వసిష్ఠ రామ సంవాదం
(యోగ వాసిష్ఠమ్)
Fede
M
మొదటి సంపుటం
వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)
మొదటి సంపుటం
వైరాగ్య, ముముక్షు వ్యవహార, ఉత్పత్తి ప్రకరణములు
అనుసృజన: వై.హెచ్. రామకృష్ణ
KAN
మఠం
రామకృష్ణ మఠం
దోమలగూడ, హైదరాబాదు - 500029
ii
Published by Adhyaksha Ramakrishna Math
Domalguda, Hyderabad - 29
O Ramakrishna Math, Hyderabad All rights reserved
I-1M-08-2010 12024
12028 (Set)
Printed at: RP Printers, Hyderabad.
Bound at Pridhvi Binders, Hyderabad.
Page:111
ప్రవేశిక
ఆర్షధర్మ వాజ్ఞయ వినీలాకాశంలో జాజ్వల్యమానంగా భాసిస్తున్న తారలెన్నో. ఆ తారా సమూహంలో విశిష్టంగా భాసిస్తూ ధ్రువతార అని పరిగణించదగినది శ్రీ యోగవాసిష్ఠము. వాసిష్ఠ రామాయణము, మహారామాయణము, ఆఖండ రామాయణము అని కూడా గణుతికెక్కిన ఈ గ్రంథం వాల్మీకి మహర్షిచే విరచితమైనది. ముప్పైరెండు వేల శ్లోకాలతో ఒప్పారే ఈ బృహద్గ్రంథంలో వైరాగ్య-ముముక్షువ్యవహార-ఉత్పత్తి-స్థితి-ఉపశమ-నిర్వాణ అనే ఆరు ప్రకరణాలు ఉన్నాయి.
వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చేసిన అద్వైత వేదాంత బోధ ఇందలి విషయం. అనాదిగా జిజ్ఞాసువులను వేధిస్తున్న ప్రశ్న 'మోక్షోపలబ్ధి కర్మ వలన లేక జ్ఞానం వలన చేకూరుతుందా?’ అని. కర్మ జ్ఞానాలు రెండు పరస్పర విరుద్ధమైన సాధనామార్గాలని, రెండింటినీ ఏకకాలంలో సమన్వయపరచటం అసాధ్యమనీ వారి భావన. దీనితో సాధకులు రెండు వర్గాలై కొంతమంది కర్మాభిముఖులై మరికొందరు కర్మను త్యజించి పూర్తిగా జ్ఞానమార్గాన్ని అవలంబించి ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఐతే పూర్తిగా కర్మాభిరక్తులై ఉండటం కాదు; కర్మను పరిత్యజించటమూ కాదు; సమాజానికి, బాధ్యతలకు దూరంగా ఉండటం కాదు; వివేక విచక్షణలతో కూడి విహిత కర్మలను ఆచరించటం ద్వారా కైవల్యపదాన్ని చేరుకోవచ్చు అని ఘంటాపథంగా చెపుతుంది ఈ గ్రంథరాజం. భగవంతుడికి అతీతంగా ఏదీ లేదని తెలుపుతూ జ్ఞాన కర్మలను సమన్వయ పరచటానికి సంబంధించి సాధకుడికి ఉండే సంఘర్షణను తొలగించి లౌకిక, పారలౌకిక ప్రపంచా లంటూ రెండూ వేరుగా ఏమిలేవని, ఉన్నదంతా ఏకైక సాక్షీభూత కేవల చైతన్యం అని ఉద్బోధిస్తుందీ గ్రంథం. అనేక అద్భుత దృష్టాంతాలతో మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థంచేసుకునే రీతిలో విషయాన్ని వివరిస్తుందీ గ్రంథరాజం.
'మోక్షకారణం కర్మయా లేక జ్ఞానమా? లేక కర్మ జ్ఞానాలు రెండూ మోక్షసాధనాలా అని ‘సుతీక్షుణుడు’ అనే బ్రాహ్మణుడు అగస్తి అనే మునీంద్రుని అడిగినప్పుడు 'కేవలం కర్మ వలనగాని, జ్ఞానం వలన గాని మోక్షం లభింపదు. ఈ రెండింటి వలన మోక్షం లభిస్తుంది. కనుక సాధుజనులు ఈ రెంటిని మోక్షోపాయాలుగా పరిగణింతురు,' అంటూ ఒక పురాణేతిహాసాన్ని ఉటంకించటంతో కథ ప్రారంభమవుతుంది. ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా కథలో కథ, కథలో కథగా సాగిపోయే ఈ గ్రంథంలో పదే పదే ద్రష్టకు దృశ్యప్రపంచపు మిథ్యాత్వాన్ని నిరూపించి, సంసార విముక్తుణ్ణి చేయడం ముఖ్య ప్రయోజనంగా కనపడుతుంది.
ఎవరు ఈ గ్రంథాన్ని పఠించటానికి అర్హులు అన్న ప్రశ్నకు సమాధానం మనకు గ్రంథ ప్రథమ భాగంలోనే లభిస్తుంది. 'నేను సంసారబద్ధుడను, ముక్తుడనవుతాను' - ఇట్టి నిశ్చయం గలవాడే ఈ శాస్త్రాన్ని పఠించటానికి అర్హుడని వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు. అంటే ముందు
iv
జనన మరణ సంసార చక్రంలో చిక్కుకున్నాను అన్న స్ఫురణ కలిగినప్పుడే సాధకుడు ఈ పుస్తకంలోని విషయాన్ని పూర్తిగా ఆస్వాదించ గలుగుతాడు. బంధం అంటే ఏమిటో ఎరిగినప్పుడే స్వేచ్ఛకై ప్రయత్నించ గలుగుతాడు. మోక్షేచ్ఛ లేనివారికి గ్రంథంలోని విషయం సులభగ్రాహ్యం కాదు. వివేక వైరాగ్యాలు కలిగిన వ్యక్తికి ఇందులోని విషయం అమృతోపమై తోస్తుంది. ఐతే శ్రద్ధాళువులై పఠించేవారికి ఇందులోని జ్ఞానకౌముది వివేక వైరాగ్యాలను పెంపొందించి ఆహ్లాద భరితులను చేస్తుంది; నిర్వాణాభిలాషులుగా పరిణతి నొందిస్తుంది.
ఆర్యుల తత్త్వ చింతనాసక్తి, తత్త్వవిశ్లేషణా శక్తి, బుద్ధి కుశలతా, ధీశక్తి వైభవానికి ఈ గ్రంథం అద్దంపడుతుంది. గ్రంథంలోని విషయమంతా ఇద్దరు జ్ఞానుల మధ్య జరిగిన సంభాషణ. ఇప్పటి వరకూ హైందవ జాతికి తమ పూర్వీకుల నుంచి లభించిన ఆధ్యాత్మిక వారసత్వంలో అత్యంత విలువైనది, గొప్పగా ఎంచదగ్గది ఈ గ్రంథం అంటే అతిశయోక్తి కాదేమో!
అస్మాచ్ఛా స్రవరాద్బోధా జాయన్తో యే విచారితాత్ లవణైర్వ్యంజనానీవ భాన్తి శాస్త్రాంతరాణి తైః!
'ఈ ఉత్తమ శాస్త్రాన్ని (యోగవాసిష్ఠము) విచారించటంచే పరమోత్కృష్టమైన జ్ఞానం సంప్రాప్తమవుతుంది. అపుడే తక్కిన శాస్త్రాలన్నీ లవణ సంయోగం పొందిన శాకం వలె రుచిస్తుంది’ అని వసిష్ఠ మహర్షి వచించడం ద్వారా ఈ గ్రంథ వైశిష్ట్యాన్ని, ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
కేవలం ఈ గ్రంథాన్ని పఠించడం ద్వారానే ముక్తిని పొందవచ్చు. పఠనమే ఒక అద్భుత సాధనా ఫలాన్ని అందించగలదు.
ఈ కావ్యాన్ని శ్లోకాలూ, తాత్పర్యంతో సహా మొదట తెలుగులో ప్రచురించినది శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు వారు. బ్రహ్మలీన పూజ్య మలయాళ స్వామీజీ వారు, రామకృష్ణ మఠం స్వామీజీ శ్రీ నిర్వికల్పానంద వారిని ప్రోత్సహించి సగభాగానికి (సుమారు 15 వేల శ్లోకాలకు) తాత్పర్యాన్ని వ్రాయించారు. మిగతా సగభాగానికి వారి శిష్యులు బ్రహ్మలీన శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామీజీ వారు తాత్పర్యాన్ని సమకూర్చారు. 1936వ సంవత్సరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 18 సంవత్సరాల శ్రమ తర్వాత 1954లో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ వరిష్ఠ గ్రంథాన్ని తెలుగులో సరళ తాత్పర్యంతో అందించిన శ్రీ వ్యాసాశ్రమం వారికి తెలుగు ప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉండాలి. శ్రీ నిర్వికల్పానంద, శ్రీ విద్యాప్రకాశానంద గిరి యతివరేణ్యులకు కూడా మనం కృతజ్ఞతా బద్ధులమై
ఉండాలి.
పంతొమ్మిది వందల యాభయ్యవ దశకం తెలుగు భాషకు, ప్రస్తుత తెలుగు భాషకు తేడా ఉన్నది. శ్రీ వ్యాసాశ్రమం వారి పుస్తకంలోని తాత్పర్యాన్ని సరళీకృతం చేసి అందులోని సుదీర్ఘ సంభాషణల నిడివి తగ్గించి, ఆధునిక పాఠకుడు సునాయాసంగా అర్థంచేసుకోవటానికి వీలుగా సంస్కృత శ్లోకాలను అక్కడక్కడ మాత్రమే ఉటంకిస్తూ వచన కావ్యంగా తీర్చిదిద్దిన వారు శ్రీ హనుమ రామకృష్ణ గారు. వసిష్ఠ రామ సంవాదాలలో వసిష్ఠులవారి సమాధానం సుదీర్ఘంగా
V
ఉన్నచోట శ్రీరాముడిచే ఇతర ప్రశ్నలను సంధింపజేసి సంవాదాలను చిన్నవిగా చేసి తేలికగా విషయాన్ని గ్రహించటానికి దోహదపడేలా వీరు పుస్తకాన్ని వెలువరించారు. వారు ప్రస్తుత తరం పాఠకుడి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సులభ గ్రాహ్యంగా అందించి అందరూ అర్థంచేసుకునే విధంగా పుస్తకాన్ని రచించారు. గృహస్థ జీవితపు బరువు బాధ్యతలను మోస్తూ తన లాంటి ఉద్యోగి చదివి అర్థంచేసుకోగలిగినప్పుడు ఇతరులు ఎందుకు చదవకూడదని భావించి, ఈ మహోత్కృష్ట గ్రంథంలోని అద్వైత వేదాంత మకరందం అందరూ గ్రోలాలని సంకల్పించి, వారు పుస్తకాన్ని స్వీయముద్రణగా ప్రచురించారు. ఒక దశాబ్ద కాలం పాటి వారి కృషి ఫలితంగా ఈ పుస్తకం రూపుదిద్దుకున్నది.
అమూల్యమైన ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న వారి సత్సంకల్పానికి మా వంతు సహాయంగా పుస్తకాన్ని మఠం స్వయంగా ప్రచురించటానికి స్వీకరించింది.
మఠ గ్రంథాలన్నింటినీ విశేషంగా ఆదరిస్తున్న పాఠకులు ఈ గ్రంథాన్ని కూడా చదివి ఆస్వాదించి శ్రీ వసిష్ఠ మహాముని శ్రీరామచంద్రమూర్తి కృపాకటాక్షాలను పొందాలని మా ఆకాంక్ష. ఈ పుస్తకాన్ని వెలువరించటానికి సహకరించిన యావన్మందికీ మా కృతజ్ఞతలు.
- ప్రకాశకులు
vii
పుష్పాంజలి
నా అభ్యున్నతి కొరకు అనేక త్యాగములు చేసి, నాకు బాల్యము నుండి భక్తి, జ్ఞాన, వైరాగ్య పూర్వకమైన అనేక విశేషములు బోధించిన మాతృదేవత శ్రీమతి ఆదిలక్ష్మీ కామేశ్వరమ్మ గారికి, పితృదేవులు శ్రీ లక్ష్మీనారాయణ గార్కి సాష్టాంగదండ ప్రమాణామములు, దైవసమానులు, ఆధ్యాత్మిక గురువులు అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశా నందగిరి స్వామివారి (శ్రీ శుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి) పాదములకు వినమ్రతతో నమస్కరిస్తున్నాను. నాకు జీవనోపాధిని ప్రసాదించిన 'ఆంధ్రాబ్యాంకు'కు సర్వదా దిగ్విజయమగుగాక!
1990లో శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు విజయవాడలో 'గీతాయజ్ఞం' నిర్వహించారు. “నాయనలారా! వాల్మీకి మహర్షిచే (కథారామాయణానంతరం) 32000 శ్లోకములలో రచించబడిన ‘యోగ వాసిష్ఠం' అనే గ్రంథం చూడండి. మన ఋషులు ప్రకటిస్తున్నదేమిటో మరింత సుస్పష్టంగా గ్రహించగలరు” అని ఆయన సభను ఉద్దేశించి పలికారు. ఆ వాక్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఒకానొక జిజ్ఞాస నాయందు బయలుదేరింది. ఇక అప్పటి నుండి పూర్వం రచించబడిన వచన గ్రంథాలు కొన్ని చదవటం జరిగింది.
1. శ్రీ జ్ఞాన వాసిష్ఠ రామాయణము (1918), (వచన కావ్యం), బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామ శర్మగారు.
2. శ్రీ వసిష్ఠగీత (1982), వాసిష్ఠమహారామాయణము (1990), శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామిగారు. 3. జ్ఞానవాసిష్ఠము (వచనకావ్యము), బ్రహ్మశ్రీ చింతలపాటి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు,
ఘంటసాల
4. యోగవాసిష్ఠము (వచనకావ్యము), బ్రహ్మశ్రీ సముద్రాల లక్ష్మణయ్యగారు 5. యోగవాసిష్ఠము 8 సంపుటములు (32000 శ్లోకములు + తాత్పర్యము) శ్రీశ్రీశ్రీ పూర్ణానందుల వారు మరియు శ్రీశ్రీశ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు (యేర్పేడు, శ్రీ వ్యాసాశ్రమము & శ్రీ శుకబ్రహ్మాశ్రమము) 1937,
శ్రీ వసిష్ఠ మహర్షి : శ్రీరామచంద్రుల మధ్య సంభాషణా రూపంలో ఉన్న యోగవాసిష్ఠం (అఖండ రామాయణం, ఉత్తర రామాయణం అని కూడా చెప్పబడినది) “అద్భుతమైన గ్రంథం” అనుటలో సందేహమేమీ లేదు. ఎందుకంటే, ఈ గ్రంథం, “ఓయి! జీవుడా! నీవు ఇప్పటికే పూర్ణుడవై యున్నావయ్యా!” అని అత్యంత సుస్పష్టంగా నిర్దుష్టంగా నిరూపించి చూపుతోంది. ఇందలి విచారణ అత్యంత సులభమైనదేనని నా అభిప్రాయం. పాఠకుడు, తాను చదువుచూ ఉండగానే, తనయొక్క మోక్ష స్వరూపమును గుర్తుచేసుకొనేట్లు చేయగల ఉత్తమవిచారణ మనకు ఈ గ్రంథంలో లభిస్తోంది. ఇట్టి మహత్తరమైన గ్రంథం విశదీకరిస్తున్న విషయమేమిటో అనేకులు గమనించి ఉండనట్లు నాకు
Vill
అనిపించింది. ఇక మరికొందరు, “ఈ గ్రంథమును సామాన్యులు గ్రహించలేరు... ఇది అందరు చదివే గ్రంథం కాదు... కుటుంబ వ్యవస్థలోని వారికి ఇందలి విషయము గ్రహించడం కష్టమౌతుంది...” మొదలైన అవిచారణ పూర్వకమైన అభిప్రాయాలు కలిగి ఉండటం గమనించాను. ఇంకొందరు తెలుగు నవలలో కనబడే అత్యంత సరళమైన భాష చదువుటకు మాత్రమే అలవాటుపడి ఉన్నారు. లోని ఆయా సిద్ధాంతాలు, 'ఉపనిషత్తులు' మొదలైన ప్రాచీన గ్రంథములచే ప్రతిపాదించ బడుచున్న సిద్ధాంతాలు వాటి సమన్వయం గ్రహించాలని మరికొందరు అభిలషించటం గమనించాను. అట్టివారినందరిని దృష్టిలో పెట్టుకొని వర్తమాన వ్యావహారిక భాషలో “శ్రీ వసిష్ఠ - రావసంవాదము వచన కావ్యం" అనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ పీఠికలో ఉదహరింపబడ్డ ఇతఃపూర్వపు గ్రంథాలు చదువుచు, ఒకానొక “ఉత్సాహము-ఆవేశములతో కూడుకొనిన ఉపన్యాసము” వింటున్న అనుభూతి పాఠకునికి రావాలనే ఉద్దేశముతో ఇందుకు ఉపక్రమించాను.
ప్రకృతి వర్ణనలకు సంబంధించిన సుమారు 500-550 శ్లోకాలు మాత్రం వదిలాను. మిగతా అన్ని శ్లోకాలు యథాతథంగా ఇందులో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జ్ఞాన విచారణకు సంబంధించిన శ్లోకాలన్నీ రావాలని నా ప్రయత్నం.
ఈ గ్రంథంలో 56 కథలు ఉన్నాయి. ప్రతి కథ పాఠకునికి 'మోక్షభావన' అంటే ఏమిటో రుచి చూపుతుంది. స్వస్వరూపము విషయమై సర్వసందేహాలు నివృత్తిచేస్తూ, అనేక విశేషాలు చర్చాపూర్వకంగా తెలియజేస్తోంది. పాఠకునకు "పునర్జన్మ-మృత్యువు ఈ జన్మ యొక్క ముందువెనుకలు-దేహి-దేహముల స్వభావ, స్వరూపములు - - దుఃఖముల మూలకారణం” ఇవన్నీ సుస్పష్టమౌతాయి. “ఈ జీవుడు పూర్ణుడు, అనంతుడు, అఖండుడు, శాశ్వితుడు, ఈతడు సాక్షాత్ ప్రత్యగాత్మయే. వాస్తవానికి ఈతనికి జన్మమృత్యువులుగాని, ఆద్యంతాలుగానిలేవు” అని అనేక దృష్టాంతాలతో ఈ గ్రంథంలో ప్రతిపాదించబడింది.
శృణ్వన్తి విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని తస్థుః |
వేదాహమేతం పురుషం మహాన్తం ఆదిత్యవర్ణం తమసః పరిస్తాత్ ॥
"ఓ అమృత పుత్రులారా! అది ఏమిటో మేము గ్రహించాము. ఆ మహత్తర తత్త్వము గురించి మీకు చెపుతాం వినండి" అని ఆ ఆత్మద్రష్టలు మనందరిని ఆహ్వానిస్తున్నారు.
మనందరిపై గల అవ్యాజమైన ప్రేమచే ఋషులు ఇదంతా చెప్పారు. “భక్తి-జిజ్ఞాస” - ఈ రెండూ ఉంటే చాలు, ఎవరైనా ఇది చదువవచ్చు. “ఇది మీది అది మాది" అను రూపముగల మూర్ఖత్వమంతా అవిచారణచేతనే ప్రబలుతోంది. ఏ ఉత్తమ గ్రంథములోనిదైనా సరే, “జ్ఞానవిచారణ” అనేది అందరి కొరకే అయి ఉంటోంది. అందరికి సంబంధించినదే అవుతుంది. మహాత్ములగు వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, జీసస్, గురునానక్, మహమ్మద్, బుద్ధుడు, వసిష్ఠుడు, శంకరాచార్యులు వంటి వారికి “వీరు మా వారు. వారు మా వారు కాదు" అనుభేదభావం ఉంటుందా? ఉండదు. మనమంతా అది గ్రహించాలి. వారి వాక్యములలో ఉద్దేశమును అర్థం
చేసుకుని మనం బలోపేతులం కావాలి. మనందరి హృదయాలలో అవధులు లేని అకృత్రిమమైన ప్రేమ వెల్లివిరియాలి. మన స్వస్వరూప ప్రభావం గ్రహించి స్వస్థచిత్తులం కావాలి. “నేను అల్పుడను” అను రూపముగల బలహీనత, “ఇతరులు అల్పులు” అనురూపముగల జాడ్యము- ఈ రెండూ
కూడా మనం అధిగమించగలగాలి.
ఈ గ్రంథములో విచారించబడిన విషయమేమిటో పరిచయం చేయటానికి, మరొక చిన్న దృష్టాంతము విన్నవిస్తాను. “ఒక అల్లరి బాలుడు ఉన్నాడనుకుందాం...అతడు బాధిస్తున్నాడు. లేక, తనను తానే బాధించుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి సత్ప్రవర్తన అలవర్చటం ఎట్లా? భయ పెట్టటం ద్వారానా? నమ్మకం ద్వారానా? విచారణ ద్వారానా?
1.భయపెట్టటం : “నాయనా! బయటకువెళ్ళకు. ఇతర బాలురను బాధించకు. అట్లా చేస్తే కొడతాను. ఇతరులను దూషిస్తే పాపం వస్తుంది. పాపపు లోకములకు వెళ్ళవలసివస్తుంది.”
2. నమ్మకం : పెద్దలు చెప్పారు. గ్రంథములు చెప్పుచున్నాయి. కనుక సత్ప్రవర్తన కలిగియుండు. మంచితనముతో పుణ్యకార్యములను ఆశ్రయిస్తే నీకు పుణ్యం కలుగగలదు. పెద్దలు చరిత్రలు చదువు. వారిని అనుకరించు.
3. విచారణ – అవగాహన : నీవు కొందరిని బాధిస్తూ ఉంటే, నీకన్నా బలవంతులు నిన్ను బాధిస్తూ ఉంటారు కదా? చివరకు మిగిలేదేమిటి? బాధయేకదా!
“విచారణ చేయి, ఈ విశేషాలు దృష్టిలో పెట్టుకొని యోచించు. ఇతరులపట్ల క్షమ, ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండు. అట్టి ప్రవర్తన స్వభావ సిద్ధంగానే శుభం చేకూరుస్తుంది. ఎందుకంటే, ఇదంతా ప్రసరించియున్నది నీవే. నిన్ను నీవు ప్రేమించు కోవటమే ఆనందంగానీ, ద్వేషించటం ఆనందమైన విషయం కాదు. నీవు వాస్తవానికి బలవంతుడవు, పూర్ణుడవు, సత్యమువు, నిత్యమువు.”
భయము, నమ్మకముల కంటే కూడా అవగాహన ఉత్తమమైనది, బలమైనది, స్వస్వరూపమునకు సంబంధించిన ‘విచారణ' ద్వారా ఈ గ్రంథము భగవంతునిపట్ల ఉత్తమ అవగాహన పెంపొందింప చేస్తోంది. అందుచేతనే ఇది ఉత్తమోత్తమమైన గ్రంథంగా శ్రీ స్వామి రామతీర్థ, శ్రీ రమణమహర్షి వంటి జ్ఞానమార్గావలంబులచే, సంత్ తుకారాం వంటి భక్తాగ్రేసరులచే శ్లాఘించబడింది. అట్లే మహనీయులు అనేకులు ఇట్టి అభిప్రాయం వెలిబుచ్చారు. మద్గురువులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద గిరిస్వామి వారు ఈ గ్రంథం పేరు వినగానే పులకిత శరీరంతో తన్మయులై మాట్లాడుతూ ఉంటారు. వారు తాము నిర్వర్తించిన 108 గీతాయజ్ఞముల సందర్భములో అనేకచోట్ల ఉదయంపూట ఈ గ్రంథముపై ఉపన్యసిస్తూ ఉండేవారు.
“శ్రీ వసిష్ఠ-రామ సంవాదము” అనబడు ఈ వచన కావ్యం ప్రచురించే ప్రయత్నం యొక్క లక్ష్యములు మూడు.
1. నా మనస్సు దోషరహితమై, నాయందు “యజ్ఞభావము” దృఢపడుట కొరకు. “యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః" అని గీతాచార్యులు చెప్పియున్నారు కదా!
X
2. నాతో సహా సర్వుల యొక్క అంతర్యామియగు ఆ భగవానుని ఈ "ప్రయత్నములు” అనే పూజాపుష్పములచే పూజించటం.
3.శ్రీ వాల్మీకి విరచితమైన “యోగవాసిష్ఠం” లోని వస్తువు అనేకమంది దృష్టికి తేవటం.
హే వెంకటేశ్వరా! సర్వేశ్వరుడవు, సర్వజీవరాసులలోని అంతర్యామివి, సర్వస్వరూపుడవు కూడా నీవే. 'శివుడు’గా 'అల్లా'గా, 'యహోవా'గా ఇంకా ఇంకా ఎన్నో నామరూపాలతో ఆరాధింపబడుచున్నదీ నీవే. నా యందలి వాస్తవతత్త్వము కూడా నీవే అయివున్నావు.
ఈ నా ప్రయత్నము సకల జనులకు శుభము, శాంతము, ఐకమత్యము, ఆనందము ప్రసాదించాలని నా ఆకాంక్ష. సమాజమంతటికీ క్షేమ, స్థైర్య, అభయ, విజయ ఆయురారోగ్యములు సిద్ధించుగాక! ధర్మ-అర్థ-కామ మోక్షములనబడే చతుర్విధ ఫల పురుషార్ధములు మానవాళికి ప్రాప్తించుగాక! భక్తి-జ్ఞాన వైరాగ్యాలు, శాంతి, అన్యోన్యత వెల్లివిరియుగాక!
“వసిష్ఠ - రామసంవాదము” అను గ్రంథపుష్పమును పరమాత్ముని పాదపద్మములకు సమర్పిస్తున్నాను.
సర్వేజనాః సుఖినో భవన్తు ।
సమస్త సన్మంగళాని సన్తు ॥
- - వై. హెచ్. రామకృష్ణ
Page:1
గ్రంథ సంఖ్యా వర్ణనం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! వివేకం ఉదయించినవాడే నీతిశాస్త్రం వినటానికి అర్హుడగుచున్నాడు కదా! అట్టివాడే ఈ ‘జ్ఞానశాస్త్రం' కూడా వినటానికి అర్హుడు. ఎవరైతే మూర్ఖ సంగమము త్యజించి, నిర్మలమైన బుద్ధితో ఉత్తమమైన ఆశయం కలిగి ఉంటున్నాడో - అట్టివాడు మాత్రమే 'సత్యవిచారణ’ చేయగలుగుచున్నాడు. నీయందు అట్టి గుణసంపద ఉండి ఉన్నది. అందుచేతనే, మనోమోహము పోగొట్టగల ఆ 'ఆత్మజ్ఞానశాస్త్రం' నీకు చెప్పబోవుచున్నాను. ఒకడు అనేక జన్మలలో ఆర్జించిన పుణ్యం చేతనే, ‘ముక్తి’ కొరకై ఈ శాస్త్రమును వినాలనే కోరిక పొందుచున్నాడు.
నీ యొక్క ఉత్తమ ప్రవర్తనలు, ప్రయత్నములు, గుణములే ఆత్మ సమాచారం స్వీకరించటానికి నిన్ను తగినవానినిగా తీర్చిదిద్దాయి. ఈ అఖండ రామాయణం ఆరు ప్రకరణములు కలిగి ఉన్నది.
1. వైరాగ్య ప్రకరణం : (1500 శ్లోకాలు) దీనిని విచారిస్తే ఈ దృశ్యము పట్ల, శరీరాదులను పేరుకొని ఉన్న అజ్ఞాన జనితమైన బుద్ధి మాంద్యము తొలగుతుంది. సాత్విక వైరాగ్యం ఏర్పడుతుంది. "జీవితము - అనుదానిని వివేకముచే పరిశీలించకుండానే బ్రతికివేస్తున్నామా?” అను వివేకపూరితమైన శోధనం ఏర్పడుతుంది. అట్టి దృష్టియే ఆత్మవిషయమై సమాచారం పొందటానికి పునాది.
2. ముముక్షు వ్యవహార ప్రకరణం : (1000 శ్లోకాలు) 'ముముక్షుత్వము' అంటే ఏమిటో, ముముక్షువులు ఎట్లు వ్యవహరిస్తారో, వారి స్వభావమేమిటో, ఎట్టి దృష్టిచే ఆత్మవిషయం గ్రహించటానికి సిద్ధంగా ఉండాలో చెప్పబడింది. బద్ధకము, అశ్రద్ధ, మూర్ఖత్వము త్యజించి శమము, సంతోషము, విచారణ, సత్సంగములను ఆశ్రయించ వలసినదిగా బోధింపబడింది. 'పరిశీలనదృష్టి - ప్రయత్నము' - రెండు ఉన్నవాడే ముముక్షువు.
3. ఉత్పత్తి ప్రకరణం : (7000 శ్లోకాలు) అనేక దృష్టాంతముల సహాయం చేత, ‘లౌకికములైన నీవు-నేను అను వ్యవహారములన్నీ అసలు ఉత్పన్నమే అయివుండలేదు” అని నిరూపించబడింది. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు మూలమే లేనిదని, రూపరహితమని ప్రతిపాతించబడింది.
“ఈ సంసారమంతా స్వకీయకల్పిత మనోరాజ్యము వంటిదే కాని, వాస్తవము కాదు. స్వప్నంలో ఎట్లు జరుగుతోందో, అదేవిధంగా, ఇదంతా అవస్తు మాత్రమే, కల్పితానుభవమాత్రమై ప్రాప్తిస్తోంది” అని యుక్తియుక్తంగా నిరూపించబడింది. ఎండమావులలో నీరు లభిస్తుందా, మెల్లకన్నువాడికి ఆకాశంలో కనిపించే “రెండవ చంద్రుడు” ఉన్నాడా? అంధకారంలో కనిపించే మోడువారిన ఒకానొక వృక్షం దయ్యమై, అపరిపక్వ బుద్ధికి మాత్రమే ప్రాప్తిస్తోంది కదా! నావ కదులుతుండగా ఒడ్డున ఉన్న చెట్లు కదులుచున్నట్లు కనిపించినంత మాత్రం చేత, ఆ చెట్ల కదలిక వాస్తవమా? ఈ సంసారము కూడా కల్పితమాత్రమని, ఒకానొకప్పుడు, ఒకానొకదృష్టిచే, ఒకానొక విధంగా భావనను
xii
అనుసరించి ప్రాప్తిస్తున్నదని తెలిసిపోతుంది. ఇది వాస్తవానికి సారరహితమని ఎరిగిన తరువాత, దీని గురించి ఎవడు దుఃఖిస్తాడు.
ఆభరణం - బంగారము కంటే వేరుకానట్లు, జలం కంటే తరంగాలు వేరుకానట్లు, ఈ జగత్తు పరమాత్మగానే దర్శించబడగలదు. ఇదంతా ద్రష్ట యొక్క దృష్టి కంటే వేతేమీ కాదు. ఆకాశంలో నీలపు పదార్థం ఏదైనా ఉన్నదా? చిత్రపటంలోని అగ్నికి ఉష్ణత్వమెక్కడ? ఈ జగత్తు కూడా అసత్తే. కాని, అవివేకదృష్టికి మాత్రం 'సత్తు' గా తోచుచున్నది. ఎప్పుడో జరిగిపోయిన ఒకొనొక దృశ్యము ఇప్పుడు మనన కారణంగా మనోవీథిలో ప్రత్యక్షమై ప్రాప్తిస్తోంది చూచావా! అదేవిధంగా ఈ జగత్తు కూడా వర్తమానంలో అనుభవమౌతోంది. ఈ కనబడే పదార్థములను జ్ఞానదృష్టిచే పరిశీలించినప్పుడు ఇవన్నీ “అస్థిరము, తుచ్ఛము, శూన్యము” అని ఈ ప్రకరణం బోధిస్తోంది.
4.స్థితి ప్రకరణం : (3000 శ్లోకాలు) “ఈ జగత్తు అహంభావమునందే స్థితి పొంది ఉన్నది కాని, ఎక్కడో బాహ్యమునందు కాదు” అనే పరమార్ధము అనేక కథల ద్వారా, దృష్టాంతముల ద్వారా నిరూపించబడింది. ఈ భ్రాంతిమయ జగత్తులు, ఈ ద్రష్ట-దర్శనము-దృశ్యములు ఇవన్నీ ఎట్లు వృద్ధి పొందుచున్నాయో చెప్పబడింది.
5.ఉపశమన ప్రకరణం: (5000 శ్లోకాలు) ఇందులో, "నేను, నీవు, అతడు, జగత్తు” అను వ్యవహారమంతా ఉపశమింపచేయ గల యుక్తులేమిటో చెప్పబడింది.
ఈ జగత్తు ఒకనికి సుస్పష్టంగా, మరొకనికి అస్పష్టంగా ఉన్నప్పటికీ - వాస్తవానికి ఇది అసత్యమే. ఊహాకల్పితమైన రూపములు ఆ ఊహ ఉపశమించగానే తొలగిపోతాయి కదా! ఈ జగత్తు స్వకల్పితమనండి, లేక స్వప్న కల్పితమనండి. ఇది మనస్సు నుండి విభజిస్తోంది. జ్ఞానముచే తొలగిపోతోంది. ఎవరికైతే జగద్భమ నశించుటలేదో, వారికి మాత్రం ఇదంతా ఒక అంతులేని అనేక సంఘటనలతో కూడిన 'కథ' వలె ప్రాప్తిస్తూపోతోంది. ఈ సంసారమంతా కల్పిత మాత్రమే. “అట్టి కల్పనలలోనే కొందరు మనోహరత్వమును, మరికొందరు దుఃఖపరంపరలను తమ అజ్ఞానం చేత, లేక మూర్ఖత్వం చేత పొందుచున్నారు" అని ఈ ప్రకరణం నిరూపిస్తోంది.
6. నిర్వాణ ప్రకరణం : (14500 శ్లోకాలు) జ్ఞానం వికసిస్తుంది. కల్పనలన్నీ తొలగిపోతాయి. “నిర్వాణము” అనబడే పరమశ్రేయస్సు లభించగలదు. ఇందలి విషయమును గ్రహించువాడు నిర్విషయము, చిత్ప్రకాశమాత్రము, విజ్ఞానమయము, నిరామయము - - అయినట్టి ఆత్మరూపమున ప్రతిష్ఠితుడగుచున్నాడు. సంసార భ్రమలన్నీ తొలగుట చేత పరమాకాశము వలె స్వచ్ఛుడౌతాడు. పరిపూర్ణుడు, కృతకృత్యుడు అగుటచేత, ఇక అతడు ప్రశాంతపూర్వకముగా ఈ 'జగత్యాత్ర’ నిర్వర్తించగలడు.
“ఒక దర్పణం ఎదురుగా ఉన్న దృశ్యమును ఎట్టి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే, తన యందు ప్రతిబింబించుటకు ఆశ్రయమౌతోంది కదా! నేను కూడా పూర్ణమగు బ్రహ్మమునై ఈ
Xill
జగత్తులు, ఈ కార్యములు ప్రతిబింబించుటకు కర్తృత్వము లేకుండానే ఆశ్రయభూతుడ నగుచున్నాను. ""
అని పఠించువాడు గ్రహిస్తున్నాడు. సమస్తము స్వస్వరూపముచే మ్రింగబడగా, అతడు తృప్తుడగుచున్నాడు. బాహ్యేంద్రియములు, చిత్తము, అహంకారము సర్వము చిదాకాశమేనని తెలుసుకొనుచున్నాడు. కార్య, కారణ, కర్తృత్వముల విషయంలో అత్యంత నిర్లిప్తుడై, దేనిచేత కూడా స్పృశించబడనివాడై ఉంటున్నాడు.
ఈ ప్రకరణము పఠిస్తున్నవాడు దేహము కలిగి ఉన్నప్పటికీ, తనను తాను విదేహిగా; సంసారి అయినప్పటికీ, అసంసారిలా గాంచుచున్నాడు. “నేను సర్వదా అఖండుడనే” అని గ్రహిస్తు న్నాడు. ఇక అతనిని లోక వ్యవహారములు తాకలేవు. పరిపూర్ణమగు చిన్మయావస్థను పొందినవాడై స్వయముగా, తానే, 'చిదాదిత్యుడు' అగుచున్నాడు. అతని పట్ల దృశ్యములన్నీ అదృశ్యమగుటచే, అతడు శుద్ధ స్వరూపము, స్వచ్ఛత్వము పొందుచున్నాడు. ఈ 'సంసారము' అనే కుత్సితవ్యాధి నశిస్తోంది. 'అహంకారము' అనే పిశాచం వదలిపోవుటచే తాను శరీరం కలిగి ఉన్నప్పటికీ, “నేను ఈ దేహమునే” అను దురభిప్రాయం తొలగించివేసుకుంటున్నాడు.
మహాత్ముడగు అట్టి జీవన్ముక్తుని హృదయమే పరమాత్మ. అతడు “సత్త” అనురూపము గల ఆనందము యొక్క విస్తారముచే, సర్వోత్తముడై, హరిహరాదులతో సమానమైన అనుభవమును పొందుచున్నాడు.
xiv
గ్రంథ ప్రశంస
శ్రీ వసిష్ఠ ఉవాచ :
మోక్షోపాయాభిధానేయం సంహితా సారసంహితా |
త్రింసద్వేచ సహస్రాణి జ్ఞాతా నిర్వాణదాయినీ ॥ 1
దీపే యధా వినిద్రస్య జ్వలితే సంప్రవర్తతే ॥ ఆలోకో అనిచ్ఛతేపి యేవం నిర్వాణమనయా భవేత్ ॥ 2
స్వయం జ్ఞాతా శ్రుతావాపి భ్రాంతి శాంన్యైక సౌఖ్యదా । ఆపేక్ష్య వర్ణితా సద్యో యధా స్వర్గతరఙ్గణీ || 3
యధా రజ్వా మణి భ్రాంతిః వినస్యతి అవలోకనాత్ | తత్ ఏతత్ ప్రేక్షణాత్ శాంతిమ్ ఏతి సంసారదుఃఖితః || 4
ఇదమ్ ఉత్తమమ్ ఆఖ్యానమ్ ఆధ్యేయమ్ వేదవత్ సదా | వ్యాఖ్యేయమ్ పూజనీయంచ పురుషార్థ ఫలప్రదమ్ || 5
యదా అస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్తత్ వేదాత్ అవాప్యతే | అస్మిన్ జ్ఞాతే క్రియాజ్ఞానం ద్వయం యాతి పవిత్రతామ్ ॥ 6
వేదాంత తర్కసిద్ధాంతస్తు అస్మిన్ జ్ఞాతేచ బుద్ధ్యతే | ఇదముత్తమమాఖ్యానం వ్యాఖ్యాతం శాస్త్రదృష్టిషు ॥ 7
కారుణ్యాద్భవతామేతదహమ్ వచ్మి, న మాయయా | భవంతస్త్వవగచ్ఛంతి మాయామేతద్విచార్యతామ్ || 8
అస్మాత్ శాస్త్రవరాత్ బోధా జాయంతే యే విచారితాత్ | లవణైర్వ్యంజనానీవ కాంతి శాస్త్రాంతరాణితైః ॥ 9
అనార్యమిదమాఖ్యానమ్ ఇతి అత్యనాదృత్యదృశ్యధీః | మా భవంత్యాత్మహన్తారో భవంతో భవభాగినః || 10
మోక్షాభ్యుపాయాన్సు మహానుభావాన్ జ్ఞాస్యన్తి యే తత్త్వవిదాం వరిష్ఠాః | పునః నమేష్యన్తి న సంస్కృతింతే కోర్ధః సుతాః న్యేన బహూదితేన || 11
XV
శ్రీ వసిష్ఠమహర్షి :
ఓ సర్వజనులారా! ‘యోగవాసిష్ఠము' అనబడే ఈ మోక్షశాస్త్రాన్ని 32000 శ్లోకములతో మీ అందరిముందు ఉంచుచున్నాను. ఇది సారవంతమైన అర్థప్రదాత నిర్వాణప్రదాతకూడా!
ఒకానొకడు గాఢనిద్రాపరవశుడై, దీర్ఘకాలంగా ఉండి అప్పుడే నిదురలేచి కనులు తెరచాడనుకోండి. ఆ గదిలో దీపం వెలుగుతూ ఉంటే, ఆ దీప ప్రకాశంలో - అతడు ప్రత్యేకమైన 'ఇచ్ఛ' కలిగి ఉండకపోయినా అక్కడ ఉన్న వస్తువులను చూస్తాడు కదా! ఈ గ్రంథములోని ‘విచారణ’ను తెలుసుకొనుటకు ప్రయత్నించినంతమాత్రంచేత ఇచ్ఛ కలిగి ఉండకపోయినప్పటికీ నిర్వాణమగు మోక్షమును పొందగలడు.
దీనిని మీరు స్వయంగా పరిశీలిస్తే, చక్కగా గ్రహించగలరు. లేదా, ఇతరులు వ్యాఖ్యానిస్తున్నప్పుడు వినటం జరిగినా కూడా మంచిదే. గంగా జలం సర్వపాపములను హరించివేస్తుంది కదా! అట్లే ఇందు చర్చించబడిన విషయమును విచారిస్తే, అనేక జన్మలుగా వెన్నంటి వస్తున్న అజ్ఞానం తప్పకుండా తొలగిపోతుంది. ఒకడు చీకట్లో త్రాడును చూచి, "అమ్మబాబోయ్! ఇదిపాము!” అని భ్రమిస్తూ సర్వవికారములు పొందుచున్నాడనుకొందాం. ఆ భ్రమ తొలగిపోయేదెట్లా? "అటె! ఇది పాముకాదే! త్రాడు మాత్రమే కదా!” అని గ్రహించుటచేతనే కదా! ఈ గ్రంథమును అవలోకించినంతమాత్రంచేత ఈ దృశ్యముపట్ల, శరీరాదులపట్ల కలుగుచున్నట్టి అనేక భ్రమలు సమూలంగా తొలగిపోతాయి. సంసారదుఃఖమంతా శమించిపోతుంది. మీరంతా పరమపురుషార్థమయినట్టి “మోక్షము” అంటే ఏమిటో గ్రహిస్తారు.
ఈ ఉత్తమగ్రంథము వేదమువలె నిత్యము పఠించబడుగాక! పూజింపబడుగాక! వ్యాఖ్యానించ బడుగాక! వేదములందు, వేదమహావాక్యములందు ప్రసరించియున్నట్టి జ్ఞానమే ఇందు ప్రసరించి ఉన్నది. ఇందలి విచారణసారానికి వేదములే ప్రమాణం. ఇందలి విషయము తెలుసుకొనుటచే జీవుని 'కర్మ జ్ఞానములు' రెండూ కూడా పవిత్రవంతములౌతాయి. అనేక మంది తత్త్వజ్ఞానుల వేదాంత తర్క సిద్ధాంతములన్నీ కార్య కారణసహితంగా ఇందు పరిశీలించబడ్డాయి. శాస్త్రదృష్టిగల మహనీయులు దీనిని ఉత్తమ వేదాంత శాస్త్రముగా నిశ్చయించారు.
ఓ ప్రియజనులారా! మీపై మాకుగల అవ్యాజమైన ప్రేమచేతనే ఇదంతా చెప్పుచున్నాము. అంతేకాని, మాయకు లోబడియో, ఒకరి అభిప్రాయమును ఖండించుటకో మేము చెప్పుచుండుటలేదు. ఈ శాస్త్రము విచారించుటచే పరమోత్కృష్టమైన జ్ఞానము లభించగలదు. తద్వారా ఈ జగత్తు మాయ అని తెలిసిపోతుంది. ఇది విచారించుటచే ఇతర అధ్యాత్మశాస్త్ర గ్రంథాలు మరింత మధురంగా, సుస్పష్టంగా గ్రహించబడతాయి.
నాయనలారా! ఈ అఖండరామాయణము కావ్యమువలె లేదని (కథాగమనం తక్కువగా, చర్చ ఎక్కువగా ఉన్నదని) దీనిని నిరాకరించకండి. స్వస్వరూపమగు ఆత్మవిషయమై ఏర్పడిన దట్టమైన
xvi
అజ్ఞానం తొలగాలంటే ఓర్పు, నేర్పులతో కూడిన విస్తారమైన ప్రయత్నం అవసరమేనని మా అభిప్రాయం. అనేక రీతులైన ప్రవచనములు అవసరమే సుమా!
ఏదిఏమైనా నిష్కారణంగా ఆత్మ విషయం మరచి సంసారాసక్తులై ఉండటం శుభప్రదం కాదు. ధ్యానాదుల దృష్ట్యా, స్వల్పప్రయత్నమే చేసియున్నవారుకూడా మోక్షోపాయమైనట్టి ఈ గ్రంథం పఠిస్తూ ఉంటే క్రమంగా అమోఘమైన ప్రయోజనం పొందుచున్నారు. తత్త్వవిదులగు సద్గురువులు చెప్పుచుండగా శ్రవణం చేశారా ఇంకా ఎంతో మంచిది. అట్టివారు తత్త్వజ్ఞులలో ఉత్తమోత్తములై పునః సంసారమున పడబోరు.
xvii
విషయ సూచిక
I. వైరాగ్య ప్రకరణం 1
మొదటి రోజు 1. ఉపోద్ఘాత కథ...3; 2. ఉపదేశ ప్రారంభం...5; 3. శ్రీరామావతారం...7; 4.వస్తుతత్త్వం...8; 5.కథా ప్రవేశం... 10; 6.విశ్వామిత్రుని రాక...11; 7. రామ సభా ప్రవేశం ...14; 8.రాఘవ వైరాగ్య వర్ణనము... 17; 9.ధన వ్యవహారం...20; 10.జీవితం-ఆయుష్షు ...21; 11.అహంకార స్వరూపం...23; 12. మనస్సు-చిత్తము...24; 13.ఆశ - తృష్ణ... 26; 14.దేహము...28; 15.బాల్య స్వరూపం... 33; 16. యౌవన దశ... 35; 17. స్త్రీ వ్యవహారం ...37; 18. ముసలితనం... 39; 19. మృత్యువు...40; 20. కాల విలాసము... 42; 21. క్రియా స్వరూపం-కృతాంత విలాసము...45; 22. దైవ విలాసం... 46; 23. మనోవృత్తులు - అశాంతి 49; 24. స్థిరాస్థిరములు - స్థితిగతులు... 54; 25. పదార్థ దోషములు... 58; 26.ప్రయోజన కథనం ...60; 27.రాఘవ ప్రశ్న...62
II. ముముక్షు వ్యవహార ప్రకరణం 67
1.శ్రీ శుక విశ్రాంతి...70; 2. సదేహముక్తి-విదేహముక్తి... 76; 3. పురుష ప్రయత్నము...83; 4. వర్తమాన పురుష ప్రయత్నములు (ఆద్యతన పురుషకారం)... 86; రెండవ రోజు 5.ప్రయత్నము - కార్యసిద్ధి... 91; 6. దైవ ప్రేరణ-పురుషార్థము... 94; 7.నిజప్రయత్న ప్రాధాన్యం...97; 8. అప్రయత్నశీలుడు - దుర్గతులు...100; 9. కార్య కుశలత... 103; 10.కర్మవిచారము...105; 11. జ్ఞానావతరణము...113; 12. సంసార చక్రం-వైరాగ్యం 117; 13.ప్రశ్న-సమాధానం...121; 14. మోక్షోపాయం... 124; 15.జగత్ భ్రమణ క్రీడ... 125; 16.వివేకులు-అవివేకులు... 128; 17. మనోజయం... 132; 18.శమము (తృష్ణా రాహిత్యము-శాంతము)... 134; 19. విచారణ ... 137; 20.సంతోషము... 141; 21.సాధు సాంగత్యం...143; 22. మార్గాన్వేషణం... 145; 23. దృష్టాంతములు... 147; 24.కుతర్కములు...150; 25.ప్రమాణ నిరూపణ... 152; 26. ఏకాగ్ర దృష్టి...153; 27. అపరోక్షానుభవం... 155; 28. చైతన్యము జగత్తు...156; 29.సదాచార
నిరూపణ... 160
III. ఉత్పత్తి ప్రకరణం
●●● 163
I.ప్రకరణ పరిచయము ... 163
1.మహావాక్య ప్రభావము... 165; 2. బంధ హేతువు... 167; 3. బంధ - మోక్షములు... 169;
XVill
II.ఆకాశజుడు - - మృత్యువు 174
1.కథావిభాగం...174; 2.స్వయంభువు... 180; 3.స్మృతి-మనస్సు-బంధము... 181; మూడవ రోజు 4.మనస్సు-దృశ్యము... 187; 5. దృశ్యము - అదృశ్యము... 189; 6.బ్రహ్మము-స్వభావము ... 191; 7.బ్రహ్మ సాక్షాత్కారం... 193; 8. మిథ్యాభ్రాంతులు... 196; 9. పరమాత్మ స్వరూపమెట్టిది? ...198; 10. భౌతికదృష్టి... 200; 11. జీవన్ - విదేహముక్త లక్షణములు... 202; 12.దృశ్యము తొలగేదెట్లా?...205; 13. నిత్యలభ్యమగు పరబ్రహ్మము ...206; 14.ఈ జగత్తు బ్రహ్మమే... 209; 15. సాక్షి చైతన్యము... 213; 16.జగత్తు అనగా ఏమిటి?...215; 17.దృశ్యభ్రమ తొలిగేదెట్లా?... 218; 18. జగత్ భావోత్పత్తి...220; 19.జగత్తు లేదు...224; 20. స్థూలదేహ ఆవిర్భావము... 226; 21. ఈ జీవుడు పరిమితుడా? అపరిమితుడా?...231; 22.అహంకార స్వరూపము...239
III. లీలోపాఖ్యానం - కథావిషయం(మండపోపఖ్యానము) 245
నాల్గవ రోజు 1. జగద్భమ... 245; 2. శ్రీ సరస్వతీమాత వరం... 247; 3. పద్ముని దేహ పతనం... 249; 4.అదే ఇంట్లో ద్వితీయ సృష్టి దర్శనం... 249; 5. ఇక్కడ ఏది సత్యం? ఏది అసత్యం?...254; 6.ఇతఃపూర్వపు సృష్టి - బ్రాహ్మణ దంపతులు...257; 7. జ్ఞాపకాలు... 259; 8. కాల కల్పన...262; 9. మిథ్యామోహ స్వీకారం... 262; 10. “మరణము పొందటం” అనగా?... 264; 11. ఇదంతా స్వకీయ కల్పనయే!... 265; 12.స్మృతికి ముందే ఉన్నదేది? ...267; 13.అన్య జగత్తులను ఎందుచేత చూడలేకపోతున్నాం?...269; 14.అభ్యాస ప్రభావం...272; ఐదవ రోజు 15. ఇతఃపూర్వానుభవ సృష్టి... 277; 16. విస్తార దృష్టి...279; 17.జన్మ - జన్మాంతరదృష్టి... 281; 18. బ్రహ్మాండ భ్రాంతి ...285; 19. పూర్వస్మృతులు ...286; 20.అన్య జగత్ పునః ప్రవేశం...289; 21.బ్రహ్మాండముల చమత్కారం...291; 22.విదూరథుని యుద్ధ విన్యాసం...293; 23. స్థూలదేహ భ్రాంతి - చిత్త నైపుణ్యం...295; 24.ప్రళయానంతర సృష్టి-భ్రమయొక్క ‘ప్రవేశం'...298; 25. విదూరథుని సుదీర్ఘ జీవితం ...302; 26.జగత్తు యొక్క నిజరూపం... 304; ఆరవ రోజు 27. స్వప్నజాగ్రత్తులు...308; 28.యుద్ధరంగ ప్రవేశం... 311; 29. చిత్తము ఎట్లా ఉంటే, దృశ్యము అట్లే!...312; 30. భావాతీతం ...318; 31. ఆరాధన - లక్ష్యార్థం... 320; 32. యుద్ధ విశేషాలు... 322; 33.“ద్రష్టత్వము” నకు ముందే ఉన్న ‘ద్రష్ట'...325; 34. దృశ్యం తొలగేదెట్లా?...326; 35.ఈ కనబడేవారంతా ఎవరు?... 327; 36. మరణానంతరం... 328; 37.ద్వితీయలీల ...330; 38. సూక్ష్మదేహ భావనా ప్రభావం 332; 39. కష్ట సుఖములు... 335; 40.ఈ అనుభవమంతా ఏమిటి?... 337; 41. మరణాను భవం, అందుకు విచికిత్స... 339; 42.ద్వంద్వ వ్యవహారం... 344; 43. పునర్జన్మ... 346; 44.ప్రేతస్థితి ...349; 45. సృష్ట్యాది - జీవభ్రాంతి...353; 46. వాసనలు - పరలోక ప్రయాణం... 356; 47. పిండ ప్రదానం...358; 48. వాసనయొక్క ఆరంభం... 360; 49. ఆధిభౌతిక భ్రాంతి ...362; 50. ఆధి భౌతికం - ఆతివాహికం... 364; 51. స్వప్నంలోని వస్తుజాలం ఏమౌతున్నాయి? ... 367; 52. భౌతిక దేహము - యోగిదృష్టి... 369; 53. పద్ముని పునరుజ్జీవనం... 370
xix
IV. లీలోపాఖ్యానం - సమీక్ష 374
1.కాలము-భావన-పురుషకారము-దైవము-అఖండ బ్రహ్మము...374; 2.జగత్స్వభావం ...384; 3.“దైవము” – అర్థము... 390; 4.బ్రహ్మమే-ఇదంతా!... 394; 5.బ్రహ్మము -ద్వితీయ 'సత్త'...396; 6. మనస్సు-జీవుడు-బ్రహ్మము...400; 7.దృశ్యాభిలాష... 402; 8. పరమాత్మను ఎరుగుటయే ఉపాయం...404
V. కర్కటి ప్రశ్నలు 406
1.ఈ జీవుడెవ్వడు? ఎందుకు ఉద్భవిస్తున్నాడు?... 406; 2. జగత్తుకు కారణం బ్రహ్మమా?...411; 3.కర్కటి తపస్సు... 418; 4. కర్కటి సూక్ష్మజీవత్వం...420; 5. పశ్చాత్తాపం ...423; ఏడవ రోజు 6.పునః తపస్సు... 425; 7. స్థూలదేహప్రాప్తి... 428; 8. వాయుదేవుని ఉద్బోధ...429; 9.అరణ్య ప్రవేశం - కిరాతరాజుతో సమావేశం... 430; 10. ప్రశ్నలు...434; 11.మంత్రి సమాధానం - “ఆత్మ యొక్క స్వరూప - స్వభావాలు”...439; 12.విక్రమరాజు సమాధానం - "ఆత్మ ఉన్నచోటు”... 447; 13. పరస్పరం... 463; 14. కందరాదేవి...468; 15.సమీక్ష...469
VI. ఐందవ – - బ్రహ్మాండములు 471
1.బ్రహ్మము 'వలన' జగత్తు?... 471; 2. వేరు వేరు బ్రహ్మాండములు...476; 3.ఇంద్ర - అహల్యల ప్రహసనం...485; 4. నేను మనోమాత్రుడను!...487; 5. యథావిధి ...491; 6.‘జీవుడు’ అనగా?... 492; 7. అహంభావము...497; 8. శాప మంత్రములు...501; 9.సావధానులై ఉండండి!... 504; శ్రీవసిష్ఠ - రామచంద్రుల పరిశీలన 10.చిత్ర-విచిత్ర భ్రమలు-సమ్యక్ దర్శనము...506; 11. ఇచ్ఛారూపములు...508; 12. జీవుల విభాగము ...510; 13.జీవుల ఉత్పత్తి స్థానము... 513; 14. "కర్మలు - ప్రభావములు" ఉన్నాయా? లేవా?...515; 15. మనస్సు యొక్క స్వరూపము...518; 16.మనస్సు జడమా? చేతనమా?...522
VII. చిత్తచాంచల్యము 529
1.ఈ కనబడేదంతా ఉన్నది మనస్సులోనేనా?...529; 2. అడవిలో చిక్కుకున్న బాట సారులు...531; 3. కథా సంఘటనలు - ఉద్దేశము...535
VIII. బాల వినోదము 539
1. ఆత్మకు వేరైనదంతా అజ్ఞానమే!... 539; 2. బంధం ఎవరికి?... 541; 3. కథా వినోదం ...544; 4. నీకెక్కడి బంధం? నిదురలే!...548
IX. మహేంద్రజాలం 554
పరిచయము 1. చిత్త విన్యాసము - జగద్రూపము... 554; 2. సభామధ్యంలో మహేంద్ర జాలం...556; 3. వాహ్యాళి -ఆకలి-వివాహం... 559; 4. క్రౌర్యం... 563; 5. భయంకర దుర్భిక్షం...566; 6. అంతా మనోవిలాసమే... 568; 7. చిత్తము – దాని చమత్కారము...569;
8. చిత్తము-చికిత్స-ఔషధం 576; 9. 'చిత్' ను భావన చేయటం...580; 10. మనస్సు
XX
యొక్క స్వభావం-ఉపశమనము... 584; 11.అవిద్య... 587; 12. మనస్సు-పరమేశ్వరుడు ...595; 13. అవిద్యను త్యజించేదెట్లా?... 599; 14. దుఃఖించడమెందుకు?...602; 15.కర్త -భోక్త...604; 16.సాధన ప్రయోజనం...609; 17.బ్రహ్మానుభవం పొందేదెట్లా?...611; 18.సప్త “అజ్ఞాన” భూమికలు... 614; 19. సప్త “జ్ఞాన” భూమికలు... 618; 20. బంగారంలో ఉంగరం...622; 21. బ్రహ్మమే ఇదంతా...625; 22. పునః కథాప్రవేశం ప్రదేశము -పరిశీలన...628; 23.ఒకని మనస్సులో విశేషాలు-మరొకరి మనస్సులో ప్రతిబింబించటం ...631; 24. పరమాత్మయొక్క నిర్వచనము...636
X. ప్రకరణ సమీక్ష 640
1.సమీక్ష...640; 2.లఘు సమీక్ష... 649
xxi
మంగళాచరణం
యతః సర్వాణి భూతాణి ప్రతిభాన్తి స్థితానిచ | యత్రైవోవశమం యాన్ని తస్మై సత్యాత్మనే నః ॥ 1
ఏ అద్వితీయ వస్తువు నుండి సృష్టికాలంలో ఆకాశము మొదలైన మహాభూతములు, వాటి నుండి సమస్త పదార్థములు ఉనికిని పొంది భాసిస్తున్నాయో, అట్టి సత్స్వరూపమగు పరమాత్మకు మోకరిల్లి నమస్కరిస్తున్నాను.
జ్ఞాతా జ్ఞానం తధా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూః |
కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః ॥ 2
జ్ఞాత (ఎఱుగువాడు) - - జ్ఞానం (ఎఱుగబడే విధం) - జ్ఞేయం (ఎఱుగబడునది) - ద్రష్ట -
దర్శనం - దృశ్యం - కర్త - హేతువు - క్రియ ఇవన్నీ దేని వల్ల భాసిస్తున్నాయో, అట్టి జ్ఞాన స్వరూపమగు పరమాత్మకు నమస్కరిస్తున్నాను.
స్ఫురన్తి శీకరా యస్మాత్ అనస్థ స్యామ్బరేః వనౌ ॥ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః || 3
ఈ దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైన ప్రాణులంతా ఏ మహానంద సముద్రంలో ఉపాధి భేదం చేత, ఆనంద బిందువులుగా స్పురిస్తున్నారో, ఏది సర్వదా ఆ సమస్త ప్రాణులకు జీవనమే అయివున్నదో, అట్టి బ్రహ్మానంద స్వరూపమగు పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను.
దివి భూమౌ తధాకాశే బహిరంతశ్చమే విభుః |
యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః ॥
స్వస్వరూపుడు, ప్రకాశరూపుడు అయినట్టి ఏ పరమాత్మ స్వర్గంలోను, భూలోకంలోను, ఆకాశంలోను, బయట, లోపల కూడా - - ఏకరూపుడైనప్పటికీ - నానా రూపములుగా ప్రకాశిస్తు న్నాడో, అట్టి సర్వరూపుడగు పరబ్రహ్మమును హృదయపూర్వకంగా మ్రొక్కుచున్నాను.
Page:1
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
1. వైరాగ్య ప్రకరణం
Page:3
మొదటి రోజు
1. ఉపోద్ఘాత కథ
పూర్వం ‘సుతీక్షుడు’ అనే ఒకానొక విద్యాకోవిదునకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది. కర్మ గొప్పదా? జ్ఞానం గొప్పదా?
కర్మలన్నీ త్యజించి 'విచారణ'ను అనుసరిస్తే మంచిదా?....
విచారణను ప్రక్కకుపెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించటం ఉచితమా? ...
అప్పుడు అతడు సందేహనివృత్తి కొరకు సధర్మి, బ్రహ్మజ్ఞాని, తన సద్గురువు అయినట్టి అగస్తిమునిని సమీపించి వినయంగా ప్రణామంచేసి తన మనస్సులోని అనుమానం బైటపెట్టాడు.
అగస్తిముని చిరునవ్వు నవ్వి ఇట్లు పలికారు :
నాయనా! అదిగో! ఆకాశంలో ఎగురుచున్న పక్షిని చూచావా? అది రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతోంది కదా! మానవుడు కూడా కర్మజ్ఞానముల రెండిటి సహకారంతో మాత్రమే మోక్షాకాశంలో విహరించగలడు. కేవలం కర్మవలనగాని, కేవలం జ్ఞానం వలనగాని జీవునికి మోక్షం లభించదు.
ఈ విషయంలో నీ సందేహాలన్నీ తొలగటానికి నీకొక కథన విశేషం చెపుతాను విను : 'అగ్నివేశ్యుడు' అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు 'కారుణ్యుడు’ అనే యువకుడు గురుకులంలో వేద వేదాంగాలు చదివి ఆ తరువాత గురుకులవాసం నుండి ఇల్లు చేరాడు.
ఇంటికి వచ్చిన తరువాత వంశపారంపర్యంగా వచ్చే అగ్నికార్యములు, సంధ్యా వందనము చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. అగ్నివేశ్యుడు అది గమనించాడు. ఒక రోజు, కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, "కుమారా! కర్మానుష్ఠానం త్యజించినట్లున్నావు. కర్మలను త్యజించి సిద్ధి ఎలా పొందాలనుకుంటున్నావు?” అని అనునయంగా ప్రశ్నించాడు. అప్పుడా కారుణ్యుడు, "తండ్రీ! మరి నన్నేంచేయమంటారు చెప్పండి? వేదములలోని కొన్ని భాగములు "కర్మానుష్ఠానం చేయవలసిందే” అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి. ఇక మరికొన్ని విభాగములలో, 'కర్మ, ధనము, సంతానము మొదలైనవి మోక్షం ఇవ్వలేవు. సర్వత్యాగమొక్కటే ఉపాయం’* అని నివృత్తి
* "త్యాగేనతు కైవల్యమ్”
Page:4
మార్గాన్ని చూపుచున్నాయి. కర్మ చెయ్యాలా? మానాలా? ఏమీ తోచక ఇట్లు మౌనం వహించి ఉన్నాను” అని పలికి ఊరకున్నాడు. అప్పుడు అగ్నివేశ్యుడు పకాపకా నవ్వి ఇలా చెప్ప ప్రారంభించాడు.
ఓహో! అదా సంగతీ! సరే. నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను. అంతా విన్న తరువాత నీకు ఎట్లా తోస్తే అట్లాగే చెయ్యి : ....
‘సురుచి' అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వతశిఖరంపై ప్రశాంతముగా కూర్చుని ఉండి, ఆకాశం వైపు చూచింది. ఒక దేవదూత కనిపించాడు. అప్పుడామె “ఓ దేవదూతా! మీ ముఖం ఏవో నూతన కాంతులతో వెలుగుచున్నది. ఏదైనా విశేషమా?” అని ప్రశ్నించింది.
అప్పుడా దేవదూత ఇట్లు చెప్పసాగాడు : ఔను! విశేషమే. ఇప్పుడే ఒక పరమాద్భుతమైన సంభాషణ వినివస్తున్నాను. అది తలచుకొంటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది. అదేమిటో నీకు చెపుతాను
విను.
దేవదూత వాక్యాలు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది ...
దేవదూత : గంధమాదన పర్వతంపై 'అరిష్టనేమి' అనే ఒక చక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండేవాడు. మన ప్రభువు ఇంద్ర భగవానుడు ఆతని తపస్సుకు మెచ్చి అతనిని స్వర్గమునకు తీసుకురావలసినదిగా నన్ను నియమించారు. నేను ఆ రాజు వద్దకుపోయి స్వర్గ లోకమునకు ఆహ్వానించాను. అప్పుడారాజు "అయ్యా! నా ఈ నమస్కారం స్వీకరించండి. నాదొక చిన్న సందేహం. దేవలోకంలో నాకు అవధులు లేని ఆనందం లభిస్తుందా? లేక అక్కడకూడా మా భూలోకంలో లాగానే గుణదోషాలు ఉంటాయా?” అని అడిగెను.
అతని ఉత్తమ జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి నేను “ఓ రాజా! జీవులు తమ పుణ్యకర్మానుభవం కొరకు స్వర్గం చేరుతూ ఉంటారు. అయితే, జీవులు చేసే పుణ్య కార్యములలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ బేధములు ఉంటాయి కదా! స్వర్గలోకవాసులలో మీ లోకంలో లాగానే అధికులైనవారు, అల్పులైనవారు ఉంటారు. ఫలితంగా దేవతా జీవులు కూడా ద్వేషాలు, అసూయలు, దురహంకారములు, స్పర్ధలు, గర్వములు, గర్వభంగములు, కలహములు పొందుతూ ఉంటారు. అంతేకాదు. పుణ్యమంతా వ్యయమైన తరువాత ఆ జీవులు భూలోకం రావలసిందే కదా! అప్పుడు అమితదుఃఖం పొందుతూ ఉంటారు. ఓ ఉత్తమ పుణ్యశీలుడా! ఇక మనం బయలుదేరుదామా?” అన్నాను.
అప్పుడారాజు, “క్లుప్తంగా ఉన్న విషయమంతా సుస్పష్టపరచినందుకు కృతజ్ఞుణ్ణి. ఓ దేవదూతా! ఒక విధంగా ఈ భూలోకము వంటిదే అయున్న, ద్వైతముతో కూడిన ఆ స్వర్గలోకం నేను కోరుకోవటం లేదు. నాకు నిర్వాణరూపమగు మోక్షమే కావాలి. అందుకొరకై ఇంకా ఇంకా తపస్సు చేస్తాను. ప్రకృతి సిద్ధమగు ఈ దేహం నేలకూలినా ఫరవాలేదు. నేను అందుకు సిద్ధమే” అని చెప్పి
మౌనం వహించాడు.
Page:5
ఇక చేసేది లేక నేను వెనుకకు మరలాను ఇంద్రదేవుని సమీపించి విషయమంతా విన్నవించాను. ఆయన ఆనందాశ్చర్యాలు పొంది ఇలా ఆజ్ఞాపించారు.
"ఓ దేవదూతా! అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు ఆనందం కలుగచేస్తోంది. అయితే అతడు కోరుకొనే 'మోక్షస్థితి' ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది. అతడు తన తపస్సుచే ఉత్తమ విరాగి అయినాడు. స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు. అందుచేత ఉత్తమోత్తమైన ఆత్మ విచారణ వినటానికి అతడు తగి ఉన్నాడు. అందుచేత నీవు అతనిని వాల్మీకి ఆశ్రమం చేర్చు. మహత్తరమగు దేవదూత దర్శనం అతనిపట్ల వృథా కాకూడదు కదా!” ఆయన సూచించినట్లే నేను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చాను.
మోక్ష సాధనలో 1) తపో, ధ్యాన, నిష్కామ కర్మలవంటి ప్రయత్నములు, 2) సత్యాసత్యముల విచారణ - రెండూ ఆవశ్యకాలే!
భౌతిక సుఖరూపములగు స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుని చేరకుండానే చేస్తాయి. ఆత్మజ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు.
ముముక్షువైనవాడు ఆత్మానుభవం గల మహనీయులను సమీపించాలి. వారి వాక్యములను వినటం, మననం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది.)
2. ఉపదేశ ప్రారంభం
అరిష్టనేమి రాజు వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడి ప్రదేశమంతా పవిత్రతో, ప్రశాంతతతో ఆనందమయమై ఉన్నది. మునికుమారులు మధురంగా సామగానం చేస్తున్నారు. మరికొందరు రామావతారకథ ఆనందంగా చెప్పుకొంటున్నారు. చల్లగా వీచే పిల్లగాలులు జీవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తు చేయుచున్నట్లున్నాయి. విశాల వృక్షములు మధుర శబ్దములు వినిపింపచేస్తున్నాయి.
ఒక ఎత్తైన స్థానంలో మహర్షివాల్మీకి ఆసీనులై ఉన్నారు. బ్రహ్మానందం ఆయన ముఖంలో మూర్తీభవించి ఉన్నది. రాజు ఆయనను సమీపించి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. మహర్షి రాజును ప్రేమగా పలుకరించి సుఖాసీనుణ్ణి చేశారు. రాజు అవనత శిరస్కుడై ఇట్లు ప్రార్థించాడు.
"హే వాల్మీకి మహర్షీ! నేను సంసారబద్ధుడనై అనేక దుఃఖ పరంపరలను అనుభవిస్తున్నాను. నేటికి ఈ దేవదూత దయవలన మీ దర్శనం లభించింది. ఎంతటి సుదినం! తండ్రీ! మీరు
Page:6
రామాయణం రచించి లోకమునకు మహోపకారం చేశారు. అయితే నాదొక సందేహం. ఎట్టి విచారణచే రాముడు మొదలైనవారు దుర్భరమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటవేశారు? నాకా విషయం చెప్ప ప్రార్థిస్తున్నాను. మీ ప్రవచనముచే నన్ను పవిత్రుణ్ణి చెయ్యండి.”
వాల్మీకి మహర్షి ఇది విని ఒక్క క్షణం మౌనం వహించారు. తనను ఆశ్రయించ వచ్చిన శిష్యుని పూర్వాపరాలు సంపూర్ణంగా గ్రహించారు. "ఇతడు వివేక దృష్టితో నిత్యానిత్యములను పరిశీలించా లనుకొంటున్నాడు. కనుక ఉత్తర రామాయణం (యోగవాసిష్ఠం) వినటానికి తగినవాడు. లోక కళ్యాణం కొరకు, జ్ఞానార్హులైన జనులపై నాకుగల అవ్యాజమైన ప్రేమచే వసిష్ఠ రామ సంవాద రూపమైన 'వాసిష్ఠ రామాయణం' ఇతనికి బోధించెదను గాక!” అని సంకల్పించారు. ఒక్కసారి ఆత్మ వస్తువును ధ్యానం చేశారు. పిమ్మట ఇట్లు ప్రవచించ ప్రారంభించారు :
శ్రీ వాల్మీకి మహర్షి :
దివి భూమౌ తథా2_2_కాశే బహిరంతశ్చ మే విభుః | యో విభాత్యవభాసాత్మా, తస్మై సర్వాత్మనే నమః ॥ (II - 1)
స్వస్వరూపభూతుడు, ప్రకాశరూపుడు అయిన ఏ పరమాత్మ స్వర్గంలోను, భూలోకంలోను, ఆకాశంలోను, బయట, లోపల కూడా నానావిధ రూపము లందు ఏకస్టుడై ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వస్వరూపుడగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను.
శృణు రాజన్ ప్రవక్ష్యామి రామాయణమఖండితమ్ | శ్రుత్వా వధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి | (1-52)
ఓ రాజా! జీవునియొక్క అఖండత్వాన్ని ప్రతిపాదిస్తున్న 'మహారామాయణము' చెప్పుచున్నాను. ఇది శ్రద్ధగా, ప్రయత్నపూర్వకంగా విని అవగతం చేసుకొన్నావా - నీవు ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తత్వము పొందగలవు.
ఈ ‘ఆత్మవిచారణ’ వినటానికి కేవలం అజ్ఞాని (“నే నీదేహమును అను దేహాత్మ బుద్ధి కలవాడు”) తగినవాడు కాలేకపోతున్నాడు. కేవలం జ్ఞానికి ఇక చెప్పవలసిన దేముంటుంది? ఎవరైతే, “నేను బద్ధుణ్ణి, ఈ దృశ్యములోని అవాస్తవత్వం నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది. ఎట్లైనా సరే, ఆత్మజ్ఞానం పొంది ముక్తుడను కావాలి” అనే తీవ్రేచ్ఛ కలిగి ఉంటారో - అట్టి వారందరూ ఈ ‘బోధ’ వినటానికి తగినవారే !
మొదట పూర్వ రామాయణం (ఏడు కాండలతో కూడిన శ్రీరాముని కథ) తెలుసుకొని ఉండటం జరిగితే అప్పుడు ఆ పాఠకుడు ప్రవృత్తి మార్గంలో చిత్తశుద్ధిని పొందుచున్నాడు. ఇలా శుద్ధినొందిన చిత్తము స్వయంగా అకృతిమంగా సులభంగా జ్ఞానం పొందటానికి అభిముఖమౌతోంది. అప్పుడు ఈ వసిష్ఠ - - రామసంవాద రూపమైన ఆరు ప్రకరణములతో కూడిన 'అఖండ రామాయణం' విచారిస్తే ద్విగుణీకృతమైన ప్రయోజనం సిద్ధించగలదు. ఇది నివృత్తి మార్గంలో తప్పక మోక్షం ప్రసాదించగలదు.
Page:7
పూర్వం దివ్యదృష్టితో శ్రీరాముని కథ దర్శించి 24,000 శ్లోకములతో రామాయణం వ్రాశాను. 'భరద్వాజుడు' అను వాడు నా శిష్యుడు. మహామేధావి, బుద్ధిమంతుడు, ఏకసంథాగ్రాహి, వినయము
కలవాడుకూడా. అతనికి రామకథ వినిపించాను.
ఒకసారి అతడు ఆ కథంతా మేరుపర్వతంపై భగవంతుడగు బ్రహ్మదేవునికి వినిపించాడు. ఆయన పరమానందం పొంది "కుమారా! చాలా బాగున్నదయ్యా! రామచంద్రుని కథ లోకమునకు కళ్యాణం కలుగజేస్తుంది. నాకు ఈ కథ వినిపించినందుకు ఏదైనా వరం కోరుకో” అని ఆశీర్వాద పూర్వకంగా పలికారు. అప్పుడు భరద్వాజుడు "తండ్రీ! ఈ జనుల దుఃఖములకు అంతూపొంతూ ఉండుటలేదు. దేనివలన జనులు దుఃఖవిముక్తులౌతారో, దాని గురించి చెప్పండి” అని వేడుకున్నాడు. అప్పుడాయన భరద్వాజుని, నా వద్దకు తోడ్కొనివచ్చి ఇట్లు ఆజ్ఞాపించారు :
“నాయనా! వాల్మీకీ! ఇప్పుడు నీవు వ్రాయపూనుకొన్న అఖండ రామాయణం శ్రమ అనుకోకుండా పూర్తిచేయి. సప్తకాండలు మధురంగా వ్రాశావు. అయితే, రాముడు ఏ విచారణచే వసిష్ఠ మహర్షిచే బోధింపబడి పూర్ణుడు, ఆత్మస్వరూపుడు అయ్యాడో - ఆ విషయాన్ని నీ ప్రియశిష్యుడగు భరద్వాజునికి బోధించు. అట్టి విచారణ సహాయంతో జీవులు ఈ సంసారమును అతి లాఘవంగా దాటివేయుదురుగాక!” ఇలా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారు.
అప్పుడు ప్రవచించబడినదే నీకు చెప్పబోవుచున్నాను. నీ మీద వాత్సల్యంతో భగవత్ప్రేరితుడనై పలుకుచున్నాను. ఉత్కృష్టమైన ఈ 'ఆత్మజ్ఞానం' పొందినవాడు శోకము, దైన్యము, అభిమానము త్యజించి వేస్తాడు. నిత్యతృప్తుడై వెలయగలడు.
3. శ్రీరామావతారం
ఓ అరిష్టనేమీ! నీ ఇష్ట దైవము ఆ నారాయణుడే భక్తుల శపాలను పరిపూర్ణమొనర్చే నిమిత్తం ఒక రాజు వేషం ధరించి ఈ భూమిపై సంచరించినాడు. తన అఖండత్వము, అద్వితీయ చిదానంద స్వరూపమును ఏమరచినవానివలె అవతరించి లోకములను పావనం చేశాడు. చైతన్య విగ్రహుడగు శ్రీమన్నారాయణునికి లీలా మాత్రంగా వేరువేరు సందర్భములలో ప్రాప్తించిన శాపముల గురించి మొదటగా చెపుతాను.
ఒకప్పుడు జగత్ప్రభువగు నారాయణుడు బ్రహ్మలోకం వచ్చాడు. బ్రహ్మదేవునితో సహా సర్వ బ్రహ్మలోకవాసులు ఆయనను పూజించారు. బ్రహ్మమానసపుత్రుడగు సనత్కుమారుడు మాత్రం "నేను నిష్కాముడను కదా! ఈ చరాచర సృష్టిలో నాకు కావలసినదేమున్నది? ఆశ్రయించవలసినది ఏమున్నది?" అని తలచి మాధవుని పూజించనేలేదు. ఇది గమనించిన గోవిందుడు "ఓయీ! మిత్రమా! సనత్కుమారా! నీవు నిష్కాముడవే కావచ్చు. కాని యుక్తాయుక్తములు మరువరాదు కదా! అందుచేత కుమారస్వామివై జన్మించి కామార్తుడవగుదువుగాక” అని శపించాడు. అందుకు
Page:8
ప్రతిగా సనత్కుమారుడు “నారాయణా! అట్లా అయితే నీవు నీ సర్వజ్ఞత్వమును కోల్పోయి కొంతకాలం అజ్ఞానివై భూమిపై సంచరించెదవుగాక" అని శపించాడు. మరి ఆ వాక్యం నారాయణుడు సఫలం చేయాలి కదా!
ఇది ఇతఃపూర్వం ఒకానొక కల్పంలోని విషయం. ఆ కల్పంలో "ఖ్యాతి” అను ఆమె భృగువు యొక్క భార్య. ఆ ఖ్యాతి విష్ణుభక్తురాలు. “సర్వాంతర్యామియగు విష్ణువునందు లీనమగుదునుగాక" అని కోరుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధించింది. భక్త వత్సలుడగు విష్ణుమూర్తి తన భక్తురాలి కోరికను అట్లే సఫలం చేశారు. అప్పుడు భృగువు క్రోధపరవశుడై “ఓయీ విష్ణుమూర్తీ! భార్యావియోగం ఎంతటి బాధాకరమో నీకు తెలియాలి. నీకు కూడా నాలాగానే భార్యావియోగం కలుగుగాక” అని
శపించాడు.
గోలోకంలో ఒకప్పుడు రాధ, సుధాముడిని చూచి ఏదో సందర్భంలో, “నీవు దానవకులంలో జన్మించెదవుగాక”! అని శపించింది.
అతడు జలంధరుడై జన్మించాడు. అతని భార్య బృంద. లోకకంటకుడగు జలంధరుణ్ణి బృంద పాతివ్రత్యం కాపాడుతూ ఉండేది. దేవతలచే ప్రార్థింపబడి, నారాయణుడు లోకకళ్యాణం కొరకు కపటరూపం దాల్చి బృంద పాతివ్రత్యం భంగపరచారు. జలంధరుడు సంహరించబడ్డాడు. అప్పుడు విష్ణువు మోసం చేసినాడని తెలిసి “నీకు కూడా భార్యా వియోగం కలుగుగాక” అని
శపించింది.
మరొకప్పుడు విష్ణుమూర్తి భీకరాకారమగు నృసింహుడై నదీతీరంలో సంచరిస్తున్నాడు. అప్పుడు ‘దేవదత్తుడు’ అనువాని భార్య నృసింహస్వామిని చూచి భయంతో ప్రాణాలు వదలింది. అప్పుడా దేవదత్తుడు “నీవు కూడా భార్యావియోగం పొందెదవుగాక" అని శపించటం జరిగింది.
ఓ రాజా! పై కారణాల వలన విష్ణుమూర్తి రాముడై జన్మించాడు. నీ ప్రియముకొరకే వేరు వేరు పురాణములలోని సంఘటనలు వినిపించాను. ఇక మనం ఆత్మవిచారణలో ప్రవేశిస్తున్నాం. సావధాన చిత్తుడవై విను.
4. వస్తుతత్త్వం
ఆకాశము యొక్క వాస్తవ స్వరూపం శూన్యమేకదా! ఈ నిజం తెలుసుకొన్న తరువాత, "ఆకాశంలో నీలవర్ణముగల పదార్థమేదో ఉన్నది" అనే భ్రమ ఎవరికి ఉంటుంది? ఈ కనబడే జగత్తుకూడా కల్పితమాత్రమని, స్వకీయమైన 'భ్రమ' అని ఎరిగిన తరువాత ఇందు ప్రాప్తిస్తున్న సర్వ వికారాలు తొలగుతాయి. అయితే, బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకొన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క నిజస్వరూపం మనం తెలుసుకోగలం.
వైరాగ్య ప్రకరణం అ
అనేక సంభ్రమములు, దుఃఖ పరంపరలు, వికారములు అనుక్షణం జీవునికి కలుగజేస్తున్న ఈ “జగద్దృశ్యము” ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది? ఈ వ్యవహారములు, అనుభవములు, శరీరములు జీవునకు రచించుచూ అందచేస్తున్న వారెవరు? సునిశిత బుద్ధితో పరిశీలిస్తే ఈ దృశ్యమును ఒకడు ఆయా విధములుగా మననము చేయుట చేతనే ప్రియముగా అప్రియముగా, సుఖ-దుఃఖ భరితంగా, సామాన్యముగా, అసామాన్యముగా.... ఇట్లు అనేక విధములైన భావనలతో అనుభవమగుచున్నది”.... అని తెలియవచ్చుచున్నది. మననమే మనస్సుయొక్క జీవునియొక్క జగత్తు యొక్క మూలకారణమై ఉన్నది. అనగా ఈ 'జగత్తు' అనబడునది మనస్సునందే ఉదయించుచున్నది. ఎప్పుడైతే 'జగత్తు' అనబడే అనుభవం మనస్సునందు ఉదయించకుండా విస్మరించబడుతుందో, అట్టి విస్మరణముచే ఏర్పడగల శుద్ధ స్వస్వరూపానుభవమే సర్వోత్కృష్టమగు ముక్తి అని జ్ఞానులు మనకు చెప్పుచున్నారు.
అయితే అట్టి విస్మరణ స్థితి అనుభవమయ్యేదెట్లా? "అనేక అనుభవములతో కూడిన ఈ దృశ్యము ఉన్నదా? ఉంటే బాలునికి ఒక రకంగా, వృద్ధునికి మరొక రకంగా ఎందుకు తోచుచున్నది? కాబట్టి ఈ కనబడు దృశ్యముగాని, దీని సాక్షిత్వము గాని ఏ కాలంలోను ఉండి ఉండనేలేదు” అను అభేదరూపమైన బోధ లేక జ్ఞానము జీవునియందు దృఢం కావాలి. అప్పుడు మాత్రమే దృశ్యము యొక్క విస్మరణ, స్వస్వరూపము యొక్క అనిర్వచనీయానుభవం ఒకేసారి జీవునికి కలుగుతాయి.
భ్రాంతి వలన కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క స్వభావమైయున్న భావము కంటే వేరైన అస్థిత్వమేదీ లేదు. అయితే అట్టి జగద్భావరాహిత్యముచే కలుగగల ఆత్మసాక్షాత్కారం శాస్త్ర విచారణా ప్రభావంచే అనాయాసంగా తప్పక లభిస్తుంది.
అట్టి ఆధ్యాత్మ విషయమును ప్రతిపాదిస్తున్న ఉత్తమ శాస్త్రములు ఉన్నాయి. వాటిని మానవుడు చక్కగా పరిశీలించాలి. లేదా, ఆత్మానుభూతి పొందిన మహనీయుల ముఖతఃవింటే ఇంకా మంచిది. "దృశ్యముగాని, ద్రష్టత్వముగాని మిధ్యయే” అనునట్టి తత్త్వజ్ఞానము యొక్క ప్రభావంచేత మనస్సు నుండి ఈ దృశ్యము తొలగిపోగా అప్పుడు శేషించు భేదరహిత స్థితియే సర్వుల యొక్క స్వస్వరూపమైనట్టి “ఆత్మస్థితి”.
కాబట్టి ఈ దృశ్యము యొక్క విచారణము కొరకు ఆత్మజ్ఞానముకై ప్రయత్నంచాలి. అట్లా కాకుండా, ఆత్మజ్ఞానం విడిచి కేవలం శాస్త్ర వాసనలతో లోక వాసనలతో కూడుకొని అనాత్మపూర్వకంగా ఎంత ప్రయాసపడితే మాత్రం ఏం లాభం చెప్పు?
మొట్టమొదట ఉత్తమ నిష్కామ కర్మలచేత, ఉపాసనలచేత, శ్రవణమననాదులచేత, స్వవిచారణచేత జీవుడు వాసనాక్షయం సాధించాలి. ఈ విధంగా చిత్తము నిర్మలత్వం పొందుగాక! సర్వ వాసనలు (tendencies) సంపూర్ణంగా త్యజించుటయే ఉత్తమమైన మార్గం. 'ఆసక్తి' కలిగి ఉండుటయే వాసనల రూపంకదా. ప్రపంచముపట్ల గల భ్రమలు తొలగితే అప్పుడు మరికొంత అభ్యాసముచే ఆసక్తి పూర్వకమగు (ఇంద్రియములతోటి) తాదాత్మ్యము సన్నగిల్లుతుంది. ఇక జన్మజన్మలుగా వెంటనంటి వస్తున్న వాసనలు తమంతట తామే తొలగుతాయి. "భ్రాంతి వలననే
Page:10
ఈ జగత్తు నాకు ఇట్లు కనబడుతోంది. భ్రాంతికి వేరుగా జగత్తు లేదు” అను స్వబోధ (selftraining) సహాయం చేత ఆత్మజ్ఞానమునకు పరాకాష్ఠ అయినట్టి “నిర్వాణస్థితి” ఉత్పన్నమౌతోంది. వాసనా రాహిత్యము, దృశ్య మనన రాహిత్యము కలుగగా అప్పుడు లభించే స్థితే 'మోక్షం'. అనగా, ఇకప్పుడు మోక్షప్రాప్తికి వేణే ప్రయత్నముల ఆవశ్యకత ఏదీ ఉండదు.
అయితే వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగం అవిద్యా దోషము లేనట్టి శుద్ధ చిత్తులకు మాత్రమే సాధ్యం. ఎండ ఎక్కుతున్న కొద్దీ మంచు కరిగిపోతున్నట్లు ఆత్మజ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ క్రమంగా దృశ్యతాదాత్మ్యం, అవిద్యాభావన, అనేకత్వానుభవం, వాసనల ప్రభావం సన్నగిల్లుతాయి.
ఓ రాజా! పంచభూతములచే (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం) తయారగుచున్న ఈ భౌతిక దేహం కూడా వాసనల చేతనే ధరింపబడుచున్నది. ఈ వాసనలు రెండు రకాలు1. శుద్ధ వాసనలు 2. మలిన వాసనలు
ఇందు మలిన వాసనలు శరీర పరంపరా ప్రాప్తికి (మరల మరల జన్మలు పొందటానికి) కారణమౌతున్నాయి. మలిన వాసనల యొక్క ఆకారముగాని, వాటికి మూలకారణంగాని అజ్ఞానమే అయున్నది. అట్టి మలిన వాసనలే ఘనీభూతమై “అహంకారము” అనే రూపమును పొందుచున్నాయి. ఇక శుద్ధ వాసనలో, ... అహంకారమును, జన్మ పరంపరలను నశింపచేస్తున్నాయి. ఉడకపెట్టబడిన వేరుసెనగ గింజ మరల మొలుస్తుందా? కాని, రూపం మాత్రం కలిగే ఉంటుంది కదా! శుద్ద వాసనలు కూడా జ్ఞేయమగు (తెలుసుకొనేది - - తెలియబడునది) ఆత్మను ఎరిగిన తరువాత తమయందు 'పునర్జన్మ' అనే అంకురం కలిగి ఉండవు. 'శరీరం ధరించుట' అను బాహ్య వ్యవహార సరళి మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి శుద్ధ వాసనలు మాత్రమే కలిగి ఉన్న జీవుణ్ణి “జీవన్ముక్తుడు” అని పిలుస్తున్నాం.
మహాత్ముడగు శ్రీరాముడు వసిష్ఠమహర్షిచే బోధింపబడి, సానపెట్టిన వజ్రంలాగా జీవన్ముక్తుడై, ఈ భూమిపై సంచరించాడు. ఆ రాముడు ఎట్టి విచారణచే అట్టి పరమోత్కృష్ట స్థితిని పొందాడో
ఆ విచారణ నీకు కూడా చెపుతాను. ఇది వినినవారికి జరామరణభయం తొలగుతుంది. వారు తమ స్వరూపము యొక్క వాస్తవస్థితి గ్రహిస్తారు.
5. కథా ప్రవేశం
అయోధ్యానగరం పాలించే దశరథ మహారాజుకు ఎంతోకాలం తరువాత పుత్రకామేష్టి మొదలైన యాగముల ఫలితంగా నలుగురు కుమారులు కలిగారు. వారే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. కులగురువు అయిన వసిష్ఠ మహర్షి వద్ద ఆ నలుగురు రాజకుమారులు విద్యాభాస్యం పూర్తిచేశారు. స్ఫురద్రూపులై, నవనవోన్నత విలాసంతో ప్రకాశిస్తున్నారు. గురుకులం నుండి అంతఃపురానికి
Page:11
తిరిగివచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక ఋష్యాశ్రమాలు, పుణ్యనదులు, దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరాడు.
అయోధ్య చేరినప్పటి నుండి రాముడు వేసవికాలంలోని తటాకజలంలాగా క్రమక్రమంగా క్షీణించసాగాడు. అప్పటికి అతని వయసు పదముడు ఏళ్ళు మించలేదు. కాని, తోటి బాలురతో ఆడటం మానివేశాడు. అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. పరిజనులు ఎంతో బ్రతిమలాడితేకాని, స్నానాదుల కొరకు కూడా లేచేవాడు కాదు. అతనిని చూచి ఆతని తమ్ములు కూడా చింతాక్రాంతులయ్యారు. అంతఃపురంలో రాజకుమారులున్న సందడేలేదు.
దశరథ మహారాజు రామునివైనం గమనించాడు. ఒక రోజు తన దగ్గరకు పిలిపించి, తొడపై కూర్చుండబెట్టుకొని లాలనగా “ఇంత దీనంగా ఉన్నావు. కారణమేమిటయ్యా? నీకు వచ్చిన లోటు ఏమిటో నాకుచెప్పు” అని తరచి తరచి ప్రశ్నించాడు. కాని ఏం లాభం? రాముడు మాత్రం ముక్తసరిగా “నాకేం అవసరం? ఇక లోటు ఏమి ఉంటుంది?" అని ఊరకున్నాడు. రాజు ఇక చేసేదిలేక, కులగురువు, వసిష్ఠుని రప్పించి రాముని నిస్తేజత్వం గురించి చర్చించాడు. అప్పుడు వసిష్ఠుడు, "ఓ రాజా! నీ కుమారుడు రామచంద్రుడు మేఘగంభీర స్వభావుడు. అట్టి వారికి స్వల్పకారణాలకు కోపం, సంతోషం, విషాదం మొదలైన వికారాలు పుట్టవు. స్వల్పులను మాత్రమే స్వల్పకారణాలు విచలితం చేస్తాయి. కనుక, మన రాముని యొక్క ఇట్టి విచిత్ర ప్రవర్తనకు ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉండి ఉంటుంది. నీవు దిగులుపడవద్దు, దేనికైనా తగిన సమయం
రావాలికదా!" అని అనునయంగా పలికాడు.
6. విశ్వామిత్రుని రాక
‘విశ్వామిత్రుడు' అనే మహర్షి ఉన్నారు. ఆయన ఒక సామాన్య రాజుగా జన్మించి స్వకీయ తపోధ్యానాది ప్రయత్నములచే బ్రహ్మర్షి అయ్యారు. ఒకప్పుడు శిష్య వాత్సల్యంతో ఇంద్రుని ఎదిరించి, ‘త్రిశంకుడు’ అను శిష్యుని కొరకు రెండవ స్వర్గం సృష్టించినట్టి మహామేధావి. అద్వితీయ ప్రతిభాశాలి. లోక కళ్యాణమే కార్యక్రమముగా కలిగియుండి సార్థకనామధేయుడైనారు. ఒక రోజు అకస్మాత్తుగా ఆయన అయోధ్యానగరం వచ్చారు. రాజు ఆయనను సభకు ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఒక ఉన్నతాసనంపై కూర్చుండబెట్టారు. సభలోని ముఖ్యులుంతా లేచి విశ్వామిత్రునికి సాష్టాంగ నమస్కారములు, ప్రదక్షిణలు సమర్పించారు. వసిష్ఠ - విశ్వామిత్రులు కుశల ప్రశ్నలతో పరస్పరం సంభాషించు కొన్నారు. యథాతథంగా సభ ప్రారంభించబడింది. దశరథ మహారాజు వినయ పూర్వకంగా సింహాసనము నుండి లేచి ఇట్లు పలికారు.
Page:12
"లోక కళ్యాణమే జీవిత ధ్యేయంగా కలిగియున్న ఓ విశ్వామిత్ర మహర్షీ! సుస్వాగతం. మానవునకు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుంది? రోజుల తరబడి కరువు కాటకం ఆవహించినపుడు అనుకోకుండా ఒక రోజు కుంభపోతవర్షం కురిస్తే ఎంత ఆనందం! గుడ్డివాడికి చూపు రావటమో, కుంటివానికి కాళ్ళు రావటమో జరిగితే ఎంత సంతోషం! మీ ఈ రాక మాకు, మా ప్రజలకు అంత ఆనందం కలుగచేస్తోంది. మేమంతా మీ దర్శనముచే పవిత్రులమయ్యాం. ఇచ్ఛాభయ క్రోధ రహితులగు మీ వంటి బ్రహ్మానందస్వరూపులు మా పూర్వజన్మల సుకృతం చేతనే మావంటి వారివద్దకు వస్తారు. మీరు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడినట్లే భావించండి. నిస్సంకోచంగా ఆజ్ఞాపించండి. ఈ రాజసింహాసనమైనా సరే, మీ పాదాలముందు ఉంచటానికి నేను సిద్ధంగా ఉన్నాను.”
విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి ఇట్లు పలికాడు.
"ఓ రాజా! మీకు, మీ రాజ్యమునకు శుభమగుగాక. నీ అతిథి మర్యాదలు నన్ను ఆనందింపచేస్తున్నాయి.
నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను. అది నిర్విఘ్నంగా నిర్వహించగలిగితే, లోకములకు శుభం చేకూరుతుంది. అయితే మేము యజ్ఞము ప్రారంభించి దేవతలను ఆహ్వానించినప్పుడల్లా కొందరు దానవులు వచ్చి యజ్ఞవాటికపై రక్త మాంసాలు కురిపిస్తున్నారు. మా ప్రయత్నాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. మేము యాగదీక్షలో ఉన్నప్పుడు అత్యంత శాంత స్వభావులమై ఉంటాము కదా! అది వారు అవకాశంగా తీసుకొంటున్నారు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నీవు మా ఈ ప్రయత్నమును సఫలం చేయాలి. నీ కుమారుడు రాముడు ఇంద్రుని మించిన పరాక్రమము కలవాడు. ఈ పూజనీయుడగు వసిష్ఠమహర్షి వద్ద సర్వశస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొని మహావీరుడై ఉన్నాడు. మాకు ఆ రాముడు కావాలి. అతడు మాత్రమే మృగములను వేటాడే వేటగానివలె ఆ రాక్షసులను మట్టుపెట్టగలడు. మా యజ్ఞం పదిరోజులు జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎక్కువ సమయం వృథా కాకూడదు. అతిత్వరలో యజ్ఞం ప్రారంభించటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం.
నీవు రాముని పరాక్రమం గురించి శంకించవలసిన పనిలేదు. అతడు వేనవేలు రాక్షసులనైనా సరే, క్షణంలో దునుమాడి నీకు కీర్తి తెచ్చిపెట్టగలడు. రాముణ్ణి నాకు అప్పగించిన మరుక్షణం మమ్ములను బాధిస్తున్న ఆ రాక్షసుల ఆయువు మూడినట్లే. మన రాముడు స్వయంగానే గొప్ప శక్తి సంపన్నుడు. పైగా నాచే రక్షింపబడగలడు. ఇక అనుమానం ఎందుకు? ఒకవేళ పుత్ర వ్యామోహం చేత అన్నమాట తప్పుతావా - అది నీకు అర్హమైనది కాదు. ఇక్ష్వాకు వంశపు రాజులు ఇచ్చిన మాట తప్పుతారా? లేదు. నీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాను.”
దశరథుడు అంతా విని అవాక్కయ్యాడు. కొద్ది క్షణములలో తేరుకొని రెండు చేతులు జోడించి ఇట్లు విన్నవించాడు:
Page:13
“ఓ మహర్షీ! అన్నీ తెలిసి కూడా నన్ను పరిహాసం చేస్తున్నారా? ఎన్నో యేళ్ళు పరితపించిన తరువాత నాకీ పుత్రులు లేక లేక కలిగారు. నా పంచప్రాణాలు రాముడి మీదే. అతనికి ఏమైనా అయితే నేను భరించగలనా? ఈ రాముడు ముక్కు పచ్చలారని పసిబాలుడు. ఇంతవరకు కల్పితయుద్ధంలోనే గాని, నిజమైన యుద్ధంలో ప్రవేశించి ఎరుగడు. మీకు తెలుసు. అది రాక్షసులతో యుద్ధం. నేను అక్షౌహిణీ సైన్యంతో వచ్చి మీ యాగం రక్షిస్తాను. అయినా, ఆ రాక్షసులెవరో మరికాస్త వివరించి చెప్పండి. వారు ఎంతమంది? ఎట్టివారు? వారు మాయాయుద్ధ విశారదులు కాదుకదా...? ఒకవేళ మీకు ప్రతిబంధకం కలిగించేది లవణాసురుడో, సుందోపసుందులో కాదుకదా? ఈ కాలంలో రావణుని గురించి వింటున్నాం. అతడు కుబేరుని తమ్ముడు. విశ్రవసుని కుమారుడు. వాళ్ళ ముందైతే మేమే నిలువలేం. ఇక మా రాముడు ఎంతటివాడు చెప్పండి? ఇది ఈశ్వరేచ్ఛానుసారం కొందరు రాక్షసులు రాణించే కాలం. స్వామి! నన్ను క్షమించి అనుగ్రహించండి. పుత్ర మమకారంతో నేనిట్లా అంటున్నానంటారా? నిజమే. ఈ పుత్రులకొరకు నేను ఎన్నో ఏళ్ళు తపించాను. మహా మహా జ్ఞానులైన వారే పుత్రుల యోగక్షేమముల కొరకు పరితపిస్తూ ఉంటారు. సామాన్య మానవులమగు మేము ఎంతటివారం చెప్పండి? అట్లుగాక, బలాత్కారంగా నా పుత్రుని గొని పోతానంటారా మరుక్షణం నన్ను విగతజీవునిగా ఎంచండి. మీ సేవచేయటానికి అక్షౌహిణి సైన్యంతో నేను సిద్ధంగా ఉన్నాను.”
విశ్వామిత్రుడు అంతా విని తటాలున లేచి నిలబడ్డాడు.
“నా కార్యము నెరవేరుస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు అన్నమాట వెనుకకు తీసుకొంటావా? రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగుతుందా? సింహం లేడి కావటమా? పూర్ణ చంద్రుని నుండి ఉష్ణ కిరణాలు బయల్వెడలటమా? సరేఁ! మంచిది. నీవు నా కోర్కె తీర్చుకుంటే నేను వెళ్ళివస్తాను. ప్రతిజ్ఞాభంగం చేసినవాడవై బంధువులతో సుఖంగా ఉండు.”
ఇంతలో వసిష్ఠుడు విశ్వామిత్రుని సమీపించి అనునయ వాక్యాలతో శాంతపరచాడు. దశరథుని ప్రక్కకు పిలిచి, "ఓ మహారాజా! నీవే ధర్మం తప్పితే ఎట్లా? పైగా, రాముని పరాక్రమం సంగతి నాకు తెలుసు. అతడు విశ్వామిత్రుని రక్షణలో ఉండగా తేరిపార చూచేవారు ఈ మూడు లోకములలో ఎవరైనా ఉన్నారా? అందుచేత రాముణ్ణి తప్పకుండా పంపు. నీకు శుభమే కలుగుతుంది” అని సముదాయించాడు. దశరథుడు పుత్ర మమకారం కొంత ప్రక్కకుపెట్టి వివేచనా దృష్టితో విషయమంతా పరిశీలించాడు. రాముణ్ణి పంపటానికే నిశ్చయించుకొన్నాడు.
Page:14
7. రామ సభాప్రవేశం
రాజు రామచంద్రుని యొక్క ఒక ఆంతరంగిక సేవకుణ్ణి పిలిపించాడు. "ఓయీ! మన రాముని స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? చింతలన్నీ త్యజించి ఉత్సాహం పుంజు కొన్నాడా?” అని ప్రశ్నించాడు.
శ్రీరామ భృత్యువు : మహారాజా! మన రామచంద్రుడు తీర్థ యాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుండీ, అదొక విధంగా ఉన్నాడు. మేమంతా ఎంతో ప్రార్థిస్తేగాని స్నాన భోజనాలకు లేచుటలేదు. మాతో మాట్లాడనే మాట్లాడడు. తనలో తానే "ఈ సంపదల వలన ఏం ప్రయోజనం? ఆపదలచే బాధింపబడనివాడెవ్వడు? ఈ అంతఃపురములు, సేవకజనం, రాజ్యాది వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా? అసలు కోరికలు ఎందుకు ఉండాలి? ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత? ఇదంతా శూన్యరూపమే కదా!” అని చెప్పుకొంటున్నాడు. ఎప్పుడు చూచినా ఏకాకివలె, ఏకాగ్రచిత్తంతో ఎక్కడో ఒక మూల కూర్చుని ఉంటాడు. తాను ఒక రాజకుమారుడననే స్ఫురణే లేదు. సుఖమైన విషయాలను పట్టించుకోడు. దుఃఖకరమగు వార్తలకు ఏమాత్రం స్పందించడు. అభిమానముగాని, కోరికలు గాని ప్రకటించడు. "రాజా! ఇది యేమి?” అని ప్రశ్నిస్తే మౌనమే అతని సమాధానం. ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు "అమ్మలారా! మీరందరు కాలముచే భక్షింపబడబోతున్నారనే విషయం తెలుసుకొనియే ఉన్నారా? మోక్షపదము కొరకు ప్రయత్నించకుంటే మీరెందుకు జీవిస్తున్నట్లో చెప్పండి?” అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. “రామచంద్రా! మీరు కాబోయే సామ్రాట్టుకదా! ఇలా మాట్లాడటం ఉచితమేనా? యోచించండి" అని మేము అన్నప్పుడు పకపక నవ్వుతాడు. ఒక్కొక్కప్పుడు మేము మాట్లాడుతుంటే అసలు వినిపించుకోవడం లేదు.
"ఇయమ్ ఆపత్ ఇయంసంపత్” ఇత్యేవం కల్పనా మయః మనసో భ్యుదితోమోహ ఇతి శ్లోకాన్ ప్రగాయతి! (X-38)
“ఇది సంపద, ఇది ఆపద... అనబడునదంతా కల్పనామయమే కదా!" అని అర్థం వచ్చే పాటలేవో బిగ్గరగా పాడుచున్నాడు. ఒకసారి, మాలో ఒకణ్ణి పిలిచి, “ఏమయ్యా! 'హా ఇంక గతేమిటి?” అని అనుకునే రోజు వచ్చేవరకు ఈ జనులు వైరాగ్యం పొందుటలేదేమిటి? నీకేమైనా కారణం తెలుసా?” అని ప్రశ్నిస్తున్నాడు. దానికి మేమేం సమాధానం చెప్పగలం? మాలో ఎవరైనా రాజకీయవిశేషముల ‘ఊసు’ ఎత్తగానే, ఆ మాటలు ఏమాత్రం విలువలేనివిగా చూస్తాడు. “ఇదంతా చమత్కారంగా ఉన్నదే! బాహ్యదృష్టిచే మాత్రమే లభిస్తున్న ఈ జగత్తులేదు. స్థూలబుద్ధికి మాత్రమే తోచుచున్న అహంకారం కూడా వాస్తవమైనది కాదు. మరి జీవుడికి దుఃఖం ఎక్కడినుండి వస్తోంది?" అని ఒకచోట వ్రాసి దాన్ని గురించే యోచిస్తూ ఉంటాడు. ఆతని దృష్టిలో బంధువులు, మిత్రులు, శత్రువులు, రాజ్యములు, కష్టములు, సుఖములు ఉన్నట్లే మాకు కనిపించటం లేదు. అతడు మూఢుడు మాత్రం కాదు. ముక్తుడు కూడా కాకపోయి ఉండవచ్చు. అతనియందు ఆశ, ప్రయత్నము, శాంతి కనబడటం లేదు.
Page:15
కిం ధనేన కిమంబాభిః కిం రాజ్యేన కిమీహయా? ఇతినిశ్చయవానంతః ప్రాణత్యాగపరః స్థితః ॥ (X-46)
"ఈ ధనంతో, ఈ బంధు జనంతో, ఈ రాజ్యములతో ఈ ప్రయత్నములతో నాకేమి పని? నేను నిశ్చయంగా ఇట్లే ప్రాణాలు వదిలేస్తాను" అని తనలో తానే గొణుక్కుంటుంటే, వింటున్న మాకు దుఃఖమే వస్తోంది. పరిపూర్ణమైన విభవములతో నిండిన అంతఃపుర ప్రాంగణమును, అతడు, కపటవేషం వేసిన మాంత్రికురాలిని చూచినట్లు చూస్తున్నాడు.
ఒకసారి ఏమైనదో చెపుతాను వినండి. మా భృత్యులలో ఒకడు మన రామచంద్రుని సమీపించి “యువరాజా! ఈ రాజవస్త్రాలు ధరించండి" అని వేడుకొన్నాడు. వెంటనే రాముడు అతనివైపు తిరిగి "ఓయీ! స్నేహితుడా! ఈ అన్నవస్త్రాలు చాలా గొప్పవైనట్లు మాట్లాడుచున్నావేమయ్యా? ఒకప్రక్క ఆయుష్షు ఎలా నిరర్థకమౌతోందో గమనిస్తున్నావా? ఆహా ఎంత ప్రమాదం! పరమానందరూపమైన మోక్షము కొరకు మనం ఏమైనా చేస్తున్నామటయ్యా? లేదు. అందుచేత ఈ స్వల్ప తతంగమంతా కాస్త కట్టిపెట్టు. ఈ జీవితం ఏమిటి? ఈ శరీరాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? కొంచెం యోచించు" అని పలికాడు. ఆ ప్రక్కనే ఉన్న మేం ఆశ్చర్యపోయాం. మాలో ఒకడు ఒకసారి రామచంద్రుని ధనం యాచించాడు. అప్పుడాతడు, "ఓయీ! యాచకుడా! ధనం కోరుకుంటున్నావా? సరే మంచిది. కాని, 'ఈ ధనమే సర్వ అనర్థాలకు మూలం' అని మాత్రం మరువకు. ఇందలి దోషమును పరిశీలిస్తూ ఉండు” అని చెప్పి, ఎదురుగా ఉన్నదంతా ఇచ్చివేశాడు.
హే మహారాజా! రాముడు మహాధైర్యశాలి. ఔదార్యంలోను, పరాక్రమంలోను అతనికి అతడే సాటి. మరి అతడు అట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడో? మాకు తెలియటం లేదు. అది నటన కాదు. కళ్ళలో నిర్మలత్వం, దృఢత్వం సర్వదా ప్రకటితమౌతూనే ఉన్నాయి. బైటనుండి పురుగుకూడా లోపలికి ప్రవేశించటం లేదు. మరి అతనిలో ఏదో మోహం చోటుచేసుకొన్నదని మాకు అనిపిస్తోంది. ఆ మోహం పోగొట్టి, అతనిని మరలించగలిగినవారు ఎవరైనా ఉన్నారా? ఎదురుగా ఉన్న వస్తువులను, జనులను చూడని వానికి మేమేం చెప్పగలం? దీనికి మీరే ఏదైనా పరిష్కారం కనుగొన ప్రార్థిస్తున్నాను.
అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కనులు ఆనందాశ్చర్యాలతో ప్రకాశించాయి.
శ్రీ విశ్వామిత్రుడు : ఓ రామభృత్యుడా! ఎంత చక్కగా వివరించావు! నీవు చెప్పినదంతా వింటే నాకు ఆనందం కలుగుతోంది. నీవు వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా. ఆశ్రిత వత్సలుడైన రాముడు మీ కోరిక, మా మాట, తండ్రి ఆజ్ఞ కాదనడు.
రామభృత్యుడు రాజాజ్ఞ గైకొని, రాముని అంతఃపురం వైపు పరుగులు తీశాడు.
శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ సభికులారా! మన రామునికి కలిగిన ఈ చిత్తవైకల్యం వైరాగ్యయుక్తంగా కనబడుటలేదా! అతని వైరాగ్యం ఆపత్తుల వల్లనో, రోగాదులవల్లనో, కామాదుల వలననో కలిగింది
Page:16
కాదు. వివేక వైరాగ్యముల వలన కలిగిన చిత్త ప్రబోధమేనని నాకు అనిపిస్తోంది. మహాసమృద్ధంలో కూడా ఇంతటి పరిశీలనాత్మక బుద్ధి ఉండటం మనం సంతోషించవలసిన విషయమే.
ఓ దశరథ మహారాజా! మీరు రాముని గురించి దిగులు పడవలసిన పనేమీలేదు. అతని చిత్తము జ్ఞాన వైరాగ్యములతో నిండి ఉన్నది. కాని, అందు స్వధర్మానికి సంబంధించిన లేశమాత్ర శంక ఇంకా మిగిలి ఉన్నది. ఆ దోషమును మనం యుక్తియుక్తాదులచే ఇప్పుడు తొలగించామా
ఇక అతడు కూడా మావంటి ఋషులవలె స్వతఃసిద్ధమగు మోక్షము నందు విశ్రాంతి పొందగలడు. ప్రకృతి సిద్ధమగు రాజ్యపాలన మొదలైన లౌకిక వ్యవహారములకు, మోక్షస్థితికి ఒకదానితో మరొకదానికి ... విరోధమేమీ వాస్తవానికి లేదు. ఆత్మ విచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది, ఆపై ఎప్పటిలాగానే వ్యవహరించవచ్చు. మా వాక్యములు వింటే సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. అతడు కార్యకారణతత్వమంతా తెలుసుకొంటాడు. సుఖదుఃఖములకు అతీతుడై గడ్డిపరకను, రాయిని, బంగారమును ఒకే తీరుగా చూడగలడు.
ఇంతలో సోదర సమేతుడై పదహారు సంవత్సరముల వయస్సుతో పూర్ణచంద్ర తేజస్సుచే ప్రకాశించుచున్న రాముడు సభలో ప్రవేశించాడు. సభలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. సభికులంతా రామునికి జయం పలికారు. ఆతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలు స్పృశించాడు. ఋషులకు, బ్రహ్మవేత్తలకు, చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు. సామంతులకు, రాజోద్యోగులకు ప్రతినమస్కారం చేశాడు. దశరథుడు, “నాయనా! రామా! స్వాగతం. ఇటువచ్చి యువరాజు ఆసనంపై కూర్చో!" అని పలికాడు. కానీ ఆ మాటలు రాముని చెవిని పడనేలేదు. అతడు సభామధ్యంలో ఒక ప్రదేశమునందు చతికిలపడి కూర్చున్నాడు. ఎవరో భృత్యువు పరుగునపోయి ఒక కంబళంతెచ్చి అక్కడ పరచాడు.
మహారాజు : కుమారా! నీవు సద్గురువు అయిన వసిష్ఠ మహర్షి వద్ద విద్య అభ్యసించావు. జ్ఞానవంతుడవు. రాజువు. సర్వ విషయములకు ఆశ్రయభూతుడవు. ఏమీ తెలియని జడునివలె ప్రవర్తిస్తున్నావేమయ్యా? నిష్కారణమైన ఈ దైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మను వినోదంతో ఆనందింపచేయాలేకాని, మోహదైన్యాదులతో నిన్ను నీవే బాధించుకోవటం ఉచితమా? నీవంటి వివేకులు పెద్దలచే, గురువులచే ఉపదేశించబడిన మార్గమే అనుసరిస్తారు కదా! ఎవరికైనా స్వధర్మమే పుణ్యము, సద్గతి కూడా. నిరర్థకమైన చిత్తచాంచల్యం వలన లాభమేముంటుంది?
శ్రీ విశ్వామిత్రుడు : ఓ రామచంద్రా! నీకు జయమగుగాక! నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ మనోవ్యాకులత్వానికి కారణములు ఏమిటి? నిన్ను ఏఏ విషయాలు బాధిస్తున్నాయి? మేము వచ్చాము కదా! నీ మనోభావాలు ఎట్టి సంకోచం లేకుండా మా ముందుంచు. మేము నీ సంశయాలన్నీ తొలగించి, మనోవ్యాధుల ఊసైనా లేకుండా చేస్తాం. విచారణ లేకపోవుటచేతనే మానవుడు ఈ దృశ్యములో మ్రగ్గుచు, అనేక వ్యధలు అనుభవిస్తున్నాడు. నీ మనస్సులో ఉన్నదేమిటో మమ్ములను తెలుసుకోనీ.
Page:17
విశ్వామిత్రుడు లాలన పూర్వకంగా చెప్పినదంతా రాముడు విన్నాడు. కొద్ది క్షణాలు సభ అంతా కలియచూచాడు. తనలో "ఆహా! నేడు ఎంత సుదినం! బ్రహ్మ విద్వరేణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు. కనుక నా సందేహాలన్నిటికీ సమాధానాలు తప్పక లభిస్తాయి” అని అనుకొన్నాడు. పూర్ణార్థయుక్తంగా ఇట్లు సమాధానమిచ్చాడు.
8. రాఘవ వైరాగ్య వర్ణనము
శ్రీరాముడు : ఉత్తమోత్తములచే అలంకరించబడిన సభకు నమస్కారం. ఇక్కడ వేంచేసియున్న విశ్వామిత్రాది మహర్షుల దర్శనభాగ్యం, సేవాభాగ్యం అనేక జన్మల సుకృతం చేతనే లభిస్తాయి.
హే విశ్వామిత్ర మహర్షీ! నా మనస్సులో ఉన్న భావాలన్నీ మీరు ఆజ్ఞాపించినట్లే చెపుతాను. నా ఈ వాక్యములలో దోషమేమైనా ఉంటే క్షమించండి. సత్పురుషులకు మనోగతమైనదంతా తెలియచేయటం శుభప్రదమే అవుతుంది కదా!
నేను పదహారు సంవత్సరముల క్రితం ఈ దశరథ మహారాజు ఇంట్లో జన్మించాను. క్రమక్రమంగా వృద్ధిచెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను. కొంతకాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళివచ్చాను. వచ్చినప్పటినుండీ నా మనస్సులో ఒకానొక "విచారణ" ఉత్పన్నమైనది. ఆ విచారణ యొక్క స్వరూపమేమిటో చెపుతాను వినండి.
కింనామేదం బతసుఖం యేయం సంసార సంతతిః? జాయతే మృతయే లోకో, మ్రియతే జననాయచ ॥ (XII-7)
ఈ సంసార వ్యవహారంలో 'సుఖం’ అంటూ ఏదైనా ఉన్నదా? ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు. పుట్టడానికే చచ్చుచున్నాడు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషమేమున్నది? కొందరు, “అలా ఎందుకనుకోవాలి? ఇందులో ఐశ్వర్యములు, ధనములు, స్వజనులు, స్త్రీలు మొదలైనవి సుఖప్రదములేకదా! అవి సంపాదించు కొన్నవారు సుఖంగానే ఉంటున్నారు కదా!” అని అంటున్నారు. కాని, ఇది వినండి!
అస్థిరాః సర్వయేవేమే సచరాచర చేష్టితాః
ఆపదాం పతయః పాపా భావా విభవ భూమయః ॥ (XII-8)
ఇందులో స్థావరజంగమ జీవులు పొందుచున్న భోగములు, విభవములు - - ఇవన్నీ అస్థిరములు, అసత్యములు, అశాశ్వతములు అయి ఉన్నాయి. ఒకప్పుడు కొంచెం సుఖకరంగా తోచినప్పటికీ, శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించుటలేదు. ఒక్కక్షణంలో కనిపించి మరొక్క క్షణంలో మాయమైపోతున్న ధన, జన, యౌవనాదులు సుఖ ప్రదాతలని అనటం ఎట్లా? ఉదాహరణకు ఈ సంపదలే తీసుకోండి. వీటిని కూడబెట్టుకోవటంలోను, రక్షించుకోవడంలోను జనులు ఎన్ని
Page:18
ఆపదలు ఎదుర్కొంటున్నారు! ఇవన్నీ ఎన్ని రకాలైన లోభమోహాది పాపపూరిత దుశ్చర్యలకు కారణభూతములౌతున్నాయి! అందుచేతనే సుఖకరములని అనేకమంది అనుకొంటున్న ఈ సంపదలు, ఈ విభవములు, ఈ పదార్థ జాలములు, ఈ మనుష్యుల సంబంధ - బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్ఛములు, తిరస్కారములుగానే ఉంటున్నాయి. వీటికై ప్రయత్నిస్తున్న అనేకమంది సంసారజీవుల అనేక చేష్టలు కూడా నాకు అర్థరహితంగానే కనిపిస్తున్నాయి.
ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధుత్వాలు, స్నేహాలు, అనుబంధాలు, మొదలైనవాటిని పరిశీలనగా చూచినప్పుడు నాకు ఒకటి అనిపిస్తోంది. ఇందలి జనులు ఒకరికొకరు సంబంధించినవారే కారు. వీరందరు ఇనుప చీలలవలె (రింగులవలె) ఒకరికొకరు ముడిపడినట్లు పైకి ఉంటున్నారు. కాని, లక్ష్యాలు, కష్టాలు, ఆవేదనలు, సంస్కారాలు - ఎవరివి వారివే. ఒకరు మరొకరి వంటివారు కానేకాదు. అయితే జీవుడు “ఈ ఈ వ్యక్తులు, ఈ ఈ పదార్థములు నాకు సుఖకరములు” అని సంకల్పించుట జరుగుతోంది. అందుచేతనే అతనికి వాటితో సంబంధములు, బాంధవ్యములు ఏర్పడుచున్నాయి. చూచారా? ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధములు కేవలం “సంకల్పించుట” అను ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుచున్నాయి. అట్టి సంకల్పమాత్ర సంబంధాలు ఈ జీవుడిని ఎంతగా క్షోభింప చేస్తున్నాయో కదా!
ఈ జగత్తు, దీనియొక్క సృష్టి స్థితి లయాలు మనస్సుచే కల్పించబడినవి మాత్రమే. అయితే ఏం? ఈ జీవుడు అంతులేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుచూనే ఉన్నాడు. మనస్సే అన్నిటికి కారణం. కాని, పరికించి చూస్తే ఈ 'మనస్సు’ అనునది ఎక్కడున్నది? దేనిచే తయారుచేయబడింది? ‘మననము చేయుట’ అనుదానికి వేఱుగా ఈ మనస్సుకు అస్థిత్వమే లేదు. అస్థిత్వం లేని వస్తువు కారణంగా జీవులమగు మేము బద్ధులం అవుతున్నాం. ఎంతటి దురదృష్టం! మూఢమృగములు అల్లంత దూరంలో మృగతృష్ణను చూచి "అందలి జలం మా దాహం తీరుస్తుంది” అని అనుకొని ఎంతో శ్రమకు ఓర్చుకొని పరుగెత్తుతాయి చూచారా! మూఢబుద్ధులమగు మేము కూడా 'అసత్తే' అయినట్టి ప్రాపంచిక సుఖములచే ఆకర్షించబడి, పరుగులు తీస్తున్నాం. ఈ విషయ సుఖములు చివరకు మా పట్ల దౌర్భాగ్యరూపములే అవుతున్నాయి. అజ్ఞానం చేతనే వాటియందు సుఖభ్రాంతి పొందటం జరుగుతోంది కాని, పొందుచున్నది మాత్రం సంకటములు మాత్రమే. 'అంతామాయ' అని తెలిసికూడా ఈ విషయసుఖములకు మేము అమ్ముడు పోతున్నాం. అరణ్యంలో ఒక లోతైన గోతిలో పడిపోయిన కొన్ని లేళ్ళు అక్కడి ఆకులను భక్షిస్తూ కాలం గడుపుతాయి. కొంతసేపటికి అవి "అయ్యో! మేము ఈ గోతిలో చిక్కుకున్నామే?” అని తెలుసుకొని దుఃఖిస్తాయి. మేము కూడా మోహవశంచేత 'ఇంద్రియముల ప్రియాప్రియములు' అనే గోతిలోపడి అనేక వాంఛలచే కట్టుబడి ఉన్నాం. ఎంతో కాలానికిగాని, "అయ్యో! ఇక్కడ ఈ అజ్ఞానంలో చిక్కుకున్నాం కదా” అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం.
ఇప్పుడు చెప్పండి. ఈ రాజ్యాదులతో నాకేమి పని? ఈ భోగపాశాలలో నేను ఎందుకు
Page:19
చిక్కుకోవాలి? అసలు నేనెవరిని? ఈ దృశ్య ప్రపంచమంతా నాకెక్కడినుండి దాపురించింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా వాస్తవ స్వరూపమేమిటి? ఈ శరీరాదులు నాకెక్కడి నుండి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వదలి నన్ను 'రాజ్యభోగాలు' అనే బురదలో చిక్కుకొమ్మంటారా? ఏది ఎక్కడినుండి వచ్చినా రానివ్వండి. ఏది మిథ్యయో అది మిథ్యగానే ఉండుగాక. అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతములు అయిన పదార్థములచే నేను భ్రమపొందకుండెదను గాక!
మహాత్మా! విశ్వామిత్రా! ఈ విధంగా అనేక కోణముల నుండి విమర్శన చేస్తూ, అంతా పరిశీలించాను. విచారణ చేయనివానికి రుచికరంగా తోచే ఈ ప్రాపంచిక పదార్థములపట్ల నాకు ఒక విధమైన 'అరుచి' పుట్టింది. ఒక బాటసారి తొందరపనిమీద దూరంగా ఉన్న గ్రామానికి త్వరత్వరగా నడచివెళ్ళుచున్నాడనుకోండి. అప్పుడు బాట ప్రక్కనగల శ్మశానభూములు తుచ్ఛములుగానే కనబడతాయి కదా! నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏమాత్రం అనిపించటంలేదు.
ఏది ఎట్లా ఉన్నా, నాకు మాత్రం నిర్దుష్టమైన, శాశ్వతమైన సుఖ శాంతులు లభించకయే ఉన్నాయి. స్వామీ! సంసారజీవులమైన మేము అనేకసార్లు పుడుతున్నాం. చస్తున్నాం. జరా-మరణములు, సంతోష -విషాదాలు, సుఖ-దుఃఖాలు, ఆవేశ-నీరసాలు వస్తున్నాయి. పోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించుకోలేక పోతున్నాం. “ఈ 'సంసారము' అనే దోషం మమ్ములను ఆక్రమించకుండా ఉండేది ఎట్లా?" అనే ప్రశ్న నన్ను రాత్రింబవళ్ళు దహించివేస్తోంది. ఒక మహావృక్షపు తొఱ్ఱలో గొప్ప అగ్నికణం ప్రవేశించిందనుకోండి. అప్పుడు ఆ వృక్షం బైటకు తన ఆకులచే పిల్లగాలులు అనుభవిస్తూ ఉన్నా, లోనమాత్రం శిథిలత్వం పొందుతూ మౌనంగా రోదిస్తూ ఉంటుంది చూచారా? మా సంసారజీవుల గతి కూడా అట్లాగే ఉన్నది. మా మనస్సులు పరితాపాగ్నులచే క్షణక్షణం దహించబడుచున్నాయి. బైటకు మాత్రం ఏవేవో స్వల్ప కార్యక్రమములు కల్పించుకొని రోజులు గడుపుచున్నాం. ఈ సంసార భ్రమలకు, ఈ దుఃఖములకు మాకు అంతు కనబడుటలేదు.
స్వామీ! మరల మరల మాచే బలవంతంగా అనుభవించబడుచున్న తుచ్ఛ భోగములచే మేము శైథిల్యమే పొందుతున్నాం. వెదురు బొంగులవలె ప్రాణ వాయువులతో కూడినవారమై, శబ్దం మాత్రం చేస్తున్నాం. జడబద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే, దుఃఖనివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయమేదీ ఆశ్రయించని మేము జడపదార్థములకంటే అధికులమా? కాదు. కటిక దరిద్రునికి అధిక సంతానం లాగా వివేక రహితులమగు మాకు అనేక ఉచ్ఛ - నీచ ఉపాధులు వచ్చిపోతున్నాయి.
ఈ తుచ్ఛ ధనాదులు శాశ్వతమైన ఆనందం ఇవ్వలేకపోగా, అవి మమ్ములను క్షణక్షణం ‘లోభము, మోహము, మాత్సర్యము' మొదలైన దుష్టమృగములు నివసిస్తున్న అజ్ఞానారణ్యములోకి త్రోసివేస్తున్నాయి. పోనీ, ఈ ధనములను, ఈ పరివారములను త్యజిద్దామా - అదీ కుదురునది
Page:20
కాదు. ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖమే కలుగుతోంది. కేవలం తల్లిదండ్రులు, తదితరులు కష్టపడతారేమోనని మాత్రమే పైకి ఏడ్చుటలేదు.
హే మహర్షీ! ఈ ప్రపంచమంతా అవిచారము, అజ్ఞానము, మూఢత్వము, మూర్ఖత్వము అన్నివైపులా దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియ ప్రియములగు “విషయములు” అనే దొంగలు మా హృదయ గృహములలో ప్రవేశించి మా 'వివేకము' అనే సంపదను దొంగిలించుకుపోతున్నారు. మేము ఆ దొంగలను గుర్తించుటలేదు. “ఇది మాకు చెంది ఉండుగాక. మా పేరు ప్రతిష్ఠలమాట ఏమిటి?” మొదలైన ఏవేవో ఘీంకారములతో ప్రొద్దుపుచ్చుతున్నాం. ఆ విషయదొంగలను నిరోధించుటకు మా ఈ శరీర సామర్థ్యాలు, శస్త్రాస్త్ర విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? బ్రహ్మజ్ఞానులగు విద్వాంసులు మాత్రమే వారిని నిరోధించగలరు.
9. ధన వ్యవహారం
ఓ మునిశ్రేష్ఠా! మేమంతా ఈ 'ధనం' అనునది సంసారంలో చాలా సారభూతమైన విషయమని భావిస్తున్నాం. అట్టి భావన మూఢత్వం చేతనే మా వద్దకు చేరుతోంది. దీనివలన నిజమైన సుఖముగాని, శాంతిగాని కలుగుతోందా? లేదు.
ఒకడు ఎంతో ప్రయాసతో “నేను ముందు ముందు సుఖపడెదను గాక” అని భావించి తన శక్తియుక్తులను, తెలివితేటలను, కాలమును వినియోగించి అట్టి ప్రయత్నమునందే నిమగ్నుడౌతున్నాడు. అనేక రోజులు గడచిపోతున్నాయి. అట్టి ప్రయత్నములో కొన్ని సఫలం, మరికొన్ని విఫలం అవుతున్నాయి. అయితే ఒక ప్రక్క విలువైన జీవితకాలం వృథా అగుటలేదా? జంతువులు, కీటకముల జన్మలన్నీ ఆహార నిద్రా మైథునాలతో గడచిపోతున్నాయి. మానవ జన్మకూడా అంతమాత్రమేనా? ఈ ధనమును అభివృద్ధి చేసుకోవటంలో ఎన్నో ప్రమాదాలు, భయాలు, దోషావేశాలు తారస పడుచున్నాయి. ఇది మనస్సును మోహమునందు చిక్కించి అనేక విధములుగా కలవరపెట్టుచున్నది. ఒక విచిత్రం గమనించారా? ధనము లేనివాడు, "అయ్యో! నాకు ధనములేదే? అతనికి ఉన్నదే?” అని వాపోవుచున్నాడు. కాని, ధనము కలిగియున్నవాడు మాత్రం, “నేను ఇప్పుడు అవిచ్ఛిన్నమైన తృప్తిని పొందుచున్నాను" అని అనుకోవటం లేదు. ఎంత చమత్కారమైన విషయం!
ఈ ధనము "నేను ఆశ్రయిస్తున్నట్టి ఈతడు గుణవంతుడా? కాదా?" అనునది చూడదు. రాజుయొక్క స్వభావంలాగానే అది ఒకచోట స్థిరంగా ఉండదు. నిప్పు త్రొక్కిన కోతిలాగా ఒకచోటినుండి మరొకచోటికి పరుగులు తీస్తూ ఉంటుంది. యుద్ధం, జూదం, వంచన, లోభం వంటి అధర్మ కార్యాలు కూడా ధనమును పెంచగలుగు చున్నాయి. ధనం ఉన్నచోట “ధర్మము” ఉండగలదన్న
ధర్మము = function, Duty consciousness
Page:21
నమ్మక మేమున్నది? పాలు త్రాగి పాము విషమును క్రక్కునట్లు, ధనమును సంపాదించి ఈ మనుజుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహాదులను అధికం చేసుకొంటున్నాడు. గొప్ప ప్రజ్ఞావంతుడు, శూరుడు, కృతజ్ఞుడు, అందరిపట్లా ప్రీతికలవాడు కూడా సంపదలు పొందినపుడు తన కోమల స్వభావం కోల్పోవుచున్నాడు. క్షణంలో కఠినాత్ముడుగా, అవివేకిగా తయారగుచున్నాడు. ధూళిలోపడిన కారణంగా రత్నముకూడా మలినపడుతుంది కదా! విచిత్రమేమిటంటే “జననిందా పాత్రుడు గాని ధనవంతుడు, తనను తానే పొగడుకొనని శూరుడు, సమదృష్టి కలిగివుండే ప్రభువు” - ఈ ముగ్గురు లభించటం లోకంలో దుర్లభమే అవుతోంది.
భయంకర విషసర్పం దాగివున్న పుట్టపైగల పూతీగ ఎట్టిదో, ఈ సంపదలు కూడా అట్టివే. ఎందుకంటారా? అవి ఉన్న కాస్త వివేకాన్ని ఊడ్చి పెడుతున్నాయి. కుసంస్కారమును, ఉద్వేగమును, దురభ్యాసములను తెచ్చిపెడుతున్నాయి. సత్యదృష్టిని మరచేటట్లు చేస్తున్నాయి. వీటి పటాటోపం ఎంతగా జీవుడిని ఆకర్షిస్తోంది! ధనమొక్కటే జీవితలక్ష్యంగా కలవారు నీచులతో, దుర్మార్గులతో, లోభులతో స్నేహం చేయవలసి వస్తోంది. గుణవంతులు దూరంగా ఉండిపోతారు. ఇక వీటియొక్క అంతిమ ఫలితం గమనిస్తే, అది అతి చంచలంగానే ఉంటోంది. ఎవరికోసం ఇంతగా శ్రమించి ఈ జీవుడు ధనాదులను సంపాదించాడో వారే ఆతనిని ద్వేషిస్తున్నారు. తిరస్కరిస్తున్నారు. ఇంతా సంపాదించి లెక్కించి చూచుకొంటూ ఉండగా మరొకవైపు ఈ శరీరమే శిథిలమౌతోంది. అతడు తాను సంపాదించినదంతా ప్రియంగా, మమకారంగా, నిస్సహాయంగా చూస్తూ "అయ్యో! ఇదంతా విడచి వెళ్ళవలసిందేనా? నేను పోయిన తరువాత ఏమౌతుందో, ఏమో?” అని అంతరంగమున తలచుచూ దుఃఖమునే పొందుచున్నాడు. బాహ్యవిషయములు మాత్రమే అయివున్నట్టి ఈ ధనాదులు ఇంతగా చిత్తమును ఆకర్షించటం నాకు చిత్రమని అనిపిస్తోంది.
ధనముతో బాటే భ్రాంతి, దుర్వ్యసనములు, బంధుద్వేషములు, దొంగలభయం, కారాగృహం, మృత్యుభయం మొదలైన అశుభ విషయాలు కూడా వెంటనంటి ఉంటాయి. ఈ అనుభవాలన్నీ జనులు గమనిస్తూనే, చూడనట్లే ఉంటున్నారే? మెఱుపువలె దీని రాకపోకలు క్షణికములు. దీనివలన ‘సుఖం లభిస్తోంది’ అని తలచటం వట్టి భ్రాంతి మాత్రమేనని నాకు అనిపిస్తోంది. జీవులను మోసగించటంలో ధనము తరువాతే ఏదైనా. ధనము ఉన్నచోట జ్ఞానము, వైరాగ్యము చోటు చేసుకోవడం దుర్లభమైన విషయమే.
10. జీవితం - ఆయుష్షు
ఈ ఆయుష్షును చూచారా స్వామీ! ఇది చిగురాకు కొనయందున్న జలబిందువు లాగా చంచలమై ఉన్నది. చిల్లికుండలోని జలంలాగా నశించుటయే దీని స్వభావం. ఈ శరీరం ఉన్నట్లుండి ఏ క్షణంలోనో అకాలంగా రోగాల పాలు అవుతోంది. ఒక 'నియమము' అంటూ లేకుండా ఏ
Page:22
క్షణంలోనో నేలకూలుతోంది. మునీశ్వరా! “ఇంద్రియ విషయములు” అనే సర్పములకు ఆలవాలమైన చిత్తము గలవారికి ఆయుష్షు శ్రమనే కలుగజేస్తోందని నాకు అనిపిస్తోంది. ఆత్మజ్ఞానం పొందినవారికి మాత్రమే అది ప్రయోజనకరం. ఎందుకంటారా? ఒకవైపు ఇంద్రియ శక్తులను ఇంద్రియ విషయములే బలహీనపరుస్తుంటే బ్రతుకు త్వరత్వరగా ఆయాసకరం అవటంలో ఆశ్చర్యమేమున్నది? మేము ఇంద్రియదృష్టిని మాత్రమే కలిగి ఉంటున్నాం. అందుకే మా ఆయుషు నిష్ప్రయోజనం అయిపోతోంది. ఈ జగత్తులో కొందరు స్వస్వరూపమగు 'ఆత్మ' గురించి ఎఱుగుచున్నవారై అట్టి ఆత్మపదము నందు విశ్రమించుచున్నారు. అందుచేత, లాభాలాభములందు సమబుద్ధి కలిగివుంటున్నారు. అట్టివారిపట్ల మాత్రమే ఈ ఆయుష్షు సౌఖ్యప్రదం అవుతోంది. ఇక మేము ఈ పరిమిత శరీరాదులందు “66 ఈ శరీరమే మేము” అనునట్టి దేహాత్మబుద్ధి కలిగి ఉంటున్నాం. అందుచేతనే కాబోలు, అనేక చింతలు మమ్ములను హింసించివేస్తున్నాయి.
అయినా ఈ ఆయుష్షును నమ్మి ఉండటం ఎట్లా చెప్పండి? ఏ క్షణంలో ఏదైనా కావచ్చును కదా! వాయువుయొక్క ప్రసరణమును, అలలను నిరోధించవచ్చునేమో కాని, నీటి బుడగవంటి ఆయుష్షును నిలపగలమని నమ్మి ఉండటం ఉచితమేనా? ఇది అతి చంచలమైనదికదా? అందుకే జ్ఞానులు దీనిని తరంగమువలె, చమురు లేని దీపంవలె త్వరలో నశించిపోయేదాని లాగానే చూస్తారు. కొందరు జనులు, "అయ్యా! మేము భగవంతుని గురించి ముసలితనంలో చూచుకొంటాం. ఇప్పుడు తొందర ఏమి వచ్చింది?" అంటూ ఉంటారు. వారికి ఆయుష్షుపై ఎంత నమ్మకం! అట్లు వారు నమ్మి మోసపోవుటలేదా?
తండ్రీ! మహర్షీ! మన పెద్దలు 'అశ్వతరి' అనే మృగం గురించి చెపుతూ ఉంటారు. అది ప్రసవించగానే మరణిస్తుంది. అయినప్పటికీ గర్భహేతువు అయినట్టి 'సంగమము' ను కోరుకొంటూనే ఉంటుంది. అట్లాగే లోకులుకూడా "మాకు ఎంతో ఆయుష్షు ఉండుగాక” అని కోరుకొంటున్నారు. కాని మూఢత్వం ఆశ్రయించి చిత్త ప్రశాంతతను కోల్పోయిన తరువాత దీర్ఘాయుష్షు ఉండి మాత్రం ప్రయోజనమేమున్నది? జీవించి ఉన్నందుకు ప్రయోజనంగా సర్వ విధ దుఃఖరహితమగు పరమానంద రూపమైనట్టి బ్రహ్మవస్తువు సాధించాలి. అఖండానందము, పరమశాంతి నిలయము అయిన ఆత్మను పొందినప్పుడే జీవితం సార్థకమౌతుంది.
తరవో2పి హి జీవన్తి, జీవన్తి మృగ పక్షిణః | స జీవతి మనో యస్య మననేన నజీవతి ॥ (XIV-11)
వృక్షాలు, మృగాలు, పక్షులు కూడా జీవిస్తున్నాయి. కాని ఏం లాభం? ఎవనికైతే, ఈ దృశ్య సంకల్పము యొక్క మననము క్షీణిస్తుందో, అట్టి మనస్సు కలవాడే వాస్తవమైన జీవితమును అనుభవిస్తున్నాడని నా అభిప్రాయం. ఈ జీవితము పట్ల, ఈ కనబడే దృశ్య వ్యవహారము పట్ల సరైన అవగాహన కలిగివుండాలి. సత్యదృష్టిని అవలంబించి వాసనలను త్యజించివేయాలి. తత్త్వబోధ పొంది ధన్యులు కావాలి. అట్టివారి విషయంలో మాత్రమే ఆయుష్షు ధన్యత చెందుతుంది. ఇక
Page:23
తక్కినవారి విషయం ఏమి చెప్పమంటారు? వారు ముసలి గాడిదల వలె ధన, దార, శాస్త్రాది విషయములను మూలుగుతూ మోస్తున్నారు. (శాస్త్రజ్ఞానం కూడా 'కామము' మొదలైన రోగములచే పీడింపబడేవారికి, దృశ్య విషయములపట్ల అనురాగం పెంచుకొన్నవారికి భారముగానే పరిణమిస్తోంది). కనుక, “జ్ఞానం సంపాదించుకోవాలి" - అని అనుకొనేవారు ముందు కామాదులను జయించాలి. పెద్దబరువు మోసేవాడు ఆ బరువును దించుకొంటేనే సుఖిస్తాడు కదా!
చిత్తశాంతి లేనివారికి ఆ చిత్తమే పెనుభారము అవుతోంది. ఈ చిత్తము అనుక్షణం అనేక సంకల్పములను ఆహ్వానించి కలత చెందుతోంది.
అయితే, కొందరు మాత్రం, “ఇది ఆత్మ, ఇది అనాత్మ" అని ఎరిగినవారై శరీరాభిమానం త్యజించివేస్తున్నారు. ఈ శరీరమును కూడా ఇతర దృశ్య పదార్థముల వలె ఒకానొక బాహ్యమైన వస్తువువలె చూస్తున్నారు. వారి బుద్ధి నిర్మలం కాగా మనస్సుకు స్వస్థత చేకూరుతోంది. మనో స్వస్థత లేనిచోట అందమైన రూపం, శరీర పుష్టి, లౌకికమైన తెలివితేటలు, దీర్ఘాయుష్షు, శాస్త్రజ్ఞానం, సంకల్ప సామర్థ్యం, గొప్పజ్ఞానశక్తి - - ఇవన్నీ నిష్ప్రయోజనమే అవుతున్నాయి. పెనుభారముగా పరిణమించి అనేక దుఃఖములను ప్రోగుచేసి పెడుతున్నాయి. అయితే మేము యౌవన గర్వాతిరేకం చేత ఇదంతా గుర్తించలేకున్నాము. ఏవేవైతే చూచుకొని “మేము ఇంతటి వారముకదా” అని అనుకొంటున్నామో, అవన్నీ మా వెంటే ఉంటున్నాయా? లేదు. కొద్దికాలంలో మా మానగర్వాలన్నీ నేలరాచి మమ్ములను విడచిపోతున్నాయి. ఈ ఆయుష్షు స్థిరమైన సుఖంగాని, సారభూతమైన అంశముగాని కలిగిఉండనప్పుడు ఇది గుణహీనమై వ్యర్థమే అవుతుంది కదా!
నూనం నిగరణాయాశు ఘన గర్ధమనారతం । |
ఆఖుర్మార్జాలకేణేవ మరణేనావలోక్యతే ॥ (XIV-19)
పిల్లి ఎలుకను ప్రియంగా చూచునట్లు ఒక ప్రక్క మృత్యువు ప్రాణిని మ్రింగి వేయడానికి మహాభిలాషతో నిరంతరం చూచుచున్నది. ఈ విషయం జీవులు ఎట్లా మరచుచున్నారో నాకు అర్థం కావటం లేదు.
రోగాలు శరీరాన్ని డొల్లచేస్తున్నాయి. వార్ధక్యం నక్కలాగా కాచుకు కూర్చున్నది. జరామరణాలు ప్రియమిత్రులవలె కరచాలనం చేసుకోవటానికి ఉత్సాహపడుచున్నాయి. ఇదంతా ఇట్లుండగా అనేకులు ఇదంతా గమనించకుండా తీరికగా కూర్చుని వర్తమానం వ్యర్థం చేసుకొంటున్నారు.
11. అహంకార స్వరూపం
అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ 'అహంకారం'. ఇతడు కారణం లేకుండానే పుట్టుచున్నాడు. రూపం లేకుండానే వ్యవహరిస్తున్నాడు. సంసారారణ్యంలో విచ్చలవిడిగా సంచరించుచున్నాడు. పరీక్షించి చూస్తే “అహం” అనే అభిమానమే ఇతని రూపం. అట్టి అభిమానం వలననే రాగద్వేషాది
Page:24
సర్వదోషాలు వచ్చిపడుతున్నాయి. ఆకారాదులు లేకపోయినప్పటికీ, ఇది అందరిని బాధిస్తోంది. ఓ మహర్షీ! భూమ్యాకాశాలమధ్య మరే శత్రువును చూచి నేను భయపడుటలేదు. కాని, ఈ అహంకార శత్రువు గుర్తుకు వచ్చినపుడు మాత్రం గజగజవణుకుచున్నాను. “దీని ఉత్పత్తికి కారణమేమి?” అని పరిశీలిస్తే 'అజ్ఞానమే' అని సమాధానం లభిస్తోంది. దీనినుండి సర్వ ఆపదలు, మనోవ్యధలు, వికారాలు జీవునకు ప్రాప్తిస్తున్నాయి.
'అహంకారము' అనే కిరాతకుడు 'మాయ' అనే వలపన్నుచున్నాడు. ఈ జీవులు అజ్ఞాన మృగములవలె అందులో చిక్కుకొంటున్నారు. ఇతడు, ఎందుకో, నా పాలపడ్డాడు. నన్ను బంధించయత్నిస్తున్నాడు. క్షణంలో శాంతి, సమత, సద్గుణములను పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇంతటి శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేక పోతున్నాను. ఇక భోగముల మాట చెప్పేదేమున్నది?
మొదలే అసత్యమై ఉన్న ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో, గ్రహిస్తామో, వాంఛిస్తామో అవన్నీ కూడా అసత్యములే అవుతాయి కదా! అహంకారముపై నమ్మకమున్నంతకాలం, ఆశ, తృష్ణలు ఉంటాయి. అందుచేత నేను అహంకారమును తిరస్కరిస్తున్నాను. “నేను రాముడనే కాదు. నాకే కోరికలూ లేవు. నాకు చెందినదంటూ ఎక్కడా ఏదీలేదు. నేను దీనికి చెందినవాడనుకాను” అనే నిశ్చయం చేసుకొంటున్నాను. “నా మనస్సు ఎటూ ప్రసరించకుండుగాక” అని శాసిస్తున్నాను. కాని ఏం లాభం? అజ్ఞానం ఉండి ఉండుటచేతనే కాబోలు నాకు ఏమీ తెలియకయే ఉన్నది.
‘దేహము’ అనే కీకారణ్యంలో 'అహంకారము' అనే పిశాచం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడు ఇట్టివే అగు అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకొని ధరిస్తున్నాడు. ఈ జగత్తే అతని 'మెడ'వలె ఉన్నది. అసలు ఈ 'అహంకారము’ యొక్క నివాస స్థానము ఎక్కడ? అంతఃకరణమే కదా! ఎప్పుడైతే అంతఃకరణము అమిత చంచలమై దుర్వాసనలతో కూడినదై, సద్గుణములు లేనిదై ఉంటోందో, అప్పుడు దానిలో అహంకారము వచ్చి తిష్టవేస్తోంది. సర్వ ఆపదలను వెంటబెట్టుకొని సంచరించే, ఈ అహంకారమును ఆశ్రయించి రాజ్యాదులు ఏలమని నన్ను మీరు ఆజ్ఞాపించకుండెదరుగాక! దానికి బదులు, ఈ అహంకారమును జయించివేయగల ఉపాయాలేమైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. మనస్సులో పేరుకొన్న ‘మహామోహము' అనే మంచు మీ ఉపదేశ ఉష్ణకిరణ ప్రభావంచేత కరిగిపోవాలనే కోరుకొంటున్నాను.
12. మనస్సు - చిత్తము
సర్వ కార్యములు సాధించటంలో దిట్ట అయిన ఈ 'మనస్సు' గురించి చెపుతాను. వినండి. ఇది అనేక కామక్రోధాలతో నిండి అతి శిథిలమై ప్రవర్తిస్తోంది. అన్ని వేళలందు దోషదుర్గంధములతో కూడుకొన్న విషయానుభవములకొరకే పరుగులు తీస్తోంది. పెద్దలు చెప్పే మార్గమును, సత్కార్యములను
Page:25
స్వీకరించమన్నప్పుడల్లా మొరాయిస్తోంది. దీని కదలికలు నెమలి పింఛపు తుదికొనలాగా అతి చంచలం. తండ్రీ! మీరు వీధికుక్కను చూచారు కదా! అది ఏ పనీ లేకపోయినప్పటికీ వీథులలో అటూ-ఇటూ తిరుగుచు ఆయాసపడుతూ ఉంటుంది కదా! అట్లాగే ఈ మనస్సు కూడా నిరర్థకంగా, నిష్కారణంగా, నిష్ప్రయోజనకరంగా అన్నివేళలలో 'అటూ ఇటూ తిరుగుతోంది. నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా దీనివేగం ఆగటం లేదు. పోనీ, పొందేది ఏమైనా ఉన్నదా? లేదు.
ఓటికుండలాగా అది ఏమాత్రం నిండటంలేదు. ఎప్పుడైనా ఏదైనా లభించినా అంతటితో తృప్తిపడదు. తన సంకల్ప పరంపరలను త్యజించే శక్తిలేక అనేకసార్లు దీనత్వం, వ్యాకులత్వం పొందుతోంది. దురాశల వలలో చిక్కుకొన్న దానికి 'తృప్తి' అన్నమాట ఎక్కడిది? జల్లెడలో నీరు పోస్తుంటే నిండేదెప్పటికి చెప్పండి.
ఈ మనస్సు* గుంపులోంచి చెదరిన కోతిలాగా అవిశ్రాంతంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తోంది. హే బ్రహ్మవేత్తా! “స్తంభజాడ్యము" (అవయవములు బిగతీసుకుపోయే ఒక వ్యాధి)చే అవయవములు అస్వాధీనమగుటచే ఒకడు ఒకచోట పడి ఉన్నాడనుకోండి.... అతడు ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చలేక బిక్కచూపులు చూస్తూ ఉంటే, ఎక్కడి నుండో ఒక ఊరకుక్క అతనిని పీక్కుతినాలని "భౌ భౌ” మంటూ సమీపిస్తుంటే అతని మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ మనస్సు నాకు అలా కనబడుతోంది. సుడిగాలిలో చిక్కుకొన్న ఎండుటాకువలె దీనిచే నేను చాలా దూరం తీసుకుపోబడ్డాను. అది నన్ను ఎక్కడ నేలకూలుస్తుందో ఏమో?
ఈ మనస్సులో ‘చిత్తవృత్తులు' అనే సుడిగుండాలు ఉన్నాయి. క్రూరత్వము, పరవంచన, దురభ్యాసము మొదలైనవి ఇందులో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
మహాత్మా! నూతిలోకి దింపబడిన ఏతామును ఏతాము త్రాడు క్రిందికి పైకి త్రిప్పుతూనే ఉంటుంది చూచారా? మేము కూడా భోగవాంఛలతో, కామక్రోధములతో కూడుకొన్న వారమై మూడు లోకములలో మనస్సుచే త్రిప్పబడుచున్నాం. ఈ మనస్సును పట్టుకొని నియమిద్దామా అంటే, ....... దీనికి ఒక రూపమే లేదాయె! తమవంటి జ్ఞానులు “మనస్సు అనబడు ఒకానొక వస్తువులేదు. దానికి అస్థిత్వమే లేదు” అని చెప్పుతూ ఉంటారు. అజ్ఞానబాలుడు కథలోని భూతమును చీకట్లో ఎదురుగా ఉన్నట్లు ఊహించుకొని బాధపడునట్లు “లేదు” అని చెప్పబడుతున్న మనస్సు మాకు ప్రాప్తిస్తోంది.
ఈ చిత్తము క్రోధాగ్నిజ్వాలలతో నన్ను ఒక ఎండుగడ్డి పరకవలె కాల్చి వేస్తోంది. ఇది అగ్నికంటె వేడి. కొండకంటే కఠినం. దీనిని మేము అసలు జయించగలమంటారా? స్వల్ప వస్తువులకోసం పరుగెత్తుతూ, స్వల్పత్వమునే పొందుచూ, నరకాదుల రుచి ఏమిటో మరల మరల
* ఒక పదార్థమును మనం ప్రీతిపూర్వకంగా ఆశ్రయించినప్పుడు మన మనోచిత్తములు ప్రవర్తిస్తున్నాయి. ప్రీతి కలిగియుండు స్వభావం= చిత్తము; మననము చేయు స్వభావము = మనస్సు
Page:26
చూపించే ఈ చిత్తము యొక్క గమనం నిరోధించటమెట్లా చెప్పండి? ఒక సింహమును ఉత్తచేతులతో బంధించవచ్చునేమో. సముద్రజలమునైనా పానం చెయ్యవచ్చునేమో. హిమాలయ పర్వతాన్ని కూడా పెకిలించవచ్చునేమో. అగ్నినైనా భక్షించవచ్చునేమో. ఈ చిత్తమును నిరోధించటం మాత్రం అంతతేలికైన విషయం కాదు. ఇది అవివేకమును ఆశ్రయించి ఉండుటచే, అన్ని ఉపాధులందు ఏకస్థమైయున్న ‘ఆత్మ’ దీనికి ఏమాత్రం కనిపించటంలేదు. ఏమి తెలుసుకొన్నా, ఎంత బోధింపబడినా, ఎల్లప్పుడూ భేద భావమునే పొందుతోంది. సామ్య - సమతా భావములను హరించివేసి దుఃఖములను కలుగచేయుటలో బహుప్రావీణ్యత చూపుతోంది. అనేక విషయాలలో అంతులేని ఆసక్తిని కల్పించుకొని అందులో జడత్వం వహించి నిదురపోతోంది. ఎంతలేపినా నిదురలేవదు. సమరసపూర్వకమగు ఆత్మజ్ఞానము కొరకు ఏమాత్రం ప్రయత్నం చేయదు. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు అర్థమగుటలేదు.
ఈ మనస్సే అంతటికీ కారణం. ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి. విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి. కొండపై అడవులు పెరుగుచున్నట్లు, సర్వ సుఖ దుఃఖాలు ఈ మనస్సు నుండే బయలుదేరు చున్నాయి. ఆచార్యులు ఎంత బోధించినా ఇది తన జాడ్యమును త్యజించుటలేదు. క్రూరుడగు పోకిరిబాలుడు మరొక పసిబాలుని బెత్తము చూపి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తోంది. ఈ ‘మనస్సు’ అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే కదా! అట్టి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖదుః ఖ వికారాలు కూడా క్షీణిస్తాయి. తమవంటి మహాత్ములు చిత్తమును జయించుటచే సర్వము జయించివేశారు. అట్టి ఈ మనస్సును నశింపచేయ నిశ్చయించుకొన్నాను. ఇక నాకీ రాజ్యాదులతో పనేమున్నది చెప్పండి?
13. ఆశ - - తృష్ణ
ఎప్పటినుండో తెలియదుకాని, ఈ హృదయంలో “ఆశ” అనే అజ్ఞానాంధకారం వ్యాపించియున్నది. కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి. నేను ఏమైనా సద్గుణాలను ఆశ్రయించాలని అనుకొంటూ ఉండగానే, ఇంతలో ఎక్కడినుండో తృష్ణ (Desire) వచ్చిపడుతోంది. ఎలుక ఇంట్లో ప్రవేశించి నూతన వస్త్రములను కొరికి పాడుచేయునట్లు, ఇది మా ఉత్తమ ప్రయత్నములను, సత్ప్రవర్తనలను పాడుచేస్తోంది. ఇక మేము వివేకము పొందేది ఎన్నటికి? ఆత్మ దర్శనం చేసేదెప్పటికి? వలలో చిక్కుకొని ఆక్రోశించే పిట్టలాగా మేము ఆశాపాశక్లేశ దుర్వాసనలలో పీకల దాకా చిక్కుకొన్నాం. అనేక తృష్ణలచే దగ్ధులమగుచున్న మేము అమృతంలో స్నానంచేస్తే మాత్రం సేద తీరుతుందా? ఊరట కలుగుతుందా?
అనుమానమే.
Page:27
బురదలోని తడిని సూర్యకిరణాలు పీల్చివేయునట్లు, మా అంతఃకరణములోని కొద్దిపాటి దయాదాక్షిణ్యములను తృష్ణవచ్చి పీల్చివేస్తుంటే మేము నిస్సహాయులమై చూస్తున్నాం. చూస్తూ ఉండగానే అది వచ్చి మా కళ్ళు కప్పివేస్తోంది. కన్నులు ఉండికూడా గ్రుడ్డివారము అవుచున్నాము. మామూలుగా అతిశాంతచిత్తుడైనవాడు కూడా, తృష్ణచేత కలవర పెట్టబడుచున్నాడు. ఎక్కడన్నా ధన, కనక, నారీజనమును చూస్తేచాలు, ఈ తృష్ణ ఎక్కడినుండో బొట్టుపెట్టి పిలిచినట్లు వచ్చిపడుతోంది.
ఆశ చేత నిండియున్న మనస్సు “నేను ఆశ్రయించబోయే వారు నాకు అనుకూలురా? కాదా? ఆయా వస్తుజాలం వాస్తవానికి శ్రేయోదాయకమా, ప్రమాదకరమా?" అని కూడా పరిశీలించుటలేదు. దీనంగా వారిని, వీరిని తుచ్ఛ పదార్థముల కొరకు అర్థిస్తోంది. "తాను తలచినది సాధ్యమా? అసాధ్యమా?” అనికూడా పరీక్షించుకోకుండా ఆతురపడుతోంది. కాని, ఏం లాభం? వయస్సుచెల్లిన
కామాతురత వలె ఏమీ పొందకయే పోవుచున్నది. దున్నపోతు ముక్కుకు త్రాడుకట్టి లాగబడునట్లు అది మమ్ములను దిక్కులన్నీ త్రిప్పుతోంది. పుత్ర, మిత్ర కళత్రాదులు అనే వలలను మాపై విసిరి మహామభ్యపెడుతోంది. అంతఃపురంలో సుఖశయ్యపై శయనించిన వానిని కూడా క్షోభింపజేసి, అడవిపాలు చేస్తోంది. ఉన్న కాస్త వివేకాన్ని ఊరేగిస్తోంది. లేని జాడ్యాలన్నీ తెచ్చిపెడుతోంది. ఆహా? నిర్దయుడగు ఆ భగవంతుడు ప్రపంచములోని జీవులందరిని 'తృష్ణ' అనే త్రాటితో 'సంసారము’ అనే స్తంభమునకు కట్టి పారేస్తున్నాడు. అచేతనుణ్ణి కీటకములు బాధిస్తున్నట్లు మేము ఆశచే బాధింపబడుచున్నాం.
అపి మేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్ తృణీకరోతి తృప్లైకా నిమేషేణ నరోత్తమమ్ II (XVII-50)
మేరువుతో సమానమైన ధీరుడైనా, మహాప్రాజ్ఞుడైనా, నరోత్తముడైనా - తృష్ణచేత క్షణంలో జయింపబడుచున్నాడు.
ఓ మహాశయా! విశ్వామిత్రా! ముసలినర్తకి ఏమాత్రం ఆనందకరం కాకపోయినా తన నృత్యం మానలేకపోయినట్లు, ఈ 'ఆశ' అనేది పొందే తృప్తి అంటూ ఏదీ లేకపోయినా, ఈ సంసారారణ్యంలో తన చపల సంచలనం మాత్రం మానలేకపోతోంది. సంసారములోని దోషములన్నిటిలో ఇది అతితుచ్ఛమైనది. ఇది ఉన్నంతవరకు మాకు మోహపూరితమైన పాట్లు తప్పవు.
ఈ లోకంలో జీవునకు దుఃఖమంతా నశించాలంటే ఒక్కటే ఉపాయం ఉన్నది. అది “విషయచింతన లేకపోవటమే”. ఆశయొక్క రూపాంతరమే విషయచింతన అయివున్నది. కనుక ఆశను త్యజిస్తే జీవుడు ఒడ్డుకు చేరినట్లే. అయ్యో! ఆశ, స్త్రీ, రోగబాధ - ఈ మూడు ఎంతటి గంభీరపురుషుడినైనా తమ వైపు అభిముఖం చేసుకొంటున్నాయి కదా! ఈ తృష్ణ అంత నీచంగా, ఘోరంగా పదునైన కత్తివేటుగాని, వజ్రాయుధ ఘాతంగాని అగ్నిహోత్రంగాని బాధింపజాలదనే నా అభిప్రాయం. ఎందుకంటారా? ఇది హృదయంలోనే ఉండి జీవుణ్ణి దహించివేస్తోంది కదా! ఇక
Page:28
తప్పించుకోవటానికి అవకాశమెక్కడిది చెప్పండి? దాని వేగం ఎంతటిదంటే, ... ఆధివ్యాధులు”* గాని, శరీరశిథిలత్వంగాని దాని ప్రబలత్వాన్ని శమింపచేయలేక పోతున్నాయి. చేప ఎఱకోసం తాపత్రయ పడునట్లు, అది ఎదురుగా కనిపించినదంతా 'తనదే' అని అనుకొంటుంది. వృద్ధ మాంత్రికురాలివలె ఎంతో క్రూరమైనది కూడా.
అయినాసరే, కొందరు మహామహులు దానిని “వివేకము” అనే కత్తితో నరికి వేస్తున్నారు. అవిద్యాపూర్వకమైన కామ్యకర్మల నుండి బైటపడి పరమశాంతిని పొందగలుగుచున్నారు. ఈ ప్రపంచమంతా ఎందులో అయితే నిబిడీకృతమై ప్రవర్తిస్తోందో, - అట్టి ఆశను నేను విజ్ఞాన వివేకాదులచే జయించి వేయ నిశ్చయించుకొన్నాను. ఈ ధన, జన, సామ్రాజ్యాదులు ఆశను అధికమే చేస్తాయి కదా! అందుచేత ఇవి నాకు అక్కర్లేదు. సర్వ వాంఛలు నశిస్తే మనస్సుకు ఉత్తమ చికిత్స ప్రాప్తించినట్లే కదా!
14. దేహము
ఈ దేహము ఉన్నది చూచారా? ఇది రక్తమాంసాదులతోనూ, తడిసిన ప్రేగులతోను, నాడులతోను, మలమూత్రాదులతోను నిండి ఉన్నది. ఒక గొప్ప కళాకారుడు తయారుచేసిన విచిత్రమైన బొమ్మవలె ఒప్పుచున్నది. క్షణభంగురమైన ఈ దేహములు జీవునకు అనేక వికారములతో కూడినవై దుఃఖము కొరకే ఏర్పడుచున్నాయి. జీవుడు వీటిని ఎందునిమిత్తం గ్రహిస్తున్నాడు? ఆనందం పొందటానికే కదా! అట్టి ఆనందం సంసార సముద్రాన్ని దాటివేసినప్పుడే లభిస్తుంది.
కానీ ఏం లాభం? ఈ జీవుడు పదేపదే ఇంద్రియములచే మోసగింపబడు చున్నాడు. “నేను ఒకానొకప్పుడు ఈ దేహం గ్రహించాను. మరొక సమయములో త్యజించబోవుచున్నాను” అనునట్టి విజ్ఞతను (లేక ఎరుకను) సమూలంగా మరచి వర్తమాన దృశ్యముతో సంసర్గము కలిగి ఉంటున్నాడు. అనేక ఉపాధులందు ప్రవేశించి ఎప్పటికప్పుడు “ఈ శరీరమే నేను” అని భావనచేసి, ఆ ఉపాధియొక్క హానివృద్ధులను తనకు ఆపాదించుకొంటున్నాడు.
ఈ శరీరము వాస్తవానికి జడమే అయివుండికూడా, 'ఆత్మ' సమీపమున ఉండుటచేత ‘చేతనము’వలె ప్రవర్తనము కలిగి ఉంటోంది. అయితే దీనికి "పుట్టుక, అభివృద్ధి, పరిణామము, క్షయము, వినాశనము” అనే వికారాలు ఎల్లప్పుడు ఉండనే ఉన్నాయి కదా! అనేక రోగములు, తాపములు అనుక్షణం దీనిని వేధిస్తూ ఉన్నాయి. అనేక బాధలకు వికారములకు, ప్రమాదములకు ఆలవాలమైయున్న ఈ శరీరము కలిగియుండుట సుఖకరమని ఎవరంటారో చెప్పండి? అయినప్పటికీ ఈ జీవుడు, “ఇది నాకు సర్వదా ఉంటేనే బాగుంటుంది. అట్లే ఉండుగాక! ఇది తొలగితే, ఇంకేమైనా
ఆధి మానసిక రుగ్మత వ్యాధి = శారీరక రుగ్మత
Page:29
ఉన్నదా? ఎంతటి హాని! ఎంతటి విపత్తు! దీనితో నాకు ఏర్పడుచున్న మాత, పిత, భర్త, భార్య, సోదర, పుత్ర, మిత్రాది సంబంధములు ఎంతటి ప్రియమైనవి! ఇవన్నీ సత్యములే కదా” ఇటువంటి రూపములు గల అనేక అసత్యపు అభిప్రాయ పరంపరలు కలిగి ఉంటున్నాడు.
హే మహర్షీ! ఇది కొంచెమునకే సంతోషిస్తున్నది. కొంచెమునకే దుఃఖిస్తుంది. ప్రపంచంలో ఇంతటి గుణహీనమైనది ఇంకేమన్నా ఉన్నదా? ఇందులో ప్రవేశించిన జీవుడు ఈ దేహము యొక్క వాస్తవత్వ - అవాస్తవత్వములు గ్రహించలేక 'ఇంద్రియ విషయములు' అనే తృణములను నెమరవేస్తూ దివారాత్రములు గడుపుచున్నాడు. అంతేకాని, 'పరమ పురుషార్థము' అంటూ ఏదీ పొందలేకయే ఉన్నాడు. ఇది అతనికి స్వగృహమువలెనే అనేక పదార్థముల కలయికచే ప్రాప్తించుచున్నది. “ఒకనాటికి దీని శిథిలత్వము అనివార్యము” అనే విషయం అందరికీ తెలిసిందే. వేఱువేఱు చోట్ల నుండి అరువు తెచ్చుకొని ఒకచోట ఒక వరుసక్రమంలో అమర్చబడిన వేఱువేఱు పదార్థముల అమరికవలె ఈ శరీరము నాకు కనబడుచున్నది.
దేహ వృక్షములు - బాటసారులు : చంకలు, భుజాలు వంటి అనేక పదార్థములతో కూడుకొని, వృక్షముతో పోల్చతగిన ఈ శరీరమునందు, బహుదూరపు బాటసారులగు ఈ జీవులు ఎక్కడినుండో వచ్చి కొంతసేపు విశ్రమించి, మరల ఎటకో బయల్వెడలుచున్నారు. ఈ శరీరము కలిగియున్న కొద్దిసేపట్లోనే, “ఇది నా శరీరం. దీని పేరు ఇది. ఈమె నా భార్య. వీరు నా పిల్లలు. ఇది నా గృహం. ఇవి నాకు ఉన్న పేరు ప్రతిష్ఠలు" - అను రూపముగల అనేక సంబంధములను కల్పన చేసుకొని అనుభవిస్తున్నాడు. ఇట్టి తుచ్ఛ శరీరము పొందినట్టి ఇతడు “ఇది నాది, ఇది నాది కాదు” అంటూ మీమాంస ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమగుటలేదు. ఇట్టి ఈ నా యొక్క - - తదితరుల శరీరములపై ఒకడికి ప్రేమ ఎందుకు? మరొకడికి ద్వేషమెందుకు? ఈ నా దేహము దుఃఖములందు, దారిద్ర్యములందు పొరలుగాక! లేదా, సుఖములందు, సమృద్ధములందు తేలియాడు గాక! దీనితో నాకేమి సంబంధం? ఇది ‘ఆయుర్దాయం' అనే నదియొక్క జలం వంటిది. జన్మ - మృత్యువులే దీని ఈవలి ఆవలి ఒడ్డులు.
విజ్ఞులైన పెద్దలు “నాయనలారా! ఈ 'శరీరము' అనేది 'సంసారము' అనే సముద్రమును దాటుటకు తెప్పవంటిది. తగినంత జాగరూకులై దీనిని సరియైన ప్రయోజనమునకై వినియోగించండి” అని జనులందరినీ హెచ్చరిస్తున్నారు. విన్నవారు వింటున్నారు. విననివారు ఈ మాటలను అవహేళన చేస్తున్నారు. కొందరు తగినంత జాగ్రత్త వహించి విజ్ఞానమును పొంది ఆవలి ఒడ్డుకు చేరుచున్నారు. ఇక మరికొందరో, మధ్యలోనే మునిగిపోతున్నారు. శరీర తాదాత్మ్యము పొందినవారై “నాది-నేను” అను రూపముగల అనేక భ్రమలకు లోనగుచున్నారు. ఫలితం? అంతులేని దుఃఖములు, వేదనలు. రక్త మాంసములచే నిర్మించబడి, ఒకానొక బాహ్య వస్తువులాగానే దర్శన మిస్తున్న ఈ శరీరముపై 'నాది' అనే అభిమానం అసలు ఎందుకు కలుగుతోంది చెప్పండి?
Page:30
దేహగృహం : 'దేహము' అనే గృహ ప్రాంగణములోగల పశువుల కొట్టాంలో ‘ఇంద్రియములు’ అనే పశువులు కట్టివేయబడ్డాయి. 'ఆశ' అనేది ఈ గృహము యొక్క గడుసరి ఇల్లాలు. ‘చిత్తము’ అనువాడే ఇక్కడి సరంజామా అంతా ప్రోగుచేసే సేవకుడు. విచారించి చూస్తే, సారమైన వస్తువంటూ ఇందులో ఏదీ లేదు. అందుచేత ఇదంతా దుఃఖకరమేకాని, వాస్తవసుఖమైనదేదీ ఇందులో నాకు కనిపించుటలేదు. ఈ శరీరగృహం 'నోరు' వాకిలిగా, 'నాలుక' గడియగా, 'వెన్నెముక' స్తంభముగా కలిగియున్నది. స్వల్ప కాలంలో నేల కూలబోయే ఈ శరీరగృహం పైకి మాత్రమే అందంగా కనిపిస్తోంది.
అయినా ఎంత రాజ్యముంటే ఏం లాభం? ఎట్టి సుందర దేహముంటే ఏమున్నది? అతికొద్ది కాలంలో ఇది కాలునిచే కబళించబడుతోంది కదా! ఈ దుష్టరోగములు సత్కర్మశీలుణ్ణి మాత్రం వదలుచున్నాయా? లేదు.
లోన రక్త మాంసములతో నిండియుండి, బైటకు 'చర్మము' అనే సున్నంతో పూయబడి, ఈ దేహము ఒక యంత్రమువలె చలించుచున్నది. 'మనస్సు’ అనే భూతం దీనిలో ఉండి దీనికి నిలకడ లేకుండా చేస్తోంది.
నశించుటయే ధర్మముగా గల ఇట్టి స్త్రీ-పురుషుల శరీరములందు జనులకు కనబడే రమ్యత్వమేమిటో నాకు అర్థమగుటలేదు. దీనికి ఏమైనా తారతమ్య జ్ఞానం ఉన్నదంటారా? ఖరీదైన వంటకాలతో సుఖింపచేసినా, లేక దారిద్ర్యాదులచే బాధింప చేసినా కాలక్రమంగా ముసలితనం పొందకుండా ఉండదుకదా! “ఇదిగో, ఇక్కడ మేము సుఖంగా ఉన్నాము” అని అనుకొంటూ ఉండగానే కాలం అన్నిటినీ క్షణంలో మార్చి వేస్తోంది.
కింశ్రియా? కిం చ రాజ్యేన కింకాయేన? కిమీహి తైః ? దినైఃకతిపయైరేవ కాలః సర్వం వికృంతతి ! (XVIII-37)
ఈ శరీరము, ధనము, రాజ్యము, మనోరథములు, వాటికి సంబంధించిన చేష్టలు వీటన్నిటివలన ప్రయోజనమేమున్నది చెప్పండి? కొద్ది రోజులలో కాలము అన్నిటినీ త్రుంచి వేయబోతోంది కదా!
ఎంతోకాలం అత్యంత ప్రియముగా జీవునిచే పెంచి పోషించబడిన ఈ శరీరము ఒకానొక రోజు 'మరణము' అనే తన ఇష్టసఖుడు ఎదుటికి రాగానే, ఆ జీవుడిని అవిశ్వాస పూర్వకంగా త్యజించి (మరణ సఖునితో) ఎటకో లేచిపోతోంది. మెఱుపులను, శరత్కాల మేఘములను, ఊహాకల్పిత భవనములను, మాయాకల్పిత వస్తువులను “ఇవి వాస్తవం, శాశ్వతం" అని నమ్మియుండే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? ఈ శరీరం విషయం కూడా ఖచ్చితంగా అంతే.
హే మహాత్మా! ఒకానొక పిల్లి ఏ రాత్రివేళో ఒక 'చినిగి డొల్లపడి, ధ్వనింపని డోలు' నందు చిక్కుకొంటే ఎట్లా అగచాట్లు పడుతుందో మా ఈ అవస్థలు కూడా అట్లాగే ఉన్నాయి. మాంసము,
Page:31
నరములు, బొమికలతో నిర్మించబడిన ఈ 'శరీరము' అనే గూటిలో చిక్కుకొన్న మా వంటి అజ్ఞానుల అగచాట్లు ఏమని చెప్పమంటారు? మాకు ప్రాప్తించిన “ఈ శరీరమే నేను” అనే ఈ జాడ్యం తొలగేది ఎట్లా?
ఈ శరీర వృక్షము యొక్క ఆశల కొమ్మలపై ‘చిత్తము' అనే కోతి గంతులు వేస్తోంది. ఈ వృక్షమును చిరకాలంగా ఆలోచనలు, దుఃఖాలు పురుగులవలె తొలుస్తున్నాయి. 'తృష్ణ' అనే కొండచిలువ చుట్టలు చుట్టుకొని వ్రేలాడుతోంది. దీనిలో కొన్ని పక్షులు, పిట్టలు గూడులు కట్టుకొని నివసిస్తున్నాయి. అవే ఈ కోపాలు, తాపాలు, నవ్వులు, ఏడ్పులు, పుణ్యాలు, పాపాలు, ఇంద్రియాలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు మొదలైనవి. కాముకులైన బాటసారులు (జీవులు) యౌవనము పైగల అపేక్షచే ఇందు విశ్రమించటానికి వస్తున్నారు. ఇది 'అహంకారము' అనే గట్టుపై 'వాసనలు' (tendencies) అనే వ్రేళ్ళతో ఆయాసమే సంచలనముగా కలిగి ఉన్నది.
కాలయాపన : ఈ 'శరీరగృహం'లో అహంకార గృహస్థుడు 'తృష్ణ' అనే ఇల్లాలుతో కాపురం చేస్తూ రోజులు గడుపుచున్నాడు. ఇంద్రియ పశువులను మేపుకొంటూంటే కాలమంతా ఎటుపోతోందో ఆతనికి తెలియుట లేదు. ఇక, రక్తమాంస బొమికలచే నిర్మించబడిన ఈ శరీరం 'ముసలితనము' అనే శైథిల్యమునకు ఎదురుచూస్తున్నట్లు లేదంటారా? 'చిత్తము' అనే భృత్యుడు పాపం, ఇది పడిపోకుండా చూస్తున్నాడు. ఈ దేహగృహంలో "అబద్ధము - అజ్ఞానము” అనే పేరుగల రెండు నిలువెత్తు స్తంభాలు ఉన్నాయి. లోపల ఎక్కడి నుండో 'దుఃఖము' అనే బాలుడు ఎలుగెత్తి రోదిస్తున్నాడు. ‘సుఖము’ అనే మరొక బాలుడు ఆదమరచి నిదురపోతున్నాడు. 'దురాశ' అనే పాలిపోయిన క్రూరమైన ఎత్తుపళ్ళుగల దాసి పళ్ళు ఇకిలిస్తూ ఈ గృహంలో అటు ఇటు సంచరిస్తోంది. ఈ ఇంటిలో "ప్రాపరచిక విషయములు” అనే అనేక కుండలు ఆ మూల కొన్నీ, ఈ మూల కొన్ని ఉన్నాయి. ఆ కుండలలో “అజ్ఞానం” అనే ఉప్పునీరు తప్ప మరింకేమీ లేదు.
ఇందలి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి అట్టి ఉప్పునీటితో నిండి ఉన్నాయి. వెదుఱు బొంగులలో గాలి ప్రవేశించి ఈల శబ్దం చేస్తున్నట్లు, పంచప్రాణాలు ఈ దేహమంతా సంచరిస్తున్నాయి.
క్షణంలో దుఃఖం. క్షణంలో ఆనందం. ఈ దేహం నాకు అనేక రుగ్మతలతో కూడుకొన్నదై అతి చంచలంగా కనిపిస్తోంది. ఆకు నుండి క్రిందకు వ్రేలాడే నీటిబొట్టువలె క్షణభంగురమైన ఈ దేహం ఏ క్షణంలో నన్ను వీడనున్నదో తెలియదు కదా! అందుచేత, ఇది నన్ను వీడకముందే, నేనే దీనిని లేనిదానిగా తిరస్కరించివేస్తున్నాను.
వహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః
సంసారాబ్దానిహోహ్యర్తే, కంచిత్తేషు నరం విదుః ॥ (XVII-47)
మహాత్మా! ఈ సంసార సముద్రమును చూచారా! కేవలం దహనం కొరకు మాత్రమే పనికివచ్చే అనేక శరీరాలు ఇందులో కొట్టుకుపోతున్నాయి. అట్లు కొట్టుకుపోయే వాటిలో కొన్ని కట్టెలను
Page:32
చూచి “వీరు నరులు” అని అంటున్నాం. నా శరీరం కూడా, ఒకానొక కట్టె. ఈ కనబడే జగదృశ్యము లందు “ఇవి సత్యము” అని చిరకాలంగా విశ్వాసం కలిగి ఉన్నవారిని చూస్తే నాకు జాలివేస్తోంది. ‘అజ్ఞానము’ అనే కల్లు త్రాగి ఉన్మత్తులై గంతులు వేయుచున్న అట్టివారికి ధిక్కారమగు గాక!
అయ్యో! ఒక ప్రక్క “విషయములు” అనే బురదనీటి మడుగులో అనేక శరీరాలు క్రుళ్ళిపోవటం ఈ జనులు చూస్తూనే ఉన్నారు. కాని వీరు తమ శరీరమేమిటో, (దీని స్వరూప స్వభావములేమిటో) గ్రహించలేక పోతున్నారు. గాలియొక్క రాకపోకలు తెలుస్తున్నాయి. మనస్సు యొక్క ప్రసరణం కూడా కొంత గుర్తించవచ్చునేమో. కాని, ఈ శరీరాలన్నీ ఎక్కడినుండి వస్తున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? అనేక పదార్థములతో కూడిన దీనిని ఎవరు ఎందుకు నియమిస్తున్నారు?
ఏదో 'అజ్ఞాతశక్తి' మాకు అర్థంకానిదై అన్ని వైపుల ఆవహించి ఉన్నదని నాకు అనిపిస్తోంది. అది మాకు "మానావమానములు, ప్రియాప్రియములు” మొదలైన రూపములుగల భ్రాంతిని చూపి మమ్ములను ఆకట్టుకొంటోంది. మా మనస్సులను హరించి మరల మరల మృత్యుముఖం వైపుకు దారులు చూపుతోంది.
ఓ దేవా! విశ్వామిత్రా! ఎవరైతే తమయొక్క అతి సూక్ష్మబుద్ధితో, “ఈ జడమగు దేహము నేను కాదు, నాకు ఈ దేహముతోగాని, ఈ దేహమునకు నాతోగాని సంబంధమే లేదు” అని గ్రహించి ఆత్మయందు విశ్రాంతి పొందుతారో, వారే మనుజులలో ఉత్తములు. ఆ విధంగా అతికొద్దిమంది మాత్రమే అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నారు. వారి జీవితములే ధన్యములు. ఇక మిగతా జనుల అవగాహనలన్నీ అనేక భ్రమలతో, విక్షేపములతో నిండి ఉంటున్నాయి. వారంతా అధోగతి పాలే అవుతున్నారని నాకు అనిపిస్తోంది.
స్వామీ! ఈ శరీరమనే గోతిలో దాగుకొనియున్న 'అహంకారము' అనే పిశాచం చేత మేము మరల మరల మోసగించబడుతున్నాం.
ఉన్నదేది? సత్యమేది?
నకించిదపి దృశ్యం స్మిన్సత్యం తేన హతాత్మనా
చిత్రం దగ్ధ శరీరేణ జనతా విప్రలభ్యతే II (XVIII-57)
ఈ దృశ్య ప్రపంచంలో “ఇది సత్యము” అని మనం అనుకోగలిగేది ఎక్కడైనా, ఏదైనా ఉన్నదా? ఈ కనబడే మొత్తము దృశ్యమునందు అంతర్గతమై ఒకానొక వస్తువువలె ఉన్న ఈ నా శరీరం కూడా అసత్యమే అయివున్నది కదా! అసద్రూపములై, దగ్ధ ప్రాయములైన ఈ శరీరాదులచే మేము ఎందుచేత మోసగింపబడుచున్నాం? ఎంత ఆశ్చర్యం! మెఱుపువలె అస్థిరంగా ఉండే ఈ శరీరంపై “ఇది మాకు కలదు. ఇది ఇట్లే ఉండబోవుచున్నది" అని విశ్వాసం కలిగి ఉండేవారికి ఎవరు మాత్రం ఏలా చెప్పగలరు?
Page:33
అందుచేత మహర్షీ! ప్రబల దోషములచే దిక్కుమాలిన దానివలె ప్రవర్తిస్తున్న ఈ శరీరమును నేను తృణప్రాయంగాను, ఇప్పటికే నశించినదాని వలేనూ చూస్తూ సుఖమును పొందుచున్నాను.
15. బాల్య స్వరూపం
జీవుడు ఈ దేహంలో ప్రవేశించి అనుభవమును పొందుచున్న బాల్యయౌవనవార్ధక్య దశలలో మొదటిదైన బాల్యదశ సుఖకరమైనదని కొందరు జనులు అనుకొంటూ ఉంటారు. “చిన్నతనంలో మేము ఆనందంగా ఉండేవాళ్ళం” అని చెప్పుకొంటూ ఉంటారు. అయితే వారంతా వర్తమాన ఆధివ్యాధుల దృష్ట్యా అలా అంటున్నారేకాని, అది వాస్తవం కాదని నాకు అనిపిస్తోంది.
చంచలము, సంకులము అయినట్టి ఈ సంసార సముద్రంలో జన్మించినప్పటి నుండీ అన్నీ కష్టాలే. బాల్యంలో శక్తి ఉండదు. అనేక వ్యాధులు, శారీరక దౌర్బల్యాలు బాధిస్తూ ఉంటాయి. "ఇది మంచి ఇది చెడు” అనే విచక్షణ ఉండదు.
-ఇది కావాలి అది కావాలి. అని ఎల్లప్పుడు కాంక్షించే స్వభావం.
-తనది కాకున్నా "నాకే ఉండాలి" - అనే లోభత్వం. -అనుక్షణం మారిపోతూ ఉండే ఇష్టాయిష్టముల చపలత్వం. -దీనత్వం, మూఢత్వం, తెలివితక్కువతనం.
-కల్పిత ఆటల మీద ధ్యాస.
-బుద్ధి నిలకడ లేకపోవటం.
-రోషం, రోదనం, చేతకాకపోవటం.
ఇవి బాల్యంలో చెప్పుకోదగ్గ విశేషాలు. ఏవేవో తినాలని, త్రాగాలని, పొందాలని కోరుకొంటాడు. కాని, లోపల ఉన్న భావాలేమిటో చెప్పుకోలేడు.
ఈ ‘మనస్సు’ అనేది స్వయముగానే పరమ చపలమైనది. బాల్యావస్థలో ఇక దీని చపలత్వానికి అంతూ పొంతూ ఉండదు. బాల్యంలో ఉండే అనేక అసమర్థతల కారణంగా ఏవేవో మనః చింతలు బాధిస్తూ ఉంటాయి. చేసే పనులన్నీ అతి మూఢంగా, అవిచారణాపూర్వకంగా ఉంటాయి.
అగ్నిజ్వాలలు, సముద్రపు అలలు, మెఱుపులు, స్త్రీల నేత్రములు ఇవన్నీ 'బాల్యావస్థ' అనుదాని నుండే చపలత్వం నేర్చుకున్నట్లు నా కనిపిస్తుంది.
ఈ బాలుడు కుక్కవలె అతి స్వల్పమునకే సంతోషించి స్వాధీనుడౌతాడు. అత్యల్ప విషయానికే పట్టరానంతకోపం పొందుతాడు. "ఈ పదార్థము పరిశుద్ధమా? కాదా? ప్రమాదకరమా? కాదా?” అని పూర్వాపరాలు విచారించకుండానే పైకి బాగున్నంత మాత్రంచేత “అది నాకు ఇప్పించండి' అని గోలచేస్తాడు. గుణదోషములు విచారించే బుద్ధి లేకపోవుటచే ఆయా పదార్థములు ఆతనికి అనేక బాధలే తెచ్చిపెడుతున్నాయి. పోనీ, పెద్దలు ఇవ్వనన్నారా, ఏడుపు ఆపడు. ఒకటి పొందగానే,
Page:34
బుద్ధి విక్షేపం చేత మరొకటి కావాలనుకొంటాడే కాని, ఏది పొందినప్పటికీ ఏమాత్రం తృప్తి పొందడు. ఇంతలోనే ఏడుపు. ఇంతలోనే నవ్వు. అతని వెకిలి అల్లరి ప్రవర్తన చూచి ప్రతివాళ్ళు బెదిరించేవారే. పెద్దలు విధించే శిక్షలను నిస్సహాయంగా, మౌనంగా అనుభవించ వలసినదే కదా! పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు పై తరగతి బాలురు - ఈ విధంగా అతడు భయపడనిది ఎవరికి? ఎవరో చెప్పిన కథలో వర్ణింపబడిన బేతాళుని ఎదురుగా ఊహించుకొని భయపడతాడు. నిద్రలో ఏవేవో ఊహించుకొని కలవరిస్తూ ఉంటాడు. ఇష్టమైన వారు దూరంగా ఉంటే బెంగపడతాడు. చూచారా స్వామీ! ఈ విధంగా బాల్యం అనేక భయములతో, తప్పుడు పనులతో, మనోవ్యాధులతో ఉద్వేగములతో నిండి ఉంటోంది. ఇట్లు అజ్ఞాన విజృంభణకు ఆలవాలమై ఉండగా, జనులు ఏ ఉత్తమానందం ఈ బాల్యంలో చూడగలుగుచున్నారు? చమత్కారమే కదా! దోష ప్రదములైన అజ్ఞానములు విజృంభించటం ఆనందకరమేమిటి?
ఈ బాలుడు పనికిరానిపనులను కూడా మహా కుతూహలంగా ప్రారంభిస్తాడు. దుశ్చేష్టులపై వ్యామోహం, దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నిప్పన్నా భయం. నీరన్నా భయం. అందరిచేత చీవాట్లు. మనఃశాంతి ఉండదు. గోతిలో చిక్కుకున్న గబ్బిలం లాగా అనేక అమంగళమైన యత్నాలు, మనోవ్యాధులు, సందేహాలు, చెడు పోకడలు కలిగి ఉంటాడు. ఇక స్వస్థత ఎక్కడిది? ఎక్కడ మనోచాంచల్యం, అజ్ఞానం కలిసి ఉంటాయో, ఏ చోట దోషాలు, వ్యాధులు, ఆధులు, చిత్తవికారాలు, అస్వాధీనత సమావేశమౌతాయో - అక్కడ శాంతి, ఆనందం ఉంటాయా? లేనేలేవు.
బాలుని మనస్సు ఏదో అర్థంకాని నూతనత్వం వైపు అఱ్ఱులు చాస్తూ ఉంటుంది. పెద్దలు "స్వసంకల్పమే ప్రతిబంధకము” అనే విషయం నిరూపించటానికి “యథాబాలు" అంటూ ఈ బాల్యమునే దృష్టాంతంగా తీసుకొంటారు. ఒక వృక్షము యొక్క అనుభవం లాగా ఇతరుల (ముద్దుల వంటి మూర్ఖపు క్రియలు, వంచనోపాయాలు ఒక బాలుడిని బాధించినట్లు మరి ఇంకెవరినీ బాధించవేమో! అనేక మనోరథాలతో, ఇతరులు విధించే క్రమశిక్షణాది అనేక నియమములతో, లోకాన్ని మ్రింగివేయాలనే మూఢత్వంలో బాలుడు పొందే సుఖసంతోషాలేమున్నాయి చెప్పండి? వృక్షం తను పడుచున్న బాధలు పైకి ఎవరికీ చెప్పుకోలేదు చూచారా! అదేవిధంగా అతడు తన అంతరంగములోని బాధలు పైకి చెప్పుకోలేడు.
పక్షులైతే ఆకలివేస్తే ఎటైనా వెళ్ళి ఆహారం తెచ్చుకొంటాయి. ఈ బాలుడో, నెత్తీ-నోరూ బాదుకోవటమేగాని చేసేది ఏమి ఉండదు. ఇతరులు ఎవరైనా కనికరిస్తేనే గతి.
ఇట్టి బాల్యావస్థలో ఏదో సుఖముగాని, విశేషముగాని ఉన్నదనుకొని, ఈ జీవుడు మరల మరల జన్మలు పొందాలనుకొంటే, ఈ విషయం నాకు జాలినే కలిగిస్తోంది. అనేక రోగ, విక్షేపాలతో, వివేక-విచారములకు అవకాశమేలేక, శాంతిని ఏమాత్రం ప్రసాదించలేని బాల్యమును నేను తుచ్ఛమైనదిగాను, అరమ్యమైనదానిగాను గాంచుచున్నాను.
Page:35
16. యౌవన దశ
ఈ మనుజుడు చివరికి ఎట్లో బాలానర్థముల నుండి గట్టెక్కి అనేక భోగ వాంఛలతో కూడుకొన్నవాడై, యౌవన ప్రాంగణంలో ప్రవేశిస్తున్నాడు.
ఇప్పటికే అతని మనస్సులో అనేక దోషాలు, కుసంస్కారాలు గూడుకట్టుకొని ఉంటాయి. ఇప్పుడిక అహంకార - కామములనే పిశాచాలు నెమ్మదిగా కనులు తెరచి జూలు విప్పుతున్నాయి. ఏవేవో గుర్తింపులు, సుఖములు పొందాలని స్వప్నం కంటూ ఉంటాడు హృదయంలోనే ఉద్భవించిన అహంకార - కామములకు ఇక 'దాసో 2 హం' అనటం ప్రారంభించుచున్నాడు. అతి చంచలమైన మనశ్చింత లన్నిటికి స్వేచ్ఛ వచ్చేస్తోంది. బుద్ధి అనేక వికారములచే ఆక్రమించబడి కలుషితం అవుతోంది. ఈ మనస్సు, యౌవనములోని ఎండమావులవంటి పరిచయాలను, విలాసాలను, స్వోత్కర్షలను చూచి, "ఆహా! ఇవన్నీ ఎంత మధురమైనవి! ఎంతగా వాస్తవమైనవి!” అని అనుకొని, పరుగెత్తి చివరకు ‘విషయములు’ అనే మురికి గుంటలో కాలుజారి పడుతోంది. అందుకే "యౌవనము అనేక మహానరకములకు బీజము వంటిది" అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ప్రత్యక్షమయ్యే కామజ్వరాదులన్నీ జీవుని వినాశనము కొరకే ప్రవర్తిస్తున్నాయి. చిత్ర విచిత్రములైన వృత్తాంతములకు, వివశత్వాదులకు ఆలవాలమైన ఈ యౌవనము వలన (వివేకం విషయమై) నష్టపోయే వారే ఎక్కువ. కామపిశాచికి వశం కాకుండా, దుష్కార్యములను ఆచరించకుండా ఈ యౌవనావస్థను ఎవరైనా దాటివేయగలిగితే అట్టివారు నా దృష్టిలో వందనీయులే. వారే మహనీయులు.
ఈ యౌవనం భోగ సమయంలో మధురంగా ఉన్నట్లే కనబడుతుంది. కాని, కల్లు యొక్క విలాసమువలె ఇది అన్ని దోషములకు శిరోమణి వంటిది. దీనిలోని కథనమంతా అబద్దమే అయినప్పటికీ, అప్పటికి మాత్రం నిజమేనని అనిపిస్తూ క్షణంలో జీవుణ్ణి మోసగించి వేస్తోంది. స్వప్నస్త్రీ సాంగత్యం లాగా, ఊహ యందు గాంచబడే రతనాల మేడ లాగా క్షణకాలపు అసత్యరమ్యత్వం ప్రదర్శిస్తోంది. వేశ్యాస్త్రీ సాంగత్యం లాగా ఈ యౌవనం మొట్టమొదట మెత్తమెత్తగా జీవునియందు ప్రవేశించి, క్రమంగా దుర్భావాలకు, రోగాలకు, దుఃఖాలకు, అరిష్టాలకు నాంది పలుకుతోంది.
హృదయములోని జ్ఞానమును యౌవనం కప్పివేస్తుంటే శివకేశవులంతటి వారే భయపడతారు. ఎందుకంటారా? ఇందులో జనించే మోహం మంచిపనులను మరపింపచేస్తుంది. వివేకమును రూపుమాపటంలో, కాంతా వియోగాది కణకణ మండే ఉష్ణత్వాలు సృష్టించడంలో, మంచి అలవాట్లను విరమింపచేయడంలో, భ్రాంతి జ్ఞానం ప్రసాదించటంలో ఈ యౌవనమునకు ఉన్నంత శక్తి మరిదేనికీ
లేదు.
❖
అయ్యో! ఎంతటి నిర్మలమైన మనస్సు అయినప్పటికీ, ఈ దశలో కలుషితం అవుతోందే? హే మహర్షీ! తుపాను సమయంలో ఆకాశాన్ని చుంబించే కెరటాలు ఉన్నట్టి నదినైనా దాటవచ్చు. ఈ యౌవనంలోని తృష్ణా తరంగాలు దాటటం ఎంతమంది తరం? ఆహా! జీవుడు ఈ దశలో
Page:36
ఆ స్తనాలు, ఆ ముఖం, ఆ విలాసాలు, ఆ హావభావాలు” అని మననం చేసుకొంటూ, ఇంతలోనే ముసలివాడు అయిపోతున్నాడు. చంచలమైన ఆశలచే బాధించబడే యువకుడు సాధువుల దృష్టిలో తృణప్రాయుడు మాత్రమే.
కామక్రోధాది అనేక దోషములతో కూడిన గంటల హారాన్ని ధరించిన ‘అభిమానము' అనే మదపుటేనుగు ఈ యౌవనారణ్యంలో సంచరిస్తోంది. ఇది జీవులు ఎంతో భయపడవలసిన విషయం కాదంటారా స్వామీ? 'దుఃఖములు' అనే కాల కూట విషసర్పాలు 'విషయవాసనలు' అనే గాలి పీలుస్తూ జీవుడిని కాటువేయటానికి అటూ ఇటూ సంచరిస్తున్నాయి. ఇది గమనించని ఆ యువకుడు మాత్రం “ఆహా! ఈ నా శరీరభాగాలు ఎంతగా మెరుస్తున్నాయి! ఈ నా నూనూగు మీసాలు చూస్తున్నారా?” అని చెప్పుకొంటూ భ్రమిస్తున్నాడు. కుత్సిత మనోవికారాలను, రాగాదులను, దుశ్చింతలను, ఆశ్రయించే యౌవన మనస్సుకు నిజమైన సుఖశాంతులు ఎక్కడ లభిస్తాయి? యౌవనపొరచే దట్టంగా కప్పబడిన కనులకు తనను అతివేగంగా సమీపిస్తున్న ఆధి-వ్యాధులు, సంకల్ప-వికల్పముల యొక్క పరిణామాలు, మూర్ఖచర్యల దుష్ఫలితాలు ఏమాత్రం కనిపించటం
లేదు.
అంతా బాగానే ఉంది కాని, ఈ యౌవనదార్థ్యం ఎన్నాళ్ళు ఉంటుందంటారు? అయ్యో! ఎంతో ప్రయాసతో సంపాదించుకొన్న అనేక సద్గుణాలు ఈ త్రిగుణ రూపములైన యౌవన వాయు వీచికలచే పెకిలించివేయబడుచున్నాయే! అహంకారం, మోహం సుకుమారత్వాన్ని తుంచి వేస్తున్నాయి. వివేకము మరుగున పడిపోతోంది. కామాంధకారముచే గ్రుడ్డిది అయిన మనస్సు తాను ప్రసరించుచున్న స్థానాలు ఎట్టివో ఏ మాత్రం పరీక్షించుకోవటం లేదు.
మహర్షీ ! ఈ యౌవనం శరీరమునకు వెన్నెలవలె కనిపించినప్పటికీ, చిత్తమును మాత్రం అధోగతిపాలు చేసి నీచత్వమును, మూర్ఖత్వమును తెచ్చిపెడుతోంది. అతి త్వరలో నశించబోయే ఈ యౌవనం చూపిస్తున్న పైపై మెరుగులు చూచి మోసపోవటానికి నేను సిద్ధంగా లేను.
ఒకానొకడు ఎంతో శ్రమించి, అనేక ప్రయాసలకు ఓర్చుకొని చివరికి ఒక 'చింతామణి'ని సంపాదించాడు. "ఆహా! చూచారా! నేను ఎంతటి గొప్పవాడినో! ఇప్పుడీ చింతామణి నాదేకదా!” అని తలచుచు మాన మద గర్వాలు పొందినవాడై ఇక ఇంటికి బయలుదేరాడు. కాని పాపం, నదిని దాటేయత్నంలో మధ్యలో మణిని చేయి జార్చుకొన్నాడు. చూస్తూ ఉండగానే ఆ మణి కాస్తా నీటి ఉరవడికి కొట్టుకుపోతోంది. అప్పుడు ఆతని మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఈ యౌవనం విషయం కూడా అంతే. ఆశపడినన్నాళ్ళు పట్టదు. ఎప్పుడో ప్రవేశిస్తుంది. కామము మొదలైన వికారాలన్నీ తలెత్తుతాయి. రాగము మొదలైన అనేక దోషాలు వివేకమును కప్పివేస్తాయి. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉండగా, ఇంతలో ఎక్కడినుంచో ముసలితనం వచ్చిపడుతోంది. చూచారా మహర్షీ! మరి ఈ విషయాలన్నీ ఈ బాల్యంలోనే ఎందుకు చక్కగా జనులు విచారించరాదు? యౌవనం
Page:37
చూచి మురిసిపోవటం చావుకు సిద్ధంగా ఉన్న బాలుణ్ణి ముద్దుపెట్టుకోవటం వంటిదేనని నేను అనుకొంటున్నాను. ఎవడైతే, అవివేకంచే క్షణభంగురమైన యౌవనమును చూచి మోహితుడై “విషయానందమే జీవిత లక్ష్యము" అనే భావన కలిగి ఉంటాడో వాడు 'నరపశువు' అని చెప్పబడుచున్నాడు. ఆతడు అతిత్వరలో కాలముచేత మోసగించబడినవాడై, పశ్చాత్తాపపడబోతున్నాడు.
స్వామీ! మరల మరల చెప్పుచున్నాను. ఈ 'యౌవనము' అనే సంకటము నుండి క్షేమంగా బైటపడినవారే మెచ్చుకోతగినవారు. పెద్ద తిమింగలాలు ఉన్న నదినైనా దాటవచ్చు. రాగద్వేషాదులతో నిండియున్న ఈ యౌవనం దాటటం అంత తేలికైన విషయం కాదు. అది మహాప్రాజ్ఞులకు మాత్రమే సాధ్యం. శాంతి, దయ, దాక్షిణ్యము, వినయము మొదలైన ఉత్తమ గుణములు గల యౌవనముతో ప్రకాశించేవారు మనకు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అత్యంత మధురఫలములు, సుందర పుష్పములతో కూడిన ద్రాక్షతీగెలు ఎక్కడోగాని తారసపడవు కదా! అందుచేత నేను ఈ యౌవనము యొక్క పటాటోపమును తూక్ష్మీకరించి మౌనం వహించాలని నిర్ణయించుకొన్నాను.
17. స్త్రీ వ్యవహారం
ఈ లోకంలో 'కామము’ అనునది చాలా గొప్ప విషయంగా తలచుచు, ఈ జనులు ఎందుకో వ్యామోహం చెందుచున్నారు. నరములు, ఎముకలు, రక్తము, మాంసము - ఇట్టి వాటితో కూడిన ఈ స్త్రీ - పురుష దేహములందు శోభను చేకూర్చేది ఏది ఉన్నది? జనులు ఎందుకు మోహం చెందుచున్నారు?
ఈ స్త్రీ శరీరమును పురుషులు (అట్లాగే పురుష శరీరమును స్త్రీలు) మననం చేస్తూ పాపం, ఇప్పటికి ఎన్ని జన్మలు బూడిదపాలు చేసుకొన్నారో కదా! ఓయీ! మానవుడా! ఈ 'వనిత' అను వస్తువు యొక్క కాళ్ళు, చేతులు, చర్మము, మాంసము, కన్నీరు మొదలైనవి విడివిడిగా ఎప్పుడైనా పరిశీలించావా? ఇందులో మహత్తరమైన విషయమేమున్నది? మరి నీవు వృథాగా ఎందుకు ముగ్ధుడవు అగుచున్నావు?
ఓ పురుషులారా! ఒకచోట కేశములు, ఒకచోట చర్మము, ఒకచోట బొమికలు, ఈ శరీరములన్నీ ఇంతేకదా! మరి మీరంతా ఇంతగా బాహ్య శరీరాకర్షణలచే ఎందుకు బద్ధులు అవుతున్నారో చెప్పండి? తద్వారా మీ "వివేకము” మరుగున పడుటలేదా? ఈ రోజు ఈ దేహాలన్నీ వివిధ వస్త్రములతోను, లేపనములతోను తైతక్కలాడే బొమ్మలవలె అగుపించవచ్చు. వారి మెడలు రంగు రంగుల ముత్యాల హారములచే జాలువారుతూ, అత్యంత సుందరంగా కనిపించవచ్చు. కాని, ఒక్క విషయం గుర్తిస్తున్నారా? ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కనిపించే అవయవాలన్నీ
Page:38
రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కలచే, నక్కలచే భుజింపబడబోవుచున్నాయి. లేదా కొన్ని ఎండు కట్టెలతోపాటుగా బూడిద కాబోవుచున్నాయి.
అయినా మునీంద్రా! పంచభూత నిర్మితమైన ఈ స్త్రీ-పురుషుల అంగములకు, అడవిలో సంచరించే కంచరగాడిదల అంగములకు భేదమేమున్నది చెప్పండి? మరి ఈ మనుజుడు శరీరము చూడగానే వికారములు ఎందుకు పొందుచున్నాడు? ఈ జనులు చీరకుచ్చెళ్ళు, కేశములు వంటి పైపై మెరుగులకు ఆకర్షితులై అనేక వికారములు పొందుచున్నారే! కల్లుకు కామమునకు భేదమేమీ కనిపించుటలేదు. ఈ రెండు కూడా మత్తు, ఉల్లాసం, చిత్తవికారం కలిగించి జీవుణ్ణి వివశుణ్ణి చేస్తున్నాయి.
ఈ జీవుడు “దేహము” అనే కట్టుకొయ్యకు “మదము” అనే త్రాడుచే బంధింపబడి ఒక పశువువలె అనేక దుఃఖపరంపరలు అనుభవిస్తున్నాడు. ఎన్ని జన్మలు గడచిపోతున్నా, ఆతని యందు వివేకము మాత్రం ఉదయించుటలేదు. “ఆ కాటుక కన్నులు, జాలువారు కురులు, ఎత్తైన స్తనములు, నాజూకైన ముక్కు” అని అగ్ని జ్వాలలకు గడ్డిపరకవలె ఆహుతి అగుచున్నాడు. ఆ సరసములు, ఆ దూరం నుండి కనబడే బాహ్య సౌందర్యాలు - అవన్నీ ప్రజ్వరిల్లుచున్న ‘నరకము’ అనే అగ్నికి కట్టెపుల్లలవంటివే కదా! ఇక శృంగార కవులు “కారుచీకటి వంటి కనుబొమలు, నక్షత్రరాశులవంటి మిలమిల మెఱిసే కళ్ళు, చంద్రబింబము వంటి మోము, విరిసిన పువ్వులవంటి చిరునవ్వులు” మొదలైన అత్యంత మధుర భాషాయుక్తములైన ఉపమానాలన్నీ ప్రయోగించి భ్రమను ఇంతింతలు అధికం చేస్తున్నారు. ఇంకేమున్నది? ఈ జనులు క్షణంలో విలాసములలోకి పీకల వరకు దిగుచున్నారు. క్షణంలో ధర్మ వైరాగ్యాది కార్యక్రమముల నుండి వెనుకకు మరలుచున్నారు. ఫలితం? విలువైన మానవజన్మ వృథా అగుటయేకదా! కామిత స్త్రీలు విషతీగలవలె, తమను సమీపించు పురుషులను తమ కామోన్మాదం చేత వివశులను చేస్తున్నారు. ఎలుగుబంటి పుట్టలోని పామును తన ఉచ్ఛ్వాస-నిశ్వాసములచే ఆకర్షించి, బైటకు వచ్చిన ఆ పామును భక్షిస్తుంది చూచారా? అదే విధంగా, కామిని స్త్రీలు, “నీవే నాకు దిక్కు” వంటి అవాస్తవమైన మోసపు మాటలచేత, మాయలచేత, కృత్రిమ మర్యాదలచేత తళుకు బెళుకులచేత విటులను ఆకర్షించుచున్నారు. వారి మాన మర్యాదలను, శక్తి యుక్తులను హరించివేస్తున్నారు. సర్వస్వము పీల్చేసి బికారిని చేస్తున్నారు. కిరాతకుని వలలో చిక్కుకున్న పక్షిలాగా ఈ జీవులు అట్టి ఆకర్షణలో చిక్కుకొని బైటపడలేక విలవిలలాడుచున్నారు.
‘సంసారము’ అనే నీటిగుంటలో గల 'చిత్తము' అనే బురదలో సంచరించుచున్న ఈ జీవులు ‘కామము’ అనే ‘ఎఱ’చే ఆకర్షించబడి, అనేక ఉపాధులను బలి చేసుకొంటున్నారు. గుఱ్ఱమునకు ముకుతాడు, ఏనుగుకు స్తంభము, పాముకు మంత్రము బంధములు అగుచున్నట్లు, కామమే జీవులకు పెద్ద గుదిబండగా పరిణమిస్తోంది. అనేక శోకమోహములచే రచించబడిన ఈ ప్రపంచమంతా ‘కామము' అనే దానిచే ఆశ్రయించబడి, తత్ఫలితంగా స్థూలత్వం పొందుతోందని నాకు అనిపిస్తోంది.
❖
Page:39
అందుచేత, ఓ మునీశ్వరా! స్త్రీ సాంగత్యమే సర్వ దోషములకు, సర్వ బంధములకు మూలకారణం. అద్దాని మాయలో పడకుండా తగు జాగ్రత్త వహించాలని నిర్ణయించు కొన్నాను. స్తనములు, కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసమయములే అయివుండగా, వాటిని చూచి నేనెందుకు వివశుణ్ణి కావాలి? ఒకప్పుడు స్థూల బుద్దులగు పురుషునిచే అతిప్రియముగా, ఆప్యాయముగా లాలించబడిన సుందర స్త్రీలు ఇప్పుడు శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్నారు. వారి మాంస ఖండములను కాకులు, గ్రద్దలు భక్షిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూచే స్త్రీ-పురుష దేహముల గతికూడా అంతేకదా! వీరి కేశములు, తిలకము, అస్థులు కొద్ది కాలానికి కటిక నేలను అలంకరించబోతున్నాయి. ఇదంతా ఈ విధంగా విచారించిన తరువాత, ఇక నేను భ్రాంతిని పొందటానికి సిద్ధంగా లేను. బుద్ధిహీనులు మాత్రమే పంచభూతముల సన్నివేశమగు ఈ స్త్రీ-పురుష శరీరముల పట్ల ఆవేశపూరితమైన అనురాగం కలిగి ఉంటారు. అట్టి అనురాగం పెంచుకొన్నందుకు గాను, చివరికి, ఈ చిత్తము దీనత్వమునే పొందుతోంది. క్షణికావేశమయినట్టి కామముచే పరవశించు మనస్సు ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి నొంది, చివరకు అనేక దుఃఖమోహములలో కూలిపోతోంది.
స్వామీ! వనిత ఉన్నవానికే కదా భోగేశ్చ! వనిత లేకుంటే “నాది, నాకు చెందవలసినది, నాతోనే ఉండవలసింది” అనునట్టి పదార్థజాలముల పట్ల భావావేశం కూడా సన్నగిల్లుట సులభమని నాకు అనిపిస్తోంది. నేను స్త్రీ వ్యవహారమునే త్యజించివేస్తాను. జరామరణముల పట్ల నాకు గల భీతి- ఆపాతారమణీయమై అతి చంచలమైనట్టి స్త్రీ సాంగత్యము పట్ల అత్యంత అరుచినే కలుగజేస్తోంది. అందుచేత ఈ మనస్సును అట్టి తుచ్ఛ వస్తువుల వైపు ప్రవేశించనీయకుండా, శాశ్వతమగు స్వస్వరూపజ్ఞానము కొరకే వినియోగించాలని నిశ్చయించుకొన్నాను.
18. ముసలితనం
కోర్కెలు తీరని బాల్యమును యౌవనం మ్రింగివేస్తోంది కదా! ఇక మానమద గర్వాలతో నిండిన యౌవనమును ముసలితనం ఎక్కడి నుండో వచ్చి మ్రింగి వేస్తోంది. ఇట్లా చూస్తూ ఉండగానే పుష్టిగల ఈ అవయవములు శిథిలమైపోతున్నాయి. కుంచించుకు పోయిన దవడలు, వంగిన నడుము, ముడుతలుపడ్డ నుదురు, వణుకుచున్న కాళ్ళు, చేతులు - ఇవన్నీ స్త్రీలు, తదితరులు అత్యంత తిరస్కార దృష్టితో చూస్తున్నారు. మనస్సంతా దైన్యంతో నిండి ఉంటోంది. సూక్ష్మబుద్ధి, పాపం, గడుసరి సవతులచే హింసించబడే సాధ్వివలె, ఏ మూలకో వెళ్ళి దాక్కుంటోంది. ఇంతకాలం ఎంతో భయభక్తులతో ప్రవర్తించిన పుత్రులు, భార్య, బంధువులు, స్నేహితులు, సేవకులు ఇప్పుడు ఆతనిని ఒక పిచ్చివానివలె చూస్తున్నారు. “ఇదే మనకు మంచి సమయం” అనుకొని 'లోభం' వచ్చి మనస్సును ఆక్రమిస్తోంది. ఇక ఈ జీవుడు బుద్ధిహీనుడై, గుణహీనుడై, శక్తిహీనుడై అనుక్షణం ఏవేవో వ్యథలతో మ్రగ్గుతూ ఉంటాడు.
Page:40
ఒక ప్రక్క శరీరం క్రమంగా శిథిలం అవుతూ ఉంటుంది. మరొకప్రక్క ఏదో అనుభవించాలనే తపన, దాహము, కామము వర్ధిల్లుతూ ఉంటాయి. ఏవేవో సంతాపములు, దీనత్వములు ఆ జీవుని చుట్టూ మూగి ఉంటాయి. “వీరంతా నా సొమ్ము తింటున్నారు. కాని, నన్ను లెక్కచేయటం లేదు. ఏవైనా రుచికరమైన పదార్థములు తింటే బాగుంటుంది. కాని, వంటికి సరిపడవు కదా! మరణం ఎక్కువ దూరంలో ఉన్నట్లు లేదు. పరలోకంలో ఏ దారుణమైన పీడ అనుభవించవలసి వస్తుందో ఏమో?” ఈ విధంగా ఉంటాయి అతని ఆలోచనలు. కోరికలు కోకొల్లలు. కాని భోగించే శక్తి ఉండదు. హృదయం నిస్సహాయంగా దహించుకొనిపోతూ ఉంటుంది. శరీరం అనేక ఆధివ్యాధులచే పీడించబడుచూ ఉండగా, క్రమంగా శక్తులన్నీ ఉడిగిపోతూ ఉంటాయి.
ఇట్లు జీవుడు అనేక వేదనలు అనుభవిస్తూ ఉంటాడు. మృత్యువు యొక్క క్రూరమైన వ్రేటును తలచుకొంటూ భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటాడు. తాను బాల్య యౌవనములో వృథా పరచుకొన్న కాలమును, అవకాశములను నెమఱు వేస్తూ సంగతి సందర్భములను అనుచితంగా గుర్తు చేసుకొంటూ ఇప్పుడు వర్తమానంలో ఉన్న కొద్దిపాటి అవకాశములను కూడా వ్యర్థపరచుకొంటూ ఉంటాడు.
19. మృత్యువు
ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులచే, ముసలితనముచే ఆక్రమించబడి, జీవుడు దీనాలాపనం చేస్తూ ఉంటాడు. ఇంతలో, ఒకానొక అనుకోని క్షణంలో 'మృత్యువు' అనే గుడ్లగూబ వచ్చి ఎదురుగా వాలుతోంది. సాయం సంధ్యను చూడగానే చీకటి ఎక్కడినుండో వచ్చి వాలదూ? గ్రద్ద మాంసమును మ్రింగటానికే గ్రహించునట్లు, ఈ శరీరమును మ్రింగటానికే ‘ముసలితనం’ దాపరిస్తోంది. బాలిక పువ్వును జడలో అలంకరించుకొని, కొంతసేపటికి ఆ పూవు వాడిపోగా, త్రుంచి దూరంగా విసరివేస్తోంది. చూచారా? అదే విధంగా 'కాలము' అనే బాలిక కూడా కొంతసేపు ఈ శరీరమును కలిగియుండి, ఆ తరువాత 'మృత్యువు' అనే చీకట్లోకి త్రోసివేస్తోంది.
ఈ జీవుడు బాల్య, యౌవనములలో ఉన్నప్పుడు అప్పటి ఆయా అల్పకాలిక కార్యములందు నిమగ్నుడై ఉంటున్నాడు. భగవంతుని ఆరాధించటం, జ్ఞానము కొరకై విచారణ చేయటం మొదలైన పెద్దలచే ప్రవచించబడిన ఉత్తమ కార్యముల పట్ల, “ఇప్పుడేం తొందర? మాకు ఇంకా సమయమున్నది. పెద్ద అయిన తరువాత చూచుకోవచ్చులే” అని తలచి ఎంతో అలసత్వము, అశ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మృత్యువు ఎదురుగా నిలచి ఉండగా, ఇప్పుడు ఆ అనుకున్న ప్రణాళిక అంతా ఏమైనది? మంచు బాగా కురియగా వాడిపోతున్న పుష్పంలాగా ఈ శరీరం శిథిలమౌతూ ఉంటే, మృత్యువు అను పేరుగల శరీర వినాశనం సమీపిస్తూ ఉంటే ఇక ఈ జీవుడు ఏమి చేయగలుగుతాడు?
Page:41
శరీరం జీర్ణం అయిపోతూ ఉంటుంది. వాతాదిరోగములు ప్రజ్వలిస్తూ ఉంటాయి. బూడిదగుమ్మడికాయ వలె తల తెలుపుతనం సంతరించుకొంటూ ఉండగా, 'కాలుడు’ అనువాడు "ఆహా! ఈ పండు పక్వమునకు వచ్చినట్లున్నదే! ఇక కోసుకొందామా?” అని అనుకొంటూ ఒక రోజు వచ్చి కోయనేకోస్తున్నాడు.
‘ముసలితనం' అనే నక్క యొక్క ఊళ వినేవరకే ఈ మానవుడి ప్రతాపమంతా. 'జర' అనే అగ్ని ఈ శరీర గృహమును తాకగానే ఇక అతడు అనేక శారీరక బాధలచే హింసించబడి దుః ఖితుడు అవుతున్నాడు. అంగములు పాలిపోతున్నాయి. నడుం వంగిపోతోంది. ఆధి-వ్యాధులు ముందు నడుస్తూ ఉండగా ఈతడు మృత్యువుకు 'కబళం' అవుతున్నాడు. పర్వత గుహలో దాగినా, సుతిమెత్తని పరుపులపై ధన-జనముల మధ్య ఉన్నప్పటికీ ఎవడైనా మృత్యువు నుండి తప్పించుకోగలడా? ఇంద్రియాలు బిగతీసుకు పోతూఉంటే ఏ లౌకిక తెలివితేటలు ఎందుకు పనికివస్తాయి?
‘జర’ మూడవకాలుతో (చేతికఱ్ఱతో) జీవుడిచేత తప్పటడుగులు వేయిస్తూ ఉంటే, అనేక అసంతృప్తులు, రోగాలు అందుకు తాళం వేస్తూ ఉంటాయి. ఏ క్షణంలో మృత్యువు పంజా విప్పబోతోందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అశక్తి, ఆర్తి, ఆపద శరీరంలోనే తిష్ఠ వేసుకొని ఉంటున్నాయి కదా! ఓ మహాశయా! చూడండి. ఈ మనకు కనబడే శరీరాలన్నీ ముసలితనం పాలబడి, చివరికి మృత్యువుచే కబళించబడవలసినదే కదా! ఈ శరీరము యొక్క ఉత్పత్తి - ఉత్తరోత్తరగతి – ఇదంతా పరిశీలించుచున్న నాకు దీనిపై ఏమాత్రమూ విశ్వాసం కలగటం లేదు.
తండ్రీ! మహర్షీ! అసలు నాకొక విషయం చెప్పండి. ముసలితనం మీద పడ్డ తరువాత కూడా, జనులకు భార్య-పుత్ర-గృహాదులపై పేరాశ ఎందుకు ఉంటోంది? ఈ మోహమంతా కల్పిస్తున్నవారెవరు? ముసలితనాన్ని జయిచిన వారంటూ ఎక్కడా ఉండరు కదా! మరి ఈ విషయం అందరికీ తెలియదా? ముసలితనం వచ్చిపడే సమయానికి అనేక కోర్కెలు కలిగివున్న ఈ జీవుడు ఆ కోర్కెలు తీరక అపూర్ణత్వాన్ని అధిగమించలేకపోతున్నాడు. బాల్య యౌవనాలలోనే “అసలు కోర్కెలు లేకుండా ఉండేదెట్లా?” అనే విషయం విచారించి తగిన కర్మ - జ్ఞానములు అభ్యాసం చేసి ఉండి ఉంటే ఇప్పుడీ దిక్కుమాలిన గతి పట్టేదా? లేదు కదా !
అందుచేత, అట్టి ముసలితనం నన్ను సమీపించక ముందే ఆత్మ - అనాత్మ విచారణచే ఈ శరీర భావమును జయించి వేస్తాను. అందుకుగాను, నా శక్తి యుక్తులన్నీ వినియోగించ నిశ్చయించుకొన్నాను.
Page:42
20. కాల విలాసము
ఓ మహాత్మా! దేహాత్మబద్ధులమగు మేము "ఇవి మేము భోగించవలసిన వస్తువులు, ఈ ఈ ఉపాయములు అవలంబించి వీటిని పొందుతాము” అని చెప్పుకుంటూ మూఢులమై ప్రవర్తిస్తున్నాము. “వీరు నా వారు. వారు పరాయివారు. ఇవి నా ఇష్టాయిష్టములు. ఇతడు నా శత్రువు. వీటిని జయించి సొంతం చేసుకొంటాను” అను భావనలను కలిగివుంటూ, ఆయా వస్తు సమూహముల వలన కలుగుచున్న రాగద్వేషములచే ప్రభావితులం అగుచున్నాము. సజ్జనులైనవారికి ఇటువంటి విషయాలలో అభినివేశం ఉంటుందా? లేదు. మాబోటి బాలుర వంటివారం మాత్రమే అద్దంలో కనిపించే ప్రతిబింబ సమానములైన ప్రయోజనములను, ఫలములను ఆకాంక్షిస్తున్నాం. “ఇది పొందిన తరువాత మేము ఎంతో సుఖవంతులం కాబోతున్నాం. ఇది మాకు ఎప్పటికి తొలగుతుందో? ఈ వస్తుజాలం కలిగి ఉండుటచే వారెంత సుఖంగా ఉన్నారు? అవి వారికే ఎందుకు లభించాలి?” ఇటువంటి సంసార సంబంధమైన లోభమోహములతో, తుచ్ఛ హావభావములతో విలువైన కాలమంతా గడపివేస్తున్నాం. స్వామీ! సాలెగూడు ఎలుకచే కొరకబడునట్లు కాలముచే మేము ఎంతగానో మోసగింపబడుచున్నాం. "ఆహా! నేను ఎంత విశాలమైన దానిని!" అని గర్వించు సముద్రంలో బడబాగ్ని పుట్టి ఆ సముద్ర జలాన్నే స్వాహా చేస్తున్నట్లు అంతరంగమున పుట్టిన దుష్ట సంకల్పములే ఈ జీవుని దీనునిగా చేసివేస్తున్నాయి.
ఈ సృష్టిలో కాలముచే మ్రింగబడనిది ఏమైనా ఉన్నదా? భయంకర సంహారాకార రుద్రస్వరూపుడగు కాలుడు ఈ కనబడే సమస్త దృశ్య పదార్థముల అస్థిత్వమును ఏదో ఒకనాటికి రూపుమాపబోవుచున్నాడు. విశ్వాత్ముడగు ఆ కాలదేవుడు "ఇతడు అధికుడు. ఇతడు స్వల్పుడు” అనే తేడా చూపకుండా సర్వమును ఆరగిస్తూ త్రేన్చుచున్నాడు. అతని స్వరూపమా, ... అగమ్యగోచరం. ఈ క్షణములు, నిమిషములు, గంటలు, రోజులు, సంవత్సరములు, యుగములు, మన్వంతరములు, కల్పములే అతని యొక్క ఉపాధి అని అనవచ్చునేమో! అట్టి ఉపాధితో కొంచెము రూపము దోపింపచేయుచు, ఈ చరాచర విశ్వమంతా తన వశం చేసుకొంటున్నాడు. ఈ వర్తమాన క్షణంలో అత్యంత శుభారంభములైనవి, రమ్యములైనవి, దృఢతరములైనవి కూడా కాలగతికి ఎర కావలసినదేకదా! క్రూరులైనవారు, నిర్దయులైనవారు, కఠినులైనవారు, పరుషంగా మాట్లాడేవారు, మహాగర్వితులు, అనేకులను నిరాటంకంగా దూషించ గలిగేవారు - వీరు, వారు అనటం దేనికి? అందరూ కూడా క్షణంలో కాలునిచే భస్మం చేయబడుచున్నారు.
ఆతనికి మ్రింగటమంటే మహా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును, ఒకేసారి అనేక వస్తువులను మ్రింగివేయగలడు. అనంత లోకములను మ్రింగినాసరే, అతని పొట్ట నిండదు. ఈ సంసార నృత్యమంతా చేస్తున్నది 'కాలము' అని పిలువబడుచున్న అతడే! ఇదంతా సృష్టిస్తున్నాడు.
మన అంతరంగమున పుడుతున్న సంకల్పముల దోషముచే మనం అల్పత్వం పొందుతున్నామని మనకు ఈ వాక్యం గుర్తుచేస్తోంది.
Page:43
కలిగి ఉంటున్నాడు. మ్రింగివేస్తున్నాడు. అతనికి అడ్డం ఎవరు? చిలుక దానిమ్మకాయను పగిల్చి లోన ఉన్న గింజలను మ్రింగునట్లు, కాలుడు కూడా తన సంహార వ్యాపారము ద్వారా అనేక జగత్తులలోని నానావిధ ప్రాణులను మౌనంగా చప్పరించి వేస్తున్నాడు. అభిమాన సమన్వితులగు ఈ జీవాత్మల సమూహమంతా 'ఒక మహారణ్యం' అని అనుకొంటే, దీనిని పెంచి, పోషించి, ధ్వంసం చేసే యజమానే కాలుడు.
‘కాలము' అనే ఏనుగుకు 'శుభాశుభ కర్మలు' అనే రెండు దంతములు ఉన్నాయి. వాటిచే జీవసమూహం చిగురుటాకువలె విచ్ఛిన్నం చేయబడుచున్నది.
విరించిమూల బ్రహ్మాండ బృహద్దేవ ఫలద్రుమమ్ బ్రహ్మకాననమాభోగి పరమావృత్య తిష్ఠతి || (XXIII-14)
ఈ 'బ్రహ్మాండము' అనుబడుదానికి మూలము బ్రహ్మదేవుడు (సమష్టి జీవుడు). దేవతలే (కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములే) ఫలములుగా గల బ్రహ్మాండవృక్షము స్వయముగా 'మాయ' అయి, బ్రహ్మమే ఉనికి స్థానంగా కలిగియున్నది.* ఈ గడుసరి కాలదేవుని విషయంలో మరొక చమత్కారం చెపుతాను వినండి. ఇతడు కార్యరూపంలో క్షణక్షణం భగ్నమగుచున్నప్పటికీ, కారణరూపంలో మాత్రం భగ్నుడు కాకుండానే ఉంటున్నాడు. ఒకచోట దహించబడుచున్నప్పటికీ, మరొకచోట, నిశ్చలుడై సుస్థిరంగానే ఉంటున్నాడు. ఒక విధంగా కనబడుచు మరొక విధంగా కనబడకయే ఉన్నాడు.
#
ఈ మనస్సు ఒక్క నిమిషంలో అనేక వస్తువులను, సంఘటనలను, రూపములను సంకల్పిస్తూ, త్యజిస్తూ ఉంటుంది కదా! అదేవిధంగా కాలము కూడా అనేక జగత్తులను ఒకవైపు సృష్టిస్తూ, మరొకవైపు మ్రింగివేస్తోంది. ఈ జగత్తుల ఆగమన నిష్క్రమణములను గమనించనట్టి ఈ జీవులు "ఈ శరీరమే మేము. ఇది పుష్టిగా ఉంటే మేము కూడా పుష్టిగా ఉంటాం. లేకుంటే లేదు. ఈ శరీరంలో ఏర్పడే అనుభవాలు, దీనితోపాటు ప్రాప్తిస్తున్న సంబంధాలు వాస్తవము” అను రూపముగల శరీర తాదాత్మ్య భావము పొందుచున్నారు. అవస్తువే అయివున్న ఈ దేహముతో ఐక్యభావము పొందుచున్నందుకు ఫలితంగా కాలుడు వారిని నిరంతరం స్వర్గనరకాదులందు త్రిప్పుచున్నాడు.
ప్రతి శరీరము ఒక బ్రహ్మాండ నిర్మాణము యొక్క సంజ్ఞయే. అందుగల సంకల్ప తత్వము బ్రహ్మదేవుడుగా, ఇంద్రియములు దేవతలుగా ఇందలి జీవుడు (Absolute Experiencer) బ్రహ్మముగా వేదములలో వర్ణించబడింది. ఈ మూడు లక్షణాలు ప్రతి జీవునికి వర్తిస్తాయి.
1. అన్నిటికీ జీవునియొక్క శుద్ధ సత్తయే మూలకారణమై ఏమాత్రం భగ్నం కాకయే ఉంటోంది.
2. ఒకానొక చోట వాస్తవానికి అతడు నిశ్చలుడై జన్మకర్మలు లేనివాడై ఆత్మయే స్వరూపముగా కలిగియుంటున్నాడు. 3. అతని శరీరాదులను మనం చూడగలిగినా అతని వాస్తవ సత్త ఇంద్రియాదులకు కనుపించునది కాదు. మనం చూచే ఈ శరీరాదులు భగ్నము అయినా, ఆ శరీరములకు కారణమగు అతడు భగ్నము కాకయే ఉంటున్నాడు.
Page:44
ఆహా! ఈ కాలుడు తృణమును, బూడిదను, కొండను, ఆకును, సముద్రమును కూడా కబళిస్తున్నాడే! ఇతని యందు క్రౌర్యము, లోభము, దౌర్భాగ్యము, చాంచల్యము దట్టంగా వ్యాపించి ఉన్నాయి. పసిబాలుడు బంతులతో ఆడుకొంటాడు చూచారా? అతడు కూడా సూర్యచంద్రులతో ఆడుకొంటున్నాడు. ప్రళయ సమయంలో జీవులందరినీ నాశనం చేసివేసి వారి అస్తులను ధరిస్తున్నాడు. ఇతని చర్యలను అడ్డగించగలిగే వారెవరు? ఒకప్పుడు అతడు రుద్రుడు, మరొకప్పుడు అతనికి రూపమే ఉండదు. ఒకే సమయంలో ఒకచోట సృష్టి, మరొకచోట సంహారం చేస్తూ ఉంటాడు.
‘కాలము’ అనే వృక్షం నుండి “దేవతలు - అసురులు” అనే పక్వ ఫలములు నేలరాలుచున్నాయి. ‘బ్రహ్మాండములు’ అనే కాయలు అనంత సంఖ్యలో కాస్తున్నాయి. ఆ కాయలపై వ్రాలే దోమలవంటి వారే ఈ జీవులు. “చిత్ప్రకాశము యొక్క సత్త" (ఏశుద్ధ తత్త్వమైతే 'స్వసత్త' కలిగియుండి ‘తెలుసుకొనుట’ అను ప్రకాశము స్వరూపముగా కలిగి ఉన్నదో. (That Absolute Self which is existence and Self -consciousness) సహాయంతోనే కాలుడు ఈ 'జీవులు' అనే రూపములు అవధరిస్తూ అనేక క్రియలు కల్పించుకొని, వినోదిస్తున్నాడు.
ఓ మహాత్మా! ఈ కాలుడు తుది మొదలు లేని అనిర్వచనీయ వస్తువువలె వెలయుచున్నాడు. అతడు ఒకచోట కారునలుపు వస్తువులను (అజ్ఞానము, నైరాశ్యము, నిస్పృహ, నిష్క్రియత్వములను) మరొకచోట కాంతిమయ వస్తువులను (సుజ్ఞానము, ఉత్తమ ఆశయము, ఉత్సాహము, క్రియాచాతుర్యము) ఇంకొకచోట శూన్యమయ వస్తువులను (శుద్ధ సత్వమును) తనయందు తానే సృష్టించుకొనుచున్నాడు. తనదైన ప్రత్యేకమైన బాణిలో ఈ అనంత సంసారము యొక్క సారమైనట్టి “స్వకీయ సత్త”చే ప్రవర్తిస్తున్నాడు. వేలాది మహాకల్పములు ఎదురుగా గడచిపోతున్నా అతడు భేదముగాని, మోదముగాని పొందుటలేదు. దేనినీ చూచి ఆనందించడు, దేనినీ ఆదరించడు. ఏదీ స్థిరంగా కలిగియుండడు.
ఈ కాలము యొక్క స్థితిగతులకు ఆద్యంతాలు ఎక్కడ? ఇతడు అనాయాసంగా లభిస్తున్న “జగత్ సృష్టి” అనే క్రీడయందు నిరహంకారుడై తనను తానే పాలించుకొంటున్నాడు. తనకు తానే సూర్యకిరణ స్వరూపుడై నిర్లిప్తంగా, ఈ జగత్తంతా ఏమూల ఏమున్నదో సర్వదా చూస్తున్నాడు. సూర్యబింబ స్వరూపుడై అవిశ్రాంతంగా రేయింబవళ్ళను సృష్టించుకొంటూ పోతున్నాడు.
ఓ మహర్షీ! 'జగత్ సమూహములు' అనే దీర్ఘకథలో అతడు లోకపాలకులనే భక్షిస్తుంటే ఇక మేము ఎంతటి వారము చెప్పండి? ఆ కాలుడే జీవులను 'జగత్తు' అనే జీర్ణకుటీరంలో అమర్చి ఇంతలోనే త్రెంపి ప్రోగులు పెట్టుచున్నాడు. అత్యంత చపలుడై కాలగమనమును ప్రవహింఎ "జేస్తున్నాడు. ఒకప్పుడు యౌవనమునకు చంద్రునివంటివాడై ఈ శరీరమును అలరించుచు, ఇంతలోనే సింహరూపుడై అవే శరీరములను కర కర నమిలివేస్తున్నాడు. 'కల్పాంతము' అనబడే ఒకానొక సందర్భంలో ప్రాణులన్నిటినీ సంహరించి "అభావ భావము” నందు ప్రకాశించుచున్నాడు. అట్టి అభావభావ* స్థితియందు ప్రవేశించినపుడు తన అధిష్ఠానమైయున్న స్వాత్మయందు (పరబ్రహ్మము
* అభావభావము = ఈ దృశ్యము గురించి భావనచేయకుండునట్టి (జీవునియొక్క) స్థితే 'కల్పాంతము'గా రామునిచే ఇక్కడ గ్రహించబడుతోంది.
Page:45
నందు) రమించుచున్నాడు. ఒకప్పుడు శుభరూపంగాను, మరొకప్పుడు అశుభ రూపంగానూ ఎల్లవేళల, అన్నివైపుల మహాగోప్యంగా వెలయుచున్నాడు. అతనిని తెలుసుకో కలిగినవారెవరు? 'కాలము’ కంటే మహత్తరమైనది, బలవత్తరమైనది ఎక్కడా, ఏదీ లేదేమో!
మహర్షీ! విశ్వామిత్రా! ఈ కాలము యొక్క విలాసం, ఇతని లీలలు అత్యద్భుతం. అతని పరాక్రమం అచింత్యమైనది. “పరబ్రహ్మము” అనే చక్రవర్తికి, 'మాయ' అనే అతని పట్టమహిషికి పుత్రుని వంటి కాలస్వరూపుడు దీనులు, మోహితులు అయిన ప్రాణులను క్రీడామాత్రంగా వేటాడు చున్నాడు. 'ప్రళయము' అనునదే అతని ఉపాహారం. ఆ కాల రాజపుత్రుని భార్య 'చండి' అనబడే కాళరాత్రి సర్వభూత వినాశినియై ఈ జగత్తులో సంచరిస్తోంది.
ఈ భూమి అంతా ఆ కాలుని చేతిలోని పానపాత్ర. మహా మహా దేవతలే ఇతనికి ఆహారమగుచుండగా, ఇక స్వల్పమైన ఆయుష్షు గల మా మానవుల మాన-మద గర్వాలు ఎంతటివి చెప్పండి? ఆ కాలుని ధనుస్సు నుండి నిరంతరం దుఃఖకారకములైన సంహారధ్వనులు వచ్చిపడు చున్నాయి. కాని మూర్ఖులగు అనేకమంది జనులు మాత్రం అదంతా పట్టించుకోకుండా, “ప్రక్కవారికంటే మేము అధికులమేనా? మాకు గొప్పదైన వస్తుజాలం లభిస్తోందా?” అని సరిచూచు కొంటున్నారు. అట్టి క్షుద్రజీవులమగు మమ్ము అతడు సర్వదా చమత్కారంగా వేటాడుచున్నాడు.
21. క్రియా స్వరూపం - కృతాంత విలాసము
-
‘కాలము’ యొక్క ఉపాధి భూతమే “క్రియ”. లోకాలన్నీ సృష్టించేది, సంహరించేది ఈ క్రియాతత్త్వమే. దీనినే 'దైవము' అని కూడా అంటున్నారు. ఈ క్రియా స్వరూపమునే వేదజ్ఞులు ‘కృతాంతుడు’ అనే సంజ్ఞచే పిలుస్తూ ఉంటారు. కర్మయొక్క ఫలమును ఉత్పాదనము చేయటమే ఈ ‘కృతాంతుడు’**అనబడువానికి ఉన్న ఏకైక కర్తవ్యం. దట్టమైన మంచు సూర్యకిరణములచే కరుగుచున్నట్లు ఈ కృతాంతుని వలననే ప్రాణులు పుడుచున్నాయి. నశిస్తున్నాయి. ఈ కనబడే జగన్మండలమంతా అతని నృత్యశాలయే కదా!
ఈ కృతాంతుడు "క్రియ - ఫలితము" అనే భంగిమలను చూపుచూ కాపాలికా వేషం ధరించి నృత్యం చేస్తున్నాడు. పైకి అనురాగివలె కనిపిస్తూ అల్పబుద్ధులకు అర్థంకాని ఏదో నియతి (దీనికి ఇది ప్రయోజనము - అను నియమము fate, destiny)ని అనుసరిస్తూ జీవుల సుఖ దుఃఖాలకు కారకుడు అగుచున్నాడు. ఈ నియతిని అనుసరించే స్వర్గమర్త్య పాతాళ లోకములు, శుభాశుభములు, కలిమిలేములు కలుగుచున్నాయి. లౌకిక వైదిక కర్మలతో కూడిన ఈ ప్రపంచ రచన అతనిదే. బాలుడు విసుగు విరామం లేకుండా మట్టిబొమ్మలు చేస్తూ, నశింపచేస్తున్నట్లు, ఆ కృతాంతుడు
కాలపురుషుడగు రుద్రుడు, కాళరాత్రి స్వరూపినియగు చండి (అనగా సృష్టి - ప్రళయములు)ల గురించి నిర్వాణ ప్రకరణంలో విస్తారంగా చర్చించబడినది.
యముడు అను పురాణ నామముచే అష్టదిక్పాలకులలోని ఒకడుగా చెప్పబడుచున్నది ఈ కృతాంతుడే.
Page:46
అసంఖ్యాకములగు జీవులను, వారివారి కర్మ వ్యవహారములను రచిస్తూ పోతున్నాడు. మరల ఆ కర్మల ప్రయోజనములను ప్రసాదిస్తూ సృష్టి ప్రళయములను సాగిస్తున్నాడు.
22. దైవ విలాసం
నియతి - కృతాంతుడు - కాలుడు - మహాకాలుడు - - వీరి సన్నివేశమే ఈ జగత్తంతా.
అట్టి విస్తార సంసారంలో ఏ మూలో స్వల్పాయుష్కులమై మేము అత్యంత అజ్ఞానముతోకూడి పడి ఉన్నాము. శరీరధారులమై ఈ దృశ్య ప్రపంచములోనికి ప్రవేశించియున్న మేము 'దైవము’ అనబడే ఏమాత్రం గ్రహింపశక్యంగాని ఒకానొక శక్తిచే మోహితులు అవుతున్నాం. అట్టి దైవము అనుదానికి పూర్తిగా అమ్ముడుపోయి, తోలుబొమ్మలు ఆడించువాని చేతిలోని తోలుబొమ్మలవలె అస్వతంత్రులమై ప్రవర్తిస్తున్నాం. * వన్యమృగములవలె మూఢులమై సంచరించుచున్నాం.
దుష్ట చరితుడగు కాలుడు “సంహరించుట (ఎప్పటికప్పుడు దేనిని దానినే హరించుట)” అనే కార్యమునందు నిమగ్నుడై మమ్ములను నిరంతరం అనేక ఆపదల పాలు చేస్తున్నాడు. ఇక మేము తరంగాల వెంట పైకి క్రిందకు తేలియాడుతూ కదలుచుండే కొయ్యవలె కాలప్రవాహంచే, దాని ఇష్టము ననుసరించి దొర్లించబడుచున్నాం. ఎంత ఆలోచించినా అర్థంకానట్టి 'దైవము' అనబడు విషయం గురించి అత్యంత భయపడుతూ బ్రతుకుచున్నాం. మేము కల్పించుకొన్న మా దురాశలే మమ్ములను అగ్నిజ్వాలలవలె దహిస్తూ 'దైవము' అనే దానికి దాసో హం చేయిస్తున్నాయేమోనని
అనుమానం.
మా బాల్య, యౌవన, వార్ధక్య దశలన్నీ అవిచక్షణాపూర్వకమైన, అర్థం పర్థం లేని అనేక యత్నములచే గడచిపోతున్నాయి. ఏవేవో భయాలు, ఆశలు, ఉద్వేగాలు, మూఢత్వాలు మమ్ములను అణచిపెడుతున్నాయి. చివరకు జరాపతితులమై కాలునిచే మ్రింగబడుచున్నాము. ఈ కాలునికి ఉచితానుచితము లెక్కడ? సద్గుణుడు - దుర్గుణుడు కూడా అతనికి ఒక్కటే.
మా దౌర్భాగ్యం గమనిస్తున్నారా మునీంద్రా! "ఎంతో సుఖకరములు" అని తలచి అనేక ప్రయత్నములచే ప్రోగుచేసుకొన్న భోగములే కొంతకాలానికి మా పాలిట దుఃఖ హేతువులు అవుతున్నాయి. 'దైవము' యొక్క విలాసమేమిటో మేము ఏమాత్రం గ్రహించలేకపోతున్నాం.
ఒక్కసారి ఈ లోకాలన్నీ పరిశీలించి చూచినప్పుడు ఇవన్నీ దుఃఖకరములేనని నాకు అనిపిస్తున్నాయి. ఏవేవి పొందిన తరువాత ఈ జీవుడు 'నేను సుఖిస్తాను' అని అనుకొంటున్నాడో అవన్నీ లభించినా అతడు ఏ వాస్తవమైన సుఖమును పొందకయే పోతున్నాడు. ఏది ఎట్లు జరుగబోవుచున్నదో, అదంతా దైవము యొక్క అధీనములో ఉండగా - జీవుడు దేనిని గురించి
ఈ అఖండ రామాయణము జీవుడు ఎట్లు అస్వతంత్ర భావన పొందుచున్నాడో, కాని ఎట్లు వాస్తవానికి స్వస్వరూపాత్మ దృష్ట్యా స్వతంత్రుడో చెప్పటమే లక్ష్యముగా కలిగియున్నది.
Page:47
సంతసించగలడు చెప్పండి? అయినప్పటికీ, అతనిలో ఏదో పొందాలనే తపన మాత్రం ఉండనే ఉంటోంది. అట్టి అంతర్గతమైన ఆరాటమును ఏవేవో ధన, జన, పేరు, ప్రతిష్ఠల వంటి వాటికొరకై చేసే ప్రయత్నములు అనే కాలయాపనతో కొద్దిసేపు కప్పి పెట్టినప్పటికీ - అతనియందు అంతర్గతమైన ఆవేదన సమసిపోవుటలేదు. ఓ మహర్షీ! ఏ ఏ పదార్థజాలమంతా మహదైశ్వర్యమని, మహద్భాగ్యమని, ఈ జీవులు భావించి ఆయా వస్తుజాలం పొందటానికి అనేక ప్రయాసలతో కూడిన ప్రయత్నములు చేస్తున్నారో, అవన్నీ కూడా నా ఉద్దేశంలో తుచ్ఛమే అయివున్నాయి. “సత్యదృష్టి, దూరదృష్టి, పరిశీలనాత్మక దృష్టి” లేకపోవుటచేతనే ఈ జీవుడు అనేక మోహములను పొందుతూ, అత్యంత ప్రయాసపడుచున్నాడు.
ఆయురత్యంత చపలం, మృత్యురేకాంత నిష్ఠురః | తారుణ్యంచాతి తరళం, బాల్యం జడతయాహృతమ్ ॥ || (XXVI-9)
ఈ ఆయువును చూద్దామా - - అత్యంత చపలమైనది. మృత్యువా, - - అల్లంత దూరంలో, అత్యంత క్రూరంగా ఎదురు చూస్తోంది. ఈ జీవుడు 'యౌవనము' అనే అందమైన, తెలివైన మోసకత్తెను చూచి, మాన-మద-గర్వాదులు పొందుతూ క్షణంలో విచక్షణ కోల్పోతున్నాడు. కాని యౌవనం శాశ్వతమా? కాదు. అది వాస్తవానికి క్షణికం. బాల్యం చూద్దామా, అది దట్టమైన అజ్ఞానంతో కప్పివేయబడి ఉంటోంది. ఈ లౌకిక విషయాలు చూస్తే, ఇవన్నీ అనేక విషయానుసంధానములచే కళంకితమై ఉన్నాయి. ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ స్వజనులు, ఈ పరిజనం, ఈ పరిచయాలు - ఇవన్నీ బంధాలేకాని, వాస్తవమైన సుఖమును, ప్రశాంతతను ప్రసాదించేవి కావు. ఈ భోగములు మహారోగముల ప్రతిరూపములు మాత్రమే. “ఎప్పటికో, ఎక్కడో, ఏదో పొంది సుఖించబోవుచున్నాను” - అను రూపముగల వ్యవహారమంతా "జింక దాహంతో పరితపిస్తూ అల్లంత దూరంలో గల మృగతృష్ణాజలం చూచి గంతులు వేయటం” వంటిదే.
❖
ఈ దైవము, లేక కాలగతి యొక్క చర్యలు ఎంత ఆశ్చర్యంగా చమత్కారంగా ఉన్నాయి! ‘ఇంద్రుడంతటివాడు కూడా మృత్యుముఖమున పడుచున్నాడు. సర్వమును నిర్దేశించే యముడు నియమించబడుచున్నాడు. వాయువంతటివాడు ఒక రోజుకు ప్రాణహీనుడగుచున్నాడు. చంద్రుడు ధూళిగా మారిపోవుచున్నాడు. సూర్యుడు ఖండ ఖండములగుచున్నాడు. అగ్ని ఆరిపోవుచున్నాడు. విరించి వీగిపోయి, నామరూపాలు కూడా లభించకుండా అగుచున్నాడు. హరి అంతటివాడు హరించుకు పోవుచున్నాడు. భర్గుడు భస్మమగుచున్నాడు. కృతాంతుడు కాలునిచే మ్రింగబడుచున్నాడు. కాలుడు మహాకాలుని యందు విలయమైపోవుచున్నాడు. ఏ అనివార్య నియతి (Inevitable and indespensable destiny) దుస్సవహమై ప్రవర్తిస్తోందని అందరు అనుకొంటున్నారో, అట్టి నియతికూడా విలయించిపోతోంది. ఆకాశమే నిరాకాశమై వినాశనమగుచున్నది. ఇక తుచ్చ శరీరధారులమగు మాబోటివారి గురించి ఏమని చెప్పమంటారు? మాకు ఆలంబనం ఎక్కడిది?
Page:48
హే మహాత్మా! ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది. అచింత్యమైన శక్తిరూపమగు 'అజ్ఞాతమూర్తి' ఏదో ఉన్నది. అట్టి అనిర్వచనీయమగు తత్త్వము వినుటకుగాని, చూచుటకుగాని, మాట్లాడుటకుగాని ప్రాప్తమయ్యేది కాదు. అయ్యది ఈ చక్షువులు మొదలైన సర్వేంద్రియములకు అగోచరము, అలభ్యము. అట్టి మహత్తర అజ్ఞాతమూర్తి తనంతట తానే, తనయందు, తనమాయచే - స్థూల సూక్ష్మ భూతములతో కూడిన విశ్వమునంతటినీ కనబడేట్లు చేస్తోంది. ఆ మహాద్భుత అజ్ఞాత వస్తువును అధిగమించేదేదీ ఈ ముల్లోకములలో ఎక్కడా లేనేలేదు. అదియే అహంకార రూపమున సర్వత్రా వెలయుచున్నది.
ఆ పరమ వస్తువుచే నిర్దేశింపబడుట చేతనే సూర్యుడు ఆకాశంలో ప్రభవిస్తూ రాత్రింబవళ్ళు నిర్మిస్తున్నాడు. ఆ పరతత్త్వ ప్రభావం చేతనే అనేక జీవ - గుణ ప్రదర్శనములచే ఆశ్రయించబడినట్టి ఈ భూగోళం ఉనికిని కలిగియున్నది. అదియే జ్యోతిశ్చక్రమును (నక్షత్ర మండలమును) ఆవేష్టించి నడిపిస్తోంది. ఆ పరమ పురుషుడు మనస్సుకు వాక్కుకు అతీతుడై, సర్వదా సర్వమై, అత్యంత మౌనస్వరూపుడై ఉన్నాడు. ఆయన తన తలపులతో సంకల్పించినంత మాత్రం చేతనే స్వర్గమున దేవతలు, భూలోకమున ఈ మనుష్యులు, పాతాళ లోకమున పాములు ప్రతిష్ఠితమౌతున్నాయి. దురాచారి అయిన మన్మథుడు కూడా ఆ ప్రభువుయొక్క అనుగ్రహంచేతనే బలిమిని సంపాదించి, ఈ లోకులను ఏలుచు, తన పరాక్రమం ప్రదర్శించుచున్నాడు. లేకుంటే ఆతడు వసంతఋతువులో పుష్పభరిత ప్రకృతి సమేతుడై మనస్సులను చలింపజేయ గలుగుతాడా? చిత్రం! ఈ విధంగా ఆ అప్రతిహత అజ్ఞాతమూర్తి నుండి శక్తిని పొందిన మన్మథుడు తన దుశ్చర్య ప్రభావంచేత, మహా వివేకులను కూడా ప్రియాంగనల వ్రేళ్ళను, కుచ్చెళ్ళను చూచి చిత్తభ్రమ పొందేట్లు చేస్తున్నాడు.
కదా!
పరోపకార కారిణ్యా, పూర్తి పరితప్తయా,
బుద్ధ ఏవ సుభీమన్యే, స్వాత్మ శీతలయాధియా ॥ (XXVI-39)
స్వామీ ఎవరైతే పరోపకారపారాయణులై ఉంటారో, ఇతరుల కష్టములు తమ వంటివేనని అనుకొని పరితపించుతారో, బుద్ధిబలంచేత తత్త్వజ్ఞానమును సంపాదించి స్వాత్మ యందే రమిస్తూ ఉంటారో ... అట్టి మహనీయులే ధన్యులు. వారే ఈ మాయా జగత్తు నందు ఉత్తమమైన సుఖమును పొందుచున్నారని నాకు అనిపిస్తోంది. ఇక మిగతా వారి విషయమేమిటంటారా? వారి వలన వారికి గాని, ఇతరులకు గాని కలిగే లాభమేమున్నది చెప్పండి?
ఈ మనుష్యులలో అనేకులు మోహవశంచేత 'జీవనము' అనే మహారణ్యంలో చిక్కుకున్నారు. అనేక స్వకీయకల్పనలచే దురాచారములచే వేధింపబడుచున్నారు.
ఓ మహర్షీ! ఈ జనులంతా మరల మరల పుడుతున్నారు. చచ్చుచున్నారు. అనేక కర్మలు ఆచరిస్తున్నారు. స్వల్ప లభ్యములచే, స్వల్ప ఆశలచే, స్వల్ప క్రియలచే మరల మరల ఆయుర్దాయం వ్యర్థం చేసుకొంటున్నారు. వారు కోరుకొనే ఫలములన్నీ చివరికి వారికే ఉరిత్రాళ్ళుగా
Page:49
పరిణమిస్తున్నాయి. మూర్ఖపు కార్యక్రమములను ప్రారంభించి, వాటినుండి ప్రాప్తిస్తున్న ఫలితముల నుండి మరికొన్ని కార్యక్రమములను స్వీకరిస్తూ - ఈ విధంగా అనేకసార్లు చేసినదే చేయుచు జన్మ పరంపరలు గడుపుచున్నారు. ఈ దుఃఖములకు అంతు ఉండటంలేదు. అయితే వివేకులు, జ్ఞానులు అయినట్టి వారికి మాత్రం, అవిద్యాజనితమైన సర్వకామ్య కర్మములు, వాటి ప్రయోజనములు తుచ్ఛంగానే ఉంటున్నాయి.
ఈ ప్రపంచంలోని అమాయిక జనులయొక్క సంచార వ్యవహారమంతా గమనించారా మునీంద్రా! "నేడు ఈ ఉత్సవం. ఇప్పుడు ఈ ఋతువు. ఈ రోజు ఈ ఊరుపోవాలి. ఆ రోజులలో యాత్రలు చేయబోతున్నాం. ఈ నా పిల్లల వివాహాలకోసం వేచియున్నాను. వీరంతా నా బంధువులు. ఇది సుఖం. ఇవి సరదాలు. ఈ విరామ సమయంలో ఈ ఆటలు ఆడుకొంటాం. ఈ విషయభోగాలు మేం పొందాలి. వీరి వలన నాకేం లాభం?" ఇత్యాది మిథ్యాకల్పనలన్నీ కల్పించుకొంటూ మేమంతా ఆ కల్పనలలో బద్ధులం అవుతున్నాం. చపల చిత్తము విజృంభిస్తూ ఉండగా, ఏది సత్యమో, ఏది నిత్యమో గ్రహించలేకపోతున్నాం.
23. మనోవృత్తులు - - అశాంతి
పైకి మాత్రమే మనోహరంగా కనిపించే ఈ కుత్సిత ప్రపంచంలో వాస్తవమైన మనశ్శాంతి కలిగించగలిగే వస్తువులు ఏమి ఉన్నాయి? బాల్యమంతా, కల్పిత క్రీడామయమే కదా! 'యౌవనం’ అంటారా, స్త్రీ సాంగత్యం, స్వోత్కర్షలవంటి అనేక దురహంకార చర్యలతో నిండినదై కృశించిపోతోంది. ఇక ముసలితనం ప్రవేశించిందా, అన్నీ కష్టాలే. ఈ విధంగా ఈ జనులు వ్యర్థ జీవనులగుచున్నారు. ఈలోగా మృత్యువు వచ్చి వడలిన శరీరమును నోటకరచుకుపోతోంది. అప్పుడా జీవునికి ఇహలోకంలో శూన్యమే శేషించుచున్నది.
ఈ జీవుడు జీవించుచున్నంతకాలం “నా వయస్సు పెరుగుతోంది” అని సంతోషించుచున్నాడే కాని, "అయ్యో! నా ఈ ఆయుష్షు తరిగిపోతోంది కదా! ఇప్పటి వరకు స్వస్వరూపము విషయమై నేను గ్రహించినదేమిటి? ఇక ఇక్కడి నుండి ఏమి చెయ్యాలి? ఏ మార్గం అన్వేషించాలి? ఏ జ్ఞానులతో సంభాషణ చేయాలి" అని తలచుటయే లేదు. ప్రయత్నశీలుడు అగుటలేదు.
తృష్ణ అనుక్షణం సంతోషమును తన పొట్టన పెట్టుకొంటోంది. పంచేంద్రియములు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వివేక రత్నములను మఱుగున పడవేస్తున్నాయి. భ్రమాత్మకమగు సంసార క్రీనీడలు బ్రతుకంతా ఆక్రమించి వేస్తున్నాయి. తృష్ణ యందు యథేచ్ఛగా సంచరిస్తున్న ఈ మనస్సు ఈ జీవుని ప్రయోజనరహితంగా పరిభ్రమింప చేస్తున్నది. కాలమంతా వ్యర్థమైపోతోంది. ఉత్తమమైన ఫలితమేదీ లభించుటయే లేదు. ఆపదలకు శోకించనట్టి, సంపదలకు మత్తిల్లనట్టి, యువతులను చూచి విచలించనట్టి చిత్తము పొందగలిగిన వాడే ఈ జగత్తులో ఉత్తముడని నా అభిప్రాయం.
Page:50
హే మునిశ్రేష్ఠా! యుద్ధరంగంలో గజ తురగములతో కూడిన గొప్ప శత్రు సైన్య సముద్రాన్ని ఎదుర్కొనేవాడు నా ఉద్దేశంలో గొప్ప శూరుడు కాదు. అనేక మనోవృత్తి తరంగాలతో విక్షిప్తం అగుచున్న ఈ ఇంద్రియములను జయించినవాడే వీరుడు. దురాశలే మానవుని నిజమైన శత్రువులు. దురాశాగ్రస్తమైన మనస్సును శాంతపరచగలిగే పదార్థములు ఈ ప్రపంచములో ఏమి ఉన్నాయి? దురాశకు అంతు ఎక్కడ?
కీర్తి, ప్రతాపం, సంపద ఉన్నచోట సత్వగుణం, వివేకం ఉండటం దుర్లభమైన విషయమే అగుచున్నది. ఓయీ! మానవుడా! పర్వతగుహలో ఉన్నా, లేక వజ్రనిర్మితమైన అంతఃపురంలో దాగినా అదృష్టానుసారంగా వచ్చే సంపదలనుగాని, ఆపదలనుగాని నిరోధించగలమా? లేదు కదా! మరి "ఈ ధన, దార, పుత్రాదులు మధుర రసాయనములు” అని ఎందుకు భ్రాంతిని పొందుచున్నావు? ఈ సంపదలన్నీ జీవించి ఉన్నంతకాలం 'అజ్ఞానము' అనే మూర్ఛను కల్పిస్తున్నాయి. శరీరం త్యజించు క్షణంలో కూడా “ఇవన్నీ నావి. వీటిని విడచి ఎట్లుండటం?” అని మమకారముల రూపములలో దుఃఖములకే కారణమౌతున్నాయి. మరి అవి ఉత్తమ విషయములు ఎట్లా అవుతాయి? వాటిపై అంతటి నమ్మిక ఎక్కడి నుండి వచ్చిపడుతోంది? మృత్యువు శరీరమును ఆక్రమిస్తున్నప్పుడు ఈ భార్య, పుత్ర, బంధు, మిత్ర పరివారాదులు ఎందుకు పనికివస్తాయి?
ఈ జీవుడు అవసానకాలంలో విషాదకరములైన అవస్థలు పొందటమే జరుగుతోంది. విషణ్ణుడై, తాను ఒనర్చియున్న పాపపు పనులను నెమరు వేసుకొంటున్నాడు. తాను మమకారం పెంచుకొన్న వాటినన్నిటిని మననం చేస్తూ, అంతరంగంలో దహించి వేయబడుచున్నాడు. ధర్మమునకు అనుకూలం కానట్టి అర్థ కామములకై జీవితమంతా వెచ్చించిన వారి మనస్సు అవసానకాలంలో నెమలి పింఛపు తుదిభాగంలాగా చంచలమే అవుతుందని విజ్ఞులగు పెద్దలు చెప్పుచున్నారు. మరి అట్టి మనస్సును అతడు ఎట్లా సముదాయించుకొంటాడు చెప్పండి?
దుష్కర్మల ఫలితాలు ఇట్లా ఉండగా, సత్కర్మ ఫలములు కూడా పడిలేచే నదీ తరంగాలవలె క్షణభంగురములే కదా! సంచితములైన సత్కర్మలు కూడా మృత్యు ముఖంలో ప్రవేశించువానికి శాంతిని కలుగచేయలేకపోతున్నాయి. ఇక జీవించి ఉన్నప్పుడు కూడా దైవవశాత్తు అట్టి సత్కర్మలు ప్రారబ్ధముగా (వర్తమానములో అనుభవించవలసినవిగా) ప్రాప్తించినప్పటికీ, - దేహాత్మబుద్ధి కలవారికి ఆ భోగములన్నీ శాశ్వతమైన తృప్తిని అందించగలవా చెప్పండి? కట్టెలసంఖ్య పెరిగినకొద్దీ అగ్నిజ్వాలలు అధికమే అవుతాయి కదా! ఆహా! "ఈ రోజు ఇది చేస్తాను. ఆ రోజు అది చెయ్యాలి” - ఇట్లు అవిశ్రాంతంగా చింతన చేయు మనుజుల ఆయా కర్మప్రయాసలన్నీ చివరికి ఏ రూపంగా చూచినా దుఃఖపరంపరలుగానే పరిణమిస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నములు చేయుటలోను, పుత్ర-మిత్ర-కళత్రాదులను సంతోషపెట్టడంలోను కాలమంతా ఎంత ఘోరంగా వ్యర్థం అయిపోతోంది! ఇక, ముదిమి (old age) దాపరించిన తరువాత, ఉన్న కొద్దిపాటి వివేకము కూడా ఊడ్చిపెట్టుకు
Page:51
పోతోంది. చెట్టుకు ఆకులు చిగురించి, కాలక్రమంగా ఎండి రాలిపోతాయి చూచారా? ఈ ప్రపంచంలో కూడా వివేకహీనులగు వారు జన్మిస్తున్నారు. మరల శీఘ్రంగా నశించుచున్నారు.
ఇతస్తతో దూరతరం విహృత్య, ప్రవిశ్యగేహం దివసావసానే
వివేకి లోకాశ్రయ సాధుకర్మ రికేహ్నిరాత్రా! క ఉపైతి నిద్రామ్? (XXVII-19)
నాకు ఒక విషయం చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తోంది. ఈ జనులంతా ఏవేవో కార్యక్రమములను రచించుకొని, అందు నిమగ్నులై పగలంతా అటూ ఇటూ తిరుగుచున్నారు. వివేకులను ఆశ్రయించకుండానే, సత్కర్మలను నిర్వర్తించకుండానే సాయంకాలానికి ఇల్లు చేరుకుంటున్నారు. రోజంతా ఏ వివేకము పొందకుండానే గడచి పోతోంది కదా! ఇక వారికి రాత్రిపూట నిద్ర ఎట్లా పడుతోంది? ఒక రోజు వృథా అయినందుకు చింతించరేం?
ఒకానొకడు అతి ప్రయాసతో శత్రువులందరిని జయించి వేస్తున్నాడు. పుష్కలంగా ధనాదులను సంపాదిస్తున్నాడు. సుఖకరములనుకొన్న పదార్థజాలమంతా చేకూర్చు కొంటున్నాడు. సరిగ్గా, అట్టి సమయంలో, ఎక్కడినుండో వార్ధక్య మృత్యుదేవతలు వచ్చి ఎదురుగా నిలబడి “నాయనా! -
అయినదా? ఇక బయలుదేరుదామా?” అని పలుకరిస్తున్నాయి.
ఇక ఈ ఇంద్రియముల విషయానికి వస్తే, ఇవన్నీ కొంతకాలం జీవుడిని అలరిస్తున్నట్లే కనిపించుచు, ఇంతలోనే శిథిలత్వం పొందుతున్నాయి. అతి స్వల్పకాలంలో నిర్వీర్యమైపోతున్నాయి. తుచ్ఛరూపంగానే వృద్ధి చెందుతూ ఈ జీవుడిని విషయ లంపటములలోనికి త్రోసివేస్తున్నాయి. ఆహా! చిత్రం గమనించారా? వీటికి చిక్కిన ఈ జనులు ప్రక్కనే ఉన్న మృత్యువును కూడా ఏమాత్రం గమనించటం లేదు. కర్మపాశముచే బంధింపబడినవారై, యజ్ఞమునకు తేబడిన మేకలవలె అనేక జన్మ పరంపరలకు ఆహుతి అయిపోతున్నారు.
అయితే, ఉత్తములగు తత్త్వజ్ఞానుల విషయం మాత్రం ఆ విధంగా లేదు. వారు ఈ కర్మ పాశబంధములన్నీ విడనాడి ఆత్మయందే తమ ధ్యేయము కలిగి ఉంటున్నారు. కనుక వారి ఉత్తరోత్తర జన్మలు ప్రశాంతము, ఆనందము, జన్మ కర్మ బంధరహితము అయినట్టి ఆత్మానుభవమువైపే సంధింపబడి ఉంటున్నాయి.
ఓ విశ్వామిత్ర మహర్షీ! క్షణభంగురములైన కెరటాలవలె ఈ జన సమూహమంతా ఎక్కడి నుండి, వస్తున్నారు? ఎటు వెళ్ళుచున్నారు? చెప్పగలిగేదెవరు చెప్పండి? అనేకులు ఈ విషయమే యోచించకుండా ఎదురుగా ఉన్నట్టి క్షణికములైనట్టి స్త్రీ, ధన, జనాది వ్యవహారములందే దృష్టి పెట్టి, ప్రాప్తించబోవు దుస్థితులను గుర్తించుటకు ప్రయత్నించుట లేదు. వివేకము సముపార్జించ నందుకు పర్యవసానం దుఃఖ మోహములే కదా!
ఓ మానవుడా! ఈ స్త్రీలోలుత్వము కాలకూట విష వృక్షమునకు వ్రేలాడే పక్వమైన పండువంటిదేనని నీవు ఎందుకు గుర్తించటం లేదు? తుచ్ఛమైన పై పై సౌందర్యములు స్త్రీ పురుషులను
Page:52
ఆకర్షించి వివశులను చేస్తున్నాయే? ఏది నిత్యమో, ఏది సత్యమో, అద్దానిని కనబడకుండా చేస్తున్నాయే? ఇంతా అయితే, ఈ శరీరములన్నీ రక్తమాంస నిర్మితములేకదా!
ఉత్సవ జనసమాగమం : ఈ మూల నుండి కొంతమంది, - ఆ మూల నుండి మరికొంతమంది - ఏదో ఋణానుబంధం చేత కాబోలు, వచ్చి ఒక చోటికి చేరుతున్నారు. ఇదే బంధు - మిత్ర - పుత్ర - కళత్రాదుల సమాగమమంతా! ఉత్సవ సమయంలోని జనుల సమాగమము వంటిదే ఇది. ఓయీ! జీవుడా! ఇది చూచి నీవు ఎందుకు భ్రమిస్తున్నావు? ఎక్కడి నుండో జలప్రవాహమునకు కొట్టుకువచ్చిన కట్టెలవలె వచ్చి చేరిన వీరందరు అదృష్టానుసారం ఒకరికొరకై మరొకరు కొన్ని కార్యములను నెఱవేర్చటం జరుగుతోంది. కాని ఇందులో - ఎవరి లక్ష్యం, ఆర్తి, కార్యక్రమం -
వారిదేకాని, ఒకరితో మరొకరు సంబంధించినవారే కాదు. “మనం మరొక జన్మలో కూడా ఇలాగే ఉందాం. స్వర్గ మర్త్య లోకాలలో మరల మరల కలుసుకొందాం” - అని జనులు అనుకునేదంతా -
కూడా భ్రమలాగానే ప్రాప్తిస్తోంది. ఎవరికి, ఎప్పుడు, ఎటు, ఏ విధమైన ప్రయాణం ప్రాప్తించనున్నదో, ఎవరేం చెప్పగలరు? కానీ, ఈ బహుదూరపు బాటసారులంతా ఒకరికి మరొకరు సర్వస్వమైనట్లు కబుర్లు మాత్రం చెప్పుకొంటున్నారు. అహంకరించు కొంటున్నారు. వాదులాడుకొంటున్నారు. కీచులాడుకొంటున్నారు. వివిధ కాలయాపనల రూపమున ఉన్నట్టి ఈ కార్యక్రమముల వ్యవహారమంతా ఎందుకు జీవుణ్ణి భ్రమింప చేస్తోంది? ఆలోచన, విమర్శ, పరిశీలన మొదలైన యుక్తులు కలిగి ఉండి కూడా అతడు ఇదంతా ఎందుకు గమనించుట లేదు? మహర్దశ దుర్దశ, స్నేహము-ద్వేషము, స్థిరత అస్థిరత మొదలైనవాటితో కూడుకొని కనబడుచున్న ఈ సంసారమంతా నాకు మాత్రం ఆరిపోవుటకు సిద్ధంగా ఉన్న దీపమువలెనే అనిపిస్తోంది. వినాశనము తప్పించి, ఇందులో నాకు సారమైనదేదీ కనిపించటం లేదు. ఒకానొక చక్రమువలె ప్రవృత్తమగుచున్న ఈ సంసారమంతా వాస్తవానికి వర్షాకాలపు జలబిందువు లాగా క్షణభంగురమే కదా! అయినప్పటికీ, అజ్ఞానియొక్క మనస్సుకు మాత్రం ఇదంతా వాస్తవమే అయినట్లు తోచుచున్నది. "ఆహా! ఈ వర్తమాన స్థితిగతులు ఎంతగానో నిజమై నాకు ప్రాప్తిస్తున్నాయి” అనే అతడు అనుకొంటున్నాడు.
ఈ శరీరం, ఈ యౌవనం, ఈ సుగుణ-దుర్గుణములు, ఈ గౌరవాగౌరవములు, ఈ పటాటోపములు - ఇవన్నీ కూడా ముదిమి (old age) అనుదాని ప్రభావంచేత వినష్టమై పోతున్నాయి కదా! ఇక ఈ చిత్తమును సంతోషింపచేయటం అసంభవమేనని నాకు అనిపిస్తోంది.
మహర్షీ! అటు ఆ మహావృక్షమును చూడండి. అది అదృష్టవశం చేత జన్మించింది. బాటసారులకు నీడను ప్రసాదిస్తోంది. పుష్పఫలాదులచే లోకానికి ఎంతో ఉపకారం చేస్తోంది. కాని, ఏం లాభం చెప్పండి? తాను ఎంతో సుఖింపచేసే ఈ జనులే ఒక గొడ్డలితో క్రూరంగా నరికివేస్తున్నారు. ఇక ఈ జగత్తులో దేనిని, ఏ విధంగా, ఎంతవరకు నమ్మి ఉండమంటారు? జనులతో ఏర్పడుచున్న సంసర్గమంతా అతి దుష్ట స్వభావమే కలిగియుండి, చివరికి వినాశనమే పర్యవసానముగా కలిగి ఉంటోంది. మోహమునే ప్రసాదించటం జరుగుతోంది.
Page:53
వర్తమానం భారంగాను, దీర్ఘంగాను కనబడవచ్చునేమో కాని, మానవుని ఆయుష్షు ఎంత స్వల్పమైనది? అందులో మార్పుచెందుచున్నట్టి ఎన్నెన్ని దశలు? మానవుల జీవితకాలం దృష్ట్యా చూచినపుడు, బ్రహ్మ, యముడు మొదలైన లోకపాలకులు ఆయువు అధికంగానే కనబడవచ్చుగాక. కాని, కల్ప సమూహములను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు, వారు కూడా క్షణమాత్రజీవులే కదా! అనేక క్షణముల సమన్వయమైనట్టి ఈ విచిత్ర కాలచక్రంలో ఆయువు యొక్క హెచ్చుతగ్గులు కూడా మిథ్యామాత్రములేనని నాకు అనిపిస్తోంది. తండ్రీ! విశ్వామిత్రా! దోషదృష్టి లేనట్టి, దుఃఖ తాపములు ప్రాప్తించనట్టి 'చోటు' ఎక్కడ? మాయకానట్టి క్రియలేమి ఉన్నాయి? ఏది పొందిన తరువాత, ఇక పొందవలసినదంటూ ఏమీ ఉండదు?
పర్వతములన్నీ పాషాణమే కదా! భూమి అంతా మట్టి మాత్రమే. వృక్షములన్నీ కొయ్యకాక మరేమి? మనుష్యులంతా మాంసమయములే కదా! అసలు ఇక్కడ అపూర్వమైనదంటూ ఏమి ఉన్నది? ఈ కనబడే పదార్థములు, వాటి వికారములు - వాటియొక్క మూలకారణము కంటె వేళైనవి కావు. మూలకారణమగు పరబ్రహ్మము నందే ఈ వివిధ నామరూపముల వ్యవహారం సంజ్ఞామాత్రంగా అనుభవమౌతోంది. ఆయా పదార్థ జాలమునకు లీలాభూమి అయినట్టి ఈ మిథ్యాజగత్తు అవివేకులకు మాత్రమే ఘనీభూతమై ప్రాప్తించుచున్నది. వివేకులు ఇదంతా పంచభూత వికారంగానే ఎఱుగుచున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము రకరకాల పాళ్ళలో కలిసి “ఇదిగో..,ఇది గోవు, ఇది ఇల్లు, ఇది మనుజుడు" అను దృశ్య వ్యవహారమంతా ప్రత్యక్ష మగుచున్నదని వారు గ్రహిస్తున్నారు. ఏది ఏమైతేనేం? అనేకులు తమ స్వప్నమునందు కూడా సుఖదుఃఖాది అనుభవములన్నీ అత్యంత వాస్తవములైనట్లే అనుభవమును పొందుచున్నారు. మహాబుద్ధిమంతులైన వారు కూడా అనేక భావాభావములు పొందుచు ఇందు తగుల్కొనుచున్నారు. అజ్ఞాన వశంచేతనే మిథ్యారూపములైన వాటియందు ఇంతటి నిశ్చయం ఏర్పడుతోంది. నిజానికి అత్యంత స్వల్ప విషయములైనట్టి ఈ ఇంద్రియానుభవములు, ఈ ధనములు, ఈ గృహములు - ఇందుకోసమే బ్రతుకుచున్నట్లు ఇవే జీవితమందలి మహత్తర విషయములైనట్లు - కల్పన గావించబడుతోంది. ఇట్టి అనేక సంకల్ప వికల్పములతో బాల్యయౌవనాలు వృథా అయిపోతున్నాయి. వార్ధక్యం వచ్చేసరికి, అప్పుడిక ఈ మానవుడు ఏమీ చేయకుండానే ఉండిపోతున్నాడు. చివరికి, అతనికి స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారమేమీ లభించకుండానే పోతుంది. ఇక నిరంతరమైన ఆత్మతాదాత్మ్యము లభించేది ఎప్పటికి? ఎన్ని జన్మలకు?
ఆదాతుమిచ్ఛన్ పదముత్తమానాం స్వచేతసైవాపహతో_ద్య లోకః | పతత్యశంకం పశురద్రికూటా, దానీలవల్లీ ఫలవాంఛయైవ ॥ (XXVII-37)
పశువులు, మేకలు పచ్చటి ఆకులమీద దృష్టితో కొండయొక్క అంచుదాకా పోయి,
Page:54
చూచుకోకపోవుటచే అప్రయత్నంగా లోయలోకి పడి కూలిపోతాయి చూచారా? అదేవిధంగా మూఢజనులమగు మేము రాజ్య, ధన, గృహాది భోగములను సంపాదించాలని మా శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని ప్రయత్నిస్తూ పోతున్నాం. మా చిత్తము రాగ లోభాది దుర్గుణములచే దూషితమైపోతోంది. అట్టి దుష్టచిత్తముచే వేధించబడినవారమై అధఃపతితులమౌతున్నాం. అజ్ఞానులమగు మాయొక్క జీవితములు ఇంద్రియ వ్యాపారములకే పరిమితమై వృథా అవుచున్నాయి. ఇక మాకు దిక్కేమిటి? మా గుణములు, యుక్తులు, తెలివితేటలు, శరీర సౌందర్యాలు ఎందుకు పనికివస్తాయి చెప్పండి? మా గురించి మేము ఎరుగము కదా!
ఈ జనులలో కొందరు దయ, దాక్షిణ్యము, విద్య, వినోదము మొదలైన చిత్త వృత్తులు కలిగి ఉంటున్నారు. మరికొందరో..., క్రోధ లోభాది నిష్ఠూరములైన వృత్తులతో ఈ భూమిపై సంచరిస్తున్నారు.
హృదయవిహీనుడగు ఆ బ్రహ్మదేవుడు ఈ దృశ్యమునందు అనేక వస్తువులను, వ్యవహారములను కల్పించుచున్నాడు. అవన్నీ పైకి రమణీయంగా ఉండవచ్చు. కాని, వాటి పరిణామం మాత్రం భయమును, ఉద్వేగమును, దుఃఖమును, అశాంతిని ప్రసాదించేదిగానే ఉంటోంది. అట్టి అనేక నూతన కార్యక్రమములన్నీ దోషయుక్తము లైనప్పటికీ, అవివేకులమగు మేము అనుక్షణం మోహం చెందుచున్నాం. వివేకులగు జ్ఞానులు మా అగచాట్లను చూచి నవ్వుకొంటున్నారు.
అనేకమంది జనులు నిరంతరం అనేక కుటిల యత్నములను ఆశ్రయిస్తూ విషయములందే ఆసక్తులై ఉంటున్నారు. మాయందు ప్రజ్ఞ కొఱవడి ఉండుటచే కాబోలు, మేము వివేకులగు జ్ఞానులను గుర్తించలేకపోతున్నాం. ఇక జీవితం ఎట్లా గడపాలో నాకు అర్థమగుటలేదు.
24. స్థిరాస్థిరములు - స్థితిగతులు
యచ్చేదం దృశ్యతే కించిజ్జగత్ స్థావర జంగమమ్ తత్సర్వమస్థిరం, బ్రహ్మన్! "స్వప్నసంగమ సన్నిభమ్” | (XXVIII-1)
ఈ కనబడే స్థావర జంగమాత్మకమగు జగత్తంతా కూడా స్వప్న సంగమమువలె అస్థిరమైనదే కదా? ఈ రోజు ఆకాశమునంటే మహారణ్యం, రేపటికి నేలమట్టమై పోతోంది. నేడు సముద్రమువలె కనబడుచున్న పెద్ద అఖాతం, ఒకనాటికి పెద్ద పర్వతమగుచున్నది. ఏ శరీరమైతే ఇప్పుడు పట్టువస్త్రములచే, గంధ లేపనములచే, సుకుమార పూలమాలలచే అలంకరింపబడి అనేకుల దృష్టిని ఆకర్షించుచు సంచరిస్తోందో - అదే శరీరం కొలది రోజులకు వస్త్రవిహీనమై ఊరికి దూరంగా గల ఒక గుంటలో పారవేయబడి, అక్కడ శల్యమగుచున్నది.
మహానగరాలు దట్టమైన అరణ్యాలుగా మారిపోతున్నాయి. గొప్ప తేజస్సుతో కూడుకొని అనేకమంది జనులను శాసించే ఒక మండలాధిపతి కొలది కాలంలో గుప్పెడు బూడిద అగుచున్నాడు.
Page:55
అందంగా, రకరకాల రంగుల మెఱుపులతో అనేక దీపకాంతులతో విలసిల్లే గొప్పభవనం మరికొంతకాలానికి మొండిగోడలతో, పిచ్చి చెట్లతో శిథిలమై భయమును గొలుపుచు గబ్బిలముల చేత, సాలెగూళ్ల చేత ఆక్రమించబడుతోంది. పూతోటల చేత, సుందర పుష్ప-లతల చేత అలంకరించబడి జనులను ఆహ్లాదపరుస్తున్న భూప్రదేశము మరుభూమి (ఎడారి) అగుచున్నది. నీరు ఉన్నచోట భూమి వెలయుచున్నది. భూమి నీరగుచున్నది. ఈ కాష్ఠ - తృణమయ జగత్తులో పరివర్తనమవనిదంటూ ఏది ఉన్నది స్వామీ?
ఈ బాల్యం, ఈ యౌవనం, ఈ శరీరం, ఈ ద్రవ్యములు - ఇవన్నీ అనిత్యములే అయి, ఎప్పటికప్పుడు నిరంతరం జలతరంగాలవలె మరొక స్థితిని పొందుచూనే ఉన్నాయి. ఈ జీవితమే గాలిలో దీపం వంటిది. ఇక దేనిగురించి ఏమని చెప్పుకోవాలి? ముల్లోకములందు కనబడే ఈ వస్తువుల శోభ అంతా మెఱుపు వంటిదే కాని, మరేమీ కాదు. బీజము - వృక్షములవలె ఈ
భూతజాలమంతా మాటిమాటికీ మార్పు చెందుతూనే ఉన్నాయి.
ఓ మహర్షీ! అనేక ఆడంబరములతో కూడిన ఈ సంసార రచన అంతా మహా నేర్పుగల ఒకానొక నర్తకి యొక్క తళుకు బెళుకుల వలె కనిపిస్తోంది. ఇక ఈ జీవులు ధూళిరేణువులవలె ‘మనస్సు’ అనే వాయువుచే లేవనెత్తబడి ఆ నర్తకికి వస్త్రరూపులు అగుచున్నారు. వీరంతా స్వర్గ, నరక, భూ, పాతాళ లోకములకు రావటం - పోవటమే ఆమె అభినయం. ఎక్కడికక్కడ క్షణభంగురమైన అనేక కార్యక్రమములు! ఎన్నెన్ని వ్యవహారములు? ఇవన్నీ ఆ నర్తకి యొక్క చంచల నేత్రముల వీక్షణములే అవుతున్నాయి. ఈ ఎదురుగా కనబడేదంతా గంధర్వ నగరంలాగా మహాభ్రమను కలుగజేస్తోంది. ఆహా! ఇదేమి నృత్యం! ఇదేమి సంచలనం! ఏమి చంచలత్వం! ఈ రోజులు, ఈ సంపదలు, ఈ క్రియలు, ఈ మహాపురుషులు, ఈ అధికారములు - ఇవన్నీ ఏమైపోతున్నాయి? క్షణంలో దృష్టిపథం నుండి దాటిపోతున్నాయే? ఇక మనం మాత్రం ఇట్లే ఉంటామా? లేదు. క్షణకాలం కనబడి మరల ఎటో పోయే వారమే కదా! ప్రతిరోజు తెల్లవారుతోంది. క్షయించిపోతోంది. మరల ఇంతలోనే ఎచటినుండో ఉత్పన్నమౌతోంది. ఈ పాడు సంసారానికి 'అంతు' ఎక్కడో చెప్పండి?
హే ప్రభూ! మనుష్యులు పశువులు అగుచున్నారు. పశువులు మనుష్య జన్మలు ఎత్తుచున్నాయి. దేవతలంతటివారు తమ దైవభావమునే విడచివేస్తున్నారు. ఈ జగత్తంతటిలో స్థిరమైనదంటూ ఏది ఎక్కడ ఉన్నది? అటు సూర్యభగవానుని చూడండి. అతడు తన కిరణములతో మాటిమాటికి రాత్రింబవళ్ళను కల్పిస్తూ సర్వభూతముల ఉత్పత్తి - వినాశనములకు 'సాక్షి' అయి దర్శిస్తున్నాడు. ఇంతలో క్రమక్రమంగా తాను కూడా కరిగిపోతూనే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా ఈ జీవులందరు - నీరు బడబాగ్నిలో ప్రవేశిస్తున్నట్లు - వినాశనము వైపునకే పయనించు చున్నారు. స్వర్గ-మర్త్య-పాతాళములు, వాయువు, ఆకాశము, భూమి, పర్వతములు, నదులు, దిక్కులు - ఇవన్నీ కూడా 'వినాశనము' అనే అగ్నికి ఎండుకట్టెలగుచున్నాయి.
Page:56
“మేము అంతటివారము ఇంతటివారము-మా జాతి గొప్పది” ఇటువంటి పై పై
పటాటోపాలన్నీ ఈ జీవుడు తలచుకొని మురిసిపోయేది 'మృత్యువు' అను రాక్షసుడు గుర్తుకు రానంతవరకే. మృత్యుభీతిగల మనుజునకు ధనధాన్యాదులు గాని, బంధుమిత్ర పరిజనంగాని, విభవములుగాని, ప్రీతిని, ప్రశాంతతను కలిగించగలవా? లేదు. ఇది ఇట్లుండగా, ఒక్క నిమిషంలో ధనవంతుడు 'దరిద్రుడు' అగుచున్నాడు. ఆరోగ్యవంతుడు రోగి అవుచున్నాడు. అశాశ్వతమగు ఈ జగత్తు అనుక్షణం భ్రాంతిని కల్పిస్తూనే ఉన్నది. దీనినంతటినీ చూచి విమోహితుడు కానివాడెవడో చెప్పండి? ఒకప్పుడు ఈ ఆకాశం కారుమేఘాలచే ఆక్రమించబడి, నలువైపుల చీకటి ఆవరించి ఉంటోంది. అదే ఆకాశం మరొకప్పుడు బంగారుకాంతులతో శోభిల్లుతోంది. ఇంకొకప్పుడు ప్రశాంత వాయు వీచికలచే నిండి ఉంటోంది. ఒకానొకప్పుడు బీభత్సధ్వనులతోను, ఉఱుములతోను, మెఱుపులతోను నిండి ఉంటోంది. కాసేపు మూగగా, మౌనంగా, ఇంకాసేపు అనేక సంరంభములతోను కనబడుతోంది. కొంతసేపు నక్షత్ర శోభితమై చంద్రకాంతులు విరజిమ్ముతూ ఉంటోంది. అదే విధంగా క్షణమొక రకంగా ఉండే ఈ జగత్తును చూచి భీతిల్లనివారంటూ ఎవరైనా ఉంటారా?
ఆపదః క్షణమాయాన్తి, క్షణమాయాన్తి సంపదః
క్షణం జన్మ , క్షణం మృత్యుః ! మునే ! కిమివ న క్షణమ్? (XXVIII-31)
ఓ మునీశ్వరా! క్షణంలో ఆపదలు వచ్చిపడుచున్నాయి. క్షణంలో సంపదలు చేరుతున్నాయి. క్షణంలో జన్మ. క్షణంలో మృత్యువు. ఆహా! ఈ ప్రపంచంలో క్షణికం కానిదేమిటో చెప్పండి? అయ్యో! భగవంతుడా! ఈ దృశ్య జగత్తులో కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా ఇతఃపూర్వం ఒక విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా ఉంటున్నాయి. ఇకముందు ఇంకొకరకంగా ఉండ బోతున్నాయి. వీటిలో స్థిరము, ఏకము, సద్రూపము అయినట్టి వస్తువు ఒక్కటి కూడా లేదు కదా!
మట్టి ‘ప్రత్తి చెట్టు’ అగుచున్నది. ఆ వృక్షమునకు కాస్తున్న ప్రత్తికాయలు ‘ప్రత్తి’ అయి అటుపై 'వస్త్రము’ అవుతోంది. ఆ వస్త్రము గర్వితములైన శరీరములను ఆచ్ఛాదించి కాలక్రమాన మట్టిలో కలిసిపోతోంది. చూచారా! 'మార్పు పొందని వస్తువు' అంటూ ఎక్కడా ఏదీలేదు. ఈ దేహాభిమానియగు జీవునిపట్ల “జన్మ - స్థితి వృద్ధి - పరివర్తనము - వినాశనము" ఇవన్నీ - అపక్షయము -
రాత్రింబవళ్ళు నిరంతరం ప్రవర్తిస్తూనే ఉన్నాయి కదా! ఇది ఇట్లా ఉండగా ఇంకెన్నో చిత్ర విచిత్రాలు! బలహీనుడు బలవంతుని చంపుచున్నాడు. ఒక్కడు నూర్గురిని మట్టుపెట్టుచున్నాడు. నీచులు ప్రభువులు అగుచున్నారు. గొప్ప విచక్షణాజ్ఞానం, ప్రజ్ఞ కలవారు చేయునదే లేక నిస్సహాయులగు చున్నారు. జగత్తంతా పరివర్తనామయమే!
జలంలోంచి తరంగాలు లేస్తున్నాయి. ఆ తరంగాలు మరల ఎప్పుడో ఎక్కడో విపర్యయం పొందుతున్నాయి. చేతన స్వరూపులగు మనుష్యులు అచేతన పదార్థముల సంస్పర్శచే మార్పు చెందుచున్నారు. ఆలోచనలు, అభిప్రాయములు, క్షణంలో మారిపోతున్నాయి. బాల్యం
' సముద్ర మధ్యంలో బయలుదేరే అగ్నిపర్వతం
Page:57
గతించిపోతోంది. యౌవనం వస్తోంది. ఆ యౌవనం కూడా గతించిపోయి ఎక్కడినుండో వార్ధక్యం వచ్చిపడుతోంది. ఈ శరీరము యొక్క గతే ఇట్లా ఉండగా, ఇక బాహ్యపదార్థముల, విషయముల మాట వేరే చెప్పేదేమున్నది?
క్షణమానందితామేతి క్షణమేతి విషాదితాం
క్షణం సౌమ్యత్వమాయాతి సర్వస్మిన్నటవన్మనః II (XXVIII-38)
మహాత్మా! ఈ మనస్సు ఉంది చూచారూ! నవరసాలు పోషించే నటునిలాగా, వచ్చిపోతున్న ఆయా విషయాలపట్ల క్షణంలో ఆనందం, క్షణంలో విషాదం, క్షణంలో సుముఖత్వం, క్షణంలో విముఖత్వం ప్రదర్శిస్తోంది. ఆ విరించి బ్రహ్మదేవుడు) అల్లరిచేసే చలాకీ పిల్లవానివలె హర్ష - విషాద మోహములు కలుగచేయగల అనేక వస్తుజాలములను సంఘటనలను ఎడతెగకుండా, విసుగు - - విరామం లేకుండా సృష్టించుకొంటూ పోతున్నాడు. అట్లు తాను సృష్టించుచున్న జీవులను రక్షించుకొంటూ ఇంతలోనే భక్షించి వేస్తున్నాడు. ఆయన చర్యలకు మోహితులైన ఈ జనులు రాత్రిం బవళ్ళు అనేక దుఃఖాలలో మునిగితేలుచున్నారేకాని స్వస్వరూపమును గ్రహించుటలేదు.
ఈ సంసార భాగస్వామ్యులగు జనులు వస్తున్నారు. పోతున్నారు. ఇక్కడ శాశ్వతమైనదంటూ ఏదీ లేకపోయినప్పటికీ వారి దుఃఖములకు మాత్రం అంతు ఉండటంలేదు. వాస్తవానికి వారి సంపదలు, ఆపదలు కూడా అస్థిరములేకదా! భగవంతుడా! విశ్వామిత్ర మహర్షీ! ఈ 'కాలము’ అనునది అతి చమత్కారమైనది. అతి చతురులైన వారిని కూడా అది విచలితులను చేస్తోంది. అది ఆపదలలో ముంచి తేల్చని జనులంటూ ఎక్కడా లేరేమో? 'సంసారము' అనబడే మహావృక్షపు ఫలముల వంటి ఈ ముల్లోకములందలి జీవులు నిరంతరం నేల రాల్చబడుచున్నారు. మరల క్రొత్త ఫలములు కాస్తున్నాయి. అయితే, అందులో అతికొద్ది ఫలములు మాత్రం 'జ్ఞానము' అనే మధురాతిమధురమైన రసమును కలిగి ఉంటున్నాయి.
హే మహర్షీ! ఈ తతంగమంతా బాగానే ఉన్నదికాని, జీవునికి ఈ దుఃఖాదులు ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి? మేమంతా ఈ కాలస్వరూపుని చేతిలోని కీలు బొమ్మలం మాత్రమేనా? అయ్యో! జ్ఞానదృష్టిని, దూరదృష్టిని కలిగి లేకుండానే జీవించి వేస్తున్నామే? అందుచేతనే ముందు ముందు ప్రాప్తించబోయే స్థితిగతులను తలచు కొన్నప్పుడు దుఃఖమునే పొందుతున్నాం. మేము ఊరుకొన్నా, జన్మ మృత్యు జరావ్యాధులు మమ్ములను సమీపించక మానవు కదా! కనుక దూరదృష్టి లేకుండా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగినట్లు, శక్తియుక్తులను కలిగియున్న రోజులు ఇట్లా వృథా అగుచుండగా ఇక మాకు ఏ గతి పట్టబోతోంది?
Page:58
25. పదార్థ దోషములు
స్వామీ! ఈ మా చిత్తమును చూచారా! ఇది అనేక విషయములందు ఆసక్తి కలిగినదై అట్లు ప్రాప్తించిన దోషములచే ఘోరంగా దహించబడుతోంది. ఈ చిత్తము జీవునకు కలిగించబోయే దుష్టదశలను గ్రహించినవారికి ఇక భోగాభిలాషేమి ఉంటుంది చెప్పండి? "దోషములు - దుః ఖములు - - నీచస్థితులు” వీటిని గమనించనివారికి మాత్రమే పదార్థాభిలాష ఉండటం జరుగుతుంది. ఈ పదార్థములలో ఉండే దోషములు వీటిని ఆశ్రయించే వారికి కూడా సంక్రమిస్తున్నాయి. వేపచెట్టును ఆశ్రయించినందుకు పూతీగ కూడా చేదును సంతరించుకొంటుంది కదా!
రోజులు గడుస్తున్నకొద్దీ, ఈ పదార్థములతో ఏర్పరచుకొన్న ‘సంబంధం’ కారణంగా మేము దుర్బలులమే అవుతున్నాం. ఈ సంసారములో నిమగ్నమగుటచే పూర్వ జన్మల నుండి తెచ్చిపెట్టుకొన్న కొద్దిపాటి మంచి కూడా అడుగంటుచున్నది. తండ్రీ! మహర్షీ! ఈ జగత్పదార్థములన్నీ ఎండిపోయిన మినపతీగ లాగా ఒకనాటికి నిశ్శబ్దంగా విరిగిపోయేవే కదా!
విచారించి చూస్తే ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఇవి కలుగచేయగల చింతలు అతి దుర్భరమైనవేనని నాకు అనిపిస్తోంది. అందుచేత, ఎట్టి చింతలు దరిచేరనట్టి ఏకాంతమును నేను కోరుకొంటున్నాను. ఈ ఉద్యానవనాలు, ఈ ధనాదులు, ఈ స్త్రీలు నన్ను ఉద్ధరించలేవని, ఉత్తమమైన
శాశ్వతమైన ఆనందమును ప్రసాదించలేవని నేను గ్రహించాను. నా మనస్సు ఇప్పుడు శాంతిని మాత్రమే పొందాలని కోరుకొంటోంది. కాని పదార్థచింతన, తృష్ణ త్యజించటం సులువైన విషయం కాదని అనిపిస్తోంది. ఈ పదార్థములందలి దోషము గ్రహించినప్పటికీ వీటిని జయించి వేయటం జ్ఞానదృష్టి, ఉత్తమ ప్రయత్నము ఉన్నవారికే సాధ్యమేమో! నా చిత్తము చాంచల్యము కలిగియున్నంత వరకు నన్ను రక్షించేవారు ఎవరు? నేను ఎట్లు శాంతిని పొందాలి?
నేను ఇప్పుడు జీవితమును కోరుకోవటం లేదు. మృతిని కూడా కోరుకొనుట లేదు. ఏది ఎట్లో, అది అట్లే ఉండుగాక. నిశ్చితుండనై, ఏమియు కోరుకోక, ఆసక్తి కలిగి ఉండక ఇట్లే ఉండదలచాను. ఈ రాజ్యములతో, భోగములతో, ధనములతో, ప్రయత్నములతో నాకు పనిలేదు. వీటన్నిటి మూలకారణం అహంకారమే కదా! అట్టి అహంకారమే త్యజించివేయదలచుకొన్న నాకు వీటితో ఏమి పని చెప్పండి?
లెక్కింప అలవికానంత సంఖ్యలో జీవులు ఈ భూమిపైకి వస్తున్నారు. కాని, ఏం లాభం? వారిలో అత్యధికుల యొక్క ఇంద్రియగ్రంథులు “పూర్వజన్మ వ్యవహారముల ప్రభావములు- పునః జన్మ పరంపరలు” అనే దిశల వైపుకే ఎక్కుపెట్టబడి ఉంటున్నాయి. అట్టి “పునర్జన్మ సంస్కారములు” అనే చిక్కుముడులను విడదీయుటకు ప్రయత్నించువారు మాత్రమే ధన్యులు. వారు మాత్రమే ప్రశంసాపాత్రులు.
ఏనుగు సమూహం నిష్కర్షగా తమ పాదములచే తామర తూండ్లను త్రెంచి వేస్తున్నట్లు అనేక తెలిసీ తెలియని వాంఛల సమూహముచే మా మనస్సులు హింసించ బడుచున్నాయి. కాబట్టి ఈ
Page:59
శరీరంలో శక్తి యుక్తులుండగానే నిర్మలమైన బుద్ధియోగంతో మనస్సులకు చికిత్స చేసుకోకపోతే ఇంకెప్పుడు, ఎట్లా, ఎక్కడ వీలౌతుంది చెప్పండి? తండ్రీ! ‘విషం’ నిజానికి విషం కాదు. విషయములే నిజమైన విషం. ఎందుకంటారా? విషము మహా అయితే ఒక్క శరీరాన్ని మాత్రమే హరించగలదు. మరి విషయములో - జన్మ జన్మాంతరాలుగా ముక్తికి అడ్డుగా నిలచి వందల - - వేలసార్లు మా ప్రాణములు తోడివేయగలవు.
❖
యజ్ఞచేతసులు : ఇదంతా ఇట్లా ఉన్నప్పటికీ ఈ జనులలో కొందరు మహాత్ములగు జ్ఞానులు మాత్రం సర్వదా ఈ దృశ్యముచే, ఈ ఇంద్రియములచే ఈ జీవిత సంఘటనలచే, ఏమాత్రం విచలితులుకాక, అచంచల మనస్కులై ఉంటున్నారు.
న సుఖాని న దుఃఖాని న మిత్రాని న బాంధవాః న జీవితం న మరణం బంధాయజ్ఞస్య చేతసః ॥ (XXIX-14)
జ్ఞానదృష్టి కలవారి విషయములో ఈ సుఖదుఃఖములు కాని, ఈ బంధుమిత్రులు కాని, ఈ జీవన్మరణములుకాని ఏమాత్రం బంధకారణములు కాలేకపోతున్నాయి.
కార్యకారణ తత్త్వజ్ఞుడవగు ఓ మహాత్మా! మీ పాదములు స్పృశించి అర్థిస్తున్నాను. తత్త్వజ్ఞానమును పొంది మేము ఈ భయ శోకముల నుండి విడువడు మార్గమేదైనా ఉన్నదా? ఉంటే అది మాకు ఉపదేశించండి. ఈ అజ్ఞానారణ్యంలో మేము చిక్కుకున్నాం. ఇది అనేక వాసనా సమూహములచే మహాజటిలమై, దుః ఖకంటకములచే (ముళ్ళచే) ఆవృతమై అనేక ఎత్తుపల్లములు కల్గినదై, అతిభయంకరమై మమ్ములను ఎంతగానో క్షోభింపజేస్తోంది. ఓ మునీశ్వరా! పదునైన కత్తితో ఈ శరీరం కోయబడినప్పటికీ నేను సహించగలను. కాని, ఈ సంసారములోని ఆశలయొక్క విషయాకర్షణల కోతను మాత్రం నేను భరించలేకున్నాను. “ఇవి మాకున్నవి. అవి మాకు లేవు” అనునట్టి అజ్ఞాన వాయువీచికా పరంపరలు మా చిత్తములను దోషపూరితం చేస్తున్నాయి. ఈ అజ్ఞాన వ్రేటులను నిరోధించేదెట్లా?
హే మహాశయా! ఈ సంసార జీవులందరు 'తృష్ణ' అనే పొడవైన సూత్రపు త్రాడుకు గ్రుచ్చబడిన ముత్యములవంటివారు. సాక్షి స్వరూపమగు శుద్ధ చిత్తమే ఇందు మధ్య ఉన్న మణి. కాలుడు ఈ హారము ధరించి సర్వత్రా సంచరిస్తున్నాడు. మేము కామక్రోధాదులచే మా బంధములను మేమే కల్పించుకొని, అస్వతంత్రులమై కాలచక్రము నందు ఇరుక్కొని దిక్కుతోచక పరిభ్రమిస్తున్నాం.
అయినదేమో అయినది. ఇప్పటికైనా నిదురలేచి, సింహం బోనుయొక్క ఊచలను త్రెంచివేయునట్లు నేను వైరాగ్యాదులచే ఈ కామక్రోధాదులను త్రెంచివేయతలచాను. ఓ తత్త్వశ్రేష్ఠా! నేను మీ పాదపద్మములకు సాష్టాంగ ప్రణామం చేసి శరణు వేడుచున్నాను. నా హృదయారణ్యంలో దట్టంగా వ్యాపించియున్న అజ్ఞానాంధకారాన్ని, ఉత్తమ జ్ఞానమునకు సంబంధించిన సమాచారం చేత తొలగించి వేయండి. నాయందు జ్ఞానజ్యోతి వెలిగించండి. పరమసుఖదాయకుడగు పూర్ణచంద్రుడు
Page:60
ఉదయించగానే చీకట్లు, ఆ చీకట్లో కనిపించే బేతాళాది వికారాలు తొలగిపోతాయి కదా! మీవంటి మహాత్ముల దర్శనం, ఆశ్రయం ఎన్నో జన్మల పుణ్యఫలితంగా కాని ప్రాప్తించునది కాదు. సత్సంగముచే నశించని జాడ్యము గాని, మనోవ్యాధి కాని ఏముంటుంది?
తండ్రీ! విశ్వామిత్రా! ఆకునుండి జాలువారు నీటిబొట్టువలె క్షణభంగురమైన ఈ ఆయువును గాని, చంచలములగు ఈ భోగములనుగాని, మోసపూరితములగు ఈ యౌవనాదులను గాని నేను నమ్మి కూర్చొనుటకు సిద్ధంగా లేను. స్వవిచారణచే వీటి 'అనిత్యత్వము'ను, ముందు ముందు ప్రాప్తింపజేయబోవు నీచస్థితులను ఇప్పుడే గ్రహించాను. నా ఉద్దేశంలో ఈ మానవజన్మ ఒకానొక ఉత్తమ అవకాశమే అయివున్నది. అందుచేత, తమవంటి తత్త్వజ్ఞులచే బోధింపబడుటకు నేను తగినవాడి ననుకొంటే మీ యొక్క బోధామృతం చేత నన్ను సముద్ధరించండి.
26. ప్రయోజన కథనం
హే మహానుభావా! ‘అనర్థవృత్తులు' అనే సంసార లంపటంలో, చిక్కుకున్న జనులను చూస్తుంటే నా మనస్సు భ్రమిస్తోంది. భయం వేస్తోంది. నా ఇంద్రియములు ఎండుటాకులవలె కంపిస్తున్నాయి. అల్పబలుడగు భర్తను పొందిన సౌందర్యవతి క్రూర జనులను చూచి భయపడుతుంది చూచారా? మా ఈ బుద్ధి కూడా అల్పజ్ఞాన యుతమగుటచేత కాబోలు, ఈ సంసారమును, చూచి కంపించిపోతోంది. ఏమాత్రం ధైర్య సంతోషాలు పొందలేకపోతోంది. పచ్చికపై గల ఆశతో లేడి పెద్దలోతైన గోతిలోపడి బైటకురాలేక ఎలుగెత్తి ఏడుస్తుంది చూచారా? ఈ మనస్సు తుచ్ఛమైన విషయాలకై పరుగెత్తి చివరకు దుఃఖమునందు కూలిపోతోంది. అవివేకమును నిరంతరం ఆశ్రయిస్తున్న ఈ మా చక్షురాది ఇంద్రియములు మమ్మల్నందరినీ అంధకూపములోనికి లాగివేస్తున్నాయి. అట్లు విషయములు, పదార్థముల పైపటాటోపాలు మమ్ములను బలవంతంగా వివశుల్ని చేస్తుంటే, మేమిక సత్పురుషులను ఆశ్రయించేది ఎన్నటికి? చింతలు చావవు. కోరుకొనే వాటికీ అంతు ఉండదు. లోనగల అసంతృప్తిని కప్పి పుచ్చుకొని “ఇప్పటికి ఈ ఈ వస్తువులు లభించుగాక” అని భావించి పిచ్చి పిచ్చి ప్రయత్నములందు నిమగ్నమౌతున్నాం. ఎవరెవరినో సమీపించి ఏదేదో అర్థిస్తున్నాం. ఏది పొందినా ఈ 'తృష్ణ' ఇట్లాగే ఉంటోంది. పొందినవాటి యొక్క దుర్లక్షణానుభవం (Adverse effects) తొలగుటలేదు. ఓ జనులారా! ఇదంతా గమనించకుండానే పిల్లి పాలు త్రాగినట్లు ఆయువునంతా గడిపివేస్తున్నారా? ఎంతటి దౌర్భాగ్యం!
ఈ 'సంతోషము' అనునది కొన్ని వస్తువులు పొందుతున్నందుకు, కొన్ని పొందనందుకు అనుక్షణం క్రిందమీదగుచున్నది. చిత్త చాంచల్య కారణంగా కాబోలు, నాకీ సంసారంలో “ఇది సుఖకరమైనది” అనునదేదీ కించిత్ కూడా లభించటం లేదు. ఇది నన్ను సగం ఆక్రమించి, సగం ఆక్రమించక ఉన్నది. బాలుడు చీకట్లో మోడుబారిన చెట్టును చూచి భూతమనుకొని భ్రమించునట్లు ఆత్మనిశ్చయం పొందని నా మనస్సు అనేక భ్రమపరంపరలను మాత్రమే పొందుతోంది. అనేక
Page:61
భోగవాంఛలు చిత్తమును ఇంకా పరిభ్రమింపచేయుటచే నేను దానిని నిశ్చయించుకొన్నట్లుగా (the way I decide) నియమించలేకయే పోతున్నాను. అది తన ఇష్టం వచ్చినట్లు దేశ ద్రిమ్మరివలె సంచరించుచునేయున్నది. దేవతలు వారి సంపదలను వీడలేకపోతున్నట్లు చిత్తము తన చంచలత్వమును ఎంతసేపటికీ పరిత్యజించుటయే లేదు.
అతో తుచ్ఛమ్, అనాయాసమ్ అనుపాధిగతభ్రమం కింతత్ స్థితి పదం, సాధో! యత్ర శోకో నవిద్యతే ? (XXX-11)
ఓ సాధువర్యా! ఉత్తమము, సుస్థిరము, ఉపాధి వర్జితము భ్రాంతి - దుఃఖరహితము అయినట్టి ఉత్తమ పదమేదో నాకు చూపండి. “ఈ సంసార వ్యవహారములు, ఈ కర్మలు స్వతహాగా బంధకరములు కావు. అజ్ఞానమే అన్నిటికి మూలకారణం” అని పెద్దలు చెప్పగా విన్నాను. అయితే అది ఎట్లో నేను గ్రహించజాలకున్నాను. జనకుడు మొదలైన శ్రేష్ఠపురుషులు ఈ సంసారక్రియా వ్యవహారమందుండి కూడా జ్ఞానులై ఎట్లా ఉంటున్నారు? ఈ సంసారమున ఉంటూ కూడా దీనిచే స్పృశించబడకుండా ఉండేదెట్లా? ఏ దృష్టిని పొందినవారై మీవంటి జీవన్ముక్తులగు మహాత్ములు ఈ సంసార క్షేత్రంలో వ్యవహరిస్తున్నారో నాకు చెప్పండి.
ఈ విషయ సర్పములు కుటిలములు, భయప్రదములు, నశ్వరములు (నశించబోయేవి), నరక కారణములు కదా! ఇవన్నీ యథేచ్ఛగా సంచరించే ఈ సంసారం శుభప్రదమెట్లా అవుతుంది? ఏనుగు ప్రవేశించి, స్వచ్ఛము నిశ్చలము అయిన సరోవరమును కెలికివేయుచున్నట్లు మోహము అనుక్షణం ఈ బుద్ధిని చంచలీభూతం చేస్తోంది.
సంసార ఏవ నివహే జనోః వ్యవహరన్నపి
న బంధం కథమాప్నోతి, పద్మ పత్రే పయో యథా? (XXX-17)
ఈ సంసార వ్యవహారంలో ఉంటూ కూడా తామరాకును నీరు అంటనట్లు నిర్లిప్తుడై ఉండటానికి ఉపాయమేమిటి? ఈ కామాది దుర్వృత్తులచే స్పృశించబడక ఉన్నవాడనై ఉండేదెట్లా? ఈ జగత్తును బాహ్యదృష్టితో తృణప్రాయంగాను, అంతర్దృష్టికి ఆత్మవలె చూడగలిగేదెట్లా? ఈ అజ్ఞాన సముద్రం దాటటం మహాపురుషులకు మాత్రమే సాధ్యం కదా! అట్టి ఏ ఏ మహాపురుషులు ఆచరణను ఆశ్రయించటంచే జనులు దుఃఖ రహితులు, ప్రశాంతచిత్తులు కాగలరు? మేమిపుడు ఏ శ్రేయోదాయకమైన బాటలో పయనించాలి? ఏ ప్రయత్నములచే ఉత్తమఫలం ప్రాప్తిస్తుంది? అనేక అసంబద్ధము లతో కూడిన ఈ జగత్తులో ఏ జ్ఞానం, ఏ బోధ కలిగి చరించాలి?
ప్రభూ! బ్రహ్మచేత సృష్టించబడిన ఈ అశాశ్వత జగత్తు యొక్క పూర్వాపరములను తెలుసుకొనుటకు వీలైనట్టి తత్త్వోపదేశం నాకు ప్రసాదించండి. హృదయాకాశంలో ఉన్న చైతన్య చంద్రుని మచ్చ తొలగిపోవాలి. ఇదే ఇప్పుడు నా ఏకైక ఆశయం. అందుకుగాను ఈ ప్రపంచంలో మేము స్వీకరించతగ్గదేది? త్యజించతగ్గదేది? ఈ రెండూ కానిదేది? ఈ చంచల చిత్తమును పర్వతమువలె స్థిరమొనర్చ గలిగేదేది? ఈ సంసార విషూచి వ్యాధి ఎన్నెన్ని బాధలు, వికారాలు,
Page:62
విహ్వలతలు కలిగియున్నదో చెప్పనలవికాదు. ఈ వ్యాధి ఏ పావన మంత్రముచే తొలగగలదు? హృదయంలో శీతలత్వము, పూర్ణత్వము, పరమశాంతి ప్రతిష్ఠింపబడేదెట్లా?
హే మహానుభావా! విశ్వామిత్ర మహర్షీ ! మీరు తత్త్వజ్ఞులు. అంతేకాదు. శరణన్న వారిని రక్షించటంలో మీ అంతటివారు లేరని లోకప్రతీతి. ఇప్పుడు మిమ్ములను వినమ్రతతో శరణు వేడుచున్నాను. నేను పూర్ణత్వము పొంది మరల దుఃఖము పొందనట్టి ఉపాయం, ఉపదేశించండి. అల్పజీవులను వారి ఉచ్ఛ్వాస - నిశ్వాసలే బాధిస్తాయి! ఆత్యంతిక విశ్రాంతి పొందనంతవరకు మా చిత్తవృత్తులు, మా కల్పనలు, మా భావాభావములు, మేము నమ్ముకొన్న విలువలే మమ్ములను వేధిస్తూ ఉంటాయి. కనుక మీ బోధతో మమ్ములను ప్రక్షాళనం చెయ్యండి.
27. రాఘవ ప్రశ్న
ఓ మహానుభావా! దీర్ఘాయువుగాని, ఈ శరీర స్థితిగాని ఈ బంధుమిత్ర సమాగమాలు గాని నిజంగా ఈ జీవుని ఉద్ధరించగలవా? కోర్కెలు అంతూపొంతూ లేకుండా మమ్ములను 'సుడిగాలి’లా చుట్టివేస్తుంటే అవన్నీ మాకు బంధమునే కలిగిస్తున్నాయి. మోహ మేఘములు గర్జిస్తూ పిడుగులు రాలుస్తుంటే ‘దురాశలు’ అనే మెఱుపులు మెఱిసి మమ్ములను గ్రుడ్డివాళ్ళను చేస్తున్నాయి. లోభము మమ్ములను పట్టి పీడిస్తూ మా నరనరములందలి శక్తిని పీల్చివేస్తోంది. క్షణక్షణం అనేక అనర్థాలు వచ్చి మా ముంగిట వ్రాలుచున్నాయి. మా సుకృత దుష్కృతాలు మమ్ములను అనేక లోకములలో త్రిప్పుచున్నాయి. కృతాంతుడు (కర్మల ఫలితములను ప్రసాదించు కార్యకారణ తత్త్వము) అనే పిల్లి 'జీవులు' అనే ఎలుకలను పట్టడానికి కన్నం వద్ద వేచియున్నాడు. జలప్రవాహ పతితులైనట్లు ఈ జీవులు ఎక్కడి నుండో వస్తున్నారు. ఇక్కడ పతనం పొందుచున్నారు. స్వామీ! ఈ స్థితిలో మాకు ఉపాయమేది? గతి ఏది? దేనిని చింతించాలి? దేనిని ఆశ్రయించాలి? ఈ జీవితారణ్యం శుభప్రదమయ్యేదెట్లా?
మీ వంటి మహాత్ములకు ఇచ్ఛ కలిగింపజేసి రమింపజేయగల వస్తువేదీ ఈ మూడు లోకాలలో ఎక్కడా లేదు. మా విషయం అట్లాలేదు. మేము అత్యంత స్వల్పము, నశ్వరము అయిన విషయములకు కూడా దాసానుదాసులమౌతున్నాం. ఈ పాడు సంసారం మాకు నిరంతరం పీడనే కలిగిస్తోంది. ఇదంతా మోహరహితమైన దృష్టిచే మాచే చూడబడేదెట్లా? జ్ఞానము, సంతృప్తి సంపాదిస్తే కాని ఇదంతా సుకరం కాజాలదు. కామ కళంకితమైన మా మనస్సులు ఏ ఉపాయం అవలంబిస్తే తద్ద్వారా మనస్సు - దృశ్యము అమృత కళలతో ప్రకాశించగలవు?
ఐహిక - ఆముష్మిక ఫలాశలను త్యజించి ఈ సంసారగతిని తెలుసుకొన్నవాడే 'మానవుడు’ అని అనిపించుకోగలుగుతాడు. అట్టి ఏ ఏ మహాపురుషులను అనుసరించి మేమీ సంసారారణ్యంలో
Page:63
చరించాలి? ఏం చేస్తే సంసారమందున్న మనుజుడు రాగద్వేషాత్మకములైన భోగేచ్ఛాసమూహములచే పీడించబడకుండా ఉండగలడు? రసమయమగు పాదరసం అగ్నిలోపడ్డా దహించబడదు కదా! మనుజుడు ఈ సంసారాగ్నిలో పడికూడా తపించకుండా ఉండ కలిగే ఉపాయమేది?
సముద్రంలో పడితే తడవకుండా ఉండగలమా? ఈ సంసారంలో పడి ఇందు దొర్లుచున్న మావంటివారి మనస్సులు ఇందలి పదార్థములచే ఆకర్షణ - వికర్షణలు పొందకపోవటం సాధ్యమయ్యే పనేనా? రాగద్వేషములు, సుఖదుఃఖములు లేనట్టి సత్రియలంటూ ఈ ప్రపంచంలో ఉన్నాయా?
తండ్రీ! మలిన భూయిష్ఠమైన ఈ మనస్సుపైననే ఈ జగత్తు యొక్క అస్థిత్వము ఆధారపడి ఉన్నది. అట్టి ఈ మనస్సు తత్త్వబోధచేత కానీ ప్రక్షాళనం కాదు. అందుచేత నాకు తత్త్వబోధయుక్తమైన వాక్యములను ఉపదేశించండి. ఎట్టి యోగము అవధరించటంచే కర్మలు ఒనర్చినను, లేక ఒనర్చకున్నను దుఃఖము యొక్క ఛాయ కూడా ఉండదో, అట్టి సద్వస్తువు గురించి ఉపదేశించండి. ఎట్లు ఆచరిస్తే ఈ మనస్సు పరమపవిత్రమౌతుందో, నాకు పరమశాంతి లభిస్తుందో - అట్టి ఉత్తమ ఆచరణ గురించి ఆజ్ఞాపించండి. అట్టి ఉత్తమ కార్యక్రమం ఇతఃపూర్వం ఎవరెవరు ఆచరించి ఆత్మోన్నతి పొందారో అట్టి వారి కథనం నాకు వినిపించండి. ఓ భగవంతుడవగు విశ్వామిత్రా! అట్టి మహనీయులుగా కొనియాడబడేవాళ్ళు ఎట్లు బ్రహ్మ వస్తువు గ్రహించారు? ఎట్లెట్లు విచారణ చేశారు? వారికి ఏ సాధనలచే మోహ నివృత్తి, దుఃఖముల ఉపశాంతి ప్రాప్తించాయి?
ఓ మునిసత్తమా ఒక్క మాట మాత్రం విన్నవించుకొంటున్నాను. అట్టి ఉపదేశ వాక్యాలు ఉంటే ఉండి ఉండవచ్చు. లేక ఉండి ఉండకపోవచ్చు. నాకెవరైనా చెప్పవచ్చు. లేక చెప్పుటకు సిద్ధపడకపోవచ్చు. నేనిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. అహంకారంతో సహా అన్ని కోర్కెలను పరిత్యజించి వేస్తాను. ఈ భోజన పానాదులు కూడా నాకక్కర్లేదు. వస్త్రధారణ, స్నానాదులను కూడా వదలివేస్తాను. ఇక ఆపదలు రానివ్వండి. లేక సంపదలు రానివ్వండి. క్రమంగా హస్త పాదాదులతో కూడిన ఈ శరీరం కృశించినా, లేక నశించినా, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సర్వ సందేహములను, అహంకారమును, అసూయను పరిత్యజించి కేవలం మౌనం వహిస్తాను. ఒక స్థాణువులాగా, బొమ్మలాగా ఉండిపోతాను. క్రమంగా శ్వాసలను, జ్ఞానమును కూడా వదలివేస్తాను. సర్వ అనర్థములకు కారణమైన ఈ శరీరమునకు ఏది అవ్వాలో అట్లే అగుగాక. ఈ దేహము నాది కాదు. నేను నా దేహమునకు చెందినవాడను కాను. ఇతర దేహులు కూడా నా వారు కారు. నేను వారికి చెందినవాడిని కాను. అందుచేత అన్నిటినీ పరిత్యజించివేస్తాను. చమురులేని దీపంలాగా ఈ దేహము శుష్కించి లయించినప్పటికీ ఇందువలన నేను క్రొత్తగా పొందునదిగాని, కోల్పోవునదిగాని ఏమీ ఉండదు. దేని పర్యవసానమెట్లుంటే అట్లే అగుగాక!
రామచంద్రుడు ఈ విధంగా మనోమోహమును నశింపజేసే వాక్యాలు పలికి మౌనం వహించాడు. అవి విన్న అక్కడి సభికులందరు ఆశ్చర్యానందములతో పులకిత శరీరులయ్యారు. అప్పుడు జనించిన వైరాగ్యవాసనలచే అక్కడివారికి సంసారము పట్లగల అజ్ఞానముతో కూడిన
Page:64
ప్రియత్వం శమించింది. వసిష్ఠ - విశ్వమిత్రాది ఋషులు పరమానందమొందారు. నారదాది మహాప్రాజ్ఞులు రాముని వాక్యములలోని విచిత్రార్థమును గ్రహించి ఉత్తేజితులయ్యారు. సిద్ధులు పుష్పవర్షం కురిపిస్తూ తమలో తాము ఇట్లు సంభాషించుకొన్నారు.
సిద్ధులు : ఆహా! ఈనాడెంత సుదినం! కల్పారంభం నుండి ఇప్పటిదాకా మనం మూడు లోకాలలో సంచరిస్తున్నాం. కాని ఇంతవరకు ఇంతటి అమృతమయ వాక్యాలు ఎప్పుడైనా విన్నామా? బృహస్పతి కూడా ఇంతటి వైరాగ్యవాక్యాలు పలుకలేదేమో! నేటికి కదా మన జన్మలు ధన్యమైనాయి. ఈ వచనాలు విన్నంత మాత్రంచేతనే మనమంతా ఎంతో ఉద్బోధించబడ్డాం. ఆహా! రఘురాముడు పలికిన ఈ ఉత్తమ ప్రశ్నలకు మహర్షులు ఏమి సమాధానమిస్తారో విని తీరాల్సిందే. ఓ సర్వ మునీంద్రులారా! రండి! మనం ఈ దశరథుని సభలో ప్రవేశిద్దాం.
అప్పుడు కమండలధారులగు అనేకమంది ఋషి పుంగవులు సభలో ప్రవేశించారు. మహారాజులేచి వారందరిని ఆహ్వానించి ఉచితాసనములను ప్రదానం చేశారు. వేద-వేదాంగులగు తత్త్వవేత్తలు అక్కడ ఉపవిష్టులవటంతో ఆ సభ ఇంద్రసభను మించిపోయింది. ఆహ్వానితులగు మునులు ఇట్లు శ్లాఘించారు.
ఆహా! మన రామచంద్రుడు వైరాగ్య పూర్ణములు, జ్ఞానప్రబోధకములు, శుభ ప్రదములు అయిన వాక్యాలు పలికాడు. ఇతడు, పలికినవన్నీ అత్యంత విచార యుతములు, సుస్పష్టములు, విశుద్ధములు, సంతోషదాయకములు కూడా! ఇతని మాటలు విని ఆశ్చర్యపడనివారెవరు? ఎక్కడోగాని ఇంతటి సర్వోత్కృష్టములు, సుందరములు, సువ్యక్తములు అయిన వాక్యాలు వినిపించవు. ఎవరి హృదయంలో ఇంతటి ప్రజ్ఞా సుగంధం గల వివేక పుష్పం వికసిస్తుందో అట్టివాడే 'పురుషుడు' అని అనిపించుకొంటాడు. ఈ లోకంలోకి అనేకులు వస్తున్నారు. వారిలో చాలామంది విషయలోలుత్వం ఆశ్రయించినవారై కేవలం రక్తమాంసమయ నిర్మితమగు యంత్రములు మాత్రమే అయివుంటున్నారు. వారియందు ప్రజ్ఞచే ఉద్దీపించు పరిశీలన లేకుండటచే జడమాత్రులే అగుచున్నారు. పురుషార్థముకొరకు, లక్ష్యశుద్ధిలేని వారి జీవితములు వ్యర్థములే కదా! "మేమెందుకు జరామరణ దుఃఖాదులచే వేధింపబడుచున్నాం? ఈ సంసారమనగా ఏమి?” అనునట్టి సారభూతమగు ప్రశ్నలు రాముని వాక్యములచే ఉదయింపజేయబడుచున్నాయి. పూర్వాపరవిచారము సల్పునట్టి నిర్మలాశయుడగు పురుషుడు మనకీరోజు రామచంద్రుని రూపములో లభించటం మనందరి పూర్వసుకృత ఫలమే. ఇంతటి తత్త్వసాక్షాత్కారత్వం ప్రకటించ గలగటం అత్యంత అరుదైన విషయం.
ఆహా! మాన్యుడు, మనీషియగు ఇతడు ఇంత చిన్న వయస్సులో ఎంతటి ఆత్మ వివేక మాధుర్యమును అనుభవమునకు తెచ్చుకొన్నాడు! ఇతడు జగత్స్వరూపమంతా చక్కగా గ్రహించియున్నాడు. ఓ జనులారా! ఎక్కడోగాని లభించనట్టి చందన, లవంగ వృక్షమువలె మనకీతడు ఈనాడిక్కడ లభించాడు. మీరంతా ఇతని మహద్వాణిని విన్నారుకదా! ఈ కుఱ్ఱవాడు చెప్పినట్లు
Page:65
"అతి క్రూరమగు దైవదృష్టియా?” అన్నట్లున్న ఈ పాడు సంసారములో సారమును గాంచటం చాలా కష్టతరమైన విషయమే. ఎవ్వరైతే ఇక్కడ ఆత్మ వస్తువును పొందటానికి ప్రయత్నిస్తారో వారు మాత్రమే ధన్యులు. వారే అగ్రగణ్యులు. వారే పురుషోత్తములు.
రామచంద్రుని వంటి మహావివేకి విచక్షణాజ్ఞాని ఇంతకుముందు కాని, ఇకముందు గాని అలభ్యుడనే మా అభిప్రాయం. ఇప్పుడీ రామచంద్రుని వచనములకు సరి అయిన సమాధానమిచ్చి ఇతని అభిమతం సిద్ధింపచేయకపోతే, మాకు మునులు-ఋషులు మొదలైన నామధేయములు వ్యర్థమే అవుతాయి.
ఈ శ్రీరాముడు తత్త్వవిచారణచే పూర్ణత్వము అనుభవించుటకు సర్వవిధముల తగినవాడై ఉన్నాడు. (రామయ్యా! ఇది కదయ్యా, నీ అవతార విశేషం!)
వైరాగ్య ప్రకరణం సమాప్తం
బ్రహ్మార్పణమస్తు - - లోక కళ్యాణమస్తు
ఓం తత్సత్
Page:99
Page:67
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము II.ముముక్షు వ్యవహార ప్రకరణం
Page:68
Page:69
ముముక్షు వ్యవహార ప్రకరణం
ముముక్షువు అనగా ఎవరు? ప్రయత్నము - - ప్రయత్నరాహిత్యముల స్థితి గతులు ఎట్టివి? ఈ మానవుని, దోషపూరితమైన ప్రయత్నములందు నియమిస్తున్నది ఎవరు? వివేక-అవివేకములు ఎట్లు ప్రవర్తిస్తున్నాయి? వివేకము వికసించాలంటే మార్గాలు ఏమిటి? ఈ జీవుని వాస్తవ స్వరూపము ఏమిటి? సాధన - విచారణముల ప్రాశస్త్యమేమిటి? జీవుడు మోక్ష స్వరూపుడు అగుట ఎట్లు? ఈ మొదలైన విషయాలన్నీ ఈ ప్రకరణంలో చర్చించబడ్డాయి. శిష్యుడు ఏ దృష్టి కలిగియుండి ఈ శాస్త్రంలోని బోధ వినుటకు సిద్ధంగా ఉండాలో, శ్రీ వసిష్ఠ మహర్షి చర్చించారు. ఈ శాస్త్రము యొక్క లక్ష్యమేమిటో కూడా చెప్పారు.
జీవుని 'పూర్ణుడు’గా తీర్చిదిద్దటమే ఈ శాస్త్రము యొక్క ఏకైక లక్ష్యము కదా! అతనిని స్వతంత్ర, యత్నశీలునిగా చేయుటకుగాను, “దైవము” అనబడు బాహ్యమగు వస్తువు అతనికి ఏదీ ప్రసాదించుటలేదని నిరూపించబడినది. జీవుని స్వకీయ యత్నములే జ్ఞానాజ్ఞానములకు కారణములగుచున్నాయి.
ఈ ప్రకరణం పాఠకుని సదాచారము వివేకపూర్వక విచారణలకు సిద్ధం చేస్తోంది.
Page:70
1. శ్రీ శుక విశ్రాంతి
శ్రీరామచంద్రుని వివేక, వైరాగ్య పూరితమైన వాక్యాలు సభలోని వారందరి హృదయాలు పులకింపచేశాయి. అనేక మంది సిద్ధులు, మునులు, ఆ సభలో ప్రవేశించారు. వారందరు ఉచితరీతిన సత్కరింపబడినవారై సభలో ఆశీనులయ్యారు. అంతటా మరల ప్రశాంత వాతావరణం అలముకొన్నది. శ్రీ విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి మధురస్వరంతో పలుకనారంభించారు.
శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ రాఘవా! నీవు పరమ పవిత్రమైన సత్యమునే పలికావు. నీ సూక్ష్మబుద్ధిచే గ్రహించవలసినదంతా చక్కగా గ్రహించావు. వాస్తవానికి నీవు క్రొత్తగా ఎరుగవలసినదంటూ ఏదీ లేదు. అయితే, సహజ నిర్మలమగు నీ బుద్ధికి కొంచెము మెరుపు మాత్రం అవసరమై ఉన్నది. ఈ సందర్భంలో ఇతఃపూర్వపు ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. శ్రీ వ్యాస మహర్షి కుమారుడు 'శుకుడు’ అనువాని విషయంలో ఇటువంటిదే... ఒకానొక సంఘటన జరిగింది. అతడు కూడా నీవలెనే తెలుసుకోవలసినదంతా తెలుసుకున్నప్పటికీ, జనక మహరాజుచే బోధింపబడిన తరువాతనే ఆత్మయందు విశ్రమించాడు. నీకు మొట్టమొదటగా, శుభదాయకమగు ఆ శుక మహర్షి వృత్తాంతం చెపుతాను విను.
ఓ రామచంద్రా! అటు చూడు. నీ తండ్రి సింహాసనం ప్రక్కనే, సూర్య తేజస్సుతో వెలుగుచు, ఆసీనుడై ఉన్న ... ఆయనే, వ్యాసమహర్షి. ఆయన కుమారుడే శుకుడు. సౌందర్యరాశి వంటి ఆ శుకుడు జన్మతః మహాప్రాజ్ఞుడు. యువకుడగు అతడు ఒకప్పుడు ఒక ఏకాంత ప్రదేశం చేరాడు. ప్రశాంతచిత్తుడై, పద్మాసనము వైచుకొని, ఈ సంసారము యొక్క గతి గురించి, ఇందలి మాలిన్యము గురించి చింతించసాగాడు. అట్లు విమర్శనా పూర్వకంగా విచారించుచు ఉండగా కొంతకాలానికి అతని మనస్సునందు ఉత్తమోత్తమమైన 'వివేకం' ఉదయించింది. మహాబుద్ధిమంతుడు అగుటచే నిజబుద్ధి బలంచేత, చిరకాల విచారణచే అతడు అకృత్రిమము, సహజము, సుందరము, సత్యము అయిన “ఆత్మస్థితి యొక్క ఆనందానుభవం” గ్రహించాడు.
అట్లు తనంతట తానే సత్య వస్తువును ఎరిగినప్పటికీ అతని మనస్సు మాత్రం పూర్ణమగు శాంతిని పొందలేదు. “నేను గ్రహించినదే సత్యమా? జీవుడనగు నేను వస్తుతః పరిశుద్ధమగు పరమాత్మనే అయివున్నానా?” అనునట్టి కించిత్ శంక ఇంకా అతనిని వదలలేదు. ఫలితంగా సంసార దుఃఖం ఉండనే ఉన్నది. అతని సుస్థిర చిత్తము క్షణభంగురములగు సర్వ సంసార విషయముల నుండి విడివడింది. అనగా రంగం సిద్ధమైనది. కాని అతడు ఉత్తమ శాంతిని పొందవలసి ఉన్నది. అప్పుడాతడు ధ్యానము చాలించి, తండ్రియగు వ్యాసమహర్షిని సమీపించి, ప్రణామంచేసి ఇట్లు ప్రశ్నించాడు: "స్వతఃగా ఆత్మ స్వరూపుడనగు నాయందు ఈ సంసారాడంబరమంతా ఎట్లా ఉదయించింది? 'సంసారము' అని చెప్పబడుచున్నదంతా ఇంతకాలం కల్పించుచున్నవారెవరు? ఈ
Page:71
ఉపాధియందున్న నేను అఖండుడనై నిత్యుడనై ఉన్నమాట వాస్తవమేనా? నాకున్న శంకను తొలగించండి.” ఆత్మజ్ఞానియగు వ్యాసుడు పుత్రుని ప్రశ్న విని నిర్మల భావంతో యథోచితంగా అనేక శాస్త్ర, లౌకిక యుక్తులతో జీవుని వాస్తవ స్వరూపము వివరించాడు. కాని, శుకుడు, “నా తండ్రి చెపుతున్న ఈ విశేషములన్నీ నేను ఇంతకు ముందే గ్రహించాను కదా!" అని అనుకోసాగాడు. కుమారుడు తన వివరణ పట్ల నిరాదరణపూర్వకంగా ఉండటం గమనించి వ్యాసుడు, “నాయనా! శుకా! నేను గ్రహించియున్నదంతా చెప్పాను. నేను ఇంతకన్నా ఎక్కువ ఎరుగను. మిథిలానగర రాజు ‘జనకుడు’ అను అతడు నాకన్నా కూడా ఉత్తమమైన జ్ఞాని. నీవు వెళ్ళి ఆయనను శరణు వేడు. ఆయన వద్ద నీవు తెలుసుకొనదలచినది తెలుసుకోగలవు" అని చెప్పి మౌనం వహించారు. శుకదేవుడు తండ్రి పాదాలకు నమస్కరించి, సెలవు తీసుకొని, మిథిలానగరం బయలుదేరాడు.
ద్వారము వద్ద వచ్చి వేచియున్న శుకదేవుని, రాజాంతఃపురములోని ఒక ద్వార పాలకుడు గమనించాడు. వివరాలు తెలుసుకొని జనకమహారాజుకు నివేదించాడు. అప్పుడు జనకుడు ఒక్క క్షణం యోచించి, “సరే. వస్తే రానీ! ఇప్పుడు సమయం లేదు. అనేక రాచకార్యక్రమములలో ఉన్నాను” అని సేవకుణ్ణి పంపివేశాడు. ఏడు రోజులు గడచిపోయాయి. శుకుడు ద్వారం వద్దనే వేచియున్నాడు. అప్పుడు రాజు ఒక భటుని పిలచి "ఓయీ! నీవు పోయి 'శుకుడు' అను ద్వారంవద్ద వేచియున్న మునికి బసకొరకు మన నగరంలోని ఏదైనా వసతి గృహం చూపించు. రాచకార్యముల వత్తిడి వలన మరొక వారం రోజుల వరకు రాజదర్శనం లభించదని చెప్పు” అని ఆజ్ఞాపించాడు. ఒక విశ్రాంతి గృహంలో ఆయనకు బస చూపించబడింది. మరొక ఏడు రోజులు గడచిపోయాయి. శుకుడు ఏమాత్రమూ ఉద్వేగంలేక అట్లే వేచియున్నాడు. వార్తాహరుల ద్వారా అంతా గ్రహించిన జనకుడు అతనిని మరికొంత పరీక్షించాలనుకొన్నాడు.
అప్పుడు అంతఃపురంలోని ఒక విలాసవంతమైన గదిలో శుకునకు బస ఏర్పాటు చేయబడింది. ఆకర్షణీయమైన పదార్థములు, భోజన పానములు అమర్చబడ్డాయి. మదమత్తులైన స్త్రీలు అతనిని సేవించుటకు నియోగించబడ్డారు. శుకుడు ఆ అంతఃపురంలో కూడా స్థిరచిత్తుడై, మౌనం వహించియున్నాడు. పిల్లగాలులు మఱి వృక్షపు కాండమును కదల్చగలవా? దుఃఖ స్వరూపములే అయివున్న అక్కడి భాగ్యవస్తువులు, సపర్యలు, వందిమాగధ వచనములు, సుందర స్త్రీల సరస - సల్లాపములు అతని మనస్సుకు ఏమాత్రం ఆకర్షితంగా అనిపించలేదు.
ఈ విధంగా ఇంకొక ఏడు రోజులు గడచిపోయాయి. శ్రీ శుకదేవుని చెక్కుచెదరని ప్రశాంత స్థితిని గురించి తెలుసుకొన్న జనకుడు చాలా సంతోషించాడు. స్వయముగా వెళ్ళి శుకదేవుని సభా మధ్యమునకు ఆహ్వానించి పూజించాడు.
శ్రీ జనక మహారాజు : ఓ శుకదేవా! ఇప్పుడు మీ స్వభావమేమిటో గ్రహించాను. నేను మహదానందం పొందాను. ఈ జగత్తులో ఉంటూనే జీవుడు ఏ విధంగా ప్రవర్తించటం ఉచితమో మీరు అట్లే
Page:72
ప్రవర్తించారు. నాకు చాలా సంతోషంగా ఉన్నదయ్యా! ఇప్పుడు చెప్పండి. మీరు ఏమి తెలుసుకోవా లనుకుంటున్నారు?
శ్రీ శుకుడు : గురువర్యా! నన్నొక సందేహం పట్టి పీడిస్తోంది. ఈ జీవుడు ఎవరు? అఖండమగు పరమాత్మయే ఇతడై ఉంటే, మరి “నేను ఈ శరీర పరిమితుడను, నానుండి తదితరులు వేరైనవారు, నేను శ్రమించి మోక్షము పొందవలసి ఉన్నది" ఇటువంటి ఏకానేక రూపములైన చాంచల్యమంతా ఎట్లు ఎందుకు ప్రాప్తిస్తోంది?
అప్పుడు జనకుడు ఈ సంసారము యొక్క వాస్తవ - అవాస్తవముల గురించి పూసగుచ్చినట్లు అంతా వివరించాడు.
శ్రీశుకుడు : హే మహావక్తా! మీరీ విషయములన్నీ ఉన్నది ఉన్నట్లు వివరించినందుకు కృతజ్ఞుడను. అయితే వివేకబలంచేత ఈ విషయాలన్నీ ఇదివరకే గ్రహించాను. (ఉపనిషత్తులు మొదలైన) శాస్త్రాలు ఈ విషయమే చెప్పుచున్నట్లు తెలుసుకొన్నాను. నా తండ్రి కూడా “నిస్సారమగు ఈ సంసారమంతా అజ్ఞానము నుండే వెలువడుచున్నది. అజ్ఞానము తొలగగా, ఈ జీవుడు స్వతహాగా నిత్యుడై, ఆనందమయుడై, పరమేశ్వరుడై ప్రకాశిస్తాడు" అని చెప్పియున్నారు.
మీరు చెప్పినట్లు “జీవుడు జ్ఞానముచే లేక అజ్ఞానము తొలగుటచే బ్రహ్మము అగును” అనే విషయం నా కర్థమగుచున్నది. కాని స్వామీ! "అజ్ఞానము తొలగుట” అనగా ఏమో నాకు సుస్పష్టమైనట్లు లేదు. “నాయందు అజ్ఞానము తొలగినది” అనుటకు గుర్తు ఏది? అట్టి స్థితి ఎప్పటికి లభిస్తుంది? నాకు అఖండత్వము యొక్క అనుభవం ఇంకను లభించలేదేమి? బ్రహ్మమే నేనైతే, మరి ఈ 'జీవుడను’ అనేది ఎందుకు నాపట్ల ఏర్పడి ఉన్నది?
శ్రీ జనకుడు : మునీశ్వరా! సత్యవస్తువగు బ్రహ్మమును మీరు స్వయముగానే స్వవిచారముచే సుస్పష్టంగా గ్రహించారు. ఆపై మీ తండ్రిగారివద్ద సవివరంగా విన్నారు. మీరు గ్రహించినదే బ్రహ్మతత్వము. ఇక మీరు తెలుసుకోవలసినదంటూ వేరే ఏమీ లేదు.
“బ్రహ్మతత్వము గ్రహించాను" అని మీరు నిరభ్యంతరంగా భావించవచ్చు. ఎందుకంటారా? మీ దృష్టిలో దృశ్య పదార్థజాలమంతా అవాస్తవము అయి ఉండుట చేతనే ఈ నగరంలో ఇరువది ఒక్క రోజులు నిర్లిప్తులై ఎట్టి వికారములకు లోను కాకుండా ఉన్నారు. సమృద్ధి - అసమృద్ధులు గాని, మానావమానములు గాని మిమ్ములను స్పృశించలేదు కదా! మీచే దృశ్యము త్యజించబడినట్లే
అయినది.
ఈ విధంగా దృశ్యము తిరస్కరించబడగా, అప్పుడు శేషించు “శుద్ధము, అనిర్వచనీయము” అగు స్వస్వరూపమే పరబ్రహ్మముగా వేదజ్ఞులచే ప్రవచించబడినదని గ్రహించండి. ఓ మహర్షీ! అఖండ, నిత్యోదిత చైతన్య స్వరూపుడు, అద్వితీయుడు అగు ఆ ఆత్మ పురుషునికి ఒక్కనికే ఈ జగత్తునందు అస్థిత్వమున్నది. ఇక తక్కినవన్నీ కల్పనా మాత్రములే. అజ్ఞానయుతములగు సంస్కారముల వలననే "నేను, నీవు, పదార్థములు, శుద్ధబ్రహ్మము ఇవి వేరువేరు" అను
Page:73
భ్రమలు కలుగుచున్నాయి. ఆ భావనలే క్రమక్రమంగా స్వస్వరూపమగు ఆత్మతత్త్వమును బంధింపబడిన దానివలె అగుపింపచేస్తున్నాయి. అట్టి బంధము యొక్క అనుభవము ఉన్న వానిని మనం 'జీవుడు’ అంటున్నాం. ఆ జీవుడు అజ్ఞానము నశించినపుడు ముక్తుడై స్వస్వరూపమగు ఆత్మగా శేషించుచున్నాడు. లేక, బ్రహ్మమే తానగుచున్నాడు.
మహాత్మా! మీరు ఈ భోగములపట్ల, ఈ సర్వదృశ్య వ్యవహారముల పట్ల, “ఇదంతా ఏమాత్రం సత్యము కాదు” అను సుస్థిరమైన బుద్ధి కలిగియున్నారని మీ ప్రవర్తచే నిరూపించారు. “ఇక తేజోమయమగు ఆత్మనే నేను" అని గ్రహించుటకు అడ్డేమున్నది చెప్పండి? ఎరుగవలసినది ఎరిగినప్పుడు మాత్రమే అకృత్రిమమగు 'విరాగము' ప్రకటితమౌతుంది. అట్లు నిస్సంగత్వం ప్రకటించి మీరు మహావీరులు అయ్యారు. శాస్త్రములచే బోధింపబడు అనేక విధి-విధానములు, వైదిక వ్యవహారములు జీవునకు అనాసక్త బుద్ధిని నేర్పుటకే ఉన్నాయి. అట్టి 'అనాసక్తిని మీరు ఇప్పటికే సాధించారు. ఇక మీకు చెప్పవలసినదిగాని, మీరు వినవలసినదిగాని లేదు. పరిపూర్ణత్వము పొందినవారియందు రాగద్వేషరాహిత్యము, దృశ్యము పట్ల అంతరంగమున నిర్లిప్తత సహజంగానే ప్రాప్తిస్తాయి. మీరు స్వయముగా మీ వివేకబలంచేత పూర్ణత్వం పొందియే ఉన్నారు. మీ తండ్రి, వేదవ్యాసులు కూడా సర్వజ్ఞాననిధి, మహాతపస్వి అయినప్పటికీ, మీవలె ఇంతటి పూర్ణానుభవం పొందియుండలేదు. నేను వ్యాసుని కంటే శ్రేష్ఠుడను. ఇక మీరో, భోగరాగములను ఉద్వేగ - అనుద్వేగములను పూర్తిగా త్యజించి ఉండుటచే నాకంటే కూడా అధికులు అయ్యారు. పొందవలసిన ఉత్తమ స్థితి పొందనే పొందారు. కనుక మీ మనోరథం సిద్ధించినట్లే. ఈ దృశ్య ప్రపంచమున, ముల్లోకములందు మిమ్ములను వివశులను చేయునది, బద్ధులను చేయునది అంటూ ఏదీ లేదు. కనుక మీరు ముక్తులే అయి ఉన్నారు. ఇక మీకు సందేహం దేనికి? "ఇంతకు మించినది ఏదో ఉన్నది” అనే భ్రమను త్యజించండి. కట్టుకొయ్య త్రెంచుకొన్న ఆవువలె మీరు బంధ విముక్తులు అయ్యారు. ఇక మీకు ఎట్లు ఉచితమనిపిస్తే అట్లే సంచరించండి. ఆత్మ స్వరూపులు, ఆత్మ స్వభావులు అయివున్న మీకు నేను నమస్కరిస్తున్నాను.
ఓ రఘురామా! మహాత్ముడగు జనకుని ఈ ఉపదేశం విన్న ఆ శుకయోగి సర్వ శంకలను అక్కడికక్కడే త్యజించి వేశాడు. మలినరహితమగు 'ఆత్మ' అను పరమ వస్తువును అధిష్ఠించి విశ్రాంతి పొందాడు. శోకము, సంశయము, ఆయాసముల నుండి విడివడ్డాడు. జనకునకు ప్రణామంచేసి అక్కడి నుండి బయలుదేరాడు. 'సమాధి'ని అభ్యసించుటకు మేరు పర్వతం చేరాడు. అక్కడ నిర్వికల్పయోగంలో అనేక సంవత్సరములు గడిపాడు. అటు తరువాత తైలరహిత స్వయంజ్యోతివలె ‘ఆత్మ స్వభావము’ అను నిర్వాణస్థితి పొందాడు. సర్వ అజ్ఞాన సంస్కారములు తొలగిపోయాయి. సునిర్మల స్వరూపుడై, పరమపావనుడగు పరమాత్మయందు లీనమై విదేహముక్తుడైనాడు.
❖
Page:74
ఈ విధంగా వ్యాసపుత్రుడగు శుకదేవునకు కించిత్ 'గుర్తుచేయుట' అనే మార్జనం అవసరమైనది కదా! ఓ మునిశ్రేష్ఠులారా! మన ఈ రాముని విషయంలో కూడా ఇప్పుడు అట్టిదే అవసరమగుచున్నది. ఇతనికి కారణ రహితంగానే భోగములందు విరాగము పుట్టుటచే తన వివేకంచేత తెలుసుకోవలసినదంతా తెలుసుకొన్నాడు. భోగజాలము పట్ల అకృత్రిమమైన అరుచియే తత్త్వజ్ఞానిలో కనిపించే ఒక ముఖ్యమైన లక్షణం. ఈ సంసార బంధమంతా స్వతహాగా వాస్తవమైనది కాకపోయినప్పటికీ, “భోగచింతన చే ఇదంతా దృఢపడి ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. “వాసనాభివృద్ధే (Increase of tendencies) బంధము. వాసనాక్షయమే మోక్షము" అని మనకు జ్ఞానులైన పెద్దలు చెప్పుచున్నారు.
మరొక్క విషయం. ఆత్మ విషయమై ఆపాత జ్ఞానం (temporary & partial knowledge) అల్పశ్రమతో కూడా కలుగవచ్చు. ఎవరో చెప్పగా వినినంత మాత్రంచేత కూడా (స్వల్పమైన ఆవేశరూపంలో) వైరాగ్యం పొందవచ్చును. కాని, అట్టి వైరాగ్య భావన సుస్థిరపడాలంటే సంగరహితమైన బుద్ధి కావాలి. విషయములపట్ల వితృష్ణ (desirelessness) మాత్రం ఎంతో కష్టించితే కాని పొందుటకు వీలుకాదు. ఎవరి జ్ఞానధనమైతే కామక్రోధాదులచే ప్రతిహతం కాదో - అట్టివాడే తత్త్వజ్ఞుడు, జ్ఞాని, పండితుడు కూడా. ఎప్పుడైతే ఈ జీవుడు తెలుసుకొనవలసినదానిని తెలుసుకొంటాడో (నేను ఎవరు? అను ప్రశ్నకు ఉత్తమ సమాధానం పొందుతాడో), అప్పుడు మాత్రమే అతనికి ఈ శరీర పటాటోపం పట్ల, ఐశ్వర్యముల పట్ల, భోగములపట్ల సహజమైన విముఖత, అరుచి ఏర్పడతాయి. యశస్సు - దంభము కొరకు కాకుండా, వాస్తవదృష్టి వలన అకృత్రిమమైన వైరాగ్యము పొంది ఉండే వారే మానవులలో ఉత్తమోత్తములు. జ్ఞేయమగు (సర్వజ్ఞానుల ఉత్తమ లక్ష్యమగు) ఆత్మవస్తువు గ్రహింపబడనంతవరకు విషయవితృష్ణ కలగటం అసంభవమే.
రమణీయమగు భోగ భాగ్యములు కూడా, ఎంతటి దోషభూయిష్ఠమైనవో మన రామచంద్రుడు స్వవిచారణచే గ్రహించాడు. అందుచేతనే మహత్తరమైన ఆశయములను పొందగలిగాడు. ఓ సభికులారా! ఈ బాలుడు చెప్పినదంతా వాస్తవమే. అయితే ఇతనికి ఇంకా చిత్త విశ్రాంతి కలుగవలసియున్నది. స్వస్వరూపమగు ఆత్మ గురించి విచారణచే ఇతడు తప్పకుండా చిత్తవిశ్రాంతి పొందగలడు. ఇప్పుడు ఈ రాముని బుద్ధి కైవల్య శాంతి మాత్రమే కోరుకుంటోంది.
లోకకళ్యాణార్థం, రాముని చిత్తవిశ్రాంతి కొరకు రఘుకుల గురువు, సర్వము ఎఱిగినవాడు, సర్వసాక్షి, బ్రహ్మజ్ఞాని, త్రికాలవేత్త అయిన వసిష్ఠ భగవానుణ్ణి ఆత్మ విచారణ బోధించవలసినదిగా సభాముఖంగా అర్థిస్తున్నాను.
హే వసిష్ఠ మహర్షీ! ఒకప్పుడు మన ఇరువురి వైరం శాంతింపచేయటానికి భగవంతుడగు బ్రహ్మదేవుడు మీకు, నాకు, తదితర మునులకు ఆత్మజ్ఞానం ఉపదేశించారు కదా! ఆ యుక్తిపూర్వకమైన జ్ఞానోపదేశం చేత సర్వ సంసార వాసనలు తొలగిపోగలవు. ఓ బ్రహ్మజ్ఞా! మీ ప్రియశిష్యుడగు రామచంద్రునకు ఉత్తమమైన ఆత్మ విషయం ఉపదేశించుటచే ఇతడు, ఈ రాజ్యం, ఈ లోకం,
Page:75
భవిష్యత్తులో అనేకమంది జనులు పవిత్రత పొందటం జరుగుతుంది. వివేక వైరాగ్యములతో ప్రకాశిస్తున్న రాముడు మీ ఉపదేశమునకు అన్ని విధాలా తగినవాడు. ఇతనికి ఉపదేశించటం చేత మీ వాక్యాలు సార్థకమౌతాయి. ధూళిచే కప్పబడక పరిశుభ్రంగా ఉన్న అద్దంలో ముఖం సులువుగా, సుస్పష్టంగా కనిపిస్తుంది కదా!
త్రికాలజ్ఞులగు మీకు మేము చెప్పగలిగేదేమున్నది? భక్తిశ్రద్ధలు కలిగినవాడు, నిగర్వి, వైరాగ్యవంతుడు అయిన శిష్యునకు బోధింపబడు శాస్త్రజ్ఞానమే సార్థకమౌతుంది. ఏ బోధ అయితే అజ్ఞానమును దగ్ధం చేస్తుందో, సర్వ సందేహములను మొదలంట్ల తొలగిస్తుందో, అనిందితమైన ఉత్తమ సత్యమును ప్రతిపాదిస్తుందో అదే ఉత్తమబోధ. అట్టి బోధను మీరు మాత్రమే
ప్రసాదించగలరు.
గురుశుశ్రూషబుద్ధి లేనివానికి, విరక్తుడు కానివానికి, అపాత్రునకు ఉపదేశించబడే జ్ఞానం కుక్కతోలులో పోయబడిన పాలవలె అపవిత్రమే అవుతుంది. హే వసిష్ఠ మహర్షీ! మీరు మహావైరాగ్యసంపన్నులు. భయక్రోధములంటూ లేనివారు. నిర్మలమైన స్వభావము కలవారు. సాధుపుంగవులు. అట్టి మీవంటి మహనీయులు ఆత్మ విషయమై ఉపదేశించటంచేత, ఆ ఉపదేశ సమయంలోనే బోధింపబడువాని బుద్ధి వికసించి విశ్రమించగలదు.
అప్పుడు వ్యాస, నారదాది మహర్షులు అభ్యర్థనపూర్వకంగా వసిష్ఠునివైపు చూచి చిరునవ్వు నవ్వారు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ సభకు వేంచేసిన వ్యాస నారదాది మునిసత్తములారా! నేను మీ ఆజ్ఞను శిరసావహించటానికి సిద్ధంగా ఉన్నాను. సజ్జనుల వాక్యములు ఉల్లంఘించే శక్తి ఎవరికుంటుంది? మీరు నన్ను నియమిస్తున్నట్లుగానే ఈ రామాదులకు జ్ఞానోపదేశం చేసి అజ్ఞానమును నివృత్తింపజేస్తాను. దీపం వెలిగించిన తరువాత చీకటి ఆ సమీపంలో ఉంటుందా?
పూర్వము నా తండ్రియగు బ్రహ్మదేవుడు నాకు, తదితర మునివరేణ్యులకు ఉపదేశించిన ఆత్మజ్ఞానమును నేను ఇప్పుడు స్మరించుచున్నాను. ఈ నా ప్రయత్నము సంసార భ్రమను శాంతింప చేయటానికి, లోక కళ్యాణము కొరకు ప్రవృత్తమగుగాక!
ఇట్లు ఆయన ప్రతిజ్ఞాపూర్వకమైన మంగళాశాసనం పలికారు. కొద్దిక్షణాలు ధ్యాన నిష్ఠులై దృష్టాంతములు, ఉపాఖ్యానములు, ప్రమాణములు మొదలైన పరికరములు చేకూర్చుకొన్నారు.
అప్పటికప్పుడు ఆ సభయందు వక్త-శ్రోతలకు అనుకూలమైనట్టి వాతావరణం, వేదికలు తయారు చేయబడినాయి. అప్పుడు బ్రహ్మర్షివరేణ్యులగు వసిష్ఠ మహర్షి అజ్ఞాన శాంతి కొరకు పరతత్త్వ బోధకమైన “యోగవాసిష్ఠము” లేక “అఖండ రామాయణం" ఇట్లు ప్రవచించ ప్రారంభించారు.
Page:76
2. సదేహముక్తి - విదేహముక్తి
శ్రీ వసిష్ఠమహర్షి :
పూర్వమ్ ఉక్తం భగవతా యత్ 'జ్ఞానం' పద్మజన్మనా, సర్గాదౌ, లోకశాంత్యర్థం తదిదం కథయామ్యహమ్ ॥ (III-1)
ప్రియశిష్యా! రామచంద్రా! పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జగశ్శాంతి కోసమై ప్రవచించిన ఆత్మ తత్త్వశాస్త్రమును నీ ముందు ఉంచబోవుచున్నాను. శ్రద్ధతో వినెదవుగాక! శ్రీరాముడు : హే భగవంతుడా! వసిష్ఠమహర్షీ! మనం మోక్షశాస్త్రంలో ప్రవేశించే ముందు నాకు ఉన్న ఒక సందేహం నివారించ ప్రార్థిస్తున్నాను. శుకదేవుడు విదేహముక్తి పొందినట్లు విశ్వామిత్రమహర్షి చెప్పియున్నారు. అతని తండ్రి, గురువు, మహామతి, సర్వజ్ఞుడు అయిన ఈ మన వ్యాసమహర్షి ఎందుకు విదేహముక్తి పొందలేదు? శుకుడు మాత్రమే ఎందుకు పొందాడు? తత్త్వజ్ఞానమునకు విదేహముక్తియే ఉత్తమ ఫలితముగదా! శుకయోగి యందుగల ప్రత్యేకత ఏమిటి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! సూర్యునివలె స్వయంజ్యోతి స్వరూపుడగు ఆ 'పరమాత్మ' యొక్క చైతన్యశక్తి లేక చిత్ప్రకాశంలో కాంతిరేణువులవలె అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు లేచి ప్రవర్తించి, లీనమైపోతున్నాయి. ఈ వర్తమాన క్షణంలో కూడా త్రైలోక్యములతో (స్వర్గ మర్త్య-పాతాళములతో) కూడిన బ్రహ్మాండములు ఇసుకరేణువులవలె లెక్కింప అలవికాదు. అదే విధంగా ఇక ముందు కూడా ఆ 'పరమాత్మ’ అనే మహాసముద్రంలో ప్రపంచ తరంగాలు అసంఖ్యాకంగా లేచి లయించబోతున్నాయి.
అట్టి ఈ 'జగత్తులు' అనే రేణువులందు “ఇది సత్యమే" అను బుద్ధితో ఈ మాయామయులైన జీవులు ప్రవర్తిస్తున్నారు. అయితే, జీవన్ముక్త పురుషులకు మాత్రం ఇందలి అసత్యత్వమంతా అవగతం అయ్యే ఉంటుంది. అందుచేత ఇదంతా వారికి స్వప్నతుల్యంగానే ఉంటోంది. అట్టి స్వప్నము వంటివే అయిన ఈ బ్రహ్మాండములలో అంతర్గతమైయున్న ఈ దేహాదులు కూడా నశ్వరము (నశించపోవునవి), స్వప్న తుల్యము, అసత్ తుల్యము (వాస్తవానికి లేనట్టివి) అయి ఉన్నాయి. ఇట్టి దేహాదులు కలిగి ఉండుటలో, (లేక) లేకుండుటలో విశేషమేమున్నది? ఆత్మతత్త్వము చక్కగా ఎరిగిన జ్ఞానుల దృష్టిలో జీవన్ముక్తులకు వచ్చిన లోటేమీ లేదు. అది విదేహముక్తి కన్నా తక్కువైనదిగా వారు ఎంచుట లేదు. ఉన్న రహస్యమంతా తన వాస్తవస్వరూపమగు 'ఆత్మ' గురించి పొందియున్న విజ్ఞానపూర్వకమైన జ్ఞానములోనే ఉన్నది.
శ్రీరాముడు : మీరు భూతకాలపు, వర్తమానపు, భవిష్యత్ కాలపు, బ్రహ్మాండముల ఉత్పత్తి, స్థితి వినాశనముల గురించి చెప్పుచున్నది అత్యంత సమంజసమే. మనకు కనబడుచున్నదంతా అనుక్షణం మార్పు చెందుతూనే ఉన్నది. భూతభవిష్యత్ కాలముల మధ్య ఈ వర్తమానకాలంలో కనబడే బ్రహ్మాండము, ఇందలి పదార్థములు సర్వదా అనిశ్చింతంగా, అస్థిరంగా ఉంటున్నాయి. అందుచేత వర్తమాన బ్రహ్మాండము గురించి, ఇందలి వస్తుజాలము యొక్క ఆయా ధర్మముల గురించి ఎరిగినంత
Page:77
మాత్రంచేత, మనం 'బ్రహ్మతత్త్వము' లేక 'ఆత్మయొక్క వాస్తవ స్వభావము' ఎరుగజాలమేమోనని నాకు అనిపిస్తోంది. భూత భవిష్యత్ అనే రెండు గట్ల మధ్య మనకు లభిస్తున్న ఈ వర్తమానమును అట్లే ఉంచి, మనం ఈ బ్రహ్మాండము యొక్క పూర్వాపరాలను (ఇది ఎక్కడి నుండి వస్తోంది? ఎటు పోబోతోంది?) తప్పక విచారించవలసియున్నది. ఈ వర్తమాన బ్రహ్మాండము యొక్క అంతర్గత దృశ్య విశేషాల గురించి విచారణ అనవసర కాలయాపనయే అవుతుందేమో, ఎందుకంటారా? ఈ కనబడే వస్తుజాలమంతా అనుక్షణం భూతకాలం నుండి, భవిష్యత్తుకు పయనిస్తూ - వర్తమానంలో లేకయే ఉన్నాయని అనిపిస్తోంది. ఎప్పటికప్పుడు భూత భవిష్యత్తులచే కప్పివేయబడుతూ ఉన్నట్టి ఈ వర్తమాన “క్షణిక దృశ్యప్రపంచము”ను మనం ఎంత తరచి చూచినా, ఇది మనకు కావలసిన ఉత్తమ అవగాహనను ప్రసాదించజాలదేమో?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓహో! తత్త్వగ్రహణ సమర్థమైనట్టి నీ సూక్ష్మబుద్ధికి మెచ్చాను. అయితే భూత-భవిష్యత్, వర్తమానములు, ఈ బ్రహ్మాండములు, ఈ వ్యవహారమంతటిలో ఒకానొక మిథ్యాత్వము అజ్ఞానముచే సత్యమైన దానివలె ప్రవర్తించుచున్నది. అందుచేత, నీ రెండు ప్రశ్నలు దృష్టిలో ఉంచుకొని నేను చెప్పబోవు సమాధానం విను.
కారణ దేహమే.... ఆయా ధర్మములను అనుసరించి
(The Self) ప్రత్యగాత్మ తత్వం 'జీవుడు', 'శరీరి', ('The Experiencer') మొదలైన పేర్లతో చెప్పబడుతోంది.
అదియే.... “తత్ - అది (తత్త్వమ్)”, “సః - - అతడు (సోహమ్)”, “స్వస్వరూపాత్మ” ఇత్యాది పదములచే ఉద్దేశించబడుతోంది.
స్థూలం: ఈ పశువులలోను, పక్షులలోను, మృగములలోను, మనుష్యులలోను, దేవతలలోను 'శరీరత్యాగము' అను రూపముగల 'మృతి'ని చూస్తూనే ఉన్నాం కదా! ఈ కళ్ళకు కనబడే రక్తమాంస నిర్మిత శరీరమును జలము - వాయువు - అగ్ని - భూమి - ఆకాశములచే నిర్మించబడుటచే భౌతికశరీరం' లేక 'స్థూలశరీరం' అంటున్నాం.
సూక్ష్మం : ఈ స్థూల దేహం నశించినప్పటికీ, 'మనస్సు-బుద్ధి-చిత్తము అహంకారముల సమన్వయం మాత్రం నశించదు. దానిని 'సూక్ష్మశరీరం' లేక 'అతివాహికదేహం' అని అంటున్నాం. 'సూక్ష్మశరీరం’ యొక్క రూపమే ఇష్టములు, అయిష్టములు, అవగాహనలు, అభిప్రాయములు, కోరికలు, భావనలు, కోపతాపములు మొ॥ అయి ఉన్నాయి. (మరికొన్ని శాస్త్రములు దీనినే 'సంస్కారశేషము' అని కూడా అంటున్నాయి).
స్థూలదేహం నేలకూలినంత మాత్రం చేత అతివాహిక దేహం నశించదు. లేక, లేకుండాపోదు. అయితే, శరీర పరిమితులైన అతని బంధువులు మాత్రం పాంచభౌతిక దేహము వరకు మాత్రమే గ్రహించగలరు కనుక, "అయ్యో! మనవాడు చనిపోయాడే!" అని అనుకొని ఊరుకొంటున్నారు.