CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.

Page:785

XVII. మహోత్సవం

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ ఓ భరద్వాజా! ఆ విధంగా శ్రీ వసిష్ఠ మహర్షి అమృతముచే పరిపూర్ణమగు మేఘమువలె గంభీరంగా ప్రవచనం పూర్తిచేసి చిదానంద స్వరూపులై చిరునవ్వుతో వాక్యములు ముగించారు. అప్పుడు దేవతల దుందుభులు మ్రోగాయి. వెనువెంటనే ఆకాశం నుండి మరల పుష్పవృష్టి కురిసింది. అది "పుణ్యదేవతల నగరం నుండి ఆ ఉత్సవమును వీక్షించటానికి పుష్పగుచ్చాలు వేంచేసినాయా” అన్నట్లున్నది. ఆ సభలోని మునిగణం అక్కడ కురిసిన దివ్య పుష్పములను గైకొని శ్రీవసిష్ఠ మహర్షి పాదములకు సమర్పించారు. ఆ సభలోని సభ్యులు మహర్షి పాదములను శిరస్సును పుష్పాలంకారం చేయసాగారు. జనన - మరణాది అనేక జన్మల దుః ఖములను తొలగించగల శ్రీ వసిష్ఠమహర్షి మహావాక్యములను మననం చేస్తూ నెమ్మదిగా ఒకరితో మరొకరు సంభాషించుకోసాగారు. ఇంతలో శ్రీ దశరథ మహారాజు సింహాసనం నుండి లేచి నిలబడ్డారు. సభంతా నిశ్శబ్దం అయిన ఆయన చెప్పబోయేదది వినటానికి అందరూ సంసిద్ధులైనారు.

శ్రీ దశరథ మహారాజు : హే మహాత్మా! అరుంధతీపతీ! సప్తర్షి మండల ప్రభూ! శ్రీవసిష్ఠ మహర్షీ! ఆకాశం నుండి పవిత్ర గంగాజలం జాలువారినట్లు మీ ముఖతః వచ్చిన ఆత్మజ్ఞాన స్రవంతి ‘సంసారము’ అనే వ్యవహారాణ్యంలో దారి - తెన్నుగాంచక సంచరించే మాకు అమృతప్రాయంగా ప్రాప్తించింది. ఈ రఘువంశంలో జన్మించి ఇంతకాలంగా శ్రమతో రాజ్యం ఏలినందుకు పరమ ప్రయోజనంగా మీ వాక్యాలు మాకు లభించాయి. తమ అనుగ్రహంచేత మేమంతా “ఆత్మ తత్త్వమునందు ప్రవేశించడం సులభమే” అని గ్రహించిన వారమై ఉత్తమ ఆత్మ పదమునందు శాశ్వతమైన విశ్రాంతిని సముపార్జించుకొన్న వారమగుచున్నాము. హేభగవాన్! ఎంతగానో ఎదురు చూచినతరువాత పిల్లలకు ఆటవస్తువు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ‘ఆత్మ’ అనే క్రీడా స్థలం లభించగా మా మనోబాలకులు అంతగా కేరింతలు కొడుతున్నారు. "పరమ పురుషార్థ సిద్ధికై అవశ్యం ఆచరించవలసినదేమిటి? ఈ “మానవజన్మ”ను వరప్రసాదంగా మలచుకోవటం ఎట్లా? “జీవితము” అనే అవకాశమును సద్వినియోగపరచుకోవటం ఏమార్గంలో?”… అనే విశేషాలు మీ నుండి తెలుసుకున్నాం.

కర్మణామవధిః పూర్ణో, దృష్టః సీమాన్త ఆపదామ్!

జ్ఞాతం జ్ఞేయమశేషేణ విశ్రాన్తాః స్మః పఠే పదే॥

మా కర్మల యొక్క అవధి ఏమిటో మాకిప్పుడు తెలియ వచ్చింది. జన్మ పరిపూర్ణమయింది. కృతకృత్యులమైనాము. ఆపదలు ఎక్కడ ముగుస్తాయో… అట్టి పరమావధి లభించింది. మీ యొక్క వాక్రవాహమహిమచే ‘జ్ఞేయము’ అగు ఆత్మవస్తువును సంపూర్ణముగా ఎరిగినవారమైనాము.

Page:786

పరమపదమున విశ్రాంతిని అనుభవిస్తున్నాం. ఆహాఁ! ఏమి ఆశ్చర్యం! కొన్ని కొన్ని ఉపమానములను ఉపకరణములుగా తీసుకొని మా దృశ్య దృష్టిని తొలగించివేశారు కదా!

-‘ధ్యానము’ కల్పించబడిన మరొక ఆకాశములోని చిరకాలానుభవములైన భ్రమలను గురించిన ఉపదేశములు (లీలోపాఖ్యానం),

- యోగధారణచే సర్వాధారమగు బ్రహ్మము నందలి విశ్రాంతి ద్వారా ఈ దేహభావమును త్యజించటం (ఉద్దాలకోపాఖ్యానం మొదలైనవి),

· ముత్యపు చిప్పలో వెండిలాగా ఈ జగత్తులో ఏదో కావాలని పొందాలని అభిలాషోద్వేగం కలిగి ఉండటం భ్రమయేనని గుర్తుచేయటం,

‘స్వప్నంలో స్వమరణం’ దృష్టాంతంతో ఈ జగత్తుకు వేరుగా ఉన్నట్టి మా యొక్క స్వస్వరూపమును నిరూపించి చూపటం,

’ వాయువు - వాయు తరంగముల అభిన్నత్వము ద్వారా ఈ జగత్తుగా కనిపించేది పరమాత్మ స్వరూపమేనని నిర్వచించటం,

మృగతృష్ణ దృష్టాంతము ద్వారా అసత్యము - నశ్వరము అయినట్టి జగద్ విభాగమును విడమర్చి విశదీకరించటం.

“ఆకాశంలో రెండు చంద్రబింబాలు కనిపించటం” అనే దృష్టాంతము ద్వారా దృష్టి యొక్క దోషముచే అహంకార రూపములగు సంబంధ బాంధవ్యాలు అగుపిస్తున్నట్లు బోధించటం,

"జీవుల ప్రాణములు సంస్కారపు పెట్టెలను మోసుకొని ఆకాశంలో ప్రకాశించటం” అనే ఆకాశ జగత్ నగర దృష్టాంతముద్వారా ప్రతి జీవుడు తనయందు అనేక జగత్తులను అజ్ఞాన దృష్టితో కలిగియే ఉన్నాడని అజ్ఞానాన్ని ఎత్తి చూపించటం,

దురాశ - నిరాశల జగత్ వ్యవహారమని మమ్ములను సంస్కరించటం.

ఈ ప్రకారంగా అనేకమంది మహాత్ముల అనుభవములను, మీ స్వానుభవములను, అనేక దృష్టాంతములను, సోదాహరణములను పరికరములుగా తీసుకొని మా యొక్క జన్మజన్మార్జిత

Page:787

దృశ్యదృష్టిని కడిగివేశారు. అట్టి మీకు మేము ఏమి ఇచ్చుకొని మీ ఋణం తీర్చుకోగలం? మీ పాదాలకు శతధాసహస్రధా సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. నా సర్వస్వము ఇక సర్వదా మీ కనుసన్నలలోనే ఉండునట్లుగా నియమితుడను అగుచున్నాను.

శ్రీ వాల్మీకి మహర్షి : ఈ విధంగా అత్యంత కృజ్ఞతాపూర్వకంగా కనులు చెమర్చుచుండగా శ్రీ దశరథ మహారాజు పలికిన పలుకులకు “ఔను! అట్లే అగుగాక! మా సర్వస్వము శ్రీ వసిష్ఠ మహర్షి పాదములకు సమర్పించబడినవై ఉండుగాక” అని సభికులు లేచి కరతాళ ధ్వనులు చేశారు. కొన్ని క్షణాలు గడచిపోయాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు లేచి నిలబడి సద్గురువగు శ్రీ వసిష్ఠి మహర్షికి హస్తమస్తకంగా వినమ్రుడై నమస్కరించాడు. అప్పుడు “ఆహాఁ! ఈ బాలకుని వలన కదా, మనం ఈ కాలంలో ఈ ఆత్మజ్ఞాన విశేషాలు శ్రీ వసిష్ఠ మహర్షి ముఖతః వినియున్నాం! ఈతడు ఋషులు చెప్పినట్లు జీవన్ముక్తుడే అయినప్పటికీ మన సందేహాలన్నీ స్వామియగు శ్రీ అరుంధతీపతి ముందు ఉంచాడు! ఈతడే మంటాడో విందాం!"… అని తలచారు. సభంతా మరల నిశ్శబ్దం అయింది.

శ్రీరాముడు :

నష్టోమోహః పదం ప్రాప్తం, త్వత్ప్రసాదాత్, మునీశ్వర! సంపన్నో_హమహం సత్యమత్యన్తమ్ అవదాతధీః ||

ఓ మునీశ్వరా! ‘ఆత్మబోధ’ అనే అమృతవర్షంచేత నేను పునీతుడనైనాను. తమ అనుగ్రహంచేత నా మోహము - అజ్ఞానము నశించాయి. ఆత్మ పదమును పొందాను. అత్యంత శుద్ధమైన బుద్ధిని పొందినవాడనై, నేను ఇప్పుడు సాక్షాత్ బ్రహ్మస్వరూపడనైనాను. మీ దయచే ఈ దశరథ రాముడు ఇప్పుడు “శ్రీరామబ్రహ్మము” అయి ప్రకాశిస్తున్నాడు.

స్థితో స్మి గత సందేహః! స్వభావే బ్రహ్మరూపిణి! నిరావరణ విజ్ఞానఃః కరిష్యే వచనం తవ I

గురువర్యా! ఇప్పుడు నేను సందేహరహితుడను అయ్యాను! ఆవరణ రహితమగు "పరమాత్మ విజ్ఞానము”ను మీ వాక్రవాహ ప్రభావంచే సంపాదించుకున్నాను. బ్రహ్మ స్వభావమున స్థితిని పొందినవాడనయ్యాను. ఇక తమ ఆజ్ఞను అనుసరించి ఆసక్తిరహితుడనై రాజ్యపాలన అయినా, అరణ్యవాసమైనా మరింక ఏమి ప్రవాహపతిత నియమిత కార్యములైనా నిర్వర్తించటానికి సంసిద్ధుడనై ఉన్నాను.

స్మృత్వా స్మృత్వా అమృతానేక సౌఖ్యదం వచనం తవ

అర్హితో2పి చ శ్రాంతో2పి హృష్యామీన ముహుర్ముహుః ॥

హే మహాత్మా! మీ వాక్యములు అమృతముచే తడుపబడినట్లు అత్యంత మధురంగాను, సౌఖ్యప్రదంగాను ఉన్నాయి. అట్టి మీ వచనములు మరల మరల స్మరించి ఆనందిస్తూనే ఉంటాను.

Page:788

ఇకపై నేను పూజించబడినను, అవమానించబడినను, నాపట్ల హర్ష - - శోకములు ఉదయించజాలవు. ఒక్కమాటలో చెప్పాలంటే "పరమ శాంతుడనై ఆనందం పొందుచున్నాను.”

దేవా! ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఏవైనా నిర్వర్తించుటచే గాని, నిర్వర్తించకుండటం చేతగాని ప్రయోజన నిష్ప్రయోజనములు లేనివాడనైనాను. పూర్వం ఎట్లా వ్యవహారమునందు స్థితి కలిగి ఉంటున్నానో, అది అట్లే కొనసాగుగాక! అట్టి వ్యవహారములచే ఇతఃపూర్వం ఏ సంతాపం జనిస్తూ ఉండేదో… అట్టి సంతాపము ఇప్పుడు నాకు లేకయేపోతోంది. సంతాప రహితుడనై ప్రశాంతమును స్వభావ సిద్ధముగా పొందుచున్నవాడనగుచున్నాను. తమ వచనములతో నాకు ఎటువంటి విశ్రాంతి, ఉపాయం లభిస్తుందో, …. అట్టి విశ్రాంతిగాని, ఉపాయముగాని మరింకెక్కడా ఉండజాలదు. ఆహాఁ! నేనిప్పుడు అపరిచ్చిన్నమగు విశ్రాంతి భూమిపై అడుగులుంచినవాడనయ్యాను. ఇప్పుడు నాకున్నది ఒకే ఒక విచారం.

తమ ఉపదేశము పొందనట్టి ప్రాణులయొక్క జనన మరణములతో కూడిన అనర్థమగు సంసార దశ ఎంత భయంకరమైనది! వారి దుఃఖ శమనమునకై నా సర్వస్వము సహకరించునుగాక!

మహాత్మా! నా కిప్పుడు శత్రువు అనేవాడు ఎవడూ లేడు! మిత్రుడూ లేడు! క్షేత్రము (శరీరము దృశ్యము) కూడా లేదు. దుర్జనుడుగాని, సజ్జనుడుగాని ఎవరూ లేరు. స్వాత్మ చైతన్యమే అజ్ఞానం ఉన్నంత వరకు సంక్షుబ్ధమై దుఃఖప్రదమగు జగత్తునందు వర్తిస్తోంది. ఇప్పుడు మీ కరుణా కటాక్ష వీక్షణ చేత అట్టి అజ్ఞానం బోధితమైనది కదా! అందుచేత ఇప్పుడు నా మనస్సు - బుద్ధి కూడా ప్రశాంతముగాను, సర్వార్థ సుందరంగాను వెలయుచున్నాయి.

గురువర్యా! తమ అనుగ్రహం లేకపోతే ఇటువంటి శుద్ధమగు ఆత్మదృష్టి మేము ఎట్లా ఎరుగగలం? ఈ జనులు తమ ఆత్మాన్నత్యమును ఎట్లా ఆస్వాదించగలరు? అందుచేత మన ఈ సంవాదము అనేకమంది సంసార పరితప్తులగు దీనజనుల చెవులకు చేరి వారిని ఆత్మానుభవమునందు స్నానము చేయించునుగాక! నావ లేనిదే ఎవడూ సముద్రమును దాటలేడు కదా! మీ ‘బోధ’ అనే నావ సంసార సముద్రమును అనేక మంది జనులచే దాటివేయించగలదు. సద్గురువులగు మీకు సర్వదా కృతజ్ఞుడను.

శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! అప్పుడు అక్కడి సభికుల కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు శ్రీరామచంద్రుని సోదరుడు లక్ష్మణుడు లేచి నిలబడ్డాడు. సభంతా మరల నిశ్శబ్దమయింది.

లక్ష్మణుడు :

జన్మాంతరోపచిత సంశయ నాశనేన, జన్మాంతరోపచిత పుణ్యశతోదితేన,

జాతో ద్యమే మునివచః పరిబోధనేన, జాతో ద్యమే మనసి చంద్రఇవ ప్రకాశః ||

Page:789

మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! మాలో అనేక జన్మలుగా సంచితమొనర్పబడిన దుర్వాసనలు మా దృష్టిని అపవిత్రం చేసియున్నాయి. ఈ ఇరవై రెండు రోజులు ఎంతటి సుదినములు! తమ యొక్క అనుగ్రహం చేత “మా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అడ్డులు తొలగించుకోవటం సులభమే అని నిరూపించి చూపారు”. “మోక్షము సులభమే” అని చెప్పేవారు సద్గురువులు. “చాలా కష్టం సుమా!” - అని చెప్పవారు సద్గురువులనిపించుకోరు. హే సద్గురూ! మా సంచిత కర్మలు మా పట్ల కొండలవలె, మహావృక్షములవలె అనేక సంశయములను నిలబెట్టాయి. మా సంశయాలన్నీ మీరు మీ ప్రవచనములతో కూకటివేళ్ళతో సహా తొలగించివేశారు. అనేక జన్మల సంచితమైన మా పుణ్య కార్యములు ఈనాడు మీ రూపం దాల్చి మమ్ములను కనికరించినట్లైనది. ఆహాఁ! ఇప్పుడు ఈ వసష్ఠి మునీంద్రుల వారిచే కావింపబడిన బోధచే ఉత్పన్నమైనట్టి ఆత్మ విచారణ నా మనస్సులో నిండు పున్నమి చంద్రునివలె అత్యంత ఆహ్లాదంగా ప్రకాశిస్తోంది. హే మునీంద్రా! మీ ఉపదేశము వలన ఎంతటి నిరతిశయానంద రూపమగు ఆనందం లభిస్తున్నది! మీరు ప్రతిపాదించిన “ఆత్మ దృష్టి” మహత్తరము, సులభసాధ్యము, మధురాతిమధురం కూడా! అయ్యో! ఈ జనులు దౌర్భాగ్యం చేత మాత్రమే ఇట్టి బోధను వినటానికి సిద్ధపడటం లేదే! మహాత్ముల సేవ, శుశ్రూష లేనివారై జననమరణాది అనేక కొయ్యలచే దహించబడుచున్నారే! అట్టివారు ఈ వసిష్ఠ - రామ సంవాదమును పఠన - శ్రవణ మననాదుల ద్వారా ఉపాసించి సంసారలంపటము నుండి తరించటానికిగాను నా జన్మజన్మార్జిత పుణ్యమంతా ధారపోస్తున్నాను. ఇట్టి మహత్తరమైన విజ్ఞానరాజమును లోకములకు ప్రతిపాదించిన మీకు సాష్టాంగ దండ ప్రణామములు.

శ్రీ వాల్మీకి మహర్షి : అప్పుడు శ్రీ విశ్వామిత్ర మహర్షి పెదవులు విప్పి ఇట్లు పలికారు.

శ్రీ విశ్వామిత్ర మహర్షి :

అహో! బత! మహత్పుణ్యం | శ్రుతం జ్ఞానం మునేర్ముఖాత్!

యేన గంగా సహస్రేణ స్నాతా ఇవ వయం స్థితాః ||

ఆహా! ఏమి సంతోషకరమైన విషయం! ఈ బ్రహ్మర్షి వసిష్ఠ మునీంద్రుని ముఖతః అతి పవిత్రమైన జ్ఞాన సారమును మనం విన్నాం! మనమందరం ఎంతటి పుణ్యం చేసి ఉంటామో మరి! వేలకొలది గంగా స్నానాలు చేస్తే ఎంతటి పవిత్రులం కాగలమో, ఈ మహర్షి వాక్యముల శ్రవణముచే మనం అంతటి పవిత్రులం అయ్యాం!

శ్రీరాముడు : హే గురువర్యా! సమస్త సంపదల యొక్క సర్వశాస్త్రముల యొక్క సర్వ సంసార దృష్టుల వినాశనము యొక్క మహావాక్యార్థముల అర్ధ పరిశీలన యొక్క ఉత్తమ ఆవధి ఏమై ఉన్నదో… అద్దానిని మీ ప్రవచనసారమగు ఆత్మజ్ఞాన రూపంగా మేము పొందాం, తృప్తిపడ్డాం! శ్రీ నారద మహర్షి :

యన్నశ్రుతం బ్రహ్మలోకే స్వర్గే భూమితలే తథా |

కర్లే తజ్జా సమాకర్ణ్య యాతౌ మే ద్య పవిత్రతామ్ ||

Page:790

హే మహాత్మా! అరుంధతీపతీ! బ్రహ్మర్షీ ఏ జ్ఞానమైతే బ్రహ్మలోకంలోగాని, స్వర్గలోకంలోగాని, భూతలంపై గాని ఇంతవరకు నేను వినివుండలేదో… అట్టి జ్ఞానమును నేడు విన్నాను. నా చెవులు పరమ పవిత్రత్వం సంతరించుకున్నాయి. హే మహర్షీ! మీకు కృతజ్ఞతాపూర్వకమైన ప్రణామాలు! లక్ష్మణుడు : మునివర్యా! బాహ్య అభ్యంతరములందలి ‘అజ్ఞానం’ అనే అంధకారాన్ని మీ మీ యొక్క జ్ఞాన వాక్య కిరణాలచే పటాపంచలు చేశారు. మీ ప్రవచనం మహోత్కృష్టం! అమోఘం! మోక్షము అనే మహత్తరమైన వస్తువును సశాస్త్రీయంగాను సులభంగాను ప్రసాదించగలుగునదై ఉన్నది. శత్రుఘ్నుడు :

నిర్వృతో2 స్మి! ప్రశాంతో స్మి! ప్రాప్తోస్మి పరమం పదమ్! చిరాయ పరిపూర్ణో స్మి! సుఖమాసే చ కేవలమ్ ||

మహాత్మా! మీ అనుగ్రహముచే మీ ముఖ కమలంనుండి జాలువారిన బోధామృతమును గ్రోలి నేను పరమతృప్తిని పొందాను. ప్రశాంతుడనైనాను. పరమాత్మ పదమును పొందినవాడనయ్యాను! శాశ్వతముగ పరిపూర్ణుడను అయ్యాను. నేనిప్పుడు కేవలము నిరతిశయానంద స్వరూపమగు ఆత్మస్వరూపమున సుఖముగా వెలయుచున్నాను.

శ్రీ దశరథ మహారాజు : ఓ సభికులారా! మన ఈ అయోధ్యాసభ పరమపవిత్రమైనది! అనేక జన్మలందు లభించిన పుణ్యము చేతనే మనకు ఈ ధీరుడగు శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క అత్యంత మధురము, పరమపవిత్రము అగు బ్రహ్మజ్ఞానోపదేశం లభించింది. దానిచే మనం పరమపవిత్రులమైనాం. హే మహర్షీ! మీకు ఏమి సమర్పించుకొని మేము తృప్తిపడగలమో….. మీ ఆజ్ఞకై మేము వేచియున్నాము.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రఘుకుల చంద్రుడా! ప్రియ దశరథ మహారాజా! నేనిప్పుడు ఏది చెప్పు చున్నానో… అది ఆచరిస్తే నాకు సంతోషం. ఈ సభలో ఇప్పుడు జరిగిన సంవాదం మనోహరమై అనేక మంది భవిష్యత్ జనులకు జ్ఞానప్రసాదతమై వారి సంసార దుఃఖములను తొలగించుగాక!

ఈ యజ్ఞము దిగ్విజయంచేయు విధంగా బ్రహ్మనిష్ఠులను నీవు పూజించి సత్కరించెదవుగాక! పవిత్ర వేద - శాస్త్రజ్ఞులగు బ్రాహ్మణ సమూహములను సంభావన సమారాధనలలో సంతోషింప

జేయుము.

ఈ వసిష్ఠ రామ సంవాద యజ్ఞము ముగించు సమయములలో వేద - వేదాంగవేత్తలనుండి వేదగానం శ్రవణం చేసి, వారిని బహువిధములుగా సత్కరించెదవుగాక! మోక్షోపాయమగు ఈ గ్రంథ కథ యొక్క పరిసమాప్తి యందు అతిదరిద్రుడు కూడా తన శక్తి కొలది వేదవేత్తలగు బ్రాహ్మణులను సత్కరించాలి. ఇక మహారాజువగు నీకు వేరే చెప్పేదేమున్నది?

శ్రీ వాల్మీకి మహర్షి : అప్పుడు ఆ వాక్యములు విని శ్రీదశరథ మహారాజు రాజగురు ఆజ్ఞానుసారం దూతల ద్వారా అయోధ్య - మధుర సౌరాష్ట్ర మొదలైన ఆయా దేశములలోగల శ్రేష్ఠులగు

Page:791

వేదవేత్తలైన బ్రాహ్మణులను ఆహ్వానించి సముచిత రీతిగా సత్కరించారు. అప్పుడు సర్వోత్తముడగు బ్రాహ్మణుని నుండి సామాన్యుడగు బ్రాహ్మణుని వరకు లక్ష మంది బ్రాహ్మణులకు సమారాధన జరిగింది. సభలో వేంచేసిన సభ్యులందరికీ మంత్రివర్యులు ఉచితరీతిగా జ్ఞాపికలు సమర్పించి పూజించారు. అట్లాగే నగరవాసులను, దీనులను, అంధులను, దరిద్రులను, ధన - దాన్యాదులు మొదలైన వాటితో సంతోషింపజేశారు.

నృత్యగీతాదులతో వేద ప్రవచనములతో అయోధ్యా నగరంలో ఏడు రోజులు ఉత్సవాలు

జరిగాయి.

లోకాసమస్థాః సుఖినోభవంతు.

శ్రీ వాల్మీకి మహర్షి : మహాబుద్ధిమంతుడవు - ప్రియశిష్యుడవు అగు ఓ భరద్వాజా! ఈ ప్రకారంగా శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క బోధను శ్రవణం చేసినవారై శ్రీరామచంద్రుడు మొదలైనవారంతా జ్ఞేయమగు ఆత్మను ఎరిగి దుఃఖరాహిత్యమును పొందారు.

అట్లాగే నీవు కూడా ఉత్తమమగు “పూర్ణ బ్రహ్మాత్మదృష్టి”ని దృఢంగా అవలంబించి రాగరహితుడవు కమ్ము. దుఃఖ వర్జితుడవై ఉండు. ప్రశాంతమగు బుద్ధిని ప్రవృత్తపరచుకొన్న వాడవు కమ్ము! జీవన్ముక్తుడవై వెలుగొందుచూ సుఖముగా ఉండు! ఓ భరద్వాజా! నీ బుద్ధి కూడా శ్రీరామచంద్రుడు మొదలైనవారి బుద్ధివలెనే భోగములతో సంగము లేకుండా ఉన్నది. ఎవరి బుద్ధి సర్వజగత్ విషయములతో సంగము తొలగునట్లుగా అభ్యాసమును అనుసరిస్తుందో అప్పుడట్టివాడు ఆయా లౌకిక - సాంసారిక పరిస్థితులు సమీపించినప్పటికీ సంసారమునందు తగుల్కొనడు. మరింకెన్నటికీ మోహము పొందడు.

ఓ భరద్వాజా! శ్రీ వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పినట్టి విశేషాలన్నీ పూసగ్రుచ్చినట్లుగా నీకు చెప్పాను. ఆ విషయాలన్నీ మననం చేస్తూ స్వవిచారణ చేయి. వాస్తవానికి ఇతఃపూర్వమే నీవు నిర్మల బుద్ధిని తపోధ్యానాది ప్రయత్నములచే సంపాదించుకొనియే ఉన్నావు. ఇప్పుడు ఈ అఖండ రామాయణము అనబడే ‘వసిష్ఠ రామ సంవాదము’ అనే మోక్ష సంహిత (యోగ వాసిష్ఠము) ను శ్రవణం చేసిన తరువాత మరింత అధికంగా ముక్తత్వమును సుస్పష్టము - పదిలము చేసుకొన్న వాడవయ్యావు. ప్రత్యక్షానుభవం కలుగజేయునట్టి ఈ పరమపవిత్రమైన మోక్ష కథనము వింటే బాలుడు - మందాధికారి కూడా ఆత్మజ్ఞానం సంపాదించు కుంటున్నాడు. ఇక నీవంటి మహావైరాగ్య సంపన్నులు, (తపోధ్యానముల దృష్ట్యా) ఉత్తమాధికారుల విషయం వేరే చెప్పేదేమున్నది? వసిష్ఠ మునీంద్రుని వాక్యములు నీ హృదయంలో ప్రవేశించటంచే, తత్ప్రభావం చేత సర్వ సంశయములు నశించుగాక! అజ్ఞానము నశించగా శ్రీరామచంద్రుడు మొదలైనవారివలె నీవు కూడా పవిత్రమైన జీవన్ముక్త పదమును పొంది దుఃఖ రహితుడవు అయ్యెదవుగాక!

ఆద్యము, నిత్య సిద్ధము అగు బ్రహ్మభావాన్ని పుణికి పుచ్చుకొని సుఖముగా ఉండెదవు గాక!