CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:696

XV. “దారు - వైవధిక" ఆఖ్యానం

-

  1. కట్టెల కోసం పోయి చింతామణి తెచ్చుకోవటం

శ్రీ వాల్మీకి మహర్షి: ఓ మహాబుద్ధీ! భరద్వాజా! ఈ విధంగా శ్రీరామచంద్రుడు “ఈ దృశ్యముగా కనపించేదంతా బ్రహ్మమే కాబట్టి, బ్రహ్మముగా దర్శించే దృష్టిని పెంపొందించుకోండి”… అని సంవాదసారమును మనకందరికీ ప్రకటించాడు. బ్రహ్మానందమున ప్రవేశించి పరమాత్మ పదమున విశ్రమిస్తూ కనులు మూసుకున్నాడు. సభ అంతా నిశ్శబ్దం తాండవించింది. సభికులంతా కూడా రామచంద్రమూర్తి యొక్క ఆత్యంతికమైన “ఇదమ్ సర్వమ్ పరబ్రహ్మమేవ”… అను పాఠ్యాంశసారాన్ని మృధుమధురంగా ఆస్వాదిస్తూ రామచంద్రునివలె మౌనం వహించారు. సభంతా నిశ్శబ్దం తాండవించింది. ఆ విధంగా రెండు ఘడియలు (24 mts x 2) గడచిపోయాయి.

నెమ్మదిగా రామచంద్రుని పద్మనయనములు విచ్చుకున్నాయి. ఆతని ముఖంలో పరబ్రహ్మానందం తాండవిస్తోంది. తనకు అంతా తెలిసికూడా గురుముఖతః విని ఆనందించాలని కొంచెము కుతూహలత్వమును స్వయంగా ఆహ్వానించి… లీలా పూర్వకంగా బ్రహ్మర్షియగు శ్రీవసిష్టులను ఇట్లు ప్రశ్నించాడు.

శ్రీరామచంద్రుడు : సంశయమనే మేఘములను తొలగించగల ఝంఝామారుత స్వరూపులగు ఓ గురువర్యా! ఇప్పుడు మనస్సులో జనించిన ఒక తుచ్ఛమైన సందేహమును మీముందుంచుతాను. తద్ద్వారా మీ వాక్రవాహ మాధుర్యాన్ని ఈ సర్వ సభికులతో సహా, ముందు ముందు ముముక్షువులతో సహా… మేమంతా ఆస్వాదిస్తాము.

హే మునీంద్రా! “పరమాత్మ సమస్త వాక్కులకు అతీతమైయున్నది”… అనునదే సంసార సముద్రమును దాటించగల మహాజ్ఞానమైయున్నది కదా! ఆ సద్రూప బ్రహ్మము… “స్వానుభవమాత్ర నిశ్చయరూపం. అవాచ్యము. మహాత్ముల వాక్కునకు కూడా విషయం కాలేకపోతోంది" అని చెప్పబడుతోంది. మనం అది గమనించాం. అది జ్ఞేయరూపం. సర్వ సంకల్పవర్జితం. స్వానుభవరూపం. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే అవస్థాత్రయమునకు అతీతం. అయ్యది తురీయ స్వప్రకాశ వస్తుమాత్రంగా లభించవలసిందే! మరి ఈ ఈ శాస్త్రాదులలో, ఇవన్నీ కూడా జాగ్రత్కు మాత్రమే అంతర్గతమై ఉన్నాయి. విధంగా జాగ్రత్ మాత్ర విషయాలైనట్టి గురు - శాస్త్రాదులకు ఆ పరబ్రహ్మము “దుర్జేయం అని… అనవలసి వస్తోంది మరి!

ప్రతియోగి-వ్యవచ్చేథ సంఖ్యా భేదైషినాం కిల? కథం శాస్త్ర పదైః తుచ్చైః సవికంపైరవాప్యతే?

Page:697

జాగ్రత్ పరిమితములగు ఈ శాస్త్రాదులు, సవికల్పరూపములే కదా? మరి బ్రహ్మమో…

నిస్సంకల్ప - నిర్వికల్ప రూపమై ఉన్నది.

ప్రతియోగి "జగత్తు పరమాత్మయందు లేదు”

వ్యవచ్చేదము "పరమాత్మకంటే భిన్నంగా ఏ పదార్థము సత్యము కాదు”

భేదము “పరబ్రహ్మం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశముల కంటే విశిష్టము - విభిన్నము అయివున్నది”

సంఖ్య ఏకమైన బ్రహ్మమే కలదు.

ఇటువంటి సవికల్పరూపములగు వాక్య, వాదోపవాద, సిద్ధాంతములచే వాక్కుకు-మనస్సుకు అతీతమైయున్న పరబ్రహ్మము ఎట్లా లభ్యమౌతుంది చెప్పండి? ఇటువంటి సిద్ధాంతాలు - వాదోప వాదాలు, ప్రవచన, ఖండనాలు వికల్పరూపాలే కదా! వికల్పాలతో కూడిన శబ్దాలతో శాస్త్రాలు నిర్మించ బడ్డాయి. అటువంటి శబ్దజాలంతో కూడిన శాస్త్రాలు నిశ్శబ్ద రూపమగు బ్రహ్మాన్ని ఎట్లా అందిస్తాయి? అందించవేమోనని అనిపిస్తోంది. మరి అటువంటప్పుడు “వివిధ వికల్ప సహితం, భ్రాంతి పరంపరా రూపం” అగు గురుబోధలు, శాస్త్ర ప్రతిపాదనలు… ఇవన్నీ ఎందుకు కల్పించబడుచున్నాయి?

గురు శాస్త్రాది విజ్ఞానే కారణంవా? అస్తి అకారణమ్?

తదత్ర నిశ్చయం, బ్రహ్మన్! బ్రూహి మే వదతాంవర!

ఓ మహావక్తా! బ్రహ్మర్షీ! ఈ కారణంచేత… ఆత్మజ్ఞానం విషయంలో గురు - - శాస్త్రాదులు కారణం కాగలవా? కారణం అవజాలవా? ఈ నా సంశయమునకు మీ నిర్ణయం ఏమిటో ప్రవచించమని ప్రార్థన!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహాబాహో! రామచంద్రా! నీవు చెప్పినది యథార్థమే!

ఏవమేతత్ మహాభావో! న శాస్త్రం జ్ఞానకారణం|

నానా శబ్దమయం శాస్త్రం అనామ చ పరం పదమ్ ॥

శాస్రాదులు బ్రహ్మజ్ఞానమునకు సాక్షాత్ కారణం కాజాలవు. ఎందుకంటే… శాస్త్రములన్నీ నానావిధములైన శబ్ద వికల్పములతో కూడుకొని ఉన్నాయి. ఇక బ్రహ్మపదమో… అది ‘అనామయము’ అయివున్నది. కానీ…

తథాపి, రాఘవశ్రేష్ఠ! యదైవతతుతాం గత

శాస్త్రాద్యుత్తమ బోధస్య తత్సమాసేన మే శృణు |

అయినప్పటికీ కూడా… గురు… శాస్త్రాదులు ఉత్తమ బ్రహ్మజ్ఞానము యొక్క బోధకు కారణమౌతున్నాయి. అంతేకాదు అవసరమగుచున్నాయి. తత్ఫలమైనట్టి మోక్షమునకు కారణం కూడా అగుచున్నాయి. ఈ విషయాన్ని విశదీకరిస్తూ ఆధ్యాత్మ శాస్త్రంలో “దారు - వైవధికన్యాయం” అనే ఒకానొక దృష్టాంతపూర్వకమైన సిద్ధాంతం చెప్పబడుచూ ఉన్నది. అద్దాని గురించి సంక్షిప్తంగా ఇప్పుడు చెపుతాను విను.

x

Page:698

దారు - వైధక న్యాయం - ఒకానొక కొండ ప్రాంతంలో ‘కీరక’ అనే పేరుగల ఆటవికుల దేశము వర్దిల్లుతోంది. ఆ కీరకజాతి ఆటవికులలో కొందరు కావడి మోస్తూ జీవించే సంచార జాతికి చెదిన వైవధిక తెగ ప్రజలు ఉండేవారు. ఆ కావడి మోసేవారు (వైవధికులు) క్రమంగా కాలమహిమచేత దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వారి వారి జీవనోపాధులను కోల్పోయారు. కటిక దారిద్య్రం అనుభవించసాగారు. వారంతా బ్రతికి చెడ్డవారు అవటం చేత ఆ పేదరికం వారిని ఎంతగానో బాధించసాగింది. శిథిలమైన వృక్షంలాగా వారు దుఃఖముచే, దుర్బలత్వంచే కృశించ సాగారు. మహా దారిద్ర్యముతో చినిగిన బొంతలు కప్పుకుంటూ పూరి గుడిసెలలో పేదరికంలో దీనముఖాలు పొందారు. "ఇంతటి పేదరికం అనుభవిస్తున్నామే! దీనికేమిటి ఉపాయం?”… అని ఆ వైవధికులంతా గుమిగూడి ఒక చెట్టుక్రింద ఒక సాయంకాలం కూర్చుని యోచన చేయసాగారు. వారిలో ఒక తెలివైన యువకుడైన వైవధికుడు లేచి నిలుచుని ఇట్లు ప్రసంగించసాగాడు.

ఓ వైవధిక (కావడి మోసే జాతి) మిత్రజనులారా! మీరంతా ఎందుకు ఇంతగా విచారిస్తు న్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మనం కావడి మోసే పని కోల్పోయి ఉండవచ్చుగాక! అంత మాత్రం చేత మనం దిగులు ఎందుకు పడాలి! మన ఒంట్లో చేవ చావలేదే! పరమాత్మ మనకు దారుఢ్యమైన దేహాలు ప్రసాదించారు కదా! మనం కాయకష్టం చేసి బ్రతికేవాళ్ళమే కదా! నేను అంతా ఆలోచించాను. ఆలోచించగా ఆలోచించగా… నాకు గడచిన రాత్రి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన ఈ వైవధిక కుగ్రామానికి సమీపంగా దట్టమైన అడవులు ఉన్నాయి కదా! మనం ఆ అడవులలో కట్టెలుకొట్టి, ఆ కట్టెలను ఈ దగ్గరలో గల పట్టణంలో అమ్ముకుని, అక్కడే నిత్యాహార వస్తువులు కొనుక్కుని తెచ్చుకుందాం! ఇక మనకు ఏ బాధా ఉండదు. మనం మరెక్కడికీ వలస పోనక్కర్లేదు!

ఈ ఆలోచన అక్కడి వైవధిక జాతి పెద్దలందరికీ బాగా నచ్చింది. ఇక మరెటువంటి ఆలోచనా చేయకుండా ఆ ఆలోచనను అమలుచేశారు. వారంతా జట్టులు జట్టులుగా కలసి అడవిలో ప్రవేశించి కట్టెలు కొట్టి, అవి మోసుకొని పట్టణం చేరి అమ్ముకోసాగారు. ఆ లభించిన డబ్బుతో ఇళ్ళు గడవటానికి కావలసినవి కొని తెచ్చుకొని జీవించసాగారు. క్రమంగా వారి తిండి - బట్టల కరువు తొలగింది. ““కష్టేకష్టే-ఫలీఫలీ” ” అన్నారు కదా! అట్లా కొంతకాలం జరిగింది. అయితే ఆ సంచార జాతి వైవధికులలో కొన్ని జట్లకు కట్టెలు కొట్టటం మాత్రం చేత తృప్తి కలగలేదు. వారు ఇట్లా అనుకున్నారు.

“మనం కొన్ని రోజులుగా కట్టెలు కొడుతున్నాం. బాగానే ఉన్నది. మనకు ఇప్పుడు తిండిబట్టకు లోటేమీ లేదు. అయితే ఈ అడవిలో అనేక రకాలైన సంపదలు ఉన్నాయి. మనమేమో ఏరోజుకారోజు కట్టెలు కొట్టి ఆ పూట మాత్రమే గడుపుకొంటున్నాం. పగలంతా కట్టెలు కొట్టి, వాటిని మోసుకొని ఆ మరునాడు సంతలో అమ్మితే మనకు ఏమంత గొప్పగా ధనం లభించటం

Page:699

లేదు కదా! రెండు రోజులు తిండి మాత్రమే లభిస్తోంది. అందుచేత మనం ఈ అడవిలో మరికొంత లోపలిగా వెళ్ళితే, అక్కడ చందన వృక్షాలు, గంధపు చెట్లు లభిస్తాయి. వాటిని కొట్టి అమ్ముకుంటే తక్కువ శ్రమ ఎక్కువ ధనం లభిస్తుంది. అప్పుడు మనం ఇళ్ళు కట్టుకొని మరికొన్ని వసతులు కల్పించుకొని హాయిగా ఉండవచ్చు కదా!”

ఇట్లా యోచన చేశాయి. తదితర జట్లతో ఈ విషయం ప్రస్తావించాయి. కానీ చాలామంది అందుకు ఒప్పుకోలేదు. "ఈ కట్టెలు కొట్టటానికి మనం అలవాటు పడ్డాం! ఇంతకుమించి మన కెందుకు? ఏదో గుడిశలలో నివశిస్తున్నాం. ఇది మనకు చాలదా? ఇంకా అడవికి లోపలగా ప్రవేశించటం యెందుకు? అక్కడ చందన వృక్షాలు ఉంటాయో? ఉండవో? ఒకవేళ ఉన్నా… వాటిని ఛేదించటంలో ఏమేమి ఇబ్బందులు ఉంటాయో! అక్కర్లేదు. మేము రాము. ఈ అడవిని మేము మామూలు వంటచెరకుకు ఉపయోగించి కట్టేలే కొట్టడం కొనసాగిస్తాం”… అని భీష్మించుకొని కూర్చున్నారు.

చివరికి కొన్ని జట్లు “గంధపు వృక్షములు ఉండే ప్రాంతం కనిపెట్టడానికి ఆ అడవిలో మరింత దూరం ప్రయాణిద్దాం”… అని నిర్ణయించుకొని బయలుదేరాయి. వారి ప్రయత్నం ఫలించింది. వారికి ఆ అడవిలో కొంతదూరం తరువాత చందన వృక్షాలు చాలా కనిపించాయి. ఇక వాటిని కొట్టి, వాటిని పట్టణం తెచ్చి మంచి ధరలకు అమ్ముకోసాగారు. వారంతా మొదటి వారి కంటే ధనికులు కాసాగారు. మంచి ఇళ్లు కట్టుకున్నారు.

ఆ విధంగా చందన వృక్షములను ఛేదించి అమ్ముకుంటున్న జట్లవారు ఒకచోట ఒక రోజు సాయంకాలం సమావేశమైనారు. అందులో ఒక వైవధికుడు లేచి నిలుచున్నాడు.

"ఓ తెలివైన వైవధికజాతి రత్నములారా! మనం ఈ మహారణ్యంలో సుదూరప్రాంత సందర్శించి చందన - గందపు వృక్షముల ప్రదేశములు కనిపెట్టి ధనికులం అయ్యాం. ఇళ్ళు కట్టుకున్నాం. కానీ ఈ అడవి యొక్క సంపద ఇంతమాత్రమే అనుకోకండి. పట్టణంలో నాగరకులకు కూడా ఊహకు అందనంతటి సంపద ఈ అడవులలో దాగివున్నదని నా ఉద్దేశం. అందుచేత మనం ఇంకా ఇంకా దట్టమైన అడవులలో సుదూర ప్రదేశాలలో ప్రవేశించుదాం. అక్కడ విలువైన సంపద దొరకవచ్చు. ఏమేమి దొరుకుతుందో, ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు. కాని కచ్చితంగా విలువైనవి లభిస్తాయని నా నమ్మకం. అందుచేత ఈ అడవులలో సుదూరంగా ప్రయాణించటానికి మీరంతా సంసిద్ధులవండి!”

ఆ సమావేశమైన వైవధికుల జట్లలో కొంతమందికి ఈ ఆలోచన ఏ మాత్రమూ నచ్చలేదు. “మనం ఇప్పుడు కొంత ధనికులం అయ్యాం కదా! ఇంతకంటే దేనికి? అడవులలో విలువైన వస్తువులు ఉండవచ్చు! ఉండకపోవచ్చు కూడా! పెళ్ళాం బిడ్డలను వదులుకొని అంతదూరం మేము రాము. మాకు ఇది చాలు. ఈ మాత్రంతో మా కుటుంబంతో మేము హాయిగా ఉంటాం! అట్లా సుదీర్ఘంగా అడవిలో ప్రవేశించి, వెతకటం అనవసరం. అసందర్భం కూడా!”… అని చాలామంది

Page:700

ఆ సమావేశాన్ని వదలివెళ్ళిపోయారు. బహుకొద్దిమంది మాత్రం “ఇంకా ఇంకా ఈ అడవులలో ఏమేమి సంపద ఉన్నదో అది చూచి, సొంతం చేసుకొని వద్దాం”… అని అప్పటికప్పుడే నిర్ణయించు కున్నారు. వారట్లా ప్రయత్నం కొనసాగిస్తూ ఉండగా, వారిలో కొందరికి అనేక రత్నాలు, బంగారం, గుప్తములైన ధనరాసులు, వారి వారి అదృష్టాన్ని బట్టి లభించాయి. అట్లా ఏవో పొందిన కొందరు వెనుకకు మరలి ఇంటికి చేరారు. భార్యాబిడ్డలను ఆ సంపదతో ఆనందింపజేస్తూ ఇంటి వద్ద

ఉండిపోయారు.

ఇక కొద్ది జట్లు మాత్రం ఆ అరణ్యంలో ఏవైనా విలువైన వస్తువులు కోసం ఇంకా ఇంకా అన్వేషించసాగారు. అట్లా వెతుకుతూ వెతుకుతూ ఉండగా వారికి ఒకచోట "చింతామణి” లభించింది. ఆ చింతామణి ఏది కోరితే అది అప్పటికప్పుడే ప్రసాదించ గల మాహాత్మ్యం కలిగి ఉన్నది. ఆ చింతామణి వలన ఆ కొద్దిమంది సమస్త ఐశ్వర్యములు పొందినవారై అచ్చటే సుఖ శాంతి ఐశ్వర్యములు అనుభవిస్తూ ఇప్పటికీ హాయిగా నిశ్చింతగా - ఆనందంగా కాలం గడుపుచున్నారు. వారు ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వారిలొ ఒకరుగా అయ్యారు.

చూచావా రామచంద్రా! ఆ కీరక జాతి ప్రజలలోని వైవధికులలో అరణ్యమును ఆశ్రయించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరైన సంపద సంపాదించుకున్నారు. కొందరు భాగ్యహీనులై రోజువారీగా కట్టెలు తెచ్చుకొని, అమ్మి, పొట్ట పోసుకుంటూ ఏ రోజుకారోజే మరల ఆ పనికి సిద్ధమగుచు గుడిశలలో రోజులు గడుపుచున్నారు. వారికి రెక్కాడితేగాని డొక్కాడటం లేదు.

మరికొందరు విలువైన గంధపు చందనపు చెక్కలు సంపాదించి అమ్ముకుంటూ ఇళ్ళు కట్టుకున్నారు. ఇంకొందరు బంగారము, రత్నాలు మొదలైన విలువైన సంపద ఇంటికి తెచ్చుకొని మంచి భవనాలు నిర్మించుకొని సుఖిస్తున్నారు. అంతటితో తృప్తి చెందుచున్నారు.

బహుకొద్దిమంది మాత్రం ఇంకా ఇంకా తిరుగాడి ’చింతామణి’ని సంపాదించుకొని మహాదైశ్వర్యములు అనుభవిస్తున్నారు. రాజభవనాలు నిర్మించుకొని గొప్పగొప్ప సంపదలతో తులతూగుచున్నారు.

ఎవవరికైతే ‘చింతామణి’యే లభించిందో, వారు మొట్టమొదట దినభత్యముల కొరకై కట్టెలు కొట్టుకుని రావడానికే వెళ్ళారు కదా! కానీ అనేక ప్రయత్నముల ఫలంగా చివరికి వారికి చింతామణి లభించింది. వారు ఇప్పుడు స్వర్గలోకంలో ఉండే దేవతలవలె మహాదైశ్వర్యములు సంపాదించుకొని సుఖంగా నివసిస్తున్నారు.

ఓ రామచంద్రా! ఆ కావడి మోసేవారు కట్టెలకోసం చేసిన ప్రయత్నం వల్లనే… (అందులో కొందరు) మహత్తరము, అనితర సాధ్యము అయినట్టి “చింతామణి”ని సంపాదించుకొని స్వర్గ సౌఖ్యములు అనుభవించ గలుగుచున్నారు. కట్టెల కోసమై ప్రయత్నం ప్రారంభించకుండా ఉండి ఉంటే, వారికిప్పుడు చింతామణి లభించేదా? లేదు కదా! ఆ చింతామణి సంపాదించుకొన్న

Page:701

వైవధికులు ఇప్పుడు భయ - మోహ - విషాద రహితులై జీవితమును ఆనందముగా ఆస్వాదిస్తున్నారు. వారి బుద్ధి పరిపూర్ణమై, ఆనందంతో కూడి ఉంటోంది. వారికి అన్ని దిగుళ్ళు సమసిపోయాయి. ఇక వారికి ఇతర లాభములు వేటితోనూ పనిలేకుండా పోయింది.

వారంతా కట్టెలకోసం వెళ్ళి చింతామణిని సంపాదించుకొని ఇప్పటికీ హాయిగా ఉన్నారు.

2. కాష్ఠ- వైవధిక న్యాయ తాత్పర్యం

శ్రీరాముడు : హే మాననీయా! మునిశ్రేష్ఠా! ఈ “కాష్ఠ - వైవధిక న్యాయం” సంబంధించిన కథా విశేషం యొక్క తాత్పర్యం ఏమిటో, ఏ ఉద్దేశంతో ఈ సందర్భంలో మీరు చెప్పారో… అవన్నీ వివరించ ప్రార్థన!

శ్రీ వసిష్ఠ మహర్షి : చెపుతా! విను. ఇక్కడ ‘వైవధికులు’ అంటే ప్రపంచమున గల సకల మానవులు. ‘వైవధికుల దారిద్ర్యం’ అంటే ఈ జనుల అజ్ఞాన జనితమైనట్టి ఆధిభౌతిక - ఆధి దైవిక - ఆధ్యాత్మిక రూపమైన త్రివిధ తాపములు. ‘మహారణ్యం / దట్టమైన అడవి’ అంటే గురు, శాస్త్రాదులచే చెప్పబడే సాధనముల క్రమము.

“వైవధికులు ‘జీవనోపాధి ఎట్లా?’ అని యోచించి ఉపాయము ఆశ్రయించటం” అంటే ఈ జనులు “ఏదో సంపాదించాలి” అని భోగాల కొరకై శాస్త్రములలో చెప్పి ఉపాయములను ఆశ్రయించటం.

అల్పబుద్ధి గల మనుజులు, “నాకు భోగ సమూహములు సిద్ధించుగాక” అనే ఆల్పబుద్ధితో గురువులను, శాస్త్ర సాధనములను ఆశ్రయిస్తున్నారు. మరికొందరేమో “మాకు ఈ భౌతిక కష్టాలు తొలగాలి”… అని కోరుకున్నవారై శాస్త్ర సాధనములను, శాస్త్ర పఠనములను, పురాణాది కథా శ్రవణాలు, గురువులను ఆశ్రయించటం ఇవన్నీ చేస్తున్నారు. వారంతా ఆ విధంగా భోగం కొరకై, (లేదా) కష్టములు తొలగటం కొరకై శాస్త్ర సాధన క్రమములందు ప్రవృత్తులగుచుండగా, వారిలో కొందరు క్రమంగా కష్టాలు తొలగటంచేతనో భోగలాభ ఫలం కారణంగానో, అంతటితో ఆగకుండా, గురువులపై, శాస్త్రాభ్యాసములపై ఆసక్తి కొంత కొంతగా విశ్వాసం కలిగి అది క్రమంగా పెంపొందుతోంది. ఆ విశ్వాసం దృఢపడుతోంది. జిజ్ఞాస ప్రవృద్ధమౌతోంది. దాంతో వారు మరికొంతగా సాధనలను, గురుదర్శనములను కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా ఆ సాధనల యొక్క అభ్యాసం చేత ఆ శాస్త్రముల “పరమ తాత్పర్యం” అయినట్టి మోక్ష ప్రదమగు “బ్రహ్మము”ను గురించి విచారణ చేయటం ప్రారంభిస్తున్నారు. కట్టెల కోసం అడవికి వెళ్ళటం ప్రారంభించినప్పటికీ ఆ వైవధికులు చింతామణిని పొందగలిగారు చూచావా? అట్లాగే భోగాల కొరకై శాస్త్రములను అవలంభించిన మనుజుడు కూడా… క్రమక్రమంగా ఒకానొకప్పటికి పరమపదమగు మోక్షమును తప్పక సంపాదించుకుంటున్నాడు.

Page:702

కింస్యాచ్ఛాస్త్ర విచారాభ్యాసమితి సందేహలీలయా కశ్చిత్ ప్రవర్తతే, పశ్చాత్ ఆప్నోతి పదముత్తమమ్ |

చాలా మంది "ఈ శాస్త్ర పఠనం, శాస్త్ర విషయముల వలన మనకేం లాభం ఉంటుంది? లాభం లేదులే!” అనుకొని అసలు శాస్త్ర పఠనం, శాస్త్ర విచారణ, శాస్త్ర సాధనములను ఆశ్రయించటం మొదలే పెట్టడంలేదు. వారు ఈ జీవితమంతా జీవించి ఏం పొందాలనుకుంటున్నారో, వారి మానసికమైన ఋగ్మత ఎట్లా తొలగుతుందని వారు అనుకుంటున్నారో… అది నాకు తెలియదు. వాళ్లనే వెళ్ళి అడుగు.

ఇక కొంతమంది “ఈ శాస్త్ర పఠనం వలన, శాస్త్ర విచారణ వలన, పురాణాదుల శ్రవణం వలన, గురువులను ఆశ్రయించటం చేత ఏదైనా శుభం కలుగుతుందంటారా? చూద్దాం”… అనే కుతూహలంతో అట్టి శాస్త్ర, శ్రుతి సాధనలలో ప్రవర్తించటం ప్రారంభిస్తున్నారు. వీరు క్రమంగా ఎప్పటికో అప్పటికి అత్యుత్తమమైన మోక్షపదం కూడా సంపాదించుకొంటున్నారు. చూచావా? ఒకడు మొట్టమొదట "బ్రహ్మపదమును గాంచనివాడే” అయినప్పటికీ… విషయ భోగాల కొరకు కొంతగా శాస్త్రాదులందు ప్రవృత్తుడై (మోక్షపదం ఆతని ఆశయం అయి ఉండనప్పటికీ) కూడా, క్రమంగా ఎప్పటికో అప్పటికి పరబ్రహ్మస్వరూపమునే ఎదురుగా గాంచుచున్నాడు!

ఈ జనులు వివిధమై వాసనలు కలిగి ఉంటున్నారు కదా! అట్టి వాసనలను అనుసరించేవారు “పరమార్థము”నకు భిన్నమైనట్టి భోగఫలములను వాంఛిస్తున్నారు. వారి వాంఛల ఫలధీకరణము కొరకై శాస్త్రములందు - సాధనములందూ ప్రవేశించి, ఆ తరువాత (చింతామణిని పొందినట్లుగా) వారు నిరతిశయానందమగు మోక్షఫలమును అంది పుచ్చుకుంటున్నారు.

సాధువు - అయితే రామచంద్రా! ఈ ప్రపంచములో కొందరు మహనీయులు తాము ఏది నిర్వర్తించినా కూడా పరోపకారము కొరకే ఉద్దేశిస్తూ ఉంటారు. "మా వలన తదితరులకు ఏదో ఒక మంచి, సంతోషము, సుఖము కలిగితే మాకు అంతేచాలు. మా ఈ జీవితం వృథా కాదు” అనే ఆశయంతో జీవిస్తూ ఉంటారు. వారు శాస్త్రములను ఆశ్రయించేటప్పుడు కూడా… ఏదో తాము పొందాలని కాకుండా… సహజీవుల సుఖ సంతోషాలే ఆశయంగా కలిగి ఉంటారు. ఈ విశ్వామిత్రుని వంటి అట్టి మహాత్ములు ఈ సభలో కొందరు ఉన్నారు.

పరోపకారే అవిరతం, స్వభావేన ప్రవర్తతే

యః, స “సాధుః” ఇతి ప్రోక్తః | ప్రమాణం తస్య చేష్టితమ్ ||

ఓ రామచంద్రా! ఎవడైతే స్వభావ సిద్ధంగానే సహజీవులకు ఉపకారం చెయ్యటమే ఆశయము, ఉద్దేశములుగా కలిగి శాస్త్రములందుగాని, తదితర కార్యములందు గాని వ్యవహరిస్తూ ఉంటాడో… ఆతడే “సాధువు” అని చెప్పబడుచున్నాడు. అతని ఆచరణయే సర్వలోకములకు ప్రమాణం. “పరోపకార కారిణ్యే - పరావర్తిపరతప్తయా బుద్ధయేవ - సుఖంమన్యే” అని మొట్టమొదటి రోజు నీవు అన్నావు కదా! తమ కొరకై ఏదో పొందాలని శాస్త్రములందు, తదితర వ్యవహారములందు ప్రవృత్తులయ్యేవారు - వారి శాస్త్ర వాసనలు లోకానికి ఉత్తమ ప్రమాణం కాజాలవు.

Page:703

ఓ సాధూ! ఈ విధంగా సజ్జనుడు సాధు ఆచరణ కొరకు, “ఈ భోగముల వలన నాకు ఉత్తమ ప్రయోజనమేమున్నది?” …అనే అల్పాశయాన్ని అధిగమించి “శాస్త్రాచరణం ద్వారా లోక కళ్యాణమగుగాక!" అను ఆశయంతో శాస్త్రములను ఆశ్రయిస్తున్నాడు. ఒకడు భోగముల కొరకై మొట్టమొదట శాస్త్ర విచారణ - శాస్త్రములు చెప్పే మార్గంలో ఆచరణ ప్రారంభించవచ్చు! సాధువు లోకహితైషి అయి శాస్త్రములను ఆశ్రయించవచ్చు! ఏది ఏమైనా శాస్త్రములు అనుభవాలు ప్రవచనాలు, లోక కళ్యాణము కొరకు ఉద్దేశించబడినవి కాబట్టి… వాటిని ఆశ్రయిస్తూ ఉండగా భోగ మోక్షములు రెండూ లభిస్తున్నాయి. కట్టెలు కొట్టుకొని జీవించటానికి అడవికి వెళ్ళిన ఆ కావడిమోయు తెగవారిలో అందరికి జీవనోపాధి లభించగా, ఉత్తమ పరిశ్రమ ఆశయాలచే కొందరు చింతామణినే సంపాదించు కున్నారనటంలో ఉద్దేశం అదే! ఆ కట్టెపుల్లల కొరకై అరణ్యంలో ప్రవేశించిన వారిలో కొందరు కట్టెలను, కొందరు, పూలు-చందనపు చెక్కలను, ఇంకొందరు సామాన్యమైన రత్నాలను సంపాదించు కుంటున్నారని చెప్పాను కదా! అందులో ఉద్దేశం… శాస్త్రములను శాస్త్రముచే చెప్పబడే విధి నిషేధములను గురువులలో కొందరు ధర్మము కొరకు, మరికొందరు ధర్మార్థముల కొరకు, ఇంకొందరు ధర్మార్థ కామముల కొఱకు శాస్త్రములను ఆశ్రయిస్తున్నారు!” … అని చెప్పటం కోసమే!

ఓ రాఘవా! ఏ శాస్త్రములు “ధర్మార్థ కామములు” అనే వర్గత్రయయమునకు ఉపాయాలు అగుచున్నాయో… అవే శాస్త్రములు మోక్షం కొరకు కూడా మార్గదర్శకాలు అగుచున్నాయి. అయితే శాస్త్రాదులందు వర్గత్రయం గురించి వాచ్యవిశేషాలే అత్యధికం. ఎందుకంటే శాస్త్రములు వాచ్యవృత్తిచే నిర్మించబడినవే కదా! ఇక బ్రహ్మప్రాప్తి వాక్కునకు అవిషయమైయున్నది. బ్రహ్మమును ప్రతిపాదిస్తున్న శాస్త్రములు కూడా లక్షణావృత్తిచే మోక్షమునకు మార్గమును చూపగలుగుతాయిగాని, కేవలం వాచ్యవృత్తిచేకాదు. వసంత కాలం వస్తే వృక్షాలు తమకు తామే చిగురించి పుష్ప-ఫలాలు ప్రదర్శిస్తాయి చూచావా? సమస్త వేదాంత వాక్యార్థములున్నూ బ్రహ్మప్రాప్తి యొక్క లక్షణ వృత్తిని గుర్తు చేయగలవు. అంతమాత్రమే అవి! వసంతకాలంలో పుష్పం చిగురించినట్లు… శాస్త్ర సాధనలు… గురుబోధల ప్రభావం చేత తగిన సమయంలో ధర్మ- అర్థ కామాలను అధిగమించినట్టి నిర్మలమైన మనస్సు వాటిని ఆశ్రయించటం ఒనగూడుతోంది. జలముతోను, వస్త్రంతోను అద్దముపై దట్టంగా కప్పబడిన ధూళి శుభ్రంగా తుడిచి వేస్తే … అప్పుడు ఆ అద్దంలో ముఖం అత్యంత స్పష్టంగా - యథాతథంగా కనిపిస్తుంది చూచావా! అట్లాగే

శాస్త్రం అనే జలంతోనూ, ‘గురుబోధ’ అనే వస్త్రంతోనూ, మనస్సు అనే దర్పణాన్ని “శాస్త్రాలచే

పారాయణలు, నామస్మరణ… మొదలైన దైనందిన అభ్యాస పూర్వకమైన కార్యక్రమాలచే మనోదర్పణాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమాలతో)… మనస్సును పరిశుభ్ర పరిస్తే… అప్పుడు ‘ఆత్మ’ అనే స్వస్వరూప ముఖ దృశ్యం అత్యంత సుస్పష్టంగా కనిపిస్తుంది.

Page:704

అనగా దర్పణమును పరిశుభ్ర పరచటం ఎటువంటిదో… శాస్త్రములను గురువులను ఆశ్రయించటం, వారు చెప్పే సాధనములను శ్రద్ధతో అన్వయించుకొని నిర్వర్తించటం అటువంటిది. “జలము - వస్త్రము నేరుగా నీ ముఖమును ధూళితో కప్పబడిన దర్పణంలో సుస్పష్టంగా చూపగలవా?” అని ఎవరైనా అడిగితే ఏం అంటావు? “అయ్యా! జలమును - వస్త్రమును ఉపయోగించుకుంటాం. ఉపయోగించి దర్పణము (అద్దము) పై ధూళిని ఈ చేతులతో తుడిచి తుడిచి పరిశుభ్రం చేస్తాం. అప్పుడు దుమ్ము - ధూళి తొలగగా ఆ అద్దంలో ముఖం చూచుకుంటాం!”… అని అంటావు కదా! జలము - వస్త్రము లేకపోతే నీ ముఖం అద్దంలో కనిపించదు. ఎందుచేత? అద్దమును ధూళి బహుదట్టంగా కప్పి ఉండటంచేత! శాస్త్రములు - శాస్త్ర సాధనలు - - గురువులు లేకపోతే అనేక జన్మలుగా అనేక దుష్ట సంస్కారముతో - అభ్యాసములతో కప్పబడిన ఈ మనస్సు నందు సచ్చిదానంద స్వస్వరూపమగు నిజాత్మ స్పష్టంగా ప్రతిబింబించదు. అనగా… శాస్త్రములు స్వయంగా ఆత్మానుభూతి కలిగించటం లేదు. అవి లేకపోతేనో, ఆత్మానుభవం స్వయంగా కలుగనే కలుగదు.

ఆత్మ స్వానుభవమే! అది మనందరి స్వస్వరూపమే కదా! మన స్వస్వరూపమును ఇప్పుడు శాస్త్రములుగాని - - గురువులుగాని క్రొత్తగా తెచ్చి అక్కడ పెట్టడం లేదు. ప్రతి ఒక్క జీవుని యందు ‘ఆత్మజ్ఞానము’ ఉండనే ఉన్నది. ప్రతి ఒక్క జీవుని స్వరూపము ఆత్మయే కదా? అయితే అద్దానిని అజ్ఞానము కప్పి ఉంచింది. ఇప్పుడు ‘శాస్త్రములు’ అనే నిర్మల జలంతో ఆ కప్పి ఉంచిన అజ్ఞానమలమును తొలగిస్తున్నాం. ఇంతే!

అయితే రామచంద్రా! అర్హత కలిగియున్న జనులకు శాస్త్రములు అత్యంత త్వరితంగా ఆత్మానుభూతిని తప్పక కలిగిస్తున్నాయి. సాధనాక్రమం చేత స్వయంగా అర్హత లభిస్తోంది. బ్రహ్మజ్ఞానం అగు “ఆత్మ లక్షణములు, ఆత్మ తత్త్వ నిర్ణయము” మొదలైన ఉపాయములతో శాస్త్రములు సర్వదా సంసిద్దమే అయివ ఉండి నిర్మల బుద్దిగల జనులకు - - సాధనా సమయంలోనే ఆత్మసాక్షాత్కారము లాభింపజేస్తున్నాయి.

కాబట్టి రామచంద్రా! గురు శాస్త్రాదులు - సాధనలు అత్యంతావశ్యకం! అయితే అవి నేరుగా ఆత్మయందు విశ్రాంతిని కలిగించలేవు. ఆత్మయందు విశ్రాంతికి అవి కారణం కాగలవు.

న శాస్త్రాత్, న గురుర్వాక్యాత్ న దానాత్, న ఈశ్వరార్చనాత్

ఏష సర్వపదాతీతో బోధః సంప్రాప్యతే పరః ॥

సమస్తమునకు అతీతమైన అత్యుత్తమమగు “బ్రహ్మబోధ” (లేక) “ఆత్మసాక్షాత్కారం” (లేక) “సర్వము స్వస్వరూపముగా దర్శించటం”… అనునది శాస్త్రములచేతగాని, గురు వాక్యములచేతగాని, దానముల చేతగాని, ఈశ్వరార్చనల చేతగాని నేరుగా (సాక్షత్తుగా) కలగటం లేదు. అవన్నీ నేరుగా కారణములు కాకపోయినప్పటికీ అవి ఆత్మజ్ఞానమునకు తప్పక దారితీయునవిగా, కారణముగా అగుచున్నాయి. అద్దాని క్రమము ఎట్లాగో… చెపుతాను. విను.

Page:705

  1. ఈ జగత్తు - దృశ్యములచే దుఃఖాదులు పొందిన మనస్సు “విశ్రాంతి ఎక్కడ?”… అని వెతకసాగుతుంది. “పోనీ! శాస్త్రములు నాకు మార్గం చూపగలవేమో?” అనే ఆశతో కూడిన కించిత్ సంశయం ప్రారంభమౌతుంది.

  2. అప్పుడు అర్థ-కామముల కొరకై ఆ జీవుడు శాస్త్రములను అందలి సాధనములను

గురువులను - వారు బోధించే సాధనా క్రమములను ఆశ్రయిస్తున్నాడు.

  1. శాస్త్రాభ్యాసముచే చిత్తము కొంచెము కొంచెమూ విశ్రాంతి పొందనారంభిస్తోంది.

  2. ఆ కొంచెము విశ్రాంతి ప్రసాదించే ప్రశాంతత యొక్క రుచిచే ఆకర్షితుడై ఆ జీవుడు శాస్త్ర - సాధనములను మరింతగా ఆశ్రయించి, క్రమంగా క్రమంగా చిత్తమును శుద్ధ పరచుకోనారంభిస్తున్నాడు.

  3. శాస్త్రాభ్యాసముచే కాలక్రమంగా చిత్తము మరికొంత శుద్ధత్వము పొందనారంభిస్తోంది. 6. చిత్తము శుద్ధత్వము పొందుచుండగా క్రమంగా కొంత కొంత నిశ్చలత్వం సంతరించుకోవటం ప్రారంభమౌతోంది.

  4. చిత్తము నిర్మలము నిశ్చలము అగుచుండగా క్రమంగా "ఏదో పొందాలి! ఇంకేదో కావాలి” …. అనే భ్రమతో కూడిన తపన “వాళ్ళు అట్టివారు - వీళ్ళను నమ్మకూడదు” మొదలైన దురభిప్రాయములు సన్నగిలనారంభిస్తున్నాయి.

  5. క్రమక్రమంగా ఈ చిత్తము తనయందలి భోగేచ్ఛలను బయటకు పంపుచుండగా శాస్త్రములు గురువులు చెప్పే పవిత్రాశయము సంతరించుకొన్న ఆప్త వాక్యములు చిత్తములో ప్రవేశించి వికాసము పొందనారంభిస్తున్నాయి.

  6. అట్టి చిత్తము ప్రతిరోజు కొంచెం కొంచెం అందరిలోనూ - అందరుగానూ వేంచేసియున్న ‘ఆత్మ’ను ఆస్వాదించ నారంభిస్తోంది.

  7. అప్పుడా జీవుడు అద్దాని అంతిమ ప్రయోజనంగా సాత్వికచిత్తుడై అంతటా తన స్వరూపమగు ఆత్మనే దర్శిస్తూ వాక్కుకు అతీమగు (అనిర్వచ్యమగు) బ్రహ్మపదమును అధిరోహిస్తున్నాడు.

అంతటా అన్నిటా బ్రహ్మమును దర్శిస్తూ … ఇక ఆ బ్రహ్మమే తానుగా అయి శాస్త్రముల అంతిమ ఉద్దేశమును ఫల ప్రదం చేసుకుంటున్నాడు.

ఏతచ్ఛాస్త్రాదవిద్యాయాః సాత్వికోభాగ ఉచ్యతే |

తామసః సాత్వికేనాస్యా భాగేనాయాతి సంక్షయమ్ ||

ఓ రామచంద్రా! శాస్త్రములు సూచిస్తున్న సాధనముల ‘అభ్యాసము’ వలన అవిద్యయొక్క ‘సాత్విక భాగము’ వృద్ధి చెందనారంభిస్తుంది. ఆ సాత్విక భాగం క్రమంగా అవిద్యయొక్క రాజసిక - తామసిక భోగములను క్షయింపజేస్తోంది.

Page:706

ఓ రామచంద్రా! మరొక్కసారి ప్రకటిస్తున్నాను. నేను శాస్త్రములను శాస్త్ర సాధనములను, గురు ప్రబోధిత సాధనా క్రమములను తిరస్కరించటంలేదు సుమా! పైగా, అవి అత్యావశ్యకమని గుర్తు చేస్తున్నాను. ఈ ‘సంసారం’ అనే నూతిలోని అంధకారంలో చిక్కుకున్న మనుజునికి గురు - శాస్త్రములే దిక్కు అవి ప్రసరించే వెలుగే ఉపాయం.

నూనం మలం ప్రధానేన క్షాలయత్ శాస్త్ర రూపిణా । పురుషః శుద్ధతామేతి పరమాం వస్తు శక్తితః ॥

“శాస్త్రం” అనే జలంతో చిత్తం యొక్క మాలిన్యాన్ని (శాస్త్రములు చెప్పే సాధనలు ఆశ్రయించిన) మనుజుడు కడిగివేసుకొంటున్నాడు. అవే శాస్త్రముల ప్రభావం చేత వాటిచే బోధించబడుచున్న “నిత్య శుద్ధాత్మ”ను గ్రహిస్తూ క్రమంగా పరమ శుద్ధత్వము పొందుచున్నాడు. సముద్రంలో సూర్యబింబం లేకపోయినప్పటికీ, సూర్యుడు ఉదయించినప్పుడు సముద్రజలంలో (సముద్రం తానుగా కోరుకో నప్పటికీ) సూర్యబింబం ప్రతిబింబిస్తుంది చూచావా? అట్లాగే… ముముక్షువు శాస్త్రములతో సంబంధం కలిగి ఉండటంచేత ఆ పరస్పర సంబంధం క్రమంగా ఇంద్రియ సంబంధమైన జ్ఞానములకు అతీత మైనట్టి ‘ఆత్మజ్ఞానం’ జనించటానికి స్వభావ సిద్ధంగా కారణమగుచున్నది. సూర్యుడు వేరు, సముద్రం వేరు. కాని ఆ రెండింటిని చూస్తున్న మనకు సముద్రంలో సూర్యబింబం కనిపిస్తోంది. అట్లాగే శాస్త్ర జనితమైన జ్ఞానంచేత ఉపాధిరూపమగు ఈ దేహంలో సర్వోపాధి రహితమైన… జ్ఞేయ రూపమగు ఆత్మను గురించిన జ్ఞానం ఉదయిస్తోంది.

ఒక బాలుడు “ఈ ధూళితో కూడిన అపరిశుభ్రమైన చేతులు శుభ్రం చేసుకోవాలి” అని అనుకున్నాడనుకో! అప్పుడేం చేస్తాడు? చెరువు దగ్గరకు పోయి, అక్కడ ఉన్న మట్టిని చేతికి రాసుకొని, అంతకు ముందున్న అపరిశుభ్రమైన ధూళిని - - ఇప్పుడు రాసుకొన్న మట్టితో సహా అక్కడి నీళ్ళతో కడిగి - రెండు చేతులూ పరిశుభ్రం చేసుకుంటాడు కదా! ఇంటి ఇల్లాలు రాత్రి వంట చేసుకొనియున్న వంట పాత్రలను ‘బూడిద’ మొదలైన నైర్మల్య వస్తువులతో తోమి, అటు తరువత ఆ బూడిద - ఆ పాత్రయొక్క మసి… ఈ రెండింటినీ నీటితో కడిగివేస్తున్నది కదా! అట్లాగే శాస్త్రములు కల్పించే విచారణ వికల్పములతో ’భ్రాంతి’చే పుట్టుకొచ్చిన"ప్రపంచ (దృశ్య) సంబంధమైన వికల్పములు” – మరల మరల తొలగించబడగా… అప్పుడు ‘ఆత్మతత్త్వ పరిశీలన’ అనబడే స్వకీయమైన విచారణను చిత్తము సంతరించుకొనుచున్నదగుచున్నది. చిత్తము దోషరహితమైనప్పుడు ఆ చిత్తము అంతటా ఆత్మను సందర్శించటం స్వభావసిద్ధమే! శుభ్రమైన దర్పణంలో దృశ్యము సుస్పష్టంగానూ - ఉన్నది ఉన్నట్లుగానూ కనబడటంలో ఇక ఆశ్చర్యమేమున్నది?

ఓ రామచంద్రా! చెరకు గడలో మాధుర్యం ఉన్నమాట నిజమే! అయితే ఆ రసం నేరుగా లభిస్తుందా? లేదు. దానిని చెరకుయంత్రంలో ఉంచి, చక్రాన్ని త్రిప్పుతూ ఒరిపిడి కలిగించి, తద్ద్వారా పిండింపజేస్తే చెరకు రసం లభిస్తుంది. ఆ చెరకు రసం త్రాగితే ఇక ఆ మాధర్యం అనుభవమౌతుంది. అట్లాగే… ఉపనిషత్తులు, ఈ యోగ వాసిష్ఠము మొదలైన శాస్త్రముల యొక్క….

Page:707

శ్రవణం (బాగుగా వినటం), మననం (విన్నది ఆకళింపు చేసుకోవటం), నిధిధ్యాసనం (ఆత్మ దృష్టిని అవలంభించి తానే ఆత్మ స్వరూపుడై ఉండటం) … వంటి ఉపాయాలు ఆశ్రయిస్తూ ఉండగా “తత్త్వమసి” (నాకు ఎదురుగా కనిపిస్తున్న నీవు ఆ పరమాత్మ యొక్క రూపమే!”) … అనే మహావాక్యము యొక్క (వాచ్యార్థము నుండి) అఖండార్థం లభిస్తుంది. అనగా వాచ్యార్థ్యం క్రమంగా లక్ష్యార్థంగా పరిణమిస్తుంది. అప్పుడు అవరోక్షానుభవం క్రమంగా సిద్ధించగలదు.

ప్రత్యక్షానుభవం - ఇంద్రియాలకు కనిపించేది,

పరోక్షానుభవం - - ఇంద్రియాలకు కనిపించకుండా అనుభవమయ్యేది,

అపరక్షానుభవం - ఇంద్రియములకు విషయం కాకుండానే అత్యంత సుస్పష్టంగా నిర్మలమైన అవగాహనకు అనుభవమయ్యే ఆత్మానుభవం!

అట్టి అవరోక్షానుభవమగు “ఆత్మ జ్ఞానం” మనుజునకు స్వానుభవం చేతనే లభిస్తోంది.

అద్దంలో ముఖం ప్రతిబింబిస్తున్నప్పటికీ అద్దానిని చూచి గుర్తించేది నీవే కదా! శాస్త్రముల సహకారంతో స్వానుభవం చేతనే ఎవరైనా స్వాత్మజ్ఞానం పొందగలుగుతారు. గురువులు తను అనుభవాన్ని చెప్పుచుండగా శిష్యుడు ఆ గురువులాగానే తాను కూడా స్వాత్మను దర్శిస్తున్నాడు. అట్లా కాకుండా, “ఓ గురువుగారు! మీరు చెప్పుతూ ఉండండి! నేను చూడను. కాని నాకు చూపండి!"3

అని అంటే ఏ గురువు (లేక) ఏ శాస్త్రము కేవలాత్మానుభవం కలిగించగలడు? తనంతట తానుగా అవగాహనను పరిపుష్టం చేసుకోవటానికి సంసిద్ధపడని శిష్యునికి గురువు ఆత్మానుభూతి ఎట్లా కలిగించగలడో చెప్పు? అట్లా గురుశాస్త్రములు ఆత్మానుభూతి కలిగించలేవు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ వస్తువులపై కాంతిని ప్రసరింపజేస్తున్నంత మాత్రాన నీకు కనిపిస్తాయా? నీవు కళ్ళు తెరచి చూస్తేనే కనిపిస్తాయి కదా! సూర్య ప్రకాశము - గోడ యొక్క సంయోగముచే స్ఫుటంగా నీవు చూస్తేనే నీకు అనుభూతమౌతోంది కదా! అట్లాగే నిత్య ప్రకాశరూపమగు ఆత్మజ్ఞానము.

శాస్త్రము యొక్క - గురువుల యొక్క - శాస్త్రములను అభ్యసించు వాని యొక్క సాంగత్యంచే స్పష్టంగా అనుభూతమౌతోంది.

ఓ రామచంద్రా! “త్రివర్గము” అను పిలువబడే ధర్మ-అర్థ-కామముల సిద్ధి కొరకు మాత్రమే నిర్వర్తించబడుచు… మోక్షము కొరకు ఉద్దేశించబడని శాస్త్ర శ్రవణము శాస్త్ర శ్రవణమే కాదు! శాస్త్రము యొక్క కథా విషయములు, చారిత్రక వివరణలను శ్రవణ-మననములను నిర్వర్తిస్తే అంతమాత్రం చేత శాస్త్రమును పఠించినట్లు అవదు. ఆ శాస్త్రము ఏ శాశ్వతమైన ఆత్మతత్త్వ జ్ఞానమునకు సూచనలు ఇస్తోందో… ఆ సూచనలను పరిశీలించి హృదయస్థం చేసుకొన్నప్పుడు మాత్రమే శాస్త్రములను అధ్యయనం చేసినట్లు అవుతుంది.

జ్ఞానము కొరకు ఎప్పుడు ఏది పఠనం, శ్రవణం చేస్తామో… అదియే పఠణము, శ్రవణము అని అనిపించుకుంటుంది. దేనిని (ఏ ఆత్మ గురించిన శ్రవణముచే) సర్వత్రా సమదర్శనం ప్రవృద్ధి పొందుతూ ఉంటుందో అదియే జ్ఞానము. ఏ శాస్త్ర విభాగముచే “నిర్వికల్పమగు ఆత్మ రూపస్థితి”

Page:708

అగు (జాగ్రత్ సుషుప్తి వంటి) సర్వ విషయాతీత స్థితి జనిస్తుందో… ఆ సమత్వస్థితియే ఆత్మజ్ఞానం యొక్క నిదర్శనరూపమై ఉన్నది. చూచావా రామచంద్రా! ఈ ప్రకారంగా శాస్త్రాలలో సమస్తం లభిస్తోంది. ఏవంహి సర్వమేతత్ సచ్ఛాస్త్రాదేః సమవాప్యతే

తస్మాత్ సర్వప్రయత్నేన శాస్త్రాత్ అభ్యాసమాచరేత్ ॥

శాస్త్రములలో ధర్మ - అర్ధ - కామ - మోక్షములనబడే నాలుగు పురుషార్థాలు లభిస్తున్నాయి. అందుచేత సర్వ ప్రయత్నములతో శాస్త్రాదుల అభ్యాసమును తప్పక కొనసాగించాల్సిందే సుమా!

ఓ రామచంద్రా! శాస్త్రములు చెప్పే అర్థాన్ని భావించటం చేత… గురువుల ఉపదేశ సారాన్ని జీవితంలో దైనందిన నిత్యానుభవములలోకి క్రమ క్రమంగా తెచ్చుకొని అనుసరిస్తూ ఉండటంచేతను… (గృహములోనివారు – వృత్తాస్థలంలోనివారు పరమాత్మస్వరూపములేనని భావన చేయటం చేతను), సత్సాంగత్యము చేతను… నియమ, శమముల చేతను… ఇట్టి మార్గంలో అడుగులు వేసేవానికి…

సర్వప్రపంచ పదముల కంటే అతీతమైనది, బ్రహ్మలోకము వరకు గల సమస్త సుఖముల కంటే అత్యుత్తమమైనది, దృశ్యమంతా ద్రష్టస్వరూపముగా మార్చివేయగలిగినది. ఆద్యంత రహితమైనది. సమస్తమునకు ‘ఆది’ అయినది, పరమ పావనము అయినది… అగు ‘మోక్షము’ అనే సుఖం సులభంగా కరతలామలకమగుచున్నది. కనుక ఓ జనులారా! వర్తమాన జన్మను నేను చెప్పుమార్గంలో సద్వినియోగ పరచుకోవలసినదిగా నామనవి!

  1. సర్వత్రా సమదృష్టి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ సభికులారా! బోధ యొక్క “దృఢత్వం” కొరకై మరల ఈ సందర్భంలో ఒకానొక విషయం గురించి గుర్తుచేస్తూ ప్రసంగిస్తున్నాను. ఈ విషయాలు ఇంతకుముందు చెప్పే ఉన్నాను సుమా! అయినా కూడా మన ఈ సంవాదము చివరికి వస్తున్నప్పటి ఈ సందర్భంలో మరల మరల చెప్పుకోవటం చేత ఈ ఈ విషయాలు హృదయంలో బాగుగా నాటుకుంటాయనే ఉద్దేశంతో మరల చెప్పుచున్నాను. అంతా వినండి.

ఓ సహ కేవలాత్మ స్వరూపులారా! ఇతఃపూర్వం మనం చెప్పుకున్న ఉత్పత్తి - - స్థితి ప్రకరణములలో “ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అయి, భ్రాంతి యందు భ్రాంతిచే ఉత్పన్నమై, భ్రాంతి యందే స్థితిని పొందినదైయున్నది” అని మనం అనుకున్నాం కదా! ఆ తరువాత ఉపశమన ప్రకరణంలో ”ఈ ‘జగత్తు’ అనే భ్రాంతి మన మనస్సుల నుండి ఉపశమించేది ఎట్లా?" అను విషయంగా అనేక యుక్తులు మనం చెప్పుకున్నాం. అందుకు అతి ముఖ్యమైన ఉపాయంగా “ఈ ప్రపంచము - ఈ దేహమును పొందినట్టి ఈ జీవుడు శాంతుడై, ‘సమదర్శి’ అయి వుండటం మరల మరల అభ్యసించాలి”… అని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా ఉపశమన ప్రకరణములో

Page:709

చెప్పబడినట్లే క్రమక్రమయుక్తంగా సారరూపంగా “సర్వత్రా సమదర్శనం“… అనే అభ్యాసంచే మీరందరు పరమశాంతియుతులు అయ్యెదరుగాక! సంతాప రహితులై నిర్వాణ సుఖమునందు వర్తించెదరు గాక! ఓ ప్రియ సభికులారా! ”ప్రాప్తవస్తువు (ఇప్పటికి ప్రాప్తించి ఉన్నదే” అగు ఆత్మను పొందినట్టి జ్ఞాని ఈ ప్రపంచ వ్యవహారములలో ఎట్లా వ్యవహరించాలి”… అనే విషయం మనమంతా మరొక్కసారి మననం చేయటం ఉచితమని నేను అభిప్రాయపడుచున్నాను. కనుక ఆ విషయాలు ప్రస్తావిస్తాను! వినండి.

ఈ ఈ ప్రపంచంలో జన్మను పొందినట్టి ఈ మనుజుడు బాల్యం నుండే ఈ జగత్తు యొక్క స్థితిని - ఇది వస్తుతః భ్రాంతియేనని ఎరిగి ఉండటం మంచిది. క్రమంగా మనం ఇప్పుడు ఈ చెప్పు కోబోయే తీరుగా సంతాపములను జయించి విక్షేపరహితుడై జీవితము కొనసాగించటం ఉచితం. సర్వసౌహార్ధ జననీం, సర్వస్యాశ్వాసకారిణీమ్

సమతా - - అమలమ్ ఆశ్రిత్య విహర్తవ్యమ్ ఇహా! అనఘ!

జ్ఞాని యగువాడు స్వభావసిద్ధంగా సర్వత్రా ఒకానొక “సర్వ సమత్వం” సర్వదా కలిగి ఉంటాడు. అందుచేత మీరంతా అట్టి సర్వసమత్యమును అభ్యసించువారై ఉండండి. “సర్వ సమత్వం” సర్వ సహజీవుల పట్ల మిత్రత్వం కలుగజేయునదై ఉన్నది. సమస్త ప్రాణులను ఊరడించునదై ఉంటుంది.

సర్వ సమత్వం అంటే సహజీవులను ఒకే ఆత్మ యొక్క వేరువేరు స్వరూప చమత్కారములుగా దర్శించటం. ఒకే గంగాజలం అనేక గంగాజల తరంగాలుగా కనిపిస్తున్నట్లు సర్వత్రా ఒకానొక సమత్వంతో కూడిన స్వభావమును పెంపొందించుకొని ఉండటం. సర్వ వైషమ్యరహితమగు బ్రాహ్మీ దృష్టిని అవలంబించి ఉండటం.

కనుక ఓ ప్రియ సభికులారా! మీరంతా “నాకు కనిపించే ఈ జగత్తులోని సర్వ రూపాలు ప్రియమైన పరమాత్మ రూపములే” అని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వారికి ఎంతో శ్రేయస్సు కలిగించినవారౌతారు. అంతేగాని “వాళ్ళు మంచివాళ్ళు కాదురా! ఆ కులం, ఈ ప్రదేశం వారిని నమ్మకండిరా!” ఇటువంటి మాటలతో ఆ పిల్లలు పొందవలసిన ప్రశాంతత్వమును చిన్నప్పటి నుండే భంగ పరచకండి. ”సర్వ సమత్వ భావన“ అనేది సమస్త సంపదలలో అత్యుత్తమమైనది. సర్వ సద్గుణాలను పెంపొందింపజేసేది. ‘జీవితం’ అనే వృక్షమునకు ”సర్వ సమత్వం” అనే ఫలం కాయటం అత్యంత పవిత్రమైన విశేషం సుమా! పిల్లలకు పెద్దలు చేయగలిగే కొంచెం ఉపకారం అదే!

ఓ రాఘవా! ‘సమత్వము’ అనే స్వభావమును పెంపొందింపజేసుకొని, సర్వజీవుల హితము కొరకై, ఆచరణ కలిగియుంటూ యథాప్రాప్తములైన వ్యవహారములను నిర్వహిస్తూ ఉండే మనుజులను సర్వైశ్వర్యముల స్వయముగా ప్రేమపూర్వకంగా ఆశ్రయిస్తాయి. “సమత్వము” అను అభ్యాసముచే ఏ నాశరహితమైన ఉత్తమ సుఖం లభిస్తుందో… అట్టి సుఖం గొప్ప గొప్ప రాజ్యాలు ఏలే వారియందు గాని, అనేక మంది వనితాజనముచే గాని లభించేది కాదు. లభించదు. అట్టి సమత్వముచే సర్వ

Page:710

ద్వంద్వములను అలవోకగా నశింపజేసుకొనటం సాధ్యపడుతుంది. అది భయ-జ్వరాలను దరి చేరనీయదు. సమస్త దుఃఖతాపాలకు క్షణంలో జయించివేయగల ప్రావీణ్యత సంపాదించి పెడుతుంది. ఓ రామచంద్రా! శత్రువులు కూడా సమదృష్టిచే మిత్రులుగా కనిపిస్తారు. అచిరకాలంలో తత్త్వదర్శనం అతిసులభము, స్వభావ సిద్ధము అవుతుంది. అట్టి ’సమత్వం’చే పరిపూర్ణులైన మనుజులు ముల్లోకా లలో అక్కడక్కడగాని కనిపించటం లేదు. “సర్వ సమత్వం” పుణికి పుచ్చుకున్న మానవులను చూచి మహర్షులమగు మేము అల్లంత దూరంగా ఉండగానే ప్రపత్తితో చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాం.

జ్ఞాని యొక్క ప్రబుద్ధము అగుచున్న నిజచిత్తం నుండి ‘సర్వ సమత్వం’ అనే చంద్రుడు అమృతకళలతో స్వయంగా బయల్వెడలుచున్నాడు. అద్దాని అమృత కళలచే జ్ఞాని హృదయమంతా అమృత మాధుర్యంతో నిండి ఉంటోంది. ఓ రామచంద్రా! రాజులు, చక్రవర్తులు మొదలైన వారిలో కూడా కొందరు అనేక లౌకికమైన బాధ్యతలు నిర్వహిస్తూనే ‘సర్వసమత్వం’ అనే రసమును ఆస్వాదిస్తున్న ‘జనకుడు’ మొదలైన తత్త్వజ్ఞులు ఎందరో ఉన్నారు. సమత్వము అభ్యసిస్తున్న జీవునియొక్క నిజ కామము, క్రోధము, లోభము మొదలైన దోషాలు కూడా క్రమంగా "శాంతి, ఉదారత్వం” మొదలైన ఉత్తమ గుణములుగా మారిపోతాయి. అట్టివానికి దుఃఖము కూడా సుఖ రూపముగా అగుచున్నది. మరణము కూడా జీవితంలాగా మధురంగానే (జీవిత సదృశంగా) అగుచున్నది. “మైత్రి - కరుణ - తితిక్ష – క్షమ - ప్రేమ” మొదలైన సద్గుణములు తమంతట తామే “సర్వసమత్వం” అభ్యసించేవాని హృదయంలోనికి సొంత ఇంటికి వచ్చినట్లుగా - వచ్చి చేరుతాయి. ఎవరిలో “సమదర్శనత్వము” పూర్ణముగా ఉదయిస్తుందో, వారికి చింతలే ఉండవు. ఉత్తమ గుణములు - అభ్యాసములు వాటికవే వచ్చి చేరుతాయి. ఆతనికి ఈ ప్రపంచములో ప్రాప్తించని సంపద అంటూ ఏదీ ఉండజాలదు.

సర్వ సమత్వము యొక్క విశేష లక్షణములు - అట్టివాడు “ఇది నాకు ఉపయోగించే పని - - అది వారికి ఉపయోగించే పని”… అనే తేడా లేకుండా సమాన దృక్పథంతో వర్తిస్తూ ఉంటాడు. ‘క్షమ, ఉదారత్వము’ స్వభావ సిద్ధంగా కలిగిఉంటాడు. యథా ప్రాప్తములైన ప్రస్తుత వ్యవహారమును నిశ్చింతగా - నిస్వార్థంగా - లోకహితైషి అయి, సమజీవులపట్ల ప్రేమాస్పదమైన ఉద్దేశములతో నిర్వర్తిస్తూ ఉంటాడు. త్యాగశీలియై ఉంటాడు. సహజనులందరినీ సహజమైన ప్రేమ వీక్షణములతో సమాదరిస్తూ ఉంటాడు. ఉదారమైన ప్రవర్తన - చరితము కలిగినవాడై ఉంటాడు. తదితరులకు “ఈతడు ఆప్తుడు - శ్రేయోభిలాషి - ప్రేమ స్వరూపుడు”… అనే ఆనందం కలిగింపజేస్తూ ఉంటాడు.

ఆతడు ఎక్కడుంటే అక్కడ ‘చింతామణి’ వంటివాడై, ఎవరికి ఏది అవసరమో వారికి ఆ రీతిగా సహకారాలు అందించే స్వభావం కలిగి ఉంటాడు. సదాచార తత్పరుడై ఉంటాడు. సర్వ జనులకు శ్రేయోభిలాషి అయి వారికి శుభము - హితము కలుగజేయాలనే తపన - స్వభావము కలిగి ఉంటాడు. సర్వ స్వతంత్ర స్వభావుడై అనేకులకు సానుకుల్యుడై ఉంటాడు. అట్టి “సర్వ సమత్వము”తో కూడిన మనుజుని తదితర మానవులు - దేవతలు కూడా తమ మధ్యగా ఉండాలని కోరుకొంటూ ఉంటారు.

Page:711

ఓ రామచంద్రా! సమచిత్తుడైన మనుజుని అగ్ని దహించజాలదు. జలము తడుపజాలదు. అవన్నీ ఆతనికి దుఃఖం కలిగించజాలవు. ఆతడు స్వభావ సిద్ధంగానే ఏ కార్యమును ఎట్లా నిర్వర్తించాలో అట్లాగే నిర్వర్తిస్తూ - హర్ష విషాదములు లేనివాడై ఉంటాడు. సమస్త కార్యములను ‘సమత్వము’ అనే స్వభావముతో కూడి ఆచరించే మహనీయుల విలువ కొలవటం ఎవరితరం అయ్యేది కాదు!

మిత్రాణి బంధురిపవో రాజానో వ్యవహారిణః

సమ్యక్కారిణి తత్త్వజ్ఞే విశ్వసన్తి మహాధియః ॥

“సమత్వము ఉత్తమ ఆచరణ” పెంపొందించుకొనియున్న మనుజుని పట్ల మిత్రులు, బంధువులు, శత్రువులు, రాజులు, తదితర వ్యవహారవేత్తలు, గురువులు, విజ్ఞులు వీళ్ళంతా గొప్ప విశ్వాసము కలిగి ఉంటారు.

న అనిష్టాత్ ప్రపలాయన్తి నేష్టాదాయాన్తి తుష్టతామ్

ప్రకృతక్రమ సంప్రాప్తాః తత్త్వజ్ఞాః సమదర్శినః ॥

వారు వారికి నియమించిన ప్రస్తుత వ్యవహారమును శ్రద్ధ - - నమ్రతలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ సమదర్శులగు మహనీయులు (తత్త్వజ్ఞులు) అనిష్టములు సంప్రాప్తించినప్పుడు భయపడి పారిపోరు. ఇష్టములు ప్రాప్తించినపుడు ఉబ్బిపోరు.

వారు సమత్వముతో కూడిన నిర్లోభగుణ విశేషం కారణంగా - ఇతరులు వదిలి పెట్టటానికి ఏమాత్రం సిద్ధంగాని “ఇళ్ళు, సంపదలు” మొదలైనవి - తదితరుల కొరకై అవసరమైతే త్యాగం చేయటానికై సంసిద్ధులై ఉంటారు. స్వభావంగానే ‘సంతోషము’ అనే ఉత్తమ వృత్తిని అవధరించి ఉంటారు. వారి యొక్క సమత్వం’ అన మనోబలం కారణంగా దుఃఖములు వారిని సమీపించజాలవు. వారు దుఃఖరహితులై, ప్రసన్నచిత్తులై అనేక భేదభావములు కలిగియుండి, తద్వారా అనేక మానసిక వేదనలలో నిష్కారణంగా చిక్కుకొని ఉన్న వారిని చూచి, - ”వీరు సమత్వమును అభ్యసిస్తూ ఉంటే ఎంత బాగు”… అని తలుస్తూ ఉంటారు. అందుకు సూచనలను అందించే ప్రయత్నంలో ఉంటారు. - తమ ఉపదేశాదులతో సహజీవులను ఉత్తేజపరుస్తూ ఉంటారు.

ఓ రామచంద్రా! ఏ జీవుడు ’సర్వసమత్వము’ను అభ్యసించి తన స్వభావంగా మలచు కొంటాడో… అట్టి వానిని దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు. అట్టి ‘సర్వ సమత్వము’ సంస్కారంగా స్వభావంగా కలవాని ‘కోపం’ కూడా అమృత ఫలములనే కలిగిస్తుంది కాని, లోకానికి క్షోభ కలిగించేది అయివుండదు.

యత్కరోతి యదశ్నాతి యదాక్రామతి నిన్దతి సమదృష్టిస్తదస్యేయం స్తోతి నిత్యం జనావలిః।

సమదృష్టిగల మనుష్యుడు ఏది నిర్వర్తిస్తాడో, ఏది భుజిస్తాడో, ఎక్కడికి వెళతాడో, ఏది ‘అనుచితం’ అని నిందిస్తాడో… ఆయా కర్మలన్నిటినీ… జనులు నిత్యం స్తుతిస్తూ ఉంటారు. ఆతను జేసేది శుభముగాని, అశుభముగాని, శీఘ్రంగా గాని నెమ్మదిగా గాని… అదంతా జనులచే

Page:712

ప్రశంసించబడుతూ ఉంటుంది. సమదృష్టి గల మహాత్ములు చిరకాల ఘోర సంకటములు సంప్రాప్తించినా కూడా భితిల్లరు. వారి సమదృష్టి ఆ సంకటములను కూడా హాస్యపు జల్లుగా మార్చివేయగలుగుతుంది.

t

ఓ రామచంద్రా! అట్టి “సర్వ సమదృష్టి”ని కలిగివున్నారు కాబట్టే శిబిచక్రవర్తి తనను శరణువేడిన పావురము యొక్క ఆపత్తు తొలగటానికి గ్రద్దకు తన శరీరము నందలి మాంసమును కోసి ఇచ్చివేశారు. అట్టి సమచిత్తుడై ఉండటం చేత ఒకానొక అంగదేశ భూపాలుడు తన ప్రాణానికి ప్రాణమైన భార్యను శత్రువులు బాధిస్తున్నప్పటికీ చిత్తవైకల్యము పొందక ఉండగలిగాడు.

ఒక త్రిగర్తరాజు ఎంతో తపస్సు చేసి పొందిన తన కుమారుణ్ణి కూడా జూదంలో ఓడిపోయి ఒక రాక్షసునికి ఇచ్చి వేసేటప్పుడు “సర్వసమత్వ అభ్యాసం" చేత దుఃఖం పొందకుండా ఉండగలిగాడు.

అంతేకాదు. జనక మహారాజు ధనధాన్య సమృద్ధితో కూడిన మిథిలా నగరం తగలబడు చున్నప్పుడు తన సమరస భావమును వీడనివాడై చింతా రహితుడై ఉండగలిగాడు.

అట్లాగే సాళ్వరాజు “నీవు ఏది కోరితే అది దక్షిణగా ఇస్తాను" …అని మాట ఇచ్చి, ఒక బ్రాహ్మణుడు తన శిరస్సును కోరినప్పుడు, తన “సమత్వము” అనే సమరసాభ్యాసము చేతనే తన శిరస్సును కూడా ఛేదించి ఆ బ్రాహ్మణునకు సమర్పించాడు.

అదేవిధంగా, సౌవీరదేశరాజు ఒకాయన ఇంద్రుని జయించి ఐరావతం సంపాదించి, యజ్ఞం ప్రారంభించబోతూ, ఋత్విక్కుల కోరికను అనుసరించి ఆ ఐరావతాన్ని ఇంద్రునికి ప్రేమ పూర్వకంగా ఇచ్చివేశాడు. అది ఎట్లా సాధ్యం? ‘సమత్వము’ చేతనే!

కదంబవనంలో నివసించే ఒక క్రూరరాక్షసుడు గురువాక్యానుసారం మాంసాహారం మానివేశాడు. అది అతనికి సమత్వాభ్యాసం చేతనే సుసాధ్యమయింది.

బాలచంద్రునివలె శుద్దుడై జన్మించిన జడభరతుడు తనయొక్క ‘సమత్వము’ అనే సాధన బలంచేత భిక్షపాత్రలో అగ్నిని చెఱుకురసం త్రాగినట్లు త్రాగివేశాడు.

సమబుద్ధి చేతనే ధర్మవ్యాధుడు (భారతంలోని వ్యాథగీత యొక్క ప్రవక్త) మాంసమును అమ్ముకొనే వృత్తి నిర్వర్తిస్తూ కూడా పరమపదమగు ’మోక్షము’ను సొంతం చేసుకున్నాడు.

సమత్వబుద్ధి సంపాదించుకొని ఉండటం చేతనే “కపర్ధనుడు" అనే రాజర్షి ఒకసారి నందన వనంలో ప్రవేశించి శృంగారరూపులు అగు దేవతా స్త్రీలను చూచికూడా కామవివశుడు కాలేదు.

ఓ రామచంద్రా! హరిశ్చంద్రాది అనేకమంది రాజర్షులు ఏవేవో సందర్భాలలో రాజ్యములను త్యజించి కాటికాపరిగా అయినప్పుడు కూడా ఎటువంటి మనో వైకల్యం పొందకయే వున్నారు.

ఈ సభలో అనేకమంది గొప్ప ఋషులు, మునులు, సిద్ధులు… వీరంతా దేవతలంటి వారిచే పూజింపబడుచున్నప్పుడు కూడా - అనేక మానావమానములను పొందుచున్నప్పుడు కూడా, గొప్ప సిద్దులుండి కూడా, ఉద్వేగులు అవటమే లేదు. అనేమంది రాజులు, సామాన్యులు కూడా సర్వ సమదృష్టి” అనే పురుషకారం చేత మహనీయులకు కూడా పూజనీయులైనారు.

Page:713

అంతేకాదు. ఉత్తమ ధీమంతులైనవారు ఇహ - - పరసిద్ధి కొరకై, ఆత్మజ్ఞానము యొక్క ప్రవృత్తిని సంపాదించుకోవటం కోసం మొట్టమొదటగా “సమబుద్ధి’ని ఆశ్రయించటం ఆవస్యకం. “సర్వ సమత్వమును అలవాటుగా చేసుకుంటూ గురుముఖతః మోక్ష శాస్త్రాన్ని అభ్యసిస్తూ అనుసరించాలి అని సర్వజనులకూ నా విన్నపం.

అభివాంఛేత్ న మరణం, అభివాంఛేత్ న జీవితమ్,

యథాప్రాప్త సమాచారో విచరేద విహింసకః ॥

కనుక ఓ ప్రియసభికులారా! మీరు “సర్వ సమత్వము” అనే పవిత్రదృష్టిని సముపార్జించుకోండి. అట్లా సంపాదించుకున్న తరువాత, ఇక మరణము - - జీవితము రెండింటినీ కోరుకొననివారై… యథాప్రాప్తములైన వ్యవహారములను ఆచరిస్తూ అహింసాతత్పరులై ప్రేమాస్పదమైన దృక్పథముతో సర్వసమత్వమును పుణికిపుచ్చుకొని… ఈ లోకమున విహరించండి.

ఓ రామచంద్రా! “సమదర్శనము” అనే మనోబలంచేత గుణదోషములను సమభావముతో చూస్తూ, ఉత్కృష్ట-నికృష్ట జన్మలందలి సుఖ-దుఃఖములను సమముగా దర్శిస్తూ, మానావమానముల పట్ల సమభావము కలిగివుంటూ… ప్రస్తుత వ్యవహారమను అనాసక్తి పూర్వకంగా, త్యాగబుద్ధితో జ్ఞాని ఆచరిస్తూవున్నాడు. అట్టి పవిత్రమూర్తి - ప్రకాశశీలుడగు జీమన్ముక్తుడు లోకోపకారము కొరకు మాత్రమే ప్రపంచంలో సంచరిస్తూ ఉంటున్నాడు.

  1. ముక్త పురుషుల లోకకళ్యాణ కారకములగు కర్మలు శ్రీరాముడు : ఓ మునీంద్రా! మోక్షశాస్త్రం యొక్క పునశ్చరణకై ఈ ప్రశ్నవేస్తున్నాను. జీవన్ముక్తులు అనునిత్యం ఆత్మజ్ఞాన పరాయణులై ఉంటారు కదా! సదా ఆత్మారాములై వెలయు వారు “కర్మత్యాగం” చేయాలి కదా? (త్యాగేనైవతు కైవల్యమ్) మరి ఆయా జీవన్ముక్తులు కర్మలు వదలకయే ఉన్నారేం? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవున్ముక్తులకు “ఇది గ్రహించాలి” అనే దృష్టి ఎట్లాగైతే ఉండదో… అట్లాగే “ఇది త్యజించాలి” అనే దృష్టి కూడా ఉండదు. వారికి ఏదైనా త్యజించటం చేతగాని, గ్రహించటం చేతగాని క్రొత్తగా రాగలిగిన ప్రయోజనమేదీ ఉండదు. జ్ఞానికి ఇక్కడ త్యజించవలసిన దుఃఖకరమైన కర్మగాని, స్వీకరించి అవశ్యం ఆచరించవలసిన సుఖకరమైన కర్మగాని ఏదీ లేదు. వారికి గ్రాహ్య - త్యాజ్య యోజనాలేవీ ఉండవు. కాబట్టి వర్ణాశ్రమమునకు ఉచితమైన ప్రవాహ పతితమైన ఆయా కార్యములను ఆ రీతిగానే ఆచరిస్తూ ఉంటారు.

యావత్ ఆయురియం రామ, నిశ్చితం స్పందతే తనుః

తద్యథా ప్రాప్తమ్ అవ్యగ్రం స్పన్దతామపరేణ కిమ్?

ఓ రామచంద్రా! ఆయుస్సు ఉన్నంతవరకు ఈ దేహం చేష్టలు కలిగి ఉంటుంది. అది దేహధర్మమే అయివున్నది కదా! కాబట్టి ఈ దేహము యథాప్రాప్తములైన ధర్మ పూర్వక వ్యవహారములు

Page:714

నిశ్చితంగా నిర్వర్తించనీ! దానివలన నష్టమేమున్నది? అట్లా కాకుండా మరొక విధంగా చేయటం వలన వచ్చే ప్రయోజనం మాత్రం ఏమున్నది? అగత్యమేమిటి?

జీవన్ముక్తునకు “అశాస్త్రీయ - సశాస్త్రీయ" కర్మలు రెండూ ఒక్కటే అయినప్పటికీ… శాస్త్రీయ సదాచారమునందు దోషం లేదు కాబట్టి… ఇక తమ ధర్మపూర్వక వ్యవహార క్రమము వదలి మరెక్కడికో వెళ్ళి ఏదో నిర్వర్తించవలసిన పని ఏమి? ఎవనికైనా సొంతిల్లు బాగానే ఉండి ఉండగా… అది వదలి ఎక్కడికో వెళ్ళి ఏదో ఇంకొక గృహంలో ఉండవలసిన పనేమున్నది చెప్పు?

ఓ రామచంద్రా! ఒకడు కార్యము యొక్క “సిద్ధి-అసిద్ధి”ల యందు సమము, నిర్మలము, నిర్వికారము - అయినట్టి బుద్ధితో ఏది ఎట్లు చేసినా కూడా… అది ఆతనిపట్ల సదా దోషరహితమే అవుతుంది! ఈ పృథివిపై అనేక శాస్త్ర - లోక రహస్యములు తెలిపినవారున్నారు. వారు వారియొక్క బుద్ధి - తెలివితేటలతో లోకోపకారములు ఆశయంగా కలిగి ఉండటమే ఉచితం కదా! అట్లాగే ఈ బుద్ధి - నేర్పరితనము లోకదేవతలు ప్రసాదించినదే కాబట్టి, ఈ లోకము యొక్క శ్రేయమునకై సద్వినియోగపడుగాక!

కొందరు జీవన్ముక్తులు సంగ రహితమగు బుద్ధితో యథాప్రాప్తములైన కర్మలు నిర్వర్తిస్తూ లోకసేవ - సంఘసేవ చేస్తున్నారు. మరికొందరో… గృహస్థాశ్రమ ధర్మములు నిర్వర్తిస్తూ ఈ ప్రపంచంలో వర్తిస్తున్నారు. అట్లాగే నీవంటి కొందరు రాజర్షులు ఆత్మారామస్వరూపులు రాగరహితంగా - సంగరహితంగా ఉత్తమ బుద్ధితో "తత్త్వజ్ఞులు సంతాపరహితులు” అయి ప్రజారంజకంగా రాజ్యములను ఏలుచున్నారు.

మరికొందరు జీవన్ముక్తులు వేదార్థములను ఆశ్రయించి కర్మసన్యాస యోగమును అభ్యసిస్తూ ప్రస్తుత కర్మలను దైవ సమర్పణ బుద్ధితో నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇంకొందరు యజ్ఞములు లోకకళ్యాణార్థం నిర్వర్తిస్తూ నిత్యాగ్నిహోత్రులై ఉన్నారు. ఇంకా కొందరు నాలుగు వర్ణాశ్రమములందు ఉన్నవారై తమ తమ ఆశ్రమములకు యోగమ్యములైన ధ్యానము - దైవార్చన మొదలైనవి నిర్వర్తిస్తూ నిజాశ్రమ ధర్మాలను కూడా కొనసాగిస్తున్నారు.

కొందరైతే, మహాశయులై ఉంటూ, అంతరంగంలో మాత్రం సర్వ కర్మఫల త్యాగము గావించివైచి… పైకి మాత్రం నిత్యము కర్మ తత్పరులై ఉంటున్నారు. అనగా అంతరంగంలో పూర్ణాత్మ జ్ఞానులై ఉండియే బాహ్యానికి మాత్రం తదితరులవలెనే ఏవేవో విహిత కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు.

ఇక కొందరు జీవన్ముక్తులైతే, మామూలు మనుష్యులకు కలలో కూడా కనిపించనట్టి నిర్జన ప్రదేశాలలో ఏకాంత ప్రదేశంలో ఉంటూ లేళ్ళు మొదలైన మృగాలు తప్పించి, జనులే ప్రవేశించని ఆ ప్రదేశాలలో ధ్యానపరాయణులై ఉంటున్నారు. కొందరేమో… పుణ్యాత్ములగు సాధుజనులచే సేవించబడే మున్యాశ్రమాలలోను, పుణ్యతీర్థ ప్రదేశాలలోను వసించుచు ప్రశాంత మనష్కులై లోకులకు జ్ఞాన ప్రవచనాలు ప్రసాదిస్తున్నారు.

మరికొందరో… సమచిత్తులై బంధుజనం మధ్యగా కలిగే అనేక విక్షేపాలను, స్వదేశమును,

Page:715

స్వగృహమును వదలి మరొక ఏదో ప్రదేశం ఆశ్రయించి ఆత్మధ్యాన పరాయణులై కాలం వెళ్ళబుచ్చుచున్నారు.

ఇంకా కొందరో… ఎక్కడా ఒకచోట ఉండకుండా… సంచారం చేస్తూ ఒక వనంలోంచి ఇంకొక వనంలోకి, ఒక నగరం నుండి మరొక నగరంలోనికి ప్రవేశిస్తూ కాలం గడుపుచున్నారు.

అట్లాగే కొందరు తత్త్వజ్ఞులు తాపసులై కాశీ - ప్రయాగ-శ్రీశైలం-బదరికాశ్రమం … మొదలైన తీర్ధ స్థలములలోను, పర్వత శిఖరములపైన, వన సమూహములలోను, నదీ ప్రాంతపు ఏకాంత ప్రదేశాలలోను నివసిస్తూ ఆత్మారాధన కొనసాగిస్తున్నారు.

కొందరు సన్యాసవిధిని స్వీకరించి ఇంతకు ముందటి వర్ణాశ్రమ ధర్మాలను త్యజించినవారై ఉంటున్నారు. బ్రహ్మ చర్యాశ్రమ ధర్మములను స్వీకరించుచూ వర్తిస్తున్నారు. కొందరైతే సర్వము తెలిసిన ఆత్మజ్ఞానులై ఉండి కూడా… ఎవరితోనూ ఎట్టి సంబంధము కలిగి ఉండకుండా ఉన్మత్త వేషధారణతో “పిచ్చివారేమోలే”…. అన్నట్లుగా వీథులలో పచార్లు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుచున్నారు.

కొందరు స్వస్థానమును త్యజించి మరొక ప్రదేశమును ఎన్నుకొని ఆత్మతత్త్వమును ప్రజలకు బోధిస్తున్నారు. మరికొందరు స్వస్థానమునందే ప్రీతి కలిగియున్నవారై ఉంటున్నారు. కొందరు సదా సంచారము చేస్తూ బోధలు సలుపుచున్నారు.

చూచావా! రామచంద్రా! ఈ విధంగా స్వర్గంలోను, పాతాళంలోను, భూలోకంలోను అనేక స్థావరములలో లోకస్థితిని ఎరిగి, సమ్యక్ జ్ఞానముచే ‘నిర్మలమైన దృష్టిని’ కలిగియుండి దృశ్యము యొక్క పరాపరములను గాంచివారై ఉన్నారు. “అట్టివారు - ఇక్కడే, ఇట్లాగే ఉంటారు. అక్కడ తీరుగా ఉండరు”… అని మనమెవరమూ నిర్ణయించి చెప్పటానికి వీలు కుదరదు.

అట్లాగే జనులలో కొందరు అల్ప బుద్ధులు అయివుండటంచేత కొంచెము అటూ - కొంచెము ఇటు ఊగే చిత్తము కలవారై ఉంటున్నారు. వారిలో కొందరు పాపాచరణము త్యజించి క్రమంగా సజ్ఞనుల మార్గం అనుసరిస్తూ వస్తున్నవారున్నారు. అట్లాగే కొందరు అర్ధ ప్రబుద్ధులు “మేము బ్రహ్మ స్వరూపులమే కదా! శాస్త్రాలు చెప్పుచున్నాయి కదా! కాబట్టి నిషిద్ధమైన ఆచరణ కలిగివున్నా తప్పేమిటి? అది మమ్ములను ఏం చేయగలదు?” … అని అనుకుంటూ ఈ ప్రకారంగా గర్వముతో కూడుకొని ఉన్నవారై సదాచారములను త్యజించి వేస్తున్నారు. అది ఉభయ భ్రష్టుత్వమునకు దారితీయగలదని అట్టి జనులకూ నా హెచ్చరిక!

ఓ రామచంద్రా! ఈ విధంగా ఈ జన సమూహంలో అనేకమంది ఈ జనన - మరణ సముద్రమును దాటివేయాలని అభిలషిస్తున్నారు. అయితే, వివిధ రీతులలో అనేక దృష్టులతో కూడి ఉంటున్నారు. వారిలో కొందరు శాస్త్రీయ సాధనకు ఉపక్రమిస్తున్నారు. మరికొందరేమో మీన మేషాలు లెక్కపెట్టుకుంటూ ప్రయత్నమునకు ఉపక్రమించటం లేదు. అందుచేత… రామచంద్రా! సంసారోత్తరణే తత్ర న హేతుర్వనవాసితా | |

నా౧పి స్వదేశవాసిత్వం, న చ కష్టతపః క్రియాః |

Page:716

సంసారమును దాటివేయటానికై వనవాసముగాని, (లేక) స్వదేశవాసముగాని, (లేక) కష్టదాయకమైన తపఃక్రియలుగాని… కారణము కాజాలవు. అట్లాగే… కర్మ పరిత్యాగంగాని, కర్మ పరిగ్రహణంగాని, వివిధములై కార్యాచరణములుగాని, వాటిచే కలిగే కార్యసిద్ధిగాని, ఖ్యాతి - లాభము ఐశ్వర్యము - వరము - కార్యసామర్థ్యము మొదలైన ఆయా పుణ్య - పాపవ్యవహారాది సమూహములుగాని సంసార నివృత్తికి కారణం ప్రత్యక్షకారణం కాదు. మరి?

స్వభావః కారణం నామ సంసారోత్తరణం ప్రతి అసంసక్తం మనో యస్య స తీర్ణో భవసాగరాత్ |

తనయొక్క శుద్ధ సత్చిత్ భావనయందలి స్థితియే సంసార సాగరమున దాటివేయటానికి కారణం అగుచున్నది. ఎవని మనసైతే… తత్త్వజ్ఞానము సంపాదించుకున్నదై ఈ ఎదురుగా కనిపిస్తున్న సర్వసాంసారిక విషయములందునూ అంతరంగంలో అనాసక్తి పెంపొందించుకొని ఉంటుందో, …ఆతడు మాత్రమే ఈ సంసార సాగరమును దాటి వేసినవాడు అగుచున్నాడు. అయితే… శుభ కార్యములను ఆచరించటం, అశుభకార్యముల నుండి మనస్సును పరిహరించటం నిర్వర్తిస్తూ వుంటాడు. అది జీవన్ముక్తుని స్వభావమే అయివున్నది.

“అసంగచిత్తుడు”… అయినట్టి జీవన్ముక్తుడు మరల సమసారమును పొందడు. ఆతనికి మరల ఈ సంసారమునందు సంగము, అభినివేశము ఉదయించవు. అట్లా కాకుండా, సంగంతో కూడినవాడై శుభాశుభకార్యములు నిర్వర్తించినా, (లేక) నిర్వర్తించకున్నా కూడా విషయములందు ఆసక్తి కలిగియున్న చిత్తముగల మూర్ఖుడు సంసారమున మగ్నుడై ఉంటున్నాడు. ఈ బుద్ధి విషయ రసములను ఆస్వాదిస్తూ పోతూఉంటే, అవి అనేక దుఃఖ పరంపరలను కలుగజేస్తూనే ఉంటాయి. అట్టి దుఃఖములకు అంతూ పొంతూ కూడా ఉండదు. "బుద్ధి తత్త్వాభ్యాసం” లేకపోతే ఈ బుద్ధి ఇంద్రియ - దృశ్య

విషయముల నుండి మరలదు.

అయితే ఈ జీవుడు సాధన చతుష్టయం ఆశ్రయిస్తూ ఉండగా, ఒకానొకప్పుడు సౌభాగ్యవశంగా కాకతాళీయ యోగంచేత చిత్తము నిర్మలం కావటం ప్రారంభిస్తుంది. చిత్తము ఆత్మసాక్షాత్కార సిద్ధికొరకై శ్రవణము - మననము మొదలైన ఉపాయములను ఆశ్రయించినదై, క్రమంగా ఆత్మావలోకనమునకై ప్రవృత్తిని పొందుచున్నది. నిర్మలత్వమును సంతరించుకున్న ఆ బుద్ధి అప్పుడు ఆత్మ దర్శనమునకై తత్త్వమును ఎరుగుచున్నది. ద్వంద్వరహితమగుచున్నది. అనాసక్త - - నిర్వికారము పొందిన చిత్తమే బ్రహ్మము. అనగా అప్పుడు చిత్తమే ’చిత్రరూపి’ అయి బ్రహ్మమే అయివుంటోంది. అందుచేత ఓ రామచంద్రా!

అచిత్తత్వం ప్రయాతేన సత్త్వరూపేణ చేతసా

సమోభూత్వా సుఖం తిష్ఠ పరాకాశాంత రూపభృత్ | ||

నీ చిత్తము సత్వము రూపమును పొందుగాక! సత్వరూపమగు చిత్తముతో సమదర్శి, సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ ఉండు. సర్వ ప్రపంచమునకు అధిష్ఠాన రూపమైనట్టి చిదాకాశ రూపమును

Page:717

ధరించినవాడవై సుఖముగా వెలయుము! ఇప్పుడు నీవు “పరమార్థతత్త్వమును పొందినవాడవయ్యావు. రాగదోష రహితుడవైనావు. నిత్యోదితమైన ఆత్మారామ స్వరూపుడవైనావు. సమబుద్ధిచే మహాత్ముడవైనావు. కాబట్టి ఇక దుఃఖరహితుడవే! ఇంక నీకు సంశయములతో పని ఏమున్నది? కాబట్టి సంశయరహితుడవు అయ్యెదవు గాక! ఎందుకంటావా

ఏకో జనన మరణముక్తం పావనం తత్పదం త్వమ్! అధిగత పరమార్థః త్యక్త రాగాది దోషః సమమతిః ఉదితాత్మా, త్వం మహాత్మా! మహాత్మన్, రఘుతనయ! విశోకః తిష్ఠ నిఃశంకమేకో!

జనన - మరణ ముక్తం పావనమ్ ‘తత్పదం’ త్వమ్ ॥

ఏకము, జన్మ-జరామరణ వర్జితం, పరమ పవిత్రం- అయినట్టి బ్రహ్మపదం నీవే అయి ఉన్నావు. ఈ జగత్తంతా కూడా నిర్మల పరబ్రహ్మ స్వరూపమే అయివున్నది! ఇక ఈ జగత్తులో ప్రకృతి రూపంగాని, మలరూపం గాని, వికారరూపం గాని, ఉపాధి రూపంగాని, ఆ ఉపాధి యొక్క బోధ రూపంగాని, అద్దాని యొక్క ఇచ్ఛ, గ్రహణం, త్యాగం, భోగం మొదలైనవి గాని ఇంకెక్కడున్నాయి? ఇవన్నీ లేనే లేవు. అంతటా కూడా “సుస్పష్టం, అకృతం” అగు చిన్మయ బ్రహ్మమే ఉన్నది! స్వానుభవముచే “ఆ బ్రహ్మమే నేను (సో హమ్)” అని ఎరిగినవాడవై, పాము కుబుసమును విడచినట్లు సర్వ సంశయాలను త్యజించివేయి. అద్వైత రూపముతో అంతటా నీవే అయి ప్రకాశించు!

ఓ రామచంద్రా! నీకు ఇంతకంటే ఎక్కువగా జ్ఞానం కొరకై చెప్పవలసినదేమీ లేదు. ఎందుకంటే, ఇప్పటికే “ఆద్యస్వరూపం, అక్షయం” అయినట్టి “జ్ఞానసారం” నీ హృదయంలో ఉదయించింది. నీ విప్పుడు వేద్య వస్తువగు ఆత్మ స్వరూపాన్ని ఎఱిగినవాడవయ్యావు. ఆత్మారాముడవై స్వయంప్రకాశ యుక్తంగా భాసిస్తున్నావు.

ఓ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! మునిశ్రేష్ఠుడగు శ్రీవసిష్ఠ మహర్షి ఇట్లా పలికి చిరునవ్వుతో మౌనం వహించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిర్మలమైన, పవిత్రమైన బుద్ధిచే మధురమగు బ్రహ్మపదాన్ని ఆస్వాదించసాగాడు. సమస్త కోర్కెలు నశించినవాడయ్యాడు. సభికులంతా కూడా పుష్పంలోని తేనె గ్రోలి మౌనం వహించిన తుమ్మెదలాగా… బ్రహ్మరసాస్వాదన తత్పరులై మౌనం వహించి ఉన్నారు.

  1. గురు పూజా మహోత్సవం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ భరద్వాజా! ఆ విధంగా శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క “నిర్వాణము” గురించిన వాక్యము పరిసమాప్తములైనాయి. వాక్య ప్రవాహం విరామం పొంది ఆయన మౌనం వహించారు. అప్పుడు ఆ సభలోగల దేవ-మనుష్య-ఋషి సమూహాలు “నిర్వికల్ప సమాధి” ద్వారా “బ్రహ్మైక రసత్వం” నందు సమత్వమును ఆస్వాదించారు. శాంతం, స్వచ్ఛం అగు “మనోవృత్తి” కలవారు

Page:718

అయ్యారు. వారంతా “స్వకీయ నిర్మల కేవలసాక్షి చైతన్యము” నందు అనిర్వచనీయమైన విశ్రాంతిని అనుభవించారు. అప్పుడు ఆకాశవాసులగు సిద్ధులు - సనకాదులు శ్రీ వసిష్ఠమహర్షిని ఉద్దేశించిన స్తుతివాక్యాలతో ఆకాశమును నింపివేశారు. తత్త్వజ్ఞులగు విశ్వామిత్ర మహర్షి మొదలైనవారి ప్రశంసావాక్యాలు దిక్కులన్నీ విస్తరించాయి. దేవ దుందుభులు ఆకాశంలోను, భూమి మీద ప్రతిధ్వనించాయి. ఆకాశం నుండి ఆ మహర్షి మస్తకంపై పుష్పవర్షం కురిశింది. ఆ సభికులు అదంతా ఆశ్చర్యచకితులై ఆత్మానందభరితంగా చూడసాగారు. అక్కడి వాతావరణమంతా సభికుల జయజయ ధ్వానములతో వ్యాప్తమైనది. పుష్ప వృష్టిచే ఆ దశరథ మహారాజు సభ శోభాయమాన మైనది. కొంత సమయమైనతరువాత పుష్పవర్ష కోలాహలం కొన్ని క్షణాలలో ఉపశమించినది. అప్పుడు సిద్ధులు ఇట్లా పలికారు.

సిద్ధులు : ఓ సభికులారా! కల్పారంభం నుండి మేము ఈ సృష్టిలో జరుగుచున్న అనేక సంగతి సంఘటన - సందర్భాలను అంతా చూస్తూనే ఉన్నాం. మా సిద్ధ సంఘములు మోక్షోపాయములగు అనేక గ్రంథముల వ్యాఖ్యానం విన్నాయి. మేమే అనేక సందర్భాలలో వ్యాఖ్యానించికూడా ఉన్నాం. కానీ… ఇంతటి మహద్రూపమైనట్టి “శ్రీవసిష్ఠ-రామ సంవాదము” “యోగవాసిష్ఠము” - “మహా రామాయణము” వంటిది ఇంతకు ముందు మేమెప్పుడూ వినియుండలేదు! శ్రీవసిష్ఠ మహర్షి యొక్క ఈ ప్రవచనము వినటంచేత పశువులు, పక్షులు మొదలైన తిర్యక్ జీవులు, స్త్రీలు, బాలురు, పాములు కూడా పరమశాంతిని పొందగలవు! ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అనేక దృష్టాంతాలచేత-హేతువుల చేత - యుక్తుల చేత, ఈ వసిష్ఠ మునీంద్రుడు ఈ అందమైన బాలుడగు శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా ఇప్పుడు బోధించారో, ఆ విధంగా ఆయన తన ధర్మపత్నియగు అరుంధతీదేవికి కూడా బోధించియున్నారో, లేదో మరి? మోక్షీపాయమగు ఈ మహారామాయణ గ్రంథమును ఎవరు కొంచెం శ్రద్ధగా, ఓపికతో శ్రవణం చేస్తారో… అట్టి పశుపక్ష్యాదులు కూడా సంసార రోగ రహితులవగలవంటే… ఇక ఈ మనుజులు విముక్తులు కాకుండా ఎందుకుంటారు? ఓ సభికులారా! ఈ మహర్షి ప్రవచనాన్ని చెవులారా విని ఆనదించాం! పరమతృప్తిని పొందాము. నూతనమైన శోభను సంతరించుకున్నాం!

సభికులంతా ఆ సిద్ధుల వాక్యాలు విన్నారు. స్తుతి వాక్య గానాలతో నిండిపోయిన ఆ సభను చూస్తూ అక్కడి జనులు శ్రీవసిష్ఠ మునీంద్రుని పాదపద్మాలను మనస్సులలో ప్రతిష్ఠించుకొని నమస్క రించసాగారు. అక్కడి సభలోని రాజులు లేచి మహర్షిని సమీపించి పాదాలపై పుష్పాలు సమర్పించారు. శ్రీదశరథ మహారాజు : అరుంధతీ నాథుడవగు ఓ శ్రీవసిష్ఠ మహర్షీ! మీ దివ్యమైన ఉపదేశం ఎడారిలో చిక్కుకున్న బాటసారిపై జడి వానలాగా మాకు లభించింది. మీ బోధచే “వృద్ధి, క్షయ రహితం, మార్పు చేర్పులు లేనిది, నిర్వికారం, నిరతిశయానంద రూపం" అయినట్టి మా యొక్క స్వస్వరూపమగు ఆత్మ యొక్క అనుభవం మాకు లభించింది. జీవాత్మబద్ధులమైన మాకు

Page:719

పరమాత్మజ్ఞానామృతం ప్రసాదించి మమ్ములను సముద్ధరించారు. మా అంతఃకరణంలో పరమోత్కృష్ట మగు పూర్ణత్వం ఉదయించింది. హే మునీశ్వరా! ఇటువంటి పురుషార్థమును ప్రసాదించిన పరమ పూజ్యులగు మీకు గురదక్షిణగా సమర్పించుకోగలిగిన అర్హమైన వస్తువేదీ ఈ భూ-పాతాళ-స్వర్గములలో లేదు. అయితే “గురు దక్షిణ" అవశ్య కర్తవ్యం కదా! శాస్త్ర లోక ప్రసిద్ధం కదా! లేకపోతే గురుపూజా క్రమం సఫలం కాదుకదా! అందుచేత గురుదక్షిణ గురించి ఒక చిన్నప్రార్థన! కోపగించక ఆలకించండి.

మీరు మాకు ప్రసాదించిన ఆత్మతత్త్వ జ్ఞానం అమోఘమై అనేక జన్మల జాడ్యం తొలగిస్తూ మాకు మహోపకారం చేస్తోంది. అద్దాని విలువ ఇంతని చెప్పలేం. అందుకు మీకు ఏది గురుదక్షిణగా ఇచ్చినా సరే, ఇంకా ఇంకా ఋణపడియే ఉంటాం. అందుచేత నేను ఇవి వినమ్రుడనై ఈ విధంగా సమర్పించుకుంటున్నాను.

1.నేను పత్నుల సమేతంగా నిర్వర్తించి ఉన్న అనేక యజ్ఞముల ఫల - సుకృతములను మీకు కృతజ్ఞతతో వినమ్రుడనై ఇచ్చుకుంటున్నాను.

2.ఈ సువిశాల అయోధ్యా సామ్రాజ్యపు చక్రవర్తిత్వమును మీకు సమర్పించుకుంటున్నాను. ప్రభూ! నాతో సహా ఈ సమస్త సామ్రాజ్యం ఇప్పుడు తమకు సమర్పించబడి, తమ అధీనం అయినది. మీరు దీనికంతటికీ ప్రభువులై ఈ రాజసింహాసనం అలంకరించి మీ భృత్యులగు మమ్ము, ఈ రాజ్యాన్ని శాసించండి పరిపాలించండి.

ఇప్పుడు మీరు మా ప్రభువులు. అందుచేత ఆజ్ఞాపించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ దశరథ మహారాజా! చాలా సంతోషం! అయితే బ్రహ్మయతులమగు మేము నమస్కరించినంత మాత్రంచేత సంతుష్టి పొందుతాం. అట్టి హృదయపూర్వక నమస్కారం మీరు చేతులు జోడించి సమర్పించియే ఉన్నారు. ఈ రాజ్యమును లోకరంజకంగా పాలించటం, ఈ ప్రజలను రక్షించటం, సేవించటం క్షత్రియులగు మీకు మాత్రమే తెలుస్తుంది. ఈ రాజ్యము మీకే శోభిస్తుంది. కనుక ఇదంతా తిరిగి మీకే ఇస్తున్నాను! మా వంటి యతులు రాజులైనదెక్కడా లేదుకదా! కనుక ఈ రాజ్యపాలన ధర్మము మీరే నిర్వర్తించెదరు గాక!

శ్రీ దశరథ మహారాజు :

కియన్మాత్రం తు రాజ్యం స్యాత్? ఇతి లజ్జామహే మునే ప్రకర్షనాత్ర తేనేశ, యథాజానాసి తత్కురు ॥

హే మహర్షీ! సప్తద్వీపములకు చక్రవర్తి అయిన ఒక మనుష్యుని ఆనందం కంటే గంధర్వానందం నూరురెట్లు అధికం. మనుష్య-గంధర్వుల ఆనందం కంటే దేవగంధర్వానందం నూరురెట్లు అధికం. ఆ ప్రకారంగా… అన్నిటి కంటే హిరణ్యగర్భానందం అత్యున్నతమైనదని ఉపనిషత్తులు అంటూ ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు మాకు ప్రసాదించియున్న “దృశ్యమును స్వాత్మానందరూపంగా దర్శించగలగటం” అనే బ్రహ్మానంద సాగర సమక్షంలో హిరణ్యగర్భానందము కూడా మహాసాగరము యొక్క ఒక నీటి తుంపరతో (జలకణంతో) సమానమగుచున్నది. అంతటి ఆత్మానందము మాకు

Page:720

అందించిన మాకు జన్మజన్మల జాడ్యమును తొలగించి మహోపకారం చేసిన మీకు ఈ తుచ్ఛ సామ్రాజ్యాన్ని, ఈ తుచ్ఛ దేహాన్ని గురుదక్షిణగా ఇవ్వటానికి సిద్ధపడినందుకు నాకు ఇది చాలా సిగ్గు కలిగించే విషయమగుచున్నది. ఇక మీ ఆజ్ఞానువర్తినై మీ సేవగా భావించి ఈ దేహమును కలిగియుండటం, ఈ రాజ్యమును పాలించటం నిర్వర్తిస్తాను! మీ ఆజ్ఞ ఎట్లో అట్లే అగుగాక! ‘నాది’ అనిపించేదంతా ఇక మీకే చెందినదై, మీ సేవకుడిగా నియమించబడిన వాడనగుచున్నాను.

శ్రీ వాల్మీకి మహర్షి : ఇట్లు పలికి ఆ దశరథ మహారాజు మరల సింహాసనం నుండి లేచి గురుచరణాలను రెండు అరచేతులతో స్పృశించి, కళ్ళకద్దుకొని, పుష్పాంజలి సమర్పించారు. “నేను సద్గురువగు వసిష్ఠ మహర్షికి చెందిన సింహాసనముపై వారి భృత్యుడనై వారి ఆజ్ఞానుసారంగా “ఆసీనుడనవటం” అనే సేవ చేస్తున్నాను’… అని ప్రకటించి మరల సింహాసనముపై ఆసీనుడైనాబీరి.

అప్పుడు శ్రీరామచంద్రుడు గురుదేవులను సమీపించి నుదుటితో వారి సుందర పాదపద్మములకు మరల సాష్టాంగ నమస్కారం చేసి పుష్పాలు సమర్పించి, అందులో ఒక పుష్పాన్ని తన కళ్ళకద్దుకుని కిరీటము యొక్క ఊర్ద్వమున అలంకరించుకున్నారు. ఆ తరువాత శత్రుఘ్నుడు, లక్ష్మణుడు మొదలైన ప్రముఖులు గురుదేవులు శ్రీ వసిష్ఠ మహర్షి పాదపద్మములకు పుష్పములు సమర్పించి వారి పాదాలను హస్తస్పర్శచే స్పృశించి కళ్లకు - హృదయానికి హత్తుకున్నారు. సభలో దూర దూరం కూర్చున్న అనేక మంది రాజులు, సామంతులు సభా మర్యాదను అనుసరించి ఒక్కరొక్కరుగా నిలబడి గురుస్తోత్ర కవచాలు పలుకుచూ కతజ్ఞతతో కూడిన దృష్టులతో పుష్పాంజలులు సమర్పించారు.

ఈ విధంగా గురుపూజా మహోత్సవం అత్యంత శోభాయమానంగా ఆ సభలో జరిగింది. క్రమంగా ఆ కార్యక్రమం ముగిసింది. సభలో మరల ప్రశాంతత నెలకొన్నది. శ్రీవసిష్ఠ మహర్షి ఆజ్ఞానుసారం పుష్పగుచ్ఛాలు అక్కడి నుండి, ఆ సభలో వేరు వేరుచోట్ల అలంకరించబడ్డాయి.

అప్పుడు శ్రీ వసిష్ఠ మహర్షి “నా ఈ ఉపదేశము బుద్ధియొక్క మాలిన్యముచే దోష యుక్తమైనదా? లేక బుద్ధి నిర్మలత్వముచే నిర్దోషయుక్తమైనదా? ఈ విషయం ఈ సభకు వేంచేసియున్న మునీశ్వరులను అడుగుదాం!" …అని యోచన చేశారు. మధురస్వర యుక్తంగా ఇట్లు పలికారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : గాధి కుల కమలమగు ఓ విశ్వామిత్ర మహర్షీ! ఓ వామదేవ-నిమి-క్రతు భరద్వాజ-పులస్త్య-అత్రి-ఘృషి-నారద-శాండిల భాస-భృగు-భారండ-వత్స్వ-వాత్సాయనాది మహాత్ములారా! కేవలాత్మానంద పరిపూర్ణులగు మీ యొక్క సమక్షంలో ఈ సంవాదం మీ ప్రభావ వీచికలచే మాధుర్యం పొంది లోకకళ్యాణకారకం అయింది. మహాత్ములారా! మహామాన్యులగు మీరంతా నాపై దయతో ఇన్ని రోజులు సంవాదం విన్నారు. కొండ ముందటి గులకరాయి వలె మహాజ్ఞానులగు మీ సమక్షంలో అల్పుడనగు నేను ఇన్ని రోజులుగా ఉపన్యసించాను. ఈ అల్పజ్ఞాని వాక్యములన్నీ విన్నారు కదా! ఈ నా వాక్యములలో ఏదైనా అనుచితమైనది గాని, దోషయుక్తమైనది

Page:721

గాని, దుష్టార్థయుక్తమైనది గాని, లోపముతో కూడినదిగాని ఏదైనా ఉంటే, అద్దానిని నాపై అనుగ్రహంతో తెలుపవలసినదిగా మిమ్మల్నందరినీ అభ్యర్థన చేస్తున్నాను.

అప్పుడు మహామాననయులగువారంతా లేచి నిలుచున్నారు. ఇట్లు పలికారు. మునిపుంగవులు : ఓ సర్వ సభికులారా! మహాత్ముడగు ఈ వసిష్ఠ మునీంద్రుని వాక్యములలో అసంగతమైన వాక్యం ఒక్కటి కూడా లేదు! "దోషవాక్యం ఉన్నదా?” అనే సందేహమే మాకు ఎక్కడా కలుగలేదు. బంగారమును పుటం వేసినప్పుడు అగ్ని యొక్క స్పర్శచే అందలి మాలిన్యం తొలగిపోతుంది చూచారా? అట్లా సభికుల మనస్సులను ఈయన వాక్యాలు పరమపావనంగా తీర్చిదిద్దాయి. తరతరాలుగా ఈ శ్రీ వసిష్ఠవాక్యమననం అనేకమంది ముముక్షువులకు మోక్ష మార్గమై వర్ధిల్లగలవు. ఓ వసిష్ఠ మహర్షి : అనేక జన్మరూప దోషములచే కూడబెట్టుకొనియున్న మా మనస్సుల మాలిన్యము మీచే తొలగింపబడినదై, ఇప్పుడు మా మనస్సులు పుటం వేయబడి స్వచ్ఛమైన బంగారం లాగా ఆత్మానందంతో కూడి ప్రకాశిస్తున్నాయి ప్రభూ!

చంద్రుడు ప్రకాశించగానే కలువలు వికసిస్తాయి చూచారా! బ్రహ్మ ప్రకాశకములగు తమ వచనములచే మా మనస్సులు ఆత్మ ప్రకాశముతో కూడి మరింత మహత్తరంగా వికసిస్తున్నాయి. మహాత్మా! మీరు సర్వతత్వస్వరూపమగు "బ్రహ్మజ్ఞానము” అనే మహాబోధను ప్రసాదించటంలో మహా సమర్థులు. “మోక్షము అనేది ఇంతటి సులభసాధ్యమా!” అని, అన్ని తరగతుల సాధకులకు ఆశ్చర్యచకితులను చేశారు. అందుచేత పరమ గురువులు మీరు! మీ వాక్యములు భావితరములలో అనేకులకు ఆత్మజ్ఞానము శుద్ధాత్మానుభవం ప్రసాదించగలవు.

అట్టి మీకు వినమ్రులమై నమస్కరిస్తున్నాం! అభినందనలు పలుకుచున్నాం!

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! అప్పుడు మరల ఆ సభ్యులంతా లేచి "హే వసిష్ఠ మునీంద్రా! మహత్తరమైన ఆత్మతత్త్వాన్ని ముముక్షువులకు మహా ప్రసాదంగా అందించిన మీకు నమస్కరిస్తూ జయ జయ ధ్వనులు పలుకుచున్నాం!” అని చేతులతో లయపూర్వకంగా చప్పట్లు పలికించారు. ఆ తరువాత సిద్ధులు దశరథ మహారాజుతో, విష్ణావతారమగు శ్రీరామచంద్రునికి ప్రశంసావాక్యాలు పలికారు. సిద్ధులు :

నమామ చతురాత్మానం నారాయణమివారపమ్

రామం! సభ్రాతరం! జీవన్ముక్తం! రాజకుమారకమ్ |

చతురశీలుడు, రెండవ నారాయణుని వంటివాడు, సోదర సమేతుడు, దశరథ మహారాజు కుమారుడు, జీవన్ముక్తుడు అగు ఈ శ్రీరామచంద్రమూర్తికి మేము నమస్కరిస్తున్నాం. త్రికాలములలోను ఉత్తమ రాజచిహ్నములు కలిగి ఈ చతుఃస్సముద్ర వేలాయుతమైన మహాసామ్రాజ్యాన్ని పాలించే శ్రీరామచంద్రుని తండ్రి శ్రీ దశరథ మహారాజుకు నమస్కరిస్తున్నాం.

Page:722

మునిసేనాధిపం భూపం భాస్కరం భూరితేజసమ్ |

వసిష్ఠ సుప్రవాదాఢ్యం విశ్వామిత్రం తపోనిధిమ్ ॥

మునిసేనానాయకుడు, మహాతేజస్వి, సూర్యునివలె మహా ప్రకాశమానుడు, మోక్ష కథన ప్రవచనంలో అత్యంత ప్రావీణ్యులు అగు ఓ అరుంధతీ పతియగు శ్రీ వసిష్ఠ మహర్షీ! మీకు మా హృదయ కుసుమాంజలీపూర్వక నమస్కారాలు.

తపోనిధియగు ఓ శ్రీ విశ్వామిత్ర మహర్షీ! ఈ వసిష్ఠ మహర్షి మీ అభ్యర్థనను అనుసరించే ఈ ఇన్ని రోజుల ప్రవచనము లోక కళ్యాణార్థం సమర్పించారు. అట్టి మీరు మా యొక్క హృదయపూర్వక పాదాభివందనములకు సమారులగుచున్నారు. మీకివే మా నమస్కారములు. ఆహాఁ! నేడు మా జీవితములు ధన్యములైనాయి. ఈ దశరథ శ్రీరామచంద్ర - విశ్వామిత్రుల ప్రభావము వలననే “జ్ఞానయుక్తి పరమైనది - సమస్త సంసార భ్రమ సమూహమును నశింపజేయునది” …అగు ఈ వసిష్ఠ మునీంద్రుల వాక్యములు మేము వినగలిగాం!

శ్రీ వాల్మీకి మహర్షి : ఈ విధంగా పలికి ఆ సిద్ధులు అభినందనపూర్వకంగా మరల పుష్పవర్షం కురిపించారు. అక్కడి సభికులు కూడా అనేకులు ఒకరినొకరు పుష్పాంజలులు సమర్పించుకొని సన్మానించుకున్నారు. మెల్లగా ఆ సభలో స్తోత్ర వాక్యాలు శమించాయి. జ్ఞానోపదేశం పొందిన అక్కడి సభలోని అనేకమంది రాజులు వికసిత హృదయులయ్యారు! సంసార భ్రమ తొలగుటచే అక్కడి సభికుల చిత్తములు స్వయంగా బ్రహ్మ జ్ఞానానుభవము వైపుగా పరుగిడసాగాయి. వారు ఆత్మయొక్క యధార్థ తత్త్వమును ఎరిగినవారై ఇంతకు ముందటి తమ యొక్క అజ్ఞాన చరిత్రను చూచి చిరునవ్వు నవ్వుకోసాగారు. అక్కడి సభ్యుల చిత్తము ప్రత్యగాత్మ పారాయణముచే బ్రహ్మానందం అనుభవించ సాగింది. చిత్త వికాసముచే జనించిన వివేకముచే ప్రశాంత చిత్తులు కాసాగారు. ఇక శ్రీరామచంద్రుడు సోదర సమేతంగా గురువు యొక్క పాదాల వద్ద అంజలిఘటిస్తూ, కూర్చుని ఉన్నారు. సింహాసనముపై ఆసీనులై ఉన్న దశరథ మహారాజులు కనులు తెరిచియే ధ్యానము నందు ఉన్నవానివలె కనిపిస్తున్నారు. “ఆది మధ్యాంత రహితం, అనిర్వచనీయం, పరమ పావనం" అయినట్టి జీవన్ముక్త స్థితిని ఆస్వాదిస్తూ ఉన్నట్లున్నారు. శ్రీవసిష్ఠ మహర్షి అక్కడి సభికుల పూజలను స్వీకరిస్తూ చిరునవ్వుతో మౌనం వహించి ఉన్నారు.

  1. ఆత్మాపమ్యేవ సర్వత్ర

శ్రీ వాల్మీకి మహర్షి : ఆ విధంగా గురుస్తోత్ర కార్యక్రమం ముగిసింది. అప్పుడు సభంతా ప్రశాంత రూపమగు ఆత్మానందం తాండవిస్తోంది. మరల అంతా నిశ్శబ్దమయింది. అప్పుడు శ్రీవసిష్ఠ మహర్షి ఇట్లా పలికారు.

m

Page:723

శ్రీ వసిష్ఠ మహర్షి : కమల నేత్రుడవగు ఓ రామచంద్రా! ఇప్పుడింకా నీవేమైనా వినదలచుకొంటే, . స్వేచ్ఛగా అడుగు. అంతేకాదు. ఇప్పుడు నీవు ఎట్టి స్థితిని స్వయంగా అనుభవిస్తున్నావో… ఈ జగత్తు యొక్క “ఆభాస"ఎట్లు దర్శిస్తున్నావో… అది కూడా నీవు ఈ సభకు చెప్పవచ్చు శ్రీరామచంద్రుడు :

త్వత్ప్రసాదేన యాతో9 స్మి పరాం నిర్మలతాం, ప్రభో | శాంతాశేషకలంకాంకమ్ శరదీవ నభస్తలమ్ ॥

హే ప్రభూ! శ్రీ వసిష్ఠ మహర్షీ! శరత్ ఋతువులో మేఘాలన్నీ తొలగిపోగా నిండు పౌర్ణమినాడు పూర్ణచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఆకాశము ఎంత ప్రశాంతంగాను, ప్రకాశవంతంగాను ఉంటుందో, … ఇప్పుడు నేను మీ అనుగ్రహంచేత అంత ప్రశాంతంగా నిర్మలంగా ప్రకాశమానంగాను అగుచున్నవాడనై ఉన్నాను. సంసార ప్రదమగు సర్వభ్రమలు నాకు తొలిగాయి. నిర్మలమగు ఆత్మ స్వరూపుడనై స్వచ్ఛముగా వెలయుచున్నాను. హృదయ గ్రంథులన్నీ నశించగా… నేనిప్పుడు సర్వ విశేషరహితుడనయ్యాను! స్ఫటికంలో స్ఫటికము యొక్క అంతర్భాగం స్ఫటికరూపమే అయి ఉంటుంది

చూచారా! అట్లాగే… నిర్మల బ్రహ్మరూపమగు ఈ జగత్తు పట్ల నిర్మల బ్రహ్మరూపమగు బుద్ధితో స్థితి పొందియున్నాను. ఈ జగత్తు జగత్తు రూపంగా కాకుండా నాకు ఆత్మ స్వరూపమై దర్శనమిస్తోంది. ఆత్మ స్వరూపుడగు నేను ఆత్మ స్వరూపమగు ఈ జగత్తును ఆత్మగా అనుభవం పొందుచున్నాను.

స్వామీ! ఒకప్పుడు నా మనస్సు సర్వవేళలా ఏవేవో విషయాల గురించి, వ్యవహారాల గురించి, విషయభోగాల గురించి, విషయభోగాల పర్యవసానం గురించి అభిలాషతో మననం చేస్తూ అనేక సంగతుల మధ్యగా అవిశ్రాంతంగా తిరుగాడుతూ ఉండేది. అట్టి అతి చంచలమగు ఆ మనస్సు నాకు అనుక్షణం ఏదో దిగులు, ఆవేదన, శ్రమ, ఉద్వేగము సంపాదించి తెచ్చిపెడుతూ ఉండేది. మరి ఇప్పుడో! నా ఈ మనస్సు మీరు అందించిన ప్రబోధ ప్రభావంచేత విషయ స్మరణమును త్యజించినదైనది. అందుచేత విషయ భోగములందలి అభిలాషను పూర్తిగా త్యజించింది. “అభిలాష”యే సంకల్పమునకు పుట్టినిల్లు కదా! అందుచేత ఇప్పటి నా మనస్సు సర్వ సంకల్పములను త్యజించినదై… ప్రశాంతతతో ఒప్పుచున్నది. ఫలితమేమిటంటారా? జాగృత్ జగత్ స్థితియందు నేను మానసిక ఇంద్రియ సంబంధమైన సర్వ విషయ విచారరహితుడనై పరమశాంతిని, స్వాభావికమైన తృప్తిని పొందినవాడనై ఉన్నాను. అందుచేత జాగ్రత్ స్థితియందు కూడా సుషుప్తి యందువలె నిర్వికారుడనై ప్రకాశిస్తున్నాను.

హే మహాత్మా! ఇతఃపూర్వం దేహాత్మ బుద్ధి కలవాడనై అనేక రకములైన విషయముల గురించిన ఆశలతో వ్యాకులత్వం పొందినప్పటి స్థితి జ్ఞాపకం వచ్చి నా కిప్పుడు పకపకా నవ్వు వస్తోంది. ప్రకాశ శీలములగు తమ ఉపదేశ వాక్యములచే సర్వ సందేహాలు తొలగిపోయాయి. అందుచేత స్వస్థుడనయ్యాను. ఆత్మ స్వరూపమునందు స్వభావసిద్ధంగా స్థితి కలిగియున్నాను. ఇంకా ఎట్లా ఉన్నదో చెప్పమంటారా?

Page:724

నోపదేశేన నా 2ర్థేన న శాస్త్రిః న చ బంధుభిః త్యాగేన చ నచైతేషామధునా మమకారణమ్ ॥

స్వామీ! ఇప్పుడు ఉపదేశములచేగాని, పదార్థములచేగాని, శాస్త్రములచేగాని, బంధువులచే గాని… అవి కలిగియున్నందువల్ల (లేక) వాటిని త్యజించటం వల్ల నాకు క్రొత్తగా వచ్చే ప్రయోజనమేదీ కనిపించటంలేదు. నా చిత్తము సర్వమును పరమాత్మ స్వరూపంగా దర్శించటంలో ప్రతిష్ఠ పొందటం చేత ఇప్పుడది నాశరహితమగు జీవన్ముక్త స్థితిని అనుభవించుచున్నది. ఇదంతా ఈ కళ్లకు నామరూపాత్మకంగా కనిపిస్తూనే… ఆత్మరూపంగా అనిపిస్తోంది. ఈ జగత్తు నిర్మల చిదాకాశమే గాని జడాత్మకం కాదు! "ఇదంతా పరమార్థమున చిదాకాశమే” అను మీ ప్రారంభవాక్యం నాకిప్పుడు సునిశ్చితమై పోయింది. “దృశ్యము” అనే పేరుగల “ఈ సర్వజగత్తు యొక్క అనుభవం’ అనే మోహ నిద్ర మీరు ప్రసాదించిన “ఆత్మ జ్ఞానము” అనే వైతాళిక గానంచేత ఎచటకో తొలగిపోయింది. చిత్స్వరూపుడనగు నేను సదా మేల్కొనియే ఉన్నాను.

యథాకామం యథాప్రాప్తం యథాస్థితమవస్థితమ్ యద్వక్తి తదవిఘ్నేన కరోమ్యపగతైషణమ్ ॥ ||

హే మునీంద్రా! ఇప్పుడు నాకు “అయ్యో! ఇది చేయవలసి వస్తోందే! మరి, అది చేయలేక పోతున్నానే?”… ఇటువంటి దిగుళ్ళన్నీ తొలగిపోయాయి. యథా ప్రాప్తమైన భవిష్యత్ కార్యములను తమరు ఎట్లా చెప్పితే అట్లా గురువాక్యానుసారం, శాస్త్ర ఉద్దేశానుసారం (అట్లాగే) నిశ్చింతగా నిర్వర్తించటానికి, ఆచరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏది ఎట్లో అట్లే అగుగాక! నేను సర్వదా ఆత్మరూపుడనై, సర్వుల యందు - సర్వమునందు ఆత్మత్వమును అనుభవిస్తూ ఆత్మయందే రమించు చున్నవాడనై ఉన్నాను.

న తుష్యామి! న హృష్యామి! న పుష్యమి రోదిమి!

కార్యం కార్యం కరోమ్యేకో భ్రాంతిః దూరంగతా మమ!

స్వామీ! “ఏదో క్రొత్తగా వచ్చి అప్పుడు మాత్రమే నేను పూర్ణుడను అవుతాను!"… అనే భ్రమ తొలగింది. ఈ ప్రపంచంలో ఇష్ట వస్తువులు వస్తే రానివ్వండి! రావా… రాకపోనివ్వండి! ఇష్టప్రాప్తిచే క్రొత్తగా సంతుష్టుడను, ప్రసన్నుడను, పరిపుష్టుడను అయ్యేదీ లేదు. అనిష్ట వస్తువుచే దుఃఖము పొందవలసిన అవసరమూ కనిపించటం లేదు. ఎందుకంటే ఈ “ఇష్టప్రాప్తి - అనిష్టప్రాప్తి” అనేది మనస్సు యొక్క సాంసారిక దోషము మాత్రమే కదా! ఆ మనస్సుకు “ఆది - ఆవల” అయినట్టి ఆత్మయే నా స్వరూపం! ఇక ఈ ప్రపంచంలో అవశ్యము చేయవలసిన లౌకిక-వైదిక కార్యములంటారా! అవి ఎట్లా విహితమో… అట్లాగే నిర్వహిస్తాను. “చేయాలి, చేయనక్కర్లేదు - ఇదే ఎందుకు చేయాలి

అది ఎందుకు చేయటం లేదు’… ఇటువంటి సంశయము నాకు నా పట్ల, తదితరుల పట్ల కూడా మొదలంట సమసిపోయాయి. నా కిప్పుడు భ్రమ తొలగిపోయింది! ఇక ఈ దృశ్యము సృష్టి సంగతేమిటంటారా? ఇదంతా ఇట్లాగే ఉన్నా సరే! లేక ఏ ప్రళయ వాయువీచిక చేతనో ఇది తొలగవలసి వచ్చినాసరే! అనగా, దృశ్యము ఉన్నాసరే! ఉండకపోయినా సరే! ద్రష్టయగు నేను

Page:725

అప్రమేయము, నిర్లిప్తము, నిత్య నిర్మలము, సర్వవిషయాతీతము అగు ఆత్మ స్వరూపుడనే కదా! అందుచేత ఇదంతా ఇట్లాగే ఉన్నా, (లేక) మరొక రీతిగా ఉన్నా, (లేక) అసలు ఉండకపోయినా… నాకు వచ్చే సందిగ్ధంగాని, అనర్థంగాని ఏమీ లేదు. నేను సర్వదా అప్రమేయము, నిత్యము, సర్వగతము అగు ఆత్మనై ఉండగా… ఇక ఇదంతా ఇంద్రియ దర్శనమాత్రమే కదా! అందుచేత నేనిప్పుడు స్వాత్మయందు నిర్విక్షేపముగా స్థితినొంది ఉన్నాను! - పరమవిశ్రాంతుడనై ఉన్నాను.

ఈ బాహ్యేంద్రియములకుగాని, మనస్సుకుగాని పరిలక్షింపబడే వాడిని (విషయాన్ని) కాదు కదా! ఈ విధంగా అలక్షితుడనై, నిర్వికారుడనై ఉన్నాను. ఎవరైనా చేతులతో ఆకాశమును పట్టుకొని జేబులో పెట్టుకోగలరా? అట్లాగే నేను ఇంద్రియ-జగత్ విషయములచే పట్టుబడనివాడనై ఉన్నాను.

వృక్షము నుండి పుష్ప సుగంధం ఆకాశంలో ప్రవేశించి ఆకాశంలో ఆకాశరూపంగా ఉంటుంది చూచారా? అట్లాగే ఈ దేహమందున్న నేను దేహము కంటే అతీతమైనట్టి చిదాకాశంలో ప్రవేశించి చిదాకాశమునందు సమరూపుడనై వెలయుచున్నాను.

ఇది నా లోక విహరణ అంటారా? జ్ఞానులు - అజ్ఞానులు అగు రాజులంతా రాజ్యపాలన మొదలైన కార్యములలో ఎట్లా విహరిస్తున్నారో… నేను నా నియమిత కార్యములందు అట్లాగే విహరిస్తాను. అయితే, అజ్ఞాని వలె కాకుండా… హర్ష విషాద రహితుడనై, స్థిరబుద్ధి కలవాడనై, సమదర్శినై, సంశయరహితుడనై… ఆత్మయందు స్థితిని కొనసాగిస్తూనే… ఈ అయోధ్యానగర న్యాయశాస్త్రమునకు సానుకూల్యంగా నిర్వర్తిస్తూ, బాహ్యమునకు ఈ ప్రాప్తాప్రాప్త కర్మలను యథారీతిగా నిర్వహిస్తూ, అంతరంగమున సమరస భావనచే దర్శిస్తూ ఉంటాను. ఇక ఈ జగత్తులో ఏది ఎట్లో అట్లే జరుగుగాక!

సర్వస్యోపర్యపి సుఖీ సుఖమ్ నేహామి మే ప్రభో |

జనసామ్యేవ తిష్టామి యథేచ్ఛం మాం నియోజయ ॥

ఓ జగద్గురూ! సమస్త విషయాలకంటే అతీతము అయినట్టి “బ్రహ్మానందము”చే నేను ఇప్పుడు సుఖిని అయ్యాను. కనుక నాకు ఈ దేహమునకు చెందిన విషయ వాంఛలు గాని, జగత్ సంబంధమైన దృశ్య సంగతమైన అభినివేశములు గాని లేవు. నేనేమీ పొందటమూ లేదు. కోల్పోవటమూ లేదు. ఇదంతా యథాతథంగా నా ఆత్మ స్వరూపమే కదా! ఇక లౌకిక దృష్టిచే నేను ఎవరినీ, దేనినీ వదలటమూ లేదు. పట్టుకోవటమూ లేదు. అయితే, ’సమత్వము’ను గ్రోలినవాడనై సర్వుల పట్ల సమస్థితిని కలిగి ఉంటున్నాను. ఇక, “ఈ జగత్తులో నేనేం చేయాలి?” అని నాకు ఏ శంకా ఉదయిం చటమే లేదు. నాకుగా ‘ఇది చేయాలి’ అని నాకు ఏదీ కనిపించటం లేదు. అస్మత్ గురువులగు మీ ఇచ్ఛానుసారంగా నన్ను సేవా కార్యములందు వినియోగించవచ్చు. ఇక ఈ దేహం విషయం అంటారా? ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అన్నీ మరచి ఆటలలో పాల్గొంటాడో… అట్లా ఈ దేహం ఉన్నంతవరకు నిర్మల దృష్టితో యథా ప్రాప్తమైన ప్రపంచ స్థితిని పాలిస్తాను. దేహం ఉండటం చేతగాని, దేహం లేకపోవటంచేతగాని నా నా స్వరూపానికి క్రొత్తగా వచ్చేదీ - పోయేదీ ఏదీ లేదు. Page:726

భుంజే పిబామి తిష్ఠామి పాలయామి నిజక్రియామ్ జాతోహం విగతా శంకః త్వత్ప్రసాదాన్మునీశ్వర II

హే ఆప్తగురూ! తమ అనుగ్రహం చేత నేనిప్పుడు సందేహరహితుడనయ్యాను. ఇప్పుడిక సమదృష్టిచే ఏది ఎట్లు నిర్వర్తించాలో అది అట్లాగే మా పితృదేవులు చెప్పినట్లు తమ సేవగా భావించి ఆచరిస్తాను. భోజనం, పానీయం, నివాసం - ఇటువంటివన్నీ ఏది ఎట్లో అట్లే అగుగాక! శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మహాసంతోషకరమైన విషయం! ఏ నిర్మలపదము సముపార్జించుకున్న తరువాత ఇక ఆపై శోకించడో… అటువంటి “పరమ పవిత్రము ఆది మధ్యాంత రహితము”… అగు పదమును నీవు పొందావు. “సర్వత్రా సర్వదా సమరూపము, అతి విశాలము, దుఃఖ రహితము, నిరతిశయానంద రూపము” - అగు బ్రహ్మ పదమును స్వావలంబనం చేసుకొన్న వాడవయ్యావు. శాంతమగు ఆకాశమున శాంతాకాశము ఏర్పడియున్నదగుచున్నట్లు, …నీవు ఇప్పుడు “సర్వదా సమరూపము అతి విశాలము దుఃఖ రహితము - నిరతిశయానంద రూపము అయినట్టి "స్వాత్మ” యందు స్వయముగా విశ్రాంతిని సంపాదించుకొని ఉన్నావు.

దిష్ట్యా జాతో విశోకస్త్వం! దిష్ట్యా సమ్యక్ అవస్థితః దిష్ట్యా లోకద్వయే అనర్ధ, శంకౌ తే శమమాగతా ॥

ఆహాఁ! ఏమి సౌభాగ్యం! నీవు ఇప్పుడు దుఃఖ రహితుడవయ్యావు! మహత్ సౌభాగ్యం చేత బ్రహ్మపదమునందు మహత్తరంగా స్థితి పొందియున్నావు. ఇహ - పరముల గురించిన సర్వ శంకలు తొలగిపోయాయి! సౌభాగ్యవశం చేతనే నీవు ఆత్మవేత్తవై నీ రఘువంశము యొక్క భూత -భవిష్యత్తులను పరమపావనం చేస్తున్నావు.

కాబట్టి రామచంద్రా! ఇక నీవు లోకకళ్యాణ మూర్తియగు ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క “యజ్ఞ విఘ్న నివారణము”… అనే ఆశయమును సఫలీకృతం చేయి! తండ్రి ఆజ్ఞను అనుసరించినవాడవై సాత్వికులను బాధించే స్వభావంగల లోకకంటకులగు రాక్షసులను సంహరించి లోక కళ్యాణము కావించెదవు గాక! ఈ భూమండలమును చక్రవర్తివై పాలించి "రామరాజ్యము” అను లోక కళ్యామగు ప్రసిద్ధిని సముపార్జించెదవు గాక! నీ బంధువులు - మీ రాజ్యంలోని ప్రజలు, సైనికులు, తిర్యక్ జంతువులు రఘువంశీయుడగు నీ వలన రోగరహితులై, భయ వర్జితులై, అభ్యుదయముతో కూడియున్నవారై వెలయుదురుగాక!

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీవసిష్ఠ మహర్షి యొక్క ఆ వాక్యాలు అక్కడి సభికుల హృదయాలను అమృత వర్షంలాగా పరమానందపరచాయి. ఆ శ్రీరామచంద్రుని ముఖం పూర్ణచంద్రుని శోభవలె మనోహరమై అమృతపూర్ణమై శోభించసాగింది. అక్కడి సభలోని మునిజనులు “ఆహాఁ! ఏమి ఈ సౌభ్యాగం! ఈ వసిష్ఠ మునీంద్రుని ఈ కొద్ది రోజుల ప్రసంగం అమోఘం! శుద్ధ - ఆత్మజ్ఞానజనకం కదా!” అని తమలో తాము ఆనంద వచనాలు చెప్పుకోసాగారు. దశరథ మహారాజు సంతోషముచే పులకాంకితుడై కనిపించసాగాడు. శాంతమనస్కుడై నూతన శోభతో ప్రకాశించసాగాడు.

Page:727

ఆ విధంగా జ్ఞేయమగు ఆత్మను గురించిన సాధు ప్రవచనం పరిసమాప్తమయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు అతి సుకుమారమగు పెదవులు విప్పి అతి మధురము గంభీరము అగు స్వరముతో ఇట్లా పలుకసాగాడు.

శ్రీరాముడు : ప్రభూ! శ్రీ వసిష్ఠ మహర్షీ! మహాత్మా! బంగారమును పుటం వేస్తే మహాప్రకాశవంత మౌతుంది చూచారా! అట్లాగే మీ జ్ఞాన ప్రసంగంచే మా అజ్ఞానమును సంపూర్ణంగా తొలగించివేశారు. హే ఆత్మబంధో! ఇంతకాలం పరిచ్ఛిన్నమగు ఈ దేహమునే ఆత్మగా సంభావిస్తూ వచ్చాం. ఇప్పుడో …ఈ సర్వ జగత్తును ఆత్మగా దర్శించుచున్నాం! ఇప్పుడు నేను సర్వత్రా సర్వదా పరిపూర్ణుడనైనాను. శారీరక-మానసిక వ్యథారహితుడను అయ్యాను. నిర్వికారుడను, సంశయరహితుడను, జ్ఞానయుక్తుడను అయి ఆత్మయందు మేల్కొన్నాను. ఆనంద స్వరూపుడనై ఇక శాశ్వత సుఖవంతుడనైనాను. శాశ్వతమగు పురుషార్థము మీ కరుణచే నాకు లభించినది. జ్ఞానయుక్తమగు మీ ప్రవచనముచే నా హృదయము ఆనందైశ్వర్యమును స్వభావంగా సముపార్జించుకున్నది. నా స్వరూపము - ఈ దృశ్యము కూడా నా కిప్పుడు అమృతప్రాయమై మధురానుభూతిని అనుక్షణికంగా అందిస్తున్నాయి. తమ అనుగ్రహంచేత నా కిప్పుడు ఆత్మ సామ్రాజ్యపదవి లభించింది. సమస్త దుఃఖములు తొలగిపోయాయి. పరమశోభను పొందాను. మీరు ప్రవహింపజేసిన జ్ఞాన తరంగాలు నా మూలాజ్ఞానమును ఎటో కొట్టుకుపోయేటట్లు చేశాయి. నిర్మలమగు స్వాత్మ యందు నిరతిశయానందమును పొందుచున్నాను. నా సాక్షి చైతన్య దర్శనం నాకు అయింది. స్వతఃసిద్ధమగు పరమ నిర్మలత్వము పొందినవాడనైనాను.

నిర్మలము - పరమశాంతము - అనంతము - సర్వము - నిత్యము - పరమానందమయము అయినట్టి నా ఆత్మ స్వరూపమునకు పునః పునః ఇవే నా నమస్కారములు.

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరాముడు ఇలా పలుకుచుండగా… అప్పుడు మధ్యాహ్నసమయ సూచకంగా శంఖారావాలు మార్మోగాయి. “శ్రీ వసిష్ఠ రామ సంవాదాన్ని వినిన ఆనందం చేతనా!”… అన్నట్లు సూర్య భగవానుడు నడినెత్తిన ప్రవేశించాడు. ఆ సూర్యకాంతులు విరజిమ్ముచుండగా ఆ సభలోని మణులు మరింత ధగధగాయమానంగా ప్రకాశించసాగాయి. అప్పుడు దశరథమహారాజు సింహాసనం నుండి లేచి నిలుచున్నాడు. సభలోగల దేశాధిపతులు, సామంతరాజులు మొదలైనవారంతా కూడా తమ ఆసనాల నుండి లేచారు. అక్కడి రాజులు తదితర మునులు మొదలైనవారు పరస్పరం అభివాదాలు తెలుపుకుంటూ సభా ప్రాంగణం నుండి బయల్వెడలసాగారు. వినమ్రుడై చేతులు జోడించి నిలుచున్న రామచంద్రుని ఆనంద నేత్రాలతో చూస్తూ శ్రీ వసిష్ఠ మహర్షి ఇట్లా పలికారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రియ రాఘవా! ప్రియ రాఘవా! వినతగినదంతా ఇప్పుడు నీవు విన్నావు. తెలుసుకొనవలసినదంతా చక్కగా తెలుసుకొన్నావు. ఇంకా నీకు కొత్తగా చెప్పవలసినదేదీ లేదు. నీకు నేను ఏమేమి ఉపదేశించానో… శాస్త్రములు నీకు ఏది తెలియజేస్తున్నాయో… ఏ శ్రేష్ఠమగు

Page:728

దానిని నీవు స్వయంగా అనుభవముగా పొందుచున్నావో … అద్దానినంతా శ్రేష్ఠమగు ఏక వాక్యరూపం చేసివేయి.

ఓ ప్రియ రామచంద్రా! ఇకలేఁ! మధ్యాహ్న స్నానాదులకు ఉపక్రమించు. ఓ మంగళస్వరూపా! ప్రియ రఘురామా! రేపు ఉదయం మనం మరల సమావేశమౌదాం. ఈలోగా మనం చెప్పుకొన్న విషయాలన్నీ… అందలి సార విశేషాలను మననం చేయి. మనన - నిధిధ్యాసల ద్వారా బాగా పరిశీలిస్తూ పర్యాలోచన చేయి. ఆ తరువాత కూడా… నీవు ఏదైనా అడుగదలచుకొన్నావా… “చివరి రోజు” అయిన రేపు ఉదయం అడిగి స్వసందేహ నివృత్తి చేసుకో! సందేహాలు కొంచెం మిగిలినా సరే… రేపు తప్పక అడుగు. సందేహాల విషయంలో ఉపేక్ష మాత్రం చేయకు! సందేహాలన్నీ తొలగిపోయాయా… ఇక అంతకన్నా సంతోషమేమున్నది!

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ విధంగా ఆ రోజు సభ ముగిసింది. శ్రీ దశరథ మహారాజు లేచి మంగల జలముతో మహనీయుల పాదపద్మములు కడిగి జలశేషమును శిరోధార్యం చేశారు. మహనీయులను పూజించిన తరువాత అనేక మంది బ్రాహ్మణులను ఆభరణ, ధన, దివ్యపుష్పాదులతో సత్కరించారు. ఆ సభకు వేంచేసిన వారందరికీ స్నానాన్నపానాదులు షడ్రసోపేతంగా సమకూర్చ బడ్డాయి. ఆకాశచరులగు దేవతలు ఆ సభలో మరల - మరల పుష్ప వృష్టి కురిపించారు.

ఆ సభా ప్రాంగణమంతా మధుమధురమైన జ్ఞానానందయుక్తమైన పరస్పర సంభావన - -

సంభాషణలతో మహోన్నతంగా ప్రకాశించింది. అనంతరం వసిష్ఠాది మునీంద్రులంతా దైనందిన మధ్యాహ్న క్రియలు ముగించుకొని ఫల - మధురాన్నాదులు స్వీకరించారు.

ఆ రోజు రాత్రంతా శ్రీరామచంద్రుడు శ్రీ వసిష్ఠ మహర్షి ప్రవచితమైన అనేక విశేషాలన్నీ పునశ్చరణ చేస్తూ జాగరణలో గడిపివేశాడు. అట్లాగే అక్కడి అనేకమంది సభికులు కూడా తమ తమ విశ్రాంతి స్థానములలో మహర్షి యొక్క వాక్యసారాన్ని తమలో తామూ - తదితరులతోను పునశ్చరణ చేస్తూ జాగరణ చేశారు.

అవును మరి ! అంతటి జ్ఞాన సారాంశాన్ని వినే సందర్భాలు ఈ సుదీర్ఘ కాలవిన్యాసంలో అతి అరుదు కదా! సారాంశాన్ని మననం చేసుకోకపోతే మరచిపోయే ప్రమాదం ఉన్నది కదా!