Page:478

పార్వతీసమేతుడై ప్రత్యక్షమయ్యాడు. ఋషభారూఢులై వేంచేసియున్న ఆ ఆదిదంపతులను ఇందువు, అతనిభార్య భక్తిరసపూరితమైన స్తోత్రాదులతో పూజించారు.

ఇందువు : దేవేశా! భగవానుడా! పార్వతీనాథా! మీ దర్శనముచే మా జన్మలు సార్థకమయ్యాయి. మాపై కరుణతో గొప్ప తెలివితేటలు, ధారణాసామర్థ్యము, మేథస్సు గల పదిమంది కుమారులను ప్రసాదించమని వేడుకొంటున్నాను. అనుగ్రహించండి.

పరమేశ్వరుడు : “అట్లే అగునుగాక అని వరమును ప్రసాదించి సపరివారంగా అంతర్ధానమయ్యాడు. ఇందువు భార్యాసమేతంగా సంతోషంగా నిజాశ్రమం చేరాడు. వారికి కాలక్రమంగా మహాతేజః సంపన్నులు, సౌందర్యవంతులు అయిన పదిమంది పుత్రులు కలిగారు. వారంతా ఏడు సంవత్సరముల ప్రాయమునకే సర్వశాస్త్రములు అభ్యసించారు.

చాలాకాలం గడచిపోయింది. కాలక్రమంగా ఇందువు, అతనిభార్య తమ తనువులను చాలించి విదేహముక్తులు అయ్యారు. ఆ పదుగురు ఐందవులకు అక్కడ బంధువులెవ్వరూ లేరు. వారు తలితండ్రుల వియోగంచే ఖిన్నులై, ఆ ఆశ్రమంలో ఉండలేక అక్కడినుండి బయలుదేరారు. కైలాస పర్వతశిఖరంచేరి, అక్కడ ఒకచోట కొంతసేదతీరుటకై బసచేశారు. ప్రయాణపు బడలిక తీరినతరువాత, ఒకచోట అందరు సమావేశమై, ఇట్లు సంభాషించుకోసాగారు.

సమావేశం - - సమాలోచన

జ్యేష్ఠసోదరుడు : తమ్ములారా! మన తల్లితండ్రులు మనను విడచి విదేహముక్తులయ్యారు. ఇక వారల గురించి శోకించడం అనవసరం, అప్రస్తుతం, అర్థరహితం కూడా. వారు మనకు ఈ మానవదేహములను ప్రసాదించి మహోపకారం చేశారు. ఈ మానవజన్మ ఒక మహత్తరమైన అవకాశంగా మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. అందుచేత మనం ఇప్పుడు భవిష్యత్తు కొరకు ప్రయత్నశీలురం కావాలి. ప్రయత్నించువాడే ఏదైనా సాధిస్తాడు. ప్రయత్నమే చెయ్యనివారు పొందేదేముంటుంది? చేయకలిగేదేముంటుంది?

అయితే ఇప్పుడు దేనికొరకు ప్రయత్నించాలి? మనకు ఇహ - - పరములందు అత్యంత సుఖమును, శ్రేయస్సును చేకూర్చకలిగేది ఏది? కీర్తి, ఐశ్వర్యం, సంతృప్తి, ఆనందాలను సొంతం చేసుకోవాలంటే, ఏది లక్ష్యముగా కలిగియుండి మనం ప్రయత్నించాలి? మన ప్రధాన లక్ష్యము ఏమిటో మీరంతా మీమీ అభిప్రాయములు చెప్పండి. అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాత మనమంతా ఒక నిర్ణయానికి వద్దాం. అప్పుడు భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుందాం.

రెండవ సోదరుడు : నా దృష్టిలో, ఎవరికైతే మంచి గృహములు, గ్రామములు ఉంటాయో - అట్టివాడు ఐశ్వర్యవంతుడు. మండలాధిపతి అనేక మందిపై పెత్తనం చెలాయించగలడు. కనుక మనమందరం మండలాధిపతులం అయ్యే ఉపాయం యోచించడం మంచిది.

మూడవ సోదరుడు : సోదరులారా! మనకు స్వల్పవిషయమైనట్టి 'మండలాధిపతి' ఎందుకు చెప్పండి?

Page:479

మండలాధిపతులను నియమించేది, పెరికివేసేది రాజులే కదా! రాజే మహదైశ్వర్య సంపన్నుడు. కనుక మనమందరం రాజులం కావటానికి ప్రయత్నిద్దాం.

నాలుగవ సోదరుడు : అన్నలారా! తమ్ములారా! దేశాధిపత్యమా? అంతటితో తృప్తి చెందుచున్నారా? అది సరి కానేకాదు. మహద్విభవోపేతుడగు “చక్రవర్తి అయితే అనేక రాజ్యాలను పరిపాలించ వచ్చును కదా! కాబట్టి మనకు చక్రవర్తి ఐశ్వర్యమే వాంఛనీయం. అందుకొరకే ప్రయత్నశీలురం కావాలని నా అభిప్రాయం.

ఐదవ సోదరుడు : కాదు. చక్రవర్తి ఎంత? అతని మహారాజ్యమెంత? మనం మహేంద్రపదవికే ఎందుకు ప్రయత్నించకూడదు?

ఈ విధంగా అనేక తర్జన భర్జనలు జరిగాయి. చివరికి ఆఖరి సోదరుడు లేచాడు. ఆఖరి సోదరుడు : మహేంద్రపదవి అవీ ఇవీ, ఉత్తమమైనవంటున్నారా? ఏమి తెలివి తక్కువ ఆలోచన? ఎందుకంటారా? అది బ్రహ్మదేవుని విభవములు, ఆయుష్షు దృష్ట్యా చూస్తే, స్వల్పమైనదే కదా? బ్రహ్మదేవుని యొక్క కొద్దినిమిషములకాలంలో మహేంద్రుని దీర్ఘమైన ఆయుష్షు సమసి పోతోంది. కాబట్టి కల్పము గడచిపోయినా కూడా నశించనట్టి ఉత్తమపదవి ఏదైనా ఈ లోకంలో ఉన్నదేమోనని యోచన చేస్తే "బ్రహ్మదేవుని పదవి మాత్రమే అని నాకు అనిపిస్తోంది.

జ్యేష్ఠ సోదరుడు : ఓ తమ్ములారా! మీ సమాలోచనలన్నీ విన్నాను. మన ఆఖరి సోదరుడు చెప్పుచున్నట్లు, సమస్త ఐశ్వర్యములలో కెల్లా బ్రహ్మదేవుని పదవే ఉత్తమోత్తమమైన పదవి అని మాకు కూడా అనిపిస్తోంది. కల్పము నశించినా, ఆ పదవి మాత్రం నశించుట లేదు.

మిగతా సోదరులంతా ఈ ఆలోచనను, మంచిది మంచిది, బాగున్నది బాగున్నది"; అని ప్రశంసించారు. అందరూ కలసి జగత్ పూజ్యుడైన బ్రహ్మదేవుని పదవి మనం పొందవలసిందే” అని తీర్మానించుకున్నారు.

బాగానే ఉన్నది. కాని బ్రహ్మపదవి పొందటం అంటే మాటలేం కాదే! ఎట్లా పొందటం? ఈ ప్రశ్న వారి మనస్సును, అన్ని ఆలోచనలను ఆక్రమించివేసింది. అప్పుడు అత్యంత తేజోసంపన్నుడైనట్టి పెద్ద కుమారుడు దీర్ఘంగా ఆలోచించుకొని, ఆపై ఇట్లు పలుకసాగాడు.

జ్యేష్ఠ కుమారుడు : ఓ సహోదరులారా! మీరు విచారించవలసిన పనేమీలేదు. మనం బ్రహ్మదేవుని దివ్యపదము పొందువిషయమై నాకు ఒక గొప్ప ఉపాయం తట్టుచున్నది. మీరంతా దృఢ చిత్తంతో నేను చెప్పేది వినండి.

మనమంతా ఉత్తమమైన 'ఆసనం' స్వీకరించి ఆసీనులమౌదాం.

"సర్వప్రకాశములకు కారణభూతుడై, పరమప్రకాశవంతుడగు బ్రహ్మదేవుడను 'నేనే!' నా శక్తి యొక్క సహాయం చేత నేనే స్వయముగా బ్రహ్మాండమును సృష్టిస్తున్నాను. ఇంతలోనే సంహారం

Page:480

కూడా చేసివేస్తూ ఉంటాను. అని భావనచేద్దాం. జీవన పర్యంతము అట్టి ధ్యానము విడువవద్దు. మనం బ్రహ్మపదవి పొందేవరకు అట్లు నిశ్చలంగా ధ్యానం చేస్తూనే ఉందాము. ఓ తమ్ములారా! ఈ శరీరాలు ఎప్పటికైనా శిథిలం కావలసిందేకదా! కనుక, ఈ శరీరము వైపు మనం దృష్టి సారించనేవద్దు. మన దేహముల విషయం కాల క్రమేణా,... “ఏది ఏట్లో- అది అట్లే... అగుగాక!

మిగతావారందరికి ఆ వాక్యాలు అత్యంత సమంజసంగా కనిపించాయి. వారంతా ఒక చక్కని ప్రశాంతమైన ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ ఆయాస్థానాలలో ఉచితాసనములను ధరించి కూర్చున్నారు. మనస్సుచే, వాక్కుచే, శరీరముచే మౌనం వహిస్తూ ధ్యానపరులయ్యారు. చిత్రంలో లిఖించ బడిన చెట్లయొక్క, ఆకులవలె నిశ్చలత్వం వహించారు. బాహ్యవృత్తులను నిరోధించి, చిత్తమును అంతర్ముఖం చేశారు. ఇక ఆపై ఇట్లు చింతించసాగారు.

ఇప్పుడు నాకు ఒక వికసించిన, విశాలమైన కమలం గోచరమౌతోంది. ఆ కమలముపై ఆసీనుణ్ణి అయిఉన్నాను. ఈ జగత్తు అంతటికీ స్రష్ట - కర్త - భోక్త కూడా నేనే. నేనే ఈశ్వరుడను. యజ్ఞస్వరూపుడను. జ్ఞానవేత్తలగు మహర్షులంతా నాయందే ఉన్నారు.

శిక్ష, వ్యాకరణముమొదలైన అంగములు, పురాణములు మొదలైన ఉపాంగములు, గాయత్రీ యుక్తమైన వేదమంత్రములు, సర్వమానవకోటి.... ఇవన్నీ నాయందే స్థితి కలిగి ఉన్నాయి. లోక పాలకులు, యముడు, సిద్ధులు నివసించే లోకములన్నీ నాయందే ఉన్నాయి. ఉత్తమ స్వరములతో విభూషితమైన స్వర్గలోకము కూడా నాయందే ఉన్నది. అనేక పర్వతములు, ద్వీపములు వనములతో కూడి భూమండలము, నక్షత్రమండలము.... ఇవన్నీ నాయందు నిక్షిప్తమై, ఇదిగో, ఇప్పుడు ప్రకటిత మవుతున్నాయి.

ఆహాఁ! ఈ విశాల ఆకాశము, దేవతాస్త్రీలతో అత్యంత సుందరంగా ఉండే దేవలోకము, దైత్యదానవులతో నిండి ఉండే పాతాళలోకం.... ఇవన్నీ నాయందు ఎంత సహజంగా శోభిస్తున్నాయి! యజ్ఞభోక్త అయినట్టి ఇంద్రుడు నాయందే త్రిలోకనగరములను పాలించుచున్నాడు. అరుగో. పన్నెండు మంది ఆదిత్యులు తమ కిరణములచే దిక్కులను నింపివేస్తూ, పన్నెండు మాసములను తపింపజేయు చున్నారు. గోపబాలుడు గోవులను మేపుతూ ఉంటాడు కదా! అట్లే ఇంద్రుడు, యముడు, కుబేరుడు మొదలైన లోకపాలకులు నియతియుక్తులై, నా అంతరంగములో ఉన్నట్టి తమ తమ లోకములను పాలించుచున్నారు.

జలమునందే తరంగములు ఉత్పన్నమగుచున్నట్లు, నాయందే చమత్కారములైన వివిధ నామ రూపాత్మకమైన వేల వేలాది జీవజాతులు-జీవ ధర్మములు, జీవులు; వారి కొరకై ఆహార-విహారములు ఉత్పన్నములగుచున్నాయి. నశించుచున్నాయి. జీవులంతా ఒకప్పుడు ఐశ్వర్యయుక్తులు అగుచున్నారు. మరొకప్పుడు దారిద్ర్యబాధచే క్రుంగిపోవుచున్నారు. వీరందరి కొరకై తపస్సు-ప్రార్థన-యోగ సాధనాలు ప్రవర్తిస్తున్నాయి.

Page:481

ఈ సృష్టి అంతా నా చేతనే నిర్మించబడుచున్నది. దీనినంతా మన్వంతరాలుగా మారి పోషిస్తున్నాను. మరల మరొకప్పుడు, నేనే దీనినంతా సంహారం చేస్తూ ఉంటాను. సమస్త లోకములకు ఈశ్వరుడను నేనే. ఏది ఏమైతేనేం? సర్వదా ఆత్మయందే స్థితి కలిగియున్నాను. కనుక పరమ శాంతియే నా స్వరూపము. ఇదిగో, ఇప్పుడు సృష్టికాలం. ఇప్పుడిప్పుడే లయము సంప్రాప్తిస్తోంది. యుగము తరువాత యుగము వస్తోంది. పోతోంది. ఇప్పటికి ఒక బ్రహ్మసంవత్సరము గడచి పోయింది. ఈ రోజుకు ఈ కల్పము గడచిపోయింది. ఇప్పుడు బ్రహ్మరాత్రి గడచుచున్నది. కాబట్టి పూర్ణాత్మ స్వరూపుడను, పరమేశ్వరుడను అయి ఉన్న నేను తదనంతర సృష్టిని కల్పించుచున్నాను.......' 99

ఆ పదిమంది ఐందవులు ఈ రూపము కలిగినట్టి భావపరంపరలను మనస్సుతో అనుసంధానం చేయసాగారు. కొంతకాలం గడిచింది. వారంతా పర్వతమువలె నిశ్చలులయ్యారు. ఒక శిలావిగ్రహం లాగా స్థిరచిత్తంతో ధ్యాన నిమగ్నులయ్యారు. బ్రహ్మదేవుని ధర్మములు చాలా కాలం భావన చేస్తూ ఉండిపోయారు. కొంతకాలానికి వారు మనస్సులోని సర్వదోషములను జయించివేయుటచే, బ్రహ్మ పదమును సమీపించసాగారు. అత్యంతశోభతో కూడుకొన్నవారై చిరకాలం విరాజిల్లుచున్నారు.

హే బ్రహ్మదేవా! ఆ విధంగా ఆ ఐందవులు ఉపాసనా క్రమముచే.... లోకముల యొక్క ప్రాణులయొక్క సృష్టి - స్థితి - - సంహారముల గురించి భావించుచు వచ్చారు. అట్లు బ్రహ్మోపాసన యందు నిమగ్నులైయుండగా, ఎప్పుడో వారి భౌతిక శరీరాలు ఎండకు - - వానకు - గాలికి సంస్పృశ్య విషయమైయుండే ఒక ఎండుటాకు వలె నేల వ్రాలిపోయాయి. ఇటు అటు - చిందర వందరగా పడియున్న వారి శరీరభాగములను మాంసాహారులైనట్టి అడవి మృగాలు భక్షించాయి. ఇట్లు దేహములు పతనము చెందినతరువాత కూడా వారు "బ్రహ్మభావన" (.... నేను సృష్టి కర్తయగు బ్రహ్మను - అను భావన) చేస్తూనే ఉన్నారు. నాలుగు యుగములు గడచిపోయాయి. కల్పక్షయం అయింది. కల్పాంతము వచ్చిపడినది. సూర్యుడు తన తీక్ష కిరణములచే లోకములను ధ్వంసం చేయటం ప్రారంభించాడు. ప్రళయమేఘములు, కల్పాంతవాయువులు అనేక ప్రాణికోట్లను నేల కూల్చివేశాయి. జగత్తంతా జలమయమైపోయింది. ఇంత తతంగం జరుగుచున్నప్పటికీ, ఆ ఐందవులు మాత్రం, శరీరరహితులై, అట్లే సూక్ష్మ శరీరముతో కూడి ధ్యానమునందు నిమగ్నులై ఉండి ఉన్నారు.

వారంతా ఆ విధంగా సుఖంగా నేను బ్రహ్మదేవుడను. సర్వము సృష్టిస్తున్నాను అను రూపము గల ధ్యానములో నిమగ్నమైయున్నారు కదా! "అహం బ్రహ్మదేవాస్మి అను నిష్ఠను వారు వీడలేదు. కాలక్రమంగా వారు పదిమంది బ్రహ్మలు అయినారు. వారిచే సంకల్పించబడిన పది బ్రహ్మాండములు వారి చిత్తాకాశమునందే ప్రతిష్ఠితమైయున్నాయి.

అట్టి పదిబ్రహ్మాండములలో, ఒకానొక బ్రహ్మాండమునందు నేను సూర్యుని రూపము ధరించినవాడనై ప్రవర్తిస్తున్నాను. రాత్రి - పగళ్ళను, తదితర వస్తుజాలమును అత్యంత అకర్తృత్వము వహించి నిర్వర్తించుచున్నాను. ఆకాశములో సంచరిస్తూ, కాల - కర్మ విభాగములను నిర్మించు స్వభావముచే నియమించబడి ఉన్నాను.

Page:482

శుద్ధ చిత్తముతో కూడుకొన్న మనోనేత్రములతో మీరు చూచిన ఆ పది బ్రహ్మాండములు ఎట్లా సృష్టించబడ్డాయో వివరించి చెప్పాను. ఇక మీకేది ఉచితమని తోస్తే, అట్లే నిర్వర్తించండి. హే ప్రభూ! మీకు తెలియనిదేమున్నది! ఈ దృశ్యము వివిధ కల్పనల.... బంధహేతువై మోహదాయకమే అగుచున్నది. జీవునకు సంభవిస్తున్న బాహ్య - అభ్యంతర ఇంద్రియతాదాత్మ్యమే ఇందుకు దృష్టాంతము. కాని, ఈ దృశ్యమంతా చిత్తభ్రాంతి మాత్రమే. ఇదంతా యథార్థమైనది కానేకాదు. ఎందుకంటే, ఇందులో మార్పుచెందని దంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు కదా!

పుత్రా! వసిష్ఠా! అదంతా విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. చాలా సేపు నా యందు ఎంతో తర్జన - భర్జనలు జరిగాయి. అప్పుడు నేను ఆ సూర్యభగవానునితో ఇట్లా అన్నాను.

నేను (బ్రహ్మదేవుడు) : ఓ భాస్కరా! ఆ ఐందవులు తమయొక్క దృఢసంకల్పమాత్రంచేత తమ చిత్తాకాశంలో ఈ బ్రహ్మాండములన్నీ సృష్టించి, దర్శించుచున్నారు కదా! ఇక నేనేం చెయ్యాలి? క్రొత్తగా సృష్టి చేయుటచే ఒరిగే ప్రయోజనమేమున్నది? కాబట్టి, నా ధర్మము అయినట్టి “సృష్టించటం” అనే కార్యక్రమం ఆపివేయాలా? మౌనం వహించి ఉండాలా? లేక, ముందుగా వీరి సృష్టి లేకుండా చేయాలా? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? నాకేం పాలుపోవటంలేదు.

శ్రీసూర్య భగవానుడు: ఓ బ్రహ్మదేవా! జనులు కర్మలు ఎందుకు నిర్వర్తిస్తున్నారు. కొందరు, ‘భవిష్యత్తులో ఏదో పొందాలి' అనే ఆశచే ... ఇంకొందరు, 'దైవ లిఖితం' అని అనుకుంటూ, ... మరి కొందరు, ‘దోష నివారణకై' అని భావించి, ... వేరేకొందరు, 'నా వారికొరకై’ అని అనుకుంటూ, ... ఇంకా కొందరు, 'తప్పదు కదా' అని అనుకుంటూ ఆయా కర్మలు చేస్తున్నారు.

అయితే, మీరు సంకల్ప వర్జితులు, సర్వసంకల్పములకు ఆవల ఉన్నట్టి నిర్మల స్వరూపులు, ఇచ్ఛారహితులు కదా! అట్టి మీరు ఏదైనా ప్రయోజనం ఆశించి ఈ సృష్టి కార్యమును నిర్వర్తిస్తున్నారా? లేదుకదా! ఓ జగన్నాథా! బాలుడు ఏమీ కోరకుండానే ఆడుట, పాడుట చేస్తున్నట్లు మీరుకూడా ఈ విధిని క్రీడాపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. ఈ సృష్టి అంతా ఒక 'లీల యే కాని, మరింకేమీ కాదు. అట్లే అగ్నిగోళస్వరూపము ధరించినట్టి సూర్యుడనగునేను కూడా, ఎట్టి ఇచ్ఛ లేకుండానే నిశ్చల-నిర్మల జలంలో ప్రతిబింబిస్తున్నాను. నిష్కాముడగు మీచే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సంభవిస్తోంది. మరి నేనో, కోరకుండానే నా ఎదురుగా నడచివెళ్ళుచున్న మానవుని యొక్క నీడ ఏర్పడుటకు కారకుడనగుచున్నాను.

విజ్ఞానమే స్వరూపముగా కలిగియున్నట్టి మీకు దేహాభిమానమేమిటి? ద్వంద్వములెక్కడ? మీరు అహంభావరహితులు. 'నేను - నాది'....అను భావావేశం లేనివారు. అందుచేత మీ వంటి వారు దేనిని వాంఛించరు. త్యజించరు. ఇచ్ఛాద్వేషములు లేకుండానే, నేను, రాత్రింబవళ్ళను నిర్మిస్తూ పోతున్నట్లు మీరుకూడా "ఇది ప్రాప్తించుగాక! ఇది తొలగుగాక అను రూపము గల ప్రాప్తాప్రాప్తములకు సంబంధించిన దృష్టిని ఆశ్రయించ కుండానే సృష్టిస్తున్నారు; మరల

Page:483

పరిపోషిస్తున్నారు. ఇట్టే సంహరిస్తున్నారు. సత్యద్రష్టలగు జ్ఞానుల అభిప్రాయం ప్రకారం ఇదంతా మీయొక్క విలాసం మాత్రమే.

ఇంతకాలంగా మీరు “ఇది నా కర్తవ్యము అని తలచి, ఆసక్తిరహితంగా నిత్యము చేస్తూవస్తున్నట్లే, ఇప్పుడు కూడా ఎట్టి స్వార్థము లేకుండా పరమార్థ భావనతో యథారీతిగా చేస్తూ ఉండటమే ఉచితం. ఒకవేళ యథాప్రాప్తములైన కర్మలను త్యజించి, ఈ 'సృష్టించడం' అనేది మానివేశార నుకుందాం. అప్పుడు మాత్రం మీరు పొందే అపూర్వవస్తువు ఏమున్నది చెప్పండి? ఒక దర్పణము దేనిని వాంఛించకుండానే, దేనిపట్లకూడా ఇచ్ఛాద్వేషములు లేకుండానే, ఎదురుగా ఉన్నదంతా తనయందు ప్రతిబింబింపజేయుట అను క్రియా వ్యవహారం సల్పుచున్నది కదా! అదేవిధంగా సత్పురుషులు కూడా “ఇది నాకు ప్రాప్తించాలి లేక, ఇది మరోవిధంగా ఉండాలి వంటి కల్పనకు, వాంఛకు తావు ఇవ్వకుండానే ఎల్లప్పుడు తమకు ప్రాప్తించిన కర్మలను నిర్వర్తిస్తున్నారు. ఆత్మజ్ఞానులకు "అయ్యో! మేము అది చేయలేదే?" అను రూపముగల అప్రాప్తములైన కర్మలను మననం చేయాలని ఏమాత్రం కోర్కె ఉండదు. అజ్ఞానులు, మాయామోహితులు మాత్రమే తమకు ప్రాప్తించిన కర్మలయందు దృష్టి ఉంచక, అప్రాప్తములైన వాటి గురించి యోచించుచూ, “వారి పనులు మాకు ఇచ్చి ఉంటే ఎంత బాగు! అని ఆవేదన చెందుతూ ఉంటారు. వారంతా కర్మహస్యం ఎరుగనివారే అగుచున్నారు. జ్ఞానులకు, తమకు ప్రాప్తములైన కర్మలను త్యజించాలనే పట్టుదలగాని, అంటిపెట్టుకొని ఉండాలనే ఇచ్ఛ ఉబలాటములు గాని ఉండవు.



కాబట్టి, ఓ బ్రహ్మదేవా! వాస్తవానికి నేనేమీ చేయుటలేదు అను అనుభవమునే జ్ఞానులు కలిగి ఉంటున్నారు. మీరుకూడా కర్మను నిర్వర్తిస్తున్న సమయమందు నాహంకర్తా నైవకించిత్ కరోమి = నేను కర్తను కాదు. నేనేమీ చేయుటలేదు... అనురూపముగల మౌనము లేక నుషుప్తి -

వంటి భావన వహించటమే ఉచితం. ఎవ్వడైనా ఎప్పుడైనా ఆసక్తితో కూడుకొన్నవాడై ఏదైనా చేస్తే మాత్రమే ... అట్టి కర్మయొక్క కర్తృత్వము, వాటి ఫలితముల భోక్తృత్వము సంప్రాప్తిస్తుంది. కర్తృత్వ -భోక్తృత్వ భావములు ఉన్నచోట మాత్రమే, సుఖ దుఃఖానుభవములు దీర్ఘమైన ప్రభావం కలిగి ఉంటున్నాయి. 'నాహంకర్తా' అనునట్టి భావన కలవానికి కర్మ ఎక్కడ? ఫలితమెక్కడ? ఒకవేళ ఏ సమయమందైనా కర్మ ప్రతీతి (నేను చేయవలసి వచ్చుచున్నదే?' అను భావన) కలిగినా కూడా - ఆఁ! ఇదంతా స్వప్నమాత్రమే కదా!" అని తలచుచు, నిష్కాములమై, ప్రాప్తించిన కార్యములను నిర్వర్తించటమే ఉచితమని నా అభిప్రాయం. జన్మలు ఏర్పడుచూ ఉండగా కూడా జన్మ రాహిత్యం ఆస్వాదించటం మోక్షస్వరూపుని అంతిమ లక్షణం కదా!

ఓ దేవా! ఇప్పుడు మీరు ఐందవుల సృష్టిని చూచి కొంత ఆశ్చర్యమును, కొంత వినోదమును పొందియున్నారు కదా! మీ సృష్టి తదితరులకు వినోదకరంగా, సంతోషం ప్రసాదించేదిగా ఉంటూ ఉంటుంది. అందుచేత, మీ కర్తవ్యమై ఉన్నట్టి సృష్టిని తదితరులు వినోదము, ఉల్లాసముల కొరకై నిర్వర్తిస్తూనే ఉండండి.

Page:484

ఇప్పుడు మీరు ఆ ఐందవులు సృష్టించిన సృష్టులను మనోనేత్రములచే మాత్రమే దర్శిస్తున్నారు. చర్మచక్షువులచే చూడలేరు. అన్యులచే గావించబడిన సృష్టులను మనం మనోనేత్రములచే మాత్రమే చూడగలం. కాని, సృష్టికర్త తాను సృష్టించినదానిని మాత్రం అవశ్యం తన చర్మచక్షువులచే చూడగలుగుతాడు. ఒకడు ఒక వస్తువుపట్లగాని, వ్యక్తిపట్లగాని ఏర్పరచుకొన్న ప్రియత్వము, అట్టి ప్రియత్వ కారణంగా కనిపిస్తున్న అందచందాలు అతనికే ఆ విధంగా తెలియవస్తాయికాని, ఇతరులకు కాదుకదా! అట్లే సృష్టికర్త మాత్రమే దీనిని నేను సృష్టించితిని” అని ఎరుగగలడు.

మరొక్క విషయం. ఈ పది బ్రహ్మాండములు ఆ ఐందవులయొక్క దృఢచిత్తముచే ప్రతిష్ఠితములై, సృష్టించబడ్డాయి. బ్రహ్మాండములను గాని, వీటిని సృష్టించినట్టి ఐందవులను గాని ఎవ్వరూ నశింపజేయలేరు. ఎందుచేతనంటారా? మనమెవ్వరమైనా ఒకని కర్మేంద్రియములచే చేయబడిన కార్యం నిరోధించగలం కాని, మనోనిశ్చయముచే చేయబడే కార్యము నిరోధించటమెట్లా? ఇక్కడ చమత్కారమేమంటే .... ఎవని చిత్తమునందు ఏది దృఢంగా నిశ్చితమై ఉంటుందో అద్దానిని అతడే తొలగించుకోవాలి. అంతేగాని, మరెవ్వరు దానిని తొలగించజాలరు. అసలు ఒక వ్యక్తియొక్క మనస్సులో ఒక దృఢనిశ్చయం ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి? బహుకాలంగా మనస్సునందు ఆ నిశ్చయమునకు సంబంధించిన సంకల్పములను అత్యంత ప్రియంగా, తీవ్రేచ్ఛతో అభ్యసించటంచేతనే కదా! కనుక, అట్లు ఏర్పడిన దృఢనిశ్చయం శాప వరాదులచేతగాని, దేహపతనము చేతగాని, మరింకే బాహ్యమైన ప్రయత్నంచేతగాని నివారించబడజాలదు. దృఢనిశ్చయమును సంకల్పిస్తున్నట్టి మనస్సు స్వయంగా దానికి వ్యతిరేకమైన సంకల్పములచే ఆ దృఢనిశ్చయమును ఉపసంహరించ వలసిందే. అట్లా ఉపసంహరించబడేవరకు ఆ నిశ్చయం 'అట్లే' ఉంటుంది. ఏదైతే మనస్సులో స్థిరంగా నిశ్చయింపబడుతుందో - ఆ మనుజుడు ఆ నిశ్చయమునకు సంబంధించిన రూపమునే పొందుచున్నాడు కాని, అన్యమైనరూపమును కాదు. ఏది ఏమైతేనేం? రాతిపై నీళ్ళు ఉన్నప్పటికీ, ఆ నీళ్లు ఒక బీజము అంకురించటానికి సహాయం చెయ్యలేవు కదా! ఈ సంసారదుఃఖం ఉపశమించాలంటే - ఒక్క ఆత్మబోధ తప్ప తక్కినవన్నీ నిష్ప్రయోజనములే.

ఈ జగత్తులన్నీ సృష్టించుచున్నది 'మనస్సే’ కదా! మనస్సే పరమపురుషుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు, ఎప్పుడు, ఏది, ఎక్కడైనా పొందుచున్నా అదంతా మనస్సుద్వారానేగాని, శరీరంచేత ఏ మాత్రం కాదు. ఈ మనస్సుయొక్క సామర్థ్యమేమిటో ఇప్పుడే ఈ ఐందవుల బ్రహ్మదేవత్వంలో చూచాము కదా! వారు కొంతకాలం క్రితం సామాన్యమైన మానవులై ఉండి, మనస్సు యొక్క దృఢ భావనచే బ్రహ్మపదమును పొందగలిగారు. ఈ జీవుడుకూడా మనస్సుయొక్క భావనను, ఆశ్రయించు స్వభావమును అనుసరించే ఆయా దేహములను పొందుచున్నాడు. ఒకనికి "నేను దేహమును” అనే భావనయే లేదని అనుకొందాం.... అప్పుడు అతడు ఈ దేహముయొక్క ధర్మములైనట్టి జనన-మరణములచే కూడా బాధింపబడజాలడు. బాహ్యదృష్టి మరియు శరీరదృష్టి కలవానికి

Page:485

మాత్రమే ఈ సుఖదుఃఖాది అనుభవములు ఉంటున్నాయి. కనుక, ఈ ప్రపంచములోని అనుభవము లన్నిటికీ కారణం మనస్సే. (కృత్రిమ)ఇంద్రుడు-అహల్య”ల వృత్తాంతమే ఇందుకు మనకు తార్కాణం.

బాహ్యదృష్టి : బాహ్యమునందు ఇది ప్రియము - ఇది అప్రియము అను భావన. అంతర్జృష్టి : "ఈ శరీరము, ఈ మనో-బుద్ధి-అహంకారాలే నేను అను పరిమిత భావన. బ్రహ్మదేవుడు : నాయనా! సూర్యుడా! నీ వచనములు చాలా యుక్తియుక్తంగానే ఉన్నాయి. నీవు చెప్పినదంతా అత్యంత సత్యము. నాకు చాలా సంతోషం కలుగజేశాయి. ఇప్పుడు సందర్భానుసారంగా అహల్య ఇంద్రుల వృత్తాంతం అని అన్నావు కదా! వారి వృత్తాంతమేమిటో వినిపించవూ? వారిద్దరి కథ వింటే నా దృష్టి మరికొంత పవిత్రత పొందగలదని భావిస్తున్నాను. అనంత కిరణములచే నిత్యోదితుడవై ఉండే ఓ సూర్యుడా! నీవు చెప్పబోయేది శ్రద్ధగా వింటున్నానయ్యా!

3. ఇంద్ర-అహల్యల ప్రహసనం సూర్యభగవానుడు : పితామహా! మీరు ఆజ్ఞాపించినట్లే చెప్పుచున్నాను వినండి.

పూర్వము 'ఇంద్రద్యుమ్నుడు' అనే మహారాజు మగధదేశమును పరిపాలిస్తూ ఉండేవాడు. “మనరాజు గొప్ప ప్రతిభాశాలి" అని ఆ రాజ్య ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. అతని భార్య అహల్య. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆ పురములోనే 'ఇంద్రుడు' అనే పేరుగల ఒక జారుడు లోలుడు) ఉండేవాడు. అతని గురించి ఆ నగరంలో పరిపరి విధములుగా చెప్పుకొంటూ ఉండేవారు.

అంతఃపురములోని చెలికత్తెలు ఆ ఇంద్రునియొక్క (స్త్రీ సాంగత్యములకు సంబంధించిన) విచ్చలవిడి ప్రవర్తన గురించి చెప్పుచున్నప్పుడు రాణి అహల్య నవ్వుకుంటూ వింటూ ఉండేది. ఒకసారి, ఆ అహల్య గౌతముని పత్నియగు అహల్య-ఇంద్రులగురించిన పురాణగాథ వినటం జరిగింది. ఆ కథాప్రసంగమును తనకే అన్వయించుకొని, చంచలము - దుష్టసంకల్పములు గల మనస్సు కలిగియుండుటచే, జారుడగు ఇంద్రునియందు ఆసక్తి కలిగియుండటం ప్రారంభించింది. ఈ ఇంద్రుడు అనబడేవాడు ఎంత అందంగా ఉంటాడోమరి! లేకపోతే, అంతమంది స్త్రీలను ఆకర్షిస్తాడా! లేదుకదా! అతడు నాయందు ఆసక్తి కలిగి, నన్ను వెతుక్కుంటూ వస్తే ఎంత బాగు! అవును, ఎందుకు రాకూడదు? అని కుసంకల్పం చేయటం ప్రారంభించింది. చిలవలు - పలవలుగాను, అత్యంత దీర్ఘంగా తలపోయుటచేత కొన్నాళ్ళకు ఇంద్రుని సాంగత్యము నాకు ఆవశ్యకము అను భావన ఆమెయందు దృఢతరం కాజొచ్చింది. ఫలితంగా దుఃఖితురాలు అయ్యేది. అక్కడి రాజభోగములు ఆమెకు ఏమాత్రం ప్రీతిగొలిపేవి కావు. తన ఆలోచనలకు తానే 'వివశ’ అయి సిగ్గునుకూడా విడచివేసింది. ఇదిగో! ఇక్కడ ఎవ్వరో నిలబడ్డారు.... ఇతడే ఇంద్రుడు..... అవును. సందేహం లేదు. ఇతడే నా ప్రియుడు.... నా కోసమే వచ్చాడు..... అని చెట్టును, గోడను, స్తంభమును చూచికూడా అరవటం ప్రారంభించింది. ఆ రాణియందు మిక్కిలి స్నేహంగల

Page:486

ఒక సఖి ఆమెయొక్క దీనావస్థనంతా గమనించింది. "ఓ రాణీ! ఈ పిచ్చి ఏమిటి? ఈ దుః ఖమేమిటి? సరే. ఏడవవద్దు. ఊరుకో. ఎట్లాగైనా సరే, నేను ఆ యువకుడగు ఇంద్రుని నీ వద్దకు తప్పకుండా తీసుకొస్తాను అని లాలనగా పలికింది. అది విని ఆ రాణి వికసిత నేత్రములతో కొంత ఉపశమనం పొందింది. తన ఇష్టసఖి పాదాలపై వ్రాలి మరల మరల దీనంగా వేడుకొన్నది. మరింకే ఊసు ఎత్తినా, అది ఆమె చెవికి చేరుటలేదు.

ఎట్లాగైతేనేం... ఆ సఖి 'ఇంద్రుడు' అనబడు యువకుణ్ణి కలుసుకొన్నది. రాణి వృత్తాంత మంతా తెలియజేసింది. ఎట్లాగో..... అతనిని ఒక రహస్య ద్వారం గుండా అంతఃపురంలోకి తీసుకొచ్చింది. ఆ రాత్రి అహల్య ఒక రహస్య ప్రదేశంలో ఇంద్రునితో పొందు అనుభవించింది. ఆ విధంగా ఆ రాణి ఒక సామాన్యయువకునికి వశమైపోయింది. అతనియందు ఆసక్తిచే, ప్రపంచమంతా అతనితోడిదే! అతని తరువాతే ఇక ఏదైనా సరే! అను రూపం గల తన్మయత పొందసాగింది.

ఆ విధంగా అనేక రోజులు గడచిపోతున్నాయి. అతనియందు వ్యామోహము ఎప్పటికప్పుడు అధికమగుచు ఉండేది. అతడు కూడా ఆమె పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండేవాడు. అతనిపై గల వ్యామోహంచేత అహల్య ఉత్తమగుణములుగల తన భర్త ఇంద్రద్యుమ్నుని కూడా అల్పునిగా తలచుచూ ఉండేది. ఇంద్రుని గురించి తలచుకొనుచున్నప్పుడెల్లా ఆమె ముఖము ఎంతో సంతోషంతో వికసిస్తూ ఉండేది. ఇక ఇంద్రుడు కూడా ఆమెయందు ఆసక్తి కలవాడై, ఆమె వియోగమును ఒక్కక్షణమైనా సహించలేకపోయేవాడు. కొన్నాళ్ళకు, అతిసంతాపకరము, జుగుప్సాకరము, అధర్మప్రవృత్తి రూపము అయినట్టి వారిరువురి దృఢప్రేమబంధము రాజుయొక్క దృష్టిలోకి వచ్చింది. అప్పుడు 'జ్ఞానము-తితిక్ష’ మూర్తీభవించిన ఆ ఇంద్రద్యుమ్నుడు వీరిద్దరి పరస్పర ప్రేమ సాంఘిక విరుద్ధంకదా! కాబట్టి వీరిద్దరిని తగినరీతిగా శిక్షించక తప్పదు. అది నా రాజధర్మమై యున్నది. తద్వారా ఇట్టి నీచ ప్రవర్తనము నుండి వీరిని విరమింపజేస్తాను" అని తలచాడు.

అది శీతకాలం. వారిద్దరిని రాజు సభకు పిలిపించి, గట్టిగా మందలించాడు. భయపెట్టాడు. కాని ఏం లాభం? వాళ్ళు మాత్రం ఏది ఏమైనాకానీ, మేము మాత్రం ఇంతే. మా ఇద్దరికీ ఒకరి కొకరు కావాలి అని మూర్ఖంగా మాట్లాడసాగారు. ఇక చేసేదేముంది? రాజశాసనమును అనుసరించి, వారిని సంస్కరించే ఉద్దేశంతో "ఇంద్రియములను బిగదీసివేయు చలి వాతావరణంలో వీరిద్దరు నాలుగు రోజులు కట్టివేయబడుదురుగాక" అని న్యాయవేత్తలచే నిర్ణయించబడింది. భటులు వారిని చల్లని నీటిలో నాలుగు రోజులు ఉంచారు. వారిలో ఏమాత్రం పరివర్తనలేదు. పైగా మామూలు వాళ్లెవరైనా రెండో రోజుకో, మూడో రోజుకో ఆర్తనాదాలు చేసేవారే! వారిద్దరికి కించిత్ కూడా బాధ గాని, దుఃఖము గాని కలుగలేదు. ఒకరితో మరొకరు సంభాషించుకొంటూ సంతోషముతో ఉండి ఉన్నారు. వారి పట్ల ఆ శిక్ష నిష్ప్రయోజనమే అయింది. ఆ వార్తను భటులు రాజుకు నివేదించారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు కొంత ఆశ్చర్యపడి, వారిద్దరిని సమీపించి "ఓ దుష్టజీవులారా! మేము విధించిన శిక్షచే ఏమాత్రం బాధ ప్రకటించనేలేదని, ఆ శిక్షచే మీరిద్దరు ఆనందమే

Page:487

పొందుచున్నారని, ఈ భటులు చెప్పారు. నిజమేనా? ఎందుచేత? అని ప్రశ్నించాడు. అప్పుడే నీటి నుండి బయటకు తేబడిన ఆ ఇద్దరు రాజుతో “ఓ రాజా! మీరు విన్నది నిజమే. మేమిద్దరం శిక్షా సమయంలో కూడా ఒకరినొకరం స్మరించుకొంటున్నాం. దృఢప్రేమబద్ధులమై యున్నాము. అందుచేత మాకు దేహస్మృతియే లేదు. దేహస్మృతి లేనివానికి చలి ఏమి చేస్తుంది? మా మనఃసంబంధం అత్యంత దృఢమైనదవటంచేత, మీ భటులచే బాధించబడినప్పటికీ మేము ఆనందంగానే ఉన్నాము. ఈ అవయవములు ఛేదించబడతాయంటే, అందుకుకూడా మేము సిద్ధమే. మేము మా ప్రేమ సంబంధబలం చేత సంతుష్టులంగానే ఉంటాము.”

అంతావిన్న రాజుకు చాలా కోపంవచ్చింది. ఓ భటులారా! వీరిని అగ్నిచే కుత కుత ఉడికి పోతున్న గదిలోకి త్రోయించండి. రెండు రోజుల వరకు వీరిని పలకరించనే వద్దు. అరిచి గీపెడుతున్నా సరే, మీరు జాలి చూపవద్దు. ఈ లోగా మరణించారా, సరే. రేఁ!, లేదా, రెండు రోజుల తరువాత వీళ్ళని నా దగ్గరకు తీసుకురండి, అప్పుడు చూద్దాం..... అని ఆజ్ఞాపించాడు. అచటకూడా వారు ఏ మాత్రం భేదం చెందలేదు. ఒకరినొకరు తలచుకొంటూ ప్రసన్నులైయున్నారు. అప్పుడు ఏనుగులచే త్రొక్కించబడ్డారు. వారు విషాదమే చెందలేదు. అస్సలు, ఆ త్రొక్కిసలాట వారిని ఏమీ చెయ్యలేక పోయింది. వారిద్దరు మాత్రం అన్నివేళల అన్యోన్య స్మృతిచే హర్షమునే పొందుచున్నారు. అప్పుడు రాజు వారిని కొరడాలచే కొట్టించాడు. అయినప్పటికీ వారిద్దరు ప్రసన్నముగానే ఉండియున్నారు. ఇక వారిని శిక్షించి ప్రయోజనం లేదని గ్రహించిన మహారాజు వారిద్దరిని తన వద్దకు పిలిపించాడు.

4. నేను మనోమాత్రుడను!

ఇంద్రద్యుమ్నుడు:తుచ్ఛబుద్ధులారా! మీ ఇద్దరినీ సంస్కరించాలని ప్రయత్నించాం. ఇంత జరిగినప్పటికీ, మీరు ఇంకా సుఖసంతోషములతో ఎట్లా ఉంటున్నారో --- నాకు కాస్త చెపుతారా? ఇంద్రుడు : ఓ రాజా! నాకీజగత్తు అంతా అహల్యామయంగానే కనిపిస్తున్నది. నాయొక్క ప్రేమ’ కారణంగా కాబోలు - నాకు ఈ ప్రపంచం ఈమె రూపముగానే తోచుచున్నది. ఈమెకు కూడా సర్వదా నా రూపమే గోచరిస్తోంది. అందుచేతనే, మీరు విధిస్తున్న దండనలన్నీ మాకు బాధకలుగజేయ లేకపోతున్నాయి. మా ఇద్దరికీ ఈ ప్రపంచమంతా ఒకరిరూపంగా మరొకరికి కన్పించుటచేతనే, అగ్నిబాధ, జలస్పర్శ, తాడనము మొదలైనవిగాని, “ఎవ్వరేమనుకొంటారో?” అనే భీతి మొదలైనవిగాని మమ్ములను ఏమీ చేయలేకపోయాయి.

ఓ మహారాజా! ఇంద్రద్యుమ్నా! నేను ఈ శరీరమునా? కాదు. నేను మనోమాత్రుడను. మనస్సే పురుషుడు. ఇక, మీకు కన్పించే ఈ దేహము మనస్సుయొక్క కల్పనాదృష్టికి ఇట్లు కనబడు చున్నదే కదా! అతిశక్తివంతమైన మనస్సును, దానియొక్క స్వకీయమైన ప్రేమ మొ॥) కల్పనలను మీ పంచభూతపరిమిత దండనలు ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఎంతటి శక్తి కలవారైతే ఏం?

Page:488

మనస్సుచే నిర్మించబడుచున్న అనుబంధమును, భావకలాపమును ఎట్లా ఛేదించగలరు? ఈ శరీరము వృద్ధి పొందవచ్చు. కాని, మనస్సు మాత్రం... “దృఢభావన చే ఇష్టములైన, “అనుభూతి” మొదలగు వాటిని ఎప్పటికీ అట్లే ఉంచుకోగలదు. ఈ విషయం మా ఇరువురిపట్ల నిరూపించబడుతోంది కదా! ఈ మనస్సు చాలాకాలం ఒక పదార్థమును వాంఛించుచున్నదనుకోండి..... అప్పుడది దాని యందు సంలగ్నమగుచుండుటచే, ఆ పదార్థాకారమునే పొందుచున్నది. అట్టి దృఢభావము పొందిన మనస్సు’ను ఆయా భౌతికమైన ప్రతిబంధకములు తాకనైనా తాకలేవు.

ఓ ప్రియమహారాజా! ఈ మనస్సుకు గల ఒక ముఖ్యమైన లక్షణం గురించి చెపుతాను. వినండి. ఇది తనయొక్క తీవ్ర సంకల్పముచే దేనిని ఎట్లు నిశ్చయిస్తుందో - దానిని అట్లే స్థిరముగా “గాంచుట పొందుట చేస్తూ ఉంటుంది. ఇక వరములుగాని, శాపములుగాని, మరింకే బాహ్యమైన ప్రయత్నములుగాని అట్టి తీవ్రసంకల్పయుతమైన మనస్సును నిరోధింపజాలవు. ఒక లేడి పెద్ద బండరాయిని కదల్చగలదా? తీవ్ర అభిలాష కలిగిన మనస్సును తనయొక్క ఇష్టవస్తువు నుండి దృష్టిని మరలింపగలిగిన వారెవ్వరు చెప్పండి?

ఈ అహల్య నా కంటికి చూపువలె, దేవాలయములో వేంచేసియున్న దేవతారూపమువలె - నా మనస్సులో ప్రతిష్ఠితమైయున్నది. మేఘాలుగాని, గ్రీష్మఋతువుగాని, ఒక కొండను బాధించలేవు కదా! నా “జీవహేతువు” అయినట్టి ఈ నా ప్రియురాలిని భావన చేసినంతమాత్రంచేత, తదితర దుఃఖములు ఎన్నైనా భరించుటకు ఓర్పు, శక్తి వచ్చిపడుతున్నాయి. "నేను ఎట్లాగైనా ధనికుణ్ణి కావాలి" అని కోరుకొనువానికి డబ్బు సంపాదించటంలోను, దాచి పెట్టుకోవటంలోను, లోభ వ్యవహారసరళిలోను వచ్చే సాధక బాధకములన్నీ సుఖప్రదములే అగుచున్నాయి కదా! నా విషయం కూడా అట్టిదే. నేను ఈ వర్తమాన మానసిక స్థితిని అనుసరించి, ఈమె పొందు కొరకు ఏ దుఃఖా నుభవమునైనా పొందటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మా ఇద్దరిని అనేక విధాలుగా భయపెట్టారు. కాని మాకు ఏ క్షణంలోకూడా భయమని అనిపించనేలేదు. నేను ఎక్కడైనా ఉండవచ్చు. లేదా, ఎక్కడైనా పతనం చెందవచ్చు. అచ్చట కూడా నేను నా ప్రియురాలి సమాగమము తప్ప, ఇంకేమీ తలచను...... భావించను. ఓ మహారాజా! మీరు సర్వము తెలిసినవారే. అంతా మనస్సే కదా! నా మనస్సుచేతనే అహల్య నాకు ప్రియురాలు అయినది. ఆమెయొక్క మనస్సుచేతనే సామాన్య పౌరుడనగు నేను ఒక మహారాజ్ఞికి అత్యంత ప్రియుణ్ణి అయ్యాను. దృఢసక్తి పొందియున్నట్టి మా ఇరువురి మనఃస్వభావములను ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఎవ్వరూ మార్చలేరు. ధీరులయొక్క చిత్తము దేనియందైనా నిమగ్నమైనదా.... ఇక దాని స్థిరత్వం ఎవరు పాడుచేయగలరు చెప్పండి? ధీరులు కానివారు మాత్రమే కొంతవరకు (ధ్యానము - పూజ - పఠించుట మొదలైన) ప్రయత్నములను ఆశ్రయించి, ఇంతలోనే ఒక చిన్న అడ్డంకి రాగానే వెనుకకు మరలుచూ ఉంటారు. “అట్లు కొనసాగించ లేకపోవటానికి ఫలానా పరిస్థితులు, ఫలానా వ్యక్తులు కారణం అని వారు తమను తామే మోసం చేసుకొంటూ ఉంటారు.

Page:489

వర-శాపములచే ఈ భౌతిక శరీరము ఒక రూపమును పోగొట్టుకొని, మరొక రూపం (మరొక శరీరం) పొందితే పొందవచ్చు. అంతేగాని, దృఢచిత్తం మాత్రం తప్పకుండా అన్ని విక్షేపాలను జయించి స్థిరంగా ఉండగలదు. ఇందులో సందేహించవలసిన పనిలేదు. ఒక వేళ విక్షేపం కలిగితే... అందుకు కారణం చిత్తము స్థిరత్వము కలిగియుండక పోవటము మాత్రమే సుమా!

ఈ శరీరము మాత్రం మనస్సునకు ఎప్పటికీ కారణం కాదు. మనస్సే శరీరమునకు కారణమగుచున్నది. లతలలోను, వృక్షములలోను రసము వ్యాపించి ఉంటుంది చూచారా? అట్లాగే మనస్సే శరీరము నందు అంతటా వ్యాపించియున్నది. జీవాత్మకు మనస్సే మొట్టమొదటి శరీరమై ఆయా భోగానుభవములకు హేతువు అవుతోంది. ప్రపంచములోని ప్రాణికోట్ల శరీరములన్నీ మనస్సు చేతనే కల్పించబడుచున్నాయి. మనస్సుచేతనే దర్శించబడుచున్నాయి. స్వీకరించటం త్యజించటం... అంతా మనస్సుయొక్క వ్యవహార దక్షతయే అయిఉన్నది. ప్రథమ శరీరము” అని చెప్పబడుచున్న మనస్సునందే నేను-నేను అను అభిమానం కూడా ఉదయిస్తోంది. అట్లు ఉదయించుట చేతనే... అట్టి మనస్సుచే భిన్న శరీరములు ఏర్పడుచున్నాయి. ఇన్ని మాటలెందుకు? ఈ జీవత్వమునకు ముఖ్యకారణం (లేక) అంకురం మనస్సే సుమా! దానినుండే ఈ దేహములన్నీ ఏర్పడుచున్నాయి.

ప్రభూ! అంకురం ('మొలచుట' అను స్వభావం) నశిస్తే పుష్పములు కూడా నశిస్తాయి. కాని పుష్పములు నశిస్తే అంకురము నశిస్తుందా? లేదు. అదేవిధంగా, ఈ దేహము నశించినా మనస్సు ఉంటుంది. కాని, మనస్సు నశించటం జరిగితే, ఇక దేహమెక్కడ?

కనుక అయ్యా! మేమిద్దరం పరస్పరం ప్రేమబద్దులం. మా గురించి మీరు ఎందుకు వేసటచెందుతారు చెప్పండి? మీ శ్రేష్ఠమగు చిత్తమును పరమ పురుషార్థమునందే నియోగించితే ఈ ‘జన్మలు-కర్మలు' అను బంధము నుండి మిమ్ములను మీరు రక్షించుకోగలరు. అట్లుచేసి, బంధము నుండి, విముక్తులు అవటానికే ప్రయత్నించండి. అదే ఉచితం.

ఓ సుబుద్ధీ! చక్రవర్తీ! నేను ఈ అహల్యనే అన్నివైపులా, అంతటా చూస్తున్నాను. నా చిత్తము ఇప్పుడు ఈమె రూపమే అయి ఉండటంచేత ఈమె సాంగత్యం చేత సర్వదా ఆనందము పొందుచున్నది. మీరు ఇప్పటికే అనేక రకాలుగా మమ్ములను హింసించుటకు యత్నించారు. అవన్నీ మీకు, మీ ప్రజలకు దుఃఖములను కలుగజేస్తాయేమోకాని, మాకు మాత్రం కాదు. అందుచేత ఇక మమ్మల్ని మా త్రోవలో పోనివ్వండి. ఇక్కడికి దూరంగా మా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాం.

అంతా విన్న మహారాజు ఎంతో ఉద్రిక్తుడైనాడు. తన ఆసనం ప్రక్కనే ఆసీనుడైఉన్న రాజగురువగు “భరతుడు” అనునాతని వైపుచూచి ఇట్లు పలుకసాగాడు.

Page:490

ఇంద్రద్యుమ్నరాజు : గురువర్యా! భరతమునీ! ఇతని ఆగడపు మాటలు వింటున్నారా? పరస్త్రీని అపహరించి మహాపాపమునకు ఒడిగట్టాడు. ఇంకా, ఏవేవో గర్వోక్తులు పలుకుచున్నాడు. నేను అనేక ప్రయత్నములచే కూడా, ఇతనిని ఏమీ చేయలేకపోయాను. మీరు మహాశక్తి సంపన్నులు కదా! శిక్షించతగ్గవానిని శిక్షించకపోతే, ఆ రాజుకు పాపం చుట్టుకుంటుంది- అని మన రాజ్యపు న్యాయశాస్త్రం ఘోషిస్తోంది. అందుచేత, మీరు మీ తపోశక్తిచే ఇతని పాపకార్యమునకు తగిన విధంగా ఏదైనా శాపం ఇవ్వండి. అటుపై వీళ్ళిద్దరిని పంపివేద్దాం.

అప్పుడా రాజగురువు ఇంద్ర - అహల్యల పాపకృత్య మంతా మరల విచారణ చేశాడు. ఎంతో చెప్పి చూచాడు. లాభం లేకపోయింది.

భరతమునీంద్రుడు : ఓ దురాత్ములారా! మీరిద్దరు చెయ్యరాని దోషపూరిత క్రియలు చేశారు. ఓయీ అహల్యా! నీవు భర్తృ దోహం చేసి పాపం చేశావు. ఓ ఇంద్రుడా! నీవు పరాయి స్త్రీతో అపవిత్రమైన సంబంధము కలిగి ఉన్నావు. ఈ రాజ్య-శాశనానుసారం, రాజాజ్ఞను అనుసరించి మిమ్ములను శిక్షించే నిమిత్తం నా తపస్సును వినియోగిస్తున్నాను. మీ ఇరువురి దోషపూరిత ప్రవర్తన శిక్షార్హం. అందుకు ఇదే నా శాపం. మీరిద్దరు మరణించెదరు గాక!”

ఇంద్రాహల్యలు : ఓ రాజా! ఓ మునీంద్రా ! మీరిద్దరు అల్పబుద్ధి కలవారే అగుచున్నారు.

ఓ మహామునీ! మీరు మాకు ఇట్టి శాపం ఇచ్చి, నిష్కారణంగా మీ దుష్కరమైన తపస్సు వ్యర్థం చేసుకొన్నారు. మా ఉద్దేశంలో ఈ శాపము మా ఇద్దరికి చేయగల హాని ఏదీలేదు. మీ వాక్య ప్రభావం చేత ఈ దేహాలు నశించవచ్చు. కాని ఒకరినొకరు ప్రేమించుకొంటున్నది ఈ భౌతిక దేహాలనా? కాదు. మనోరూపులమైనట్టి మాకు నాశనమెక్కడిది? మా చిత్తము సూక్ష్మము, చిన్మయము, అగోచరము కదా! మా మనస్సులు మీయొక్క శాపపర్యవసానానంతరం కూడా నశించకుండానే ఉంటాయని గ్రహించండి.

దృఢస్నేహబద్ధులగు వారిద్దరు ఇట్లు ఎలుగెత్తి పలికారు. ఒకరు చెప్పుచుంటే మరొకరు 'అవును.... అవును' అనురూపముగల అనుకూల శబ్దములు చేశారు.

శాప ప్రభావంచేత వారిద్దరు నేలకూలి మరణించారు.

వారిద్దరికి ఒకరిపై మరొకరికి విడదీయరాని అనురాగమున్నది కదా! అందుచేత, మరుజన్మలో రెండు లేళ్ళుగా జన్మించారు. ఆ తరువాత అనేక పక్షి జంటల జన్మలు ఎత్తారు. ఇక ఇప్పుడు, నేను సంచారం చేసే ఒకానొక బ్రహ్మాండములో ఒకచోట వారిద్దరు పరస్పరాసక్తత కలిగియుండి--- తపః సంపన్నులగు బ్రాహ్మణ దంపతులుగా జన్మించారు.

చూచారా! పితామహా! దుస్సాధ్యములగు శాపములు కూడా వారిద్దరి మనస్సులను విడదీయ లేకపోతున్నాయి. వారియొక్క స్నేహసంస్కారముచే వారు ఎక్కెడెక్కడ జన్మించినప్పటికీ స్త్రీ - పురుషులు

Page:491

గానే ఉంటున్నారు. వారి సహజ ప్రేమ భావమును, అత్యధిక స్నేహమును చూచి వృక్షములు కూడా ప్రేమరసపూర్ణములై ఉంటున్నాయి.

5. యథావిధి

కనుక, శాపాదులు మనస్సును భేదింపలేవు. మరలింపజాలవు. ఐందవుల సృష్టులను నశింప జేయటం ఇప్పుడు ఉత్తమమైన పనికాదు. మీవంటి మహాత్ములు రాగము, మదము మాత్సర్యములను దగ్గిరకు రానివ్వరు కదా! ఈ లోకమునకు, అనేక బ్రహ్మాండములకు ప్రభువు అయినట్టి మీరు అట్లా చేయటం దీనత్వమునకే హేతువు అవుతుంది. బ్రహ్మాండములను సృష్టించగలశక్తి - సంపన్నములు గల వారి-వారి మనస్సులను ఎవ్వడూ దేనిచేతా నశింపజేయలేడు. అందుచేత, ఆ ఐందవులను తమ దివ్యదృష్టి కలిగియే ఉండనివ్వండి.

మీరు కూడా, మీ చిత్తాకాశమునందు యథావిధంగా ప్రజలను సృష్టించండి.

చిత్తాకాశము ఈ పాంచభౌతిక సంబంధమైన ఆకాశము వంటిది కాదుకదా! అది అనంతము. మీకు సర్వము తెలిసే ఉన్నప్పటికీ... మన ఉభయుల పునశ్చరణ కొరకు - - సందర్భం వచ్చినది కనుక చెప్పుచున్నాను. మనం పూర్ణతత్త్వాన్ని పరిశీలించినప్పుడు, ఆకాశములు మూడు రకములుగా విభజించబడుచున్నాయి -

1. భూతాకాశము (Zone of matter)

2. చిత్తాకాశము (Zone of thoughts)

3. చిదాకాశము ( Zone of Consciousness)

మొదటి రెండూకూడా చిదాకాశము చేతనే ప్రకాశింపబడుచూ, అనంతములే అయిఉన్నాయి. కాబట్టి ఓ జగదీశా! మీరు 'ఒకసృష్టి' గాని, లేక 'రెండుసృష్టులు గాని, లేక 'అనేక సృష్టులు’ గాని ఇతఃపూర్వము వలెనే సృష్టించండి. ఆ పదిమంది ఐందవులు మీదైనదంటూ ఏదీ ఆక్రమించియుండ లేదు కదా! ఇక వారిపై కోపందేనికి చెప్పండి? చిదాకాశమునందు వాస్తవానికి సృష్టిత్వము లేకయే ఉన్నది. అది ఎవరిది? ఎట్టిది? మాయచేతనే నేను-నాది - నీవు-నీది-అది-ఇక్కడ-అక్కడ... అను భేదమంతా తోచటం జరుగుతోంది. కనుక, సర్వజ్ఞులగు మీరు మీ "స్వకీయ ప్రేరేపణ"ను అనుసరించి సృష్టికార్యము చేయుచు, నిరభ్యంతరంగా ఆత్మయందు స్థితి కలిగియుండవచ్చు. బ్రహ్మదేవుడు : ఓ ఓ సూర్యభగవానుడా! నీవు చెప్పుచున్నదంతా చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలా చక్కగా సత్యవిషయమును, నా యొక్క విహిత - - అవిహితములను గుర్తుచేశావు. నీవు అన్నట్లు ఆకాశములన్నీ అనంతములే. "చిత్తాకాశము అనగా “మనస్సహితమైన చిదాకాశము” కాకుండా మరింకేమీ కాదు. కాబట్టి చిత్త చిదాకాశములు రెండూ అనంతములే. ఇక ఈ భూతాకాశము ఈ కనబడే సృష్టియందు అంతర్భూతమై ఉంటోంది. బ్రహ్మాకాశము (లేక చిదాకాశము)

Page:492

నకు వాస్తవానికి దేనితోనూ సంగము (Attatchment) లేదు. కనుక నాకు అభిమతమగుచున్న ఈ సృష్టిని ఒనర్చుచు, స్వధర్మమైనట్టి నిత్యకర్మను నిర్వర్తించెదను గాక! ఓ భాస్కరా! నాకు ఇప్పుడు ఉత్తమ విషయమును (ధర్మమును) గుర్తు చేసినట్టి నీవే నా ఈ 'సృష్టి' అను కార్యక్రమము నందు, “ప్రథమ-మనువు” అగుదువుగాక! ఇక ప్రాణులను సృష్టించుటే నా తక్షణ కర్తవ్యం. నాయొక్క ప్రతినిధిగా నీవు నాచే ప్రేరితుడవై, నీ ఇచ్ఛానుసారంగా సృష్టిని గావించు!

బ్రహ్మదేవుడు : నాయనా! వసిష్ఠా! మహాతేజస్వియగు ఆ ఆ భానుడు నేను చెప్పినదానికి అంగీకరించాడు. అప్పటికప్పుడు తన శరీరమును 'రెండు భాగాలుగా విభజించాడు. అందులో ఒక శరీరమును ‘ఐందవ సృష్టి’ లోని సంచరించుచున్న బ్రహ్మాండము నందు సూర్యుడుగా ఉండి యథాతథంగా లోకములను ప్రకాశింపచేయటం కొనసాగించాడు. రెండవ శరీరముతో, నాచే ప్రసాదించ బడిన మనువు’ పదవిని అలంకరించి నా అభిమతానుసారం సృష్టులను నిర్మించ ప్రారంభించసాగాడు.

6. 'జీవుడు' అనగా?

శ్రీ బ్రహ్మదేవుడు : ప్రియపుత్రా! వసిష్ఠ "ఈ సృష్టులన్నీ ఎట్లా కలుగుచున్నాయి? అను నీ ప్రశ్నకు సమాధానంగా ఐందవ బ్రహ్మాండము మరియు “ఇంద్రాహల్యల ప్రహసనం చెప్పాను. 'మనస్సు’ యొక్క సర్వకర్త ృత్వము, శక్తి గురించి తెలియజేయుటయే నా ఉద్దేశం. ఇది ఇట్లు కనిపించి, అనుభవమగుటకు కారణం? నీ మనస్సు ఇట్లు భావించుట - - సంకల్పించుటయే సుమా!

ప్రతిజీవిలోని మనస్సు అంతటి మహాశక్తి సమన్వితము, సర్వకర్తృత్వ సహితము, సర్వభావనా సమర్థము అయి ఉన్నది సుమా! అయితే ఈ జనులు స్వల్ప విషయములనే మళ్ళీ మళ్ళీ ఆశ్రయిస్తూ, సంకల్పించుచుండుటచే, వారి మనస్సులు స్వల్ప ప్రయోజనములను మాత్రమే పొందుచున్నాయి.

ఈ చిత్తమునందు ఏదేది ప్రతిభాసిస్తోందో - అది మాత్రమే వ్యక్తమగుట, స్థిరత్వము పొందుట, సాఫల్యమగుట జరుగుచున్నది. ఈ మనస్సుయొక్క సామర్థ్యమెట్టిదో ఐందవబ్రహ్మాండములు నిరూపిస్తున్నాయి. ఐందవులు మనోభావనాబలం చేతనే బ్రహ్మపదమును పొందగలిగారు. ఐందవుల చైతన్యమే చిత్తత్వము పొందటం జరిగింది. ఆ చిత్తత్వము నందలి 'భావన' యే, హిరణ్యగర్భత్వము (సమష్టిసృష్టి భావన)ను సంతరించుకొన్నది. అంతేకాదు, మనందరి విషయం కూడా అట్టిదే. చైతన్య స్థితి నుండి చిత్తత్వము పొంది, తత్ఫలితంగా మనం ఈ ఈ రూపములను ఆశ్రయించాము. చిత్తమే ప్రతిభాసారూపముచే (In the process of reflection) 'దేహము' మొదలైన రూపములను ప్రకాశింపజేయుచున్నది. అనగా, ఈ దేహాదులు చిత్తముకంటే ఏమాత్రం వేరైనవి కావు.

ఈ చిత్తము చాలా సమయాలలో అనేక కల్పనలతో కూడుకొని ఉంటోంది. మిరియపుగింజ కారంగాను, ద్రాక్షపండు తియ్యగాను ఉంటూఉంటాయి కదా! ఈ జీవుని చిత్తము కూడా

Page:493

కామ్యకర్మలను, వాసనలను ఆశ్రయించటం, కలిగియుండటం స్వభావంగా పొంది ఉంటోంది. చిత్తము ఎట్లా ఉంటే అద్దాని భావసంస్కారములను అనుసరించే వ్యక్తీకరణ కూడా ప్రాప్తిస్తూ ఉంటుందని గ్రహించు. చిత్తము యొక్క మననమును - మననములను అనుసరించే సృష్టిలోని వివిధ దేహాలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఈ జీవుడు భ్రాంతిచే తన సూక్ష్మ వాసనలనే స్థూలముగా భావించి, నేను మనుజుడను, నేను దేవతను... అని తలచుచూ వ్యర్థముగా మోహితుడు అగుచున్నాడు.

సూక్ష్మవాసనలతో కూడుకొని యున్న చిత్తమునే 'జీవుడు' అంటున్నాం. స్థూలత్వ భ్రాంతిచే అదియే దేహము' అని కూడా దర్శించబడుచున్నది. ఏది ఏట్లైనా ఉండనీ! ఈ సూక్ష్మ, స్థూల శరీరములు, వీటిని దర్శించటం ఇదంతా కల్పనామాత్రమే. వాస్తవానికి ఈ జీవుడు సాక్షాత్ బ్రహ్మమే అయి ఉన్నాడని సర్వదా ఎరుక కలిగియుండుము.

ఓ విశ్వామిత్ర - వసిష్ఠులారా! దారము కంటే వస్త్రము వేరైనదని అనగలమా? ఈ “నేను-నీవుఅతడు మొదలుగాగల తదితరములన్నీ... అత్యంతాశ్చర్యకరమైన ఈ చిత్తముకంటే వేరేమీ కాదు. అయితే, ఈ చిత్తము వాస్తవానికి స్వరూపరహితమైనదే. కల్పిత మాత్రమైనదే. కాని, మనం ఐందవ బ్రహ్మాండములు (ఐందవోపాఖ్యానం) విషయంలో గమనించినట్లు ఇది సత్తను పొంది వర్తించుచున్నది. జడము మాత్రమే” అయిన ఈ చిత్తము ఇద్దాని ఆధారమగు చైతన్యము చేతనే సత్తను పొందుచున్నదని గ్రహించు. ఐందవుల మనస్సే 'బ్రహ్మ', 'బ్రహ్మాండము' లుగా పరిణమించినది కదా!

1) భూతికంగా ఘనీభూతమై కనిపించే ఈ పాంచ భౌతిక దృశ్య సృష్టి వస్తుతః మనోరూపమే అయి ఉన్నది. (లేక) ఇదంతా సంకల్ప రూపమే!

2) అనుభవమునకు కారణమగుచున్న 'అనుభూతి - స్వయంకృతమే! (లేక) స్వయం నిర్మితమే! 3) జగత్ సంకల్పము ఆత్మ సంకల్పమునందు లయిస్తే ..., సర్వమూ పరమాత్మనుభవంగా శేషించగలదు.

మనం కూడా మన సంకల్పముల ప్రభావంచేతనే బ్రహ్మ - - మహర్షులము అయినాము. అట్టి మనస్సుచే స్థితి పొందినట్టి మనం, మనచే రచించబడిన ఈ జగత్తు ... ఈ సర్వం సంకల్ప రూపముననే భాసించుచున్నది.

ఈ చిత్తముయొక్క కల్పనచేతనే ఒకడు 'నేను బ్రహ్మను' అని, మరొకడు "నేను అత్యంత పరిమితమగు పురుగును అని అనుభవం పొందుచున్నారు. వాస్తవానికి, పరమాత్మయే ఈ సర్వ దేహాదుల రూపమున ప్రకాశించుచున్నాడు. పరమాత్మయే జగత్తు - - జగద్రహితమగు చిదాకాశము కూడా అగుచున్నాడు.

నిర్మలమగు చిత్తమే పరమార్థ స్వరూపము సుమా! అంతేకాదు. పరమార్థ స్వరూపమగు చిత్తమే ఏమరపుచే, భావనావశంచేత 'జీవుడు' గాను, 'మలిన చిత్తము' గాను పరిణమించుచున్నదని

Page:494

గ్రహించు. అట్టి మలిన చిత్తమే ఈ దేహాదుల రూపమున వ్యక్తమగుచున్నది. కల్పనయే అయినప్పటికీ, ఈ దృశ్యము సుఖదుఃఖముల రూపమున ఈ జీవునికి బంధము, బాధ కలిగించుచునే ఉన్నాయి కదా! ఎందుచేత?

ఒక దృష్టాంతము చెపుతాను. విను. ఒకడు తనయొక్క అజ్ఞానశక్తిచే ఉత్పన్నము చేసుకొన్నట్టి స్వప్నమునో, ఊహనో, లేక సంకల్పమునో చాలాకాలం అట్లే కలిగియున్నాడనుకో..... అప్పుడు ఏమవుతుంది? అది అతనిచే జాగ్రత్వలెనే దర్శింపబడుతుంది. అనగా "ఇది అత్యంత వాస్తవమే” అని అనిపిస్తుంది. అదే విధంగా చిద్వస్తువుచే వ్యాప్తమైయున్న ఈ జాగ్రత్ ప్రపంచము కూడా ఈ జీవునకు,... నాకు ఆ ఐందవసృష్టిలాగా,... సత్యమువలెనే అనుభూతమౌతోంది.

నాయనలారా ! విశ్వామిత్ర వసిష్ఠులారా ! ఈ చిత్తమే ప్రపంచమునంతటినీ ఉత్పన్నము చేయుచున్నది. అతి సూక్ష్మ వాసనా మయమైనట్టి "శబ్ద స్పర్శ రూప రస-గంధములు అనే తన్మాత్రలకు సంబంధించిన 'అధ్యాస' (Avocaiton) బలపడుటచేత 'జగత్తు' అనబడు అనుభవం ఏర్పడుతోంది. ఒకనికి కంటిచూపు దోషంచేత ఆకాశంలో రెండవచంద్రుడు కనబడుతూ ఉంటాడే! ఈ 'జగత్తు' దర్శనముకూడా అట్టిది మాత్రమే.

ఈ 'అహంభావము' రూపమున ప్రకాశించునది, దానిని ఆశ్రయించుకొని అనుభవమగు చున్నది... ఇదంతా సత్తు కానేకాదు. ఎందుకంటావా? ఏదైతే త్రికాలములందు అనగా, ఇంతకు ముందు - ఇప్పుడు - ఇకముందు కూడా, ఉండి ఉంటుందో... అట్టి దానిని మాత్రమే మనం సత్తు’ అని అనగలం. ‘గాఢనిద్ర’ లో ఈ జీవుడు ఉండి ఉన్నప్పుడు జాగ్రత్ రూపమైన అహంకారము అనుభవమగుటలేదు కదా! ఒకప్పుడు ఉన్నట్లుతోచి, మరొకప్పుడు లేకుండా పోయేదానిని సత్తు అనిగాని, సత్యమనిగాని ఎట్లా అనటం? పోనీ, అహంభావమును ఆశ్రయించి లభ్యమయ్యేదంతా ఇది అసత్తు మాత్రమే" అని అందామా? అసత్తు అయిన వస్తువు లభించనే కూడదు కదా! సద్వస్తువు ఎల్లప్పుడు సత్తుగానే (అనగా ఉండియే) ఉంటుంది. అసద్వస్తువు అసత్తుగా (లేకయే) ఉంటుంది. ఈ అహంకారము' అనునది - - సత్తుకు, అసత్తుకు కూడా విలక్షణమై ఉండిఉండుటచే అద్దానిని మాయకము, అనిర్వచనీయము" అని విజ్ఞులు అంటున్నారు. ఎందుకంటే విచారణ ప్రభవించి, వికసించేవరకు అది ఉంటోంది. విచారణచే నిర్మలమైన బుద్ధి కలవాని దృష్టిలో అది ఉండుట లేదు. ‘అహం' అని భావించుటకు మునుముందే ఆ భావకుడు భావరహితుడై భావములకు అతీతుడై ఉండి ఉన్నాడు కదా! అదియే ఈ జీవుని వాస్తవస్వరూపం.

ఈ మనస్సు సంకల్పాత్మకము, విశాలము అయి ఉంటోంది. అట్లే అది జడము, అజడముకూడా అయి ఉన్నది. ఎట్లా అంటావా? బ్రహ్మము అద్వితీయముకదా! కనుక మనస్సు స్వతహాగా బ్రహ్మ స్వరూపమే కదా! కనుక అజడము. కాని దానికి స్వకీయమైన ఉనికి ఎక్కడ? ద్రష్ట ఉంటేకదా, దాని ఉనికి! కాబట్టి జడమే. అది ఈ దృశ్యమే తన రూపముగా కలిగియున్నది. 'దృశ్యము యొక్క

Page:495

అనుభవం’ ఉండి ఉంటున్న సమయంలో ఈ మనస్సు సత్యమైనదానిలాగానే కనిపించుచున్నది. కాని, బ్రహ్మానుభవకాలమందు మాత్రం ('నేను బ్రహ్మమునే' అను ఎరుక కలిగి యున్నప్పుడు) అది బ్రహ్మము కంటే వేరుగా ఏమాత్రం లభించుటలేదు. ఇందుకుగాను ఒక దృష్టాంతము చెపుతాను. ఒకడు ఒక ఆభరణము యొక్క ఆకారమును, అంద చందములను పరిశీలిస్తున్నాడనుకో.... అప్పుడతనికి “ఇది గొలుసు, అది ఉంగరం, ఇది గాజు, ఇది ముక్కుపుడక" మొదలైన ఆకారములే (ఆభరణత్వమే) కనిపిస్తాయి కాని, అందలి అన్ని ఆభరణములలోని బంగారమువైపు దృష్టి ఉండదు. ఆభరణమును చూస్తున్నప్పుడు బంగారము కనిపించదు. అనగా అదే ఆభరణములను సువర్ణదృష్టితో చూచినప్పుడు... ఆ ఆభరణములన్నీ బంగారముకన్నా వేరు కానివిగా (అభిన్నమైనవిగా) తెలియవస్తాయి. మనస్సుకూడా బ్రహ్మంలో, -బంగారంలో ఆభరణత్వమువలె, -స్థితి కలిగియున్నది. చైతన్యము జడమును ఎట్లా ఎరుగుతోంది?

హిరణ్యగర్భుడు (సమష్టి సృష్టి స్వరూపుడు) అగు బ్రహ్మ సర్వస్వరూపుడు కదా! అందుచేత జడ-చైతన్యములన్నీ బ్రహ్మమే అవుతాయి. అయితే, బ్రహ్మదేవుడు మొదలుకొని, ఒక రాయి వరకు సమస్త పదార్థములు యథార్థానికి జడ - చైతన్యముల రెండింటికీ విలక్షణమై ఒప్పుచున్నాయి. అహంకారము గురించి మనం అనుకొన్నట్లే, అవికూడా మాయారూపములై అనిర్వచనములై (Illusionary and undefinable) ఉంటున్నాయి. జీవుడు చైతన్యమే స్వరూపముగా కలవాడుకదా! కొయ్య మొదలైనవి జడము. చైతన్యరూపుడగు జీవుడు కొయ్యమొదలైన జడపదార్థములు పొందికను ఎట్లు అనుభవిస్తున్నాడు? ఈ ప్రశ్నకు శాస్త్రకారులు ఇస్తున్న సమాధానమేమిటో విను. ఇక్కడ నాలుగు విషయాలు పాల్గొనుచున్నాయి.

ప్రమాత : ఎరిగెడువాడు (that which is knowing)

ప్రమాతృచైతన్యము చైతన్యముయొక్క ఎరుగుట' అను స్వభావం.

ప్రమేయము : ఎరుగబడుచున్నది (that which is being known)

ప్రమేయ చైతన్యము :ఎరుగబడుట' అను స్వభావము. జీవునిలోని ప్రమాతృచైతన్యము, ఆ కొయ్యలోని ప్రమేయచైతన్యము... ఈ రెండు వృత్తిద్వారా అభేదము పొందుటచేతనే - - ఆ రెండిటి యొక్క పొందిక (Association) సందర్భపడుతోంది.

కాబట్టి చైతన్యము’తో చైతన్య సంబంధము' కలుగుట వలన అనుభవము - అనేది సిద్ధిస్తోంది. సాదృశసంబంధము వలననే పొందిక లభిస్తోంది. చైతన్యరహితమైన వస్తువు అనుభవమునకే లభించదు. కనుక, జగత్తు అంటే చైతన్యమే రూపముగాగల జీవుడు... చైతన్యమే స్వరూపముగాగల ఆయావస్తువులతో ఏర్పడుచున్న సామ్యముయొక్క “అనుభవం పొందటం.”

బ్రహ్మము సర్వదా విషయరహితమైనదే!

అయితే ఒక్క విషయం. విశాలమైన ఇసుక ఎడారి మధ్యలో ఎక్కడైనా ఫలవృక్షాలు ఉంటాయా? ఉండవు కదా! వాక్కుకు కూడా అతీతమై (అనుభవ మాత్రమైయున్న) 'పరబ్రహ్మము' నందు

Page:496

చేతనారూపంగా కనిపించే 'నీవు - నేను' అనునవిగాని, అచేతనంగా కనిపించే పదార్థజాలముగాని లేవు. బ్రహ్మమునందు 'ఇది జడము'-'ఇది చైతన్యము' అనునట్టి శబ్దార్థముల కల్పనయే ఉండదు. అయితే ఈ చిద్వస్తువు ఒకానొకచోట దృశ్యమునందలి ఆయా పదార్థములతోను, వ్యక్తులతోను, సంఘటనలతోను ఏర్పరచుకొన్న సంబంధము కారణంగా ఒక స్ఫురణ’ కలిగి ఉంటోంది. జలము కొన్ని సమయములలో ఆవృత్తములు (Circles) తోకూడి ఉంటుంది చూచావా? బ్రహ్మమునందు ఏర్పడు ద్రష్టత్వము-దృశ్యత్వము కూడా అట్టివి మాత్రమే. సర్వదా జలము జలముగానే ఉంటోంది. ఆ వృత్తమునకు ముందు, ఆవృత్తసమయంలో, ఆ తరువాతకూడా జలం జలమేకదా! జగద్భావము ఏర్పడుచున్నప్పుడు కూడా బ్రహ్మము బ్రహ్మముగానే ఉండిఉంటోంది. విషయసంబంధమైన చైతన్యము లేక బ్రహ్మముయొక్క స్ఫురణనే మనస్సు’ అంటున్నాం. మనయొక్క విచారణ, మనస్సును రెండు రకాలుగా విభజించవచ్చు.

1. 'చిత్' అంశము లేక జ్ఞానాంశము : (Awareness consciousness / 'The knower'

dimension / The experiencer)

2. విషయాంశము లేక విషయరూపానుభవం : (The knowing dimension /

The experiences)

చిత్ అంశమును ‘అజడము' అని, విషయాంశమును 'జడము' అని అంటున్నాం. మనం చూస్తున్న ఈ జడవస్తు జాలమంతా ఆ విషయాంశమే. ఈ జీవుని యందుగల "తెలుసుకొనుట” అను స్వభావం రెండు విధములైన ప్రసరణ కలిగి ఉంటోంది.

చిదంశము విషయాంశము

ఎరుగుట/

తెలుసుకొనుట

నిర్మలము - నిత్యము వస్తువులు, విషయములు ఆద్యంత రహితము అగు మొ విశేషములతో స్వస్వరూపము కూడిన బాహ్యజగత్తు

ఈ జీవుడు అన్ని వేళల చాంచల్యమును పొందుచున్నాడు. జగద్భాంతిని అనుభవిస్తున్నాడు. జగత్తు చిద్రూపమే : చిత్తమునందలి చిదంశమే (Knower concept) (1) చిత్తము (2) జగత్తు అను రెండు విధములుగా విభజించబడుచున్నది. కాని, ఈ కనబడే జగత్తుకూడా, విజ్ఞాన దృష్టితో చూస్తే, చిద్వస్తువు మాత్రమే అవుతుంది. చైతన్యముతో ఈ జగత్తు అభేదమే! అందుచేత ఆత్మదృష్టి కలవారు, ఈ జగత్తు చిద్రూపమే అయి ఉన్నది, మరింకేమీ కాదు అని సిద్ధాంతీకరించుచున్నారు.

Page:497

భేద దృష్టిచే మాత్రమే... ఈ చైతన్యము-మరొక ఏవేవో రూపములు ధరించుచున్నట్లు అనుభూత మవుతోంది. వాస్తవానికి చైతన్యము విభాగరహితం సుమా! కాని, విభాగము కలదాని వలె కన్పట్టుచున్నది.* అది భ్రమ రహితమే అయినప్పటికీ, భ్రమయుక్తముగా ప్రవర్తించుచున్నది.

నాయనా! వసిష్ఠా ! యథార్థానికి 'భ్రమ అనబడునది ఏదీ లేదు. చేతనస్వరూపుడగు ఈ జీవుడు భ్రమను పొందుచున్నాడు అనటం కూడా మా ఉద్దేశంలో సరికాదు. మరి ఇదంతా ఏమంటావా? పూర్ణసముద్రము తనయందు తరంగములు అను అనుభవం పొందుచున్నది కదా! సర్వదా పూర్ణమే అయిఉన్న చైతన్యము తనయందు ఈ "జగత్తులు-పదార్థములుభావాభావములు మొదలైన రూపముగల అనుభవం పొందుచున్నది. అంతే!

‘చిద్వస్తువు’ - స్వస్వరూపం లేక ప్రతి ఒక్కరి వాస్తవ శుద్ధ స్వరూపం అయి ఉన్నది కదా! ‘జడము’ కూడా చిద్రూపమే అయిఉన్నది సుమా! ఎందుచేతనంటే 'జడము' అని చెప్పబడుచున్నది కేవలం జడము మాత్రమే అయి ఉంటే... స్వస్వరూపము దృష్ట్యా చిద్వస్తువగు నీకు అది భాసించ కుండానే ఉండేది. జాగ్రత్లో ఉన్నవాడే జాగ్రత్లో ఉన్నవాడితో సంభాషించగలడు. నిద్రించువాడు జాగ్రత్ - పురుషునితో ఎట్లా మాట్లాడుతాడు చెప్పు? స్వతహాగా చైతన్యమే అయిఉన్న నీవు అట్టి చైతన్యము యొక్క జడంశమునందు జడమునకు సంబంధించిన అనుభవం పొందుచున్నావు. కనుక జడంశము 'చిత్' యొక్క ఒకానొక అంశ మాత్రమే!

7. అహంభావము

శ్రీ బ్రహ్మదేవుడు : “జ్ఞానము యొక్క చైతన్యాంశమునందు 'అహంభావము (నేను-నాది' అను జడత్వపు భావన ఉదయిస్తోంది" - అనునదే ఇక్కడ మనకు సిద్ధాంతము. ఏదైతే ఎందులోంచి - బాహ్యకారణమేదీ లేకుండా ఉదయిస్తుందో... అట్లు ఉదయించేదంతా ఆ మూలవస్తువుకు వేరైనది అయిఉండదు కదా! శుద్ధతత్వమగు బ్రహ్మము లేక ఆత్మ 'జీవుడు' అనబడు మరొక తత్త్వముగా పరిణమించినట్లు తోచినప్పటికీ వాస్తవానికి బ్రహ్మమునందు బాహ్యమైన లేక బాహ్యము నుండి నియోగించబడిన కారణమేదీ లభించుటలేదు కాబట్టి... ఈ జీవుడు సర్వదా బ్రహ్మమే అయివున్నాడు. శ్రీ వసిష్ఠ మహర్షి : తండ్రీ! అట్లా అయితే మరి ఈ 'అహంకారము,' అద్దానిచే అనుభవించబడుచున్న ‘జడత్వము’ మాట ఏమిటి?

శ్రీ బ్రహ్మదేవుడు : సూర్యుని తేజస్సే సూర్యకిరణరూపమై వస్తువులపై ప్రసరిస్తోంది కదా! అనగా, సూర్యకాంతి వస్తువు ఆకారం సంతరించుకొని కనబడుతోంది. చైతన్యాంశమే అట్లు వివర్త భావము

* అవిభక్తంచ, భూతేషు విభక్తమివచ స్థితమ్.... శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం.

Page:498

పొందుచున్నది" అని అనక తప్పదు. అనగా ఈ జగత్తు, ఈ జగత్తును దర్శించుచున్నట్టి ద్రష్టవగు నీవు, నీతో ఈ సంభాషణ చేయుచున్నట్టి నేను... అంతా చైతన్యము యొక్క ప్రకటనయే అయిఉన్నది. చైతన్యమునకు అన్యమైనదంటూ ఏదీ ఎక్కడా లేదు. జలమునకు వేరుగా తరంగములు అనబడు మరొక బాహ్యవిశేషమేమైనా పరిణమించుచున్నదా? ఆ జలం మరొకటిగా మారుచున్నదా? లేదు. ఆ సమయంలో జలమునకు వేరుగా మరొకటి ఏదీ అగుచున్నదిలేదు. అదేవిధంగా 'పరమాత్మ' యందు అహంకారము మొదలైనవేవీ లేవు. మరి లేని అహంకారమును తొలగించుట లేక త్యజించుట ఏమిటి చెప్పు? కనుక, అహంకారము చైతన్యముయొక్క సంప్రదర్శనమే!" అను సందర్శమును పెంపొందించుకొండి.

“నేను శుద్ధ చైతన్యమునే” అనునదే జ్ఞానసారం.

- దృశ్యమందలి సారము కూడా... 'ద్రష్ట' యందలి సారముకంటే వేరైనదేదీ కాదు. అనగా, అన్నిటియందును ఏకైక చైతన్యమే ఏకరసమై సర్వదా ప్రకాశించుచున్నది.

నాయనా! అహంభావమే 'మిథ్య' అయినప్పుడు, ఇక అట్టి 'అహం' భావనచే ఉత్పన్నము లగుచున్న విషయముల మాట ఏం చెప్పాలి? అవన్నీ ఎండమావులలోని నీటిని కడవలలో నింపి తెచ్చుకోవటం లాగా అత్యంత భ్రమాత్మకమే అవుతాయి. అందుచేత “అవన్నీ అప్రస్తుతం అనగా, ప్రస్తుతమే లేవు అని గ్రహించు. ద్వైతదృష్టి అంతా తొలగిపోగా, అప్పుడు శేషించేదే 'ఆత్మ' అయి ఉన్నది కదా! అట్టి ఆత్మయందు ఇక అహంకారమునకు, అల్పత్వభావనకు, అఖండమునకు వేరైన అస్థిత్వమునకూ చోటెక్కడ?

శ్రీ వసిష్ఠమహర్షి : పితృదేవా! మరి మాకు ఘనీభూతమై తోచుచున్న ఈ 'అహంభావన ఎక్కడి నుండి వచ్చిపడుతోంది?

శ్రీ బ్రహ్మదేవుడు : నీరు అధికమైన శీతల వాతావరణము నందు ఉంచబడినప్పుడు మంచు’ గా ప్రాప్తించుచున్నది చూచావా? చేతన వస్తువు స్వస్వరూపమునకు సంబంధించిన అజ్ఞానమును అంగీకరించి, అట్లు అంగీకరిస్తున్న సమయంలో "అహంకారము - 'విషయానుభవము' అనునట్టి రూపమును పొందుచున్నది.

ఒక చిన్న హాస్య సంఘటన చెపుతాను. విను. ఒకడు ఒక అర్ధరాత్రి తటాలున నిద్రలేచి, తన ప్రక్కనే నిద్రిస్తున్న తన స్నేహితుని నిద్రలేపి, మిత్రమా! ఇప్పుడు నాకొక కల వచ్చింది. ఆ కలలో - - నేను చచ్చినానట. అప్పుడు నా శరీరమును ఎవ్వరో మోసుకొని వెళ్ళుచూ, నా మంచితనము గురించి చెప్పుకొంటున్నారు. 'ఇతడు మరల బ్రతికితే ఎంత బాగుండు!' అని అనుకొంటున్నారు. కాని చనిపోయినట్టి నేను మరల బ్రతకటం అసాధ్యం కదా, ....” అని చెప్పుకుపోతున్నాడు. స్వప్న ద్రష్టయగు తానే మరణిస్తే స్వప్నమెక్కడిది? తన కల్పన ఉంటేకదా,... ఆ కల్పనలో ఆయా వ్యక్తులుండటం! అతని శరీరము మోయుచున్నవారెవరు? స్వపద్రష్టచే సంకల్పించబడి, దర్శించబడేవారే కదా!

Page:499

మరొకడు “రాత్రి కలలో నేను గాఢ నిద్రపోతూ ఉండగా, ఆ కలలో ఒకడు మా ఇంటిలో ప్రవేశించి నన్ను నిద్రలేపినట్లు కలవచ్చింది. అప్పుడేమైనదంటే..... అని కలలోని విశేషాలు చెప్పుచున్నాడు. తానే గాఢనిద్రలో ఉంటే ఆ స్వప్నములోని మరొకడు ఎక్కడి నుండి వచ్చాడు? స్వప్నమంతా స్వప్నద్రష్ట యొక్క స్వకీయకల్పనయే కదా! అదే విధంగా చైతన్యము కూడా మిథ్యారూపంగా జడత్వానుభవం పొందుచున్నది. సర్వాత్మకమగు ఆ చైతన్యము తన అనంత రూపములోని ఒకానొక చోట జడస్థితిని అనుభవించుచున్నది. దృఢమైన అజ్ఞానమును ఆశ్రయించుట ద్వారా స్వస్వరూపానుభవం ఏమరుస్తోంది. 'సంస్కృతి' అని చెప్పబడు బాహ్యదృష్టి కలిగియుంటోంది. అనగా అది తన సర్వాత్మకత్వమును మరచి, తనకు ఎక్కడ 'దృష్టి (Avocation) ఏర్పడుచున్నదో

అక్కడ జడాకారము, పరిమితత్వమును వహించి ఉంటోంది. సమస్త వస్తువులకు ఆదికారణం మనస్సే. ఆ మనస్సే అన్నిటా, అన్ని రూపములలోను వ్యక్తమగుచున్నది. అదే ఆకాశమువలె, అత్యంత విశాలమై అనేక రూపములను స్వయముగా దర్శించుచున్నది. ఇక దానిని నియమిస్తున్నది ఎవ్వరంటావా ? దాని వాస్తవ స్వరూపమైనట్టి ఆత్మయే.

ఓ జనులారా! మీరు మొట్టమొదట అభ్యాసము, వైరాగ్యము మొదలైన ఉత్తమ గుణములను అలవర్చుకోండి. అప్పుడు మీ చిత్తములు జ్ఞానము పొందుటకు 'అర్హత' పొందుతాయి. జ్ఞానము అభివృద్ధి పొందుచూ ఉండగా ఇక స్థూల - సూక్ష్మ - కారణ శరీరముల భ్రాంతిని మీ అంతట మీరే పరిత్యజించివేస్తారు. "ప్రతిభాసాత్మక (Image like) చిత్తము అనుదానిని మీయొక్క ‘చిత్తము’ నే ఉపయోగించి స్వయముగా విచారణ చేయండి. అప్పుడు నేను చెప్పు దానిలోని వాస్తవాన్ని మీరే గ్రహించగలరు. చిత్తము అపరిశుభ్రంగా ఉన్నంతకాలం భ్రమాత్మకములగు అనుభవములు, తత్ఫలితములు, సంసారదుఃఖ పరంపరలు తప్పునవికావు. చిత్తము శుద్ధమైనంతమాత్రం చేతనే నిత్య నిరతిశయానందమును పొందగలరు. మీరంతా ఈ దేహాదుల పరిశుభ్రతకొరకు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారుగాని, చిత్త నిర్మలత్వము కొరకు తగినంత ప్రయత్నశీలురు అగుచున్నారా? లేదు. కనుక, పరిశీలించి చూచుకోండి. చిత్త నిర్మలత గురించి అశ్రద్ధ వహించియుండుటచేత అనేక దౌర్భాగ్యములు వచ్చి పడుచున్నాయి. చిత్తముచే చైతన్య పరబ్రహ్మము" అయి ఉన్న స్వస్వరూపమును గ్రహించాలి. అది మానివేసి ఈ దేహాది ఖండములను మాత్రమే విచారించుచు ఆయుష్షును వృథా చేయుటచే ప్రయోజనమేమున్నది?

ఏది సత్యమో దానిని గురించే విచారించాలి. అట్టి విచారణ రూపమగు జ్ఞానమే సఫలమౌతుంది. అసత్యము, కల్పితము అయిన దాని గురించి ఎంత విచారించి ఏం ప్రయోజనం? అట్టి అసత్యమైన దానిని ఆశ్రయించుటచే శ్రమకు ఫలితంగా అసత్యమైనది, కల్పితమైనదే ప్రాప్తించటం జరుగుతుంది. అందుచేతనే సంసారజీవులను దుఃఖాదులు ఆశ్రయించుకొనియే ఉంటున్నాయి. ఆకాశంలో "తన యొక్క కల్పన అను వికారముచే గాంచబడే వృక్షమును ఎవరైనా శోధిస్తారా? ఈ దేహాదుల

Page:500

విషయం కూడా అట్టిదే. అందుచేత, జ్ఞానులు ఈ దేహముల రాక - పోకల గురించిన విచారణను ప్రక్కకు పెట్టి, దేహి (లేక) చైతన్యతత్వము గురించి శోధించుచున్నారు. నాయనలారా! సర్వప్రసరణ శీలమగు ‘ఆత్మ’యే మీరు. కాబట్టి "నేను ఈ దేహపరిమితుడను అని భావించి భేదము చెందకండి.

ఓ ప్రియ తనయులారా! వసిష్ఠా! విశ్వామిత్రా! "జీవుడనగా ఈ దేహమే. మరింకేమీ కాదు” అని చెప్పుచూ, కొందరు దేహాత్మవాదులు ఆయా ప్రమాణములతో ఈ జీవునకు అల్పత్వం ఆపాదించు చున్నారు. ఈ చిత్తము దేనిని ఎట్లు భావించునో అది అట్లే అయి, ప్రాప్తిస్తూ ఉంటుంది. అహల్య, ఇంద్రుల మనోనిశ్చయము యొక్క ప్రభావమే మనకు ఇందుకు దృష్టాంతము. కనుక అట్టి ఈ చిత్తముతో ఉత్తమోత్తమమైన భావనయే చెయ్యాలి. కాని, నేను స్వల్పుడను, శరీరమును, అల్పుడను” అను రూపము గల నీచ భావనలు ఎందుకు చెయ్యటం? సర్వాత్మకమైనట్టి చైతన్య పరబ్రహ్మమే ఈ “నీవు-నేను మొదలైన సర్వరూపములుగా ఒకే జలం అనేక తరంగములు అగుచున్నట్లు

ప్రకటితమౌతోంది. కనుక నేను పరబ్రహ్మమును. నాకు ఆద్యంతాలు లేవు. జన్మ- జరా - మృత్యువులు లేవు. ఇదంతా నాకంటే వేరైనది కాదు అని భావన చెయ్యాలి. అట్లే ఈ కనబడే ప్రతి ఒక్కరు పరబ్రహ్మ స్వరూపులే(తత్-త్వమసి) ... అను మననమును ప్రవృద్ధం చేసుకోవాలి. అట్లు భావించుట చేతనే మీరు ఉత్తమత్వమును పొందగలరని గ్రహించండి.

ఈ చిత్తము ఏ విధంగా స్ఫురించుచున్నదో, అట్టి స్పురణను అనుసరించే ఆయా ఉపాధి పరంపరలు వచ్చి చేరుచున్నాయి. వాస్తవానికి, ఈ దేహముగాని, లేక, అహంకారముగాని ... స్వప్నములోని వ్యక్తులు, వస్తువుల వలె ... “లేనివే సుమా! కనుక ఓ వసిష్ఠా! సర్వదా ఏకరూపమై, ఇచ్ఛారహితమై ఉన్నట్టి ఆత్మనే ఎరుగుము. అట్లు ఎరుగుచూ ఇచ్ఛారహితుడవై ఉండుము.

ఒక బాలుడు ఎవ్వరో చెప్పిన మాటలు విని తనకుతానే కల్పించుకొనినట్టి భ్రమపూర్వకమైన కల్పన చేత బేతాళదేహమును ఎదురుగా చూస్తూ, భయాదులను అనుభవిస్తూ ఉంటాడు. పంచభూతాత్మకమైన తన ఈ దేహమెక్కడ? జడలు - కోరలు - నాలుక మొదలగు కల్పనలతో మనస్సుచే ఊహగా చూడబడే బేతాళ దేహము ఎక్కడ? ఆ రెండింటికీ సంబంధమే లేదు కదా! కల్పనలు నశించగానే ఆ బేతాళుడు, భయాదులు, ... అన్నీ తొలగిపోతున్నాయి. ఆత్మ కూడా కల్పనావశం చేతనే ఈ 'మనుష్యుడు' మొదలైన దేహములుగాను, ఈ సర్వదృశ్య ప్రపంచముగాను అగుచున్నది. ఆ దేహాదులు నశించుచున్నప్పుడు తానే నశించుచున్నట్టి భావనకు లోను అగుచున్నది. అవిద్యా కల్పన నశించిన మరుక్షణం సర్వభ్రమలు తొలగిపోతాయి. అప్పుడు స్వస్వరూపప్రాప్తి స్వయముగానే సంభవించుచున్నది.

Page:501

8. శాప్ - మంత్రములు

శ్రీవసిష్ఠమహర్షి : తండ్రీ! బ్రహ్మదేవా! మీరు నాకు అత్యుత్తమమైన విషయమే బోధిస్తున్నారు. ఆత్మజ్ఞానమే అన్నిటా ఉత్తమమైనది. అయితే, మీరు చెప్పిన విషయాలలో ఒక్కటిమాత్రం నాకు యుక్తియుక్తంగా కనిపించటం లేదు. మీరు ఒకప్పుడు నాతో "శాప - మంత్రాదులు అమోఘమైనవి. అవి తమ ప్రభావం కలిగియే ఉంటాయి" అని చెప్పియున్నారు. మరి ఇప్పుడేమో దృఢమైన మనోబలిమి కలవానిని శాప-మంత్రాదులు ఏమీ చెయ్యలేవు అనే అర్థం వచ్చేవిధంగా చెప్పుచున్నారు. అంటే, శాప’, ‘మంత్రములు' మొదలైన శక్తులు వ్యర్థమైపోగలవంటారా? "శాపమంత్రాదుల శక్తిచే మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియములు మూఢావస్థ చెందగలవు" అని అనేక సందర్భములలో నిరూపించబడినట్లు నేను వినియున్నానే? * స్వామీ! వాయువు-దాని చలనము, నువ్వులు-నూనె, అగ్ని-ఉష్ణము వేరువేరైనవి కావు కదా! అట్లే ఈ మనస్సు-శరీరము ఒక్కటే కదా! ఎందుకంటే మనస్సును అనుసరించే ఉపాధి ఉంటుంది" అని మీరు కూడా ఇప్పుడు చెప్పియున్నారు. కాబట్టి ఈ శరీరము మనస్సు యొక్క రూపమే. వర - శాపాదులు మనస్సును ప్రభావితం చేయలేకపోతే, ఇక దేహమును కూడా ఏమీ చెయ్యలేకపోవటమే జరగాలి. కాని అహల్య, కృత్రిమ ఇంద్రుల భౌతిక దేహములు శాపము యొక్క ప్రభావం చేత నేల కూలి, వారిద్దరూ మరణించారు కదా! ఎందుచేత?

పోనీ, మీరు అంటున్నట్లు, ఈ దేహము వాస్తవము కాదు. అది చిత్తముయొక్క కల్పన మాత్రమే అనే అనుకుందాం. ఎండమావులవలె, రెండవ చంద్రునివలె ఈ దేహము వ్యర్థముగా అవాస్తవత్వముతో కూడి కనబడుతోంది. అయినప్పటికీ కూడా, ఈ దేహము, మనస్సులలో ఒకటి నశిస్తే, రెండవది కూడా నశిస్తోంది ... అనునదే లౌకిక దృష్టికి తెలియవస్తోంది. రెండూ సమాన సత్తయే కలిగి ఉంటున్నాయి. మనస్సు నశించినప్పుడు అట్టివాని శరీరం మాత్రం ఉంటుందా? నశిస్తుందనే నా ఉద్దేశం. మరి ఇక, శరీరము నశించినప్పుడు కూడా మనస్సు నశించవలసియే

ఉంటుంది కదా?

వరశాపాదులచే శరీరము నశించినప్పుడు కూడా మనస్సు నశించదంటారా ఏమిటి? శాపాదులవలన మనస్సు ఎందుకు ప్రభావితం కాకుండా ఉండగలుగు చున్నది? శరీరము మాత్రమే ఎందుకు ప్రభావితమౌతోంది?

ఈ విషయాలన్నీ మరికొంత వివరించి చెప్పండి.

శాపము మనస్సుపై పనిచేస్తుంది అని నిరూపించే కొన్ని ఇతిహాస సంఘటనలు ఉన్నాయి. నహుషుడు శాపవశం చేత సర్పము అయ్యాడు. అట్లు సర్పంగా మారి, తన వంశమునకు సంబంధించిన వారు, తనకు ప్రియాతి ప్రియులు అయి ఉన్న భీముడు మొదలైనవారిని బాధించాడు.

కొందరు ధర్మాత్ములు కూడా శాపవశం చేత పిశాచజన్మలు ఎత్తి తమ జాతివారగు మానవులనే భక్షించినట్లు కొన్ని కథలు చెప్పుచూ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మహర్షి బ్రహ్మదేవుని ఇట్లు ప్రశ్నించుచున్నారు.

Page:502

శ్రీ బ్రహ్మదేవుడు : కుమారా! శుద్ధమైనట్టి శుభకర్మల చేత, పురుష ప్రయత్నముచేత ఈ జగత్తులో పొందరాని వస్తువంటూ ఏదీ లేదు. ప్రయత్నము చేతనే ఎవ్వరైనా ఏదైనా అధిరోహించగలరు, వహించగలరు, నిరోధించగలరు.

ఈ ప్రపంచంలో బ్రహ్మ నుండి ఒక పురుగు వరకు దేహధారులైనట్టి ప్రాణికోట్లన్నిటికీ రెండు శరీరములు ఏర్పడి ఉంటున్నాయి.

1) మాంసనిర్మితమగు ఈ 'భౌతిక దేహము’

2) సర్వకార్యములకు కారణమగుచు, సదా స్థిరమై ఉండి ఉంటునట్టి 'మనస్సు’ “మాంసదేహము” : అందరికీ కనబడుతూనే ఉంటుంది కదా! ఇది సకల విధములైన శాపముల చేతను, శస్త్రములచేతను, క్షుద్రవిద్యలచేతను బాధింపబడగలదు. ఈ పాంచభౌతికదేహము జడము. స్వయముగా ఏదీ నిర్వర్తించలేదు. కాబట్టి అత్యంత అసమర్థము. అతి దీనమైనది. తామరాకుపై నీటి బిందువు వలె అతిచంచలము కూడా. ఇది ఏ క్షణమైనను వినాశనం కావచ్చు. ప్రారబ్ధకర్మల చేత, రాజదండనము చేత, వాయువు - జలము - క్రియలు మొదలైన ప్రకృతి పదార్థములచేత ఎదుర్కొనబడుతూ ఉంటుంది.

మనస్సు : ఇది ఇతరుల భౌతిక దృష్టికి కనబడేది కాదు. ఈ మనస్సు స్వతంత్రమైనదీ అస్వతంత్రమైనదీ కూడా! ఎవ్వరైతే పురుష ప్రయత్నమును ఆశ్రయిస్తూ, నిత్యము ధైర్యమును అవలంబిస్తూ ఉంటారో అట్టివారి మనస్సు దుఃఖమును పొందకుండా ఉంటుంది. జీవుని యొక్క ఈ మనోమయదేహము, ఏ విధమైనయత్నము ఇతడు చేస్తాడో, ఆ విధమైన ఫలములను

పొందుతూ ఉంటుంది.

మాంసమయ దేహము తనంతటగా ఏ ప్రయత్నం చేయలేదు. దేనినీ సాధించలేదు. ఏదైనా సరే, మనోమయ దేహము క్రియావంతమగుచున్నప్పుడే అంతా ఫలవంతమవటం జరుగుతోంది. ఈ మనస్సు కనుక ఎల్లప్పుడు పవిత్రమైన దానినే చింతించటం, ధ్యానించటం జరుగుతూ ఉంటే, మాంసమయదేహమునందలి మార్పుచేర్పులు ఆ చింతనను ఏమీ చెయ్యలేవు. ఒకడు ఒకదానికొరకు ఎంతటి తీవ్రేచ్ఛతో భావన-సంకల్పము -ప్రయత్నములను గావించుచున్నాడు?” అనునదే ప్రయోజనం యొక్క సరళిని నిర్ణయిస్తోంది. ఈ మాంసమయదేహము అగ్నియందు పడుగాక! మట్టిలో కలిసిపోవుగాక! లేక అనేక నామరూపములతో విజృంభించుగాక! ఏది ఏమైనప్పటికీ... “మనస్సు దేనినైతే దీక్షతో చింతించుచున్నదో, అద్దానినే ఈ జీవుడు పొందుచున్నాడు" అని గ్రహించు.

ఈ భౌతికదేహము స్వయముగా ఏమాత్రం క్రియాకారకము కాదని అనుకొన్నాముకదా! అయినప్పటికీ పురుషప్రయత్నం అధికంగా సిద్ధించుచున్నప్పుడు ఇది కూడా నిర్విఘ్నంగా కొన్ని ఫలములను కలుగజేస్తూ ఉంటుంది. ఒక గొప్ప 'ముని' లో కనిపించే ముఖవర్చస్సు, ప్రశాంతచిత్తుని చూడగానే మనకు కనిపించే ప్రశాంత - ప్రజ్ఞ ఆనందములు ఇట్టివే. పురుష ప్రయత్నము మనస్సు యొక్క రూపమే అయిఉన్నది. అనగా అట్టి ఫలములన్నీ “మనస్సే మనస్సుకు అట్టి

Page:503

ఫలమును కలుగజేస్తోంది అనియే గ్రహించాలి కాని "పాంచభౌతికమైన ఉపాధి అట్లు కొందరిని ప్రభావితం చేస్తోంది అని భ్రమించటం ఉచితంకాదు. పురుష ప్రయత్నంచేతనే కృత్రిమేంద్రుడు తన యొక్క మనస్సు”ను అహల్యామయంగా చేసివేశాడు. అట్లు మనస్సు అహల్యనే మననం చేస్తూ ఉండటం చేత భౌతికదేహము ఎంత బాధింపబడుచున్నప్పటికీ అతడు ఆ బాధను పొందనేలేదు. ఇట్లు భౌతికదేహం బాధింపబడటం - కాని మనస్సులు ఆ బాధను పొందకపోవటం" అనే చమత్కారం అనేక గాథలలో నీవు వినే ఉంటావు. ఉదాహరణకు మాండవ్య మహర్షి ఒకసారి తన మనస్సును తీవ్రమైన తపస్సులో వినియోగించాడు. కొందరు దొంగలు రాజభటుల దృష్టినుండి తప్పించుకొని ఆ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి తలదాచుకొన్నారు. భటులు ఆ ఆశ్రమంలో ప్రవేశించి మహర్షిని చూచి "ఇతడు కపటముని వేషం ధరించిన దొంగల నాయకుడే అయిఉంటాడు” అని తలచి, అతనిని బంధించి, తీసుకుపోయి, రాజాజ్ఞపై కొరత' వేశారు. కాని అతడు కొంచెము కూడా బాధ అనుభవించనేలేదు. ఎందుచేత? మనస్సు తపస్సునందు లగ్నమైనప్పుడు శారీరకశ్రమ బాధగా అనుభవమునకు రాలేదు కాబట్టి ! ఆ విధంగా బాధ దృష్టికి రాకపోవడం ప్రతిరోజు ప్రతిఒక్కరికీ అనుభవమయ్యే విషయమే. ధ్యాన నిష్ఠ కూడా ఉత్తమ పురుష ప్రయత్నము చేత మాత్రమే సాధ్యం కదా!

ఇలా, మానసికప్రవృత్తి ప్రభావం గురించి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మరొక సంఘటన చెపుతాను. విను. 'దీర్ఘతపుడు' అనే మహర్షి ఒకసారి ఒక యజ్ఞం చేయతలపెట్టాడు. యజ్ఞసామాగ్రి కొరకై ఒకరాజును ఆశ్రయించాలని బయలుదేరాడు. అట్లా నడచిపోతూ ఉండగా త్రోవలో విధివశాత్తూ ఒక నూతిలో పడిపోయాడు. ఆ నూతినుండి తనంతటతానే బయటకు వచ్చుటకు ఏమాత్రం వీలు కాలేదు. అతని మనస్సు మాత్రం నేను లోకమునకు శుభం కలుగజేయగల ఈ యజ్ఞం చెయ్యాలి అనునట్టి బలవత్తరమైన సంకల్పము కలిగి ఉన్నది. అప్పుడు ఆ నూతిలోనే ఊహతో, లేక, మనస్సుతో మహాయజ్ఞం ప్రారంభించాడు. ఋత్విక్కులను ఆహ్వానించాడు. అగ్నిగుండమును సంకల్పించాడు. సశాస్త్రీయంగా అంతా నిర్వర్తించాడు. అప్పుడు ఇంద్రుడు ప్రసన్నుడై ఆ నూతి నుండి దీర్ఘతపుని బైటకుచేర్చి, తన ఇంద్రపదవిని సమర్పించాడు. చూచావా? వసిష్ఠా! ఇక్కడ మనస్సుచే చేసిన పురుషప్రయత్నం శరీరం పాల్గొనకపోయినప్పటికీ ఉత్తమ ప్రయోజనం ప్రాప్తింపజేసింది. ఇంతకు ముందు మనం ఐందవుల గురించి చెప్పుకొన్నాం. వాళ్ళు సామాన్య మానవులే కదా! ఐతే ఏం? పురుష ప్రయత్నంచే మనోబలం (చిత్తైకాగ్రత) సంపాదించారు. మనోబలం చేత బ్రహ్మపదప్రాప్తిని పొందారు. వారినిప్పుడు ఆ స్థానం నుండి తొలగించటం నా వల్ల కూడా కాదు కదా! ఆ విధంగానే, ఈ దేవత లలో, మానవులలో, జంతువులలో, తదితర పాతాళ జీవులలో కొంతమంది తమ యొక్క చిత్తెకాగ్రత్త మరియు, జ్ఞాన, ఉపాసనలు ఏమాత్రం త్యజించకుండా ఉంటున్నారు కూడా. నాయనా! ధ్యేయ వస్తువు (The aspect aimed at as the goal) నందు ఏకాగ్రచిత్తము కలిగి ఉంటే అట్టి చిత్తమును

కొరత : పదునైన శూలమునకు శరీరమును నిలువుగా గ్రుచ్చటం.

Page:504

శారీరక, మానసిక వ్యాధులుగాని, శాపములుగాని, విద్రోహచర్యలు గాని, పాప స్వభావులగు రాక్షసుల ప్రయత్నములు గాని విరమింపజేయలేవు. బండశిలను కమలము ఛేదించగలదా?

కొందరు శాపమును పొందినప్పుడు (నహుషుడు మొదలైనవారు) ఆయా శాపములచే నిర్ణయించ బడిన నూతన శరీరాలు పొందటం, జ్ఞానప్రాప్తి విషయంలో అసమర్థులై ఉండటం జరుగుచున్నమాట నిజమే. దానికి కారణం చిత్తము యొక్క అదృఢత్వమే సుమా! నేను చచ్చాను. ఇప్పుడు నేను ఒక పామును అయ్యాను అనునట్టి భ్రమాత్మకమైన అనుభవం ఒక జీవుడు పొందటానికి కారణం... ఈ శరీరమును ఎంతో నమ్మికతో గాంచుటచేతనే. అనగా నేను ఈ శరీరమును అను భావనయే అట్టి దౌర్భాగ్యమునకు దారితీస్తోంది. అది కూడా చిత్తము యొక్క అశుభములకు దారితీయు ప్రయత్న రూపమే.

9. సావధానులై ఉండండి!

సావధానచిత్తులైనవారు ఈ ప్రపంచమునందు జాగృత దశయందు గాని, స్వప్నమునందుగాని ఎట్టి దోషముల చేత కూడా పీడింపబడజాలరు. అసావధానచిత్తులే ఎప్పటికప్పుడు రాగ ద్వేషముల చేత, సుఖదుఃఖముల చేత, మాన అవమానముల చేత తాడనం పొందుచున్నారు. ఆ ద్వంద్వముల ప్రభావం చేత అనేక క్లేశములు అనుభవిస్తున్నారు. 'సంసారము' అని శాస్త్రములచే చెప్పబడుచున్నది ఏమిటి? ఈ జీవుడు నిజరూపమగు ఆత్మ విషయమై అసావధానచిత్తుడై ఉండుటయే సుమా! ఓ సర్వజనులారా! మీరు పురుష ప్రయత్నమునే ఆశ్రయించండి. మనస్సును మనస్సుచేతనే పవిత్రమార్గంలో

నియోగించండి.

మనసైవ మనస్తష్మా త్పౌరుషేణ పుమానిహ స్వకమేవ స్వకేనైవ యోజయే త్పావనే పథి ॥ (సర్గ : 92; శ్లో. 28. )

అంతేగాని, నేను ఈ శరీరమును. ఒకప్పుడు పుట్టుచున్నాను. మరొకప్పుడు చచ్చుచున్నాను. ఇవన్నీ నావి. వీరు నా వారు అని పలుకుచు మీమీ చిత్తములను అల్పత్వమువైపు నియోగించకండి. ‘అజ్ఞానము’ అనే చీకటినూతిలోకి మిమ్ములను మీరే త్రోసివేసుకోకండి.

ఓ మునీంద్రా! ఈ చిత్తమునందు ఏ వస్తువు స్ఫురిస్తే అది రూఢిపడి క్రమంగా స్థూలత్వమును పొందుచున్నది. క్రమంగా అదియే అతనికి సత్యముగా తోచుచున్నది. తల్లి తన బిడ్డ మొరాయిస్తూ అల్లరిచేస్తున్నప్పుడు. “ఓయీ! అల్లరి మాను. లేదా, అటువైపు ఆ చీకట్లోకి చూడు. అక్కడ ఒక బూచి ఉన్నది.... కనిపిస్తోంది కదా! ఆ బూచిని పిలుస్తాను. ఆపై నీ ఇష్టం అని, అంటూ ఉంటుంది. ఆ వాక్యములు ఆ బాలుని చిత్తమునందు ప్రవేశిస్తాయి. రూఢిపడతాయి. అప్పుడు అతనికి ఆ చీకట్లో నిజంగా 'బూచి' అనునదేదో కించిత్ కదలికలతో కనిపిస్తూ ఉంటుంది. మనస్సే అట్లు కల్పనచేసుకొని కనులతో చూస్తోంది.

Page:505

ఈ మనస్సు ఆయా పురుష ప్రయత్నములచే ఎప్పటికప్పుడు యితః పూర్వపువాసనలను త్యజించివేస్తూ, నూతన - దృఢ వాసనల ప్రాబల్యంచేత నూతన రూపములుగా అగుచున్నది. ప్రవహించటం ప్రారంభించిన జలం ఒక క్షణంలో తరంగరూపం చెందుతోంది కదా! ఈ మనస్సు కూడా క్రొత్త క్రొత్త దృఢభావనలచే వెంటవెంటనే ధ్యేయ వస్తురూపమును పొందగలదు. అందుకే మానవుడు మనస్సును ఉత్తమభావనలవైపే నడిపించాలి.

దృఢభావనకు మహత్తరమైన శక్తి ఉన్నది. దృఢభావనచే మనస్సు సూర్యబింబమునందు కూడా అంధకారమును గాంచగలదు. ఓ కుమారా! సర్వము భావనామయమే సుమా! ఈ మనస్సు దేనిని భావిస్తే అద్దానినే శీఘ్రంగా పొందుచున్నది. అట్లు పొందినదానిని హర్ష విషాదములతో అనుభవించుచున్నది. “కర్తయగు మనస్సే భోక్త కూడా అగుచున్నది" అని మేము గ్రహిస్తున్న నిత్య సత్యమును ప్రకటిస్తున్నాము. దృఢభావనచే ఈ చిత్తము చంద్రుని యందు కూడా అనేక అగ్ని జ్వాలలు గాంచుచు, ఉష్ణత్వమును అనుభవించగలదు. దగ్ధమై, పరితాపం కూడా పొందగలదు. ఈ చిత్తము తన భావము చేత రాతినేలలో జలానుభవము పొంది ఆ జలమును త్రాగి తృప్తిగా నాట్యం చెయ్యగలదు. తన కల్పన చేతనే ఆకాశంలో గొప్ప వనమును దర్శించి ఆ వనంలో సంచరిస్తూ పుష్పాలను, ఫలములను కోయటం, వృక్షములను పెంచటం, నరకటం కూడా చెయ్యగలదు.

ఇట్లు మనస్సే బంధము, మనస్సే మోక్షము. మనస్సు తాను కల్పించిన ఇంద్రజాలమును తానే వీక్షించుచున్నది. జీవుని యొక్క జగద్దర్శనమంతా అట్టిదే సుమా!

కాబట్టి ఓ వసిష్ఠ-విశ్వామిత్రులారా! సర్వ జనులారా! ఈ జగత్తు సత్తు కాదు! అసత్తు కాదు.” అనియే భావించండి. మీమీ ఉత్తమ ప్రయత్నములచే పలువిధములైన కల్పనలతో కూడిన ఈ పరిచ్ఛిన్నదృష్టిని క్రమక్రమంగా త్యజించండి.

"సర్వగామి, అఖండము, అద్వితీయము అయిఉన్న ఆత్మతత్వమునే 'నేను'. ఈ నా చిత్తముయొక్క స్వరూపము కూడా ఆ చిదాకాశతత్త్వమే”

అని భావించి, సర్వకల్పనలను త్యజించి, సుఖరూపులు అగుదురుగాక!

Page:506

శ్రీవసిష్ఠ - రామచంద్రుల పరిశీలన

10. చిత్ర - విచిత్ర భ్రమలు - సమ్యక్ దర్శనము శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నా తండ్రి బ్రహ్మదేవుడు ఆ సందర్భంలో నాకు, ఈ విశ్వామిత్ర మహర్షికి, తదితర మునివర్యులకు ఏమేమి చెప్పియున్నారో ... ఆ విషయాలు నీకు చెప్పాను. ఈ మనస్సు గురించి నా దృష్టిలో ఉన్నట్టి మరికొన్ని విషయాలు నీ ముందు ఉంచుతాను. విను.

బ్రహ్మము సర్వదా అనిర్వచనీయము. వాక్కుకు అతీతము. అట్టి అనిర్దేశ్య తత్త్వమగు బ్రహ్మము నుండి మొట్టమొదట సర్వ వ్యాపకమగు అవ్యాకృతము ఉదయించింది. అది కాలక్రమంగా సంకల్ప వికల్పరూపమగు మనన శక్తిచే కొంత స్థూలత్వమును చెంది “మనస్సు అగుచున్నది. ఆ మనస్సు ఒకానొకప్పుడు సూక్ష్మ భూత కల్పనతో కూడి ఉంటోంది. అప్పుడు అద్దానినుండి తేజోరూపమగు సమష్ఠి లింగ శరీరాభిమాని” అయినట్టి పురుషుడు (పురుషకారమే స్వభావముగా గల తత్త్వము) ఉదయిస్తున్నాడు. అట్టి సమష్టిసృష్టి - అభిమానిని, 'బ్రహ్మ' అని, 'హిరణ్యగర్భుడు' అని, 'స్వయంభువు’ RAMA లక్షణములను దృష్టిలో పెట్టుకొని శాస్త్రములు వర్ణిస్తున్నాయి. ఈ సమష్ఠియగు ఆ బ్రహ్మ మనోరూపుడు మాత్రమే కదా! కనుక, మనోరూపమే జగత్తునకు కర్త అయి ఉన్నది.

మననతత్త్వమే ఆకారముగా గల భగవంతుడు బ్రహ్మదేవుడు 'సంకల్పరూపుడు’ అయిఉన్నాడు. అతడు దేనిని ఎట్లు సంకల్పిస్తాడో, దానిని వెంటనే అట్లే దర్శిస్తూ, మరియు పొందుతూ ఉంటాడు. అతడు “సంకల్పసిద్ధి” కలవాడు. అతడు తనయొక్క సంకల్పశక్తి ప్రభావంచేత అవిద్యను* కల్పించినాడు.

అట్టి అవిద్యాకల్పన చేతనే బ్రహ్మదేవుడు ఈ పర్వత - తృణ - సముద్రయుక్తమగు జగత్తును సృజించారు. చిత్తమే స్వరూపముగా గల బ్రహ్మ నుండే సృష్టి జనించుచున్నది.

కాని కొందరు, జడములగు పరమాణువుల చేతనే ఈ సృష్టి ఏర్పడినది" అని వాదిస్తున్నారు.

పరమాత్మ భగవంతుడు - - జగత్తు ... వేరు వేరు సిద్ధాంతములు

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు గురించిన వేరువేరు సిద్ధాంతములు ప్రవచించబడుచున్నాయి కదా! వాటి గురించి సంగ్రహంగా చెప్పండి.

శ్రీవసిష్ఠ మహర్షి : ఆయా వాదములలో కొన్నిటిని ఇక్కడ వివరిస్తాను.

1) పరమాణు వాదము : "జడములైన వేరు వేరు పరమాణువులే ఈ సృష్ట్యి. పరమాణువులు తప్పిస్తే, ఇక ఎక్కడా ఏదీ లేదు. భగవంతుడు అనబడునదేదీ ఎక్కడా లేదు.”

అవిద్య = అనాత్మయందు ఆత్మాభిమానము కలుగజేయునది.

Page:507

మనకు ఇది ఉత్కృష్టమైన సత్యమును ప్రసాదించగలుగుటలేదు. ఎందుచేతనంటావా? ఈ వస్తుజాలములన్నీ అనేక స్వరూప - స్వభావములు కలిగి ఉంటున్నాయి కదా! ఇంద్రియములకు వస్తువులకు ఒకానొక సానుకూల్యత ఎట్లా ఏర్పడుతోంది? ఈ పరమాణువులు ఇన్ని రకములుగా ఒనగూడవలసినదిగా శాసించుచున్నదెవరు? నాలుక-ఉప్పులందు ఆ సమన్వయమును కల్పించి, రుచి యొక్క అనుభవమును పొందింపచేస్తున్నదేది? కర్తయే లేకపోతే, ఈ సూర్య చంద్ర నక్షత్ర భూమి-వృక్షాది చమత్కారమైన వస్తువులతో కూడిన ఈ జగన్నిర్మాణము ఎట్లా సిద్ధిస్తోంది?

2) ప్రధాన కారణ వాదము : ఈ వాదము ప్రతిపాదించు ద్రష్టలు "సర్వమునకు పరమాత్మయే కర్త అని చెప్పుచున్నారు. అయితే భగవంతుడు అసంగుడు. ఉదాసీనుడు. కార్య కారణములకు అతీతుడు అని సామవేదాదులు శ్లాఘిస్తున్నాయి. ఆయనకు ఈ సృష్టి కార్యము నిర్వర్తించుటవలన కలిగే ప్రయోజనం ఏమి ఉంటుంది? సర్వ ప్రయోజనములకు అతీతుడై, సాక్షీభూతుడైయున్న పరమాత్మ తత్త్వమునకు ఈ జగత్ కర్తృత్వం (Intention of designing th world) ఎట్లా ఆపాదిస్తాం? కనుక ప్రధాన కారణ వాదము కూడా సరిపోదనే మేము భావిస్తున్నాం.

3) విజ్ఞానకారణ వాదము : వీరు భగవంతుడే ఈ జగత్తురూపమున వివర్తం పొందుచున్నాడు” అని చెప్పుచున్నారు. అయితే, చైతన్య స్వరూపుడగు భగవంతుడు జడరూపమును ఎట్లా పొందుతాడు? అందుచేత, ఈ విజ్ఞానవాదము కూడా అత్యుత్తమ సత్యము ప్రకటించలేదని అనిపించుచున్నది.

4) శూన్యవాదము : “శూన్యమునుండే ఈ జగత్తు వచ్చుచున్నది. కొంతకాలానికి శూన్యమునందే లయించపోబోవుచున్నది అని వీరు చెప్పుచున్నారు. అయితే "శూన్యం నుండి పదార్థములు ఎట్లా ఎవరి కారణంగా ఎందుకు ఉత్పన్నములు అవుచున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. ఈ విధంగా, ఈ వాదములన్నీ ప్రకటించబడ్డాయి.

ఇక, ఈ విషయంలో మరొక అభిప్రాయం కూడా చెపుతాను, విను.

ఈ సృష్టి యథార్థానికి ఉత్పన్నమే అయి ఉండలేదు.

చైతన్యమే, అనిర్వచనీయమగు మాయాశక్తిచే, నేను జీవుడను అను సంకల్పమును స్వీకరించి తనయందు దీనినంతా ఇట్లు తానే గాంచుచున్నది. (తద్భావయ - తద్విశతే)! కనుక ద్రష్ట. -

దృశ్యములు 'అద్వితీయ చైతన్యము'నకు వేరైనవి కావు.

సముద్రములోని తరంగములవలె ఈ త్రిలోకములందలి పదార్థజాలమంతా..... స్వసంకల్పమే స్వరూపముగా గల సమష్టి మనోరూపము చేతనే ఉత్పన్నమగుచున్నది, భావించబడుచున్నది, అనుభవించబడుచున్నది. కనుక ఇదంతా భావనామయమే. సమష్టి మనోరూపప్రజ్ఞ కలిగినట్టి 'సమష్టి-అహంకారి'ని 'బ్రహ్మదేవుడు' అని పిలుస్తున్నాం.

చైతన్యమే సమష్టి మనోరూపమున పదార్థ జాలమంతా సంకల్పించి దర్శించుచున్నది. చైతన్యము సంకల్పించనట్టి దానికి అస్థిత్వమే లేదు. కనుక, ఈ జగత్తు ఉత్పత్తి కాకయే ఉన్నది అని నిశ్చయించ

Page:508

బడుతోంది. బ్రహ్మము యొక్క చితశక్తి'యేసమష్టి అహంకారోపాధి యందు ప్రవేశించుచున్నాను” అను కల్పన చేయుచు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) పొందుచున్నది. వ్యష్టి-సమష్టి అహంకార ఉపాధులలోని చిదాభాస శక్తులు సర్వశక్తివంతమగు బ్రహ్మముకంటే వేరేమీ కాదు. అనగా, ప్రతి వ్యక్తీ బ్రహ్మమే అయిఉన్నాడు. కాని అజ్ఞానముచే "నేను జీవుడను. నేను శరీరధారిని, పరిమితుడను”

ఇట్లు అనేక విధములుగా భ్రమించుచున్నాడు. 'అవిచారణ' (Non enquiry) ఉన్నంతవరకు ఈ భ్రమ ఉంటూనే ఉంటుంది.

సూర్యుని నుండి వేలాది కిరణములు బయలుదేరుచున్నాయి. అయితే ఆ వివిధ కిరణములన్నీ సూర్యుని నుండి వేరైనవా? కావు కదా! అదేవిధంగా, బ్రహ్మదేవునియొక్క వివర్తభావము పొందిన వివిధ శక్తులే ఇట్లు అనేక జీవుల వలె ప్రకటితం అగుచున్నాయి. ప్రతి ఒక్క కిరణము వేరువేరైన వస్తువులపై ప్రసరించవచ్చుగాక ! కాని, అనేక సూర్యకిరణములలో ఏకత్వమే సత్యము కదా! బ్రహ్మదేవుడు, అతని నుండి ప్రసరించుచున్న ఈ వ్యష్టిజీవులు .... వీరంతా చైతన్యముకంటే వేరైన వారు కారు. సమష్టి జీవుని సంకల్పము సుదృఢం అగుచున్న సమయంలోనే ఈ జగత్తు ఆవిర్భవించు చున్నది. సమష్టి జీవుడే వివిధ జీవులుగా అయి, ఈ జగత్తును అనుభవించుచున్నాడు.

ఇందలి ప్రతిజీవి సమష్టిజీవుని తత్త్వమే అయి ఉన్నది.

సమష్టిజీవుడు బ్రహ్మముకంటే వేరు కాదు. వ్యష్టి జీవుడు కూడా బ్రహ్మమే.

ఈ జీవులంతా 'చిదాకాశము' నుండే బయలుదేరియున్నారు. అట్లు బయలుదేరి మాయాకాశ మందలి పంచభూతమాత్రమగు ఉపాధులతో కలయుచున్నారు. "అన్నివేళలందూ వీరంతా చిదాకాశ స్వరూపులే అని వేదవాక్యములు ప్రకటిస్తున్నాయి కదా! వీరు వాసనలు, కర్మలు అనుసరించి స్థావర జంగమ రూపాలను పొందుచున్నారు. ప్రాణశక్తి ద్వారా వీర్య - రక్తాది రూపమున బీజత్వమును పొందుచున్నారు. అయినప్పటికీ తమయొక్క చిదాకాశత్వమును త్యజించుట లేదు. అట్లు బీజత్వము పొంది, యోనిమండలమునుండి వారు ఈ జగత్తున ఉత్పన్నమగుచున్నారు. కాకతాళీయ న్యాయముచే సంభవించిన వాసనాజాలమును అనుసరించి తమ తమ కర్మఫలములను అనుభవించుచున్నారు. శుభాశుభవాసనలతో కూడుకొని "పుణ్య-పాపకర్మలు అనే త్రాడుచే కట్టబడి లింగశరీరాలను ధరించుచున్నారు. ఒకప్పుడు ఉత్తమలోకములకు, మరొకప్పుడు నరకలోకములకు పోవుచున్నారు.

11. ఇచ్ఛారూపములు

ఈ ప్రాణులన్నీ ఇచ్ఛారూపములే అయి ఉన్నవి సుమా! అనగా 'చిత్తశక్తి' తన ఇచ్ఛను అనుసరించే ఈ ఏకానేక రూపములను ధరించుచున్నది. ఈ జీవులు తాము గాఢముగా కోరుకొన్నట్టి ఉపాధులను భావాభావములను పొందుచున్నారు. రామచంద్రా! మరొక చెప్పుచున్నాను. విను. *కామమయయేవాయమ్ పురుషః = ఈ జీవుడు ఇష్టమే స్వరూపముగా కలిగియున్నాడు. -శ్రుతి

Page:509

ఆయా జీవులు తమ ఇచ్ఛను అనుసరించే అసంఖ్యాకములగు జన్మలు పొందుచున్నారు. సంసారములోని చమత్కృతులన్నీ మరల మరల అనుభవిస్తున్నారు. వాసనలను అనుసరించి వర్తిం చుచూ 'కర్మ’ అనే వాయువీచికలచే ఒకచోటినుండి మరొకచోటికి ఎగురగొట్టబడుచు సంచరిస్తున్నారు. ఒకానొక జన్మయందు ఈ జీవుడు యాదృచ్ఛికంగా నేను ఉపాధిమాత్రుడనుగాను. ఈ కార్యకారణములకు (Cause & effect) సంబంధించినవాడను కూడా కాను; కార్య-కారణరహితమగు ఆత్మయే నేను అనునట్టి ఆత్మజ్ఞానమును సముపార్జించుచున్నాడు. అట్టి ఆత్మ జ్ఞానము యొక్క ప్రభావం చేత ‘ముక్తుడు’ అగుచున్నాడు. ఈ జన్మ, కర్మ, దృశ్యాదులను తన ఆత్మ యొక్క జడంశముగా ఆస్వాదిస్తూ ఆత్మత్వమును పుణికి పుచ్చుకొని ఉంటున్నాడు.

మరికొందరు జీవులు తమ స్వస్వరూపమే అయి ఉన్నట్టి చిద్వస్తువును ఎరుగుటలేదు. అజ్ఞానముచే మోహితులై అనేక కల్పముల పర్యంతము ఈ ప్రపంచములో జన్మిస్తూనే ఉన్నారు. ఇంకా కొందరు శుభజన్మలను అనుభవించినవారై, ఈ జన్మలో కూడా శుభకర్మపరాయణులై ఉంటున్నారు. అట్టి శుభకర్మపరాయణులు కొద్ది జన్మలలో ముక్తిని పొందగలరు. సముద్రంలో ఆవిరి రూపమున లేచిన జలము ఎప్పటికో సముద్రమే జేరుచున్నది కదా! ఈ జీవులంతా ఒకానొ కప్పుడు తమ స్వస్వరూప స్థితినుండి చ్యుతిపొంది ఈ సంసారారణ్యంలో అశాంతిగా, అవిశ్రాంతిగా సంచరిస్తూ ఉన్నారు. తత్త్వజ్ఞానము పొందనంతవరకు ఆ సంచారము కొనసాగుతూనే ఉంటుంది. ఉత్తమం, ప్రశాంతం అయిన మోక్ష స్థితియే సర్వజీవులలోని అంతర్లీనమై ఉంటున్న ఆర్తి సుమా!

ఓ దశరథవరపుత్రా! రామచంద్రా! ఈ విధంగా జీవులందరి ఉత్పత్తి బ్రహ్మము నుండే కలుగుచున్నది. బ్రహ్మము ఏమాత్రం మార్పు చేర్పులు పొందక, యథాతథంగా ఉండియుండగా

ఈ మనస్సు మాత్రం అనేక ఆవిర్భావ, తిరోభావములను కలిగి ఉంటోంది. క్షణభంగురములైన ఈ జన్మలను చూచుకొని, ఎప్పటికప్పుడు ఇట్లు ఇప్పుడు ఇక్కడ కనబడుచున్నదంతా ఇట్లే సర్వదా శాశ్వతంగా ఉండబోవుచున్నది అని భ్రమిస్తోంది. అనేక జన్మలకు కారణమై ప్రవర్తిస్తున్న “వాసనలు” అనువాటిచే వ్యాకులత్వము పొందుతోంది. సంసార జ్వరముచే పీడింపబడుచున్న జనులకు అనేక సంకటములు, అనర్థములు కలుగజేస్తున్నది ఎవరనుకొంటున్నావు? ఈ మనస్సే సుమా! ఇది ద్రష్టను (లేక జీవుని) అనేక దిక్కులందు, అనేక దేశములందు, అనేక కాలములందు సంచరింప జేస్తోంది. చిత్రవిచిత్రములైన భ్రమలను కలుగజేస్తూ, అనేక విక్షేపములతో కూడియున్న ఈ మనస్సును సమ్యక్ జ్ఞానము” (Perception of Unity in Diversity) అనే గండ్రగొడ్డలిచే నరికివేయాలి. అప్పుడు అది ఇక ఈ జగత్తు అనే మహారణ్యంలో మరల ఉత్పన్నము కాదు. సమ్యక్నమే ఈ జీవుని యొక్క సంసారవ్యాధికి దివ్యమైన ఔషధం.

Page:510

12. జీవుల విభాగము

ఓ రామచంద్రా! బ్రహ్మవస్తువు సర్వదా అన్నిచోట్ల అభేదరీతిలోనే ఉండిఉంటోంది. కాని, త్రిగుణములతో కూడుకొన్నదై, సాత్విక-రాజసిక-తామస గుణభేదములచే ఈ లోకంలో ప్రకటిత మగుచున్నది. అనేక కెరటములవంటి ఈ అనేక జీవులు శాస్త్రములచే విభాగించబడి జ్ఞానాభివృద్ధి కొరకు వర్ణించి చెప్పబడుచున్నారు. అట్టి ఉత్తమ మధ్యమ జీవుల ఉత్పత్తి గురించి చెపుతాను విను. ఈ ప్రపంచంలో కనిపించే జీవుల విభాగం

(1) ‘ఇదం ప్రథమతా’ జన్మ : ఒకానొకడు ఇంతకుముందు కల్పములోని చివరి జన్మయందు తన యొక్క అనేక ప్రయత్నముల సహాయంచేత శమము - దమము సంపాదించియే ఉంటాడు. కాని జ్ఞాన విశ్లేషణం వినక పోవటంచేతనో, లేక ఏవైనా బలవత్తరమైన విఘ్నములు కలగటం చేతనో జ్ఞానప్రాప్తిని, స్వస్వరూప అనుభవమును పొంది ఉండడు. ఇప్పుడు ఈ కల్పమునందు జన్మను పొందియుంటాడు. ఇట్టివాడు బాల్యమునుండే శమ - దమాది గుణములు, భక్తి, సాత్విక భావములు కలిగియుంటాడు. కనుక, జ్ఞాన ప్రాప్తికి యోగ్యుడు అగుచున్నాడు. ఇట్టివారిలో కొందరు ప్రవక్తలై తమ బోధామృతంచే అనేకులను అజ్ఞానాంధకారం నుండి కాపాడుతూ ఉంటారు.

అయితే పూర్వకల్పము నందు పూర్ణముగా శుభాభ్యాసము కలిగియున్నవారే ఈ ఇదం ప్రథమతా అనే విభాగానికి చెంది యుంటారు. వారు ఈ జన్మ యందో, లేక మరు జన్మ యందో ముక్తికి అర్హులు అగుచూ ఉంటారు.

(2) ఉత్తమ సంపన్నమైన జన్మ (గుణపీవరీ) : వీరు ఇంకా ఇదంప్రథములంతటి తీవ్రవైరాగ్యం పొందియుండరు. పుణ్యలోకముల కొరకై ఉపాసనాదులను మాత్రం ఇంకా చేస్తూ ఉంటారు. వీరు ఇక పది లేక పదిహేను జన్మలలో ముక్తులు అగుటకు క్రమంగా సిద్ధమగుచున్నారు.

(3) స-సత్వులు : వీరు గుణపీవరీల తరువాత తరగతికి చెందినవారు. వీరు పుణ్య పాపములతో కూడుకొనిన మిశ్రమ కర్మలు నిర్వర్తిస్తూ ఆయా సుఖ-దుఃఖములను పొందుచూ ఉన్నారు. కాని “మేము మెల్లమెల్లగా సత్వగుణమును పెంపొందించుకొనెదముగాక అను ఉత్తమమైన లక్ష్యము, ఆశయము కలిగిఉంటున్నారు. ఉత్తమ కర్మలవైపు ఇంకనూ శ్రద్ధను అభివృద్ధి చేసుకోవలసి ఉన్నది.

వీరు సుమారు వంద జన్మలలో సత్వగుణమును ఆరూఢం చేసుకోగలరు. క్రమంగా ముక్తిని పొందటానికి సిద్ధమౌతున్నారు.

(4) అధమసత్వులు : వీరు విచిత్రములైన ప్రాపంచికవాసనలు కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. మలినమైన అంతఃకరణముతో ఆయా సుఖదుఃఖరూపములుగల ఫలముల కొరకై మరల మరల ఆశ్రయించటం, జన్మలు ఎత్తటం చేస్తూ ఉంటారు. వారు తమ దృష్టిని పరిశీలించుకొనే దాకా అట్లు వేలాది జన్మలు ఎత్తుతూనే ఉంటారు. వీరికి అశ్రద్ధ బాగా ఉండి ఉంటుంది. కాని, అధ్యాత్మశాస్త్రం పట్ల (ఆత్మ విషయమై విచారణ పట్ల) విముఖత మాత్రం కలిగి ఉండరు. కనుక, వారు అభివృద్ధి

Page:511

చెందుటకు అనేక అవకాశములు కలిగియే ఉంటారు. ఏవైనా ఉత్తమ సంఘటనల వలన గాని, కాకతాళీయంగా గురువులబోధ వినుటచేతగాని వీరు ఆత్మజ్ఞానము వైపు సుముఖులు కావటానికి కొంత అంతరంగమునందు సిద్ధపడే ఉంటారు.

(5) అత్యంత తామసీ : వీరు కూడా కొంత వరకు అధమసత్వుల లక్షణములే కలిగి ఉంటారు. అయితే వీరు అధ్యాత్మశాస్త్రం పట్ల విముఖత్వము (disliking, Non-accepting) కలిగి ఉంటారు. సర్వదా అనేక సంశయములచే - శాస్త్రము యొక్క గురువుల యొక్క సామీప్యతను తిరస్కరిస్తూ ఉంటారు. ఎన్నో కల్పములు, వేలకొలది జన్మలు గడచిపోవచ్చుగాక! "ఆత్మవస్తువు అనే దూరస్త వస్తువు వైపు పయనించే విషయంలో, వీరికి వీరియొక్క సంశయత్వము- ప్రయత్నరాహిత్యములే అడ్డుపడుతూ ఉంటాయి.

(6) రాజసులు : వీరు పూర్వ కల్పమునందలి తమయందు శేషించియున్న వాసనలను అనుసరించి విచిత్ర కర్మాచరణములు కలిగి ఉంటూ ఉంటారు. అనేక మధ్యరకపు (జంతు) జన్మలు ఎత్తుతూ ఉంటారు. అయితే వారిలో ప్రయత్నము అను రూపముగల ఆర్తి బయలుదేరింది. అందుచేత వారు కొన్ని జన్మలలో మనుష్యత్వమును గ్రహించి, ఆ తరువాత కర్మానుసారంగా స్వర్గ

- - నరకములకు వెళ్ళివస్తూ మరి కొన్ని జన్మలు గడుపుతారు. వారు మోక్షప్రాప్తియందు ఏమాత్రం నిశ్చయం ప్రస్తుతానికి కలిగిలేరు.

(7) రాజస - సాత్వికులు : వీరికి ఇప్పుడిప్పుడే వైరాగ్యం కొంచం కొంచెం ఉదయించుచున్నది. సమీపంలోనే 'జ్ఞానప్రాప్తి’ సిద్ధించు జన్మలను పొందగలరు. మోక్షార్హమైన ఉపాధులను పొందుచు, మోక్షప్రాప్తికి యోగ్యమైన కర్మాచరణం కలవారై ఉంటారు. వీరు కొంత నిశ్చలబుద్ధి గల మోక్ష - యత్నపరులని అనవచ్చు. వీరు ఇప్పటికి ఇంకా పూర్ణమైన 'లక్ష్యశుద్ధి' ఏర్పడి ఉండకపోవచ్చు. కాని వారి యందలి ప్రయత్నశీలత్వమే వారి కవచం.

(8) రాజస-రాజసులు : వీరు యక్ష - గంధర్వ యోనులలో ఎక్కువగా పుట్టుచూ ఉంటారు. కొలది జన్మలలో 'రాజస-సాత్వికత'ను స్వీకరించనున్నారు. అప్పటినుండి ముక్తికొరకై యత్నించగలరు. వర్తమానంలో మాత్రం 'ముక్తి' యొక్క శబ్దార్థములు వారికి తెలియవు. వీరు సర్వదా ఏవేవో మానసిక, శారీరక క్రియావ్యవహారములందు నిమగ్నులగుచు, స్వప్నంలోలాగా విజ్ఞాన దృష్టి లేకుండా కాలం గడుపుచున్నారు.

(9) రాజస-తామసులు: వీరు అల్పమైన ప్రయత్నము కలవారు. ఎన్ని వందల జన్మల తరువాతో గాని, వారియందు ప్రయత్నము' అనునది కొంత వేగం పుంజుకోదు. వీరు ఎప్పటికో ‘రాజస రాజసులు’ ఆపై, రాజస సాత్వికులు కాబోవుచున్నారు. వీరు "అత్యంత తామసీలు" సమానమే.

(10) రాజసాత్యంతామసీలు : వీరు తమస్సుచే ఆవరించబడి కార్యములను చేస్తూ ఉంటారు. ఎన్ని వేల జన్మలు జరుగుచున్నప్పటికీ నేనేమిటి? నేనెవ్వరు?" అనే విషయం వారి దృష్టిన పడుటయే

లేదు.

Page:512

(11) తామసులు : వీరు ఇప్పటికే అనేక కల్పములందు జన్మించారు. బహుకాలం జరిగి పోయింది. మోక్ష విషయమై ఒకానొక ప్రగాఢ నిద్ర అనుభవిస్తున్నారు. ఎవ్వరేది చెప్పినా వినుటలేదు. వారికి తోచుటలేదు. కాని, వీరిలో కొందరు వర్తమాన జన్మను సార్థకపరచుకొనువారు కూడా లేకపోలేదు సుమా!

(12) తామస-సత్వులు : తామసులై ఉండి, మోక్షప్రాప్తికి యోగ్యమైన కార్యాచరణం ప్రారంభిస్తున్నారు. అట్లు ప్రారంభించి ఉత్తమ పదమును పొందిన ఉదాహరణలు కూడా అనేకం (కర్కటి, ప్రహ్లాదుడు ఇట్టివారే).

(13) తమోరాజసులు : దూరంగా ఎక్కడో మినుకు మినుకుమంటున్న కాంతిని చూచి, అటువైపు వెళ్ళుట గురించి యోచించుచున్నట్లు, ఈ తమోరాజసులు ఇప్పుడిప్పుడే ప్రయత్నశీలుర గుచున్నారు. వీరు కొన్ని జన్మలలో అట్లే కొంచము కొంచము ప్రయత్నశీలురగుచు ఉంటారు. ఆ ప్రయత్నముల నుండి విముఖులు కాకపోతే, వీరు తామససత్వులు కాగలరు.

(14) తామస-తామసులు : వీరు ఇప్పటికే అనేకవేల స్థావర జంగమ జన్మలు ఎత్తారు. ఇంకా ఎంతగానో జన్మిస్తూ పోవాలనే దృష్టియే కలిగి ఉంటున్నారు. వీరు ఎప్పటికి ఎట్లు జ్ఞానము వైపు దృష్టి మరల్చుతారో ఎవ్వరం చెప్పలేం. వీరు అత్యంత తామసులు.

లక్షలాది జన్మలు గడచిపోతున్నాయి. 'జ్ఞానం' విషయమై మూఢత్వం ఆవరించి ఉన్నది. మార్పు చేర్పులు లేవు. ప్రగాఢమగు దుఃఖ మోహములు ఆక్రమించివేసి ఉన్నాయి. వారు ఏమాత్రం ముక్తి గురించి వినరు, చూడరు. వారికేమీ తెలియదు. మౌనము, మౌఢ్యము వారి యందు తాండవిస్తున్నాయి. అయితే, వారందరిలో ఎవ్వరైనా-ఏక్షణంలోనైనా నిదురలేచి ‘ఆత్మజ్ఞానం’ వైపుగా అడుగులు వేయటానికి, నడచి వెళ్ళుటకు సర్వదా 'సంసిద్ధత' అంతరంగమున కలిగియే ఉన్నారు. అంతా బ్రహ్మమే

ఓ రామచంద్రా! భిన్నభిన్న ఉపాధులు (Physical bodies) గల ఈ జీవజాతులన్నీ బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నాయి. బ్రహ్మమునకు వేరైనవి కావు. చలించుచున్న సముద్ర జలంలో అసంఖ్యాకంగా తరంగాలు బయల్వెడలుచున్నాయి కదా! ఆ తరంగములన్నీ జలముకంటే వేరైనవా? కాదు. దీపం నుండి వేలాది కిరణములు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణములు దీపం కంటే వేరైన అస్థిత్వం కలిగి ఉంటున్నాయా? లేదు. అట్లే ఆ సర్వవిధ భౌతిక, మానసిక స్థితిగతులతో ప్రకటిత మగుచున్న జీవరాసులన్నీ బ్రహ్మముకంటే వేరుకాదు. ప్రజ్వలించుచున్న అగ్నినుండి సన్నటి కాంతి పుంజములు లేచుచున్నట్లు, ఈ ప్రాణికోట్లన్నీ బ్రహ్మమునుండే ప్రభవిస్తున్నాయి. వృక్షం నుండి శాఖల వలె, బంగారము నుండి ఆభరణములవలె, జలము నుండి జలబిందువులు - ఆవర్తములుతరంగములు-బుడగలు వలె, చంద్రబింబము నుండి చంద్రకిరణములవలె, మహాకాశం నుండి ఘటాకాశం వలె బ్రహ్మం నుండే ఈ ప్రాణికోట్లు, అవి దర్శించుచున్న దృశ్యములు ఉత్పన్న మవుతున్నాయి.

Page:513

ఎండమావులలో జలతరంగముల అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ ఎండమావులు సూర్యకాంతి కన్నా వేరైనదాని మూలంగా ఏర్పడుట లేదుకదా? సూర్యకాంతి ప్రసరించకుంటే ఎండమావులే ఏర్పడేవికావు. ఈ ద్రష్ట బ్రహ్మము యొక్క స్వరూపమే. ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించే దృశ్యం ఉంటోంది. మనం ఇప్పుడు చెప్పుకొన్న అనేక విభాగములతో కూడిన జీవజాతులన్నీ ఏ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయో, ఆ పరమాత్మయందే లీనమౌతున్నాయి. * కొన్ని లేచిన కొద్ది క్షణాలకే లీనమౌతున్నాయి. మరికొన్ని అనేక జన్మల తరువాత ఎప్పటికో లీనమౌతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ, జగత్తుకు బ్రహ్మమునకు భేదం లేదు. ఈ రెండిటికీ జల-తరంగముల సంబంధమే దృష్టాంతము. మరి ఈ కనబడుచున్న అనేకత్వము మాట ఏమిటంటావా? ఉపాధులందు ద్రష్ట కలిగియుంటున్న భ్రమాత్మకమైన దృష్టి కారణంగానే ఈ భేద ప్రతీతి అంతా ఏర్పడుతోంది. ఈ జీవజాతులన్నీ ఉపాధిభేదం చేత బ్రహ్మాండములందు అంతటా వ్యవహరిస్తున్నాయి. మరల ఆ సర్వేశ్వరుని యందే లయిస్తున్నాయి. వ్యవహరిస్తున్నట్టి సమయంలో స్వర్గాదులకు పోతున్నాయి. మరల అక్కడి నుండి అధోలోకములైనట్టి నరకాదులకు వెళ్ళుచు, పరిభ్రమిస్తున్నాయి. మాయ యొక్క చమత్కారం అట్టిది. అది అనిర్వచనీయం, అద్భుతం.

అయితే నాయనా! రామచంద్రా! ఇదంతా చూచి నీవు భ్రమించవలసిన పనేమీ లేదు. ఆ సర్వేశ్వరుని శరణువేడు. సర్వదా సర్వేశ్వరత్వమును ఆరాధించు. ఆ సర్వేశ్వరత్వమునే భావించు.

“ఇదంతా నాదే. నేనే ఈ సర్వమునందు అంతర్లీనంగా ప్రసరించియున్నాను. నేను కానిదంటూ ఎక్కడా ఏదీలేదు.... అను సంభావనను ఆశ్రయించు.

మనస్సులో ఉండే దోషభావనలన్నీ తొలగించుకొని, నిర్మలుడవుకమ్ము. ఆత్మారాముడవై విరాజిల్లు. ఈ దృశ్యమంతా నీ స్వస్వరూపంగా ఆస్వాదించు.

13. జీవుల ఉత్పత్తి స్థానము

శ్రీరాముడు : హే సద్గురూ! "బ్రహ్మము నుండే ఈ జీవులు ఉత్పన్నమైనారు" అని చెప్పబడుచున్నది కదా! అట్టి వ్యవహారమును కలుగజేయుచున్న ఫలప్రదాత ఎవ్వరై ఉన్నారు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక వృక్షమునుండి ఆ వృక్షము యొక్క పూలు, ఆ పూలలోని

సుగంధము - - ఆ వృక్షమునకు అభిన్నమైనవే కదా! అట్లే కర్త, ఆ కర్త యొక్క క్రియ ఏకమే అయి ఉంటాయి. ఈ కర్త - క్రియలనబడు రెండూ కూడా పరమపదమైనట్టి బ్రహ్మము నుండే వ్యక్తము

సగుట = ఆత్మభావము నందు సువ్యవస్థమై ఉండుట (లేక) నేను బ్రహ్మమునే అను అఖండ అప్రమేయ-అద్వితీయ-సర్వనియామక తత్త్వభావం అవధరించి ఉండటం.

Page:514

లవుతున్నాయి. ఇక్కడ చమత్కారం చూచావా? వాస్తవానికి ఏ కల్పనలు ఉండనట్టి నిర్మల- పరబ్రహ్మము నందు అజ్ఞానముచే జీవత్వము స్ఫురించుచున్నది. ఆకాశంలో, 'లేని నీలత్వం కనిపిస్తోందికదా! ఇది కూడా అట్టిదే.

"ఈ జీవులు బ్రహ్మము నుండి ఉత్పన్నమయ్యారు" అనేదికూడా అసత్యమైన సిద్ధాంతమేనని, అది అజ్ఞానముచేతనే ప్రబలుచున్నదని గ్రహించు. పూర్ణాత్మ జ్ఞానులు ఉండేచోట ఇట్టి భ్రాంతి వాక్యములకు చోటు ఉండదు. ఎందుకంటే ద్వైతకల్పన ఉన్నచోట మాత్రమే, ఒకదాని నుండి, మరొకటి ఉత్పన్నమగుట అనే దర్శనము ఏర్పడగలదు. "ద్రష్టయే దృశ్యమును కల్పించి దర్శించుటచే, ద్రష్ట కంటే వేరుగా దృశ్యము లేదు" అను అవగాహనతో కూడిన అద్వైతస్థితియందు విజ్ఞానము సుస్థిరపడినప్పుడు, ఇక ఆపై అట్టి భేదభావనయే ఉండదు.

అయితే గురువులు తమ శిష్యులయందు ఉత్తమోత్తమమైన లక్ష్యము రూపుదిద్దుకొనుటకు వీలుగా ఒకానొక బోధక్రమమును రచించుచూ, ఇది బ్రహ్మము, వీరు జీవులు. వీరు బ్రహ్మమునుండే బహిర్గతమయ్యారు అను ద్వైత కల్పనను ప్రతిపాదిస్తున్నారు. ఇదంతా బోధ కలిగించుటకే అయి ఉంది. లోకము నందు గాంచబడేది కూడా ఇట్టి కల్పనాక్రమమే. ఒకవేళ 'అద్వితీయమగు బ్రహ్మము నుండే లేక అసంగుడగు పరమాత్మ నుండే ఈ కనబడేదంతా ఉత్పన్నమౌతోంది" అని చెప్పుకొన్నా, అట్లు ఉత్పన్నమగుటకు ఉపాదానకారణం బ్రహ్మమే (లేక పరమాత్మయే) అయిఉండాలి. ఎందుకంటే పరమాత్మను నియమించునది మరేదీ ఉండజాలదుకదా! కనుక, "ఈ జగత్తు బ్రహ్మము యొక్క రూపమే. ద్రష్ట బ్రహ్మము కంటే వేరైనవాడు కాడు అని మనకు ఇక్కడ సిద్ధిస్తోంది. ఎందుకంటావా?

ఉత్పత్తికి ముందు ఈ జగత్తు ఎక్కడ ఉన్నది? బ్రహ్మమునందే సంస్కారరూపంలో అణిగియున్నది సుమా! బ్రహ్మము ద్రష్ట-దర్శనములకు ముందే, దేనిచేతనూ తాకబడక, అసంగమైయున్నది. భ్రాంతిచే “ఉత్పత్తి-ఆకారము-భావన-అనుభవము అను రూపములతో కూడి ఈ జగత్తు ప్రాప్తి స్తోంది. భ్రాంతిచేత బ్రహ్మమే ఇట్లు జగత్తుగా కనిపించటం జరుగుచున్నదని మేము సిద్ధాంతీకరిస్తున్నాం.

అసంఖ్యాకములైన ఈ జీవరాసులన్నీ బ్రహ్మము నుండే ఉత్పన్నమై మరల ఆ పరమపదమగు బ్రహ్మమునందే లయించుచున్నాయి. జలములోనే బుద్బుదములు (Bubbles) లేచి లీనమగు చున్నాయి కదా! త్రికాలము* లందు ఈ జీవరాసుల సృష్టి-స్థితి-లయలు అనే ప్రక్రియ ఇట్లే జరుగుచున్నది. అయితే, పురుషునికి, అతని కర్మలకు పుష్ప- గంధముల వలె భేదం లేదు. జలము-జల కదలికల వలె అవి రెండూ పరమాత్మ నుండే ఉత్పన్నమై, తిరిగి పరమాత్మ యందే లయించుచున్నాయి. శ్రీరాముడు : మునీంద్రా! మనకు ఈ దైత్య-నాగ-మనుష్య-దేవత-జంతు రూపములలో పాంచభౌతిక ఉపాధులు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఎట్లా ఏర్పడుమన్నాయి?

త్రికాలములు = సృష్టి - స్థితి - లయములు

Page:515

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మరల మరల ఏర్పడుచున్న పాంచభౌతిక ఉపాధులన్నిటినీ నిర్మించుచున్నది అంతరంగములోని వాసనలే. వాసనలు ప్రియాప్రియ సంకల్పములకు వేరుగా ఏవీ కావు కదా! బాహ్యమునందు ఏర్పడుచున్న ప్రియ-అప్రియములకు మూల కారణం ఆత్మయొక్క విస్మరణమే సుమా! “ఆత్మ యొక్క స్వరూపమును ఏమరిచియుండుట అనుదానికి వేరుగా జన్మాంతర ఫలదాత ఏదీ లేనేలేదు. "బాహ్యమున ఎక్కడో ఉండి ఎవ్వరో ఏదో చేస్తున్నారు అనునదంతా వాస్తవం కాదు. ద్రష్ట యొక్క (1) అభిలాష, (2) ఆత్మవిస్మరణ.... ఈ రెండే అంతటికీ కారణమగుచున్నదని గ్రహించు. వాస్తవానికి జన్మలు లేవు, కర్మలు లేవు.

14. "కర్మలు - ప్రభావములు" ఉన్నాయా? లేవా?

-

శ్రీరాముడు : మహాత్మా! "జన్మలూ లేవు - కర్మలూ లేవు అని మీరు అంటున్నప్పుడు, నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. రాగరహితులైన పెద్దలచే ఈ లోకమున వేదసమ్మతంగా ధర్మము, వ్రతము మొదలైనవి నిర్ణయించబడినాయికదా! అట్లాగే స్మృతులు, పురాణాలు, కాలకల్పసూత్రములు ప్రవచించే ఇతిహాసములు మొదలైనవి, కూడా ఉన్నాయి. నాయనలారా! ఇది పుణ్యం. ఇది పాపం. ఇది ఇట్లాಇಲ್ಲ చేయండి. అది అట్లు చేయకండి" అని ఆయా విధి-విధానములను శాస్త్రములు జనులకు చెప్పుచున్నాయి.

ఈ ప్రపంచంలో విశుద్ధ సత్వగుణోపేతులు, ధీరులు, చక్కటి సమదృష్టి కలవారు, బ్రహ్మ సాక్షాత్కారము పొందియున్నవారు అగు సాధువులు సంచరిస్తున్నారు. వారి వాక్కులు, వారి ఆచరణలు, వారి శాస్త్రవ్యాఖ్యానములు తత్వజ్ఞానానుభవం లేని అనేకులకు ప్రమాణాలు అవుచున్నాయి. అనుసరణీయమౌతున్నాయి. అట్టి శాస్త్రనియమములు, ఆర్యనిర్ణయములు అనుసరించి అనేక మంది జనులు తమయొక్క ఉచిత - అనుచితములను నిర్ణయించుకొని, అప్పుడు ప్రవర్తిస్తున్నారు. కొందరైతే -ఇతడు సాధువులు చెప్పిన మార్గంలో నడచుకోవటంలేదు. అందుచేత ఇతనిని మేము బహిష్కరి స్తున్నాం అని కూడా అంటూ ఉంటారు. సంధ్యావందనము వంటి శిష్టాచారములను అనుసరించని వారికి దుఃఖమే కలుగగలదని లోకప్రతీతి కూడా ఉన్నది.

పైగా మహాత్మా! ఈ "కర్మ-కర్త అను రెండూ కూడా, ఒకదానిచే మరొకటి కలుగుచున్నవని లోకంలో అంటూ ఉంటారు. శాస్త్రప్రతీతి కూడా అట్లాగే ఉంటోంది. అనగా, కర్మచేత కర్త ఏర్పడు తుంది. కర్త, కర్మని సిద్ధింపచేస్తోంది. చెట్టు నుండి విత్తు, విత్తునుండి చెట్టు ఏర్పడుచున్నట్లు.... జీవుని వలన కర్మ, ఆ కర్మ వలన జీవుడు ఉనికిని ఏర్పాటు చేసుకొంటున్నారు అని అర్థం అవుతోంది. మీరు చెప్పుచున్నట్లుగానే, ఈ జీవుడు ఏ వాసన కలిగియుండి ఈ సంసార పంజరంలోనికి త్రోయబడుచున్నాడో అట్టి వాసనలను అనుసరించే ఫలానుభవములను కూడా పొందటం జరుగు తోంది. వాసనలే జన్మకు మూలం. ఆ వాసనలు ఏర్పడుచున్నది ఎక్కడినుండి? కర్మలనుండే కదా!

Page:516

మహర్షీ! ఇదంతా ఇట్లుండగా, ఇప్పుడు అసలు నా సందేహమేమిటో చెపుతాను. వినండి.

జన్మకు బీజభూతమైన కర్మ అంటూ ఏదీ లేదు. ఎట్టి కారణం లేకుండానే ఈ జీవులు బ్రహ్మము నుండి ఉత్పన్నమగుచున్నారు అని మీరు అక్కడక్కడ అంటున్నట్లుగా నాకు అనిపిస్తూ వస్తోంది. ఎందుచేత? కర్మలు అసలు ఉన్నాయా? జన్మలు కలిగేది కర్మ ప్రభావం చేత కాదా? శ్రుతులలోని కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యములలోని సారమును అనుసరించి దుష్కర్మలు, సుకర్మలు వాటి వాటి ప్రయోజనమును కలిగియే ఉంటాయికదా! మరి, మీరు కర్మల వ్యవహారమే తిరస్కరించి, “ఇచ్ఛ, ఆత్మ విస్మరణలే అంతటికీ కారణం అంటున్నారేమిటి? 'కర్త', 'కర్మ' - ఈ రెండూ కూడియే ఉత్పన్నమౌతాయికదా! కాబట్టి ఈ జగత్తు జన్మ - కర్మల హేతు - ఫలరూపమే కదా! బ్రహ్మము నందు కర్మల వ్యవహారమే లేదనుకొంటే బ్రహ్మరూపులగు ఈ అనేక విధములైన ద్రష్టలు, (లేక) జీవులంతా కర్తృ - కర్మల వ్యవహారం లేకుండా ఎట్లు జన్మించుచున్నారని అర్థం చేసుకోవాలి?

బ్రహ్మము (ఆ పరమాత్మ) కారణరహితుడు, మాయాసహితుడు అని కదా మీరు అన్నారు! అట్టి బ్రహ్మము నందు 'ఆకాశము' మొదలైన ఈ అనుభవమునకు వచ్చుచున్న పదార్థములు, బ్రహ్మదేవుడు మొదలుగా అనేక స్థూల - సూక్ష్మ ఉపాధులు, ఆయా ఫలానుభవాలు ఎట్లా ఏర్పడుచున్నాయి? కర్మలకంటే వేరైన కారణం ఏముంటుంది? ఈ కనబడేదంతా 'సృష్టి' అను కర్మ రూపఫలమే కదా? ఇదంతా కర్మఫలానుభవమే అయినప్పుడు ఈ జన్మ కర్మల వ్యవహారం తిరస్కరించటమెట్లా చెప్పండి?

ఒకవేళ మీరు "కర్మలు లేవు. కర్మలు నిష్ప్రయోజనమైనవి" అని సిద్ధాంతీకరించటం జరిగితే, అప్పుడు లోకంలో నరకాదులను గూర్చిన భయమే లేకుండాపోతుంది. అప్పుడు లోక సంకరమే ఏర్పడుతుంది. పాపభయం పోతుంది. పాపభయం లేకపోతే లోకంలో "మత్స్యన్యాయం (చిన్నచేపను పెద్దచేప మింగటం) ప్రవర్తించి, బలవంతుడు బలహీనుణ్ణి హింసిస్తాడు. అప్పుడు సర్వనాశనమే చేకూరగలదు కూడా. స్వామీ! "బ్రహ్మమునందు కర్మలు లేవు. జన్మలకు కర్మ కారణం కాదు అని అంటున్నప్పుడు మీరు కొంత సందిగ్ధమునే కలుగజేస్తున్నారు. ఓ వేదవరేణ్యా! ముందు నాకీ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.

ఒకనిచే నిర్వర్తించబడిన కర్మలు ఫలవంతము అవుతాయా? కావా? ఈ నా సంశయమును

తొలగించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! కర్మల విషయమై మంచి ప్రశ్న వేశావు. ఈ సమాధానం విను. దీని వలన కొంత విశేషమైన జ్ఞానం కలుగుతుంది.



ఉదా ||సాధుకారీ సాధుభవతి - పాపకారీ పాపోభవతి ॥ "పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి - పాపః పాపేన కర్మణా జాయతే||

Page:517

మనః సంబంధమైన క్రియయే కర్మకు బీజము కదా! ఇట్లు మనస్సుతో చేసిన క్రియకే ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది.

ప్రథమ సృష్టి యందు* పరబ్రహ్మము నుండి మనోరూపము ఆవిర్భవించింది. అట్టి ప్రథమసృష్టి సమయంలోనే మనోరూప ఉపాధులచే కలుగుచున్న సమష్టి - వ్యష్టి జీవుల కర్మలు కూడా ప్రకటితం అవుచున్నాయి. అప్పుడే ఈ జీవులు పూర్వ కర్మ వాసనానుసారం దేహములందు అభిమానం కలిగి ఉంటున్నారు. "పుష్పము - - దాని సువాసన వేరువేరు కానట్లే “మనస్సు, కర్మలు అనబడు రెండూ వేరువేరైనవి కావు. వాటియందు భేదం లేదు. విజ్ఞులైనవారు 'క్రియాస్ఫురణ (tinge of activity) నే 'కర్మ' అని అంటున్నారు. సంస్కార రూపమగు మనస్సే అట్టి కర్మకు ఆశ్రయం కాబట్టి, కర్మయే మనస్సు. నాయనా! రామా! ఎవ్వడు ఎక్కడైనా ఉండవచ్చు. కర్మయొక్క ఫలితంనుండి మాత్రం తప్పించుకోలేడు. అది ప్రాప్తించియే తీరుతుంది.

#

కర్మ అంటే ఏమిటి? ఈ జన్మ యందు గాని, ఇతఃపూర్వపు జన్మలందు గాని నిర్వర్తింప బడియున్న మనస్సుతో కూడినట్టి పురుషప్రయత్నములే సుమా! అట్టి పురుష ప్రయత్నం ఎన్నటికీ నిష్ప్రయోజనం కాదు.

అవిద్యచే ఉద్భవించిన ఈ మనస్సే క్రియావంతమగుచున్నది. ఈ మనస్సు 'చిదాత్మ' యొక్క ఉపాధియే కదా! కనుక కర్త-భోక్త కూడా ఈ మనస్సే అగుచున్నది. నీవు చెపుతున్నట్లు “చేయబడిన కర్మ ఫలవంతము కాకుండా ఉండుట చేయబడని కర్మ ఫలించుట ఈ రెండూ కుదిరే విషయాలే కావు. శాస్త్రప్రమాణములు ఈ విషయమే అనేకచోట్ల నిరూపిస్తున్నాయి. అందుచేత మత్స్యన్యాయము’ ప్రసక్తే లేదు.

శ్రీరాముడు : అయితే మహర్షీ! ఒక కర్మ, దాని నుండి ఫలితము..... ఆ ఫలితము నుండి మరొక కర్మ.... ఈ విధంగా చర్వితచరణంగా సాగవలసినదేనా? ఈ కర్మల వ్యవహారమునకు నాశనమంటూ లేనే లేదా? ఈ మనస్సు ఎల్లప్పటికీ ఇంతేనా?

శ్రీవసిష్ఠ మహర్షి : 'నలుపుదనము' లేకుండాపోతే అప్పుడిక 'కాటుక' కూడా ఉండదు కదా! అట్లే, కర్మ నశిస్తే, కర్మ రూపమే అయి ఉన్న మనస్సు కూడా స్వయంగా శాంతిస్తుంది.

నేను అకర్తను అను అవగాహనయే కర్మనాశనము.

కర్మనాశనమే మనోనాశనము. అట్లే, మనస్సు నశించుటయే కర్మయొక్క సంక్షయము అయి ఉన్నది. అయితే, అట్టి మనోనాశనము ముక్తులకు మాత్రమే కలుగుచున్నది సుమా! "నేను సర్వాత్మకమగు బ్రహ్మమునే అనునట్టి అనుభూతిపూర్వకమైన ఎరుక గలవాడే, అనుభవపూర్వకమైన ప్రజ్ఞను

'ప్రథమసృష్టి : వృత్తిగాని రాగముగాని లేనట్టి చిన్మయస్వరూపుడే ఈ జీవుడు. అట్టి పూర్ణానుభవము నుండి బాహ్యదృష్టిని లేక 'వృత్తి'ని, 'రాగము'ను అవలంబించటం ప్రారంభించుట చేతనే సృష్టి ప్రాప్తిస్తోంది. అట్టి ప్రారంభమే ప్రథమసృష్టి.

Page:518

సుస్థిరపరచుకొన్నవాడే ముక్తుడు. కనుక ముక్త స్వరూపము పొందిన తరువాత ఇక మనస్సు ఉండదు. మనస్సు లేదు కనుక 'కర్మ' కూడా ఉండదు. బద్ధులైనట్టి అజ్ఞానులకు మాత్రం మనస్సు ఉండియే ఉంటుంది. మనస్సు ఉన్నంతవరకు కర్మలు, ఆ కర్మలకు ఫలితములు ఉండియే తీరుతాయి.

అగ్ని, ఉష్ణత్వములను గమనించావా? ఆ రెండిటిలో ఒకటి క్షీణిస్తే రెండవది కూడా క్షీణిస్తుంది కదా! ‘చిత్తము - కర్మలు' అను ఈ రెండింటిలో ఒకటి నశిస్తే, రెండవది కూడా స్వయముగానే నశిస్తోంది. ఈ చిత్తము స్ఫురణ రూపమును పొంది, విహితమైనట్టి - నిషిద్ధమైనట్టి కర్మల (acts which one 'should do' and 'should not do') ద్వారా పుణ్య - పాపముల రూపమున, ధర్మాధర్మముల రూపమున పరిణమించుచున్నది. కర్మ కూడా, దాని ఫలభోగానుసారంగా, 'స్ఫురణ' రూపమును (లేక చలనరూపమును) పొంది 'చిత్తము అగుచున్నది. వాస్తవానికి ఈ రెండూ ఒక్కటే. అయినాకూడా 'చిత్తము, కర్మ' అను రెండు పేర్లతో లోకంలో వ్యవహరించబడుతోంది. ఇవి రెండు ఒకదానికి మరొకటి కారణమూ, రూపము అగుచున్నవి.

చిత్తరాహిత్యమే మోక్షము. లేక కర్మరాహిత్యమే మోక్షము.

'కర్మరాహిత్యము అనగా "నిష్క్రియ రూపమైన జడత్వమును ఆశ్రయించుట" అని మాత్రం అర్థం చేసుకోకూడదు సుమా! మరింకేమంటావా?

తననుతాను 'అకర్త'గా తనయందలి అకర్తాతత్త్వమును దర్శించుచున్నవాడు ఆత్మవస్తువుగానే శేషించుచున్నాడు. ఫలితంగా కర్తృత్వమునూ, భోక్తృత్వమునూ అధిగమిస్తున్నాడు.

శాస్త్రములలో అనేకచోట్ల చెప్పబడిన విహిత నిషిద్ధ కర్మల అంతిమ ప్రయోజనం కర్మరాహిత్యమే లేక చిత్తరాహిత్యమే. అనగా, నా హం కర్తా! నా హం భోక్తా!" - నేను కర్తను కాదు భోక్తను కాదు! ....అను రూపముగల ఆత్మ యొక్క ధర్మమును ఈ జీవుడు సంతరించుకొనుటయే ఉత్తమోత్తమ ప్రశాంత స్థానమైయున్నదని సూక్ష్మదృష్టిచే జనులు గ్రహించెదరుగాక! అట్టి ప్రశాంత-మౌన-అంతరంగ స్థితియే ‘మోక్షము’ అను శబ్దముచే వ్యవహరించబడుతోంది. సర్వం యొక్క అంతర్యామిత్వం స్వభావ సిద్ధంగా అభ్యాసఫలంగా అవధరించువాడు స్వతఃసిద్ధంగా కర్మలకు అతీతుడై వెలుగొందుచున్నాడు.

15. మనస్సు యొక్క స్వరూపము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! ఈ మనస్సు యొక్క రూపం భావనయే సుమా! భావించుటయే మనస్సు కలిగియుండుట" అయి ఉన్నది. భావన చలన స్వభావం కలది. మనస్సు చేతనే ఆయా కర్మలన్నీ నిర్వర్తింపబడుచున్నాయి. క్రియలు సూక్ష్మత్వమును, అదృశ్య రూపత్వమును పొందియున్నప్పుడు అవి అంతరంగంలో సంస్కార రూపమును లేక సూక్ష్మవాసనల రూపమును (Subtle tendencies) పొంది ఉంటున్నాయి. అట్టి సంస్కారములను అనుసరించే భావికాలపు జన్మలు, కర్మలు, ఫలములు జీవులు పొందటం జరుగుతోంది.

Page:519

శ్రీరాముడు : స్వామీ! మీరు మనస్సు గురించి కొన్ని విషయాలు చెప్పారు. చమత్కారమైన కథలు కూడా వినిపిస్తున్నారు. ఈ మనస్సు దృఢసంకల్పాత్మకమైన రూపం కలిగి ఉంటోందని, జడ చైతన్యములనే ఉభయ - స్థితులు కలిగి ఉంటోందని నేను గ్రహిస్తున్నాను. ఈ మనస్సు యొక్క స్వరూపమేమిటో దయచేసి మరికొంత వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : అనంతుడు, సర్వశక్తిమంతుడు, మాయావేష్టితుడు అయినట్టి ఆ పరమాత్మ మొట్టమొదట "సంకల్పించుట అను భావనతోకూడిన క్రియారూపమును స్వీకరించుచున్నారు. అట్టి సంకల్పాత్మకమగు ప్రథమ కల్పన యొక్క స్వరూపమే మనస్సు. అదియే వికల్పాత్మకమైన వ్యవహారములలో సత్ - అసత్ ల రెండిటిమధ్య 'స్మృతి' రూపమున ఉండి ఉంటోంది.

స్మృతి రూపమగు భావనయే “మనస్సు”.

చిద్రూపమై, సర్వజ్ఞమై భాసించు ఆత్మయందు నా హమ్వేదోస్మి - నేను ఏదో ఎరుగను అనునట్టి ఒకానొక ప్రతీతి అనిర్వచనీయమైన కారణంగా కలుగుచున్నది. అట్టి ప్రతీతియే “మనస్సు”.

అకర్త - అభోక్త అయినట్టి చిదాకాశాత్మయందు నేను కర్తను అను వ్యవహారము దేనివలన కలుగుతోందో .... అదే “మనస్సు”.

ఓ రాఘవా! ఎక్కడైనా గుణరహితుడైన 'గుణి' ఉంటాడా? 'గుణి' అని అంటేనే గుణములు కలవాడు" అని అర్థం కదా! ఈ జగత్తునందు స్పందస్వభావముగల కల్పనాత్మకమైన శక్తియే లేకపోతే మనస్సు కూడా ఉండటం సంభవించేదేకాదు. అగ్ని - ఉష్ణములు వేరువేరుగా ఉండటం సంభవిస్తుందా! లేదు కదా! కర్మయుక్తమైన మనస్సులు - మనోయుక్తమైన జీవులు వేరువేరుకాదు. వేర్వేరుగా ఉండజాలరు. ఈ చిత్తము (లేక మనస్సు) “ఫలధర్మిణి (that which produces fruits of action) అను సంకల్పమునే శరీరంగా కలిగియున్నది. ఇది మాయామయము. కారణరహితము. అనేక విధములైన రచనలతో, కల్పనలతో కూడియున్నది. వాసనాయుతము. అట్టి ఈ చిత్తము జగత్తంతా వ్యాప్తమైయున్నది.



ఎవడు, ఎచట - ఏ రూపమున ఉన్నట్లు కల్పన చేస్తాడో, ఆ కల్పనను అనుసరించి ఫల స్వరూపముగా అట్టి రూపమునే అతడు పొందుచున్నాడు. 'వాసన' అనబడు వృక్షము (The tree of tendency) నకు కర్మయే బీజము అయి ఉన్నది. మనస్సు యొక్క గతియే ఈ శరీరము. (This 'Physical Body' is merely one sequence of 'Thought') చిత్రవిచిత్రములైన ఆయా క్రియలన్నీ వాసనావృక్షము యొక్క శాఖలు. ఆయాఅనుభూతములు అగుచున్న క్రియాఫలములు ఆ వృక్షము యొక్క పండ్లు. అయితే జ్ఞానులగువారు మాత్రం 'అసంగము' (Unattachment) అనే ఒకానొక పదునైన గొడ్డలితో ఈ వాసనావృక్షమును కూకటివేళ్ళతో సహా త్రెంచివేస్తున్నారు.

మనస్సు తాను ఏమి చింతిస్తుందో దానిని అనుసరించే కర్మేంద్రియాలు ఆయా పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. అందుచేత మనస్సే కర్మ" అని మనం నిర్ణయిస్తున్నాం. స్వస్వరూపమును

Page:520

మరచిన “అపరిచ్ఛిన్న - చిదేకరూపుడు" అగు పరబ్రహ్మము కాకతాళీయ యోగముచేత, అకస్మాత్తుగా -

ఒక సమయంలో బాహ్య విషయములవైపు ఉన్ముఖమగుచున్నది. అట్లు ఉన్ముఖమగుచున్న 'చిత్శక్తి'నే ఆయా స్థితిగతులను అనుసరించి అనేక పేర్లతో శాస్త్రకారులచే పిలువబడటం జరుగుతోంది.

శుద్ధ చైతన్యమునందు బోధ కొరకు రకరకాల పర్యాయపదములు కల్పించబడ్డాయి. శుద్ధ చైతన్యము ఏ బాహ్యకారణముగాని, ఉపాదానముగాని లేకుండానే, అకారణంగా ఒకానొకప్పుడు అవిద్యచే కలుషితమైనట్లు ఉంటోంది. అప్పుడు స్ఫురణ (జ్ఞాపకము) యొక్క రూపము కలిగి, వికల్పములచే అనేక రూపములను పొందుచున్నట్లు భావించుచున్నది. వృత్తులు ఎట్లా రూఢి పడుచున్నాయి? అనే విషయం నీవు గ్రహించటానికి వీలుగా ఈ యోగవాసిష్ఠమునందు, తదితర ఆధ్మాత్మ శాస్త్రములందు ఉపయోగించబడిన కొన్ని పదజాలములను చెపుతాను, విను1) మనస్సు : స్ఫురణను మూలముగా కలిగియున్న భావన. 'భావించుట' అను స్వభావము. 2) బుద్ధి : పదార్థముల “ముందు వెనుక లను పరిశీలించటం. ఈ వస్తువు (లేక విషయము, లేక వ్యవహారము లేక వ్యక్తి) ఇట్టిది" అను విశేషమును గ్రహించగలుగునట్టి సామర్థ్యము.

3) అహంకారము : మిథ్యయే అయినట్టి ఈ దేహము పట్ల "నేనీ దేహమును, ఈ దేహమునందు మాత్రమే ఉన్నాను. దేహ పరిమితుడను. తదితరులు కూడా దేహమాత్రులే అనునట్టి దేహాభిమానము కలిగి, అట్టి "పరిమితసత్త ను స్వయంగా ఆశ్రయించునప్పుడు, ఆ స్వభావమే అహంకారము. “నేను-నేను-నాది-నాది" అను రూపముగల అహంకారమే సర్వ అనర్థములకు హేతువు అగుచున్నది. అందుచేతనే దీనిని 'బంధహేతువు' అంటూ ఉంటారు.

4) చిత్తము : తగినంతగా విచారణ చేయకుండానే ఒక విషయమును స్వీకరిస్తూ, మరొక విషయమును త్యజిస్తూ ఉండే నిలకడలేనితనము.

5) కర్మ : చైతన్యం స్పందము (చలనం)ను ముఖ్యధర్మముగా కలిగి ఉంటోంది. అట్టి స్పందము ఏర్పడుచున్న సమయంలో, అసద్వస్తువు సత్యమైనదానివలె గోచరిస్తూ ఉంటుంది. "నేను కర్తనగు చున్నాను”. అను భావన పొందిన చైతన్యం శరీర, అవయవాదులను ఒకచోటి నుండి మరొక చోటికి కదల్చుటకు ఆయత్తమగుచున్నది. ఆయా ఇంద్రియములను నియమించుటకు ఆలోచనల ·- భావనల రూపమున ప్రవృత్తమగుచున్నది. అట్టి ప్రవృత్త వ్యవహారమునే 'కర్మ' అంటున్నాం. 6) కల్పన : చైతన్యము ఆకస్మికంగా (కాకతాళీయంగా) తనయొక్క స్వస్వరూపమునకు సంబంధించిన పూర్ణభావనను త్యజించి, తాను అభిలషించిన పరిచ్ఛిన్న భావమును, లేక, 'నేను అసంపూర్ణమును అను వెలితిని కల్పించుకొనుచున్నది. అప్పుడు ఆ చిద్వస్తువే “కల్పన” అనే పేరుతో పిలువబడుతోంది.

'కల్పారంభం - కల్పాంతము' అనునవి ద్రష్ట యొక్క "కల్పనా వ్యవహారం స్వీకరించుట సర్వకల్పనలు త్యజించుటను అనుసరించే ఉంటున్నాయి.

7) సంసృతి : పూర్వము చూచినవి, చూడనివి, మరియు ఇప్పుడు చూస్తున్నవి అగువాటి

Page:521

గురించి ఏర్పడుచున్న నిశ్చయములచే అంతఃకరణము చేష్టితం (flexible) అగుచున్నది. దృశ్యముతో ఏర్పడుచున్న సుఖ-దుఃఖ సమన్వితమైన సంబంధమే “సంసృతి”.

8) వాసన : చైతన్యము తాను అనుభవించిన మరియు భావించిన పదార్థములను సూక్ష్మశక్తుల భావనారూపమును కలిగి ఉంటోంది. అట్లు సూక్ష్మమై, సూక్ష్మచేష్టా సహితమై ఉండునప్పటి ఆ చైతన్యమే ‘వాసన' అని పిలువబడుతోంది.

9) విద్య : ఒకానొకప్పుడు ఈ చైతన్యమే - శుద్ధమగు ఆత్మతత్త్వమొక్కటే సత్యమైనది. ఈ ద్వైత దృష్టి అవిద్య చేతనే కలుగుచున్నది. యథార్థానికి ఈ దృశ్యప్రతీతి అంతా మూడువేళల సత్యము కానేకాదు అనునట్టి జ్ఞాన రూపమున ప్రకాశించుచున్నది. అప్పుడు ఆ సంవిదాత్మనే 'విద్య' అనే పేరుతో పిలుస్తున్నారు.

10) ప్రయత్నము : ఈ చైతన్యము క్రియాశీలత్వం పొందటమే ప్రయత్నం. అట్టి అనేక ప్రయత్నములలో కొన్ని ఆత్మను మరపించేవి, మరికొన్ని ఆత్మను గుర్తు చేసేవి అయి ఉంటున్నాయి.

11) మలము : తదితరమైన భావన యొక్క "ఆవరణ ఈ ఆత్మను మరుగుపరచి, విస్మరించేట్లు చేస్తోంది. అట్టి ఆవరణ శక్తి ప్రాధాన్యము (over-covering) వలన ఈ ఆత్మయందు ఆరోపించ బడునదంతా 'మలము' అనే శబ్దముచే వ్యవహరింపబడుతోంది.

12) విస్మృతి : మిథ్యారూపమైన ఆయా వికల్పములచే అనేక రకములైన ఆలోచనలకు సంబంధించిన విక్షేపములు (perturbances) ఏర్పడుచున్నాయి. చైతన్యము యొక్క 'విక్షేప శక్తి' ప్రాధాన్యమే విస్మృతి.

13) ఇంద్రియములు : మనోరూపమును సంతరించుకొన్న చైతన్యము - వినుచూ, చూచుచూ, స్పృశించుచూ, ఆస్వాదించుచూ, వాసన చూచుచూ, సంకల్పించుచూ - ఉంటోంది. ఇట్లు ఆయా ఇంద్రియములచే భోగానుభవకార్యములను నిర్వహిస్తోంది. తద్వారా ఈ జీవత్వము పొందిన ‘ఇంద్రుడు’ అను పేరుతో చెప్పబడు ఈశ్వరుని తృప్తిపరచుచున్నాయి కనుక, వాటిని 'ఇంద్రియములు’ అంటున్నాం.

14) ప్రకృతి : పరమాత్మ ఇంద్రియాలకు ఎదురుగా కనబడేవాడు, గాంచబడేవాడు కాడు. అనగా దృశ్య దృష్టిచే అతడు అలక్షితుడు (one who cannot be experienced by 'sences')" అయి ఉన్నాడు. అట్టి పరమాత్మయందు, అతని కంటే ఏమాత్రం వేరు కానట్టి కర్తృత్వరూపము ఏర్పడుతోంది. ఇది నీటి యందు తరంగములు ఏర్పడుటవంటిదే. నేను కర్తనగుచున్నాను అను కర్తృత్వ రూపము కారణముగా ఏర్పడుచున్నదే 'ప్రకృతి'.

15) మాయ : శుద్ధ చైతన్యమునందు ఒకానొక విస్మరణ ఏర్పడుచున్నది. ఆ విస్మరణ .... సత్యమగు ఆత్మను మిథ్యగాను, మిథ్యారూపమైన ఈ జగత్తును, ఇందలి అనుభవములను అత్యంత దృఢమైన సత్యముగాను దోపింపచేయుచున్నది. సత్యాసత్యముల వికల్పమునకు హేతువగుచున్న చైతన్యము యొక్క స్వభావమే “మాయ”.

Page:522

16) క్రియ : వినటం, చూడటం, ఆఘ్రాణించటం, రుచిచూడటం, స్పర్శ వంటి ఆయా కర్మలచే చైతన్యం లోకమునందు కార్యకారణరూపత్వము పొందుచున్నది. అదే 'క్రియ’ అనబడుతోంది.

ఓ రామా ! ఒక విషయం గమనిస్తున్నావా? ఇవన్నీ చైతన్యము యొక్క రూపాంతరములే. చైతన్యం విషయోన్ముఖమైనప్పుడు అవిద్యచే మలినమగుచున్నది. స్ఫురణ రూపదర్శనాన్ని పొందుతోంది. చైతన్యమే స్వయముగా చిత్తము యొక్క రూపము స్వీకరిస్తోంది, తద్వారా సంసార బంధమున తగుల్కొనుచున్నది. అట్టి త్రోవలో రూఢిపడినదై, మనం చెప్పుకొంటున్న అనేక పేర్లకు తగుచున్నది.

చైతన్యము తనకు తానే "నేను అజ్ఞానిని, బద్ధుడను, ఈ దేహపరిమితుడను అనునట్టి దోషముతోకూడిన భావనను, అనుభవ సిద్ధిని పొందుచున్నది. ఇంద్రియానుభవములపట్ల గల ఆసక్తిచే ఏర్పడిన ద్వైతవాసనా కళంకమును "తన స్వభావమే అయినట్లు ఆపాదించుకొంటోంది. అవిచారణ వశంచేత పూర్ణమగు తన స్వస్వరూపము నుండి 'చ్యుతి' (displacement) పొందుచున్నది. చూచావా, ఎప్పుడైతే చైతన్యము వివిధ కల్పనలతో గూడిన జడమగు ఈ దేహాదులవైపు అభిముఖం అగుచున్నదో అప్పుడు ఆ చిద్వవస్తువునే 'జీవుడు' అని, 'మనస్సు' అని, 'చిత్తము’ అని, ‘బుద్ధి’ అని ఇట్లు అనేక విధములైన శబ్దములతో చెప్పుకుంటున్నాం.

పరమాత్మ పదము నుండి తొలగి, అవిద్యచే కళంకితమైన ఈ చైతన్యమే.... ఆయా ప్రకటిత మగుచున్న వృత్తులను అనుసరించి .... ఆయా పేర్లుతో శాస్త్రకారులచే పిలువబడుతోందని గ్రహించు.

16. మనస్సు జడమా? చేతనమా?

శ్రీ రాముడు : గురువర్యా! మునీంద్రా! ఇంతకీ ఈ 'మనస్సు' అనునది జడమా? చేతనమా? ఈ విషయం ఇంకా నాకు బోధపడనేలేదు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు చిత్ - అచిత్ రూపమైయున్నది. అనగా, ఇది జడముకాదు. చేతనము కాదు. చైతన్యమే సంసార దశ యందు ఉపాధి దోషంతో కూడుకొని ఉన్నప్పుడు మనస్సు’ అని పిలువబడుతోంది. అనగా, చైతన్యమునకు వేరుగా 'మనస్సు' అనబడునది ఏదీ లేదు. 'ఆలోచన' అనునది ఆలోచించువానికి వేరుగా ఉంటుందా? ఉండదు కదా!

“మనస్సు సత్-అసత్తులకు విలక్షణమై ఉంటోంది" అని చెప్పబడుతోంది. ఈ మనస్సే జగత్తు అనబడు అనుభవమునకు కారణభూతమై ఉంటోంది. కాని మనస్సునకు పరమాత్మ కారణం కాదు సుమా! ఉపాధి భేదం చేత భిన్నభిన్నంగా కనబడేటట్లు చేస్తున్నది ఈ మనస్సే. అవిద్యచే కళంకితమైన చైతన్యమే మనస్సు లేక, చిత్తము. ఆత్మను గూర్చిన నిశ్చయత్వము లేకపోయినప్పుడు కలుగు స్థితియే ‘చిత్తము’ అని చెప్పబడుతోంది. చిత్తము చేతనే ఈ జగత్తు అను రచన సాగించబడుతోందని గ్రహించువాడు ఆత్మ యొక్క స్వభావమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

Page:523

మనస్సును మలినోపాధిని పొందినట్టి చైతన్యము యొక్క జడ - చేతనముల మధ్యగా

స్వీయకల్పితమైన చంచలరూపమే అని కూడా అనవచ్చు.

చిద్వస్తువు మలినోపాధితో సంబంధం ఏర్పరచుకొనుచున్నప్పుడు (నాచే గాంచబడు చున్న ఈ దృశ్యములో అంతర్గతమైయున్న ఈ శరీరమే 'నేను' అను భ్రమ పొందినప్పుడు), అట్టి సంబంధముచే చంచల భావయుక్తమగుచున్నది. అయితే ఆవరణరాహిత్యము దృష్ట్యా చూచినప్పుడు అన్నివేళల దోషరహితంగాను, కళంక వర్జితంగానే ఉండిఉంటోంది కూడా! అందుచేత మనస్సు జడమూ కాదు, చేతనమూ కాదు. ఈ మనస్సుకే అహంకారము, బుద్ధి, జీవుడు మొదలైన చిత్రవిచిత్రములైన పేర్లు ఉన్నాయి. ఒకే నటుడు అనేక వేషములు ధరించి, నాటకమాడుచున్న సమయంలో అనేక పేర్లతో ప్రేక్షకులచే గాంచబడతాడు చూచావా? ఈ మనస్సే క్రియా భేదంచే అనేక పేర్లు కలిగియున్నది.

ఈ చిత్తం యొక్క వివిధ సంజ్ఞల గురించి మనం చెప్పుకొన్నాం కదా! దీనినే భిన్న అభిప్రాయాలు కలవారు కల్పనా భేదంచేత అనేక రీతులుగా చెప్పటం జరుగుతోంది. అనేక తర్క- వితర్కములచే ఏర్పడుచున్న అభిమతములను అనుసరించి, కొందరు 'అణుత్వము, ద్రవత్వము' మొదలైన ధర్మములను మనస్సుకు ఆపాదిస్తున్నారు. తమ బుద్ధి ప్రసరణమును అనుసరించి మనో-బుద్ధి-ఇంద్రియములకు సంజ్ఞాభేదములను ఇస్తూ, వారు చిత్రవిచిత్రములైన రీతులుగా దర్శించుచున్నారు. ఈ మనస్సును కొందరు ‘జడమైనది’ అంటున్నారు. మరికొందరి అభిప్రాయానుసారం - ఇది జీవునికన్న భిన్నమైనది. అలాగా ‘అహంకారం, బుద్ధి'ల గురించి కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పటం జరుగుతోంది. ' ఇక మా అభిప్రాయమేమిటో చెపుతాను విను.

నైయాయికులు (గౌతమ మహర్షి) : అహంకారం ఒకానొక ద్రవ్యవిశేషం. ఈ జీవుడు అహంకారమునకు భర్త వంటివాడు. మనస్సు అణుస్వరూపమైనది. ఇక బుద్ధి, అంతఃకరణం - ఆత్మకు సంబంధించినవి. ఆత్మ సాక్షాత్కారమైన తరువాత బుద్ధి, అంతఃకరణాలు ఉండియే ఉంటాయి. కాని మనస్సు, అహంకారాలు మాత్రం త్యజించబడతాయి.

సాంఖ్యులు (కపిలముని) : "బుద్ధి అనేది ప్రకృతి చేస్తున్న పనే. సత్వ-రజ-తమోగుణముల ప్రదర్శనమే ప్రకృతి. బుద్ధియే మహతత్త్వము. బుద్ధిని మించినదేదీ ఎక్కడా లేదు. బుద్ధిని అనుసరించే అంతా ఉంటోంది. మనస్సు పదకొండు ఇంద్రియముల అంతర్గతమై ఉన్నట్టిది.

చార్వాకులు (చార్వాకుడు) : బుద్ధి ఈ శరీరమునకు అంతర్గతమయ్యే ఉంటోంది. అది శరీరము యొక్క ధర్మం అయి ఉన్నది. చైతన్యము కూడా శరీరము యొక్క గుణము లేక లక్షణము మాత్రమే. అహంకారరూపముననే 'ఆత్మ' అని చెప్పబడేది ఉన్నది. అయితే, అది శరీరముతో వస్తుంది. శరీరంతో పోతుంది. పూర్వాపరవిచారము చేయునది మనస్సు. అట్టి ఈ మనస్సును సంతసింపచేయుటయే బుద్ధియొక్క ధర్మము.

పంచరాత్రులు : 'వాసుదేవుడు' అను పేరుగల పరమాత్మ నుండి 'సంకర్షణుడు' అను పేరుగల జీవుడు కలిగాడు. ఆ సంకర్షణుడే అహంకారము. వాని నుండి 'ప్రద్యుమ్నుడు' అను మనస్సు, 'అనిరుద్ధుడు' అనే బుద్ధి ఏర్పడుచున్నాయి. సర్వము వాసుదేవమయమే. మిగతాదంతా మాయయే.

వైశేషికులు : ‘అహంకారము' అనేది కూడా ఒకానొక ద్రవ్యవిశేషమే. ఇక ఈ 'బుద్ధి' ఐదు వికల్పములచే ఐదు విధములుగా ఉంటోంది. అవి - స్మృతి, ప్రత్యక్షము, అనుభవము, తర్కము, విపర్యము. అహంకామునకు కర్త జీవుడు. అహంకారమును దాటినప్పుడు శేషించునదే పరమాత్మ స్థానము.

Page:524

అహంకారం, మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ సంకల్పవృత్తి భేదంచేత వేరువేరుగా పిలువబడు చున్నప్పటికీ, అంతఃకరణము యొక్క ఏకత్వముచే అవన్నీ ఒకరూపమే అయి ఉన్నాయి. సంకల్పించు వాని నుండి సంకల్పము వేరుకాదు కదా! చూచువాని నుండి చూపువేరా? అందుచేత చైతన్యమే అహంకరించునపుడు - అహంకారము,

నిర్ణయించునపుడు - - బుద్ధి

మననము చేయునపుడు - మనస్సు

అంతేగాని 'అహంకారము', 'మనస్సు', 'బుద్ధి' అనునవేవీ విడిగా ఏమాత్రం లేనేలేవు. కర్తకు వేరుగా క్రియలు ఎక్కడుంటాయి? సూర్యుని నుండి సూర్యకిరణములు వేరా? అయితే, .... అట్లు అహంకరించుటకు ముందు .... చైతన్యము ఉండిఉన్నది. భావించుటకు ముందే భావించు వాడు ఉండనే ఉన్నాడు కదా! అట్టి 'అహమ్' అను భావనాక్రియ 'జరుగుచున్నప్పుడు త్యజించునపుడు’ ఏర్పడి ఉండేది, శేషించేదీ ఆ చైతన్యమే. అహంకారమునకు అతీతమైన దృష్టితో పరికించి చూస్తే “సర్వము చైతన్యమయమే అని తెలియవస్తుంది.

అఖండమగు చైతన్యము నేను ఖండితుడను అని భావించుటయే.... అహంకరించుట అయి

ఉన్నది.

ఈ మనోబుద్ధి చిత్త అహంకారముల గురించి వేరు వేరు ఆచార్యులు వేరు వేరు కల్పనలతో తమ శిష్యులకు బోధించటం జరిగింది. వేరు వేరు కాలములందు బయలుదేరిన బాటసారులు దూరంగా ఉన్న ఒకే నగరమును ఆకారాదులకు సంబంధించిన వివిధ అవగాహనలతో వివిధ రీతులుగా దర్శిస్తూ ఉంటారు కదా! అట్లే వేరువేరు గురువులు తమ శిష్యులను తీర్చిదిద్దటానికి వేరు వేరు సిద్ధాంతాలు ప్రతిపాదించియున్నారు. వారంతా వారి వారి బుద్ధి యొక్క అనుభవమును బట్టి, శిష్యుల యొక్క అవగాహనా సామర్థ్యమును అనుసరించి తమ యొక్క తపోఫలితంగా తాము గ్రహించింది నిర్ణయించి ప్రజలకు చెప్పటం జరుగుతోంది.

అట్టి వారిలో కొందరు ఆత్మపథమును అధిష్ఠించుటకు ప్రయత్నించుచున్నారు. మరికొందరు పరమార్థమగు బ్రహ్మతత్వమును అధిష్ఠించక పోవుటచే కొంత అపరిపక్వతతో కూడిన అవగాహన కలిగి ఉంటున్నారు. ఇక వారివారి శిష్యులలో కొందరు అపూర్ణమగు అవగాహనచేత, గురువుల ఉద్దేశము ఏమిటో సరిగ్గా గ్రహించకుండా, "మీ సిద్ధాంతములన్నీ తప్పు. మా సిద్ధాంతమే సరి అయినది అనునట్టి కాలయాపనకు, రాగద్వేషములకు దారితీయగల వాదోపవాదములందు నిమగ్నులగుచున్నారు.

వాస్తవమేమిటో గ్రహించిన తరువాత.... ఆయాదూరముల నుండి ఆత్మవస్తువు దర్శించినపుడు, అట్లు తోచుచున్నది. ఆత్మ వాస్తవానికి అనిర్వచనీయమైనది. అద్దానిని వాక్కుగాని, మనస్సుగాని ప్రకటించలేవు. ద్రష్ట యొక్క స్వస్వరూపము నుండి అది వేరుకాదు. అందరు అదియే అయి ఉండి, అటే పయనిస్తున్నారు. శ్రద్ధను బట్టి మనస్సులో దోషములు తొలగుచున్నాయి. నిర్మలమైన మనస్సుకు

Page:525

పరమాత్మ స్వయముగా, సుస్పష్టముగా అంతర్-హృదయేశ్వరుడై ప్రకటితమగుచున్నాడు తెలియవస్తోంది. సత్యమేదో గ్రహించినవాడు ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనమని, కాలయాపన యేనని తెలుసుకొంటున్నాడు. సర్వము లయించగా, ఇక అప్పటికీ శేషించి, విస్తరిల్లియుండే నాయొక్క స్వరూపమే ఇదంతా" - అని గ్రహించుచున్నాడు. తనయొక్క వాస్తవ స్వస్వరూపం గురించి మరొకరు సిద్ధాంతీకరించి చెప్పవలసిన అగత్యం ఇక కనిపించదు.

అనేకులు వేరువేరైనట్టి దేశ కాల దృష్టులు” యొక్క ప్రభావంచేత కొన్ని విధినియమములకు సంబంధించిన ఆచార-అవగాహనల భేదం కలిగి ఉంటున్నారు. అట్టి వారిలో కొందరు, ఈ మార్గమే ఉత్తమమైనది అని ప్రశంసిస్తూ పరులను దూషిస్తూ ఉంటున్నారు. అట్టివారిలో మరికొందరు ఫలేచ్చచే అట్టి ఫలమునకు సాధన భూతమగు కర్మయందే ఆసక్తిగల చిత్తులు అగుచున్నారు. గురువుల వాక్యములలోని జ్ఞానసారాన్ని తిరస్కరిస్తూ కేవలం బాహ్య ఆచారవ్యవహారములకు పరిమితులై అనేక భేదదృష్టులకు లోనగుచున్నారు. "సర్వం ఖల్విదం బ్రహ్మ ప్రతి ఒక్కడు బ్రహ్మమే అయిఉన్నాడు" వంటి ఉపనిషత్ ప్రమాణ వాక్యములను ఏమరచుచున్నారు.

కర్మలు, విధి-విధానములు అనేక రీతులుగా ఉంటేఉండనీ, ఆత్మవిచారణ విషయంలో అనేక గురువుల అభిప్రాయాలు ముముక్షువు తప్పక గ్రహించవచ్చును. ఇందులో తప్పేముంటుంది? అయితే, మానవుడు మనోనైర్మల్యము కొరకు ప్రయత్నించాలి, గ్రహించాలి, వినాలి. అనేకత్వములో అంతర్లీనమై జాజ్జ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఏకత్వము యొక్క అనుభూతిని పొందుటకు ఉద్యుక్తుడు కావాలి. అంతేగాని, ఇది ఇంతవరకే. ఇక మేమేదీ వినం, గ్రహించం అనునట్టి వ్యర్థమగు పలుకులతో, విచిత్రయుక్తులతో కల్పితవచనములతో ఆత్మకు భిన్నత్వము ఆపాదించుట ఉచితము కాదని మా అభిప్రాయం.

స్నానము, దానము మొదలైన క్రియలు చేసేవాడు ఆ క్రియలను ఏ విధమైన కర్తృత్వముతో చేస్తాడో, అతని మనస్సు అట్లే విషయములను పొందుచున్నది.

ఈ క్రియలన్నీ - నన్ను పవిత్రుణ్ణి చేయగలవు - పుణ్యవంతుని చేయగలవు- పరిశుభ్ర పరచగలవు - ధనికునిగా చేయగలవు - జ్ఞానినిగా చేయగలవు అందగానిగా చేయగలవు.

ఈ విధాలుగా ఎవడు ఏ విధమైన భావనచేస్తే అతడు ఆతీరుగానే పొందగలడు. మరి, మనస్సు యొక్క వైచిత్ర్యము అట్టిది. మనస్సు దేనిని ఎట్లు భావిస్తే అది అట్లే సత్యమై ప్రాప్తిస్తోంది. వేరువేరు ఆచార్యులు “అహంకారము-మనస్సు-బుద్ధి-పరమాత్మలల గురించి చెప్పిన సమాచారం కూడా వారివారి శిష్యులకు అట్లే సత్యమై తోచుచున్నది.

Page:526

ఒకడు వేరువేరు సమయ సందర్భములలో వేరువేరు కార్యక్రమములందు నిమగ్నమై ఉన్నాడనుకో... అతడు ఎప్పటికప్పుడు చేస్తున్న పనిని బట్టి మావటివాడు-సారథి-వ్యవసాయ దారుడు-కుటుంబపు యజమాని-సేవకుడు-మిత్రుడు .... అని ఆయా సందర్భములలో వేరువేరు జనులచే పిలువబడుచూ ఉండవచ్చు. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఆ అన్ని సందర్భములలోనూ “ఒక్కడే” అయి ఉన్నాడు కదా! మనస్సు అన్ని వేళల ఒక్కటే అయిఉంటున్నప్పటికీ, అది నిర్వర్తించే కార్యక్రమములను అనుసరించి, జీవుడు, వాసన, కర్మ" మొదలైన పేర్లతో పిలువబడుచున్నది.

అయితే ఈ జీవులయందు ఉండి, ఈ సర్వ అనుభవములను పొందుచున్నది చిత్తమే కదా! ఎందుకంటావా? చిత్తరహితుడు ఏదైనా చూస్తున్నప్పటికీ ఏదియు గాంచకయే (గ్రహించకయే) ఉంటున్నాడు. చిత్తసహితుడు, భుజించుట, వాసనచూచుట, తద్వారా సుఖదుఃఖములను పొందుట జరుగుతోంది. ఒకచోట ఉండియున్న రూపములను చూడగలుగుటకు వెలుతురే కారణం అయినట్లు, సమస్త పదార్థములను ఆయావిధములుగా గ్రహించటానికి మనస్సే కారణం. అందుచేత, బద్ధ చిత్తము కలవాడు మాత్రమే బంధమును పొందుచున్నాడు. ముక్త చిత్తము కలవాడు 'మోక్షభావి' అగుచున్నాడు.

మనస్సు జడము' అనటం ఎట్లా? అది సంచలనము కలిగి ఉంటోంది కదా! పోనీ చేతనము’ అని అందామా?

1. అది స్వయముగా చలించలేదు. ఆత్మయొక్క సామీప్యములో మాత్రమే చలనము-గతి'లను స్వీకరించగలుగుచున్నది.

2. అది చేతనమే అయి ఉంటే ఇక అద్దానికి జడరూపమైన జ్ఞానమే (పరిమితమైన, ఖండమైన జ్ఞానమే) ఉండేది కాదు.

అందుచేతనే అది జడము కాదు. చేతనము కాదు అని మొట్టమొదటే చెప్పాను. అట్టి మనస్సు ఎప్పుడైతే వ్యక్తమవటం జరుగుతుందో, అప్పుడే ఈ జగత్తు కూడా జడ చేతనములకు విలక్షణమై ఆవిర్భవించుచున్నది.

మనస్సు ఏకరూపమైనప్పుడు (భ్రాంతి రూపమును త్యజించి బ్రహ్మాకారమును పొందినప్పుడు) ఇక ఆ మరుక్షణం ఈ జగత్తు ఇట్లుండదు. అనగా అట్టివాని దృష్టిలో జగత్తు లేనిదే అగుచున్నది. ఇందలి అనేకత్వము, పదార్థత్వము నశించుచున్నది. అనగా, ఈ జడచేతన జగత్తంతా స్వస్వరూపాత్మ యొక్క సంప్రదర్శనా విలాసంగా అనుభూతమవగలదు. అట్లుగాక మనస్సు మలినజలం లాగా కలుషితమైనప్పుడు మనస్సే జగత్తుకు కారణరూపముగా (ఇదంతా ఇట్లు తోచుటకు కారణముగా) రూపొందుచున్నది. అట్టి కలుషితమైనట్టి సమష్టిరూప మనస్సు నుండే ఈ కనిపించే జగత్తు అంతా ఉత్పన్నమైయున్నది సుమా!

ఓ రామచంద్రా! దోషదృష్టి, జడదృష్టి తొలగినాయా, అప్పుడు ఈ మనస్సు బ్రహ్మమే అగుచున్నది.

Page:527

“ఈ మనస్సు జగత్తుకు కారణము అనటం కూడా అసమంజసమే అని అనిపించుకొంటోంది. పోనీ "బాహ్యపదార్దజాలమే సంసారమునకు కారణము" అందామా? బాహ్యపదార్థమంతా జడ రూపమే కదా! జడమైనది ఒకానొక కర్తృత్వమును ఎట్లా నిర్వర్తించగలదు చెప్పు? అందుచేత "సంసారమునకు దృశ్యమే కారణం" అనటం యుక్తియుక్తం కాదు.

మనస్సు

జడ చైతన్య విభాగము

విభాగము

జడ మాత్రమగు మనస్సు సంసారమునకు కారణం కాజాలదు. కనుక “జడము - చైతన్యము” కూడా కానట్టి మనోవిభాగమే పదార్థములకు కూడా కారణమగుచున్నది.

చిత్తము లయిస్తే జగత్తుకూడా లయించుచున్నది. చిత్తములేనివానికి జగత్తే ఉండదు. ఇక్కడ “రహితం కావటం” అనగా నిర్మలమగుట అనియే అర్థం. కాలము ఒక్కటే అయి, ఋతుభేదంచే అనేక రూపములు ధరించుచున్నట్లు .... ఒకే మనస్సు వివిధ కర్మలచే (చిత్తము, అహంకారము మొదలైన) వివిధ నామములను ధరిస్తోంది.

శ్రీరాముడు : మునీంద్రా! ఈ జీవునియొక్క అహంకారం, ఇంద్రియాలు, క్రియలు, దేహము మొదలైనవన్నీ అనేక సందర్భములలో అతనినే బాధించుచున్నాయి కదా! మరి, 'ఇదంతా మనస్సే అయి ఉన్నది. జీవునియొక్క మనస్సే అతనిని బాధిస్తోంది అనటం సమంజసమా? కాదేమో? ఈ జీవుని దుఃఖింపజేయటంలో "అహంకారం, ఇంద్రియాలు, క్రియలు, దేహముల పాత్ర ఏమిటి ? అవన్నీ మనస్సుకంటే వేరేకదా! మనస్సు యొక్క పాత్ర ఏమిటి?

శ్రీవసిష్ఠమహర్షి : మనస్సుతో సంబంధం లేకుండానే ఈ అహంకారము, ఇంద్రియములు, క్రియలు, దేహములు జీవుని బాధిస్తున్నాయంటావా?....ఊహూ! మనస్సు లేనప్పుడు కూడా అవి ఇతనిని క్షోభింపజేయగలిగితే, అప్పుడు మనస్సు కంటే అవన్నీ వేరు అని నేనుకూడా ఒప్పుకుంటాను. కాని అట్లు జరగటంలేదు. కనుక మనస్సు కంటే అవన్నీ వేరుకాదు. ఓ రామా! ఎవరైనా “దేహము వేరు. మనస్సు వేరు. జీవుడు వేరు అని వాదిస్తుంటే, అట్టివారు యథార్థ వస్తువును ఎరిగినవారు కాదనే మా అభిప్రాయం. జ్ఞానమునకు సంబంధించిన ఉత్తమ శిక్షణ పొందకపోవుటచేతనే వారు అట్లా వాదిస్తున్నారు. మనస్సే “దేహానుభవము" అను వేషమును వేస్తోంది. 'జీవుడు' అని మనం అంటున్నది మనస్సునే.



Page:528

'మనఃశ్శక్తి' సర్వవ్యాపకమై ఉండుటచే, కుతర్క శక్తి కూడా మనస్సు అనే దేవుని యందే ఉండి ఉంటోంది.

శుద్ధ చైతన్యమునందు జడత్వ రూపమగు కలుషిత శక్తి ఉదయించిన మరుక్షణం ఈ జగద్వైచిత్ర్యమంతా కలుగుతోంది.

‘చేతనము’ అయినట్టి సాలెపురుగు నుండి జడమగు సాలెతంతువులు (దారం) ఉత్పన్నమగు చున్నది కదా! నిత్యజ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మము నుండి మనోరూపమగు ప్రకృతి జననంపొంది, రూపుదిద్దుకొంటోంది.

అవిద్యా కారణం చేతనే కుతర్క - - వితర్కములైన అనేక భావనలు చిత్తమునందు రూఢిపడుచున్నాయి.

చైతన్యము యొక్క పర్యాయ వృత్తులే 'జగత్తు'. కాని, భ్రమచే జగత్తు చైతన్యమునకు వేరైనదిగా తలచబడుచున్నది. అనగా, మనస్సు యొక్క వాస్తవరూపం ఆత్మచైతన్యమే! కనుక, ఈ ఎదురుగా కనబడేదంతా-జడచేతనములతో సహా ఆత్మ చైతన్యవిన్యాసమే!

నిర్మలమగు చైతన్యమొక్కటే ఈ జీవ-మనోబుద్ధి-అహంకార రూపములుగా ప్రసిద్ధికెక్కుచున్నది. అదియే లోకంలో చేతనమని, జీవమని, చిత్తము అని జడమని .... ఇంకా అనేక సంజ్ఞలచే పిలువబడుచున్నది. ఈ విషయంలో సంశయము అవసరములేదని చేతులెత్తి ప్రకటించుచున్నాను. ఆత్మచైతన్యం ఈవిధంగా అద్వితీయం! నిత్యనిర్మలం!

Page:529

VII. చిత్తచాంచల్యము

1. ఈ కనబడేదంతా ఉన్నది మనస్సులోనేనా?

శ్రీరాముడు : హే మహర్షీ! మనకు కనబడుచున్న ఈ జగత్ వైచిత్రమంతా మనస్సు నుండే ఆవిర్భవిస్తోందంటారా? ఇదంతా మనః కల్పితమేకాని, మరింకేమీ కాదని మీ అభిప్రాయమా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఒక ఎడారిలో ప్రచండ సూర్యతేజము కారణంగా ఉత్పన్నమైన మృగతృష్ణ ఆ సూర్యతేజమును ఆవరించినదై జలభ్రాంతిని కలుగజేయటం జరుగుతోంది కదా! అట్లే జడమగు మనస్సు స్వయం ప్రకాశవంతమైన ఆత్మను ఆవరించివేసి ఉండగలుగుతోంది. మనస్సు యొక్క జడమునకు సంబంధించిన అంశమే ఆత్మను మరుగుపరచి ఉంచుతోంది. అట్టి మరుగు యే జగత్తుగా ప్రాప్తిస్తోంది. ఈ విధంగా మనస్సే జగత్తునకు కారణం" అని నీవు చెప్పినది అక్షరాలా నిజమే.

ఈ జగత్తు బ్రహ్మరూపమే! అయితే,... మనస్సే 'జగత్తు' అను ఆకృతిని పొంది, ఒక చోట మనుష్యరూపముగాను, మరొకచోట దేవతారూపముగాను రూఢిపొందుచున్నది. ఒకచోట రాక్షస రూపంగాను, మరొకచోట యక్షరూపంగా, ఇంకొకచోట గంధర్వ రూపంగాను, కిన్నెర రూపంగాను అవతరించుచున్నది. అంతేకాదు. ఈ మనస్సే భిన్న భిన్న ఆచారములుగా, పంచభూతములుగా, గ్రామ, నగరాది రూపములుగా విస్తరించుచున్నది. మహావిశాలరూపమై కూడా మనస్సే వ్యక్త మగుచున్నట్లు మేము దర్శిస్తున్నాము. కాబట్టి ఓ సర్వజనులారా! మీరంతా ఈ మనస్సు గురించే బాగా విచారించండి. ఈ మనస్సు యొక్క శక్తి - యుక్తులు, స్వభావ వైచిత్రములు గ్రహించండి. అట్టి మనస్సును పరిశీలించటం వదలి, గడ్డి పరక - కొయ్య - - లతలవంటి ఈ స్థూల దేహముల గురించి, ఎదురుగా కనిపించే ఆయా దృశ్య సంబంధ వ్యవహారముల గురించి మాత్రమే విచారించటం చేత వచ్చే ప్రయోజనమేమీ ఉండదు.

సర్వవ్యాపకమగు ఈ జగత్తంతా మనస్సు చేతనే పరిపూర్ణమైయున్నది. అట్టి ఈ మనస్సును శోధించినప్పుడు మాత్రమే ఈ కర్త-కర్మల రూపము చక్కగా తెలియబడగలదు. కర్త-కర్మల చమత్కార మంతా గ్రహించిన తరువాత ఇక ఆపై పరమాత్మయే శేషించుచున్నదని మా అనుభవమైయున్నది. అట్టి ఆత్మ సర్వ వస్తువులకు అతీతమై, సర్వవ్యాపి అయి, సర్వమునకు ఆశ్రయమైయున్నది. అద్దాని కృపాతిశయంచేతనే ఈ మనస్సు లోకంలో పరుగిడగలగడం, పలు విధములుగా విజృంభించటం జరుగుతోంది కూడా! ఈ 'మనస్సు' అనునది ఆత్మయొక్క 'ఇచ్ఛ ఆలోచన' అను రూపమైన 'కర్మ' యేనని మేము ఎంచుచున్నాము.

Page:530

అట్టి మనస్సే ఈ దేహాదులకు కూడా కారణం. మనస్సే ఉత్పన్నమౌతోంది. అదియే విజృంభి స్తోంది. అదియే అన్ని వైపుల ప్రవర్తిస్తోంది. అదియే లయించుచున్నది. అంతే కాని 'ఆత్మ' కాదు. ఎందుకంటావా? ఆత్మకు జనన మరణాదులు, ఉత్పత్తిలయాలు లేవు. నాయనా! రామా! ఈ ఆత్మ విచారించబడిందా, ఇక మనస్సు స్వయంగానే లయించగలదని శాస్త్రనిశ్చయం. మనస్సు లయించిన మరుక్షణం మోక్షం ప్రాప్తించగలదు. భ్రమదాయకమైనట్టి మనస్సు అనబడే కర్మ క్షయించినపుడు ఈ జీవుడు ముక్తుడు అగుచున్నాడు. అట్టివాడు ఈ ప్రపంచంలో మరల జన్మించుట లేదు. శ్రీరాముడు : ఓ ముని శ్రేష్ఠ! మీరు ఇంతకుముందు .... సత్వరజస్తమోగుణముల దృష్ట్యా ఈ జీవులను పదునాల్గు విధాలుగా వర్ణించారు కదా! వాటన్నిటికీ ముఖ్య కారణం సదసదాత్మకమగు ఈ మనస్సే అయిఉన్నదని నేను గ్రహిస్తున్నాను. అయితే, నాదొక సందేహం. బుద్ధిరహితమగు శుద్ధ చైతన్యమునందు ఈ మనస్సు' అనబడునది ఎట్లా ఉత్పన్నమైనది? ఈ చిత్ర విచిత్రములైన జగన్నిర్మాణం చేసే విధంగా అది ఎట్లా విస్తరిస్తోంది? బుద్ధి ఉంటే కదా సృష్టి సంభవించటం? మరి బుద్ధిగాని, మనస్సుగాని ఎట్లా ఏర్పడుచున్నాయి?

శ్రీ వసిష్ఠమహర్షి : అతి విశాలమైన మూడు 'ఆకాశములు' ఉన్నాయని ఇతఃపూర్వమే చెప్పియున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్పుచున్నాను. అవి :

1) భూతాకాశము (Zone of matter)

2) చిత్తాకాశము (Zone of thought)

3) చిదాకాశము (Zone of awareness, consciousness)

సర్వసామాన్యములైన ఈ మూడు వాటి వాటి కార్యములందు సువ్యవస్థిములై ఉన్నాయి. ఈ మూడిటికి శుద్ధ చిత్ శక్తి" చేతనే స్థితి లభించుచున్నది.

చిదాకాశము: బాహ్య జగత్తునకు అంటక, అంతటికీ 'సాక్షి' అయిఉంటోంది. అది - ఈ బుద్ధి, మనస్సు మొదలైనవి - ఉండుటకు, లేకుండుటకు కూడా సాక్షీభూతమై, ఈ సర్వభూతములందు ఏకస్థమై, సర్వమునందూ వ్యాపించి ఉంటున్నది.

చిత్తాకాశము : ఈ జీవులందరి వ్యవహారములకు ఇదే హేతువుకదా! అందుకే దీనిని సర్వ హితము (సర్వజనులకు హితమైనది) అని కూడా అంటూ ఉంటారు. కార్య-కారణములన్నిటికీ ఇదే మూలమై ఉన్నది. అందుచేత సర్వశ్రేష్ఠమై ఉంది. ఇది జగద్వ్యాపకమై వికల్పరూపమై ఉంటోంది.

భూతాకాశము : ఈ భౌతికమైన కంటికి కనబడుచున్నది. ఇది పది దిక్కులలోను వ్యాపించి, విశాలమైన దేహము కలదై ఉంటోంది. ఇది వాయువు యొక్క సూర్యుని యొక్క మేఘము యొక్క .... విశాల రూపమై వెలయుచున్నది.



మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో”

- మనస్సే ఈ జీవుని యొక్క బంధమునకు, మోక్షమునకు కూడా కారణమగుచున్నది.

Page:531

భూతాకాశ - చిత్తాకాశములు రెండు చిదాకాశము నుండే ఉత్పన్నమౌతున్నాయి. 'పగలు' జరుగుచున్న కార్యములన్నిటికీ పగలే కారణమగుచున్నట్లు చైతన్యమే అన్నిటికీ కారణమగుచున్నది. నేను జడస్వరూపుడను... నేను జడస్వరూపుడను అనునట్టి చిద్వస్తువు యొక్క మలిన నిశ్చయమే మనస్సు. దీనివలననే ఈ ఆకాశాదులు ఉత్పన్నమౌతున్నాయి. అయితే రామా! ఇక్కడ నీవు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేమిటంటే, ఆత్మతత్త్వము ఎరుగనట్టి వానికి ఉపదేశించటం కోసమే ఈ మూడు అకాశాలు కల్పించబడుచున్నాయి. జ్ఞాని యొక్క దృష్టికి మాత్రం ఈ మూడు విభాగములతో పని లేనేలేదు.

ఎందుకంటే, పరమమగు బ్రహ్మమొక్కటే అంతటా నిండియున్నది. అంతయు తానే అయి వెలుగుచున్నది. భూత-భవిష్యత్ వర్తమాన కాలములందు అదియే ఏకరసమై, నిత్యమై, 'కాలము’ అనే కల్పనయే లేనిదై ప్రకాశించుచున్నది. ఓ రఘురామా! జ్ఞానప్రాప్తి కలుగనంతవరకు నీకీ మూడు ఆకాశముల కల్పన ఉండనే ఉంటుంది. సర్వకల్పనలు నశించేవరకు, జ్ఞానోదయం అయ్యేవరకు ఇట్టి ఉపదేశములు అవసరమే అగుచున్నాయి. నీవు కూడా జ్ఞానోదయం అయ్యేవరకు ఈ విభాగమంతా పరిశీలిస్తూ ఉండు.

మాయా కళంకితమైన చిదాకాశము నుండి చిత్తాకాశము, భూతాకాశము ఉత్పన్నమౌతూనే ఉంటున్నాయి. ఆహాఁ! ఏమి విచిత్రమో చూచావా? మాయావేష్టితమైనట్టి చైతన్యమే చిత్తత్వము (‘చిత్తము’ అను స్వభావం) ను పొంది ఆ మలినరూప సంచయమంతా జగత్తు రూపమున గాంచు చున్నది. వివిధ కల్పనలతో కూడినదై, త్రిలోకములు అను ఇంద్రజాలమును నిర్మించుకొనుచున్నది. “ఇది ముత్యపు చిప్పయే కదా! ఇందు వెండి ఉండటానికి అవకాశమెక్కడ? అను జ్ఞానము లేనివాడు ఆ ముత్యపు చిప్ప యందు వెండినే చూస్తూ ఉంటాడు. అజ్ఞానికి మాత్రమే చైతన్యము నందు మలిన రూపమగు చిత్తము యొక్క అనుభవం కలగటం జరుగుతోంది. లోకంలో అజ్ఞానము’ అనే దోషముచే మాత్రమే బంధము కలుగుచున్నది 'జ్ఞానము' అను బలముచే మోక్షరూపమగు ఆనందము సిద్ధించుచున్నది.

ఈ జగద్రూపము యొక్క రహస్యము ఇంత మాత్రమే.

2. అడవిలో చిక్కుకున్న బాటసారులు

ఓ రామచంద్రా! ఈ 'చిత్తం' అనునది ఎక్కడినుంచో ఆకస్మికంగా ఉత్పన్నమై వచ్చిపడింది. సరే, ఇప్పుడేం చేయాలి? ఈ చిత్తం ఎక్కడినుండి వస్తే మనకేం? ముందుగా ఈ చిత్రాన్ని 'ఆత్మవిముక్తి' యందు జాగరూకతతో నియోగించాలి. స్వస్వరూపి, సర్వాత్మకుడు, బ్రహ్మతత్వ స్వరూపుడగు పరమాత్మ యందు దీన్ని లగ్నం చేయాలి. క్రమంగా వాసనలన్నీ రహితం కావాలి. అప్పుడు ఏ విధమైన కల్పన లేనిదై, ఈ చిత్తం ‘ఆత్మ స్వరూపము'నే పొందుచున్నది. ఆత్మ రూపంగానే వెలుగొందుచున్నది.

Page:532

ఈ చరాచరజగత్తంతా చిత్తమునకే అధీనమైయున్నది. అనగా, బంధ-మోక్షములు కూడా చిత్తము యొక్క అధీనంలో ఉన్నట్లే కదా! ఈ సందర్భంలో పూర్వం నా పితృదేవులగు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన చిత్తచాంచల్యమునకు సంబంధించిన ఒక చమత్కారమైన కథ గుర్తుకు వస్తోంది. అది చెపుతాను విను.



ఒకచోట ఒక గొప్ప అరణ్యం ఉన్నది. ఆ అరణ్యం అతి విశాలమై, శూన్యవంతమై, అశాంతి మయమై, అతిభయంకరమై ఉన్నది. దాని ముందు అనేకవేల లక్షల యోజనాలు కూడా అత్యంత స్వల్ప భాగంగా కనిపిస్తున్నాయి, అది అంత విస్తీర్ణమైనదన్నమాట! ఆ మహారణ్యలో అతిభీకరమైన ఆకారము కలిగిన ఒక పురుషుడు ఉన్నాడు. అతడు అనేక చేతులు, అనేక కాళ్ళు కలిగియున్నాడు. “మహావ్యాకులచిత్తుడై ఉన్నాడా? అని అతనిని చూచినపుడు అనిపిస్తోంది. చూడటానికి అతిభయంకర మైన ఆకృతితో ఉన్నాడు. “ఇతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అని నేను మరికొంత పరిశీలనగా చూచాను. అతడు తన వేలాది చేతులతో అనేక గుదిబండలు తీసుకొని తన వీపుపై తానే బాదుకొంటూ, ఆ అరణ్యంలో పిచ్చిపిచ్చిగా సంచరిస్తున్నాడు. అటుఇటు పరుగులు తీస్తున్నాడు. అతిదీనంగా తనను తానే బాధించుకొంటున్నాడు. అట్లా అతడు అనేక యోజనముల దూరం పరిగెత్తడం చూచాను. పాపం, వివేకదృష్టి లేకపోవడం చేత అత్యంత వివశుడై పడుచూ, లేస్తూ. ఇటు అటు తిరుగుచూ, బాగా అలసిపోయి ఉన్నాడు. అతని అవయవములన్నీ తీవ్రమైన హింసను అనుభవిస్తున్నాయి.

అట్లా అతడు పరుగులు తీస్తూ పోయి పోయి ఒక లోతైన నూతిలో పడ్డాడు. ఆ నుయ్యి యొక్క లోపలిభాగం అత్యంత దట్టమైన చీకటి అలుముకుని ఉండటంచేత అసలేమీ కనిపించుటలేదు. చాలా సేపటికి ఆ పురుషుడు ఆ నూతిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మరుక్షణం మరల తననుతానే బాదుకొంటూ పరిగెత్తడం ప్రారంభించాడు. చాలా దూరం పరుగెత్తి ఈమాటు మరొక ప్రదేశం ప్రవేశించాడు. అతడు ప్రవేశించిన ప్రదేశమంతా దట్టమైన ముళ్ళపొదలతో నిండి ఉంది. అది అత్యంత బాధాకరంగా ఉండినది. అగ్నిని సమీపించిన మిడుతలాగా అక్కడ ఎంతో క్లేశం అనుభవించాడు. అక్కడ గల రక్కిస ముళ్ళు అతని దేహమును నిర్దాక్షిణ్యంగా బాధించాయి. ఇంతలోనే అక్కడి నుండి లేచాడు. తననుతానే కొట్టుకొంటూ అటు-ఇటు పరుగెత్తసాగాడు. అట్లా చాలాదూరం వెళ్ళాడు. ఈ మాటు ఒక అరటిచెట్ల వనంలో (తోట) ప్రవేశించాడు. ఆ తోట పున్నమినాటి చంద్రుని కిరణాలులాగా శీతలంగాను, మనోహరంగాను ఉండియున్నది. మరల ఎందుకో ఒక్క క్షణంలో ఆ అరటితోటను వదలి తనను తాను బాదుకొంటూ పరుగెత్తసాగాడు. చాలా దూరం పరిగెత్తటంచేత అతని అవయవములు ఛిన్నాభిన్నం కాసాగాయి. మరల గుడ్డివాడిలాగా ఇతఃపూర్వపు అంధకూపంలోకి పోయి పడ్డాడు.

కొంతసేపు గడచింది. ఆ చీకటి నుయ్యిలోంచి మరల బైటకు వచ్చాడు. మళ్ళా అరటితోటలో ప్రవేశించాడు. అక్కడి నుండి ముళ్ళతోకూడిన గంభీరమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ విధంగా

Page:533

అతడు ముళ్ళపొదల నుండి నూతిలోకి, నూతిలోంచి అరటితోటలోకి తనను తాను పీడించుకొంటూనే పరిగెత్తటం చాలాసేపు నా వివేక దృష్టితో నేను గమనించాను. అతడు నిష్కారణంగా పరుగులు తీస్తూ అలసిపోవటం, తనను తానే హింసించుకోవటం, రోదించటం చూచి నాకు ఎంతో జాలివేసింది.

అప్పుడు నేను నా యోగబలంతో అతనిని మార్గంలో ఒకచోట ఒక ఐదు నిమిషాలు ఆపాను. "ఏమయ్యా బాబూ! నీవు ఎవరవు? ఇటువంటి విచిత్ర కార్యం ఎందుకు చేస్తున్నావు? నీ బాధ ఏమిటి? నిన్ను నీవే ఎందుకు బాధించుకొంటున్నావు? నీకేం కావాలి? వ్యర్థంగా ఇట్లు ఎందుకు విమోహితుడవగుచున్నావు? అని ప్రశ్నించాను. నేను ఇట్లా ప్రశ్నిస్తూ ఉండగానే అతడు పెద్ద గొంతుకతో "ఓ మునీ! నేనెవ్వరనూ కాదు. నేనేమీ చేయుటలేదే? నీవే నన్ను హింసిస్తున్నావు. ఇక్కడ నీకేం పని? నీవే నా శత్రువు అని ఆవేశంగా అరవసాగాడు. నేను అనునయ వాక్యాలతో అతనిని కొంత ప్రశాంత పరచాను. నాపై గౌరవంతో, నమ్మికతో నేను చెప్పేది వినటం ప్రారంభించాడు. చాలాసేపు గడచిన తరువాత లేచి నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా తలపంకించాడు. అవునులే, మిత్రమా! నిన్ను చూడగానే నేను సుఖముగాని దుఃఖముగాని పొందుటలేదు. నీ సహచర్యంతో సత్యాసత్య, నిత్యానిత్య విషయం ఏమిటేమిటో తెలుస్తోంది" అని పలికాడు. తనయొక్క శిథిలములైన అవయవములవైపు ఒకసారి తేరిపార చూచాడు. కొద్దిసేపు సంతుష్టుడైనాడు. ఇంతలోనే ఎలుగెత్తి దుఃఖించసాగాడు. కన్నీళ్లు ప్రవహించసాగాయి. కొన్ని క్షణాలకు ఎందుకో ఏడుపు ఆపాడు. తన అంగములను చూచి నన్ను ఎరుగుచు నవ్వుకొన్నాడు. ఇంతలోనే వికటాట్టహాసం చేశాడు. ఆ అట్టహాసం ముగించిన తరువాత నా ఎదుట అతడు క్రమంగా తన అవయవములన్నిటినీ త్యజించి వేయసాగాడు. మధ్యమధ్యలో నాతో సంభాషిస్తున్నాడు, సంప్రదిస్తున్నాడు. అతిభయంకరమైన అతని శిరస్సు మొదట నేల వ్రాలింది. ఆ తరువాత క్రమంగా అతని కాళ్ళు, చేతులు, వక్షస్థలం, పొట్ట జారి పడ్డాయి. ఈ విధంగా నియతి శక్తి-జ్ఞానముల ప్రభావములచే అతడు అంగములన్నీ త్యజించాడు. అటు తరువాత స్వస్థత చెందటానికి ఉద్యుక్తుడయ్యాడు.

అతనిని అట్లాగే వదలి నేను మరొకవైపు చూచాను. అక్కడికి మరికొద్దిదూరంలో, మరొక ఏకాంత ప్రదేశంలో అట్టివాడే అయినట్టి మరొకడు కనిపించాడు. అతడు కూడా మొదటివానివలెనే తనను తాను బాదుకొంటూ హింసించుకొంటున్నాడు. గట్టి బాహువులతోను, ఆ బాహువులలో గల గుదిబండలతోను తనను తాను బాదుకోవడం అతిదారుణమైన విషయమనిపించింది. అతడు కూడా నూతిలో పడటం, బయల్వెడలటం, ముళ్ళ పొదలలోకి పరుగులు తీయటం, అక్కడినుండి అరటితోటలో ప్రవేశించటం చేస్తున్నాడు. మరల మరల దుఃఖిస్తున్నాడు. ఇంతలోనే తననుతానే సుదాయించుకుంటూ సంతోషిస్తున్నాడు. మరల, మరికొంతసేపైనతరువాత తననుతాను బాదుకొంటున్నాడు. అతని వింతక్రియలను కూడా చాలాసేపు చూస్తూ ఉన్నాను. అప్పుడు అతనిని కూడా ఆపాను. కొన్ని ప్రశ్నలు వేశాను. అతడు సమాధానాల కొరకు యోచించాడు. లభించలేదు. అప్పుడు నన్ను మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ విధంగా మా ఇద్దరి మధ్య అనేక ప్రశ్నలుPage:534

జవాబులు నడిచాయి. ప్రశ్న-సమాధానాల ద్వారా అతనికి అనేక విషయాలు బోధించాను. అతడు ఒక ప్రక్క ఏడుస్తూ - నవ్వుతూనే మరొక ప్రక్క నేను చెప్పుచున్నదానినంతా విచారించాడు. అతని అంగాలన్నీ అప్పటికప్పుడే ఛిన్నాభిన్నములైనాయి. అప్పటికప్పుడు నిర్మలరూపుడయ్యాడు. ప్రయాసతో కూడిన పరుగులను ఆపి, ఇక అక్కడినుండి బయల్వెడలటానికి సిద్ధమైనాడు.

ఇక త్రోవలో ఆ అడవిలో మరికొంతదూరం పరిశీలిస్తూ పోయాను. మరొక ఏకాంత ప్రదేశంలో అట్టివాడే మరొకడు తారసపడ్డాడు. అతడు కూడా పరిగెత్తుకుంటూపోయి ఒక అంధకూపంలో పడటం చూచాను. అతడు ఆ నూతిలోంచి బైటకు వస్తాడేమోనని అతనికోసం కాచుకు కూర్చున్నాను. చాలా సమయం గడచిపోయింది. ఏదీ? ఆ మూర్ఖుడు ఆ నూతిలోంచి బైటకు రాడే? ఇక వెనుకకు మరలాలని ఉద్యుక్తుడనౌతున్నాను. ఇంతలో అతడు బైటకు రావటం చూచాను. నేను అతనిని పలకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండగానే అతడు నా కేకలు వినిపించుకోకుండా మరల ఆ చీకటి నూతిలోకి దూకబోయాడు. ఎట్లాగో అతి కష్టంగా నా యోగబలంతో బలవంతం మీద అతనిని ఆపాను. ఇతఃపూర్వంలోలాగానే అవే ప్రశ్నలు వేశాను. అతడు నా ప్రశ్నలను అర్థంచేసుకున్నట్లు లేడు. నన్ను గుడ్లు ఉరిమి చూస్తూ "ఓ మూర్ఖుడా! నీకేమీ తెలియదు. నేను నిన్ను నమ్మను. నన్నెందుకు ప్రశ్నిస్తావు? నీవు దుష్టుడివలె ఉన్నావే? నువ్వు నాకేం చెపుతావు? ఇక ఆపు. నీలాంటి వారిని ఎందరినో చూచాను. నిన్ను నమ్మేది లేనేలేదు. నేను నాసంగతి ఇంతే" అని అరచుచు యథాప్రకారం తన వ్యాపారంలో మునిగాడు. మరల ఆ చీకటి నూతిలోకి దూకాడు.

ఆ తరువాత నేను ఆ ఆ మహారణ్యంలో సంచరిస్తూ, ఇట్టి వారినే అనేకులను చూచాను. వారిలో కొందరు నా ప్రశ్న, సమాధానాల ప్రభావంచే బోధితులైనారు. వారి దృష్టి పథంలోనించి స్వప్నం వలె మిథ్య అయినట్టి వారి గుదిబండలు ధరించిన చేతులతో కూడిన దేహము “లేనిది కాసాగింది. వారు శాంతులయ్యారు. కొందరు నా వాక్యములు విననైనాలేదు. వారు అక్కడి అంధకూపములలో పడిలేస్తూనే ఉన్నారు. మరికొందరు అరటితోటలోంచి చాలాసేపటికి బైటకు వస్తున్నారు. నేను చెప్పేది లక్ష్యపెట్టకుండా మళ్ళా పొదల అడవిలోకి పరుగెత్తుకుపోతున్నారు. ఇంకా కొందరు ముళ్ళపొదల అడవిలోనే ఉంటూ, అక్కడే అంతులేని వేదనలు పొందుచున్నారేగాని, బయటకు వచ్చుటలేదు.

కొందరు నువ్వు చెప్పక్కర్లేదు.... ఇది మా ఇష్టం" అని నాతో పలుకుచూ, కామ్య కర్మ పరాయణులై ఇటూ - - అటూ తిరుగుచూనే ఉన్నారు. నన్ను పట్టించుకోవటంలేదు.

ఆ మహారణ్యమంతా ఈ విధంగానే ఉన్నది.

ఓ రామచంద్రా! ఆ మహారణ్యము ఇప్పటికి అక్కడే ఉన్నదయ్యా! దానియందు ఆయా పురుషులు ఆ విచిత్ర వ్యవహారములను అట్లే చేస్తున్నారు. నేనే కాదు. నీవు కూడా ఆ మహారణ్యం చూచావు. చూస్తున్నావు కూడా! కాని, సూక్ష్మబుద్ధితో గమనించకపోవుటచే ఆ అరణ్యమును

Page:535

ఎరుగకపోతున్నావు. ఆ అరణ్యం అందరికీ కనిపిస్తూనే ఉన్నది. ఈ సభలో చాలామందికి ఆ ఆరణ్యబాటసారులు తారసబడుతూనే ఉన్నారు.

ఆహాఁ! ఏమి దౌర్భాగ్యం! ఉత్తమమైన మనుజ జన్మ పొందికూడా తాము సంపాదించుకొన్న బుద్ధికౌశలత్వాన్ని సద్వినియోగపరచుకోవటం లేదే? దానిని వృథాయే చేసుకుంటున్నారు కదా! అతి భయంకరము, ముళ్ళచే నిండియున్నది. గాఢాంధకారముచే వ్యాప్తమైనది అగు ప్రదేశములను వారు ఇవి పుష్పవాటికలే కదా అని తలచి మోహం చెందుచున్నారే? వాటినే మరల మరల సేవిస్తూ దుఃఖితులౌతున్నారు. "వీరు సంస్కరించబడేది, శాంతిని పొందేది ఎట్లా అనియే నేను

మరల మరల యోచించటం జరుగుతోంది. మేము వారికి ఏ రకంగా సహాయం చేసేది?

3. కథా సంఘటనలు - ఉద్దేశము

శ్రీరాముడు : మహాత్మా! ఆ మహారణ్యం ఉన్నది ఎక్కడ? ఎట్లా ఉన్నది? నేను దానిని చూచానని అంటున్నారే? చూచినట్లు నాకు గుర్తులేదే? అందున్న ఆ భీకరమైన ఆకారములుగల జీవులు ఎవరు? వారంతా అట్లా ఆయారీతులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు ఎప్పుడు ఎందుకు ఆ మహారణ్యంలోకి వెళ్ళారు? ఈ సభలోని మహనీయులెందరో ఆ అరణ్యం చూస్తూనే ఉన్నారని అన్నారుకదా! మీరు ఏ ఉద్దేశంతో ఈ సంఘటన చెప్పారో నేను గ్రహించలేకపోతున్నాను. దయచేసి మీ ఉద్దేశమేమిటో మీరే వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ వృత్తాంతమంతా చెపుతాను. విను. ఆ మహారణ్యముగాని, ఆ పురుషులుగాని ఎక్కడో లేరు సుమా! అత్యంత గంభీరము, విశాలము అయిన ఈ సంసారమే ఆ శూన్యారణ్యము.

బ్రహ్మము విచారించబడినప్పుడు ఇదంతా ఆత్మచే పరిపూర్ణమైయున్నది. కదా” అని గ్రహించ బడుతుంది. అప్పుడిక ఆత్మకు వేరైనదేదీ ఎక్కడా గోచరించదు. అనగా, పరమార్థ దృష్టిచే ఈ సర్వము బ్రహ్మము రూపంగానే కనిపిస్తుంది. అప్పుడీ సంసారారణ్యం వస్తురహితమై శూన్యంగా గోచరిస్తుంది.

అట్లా కాకుండా జగద్దృష్టితో చూచినప్పుడు మాత్రం ఇది మహావికారయుక్తమై ఉంటోంది. ఈ సంసారారణ్యంలో అనేక సాంసారిక దృష్టులచే వికృతాకారం కలిగి సంచరిస్తున్నవారు ఈ జీవులే సుమా! వీరు భ్రాంతిచే అత్యంత దుఃఖితమైన చిత్తము కలవారై ప్రవర్తిస్తున్నారు. వారలను చూస్తున్న ద్రష్టయగు నేను ఆ జీవునియందలి వివేకమును. నేను వారిని ఈ సంసారారణ్యంలో అట్టి సంచలనముతో చూస్తున్నది నాయొక్క వివేకము చేతనే కదా! వివేకముచే వారి మనస్సులకు ప్రబోధము కలుగజేయుటకు నిరంతరం శాస్త్రములు, గురువులు యత్నించుచునే ఉన్నారు. వారంతాకూడా 'వివేకము, అనుదానిచే ఉద్దేశింపబడ్డారు. ఈ సంసారంలో సంచరిస్తున్న కొందరు తత్త్వజ్ఞానరూపమగు ప్రబోధమును పొందినవారై అద్దాని ప్రభావంచేత చిత్తశాంతిని పొంది ముక్తులు

Page:536

అవుతున్నారు. మరికొందరు వారివారి వివేకములను వాంఛించక తిరస్కరిస్తూ అజ్ఞానకూపంలో పడుచున్నారు.

అగాధమగు చీకటి నూతులు” = నరకములు

అద్దాని నుండి లేవనివారు = పాపకార్యములందు ప్రవృత్తి కలవారు. అరటితోటలో ప్రవేశించినవారు = స్వర్గలోక భోగములందు ఆసక్తులై తత్సంబంధమైన యజ్ఞాది పుణ్యకార్యములకు ఆయత్తమగుచున్నవారు. పుణ్యవంతులు. ముళ్ళపొదల అరణ్యంలో ప్రవేశించువారు = కర్మపరంపరాసక్తులతో కూడిన మనుజ రూపమున పరిణామము పొందినవారు. అంటే, కర్మ చక్రమును పొందినవారు. ఈ మనుజ జన్మ పొందినవారిలో కొందరు జ్ఞానసంపన్నులై సంసార బంధము నుండి తప్పించుకొని ముక్తులగుచున్నారు. మరికొందరు ఒక యోని నుండి మరొక యోనికి వెళ్ళుచు స్వర్గ - నరక - భూలోకముల మధ్య పరిభ్రమిస్తున్నారు.

‘ముళ్ళపొద’ = దుఃఖములచే పూర్ణమై, భౌతిక స్వభావయుక్తమై, కుటుంబ, బంధు, స్నేహాదులు కలిగి రకరకాల ఇచ్చలతో కూడుకొని యున్నట్టి ఈ చిత్తము యొక్క స్థితి.

కొందరు ఆయా శాస్త్రములచే నిర్ణయింపబడుచున్న పుణ్యకర్మలను ఆచరించుచున్నారు. తద్వారా, తమ మనస్సును పరిశుద్ధ పరచుకుంటున్నారు. ధ్యేయ వస్తువు నందు (పరమాత్మయందు) తమ చిత్తమును సంలగ్నం చేస్తున్నారు. ఆయా ఉపాసనలను, సుహృద్భావపూర్వకమైన త్యాగాదులను ఒనర్చుచు, “గ్రహమండలము-సప్తర్షి మండలము-ధ్రువమండలము మొదలైన ఉత్తమ పదములకు, గతులకు అర్హులగుచున్నారు. అట్టివారు అధికమైన తేజోసంపన్నులై తత్త్వజ్ఞానముచే ఎల్లప్పుడు శ్రేయమునే పొందుచున్నారు.

"కొందరు అజ్ఞులు నన్ను తిరస్కరించారు = ఆత్మ జ్ఞానమును ఆశ్రయించక, కొందరు తమ వివేకమును తామే తిరస్కరిస్తూ దూషించుచున్నారు.

"నిన్ను చూడగానే నశించుచున్నాను. నీవు మా శత్రువు" = ఈ మాటలు చిత్తము యొక్క విలాసమే. వివేక దృష్టి ఏర్పడుచుండగా చిత్తము క్రమంగా వినాశనం పొందటమే అది. ఆర్తనాదం చేస్తూ బిగ్గరగా ఏడ్చువాడు = భోగములు, విషయములు త్యజించుచుండగా భేదము పొందుచున్నట్టి ఈ చిత్తము యొక్క చమత్కారం.

వివేకము కొంత కొంత వికసించుచున్నప్పుడు ఇక భోగములు త్యజించబడుతూ వస్తాయి. అప్పుడు ప్రారంభదశలో ఈ చిత్తము కొంత కొంత దుఃఖము పొందుతూ ఉంటుంది. అల్పవివేకము గల చిత్తము స్త్రీ, పుత్రులు మొదలైన వాటిని కరుణాదృష్టితో తిలకిస్తూ "ఎంత కష్టం వచ్చింది! నా బంధువుల గతి ఏమిటి? వీరికి నేనంటే ఎంత అభిమానం!" అని తలచుచూ దుఃఖములు పొందు తోంది. పూర్ణజ్ఞానము, ఆత్మపదప్రాప్తి ఇంకా పొందనప్పుడు ఈ స్నేహములు మొదలైనవి కోల్పోయే సమయంలో చిత్తము కొంత ఆవేదన పొందటం సహజమే. ఇదంతా సంసార వైచిత్ర్యమే సుమా!

Page:537

నన్ను ఎరుగుచు, ఆ ఆ పురుషుడు నవ్వాడు = వివేకమును పొందిన చిత్తము సంతుష్టిని పొందుచున్నది.

వివేకము పొందిన చిత్తము క్రమంగా సంసార స్థితిని, తనయొక్క చిత్తత్వమును త్యజిస్తుంది. అప్పుడు ఆ చిత్తములో అకృతిమమైన ఆనందం వెల్లివిరుస్తుంది. అందరిపట్ల స్నేహభావం స్వయముగా పెంపొందించుకొంటుంది. ఇంతవరకు తనయందు చోటు చేసుకొన్న మోహము, ద్వేషము, లోభము మొదలైన అజ్ఞాన వీచికలను గుర్తుకు తెచ్చుకొని, ఆహాఁ! మిథ్యావికల్పములతో రచించబడుచున్న విషయములచే నేను ఇంతకాలం ఎంతగా వంచింపబడ్డాను! ద్వేషము, ఆవేశము, కోపము, రాగము మొదలైనవి ఎంతటి హాస్యాస్పదమైన విషయాలు!" అని ఆ జీవుడు ఆశ్చర్యపడుతూ ఉంటాడు. వివేక ప్రాప్తిని పొంది వ్యాపక బ్రహ్మము నందు విశ్రాంతి పొందిన చిత్తమునకు ఇతఃపూర్వపు సంసారానుభవమంతా హాస్యాస్పదంగాను, స్వప్నమాత్రంగాను ఉంటూ ఉంటాయి. నేను పడ్డ క్లేశములన్నీ నా అజ్ఞానము యొక్క పరిణామమే కదా అని అతడు గ్రహిస్తాడు.

"నేను అతనిని ఆపి ప్రశ్నించాను” = వివేక బలముచే చిత్తము నిగ్రహించబడినది. అవయవములన్నీ ఛిన్నాభిన్నమై లుప్తం అయ్యాయి = చిత్తము శాంతించగా, సర్వ పదార్థములపట్ల ఆశలు ఉపశమించాయి. "వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళు గలవాడు = ఇష్ట-అయిష్టములే రూపముగాగల ఈ చిత్తమే ఆ విధంగా వర్ణించబడినది. మనస్సులో ఎన్ని ఆశలు? ఎన్ని ఆసక్తులు? ఎన్ని ప్రియాప్రియములు? తనను తానే బాదుకొనుచున్నాడు. హింసించుకొనుచున్నాడు” = దుష్ట సంకల్పములచే ఈ మనస్సు తనను తానే బాధించుకొనుచున్నది. “తననుతానే కొట్టుకొనుచు, పరుగెత్తుచున్నది = మనస్సు తన యందలి వాసనలచే కొట్టబడుచు, ముల్లోకములందలి అనేక యోనులలో ప్రవేశించుచున్నది.

ఓ రామచంద్రా! అజ్ఞానము యొక్క విచిత్రమైన లీలలు చూచావా? ఈ చిత్తము తన కోర్కెలను అనుసరించే తననుతానే బాధించుకొనుచు పరుగులు తీయుచున్నది. జీవుడు బ్రహ్మపదము పొందవలె నని లక్ష్యము పొందియుంటున్నప్పటికీ, వాసనారాహిత్యము అతడు పొందనంతవరకు అతని చిత్తము దుర్విషయముల అభ్యాసముచే 'క్షోభ' చెందుచూనే ఉన్నది. చిత్తములన్నీ సంసారారణ్యంలో పరుగులు తీస్తున్నాయి. ఈ జీవుని దుఃఖములను విస్తరింపజేయుచున్నది మనస్సే. అది అనేక ఆవేదనలను తనయందు దాచుకొన్నదై, మిక్కిలి భిన్నముగా అటు-ఇటు పరుగులు తీస్తోంది. పట్టుపురుగును గమనించావా? అది తనచేత నిర్మించబడిన గూటియందు తానే చిక్కుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ మనస్సు కూడా తననుండి బయలుదేరిన సంకల్ప-వాసనాదులచేతనే బంధింపబడి, అనేక వేదనలకు గురి అగుచున్నది. ఊరకుక్కను గమనించావా! అది ఎందుకో- ఏమిటో తెలియకుండానే వీధులలో చుట్టి చుట్టి పరుగులు తీస్తోంది. బాలుడు భవిష్యత్తులోని సాధకబాధకాలు

Page:538

తెలియక దుష్ట పదార్థాలను భుజించటం, దుష్టప్రదేశాలలో సంచరించటం చేస్తూ ఉంటాడు. ఈ మనస్సు ముందు-వెనుకలను, ప్రయోజన-నిష్ప్రయోజనములను చూచుకోకుండానే అనర్థములను ఆశ్రయిస్తోంది. అనేక దుఃఖపూరితములైన కార్యక్రమములకు తనను తానే బలవంతంగా సమర్పించుకొంటోంది. చపలమగు కోతి తన చాపల్యం చేత చీల్చబడుచున్నట్టి దుంగలో కాలుపెట్టి యమయాతనలు తెచ్చిపెట్టుకొంటుంది చూచావా? చంచలమగు మనస్సు కూడా అనేక ఆసక్తులచే రాగద్వేషములను సంతరించుకొని సంచరించుచు అనేక దుర్భర పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకొంటోంది. శ్రీరాముడు : మహర్షీ! మరి ఈ మనస్సు తన చాంచల్యము వదలదా? దీని గతి ఇంతేనా? శ్రీ వసిష్ఠ మహర్షి : నిరుత్సాహపడవలసిన పనిలేదయ్యా! దీనిని అభ్యాస ప్రభావంచేత తప్పకుండా వశం చేసుకోవచ్చు. ఓ జనులారా! బాహ్యాడంబరములను, వృథాకాలయాపనలను, అల్ప లక్ష్యములను క్రమక్రమంగా తగ్గించుకోండి! మనసుకు మౌనం, ప్రశాంతత, సర్వులపట్ల అవ్యాజమైన ప్రేమ అలవాటు చేయండి. ఈ మనస్సు చిరకాలం ప్రపంచ రహిత సమాధిని అభ్యసించాలి. అనగా, మీ మనస్సు ప్రపంచమునకు సంబంధించిన మననము చేయకుండా చూచుకోండి. ఆత్మభావననే (సర్వము ఆత్మస్వరూపంగా) దృఢం చేసుకోవాలి. ఇక వేరే ఉపాయంలేదు. మనస్సు యొక్క ప్రమాదము వలననే ఈ జీవునకు అనేక దుఃఖములు పర్వతమంత ఆకారంగా వృది చెందుచున్నాయి. ఈ మనస్సు వశీకృతమైనదా.... ఇక మిగతా జాడ్యమంతా తనంతటతానే నశిస్తుంది.

మానవుడైనవాడు, శాస్త్రార్థములను చక్కగా గ్రహించాలి. ఉత్తమమైన సంస్కారములను అలవరచు కోవాలి. సమభావనను అన్నివేళల అభ్యసిస్తూ ఉండాలి. రాగద్వేషములకు విచలితం కావటమును తగ్గించుకొంటూ ఉండాలి. ఇంద్రియముల ప్రభావమును నిరోధిస్తూ దృష్టిని సర్వాత్మస్వరూపుడగు పరమాత్మవైపుకు సారించాలి. అప్పుడాతడు తప్పక అతి పవిత్రమగు బ్రహ్మపదమున చిరకాలం ప్రతిష్ఠితుడు కాగలడు. అట్టి ఆత్మసారూప్య స్థితి" యందు జన్మాది వికారములు ఉండవు. అది పరమశాంతిదాయకమైనది. అందు ఈ ఆధ్యాత్మిక - ఆధిభౌతిక - - ఆధిదైవిక తాపములకు చోటు ఉండదు. అట్టివాడు దుఃఖములు పొందడు. విపత్తులకు విచలితుడు కాడు. ఓయీ! మానవుడా! ఈ జన్మయందే, ఇప్పుడే ఉత్తమమైన ప్రయత్నములు, విచారణలచే అట్టి ఆత్మస్థితిని ప్రాప్తింపజేయు విషయమై ఎందుకు శ్రద్ధ కలిగి ఉండరాదు? చిత్తమును జయించి, జ్ఞానస్థితిని పొందుటకు ఇంతకన్నా ఉత్తమమైన అవకాశము ఎక్కడున్నది?

Page:539

VIII. బాల వినోదము

1. ఆత్మకు వేరైనదంతా అజ్ఞానమే!

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సముద్రంలో తరంగములు ప్రకటితమగుచున్నట్లు, పరమపదమగు బ్రహ్మము నుండే ఈ 'మనస్సు' అనునది ప్రకటితమగుచున్నది. “మనస్సు లేదు” అని, మనస్సు తప్ప మరింకేమీ లేదు అని కూడా చెప్పవచ్చు సుమా!

మనస్సు లేదు = ‘మనస్సు' వాస్తవానికి లేదు. బ్రహ్మం మాత్రమే ఉంది. అయితే మనస్సుగా ప్రాప్తించేదంతా బ్రహ్మం గురించిన ఏమరుపు-అజ్ఞానం యొక్క వికాసము మాత్రమే అయి ఉంది.

మనస్సు తప్ప మరింకేమీ లేదు = శుద్ధబ్రహ్మమే ఇట్లు స్వకీయమైన ఇచ్చచే సువిశాల దృశ్యరూపంగా వివర్తము చెందుచున్నది. కనుక, ఈ కనబడే సర్వము ఆ ద్రష్టయొక్క మనస్సే!

రెండు వివరణలూ సమంజసమే అగుచున్నది. జలసామాన్య రూపము ఎరిగినవానికి “జలము వేరు, తరంగము వేరు అను దృష్టి ఉంటుందా? ఉండదుకదా! జ్ఞానుల దృష్టిలో ఈ మనస్సు బ్రహ్మమే అయిఉన్నది? అంతేకాని ఇది వేరే ఏదీ కాదు. జలమే ఇట్లు తరంగము అగుచున్నది" అనే దృఢభావం లేనివానికి "ఈ తరంగము వేరు, ఆ తరంగము వేరు" అనే దృష్టి బలపడి ఉంటుంది. అజ్ఞానుల యొక్క స్వకీయచిత్తమే సంసారభ్రమణకు కారణమగుచున్నది. అట్టి అజ్ఞానులకు ఉపదేశించటానికే మేము వాచకములను (Technical words, jargons), వాచ్యములను (Meaning conveyed by such words) కల్పించుచున్నాము. అట్టి భేదకల్పన అంతా బోధను సునిశితం చెయ్యటానికీ, అజ్ఞాని యందు జ్ఞానదీపము వెలిగించటానికీ అయిఉన్నది.

పరమాత్మ సర్వశక్తిమంతుడు, నిత్యుడు, సర్వత్రా పరిపూర్ణుడై వెలుగు చున్నవాడు. అట్టి సర్వశక్త్యోపేతునికి సర్వశక్తిత్వమే శోభిస్తుంది కాని, అల్పత్వము కాదు. అతనిలో లేని వస్తువే లేదు. సర్వవ్యాపి అగు అతడు తనయొక్క సర్వశక్తిత్వము అంతటా క్రియారూపమున ప్రకటితం చేస్తున్నాడు. అతడు ప్రతి జీవునియందు ఉండిఉన్నాడు. ప్రతి జీవుడు అతనికంటే వేరు కాదు. ఆ బ్రహ్మము యొక్క చేతనశక్తి సర్వవిధ ప్రాణులందు కలదు. అదియే వాయువునందు చలనశక్తిగాను, బల్లయందు కఠినశక్తిగాను, జలమునందు ద్రవశక్తిగాను, అగ్నియందు ప్రకాశశక్తిగాను, ఆకాశమందు శూన్యశక్తి గాను, సంసారస్థితియందు వ్యవహారయోగ్యత్వ శక్తిగాను గాంచబడుచున్నది. ఈ విధంగా ఆ బ్రహ్మము యొక్క శక్తులన్నీ దశదిశలా వ్యాపించి ఉన్నాయి. నాశనవంతములగు పదార్థములందలి నశింప జేసేశక్తి ఇదే. దుఃఖితులైన వారిలోని శోకశక్తి, ప్రసన్నులందలి ఆనందానుభవశక్తి, సృష్ట్యాది యందలి- ప్రళయము నందలి ఉత్పత్తి - వినాశకశక్తి ఆ బ్రహ్మమే అయి ఉన్నది. సర్వపదార్థముల యొక్క “బీజము” అదే.

Page:540

ఒక బీజంలో భవిష్యత్ వృక్షము, ఆ వృక్షముయొక్క ఆకులు, పూలు, కాయలు, కొమ్మలు .... ఇదంతా సంస్కార రూపమున దాగియున్నది కదా! వృక్షముయొక్క ధర్మములన్నీ ఒకప్పటి విత్తుకు వేరైనవి కావు. ఈ జగత్తు, ఇందలి శుభ - అశుభ వ్యవహారములు .... ఇవన్నీ బ్రహ్మమునందే ఉండిఉన్నాయి. అట్లే, చిత్తము జడము”ల మధ్య ఉన్నట్టి ఈ 'జీవుడు’ అనబడుచున్న చిదాభాసుడు (చిద్వస్తువు యొక్క ప్రతిబింబము వంటివాడు కూడా సాక్షి చైతన్యము యొక్క ప్రకటనయే. అట్టి సాక్షి చైతన్యమే స్వరూపముగా కలిగి, అతడు బ్రహ్మమునందే స్థితి కలిగియున్నాడు. 'నేను జీవుడను' అను భావన చేయటం బ్రహ్మము యొక్క ఒకానొక స్వభావమే అయి ఉన్నది. ఇక ఈ దృశ్యప్రపంచం విషయానికి వస్తే, ఇందలి పదార్దములన్నీ మాయతో కూడుకొనినట్టి చైతన్యము యొక్క వివర్తమే. ఇవన్నీ కూడా శుద్ధ చైతన్య రూపములే అయి ఉన్నాయి. కనుక రామా! ఈ జగత్తు, ఇందలి 'నేను' అను 'భావన' చేస్తున్న జీవత్వము.... ఇదంతా చిద్రూప బ్రహ్మమే ..... అను దృష్టితోనే చూడాలి.

చిత్ లేక ఎరుక” శరీరముగా కలిగియున్న ఆ పరమాత్మయే మహత్తరమైన శరీరము కలిగియున్నవాడై ఈ 'నేను - నీవు - - జగత్తు' మొదలైన సర్వవ్యవహారములతో కూడుకొని సదా ప్రకాశించుచునే ఉన్నాడు.

మనస్సు అంటే ఏమిటి? మనన శక్తిని కలిగియున్నప్పటి చైతన్యమే 'మనస్సు' అనే శబ్దంతో పిలువబడుతోంది. జలమును ఒడ్డున ఉండి చూస్తున్నవానికి ఇది జలము - ఇవి వేరువేరు తరంగములు - ఇది ఆవర్తము అను బుద్ధి కలుగుచున్నట్లు, ఈ జీవుడు మనస్సు అనేవి ప్రతిభాసా రూపమున ఆత్మయందే ఉండి ఉంటున్నాయి. "ఆత్మనుండే మనన రూపమగు మనస్సు ఆవిర్భవిస్తోంది అనుటలో సందేహమేమిటో చెప్పు? ఓ రఘురామా! ఈ సమస్తము బ్రహ్మము యొక్క శక్తియే. కనుక ఈ బ్రహ్మాండమంతటినీ బ్రహ్మస్వరూపముగానే దర్శించు. ఇక 'అది-ఇది-నేను' ఇత్యాది భిన్న విభజన అంతా ప్రతిభాసావశంచేతనే ఉత్పన్నమగుచున్నది.

ఒక దృష్టాంతము విను. ఒకచోట ప్రశాంతజలముతో కూడిన ఒక తటాకం ఉన్నది. అందలి జలంలో విశాలమైన ఆకాశం ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు నక్షత్రములు ప్రతిబింబిస్తున్న విభాగములోని జలము, చంద్రుడు ప్రతిబింబిస్తున్న విభాగములోని జలము వేరువేరా? ఏది ఎట్లు ప్రతిబింబిస్తున్నా జలమంతా ఒక్కటే అయి ఉన్నది కదా! అద్వితీయ బ్రహ్మమునందే ఈ సమస్తము ప్రతిబింబిస్తోంది. వేరు వేరు సంస్కారములతో కూడిన ఈ వేరు బాహ్య - అభ్యంతర (Outward and inward) చిత్త రూపములను ధరిస్తున్నది ఒకే పరబ్రహ్మము. నిప్పుకు నిప్పురవ్వలులాగా, ఆ బ్రహ్మము యొక్క చిత్ శక్తియందు ప్రకటితమగుచున్న కిరణపుంజములమే మనమంతా! అన్ని అగ్నికణములు అగ్నియే అయి ఉన్నట్లు మనమంతా బ్రహ్మమే అయి ఉన్నాము. దేశకాలానుగుణంగా భూమి యందు ధాన్యశక్తి ప్రకటితం అవుతూ ఉంటుంది కదా! అట్లాగే పరమాత్మకూడా దేశకాలములను అనుసరించి వ్యవస్థితమగుచున్న ఫలరూపంగా ఈ నీవు-నేను-దృశ్యము మొదలైన రూపములలో కనబడే ఆయా శక్తులను వ్యక్తమొనర్చుచూ ఉంటాడు.

Page:541

అయితే ప్రతిభాసగా కనిపిస్తున్నది యథార్థముగా ఉన్నదౌతుందా? ప్రతిభాసితం కారణంగా ఎండమావులలో జలము కనిపిస్తోంది. కనుక, అట్లు కనిపించటానికి కారణం అందలి జలమే అని అనగలమా? అక్కడ వాస్తవమైన జలము లేనే లేదు కదా? ఇక అది కారణమవటమేమిటి? "దృశ్యము ఉండుట చేతనే దృష్టి ఉంటున్నది" అనునది సమంజసంకాదు. లేక, అది పరిపూర్ణమైన అవగాహన కాదు. ఇక పరమార్థ దృష్టితో చూస్తే, ఎవ్వరూ దేనిని గాంచుటలేదు. ఎందుకంటే ఈ ద్రష్ట యొక్క స్వభావం 'సత్త' ("Existence" Experience) యే కదా! ఎక్కడ 'సత్త' (Absolute Experience) మాత్రమే కలదో, అక్కడ ఎవరు దేనిని చూస్తారు?*

ఆత్మ సత్త”కు అన్యమైన దృష్టి ఏర్పడుతుంటే, అందుకు కారణం అజ్ఞానమే అని గ్రహిస్తావు గాక!

2. బంధం ఎవరికి?

శ్రీరాముడు : మరి మేము ఈ దృశ్యమును 'ఘనీభూతమైన సత్యము' వలె పొందుచున్నామే? శ్రీ వసిష్ఠమహర్షి : కారణం? తగినంత విచారణ, పరిశీలన, లేకపోవుటయే! జ్ఞానులు మీమాంస యొక్క నాలుగు అంగములను ఉపయోగించి దృశ్యము యొక్క సత్యాసత్యములను పరిశీలిస్తున్నారు. 1) ప్రతియోగి = "అది ఉన్నదా? లేదా?" అను విచారణ

2) వ్యవచ్ఛేదము = విభాగించి పరిశీలించుట

3) సంఖ్య = విడివిడిగా పఠించుట (Studying in separate components)

4) రూపము = Analysis of "what is its actual form?"

వారు ఈ దృశ్యజగత్తును “మీమాంస (Logic) చే పరిశీలించి, ఆపై శాస్త్రముల రూపంలో ప్రవచిస్తూ, మనకుకూడా చెప్పుచున్నారు.

ఈ జగద్వైచిత్రములన్నీ స్వయముగా వాస్తవమైనవికావు. ఇవన్నీ మనస్సు చేతనే కల్పించ బడుచున్నాయి. మనస్సు చైతన్యము యొక్క మనన శక్తియే. కనుక అట్టి మనన శక్తి యొక్క కల్పితదృష్టిచే కనిపించుచున్న ఇవన్నీ కూడా .... వివర్త రూపమున బ్రహ్మము నందే, బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నట్లు అగుచున్నది. ఇదంతా బ్రహ్మమే. ఇవన్నీ బ్రహ్మమునకు వేరైనవి కావు.

"ఈ దృశ్యము బ్రహ్మమే అయిఉన్నది (విశ్వమ్ విష్ణుః)" అను విషయమే ఉపనిషత్తులు, సత్య ద్రష్టలగు మహర్షులు అనేక రీతులలో ఘంటాపథంగా నిరూపించుచున్నారు. ప్రతిభాసాత్మకమైన ఈ మనస్సుకు అతి విచిత్రమైన ఒక శక్తి ఉన్నది. ఇది ఏ విధంగా దేని యందు ప్రవృత్తమగుచున్నదో అది ఆ విధంగానే ప్రాప్తించగలదు. ఐందవుల సృష్టియే మనకు ఇక్కడ దృష్టాంతము.

“యత్తత్పస్యాత్ అద్వైతమేవాభూత్ తత్ర కేన పశ్యత?”

- అనే శ్రుతి వాక్యార్థమే ఇక్కడ వసిష్ఠ మహర్షి ఉద్దేశిస్తున్నారు.

Page:542

అందుచేత, రామా! నాతో సహా ఈ ఈ సర్వము సర్వదా అంతా చైతన్యమే అయి ఉన్నది. త్రికాలములలోను (In the past, in the present and also in the future) పరబ్రహ్మమునకు వేరైనది ఎచ్చటా లేదు .... అనియే నీ మనస్సు అన్ని వేళలా ప్రవృత్తమగుచుండుగాక! దాని ఫలితంగా మోక్షం స్వయంగా ప్రాప్తించగలదు. ఒకడు తనకు ప్రవాహపతితంగా ప్రాప్తిస్తున్న ఆయా కార్యములను నిర్వర్తిస్తూ “నాతో సహా సర్వం బ్రహ్మమే" అను భావన కలిగియుండుటలో ఏమి కష్టముంది చెప్పు?

ఏ జలములో అయితే ప్రశాంతత ఉన్నదో అదే జలములో తరంగత్వము కూడా ఉంటున్నది కదా! “తరంగము” అనబడేది ఎక్కడో బైటనుండి వచ్చిచేరే ఏదైనా పదార్థముకాదు. చ్యుతి (Deviation) పొందటం (అనగా, ఈ జగద్భావమును అనుసరించటం); 'అచ్యుతి' పొందటం, (అట్టి జగద్భావమును త్యజించి ఉండటం) ఇదంతా కూడా బ్రహ్మము లేక పరమాత్మ యొక్క చమత్కారముతో కూడిన స్వభావమే అయి ఉన్నది. పరమాత్మయందే ఈ ప్రపంచ కల్పనంతా ఉండి ఉన్నది. ఇట్టి కల్పన అంతటికీ కారణం జీవరూపమున ఉన్నట్టి పరబ్రహ్మమేకాని, మరిక వేరే ఏదీ కాదు. కల్లోలముతో కూడిన సముద్రంలోని బుద్బుదములు, తరంగాలు, ఆవృత్తములు అంతా జలమే కదా! జ్ఞానికి అంతటా బ్రహ్మమే వ్యాపించియున్నట్లు అగుపిస్తోంది. వికారవంతమైయున్నట్టి ఈ జగత్తునందు పరమాత్మకు వేరుగా ఏదీ లేదు. ఆ పరమాత్మయందు - - నామరూప క్రియాత్మకమైన

-- వేరొక సత్త ఎక్కడి నుండి ఎట్లా వచ్చిచేరగలదు చెప్పు? ముత్యపు చిప్పలో వెండి ఉంటుందా? భ్రమచేత మాత్రమే నిర్లిప్త-నిరవయవమగు బ్రహ్మమునందు "ఉత్పన్నమగుట, నశించుట, ఉండుట, పోవుట మొదలైన దృశ్యవికారములు భాసించుచున్నాయి. ఆత్మ వాస్తవానికి నామరూప రహితమే అయి ఉన్నప్పటికీ, తన ఇచ్ఛను అనుసరించే ఈ జగత్ వైచిత్ర్య రూపమున భాసించుచున్నది. అట్లు భాసించుట’ను తానే గాంచుచు, తన శృంఖలములను (Fetters or Limitations) తానే నిశ్చయించుకొనుచున్నది. మరొక తరుణంలో అఖండత్వమును ఆశ్రయించుచున్నది.

కర్త-కరణము-కర్మలు-జననములు-మరణములు” ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే. అతనికి అన్యముగా ఎక్కడా ఏ కల్పనా ఉండజాలదు.

పరమార్థ దృష్టికి లోభమోహములు కూడా లేవు. ఆత్మయందు ఆత్మకు లోభముగాని, తృష్ణగాని ఎట్లా ఉంటాయి? ఈ జగత్తు, దీని కల్పనా క్రమము ఆత్మయే అయి ఉన్నది. సువర్ణమే ఆభరణములుగా ప్రకాశించుచున్నట్లు ఆత్మయే ఈ ఈ మనస్సుల రూపమున ప్రకటితమగుచున్నది. ఇక చిత్తము గురించి ఒక్క మాటలో చెప్పాలంటే .... ఇది ఉత్తమోత్తమమగు ఆత్మ పదము యొక్క అనభిజ్ఞత్వము” లేక ఏమరపు”.... మాత్రమే! అదియే ఈ జీవుడు!

శ్రీరాముడు : స్వామీ! మరి ఈ బంధముల మాటేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అజ్ఞాన దశలో ఎంతగానో అనుభవమునకు వచ్చుచున్న ఈ బంధము జ్ఞానముచే విచ్ఛేదనమగుచున్నది. అప్పుడు బంధమనునది మొదలే లేదు" అను అనుభవమే

Page:543

శేషిస్తోంది. ఆకాశమే శూన్యత్వమును వ్యక్తమొనర్చుచున్నట్లు, అజ్ఞాత-చిన్మయి అగు ఆ పరమాత్మయే తన సంకల్పముచే జీవత్వమును (నేను జీవుడననే స్థితిని) లీలగా, క్రీడగా ప్రకటిత మొనర్చుచున్నాడు.

ఆహాఁ! ఎంత చమత్కారం! ఈ జీవుడు వాస్తవానికి ఆత్మ స్వరూపుడే అయినప్పటికీ, అనాత్మ భూతమగు ఈ అహంకారము మొదలైన వాటితో అభేదము”ను సంపాదించుకొనుచున్నాడు. మరుక్షణమే ఈ దృశ్య జగత్తు అంతా ఆవిర్భవించటం, ఎదురుగా నిలచియుండటం జరుగుతోంది. జీవుని యొక్క ద్వైత రూపముతోకూడిన ఈ కలుషిత దృష్టి అంతా మిథ్యమాత్రమే.

నిత్యాసంభవః బంధస్య, బద్ధం స్మీతి కుకల్పనా? యస్య కాల్పనికన్తస్య మోక్షో మిథ్యా స తత్త్వతః |

సత్యత్వాదాత్మనశ్చైవ, క్వాత్మా బద్ధః? క్వముచ్యతే ॥

ఓ సర్వజనులారా! మీరంతా ఆత్మయే అయి ఉన్నారు కదా! మరి, కాదు నేను బద్ధుడను, ఎప్పటికో ఎవరి దయ వలననో ఎట్లో బంధ విముక్తి పొందవలసి యున్నది అను కుకల్పన ఎందుకు చేస్తున్నారో చెప్పండి? యథార్థానికి "మోక్షము" అనుబడునది కూడా లేదు. ఎవరిపట్ల అయితే...., ‘బంధమే కుకల్పితము' (false attribution) అని నిరూపిస్తున్నామో, అట్టి ఆత్మకు మోక్ష వ్యవహారం కూడా మిథ్యయే గాక మరేమిటి?

శ్రీరాముడు: గురువర్యా! మీరు చెప్పుచున్న దానిని అనుసరించి ఆత్మ, మనస్సు” అనబడు ఈ రెండింటిలో ఆత్మకు బంధముగాని, మోక్షముగాని ఉండజాలదు. ఈ జీవుడు ఆత్మయే స్వరూపముగా కలిగియున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఈ మనస్సు దేనిని ఎట్లా నిర్ణయిస్తే అది అట్లే అగుచున్నది. కాబట్టి మనస్సే బంధమై యున్నదా? మనస్సే బంధమునకు, మోక్షమునకు కారణ మగుచున్నదని మీరు చెప్పియున్నారు. అయితే, ఈ మనస్సు యొక్క దర్శనమంతా కల్పితము మాత్రమే కదా! అంతా కల్పితమే అయినప్పుడు, ఈ మనస్సుకు మాత్రం బంధమెక్కడిది?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, మనస్సు కల్పితమైనదే. చైతన్యము జగద్వస్తువుపై ఆసక్తి కొనియున్నప్పుడు, అట్టి ప్రసరణముయొక్క రీతినే 'మనస్సు' అని అంటున్నాం. అదికాక మనస్సుకు వేరే రూపమేమి ఉన్నది? ఒకడు దీర్ఘస్వప్నంలో చూచిన అనేక పదార్థాలు అతడు జాగ్రత్తుకు వచ్చేసరికి మిథ్యయే అగుచున్నాయి కదా! అదేవిధంగా, బంధమును గూర్చిన అజ్ఞానుల కల్పన మిథ్యయే. జ్ఞానుల దృష్టిలో 'మోక్షము' యొక్క కల్పన కూడా మిథ్యయే. అనిర్వచనీయము, తుచ్ఛము అయినట్టి అజ్ఞానము’ వలననే ఈ బంధ - - మోక్షముల కల్పన అంతా జరుగుచున్నదని గ్రహించు. బంధ మోక్షములు సత్యములేనని అనటం వేద - ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నదానికి విరుద్ధంకూడా. ఉపనిషత్తులు "ఓయీ! జీవుడా! నిత్యోదిత చైతన్యస్వరూపుడగు నీకు బంధమెక్కడిది? నీవు సర్వదా అమృత పరమానంద స్వరూపుడవే అని అవి ఎలుగెత్తి చెప్పుచున్నాయి. నేను కూడా, నా స్వానుభవముచే పరమార్థమున బంధమోక్షములు లేవు" అనే ప్రకటిస్తున్నాను.

*"నముముక్షుర్నవైముక్త ఇత్యేషా పరమార్థతః”

యథార్థానికి ముముక్షువు గాని, ముక్తుడు గాని లేరు. ఆత్మ మాత్రమే ఉంది.

Page:544

ఓ ప్రాజ్ఞుడా! రామచంద్రా! "త్రాడును చూచి పామని అనుకోవటం మొదలైన అనేక దృష్టాంతములచే ఈ “కల్పన యొక్క అవస్తుత్వము గురించి ప్రబుద్ధుడైయున్న శిష్యుని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పుచున్నాం. ఇక ప్రబుద్ధుడు కానట్టి అజ్ఞాన శిష్యుని దృష్టిలో పెట్టుకొని బంధము - - బంధవిముక్తి మొదలైన తతంగమంతా విశదీకరిస్తున్నాం. “నాయనా! నీవు నిష్కారణంగా 'నేను బద్ధుడను' అను భావం స్వీకరించావు. నీయొక్క బంధమునకు విచారణయే ఉపాయం. నీవెవ్వరో, ఈ దృశ్యమేమిటో గ్రహించు. తద్వారా మోక్షభాగివి కమ్ము" అని బోధిస్తున్నాం. సర్వము గ్రహించిన తరువాత ఆ అజ్ఞాని .... విజ్ఞాని అగుచున్నాడు. ఇక ఆపై అతనికి బంధమోక్షముల ప్రసక్తి అక్కర్లేదు. అట్టి విజ్ఞాన శిష్యునితో సంభాషించునపుడు బంధ-మోక్షములు లేవు అను పరమ సత్యం సంభాషిస్తున్నాం. తత్త్వవేత్తలకు బంధ-మోక్షముల వ్యామోహం ఉండదు. బంధ మోక్షముల కల్పనంతా అజ్ఞానియొక్క జ్ఞానాభివృద్ధి కొరకేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. అజ్ఞానిని జ్ఞానిగా తీర్చిదిద్దుటయే గురువుల ధర్మము నిర్వర్తిస్తున్న మా కర్తవ్యమైయున్నదికదా! అందుచేత ప్రథమంలో కొంత కల్పన అవసరమై ఉంటోంది. ఈ విషయములన్నీ తత్త్వజ్ఞులు ఎరిగియే ఉన్నారు. ఓ సత్యవ్రతా! రామా! మాయావేష్టితుడగు పరమాత్మ నుండి మొట్టమొదట మనస్సు, ఆ తరువాత బంధ మోక్షముల గురించిన కల్పన, అటుపై ఈ జగన్నిర్మాణం క్రమక్రమంగా ఒక బాలక్రీడవలె రూఢీ పడుతోంది. ఈ స్థితి అంతా బాల వినోదము లోలాగా ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. ఈ జగదృశ్య బాలవినోదం ఎట్లా ఉంటే ఏం? పరమాత్మయే సర్వదా, అన్నిటా వెలుగొందుచున్నాడని గ్రహించు.

3. కథావినోదం

శ్రీరాముడు : మునీంద్రా! బాల వినోదము నందువలె అని అంటున్నారు కదా! అనగా ఏమిటి? ఆ జగదృశ్య-బాలవినోదం" అనబడే చమత్కారమేమిటో చెప్పండి.

శ్రీ వసిష్ఠమహర్షి :బాలకాఖ్యాయిక లేక “బాల వినోదము అను ఒక మాట అధ్యాత్మ శాస్త్రంలో ప్రచారమై ఉన్నది. దాని వెనుక ఒక కథ ఉన్నది. అదేమిటో చెపుతాను. విను.

అనగా, అనగా, ఒక బాలుడు ఉన్నాడు. అతని బుద్ధి ఇది నిజము, ఇది కాదు” అనే విమర్శ చేయలేనట్టిది. బుద్ధి మాంద్యము గల ఆ పిల్లవాడు ఒక రోజు తన దాదితో "అవ్వా! నాకు నిద్ర రావటం లేదే. ఏదైనా రాజుల చరిత్ర వినిపించవూ?” అని అంటూ మారాం చేశాడు.

దాది : సరే, అబ్బాయీ! నీ వినోదం కొరకు ఆనందదాయకము, మధుర శబ్దములతో కూడినది అయిన “ముగ్గురు రాజకుమారుల అనుభవాలు అనే కథ చెప్పుచున్నాను. ఇది విని, నీవు ఎంతో నేర్చుకోవచ్చు.

Page:545

ఒకచోట ఒక నగరము ఉన్నది. ఆ నగరంలో ఇళ్ళు-వాకిళ్ళు-బాటలు-వృక్షములు... ఇటువంటివేవీ లేనేలేవు. ఆ నగరమంతా 'శూన్యము తో మాత్రమే నిండియున్నది. ఆ శూన్యనగరంలో ముగ్గురు రాజకుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు గొప్ప అందగాళ్ళు, ధార్మికులు, వీరులుకూడా! అయితే, ఆకాశంలో ఎక్కడన్నా ఒక చెరువు ఉంటుందా? ఎక్కడన్నా నీళ్ళలో నక్షత్రాలు ఉంటాయా? బాలుడు : అబ్బే! ఉండవు. ఉండవు. ఎట్లా ఉంటాయి?

దాది : అదేవిధంగా, ఆ ముగ్గురు రాజపుత్రులలో ఇద్దరు ఇప్పటికింకా జన్మించనేలేదు. ఇక మూడవవాడు, ఇంకా ఎప్పటికో తల్లి గర్భంలో ప్రవేశించవలసియున్నది.

బాలుడు : అవ్వా! ఆశ్చర్యంగా ఉన్నదే ! అయితే ఆ రాజపుత్రుల గురించి నేను వినాలి. ఎందుకంటే పెద్ద అయిన తరువాత నేను కూడా రాజకుమారుడనౌతాను కదా! అట్లాగే చేస్తాను. వాళ్ళేంచేశారు? దాది : పాపం, దైవవశంచేత ఆ ముగ్గురు రాజపుత్రుల బంధు జనమంతా మరణించారు. అప్పుడు వారు ఎంతో దుఃఖాక్రాంతులయ్యారు. మలిన ముఖంతో ఒకచోట గుమిగూడి, కొంత సమాలోచన తరువాత ఒక నిశ్చయానికి వచ్చేశారు. మనం ఇక్కడ ఇంకా ఉండి ఏం ప్రయోజనం? మన బంధువులంతా మరణించారాయె! ఇక లాభంలేదు. ఈ శూన్యనగరం వదలి ఏదైనా మరొక నగరం వెళ్ళిపోదాం అని అనుకొన్నారు. ఒక రోజు వాళ్ళు బుధ - శుక్ర - శనులవలె ఆ శూన్య నగరం నుండి ఆకాశమార్గంలో బయలుదేరారు. ఆకాశ మార్గమధ్యంలో ఎండవేడిమికి ఎంతో తపించారు. అక్కడ (ఆకాశంలో) వేడి ఇసుకలో నడవటం చేత గుఱ్ఱాల కాళ్ళు కాలాయి. మంద నుండి వేరుపడ్డ మృగములలాగా వాళ్ళు ఎంతో పరితాపం పొందారు.

బాలుడు :ఊఁ! ఆ తరువాత?

దాది : అయినాసరే, వాళ్ళు ఆ ఆకాశంలోని ఇసుకతిన్నెలపై (ఇసుక గట్లపై) ఎట్లాగో అట్లా చాలా దూరం పయనించారు. ఒకచోట వాళ్ళకి మూడు పెద్దచెట్లు కనిపించాయి. ఆ మూడు వృక్షాలు లతలతోను, ఫలములతోను, పుష్పములతోను నిండి ఉన్నాయి. వాటి కొమ్మలు అనేక పక్షులకు ఆశ్రయమయి ఉన్నాయి.

అయితే, ఆ మూడు మహావృక్షములలో రెండు ఇంకా మొలవలేదు. మూడవదానికి ఇంకా బీజం ఏర్పడలేదు.

మన రాజకుమారులు అప్పటికే ఎంతో అలసిపోయి ఉన్నారు కదా! అందుచేత ఆ చెట్ల నీడలలో ఇంద్రుడు - - అగ్ని - వరుణుడులాగా చాలాసేపు విశ్రమించారు. కొంత సేదతీర్చుకొన్నారు. తృప్తితీరా చాలా పండ్లను భుజించారు. పుష్పములను మాలలుగా చుట్టి ధరించారు. బాలుడు : చెట్లే మొలవని ఆ పళ్ళు తియ్యగానే ఉన్నాయా? పుల్లగా ఉంటాయా ?

దాది : అబ్బో! భలే తియ్యగా ఉన్నాయి. ఆ తరువాత చాలాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని మరల బయలుదేరారు. చాలా దూరం వెళ్ళిన తరువాత వారికి ఒకచోట తరంగములచే చంచలమై గొప్ప శబ్దం చేస్తూ ఉండే మూడు నదులు కనిపించాయి.

Page:546

ఆ నదులలో ఒకదానికి గట్లు అనేవి లేనేలేవు. ఇక తక్కిన రెండు నదులలో గట్లే కాదు,.... ‘నీరు’ కూడా ఉండదు.

గంగలో త్రిమూర్తులు స్నానం చేస్తున్నట్లు సూర్యతాపముచే పీడితులైన ఆ మన ముగ్గురు రాజకుమారులు ఆ మూడు నదులలో తీరికగా స్నానాలు చేశారు. ఎంతోసేపు జలక్రీడలాడారు. స్వచ్ఛమైన ఆ నీరు త్రాగి ప్రసన్నులైనారు.

బాలుడు : గుఱ్ఱాలకు నీళ్ళు పట్టారా ? లేదా ? ఊఁ!

దాది :ఆఁహా! గుఱ్ఱాలకు నీళ్ళు పట్టారు కూడా! ఇంతలో క్రమంగా సూర్యాస్తమయం అయింది. వారికి కనుచూపుదూరంలో నూతనంగా నిర్మించబడిన ఎత్తైన భవనములు కలిగిన ఒక నగరం కనిపించింది. ఆ నగరంలో, విశాల నీలాకాశంలో లాగానే, వృక్షాలు-పూమొక్కలు-జలము ఉండనట్టి సుందరవనములు, శూన్యసరోవరములు ఉన్నాయి. ఆ శూన్యసరోవరాలలో అందమైన కమలములు అప్పుడప్పుడే వికసిస్తున్నాయి. దూరానికి నగరవాసులు గానములు వినిపిస్తున్నాయి. ముగ్గురు రాజకుమారులు ఆ నగరంలో ప్రవేశించారు. అక్కడ వారికి అన్నిటికన్నా ఎత్తైన మూడు భవనాలు

కనిపించాయి.

వాటిలో రెండింటికి నేల, పునాదులు లేవు. మూడవదానికి గోడలు కూడా లేవు.

వారు మొదటి రెండు భవనాలను వదలి, గోడలు - నేలకూడా లేనట్టి మూడవ గృహంలో ప్రవేశించారు. ఆ రాజకుమారులు తమ అందమైన ముఖములతో ఆ భవనంలో పచార్లు చేయసాగారు. అట్లా సంచరిస్తూ ఒకచోట బంగారంతో తయారైన మూడు పాత్రలు చూచారు.

ఆ పాత్రలలో రెండు కపాలములవలె అన్ని వైపులా మూసుకొని ఉన్నాయి.

ఇక మూడవపాత్ర ‘చూర్ణం' (Powder) రూపంలో ఉన్నది.

వారు ఉత్తమధీశాలురు కదా! అందుచేత చూర్ణమైన పాత్రనే ఎంచుకొన్నారు. దానితో అప్పటికప్పుడు పదిశేర్లు అన్నమును, తదితర పదార్థములను వండుకొన్నారు. మరి ఆ ముగ్గురూ ఏమన్నా సామాన్యులా? గొప్ప ధర్మబుద్ధి కలవాళ్ళాయ్! అందుచేత వాళ్ళు భోజనం చేయటానికి అతిథులుగా ముగ్గురు బ్రాహ్మణులను ఆహ్వానించారు.

అందులో ఇద్దరికి దేహాలే లేవు. ఒకనికి ముఖము కూడా లేదు.

ఓ బాలకా! వింటున్నావా!

బాలుడు : ఓc! బాగా వింటున్నాను. భలేగా ఉన్నది. ఇంకా చెప్పు. అప్పుడేం జరిగింది? దాది : ఇంకేమున్నది? వారిలో ముఖములేని అతిథి ఉన్నాడు చూచావా? అతడు అన్నములోని చాలాభాగం తినివేశాడు. ఇక మిగిలిన దానిని ఆ ముగ్గురు రాజకుమారులు సుష్టుగా భోంచేశారు. తృప్తిచెందినవారై, అప్పటికీ ఇప్పటికీ కూడా లేనట్టి - భవిష్యత్తులో ఎప్పటికో ఉండబోయే.... ఒకానొక నగరంలో (భవిష్యన్నగరంలో) వేటాడటానికి వెళ్ళారు. వారు నేటికికూడా అట్లే వేటాడుచూ

Page:547

సుఖంగా ఉన్నారు. ఆ భవిష్యన్నగరంలోని మృగాలు - పక్షులు ఆ రాజకుమారులు వేటాడుతూ

ఉంటే - తోడుగా ఉంటూ ఉన్నాయి.

ఓ అబ్బాయ్! ఈ ఉత్తమమైన చరిత్రను మొదటి నుండి చివరిదాకా విన్నావు కదా! ఇది మరిచిపోకూడదు సుమా! దీనిని చక్కగా నీ మనస్సులో పెట్టుకో. అప్పుడు గొప్ప పండితుడవు అవుతావు. సరేనా?

బాలుడు : అవ్వా! అలాగే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీవు నిద్రపో. నేను ఇట్లా ఆ రాజకుమారులను మననం చేస్తూనే పడుకొంటాను.

ఓ రామచంద్రా! నీకు ఇంతకుముందు చిత్తాఖ్యానం" చెప్పానుకదా! ఇప్పుడు, 'ఈ జగత్తంతా మనోవికల్పం మాత్రమే’ అని నిరూపించటానికే దృష్టాంతపూర్వకమైన ఈ 'బాలవినోదం’ చెప్పాను. సంకల్ప - కల్పనలన్నీ దృఢపడటంచేతనే ఈ 'సంసార రచన' అంతా స్థిరత్వం పొందుతోంది. ఈ కల్పనా దృశ్యమంతా ప్రతిభాసా రూపమే. అయినప్పటికీ, ఈ బంధమోక్ష వ్యవహారమంతా విస్తరింప జేస్తోంది. "ఇది ఎట్లా సాధ్యం!" అని ప్రశ్నించుకోకుండానే, ఆ పిల్లవాడు ఆయా సంఘటనలు వింటూ ఎంతగా ఆనందించాడో చూచావా! జీవుడు కూడా ముందు - వెనుకలను పరిశీలించకుండానే ఈ భావములు–అభిప్రాయములు-నిర్వచనములు-సంబంధములు, ఉద్వేగములు (Perceptions, Opinions, Definitions, Relationships, Emotions etc.)” .... మొదలైన వాటిని అవధరిస్తున్నాడు.

ఈ కనపడేదంతా సంకల్పమాత్రమేగాని వేరే ఏమీ కాదు. సంకల్పముచే భాసించేది యథార్థ మెట్లా అవుతుంది చెప్పు? ఇదంతా వాస్తవానికి లేనిదిగా, అనిర్వచనీయంగా చెప్పబడింది. ఈ ఇంద్రియములు, ఇవి గాంచుచున్న భూమి-ఆకాశము-వాయువు-దిక్కులు-పర్వతములు మొదలైన పదార్థజాలం స్వప్నములోని వస్తువులవలె ఊహామాత్రము, అసత్త్యుల్యము అయి ఉన్నాయి. నేనిప్పుడు చెప్పిన భవిష్యన్నగరంలోని ముగ్గురు రాజకుమారులు, నదులు, ముగ్గురు అతిథులు సంకల్ప మాత్రమే’ అయినప్పటికీ, ఆ పిల్లవాడుమాత్రం అంతరంగమునందు ఉత్సుకత, అభిలాష, వికల్పములు పొందుచూనే ఉన్నాడు కదా!

“ఈ జగత్తు యొక్క అనుభూతి అంతా సంకల్పమాత్రమే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే. ఆత్మతత్త్వజ్ఞానము ఎరిగినవారు, జ్ఞానదృష్టికలవారు ఈ సత్యమును గ్రహించగలుగు చున్నారు. వారికి మాత్రమే అది గ్రాహ్యమగుచున్నది. ఇక తక్కినవారంతా 'ఇది సత్యమే' అని భావించుచు, ఒక అనుభవమునుండి మరొక అనుభవమునకు ప్రయాణిస్తూనే ఉన్నారు. అట్టి ప్రయాణమునకు 'అంతు' ఉండుట లేదు. అనేక తరంగములుగా కనబడుచున్నదంతా సముద్ర జలమే అయినట్లు, ఈ స్ఫురించునది, - - మరియు ఇట్లు స్ఫురించుదాని అనుభవము పొందుచున్న ఖండభావన తో కూడిన ద్రష్ట' లేక 'జీవుడు' కూడా సంకల్పమాత్రమే. పరమాత్మ నుండి మొట్టమొదట సంకల్పము మాత్రమే ఉదయించింది. ఆ తరువాత, ఈ "ప్రాణుల యొక్క, మరియు సూర్యుని

Page:548

యొక్క దైనందిన క్రియలచే 'కాలము' విస్తరిస్తోంది. క్రమంగా ఆ కాలమును అనుసరించి ఈ జగద్రూపమంతా విస్తారం పొందుతోంది.

కాబట్టి రామా! ఈ ప్రపంచమంతా సంకల్పరూపమే. మనోవికారములు, రాగద్వేషవృత్తులు, వాటికి సంబంధించిన తదితర విషయములు - ఇవన్నీ సంకల్పమాత్రమే. కనుక, నీవు నిర్వికల్ప (వికల్పములు లేనట్టి) సమాధి (మానసిక సుస్థిరత) ను ఆశ్రయించు. అనగా, సర్వసంకల్పములకు ఆవల గల స్వస్వరూపమును అభ్యసిస్తూ-ఆస్వాదిస్తూ ఉండు. సర్వసంకల్పములనుఅధిగమించిన వాడవై ఉండు. అట్లు సంకల్పములను త్యజిస్తే ఇప్పుడే, ఇక్కడే, ఇదంతా ఇట్లు ఉంటూ ఉండగానే నీవు పరమశాంతిని పొందగలవు.

4. నీకెక్కడి బంధం? నిదురలే!

అజ్ఞాని తన యొక్క సంకల్పవశం చేతనే మోహితుడగుచున్నాడు. జ్ఞానికో, మోహమే ఉండటం లేదు. ఆహాఁ! అజ్ఞుడు, నాశరహితమగు పరమాత్మ యందు క్షణభంగురము, భావనాను సరణము, అనుక్షణ పరిణామయుతము అగు 'జగత్తు' అనబడు దానిని మనస్సు యొక్క సంకల్పం చేత గాంచుచున్నాడు. భ్రాంతిని పొందుచున్నాడు.

శ్రీరాముడు : ఓ బ్రహ్మవిద్వరా! ఈ ఆత్మ మహామోహమయమగు సంసార భ్రమను దేని వలన పొందుతోంది? "నశ్వరము, అగు సంకల్పములను కల్పన చేస్తున్నదెవరు? నిత్యాత్మ చేస్తోందా? లేక నశ్వరాత్మ చేస్తోందా? జగత్పారవస్యమును పొందుతోంది నిత్యాత్మయా! నశ్వరాత్మయా?

అహంకారమా?

నిత్యాత్మ చేస్తోంది అనటానికి వీలు లేదు. అట్లా అంటే సంకల్పముతోబాటు అదీ నశించాలి. అప్పుడు ఆత్మయొక్క నిత్యత్వానికి హాని కలుగుతుంది కదా!

ఇక నశ్వరాత్మ తన సంకల్పముచే తనను రచించుకొంటోంది అని ఎట్లా అంటాము? అట్లా అంటే, ఆత్మను మరొకటేదో వచ్చి ఆశ్రయించుచున్నట్లు అవుతుంది కదా? అది కూడా వేదవాక్యములకు సరిపోదు. సంకల్పితమగు నశ్వరాత్మ జడమా? చేతనమా? జడము' అని అంటే, అది చిదాత్మతో ఐక్యం ఎట్లా పొందుతోంది? 'చేతనము' అందామా? చిద్వస్తువు నిష్క్రియము కదా! అది ఎట్లా సంకల్పిస్తుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : పరమాత్మ 'అహం' అను అనుభవరూపముగల అవిద్యతో కూడుకొని ఈ సర్వప్రాణులందు ఉండిఉన్నాడు. బాలుడు దయ్యములను హృదయంలో కల్పించుకొని వాటిని బాహ్యమున చూస్తాడు చూచావా? అట్లే ఆ పరమాత్మ ఈ నశ్వర సంకల్పాత్మకులగు ప్రాణులను

*నశ్వరము : ఏ క్షణమునందునూ నిలకడయే లేనట్టిది; ఎప్పటికప్పుడు మార్పుకు లోనగునట్టిది.

Page:549

మిథ్యా రూపములుగానే కల్పించుకొని దర్శించుచున్నాడు. ఒకే పరమాత్మయందు అంతయు స్థిర పడియున్నది" అనునది నిర్వివాదాంశము. ఇక అహంకారము" అనబడునది వేరొకటి ఎట్లా ఎక్కడ ఉంటుంది? వాస్తవానికి పరమాత్మ భేదరహితుడు. భేదరహితుడగు పరమాత్మ యందు అహంకారము' అనునదే లేదు. అతడు సర్వదా అఖండుడే. కాని మండుటెండలో మృగతృష్ణ కనబడునట్లు, స్వతహాగా ఏమాత్రం లేనట్టి అహంకారము భ్రాంతిచే భాసించుచున్నది. ఏది భ్రాంతి మాత్రమే అయి ఉన్నదో అట్టిదానిని ఇది అసత్యమే కదా!" అనే దృష్టిచే దర్శించటమే జ్ఞానం. అనిత్యమైన దానిలో నిత్యాత్మే దాగి ఉన్నది. నిత్యాత్మలోనే అనిత్యమైనది కనబడటం జరుగుతోంది. జలము తనయందు తానే 'తరంగము' రూపమున వ్యక్తమగుచున్నది కదా!

ఆత్మానాత్మనమాశ్రిత్య, స్ఫురత్యతః యథా అంబసా”

ఈ ఆత్మ తనను తానే (మనస్సు రూపమున) ఆశ్రయించినదై, అటుపై తానే కార్యరూపమగు, (As an Eventuality) ఈ జగత్తుగా ప్రకటితమగుచున్నది అని మేము ఈ జగత్తు విషయమై గ్రహిస్తున్నాం. కనుక ఓ విజ్ఞానఖనీ! రామచంద్రా! అసద్విషయము, (that which is not infact true) గురించిన భ్రాంతిని నీవు త్యజించు. ఇక అహంకారము విషయానికి వస్తే ...... జాగ్రదహంకారం స్వప్నంలో లేదు. స్వప్నాహంకారం సుషుప్తిలో లేదు. కనుక అహంకారం స్వతహాగా లేదు. స్వతహాగా లేనట్టి ఈ అహంకారమును చూచి, "అయ్యో! దీనిని నేను ఎట్లా తొలగించుకోవాలి? అనే భ్రమాత్మక మైన ప్రయత్నము అనవసరం. అసత్యమును అసత్యముగానే దర్శించు. సత్యస్వరూపము, ఆనంద మయము అగు 'సమ్యక్ దర్శనము' (Perception of Equality in all) నే ఆశ్రయించు. అట్టి సమ్యకిస్థితియే పరమాత్మ యొక్క స్వరూపము.

అజ్ఞానరహితుడవై సునిశితమైన బుద్ధిచే ప్రయత్నపూర్వకంగా ఆత్మతత్త్వ విచారణ చేయటమే ఉచితం. అసద్వస్తువు గురించి ప్రయత్నము, అనగా,“ఈ నా అహంకారము తొలగించుకొంటాను” అనే అభినివేశము ఉచితం కాదు.

అబద్ధో బద్ధ ఇత్యుక్త్వా కిం శోచసి ముధైవహి? అనంతస్య ఆత్మతత్త్వస్య కిం, కథం, కేన బద్ధ్యతే?

ఓ రామచంద్రా! ఓ సర్వజనులారా! మీలో ఏ ఒక్కరు బద్ధులు కానేకారు. మరి మీరు నేను బద్ధుడను. విముక్తి ఎప్పటికి? అని తలచుచూ ఎందుకు అనవసరంగా దుఃఖిస్తున్నారు? మీ అందరి వాస్తవస్వరూపము ఆత్మయే కదా! అనంతమగు ఆత్మ ఎవనిచే ఎట్లు బంధింపబడగలదు? ఆహాఁ! భేదరహితమగు పరమాత్మయందు భేదాభేదముల గూర్చిన భ్రాంతి కల్పించబడుచున్నది. తొలగవలసింది భ్రాంతి మాత్రమే. భ్రాంతి తొలగగానే, ఇక బంధమేమిటి? ముక్తి ఏమిటి? ఆత్మ యందు వాస్తవానికి ఈ దేహాదులు లేవు. అది దేహరహితమే అయినప్పటికీ, దేహముతో కూడి యున్నట్లు కనిపించుచున్నది. ఈ దేహము ఛిన్నాభిన్నమవవచ్చు గాక! ఆత్మకు వచ్చే హాని ఏమీ ఉండదు. భేదా భేదములు, తదితర వికారములు ఈ శరీరమునకే గాని, ఆత్మకు ఉండవు. ఈ

Page:550

దేహము నశించవచ్చు. లేక, అనేక గాయములచే, పుండ్లచే నిండిపోవచ్చు. ఎంతో బలం పుంజుకో వచ్చు. లేక క్షీణించవచ్చు. ఇవన్నీ ఆత్మకు సంబంధించినవే కావు. కంసాలి (లేక వడ్రంగి) ఉపయోగించే కొలిమివద్ద ఉండే తోలుతిత్తి చిరిగిపోవటం జరిగితే అందలి వాయువుకు ఏమైనా హాని కలుగుతుందా? సూర్యకిరణములు గోడపై పడుచున్నప్పుడు, ఆ గోడ నేలకూలటం జరిగితే సూర్యకిరణములు పోగొట్టుకున్నదేముంటుంది? ఈ దేహము యొక్క మరియు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములచే ద్రష్టలగు మనకు వచ్చే హానిగాని, లోపముగాని ఏమీ ఉండదు. "నేను శరీరము కంటే విలక్షణ స్వరూపము కలవాడను. అట్టి నా యొక్క స్వరూపమునకు ఈ శరీరాదులవలన, తదితర భావాదులవలన కలిగే మార్పు చేర్పులేమి ఉంటాయి?" అనియే మనం భావించాలి. ఓ రామా! దేహము-ఆత్మ ఈ రెండింటికీ సంబంధము మేఘము - ఆకాశము ల సంబంధము వంటిది మాత్రమే. ఈ జగద్రూపమంతా మనస్సే. మనోరూపమగు ఈ జగత్తు యొక్క అంతర్లీనశక్తి చిదాత్మయే. ఆ చిదాత్మ మనస్సు కంటే కూడా అతి సూక్ష్మమైనది. అది ఎన్నటికీ నశించేది కాదు.

ప్రజ్ఞాస్వరూపమునకు జనన నాశనాది వికారములు ఉండవు. అది ఎచ్చటికీ పోదు. ఎక్కడి నుండి రాదు. ఆత్మ” సర్వవేళల అవినాశి అయిఉండగా, ఇక ఈ దేహాదుల వినాశమునకు ఎందుకు దుఃఖితులం కావాలి? ఒక మేఘం నశిస్తే, దానిని తాకుచున్న వాయువు ఏమౌతుంది? శ్రీ రాముడు : మరొక మేఘమును తాకుతుంది. లేదా, ఆకాశమును పొందుతుంది.

శ్రీ వసిష్ఠ మహర్షి : అంతేగాని, మేఘము నశించినంతమాత్రం చేత, దానిని తాకుచున్న వాయువు నశించదు కదా! ఈ దేహము నశించటం జరిగినప్పుడు బద్ధాత్మ మరొక దేహమును పొందుతుంది. ‘ముక్తాత్మ’ అయితే పరమపదమునే పొందుచున్నది. ఇందులో దుఃఖించవలసిన విషయమేమున్నది? ఈ సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటున్నట్టి జీవుని మనస్సే శాశ్వతమై ఉంటూ ఉంటుంటే, ఇక, ఆత్మ విషయం వేరుగా చెప్పాలా?

నాశనభూతమగు ఈ దేహమునకు అవినాశియగు ఆత్మకు ఉన్న సంబంధం, కుండ బదర న్యాయము వంటిది.

ఒక కుండలో ఒక ఫలము వున్నది. ఏదో ప్రమాదవశాత్తు ఆ కుండచిట్లిపోయింది. అంతమాత్రం చేత ఫలము నశిస్తుందా? శరీరము నశించినప్పుడు ఈ జీవాత్మ చిత్తాకాశమును పొందుచున్నది. అట్లాగే, పగిలినప్పుడు కుండలోని ఆకాశము ఏమౌతోంది? కుండలోపల, కుండ బయట కూడా ఉన్నట్టి మహాకాశముతో లీనమగుచున్నదికదా! అసలు, "కుండలోని ఆకాశము కుండ పగులుటచే బాహ్యాకాశమున లీనమగుట" అనునది మాత్రం ఎక్కడున్నది? ఆకాశమంతా సర్వదా అఖండంగా ఉండి ఉన్నదికదా! చిత్తము కూడా క్షయించినప్పుడు ఈ జీవుడు అఖండుడు అగుచున్నాడు. మహాకాశ స్వరూపుడుగా వెలుగొందుచున్నాడు.

ఈ ప్రాణుల యొక్క మనోమయదేహము 'మృత్యువు' అనే వస్త్రం కప్పుకొని 'దేశ-కాలములు’ అనే ప్రదేశము లందు దాగుకొనుచున్నది. ఆత్మ వస్తువుకు చిత్ర విచిత్రములైన రంగులను

Page:551

పూయుచున్నది. ఇట్టి మోసయుక్తమైన మనస్సు గురించి నీవు తపించవలసిన పనేమున్నది? ఇక మరణము మాటేమిటంటావా? పాపం అనేక గృహవ్యవహారములందు నిమగ్నమైన ఈ జీవుడు అంతిమశ్వాస సూచితమగు మరణమువరకు 'ఆత్మ' యొక్క స్వభావమేమిటో, ఎంతటిదో ఎరుగకయే ఉంటున్నాడు. తనపై తనకే సమగ్రమైన అవగాహన లేకుండుటచే అనేక భ్రమలకు లోనగుచున్నాడు. ఆత్మ మరుగునపడుటయే మరణము. ఆత్మను ఎరుగనట్టి మూర్ఖుడు మాత్రమే "అయ్యో! నేను చచ్చుచున్నాను అనే భావావేశము పొంది 'మరణము' అనుదానిని గాంచుచున్నాడు. ఆత్మయే స్వరూపముగా గలిగిన నీకుగాని, నాకుగాని, మరింకెవ్వరికిగాని మరణమనేదేదీ లేదు. మనమంతా అమృతానంద స్వరూపులమే. నిత్యత్వము, అప్రమేయత్వము మన సహజ స్వభావమే అయిఉన్నది. మరిక మరణము గురించి భయమెందుకు? ఈ మరణమనునది జీవునియొక్క ప్రారంభముగాని, అంతముగాని కాదు. లోకంలో ఎవరైనా నేను లేకుండా పోవుచున్నాను అను అనుభవం పొందు చున్నారా? అట్టిది ఎవరూ గాంచుటలేదు. జ్ఞాని తన యొక్క శరీరము తొలగినపుడు 'స్వసత్త' (Self State with the sense - "I exist") ను అనుభవిస్తూనే ఉన్నాడు. కనుక అతనికి మరణానుభవం లేదు. వాసనలతో కూడిన అజ్ఞానియొక్క మనస్సు జన్మలను, మృత్యువులను ఎప్పటికప్పుడు పొందుచూ, అనుభవిస్తూనే ఉన్నది. కనుక, 'మరణము'-అతని విషయంలో మరొక దేహమునకై నంది’ పలుకుటయే అగుచున్నది.

రెక్కలు వచ్చిన తరువాత పక్షి గూటిలో ఇక ఉండదుకదా! అట్లాగే నీవు ఈ 'వాసనలు' అను గూటిని త్యజించివేయి. మనఃశక్తియే ఇష్ట- అయిష్ట వస్తువులందు, రాగ ద్వేషములు కలిగి ఉంటున్నది. తద్వారా బంధమున తగుల్కొనుచున్నది. స్వప్నంలోలాగా, మనస్సు భ్రాంతి చేతనే ఈ 'కల్పన' అంతా వ్యర్థంగా చేసుకొంటోంది. ఇది అవిద్యారూపమే కదా! కాబట్టి ఈ మనస్సును నశింపజేయటం సుఖప్రదం. ఇది అభివృద్ధి పొందుచున్నప్పుడు దుఃఖమే కలుగుచున్నది.

‘మనస్సు వృద్ధి పొందుట' అనగా అవివేకము పరిఢవిల్లుటయే.

శ్రీ రాముడు : ఈ మనస్సు నిరంతరం తుచ్ఛత్వం, మలినత్వం ఆశ్రయిస్తోందే? ఎందుచేత? దీనిని నిరోధించటం ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి : తత్త్వజ్ఞానముయొక్క అల్పత్వము' చేతనే ఈ మనస్సు మిథ్యారూపమైనట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తోంది. మంచుతోను, మేఘములతోను కప్పబడినప్పుడు ఆకాశము మలినమైనట్లు కనబడుతుంది. కాని, వాస్తవానికి ఆకాశము సర్వదా నిర్మలమైనదే కదా! స్వతహాగానే స్వచ్ఛమే అయినట్టి ఆకాశము మలినమొనర్చగలిగేది ఏది ఉన్నది చెప్పు? ఇక ఈ మంచు, మేఘములు అంటావా అవన్నీ వస్తూ, పోతూ ఉంటాయి. అంతమాత్రంచేత అవి ఆకాశమును తాకలేవు, మార్చలేవు కదా! భ్రాంతిచేతనే నీ మనస్సు నేను సహజంగా తుచ్ఛమైనదానను. మలినమైన దానను అని భావించుచున్నది. అది ఏమాత్రం వాస్తవం కాదు.

#

Page:552

మానసిక శక్తియే దీర్ఘస్వప్నము వంటి మిథ్యారూపమగు ఈ జగద్వైచిత్ర్యమంతటి నీ సత్యమైనదానివలె కల్పన చేయుచున్నది. ఒక చిన్న దృష్టాంతము విను. ఒకని కంటికి తిమిర-రోగము’ (a disease that leads to constant movement of eye-lids) అనే వ్యాధి వచ్చినదనుకో అప్పుడాతడు ఆకాశంలో రెండు చంద్రులను, రెండు సూర్యులను చూస్తాడు.

1) రెండు చంద్రులు కనబడుటకు కారణం? చంద్రుడా? కాదుకదా! కంటియొక్క దోషమే అట్లు కనబడుటకు కారణమగుచున్నది.

2) రెండవది దృష్టిదోషమును ఆశ్రయించి ఉన్నప్పటి భావనామాత్రవైచిత్ర్యమే కదా! అంతేకాని, సత్యం కాదు కదా!

మానసిక శక్తియే జగత్తుయొక్క ఆకారమును భావనామాత్రంగా గాంచుచున్నది. కనుక ఈ జగత్తు యొక్క కర్తృత్వమును మనస్సుకే ఆపాదించక తప్పదు. రెండు చంద్రులు కనబడుటకు చంద్రుడు కారణం కానట్లు ఈ జగత్తుల స్థితికి ఆత్మకారణం కాదు. దృశ్యము కూడా కారణం కాదు. ఉన్నదంతా ద్రష్టయొక్క మనోరాజ్యములోనే ఉన్నది.

ఓ రామా! సూర్యుడు తన తీక్ష కిరణాలతో మంచును కరిగించివేస్తాడు చూచావా? నీవుకూడా ఆత్మవిచారణచే మనస్సుయొక్క స్వరూపమును నశింపచేయి. తత్త్వవిచారణచే చిత్తము లయంకాగా, "నిర్మలాకాశం లాగా ఆత్మసాక్షాత్కారం తప్పక సిద్ధించగలదు. ఓ సర్వసభికులారా ఆత్మతత్త్వము ఎరుగకపోయారా .... అనేక అనర్థములు కలిగించగల అవిద్య పలువిధములైన జన్మలకు, అనేక రకములైన బ్రహ్మాండముల అనుభవమునకు కారణం కాగలదు.

ఈ మనస్సు ఆత్మను ఆశ్రయించటం జరుగుచున్నప్పుడు తనను తానే వివేక - వైరాగ్యములచే నాశనము చేసుకొంటోంది. అందుకే కవులు, మనస్సు ఆత్మను సమీపిస్తున్నప్పుడు స్వసంహార నాటక పాత్ర ధరించి నృత్యం చేస్తోంది" అని వర్ణిస్తూ ఉంటారు. తనయొక్క నాశనము కొరకే ఇది ఆత్మను దర్శించుచున్నది. ఆత్మ ప్రాప్తించనంతకాలం తన నాశనము ఎట్లా సాధ్యమో తానే ఎరుగలేకపోతోంది. దుర్బుద్ధికలవాడు తాను పొందుచున్న సంకటములకు, దౌర్బల్యములకు తానే కారణం అని ఎరుగలేడు చూచావా? ఇది కూడా అట్టిదే. ఏ వివేకులైతే మనోనాశనమును వాంఛించు చున్నారో, అట్టివారి అభీష్టమును ఈ మనస్సు తప్పక, సంకల్పబలమును అనుసరించి, సిద్ధింప చేస్తోంది. కాబట్టి ఈ మనస్సు ఆత్మయొక్క ఇచ్ఛను అనుసరించే ప్రవర్తిస్తోందని గ్రహించు. ఆత్మకు ఇచ్ఛగల వ్యవహారములను నిర్వర్తించటంలో ఈ మనస్సుకు క్లేశమేమీ ఉండదు. వివేకము, ఉత్తమ సంస్కారములు గల చిత్తము తన యొక్క వివేకబలమును అనుసరించి ఇతఃపూర్వపు సర్వసంకల్ప వికల్పములను త్యజించివేస్తోంది. ఆశలన్నిటినీ వదలుచున్నది. అప్పుడిక సహజంగానే బ్రహ్మాకారవృత్తి కలిగి ఉంటోంది.

నస్సు లయించినప్పుడు పరమపురుషార్థమగు మోక్షము స్వయముగానే సిద్ధించుచున్నది.

Page:553

మనస్సుకన్నా ముందే స్వసత్తస్వరూపుడనై నేను ఉండనే ఉన్నాను అను ఎరుక, అట్టి ఎరుకతో కూడిన సుస్థిరస్థితియే 'మనోనాశనము' అనే శబ్దముచే చెప్పబడుతోంది, ఉద్దేశించబడుతోంది కూడా! మనస్సు కన్నా (ఆలోచనల కన్నా) ఆ ఆలోచనలు చేయుచున్నవాడు మునుముందుగానే ఉండాలి కదా! అతడే ఆత్మ యొక్క ఉనికికి తార్కాణం. అతని గురించిన మననమే ఆత్మోపాసనమోక్షస్థితి కూడా".

అట్టి మోక్షస్థితిలో దుఃఖములన్నీ శమించుచున్నాయి. కనుక ఓ రాఘవా! అట్టి మనోనాశనము కొరకే నీవు ప్రయత్నించాలి. అంతేగాని.... మనోవిస్తృతి, విస్తరణ- కొరకు నీ ప్రయత్నములను వ్యర్థం చేసుకోరాదు సుమా! సంసారమనే ఘోరారణ్యం మిక్కిలి దట్టమైనది. ఈ అరణ్యంలో 'సుఖ

- దుఃఖములు అనే అసంఖ్యాకములైన వృక్షములు, 'మృత్యువు' అనే కొండచిలువ నివసిస్తున్నాయి. ఈ అరణ్యమునకు అవివేకముతో కూడిన మనస్సే ప్రభువు. అన్ని విపత్తులకు అవివేకమే హేతువు. కనుక జాగరూకుడవై ఉండాలి సుమా!

Page:554

IX.మహేంద్రజాలం

పరిచయము

1. చిత్త విన్యాసము - - జగద్రూపము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ సభికులారా! ఇక మనం తొమ్మిదవ రోజు విచారణలో ప్రవేశిస్తున్నాం.

సముద్రంలో తరంగాలు ప్రకటితమౌతాయి చూచారా? పరమాత్మయందే ఈ చిత్తము ప్రకటితమై, క్రమంగా విస్తారమగుచున్నది. అది అల్పకాలంలో హ్రస్వమును దీర్ఘంగాను, దీర్ఘమును హ్రస్వంగాను చేసివేయుచున్నది. తన రూపమును అన్యముగాను, అన్యమైనదానిని తన రూపముగాను ఒక్క క్షణంలో మార్చివేయుచున్నది. ఆత్మను 'అనాత్మ' గాను, 'అనాత్మ' ను ఆత్మగాను అనుభవించు చున్నది. ఈ చిత్తముయొక్క వైచిత్రము, చమత్కారము అంతటిది. అది తాను చూడని వస్తువును కూడా తన భావనచే అత్యంత ఘనీభూతముగా పొంది అనుభవించగలదు.

బ్రహ్మ చైతన్యమునుండి వికాసము పొందిన ఈ మనస్సు ఒక్క నిమిషంలో అనేక బ్రహ్మాండము లను నిర్మించుచూ, మరల వినాశనమొనర్చగలదు. రాఘవా! స్థావరజంగమములతో (Non-moving, moving) కూడిన ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా చిత్తమునుండే ఆవిర్భవిస్తోంది సుమా! అట్లు ఆవిర్భవించి దేశ-కాల-క్రియా శక్తులచే సర్వదా పూర్ణమై ఒప్పుచున్నది. ఒక నటుడు అనేక వేషములు వేయుచున్నట్లు ఈ మనస్సు తన చంచలత్వకారణంగా ఎల్లప్పుడు భావనా శక్తిచే సత్యమును మిథ్య గాను, మిథ్య' ను సత్యముగాను చేసివేయగలుగుతోంది. స్వయంకల్పితోపార్జితమైన అనేక సుఖ-దుఃఖములను స్వీకరించి అనుభవిస్తోంది. అది దేనిని సుఖముగా భావిస్తే అది సుఖము గాను, దేనిని దుఃఖంగా భావిస్తే అది దుఃఖముగాను పొందుచుండుట గమనార్హం. ప్రాప్తించిన వస్తువులను, విషయములను ఎప్పుడు ఏవిధంగా ('అనుకూలం' అనో, లేక 'ప్రతికూలం' అనో) గ్రహిస్తుందో, అప్పుడు ఈ కాళ్ళు-చేతులు-చెవులు ....మొదలైన ఇంద్రియాలన్నీ అట్లే ప్రవృత్తం అగుచున్నాయి. ఇది సుఖరూప ఫలము -ఇది దుఃఖరూప ఫలము అని ఏ క్రియను ఈ చిత్తము సంకల్పించి ఆచరిస్తుందో, అది అట్లే పరిణతి చెందటం జరుగుతోంది. పిల్లలు ఇంటిలో మట్టితో అనేక బొమ్మలు తయారుచేసి ఇది రాజు-ఇది రాణి-ఇది మంత్రి-ఇవి సైనికులు- ఇవి శత్రురాజులు -ఇవి శత్రురాజుల గుఱ్ఱాలు .... అని కల్పనచేసుకొని ఆడుకొంటారు చూచావా? అదేవిధంగా ఈ మనస్సు కూడా ఈ ఈ 'జగత్తు' అనే వికల్పములన్నీ నిర్మించుకొని క్రీడించుచున్నది. అట్టి క్రీడలోనే నవ్వటం, ఏడ్వటం, సుఖించటం, దుఃఖించటం, గర్వించటం, అవమానపడటం, కోపించటం... మొదలైన అనేక క్రియలు నిర్వర్తిస్తోంది. మనస్సుయొక్క సృజనాత్మకమైన 'బాలక్రీడ’ యందు ఈ

Page:555

మనుజుల దేహములు, తదితర దేహములు మట్టితో చేసిన ఆటవస్తువుల వలె ఉంటున్నాయి. అట్టి మట్టి ప్రతిమల వంటి తదితర దేహములందు, “ఇవన్నీ సత్యమే” అను సత్యత్వబుద్ధి చిత్తముచే కల్పించబడుచున్నది. కాని ఇదంతా మిథ్యయే అయి ఉన్నది. ఆహాఁ! ఈ చిత్తము పదార్థములన్నిటి యందు అనేక మార్పులను కలుగజేయుచూ, భేదమును ప్రదర్శించుచున్నది. స్వప్నము నందు, సంకల్పము నందు, మనోవీథియందు ఈ చిత్తము దీర్ఘకాలమును స్వల్పంగాను, అనేక యోజనముల దూరం బెత్తడంతగాను చేసివేస్తోంది. ఓ రామా! సూక్ష్మబుద్ధి కలిగియున్నవాడవై, ఈ చిత్తముయొక్క చిత్ర విచిత్ర కథనమంతా గమనించుచూ ఉండు.

మనస్సు క్షణమును కల్పంగాను, కల్పమును క్షణంగాను చేసివేయగలదు. అందుచేతనే “దేశకాలములు మనస్సుచేతనే భావించబడుచున్నాయి. అట్టి భావనయే 'అనుభవం' అగుచున్నది. అందుచేత అవి మనస్సుయొక్క అధీనంలోనే ఉన్నాయి" అని విజ్ఞులు చెపుతూ ఉంటారు. ఈ మనస్సు రజోగుణమును అధికముగా ఆశ్రయిస్తున్నప్పుడు తీవ్రమైన కార్యశీలత్వమును, తమోగుణం అధికంగా కలిగియున్నప్పుడు మందత్వమును పొందుతోంది. ఏ కార్యమునందైతే ఈ మనస్సు అధికంగా ప్రసరించి ఉంటోందో ఆ కార్యము ఆ రీతిగానే తప్పక సిద్ధిస్తోంది. దేనియందైతే ఈ మనస్సు మందకొడిగా ఉంటుందో, అట్టి కార్యక్రమము కష్టసాధ్యముగాను, అయిష్టముగాను తోచుచూ ఉంటుంది. మనస్సు యొక్క ఏకాగ్రత ఆత్మ సందర్శనాయుతంగా ఉన్నదా; ... ఇక, సర్వ విలంబనము లను ఈ జీవుడు తప్పక అధిగమించగలడు. చెట్టునుండి కాండములు, ఆకులు, పూలు, మొదలైనవన్నీ వస్తున్నట్లు, ఈ భ్రమలు, వ్యామోహములు, దేశకాలాదులు, గమనాగమనములు - - ఇవన్నీ చిత్తము నుండే బయల్వెడలుచున్నాయి.

అగ్ని” అంటే ఉష్ణత్వమే ఉష్ణత్వమే అయి ఉన్నది కదా!

సముద్రము’ అనగా జలము మాత్రమే కదా!

ఈ వివిధ సాంసారిక కార్యక్రమమంతా సంకల్పముల రూపమగు చిత్తమే అయి ఉన్నది. ఈ "ద్రష్ట - దృశ్యము - దర్శనముకర్త - కర్మ - కరణములు”, “భోక్త - భోగ్యము - భోగములు.... ఇట్టి అనర్ధములతో కూడుకొనియున్న ఈ జగత్తంతా చిత్తము మాత్రమే. మరింకేమీ కాదు. ఒక కంసాలి ఆభరణ విశేషము చూడకుండా, "ఈ నగలోని బంగారము ఎట్టిది?" అని మాత్రమే చూస్తాడు కదా! వివేకులు ఈ జగత్తును గాంచుచున్నప్పుడు, ఆహాఁ! ఈ బ్రహ్మాండములు, ఈ లోకములు, ఇందలి వస్తుజాలములు ... ఇవన్నీ చిత్తము యొక్క విన్యాసములే. చిత్తమే ఇట్లు ప్రకటితం అవుతోంది అని వారు గ్రహిస్తున్నారు.

ఈ సందర్భంలో మరొక చమత్కారమైన సంఘటన చెపుతాను. ఇందులో జగద్రూపముగా కనిపిస్తున్న ఈ ఇంద్రజాలమంతా చిత్తము యొక్క అధీనములోనే ఉన్నది" అని నిరూపించబడుచున్నది.

Page:556

2. సభామధ్యంలో మహేంద్రజాలం

ఈ భూతలంలోగల "ఉత్తరపాండవము అనే రాజ్యమును హరిశ్చంద్రుని వంశములోని వాడైన 'లవణుడు' అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని యొక్క శౌర్యము, ఉదారగుణము, వినయములను ఇంద్రలోకవాసులు కూడా మెచ్చుకొంటూ ఉండేవారు.

ఒకరోజు అతడు రాజసభలో సింహాసనం అధిష్ఠించియున్నాడు. ఏవేవో రాజవ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఐంద్రజాలికుడు ఆ సభలో ప్రవేశించాడు. వేషభాషల విషయంలో గొప్ప ఆడంబరములను ప్రకటిస్తూ లవణమహారాజుకు ప్రణామం చేసి "ప్రభూ! తమ అనుజ్ఞ అయితే నా ఇంద్రజాల విద్య ప్రదర్శించి మీకు, మీ ప్రజలకు వినోదం కలిగిస్తాను అని విన్నపం చేసుకొన్నాడు. అప్పటికే ముఖ్యమైన రాచకార్యాలన్నీ పూర్తి అయినాయి. అక్కడి వారందరి మనస్సులు వినోదించాలని అభిలషించాయి. అందుచేత రాజాజ్ఞానుసారంగా ఇంద్రజాల ప్రదర్శన ప్రారంభించ బడింది. కొంచెము సేపు అవీ - - ఇవీ చూపిన తరువాత ఆ ఐంద్రజాలికుడు రాజసింహాసనమునకు కొంచము దూరంలో నిలబడ్డారు. తన చంకకు తగిలించియున్న సంచిలోంచి ఒక నెమలి పింఛం బయటకు తీశాడు. అది అనేక రంగులతో వెలుగొందుచు, ఈశ్వర మాయవలె భ్రమను గొలుపుచున్నట్లు ఉంది. రాజు యొక్క దృష్టి అసంకల్పితంగా ఆ పింఛముపై కేంద్రీకరించబడింది. వివిధ కాంతులు విరజిమ్ముతున్న ఆ పింఛమును ఐంద్రజాలకుడు గాలిలో చిత్రమైన విన్యాసంతో అటు ఇటు ఊపాడు. రాజు కళ్ళు అనాలోచితంగా మూతబడ్డాయి.



అప్పుడు ఒక రౌతు (Horse Rider) ఆ సభలో ప్రవేశించాడు. అతని వెంట ఒక పంచకళ్యాణ లక్షణములు గల గుఱ్ఱం నడచివచ్చింది. ఆ గుఱ్ఱం అత్యంత సౌందర్యముగాను, శాంతగుణమును కలిగినదై ఉన్నది.

రౌతు : రాజా ! ఇది అశ్వములన్నిటిలో శ్రేష్ఠమైన పంచకళ్యాణి - తెల్లగుఱ్ఱం. బహుప్రావీణ్యం గల ఈ గుఱ్ఱం వాయువేగంతో పరుగెత్తగలదు. మా ప్రభువు దీనిని మీ కోసం పంపించారు. మహాత్ములకు సమర్పించబడినప్పుడు అట్టి పదార్థములు మరింత శోభిల్లుతాయి కదా!

ఐంద్రజాలికుడు : ఔను ప్రభూ! మీరీ అశ్వమును అధిరోహిస్తే సూర్యభగవానునిలాగా స్వయంప్రకాశం తో వెలుగొందుతారు. భూమిపైకి విచ్చేసిన ఇంద్రభగవానునిలాగా మీరు ఈ గుఱ్ఱము పై కొంతసేపు స్వారీ చెయ్యండి. దీనిని మీ కొరకే తీసుకొచ్చాం!

రాజు ఆ గుఱ్ఱమును చూచి, దాని సౌందర్యమునకు ఎంతో ఆశ్చర్యచకితుడైనాడు.

అనాలోచితంగా కళ్ళుమూసుకున్న ఆ రాజు ఇంతలోనే ఒక్క క్షణంలో విచిత్రమైన ఆకృతి కలవాడయ్యాడు. గోడ మీద చిత్తరువులో లిఖించబడిన పురుషుని యొక్క తెరచియున్న కన్నులువలె

Page:557

తదేకదృష్టితో అవలోకించసాగాడు. అట్లాగే కొద్ది క్షణాలు ఉండి నెమ్మదిగా కనులు మూసుకొన్నాడు. సింహాసనముపై కూర్చుని ఉండియే చేష్టారహితుడైయ్యాడు. ఒక రాగరహితుడగు మునీశ్వరుడు అంతర్ముఖుడై ఆత్మానందము పొందుచున్నప్పుడు ఎట్లా నిశ్చలంగా ఉంటాడో, అతడు కూడా అట్లే ఉండిపోయాడు. గొప్ప బలశాలి, స్వబుద్ధిచే అత్యంత సునిశితమైన దృష్టిగలవాడు అయిన ఆ రాజు ధ్యానాసక్తుడై ఉన్నాడని అక్కడివారు తలచారు. చాలాసేపైన తరువాత మంత్రులు కొందరు సింహాసనము నకు సమీపంగా వెళ్లి నిలుచున్నారు. మహాధీశాలి అయిన ఆ రాజును సమీపించటానికి, తాకటానికి అక్కడివారెవ్వరికీ ధైర్యం చాలటం లేదు. వింజామరలు కదలటం మానివేశాయి. వింజామరలు వీచే స్త్రీలు కూడా రాజును గమనిస్తూ, పాపం చేష్టారహితులయ్యారు. సభాసదులందరు క్రమంగా నిశ్చేష్టితులై ఉండిపోయారు. అక్కడి కోలాహలం క్రమంగా శాంతించింది. మహామేధావులైన అక్కడి మంత్రులు ఇదంతా విస్తుపోయి గమనిస్తున్నారు. ఏమి చెయ్యాలో తెలియక సంశయగ్రస్తులై విషాదంలో మునిగిపోయి, ఒకరి ముఖాలు ఒకరు చూచుకొంటున్నారు. సభికులలో చాలామంది ఆశ్చర్యంగా అంతా గమనిస్తూ నిరుత్సాహం, దుఃఖం పొందసాగారు.

ఒక గంట కాలం గడచిపోయింది. లవణ మహారాజు శరీరం అకస్మాత్తుగా కొంచెం ప్రబోధం పొందింది. అతడు అవయవములను కొద్ది కొద్దిగా కదల్చసాగాడు. ఇంతలోనే అతని అవయవములు వేగంగా కదలసాగాయి. పెద్ద భూకంపం సమయంలో ఎత్తైన మేడ ఒక్కసారి నేలకూలుతుంది చూచావా? ఆ విధంగా ఆ రాజు ఒక్కసారి పైకి ఎగిరి నేలకూలసాగాడు. ఆ ప్రక్కనే ఉన్నట్టి అత్యంత సమయస్ఫూర్తి గల అతని మంత్రులు రాజు నేలపై పడకముందే పట్టుకున్నారు. కొంచెము వగర్చుచు రాజు కొద్ది క్షణములైన తరువాత నెమ్మదిగా కనులు తెరచాడు. చుట్టూ చూచి ఒక్కసారిగా “ఏమిటిది? ఆశ్చర్యంగా ఉన్నదే? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది ఏ ఊరు? అయ్యగార్లు? మీరంతా ఎవరు? ఈ సభ ఏమిటి? పిల్లాడు ఏడీ? అయ్యా ! అయ్యా ! దణ్ణం పెడతాను. నన్ను వదలండి అని కలవరిస్తున్నట్లు పలుకసాగాడు.

మహామంత్రి : దేవా! మహారాజా! రాహువును చూచినప్పటి సూర్యునిలాగా తాము ఇట్లు చింతా క్రాంతులు అయ్యారేమిటి? తమకు ఇట్టి స్థితి ప్రాప్తించటం, ఇట్లా మాట్లాడటం చూచి మేమంతా ఎంతో వ్యాకులచిత్తులమౌతున్నాం. మీ వంటి దృఢచిత్తము కలవారిని కూడా కారణం లేకుండానే భ్రాంతి భేదించగలదంటే మాకు ఆశ్చర్యంగానే ఉన్నది. మేమంతా చాలా కాలంగా ఉన్నతమైన తమ వ్యక్తిత్వమును గమనిస్తూ వస్తున్నాం. ప్రియమైన మిత్రునివలె మమ్ములను మామా ధర్మములందు సముత్సాహపరుస్తూ ఉండేవారు. మమ్ములను మా పూర్వజన్మసుకృతం చేతనే, మీరు పాలించటం జరుగుతోంది. వికల్పరూపముతో కూడిన అల్పభోగములందు మీ చిత్తం తగుల్కొనటం మేమెప్పుడూ చూడలేదు. అవిచారముచే మొదట రమణీయంగా కనిపించినా, ఆ తరువాత తుచ్ఛంగా పరిణమించే అల్పభోగవ్యవహారములు, మాయతోకూడిన ఆయా ప్రాపంచిక వ్యవహారములు... ఇవన్నీ, అనుభవజ్ఞు లగు మీకు తెలియునవి కాదు. ఉత్తమ గుణసమన్వితమైన మీ చిత్తము ఇప్పుడు ఏవైనా రాగాదులచే

Page:558

మోహితం అయిందా? లేదే! మీరు నిత్యము రాజసభలో వివేకమును నిదురలేపే ఉత్తమ కథలను, చరిత్రలను ప్రవచించు కార్యక్రమములు ఆజ్ఞాపిస్తూ ఉండేవారు కదా! అట్టి శాంతనిర్మలమైన మీ మనస్సు ఏ భయోత్పాత విషయములందు నిమగ్నమై భ్రమ పొందటం జరిగింది?

మహారాజా! మీరు సర్వము తెలిసినవారు. విషయములు నశించటం జరిగితే నేను కూడా నశిస్తాను అని తలచటమే ఈ మనస్సు యొక్క ఒకానొక దుర్లక్షణం. అట్టి క్షుద్రభావముతో కూడియుండుట చేత ఈ మనస్సు లోకకార్యములందు విమోహితమగుచున్నది. అయితే శుద్ధము, వివేకయుక్తము అయిన మనస్సు మాత్రం అట్లా మోహం చెందుటలేదు. దేహాభిమానము కలిగి, అజ్ఞానము నందు ఉండి ఉన్నప్పుడు ఈ మనస్సు తనయందు ఏ 'విషయవృత్తి ఉదయిస్తే ఆవైపే పరుగెత్తుతుంది. ఓ మహారాజా! ఏ మనసైతే వివేకమును తగినంతగా అభ్యసించకుండా దేశ కాలముల వైపు నిత్యం పరుగులు తీస్తూ ఉంటుందో అట్టి మనస్సు మాత్రమే మంత్ర - - ఔషధములకు వశమౌతూ ఉంటుంది. మీరు అట్టివారు కాదు. వివేకయుక్తమై, ఉదారవృత్తిగల మీవంటివారి మనస్సు దేని చేతనూ బలహీనం కాదు. ఒకవేళ దైవవశాత్తూ కించిత్ విక్షేపం కొద్దిసేపు సంభవించినా, మీరు సంపాదించియున్న విజ్ఞాన-వివేకాదుల ప్రభావంచేత మరల ప్రశాంతత పొందగలదు. నిత్యము వివేకము కలిగియుండే మీ వంటివారి మనస్సు... ప్రజ్ఞ కోల్పోవటమో అల్పవిషయములను ఆశ్రయించటమో.... చేస్తుందా? అట్లా జరగకూడదే? గాలి కొండను కదల్చగలుగుతుందా? దృఢచిత్తమును విషయవృత్తులు ఏమీ చెయ్యలేవు.

మంత్రుల యొక్క తదితర స్వజనుల యొక్క ప్రియవచనములు ఆ రాజు ఆలకించాడు. మరల కొంచెం కొంచెం ధైర్యం పుంజుకొన్నాడు. పూర్ణచంద్రునివలె అతని మనస్సు-బుద్ధి వర్తమానమైన పరిసర జ్ఞానంతో వికాసం పొందాయి. సభ అంతా కలియచూస్తూ కొంచెం సేపు గడిపాడు. అనేకులను కళ్ళతోను, చిరునవ్వులతోను పలకరించాడు. ఆ తరువాత కొంత భయ-ఆశ్చర్యములతో తన యందు ఉదయించిన 'తీవ్ర ఉద్వేగము' గురించి విచారించసాగాడు. ముందు వెనుక వృత్తాంతమంతా స్మరించుచు, ఇక ఇట్లు పలికాడు.

లవణ మహారాజు : ఓయీ! ఐంద్రజాలికుడా! నీ మాయాజాలం క్షణంలో శాంత సముద్రమును కూడా క్షుభితం చేయగలిగేదేనయ్యా! ఎంత విచిత్రంగా రచించావు! ఆహాఁ! మంత్రాదులందలి ఈశ్వరశక్తి అత్యద్భుతమైనది కదా! ఎంతటి సమర్థుల చిత్తమైనప్పటికీ, అది విమోహం చేసి వేయగలదు కాబోలు! మేము ఈ లోకవ్యవహారం నిర్వర్తించటంలో దక్షత కలిగిఉండవచ్చు. ఏం లాభం? ఆ దక్షతంతా నీ మాయ ముందు ఎందుకూ పనికి రాకుండా పోయింది కదా! మోహప్రదములైన ఆ ఆపదలు గుర్తుకు వస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. గొప్ప ప్రజ్ఞావంతుల ఉత్తమ వివేకయుక్తమగు మనస్సు కూడా అప్పుడప్పుడు స్వప్నములాగా, ఇంద్రజాలంలాగా మోహం చెందుతుందని విన్నాను. ఇక నేనెంతటివాడను?

Page:559

ఓ సభికులారా! ఈ ఐంద్రజాలికుడు శంభరాసురుడంతటి మాయా రచయిత అయిఉన్నాడు. కొద్ది సమయంలో అతి దీర్ఘమైన, దుర్భరమైన, విచిత్రమైన జీవితమును చవిచూపించాడు. ఒకప్పుడు బలిచక్రవర్తి ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఒక గొప్ప ఇంద్రజాలమును రచించి, ఇంద్రుని యొక్క పటాటోపమంతా వినాశనమొనర్చి, కొంతసేపు బలిచక్రవర్తికి ఇంద్రపదవి కట్టబెట్టిన అనుభవం కలిగించాడని పురాణాలలో చదివాం.

అదే విధంగా ఇతని ఇంద్రజాలంలో 60 సంవత్సరములుగా విస్తరించిన అనేక కార్యములను, చంచల పరిస్థితులను చూచాను.

ఇప్పుడు నేను భ్రమచే పొందియున్న అనేక వ్యవహారములను, స్థితి - - గతులను వివరించి

చెపుతాను. అంతా వినండి.

3. వాహ్యాళి - ఆకలి - వివాహం

లవణ మహారాజు : సభికులారా! కొద్దిక్షణాలలో నా మనస్సుకు అనుభవమైన సుదీర్ఘ అనుభవ

పరంపరల గురించి చెపుతాను. వినండి.

నేను ఈ సింహాసనముపై కూర్చుని ఉండగా ఈ ఐంద్రజాలికుడు ఎక్కడనుండో వచ్చి ఇక్కడ మన ముందు ఇంద్రజాలవిద్యలు ప్రదర్శించటం మీరు చూచారుకదా! అతడు ఒక నెమలి పింఛమును నా కళ్ళముందు వేగంగా త్రిప్పాడు. అందులోంచి చిత్రవిచిత్రములైన రంగులు కనిపించాయి. నా పరిసరాలన్నీ మరచి, ఒంటరివాడనై విరజిమ్ముచున్న ఆ రంగులనే కొంత సేపు చూచాను. ఏదో భ్రాంతి నా బుద్ధిని ఆవహించింది. తలవిదిల్చి చూడగా, ఎదురుగా నాకొక గుఱ్ఱం కనిపించింది. ఎవ్వరో మహారాజా! ఈ ఉత్తమజాతి గుఱ్ఱం మీకే తగినది. దీని తెల్లటి స్వచ్ఛత, జూలు చూచారా? దీనిని మీవంటి వీరాధివీరులు అధిరోహించటం, స్వారీ చేయటం ఎంత సుందరమైన విషయం!" అని ఉత్సాహపరిచారు. అది విని నేను ఆ తెల్లటి పంచకళ్యాణి గుఱ్ఱం అధిరోహించాను. వేటకై అడవిలో ప్రవేశించాలనే ఉత్సుకతతో మన ఈ రాజధానికి ఉత్తరంగా గల అడవుల వైపు గుఱ్ఱమును పరిగెత్తించాను.

88

ఆ గుఱ్ఱం ఎక్కి వాయు వేగంతో చాలా దూరం ప్రయాణం చేశాను. ఈ మనస్సు అవిచారణచే పైకి మాత్రమే రమ్యంగా కనిపించే విషయములను సేవిస్తూ జడత్వం పొంది, పరమాత్మానుభవమునకు దూరమౌతుంది చూచారా! నేను కూడా ఆ విధంగా తెలిసీ తెలియకుండా చాలా దూరం వెళ్లి, చివరికి ఒక వనంలో ప్రవేశించాను. ఆ వనం అతి భయంకరంగాను, సహించరానిదిగాను కనిపించింది. అందులో కొంత భాగం 'విరాగుల చిత్తము' వలె పదార్థరహితమై యున్నది. అయినప్పటికీ నేను అట్లా పోతూనే ఉన్నాను. ఎక్కడా కనుచూపు మేరలో చెట్టుగాని, నీరుగాని

Page:560

కనిపించటం లేదు. గుఱ్ఱం ఎంతగానో అలిసిపోయి ఉండటం గమనించి ఆగి, అన్నివైపుల కలయ చూచాను. అనంతంగా కనబడుచున్న ఆ ప్రదేశంలో ఎక్కడా జనసంచారం ఉన్నట్లు లేదు. ఆ పరిసరాలు చూచి ఎందుకో ఎంతో ఖిన్నుడనయ్యాను. ఏదో దైన్యం నా గుండెలో ప్రవేశించింది. మరల గుఱ్ఱం ఎక్కి ఎట్లో ప్రయాణం సాగించాను. ఎట్లాగైతే ఏం? సూర్యాస్తమయం అయ్యే సమయానికి, వివేకులు ఈ సంసారమును దాటి వేయ కలుగుచున్నట్లు, నేను ఆ విశాలశూన్యవనమును దాటి వేశాను. ఎంతో అలసిపోయి ఉన్న ఆ గుఱ్ఱంతో మరొక అరణ్యంలో ప్రవేశించాను.

ఆ అరణ్యంలో ఆకాశమును అంటుచున్న పెద్ద పెద్ద వృక్షాలు కనిపించాయి. పక్షులు చెట్లపై నుండి మధురంగా గానం చేస్తున్నాయి. అయితే అక్కడ నాకు ఒక చిత్రం కనిపించింది. అధర్మముచే ధనము ఆర్జించే దుష్టుని యందు ఆనందవృత్తులే కనిపించవు చూచారా? అట్లాగే అక్కడ నేలపై ఎక్కడా పచ్చికయే కనిపించలేదు. కాని వెనుకటి వనంకంటే ఇది కొంత సుఖకరంగా అనిపించింది. ఈ జీవులు "అత్యంత దుఃఖదాయకమగు మరణముకంటే ఈ రోగములే మేలు అని చెప్పుకొంటూ ఉంటారు చూచారా? నా పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది.

సాయంకాలమయింది. కొంచెం - - కొంచెం సూర్యుడు అస్తాద్రి చేరుకున్నాడు. వెలుగు మందగించ నారంభించింది. నేను గుఱ్ఱంపై చెట్ల మధ్య నుండి వంకరటింకరగా ప్రయాణిస్తూ ముందుకు పోతూ ఉన్నాను. ఇంతలో ఒక పెద్ద వృక్షమునకు వ్రేలాడుతున్న ఏదో తీగ నా మెడకు చుట్టుకొన్నది. నేను నేలపై చతికిలపడ్డాను. గుఱ్ఱము నన్ను వదలి ఎటో వెళ్లిపోయింది. అప్పటికే ఎంతో అలసిపోయి ఉండటం చేత కొంతసేపు అక్కడే పడి ఉన్నాను. ఇంతలో సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. అరణ్యమంతటా నిబిడాంధకారం వ్యాపించింది. అక్కడి నుండి లేచి నెమ్మదిగా ఒక చెట్టు యొక్క తొఱ్ఱలోకి పోయి, దాక్కున్నాను. ఏవైనా క్రూరమృగములు అక్కడ సంచరిస్తూ ఉండవచ్చని నా భయం. ఆహాఁ! ఇక ఆ రాత్రి ఆ చెట్టు తొఱ్ఱలో ఎట్లా గడచిందో చెప్పలేను. పాము కరిస్తే మనిషి తన వివేకం కోల్పోతాడు చూచారా? నా బుద్ధి కూడా అట్లాగే అయింది. జ్ఞాపకశక్తి మందగించింది. త్రాళ్ళతో చెట్టుకు కట్టివేయబడినవానివలె విలవిలలాడాను. చీకటినూతిలో పడినవానివలె అస్వతంత్రుడనయ్యాను. మనస్సు మోహముచే కప్పివేయబడింది. ఒక మహాసముద్రంలో ఎటో తెలియని వైపుగా కొట్టుకుపోతున్నానా? అని అనిపించింది. ఆ రాత్రి ఒక కల్పమంత దీర్ఘంగా గడచి పోయింది. క్రమంగా తెల్లవారటం ప్రారంభమైనది. కాని, అప్పుడు నాకు స్నానం లేదు. పూజలేదు. భోజనం చెయ్యలేదు. ఒక్కొక్క క్షణం ఎంతో బరువుగా సాగుచున్నది.

సూర్యోదయం చూచి ప్రాణం లేచి వచ్చినట్లైనది. ఒక దరిద్రుడు గొప్ప బంగారపు మూటను చూచినట్లు, ఒక అజ్ఞాని గురుకృపచే సమగ్రమైన జ్ఞానం పొందినట్లు నేను సూర్యభగవానుని చూచాను. చెట్టు దిగి ఇక ఆ అరణ్యంలో సంచరించసాగాను. అక్కడ నాకు ఒక్క ప్రాణి కూడా కనిపించనే లేదు. అక్కడక్కడ పళ్లు ఏమాత్రం లేని వృక్షములపై ఏవో చిన్న పిట్టలు మాత్రం

Page:561

కనిపించాయి. వాటి "కూచికూచి శబ్దములు వింటూ అటూ ఇటూ తిరుగసాగాను. క్రమంగా నాలో నీరసం అధికం అయింది. మిట్టమధ్యాహ్నమైనది. ఆకలితో, దాహంతో, కడుపు కరకర లాడుతోంది. అన్నార్తితో నా కళ్ళు అటూ ఇటూ వెతుక నారంభిచాయి.

ఇంతలో నాకు అల్లంత దూరంలో ఒక 11 12 సం||ల వయస్సు ఉండే బాలిక కనిపించింది. ఆమె మట్టి కొట్టుకుపోయి, చినిగి, జీర్ణమైన వస్త్రములు ధరించియున్నది. జుట్టు ముళ్ళుపడి సంస్కార రహితంగా మఱి ఊడలవలె వ్రేలాడుచున్నది. ఆమె చేతిలో అన్నపు మూట కనిపించింది. నా ప్రాణాలు లేచివచ్చాయి. ఎట్లాగో ఓపిక చేసుకొని చంచలనేత్రములుగల ఆమె దగ్గరకు పరుగులు తీశాను.

"ఓ బాలికా! ఒక్కమాట. ఇప్పుడు నాకెంతో ఆకలిగా ఉన్నది. ఈ ఆపద సమయంలో నాకీ అన్నం పెట్టు. దీనుల దుఃఖములను తొలగించువారి సంపదలు వృద్ధిపొందుతాయని పెద్దలంటారు. నా ఆకలి బాధ మాటలతో చెప్పలేను... అంటూ ప్రార్థించసాగాను. కానీ ఏం లాభం? స్త్రీలను హింసించే వానికి లక్ష్మీదేవి ధనం ఇవ్వదు చూచారా? అట్లాగే ఆమె నాకు ఆహారం ఇవ్వకుండానే నడచి వెళ్లిపోతోంది. అయినాకూడా నేను ఆమె వెంటపడి బ్రతిమిలాడాను. అప్పుడా కన్య "ఏమయ్యోయ్! ఓ భుజకీర్తులు ధరించిన అయ్యగారూ! నా వెంటపడుచున్నావేమిటి? నేను చండాల కన్యనే! మేము మనుష్యుల, గుఱ్ఱముల, ఏనుగుల మాంసం తింటూవుంటాం కదా! నేను అతి క్రూరమైన రాక్షసివంటిదాననని నీవంటి పెద్ద అయ్యలు అంటూ ఉంటారు. మా ఆహారం నీవు తినటమేమిటి? చాలు చాలు. నా వెంటపడబోకు. నానుంచి నీకు ఒక ముద్ద బువ్వ కూడా లభించదు. వెళ్ళెళ్ళు అంటూ పోతూనే ఉన్నది. మధ్యమధ్యలో వినోదంగా చెట్టు వెనుక, పుట్టవెనుక దాగుడు - మూతలాడుతూ నన్ను ఏడిపించసాగింది. రా బాబు! రావయ్యా...రా అంటూ నన్ను కవ్విస్తోంది. పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదే కాబోలు .... అని అనుకొన్నాను. ఎట్లాగో అట్లా ఒకచోట ఆమెను సమీపించాను. ఆమె నేలపై కూర్చుని నావైపు చిలిపిగా చూస్తోంది. నేను ఆ ప్రక్కనే చతికిలపడ్డాను.

నేను : చూడు అమ్మాయీ! ఇక నా ఓపిక క్షీణించింది. ఇప్పటికన్నా నీ చేతిలోని ఆహారం నాకు ఇచ్చి పుణ్యం కట్టుకో.

బాలిక : ఓ దొరా! ఇప్పుడు నా మనస్సులోని మాట చెపుతాను. విను. నీవు అందమైన కుఱ్ఱవాడివి. నాకు నచ్చావు. నీవు నాకు మొగుడు కావటానికి ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు ఈ ఆహారం నీకు ఇస్తాను. లేదంటావా, నా దోవన నేను పోతాను. నువ్వు ఒప్పుకోకపోతే, నీకు నేను బువ్వ ఎందుకు పెట్టాల? నా తండ్రి అదిగో, అల్లంత దూరంలో ఎద్దులు తోలటం, పొలములు దున్నటం చేస్తూ ఉంటాడు. ఈ ఆహారం మా అయ్యకోసమే తీసుకుపోతున్నాను. కాని నీవు నా మొగుడివైతే ఇదంతా ఇచ్చివేస్తాను. ఆడదానికి మొగుడు ప్రాణంతో సమానం కదా!

Page:562

అంత ఆకలిగా ఉన్నప్పుడు కుల జాతి ధర్మాలు ఎవడికి కావాలి? ఆహాఁ! ఆకలి సకల విభేదాలు విస్మరింపజేస్తుంది.

నేను : ఓ అమ్మాయీ! సరే. నీవు కోరినట్లే నీకు భర్తను అవుతాను. ముందు ఆ ఆహారం నాకు పెట్టు. అప్పుడామె ఆ ఆహారంలో సగభాగం ఇచ్చింది. నేనది ఆవురావురంటూ అమృతతుల్యంగా తిన్నాను. ఆ సమయంలో ఆకలి తీర్చుకోవటమే యోచించాను. మరింకే విషయంలోనూ నా బుద్ధి పనిచేయటమే మానివేసింది. ఆ ప్రక్కనే పొదలలో ఉన్న ఏవో పళ్ళు తెచ్చి వాటిరసం ఒక తోలు పాత్రలో పోసి ఆ బాలిక నాకు ఇచ్చింది. అది గటగటా త్రాగివేశాను. అక్కడే కొద్దిసేపు విశ్రమించాను. ధూళిచే కప్పబడి, నల్లటి రంగు పుణికి పుచ్చుకొన్న ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని తన తండ్రి ఉన్న ప్రదేశానికి తీసుకుపోసాగింది. అప్పుడామె నా ప్రాణం తనవశం చేసుకొని తీసుకుపోతున్నట్లుగా అనిపించింది. ఒక అరగంటసేపు నడచిన తరువాత ఆమె తండ్రిని సమీపించాం. అతడు పొడవైన శరీరం కలవాడు. అతని ఆకారం చూడగానే భయము కొల్పేట్లు ఉన్నది. కురూపుడు, దుష్టుడు అయిన అతని కళ్ళు క్రూరత్వమును నిర్వచిస్తున్నట్లున్నాయి.

ఆ పిల్ల తండ్రి : ఏమేవ్? ఏందీ, ఇంత ఆలస్యమైనది? ఏం పోయేకాలం?

ఆ పిల్ల : అయ్యా! ఈ పోరగాడిని చూచావా? ఈడు నాకు నచ్చాడు. ఈడు నన్ను మనువాడుతాడంట! నువ్వు “ఊఁ” అనువే ...

ఆ పిల్ల తండ్రి : సరేలేయే .... ఆడు ఒప్పుకున్నాడు గందా.... అట్లాగే మనువాడుదువుగాని .... ముందు బువ్వపట్టుకురా.

అతడు ఆహారం తీసుకొని మరల పనిలోకి పోయాడు. ఆమె నా ప్రక్కన చేరి వినసొంపు గాని భాషలో ఏవేవో సరస - విరసాలు - ఆడసాగింది. నేను ఏమగుచున్నాను? అనునది అర్థం కాక ఏదో విషాదంగా యోచిస్తూ అట్లే చతికిలపడి ఉన్నాను. ఇంతలో సాయం సమయమయింది. మేము ముగ్గురం నడచుకొంటూ చండాలవాటికకు చేరాం. అక్కడ గుడిసెల ముందు కోళ్ళు, కాకులు, కోతులు, పందులు మొదలైనవి ముక్కలు ముక్కలుగా కోయబడి ఉన్నాయి. అనేకచోట్ల, నేల రక్తముచే తడుపబడి ఉన్నది. ఆ ప్రదేశాలలో దోమలు, ఈగలు దట్టంగా ముసురుతున్నాయి. కొన్ని గుడిసెల ముందు దండాలకు తడిప్రేగులు ఎండబెట్టి ఉన్నాయి. గొట్టె చర్మములు త్రాళ్ళకు వ్రేలాడుచుండగా, వాటిలోంచి రక్తపు చుక్కలు ఇంకా నేలకు రాలుచున్నాయి. కొన్నిచోట్ల వేపచెట్లపై పక్షులు శబ్దాలు చేస్తున్నాయి. నేలంతా ఎండిన వేపాకులతోను, పుల్లలతోను, మురికినీరు గల చిన్న చిన్న గుంటలతోను నిండిఉన్నది. అక్కడి బాలుర చేతులలోగల పచ్చి మాంసపు ముక్కలపై దోమలు వ్రాలుచు ఝంకారం చేస్తున్నాయి. వృద్ధులు, శ్రేష్ఠులు అయిన అక్కడివారు ఆ బాలురను మందలి స్తున్నారు. నేను నడచి వెళ్ళటం చూచి, వాళ్లంతా ఆ రణగొణలు ఆపి నా వైపే చూడనారంభించారు. అట్లా కొంతసేపు నడచి, ఆ బాలిక యొక్క గృహంలో ప్రవేశించాం.

ఆ ఊరి పేరు 'పుష్కరఘోష’.

Page:563

ఆ బాలికావాళ్ళ ఇంటి ప్రదేశమంతా నాడులతోను, జంతువుల బొమికలతోను నిండి ఉన్నది. ఆ కన్యక పరుగు పరుగున ఇంటిలోకి పోయి తల్లితో ఏదేదో చెప్పింది. ఆ ఇంటిలోనివారు ఆదరంతో నన్ను ఒక గోనెసంచీ ఆసనంపై కూర్చోబెట్టారు. ఆ చుట్టుప్రక్కల గుడిసెల వాళ్ళకి నా రాక గురించి తెలిసింది. కంకరరాళ్ళు దొర్లిస్తునట్లు భీకరమైన గొంతుగల మా అత్తగారు అక్కడి ఆడవాళ్ళతో 'ఓసి అత్తా! పిన్నీ! చూడండే. ఈడే మా కాబోయే అల్లుడు. మాకు శ్రమలేకుండా మా అమ్మాయే తెచ్చుకుంది" అని అరుస్తూ చెప్పసాగింది. వాళ్ళందరు, 'ఒక బుట్టబొమ్మను పిల్లలు చూచునట్లు’ నన్ను చూడసాగారు. ఆ తరువాత నేను కొంతసేపు విశ్రమించాను. మా మామగారు, అత్తగారు ఏవేవో పదార్థములు తెచ్చిపెట్టారు. అవన్నీ ఇవేమిటి? అని అడగకుండా తినసాగాను. మరి ఆకలియొక్క మహిమ అట్టిది. ఇక ఆ పిల్ల, మా అత్తగారు అనేక దుఃఖములకు హేతువైన కుత్సిత ప్రణయవాక్యాలు పలుకసాగారు. ఆ వాక్యాలలోని నీచత్వం నాకు బాధ కలిగిస్తున్నది. అయితే వాళ్ళుమాత్రం గొప్ప ధనపుమూట దొరికినట్లు నవ్వుకొంటున్నారు.

ఒక శుభముహూర్తాన ఆ బాలికను నేను పెళ్ళి చేసుకున్నాను. మా పెళ్ళిరోజున అక్కడివారంతా ఒకచోట గుమిగూడారు. పచ్చివి, పచనము అయినట్టివి అయిన మాంసాదులను సేవించారు. చాలా మంది పీకల దాకా మద్యమును త్రాగారు. పెద్ద పెద్ద వాయిద్యములతో భీకర శబ్దములు చేశారు, ఆడారు, పాడారు. నాకు మాత్రం - ఆ స్థలము ఒక మహానరకమువలె, ఆ వాయిద్యములు బ్రహ్మహత్యాది మహాపాపముల సముదాయమువలె నాకప్పుడు తోచింది. జీవుడు యమలోకమునకు పోయినప్పుడు స్తబ్ధుడైనట్లు నేను మౌనం వహించి అదంతా నిర్లిప్తంగా చూస్తూ ఉన్నాను. ఓ సభికులారా! ఇక ఎక్కువగా చెప్పేదేమున్నది? వివాహమహోత్సవమునకు వశుడనై, అది మొదలుగా, నేను అక్కడి వారిలో ఒకడనయ్యాను. క్రూరత్వము మొదలైన అక్కడివారి గుణములు నేను కూడా ఆశ్రయించాను. మా పెళ్ళి ఉత్సవం ఏడు రాత్రులు జరుపబడింది.

4. క్రౌర్యం

క్రమంగా రోజులు గడుస్తున్నాయి. ఎనిమిది నెలల తరువాత నా భార్య ఋతుమతి అయింది. దుష్క్రియలు ఆపదలు కలుగజేస్తాయి చూచారా? మూర్ఖుడు అనర్థములైన సంకల్పములు చేస్తూ ఉంటాడు కదా! అదే విధంగా కాలం అనేక మూర్ఖపు పనులతో గడువసాగింది. మాకు కాలక్రమేణా ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు పుట్టారు. క్రమంగా మా పిల్లలు ఎదుగనారంభించారు. బ్రహ్మ హత్య చేసినవాడు అనేక దుఃఖములను పొందుతూ ఉంటాడే! అట్లాగే నేను కూడా అనేక సంసార దుఃఖములను మరల మరల పొందుతూ కాపురం చేశాను. నా పరిస్థితి అల్పజలాశయంలోని ముసలిచేపవలె తయారయింది. ఎండకు, చలికి వివశుణ్ణి అవుతూ ఇంతకుముందు నేను ప్రవేశించియున్న అరణ్యంలో ఎంతోకాలం సంచరించాను. కుటుంబపోషణ అనే చింతలో ఎందరు

Page:564

ఈ మహాసంసారారణ్యంలో సంచరించటంలేదు చెప్పండి? నా సంచారం కూడా అట్టిదే అయింది. అనేక క్షుద్ర ప్రయత్నముల ప్రభావంచేత నా బుద్ధి మందగించింది. అనేక సంసార క్లేశములచే దుఃఖ పీడితుడనయ్యాను. పిల్లలు-ఆరోగ్యములు-ఆహారములు-ధనములు”.... ఇట్టి ఏవేవో కార్యక్రమములలో నిమగ్నమగుచు దిక్కుతోచక దిక్కులన్నీ పరిభ్రమించాను. పాపభారం మోసినట్లు, చినిగియున్న వస్త్రమును తలకు చుట్టుకొని, గడ్డిమోపును నెత్తిన ధరించి వేలాదిసార్లు అనేక మైళ్ళ దూరం నడిచాను. దుర్గంధ భూయిష్ఠమైన ఒక గోచి ధరించి ఎక్కడెక్కడో తిరిగాను. ఈగలు వ్రాలు చుండే అనేక మురికి ప్రదేశములలో విశ్రమించాను. నా కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతో అనేక ప్రయత్నములందు నిమగ్నమగుచు జీర్ణదేహుడనయ్యాను. జంతువులను వేటాడే ప్రయత్నాలలో ఎక్కడెక్కడో దాక్కున్నాను. ఎవరెవరినో ఎంతగానో హింసించాను. అనేక కలహములచే కలిగిన దుఃఖ తాపములకు రక్త బిందువులతో సమానమైన కన్నీళ్ళు కార్చాను.

అక్కడి అడవిలో కొన్ని శిలల క్రింద రహస్య గృహములవలె గుహలవంటివి ఉన్నాయి. ఆ

రహస్యగృహములలో ఉండి అప్పటికప్పుడు కాల్చుకొన్న పంది మాంసము భక్షిస్తూ ఎన్ని రాత్రులు గడిపానో చెప్పాలంటే, అలవి కాదు.

ఆ విధంగా అక్కడ చాలా కాలం గడిచిపోయింది. నిరంతరం కొందరు బంధువులంటే ఇష్టం, మరికొందరు బంధువులంటే ద్వేషం కలిగియుండేవాళ్ళం. అనేకమందితో ఏర్పడిన పోట్లాటలు నన్ను దుఃఖితునిగాను, దీనునిగాను చేశాయి. కొన్నాళ్ళైన తరువాత నేను నా భార్య - పిల్లలతో మరొక చండాల గృహంలో ప్రవేశించి, అక్కడ చాలా కాలం ఉన్నాం. నా ముఖం ఎల్లప్పుడు భార్యతో పోట్లాడటంలోను, ఇతర చండాలురతో ఘర్షణ పడటంలోను ఆయత్తమగుటచే అతి క్రూరంగా ఉండేది. పైకి క్రూరంగాను, లోన దీనంగాను ఉంటూ ఉండేవాడను. మేక, పులి, లొట్టిపిట్ట, గొట్టె, పంది, ఎలుక మొదలైన రకరకాల మాంసములను చిత్ర - విచిత్రములైన విధానములలో పచనం చేసుకొని, దాచుకొని - దాచుకొని తినేవాళ్ళం. యాచకులు వస్తే ఎంతో సేపు దూషించిన తరువాత కొంచము పెట్టే వాళ్లం.

ఓ మిత్రులారా! సభికులారా! నాకు బట్టలు కూడా లేవు. గోచితోనే సంచరిస్తూ దుఃఖప్రదములగు అనేక అనుభవములు పొందాను. మన ఈ వర్తమానం నిజమే కదా!" అని అనిపించినట్లు, అప్పుడు కూడా, అదంతా వాస్తవములాగానే నాకు అనుభవమయింది. మూఢచిత్తుడనై అనేక వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికాను. పిట్టల రెక్కలు పెడవిరిచి బుట్టలో కుక్కాను.

మట్టి కుండలో మాంసం వండుకోవటం.... వికృతమైన ఆకారంతో, లేళ్లు మొదలైన అనేక మృగముల కోమల భాగములను నీళ్ళతో కడగటం ... నా చర్యలకు హింసింపబడుతూ, రోదిస్తున్న మృగముల ఆర్తనాదములు మధురసంగీతం వలె విని ఆనందించటం. మాంసమును ఎండలో ఆరబోయటం .... ఆ చండాలి భార్యతో అపవిత్ర ప్రదేశములలో కూడటం. ఎంతో ఆకలితో ఏవేవో తుచ్ఛపదార్దములు నములుతూ భుజించటం ...

Page:565

ఇవన్నీ ఇప్పుడే జరిగిన సంఘటనలవలె నా కిప్పుడు స్పష్టంగా అనిపిస్తోంది. “అనేక జన్మల పాపఫలితం ఆ విధంగా పరిణమించిందా? లేక నేను మహాశాపగ్రస్థుడనయ్యానా? అన్నట్లుగా నా బుద్ధి ప్రవర్తించింది. వచ్చిపడుతున్న ఏవేవో ఆపదలను ఎదుర్కోవటం, జంతువుల బారి నుండి శరీరాన్ని రక్షించుకోవటం, భార్యా - పుత్రులను పోషించటం గురించే ఎప్పుడూ యోచిస్తూ ఉండటం, ఇవే అప్పటి పెద్ద పెద్ద కార్యక్రమాలు. ఇక ఒక్కొక్క రోజైతే నా భార్య నాకోసం తుచ్ఛమగు మాంసపు ముక్కలు మిగల్చనందుకు ఎంతోసేపు నీచమైన మాటలతో దూషించేవాడిని. "బేతాళుని బంధువా?” అన్నట్లు మలిన దేహంతో నదీతీరంలో అటూ - ఇటూ పచార్లు చేస్తూ చేపలు పట్టేవాడిని. ఇంకా నా అప్పటి ప్రవర్తనల గురించి ఏమని చెప్పమంటారు? తల్లి పాలు బిడ్డ త్రాగినట్లు, నేను, కోయబడిన మృగముల వక్షస్థలములోని రక్తమును జుర్రుతూ పానం చేస్తూ ఉండేవాడను. అపవిత్ర భోజనం చేసే అక్కడి అనేక జనులు కూడా నన్ను వీథిలో చూడగానే దూరంగా పారిపోయేవారు.

నాయందు ‘పాపము - క్రౌర్యము' అనే వాయువీచికలు ప్రసరిస్తూ ఉండేవి. నాచేత హింసించబడే పక్షుల, జంతువుల చావుకేకలు నాకు ఆహ్లాదం గొలిపే సంగీతంలా అనిపించేది. నాలో కొంచెం కూడా జీవకారుణ్యం లేదు. నిష్టుర భాషణం చేస్తూ క్రౌర్యంగా దుర్గంధభూయష్ఠమైన ప్రదేశాలలో ఏవేవో 'పేర్లు ఆకారములు' గల జంతువులకోసం వెతుకుతూ, వలపన్నుతూ ఉండేవాడను. ఆహాఁ! “ఇప్పుడిట్లా ఈ ప్రాణిని హింసిస్తే నియమితకాలంలో దీని ఫలితంగా నేను దుఃఖమురూపంగా అనుభవించవలసి వస్తుందేమో? అనే సంకోచమే లేకుండా ప్రవర్తించాను. భవిష్యత్ స్థితి గతులు చింతించకుండా నరకభూములలో అజ్ఞానవిత్తులను నాటినవాడనయ్యాను.

గోచి పెట్టుకొని, బొంతనొకదానిని కప్పుకుని చేతిలో పొడవైన లావుపాటి కఱ్ఱతో, సంస్కార రహితమైన మీసము - గడ్డముతో నేను వస్తుంటే, సున్నితంగా వ్యవహరించు కోమల స్వభావులంతా గజగజ వణికేవారు.

దోషరహితమైన రాజపుత్రుడనగు నేను ఆ విధంగా పూర్వజ్ఞానరహితంగా అనేక సంవత్సరాలు గడిపాను. ఓ సభ్యులారా! మన ఈ కాలమునకు వేరైన కాలక్రమంలో ఎన్నో ఏండ్లకు పైగా వర్తించాను. ఈ విషయం నాకే ఆశ్చర్యం గొలుపుతోంది.

అప్పుడు అక్కడ దుష్టవాసనలు అనే ఇనుపతీగలకు బద్ధుడనయ్యాను. క్రోధ పారవశ్యంతో వెనుక - ముందు చూడకుండా అసభ్యపదజాలం ఉపయోగిస్తూ, భయమును కలిగించే గర్జనలు చేశాను. ఆపదలు వచ్చినప్పుడు ఏడ్చాను. నింద్యమైన పదార్థాలు భుజించాను. ఏ మానసిక స్థితి నుండి ఎక్కడకు చేరి బ్రతుకసాగానో అదంతా మాటలకు అందదు.

కాలచక్రం పరిభ్రమించసాగింది. సంవత్సరాలు వస్తున్నాయి. పోతున్నాయి. నా శరీరం కృశించింది. వృద్ధాప్యం వచ్చిపడింది. చర్మం ముడతలు పడింది. మీసము, గడ్డము, తల నెఱసి

Page:566

పోయాయి. ముసలితనమును చూస్తే దుఃఖములకు, మానసిక వేదలనకు పండగే కదా! "తోటివారితో తగాదాలు. హింసించుకోవటాలు" మొదలైన అమానుష ప్రవర్తనలలో చిక్కుకొన్న నన్ను అందరు నిరాదరించటం ప్రారంభించారు. ఆకాశంలో ఎగురుతూ అకస్మాత్తుగా శక్తినంతా కోల్పోయిన పక్షిలాగా నిరాధారుడనయ్యాను. ఎంతో భ్రాంతికి లోనయ్యాను. చింతాక్రాంతుడనై చక్రయంత్రమును (Giant Wheel) అధిరోహించిన వానివలె పరిభ్రమించసాగాను. 'కాలము' అనే సాగరంలో కొట్టుకు పోతున్న గడ్డిపీచులాగా ఆటు పోట్లు నన్ను ఆవరించివేశాయి. నిస్సత్తువ క్రమ్మివేసింది. ఇట్టి శారీరక మానసిక దౌర్భాగ్యం అనుభవిస్తూ, ఒక్క భోజనం విషయం మాత్రమే పట్టించుకొంటూ ఉండగా మరొక సంవత్సరం గడచిపోయింది.

నేను రాజును అనే కించిత్ ఇంగితజ్ఞానం కూడా ఆ సమయంలో లేదు.

"నేను చండాలుడను. ఈమె నా భార్య. ఈ పిల్లల యొక్క తండ్రిని. ఈ ఆహారం నాకు లభించుగాక! ఈ నా శత్రువులు బాధింపబడెదరుగాక... ఇంతమాత్రమే నా ఆలోచనా పరిధి. ఫలితంగా ఆయా ఆశ - నిరాశల మధ్య నా చిత్తము అన్ని వేళల వ్యాకులత పొందుతూ ఉండేది. అట్లు ఒంటిలో సత్తువ క్షీణిస్తూ ఉండగా రోజులు ఉదాసీనంగా గడచిపోతున్నాయి.

5. భయంకర దుర్భిక్షం

అప్పుడు ఆ ప్రదేశంలో ఒక భయంకర దుర్భిక్షం వ్యాపించింది. ఎండిన చెట్టుపై పిడుగుపాటు వలె, దావాగ్నిలాగా ఆ దుర్భిక్షం అక్కడి ప్రజలను ఎంతగానో భయభ్రాంతులను చేసింది. చాలాకాలంగా వర్షాలు లేవు. ఎండవేడిమిచే కలిగిన ఉష్ణవాయువుల వలన చెట్లన్నీ నశించాయి. ఆ వేడికి గడ్డి మొక్కలు కూడా ఎండిపోయాయి. పాషాణాలు కరిగాయి. ప్రాణుల అవయవాలు ధూళితో కప్పబడ్డాయి. జనులు ఆకలిబాధచే అలమటించసాగారు. తృణ అన్న - పానములు లభించకపోవటం చేత పెద్ద పెద్ద జనపదాలే నిర్మానుష్యం కాసాగాయి. దూరంగా మృగతృష్ణలను చూచిన దున్నలు అవి జలశయములని భ్రమించి పరిగెత్తి-పరిగెత్తి నేల కూలి ప్రాణాలు విడవ సాగాయి. అక్కడ వీచే వాయువులో జలకణమనే మాటే ఉండేది కాదు. ఎక్కడైనా 'జలము' అనే మాట వింటే చాలు, అక్కడి జనులు ఎంతో ఉత్కంఠులు అవుతూ ఉండేవారు. వాతావరణంలో ఉష్ణము పెరుగుతూ పదార్థములను శుష్కింపచేస్తున్నది. ఆకులను నమలి మ్రింగునంతటి ఆకలితో ప్రజలంతా విలవిల్లాడారు. కొన్ని చోట్ల కొందరు ఒకరినొకరు చంపుకుతినటం కూడా జరిగింది. కొందరు క్షుద్బాధకు తట్టుకోలేక ఏనుగులను, గుఱ్ఱములను చంపి తినసాగారు. ఆకలి కారణంగా జీవులలో విపరీతమైన ప్రవృత్తులు ఉదయించసాగాయి. తమ సంతానం నిస్సహాయంగా క్షోభిస్తుంటే, తల్లిదండ్రులు చేసేదేమీ లేక శిలామౌనం వహించి ఉండేవారు. ఉన్నట్టుండి ఇళ్ళలోంచి పెద్ద ఆర్తనాదాలు వినవచ్చేవి. కాని ఎవ్వరిని ఎవ్వరు పట్టించుకొనేవారు కారు. స్త్రీ పురుషులు కొంచెము

Page:567

ఆహారంకోసం ఎక్కడెక్కడికో పరుగు తీస్తూ ఉండేవారు. ఇట్లు అకాలదుర్భిక్షం కారణంగా ఆ ప్రదేశ మంతా శుష్కించి పోయింది. శని-అగ్ని- సూర్యులు ఆ ప్రాంతమంతా విలయతాండవం చేయసాగారు.

దైవం ప్రతికూలించి, అకాలంగా ప్రళయం సంభవిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? పరమదుఃఖకరమైన ఆపదలు సంభవించటంచేత అక్కడి జనులు అనేకులు తమ బంధు-మిత్రులతోసహా దూర దేశాలకు వెళ్ళిపోయారు. మరికొందరు తమ పుత్ర - మిత్ర - స్త్రీ - బంధుజనులను వదల లేక అక్కడే ఉండిపోయి మరణించారు. ఎంత బాధించినా ఈ జీవుడు అట్లు బాధిస్తున్నట్టి అంగములను వదలలేడు కదా! అట్లాగే కొందరు తాము ప్రేమగా శ్రమించి ప్రోగుచేసుకొన్న గృహ - ధనాదులు వదల లేక అక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరు ఉన్న ఊరు వదలి దూరదేశాలకు ప్రయాణం చేస్తూ త్రోవలో క్రూరమృగములకు ఆహారమయ్యారు. మరికొందరు త్రోవలో నేలకూలి, ఆహారము, జలము లభించక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అట్టి మహాసంరంభముతో, భయోత్పాతంతో కూడిన సమయంలో నేను ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా భార్యను, పిల్లలను వెంటబెట్టుకొని దూరంగాగల ఒక దేశం వెళ్ళి పోయే ఉద్దేశంతో బయలుదేరాను. మా మామగారు, అత్తగారు ఉన్న ఊరు వదలబుద్ధిగాక, అక్కడే ఉండిపోయారు. వారికి వర్షములు పడవచ్చు" అనే ఆశ ఇంకా ఉన్నది.

త్రోవలో పులులవల్ల, అగ్నివల్ల వచ్చే అనేక ప్రమాదాలు తప్పించుకొంటూ ముందుకు పోతున్నాం. ఒక రోజు ఒక ప్రదేశానికి చేరాం. నా భార్య, పిల్లలు చాలా అలసిపోయి ఉన్నారు. వాళ్లు ఒక తాడిచెట్టు నీడలో కాసేపు విశ్రమించారు. నా ముగ్గురు పిల్లలు తల్లి ఒడిలో నిదురించారు. మా ఆఖరివాడు మాత్రం నా వెంటే ఉన్నాడు. వాడి పేరు పృచ్ఛకుడు. వాడంటే నాకు మొదటినుంచీ ఎంతో ఇష్టం. వాడు కళ్ళ నీళ్ళు కారుస్తూ నా కాళ్ళు పట్టుకొని, "అయ్యా! నాకిప్పుడు ఎంతో ఆకలి వేస్తోందే! తినటానికి మాంసం కావాలి. త్రాగటానికి రక్తం కావాలి. నువ్వు తెచ్చిపెట్టాలిసిందే! నాకింకేం తెలియదు అంటూ దీనంగా ఏడుస్తూ పలుకసాగాడు. ఎంత చెప్పినా వినడు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపడు. వాడు మాత్రం ఏం చేస్తాడు? ఆకలి బాధ అంతటిది మరి. అప్పుడు నేను, “ఓరీ! పృచ్ఛకా! ఇప్పుడు మాంసము ఏడదిరా? అయినా కాసేపు ఆగు. ఏడుపు ఆపు. చూద్దాంగా!” అంటూ బుజ్జగించసాగాను. అనేకసార్లు చెప్పిచూచాను. వినుటలేదు. కొంతసేపటికి వాడు దగ్గటం ప్రారంభించాడు. దాహంతో, ఆకలితో వాడి ప్రాణాలు రెపరెపలాడుతున్నాయి. వాడి అవస్థను చూచి నాకు చెప్పరానంత ఏడుపు వచ్చింది. పుత్రవాత్సల్యంతో నా మనస్సు ఎంతో వేదన

పొందింది.

నాయనా! పృచ్ఛకా! నీవు ఆకలితో నకనకలాడటం నేను చూడలేనురా. ఇప్పుడు మాంసముగాని, రక్తముగాని నీకు తెచ్చిపెట్టగలిగే అవకాశమే లేదు. ఇక ఒక్కటే ఉపాయం. నీవు నన్ను పీక్కు తిను. నా రక్తమాంసములతో నీవు నీ ఆకలి తీర్చుకో.

అని ఉద్దేశపూర్వకంగా పలికాను. అప్పుడాబాలకుడు ఓరై అయ్యా! పోనీ అట్లాగే చేయి. నేను ఈ ఆకలి భరించలేను. నీ మాంసమే తింటాను" అని అంటూ తన నుదుటితో నా మోకాలు

Page:568

స్పృశించసాగాడు. అప్పుడు అత్యంత దుఃఖభారంతో క్రుంగిపోతున్న నా కుమారుని యొక్క సంకటస్థితిని చూచాను. అది నాకు గొప్ప ఆపదవలె కనిపించింది. ఆ ఆపదను సహించలేకపోయాను. కొడుకు కొరకై స్నేహ-కారుణ్యములకు వశుడనయ్యాను. సర్వదుఃఖములను ఉపశమింప జేయగలదని భావించి, మృత్యువుకు నా శరీరం అర్పించాలని నిశ్చయించుకొన్నాను.

అక్కడ - ఇక్కడ పడిఉన్న కొన్ని చితుకులను ఏరి ఒక చోటికి జేర్చాను. ఆ వాతావరణంలో వాటిని మండించటం ఏమాత్రం కష్టమనిపించలేదు. అగ్ని చటచట శబ్దములను చేస్తూ పైకి లేచింది. ఆ శబ్దములు నా ప్రాణములను కాంక్షిస్తున్నట్లు అనిపించింది. లేచి వెళ్ళి అమాంతంగా ఆ అగ్నిలోకి దూకాను.

అంతేఁ! మరుక్షణం నా ఈ శరీరం సింహాసనము మీద నుండి క్రిందకు పడుతోంది. ఈ మంత్రివర్యులు నన్ను నేలకు ఒరగకుండా పట్టుకొన్నారు. ఇక్కడి మీ అందరి గొంతుకలు నా చెవిన బడ్డాయి. వెంటనే ప్రబోధితుడనయ్యాను.

ఓ సభ్యులారా! ఈ విధంగా ఈ ఐంద్రజాలికుడు నన్ను మోహములో ముంచి, తేల్చాడు.

6. అంతా మనోవిలాసమే

మహాతేజస్వి అయిన ఆ లవణ మహారాజు ఇట్లు చెప్పుచూ ఉండగా, అక్కడివారందు ఐంద్రజాలికుని వైపుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ఇంద్రజాలికుడు ఒక్కక్షణంలో అక్కడి సభామధ్యం నుండి అంతర్ధానమయ్యాడు. అది చూచిన అక్కడి సభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు. సభలో కలకలం బయలుదేరింది. అంతా గమనిస్తున్నట్టి మహామంత్రి లేచి నిలుచున్నాడు. సభనంతా నిశ్శబ్దపరచి, ఇట్లు ప్రసంగించ ప్రారంభించాడు.

మహామంత్రి : ఓ మహారాజా! చూచారా! ఈ క్షణం వరకు మన మధ్య ఉన్న ఐంద్రజాలికుడు ఇప్పుడే అంతర్ధానమయ్యాడు. ఇంత ఇంద్రజాలం చూపినతరువాత మిమ్ములను ధనం అర్ధించాలికదా? కానీ, అట్లు చేయలేదూ అంటే, అతనికి ధనాపేక్ష లేదు. ఈ ప్రపంచస్థితిని మనకు బోధించటానికి వచ్చిన ఒక దైవమాయయే అతడై ఉంటాడు. అంతేకాని, అతడు ఒక సామాన్య ఐంద్రజాలికుడు మాత్రం కాదు.

మీరు చెప్పినది ఇక్కడ జరిగినది పరిశీలించినప్పుడు, “ఈ ప్రపంచమంతా మనోవిలాసము మాత్రమే అని మనకు తెలియవచ్చుచున్నది. సర్వశక్తిమంతుడగు విష్ణుభగవానుని మనస్సే కదా ఈ జగత్తు!* ఆ పరమాత్మకు అనేకానేక చమత్కారములు ఉన్నాయి. అతడు తన మాయచేత ఉత్తమ వివేకవంతులను కూడా మోహంలో ముంచివేయగలడు.

* విశ్వమ్ విష్ణుః విష్ణు సహస్రనామమ్

Page:569

ఆహాఁ! ప్రజ్ఞ-చతురత, మహావివేకము, ఎంతో లోకానుభవము కలిగియున్న మన ఈ లవణచక్రవర్తి ఎక్కడ? సామాన్య మానవుల మనోవృత్తి అనతగ్గ ఈ అల్పభ్రమ ఎక్కడ? ఓ రాజా! మేము అనేకమంది మాంత్రికులను, ఐంద్రజాలికులను చూచాం. వారికెవ్వరికీ ఇట్లు జనులను విమోహితులను చేసే ఆలోచనగాని, సామర్థ్యముగాని ఉంటుందనునది వినలేదు, చూడలేదు. ఈ ఐంద్రజాలికులంతా ప్రజల చిత్తములను రంజింపజేసి తద్వారా ధనం సంపాదిస్తూ మాత్రమే ఉండటం చూచాం! పైగా, మనం చూస్తూ ఉండగా అంతర్ధానం కాగలరా? ఈ విషయాలన్నీ గమనించిన తరువాత మేము “ఇతడు దైవమాయ యొక్క స్వరూపమే అని తలచుచున్నాం. ఆ భగవంతుడే మనలను జ్ఞానులుగా తీర్చిదిద్దటానికి ఇట్లు చేసి ఉంటాడు.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ లవణమహారాజు యొక్క సభలో నేను కూడా ఉండిఉన్నాను. ఈ వ్యవహారమంతా నేను స్వయంగా చూచాను. ఆ చూచినదే నీకు చెప్పాను.

దీనినిబట్టి నీవు గ్రహించవలసినదేమిటి? ఈ మనస్సే వివిధరచనలచే వృద్ధి పొందుతోంది. చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు, పుష్పములు, కాయలు వలె విస్తరిస్తున్నది ఆ వృక్షమే కదా! ఈ మనస్సే స్వయముగా ఈ జగత్తు రూపమున విస్తరిస్తోంది. మరల మరొకప్పుడు ఇదే మనస్సు జ్ఞానవిచారణాదులు చేపట్టుటచే, తన ప్రయత్నముల సాఫల్యంగా వాసనారహితం అవుతోంది. ఆత్మతో ఏకత్వమును పొందుతోంది. అప్పుడు భేదకల్పన అంతా నశించుటచే ప్రశాంత, మౌన, అద్వితీయ, నిర్వికల్ప అనుభవస్థితిని అవధరిస్తోంది.

ఓ రామా! సర్వభేదకల్పనలు నశించినప్పుడే (అతీతత్వమును సముపార్జించుకొన్నప్పుడే) పరిపూర్ణమగు ఆత్మపదము లభించగలదు. ప్రతి జీవుడు శాంతి పొందుటకు మార్గం ఇది మాత్రమే.

7. చిత్తము - దాని చమత్కారము

శ్రీరాముడు : మహర్షీ! నాదొక సందేహం. అసలు మా ఈ చిత్తములు ఎందుకు విషయములపైనే అభిముఖమౌతున్నాయి? స్వస్వరూపమగు ఆత్మను ఎందుకు గ్రహించటం లేదు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అన్నిటికీ మూలకారణమైయున్న అజ్ఞానము - అవిచారణల వలననే ఈ చిత్తము విషయాభిముఖమగుచున్నది. అట్లు అభిముఖమై, ఆయా పదార్థముల రూపమును పొంది, పలురకములైన వైచిత్ర్యములతో కూడిన మలినత్వమును పొందుచున్నది. స్వయంకృతంగానే అనేక మిథ్యావ్యాపారములచే భ్రాంతి దృఢమగుచున్నది! అట్టి భ్రాంతి యొక్క దృఢత్వ కారణంగా చైతన్యము తన పూర్ణరూపమును మరచి, మనోరూపమును పొంది, అనాది కాలంగా ఈ జనన మరణాల పరంపరలో తాదాత్మ్యం చెందుతూ పరిభ్రమిస్తోంది. తుచ్ఛ మనోవృత్తి రూపమున అనేక వాసనలను తనయందు నిక్షిప్తం చేసుకుంటోంది. చిన్నపిల్లవాడు బేతాళుని రూపమును ఊహించుకొని, ఆ

Page:570

ఊహకు అనుగుణంగా ఎదురుగా జడలు-కోఱలు-కొమ్ములు తో కూడిన రూపమును చూస్తాడు చూచావా? అట్లాగే చిద్వస్తువే తనయొక్క కల్పనలను విస్తరించుకొనుచూ దుఃఖములను పొందుచున్నది. అయితే, ఏది ఎప్పుడు ఎట్లైనా కావచ్చు - కాకపోవచ్చుగాక! ఈ జీవుడు సర్వదా చిద్వస్తువే అయి ఉన్నాడు.

వాసనలు క్షయించుటయే శాస్త్రప్రవచితములగు అన్ని ప్రయత్నములలోని గూఢార్థం. వాసనలు క్షయిస్తే ఇకప్పుడు సద్వస్తువగు చైతన్యం నిర్మల మనోవృత్తిని పొందుచున్నది. సర్వ దుఃఖములకు కారణం ఈ జీవుడు ప్రాపంచిక వృత్తులు కలిగి ఉండుటయే. సూర్యకిరణం ప్రసరించినచోట చీకటి ఉండదుకదా! ప్రపంచవృత్తులు ఏ చిత్తములో లయిస్తాయో, ఇక అట్టి చిత్తమునందలి దుఃఖమంతా క్షణకాలంలో పటాపంచలౌతోంది.

శ్రీరాముడు : మునీశ్వరా! చిత్తమునకు ఈ జాగ్రత్ - స్వప్నముల రూపమున గల వేరువేరు అనుభవములు ఎట్లా సంప్రాప్తిస్తున్నాయి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు దూరమును దగ్గరగా, దగ్గరను దూరముగా చేసి వేయగలదని ఇతఃపూర్వమే చెప్పుకొన్నాంకదా! పిల్లవాడు చిన్న చిన్న క్రీడల మధ్య క్రీడించుచున్నట్లు ఈ మనస్సు జీవులందు విజృంభిస్తోంది. తదితరులు” అను అనుభవముయొక్క కల్పన చేసుకుంటూ పోతోంది.

అజ్ఞానియగు ఒక బాటసారి దూరంగా ఉన్న ఒక శిలను చూచి "అదిగో.... పిశాచం.... అని తలుస్తూ ఉంటాడు, చూచావా? వాసనలతో కూడిన చిత్తమునకు అభయమైన విషయములందు కూడా భయంకలుగుతోంది. మత్తుపానీయం సేవించినవానికి బుద్ధి యొక్క అల్పత్వం ఏర్పడుట చేత ప్రపంచమంతా గిఱ్ఱున తిరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. వాసనలచే కళంకితమైన మనస్సుకు మిత్రుని యందు "శత్రువేమో? అనే శంక కలుగుతోంది. మనస్సు వ్యాకులత చెందియున్నప్పుడు చంద్రుడు కూడా భరించరానంత వేడిమిని వెడలగ్రక్కుచున్నట్లు కనిపిస్తాడు. దుర్విషయ భావన గల వానికి అమృతమిచ్చినా, అది చేదుగా ఉంటుంది.

వాసనలచే ఆచ్ఛాదితమైన చిత్తము ఈ జగత్రరచనను తనయొక్క 'అర్థము అనుభవము’ లను అనుసరించి గాంచుచున్నది.

ఓ రాఘవా! ఈ జాగ్రత్ స్థితి కూడా స్వప్నము వంటిదేనని సర్వజనులను ఉద్దేశ్యించి మరల మరల ప్రకటించుచున్నాను.

శ్రీరాముడు : ఈ దేహములోనికి దుర్భావాలు, దురభ్యాసాలు ఎందుకు వచ్చి చేరుచున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : మరల చెప్పుచున్నాను. ప్రబలమగు వాసనలే ఈ జీవుని మోహమునకు కారణమగుచున్నాయి. అట్టి వాసనలను సమూలంగా ఛేదించి, పెరికివేయాలి.

ఈ సంసారవనంలో మనస్సు అనే మృగం వాసనాజాలం చేత ఈడ్వబడుతోంది. ఫలితంగా అనేక దుఃఖములను మరల మరల అనుభవిస్తోంది. ఎవని యందైతే తత్త్వవిచారణ యొక్క

Page:571

దృఢత్వం చేత పదార్థములపట్ల ఇవి నాకు కలగాలి, ఇవి తొలగాలి" అను రూపము గల వాసన (లేక) అభినివేశం నశించిపోతుందో, అట్టివానియందు జ్ఞానం అత్యంత సులభంగా ప్రవేశిస్తోంది. మేఘాలు తొలగితే ఆకాశంలో సూర్యుని ప్రకాశం స్వయంగానే ద్యోతకమౌతున్నట్లు “ఏదో పొందాలి” అను భావావేశం త్యజించగానే ఆత్మజ్ఞానం ఈ జీవునిలో ప్రకాశిస్తోంది. జ్ఞానమే ఈ జీవుని సత్యమగు స్వరూపము, స్వభావము కూడా. అట్టి జ్ఞానమును అజ్ఞానము ఆవరించుట చేతనే ఈ జగదృష్టులు ఏర్పడుచున్నాయి.

ఓ ప్రియరాఘవా! మనస్సే జీవుడు. అంతేగాని, ఈ తుచ్ఛమైన దేహము జీవుడు కాదు సుమా! ఎందుకంటావా? ఈ దేహము జడమైనది. ఇక దీనియందలి మనస్సు మాత్రం అటు జడము గాని, ఇటు చేతనముగాని కాక, ఈ రెండింటికీ విలక్షణమై ఉంటోంది. ఈ మనస్సు ఏ కార్యమైతే చేస్తుందో, అది మాత్రమే ఈ జీవునిచే వాస్తవంగా చేయబడినదౌతోంది. ఇది దేనిని త్యజిస్తుందో, అది మాత్రమే త్యజించబడుచున్న దగుచున్నది. ఈ జగత్తంతా మనస్సే. మనస్సుకాక ఇక్కడెక్కడా ఏదీ లేదు. ఈ భూమండలము, ఆకాశము, పృథివి, వాయువు, మహత్తు ఇవన్నీ మనస్సు మాత్రమే. ఈ మనస్సు కనుక ఆయా పదార్థము లందు భావన చేయటం జరుగకపోతే ఆయాపదార్థజాలము యొక్క ఉనికే అనుభవమవటం జరిగేదికాదు!

ఎవరి మనస్సైతే అజ్ఞానాన్ని ఆశ్రయిస్తోందో, అట్టివాడు మూఢుడు అని అనిపించుకొంటు న్నాడు. అదే మనస్సు వివేకమును ఆశ్రయించినపుడు జ్ఞానయుక్తుడు అని అంటున్నారు. అంతేగాని ఈ జడ శరీరమును దృష్టిలో పెట్టుకొని, ఇతడు జ్ఞాని. ఇతడు మూఢుడు" అని అంటామా? లేదు.

అట్లాగే ఎదురుగా ఉన్నదానిని చూచేది మనస్సే కాని ఈ కనుగ్రుడ్లు కానేకావు. ఆ మనస్సే వినుటను నిర్వర్తించు చోటును చెవులు అని, స్పర్శను పొందేచోటును 'చర్మము' అని, సువాసన ఆస్వాదించే చోటును ఘ్రాణేంద్రియము (ముక్కు) అని, రుచిచూచే స్థానమును నాలుక అని అంటున్నాం. ఆయా వృత్తులందు ప్రవర్తిస్తున్నట్టి ఈ మనస్సు యొక్క శక్తి అతి విచిత్రమైనది. మనస్సు లేకపోతే ఇంద్రియాలకు ఉనికే లేదు. కవిత్వం అల్లుచున్నది కవియేగాని, కలముకాదు కదా! మనస్సే ఇంద్రియములలో ప్రవేశించి ఆయా అనుభవములను రచించుకొంటోంది. ఒకే నటుడు అనేక వేషాలు వేస్తూ ఉంటాడు.... ఆ వేషములన్నీ అతడే.... కాని ఆ వేషములన్నిటికీ విలక్షణమై ఉండి ఉంటున్నాడు కదా! అట్లే

ఒక వ్యక్తి తండ్రి, తాత, తమ్ముడు, అన్న, కొడుకు, స్నేహితుడు మొదలైనవన్నీ అగుచున్నాడు. అన్నీ అతడే....

కానీ అతడు వాటిలో ఒకటి నుండి మరొకటిగా పరిణమిస్తున్నాడా? లేదేఁ!

ఈ మనస్సు కూడా అన్ని ఇంద్రియములలోను వేరువేరుగా వర్తిస్తోంది. అందులో ఏ ఒక్కటీ తాను కాకుండానే ఉంటోంది. దీనికి వేరుగా ఇంద్రియములకు అస్థిత్వమే లేదు. ఇది అల్పమైన దానిని అధికంగాను, అధికమైనదానిని అల్పంగాను చేసి వేయగలదు. స్వజనుల తప్పులు

Page:572

స్వల్పమైనవిగా, విరోధిజనుల అవే తప్పులు తీవ్రమైనవిగాను కనిపించటమే మనకు ఇందుకు తార్కాణం. సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగాను మార్చివేసి దర్శించటంలో ఈ మనస్సుకున్న శక్తి మరింక దేనికీ లేనే లేదు కదా! ఇది కటు (చేదు) వస్తువును కూడా మధురంగా భావిస్తే, అట్టి మధురానుభవంగానే పొందగలదు. శత్రువుని మిత్రునిగా, శ్రేయోభిలాషిని కూడా శత్రువుగా చూపించటంలో దీనికిదే సాటి.

ఈ చిత్తము దేనియందు ఏ వృత్తిచే ప్రతిభాసిస్తుందో, ఆ వస్తువు అట్లే పరిణమిస్తుంది. ఇది నాకు ప్రియము అను వృత్తితో అది దర్శించుచున్నప్పుడు, ఆ వస్తువు అట్లే ప్రియమై ప్రాప్తిస్తోందికూడా. ఇట్టి ప్రతిభాస (Reflection) లేక స్ఫురణ లేక భావన వల్లనే, వ్యాకులచిత్తుడైయున్న హరిశ్చంద్రుడు ఒకే రాత్రి కొద్ది గంటల కాలంలో పండ్రెండు సంవత్సరముల సుదీర్ఘమైన అనుభవం అత్యంత జాగ్రత్ లాగా, వాస్తవానుభవంలాగా స్వప్నంలో పొందాడు. ఈ చిత్తప్రభావం చేతనే ఇంద్రద్యుమ్నుడు అనబడు ఒక వ్యక్తి ఒక గంటకాలంలో ఒక యుగం కట్టివేయబడి ఉన్నాడు... అయితే ఆ బంధనము నకు ప్రయోజనంగా ఆ మరునాడు తాను తప్పక “ఒక రాజు కాబోవుచున్నట్లు తెలిసింది..... అప్పుడు ఆ బంధమును కూడా సంతోషముతోనే అనుభవించగలుగుతూ ఉంటాడు. మనస్సు యొక్క వైచిత్ర్యము అట్టిది. భగవద్భక్తుల విషయంలో కూడా ఈ చమత్కారం చూస్తున్నాం. వారి మనస్సులు పరమాత్మ యొక్క చింతనాప్రభావంచేత ఒకానొక ప్రియవృత్తి కలిగి ఉంటున్నాయి. అట్టి సమయంలో వారు మహానరకములను కూడా నిశ్చింతంగా అనుభవించ గలుగుచున్నారు. అదంతా మనస్సు యొక్క ప్రభావమే.

దారం తెంచితే పూదండయందు గల పూలన్నీ నేల రాలుతాయి కదా! మనస్సు జయించబడితే చాలు. ఇక, తక్కిన ఇంద్రియములన్నీ తమంతట తామే అప్రభావితం అవుతాయి.

పదార్థముల గురించి విపరీత కల్పన చేయటంలో (ఇది ప్రియము. ఇది అప్రియము - అని త్వరితగతిని నిర్ణయించుకోవటంలో) ఈ మనస్సుకు మహాసామర్థ్యము ఉన్నది.

ఆత్మ అంతటా సమరూపమై యున్నది. అది స్వచ్ఛమై, నిర్వికారమై, సూక్ష్మమై, నిత్యమై, సాక్షి స్వరూపమై, సర్వపదార్థము లందు వ్యాపించియున్నది. సర్వ విషయములకు అతీతమై, వాక్-ఇంద్రియములకు అలభ్యమై మౌనభావము వహించి ఉంటోంది. అట్టి బ్రహ్మమును ఈ దేహ రూప మాత్రంగా చూస్తున్నది ఈ మనస్సే. శరీరముతో అభేద కల్పన చేస్తూ, ఇక తన జన్మ స్థానమగు బ్రహ్మము (లేక ఆత్మ)నే జడంగా దర్శిస్తోంది ఈ మనస్సు.

అంతరంగంలో .... ఇచ్ఛ, సంకల్పములు మొదలైనవి కలిగియున్న ఈ మనస్సు బాహ్యంలో

- - నది, ఆకాశం నగరాలు, సముద్రాలు మొదలైన కల్పనలు వ్యర్థంగా కలుగచేస్తోంది. ఎంత వివేకబోధ పొందుచున్నప్పటికీ, ఎంతగా నియమించబడినప్పటికీ ఈ మనస్సు దేనినైనా ఇష్టమైతే అమృతతుల్యంగాను, లేదా, ఇష్టంలేకపోతే, విషతుల్యంగాను చూచుట మానటం లేదు. అందుచేత ‘ఇచ్ఛ’యే మనస్సు యొక్క బీజము ... అని చెప్పబడుతోంది. బీజమే వృక్షమగుచున్నట్లు, ఇచ్ఛయే మనస్సు అగుచున్నది.

Page:573

శ్రీరాముడు : ఈ మనస్సు ఇష్టానిష్టములను ఎందుకు పొందుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏ మనస్సైతే పూర్ణమగు ఆత్మ స్వరూపము యొక్క సాక్షాత్కారం పొందదో, అదియే ఆయా వస్తువులందు ఇది నాకు ఇష్టము. ఇది నాకు కష్టము మొదలైన కల్పనలన్నీ చేసుకుంటోంది. అయితే, తత్త్వజ్ఞుల మనస్సు ఇట్టి చపలత్వము కలిగియుండదు. మనస్సు అనేది చేతనశక్తినుండే స్ఫురిస్తోంది. కాబట్టి ఈ వాయుత్వము ప్రకాశత్వము, ద్రవత్వము కూడా “మనస్సే”! కఠినత్వము, శూన్యత్వము పొందుచున్నది అదే. చైతన్యము అనిర్వచనీయమైన తన ఇచ్ఛాశక్తిచేతనే ఇట్లు మనస్సు యొక్క రూపమును స్వీకరిస్తోంది. అట్టి మనోరూపముతో భావనామాత్రంగా దేశ కాలాదుల అనుభవం తనయందు అంగీకారబుద్ధిచే పొందుతోంది.

మనస్సు - సంలగ్నము : ఈ మనస్సు ఎక్కడ సంలగ్నమైతే అక్కడ మాత్రమే ఆ భావనకు సంబంధించిన అనుభవమును పొందుతోందని మరొకసారి ప్రకటిస్తున్నాను. ఒకడి మనస్సు ఎక్కడో లగ్నమై ఉన్నప్పుడు, అతడు తాను తింటున్న పదార్థపు రుచిని కూడా గుర్తించడుకదా! దృష్టి పథంలో ఎదురుగా ఉన్నా కూడా, మనస్సు లగ్నం కాకపోతే, ఆ వస్తువుగాని, విషయంగాని చూడబడకపోవటం మనందరికి అనుభవమే.

అట్లాగే ఈ మనస్సు చీకటియందు విచిత్ర కల్పనలన్నీ చేసి, వాటినన్నిటినీ స్వయంగా పొందగలదు. (అనగా అక్కడ లేని వాటినికూడ తానే కల్పించుకొని ఉన్నట్లే చూడగలదు). ఈ మనస్సు - ఇటు ఇంద్రియముల - అటు ఆ ఇంద్రియములచే అనుభవించబడుచున్న పదార్థముల - ఆకారములను పొందుచున్నది.

మనస్సే ఇంద్రియములకంటే శ్రేష్ఠమైనది. అది ఇంద్రియములకంటే మునుముందే ఉన్నదని గ్రహించు. ఓ రామా! ఈ చిత్తము - శరీరములు వేరువేరు వలె అజ్ఞాన దృష్టికి మాత్రమే కనిపించటం జరుగుతోంది. మనస్సుయొక్క కార్యక్రమమే ఈ భౌతిక శరీరము.”

ఈ మనస్సే నేనిట్లు అగుదును అని భావించి, అట్టి భావనకు అనుకూలమైన ఈ ఈ ఉపాధులను నిరంతరం పొందుతోంది. ఇదే మనస్సుతో ఉపాధుల కావల నిశ్చలంగా ఉన్న ఆత్మను గ్రహించువారు ఉపాధిభావనను అధిగమించి, ఆత్మభావనను స్వీకరించగలుగుచున్నారు. అఖండమగు ఆత్మను ఎరిగినవారు అఖండభావననే పొందుచున్నారు. మహాత్ములు సర్వము గ్రహించియుండుటచే మనోరహితులై ఉంటున్నారు. ధీరులై, వాసనలను జయించివేయుటచే మనోరాహిత్యమును పొందుచున్నారు. సుందరస్త్రీల లయవిన్యాసములు చూచినప్పుడుకూడా, వారు ఒక కొయ్య-రాయి లాగా వికారరహితులై ఉంటున్నారు. కొందరు మహనీయులగు మునులు తమ యొక్క మనస్సు ఆత్మయందు సంలగ్నమై ఉంటున్నప్పుడు తమ కాళ్లు చేతులు త్రెంచబడటం కూడా గ్రహించకపోవటం మనం కొన్ని చరిత్రలలో విన్నాం కదా!* అదంతా అభ్యాసవశంచేతనే అట్లు

మాండవ్య మహామునిని 'దొంగ' అని అనుకుని కొరత వేయడం జరిగినప్పుడు, ఆ శరీరము పొందిన హింస అతడు పొందకపోవడం.

Page:574

‘సుస్థిర' లేక 'అతీత' స్థితి సాధ్యపడుతోంది. "ఈ సాంసారిక వ్యవహారాలకు కలతచెందుట అనేది కూడా ఈ జీవునకు మనస్సు యొక్క అభ్యాసవశంచేతనే ప్రాప్తించింది సుమా! జ్ఞానులు అభ్యాసబలం చేతనే దుఃఖములను సుఖములుగా, స్త్రీ-ధన-వస్తుప్రాప్తులన్నీ తుచ్ఛమైనవిగా గాంచగలుగుచున్నారు.

అంతదాకా దేనికి? ఒకని మనస్సు ఎక్కడో సంలగ్నమైయున్నదనుకో ... అప్పుడు నీవు అతనికి అనేక వివరణలతో కూడిన కథ చెప్పితే అది అతడు గ్రహిస్తాడా? లేదు కదా!

ఒకడు ఇంటిలోనే ఉండి "నేనిప్పుడు ఈ కొండను అధిరోహించాను. ఇక్కడ సరస్సు ఉన్నది. ఆ సరస్సును సమీపించాను. చల్లనిగాలి వీస్తోంది. స్వచ్చమైన మేఘములు అంతటా విహరిస్తున్నాయి. ఇప్పుడిక ఈ గుహలో ప్రవేసిస్తున్నాను. ఆహాఁ! సువిశాలమైన గుహాంతర్భాగంలోని ఈ చెట్టు క్రింద నే నిప్పుడు ఎంతో ప్రశాంతంగా విశ్రమిస్తాను...” అని భావించుచున్నాడనుకో... అప్పుడాతడు అక్కడి స్వచ్ఛమైన మేఘములను, గుహలను భ్రాంతిచే పొందగలడు. అట్లాగే మరొకడు సుందరమైన పాన్పుపై పరుండి, స్వప్నవశంచేత అనేక దుఃఖకరములగు ప్రదేశములలో సంచరిస్తూ ఏడవటం, నవ్వటం మొదలైనవి అనుభవిస్తూ ఉంటాడు. స్వప్నంలో మనస్సు విజృంభిస్తున్నప్పుడు అనేక వ్యక్తులను, సంఘటనలను పొందుతోంది. స్వప్నములోని ఆయా పదార్థజాలమంతా ఆ స్వప్న సమయంలో వాస్తవంలాగానే ప్రాప్తిస్తోందికదా! ఆ స్వప్నపదార్థములన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఆత్మ తన స్వస్వరూపమునుండి చ్యుతి చెందినదై, క్షుభితం (disturbed) అయినప్పుడు, తన హృదయం లోనే ఆ స్వప్న వ్యవహారమంతా అట్లు దర్శించుచున్నది. అనగా ఆత్మయే అట్లు విస్తరిస్తోంది.

సముద్రజలం నుండి తరంగాలు ఉత్పన్నమౌతున్నాయి. అట్లే, ఈ దేహమునందు అంతర్గమై యున్న మనస్సునుండే స్వప్నము' అనే అవస్థ, అట్టి అవస్థలో ఆయా ఆకార-వికారములు ఏర్పడు చున్నాయి. ఈ జాగ్రత్ విషయం కూడా. అట్టిదే.

ఈ జాగ్రత్, స్వప్నములు రెండూ మనస్సు నుండే ఉత్పన్నమౌతున్నాయి.

ఒక కొండరాయి యందు చెక్కబడిన స్త్రీవిగ్రహం ఆ కొండరాయికి వేరైనది అవుతుందా? అట్లే ఈ జాగ్రత్ - స్వప్నములు చిత్తమునకు వేరైనవి కావు. సకల విధములైన వైచిత్రములు చిత్తమునుండే కలుగుచున్నాయి. స్వకీయమైన చిత్తవృత్తియే జాగ్రత్ స్వప్నములందు, ఇష్ట-అయిష్టములందు, సుఖ-దుఃఖములందు, భావ - అభావములందు ప్రవర్తిస్తోంది.

శ్రీ రాముడు : హే మహర్షీ ! లవణుడు ఆ అనుభవములన్నీ సుదీర్ఘమైన వాస్తవంగా పొందటం ఎట్లా జరిగింది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రతిభాసావశం చేతనే (as a process of Refraction) అతనికి ఆ అనుభవాలు ప్రాప్తించాయి. అనగా, ఒకానొక సుదీర్ఘమైన దృశ్య వ్యవహారం అతని చిత్తమునందు ప్రతిబింబించటం చేతనే అతనికి ఆ అనుభవాలు కలిగాయి. స్ఫురణ యే రూపంగా కలిగియున్నట్టి ఈ మనస్సు ఏ రూపమును భావిస్తే అద్దానినే శీఘ్రంగా పొందటం జరుగుతోంది. దేనిని ఎట్లు భావన చేస్తూవస్తే,

Page:575

అది అట్లే పరిణమిస్తూ ఉంటుంది. కనుక రామా! నీకు ఏది సమ్మతమై ఉంటుందో అదే భావనచేయి. ఒకటి భావనచేసి, మరొకదానిని పొందటం జరగదు.

ఆత్మ యొక్క సర్వసమ్యత్వమును భావనచేస్తే 'ఆత్మ' రూపమునే పొందగలవు.

ఈ 'మనస్సు' అనేది జీవుల యొక్క అంతరమున ఉండి, ఈ అనేక రూపములను తానే పొందుతోంది. అట్లు పొంది, జాగ్రత్ - స్వప్నమయమగు ఈ జగత్తును విస్తరింపజేస్తోంది. లవణమహారాజు చండాలత్వము పొందిన విధంగానే, ఈ చిత్తము ప్రతిభాసావశం చేత దేవత్వం నుండి ఆసురత్వం, సర్పత్వము నుండి వృక్షత్వము పొందుతోంది. ఒకడు, అతని భార్య దృష్టిలో భర్తగాను, అతని తండ్రి దృష్టిలో కొడుకుగాను, ఒక స్నేహితుని దృష్టిలో స్నేహితుడుగాను, అతని శత్రువు దృష్టిలో శత్రువుగాను అగుచున్నాడు కదా! స్వసంకల్పమును అనుసరించి ఈ మనస్సు కూడా అనేక వేషములు ధరిస్తోంది. అది ఆకారరహితమైనప్పటికీ, చిరకాలపు అభ్యాసముచే జీవుడు అను ఆకారమును అవధరిస్తోంది. మోహమయమగు వాసనలతో కూడుకొన్నదై, సర్వత్రా వ్యాపించి ఉంటోంది. ఒకడికి తన తల్లి చెల్లి-భార్య-స్నేహితులు శత్రువులు వేరువేరు రీతులుగా అనుభూతమవటమంతా మనో చమత్కారమే!

శ్రీ రాముడు : ఈ మనస్సు ఎందులోంచి ఉత్పత్తి అవుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇది జన్మించేది ఎక్కడినుండో కాదు. ఆత్మయొక్క స్వసంకల్పమే మనస్సు యొక్క రూపము, ఉనికి, స్థానం కూడా! అట్టి సంకల్పము యొక్క ఆశ్రయము కారణంగానే శుద్ధస్వరూపమగు ఆత్మకు సుఖ-దుఃఖములు, భయ-అభయములు మొదలైన అనేక ద్వంద్వములు వచ్చిపడుచున్నాయి. నూనె నువ్వులలోనే ఉండి ఉన్నట్లు, ఈ ద్వంద్వములన్నీ కూడా మనస్సునందే ఉండి ఉన్నాయి. అందుచేత మనస్సుకి చికిత్స చేసుకోవాలి. మనస్సులో ఉన్నట్టి ఆవేశపూరితమైన భావనాక్రమమే ఆయాసందర్భాలలో అల్పంగానో, అధికంగానో ప్రకటితమవటం జరుగుతోంది. చిత్తమునందు ఘనీభూతమై ఇంతకుముందే నిలచియున్న ఆయా సుఖ-దుఃఖములు మనస్సు యొక్క స్ఫురణచే వ్యక్తమౌతున్నాయి. ఓ రామా! వేటినైతే మనం దేశ కాలములు" అని అంటున్నామో.... అదంతా మనస్సంకల్పమే అయి ఉన్నది. అనగా, సంకల్పముల ప్రభావంచేతనే దేశ - కాలములు స్థితి పొందినవై ఉంటున్నాయి. అంతేకాదు ఈ స్థూలశరీరం శోభించటం, విజృంభించటం, శాంతిని పొందటం, వేరైన స్థానములను పొందటం .... ఇవన్నీ కూడా మనస్సు యొక్క కార్యక్రమములే సుమా! అంతఃపురంలో మహారాణి గొప్పదర్పంతో సంచరిస్తూ ఉంటుంది కదా! ఈ మనస్సు తనయొక్క అనేక సంకల్పములచే రచించబడిన అనేక క్రియాసంరంభములను వెంటబెట్టుకుని ఈ దేహములందు గొప్ప అతిశయంతో వర్తిస్తోంది. స్తంభనాస్త్రము” (మోహనాస్త్రం) ప్రయోగించినప్పుడు శత్రువులు చేష్టారహితులు అవుతారు చూచావా? అదే విధంగా ఎవడైతే తనయందు విషయచింతన” అనే చాపల్యమునకు చోటు ఇవ్వడో ... అట్టివాడి మనస్సు, ఆ మనస్సు కల్పించే కల్పనా విశేషాలు తమంతటతామే సశాంతిస్తాయి. తత్త్వవిచారముచే విషయములనుండి మరలించబడిన మనస్సు

Page:576

కలవాడే అందరికంటే శ్రేష్ఠుడు' అగుచున్నాడు. నాయనా! రామా! ఇక తక్కినవారి జీవితవిధానమంతా బురదలోని పురుగుల జీవితములకంటే, గొప్పవి కాదు.

ఎవని మనస్సు ఏకాగ్రతను పొంది స్థిరంగా ఉంటుందో అతడే తనయొక్క ఆత్మధ్యాన ప్రభావంచే సర్వోత్తమమగు బ్రహ్మపదమును పొందగలడు.

మందర పర్వతం చలించకపోతే క్షీరసాగరం ప్రశాంతంగా ఉంటుంది కదా! ఈ మనస్సు సంయమనం పొందితే సంసార భ్రమ కూడా శాంతిస్తుంది. అసలు ఈ సంసార విషవృక్షం మొలిచేది ఎక్కడో తెలుసా? విషయభోగములందు ప్రవర్తించు “మనోవృత్తులు” అనే ప్రదేశంలోనే సుమా! ఈ జీవులలో అనేకులు క్రోధ-మోహాదులతో కూడుకొన్నవారై, ప్రమత్తులై మందబుద్ధితో ప్రవర్తిస్తున్నారు. చపలమైన చిత్తము కలవారై ఈ సంసారము (wordly attachment) అనుదానిని ఆశ్రయిస్తున్నారు. జడత్వములో తగుల్కొని, తత్ఫలితంగా ప్రబలమైనట్టి అనేక దుఃఖములచే విచ్ఛిన్నులు’ అగుచున్నారు. 'చక్రభ్రమణము' వలె అనేక చింతలలో మునిగి - - తేలుచు, చివరికి ప్రవాహపతితంగా అనేక లోకసంచారములను మరల మరల పొందుచున్నారు.

వారి పతనము ఉత్పతనములు సముద్రకెరటములవలె వచ్చి పోతూనే - ఉన్నాయి.

మనస్సును నిరోధించటంలో అప్రయత్నశీలురై ఉండేవారి దుస్థితికి అంతు ఉండుట లేదు.

8. చిత్తము చికిత్స ఔషధం

- - - నాయనా! రామా! ఇప్పుడు ఈ 'చిత్తము' అనే ఘోరవ్యాధిని నిర్మూలించటానికి ఒక గొప్ప ఔషధం మీ అందరిముందు ఉంచుతాను. ఈ ఔషధం సేవించటానికి ఏ ఒక్కరు ఎక్కడికీ పోనక్కర్లేదు. ఎవ్వరినీ ఆశ్రయించవలసిన అవసరంలేదు. ఎవరికి వారికే తమ అధీనంలోనే ఉన్న ఔషధం ఇది. బాహ్య ప్రయత్నములు, ఇతరుల సహాయం అవసరముండదు. ఇది పురుషార్థ సాధకము. ఉత్తమ సుఖదాయకము కూడా.

మేము అనేక సంవత్సరములు సుదీర్ఘమైన తపస్సులచే, ధ్యానములచే, శాస్త్రవిచారణలచే, పరస్పర వాదోపవాదములచే ఎంతగానో విచారించాం. అట్లు విచారించిన తరువాతనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. ఈ చెప్పబోయే ఔషధం' యొక్క ప్రాశస్త్యమేమిటో ఇక్కడకు వేంచేసియున్న అనేకమంది జ్ఞానులు గ్రహించియే ఉన్నారు. ఇప్పుడు ఆ ఔషధము' యొక్క విశేషమును చెప్పుచున్నాను. అంతా శ్రద్ధగా వినండి.

“ఇష్ట - వస్తువుల పట్ల ఏర్పడే వృత్తిని త్యజించటం”

చిత్తము’ అనే బేతాళుణ్ణి నిరోధించాలంటే 'వాంఛిత వస్తువు' (I want some-thing).... అను దానిని త్యజించివేయాలి. అట్లు త్యజించాలంటే ఆత్మకు సంబంధించిన ఎరుకను, సాక్షాత్కారమును

Page:577

పెంపొందించు శారీరక - మానసిక క్రియలను ఆశ్రయించటమే ఉపాయం. అట్లు ఆశ్రయిస్తూ ఉండగా కొంతకాలానికి, ఈ దృశ్యముపట్ల ఏర్పడుచున్న ఇది వాస్తవమే అను అల్పభావం సన్నగిల్లుతూ వస్తుంది. 'ఇష్టవస్తువు' అను వృత్తిని త్యజించుచు, క్రమక్రమంగా 'రాగము-ద్వేషము' అను రెండు దోషములకు చిత్తమునందు చోటు ఇవ్వకుండా ఉంటూ ఉంటే చాలు. అట్టివానిచే మనస్సు జయింపబడటం అతిసులభం.

ఆత్మసాక్షాత్కరము’ అనునట్టి యత్నములచే ఈ చిత్తమును మిథ్య అయినట్టి ఈ సంసారపదార్థ సముదాయముల నుండి తొలగించాలి. ఎట్లాగైనా సరే 'ధ్యానము'ను 'ఆత్మస్వరూపము' అను సత్య వస్తువునందు నియమించాలి. ఆయా గుణములతో కూడి కనిపిస్తున్న ఈ సహజీవులంతా మమాత్మ స్వరూపులే! అనే మననమును రోజు రోజుకూ పెంపొందించుకోవాలి. అప్పుడు నీవు జ్ఞానయుక్తుడవై, ఈ సంసారము అనబడుదానినుండి రక్షింపబడగలవు. శ్రేష్ఠమైన విషయములను విని, మననము చేయకలిగిన మనస్సు గల ఓ రామచంద్రా! దుఃఖాగ్నియందు పరితప్తమగుచున్న నీ మనస్సును మరొక నీ మనస్సుతో జయించివేయాలి. మనస్సుతోనే మనస్సును అణచివేయాలి. జయించివేయాలి. ఆ రెండవ మనస్సును చింతారాహిత్యముతోను, శాస్త్ర - సత్సంగములతోను, ధీరత్వముతోను, ప్రశాంతతతోను నింపివేయాలి.

ఒక బాలుడు దుష్ట, తుచ్ఛ కార్యము లందు నిరంతరం నిమగ్నమగుచున్నాడనుకో అప్పుడు ఏం చేస్తాం? అతనిని అనేక ఉపాయాలతో సరిదిద్ద యత్నిస్తాం.

సామం Affectionalety explaining / Gentle cajoling

దానం offering/showing the advantages

భేదం : differentiation

దండం : punishing

ఇట్లు ఈ నాలుగు ఉపాయాలు సమయోచితంగా తగినంతగా ఉపయోగించి అతనిని మరొక ఉత్తమ కార్యమునందు వినియోగిస్తాం. అట్లే ఈ చిత్తముయొక్క 'దృశ్యాసక్తి' అనబడే ఒక భాగమును "దృశ్య తిరస్కృతి .. ఆత్మాంగీకారము అను సమృద్ధితో నింపబడిన మనస్సుయొక్క మరొక భాగంతో నియమించాలి. సమయోచితంగా పై నాలుగు ఉపాయాలు ఉపయోగిస్తూ ఉండాలి. ఇందులో కష్టం ఏమీ లేదు. కొంత ప్రయత్నశీలుడవై, ఈ దృశ్యము సత్యము కాదుకదా! ఇందు నాకు ఆసక్తి ఎందుకు ఉండాలి? కాబట్టి అన్ని పరిస్థితులలోను, అన్ని వేళలలోను 'ఈ దృశ్యము అవాస్తవమే’ అను ఎరుక కలిగి ఉంటాను అని నిర్ణయించుకో. నీ దృష్టిలో ఈ దృశ్యము అవాస్తవమైనదిగా సుస్థిరపడితే అప్పుడు ప్రాప్తించుచున్న స్థితినే "సమాధాన స్థితి" అని అంటున్నాం. అట్టి నిశ్చల సమాధియందు నియమితుడవై ఉండు. ఇక ఆయా ప్రవాహపతితమైన కార్యక్రమములను నిశ్చింతగా, అనాసక్తిపూర్వకంగా, సంగరహితంగా, ఉద్వేగరహితంగా నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడు అట్లు నీచే నిర్వర్తించబడుచున్న ఆయా క్రియావ్యవహారముల కారణంగా నీ 'సమాధి స్థితి’ కి వచ్చే లోటేమీ ఉండదు. మేమంతా కూడా అట్లే 'సమాధి' యందు సుస్థిరులమై శిష్యులకు ఆత్మవిషయమై