CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:729

ఇరవై రెండవ రోజు

XVI. శ్రీ ప్రజ్ఞప్తి - శ్రీ వసిష్ఠ సంవాదము

-

(మహా ప్రశ్నలు - - సమాధానాలు)

  1. కృతకృత్యోస్మి

శ్రీ వాల్మీకి మహర్షి: ఆ మరునాడు సుమంత్రుడు, మహారాజు మొదలైనవారంతా ప్రపత్తి వాక్యములు పలుకుచుండగా శ్రీవసిష్ఠ మునీంద్రులు అయోధ్యా సభలో ప్రవేశించి ఉన్నతాసనంపై ఆసీనులైనారు. అప్పుడు కమలనేత్రుడు, మహాధీమంతుడు అగు శ్రీరామచంద్రుడు కోమలమైన శబ్దములతో ఇట్లా

పలికాడు.

శ్రీరామచంద్రుడు :

భగవన్! సర్వధర్మజ్ఞ! సర్వజ్ఞానమహార్ణవ! సర్వ సందేహ పరశో! పరశోకభయాపహ! శ్రోతవ్యమ్ అపరం కిం మే విద్యతే వేద్యమేవ వా శ్రోతవ్యం విద్యతే యద్వా తత్సర్వం వక్తుమర్హసి!

ఓ భగవాన్! ఓ వసిష్ఠ మహర్షి! సర్వధర్మజ్ఞా! సర్వ జ్ఞానమహాసముద్రా! సర్వ సందేహములకు గొడ్డలి పెట్టువంటివాడా! సర్వజీవుల శోకములను పటాపంచలు చేసే మహాత్మా! మీ ప్రసంగమంతా రాత్రంతా మా సోదరులు, మిత్రులతో కూడి తరచి తరచి గుర్తు చేసుకొని ఆస్వాదించాం. మహదానంద భరితులమయ్యాము. నాకు ఏదీ సందేహంగా ఏమాత్రం అనిపించలేదు. మహత్తరమైన (సో హమ్ అనే) ఏకవాక్యము నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. అయితే, "మీ వాక్యామృతం ఇంకా ఇంకా గ్రోలితే బాగుండు” …అని మాత్రం అనిపించసాగుచున్నది. అందుచే మహాత్మా! మహర్షీ! మేము ఇంకా ఏది వింటే శుభప్రదమో… ఏది ఎరిగితే కళ్యాణ ప్రదమో… అద్దానిని పలుక వలసినదిగా మా ప్రార్థన, విన్నపం!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీకిప్పుడు ‘భౌతికబుద్ధి’ తొలగినదై… ఆత్మబుద్ధి ప్రాప్తించింది. కాబట్టి నీవింక వినతగినదంటూ నాకింకేమీ కనిపించటం లేదు. నీవు పొందతగిన వస్తువు పొందావు. కతకృత్యుడవైనావు. నీ బుద్ధి ఈ జగత్తును ఆత్మగా దర్శిస్తూ స్వాత్మయందు నెలకొనినదై

Page:730

ఉన్నది. ఇప్పుడు నీవు ’స్వబుద్ధి’తో విచారణ చేసి నీ అంతఃకరణమున నీవు ఎట్టివాడవని నీవు అనుకుంటున్నావో నీకు ఇంకా వినదగినదేదైనా శేషించియున్నదని నీవు అనుకుంటున్నావో… ఆ రెండు విశేషాలు నీవే ఈ సభకు చెప్పు. ఇది ఆఖరి రోజు కాబట్టి పునశ్చరణ ఉచితమే అవుతుంది

కదా!

శ్రీరామచంద్రుడు :

బ్రహ్మన్నేవమహం మన్యే యథాహం కృతకృత్యథీః నిర్వాణో2 స్మి, ప్రశాంతో స్మి నాకాంక్షామమ విద్యతే!

ఓ వసిష్ఠ మహర్షీ! జగద్గురూ! అమృత మాధుర్యముతో కూడిన మీ వాక్యములు విన్న తరువాత నేనిప్పుడు కృతకృత్యుడను అయ్యాను. పరమానందమగు నా స్వరూపమునందు నెలకొనియున్నాను. నా స్వరూపము ప్రశాంతమై అంతటా ఆక్రమించినదైయున్నది. ఈ సర్వమూ నాయందున్నదే అగుచున్నది. “ఏదో కావాలి” అనునదేదీ నాకికలేదు. మీరు చెప్పవలసినదంతా నాకు చెప్పారు. అద్దాని ననుసరించి నేను ఎరుగవలసినదంతా ఎరిగాను. మీరు 21 రోజులు సుదీర్ఘంగా మాపై కరుణతో శ్రమ తీసుకొని ప్రసంగించారు. మీ వాక్యాలు సఫలమైనాయి.

హే మహర్షీ! పొందవలసిన బ్రహ్మ వస్తువును నేనిప్పుడు సర్వదా పొందబడినదానిగా దర్శిస్తున్నాను. “ఈ జగత్తు బ్రహ్మమే”… అనేది నా దృష్టికి సుస్పష్టంగా గోచరమౌతోంది. “జీవుడు - బ్రహ్మము” ఇటువంటి ద్వైతరూప భ్రమ నశించింది. దృశ్యభేదమంతా బ్రహ్మమయానుభవంలో విలీనమైపోయింది. మీరు చెప్పుచున్నదంతా విచారిస్తూ ఉండగా "ఈ దృశ్యము దృశ్యముగా సత్యమే”… అనే సంసార సత్యత్వబుద్ధి నశించింది. వెలుతురు రాగానే చీకటి ఎటుపోతోంది? అట్లాగే జ్ఞాన వాక్య శ్రవణం చేత నా ఇతఃపూర్వపు అజ్ఞానం ఎటు వెళ్ళిందో ఏం చెప్పను?

  1. అభ్యాసము యొక్క ఆవశ్యకత

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పే వాక్యాలు విని “నా వాక్కుకు ప్రయోజనం సిద్ధించింది”… అని నేను ఎంతగానో ఆనందిస్తున్నానయ్యా! అయితే, అద్దం మరల మరల తుడిచి అనునిత్యమూ పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదా!

భూయ ఏవ మహాభావో! శృణు మే పరమం వచః! I ఆదర్శో రాజతే త్యర్థం పౌనః పున్యేనమార్జితః ॥ ||

అట్లాగే ఈ ఉత్తమ వాక్యములు మరల విను. ఈ దృశ్యము గురించి విశదీకరించటానికి వీలుగా మహనీయులగు ఆత్మ శాస్త్రజ్ఞులు ఇద్దానిని రెండు విధాలుగా విభజిస్తున్నారు. 1.రూపాత్మకమైన సంకేతములు, 2. నామాత్మకమైన సంకేతములు.

Page:731

రూపము నామము / అర్థము 2

1

జాతి గుణము క్రియ సంస్థానము

3 4 5 6

ఈ పదార్థము గురించి చెప్పబడే జాతి - గుణ - - క్రియ - సంస్థానములు నాలుగూ కూడా

శబ్ద భేద ప్రవృత్తిచే కల్పించబడినవే! అవి భ్రాంతి సంకేతములు. వాస్తవం కాదు. ఉదాహరణకు నీ మెడలో ప్రకాశించే ఆ బంగారు ఆభరణం ఉన్నదనుకో…!

1.ఈ బంగారు ఆభరణం ఖరీదైనది.

2.ఈ బంగారు ఆభరణము యొక్క ఆకారం చూచారా? ఎంత బాగున్నది?

  1. ఇది ముత్యములతో బారుగా కూర్చబడి మెడలో ధరిస్తాం.

4.ఇది మా తండ్రిగారు ఇచ్చారు. ఆయనకు మరొక రాజుచే బహుమతిగా ఇవ్వబడింది. 5.ఇది ధరిస్తే చాలా అందంగా కనిపిస్తాం.

6.ఇది మా అంతఃపురంలోనుంచి తీసుకువచ్చాను.

ఇవన్నీ పదార్థమునకు చేయబడిన కల్పనలే గాని వస్తు విభాగాలు కాదు, ఇవన్నీ భ్రమ రూపములే అవటం చేత వాస్తవవమైన వస్తు ధర్మాలు కావు. కనుక అవన్నీ లేవు. వస్తుతః చూస్తే? బంగారము ఒకానొక ఖనిజము. ఈ విధంగా ‘పదార్థము’నకు కల్పించబడే అర్థము మొదలే లేకపోయినప్పుడు ఇక అద్దాని గురించి జనులు అనుకునేదంతా తరంగ శబ్దములవలె నిరర్థకమే!

ఈ విధంగా ఇక్కడి సర్వపదార్థముల యొక్క రూపాత్మకమైనదంతా ఎప్పుడైతే తొలగించి చూస్తామో… అప్పుడిక నామాత్మకమైనది కూడా తనకు తానే నిషేధించబడుతోంది. ఈ రెండూ తొలగించితే ఈ దృశ్యము వాస్తవానికి లేనిదే అగుచున్నది. అప్పుడు ఇదంతా కూడా చైతన్యము యొక్క అభాస మాత్రమే అగుచున్నది. అనగా… ఈ దృశ్యమంతా కూడా స్వప్నమువలె అగుచు, స్వప్నమువలె వర్తించుచున్నదే అయి ఉంటోంది! ఇప్పుడిక ‘జగత్తు’ అనబడేది ఎక్కడున్నది?

ఎప్పుడైతే ఈ భావావేశంతో కూడిన స్మరణం వంటి జాగ్రత్తులో కనిపించేదంతా ఈ విధంగా “మిథ్యయే” అయివున్నదో… ఇక స్వప్నము గురించి ఏమనాలి? స్వప్నము జాగ్రత్తు యొక్క స్మరణ వంటిది మాత్రమే కదా! ఆత్మయే స్వప్నంలో స్వప్న దృశ్యరూపంగా అగుపిస్తోందని చెప్పటం అతిసులభం కదా! అనగా, అక్కడ చిద్రూపమగు ఆత్మయే అన్య పదార్థ ఆధారంగా వ్యాపించి ఉన్న దనియే అర్థమౌతోంది. స్వప్నంలో చైతన్యమునకు అన్యంగా కించిత్ కూడా ఎక్కడా ఏదీ లేదు కదా!

ఏ విధంగా స్వప్న నగరం ’ప్రత్యగాత్మ’లో నిర్మల చిదాకాశమాత్రమే అయి ఉన్నదో… విధంగానే ఈ ముల్లోకాలు కూడా రూపసహితంగా (స్వప్నంలో లాగానే) ద్రష్ట యొక్క ఉద్దేశం భావన - అవగాహనలను అనుసరించి మాత్రమే అనుభూతమౌతున్నాయి. వాస్తవానికి ద్రష్ట దృశ్యములు రెండూ చిదాకాశ రూపములే అయివున్నాయి.

Page:732

శ్రీరాముడు : స్వామీ! చైతన్యము సర్వదా పరమ నిర్మలము కదా! మరి నిర్మల చైతన్యమునందు ఈ ‘జడత్వం’ ఎట్లా రూపం పొందింది? భూమి మొదలైన వైచిత్ర్యమంతా ఎట్లా ఏర్పడింది? ఈ ఎదురుగా జగత్తులో కనబడుచున్న ఈ పర్వతాలు, జలము, శిలలు, అగ్ని, వాయువు, క్రియ, కాలము, శూన్యము, చిత్తాకాశము… ఇవన్నీ ఎట్లా సంభవిస్తున్నాయి?

హే మహర్షీ! ఇవన్నీ మీరు ఇతఃపూర్వం సవివరంగా చెప్పియే ఉన్నారు. నేను మీ ప్రవచనాను సారం ఎరిగియే ఉన్నాను. అయినా కూడా ‘ఆత్మాసంభావన’ తొలగి ’ఆత్మ సంభావన’ మరింతగా పరిపూర్ణం అవాలనే ఉద్దేశంతో ఈ ప్రవచనం ముగియవస్తున్న సమయంలో మరల మీ వాక్కు వినాలని అనిపించి అడుగుచున్నాను. కనుక బోధాభివృద్ధికై మరల మీ అమృత వాక్కును ప్రసాదించమని వేడుకుంటున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగే! అయితే, నీకీ విశేషాలు చెప్పటానికి ముందుగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. సరేనా?

శ్రీరాముడు : స్వామీ! అట్లే అగుగాక!

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో కూడా మహానగరము, భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, దిక్కులు, కాలము, క్రియ, కార్యకారణ వ్యవహారం కనిపిస్తున్నాయి కదా! ఆ స్వప్న సమయంలో అవన్నీ "నిజమే” అనుకొని నీవుగాని, మరొకరుగాని అనుభవించటం జరుగుతోంది కదా! ఇప్పుడు చెప్పు! అవన్నీ కూడా ఎట్లా ఏర్పడి అక్కడికి వచ్చాయి? వాటిని స్మరించిన వారెవరు? వాటిని అక్కడి నుండి ఎవరు మళ్ళీ తొలగిస్తున్నారు? ఎందుకు తీసుకొచ్చి అక్కడ ఉంచినట్లు? ఎవరు రచన చేశారు? వాటిని ఆయా విధాలుగా ప్రకాశయుక్తం చేస్తున్నదెవరు? అవన్నీ ఏ పద్దతిని అనుసరించి ఉత్పన్నం అయినాయి? ఆ స్వప్నం యొక్క ఆచారమంతా ఏమైయున్నది? అందులో కనిపించిన నగరాదుల యొక్క అసలు స్వరూపం ఏమిటి?

శ్రీరాముడు : స్వామీ! అర్థమయింది! ఈ జగత్తు కూడా స్వప్న రూపం వంటిదే! స్వప్నరూపమగు ఈ జగత్తు యొక్క స్వరూపం కేవలం “నిరాకారము - నిరాశ్రయము” అయినట్టి చిదాకాశమే అయివున్నది. ఈ కనబడే భూమి, పర్వతాలు, ఆకాశం, నగరాలు, దేహముల నామరూపాలు… ఇవన్నీ సత్యము కాదు. "నిరాకారము, నిరాధారము”… అగు చిదాకాశమే ఆ అన్ని రూపాలుగా కనిపిస్తోంది. నిరాకారమైన చిదాకాశమునకు మరొక ఆధారము యొక్క ఆవశ్యకతయే లేదు!

న కించిదేతత్ సంపన్నం సద్యథైతన్న సంవిదః ।

ఏతత్ చిత్కచనం నామ మనఏవ తథా స్థితమ్ ||

మనస్సే స్వప్నరూపమై ఉంటోంది కదా! అట్లాగే,… స్వప్నదృశ్యంలాగానే ఈ దృశ్య జగత్తు కూడా వాస్తవానికి ఒకింత కూడా లేదు. చైతన్యము యొక్క ఒకానొక చమత్కారమైన స్ఫురణయే (స్వప్నంలాగానే) ఈ జగత్తులో ఈ జగదాకారంగా స్థితి పొందినదై ఉన్నది! అంతేగాని ఈ జగత్తుగా కనిపించేదంతా మరింకొకటేదో అయివుండలేదు. ఎవరో కల్పించి (సృష్టించి), ఏర్చిPage:733

కూర్చి ఇక్కడ అమర్చినదీ కాదు. తత్త్వజ్ఞానమును ఎరిగి అనుభూతమొనర్చుకొన్నవారికి ఇక్కడి ఆకాశ - భూ - జల - నగర - ప్రాణ - దేహాదులన్నీ చైతన్యము యొక్క స్ఫురణ మాత్రంగానే నిస్సందేహంగా కనిపిస్తున్నాయి. చైతన్యమే శూన్యరూపం. చైతన్యమే ఆకాశం. చైతన్యమే కఠినరూపమై శిలగా కనిపిస్తోంది. అదియే ద్రవరూపమై జలంగా వర్తిస్తోంది.

వస్తుతస్తు న భూమ్యాది కించిత్ తత్ న చ దృశ్యతా, చిదాకాశమ్, అనన్తం తత్సర్వమేకం తదాత్మకమ్ II

వస్తుతః చూస్తే భూమి మొదలైనవిగాని, దృశ్యము మొదలుగా గలిగినవి గాని కించిత్ కూడా లేనేలేవు. ఇదంతా కూడా “ఏకము, అనంతము” అగు చిదాకాశమే అయివున్నది. చిదాకాశరూపంగానే ఇది వర్తిస్తోంది. నిర్మల సముద్ర జలమంతా ఏకరూపమే అయినప్పటికీ “తరంగము, బుడగలు, నురుగు, ఆవర్తనము, సుళ్ళు” … ఈ విధంగా ఏకానేక రూపాలుగా కనిపిస్తోంది కదా! అట్లాగే… చిదాకాశము సర్వదా ఏకమే అయివుండి కూడా… తన యందు ఈ జగత్తు రూపంగా నానా విధములుగా భాసిస్తోంది. అయినా కూడా, చైతన్యము తన యొక్క పరమార్థ రూపమును ఏమాత్రం కూడా ఎక్కడా త్యజించటమే లేదు. ఆవర్తములుగా కనిపిస్తున్నప్పటికీ జలము తన జలత్వ - ద్రవత్వ ధర్మములను కోల్పోతోందా? లేదు కదా! అట్టి చిదాకాశమే తన యొక్క కాఠిన్యమును గూర్చిన అనుభవంతోటి భూమి పర్వతాది రూపంగాను, శూన్యమును గూర్చిన అనుభవంతోటి ఆకాశాదులు గాను, ద్రవత్వం గురించిన అనుభవంతో జలాదులుగాను, స్పందత్వమును గూర్చిన అనుభవంతోటి వాయువుగాను, ఉష్ణత్వమును గూర్చిన అనుభవంతో అగ్నిరూపంగాను తనను తాను ఎరుగుచున్నది. ఈ విధంగా "నిష్కారణంగా నామ రూపములతో స్ఫురించటం”… అనేది చిదాకాశము యొక్క స్వభావమే అయి వున్నది.

జలానికి వేఱుగా సముద్రమునకు మరొక రూపమేదీ లేదు కదా! శూన్యత్వమునకు వేరుగా ‘ఆకాశము’ అనబడేది ఎక్కడున్నది? అట్లాగే చిదాకాశమునకు వేరుగా ‘జగత్తు’ అనబడేది ఎక్కడా ఏదీ లేనే లేదు! అద్దానికి చిదాకాశమునకు) వేరుగా రూపమూ లేదు. జలమునకు వేరుగా తరంగం ఎక్కడ? తరంగాకారమెక్కడ?

న తు చిత్ గగనాత్ అన్యః న సంభవతి కించన |

“ఇదం-త్వమ్-అహమ్” ఇత్యాది, తస్మాత్ ఆశాంతమాస్యతామ్ ||

"ఇది నీవు - నేను” ఇత్యాది రూపములతో కూడిన చిదాకాశము కంటే వేరుగా ఏదీ సంభవించజాలదు. కాబట్టి ఓ సర్వసభికులారా! మనమంతా కూడా చిదాకాశ రూపులమే! అట్టి చిదాకాశమాత్ర రూపముగా పరమ శాంతముతో వెలయుదముగాక! ప్రశాంత స్వరూపులమై ఉండెదము గాక! ఎందుకంటే, మనందరి వాస్తవరూపం చిదాకాశమే కాబట్టి!

ఓ సహ చిదాకాశానంద స్వరూపులారా! మనమంతా రోజు స్వప్నం చూస్తున్నాం. అట్టి స్వప్నంలో దేహం లేకుండానే, నిరాకార రూపులమై అగ్ని, కొండ, ఇల్లు, వాకిలి … ఇవన్నీ మనకు

Page:734

మనమే రచించుకొని తత్సంబంధమైన అనేక క్రియలను నిర్వర్తిస్తున్నాం కదా! అట్లాగే … నిరాకారమైన చిదాకాశము జాగ్రత్తునందు ఈ సాకారములగు అగ్ని-ఆకాశ-పర్వతాది నానా విధములైన ప్రదర్శనములను నిర్వర్తిస్తూ వాటియందు ద్రష్టగా తానే ప్రవేశించినదై దర్శన-స్పర్శ-సంచారాది ఆయా క్రియలన్నీ నిర్వర్తిస్తోంది. ఈ విధంగా సర్వజీవులు చిదాకాశరూపులేగాని, భౌతికదేహ

పరిమితులు కాదు.

స్వప్నంలో భౌతిక దేహం లేకుండానే స్వప్నద్రష్ట చైతన్యము దేహాకారమువలె ప్రకటన మగుచున్నట్లే… సృష్ట్యాది యందు చిదాకాశము జగదాకారంగా ఉదయించుచున్నదగుచున్నది. వాస్తవానికి చిదాకాశం జగదాకారంగా అగుటయే లేదు. జగత్తుకు కారణమనేదే లేదు. అందుచేత… అజ్ఞానం చేత చైతన్యమే జగదాకారంగా కనిపిస్తోంది. జగదాకారంగా కనిపించేదంతా సుజ్ఞానం చేత చైతన్యంగా అనిపిస్తోంది… అని మనం అందరం ఈ మహర్షి వాక్యమననంచేత గమనిస్తూ ఉందాం.

ఓ సహసభికులారా! ఈ మనస్సు, బుద్ధి-చిత్తము-అహంకారాలు, పంచభూతాలు, పర్వత - నగరాదులు, ఈ 10 దిక్కులు, యథాస్థితిలో కనిపించే సమస్త ప్రపంచం - ఇవన్నీ, ఇదంతా శిలయొక్క అంతర్భాగమువలె మహా మౌనమయమై ఉన్నాయి. ఇవన్నీ కూడా వాక్కుకు విషయమే కానట్టి చిదాకాశమే అయివున్నది.

ఏవం న కించిత్ ఉత్పన్నం, నష్టం న చ న కించన యథాస్థితం జగద్రూపం చిద్రహ్మాత్మని తిష్ఠతి |

ఈ ప్రకారంగా… వాస్తవానికి ఇక్కడ ఏదీ కూడా కొంచెం కూడా ఉత్పన్నమనటంలేదు. నశించటమూ లేదు. యధారీతిగా స్థితి కలిగి ఉన్న… ఈ జగత్ రూపమంతా కూడా… చిద్రహ్మాత్మలో సద్భహ్మ రూపంగానే వెలయుచున్నది. చైతన్యంలో గల ఈ జగత్స్వరూప స్ఫురణమే ఇదంతా! “చిత్ స్వరూపం” యొక్క విజృంభణమే ఈ జగత్తు. జలం-ద్రవంలాగా చైతన్య జగత్తులు ఏకరూపమే అయివున్నాయి. ఇక పొందవలసినదేమున్నది? తొలగవలసినదేమున్నది? నా గురుదేవులగు వీరు

ఓ మునీంద్రా! “యథార్థ సందర్శనము” అనే పవిత్రదృష్టిని కలిగి ఉన్న జ్ఞానియొక్క దృష్టిలో ఈ జగత్తు భాసిస్తూ కూడా భాసించనిదే అగుచున్నది. ఇదంతా ఆతనికి దృశ్యశూన్యమగు పరమార్థ చిదాకాశముగానే గోచరిస్తోంది. ఇక అజ్ఞానుల దృష్టియందు ఏది ఎట్లా ఉంటే మాత్రం ఏమున్నది? అద్దానిని గురించి మనం ఇప్పుడు విచారించవలసిన పనేమున్నది? మనకేం ప్రయోజనం? అందుచేత జ్ఞానుల దృష్టితోనే నేను చూస్తున్నాను. ఇదంతా దృశ్యరహిత - నిర్వికార చిదాకాశమే! అనునదే నా ప్రస్తుతానుభవం! ఇంతకు మించి ఏ విశేషమూ ఎక్కడా లేదని నేను తృప్తిపొందాను.

Page:735

  1. జగత్తుకు ఉత్పత్తి లేదు. స్థితి లేదు. ఇక ఉపశమనమెక్కడిది?

శ్రీరాముడు : హే మహాత్మా! సందేహాలన్నీ తొలగితే… ఇక ఆపై “స్వప్నంలో దృశ్యము చిదాకాశమే అయినట్లుగా… ఈ జాగ్రత్తులో దృశ్యం కూడా అట్లాగే చిదాకాశరూపమే” అని సుస్పష్టంగా తెలియవస్తోంది. అందుకు ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని తొలగించుకోవటమే ఆధ్యాత్మ శాస్త్రము యొక్క అధ్యయనోద్దేశం.

మీరు అన్నీ సవివరణగా చెప్పారు. ఇంక సందేహమంటూ ఏదీ మిగలనే లేదు. అయినప్పటికీ మరికొంత మీ వద్దనుండి వింటే బాగుంటుందని మా మనస్సు ఇంకా ఉత్సాహపడుతోంది. అందుచేత మాత్రమే ఇక్కడ ఒక ప్రశ్నను మన ఈ సంవాదములోనికి కొనితెస్తున్నాను.

చిన్మాత్రము, దేహరహితము, కూటస్థము - - అద్వయము కదా! అట్టి చిన్మాత్రము జాగ్రత్

- - స్వప్న - సుషుప్తి సమయాలలో జాగ్రత్ దేహం స్వప్నదేహం ఎందుకు ధరిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం ప్రసాదించ ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జాగ్రత్ - స్వప్నములలో రెండింటిటో కూడా… దృశ్యము కారణరహితమై ఉత్పన్నం అవుతోంది. కాబట్టి ఇదంతా శూన్యమే ఆధారముగా కలిగియున్నది. అనగా… శూన్యరూపమే అయివున్నది. అట్టి ’శూన్యము’నకు ఆధారమేమిటి? పరబ్రహ్మమే గాని, మరింకొకటేదీ కాదు! కాబట్టి ఈ “జగద్రూప వివర్తము” వల్ల బ్రహ్మం యొక్క అద్వైత తత్త్వమునకు వచ్చే హాని ఏదీ లేదు! సృష్ట్యాదిలో పరబ్రహ్మమునకు వేరుగా మరింకేదీ శేషించియే ఉండదు. బ్రహ్మమున వేరై “పంచభూతాలు” అనే కార్యం సంభవించజాలదు. పంచభూతాలే లేనప్పుడు, ఇక ఈ భూమి-దేహములు ఎక్కడివి? కాబట్టి, పంచభూత సమూహంగా కనిపిస్తున్న ఈ దేహాలన్నీ సృష్ట్యాదినుండి చిదాకాశ రూపములే అయివున్నాయి. చిదాకాశమే “స్వస్వరూపమాత్ర స్ఫురణము అను మాయా గుణముచే ఆకారవంతముగా విక్షుబ్దమై ఈ జగత్తు యొక్క “ఆభాస”ను తనయందు తానే గాంచుచున్నది.

చిదాకాశము యొక్క ఆభాస (లేక) స్ఫురణయే… స్వప్నదర్శనం. జగదాకారమగు చిదాకాశం యొక్క “ఆభాస” యే “స్వప్నము - వివర్తము - జగత్తు” … ఇటువంటి శబ్దములతో చెప్పబడుతోంది. జాగ్రత్ = చిదాకాశమునందు స్వకీయమైన భావావేశం చేత స్థూలరూపంగా భాసించే నామరూపాత్మక వస్తుతత్వం.

స్వప్నము = చిదాకాశమునందు సూక్ష్మరూపంగా భాసించే జగద్రూపం.

వాస్తవానికి ఈ రెండు కూడా నిర్మల చిదాకాశరూపములే అయివున్నాయి. చిద్రూపమే తనయొక్క ‘వ్యాపము’ అనే “చిత్స్వభావ స్ఫురణ”… యందు ఈ భిన్న విభిన్నములైన “ఆకాశంభూమి-గ్రామం-నగరం”… ఇత్యాది (భిన్న భిన్న) నామములన్నీ కల్పించుకుంటోంది.

Page:736

ఈ ప్రకారంగా…

1. “చిదాకాశము యొక్క స్ఫురణ”యే “స్వప్న జగత్ రూపం”, “జాగ్రత్ జగత్ రూపం” అనే శబ్దములచే చెప్పబడుతోంది.

  1. అట్టి “స్ఫురణ” అనబడేది అధిష్ఠాన దృష్టిచే ఆ చైతన్యము యొక్క స్వభావమే అయివున్నది. ఓ సభికులారా! ఈ స్వప్న - జాగ్రత్తులు జనించనప్పుడు - జనిస్తున్నప్పుడు - నశిస్తున్నప్పుడు కూడా చిదాకాశం యథాతథం. ఆ మన చిదాకాశ స్వరూపం జనించదు. నశించదు. శూన్యత్వము ఆకాశమునందు వర్తిస్తోంది చూచారా? అట్లాగే బ్రహ్మాకాశమునందు బ్రహ్మరూపములే అగు భిన్నభిన్న సృష్టులు జనిస్తున్నాయి. ఉంటున్నాయి. నశిస్తున్నాయి.

శ్రీరాముడు : మహాత్మా! మీరు ఆయా (లీలోపాఖ్యానం మొదలైన) ఉపాఖ్యానాలు చెప్పుచున్నప్పుడు అనేక రకములైన బ్రహ్మాండముల గురించి చెప్పియున్నారు. అందులో కొన్ని భౌతికములు, మరికొన్నేమో మానసికములు. కొన్ని వాయుగోళములలోను, కొన్ని తేజః కోశంలోను, కొన్ని ఒక శిలలోను… ఇట్లా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి కదా! ఈ భూమి ఊర్ధ్వంలో పాదములు - అధోభాగంలో శిరస్సు కలిగి ఉన్నదై అనేక జీవరాసులతో నిండి ఉన్నది. ఆయా బ్రహ్మాండాలు కొన్ని గృహాకాశంలోను, మరికొన్ని పక్షులవలె ఆకాశంలో వ్రేలాడుతూ ఉన్నాయి. స్వామీ! అటువంటి అనేక సృష్టులలో మనం ఉన్న ఈ బ్రహ్మాండము ఏ రీతిగా స్థితి కలిగి ఉన్నదో… అది తెలుప ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి :

యత్ అపూర్వం, అదృష్టం వా, నా నుభూతం న వా శ్రుతమ్ | తద్వర్ణ్యతే సుదృష్టాంతైః గృహ్యతే తే చ తదూహ్యతే ॥

ఓ రామచంద్రా! మన సంభాషణకు ముఖ్య విషయం బ్రహ్మ వస్తువు కదా! అట్టి బ్రహ్మము… అనునిత్యమైనది పూర్వం లేనిది - ఇప్పుడు క్రొత్తగా లభించేది కాదు. అదృష్టం భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదు. నా నుభూతం ఇంద్రియములకు అనుభూతమయ్యేది కాదు. మనస్సుకు కూడా అది విషయం కాదు. నవాశ్రుతమ్ ఎవరైనా చెప్పితే తెలిసేది కాదు. అది ప్రత్యక్షము, అనుమానము, ఆగమము మొదలైన అన్నీ ప్రమాణములకు అతీతమైనది.

అట్టి పరబ్రహ్మమును ఉత్తమ గురువు అనేక దృష్టాంతముల సహాయంతో బోధిస్తున్నారు. ఉత్తమ శిష్యుడు శ్రవణ మనన నిధిధ్యాసలచే చింతించుచూ, క్రమంగా గ్రహిస్తున్నాడు.

ఇక ఈ మన బ్రహ్మాండం గురించి అంటావా? ఈ బ్రహ్మాండం గురించి జ్యోతిష్యాది శాస్త్రాలు అనేక విశేషాలు విశదీకరించి చెప్పుచున్నాయి. అట్లాగే మునులచేత, దేవతలచేత అనేక వర్ణనముల ద్వారా విశదీకరించబడుతోంది. అవన్నీ నీవు విద్యాధ్యయన సమయంలోను, మన ఈ సంవాదము సందర్భంగాను అనేక విషయాలు వినటం జరిగింది. కనుక నీవు ఎరిగియే ఉన్నావు. ఇక ఈ బ్రహ్మాండం ఏ ప్రకారంగా స్థితి కలిగియున్నదో, అదంతా క్రొత్తగా ఇప్పుడు చెప్పవలసినదేమీ లేదు. ఈ బ్రహ్మాండము చిదాకాశ స్వరూపమే! అట్లాగే తదితర బ్రహ్మాండములు కూడా! ఇటువంటి

Page:737

బ్రహ్మాండముల వ్యవహారమంతా కూడా పరబ్రహ్మము యొక్క స్వభావమే అయి, పరబ్రహ్మమునకు అనన్యమై ఉన్నాయని మాత్రం ఇప్పుడు గ్రహించు.

శ్రీరాముడు : అయితే హే మహర్షీ! చిదాకాశ రూపమగు బ్రహ్మము ఈ బ్రహ్మాండాకారంగా ఎట్లా అగుచున్నదో… అది చెప్పండి. ఈ బ్రహ్మాండము ఎంతటి పరిమాణము కలిగి ఉన్నదో, ఎంత కాలం వరకు ఇది ఈ ప్రకారంగానే ఉంటుందో… అట్టి వివరాలు తెలుప ప్రార్థన!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బ్రహ్మము ఆది మధ్యాంత రహితము. నిత్యము, అవ్యయము. అట్టి బ్రహ్మరూపమగు బ్రహ్మాకాశమునకు “ఆది-మధ్య-అంతము”… అనునవేవీ లేవు. అద్దానియందు ‘ఆకారము’ అనే వికారమే లేదు. అట్టి బ్రహ్మాకాశము అనాది-అనంతము-అవ్యయముసర్వవ్యాపకము అయివున్నది. ఇక ఈ జగత్తంటావా… ఇది బ్రహ్మమే అయివున్నది. కాబట్టి ఈ జగత్తు కూడా ఆద్యంతరహితమై, సర్వవ్యాపకమై వెలయుచున్నది. ఆ పరమ చిదాకాశము “తన యందలి తన యొక్క” స్ఫురణమునకు తానే స్వయంగా ‘జగత్తు’ అనునదిగా పొందుచున్నది. అయితే, ‘జగత్తు’ అనబడేది చిదాకాశమునకు అన్యంగా మిథ్యయే! మనుజునకు స్వప్నంలో ఒక నగరం కనిపించటం ఎటువంటిదో… ఈ దృశ్యం కూడా అటువంటిదే! “చైతన్యం యొక్క స్ఫురణయే ఈ జగత్తు” అని విజ్ఞులు సుస్పష్టంగా నిర్వచిస్తున్నారు. అట్టి చిదేక స్వభావమగు బ్రహ్మమునందు అందుకు విరుద్ధములైన పర్వత కాఠిన్యములు, జలద్రవత్వములు… ఇవన్నీ లేవు. అయితే అవ్యయమగు చైతన్యం మాయతో కూడుకొని ఎద్దానిని ఎట్లు ఏ రీతిగా ఎరుగుచున్నదో… అది అట్లే ఆ రీతిగా (పర్వతాది రూపాలుగా) స్థితి నొందియున్నదగుచున్నది.

అట్టి చైతన్యం ‘శిల - ఆకారము’ మొదలైనవిగా తాను అగుచుండకపోయినప్పటికీ స్వప్నంలో శిలను, ఆకాశమును దర్శిస్తోంది కదా! స్వప్నద్రష్ట స్వప్న పదార్థములుగా అగుచున్నాడా? లేదు. ఆతడు పదార్థ రూపుడుగా కాకపోయినప్పటికీ అవన్నీ అనుభవముగా పొందుచున్నాడు కదా! అట్లాగే… చైతన్యము తాను దృశ్యము కాకపోయినప్పటికీ జాగ్రత్తు నందు దృశ్య జగత్ రూపంగా ఈ సర్వము తనయందు తనకు అనన్యంగా పొందుతోంది.

నిరాకారము, పరమశాంతము అగు చైతన్యము తన యొక్క నిజ స్ఫురణచే స్వప్నము వంటి దృశ్యమును ఎరుగుచున్నది. చైతన్యము యొక్క నిజస్ఫురణమగు స్వకీయ దర్శనమే ఈ “జగత్తు” అనే పేరుతో ప్రసిద్ధమైయున్నది.

కాబట్టి మనకు కనిపించే ఈ జగత్తంతా కూడా చైతన్య రూపమే! చైతన్యము వలెనే ఇది కూడా నిరాకారము, సద్రూపము అయి ఒప్పుచున్నది. ఈ విషయం నేను అనేకసార్లు సిద్ధాంత పూర్వకంగా చెప్పియే ఉన్నాను కదా!

వాయువు యొక్క స్పందం (చలనం తరంగాలు) సదా వాయురూపమే అయి వాయువునందే ఉండి ఉన్నాయి కదా! వాయువులో తరంగాలు పుట్టటమెక్కడ? నశించటమెక్కడ? వాయువుకు వేరుగా తరంగాలు ఉన్నదెక్కడ? అట్లాగే బ్రహ్మము నందు ఈ జగత్తుగాని, మరొక జగత్తుగాని ఉదయించక - అస్తమించక వెలయుచున్నాయి.

Page:738

ఓ రామచంద్రా! వాయువునందు వాయుతరంగత్వం ఎట్లా ఉన్నదో… జలమునందు ద్రవత్వం ఎట్లా ఉన్నదో… ఆకాశమునందు శూన్యత్వం ఎట్లా ఉన్నదో… వస్తువునందు వస్తుత్వం ఎట్లా ఉన్నదో… అట్లాగే… బ్రహ్మమునందు జగదత్వం ఉన్నది.

న ప్రయాతం న వా యాతమకారణమకారణాత్ | న చ నాస్తి నవాస్తీదం భిన్నం బ్రహ్మపదే జగత్ II

బ్రహ్మము సర్వదా కారణరహితం! ఈ జగత్తు కూడా మొదలే కారణరహితం! అందుచే ఈ జగత్తు సృష్టికాలంలోనే బ్రహ్మమున ఆవిర్భవించి ఉండనే లేదు. ఇక మధ్యలో మాత్రం ఎక్కడున్నది? ఇక ఇది ప్రళయకాలంలో నశించటమనేది ఎక్కడ?

అంతే కాదు!… ఇది బ్రహ్మమున “ఉన్నది” అని గాని, “లేదు” అని గాని చెప్పటానికి వీలే లేదు. జగత్తుకు కారణం ఎక్కడిది? ఎందుకంటే “అనాది - అభాసవర్జితము - నిరాకారము” అగు చిదాకాశము జగత్తుకు కారణమెట్లా అవుతుంది? అవజాలదు.

కాబట్టి రామచంద్రా! ఒక “అవయవి”కి ఈ అవయవములు ఎట్లాగైతే “నిజస్వరూపములే” అయివున్నాయో… ’వేరు’ కాకయే ఉన్నాయో… అట్లా… అవయవరహితము, నిరాకారము, చిదాకాశ రూపము అగు బ్రహ్మమునందు “చిదాకాశరూపమే” అగు ఈ జగత్తు (బ్రహ్మమునకు అభిన్నమై) స్థితినొంది యున్నది.

సర్వం శాంతం నిరాలంబం జ్ఞప్తిమాత్రం అనామయమ్

నేహ సత్తా న వాసత్తా న చ నానాస్తి కించన||

ఈ జగత్తుగా కనిపించేదంతా కూడా "శాంతం, నిరాధారం, నిర్వికారం” అయినట్టి చిన్మాత్ర బ్రహ్మమే అయివున్నది. ఇక్కడిక బ్రహ్మం కంటే వేరైన ‘సత్త’ గాని, ‘అసత్త’ గాని, ఏకత్వ- అనేకత్వాలు గాని కించిత్ కూడా లేవు (నే 2 హనానాస్తి కించన -శ్రుతివాక్యం). సంకల్పాలోని దృశ్యంలాగా, స్వప్నంలోని నగరంలాగా ఈ జగత్తంతా కూడా “సమం, శాంతం, జన్మరహితం, అవ్యయం, సర్వవ్యాపకం” అగు చిదాకాశమే! చిదాకాశం గానే చిదాకాశమునందు స్థితి కలిగి ఉన్నదైయున్నది.

ఓ రామచంద్రా! “స్వచ్ఛం, ప్రకాశరూపం, సారభూతం” అయినట్టి చిదాకాశ స్వరూపం తన యొక్క చిత్స్వభావం వలన భ్రాంతిచే జగత్తుగా… స్ఫురిస్తోంది. అట్లు తన కల్పాంతం వరకూ స్వకల్పితమగు తన రూపమునే తన జగత్తుగా ఎరుగుచున్నది.

  1. ప్రజ్ఞప్తిరాజు - - మహాప్రశ్నలు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ ‘జగత్తు’ అనబడేది కారణము లేకయే చిదాకాశమునందు భాసిస్తోంది. కనుక ఇది వాస్తవానికి కించిత్ కూడా లేదు. పరమార్థమగు బ్రహ్మమే యథార్థానికి

Page:739

ఇట్లు (నామ రూపాత్మకంగా) స్థితి నొందినట్లుగా ఉన్నది. ఈ విషయమే ఒకానొక సమయ - - సందర్భములలో నన్ను అడిగితే, నేను ఆ ఒకానొక మహాప్రశ్నకు చెప్పిన సమాధానం ఇప్పుడు చెపుతాను. సమ్యక్ - జ్ఞానము యొక్క పుష్టి కొరకై విను.

కుశద్వీపమున ‘జల’ అనే పట్టణమును రాజధానిగా కలిగి “ప్రజ్ఞప్తి" అనే మహారాజు ఒకాయన పాలిస్తూ ఉండేవారు. ఏదో కారణవశంగా నేనారాజును దర్శించటం జరిగింది. ఆయన నాకు పుష్ప - అర్ఘ్య - ఆచమనీయాదులతో పూజించి ఉత్తమ ఆసనం సమర్పించారు. ఆ తరువాత ఏదో ప్రసంగ సందర్భంలో నన్నిట్లా ప్రశ్నించారు.

శ్రీ ప్రజ్ఞప్తి మహారాజు : మహాత్మా! శ్రీ వసిష్ఠ మునీంద్రా! ఇప్పుడు నాకుగల కొన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో మీ ముందు ఉంచుతాను. ప్రళయ కాలంలో సర్వనాశనం సంభవిస్తోంది కదా! అప్పుడు ఈ భూమి మొదలైనవన్నీ నశిస్తున్నాయి. అంతా శూన్యమైపోగా, ఇక అనిర్వచ్యము అగు చిదాకాశం మాత్రమే శేషిస్తోంది కదా! ఆ తరువాత మరల సృష్టి యొక్క ఆరంభానికి మూలకారణం (ఉపాదాన కారణం) ఏదై ఉన్నది? సహకారి కారణాలు ఏవి? సర్వము నశించియే పోగా ఇక సహకారి కారణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి.

ఉదాహరణకు… కుండ తయారవటానికి మూలకారణం- మట్టి. సహకార కారణం -

కుమ్మరి, సారె మొదలైనవి. సృష్టియే లేనట్టి సమయంలో ఏ కుమ్మరి ఏ మట్టితో ఏ సారెను ఉపయోగించి ఈ సృష్టి అనే కుండను తయారుచేస్తున్నాడు?

హే మహర్షీ! ఈ జగత్తు వాస్తవానికి ఏమైయున్నది? “సృష్ట్యాది’ నుండి ”ప్రళయాంతము” వరకు ఇది ఏ ఏ వికారములు పొందుతోంది? ఈ సృష్టులలో కొన్ని నిరంతరం చీకటితో నిండి ఉన్నాయి. కొన్ని ఆకాశము, సముద్రములను కలిగియుండి అనేక క్రిమి కీటకములకు ఆలవాలమై ఉన్నాయి. మరికొన్ని ఆకాశకోశంలో ఉన్నాయి. ఇంకొన్ని శిలలయొక్క గర్భభాగంలో ఏర్పడినవై ఉన్నాయి. అసలీ వైచిత్రమంతా ఏమిటి? దీనికంతా కారణమేమిటి?

ఈ భూమి మొదలుగా గల పంచభూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? అటువంటి ఈ భూమిపై అండజ-బీజజ - వాయుజ - శ్వేదజ - గర్భజాది ఆయా విధములై ప్రాణి సమూహాలు ఎట్లా వచ్చాయి? ఎట్లా ఉద్భవించాయి? ఇవన్నీ వాస్తవానికి ఏమైయున్నాయి?

ఇది ఇట్లా ఉండగా, ప్రతి జీవునియొక్క అంతఃకరణ రూపములైనట్టి ఈ మనస్సు-బుద్ధిచిత్త-అహంకారాలు ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క రీతిగా ఎట్లా రూపం దిద్దుకుంటున్నాయి? లోకాలన్నిటికీ కర్త ఎవరు? ద్రష్ట ఎవరు? దేని యొక్క ఆధార - - ఆధేయత్వములచే ఇవన్నీ సంభవిస్తున్నాయి?

వేద - శాస్త్ర - పురాణముల అర్థమును అనుసరించి ఈ ఈ ప్రాణులన్నీ కూడా తమ ఇతః పూర్వపు కర్మలను బట్టే వ్యవహారములలో ప్రవర్తిస్తున్నాయి కదా! ఈ తతంగమంతా ఎట్లా ప్రవర్తిస్తోంది? ఆ కర్మల ప్రయోజన ప్రదాత ఎవరు? ఎక్కడుంటారు? ఆయనను సృష్టించిందెవరు? ఆయన ఇదంతా ఎందుకు నిర్వర్తిస్తున్నారు?

Page:740

ఈ జగత్తులకు ‘మహానాశనము’ అనబడేది ఏదైనా నిజంగా ఉన్నదా? లేదా? "జ్ఞానమును అనుసరించే అనుభవములు కలుగుచున్నాయి!” …అని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు కదా! అనగా, జ్ఞానమే దేహాదులకు కారణమా? లేక, ఈ దేహాదుల నిర్మాణమునకు మరొకటేదైనా కారణం ఉన్నదా? ‘జ్ఞానమే’ ఈ ఉపాధులకు కారణమని అనుకుంటే… అప్పుడు ఆ జ్ఞానము నిత్యమా? అనిత్యమా? ఒకవేళ ’జ్ఞానము’ నిత్యమే అయితే, అది కూటస్థమే అగుచున్నది కదా! అట్టి దానినుండి వికారవంతములగు ఈ దేహాదులు ఎట్లా కలుగుచున్నాయి?

అలా కాకుండా “జ్ఞానము అనిత్యము” అని అంటారా? అట్లా అయితే అద్దాని ఉత్పత్తికి కారణమేమిటో చెప్పవలసి ఉంటుంది! ఆ ఆ కారణము ఏమిటో జ్ఞానము లేకపోతే గుర్తించబడజాలదు కదా? జ్ఞానము దేహమునకు కారణమా! దేహమే జ్ఞానమునకు కారణమా?

దేహమే జ్ఞానమునకు కారణమైతే దేహముతోపాటే జ్ఞానము కూడా నశించాలికదా? అనగా దేహానంతర లోకములుగా చెప్పబడే స్వర్గ - నరకాదులు లేవనియా? ఉన్నాయని కొన్ని పురాణాలు ప్రతిపాదిస్తున్నాయి కదా? జ్ఞానము లేకపోతే మరణానంతరం అవి అనుభవానికి రావు కదా?

సరే! కాసేపు దేహానంతర లోకాలైన స్వర్గ - - నరకాదులు ఉన్నాయని అనుకున్నామనుకోండి. మాత - పితాది కారణాలు లేకుండానే అనుభవమయ్యే స్వర్గ - - నరకాదులు ఈ జీవుడు మరణించిన తరువాత ఏ దేహంతో అనుభవిస్తున్నాడు? వాటికి ఉపాదాన - సహకారికి కారణాలేమై ఉన్నాయి?

ధర్మ - అధర్మాలు రూపరహితం కదా! అవి మూర్తిమంతములగు ఈ దేహాదులకు కారణాలు అగుచున్నాయా? అవటం లేదా? అయితే ఎట్లా అగుచున్నాయి? ఈ దేహాలు నిర్మిస్తున్నదేది? అట్లా నిర్మించేది పదార్థ రహితమా? అవేవన్నా దేహాదుల నిర్మాణానికి కారణమౌతూ ఉంటే… మరి మాతా - - పితల పాత్ర ఏమిటి? పదార్థ రూపమే ఈ దేహం కదా! అట్టి పదార్థమునకు తండ్రి ఎవరు? తల్లి ఎవరు?

ఈ శరీరాలు ఎవరు నిర్మిస్తున్నారు? ఈ దేహాదులు నిర్మితమటానికి మరింకేదైనా కారణము లున్నాయా? ఈ పదార్థాలన్నీ ఎట్లా సంభవిస్తున్నాయి? “ధర్మాధర్మములు లేవు” అనే నాస్తికుల మతం సరియైనదా? కాదా? ‘పరలోకం’ అనేది ఉన్నదా? పరలోకం ఉండి ఉన్నదనుకొంటే, ఈ జన్మ పూర్వజన్మకు పరలోకమే కదా? అయితే ఈ జన్మ “సంవేదము (లేక) జ్ఞానము”ను అనుసరించే ఉన్నది కదా! కనుక జ్ఞానమే ఇహలోక - పరలోక రూపములు కదా?

“పరలోకము లేదు” అని నాస్తికులు చెప్పేది వేదాదులకు, లౌకికానుభవానికి అసమంజసమని, విరుద్ధమని అనిపిస్తోంది. ఇంతకీ పరలోకం ఉన్నదా? లేదా? ఉంటే ఈ బ్రహ్మాండంలోనిదా? వేరే మరొక బ్రహ్మాండంలోనిదా? ఈ జన్మకు పూర్వజన్మ ఉన్నదా? ఉంటే అప్పటి కర్మలు ఇప్పటి ప్రయోజనాలకు కారణమౌతాయా?

వరములు - శాపములు ఎట్లా ప్రభావితమై ఉంటున్నాయి? శాస్త్రములు “ఇది చేయండి - ఇది చేయకండి" అని విధి నిషేధములు ప్రకటిస్తున్నాయి. కొందరు “ఈ విధి -నిషేధములు

Page:741

పాటించాలి! లేకపోతే ముందు ముందు దుష్ఫలితాలు ఉంటాయి” అని అనుకుంటున్నారు. మరి కొందరో… “విధి-నిషేధములు శాస్త్ర కల్పితాలు. అవి అనుసరించకపోయినా ఏమీ కాదు. పాప పుణ్యాలు లేవు"… అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. విధి-నిషేధములు, పాప-పుణ్యములు ముందు ముందు ఫలవంతములు అవుతాయా? అయితే ఎట్లా అవుతాయి? శాస్త్రములు చెప్పే విధి-నిషేధముల ప్రయోజనం ఏమిటి?

కొందరు మహనీయుల ఆశీర్వాద మాత్రంచేత ధనధాన్యములు లభిస్తాయని కొందరనుకొంటూ వుంటారు. అట్లా మునులు మొదలైనవారు ఆశీర్వదించినంత మాత్రం చేత ధనాదులు నిజంగా లభిస్తాయా? ఎట్లా లభిస్తాయి? కష్టాలు, విఘాతాలు, నిరోధాలు తొలగుతాయంటారు. ఎట్లా

తొలగుతాయి?

శ్రుతులలో కొన్ని కొన్ని పరస్పర విరుద్ధములైన అర్థములు ప్రతిపాదించే కొన్ని మూల సూత్రములను వేరు వేరు చోట్ల చెప్పుచున్నాయి.

మాయాంతు ప్రకృతి విద్ధి! మాయి నంతు మహేశ్వరమ్ - ఈ జగత్తు / ప్రకృతి ‘మాయ’ అయి ఉన్నది.

అసదేవే౨దమగ్ర ఆసీత్ తతో వైనద జాయతే - సృష్టికి పూర్వం ‘అసత్’ మాత్రమే ఉన్నది. అద్దాని నుండి సత్ స్వరూపమగు ఈ జగత్తు జనిస్తుంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ - ఈ జగత్తంతా కూడా ఏకము, సద్రూపము అయినట్టి ‘బ్రహ్మమే’ అయి ఉన్నది.

నాసదాసీన్నోసదాసీత్తదానీమ్ - ఈ సృష్టికి పూర్వం సత్తుగాని, అసత్తు గాని లేదు. -

సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ - ఈ సృష్టికి పూర్వం ‘సత్’ మాత్రమే ఉన్నది.

…ఇవన్నీ పరస్పరం అసంగతంగాను, పరస్పరం విరుద్ధంగాను ఎందుచేత శ్రుతులలో (వేదములలో) చెప్పబడ్డాయి.

సృష్ట్యాదిలో అంతా పదార్థశూన్యం కదా! అట్టి పదార్థ శూన్యమగు చిదాకాశం నుండి సాకారుడు, గుణ సమన్వితుడు అగు బ్రహ్మదేవుడు ఎట్లా ఉత్పన్నమైనాడు? చిదాకాశానికి "బ్రహ్మదేవుడు ఉదయించటం” అనే చమత్కారం కలిగియే ఉన్నదంటారా? అట్లా అయితే చిదాకాశము సర్వత్రా, సర్వదా వర్తిస్తోంది కదా! మరి సర్వస్థానముల నుండి బ్రహ్మదేవుడు ఉత్పన్నం అవటం లేదేం?

‘చిదాకాశము’ సర్వదా ఏకము, ఏకైకము కదా! అద్దాని నుండి ఉదయించిన ఓషధులు (ఆమ్ల - క్షార లక్షణములుగల మొక్కలు) భిన్నభిన్నములుగా ఉంటున్నాయేం? చిన్న చిన్న బీజములను ఉత్పన్నం చేసే వేరు వేరు స్వభావములు కలిగి ఉంటున్నాయేం? అట్లాగే అగ్ని ఉష్ణంగాను, జలము శీతలంగాను పరస్పర విరుద్ధ స్వభావములు ఎట్లా ఏర్పరచుకొని ఉంటున్నాయి?

“ఈ జగత్తంతా మనోభావనా మాత్రము, ఏ జీవుడు దేనికై తీవ్రంగాను, సుదీర్ఘంగాను భావన చేస్తే అది అట్లే పొందుతూ ఉంటాడు" … అని ఉపనిషత్తులు మొదలైన వేద - వేదాంత

Page:742

విభాగాలు చెప్పుచున్నాయి. ఒక వ్యక్తి తీర్థములను - ఇష్ట దైవమును సేవిస్తూ “ఈ నా శత్రువు నశించాలి” అని కోరుకుంటున్నాడనుకోండి. అదే వ్యక్తి ఆతని బంధువు “ఈతడు కలకాలం జీవించాలి’ అని కోరుకొంటూ ఇష్టదైవమును - తీర్థములను సేవిస్తున్నాడనుకోండి. ఇప్పుడు ఆ శత్రు - బంధువుల విరుద్ధ స్వభావముతో కూడిన కార్యములు ఎట్లా సంభవించ గలుగుతాయి? అసలు తీర్థములు సేవిస్తే అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయా? ఎట్లా జరుగుతుంది?

ఎప్పుడు ఎట్టి భావన చేస్తే అది అట్లే అగుచున్నది. (యద్భావం - తత్భవతి)… అని శ్రుతి వాక్యం కదా! ఇప్పుడు “ఆకాశంలో నేను పూర్ణ చంద్రుడుగా అగుదును గాక!” - అని అనేకమంది ఉపాసనా విధిని అనుసరించి ధ్యానిస్తే… అప్పుడు ఏకకాలంలో వారంతా అనేక చంద్రులుగా అయి ఆకాశంలో కనిపిస్తారా? అప్పుడు ఈ ఆకాశంలో అనేక చంద్రబింబాలుంటాయా?

ధ్యానము ఆశయమును సిద్ధింపజేస్తుందని… అంటారు కదా! అనేకమంది ఒకే స్త్రీని ఉద్దేశించి “ఈమె నా భార్య కావాలి"… అని ధ్యాన - - ఉపాసనలకు ఉపక్రమించారనుకోండి. అప్పుడు ఆ వేలాది మంది ధ్యానం ఎట్లా ఫలిస్తుంది? భిన్న భిన్న గృహములలో వేరువేరుగా అయి ఆమె వారందరికీ గృహిణిగా వర్తించజాలదు కదా! ఇది ఇట్లా ఉండగా, ఆ స్త్రీ “నేను బ్రహ్మచారిణిగా ఉండాలి” అని తపస్సు - ధ్యానములకు ఉపక్రమించిందనుకోండి. ఇప్పుడు ఆమె బ్రహ్మచారిణిత్వము - - బహు భర్తృ భోగ్యత్వము రెండూ ఎట్లా పొందగలుగుతుంది?

ఒక దంపతులలో భార్య “ఈతడు ఈ గృహం నుండి ఎప్పటికీ బయటకు వెళ్ళకూడదు” అని, భర్తేమో ”నేను సప్త ద్వీపములతో కూడిన ఈ భూమండలమునకు చక్రవర్తి కావాలి” అని ఒకేసారి ఉపాసనకు ఉపక్రమించి తపోధ్యానములు ప్రారంభించారనుకోండి. అప్పుడు ఆ ఇద్దరి ఆశయము ఒకేసారి సిద్ధించటమెట్లా? ఆ భార్య కోరికను అనుసరించి భర్త ఇంట్లోనే ఎట్లా ఉంటాడు? భర్త తన ఆశయం అనుసరించి సప్తద్వీపములతో కూడిన భూమండలం ఎట్లా పరిపాలిస్తాడు.?

కొందరు వారి వారి తండ్రి - తాతలను ఉద్దేశించి పితృకార్యాలు నిర్వర్తిస్తున్నారు. దాన - ధర్మ - తపస్సులు సమర్పిస్తున్నారు. అటువంటి ఔర్ధ్వ దేహిక కర్మల ప్రయోజనం వారు నిర్వర్తించిన చోటే ఉత్పత్తి అవుతాయి కదా! అట్టి క్రియా ఫలాలు పరలోకం ఎట్లా ప్రయాణిస్తాయి? ఊర్ధ్వలోకాలలో గల పితృ దేవతలను ఎట్లా జేరుతాయి?

ఈ శరీరాలు కనబడుచున్నాయి. మరి పుణ్యపాపాలు కనిపించటం లేదు. కంటికి కనబడని (అదృష్టములగు) పుణ్య-పాపాలు కంటికి కనిపించే దేహాలపై ప్రభావం ఎట్లా చూపుతాయి? ఈ జీవుడు ఇహ పర లోకములలో అమూర్తిమంతుడై (ఆకార రహితుడై) ఉన్నాడు. దేహికి ఆకారం లేదు కదా! ఇక దేహం ఆకారం కలిగివున్నది. ఏ దేహంతో పాపపుణ్యాలు చేస్తున్నాడో… ఆ దేహం ఇక్కడే నశిస్తోంది. ఆకార సహితమైన దేహముతో చేసే పుణ్యపాపాలు దేహం నశించిన తరువాత ఆకార రహితుడగుదేహిని వెన్నంటి పరలోకములకు ఎట్లా ప్రయాణిస్తాయి?

అసలీ పుణ్యపాపాలు మరణానంతరం దేశాంతరంలో కాలాంతరంలో ఫలాలు ఎట్లా ఇవ్వగలుగుచున్నాయి?

Page:743

హే మహాత్మా! వసిష్ఠ మహర్షీ! నాకు ఇక్కడ అనేక అసమంజసమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ నాకు అనేక సందేహములను కలుగజేస్తున్నాయి. హే మహానుభావా! మీ అమృత తుల్యమైన వాక్కుచే నా ఈ సందేహాలు తొలగించండి. ఇవన్నీ నేను చాలా మందిని అడిగాను. అయితే సందేహాలు తీరలేదు. స్వామీ! “పరమాత్మ వస్తువు యొక్క ఉపదేశం పొందితే అన్ని అనుమానాలు అవే పోతాయి” అని మా రాజ్యంలోని పెద్దలు అంటూ ఉంటారు. అద్దానిచే ఉభయ లోకములలో శ్రేయస్సు లభిస్తుందని విన్నాను. "ఆత్మతత్త్వము యొక్క ఉపదేశము గ్రహిస్తే విరుద్ధ ఫలములన్నీ అవిరుద్ధంగా అయిపోతాయి”… అని విని ఉన్నాను. కాబట్టి నాకు “పరమాత్మవస్తువు” అగు బ్రహ్మమును గురించి బోధించండి. ఎందుకంటే తమ వంటి మహా పురుషులతో ఈ కొద్దిసేపు సాంగత్యం వృథా కాకూడదు కదా! మీతో ఈ సాంగత్య సంభాషణలు నాకు మహత్తరమైన ప్రయోజనమును ప్రసాదించగలవని ఎరిగియే ఉన్నాను. అందుకే మీ పాదములను స్పృశిస్తూ ఈ “పరస్పర విరుద్ధ విషయములు” అనే మహాప్రశ్నలను మీ ముందు ఉంచాను. మీ సమాధానం శ్రద్ధగా ఆలకించి పునీతుడను కాగలను.

  1. జగత్తుగా భాసించేదంతా చిదాకాశమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ ప్రజ్ఞప్తిరాజు వినిపించిన “పరస్పర విరుద్ధములు” గురించిన మహా సందేహములన్నీ విన్నావు కదా!

శ్రీరాముడు : విన్నాను స్వామీ! అందుకు మీరిచ్చిన ప్రత్యుత్తరమేమిటో వినాలని కుతూహలంగా

ఉంది.

శ్రీ వసిష్ఠ మహర్షి : అయితే, ఇక విను.

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఇప్పుడు నీకు ఆత్మతత్త్వము స్పష్టమయ్యేటట్లుగా విశదీకరిస్తాను. ఇది వింటే నీ సందేహాలన్నీ ఒక్క వేటితో నిర్మూలనమై పోతాయి.

ఈ “జగదనుభవమంతా ఏమిటి?” అనేది అర్థం చేసుకోవటానికి వీలుగా ముందుగా ఈ మొత్తాన్ని రెండుగా విడదీసి చూద్దాం.

  1. అనుభవము పొందుచున్నవాడు (అనుభవజ్ఞుడు “సంవిత్తు”)

  2. అనుభవరూపంగా పొందబడుచున్నది. (అనుభవములు "సంవేదము”)

ఈ జీవుడు సంవిత్ స్వరూపుడే! అట్టి ఈ జీవుని (లేక సంవిత్తు) యొక్క అనుభవమును అనుసరించే ఈ జగత్ పదార్థాలన్నీ కూడా అనుభవమౌతున్నాయి.

“ఇది ఉన్నది”… అని ఆయన అనుకుంటే ఇది సద్రూపము అవుతోంది. “ఇది లేదు”… అని ఆయన అనుకుంటేనో… ఇదంతా అసద్రూపమే అగుచున్నది.

Page:744

అనగా… సంవిత్తు ఎట్టి భావనచే దేనిని దర్శిస్తాడో… అది ఆ రూపంగానే అనుభవం అగుచుండటమే ఈ దృశ్యము యొక్క చమత్కారం. (యద్భావం - తద్భవతి).

అనగా… సంవిత్ స్వరూపుడగు ఈ జీవుడు “ఇది కుండ, ఇది గోడ, ఇది నీలము (కాబట్టి వ్యవహార శీలము), ఇది ఎరుపు (కాబట్టి ప్రమాద సూచకము), ఇది ఇల్లు”… విధంగా దేనిని దృఢనిశ్చయంతో ఏ దృష్టితో చూస్తే అది అట్లే అనుభూతమౌతోంది. ఇక “ఇది సత్తా? అసత్తా?” అనే ప్రశ్న ఎక్కడిది? ఏది ‘అసత్తు’ అని తలిస్తే అది అసత్తుగాను, ఏది ‘సత్తు’ అని తలిస్తే అది ‘సత్తు’ గాను ఈ వస్తువులన్న సంప్రాప్తిస్తూ వస్తున్నాయి. “తలిస్తేనే తెలుస్తోంది” - అనునది గమనించు.

దేహం – మొట్టమొదట ఈ దేహం విషయానికి వద్దాం. ఈ ‘జీవుడు’ అనబడే సంవిత్తు తన యొక్క ‘చిత్స్వరూపము’ నందు దేహమును గురించిన భావన చేయటమనేది ఆ సంవిత్తు యొక్క స్వభావమేనని చెప్పబడుతోంది. ఆ సంవిత్స్వరూపం “దేహమే నా స్వరూపం“ అని భావించి దేహముగా అభివ్యక్తమౌతోంది. ఈ విధంగా అయ్యది తనయొక్క ’నిర్మల సంవిత్ ధర్మము’ను ఏమరచి తనయందు దేహ ధర్మమును ’అధ్యాస’గా చేసుకుంటోంది. అందుచేతనే అజ్ఞాన యుక్తులగు జనులు ”ఈ దేహమే నేను” అని జాగ్రత్ స్వప్నానుభవాలు పొందుచున్నారు. అనగా నిర్మలము, అపరిమితము, సర్వగతము అగు సంవిత్తు యొక్క ఒకింత (స్వస్వరూపము గురించిన) ఏమరపుతో కూడిన “దేహధర్మ అధ్యాస” యే శరీరత్వం. అంతేగాని ఈ భౌతికంగా కనిపించే శరీరం ఈ జీవుని వాస్తవ శరీరం కాదు. “నేను దేహ ధర్మములు స్వరూపంగా కలవాడను” అను ఒకానొక పరిమిత దృష్టియే దేహత్వం.

సృష్ట్యాదియందు జగత్తుకు సంబంధించిన కారణము లేనేలేదు. నిజమే! సంవిదాత్మయే తన అధ్యాసచే తన యందు జాగ్రత్, స్వప్న ద్రష్టత్వం వహించి, తానే తద్ద్వారా జాగ్రత్-స్వప్న దృశ్యరూపంగా భాసిస్తున్నాడు. కనుక సంవిదాత్మయే ఈ జగత్తు యొక్క స్వరూపం! ఇక ఈ జాగ్రత్ జగత్తులో స్వప్నం కంటే విలక్షణమైనదేదీ లేదు. బ్రహ్మం అను పేరుగల నిర్మల సంవిత్తు మాత్రమే ఉన్నది. అదే జగత్ రూపంగా కూడా భాసిస్తోంది. కనుక ఈ జగత్తుకు బ్రహ్మం కంటే అన్యత్వమైనదేదీ లేదు.

ఈ ప్రకారంగా… “అవికారం, సర్వదా ఏకరసం" అగు బ్రహ్మమే జగత్ రూపంగా స్థితినొంది ఉన్నదనే విషయం బ్రహ్మవేత్తల ప్రవచనములు విన్న తరువాత, వేద - వేదాంగముల అధ్యయనం చేసిన తరువాత మేము అనుభూతం చేసుకొని ఉన్నాము. అదే నీకిప్పుడు ప్రకటిస్తూ చెప్పుచున్నాను. ఇక్కడ లోకప్రచారములైయున్న రెండు సిద్ధాంతాలు మన సంవాదము కొరకై ఉదహరిస్తాను.

  1. దేహమే దేహి (నైయాయికులు) : “దేహా హమ్” సిద్ధాంతం ఇది - కొందరు సిద్ధాంత పూర్వకంగా చెప్పుచున్నారు. వీరి (నైయాయికులు) సిద్దాంతమును అనుసరించి… “దేహము వేరు”, “దేహి వేరు” అని మేమూ ఒప్పుకోము. అయితే దేహము ఉంటేనే, ‘నేను’ అనేది ఉంటుంది. దేహము నశించినప్పుడు ‘నేను’ అనేది కూడా నశిస్తోంది. దేహము పతనమైన తరువాత ఇక ‘నేను’ అనేది ఎక్కడా ఉండజాలదు. దేహ పదార్థములకు సంబంధించిన ఒకానొక రసాయనిక ఉత్పత్తియే ఈ నేను అనునది!

Page:745

కనుక దేహంలోనే దేహంతోనే ‘నేను’ పుడుతుంది. దేహముతోనే ఆ ‘నేను’ అనేది నశిస్తోంది. దేహమునకు వేరుగా ‘సంవిత్’ (సత్ = ఉనికి; విత్ = ఎరుక) అనేది ఉండదు. కాబట్టి ఈ జీవుడు సంవిత్ స్వరూపుడని, అటువంటి సంవిత్ స్వరూపం దేహం కంటే విలక్షణమై, శాశ్వతమై, దేహంతో పుట్టక - - దేహంతో నశించక ఉంటోందంటే మేము ఒప్పుకోము.

  1. జగత్ సత్యమ్ - సంవిత్ మిథ్యా (చార్వాకులు) : ఇక (చార్వాకులు) ఈ విధంగా అంటున్నారు. జగత్తు ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. నీళ్ళలో బుడగలలాగే ఈ జీవులు పుడుతూ ఉంటారు. చస్తూ ఉంటారు. “దేహి - శరీరి - సంవిత్తు” … ఇటువంటివేవీ లేవు. శరీరం అనేది కొన్ని

పదార్థాల కలయిక. ‘నేను’ అనేది ఆ పదార్థాలు కలిసినప్పుడు ఉంటుంది. అవి విడిపోతే లేకుండా పోతుంది. ఈ ఎదురుగా కనిపించే జగత్తు తప్పితే మరొక జగత్తు లేదు. అనుభవం లేదు. దేహానంతరం మరింకేమీ ఉండదు. కనుక పాపము, పుణ్యము ఇవన్నీ ఎవరో కల్పించారు. అవన్నీ లేవు. వేరే లోకాలు లేవు. పుట్టుకకు ముందు ఏమీ లేదు. చచ్చిన తరువాత ఏమీ మిగలదు. కనుక తినండి, తాగండి, ఇంకేమీ ఆలోచించకండి!

పై రెండు సిద్ధాంతాలు ఇంచుమించు ఒకే తీరైనవే! వారు “దేహి లేడు - దేహమే ఉన్నది” అని చెప్పుచున్నారు. దేహంతోబాటే దేహి కూడా నశిస్తాడని, ఆ తదనంతరం మరింకేమీ లేదని వారి ఉద్దేశం. అయితే… ఈ రెండు సిద్ధాంతాలు మా అనుభవంలో - ఉద్దేశంలో "పిల్లలు చెప్పే అమాయకపు మాటలు” వంటివేగాని అనుభవసిద్ధమైన వాక్యాలు కావు. మా ఉద్దేశం - అనుభవం

- మహాత్ముల ప్రవచనం ఏమిటో చెప్పుతాను. విను.

ఈ జగత్తు వస్తురూపం కాదు! అనుభవరూపమే! ఈ జీవుడు అనుభవి స్వరూపుడు!

అనుభవి = సత్ (ఉనికి) + చిత్ (ఎరుక)

సమస్త ప్రాణులకు “నేను ఉనికి, ఎరుకల స్వరూపుడను”… అనేది నిత్యానుభవమే అయివున్నది. దృఢానుభవసిద్ధియే అయివున్నది. ఈ ‘జగత్తు’ ఎరుక యొక్క స్వరూపం అయివున్నది. ఈ జగత్తంతా కూడా సత్త స్వరూపమే! అటువంటి జగత్తు యొక్క నిత్యసత్తా స్వరూపం ఏమరచి “వర్తమానపు నామరూపములే జగత్తు"… అని అనుకొని వర్తమానపు దృశ్యాన్ని ప్రమాణంగా తీసుకోవటం చిన్నపిల్లల భ్రమ వంటిదేనని మా ఉద్దేశం.

"చైతన్యము నిత్యం కాదు. శరీరమే సంవిత్తు (ఈ జీవుని ఉనికి - ఎరుకలకు) కారణం.” అట్లా అనుకోవటం మోహముచే స్వీకరించబడేదే అవుతుంది. జడమగు దేహమే చైతన్యరూపమమగు ‘నేను’కు కారణం… అని అనుకోవటం ’కూపస్థ మండూకం’తో సమానం (నూతిలో ఉన్న కప్ప నూయ్యే సర్వ జగత్తు అని అనుకోవటం వంటిది). అట్లా అనుకోవటం ఉన్మత్తతయే! అట్లా “శరీరంలో నుంచే ‘నేను’ వస్తోంది. శరీరంతో ‘నేను’ నశిస్తోంది”… అని వాదించే వారు ఆధ్యాత్మిక బోధకు అర్హులు కాలేకపోతున్నారు. ఎట్లా అంటే ఒక ఉన్మత్తునికి (పిచ్చివానికి) - విచక్షణా జ్ఞాన సహితునికి వివేకమైన సంభాషణ ఎట్లా కుదురుతుంది? అట్లాగే దృశ్యమును నామరూపాత్మకంగా నమ్మి ఉండే వానికి - ఎరుక రూపంగా పాఠ్యాంశము కలిగి ఉన్న జ్ఞానికి సంభాషణ కుదరటంలేదు.

Page:746

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఏ పండితుడైనా సరే… అతను చెప్పే కథనం చేత సమస్త సందేహాలు తొలగితేనే మనం అద్దానిని ఉత్తమ సిద్ధాంతంగా ఒప్పుకోగలం. కొన్ని సందేహాలు మిగిలియే ఉంటే అది మూర్ఛకథనమే అవుతుంది సుమా! "ప్రత్యక్ష దృశ్యాత్మ సిద్ధాంతం ప్రకారం ఎదురుగా ఏది కనబడితే అది మాత్రమే సత్యం. ’అనుమానము’ను ఆతడు స్వీకరించటం లేదు. ఆతడు పూర్వపరము వదలివేసి “ప్రత్యక్షమే మాకు ప్రమాణం. ఎవరో చెప్పితేనో, (లేక) శ్రుతులలో చెప్పబడిందనో ప్రమాణంగా తీసుకోమంటే మేమేమీ ఒప్పుకోం”… అని చెప్పి “ఈ శరీరం తరువాత ఎవరు ఏమౌతున్నారో తెలియదు. అందుచేత దేహం నశిస్తే ఆ జీవుడు ఇక లేనట్లే”… అని చెప్పటం మా ఉద్దేశంలో యుక్తి రహితమనే చెప్పాలి. అట్లా వాదించేవాడు “శరీరమునకు వేరుగా నేను లేను” అని తనను తానే తిరస్కరించుకొన్న వాడగుచున్నాడు. అట్టి ప్రవచనం విజ్ఞుల చెవులకు కఠోరంగా ఉంటోంది. అందుచే అద్దానిని “అంధకూప మండూక న్యాయం (చీకటి నూతిలోని కప్ప యొక్క అనుభవం వంటిది” అని విజ్ఞులు భావిస్తున్నారు.

ఇక తత్త్వజ్ఞుల అభిప్రాయం చెప్పుచున్నాను విను. “ఈ జగత్తు జీవుని యొక్క అనుభవ రూపమేగాని నామరూపాత్మకం కాదు”… అని, సర్వ అనుభవములకు ముందే అనుభవజ్ఞ (అనుభవములను ఎరిగే) ప్రజ్ఞారూపం ఏర్పడియే ఉన్నదని, “ఆ అనుభవజ్ఞ రూపం జాగ్రత్ స్వప్న సందర్భములన్నిటికీ కేవల - నిర్మల సాక్షి అయివున్నది“… అని, అద్దానికి జాగ్రత్ స్వప్నాను భావములచే మరొకటిగా మార్పు చేయజాలదని, “అదియే భాషానుకూలం కోసం “ఉనికి, ఎరుక (సత్ + విత్) = సంవిత్తు”… అని చెప్పబడుచున్నదని, “ప్రతి జీవుడు సంవిత్ స్వరూపుడే”… అని, “ఆతని అనుభవ విభాగమే ఆతనికి జగత్తుగా ప్రదర్శితం అవుతోంది“ అని, ”ఆతని అనుభవము ఆతని భావన చేతనే ఏర్పడుతోంది”… అని, “ఆతని భావనకు వేరుగా జగత్తు (లేక) దృశ్యము అనబడేది ఎక్కడా ఈషన్మాత్రం కూడా లేదని నిర్ద్వంద్వంగా నిరూపించబడుతోంది.

కాబట్టి ఈ జగత్తు సంవిత్ స్వరూపమే! ద్రష్ట యొక్క రూపమే దృశ్యము!

ప్రజ్ఞప్తి మహారాజు : ప్రత్యగాత్మ యొక్క సంవిత్తే ఈ ‘జగత్తు’ అయినప్పుడు మరణించిన శవమును ఆ సంవిత్స్వరూపుడగు జీవుడు ఎందుకు కదల్చలేకపోతున్నాడు? మరణించిన శవం మరల జీవించటం లేదు కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సమష్టి సృష్టికర్తయగు “హిరణ్య గర్భుడు” అనేవేషం ధరిస్తోంది. ఒకడు ఒక నాటకంలో ఒక వేషం వేస్తూ ఉంటే, ఆతడు ఆ పాత్రగా కనబడుతూ కూడా, ఆ పాత్రకు వేరైన తన వ్యక్తిత్వం కలిగియే ఉన్నాడు కదా! ఆ విధంగా బ్రహ్మమే ’బ్రహ్మదేవుడు’ అనబడు ‘హిరణ్యగర్భుడు’ అనే వేషధారణం చేస్తోంది. అనగా బ్రహ్మదేవుని వాస్తవరూపం బ్రహ్మమే! ఆతని ఊహయే ఈ సృష్టి. నీకు నీ స్వప్నంలో స్వప్ననగరం ఎట్లా భాసిస్తోందో… అట్లాగే బ్రహ్మదేవుని సంకల్ప నగరం ఈ సృష్టిగా వ్యాపించి ఉన్నది.

అయితే… ఏ విధంగా బ్రహ్మదేవుడు బ్రహ్మమే తన వాస్తవ రూపంగా కలిగివున్నాడో…

Page:747

అట్లాగే నీ యొక్క - - నా యొక్క… తదితర సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపం కూడా బ్రహ్మమే అయివున్నది! అంతేగాని, మనమంతా ఈ భౌతిక దేహరూపులం కాదు.

నీ యొక్క స్వప్ననగరం, బ్రహ్మదేవుని సంకల్పనగరం… రెండూ నిరంతరం చిన్మాత్రాత్మయే అయివున్నది. ఎరుకయే నీ స్వరూపమైనప్పటికీ స్వప్నంలో అనేక స్వప్న దృశ్యాలు ఎరుగుచున్నావు కదా! నీవు నీ స్వప్నంలో ఒకానొక రూపంగా అగుచున్నావా? లేదు. స్వప్నం నీది. స్వప్నంలో నీవున్నావు. మరి స్వప్నంగా కనిపించే దృశ్యమంతా ఏమిటి? నీ యొక్క ఊహ నీచే స్వప్న దృశ్యంగా పొందబడుతోంది కదా! “నాకు వేరుగా స్వప్నం సత్యమై ఉన్నది”… అనే భ్రాంతి ఎవరూ (మెలుకువ తరువాత) పొందటం లేదు కదా! అట్లాగే “శరీరము, శవము” మొదలైన జడవస్తు భ్రాంతి కూడా (నీ గురించి నీవు ఎరిగిన తరువాత, ఇక) లేవు. స్వప్నంలో కనిపించిన ఆకాశం, భూమి, భవనము, మిత్రులు, బంధువులు, తదితర వ్యక్తులు… వారంతా ఎవరు? ఏ రూపమై ఉన్నది? అదంతా చిదాకాశ రూపమే! ఇందులో నీకేమీ సందేహం ఉండనక్కర్లేదు.

ప్రజ్ఞప్తి మహారాజు : ఔను స్వామీ! నా స్వప్నంలో కనిపించేది నా ఊహయే! నా ఊహకు వేరుగా స్వప్న దృశ్యం లేదు. నా భావనకు వేరుగా ఊహలేదు. నా ప్రజ్ఞకు వేరుగా నా భావన లేదు. కనుక భావన చేయు నా చిత్ స్వరూపమునకు వేరుగా ప్రజ్ఞ లేదు. ఈ విధంగా స్వప్నంలో కనిపించేదంతా చిదాకాశ రూపమే! ఇది నాకు స్వానుభవసిద్ధమే అగుచున్నది.

శ్రీ వసిష్ఠ మహర్షి (నేను) : అట్లాగే… బ్రహ్మం చిదాకాశ ఘనమై ఉన్నది. అద్దాని సంకల్ప నగరమే విరాట్టు (సమష్టి భావనా స్వరూపుడగు హిరణ్యగర్భుడు (లేక) బ్రహ్మదేవుడు. ఆయనయే శుద్ధ సంవిన్మయుడు అయివున్నాడు. ఆతని భావావేశ రూపమగు ఈ సృష్టి ఈ విధంగా శుద్ధ సంవిన్మయ మేనని చెప్పబడుతోంది.

బ్రాహ్మే సంకల్పనగరే యద్యత్ సంకల్పితం యథా | తథానుభూయతే తత్తత్ త్వత్ సంకల్పపురే యథా ||

నీ సంకల్పపురంలో నీవు ఏది సంకల్పిస్తే అది నీకు (సంకల్పసమయంలో) నీకంటే వేరైనట్లుగా (దృశ్యమువలె) అనుభూతమౌతుంది కదా! అట్లాగే బ్రహ్మము యొక్క “సంకల్పపురం” అన తగినట్టి ఈ జగత్తు ఆ సంకల్పించువానికి వేరైనదైనట్లుగా ఈ ప్రకారంగానే అనుభవించబడుచున్నది.

అనగా… బ్రహ్మము యొక్క “సంకల్పనగరము” అయినట్టి ఈ జగత్తునందు ఏ పదార్థము ఏ ప్రకారంగా సంకల్పించబడుతోందో ఆ పదార్థం ఆ ప్రకారంగానే (నీ యొక్క సంకల్ప నగరంలోలాగా) స్థితినొందియున్నది. అదియే నియతి. కాబట్టి ఈ ’దేహము’ యొక్క నియతి యందు బ్రహ్మరూపమగు చైతన్యము ఎట్లు కల్పించిందో

అట్లాగే, జీవిత శరీరమునకు చలనము… మృత శరీరమునకు అచలనము… ఈ రకంగా చలన - అచలనములు అనుభూతమౌతున్నాయి. అంతేగాని బ్రహ్మము రూపముగాగల చైతన్యము యొక్క ‘నియతి’కి వేరుగా ఎక్కడా ఏదీ మరొక రీతిగా ఉండటం లేదు. అనగా ఈ జగత్తు యొక్క

Page:748

వ్యవహారమంతా బ్రహ్మము యొక్క సంకల్పమాత్రమే! సంకల్పము సంకల్పించువానికంటే వేరే రూపం కలిగి ఉండలేదు కదా! ఆ విధంగా ఈ జగత్తు బ్రహ్మమే అయి వున్నది.

ప్రజ్ఞప్తి మహారాజు : హే శ్రీ వసిష్ఠ మహర్షీ! మహా ప్రళయంలో సమస్తము రహితమైపోతోంది కదా! సమస్త కారణముల యొక్క అభావంచేత అప్పుడిక సృష్టియొక్క ఆరంభమునకు పదార్థమే ఉండదు కదా! కానీ… చమత్కారం చూచారా? మరల సృష్టి ప్రవర్తిస్తూనే ఉన్నది! ఎట్లా ప్రవర్తిస్తోంది? ప్రళయమునకు ముందే ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుడు ముక్తిని పొందుతాడు కాబట్టి ప్రళయానంతరం ఆతని ‘స్మృతులు’ అంటూ ఏవీ ఉండవు కదా! మరల జగత్తు ఆవిర్భవించటానికి కారణం ఏమిటి? పూర్వ బ్రహ్మదేవుడికి ముక్తితోబాటే పూర్వ స్మృతులు కూడా తొలగుతాయి కదా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఇప్పుడు నీవు చెప్పినది యుక్తియుక్తమే! అందుచేత పూర్వ సృష్టి అంతా రహితమై పోగా… మరల నూతన సృష్టి - వ్యవహారం ఎవరి స్మృతిలోంచి, (లేక) ఎవరి కల్పనను అనుసరించి ఆవిర్భవిస్తోంది? నీ ప్రశ్న “ సృష్టి స్మృతి యొక్క ఫలితం కాదు!”… అని నిరూపిస్తోంది. అనగా ఇది ఎవరి స్మృతీ కానట్లే కదా! కనుక స్వయంజ్యోతి స్వరూపమగు బ్రహ్మమే జగత్తుగా స్వయంగా భాసిస్తోంది. బ్రహ్మమే జగత్తుగా (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది. ఆత్మజ్ఞుల దృష్టికి ఇదంతా బ్రహ్మముగా అనిపిస్తోంది… కనిపిస్తోంది. కనుకనే ”ఇదంతా బ్రహ్మమే (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ)” అని చెప్పబడుతోంది.

బ్రహ్మమే జగత్తుగా భాసిస్తోంది. బ్రహ్మానికి వేరుగా ‘జగత్తు’ అనబడేది ఏదీ లేదు. బ్రహ్మమే మొట్టమొదటగా బ్రహ్మదేవుని రూపంగా భాసిస్తోంది. అది నిష్కారణమని (ఆకారణమని) చెప్పబడింది.

చిదాకాశరూపుడగు ఆ బ్రహ్మదేవుడు తన చిత్ స్వరూపమును “సంకల్పం” అను చమత్కారముతో కూర్చి దర్శిస్తున్నారు. అది కూడా నిష్కారణమే! అట్టి తన యొక్క సంకల్ప నగరమున చిత్ స్వరూపమును జగత్తుగా ఎరుగుచున్నారు. అదీ అట్లాగే నిష్కారణం.

కనుక ఈ జగత్తు వాస్తవానికి చిదాకాశరూపమే! నామ రూపాత్మకంగా (జగత్తుగా) దర్శించటమే పరబ్రహ్మం యొక్క స్వభావం. కనుక ఈ జగత్తు పరబ్రహ్మం యొక్క స్వయంకల్పిత ఊహా చమత్కారమే! నీ ఆలోచన నీ రూపమే అయినప్పుడు, ఆ నీ ఆలోచనకు అనిపించేది కూడా నీ రూపమే కదా! యథా సంకల్పనగరం చిన్మాత్రం భాతి కేవలమ్ |

తథైవ అకారణం భాతి చిన్మాత్రోన్మేషణం జగత్ ॥

ఏ విధంగా సంకల్ప నగరం చిన్మాత్రమే అయి, చిన్మాత్రమే అట్లు భాసిస్తోందో… అట్లాగే ఈ జగత్తు చిన్మాత్రము యొక్క స్ఫురణయే అయి నిష్కారణంగా జగత్తుగా భాసిస్తోంది! ఈ జగత్తు ఈ విధంగా చిన్మాత్రమే అయివున్నది? చిన్మాత్రమే నిష్కారణంగా జగత్తు అయివున్నది. జగత్తే నిష్కారణంగా చిన్మాత్రము.

శరీరమస్తు వామాస్తు యత్ర యత్రాస్తి చిన్నభిః | ॥వేత్యాత్మానం తత్రతత్ర ద్వైతాద్వైతమయం జగత్ II

Page:749

“ఈ శరీరం ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది. శరీరం లేకపోతే జగత్తు ఉండదు”… అని అనుకుంటున్నావా? లేనే లేదయ్యా! శరీరంతో (భౌతికమైన ఇంద్రియాలతో) సంబంధం తెంచివేసుకొని కూడా స్వప్న సమయంలో ఈ జీవుడు స్వప్న దృశ్యం (స్వప్న జగత్తు) పొందుచూ… “ఇది నిజమే!” …అని అనుభవిస్తున్నాడా!… లేదా?

ప్రజ్ఞప్తి మహారాజు : అవును. అనుభవిస్తున్నాడు!

శ్రీ వసిష్ఠ మహర్షి : అదే మనకు దృష్టాంతం. ఈ శరీరము ఉండవచ్చు! ఉండకపోవచ్చు! ఎచటెచట చిదాకాశము ఉంటుందో అచటచట అయ్యది తన స్వరూపమును స్వరూపమునందే ద్వైత - అద్వైతమయమగు జగత్తుగా ఎరుగుచున్నది.

మరణానంతర జగత్తు -

తస్మాత్ యథా స్వప్నపురం, యథా సంకల్ప పత్తనమ్ తథా పశ్యతి చిద్వ్యోమ మరణానంతరమ్ జగత్ II

కాబట్టి చిదాకాశ రూపుడగు ఈ జీవుడు ఈ శరీరం ఉన్నప్పుడు ఎట్లా స్వప్న - సంకల్ప పురములను గాంచుచున్నాడో, అట్లాగే ఈ శరీరం పతనమైన తరువాత కూడా (మరణానంతరం కూడా) తనను తాను జగద్రూపంగా గాంచుచున్నాడు.

మరొక రకంగా చెప్పాలంటే… చిదాకాశము స్వప్న - సంకల్ప పురములను (బ్రహ్మదేవుని రూపందాల్చి / సంకల్పించినదై) - ఆ బ్రహ్మదేవుని స్వప్న రూపంగా (జగత్తును) గాంచుచున్నది. అట్లాగే, ఈ దేహాదులు లేనప్పుడు కూడా చిదాకాశము సర్వదా ఉండియే తీరుతుంది. కాబట్టి (అది సత్ స్వరూపం కాబట్టి) తనను తాను జగద్రూపంగా దేహం వున్నప్పుడు - లేనప్పుడు కూడా గాంచుచున్నది. జగత్తుగా కనిపించేది చిదాకాశమే కాబట్టి చిదాకాశము యొక్క జగత్ దర్శనముచే గాని, జగత్ అదర్శనముచేగాని (ఉదాహరణ : గాఢనిద్ర) చిదాకాశము యొక్క స్వరూప స్వభావాలు మారునవేకావు. ఇక లోటేమున్నదో చెప్పు?

సృష్ట్యాదియందు చిదాకాశము భూమి ఆకాశం మొదలైనవి లేనప్పటికీ, అది భూమి - ఆకాశాదులతో కూడిన జగత్తుగా నిష్కారణంగా భాసిస్తోంది! అందుచేత భూమి - ఆకాశరూపములై కనిపించేదంతా నిర్మల చిదాకాశ రూపములే! ఏది ఈ దేహరూపంగాను - దృశ్యరూపంగాను ద్రష్టరూపంగాను భాసిస్తోందో… చిదాకాశమే అట్లు ఆయా చమత్కారములుగా భాసించుచున్నది. జ్ఞాన దృష్టికి అవన్నీ చిదాకాశమాత్రం! అజ్ఞాన దృష్టికి నేను చెప్పేదేమున్నది?

చిదాకాశంలోంచి బయల్వెడలి సంకల్ప చమత్కారంలో ఈ దేహములు- దేహముల ద్వారా కనిపించే దృశ్య జగత్తులు - దేహ వినావన / రాహిత్యములు వున్నాయి. అంతేగాని, చిదాకాశము దేహములచే పరిమితి కల్పించబడేది కాదు. ఏ విధంగా సృష్ట్యాది యందు చిదాకాశము… భూమి - ఆకాశములతో కూడిన జగత్తువలె భాసిస్తోందో… అట్లాగే ఈ జీవుని మరణం తరువాత కూడా ఆ చిదాకాశమే సర్వ జగద్రూపంగా భాసిస్తోంది.

Page:750

ఒకాయన సుదీర్ఘ స్వప్నంలో అనేక దృశ్యాలు చూచాడనుకో! మేల్కొనిన తరువాత “నీవు చూచిన ఆ విస్తార జగత్తు ఎంతవరకు ఎక్కడ ఎట్లా విస్తరించి ఉన్నది చెప్పు?” అని అడిగామనుకో! ఏమంటాడు? "అయ్యా! అదంతా నా స్వప్నం! అక్కడ జగత్తు లేదు! అది విస్తరించీ లేదు!”… అని చిరునవ్వు నవ్వుతాడు కదా! అనగా స్వప్న జగత్తులో విస్తారంగా కనిపించిన దీర్ఘ దేశ కాలములు జాగ్రత్ దృష్టిలో కొంచెం కూడా ఏమాత్రం వ్యాపించి లేవుకదా! అట్లాగే ఈ దేహపతనానంతరం పరలోకం పొందినవానికి ఈ ఇహలోక దేశ కాలములు ఒకింతగా కూడా వర్తించటం లేదు.

ఆతనికి ఆ స్థితిలో ప్రదర్శితమగుచున్నదే అప్పటికి ఇహలోకమగుచున్నది. అట్లాగే… ఇదం ప్రబుద్ధవిషయే స్వానుభూతమపి స్ఫుటమ్ | జగన్నవిద్యతే, కించిత్ కారణం గగనే యథా ||

ఈ జగత్తు (ఈ దృశ్యము) ప్రత్యక్షంగాను, స్పష్టంగాను, స్వానుభవంగాను కనబడవచ్చు గాక! ఆకాశంలో అరణ్యం - వృక్షాలు - జంతువులు ఉంటాయా? అట్లాగే జ్ఞానియొక్క దృష్టిలో ఇదంతా జగత్ూపంగా (నామరూపాత్మకంగా) ఏ మాత్రం ఉండి ఉండలేదు. అప్రబద్ధునికి ఎంతగా ఆకాశము, భూమి, తదితర జీవులు, నాది, నీది, దేహము, జన్మ, కర్మ, మరణము… ఇత్యాది జగద్రూపంగా కనిపిస్తోందో అదియే ప్రబుద్ధునికి అంతగా ప్రత్యక్షంగానూ కేవల - - నిర్మల చిదాకాశంగా తెలియవస్తోంది.

“ఈ జగత్తు పరమాత్మ స్వరూపమే” అను వాక్యార్థం అదే కదా! నిదురించినవానికి స్వప్నంలో అసద్రూపమే అయినప్పటికీ జగత్తు ఎట్లా ప్రకాశమానమై ఉంటోందో… అట్లాగే ఈ దేహం పతనమైన తరువాత కూడా పరలోకమున చిదాకాశమే సృష్టివలె భాసిస్తోంది. ఆతనికి కనిపించే భూమ్యాకాశాలు, వస్తు సముదాయం, సంబంధ బాంధవ్యాలు ఎట్లా స్వప్నదృశమో… అట్లాగే ఈ వర్తమానంలో దేహంతో అనుభమయ్యే భూమ్యాకాశాలు, వస్తు సముదాయం, సంబంధ బాంధవ్యాలు మొదలైనవన్నీ స్వప్న సదృశమేనని గ్రహించు.

స్వప్నంలో ప్రవేశించేవానికి ఆ స్వప్నంలోకమంతా అంతకు ముందే అక్కడ సంసిద్ధమైనట్లుగాను, ఆతనిచే అది అప్పుడే ప్రవేశించబడినట్లు భావించబడుతోంది కదా! అట్లాగే పరలోకమున ప్రవేశించినవానికి అక్కడి ఆకాశ-భూమి-యమలోకాదులు అంతకు ముందే తయారైనవి కాకపోయి నప్పటికీ పూర్వసిద్ధము అయినట్లుగా అనిపిస్తూ ఆతనిచే పొందబడుతోంది. అనుభవించబడుతోంది. అట్లా విశాల జగద్రూపంగా (మరణానంతరం) భాసించేది చిదాకాశమే సుమా!

అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ రీతిగా భాసిస్తూ నీకు నాకు కనిపించేది కూడా చిదాకాశమే! మృతో2యం పునరుత్పన్నో యమలోకే శుభాశుభమ్

భుంజేహ౨_మ్, ఇత్యతిఘనం మృతో భ్రాంతిం ప్రపశ్యతి ||

ఇప్పుడు నేను మరణించాను. మరణించి యమలోకంలో ప్రవేశించాను. ప్రవేశించి నరకలోక నివాసిని అయ్యాను. ఇక ఇక్కడ శుభ - అశుభములు అనుభవిస్తున్నాను”… ఇత్యాది రూపంగా

Page:751

మరణించిన జీవుడు అజ్ఞానము కొనసాగించటంచేత మహాభ్రాంతిని గాంచుచున్నాడు. అట్టి మహాభ్రాంతి ఈ జీవుడు ఈ దేహం పొందకముందు, దేహం పొందిన తరువాత, ఈ దేహ పతనానంతరం కూడా కొనసాగుచూనే ఉన్నది!

ప్రజ్ఞప్తి మహారాజు : హే మహర్షీ! అయ్యో! ఏమి ఈ భ్రాంతి! ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా పోతుంది? దేనికి ‘అంతు’ అనేది లేదా?

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ ప్రజ్ఞప్తి మహారాజా! మోక్షోపాయమును అనాదరిస్తున్నంత వరకు ఈ జీవునికి ఇటువంటి మోహపరంపరలు అంతు లేకుండా కొనసాగుతూనే ఉంటుందయ్యా! అయితే… ఈ జీవుడు వాస్తవానికి నిర్మల - కేవల చిదాకాశ స్వరూపుడేనని మరల గుర్తు చేస్తున్నాను. అసలీ “నామ రూపాత్మక జగత్ దర్శనం" అనేది ఎక్కడి నుండి వచ్చింది? అభ్యాసంచే ఏర్పడిన వాసనా ప్రభావం చేతనే కదా! ఇప్పుడీ మోహం తొలగాలంటే రెండే ఉపాయాలు.

  1. బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవటం.

  2. ఇదంతా నిర్మల పరబ్రహ్మముగా, పరమాత్మ స్వరూపంగా, పరమాత్మకు అభిన్నంగా దర్శించే అభ్యాసం కొనసాగించటం.

ఈ జీవుడు మానవదేహం పొందినందుకు ప్రయోజనంగా “ఇదంతా నిర్మల చిదాకాశమగు పరబ్రహ్మమే”… అని అభ్యసించటం ఉత్తమమైన ఔషధం అని మా ఉద్దేశం! బ్రహ్మజ్ఞానం వలన వాసనారాహిత్యం (ఇదంతా నామ రూపాత్మకమైన దృశ్యంగా దర్శించే అభ్యాసం తొలగటం) కలుగుతుంది. వాసనా రాహిత్యంచే ఇదంతా పూర్తిగా శమించినదై (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ మొదలైన) వేదోపనిషత్ ప్రవచితమైన మహావాక్యానుభవం తప్పక లభించగలదు.

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఈ ‘జగత్తు’ అంటే ఏమిటో నిర్వచిస్తున్నాను విను. అప్రబద్ధుని యొక్క… ధర్మ, అధర్మ… వాసనారూపమైనది.

విహిత (చేయవలసినది), నిషిద్ధ (చేయకూడనిది) ఆచరణ యొక్క అనుభవ రూపమైనదగు “సంవిత్తు” ఈ జగదాకారముగా స్థితినొందియున్నది.

అనగా… ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఇది పొందాలి ఇది పొందకూడదు. ఇది ఇట్లా ఉండాలి - అది అట్లా ఉండకూదు… ఇటువంటి స్వకీయ భావనారూప జీవసంవిత్తే ఈ జీవునిచే జగత్తు రూపంగా పొందబడుతోంది! వాస్తవానికి ఈ జగత్తు చిదాకాశమే! జగదనుభవరచయిత అగు ఈ జీవుడో,… సర్వదా చిదాకావ స్వరూపుడే!

చిదాకాశమే చిదాకాశమున ద్రష్ట - దర్శన - దృశ్యరూపంగా ప్రభవిస్తూ ప్రకాశిస్తోంది!

ప్రజ్ఞప్తి మహారాజు : హే మహర్షీ! ఈ జగత్తు అనగా ఏమో, ఏదై ఉన్నదో, ఏది కాకయే ఉన్నదో…. అట్టిది మరొక్కసారి సంక్షిప్తంగా నిర్వచించి చెప్పండి.

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : అయితే సంక్షిప్తంగా ఏక శ్లోకంగా చెపుతాను విను.

Page:752

న శూన్యరూపం న చ సత్స్వరూపం బ్రహ్మాభిదం భాతి జగత్స్వరూపం తచ్ఛ అపరిజ్ఞానవశాత్ అనర్థభూతం పరిజ్ఞాతవతః శివాత్మ॥

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఈ జగత్తు శూన్యరూపం కాదు! సత్స్వరూపం కూడా కాదు! అనగా “ఇక్కడ ఏదీ లేదు” అనిగాని, “అంతా ఉన్నది” అనిగాని అనటానికి వీలు లేదు. మరి? బ్రహ్మం అను పేరుగల చైతన్యమే ‘జగత్’ స్వరూపంగా భాసిస్తోంది! ఈ జగత్తుగా ఉండేదంతా కూడా… అజ్ఞానవశం చేత అనర్థభూతమై ఉన్నది. జ్ఞాన వశంచేతనో, ఇదంతా కూడా… శివానందలహరీ స్వరూపం! పరమ కళ్యాణ రూపం! నిరతిశయానందాత్మకం! ఆనందైశ్వర్యమగు నీ ఆత్మస్వరూపమే!

  1. పరబ్రహ్మము పదార్థ రూపం - పదార్థ రహితం కూడా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఎప్పుడో-ఎక్కడో ఏదో సందర్భంలో చేసియున్న అమూర్తములు (భౌతికమైన ఆకారం లేనట్టి) పుణ్య - పాప ఫలములు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉండగా ఎట్లా ఫలప్రదాతలగుచున్నాయి?" అనే ఆ ప్రజ్ఞప్తి రాజు యొక్క మహాప్రశ్నలలోని మరొక విభాగం గురించి నేను చర్చించటం ప్రారంభించాను. అది విను.

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ ప్రజ్ఞప్తి మహారాజా! "పుణ్య-పాపాలు ఎప్పుడో ఎక్కడో నిర్వర్తించబడి ఉన్నవి కదా! వాటి ఫలాలు అమూర్తములు కదా! అవి ఆ తరువాత మరెప్పుడో మరెక్కడో ఎట్లా ప్రయోజన కారకాలు అవుతున్నాయి?” అనే నీ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించి ఉండవచ్చు. అయినా కూడా ఈ విషయం మరి కొంత స్పష్టంగా వివరిస్తున్నాను విను.

బ్రహ్మమే… అజ్ఞానం వల్ల దృశ్యబోధయే దృశ్యంగా కనిపిస్తోంది. జ్ఞానంచే బ్రహ్మబోధయే బ్రహ్మంగా అనిపిస్తోంది. తెలియవస్తోంది. కనుక, ఈ జగత్తు బ్రహ్మం యొక్క సంకల్పనగరమే అయి ఉన్నది సుమా!

ఓ రాజా! నీ యొక్క సంకల్ప నగరంలోని ప్రజలు నీ సంకల్పానుసారంగానే ఉంటారు కదా! అట్లాగే… బ్రహ్మం యొక్క “సంకల్ప నగరమే” అయివున్నట్టి ఈ జగత్తు నందు జీవులంతా కూడా బ్రహ్మం యొక్క ‘సంకల్పము’ను అనుసరించే ఇట్లు స్థితి కలిగయున్నారు. నీవు ఏది ఎట్లా సంకల్పిస్తే అట్లాగే నీ ఊహా ప్రపంచంలో అంతా జరుగుచున్నట్లే, ‘బ్రహ్మం’ యొక్క సంకల్పానుసారమే ఇదంతా నియమించబడినదగుచున్నది. కనుక నియతి బ్రహ్మం యొక్క సంకల్పానుసారమే ఉంటోంది. మునుల యొక్క యమ-నియమాదుల ప్రభావం చేత శుద్ధ సంవిత్తు వర శాప రూపాదులుగా వ్యవహారార్థం సమర్థం అవటం కూడా ఆ నియమ విభాగరూపమే! అనగా, “తపస్సులచే వరశాపముల సమర్థత సిద్ధించుగాక!” అనునది బ్రహ్మము యొక్క కల్పనా (లేక భావన) ప్రయోజనమే అయివున్నది. కాబట్టి వరశాపములు సిద్ధించటమనేది బ్రహ్మము యొక్క సత్య సంకల్ప రూపమే!

Page:753

అట్లాగే… శాస్త్రములచే చెప్పబడే “విధి - నిషేధముల, ధర్మ - అధర్మ ఆచరణముల చేత జనులకు సుఖదుఃఖాలు ఫలములుగా లభిస్తూ ఉంటాయి” అనేది బ్రహ్మము యొక్క “సంకల్ప కల్పన”యే అయివున్నది. “ఈ ప్రపంచంలోగల ప్రాణులంతా సృష్టికి పూర్వం లేరు. జగత్ సృష్టి ప్రారంభమైన తరువాత ఉంటారు” అనేది కూడా సంకల్ప కల్పనా విభాగమే! ఓ ప్రజ్ఞప్తి మహారాజా! “ఈ జగత్తు వాస్తవానికి అసత్తే అయినప్పటికీ ఒకింతకాలం సత్తువలె భాసించటం" అనేది కూడా చిద్రూప బ్రహ్మము యొక్క సంకల్పవశంచేతనే సుమా! కాబట్టి బ్రహ్మము యొక్క సంకల్ప మాత్ర భావనామాత్రమగు వికాస - సంకోచములే ఈ జగత్తు యొక్క సృష్టి, ప్రళయములు అయివున్నాయి.

“విధి-నిషేధాలు, పుణ్య-పాపములు, వాటివాటి తదనంతర ప్రయోజనములు” - - ఇవన్నీ కూడా “ఉపాది యొక్క ప్రారంభం, ఒక ఉపాధి తరువాత మరొకటి"… అను దీర్ఘ కథలో కల్పిత కథాం తర్విభాగములే సుమా!

ప్రజ్ఞప్తి రాజు : ఓ వసిష్ఠ మహర్షీ! మీరు చెప్పినట్లు బ్రహ్మము యొక్క సంకల్ప వశం చేతనే ఈ జగత్తు-ఇందలి విశేషాలు ’సత్తు’గా అగుచున్నాయనే అనుకుందాం. మరి అట్టి ఈ జగత్తు గాఢ నిద్రలో ఉన్నప్పుడు లభించటం లేదేం! ప్రళయంలో ఈ జగత్తు లేకుండా పోతోందే! జాగ్రత్ కాలం లోను, సృష్టి సమయంలోను మాత్రమే ఎందుకు లభిస్తోంది? మరొక సందేహం. సదా వికారవంతమే అయినప్పటికీ, జగత్తు సుస్థిరరూపంగా ఉన్నట్లుగా ఎట్లా భాసిస్తోంది?

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : మరి చిదాకాశము యొక్క మాయా సంబంధమైన సంకల్ప నగర స్వభావం అట్టిది! జాగ్రత్ స్వప్నములందు అనుభూతములతో కూడినదై… సుషుప్తి -ప్రళయాలలో సర్వ అనుభవాల పట్ల మౌనం ప్రకటించుచున్నదై… మరల ఇంతలోనే క్షణకాలం జాగ్రత్తులోను, మరొక క్షణంలో స్వప్నంలోను ఆవిర్భవిస్తూ ఉండటం చిదాకాశ మాయావిభాగ సంకల్ప తత్త్వం యొక్క స్వభావమే అయివున్నది! ఆహాఁ! ఆటలాడుకునే బాలుడు తన సంకల్పపురంలో (ఊహా నగరంలో) ఆయా దృశ్య-అదృశ్య విశేషాలు సందర్శిస్తున్నట్లుగా… ఆకాశంలో కేశాలు ముత్యాలు (భ్రమచే) అగుపిస్తున్నట్లుగా, చిదాత్మలో ఈ సత్ - అసత్ రూపములైన సృష్టులు భాసిస్తున్నాయి.

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! నీవు నీయొక్క ఊహ (సంకల్ప నగరం)లో ఒక గొప్ప నగరమునో, కట్టడాన్నో ఊహించి… మరల అద్దాని యొక్క దృశ్య విశేషమును సంకల్పవశంచేతనే నశింపజేయ గలుగుచున్నావు కదా! అదంతా కూడా నీ యొక్క స్ఫురణను అనుసరించి, స్ఫురణను ఆధారంగా చేసుకొనియే ఉంటోందిగా! అట్లాగే "చిదాకాశం యొక్క సంకల్పనగరం (ఈ సృష్టి) యొక్క ఉత్పత్తి -ఉనికి-వినాశనములు కూడా చిదాకాశము యొక్క నిర్మల స్వభావమే!”… అని ఎరుగుము! కాబట్టి ఈ దృశ్యాంతర్గత విభగాములైనట్టి మూడు లోకాలు కూడా ఆద్యంతరహితమైనట్టి చిదన బ్రహ్మాకాశమే అయి ఉన్నాయి. చిదాకాశ స్వరూపుడగు ఆ పరమేశ్వరుడు జీవరూపంతో ఏదేది చేయటం జరుగుతుందో… ఏదేది ప్రకాశింపచేయటం జరగుతుందో… ఆ క్రియలు, ఆ పుణ్య పాప ఫల సందోహాలు, ఆవరణ రహితమగు ఆ పరమేశ్వరుని సత్యంకల్ప బలం చేత అసంఖ్యాక

Page:754

యోజనముల దూరం, అనేక యుగముల కాల వ్యవధిగా విస్తరించి ఉండగలదు. ఆ సత్య సంకల్పమే వర్తమాన కాలమువలె పూర్వ - పూర్వ కర్మ ఫలములకు (ఇప్పుడు) రూపం ఇస్తోంది. అద్దాని సంకల్పాను సారమే స్వర్గ - - నరక - భోగైశ్వర్య - బాధా పరితప్త కార్యములన్నీ ఏర్పడి ఉంటున్నాయి. వేరువేరు ప్రదేశములలోను - వేరువేరు కాలములలోను కర్మ - తత్ఫలితముల అధిష్ఠాన భూతమగు ఆవరణరహిత చైతన్యము వాస్తవానికి ఏకమే, అఖండమే అయివున్నది కదా! అందుచేత కర్మ + కర్మ ఫలములు నిత్యము సమీపమున ఉన్నవే అగుచున్నాయి. కాబట్టి కర్మయొక్క ఫలమును ఎట్లా పొందకుండా ఉండగలుగుతాడు? అవిదూరంగా ఎక్కడో ఉన్నవి అవవు!

ప్రకాశించుచున్న మణి యందు. అద్దాని ప్రకాశము చేతనే కాంతి పుంజములు ఆవిర్భవించటం, తిరోధానం పొందటం జరుగుతోంది కదా! అట్లాగే “చిదాకాశము” అనే మణియందు నిజ ప్రకాశం వలననే సృష్టి-ప్రళయాలు, కర్మ-కర్మఫలాలు… ఇవన్నీ పరావర్తన రూపంగా ఏర్పడినవై ఉంటున్నాయి. కనుక ఓ రాజా! వేద శాస్త్రముల యొక్క విధి-నిషేధములు కలుగజేయునట్టి విధి -విధానం (లేక) నియతి (లేక) సృష్టి చమత్కారం బ్రహ్మమునందు రూఢిపడియే ఉన్నది. అద్దానిని అనుసరించే ఈ జీవుడు మరణించిన తరువాత కూడా పరలోకములందు ఆతని సుకృత - దుస్కృత కర్మల ఫలములు కల్పించబడినవై ఉంటున్నాయి.

అయితే… వాస్తవానికి ఆత్మకు జనన, మరణాలు లేవు. అది ఏ సమయంలోనూ ఉదయించేదీ కాదు. అస్తమించేదీ కాదు. అది సర్వదా చిద్రూపమగు స్వాత్మ యందే నెలకొని ఉంటోంది. ఇక ఈ జనన-మరణాలు ఎట్టివంటావా? అవి భ్రమ చేతనే కల్పించబడినవై ఉంటున్నాయి.

జగత్తు అంటే చైతన్యము “కల్పిత ద్రష్ట, కల్పిత దృశ్యము” లతో కూడుకొనినదై ఉండటం! “ద్రష్ట, దృశ్యము” ఈ రెండూ కలిసి భాసిస్తే అప్పుడు “జగత్తు ఉత్పన్నమైనది” అని చెప్పబడుతూ ఉంటోంది. ఏ సమయంలో ఆ రెండూ కలసి భాసించవో… అదియే ప్రళయం. ఇంతకు వేరుగా సృష్టి ప్రళయాలు లేవు. ఇంతకు వేరుగా ‘జగత్తు’ అనబడేది వాక్కు యొక్క కల్పనా మాత్రమే!

జగత్ ఉపశమనం అంటే చిదాకాశ - - ఏక రూపమగు బ్రహ్మం ‘నిజ స్వభావం’ నుండి తన యొక్క స్ఫురణను ఉపసంహరించుకొన్నదై స్వాత్మ యందే నెలకొని ఉండటం.

వాస్తవానికి కళ్ళు తెరిస్తే… దృశ్యం కనబడటం, కళ్ళు మూస్తే సృష్టి కనబడక పోవటం వంటిదే ఈ సృష్టి-ప్రళయాల వ్యవహార చమత్కారం సుమా! "స్థిరంగా ఉండడం, సంచలనం కలిగి ఉండటం”… ఈ రెండూ కూడా ఒకే వాయువు యొక్క స్వభావాలు అయివున్నాయి కదా! వాయువు కంటే స్థిర-చలనాలు వేరుగా ఉన్నాయా? లేదు కదా! అట్లాగే… దృశ్యాకారమగు స్ఫురణ, దృశ్య రహితమగు అస్ఫురణ… ఈ రెండూ కూడా చిదాకాశం యొక్క నిర్మల అక్షయ స్వభావమే సుమా!

ఈ సర్వ పదార్థముల స్వభావం బ్రహ్మం యొక్క సత్య సంకల్పమే! వార్ధక్య - మరణాదులను నిరోధించే మణి-మంత్ర-ఔషధాల యొక్క పదార్థ (భౌతిక) ధర్మములు “ఈ మంత్ర - ఔషధాదులు ఇటువంటి ప్రయోజనం - ప్రభావము కలిగి ఉండుగాక!”… అను బ్రహ్మం యొక్క సత్యసంకల్పమే!

Page:755

నీ సంకల్ప నగరంలో కనిపించే వస్తు ధర్మాలు నీ సంకల్పం చేత నిర్మించబడి నీ చేతనే పొందబడు చున్నాయి కదా! బ్రహ్మమే తన సంకల్పిత పదార్థ ధర్మమునకు తానే ద్రష్ట రూపంగా కూడా ఉండి నదై, పొందుతోంది. అదే ‘ఈశ్వరాజ్ఞ’, “ఈశ్వర సంకల్పం” అని ప్రపంచంలో ప్రసిద్ధమై ఉన్నది.

అయితే ‘ఈశ్వరేచ్ఛ’ అనే బ్రహ్మం యొక్క సంకల్పం ప్రతిక్షణం ప్రతి వస్తువులోను ప్రవేశించి ఈ జగత్తులో స్వభావ సంకల్పం చేస్తూ వుంటుంది. అట్లాగే, ఒక బాలుడు క్రీడలో అనేక నియమ - విధానాలు ఒకేసారి సంకల్పించునట్లుగా ఈశ్వరుడు “ఈ వస్తువులు ఇట్లు ధర్మములు కలిగి ఉండగాక”… అని ఒకేసారి సంకల్పించుచున్నారు. ఆ ప్రారంభ సంకల్పమును కొనసాగిస్తూ వస్తువులు ఆయా ధర్మములను కల్పాంతము వరకు కలిగియున్నవై ఉంటున్నాయి.

ఆ చిదన పరమాత్మ క్షణకాలంలో ఎచ్చటెచ్చట ఏ పదార్థములను ఏ ప్రకారంగా సంకల్పిస్తు న్నారో, అచ్చటచ్చట ఆయా పదార్థములన్నీ కూడా వాటివాటి శక్తి కార్యముల భేదంచే ఆయా కార్య పరంపరలను అట్లాగే జరుపుచూ కొనసాగుచున్నాయి. ఇదంతా పరమాత్మ యొక్క స్వభావమే అయివున్నది. ఈ విధంగా సంకల్ప కల్పిత పదార్థములన్నీ కూడా స్వభావంగా నానా రూప - - ధర్మ - స్థితి - గతులు కలిగి ఉన్నప్పటికీ కూడా… ఇవన్నీ “అధిష్టాన దృష్టి”చే ఏకమగు చిద్రూపముగానే భాసిస్తున్నాయి. అనగా ఈ ఈ కనబడే సర్వ పదార్థములు వివిధాకారాలు, ధర్మములతో వెలయుచూ వాస్తవానికి ‘ఏకం, చిద్రూపం’ అగు పరమాత్మ రూపంగానే స్థితినొంది ఉన్నాయి. ప్రతి ఒక్క పదార్థం యొక్క తత్త్వంలో (అస్తి-భాతి-ప్రియం రూపంచే)… బ్రహ్మ చిన్మాత్రత్వమే నిండి ఉన్నది. ఎందుచేత నంటే… సర్వరూపమగు ఆ చైతన్యమే ఎచ్చట ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగానే భాసిస్తూ ఉండటమే స్వభావంగా కలిగి ఉంటోంది.

అనాదిమధ్యాన్తం, అనంత వీర్యం, కించిచ్చ కించిచ్చ సదప్యసత్యమ్,

స్థితం యథాయత్ర తథాత్మ తత్ర సర్గాత్మ భూర్భూత తృణాది జాతౌ॥

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఈ విధంగా "ఆది మధ్యాంతరహితం, అపరిచ్ఛిన్న శక్తి యుక్తం” అయిన బ్రహ్మం పదార్థ రూపంగానూ ఉంటోంది. పదార్థ రహితంగానూ ఉంటోంది. పదార్థ సహితం గానూ ఉంటోంది. సత్తుగాను, అసత్తుగా కూడా స్థితిని కలిగినదై ఉంటోంది. (సత్యంచానృతాంచ సత్యమభవత్ - శ్రుతివాక్యం). ఆ పరబ్రహ్మము సర్వ స్వరూపమై ఉన్నది!

అందుచేతనే సర్వప్రాణులయందు, తృణముల నుండి (చిన్న గడ్డి పరకల నుండి)… బ్రహ్మదేవుని వరకు ఎచ్చటెచ్చట ఏ స్వభావంతో ప్రసిద్ధమై ఉంటోందో… అచ్చటచ్చట స్వయముగా ఆ స్వభావమే అయి స్థితినొంది ఉన్నదగుచున్నది.

Page:756

  1. విరుద్ధ సంకల్పములు - విరుద్ధ కర్మ ఫలములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ తరువాత, ఒకడు - “ఒకనికి శుభం జరగాలి” అని, మరొకడేమో "అతనికి అశుభం జరగాలి” అని ఒకానొక వ్యక్తి గురించి కోరుకున్నవారై తీవ్ర ధ్యానపరులైతే (తపస్సువంటివి నిర్వర్తిస్తే)…. వారి వారి విరుద్ధ పరస్పర వ్యతిరిక్త కర్మఫలాలు ఎట్లా ప్రయోజనకారి అవుతాయి?”… అనే ప్రశ్నకు ఇట్లా సమాధానం చెప్పటం ప్రారంభించాను.

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ ప్రజ్ఞప్తి మహారాజా! అర్హతను అనుసరించి ఫలము ప్రసాదించే ప్రయోజనం సమస్త క్షేత్రములందు (తీర్థ ప్రదేశములందు), తపస్సు-వ్రతము-పూజ మొదలైన వాటిలో సృష్ట్యాదిలో బ్రహ్మచే తన సంకల్ప నగరము వంటిదగు ఈ సృష్టియందు కల్పించబడియున్నది. అనగా శాస్త్రానుకూలమైన స్నాన-దాన-తపో-యజ్ఞ-పూజ-వ్రతాదులు, ప్రయాగ మొదలైన పవిత్ర స్థానములతో దేహపతనములు మరణాదులు మొదలైనవి విధి పూర్వకంగా ఆచరించుటచే అవన్నీ అవశ్యం ఆయా రీతులుగా అనుకున్న ఫలములు ప్రసాదించటం బ్రహ్మ యొక్క సంకల్పానుసారమే అయి ఉన్నాయి. మహాపాపియగు ఒకానొకడు శ్రద్ధాళుడై (ప్రయాగాది) పవిత్ర తీర్థ క్షేత్రంలో వార్ధక్యములో దేహమును త్యజించు సమయంలో చైతన్యము యొక్క విభాగమగు ఆ పుణ్యక్షేత్ర మహిమచే ఆతని సమస్త పాపములుగాని, కొంత విభాగంగాని ఉపశమించటం కూడా చైతన్యము యొక్క సంకల్ప రూపనియతియే అయివున్నది. శాస్త్రానుసారము నడుచు మనుజుని పాపము అల్పము అయివుంటే ఆతనికి ఆయా ప్రయోజనాలు ఆయా కోరుకున్న వ్రత-నియమ-తపోనామ స్మరణాదుల ఫలాలు మరింత తక్కువ వ్యవధిలో మరింత వేగంగా ప్రయోజనకారి అవటం కూడా బ్రహ్మదేవుని సంకల్ప నియతియే అయివున్నది. ఆయా క్షేత్రములలో మనుజుడు ఆర్జించిన ధర్మము ఆతని పాపమునకు సమానం అయివుంటే అప్పుడు ఆ రెండింటి యొక్క భోగము కొరకై రెండు శరీరములు, ఈ రెండు శరీరముల కొరకై ఇరువురు (2) చిదాభాసులు స్ఫురించటం కూడా జరుగుచూ ఉంటాయి కూడా! చూచావా రాజా! ఈ విధంగా అల్పము - అధికము అగు పుణ్య - - పాపముల యొక్క మహత్ఫలం బ్రహ్మము యొక్క సంకల్పముచే ఏఏ ప్రకారంగా స్ఫురిస్తోందో… ఆయా ప్రకారంగానే అది వ్యవస్థితమై ఉంటోంది.

ఆ చిద్వస్తువు అగు బ్రహ్మమే ‘హిరణ్యగర్భుడు’ వంటి సమష్టి జీవులుగాను, నీవు - - నేను వంటి వ్యష్టి జీవులుగాను కూడా రూపం దాల్చుచున్నది. అది ఎచటెచట ఏఏ ప్రకారంగా సంకల్పిస్తే అచటచట ఆయా ప్రకారంగానే స్థితినొంది ఉంటోంది.

బ్రహ్మము యొక్క సంకల్పమే ఈ జగత్తు బ్రహ్మం యొక్క ‘సంకల్పం’ అనే నియతిని అనుసరించే పాపం చేసి ఉన్న వానికి “నేను నరకం చేరుచున్నాను” అనే బుద్ధి ఉదయిస్తోంది. బ్రహ్మం యొక్క సంకల్పానుసారమే ‘పుణ్యక్షేత్ర దర్శనము’ పుణ్యఫల రూపంగా అనుభూతమౌతోంది.

Page:757

ఏకాత్మనాహమద్యైష, మృతో మీ మమ బాంధవః రుదంతీమే పరంలోకం ప్రాప్తో యమహమేకకః ॥

మరణము పొందిన తరువాత జీవునకు “ఇప్పుడు నేనొక్కడినే మరణించాను. వారు, వీరు, నా బంధువులు. నా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన వారంతా నా కొరకై ఏడ్చుచున్నారు. ఇప్పుడు ఏకాకినై నేను పరలోకం పొందాను” ఇటువంటి బుద్ధి అంతా (మరణానంతరం) ఉదయి స్తోంది. మరణానికి ముందు కూడా “వాతం, పిత్తం” మొదలైన ధాతువుల యొక్క క్షోభచే దేహంతో తదాత్మ్యం చెంది ఉన్న బుద్దిలో అనేక భ్రమలు ఉదయిస్తున్నాయి. అప్పుడాతని పాప పుణ్య ఫలాల భావన చైతన్యం యొక్క కల్పనావశంచేత ఆతనికి కలగటం జరుగుచూనే ఉన్నది. నిగ్రహానుగ్రహ ద్రష్టులగు మహాత్ములు మాత్రమే ఒక జీవుని యొక్క పాప-పుణ్య దేహములు (భౌతిక దేహమునకు అన్యంగా) చూడగలగటం కూడా చైతన్యం యొక్క కల్పనాచమకృతియే! ఇక ఆ మరణించిన దేహం చుట్టూ వున్న ఆతని బంధువులు ఆతనిని అచేతనునిగాను, శవముగాను, మృతునిగాను మాత్రమే చూడగలుగుచున్నారు. వారు ఆతని జీవిత విశేషాలను గుర్తు చేసుకొంటూ ఏడుస్తూ శ్మశానం వరకు వెళ్ళి ఆతని భౌతిక దేహమును దహనం చేస్తున్నారు. ఆతని మనోకల్పితమైన పాప-పుణ్యభావనా సరంభం వారు గాంచలేక పోవుచున్నారు. అది కూడా చిదాకాశ సంకల్ప నియతియే!

ఇక నీ ప్రశ్నకు వద్దాం. ఒకే మనుజుని గురించి … మిత్రుడు- “ఈతడు సుఖంగా జీవించుగాక” అని కోరుకొనినవాడై కోరికలు ప్రసాదించే క్షేత్రంలో, ఆ ధ్యాసతో, ఏకాగ్రతతో, ఆరాధనతో ధ్యానిం చటం!; శత్రువు- “ఈతనికి మరణము సంభవించుగాక” అని అట్టి కోరికలు ప్రసాదించే క్షేత్రములలో ధ్యానించటం…. ఈ రెండు ఒకేసారి జరిగాయనుకో! అప్పుడేమౌతుందని ప్రశ్నించావు కదా! విను. అప్పుడు…

  1. ఆ మనుజుని సంవిత్తు మిత్ర సంవిత్తు యొక్క సంకల్పబలం చేత “సుఖజీవస్థితి”ని ఆ ఆ

వర్తమానపు దేహంతో ఎరుగుచున్నది.

  1. సంవిత్తు యొక్క మిత్రసంకల్ప బలం అంతగా లేకపోతేనో? అప్పుడు ఆతని సంవిత్తు యొక్క శతృ సంకల్పం ఆతనిపై ప్రభావం చూపునదై, ఆతని మరణానుభవమునకు కారణమౌతుంది.

ఆ మిత్ర-శత్రువుల సంకల్ప బలాలకు ఆతని సంకల్పబలం (ఆతని ధైర్య - అధైర్య, నమ్మక అపనమ్మకాలు) తోడై… ఆ సంయోగంలో ఏది బలవత్తరమైతే అది ప్రభావం చూపుచున్నది. కవచం ధరించిన వానిని శస్త్ర ప్రయోగం ఏమీ చేయలేదు చూచావా? అట్లాగే సాత్విక భక్తి పెంపొందించుకొన్న వానిని తదితరుల దుష్ట సంకల్పాలు స్పృశించి కూడా ఏమీ చేయ జాలవు. అట్లా కాకుండా ఆత్మ స్వరూపంపై సాంసారిక దృష్టుల అభ్యాసం చేత అపనమ్మకం గల వానికి శత్రువుల దుష్ట (హాని కలగాలనే ఉద్దేశంతో పుణ్య క్షేత్రములలో నిర్వర్తించిన ప్రార్థనలతో కూడిన) సంకల్పం అధిక బలం కలిగినదై అది అట్లా బలవత్తరంగా ప్రభావం చూపుతుంది.

ఇది ఇట్లా ఉండగా…“సంవిత్తు యొక్క దృఢమైన, తీవ్రమైన అధ్యాసతో కూడిన సంకల్పం వృథాకాదు”… అనే సిద్ధాంతమును అనుసరించి, ఆతని బంధువులకు ఆతడు సలక్షణంగా జీవిస్తూ

Page:758

కనిపిస్తూనే… ఆ బంధువులకు కంటికి కనిపించని శరీరంతో ఆతడు మరణానుభవమును కూడా (శత్రువు యొక్క ఆ ధ్యాసతో కూడిన దృఢ సంకల్పం కారణంగా)… పొందుతూ ఉంటాడు! ఈ విధంగా ఒకడు ఒకే కాలంలో జీవితము, మరణముల అనుభవం పొందటం కూడా జరుగవచ్చు! ఇది ఆశ్చర్యకరమైన విశేషమేమీ కాదు! ఎందుకంటే ఈ జీవన్మరణాలతో కూడా కలిపి ఈ ముల్లోకాలలో ఏ విపరీతమైన విశేషమైనా సరే… సంభవించటంలో ఆశ్చర్య పడవలసినదేమున్నది? స్వప్నంలోను, భ్రమతో కూడిన సంకల్ప పట్టణంలోను ఏది సంభవించదు? ఊహలో ఏది ఎట్లాగైనా అవవచ్చు కదా! ఓ ప్రజ్ఞప్తి మహారాజా! నీవు ఒక విషయం గమనిస్తున్నావా?

సంకల్ప స్వప్న పురయోః యా భ్రాంతిః అనుభూయతే

తతో 9 ధికోయం న న్యూనాత్ జాగ్రత్ స్వప్నే అనుభూయతే ॥

సంకల్ప - స్వప్న నగరాలలో ఏ భ్రాంతి పొందబడుచున్నదో - అంతకంటే ఎంతో ఎక్కువగా భ్రాంతి ఈ జాగ్రత్ స్వప్నంలో (కనబడే జాగ్రత్తులో) అనుభవమౌతోంది. ఇదేమీ చిన్నదైన భ్రాంతి

కాదు.

ప్రజ్ఞప్తి మహారాజు : స్వామీ! శ్రీ వసిష్ఠ మహర్షీ! ధర్మ-అధర్మములే దేహమునకు కారణమౌచు న్నాయని అంటూ ఉంటారు కదా! ధర్మ - అధర్మాలు ఆకారరహితం కదా! ఈ జీవుడు చనిపోయిన తరువాత నిరాకారములైన ‘ధర్మాధర్మాలు’ ఆ చనిపోయిన వానియొక్క మరొక దేహమునకు కారణం ఎట్లా అగుచున్నాయి? అవి సాకార శరీరానికి కారణమగుచున్నాయని అనటం ఎట్లా యుక్తియుక్తం? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ మహాబుద్ధీ! ప్రజ్ఞప్తి మహారాజా! ఈ జగత్తంతా కూడా బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే కదా! ఊహలో ఊహ కారణంగా జరగనిది ఏముంటుంది? అటువంటి బ్రహ్మం యొక్క “ఇది ఇట్లు ఉండుగాక”… అను సత్య సంకల్పమే ఈ మూర్తములైన - అమూర్తములైన చమత్కారముల యొక్క పరస్పర సంబంధమును కూడా "నియతి”. రూపంగా సంప్రాప్తిస్తోంది. అయినా, అమూర్త రూపమగు ప్రేమ - - కోపం - ఆవేశం మొదలైనవి మూర్త రూపమగు దేహంలో ప్రస్ఫుటం అవుతూనే ఉన్నాయి కదా!

యథైవ సంకల్పపురే యన్న సంభవతీహ హి

తన్నాస్త్యేవ తదేతస్మిన్ కింవాస్తు బ్రహ్మకల్పనే ॥

సంకల్ప పురంలో క్షణంలో ఎక్కడైనా ఏదైనా సంభవమే కదా! “ఒకని స్వప్నంలో పదిమంది బంధువులే ఉంటారు. పదకొండు మంది ఉండలేరు. ఒకనికి స్వప్నంలో రెండు ఇళ్లే ఉంటాయి. ఐదు ఇళ్ళు ఉండజాలవు"… అనే నిర్ణయమే ఉన్నది? అట్లాగే బ్రహ్మ కల్పనా జగత్తులో ఏది ఎట్లైనా ఉండవచ్చు కదా! స్వప్నంలో ఒకే స్వప్నద్రష్ట జీవ చైతన్యము (లక్షల కొలది సైనికులను స్వప్నంలో చూస్తున్నప్పుడు) లక్షల కొలది సైనికుల రూపంగా అగుచున్నది కదా! ఆ స్వప్న ద్రష్ట “గాఢనిద్ర (సుషుప్తి)”లో ప్రకాశించగానే స్వప్నంలో కనిపించి ఉన్న ఆ లక్షల కొలది సైనికులంతా ఏమైనారు? ఆ ద్రష్ట యొక్క ఏకరూపమును పొందుచున్నారు కదా!

Page:759

అట్లాగే… చిదాకాశమాత్రం, అనుభవరూపం” అగు ఈ జగత్తు నందు కూడా… అప్పుడు కలలో కనబడిన సేనయే “ఈ జాగ్రత్తులో కనబడే సేన. (లేక) అక్కడ జాగ్రత్తులో కనబడిన సేనయే ఇప్పుడు ఈ కలలో కనిపిస్తోంది”, “అప్పటి అనుభవమే ఇప్పుడు సిద్ధిస్తోంది”… అని అనుకుంటున్నట్లే “అప్పటి నా పుణ్యపాపాలే ఇప్పుడు ఇక్కడ ఇట్లా సిద్ధిస్తున్నాయి… అనే కల్పన కొనసాగుచున్నది. అటువంటి చిదాకాశ కల్పనామయ జగత్తులో ఒకడు మరణించిన తరువాత “నా పుణ్య - పాపకర్మలే నన్ను వెంటాడుచున్నాయి”…. అనే కల్పన కలిగివుండి, వాటి సుఖ - దుఃఖానుభవములను పొందటం జరుగుతోంది. "ఇది సుఖము, ఇది దుఃఖము” అనే కల్పన ఉన్నంతకాలం కార్య కారణ వ్యవస్థ యొక్క కల్పన కూడా ఈలాగే కొనసాగుతుంది.

కాబట్టి ఓ రాజా! “జగత్ రూపభ్రాంతి కూడా చిదాకాశ రూపప్రకాశమే”…. అని గ్రహించు. ఇక సత్తుగాని, అసత్తుగాని, సదసత్తుగాని ఇక్కడ లేవు. ఎందుచేతనంటావా?

యథా అనుభూయతే యద్యత్ తత్తథా తత్త్వదర్శినః

ప్రబుద్ధస్యాత్ర కిం నామ తత్స ఏవాంఙ్గతేత్యలమ్

ఎవరెవరికి ఏఏ పదార్థం ఏ ప్రకారంగా అనుభూతమౌతోందో… అదంతాకూడా ఆ ప్రకారంగా చిదాకాశమే వివర్తము పొందుచున్నదగుచున్నది. కాబట్టి ప్రబుద్ధుడగు "తత్త్వదర్శి” యొక్క దృష్టికి ఇక్కడ అసమంజసమైనదంటూ ఏదీ కనిపించదు. ఓ రాజా! నీవు కూడా తత్త్వదర్శివై “ఇక్కడ ఏది ఎట్లు కనిపిస్తున్నా అదంతా కూడా చిదాకాశమే (లేక పరమాత్మయే) అట్లు వివర్త రూపము పొందిన దానివలె నాకు అగుపిస్తోంది” (అనిపిస్తోంది)… అని గ్రహించి ఉండు.

ఒకడు పురాణాదులలో “స్వర్గము” మొదలైన లోకముల గురించి పఠిస్తున్నాడనుకో! ”స్వర్గలోకం ఉన్నది. అక్కడ అత్యుత్తమ భోగ వస్తువులు, అమృతముతో నిండిన సరోవరములు, మధుర సువాసనతో కూడిన పుష్పములు, అత్యంత సుందరమైన వనములు, అప్సరసలు ఉంటారు. అక్కడ అంతా సుఖమే గాని, ఇక దుఃఖమనేదే ఉండదు! అయితే ఇక్కడ వ్రతములు, ధర్మములు, దానములు చేస్తే అవి నాకు లభిస్తాయి” అని పురాణాలలో చెప్పినట్లు యజ్ఞ కార్యములు, దాన ధర్మములు మొదలైనవి చేస్తే, అప్పుడాతనికి ఆ స్వర్గలోకం, అందులో శాస్త్రములచే చెప్పబడే సుఖమయ వస్తువులు తప్పక లభిస్తాయి. అవన్నీ అట్లాగే అనుభూతమౌతాయి.

అట్లా కాకుండా, “ఇదంతా కూడా ఇక్కడ, అక్కడ కూడా మిథ్యయే కనుక అసమంజసమే అయివున్నది”… అనే బుద్ధిని మరొకడు కలిగి ఉన్నాడనుకో! అప్పుడు ఈతనికి ఈ లోకం, ఈ లోకంలో నిర్వర్తించే కర్మానుష్టానం, దీనిచే ఫలప్రదాలగు సుఖ స్వరూపాలగు స్వర్గాది లోకాలు, అచట గల భోగ్యవస్తువులు… ఈ వ్యవహారమంతా కూడా సంకల్పపురం వలె అసమంజసమే అవుతుంది.

ఈ దృశ్యము వాస్తవమేనా?… ఈ ఘనీభూతమై ప్రతి జీవునికి కనిపిస్తున్న దృశ్యం స్వతహాగా వాస్తవమా? ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఈ జీవులు - ఈ భూములు ఇవన్నీ కూడా వాస్తవం కాదు. అవాస్తవం! అయితే ‘దృశ్యం’ అనేది సంభవిస్తోంది. వాస్తవమే కానప్పుడు దృశ్యము ఎక్కడి నుండి

Page:760

సంభవిస్తోంది? దృశ్యమే స్వతఃగా లేనప్పుడు ఇక అద్దానిలో సమంజసమైనదేమున్నది? అసమంజస మైనదేమున్నది?

ప్రజ్ఞప్తి మహారాజు : ఈ దృశ్యము ఎదురుగా కనిపిస్తూ ఉంటే “ఈ దృశ్యమే లేదు! ఇక ఇందులో సమంజసమైనదీ లేదు! అసమంజసమైనదీ లేదు” అని మీరు సిద్ధాంతీకరిస్తున్నారు. అట్టి మీ సిద్ధాంతం ఎట్లా యుక్తియుక్తం?

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఈ దృశ్యమునకు “ద్రష్ట" అగు నీవు - సంవిత్ స్వరూపుడవే! సంవిత్ (సత్ + విత్ = ఉనికి +ఎరుక) స్వరూపుడవగు నీ యొక్క సంవిత్ స్వరూపమే నీకు దృశ్యముగా అనుభూతమౌతోంది.

“చిదాకాశమే దృశ్య జగత్ రూపంగా వివర్తము పొందుతోంది” అని అంటే దాని అర్థం ఏమిటి? ”కేవలం సంవిత్ స్వరూపుడగు ద్రష్టయే… స్వకీయమైన దృశ్యకల్పనచే… దృశ్యరూపంగా వివర్తము పొందినవాడై… ఈ దృశ్యమున తనకంటే వేరైన దానివలె కల్పనను ఆశ్రయించి… ఈ దృశ్యమును పొందుచున్నాడు!" …అని కదా!

“ఈ దృశ్యము లేదు”… అని నేను సిద్ధాంతీకరించటంలోని సారవిషయం అదే! ”ద్రష్ట యొక్క కల్పనకు వేరుగా దృశ్యము అనుభవమవదు. ఆతని కల్పనను అనుసరించే ఆతనికి దృశ్యము ఎట్లెట్లో అట్లట్లు అనుభూతమౌతోంది”… అని విశదీకరించటమే నా ఉద్దేశం.

“అందరికీ అనుభూతమగుచున్న స్వప్నంలోను, సంకల్ప నగరంలోను సమంజసమైనదీ లేదు. అసమంజసమైనదీ లేదు, అన్నీ సమంజసమే! అన్నీ అసమంజసమే” అని ఒప్పుకుంటావు కదా! ఏ కల్పనా న్యాయం స్వప్న - సంకల్ప నగరాలలో వర్తిస్తోందో… అదే కల్పనాన్యాయం “స్వప్న జాగ్రత్ దృశ్యం” (లేక) “జాగ్రత్ స్వప్నదృశ్యం“ అనబడు ఈ వర్తమానంలో నీకు కనిపించే దృశ్యంలో కూడా వర్తిస్తోందని గ్రహించు. అనగా నీ యొక్క కల్పనను అనుసరించే దృశ్యం అనుభవమౌతోంది. నీకు కల్పనయే లేనప్పుడు దృశ్యమే లేదు. ”స్వర్గలోకాలు ఉంటాయి. అవి పుణ్యకార్యముల ద్వారా సంపాదించుకోవాలి” అని నీవు కల్పనను ఆశ్రయిస్తే అప్పుడు “పుణ్యకార్యములు - అవి నిర్వర్తించటం, తద్వారా స్వర్గ లోకాలలో ఆయా సుఖాలు పొందటం” ఇవన్నీ సంభవిస్తాయి! అనగా, “అవన్నీ సమంజసమే”… అనే రూపంలో ఈ దృశ్యాన్ని పొందుతావు. అట్లా కాకుండా, "ఇదంతా బ్రహ్మమే! పరలోకాలు బ్రహ్మమే! బ్రహ్మమే సత్యము! నేను సర్వదా సర్వకల్పనలకు ఆవల మార్పు చేర్పులు లేని బ్రహ్మమే స్వరూపంగా కలిగి ఉన్నాను. ఈ జీవులు - - ఈ లోకములు బ్రహ్మమే స్వస్వరూపముగా గల నా కల్పన చేతనే ఏర్పడి, కల్పన తొలగితే నా రూపమే అగుచున్నాయి” అనే దృఢ భావన కలిగి ఉన్నవానికో? ఆతనికి ఇక్కడ లేనివి, స్వర్గంలో లభించేవి ఏవీ ఉండవు. అనగా ఆతనికి ఇహలోకమూ లేదు! పరలోకమూ లేదు! ఆతడు సర్వదా అంతటా ఆత్మనే ఆత్మకు అభిన్నమైనదిగానే పొందుచున్నాడు.

కనుక ఓ రాజా! స్వప్నంలోలాగానే ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మ స్వరూపమగు చైతన్యము యొక్క సంకల్పమే అయివున్నాయి.

Page:761

మరల చెప్పుచున్నాను! నీ సంకల్ప నగరంలో నీకు అసంభవం, అసమంజసం అయినది ఏదీ ఉండనట్లే… “బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే“ అయి ఉన్నట్టి ఈ జగత్తు యొక్క సమస్త పదార్థములందు కూడా ”అసంభవం, అసమంజసం”… అనేదేదీ లేదు! అట్లాగే స్వప్నంలోలాగానే ఇక్కడ సంభవం, సమంజసం అయినది కూడా ఏదీ లేదు. బ్రహ్మం యొక్క సంకల్పం (అనగా ఈ జగత్తు) నందు ఏ వస్తువు ఏ ప్రకారంగా కల్పించబడిందో …అది ఆ ప్రకారంగానే అట్టి ఆకారం, లక్షణం, ధర్మములతో కూడియే ఆ స్వభావమున స్థితినొంది ఉన్నదగుచున్నది! అట్టి ఆకార - స్వభావ-నియమాలను అనుసరించే జ్ఞానేంద్రియాలు (కళ్ళు-చెవులు-చర్మము-నాలుక-ముక్కు) ఆయా వస్తువులను ఆయా రూపాలుగా పొందుచూ “ఇది జగత్తు”…అని నీచే అనుభవరూపంగా పొందబడుచున్నాయి. అట్లాగే కర్మేంద్రియాల వ్యవహారం కూడా కొనసాగు తోంది! చైతన్యం యొక్క పూర్వ కాలపు అనుభవ స్థితి ఉత్తర కాలమున చైతన్యం యొక్క మరొక రీతి అయిన ప్రయత్నం చేతనే అన్యధాభావం పొందటం జరుగుచున్నది.

బ్రహ్మమే హిరణ్యగర్భుని వేషం ధరిస్తోంది. ఆ హిరణ్యగర్భుని సంకల్పము చేతనే వస్తుధర్మాలు, లోకాలు, కర్మ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. ఇది ప్రళయము వరకు ఇట్లాగే కొనసాగటం కూడా జరుగుతోంది. మరల ప్రళయానంతరం ఆ కల్పన యొక్క చైతన్యము - ప్రయత్నమును అనుసరించి ‘అన్యధా భావము’ పొందటం జరుగుతోంది. ప్రతిజీవునికి చైతన్యము నందు స్వప్నము, ఆ స్వప్నంలో స్వప్ననగరం, ఆ స్వప్న నగరంలో ప్రియ - - అప్రియ రూపాలు, పరస్పర సంబంధాలు - - అనుభూతులు ఎట్లా ప్రాప్తిస్తున్నాయో… అవన్నీ తొలగి మరునాటి స్వప్నంలో మరొక రీతిగా అవి పొందబడు చున్నాయో… అట్లాగే బ్రహ్మం యొక్క సంకల్ప రూపమగు ఈ జగత్తులు, కల్పములు, కల్పాంతములు, ప్రళయములు, పునః జగత్తులు మాయా పూర్వకంగా సంభవిస్తున్నాయి. అయితే వాస్తవానికి స్వయముగా బ్రహ్మమే అయి భాసిస్తున్నాయి. కాబట్టి…

1.బ్రహ్మము యొక్క “సంకల్ప నగరమే” అయివున్న ఈ జగత్తు నందు “సంభవించనిది” అంటూ ఏదీ లేదు. “అసమంజసం”గా ఏదీ లేదు.

  1. సంకల్పము సంకల్ప కర్త రూపమే కదా! ‘ఊహ’ ఊహించుకొనువాని స్వరూప స్వభావమే కదా!

స్వప్నం స్వప్న ద్రష్ట యొక్క స్వరూప చమత్కారమే కదా! అట్లాగే, ఇదంతా బ్రహ్మము సంకల్ప రూపమే కనుక బ్రహ్మమే అయివున్నది (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ). నీచే పొందబడుచున్నదంతా నీ “స్వభావము” యొక్క అంతర్గత విభాగమే అయివున్నది.

  1. వ్యక్తిగత జగత్ - - బ్రహ్మాండానుభవాలు

శ్రీ ప్రజ్ఞప్తి రాజు : హే మహర్షీ! ఎంతటి సుదినం! మీ వాక్రవాహంచే నా అజ్ఞానాంధకారమంతా పటాపంచలు అవుతోంది.

Page:762

స్వామీ! మరొక సందేహం, ఇతఃపూర్వం అడిగినదే… మరొక్కసారి మీ ముందు ఉంచుతాను. 66 ఆకాశంలో పూర్ణ చంద్రరూపుడను అయి ఉండెదను గాక!"… అని ఒక వంద మంది ఆ ఫలప్రాప్తికై శాస్త్రీయంగా ప్రయత్నశీలురైనప్పుడు… ఆకాశంలో వంద మంది చంద్రులు ఆవిర్భవిస్తు న్నారా! లేదు కదా! ఆకాశంలో ఎప్పటికైనా ఒక్క పూర్ణచంద్రబింబమే ఉంటుంది కదా! అటువంటి అనేకమంది యొక్క ఒకే రీతి అయిన అభీష్టాలు ఒక్కసారే ఎట్లా నెరవేరుతాయి?… అని ప్రశ్నించి యున్నాను. అప్పుడీ కనిపించే చంద్రబింబం ఏమౌతుంది?

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : “ఒకేసారి అనేకులు పూర్ణ చంద్రబింబ స్వరూపులు కావాలని ఉపక్రమిస్తే అప్పుడు ఆకాశం నిండా పూర్ణచంద్రబింబాలు ఏర్పడతాయా?”… అనే నీ ప్రశ్నకు సమాధానంవిను.

నీవు చెప్పిన ఏ వందమందైతే “మేము పూర్ణచంద్రబింబ స్వరూపం కావాలి’… అనే ఉసాసనకు ఉపక్రమించారో… ఆ ఫలం యొక్క ప్రాప్తి అనివార్యమే కాబట్టి వారందరు చంద్రబింబ స్వరూపులుగా ఒకే సమయంలో కూడా అవవచ్చు! అయితే వారు ఈ ఆకాశంలో ఈ చంద్రబింబ స్వరూపులుగా అవరు. కనుక ఈ ఆకాశానికి, ఈ చంద్రబింబానికి వచ్చే ప్రమాదమేదీ లేదు. ఎందుకంటే ఒకరు ఒక కలకంటూ ఉంటే అందులోకి రెండవ వాని స్వప్నం ప్రవేశించి ఆ కలలోని విశేషాలకు విఘ్నం కలిగించటం లేదు కదా! నీ ఊహలో నేను ప్రవేశించి అందులోని భవనాలను తొలగించి గుడిసెలు కట్టడం లేదు కదా! అసలు… సంకల్పపురంలోని వీథులు, గృహాలు, సహజీవులు… ఇవన్నీ ఆ సంకల్పమును నిర్వర్తించే జీవులలోనే ఉన్నాయిగాని, మరెక్కడో లేవు! కాబట్టి నీవు చెప్పిన వంద మంది పూర్ణ చంద్రోపాసకులు వారి వారి సంకల్ప సృష్టులలోని ఆకాశములలో వేరువేరుగా పూర్ణ చంద్ర స్వరూపులై వెలుగొందగలరు. ఏ ధ్యాత (ధ్యానం చేయువాడు) అయితే “రాత్రిపూట వెలుగొందుచున్న ఈ చంద్రబింబంలో ఇప్పుడు నేను ప్రవేశిస్తున్నాను” అనే ధ్యానమును పరిపూర్ణ పరచుకొంటాడో… ఆతడు అట్లాగే ఆత్మజ్ఞాన సుఖరహితుడై, ఈ చంద్రుని యందు ప్రవేశించగలడు. అట్లా కాకుండా, “నేను ఆకాశంలో చంద్రబింబంలో ప్రవేశించి ప్రత్యేక చంద్రబింబ సుఖం అనుభవిస్తాను” అని తలచి ప్రయత్నిస్తే వారు అనంత సంఖ్యాకంగా ఉత్పత్తి కాగల భూమండలాలలో చంద్రబింబ రూపం ధరించగలరు. ఈ మనుజుడు ఏ స్వభావంతో ఏ రీతిగా దృఢ సంకల్పము కలిగియున్నవాడై ధ్యానమును ఆశ్రయిస్తాడో… ఆ స్వభావమునే… ఆ రీతిగానే ఆతని సంవిత్తు అనుభవిస్తూ ఉంటుంది.

ఆ విధంగా వేరు వేరు ధ్యాతలు వేరు వేరుగా పూర్ణచంద్రమండల రూపాలను ధ్యానిస్తూ వేరు వేరు చంద్రమండల రూపములను తమతమ సంకల్ప జగత్తులలలో పొందుచున్నట్లే… ఒకే స్త్రీని గూర్చిన ధ్యానముచే అనేకమంది తమ తమ సంకల్ప నిర్మిత జగత్తులలో వేరువేరుగా ధ్యానించటంచే ఆ స్త్రీని అనేకులు తమ సంకల్ప జగత్తులో పొందుతూ ఉండటం కూడా జరుగగలదు. అదంతా వారి సంకల్పానుసారమే నిర్మించబడుచున్నదని నీవు గ్రహించు! ద్రష్ట యొక్క సాక్షి చైతన్యమే ప్రియత్వముచే ప్రియమైన రూపాదులుగా అయి ఆ రూపాదులన్నీ పొందుతుంది.

Page:763

అట్లాగే "నేను ఈ గదిలోంచి బయటకు వెళ్ళకుండానే సప్తద్వీపములకు చక్రవర్తినై చక్రవర్తి సింహాసనం అధిష్ఠించి సప్తద్వీపవాసులను శాసించాలి”… అనే ధ్యానము గల ధ్యాత, తన ఉపాసన తీవ్రతచే ఆ గదిలోనే స్వచిత్తాకాశంలో కల్పనా సిద్ధమైయున్న సప్తద్వీప సమన్వితమైన మహా సామ్రాజ్యాన్ని సుదీర్ఘంగా సంచారము చేస్తూ పరిపాలించగలడు. ఎందుకంటే ఆతని సాక్షి సంవిత్తే ఆతని ఉపాసన ప్రయోజన రూపం కూడా దాల్చుచున్నది కనుక!

శ్రీ ప్రజ్ఞప్తి రాజు : మీరు చెప్పినట్లే గదిలోనే సప్తద్వీపములు - సూర్యచంద్ర - నక్షత్ర మండలాలతో కూడి సిద్ధించియే ఉన్న మహాసామ్రాజ్యం ఆతనికి ఎలా లభ్యం అవగలుగుతుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇందులో అంతగా ఆశ్చర్యపడవలసినదేమున్నది? మనకు దృశ్యరూపమై కనిపించే జగత్తంతా కూడా… “ఆద్య స్వరూపుడు - సర్వజ్ఞుడు" అగు బ్రహ్మదేవుని (హిరణ్యగర్భుని) కల్పనామాత్రమే కదా! అనగా? ‘కల్పన’ మాత్రమే కదా! ‘కల్పన’ అనేదది (అది హిరణ్యగర్భునిది అయినా, (లేక) నీది, నాది, మరొకరిది అయినా కూడా)… శూన్యరూపమే కదా! నిరాకారమే కదా! అట్టి ఊహ (లేక) కల్పనలో ఈ భౌతిక పదార్థాలన్నీ సమకూడినవై నామ - రూపాత్మకంగా ఉండటం లేదా? అప్పుడిక ఉపాసకుల కల్పనా జగత్తులో కల్పిత జగత్తులు ఏర్పడటంలో మనం “అసమంజసము”… అని అనుకోవలసినదేమున్నది?

  1. ఇహలోక కర్మములు - పరలోక ఫలములు

శ్రీ వసిష్ఠ మహర్షి :

దానౌర్ధ్వదేహిక తపో జపాదీనాం పరత్ర యత్ | అమూర్తానాం ఫలం మూర్తం, తదిదం కథ్యతే శృణు |

ఓ ప్రజ్ఞప్తి మహారాజా! ఇక, “ఈ ప్రపంచంలో ఒకడు తనకు ప్రియమైన వారిని ఉద్దేశించి నిర్వర్తించే దానము, (లేక) పితృ దేవతలను ఉద్దేశించి చేసే శ్రాద్ధము మొదలైన ఊర్ధ్వదేహిక క్రియలు, తపస్సు, జపము, పూజ, దేవతా పూజలు… ఇటువంటి అమూర్తములు (నిరాకార క్రియా ఫలములు) ఎక్కడో దూరంగా ఉన్నవారిపట్లా, ఊర్ధ్వలోకాలలో ఉన్న వారిపట్లా ఎట్లా ఫలప్రదమౌతాయి?" అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుచున్నాను… విను.

పరలోకంలో ఉన్న అమూర్తులు భౌతికదేహం కలిగి ఉండనప్పటికీ మనోరూప సూక్ష్మదేహం కలిగియే ఉంటారు. దానాదులచే చిహ్నితమైన బుద్ధి కలిగియే ఉంటున్నారు. ప్రతిజీవుడు భౌతికదేహం ప్రక్కకు పెట్టి అమూర్తంగానే స్వప్నంలో అనేక దృశ్యములు - అనుభవాలు పొందుచూనే ఉన్నాడు కదా! అట్లాగే చైతన్యము యొక్క ప్రభావం చేతనే మూర్తమగు దేహాదులతో చేసిన కర్మల ఫలములు దూర ప్రదేశాలలో నివసించే బంధువులు, అమూర్తమగు ఊర్ధ్వలోకాలలోని పితృ దేవతలు పొందటం జరుగుతోంది. సర్వత్రా సర్వదా వేంచేసియున్న చైతన్యము యొక్క ప్రభావం చేతనే… ఒకడు తన

Page:764

ప్రియమైన వారి ఆనందము - సంక్షేమము కొరకై ఉద్దేశించి నిర్వర్తించిన శుభకర్మలు ఆ దూరంగా ఉన్నవారి పట్ల ఫలప్రదం అవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం నీవు గమనించు.

మనస్సు చేతనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలయికయే ఈ శరీరము. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా ఏదేది ఎవరెవరిచే భావనయొక్క పుష్టిచే పొందబడుచున్నదో… అదియే వారి వారికి ‘జగత్తు’ అను శాస్త్రీయ నామమై ప్రసిద్ధమై ఉంటోంది.

అంతేగాని, ‘జగత్తు’ అనగా ఈ ఆకాశము, భూమి, గ్రామము, పట్టణము, ఇల్లు, వాకిలి, దేశము, కొండలు, గుహలు కాదు. మనస్సు చేత, జ్ఞానేంద్రియముల చేత చిన్మాత్రమునకు వేదనం -అవేదనం (తెలియటం, తెలియకపోవటం) ఆకార రూపమగు ‘భ్రాంతి’ కలుగుతోంది.

అట్టి భ్రాంతియే "విషయప్రాప్తి కొరకై తన కల్పనారూప జగత్తునందు సుదీర్ఘంగా సంచరిస్తూ అనేక దేహములు పొందటం, త్యజించటం చేస్తోంది. అనగా ఆ చిన్మాత్రము (కేవల చిత్ స్వరూపమే అయివుండి కూడా) మనస్సుతో కూడిన కర్మేంద్రియములను స్వరూపంగా దర్శిస్తూ చలన - అచలన భావములన్నీ పెంపొందించుకొని పొందుచున్నది.

ఈ విధంగా ప్రతి ద్రష్ట వాస్తవానికి కేవల - నిర్మల చిత్ స్వరూపుడే అయివున్నాడు. ప్రతి ఒక్కరి స్వస్థానము (లేక) జన్మస్థానము చిదాకాశమే అయివున్నది. మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ జనితమైన ఆ ’భ్రమ’ శమించిందా… ఇక ఆ ఉపాసకుడు (ఆత్మనే సర్వత్రా ఉపాసించువాడు) శాంతము, నిర్మలము అగు ఆత్మగానే శేషించుచున్నవాడగుచున్నాడు.

ఇక… శాస్త్రజ్ఞులు, “ఈ లోకమున అనుష్ఠింపబడిన దానములు, ధర్మములు, మంత్రములు మొదలైనవి చిత్ప్రతిభాస రూపుడే అగు దూరంగా ఉన్నట్టి (లేక) పరలోకంలో ఉన్నట్టి మరొక జీవునికి సత్పల రూపంలో ప్రతిఫలిస్తాయి”… అని శాస్త్రపూర్వకంగా చెప్పుచున్నప్పుడు, “అవి సంకల్ప రూపంగా నిరాకారమే కాబట్టి సాకార ఫలాలను ప్రసాదించవు” … అని వాదించవలసిన పనేమిటి? అనుభవజ్ఞులగు జ్ఞానులు చెప్పే శాస్త్ర మర్యాదను అనుసరించి అవి అట్లా సత్ఫలాలను ఇవ్వగలవని గ్రహించియే ఉండు.

"కల్పనామయమే అయివున్నట్టి ఈ ప్రపంచమునకు ఆధారము అగు చిన్మాత్రమే సంకల్ప ప్రతిభాసచేత దాన-వ్రత తపస్సు - పూజల భోగైశ్వర్య ఫలరూపంగా ఆయా ఉద్దేశించబడిన జీవులకు బాధానివారణ రూపంగాను, దారిద్ర్యాలను తొలగించే విధంగాను ఇహ పరలోకాలలో ప్రయాణించ గలవు” - అనుదానికి విరోధమేమున్నది చెప్పు? మనోశక్తి భౌతిక శక్తికంటే సూక్ష్మం, విస్తారం కదా!

ఓ రాజా! ఈ విధంగా నీవు అడిగిన దానికి సమాధానపూర్వకంగా, రెండు విషయాలు క్రోడీకరించి మరల చెప్పుచున్నాను.

  1. ఈ జగత్తంతా నిరాకారము, 2. ఇది చైతన్యము యొక్క కల్పనా స్వరూపం

Page:765

ప్రజ్ఞప్తి మహారాజు : మహాత్మా! చైతన్యము మొట్టమొదట దేహరహితము - - నిరాకారము కదా! అట్టి దేహ రహితమగు చైతన్యముచే సృష్ట్యాది యందు ఈ దేహకల్పన అంతా ఎట్లా భాసిస్తోంది? వెలుతురులో వస్తువు ఉంటేనే చూడగలంగాని వస్తువు లేనప్పుడు వెలుతురు చూడలేం కదా! అట్లాగే చైతన్యం దేహం ఉన్నప్పుడే అభివ్యక్తం అవుతోంది. దేహం లేనిచోట చైతన్యము అభివ్యక్తం కావటం లేదు కదా! ఇది ఎందుచేత?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాజా! “దేహము” అనే శబ్దానికి ఏ జడమైన వస్తువు రూపంగా నీవు అర్థం గ్రహిస్తున్నావో.. అట్టిదాని విషయంలో తత్త్వజ్ఞానికి అట్టి అర్థం కనబడటంలేదు. జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే అయివున్నది. ఏది ‘బ్రహ్మం’ అనే శబ్దానికి అర్థమై ఉన్నదో… అదియే “దేహము” అనే శబ్దానికి కూడా అర్థమై యున్నది. జలం, నీళ్ళు … ఈ రెండింటికీ ఒకే అర్థం ఉన్నట్లుగా… బ్రహ్మం, దేహం అను రెండు శబ్దములకు అర్థం ఒక్కటే!

ఇక నీ దృష్టికి వద్దాం. స్వప్నంలో కనిపించిన దేహం స్వప్నరూపమే కదా! అట్లాగే ఏ ఈ దేహమును నీవు చూస్తున్నావో… అది చిద్రూపబ్రహ్మమే అయివున్నది.

నాయనా! “స్వప్నం” అని నేనప్పుడు నీకు దృష్టాంతము కొరకు సర్వజనుల పరిభాషగా ఆ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాను. అంతేగాని, వాస్తవానికి ఆ స్వప్నము స్వప్నము కాదు. మరి? బ్రహ్మమే అయివున్నది! స్వప్నం నీకు అనుభూతమగుచున్న విషయం కనుక అద్దానిచే నీకు బోధ నిర్వర్తిస్తున్నాను. వాస్తవానికి స్వప్నము - సృష్టికి సాదృశ్యం లేదు. ఎందుకంటే?

స్వప్నంలో స్వప్నం వేరు, స్వప్న ద్రష్ట వేరు …అని అనిపిస్తోంది కదా! జగత్తులో సృష్టి - ద్రష్ట కూడా చిద్రూపముగానే (జ్ఞాన దృష్టిచే స్వకీయాత్మ స్వరూపంగానే) భాసిస్తోంది. అందుకే ‘సాదృశ్యం లేదు’ అని అంటున్నాను. ఎప్పుడైతే అంతాకూడా కేవల బ్రహ్మమే అయి ఉన్నదో… అప్పుడిక అచట దేహమెక్కడ? స్వప్న పదార్థములు ఎవనికి? స్వప్న బుద్ధి ఎక్కడిది? ‘స్వప్నం’ అనే మిథ్యారూప భ్రమచే జ్ఞాని అజ్ఞానికి బోధిస్తున్నాడు. అంతకు మించి వాస్తవానికి బ్రహానికి వేరుగా స్వప్నం లేదు. బ్రహ్మపదంలో జగత్తు లేదు. స్వప్నం లేదు. సుషుప్తి లేదు. మరింకొకటేదీ లేదు.

బ్రహ్మమే అన్నిటా… అంతటా తానై ఉన్నది. అనిర్వచనీయము, చిదాకాశ మాత్రము, మౌన రూపము, “విరాట్టు - చిత్తాకాశము - అహంకారము” అనే మూడు లయించగా కూడా శేషించునది, ‘తురీయము’ అనే పేరుతో చెప్పబడేది, ‘ఓం’ కారము యొక్క లక్ష్యార్థము, పరమ పురుషార్థము అగు బ్రహ్మమే ఇట్లు జగత్తు రూపంగా భాసిస్తోంది. ఏ ఈ జగత్తు నీవు భాసిస్తున్నదని అనుకుంటున్నావో (నీకు కనబడుతోందో)… అది వాస్తవానికి భాసించకయే ఉన్నది. జాగ్రత్ స్వప్నాదులు వాస్తవానికి లేవు. అతి నిర్మలమగు బ్రహ్మం మాత్రమే కలదు.

ప్రజ్ఞప్తి మహారాజు : మహర్షీ! అసలీ దృశ్యంగా భాసించేదంతా ఎందులో భాసిస్తోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :

దేశాద్దేశాంతర ప్రాప్తా యన్మధ్యే సంవిదో వపుః

తన్మయం సర్వమేవేదం ద్వైతమద్వైతమేవ చ ॥

Page:766

నీయొక్క బుద్ధి వృత్తి నీ నేత్రేంద్రియం (కళ్ళు) ద్వారా ఒక ప్రదేశము నుండి మరొక

ప్రదేశమునకు వెళ్ళుచున్నదనుకో.

బుద్ధివృత్తి → నేత్రేంద్రియం ↓ ఆ రెండు దృశ్యవిషయముల మరొక దృశ్య

ఒక దృశ్య మధ్య గల చైతన్యం యొక్క విషయం వైపు

విషయం నుండి నిర్విషయ స్వరూపం వెళ్ళుచుండటం.

.

మరొక విషయం

వైపుగావెళ్ళుచుండడం

ఆ రెండు దృశ్యవిషయముల మధ్యగా – గల చైతన్యం యొక్క నిర్విషయ

స్వరూపము ఏదైతే కలదో… అద్దాని చేతనే, అద్దాని యందే పరిపూర్ణమై ఈ ద్వైతాద్వైతరూపమగు జగత్తంతా కూడా వెలయుచున్నది.

అజ్ఞానికి ఆతని దృష్టియందున్న ఈ జగత్తును స్వప్నంతో సాదృశ్యంగా చేసి బోధించబడుతోంది. జ్ఞానియొక్క దృష్టిలో ఈ “ద్వైత-అద్వైత-శుభ-అశుభ” రూపమగు స్వప్న-జాగ్రత్ జగత్తులు చిన్మయ రూపాలే! కాబట్టి అజ్ఞానికి “ఇదంతా మాయయే” అని బోధిస్తున్నప్పటికీ, జ్ఞానికి బోధించే టప్పుడు “ఈ సమస్తం మృణ్మయం కాదు. చిన్మాత్రాకాశమునకు సాదృశ్యమైనదే!" అని బోధించ బడుతోంది. శూన్యం, పదార్థ ప్రాప్తి, పదార్థముల భావన, పదార్థముల ప్రకాశం (సృష్టి), పదార్థముల అభావం లేక అప్రకాశం (ప్రళయం)… అంతా కూడా పరమ చిదాకాశమే అయి వున్నది.

పూర్ణాత్ పూర్ణం ప్రసరతి, పూర్ణమేవ స్థితం జగత్ న చ భాతం న చాభాతం శిలాబద్ధోదరోపమమ్ II

పూర్ణమగు పరబ్రహ్మము నుండి పూర్ణమే అగు ఈ జగత్తు ప్రసరించుచున్నది. ఈ జగత్తు పరిపూర్ణ పరబ్రహ్మముగానే స్థితినొంది ఉన్నది. (పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణముదచ్యతే! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే॥) వాస్తవానికి బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నదిగాని అద్దాని యందు ‘జగత్తు’ అనబడునదేదీ భాసించటమే లేదు. భాసించకయూ లేదు. శిలయొక్క ఘనీభూతమగు మధ్యభాగమువలె ఇదంతా కూడ చిదనమే అయివున్నది.

ఈ జగత్తు చైతన్యం యొక్క స్పురణ మాత్రమే కదా! అందుచేత ఇదంతా కూడా నిరాకారమగు చిదాకాశరూపమే అయి వెలయుచున్నది. అంతేకాదు. ఎచ్చటెచ్చట చిన్మాత్రము ఉంటుందో… అచ్చటచ్చట అద్దాని చమత్కారమే అగు స్ఫురణ రూపజగత్తు ఉండనే ఉంటుంది.

చిదాకాశం సర్వత్రా ఉన్నది. ఆ చిదాకాశమే సర్వజగత్ రూపంగా వర్తిస్తోంది. ఇది ‘జగత్తు’ అని చెప్పబడుచున్నప్పటికీ, ఇదంతా కూడా సర్వదా నిర్వికారమగు బ్రహ్మమే అయివున్నది.

Page:767

ఓ రాజా! పరమపురుషార్థమయినట్టి ‘మోక్షము’ పట్ల మాత్రమే ఇచ్ఛగల శ్రోతలకు ఏదో యుక్తితో బ్రహ్మమును విశదీకరించటానికి “ఇది జగత్తు, ఇది స్వప్నము, ఇది బ్రహ్మం” అని మొట్ట మొదట చెప్పుచున్నాం. ”జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే కాబట్టి జగత్తు లేదు. బ్రహ్మమే ఉన్నది” అని అతిత్వరగా బోధించటానికి మేము ఉత్సాహవంతులమౌతున్నాం. యుక్తితో ఆగిపోకూడదు. అనుభవమే అన్నిటికీ ప్రమాణం అందుచేత నా అనుభవాన్ని అనుసరించి ఈ జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే! (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ); నేను బ్రహ్మమే స్వరూపముగా కలవాడను! (అహమ్ బ్రహ్మా స్మి); ఈ జగత్తంతా నా రూపమే! (సో హమస్మి); నీవు నా స్వరూపమగు బ్రహ్మమే అయివున్నావు! (త్వమేవార్తి హమ్).

జగత్తుకు అతీతమైన నేను (పరమాత్మ), జగత్తులోని నేను (జీవాత్మ), జగత్ సంబంధమైన నాది (అహంకారం), జీవాత్మ యొక్క ఇంద్రియాలు (ఉపకరణాలు), ఈ జీవాత్మ యొక్క ‘త్వమ్’ ప్రత్యయం (ఇంద్రియ విషయాలు, దృశ్య జగత్తు) - ఇవన్నీ కూడా సదా, సర్వదా ఏకైక స్వస్వరూప బ్రహ్మమే అయివున్నాయి.

యథాస్థిమ్ ఇదం విశ్వం తథా సంస్థమ్ అనామయమ్ బ్రహ్మైవ నిరవద్యాత్మ చిత్సంకల్పపురాకృతి ॥

ఈ జగత్తు యథాతథంగా చైతన్యము యొక్క సంకల్పనగరాకాశం కలిగియున్నదై, నిర్వికారమై సర్వదా బ్రహ్మమునకు (మొదలే) అభిన్నమై వెలుగొందుతోంది. ఈ జగత్తే కాదు. స్వప్న జగత్తు కూడా అంతే! అదంతా కూడా బ్రహ్మమే! ఇప్పటి ఈ జగత్తే కాదు. ప్రతి జీవునికి కనిపించే భూత - వర్తమాన - భవిష్యత్ జాగ్రత్ స్వప్న జగత్తులు, వాటి యొక్క ద్రష్టలు… ఇవన్నీ కూడా సర్వదా బ్రహ్మమే అయివున్నాయి. ఎవ్వరైనా ఎక్కడైనా మరింకేదైనా జగత్తుగా దర్శిస్తుంటే… “వారు బ్రహ్మమునే అట్లట్లుగా దర్శిస్తున్నారు”… అని గ్రహించినవాడివై ఉండు.

ప్రజ్ఞప్తి మహారాజు : మహర్షీ! మరి ఈ జగత్తును అధిగమించి బ్రహ్మమును పొందటం ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి :

లోకే శాస్త్రే థ వేదాదౌ యత్సిద్ధం సిద్ధమేవ తత్

సదస్త్వ సద్వాత్మని తద్ధాతుం శక్యం న వా క్వచిత్ II

ఓ రాజా! ఎవరు ఏ భావనతో ఎట్లు దర్శిస్తే అది వారికి అట్లే బ్రహ్మమే సర్వదా అనుభవ మౌతోంది. లోకాచారాలు గాని, శిష్టాచారాలుగాని, శాస్త్రములందు ఏది చెప్పబడుచున్నదో… వేదాలలో ఏది సిద్ధాంతీకరించబడుతోందో… అది అట్లే వారికి స్వకీయ భావనానుసారమే సత్యమైన దగుచున్నాయి. సత్యమగు బ్రహ్మము గురించిన అద్వైత సిద్ధాంతం కావచ్చు. ద్వైతము గురించిన సిద్ధాంతం కావచ్చు… ఇవన్నీ ఏవీ త్యజించబడవు. అనగా… ఈ జగత్తు ఇతఃపూర్వం ఇట్లాగే ఉన్నది. ఇప్పుడు, మరొకప్పుడు కూడా ఇట్లాగే ఉండటం జరుగుతోంది. అయితే, నీ నీ దృష్టి పవిత్రమై నప్పుడు… ఇది జగత్తుగా కాకుండా బ్రహ్మముగానే అగుపిస్తోంది. అనగా జ్ఞాన ప్రాప్తికి పూర్వం (అబ్రహ్మపరంగా) కనిపించిన జగత్తు ‘చరమసాక్షాత్కార వృత్తి’ రూపమగు ఆత్మ జ్ఞానమునందు

Page:768

లయించగా “ఈ జగత్తే బ్రహ్మం” అని అనుభూతమౌతోంది. కనుక “ఈ జగత్తులోని ఏది త్యజించాలి? ఈ జగత్తును ఎట్లా జయించాలి?” అనే ప్రశ్న అసంగతమైనదే కదా! నీ దృష్టిని పవిత్రము, సూక్ష్మము, విస్తారము సమున్నతము చేసుకొన్నవాడివై “ఇదంతా బ్రహ్మమే“ అనేది గమనిస్తూ దర్శిస్తూ ఆస్వాదించు (దృష్టిమ్ జ్ఞానమయమ్ కృత్వాత్ పశ్యేత్ బ్రహ్మమయమ్ జగత్). ఇంతకుమించి నేను బోధించగల ఉత్కృష్టమైనదేదీ లేదు. “దేహమే బ్రహ్మము. బ్రహ్మమే ఈ దేహము” అను నా ఈ వాక్యము యొక్క పరమార్థమును గ్రహించి జీవన్ముక్తుడవై ద్రష్ట - దృశ్యములను (నీవు - నీకు కనబడే దృశ్యములను) భ్రమభావం నుండి బ్రహ్మభావమునకు తరలించు. ఈ కనబడే ”జీవుడు, దృశ్యం, జీవన్ముక్తి”. మొదలైన సమస్త జగత్తు బ్రహ్మమే! నేను చెప్పిన ఈ న్యాయం (సిద్ధాంతం) పరమ పురుషార్ధోపాయం అయివున్నది. కనుక గ్రహించుటకు యోగ్యం అయివున్నది. “ఈ దృశ్యం దృశ్యంగా కనిపించటం” అనేది అపరిజ్ఞాత యొక్క దృష్టి మాత్రమే! అపరిజ్ఞాతాత్మమాత్ర రూపమగు ఈ ‘జగత్తు’ అనే మహావృక్షంలో పరిజ్ఞాతాత్మకమగు చిదాకాశమునకు వేరుగా ఒక అణువు కూడా లేదు.

పరిజ్ఞాతాచిదాకాశమంతా నేను అయివున్నాను. నేనుగా ఉన్నది సర్వదా ఆ పరిజ్ఞాతా చిదాకాశమే! అపరిజ్ఞాతంగా ఉన్నది కూడా పరిజ్ఞాత చిదాకాశమే. ఈ మూడు లోకములు - ఈ బంధ మోక్షములు… ఇవన్నీ నేనే అయివున్నాను.

యథాస్థితమిదం దృశ్యం పరిజ్ఞానాత్ విలీయతే తజ్ఞస్యాత్ సంగతస్యైవ శిలామౌనం తు శిష్యతే ||

యథారీతిగా స్థితి కలిగి ఉన్న ఈ దృశ్యమంతా కూడా ‘జ్ఞానము’ అనే వెలుగు ప్రసరించగానే పరిపూర్ణంగా లయించిపోతోంది. చీకట్లో పిశాచాకారంగా కనిపించిన మోడుబారిన చెట్టు యొక్క పిశాచాకారం వెలుతురు పడగానే ఏమౌతోంది? వెలుతురులో ఆ చెట్టుపట్ల ఏర్పడిన పిశాచదృష్టి క్షణంలో తొలగిపోతుంది కదా! "ఇది జగత్తు, ఇది దేహం, ఇది దృశ్యం”… మొదలుగా గల వ్యవహారమంతా కూడా ఆ విధంగానే జ్ఞానమునందు లయించిపోతోంది. అట్టి జ్ఞానికి ఇక ఆపై ఇదంతా కూడా… (ఇద్దాని దృశ్యరూపమంతా) నశించిపోగా… అప్పుడు వాక్కుకు అగమ్యమైనట్టి ‘దృక్’ మాత్రమైన ’చిదనాత్మ’గా అనుభవమౌతోంది.

ఓ మహారాజా! వేదములచేత, శాస్త్రములచేత, జీవన్ముక్తులచేత ఏ దృష్టిచే “ఇదంతా బ్రహ్మమే (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ)” అని ఎలుగెత్తి చాటబడుచున్నదో… అట్టి దృష్టిని సముపార్జించుకొని, ఆ వాక్యమును స్వానుభవం చేసుకోవటమే నీ పరమావధి అగుగాక! అదియే పరమ పురుషార్థమగు మోక్షము. అది ఇప్పుడే ఇక్కడే సముపార్జించుకో!

ప్రజ్ఞప్తి మహారాజు : స్వామీ! ‘సర్వము బ్రహ్మము’ అనే జీవన్ముక్తుల మోక్షరూప దృష్టిని నేను సముపార్జించుకోవటమెట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇతరములైన పదార్థ-దేహ-భౌతిక దృష్టులన్నీ త్యజించి బ్రహ్మమునే చిరకాలం భావించు. “నాకు కనబడే ఇష్ట - అయిష్ట జనుల రూపము బ్రహ్మమే” అని మననం చేస్తూ ఉండు. చిరకాల భావనచే బ్రహ్మం ఎవరికైనా ఎక్కడైనా తప్పక అనుభూతం కాగలదు. అసత్యం అభ్యాసవశం

Page:769

చేత ’సత్యం’గా అనుభవమౌతూవుంటే… ఇక సత్యం సత్యంగా ఎందుకు అభ్యాసవశంచేత అనుభూతం కాకుండా ఉంటుంది? కనుక లౌకికమైన పదార్థాలు కూడా అనన్య భావనచే సదాశివ బ్రహ్మంగా తప్పక దర్శించబడగలవు. ఎందుకంటే… లౌకికత్వం అసత్యం, బ్రహ్మం సత్యం అయి ఉన్నది కదా! ఆ రెండింటి భేదం అంత మాత్రమే! సాధన, ప్రయత్నం, తత్ఫలానుభవాలలో ఆ రెండింటికీ ఏమాత్రం భేదం లేదు. ఎవడు ఏది సత్యమనుకుంటే అది ఆతనికి సత్యంగా అనుభవ మౌతోంది. నీవు మాత్రం “బ్రహ్మ సత్యమ్ - - జగన్మిథ్య” అను సారవాక్యమును గ్రహించి అభ్యసించు. ఓ మహాబుద్ధీ! మహాత్మా! ప్రజ్ఞప్తి మహారాజా! ఈ ప్రకారంగా నీ మహాప్రశ్నలకు సమాధానం చెప్పాను.

ఈ సమాధానాలు సుదీర్ఘ విచార ఫల నిర్ణయాలై ఉన్నాయి. నేను చెప్పిన మార్గంలో “అంతా బ్రహ్మమే” అను అభ్యాసముచే నీవు శారీరక - మానసిక వ్యధారహితుడవు కాగలవు. ఏ దృశ్యవ్యసనమూ లేక… సర్వోత్కృష్టుడవు అవుతావు!

  1. పునః స్పష్టం - పునః స్పష్టం! జగత్ బ్రహ్మైవ కేవలమ్!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియ రామచంద్రా! ఈ ప్రకారంగా ఆ కుశద్వీపంలోని ఐలావతీ నగరంలో ఒకానొక సమయంలో నాచే ఆ ప్రజ్ఞప్తి మహారాజుకు జ్ఞానోపదేశం చేయటం జరిగింది. నీ యొక్క పవిత్ర దృష్టి యొక్క పరిపుష్టి కొరకై ఈ సందర్భంలో చెప్పాను. ఆ తరువాత, ఆతడిచే పూజింపబడిన వాడనై తిరిగి దైవకార్య నిమిత్తం అక్కడి నుండి స్వర్గలోకం చేరడం జరిగింది. అట్టి ఉత్తమ జ్ఞాన దృష్టిచే నీవు ప్రశాంత మనస్కుడవు కాగలవు. కేవల చిదాకాశ స్వరూపుడవై ఉండగలవు.

బ్రహ్మైవ తదిదం సర్వం నిర్నామైవామలం నభః

కిమస్యేవాజమాశాంతమ్ ఆదిమధ్యాంత వర్జితమ్ ॥

ఓ రామచంద్రా! ఈ సమస్తం కూడా. ఆది మధ్యాంత రహితం, జన్మాది వర్జితం, మహాశాంత స్వరూపం, అనిర్వచ నీయం, శబ్దశూన్యం (నిశ్శబ్దరూపం), ఆకాశం వలె నిర్మలం, అగు చిద్రూప బ్రహ్మమే అయివున్నది! ’పరమాత్మ’కు ’బ్రహ్మం’ అనే శబ్దం కూడా కల్పితమైనదే అవుతుంది. ఎందుకంటే ‘కూటస్థం’ అయిన దానికి ‘బృహత్’ అనే శబ్దార్థమైనట్టి వృద్ధి మొదలైనవి లేనేలేవు. శబ్దరహితమగు ఆ నిర్మల పరమాత్మ పదాన్ని “చిన్మాత్రం” అని, ’పరాత్పరం’ అని శాస్త్రములు శబ్దార్థ పూర్వకంగా అందిస్తున్నాయి.

శ్రీరాముడు : మహాత్మా! సిద్ధులు, సాధ్యులు, యముడు, బ్రహ్మదేవుడు, విద్యాధరులు, దేవతలు - మొదలైన వారికి ఆధార భూతాలైన లోకాలు మనకు కనబడతాయా? ఏ ఉపాయంతో కనిపిస్తాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పిన ఆ లోకాలన్నీ కూడా ప్రతి రాత్రి - ప్రతి పగలు, ముందు - వెనుక, పైన - క్రింద అందుకు సంబంధించిన ధ్యానము- ఏకాగ్రతలను ఆశ్రయించి, ఎవరైనా “చూడాలి” అని అనుకుంటే చూడగలరు. లేకపోతే చూడలేరు.

Page:770

ఈ సిద్ధుల లోకములు రెండు విధములు -

  1. దూరస్థ లోకాలు (మహర్లోకం, తపోలోకం, సత్యలోకం మొదలైన దూర లోకాలు). 2. సర్వత్రా వెలయుచు సర్వ ప్రసిద్ధమైయున్న సంకల్ప లోకాలు.

….ఈ రెండింటిచేతా ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. ’ధారణాభ్యాసముచే ఆ రెండు విధాలైన లోకాలు సందర్శించవచ్చు. ధారణాభ్యాసం లేకపోతే వాటిని ఎవరూ దర్శించలేరు.

అయితే… సిద్ధుల లోకాలు కల్పనామాత్రమే! అట్లాగే ఈ మనలోకం కూడా కల్పన చేతనే సిద్ధించినదై ఉన్నది. వాయువు కల్పనారూపమే అయినప్పటికీ సర్వత్రా పరిభ్రమిస్తోంది కదా! అట్లాగే వారి లోకాలు కూడా కల్పనామాత్రమే అయివుండి సర్వత్రా పరిభ్రమిస్తున్నాయి. ఇక ఆ సిద్ధ లోకాలు ఎటువంటివంటావా? నీకు నీ 1. సంకల్పలోకం, 2. స్వప్నలోకం ఎట్లా రాత్రింబవళ్ళు భాసిస్తున్నాయో… అట్లాగే ఆయా ఇతర లోకాలన్నీ కూడా ఆయా కల్పనా పురుషులచే మనో కల్పనగా రచించబడినవై భాసిస్తున్నాయి. అట్లాగే నీవు కూడా నీ యొక్క యోగసాధనచే ’స్థిరము’ చేయబడిన ‘ధారణ’ ద్వారా స్వసంకల్పితంగా ఆయా లోకములకు ’స్థిరత్వం - నిశ్చలము’ ప్రసాదిస్తే అప్పుడు అటువంటి లోకాలు నీ పట్ల స్థిరత్వం పొందగలవు. అదే విధంగా ఏ ధ్యాత అయినా సరే …దృఢతరమైన “సంకల్పభావన”తో కూడివుంటే అప్పుడాతడు కూడా ఆయా సిద్ధుల వలెనే తన కల్పిత లోకాలలో తనకు అభిమతమైనట్టి విస్తారమైన సంపదలతో కూడివున్నవాటినిగా స్థిరములుగా గాంచగలుగుతాడు. అయితే ఇక్కడ ఒక విశేషం మాత్రం ఉన్నది. అదేమిటంటే… ఆయా సిద్ద లోకాలు పొందినట్టి పూర్వపుణ్య సంపత్తి చేత ఆయా సిద్ధులచే ఆయా లోకాలన్నీ అనాయాసంగా పొందబడుచున్నాయి.

అట్లా కాకుండా వర్తమానపు ‘ధారణ’ అనే అభ్యాసంచేత ఏ యోగి అభిలషిస్తాడో ఆతడు అట్టి లోకాలు శ్రమచే స్థిరముగా చేయుచున్నాడు! ఈ జగత్తు, ఆ లోకాలు… అన్నీ కూడా సదా “శాంతం, నిరాకారం” అయినట్టి చిదాకాశమే! ఈ జీవుడు దృఢ నిశ్చయంతో కూడుకొని ఉంటాడో… ఆతనికి చిదాకాశమే ఆ విధంగా భాసిస్తోంది. అంతకు మించి వేరే ఏమీ లేదు. శ్రీరాముడు : : ఏ నిశ్చయమూ లేని మనుజునకో?…

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏ నిశ్చయము, ఏ సంకల్పము లేని మనుజునకు ఏ లోక దృశ్య సంబంధమైన తర్క వితర్కములు ఉండవు. విషయత్వము ఉండదు. కనుక ఆతనికి ఈ సమస్త జగత్తు దృశ్యశూన్యము, నిరాకారము, ప్రతిబంధ రహితము అగు చిదాకాశముగానే గోచరిస్తోంది.

అనగా… దృఢ నిశ్చయముచే ఏదేది భాసిస్తోందో… అదంతా కూడా చిత్స్వభావం వల్లనే ప్రకాశమానమై గోచరిస్తోందని గ్రహించు! వాస్తవానికి ఈ దృశ్యరూపమగు ఆ సంవిత్తునందు దృశ్యాభిమానము లేదు. చిత్ సత్తావ్యాప్తి లేదు. ఇట్లు భాసించేది మిథ్య (లేక) దృష్టియే! ఉద్దేశమును అనుసరించే దృష్టి, దృష్టిని అనుసరించి దృశ్యము అనుభూతమౌతున్నాయి.

ఇక చిదాకాశము పట్ల ‘కార్య కారణ’ ప్రసంగమే లేదు. ఎందుకంటే ’అనంతము’ అయినట్టి చిదాకాశంలో ఏది ఎట్లు జనించగలుగుతుంది? మరిక ఈ "జీవులు-భూములు” మొదలుగాగల

Page:771

ఏదైతే ఉత్పన్నమైనట్లుగా భాసిస్తోందో… అదంతా కూడా, “చిదాకాశమే చిదాకాశమున అట్లు అభ్యాసవశం చేత అగుపించటం" అగుచున్నది. ఈ ప్రకారంగా రూపరహితమైన ఆ చిదాకాశమే అంతటా అన్నీ అయివుండగా (ఈ లోకము, సిద్ధలోకములు కూడా అయివుండగా) ఇక అద్దానిలో ద్వైత-ఏకత్వాల కల్పన ఎక్కడిది? అద్దానిలో కార్యకారణ భావన ఎక్కడిది? స్వప్నంలో చిదాకాశమే ‘పర్వతం’ రూపంగా కనిపించినప్పటికీ… వాస్తవానికి చిదాకాశం నిర్వికారంగానే వెలయుచున్నది కదా! అట్లాగే జాగ్రత్తులో కూడా చిదాకాశమున ఏదీ ఉత్పత్తి వినాశనములు కలిగి ఉండనప్పటికీ… అదియే ఈ వివర్తరూపమునకు అధిష్ఠానమై ఉండటం చేత… సర్వదా నిర్వికారమేఅయి, స్థితినొంది ఉన్నది. స్వప్నంలోను, సంకల్పంలోను చిత్తమే ఆకారాన్ని కల్పించి ఆయా పర్వతాదుల రూపం దర్శిస్తు న్నట్లుగా, (అందులో పర్వతాలు, ఆకాశం వాస్తవానికి లేనట్లే) బ్రహ్మమునందు ఈ జగత్తు లేనేలేదు. కాబట్టి మహాబుద్ధిమంతులగు జీవన్ముక్తులు ఈ ప్రపంచంలో వాక్ ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నప్పటికీ అంతరంలో శిలా విగ్రహంలాగా మహామౌనాన్ని అవధరించి నిర్వ్యాపారులై వెలయుచున్నారు.

జలము, జలతరంగం ఒకదానికి మరొకటి అభిన్నమే కదా! తరంగాలు పరివర్తనం పొందినా కూడా జలం యథాతథమే కదా! అట్లాగే బ్రహ్మంలో ఈ సృష్టులు బ్రహ్మానికి అభిన్నాలై వెలయు చున్నాయి. వాయువులో వాయుతరంగాలు, ఆకాశంలో శూన్యం అభిన్నంగా మూర్త - అమూర్తంగా వెలయుచున్నట్లు బ్రహ్మంలో సృష్టులు మూర్తామూర్తంగా బ్రహ్మమునకు వేరు కానివై వెలయు చున్నాయి. సంకల్ప నగరం వాస్తవానికి శూన్యం, నిరాకారం అయినప్పటికీ సాకారంగా ఎదురుగా కనిపిస్తూ ఉంటున్నట్లే, బ్రహ్మంలో ఈ జగత్తు కనబడుతోంది. అట్లాగే యమలోకాది తదితర జగత్తులు కూడా! ఈ త్రిలోకాలు దీర్ఘకాలంగా అనుభూతం అయినప్పటికీ… లౌకిక-పారలౌకిక కార్య సమర్థమై ఉంటున్నప్పటికీ… ఇదంతా కూడా శూన్యం, నిరాకారం అయి ఒప్పుచున్నది. చిత్త రూపమే స్వప్నాంతర్గత విశేషాలన్నీ అయినట్లు, ఈ జగత్తుగా కనిపించేదంతా చిత్తం యొక్క రూపమే!

ఒకడు తాను మరణించగా, బంధువులు ఏడ్చుచు తన దేహమును శ్మశానంలో కట్టెలతో కాల్చినట్లు కలకంటూ ఉంటాడు. తానే మరణిస్తే స్వప్నం ఎక్కడిది? స్వప్న బంధువులు ఎవరు? వారెవరూ లేనేలేరు కదా! అట్లాగే ఈ జగత్ పదార్థములు కొంచెము కూడా లేవు! ఈ జగత్తు (సృష్టి) - ఇద్దాని అభావం (ప్రళయం)… ఇవి రెండూ నిర్మల పరమాత్మ రూపాలే అయివున్నాయి. అధిష్ఠాన రూపంచే పరమాత్మ రూపాలు. ఆరోపిత రూపంచే అవి సత్యములే కావు. త్రాడే పాముగా కనిపించినప్పటికీ… త్రాడునందు పాము లేదు కదా! పాముగా కనిపించేది త్రాడేకానీ, పాము సత్యం కాదు కదా!

ఓ రామచంద్రా! ఈ విధంగా నాచే చెప్పబడుచున్నట్లు సిద్ధలోకములు కల్పనా మాత్రమే అయివుండవచ్చు. లేక మరొకరు చెప్పునట్లు అవి వారి దృష్టిలో నిజంగా ఉండివుండవచ్చు. కాదా, మరొక విధంగా మరొకరు అనుకోవచ్చు. ఏది ఏమైతేనేం? జీవన్ముక్తునికి వాటి పట్ల ఆదరణ ఉండవలసిన పనేమున్నది? ఓ రామచంద్రా! ఓ సభికులారా! నశ్వరములైన (శాశ్వత ఫలములు

Page:772

కానట్టి, ఎప్పటికైనా నశించబోవునట్టి) సిద్ధులు - సిద్ధ లోకములు… ఇటువంటి వాటి గురించిన అభిలాషచే పరమ పురుషార్థము వదలి ఉండకండి. కొండను సొంతం చేసుకొన్న తరువాత గులకరాయి కావాలి అని ఆశయము, పురుషార్థము ఎవడు కలిగివుంటాడు? ఓ సభికులారా! ఓ రామచంద్రా! మీరంతా నాచే బోధించబడి బ్రహ్మతత్వమును ఎరిగిన వారై ఉన్నారు. అందుచేత, “మాయా మాత్రములైన సిద్ధ లోకముల ఐశ్వర్యములను ఎరుగుట" అనే శ్రమ వలన వచ్చే ప్రయోజనం ఏమున్నది? కనుక అట్టి శ్రమతో మీకుగా పనిలేదని నా అభిప్రాయం!

  1. అజ్ఞానం దుఃఖ కారణం

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు వాస్తవానికి కల్పనా మాత్రమే అయినప్పటికీ…. ఈ జీవుడు ఇందులో ప్రవేశించి అనేక దుఃఖ పరంపరలను పొందటం మాత్రం జరుగుతోంది. ఈ జీవునికి సర్వ దుఃఖాలు మొదలంటా ఉపశమించేది ఎట్లా? అందుకు ఉపాయంకాగల పాఠ్యాంశమును సంక్షిప్తంగా తెలియజేయండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మొట్టమొదట చిదాకాశరూపమగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఇప్పుడు కూడా కేవలం బ్రహ్మమే ఉన్నది. ఇక ముందు కూడా సర్వదా బ్రహ్మమే సర్వత్రా ఏర్పడి ఉండబోవుచున్నది. అట్టి బ్రహ్మము సదా-సర్వదా-సర్వత్రా ఆనందమయమేగాని దుఃఖ మయం కాదు. అద్దానియందు జగత్తు కల్పితదృష్టియేగాని వాస్తవం కాదని నేను అత్యంత సుస్పష్టంగా వ్యక్తీకరించి ప్రకటించియున్నాను కదా! వాస్తవానికి లేని జగత్తు దుఃఖకారణం ఎట్లా అవుతుంది? “ఈ జీవుడు అజ్ఞాన దృష్టిచే దృశ్యమును సరిఅయిన రీతిగా అన్వయించుకోవటం చేతనే దుఃఖం పొందటం జరుగుతోంది” అని మనం చెప్పుకోక తప్పదు. “ఈ సృష్టి ఎక్కడి నుండి వస్తోంది? ఈ దృశ్యమునకు జనన స్థానం ఏమిటి?” అనే ప్రశ్నలకు ఇక్కడ సమాధానం మరల గుర్తుచేస్తాను. అది గ్రహిస్తే సర్వదుఃఖాలు తమంతట తామే తోక ముడుస్తాయి, విను.

చిదాకాశమగు బ్రహ్మము ’చిత్ (ఎరుగుట) అనే ఒకానొక స్వభావము స్వతఃగా కలిగి ఉన్నది. బ్రహ్మమే చిదాకాశము. అట్టి ’చిత్ స్వభావము’తో “నేను సమష్టి జీవరూపుడను” అను సమష్టి అహంకార రూపంగా తనను తాను ఎరుగుచున్నది. కనుక ఆ సమష్టి జీవాహంకారము చిత్ స్వభావ రూపమే! చిత్ స్వభావము బ్రహ్మమే కదా! కనుక సమష్టి జీవాహంకారపురుషుడగు బ్రహ్మదేవుడు (లేక) హిరణ్యగర్భుడు స్వతఃగా బ్రహ్మమే అయివున్నాడు. ఆతని సంకల్ప రూపమగు సమష్టి అహంకారము కూడా బ్రహ్మమే!

అట్టి సమష్టి అహంకారము యొక్క రూపకల్పనయే ఈ జగత్తు. కాబట్టి ఈ జగత్తుగా కనిపించే సమష్టి జీవాహంకారుడగు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) జగత్ దేహం స్వతఃగా బ్రహ్మమే అయివున్నది. కనుక…

Page:773

పరబ్రహ్మం స్ఫురణరూప జ్ఞానం హిరణ్యగర్భరూపత్వం → జగత్తు

ఈ నాలుగు పర్యాయపదములే! అభేదములే! వేరు వేరు కావు.

బ్రహ్మము యొక్క సంకల్పమాత్రమే ఈ సమస్తం అయివున్నది. నీవు - నీ ఊహలో స్ఫురించే ఒక కొండ వేరువేరా? కాదు కదా! నీ ఊహలో కనిపించిన కొండ నీకు వేరుగా పుట్టినదెప్పుడు? తొలగేదెప్పుడు? మొదలే అది ఊహ కదా! అట్లాగే ఈ సమస్తము ఏదైవున్నదో… అట్టి బ్రహ్మము నందు వాస్తవానికి బ్రహ్మదేవుడుగాని, జగత్తుగాని ఒకింతకూడా జనించనే లేదు. అంతా కూడా ఇతఃపూర్వం లాగానే యథారీతిగా నిర్వికారము - జన్మరహితము అగు పరబ్రహ్మమే అయివున్నది. అయితే అజ్ఞానం కొనసాగుచున్న జీవునికి మాత్రం ఇదంతా ’జగత్తు’గా భాసిస్తూ ప్రతిభాసిక సత్యంగా ఒప్పుచున్నది. ఇది దృశ్యరూపంగా పారమార్థిక సత్యము కాదు! “ఇది కనిపిస్తోంది కదా! కనుక ఈ జగత్తు మాకు సత్యమే” అని ఎవరైనా అనుకొంటే, వారిని… “దూరంగా కొండలు నునుపుగా కనిపిస్తున్నాయి కదా! అవి నునుపేనని మీరు అనుకుంటున్నారా? ఎండమావులలో జలతరంగాలు కనిపిస్తున్నాయి కదా! అవి నిజమైన జలతరంగాలని మీరు అనుకుంటున్నారా?”… అని ప్రశ్నించు. లేదు కదా! అట్లాగే ఈ జగత్తు అనేక భేదరూపములతో కనిపించవచ్చుగాక! వాస్తవానికి ఇదంతా అభేదరూప బ్రహ్మమే! ఈ దృశ్యరూపం, సృష్టికాలం మొదలుగా - భ్రాంతిచే ఉదయించి భ్రాంతిచేతనే కొనసాగుచున్నది. వాస్తవానికి ఇది ఉదయించనే లేదు. “పుట్టని బిడ్డకు పేరు పెట్టటం” వంటిదే ఈ జగత్ దృశ్య చమత్కార ప్రాప్తి. ఎందుకంటే, అంతా కూడా నిర్వికార మగు బ్రహ్మమే అయివుండగా… అద్దానియందు ‘భ్రాంతి’ అనబడునది మాత్రం ఎక్కడున్నది? భ్రాంతి కూడా బ్రహ్మమే! అనేక తరంగాలు జలమునకు వేరుగా లేవు కదా! వేరుగా లేనట్టి తరంగాలకు ఏకత్వమెక్కడిది? అనేకత్వమెక్కడిది? నిరాకార జలం - సాకార జలతరంగాలకు భేదమే లేదు కదా! అట్లాగే, నిరాకార బ్రహ్మం - ఆ బ్రహ్మమునందు కనిపించే సాకార జగత్తుకు మొదలే భేదం లేదు. భేదమే లేనిదాని పట్ల ఏకత్వ-అనేకత్వ శబ్దాలు ఎట్లా పొసగుతాయి? చెప్పు!

కాబట్టి … ఈ సమస్తం ‘మహాశాంతము’ అయినట్టి బ్రహ్మఘనమే అయివున్నది. విశాలమగు ఆకాశం తనయందలి శూన్యత్వమును ఆప్రయత్నంగాను, స్వతః సిద్ధంగాను ప్రదర్శించునదై ఉంటోంది కదా! అట్లాగే శుద్ధము, శాంతము అగు పరబ్రహ్మం కూడా తనయందు స్వతః స్సిద్ధంగాను, అప్రయత్నంగాను తనయొక్క ‘చిత్స్వభావము’ అను స్వతఃస్సిద్ధమైన విశేష భాగం చేత “సమష్టి అహంకారము”ను ఎరుగుచు అద్దానిని స్ఫురింపజేస్తోంది. ఇక ఈ వ్యష్టి అహంకారము కూడా సమష్టి అహంకారము యొక్క “స్వభావ సిద్ధము - అప్రయత్నపూర్వకము”, అగు ప్రదర్శనమే అయివున్నది. కాబట్టి బ్రహ్మమే తనను తాను వ్యష్టి అహంకారముగాను, ఆ వ్యష్టి అహంకారమునకు ప్రాప్తిస్తున్న దృశ్య విభాగ చమత్కారంగాను వెలుగొందుచున్నది. వాయువు చలనము, అగ్నిఉష్ణత్వము, పూర్ణచంద్రుడు -శీతలత్వము స్వభావసిద్దమే అయినట్లు బ్రహ్మము-చిత్స్వభావము, హిరణ్యగర్భుడు-సమష్టి అహంకారం, సమష్టి-వ్యష్టి ఇవన్నీ స్వభావ సిద్ధంగానే ఏర్పడి ఉంటున్నాయి.

Page:774

కనుక ’జగత్తు’ ఒక పీడగా కాకుండా, క్రీడగాను, బ్రహ్మంగాను జీవన్ముక్తులు దర్శిస్తున్నారు. అందుచేత వారికి ఇక్కడ తొలగవలసినది గాని, క్రొత్తగా పొందవలసినదిగాని ఏదీ ఎక్కడా కనిపించ టమే లేదు. వారికి ఈ పదార్థ సత్తా సహజమైనది గాను, శుద్ధబ్రహ్మరూపంగాను అగుపిస్తోంది. శ్రీరాముడు : హే మహర్షీ ఈ బ్రహ్మ చైతన్యము “అహంకారము, పదార్థ సత్త” మొదలైన వాటిని ఏ ఏ సమయాలలో స్ఫురింపజేయకుండా ఉంటోంది?

అట్టి పరబ్రహ్మము సదా "నిరావరణము, ఆద్యంత రహితము, అనునిత్యము” అయి వెలయున్నది కదా! అది సర్వదా వర్తించుచుండగా “అది సృష్ట్యాది యందు పదార్థములను స్ఫురింపజేస్తోంది”… అని మీరు ఎట్లా సిద్ధాంతీకరిస్తున్నారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పినది సత్యమే! యౌక్తిక దృష్టితో (జగత్తు కలదు - ఇది ఎట్లా వచ్చింది? అనే దృష్టితో చూస్తే… బ్రహ్మ చైతన్యము “అహంకారము, జగత్తు” మొదలైన వాటిని నిజచైతన్య రూపంగా ఎల్లప్పుడూ ప్రకాశింపజేయుచునే ఉన్నది. అది స్వభావమేనని అనుకున్నాం కదా! అయితే, ’అనాది, జన్మరహితము’ అగు పరబ్రహ్మమునకు స్వరూప చైతన్యముచే ఏర్పడే స్వరూప ప్రాప్తియందుగాని, అవిద్యచే ఏర్పడే అహంకారము మొదలైన పదార్థముల స్ఫూర్తియందుగాని, మరొకదానియందుగాని ఎట్టి అపేక్ష ఉండదు. కనుక పరబ్రహ్మం నందు అజ్ఞానం చేత కనిపించే భావ- అభావములు (సృష్టి ప్రళయములు) చిదాకాశరూపములే అయివున్నాయి. ”సృష్టి-స్థితి-లయములు” అనే మూడింటిలోనూ ఆ నిర్మల పరబ్రహ్మము సదా సర్వత్రా యధాతథంగా అప్రమేయమై వెలయుచున్నది.

అవిద్యాదృష్టిచే ఈ జగత్తు యొక్క యధార్థ తత్త్వమేమిటో ఎరుగబడటం లేదు. విద్యా దృష్టి చేతనో, ఈ జగత్తు ఒకింత కూడా లేనిదే అగుచున్నది. అంతా కూడా చిద్రూపమే! మిశ్రమ దృష్టిచే బ్రహ్మము, జగత్తులు ఒకదానికొకటి అభిన్నమై ఉన్నాయి. కాబట్టి “బ్రహ్మము, అహంకారాదులతో కూడిన జగత్తు" - - ఉభయము అభిన్నరూపములై ఉన్నాయి. ఇక పరబ్రహ్మమో, సర్వదా స్ఫురించు చున్నదే అగుచున్నది. అది అంతటా అన్నిటా సర్వదా వేంచేసియు ఉన్నది.

ఈ ప్రపంచసత్త దేహము కంటే భిన్నం కాదు. అది సమష్టి - వ్యష్టి జీవ కల్పనానుసారమే ఉన్నది కదా! అట్టి ఈ ప్రపంచము నిర్వికారము, ఆద్యంతరహితము అగు బ్రహ్మమే అయివున్నది. ఓ రామచంద్రా! నీవు అద్వయమగు బ్రహ్మ జ్ఞానము కలిగివున్నప్పటికీ కూడా… అజ్ఞానమును తాత్కాలికంగా స్వీకరించావు. నా ఉపదేశ శబ్దములను ఆసక్త చిత్తుడవై మిశ్రమ దృష్టియగు ప్రపంచము, నిష్ప్రపంచములను పొందుచున్నావు. వాస్తవానికి తత్త్వదృష్టిచే బ్రహ్మము - జగత్తు అనబడు రెండూ లేవు. మిశ్రమ దృష్టిచే కూడా బ్రహ్మము సర్వస్వరూపము అయివున్నది కదా! అద్దానిలో ఏదైతే ఒకింతగా ‘జీవుడు’ అనే రూపంతో ప్రకాశింపజేయుచున్నదో… ఆ జీవరూపమును ప్రకాశింపజేసేది

- - ప్రకాశించుచున్నది బ్రహ్మమే అయివున్నది. కాబట్టి బ్రహ్మం ఎల్లప్పుడూ సమస్తముగా

Page:775

ప్రకాశించుచునే ఉన్నది. ఇక నిర్విశేష దృష్టిచే బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. అది దేనినీ (అహంకారము మొదలైన వాటిని) ప్రకాశింపజేయటం లేదు. అహంకారాదులుగా అవటంలేదు. అయితే, సర్వుల అహంకార రూపంగా కనిపించేదంతా బ్రహ్మమే అయి వున్నది.

ఓ రామచంద్రా! “బద్దజీవుడు” అని చెప్పబడేవాని దృష్టికి ఏ త్రిలోకములు కనిపిస్తున్నాయో… వాటి యొక్క వాస్తవరూపం బ్రహ్మమే! "బ్రహ్మమే సదా సర్వదా నా స్వరూపంగాను - దృశ్యరూపంగాను భాసిస్తోంది” …అనునదొక్కటే సర్వబంధములకు, సర్వదుఃఖములకు, సర్వ వేదనలకు ఔషధ రూపమైయున్నది. ఇక ముక్తుని దృష్టియందో… త్రిలోకములుగాని, నానాత్వముగాని ఒకింత కూడా భాసించటమే లేదు! అంతటా అన్నిటా సర్వత్రా పరబ్రహ్మమే సర్వాత్మకమై, ద్రష్ట - దృశ్య స్వరూపమై, సర్వదా నిర్మలము, అపరిచ్ఛేదము, అప్రమేయము అయి వెలుగొందుచున్నది.

ఓ ఓ రామచంద్రా! ఆకాశంలో వృక్షాలు - కొండలు ఉండవు కదా! అట్లాగే బ్రహ్మమునందు జగత్తులు జనించటం లేదు. నశించటం లేదు. జీవన్ముక్తులు ఈ విషయము ఎరిగి ఉన్నవారై పరమశాంతులై ఉంటున్నారు. అయితే ఇక నీవు మాత్రం “ఉపదేశము, ఉపదేశక్రమము” యొక్క ప్రవృత్తి కొరకు మాత్రమే “సందేహము” నివృత్తి అయ్యేవరకు, తత్త్వజ్ఞానము హృదయస్థం కానంతవరకు భేదమును నమ్ముము. అయినా కూడా “నేను అభేద దృష్టిని సముపార్జించాలి"… అనే ఆశయమును మాత్రం ఏమరువవద్దు. ఆ తదనంతరం భేదదృష్టి యుక్తియుక్తంగా తొలగుతూ ఉండగా, ఉత్తమమైన ఆత్మజ్ఞానం ఆవిర్భవిస్తోంది. అట్టి ఉత్తమోత్తమ ఆత్మజ్ఞానం ఆవిర్భవించిన తరువాత శబ్దబుద్ధిగాని, అహంకారము గాని, అద్దాని సంకల్పమాత్రమగు జగత్తుగాని, బ్రహ్మదేవుని సృష్టి విశేషాలుగాని, శాస్త్రములలో కనిపించే చర్చ - మీమాంసలు గాని నీ నిజస్వరూపము నందు స్థానము పొందజాలవు! స్వప్నంలో కనిపించిన ఇల్లు - కొండ నీ స్వరూపములోని (లేక దేహము యొక్క విభాగాలౌతాయా? అవవు కదా! అట్లాగే ఈ దృశ్యము నీ స్వరూపములోని విభాగమని కూడా అనిపించుకోదు.

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పేదంతా అత్యంత సముచితము, శ్లాఘనీయము, అత్యద్భుతము, యుక్తయుక్తము, అనుసరణీయము, సులభ గ్రాహ్యము అయివున్నది. ఇప్పుడిక “సమష్టి అహంకారం” అర్థం చేసుకోవటానికి వీలుగా మాకు బోధించండి.

మునీంద్రా! ఆ పరబ్రహ్మమునందు ‘అహంత్వము’ అనేది మొట్టమొదటగా ఎట్లా స్ఫురిస్తోంది? స్ఫురించిన తరువాత మరింకా ఏమగుచున్నది? సర్వజ్ఞులగు తమరు మాపై జ్ఞానామృతాన్ని వెదజల్లుచున్నారే! మీ మృదుమధుర ప్రసాద వాక్యాలు నాకు ఇంకా ఇంకా మరికొంత వినాలని కుతూహలం కొనసాగుచునే ఉన్నది.

శ్రీ వసిష్ఠ మహర్షి : సరేఁ! జగత్తు యొక్క పురాణేతిహాస పూర్వక సృష్టిక్రమం చెప్పుచున్నాను విను. ఆ పరబ్రహ్మమున ‘అహంత్వము’ స్ఫురించిన తరువాత ‘ఆకాశసత్త’ ప్రవర్తిస్తోంది. ఆ తరువాత ‘దిక్ సత్తా’, ‘కాలసత్త’ స్ఫురించి ప్రవర్తిస్తున్నాయి. ఆపై దేశ - కాల - వస్తుభేదసత్త ప్రవృత్తమౌతోంది.

Page:776

ఇక ఆపై సమష్టి - వ్యష్టిత్వములు ప్రవర్తిస్తున్నాయి. ఇక అటు తరువాత ’చిదాకాశమయములే’ అయివున్న దేశ - కాలాది సత్తల పరస్పర భేదములయినట్టి జాతి - గుణ - - క్రియాదుల గూర్చిన భేదసత్త కల్పన ఏర్పడుతోంది. అనగా భేదమునకు సంబంధించిన అధ్యాస రూపుదిద్దుకుంటోంది. అయితే ఆ భేద వ్యవహారమంతా చిదాకాశమే సుమా!

ఆత్మకు ఎప్పుడైతే ఈ దేహాదులందు “ఇచ్చట నేను ఉన్నాను" అనునది ఏర్పడుతోందో, ఆ మరుక్షణమే “అచ్చటచ్చట (మరొకచోట) నేను లేను” అని కూడా అప్పటికప్పుడే భాసిస్తోంది. స్వాత్మయే… వస్తుకృత పరిచ్ఛేదము, దేశకృత పరిచ్ఛేదము… అను ఉభయ రూపములుగా (ద్వైత రూపంగా) ఉదయించుచున్నదై ఉంటోంది. ఆ చిదాకాశ మయములగు దేశ - కాలాది - సత్తల పరస్పర భేదములైన జాతి, గుణ, క్రియాదులతో గూర్చిన కల్పనచే ఈ నామరూపాత్మక జగత్తు యొక్క భేద అభ్యాసం సంభవిస్తోంది. వాస్తవానికి ఇదంతా చిదాకాశమే! ఈ ప్రకారంగా నిరాకారమగు “పరబ్రహ్మపదము” నందు ‘అహంభావము’ ద్వారా దేశ - కాలాదుల కల్పన సంభవిస్తూ ఉండగా, ‘దృశ్యము’ అనే పేరుగల ఈ జగత్తు ప్రకాశరూపంగా భాసిస్తోంది. అట్లా భాసించుచున్నదంతా బ్రహ్మము కానట్టి క్షణము ఎప్పుడూ లేదు. అనగా, శాంతము, జన్మరహితము, ఏకము, ఆది మధ్యాంతములనేవే లేనిది. జీవుడుగా, జగత్తుగా ఏమాత్రం భావన పొందనిది… అగు చిదాకాశమే

జీవుడు ‘అనుదానిని’ తన యందు ఆ జీవునికి ఉపాహారమగు ’దృశ్యము’గా తానే కల్పించుకుంటోంది. ప్రత్యక్షమై సుదీర్ఘంగా నామ రూపాత్మకంగాను, మార్పు చేర్పులతోను కొనసాగుతోంది.

అనగా ఆ చిదాకాశమే ద్రష్టయగు జీవుని రూపముగా అయి, ఆ జీవాహంకారము నుండి తనయందే - - అనగా నిరావరణమగు జీవసాక్షి రూపమైన చిదాకాశమునందే అతి విశాలమగు ఈ దృశ్యము దర్శిస్తోంది. ఆత్మజ్ఞానము కలుగనంతవరకు అట్టి చిదాకాశ ద్రష్టాహంకారము యొక్క చిదాకాశ మాత్ర దృశ్యదర్శన భ్రమ కొనసాగుచూనే ఉంటోంది. అయితే… చిదాకాశము సర్వదా యథాతథమే కాని దృశ్య రూపముగా గాని, ద్రష్ట రూపముగా గాని పరివర్తమవకుండానే, భావనా చమత్కారముచే ఈ జగన్నాటకమును నడిపిస్తోంది.

  1. ప్రార్తన / పూర్వకల్ప శ్రీ వసిష్ఠ రామ సంవాదము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ శత్రుమర్దనా! శ్రీ రామచంద్రా! ఇప్పుడు నీవు ఏ ‘జగత్ తత్త్వం’ గురించి, ’ఆత్మతత్త్వం’ గురించి నన్ను అడిగావో… ఈ విషయమే పూర్వం జరిగిపోయిన కల్పములలోని ఒకానొక కల్పంలో రామావతారమున నన్ను అడిగావు. ఆ పూర్వకల్పంలో గురువైన నేను శిష్యుడ వగు నీకు ఎట్లా సమాధానం చెప్పటం జరిగిందో అది ఇప్పుడు మరల యథాతథంగా పునరుచ్చరిస్తాను.

Page:777

శ్రీరాముడు : స్వామీ! ఇతఃపూర్వం కూడా మీరు నాకు బోధించియున్నారా? ఎప్పుడు? ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును ఆ పూర్వకల్పంలో కూడా నీవు శ్రీరాముడవై ఉన్నావు. నేను వసిష్ఠుడనై ఉన్నాను. అప్పుడు కూడా నీకు ఇట్లాగే వైరాగ్యం కలుగగా నేను నిన్ను సమీపించటం జరిగింది. ఇద్దరం ఒకానొక ఆశ్రమంలో సమావేశమైనాము. గురు-శిష్య సంవాదరూపంలో మనిద్దరి మధ్య ప్రశ్న - సమాధానాలు కొనసాగాయి. నాకైతే ఆ చిత్ చమత్కారమంతా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరిగినట్లుగా గోచరిస్తోంది. అప్పుడు నీవు నన్ను ఇట్లా ప్రశ్నించావు.

ప్రాక్తన శిష్యుడు : హే మహాత్మా! ఈ కనబడే సమస్త జగత్తు విషయమై నాకొక గొప్ప సంశయం ఏర్పడుతోంది. ఆ సంశయమును ఛేదింప వేడుకొనుచున్నాను. ’మహాకల్పము’ యొక్క అంతము సమయమున ఏది నశిస్తోంది? ఏది అప్పటికీ కూడా నశించక - శేషించియే ఉంటోంది?

ప్రాక్తన గురువు : బిడ్డా! ఒకడు ఒక సుదీర్ఘమైన కల కంటున్నాడనుకో! అప్పుడు ఆతడు గాఢనిద్రలో (స్వప్న రహిత సుషుప్తిలో ప్రవేశించినప్పుడు)… ఏది నశిస్తుంది? ఏది శేషిస్తుంది? స్వప్న దృశ్యమంతా నశించినదై ఆత్మమాత్రంగా శేషిస్తోంది కదా! అట్లాగే మహాప్రళయమందు కూడా… దృశ్యమంతా నశిస్తోంది. దృశ్యమున్నప్పుడే ద్రష్ట కదా! దర్శనమే లేకపోతే ద్రష్టగాని దృశ్యముగాని ఉండవు కదా! అట్లాగే… దృశ్యమంతా ద్రష్టతో సహా నశించిపోగా… అవన్నీ ఎద్దానియందు లయము పొందుచున్నాయో… అట్టి దృక్ స్వరూపమగు ఆత్మ మాత్రమే శేషిస్తోంది? అనగా ఇప్పుడీ దృశ్యంలో అంతర్గతమై ఉన్న ఈ భూమి, ఆకారం, పది దిక్కులు, క్రియ, కాలక్రమము, సమస్త భూతములు (జీవులు)… ఇవన్నీ నశించినవై, కొంచెము కూడా ఏ మాత్రం మిగలనివై ‘అవ్యాకృతాకాశము’ నందు లయించిపోతున్నాయి. సముద్ర జలతరంగాలు సముద్ర జలంలోనే లయిస్తున్నట్లు ఈ సర్వం అవ్యాకృతాకాశంలో విలీనమై పోతున్నది. ప్రళయంలో భోక్త ఉండదు. ఇక భోగ్యం ఎట్లా ఉంటుంది? అట్లాగే కారణములన్నిటికీ కారణరూపములగు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదుల పేర్లు కూడా ఆ మహాకల్పాంతంలో ఇక ఉండజాలవు. ఓ ప్రియశిష్యా! ఈ దృశ్యం త్రిమూర్తులతో సహా అవ్యయమగు చిద్వస్తువు యొక్క వివర్త రూపాలే కదా! అట్టి ఈ దృశ్య జగత్తు నశించిపోగా అప్పుడు కేవలము నిర్మల చిదాకాశమే శేషిస్తోందని అనుమానించ బడుతోంది. ఎందుకంటావా? ఈ సృష్టులన్నీ అధ్యస్తమై ఉన్నది, ఈ సృష్టుల అనుభవమునకు సర్వదా హేతువై ఉంటున్నది కూడా కేవల సాక్షియగు చిదాత్మయే కదా! అట్టి చిదాత్మచేతనే సర్వ ప్రపంచ శూన్యరూపమగు ప్రళయము కూడా సిద్ధిస్తోంది. ఏ సాక్షి చిదాకాశము నుండి ఈ దృశ్య జగత్తు ఆవిర్భవించిందో… అట్టి సాక్షి చిదాకాశం యొక్క సాక్షిత్వ ప్రకర్షణయగు ఈ దృశ్య జగత్తు ఇక ఆపై నిర్మల, కేవల చిదాకాశముగా శేషిస్తుందనటంలో (అనుభవం అవటంలో) ఆశ్చర్యమేమున్నది? ప్రాక్తన శిష్యుడు :

నాసతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః ఇదం తత్కథమాభోగి విద్యమానం క్వ గచ్ఛతి?

Page:778

గురువర్యా! అసత్ పదార్థానికి ఉనికియే లేదు. సత్ పదార్థానికి ’లేమి’యే లేదు కదా! కాబట్టి ఈ విశాలంగా విద్యమానమై ఉంటున్న ఆకాశము - భూమి - సముద్రాలు - - నక్షత్రాలు - జీవులు మొదలైన అనేక విశేషములతో కూడిన జగత్తు ప్రళయంలో ఎక్కడికి వెళ్ళుచున్నది? ఏం రూపం పొందుతోంది?

ప్రాక్తన గురువు : ప్రియ శిష్యా! శ్రుతులు మాయచే ఎదురుగా కనిపిస్తున్న నామరూపాత్మకమైన మాయాజగత్తు యొక్క అభావమును (జగత్తు జగత్తుగా లేదు. దీనికి అధిష్ఠానమై ఉన్న ఆత్మవస్తువును దర్శించండి అని) సూచన చేస్తున్నాయి. దర్శింపజేస్తున్నాయి. అంటే సత్యమగు జగత్తు (జగత్తు ఆత్మయే కనుక) సత్యమగు ఆత్మ యొక్క అభావమును కాదు. ఈ పదార్థముల యొక్క భ్రమత్వము ప్రత్యక్ష ప్రమాణములచే శాస్త్రములచే ప్రసిద్ధమయ్యే ఉన్నది. “మాయా జగత్తు యొక్క నాశనము” అని శాస్త్రములు ప్రతిపాదించేది ”మాయచే దర్శించు జగత్తు వాస్తవానికి లేదు” ….. అని సుస్పష్ట పరచటం మాత్రమే! వాస్తవానికి ఈ జగత్తు స్వతఃగా లేదు. కాబట్టి నీవు చెప్పినట్లు

అసత్తు అగు దానికి ఉనికియే లేదు. ఉనికియే లేని దానికి నాశనం మాత్రం ఎక్కడిదో చెప్పు?

సత్తు అగుదానికి ’లేమి’ అనునదే లేదు. ఈ కనబడే జగత్తు బ్రహ్మముకాని క్షణమే లేదు. బ్రహ్మము ఈ కనబడే జగత్తుగా అయిన క్షణము కూడా లేదు. ఏదైతే వాస్తవానికి ఉన్నదో (సత్ స్వరూపమగు ఆత్మ) అది అసత్తు ఎన్నటికీ కాదు. (అది లేకపోవటం, మరొకటిగా అవటం అనేది ఎప్పుడూ ఎక్కడా జరుగదు) సత్తుకు నాశనమనేదేదీ లేదు. ఎక్కడైనా మృగతృష్ణాజలం స్థిరమై ప్రతిష్ఠ కలిగినదై కొంతకాలంగాని, అల్పకాలంగాని, దీర్ఘకాలం గాని ఉన్నదా? మృగతృష్ణలో మొదలే జలం లేదు కదా! ఇక అది ఎంతకాలం జలరూపంలో ఉంటుందన్న ప్రసక్తి ఎక్కడిది? రెండవ చంద్రుని గురించిన భ్రమ స్థిరంగా ఉన్నదెప్పుడు? ఆకాశంలో (భ్రమచే కనిపించే) కేశాలు ఎక్కడున్నాయి? అంతెందుకూ? భ్రమ సిద్ధమగు అనుభవానికి స్థిరత్వం ఎక్కడున్నది? “సర్ప - రజ్జుభ్రాంతి”లో “త్రాడు పాముగా ఎంతకాలం ఉంటుంది?“ అని అడిగిన వారికి సమాధానం ఏమి చెప్పాలి? ”త్రాడును త్రాడుగా తెలుసుకోనంతవరకు”… అని మాత్రమే అనగలం కదా! ఓ పుత్రా! ఈ దృశ్యమంతా భ్రాంతి మాత్రమే!

అసన్మయము (స్వతఃగా లేనిది, భ్రమచే అనుభవమగుచున్నది) అయివున్నది. స్వప్నంలో పురంలాగానే ఈ జాగ్రత్ దృశ్యమంతా భాసిస్తోంది. కాబట్టి ఇది (భ్రమ తొలగగానే) నశించకుండా ఎట్లా ఉంటుంది? అసత్తుకు భ్రమ తొలగటం చేత వినాశనము అనివార్యమైయున్నది. జాగ్రత్తుకు వచ్చేసరికి స్వప్నం నశించటం లేదూ? స్వప్నంలో ప్రవేశించే ద్రష్టపట్ల జాగ్రత్తు స్ఫురణలో లేకపోవటం ప్రతి జీవునియొక్క దైనందిన అనుభవమే కదా! అట్లాగే ఏది వర్తమానంలో ఘనీభూత దృశ్యముగా అనుభూతమౌతోందో,…. అదంతా కూడా "ఆత్మజ్ఞానము” అనే మెలుకువచే సర్వత్రా సర్వదా సంపూర్ణంగా శమించి పోతోంది. జ్ఞానము వికసించినప్పుడు ఈ జగత్తంతా ఎక్కడికి పోతోందంటావా?

Page:779

జాగ్రత్తులోకి రాగానే ఆ జీవుడు అంతదాకా దర్శించిన స్వప్న దృశ్యం ఎటుపోతోంది? అట్లాగే ఈ దృశ్య జగత్తు కూడా ఆత్మ జ్ఞానముచే మొదలంట్లో శమించినదై ఎటకో శీఘ్రంగా పోవుచున్నది. (లేక) ఆత్మయందే లయిస్తోంది. జగద్దర్శనమంతా ఆత్మదర్శనంగా విరాజిల్లుతోంది.

ప్రాక్తన శిష్య రాముడు : మహాత్మా! ఈ దృశ్యము కొంచెము కూడా లేనట్లయితే…మరి, కొంచెము కాలము ఈ దృశ్యముగా కనిపిస్తున్నదేది? మరల జ్ఞానప్రాప్తి తరువాత భాసించకుండా ఉంటున్నదేది? అసలు ఈ “భాసించటం, భాసించకపోవటం" అనేది దేని రూపమైయున్నది? చిదాకాశమే ఈవిధంగా జగత్తుగా భాసించటం, జ్ఞాన ప్రాప్త్యానంతరం జగత్తుగా భాసించకపోవటం నిర్వర్తిస్తోందా ఏమి? ప్రాక్తన గురువు : బిడ్డా! ముత్యపు చిప్ప (శక్తి)లో అద్దాని చాకచక్యం చేతనే వెండి (రజితము)వలె స్ఫురిస్తోంది కదా! అట్లాగే నిర్మలమగు చిదాకాశమే నిజ ‘చిత్ స్వభావం’ చేత ఈ విధంగా ‘జగత్తు’ రూపంగా స్ఫురిస్తోంది. అంతేగాని జగత్తు అనబడేది వేరుగా ఎక్కడా లేదు. ఆ నిర్మలచిత్తు తన నిర్మలచిత్స్వభావమును త్యజించకుండానే ఈ విధంగా విశాల జగత్తుగా భాసించటం అద్దాని స్వభావమే అయివున్నది. ఆకాశం నీలంగా కనిపించటం అద్దాని స్వభావమే కదా! అవయవి యొక్క అవయవములు ఆతని స్వభావమే కదా! అట్లాగే, దృశ్యరూప ‘స్ఫురణ - - అస్ఫురణ’, ‘సృష్టి - - ప్రళయములు’ - ఇవన్నీ కూడా చిదాకాశము యొక్క స్వరూప చమత్కారములే అయివున్నాయి. నీవు నిర్మలమైన జలాశయం సమీపించావనుకో! అందులో నీకు వినీలాకాశం ప్రతిబింబితమై కనబడుతోంది. స్నానం చేద్దామనో, (లేక) ఆ ప్రతిబింబ వినీలాకాశాన్ని పరిశీలిద్దాం అనో ఆ నీళ్ళలో ప్రవేశించావనుకో! అప్పుడేమౌతుంది? నీటి యొక్క కదలికచే ఆ ప్రతిబింబాకాశము జలాశయంలో కనిపించక క్షయిస్తుంది. ఆ ప్రతిబింబాకాశం ప్రతిబింబిస్తున్నప్పుడు, క్షయిస్తున్నప్పుడు కూడా వాస్తవాకాశం అక్షయమై యథాతథంగా ఒకే రూపంతో ఏర్పడి ఉంటోంది కదా! అట్లాగే నిర్మలమగు బ్రహ్మము కూడా సృష్టి - ప్రళయములందు అక్షయమై, ఏకరూపమై సర్వదా యథాతథంగా వెలుగొందుచున్నది. ఓ రామా! అట్టి నిశ్చల, ఏకరూప, అక్షయ చిదాకాశరూపుడవే నీవు కాని… సాకార ప్రతి బింబమాత్రమగు భౌతిక రూపుడవు, (లేక) మనోరూపుడవు కాదు!

స్వప్నమునందు - సుషుప్తి యందు నిద్ర సదా ఏకరూపమే అయివున్నది కదా! అట్లాగే సృష్టి - ప్రళయములందు అక్షయమగు చిద్రూప బ్రహ్మము సదా ఏకరూపముగానే ఏర్పడినదై ఉంటోంది. స్వప్నంలోని జగత్తు మెలుకువ వచ్చేసరికి ఏ విధంగా పూర్ణంగా శమిస్తోందో… అట్లాగే ఈ మన దృశ్య జగత్తు కూడా ’జ్ఞాన బోధ’చే బోధ దశయందు సంపూర్ణంగా శమించినదగుచున్నది. మనం స్వప్న జగత్తును ఏమని చెప్పుకుంటాం? “అది శూన్యము” అని అంటాం కదా! ఎందుకు? మెలుకువ రాగానే స్వప్నంలోని వస్తువులేవీ ఇక్కడ జగత్తులో కనిపించటం లేదు కాబట్టే కదా! అంతేగాని “నాకు కనిపించిన స్వప్నంలోని జగత్తు ఎక్కడో అంతదూరంలో ఉన్నది”… అని ఎవరూ అనుకోవటం లేదే? లేక, “ఆ స్వప్నంలోని జీవులు అది అట్లా అనుభవించటం కొనసాగుచుండగా నేను మాత్రం ఇటు వచ్చేశాను”… అని ఎవరైనా అనుకుంటున్నారా? లేదే! ఎందుచేత? ఎందుచేతనంటే, మన

Page:780

వాసనామయ ప్రపంచమున మన వాసనలే ఆయా రూపాలుగా స్వప్నంలో కనిపించటం జరుగుతోందని మనకందరికీ తెలుసు కాబట్టే! మన వాసనామయ ప్రపంచం మన జీవాకాశంలోనే సంభవమౌతోంది గాని, అది అన్యులకు సంబంధించినది కాదని తెలుసు గనుక!

ఓ రామచంద్రా! ఇక్కడ ఒకానొక ముఖ్య విశేషం చెప్పుతాను! సునిశితమైన బుద్ధితో విను. మన చిదాకాశమునందు చిదాకాశమే మనకు జగత్తుగా స్ఫురించటమే “సృష్టి”. మన చిదాకాశము నందు సృష్టిగా స్ఫురించిన జగత్తు జ్ఞానదృష్టిచే చిదాకాశముగా అనిపించటమే ప్రళయము.

ఇది గ్రహించావా? ఇప్పుడు మరొక ప్రశ్న. మనకు స్ఫురించే జగత్తు మనకు చిదాకాశ రూపంగా కనిపించవచ్చుగాక! కాని తక్కినవారి (అప్రబద్ధుల) జగద్రూప స్ఫురణ మనవలెనే చిదాకాశ రూపంగా అవవలసిన పనేమీ లేదు కదా! మన ప్రళయము వారి ’జగత్ రూప స్ఫురణ’ యందు ప్రవేశించవలసిన అగత్యం లేదు. మనకు తొలగిన జగత్తు తక్కిన వారిలో (మనవలెనే ఆత్మదృష్టిగా) స్ఫురించకపోవటం మనకు ప్రమాణ. అ ప్రమాణములు కావు.

ప్రాక్తన శిష్య రామచంద్రుడు : మహాత్మా! మీరు చెప్పిన ప్రకారంగా మన సంవిత్తు యొక్క సృష్టి - ప్రళయములు మరొకని సంవిత్తులో ప్రవేశించదు కదా! అనగా ఒకడు నిద్రించటం, మరొకడు మెలుకువతో ఉండటం ఒకే గదిలో జరుగుతోందనుకోండి. అప్పుడు నిద్రపోయే వాని స్వప్న జగత్తు మెలుకువగా ఉన్నవాడు పొందడు. మెళకువగా ఉన్నవాని జాగ్రత్ జగత్తు నిద్రపోయేవానికి ఉండదు. అనగా అదే దృష్టాంతం తీసుకొని పరిశీలించగా… ఇప్పుడు నాకు అనిపిస్తున్నదేమిటంటే… ఒకడు ప్రళయం పొందుతూ ఉంటే, అది రెండవానికి సృష్టిరూపంగా భాసించవచ్చు. ఒకడు జగత్ సృష్టి పొందుచుండగా మరొకడు ’ప్రళయము’ను పొందుచున్నవాడవవచ్చు. అదేసమయంలో ఒకనికి జగదాది బుద్ధి, మరొకనికి ప్రళయబుద్ధి ఏర్పడి ఉండవచ్చునని నాకు అనిపిస్తోంది!

ప్రాక్తన వసిష్ఠుడు : ఓ మహాప్రాజ్ఞుడవగు శ్రీ రామచంద్రా! నీవు చెప్పింది సత్యమే! చైతన్యము చైతన్యముగానే వుంటోంది గాని, జగత్తుగా ఈ జగత్తు (నామరూపాత్మకంగా చూస్తున్నప్పుడు) చైతన్య స్వరూపమే అయివుంటే… అది సర్వసాధారణమై ఒకే రూపము కలిగి ఉండేది. కాని ఇది అట్లు ఉండటం లేదు. ఎట్లా అంటావేమో? ఒకానొక సుందర స్త్రీ బాటలో వెళ్ళుచున్నదనుకో!

ఒక బాటసారికి శృంగార భావాలు కలుగవచ్చు. మరొకరికి తన చనిపోయిన సోదరి గుర్తుకురావచ్చు. ఇంకొకరికి “ఇది కూడా పాంచభౌతిక శరీరమే”… అని అనిపించవచ్చు. వేరొకరు పరమాత్మ యొక్క సహస్రాది రూపాలలో ఇది కూడా ఒకానొకటి కదా… అని అనుకొని మననం చేస్తూ ఉండవచ్చు.

మరింకొకరికి “నా ఆత్మయే ఈ కనబడే రూపంలోని ఆత్మ. కనుక ఇదంతా నా భావనరూపమే కాబట్టి నా రూపమే”… అని అనిపించవచ్చు. కాబట్టి… ఈ రీతిగా చైతన్యమున అధ్యస్తమైయున్న ఈ జగత్తును చూచువారికి వారి వారి సంకల్పానుసారంగానే ఇదంతా భాసిస్తోంది. ఒకరికి ఎట్లా కనిపిస్తోందో…. ఆ రీతిగా మరొకరికి కనిపించటం లేదు. అనగా, ఈ జగత్తు ఎవరికి వారికి వారి సంకల్పానుసారంగా స్వరూప వ్యవస్థ కలిగి ఉంటోందని నిరూపించబడుతోంది కదా!

Page:781

న భాతి న చ తత్కించిన్న చ తత్కించిదేవ సత్ తచ్చిదాకాశకచనం కే తత్ర సదసదృశౌ ॥

ఈ జగత్తు జనులందరికీ ఒకేరీతిగా భాసించటంలేదు. కాబట్టే ‘ఇది తుచ్ఛం’ అని చెప్పబడు తోంది. ఇది ఒకింత కూడా సత్తు కాదు. ఇదంతా కూడా ఆయా జీవులయొక్క ‘స్ఫురణం’ మాత్రమే అయివున్నది. కాబట్టి ఇక్కడ “ఇది సత్తు - - ఇది అసత్తు”… అని ఎక్కడున్నది? ఒకవేళ “ఈ జగత్తు అధిష్ఠాన చిదాకాశ రూపముచే కలదు" అని అందామా? అట్లా అయితే బంగారం నిరాకారమే అయినప్పటికీ, ఏదో ఒక ఆకారం కలిగియే ఉంటున్నట్లు, చిదాకాశము ఉన్నచోట జగత్తు విద్యమానమై ఉండియే ఉంటోంది. ఇక దృశ్య రూపముగా ఇది ఒకింత కూడా ఎచ్చటా ఎప్పుడూ లేనేలేదు!

బ్రహ్మము పరమార్థరూపముచే ’సత్తు’గాను, వృత్తులచే కప్పబడి ఉండడంచేత ‘అసత్తు’గాను ఉండటంచేతనే ఈ జగత్తంతా కూడా "సత్, అసత్’ రూపమై భాసిస్తోంది. చిదాకాశరూపమగు బ్రహ్మము నాశరహితమే అయివుండటంచేత, చిదాకాశమయము అయివున్న ఈ జగత్తు కూడా నాశరహితమే అయివున్నది.

‘సద్వస్తువు’ అగు చిదాకాశమే సృష్టి - ప్రళయరూపములుగా కూడా అయివున్నది. ఆ చిదాకాశము ఎరుగబడనప్పుడు దుఃఖప్రదమగు సంసారముగా ప్రాప్తిస్తోంది. ఎరుగబడినప్పుడో… పరమశాంత రూపమగు మోక్షానుభవము కూడా అగుచున్నది.

విద్యతే సర్వథైవేదం సర్వం సర్వత్ర సర్వదా

న విద్యతే సర్వథా చ సర్వం సర్వత్ర సర్వదా ||

‘చిదాకాశాత్మతత్త్వము’ను ఎరిగిన జ్ఞానియగు మహనీయునికి బ్రహ్మమే సర్వదా సర్వరూపమై సర్వత్రా సదా సర్వదా వెలయుచున్నదగుచున్నది. అజ్ఞానికో… అది (బ్రహ్మము) ఎన్నడూ ఎచ్చటా ఏ రూపంగానూ లేనిదిగా అనిపిస్తోంది.

బ్రహ్మమే దేవతలుగా, ఘటముగా, పర్వతముగా, వస్త్రముగా, సకల వస్తు సమూహంగా, తటముగా, వృక్షముగా, గడ్డిగా, అగ్నిగా, స్థావరముగా (కదలనివిగా), జంగమముగా (కదిలేవిగా) సమస్తములుగా అయివున్నదయ్యా!

కలదు-లేదు-శూన్యము. క్రియ-కాలము-భూతవర్తమాన భవిష్యత్తులు. భూమి-ఆకాశముదిక్కులు. భావము-అభావము - భావాతీతము. జన్మ-నాశనము-ఐశ్వర్యము. శుభము-అశుభము -కర్మల యొక్క భవిష్యత్ ఫలములు.

ఈ మొదలైనవన్నీ కూడా ఆ పరబ్రహ్మమే అయివున్నది. ఏకం, నిత్యం అయినట్టి పరమాత్మ లేని పదార్థము, పరమాత్మ కాని పదార్థము ఈ బాహ్య అంతరములందుగాని, ఆది-మధ్యఅంతరములందుగాని, భూత-వర్తమాన భవిష్యత్ (కాలత్రయం) లందుగాని ఎక్కడా ఏదీ లేనేలేదు.

సర్వం సర్వేణ సర్వత్ర, సర్వదైవాత్ర విద్యతే ॥

సర్వం సర్వేణ సర్వత్ర సర్వదా అత్ర న విద్యతే ॥

Page:782

ఆ అధిష్ఠాన రూపమగు పరబ్రహ్మమునందు సర్వంలో సర్వరూపాలచే, సర్వదా, సర్వత్రా జగత్తు కలదు. దృశ్యరూపందృష్ట్యా అంటావా… ఆ పరబ్రహ్మంలో ఏదియు ఏ రూపమున కూడా ఎన్నడూ ఎచ్చటాకూడా ఏమాత్రం లేనేలేదు! స్వప్నంలో అన్నీ ఉన్నాయి! కానీ ఏవీ లేవు కదా! స్వప్న చైతన్యము స్వప్నంలోని ఏ కించిత్ విభాగంలో వేంచేసిలేదు? అంతటా ఉన్నది. ఈ విధంగా స్వప్న నగరముల దృష్టాంతముచే సర్వము బ్రహ్మమయమే! కనుక సమస్తము యథాతథమే! తృణం కర్తృ, తృణం భోక్తృ, బ్రహ్మాత్మత్వాత్ తృణం విభుః ఘటః కర్తా, ఘటో భోక్తా, ఘటః సర్వేశ్వరేశ్వరః ॥

ఆ “గడ్డి పరక” కూడా బ్రహ్మమే అయివున్నది. అందుచేత అది కర్త - - భోక్త - సర్వ వ్యాపకము అగు ఈశ్వరుడు కూడా! అట్లాగే ఈ కుండ కూడా బ్రహ్మమే కాబట్టి ఇది కర్త - భోక్త - ఇంద్రాది ఈశ్వరులకు కూడా సర్వేశ్వరుడు కూడా అయివున్నది.

పటః కర్తా పటో భోక్తా, పటః సర్వేశ్వరేశ్వరః, దృశిః కర్తా దృశిర్భోక్తా దృశిః సర్వేశ్వరేశ్వరః, గిరిః కర్తా, గిరిర్భోక్తా, గిరిః సర్వేశ్వరేశ్వరః, నరః కర్తా, నరోభోక్తా నరః సర్వేశ్వరేశ్వరః II ఈ విధంగా వస్త్రములు, నేత్రములు, పర్వతములు, మనుజులు ఇత్యాది… అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే కనుక దేనికి దానికే ప్రత్యేకంగా కర్త- భోక్త ఈశ్వరేశ్వరుడు కూడా అయి వెలయుచున్నాయి. ఈ విధంగా సమస్తము బ్రహ్మస్వరూపమే అయివున్నది.

అందుచేత ప్రతి ఒక్క వస్తువునందు, అద్దాని యొక్క ప్రతి ఒక్కొక్క విభాగము నందు కూడా కర్త-భోక్త-ఆది మధ్యాంత రహితుడగు పరబ్రహ్మమూర్తి వేంచేసియే ఉన్నారు. ఈ తృణ (గడ్డిపరక) - ఘటములు (మట్టికుండ) ఆదిగాగల పదార్థాలన్నీ కూడా నిజసాక్షి అయి, సర్వవ్యాపకమైనట్టి ప్రత్యగాత్మ రూపముతోనే స్థితిని కలిగియున్నాయి. అంతేకాదు. దేనియందు అద్దానియొక్క ఉత్పత్తిఉనికి-వినాశనము భాసిస్తోందో… ఆ సమస్త రూపంగా సర్వవ్యాపకమగు బ్రహ్మమే అట్లు వెలయుచున్నది.

ఎవరి దృష్టిలో అయితే, “ఇదంతా కూడా ఎరుక (లేక) విజ్ఞానమునకు భిన్నమైనవి. ఇవి పాంచభౌతికము. ఇదంతా స్వకీయ లక్షణములతో కూడుకొని ఉన్నవి” అని అనిపిస్తోందో (వైశేషికులు, సౌతాంత్రికులు), అట్టి వారికి ఆ విజ్ఞానేతరమై సర్వేశ్వరతత్వమే కర్త - భోక్త కూడా అయి ఉంటోంది. ఎట్టి వాదులకు ఏఏ దృష్టిచే ఏమేమనిపిస్తోందో… అదంతా బ్రహ్మమే! బ్రహ్మమునందు బ్రహ్మమే అట్టి ద్వితీయ దృష్టిని ప్రదర్శించుకొనుచున్నదగుచున్నది. విజ్ఞాన వాదులకు (బౌద్ధులు) విజ్ఞానమే కర్త-భోక్త అగుచున్నది.

శూన్యవాదులకు ఈ జగత్తుకు కర్తలేడు. అంతా శూన్యమే అయివున్నది. పాశుపతాదుల మతమునందు - ఈశ్వరుడే కర్త ఈశ్వరుడే భోక్త.

చూచావా రామచంద్రా! ఈ ప్రకారంగా “సర్వశక్తిమంతము” “సర్వరూపము” సర్వోత్కృష్టము” అగు బ్రహ్మమునందు సమస్తము సంభవిస్తున్నాయి. ఆ బ్రహ్మమునందు ఆయా మతవాదులకు

Page:783

అభిమతమై ఉంటున్న పరస్పర విలక్షణములలైన విధి-నిషేధములు, తాత్పర్య-అతాత్పర్య వాక్యములు, జగత్ ఉత్పత్తి - వ్యావహారిక భాష్యములు అజివరోధపూర్వకంగా ఆయా మత గురువుల అభిప్రాయాలు ఆశ్రయించిన శిష్యులకు అట్లే అనుభూతమౌతున్నాయి. సమస్త వివర్తములకు అధిష్ఠానమైయున్న ఆ చిదాకాశమున సంభవించనిదేమున్నది? చిదాకాశమే ‘శుద్ధస్వాత్మ’ యందు ఆయా ఉపాధులలో ఆయా వాసనలను అనుసరించి… ద్రష్ట వలె అయివుండటం, దృశ్యమును భావన చేయటం, జగద్రూపమును దర్శిస్తూ ఉండటం జరుగుతోంది. అట్లా జరుగుచూ ఉన్నప్పటికీ ఆ చిదాకాశము సర్వదా నిర్వికారరూపముతోనే స్థితినొందియున్నది.

ఓ రామచంద్రా! సమస్త జీవులు పరస్పరం విలక్షణమైన దృష్టులు కలిగి ఉంటున్నారు. స్వానుభవసిద్ధములైన పదార్థానుభవాలు కలిగి ఉంటున్నారు. వారి వేరు వేరైన వివిధ రీతులైన విధి - నిషేధముల గూర్చిన అభిప్రాయములు, వివిధములైన సంకల్ప - అనుభవవిశేషములు కలిగినవారై వాసన - కామ్య - - కర్మలను అనుసరిస్తూ ఆయా వ్యవహారములందు పాల్గొనుచున్నారు. వారి వారి కామ - కర్మ - వాసనలను అనుసరించి ఈ జగత్తులోని ఆయా విశేషాలు అర్థ - క్రియా సమర్థములు అగుచున్నాయి. వేరు వేరు దృష్టులు గల జీవులకు వేరు వేరైన విశేషాలు సత్యమని, మరొకరి దృష్టులు అసత్యములనీ అనిపిస్తూ వస్తోంది. ఈ విధంగా ఈ జగత్తులో అనేక అర్థ క్రియ - కామ్య - వ్యవహారాదులన్నీ ఆయా జీవుల వాసనలను అనుసరించి పరిఢవిల్లుచున్నాయి. ఓ రామచంద్రా! ఆత్మదృష్టిచే వేరువేరుగా తమ తమ అనుభవముల దృష్ట్యా కనిపిస్తున్నదంతా "కుందేటి కొమ్ము” వలె అసత్యమే! పరబ్రహ్మమే సర్వరూపమై, సర్వానుభవములకు కారణమై తానుమాత్రం అప్రమేయమై ఉంటూనే ఈ జగత్ రచనకు ఆధారభూతమై ఉంటోంది. ఒక కథా రచయిత రచించిన కథలోని పాత్రలో తాను ఒకడు కాకపోయినప్పటికీ, కథలోని పాత్రలన్నీ ఆతని రచనా వ్యాసంగ చమత్కారమే అయివున్నాయి కదా! పరబ్రహ్మమే వస్తువుల యొక్క రూపమైయున్నది. జీవుల నిజ సంకల్పానుసారమే ఈ జగత్తు అనుభవమౌతోంది. ఈ విధంగా ద్రష్ట - దృశ్యముల వాస్తవ రూపం పరబ్రహ్మమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ దశరథరామా! ఈ విధంగా ఇతఃపూర్వం కాలగర్భంలో కలిసిపోయివున్న ఒకానొక కల్పమునందు - ’నీకు గురువునై నీకు నేను బోధించటం జరిగింది. అట్టి ప్రబోధచేకూడా అప్పుడు నీవు పూర్ణ ప్రబుద్ధుడవు అయివుండలేదు. అందుచేత మరల త్రేతాయుగంలో ఇచట దశరథ మహారాజు యొక్క ఈ అయోధ్యా సభలో నీ సమక్షంలో మరల ప్రబోధించటం జరిగింది. ఇక్కడ జన్మించి నీవు మరల అవే ప్రశ్నలను అడగటం, నీవు వాటికి ధన్యవాదాలు చెప్పటం ఈచిరవైరెండు రోజులుగా జరిగింది.

ఈ జన్మయందు నాచే ఉపదేశించబడినట్టి జ్ఞానమునంతా నీవు విన్నావు. నీ ద్వారా జనులకు ఈ మోక్షశాస్త్రాన్ని మరొక్కసారి సంపూర్తిగా అందించడం జరుగుతోంది. ఈ మన గురు-శిష్య సంవాదము మా తండ్రి బ్రహ్మదేవుని ఉద్దేశమును అనుసరించి ఆత్మజ్ఞాన శాస్త్ర నిరూపణ కొరకే

Page:784

అయి వున్నది. ఈ మన సంవాదము ఆధ్యాత్మ శాస్త్రమును ప్రతిపాదించటంలో ఉత్తమమైనది. పరమార్థ వస్తువును శ్రోతలకు - పాఠకులకు గోచరింపజేసేది. సంసారము అనే సుదీర్ఘమైన రాత్రి యొక్క అంధకారమును, తాపమును పటాపంచలు చేయగలిగినది. బాధిస్తున్న సంసారాంధకారానికి పూర్ణ చంద్రబింబము వంటిది. అనేక మంది అభిప్రాయములను అనుభవములను క్రోడీకరిస్తూ, స్వానుభవమైన దానిని - విజ్ఞుల అనుభవమును నేను ఇప్పుడిక్కడ విస్తారంగా అనేక దృష్టాంతాల సహాయంతో బోధించాను.

ఈ నా చెప్పబడిన వాక్యములు విశ్వామిత్ర-నారదాది అనేకమంది సభికులగు మహనీయులైన శ్రోతలకు స్వానుభవము - - నిత్యానుభూతియే అయివున్నది.

ఈ మన ‘యోగవాసిష్ఠము’ అనబడే శ్రీ వసిష్ఠ - రామ సంవాదముచే అనేకులు అజ్ఞానమును విశేషముగా తొలగించుకున్న వారగుచున్నారు. నిరతిశయానందరూపమగు “మోక్షము” అనే పరమ పురుషార్థమును సముపార్జించుకున్నవారగుచున్నారు. అట్లాగే నీవు అభ్యుదయమును పొంది నిర్మల బోధైక రూపుడవు అయి ప్రకాశిస్తున్నావు. ఈ ప్రకారంగా కృతకృత్యుడవైనావు.

ఇదంతా ఈ సభలో ప్రస్తావించుటచే నేను కృతకృత్యుడనైనాను. ఇదంతా ఈ సభకు వేంచేసిన అనేకమంది - - శ్రీవిశ్వామిత్ర - వామదేవ - నిమి - - క్రతు - భరద్వాజ - - పులస్త్య - - అత్రి - - ఘృషి నారద శాండిల భాస - భృగు - భారండ - వాత్స్య - వాత్సాయనాది మహనీయుల సంత్సాంగత్యవీక్షణా ప్రయోజనంగా భావిస్తున్నాను.

జగతఃపితరులు - నా పిత్రుదేవులగు బ్రహ్మదేవుని ప్రసన్న వీక్షణములుగా స్వీకరిస్తూ వారికి ప్రణామాలు - జేజేలు పలుకుచున్నాను. వారిపాద పద్మములకు సాష్టాంగదండ ప్రమాణపూర్వకంగా సమర్పిస్తున్నాను.

ఓ రామచంద్రా! ఇక, నీవు నీకు యథాప్రాప్తమైనట్టి అయోధ్యా సామ్రాజ్యానికి చక్రవర్తివై రాజ్యాధికారము నిర్వర్తిస్తూ సుఖముగా ఉండెదవు గాక! నిర్మల స్వభావ యుక్తము సర్వత్రా ప్రకాశమానము - సర్వరూపము… అగు పరమ్మాత పదమునందు ’స్థితి’ని ఆస్వాదిస్తూ ఉండు.

సర్వ దృశ్యపదార్థ రహితుడవై ప్రకాశించెదవు గాక! నిర్వాణరూపమగు నిరతిశయానందమున ప్రశాంతుడవై ఉండెదవు గాక! తత్ఫలితంగా శాంతచిత్తుడవై, ఆకాశ కోశము వలె మనోహరుడవై దీపించెదవు గాక! తృష్ణా వర్జితుడవై సమదృష్టితో ధర్మపూర్వకంగా రాజ్యపాలన నిర్వర్తించెదవు గాక! సర్వాత్మకుడగు పరమాత్మకు సాష్టాంగదండ ప్రణామములు. లోకకళ్యాణమగుగాక. శ్రీరామావతారము లోకకళ్యాణకారకమై, శ్రీరామనామము తరతరాలుగా భక్తులకు సులభ మోక్షమార్గమై చతుర్దశభువనాలలో ఆచంద్రార్కం వెల్లిలిరియునుగాక! స్వస్తి!