Page:178
మృత్యువు : భగవానుడా! ఆ ఆకాశజుడు “ఆకాశము నుండి జన్మించినాడు" అని అంటున్నారు. కాని, ఆకాశము శూన్యముకదా! శూన్యము నుండి ఇతడు ఎట్లా ఉద్భవించాడు? నాకు ఇంకొక సందేహం కూడా ఉన్నది. అది కూడా చెపుతాను. ఈ భూమి మొదలైనవి ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవటానికి కారణం ఏమిటి?
యముడు : మన ఈ విప్రుడు ఏ కాలమందును, జన్మించియే ఉండలేదు. ఇతడు 'జన్మ' అనునదే లేనివాడు. నిత్యుడు. విజ్ఞానస్వరూపుడు. (విజ్ఞానమే రూపముగా కలవాడు).
దృశ్య సంబంధమైన సర్వసంకల్పములు స్వస్వరూపముయొక్క నిర్దుష్టానుభవముచే మ్రింగి వేయబడగా అట్టి మహాప్రళయ సమయమందు ఇక మిగిలిఉండేదేది? కేవలము ఏక మాత్రము, శాంతము, శూన్యము, నిత్యము, ప్రకాశము, సూక్ష్మము, నిరుపాధికము, అనంతము, జరామరణాది వృత్తులు లేనిది అయిన బ్రహ్మమే కదా! అట్టి బ్రహ్మమునకు, లేక బ్రహ్మభావనకు ఇక మార్పు-చేర్పులు ఏమి ఉంటాయి? మన ఆకాశజుని స్వరూపము ఆ పరబ్రహ్మమే అయివున్నది. మార్పు చేర్పులు లేనిచోటికి నీవు చేరలేవు. ఎందుకంటే .... మార్పు చేర్పులే నీయొక్క రూపము కదా!
మృత్యువు : హే యమ దేవా! ఈ ఆకాశజుని జన్మవృత్తాంతమేమిటి? ఇతని స్వరూప - స్వభావములు ఎట్టివి? ఇతడు ఏమి కానున్నాడు? సర్వమార్పులకు అతీతుడైన ఇతని విషయము మరికొంత
వివరించండి.
యముడు : 'పరబ్రహ్మము' అని చెప్పబడుచున్న ఒకానొకటి ఉన్నది. అది శుద్ధ చైతన్యము, అనిర్వచనీయముకూడా. జ్ఞానమాత్ర స్వభావకమగు అట్టి 'పరబ్రహ్మము' నందు “నేను దేహమును” అను రూపముతో తేజోమయమగు విరాట్ పురుషుని విశాలదేహము 'కించిత్' ఆవిర్భవిస్తోంది. అప్పుడు బ్రహ్మమునందు ఈ మిథ్యామయమగు ఆకారవికారం కాకతాళీయంగా మనబోటి బద్దదృష్టి కలవారికి గోచరిస్తోంది. అట్టి బద్దదృష్టి (Bonded Perception) లేనివారికి అన్నివేళల కూడా బ్రహ్మమే ప్రస్ఫుటమౌతోంది.
ఒకానొక దృష్టాంత సహాయంతో విషయం చెపుతాను.
"బ్రహ్మము ఆకాశమువంటిది” అని అనుకొందాం. అప్పుడు, హిరణ్యగర్భుని ఉపాధియగు అజ్ఞానము ఒకానొక విశాల జలాశయం వంటిది. జలాశయంలో ఆకాశం ప్రతిబింబించినట్లు, హిరణ్యగర్భునియందు ‘బ్రహ్మము' ప్రతిబింబిస్తోంది. అనేక ఉపాధులయందు ప్రవేశిస్తూ ఇంతలోనే త్యజిస్తూ ఉండే సమష్టి మనస్సే 'హిరణ్యగర్భుడు’.
ఆ జలాశయంలో నీరు కదలుచున్నదనుకో. అప్పుడు అక్కడ ఉండి చూచేవారికి “ఆకాశమే కదులుచున్నది కదా” అని అనిపిస్తుంది. కాని "ఆకాశం ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. తరంగములు కదులుచుండగా అందు ప్రతిబింబిస్తున్న ఆకాశం కదులుచున్నట్లు నా అవగాహన యొక్క దోషంచేత అనిపిస్తోంది”, అనే విషయం సూక్ష్మదృష్టి గలవానికి మాత్రం తెలిసిపోతోంది.
Page:179
"బ్రహ్మము ఉపాధి దోషం పొందుతోంది" అని మనకు మన అజ్ఞానం చేతనే అనిపిస్తోందని మరల గుర్తుచేస్తున్నాను.
- ఆ జలాశయంలో ప్రతిబింబించే ఆకాశమును చూస్తున్నప్పుడు, అందులో కొద్ది నీటి భాగం ‘వ్యష్టి'
మొత్తం నీరంతా కలిపిచూస్తే 'సమష్టి'
- ఈ విధంగా వ్యష్టి-సమష్టిలు రెండూ అసత్యములే
- జలాశయంలోని కొద్ది భాగంలో కనిపించే ఆకాశం, విశాలజలంలో (మొత్తం జలాశయంలో) కనిపించే ఆకాశం కూడా వాస్తవంకాదు. జలాశయంలో కనిపించే ఆకాశమంతా ప్రతిబింబమాత్రమే.
- జలాశయంలో ఆకాశానికి ప్రాప్తిస్తున్న అనేక స్పందములు వాస్తవం కాదు.
- పైనున్న ఆకాశం వాస్తవం. అది యథాతథంగా ఉండగా, తరంగముల కదలికచేత జలంలోని ప్రతిబింబం - ఆకాశం, క్రింద - మీద అగుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. - ఈ అనేక స్థావర జంగమములందు గల 'మనస్సు’ అను జలంలో ప్రతిబింబించే బ్రహ్మము మనయొక్క అవగాహన లోపం చేత మార్పు చేర్పులు పొందుచున్నట్లు మన దృష్టికి అనిపిస్తోంది. బ్రహ్మము సర్వదా నిత్యసత్యమై, శుద్ధమై, శాంతమై వెలుగొందుచున్నది.
ఈ వ్యష్టి-సమష్టిలు ఉండనీ, లేకుండనీ, బ్రహ్మమునకు వచ్చు లోపమేమీ ఉండదు. తటాకంగాని, అందలి మొత్తం జలంగాని, లేక కొద్ది జలంగాని ఉన్నా, లేకున్నా, భీకర తరంగములు పొందినా, సుడిగుండములు ఏర్పడిన ... పైనున్న ఆకాశమునకు లోటేమిటో చెప్పు?
జలాశయజలంలోని ఒక విభాగంలో ప్రకటితమగుచున్న, ప్రతిబింబిస్తున్న ఆకాశం 'వ్యష్టి' అని, మొత్తం జలంలో ప్రతిబింబిస్తున్న ఆకాశం 'సమష్టి' అని అన్నాను కదా! “సమష్టి ప్రతిబింబిత బ్రహ్మము - “విరాట్-పురుషుడు, సమష్టి-జీవుడు, హిరణ్య గర్భుడు” అని చెప్పబడుతోంది.
ఓ మృత్యువా! ఈ జీవుడు, పై దృష్టాంతములోని జలాశయమునకు సంబంధించని ఆకాశమువలె “నేను బ్రహ్మమునే” అనునట్టి జ్ఞానానుభవ-దృఢత్వముచే నిన్ను అధిగమించి వేస్తున్నాడు. మన ఈ ఆకాశజుడే విరాట్పురుషుడు. ఎందుచేత?
"నేను వేలాది శరీరములోని ఒకానొక శరీరమును కాను. ఈ స్థావర జంగమాత్మకమగు సమష్టి సృష్టిని నేనే” అని భావించటం చేతనే సుమా! బిడ్డా! మనం ఇంతకు ముందు “ఈ జీవుడు సత్యసంకల్పుడు” అని అనుకొన్నాం కదా! అతడు ఏది దృఢంగా భావిస్తే అది అతనికి సత్యమై తీరుతుంది. మన మందరము ఇట్టి స్వసంకల్పములచేతనే ఈ ఈ రూపములను, క్రియలను పొందుచున్నాం. అట్లే ఈ ఆకాశజుడు కూడా. అతడే సృష్టి ప్రారంభంలో పరమాకాశము, నిర్విశేష - చిదాకాశరూపుడుగా సంస్థితుడై ఉన్నాడు. అతనికి శరీరములుగాని, కర్మలుగాని, కర్తృత్వబోధగాని, వాసనలుగాని లేవు. విశుద్ధాకాశ స్వరూపుడై, కేవలుడై, జ్ఞానఘనుడై వెలయుచున్నాడు. ఇతనికి
Page:180
ప్రాక్తన వాసనలు (tendencies that devolved from the past) ఏవీ లేవు. తేజస్సుకు దీప్తి కాక మరింకే రూపములేనట్లు, ఈ ఆకాశజునికి ఆకాశము కాక మరింకే రూపము లేదు.
ఇప్పుడితని ప్రాతిభాసితరూపము మనకు కనిపిస్తోంది కదా! అందుకు కారణం అతనిలో శేషించి ఉన్నట్టి స్వల్పచిత్తవృత్తులే. అవి కూడా రహితమైనప్పుడు ఇతనికి ఈ ప్రాతిభాసిత రూపము (Reflective appearence) కూడా ఉండదు. 'నేను చిదాకాశమే' అని గ్రహించినప్పుడు ఈ బహిర్ముఖ చిత్తవృత్తులు కూడా నశించిపోతాయి. కాబట్టి ఓ మృత్యువా! ఇతనికి 'ఘన-ద్రవ-వాయు' మొదలైన వాటితో సంబంధం లేదు. ఇతనిని నిగ్రహించాలని నీవు చేసే ప్రయత్నం వ్యర్థమైనదే. ఆకాశమును ఎవరైనా మ్రింగగలరా?
ఈ మాటలు విన్న మృత్యువు ఆశ్చర్యపడింది. ప్రభువగు యమధర్మరాజు వద్ద సెలవు తీసుకొని తన నివాసస్థానమునకు వెళ్ళిపోయింది.
2. స్వయంభువు
శ్రీరాముడు కొంచెంసేపు మౌనం వహించాడు. వసిష్ఠమహర్షి చెప్పిన ఆకాశజ - మృత్యు యమదేవుల కథ కొద్ది క్షణాలు మననం చేశాడు. పరిశీలనాత్మకంగా దర్శించి ఇట్లు పలుకసాగాడు. శ్రీరాముడు : మీరు చెప్పిన ఆకాశజుని వృత్తాంతం, యమ-మృత్యువుల సంభాషణ విన్నాను. మీరీ కథ ఏదో గూఢార్థంతో చెప్పారని నాకు అనిపించింది.
మీరు చెప్పిన ‘ఆకాశజుడు' అనగా లోకపితామహుడైన బ్రహ్మదేవుడే కదా! అతడే హిరణ్య గర్భుడు, స్వయంభువు, అద్వితీయుడు, జీవసమష్టిరూపుడు ... అని కూడా చెప్పబడ్డాడు. వివిధ రీతులైన భావాభావములకు అనుసంధానకర్తయే ఆ ఆకాశజుడు. మీరు చెప్పిన దానిని బట్టి ఈ జగత్తు మిథ్యయే అయివున్నది.
శ్రీ వసిష్ఠమహర్షి : అవును. నీకు బ్రహ్మదేవుని గురించే చెప్పాను. ఒకప్పుడు ఒకానొక మన్వంతరంలో మృత్యువు జీవులందరిని భక్షించి, బ్రహ్మను కూడా ఆక్రమించాలని అనుకొన్నది. అప్పుడు మనం చెప్పుకొన్న విధంగా యముడు బోధించటం జరిగింది. ఎవడు ఏ పని చేయాలనుకొంటాడో అతడికి ఆ విషయంలో సహజమైన ప్రవృత్తి ఉంటుంది కదా! అందుచేత మృత్యువు బ్రహ్మదేవుని భక్షించాలని ప్రయత్నించింది. అయితే బ్రహ్మ ఆకాశ-శరీరి మాత్రమే కదా! మృత్యువు అతనిని ఎట్లా ఆక్రమిస్తుంది?
“నేను మనోమాత్రుడను. పృథివి మొదలైన ఆకారాదులు లేనట్టి సంకల్పమాత్రుడను. చిదాకాశరూపుడను” అని ఎవడైతే సుస్థిరంగా భావిస్తాడో.... అతడు చిదాకాశమే అగుచున్నాడు. అట్టివాడు కారణహీనుడు. 'ఉత్పత్తి' అనునదే లేనివాడు. అట్టివానిని మార్పు చేర్పులు తాకజాలవు.
చిదాకాశము : చిత్ = ఎరుక, ఆకాశము = ప్రసరణము
బ్రహ్మవిత్ బ్రహ్మైవభవతి : బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు.
Page:181
మనస్సుచే సంకల్పించబడినప్పుడు ఆ మనస్సులోనే వస్తువులు, పురుషులు అగుపిస్తారు కదా! ఈ పంచభూతములతో సంబంధం లేనివాడు, స్వయంభువు అగు బ్రహ్మ కూడా 'ఆకాశజుడు' అనే రూపంలో పరిమిత దృష్టి గలవారికి గోచరిస్తున్నాడు. నిర్మలాకాశంలో సంకల్పబలం చేత ఒకనికి ముత్యాలు ఉన్నట్లు తోస్తుంది. స్వప్నం, స్వసంకల్పము ప్రవర్తిస్తున్నప్పుడు కల్పిత నగరం కనబడటం అందరికీ అనుభవమగుచున్న విషయమే. ఈ 'స్వయంభువు' కూడా అట్లే శరీరములతో అగుపడటం జరుగుతోంది. ఇతడు కేవలం పరమాత్మయే. అందుచేత అతని యందు దృశ్యత్వము గాని, ద్రష్టత్వము గాని లేవు.
సంకల్పము లేక భావించటం మనస్సు యొక్క రూపము. శుద్ధమనస్సే బ్రహ్మము. అనగా మనోభావాలు ధరిస్తున్న చైతన్యమునకు నామరూపాలు లేకపోయినప్పటికీ, గుర్తుకోసం 'బ్రహ్మము' అను పేరు పెట్టబడింది. అట్టి శుద్ధ-మనోమయాకాశంలో ఈ పృథివి మొదలైన వస్తుజాలం లేదు. ఒక చిత్రకారుడు ఒకానొక సుందరమైన ప్రకృతి దృశ్యం చిత్రించాలను కొన్నాడనుకో ఇప్పుడు అతని మనస్సులో దేహరహితమైన ఆ 'ప్రకృతి దృశ్యం' రూపుదిద్దుకొంటుంది కదా! ఈ బ్రహ్మదేవుని చిదాకాశమునందు ప్రతిబింబము గ్రహించు స్వభావము గల శుద్ధమయినట్టి మనస్సుయొక్క స్వరూపము ఉదయించి ప్రకాశిస్తోంది.
కాబట్టి రాఘవా! ‘బ్రహ్మము' అనునది వేరే ఏదో ఎక్కడో ఉన్నది కాదు. అది ఆదిమధ్యాంత రహితము. కేవలము, స్వస్వరూపము అయినట్టి చిదాకాశమే అయ్యది. అద్దానిని సృష్టించునది అంటూ ఇంకేమీ ఉండదు. అది సంకల్పించుటచేతనే సర్వము సృష్టించ బడుతోంది. స్వయముగా, సంకల్పరూపంచే ప్రదర్శితమగుచుండుటచే అద్దానిని 'స్వయంభువు' అని అంటున్నాం.
ఈ మనస్సు ఆకార రహితము అయినప్పటికీ చిత్తము వలన, ఆకారయుతముగా ప్రకాశించు చున్నది. వంధ్యాపుత్రునివలె (గొడ్రాలి కుమారునివలె) దానికి వాస్తవానికి శరీరాదులు లేవు.
3. స్మృతి - మనస్సు - బంధము
శ్రీరాముడు : ఓ బ్రహ్మజ్ఞా! మీరు మనస్సును శుద్ధమని అంటున్నారు. "పృథివి మొదలైన భూతజాలమునకు ఏమాత్రం సంబంధించనిది” అని వర్ణిస్తున్నారు. ఈ మనస్సే బ్రహ్మమని కూడా చెప్పుచున్నారు. ఇంతవరకు ఈ విషయాలు నేను ఒప్పుకొంటున్నాను. అయితే, ఇక్కడ ఒక సందేహం. మీరుగాని, నేనుగాని, ఈ సభికులుగాని ఈ వర్తమాన శరీరములను ధరించుటకు ఇతఃపూర్వపు స్మృతియే కారణమైయున్నది కదా! అదే విధంగా ఆత్మకు ప్రప్రథమ సృష్టి సంకల్పుడగు బ్రహ్మదేవునికి కూడా ఇతఃపూర్వపు స్మ ృతే కారణమని ఎందుకు అనకూడదు? అతడు కారణరహితుడని, 'స్వయంభువు’
అని ఎందుకు అనాలి?
Page:182
శ్రీ వసిష్ఠమహర్షి : పూర్వకర్మలతో కూడి ఉన్నప్పుడు “సంస్కారము” అనేది ఉంటుంది. అట్టి సంస్కారమునే "లింగదేహము” అని కూడా అంటున్నాం. "ఇతఃపూర్వపు స్మృతి”యే ఆ తదుపరి శరీరము దాల్చుటకు కారణమగుచున్నదనునది వాస్తవమే.
అయితే ఆకాశజునకు ప్రాక్తన కర్మలే లేవు. ఇక ఇతఃపూర్వపు స్మృతి ఎట్లా ఉంటుంది? స్మృతియే లేకపోతే జన్మకు ఏది కారణమౌతుంది? అందుచేత “అతని రూపం దానంతట అదే ఉత్పన్నమైనది” అని చెప్పటానికి “స్వయంభువు” అని చెప్పుచున్నారు. లేదా "చిత్తరూపమగు మనస్సే అతని శరీరమునకు కారణం” అనికూడా అనవచ్చు. అట్టి మనస్సు అనబడు చిత్పదార్ధమునుండి అతడు భిన్నుడు కాడు. ఎందుచేత? “నేను చిత్పదార్ధమునే” అనునట్టి నిత్యోదితమైన ఎరుకవలననే. ఇతని దేహము ఈ కనబడే కాళ్ళు, చేతులు, తల కాదు. అతని వాస్తవ దేహము ‘అతివాహికము’ లేక 'సూక్ష్మదేహము' అయివున్నది. జన్మరహితమగు అతనికి సామాన్యమైన పంచభూతములతో ఏమాత్రం సంబంధం లేదు. అతని వాస్తవ స్వరూపం పంచభూతములతో నిర్మించబడినది కాదు. “నేను పంచభూతనిర్మితమైన ఈ శరీరమును. ఇది శిధిలమగునప్పుడు నేను చచ్చుచున్నాను. రహితమగుచున్నాను.” అని ఎవరైతే తలుస్తారో వారికి మాత్రమే జన్మ-మృత్యువులు, త్రిలోకములు ఉంటాయి. ఆ బ్రహ్మదేవునికి అట్టి భావము లేదు.
శ్రీరాముడు : మహర్షీ! ప్రతి ప్రాణికి ఈ ఈ స్థూలదేహము - - సూక్ష్మదేహము (లింగ శరీరం / అతివాహిక శరీరం) (Gross body & Subtle body) అనేవి రెండు ఉంటాయి కదా! మరి బ్రహ్మదేవునికి అతివాహిక శరీరం మాత్రమే ఉండటానికి కారణమేమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : "పంచభూతములపట్లగల ఆసక్తి" అను కారణముతో కూడుకొనియున్న ప్రాణులందరికీ నీవు చెప్పినట్లు రెండు దేహాలు ఉంటాయి. కాని జన్మరహితుడగు బ్రహ్మకు కారణమంటూ ఏదీ లేదు. అందుచేత ఒక్క సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది. జన్మ రహితుడగు ఆ బ్రహ్మయే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము.... అనబడు పంచభూతములకు పరమకారణము. అతనికి ఇంకొక కారణం లేకపోవటం చేత అతివాహిక శరీరమొక్కటే ఉన్నది. (He is beyond all
causes. And all causes exist because of him)
విషయరహితమగు ఆత్మనుండి ప్రప్రథమంగా నిశ్చల జలములో ఉత్పన్నమగు కెరటంలాగా “భావనచేయుట” అను స్వభావముతో కూడిన కర్తృత్వము ప్రకటితమౌతోంది. శాస్త్రములు ఆ తత్వమును 'ప్రజాపతి' అని పిలుస్తున్నాయి. సృష్టిలో ప్రప్రథముడగు ఈ ప్రజాపతికి భౌతిక శరీరం లేదు. ఇతడు అతివాహిక (లేక సూక్ష్మ శరీర మాత్రుడగుటచే చిదాకాశ స్వభావమున స్వయంగా ప్రకాశించుచున్నాడు. అతడు “సంకల్పించుట” అనునదే రూపముగా కలిగియున్నాడు. ఈ పృథివి మొదలైన భూతముల క్రమసంబంధం అతనికి లేదు. ప్రథముడగు ఈ ప్రజాపతియే
Page:183
ఆకాశ శరీరము దాల్చి ప్రజాసమూహమును సృష్టించు చున్నాడు. చిదాకాశము చిత్తాకాశము స్థూలాకాశము
చిదాకాశము
సూక్ష్మదేహము / అతివాహిక దేహము / లింగశరీరము స్థూలశరీరము లేక పాంచభౌతిక దేహము
(Zone of thought and perception)
(Zone of Self)
1. ప్రతివానియందు 'స్థూలదేహము - లింగదేహము’ అనునవి ఉంటున్నాయి.
2. లింగదేహమును అనుసరించి స్థూలదేహం ఉంటోంది.
3. లింగదేహము సర్వకారణమగు 'చిదాకాశము' లేక 'శుద్ధ చైతన్యము'ను ఆశ్రయించి
ఉంటోంది.
4. చిదాకాశము కారణరహితము. చిదాకాశమే స్థూల సూక్ష్మములకు కారణము, కర్త కూడా. కనుక అదియే ‘కారణ-కారణం' అని పిలువబడుతోంది.
5. మృత్యువు అనబడునది స్థూలదేహమునకు సంబంధించినది మాత్రమే. సూక్ష్మ
కారణములను అది తాకజాలదు.
ఓ రామచంద్రా! ప్రజాపతి ఆకాశ శరీరమును దాల్చి ప్రజాసమూహం సృష్టిస్తున్నాడనుకొన్నాం కదా! ఈ ప్రజలందరు కూడా ఆకాశస్వరూపులే. ఎందుకంటావా? ఒక వస్తువు నుండి ఏ
బాహ్యమైన కారణము లేకుండా .... బయల్వెడలిన మరొక వస్తువు మొదటి వస్తువుకు అభిన్నమైనదే కదా! కాబట్టి 'పరమబోధ' స్వరూపుడైన పురుషుడు (జీవుడు) భ్రాంతిచేత చిత్తమాత్రుని వలె అగుపించవచ్చు. అయినప్పటికీ వాస్తవానికి ఇతడు చైతన్యస్వరూపుడే. అంతేగాని పాంచభౌతికస్వరూపుడుగా మారడు.
సంసారమున చరించుచున్న జీవులందరికి సూక్ష్మశరీరముతో కూడిన చిదాత్మయే కారణం. అహంకారం దానినుండే జన్మిస్తోంది. కనుక, 'నీవు-నేను' అనునదంతా అద్దాని రూపమే. వాయువునందు 'స్పందము' లేక చలనము కలుగుటచే “వాయువీచికలు" ఏర్పడుచున్నాయి కదా! ఆ వాయువీచికలన్నీ మొట్టమొదటిదయినట్టి వాయువు కంటే వేరు ఎట్లా అవుతాయి? మొదటి కదలిక (చలనము) అయినట్టి బ్రహ్మదేవుని నుండి అట్టివారేయగు ప్రజలు విస్తరిల్లుచున్నారు.
ఈ జీవసమూహమంతా పరమార్థ చిన్మాత్రకారుడగు 'బ్రహ్మ' నుండే జన్మిస్తోంది. కాబట్టి ఇదంతా చిన్మాత్రాకారమే. కాని, దర్శించువాని యొక్క సంకల్ప-దృఢత్వంచేత జడాకారముగా
Page:184
ప్రకాశించుచున్నది. భౌతికమైన దృష్టికి ప్రాప్తించే ఆకారాదులే సత్యమని, వాస్తవమని సంసారదృష్టిగల జీవుడు భావిస్తున్నాడు. కనుక, ఇక్కడ 'దృష్టి' పవిత్రమైతే సర్వమూ సర్వదా బ్రహ్మమే!
“అసద్వస్తువు సత్యమువలె క్రియ నిర్వర్తించుట” అనునది సుస్పష్టమవటానికి నీకొక దృష్టాంతము చెపుతాను. “ఒకడు ఒక స్వప్నం పొందాడు. ఆ స్వప్నంలో అత్యంత సుందరియైన స్త్రీ తారసపడింది. ఆమెను ఆతడు ఆలింగనం చేసుకొన్నాడు.” అనే విషయం తీసుకొందాం. వాస్తవానికి అది
సత్యమైన అనుభవమా? కాదు. ఎందుకంటే ఆ స్త్రీ ఊహమాత్రమే కదా! కాని, ఆ వ్యక్తి ధాతుక్షయానుభవం పొందుతాడు. ఈ జగత్తులో కనిపించే పదార్థముల సంస్పర్శ-అనుభవం కూడా అట్టివే. పంచమహా భూతత్వమంతటికీ ఈశ్వరుడు, నిరాకారుడు అయిన స్వయంభువే. అతడు దేహాదులు లేనివాడు. కాని “దేహి” వలె ప్రకాశిస్తున్నాడు. సంకల్పరూపి, స్వస్థుడు అయినట్టి స్వయంభువు ఉదయించినట్లు అగుపడటం కేవలం భ్రాంతివలననే సుమా! పారమార్థిక దృష్టితో చూస్తే అతడు ఉదయించుటయే లేదు. 'పృధివి' మొదలైన వాటితో సంబంధంలేనట్టి చిత్తమాత్రశరీరుడు, సంకల్పపురుషుడు అయిన బ్రహ్మ ముల్లోకముల స్థితికి కారణమగుచున్నాడు.
మరొక ముఖ్యమైన విషయం. ప్రాణుల కర్మలను అనుసరించే సంకల్పములు రూపుదిద్దుకుంటున్నాయి. ఆకాశాత్ముడగు స్వయంభువు ఏఏ రూపములను భావిస్తున్నాడో ఆయారూపములనే ఈ కనబడే ప్రాణుల రూపముగా దాల్చుచున్నాడు. అంతేగాని, 'ఇతని రూపము ఇదే' ... అనునట్టి పరిమిత రూపమంటూ అతనికి ఏదీ లేదు. ఒకానొక పర్వతమును నీవు చూచావనుకో, నీవు దానిని ఎట్లు తలుస్తావో.... అది ఆ రూపముననే నీ చిత్తవృత్తిలో ప్రతిఫలిస్తోంది కదా! ఈ కొండ శిలామయము - - ఇది పర్వత దేవుడు - ఇది వృక్ష, జంతువులకు ఆలవాలమైన ఒక ప్రదేశము - ఇది నిరుపయోగమైన స్థలము - ఇది ఒక గోపురము వంటిది - ఒక మునీశ్వర స్వరూపం..... మనస్సును అనుసరించే ఇదంతా రూపుదిద్దుకొంటోంది.
అది నీవు ఎట్లా తలస్తే ... నీ చిత్తంలో అది అట్లే ప్రతిఫలిస్తోంది. అదేవిధంగా ఈ జీవులు కూడా తమ అంతరమునందలి నిరాకారత్వమును మరచి పిశాచంలాగా పాంచభౌతిక శరీరమున ప్రకాశిస్తున్నారు. "నేను ఈ శరీరమునకు పరిమితమైనవాడను ....” అను దృఢమైన భావనను ఆశ్రయించటం జరుగుతోంది.
మాయతో కూడిన ఈ లోకములను సృజించుచున్న మూలకారణం సూక్ష్మభూతాత్మకమే. అట్టి సూక్ష్మభూతాత్మకము (లింగ శరీరము) యొక్క సంకల్పబలం చేతనే ప్రత్యక్ష జగత్తు ఆవిర్భవిస్తోంది. లింగదేహము (మనస్సు) వాస్తవానికి తమోరహితమైన సంవిత్స్వరూపమే. అందుచేతనే అది ఏ సమయమందు కూడా తన అతివాహిక (సూక్ష్మతత్వ) భావమును కోల్పోవుటలేదు. అట్లు కోల్పోకుండానే ఈ స్థూలత్వం అనుభవించటం జరుగుతోంది. మొట్టమొదటే పాంచభౌతిక శరీరం
Page:185
ఉత్పన్నం కావటం లేదు సుమా! సూక్ష్మదేహం క్రమంగా స్థూలత్వం పొందగా ఈ పాంచభౌతికానుభవం సిద్ధిస్తోంది. దేహికి దేహము ఐహిక మోహము. కాబట్టి, భ్రమ దాయకమైన ఈ స్థూలదేహం తనకు కారణమైనట్టి సూక్ష్మదేహమును బాధించుటయేమిటి? అట్లు శరీరము మనస్సును బాధింపచేయుట .... అనునది అజ్ఞానం వలననే సిద్ధిస్తోంది.
కనుక ఓ రఘురామా! సృష్టికర్త బ్రహ్మదేవుడు మనోమయుడు మాత్రమే. అతడు శరీరాది ఆకారములు కలవాడు కాదు. దీనిని అనుసరించి, “ఈ విశ్వము మనోమయము మాత్రమే. ఇది పంచభూత సంబంధమాత్రమైనది కాదు” .... అని గ్రహించు. కార్యము తనకు కారణమైనదానికంటే వేరైనది ఎట్లా అవుతుంది?
జన్మరహితుడైన బ్రహ్మకు ఎట్లా సహకారి కారణాలు లేవో, అదేవిధంగా బ్రహ్మ నుండి జనించిన ఈ జగత్తుకు కూడా ఎట్టి సహకారి కారణాలు లేవు. కార్య కారణములకు భేదం ఉండదని, కారణము ఎట్టిదో, కార్యము అట్టిదేనని అనుకున్నాం కదా! కనుక పరబ్రహ్మము ఎట్టిదో, ఈ త్రిజగత్తులు (దేవ-మర్త్య-పాతాళలోకములు - జాగృతి - స్వప్న - సుషుప్తులు - స్థూల - సూక్ష్మ - కారణములు) అట్టివేనను విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నీరు నుండి ద్రవత్వం వేరా? అగ్నికంటే ఉష్ణత్వం వేరైనది కాదు కదా! బ్రహ్మ మనోభావములను పొందినవాడై ఈ జగత్తులను సృష్టించుచున్నాడు. బ్రహ్మ విశుద్ధ తత్త్వమే కదా! జగత్తు కూడా విశుద్ధతత్త్వముకంటే వేరేవి అయివుండ లేదు. అవబోవుటలేదు.
మిథ్యాభావన : ఈ మనస్సే సంకల్ప- పూర్వకంగా, గంధర్వనగరంలా, 'మిథ్య' అయినట్టి ఈ విశాల ప్రపంచమును కల్పించుచున్నది. ఇక్కడ 'మిథ్య' అంటే ఏమిటి? "ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు” .... అనే భావనే మిథ్య అని విజ్ఞుల అభిప్రాయం. ఒకడు చీకటిలో త్రాడును చూచి 'పాము' అని భ్రమించినాడనుకో. “ఆతడు భయముతో వణుకుచున్నాడు కదా! కనుక అది పామే అయివుంటుంది”.... అని అనటం ఎంతవరకు సమంజసం? వాస్తవానికి “భూతత్వము” (Phenomenal Existence) అనునది ఈ జగత్తునందు లేదు. "సంకల్పత్వము” (Will or Volition) మాత్రమే ఉన్నది. అయితే ఈ సంకల్పత్వము ఎవరికి ఉంటుంది? అల్పజ్ఞులకే కదా! బ్రహ్మదేవుడు మొదలైనవారు తత్త్వజ్ఞులు కదా! వారియందు ఈ భూతత్వము ఎట్లా ఉంటుంది? తత్త్వజ్ఞులైనవారి దృష్టికి అతివాహికశరీరమే (మనోరూపమే) ఉండదు. ఇక భౌతిక దేహమెక్కడిది?
ఈ జగత్తు “మనస్సు” అనుదానియొక్క భావనయే అయివున్నది. అనగా జీవునియొక్క మనోరాజ్యమాత్రమే ఇదంతా! మనోరాజ్యము వంటి ఈ జగదృశ్యము ప్రాప్తిస్తోంది. ‘మూఢత్వము’ అంటే ఏమిటి? తన వాస్తవ స్వరూప స్వభావములను మరచిన ఈ జీవుడు ఇంద్రియానుభవములతో తాదాత్మ్యము పొందుచూ భ్రమనే వాస్తవమన్నట్లుగా అనుభవించుటయే. అట్టి అనుభవమునే ‘జగత్తు' అని అంటున్నాం. మనస్సే 'విరించి' లేక బ్రహ్మ యొక్క శరీరం. ఇక మనస్సు అంటే
Page:186
ఏమిటి? సంకల్పమాత్రమే కదా! సంకల్పాత్మకమనోరూపియగు ప్రప్రథమ తత్త్వమే నిజశరీరమును (అనగా సంకల్పములను విస్తరించి ఇట్లు ఈ జగత్తును సృష్టించుచున్నది.
బ్రహ్మయొక్క రూపము, శరీరము కూడా మనస్సే. అందు 'పృథివి' మొదలైన పంచ భూతములు లేవు. “అట్లే ప్రతిప్రాణియొక్క మనస్సు విషయం కూడా” అని గ్రహించబడుగాక! కాని, మనస్సు చేతనే పృథివి మొదలైన పంచభూతములు కల్పించ బడుచున్నాయి. ఒక చిన్న కలువ విత్తులో, కలువ పుష్పము లక్షణములన్నీ ఇమిడి ఉన్నాయి కదా! అదే విధంగా మనస్సునందే ఈ దృశ్యమునకు సంబంధించిన సమాచారమంతా ఇమిడి ఉన్నది. మనస్సు-దృశ్యము వేరువేరని ఎవరైనా అనగలరా? మనస్సు ఉండటంచేతనే దృశ్యమగుపడుచున్నది. మనస్సు లేకపోతే, దృశ్యము కూడా లయించి పోతుంది. ఒకడు స్వప్నములోను, మనోవీథిలోను, వస్తుజాలము చూస్తున్నాడు. ఆ వస్తుజాలమంతా ఉన్నదెక్కడ? హృదయమునందే కదా! అదే విధంగా ఎదురుగా కనబడుచున్న ఈ దృశ్యమంతా ఒకడు తన హృదయమునందే గాంచుచున్నాడు. కాని, బాహ్యమున కాదని, సూక్ష్మబుద్ధితో గ్రహించెదవుగాక! బాలుడు తన చిత్తమున కల్పించబడిన పిశాచము చేతనే భయకంపితుడగుట చూస్తూ ఉంటాము. ఈ దృశ్య పిశాచము కూడా అజ్ఞానబుద్ధులగు మనుజులను పీడించి పీల్చి పిప్పిచేయుచున్నది.
ఒక బీజములో ఇమిడియున్న అంకురము, తగిన దేశ కాలములు ప్రాప్తించినప్పుడు ఒక పెద్ద మహావృక్షమగుచున్నది. మనస్సులో ఇమిడివున్న ఈ దృశ్యము కూడా తగిన దేశకాలములు లభించినపుడు సంకల్ప రూపమున ప్రకాశిస్తోంది.
ఓ రామచంద్రా! ఒకవేళ ఈ దృశ్యము వాస్తవమే అయివుంటే, ఇక ఇది రూపుమాసే ప్రసక్తి ఎక్కడుంటుంది? అపుడు దుఃఖశాంతి చేకూరే వ్యవహారమే ఉండదు. జీవుని దృష్టిలో దృశ్యము ఉపశమించనంతకాలము ఆనందమయమగు కైవల్యము పొందే అవకాశమే లేదు. దృశ్యత్వము తొలగినపుడు ఈ జీవునకు ద్రష్టత్వము కూడ ఉండదు కదా! అపుడు శేషించేదేమిటి? “కేవలత్వం” అని ఈ స్థితిని విజ్ఞులు పిలుస్తున్నారు. అట్టి "కేవలత్వమే" మోక్షము అని చెప్పబడినది.
శాంతి మంత్రాలు ఉచ్చరించబడిన తరువాత సభ చాలించబడింది.
(రెండవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:187
మూడవ రోజు
4. మనస్సు - దృశ్యము
శ్రీరాముడు : ఓ భగవానుడా! వసిష్ఠ మహర్షీ! మీరు నిన్న రెండవ రోజు బోధించిన దానిని బట్టి “ఈ జగత్తు అంతా మనస్సు నుండే వెలువడి ప్రకాశిస్తోంది” .... అనే విషయం సుస్పష్టమౌతోంది. అయితే ఈ మనస్సు యొక్క రూపమేమిటి? ఎక్కడ, ఎందుచేత, ఎట్లు ఉంటోంది? మాకు వివరించండి. శ్రీ వసిష్ఠమహర్షి : ఆకాశము అని మనం పిలుస్తున్నది దేనిని? అక్కడ శూన్యత్వము కాకుండా మరింకేదైనా ఉన్నదా? నీలపు రంగుగల ఏదైనా పదార్థమున్నదా? లేదే! అదే విధంగా శూన్యాకాశాత్మకమైన మనస్సుకు కూడా వేరే రూపం అంటూ ఏదీ లేదు. దాని వెలుపల గాని, లోపలగాని ఏదీ కానరాకుండానే ఉన్నది. అయినప్పటికీ, ఆకాశమువలె సర్వత్రా వెలయుచునే ఉన్నది. 'మృగతృష్ణ' యందు నీరు యొక్క అనుభవంలాగా, మనస్సు నుండి ఈ జగత్తు యొక్క అనుభవం ప్రాప్తిస్తోందనుమాట నిజమే. ఒకడు తన 'స్వసంకల్పము' చేతనే మనోదృశ్యం చూస్తున్నట్లుగా
ఈ మనస్సు యొక్క రూపకల్పన కూడా భ్రమపూర్ణమే. శూన్యమైన ఈ మనస్సును నిర్వచించటమెట్లా చెప్పు? నీ బోధ కొరకు ఒక నిర్వచనం చెపుతాను. విను.
“సత్+అసత్ (వాస్తవ-అవాస్తవ) వస్తువులను ప్రకాశింపచేసేదే మనస్సు” అని చెప్పవచ్చు.
ఇంతకుమించి దానికి వేరే ఆకృతి లేదు. నిరాకారమైన చిత్తు (Absolute & Formless Consciousness) అర్ధాకారముగా అధ్యవసితమైనప్పుడు (taking half form) 'మనస్సు' అంటున్నాం. అనగా మనస్సు చిత్తు కన్నా వేరైనది కాదు. 'మట్టి' నిరాకారం కదా! 'మట్టిగడ్డ' అనునది ఆకారము కలిగి ‘మట్టి’ కంటే వేరు కాకుండానే ఉన్నది కదా.
సంకల్పించువాడు - సంకల్పములు: సంకల్పమే మనస్సు యొక్క రూపము. సంకల్పము అనుదాని కంటే ముందే సంకల్పించు వాడు ఉన్నాడుకదా! సర్వమునకూ ముందేగల శుద్ధత్వము ‘చిత్తు' అని, ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు ‘మనస్సు’ అని చెప్పబడుతోంది. అయితే నీటి నుండి ద్రవత్వము వేరా? వాయువునుండి వాయుచలనము వేరైనదిగా చెప్పగలమా? ఎక్కడ సంకల్పముంటే అక్కడ మనస్సు ఉంటుంది. ఈ రెండు వేరువేరుగా ఎక్కడా ఎవ్వరూ అనుభవించియుండలేదు.
వస్తు జాలమును, విషయములను 'ఎరుక' రూపమున అనుభవరూపమున ప్రకాశింప
జేయునదే మనస్సు. “అట్లు - ప్రకాశింపజేయబడునది సత్యమైనదా? అసత్యమైనదా? అల్పకాలికమా?; అధికకాలికమా?” .... అనేది వేరే విషయం. మనస్సు దేనిని ఎట్లు సంకల్పిస్తుందో, దానిని అది అట్టి అనుభవంగానే పొందుతూ ఉంటుంది. అట్టి మనోభావముతో కూడుకొనిన శుద్ధ చైతన్యమే పితామహుడగు 'బ్రహ్మదేవుడు'. అతడే - “ఆధిభౌతిక బుద్ధి” (ఇది పదార్థజాలము అని గుర్తించుతత్త్వము)ను సృష్టించుచున్నాడు. నాయనా! రామా! ఉత్తములగువారు మనస్సున
Page:188
ప్రాప్తిస్తున్న ఈ దృశ్యప్రపంచమునకు “అవిద్య, సంస్కృతి, చిత్తము, మనస్సు, బంధము, ....
మలము, తమస్సు” ... అనునవి మారుపేర్లేనని గ్రహించి ఉంటున్నారు.
మననము చేయు స్వభావమే మనస్సు : ఈ దృశ్యప్రపంచము కాకుండా మనస్సునకు వేరే రూపమే లేదు. మనస్సు సంకల్పించ బడినప్పుడు ఉంటోంది. అందుచేత “అది ఇప్పుడు ఇట్లు ఉత్పత్తి అయినది” అని మనం నిర్దేశించలేం. అట్లే "ఈ దృశ్యమునకు కూడా వాస్తవానికి ‘ఉత్పత్తి’ అనునదే లేదు" ... అని చెప్పబడుతోంది. నిన్న చెప్పిన దృష్టాంతమే చెపుతాను విను. తామరపువ్వు యొక్క బీజంలో ఆ పువ్వుయొక్క సూక్ష్మభావమంతా సంస్కారరూపంలో ఇమిడి ఉన్నది కదా? అట్లే చిత్-పరమాణువునందే ఈ జగత్తు అంతా సంస్కార రూపమున ఇమిడియున్నది. అనగా ద్రష్టయందే దృశ్యత్వము ఇమిడివున్నదని గ్రహించు. అయితే, ఒక చమత్కారం. బంగారమునకు ఆభరణత్వం ఉన్నదా? లేదు. కాని ఆభరణము బంగారము కంటే వేరు కాదు కదా! ఎండమావులలో జలమెక్కడ? కాని జలము యొక్క ఆకారమేకదా .... ఎండమావులలో స్ఫురించేది? స్వప్నపురంలో కనబడే గోడలకు పునాది ఉన్నదా? అదేవిధంగా ద్రష్టయందుగల ఈ దృశ్యత్వబుద్ధి కూడా భ్రమత్మాకమే. కార్యమునకు కారణము కంటే వేరైన 'సత్త' లేదు. అదేవిధంగా ...” ఈ దృశ్యము యొక్క ఉనికికి కారణం? "నీవు దీనిని ఈ రీతిగా దర్శించుటయే సుమా!” అనునదే సమాధానమగుచున్నది. ఇయ్యది నీకంటే వేరు కాదు. అనగా నీ మనస్సు నీకంటే వేరుకాదు. మనస్సు ఉన్నది నీయందే. నీ స్వరూపము చేతనే అది తయారగుచున్నది. స్వతత్త్వమే మనస్సు యొక్క మూలపదార్థం.
ఈ దృశ్యములన్నీ ద్రష్టయందే ఉన్నాయనేది పరిశీలించి చూచి గ్రహించినప్పుడు నీకే అవగతం కాగలదు. ఈ విషయం సుస్పష్టపడటానికే నీ చిత్తదర్పణమున ఉన్న మాలిన్యమును ఈ బోధచే తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. చిత్తమాలిన్యము చేతనే ఒకనికి తనయందు ఈ విశ్వము అనబడే 'దృశ్యము’ తోచుచున్నది. చిత్తములో గల మాలిన్యము తొలగించివేస్తే దృశ్యము ఉండదు. అప్పుడీ జీవుడు నిర్మలుడై, స్వచ్ఛుడై ప్రకాశించగలడు. గాలి వీచనప్పుడు ఆకులు కదలవు కదా! ఆత్మతో ఏకత్వము సంభవించినప్పుడు చిత్తము యొక్క స్పందనము ఆగి ఉంటుంది. అప్పుడు ఈ చిత్తము నందు ఉండి ఉన్న రాగ-ద్వేషములు, వాసనలు తొలగిపోతాయి.
చైతన్యమయజ్ఞానము వల్లనే ఈ దిక్కులు, భూమి, ఆకాశము మొదలైనవి ప్రకాశించు చున్నాయి కదా! (లేక అవి తెలియవచ్చుచున్నాయి కదా!) ఆ చైతన్యము యొక్క ప్రకాశము నందు దిక్కులు మొదలైనవన్నీ లేకపోయివున్నప్పుడు దానినే “ఆత్మప్రకాశం” అంటున్నాం. “నీవు-నేను-లోకములు”
మొదలుగాగల దృశ్యములన్నీ - అసత్తే" అని బోధ పడినప్పుడు ఆ దర్శించువాడు లేక ద్రష్ట మలరహితుడై కైవల్యము పొందినట్లే! దర్పణంలో (అద్దంలో) కొండలు మొ॥వి ప్రతిబింబించనప్పుడు ఆ అద్దము కేవలం అద్దముగానే ఉంటుంది కదా! ద్రష్టయందు నేను-నీవు-జగత్తు .... మొదలైన భావాలు లేకపోయినప్పుడు (ప్రదర్శితమవనపుడు లేక అనుభవమవనప్పుడు ఆ ద్రష్ట కూడా కేవలుడు అగుచున్నాడు.
Page:189
5. దృశ్యము - అదృశ్యము
శ్రీరాముడు : బ్రహ్మజ్ఞా! వాస్తవానికి సత్తునకు వినాశనమనునదే లేదు. అసత్తునకు ఉత్పత్తి లేదు. ఇంతవరకు నాకు సుస్పష్టమే అని అనిపిస్తోంది. కాని చిత్రం చూచారా? ఈ 'దృశ్యము' అనేక ఎడతెగని దోషములతో కూడినదై, సత్యమైనదానివలెనే మాపై ప్రభావం చూపిస్తోంది. “ఇది అసత్తు లేక అవాస్తవం" అని మేము గ్రహించలేక పోతున్నాము. ఇదంతా మాకు ఎంతో శ్రమను, దుఃఖమును మరలమరల కలిగిస్తూనే ఉన్నది. అందుచేత, ఈ దృశ్యవిషూచి శాంతించేది ఎట్లాగో చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ఈ దృశ్యపిశాచమును శాంతిపజేయగల ఒకానొక మంత్రము (విచారణ) చెపుతున్నాను. విను.
ఓ రామా! ఈ దేహాదులను చూడు. ఇవి చేతనములవలె కనిపిస్తున్నాయి కదా! అయితే ఇవి కాలక్రమంగా ఒకనాటికి మృతి చెందుచున్నాయి. ఈ దేహాదులే నశిస్తుంటే, ఇక అచేతనమైన వస్తువుల గురించి వేరే చెప్పవలసినదేముంటుంది? అందుచేత ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ నశించబోతున్నాయి. ఇంతకుముందు లేనివై, ఇప్పుడు ఉండి, ఒకప్పుడు నశించబోయేవి సత్యమెట్లా అవుతాయి? ఒక చిన్న ఉదాహరణ. జలం తరంగాకారంలో అనుక్షణం పారుచున్నది కదా! 'తరంగము' అనే వస్తువు ఎలా ఎప్పుడు లభిస్తుంది? అది జలమునందుగల జలము యొక్క ఆకారమే కదా! కాని, వేరైనట్లు కనబడుచున్నది. ఈ దృశ్యవ్యవహారమంతా అట్టిదే. ఇదంతా స్వస్వరూపాత్మ యొక్క విన్యాసమే!
నీవు చెప్పినట్లు ఉన్నదానికి (సద్వస్తువునకు) నాశనము ఏనాటికీ సంభవించదు. అట్టి అవినాశనమగు వస్తువు (ద్రష్టయే) జగత్తుకు, ఈ జగత్తులోని “నీవు-నేను- శరీరములు -జన్మలు-మృత్యువులు” మొదలైన పదార్థజాలానికి “మూలస్థానము” లేక “ఉనికిస్థానము” అయున్నది. అనగా అది ఈ సర్వదృశ్యము యొక్క బీజమును తనయందు సంస్కార రూపమున కలిగి ఉంటోంది. ఆ సంస్కారం సుషుప్తి సమయంలో బుద్ధియందు, ప్రళయ కాలంలో ప్రకృతి యందు అణగి ఉంటోంది. మరల, సుషుప్త్యానంతరం, ప్రళయానంతరం “ద్రష్ట-దృశ్యము” రూపమున ప్రకటితమౌతోంది. అయితే ఈ ద్రష్ట-దృశ్యము లేనట్టి ముక్తి అసంభవమందామా? అట్లు అనటానికి వీలులేదు. ఎందుకంటే, ఈ రెండింటిని అధిగమించిన స్థితియందు సుస్థితులైనట్టి జీవన్ముక్తులు దేవతలలోను, ఋషుల లోను, మనుష్యులలోను, పాతాళజీవులలోను అనేకులు మనకు తారసపడుతున్నారు. అట్లు జీవన్ముక్తులై ప్రకాశించువారు ఈ దృశ్యమును పొందుచున్నారు. తదనుగుణంగా ప్రవర్తిస్తున్నారు కూడా. మరి ఆ జీవన్ముక్తులకు, సంసార జీవులకు గల భేదమేమిటి చెప్పు? అట్టి భేదము అంతరంగమున ఏర్పడియున్న అవగాహనయందే ఉన్నది సుమా!
ఈ దృశ్యము బయట ఉంటే ఉండనీ. లేదా లేకుండనీ. దానివలన లాభనష్టములేమీ లేవు. అది హృదయంలో ప్రవేశించకుండా చూచుకోవాలి. పడవ నీళ్లలో ఉన్నా, నీరు పడవలోకి
Page:190
ప్రవేశించనీయము కదా! ఒకవేళ ఈ దృశ్యము హృదయంలోకి రాగ-ద్వేష- ఆసక్తుల రూపమున ప్రవేశించిందా ఇక అది ఈ జీవుని గాలిపటంలాగా మూడు లోకాలు త్రిప్పగలదు. ఆ త్రిప్పుటకు అంతు ఉండదు. అందుచేత జీవుడు మనస్సు విషయంలో జాగరూకుడై ఉండాలి. నీరు పడవలో ప్రవేశించకుంటే పడవకు వచ్చే ఇబ్బంది ఏం ఉంటుంది?
ఓ రామచంద్రా! అనుభవపూర్వకమైన మరియు ప్రతిజ్ఞాపూర్వకమైన ఈ నా వాక్యాలు విను. ఆ తరువాత నీవు అడిగినది చెపుతాను.
బాహ్యమున కనిపిస్తున్న ఈ ఆకాశాది పంచభూతములు గాని, అంతరమున అనుభవ మగుచున్న “అహం” మొదలైనవిగాని వ్యవహారదశలో మాత్రమే అపరిజ్ఞాన దృష్టికి వేరు వేరుగా తోచుచున్నాయి. వాస్తవానికి పరమార్థ దృష్టిలో - ఇదంతా అవ్యయము - - జరామరణరహితము అగు బ్రహ్మమే అయివున్నది. బ్రహ్మమునకు వేరైనట్టి “జగత్తు” అనబడు ఒకానొక పదార్థము ఏ క్షణమందు లేనేలేదు. పూర్ణమున పూర్ణుడు, ఆకాశమున ఆకాశద్రష్ట, శాంతమున శాంతుడు, బ్రహ్మమున బ్రహ్మము ఉన్నాయని గ్రహించేవాడే జ్ఞాని. ఉన్న సత్యము అదే. వాస్తవానికి ఈ “దృశ్యము-ద్రష్ట-దర్శనము" ... అనునవి లేవు. అంటే అవి శూన్యములని నా అభిప్రాయం కాదు. ఇదంతా శాంతమగు చైతన్య భరితమేనని గ్రహించబడుగాక!
శ్రీరాముడు : ప్రభూ! "ఈ జగత్తు లేదు” అని మీరు చెప్పుచున్నప్పుడు వినటానికి బాగానే ఉన్నది. కాని మా అనుభవం అందుకు తగినట్లు లేదు.
గొడ్రాలి కుమారుడు పర్వతమును పగులగొట్టుచున్నాడు. - కుందేటి రెండు కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి! - బండరాయి చేతులు చాపి నృత్యం చేస్తోంది.
- ఇసుక చమురును ప్రసాదిస్తోంది.
రాతిబొమ్మ ఎంతబాగా చదువుతోంది!
ఆ చిత్రపటంలోని మేఘములు చేసే గర్జనచే నా చెవులు పూడిపోతున్నాయి.
పై వాక్యాలు ఎట్టివో, మాపట్ల “ఈ జగత్తు లేదు” అను వాక్యము కూడా అట్టిదే. ఎందుకంటారా? మృత్యువు, ముసలితనము, దుఃఖములు, వస్తుజాలం, ఆకాశం, పర్వతములు .... ఈ మొదలైన అనేక విషయములతో కూడిన ఈ జగత్తే లేదని అంటున్నారు కదా! ఇవన్నీ లేనప్పుడు మేము చూచే ఈ తతంగమంతా ఏమిటి?
అయితే, బ్రహ్మజ్ఞులగు మీరు వృథా అయిన ఏ వాక్యం పలుకరని కూడా నాకు తెలుసు. అందుచేత, “ఈ విశ్వము ఇతఃపూర్వము లేదు. ఇప్పుడు కూడా ఉత్పన్నమగుట లేదు. ఇంకెప్పటికీ ఉండదు" అని చెప్పుటలో అర్థమేదైయున్నదో మరికొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రాఘవా! నా వాక్యములు అసంగతం కాదు. నేను చెప్పేది శ్రద్ధగా, ఉద్వేగరహితంగా విను.
Page:191
నిజంగానే గొడ్రాలి కుమారునివలె ఇదంతా భ్రమమాత్రమే. “నాకు కనబడుచున్నది కదా!” అంటావా? స్వప్నంలో కూడా నీవు గృహములను, జనులను చూస్తున్నావు కదా! అవన్నీ ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? లేకుంటే వికారాలన్నీ ఎట్లు కలుగుచున్నాయి? అదంతా మనస్సు యొక్క వికల్పము మాత్రమేనని తెలుసుకదా! స్వస్వభావమే స్వప్నమును చూచేటట్లు, స్వప్నానుభవం పొందేటట్లు చేస్తోంది. మనస్సు అసత్తే అయినప్పటికీ, నిజేచ్ఛ వలన నిజశరీరమును కల్పించుకొని, ఇక ఆపై ఇంద్రజాలమువలె ఈ జగత్తును ఇట్లు విస్తరింపచేస్తోంది.
చంచలశక్తితో కూడుకొనియున్న మనస్సే స్వయముగా స్ఫురిస్తోంది. అదే భ్రమిస్తోంది. సర్వమును కల్పించుకొని స్వర్గనరకాలకు పోయి వస్తోంది. యాచిస్తోంది. సంసారంలో నిమగ్నమౌతోంది. ఇంతలోనే ముక్తిని పొందుతోంది. ఇదంతా మనస్సు యొక్క కల్పన మాత్రమే. మనస్సు కాకుండా వేరే జగత్తు లేనేలేదు.
6. బ్రహ్మము - స్వభావము
శ్రీరాముడు : స్వామి! "ఈ మనస్సు కూడా మిథ్యయే" అని అంటున్నారు కదా! ఎందుకని? మాయామయమగు ఈ మనస్సు ఎక్కడి నుండి ఉత్పన్నమౌతోంది? మొట్టమొదట ఈ విషయం గురించి వివరంగా చెప్పండి. అటుపై మిగతా విషయాలకు వద్దాం.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ దృశ్యసృష్టి అంతా నామరూపాలతో సహా లయించిపోయే “మహాప్రళయము” సమయంలో అప్పుడిక శేషించేదేమిటి? ప్రశాంతము, అఖండము, నిర్లిప్తము, అద్వితీయము అయినట్టి సత్-వస్తువే. (A state of absolute self-existence). అనుభవమాత్రమగు అట్టి ఈ జీవుని స్థితికి నామరూపాలు లేకపోయినప్పటికీ శాస్త్రములు అద్దానికి ‘బ్రహ్మము' అను పేరు పెట్టాయి.
అట్టి బ్రహ్మవస్తువుకు జన్మగాని, ప్రకాశముగాని, లయముగాని లేవు. అది నిత్యము, స్వస్వరూపము, సర్వశక్తివంతము, కారణరహితము అయివున్నది. దానినే 'పరమాత్మ', 'మహేశ్వరుడు' అని కూడా అంటున్నారు. ఎన్నిపేర్లతో ఎంత చెప్పినా ఏం లాభం? ఆ పరమవస్తువు వాక్యములచేత గ్రహించబడగలిగేది కాదు. ముక్తపురుషులు దానిని తమ యొక్క అనుభవమాత్రంగా ఎరుగుచున్నారు.
"ఆత్మ, బ్రహ్మము, బ్రహ్మ, పరమాత్మ, శివుడు.... అనునవన్నీ బోధించుటకు వీలుగా అద్దాని యందు కల్పించబడ్డాయి. అయితే ఈ పేర్లన్నీ దాని స్వాభావికములు కావని, నామరూపముల కల్పనమాత్రంచేత భేదభావం పొందవలసిన పనిలేదని సర్వజనులకు మనవి చేస్తున్నాను. సాంఖ్యులు = దానిని 'పురుషుడు' అని పిలుస్తున్నారు.
వేదాంతులు = ‘బ్రహ్మము' అని చెప్పుచున్నారు.
విజ్ఞానవాదులు = 'సునిర్మల విజ్ఞానము' అంటున్నారు.
శూన్యవాదులు = అది “పదార్థరహితము”, 'శూన్యము' - అని పిలుస్తున్నారు.
Page:192
అయితే అది సర్వ “నామ రూప భావన”లకు అతీతమైనది. అదియే సూర్య-చంద్రనక్షత్రాదులను, సర్వజీవులను ప్రకాశింపచేస్తోంది. కనుక సర్వజీవుల వాస్తవ స్వరూపమదే. నామరూపముల కల్పన అద్దానిని పొందే మార్గం సుగమం చేయటానికే సుమా! అదే వక్త-వినువాడు -భోక్త-ద్రష్ట-కర్తల రూపమున ప్రకాశిస్తోంది. అది 'సత్తు' అయికూడా అసత్తువలె ఉంటోంది. సర్వదేహములందు సర్వదా ఉంటూ కూడా దూరస్థమువలె అనిపిస్తోంది. చిత్ప్రకాశమే అది.
సూర్యుని నుండి కిరణపుంజములు బయలుదేరుచున్నట్లు ఆ చిత్తాకాశము నుండే బ్రహ్మ విష్ణువు - ఇంద్రుడు మొదలైన దేవతలంతా బహిర్గతమవుతున్నారు. సముద్రజలంలో బుద్బుదములవలె (బుడగలవలె) అనంత సంఖ్యలో జగత్తులు బయల్వెడలటం జరుగుతోంది. నదులన్నీ సముద్రమువైపుకే అభిముఖమగుచున్నట్లు, ఈ దృశ్యములన్నీ అద్దానివైపుకే కదులుచున్నాయి. దీపంవలె అది తననుతానే ప్రకాశింపచేసుకొనుచు, తద్వారా సర్వ పదార్థములను ప్రకాశింపచేస్తోంది. అదియే ఆకాశంలో, శిలలలో, పర్వతములలో, పాతాళంలో, వాయువులో, ప్రతి ప్రాణియొక్క హృదయంలో సుస్థిరమై వెలుగొందుచున్నది. అదియే శరీరములందు ప్రవేశించి ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు తమ తమ పనులను నిర్వర్తించునట్లుగా శాసిస్తోంది. అయ్యది ఒకప్పుడు స్వస్వరూపమును మరచి మూఢునివలె, మూగవానివలె, జడునివలె ప్రవర్తిస్తోంది. శిలలు నిశ్చలంగాను, ఆకాశము శూన్యముగాను, పర్వతములు కఠినముగాను, జలము ద్రవత్వముతోను ఉండేటట్లు శాసించేది, నియమించేది ఆ బ్రహ్మవస్తువే. దాని శాసనమును అనుసరించే సూర్యుడు ఒకానొక నియమంగా ప్రకాశిస్తూ ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు.
మేఘాల నుండి వర్షం కురుస్తుంది కదా! అదే విధంగా అక్షయసుఖముతో నిండిన ఆ పరమవస్తువు నుండి, “సంసారము” అనబడే అసారవృష్టి కురుస్తోంది. ఈ 'త్రిలోకములు' అనే వీచికలు దానినుండే వెలువడుచు అందులోకే పయనిస్తున్నాయి. అదే సర్వభూతముల అంతర్యామియై, అంతర్లీనగానమై, శాశ్వతమై, సర్వమై ఉండికూడా... లేకయే ఉన్నట్లు భ్రమింపచేస్తోంది. మహత్తరమై ఉండికూడా అందరియందు సమాన భావమున వెలయుచున్నది. వాయువు తన వీచికలచే లతలను నాట్యం చేయిస్తుంది. చూచావా? అట్లే, అది .... 'ఇంద్రియములు' అనే దళములతోను, 'బ్రహ్మాండములు’ అనే ఫలముల తోను 'చిత్' అనే మూలముతోను కూడుకొనియున్న ఈ "ప్రకృతి" అనే లతను నాట్యం చేయిస్తోంది. 'దేహములు' అనే అసంఖ్యాకమైన పెట్టెలలో చిన్మయమగు మనస్సును ఉంచింది అదే సుమా! చంద్రునినుండి కిరణములు వస్తున్నట్లు ఆత్మనుండే సృష్టులు వెలువడుచున్నాయి.
ఓ రాఘవా! ఆ చిదాకాశమునందు సృష్టి అనే విద్యుత్తు ప్రకాశిస్తోంది. 'ప్రాణములు' అనే శీతల వాయువులు వీచుచున్నాయి. అసద్వస్తువులను కల్పించేది, సద్వస్తువును మరుగుపరిచేది, లేక 'సత్త' ఏర్పరచేది అదే. దాని సాన్నిధ్యము చేతనే జడములైన ఈ శరీరాదులు చలించటం జరుగుతోంది. 'సత్త’లన్నిటికీ సత్త అయివున్నట్టి దానివలననే దేశకాలములు, నియతి (cause & effect), చలన-స్పందాది క్రియలు ప్రవర్తించటం జరుగుతోంది. శుద్ధ - చిన్మయమగు ఈ
Page:193
పరమవస్తువే ఆకాశమున పదార్థములను స్వయముగా చింతించి, ఆయారూపములను అప్పటికప్పుడు దాల్చుచున్నది.
ఆ పరమవస్తువే ఈ విశాల బ్రహ్మాండములను ఒక ప్రక్క సృష్టిస్తూ, మరొకవైపు ఏమీ చేయనట్లు మౌనము, నిష్క్రియత్వము, నిర్లిప్తత్వము, శాంతము వహిస్తోంది. సర్వప్రాణుల వాస్తవ స్వరూపము కంటే వేరైనది కానట్టి అద్దానికి స్థితిగతులు లేవు. అది సర్వదా ఈ ప్రపంచము యొక్క 'దృశ్యత్వము
ద్రష్టత్వము’ లయించినట్టి నిర్వికార చైతన్యముగా తనయొక్క అద్వైత ఆత్మతత్త్వమునందే నిలచియున్నది. ఓ రామచంద్రా! అదికాక - ఇక్కడ గాని మరెక్కడ గాని మరొక వస్తువు ఏదీ లేదు. అదియే సర్వులచే సర్వవిధముల ఆరాధించబడతగినది. నమస్కరించబడతగినది. దానిని గ్రహించినవారియందు సర్వ స్వల్పత్వములు నశిస్తాయి.
7. బ్రహ్మ సాక్షాత్కారం
దేవదేవుడగు ఆ పరమాత్మునితో లేక, సర్వుల వాస్తవ స్వరూపమగు శుద్ధ చైతన్యాత్మ భగవానునితో ఏకత్వము "జ్ఞానయోగము” వలన మాత్రమే లభిస్తుంది. అంతేకాని, శరీర కష్టములతో కూడిన ఆయా కర్మలు నిర్వర్తించినంత మాత్రంచేత లభించేది కాదని సర్వులకు గుర్తు చేస్తున్నాను. ఏ కర్మానుష్ఠానమైనప్పటికీ - అది 'మనస్సు యొక్క పవిత్రత' అను లక్ష్యముతో చేయబడాలి. అప్పుడు దోషరహితమగు మనస్సులో జ్ఞానస్ఫురణ స్వయముగా ఉదయిస్తుంది. ఆపై, ఆత్మదర్శనము యొక్క అనుభవం ప్రాప్తిస్తుంది.
ఓ రామచంద్రా! మేము ఈ సంసార వ్యవహారమంతా తరచి తరచి పరిశీలించాం. ఇందు ఏర్పడుచున్న సుఖ-దుఃఖముల భ్రమ అంతా - మృగతృష్ణను చూచినప్పుడు ఏర్పడుచున్న జలభ్రాంతి వంటిది మాత్రమే. ఈ భ్రమను శాంతిపజేయగల ఉపాయం “తత్త్వజ్ఞానం” ఒక్కటేనని మేము గ్రహించిన తరువాతనే, ఆ విషయం ప్రపంచమంతటికీ చాటుచున్నాం. "నేను ఎవరు? వీరంతా ఎవరు? ఈ దృశ్యము, దృశ్యాంతర్గతములైన ఈ శరీరములు ఏమై ఉన్నాయి?” అను విషయమై సంపూర్ణ అవగాహనపూర్వకమైన జ్ఞానమే సర్వభ్రమలకు సరయిన ఔషధం.
ఓ జనులారా! వృత్తి-రహితుడు, శుద్ధ-స్వరూపుడు అయినట్టి పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు. లేక దగ్గరగా ఉండేవాడుకూడా కాదు. దూరస్థుడు కాదు. సమీపస్థుడు కాదు. ఏదైనా బాహ్యమున ఉన్న వస్తువైతే .... ఇది దూరంగా ఉన్నది, లేక దగ్గరగా ఉన్నది ... అని అనవచ్చు. కాని పరమాత్మ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపమే అయినప్పుడు, ఇక దగ్గర, దూరములు ఎట్లా ఉంటాయి? అతడు లభించి ఉండనిది ఎప్పుడు? అతడు సులభుడు కాదు. దుర్లభుడు కూడా కాదు. స్వానంద ప్రకాశరూపమగు ఆ బ్రహ్మము మీ మీ నిజ-శరీరములందే, సర్వదా లభించియే
Page:194
ఉన్నాడు. ప్రయత్నశీలురైనప్పుడు మీయందు అతని ఉనికిని తప్పక గాంచగలరు. మీయందే దివ్యమై వెలుగుచున్న ఆ ఆత్మదేవుని వదలిపెట్టి ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు చెప్పండి? తపస్సు - దానము - - వ్రతములు మొ॥ మీ దృష్టిని శుద్ధపరచుటకు మాత్రమే ఉపకరిస్తాయి. వాటిలో ఏ ఒక్కటీ స్వయముగా తత్త్వజ్ఞానమును చేకూర్చలేవు. అయితే, వాటి సహాయం తీసుకోండి. మీరే స్వయముగా మీమీ స్వస్వరూప ఔన్నత్యమును దర్శించుటకు సిద్ధులు కావాలి. విజ్ఞులైన మహనీయులు స్వస్వరూపమును ఆశ్రయించి తమయందు ఆ పరమాత్మయొక్క అనుభవమును పొందుచున్నారు.
నాయనలారా! మీరు "దృశ్య సంసక్తత - (Attachment towards sensory impressions &
experiences) అనబడు మోహజాలంలో చిక్కుకొనియున్నారని గుర్తుచేస్తున్నాను. ఈ మోహం తొలగేదెట్లాగో కొంచెం యోచన చేయండి. ఇందుకు మాకు తోచుచున్న ఉపాయములు చెప్పుచున్నాం. సాధుజనులను సమీపించండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మనన-నిధిధ్యాసలను సంపాదించండి. ఆత్మతత్త్వమును విశదీకరించే శాస్త్రములు జ్ఞానుల ప్రసాదమే కదా! అవి కూడా మిమ్ములను ఉద్దరించగలవు. క్రమంగా "ప్రశాంతము - సర్వశేష్యము” అగు బ్రహ్మమే మీ స్వస్వరూపమై యున్నదని అనుభవపూర్వకంగా గ్రహించండి.
అయం సదేవ ఇత్యేవ సంపరిజ్ఞానమాత్రతః
జంతోర్నజాయతే దుఃఖమ్, జీవన్ముక్తత్వమేతి చ || (VI. 6)
“నాయందే వెల్లివిరిసియున్నట్టి ఇతడే దేవదేవుడగు పరమాత్మ" అను జ్ఞానము లభించిన తరువాత, ఇక ఈ దుఃఖానుభవముల క్రీనీడ కూడా ఉండదు. అట్టి జ్ఞానమునే “ఆత్మజ్ఞానం” అని అంటున్నాం. అది పొందినవాడు జీవన్ముక్తుడగుచున్నాడు.
శ్రీరాముడు : మహాత్మా! 'ఆత్మయోగం' చేత స్వస్వరూపమే ఆ పరమాత్మగా గ్రహించుటచే ఈ జనన-మరణ-సంసారాది దోషములన్నీ తొలగిపోతాయని మీ మాటల వలన గ్రహిస్తున్నాను. అయితే మహర్షీ! ఆ దేవదేవుని శీఘ్రంగా పొందాలంటే ఏ కఠోర నియమాలు ఆచరించాలో చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి : రఘురామా!
స్వపౌరుషయత్నేన వివేకిన వికాసినా
స దేవో జ్ఞాయతే, రామ! న తపః స్నాన కర్మభిః ॥ (VI. 9)
తనయొక్క ప్రయత్నముల చేత (పురుషకారము చేతనే) “వివేకము - వికాసము (Discrimination & Knowledge\wisdom)లను పొందినవాడే బ్రహ్మసాక్షాత్కారం పొందుచున్నాడు. వివేకముతో కూడిన బుద్ధిని ఉపయోగించకుండా కేవలం స్నానము తపము మొదలైన కార్యక్రమముల చేత ‘బ్రాహ్మీదృష్టి’ అలవడదు. “కుటుంబ పోషణ” మొదలైన లౌకిక వ్యవహారములు నిస్సంగత్వముతో
Page:195
ఆచరించువారికి, అవేమీ జ్ఞానసముపార్జనకు అడ్డుకావని ప్రకటిస్తున్నాను. "మేము ఈ భౌతిక వ్యవహారములందు నిమగ్నులమైయున్నాము. ఇప్పుడీ జ్ఞానమును, బ్రహ్మ సాక్షాత్కారమును పొందాలనుకొంటే లౌకిక వ్యవహారములు నిర్వహించలేమో ....” అని తలచి ఆత్మజ్ఞాన సమాచారమును పరిశీలించనివారు మా దృష్టిలో మూర్ఖులు మాత్రమే.
రాగ ద్వేష తమః క్రోధ మదమాత్సర్య వర్జనమ్
వినా, రామ! తపోదానం, క్లేశఏవ న వాస్తవమ్ II (VI. 10)
ఓ రామా! “కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎంతవరకు త్యజించ గలిగాం?" అనునదే ముఖ్యం. అవి వదలాలనే “లక్ష్యము కలిగియుండకుండా, తపోదానాదులు ఆశ్రయించటం కాయక్లేశకరములే అవుతాయి కాని, ఉత్తమోత్తమమైన ప్రయోజనం సిద్ధింపచేయలేవు. ఒకడు రాగద్వేషములకు లోబడి పరులను వంచించి సంపాదించినదానిని దానం చేశాడనుకో. అసలు ఆ ధనము ఎవరిదో అతడే దాని ఫలమును పొందుచున్నాడు. రాగద్వేషములకు లోబడి చేయబడే వ్రతములు మొ|| సత్కార్యములు “దాంభికములు” అని చెప్పబడుచున్నాయి. ఇట్టి కార్యముల వలన ఏం ప్రయోజనం? "నేను నా మనస్సును శుద్ధి చేసుకొనుటకే ఈ వ్రత, జప, తపో దానాదులను ఆశ్రయిస్తున్నాను. మరెవరినీ ఉద్దరించుటకు కాదు. అట్టి శుద్ధమైన మనస్సుచే - నాతో సహా సర్వులయందు వెలుగుచున్న ఆత్మదేవుని దర్శనం చేసుకుంటాను” అను అవగాహనతో తపస్సు, దానము మొ||నవి నిర్వర్తించబడాలి. *
కనుక ఓ జనులారా! మీరంతా ప్రయత్నశీలురు అవండి. ఎంత కష్టపడైనా సరే, సాధు-పుంగవుల సామీప్యత, సచ్ఛాస్త్రముల బోధసారం సంపాదించండి. నిజంగా మీరు దుః ఖరహితులు కాగోరుచున్నారు కదా! ఆత్మదేవుని పొందగోరుచున్నారు కదా! అయితే, ఈ రాగాది దోషములను వదలవలసినదే! అందుకు పురుషకారం కాకుండా వేరే ఉపాయమేమి ఉన్నది?
పురుషకారముచే తత్త్వజ్ఞానం ఎట్లా లభిస్తుందో చెపుతాను, వినండి. దీనిచే రాగద్వేషాది దోషముల రూపమున ఉన్న విషూచివ్యాధి ఉపశమించగలదు.
యథా సంభవయా వృత్యా లోకశాస్త్ర విరుద్ధయా
సంతోష సంతుష్టమనా భోగగంధం పరిత్యజేత్ ॥ (VI. 16)
మొట్టమొదట వీలైనంతవరకు లోక-శాస్త్రములకు విరుద్ధములు కానట్టి జీవితమును అవలంబించండి. యాదృచ్ఛికంగా పొందుచున్నదానితో సంతుష్టులు కండి. భోగవాసనల వలననే అసంతృప్తి బయలుదేరి మిమ్ములను పీల్చి పిప్పిచేస్తోంది. అందుచేత భోగవాసనలు (tendencies that keep you craving) త్యజించండి. ఆవేశ కావేశాలు వదలండి. క్రమంగా చిత్తమునకు ప్రశాంతత అలవాటు చేయండి. సాధువులు ఏమి చెప్పుచున్నారో వినండి. సచ్ఛాస్త్రములు ప్రకటించుచున్నది
*"దానాద్యస్యార్ధాస్తస్య తత్ఫలమ్" అన్నట్లు.
Page:196
గ్రహించండి. నిషిద్ధమైన కర్మలను వదలుచు విచారణ - - ప్రయత్నములను ఆశ్రయించువాడు అతి శీఘ్రంగా ముక్తిని పొందగలుగు చున్నాడు. ఇది మా అనుభవసారం. ఏ బుద్ధిమంతుడైతే విచారణచే బ్రహ్మస్వరూపమును గ్రహిస్తాడో, అట్టివానిపట్ల బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - - ఇంద్రాది దేవతలు కూడా దయ చూపుతూ ఉంటారు. ఒక రైతు తన తోటలోని అందమైన పూలమొక్కలను కాపాడునట్లు
కాపాడుకొంటారు.
ఓ రామా! 'సాధువు' అనగా ఎవరు? జ్ఞాన-వైరాగ్యాది విశిష్ట గుణములతో ప్రకాశించు నట్టివాడే సుమా! అట్టి సాధువులను సుజనులే గుర్తించగలరు. సుజనుల అభిప్రాయం ప్రమాణంగా తీసుకొని 'సాధువు'ను గుర్తించాలి. ఎంత ప్రయత్నించైనా సరే, అతనిని ఆశ్రయించి, అతడు చెప్పేది భక్తి-శ్రద్ధలతో వినాలి. అణకువతో ప్రశ్నించి, చెప్పింది విని, స్థిరీకరించుకొని పరిశీలనాత్మక బుద్ధిచే ఆత్మజ్ఞానివి కావాలి.
శాస్త్రముపై, గురువుపై, తనపై విశ్వాసము కలవాడే సద్వస్తువును దర్శించుచున్నాడు. సచ్ఛాస్త్రము : విద్యలన్నిటిలో శ్రేష్ఠమైనది 'ఆధ్యాత్మవిద్య'. అట్టి ఆత్మవిద్యను బోధించే శాస్త్రమే “సచ్ఛాస్త్రము”.
యోగము అభ్యసించినవారి మనస్సులోని వృత్తులన్నీ తొలగుతాయి కదా! అదేవిధంగా “సాధుసంగము సచ్ఛాస్త్రపఠనముల వలన వైరాగ్యము, దృశ్యముపట్ల రాగము తొలగుట” మొ॥ ప్రాప్తిస్తున్నాయి. తత్కారణంగా 'అవిద్య' అనబడే సంసారము నశిస్తోంది. సర్వదా సర్వత్రా సర్వవిధాలా దేవదేవుడగు పరమాత్మను సర్వకర్మలచే ఆరాధించటమే సర్వోత్కృష్టమైన ఉపాయం.
8. మిథ్యాభ్రాంతులు
శ్రీరాముడు : ఓ మహర్షీ! దేవదేవుడగు పరమాత్మను సేవించమని ఆజ్ఞాపించుచున్నారు. అట్టి పరమాత్మతో సమీప్యతచే అమోఘమైన ప్రభావం ప్రాప్తించగలదని మీ వాక్కులచే గ్రహిస్తున్నాం. తత్వవేత్తలు, మా శ్రేయోభిలాషులు అయినట్టి యొక్క వాక్యములు మమ్ములను ఈ 'సాంసారిక దృష్టి’ నుండి తప్పక కాపాడుతాయి.
కాని మహాశయా! నాకు మరొక సమస్య వచ్చిపడుతోంది. మీరు చెప్పు ఆ “పరమాత్మ” అనునది ఎవరి గురించి? ఎవని గురించి ఎరిగిన తరువాత ముక్తి లభిస్తుందని అంటున్నారో అట్టి పరమాత్మ ఎక్కడుంటాడు? అతనిని మేము తెలుసుకోవటం ఎట్లా? చేరటం ఎట్లా? మరికొంత
వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : నేను చెప్పుచున్న ఆ ఆత్మ భగవానుడు ఎక్కడో దూరంగా లేడు సుమా! అతడు చైతన్యరూపమున మనందరి శరీరములలో నివసించుచున్నాడు. ఈ విశ్వమే అతడు.
Page:197
కాని అతడు విశ్వరూపముగా అగుటలేదు. ఉన్నది అతడొక్కడే. అతనికి వేరుగా విశ్వము అనునది ఎక్కడా ఎన్నడూ లేదు. “ఆ చిన్మయ తత్త్వమే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, నీవు, నేను, కూడా” .... అని గ్రహించెదవు గాక. సర్వము ఆ చైతన్య స్వరూపమే కాని, మరింకేమీ
కాదు.
శ్రీరాముడు : స్వామి! ఈ విశ్వమంతా చైతన్యస్వరూపము మాత్రమే అయివుంటే .... ఆ విషయం ఇప్పటికే అందరు గ్రహించి ఉండాలి కదా! మరి మీవంటి సాధువులచే ఉపదేశములు ఇవ్వబడవలసిన అగత్యం ఎందుకు ఉంటోంది? ఆ చితత్త్వము ఈరీతిగా “జడము - - చైతన్యము : నీవు-నేను" అనబడు అనేక రూపములుగా ఎందుకు ప్రకటితమౌతోంది....?
శ్రీ వసిష్ఠమహర్షి : "ఈ భౌతిక దృష్టికి అనేకత్వముగా కనిపించు దృశ్యము చిత్ తత్వము యొక్క పరిణామము” అనునది సరికాదు. చిదాత్మ లేక చిద్వస్తువు సర్వదా పరిణామ రహితంగానే ఉండి ఉంటోంది. "అది అనేకత్వము పొందుచున్నది .....” ” అనే అభిప్రాయముతో కూడిన జాడ్యము ఉన్నంతవరకు ఈ జీవునికి 'సంసారము' అనే అనుభవము కొంచముకూడా ఉపశమించదు.
"సంసారము అంటే ఏమిటి?" అనే ప్రశ్నకు విజ్ఞులు, “అనేకత్వ రూపము దాల్చుచున్న ఈ దృశ్యమే సారవంతమైనది ... అని అనుకొనే పశుతుల్యులగు చేతన జీవుల దృష్టియే సంసారము” అని నిర్వచనం చెప్పుచున్నారు. అట్టి ఆలోచనా విధానమే జనన మరణాది ఫలములను కలుగజేస్తోంది.
ఈ జీవుని చూచావా? ఇతడు అజ్ఞుడై, సత్యవిషయమును గ్రహించనివాడై, తన వాస్తవ స్వరూప-స్వభావములు మరచినవాడై అందుకు ఫలితంగా అనేక దుఃఖపరంపరలు అనుభవిస్తున్నాడే? ఎందుచేత చెప్పు? "నే నీ శరీరమును. ఈ నా ఇంద్రియ అనుభవములు - వాస్తవం. ఇతరులతో ఏర్పరచుకొన్న సంబంధ బాంధవ్యములు సత్యము” అని భావించుటచేతనే సుమా! అతడు “స్వస్వరూపానుభవము” ను వదలినవాడై ప్రతిబింబితమగు అంతఃకరణ చైతన్యమున పడి వ్యర్థముగా అనర్థములు అనుభవిస్తున్నాడు. బహిర్ముఖ వృత్తులే (Avocations of external matters) ఇందుకు కారణం. అట్లు బహిర్ముఖం అగుచున్న చిత్తవృత్తి .... నిత్యచేతనమగు ఆత్మయొక్క దర్శనముచే నశించుచున్నది. బాహ్యమగుచున్న వృత్తులు అంతర్ముఖం కాగా అప్పుడు ఈ జీవునియందు ఒకానొక పూర్ణత్వము ప్రకాశించుచున్నది. అనగా ఈ జీవుడప్పుడు పూర్వాపూర్వస్వభావుడు అగుచున్నాడు. నేను “పూర్ణుడను - శుద్ధుడను - నిత్యుడను" అను అవగాహననే “తత్త్వసాక్షాత్కారం” అని అంటున్నాం. దానిని పొందిన వానికి ఇక శోక-మోహములు ఉండవు. పరాత్పరుడగు బ్రహ్మమును ఎరిగినవాని యొక్క హృదయగ్రంథులు, కుసంస్కారములు విచ్ఛిన్నమైపోతున్నాయి. “నేను ఒక రక్త-మాంస-బొమికలతో నిర్మించబడిన గూడు వంటివాడిని. వీరు మాత్రమే నా వారు. వారు పరాయివారు" .... అనునట్టి దుర్భాషలన్నీ త్యజించబడతాయి. సందేహములన్నీ తొలగిపోతాయి. సంచితకర్మలన్నీ లయించిపోతాయి.
Page:198
కాబట్టి ఓ రామచంద్రా! “నేను ఎవరు? ఏది కాదు? ఈ దృశ్యమేమిటి?” అనునది గ్రహించినప్పుడే ఈ జీవుని జాడ్యం మొదలంట తొలగిపోతుంది. అప్పుడీ జీవుడే శివుడు అవుతాడు.
అయితే ఈ చిత్తమును బాహ్యమువైపుకు ప్రసరించకుండా హఠంతో బలవంతంగా నిరోధిస్తే దృశ్యదర్శనం ఆగుతుందా? దృశ్యశాంతి ప్రాప్తిస్తుందా? లేదు. "ఈ దృశ్యభ్రాంతులన్నీ మిథ్యాభ్రాంతి చేతనే కలుగుచున్నాయి” అనే జ్ఞానం లేకపోతే, బహిర్ముఖమగుచున్న చిత్తవృత్తులను నిరోధించటం ఎవరి తరం? జ్ఞానసముపార్జన లేకుండా దృశ్యదర్శనం శాంతించటం అసంభవం. “దృశ్యవస్తువు మిథ్య” అనునట్టి సుస్థిరమైన అవగాహన (లేక జ్ఞానము) లేకపోతే దృశ్యాతీతమైనట్టి చిత్స్వరూపమోక్షం ఎట్లా లభిస్తుంది.
అందుచేత రాఘవా! ఏ హఠయోగంతోనో ఈ దృశ్యమును తిరస్కరించినంతమాత్రంచేత ఒరిగేదేమీ ఉండదు. పైగా, అట్టిదానితో ఈ జగత్స్వరూపమేమిటో అర్థం కాకపోగా, అపార్థమే మిగులుతుంది. మేము ఈ వర్తమాన బోధవంటి ఆయా ప్రవచనముల ద్వారా ఈ జగత్స్వరూపమేమిటో విడమర్చి చెప్పుచున్నాం.
మా ఈ ప్రయత్నము ... "ఈ జీవునిలో ఇతఃపూర్వమే సర్వదా వేంచేసియున్న “పరిశుద్ధాత్మ తత్త్వము”ను గుర్తుచేయటం మాత్రమే. అంతేగాని, క్రొత్తగా మరొకటేదీ తెచ్చి ప్రతిష్ఠాపన చేయుచుండుట లేదు సుమా!
9. పరమాత్మ స్వరూపమెట్టిది?
శ్రీరామచంద్రుడు : హే మహర్షీ! “నేను ఇది” అని తెలుసుకోకపోవటం చేతనే జీవునికి ప్రాప్తించియున్న ఈ సంసారము తొలగకున్నది కదా! అయితే ఈ సర్వజీవులలోను ఉండి ఉంటూ, సర్వజీవులు ‘తానే’ ..... అయినవాడు ఎవడు? అతడు ఆకాశరూపియా? అతడు ఏ ఆధారంతో ఎక్కడ, ఎట్లు వసించుచున్నాడు? మీరు చెప్పుచున్నట్లు సాధు సంగమములచే, సచ్ఛాస్త్రములచే లభ్యుడుకాగల ఆ పరాత్పరుని స్వరూపమెట్టిది? దయచేసి చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! రామా! “జన్మ” అనే అరణ్యంలో సంచరించుచున్న ఒకానొక చేతన - జీవునియందు "ఇతడే పరమాత్మ” అనునట్టి బుద్ధి ఉంచువారు ఎంతటి పండితులైనా మా దృష్టిలో సంపూర్ణమైన అవగాహన కలవారు కాదు. ఎందుకంటావా? ఈ సంసారమునకు, తదంతర్గతమైన దుఃఖములకు కారణం జీవభ్రాంతియే కదా! ఒక్కనిని ఎరిగినంత మాత్రం చేత లాభమేమున్నది? ఒకానొక జీవుని జీవత్వముతో ఉపాసన ప్రారంభించి అటుపై క్రమక్రమంగా “సర్వజీవులు పరమాత్మ స్వరూపమే” అనునట్టి సర్వాత్మభావమును గ్రహించినప్పుడే దుఃఖములన్నీ తమంతటతాము స్వయముగా ఉపశమిస్తున్నాయి. విషము తొలగితే ఆ విషము యొక్క ప్రభావం తొలగుతుంది కదా! అట్లాగే దృశ్యము పరమాత్మ స్వరూపంగా అనుభూతం కాగలదు.
Page:199
శ్రీరాముడు : ఓ బ్రహ్మజ్ఞా! పరమాత్ముని రూపమేమిటో ఉన్నది ఉన్నట్లు వర్ణించండి. మీరు చెప్పేది విని, ఆ పరమాత్మను దర్శించి మేము ఈ మనోమోహము నుండి సంపూర్ణముగా విడివడ
గలుగుతాం.
శ్రీ వసిష్ఠమహర్షి : ఏ జ్ఞాన స్వరూపమైతే క్షణంలో ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళుచున్నదో.... ఏ బోధరూప సముద్రంలో అయితే ... ఈ భూత-భవిష్యత్ వర్తమానముల రూపములుగా ఉండునట్టి “కాలము” కూడా 'మిథ్యయే' అయి ఉన్నదో
- ఏ “ఎరుక” అను దానిలో ఈ జగత్తు అంతా తేలియాడుచున్నదో.
....
- దేని యందు ద్రష్ట-దర్శనము - దృశ్యము స్వతహాగా ఉన్నవి కానప్పటికీ, ఉన్నట్లే
అగుపిస్తున్నాయో
- ఈ ప్రపంచమంతా అసత్తే అయినప్పటికీ దేని యందు సత్తువలె (సద్రూపము వలె) కనబడుతోందో
- అనాదియగు ఈ సృష్టి ప్రవాహమంతా దేనియందు మిథ్యారూపముతో భాసిస్తోందో.... - ఏ చిన్మాత్రము (Knowing concept) చైతన్యమే అయివుండికూడా బండరాయి వలె మార్పు-చేర్పులు లేకయే సర్వదా నిశ్చేష్టితమై ఉన్నదేదో
ఏది జడము అయి కూడా జడము కాకయే ఉన్నదో
- ఈ బాహ్య-అభ్యంత (శరీరాదులు-మనోబుద్ధి అహంకారాదులు) వస్తువులన్నిటితో కూడి ఉండి, సర్వ వ్యవహారములు నిర్వర్తించుచున్నదేదో...
నాయనా! అదియే 'పరమాత్మ' యొక్క స్వరూపము. సూర్యుడు మొదలైన ప్రకాశ పదార్థము లన్నిటి యొక్క రూపము వెలుతురే కదా! ఈ కనబడేదంతా దేనిలో ఉన్నదో అదే పరమాత్మ యొక్క పరివేష్టితమని గ్రహించు.
శ్రీరాముడు : “పరమాత్మ ఒక్కటే సద్రూపము. ఈ దృశ్యజగత్తు అంతా అనిత్యము-మిథ్య” . మాకు అనుభవపూర్వకంగా తెలిసేదెట్లా?
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! అటు ఆ ఆకాశమువైపు చూడు. అక్కడ ఏదో నీలంగా కనబడుచున్నది కదా! అయితే, ఆకాశంలో నీలపురంగుగల పదార్థం ఉన్నదా? లేదు కదా! ఆకాశము వాస్తవానికి శూన్యము, రూపహీనమయి ఉన్నట్లు, చిన్మయ బ్రహ్మము నందు ఈ భ్రాంతిమయజగత్తు కూడా కనిపిస్తోంది. అట్టి జ్ఞానము లభించినప్పుడు బ్రహ్మము యొక్క స్వరూపము స్వయముగా బోధపడుచున్నది. “ఈ జగత్తు మిథ్యయే" అను జ్ఞానము కాకుండా, బ్రహ్మమును ఎరుగుటకు వేరే
ఉపాయం అంటూ ఏదీ లేదు.
“ప్రళయకాలము” అనబడు స్థితిలో ఈ దృశ్యసమూహములన్నీ నశిస్తున్నాయి. అప్పుడు ఆ పరమపురుషుడొక్కడే శేషించుచున్నాడు అట్లు మిగిలియుండేదే "బోధస్వరూపము”.
Page:200
అనగా... నీ దృష్టిలో "నీవు నేను అతడు జగత్తు- " అనబడునదంతా సంపూర్ణంగా లయించగా... అప్పుడు నీయందు శేషించేదే అది. శుద్ధవిజ్ఞానతత్త్వమగు అద్దానియందే ఈ దృశ్య జాలమంతా జనించటం, ఉండటం, లయించటం కూడా జరుగుతోందని గ్రహించు.
అయితే ఒక ముఖ్యమైన విషయం. “గాఢనిద్రలో ఏర్పడే జడస్థితియే బోధస్వరూపము” అని భ్రమ పడకూడదు. ‘ప్రతిబింబము' అనునదే ఉండని దర్పణం ఎక్కడన్నా ఉంటుందా? దృశ్యభావం లేకపోతే బ్రహ్మము యొక్క ప్రతిబింబము కూడా ఉండదు.
శ్రీరాముడు : మరి మీరు "సర్వము లయించగా అప్పటికీ శేషించు స్థితి" అని చెప్పునది దేనిని? శ్రీ వసిష్ఠమహర్షి : "ఈ జగత్తు సత్తుకాదు” అనునట్టి వాస్తవజ్ఞానమే అట్టి స్థితి. "ఇది మిథ్య మాత్రమే”... అని గ్రహించనంతకాలం పరతత్త్వమును ఎక్కడా ఎవరూ ఎరుగలేరు. కనుక “దృశ్యమును త్యజించటం” అంటే “జడత్వము ఆశ్రయించటం”... మాత్రంకాదని మరల గుర్తు చేస్తున్నాను. గాఢనిద్రాసమయంలో పిపీలికాది బ్రహ్మపర్యంతము (పురుగు నుండి - బ్రహ్మదేవుని వరకు) దృశ్యరహితమైన జడత్వం పొందుచూనే ఉన్నారు కదా! అది మోక్షం అనిపించుకుంటుందా? లేదు “ఈ దృశ్యము నేను చూడను” అని కళ్ళు మూసుకొన్నంత మాత్రంచేత పరతత్త్వానుభవం ప్రాప్తించదు.
ఈ దృశ్యము స్వతఃగా ఉన్నది కాదు. ఇది స్వకల్పితమాయ చేతనే ఈ సమస్త ప్రాణులకు ఆయా విధములుగా తోచుచున్నది. సమస్త జీవరాసులలో ఏకస్థమైయున్న బ్రహ్మము ఈ 'దృశ్యా నుభవము'చే ఏమాత్రం ఏ క్షణమందుకూడా తాకబడటంలేదు”... అనునట్టి ఉత్తమ సంస్కారం లేక దృష్టియే మోక్షము. కనుక రామా! ఈ దృశ్యము లేదు. బ్రహ్మము మాత్రమే ఉన్నది.
10. భౌతికదృష్టి
శ్రీరాముడు : మాకందరికీ ఎదురుగా కనిపిస్తూ ఈ దృశ్యము స్పష్టముగా అనుభవ మగుచున్నది కదా! ఇది మిథ్య ఎట్లా అవుతుంది? మరొక ప్రశ్న. బ్రహ్మము అత్యంత సూక్ష్మమైనదిగా చెప్పబడింది కదా! అట్టి సూక్ష్మమైనదానిలో ఈ అత్యంత విస్తారమైన జగత్తు ఎలా ఇమిడి ఉన్నది?”* ఆవగింజలో మేరుపర్వతం ఇమడగలదా?
శ్రీ వసిష్ఠమహర్షి : నాయనా! నీయొక్క ఇతఃపూర్వపు దృఢాభ్యాసం చేతనే ఇప్పుడు ఈ ప్రపంచమును పాంచభౌతిక దృష్టితో చూస్తున్నావు. అందుచేతనే నీపట్ల “ఇది స్థూలము - ఇది సూక్ష్మము” ... మొదలైన వ్యవహారములన్నీ ప్రవర్తిస్తున్నాయి.
ఇప్పుడు నీవు ఏకాగ్రతచిత్తంతో సాధుసంగం, సచ్చాస్త్రం, స్వవిచారణలను ఆశ్రయిస్తూ ....
* “తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్" అతి సూక్ష్మమై, హృదయాం తర్భాగమందున్న అద్దానియందే సర్వము ప్రతిష్ఠితమైయున్నది .... మంత్రపుష్పం.
Page:201
"ఈ దృశ్యము వాస్తవానికి ఏమైయున్నది?” అనునది పరిశీలించటం జరుగుతోంది కదా! ఇక నీ చిత్తమును అంటిపెట్టుకొని ఉన్నట్టి దృశ్యభ్రాంతి తొలగుతుంది. ఎప్పుడైతే "ఈ దృశ్యము ఇట్లు ఉన్నది” అనునట్టి ఆసక్తిపూర్వక జ్ఞానం తొలగుతుందో ... అప్పుడు ద్రష్టత్వము యొక్క ఆవరణ కూడా నశించుచున్నది. అనగా "వీటిని దర్శించునట్టి ద్రష్టనగు నేను ఈ దృశ్యమునకు మాత్రమే పరిమితుడనై ఉన్నాను” అను భావన ఉండదు. అప్పుడు శేషించేదేమిటి? స్వస్వరూపమగు శుద్ధ చైతన్యమే. అద్దానియందు ప్రజ్ఞాపూర్వకంగా నిలకడ కలిగియుండుటే మోక్షం.
అసలు దృశ్యానుభవం ఎక్కడి నుండి సిద్ధిస్తోంది? ద్రష్టత్వము నుండే కదా! ఈ ప్రపంచంలో ద్విత్వము (రెండు కలవు) అనుదానినుండి ఏకత్వము; ఏకత్వయోచన (ఆలోచన) నుండి ద్విత్వము కలుగుచున్నాయి. 'ఒకటి' లేకపోతే 'రెండవది' కలుగదు. ఈ 'ద్విత్వ వివర్జితమైనట్టి సద్వస్తువు (that which is absolutely true) మాత్రమే మిగిలి ఉంటుంది. "ఈ జగత్తు (లేక దృశ్యము) అవాస్తవము. మిథ్య, భ్రమ వంటిది" అను బోధ నీకు కలిగించాననుకో ... అప్పుడు నీ చిత్త దర్పణమును అంటిపెట్టుకొనియున్న “అహంకారం, బుద్ధి, మనస్సు, వస్తుభావన” మొదలైన రూపమునగల “దృశ్యమలము” తొలగి పోతుంది. ధూళి తుడిచివేయబడినప్పుడు దర్పణము (అద్దం) సుస్పష్టముగా ప్రతిబింబములు చూపునట్లు, శుద్ధ చిత్తమునందు ఆత్మవస్తువు తన నిత్య అఖండాది స్వభావములతో మహా స్పష్టముగా ప్రకటితం కాగలదు.
"ఈ దృశ్యమూలము తొలగుట కష్టసాధ్యము కదా” అని నీవు భావించకూడదు సుమా! ఎందుకంటావా? అసత్తు అయినదానికి సత్తు (లేక ఉనికి) ఎక్కడ? సత్తుకు “లేకుండటం” అనునది ఎప్పుడుంటుంది? స్వాభావికంగానే మిథ్య అయినదానిని తొలగించటంలో కష్టమేమి ఉంటుంది చెప్పు?
ఓ ప్రియరాఘవా! ఈ కనబడు విశాల బ్రహ్మాండము ఎన్నడూ ఉత్పన్నమే అయి ఉండలేదు. ఇదంతా ఆ నిర్మల చైతన్యముననే కల్పితమైయున్నది. అందుచేత దీని వాస్తవ స్వరూపం బ్రహ్మమే. ఆభరణము బంగారమే అయివున్నది కాని మరింకేమీ కాదుకదా! అదే విధంగా ఈ జగత్తు కూడా మిథ్యయే. ఇది ఏనాడూ సృష్టించబడలేదు. “ఉంగరము” అనబడునది బంగారమునకు వేరుగా ఎక్కడైనా ఉన్నదా? కొయ్యయందు చెక్కబడిన వస్తుజాలమంతా కొయ్య కన్నా వేరుకాదు కదా! స్వతఃగా లేకుండా, ద్రష్టయందు కల్పితమాత్రంగా రూపుదిద్దుకొనియున్న ఈ జగత్తును మనస్సు నుండి తొలగించుటలో శ్రమ ఏమి ఉంటుంది చెప్పు? బ్రహ్మతత్త్వము నిత్యసత్యమైయున్నది. కనుక “అత్యంత సహజమైనది?” నీకు ఈ విషయం అనేక యుక్తులతో విశదీకరిస్తున్నాను.
ఎడారిలో భ్రమ చేతనే సూర్యకిరణముల ప్రతిభాస (refraction) వలన “సరోవరం” అగుపిస్తోంది. కాని మరుభూమి (లేక ఎడారి)లో సరోవరమెక్కడ? ఒకానొక కంటి దోషం చేత ఆకాశంలో రెండు చందమామ కనిపిస్తాయి. కాని ఇద్దరు చంద్రులు వాస్తవంగా ఉన్నారా? వంధ్య (గొడ్రాలు)కు కుమారులు ఉండటం ఏమిటి? భ్రమచేత ఆకాశంలో మేఘముల ఆకృతి కారణంగా ఆకాశంలో ఆయా వస్తుజాలముల ఆకారములు (కొండకొండల మధ్య సరోవరం మొ||వి) స్ఫురించి
Page:202
నంత మాత్రంచేత ఆ పదార్థములు అక్కడ ఉన్నాయా? ఈ జగత్తు కూడా లేదు. దీనికి అస్థిత్వము లేకపోయినప్పటికీ ... భ్రమచేతనే ఇట్లు గాంచబడుచున్నది.
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. నీవు చూస్తున్నది, నీకు కనబడుచున్నది . తా
బ్రహ్మమే సుమా! ఇప్పుడు నేను చెప్పుచున్నదానిలో తగినంత నమ్మిక నీకు కలుగవచ్చు. కలుగక పోవచ్చు. నేను యుక్తియుక్తంగా చెప్పబోయేదంతా వినిన తరువాత ఈ విషయం నీవే గ్రహిస్తావు.
సర్వజనులారా! తత్త్వజ్ఞులు లోకానికి ప్రసాదిస్తున్న యుక్తితో కూడిన ఉపదేశములను చక్కగా వినండి. అంతేకాని, “ఇదంతా మాకెందుకు?" అని తలచుచు దృష్టాంతముల సహాయంతో ఆత్మజ్ఞులు, అనుభవజ్ఞులు అగువారు బోధిస్తున్నది తిరస్కరించకండి. అట్టి జ్ఞానుల వాక్యములను తిరస్కరిస్తూ ఆత్మ (స్వస్వరూపము) యొక్క స్వరూప స్వభావములను గ్రహించకుండా, యుక్తిరహితమైన పంథాను అనుసరించేవారు తమ విలువైన 'కాలము' అను అవకాశమును వృథా చేసుకొంటున్నారు. అశ్రద్ధ కారణంగా ఆత్మసమాచారము విషయమై స్తబ్ధత వహించియుండే మూఢ బుద్ధులను, మంద భాగ్యులను, అజ్ఞులను, అప్రయత్నశీలురను ఈ ప్రపంచములోని పదార్థములు గాని, మరెవరుగాని
కాపాడగలరా? లేదు.
11. జీవన్ - విదేహముక్త - లక్షణములు
శ్రీ వసిష్ఠమహర్షి : బ్రహ్మమునందు చిత్తమును నిలిపి, బ్రహ్మగతప్రాణులై ఒకరినొకరు బ్రహ్మము గురించి సంభాషించుకొనువారు కొందరు జ్ఞానదృష్టిచే సంతుష్టులై ఆనందమును పొందుచున్నారు. బ్రహ్మవిచారపరులగు అట్టి జ్ఞాననిష్ఠులకు జీవన్ముక్తి లభించుచున్నది. అట్టి జీవన్ముక్తులు విదేహముక్తులు కూడా అగుచున్నారు.
శ్రీరాముడు : హే బ్రహ్మజ్ఞా! మీరు మాకు "జీవన్ముక్తుల - విదేహముక్తుల” లక్షణములు ఏమిటో చెప్పండి. మీరు చెప్పినది విని శాస్త్రదృష్టితో, స్వబుద్ధితో వాటికొఱకై మేము ప్రయత్నం చేయగలుగుతాం. శ్రీ వసిష్ఠమహర్షి :
జీవన్ముక్తుడు : శాస్త్రవిధిని అనుసరించుచూ, ఈ విశ్వమును శూన్యముగా గ్రహిస్తూ ఉండేవాడినే మనం “జీవన్ముక్తుడు” అని పిలుస్తున్నాం. ఆయా ప్రవాహపతితమైన లోకక్రియలను నిర్వర్తిస్తూ జ్ఞానసహితుడై, జాగ్రదవస్థయందు కూడా నిద్రితుని లాగానే, నిర్వికారుడై మెలగువాడే జీవన్ముక్తుడు.
అతని ముఖము సుఖము లభించినప్పుడు వికసించదు. దుఃఖము ప్రాప్తించినపుడు ముకుళించదు. అన్ని సమయములందు ఒకే రీతిగా ఉంటుంది. ఎప్పుడు ఏది చేయవలసి ఉంటుందో, అది ఆయా సమయములందు అట్లే ఇతరులకు అనుకూలంగా అవలంబిస్తూ ఉంటాడు. మేలుకొని ఉన్నప్పుడు కూడా నిర్వికార ఆత్మతత్త్వమును ఆశ్రయించినవాడై సుషుప్తునివలె ఉంటాడు కదా! అందుచేత “ఇతడు సుషుప్తుడేమో!” అనిపించవచ్చు. కాని, “అవిద్య” అను నిద్ర నశించియుండటంచే
Page:203
ఆత్మయందు అతడు సర్వదా జాగ్రతుడే అగుచున్నాడు. ఈ దేహేంద్రియముల విషయంలో “ఇవి నాకు సంబంధించినవి” అనిగాని, “నేను వీటికి సంబంధించినవాడిని” అనిగాని అతడు అనుకోడు. అందుచేత అంతరంగంలో ఎట్టి ఉద్వేగం పొందకుండానే ఉంటాడు. జాగ్రత్ వాసనలన్నీ నశించియే ఉండటంచే అతడు స్వప్నస్థితికి కూడా సంబంధించినవాడు కాడు.
చెట్లు
కొండ
గాలి వేగంగా వీస్తున్నదనుకో... ఆ గాలి వేగానికి కొండపై చెట్లు కదులుతాయేమోగాని, కొండ కదలదు కదా! బయటకు సంతోష, దుఃఖ, రాగ, ద్వేష, భయాదులు అతడు ప్రకటించినప్పటికీ, అంతరంగంలో మాత్రం ఆకాశంవలె స్వచ్ఛుడై వెలయుచు ఉంటాడు. తన వాస్తవ స్వరూపమేమిటో, ఏది తాను కాకయే ఉన్నాడో తెలుసుకొనే ఉంటాడు. “నేను దేనికి కర్తను కాదు. చైతన్యస్వరూపుడనగు నేను పుట్టుటలేదు. చచ్చుటలేదు. ఏదియు నిర్వర్తించుట లేదు. ఇక నాకు బంధమేమిటి? మోక్షమేమిటి?” అనునట్టి నిరహంకారత్వము, అకర్తృత్వభావన కలిగి ఉంటాడు. కర్తృత్వాభిమానము లేనివాడూ, కర్మలు చేసినా, చేయకున్నా బుద్దిచే దేనిని స్పృశించనివాడు అయి ఉంటాడు.
“చిదాత్మస్వరూపమగు నేనే ఆవరణము తొలగినప్పుడు ప్రళయమును, ఆవరణమున్నప్పుడు సృష్టిని కల్పించుకొనుచున్నాను” అనునట్టి గ్రాహ్యబుద్ధితో ఉంటాడు. చేస్తూ - చెయ్యనివాడుగా, చూస్తూ-చూడనివాడుగా కాలగమనం సాగిస్తాడు. ఎవరికీ భీతి కలిగించడు. తాను లోకములను చూచి భీతిచెందడు. సంతోషము-దుఃఖము-భయము ... అనువాటినుండి పూర్తిగా విడివడి ఉంటాడు.
జీవన్ముక్తునికి ఈ సంసారముపట్ల 'కించిత్' కూడా ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉంటేకదా బంధము? ఆసక్తి లేకపోయినప్పుడు ఇక ఎవరికైనా జీవన్ముక్తత్వము వలన వచ్చే లోటు ఏం ఉంటుంది? అతడు దేహి అయి ఉన్నప్పటికీ నిరాకారుడై, మనస్సు ఉన్నప్పటికీ అమనస్కుడై ఉంటాడు. అందరిలాగానే ఈ జగత్తులో సంచరిస్తూ కూడా సర్వదా నిశ్చింతుడై ఉంటాడు. ఈ జగద్వ్యాపారములందు పాల్గొనుచున్నప్పటికీ, కామాదులు వేగానికి ఏమాత్రమూ లొంగడు. ప్రతి ఒక్కరియందును ఆత్మయొక్క పూర్ణత్వమును సదా దర్శిస్తూ ఉంటాడు.
విదేహముక్తుడు : అట్టి జీవన్ముక్తుడు కాలక్రమంగా దేహము త్యజించిన తరువాత విదేహ ముక్తుడగుచున్నాడు. వాయువు స్పందము వదలిన తరువాత నిశ్చలత్వము పొందుతుంది కదా! అట్టి విదేహముక్తుడు మరల జన్మించడు. మరణించడు. వ్యక్తుడుకాడు. అవ్యక్తుడుకాడు. దూరముగాని,
Page:204
దగ్గరగాని ఉండడు. 'నేను ఇతరులు' అను భేదదృష్టి అతనికి ఉండదు. సర్వాత్మకమగు బ్రహ్మమే తానగుచున్నాడు. అందుచేత, సూర్యరూపమున తాపమును, బ్రహ్మ అయి జగత్సృష్టిని, విష్ణువై రక్షణను, శివుడై సంహారమును చేస్తూ ఉంటాడు. ఆకాశస్వరూపుడై గాలియొక్క స్పందమును గ్రహిస్తూ ఉంటాడు. మేరుపర్వత స్వరూపుడై సుర, అసుర దైత్య, పాలకులకు, ఋషులకు కూడా నివాసస్థానమై ఉంటూ ఉంటాడు. భూమి అయి ఈ సృష్టినంతా వహించుచున్నాడు. వృక్షస్వరూపుడై మధురఫలములను ప్రసాదిస్తూ ఉంటాడు.
జలరూపంతో ద్రవత్వము, 'అగ్ని' రూపంతో దాహకత్వము ధరిస్తూ ఉంటాడు. ఆ ముక్త పురుషుడే దిక్కుల రూపమును సంతరించుకొని వెలుతురు, చీకటిలను విస్తరింపచేయుచూఉంటాడు. ‘శూన్యరూపి’ అయి ఆకాశమును, పర్వతమై స్థలమును ఆక్రమించుచు ఉంటాడు. వికసిత చైతన్యమై ఈ కనబడే జంగమపదార్ధములను సృష్టించుచున్నాడు. సముద్రమై భూమిని చుట్టుకొని ఉంటున్నాడు. ఆవరణ లేనట్టి చిదాత్మ రూపమున (అనావృత్తంగా) ఈ విశాల విశ్వమును వెలిగించుచు శాంత రూపమున అవస్థితుడై ఉంటున్నాడు. ఓ రాఘవా! భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ప్రకాశితమైనది, అగుచున్నది, అవబోవుచున్నది అయినట్టి ఈ దృశ్యసమూహమంతా కూడా ఆ విదేహముక్తుడే అయివున్నాడు సుమా!
శ్రీరాముడు : మహర్షీ! “సమదృష్టి పొందటం” ... అనునది చాలా కష్టమైనది, దుష్ప్రప్యమైనది కూడా కదా! కనుక మీరు చెప్పుచున్నట్టి ఆ 'విదేహముక్తి' ఏమంత సులభమైన విషయం కాదేమో? ఈ చిత్తమును చూచారా? ఇది క్షణక్షణం చంచలమై ఉన్నది కదా! దీని చాంచల్యమును నిరోధించేదెట్లా? స్వామి! ఇందుకు సరైన ఉత్తమమైన ఉపాయం ఉంటే చెప్పండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రాఘవా! చిత్తమును నిరోధించాలని అనుకొంటే ఆ చిత్తముయొక్క వాస్తవ స్వరూపమేమిటో మొట్టమొదట గ్రహించాలి. చిత్తము విషయమై మనం విస్తారంగా చర్చించబోతున్నాం. శత్రువును మట్టుపెట్టాలనుకొంటే... ఆ శత్రువు యొక్క స్వరూప - స్వభావాలేమిటో, శక్తి - యుక్తులేమిటో, గ్రహించాలి కదా! అయితే ఆ చిత్తము విషయమై నీవు దిగులు చెందవలసినపనిలేదు. ఈ మన విచారణను వెంటనంటి వస్తూ ఉండగా సర్వము విదితమౌతుంది. అప్పుడు నీ ముక్త స్వరూపము నీకే అవగతమౌతుంది.
‘ముక్తి' అని దేనిని అంటున్నామో, అదే బ్రహ్మము, అదే నిర్వాణము. అది పొందటానికి ప్రతిజీవునకు హక్కు ఉన్నది. స్వగృహం చేరుటను ఎవరు కాదనగలరు? ఇక అది పొందటానికి
ఉపాయమంటావా? విను.
“నేను” అను బుద్ధితో కూడుకొని కనబడుచున్న ఈ దృశ్య - జగత్తంతా గొడ్రాలి కుమారుని వలె 'భ్రమ’ మాత్రమే. ఇందేదీ సత్యము లేదు”.... అనునట్టి జ్ఞానము వలన అట్టి ముక్తి లభిస్తోంది.
Page:205
12. దృశ్యము తొలగేదెట్లా?
శ్రీరాముడు : హే వేదజ్జా! ఇక్కడ నాదొక సందేహం.
“విదేహముక్తులే త్రిభువనములుగాను, సూర్యాది మహత్తర పదార్థములుగాను అగుచున్నారని మీరు చెప్పారు కదా! అనగా ఆ విదేహముక్తి - స్వరూపులే ఈ సృష్టిగా మారుచున్నారని అనుకోవచ్చా?” శ్రీ వసిష్ఠమహర్షి : నీ ప్రశ్న బాగానే ఉన్నది. అయితే నేను నిన్ను మరొక ప్రశ్న అడుగుతాను. అసలు “త్రిభువనములు (స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం) ... అనే పేరుతో ఏదైనా ఉండి ఉన్నదంటావా? ఉండి ఉండటం వాస్తవమైతే “వారు అట్లు మారినారు” అని అనవచ్చు. “త్రిలోకములు” అనబడే పదార్థమే లేదని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. “ఆ బ్రహ్మమే చితశక్తి వలన ఈ సంసారముగా మారుచున్నది" అను ప్రవచనం కూడా భ్రమమాత్రమే అయున్నది. 'జగత్తు' అను శబ్దము, అర్థము కూడా కేవలము కల్పనయేనని సిద్ధాంతీకరించబడుచున్నది.
ఈ నా వాక్యములు సూక్ష్మబుద్ధితో గ్రహించాలి సుమా! వాస్తవానికి ... “అతి నిర్మలము శాంతము చిద్రూపము" ... అయినట్టి బ్రహ్మము ఒక్కటే ఉన్నది. 'జగత్తు' అనబడు వేరొకటి లేనేలేదు. నీవు సద్వస్తువును సూక్ష్మబుద్ధితో గ్రహించినప్పుడు ఈ సత్యము బోధపడగలదు. ఈ విషయంలో బ్రహ్మజ్ఞానుల అనుభవం అది. మేము కూడా ఈ “జగదృశ్యము”ను ఎంతో తరచి-తరచి పరిశీలించాం. ఎంత విచారించి చూచినా "బంగారు ఆభరణం” అనబడు దానిలో బంగారము కాకుండా ‘ఆభరణము’ అని చెప్పబడుదానిగా ఏదైనా పదార్థముగాని, వస్తువుగాని లభిస్తున్నదా? జలకెరటంలో జలము కాకుండా 'కెరటము' అనబడే ఏదైనా ఎక్కడున్నది? గాలి వీచికలు గాలి కంటే వేరా చెప్పు? శూన్యత్వము ఆకాశము కంటే వేరా? సూర్యుని కంటే సూర్యకిరణములు లేక సూర్యప్రకాశము వేరు కాదు కదా! అదే విధంగా "జగత్తు కూడా బ్రహ్మము కంటే వేరుకాదు” అనునదే సత్య ద్రష్టలగు మా అంతిమ నిర్ణయం. కనుక ఇదంతా బ్రహ్మమే అయున్నది.
శ్రీరాముడు : స్వామి! దేనియొక్క అత్యంత అభావము (భావించకుండటం) వలన ఈ దృశ్యజగత్తు అంతర్ధానమైపోతుంది? దేనిని వినటంచే మాలో పేరుకొనిన ఈ అజ్ఞానము తొలగుతుంది? అట్టి విషయమును, రహస్యమును మాకు బోధించండి.
అంతేకాదు, “పరస్పర సాపేక్షల రూపముననే (relative to each other) .... ఈ దృశ్యము - ద్రష్ట ప్రవర్తించుచున్నాయి” అనునది నిర్వివాదాంశమే కదా! ద్రష్ట దృశ్యములలో ఒకటి ఉండటంచే రెండవదానికి ఉనికి లభిస్తోంది "ఈ ద్రష్ట-దృశ్యము అనునవి రెండు అంతరించినపుడు మిగలి ఉండేది నిర్వాణమే” అని మీరు చెప్పారు. ఈ జగత్తు యొక్క అభావము, అప్పుడు ఉండి ఉండే స్వభావస్థితి యగు బ్రహ్మము గురించి మరికొంత వివరించి చెప్పండి. దేనిని పొందిన తరువాత ఆపై మరింకే సాధనములచే పని ఉండదు? అట్టి దాని గురించి ప్రవచించండి.
Page:206
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! ఈ జీవునియందు ... “జగత్తు లేక దృశ్యము” ... అనబడు జ్ఞానము అనేక జన్మలుగా పాతుకుపోయి ఉన్నది. ఎందుచేతనంటావా? అతడు ఈ దృశ్యజగత్తులోని వస్తుజాలముపట్ల, “ఇవి నన్ను సంతసింపజేయగలవు. ఇవి పొందినప్పుడే తృప్తుడను, లేదా అసంతృప్తుడనే” .... అనబడు ఒక విధమైన మూర్ఖత్వముతో కూడిన నమ్మకము కలిగి ఉంటున్నాడు. ఇంద్రియానుభవముల పట్ల తనయందు ఏర్పరచుకొన్న ప్రియత్వముచే, అట్టి అనుభవము కొరకు వేలాది జన్మలుగా పరుగులు తీస్తూనే ఉన్నాడు. సరే, అయినదేమో అయినది. ఇప్పుడైనా చక్కగా విచారించటం ప్రారంభిస్తే “మిథ్యాజ్ఞానము” అనబడే విషూచివ్యాధి తప్పక నయమౌతుంది.
కాని ఒక విషయం. నిట్టనిలువుగా, ఎత్తుగా ఉన్న కొండ ఎక్కడం-దిగటం అంత తేలికైన విషయం కాదుకదా! ఈ జ్ఞానం కూడా తనంతటతానే సహజంగా స్వయంగా లభించేది కాదు. నేనిట్లా అంటున్నానని నా ప్రియశ్రోతలు నిరుత్సాహపడకుండెదరు గాక! 'చాల కష్టము' అని చెప్పి నిరుత్సాహపరచటం నా ఉద్దేశమే కాదు.
ఈ ప్రపంచంలో మానవుడు అనేక కఠినమైన విషయాలు కూడా సాధిస్తున్నాడు. ఎట్లా?.... అభ్యాసము-యుక్తులను ఆశ్రయించే కదా! అదేవిధంగా ఈ జగద్ర్భాంతి కూడా .... అభ్యాసము వలన, యుక్తి - ఉపాయము వలన, సత్పురుషుల ఉపదేశములను వినటంచేత, శాస్త్రములచే చెప్పబడిన విజ్ఞానయుక్తమైన ప్రయత్నముల చేత ... తప్పక ఉపశమిస్తుంది. నీకు చెప్పబోవు ఈ కథనము వలన బోధ (Awareness) స్వరూపమగు ముక్తి తప్పక లభిస్తోంది.
13. నిత్యలభ్యమగు పరబ్రహ్మము
శ్రీ వసిష్ఠమహర్షి : శ్రీరామచంద్రా! ఈ 'ఉత్పత్తిప్రకరణం'లో మనం ... “జగద్ర్భాంతి జన్మరహితమైన ఆకాశమువలె ప్రభాసితమగుచున్నది" అని ప్రతిపాదించబోవుచున్నాము.
ఈ దృశ్యజగత్తు దేవ-దానవ-మానవ-పక్షి-మృగ-పిపీలిక (చీమలు) మొదలైన జంగమ పదార్థములతోను, కొండ-నేల మొదలైన స్థావర పదార్థములతోను నిండియున్నట్లు నీవు చూస్తున్నావు కదా! అట్టి ఈ దృశ్యజగత్తు అంతా మహాప్రళయ సమయమున అదృశ్యమై పోతోంది. వినష్ట మగుచున్నది. రుద్రాది దేవతాగణం కూడా అదృశ్యమై పోతోంది. ఎందుచేత? ఇదంతా అసత్తే. కనుకనే, “ఏదైతే కనబడుతోందో, అది నశించబోవుచున్నది" ... అనునది లోకవిదితమైన అనుభవమే కదా!* ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోయేది సత్యమెలా అయి వుంటుందయ్యా? సద్వస్తువునకు ‘లేకపోవటం' అనేది ఏ క్షణమందును ఉండదు. అసద్వస్తువునకు భ్రమచే కనబడినంత మాత్రంచేత ‘ఉనికి’ ఉన్నదా? లేదు. అయితే ఈ రెండింటినీ విభాగం చేయగల (వేరుచేయగల) దృష్టి కావాలి.
యత్ దృశ్యమ్ ..... తత్ నశ్యమ్
Page:207
ఈ దృశ్యమంతా నీ దృష్టిలో అదృశ్యమైనప్పుడు, ఇక మిగిలేదేమిటి? అప్పుడు తేజము ఉండదు. అంధకారము కూడా ఉండదు. ఒకానొక సత్త (Absolute Existence Awareness) మాత్రమే మిగిలి ఉంటుంది. “అది అట్టిది" అనిగాని, “దాని పేరు ఇది” అనిగాని చెప్పటానికి వీలుపడదు. మనస్సు ఉన్నంతసేపు మాత్రమే... "ఇట్టిది ఈ పేరు" అనేవి ఉంటాయి. కాని ఆ 'సత్త' మనస్సుకు ఆవల ఉన్నది కదా! అది శూన్యమా? కాదు. పోనీ నిరాకారమందామా? అదీకాదు. దృశ్యము కాదు. దర్శనము కాదు. పంచ భూతములలో ఏ ఒక్కటి కాదు. లేక మరియే ఇతర పదార్థము కాదు. దానిని 'ఇది' అని నిర్ణయించి చెప్పలేమని మరొక్కసారి ప్రకటిస్తున్నాను. సర్వపూర్ణములకంటే పూర్ణమైనదది. దానిని 'సత్తు' అని మనం మన సంవాదము కొరకు అనుకున్నప్పటికీ అది 'సత్తు' (ఉన్నది) కూడా కాదు. అసత్తు కూడా కాదు (That is beyond existence & nonexistence). భావ పదార్ధం కాదు. అభావ పదార్థం కూడా కాదు.
మాటలకు* అందనట్టి దానిని గురించి ఏమి చెప్పమంటావు? అయినప్పటికీ, నీవు సూక్ష్మగ్రాహివి కనుక, నీ బోధ కొరకు దాని గురించి కొన్ని గుర్తులు చెపుతాను : అది కేవల చిన్మాత్రము. అనంతము. ఆదిగాని, మధ్యగాని లేనిది. జన్మలేనిది. నిరామయమైనది. మంగళ స్వరూపమైనది. చమత్కారం చూచావా! సత్-అసత్రూపియగు ఆ పరమవస్తువు సర్వస్వరూపములు తానే అయివుండి కూడా ... ఏదియు కాకయే ఉన్నది. ఒక అతి ప్రావీణ్యము గల శిల్పి కొయ్యతో ఏనుగును తయారుచేసినప్పుడు, అది చూచుచున్నట్టి ప్రేక్షకునికి అక్కడ కొయ్య కాకుండా ఏనుగే కనిపిస్తుంది కదా! ఆ పరమ వస్తువునందే ఈ జగత్తు కనబడుతోంది.
చిదాకాశస్వరూపము, నీ-నా-సర్వుల వాస్తవ స్వరూపము అయినట్టి ఆ పరమ వస్తువునకు కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము ... మొదలైనవి లేవు. అయినను అది అన్నిచోట్ల, ఎల్లవేళల చూస్తోంది. వింటోంది. వాసనచూస్తోంది. రుచిచూస్తోంది. స్ఫురిస్తోంది. అద్దాని ప్రకాశము వల్లనే సత్-అసత్ వస్తువులు వీక్షింపబడుచున్నాయి. అనాది, నాశనశీలము అయినట్టి ఈ సృష్టి దానియందే చిత్రింపబడినదని గ్రహించు. సగం మూసుకొన్న కళ్ళతో ఈ దృశ్యమును ప్రతిబింబ మాత్రంగా చూచేది కూడా అదియే సుమా!
సర్వవ్యాపియగు ఆ బ్రహ్మమునకు కారణమంటూ ఏదీ లేదు. నీటిలో తరంగములు లేస్తాయి. చూచావా? అట్లే బ్రహ్మమునందే ఈ సృష్టులన్నీ నిరంతరం ఉదయిస్తున్నాయి. కనబడుతున్నాయి. లయిస్తున్నాయి. ఎన్ని తరంగాలు లేచినా, లేవకున్నా - నీరు మార్పు చెందదు కదా! బ్రహ్మము విషయము కూడా అంతే. అయితే, అది ఎక్కడో ఉన్నదని, ఎన్నడో లభిస్తుందని భ్రమించకుండెదవు గాక! ఎందుకంటే అది చిత్తమునందే చిన్మాత్ర దీపమై వశించుచు, స్వతేజముచే ముల్లోకములను ప్రకాశింపజేయుచున్నది. ఆ పరమ వస్తువు యొక్క ప్రకాశము ఉండటం చేతనే, 'సూర్యుడు' మొదలైన తేజోమయ పదార్థములు చీకటిమయం కాకుండా ఉండగలుగుతున్నాయి. ఎండమావులలో యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసహా.
Page:208
నీరు కనబడుచున్నట్లు అద్దాని సత్తయందే మూడు లోకములు ప్రకాశించటం జరుగుతోంది. దాని యందు ‘ఇచ్ఛ’ అనునది జన్మించినప్పుడు ఆ ఇచ్ఛను అనుసరించే ఈ 'జగత్తులు’ అనే నిప్పురవ్వలు వెలువడటం, అట్టి ఇచ్ఛ త్యజించబడినపుడు, అవి కరిగిపోవడం జరుగుతోంది. ఆ మహద్వవస్తువు యొక్క నిర్మల-అక్షయ స్వభావము లేక స్పందము వలననే సృష్టి - స్థితి సంహారములు
ప్రవర్తిల్లుతున్నాయి.
ఆ పరమవస్తువు యొక్క సత్త, వాయుస్వభావం వలెనే, సర్వగతము (All-Pervading), స్పందాస్పందమయము అయివున్నది. స్వల్పదృష్టిచే ఒకానొకప్పుడు అది “తన సద్రూప పూర్ణత్వము నుండి వేరుపడినదా?” అను విధంగా తోచుచున్నప్పటికీ. వాస్తవానికి ఎట్టి భిన్నత్వము అది పొందటం లేదు. ఆ బ్రహ్మము సర్వదా నిద్రితము. సర్వదా జాగృతము. మరియు సర్వదా, సర్వత్రా జాగృతము కాదు. నిద్రితము కాదు. అద్దాని స్పందమునందే శాంతము, శివము అయినట్టి ‘ముల్లోకములు’ ఇమిడి ఉన్నాయి. అది ఏకాత్మకము, పూర్ణము. నశించే పదార్థాలలో ఉన్నప్పటికీ నాశనము లేకయే ఉన్నది. కుండ ఉండుటచే గాని, పగులుటచేత గాని ఆకాశమునకు వచ్చు లోటేమున్నది? మార్పు చేర్పులేమి ఉంటాయి? ఆ పరమ సత్త ఈ జగత్తు యొక్క భావము పొందుగాక, లేదా, త్యజించుగాక. దానికేమీ సంబంధము లేదు. అది మరొకటిగా కాబోదు.
అది వాగింద్రియము లేనిదగుటచే 'మూగ'. అయితే ఏం? వావృత్తికి అదే కారణం. కనుక మూగది కాదు. రాతివలె సర్వదా నిర్వికారంగా ఉంటోంది. కాని, మననశక్తి అంతా దానిదే. నిత్యపరితుష్టమైనప్పటికీ, సర్వమునకు 'భోక్త' అదే. అది క్రియలకు ఏమాత్రమూ సంబంధించినది కాదు. కాని సర్వమునకు 'కర్త' అదే. అది ఆకారరహితమైనప్పటికీ, అసంఖ్యాకములగు హస్తపాదాది అవయవములతో విశ్వమంతా వ్యాపించియున్నది. ఇంద్రియశక్తులన్నిటికీ అది అతీతమైనప్పటికీ, సర్వ శరీరములలో ఇంద్రియ - వ్యాపారములన్నీ నిర్వర్తించేది అదే. తనకు ‘మనస్సు' అనునది లేకపోయినప్పటికీ మనోచర్యలన్నీ తానే నిర్వర్తిస్తోంది.
ఓ రామచంద్రా! ఈ జీవుడు స్వస్వరూపమగు ఆ పరమవస్తువును గాంచకపోవటం చేతనే భ్రమ, సంసార వ్యాధి పొందుచున్నాడు. దానిని దర్శించాడా... ఇక ఆపై సకలభయాలు, సర్వ వాసనలు ఎచటికో పారిపోతాయి.
దీపం ఉంటేనే కదా ... రంగము పై నాట్యము మొదలైన విన్యాసాలన్నీ జరిగేవి. సర్వవ్యాపియగు బ్రహ్మము అపరిచ్చిన్న ప్రకాశరూపమున "సాక్షి" అయి వెలయుచుండటం చేతనే ఈ చిత్తవృత్తులన్నీ తమ తమ కార్యములను నిర్వర్తిస్తున్నాయి. ఓ రాఘవా! సముద్రమందలి ఒకే జలము కెరటములుగా, ఆవర్తములుగా, బుడగలుగా, సుడులుగా ప్రకటితమగుటలేదా? ఒకే బంగారం గాజులుగా, గొలుసుగా, ఉంగరముగా, మరెన్నో నామరూపములుగల ఆభరణములుగా వ్యవహరించబడుతోంది కదా! అట్లే బ్రహ్మమే అవిభాజకమై కూడా అనేక రూపములతో వేర్వేరుగా కనబడటం అజ్ఞాన దృష్టికి జరుగుతోంది.
Page:209
అట్టి స్వస్వరూపమగు బ్రహ్మమునకు ఉత్పత్తి లేదు. క్షయము లేదు. ఆద్యంతములు లేవు. అయ్యది శాశ్వతమై, నిత్యమై, మంగళస్వరూపమై, పవిత్రమై, పదార్ధత్వరహితమై, వందనీయమై, అనింద్యమైయున్నది. దానికి ఆగంతుక (శరీరములు పొందటం - త్యజించటం వంటి) ధర్మములు లేవు. రాకపోకలు లేవు. సర్వకారణములకు కారణము అదే. అది అజ్ఞేయము (తెలియబడజాలనిది). ఎందుకంటావా? తెలుసుకొనునది అదే అయినప్పుడు తెలుసుకోవటమనేది ఎక్కడ ఉంటుంది? ఒకడు తనకు వేరైన వస్తువునైతే తెలుసుకోగలడు. ఆత్మయో, తన వాస్తవ స్వరూపమే కదా! అది స్వానుభవము చేతనే తెలియబడగలదు గాని, మరొకరు ప్రసాదించునది కాదు. అయ్యది ఏకమాత్రజ్ఞేయమై వెలయుచున్నది. నీయొక్క-నాయొక్క–సమస్త ప్రాణులయొక్క - సర్వము యొక్క సత్యస్వరూపము అదే. మనం అదికాకుండా మరింకేదీ అయివుండలేదు. దానిని దూరముగా, భవిష్యత్తులో ఎన్నడో ఎప్పుడో ఎక్కడో లభించునదిగా చూచువారు మా దృష్టిలో మూర్ఖులు మాత్రమే. అది నీకు నాకు వేరైనది కాదు కనుకనే 'అద్వితీయము' అని చెప్పుకొంటున్నాం.
14. ఈ జగత్తు బ్రహ్మమే
శ్రీరాముడు : హే వసిష్ఠ ప్రభూ! మీరు అనిర్వచనీయ బ్రహ్మము గురించి చెప్పిన విషయాలు యుక్తియుక్తంగా ఉన్నాయి. మహాప్రళయ సమయంలో మిగిలి ఉండే ఆ సద్వస్తువు మీరు చెప్పినట్లు నామరూపరహితమనటంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. "అది శూన్యము కాదు. ప్రకాశము కాదు. అంధకారం కాదు. తమోరూపం కాదు. చిత్స్వరూపము (Form of Consciousness) కాదు. జీవుడు కాదు. బుద్ధి-తత్వము కూడా కాదు. మనస్సు కూడా కాదు” ... అని చెప్పారు. బాగానే ఉన్నది. ఇంతలోనే “అన్నియు అదే” అని అంటున్నారు. మీ వాక్యములలోను అర్థసమన్వయం నేను గ్రహించలేకపోతున్నాను. మరి కొంత స్పష్టంగా వివరించండి.
Page:210
శ్రీ వసిష్ఠమహర్షి : నీ ప్రశ్నను మెచ్చుకొంటున్నాను. ప్రశ్న కొంత క్లిష్టమైనదే. సరే సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుంది కదా! నీ సందేహం పోగొట్టుతాను. విను.
‘సర్వవిషయ రహితం’ అయి ఉండునట్టి మహాప్రళయ సమయంలో శేషించి ఉండేది. “శూన్యము
కాదు” :
ఒక కళాకారుడు ఒక శిలయందు సుందర స్త్రీయొక్క శిల్పమును మలచాడనుకో స్త్రీ శిల్పం చెక్కక ముందే ‘శిల’ అనునది ఉన్నది కదా!
ఆ స్త్రీ యొక్క రచనకు శిలకన్నా వేరైన 'సత్తా' ఉన్నదా? లేదు. స్త్రీ యొక్క ఆకారమంతా
శిలయే కదా!
ఇప్పుడు కనబడుచున్న స్త్రీ ఆకారమంతా అంతకు ముందు ఎక్కడున్నది? శిలలోనే కదా! ఈ స్త్రీ ఆకారమునకు శిలకు ఏమి సంబంధం? శిల 'స్త్రీ'గా అగుచున్నదా? లేదే! శిల లేనిదే స్త్రీ ఆకారమెక్కడ ఉన్నది?
ఈ జగత్తు కూడా సృష్టికి పూర్వం బ్రహ్మమునందే ఉన్నది. అందుచేత, “బ్రహ్మము శూన్యము” అనటానికి వీలు లేదు. ఈ విశాల బ్రహ్మాండము జీవుని భోగనిమిత్తమై రచించబడినట్లు తోచుచున్నది. ఈ జగత్తు వాస్తవమే అయివుండనీ .... లేక శూన్యమే కాని ... లేదా ఎక్కడో ఏ మనస్సునందో ఉండనీ ఏది ఏమైనా, ఇది ప్రకాశించునట్టి అధిష్ఠానము (ఇది ఎందుకలదో అయ్యది) శూన్యము కాదు. ఎందుకంటావా? శూన్యంలో "ఆరోపణ, విషయములు-జగత్తుకు సంబంధించిన అనుభవములు”... మొదలైన కార్యములు ఎలా సంభవిస్తాయి?
"శిలచే తయారుచేయబడిన 'స్త్రీ శిల్పం' ఇంతకుముందు శిలలోనే ఉన్నది." ఈ జగత్తు కూడా ఉత్పత్తికి పూర్వం బ్రహ్మమునందే ఉండి ఉన్నది.
(శిల - స్త్రీ శిల్పములవలె) జగత్తు - బ్రహ్మము అభేదమైనది.
స్త్రీ శిల్పం యొక్క కనులు, కాళ్ళు, ముక్కు వేరువేరైనట్లు 'శిల్పదృష్టి' కలవారికి కనిపిస్తుంది. కాని శిల దృష్టితో చూచేవారికి ఆయాభాగములన్నీ శిలగానే తెలియవస్తాయి కదా! ఖండదృష్టి గలవారికి ఈ జగత్తు “నీవు-నేను-వారు వీరు నీది నాది తదితర పదార్థములు”గా కనిపిస్తోంది. విజ్ఞానరూపమగు బ్రాహ్మీదృష్టి కలవారికి సర్వము బ్రహ్మముగానే ప్రదర్శితమౌతున్నది.
❖
నీకు ఇంకొక దృష్టాంతము చెపుతాను. ఒక తటాకంలో నిశ్చలంగా నీరు ఉన్నదనుకో ఇప్పుడు ఆ జలం నిశ్చలంగా కదలకుండా ఉన్నందుచేత తరంగములు కనిపించవు. అయితే ‘తరంగములు’ అనునవి బాహ్యము నుండి వస్తున్న ఏవైనా పదార్థములు కాదు కదా! ఆ నిశ్చలమైన నీరే స్పందము (చలనము) పొందినప్పుడు తరంగాలుగా మనకు కనబడటం జరుగుతోంది. “తరంగములు - - అనునవి కదలికలేని జలంలో అంతర్లీనంగా ఉండియే ఉన్నాయి” అని మనం
Page:211
అర్థం చేసుకోక తప్పదు. ఈ జగత్తు విషయం కూడా అట్టిదే. ఇది బ్రహ్మమునందే శూన్య-అశూన్య రూపమున ఉండీ-లేనట్లు, అనిర్వచ నీయంగా, నిలచియున్నది.
శిల, తదితర పరికరములు ఉన్నప్పటికీ, శిల్పి యొక్క ఇచ్ఛలేకపోతే శిల్పము ఎట్లా తయారవుతుంది? కల్పాంత కాలంతో కూడా బ్రహ్మయొక్క ఇచ్ఛ లేకపోతే ఈ జగత్తు సృష్టించబడదు. అయితే రామా! "జగత్తు బ్రహ్మమునందు ... శిలయందు శిల్పమువలె ..... చిత్రించబడి ఉన్నది” అని చెప్పాను కదా! ఇక్కడ నేను ఉపయోగించిన ఉపమానం గ్రహించేటప్పుడు 'శిల-స్త్రీ శిల్పము వేరువేరు కానట్లు జగత్తు - బ్రహ్మము వేరువేరు కాదు” అని మాత్రమే బోధిస్తున్నానని గ్రహించు. ఆ అంశమును అంతమాత్రమే గ్రహించాలి. “ఈ జగత్తు అను శిల్పమునకు ద్రష్టయే శిల్పి. బ్రహ్మమే శిల” .... అని గ్రహించు. వాస్తవానికి ఈ 'జగత్తు' అనబడునది బ్రహ్మమునందు ఏనాడు ఉదయించి ఉండనేలేదు. ఏది ఉదయించనే లేదో ... అది ఇక అస్తమించటమనే ప్రసక్తి ఎక్కడ? ఇదంతా బ్రహ్మము కంటే వేరైనది కాదు. కనుక, సత్స్వరూపముననే నిలచియున్నది. ఇక ఈ జగత్తు విషయంలో "ఇది శూన్యము కాదు” అని చెప్పబడుతోంది.
పరబ్రహ్మము తమస్సు (చీకటి) కాదు, తేజము కాదు. అది సర్వదా మనందరి స్వస్వరూపమై విరాజిల్లుతూనే ఉన్నది.
నాయనా! రామా! ఈ సూర్యుడు, అగ్ని, నక్షత్రములు మొదలైన తేజోమయ పదార్థములు ఆ
బ్రహ్మమును ప్రకాశింపజేయజాలవు. అవ్యయమగు పరమాత్మకు ఇట్టి తేజోమయ పదార్థములతో ఏమాత్రం సంబంధం లేదు. “చీకటి” అని మనం దేనిని అంటున్నాం? వెలుతురు లేకపోవుట (లేక వెలుతురు యొక్క అభావము)నే కదా! ఇట్టి భౌతికమైన తేజము లేకపోయినప్పటికీ బ్రహ్మము స్వయంప్రకాశమగుటచే, అది ఉండనే ఉంటుంది. అందుచేతనే “అది తమస్సు కాదు. తేజము కాదు” అని మనం చెప్పుకొన్నాం.
ప్రకాశస్వరూపమగు ఆ బ్రహ్మము స్వయంప్రకాశమై, బుద్ధి గుహ యందు ఉండి ఆ బుద్ధిని ప్రకాశింపచేస్తోంది. దానిని మరెవరూ, దేని చేతను ప్రకాశింపజేయలేరు. కాబట్టి “అది తమస్సు” అని కూడా చమత్కారంగా అంటూ ఉంటారు. అది సర్వప్రకాశములకు వేరైనదని గ్రహించు. అది అజరము (జరామరణములులేనిది). అవ్యయము, ఆకాశమువలె ఆది-మధ్య-అంతములు లేనిది. ఈ జగత్ స్థితికి ఆవల నిత్యమై స్వస్వరూపచమత్కారంగా జాజ్వల్యమానంగా సర్వదా ప్రకాశిస్తోంది. అందుచేత అది “పరమాత్మ" (ద్రష్ట - దృశ్యత్వ - - దృశ్యములకు పరమై, ఆవలగా ఉన్నది....) అను శబ్దార్థము.... "పరమ్ ఆత్మః...” గా ప్రవచించబడుతోంది.
‘మారేడుపండు’ అని మనం పిలుస్తున్నదానికి, అందలి 'గుజ్జు'కు గల భేదమేమిటో చెప్పు? బ్రహ్మమునకు, జగత్తుకు కొంచెము కూడా భేదం లేదు. నీటియందు అలలు, మట్టియందు కుండలు ఉన్నట్లు ... బ్రహ్మమునందు ఈ జగత్తు ఉన్నది. అట్టి బ్రహ్మ పదార్థము శూన్యమెట్లా అవుతుంది? బ్రహ్మము నిరాకారమే అయినట్లు జగత్తు కూడా నిరాకారమే. ఆకాశరూపమగు ఆ
Page:212
చిన్మయబ్రహ్మము ఈ పాంచభౌతికాత్మికమైన ఆకాశము కంటే అత్యంత సూక్ష్మమైనది. స్వచ్ఛమైనది. దాని అంతర్గతమై ఉన్నట్టి ఈ 'జగత్తు' అని చెప్పబడునది కూడా స్వచ్ఛమైనదే. సూర్యకిరణములకు ఉష్ణత్వము కాకుండా మరొక అనుభవం లేదు కదా! చిన్మయబ్రహ్మము “ఎరుక” అను అనుభవము మాత్రం కలిగి ఉంటోంది.
పరమ్ - ఆత్మః = జగద్దర్శనమునకు మునుముందే సర్వాంతర్గతమై ఏర్పడియున్న స్వస్వరూపం. “చిత్తు - అచిత్తు” అని రెండుగా శాస్త్రములచే చెప్పబడుచున్నదంతా పరమాత్మయందే ఉన్నాయి. ఆ “పరమాత్మ”యే దృశ్యముగా దర్శనముగా ప్రభవించుచున్నాడు. వాస్తవానికి పరమాత్మయే స్వరూపముగా గల జీవునకు 'దృశ్యత్వము' అనునది లేదు. దృశ్యత్వములేనట్లే జగత్తు కూడా లేదు. నామ-రూపములతో కూడిన బహిర్విషయములు, వీటికి అర్థములను కల్పిస్తున్న మనఃబుద్ధి అహంకారాదులు, ఆయా విషయములు పరమాత్మయందు కల్పితమాత్రంగా ఉంటూ ... పరమాత్మకు వేరైనవి కాకుండానే (అద్వితీయమై) ఉన్నాయి.
ఈ విశ్వము ఏ విధంగానైనా ఉండనీ, చివరికి ఇందులో ఎదురౌతున్న ప్రతి విషయము ‘సుషుప్తి’గా మారక తప్పదు. అనగా విషయములన్నీ ఒక స్థితిలో నిర్విషయమై పోతున్నాయి. అందుచేత “సుషుప్తి భూమిక" యందున్న యోగి ఈ జగత్తును పొందుచున్నప్పుడు ... అనగా ఇందు పాల్గొనవలసివచ్చుచున్నప్పుడు, (లేక) దీనిని త్యజించి ఒక మూల చతికిలపడి కూర్చొనవలసి వచ్చినప్పుడు ... ఉభయ సమయాలలో కూడా శాంత చిత్తుడై ఉంటున్నాడు. సర్వప్రకాశము -
అప్రకాశ్యము కూడా అయినట్టి (సర్వమును వెలిగించునది - దేనిని వెలిగించనిది కూడా అయినట్టి) బ్రహ్మభావమునందే సుస్థిరుడై నిశ్చింతగా ఉంటున్నాడు. ప్రశాంతత పొందిన జలంలో నానా విధములైన కెరటములు అణిగి ఉంటాయి కదా! అట్లే ఉత్తమయోగి దృష్టిలో నిర్వికార బ్రహ్మమునందు, నిర్వికారము, నిరాకారము అయినట్టి ఈ జగత్తు కూడా ... అన్నివేళల అణిగిపోయి ఉంటోంది. పూర్ణ బ్రహ్మము నుండి వెలువడుచున్న ఈ ఉపాధి-భేదముల వ్యవహారమంతా వాస్తవానికి నిరాకారమైనదే. మరి పూర్ణబ్రహ్మము నుండి వెలువడుచున్న అనేక అనుభవములతో, పదార్థములతో కూడుకొనిన ఈ జగత్తు యొక్క పాత్రఏమిటి? ఈ విషయంలో ఋషులమగు మేము ఇట్లు అర్థం చేసుకొంటున్నాం.
66 “ఈ జగత్తు' అనే సువిశాల నాటకరంగం ఆయా ప్రాణులకు వారివారి ఇచ్చలకు అనుకూలములైన శరీరములు, అనుభవములు పొందుటకు తగిన స్థానమైయున్నది. ఈ జీవునకు ఆధికారిక శరీరమును (a body which he deserves and desires) ప్రాప్తింపచేస్తోంది. ఇదంతా 'స్వస్వరూపజ్ఞానము' అనబడు ప్రయోజన సిద్దికొరకు కూడా ... అట్టి లక్ష్యముతో శరీరము పొందువారికి ... అనువైన స్థానమైయున్నది. కనుక ఈ జగత్తంతా ఉత్తమ దృష్టి కలవారికి ఉత్తమ ప్రయోజనము కొరకే సంకల్పించబడియున్నది.
Page:213
పూర్ణాత్ పూర్ణం ప్రసరతి సంస్థితం పూర్ణమేవతత్
అతో విశ్వమనుత్పన్నం యచ్చోత్పన్నం తదేవతత్ ॥ * (X.28)
పూర్ణము నుండి వెలువడునది పూర్ణమే అయివుంటోంది. ఈ జగత్తు పూర్ణమునందు ఏర్పడియున్న 'కల్పన' మాత్రమే. అందుచేత ఈ విశ్వము ఉత్పన్నమై, స్థితి పొందియున్నట్లు తోచుచున్నప్పటికీ ... వాస్తవానికి “అనుత్పన్నమైనదే” (that which is never created) అని మేము గ్రహించుచున్నాము. ఎందుకంటావా? జ్ఞానులకు దృశ్యము - దర్శనముల భేదమే కనిపించదు. ఎవరు ఎట్లు చూస్తే ఈ విశ్వము వారికి అట్లే కనబడుతూ ఉంటుంది.
చూచే ఆయన = “ద్రష్ట”
ఎట్లు చూస్తే = "దర్శనము” అట్లు కనబడుట = “దృశ్యము”
అందుచేత జ్ఞానులకు 'జగత్తు' అని చెప్పినప్పుడు, 'బ్రహ్మము' అని చెప్పినప్పుడు ఒక్క అర్థమే కనబడుచున్నది. "సూర్యకిరణములు వేడిగా ఉంటాయి” అనే విషయము అట్లు వేడిపొందు స్వభావము గల ఉపాధి కలిగియున్నప్పుడు, 'ఆ ఉపాధి యొక్క అనుభవముతో జీవుడు ఏకత్వము అనుభవిస్తున్నప్పుడు మాత్రమే' .... ఏర్పడగలదు. 'అనుభవించువాడు’ లేకుంటే ‘అనుభవము’నకు ఉనికిగాని, అర్ధముగాని లేవు కదా! అనుభవమయ్యేదంతా అనుభవించువాని స్వస్వరూపవిన్యాసమే! అయితే, వాక్యజ్ఞానము మాత్రమే కలిగియుండి, అర్థజ్ఞానము ఇంకను పొందనివారికి ఈ విషయము తగినంతగా గ్రాహ్యమగుట లేదు. అభ్యాసమే అందుకు దివ్యౌషధం.
15. సాక్షి చైతన్యము
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! “ఘనీభూతమై, సత్యమువలె కనిపించుచున్న ఈ దృశ్యపదార్థములు - అట్టి దృశ్యపదార్థములను దర్శించుచు, పొందుచున్న ఈ చిత్తము” ఈ రెండూ కూడా మిథ్యయే. ఇక ప్రతిబింబమాత్రమైనట్టి 'జీవుడు' అనబడునది మాత్రం సత్యదృష్టికి ఏం నిలబడగలదు చెప్పు? కనుక “నీవు-నేను-అతడు' మొదలైన జీవభావము కూడా భావనామాత్రమే. ఈ సర్వము బ్రహ్మము కంటే వేరుగా (అనేకముగా) ఏనాడూ ఉండుటలేదు.
అట్టి బ్రహ్మము అణువు కంటే కూడా అణువు. ఆ బ్రహ్మము యొక్క 'శుద్ధత్వము సూక్ష్మత్వము’ల విషయానికి వస్తే .... అది ఆకాశము కంటే కూడా అనేకరెట్లు మహోన్నతమైనది. ఆకాశకోశము (మధ్యప్రదేశము) కంటే కూడా అత్యంత శాంతమైనది. దానికి రూపమంటూ ఏదీ లేదు. అది 'దిక్కు-కాలము' మొదలైనవాటిచే బంధింపబడునది కాదు. అందుచేత అది విస్తృతము,
పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవావశిష్యతే ॥ ..... ఋగ్వేదము
Page:214
అనాది, స్వప్రకాశము అయివున్నది. అట్టి చిద్రూప బ్రహ్మము లేనిచోట వాసనలు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, జీవము కూడా ఉండవు. ఈ విధంగా ఆ బ్రహ్మము పూర్ణమై నిరాకారమై ప్రశాంతమైనట్టి పరమపదముగా ఉత్తమ జ్ఞానులకు గోచరిస్తోంది. అయ్యది స్వస్వరూపంగా, సర్వస్వరూపంగా, సర్వాంతర్యామిగా, సర్వాతీతంగా సర్వదా అనుభవమౌతోంది.
శ్రీరాముడు : ఓ మహర్షీ! 'చిత్తు' అను ఆకృతి మాత్రమే కలిగియున్నట్టి ఆ పరమార్థ 'తత్త్వము' యొక్క రూపమెట్టిదో ... మరొక్కసారి "సూక్ష్మదృష్టి"ని అవలంబించి చెప్పండి. దాని వలన మాకు జ్ఞానం వృద్ధి చెందగలదని, మీరు చెప్పబోయేదంతా మరింత స్పష్టంగా గ్రహించగలమని అనుకొంటున్నాను.
శ్రీ వసిష్ఠమహర్షి : సర్వవర్ణనములకు అతీతమై, మహాప్రళయ సమయమున కూడా ఇంకా శేషించి ఉండే .. కారణ-కారణమగు పరబ్రహ్మమును వర్ణించి చెపుతాను విను.
అది ఎక్కడో ఉన్నది కాదు. ఎప్పటికో లభించేది కాదు. ఇప్పటికే సర్వజనులయొక్క వాస్తవ స్వరూపముగా ఎల్లవేళల లభించియే ఉన్నది.
ఓ మానవుడా! ఒకసారి నీ చిత్తవృత్తులను నిరోధించు. మనస్సును ఆయత్తమొనర్చి (సిద్ధం చేసి) చూడు. అప్పుడు మిగిలి ఉండేదేది? ఆ అవర్ణనీయ సాక్షి చైతన్యమే 'చిత్' అనబడు పరమాత్మ. అట్టి తత్త్వానుభవ సమయంలో ఈ దృశ్యజగత్తు నశిస్తుంది. శుద్ధ చైతన్య భావనచే దృశ్యము లేనిదగుటచే, దర్శనము కూడా లేనిదగుచున్నది. దర్శనము లేనప్పుడు ఇక ద్రష్ట ఎక్కడ ఉంటాడు? అట్టి త్రిపుటి లయించగా భాసించునదే బ్రహ్మము యొక్క స్వరూపానుభవం. ఈ త్రిపుటి అంతా భాసిస్తున్నది ఆ బ్రహ్మము వలననే, అద్దాని యందే. కనుక అది భాసించని క్షణమే లేదు. దాని అనుభవం మాత్రం ... ఈ త్రిపుటి (ద్రష్ట - దర్శనము - దృశ్యములు) పట్ల కించిత్ తన్మయత్వము కారణంగా మరుగునపడటం జరుగుతోంది. జీవ చైతన్యము యొక్క చేత్యభావము (ఆయా వస్తు - విషయములను ఆసక్తితో సమీపించి స్వీకరించు స్వభావము) లోపించిపోగా అప్పుడు మిగిలి యుండు “ప్రశాంత చిన్మాత్రమే” ఆ పరమాత్మ స్వరూపము.
ఒకానొకడు శరీరాదులతో కూడినవాడై ఈ లౌకిక జగత్తునందు సంచరిస్తున్నప్పటికీ అతని చిత్తము శబ్ద-స్పర్శాది-వికారములచే స్పృశించబడకయే నిర్లిప్తంగా, మౌనంగా, ప్రశాంతంగా ఉన్నదనుకో అప్పుడా చిత్తము ఉండే స్థితే పరమాత్మ యొక్క స్వరూపము.
మనస్సు స్వప్నరహితము, జాడ్యహీనము, అపరిచ్ఛిన్నము అయివుండగా ... అప్పుడు కలుగగల ఒకానొక “సుషుప్తస్థితి” వంటి అనుభవసారమే “పరమాత్మ” యొక్క స్వరూపము.
ఓ రాఘవా! ఆకాశము యొక్క, వాయువుయొక్క, శిలయొక్క హృదయములను గమనించావా? అవి శూన్యత్వము, పూర్ణత్వము, ఘనత్వము కలిగివుంటాయి కదా! "ఇవే చిన్మయబ్రహ్మము యొక్క విశేషములు”... అని గ్రహించు. 'అద్రష్ట' యొక్క భావాతీత స్వరూపమే శుద్ధతత్త్వమగు ఆత్మయొక్క
Page:215
రూపము. ఈ జీవునియందు చైత్యభావము (తెలియబడటం) చిత్తభావము (తెలుసుకొనటం) .... శాంతించాయనుకో... అప్పుడు మిగిలియుండు శాంతి రూపసత్తయే ఆ ఆదివస్తువుయొక్క స్వరూపము.
చిత్ప్రకాశము యొక్క ఆకాశప్రకాశము యొక్క, ఇంద్రియ వృత్తులయొక్క అంత రాంతరాలలో సర్వదా వికసించియుండేదే బ్రహ్మము యొక్క స్వరూపము. 'సమస్త దృశ్య పదార్థములు', మరియు ‘అంధకారము’ కూడా ఏ 'అనాది-అనంత-చిచ్ఛక్తి' వలన తెలియబడుచున్నాయి? ఒక్కసారి ప్రశ్నించి, తర్కించి చూడు. అయ్యదియే పరమాత్మ. ఈ జగత్తంతా ఎద్దానియందు ఉత్పన్నమై, అద్దానికి అభిన్నమైనప్పటికీ ..... వేరైనట్లుగా కనబడుతోంది? ఏది వ్యవహారపరమై కూడా, శిలలాగా నిశ్చేష్టితమై యున్నది? ఏది ఆకాశము కాకపోయినప్పటికీ, ఆకాశస్వరూపమైయున్నది? అన్నివైపుల అఖండితమై యున్నది? సర్వదా ప్రసరించుచు అనుద్వేగం (unemotional)గా ఉండి ఉన్నట్టి ఎద్దాని నుండి -
ఈ జ్ఞాని - జ్ఞానము - జ్ఞేయములు ఉదయించి అస్తమిస్తున్నాయి? దర్పణంలోని ప్రతిబింబ వస్తువుల వలె ఎద్దానియందు ఈ జ్ఞాత-జ్ఞేయములు ప్రతిబింబిస్తున్నాయి? నాయనా! రామా! అయ్యదియే పరమాత్మ యొక్క స్వరూపము.
మనస్సు జాగ్రత్-స్వప్నముల నుండి విడివడినపుడు ‘మహాచైతన్యము' అనబడే సుషుప్తి దశ వంటి శుద్ధ చైతన్యము నందు ప్రవేశిస్తోంది. చరాచర సృష్టి లయమైపోయినట్టి అట్టి స్థితి యందు పరమాత్మానుభవమే మిగులుచున్నది.
ఓ సూక్ష్మగ్రాహీ! వింటున్నావా! పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అర్థమౌతోందా? ఒక ఉపమానం చెపుతాను, విను. అచలస్వభావముగల స్థావరపదార్థములను చూస్తున్నాము కదా! వాటికి మనస్సు బుద్ధి ఇంద్రియములు లేవు. అయితే వాటియందు శుద్ధ చైతన్యభావన మాత్రమే ఉన్నదనుకో... అట్టి స్థితిని పరమాత్మతో పోల్చవచ్చు. బ్రహ్మ, విష్ణు, హర, ఇంద్రాదులు కూడా నశించగా, అప్పుడు పరమశివమగు సద్వస్తువు ఒక్కటే మిగిలివుంటుందో అద్దానికి ఎట్టి ఉపాధి ఉండదు. కాబట్టి ‘నిరుపాధికము’, ‘నిర్వికల్పము' అను పేరుతో చెప్పబడుతోంది. "విశ్వసంజ్ఞు” పరిత్యజించ బడినప్పుడు, ఇక ఆపై చైతన్యమందు బ్రహ్మమే శేషించుచున్నది. నీయొక్క, నాయొక్క ప్రతి ఒక్క జీవునియొక్క ... నిత్యమై వెలుగుచున్న సత్యస్వరూపము ఆ ఆ పరమాత్మయే గాని, వేరేమీ కాదు. “వేరు” అని తలచుటయే సంసారము "వేరు కాదు” అని తలచుటయే, అసంసార స్వరూప మోక్షము.
16. జగత్తు అనగా ఏమిటి?
శ్రీరాముడు : ఓ బ్రహ్మజ్ఞా! ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతా అత్యంత స్పష్టంగా ఘనీభూతమై కనబడుచున్నది కదా! ఇట్లు ప్రాప్తిస్తున్న ఈ జగత్తు ప్రళయ కాలంలో ఎక్కడికి పోతోంది? ఏమౌతోంది?
శ్రీ వసిష్ఠమహర్షి : ఒకానొక గొడ్రాలి యొక్క రెండవ కుమారుడు ఎక్కడి నుండి వచ్చుచున్నాడు?
Page:216
ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడికి పోవుచున్నాడు? ఆకాశంలో ఒక బాలునికి మేఘాకృతి కారణంగా కనిపించే వనములు, జంతువుల ఆకారములు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడికి కదలిపోతున్నాయి? ముందుగా ఈ నా ప్రశ్నలకు సమాధానమేమిటో చెప్పు?
శ్రీరామచంద్రుడు : గొడ్రాలికి కుమారుడు, ఆకాశంలో వనము ... అనేవి ఏ కాలము నందు జన్మించియుండలేదు. అవి అసలు ఎక్కడా ఉండవు. కనుక వాటికి అస్థిత్వమెక్కడ? అభావమెక్కడ? రెండూ ఉండవు. ఆ భావమునకు అర్థమేలేదు.
శ్రీ వసిష్ఠమహర్షి : ఆ రెండూ అభావ పదార్థములే కదా! అదే విధంగా ఈ జగత్తు కూడా అభావ పదార్థమే. దీనికి అస్థిత్వమే లేదు. ఇక “ఎట్లు ఉత్పన్నమైనది?” అనే ప్రశ్న ఎక్కడుంటుంది? మొదలే అభావముచే కూడుకొనియున్న ఈ జగత్తుకు ఉత్పత్తిగాని, అస్థిత్వముగాని, వినాశనముగాని లేవు. “స్వప్నంలో కనిపించిన భవనం ఎవరు కట్టించారు? ఎప్పుడు ఎందుకు కట్టించారు?” అను ప్రశ్నలకు అర్థమేమున్నది?
శ్రీరాముడు : అయితే నాదొక చిన్న ప్రతిపాదన. “వంధ్యాపుత్రుడు”, “ఆకాశవృక్షము (లేక ఆకాశవనము)" అనునవి కల్పనలు మాత్రమేనని అనుకొందాం. 'కల్పన' అనునది ఒకప్పుడు ప్రారంభమై, మరొకప్పుడు నశిస్తోంది. కనుక కల్పనలకు ఉత్పత్తి-క్షయాలు ఉన్నాయి కదా! ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి-క్షయాలు ఉన్నాయని అనుకొంటే తప్పేమున్నది?
శ్రీ వసిష్ఠమహర్షి : ఔను, 'కల్పన' అనునది ఉన్నప్పుడు “ఆకాశ వృక్షము - వంధ్యాపుత్రుడు" అనునవి ఉంటున్నాయి. కల్పన క్షయిస్తే అవికూడా లేనివే అవుచున్నాయి. ఈ జగత్తు విషయం కూడా అట్టిదే కూడా! కల్పన ఉన్నప్పుడు జగత్తు ఉన్నది. లేనప్పుడు లేదు. ఈ విధంగా వంధ్యాపుత్రునకు జగత్తుకు పోలిక ఉన్నది.
“మరి ఈ జగత్తు ఏదై ఉన్నది? ఎక్కడ ఉన్నది?" అను ప్రశ్నలకు వద్దాం. “బంగారపు గాజులు” అను దానిలో బంగారమునకు వేరుగా “గాజులు” అనుబడునది ఎక్కడైనా విడిగా ఉన్నదా? ఆకాశమునందు శూన్యత్వము కాకుండా వేరే ఆకాశత్వము ఎక్కడున్నది? అట్లే ఈ జగత్తు బ్రహ్మమునందే ఉన్నప్పటికీ, దీనికీ బ్రహ్మము కంటే వేరైన రూపం లేదు. కాటుక నలుపు, మంచు చల్లదనములకు భేదము ఏమాత్రం లేదు. ఎండమావి యందలి నీటికి, (మెల్లకన్ను దోషంచే చూడబడుచున్న) ద్వితీయ చంద్రుని చంద్రత్వమునకు గల అస్థిత్వమేమిటి? ఈ రెండూ లేకయే ఉన్నాయి. కనుక, 'అత్యంత అభావమే సిద్ధిస్తోంది కదా! ఒకానొకడు నీ దగ్గరకు వచ్చి “ఎండమావులలో నాకు నీరు కనబడుతోంది కదా! లేదంటే నాకేం ప్రయోజనం?" అంటే నీవు ఏం అంటావు?
“నాయనా! నీకు కనబడవచ్చు. కాని మేము దానిని నిశింతగా పరిశీలించి చూచాం. నీవు కూడా దృష్టిని శుద్ధం చేసి పరిశీలించు. నీకే ఆ విషయం తెలుస్తుంది. అక్కడ ఏమాత్రం జలం లేదు. తరంగాలు లేవు" అని అనవలసిందే కదా!
Page:217
ఈ జగత్తు విషయం కూడా అంతే. ఇది సంసారదృష్టికి లోభమోహమదమాత్సర్యాదుల కారణంగా, అవిమర్శ నాత్మకంచేత, ఇంద్రియదృష్టిమాత్రంచేత, సంకుచిత-హ్రస్వదృష్టిచేత ఘనీభూతమై తోచుచుండవచ్చు. కాని శుద్ధ-స్వస్వరూపమగు బ్రహ్మము గ్రహించబడినప్పుడు ఈ జగత్తు యొ అభావమే సిద్ధించుచున్నదని మేము ప్రకటిస్తున్నాము.
అనేక కోణముల నుండి 'జగత్తు' అనబడుదానిని పరిశీలించినప్పుడు, “ఇది ఇట్లు” అని లభించకయే ఉన్నది. వేరువేరు దృష్టులకు వేరువేరు అనుభవమగుచున్నది.... వాస్తవానికి ఏమైఉన్నట్లు? అసలు ఉన్నట్లా? లేనట్లా? నాయనా! రామచంద్రా! ఈ జగత్తు అనబడునది ఇతఃపూర్వం లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇదివరకు గాని, ఇప్పుడుగాని, లేనట్టి దానిని ... “ఇది ఒకానొకప్పుడు వినాశనమగును” అను వాక్యము సమంజసమెలా అవుతుంది? అయితే ఒకానొక ద్రష్ట దృష్టిలో, ఈ ‘జగత్తు’ అను భావము లయించిపోవుట సంభవించుచున్నది 'జగత్తు' అను రూపముగా అనుభవమయ్యే ‘భావము' యొక్క ఉత్పత్తి-వినాశనములే 'సృష్టి-ప్రళయములు” అను శబ్దములచే శాస్త్రములు బోధిస్తున్నాయి.
శ్రీరాముడు : మహర్షీ! ఈ జగత్తుకు కారణమేలేదని ఎట్లు నిశ్చయిస్తున్నారో చెప్పండి?
శ్రీ వసిష్ఠమహర్షి : "ఈ జగత్తుకు బ్రహ్మమే కారణం" అని అంటామనుకో ... పృథివి మొదలైన జడవస్తువులకు జడమైనదేదో కారణం కావాలికాని, శుద్ధ-చైతన్య స్వరూపమగు 'బ్రహ్మము' ఎట్లా కారణమౌతోంది? “ఎండ” అనగా ప్రకాశము ... 'నీడ' అనగా ప్రకాశ రాహిత్యము. సూర్యకాంతికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఏర్పడు దానినే 'నీడ' అని అంటున్నాము. కాని “నీడ” అనుదానికి కారణం ఎండయే” అని అనలేము కదా! బ్రహ్మము జడము కాదుకదా! ఎండ అనునది నీడకు ఎట్లా కారణమౌతుంది?...అట్లాగే, అఖండము- చైతన్యవంతము - సూక్ష్మాతిసూక్ష్మము - నిష్క్రియము అనిర్వచనీయము అయివున్నట్టి బ్రహ్మము ఈ జగత్తును నిర్మించుటకు కారణమెట్లా అవుతుంది? బ్రహ్మము కాకుండా వేరే ఏదీ ఈ జగత్తుకు కారణంగా లభించుటలేదు. అందుచేత “ఈ జగత్తుకు కారణం లేదు” అని గ్రహించబడుతోంది. కారణము లేని చోట కార్యము ఎట్లా సిద్ధించగలుగుతుంది?
ఇక మేము ఈ జగత్తును ఎట్లు గ్రహిస్తున్నామో చెపుతాను విను.
ఆదికారణమగు ఆ బ్రహ్మవస్తువే విశ్వమువలె గోచరించుచున్నది. ఇక ఈ అభాస* కు కారణమేమిటంటావా? అజ్ఞానము. బ్రహ్మవస్తువు నిష్క్రియమైనదగుటచే "బ్రహ్మము విశ్వమును సృష్టించుచున్నది” అను మాట సరికాదు. అతి సూక్ష్మమైనట్టి స్వస్వరూపము యొక్క స్వరూప స్వభావములను జీవుడు ఏమరచి ఉంటున్న సమయంలో ఈ 'జగత్తు' అనబడు అనుభవం ప్రాప్తించి వాస్తవమువలె గోచరించుచున్నది.
అభాస = ప్రతిబింబత్వము, లేనిది వాస్తవమువలె తోచుట (Illusionary)
Page:218
కాబట్టి రాఘవా! ఈ జగదృశ్యమంతా స్వప్నమునందు కనిపించే వస్తుజాలము వంటిదేనని గ్రహించెదవు గాక! స్వప్నంలో ఒక పెద్ద మేడ కనిపించుచున్నప్పటికీ - అది వస్తువా? దేనితో తయారుచేయబడింది? స్వకీయమైన కల్పనయే స్వప్నసమయమందు అట్లు ప్రాప్తిస్తోంది కదా! అదేవిధంగా బ్రహ్మమునందు 'జగత్తు' అనబడు వస్తువు లేక పోయినప్పటికీ అజ్ఞానము
వలన ఘనీభూతమైన అనుభవమువలె భావనాచమత్కారంతో కూడుకొని గోచరించుచున్నది”.. అనునది జ్ఞానులకు నిస్సందేహముగా, సుస్పష్టముగా తెలియవచ్చుచున్నది.
ఈ ‘జగత్తు’ అనబడునదంతా పరమాత్మయందు ఎల్లప్పుడు నిలచియున్నది. అంతేకాని, ఇది ఒకప్పుడు ఉదయించి, మరొకప్పుడు అస్తమించటం లేదు. నీరు ద్రవభావమును, వాయువు స్పందరూపమును, ప్రకాశము కాంతి ఆకారమును దాల్చియే ఉంటున్నాయి కదా! ఒకదానితో మరొకటి లేనిదెప్పుడు? బ్రహ్మము కూడా జగదాకారమును వహించియే ఉంటోంది. స్వప్నంలో గాంచబడే నగరం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు? “ఆ స్వప్నద్రష్ట యొక్క చైతన్యమే అంతరమున అట్టి నగరమును కల్పించుకుని, తానే ఆ 'కల్పన' అయి, ఆపై తననుతానే అట్లు దర్శించుచున్నది” అని మనం ఒప్పుకోక తప్పదు. అదే విధంగా ఈ జగత్తు యొక్క విషయం కూడా!
స్వీయ ఆత్మయే బ్రహ్మమైయుండి, బ్రహ్మమునందు జగదాకారముగా కల్పనామాత్రంగా అభాసించుచున్నది.
17. దృశ్యభ్రమ తొలిగేదెట్లా?
శ్రీరాముడు : బ్రహ్మజ్ఞా! విషంతో సమానంగా మమ్ములను అనేక యాతనలు పెట్టుచున్న ఈ దృశ్యజగత్తు స్వప్నానుభూతివలె “మిథ్యయే” అయిఉన్నదంటారా, స్వామీ! మీరు అత్యంత చమత్కారమైన విషయమే ప్రతిపాదిస్తున్నారు. ఇది స్వప్నసమానమే అయివుంటే ... మనుజునకు (జీవునకు) అనాదికాలం నుండి ఈ దృశ్యము విషయంలో విశ్వాసం ఎట్లా ఏర్పడుతోంది?
మరొక విషయం. దృశ్యము ఉంటే ద్రష్ట ఉంటాడు. ద్రష్ట ఉన్నంతవరకు దృశ్యము కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఒకటి ఉంటే రెండవదానితో సంబంధం ఏర్పడుతోంది. ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా ... రెండవదానికి 'ముక్తి’ కలుగుతోంది కదా! నేను అనుకోవటం ఏమంటే
దృశ్యబుద్ధి సంపూర్ణంగా నశించనంతవరకు దృశ్యము కనిపిస్తూనే ఉంటుంది. ఈ దృశ్యము మా దృష్టిలో ఉన్నంతవరకు మాకు జ్ఞానం లభించనట్లే - అని.
మొట్టమొదట దృశ్యజ్ఞానము కలిగి ఉండి ... మధ్యలో ఎదురుగా ఉన్నది నశించటం జరిగినా ... మరలా సంసార రూపమున ఉద్భవిస్తూనే ఉన్నది. కాబట్టి మన ఎదురుగా ఉన్న ఈ దృశ్యము ఇక్కడినుండి తొలగించినంతమాత్రంచేత (దృశ్యబుద్ధి ఉండియే ఉన్నది కనుక) అనర్థమగు
Page:219
బంధము తొలగుతుందని చెప్పలేం. గాఢ నిద్రా సమయంలో దృశ్యము ఉండదు. కనుక జీవుడు దృశ్యరహితుడు అయినట్లే, కాని నిదురలేవగానే మరల దృశ్యభావం వచ్చిపడుతోంది కదా!
కనుక, ఈ దృశ్యములోని వస్తుజాలము నశించటంచేతగాని, వీటిని వదలి మనం ఎటకో వెళ్ళటంచేత గాని ... ఈ దృశ్యబుద్ధి ఉన్నంతవరకు బంధము తొలగదు. అది మన సమస్యకు
సమాధానం కూడా కాదు.
ఇంకొక విషయమేమంటే అద్దం ఎక్కడ ఉంటే అక్కడ అది ప్రతిబింబాన్ని గ్రహిస్తూనే ...
ఉంటుంది కదా! ‘చిద్వస్తువు' అనే అద్దం ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అక్కడ స్మృతి నుండి జనించే సంసార సంస్కారం ప్రతిబింబితమౌతూనే ఉంటుంది.
“అసలు ఈ దృశ్యము ఉత్పన్నమే అయివుండలేదు. ఇదంతా వాస్తవానికి లేదు” అను వాక్యం సత్యమైనా, అసత్యమైనా “దృశ్య - దృష్టి” లేక “దృశ్య-బుద్ధి" గల మాపట్ల నిరర్థకమే అగుచున్నది. “దృశ్యరాహిత్యము” అను నిష్కల్మషమైన మనఃస్థితి ప్రాప్తించనంత కాలం ముక్తి అసంభవమే అవుతోంది. కనుక ఓ ఆత్మ విద్వరా! మా యొక్క “ముక్తి”ని అరికట్టుచున్న ఈ ఈ ‘దృశ్యభావం’ లేక ‘దృశ్యబుద్ధి' తొలగిపోవటం ఎట్లా? అట్టి సంయుక్తులు మాకు ఉపదేశించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! సర్వాత్మకమగు ఈ జగత్తు అసత్యమైయుండి కూడా సత్యమువలె ప్రతిభాసిస్తోంది. దీని విధము ఎట్టిదో .... నీకు కొన్ని దీర్ఘమైన కథల ద్వారా తెలియజేస్తాను. ఈ చెప్పబోవు కథలన్నీ ఇతఃపూర్వమే వర్ణించబడ్డాయి. వర్షపుజల్లు పడితే ధూళి గాలికి లేవదుకదా! ఈ కథలు చక్కగా విను. అప్పుడు దృశ్యబుద్ధి తనంతట తానే తొలగుతుంది. నీ మనోనగరంలో ప్రశాంతత వర్ధిల్లగలదు.
మానవుడైనవాడు “ఈ జగత్ స్థితి అంతా సంపూర్ణముగా భ్రమాత్మకమే” అని గ్రహించాలి. అది వివేకాదుల చేతనే సాధ్యపడగలదు. సర్వవేళల బ్రహ్మవస్తువును ఒక్కదానినే చింతించుచు వ్యవహరించాలి. మహాపాషాణమును (కొండరాయిని) బాణము ఏమీ చేయలేదు కదా! బ్రహ్మభావమును అలవరచుకొంటే, ఇకప్పుడు ఈ భావాభావములు, స్థూల సూక్ష్మాదిభ్రమలు, స్థిరాస్థిర సంకల్ప వ్యవహారములు, నిన్ను ఏమీ చెయ్యలేవు.
ఓ ప్రియరాఘవా! ఆత్మవస్తువు ఒక్కటి మాత్రమే ఉన్నది. దానియందు ఇక ఎట్టి వికల్పములు లేవు. అట్టి ఆత్మవస్తువునందు ఈ జగత్తు ఎట్లు ఉత్పన్నమైనదో గ్రహిస్తే... అంతా నీకే అవగతమౌతుంది. ఈ ఉత్పత్తి ప్రకరణంలో “జగత్తు” ఎట్లు ఉత్పన్నమైనది? అనే విషయం విచారించబోవుచున్నాము.
ఓ ప్రియతనయులారా! అమృతానంద స్వరూపులారా! సర్వజనులారా! ముందుగా ఒక విషయం నిర్ద్వంద్వంగా, నిస్సందేహంగా లోకమునకు ప్రకటిస్తున్నాను. వినండి. ఆత్మ వస్తువు నుండే స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు అంతా విజృంభిస్తోంది. ఆ మహదాత్మయే ఈ 'చక్షువులు’ మొదలైన ఇంద్రియములచే ప్రాప్తిస్తున్న నామ రూపములతో కూడిన "బాహ్యదర్శనము” అగుచున్నది. అదేవిధంగా అదే సమయంలో అంతరింద్రియ గ్రాహ్యమగు మననము మొదలైన పదార్థముల
Page:220
రూపముగను ప్రకాశించుచున్నది. మరల అదియే ఒకానొకప్పుడు తనయందు తానే లీనమగుచున్నది. అప్పుడు వృత్తిరహితమగు ఆత్మైకత్వమును ప్రకటిస్తోంది.
అట్టి ఆత్మభగవానునికి ఇవే మా ప్రణామములు.
18. జగత్ భావోత్పత్తి
శ్రీ వసిష్ఠ మహర్షి : పరమపవిత్రము, పరమశాంతము అయినట్టి బ్రహ్మపదము నుండి ఈ దృశ్యజగత్తు ఎట్లు ఉత్పన్నమైనదో చెపుతాను. విను.
నిద్ర పోతున్నవాడే కలలు కంటున్నాడు కదా! అదేవిధంగా స్వస్వరూపమే అయివున్నట్టి బ్రహ్మము కూడా సృష్టితో కూడుకొన్నదై ప్రతిభాసిస్తోంది.
ఈ విశ్వము ఏది అయివున్నది?
అనంత ప్రకాశ స్వరూపము, అనంత చిన్మయము అయినట్టి పరమాత్మయొక్క స్వాభావిక సత్తయే ఈ విశ్వమైయున్నది. ఇది మరింకొకటి ఏదీ కాదు. సర్వప్రాణుల స్వస్వరూపమగు ఆ పరమాత్మ ఆకాశము కంటే కూడా సూక్ష్మము, నిర్మలము అయివున్నాడు. అతనియందు తెలియబడుదానివలె ప్రకాశించుచున్నట్టి జ్ఞానమే, “అహం - నేను” అనునట్టి భావనతో కూడుకొని
ఉంటోంది.
అట్టి పరమాత్మ నుండి ఈ ఈ జ్ఞాన సంస్కారములన్నీ లేచుచున్నాయి. ఆ జ్ఞాన సంస్కారము తదితర సంస్కారములతో కూడుకొని 'చిత్తము'ను ఉద్బోధించుచున్నాయి.
చిత్ = "చిత్తవృత్తులతో కూడుకొనియున్న చేతనాత్మక బ్రహ్మసత్త”
ఆ పరమవస్తువు అనాదికాలం నుండి అనుసరిస్తూ వస్తున్న “క్షణ-సంవేదము” వలన దృశ్యజ్ఞానఘనము అగుచున్నది. అనగా ఆ ఆత్మస్వరూపుడు ఒక్కక్షణంలో ద్రష్టత్వము (State of Perceiver) వహిస్తున్నాడు. అట్లు దృశ్యములలో సంచరిస్తూ ఆసక్తిపరుడై క్రమంగా ఆత్మభావమును విస్మరించుచున్నాడు. అనగా పరమపదమును త్యజించి, సంసారోపాధితో కూడిన జీవభావమును పొందుచున్నాడు. అయితే, ఆ విధంగా, “నేను జీవుడను, ఖండుడను, శరీరమాత్రుడను” అను భావము పొందుచున్నప్పటికీ - అతనియందు 'బ్రాహ్మీస్థితి' (బ్రహ్మమునే అను స్థితి లేక భావము) ఏమాత్రం తొలగకయే ఉన్నది. ఎందుచేతనంటావా? బ్రహ్మసత్త (లేక చిత్)యే ఒకానొక విశేష - భావంచేత “నేను జీవుడను" అను విధంగా భావిస్తోంది. కాని, వాస్తవానికి అది వేరే
ఆకారమును పొందటంలేదు కదా!
ఈ విధంగా బ్రహ్మమునందు “జీవసత్త” ప్రకాశించిన తరువాత, క్రమంగా శూన్య రూపమగు ఆకాశసత్త (Space factor) ఆవిర్భవిస్తోంది. ఈ ఆకాశసత్తయే “ఆకాశము - శబ్దగుణము” అనబడు
Page:221
భవిష్యత్-వ్యవహారములకు స్థానభూతమగుచున్నది. క్రమంగా కాలసత్త (time factor) జనిస్తోంది. దానితోకూడి అహంకారముతో కూడిన అభిమానము ఉద్భవిస్తోంది. ఇవే భావిసృష్టికి, ఈ జగత్ సృష్టికి మూలములు.
చిత్ చైతన్యము
జీవ చైతన్యము
ఆకాశ సత్త ... శబ్ద గుణము
కాల సత్త
అహంకారాభిమానము జగత్ సృష్టి
ఆకాశ - అహంకార - కాలరూపమగు ఆ సృష్టిని సంకల్పమాత్రంగా సృష్టిస్తున్న తత్త్వమునే "హిరణ్యగర్భుడు” లేక “సమష్టిజీవుడు” అని శాస్త్రములు పిలుస్తున్నాయి. అయితే ఇదంతా చైతన్యతత్వమగు పరమాత్మసత్తను ఆశ్రయించే ఉంటున్నది. ఒక శిల్పి ఒకానొక గొప్ప శిల్పమును తయారుచేయాలనుకొంటున్నప్పుడు ... అతని మనస్సు నందు చిత్రించబడబోవు శిల్పము సంకల్పరూపంలో ఉంటుంది. అట్లే హిరణ్యగర్భుడు సమష్టిసృష్టి సంకల్పమే రూపముగా కలవాడు. కాని శిలసత్త వలననే శిల్పము నిలచి యున్నదికదా! నిష్క్రియమగు చైతన్యమే ఇదంతా అయివున్నది. ఆత్మచేతనే ఎరుగబడుచున్నట్టి ఈ అసద్రూపజగత్తు (illusionary world) పరమాత్మ నుండియే ఉత్పన్నమై సద్రూపమున ప్రకాశిస్తోంది.
అహంకారము మొదలైన తత్త్వములతో కూడుకొనిన సంవిత్తే 'సంకల్పము' అను వృక్షమునకు బీజమైయున్నది. అట్టి సంవిత్తు (Existence knowledge) యొక్క అంశము వలననే స్పందధర్మమగు వాయువు ఉత్పన్నమగుచున్నది. 'అహం'భావముతో కూడుకొనిన ఆకాశ రూపమగు సత్తను ‘శబ్దతన్మాత్ర’ అని అంటున్నాం. దీని నుండి క్రమంగా "ఆకాశ తన్మాత్ర (Physical space)” ఉదయిస్తోంది. శబ్దమయమగు శబ్ద తన్మాత్రము నుండి పదవాక్యముల ప్రమాణముతో కూడిన ‘వేదములు' వికసిస్తున్నాయి. అర్థములతో కూడిన శబ్దములుగా పరిణమించిన వేద స్వరూప బ్రహ్మమునుండే ఈ 'జగత్తు' అనునది ఉదయిస్తోంది.
క్రమంగా 'అహం-తన్మాత్ర'ల తత్త్వము నుండి ప్రియత్వము యొక్క ప్రభావంచేత "ప్రాణ తత్త్వము” ఉదయిస్తోంది. భావి (future) జీవుడగు ఈ ప్రాణతత్వమే ఇంద్రియములచే గ్రహించబడుచున్న ఈ రూపాదులకు కారణము. ఆ ప్రాణతత్వము నుండే పదునాలుగు లోకములు, జరాయుజ - అండాయుజ - - శ్వేదాయుజ - బీజాయుజములైన చతుర్విధ ప్రాణసమూహములన్నీ జన్మిస్తున్నాయి. ప్రాణతత్త్వాభిమాని యొక్క చిత్స్ఫురణ వలన ఈ భౌతికదేహము ఉత్పన్నమగుచున్నది. “స్పర్శతన్మాత్ర” అనబడే తత్త్వము నుండి నలుబదితొమ్మిది వాయుప్రసరణములు వెలువడుచున్నాయి.
Page:222
తద్వారా, సర్వభూతముల స్పంద కార్యనిర్వహణకు .... 'స్పర్శ తన్మాత్ర' కారణభూతమగుచున్నది. దీనినుండే ప్రకాశతత్త్వభావన వలన "తేజోతన్మాత్ర” (లేక రూపము) అను అనుభవము ఉత్పన్న మౌతోంది. అట్టి తేజస్సు నుండి సూర్యుడు, అగ్ని, విద్యుత్ మొదలైన తేజోపదార్థములన్నీ ఉత్పన్నం అవటం జరుగుతోంది. దానివల్లే రూపవిభజన జరిగి, ఈ సంసారం విస్తరిల్లటం కూడా జరుగుతోంది.
ఆ పరమవస్తువే సంకల్పమాత్రం చేత జలమయ శరీరమును గ్రహిస్తోంది. దాని ఆస్వాదననే ‘రసతన్మాత్ర’ అని అంటున్నాం. ఈ రసతన్మాత్రే ద్రవపదార్థములన్నింటికీ కారణమై, ఈ ఇంద్రియము లచే గ్రహించబడుచున్న సంసారవిస్తృతికి తోడ్పడుచున్నది.
కల్పనామయమగు ఆత్మయే తన కల్పనా ప్రభావం చేత “గంధతన్మాత్ర” (Experience of Smelling)ను వీక్షించుచున్నది. అది భూగోళము, శరీరములు మొదలైన ఆకృతులకు కారణభూతమగు చున్నది.
❖
చూచావా? రామచంద్రా! నీరు బుడగలయి, మరల నీరు అగుచున్నది కదా! అట్లే చితశక్తి యొక్క భావనాప్రభావంచేత కలిగిన తన్మాత్రలే ఒకదానితో మరొకటి కలిపి బ్రహ్మాండములగుచున్నవి. ఈ బ్రహ్మాండములన్నీ అనేక బుద్బుదమువలె (బుడగలవలె) కొంతకాలం కూడి ఉంటాయి. మరల విడిపోతాయి. మహాప్రళయమై, ఇవన్నీ నశించనంతవరకు .... ఈ సంయోగ-వియోగములు ఇట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే “ఇవన్నీ విశుద్ధ శక్తిసంపన్నములే” అనే విషయం అల్పబుద్దిచే గ్రహించలేము. ఒకచిన్న మఱివిత్తులో భవిష్యత్ మహావృక్షము, దాని వేలాది ఆకులు, పూలు, కొమ్మలు, విత్తులు, ఆ విత్తుల నుండి మరల వేలాది వృక్షములు ... మొదలైన వ్యవహారమంతా అప్రకటితమై దాగివుంటుంది కదా! “చెట్టు నుండి విత్తు - విత్తు నుండి చెట్టు”వలె ఈ శబ్ద-స్పర్శ-తేజ-రస గంధములనే పంచతన్మాత్రలు* ఆకాశముననే వెలయుచున్నాయి. మరల వాటి నుండి ఆకాశాదులు ప్రకాశిస్తున్నాయి.
అయితే నీవు ఇక్కడ ఒక విషయం సూక్ష్మబుద్ధితో గ్రహించాలి. “ఒక విత్తు అంకురించటం - ఆ అంకురము నుండి మహావృక్షము - ఆ వృక్షము వందలాది కొమ్మలతో ప్రకాశించుట - ఫలములను ఇవ్వటం” ఇవన్నీ ఆ విత్తులో అప్రకటిత సంస్కారరూపములో దాగివున్నాయి
కదా! అట్లే చిదాత్మ పరమాణువులో ఈ విస్తారమైన చరాచర జగత్తు అంతా ప్రకటితమౌతోంది. అట్లు ఒక చిదాత్మ పరమాణువు నందు ఇదంతా కనబడుచున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా 'మాయ'యేనని గ్రహించు.
శ్రీరాముడు : 'చిదాత్మ' అను సూక్ష్మపరమాణువులో ఇంతటి విస్తారమైన జగత్తు ఉండటమేమి? ఇదంతా ఎట్లా ఇముడుచున్నది?
పంచతన్మాత్రలు = శబ్దము - స్పర్శ - రూపము రసము - గంధము అనినబడు అనుభవములు.
Page:223
శ్రీ వసిష్ఠమహర్షి : స్వప్నంలో అతిసూక్ష్మనాడియందు పెద్ద పెద్ద వస్తుజాలమంతా కనబడుట లేదా? ఇదికూడా అట్టిదే. కాని ఈ కనబడేదంతా వాస్తవమైనది కాదు.
ఈ స్థూలభావములన్నీ ఒకప్పుడు రూపము పొందుచున్నాయి. మరొకప్పుడు రూపము పోగొట్టుకొంటున్నాయి. అనగా, 'చిత్' అను ఆధారమునందు సూక్ష్మత్వం పొందు చున్నాయి. ఒకానొకప్పుడు మరల స్థూలములౌతున్నాయి. సంకల్పాత్మకమగు చిత్-శక్తి వలననే ఈ 'జగత్తు' అను అనుభవం శబ్దస్పర్శరూప రస గంధముల ఆకారంగా ఏర్పడుతోంది. ఇంకొకప్పుడు ఆకారరహితమగుచున్నది.
ఓ రాఘవా! ఈ దృశ్యజగత్తుకు కారణం పంచతన్మాత్రలే. వీటికి పరమాత్మతో నిత్య సంబంధమున్నది. ఈ పంచతన్మాత్రలకు సాక్షాత్ కారణం మాయాశక్తియే. ఇక పరబ్రహ్మమో సర్వమునకు పరమకారణమగుచున్నది. మరి మాయాశక్తికి కారణమేమిటంటావా? 'ఆదిశక్తి' అని చెప్పబడే మాయాశక్తికి కారణం ... ఆదిభావమై, అనుభూతికి మాత్రమే గ్రహించబడునదై, జన్మరహితమై, చిత్స్వరూపమైనట్టి “పరమాత్మ”యే సుమా! పరమాత్మ లేక పరబ్రహ్మము
కారణరహితము.
‘మాయ’ కారణంగానే జగత్తు వికసించటం - మరల ముకుళించటం జరుగుతోంది. “పరమాత్మ” అనునది సర్వదా ఒకే రీతిగా మార్పు చేర్పులకు అతీతమైనదై ఉండి ఉంటోంది.
చేత్యము - తెలియబడుచున్న విషయమునకు సంబంధించిన కల్పన
నేను 'జీవత్వమును'
అను జీవభావము
అహం జ్ఞానము (నేను నీవు నాది నీది)
నిశ్చయాత్మక(Faculty of Discrimination) స్వభావం - బుద్ది
మనధర్మము
మనస్సు
శబ్దము స్పర్శ గంధము
రూపము రసము
1 తన్మాత్రలు 1
మ హా భూత ము లు
1
జగత్తు
Page:224
19. జగత్తు లేదు
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామా! ఈ ఆకాశము తేజస్సు తమస్సు మొదలైనవన్నీ తమంతట తాము ఉత్పన్నమైనవి కావు. ఇవన్నీ కూడా చిదాత్మమగు పరబ్రహ్మము యొక్క సత్త వలననే నిలచివున్నాయి. అంతేకాని, వీటికి స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. అన్నిటికి కారణం చిదాత్మయే సుమా! ఆ చిదాత్మయే తెలియబడుచున్న విషయమునకు సంబంధించిన కల్పనను, ఆ తెలియబడు దానితో కలిసిన జీవభావమును, ‘అహం' జ్ఞానమును కల్పించుచున్నది. అహంభావము యొక్క పరిణామము వలన బుద్ధి వికసిస్తోంది. అట్టి బుద్ధి, శబ్దము మొదలైన తన్మాత్రలతో కూడి 'మననము' అను ధర్మముగల 'మనస్సు’గ మారుచున్నది. ఆ మనస్సే తన్మాత్రలతో కలిసి, మహా భూతములుగా మారి జగత్తుగా ప్రాప్తించుచున్నది.
‘జగత్తు’ అనబడే పూతీగకు ఈ విధంగా బీజము చిదాకాశమే. అయితే ఈ 'జగత్తు' అనబడుదానికి బీజము ఎవరూ ఎక్కడా పాతవలసిన అవసరం లేదు. భౌతికమైన పాదువలె నీరు, నేల, వెలుతురు అవసరం లేకుండానే... భావనామాత్రంగా దానంతట అదే అంకురించుచున్నది.
'కేవల చిద్రూపము’ అయినట్టి ఆ పరమవస్తువు స్వప్న సృష్టిలాగా ఈ పృథివి మొదలైన వాటిని సృష్టిస్తోంది. అయితే రాఘవా! ఆ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ... అది ఈ 'జగత్' అను విషయమునకు అతీతమైయున్నదని గ్రహించెదవుగాక! దాని స్వభావము అసంగత్వమైనది. (It never gets attached to anything). అనగా సర్వసంగమములకు అతీతమైనది. నీవు స్థూల జగత్తును చూస్తున్నావు కదా! ఈ స్థూలజగత్తు యొక్క బీజము .... పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు). పంచతన్మాత్రలయొక్క బీజమో - అక్షయము, అవ్యయము అగు చైతన్యమే అయివున్నది. దీనినిబట్టి "ఈ జగత్తంతా బ్రహ్మమయమే" అని గ్రహించబడుగాక!
ఈ భూత (లేక/దృశ్య) సృష్టికి పూర్వమే మహాకాశమున తన్మాత్రపంచకము ఉన్నది. ఆ తన్మాత్రలను చైతన్యమే ఎట్టి ఉపకరణం లేకుండా... స్వసామర్థ్యం చేత కల్పించుచున్నది. కల్పన వాస్తవం ఎట్లా అవుతుంది? అందుచేత పంచతన్మాత్రలు కూడా వాస్తవంకాదు. అవాస్తవమైన పంచతన్మాత్రలు వర్ధిల్లి, స్థూలజగత్తుగా మారుచున్నది.
దీనినిబట్టి .... “సత్తు-కల్పన"లకు అధిష్ఠానమైయున్నట్టి "నిష్క్రియ - నిర్వికల్ప - చైతన్యము” నందు ఒక స్వప్న-కల్పనలాగా ఈ జగత్తు అవస్థితమైయున్నదని తేలుచున్నది. కాబట్టి రాఘవా! “నీవు-నేను-అతడు-అది-ఇది” మొదలుగా గల ఈ సమస్తము ఆ అద్వితీయ-చైతన్యమే అయివున్నది. దానికి వేరుగా ఈ త్రిలోకములలో ఏదీ లేదు సుమా!
“ఈ జగత్తు చైతన్యమునందు ఏర్పడుచున్న 'కల్పన' మాత్రమే” అని మనం నిర్వచించాము కదా! మరి కేవలం కల్పనచేత మాత్రమే వర్ధిల్లునది సత్యమెట్లా అవుతుంది? సృష్ట్యాదిగా మనం ఈ
Page:225
వ్యవహారమంతా పరిశీలించినప్పుడు ఈ తన్మాత్ర-పంచకము, దాని నుండి ఉద్భవిస్తున్న ఈ జగత్తు కూడా బ్రహ్మచైతన్యము నుండే వికసిస్తున్నాయని తెలియవస్తోంది. బ్రహ్మమే ఈ 'జగత్తు' అను కార్యమునకు కారణము కూడా. చూచావా రామా! ఇక్కడ ఈ జగత్తుకు కార్య కారణములు రెండూ బ్రహ్మమే అయివున్నాయి. కనుకనే మేము .... “ 66 'జగత్తు' అనబడు మరొక పదార్థమేదీ ఉత్పన్నమే అయివుండలేదు” .... అని నిర్ద్వంద్వముగా లోకమునకు ప్రకటించుచున్నాయి. “లేదు, జగత్తు అనబడునది ఒకప్పుడు ఇన్ని సంవత్సరముల క్రితం జన్మించింది” అని ఎవరైనా అంటారేమో? పంచమహా భూతములు (ఆకాశము, భూమి, అగ్ని వగైరా), పంచతన్మాత్రలు ఈ రెండిటి
కలయికే ఈ జగత్తు కదా! ఈ “అనుభవము - - అనుభవించువాడు” అను రెండు తత్త్వములలో ఒకదాని కాలనియతి మనకు పూర్ణార్థమును ప్రసాదించజాలదు. ఇంద్రియాసక్తులను అనుసరించి అనేక విధములుగా తోచే ఈ జగత్తును నిర్వచించి, నిర్దేశించి, కాలనియతిని ఆపాదించుటెట్లు?
శబ్ద-స్పర్శ-రూపాది-అనుభవ సంస్కారం-జగత్పదార్థముల కలయిక-ఇదే జగదనుభవంగా ముందు ముందు నిరూపించబడుచున్నది.
“ఇదంతా లేదు” అని మేము అనునప్పుడు, “మాకు అనుభూతమగుచున్నది కదా! లేదంటారేం?” అని ఎవరైనా అంటారేమో? వారికి మేము ఒక దృష్టాంతము చూపుచున్నాం. స్వప్నంలో కనబడే నగరాలు వాస్తవానికి అసత్తే కదా! స్వకల్పిత మాత్రములే కదా! అయినప్పటికీ, అవి ఆ స్వప్నసమయంలో సద్వస్తువులవలెనే అనుభూతములగుచున్నాయి కదా! అట్లే ఈ జీవుడు స్వకీయకల్పనచే జగత్తు యొక్క అనుభవం తన స్వస్వరూపమునందే స్వసంకల్పానుసారం పొందుచున్నాడు. ఈ జీవుడు బ్రహ్మాకాశస్వరూపుడే. పరమప్రకాశ స్వరూపమగు బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే అయివున్నట్టి ఈ “కాల్పనిక” యొక్క అస్థిత్వం గోచరిస్తోంది.
విశుద్ధమగు బ్రహ్మమునందు "పృథివి” మొదలైన పదార్థముల ఉనికి అసంభవమని మనం అనుకొన్నాం కదా! అందుచేత ... ఈ 'జగత్తు' అనబడునది భ్రమాత్మక దృష్టికి మాత్రమే గోచరిస్తోందని సత్య-ద్రష్టలు మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఆకాశమున ఊహాపూరితమైన నగరాదులు భ్రమదృష్టిచే దర్శించువానికి గోచరిస్తాయి. అట్లే బ్రహ్మము నందు కూడా 'జీవుడు' అనబడునది గోచరించటం జరుగుతోంది. 'ఉపాధి' దృష్టిని త్యజించి 'శరీరి' దృష్టితో పరిశీలించినప్పుడు ఈ విషయం సుస్పష్టమగుచున్నది. ఆహా! ఎంతటి చమత్కారం! శుద్ధ స్వరూపమగు బ్రహ్మమే ఈ జీవుని రూపమున ప్రకాశించటం జరుగుతోంది. అనగా ఆ పరమేశ్వరుడే ఈ "జీవుడు సమష్టి” మొదలుగాగల ఆకారమున జీవసమష్ట్యాకాశమున (సద్రూపమున) ప్రతీయమాను డగుచున్నాడు.
Page:226
20. స్థూలదేహ ఆవిర్భావము
శ్రీరాముడు : స్వామీ! ఈ జీవుడు - పరమేశ్వరుడు ఒక్కటే పని ప్రతిపాదిస్తున్నారు కదా! సర్వమునకు అతీతుడు, స్వరూపమంటూ ఏదీ లేనివాడు అయిన ఈశ్వరుడు ఈ స్థూలదేహమును ఎందుకు, ఎట్లు ఆశ్రయిస్తున్నాడు? “నేను జీవుడను మాత్రమే ... అత్యల్పుడను” అను రూపమున గల ఈ సంకుచిత స్వభావమంతా ఎక్కడినుండి వచ్చిపడుతోంది?
శ్రీ వసిష్ఠమహర్షి : స్వయంప్రకాశమగు ఆత్మవస్తువును అత్యంత అసంగతమైనట్టి ఈ స్థూలదేహము యొక్క ఆపాదనంతా ఏర్పడుచున్న ఒకానొక క్రమమును విశ్లేషించి చెపుతాను. విను.
మొట్టమొదట పరమేశ్వరునకు జీవకల్పన అగ్ని స్ఫులింగమువలె కొద్దిగా ఉదయిస్తోంది. క్రమక్రమంగా కల్పనాబలం చేత ఆయనే స్థూలజీవిగా భావన పొందటం జరుగుతోంది. ఆకాశంలో చంద్రుడు ఒక్కడేగాని, ఇద్దరు చంద్రులు లేరుకదా! కాని, మెల్లకన్ను దోషము కలవానికి రెండవ చంద్రుడు వాస్తవమువలెనే గోచరించుచున్నాడు. అట్లే, ఈ జీవభావము 'అసత్తు' అయివుండికూడా సత్తువలె ప్రతీయమానమగుచున్నది. అటు తరువాత భావనాబలము వలన ద్రష్టత్వము ద్రష్టత్వము నుండి దృశ్యత్వము ఏర్పడుచున్నాయి.
క్రమంగా, ఆ ఆ సూక్ష్మతేజము తనయొక్క స్ఫులింగభావమును మరచినదై, తనను స్థూలముగా భావించుచు స్థూలమే అగుచున్నది. ఒకడు స్వప్నంలో "నేను మరణించాను, నా బంధువులు నా చుట్టూ కూర్చుని ఏడ్చుచున్నారు” అనే అనుభవం పొందుతూ ఉంటాడు. తానే మరణిస్తే... ఆ ఆ
స్వప్నం ఎవరికి? అందలి ఏడ్చుచున్న జనులు ఎవరు? తాను ఉంటే కదా, స్వప్నము గాంచుట! ఇట్లు స్వప్నంలో తన మరణం ఎంతటి హాస్యాస్పదమో ... శుద్ధచైతన్యము స్వకీయమైన స్ఫురణచే ఈ జీవత్వము, జీవభావము, “నేను ఒక జీవుడను” అను భ్రమ పొందటం అట్టిదే. కంటి యందు 'పొర' అను దోషము పొందినవాడు ప్రతి వస్తువును రెండు వస్తువులుగా చూస్తాడు. వాస్తవానికి ఇక్కడ వస్తువులు 'రెండు అగుట లేదు కదా!
శుద్ధ చైతన్యము నందు జలతరంగమువలె ఉదయించినట్టి లింగదేహము • "జ్ఞానము -
చిత్తము” అను కల్పనల ద్వారా స్థూల దేహములను గ్రహిస్తోంది. ఆయా ఉపాధులతో ఏకత్వము పొందుచు, “నేను ఈ రక్తమాంసమయ శరీరమునే” అని భ్రమిస్తోంది. ఆహా! చూచావా? ఎక్కడి
నిత్య-నిర్మల-వృత్తి రహితమగు ఆత్మతోటి 'ఏకత్వము'? ఎక్కడి శరీరము తోటి తాదాత్మ్యము? ఎక్కడి “శరీరమే నేను-అను భావన?” ఎక్కడి “అఖండమగు ఆత్మయే నేను” అను ఎరుక?
ఇట్లు లింగాకారమే క్రమంగా స్థూలత్వమౌతోంది. ఒక లక్షాధికారి స్వప్నంలో తనను తాను ఒక భిక్షుకునిగా గాంచునట్లు, “వాస్తవానికి శుద్ధచైతన్యమే” అయున్న ఈ జీవుడు “నేను
లింగదేహము = (Subtle body or Mind)
Page:227
శరీరమును లేక శరీరమాత్రుడను, శరీరము చేతనే ఉంటున్నాను” అని భావించుకొనుచున్నాడు. ఒక దాని వెనుక మరొకటి చొప్పున భ్రమాత్మకమైన అనేక ఆశలకులోనై, నానాయాతనలు అనుభవించుచున్నాడు. చిత్తము ఏయే విషయముల ఆకారమును (లేక భావనలను) దాల్చుచున్నదో ... ఈ జీవుడు కూడా అట్టివే అగు ఉపాధులను దాల్చుచున్నాడు. ఒక దర్పణం (అద్దము) తనయందు, తన ఎదురుగా ఉన్న పర్వతమును ప్రతిబింబిస్తుంది చూచావా? అట్లే 'సర్వగామి’యగు ఈ ఆత్మకూడా తన జ్యోతిర్మయలింగ శరీరమును “అహం” అనునట్టి అభిమానమును దాల్చి వెలయుచున్నది. లోతైన నూతిలో పడినవాడు బయటకు రాలేక కొట్టుమిట్టాడు చున్నట్లు ... ఈ జీవుడు కూడా దేహాభిమానమును వదలలేకున్నాడు. అతడు తన ఆత్మయొక్క స్వరూప స్వభావములను ఎరిగినప్పుడు మాత్రమే 'స్వస్థత' పొందగలడు సుమా! ఓ రాఘవా! ఈ జీవునికి అతని ఆత్మయొక్క స్వరూపమును గుర్తు చేయటానికే .... మేము ఈ ‘ప్రవచనము’ అను ప్రయాసతో కూడిన వ్యవహారమంతా చేస్తున్నామయ్యా! అయితే, జీవుడు తన ఆత్మతత్త్వమును ఏ క్షణంలో కూడా త్యజించి ఉండనే లేదు. ఇది సత్యము. మా ఈ ప్రబోధముచే "ఉండివున్న సత్యము”నే (that which is already true) ఎరుక పరుస్తున్నాము. లేక గుర్తు చేస్తున్నాము. అంతేగాని, మేము క్రొత్తగా ఏదీ తెచ్చి ఇచ్చుటలేదు.
“స్వప్న దర్శనం - సంకల్పమునందలి కల్పితమైన దృశ్యము యొక్క అనుభవం” ... ఇవి రెండూ నిజశరీరమునందే జరుగుచున్నాయి కదా! ఈ జీవుడు ఆత్మతత్త్వమగు స్ఫులింగరూపమున (చైతన్య రూపమున) అహంకారాదులతో కూడినవాడై ఉపాధిని ఆశ్రయిస్తున్నాడు. అట్లు ఆశ్రయిస్తూ క్రమంగా తన వాస్తవమగు స్వరూప స్వభావములను ఏమరచి, “నేను ఈ ఉపాధియందు ఉండువాడిని. ఈ ఉపాధికి మాత్రమే సంబంధించినవాడిని” అను భావనకు బద్దుడగుచున్నాడు. ఇక ఆపై అట్లే కల్పనామయ దేహములను (స్థూల సూక్ష్మ దేహములను) అనుభవించుచున్నాడు. అయితే ఈ జీవబుద్ధియొక్క నివాసస్థానము ఏది? ఇది “సత్త-చిత్తము” అను రెండిటితో కూడినదై, “ఉండటం-ఇష్టపడటం” అను రెండు స్వభావములతో స్వయముగా జ్యోతిరాకాశ మధ్యమున, తన లింగశరీరముననే లేక సూక్ష్మశరీరముననే వెలయుచున్నది. ఆ లింగ శరీరము జలమునందలి తరంగమువలె ఆత్మయందు ఉనికిని పొందియున్నది.
మొట్టమొదట, “నేను అనుభవమును పొందెదను గాక! (ఉదాహరణకు చూచెదను గాక! వినెదనుగాక! మొదలైన రూపమున)” .... అను ఆసక్తితో కూడిన భావన ఉదయిస్తోంది. అప్పుడు నేత్రము నుండి దృష్టి రూపమున చైతన్యము ప్రసరించి "భవిష్యత్ బాహ్య దృశ్యము"ను సమీపిస్తోంది. అప్పుడు ఈ 'జీవుడు’ అనబడు చైతన్యమూర్తి తనయందు ఆ వస్తువు యొక్క ఆకార-లక్షణములకు సంబంధించిన వృత్తిని పొంది, ఆ వృత్తిని అనుభవించుచున్నాడు. దేనివలన
Page:228
చూచుచున్నాడో, అవి ‘కళ్ళు' అని, దేనియందు స్పర్శానుభవం ప్రాప్తిస్తోందో అది 'చర్మము’ అని, దేనివలన వింటున్నాడో అది 'చెవి' అని, దేనివలన వాసన పొందుచున్నాడో (ఆఘ్రాణిస్తున్నాడో) అది ‘ముక్కు’ అని పేర్లు ఇవ్వబడ్డాయి. ఈ విధంగా చైతన్యమునందలి వివిధ వృత్తులు .... 'వివిధ అనుభవములు ... వివిధ ధర్మములు'గా పరిణమించి నామరూపములను సంతరించుకొంటున్నాయి.
దేనివలన అయితే “ప్రయత్నము-కర్మేంద్రియములు" కూడా వికసిస్తున్నాయో, దానిని 'వాయువు' అంటున్నాం. అది సర్వదా 'స్పందము' అను లక్షణము కలిగియున్నది కదా! ఈ వాయువే తన స్పంద క్రియ ద్వారా జీవునకు బాహ్యవిజ్ఞానము, అంతర్విజ్ఞానము కలిగించుచున్నది.
ఈ విధంగా ఆతివాహిక దేహి (లేక సూక్ష్మ - దేహి లేక 'అపంచీకృత దేహి' .... మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములే దీని రూపము) ... స్థూలాకారము ధరించుట వలన స్థూలధర్మము ప్రకటితమౌతోంది. అయితే అతని స్వస్వరూపము ఆత్మచైతన్యమే కదా! అనగా ఆత్మచైతన్య స్వరూపుడే “లింగ-స్థూల” శరీరములను ధరించి, అందలి "స్థూల సూక్ష్మ” విషయముల మధ్య ఆకాశమువలె వెలయుచున్నాడు. అసత్యమే అయి కూడా సత్యమువలె తోచునట్టి కల్పనను ఆశ్రయించి బ్రహ్మ-జీవ శబ్దార్థబోధకమగు (ఆరెండు శబ్దముల అర్థమును ప్రతిబింబించు) జీవత్వమును స్వయంగా, లీలామాత్రంగా, అనిర్వచనీయ కారణంగా ... స్వీకరించుచున్నాడు.
ఈ 'జగత్' అనబడు దృశ్యప్రాప్తికి ఇస్తున్న ఒకానొక నిర్వచనం విను.
“ఆ పరమాత్మయే అతివాహికదేహి' అయి స్థూలదేహ ఆవరణము నుండి స్వబుద్ధిచేత
కల్పించబడిన ఈ బ్రహ్మాండమును గాంచుచున్నాడు”.
శ్రీరాముడు : మరి వేరువేరు జీవుల మాటేమిటి? ఇక్కడ ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క విధంగా ఇచ్ఛ, హావ-భావములు ఉనికి ప్రకటిస్తున్నాడు కదా! ఈ కనబడుచున్నదంతా ఏమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : ఔను! ఒక జీవి జగత్తును, మరొకజీవి విశాల బ్రహ్మాండ స్వరూపమును, ఇంకొక జీవి భావి బ్రహ్మాండమును గాంచుచున్నారు. ఒకే శక్తి అనేకచోట్ల అనేక వ్యవహారములను నిర్వర్తించుట లేదా? ఒకే చైతన్యము ఒకచోట జీవునిగాను, మరొకచోట విరాట్ స్వరూపము (విస్తారమైన పంచభౌతిక సృష్టి సమన్వయము) గాను, ఇంకొకచోట దీర్ఘ - హ్రస్వకాలస్వరూపము గాను... తనను తానే వ్యక్తీకరించుకొంటోందని గ్రహించెదవుగాక. అట్లు గాంచుచు, ఆయా అనుభవములను అంగీకారబుద్ధితో దర్శించుటయే ఈ బ్రహ్మాండ నిర్మాణములోని అంతర్లీన లక్షణము.
ఈ జీవుడు “నిజగర్భ గృహము (own inner recess of the house)” అనతగినట్టి తన చిత్తమునుండే... కల్పనానుసారంగా కాలము, కార్యము, కల్పన, ద్రవ్యములను అనుభవించు చున్నాడు. ఆయా రూప - నామ - శబ్దములకు బద్ధుడగుచున్నాడు. అయితే వస్తుతః ఇదంతా స్వప్న కల్పనవలె అసత్తు లేక అశీకము (భ్రమమాత్రము) అయివున్నది. అందుచేత, జ్ఞానులు “ఇదంతా అనుత్పన్నమైనది” అనే నిర్ణయిస్తున్నారు. “విశ్వరూపుడు, ఆదిప్రభువు అయినట్టి ఆత్మ
Page:229
'స్వయంభువు'. అట్టి ఆత్మకు వాస్తవానికి "ఉత్పత్తి" అనునదే లేదు. కాని స్వకీయమగు మాయచే వ్యష్టి-సమష్టి సృష్టి రూపములుగా ప్రకటితమగుచున్నాడు” ... అని వేదములు ప్రవచించుచున్నాయి, బోధించుచున్నాయి. బ్రహ్మాండాకారముగా కనిపించే ఈ భ్రమయందు ... ఆతివాహిక దేహస్వరూపి, ఆది ప్రభువు అగు 'ప్రజాపతి' అని పిలువబడుచున్న శుద్ధస్వరూపుడగు 'ద్రష్ట’ కాక మరింకేదీ ఎక్కడాలేదు. ఈ 'దృశ్యజగత్తు' అనబడుదానియందు ఏదీ ఉత్పన్నమయి ఉండలేదు. ఏది ఉత్పన్నము అవబోవుట లేదు. ఇంకేమి ఎవరిచేత చూడబడటంలేదు. ఓ రామచంద్రా! మేము ఈ జగత్ వ్యవహారమంతా బాగా పరిశీలించాము. అనేక కోణముల నుండి ఈ "నీవు నేను” మొదలైనవాటిని పరీక్షించి చూచాం. అనేక చర్చల తరువాత జగద్విషయమై మేము చేస్తున్న నిర్ణయం విను.
ఆతివాహిక రూపమును (మనోరూపమును) స్వయముగా ఆశ్రయించిన పరమాత్మ ఈ జగత్తును తనకుతానే చిత్తమునందు రచించుకొని - ఆ రచనచే బ్రహ్మాండముగాను, వస్తుజాలముగాను, ఉత్తమ - మధ్యమ - ప్రథమ పురుషులుగాను దర్శించుచు, అనుభవించుచున్నాడు.
“ఇక్కడ-అక్కడ, ఇప్పుడు అప్పుడు బ్రహ్మాకాశమే ఉన్నది" అని గ్రహించుటే జ్ఞానం.
అందుచేత, రామా! ఈ దృశ్యవ్యవహారమంతా సత్తవలె (As if exists truly) గ్రహించబడవచ్చు. అనుభవించబడవచ్చు. కాని, వాస్తవానికి ఇదంతా స్వప్నములో గాంచబడే నగరమువలె “కల్పితము, ప్రతిబింబమాత్రము, భ్రమ, అళీకము” అని నీవు గ్రహించెదవుగాక! ఇదంతా వాస్తవానికి అనిర్మితం, రాగరహితం, బంధరహితం. అయితే ఏం? అత్యంత ఆశ్చర్యం కలిగిస్తూ ప్రకాశిస్తోంది.
ఆకాశములోని నక్షత్రములు, చంద్రుడు మొదలైనవి తటాకజలంలో ఎవరి కారణంగా ప్రతిబింబిస్తున్నాయి? ఈ అళీకదృశ్యము, నీటిలో ప్రతిబింబించే ఆకాశ దృశ్యమువలె, ఎవ్వరూ సృష్టింపకున్నప్పటికీ సత్యానుభవమువలె వెల్లివిరుస్తోంది. మహాప్రళయ సమయంలో బ్రహ్మాదులు కూడా లయమైపోతున్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకప్పుడు ఉండి .... మరొకప్పుడు లేకుండా పోయేది సత్యమెట్లా అవుతుంది? ఈ సృష్టి అంతటికీ కర్తయగు బ్రహ్మయే ఒకానొక దృష్టిచే, 'మాయ'లోని భాగంగా, “లేనివాడే” అగుచుండగా, ఇక ఆయన సృష్టియగు ఈ జగత్తు గురించి వేరుగా మనం చెప్పుకునేదేమున్నది? ఇది కూడా అట్లే లేనిదే అగుచున్నది. సృష్టికర్త ఎట్టివాడో, ఆ సృష్టికర్తచే కల్పించబడిన ఈ జగత్తుకూడా అట్టిదే అవుతుంది కదా!
శ్రీ ప్రియరాఘవా! 'జ్ఞానము' అనబడే జాగ్రత్ ప్రవర్తించినప్పుడు ఈ 'జగద్దర్శనము' అనే స్వప్నము తనంతటతానే అంతర్థానమగుచున్నది. అప్పుడు పరమాత్మ తన జీవత్వభ్రమలు వదలి, తనయొక్క "కేవలం - అద్వితీయం - అద్వయం” అగు బ్రహ్మ స్వరూపమున వెలియుచుండటం జరుగుచున్నది. అప్పుడిక అతనిపట్ల ఈ దృశ్య జాడ్యములేవీ ఉండవు. స్వప్నం త్యజించుటచే మెలుకువ వచ్చిన తరువాత ఆ స్వప్నములోని గృహములు, మనుష్యులు, సంఘటనలు అసత్యముగా తెలియవస్తాయి. అప్పుడవన్నీ జ్ఞాపకమాత్రంగా మాత్రమే ఉంటాయి కదా! అట్లే ఈ జగత్తు - శరీరాదులు ఉండివున్నా, జ్ఞానము ప్రాప్తించినట్టి స్థితిలో ఇవన్నీ, వీటి మూలకారణముతో
Page:230
సహా ఆకాశరూపముననే సాక్షాత్కారమౌతాయి. అప్పుడు "నేను - నీవు - - ఇది”లతో
కూడిన జగత్తంతా 'బ్రహ్మము'గానే అనుభూత మగుచున్నది. జలమునకు వేరుగా ద్రవత్వమున్నదా? సృష్టికూడా పరమాత్మ నుండి వేరుకాదు.
“జ్ఞానులు” అంటే ఎవరు? తపస్సు మొదలైన ఆయా ప్రయత్నములచే మనస్సును నిర్మలం చేసుకొనినవారే కదా! అట్టి నిర్మల మనస్కులకు ఈ కనబడే బ్రహ్మాండము ఆకాశమువలె అతి నిర్మలము, ప్రశాంతము, నిరాధారము (ఏదీ ఆధారముగా కలిగి ఉండనిది) నిరాధేయము (దేనికీ కూడా తాను ఆధారము కానిది). అద్వయము, అద్వితీయముగా (తనకు వేరైనది కానిదిగా) తెలియవచ్చుచున్నది. ఇదంతా బ్రహ్మము నుండే ప్రాప్తిస్తున్నప్పటికీ, బ్రహ్మమునకు వేరుగా ఏదీ, ఏ సమయమందును ఉత్పన్న మగుటలేదు. ఇది పరమాకాశమువలెనే శూన్యము, నిర్మలము అయి వెలయుచున్నది.
ఓ మహాసూక్ష్మబుద్ధీ! ఒక విషయం ప్రకటిస్తున్నాను. వాస్తవానికి “సంసారము” అనునదే లేదు. ఇది (ఈ కనబడునది) ఆధారముగాని, ఆధేయముగాని, ద్రష్టగాని, దృశ్యముగాని కాదు. దీనియందు బ్రహ్మము - బ్రహ్మాండము అనబడు పదార్థములేవీ లేవు. ఇక్కడ రూపనామములకు సంబంధించిన కార్యకారణములను, కాలప్రతిపాదనలను నిరూపించాలని, సిద్ధాంతీకరించాలని ప్రయత్నించటం ఒక విధంగా “వితండవాదమే” నని అనిపించుకొంటుంది. అయితే శాస్త్రములు కొన్ని నామ రూపముల సహాయం తీసుకొని, శిష్యునియందు సంసారరాహిత్యమును వెలిగించటానికి ప్రయత్నం చేస్తున్నాయి. పదజాలము యొక్క ప్రాస్త్యము అంతవరకే. (అనగా శిష్యులకు బోధించటం కొరకే).
వాస్తవానికి, ఇక్కడ జంగము-స్థావరాదులు కూడా లేవు. జలములో తరంగములు, ఆవృత్తములు, సుడిగుండాలు లేస్తాయి చూచావా? ఒకే జలం ఆ విధంగా అనేక రూపములలో ప్రవర్తిస్తోంది. బ్రహ్మము తనయందు తానే "జగత్కల్పన” చేసుకొని ఇంతలోనే ఆ కల్పనలన్నీ విలీనం చేసుకొంటోంది. ఇదంతా ద్రష్టకు వేరుగా చూచినప్పుడు అసత్తు అయివుండి కూడా దృశ్యదశలో దృశ్యరూపమున అనుభూతమై అనేక అనుభవములకు ఆలవాలమగుచున్నది. ఆహా! ఈ అసత్తు అయినట్టి దృశ్య వ్యవస్థలో ఎన్ని వేదనలను, ఎన్ని దుఃఖములను, ఎన్ని భయములను జీవుడు నిష్కారణంగా అనుభవించుచున్నాడో కదా! ఒకడు స్వప్నంలో తాను మరణించినట్లు కలగాంచుచున్నాడు. ఇంతలోనే, నిదుర లేచిన తరువాత, “ఈ స్వప్నానుభవం నాయొక్క భ్రమచే కల్పించబడినదే కదా! మరి నేను అంతగా ఎందుకు రోదించాను?” అని ఆశ్చర్యపడతాడు. ఇక ఆపై పట్టించుకోకుండా ఆ అనుభవంపట్ల మౌనం వహిస్తాడు. అదే విధంగా జ్ఞానము ప్రాప్తించినప్పుడు "ఈ సంసారము మిథ్యయే కదా” అని బోధపడుచున్నది. అప్పుడాతడు కేవలము అఖండము, అనాది, అనంతము అగు బ్రహ్మమునే జ్ఞానాకాశమునందు దర్శించగలడు. ఆపై పూర్వ తత్పూర్వ జగత్ వ్యవహార మననము ఉండజాలదు.
Page:231
ఆ పరమాకాశమునందే స్వయముగా శూన్యరూపమున “అతివాహిక దేహధారి” అయి ప్రజాపతి* వెలయుచున్నాడని గ్రహించు. అతని దేహము పాంచభౌతికము కాదు. కార్యము, కారణము కంటే వేరు కాదుకదా! (Effect in not different from the cause). ఆ ప్రజాపతి సంకల్పమాత్ర వ్యవహారమైనట్టి ఈ పృథివి మొదలైన స్థూలసృష్టి 'సత్తు' కాదు సుమా! ఇదంతా ప్రజాపతి నిజ స్వరూపమైన బ్రహ్మమే. “సర్వము సర్వదా బ్రహ్మమే" అని గ్రహించిన తరువాత ఇక్కడ నీకు తారసపడగల సుఖ - దుఃఖములేమి ఉన్నాయి? “సంసారము” అనునది ఎక్కడ ఉన్నది చెప్పు?
21. ఈ జీవుడు పరిమితుడా? అపరిమితుడా?
శ్రీ వసిష్ఠమహర్షి : ఇప్పటి వరకు మనం విచారించిన దానిని అనుసరించి "అహంభావము గాని, దానిని ఆశ్రయించి ఉన్న ‘జగత్తు' మొదలైన దృశ్య సమూహములు గాని లేవు” ... అని తేలుచున్నది కదా! ఇదంతా జన్మరహితమైయుండుటచే “లేవు” అనునది యుక్తియుక్తమే అవుతుంది. 'బ్రహ్మము' ఒక్కటే సత్పదార్థము. ఇక ఇతరమైనదేదీ ఎక్కడా లేదు.
పరమాకాశము - స్థూల/సూక్ష్మ దేహములు - దృశ్యము :
నిశ్చలమగు సముద్రజలము తన జలత్వము త్యజించకుండానే చంచలమగు కెరటములుగా మారినది కదా! పరమాకాశమే తన ఆకాశరూపమును త్యజించకుండా జీవరూపమున ప్రకాశమును పొందుచున్నది. సంకల్పమే రూపముగా గల “చిద్వృత్తి" ఈ అసంఖ్యాకములగు జీవ రూపములను దాల్చుచున్నది.
ప్రథమజీవి (జీవత్వమునకు నాంది), విరాట్టు ప్రజాపతి అయివున్న ఆ బ్రహ్మదేవుని చిత్స్వరూప-ఆకాశదేహమునే మనం “అతివాహికము, సూక్ష్మదేహత్వము” అని పిలుస్తున్నాం.
ఇక ఈ ‘దృశ్యము’ విషయానికి వస్తే ఇదంతా కలలో కనబడే కొండలాగా భాసిస్తోంది. ఇది ఏ చిత్రకారుడో ఏకాగ్రచిత్తము నందు కల్పించిన “సేవాదళము” అను పంచరంగుల చిత్రమువంటిది. ఒక చిత్రకారుడు ఒక గొప్ప చిత్రమునకు రూపకల్పన చేసాడనుకోండి... ఆ చిత్రము యొక్క ప్రావీణ్యత అతని చిత్తమునందే అన్ని వేళల దాగియున్నది కదా!
ఈ జగత్తు ఒక స్తంభములో చెక్కబడిన శిల్పదృశ్యము వంటిది. విరాట్పురుషుడు (లేక ప్రజాపతి లేక బ్రహ్మదేవుడు లేక సమష్టి సృష్టి) ఆ స్తంభమున గల 'శిల' వంటివాడు, “ఆది ప్రజాపతి” ** అయిన ఆ బ్రహ్మదేవునికి, సామాన్యజీవునికి ఉన్నట్లు... సహకారికమైన “ఉత్పాతక కారణం” అంటూ ఏమీ లేదు. ఎట్లు అంటావా? జీవుడు... “ఈ ఇంద్రియానుభవములను
ప్రజాపతి = సూక్ష్మతత్వము (Subtle body) యొక్క ఆదికారణ చైతన్యమే ప్రజాపతి యొక్క స్వరూపము. ఆది ప్రజాపతి = ప్రతిజీవుడు పూర్ణమగు ఆత్మయే కదా! శుద్ధతత్వమగు ఆత్మ సమష్టి-సృష్టి భావమును పొందునట్టి తత్వమునే ‘ఆది ప్రజాపతి’గా చెప్పబడింది.
Page:232
పరమాకాశమున తననుతాను ప్రకటించుకొనుచున్నాడు.
ఇతఃపూర్వపు ప్రజాపతులు మహాప్రళయ సమయమున 'ముక్తులు' అయినారు. ముక్తులైన వారికి పూర్వపు కర్మలు, సంస్కారములు ఉండవు కదా! కెరటాలు జలంలో లేచి లయిస్తున్నట్లు బ్రహ్మమునందు బ్రహ్మలు వారివారి సృష్టులతో సహా లేవటం, లయించటం జరుగుతోంది. శ్రీరాముడు : అనగా ఆ ఆదిప్రజాపతియే దృశ్యములో ఎదురుగా ప్రాప్తిస్తున్న ఈ వస్తువులుగా అగుచున్నాడా?
శ్రీ వసిష్ఠమహర్షి : ఈ జగత్ పదార్దములు అద్దంలోని ప్రతిబింబములాగా జీవుని చిత్తమునందు ప్రతిబింబిస్తున్నాయి. చిత్తమే శరీరముగాగల ప్రజాపతి "స్వతంత్రసత్త శూన్యుడు" అని చెప్పబడుచున్నాడు. దృశ్యమునకు అతీతమైన ఆత్మయే అతనికి ఆధారము. అతడు దృశ్యము గాని, దర్శనముగాని, ద్రష్టగాని స్వతహాగా కాకపోయినప్పటికీ అన్నీ తానే అగుచున్నాడు. దీపం
నుండి మరొక దీపం వెలిగించబడునట్లు, ఆ ఆది ప్రజాపతి నుండే ఈ దృశ్య సమూహములన్నీ ఉత్పన్నమౌతున్నాయి. ఒక సంకల్పములో మరింకెన్నో సంకల్పములు, ఒక స్వప్నములో మరికొన్ని దుస్స్వప్నములు కలుగుచున్నట్లు, ఆ ఆది ప్రజాపతి యొక్క “సమష్టిసృష్టి” అను స్వప్నంలో అనేక ‘జీవులు’ అను అసంఖ్యాక స్వప్నములు ఉంటున్నాయి. చెట్టు నుండి కొమ్మలు, ఆ కొమ్మల నుండి అనేక ఆకులు ఉత్పన్నమగుచున్నట్లు, సమష్టి-సృష్టి స్వరూపుని స్వప్నము నందు అనేక వ్యష్టి-అల్పసమష్టి సృష్టులు బయల్వెడలుచున్నాయి. అతని స్పందము వలననే ఈ జీవుడు ఉత్పన్నమగుచున్నాడు. మట్టితో అనేక బొమ్మలు తయారు అయినప్పుడు ... ఆ మట్టికి - బొమ్మలకు అభేదమే సిద్ధిస్తోంది కదా! బాహ్యమైన సహకారి కారణము లేనప్పుడు కార్య - కారణములు అభిన్నమే కదా! అదేరీతిగా ఈ సృష్టికి, పరమాత్మకు భేదం లేదు.
ఎవనియందు ఈ 'పృథివి' మొదలైన అళీకమైన (జలము నందలి ప్రతిబింబము వంటి) వస్తువులన్నీ కనబడుచున్నాయో, అతడే జీవాకాశస్వరూపుడగు* ఆదిబ్రహ్మ. అతడే ఈ “విరాట్ ఆత్మ ... విస్తారపదార్థ సృష్టి స్వరూపము" అని వేదజ్ఞులు చెప్పుచున్నారు.
శ్రీరాముడు : భగవంతుడగు ఓ వసిష్ఠ మహర్షీ! మీరు చెప్పినదంతా విన్న తరువాత, ఇప్పుడు నాకు కొన్ని సందేహాలు కలుగుచున్నాయి. జీవుడు పరిమితుడా? అపరిమితుడా? జీవులు అనేకులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడా? ఒక వేళ అనేకులు ఉంటే వారందరు కూడా అనంతస్వరూపులేనా?
ఈ కనబడే వస్తుజాలం ఇట్లు ఇంద్రియముల అనుభవంగా ప్రాప్తిస్తున్నాయి. ఆ ఇంద్రియములు శబ్దస్పర్శరూప రసగంధములను తన్మాత్రలలో ఉన్నాయి. ఆ తన్మాత్రలు చిత్తాకాశంలో ఉన్నాయి. చిత్తాకాశం జీవాకాశంలో ఉన్నాయి. ‘శుద్ధచిత్’ యొక్క ప్రథమ ప్రకటన అజీవాకాశమే.
Page:233
వారందరు అచలము (కొండ) వలె మార్పుచేర్పులు లేకుండానే ఉంటున్నారా? అసలు ఈ జీవులందరు ఎక్కడి నుండి వెలువడుచున్నారు? విచిత్రం చూచారా? మేఘం నుండి జలధారలు పడుచున్నట్లు, సముద్రం నుండి అనంత సంఖ్యలో జలకణములు వెలువడుచున్నట్లు, అగ్ని నుండి రవ్వలవలె ఈ జీవులందరు అసంఖ్యాకంగా ఎటునుండో వెలువడుచున్నారు. ఉంటున్నారు. వీరందరు బయలుదేరినది ఎందులోంచి? ఎక్కడికి వెళ్ళుచున్నారు?
శ్రీ వసిష్ఠమహర్షి : నీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పమన్నావా? విను.
'జీవుడు' అనబడువాడు ఒక్కడూ లేడు. ఇక “చాలామంది జీవులు” అనే మాట ఎక్కడ ఉన్నది? నీ ప్రశ్న "కుందేటికి కొమ్ములు ఎందుకు కనబడుచున్నాయి?" అన్నట్లు ఉన్నది. జీవుడు లేడు. జీవరాశి లేదు. పర్వతమువలె జీవపిండము కూడా లేదు. నీకు కనబడుచున్న 'జీవుడు' అనబడుచున్నదంతా ప్రతిభాస, లేక ప్రతిబింబము వంటిదే కాని, వాస్తవము కాదు.
శుద్ధము, సర్వగతము (అంతయు ఆక్రమించి, ప్రసరించియున్నది), పవిత్రము అగు బ్రహ్మముగాక మరొక వస్తువే లేదు. ఆ బ్రహ్మము సర్వశక్తిమంతము. అందుచేత, ఈ కల్పనా కౌశలమంతా దానియందే ఉపస్థితమైయున్నది. ఆ చైతన్యమునందు సంకల్ప వృత్తులు ప్రతిబింబించి, తద్వారా ప్రతిబింబ (అళీక) మాత్రములైనట్టి ఈ ఈ సాకార - నిరాకారములగు పదార్ధములుగా ఆవిర్భవిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బ్రహ్మ ద్రష్టలకు ... బ్రహ్మమునందు, బ్రహ్మముగా కనిపిస్తున్నాయి. ‘విత్తు' (Absolute knowing) అను లత “చైతన్యము” అను సంసర్గముచే “నీవు-నేను- పదార్థములు - అంతరంగ విషయములు” అను రూపుగల 'పూలు-కాయలు'గా వికసిస్తోంది. కనుక ఈ కల్పనా వృత్తుల ప్రకాశమంతా పూలు-కాయలతో కూడిన 'లత'గా పోల్చబడుచున్నది. దీనిని గాంచునది కూడా బ్రహ్మమే. “జీవుడు - బుద్ధి - స్పందము మనస్సు - ద్వైతభావము
బ్రహ్మసత్త” ఇవే జ్ఞానగమ్యములగుచున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానికి స్వకీయమైన సత్త (Independent existence) లేదు. "ఏకమాత్ర బ్రహ్మము”నకు మాత్రమే అస్థిత్వమున్నది. మిగతావాటికన్నిటికీ బ్రహ్మము వలననే అస్థిత్వం ఏర్పడుతోంది. ఆ బ్రహ్మసత్తను తత్త్వపూర్వకంగా (తత్త్వమ్ = అదియే నీవు అను ఎరుకగా) తెలుసుకోకపోవటం చేతనే అది వేరైన సత్తవలె ప్రతిభాసమౌతోంది. తత్వతః గ్రహించిన తరువాత అది కాకుండా వేరొకటేదీ అగుపించదు. బ్రహ్మసత్తను అజ్ఞానము ఆవరించియున్నది. అయితే, భయపడ వలసినదేమీ లేదు. ఎందుకంటే, అట్టి అజ్ఞానమును 'ఆత్మజ్ఞానం' అనతికాలంలో వినాశనమొర్చుచున్నది.
ఒక చమత్కారం ఏమిటంటే, “అజ్ఞానం ఎట్టిది? ఎందుకు సంభవిస్తోంది?” అనే విషయమై ఏమీ చెప్పలేం. “దీపపు వెలుతురు వలన చీకటి నశిస్తుంది"... అనే విషయం మనందరికీ తెలుసు. కాని ‘చీకటి’ అనగా ఏమో ఏమిచెప్పగలం? “వెలుతురు లేకపోవటమే చీకటి” అనిమాత్రం ఒక మాట అనగలం. అదేవిధంగా, "జ్ఞానము ఉదయించినప్పుడు అజ్ఞానము నశించుచున్నది”
Page:234
అని మనం తప్పకుండా చెప్పగలం. కాని, “ఈ అజ్ఞానం ఇట్టిది. ఇక్కడి నుండి వచ్చింది, ఇక్కడ ఉన్నది” అని మాత్రం నిర్వచించలేము. మేము బోధించునపుడు ... అజ్ఞానము తొలగే ఉపాయము లేమిటో చెప్పుచున్నాం. అజ్ఞానం ఎందుకు ప్రాప్తించిందో అది అనిర్వచనీయమే సుమా!
“పరిశుద్ధ తత్త్వమగు ఆత్మ మనన కారణంగా జగత్తును పొందుతోంది” అని చెప్పుచున్నాం. అట్టి బాహ్యప్రియత్వముతో కూడిన మననము ఎందుకు ప్రాప్తిస్తోంది?
శ్రీరాముడు : అవును ... ఎందుకు ప్రాప్తిస్తోంది?
శ్రీ వసిష్ఠమహర్షి : అది మేము చెప్పజాలకపోతున్నాము. వాస్తవానికి అది అనిర్వచనీయము. నిజానికి మనకు ఆ విషయం అనవసరం కూడా! వ్యాధి ఏమిటో, దానికి చికిత్స ఏమిటో తెలిసిన తరువాత, “ఇతనికీ వ్యాధి ఎందుకొచ్చింది? ఎప్పుడు, ఎట్లా ప్రారంభమైంది?” అనునది అప్రస్తుతమేనని మా అభిప్రాయం. ఒకవైద్యుడు సుదీర్ఘకాలం వెచ్చించి వాటికి సమాధానాలు వెతక పూనటం కాలమును వృథాచేయుటయే కదా! వైద్యం చేయటానికి ఉపక్రమించటమే తక్షణ కర్తవ్యం కదా!
ఇప్పుడు మేము ప్రతిపాదించునది, "బ్రహ్మమే ఈ 'జీవుడు' అయివున్నది” అని కదా! కనుక నీవు నీ ప్రశ్నలలో తరచితరచి చెప్పుచున్న 'జీవుడు’ అనువాడు బ్రహ్మమే. అట్టి బ్రహ్మము “సర్వశక్తిమంతము, అఖండము, అపరిచ్ఛిన్నము, అనాది, అనంతము, సత్యము, చైతన్యరూపము” ... అయివున్నది. ఈ లక్షణములన్నీ జీవునియొక్క వాస్తవ స్వరూపము యొక్క స్వభావమే అయివున్నది. ‘బ్రహ్మము’ అనునది ఎక్కడో లేదు. ఎప్పటికో లభించునది కాదు. ఓ మహాబుద్ధిశాలీ! రామచంద్రా! ఈ జీవుని వాస్తవ స్వరూపమే బ్రహ్మము సుమా! దానియందు భేదకల్పనలు లేవు. ఈ కనబడుచున్న జగత్కౌశలమంతా కూడా (అపరోక్షానుభూతి సమయమందు) బ్రహ్మమునందే పర్యవసించుచున్నదని గ్రహించెదవుగాక!
శ్రీరాముడు : స్వామీ! మీరు చెప్పేదంతా బాగానే ఉన్నది. ఒప్పుకొంటున్నాను కూడా. కాని, మీరు “జీవసమష్టియే మహాజీవుడు” అంటున్నట్లు నాకు అవగతమౌతోంది. మరి ఈ వ్యష్టిజీవుడు ఎవడు? ఇతడు సమష్టిజీవుని అంగము వంటివాడా? ఒకవేళ అది నిజమైతే ఒక జీవుని
యందు ఒక ఇఛ్ఛ అన్ని జీవులలోను పుట్టాలి కదా? అలా జరుగుతోందా? లేదే! జీవులకు పరస్పరభేదమేదీ లేదని మీ అభిప్రాయమా? అట్లైతే ఈ వేరువేరు అభిప్రాయములు, జ్ఞానములు, సంకల్పములు మాట ఏమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి : మంచి ప్రశ్నే వేశావు. చెపుతాను, విను.
బ్రహ్మమే సమష్టి జీవరూపమును గ్రహించి, అటు తరువాత వ్యష్టిరూపమును కూడా దాల్చుచున్నదని ... నేను ఇంతవరకు చెప్పినదానినిబట్టి గ్రహించే ఉంటావు కదా!
ఆ సర్వశక్తిమంతుడు, మహాజీవియగు అఖండ-బ్రహ్మమునందే ఈ 'జగత్వ్యవస్థ' అంతా ఇచ్ఛారూపమున ఉంటోంది. అతడు నిరంతరం దేనిని కోరుచూ ఉంటాడో, అయ్యది సత్వరము
Page:235
ఫలిస్తూ ఉంటుంది. సత్యసంకల్పము (ఇది సత్యమైయున్నది అను సంకల్పము) కూడా అతని ఇచ్ఛకు లోబడియే ఉంటోంది. అనగా ఆ బ్రహ్మము ఏది ఎట్లు సత్యమని భావిస్తే, అది అట్లే ప్రాప్తించుచున్నది.
అతనియందు ఇంతకుముందే “నేను వ్యష్టిజీవత్వము' అను అనుభవమును పొందెదను గాక” అనునట్టి భావబీజము ఉండి ఉంటోంది. ఈ విధంగా, సమష్టిజీవుడు 'వ్యష్టి' అగుట కూడా ఆ బ్రహ్మము యొక్క ఇచ్ఛాలీలయే. అతడు తన అంశలగు జీవన సమూహములను, “ఇది ఇట్లు అగును” అని సంకల్పించి కల్పించుచున్నాడు. ద్విత్వము (the second one) అనునది ఏకత్వము నుండే వస్తోంది కదా!
లౌకిక వ్యవహారం దృష్ట్యా ఏ కార్యము ఎట్లు చేయాలో సంకల్పించుటయే కాకుండా, తదనుకూలంగా అవలంబిస్తేనే ఆయా కార్యములు సిద్ధిస్తాయి కదా! కాని సమష్టిజీవి విషయం అట్లు కాదు. అతడు సంకల్పించినంత మాత్రం చేతనే, క్షణంలో కార్యము సిద్ధించుచున్నది. వ్యష్టిజీవి ఆయా కర్మలు నిర్వర్తించటం ద్వారా ప్రయత్నించినపుడు మాత్రమే ఏదైనా పొందుచున్నాడు. ఈ వ్యష్టి-సమష్టి జీవులకు (1) “సంకల్పించి + ప్రయత్నించి పొందటం, (2) సంకల్పించినంతమాత్రంచేత పొందటం" ... అనునట్టి నియమమునకు వ్యతిరిక్తంగా ఏదీ సంభవించదు.
శ్రీరాముడు : మహర్షీ! మహర్షుల కార్యములు సంకల్పమాత్రంగానే ఈడేరుచున్నాయి కదా! శ్రీ వసిష్ఠమహర్షి : నిజమే. కాని, అది అట్లు జరుగుట కూడా మనం సమష్టి జీవుల ఇచ్ఛకే ఆపాదించవలసి వస్తుంది. "మహర్షుల సంకల్పము సత్యమై ప్రవర్తించుగాక” అనునట్టి సమిష్టి-జీవుని నిర్ణయమే అట్లు వారి వర-శాపాదులను శక్తివంతం చేస్తోంది. వ్యష్టి - జీవుని ఇచ్ఛకు కూడా కారణం సమిష్టిజీవుని ఇచ్ఛయే. అట్టి ఇచ్ఛ ఫలించటానికి కూడా అదే కారణం.
ప్రధాన జీవుడు కల్పనా
మహాజీవాత్మ అనే వ్యష్టి శక్తి జీవుడు
ము క్రియాక్రమమునకు సంబంధించిన ఇచ్ఛ
'సమష్టిజీవి' లేక 'ప్రధానశక్తి' యొక్క నియమమునే “ఈశ్వరేచ్ఛ" అని అంటున్నాం. అట్టి ఈశ్వర-నియమమునకు వ్యతిరేకముగా ఏ కార్యమూ సిద్ధించదు. సర్వము దానిని అనుసరించే ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈశ్వరేచ్ఛానుసారమే జరుగు చున్నాయి. వ్యష్టిజీవి ఇచ్ఛ వలన సిద్ధించేదంటూ ఏదీ లేదు.
బ్రహ్మమే స్వరూపముగాగల “మహాజీవి” ఆద్యంతరహితుడైయున్నాడు. అతడే కోట్లకొలది వ్యష్టిజీవుల - సమష్టిజీవుల యొక్క స్వరూపం. అతడు కాకుండా ఇంకేదీ ఇక్కడ లేదు. 'బ్రహ్మదేవుడు’ అని మనం పిలుస్తున్నది సమష్టి జీవుని గురించేనని ఇతఃపూర్వమే చెప్పాను కదా! అయితే
Page:236
“జీవుడు బ్రహ్మ” లకు చైతన్యాంశమున భేదమేమీ లేదు. కాని ఉపాధియందు భేదమున్నది. 'జీవసమష్టి' అని మనం చెప్పుకొంటున్నవానికి
1. సూక్ష్మశరీరము (Subtle body),
2. కారణశరీరము (causal body - that body which causes every thing else)
అని రెండు ఉంటాయి. ఇక వ్యష్టిజీవి విషయానికి వస్తే, అతనికి ఈ రెండు శరీరములే కాకుండా, క్రియకు ఆశ్రయమైన స్థూలశరీరము కూడా ఉన్నది.
నీవు చెప్పినట్లు, వేరువేరైన “వృత్తి ఇచ్ఛ-ఫలము”ల తారతమ్యము వ్యష్టివిషయంలో తారసపడటానికి కారణం ఉపాధి భేదములే సుమా! "నాకీ శరీరము ప్రియము. నేను ఈ శరీరమునకు సంబంధించినవాడను మాత్రమే. ఈ శరీరమునకు సంబంధించిన హాని వృద్ధులు నావే. ఈ శరీరమునందుగల ఇంద్రియములకు అనుభవమగుచున్న ఆయా బాహ్యపదార్థముల సంస్పర్శచేత మాత్రమే నేను ఆనందించగలను” ... అని బ్రహ్మము (తాను చైతన్యతత్త్వమైనప్పటికీ) ఒకానొకప్పుడు జడభావమును పొందుచున్నది. జడవస్తువు చేత ఏర్పడుచున్న సంసర్గము చేతనే బ్రహ్మమునకు 'నేను జీవుడను' అనే అనుభవము, తద్వారా విస్తారమైన
సంసారము వచ్చిపడుచున్నాయనే విషయం ఈ గ్రంథము చేతను, ఉపనిషత్తులు మొదలైన ఆత్మవిషయ ప్రతిపాదకమగు తదితర గ్రంథముల చేతను అనేక దృష్టాంతముల ద్వారా మరల మరల నిర్దుష్టముగా నిరూపించ బడుతోంది. ఈ సంసర్గము (attachment) దూరమైనప్పుడు “వ్యష్టిజీవభావము” తొలగిపోయి, ఆ స్థానంలో “మహాజీవత్వము” సిద్ధిస్తోంది. అదికూడా లయించినపుడు... ఇక సర్వదా సమరసపూర్వకమగు సమస్వరూపమే ఏర్పడుచున్నది. ఒక జడమైన కొయ్య, అగ్ని యొక్క స్పర్శచే అగ్నికణముగా మారుచున్నది కదా! రాగి, బంగారము యొక్క స్పర్శచేత గాని, ఔషధ ప్రభావం చేతగాని ‘బంగారము'గా రూపమును పొందుతోంది కదా! వ్యష్టిజీవుడు కూడా తన సమష్టిత్వమును పొందుచున్నాడు. పరంపరా క్రమంగా ఆ సమష్టి జీవభావమును కూడా త్యజించటం జరిగినప్పుడు "నేను బ్రహ్మమునే” అనునట్టి బ్రహ్మభావమును పొందుచున్నాడు. అట్టి బ్రహ్మ భావమును పొందువాడు, “నేను అఖండుడను. సర్వదా సర్వతత్త్వములందు నిండియుండి, సర్వమునకు కారణమగుచు, దేనికి అంటకుండా ఉండెడివాడనైన నేను సర్వదా శుద్ధుడను. అనిర్వచనీయుడను. అనిర్దేశమగు సత్స్వరూపుడను” అనునట్టి అనుభవము కలిగి ఉంటున్నాడు. అట్టి స్వానుభవపూర్వకమగు అవగాహన కలిగియున్నవానికి ... పరమాత్మతత్త్వమగు బ్రహ్మమునకు భేదమేమీ ఉండదు. 'నేను బ్రహ్మమును' అని గ్రహించినవాడు బ్రహ్మమే కాక మరింకేమౌతాడు? చూచావా రామా! ఈ ‘జీవుడు’ అనబడువాడే కనిష్ఠ - - జీవత్వము నుండి జేష్ఠ-జీవత్వము, జేష్ఠ-జీవత్వము నుండి జీవరాహిత్యమగు బ్రహ్మభావమును పొందుచున్నాడు. అట్లే ఇప్పుడు నీకు 'జీవుడు' అనబడు విధంగా కనబడువాడు ఒకప్పుడు 'నేను బ్రహ్మమునే” అను ఎరుకను త్యజించి, క్రమంగా 'నేను వ్యష్టిని' అనునట్టి స్వల్ప (లేక కనిష్ఠ) జీవత్వ భావనను పొందియున్నాడు.
Page:237
నేను బ్రహ్మమును. జీవతత్వమునకు నేను
అతీతుడను నేను వ్యష్ఠినిసమష్ఠి .
| జీవత్వమును. కనిష్ఠ శాశ్వతుడను జ్యేష్ఠ జీవత్వమును
అఖండుడను జీవత్వమును పరిమితత్వమును
అపరిమితుడను
ఈ వ్యష్టిజీవుడు (Individual soul) గా మనం (స్వదృష్టిదోషంచేత) చూస్తున్న ప్రతిజీవుని హృదయంలోను మహాకాశస్వరూపమగు ఆత్మ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది. అట్టి ఆత్మయందే ఈ జగత్తు 'అసత్తు' అయినప్పటికీ, సత్తువలె ప్రకాశించుచున్నది. వాస్తవానికి, ఆ విధంగా సత్తువలె ప్రకాశించటం చైతన్యముయొక్క చమత్కారమేగాని, వేరేమికాదు. అనగా, చైతన్య స్ఫూర్తియే ‘స్వచమత్కారం’ చేత తనంతటతానే, భవిష్యత్ నామరూపములను గ్రహించుచు, “ఈ రూపమే నేను. ఈ పేరు నాది. ఈ వస్తువులు, వ్యక్తులు నాకు సంబంధించినవి” అనునట్టి అహంభావమును స్వీకరించుచున్నది. కాబట్టి రాఘవా! “ఈ వ్యష్టిజీవుడు 'చైతన్య బింబము' యొక్క చిదాభాస ప్రతిబింబమే” అని గ్రహించు. * చైతన్యము-చిదాభావము (Reflective) అనబడు బింబ- ప్రతిబింబాలు “చిన్మయము” గాక వేతేమీ కాదు. అట్టి చిదాభాసయే జగత్తు రూపంలో ఆత్మచైతన్యము నందు ప్రతిబింబిస్తోంది. కనుక ఈ ప్రకాశము కూడా చైతన్యప్రకాశమే.
#
'వ్యష్టిజీవుడు' అనబడుచున్న చిదాభాస చైతన్యము లేక ప్రతిబింబ చైతన్యము / (Reflection of pure consciousness) .... బింబ చైతన్యము (సమష్టిజీవము, మహాజీవము) కంటే అభిన్నమే అయినప్పటికీ “పరిణామము” మొదలైన విషయాల దృష్ట్యా విభిన్నముగా తెలియబడుచున్నది. ఇట్టి విభిన్నత్వము కూడా చైతన్యము వలననే సంభవించుచున్నది. "చేతనము - జడము జడప్రకాశము”... ల అభిన్నానుభవం, భ్రాంతిచేత భిన్నముగా కనబడటం... అనునదే జగద్రూపవ్యవహారమని గ్రహించెదవు గాక! చేతన స్వరూపమగు బ్రహ్మము యొక్క విశాలశక్తి ఆకాశముకంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ అహంభావ దర్శనమంతా బ్రహ్మమునందే, దానిచేతనే, దానివలననే ఏర్పడుచున్నదని గ్రహించువారు బ్రహ్మస్వభావులే అగుచున్నారు.
“వ్యష్టిజీవుడు-సమష్టిజీవుడు” అను రెండు విషయములు వాస్తవదృష్టిలో అభిన్నములు. వ్యష్టిలో సమష్టిత్వమున్నది. సమష్టిలో వ్యష్టిత్వమున్నది. జలములోని అనేక తరంగములకు, అందులో
సూర్యబింబము ఆకాశములో ప్రకాశించునప్పుడు ఆ బింబము ఒక తటాకంలోని జలంలో కూడా ప్రతిబింబిస్తుంది కదా! ఆకాశమున ఉన్న సూర్యుడు “బింబము” అని, నీటిలో ప్రతిబింబించే సూర్యుడు “ప్రతిబింబము” అని ఇక్కడ దృష్టాంతంగా గ్రహించాలి. ఆకాశ సూర్యుడు వాస్తవంగాని, ప్రతిబింబ సూర్యుడు కాదు కదా!
Page:238
గల ఒకానొక తరంగమునకు భేదమేమున్నదో చెప్పు? ఒక తరంగమునకు, అనేక తరంగములకు, జలమునకు అభేదమే సిద్ధిస్తోంది కదా! అట్లే వ్యష్టిజీవుడు - సమష్టిజీవుడు - చైతన్యములు అభేదమైనవని గ్రహించెదవు గాక! భేదముగా గ్రహించబడటం అజ్ఞానము చేతనే సుమా! అజ్ఞానమే “నీవు - - నేను - అతడు - జడము - చేతనము”లతో నిండినట్టి ఈ జగద్దర్శనమునకు అసలైన కారణమగుచున్నది. చైతన్యశక్తియే అహంకారముతో కూడినట్టి ఈ బ్రహ్మాండమును తనయందు తాను లీలామాత్రంగా దర్శిస్తోంది. ఇంతకుమించి ఇక్కడ ఏ ప్రత్యేకమైన విషయము లేదు. 'చిత్' శక్తి తన నిజరూపమున స్వయముగా కల్పించుకొనుచున్న మనోహర 'వివర్తవైచిత్రమే' (down word view) ఈ 'జగత్తు' అనబడుచున్నది.
ఈ 'బుద్ధి' మరియు 'అహంకారము' అనబడునవి కూడా ఆ చితశక్తి యొక్క వివర్తము మాత్రమేనని గ్రహించు. అనగా 'నేను జీవుడను' అను, మూలభావంతో కూడుకొని కనబడేదంతా ఒక 'కల్పన’ వంటిదేగాని, వాస్తవము కాదు. అదేవిధంగా, “శబ్ద - స్పర్శ - రూప రస-గంధములు”
అనబడే పంచతన్మాత్రలు కూడా చైతన్యము యొక్క వివర్తములే అయివున్నాయి. ఇక ఈ ద్వైత-ఏకత్వభావం గురించి వేరుగా చెప్పేదే మున్నది? ఇదంతా చితశక్తి (లేక ఆత్మభగవానుని) కంటే వేరుగా కనబడుటకు మూలకారణం వాసనలే. వాసనలు అజ్ఞానము నుండే కలుగుచున్నాయి. “వాసనలు” అనగా ... అనేక శారీరక-మానసిక క్రియాపరంపరల పర్యవసానమే. కనుక రామా! నీవు ఈ వాసనలను, తత్సంబంధమైన కర్మల పర్యవసానమును మొదలంట పరిత్యజించెదవు గాక! ఈ “నీవు -నేను-నీది-నాది" అను స్వల్పదృష్టులకు అతీతుడవగుము. అప్పుడుగాని, నీకు సత్యము సుస్పష్టం కాదు. "సత్యము-భ్రమ”... అను ఈ రెండు అత్యంత జటిలంగా కలిసిపోయి ప్రవర్తిస్తున్నాయి. నీవు ఎప్పుడైతే వాసనలను, భేదభావనలను త్యజించివేస్తావో ... అప్పుడు సత్యము శేషించి అనృతము (అసత్యము) తొలగిపోగలదు.
నాయనా! రామా! "ఈ దృశ్యము ఏమై ఉన్నది?" అనునది ఎరిగినవాడవై, దాని కారణ కారణమైయున్న నీ స్వస్వరూపముయొక్క ప్రాప్తియందు రమించుచుండుము. మేఘములచే కప్పబడి ఉన్నప్పుడు ఆకాశము యొక్క స్వరూపము గ్రహించగలమా? మేఘములు తొలగిపోయినప్పుడో? ఆకాశము యొక్క వాస్తవమైనట్టి, అఖండమైనట్టి స్వరూపము గోచరిస్తుందికదా! స్వస్వరూపము విషయము కూడా అట్టిదే. శరీరముల పట్ల, దృశ్యముల పట్లగల భ్రమలు తొలగిన మరుక్షణం స్వస్వరూపము యొక్క వాస్తవమైన అఖండత్వము, నిత్యత్వము, “దేశ-కాల”-అతీతత్వము గోచరిస్తాయి. ఈ ఆకాశము యొక్క స్థితత్వము ఆకాశమునందే గోచరిస్తుంది కదా! అదేవిధంగా దృశ్య ప్రపంచము తొలగిపోయినప్పుడు కూడా 'చితశక్తి' యొక్క స్వాభావికసత్త గోచరించ గలదు. నీ స్వరూపము ఆ
స్వాభావికసత్తయే. చితశక్తి కంటే దాని స్వాభావికసత్త వేరైనది కాదు సుమా!
అసలు సత్త అంటే ఏమిటి? 'అసత్త' అంటే ఏమిటి? మాకీ తేడా ఏమిటో తెలియవచ్చుట లేదు. ఒక్క విషయం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. విను. "దృశ్యప్రపంచము విచారణచే తొలగిపోగా
Page:239
ఈ జీవుడే అప్పుడు స్వచ్చుడై వెలయును” అని ఖచ్చితంగా, అనుభవ పూర్వకంగా చెప్పుచున్నాం. ఆ స్థితిలో చితశక్తి యొక్క స్వాభావికత్వమునకు, స్వస్వరూపమునకు అభేదమే అనుభవమవుతోంది.
ఓ రామచంద్రా! మనఃచేష్టారూపమగు సూక్ష్మజగత్తు (ఆతివాహిక జగత్తు Zone of thought process) శూన్యము మాత్రమే. ఇంద్రియములచే అధిష్ఠితమైయున్న ఈ శరీరాదులు, ఈ బ్రహ్మాండములు ఇవన్నీ చైతన్యము యొక్క భావనావివర్త మాత్రములే కదా! చైతన్యము కంటే భిన్నమైనది ఎక్కడ ఏమున్నది చెప్పు? ఏ పదార్ధం ఎద్దాని నుండి ఉత్పన్నమౌతోందో, అట్లు ఉత్పన్నమైనది తన మూలమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది? నీటి నుండి ఉత్పన్నమైన మంచు నామ-రూప-రంగుభేదంచేత జలముకంటే వేరుగా తోచుచున్నప్పటికీ.... మంచుగడ్డ ఏ సమయమందు కూడా ... జలము కంటే వేరైనది అయివుండదు కదా! స్థావరపదార్థములకే ఈ నియమము చెల్లుచున్నప్పుడు ఒక నిరవయవ పదార్థములు గురించి వేరుగా చెప్పేదేమున్నది? వ్యష్టివలె తోచుచున్న అహంకారము, శుద్ధ బ్రహ్మ చైతన్యము నిరవయవములైనవే! అవి రెండు వేరువేరైనవి కావు.
22. అహంకార స్వరూపము
చిత్రశక్తి స్వయం ప్రకాశకము. దానికి నామరూపాలు లేవు. దాని స్వయంకల్పిత స్ఫురణయే ‘జగత్తు' రూపంగా ప్రతిబింబిస్తోంది. ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు, పర్వతములు, దిక్కులు... ఇదంతా చైతన్యము యొక్క సంకల్ప పూర్వక రచనా చమత్కారమే. ఎందుకంటావా? ఈ జగత్తు యొక్క స్వరూపము దీని దర్శనము చైతన్యమునందే పర్యవసిస్తోంది కదా! కనుక, “ఈ జగత్తు చితశక్తి యొక్క ధర్మము (function)" అనునది గ్రహించెదవు గాక! జగత్తును వదిలివేస్తే చితశక్తి యొక్క శక్తిత్వమే శేషిస్తోంది. అప్పుడు శేషించుదానికి నామరూపాలు లేవు. “జగత్తును వదలుట” అంటే ఏమిటి? జగద్భావమును వదలుటయే. ఓ రామచంద్రా! వాస్తవానికి నీవు భావములకు అతీతమై, భావములను కల్పించువాడవేగాని భావనా సిద్ధుడవు కాదు. ఇది నిత్యసత్యము. 'జగత్' భావము తొలగినప్పుడు జడపదార్థము యొక్క పరిణామము కూడా “చిత్శక్తి”లో కరిగిపోవుచున్నదని అనుకొన్నాము కదా! జగద్భావం ఉన్నంతవరకు భేదభావం
తొలగదు.
ఇప్పుడు చెప్పు! ఈ జగత్తుకు స్వతంత్రసత్త ఎక్కడున్నది? మరల చెప్పుచున్నాను. విను. “చితశక్తి” యందు, “ప్రపంచమును ప్రకటించటం" అను శక్తి స్వయంకృతమై (Self designed)
ఆ శక్తి నుండి వేరుకానట్టిదైయున్నది. అది జీవరూపమున, తన్మాత్ర ... (శబ్ద-స్పర్శ - రూపరస-గంధముల అనుభవములను పొందునది) రూపమున ప్రతిభాసమై జగత్తుగా కన్పట్టుచున్నది.
Page:240
చిత్తుతో కూడిన అహంభావ స్ఫురణయే ప్రాణముతో కూడి, “జీవుడు” అనబడు సంజ్ఞను పొందుచున్నది.
చమత్కారం చూచావా? “చితశక్తి" దానియొక్క ‘స్పురణ’ అనునవి అహంభావం చేత వేరుపరుపబడినవై జీవసంజ్ఞను దాల్చుచున్నాయి. అయితే ఈ వ్యవచ్ఛాధర్మము (the function of differentiation) క్రీనీడవంటిది మాత్రమే కాని వాస్తవము కాదు. “అహంభావమును జయించటం” అనగా అద్దానిని అవాస్తవ - దృష్టిచే దర్శించుటయే. అంతేగాని, దానిని ఒక వస్తువులాగా భావించి, తొలగించుటకు యత్నించుట కాదు. లేదంటావా, అట్లు ప్రయత్నిస్తూ ఉంటే, 'అహంకారము’ యొక్క ఉనికిని అంగీకరించుటయే అయి, ఇక ఆపై మాయ పరిఢవిస్తూనే ఉంటుందని గ్రహించు. క్రీనీడ వంటిదే అయినట్టి ‘అహంభావము' వాస్తవదృష్టిచే పరికించబడినప్పుడు, “ఇది బ్రహ్మమే” అని తెలియవచ్చుచున్నది.
❖
ఈ 'జగత్తు' విషయమై మరికొన్ని విశేషాలు చెపుతాను. విను.
చైతన్య ప్రధానమగు అహంకారమే అన్నింటికి కర్త. క్రియా ప్రధానమగు ప్రాణమే 'కర్మ'. “కర్త” అనగా ... ‘క్రియనిర్వర్తించునది' అని కదా! కర్తకు క్రియకు భేదం లేదు. అందుచేత, అహంకారమునకు - ప్రాణమునకు భేదంలేదు. కర్తయొక్క ధర్మ (functional) విశేషమే కర్మ. అందుచేత, మనం ‘జీవుడు' అని పిలుస్తున్నది కర్మనే సుమా!
క్రియామయమగు జీవుడే పురుషుని యొక్క చిత్తము. ఈ చిత్తమే ఇంద్రియరూపమున ప్రకటితమై నానావిధాలుగా ప్రతీయమానమగుచున్నది. ఇక కార్య కారణభావముల (Effect & cause experiences) విషయానికి వస్తే ఇదంతా అళీకమే. (లేక దర్పణములోని ప్రతిబింబము వంటిదే). ఈ జగత్తు అంతా చిత్రకాశముయొక్క అంశయే కనుక ఇందు భేదత్వమునకు తావు లేదు. ఇదంతా అభేదత్వమే అయివున్నది.
అచ్ఛేద్యోహమదాహ్యోహమక్లేద్యోశోష్యయేవచ నిత్యః సర్వగతః స్థాణురచలోహమితి స్థితమ్ ||
అహంకారమునకే స్థానభూతమైన ఆత్మకు ఛేదింపబడుట, దహింపబడుట, తడుపబడుట, శోషింపబడుట అనునవి లేవు. అది సర్వవేళలందు సర్వవికారములకు అతీతమైయున్నది. అయ్యది నిత్యము, సర్వగతము, స్థిరము అచలము కూడా. ఓ రాఘవా! మేము ఆత్మయొక్క స్వరూపము (లేక బ్రహ్మతత్త్వమును) గ్రహించియున్నాం. అట్లు స్వానుభవంగా గ్రహించిన దానినే లోకములకు ప్రకటిస్తున్నాం. తమ స్వస్వరూపమును గ్రహించనట్టి అనేకమంది జీవులు భ్రమాత్మకము, దుః ఖప్రదము అయినట్టి పరహింస, పరదూషణ వంటి నీచకార్యములను ఆశ్రయిస్తున్నారు. శాస్త్రములు
పురుషుడు : పురుషకారము (Effort) రూపముగలవాడు.
Page:241
ప్రతిపాదించుదానిని తిరస్కరిస్తున్నారు. ఫలితంగా అనేక దౌర్భాగ్యములు అనుభవిస్తున్నారు. అయితే ఈ దృశ్యవ్యవహారము యొక్క ఆటలన్నీ 'అజ్ఞాని’ వద్ద మాత్రమే సాగుచున్నాయి. అతనికి మాత్రమే ఇదంతా మూర్తివంతమై, వికారాదులతో కూడి సార్థకత పొందుతోంది. జ్ఞానికో ... ఈ దృశ్య ప్రపంచమే అగుపడటం లేదు. అతడికి అనుభవమగుచున్నది చిదాకాశమే. స్వీయా అహంకారంతో సహా ఈ సర్వ సత్-అసత్ భావములన్నీ నదీజలం సముద్రం చేరునట్లు, చిదాకాశమునందే ప్రవేశిస్తున్నాయి. నీటిలో వేయబడిన ఉప్పువలె, అతనిని చేరుచున్న రూప-నామాలన్నీ స్వస్వరూపమునందు నిశ్శేషముగా లయించిపోతున్నాయి. ఓ రామచంద్రా! ఇప్పుడు మనం జ్ఞానుల దృష్టినే మరల మరల స్వీకరించాలి. అంతేకాని, అజ్ఞానుల భేదదృష్టిని ఎంతవరకు తరచి చూస్తే మాత్రం ఏం ప్రయోజనం?
“చిత్”ను (ఉపనిషత్తు ద్రష్టలు) ఒక వృక్షముతోను, “మాయ”ను వసంతము యొక్క రాకతోను,
“జడశక్తి”ని ఆ వృక్షములోని రసముతోను,
“కాల దూరాదుల”ను ఆ చితవృక్షము యొక్క పుష్ప-ఫలములతోను పోల్చుచున్నారు.
ఆ బ్రహ్మమే అన్నివేళల, అన్నిచోట్ల, అన్ని రూపములతోను ప్రకటితమగుచున్నదని చెప్పటానికే నేను ఈ ఉపమానం తీసుకొన్నాను. కనుక, శూన్యమే రూపముగా గల ఆకాశము, స్పందమే ధర్మముగా గల వాయువు, తేజము, జలరాశి, భూమి, ఓషధ స్వరూపుడగు చంద్రుడు, మహాజ్యోతి స్వరూపుడగు సూర్యుడు మొదలైన రూపములుగా ప్రకటితమగుచున్నది - ఆ అద్వితీయ బ్రహ్మమే సుమా! 'బ్రహ్మసత్త’ కాకుండా వీటికి వేరైన స్వతంత్రసత్త లేదు. స్వస్వరూపజ్ఞానం చేత దృశ్యప్రపంచము లయించిందనుకో అప్పుడు 'చిద్ర్బహ్మము’ తనయొక్క పూర్వభావముననే వెలయగలదు. జాగ్రత్-స్వప్న-సుషుప్తులతో కూడా బ్రహ్మమే అట్లు స్ఫురించుచున్నది. ఈ మూడు స్థితులు - “జడభావ సమ్మేళనము” లేక “మనోభావ ప్రాప్తి" అనువానియందే ఉండి ఉన్నాయి కదా! వాటిలో కనబడే తేడా అంతా ఈ రెంటి యొక్క సమ్మిళితము నందు మాత్రమే. 'బ్రహ్మసత్త' నుండే ‘జగత్సత్త’ ఏర్పడుచున్నది. అయితే ద్రష్ట నుండి వేరుగా స్వరూపతః చూచినప్పుడు జగత్తు అసత్యమే. “మాకు ఈ జగత్తు ఇట్లు ఎందుకు ప్రాప్తించుచున్నది?” అను ప్రశ్నకు సమాధానంగా, “మీరు అద్దానిని అట్లు భావించటం చేతనే” అని చెప్పుచున్నాము.
ఈ “జగత్తు” అనబడునది :
చిత్స్వరూప - మహాకాశము యొక్క “శూన్యము” చిత్స్వరూప - వాయువు యొక్క “స్పందము” చిత్స్వరూప - గాఢాంధకారము యొక్క “స్పందము” చిత్స్వరూప - సూర్యుని “దినకల్పన”
Page:242
అని విజ్ఞులు రసమయంగా చెప్పుచున్నారు. కనుకనే, ఇది స్వరూపతః చూచినప్పుడు “అసత్యము” అని నేను ప్రకటించాను.
కాని అధిష్ఠానరూపమున (ఇదంతా ఎందు నిక్షిప్తమై ఉన్నదో అట్టి శుద్ధతత్వమున) సత్యము. దీపశిఖ ఆరిపోతే మసి మాత్రమే మిగులుచున్నది కదా! జగత్తు నశించినప్పుడు బ్రహ్మమే మిగులుచున్నది. ఆకాశము నందు “నీలిరంగు పదార్థము ఉండుట" అను ప్రసక్తి అవాస్తవమైనట్లు, ఇక్కడ (ఈ దృశ్యమునందు) భేదవికారములు కనబడు చున్నప్పటికీ... వాస్తవానికి ఈ భేదవ్యవహారం బ్రహ్మమునందు లేదు. ఈ స్వర్గ - మర్య - పాతాళ లోకములు అసత్తులే (స్వకీయమైన ఉనికి లేనివి) అయినప్పటికీ, సన్మయంగా (సత్+మయము .... వాస్తవమైన ఉనికి కలిగియున్నట్లు) కనబడటంచే ... అనేక శబ్ద వ్యవహారములకు యోగ్యములు అవుచున్నాయి.
ఒకడు చీకట్లో త్రాడును చూచి 'పాము' అని తలచుచున్నాడనుకో ఆ త్రాడు పాముగా చూడబడుచున్నదాని కంటే వేరైనది కాదు కదా! అట్లే ఈ జగత్తే బ్రహ్మము. కల్పిత పదార్థముల సత్త (లేక అసత్త) అధిష్ఠాన సత్త కంటె వేరైనది కాదు. త్రాడు - - పాముల (వాస్తవము - అవాస్తవము నందు కల్పించబడిన) భ్రమ సత్ - - అసత్తులు ఒక్కటే కాని వేరువేరు అయిన విషయాలు కావు కదా! అట్లే బ్రహ్మము - ఈ జగత్తు ఒక్కటే.
“అవయవి-అవయవములు" అను శబ్దములకు నిరాకార-సాకార అర్థకల్పనలు చేసి రెండింటికి వేరువేరైన 'సత్త' ఉన్నది" అని ఆరోపణ చేయటం దోషభూయిష్ఠమైన యోచన - అని మా అభిప్రాయం. ఇట్టి శబ్దార్థ - కల్పన కుందేటి కొమ్ములాగా అర్థం లేనిదే. “నది” అని మనం దేనిని పిలుస్తున్నాం? నీరు నేల గట్లు ... ఈ మూడింటి సమన్వయమే కదా? ఇవి కాక, నది అనునది ఎక్కడున్నది? ఇట్లే సముద్రం కూడా? అట్లే తదితర శబ్దార్థములన్నీ. అట్టిదే ఈ కనబడు “అవయవి-శరీరము” అనునవి కూడా! ఇట్లు ఈ జగత్తే బ్రహ్మము.
ఒక దృష్టాంతము చెపుతాను. ఒక స్ఫటికం తన బైట లోపల కూడా నిండి ఉన్నట్లు అగుపడుచున్నప్పటికీ, దానియందు ఆకాశము ఉండనే ఉండివున్నది కదా! ఐతే ఎదురుగా ఉండే పదార్థములను తనయందు ప్రతిబింబింపచేయుటకు (ప్రతిబింబమునకు అధిష్ఠానం) ఆ స్ఫటికమే కదా! అదేవిధంగా, చిన్మయమగు 'మాయ' కూడా, లోన బయట జడమే అయినప్పటికీ, దానియందు “చిత్ ప్రతిబింబము” పడుతోంది. చిత్ ప్రతిబింబముతో కూడిన మాయయందు ఈ 'అసత్తు' అయినట్టి జగత్తు ప్రతిభాసితమగుచున్నది.
“స్ఫటికం” మొదలైన పదార్థ సమూహములలో అంతర్గతమైయున్న స్థూలాకాశంలో ఈ ఆకాశజనితమైన 'వాయువు' మొదలైనవాటి సంపర్కము ఉండదు కదా! అట్లే చిదాకాశమునందు కూడా “నీవు-నేను-అతడు" మొదలైనవాటి యొక్క 'సత్-అసత్తు'ల మాలిన్యం ఉండదు.
మరొక దృష్టాంతం ద్వారా జగత్-బ్రహ్మముల అభేదం చెపుతాను, విను. ఆకులో ఉండే
Page:243
ఈనెలు ... ఆ ఆకునుండి వేరుకాకున్నప్పటికీ వేరైనట్లు తోచటం లోకవిదితమే కదా! జగత్తు కూడా బ్రహ్మము నుండి వేరుకాకపోయినప్పటికీ వేరైనట్లు కనిపించుటయే మాయ యొక్క చమత్కారం. కనుక జగత్తు-బ్రహ్మము పరస్పరం అభిన్నములే. బ్రహ్మము ఈ జగత్తును ధరిస్తోంది. కారణమునకే కారణము - ఆదికారణము బ్రహ్మమే. చిత్తమునకు అధిష్ఠానమగు చైతన్యము అదే. బ్రహ్మదేవునికే ఆదికారణం బ్రహ్మము. అదియే శివము, తత్త్వము, మర్మము మొదలైన అర్థపూరితమైన ప్రవచనములచే చెప్పబడుతోంది.
చిత్తు: ఈ జగత్తు నందు స్వరూపాదులు తోచుచున్నాయి కదా! అయితే అట్టి స్వరూపాదుల అనుభవమునకు మూలకారణమేమిటి? ఆ స్వరూపాదులకు సంబంధించిన అంతరంగమునందలి జ్ఞానస్ఫురణయే కదా! అట్టి చిత్తు లేక జ్ఞానము అకారణమే కారణరహితమే) అని చెప్పబడుతోంది. “సర్వ స్వరూపావస్థలకు ఉపాధి కారణము ... బ్రహ్మమే” అని కూడా శాస్త్రములు చెప్పుచున్నాయి. అట్టి ఈ చిత్తు స్వానుభవమాత్రమే గాని, మరొకరిచే ప్రసాదించబడునది, తెలియజేయబడునది
కాదు.
చేత్యము చేత్యము (తెలియబడునది) చిత్తు (లేక ద్రష్ట) యొక్క భావనను అనుసరించి మాత్రమే ఉంటోంది. జ్ఞానదృష్టిచే “చేత్యము లేదు” అనునదే సిద్ధిస్తోంది. “ఇది బాగున్నది. ఇది పొందుటయే గొప్ప. ఇది లేకున్న దుఃఖమే” ... మొదలైన సమాచారమంతా ద్రష్ట యొక్క కల్పనను ఆశ్రయించే ఉంటోంది. ఒక కల్పనచే ఉండి, వేరొక కల్పనచే లేకుండటం వల్ల చేత్యమును “సదసత్తు” (ఉండి - - లేకవున్నది) అని అంటున్నారు.
అయితే అసత్తా వ్యవహారమగు ఈ దృశ్య జగత్తు పట్ల 'దృష్టి' (లేక ఆసక్తి) ఉన్నంత కాలం, చేత్యమునకు (తెలియబడుదానికి) అతీతమైయున్నట్టి చిత్తు అనుభవమునకు వచ్చుట లేదు. అనగా నీవు, నీ స్వస్వరూపమగు ఆత్మ యొక్క అనుభవం (చిత్తు యొక్క అనుభవం) పొందాలనుకొంటే :
1. "ఎదురుగా ఉన్న ఈ దృశ్యము స్వతహాగా ఉన్నది కాదు. ఇది నా యొక్క సంస్కారములచే చేయబడుచున్న కల్పన యందే ప్రతిష్ఠితమైయున్నది” అని గ్రహించాలి.
2. అట్లా గ్రహించుటచే దృశ్యాతీతుడవు కావాలి. (అదియే సంసారాతీతము - లేక - - -
చేత్యాతీతము).
ఇక్కడ నీవు మరొక విషయం కూడా గ్రహించాలి. “చేత్యచిత్తు” మాత్రమే అనుభవమునకు లభ్యమౌతోంది. చేత్యరహితమైన చిత్తు ** (Perceiver without perception or Knower without the function of knowing) లౌకిక వ్యవహారమునకు, పదజాలమునకు వర్ణనలకు లభ్యమవదు.
చేత్యచిత్తు = చేత్యము లేక తెలియబడు దానిని గ్రహించు సంస్కారవృత్తులు గల చిత్తు. ** చేత్యరహితచిత్తు = బాహ్యసంస్కారవృత్తులు అంటూ లేని చిత్తు
Page:244
చేత్యవృత్తితో కూడిన చిత్తు మాత్రమే ప్రకటితమౌతోంది. లేదా చేత్యరహిత చిత్తు అప్రకటితంగానే ఉండిపోతోంది. బీజము లోని అంకురమే వెలువడుతుంది కాని, బీజములో లేని అంకురం వెలువడదు కదా! ఓ రామా! బ్రహ్మమునందు జగద్బీజము ఉండనే ఉండి ఉన్నది సుమా! కనుక కృత్రిమదృష్టితో “ఈ జగత్తు తొలగుగాక” అనునట్టి ప్రయత్నముతో వ్యవహరించవలసిన పనేమున్నది? "ఈ జగత్తు ఎట్లైనను ఉండుగాక! లేక తొలగుగాక! ఇదంతా బ్రహ్మమే. ద్రష్టనగు నేను కూడా బ్రహ్మమే” ... అనునదే ఉత్తమదృష్టి.
ఆకాశమునకు ... “ఇది వేరు - అది వేరు” అను భేదము ఎక్కడ ఉన్నది? ఒకవేళ వేరు వేరుగా (దిక్కులు, పదార్థరూపనామముల దృష్ట్యా) కనబడినా అదంతా ఆకాశము యొక్క స్వరూపమే కదా! కనుక నీవు భేద శూన్యుడవై “ఈ త్రిభువనములన్నీ బ్రహ్మ స్వరూపములే” అనునట్టి నిశ్చయము కలిగియుండుము.
సభ్యులందరు తమ సాయంసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించుటకుగాను సాలోచనలతో గృహోన్ముఖులయ్యారు.
(మూడవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:245
నాల్గవ రోజు
III. లీలోపాఖ్యానం - కథావిషయం (మండపోపఖ్యానము)
1. జగద్భమ
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ దృశ్యజగత్తు చిదాకాశమే కాని వేరేమీ కాదని నిన్న మూడవ రోజు చెప్పుకొన్నాం కదా! ఇక మనం నాల్గవ రోజు విచారణలో ప్రవేశిస్తున్నాం.
సభికులంతా శ్రద్ధాసక్తులతో వినండి.
ఒకనికి నిర్మల-ఆకాశంలో ఆకారాదుల భ్రమ కలుగుచున్నట్లు, నిర్మలమగు ఆత్మయందే ఈ జగత్ప్రమ కలుగుతోంది. ఒక స్తంభమున చిత్రించబడిన శిల్పము ఆ స్థంభము లాగానే శిలయే అయివున్నది కాని - మరింకేమీ కాదు కదా! చిత్-రూపము అనే స్తంభమున చెక్కబడిన ఈ జగత్తు కూడా చిద్వస్తువు కంటే వేరు ఏమాత్రం కాదు. అయితే, మనం ఇక్కడ చెప్పుకొంటున్న ఉపమానంలో ఉన్న తేడా ఒక్కటే. మామూలు శిలాస్తంభములో శిల్పము లభించాలంటే, ఒకానొక శిల్పి ఉండాలి. కాని ఈ జగత్తు చిత్ - వస్తువు నందు ప్రకటితమవటానికో ... ఏ శిల్పి అవసరం లేదు. సముద్రజలంలో తరంగములు ఉండటం సహజమైన విషయమే కదా! బ్రహ్మము నందు ఈ దృశ్యజగత్తు ప్రతీతమై ఉండటం కూడా సహజమైన విషయమే. అజ్ఞాని యొక్క దృష్టిలో జగత్తు అత్యంత స్థూలమై ఎదురుగా నిలచి ఉంటోంది. ఇక జ్ఞాని దృష్టికో... ఇదంతా అనేక మట్టి పాత్రలలోని ఒకే ‘మట్టి’ లాగా, అనేక కిరణములలోని ఒకే సూర్యతేజములాగా, సూక్ష్మముగాను, భేదశూన్యముగాను అనుభవమౌతోంది. వేరువేరు సూర్యకిరణములు వేరువేరు వస్తు సమూహములను ప్రకాశింపజేస్తున్నప్పటికీ, కిరణములన్నీ సూర్యతేజము నుండి బయల్వెడలుతూ, దానికి అభేదంగానే ఉంటున్నాయి కదా! అయితే, బ్రహ్మజ్ఞానము లేకపోతే జగత్తు యొక్క సూక్ష్మ భావము అనుభవము
కాదు సుమా!
కనుక, ఈ జగత్తునందు భూమి, ఆకాశము మొదలైనవి అనుభూతమగుచున్నప్పటికీ వాటి స్వరూపము చిదాకాశమే. అవన్నీ స్వప్నమునందలి కల్పనవలె భ్రమాత్మకము, (భేదానుభవం దృష్ట్యా) అసత్యము మాత్రమే. ఎండమావుల గురించి తెలిసినవానికి, “ఇక్కడ ఒక నది ఉన్నది. ఈ కనబడేవన్నీ ఆ నదియొక్క తరంగములే” ... అను ఆవేశము ఉంటుందా? జలము - జ్ఞాన - విజ్ఞానముల యొక్క అనుభవపూర్వకమైన ఎరుకగలవానికి ఈ జగత్తుపట్ల పదార్థజ్ఞానము, భేదజ్ఞానము ఉండవు. కనుక రామా! "ఈ దృశ్యజగత్తు నిరాకారము, భ్రమమాత్రము, సంకల్పము
Page:246
నందలి నగరము వంటిది" అని మొట్టమొదట నిశ్చయించుకో. ఇక ఆపై శాస్త్రోచితమైన విహిత కర్మలను ఎట్లు నిర్వర్తించాలో నిర్ణయించుకొని ప్రవర్తించు. అప్పుడు ఈ “అనేకత్వము” అనే మాయాజాలం నిన్నేమి చెయ్యలేదు. “మెలుకువ” వచ్చిన తరువాత స్వప్నంలో చూచిన వస్తువుల కొరకు వెతకేవాడెవరైనా ఉంటాడా? జ్ఞానులకు "ఈ జగత్తు అసత్తే” అని బోధపడుచున్నది. వారు, “ఇదంతా బ్రహ్మతత్త్వమునకు వేరైనది కాదు" అని ఎరిగియే ఉంటున్నారు. అజ్ఞానులు మాత్రమే ... “ఇది జగత్తు - అది బ్రహ్మము” అనునట్టి శబ్దభేదములను ఆశ్రయించుచున్నారు. “వాస్తవానికి బ్రహ్మము - జగత్తులకు ఏమాత్రం భేదం లేదు” అని, మేము, అనేక పరిశీలనల తరువాత నిస్సంకోచంగా నిర్ణయించుకొన్నాం. ఆకాశంలో సూర్యమండలము, స్థూలమగు మేఘములు, సూక్ష్మజల కణములు, వాటి ఆకారములు ప్రతిభాసితమగుచున్నట్లు ఈ జగత్తుకూడా చిన్మయ బ్రహ్మమున ప్రకాశించుచున్నది.
ఒకనికి స్వప్నంలో కనబడేదంతా అతని కల్పనయొక్క ప్రభావంచేతనే తన హృదయాకాశంలోనే ప్రాప్తిస్తున్నట్లు, ఈ జాగ్రత్తులో కూడా ఇక్కడ కనిపించేదంతా "స్వకీయకల్పనచే ఏర్పడినట్టి దృష్టి (Perception born of one's own volition / imagination) చే దర్శించబడుచున్నది. ఈ జాగ్రత్ జగత్తు కూడా సంకల్ప-జగత్తు లాగానే 'భ్రమ' మాత్రమే. ఈ రెండిటినీ తప్పకుండా ఒక దానితో మరొకదానిని పోల్చవచ్చు.
ఓ రామచంద్రా! నీవు జ్ఞానివే కావాలి సుమా! “ఈ జగత్తు చిన్మయాకాశమే కాని, మరింకేమి కాదు” అని అనుభవపూర్వకముగా గ్రహించు! “జగత్తు-మహాకాశము” అను రెండు శబ్దములకు గల అర్థము ఒక్కటే. అవి చిన్మయబ్రహ్మము యొక్క రూపాంతరములే. ఈ కనబడే “జాగ్రద్దృశ్యము” ఏ సమయమందును ఉత్పన్నమే అయివుండలేదు. ఇది నిరుపాధికము (ఉపాధిలేనిది). దీనిని ఎక్కడి నుండీ, ఎవ్వరూ నియమించుటలేదు. ఇది ఎప్పటికప్పుడు 'యథాస్థితి' యందే వెలయుచున్నది. ఈ జగత్తు మహాకాశమున ఉన్నప్పటికీ ... దీనిచే బ్రహ్మము కప్పబడజాలదు. ఎక్కడన్నా మేఘములు ఆకాశమును కప్పివేయగలవా? “మేఘములు దట్టముగా పట్టినప్పుడు ఆకాశమును కప్పివేస్తున్నాయి కదా?” అంటావా? ఒక స్థలమున నిలుచున్నప్పుడు నీకు అట్లు తోచవచ్చును గాని ... నీవు చూచు ఘములు ఆకాశమునంతటినీ కప్పివేస్తోందనుమాట భ్రమ మాత్రమే. ఈ కల్పిత-జగత్తు చిదాకాశమును ఒక అణుమాత్రం కూడా ఆవరించజాలదు. ఈ 'జగత్తు' అనబడునది వాస్తవానికి ఆకాశమువలె నిర్మలము, నిరాకారము అయి, సంకల్పనగరంలాగా, మహాకాశము నందు రచించబడిన చిత్రమువలె వెలయుచున్నది.
ఈ విషయమును నిరూపించుటకు నీకు ఒక ప్రాచీనమైన ఇతిహాసమొకటి చెపుతాను. సరస్వతీమాత - లీలల సంభాషణారూపమునగల ఈ ఇతిహాసం వినటంచేత నీకు అనేక సందేహాలు తొలగిపోతాయి. శాంతి లభిస్తుంది.
Page:247
2. శ్రీ సరస్వతీమాత వరం
పూర్వకాలంలో “పద్ముడు” అను ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఐశ్వర్యవంతుడు. బహు సంతానవంతుడు. వివేకి కూడా. అతడు విధివిహితంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. దోషరహితమైన ఉత్తమ గుణములు అతనిని ఆశ్రయించి ఉండేవి. అతని భార్య “లీల”. ఆమె సౌభాగ్యవతి. మధురభాషి. సౌందర్యరాశి. ఆమె తన భర్తను నీడవలె సర్వదా వెన్నంటి సేవలు చేస్తూ ఉండేది. అవ్యాజమైన పరస్పరప్రేమతో, పరిహాస వాక్యములతో, పుణ్యకథాశ్రవణములతో, పరమాత్మ-తత్త్వము వంటి విషయ చర్చలతో వారు కాలం గడుపుతూ ఉండేవారు.
ఒక రోజు లీల అంతఃపురంలో ఒకచోట ఒంటరిగా కూర్చుని ఇట్లు యోచించసాగినది.
"ఈ నా భర్త పద్ముడు నాకు నా ప్రాణముల కంటే కూడా అధికుడు. మా ఈ దాంపత్యము ఎప్పటికీ ఇదేవిధంగా ఉంటే ఎంత బాగుంటుంది! నా భర్త ముసలితనముగాని, చావుగాని పొంద కుండా ఉండే ఉపాయం ఏదైనా ఉన్నదా? నేను కూడా నా ఈ యౌవనం పోగొట్టుకోకుండా అనంతకాలం ఇతనితో వనసంచారాలు చేస్తూ ఉండేది ఎట్లా? ఏమి చేస్తే మనుష్యులు మరణమును జయించవచ్చు? శాస్త్రములలో దీనిగురించి చెప్పే ఉంటారు. యమ-నియమ-జప-తప-ధాన్యము లను వేటినైనాసరే, అనుసరించి నేను నా భర్తను ఎల్లకాలం పొంది ఉండేది ఎట్లా? దేశంలోని జ్ఞానవృద్ధులను, తపస్సంపన్నులను రప్పించి మరణమును జయించే ఉపాయం తెలుసుకొంటాను. అట్టి ఉపాయం ఆశ్రయించి నా భర్తను ఎప్పటికీ ఇట్లే పొంది ఉంటాను.”
ఇట్లు ఆలోచించి ఆ లీల దేశంలోని మహాజ్ఞానులందరినీ పిలిపించింది. “అమరత్వము” పొందటం గురించి తరచి తరచి ప్రశ్నించింది. అప్పుడు ఆ జ్ఞానవృద్ధులు ఇట్లు పలికారు : “అమ్మా! లీలాదేవీ! జప-తప-నియమాదులు ఆచరిస్తే ఏదైనా సిద్ధిస్తాయి. కాని, అమరత్వం మాత్రం సాధ్యంకాదు. శరీరధారి అయిన ప్రతివాడు ఎప్పటికైనా ఆ శరీరము త్యజించక తప్పదు. ఇది అప్రతిహతమైన ప్రకృతి నియమము.”
అది విని లీలాదేవి ఎంతో వ్యాకులత నొందినది. "అయ్యో! అయితే పతివియోగం పొందే అవకాశము ఉన్నదన్నమాట? దైవవశాత్తు నా భర్త పద్మునికన్నా ముందుగా నేనే మరణించినా మంచిదే, గొడవవుండదు. ప్రియమైన భర్త నుండి వియోగదుఃఖం ఉండదు కాబట్టి సుఖంగానే ఉంటాను. కాని, కాలనిర్ణయం ఎవరికి తెలుస్తుంది? నా భర్తయే నాకన్నా ముందుగా మరణిస్తే? ఈ మహాజ్ఞానులు చెప్పినదానినిబట్టి శరీర క్షయము అనివార్యము కదా! అతని ప్రాణాలు శరీరం నుండి బహిర్గతం కాకతప్పనప్పుడు ఆ ప్రాణాలు అంతఃపురంలోని ఈ పడకగది నుండి బయటకు వెళ్ళకుండా ఉండేటట్లు చూచుకొంటాను. అప్పుడు నా పతి ఈ అంతఃపురంలోనే ఉంటాడు. నేను అతనిచే చూడబడుచు శేషించియున్న ఆయుష్షును సుఖంగా గడిపివేస్తాను. అందుకుగాను ఈ రోజు నుండే జప-ఉపవాసాది అనుష్ఠానముల ద్వారా చిద్రూపి, జగన్మాత అయివున్న సరస్వతీదేవిని
Page:248
ఆరాధిస్తాను” అని అనుకొన్నది. స్థిరచిత్తురాలై శాస్త్రానుసారం కఠోర నియమాలతో ఆ జగజ్జనని సరస్వతీదేవిని ఆరాధించటం ప్రారంభించింది. అయితే ఈ విషయాలుగాని, ప్రయత్నాలుగాని, తన భర్తకు ఏమాత్రం తెలియనీయనేలేదు.
అత్యంత శ్రద్ధాభక్తులతో ఉపవాసాలు, పూజలు చేయసాగింది. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను సత్కరించింది. ప్రతి మూడు రాత్రుల తరువాత సరస్వతీమాత ఆరాధనావిధానము ముగింపుకు వచ్చేది. వెనువెంటనే ఆమె మరొక మూడు రోజుల నియమమును స్వీకరించేది. ఈ విధంగా స్నాన దాన తపో-ధ్యానాది అనేక క్లేశకర కార్యములందు శరీరమును వినియోగించుచు, శాస్త్రములందు, తనయందు, జగదీశ్వరి సరస్వతీదేవిపై అకుంఠితమైన విశ్వాసంతో ప్రయత్నం సాగించింది. అదే సమయంలో భర్తను సేవించుచు అతనికి సంతోషము చేకూర్చుచుండెడిది. ఈ విధంగా నూఱు "త్రిరాత్రివ్రతములు” పూర్తిచేసింది. ఆ వ్రతారాధనచే పూజింపబడిన భగవతి వాగ్దేవి అత్యంత ప్రసన్నురాలైనది. ఒక పవిత్ర క్షణంలో లీల ముందు ప్రత్యక్షమై “వత్సే! లీలా! పతిభక్తితో కూడిన నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏమి కావాలో కోరుకో” అని ప్రసన్నమైన వాక్కుతో పలికింది. లీల ఆ జగన్మాత దర్శనం చేత పునీతురాలై పరమానందం పొందింది.
లీల :
జయ జన్మజరాజ్వాలా దాహదోష శశిప్రభే!
జయ హార్దాంధకారౌఘ నివారణ రవిప్రభే!
అంబ మాతర్జగన్మాతస్రాయ స్వకృపణామిమామ్!
ఇదం వరద్వయం దేహి! యదహం ప్రార్థయే శుభే ॥ (XVI.37, 38)
జన్మజరా అనెడి జ్వాలలచే దహింపబడుతున్న వారికి శశిప్రభవైన ఓ జగన్మాతా! హృదయాంద √కారమును నివారించు రవిప్రభువైన ఓ జగజ్జననీ! అంబా! నీకు జయమగుగాక! నిన్ను దర్శించిన తరువాత జన్మజన్మల జాడ్యం తొలగక ఏం చేస్తుంది? ఇదే నా భక్తిపూర్వకమైన సాష్టాంగ నమస్కారం. నేను నిన్ను రెండు వరములు అర్ధిస్తున్నాను. అందుకు నేను తగివుంటే ప్రసాదించమ్మా!
1. ఒకవేళ నా కన్నా ముందే నా భర్త మరణించటం జరిగితే, అతని ప్రాణములు లేక జీవాత్మ నా ఈ అంతఃపురములోని మా పడకగది నుండి వెలువడకుండా ఇక్కడే ఉండుగాక! 2. నేను నిన్ను తలచుకొన్నప్పుడు నీ దర్శనభాగ్యం నాకు ప్రాప్తించుగాక! లీలాదేవి యొక్క అభ్యర్థనను విని, పుత్రికావాత్సల్యశీలియగు సరస్వతీదేవి, “అట్లే అగుగాక” అని పలికి, సముద్ర తరంగమువలె అంతర్ధానమయింది.
Page:249
3. పద్ముని దేహ పతనం
కాలచక్రం తిరుగసాగింది. ఆకునందలి రసము శుష్కించునట్లు, పద్ముని స్థూలదేహము ప్రకృతి నియమానుసారం శుష్కించసాగింది. ఒకానొక రోజు అతని స్థూలదేహ చైతన్యము సూక్ష్మ శరీరమున (లింగదేహమున లేక అతివాహిక దేహమున) లీనమైనది.
గృహమధ్యమున మృతుడైన భర్త భౌతిక దేహమును చూచి లీల ఎంతో రోదించింది. రోదనలోనే మూడు రోజులు గడిచాయి. విరహపీడితురాలై లీల తానుకూడా చచ్చిపోవాలని నిశ్చయించుకొన్నది. అత్యంత విషాదంతో, దిక్కుతోచకుండా ఉన్న ఆ లీలాదేవిని చూచిన ఆకాశవాణియగు సరస్వతీదేవి అశరీర వాక్కుతో :
"పుత్రీ! లీలా! నీవేల దుఃఖిస్తున్నావమ్మా? నేను ఇచ్చిన వరమును మరచిపోయావా ఏమిటి? నీ భర్తయొక్క భౌతిక శరీరమును పుష్పములతో కప్పి, జాగ్రత్తగా ఉంచు. అతనిని నీవు తప్పక మరల పొందుతావు. ఈ శరీరం పాడుకాదు. పూవులు వాడవు. ఇతడు మరల జీవించి, నిన్ను పాలిస్తాడు. ఆకాశమువలె నిర్మలమైనట్టి ఇతని జీవాత్మ నీ అంతఃపురమును, నీ శయన మందిరమును విడచి వెళ్ళదనునది నేను నీకు ఇచ్చిన వరము కదా!” అని మృదుమధురంగా పలికింది.
లీలాదేవి, ఆమె బంధువులు భగవతియగు సరస్వతీదేవి అశరీర వాక్కులు విన్నారు. ఊరట పొందారు. లీల తన భర్త భౌతిక దేహమును పుష్పములతో కప్పి ఉంచింది. ఆ రాత్రి అందరు నిదురించిన తరువాత ఆమె ధ్యానపరాయణియై సరస్వతీదేవిని ఆహ్వానించింది.
4. అదే ఇంట్లో ద్వితీయ సృష్టి దర్శనం
శ్రీ సరస్వతీదేవి : వత్సే! నీవు ఎందుకు ఆహ్వానించావు? ఇదేమిటి దుఃఖిస్తున్నావు? ఈ సంసారమంతా భ్రమమయమని నీకు తెలియదా? ఇదంతా మృగతృష్ణలోని జలంలాగా మిథ్యయే కదా! లీల : హే జగన్మాతా! నీ పాదములు స్పృశిస్తూ నేను చేస్తున్న ఈ నమస్కారం స్వీకరించు.
అమ్మా! ఇప్పుడు నా భర్త పద్ముడు ఎక్కడ ఉన్నాడు? ఏమి చేస్తున్నాడు? ఎట్లా ఉన్నాడు? నన్ను అతని వద్దకు తీసుకొని పోకూడదా? అతడు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను.
శ్రీసరస్వతీదేవి : బిడ్డా! ఇప్పుడు నీవు నీ కళ్ళతో అనేక పదార్థజాలములతో కూడిన ఈ పాంచభౌతిక జగత్తును చూస్తున్నావు కదా! ఇది 'భూతాకాశము' లేక 'స్థూలాకాశము' అంటారు. ఇంతకన్నా సూక్ష్మమైనది చిత్తాకాశము. దానిని ఈ కళ్ళతో చూడలేవు. అయితే అంతకన్నా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన, ఒకానొక ఆకాశము ఉన్నది. అదే “చిదాకాశము”. ఆ చిదాకాశమునందే నీభర్త యొక్క ఆత్మ ఉన్నది. ఆ చిదాకాశమును ధ్యానించి, దానిని అనుభూతమొనర్చుకొన్నావా ... నీవు తప్పక దానిని గాంచగలవు. అవిద్యమానమగు ఈ పాంచభౌతిక దృష్టి ఘనీభూతమై ఉండటం
Page:250
చేతనే (Crystallised material outlook) నీ అనుభవము (Range of Experiencing) పాంచభౌతిక వ్యవహారమునకు పరిమితమగుచున్నది. ఈ దృశ్యమానమగుచున్న వస్తుజాలమును ధ్యానించుట ఆపి చిత్తాకాశమును కూడా ధ్యానించటం వదలి, చిదాకాశమునే ధ్యానించుము. అప్పుడు అంతా నీవే ఎరుగగలవు.
“నాతో సహా సర్వము చిదాకాశమే”, అను భావనను దృఢీకరించి, ఆ భావనలో ప్రవేశించు.
లీల : అమ్మా! ఈ చిత్తము యొక్క ప్రవర్తనను గమనించారా? ఇది ఒక నిమిష మధ్యకాలంలోనే ఒకచోటి నుండి మరొకచోటికి పరుగులు తీస్తోంది కదా! అట్టి ఈ చిత్తము స్వయముగానే ప్రకాశించుచున్నదా? లేక, దీనిని మరెవరైనా ఎక్కడినుండైనా నియామకం చేస్తున్నారా? సరస్వతీదేవి : లేదు. చిత్తమునకు స్వయముగా ప్రకాశించగల, ప్రసరించగల, శక్తి లేదు సుమా! మరి ఈ చిత్తమును కూడా ప్రకాశింపజేసేది, ప్రవర్తింపజేసేది ఏది? చిదాకాశము, లేక, బ్రహ్మమే దీనిని ప్రకాశింపజేస్తోంది. చిత్తము స్వతహాగా జడమైనది మాత్రమే. నీవు నీ చేతిని కదల్చుచున్నావనుకో. 'చేయి’ స్వయంగా కదలదు కదా! దానిని కదల్చు చైతన్యమూర్తివి 'నీవు'. అవయవములు స్వయముగా జడమై చైతన్యమగు 'సత్తు'చే సంచలనము నిర్వర్తించబడునట్లుగానే, జడమగు చిత్తమును 'చిత్సత్త'యే క్రియాశీలత్వమొనర్చుచున్నది. ఒక్క చిదాకాశము మాత్రమే స్వయం చైతన్యవంతమని గ్రహించు. అట్టి చిదాకాశము యొక్క ప్రకాశమునే 'సంవిత్తు' లేక ‘జ్ఞానము' అని అంటున్నాం. అటు 'మహాకాశము'ను ఇటు చిత్త-భూత-ఆకాశములను, ప్రకాశింప చేసేది, ఆధారభూతమైనది కూడా చిదాకాశమే సుమా! చిత్తవృత్తుల ప్రబలత్వం చేతనే నీకు విరహదుః ఖము, తదితర దుఃఖములు ప్రాప్తిస్తున్నాయి. చిత్తవృత్తులను పరిత్యజించి, చిదాకాశానుభవమున సుస్థిరమవగలిగినచో, నీవు నిశ్చయంగా సర్వాత్మకమగు బ్రహ్మ పదమును పొందగలవు కూడా. ఇందులో సందేహం లేదు.
లీల : మాతా! ఇప్పుడు నన్ను ఈ దృశ్య ప్రపంచము, నీవు చెప్పినట్లు ఎంతగానో భ్రమింపజేస్తోంది. ఎందుచేత? కారణమేమిటి?
శ్రీసరస్వతీదేవి : చెప్పాను కదా! నీవు మరల - మరలా పాంచ భౌతిక దృష్టిని ఆశ్రయిస్తూ :
“నేను ఈ భౌతిక శరీరమును! నా భర్తయగు 'పద్ముడు' అనగా మరొక పాంచభౌతిక దేహము ! నా ఈ శరీరమునకు - ఈ నా భర్తయగు 'పద్ముడు' అనబడువాని శరీరమునకు చిరకాలం సామీప్యత ఉండుగాక!" అనునట్టి భౌతిక భావావేశము ఘనీభూతం చేసుకోవటం జరిగింది. క్రమంగా ఈ దృశ్యముపట్ల 'ఇది సత్యము' అను రూపముగల సత్యత్వబుద్ధి ఏర్పడి ఉండటం చేతనే, నేడు ఈ దైన్యమును, దుఃఖమును అనుభవిస్తున్నావు. ఈ చిత్తవృత్తులను పరిత్యజించి, అప్పుడు శేషించియుండుదానినే భావించుచున్నావనుకో నీకీ దైన్యత్వము ప్రాప్తించి ఉండేదే కాదు. అప్పుడు మాత్రమే ఈ దృశ్యము యొక్క అభావత్వము బోధపడగలదు. అట్టి తత్త్వజ్ఞానము
Page:251
తత్త్వానుభవము లభించటం కష్టతరమైనదనుమాట నిజమే. కాని నీవు నా భక్తురాలవుకదా! నా ప్రసాదము చేతను, నేను చెప్పునది 'స్వబుద్ధి'తో గ్రహించటంచేత, స్థిరమైన బుద్ధిని ఆశ్రయించటంచేత అట్టి ‘తత్త్వదృష్టిని’ తప్పకుండా పొందుతావు. 'సత్యస్వరూపిణి' అయినట్టి నా మాటలు అసత్యమెలా అవుతాయి? అందుచేత ఇప్పటికిప్పుడే సందేహములన్నీ జయించి 'తత్త్వదృష్టి'ని ఆశ్రయించు. ఇట్లు పలికి ఆ వాగ్వాణి అంతర్ధానమైనది.
ఇట్టివే అయినట్టి అనేక వాక్యములు శ్రవణానందకరములుగా బోధించుటచే లీలాదేవి ఉద్బోధితురాలై, అనాయాసంగా, అభ్యాసశ్రమ లేకుండా నిర్వికల్పసమాధిని ఆశ్రయించినది. శ్రీరాముడు : హే మహర్షీ! లోకమాతయగు సరస్వతీదేవి ఏ విధమైన జ్ఞానముచే? తన భక్తురాలగు లీలయందు ఆత్మదృష్టిని సుస్థిరీకరించగలిగింది?
శ్రీ వసిష్ఠమహర్షి : విను.
అంతఃకరణముతో కూడుకొనిన ఈ స్థూలదేహాభిమానం లోహ పంజరము వలె అత్యంత దుర్బేధ్యమైనదే. అయితే ప్రయత్నశీలుడు ఈ పంజరమును తప్పకుండా భేదించివేయగలడు. ‘వాణి’ యొక్క వరప్రసాదంచేత, దర్శన భాగ్యంచేత ఉత్తేజితురాలై, ఆ లీలాదేవి గూటి నుండి ఎగిరే పక్షిలాగా దేహాభిమానము వదలింది. చిత్తాకాశమును కూడా అధిగమించినది. చిదాకాశమునందు 'సత్తస్వరూపిణి’ అయి ప్రవేశించింది. ఆ చిదాకాశమునందు స్వప్రయత్నముచే తన భర్త కొరకు వెతుకుట ప్రారంభించింది. అట్టి చిదాకాశమున ఒకానొకచోట పద్ముడు కనిపించాడు. అతడు ఒక రాజసింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. ఆ సభలో మంత్రులు, సేవకులు, సైనికజనం, ప్రజలు ఆయా ఆసనములపై పరివేష్టించి ఉన్నారు. సింహాసనారూఢుడై ఉన్న ఆ పద్ముడు ఏవేవో రాచకార్యములు నిర్వర్తిస్తున్నాడు. ఆ సభకు తూర్పువైపు ఉన్న ద్వారంవద్ద ఆశీనులై ఉన్న ఋషులు, మునులు, విప్రులు “జయ-జయ-దేవ" అంటూ ఆ పద్ముని ఆశీర్వదిస్తున్నారు. దక్షిణ ద్వారంవైపున అనేక మంది రాజులు, మహారాజులు ఆశీనులై ఉన్నారు. ఉత్తరద్వారంవైపుగా ఉన్న విశాల ప్రదేశంలో గుఱ్ఱాలు, ఏనుగులు పెద్దసంఖ్యలో ఉండి ఉన్నాయి. పశ్చిమ ద్వారంవైపు అనేకమంది యువతులు కూర్చుని ఉన్నారు. ఇంద్రసభలోని ఇంద్రునివలె, ఆకాశమున చంద్రునివలె రాజాధిరాజు, చక్రవర్తి అయిన ఆ పద్ముడు అనేకమందితో సంభాషిస్తూ, అనేక రాచకార్యములను నెరవేరుస్తున్నాడు.
ఇంతలో ఒక భృత్యుడు ఎక్కడినుండో పరుగుపరుగునవచ్చి ఆ సభలో ప్రవేశించాడు. రాజును సమీపించి “మహారాజా! మీకు జయమగుగాక! దక్షిణాపథములోని శత్రురాజు అకస్మాత్తుగా మన సామ్రాజ్యముపై దండెత్తివచ్చాడు. .” అని చెప్పి యుద్ధ విషయాలు చెప్పసాగాడు. అట్లు అతడు చెప్పుచుండగానే మరొక భృత్యుడు మహారాజువద్దకు వచ్చి “మహారాజా! ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి. ఒకప్పటి మనదేశమిత్రుడు కర్ణాటకరాజు తూర్పువైపు రాజ్యమును ఆక్రమించటానికి దండెత్తి వస్తున్నాడు. ఈ ఆకస్మిక పరిణామమునకు మన సైన్యం పూర్తిగా
Page:252
సన్నద్ధమై లేదు. ఈ విషయమై సమాలోచించెదరు గాక!” అని పలికి ఊరుకున్నాడు. అట్లే మరికొంతమంది భృత్యులు ఆయా సరిహద్దురాజుల దండయాత్రలకు సంబంధించిన యుద్ధవార్తలు తెచ్చారు. ఆ రాజ్యమును ఒక్కసారి అనేకమంది శత్రురాజులు అనేకవైపుల నుండి చుట్టుముట్టినట్లు తెలియవచ్చింది. అంతవరకు ప్రశాంతముగా ఉన్న ఆ సభలో రణగొణధ్వనులు, సమాలోచనలు ప్రారంభమయ్యాయి. మంత్రులు, సామంతరాజులు మహారాజును సమీపించారు. యుద్ధవిషయమై
మంతనాలు సాగించసాగారు.
❖
ఆకాశస్వరూపిణి (అశరీర స్వరూపిణి) యగు లీలాదేవి అట్టి సమయంలో సభాప్రవేశం చేసింది. ఆమె సభలో సంచరిస్తున్నప్పటికీ అక్కడివారు ఆమెను చూడలేకపోయారు. సంకల్పములోని నగరమును ప్రత్యక్షంగా (జాగ్రత్లో) చూడలేనట్లు, ఒకని సంకల్పము లేదా స్వప్నములోని వస్తు జాలమును ఆ ప్రక్కనే ఉన్న మరొకరు చూడజాలనట్లు, అక్కడి వారెవరికి ఆమె కనబడటం లేదు.
లీల ఒక్కసారి సభ అంతా కలయచూసింది. ఎంత ఆశ్చర్యం! అక్కడంతా ఆమెకు ఇతః పూర్వపు భృత్యులు, సామంతులు, మంత్రులు కనిపించారు. వారంతా తమ రాజసభలో ప్రతిదినము కనిపించే సభికులు. “మా రాజ్యసభ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొనిరాబడిందా ఏమి?” ... అని
ఆమెకు అనిపించసాగింది. అందరు మునుపటి వారే. వారి ఆచరణ కూడా మునుపటిలాగానే ఉన్నది. ఆ పరిచారికలే, ఆ మంత్రులే, ఆ పండితులే, ఆ సేవకులే, ఆ స్నేహితులే ఇక్కడ కూడా కనిపించారు. తమ రాజ్యము లాగానే ఇక్కడ కూడా పగలు, దిక్కులు, సూర్యచంద్రులు, ఆకాశము, మేఘములు, వాయువు కనిపిస్తున్నాయి. అట్టివేయగు వృక్షములు, నదులు, పర్వతములు, నగరములు, గ్రామములు, అడవులు కూడా ఇక్కడ ఉండటం గమనించింది.
మరల సభ అంతా అన్నివైపులా ఆ లీల సంచరించింది. అందరు మునుపటి విధంగా ఉన్నారు. కాని, సింహాసనం మీద ఆసీనుడైన పద్ముడు మాత్రం ఇతఃపూర్వమువలె అంతటి ముదుసలిగా లేడు. అతడు కొంత మధ్యవయస్కుడై ఉండటం కనిపించింది. "ఇది ఏమిటి? మా పట్టణంలోని వారంతా మరణించారా? లేకపోతే, వారే ఇక్కడెట్లా ఉన్నారు? ఇది ఎంతటి దుఃఖకరమైన విషయం!” అని ఆశ్చర్యచకితురాలై యోచించ సాగింది.
ఇట్లు ఆమె చింతించుచుండగా, సరస్వతీదేవి అనుగ్రహంచేత ఆమెకు “సమాధి” భంగం అయినది. ఆమె నిద్రనుండి మేల్కాంచినట్లు లేచికూర్చుని చుట్టూ చూచింది. తాను యథారీతిగా తన అంతఃపురంలోనే ఉన్నట్లు గమనించింది. తన చుట్టూ పరిచారికలు మునుపటివలెనే నిద్రిస్తున్నారు.
"ఓ పరిచారికలారా! నిద్రలేవండి. ఇప్పుడు నా మనస్సంతా ఎంతో విషాదంగా ఉన్నది. మన సభలోని మంత్రులు, సామంతులు, తదితర సభికులు అనేకులు మరణించినట్లు నాకు అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు సభను సమావేశపరచండి. సభలో సింహాసనం అధిరోహిస్తాను. సభ్యులందరు
Page:253
యథారీతిగా ఉన్నారా మంచిదే. అందరు మరణించారా ఇక నేనుమాత్రం ఉండి చేసేదే ముంటుంది? నేను కూడా మరణిస్తాను. పొండి. పరుగులుతీసి మంత్రులకు సభను సమాయత్తపరచ వలసినదిగా నా ఆజ్ఞను తెలియజేయండి.”
పరిచారికలు ఆశ్చర్యపోయారు. ఆ అర్ధరాత్రి సభ సమావేశమవటమేమిటి? అయినా చేసేదే మున్నది? మహారాజ్ఞి ఆజ్ఞ కదా! పరుగుపరుగున వెళ్ళి ఈ విషయం మంత్రులకు, పురవాసులకు తెలియచెప్పారు. ఆ క్షణంలో లీలాదేవి ప్రాణాలు కాపాడుకోవటమే అక్కడి పురజనులు తక్షణ కర్తవ్యమైనది. అక్కడి పురజనులు, భృత్యులు సభాసమావేశమునకు సిద్ధమైనారు. ‘డప్పులమోత’ ద్వారా సభాసమావేశం గురించి నగరమంతా తెలియజేయ బడింది. కొందరు సభలో ప్రవేశించి సమావేశమునకు అంతా సిద్ధం చేశారు. క్షణాలలో పురజనులు సభలో ప్రవేశించి ఉచితాసనములలో ఆశీనులైనారు. మంత్రులు, సామంతులు ఆయాస్థానములు ఆక్రమించి ఉన్నారు. ఇంతలో లీలాదేవి స్నానాదులు ముగించుకొని, సభలో ప్రవేశించి, సింహాసనం అధిష్టించింది. సభంతా కలియచూచింది! ఎంత ఆశ్చర్యం! అక్కడ రాజన్యులు, స్త్రీలు, గురువులు, బంధుజనం, స్నేహితులు ఎప్పటిలాగానే సభలో ఉన్నారు. సభ అంతా యథాతథంగానే ఉన్నది. లీలాదేవి ఉపశాంతి పొందింది. అందరు జీవించి ఉన్నందుకు సంతోషపడుచూ, ఒక్కసారి పద్ముని సింహాసనం వైపు చూచింది. ఒక్క మహారాజు మాత్రం అక్కడ లేడు. సింహాసనం బోసిపోయి ఉన్నది. అతని భౌతికదేహం (విగతజీవుడై) అంతః పురంలోనే ఉన్నదికదా! అప్పుడు లీలాదేవి సభను ఉద్దేశించి "ఓ సభికులారా! నా చిత్తము మహారాజు వియోగంచే భరించరానంత దుఃఖము పొందినది. దానిని కొంత వినోదింపచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశము ఏర్పరచాను. మీ అందరికి ఇప్పటికిప్పుడు ఇంత శ్రమయిచ్చినందుకు నన్ను క్షమించండి” అని పలికి, అక్కడనుండి లేచింది. పరిజనం వెంటరాగా, అంతఃపురమునకు నడుస్తూ వెళ్లింది. తన భర్త పద్ముని భౌతిక శరీరాన్ని సమీపించింది. ఆ దేహము పూలతో కప్పబడి, ఎప్పటి యట్లే ఉన్నది. ఆ గదిలోనే ఒకచోట చతికిలపడి కూర్చుని ఇట్లు యోచించసాగింది.
"ఆహా! ఈ మాయ ఎంతటి విచిత్రమైనది! ఈ సభికులు, తదితరులు నా భర్త యొక్క భౌతిక దేహము ఉన్నచోట-ఈ నగరంలో ఉన్నట్లే, చిదాకాశంలో కూడా అతని సూక్ష్మదేహము వెంటనంటి ఉన్నారే? ఇక్కడ ఉన్న కొండలు, భవనములు మొదలైన స్థావర వ్యవహారమంతా కూడా ... అక్కడా అట్లే ఉన్నదే? అద్దంలో ప్రతిబింబించే కొండయే బాహ్యమున కూడా ఉన్నట్లు, చిదాకాశమునందు వెలుపల కూడా సృష్టి ఒకే తీరుగా కనబడుతోంది. అయితే, నేను చూచిన ఈ రెండు దృశ్యములలో ఏది వాస్తవం? ఏది భ్రాంతి? ఈ కనబడేది వాస్తవమా? చిదాకాశమున నేను చూచిన మధ్య వయస్కుడగు నా భర్త ‘రాజ్యము-ప్రజలు’ వాస్తవమా? ఈ రెండింటిలో పారమార్థికమైనదేది? ఈ విషయం నేను నా స్వబుద్ధితో గ్రహించలేను. అందుచేత నా ఆరాధ్యదేవతయగు 'వాగ్దేవి'నే అడిగి
తెలుసుకొంటాను”.
ఇట్లు అనుకొని లీలాదేవి ఏకాగ్రతతో సర్వస్వతీ జగన్మాతను ధ్యానించింది. తన భక్తురాలి
Page:254
పిలుపును అందుకొని, కుమారి రూపధారిణియై జగన్మాత, దర్శనమిచ్చింది. మహాశక్తి స్వరూపిణియగు వాణీదేవిని సువర్ణ సింహాసనం అధిరోహింపజేసి, లీలాదేవి ఉత్తమ స్తోత్రములతో ఆనందింపచేసింది.
5. ఇక్కడ ఏది సత్యం? ఏది అసత్యం?
లీల : దేవీ! పరమేశ్వరీ! నీవు 'సృష్ట్యాది’ యందు స్థాపించిన మర్యాద (System) విషయంలో నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. వాటి గురించి ప్రశ్నిస్తాను. తెలియపరచి నా పట్ల నీకున్న దయను సఫలంచేయి మాతా!
ఈ 'జగత్తు' అనబడునది ఆకాశము కంటే కూడా అత్యంత నిర్మలమైనది కదా! కోటియోజనముల విస్తీర్ణం కూడా విస్తారజగత్తు దృష్ట్యా అత్యంత స్వల్పమైనదే. వేద మహావాక్యములు ఈ జగత్తును "జ్యోతిర్మయము, సూక్ష్మము, శీతలము” మొదలైన విశేషణములతో వర్ణించి చెప్పుచున్నాయి. ఇది “గోడలేకుండానే చిత్రం ఉన్నట్లు” నిరావరణమైనదానివలె కనబడుతోంది. ఇందు ‘ఆకాశము, భూమి, దిక్కులు, కాలము’ ... మొదలైన అనేక విశేషాలు కనబడుచున్నాయి. ఈ జగత్తే అన్నిటిని ప్రకాశింప చేస్తోంది. దీనిని ప్రకాశింపజేస్తున్న మరొకటి ఎక్కడన్నా ఏదన్నా ఉన్నదా? లేదనే నేను అనుకొంటున్నాను. వస్తువులన్నీ ఇందులోనే ప్రతిబింబించి, విలీనం అయిపోతున్నాయి. ఈ త్రిలోకసృష్టి కనబడుచున్నది “చిద్వస్తువు” అను దర్పణమునందే కదా!
ఇప్పుడు నాకు కలిగిన సందేహమేమిటో చెపుతాను. ఈ బయట కనబడే వస్తుజాలము వాస్తవమా? లేక ఇదంతా ప్రతిబింబిస్తున్న “చిద్వస్తువు" (The absolute consciousness in which phenomenal universe is reflected.) వాస్తవమా? ఈ జగత్తు సత్యమా? దీనిని దర్శించి అనుభవమును పొందుచున్న 'నేను' అనబడునది సత్యమా? ఈ రెండింటిలో కృత్రిమమైనదేది? అకృత్రిమమైనదేది? ఈ సృష్టితత్త్వమంతా ఏదైనా మరొకదానిలో ఉన్నదా? ఉంటే ఆ మరొకటి ఇంకెందులో ఉన్నది?
నీ ఆజ్ఞను అనుసరించి నేను స్థూలసూక్ష్మములను త్యజించి చిదాకాశంలో ప్రవేశించాను. ఆ
చిదాకాశంలో ఒకానొకచోట నా భర్త పద్ముడు ఒక విస్తారమైన సామ్రాజ్యమునకు మహారాజై ఉండటం చూచాను. అతని సభలో ఇట్టి మంత్రులే, ఇట్టి ప్రజలే నాకు గోచరించారు. ఆ చిదాకాశములో నాకు కనిపించిన సభాదృశ్యము వాస్తవమా? ఇక్కడ సమావేశమైన సభ వాస్తవమా? ఈ ప్రశ్నలన్నీ నన్ను వేధిస్తున్నాయి. చిగురుటాకు కొనవలె నా మనస్సు చంచలమగుచున్నది. ప్రసన్న స్వరూపిణియగు నీవు ఇప్పుడు ఏది బోధించాలనుకొంటే, అదియే బోధించవేడుకొనుచున్నాను.
గోడపై ఒకానొక చిత్రము (painting) చిత్రించటం మనం చూస్తూ ఉంటాం. అయితే లీలాదేవి ఈ జగత్తును "గోడ లేకుండానే చిత్రం కనబడువిధంగా (Painting without canvas or wall) పోల్చుచున్నది.
Page:255
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! నీ ప్రశ్నలు అత్యంత చమత్కారంగా ఉన్నాయి. ఈ సృష్టిలో ఏది కృత్రిమమైనది? అకృత్రిమమైనదేది? సరే! ఇప్పటి వరకు నీకు తోచిన దానినిబట్టి ఏది వాస్తవమనుకొంటున్నావో, ఏది అవాస్తవమనుకొంటున్నావో చెప్పు? నీకు అర్థమైనదేమిటో చెప్పితే, దానిని అనుసరించి, నీకు అర్థము కావలసినదేమిటో సవివరంగా తప్పక చెపుతాను.
లీల : సరే! నేను ఏది వాస్తవమని అనుకొంటున్నానో చెపుతాను. నాకు ఇదంతా ఎట్లు అనిపిస్తోందో, అర్థమౌతోందో చెపుతాను.
ఇప్పుడు ఇక్కడ నీవు-నేను ఉండి సంభాషించుకొంటున్నాము కదా! ఇది అకృత్రిమ సర్గము లేక వాస్తవమైన 'సృష్టి'. నా భర్త పద్ముడు చిదాకాశమునందు ఉండియున్న విధానము 'కృత్రిమసర్గము' లేక కల్పిత స్వప్నతుల్యమైన సృష్టి అని భావిస్తున్నాను. ఎందుకంటావా? స్వప్నములోని అనుభవంలాగా అది శూన్యమైనదే కదా! దేశకాలముల (Space & time) దృష్ట్యా అది, “ఇక్కడ ఆకాశములో ఇట్లు ఇప్పుడు ఉన్నది” అను విధంగా లభించటం లేదు కదా! ఇప్పుడు మనిద్దరం పాల్గొనుచున్న ఈ దృశ్యము దేశ కాలముల పరిచ్ఛేదం కలిగియుండుటచే ఇది వాస్తవమని అనుకొంటున్నాను. (As
this is available for factors of time and distance, this looks to me as true).
శ్రీ సరస్వతీదేవి : నీవు అంటున్నట్లు ఇక్కడ కనిపిస్తున్న ఈ సృష్టి అకృత్రిమమైనదనే అనుకొందాం. అకృత్రిమ సృష్టి నుండి కృత్రిమసృష్టి ఎట్లా ఉత్పన్నమౌతుంది? ఏదైనా ఒకానొక కారణము (cause) నుండి, ఆ కారణమునకు సంబంధంలేని విజాతీయమైన కార్యము (Entirely different type of "EFFECT") ఉత్పన్నము కాదు కదా! అందుచేత “ఈ సృష్టి అకృత్రిమం” అని అనుకొంటే ఇందులో పదార్థజాలమంతా అకృత్రిమమైనదే అయివుండాలి. ఈ సృష్టి నుండి బయలుదేరిన నీవు చూడటం జరిగినట్టి 'చిదాకాశము'లోని నీ భర్త రాజ్యం కూడా అకృత్రిమమే అయివుండాలి. ఇక్కడ, అక్కడ కూడా నీ అనుభవం ఒకే తీరుగా కొనసాగుతూ ఉన్నది కదా!
లీల : మాతా! "ఒక కారణము నుండి, ఆ కారణమునకు ఏమాత్రం సంబంధంలేని కార్యములు ఉత్పన్నమౌతాయి” అని అనటానికి అనేక దృష్టాంతాలు మనకి ప్రపంచంలో లభ్యమౌతున్నాయి. ఉదాహరణకు మట్టిలో మంచినీరు నిలువ ఉంచలేము. కాని ఆ మట్టితో తయారైన కుండలో నీరు
నిలువ ఉంచగలం కదా!
శ్రీ సరస్వతీదేవి : సహకారి కారణం నుండి కలుగు కార్యము ముఖ్యకారణం కంటే కొంచెం విజాతీయమై కనబడటమే నీ దృష్టాంతములోని "మట్టి కుండ”లలో చూస్తున్నాం. మట్టి కుండగా ఆకారము పొందుట అందుకు కారణమగుచున్నది.
కారణము = Main Cause ; సహకారికారణము = Supportive Cause
ఇప్పుడు నీ భర్త విషయానికి వద్దాము. అతడు ఇక్కడ ఒకతీరుగా, అక్కడ మరొక తీరుగా
ఉండటానికి తగినంత కారణమేదైనా ఉన్నదా?
Page:256
ఒక్క విషయం నీవు ముందుగా దృష్టిలో పెట్టుకో. ఈ పృథివి మొదలైన పంచభూతములు నీ భర్త యొక్క సృష్టికి కారణములని అనుకొంటున్నావా? లేదు. ఇప్పుడు నీ భర్త ఇక్కడ జన్మించి అక్కడికి వెళ్ళాడంటావా? అసలు ఈ భూమండలమంతా ఎక్కడ ఉన్నది? ఆ భూమండలం ఎక్కడున్నది? ఇదే అక్కడికి వెళ్ళి ఉంటుందంటావా? ఒకవేళ ఇది అక్కడకు వెళ్ళకపోతే ఇట్టిదే అయిన సృష్టి అక్కడ ఎందుకు సంభవిస్తోంది?
వాస్తవానికి నీ భర్త ఈ బ్రహ్మాండంలోగాని, అతనిచే అనుభవించబడుచున్న ఆ సృష్టిలో గాని పుట్టుకకు సహకారి కారణమంటూ ఏదైనా ఉన్నదా? లేదే! అన్య (బాహ్య) కారణమంటూ ఏదీ లేకుండా ఏదైనా సంభవిస్తుంటే అద్దానికి అతని పూర్వపు సృష్టులందలి కామకర్మ-వాసనలే కారణములగుచున్నాయా? ఆలోచించి చెప్పు?
లీలాదేవి : నీవు చెప్పినట్లు, “నా భర్త అసలు ఎట్లు సృష్టించబడ్డాడు?" అను ప్రశ్నకు “అతని ఇతః పూర్వపు జన్మలందలి జ్ఞానమే కారణము” అనునది సమాధాన మగుచున్నదని నేను అనుకుంటున్నాను. అట్టి ‘జన్మాంతరజ్ఞానము' (The knowledge gained in past lives & Carried forward in thier life) వృద్ధి చెందుచుండగా, అదే ఈ సృష్టికి కారణమగుచున్నదని నాకు తోచుచున్నది.
శ్రీ సరస్వతీదేవి : అంటే, నీవు "సృష్టికి స్మృతియే కారణము” అనునట్టి వాక్యానికి వస్తున్నావు. నీ ఈ అభిప్రాయం ప్రకారం "ఈ జీవుడు జ్ఞప్తి లేక జ్ఞాపకము స్వరూపముగా గలవాడు మాత్రమే” అని కదా! అయితే 'జ్ఞాపకము' అనునది అనుభవము ఉన్న తరువాతే ప్రారంభమౌతుంది కదా! అట్టి అనుభవము కంటే ముందే అనుభవజ్ఞుడు ఉండి ఉండాలి కదా! జ్ఞప్తి ఎవరికి కలుగుతోందో అతడు ముందుగా ఉంటేనే, అతనియందు అనుభవములు రచించబడగలవు. కనుక 'జీవుడు’ అనగా ‘జ్ఞాపకములు’ అని గాని, 'సంస్కారములు' అనిగాని అనటం సమగ్రమైన సమాధానం కాదు. ఈ 'సంస్కారములు' అనబడునవి మొదలంట అధ్యయనం చేస్తే అవి 'శూన్య రూపములే’ అని తెలియవస్తున్నాయి. వాటి రూపము ఆకాశమే. అట్టి సంస్కారము ఆకాశరూపమే అయి ఉండటంచే, దాని నుండి కలిగిన సృష్టులు కూడా 'ఆకాశమయమే' అని గ్రహించు.
లీలాదేవి : మాతా! ఇప్పుడు నీచేత బోధింపబడటంచే ఒకానొక నూతన విషయం తెలుసుకొంటున్నాను. నాభర్తయొక్క “చిదాకాశసృష్టి స్మృతి + ఊహ” జనితమే కదా! అది ఆకాశస్వరూపమే. శూన్యమే. అందుచేత ఇక్కడ ఇప్పుడు నాచేత గాంచబడుచున్న సృష్టి కూడా పైన చెప్పిన దృష్టాంతము ప్రకారం ఆకాశస్వరూపమేనని అనిపిస్తోంది. ఈ రాజ్యాదులు, నా భర్తతో గల సంబంధము, ఈ అనుభవములు ... ఇవన్నీ కూడా ఆకాశమువలె శూన్యరూపములే, సంకల్పమాత్రములే (లేక) ఊహామాత్రములే అయివున్నాయి.
శ్రీసరస్వతీదేవి : సుప్రతీ! ఇప్పుడు నీవు సరయిన అవగాహనకే వస్తున్నావు. నీ భర్త యొక్క చిదాకాశసృష్టి అతని ఊహామాత్రమే! అది అసత్తు-అవాస్తవం అయినట్లే, దృశ్యమానమగుచున్న ఈ సృష్టి కూడా అసత్తు-అవాస్తవమే. జ్ఞానప్రభావం చేత మేము ఇదంతా అట్లే దర్శించుచున్నాము. నీవు కూడా ఇది గ్రహించు.
Page:257
లీల : హే జగజ్జననీ! నీవు సత్యస్వరూపురాలవు. అసత్యం ప్రకటిస్తావా? లేదు. కాని, నాలో ఏదో భ్రమ ఇంకా తొలగిపోలేదు. అందుచేత నాభర్తయొక్క భ్రమాత్మకమైన చిదాకాశసృష్టి ఎలా సంభవించిందో . ఆ రీతిని నాకు వివరించు. అది వినటంచేత నా ఈ భ్రమ తొలగిపోగలదనే నేను భావిస్తున్నాను.
శ్రీ సరస్వతీదేవి : ఇతఃపూర్వపు స్మృతినుండే స్వప్నభ్రమవలె, 'కల' లోని మరొక 'కల' వలె .... ఈ ఈ సృష్టులన్నీ ప్రకాశిస్తున్నాయి. కనుక 'సృష్టి' అనబడేదంతా ద్రష్టయొక్క స్వయంకృత సంబంధమైన సంస్కారములతో కూడిన ఊహాపరంపరా ప్రదర్శనం మాత్రమే! ఈ విషయం ఇంకా సుస్పష్టపడటానికి ఒక చిత్రమైన సంఘటన గురించి చెపుతాను విను.
6. ఇతఃపూర్వపు సృష్టి - బ్రాహ్మణ దంపతులు
శ్రీ సరస్వతీదేవి : చిదాకాశమున, ఒక మారుమూల ఒక సంసారమండపము ఉన్నది. ఆ సంసారమండపము పంచభూత విభాగమగు “ఆకాశము” అనే గాజుతో కప్పబడివున్నది. ఆ మండపములో లోకపాలకులు స్తంభముల వంటివారు. దేవతా స్త్రీలు అందు చెక్కబడిన బొమ్మలు, పదునాలుగు లోకాలు అందుగల గదులు. ఆ గదులందు ఆమూల ఈమూల - పుట్టలవలె అనేకమంది ప్రాణులు ఉన్నారు. "ప్రజాపతి (బ్రహ్మదేవుడు)" అందు నివసించు బ్రాహ్మణుడు. సాలెపురుగు తనగూటిలో తానే చిక్కుకున్నట్లు, అందుగల అనేక ప్రాణులు (లేక జీవులు) తమ ఆశలతో కట్టుకొన్న గూటిలో తామే చిక్కుకొనియున్నారు. 'ఆకాశము' అనునది ఆ మండపముపై పట్టిన బూజువలె కనిపిస్తోంది. ఆకాశంలో సంచరించే సిద్దులే ఆ ఇంటిలో రొదచేసే దోమలు, లోకములు, నగరములు అందలి 'కుండలు' వంటివి. అట్టి మండపంలో ఒకచోట 'గిరి' అను పేరుగల ఒక గ్రామము ఉన్నది. ఆ గిరి గ్రామంలో గల ఒక గృహమునందు వసిష్ఠుడు అను పేరుగల ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు శ్రోత్రియుడై, వేదములలో చెప్పబడిన నిష్ఠలను, విధివిధానములను అనుసరించినవాడై, భార్య - - పిల్లలతో కాలం వెళ్ళబుచ్చుచున్నాడు. రోగహీనుడై, భయరహితుడై, శాంతచిత్తుడై ధర్మపరాయణుడై, సేవానిరతుడై, గృహస్థాశ్రమమును నిర్వర్తించుచున్నాడు. అతని పేరు, విత్తము, వయస్సు, విద్య, వైభవము, యత్నముల దృష్ట్యా వసిష్ఠమహర్షి వంటివాడే అయినప్పటికీ... అతను ఇక్ష్వాకు వంశజుల పౌరోహిత్యము వహించు సప్తర్షి మండల సంబంధితుడగు వసిష్ఠమహర్షి కాదు. అతని భార్య పేరు కూడా అరుంధతియే. ఇక్ష్వాకుల సద్గురువగు వసిష్ఠుని ధర్మపత్ని 'అరుంధతి' జీవన్ముక్త. కాని ఈమె విషయం అట్టిది కాదు. (అనగా ఆ దంపతులు వేరు. వీరు వేరు.)
ఆ బ్రాహ్మణుడు తన భార్యపై అకృత్రిమమైన ప్రేమ రసము కురిపిస్తూ ఉండేవాడు. అతని
సంసారమంతా ఆమెయే అయివుండేది.
Page:258
ఆ బ్రాహ్మణుడు ఒక రోజు ఒక పర్వతముపై గల 'పచ్చికబయలు' నందు ఆశీనుడై ఒంటరిగా ప్రకృతి సౌందర్యమును, ప్రశాంతతను అనుభవిస్తున్నాడు. అప్పుడు ఒకానొక రాజు తన పరివారమును వెంటబెట్టుకొని వేటవినోదమును ఆస్వాదించుచు ఆ కొండ క్రింద గల బాటవెంట రావటం జరిగింది. మన బ్రాహ్మణుడు ఆ సంరంభమంతా గమనించుచు తన అంతరంగమున ఇట్లు సమాలోచించసాగాడు. "ఆహా! ఈ రాజు ఎంతటి వైభవము అనుభవించుచున్నాడు! ఈ గుఱ్ఱాలు, ఈ ఏనుగులు, ఈ సేవకులు, ఈ నారీజనం! ఇవన్నీ నేనుకూడా పొందితే ఎంతబాగు! నేనుకూడా ఎప్పటికైనా ఇంతటి వైభవం అనుభవిస్తానా?”
ఆ రోజునుండి అతడు ఇట్లే చింతనచేయసాగాడు. అట్లా అనుక్షణికంగా 'చింతన' చేస్తూనే తన దైనందిక కర్మలను యథావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. కాలక్రమంగా ముసలివాడయ్యాడు. ఒక రోజు అతని భార్య “అయ్యో! ఈ నా భర్త ఇక ఎంతోకాలం జీవించనట్లే ఉన్నదే?” అని అనుకొన్నది. మరణ రహితమనేది అసంభవమని ఆమెకు బాగా తెలుసు. ఆమె తన భక్తిప్రపత్తులతో నన్ను ప్రసన్నురాలిని చేసుకొని, "అమ్మా! ఈ నా భర్త ఒక వేళ విధివశాత్తూ మరణిస్తే అతని జీవము నేను కూడా నా ఈ గృహమునుండి బయటకు వెళ్ళకుండునట్లు దీవించు” అని నన్ను వరం కోరుకున్నది. నేను అట్లే వరం ప్రసాదించాను.
కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. అయితే, అతని జీవచైతన్యము జీవ వాసనా ప్రభావం చేత ఆ ఇంట్లోనే నివసించసాగింది. అతడు ఆ గృహాకాశము నందే తన కల్పనాబలం చేత పరమశక్తి సంపన్నుడగు రాజు అయ్యాడు. తన ప్రతాప శక్తులతో ముల్లోకములను జయించి పాలించసాగాడు. అతడు సాధువులకు దిక్కె, శాస్త్రములకు ఆదర్శమై, యాచకులకు కల్పవృక్షమై, ద్విజులకు ఆశ్రయమై, ధర్మమునకు ఆలవాలమై రాజ్యపాలనం చేస్తూ వస్తున్నాడు. చూచావా బిడ్డా! ఆ బ్రాహ్మణుడు తన పాంచభౌతిక శరీరమును పరిత్యజించి ... ఆ గృహాకాశమునందే చిత్తాకాశ మయమగు శరీరమును దాల్చి విస్తారమైన రాజ్యపాలనను అనుభవించుచున్నాడు.
అతని భార్య విగతజీవుడైన తన భర్త శరీరమును చూచి అత్యంత దుఃఖమును పొందింది. కొద్ది సమయం ఎంతగానో దుఃఖించింది. అప్పుడామె కొయ్యబారిపోయి, తన దేహమును పరిత్యజించి తానుకూడా అతివాహిక దేహము (లేక చిత్తాకాశము)ను ఆశ్రయించి తన భర్త వద్దకు వెళ్ళినది. అక్కడ ఆమె తన భర్తతో సంతోషంగా కాలం గడపసాగింది. అది ఆమె కోరుకున్నట్లు ఆ బ్రాహ్మణ గృహంలోనే ఏర్పడి కొనసాగుతోంది.
❖
ఓ లీలాదేవీ! ఆ బ్రాహ్మణదంపతులు మరణించి నేటికి ఆ గిరి గ్రామంలో ఎనిమిది రోజులు గడచింది. వారిద్దరు తమ స్థూలదేహములను పరిత్యజించారు కదా! వారి ఇరివురి భౌతిక శరీరములు ఆ గిరి గ్రామంలో ఆ ఇంటికి సమీపంలో ఖననం చేయబడ్డాయి. అక్కడ, వారి భూములు ‘స్థిర-చర' ఆస్తులు, ధనరత్న, గృహాదులు ఇప్పటికి అట్లే ఉన్నాయి.
Page:259
ఓ పుత్రికా! ఆ బ్రాహ్మణ దంపతుల కథ అంతా చెప్పాను కదా! ఇప్పుడు విను. ఆ బ్రాహ్మణుడే నీ భర్తయగు 'పద్ముడు’ అతడే ఇప్పుడు చిదాకాశమునందు నీవు చూచిన-రాజ్యమును పొంది పాలన చేస్తున్నాడు. నీవే ఆ 'అరుంధతి' అనబడు బ్రాహ్మణ పత్నివి. అప్పుడు ఆ గిరి గ్రామంలో మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులవలె బ్రాహ్మణ దంపతులుగా చాలాకాలం ఉండి ఉన్నారు. ఇప్పుడో ఆ నీవే ఇక్కడ నీ భర్త యొక్క వియోగమును పొందినదానవై, విరహము అనుభవిస్తూ, ఈ రాజ్యమును పాలించు చున్నావు.
“ఇతఃపూర్వపు - సృష్టులు, ఇప్పటి -సృష్టులు, ఇకముందు సృష్టులు” భ్రమ మాత్రమేనని చెప్పానుకదా! బ్రహ్మాకాశమే (లేక శుద్ధ చైతన్యమే) భ్రమ వలన జీవ స్వరూపమును గ్రహించుచున్నది. భ్రమ వలననే చిదాకాశమునందు భ్రమ ప్రతిబింబిస్తోంది. ఏది సత్యమో, ఏది మిథ్యయో అనుభూతిపూర్వకంగా సుస్పష్టపడితే అప్పుడిక్కడ ఇక మిగిలేది ఏమీ ఉండదు. అందుచేత నీవు ఏది భ్రమయుతమో చక్కగా గ్రహించటానికి ప్రయత్నించు. అప్పుడు, “ఈ సృష్టి స్వతహాగా లేదు. నేను నాయొక్క స్వకీయ సంకల్పనాబలంచేత, కల్పనను ఆశ్రయించటంచే లేనిదానికి అస్థిత్వమును ప్రసాదించుచున్నాను. అట్లు ప్రాప్తించిన అస్థిత్వమును మరల అనుభవించుచున్నది నేనే” .... అనునట్టి ఆత్యంతికమైనట్టి “సృష్టి కేవలం దృష్టి మాత్రమే” అనే అవగాహన కలుగగలదు.
7. జ్ఞాపకాలు
సరస్వతీ మాత చెప్పినదంతా విని లీలాదేవి మరల మరల యోచిస్తూ అత్యంత ఆశ్చర్యం పొందింది. కొద్దిసేపు మౌనం వహించింది.
లీల : హే దేవీ! నీ పలుకులు కొంత అసందర్భముగా ఉన్నట్లు నా బుద్ధికి అనిపిస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడు ఒక చిన్నగృహంలో మరణించి ఉండటమేమిటి? మేము ఇక్కడ ఉండటమేమిటి? మేమే ఆ బ్రాహ్మణ దంపతులమై ఉండి ఎనిమిది రోజుల క్రితం మాత్రమే మరణించియుండుటమనేది ఎంతటి చమత్కారం! బహు విస్తారమైన మా ఈ రాజ్యము ఆ బ్రాహ్మణ గృహములో ఇమిడి ఉండి ఉన్నదంటావా? ఇప్పుడు నా భర్త పరలోకమున ఉన్నాడు కదా! అక్కడి మహారాజ్యములు, విస్తారమైన భూములు, పర్వతములు, దిక్కులు ఈ చిన్న గదిలో ఎట్లా ఇముడుతాయి? మదించిన ఒక పెద్ద ఏనుగు ఆవగింజలో ఇమిడేదెట్లా? ఒక చిలక సింహముల గుంపును, అటువంటి చాలా చిలకల గుంపులను ఒక దోమ మ్రింగగలవా? “ఒక తుమ్మెద ఐదు క్షణములలో ఒక మేరుపర్వతమును నమిలి జీర్ణం చేసుకొన్నది” అన్నట్లున్నాయి నీ మాటలు. నా స్వప్నంలో చూస్తున్న మేఘములకు స్పందించి నేను నిద్రిస్తున్న గది వెలుపలగల నెమళ్ళు నాట్యం చేస్తాయా? ఓ సర్వేశ్వరీ! ఇవన్నీ అసంభవమైనట్లే ఆ విప్రభవనంలో పృథివీ - పర్వతాలు ఉండటం అసంభవమని నేను అనుకొంటు న్నాను. అమ్మా! మూఢురాలు, అజ్ఞానియగు నావంటి బిడ్డలు ఏదో తెలిసో తెలియకో ప్రశ్నించి
Page:260
నప్పటికీ మహాత్మురాలవు, జగత్తుకే మాతవు అయినట్టి నీకు కోపం వస్తుందా? లేదు. నాకు చిత్తశుద్ధి ప్రాప్తించే విధంగా నీవు ఉన్న సత్యము ఉన్నట్లు నాకు విశదపరచ వలసినదని ప్రార్థన చేస్తున్నాను.
శ్రీ సరస్వతీదేవి : పుత్రికా! లీలాదేవి! ఈ మాయ యొక్క స్వరూపస్వభావములను గ్రహించి, దీనికావల ప్రతిష్ఠితమైయున్న మేము నీ ప్రశ్నలకు ఆశ్చర్యపడం. నేను ఏదీ అసత్యం చెప్పటంలేదు సుమా! “జనులు అబద్ధము చెప్పరాదు” అను నియమమును లోకమున ప్రబోధించినది సత్యస్వరూపుల మగు మేమే కదా! మేమే ఆ నియమమును ఉల్లంఘిస్తే ఇక ఉత్తమ ఆచారములను పాలించే వారెవరుంటారు? కనుక నేను చెప్పుచున్నదంతా వాస్తవమేనని గ్రహించు. ఆ బ్రాహ్మణుని జీవాత్మ అక్కడి గృహాకాశంలో ఆకాశరూపమును పొంది అట్టి 'ఆకాశరూపము'నే విరజగత్తువలె గాంచుచున్నది.
లీలాదేవి : అయితే మరి “నా భార్య, నా భర్త, నా పుత్రులు, మా గృహములు” వంటి స్మృతులన్నీ ఏమయ్యాయి?
శ్రీ సరస్వతీదేవి : రాత్రివేళ స్వప్నము గాంచుచున్నప్పుడు, ఏర్పడియున్న “నా భార్య - - నా భర్త - నా పుత్రుల - నా గృహములు" ... అనునవన్నీ నిదుర నుంచి లేవగానే ఏమైపోతున్నాయో చెప్పు? స్వప్న సమయంలో ఆస్వప్నములోని పదార్ధములు, సంఘటనలు, వ్యక్తులు 'సత్యము' వలె తోచుచు, జాగ్రత్ వ్యవహారమంతా అసత్యమువలె, అస్థిత్వము లేనిదానివలె అనుభవమౌతోంది. అదేవిధంగా, ఈ జాగ్రత్తుకు వచ్చినప్పుడు (నిదురలేచినపుడు) స్వప్నములోని వ్యవహారమంతా భ్రమమాత్రంగా, అవాస్తవంగా తోచుచున్నది. కాని ఈ జాగ్రత్ వ్యవహారము మాత్రం జాగ్రత్ సమయంలో ఘనీభూతమై సత్యమైనదానివలె అనుభవించబడుతోంది.
ద్రష్ట
స్వకీయమైన కల్పన / భావన
జాగ్రత్ స్వప్నము సుషుప్తి / గాఢనిద్ర
దృశ్యము దృశ్యము మౌనము
స్వప్న సమయంలో ఈ జాగ్రత్ స్మృతులు లేకుండా (అవాస్తవమై) ఉంటున్నట్లే. జాగ్రత్ సమయంలో స్వప్నస్మృతులు అవాస్తవముగా, అస్థిత్వము లేనివిగా మిగిలి పోతున్నాయి కదా!
అదేవిధంగా "మేము విప్రదంపతులమై ఉండి ఉంటిమి కదా!" అను విషయజ్ఞానం ఈ “రాజు-రాజ్ఞి” జన్మలలో మీకు ప్రాప్తించటం లేదు. అది "స్వప్నతుల్యమాత్రంగా, భ్రమగా భావన కలిగియుండుటయే అందుకు కారణం. ప్రతి ప్రాణియొక్క పూర్వ జన్మానుభవం ఇట్లే ఉంటున్నది.
Page:261
అసలు, ఆ మాటకు వస్తే .... “మేము విప్ర దంపతులము” అనునది ఉల్లిపొరలవలె ఒకానొక స్వప్నతుల్యమే కదా! అనేక కెరటములలో నీరు మాత్రమే సత్యమై యున్నట్లు, మీ ఇరువురి యందు, నాయందు, సర్వులయందు గల “చిదాత్మ” మాత్రమే సత్యము.
1. ఒకడు తన స్వప్నములో జనులను, పదార్థములను దర్శించటం.
2. మరొకడు తన సంకల్ప ప్రపంచమందు 'నగరములు' మొదలైనవి పొందటం. 3. ఎడారిలో జలభావము కారణంగా నీటి కాలువలను (ఎండమావులను) గాంచటం. 4. ఆ బ్రాహ్మణుడు గృహాకాశంలో వన పర్వతాదులతో కూడిన పృథివిని చూడటం.
ఇవన్నీ ఒక తీరుగల విషయాలే అయివున్నాయి. ఒక చిన్న అద్దంలో పెద్దవస్తువులు, విశాలమైన దృశ్యము కనబడటంలేదా? కాని ఆ కనబడునది అవస్తువే అయివున్నది కదా! అదేవిధంగా సూక్ష్మమైన అంతఃకరణమున ప్రతిబింబించు విశాలజగత్తులు కూడా మిథ్యయే. అందులో కనబడే పృథివి మొదలైనవి కూడా మిథ్యయే. అవన్నీ సత్యస్వరూపమగు 'చిదాకాశము యొక్క - జలంలో ‘ప్రతిబింబాలు’ వంటి ప్రతిబింబ చమత్కారములు మాత్రమే.
దీనినిబట్టి నీవు గ్రహించవలసినదేమిటి?
"నిర్మలాకాశస్వరూపమగు పరబ్రహ్మమున అసత్యమగు ఈ సృష్టి సత్యమైనదానివలె ప్రతిభాసితమగుచున్నది” అని ఓ లీలాదేవీ! జగత్తునందు ఇంతకుమించి వాస్తవమగు సత్యమంటూ ఏదీలేదు. సర్వుల హృదయాంతర్గతమైనట్టి, 'చిదాత్మ' యొక్క అనుభవమే ... ఆరోపమాత్రమగు ఈ జగత్తునందు ప్రతిబింబిస్తోంది. ఎడారిలోని ఎండమావులలో నీరెక్కడిది? భావనామాత్రంచే ఏర్పడిన స్మృతి నుండి కథా సంఘటనలవలె జనించే ఈ "పృథివి, అనుభవములు, సంఘటనలు, సంబంధములు” .... మొదలైనవన్నీ సత్యమెట్లా అవుతాయి? ఈ నీ గృహము, ఈ గృహాకాశమున ఉన్న నీవు, నేను, తదితరములగు వస్తువులు ఇవన్నీ చిదాకాశమే గాని, మరింకేమి అయి ఉండలేదు. అయితే, చీకట్లో ఉన్న దానిని చూడటానికి దీపం సహకరిస్తున్నట్లు, ఇవన్నీ మనకు, "ఈ జగత్తు యొక్క మిథ్యాత్వం” అర్థం చేసుకోవటానికి ప్రమాణాలుగా, దృష్టాంతాలుగా సహకరిస్తున్నాయి.
“గిరి” గ్రామంలో గల ఆ ఇంటిలోని చిదాకాశమునందే ఆ విప్రుడు ఉన్నాడు. ఆ గృహాకాశంలోనే సముద్రములతో గూడిన పృథివి కూడా ఉన్నది. ఓ పుత్రికా! ఒక త్రసరేణువులో (పరమాణువులో) అనేక జగత్ సమూహములు అనుభవం కాగలవు. ఇక ఆ విప్రగృహంలో నగరములు, ఉపవనములు మొదలైనవి ఇమిడి ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? 'కల్పన' అనుదానికి అంతెక్కడ? అడ్డేముంటుంది? ‘చిన్మయ పరమాణువు’ అయినట్టి యీ 'మనస్సు’లోనే యీ జగత్తంతా ఉండివున్నదని నీవు ఎఱుగవా? ఇది అత్యంత సామాన్యమైన విషయమే. దీనిని గురించి నీవు యింతగా శంకిస్తున్నావేమిటి?
Page:262
8. కాల కల్పన
లీలాదేవి : ఓ పరమేశ్వరీ! ఇదంతా బాగానే ఉన్నది. కాని ఆ వసిష్ఠ నామధేయుడగు బ్రాహ్మణుడు మరణించి ఇప్పటికి ఎనిమిది రోజులు మాత్రమే అయినదని అన్నావు కదా! నేను నా భర్త ఇచట ఈ రాజ్యం పాలిస్తూ ఈ అంతఃపురంలో అనేక పదుల సంవత్సరములు గడిపామే! ఇదెట్లా సాధ్యం? ఈ విషయం మరికొంత నాకు సుస్పష్టం చేయి.
శ్రీ సరస్వతీదేవి : "ఈ స్థలము ఇక్కడ ఉన్నది" అను మాట ఆయా సరిహద్దు స్థలములను దృష్టిలో పెట్టుకొని మాత్రమే అనగలం. అంతేకాని స్థలమునకు స్వయంనిర్మితమైన నామరూపస్థితులు ఎక్కడ ఉన్నాయి? 'దేశము' అనబడుదాని విషయము కూడా అంతే. "ఇది ఈ పేరుగల దేశము, దీని సరిహద్దులు ఇవి. దీని ఆవల ఆ దేశమున్నది" అను కల్పనల చేతనే దేశము యొక్క ఉనికి అనుభవమౌతోంది. అంతేకాని, దేశమునకు స్వతఃసత్త ఎక్కడ ఉన్నది? అదేవిధంగా “కాలము” అనుదానికి కూడా స్వతఃసిద్ధ నిర్ణీతమైన కొలత లేదని గ్రహించు. (Time and distance are
relatively experienced. They do not have form and existence if relativity is removed or dropped). "ఈ 'జగత్సృష్టి' అంతా బ్రహ్మము నందే దర్శించబడుచున్నది” అని అనుకొన్నాము
కదా! అదే విధంగా “క్షణము-కల్పము” అనునట్టి కల్పనామయమగు కాలము కూడా “బ్రహ్మము” నందే అధ్యాసింపబడుచున్నది. అనగా .... “క్షణములు, సంవత్సరములు, యుగములు, కల్పములు, త్రిభువనములు, నీవు, నేను" మున్నగు వస్తువులన్నీ పరమాత్మయొక్క ప్రతిభాసలే అయివున్నాయి. అది ఎట్లో చెపుతాను. విను.
9. మిథ్యామోహ స్వీకారం
ఈ జీవుడు క్షణకాలంలో మిథ్యామోహమున పడి, తన ఇతఃపూర్వపు విశేషములన్నీ మరచి, “అన్యధా” గాంచుచున్నాడు. అదియే భౌతిక దృష్టిచే 'మరొక జన్మ' వలె తోచుచున్నది. స్వప్నంలో ప్రవేశించుచున్నప్పుడు ‘జాగృత్'ను క్షణంలో త్యజిస్తున్నాడు కదా! ఇది కూడా అట్టిదే.
శరీరమును ఆశ్రయిస్తున్నప్పుడు కూడా ఇతడు చిదాకాశమునందే చిదాకాశమే స్వరూపముగా కలిగినవాడై ఉంటున్నాడు. అయితే, మాయాబద్ధుడై ఉన్నప్పుడు అతని భావపరంపరలు ఇట్లు ఉంటున్నాయి.
“నేను ఈ పంచభూతాత్మికమైన వస్తుస్థితిపై ఆధారపడియున్నాను. ఇదియే నా రూపము. ఈ చేతులు కాళ్లతో కూడుకొనియున్న శరీరము నాది. నేను ఈ శరీరమున నిండి ఉన్నాను కాని, మరింకెక్కడా లేను. ఈ తండ్రికి కొడుకైనాను. క్రమంగా నాకు ఇంత వయస్సు గడచిపోయినది. ఈ బంధువులు అందరు నా వాళ్ళు. ఈ అందమైన ఇల్లు నాది. నేను పుట్టిన తరువాత బాల్యము
Page:263
గడిపాను. ఇప్పుడు యువకుడనయ్యాను. అది కూడా గడచిపోయి, ఇప్పుడు వృద్ధుడనయ్యాను. నా బంధుమిత్రులు ఇదివరకటిలాగానే ఉన్నారు.”
చూచావా లీలా? ఇట్టి భ్రమపూర్వకమైన జ్ఞానమంతా వచ్చిపడుతోంది. అయితే అట్టి జ్ఞానము యొక్క కారణము, అధిష్ఠానము (cause and substratum) కూడా చిదాకాశమే సుమా! అందుచేత ఈ ద్రష్ట దృశ్యములు, అనుభవజ్ఞుడు అనుభవములు (Experiencer - Experiences) అనునవి చిత్స్వభావములే కాని, వేరేవి కావు. చిదాకాశము (Zone of Consciousness / Awareness) కాకుండా ఇక్కడగాని, మరెక్కడాగాని మరింకేదీ లేనేలేదు.
ఈ జీవునియొక్క వాస్తవస్వరూపము 'చిత్-శక్తి'యే. సర్వవ్యాపియగు చితశక్తియే “నేను జీవుడను” అను రూపముగల స్వప్నమును గాంచుచున్నది. ఈ దృశ్యము - దర్శనముల స్వరూపమంతా అదియే. అందుచేతనే అసత్యములగు ఈ లోకములన్నీ సత్యములవలె కనబడుచున్నాయి. నీటికి-కెరటములకు భేదమేమున్నది చెప్పు? ఇహలోక పరలోక - స్వప్నములకు భేదమేమి ఉండదు. ఇహలోకము కూడా ఇతఃపూర్వమునకు పరలోకమే కదా! అసలు 'భేదబుద్ధి’ అనునది భ్రమనుండే కలుగుచున్నది. “జగత్ - - భావము” అనునది భ్రమయొక్క పరిణామమే. అనగా, ‘జగత్తు అనబడుదానికి అస్థిత్వమే లేదు. భ్రమను ఆశ్రయించియున్నది వాస్తవమెట్లా అవుతుంది? ఆ కారణంగా "ఈ జగత్తు పుట్టుకయే లేనిది" అని చెప్పబడింది. పుట్టుకయే లేనప్పుడు ఈ దృశ్య జగదత్వమునకు నశించటం మాత్రం ఎక్కడ ఉంటుంది?
ఓ లీలా! ఈ ప్రతిభాతమగుచున్నదంతా, లేక, మనస్సుచే జగత్తుగా చూడబడు చున్నదంతా "చిత్తు (consciousness) కాక మరొకటేదీ కాదు సుమా! ఇదంతా సర్వదా ఆకాశస్వరూపమే. దృశ్యములన్నీ ఈ చిత్తునందే ఆరోపించబడుచున్నాయి. ఒకడు చీకట్లో మెలితిరిగి పడియున్న త్రాడును చూచి 'పాము' అని భ్రమించటం ఎట్టిదో - - ఈ జగదృశ్యము కూడా అట్టిది మాత్రమే. ఎందుకంటావా? ఈ దృశ్యములకు ద్రష్ట కన్న వేరైన 'సత్త' లేనేలేదు. 'తరంగములు' అని మనం చెప్పుకునేదంతా జలము అయివున్నది కదా! ఆరోపితమాత్రమైన ఈ సృష్టి (Superimposed one) కూడా చిదాకాశము కంటే వేరేమికాదు. “నీటి నుండి తరంగములు వేరైనవా?” అని ఎవరు విమర్శించి పరీక్షిస్తారో వారికి "తరంగభావము మిథ్య” అని తెలియవచ్చుచున్నది. అదేవిధంగా జ్ఞానదృష్టితో ఈ సర్వము పరీక్షించినవారికి మాత్రమే "చిదాకాశమునకు వేరుగా సృష్టి లేదు” అని తెలియవచ్చుచున్నది. ఒకవేళ వేరుసృష్టి కనబడుతుంటే, అది “అవిచారణ, వ్యతిరిక్తమైన అభ్యాసము”ల చేత మాత్రమే. అందుచేత పుత్రీ! చిదాకాశమే స్వప్రకాశంచేత జగదాకారముగా కనబడుచున్నదని గ్రహించు. ఈ విధంగా 'దృశ్యపదార్థము' అనునదే మిథ్య (లేనిది) కాబట్టి, “ద్రష్ట - దృశ్యబోధ” అనునవి కూడా మిథ్యయే.”
Page:264
10. “మరణము పొందటం" అనగా?
ఈ ప్రాణి (లేక జీవుడు) 'మరణము' అనునది పొందటం మనం చూస్తూనే ఉన్నాము కదా! అట్టి సమయంలో నశించుచున్నదేమిటి? ఈ స్థూలశరీరము మాత్రమే నేలకూలుచున్నది. అనేక భావములు, ఆర్తులు, అభిప్రాయములు, కోరికలు, అభిరుచులు, ఉబలాటములు మొదలైనవన్నీ తన రూపముగా గల “సూక్ష్మదేహము” (ఆతివాహిక శరీరము లేక Subtle body) యథాతథంగా ఉండనే ఉంటుంది. అందుకు దృష్టాంతము గాఢనిద్రయే. గాఢనిద్రాసమయంలో మనోగతమైనదంతా అప్రకటితంగాను, జడంగాను ఉంటోంది. అంతేగాని, లేకుండా పోవుటలేదు కదా!
అట్టి సూక్ష్మ శరీరము ఉన్నంతవరకు మోహము ఎక్కడికీ పోదు. అది మరలమరల వచ్చి పడుతూనే ఉంటుంది. మోహము వికసించగానే మరల దృశ్యమునకు చెందిన అనుభవము స్వభావసిద్ధంగా ప్రాప్తిస్తూనే ఉంటుంది. అనగా, అద్దములో ప్రతిబింబము లాగా ఆత్మయందు జగత్తు ప్రతిభాసితమౌతూనే ఉంటుంది. అయితే దృశ్యములోని మార్పు - చేర్పులు, అది ప్రతిబింబించే అద్దమునకు ఏమాత్రం సంబంధించి ఉండదు కదా! ఆత్మయందు ప్రతిభాతమయ్యే జగదనుభవము ఆత్మకు ఏమాత్రం మార్పుచేర్పులు కల్పించటం లేదని గ్రహించు.
జీవ చైతన్యము - సూక్ష్మ దేహము - - స్థూల శరీరము :
అతని జీవచైతన్యమునకు (లేక శుద్ధ-స్వస్వరూపమునకు) 'మృత్యువు' అనునది ఉండదు. అనగా మననమే స్వరూపముగా గలిగినట్టి సూక్ష్మదేహము ఎవరి కర్తృత్వమైయున్నదో అట్టి 'చిదాత్మ’కు పుట్టుకలుండవు. ఈ జీవుని వాస్తవ స్వరూపము అట్టి చిదాత్మయేగాని, ఈ సూక్ష్మ-స్థూలదేహములు కావు సుమా! 'మృత్యువు' అనునది పాంచభౌతిక దేహమునకు మాత్రమే పరిమితము. అద్దంలో ప్రతిబింబములాగా అతని చైతన్యము నందు ప్రతిబింబించేదంతా శరీరము ఉన్నప్పుడూ - లేనప్పుడూ కూడా ఇంతకుముందటి స్మృతి లేక జ్ఞానమునకు అనుసరించే ఉంటోంది. అనగా, మరల శరీరము ధరించిన ఈ జీవుడు తాను ఇంతకు ముందు గాంచిన "కాలము ఆరంభము - క్రమము - జగత్తు - తల్లి - తండ్రి - వయస్సు - - జ్ఞానము బంధువులు
భృత్యులు - యత్నములు - స్థానములు - క్షయము" మొదలైనవాటిని చిదాకాశము నందు గాంచుచున్నాడు. అట్లు ఎరుగుట అతని స్వభావం. "నేను జన్మించాను. వీరు నా తల్లిదండ్రులు. ఇప్పుడు నేను బాలుడను" అనునదంతా పూర్వస్మృతి బలంచేతనే కలుగుతోంది. క్రమంగా దేశ-కాలముల బోధకూడా ఏర్పడుతోంది. పువ్వు నుండి కాయ - పండు లాగా అవన్నీ రూపుదిద్దుకుంటున్నాయి.
అట్టి సమయంలో అతడు 'ఒక్క క్షణం'లో 'కల్పము' అంతటి కాలమును కూడా అనుభవించగలడు. “స్వల్పకాలంలో దీర్ఘకాలము యొక్క అనుభవం” .... అనుదానికి అనేక దృష్టాంతాలు మనకు లభిస్తున్నాయి. 'హరిశ్చంద్రుడు' అను ఒక మహారాజు ఒక్కరాత్రిలో పండ్రెండు సంవత్సరముల కాలమును అనుభవించియున్నాడు. ఒకడు అత్యంత విరహముతో బాధ
Page:265
పడుచున్నప్పుడు ఒక్కరోజు కాలం అత్యంత దీర్ఘంగా అనుభవమవుతూ ఉంటుంది కదా! బాగా ఆకలిచే బాధపడువానికి ఆయా జడాకారములు ఆహారపదార్థాలవలె గోచరిస్తూ ఉంటాయి. ఈ జీవచైతన్యమునకు కూడా, “నేను జన్మించాను. మరణించాను. నా తల్లి, నా తండ్రి, నా బంధువులు” అనునట్టి బుద్ధి కలుగుచున్నది. ఇక అతడు అప్పుడు శూన్యస్థానములో జనసమూహమును దర్శిస్తాడు. విపత్తు ఉత్సవంలాగా ఉంటుంది. వంచన లాభంవలె తోస్తుంది. ఈ బుద్ధి యొక్క కల్పనకు అంతు ఎక్కడిది? అర్ధమేమున్నది?
ఇది ఇట్లుండగా, మరొక విషయం చెపుతాను విను. మిరియపుగింజలో 'కారం' బైటకు అగుపడకుండానే ఉంటుంది. ఒక శిలయందు శిల్పము చెక్కబడకపోయిన సమయంలో కూడా “శిల్పత్వము” ఉండే ఉంటుంది. శిల్పి ఆ శిలయందు శిల్పము చెక్కుచున్నప్పుడు బైటనుండి ఏదీ తెచ్చి అందు ఉంచుట లేదుకదా? "భ్రమ మయమైనట్టి ఈ జగత్తు ఉన్నది ఎక్కడ?” అనే ప్రశ్నకు
సమాధానం విను :
"భ్రమాత్మకమగు ఈ దృశ్యజగత్తంతా మరెక్కడా లేదు. ఇదంతా జన్మరహితుడు, నిత్యుడు అయినట్టి ఆ పరమపురుషుని ఆశ్రయించుకొనే ఉన్నది. అంతేకాని దీనికి స్వకీయమైన 'సత్త' లేదు. ఈ జీవుడు స్వతహాగా ఆ పరమపురుషుడే సర్వదా అయివున్నాడు?”
11. ఇదంతా స్వకీయ కల్పనయే!
ఓ లీలా! శ్రద్ధగా వింటున్నావు కదా! ఇందుకు... ప్రతిరోజు, ప్రతిక్షణం, ప్రతి ఒక్కరికి అనుభవమగుచుండే ఒక చిన్న దృష్టాంతము నీ అవగాహన కొరకు చెపుతాను, విను. "కళ్ళు మూసుకున్నప్పుడు ఏ రూపములు కనుపించవు. కాని, కళ్ళు తెరిచి చూచినప్పుడో నానావిధ రూపములు కనిపిస్తాయి కదా! అదేవిధంగా ద్రష్టయందు 'జ్ఞానదృష్టి బలవత్తరమైనప్పుడు, “నానా రూపములుగా కనిపించేవన్నీ నానావిధములు కావు” అనునట్టి అంతర్గతమైన దృష్టి లేక అవగాహన తప్పకుండా సుసాధ్యమే. అజ్ఞాన దృష్టికి మాత్రం ఇవన్నీ పూర్తిగా మరొక విధంగా అనుభవమౌతున్నాయి.
ఈ జీవుడు మృతి పొందిన వెంటనే (శరీరము నేలకూలిన వెంటనే అతనికి అసంఖ్యాకములగు దృశ్యజగత్తులు కనిపిస్తున్నాయి. ఈ దిక్కులు, కాలము, ఆకాశము, ధర్మము, కర్మలు ఇవన్నీ కల్పాంతము వరకు స్థిరముగా ఉండే వస్తువులే సుమా! ఇవన్నీ చిదాకాశములోనే ప్రస్ఫుటమౌతున్నాయి. చిదాకాశమునకు ఆద్యంతాలు ఎక్కడ? కల్పన ఉన్నంతవరకు జగద్వ్యవహారము ఉంటుంది. కల్పన తొలగితే ఏమీ ఉండదు. కల్పన లేనట్టి స్థితినే “కల్పాంతము” అని పిలుస్తున్నాము.
Page:266
‘స్మృతి' (జ్ఞాపకము) అనుదానినుండి ఉద్భవిస్తున్న ఈ 'స్మరణము' అనునది అత్యంత విచిత్రమైనది. స్వప్నంలో అంతకుముందు అనుకోనివి, చూడనివి, కోరనివి కూడా స్మరణకు వస్తాయి కదా! అదేవిధంగా ఈ జీవుడు అంతకుముందు గాంచనట్టి, ఒనర్చనట్టి విషయములు కూడా మరణానంతరం స్మరణకు వస్తున్నాయి. అయితే ఈ స్మరణ అంతా అతని అంతరంగమున గల సంస్కారమునకు వేరుగా ఉండినది కాదు. మనస్సుచే కల్పించబడి గాంచబడు ఊహానగరమునకు మూలమంటూ ఏదీ లేనట్లే, ఈ భ్రాంతికి కూడా మూలమంటూ ఏదీ లేదు. ఇదంతా వెలిసి ఉండేది చిదాకాశమునందే కదా! భ్రాంతియే పూర్వస్మృతిని ఆధారంగా చేసుకొని, “ఇది జగత్తు - ఇది సృష్టి', 'ఇది దూరము - ఇది దగ్గర', 'ఇది క్షణము - - ఇది యుగము', 'ఇది స్వల్పము - ఇది దీర్ఘము’ ” అను రూపములుగా ముందుముందు భ్రమలన్నీ కల్పించుకొనుచున్నది.
‘చిద్రూపము' ఒక్కటే కారణరహితమైనది. తదితరములన్నీ కల్పన యొక్క ప్రభావమే అయివున్నది. ఆ కల్పనకు కారణం చిద్రూపమే. స్వప్నంలో కనబడే వస్తువులు, వ్యక్తులు ఏమి అయివున్నాయి? అక్కడ అనుభూతమయ్యేదంతా స్మృతి యొక్క కల్పనయే కదా! తండ్రివలె ఉన్నవానిని చూచినప్పుడు తండ్రి గుర్తుకు వచ్చినట్లు. ఆయా నూతన వస్తువులు తారసపడినప్పుడు అంతరంగమున నూతనానుభవములు ఉద్భవించి బహిర్గతం అవుతున్నాయి. ఇట్లు జ్ఞప్తి రెండు విధాలుగా వర్తిస్తోంది. 1. స్మృతి 2. సంస్కారము
ఈ రెండు కూడా, నిశితంగా, పరిశీలించినప్పుడు, "ఈ రెండూ చిదాకాశము కంటే వేరు కాదు” అని తెలియవచ్చుచున్నది.
స్మృతి - ముక్తి :
ఓ లీలా! సంకల్పమయమగు ఈ సంసారమంతా కూడా సృష్టికాలంలో విధాత (లేక ‘బ్రహ్మదేవుడు’ లేక 'సమష్టి-సృష్టికర్త') యొక్క కల్పన యందే ఇమిడివున్నది. ఆ తరువాత స్థూలమగుచు క్రమముగా ఈ విస్తారమైన రూపమును దాల్చుచున్నది. కొందరు ఈ జగదృశ్యమును ఒకానొక బాహ్యమైనదానివలె గాంచుచున్నారు. మరికొందరు ఇదంతా తమ స్మృతియందే అనుభవమాత్రమై ఉండి ఉండుటను గమనించుచున్నారు. మరికొందరికి కాకతాళీయంగా స్మరణలేకుండానే ఇది అనుభవమునకు వస్తోంది.
ఈ సంసారవ్యవహారం ఈ విధంగా 'స్మృతి' చేతనే నిర్వచించబడుచు, స్మృతికి అందనిదై ప్రవర్తిస్తోంది కదా! అయితే జ్ఞానులు “ముక్తి” అనబడు మరొక స్థితిని మనందరికి ప్రతిపాదిస్తున్నారు. ‘ముక్తి' అంటే ఏమిటి? ఈ సంసారము సంపూర్ణముగా విస్మరించబడుటయే సుమా! “ఈ సంసారము నందు నాకు కోర తగినది గాని, నిరాకరించ తగినదిగాని ఏదీ లేదు” అనునట్టి భావము సుస్థిరముగా యుండుటే “ముక్తి”. ఈ 'అహం' అను జ్ఞానము దానిని అనుసరించియున్న దృశ్య జగత్తు అభావాన్నొందినప్పుడు మాత్రమే ‘ముక్తి' అనునది బోధపడగలదు. “అహం-దృశ్యము”లు అంగీకరించబడినంతకాలం ఈ జన్మ-కర్మలు, అనుబంధ బాంధవ్యములు ఉంటూనే ఉంటాయి.
Page:267
అనగా దృశ్య పరంపరలు ఒకదానివెనుక ఒకటి వచ్చిపోతూనే ఉంటాయి. అవి జీవుని ప్రభావితం చేస్తూ, పోతూ ఉంటాయి. చీకట్లో మెలికలు తిరిగి ఉండియున్న త్రాటియందు, “ఇది పాము” అనునట్టి “శబ్దము- దాని అర్థము” తొలగనంతవరకు సర్పము యొక్క భయం తొలగేదెట్లా?
ప్రయత్నపూర్వకమైన చిత్రనిరోధము :
"ఈ దృశ్యమును మరచిపోతాను. అట్లు మరచుటచే త్యజించివేస్తాను. దీనిని 'తిరస్కరించటం' అనునట్టి యోగమును ఆశ్రయిస్తాను” అని కొందరు యోగముచే చిత్తమును నిరోధింప ప్రయత్నిస్తున్నారు. అయితే అట్టి 'చిత్త-నిరోధము' అను బలవత్తర ప్రయత్నముచే కొద్దిసేపు శాంతి, ఉపశమనము లభించినప్పటికీ, అది నిజమైన, శాశ్వతమైన శాంతి కాదు. ఆ 'యోగము' భంగమైనప్పుడు మరల, మరుక్షణం, 'సంసృతి' లేక 'సంసారము' వచ్చిపడుతోంది. ఒక దయ్యం వదలి మరొక దయ్యం పట్టుకొంటే లాభమేమున్నది? అందుచేత లీలా! నీవు జ్ఞానదృష్టిని అలవరచుకో. 'జ్ఞానదృష్టి' అంటే ఏమిటి? :
"ఈ దృశ్యము ఇట్లు ఉన్నప్పటికీ, ఇది సత్యము కాదు. ఇందు కనబడే అనేకత్వము వాస్తవము కాదు. అద్వితీయమగు చైతన్యమే ఇట్లు “నేను-నీవు-దృశ్యము”గా స్వకీయమైన మాయచే ప్రవర్తించుచున్నది. “ఇందలి చిదాకాశస్వరూపమగు ఆత్మ తత్త్వమును దృష్టియందు ఉంచుకొని, ఆపై ఇక, ఏది ఎట్లో అట్లే ఆచరించెదనుగాక!” అనునదే జ్ఞానదృష్టి.
ఏది - 'భ్రమ’ అయివున్నదో ... అది భ్రమగాను, ఏది - సత్యమైయున్నదో ... అది సర్వదా, సర్వత్రా, సర్వవేళల కార్య - కారణ రహితముగాను దర్శించుము. అప్పుడు నీకీ జాడ్యము తొలగిపోయి మావలెనే 'ముక్తస్థితి’ని అనుభవించగలవు. తత్త్వజ్ఞానమే ముక్తికి కారణం అవుతోంది. జ్ఞానము లభించినప్పుడు, “ఈ సంసారము బ్రహ్మమే అయివున్నది. ఈ ద్రష్ట - దర్శన - దృశ్యములందలి సారవస్తువు బ్రహ్మమే" అను బోధ కలుగుతోంది. నిద్రలేచిన వానిని కలలో చూడబడిన 'పులి’ ఏమి చేయగలదు చెప్పు? ఈ సంసారముకూడా, నీవు జ్ఞానివైనప్పుడు, నిన్ను ఏమాత్రం స్పృశించలేదు. దుఃఖింపజేయలేదు.
12. స్మృతికి ముందే ఉన్నదేది?
లీల : అమ్మా! నీవు చెప్పుదానిని అనుసరించి సృష్టికి పూర్వసంస్కారమే కారణమని గ్రహించు చున్నాను. అయితే ఒక ప్రశ్న. “అరుంధతి - వసిష్ఠులు” అనబడే ఈ బ్రాహ్మణ దంపతుల సృష్టికి కారణమగు అంతకుముందటి సంస్కారాలు నాకు ఎక్కడినుండి వచ్చాయి? నేను ఎప్పుడూ అవి అనుభవించినట్లే లేదేమిటి?
శ్రీ సరస్వతీదేవి : మెళుకువ రాగానే స్వప్న వృత్తాంతాలన్నీ త్యజించబడుచున్నట్లు, నూతన దేహసందర్శముచే పూర్వ-తత్పూర్య దేహ వ్యవహారాదులు స్వప్నమాత్రానుభవత్వం సంతరించు
Page:268
కుంటున్నాయి. 'మృతి' అనబడు శరీరత్యాజ్యము తరువాత దృశ్యము అగుపడుటకు కారణం ద్రష్ట యొక్క స్మృతియే కదా! అసలు ఆ 'స్మృతి' అనబడుదానికి ప్రారంభము ఎక్కడ? స్మృతికి ముందు ఉన్నదేది? "స్మృతికి ముందు ఏదీ లేదు. లేక శూన్యము ఉంటుంది?” అను అభిప్రాయం సరికాదు. శూన్యములో నుండి స్మృతి ఎట్లా వస్తుంది? "ఏదీ లేనట్టి శూన్య ప్రదేశంలో, లేదా, శూన్యాకాశంలో బంగారు సంచులు లభించాయి” అనునది ఎంతటి అసమంజసమైన విషయం?
స్మృతికి కూడా ముందు ఆ స్మరణమునకు 'కర్త' అయినట్టి నీవు ఉండనే ఉండాలి. నీవు ఉన్నావు కనుకనే 'స్మృతి' అనునది ఉంటుంది. అట్టి నీ శుద్ధ స్వరూపమే. (స్మరణమునకు ఆవల ఉన్న శుద్ధ చైతన్యమే) పరమాత్మయొక్క స్వరూపము.
సరే! ఇప్పుడు ప్రథమ జీవుడగుబ్రహ్మదేవుని గురించి శాస్త్రములు ఎట్లు విశద పరుస్తున్నాయో చెపుతాను. విను. ఇది వింటే నీ సందేహాలన్నీ తొలగుతాయి.
‘స్మృతి'కి ఆవల ఉన్నది ముక్త స్వరూపము. బ్రహ్మ స్వతహాగానే ముక్తజీవుడు. ఎవడు ముక్తుడో అతడు తన స్వతత్త్వమునందు సుస్థిరుడై ఉంటాడు. అందుచేత బ్రహ్మకు 'పూర్వస్మృతి' అనే ప్రసక్తి ఉండదు. సృష్టికర్త. సమష్టిజీవుడు, చిత్తాకాశస్వరూపుడు (cosmic mind process) అగు బ్రహ్మ యొక్క కల్పనయే ఈ జీవుడు కదా! అట్టి ఈ జీవుని యొక్క ఈ 'జగత్' సృష్టికి కారణం ‘స్మృతి’ అనటానికి వీలులేదు. కనుక ఇక్కడ సిద్ధాంతీకరించబడిన విధం విను.
వ్యష్టిజీవుడు : ఒకానొక ఉపాధికి సంబంధించిన ద్రష్టత్వము - కర్తృత్వము.
సమష్టి - - జీవుడు లేక ప్రజాపతి : పునర్జన్మ పరంపరల రూపంగా ఏర్పడి ఉంటున్న అనేక ఉపాధులలోని ద్రష్టత్వము - కర్తృత్వము.
అనేక జన్మలలోని వాడు, ఒక జన్మలోని వాడు ఒక్కడే అయివున్నాడు కదా! కాబట్టి ఆ
ఇరువురు ఒక్కటే.
ఒక ప్రజాపతి (సమష్టి జీవుడు) నుండి మాయయొక్క సంపర్కముచే మరొక ప్రజాపతి ఉదయిస్తూ సృష్టిని దర్శించటం జరుగుతోంది. ఒకే ద్రష్ట వేరువేరు సందర్భములలో అనుభవం స్వీకరించుచున్నాడు.
ఇది ఇట్లుండగా, జన్మలు అంగీకరించుచున్న “ప్రజాపతి” నుండి ఉద్భవించుచున్న ప్రజాపతులలో కొందరికి కాకతాళీయంగా 'పూర్వస్మృతి'తో కూడిన ప్రతిభ వికసిస్తోంది.
సృష్టులన్నీ చైతన్యాకాశంలో ఉదయించి కనబడుచున్నాయి. వాస్తవానికి ఈ సృష్టులన్నీ సంకల్పమాత్రములే కనుక, మిథ్యారూపములే. సంకల్పమున్నచోటే స్మృతి సంస్కారములు కూడా ఉంటాయి. “సంకల్పమునకు ముందు ఉండక - సంకల్ప సమయంలో ఉన్నట్లు తోచుచు
Page:269
సంకల్పము తొలగినప్పుడు తాము కూడా తొలగుచుండే ఈ సృష్టులు ఏ సమయమందును ఉదయించి ఉండలేదు”... అనునది ఇక్కడ సిద్దాంతము. ఓ లీలా! నేను చెప్పుచున్నది కొంచెం సూక్ష్మదృష్టితో యోచించు. సంకల్పముచేత జనించి, ఆ సంకల్పము లయించినప్పుడు లేనట్లు అనుభూతమయ్యేది .... ఎప్పుడు ఉదయించినట్లు? ఎప్పుడు అస్తమించినట్లు? కనుక “నా సృష్టిని నేనే నా 'సంకల్పములు’ అను ప్రక్రియచే సృష్టించుకొనుచున్నాను. నేను సంకల్పములు త్యజించినప్పుడు నా శుద్ధతత్వమే శేషించుచున్నది. సృష్టికి అతీతమై వెలుగుచున్నట్టి చిత్ చైతన్యమే 'పరమాత్మ' అను శబ్దముయొక్క అర్థము” అని గ్రహించు. అదే పరబ్రహ్మము.
బ్రహ్మకు కలిగే “పూర్వ-అపూర్వ" స్మృతులకు కారణం పరబ్రహ్మమే. అనగా పరబ్రహ్మమే కార్య-కారణస్వరూపమై చిదాకాశమున వెలయుచున్నది. కార్యకారణముల అభేదజ్ఞానమే ముక్తి. “అట్టి అభేదజ్ఞానము సుస్థిరం కానంతవరకు ముక్తి లభించునది కాదు” ... అని ముక్త స్వరూపులమగు మేము అనుభవపూర్వకంగా గ్రహించి, ప్రకటిస్తున్నాము. అందువల్ల 'పూర్వస్మృతి' అనునది కూడా “అఖండచిన్మయము” నకు వేరైనది కాదని గ్రహించు. అగ్ని-ఉష్ణము ఆకాశము-శూన్యమువలె కార్యము - కారణము (Effect-Cause) అనునవి శబ్దము నందే భేదము కలిగివున్నాయి గాని, అర్థము నందు కాదు. ఆ రెండింటికి భిన్నమైన సత్త లేదు. అందుచేతనే, “నాయనలారా! 'జగత్' అనబడు దృశ్యము ఏమాత్రము ఉత్పన్నమగుట లేదు. 'బ్రహ్మసత్త’నే నీవు నీ స్వకీయ కల్పనారచనచే ఇట్లు జగత్తుగా దర్శించుచున్నావు” ... అని గురువులు లోకములకు బోధిస్తున్నారు. “తత్త్వమ్” (“తత్ = అదియే, త్వమ్ = నీవు అయిఉన్నావు") అను మహావాక్యము యొక్క గూడార్థము ఇదే కదా! కేవల పరబ్రహ్మస్వరూపమగు చిదాకాశముననే సర్వము వెలయుచున్నదని గ్రహించు.
13. అన్య జగత్తులను ఎందుచేత చూడలేకపోతున్నాం?
లీల : హే జగజ్జననీ! మాతా! నీవు ఈ రోజు నీ వాక్యపరంపరలచే నాకు దివ్యమైన దృష్టిని ప్రసాదిస్తున్నావు. సూర్యుడు ఉదయించగానే సర్వము చూడబడునట్లు, నేను పరమజ్ఞానమును నీ ప్రసాదముచే పొందుచున్నాను.
హే లోకపావనీ! సత్యస్వరూపిణియగు నీవు సర్వదా సత్యమునే ప్రకటిస్తావు. అయినప్పటికీఅ , ఇతఃపూర్వపు సంస్కారములచేత కాబోలు, నాలో కించిత్ శంక, కుతూహలము మిగిలియే ఉంటున్నాయి. నీకు అభ్యంతరం లేకుంటే, నన్ను ఆ 'గిరి' గ్రామమున గల అరుంధతి - వసిష్ఠులు నివసించిన గృహమునకు తీసుకొని వెళ్ళు.
శ్రీ సరస్వతీదేవి : సరే. అట్లే అగుగాక. అయితే నీవు మొట్టమొదట సమాధిని ఆశ్రయించి, అట్టి సమాధియొక్క ప్రభావంచేత స్థూలదేహమును పరిత్యజించాలి. “అచేత్య (భౌతిక దృష్టిచే తెలియబడు దానికంతటికీ అతీతమైన) చిద్రూపమైనట్టి నేను చిత్రచైతన్యమును” అనునట్టి పవిత్రదృష్టిని అవలంబించి,
Page:270
మావలెనే పవిత్రురాలవు కమ్ము. అప్పుడు నీవు ఆకాశస్వరూపమగు సృష్టిని గాంచగలవు. ఈ నీ స్థూలదేహభావము ఆ సృష్టి దర్శనమునకు ప్రతిబంధకమైయున్నది సుమా! అందుచేత ఇప్పుడు “నేను చిదాకాశ స్వరూపమును” అను జ్ఞానదృష్టిని అవలంబించు.
లీల : దేవీ! ఈ భౌతిక దేహభావోద్రేకం ఉన్నంతవరకు అన్యజగత్తును ఎందుకు చూడలేము? దానికి కారణమేమిటి? నాపై కనికరంతో ముందుగా ఈ విషయం వివరించి చెప్పు.
శ్రీ సరస్వతీదేవి : వాస్తవానికి ఈ దృశ్యజగత్తు ఆకృతిరహితమైనది. అయితే మిథ్యా జ్ఞానవశం చేత ఆకృతి ఉన్నట్లు అగుపడుచున్నది. దృష్టాంతానికి ... “బంగారపు ఉంగరం" అను దానిలో ఉన్నదంతా బంగారమే కదా! కాని ‘ఉంగరం' అను శబ్దంతో పిలుస్తున్నాం. బంగారంలో ఉంగరం ఉన్నదా? మరి ఉంగరం ఉన్నది దేనిలో? ఉంగరము అనునది ఆకారమే కదా! ఆ ఆకారము బంగారమునకు వేరైనది కాదుకదా! అట్లాగే ఈ దృశ్యజగత్తు కూడా పరమాత్మకంటే వేరైన సత్త లేదు. అందుచేతనే ఇది “మిథ్య” అని అనిపించుకొనుచున్నది.
ఈ జగదాకాశము బ్రహ్మము కంటే వేరు కాదు. తటాకంలోని జలంలో (పైనున్న) ఆకాశం లేకపోయినప్పటికీ, ప్రతిబింబిత కారణంగా ఆ నిశ్చల-జలంలో "మేఘావృతమైన ఆకాశం” కనబడుతోంది కదా! నిరాకారమగు బ్రహ్మమునందు మిథ్యయగు జగత్తు యొక్క ఆకృతి అట్లే తోచుచున్నది.
అయం ప్రపంచో మిథ్యైవ సత్యం బ్రహ్మా హమద్వయమ్ | అత్రప్రమాణమ్ వేదాంతా గురువో నుభవస్తథా || (XXI.35)
"ఈ ప్రపంచమంతా మిథ్యయే. నేనే బ్రహ్మమును" అను జ్ఞానమొక్కటే సర్వవేళల సత్యమైయున్నది. “బ్రహ్మము నాకంటే వేరైనది కాదు" అనునదే ఉత్తమ జ్ఞానము. ఈ విషయంలో శాస్త్రమహావాక్యములే (“అహం బ్రహ్మాస్మి", "జీవోబ్రహ్మేతి నాపరః”, “అయమాత్మా బ్రహ్మమ్”, “సోహం”, “తత్త్వమ్” మొదలైనవి) ప్రమాణాలు. 'స్వవిచారణ' అను ప్రయత్నముతో కూడుకొనిన మహనీయులగు గురువుల స్వానుభవమే, మరియు ఆత్మానుభవమే ప్రమాణం.
"బ్రహ్మైవ పశ్యతి బ్రహ్మ, నాం బ్రహ్మ బ్రహ్మపశ్యతి|
సర్గాదినామ్నా ప్రథితః స్వభావో అస్యైవచేదృశః॥ (XXI.36)
బ్రహ్మమే బ్రహ్మమును గాంచగలదు. బ్రహ్మము కానిది బ్రహ్మమును దర్శించగలదా? లేదు. ఆ బ్రహ్మమే జగత్తును కల్పించి జగత్తు అను పేరుచే తానే వ్యవహరించుచున్నది. అట్లు “కల్పించుట-దర్శించుట-అగుట” బ్రహ్మము యొక్క స్వభావమైయున్నది. అయితే బ్రహ్మము నందు జగత్తుయొక్క కారణముగాని, కార్యముగాని లేవు. ఎట్టి బాహ్యమైన సహకారి కారణములు కూడాలేవు. బ్రహ్మము విశుద్ధమైనది. బ్రహ్మమే తన స్వకీయమైన అభ్యాసంచేత జగత్తును గాంచుచున్నది. అందుచేత, మరల అభ్యాసవశం చేతనే భేదజ్ఞానం తొలగుతోంది. భేదజ్ఞానము
Page:271
తొలగనంతవరకు ఏ ఒక్కరు బ్రహ్మ స్వరూపమును పొందలేరు. అనగా - బ్రహ్మదర్శనం కావాలంటే భేదజ్ఞానం తొలగటం ఒక్కటే ఉపాయం. అట్టి లక్ష్యము సాధించు నిమిత్తమే చెప్పబడిన - చెప్పబడ బోవుచున్న శాస్త్ర - - విధి విధి - - నియమాదులన్నీ ఉన్నాయి. ఓ లీలా! నీవు బ్రహ్మము విషయమై అభ్యాసబలంచేత దృఢజ్ఞానం సంపాదించాలి. అప్పుడు మాత్రమే ఆ పరమపదమును దర్శించు అధికారం లభిస్తుంది. నీచే చూడబడుచున్న ఈ నా భౌతిక శరీరము కూడా సంకల్పనగరమువలె ఆకాశస్వరూపమే. అట్టి ఎరుక చేతనే నేను దీనియందు కూడా బ్రహ్మపదమును గాంచగలుగుచున్నాను. లీల : ఓ జగదీశ్వరీ! 'సమాధి' మొదలైన ఉపాయముల ద్వారా ఆతివాహికజ్ఞానం (Subtle consciousness) దృఢమైనదనుకో.... అప్పుడు ఈ శరీరం ఏ స్థితిలో ఉంటుంది? ఇది నశిస్తుందా? నశించకుండా ఇట్లాగే ఉంటుందా?
శ్రీ సరస్వతీదేవి : నీ ప్రశ్నకొంత అసంగతమైనదనే చెప్పాలి. ఎందుకంటావా? ఉన్న వస్తువుకు మాత్రమే క్షీణించటం-నశించటం వంటివి ఉంటాయి. అసద్వస్తువు స్వతహాగా లేనట్టిది. ఇక ఉద్భవించటమేమిటి? క్షీణించటమేమిటి? నశించటమేమిటి? చీకట్లో 'త్రాడు'ను చూచి 'పాము' అని భ్రమించావనుకో ... అప్పుడు ఒక దీపం తెచ్చి ఆ వెలుతురులో పరీక్షగా చూచినప్పుడు “ఇది త్రాడు మాత్రమే” అని తెలిసిపోతుంది కదా! భ్రమ తొలగిపోయింది. అప్పుడు, సర్పము ఏమైనది? చచ్చినదా? అసలు అట్టి ప్రశ్న ఎక్కడ ఉంటుంది? సత్యజ్ఞానం కలిగిన తరువాత 'త్రాడు'నందు పాము కనిపించదు కదా! ఆతివాహిక భావము (సూక్ష్మతత్త్వము) గ్రాహ్యమైన తరువాత ఆధిభౌతిక భావమే తొలగిపోతుంది. అనగా "నేను రక్త మాంసమయమైనట్టి ఈ భౌతిక దేహమును” అను భావమునకు చోటు ఉండదు. “ఈ శరీరము యొక్క పెరుగుదల - - తరుగుదలలకు, ఉత్పత్తి - వినాశనములకు నాకేమీ సంబంధము లేదు” అనునట్టి నూతన జ్ఞానానుభవం ఉదయిస్తోంది.
“కల్పన”యే సర్వభ్రమలకు కారణం. అయితే, ఈ కల్పన కల్పిస్తున్నవారెవరు? ఎవరో బాహ్యము నుండి కల్పించుచుండటం జరుగుతుంటే, బాహ్యమైన ఉపాయాల కొరకు వెతుకవచ్చు. అది ద్రష్టయే తనకు తాను కల్పించుకొనుచున్నాడు. స్వప్నములోని శిల ‘లేనిదే’ అయివున్నది కదా! ఈ శరీరాలు కూడా వాస్తవానికి లేకయే ఉన్నాయి.
లీల : మరి ఈ కనబడుచున్న శరీరముల మాట ఏమిటి?
శ్రీ సరస్వతీదేవి : ఇవన్నీ 'పరబ్రహ్మము' అనబడు పరిపూర్ణ భావమునందే కల్పనా చమత్కృతిచే ఉన్నాయి. వీటినన్నిటినీ మేము సత్యస్వరూపమునందే గాంచుచున్నాము. మరి, నీవో? నిత్యసత్యమగు స్వస్వరూపభావన సన్నగిలియుండుటచే, మిథ్యా జ్ఞానముచే, “అనేక శరీరములు” అను భావన పొందుచున్నావు. అందుచేతనే, ఇందలి సత్యత్వమేమిటో, అసత్యత్వమేమిటో తెలుసుకొలేకపోతున్నావు. ఇదంతా సృష్ట్యాదియందే చిత్స్వభావమున కల్పితమైయున్నది. అప్పటి నుండి అద్వయసత్తయే దృశ్యరూపమున పరిగ్రహించబడుచున్నది.
Page:272
లీల : అనగా “దిక్కులచే, కాలములచే పరిచ్ఛిన్నము కానట్టి అద్వయపరతత్త్వము' ఒక్కటే ఉండి ఉన్నది. మరింకేదీ ఎక్కడాలేదు” ... అని నీ అభిప్రాయము కదా. మరి అట్టి దానికి, ఈ “నీవు-నేను-దృశ్యము” వంటి కల్పనలతో పని ఏమి వచ్చింది? ఈ భ్రమలన్నీ ఎందుకు ఉన్నాయి? ఎందుకు, ఎట్లు, ఎవరి వలన, ఎవరి కొరకు ప్రవర్తిస్తున్నాయి?
శ్రీ సరస్వతీదేవి : బంగారమునకు ఆభరణత్వము సత్యమా? జలమునకు తరంగత్వము వాస్తవమా? స్వప్నములోనో, సంకల్పములోనో, తారసపడే వస్తువులకు అస్థిత్వమెక్కడిది? అదేవిధంగా విశుద్ధ సత్స్వభావమగు బ్రహ్మమునందు ఈ “నీవు-నేను-దృశ్యము" అను కల్పనలు ఏమాత్రం ఏ క్షణమందు కూడా లేవు. సృష్ట్యాదియందు పరబ్రహ్మమునకు ఎట్టి రూపమూ లేదు. ఆ బ్రహ్మము శాంతము, అద్వయము, జన్మరహితము అయివున్నది. ఒక మణి లేక దర్పణమునందు ప్రకాశించేదంతా దృశ్యము యొక్క ప్రతిబింబమేకాని ఆ మణి లేక దర్పణమునందు ఉండి ఉన్న వస్తుజాలము కాదు కదా! ఈ దృశ్యమంతా బ్రహ్మము యొక్క ప్రతిబింబము మాత్రమే. బ్రహ్మమే ఇట్లిట్లు దర్శింప బడుచున్నదని గమనించు.
14. అభ్యాస ప్రభావం
లీల : అట్లా అయితే మమ్ములను ఈ విధంగా ద్వైత అద్వైత జ్ఞాన విమూఢులుగా చేసి భ్రమింపజేసేదెవరు?
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! నిన్ను ఇంతవరకు భ్రమింపజేసేది బయట నుండి మరెవ్వరో కాదు. నీయొక్క ‘అవిచారము' అను స్వరూపము గల మోహమే సుమా! అయితే స్వభావజనితమైన “అవిచారణ” .... విచారణ మాత్రం చేత తప్పక నశిస్తోంది. “అవిచారణ”ను ఎదుర్కొన గలిగినది “విచారణ” కాకుండా మరింకేముంటుంది? అయితే ఈ అవిద్య కూడా 'బ్రహ్మసత్త' కంటే భిన్నమైనది కాదు. బ్రహ్మసత్తయే ఇచ్ఛామాత్రంగా అవిద్యను అవలంబించటం, త్యజించటం కూడా నిర్వహిస్తోంది.
వాస్తవానికి ‘బ్రహ్మము’ ... అభిన్నము, అఖండము, శుద్ధము అయివున్నది. ఇంక విచారణ ఏమిటి? అవిచారణ ఏమిటి? అవిద్యలేదు, బంధములేదు, మోక్షములేదు. కేవలము విశుద్ధరూపమగు బ్రహ్మమొక్కటే సర్వదా ఉండి ఉన్నది. 'జగత్తు' అనునది అందు ఆరోపితమగుచున్నది. ఈ తత్త్వము నీవు ఇంతవరకు విచారించి ఉండ లేదు. అందుచేతనే భ్రాంతి నిన్ను కలచివేయటం జరుగుతోంది. కాని ఇప్పుడు ఉన్న విషయమేమిటో గ్రహించి ప్రబుద్ధురాలవగుచున్నావు కదా! అనగా “విదేహజ్ఞానము”ను పొందావు. ముక్తిని పొందావు. నీయందు వాసనలన్నీ క్షీణించిపోయాయి.
“నిర్వికల్ప సమాధి” సమయంలో చిత్తము “అద్వయబ్రహ్మము” నందు స్థిరీకృతమై ఉంటుంది. అందుచేత ద్రష్ట - దర్శనము - దృశ్యములు స్వస్వరూపమునందు లయించిపోయి ఉంటాయి. అట్టి సమయంలో ఒకవేళ హృదయ క్షేత్రంలో వాసనాబీజము ఒకింత అంకురించి ఉన్నప్పటికీ,
Page:273
అది రాగ-ద్వేషాది భావములను ఏమాత్రం ఆశ్రయించదు. సంసారకారణములైనట్టి రాగద్వేషాలు నశిస్తే స్వయముగా సుస్థిర 'నిర్వికల్పసమాధి’ స్థితి లభ్యమవుతుంది. సమరసభావమే స్వరూపముగా కలిగినట్టి సమాధి అభ్యసిస్తూరాగా, సంసారభావన క్రమంగానో, లేక వెంట వెంటనేనో తొలగిపోతుంది. అందుచేత ఓ లీలా! నీవు నిర్మలపరమాత్మను అవలంబించు. తద్వారా భ్రాంతి మయమగు కార్యములు, సంకల్పములు నీనుండి తొలగిపోతాయి. అప్పుడు నీవు మోక్షస్వరూపురాలవు అవుతావు. అవధులు లేని "ప్రశాంత -ఆనందమయ స్వస్వరూప" స్థితిలో నిలిచియుంటావు.
“ఇది స్వప్నము” అని తెలిసిన మరుక్షణం, ఆ స్వప్నములోని పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు “మిథ్యయే” అని తెలిసిపోతాయి కదా! వాసనలు క్షయించి పోయినప్పుడు, ఇక ఆపై ఈ స్థూలదేహము అగుపడుచున్నప్పటికీ, “ఇది అసత్తే" అను బోధ కలుగుతుంది. సర్వవాసనలు క్షయమైనప్పుడు ఈ జాగ్రతేహము కూడా శామ్యత్వము పొందుతుంది. అనగా "ఈ శరీరము కలిగియున్నాను. ఇది నాకు ప్రియము. ఇది నాయొక్క పరిధులను నిర్ణయించుచున్నది. ఇది ఉన్నప్పుడే, ఉన్నచోటే ఉండి ఉన్నప్పటికీ,.... “దీని హాని వృద్ధులను అనుసరించే నేను హాని వృద్ధులను పొందుచున్నాను” అను భావములన్నీ తొలగిపోతాయి. “నేను సర్వదా శుద్ధ చైతన్యమునే! నా సంస్కారములను అనుసరించే ఈ శరీరాదులన్నీ ఉంటున్నాయి. సర్వమునకు కర్తనైయుండి కూడా, నేను అకర్తృత్వమే స్వభావముగా గల సాక్షి స్వరూపుడను" అను దివ్యమైన అవగాహన స్థిరీకరణ పొందుచున్నది.
స్వప్నము అనుభవించువాడు “నేను శరీరమునకు, శరీర ధర్మములకు సంబంధించిన వాడను” అను భావనను త్యజించి, తన అంతరంగమునందు (లేక తన ఆతివాహిక దేహమునందు) ఆయా పదార్థములను, సంఘటనలను గాంచుచున్నాడు. కాని నిదుర లేవగానే జాగ్రత్లో "నేను కాళ్ళు-చేతులుగల భౌతిక దేహము యొక్క ధర్మములకు సంబంధించినవాడిని” అను భావన, అనుభవం పొందుచున్నాడు. సంకల్పములోని అనుభవములు కూడా స్వప్నమువలెనే ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ జీవుడు “నేను ఈ దేహస్వరూపుడను" అను భావమునుండి విడివడుతాడో, అప్పుడు “ఆతివాహిక దేహభావన" ప్రకాశిస్తోంది. వాసనలన్నీ తొలగటం జరిగితే ఒకానొక జాగ్రత్ మౌనరూపమగు సుషుప్తివంటి ‘భావనావ్యవస్థితి’ కలిగి ఉండగలడు. వాసనాబీజము తొలగినప్పుడు "నేను శరీరమును, శరీరమునకు సంబంధించినవాడను" అనునది కూడా లేకుండా పోతుంది. అట్టి జీవునే “ముక్తస్వరూపుడు" అని అంటున్నాము. అతడే జీవన్ముక్తుడు.
జీవన్ముక్తులలో మనము చూచే వాసనలు ఈ సాంసారిక జీవుల వాసనలవంటిది కాదు. వారియందలి జీవసంస్కారము (లేక) వాసన - "శుద్ధ - సత్త్వ స్వభావము : సామ్య-సత్త" (An Experience of all pervading equality) - అని చెప్పబడుతోంది.
గాఢనిద్రాలో మనస్సు జడత్వం వహిస్తోంది. ఆ సుషుప్తిలో వాసనలన్నీ అప్రకటితంగా ఉంటున్నాయి. జాగ్రత్-స్వప్నదశలలో ఆ వాసనలు జడత్వమును త్యజిస్తున్నాయి. జాగ్రత్ —
Page:274
సుషుప్తులు రెండూ వాసనాశూన్యములు అయినాయనుకో అప్పుడు, ఒకానొక ప్రపంచరహిత - మనోరహితస్థితి అట్టి జీవునియందు శేషించి ఉంటుంది. ఆ స్థితినే శాస్త్రములు 'తురీయము’ అను పేరుతో పిలుస్తున్నాయి. జ్ఞానాగ్నిచేత వాసనలన్నీ నశించినప్పుడు అట్టి తురీయ స్థితి ఈ జీవునియందు జాగ్రత్లో ప్రకాశిస్తుంది. వాస్తవానికి ఆ స్థితి ప్రతిజీవుని వాస్తవ - స్వభావమే అయివున్నది. అట్టిస్థితినే, “బ్రాహ్మీస్థితి” లేక “మోక్షస్థితి" అనికూడా పిలుస్తున్నారు. ఇక దీనికంటే ఉత్కృష్టమైన స్థితి అంటూ ఏదీ లేదు. వాసనలు కలిగియుండుటే 'బంధము', లేకయుండుటయే ‘మోక్షము’. ఒకానొకడు వాసనారహితుడై కూడా ఈ సంసారమునందు ఇతరులవలెనే యథాతథంగా ఉంటూ ఆయా కర్తవ్య- అకర్తవ్యములను నిర్వర్తించుచున్నాడు. అంతరంగమున పూర్ణమగు ఆత్మ భావననే కలిగి యున్నట్టి, అట్టివాడే జీవన్ముక్తుడు. అతడు స్వస్వరూపజ్ఞాన ప్రభావంచేత సర్వ సామ్యమును, పూర్ణానుభవమును (నేను “పూర్ణుడను" అను అనుభవమును) పొందుతూనే ఉంటాడు. ప్రవాహపతితంగా ప్రాప్తించుచున్న కర్మల వ్యవహారములు అతని నిశ్చలత్వమునకు ఏమాత్రం ప్రతిబంధకం కాదు. అతడు అంతరంగాన 'కొండ'వలె గాంభీర్యం వహించి, బాహ్యమునకు మాత్రం లోకానుకూలార్థం ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్టి జీవన్ముక్తుని బద్ధజీవులు గుర్తించలేకపోవచ్చు కూడా!
మంచు వేడి వలన కరిగినప్పుడు తన ఇతఃపూర్వపు స్వభావమైనట్టి జలముగానే అగుచున్నది కదా! వాసనాశూన్యమైన చిత్తము కూడా తన సహజస్వరూపమైయున్న “శుద్ధసత్త్వ స్వభావము”నే పొందుచున్నది. అది తన స్థూలభావము (స్థూల విషయము స్మరించుట)ను త్యజించి స్వభావసిద్ధమైన సూక్ష్మత్వము వహించుచున్నది. 'స్థూలభావం' తొలగనంతవరకు ఈ ఇంద్రియములు, వీటిని అంటిపెట్టుకొని ఉండే పదార్థజాలము మరల మరల ప్రోగుపడుతూనే ఉంటాయి. ‘జ్ఞానబలము’ ప్రబుద్ధమైనప్పుడు ఆతివాహిక భావము పొందిన చిత్తము అన్యచిత్తములలో ప్రవేశించగలదు. అదేవిధంగా, ఆ చిత్తము జన్మాంతరీయములైన, సృష్టాంతరీయములైన పదార్థములతో కలియగలుగు సామర్థ్యమును కలిగివుంటుంది.
కాబట్టి ఓ లీలా! నీవు అభ్యాసబలం చేత “నేను ఈ దేహమును, ఈ దేహమునందు మాత్రమే ఉన్నాను" అనునట్టి దేహాభిమానత్వం దూరంచేయి. అప్పుడు నీయందు దట్టంగా పేరుకొనియున్న .... “ఈ దృశ్యము వాస్తవము. ఇది అనేక పదార్థములతో, నీవు-నేను-నీది-నాది అను అనేక వ్యవహారములతో నిండివున్నది.” ” అను అజ్ఞానపూరిత - - దోషం తొలగుతుంది. సంకుచిత లేక పరిమిత అనుభవజ్ఞానంతో కూడిన ఇప్పటి నీ బుద్ధి విశాలత్వము, అపరిమితత్వము సంచరించుకొంటుంది. “నేను చైతన్య తత్త్వమును” అనునట్టి దృఢమైన స్థిరమైన, అవగాహనను స్వీకరించునప్పుడు, అప్పుడు ఏర్పడుచున్న “ఆతివాహికదృష్టి” లేక “జ్ఞానము” సహాయంచేత పవిత్రమైన లోకములను గాంచగలుగుతావు.
పుత్రీ! వాసనలు క్షయింపజేయ గల ఉపాయములనే సర్వదా ఆశ్రయించు. వాసనలు క్షయించుటచే ఏర్పడు స్థిరబుద్ధియే నిన్ను జీవన్ముక్తురాలిగా తీర్చిదిద్దుతుంది. ఉత్తమోత్తమమైన
Page:275
బోధ మరియు అనుభవజ్ఞానము ఉదయించేవరకు క్రమంగా స్థూలదేహానుభవమును సన్నగిల్లచేసుకొంటూ, ఆతివాహిక దృష్టికొరకు ప్రయత్నిస్తూ ఉండవలసినదే.
మాంసమయదేహము మాంసమయదేహమును మాత్రమే తాకుతుంది. మాంసమయ దేహం చిత్తదేహమునుగాని, చిన్మయ దేహమునుగాని కలియగలదా? లేదు. నీ చిత్తదేహముతో మాత్రమే ఇతరుల చిత్తదేహమును గాంచగలవు. చిత్తస్వరూపమును స్వప్రయత్నముచే ధరించవచ్చు. సత్యదేవతాస్వరూపిణియగు నేను నీపైగల పుత్రికా వాత్సల్యంతో ఈ విషయాలు చెప్పుచున్నాను. వాస్తవానికి నేను చెప్పు ఈ వాక్యములలోని సత్యము ఆబాలగోపాలం అందరికీ అంతరంగంలో తెలిసియున్నదే. కాని, స్థూల దృష్టియొక్క అభ్యాసము ఈ జీవుని చిదాకాశత్వమును కప్పియుంచుటచే అనేకులకు తమపై తమ యొక్క ఆత్మ స్వరూపముపై తమకింకా విశ్వాసము కలుగటం లేదు. కనుక లీలా! చిత్తశరీరమును స్వయముగా అభ్యాసయోగంచేత ధరించవచ్చు. ఆ చిత్తశరీరము ఆయా వ్యవహారములు కూడా నిర్వర్తించగలదు. వరములు-శాపములు, ఇతర చిత్తాకాశములందు ప్రవేశించి ఆయా ప్రయోజనములను సిద్ధింపజేయుట మహనీయులగు గురువులు దేహానంతరం శిష్యులతో సంభాషించటం మొ||నవి ఇందుకు మనకు దృష్టాంతము.
ఓ లీలా! మరల ప్రకటించుచున్నాను, విను. నిరంతర జ్ఞానాభ్యాసంచేత వాసనా సమూహములన్నీ క్షీణించగా, ఈ దేహము ఇట్లా ఉండగానే ఆతివాహిక దేహము పొందవచ్చు. ధరించవచ్చు. మరణించినప్పుడు మాత్రం జరిగేదేమిటి? అప్పుడు ఈ పాంచభౌతిక దేహము ఉండదు కదా! అనగా ఆ స్థితిలో ఆ ప్రాణి (లేక జీవచైతన్యము) ఆతివాహిక దేహి స్వరూపుడే అయివుంటాడు. అయితే, ఈ ఆతివాహిక దేహముయొక్క ఉత్పత్తి గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఈ జనులు భౌతిక దృష్టికి పరిమితు లగుటచే మృతదేహమును మాత్రమే చూడగలుగు చున్నారు. కాని, ముక్తపురుషుని దృష్టి యందు (ఆతివాహికదేహము దృష్ట్యా) జీవునకు ఉత్పత్తి వినాశనములు లేవు. అందుచేత, ఘనీభూతమై కనబడుచున్న ఈ 'జీవన్మరణములు' అనునవి భ్రమమాత్రమే. సంకల్ప - పురుషునికి పుట్టుక ఏమిటి? చావు ఏమిటి? అది మొదలే మిథ్యకదా! అదేవిధంగా, "జీవన్మరణములు మిథ్యయే” అని గ్రహించు.
సంకల్పములే
శుద్ధ - చిత్ రూపముగాగల స్థూల శరీరము
చైతన్యము చిత్తము
సంకల్పము ఉన్నను, లేకున్నను నీకు లోటేముంటుంది? నీవు సర్వదా చిత్స్వరూపమువే కదా! శరీరముల విషయము కూడా అట్టిదే.
లీల : హే భగవతీ! నీవు ఉపదేశిస్తున్న ఈ పవిత్రజ్ఞానం వింటుంటే నా దృశ్య-దర్శన రోగము దానంతట అదే ఉపశమించిపోతోంది. అయితే, “అభ్యాసము అవసరము” అని అంటున్నావు
Page:276
కదా! ఇప్పుడు దీనిని, ఎట్లు, అభ్యసించాలి? ఆ అభ్యాసం దృఢపరచటానికి నేను ఏంచెయ్యాలి? అట్లు ఆచరిస్తే లభించే ప్రయోజనం ఏమిటి? నాపై దయతో వివరించి చెప్పు.
శ్రీ సరస్వతీదేవి : పుత్రీ! ఎవరైనా, ఎప్పుడైనా, ఏ పనైనా చేయాలంటే, ఆ పని అభ్యాసం లేకపోతే సిద్ధించదు కదా! బ్రహ్మమును గురించే చింతనచేయటం, మాట్లాడుకోవడం, ప్రసంగించటం, ప్రబోధించటం, స్థిరభావన కలిగివుండటమునే పండితులు (లేక నిత్యా నిత్యజ్ఞానము కలిగియున్నట్టి మహనీయులు) “అభ్యాసము" అని పిలుస్తున్నారు. మహాత్ములగువారు ఈ సంసారమందలి దోషములను గమనించినవారై, ఇందలి సత్యాన్వేషణమునకు ఉపక్రమించుచున్నారు. జనన-మరణ శాంతిని కోరినవారై భోగవాసనలను త్యజించివేయుచున్నారు. శాస్త్రములచే బోధింపబడిన అనేక విధి, విధానములలో తమకు తగినవాటిని ఎన్నుకొని, సర్వదా ప్రయత్నశీలురై ఉంటున్నారు. అందుచేతనే, వారు ఈ జగత్తును జయించివేయగలుగుచున్నారు. వారిబుద్ధి నిత్యమూ అన్ని పరిస్థితులందు ఔదార్యముచే సుందరంగా అలంకరించబడి ఉంటోంది. ఆ ఉత్తమ సాధకుల చిత్తము పరమ-వైరాగ్యముతో నిండియుండి, సర్వదా అకృత్రిమమగు స్వస్వరూపానందమును పొంది ఉంటోంది. “బ్రహ్మాభ్యాసులు” అని పిలువబడే అట్టివారు అనేకయుక్తులను ఆశ్రయిస్తూ, శాస్త్రావలోకనం చేస్తూ ఈ జ్ఞాతృజ్ఞేయముల ("Knower" and "that being known") యొక్క అత్యంత ‘అభావము’ను పరిగ్రహించుచున్నారు.
ఓ ప్రియమైన లీలా! వాస్తవమేమిటో చెప్పుచున్నాను, విను. సృష్ట్యాదియందు దృశ్యము లేదు. ఇప్పుడూ లేదు. మరింకెప్పుడూ కూడా లేదు. అందుచేత “ఈ జగత్తు గాని, నేను-నీవు-అను పదార్థములు గాని లేవు" .... అనునట్టి జ్ఞానమునే "బోధాభ్యాసము” అని అంటున్నాం. ఈ విధంగా “దృశ్యము అసంభవము” అని గ్రహించిన తరువాత, పరమాత్మయందు ఆసక్తి స్వయముగానే కలుగుతుంది. అట్టి ఆసక్తియే “బ్రహ్మాభ్యాసము” అని కొందరు, “భగవద్భక్తి" అని మరికొందరు చెప్పుచూ ఉంటారు. పుత్రీ! "రాగ-ద్వేష క్షయము" అనునది సాధించుకోకుండానే, "మేము బ్రహ్మమును అభ్యసిస్తాం” అంటే ప్రయోజనం ఏముంటుంది. అట్టి ప్రయత్నములు రాగ-ద్వేషములు త్యజించనంతవరకు మూఢములు, తాపదాయకములు, దుఃఖకారకములే అయివుంటాయి. “దృశ్యము అసంభవము” అనునట్టి బోధనే (ఉపనిషత్తులు మొదలైన) శాస్త్రములు “జ్ఞానము, జ్ఞేయము” అని వ్యవహరిస్తున్నాయి. అట్టి అభ్యాసమే ఉత్తమమైన అభ్యాసము. దానినే 'నిర్వాణము' అని కూడా అంటున్నారు. వేసవికాలం వచ్చిన తరువాత మంచు-వర్షం ఉంటుందా? "నిరంతర వివేకాభ్యాసము” యొక్క ప్రభావంచేత ఈ చిత్తమునందు వర్షిస్తున్న సంసార వ్యవహారమంతా రూపనామాలు లేకుండా తొలగిపోతుంది. నిద్రలేస్తే ఇక స్వప్నదృశ్యం ఎదురుగా ఉండి ఉంటుందా? ఉండదు కదా!
(నాలుగవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:277
ఐదవ రోజు
15. ఇతఃపూర్వానుభవ సృష్టి
శ్రీ వసిష్ఠమహర్షి : ఆ రాత్రి ఆ విధంగా లీలాదేవి, సరస్వతీదేవి సంభాషించుకొంటున్నారు. అంతః పురంలోని పరిజనులంతా గాఢనిద్రాపరవశులై ఉన్నారు. ఆ ప్రక్కనే పద్ముని దేహము వాడని పూలతో కప్పబడియున్నది. అక్కడే వారిద్దరు (లీలా-సరస్వతులు) సమాధిని ఆశ్రయించి నిశ్చల శరీరులయ్యారు. వారి వదనములు ఒకానొక కాంతితో ప్రజ్వరిల్లుచున్నాయి. వారి ఇంద్రియ వ్యాపారములన్నీ స్తంభమున చెక్కబడిన శిల్పము యొక్క అవయవములవలె కట్టుబడ్డాయి.
వారిద్దరు సూక్ష్మభావమును పొందారు. నిర్వికల్పసమాధిని ఆశ్రయించి బాహ్య జ్ఞానమును త్యజించివేశారు. “నేను-నీవు-దృశ్యజగత్తు... అనునదంతా మిథ్య" అని వారిద్దరిచే గ్రహించబడుటచే వారి చిత్తము నుండి దృశ్యపిశాచి తొలగిపోయింది. చూచావా, రామచంద్రా! ఈ 'జగత్తు' ఎంతగా ఘనీభవించి ఈ జీవుని మభ్య పెడుతోందో!
ఆ ఇద్దరు దృశ్య-దర్శన భావము నుండి విడివడినవారై, శూన్యమగు ఆకాశము వలె శాంత భావము వహించారు. జ్ఞప్తిదేవతయగు ఆ సరస్వతీదేవి వాస్తవానికి 'అశరీరి' అయినప్పటికీ, తన భక్తురాలి బుద్ధిని సునిశితం చెయ్యటానికి జ్ఞానమయమగు సూక్ష్మశరీరం దాల్చినది. ఆ లీలాదేవి “భౌతికదేహాభిమానము” లేనట్టి సూక్ష్మ శరీరముగా అవధరించినది. ఆ విధంగా, వారు ధ్యాన జ్ఞాన మయమగు ఆతివాహిక దేహము అవలంబించి సంచరించసాగారు. పరిమితగృహాకాశము నుండి చిదాకాశ స్వరూపమును గ్రహించినవారై, పూర్వజ్ఞానము ననుసరించి “చితవృత్తి” సహాయంతో
విహరించసాగారు.
వారి ఇప్పటి శరీరములు పాంచభౌతికము కాదు. అయినప్పటికీ, పూర్వ సంకల్పముతో కూడిన మనస్సు కలవారగుటచే, పరస్పర స్నేహదృక్కులతో ఒకరినొకరు వీక్షిస్తూనే ఉన్నారు.
వారు చేతులు కలుపుకొని దూర- సుదూర ప్రదేశాలు దాటుకుంటూ, నభోమండలం వీక్షించసాగారు. అక్కడి ఆకాశమండలము ఒక ప్రశాంత మహాసముద్రంలాగా అతి విస్తీర్ణముగా, గంభీరంగా, నిర్మలంగా కోమలంగా ఉన్నది. అది చిత్తమునకు ఆహ్లాదం కలిగిస్తూ సుందరంగాను, సుఖదాయకంగాను ఉన్నది. తమ ప్రయాణంలో మధ్యమధ్య వారిద్దరు దేవతల సౌధములలో విశ్రమించారు. మరికొంతసేపు శూన్యపథంలో ప్రయాణించుచు, అనేక జగత్తులు దాటారు. ఎన్నో లోకములు, ఎన్నో జగత్తులు కూడా ఆ ఆకాశపు 'శూన్యత్వము'ను ఏమాత్రం నింపలేకే పోతున్నాయి. కొన్నిచోట్ల సురాసురులు సంచరిస్తున్నారు. కాని, వారు ఒకరినొకరు గుర్తించలేకే పోతున్నారు. మరికొన్ని చోట్ల కూష్మాండ రాక్షస-పిశాచమండలములను కూడా వారు గమనించారు. మరికొన్ని