుభవాలకు నాంది ఎక్కడిది? అట్టి అనుభవజ్ఞుడు సర్వానుభవాలకు మునుముందుగా ఆత్మ స్వరూపుడే అయివున్నాడు. అట్టి కేవలాత్మ స్వరూపుని సమక్షంలో ‘జగత్ దృశ్యము’ అనబడే బాహ్యత్వము జనించటానికి కారణము కాగలిగినదేమి ఉన్నది? ఏదీ లేదు. కారణమే లేనప్పుడు కార్యము ఎక్కడుంటుంది? కనుక ఈ జగత్తు ఉత్పన్నమే అయివుండలేదు. గొడ్రాలి రెండవ కుమారుడు - మూడవ కుమార్తెల ఆస్తి తగాదాలు ఎక్కడుంటాయి? ఈ జగత్తు ఈ రీతిగా భ్రమయే అయివున్నది.
స్వప్న ద్రష్టకు వేరుగా స్వప్నము లేనట్లే, జాగ్రత్ ద్రష్ట యొక్క స్వకీయ తాత్పర్యమునకు వేరుగా జాగ్రత్ దృశ్యము కూడా లేదు. దేని నుండి ఈ జాగ్రత్ భ్రాంతి ఉత్పన్నమైనదో… అట్టి దానికి ఆత్మకు వేరుగా కారణమెక్కడున్నది?
Page:687
పోనీ కారణము ద్రష్ట స్వస్వరూపమగు బ్రహ్మమని అందామా? అది కుదరదు. బ్రహ్మము సదా నిర్వికారము - జరామరణ రహితము కదా! అట్టి నిర్వికార బ్రహ్మము దృశ్యమునకు కారణం ఎట్లా కాగలదు? అవజాలదు. బ్రహ్మమే కాకుండా దృశ్యము యొక్క కల్పనకు మరొక కారణమెక్కడిది? మరొకటేదైనా ఉండి ఉంటే ఆత్మ “అనన్యం” ఎట్లా అవుతుంది? దృశ్యమునకు ‘ఇది’ అనతగిన రూపమెక్కడిది? పైగా, సవికారమైన ఏ వస్తువైనా సరే… ఒకానొక పూర్వావస్థ నశిస్తేనే వర్తమాన అవస్థ పొందుతోంది కదా! సృష్ట్యాదిలో సర్వము పదార్థ శూన్యము అయివుండగా… కేవలము చైతన్యం మాత్రమే శేష్యమైయుండగా… ఏ పూర్వావస్థ నుండి ఈ జగత్ పదార్థముల ఉత్పన్నమవగలవు?
అవాచ్యము (వాక్కుచే చెప్పబడలేనిది) - - నిర్వికారము అగు బ్రహ్మమే, త్రాడు పాముగా కనిపిస్తున్నట్లుగా ఈ రీతిగా జగదాకారంగా విజృంభిస్తోందని అందామా? అప్పుడిక జగత్తు యొక్క శబ్ద అర్థములు సత్యములై లభించనట్లే కదా? “రజ్జు సర్పభ్రాంతి”లో సర్పము మొదలే లేదు కదా! “త్రాడు ‘సర్పము’ అనే రూపమును దాల్చింది”… అనేది (రజ్జు - సర్పభ్రాంతిలో) అయుక్తం కదా!
కాబట్టి… అవాచ్యము, శాంతము అయినట్టి బ్రహ్మపదమున బ్రహ్మమునకు అనన్య స్వరూపుడగు "హిరణ్యగర్భుడు” అనే (జలంలోని ప్రథమ తరంగం వంటి) ప్రప్రథమ చైతన్యతరంగము… కొంచెం నామరూపాత్మకమైన సూక్ష్మశరీరం ధరిస్తోంది.
స్వప్నంలో కొద్ది సమయం తన స్వల్ప కల్పనా శరీరములో తనకు అనన్యమైన స్వప్న దృశ్యమును ప్రతిజీవుడు తనకు అన్యమైనదానివలె చూస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే ప్రప్రథమ చైతన్య స్వరూపుడగు హిరణ్యగర్భుడు కూడా ఒకింతకాలం వివర్తరూపమగు సూక్ష్మశరీరం ధరించినవాడై ఉంటున్నాడు. అట్టి స్వప్న సదృశ సూక్ష్మశరీరం… ఈ జీవుని స్వప్నంలా కాకుండా… బహుదీర్ఘకాలం కొనసాగవచ్చు గాక! కానీ, ఈ ముల్లోక జగత్తు ఆ హిరణ్యగర్భుని సుదీర్ఘ స్వప్నమే అయివున్నది. సత్య సంకల్ప రూపుడగు ఆ బ్రహ్మదేవునకు దేశ కాల క్రియాది సమన్వితమగు ఈ జగత్తంతా కూడా చిదాకాశమునందే స్వయంగా భాసిస్తోంది.
తస్మిన్ మిథ్యోపసంపన్నే స మిథ్యాపురుషస్తతః మిథ్యైవ తత్సమాచారం కుర్వన్తి విపరివర్తతే ||
మిథ్యా భూతమగు ఈ జగత్తునందు, మిథ్యా రూపుడే అగు ఆ బ్రహ్మదేవుడు… మిథ్యగానే
ఈ భూత - - భువనాది సర్వ సమాచారములను గావించుచు … వివర్త భావమును పొందుచున్నాడు.
ఆయనే అనర్థరూపములైనట్టి అనేక పదార్థ సంరంభముల గూర్చిన భ్రమను కల్పిస్తున్నారు. స్వకల్పితములగు లోకములలో ప్రవేశించి వ్యష్టి జీవరూపంతో పుణ్య - పాపభోగార్థం తన కల్పిత త్రిజగత్తులందు తానే తిరుగాడుచున్నారు. ఆతని సంకల్పము యొక్క పూర్వస్థితి ఎట్టిదో … ఇప్పటి
Page:688
స్థితి కాకతాళీయంగా అట్టిదే అయివుంటోంది. ఆతని సంకల్పము చేతనే జగత్తునందు ఈ ఎదురుగా కనిపించేదంతా సుస్థిరస్థితి వలె అగుపిస్తుంది. అట్టి సంకల్ప నిర్మితమైన ఈ ఈ దృశ్య జగత్తు మిథ్యగానే స్థితినొందియున్నది.
శిలా -వస్ధ్వాసుత న్యాయం -
శిలా వన్యాసుతముఖే వ్యోమ చూర్ణేన రంజనమ్ కరోతి ఇత్యాదివత ఇదం, మిథ్యాజగదుపస్థిమ్ ॥
ఒకానొక ప్రదేశంలో ఒకచోట శిల ఉన్నది. ఆ శిల ఒక సమయంలో కామవికారం పొంద సాగింది. ఇకప్పుడు తనకు తగిన ఒక ప్రియుని కొరకై వెతకసాగింది. వెతకగా, వెతకగా శిలకు ఒక గొడ్రాలి పెద్దకుమారుడు నవయౌవనుడై కనిపించాడు. ఆ శిల ఆ గొడ్రాలి కుమారుణ్ణి సమీపించింది. తన హాస విలాస విన్యాసాలతో … ఆ గొడ్రాలి కుమారునికి తన ప్రేమను తెలియజేసింది. అప్పుడు ఆ వంథ్యా పుత్రుడు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టపడ్డాడు. అనేక ఇబ్బందులను, అడ్డులను అధిగమించి వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారు. వివాహానంతరం తన పతి సౌందర్యం చూచి ఆ శిల మురిసిపోయింది. అప్పుడు ఆ శిల తన ప్రియుని ముఖంలోకి చూచి, కించిత్ ఆదుర్దాగా, “అయ్యో! అదేమిటీ! నీ ముఖానికి బొట్టు లేదేం”? అని వయ్యారంగా పలికింది. అప్పుడు ఆ గొడ్రాలి కుమారుడు తన ప్రియ సఖియగు ఆ శిలను చూచి, ”ఓ ప్రియురాలా! నీ కోసం నేనేమైనా చేస్తాను! ఇక బొట్టు మాత్రం ఎందుకు ధరించను? నీవే నా నుదుటికి బొట్టు అలంకరించు….” అని అనునయంగా పలికాడు. అప్పుడా శిల తన చేతులతో ఆకాశమును చూర్ణం చేసి, చూపుడు వ్రేలుతో తిలకంగా చేసి తన ప్రియుడగు ఆ వంథ్యా పుత్రుని నుదిటిపై ఆ తిలకంతో కళ్యాణపు బొట్టును పెట్టి, అలంకరించి ఎంతో సంతోషించింది. అప్పుడొక మహోత్సవం జరిగింది. ఆ మహోత్సవానికి భూమిపైగల వంటపాత్రలు చాలక … చంద్రమండలం నుంచి కూడా మరికొన్ని వంటపాత్రలు తెప్పించారు.
ఇటువంటి వాక్యముల అర్థసారంలాగా (ఆద్యంతమూ ఏమాత్రం సమకూడని విధంగా) ఈ జగత్తు మిథ్యగానే స్థితినొంది ఉన్నది. వాస్తవానికి ఈ జగత్తు “ఆకాశకోశము”వలె అతి స్వచ్ఛమై, శిలయొక్క గర్భభాగంలాగా చిదనమై, పరమ మౌన - శాంతరూపమై, నాశరహితమై వెలయుచున్నది.
జగత్తు = సర్వాకారుడు - సర్వ సంకల్పధారుడు - - చిన్మాత్రరూపుడు అయిన విరాట్ పురుషుని యొక్క “సూక్ష్మ శరీరము” నందు గల విషయాభిముఖమైన స్ఫురణము. అట్టి స్ఫురణమే ఈ జగద్రూపంగా భాసిస్తోంది.
ఈ ప్రకారంగా ఈ సమస్తము కూడా సర్వదా . - ‘విషయత్వము’ మొదలైన దోషములు లేని బ్రహ్మమే! ఇదంతా దోషరహితమైన, సచ్చిదానందరూపమై, శాంతము - - ఏకము ఆద్యంత
Page:689
వర్జితము అగు బ్రహ్మాకాశమే అయివున్నది. ఇక ‘జగత్తు’ అని దేనిని అనగలం? జలంలో అనేక తరంగముల ఉత్పత్తి వినాశనములు సంభవించవచ్చుగాక! వాటిలో ఏ తరంగం జలంకన్నా భిన్నం? అట్లాగే బ్రహ్మమునందు ఈ జగత్తు యొక్క సృష్టి - స్థితి - ప్రళయముల మాత్రంచేతకూడా బ్రహ్మము కంటే ఈ జగత్తుకు భిన్నత్వం ఏమాత్రం లేదు! శుద్ధ జలబిందువు శుద్ధ జలంలా స్వభావ సిద్ధంగా లయమొందుతుంది, చూచారా? అట్లాగే…. సారాసారములను గూర్చిన వివేకము గల తత్త్వజ్ఞానులు కొందరు ఈ సభలో ఉండియున్నారు. వారు ‘శుద్ధ బ్రహ్మము’ అనే ఏకరసత్వము పొందియే ఉన్నారు.
ఆహా! ఏమి ఆశ్చర్యం! ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క అవయవమా అన్నట్లుగా, (లేదా) పరబ్రహ్మం యొక్క కార్యమా అన్నట్లుగా బ్రహ్మమునకు భిన్నమైన దానివలె భాసిస్తోంది! కాని విచారించి చూస్తేనో?… ఈ జగత్తు బ్రహ్మమే అయివున్నది! ఎందుకంటే శాంతం, నిర్మలం, నిష్క్రియం అగు బ్రహ్మమునందు, బ్రహ్మం చేతగాని, మరింకే కారణం చేతగాని జగత్తు ఏర్పడజాలదు.
స్వప్న పదార్థములన్నీ… స్వాత్మరూపమే అయివున్నాయి! దృశ్యరూపములన్నీ… బ్రహ్మమే అయివున్నాయి. మృగతృష్ణగా కనిపించేదంతా… ఎడారి భూములే కదా! ఎరుగబడిన తరువాత స్వప్నాదులందు ఎవరికి సత్యత్వబుద్ధి ఉంటుంది? అట్లాగే… ఈ జగత్ దృశ్య విషయం కూడా!
శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు మద్యము మత్తు ఏమిటో తెలియదు కదా! అట్లాగే జ్ఞాని ఈ దృశ్యము ఏమిటో… బాహ్య రూపమగు ఈ ప్రపంచపు భోగరసము యొక్క విశేషరుచి ఏమిటో ఎరుగుటలేదు. ఈ సంస్పర్శజనిత భోగములు వస్తుతః పైకి ఆకర్షితంగా కనిపిస్తున్నప్పటికీ… ఇవి దుఃఖ ప్రదములే! ఇట్టి విషయోన్ముఖత్వము భ్రమచేతనే రూపుదిద్దుకుంటోంది. అందుచేత ఈ దృశ్యము స్వకీయమగు ఆత్మరూపంగా ఎరుగుటచేతను, నిజశుద్ధ రూపంగా దర్శించటం చేతను నిత్యముక్తమగు ప్రశాంతాత్మానుభవం సిద్ధిస్తోంది.
ప్రియజనులారా! మీరంతా అట్టి స్వస్వరూప ప్రశాంతాత్మత్వ దృష్టిచే మీకు కనబడుచున్న ఈ వారి దృశ్యమును పునీతం చేసుకొనెదరు గాక!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మరొక ప్రశ్న. బీజంలో అంకురం ఉంటుంది చూచావా? ఆ విధంగా కారణభూతమగు బ్రహ్మమున కార్యభూతమగు ఈ ‘జగత్తు’ అనబడే దృశ్యము విద్యమానమగుచున్నదని అనుకోవచ్చు కదా! కనుక ఈ జగత్తు సత్తాస్వరూపమే అవుతుంది కదా? అంతేగాని, ఈ జగత్తు స్వతహాగా లేదని ఎందుకు సిద్ధాంతీకరించాలి?
శ్రీరామచంద్రుడు : మహాత్మా! బీజమునందు అంకురము (మొలకెత్తే వృక్షము) అంకుర రూపంలో ఉండి ఉంటే… అప్పుడు మనం "అకురం బీజం పొట్ట చీల్చుకొని బయల్వెడలుతోంది”… అనవచ్చు
Page:690
నేమో! కానీ, మనం బీజమును ఛేదించి చూచామనుకోండి. అప్పుడు అందులో అంకురం లభిస్తుందా? లేదే! బీజము అంటే ఏమిటి? బీజము నందలి అంకుర సంబంధమైన సత్తా విభాగమే బీజము. అంతేగాని బీజము ఆకారమో, పై చర్మమో బీజం కాదు కదా! కనుక బీజమే అంకురంగా పరిణతి పొందుతోంది! అనునది ఇక్కడ సిద్ధిస్తోంది.
కానీ… బ్రహ్మమునందు జగత్ సత్త అట్లా లేదు. బ్రహ్మమే జగత్తు వలె సర్పరజ్జుభ్రాంతి విశేషంగా అనిపిస్తోంది. బ్రహ్మము నందు జగత్తు ఎక్కడున్నది? అది సదా దాగివుండటం, ఒకానొకప్పుడు బయల్వెడలటం… ఇది యుక్తీయుక్తం కాదు. అందుచేత బ్రహ్మము - జగత్తులకు బీజాంకుర న్యాయము ఏమాత్రం తగియుండటమే లేదు.
స్వామీ! నిర్వికారమగు దాని నుండి సవికారమగు వస్తువు, నిరాకారమైన దానినుండి సాకారమైనది ఉత్పన్నమవటం ఎట్లా కుదురుతుంది? అట్టిది నేను విని ఉండలేదు. చూచి ఉండలేదు. కాబట్టి నిర్వికారమై, అవయవ రహితమైన బ్రహ్మమునందు సాకారము - - సావయవము అయినట్టి జగత్తు ఉండజాలదు. ఆవగింజలో ఏనుగుల గుంపు ఎక్కడైనా ఉంటుందా?
“ఒక పెట్టెలో (పేటికలో) రత్నము ఉన్నట్లుగా ఈ జగత్తు బ్రహ్మమునందు కలదు” …అని కొందరు చేస్తున్న ప్రతిపాదనకూడా నా ఉద్దేశంలో వృథా ప్రేలాపనవంటిదే! ఎందుకంటారా? నిరాకారమగు దానియందు గొప్ప సాకార జగత్తు ఉన్నదనటం ఎట్లా పొసగుతుంది?
కొందరు “సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారం" అని అంటున్నారు. అది కూడా కుదిరేది కాదు. ఎందుకంటే, సర్వ వస్తు రహితము - పరమ శాంతము అగు పరబ్రహ్మము సర్వ వస్తు సహితము అశాంతము అగు జగత్తునకు ఆధారం ఎట్లా అవుతుంది? ఆధారము - ఆధేయము కొంత సమాన ధర్మములు కలిగినవై ఉండాలి కదా! అందుచేత ఈ కనబడే దృశ్యమునకు బ్రహ్మమే ఆధారం అనటం కూడా ఏమాత్రం యుక్తియుక్తం కాదు.
“ఒకడు నిదురించగానే స్వప్న దృశ్యం ఉత్పన్నమౌతోంది కదా! అట్లాగే… బోధ (ఆత్మ)యే క్షణిక సాకారయుక్తంగా ఉత్పన్నమగుచున్నది" అనే సిద్ధాంతం కూడా కుదిరేది కాదు. ఎందుచేత నంటారా? జాగ్రత్తునందు బాగుగా అనుభవించబడి బాగుగా, అభ్యస్తమైనట్టి పదార్థములకు (దృశ్యమునకు) సంబంధించిన సంస్కారములే స్వప్నంలో స్వప్నరూపంగా సాక్షాత్కరిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసినదై, అనుదినం అనుభవమగుచున్న విషయమే కదా! ఇక ఈ సృష్టియో… పూర్వకాలమున అనుభవించబడినది కాదు కదా! ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా, కళ్లకు ప్రమాణ రూపంగా అగుపిస్తోంది. కనుక ఇది ‘స్వప్నమాత్రము’ కాదు. కాబట్టి ఏది జాగ్రత్తో… అదియే స్వప్నము అను (బౌద్ధుల) సిద్ధాంతము కథనంకూడా యుక్తము కాదు. జాగృత్ - స్వప్నము ఒక్కటే అయివుంటే స్వప్నంలో మరణించిన బంధువు జాగ్రత్తులో కూడా మరణించాలే గాని, జీవించివుండకూడదు కదా! కానీ ఆతడు ఆ మరునాడు తెల్లవారగానే ఎట్లా కనిపిస్తాడు? కాబట్టి ఈ జాగ్రత్ జగత్తు క్షణికమాత్ర స్వప్నము వంటిదని అనవీలులేదు.
Page:691
ఇక మరొక సిద్ధాంతము (చార్వాకులు) ను అనుసరించు “ఈ జీవుడు స్థూల శరీరుడే! ఈ దేహము నశించిన తరువాత జీవుడు కూడా నశిస్తాడు! ఈ జీవునకు స్థూల శరీరమే ఉన్నదిగాని, ఆ తదనంతరంగాని, ఇప్పుడుగాని, (శరీరము ఉన్నప్పుడు గాని) ఆతనికి మరొక సూక్ష్మ శరీరమేదీలేదు”… అని చెప్పటం కూడా సముచితం కాదు. ఎందుకంటే… ఈ జగత్తులో పిశాచా దులు, వాటి యొక్క స్వప్నము వంటి స్థితులు లోక ప్రసిద్ధమే అయి వున్నాయి కదా!
కాబట్టి హే మహర్షీ! ఆత్మ చైతన్యము సర్వదా నిరాకారమే అయి, తన చిత్స్వరూపముననే స్థితి కలిగియున్నది. స్వప్న ద్రష్ట నిరాకారుడైనప్పటికీ స్వప్నం సాకారంగా కనిపిస్తోంది. వాస్తవానికి స్వప్నము కూడా నిరాకారమే! అట్లాగే ఆత్మ చైతన్యమే ‘సృష్టి’ అనబడే వివిధాకారములుగా అజ్ఞాన దృష్టికి అగుపిస్తున్నది. జ్ఞానదృష్టిచే - సాకరమగు జగత్తు నిరాకారమగు పరమాత్మయే అయివున్నది”…అను సిద్ధాంతం ఇక్కడ ఒనగూడుచున్నది.
స్వప్నంలో చైతన్యమే తనయందు తాను పర్వతాది ఆయా ఆకారములుగా స్థితి కలిగి ఉండటం సుస్పష్టమైన విషయమే కదా! అట్లాగే సర్వజీవులలోని సాక్షి చైతన్యము సర్వసంబంధరహితమగు బ్రహ్మమే అయివున్నది. ఆ సాక్షి చైతన్యముచే జగత్ రూపంగా అజ్ఞానంచేత పొందబడుచున్నది. (లేక దర్శించబడుతోంది) స్వప్న దృశ్యం ఉన్నదా? లేదా? స్వప్నద్రష్టకు ఉన్నది. మరొకరికో, ఆ స్వప్నదృశ్యం లేదు. స్వప్నము మిథ్యయేనని మేల్కొనిన తరువాత ఆ స్వప్నద్రష్ట గమనిస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే అజ్ఞానదృష్టిచే ఈ జగత్తు ఉన్నది. జ్ఞాన దృష్టిచే ఇది పరమాత్మ స్వరూపమే అయివున్నది. ఇదియే ఇక్కడి బ్రహ్మము - జగత్తుల సత్ - అసత్ సంబంధం! అనగా… ఈ జగత్తు సత్-అసత్ రూపంగా విజృంభించుచున్నదై, అనిర్వచనీయమై, స్వానుభవవేద్యమై, అజ్ఞాన దశయందు అనుభవించ బడుచున్నది. ఆత్మజ్ఞానము ఉదయించినప్పుడో… ‘జగత్’ అనబడునది అనుభవించబడకయే (పొందబడకయే) పోతోంది. అనగా ఇదంతా జ్ఞానిచే బ్రహ్మముగానే దర్శించబడుతోంది. ఈ భావ - అభావాలన్నీ కూడా జ్ఞాని దృష్టిలో సర్వదా ఆత్మ ప్రకాశ రూపమును సంతరించుకుంటున్నాయి. భావము అభావ రూపంగాను, అభావము భావరూపంగాను (ఆత్మ నిత్యానుభవంగాను, జగత్తు మిథ్యానుభవంగాను) అగుచున్నది.
బృంహతి బ్రహ్మణి బ్రహ్మ వ్యోమ వ్యోమని వర్ధతే నచోపపద్యతే కించిత్ బ్రహ్మ వ్యోమ్ని విబృంహణమ్
బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే జగతూపంగా వర్ధిల్లుతోంది!… కానీ, వాస్తవానికి నిర్వికారమగు బ్రహ్మాకాశమున ‘జగత్తు’ అనబడేది వర్ధిల్లటానికి అవకాశమే లేదు. ఈ ద్రష్ట - దర్శనము - దృశ్యము - వీడు - - వాడు - నేను - నీవు … ఇత్యాదిగాగల ఈ సృష్టి విభ్రమమంతా కూడా… శాంత స్వరూపమగు చిదాకాశము యొక్క అనన్యవిస్తార స్వరూపమే! కాబట్టి ఈ జగత్తుకు సాకారత్వం వాస్తవానికి లేదు! ఏ విధంగా స్వప్నంలోను, సంకల్పం (ఊహ)లోను కనిపించే నగరము - · భవనము వగైరా సత్యమే కాదో, …. అట్లాగే సాకారంగా పొందబడినప్పటి ఈ జగత్తు సత్యమే కాదు! ఇదంతా కూడా శాంతము - ఏకము - నిర్వికారము అగు బ్రహ్మమే అయివున్నది.
Page:692
పూర్ణం హి పరమం శాస్త్రమిదమ్ సర్వమఖండితమ్ అనిఙ్గనమ్ అనాభాసం అనాద్యంతం అచేతితమ్ ||
ఈ కనబడే ప్రపంచమాతా కూడా “పూర్ణము పరమశాంతము నిష్క్రియము విషయాభాస రహితము - ఆద్యంత శూన్యము స్వప్రకాశ రూపకము అఖండము
అద్వితీయము”… అయినట్టి బ్రహ్మమే అయివున్నది.
హే మహాత్మా! జనన మరణ రహితము పరమశాంతము ఆద్యంత వర్ణితము మహత్తరము - ఉపాధి వర్జితము - నిరాకారము అయినట్టి స్వాత్మపదమునును మీ అనుగ్రహంచేత నేను దర్శిస్తున్నాను. గమనిస్తున్నాను. అనుభవం పొందుచున్నాను. ఈ నా వాక్యము సత్యము …. సత్యము… సత్యము! అంతఃకరణం ఏ వృత్తిరూపం పొందితే అదియే ఈ వాక్యప్రవాహంగా ఇప్పుడు ఉదితమౌతోంది. ఏ బీజమును భూమిపై నాటితే అది ఆ రూపంగానే అంకురించునట్లు, మీరు ఏ పాఠ్యాంశం మాకు ప్రకటించి ఉన్నారో,… అదియే మాకు మా స్వస్వరూపానుభవము యొక్క మాధుర్యాన్ని చవిచూపుతోంది. ఈ జగత్తును స్వస్వరూపంగా ప్రత్యక్షానుభవం ప్రసాదిస్తోంది.
శుద్ధ జ్ఞానమయైకాత్మా ద్వైతైక్య పరివర్జితః
మనాగపి నజానామి ద్వైతైక్య కలనాకలామ్ ॥
శుద్ధ జ్ఞానమయము - ద్వైతైక్య రహితము అయినట్టి ఆత్మ నేనే అయివున్నాను. ద్వైతైక్య కల్పన నాకు లేనిదే అగుచున్నది. ఇక ఈ కనబడే జీవులంతా కూడా… నా దృష్టియందు శాంత స్వరూపులే! సర్వేంద్రియ వ్యాపార రహితులు! సర్వక్రియా వర్జితులు! వీరందరి స్వరూపము బ్రహ్మమే! కనుక అందరు కూడా సదా జీవన్ముక్తులై ఆకాశమున శూన్యత్వంలాగా బ్రహ్మమునందు బ్రహ్మముగానే స్థితినొందియున్నారు. ఈ జగత్తు శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాది అనేక విశేషములతో వివిధములైన కార్యారంభములతో కనిపించవచ్చు గాక! అయినా కూడా నా దృష్టిలో ఇప్పుడు ఇదంతా గోడపై రంగులతో చిత్రించబడినట్టి "తుపానుగాలికి సముద్ర మధ్యంలో చిక్కుకున్న ఓడ” వలె మౌనస్వరూపము, ఆభాసమాత్రము, మనో రాజ్యము వంటిది అయివున్నది. శిలయందు చెక్కబడిన శిల్పంలాగా, కథలోని రకరకాల పాత్రలలాగా, ఆకాశంలో శంబరాసురుని మాయచే కల్పించబడిన ఇంద్రసభలాగా స్వప్నమువలె ఉదయించి భాసించుచున్నదే అగుచున్నది! హే మహాత్మా! ఏదైతే సృష్ట్యాదియందే స్వప్నమువలె ఉదయించినదై ఆలంబన రహితంగా, నిరాకారంగా భాసించి ఇప్పటికీ కొనసాగుతోందో… అట్టి ఈ దృశ్యమునందు సత్యత్వమనేది ఎక్కడిది?
ఈ జగత్తు అజ్ఞానియొక్క దృష్టియందు సత్యమే! కానీ… వివేకి యొక్క దృష్టిలో మిథ్య మాత్రమే! ఇక… బ్రహ్మ స్వరూపంగా గాంచువాని దృష్టిలో ఇది బ్రహ్మమే అయివున్నది. భూమికలను అధిగమిస్తూ వచ్చిన ఉత్తమ సాధకుడగు మనుజునియందు ఇదంతా క్రమంగా శమించినదై చివరికి మహాకాశమువలె శూన్య స్వరూపంగా పర్యవసించినదై ఒప్పుచున్నది. పూర్ణ జ్ఞాని దృష్టియందు “నాతో సహా ఈ స్థావర జంగమాత్మక జగత్తంతా కూడా చిదాకాశరూపమే అయివున్నది.
Page:693
ఓ గురువర్యా! నేను చిదాకాశ రూపుడనే! మీరుకూడా చిదాకాశరూపులే! ఈ జగత్తంతా కూడా చిదాకాశమే! నా ఈ వాక్యమును పరీక్షించటానికై మీరు చిదాకాశ స్వరూపముతో ఏకత్వం పొంది నా చిదాకాశరూపమును నిరభ్యంతరంగా, దర్శించవచ్చు! హే మహర్షీ! మనుజులలో పరమ శ్రేష్ఠులు, బ్రహ్మాకాశ స్వరూపమును సంతరించుకున్నవారు అయిన మీ నిజస్వరూపమును ఆకాశమువలె నిర్మలము, శుద్ధ జ్ఞానానందము, సర్వాత్మకము, పూర్ణానందైక బ్రహ్మమునకు అభిన్నము అయినదానిగా ఎరుగుచున్నారు. ఆత్మజ్ఞానమును ప్రసాదించినట్టి తమ పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను.
సూర్యుడి నుండి కారణము లేకయే కిరణములు అనేక ప్రదేశములపై ప్రసరించి ఆయా వస్తుజాలమును విద్యమానంగా చేసివేస్తున్నాయి కదా! అట్లాగే కారణము లేకయే చిద్రూపము నుండి ఈ జగత్తు ఉత్పన్నమగుచు… మరల చిద్రూపమునందే లయించుచున్నది. కాబట్టి ఇది నిర్మల చిదాకాశ రూపమే అయివున్నది!
ఓ మునీంద్రా! మీరు నాకు చిదాకాశరూపులే అయి కనిపిస్తున్నారు! అట్లే ఈ సభికులంతా కూడా! అట్టి మనందరి కేవల చిదాకాశరూపము సమస్త శాస్త్రయుక్తులను అధిగమించినదై ఉన్నది. సర్వ పదములకు అతీతమైయున్నది. ద్వంద్వవర్జితమై ఉన్నది. మీరు నా స్వరూపులే! ఈ సర్వజనులు సర్వదా నా స్వరూపులే! (తత్త్వమసి అను) వేదవాక్యముల భావార్థం నాకిప్పుడు సుస్పష్టంగా ద్యోతకమౌతోంది. నేను, నా కాళ్ళు, - - చేతులు - కళ్ళు మొదలైన సర్వ అవయవములు, బాహ్యమందలి ఈ ఘట-వస్త్రాది సర్వ వస్తువులు, ఈ సమస్త జగత్తు… ఇదంతా నామరూపాదుల దృష్ట్యా వాస్తవం కాదు. ఇవన్నీ … ఇదంతా అతి నిర్మలము - మహాసూక్ష్మము అయినట్టి చిదాకాశరూపమే అయివున్నది.
హే మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! ఈ విధంగా ఈ దృశ్యజగత్తు పదార్థసహితం కాదు! కేవలము బ్రహ్మమే "నేను, నీవు, దృశ్యజగతు, మనోబుద్ధి చిత్త అహంకారాలు, దేహాలు, దేశాలు - పంచభూతాలు, సప్త సముద్రాలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, జన్మ మృత్యు పునర్జన్మాదులు స్వర్గ భూపాతాళ లోకాలు, త్రిమూర్తులు, స్త్రీ పురుషులు, ఆకాశం, భూమి, గ్రహాలు, ఆరామాలు, బాహ్యము, అంతరము, పైన క్రింద, దిక్కులు, గ్రామాలు, పట్టణాలు, నేడు, నిన్న, మొన్న, క్షణాలు, యుగాలు, సుఖదుఃఖాలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు” …ఈ విధంగా ఏకానేక విశేషాలుగా కనిపిస్తోంది. ఇవన్నీ వస్తురూపంగా పొందబడడం అట్టిది భ్రమమాత్రమే! వాస్తవం కాదు. అయితే బ్రహ్మమే ఇవన్నీ! కాబట్టి, తరంగములు జలమునకు వలె, స్వప్నము స్వప్న ద్రష్టకువలె, ఆలోచన ఆలోచించువానికివలె … ఇవన్నీ బ్రహ్మమునకే చెందినవై, బ్రహ్మమునకు అభిన్నమై, బ్రహ్మమునకు పర్యాయపదములై ఉన్నాయి.
Page:694
హే మహాత్మా! మీరు - నేను - మా మా తండ్రిగారు తండ్రిగారు - - మా ముగ్గురు తల్లులు నా సోదరులు
ఒక్కమాటలో చెప్పాలంటే … బ్రహ్మమే అజ్ఞానముతో కూడిన అవగాహనచేత ఈ సర్వజగత్తుగా కనిపిస్తోంది. విజ్ఞానంచేత జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపిస్తోంది. బ్రహ్మముగా ఇదంతా సత్యమే! నామరూప పాదార్థాత్మికంగా కనిపించినా కూడా ఆబ్రహ్మస్తంభ పర్యంతము (బ్రహ్మదేవుని నుండి ఒక జడమగు స్తంభము వరకు) బ్రహ్మమే!
స్వామీ! నా అనుభవము - అనుభూతి - దర్శనములను ఈ విధంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాను. అయితే ఇక్కడ ఏ పదార్థముల అభావత్వము నేనిప్పుడు ప్రకటిస్తున్నానో… అది తార్కికవాదుల సభలో నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. "ఈ దృశ్యము పదార్థ రహితమగు కేవల బ్రహ్మమే” …అనే నా సుస్పష్టమైన అనుభూతిని తార్కికుల సభలో “వితర్కము” …అని అనుకో వచ్చునేమో మరి. “నా తల్లి గొడ్రాలు. నా నోట్లో అసలు నాలుకే లేదు” … ఇటువంటి వాక్యాలవలె ఆ తార్కికులకు నింద్యముగాను, వారి వాదోపవాదముల దృష్ట్యా లభించకపోవచ్చునేమో? కానీ ఏ సభలో ఆత్మజ్ఞానము గురించి విచారణ జరుగుతోందో, “పరమ పురుషార్థమగు జ్ఞానము ఏది?” …అని తీవ్రమైన పరీక్ష జరుగుచున్నదో… అట్టి వారి సభలో నా ఈ అనుభూతి అనుభవ వాక్యాలు తప్పక శోభిస్తాయి.
ఎందుకంటారా?… సమస్త పదార్థముల యొక్క ’అభావము’ లేకపోయిందా?… ఆత్యంతికమైన ‘అనర్థ నివృత్తి’ రూపమగు నిరతిశయానందము సిద్ధించదు!” అని నా అభిప్రాయము, నా సమాధానం కూడా! బ్రహ్మము వాదోపవాదములచే లభించేది కాదు. (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, బుద్ధిగ్రాహ్యం - అతీంద్రియమ్, తదంగీకార సూచనం మౌనం, స్వానుభవంతు కేవలం …మొదలుగా గల) వేదోపనిషత్తు అభిప్రాయములను అనుసరించి బ్రహ్మము వాదోపవాదాలకు విషయం కాదు. అందుచేత కాష్ఠమౌనరూపమగు "సర్వ పదార్థ అభావము” …అనబడే కేవలీస్థితి వాదములచే ప్రతిపాదించి నిరూపించటం సాధ్యపడేది కాదు. శుష్క వాదములచే ఆత్మజ్ఞానం ఉదయించదేమో! నిర్మల విచారణ మాత్రమే అందుకు మార్గం, ఉపాయం కూడా! ఏదైతే ఈ ప్రత్యక్షాది ఇంద్రియములకు విషయమే కాదో, ప్రమాణములచే పొందబడజాలదో, ఎద్దానియందు ఏ చిహ్నము ఏమాత్రం లేనేలేదో… అట్టి స్వానుభవరూపమగు బ్రహ్మము వాదములతో నిరూపించి చెప్పలేమని ఇక్కడ నా అభిప్రాయం. అయితే అందుకు అనుభవమే ప్రమాణము.
ఇక్కడున్నదంతా చిద్రూప బ్రహ్మమే! అందుకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. బ్రహ్మముకంటే వేరుగా ఏది ఎక్కడ అనిపించినా అది భ్రమయే మూలముగా కలిగియున్నది. అట్టి ఈ జగత్తుగా (భ్రమచే) అనిపిస్తున్నట్టి (వాస్తవానికి పదార్థ రహితం అయినట్టి) ఇదంతా కూడా జగత్నామధేయ
Page:695
పరబ్రహ్మమే అయివున్నది. ఈ దృశ్య జగత్తు … సమస్త శాస్త్రార్థముల యొక్క అత్యంతిక సారం బ్రహ్మమే అయివున్నది. అనుభవమే ప్రమాణముగా కలిగియున్నట్టిది. అది చిహ్నరహితం. అతి నిర్మలము. కేవల చిదాకాశరూపము. ఏకము - జన్మవర్జితము - - ఆద్య స్వరూపము. నామరూప రహితము - శుద్ధము - కల్పనా శూన్యము.
పరబ్రహ్మమే దురభ్యాసవశం చేత అనుభవమాత్రమగు దృశ్యజగత్తుగా అనిపిస్తోందేమో! అనగా, నాకు జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపిస్తోంది. చిద్రూప పరబ్రహ్మమునకు అనన్యమైనదేదీ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మము అనన్యము - అద్వితీయము కదా! అట్టి నిర్మల పరబ్రహ్మమే అంతటా ఉండి ఉండగా, ఇక "ఆ బ్రహ్మమునందు జగత్తు ఉన్నదా! లేదా?” ఇటువంటి వికారాది నామరూపాదుల గురించిన, దోషాదుల గురించిన శంక వలన ఏం ప్రయోజనం? శంక ఎందుకుండాలి?