Page:578
బోధించుట” అను ఈ గురుధర్మమును, తదితర యజ్ఞాది లోక శుభకరమగు కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాం. నీవు కూడా ఉత్తమ ఫలదాయకమగు 'సమాధి' అను సత్కర్మయందు మనస్సును నియోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సును సర్వదా ఐక్యపరచి ఉంచు.
ఓ రాఘవా! “బాహ్యవిషయములు అభిలషించటం” అనే జాడ్యమును నిరాకరించటం (లేక) త్యజించటం నీ అధీనంలోనే ఉన్నది సుమా! దానికి గురువులుగాని, మరింకెవరోగాని ఏం చేయగలరు చెప్పు? నీవే అందుకొరకై ప్రయత్నించాలి. అట్టి ప్రయత్నం నీకు సర్వదా హితమును చేకూర్చగలదు.
“అభిలాషను జయించుట" అనే వైరాగ్యవృత్తిని అనుసరించుటకు సిద్ధముకానట్టి మనుజుడు కీటకముతో పోల్చతగినవాడు. అట్టివానికి ధిక్కారమగుగాక!
శ్రీ రాముడు : స్వామీ! ఏవేవో రమణీయమైన వస్తువులు మా ఎదుటకు వస్తూ - పోతూ ఉంటాయి. వాటిపట్ల ఆకర్షణ - వికర్షణలు ఏర్పడకుండా చూచుకోవటం ఎట్లా సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మసాక్షాత్కారరూప భావనచే అది సుసాధ్యమే! రమణీయమైన-అరమణీయమైన వస్తువులు, ఇష్ట - - అయిష్టమైన వారు తారసపడుతూ ఉంటారు కదా! అయితే, “ఇవన్నీ కూడా పరమోత్తమమగు పరబ్రహ్మము యొక్క రూపమే అయి ఉన్నాయి కదా! పరమాత్మకు చెందినదే కదా!" అని భావిస్తూ ఉండు. అప్పుడు గొప్ప మల్లయోధుడు ఒక బాలుని జయించివేయునట్లు నీవు ఈ చిత్తమును జయించి వేయగలవు.
అరమ్యం రమ్య రూపేణ భావయిత్వా స్వసంవిదా | మల్లేనేవ శిశుశ్చిత్త మయత్నేనైవ జీయతే ॥
ఓ జనులారా! "ధ్యానము - ప్రార్థన - తపస్సు - పూజ దానము సత్సంగము విచారణ” వంటి ఆత్మసాక్షాత్కారరూపమగు పురుష ప్రయత్నములు మీచే సర్వదా ఆశ్రయించబడుగాక! అప్పుడీ చిత్తము తప్పక జయించి వేయబడగలదు. అట్లు జయించబడిన చిత్తము అప్రయత్నంగానే బ్రహ్మమును పొందుచున్నది.
తన అధీనములోనే ఉన్నట్టి "అభిలాషను జయించుట” అనబడు మనోనిగ్రహంకోసం ప్రయత్నించువాడే ‘మనుజుడు' అను పదమునకు తగుచున్నాడు. అట్లు ప్రయత్నించనివాని జన్మ తదితర జంతువుల జన్మలతో సమానమే అగుచున్నది. “అభిలషిత వస్తుత్యాగం”, “ఈ కనబడే వారంతా పరమాత్మ స్వరూపులే”, అను రూపముతో కూడిన ఉభయ అభ్యాసములు ఎవరికైనా స్వప్రయత్నము వలననే సుదృఢతరం అవుతున్నాయి. ఈ రెండిటిని ఆశ్రయించకుండా ఉన్నంతకాలం వేలాది జన్మలు గడచినప్పటికీ మోక్షం దుస్సాధ్యం. ఆత్మసాక్షాత్కారం కొరకై చేయు ప్రయత్నముల బలం చేతనే దృశ్యాసక్తి రూపమైన మనస్సు నశింపజేయబడుతోంది. మనస్సు నశించటం జరిగిందా, ఇక ఈ కామము, ఆకర్షణ, వికర్షణ మొదలైన శత్రువులు తమంతట తామే నశిస్తాయి. అట్టి ఆద్యంతరహితమగు స్వరాజ్యసుఖమును, మనోరహితస్థితిని ఈ జీవుడు, ఈ దేహం, ఉండి ఉండగానే తప్పక సంపాదించవచ్చు. కనుక రామా! నీవు సర్వదా జీవన్ముక్తత్వము కొరకే యత్నించెదవుగాక!
Page:579
బాహ్యవిషయములపట్ల తిరస్కారం, మనోనాశనము కొరకు సంసిద్ధత లేకపోతే, ఇక గురువులు శ్రమతీసుకొని బోధించటం... శాస్త్రములలోని అర్థమును విచారణచేయటం ... ఏళ్ళ తరబడి మంత్రములను ఉచ్చరించటం ... ఇవన్నీ ఇవ్వవలసినంత ఫలితం ఇవ్వవు.
సంకల్పించకుండటం : 'సంకల్పరాహిత్యము' అనే శస్త్రమును సునిశితం చేసుకుంటూ ఉండు. అట్టి శస్త్రముచే ఈ చిత్తమును తప్పకుండా సమూలంగా ఛేదించవచ్చు. చిత్తము శాంతించిన మరుక్షణం ఈ జీవుడు “సర్వరూపము - సర్వవ్యాపి - శాంతము- - ” అయినట్టి బ్రహ్మముయొక్క రూపమును తప్పక సంతరించుకుంటున్నాడు.
ఓ రాఘవా! “ఈ ‘సంకల్పములు' అనే అనర్థం నిర్మూలించబడకపోవుట చేతనే ప్రశాంతమగు 'జీవన్ముక్తస్థితి' లభించుటలేదు” అని గ్రహించు. ఉత్తమమైన మనుజ జన్మ పొంది, తద్వారా మోక్షమునకు అర్హుడు అగుచున్న ఈ జీవుడు "సంకల్పములు చేయకుండుట" అనునది అభ్యసిస్తూ ఉండుటలో ఏమి కష్టమున్నదో మాకు అర్థమగుటలేదు.
శ్రీ రాముడు : తండ్రీ! ఏది ఏమైనప్పటికీ, ప్రారబ్ధము (The culmination of past deeds) మా పట్ల ప్రవర్తించియే తీరుతుంది కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రజ్ఞాస్వరూపా! రామచంద్రా! 'అల్పజ్ఞానదశ' ను సంస్కరించుట కొరకు మాత్రమే కల్పించబడి, చెప్పబడుచున్న ‘ప్రారబ్ధము' అనబడునది నీచే ఇప్పుడు ఆదరింపబడవలసిన పనేమున్నది?
ఓ మానవులారా! మీ అందరికి మరల మరల గుర్తుచేస్తున్నాను. ఆత్మసాక్షాత్కారమగు పురుషప్రయత్నముచే ఈ చిత్తమును 'అచిత్తం' చేయండి. అంతేగాని ఆ కారణాలు - ఈ కారణాలు చెప్పుకొంటూ, మీనమేషాలు లెక్కించుకొంటూ, “మానవజన్మ పొందియుండుట” అనబడు మహత్తర అవకాశమును వృథా చేసుకోకండి. “నేను జీవుడను. మనోబద్ధుడను" అను తుచ్ఛకల్పనలు చేయటం మీ స్వస్వరూపమగు ఆత్మను తిరస్కరించటమే సుమా!
అందుచేత మీరు "అభ్యాసవశంచేత ప్రాప్తించగల ఉత్తమ బ్రహ్మపదమును పొందుటయే మేము లక్ష్యంగా కలిగి ఉంటాం” అని దృఢంగా నిర్ణయించుకొని 'మహాశయులు' (మహత్తరమైన ఆశయము కలవారు) కండి. అంతేగాని, “నేను స్వల్పుడను, అల్పుడను” అని ఎందుకు భావన చేయాలి? అట్లు తలచి స్వల్పత్వము పొందవలసిన అగత్యమేమున్నది? మీ స్వస్వరూపమగు ఆత్మకు అట్టి అల్పత్వమును ఆపాదించుటచే మీకు వచ్చే లాభమేమున్నదో కొంచెం చెపుతారా?
చిరకాలాభ్యాసంచే "నేను బ్రహ్మమునే. అంతేకాని, ఈ దేహ - మనో - బుద్ధ్యాదులు నేను
కాను” అని భావించుచు ప్రసిద్ధమైయున్న ఉత్తమ బ్రహ్మపదమునే పొందండి.
అంతిమసాక్షాత్కారవృత్తిచే ఆవిర్భవించు నిష్కళంక చైతన్య భావమును స్వీకరించి, తద్వారా అవిద్యను సంపూర్ణంగా నశింపజేయండి. మీ చిత్తములను ఆత్మయందు లయింపజేయండి.
Page:580
“చిద్వస్తుభావన”ను క్రమక్రమంగా అలవరచుకోండి. అద్దానిని హృదయంలో తీర్చిదిద్దుకోండి. మహత్తరంగా పదిలపరుచుకోండి.
9. 'చిత్' ను భావన చేయటం
“నా యందు ఈ నా మనస్సుకు కూడా సాక్షీభూతమైయున్న “సత్య - నిత్య” వస్తువు అగు “ఆత్మ”, నాయందున్నట్లే, సర్వులందు - సర్వజీవరాసులందు కూడా సాక్షీభూతమైయున్నది” అని భావించుటయే చిద్వస్తు భావన.
అట్టి చిద్వస్తుభావనను, సుస్థిరపరచుకొనుటయందు సావధానముగా ఈ 'బుద్ధి' ని నియోగించాలి. ఓ జనులారా! మీరంతా స్వస్థచిత్తులై... చిత్తమునకు పరమైనట్టి, చిత్తమును కూడా మ్రింగివేయ కలుగునట్టి ... పరమాత్మయందే నిలకడ కలిగి ఉండండి.
ఓ రామచంద్రా! ఒకానొకడు కొంత భ్రమకు లోనగుటచేత పశ్చిమదిక్కును చూచి “ఇదియే తూర్పుదిక్కు” అని తలచటం జరిగిందనుకో...! విజ్ఞులగు వారిచే ఏది పశ్చిమమో, ఏది తూర్పో తెలియజేయబడగా, అది అతడు గ్రహించిన తరువాత, ఇతఃపూర్వపు దోషజ్ఞానం తొలగిపోతుంది కదా! పురుషప్రయత్నం చేసేవారికి కొంత కాలానికి దోషజ్ఞానం తొలగుతుంది. అప్పుడు మనస్సును జయించటం సులభమే అవుతుంది.
ఒకడు అనుద్వేగంగా, ఓర్పుతో, నేర్పుతో ప్రయత్నిస్తేనే ధనములు, పదవులు, రాజ్యములు పొందుచున్నాడు. మనోజయం కూడా అట్లు ప్రయత్నించినవానికే సిద్ధిస్తోంది. అయితే రాజ్యము, ధనము, పదవి మొదలైనవాటిలో రాజభయం, చోరభయం, శత్రుభయం వంటివి ఉంటాయి. స్వర్గలోకములో కూడా, "నా పుణ్యమంతా ఖర్బైతే అధోలోకములకు పోతానే....” ” అనే మనోవ్యాధి ఉండవచ్చు. కాని, "ఈ మనస్సును జయించి, ఆత్మయందు నిలిపి ఉంచుట” అనుదానిలో అట్టి తదనంతర క్లేశములు ఉండవు. అట్టి "స్వభావమాత్రవ్యావృత్తి" (Natural avocation towards one's own self) అయినట్టి 'ఆత్మస్థితి' కొరకు ఈ జీవుడు ఎందుకు ప్రయత్నిస్తూ ఉండరాదు? ఓ సర్వజనులారా! అట్టి చిత్తలయరూపమగు ఆత్మస్థితి పొందక పోవుటకు కారణం అజ్ఞానమే అయి ఉన్నది. "మేము ఈ ఈ పనులలో ఉన్నాం. అందుకే ఆత్మస్థితిని అవధరించలేకపోతున్నాం” అని పలకటం ఏమాత్రం భావ్యం కాదు. "సర్వము ఆత్మతత్త్వమే” అని నిశ్చయించుకుని యథాతధంగానే మీమీ ధర్మములు నిర్వర్తిస్తూ ఉండండి. ఆత్మయొక్క చమత్కారమంతా గ్రహించిన తరువాత, ఆపై మీకు ఎట్లు ఉచితమని అనిపిస్తే అట్లే చేయండి. (కర్మలు నిర్వర్తించండి - లేదా త్యజించండి).
కాబట్టి "ఆత్మతత్త్వమగు ఆ భగవంతుడే ఇదంతా” అని గ్రహించి, అట్టి సంగ్రహణము యొక్క శక్తి ద్వారా మనస్సు యొక్క సంచలనమును జయించివేయండి. ఇంతమాత్రపు భావన కలిగియుండుటలో కష్టమేమున్నది?
Page:581
తన మనస్సునందలి దోషములేమిటో గ్రహించి, అట్టిదోషపూరిత మనస్సును జయించుటకు సిద్ధపడుచుండనివాడు ఈ లోకంలో ప్రశాంతంగా ఎట్లు జీవిస్తాడో మాకర్థమగుటలేదు. శ్రీ రాముడు : మహర్షీ! ఈ జన్మ జరా మరణములు, ఇహ పరలోకములు, పురుష - స్త్రీజన్మలు మొదలైన తతంగమంతా ఏమైయున్నది? ఆత్మ అభేదస్వభావము కలదిగదా! ఈ భేదమంతా ఎందుకుంటోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : "నేను పురుషుడను. నేను స్త్రీని. నేను జన్మించితిని నేను జీవించుచున్నాను. నేను మరణిస్తున్నాను....” మొదలైన సర్వకు కల్పనలు చంచలచిత్తము యొక్క వృత్తులే అయి ఉన్నాయి. యథార్థానికి ఎవ్వరూ మరణించుటలేదు. జన్మించుట లేదు. ఈ మనస్సే “ఇది నా జన్మ, ఇది నా మరణము. ఇది ఇహము. ఇది పరము” అని స్వయముగా కల్పించుకొని అనుభవిస్తోంది. ఈ మనస్సే ఇక్కడికి వస్తోంది. మరల పరలోకమునకు పోతోంది. మరొక రూపముగా స్ఫురిస్తోంది. ఈ విధంగా మోక్షప్రాప్తి పర్యంతము మనస్సుయందు కల్పనలు సంభవిస్తూనే ఉన్నాయి. సర్వము కల్పనామయమే అయిఉండగా, ఇక మరణభయం ఎందుకు? ఎవరికి? ఎచట?
ఈ సర్వము చిత్తముయొక్క ప్రభావమే. చిత్తమునకు వేరైన రూపమేదీ ఈ జగత్తుకు లేదు. బంధువులు మరణించినప్పుడు, తదితర సందర్భములలోను ఆయా క్లేశములను పొందుచున్నది చిత్తమేకాని శుద్ధచైతన్యము కాదు సుమా!
పరమాత్మ సర్వవేళల ఆపేక్షారహితుడు, మహత్తర శక్తిమంతుడు. సర్వహితుడు. మాయాదోష రహితుడు. శ్రుతులచే ప్రతిపాదించబడినట్టి అట్టి స్వస్వరూపమగు పరమాత్మయందు ఈ చిత్తమును లయం చేయాలి. ఇంక మరే ఉపాయంచేతను ముక్తి లభించదు. ఈ నా నిర్ద్వంద్వమైన అభిప్రాయం ఈ త్రిలోకములందలి అనేకమంది తత్వవేత్తలచే అంగీకరించబడుచున్నది.
ఈ విషయమే వేదాంగములైన ఉపనిషత్తులు నిర్దుష్టంగా ప్రకటిస్తున్నాయి. చిత్తము ఉపశమించగా, కేవల - చిన్మాత్రవస్తువుగా శేషించుటే ముక్తి.
ఇంతకుమించి ‘మోక్షము' అనబడునది వేరుగా లేదు. ఆత్మసాక్షాత్కార రూపమైన ప్రబోధము హృదయమునందు ఉత్పన్నముకాగా అప్పుడు ఈ జీవునకు పరమశాంతి లభిస్తోంది. “నా ఆత్మయే సర్వుల ఆత్మ. సర్వులు ఆత్మస్వరూపులే! ఆత్మయే ఇదంతా!" ..... అనునదే ఆత్మజ్ఞానం.
అట్టి ఆత్మవస్తువు మాత్రమే సత్యమైయున్నది. అది త్రికాలములచే అభేద్యమై సర్వదా వెలుగొందుచున్నది. సర్వవ్యాపకమై, అఖండమైయున్నది. అజ్ఞానమాలిన్య రహితమగు అట్టి ఆత్మయొక్క స్వరూపమే ... నేను, నీవు, ఈ సర్వసభికులు, సర్వ భూత భవిష్యత్ వర్తమాన జీవరాసులు కూడా.
ఓ రామచంద్రా! అతివిస్తీర్ణమగు హృదయాకాశమునందు ఈ 'మనస్సు’ ఒక దురాక్రమణదారుని వలె తాండవం చేస్తోంది. అందుచేత, నీవు అంతిమసాక్షాత్కారవృత్తి (The final beautitude of self) చే ప్రకాశమానమగు, 'చిద్రూపము' అను సుదర్శనచక్రం చేతిలో ధరించు. అప్పుడు ఈ మనస్సును ఛేదించివేయి. ఆపై ఇక ఎట్టి మానసిక వ్యధలు నిన్ను బాధించలేవు.
Page:582
ఈ - పుత్రాదులు, తదితర విషయానుభవములు అవిచారణ చేతనే రమణీయంగా కన్పట్టుచున్నాయి. వాటియందలి అరమణీయత్వము గాంచబడిందా, మరుక్షణం మనస్సుయొక్క సర్వాంగములు తెగి నేలరాలినట్లే. ఎందుకంటావా? ఈ దృశ్యమానమగు ప్రపంచంలో ప్రాప్తిస్తున్న ఈ దేహపరంపరలు తదితర సంబంధ - బాంధవ్యములు, గృహ - ధన - క్షేత్రాదులు - ఇవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ అంగములే అయిఉన్నాయి. అవన్నీ మనస్సు భావించకున్నంత మాత్రంచేత విచ్ఛిన్నం కాగలవు. సంకల్పరాహిత్యం చేత మనస్సే లయించిపోతోంది.
“సంకల్పరాహిత్యము” - అనే అభ్యాసం : శస్త్రములో, అగ్నియో, శత్రువులో ఉన్నచోటైతే భయం వేయవచ్చు. “సంకల్పరాహిత్యము” అను ప్రయత్నమునందు భయమెందుకు? సంకల్పించక పోయినంతమాత్రం చేత మనస్సు లయించగలదు కదా? సంకల్పరాహిత్యమును ఆశ్రయించుటలో ఏం కష్టం ఉన్నది? ఈ జనులంతా ఏది శ్రేయమో, ఏది బంధమో గ్రహించెదరుగాక! ఈ చిత్తము వ్యవహారంలో అత్యంత జాగరూకులై ఉండెదరుగాక! లౌకిక వ్యవహారాలలో ఉన్నప్పుడు “ఇది లాభదాయకము. ఇది కాదు” అని ఈ జనులు గ్రహిస్తున్నారు కదా! మరి, వీరు "సంకల్పరాహిత్యము - అచిత్తలాభము” ల గురించి ఎందుకు గ్రహించుటలేదో నాకు అర్థం కావటం లేదు!
మన బాలురను మనం ఉత్తమమైన క్రియలందే నియమిస్తూ ఉంటాం. అదే విధంగా ఈ మనస్సును కూడా ఉత్తమ శ్రేయోమార్గంలోనే నియోగించాలి. లేకుంటే దీనిని జయించటం కష్టమే అవుతుంది. ఏ మహాత్ములైతే ఈ మనస్సును ఒక పద్ధతిగా నియమించుచూ, క్రమంగా దీనిని నశింపజేస్తారో, అట్టివారే సర్వులలో ఉత్తములు అగుచున్నారు. అట్టివారు ఎక్కడవుంటే అక్కడ తదితరులను కూడా తమవలెనే 'ముక్తులు'గా చేసివేయగలరు.
ఎడారి భూములలోనే మృగతృష్ణలు అనుభవమౌతూ ఉంటాయికదా! ఈ "సంకల్పములు” అనే వ్యవహారమునుండే భయంకరములు, భ్రమదాయకములు అయిన, అనేక విపత్తులు ఉత్పన్నమౌతున్నాయి. అయితే కొందరు మహనీయులు సంకల్పములకు ఆవల ఉన్నట్టి ఆత్మతత్త్వమును సర్వదా పొందుతూనే ఉన్నారు. ఓ రామా! ప్రళయవాయువులు వీచుగాక! సప్తసముద్రములన్నీ పొంగిపోయి, లోకములన్నిటినీ ముంచివేయుగాక! ద్వాదశాదిత్యులు ఒక్కసారిగా ప్రజ్వలించుగాక! తమ మనస్సును జయించివేసి సుస్థిరం చేసివేసియున్న మహాత్ములు భేదము పొందరు. మోదము పొందరు. స్వస్థానమునుండి చ్యుతి పొందరు.
ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఉత్తమోత్తమమైనది ఏదైనా ఉన్నదనుకొంటే, అది ... అకృత్రిమము, జడత్వరహితము అయినట్టి అమనస్కమే సంకల్పరాహిత్యత్వమే అయి ఉన్నది.
ఈ జనులలో అనేకులు, “అయ్యో! ఏదో మహత్తరశక్తి లేక 'విధి' అనబడేది మమ్ములను ఈ సంసారకూపంలో పడవేసి బాధిస్తోంది” అని అనుకొంటూ ఉంటారు. అది సరికాదు. ఈ ‘మనస్సు’ అనే బీజంలోనుంచే సుఖ-దుఃఖ రూపకములైన శుభాశుభములు, ఈ ఊర్ధ్వ, అధోలోకములతో కూడిన సంసారారణ్య సంచారం సంప్రాప్తిస్తున్నాయి. మరి మనస్సో, స్వసంకల్పముల నుండే
Page:583
ప్రభవిస్తోంది. తన తలను తానే గోడకు బాదుకుంటూ “ఈ గోడ నన్ను హింసిస్తోంది" అని తలచటం మూర్ఖత్వమే అవుతుంది కదా! అట్లే, స్వసంకల్ప రచన అయి ఉన్న ఈ సంసారదోషమునకు పరులనెవ్వరినో దూషించటం 'మూర్ఖత్వం' అని అనిపించుకుంటుంది.
ఓ రామచంద్రా! ఇన్ని మాటలు అఖర్లేదు. ఒక్కమాట ముక్కుకు సూటిగా చెపుతాను. విను. అసంకల్పనమాత్రైక సాధ్యే సకల సిద్ధిదే |
అసంకల్పనసామ్రాజ్యే తిష్ఠావష్టబ్ధతత్పదః ॥
నిశ్చల తత్వపూర్వకమైన 'నిస్సంకల్పం' అనబడే మహాసామ్రాజ్యం ఈ భౌతిక సామ్రాజ్యములకన్నా, స్వర్గాది లోకములకన్నాకూడా పరమోత్తమమైనది. “నేను దేనిని సంకల్పించకుండెదను గాక” అను భావం సుస్థిరం చేసుకున్నంత మాత్రంచేత అది సాధించబడగలదు. అట్టి నిస్సంకల్పము ఈ జీవుని “ఆత్మపదము” అను సింహాసనముపై కూర్చుండబెట్టగలదు. ఇంతమాత్రపు రహస్యమే అనేక మాటలు ఉపయోగించి శాస్త్రయుక్త - ప్రయత్నరూపములలో శాస్త్రకారులు ఈ జనులకు బోధిస్తున్నారు. ఇంతమాత్రం సాధించటంలో కష్టమేమి ఉన్నది? ఒకడు ఉష్ణతాపముచే బాధింపబడుచున్నాడనుకో .... అప్పుడు ఆతని సమీపంలో గల అగ్ని ఉపశమిస్తూ ఉంటే, ఉష్ణతాపం తొలగుతుందికదా! అట్లాగే దృశ్యతాదాత్మ్యము వలన కలుగుచున్న దృశ్యముయొక్క మననము -(“విషయములను ఆశ్రయించటం దృశ్యమును సంభావించటం” వలన కలుగుచున్న) ‘అమననము’ అను అభ్యాసం చేత క్రమంగా ఆ జీవునికి ఉపశమనాన్ని కలిగించగలదు. దృశ్యము గురించి మననము క్రమంగా క్షయించుచుండగా, ఈ మనస్సు జీవునకు అనిర్వచనీయమగు ఉత్తమసుఖమును అందిస్తూ ఉంటుంది.
ఈ మనస్సు కనుక తలచుకొంటే, ఒక చిదణువునందు లక్షలకొలది బ్రహ్మాండములను వేర్వేరుగా, విస్పష్టముగా, గోచరింపజేయగలదు. సంకల్పమాత్రంచేత అనేక సృష్టులను రచించుకుంటూ పోగలదు. అది జీవునకు రుచి చూపించగల స్థితి గతులకు, విభ్రమములకు, దుర్లక్ష్యములకు, దుష్ట - అసత్య ఆకర్షణలకు అంతు ఉండదు. "అట్టి దుష్టము, దుర్భరము అయినట్టి ఈ మనస్సును జయించుట ఎట్లా?” అనునదే అందరియొక్క ముఖ్యమైన సమస్య. శాస్త్రకారులచే చెప్పబడుచున్న అనేక నియమములు, నిష్ఠలు - అన్నిటియొక్క ఉద్దేశము ఒక్కటే. ఈ మనస్సును సన్మార్గములలో నియమించుటే. అట్టి ఈ మనస్సు నిరంతర అభ్యాసముచే సిద్ధించగల రెండు ఆయుధములచే మాత్రమే జయించివేయబడగలదు.
1. తృష్ణారాహిత్యము (Desirelessness)
2. సంతోషము (Contentment)
ఈ రెండు ఆయుధములను నిర్మించుకో. అప్పుడు ఈ మనస్సును జయించివేయి. విజయమును పొందు. ఆత్మపదమును అధిరోహించు. అట్టి ఆత్మపదము ఇప్పుడే, ఇక్కడే లభించవలసినదే గాని “మరెక్కడో ఎప్పటికో లభించవలసినది" అని భావించతగదు. పరమపవిత్రమైన, అమనస్కరూపమైన,
Page:584
అహంకారరహితమైన, దుఃఖరహితమైన, శాంతరూపమైన, ఈ 'జన్మలు' మొదలైన వికారములు ఏ క్షణమందును ఉండనట్టి స్థితియే 'ఆత్మపదము' అని పిలువబడుచున్నది. ఆత్మవేత్తలచే మహత్తరమైనదిగా చెప్పబడుచున్న ఆ ఆత్మపదము - - కేవలం సంకల్పరాహిత్యంచేత ఏర్పడగల అమనస్కస్థితియే అయి ఉన్నది. ఏది నీయొక్క నాయొక్క, సర్వులయొక్క సత్యస్వరూపమే అయి ఉన్నదో ... అది పొందటానికి ప్రతిఒక్కరికి సర్వహక్కులు ఉన్నాయి. ఓ రామా! అట్టి 'ఆత్మస్థితి' ని ఏమరచి అనేక భ్రమలకు లోను అగుచు ఆసక్తి కారణంగా ఈ సంసారసాగరంలో కొట్టుమిట్టాడవలసిన అవసరం ఏమున్నది? అట్టి అగత్యంలేదు. జ్ఞానివి అయి, ఆపై యథారీతిగా వర్తించుటయే ఉచితం.
10. మనస్సు యొక్క స్వభావం - ఉపశమనము
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ మనస్సు ఏ పదార్థం గురించి ఏ విధంగా తీవ్రవేగంతో ప్రవృత్తమౌతోందో –ఆయా కోరుకునే పదార్థములను ఆ విధంగానే గాంచుచున్నది. తటాకపు నీటిలో బుద్బుదములు (బుడగలు) ఏ నిమిత్తము లేకుండానే స్వాభావికంగా ఉత్పన్నమై నశిస్తూ ఉంటాయికదా! అట్లే ఈ మనస్సులో కూడా సంకల్ప-వికల్పములు తీవ్రవేగముతో ఉత్పన్నమగుచు, నశించుచున్నాయి. శీతలత్వము మంచుయొక్క రూపం, నలుపురంగు కాటుకయొక్క రూపంకదా! “సంకల్పముల యొక్క తీవ్రాత్రీవములు” అను చంచలత్వమే ఈ మనస్సు యొక్క రూపం. సంకల్పముల పరంపరయే మనస్సుగా చెప్పబడుతోంది.
శ్రీ రాముడు : ఈ చపల మనస్సే సర్వ ప్రవృత్తులకు ముఖ్యహేతువు కదా! దీని వేగమును, బలాత్కారంగా అయినా సరే, నివారించేదెట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! ఈ లోకంలో ఎక్కడా మనస్సు తన చంచలత్వం విడిచిపెట్టి కనిపించుటలేదు. అగ్నికి ఉష్ణత్వం ఎట్లాగో, మనస్సుకు కూడా చంచలత్వము ధర్మమైయున్నది.
చిత్తము = "మాయతో కూడుకొన్న చైతన్యము యొక్క భావనాస్వరూపము”
చిత్తమునందలి చంచల క్రియాశక్తియే “మానసికశక్తి" అని పిలువబడుతోంది. అదియే ఈ జగదాడంబరమంతా. వాయువు స్పందాస్పందములే రూపముగా కలిగి ఉంటోంది కదా! 'స్పందము’ లేక ‘చపలత్వము’ కాకుండా ఈ చిత్తమునకు వేరురూపం లేదు. చంచలత్వము లేకుండా పోయిందా, ఈ చిత్తమే లేకుండాపోతోంది. అట్టి మనోనాశనమే 'తపస్సు-మోక్షము' కూడా అయిఉన్నదని శాస్త్రముల సిద్ధాంతము. మనస్సు గనుక 'అఖండము - అప్రమేయము' స్వభావముగా గల ఆత్మనే నిత్యము మననం చేస్తుంటే, ఇక దుఃఖములన్నీ మటుమాయమవక తప్పదు. “అందరూ అంతా (నాతో సహా) ఆత్మరూపమే” అనే సంకల్పంతో మనోసంకల్పములను జయించాలి.
ఈ మనస్సు లేక 'చిత్తము' అనే రాక్షసుడు స్పురించి విజృంభిస్తూ ఉంటే అనేక వేసటలు, దుః ఖములు, నీచప్రవృత్తములు, భేద దృష్టులు పొంగిపొరలి వచ్చిపడుచున్నాయి. అందుచేత, రామా!
Page:585
నీవు ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా ఆత్మదేవునివైపుగా నడిపించగలిగితే ... అప్పుడు “దేశ వస్తువులచే పరిచ్ఛిన్నము కాజాలనట్టి అనంత మోక్షసుఖము”ను అనుభవించగలవు. దుఃఖముత్పాదయత్యుచ్చై రుద్ధితశ్చిత్త రాక్షసః
సుఖ యానంత భోగాయ తం ప్రయత్నేన పాతయ. (శ్లో.10, సర్గము. 112)
అనేక దుర్వాసనలకు (Bad tendencies) ఆహ్వానం పలుకుచున్న ఈ మనోచాంచల్యమునే “అవిద్య” అనే శబ్దంతో చెప్పుచున్నారు. అట్టి మనస్సును, దాని చాంచల్యమును “ఆత్మ - విచారము” అను ఉద్వేగరహిత తీవ్రయత్నము (Unemotional - intensified effort) చే నాశనము చేయవచ్చు. శ్రీరాముడు : అది ఎట్లా సాధ్యం మహర్షీ!
శ్రీ వసిష్ఠ మహర్షి : ముందుగా, ఈ చిత్తశక్తి దేనివైపు ప్రసరించి అచ్చట తిష్టవేసుకొని ఉంటోందో గమనించు. ఏఏ ఇంద్రియ - ప్రాపంచిక విషయములపట్ల ప్రమేయము-ఆసక్తి-భయము-ఉద్వేగము ఏర్పడితే అచ్చటచ్చట నీ చిత్తము తగులుకొంటున్నట్లే! అట్టి ప్రియంగా భ్రమను గొలుపుచున్న బాహ్య విషయములపట్ల అనాసక్తి (Un-attachment) పెంపొందించుకో. క్రమంగా ఆయా బాహ్య విషయములను త్యజించివేయి. ఆత్మవస్తువు గురించి, దాని ధర్మముల గురించి మరల మరల మననం చేస్తూ ఉండు. ఆత్మ గురించిన సమాచారం విను, యోచించు, అవలంబించు. అప్పుడు తప్పకుండా “మోక్షము” అను ఉత్తమశ్రేయస్సు లభించగలదు.
ఓ రాఘవా! అసలు మనస్సు అనునది ఉన్నదెక్కడ? సత్-అసత్లకు, జడ-చైతన్యములకు మధ్యగల రూపము లేక తత్త్వమునే మనస్సు అంటున్నాం. ఈ మనస్సు అటు చైతన్యమువైపు, ఇటు జడమువైపు ప్రవృత్తము కలిగినదగుచున్నది.
ఆత్మను భావించటం
చైతన్యానుభవం
ఊర్ధ్వమార్గం
A
మనస్సు లేక చిత్తము
అధోమార్గం
జడత్వానుభవం దృశ్యానుభవం. దృశ్య మననం
Page:586
ఈ మనస్సు జడపదార్థముల విషయమై, “ఇది ప్రియమైనది. ఇది అప్రియమైనది” అను చింతన చేయుచున్నది. అట్టి జడత్వమునకు సంబంధించిన దృఢాభ్యాసంచే కలుషితమైన ఈ చిత్తము జడత్వమునే పొందటం జరుగుతోంది. అదే చిత్తము చిద్వస్తువును చింతించటం జరిగినప్పుడు, అట్టి 'చిద్వస్తుచింతన' యొక్క దృఢాభ్యాసంచే చైతన్యముతో ఏకమౌచున్నది. శాస్త్రీయ-పురుషప్రయత్నముచే దేనియందు ఈ చిత్తము నియోగించబడితే, అభ్యాసబలం అనుసరించి, అద్దానిరూపమునే పొందుచున్నది. అందుచేత రామా! నీవు పురుష ప్రయత్నముచే చిత్తమును చిత్తముచే జయించివేయి. సర్వదా దుఃఖరహితమగు ఆత్మపదమునే ఆశ్రయిస్తూ ఉండు. సర్వసందేహములను అధిగమించి, నిశ్చలత, అద్వితీయత, అఖండత అలవరచుకో. ‘మనోనాశనము’ అని మనం చెప్పుకొంటున్న క్రియాక్రమమునందే సంలగ్నుడవై ఉండెదవుగాక! ఈ మనస్సును బలాత్కారంగా విషయముల నుండి విముఖం చెయ్యాలి. ఇంతకుమించి మోక్షప్రాప్తికి వేరే ఉపాయం లేదు. బాలుడు అల్లరిని ఆపి పాఠ్యాంశాలు పఠిస్తేనేకదా, చదువు వచ్చేది!
మనస్సును నిగ్రహించగలిగేదేది?
ఈ మనస్సును నిగ్రహించకలిగేది ఈ సృష్టిమొత్తం మీద ఒక్కటే - ఒక్కటి వున్నది. అది ... “నీ మనస్సే”
రాజును రాజే జయించగలడు గాని బాలుడు రాజును జయించలేడుకదా!
ఈ జీవుడు 'సంసారము' అనే సముద్రంలోపడి 'తృష్ణ' అనే మొసలిచే పీడింపబడుచు, దిక్కుతోచకున్నాడు. ‘విషయములు' అనే సుళ్ళలో చిక్కి దూరదూరాలకు కొట్టుకుపోతూ ఉన్నాడు. అట్టి ఈ జీవునకు 'వివేకము' తో కూడిన మనస్సే 'నౌక' అగుచున్నది. దీర్ఘపాశము వంటిది, దృఢబంధన రూపముగలది అయిన మనస్సును మనస్సుతోనే ఛేదించాలి. ఆత్మను బంధమునుండి విడిపించాలి. మరింకే క్రియలచేతను బంధవిమోచనము కలుగదు. 'మనస్సు' అను పేరుతో చెప్పబడుచున్న ‘వాసనాసమూహం' అనేక 'ప్రాపంచిక విషయములు' అనువాటికి గ్రుచ్చబడియున్నది. ఈ మనస్సు బాహ్య పదార్థములవైపు ప్రవృత్తి కలిగియున్నది.
ప్రాజ్ఞుడైనవాడు అట్టి వాసనలను రహితం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. 'ప్రజ్ఞ . పరిశీలన' కొరవడినప్పుడో... వాసనలను అధికం చేసుకుంటున్నాడు. ఫలితం? బద్ధుడు అగుచున్నాడు.
ఉష్ణత్వం క్షయిస్తే అగ్ని ఆరిపోవుచున్నట్లు వాసనలు క్షయిస్తే అవిద్యకూడా క్షయించగలదు. కనుక, రామా! మొట్టమొదట భోగవాసనలను త్యజించు. అటుతరువాత భేదవాసనలనుకూడా వదలివేయి. ఇక విషయములను కూడా త్యజించి, వికల్పరహితుడవై సుఖంగా ఉండు.
'పూర్ణానందము' ను 'దృశ్యవ్యామోహము' అను ఆవరణము మరుగుపరచుచున్నది. అట్టి అవిద్యను “ఆత్మసాక్షాత్కార రూపభావన" చే తొలగించివేయుటయే “వాసనలను క్షయింపజేయుట” అగుచున్నది.
Page:587
ఓయీ! జీవుడా! నీవు వాస్తవానికి సర్వమునకు సర్వదా కేవలసాక్షివై ఉన్నావు. “ఈ చిత్తము ద్వారా సాక్షి (The Witness of Experiences) ఏఏ పదార్థములను అనుభవిస్తోందో అట్టి ఆయా అనుభవములు సాక్షియందు గాని, ఆ అనుభవములయందు 'సాక్షి' గాని లేకుండా పోవుట" అనుదానినే “నిర్వాణము” అని పిలుస్తున్నారు.
విషయానుభవం కలిగియుండుటయే "దుఃఖం”.
విషయానుభవములకు అతీతమైనస్థితి కలిగియుండుటయే... “నిర్వాణం”.
అట్టి నిర్వాణము స్వప్రయత్నముచే తప్పక లభించుచున్నది. “ఆఁ! మేమెక్కడ? ఆ నిర్వాణమెక్కడ? మేము దానిని ఇప్పట్లో పొందలేం” అని చెప్పుకొంటూ అప్రయత్నశీలురై ఉండేవారితో పలుకనైనావద్దు. ఎవరైతే ప్రయత్నశీలురై ఆత్మవిశ్వాసముతో విచారణపూర్వకంగా వ్యవహరిస్తున్నారో వారికి సత్యము కరతలామలకము అగుచున్నది. పిడివాదములతో ఆత్మ స్థితిని గ్రహించని వారితో వాదులాట
అనవసరం.
ఓ రామచంద్రా! జాగ్రత్తగా విను. నీ మనస్సులో “ఆయా విషయములు వాటిని పొందవలె ననే ప్రయత్నములు” కాపురం చేస్తూ ఉంటే,.... “అవన్నీ మిథ్యయే” అని గ్రహించు. “అవన్నీ అజ్ఞానము నుండి ఉత్పన్నమైన భావనా క్రమములే కదా” అని భావిస్తూ ఉండు. క్రమంగా అట్టి అజ్ఞానవాసనల బీజమునే తొలగించి వేసుకోటానికి ప్రయత్నిస్తూ ఉండు. అట్లు ఆ వాసలను మొదలంట త్యజించి నిత్యతృప్తుడవైయుండు. ఇక ఆయా విషయజనితమైన హర్షశోకములను మరింకెన్నటికీ పొందకుండెదవు గాక!
11. అవిద్య
శ్రీ వసిష్ఠ మహర్షి : కంటిదోషం వలననే ఆకాశంలో రెండవచంద్రుడు కనబడునట్లు, వాసనవలననే దృశ్యజగత్తు సుఖ-దుఃఖ బంధముల రూపంగా సంప్రాప్తిస్తోంది. అయితే, “వాసనలు" అనేవి మిథ్యారూపంగానే ఉదయిస్తున్నాయి. నీటిలో ప్రతిబింబించే ఆకాశంలాగా అవస్తువు అయినప్పటికీ, ఈ దృశ్యవ్యవహారం అవివేకముచే సత్యము అయినట్లుగా ప్రాప్తిస్తోంది. ఇదంతా అవిద్య యొక్క ప్రభావమే. వివేకులు దీనిని చూస్తున్నప్పుడు “ఇదంతా 'గొడ్రాలి రెండవకుమారుడు' అను మాటలాగా మొదలే అసత్యమై, అవాస్తవమైయున్నది” .... అను దృష్టిని కలిగి ఉంటున్నారు. వారి దృష్టిలో ఇదంతా లేనిదే అయి ఉన్నది. అవివేకుల దృష్టియో,... వేరొక విధంగా ఉంటోంది.
ఓ రామచంద్రా! నీవు అజ్ఞానివి కాకూడదు సుమా! చక్కగా ఆత్మవిచారణచేసి తత్వజ్ఞానివే అవ్వాలి. ఆకాశంలో రెండవచంద్రుడు అవాస్తవమే అయినట్లు, ద్వైతరూపమగు 'అవిద్య' లేక ‘సంసారము’ లేక ‘దృశ్యము' అనునవికూడా ఉనికి కలిగిలేవు. ఈ ప్రపంచంలో బ్రహ్మతత్త్వమొక్కటి తప్ప ఇతరములైనట్టివన్నీ లేనేలేవు. వేలాది తరంగములతో కూడిన విశాలసముద్రమంతా జలమయమే
Page:588
అయి ఉన్నదికాని, మరింకేమీ కాదుకదా! భావాభావయుక్తములై, మిథ్యారూపములే అయివున్న ఈ పదార్థములన్నీ 'సంకల్పము' నకు వేరైనవి ఏమాత్రం కాదు. ఆత్మ సర్వదా మాయారహితము, నిత్యము, వ్యాపకము, శుద్ధము, “నీ - నా - ఈ సర్వుల” స్వస్వరూపము అయి ఉన్నది. అట్టి ఆత్మయందు ఈ ద్వైతమును ఆరోపించుట తగదు.
శ్రీరాముడు : మేము ఆత్మస్వరూపులమే అయినప్పటికీ కూడా, మరి ఏవేవో క్రియావ్యవహారములందు ప్రవేశించవలసివస్తోంది కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అయితే ముక్కుకు సూటిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఈ ప్రాపంచిక సంఘటనలన్నింటికీ నీవు కర్తవా? కాదు కదా!
నీవు కర్తవు కానప్పుడు ఈ క్రియలందు నీకు మమత్వం ఎందుకో చెప్పు?
అద్వితీయుడగు పరమాత్మ ఒక్కడే సర్వే - సర్వత్రా సర్వదా స్థితి కలిగియుండగా, ఇక ఎవనిచే ఏ క్రియ ఎట్లు ఒనర్చబడగలదో చెప్పు?
ఓ ప్రాజ్ఞుడా! ప్రియరాఘవా! అట్లని, నీవు అకర్తవుకూడా కావద్దు. స్వప్రయత్నముచే సాధ్యంకాగల ఫలమేదీ ప్రయత్నరహితునకు లభించదు కదా!
శ్రీరాముడు : స్వామీ! "కర్తవు కావద్దు - అకర్తవు కావద్దు" అని ఒకేసారి పరస్పర వ్యతిరేకములైన రీతిగా ఆజ్ఞాపిస్తున్నారు.....? అద్దాని సమన్వయం ఎట్లా ?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇప్పుడు నీకు కర్మరహస్యం ఒకటి చెప్పుచున్నాను. విను.
కర్మలు, ఆసక్తి
ఏదైనా కార్యమును అభిమానరహితుడవై నిర్వర్తించావనుకో. అప్పుడు నీయందు ఆసక్తి ఉండదు కాబట్టి అకర్తవే అవుతావు సుమా!
అదేవిధంగా “నేను దీనికి అకర్తను” అను అభిమానం కించిత్ కూడా లేకయే ఉన్నప్పుడు “సర్వకర్త” గానే ఉండి ఉంటావు.
నీవు వాస్తవానికి ఆత్మయే స్వరూపముగా గలవాడవు. కనుక నిష్క్రియుడవు. అట్టి నీకు ఈ దేహముచే చేయబడు క్రియలకు సంబంధించిన 'బంధనం' ఎట్లా అంటుతుంది? ఈ క్రియావ్యవహారములేవీ నీ స్వస్వరూపమును స్పృశించలేవు.
"నిష్క్రియుడను, ఆత్మదర్శిని అయిన నాకు ఈ కర్తృత్వము వాస్తవంగా ఉన్నదా?" అనే విషయం ముందు యోచించు. అసలు 'కర్తృత్వము' అనేది సత్యమైతే, “నేను దీనికి కర్తను” అనునది గ్రహించటం ఉచితం. అసత్యం అయితే? త్యజించవలసిందేకదా! ‘క్రియాప్రసక్తి’ అంతా కర్మఫలములను దృష్టిలో పెట్టుకునే ఏర్పడుతోంది కదా! క్రియాఫలములు (The ultimate results of all acts) సత్యమై ఉంటే, అప్పుడు నీవు కర్మలందు ఆసక్తి కలిగి ఉండటం ఉచితమౌతుంది. పరిశీలనాత్మక దృష్టితో చూచినప్పుడు ఈ క్రియాఫలములన్నీ కూడా స్వప్నతుల్యము, అవాస్తవము
Page:589
అయి ఉన్నాయి. అట్టి మిథ్యావ్యవహారమే అయివున్న ఈ కర్మలందు ఆసక్తి కలిగి ఉండటం ఎట్లు ఉచితమో చెప్పు? ఒక ఇంద్రజాలంలోని వస్తుసమూహంలాగా ఏ దృశ్యవ్యవహారమందైతే పదార్థములన్నీ మాయామయమై, స్వప్నతుల్యమై, భావనానుసారమై అలరారుచున్నాయో అట్టిచోట ఆసక్తి కలిగియుండుట ఉచితం ఎట్లా అవుతుంది చెప్పు? ఎదురుగా కనిపిస్తున్న ఈ సంఘటనలు, అనేక క్రియావ్యహారములను ఆశ్రయించుటచే పొందబడబోవు ఈ పదార్థజాలం... ఈ రెండుకూడా ఆత్మదృష్టితో చూచినపుడు సత్యము కాదు. ఇక వీటిలో గ్రహించవలసినవేవి? త్యజించవలసినవేవి?
ఓ రఘుకులతిలకమా! రామచంద్రా! "ఈ సంసారమునకు బీజము వంటిది" అని మనం చెప్పుకొంటున్న ‘అవిద్య' సర్వదా లేనిదే అయిఉన్నది సుమా! అయినప్పటికీ చమత్కారంగా ఉన్నట్లే తోచుచు, విశాలరూపముగా పొందబడుతోంది.
కృత్రిమ వేషధారణి యగు ఈ అవిద్య అసారమగు ఈ సంసారయంత్రమును ప్రారంభించు చక్రము వంటిది. ఇదియే ఈ జీవుని చిత్తమునందలి వాసన అని గ్రహించు. వెదురు తీగ (వెదురు పుల్లలు విస్తళ్ళను కుట్టుటకు వాడతారు) అందంగా ఉండవచ్చు. కాని అందులో తినుటకు రుచికర మైనదేదీ లభించదుకదా! ఈ అవిద్యకూడా పైకి జీవుని ఆకర్షిస్తోంది. కాని, అంతరమున మాత్రం శూన్యంగాను, నిస్సారంగాను ఉండి ఉంటోంది. నదీతరంగమును ఒక కఱ్ఱతో విభజించుటకు ప్రయత్నించి సఫలులం కాగలమా? అట్లాగే ఈ అవిద్య కూడా అనేక ప్రయత్నముల తరువాత కూడా నశించుట లేదు. చేతితో తాకుటకై ఏమన్నా అందుతుందా? లేదు. విషయాసక్తులైన వారిని దుఃఖింపజేయటంలో దీనిని మించింది వేరొకటి లేనేలేదు.
ఈ అవిద్య అనేక కారణసమూహములు కలిగియున్నట్లు, అట్టి అవిద్య కార్యసమర్థములు అయినట్లు గోచరిస్తోంది. కాని, కొంచం “పరిశీలనాత్మక చతురత" తో చూస్తే, ... 'సత్యము నిత్యము' దృష్ట్యా దీనికి ఏ ఉపయోగం లేనేలేదని తెలియవస్తోంది. 'మృగతృష్ణ' లో కూడా తరంగాలు వాస్తవమైనవాటివలె అనిపిస్తాయి. కాని అక్కడ జలం ఎక్కడ? ఈ కార్య - కారణములు కూడా ఆకారమాత్రంగా మాత్రమే కనబడుచున్నవి. ఈ అవిద్య ఒకచోట వక్రంగా - మరొకచోట స్వచ్ఛంగాను; ఒకచోట లఘువుగాను - మరొకచోట దీర్ఘంగాను; ఒకచోట సుస్థిరంగా - మరొకచోట చంచలంగాను భాసిస్తోంది. దీని ప్రభావంచేతనే ఉత్పన్నమైయున్న ఈ సకలపదార్థములు పరస్పర భేదభావాలు పొంది ఉన్నాయి. అవిద్యా ప్రభావంచేత కనబడుచున్న ఈ దృశ్యవ్యవహారమంతా లోన శూన్యమే అయినప్పటికీ, బయటకు మాత్రం సారవంతంగాను, సుందరంగాను కనిపిస్తోంది. ఎచ్చటా లేనిదే అయినప్పటికీ అంతటా విస్తరించి ఉన్నట్లే కనబడుతోంది. 'జడమే’ అయినప్పటికీ చైతన్యమువలె కనిపించుచూ, మనస్సు యొక్క చపలత్వమును ఉజ్జీవింపజేయుచున్నది. ఇందులో ఏదైనా ఒక నిమిషమైనను ఒకచోట స్థిరత్వం కలిగి ఉంటోందా? లేదు. అయినను ఇదంతా స్థిరంగా ఉన్నట్లే అనిపిస్తోంది. సత్వగుణంచేత శుద్ధంగాను, తమోగుణంచే మినపగింజలాగా మలిన వర్ణంగాను కనబడుతోంది.
Page:590
అయితే ‘అవిద్య' అనే పేరుతో వ్యవహరించబడుచున్న ఈ దృశ్యవ్యవహారము (లేక) ఈ కనబడే ప్రపంచము స్వయంప్రకాశకము కానేకాదు. పరమాత్మయొక్క ప్రభావంచేతనే ఇది విజృంభించుచున్నది. మరల అతని సాక్షాత్కారంచేత నశించుచున్నది. ఎవని “ప్రభావముచే -
కల్పనచే - దృష్టిచే” ఇది విజృంభిస్తోందో అట్టి వాని జ్ఞానదృష్టిచే క్షణంలో మటుమాయమౌతోంది.
ఇప్పుడు చెప్పు. ఒకానొక 'భావన' లేక 'దృష్టి' చే ఉండి, మరొక భావన-దృష్టులచే లేకుండా పోయేది ఉన్నట్లా? లేనట్లా? అజ్ఞానాంధకారంచే శోభిస్తున్న ఈ దృశ్యానుభవమంతా ఆత్మప్రకాశంచే రహితమగుచున్నది.
ఆహాఁ! ఈ దృశ్య-అవిద్య 'మృగతృష్ణ' వలె శుష్కప్రాయమైనప్పటికీ, పలువిధములైన వర్ణనము లతో విలాసవంతముగా ఒప్పుచున్నదే?
వక్రమై, విషపూర్ణమై, అతి సూక్ష్మమై అనేక ఆపదలకు ఆలవాలము - - హేతుభూతము అయినట్టి ఈ 'అవిద్య' యొక్క వాస్తవమైన రూపమేమిటో గ్రహించటానికి మేము ఎంతగానో ప్రయత్నించాం. చివరకు, “ఈ అవిద్యకు 'తృష్ణ' లేక 'రాగము' తప్ప వేరే రూపం లేదు” అని గ్రహించాం. ఆ రాగము నశించిందా...ఇకప్పుడు నూనె లేని దీపంలాగా ఇది శీఘ్రంగా నశించ గలదు. రాగము ఉన్నంతవరకు ఈ అవిద్య ఉంటూనే ఉంటుంది.
ఆహాఁ! ఈ అవిద్య క్షణకాలంలో స్ఫురించుచు, చంచలమై, మరల మరల జీవుని జడత్వమును ఆశ్రయింపచేస్తోంది కదా! అజ్ఞులగువారిని ఇది ఎంతగా దుఃఖింపచేస్తోంది! యత్నపూర్వకంగా ఈ జీవులను మెఱుపుతీగవలె పట్టిదహిస్తోందే? మరల మరల ఈ అవిద్యయొక్క ఉపశాఖలు ఉత్పన్న మవుతున్నాయి. మరల మరల లయించుచున్నాయి. మేఘముల సమూహంమధ్య ఏర్పడి క్షణకాలంలో మాయమయ్యే విద్యుల్లతలాగా ఈ అవిద్యయందు ప్రేమ, ద్వేషము మొదలైనవి క్షణంలో కనబడి, మరుక్షణం ఎటుపోతున్నాయోకూడా తెలియవచ్చుటలేదు. ఇదంతా కోరుకోనప్పటికీ ఎదురుగా ప్రాప్తిస్తోంది. పైకి రమణీయంగా ఉన్నప్పటికీ, నిజానికి అర్థరహితం- అనర్థకారిణియే కదా! ఈ 'అవిద్య' లేక 'సంసారం' అంతా ఏర్పడేది శ్రేయము కొరకు మాత్రం కాదు. ఇది ఒక అకాల పుష్ప మాల వలె ప్రాప్తిస్తోంది. ఈ జీవుడు దీనిని బాగుగా విస్మరించటానికి ప్రయత్నించినప్పటికీ, ఇది అతిశయమైనట్టి “సుఖభ్రమ” కలుగజేయటానికి ఎప్పటికప్పుడు సంసిద్ధపడుతోంది. అనగా ఇందులో ప్రవేశించిన జీవుడు “ఏదో పొందాలి. అట్లు పొంది సుఖించెదనుగాక” అను భ్రమకు ఎప్పటికప్పుడు లోను అగుచున్నాడు.
దుఃస్వప్నకల్పన సుఖమైన విషయమా? కాదు కదా! "ఈ అవిద్య అనర్థకారిణియే” అని జ్ఞానులైనవారు మనందరినీ అనేకసార్లు హెచ్చరిస్తున్నారు. “నాయనలారా! ఈ 'అవిద్య' అనే అనర్థమునకు ఇక్కడ చికిత్స పొందండి" అని అనేకమంది సద్గురువులు చెవులో దూరి మరీ చెప్పుచున్నారు. కాని, ఏం లాభం? అనేకమంది జనులు అశ్రద్ధగానే జీవితాలు గడిపివేస్తున్నారు. ఆహాఁ! ఎంత చిత్రం! ఆ అవిద్య తన కల్పనచే కొన్ని క్షణాలలో విశాలమగు త్రిలోకములను
Page:591
సృష్టించి, ధరించి, మరల నశింపజేయుచున్నది! లవణమహారాజు ఒక గంటన్నర కాలంలో ఎన్నో సంవత్సరముల అనుభవం పొందాడుకదా! అదంతా అవిద్యయొక్క ప్రభావమే. హరిశ్చంద్రుడు ఒక్క రాత్రిలో పండ్రెండు సంవత్సరముల అనుభవం పొందటం అట్టిదే.
అవిద్య చేతనే ‘వియోగము' అనుభవించేవారికి కొద్ది సమయం కూడా దుర్భరమైన దీర్ఘకాలంగా ప్రాప్తిస్తోంది. అట్లే, ఏదైనా చమత్కారమైన విషయము నందు ధ్యాస ఏర్పడునప్పుడు దీర్ఘకాలం కూడా క్షణాలలో గడచిపోతుంది. దీని ప్రభావంచేతనే భ్రమకు లోనైనవారి దృష్టియందు కాలము అనేక విభిన్నరూపములుగా స్ఫురించుచున్నది. సుఖవంతులకు అల్పముగాను, దుఃఖితులకు దీర్ఘంగాను ఒకే పరిమిత కాలం స్పురించటమే అవిద్యకు ఒక “దృష్టాంతము”.
శ్రీరాముడు : స్వామీ! ఈ అవిద్యకు ఇంతటి సామర్థ్యం ప్రసాదిస్తున్నవారు ఎవరు? ఇది ఇంత గమ్మత్తుగా ఎందుకు ప్రవర్తిస్తోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒక గదిలో దీపం వెలుగుచుండగా ఆయా వస్తువులు కనిపిస్తున్నాయి. ఆ
వస్తువులు అట్లు ప్రకాశించటానికి కారణం గదిలోని ఆ దీపమేకదా! కాని, ఆ దీపం తానుగా “నేను ఈ ఈ వస్తువులను చూపుతాను. వీటిని చూపను, ఇది బాగు - ఇది బాగుకాదు” అను కర్తృత్వ భావనతో సంకల్పించి అట్లు వెలిగిస్తోందా? లేదు. గదిలోని ఆ వస్తువులను చూచునది మనం. అంతేగాని, దీపం చూస్తుందా? లేదు. అట్లాగే ఆత్మ యొక్క సమక్షంలో మనస్సే అంతా చూస్తోంది. ఆత్మ యొక్క ఉనికి- ఔన్నత్యములను ఏమరచిన ఈ మనస్సు దృశ్యమునకు అధీనమై చరించుటే అవిద్య! అయితే, చైతన్యము యొక్క సమక్షంలో ఈ అవిద్యకు పరిమితమైన కర్తృత్వము మాత్రమే ఉన్నది. అన్నిటినీ గ్రహించేది, అనుభవించేది చైతన్యమేకాని, అవిద్య కాదు. అవిద్యకు స్వతంత్రమైన అస్థిత్వమే లేదు. అది ద్రష్ట యొక్క అవికాసదృష్టిని ఆశ్రయించుకొని మాత్రమే ఉంటోంది. అస్థిత్వమే లేనిది ఎట్లు అనుభవిస్తుంది? ఎట్లు ఏదైనా నిర్వర్తిస్తుంది? ఒక రంగులచిత్రంలో స్త్రీ మూర్తిని అందరు “ఇది స్త్రీయే" అని గుర్తించవచ్చు. అంతమాత్రంచేత ఆ స్త్రీమూర్తి ఒక స్త్రీ యొక్క మాతృవాత్సల్యాది ధర్మములన్నీ కలిగి ఉంటుందా? లేదు.
అవిద్యకు ఇతఃపూర్వం, ఇప్పుడు అనుభూతమైన విషయాలు, పదార్థాలు ఇవన్నీకూడా, “స్వవాసనలే అట్లు ప్రాప్తిస్తున్నాయి,” అని గ్రహించాలి. ద్రష్ట దృశ్యవాసనలను కొనసాగిస్తున్నంత సేపూ అవిద్య ఉంటుంది.
అట్టి స్వవాసనలే ముందుముందు ఆయా ప్రవర్తనలుగా పరిణమిస్తున్నాయి. అంతేగాని "అవిద్యయే అట్లు ప్రవర్తిస్తోంది" అనటం సమంజసంకాదు.
శ్రీరాముడు : తండ్రీ! ఈ అవిద్యను జ్ఞానులు ఎట్లా దర్శిస్తున్నారు? వారి దృష్టిలో ఇదంతా ఎటు
పోతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! ఈ అవిద్య అంతా ఒక 'మనోరాజ్యం' లాగా కల్పితమైన ఆకృతి కలిగి ప్రకాశిస్తోంది. నిత్యసత్యమై యున్నదానిని కప్పిఉంచే భ్రమయే అవిద్య. ఇదంతా అనేక
Page:592
శాఖలుగా విస్తరించి కనబడవచ్చుగాక! అయినప్పటికీ, పరమార్థమున (At its highest meaning) ఇదంతా ‘లేనిది’ మాత్రమే సుమా! ఇది అనేక మిథ్యారూపమైన ఆడంబరములు గలిగి, అజ్ఞులను మాత్రమే మోహపెట్టుచున్నది. విజ్ఞులు సర్వము గ్రహించి ఉంటున్నారు కనుక, వారు ఏమాత్రం మోహితులు కావటంలేదు. ఒక నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఆ నీరు అనుక్షణం ప్రవహించుచూ, అస్థిరమైనప్పటికీ, నదీ ప్రవాహరూపంగా 'నిత్యము' గానే కనబడుతూ ఉంటుంది. ఈ అవిద్య (లేక) సంసారం కూడా చంచలమైన ఆకృతి కలిగి ఉంటోంది. అవిద్య గ్రహించబడిందా, ఇదంతా ఏదీ కాకుండానే పోతోంది. ఇది తనశక్తిచే లోకములన్నీ ఆక్రమించి, సర్వత్రా పరిభ్రమించు చున్నమాట నిజమే. అయితే, ఈ అవిద్య తన గర్భమునందు పరమాత్మను ధరించుటచేతనే అట్లు ఆక్రమించి సంచరించుచున్నదని గ్రహించు.
ఆకాశంలో విశాలమైన మేఘములు రకరకాల ఆకారాలు ధరిస్తుంటాయి చూసావా? అక్కడ తోట, వృక్షములు మొదలైనవి ఉన్నట్లు మేఘముల ఆకారమును చూస్తూ మైమరచే ద్రష్టకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సంసారము కూడా అట్టిదే. ఇది వాస్తవానికి అసారం. అందుకే జ్ఞానులగు కవులు దీనిని తరంగములతోను, కమలనాళములలోని తంతువులతోను పోలుస్తూ ఉంటారు. "మేము ఇక్కడ అభివృద్ధి చెందుచున్నాము” అని ఈ జనులు చెప్పుకునేదంతా భ్రమాత్మకమే. అవిచారముచేతనే ఈ అవిద్యాపూర్వక దృశ్యపదార్థములు ఆరంభంలో మధురంగా, చివరికి అతిభయంకరంగా పరిణమించుచున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! అవిద్యచేతనే విజృంభిస్తున్న ఈ సంసారవ్యవహారం అవిద్య తొలగి పోయినప్పుడు ఏమగుచున్నది? ఎటు పోవుచున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : దీపం ఆరిపోయినప్పుడు, ఆ దీపమునందలి జ్వాలయొక్క ఆకారం ఏమవుతోంది? ఎక్కడికి పోతోంది? అవిద్య నశించినప్పుడు ఈ దృశ్యవ్యవహార ప్రహసనమంతా 'రహితం' అవుతోంది. ధూళిని చేతిలోకి తీసుకొన్నామనుకో.... ఒక ముద్దవలె ఉంటుంది. అదే ధూళి వెదజల్లబడినప్పుడో? ‘ముద్ద’ కనబడదు. నిజానికి, అదంతా కణములమయమేకదా! అవిద్యను పరిశీలించి చూచామా, అదంతా శూన్యమనియే తెలియవస్తోంది. ఆకాశం శూన్యమయమే కదా! మరి నీలపురంగుతో కనబడటానికి కారణమేమిటి? ద్రష్టయొక్క భ్రమయే కదా! అదేవిధంగా అవిద్య అకారణంగానే వ్యక్తమగుచున్నది. నౌకయందున్నవానికి ఒడ్డునవున్న చెట్లు కదలుచున్నట్లు తోచుచు ఉంటాయి. స్వప్నంలో అనేక పదార్థజాలమంతా కనిపిస్తోంది. అదంతా అవాస్తవము, స్వయంకల్పితము, మిథ్యా రూపము కదా! కాని ఆ స్వప్నసమయంలో మాత్రం అజ్ఞానదృష్టికి అదంతా వాస్తవమువలెనే ప్రాప్తిస్తోంది. మెలుకువ రాగానే స్వప్నము, ఆ స్వప్నములోని పదార్థములు ఎటు పోతున్నాయి?
అవన్నీ వాస్తవంగా ఉంటే కదా ఎటైనా పోవటం! అట్లే భ్రాంతి పూర్వకమైన ఈ అవిద్య మిథ్యారూపంగానే అజ్ఞానియొక్క దృష్టికి ప్రాప్తిస్తోంది. అవిద్యచే చిత్తము కలుషితమైన మరుక్షణంనుండి ఈ జీవుడు తనకు తానే చిరకాలంగా ఉండగల “దీర్ఘ - సంసారస్వప్నము” ను కల్పించుకొనుచున్నాడు.
Page:593
ఆత్మ ఈ అవిద్యచేతనే ఆవరణయుక్తం అగుచున్నది. అట్టి తరుణంలో ఈ చిత్తంలో అనేక రకములైన భ్రమలు ఉదయించి నశించుచున్నాయి. సముద్రంలో తరంగాలు లేవటం, నశించటం జరుగుచున్నది కదా! కానీ, జలమో? సర్వదా యథాతథం. అట్లాగే భ్రమలయొక్క ప్రభావంచేత సత్యము, సర్వోత్తమము అగు బ్రహ్మము అసద్రూపంగా (లేనిదానిగా భావించబడుతోంది. అమనోజ్ఞము, అత్యంత మిథ్యారూపము అయిఉన్న ఈ జగత్తు రమణీయంగా, సత్యంగా అనుభవం అవుతోంది. ఇంతకన్నా చమత్కారం ఏం ఉంటుంది?
‘వల' క్రింద ఉంచబడిన ధాన్యపు గింజలు ఎక్కడో ఆకాశంలో ఎగురుచున్న పక్షియొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి చూచావా? 'ఇంద్రియ విషయములు' అను వాసనారూపమైన అవిద్య చిత్తమును విమోహితం చేసివేస్తోంది. క్షణంలో ఈ జీవులను బంధములో పడద్రోస్తోంది. కొంతసేపు ఆనంద ఉల్లాసములను కల్పించటం, ఇంతలోనే సర్వమును విషపూరితం చేసివేయటంలో ఈ అవిద్యకు ఉన్న సామర్థ్యం మరింక దేనికీ ఉండదు. ఈ అవిద్యకు వాక్ మొదలైన ఇంద్రియములు లేకపోయినప్పటికీ, ఆయా కార్యక్రమములను రచిస్తూ.... ఇది జీవులను గ్రుడ్డివారిగా చేసివేయ గలుగుతోంది. ఒక బండరాయిని ఉన్మత్తనృత్యం చేస్తున్నట్లుగా చూచేట్లు చేస్తోంది. దీని ప్రభావం చేతనే “మట్టి, శిలలు” కూడా మహత్తరమైన విషయాలుగా చూడబడుతున్నాయి. “ఇదంతా మాదే. మాకే ఉండాలి” అను అర్థరహితమైన భావనలన్నీ హృదయంలో ప్రవేశించి ఈ జీవులను ఘోరంగా హింసించ గలుగుచున్నాయి.
సంహారకుడగు కాలునికి అతిదీర్ఘమైన ప్రళయరాత్రి కూడా అల్పంగా తోస్తుంది. అట్లాగే ‘అవిద్య’ కారణంగా దీర్ఘమైన కాలం కూడా 'క్షణికము' వలె అగుచున్నది, కొద్దిక్షణాల కాలం అతిదీర్ఘంగా అనుభవమౌతోంది. ఆహా! దీని సామర్థ్యం గురించి ఏం చెప్పాలి? తనయందు 'సత్యము' అనునదే లేకపోయినప్పటికీ, ఈ అవిద్య విజృంభిస్తోంది. వర్ణనాతీతమైన వ్యవహారమంతా నడిపిస్తోంది. కనుక వివేకవంతుడు బుద్ధిమంతుడు అయినవాడు స్వప్రయత్నముచే తన చిత్తమును విషయములనుండి ప్రయత్నపూర్వకంగా మరల్చాలి. ఎట్లాగైనాసరే, ఆత్మయందే ప్రతిక్షేపించాలి.
శ్రీరాముడు : ఆహాఁ! మునీంద్రా! మిథ్యారూపం, అల్పం, తుచ్ఛం, అవస్తువు అయినట్టి ఈ అవిద్య జగత్తును ఎంతగా అంధకారంలో ముంచివేస్తోంది! ఎంత ఆశ్చర్యం!
ఈ అవిద్యకు రూపంగాని, ఆకృతిగాని, స్థానంగాని లేదు. పోనీ ఇది స్వయంప్రతిభా సమన్వితమైన చైతన్యమా? కానే కాదు. ఇది అసత్తే అయినప్పటికీ 'అంతు’ అనేది లేకుండా జనులందరిని మోహపరుస్తోంది.
ప్రకాశరూపమైనట్టి జ్ఞానంచేత నశిస్తోంది.
అంధకార రూపమైన అజ్ఞానంచేత స్పురిస్తోంది.
అరెరె! గుడ్లగూబయొక్క రెండు కన్నుల వలె ఇది ఎంత చాంచల్యంగా ప్రవర్తిస్తోంది! క్రియాశక్తిని
Page:594
ఆశ్రయించి అనేక దుష్కర్మలకు కారణమగుచున్నదే! ఈ అవిద్య ప్రకాశమును (జ్ఞాన వాక్యములను, జ్ఞాన-సమాచారమును) ఏమాత్రం సహించలేకపోతోంది.... దగ్గరకు రానిచ్చుటలేదు. అది జ్ఞానశూన్యం కదా! అందుచేత, “నేను ఇట్టిదానిని అను స్వ-శరీరజ్ఞానం లేదు. తనను ఆశ్రయిస్తున్న జీవుని కూడా స్వస్వరూప జ్ఞానరహితం చేసివేస్తోంది. "దుష్టాచారములు, నీచ స్వభావములుగల మనుజులు ఎక్కడెక్కడున్నారు?” అని వెతికివెతికి, అట్టి అజ్ఞుల ముంగిటవాలి, తీరికగా వారితో కాపురం చేస్తోంది. అనేక విధములైన దుఃఖములతో కూడుకొని, మృతప్రాయమై, జ్ఞానరహితమై ఇది ఈ జీవునియొక్క అనేక జన్మపరంపరలకు కారణభూతమగుచున్నది. కామము - క్రోధము... ఈ రెండూ అవిద్యయొక్క రెండు కళ్ళు. అజ్ఞానం ఎట్లెట్లు విస్తరించాలో నూతన విధానాలు ఎప్పటికప్పుడు కనిపెట్టుచు, భయంకరంగా ఒప్పుచున్నది.
జ్ఞానోదయంచే ఈ అవిద్య శీఘ్రంగా నశించగలదు. నిజమే. సందేహం లేదు.
కాని, అజ్ఞానకాలంలో జ్ఞానాకాశమును అంధకారమయం చేస్తోంది కదా! ఏమి విచిత్రం! “ఓ అవివేకమా! ఇంతకీ నీ నివాసం ఎక్కడ?” అని మేము విజ్ఞానదృష్టితో పరిశీలించినప్పుడు, “ఇదిగో! ఇక్కడ! మీ అజ్ఞానుల హృదయములే నా నివాసస్థానం” అను సమాధానం వినవస్తోంది. ‘జడత్వం’ దృష్ట్యా ఎప్పటికప్పుడు శిథిలత్వమునే ఆశ్రయిస్తోంది.
తాను కలిగించగల దుఃఖములచే అది అతిదీర్ఘంగా అనుభవమౌతోంది. దాని ప్రతాపములు వింటుంటే భయంకరమైన రాక్షసియొక్క భీకర నినాదాలు గుర్తుకు వస్తున్నాయి.
చివరికి ‘చైతన్యము’ అను పురుషునియొక్క “ఏకత్వధ్యానం” అనే ప్రక్రియచే అవిద్య
సమసిపోతోంది.
పురుషసంగి - ఈ అవిద్యను కవులు చమత్కారంగా “పురుషసంగి” అని కూడా చెప్పుచూ ఉంటారు. ఎందుకంటారా? ఇది అనేక కల్పనలు చేస్తూ భోగములను అనుభవించాలనే ఇచ్ఛతో పురుషునియందు అనురక్తమై ఉంటోంది. కాబట్టి, ఏ జీవుడైతే 'ఆత్మతత్త్వవిచారణ' అనే సుక్షేత్రం వదలి దూరంగా వస్తాడో అట్టి వానిని ఈ పురుషసంగి పిశాచివలె విమోహితుని చేసి ‘అనర్థములు’ అనే పేరుగల తన అంతఃపురమునకు గొనిపోతోంది. ఇది తన ఆవరణ ప్రభావంచేత ఈ జీవుడు నిలబడి ఉన్నచోటును అంధకారమయం చేసివేస్తోందే? ఇదేమన్నా స్వయంప్రతిభావంతమా? కాద అయినాసరే, ఇది మరింక ఏ బాహ్యవస్తువుచేతను నాశనం చేయబడజాలదు. ఏమి దీని ప్రతాపం! శ్రీరాముడు: ఓ మహర్షీ! ఈ అవిద్య కలుగజేసే దుష్టభ్రమలకు అంతు-పొంతు లేకుండా పోతోంది. జనన - మరణములు, ఉత్పత్తి - నాశనములు కలుగుచున్నది కూడా దీని వలననే కదా! తండ్రీ! “విషయములు” అనే మనోగృహంలో 'వాసనలు' అనే రూపంలో ఉన్న ఈ అవిద్య నశించేదెట్లా? ఈ విషయం తలచుకుంటేనే నాకు వేదనగా ఉన్నది.
Page:595
12. మనస్సు - పరమేశ్వరుడు
శ్రీరాముడు : కాబట్టి, మునీంద్రా! మాయందు ఎక్కడినుంచో విచిత్రమైన అంధత్వం వచ్చిపడుతోంది. ఘనీభూతమై, ఆవరణరూపమున ప్రవర్తిస్తోంది. అట్టి ఈ అంధత్వం నశించేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అంధకారంలో ఉన్నప్పుడు భయ-ఉద్వేగ-నిస్తేజాదులు వచ్చి మీదపడుచున్నాయి. సూర్యుడు ఉదయించిన మరుక్షణం దిక్కులలోని అంధకారమంతా పటాపంచలైపోతుంది కదా! సర్వవ్యాపి, బోధస్వరూపము (of the nature of awaremess) అగు ఆత్మానుభవమే అవిద్యకు మందు. ఆత్మావలోకనం చేసినంతమాత్రంచేత సర్వసంసార వికారాలు తొలగిపోతాయి. ఆత్మదర్శనము గురించి తీవ్రేచ్ఛ ఉత్పన్నం కానంతకాలం మోహరూపమగు అవిద్య ఉండనే ఉంటుంది. అది అత్యంత దుఃఖకంటకయుక్తమై, ఈ జీవుని ఆందోళనపరుస్తూనే ఉంటుంది.
పరమాత్మను దర్శించిన మరుక్షణం ఈ అవిద్య నశిస్తుంది.
శ్రీరాముడు : స్వామీ! అసలు అవిద్యయొక్క మూలకారణం....?
శ్రీ వసిష్ఠ మహర్షి : "ఇచ్ఛ” యే అవిద్య. అంతకుమించి అది వేరే ఏదీ కాదు. మిగతాదంతా ఆ ‘ఇచ్ఛ’ యొక్క వికారస్వభావమే. అందుచేతనే ఆత్మద్రష్టలగు జ్ఞానులు “నాయనలారా! ఇచ్ఛానాశనమే మోక్షము" అని మనకు బోధిస్తున్నారు. అట్టి మోక్షము 'దృశ్య అసంకల్పత్వం' చేత సిద్ధిస్తోంది. “నేను చైతన్యమే స్వరూపముగా కలవాడను" అను భావన ఉదయించగానే, వెలుతురుచే చీకటి యొక్క గతివలె, కామవాసనారూపమైన అవిద్యావరణ (The cloudy cover of ignorance) స్వయంగా క్షయిస్తోంది. వివేకము ఉదయించనంతకాలం సంకల్పపరంపరల రూపంలో ఈ అవిద్య ఉండి తీరుతోంది. ఘనవాసనలచే దృఢమైన బంధనమునకు దారితీస్తోంది.
శ్రీరాముడు : మహర్షీ! ఈ దృశ్యప్రపంచమంతా అవిద్యాత్మకమని, ఆత్మభావనచే నశించిపోగలదని చెప్పియున్నారుకదా! ఆత్మస్వరూపము ఎట్టిదో ఇంకా కొన్ని విశేషాలు తెలియజేయండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! 'చిత్తము’ లేక మనస్సు' అనబడునదే పరమేశ్వరుడు. మనస్సు ఈ అవిద్యతో కూడుకొనియున్నప్పుడు చిత్తమని, పరిపూర్ణమగు ఆత్మజ్ఞాన - అనుభవములతో కూడుకొని ఉంటే సర్వాతీతస్వరూపమగు 'భగవంతుడు' (భ=జ్ఞానము) అని చెప్పబడుతోంది. వాస్తవానికి ఈ మనస్సు - - అనేది విషయవర్జితం, ఆవరణ - విక్షేపములు లేనట్టిది, సర్వవ్యాపకము, సర్వమునకు కారణము అయిఉన్నది.
ఈ మనస్సు (లేక, చిత్తము) తనయొక్క దృశ్యతాదాత్మ్యము త్యజించినప్పుడు ఇక, ఆపై,
ఏది స్వయంసిద్ధంగా శేషిస్తోందో అదియే “చితవస్తువు”.
ఈ మనస్సుకు ఆత్మలక్షణములన్నీ స్వతహాగా ఉన్నప్పటికీ ఇది చిరకాలంగా ఆర్జించుకొనియున్న పదార్థములపట్ల ఆసక్తి చేతనే పరిమితత్వము - ప్రమేయత్వములతో కూడి వ్యవహరిస్తోంది.
Page:596
ఓ ప్రియశిష్యా! రామా! బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డిపఱక వరకు కూడా ఈ జగత్తు అంతా సర్వదా ఆత్మస్వరూపమే అయి ఉన్నది. 'అవిద్య' అనబడేది వాస్తవానికి లేనే లేదు. ఈ దృశ్యప్రపంచమంతా కూడా "నిత్యము నాశరహితము - చిదనస్వరూపము” అగు బ్రహ్మమే
సుమా! అసలు ఆత్మకు వేరుగా 'మనస్సు' అనబడే కల్పనయే లేదు.
శ్రీరాముడు : అదేమిటి స్వామీ! మా అందరికీ 'మనస్సు’ అనబడేది అనుభూతమౌతోంది కదా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మ యొక్క మననము చేయు స్వభావమే మనస్సు. ప్రీతి పూర్వకముగా ఆయా బాహ్య విషయములను దర్శించుటే చిత్తము. “మననము ప్రియత్వము" ఈ రెండూ కర్తకంటే వేరైనవి కావు కదా! అందుచే “మనస్సు అనబడునదేదీ నీకు వేరుగా లేదు” అని మేము చెప్పుచున్నాం. మనస్సు - లేకుండునప్పుడు, మనస్సును ఆశ్రయించుకొనియున్న మిగతా వ్యవహారము మాట ఏమిటి? నాటకమే 'కల్పన' అయినప్పుడు నాటకంలోని ఒకానొక పాత్రయొక్క స్వరూపస్వభావాల గురించి 'కల్పనయే’ అని వేరే చెప్పాలా? ఈ దృశ్యమంతా మనస్సును ఆశ్రయించి మాత్రమే ఉన్నది. కాబట్టి తదితర జగత్తు వ్యవహారం విషయము కూడా అట్టిదే. పరమార్థమున ఈ మూడు లోకములందు ఏదీ ఉత్పన్నమగుట లేదు, నశించుట లేదు. ఇక ఈ పదార్థముల వికారములు అంటావా? ఇవన్నీ ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించి మాత్రమే ఉన్నాయి. అందుచేత ఇవి స్వతహాగా సత్యములే కావు.
ఈ జగత్తంతా కేవలము చైతన్యమే అయి ఉన్నది. చైతన్యము సర్వదా అద్వితీయమై, స్వయం ప్రకాశమై సర్వవ్యాపకమై, నాశరహితమై, విషయవర్జితమై, సద్రూపమై వెల్లివిరియుచున్నది. ఈ జీవుడు అనబడేవాడు చైతన్యమే స్వరూపముగా కలిగియున్నాడు.
ఓ రాఘవా! ఆత్మ నిత్యమై, వ్యాపకమై, శుద్ధమై, చిన్మాత్రస్వరూపమై, దుఃఖరహితమై, శాంతమై, విశాలమై, సర్వత్రా ఏకరూపమై వెలయుచున్నది. అట్టి స్వతహాగా నిర్వికారమగు ఆత్మ తనయొక్క “చిత్స్వభావము” నకు విరుద్ధంగా ఆవరణయుక్తమైన జడత్వమును గ్రహిస్తోంది. పరిచ్ఛిన్నములగు విషయములను సంకల్పించుచు, వాటివైపే మరల మరల పరుగులు తీస్తోంది. అట్టి మలినముతో కూడిన 'విక్షేపణశక్తి' నే 'మనస్సు' అని పిలుస్తున్నారు.
సర్వవ్యాపి, సర్వశక్తిమంతము, మహత్తరము అయిన ఈ 'మనస్సు' అనబడే దైవము చేతనే, సముద్రంలోని తరంగాలులాగా, ఈ అనేకపదార్థముల కల్పనాశక్తి ఉత్పన్నం చేయబడుతోంది. వాస్తవదృష్టితో పరిశీలిస్తే "ఏకము - అద్వితీయము - - వ్యాపకము - శాంతము” అగు పరమాత్మ యందు ఈ 'అవిద్య' అనబడేది ఉండటమేమిటి? ఎట్లా ఉంటుంది? కాని, సంకల్పమే రూపంగా కలిగి, స్ఫురణ మాత్రంగా అది అల్పదృష్టికి అనుభవమౌతోంది.
‘అవిద్య' అనేది సంకల్పముగానే ఉత్పన్నమగుచున్నది.
మరల సంకల్పబలంచేతనే నశించిపోవుచున్నది.
Page:597
అగ్నిజ్వాల వాయువు యొక్క ఉనికి చేతనే కలుగుచు, మరల వాయువుచేతనే నశించుచున్నది కదా! ఇది కూడా అంతే! ఏది దేనిచేత ఉత్పన్నమగుచున్నదో దానిచేతనే నశించబడుచూ ఉంటుంది. “విషయభోగాభిలాష” రూపమును గ్రహించుచున్న ఈ అవిద్య దృఢమైన నిధిధ్యాసలతో కూడిన పురుషప్రయత్నముచే సిద్ధించగల “అసంకల్పత్వము”చే నశించగలదు.
ఈ మనస్సు “నేను అల్పమగు వస్తువును; అంతేకాని, నేను బ్రహ్మమును కాను” అను దృఢమైన సంకల్పమును ఆశ్రయించి బంధమును తెచ్చిపెట్టుకుంటోంది. మరల ఇంతలోనే “నాతో సహా ఈ సర్వము ఆత్మస్వరూపమగు బ్రహ్మమే అయిఉన్నది" అను దృఢసంకల్పముచే ముక్తిని పొందుచున్నది.
దృశ్య - సంకల్పమే “బంధము”.
దృశ్య - - అసంకల్పమే “ముక్తి”.
ఓ రామచంద్రా! "నేను బ్రహ్మమును కాను" అను సంకల్పమును "సర్వము బ్రహ్మమే” (“సర్వం ఖల్విదం బ్రహ్మ”) అను విరుద్ధ సంకల్పమును ఆశ్రయించుటచే పొందబడు జ్ఞానబలంతో జయించివేయాలి. అట్లు జయించుటలో విజయము సాధించి, ఆ తరువాత నీకెట్లు తోస్తే అట్లే ఈ ప్రపంచమున వ్యవహరించు.
స్వతహాగా ‘లేనిదే’ అగు ఈ అవిద్య చిదాకాశమునందు చిత్రముగా ఉత్పన్నమై, చంచలమైన భ్రమణము కలిగినదై, అన్నివైపులా పుష్పసువాసనవలె వ్యాపించి ఉంటోంది. ఇది తన జన్మస్థానమైనట్టి ఆత్మప్రకాశమునే పరిహాసం చేస్తోంది! అనేక వికల్పజాలములను కల్పించుకొనుచూ, అట్టి జాలము లందు తనకుతానే బంధితురాలు అవుతోంది. యథార్థానికి అవిద్య లేకున్నప్పటికీ, కనిపించటం జరుగుతోంది. బంధహేతువు, చపలము అయిన ఈ అవిద్యకు అజ్ఞానులు తమయొక్క దుఃఖము కొరకే కల్పనచేసుకుంటున్నారు కాని, సుఖము కొరకు కానేకాదు. బాలుడు “వినోదము కొరకు” అని తలచి అల్లరిని ఆశ్రయించి, తద్వారా అనేక శారీరక - మానసిక వేదనలను కొనితెచ్చి పెట్టుకొంటాడు చూచావా? ఈ జీవుని విషయము కూడా అట్టిదే. ఇతడు “నేను శరీరమాత్రుడను. అతి దుర్భలుడను, దుఃఖితుడను, బద్ధుడను, ఈ చేతులు - కాళ్ళు నా స్వరూపమునకు సంబంధించినవి, వీటిచే నేను పరిమితుడను.....” అని దృఢంగా భావిస్తూ, తదనుగుణంగానే వ్యవహరిస్తున్నాడు. ఫలితం? బంధమునందు తగుల్కొనుచున్నాడు. “నేను దుఃఖితుడను కాను. చైతన్యమే స్వరూపముగా కలిగియున్నట్టి నేను ఒక పాంచభౌతిక పదార్థమును ఎట్లా అవుతాను? చైతన్యము సర్వమును ప్రకాశింపజేస్తుంది. అట్టి దానికి బంధ - మోక్షములేమి ఉంటాయి? నాకు దేహమే లేదు. ఇక బంధము ఎవరికి?” అని ఈ జీవుడు ఎందుకు ఉత్తమ భావనను ఆశ్రయించరాదో చెప్పు? అప్పుడు అతడు ముక్తరూపుడే అవుతాడు కదా! "నేను ఈ మాంసముగాని, బొమికలుగాని కానేకాను. ఈ దేహమునకు విలక్షణమైనవాడను. బుద్ధికి అతీతమైనట్టి చిద్రూపమే నేను” అని నిశ్చయించు కొన్నవాడే అవిద్యారహితుడు అగుచున్నాడు.
Page:598
ఆకాశము-నీలత్వ ధర్మము : ప్రపంచము - - అవిద్యాధర్మము
ఓ రామా! అటు ఆకాశంలోకి చూడు. అక్కడ నీకు నీలత్వం కనబడుతోంది కదా! "అట్లు నీలంగా ఎందుకు కనబడుతోంది? ఇంతకీ అక్కడ ఉన్నదేమిటి?" అను ప్రశ్నలకు వివిధరూపములైన సమాధానాలు చెప్పబడుచున్నాయి.
యోగ భాష్యకారులు : 'మేరువు' అనబడే ఒక మహాపర్వతం ఉన్నది. అందులో ఈ భూమి, ఈ నక్షత్రములు, మర్త్య-పాతాళ స్వర్గాదిలోకములు ఒక స్వల్పభాగం వలె ఉన్నాయి. ఆ మేరు పర్వత శిఖరం 'నీలమణి' చే ప్రకాశిస్తోంది. ఆ శిఖరపు రంగే మనకు కనబడే ఈ నీలత్వం.
జ్యోతిష్కులు : సూర్యమండలమునకు దూరంగా ఉండుటచే ఏర్పడే అంధకారపు కాంతే అది. వేదాంతులు : ఆ ఆకాశం అనేక విధములుగా గాంచబడుచున్నది. అనేక కల్పనలు చేయబడు చున్నది. అదే విధంగా అనాత్మభూతములగు ఈ దేహము, తదితర పదార్థములు మొదలైనవి, అవిద్య - - అజ్ఞానముల ప్రభావంచేత పరిపరివిధములైన కల్పనా దృష్టులచే గాంచబడుచున్నవి. ఆకాశంకూడా కల్పనాదృష్టికి అట్లు కనిపిస్తోంది.
శ్రీరాముడు : మహాత్మా! ఆకాశంలో మనకు కనిపిస్తున్న ఆ నీలత్వమునకు కారణం " మేరు పర్వతం పై గల నీలమణి శిఖరం యొక్క కాంతి, అంధకార కాంతి" ... ఈ రెండు కావని నాకు అనిపిస్తోంది. ఎందుకంటారా? "మేరుపర్వతం ఎఱ్ఱగా రక్తవర్ణంగా ఉంటుంది" అని పురాణద్రష్టలు (దేవీభాగవతము మొదలైన) పురాణాలలో చెప్పుచున్నారు. ఈ కనబడే ఆకాశం మేరు పర్వతము యొక్క శిఖరాగ్రం అయిఉంటే, ఇది ఎఱ్ఱగా ఉండాలిగా? నీలంగా ఉన్నదేం? ఇక బ్రహ్మాండముయొక్క ఆవలి (ఊర్ధ్వ) భాగం ‘సువర్ణచ్ఛాయలో ఉంటున్నట్లు పెద్దలు చెప్పుచున్నారు. కనుక సూర్యునకు దూరంగా ఉన్నంతమాత్రంచేత నీలంగా కనబడుటకు వీలులేదు.
పైగా ఊర్ధ్వలోకమైనట్టి “తపోలోకం”, “సత్యలోకం” మొదలైనవి ప్రకాశవంతములైనవి కదా! మరి ఆకాశమునకు నీలత్వం ఎట్లా వచ్చింది?
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామా! ఈ నీలత్వము శూన్యరూపమగు ‘ఆకాశము' యొక్క
గుణము కాదు.
మేరుపర్వతశిఖర కాంతి కాదు. సూర్యకాంతి అంధకారమువైపు పయనించుచున్నప్పుడు అట్లు నీలంగా కనిపిస్తోంది - - అనేది కూడా కారణం కాదు. ఈ రెండు కారణాలు నీవు నిరాకరించటం ఉచితమే. మరి ఆ ఆకాశము ఏమై ఉన్నది? ఆ కనబడేదంతా కేవలం శూన్యం. అవిద్య వలన మిథ్యా రూపముగా అదంతా అట్లు కనిపిస్తోంది. ఆకాశమున నేత్రదృష్టి ప్రసరించనిచోట “అదర్శనము (Failure to see)” ఏర్పడుతోంది. అట్టి అదర్శనము వస్తుస్వభావముచే నీలత్వముగా దృష్టికి గోచరించుచున్నది. కనుక ఆకాశములోని నీలత్వమునకు అసలు కారణం “ద్రష్టయొక్క దృష్టి చమత్కారమే”.
Page:599
ఒకడు ఈ విషయమును ఇట్లు తెలుసుకొన్న తరువాత మరల ఆకాశంలో నీలత్వం కనిపించినప్పటికీ ... “ఈ నీలత్వము ఆకాశము యొక్క గుణము కాదు నాదృష్టి యొక్క వస్తుస్వభావ విశేషమే!” ... అను బుద్ధిని కలిగి ఉంటాడు కదా!
ఈ 'అవిద్య' అనే అంధకారం విషయం కూడా అట్టిదే. ఇదంతా స్వసంకల్ప మాత్రంగానే ఏర్పడుతోంది. జ్ఞానదృష్టి స్థిరపడియున్నప్పుడు, “నాచే అనుభవం పొందబడుచున్న ఇదంతా ప్రపంచ ధర్మముగాని, వస్తుధర్మముగాని, శరీరధర్మముగాని అయిఉండలేదు. నాకు నేనే నాయొక్క 'విక్షేపముతో కూడిన బుద్ధి' చేత ఇదంతా ఇట్లు దర్శించటం జరుగుతోంది" - అని సుస్పష్టంగా ఎరుగగలవు.
13. అవిద్యను త్యజించేదెట్లా?
ఈ అవిద్య మిథ్యారూపంగానే ఉదయిస్తోంది. దీనిని జయించాలంటే ఉపాయం:
"సంకల్పములను త్యజించుటయే”
"దశ్యమును అభావించుటయే!”
అని విజ్ఞులు చెప్పుచున్నారు. “అది కష్టసాధ్యంకదా?" అని అంటావేమో? సంకల్పం చేయటంలో కొంత క్రియాపూర్వకమైన శ్రమ ఉన్నదికాని, సంకల్పం చేయకపోవటంలో శ్రమ ఏమి ఉంటుంది, చెప్పు? కాబట్టి అవిద్యను జయించుట సులభసాధ్యమేనని ప్రకటించుచున్నాను. ఓ రాఘవా! 'మిథ్య' యే అయి ఉన్న ఈ జగద్భమను పూర్తిగా విస్మరించివేయి. అనగా మిథ్యగానే దర్శించు అట్లు విస్మరించివేయగా ఏదైతే శేషించుచున్నదో అదే “స్వసత్త ("That which exists absolutely by itselfN) రూపమగు ఆత్మచైతన్యము.” అట్టి స్వస్వరూపమునందే సుస్థిరుడవై యుండుము. ఇదియే ఉత్తమోత్తమమైన మార్గము.
ఒకడు తన స్వప్నంలో “అమ్మబాబోయ్! ఈ మృగం నాపైకి దూకుతోంది. నన్ను చంపుతోంది. ఇప్పుడు నేను చచ్చాను. నన్ను మోసుకుపోతున్నారు” అని అనుభవం పొందుతూ, దీనాలాపన చేస్తూ ఉంటాడనుకో.... ఆ ఆ దుఃఖస్థితికి విమోచనమేమిటి? “నేను మేల్కొన్నాను” అను అనుభవం చేత స్వప్నంలో ఏర్పడిన దుఃఖములను పారద్రోలివేయవచ్చు కదా! మెలుకువ రాగానే ఆ స్వప్నద్రష్ట సుఖమునే పొందుచున్నాడు. ఈ మనస్సు కూడా అనేక దుష్టసంకల్పములచే మరల మరల అల్పత్వమును పొందుతోంది. జ్ఞానరూపమగు ఉత్తమ సంకల్పముచే ఇది "బ్రహ్మైక్యజ్ఞానము”వైపునకు పరుగులు తీస్తున్నది.
ఓ రామా! ఈ అవిద్య ఎప్పుడు ఎట్లు ఉదయిస్తోందో చెపుతాను విను.
ఈ ఆత్మయందు “నేను అల్పుడను, ఖండుడను" అనునట్టి సంకల్పముచే క్షణకాలంలో ‘అనాది’ యగు అవిద్య ఉదయించుచున్నది. నశ్వరము - క్షణికము అయిన అసంఖ్యాకమైన సంకల్పములు
Page:600
రూపంపొంది అంతరంగంలో ఎప్పటికప్పుడు సంచారం చేస్తున్నాయి. వాటి రాక పోకలను సాక్షిత్వబుద్ధిచే గమనించాలి. నీ స్వస్వరూపము నుండి వాటిని వేరు పరచాలి. వాటితో ఏర్పడే “తాదాత్మ్యము”ను నిరోధించాలి. మొదలే, “ఇదంతా కల్పనామాత్రమే కదా! నేను స్వచ్ఛుడను. నిత్యుడను. సర్వసంకల్పములకు మును-ముందే వీటికి వేరై ఉండియున్నాను” అను భావనచే, దృష్టిని పవిత్రం, సుదృఢం చేయాలి. అప్పుడు సంకల్పములు తమంతటతామే ఛేదించబడతాయి. సంకల్పముల వైపు ప్రసరించుచున్న దృష్టి ఉపశమిస్తూ ఉంటే, ఇక ఈ జగత్తు యొక్క వాస్తవ - అవాస్తవములు తెలిసిపోతున్నాయి.
పదార్థములన్నిటిని ఉత్పన్నము చేసేది, జీవులందరిని మోహితులను చేసేది, నిరంతర దుర్భరమైన సంకుచితము ప్రసాదించేది అయిన ఈ అవిద్య "ఆత్మదర్శన ప్రభావం”చేత సువిశాలత పొందుచున్నది. సంకుచితమును త్యజిస్తోంది. అనగా 'విద్య' గా రూపుదిద్దుకొంటోంది. అపరిచ్ఛిన్న మైన ఆత్మస్వరూపము ప్రాప్తించినప్పుడు ఇక 'అవిద్య' ఏమగుచున్నదో కూడా చెప్పలేం. శ్రీరాముడు : తండ్రీ! మరి ఈ ఇంద్రియముల మాటేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : రాజుగారి ఆజ్ఞను మంత్రులు పాటిస్తూ ఉంటారు చూచావా? మనస్సు దైనినైతే చింతిస్తూ ఉంటుందో అద్దానిని ఈ ఇంద్రియవృత్తులు వెంటవెంటనే సిద్ధింపచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మనస్సు “అహం బ్రహ్మాస్మి" (నేను బ్రహ్మను) అను భావనయందు నిమగ్నమై ఉంటుందో, అప్పుడా మనస్సు విషయములు చింతించుటలేదు కాబట్టి, ఇంద్రియములు కూడా పరమశాంతినే పొందుతాయి. సర్వత్రా ఆత్మసందర్శనంలో ఉపకరణాలుగా అవి రూపుదిద్దుకుంటాయి.
ఓ రాఘవా! ఏ జగత్తెతే సృష్టికి పూర్వంలేదో, అది ఇప్పుడు కూడా లేనిదే అగుచున్నది. ఇక ఈ జగత్తు రూపమున భాసించుచున్నదంతా ఏమిటి? ఇదంతా శాంతము, పరమోత్తమము అగు బ్రహ్మమే అయిఉన్నదని గ్రహించు. బ్రహ్మమునకు వేరైనదంటూ, చింతింపతగినదేదీ ఎచ్చటా, ఎప్పుడూ ఎవ్వరికీ లభించుటలేదు. ఏమాత్రంలేదు. ఈ సర్వము అనాది - అనంతము - నిర్వికారము అగు బ్రహ్మమునందే స్థితి కలిగియున్నది. అట్టి భావనను ఆశ్రయించినవాడవై నీవు బ్రహ్మమునందే స్థితి కలిగియుండుము. అందుకుగాను, శాస్త్రాదులచే సవివరంగా చెప్పబడిన విచారణను గ్రహించు. ఉత్తమ బుద్ధిచే పురుష ప్రయత్నమును ఆశ్రయించు. “విషయ భోగాశ” రూపమగు భావనను నీ
చిత్తము నుండి సమూలముగా తొలగించివేయి.
నాయనా! రామా! ఎందుకో, మహామోహము జీవునియందు ఉదయించుచున్నది. అది అనేక ఆశాపాశములతో కూడుకొని ఉంటున్నది. అది "వార్ధక్యము - మరణము” మొదలైన అనేక వికారములకు, అంతులేని అజ్ఞాన పరంపరలకు హేతువు అగుచున్నది. అట్టి మహామోహమంతా వాసనావిజృంభణము మాత్రమే. “నా పుత్రులు, నా ధనము, నా దేహము, నా గృహము, నా పొలములు, నా రాజ్యములు, నా పేరు ప్రతిష్ఠలు....” మొదలైన భ్రమాత్మకమైన ఇంద్రజాలమంతా వాసనలచేతనే ప్రాప్తిస్తోంది. వాయువుచే జలంలో తరంగాలు కల్పించబడునట్లు శూన్యమయమగు
Page:601
ఈ దేహమునందు వాసనచేతనే “అహంభావము” అనునది కల్పితమగుచున్నది. ఈ జీవుని “దృష్టి” ఈ దృశ్యము యొక్క “సృష్టి”
ఓ తత్త్వజ్ఞా! పరమార్థమున 'నేను - నాది' అనునదేదీ లేదు. ఎందుకంటావా? ఆత్మతత్త్వమునకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ సత్యమై లభించుటయే లేదు కదా!
ఒక చమత్కారమైన విషయం చెప్పుచున్నాను, విను:
ఈ రెండు ఒకే కాలంలో సంభవిస్తున్నాయి. అనగా, దృష్టిచేతనే సృష్టిఏర్పడుతోంది. అధ్యాత్మశ రాస్త్రాలలో ప్రచారంలో ఉన్న “దృష్టి - సృష్టి" న్యాయం (లేక) వాదము యొక్క అంతరార్థం ఇదే.
అవిద్యయే, వేరు రూపమును పొందినట్లున్నదై, అనేక విచిత్రములైన ఆకారములను ధరించుచు మరల మరల ప్రవర్తించుచున్నది. దేశ - కాల వస్తువులచే పరిచ్ఛిన్నమై కనబడుచున్న ఈ అవిద్య అజ్ఞానము చేతనే ఉదయిస్తోందని అనుకొన్నాము కదా! ఒకడు ఒక క్రీనీడగల ప్రదేశంలో ఒక త్రాడును చూచి “అమ్మబాబోయ్! ఇక్కడ పెద్దపాము మెలికలు తిరిగిపడి ఉన్నది" అని గావుకేకలు పెడుతున్నాడనుకో. ఇప్పుడు అతనియందు ఏర్పడియున్న త్రాడునందు “పాముకు సంబంధించిన బుద్ధి” పోవలసి ఉన్నది. మరి పోయేదెట్లా? 'ఎరుక' లేక జ్ఞానము' చేతనే కదా! ఈ అవిద్య కూడా ఎరుక (లేక) ‘జ్ఞానము’ చేత నశించగలదు. అట్టి అవిద్యానాశనము ఒక్కసారిగా కాని, లేక క్రమక్రమంగా కాని జరుగవచ్చు. దానికి “ఇది ఇట్లాగే జరగాలి” అను నియమమంటూ ఏదీ లేదు. "కాదు....ఏదో నియమము ఉన్నట్లే ఉన్నది" అని నీకు అనిపిస్తోందా? అట్లు అవిద్య తొలగుటకు ఏదో క్రమము ఉన్నదని అనిపించటం కూడా అవిద్య యొక్క ప్రభావం చేతనే.
“ఆఁ! అప్పుడే ఎక్కడ? మేము జ్ఞానులము కాగలమా? మాయను తొలగించగలమా? లేదు. అది ఎప్పటికో, ఎన్నటికో సాధ్యపడాల్సిందే. ఇప్పటికి మాత్రం ఇది ఇంతే....” అనునదంతా అజ్ఞానవశం చేతనే అట్లు అనిపిస్తోంది.
ఈ 'ఆకాశము-నేల-నదులు-గృహములు' మొదలైన రూపములో ఉన్న అవిద్య అంతా అజ్ఞాని దృష్టిలోనే ఉదయిస్తోంది కాని, జ్ఞాని దృష్టియందు కాదు.
శ్రీ రాముడు : మహర్షీ! జ్ఞాని దీనినంతా చూస్తూ ఏమని అనుకొంటున్నాడు?
శ్రీ వసిష్ఠ మహర్షి : జ్ఞాని, “ఈ కనబడుచున్న సర్వరూపములందు ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమే తనయొక్క మహిమాతిశయంచేత ఈ విధంగా ప్రతిష్ఠితమైనది. బ్రహ్మము యొక్క స్వభావము కానిదంటూ ఇక్కడ ఏదీ లేనే లేదు” అనియే గాంచుచున్నాడు. అతనికి "వికార రహితమగు పరమార్థ దృష్టి” మాత్రమే అన్ని వైపులా నిర్ణీతమై ఉంటోంది. ఇక ఈ రజ్జు - సర్ప భ్రాంతులు (తాడును చూచి 'పాము' అనుకోవడం), ఈ ప్రాతిభాసికదృష్టులు ఇవన్నీ కూడా అజ్ఞాని చేత, అజ్ఞాన విన్యాసము కొరకు కల్పించబడి, అనుభవించబడుచున్నాయి.
Page:602
14. దుఃఖించడమెందుకు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! నీవు ఏమాత్రం అజ్ఞానివి కావద్దు. జ్ఞానివే కావాలి. అజ్ఞానభూతమగు ఈ దేహము మొదలైన వాటియందు ఆత్మ భావము కలిగి ఉండవలసినపనేమున్నది? నీవు అసలు ఎందుకు అజ్ఞానివలె దుఃఖిస్తున్నావో చెప్పు? ఈ సుఖ-దుఃఖ వ్యవహారములు నిన్ను వివశుణ్ణి చేయడమేమిటి? వాటి చేత నీవు పరాజితుడవు కావటమేమిటి? అట్టి సుఖ-దుఃఖములకు కారణమగు ఈ జడదేహం నీ కెక్కడున్నది? “కత్తిపీట - కుండలోని పళ్ళు" గమనించు.
కత్తిపీటలో లోహము - - కొయ్య కలిపి ఉన్నంత మాత్రంచేత అవి రెండు ఒక్కటే అవుతాయా? కుండలో మామిడిఫలములు ఉన్నాయనుకో. అప్పుడా పళ్ళు - - కుండ ఒక్కటే అవుతాయా?
ఈ దేహము, ఆత్మ కూడా ఒకదానితో మరొకటి ఎన్నడూ సంబంధం లేకుండానే ఉంటున్నాయి. ‘కొలిమితిత్తి’ దహించబడినంత మాత్రం చేత అందలి వాయువు దహించబడుతుందా? లేదు కదా! ఆత్మ శరీరముచే పుట్టునది కాదు. శరీరంలో చిక్కి ఉన్నది కాదు. శరీరంతో నశించేది కూడా కాదు. నీవు ఆత్మ స్వరూపుడవు. అంతేగాని, “జడము - తుచ్ఛము” అగు శరీరరూపుడవుకాదు. రెండు విధములైన “భావనాబీజములు” :
1) “నేను స్వతహాగా దుఃఖిని : అయితే, ఆయా వస్తువులు, స్థితి గతులు లభించినప్పుడు నేను 'సుఖి' ని అగుచున్నాను”
2) “నేను స్వతహాగా ‘సుఖి’ ని : ఆయా వస్తువులు, స్థితి గతులు వస్తూవుంటాయి, పోతూ ఉంటాయి. అయినా కూడా నా స్వస్థితిని సుఖ స్వరూపముగానే ఉంచుకోగలను! మొదటిది త్యజించాలి. రెండవదానిని ఆశ్రయించాలి.
ఓ నరశార్దూలా! రామా! ఉత్తిష్ఠ! ఇక “నేను స్వతహాగా దుఃఖిని. కానీ విషయ సుఖములు పొందుచున్నప్పుడు మాత్రమే సుఖిని” ... అనునట్టి కలవరింతలు కట్టిపెట్టు. "ఇది ఇట్లే ఉండాలి? అది అట్లు ఉన్నదేం? వీరు నా వారు. వీరు సుఖించాలి. వారు వేరైనవారు. వారికి ఆ ధనాదులు ఎందుకు కలగాలి? .... "" ఇట్టి అసంఖ్యాకమైన భ్రమలు ఎందుకు కలుగుచున్నాయి? భ్రాంతి చేతనే కలుగుచున్నాయి. ఇవన్నీ మృగతృష్ణలో జలబిందువువలె మిథ్యయేనని తెలుసుకొని త్యజించివేయి. నీవంటివారు సత్యమునే ఆశ్రయించాలి గాని అసత్యమును ఆశ్రయించటమేమిటి? దుఃఖించటమేమిటి? అనేకమంది అసత్యమును ఆశ్రయిస్తూ “నేను దుఃఖితుడను, స్వల్పుడను,
Page:603
శరీరమాత్రుడను. ఇక ఈ నియమము ఇంతే, నా గతి అంతే!” అని సన్ననికేకలో - - గావుకేకలో పెట్టటం మేము వింటున్నాము. ఓ జనులారా! మీరంతా ఆత్మస్వరూపులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక దుఃఖితులు కావలసిన పనియేమున్నది చెప్పండి? "సర్వదా శాశ్వతమై, అనంతమై, విశుద్ధమై, సర్వమునకు అంతర్యామి అయి ఉన్న ఆత్మనే నేను” అను భావనను ఆశ్రయించండి. అంతేగాని, ఈ శరీరముయొక్క ధర్మములను మీపై ఆపాదించుకొని భ్రమించమని, దుఃఖించమని మీకు ఎవరు చెప్పారు? మీ యొక్క “సేవకులు” మాత్రమే అయి ఉన్న ఈ ఇంద్రియములతో తాదాత్మ్యముచెంది, నిష్కారణంగా అల్పత్వం ఎందుకు ఆశ్రయించాలి?
ఆహాఁ! ఏమి ఆశ్చర్యం! సత్యమగు బ్రహ్మమును మరచి ఈ జనులు గొప్ప అసత్యమగు “అవిద్య”నే ఎల్లప్పుడు స్మరించుచున్నారే? ఓ రామా! ఆత్మను విస్మరింపజేయగల ఈ అవిద్యకు చోటు ఇవ్వకూడదయ్యా! అట్లా చోటు ఇచ్చావా... ఇక నీ చిత్తము కలుషితమై తీరుతుంది. ఫలితం? దుఃఖ పరంపరలు వచ్చి నిన్ను వివశుణ్ణి చేసి కూర్చోబెడతాయి. నీవు వాటిని జయించవలసిందిపోయి, అవే నిన్ను ఆక్రమించివేస్తాయి. ఈ అవిద్య :
మిథ్యారూపంగా అనేక పదార్థములను ఎదురుగా ఉంచి చూపుతోంది.
-
- సంకల్పమాత్రంచేత బహు విశాలత్వం పొందుతోంది.
- చివరకు అజ్ఞానమే రూపముగాగల అనేక ఫలములను తెచ్చి పెడుతోంది.
-
అమృతతుల్యము, స్వయంప్రకాశవంతము అయి ఉన్న నీ యొక్క సత్య - నిత్య స్వరూపమగు ఆత్మను మరుగు పరచి, నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఈ అవిద్యయే సుమా! ఈ జనులు చేస్తున్నదేమిటి? వేద - ఉపనిషత్తులచే ప్రతిపాదించబడుచు, ఋషులచే అనేక ఉపాయములద్వారా గుర్తు చేయబడు చున్న స్వస్వరూపమగు ఆత్మ యొక్క సమాచారమును - జ్ఞానమును తిరస్కరిస్తున్నారు. ఫలితంగా ఈ జీవుడు అనేక దుస్సహమైన అనుభవములను పొందుచున్నాడు. అవిద్యాప్రభావం చేతనే, సరోవరమును ఎడారివలె గాంచుచున్నాడు. ఊహాసౌధనిర్మాణం (గంధర్వ జన్మలు), నరకములు, స్వర్గములు - ఇటువంటి సుఖ, దుఃఖ ప్రదములైన విచిత్ర భ్రమలు స్వప్నంలోలాగానే అజ్ఞాన కారణంగా ఈ జీవునకు అనుభవమౌతున్నాయి.
అవిద్య కనుక చిత్తమునందు సాంసారికవాసనలు నింపియుండకపోతే ... ఇక ఈ జాగ్రత్ -స్వప్న విభ్రమములు ఆత్మను క్షోభించగలిగేవా? లేదు. మిథ్యారూపమగు 'అజ్ఞానాభివృద్ధి' చేతనే ఈ జీవుడు తన జాగ్రత్ స్వప్నములందు భయంకర దృశ్యములను నిర్మించుకుని, "అయ్యో! నన్ను ఎవరు కాపాడుతారోకదా?” అని రోదిస్తున్నాడు. 'అవిద్య' అను అస్వస్థతను పొందిన ఈ చిత్తము క్షణంలో 'విశాల సంసారసాగర' రూపమైనట్టి 'భ్రమ’ను, ఆ భ్రమకు అంతర్గతమై ఉంటున్న అనేక అనర్థములను తనయందే గాంచుచున్నది. చిత్తము రోగగ్రస్తమైనప్పుడు ఇక అట్టి జీవుడు రాజ్యాధిపత్యం పొందితే మాత్రం లాభమేమి ఉంటుంది? అతడు నిరుపేదకు కూడా అయోగ్యమైనట్టి దుఃఖములు అనుభవిస్తూనే ఉంటాడు.
Page:604
కాబట్టి రాఘవా! ఈ ప్రపంచంలో బంధహేతువై, రాగమయమై, అవిద్యామయమై ప్రవర్తిస్తున్న వాసనల బారి నుండి నిన్ను నీవు రక్షించుకో. రాగరహితుడవై స్వచ్ఛమైన స్ఫటికమువలె వెలుగొందు. ఒక దర్పణములో ప్రతిబింబిస్తున్న ఆయా పదార్థజాలములపట్ల ఆ దర్పణమునకు ఏదైనా ఆసక్తి ఉంటుందా? ఉండదు కదా! అట్లాగే నీచే నిర్వర్తించబడు ఆయా కార్యములందు నీ మనోదర్పణమునకు ఎట్టి ఆసక్తి-రాగము ఉండకుండునుగాక!
నిరతిశయానందరూపమగు బ్రహ్మమును ఎరిగిన తత్వవేత్తలు ఈ భూమిపై నిరాడంబరముగా సంచరిస్తూ ఉన్నారు. వారిని సమీపించు. వారితో సంసర్గము కలిగియుండు. వారు బోధించునది భక్తి-జ్ఞాన-వైరాగ్యపూర్వకంగా గ్రహించు. మరల మరల విచారణ చేయి. బ్రహ్మభావనను దృఢపరచుకో! అట్టి దృఢ నిశ్చయముచే శోభించు. సమత్వము, సౌశీల్యము సర్వదా ఆశ్రయించి ఉండు. ఆసక్తి రహితుడవై ఉత్తమ వివేకబుద్ధితో కూడి సదా వ్యవహరిస్తూ ఉండు.
స్వల్పములగు శరీరాదులందు, ఈ దృశ్యవస్తువులందు 'మమత్వము'ను వదిలివేయి. అప్పుడు అవిద్యాజనితములైన ఈ జనన, మరణాది వికారములు చేరజాలనట్టి స్థితి పొంది ఉండగలవు. నిత్యముక్తుడవై ఉంటావు.
ఓ రామచంద్రా! ఒక ఉత్తమ సత్యమును ప్రకటిస్తున్నాను.
“ఆత్మైక్యస్థితి” కలిగి ఉన్నావా, ఇక నీతో హరి-హర-బ్రహ్మాదులు కూడా సాటిరారు.
15. కర్త - భోక్త
అమృతతుల్యములగు వసిష్ఠ భగవానుని వాక్యములు విని రామచంద్రుడు వికసితమైన అంతః కరణుడు అయ్యాడు. గొప్ప అనిర్వచనీయమైన వికాసం(Splendour)చే శోభించాడు. ఇట్లు పలికాడు. శ్రీరాముడు : ఆహాఁ! ఏమి ఆశ్చర్యం! "ఒక బారెడు పొడుగు దారము పోయి ఉన్నతమైన ఒక కొండను బంధించినది” అనునది ఎంత హాస్యాస్పదమో, ఇదంతా కూడా అంతే మహా హాస్యాస్పదంగా ఉన్నదే! “స్వతహాగా ఏమాత్రం లేనిదే” అయినప్పటికీ ఈ అవిద్య అందరిని తన వశం చేసుకొంటున్నది కదా! ఎక్కడి ఆత్మ? ఎక్కడి అవిద్య? ఒక గొడుగు ఆకాశమును కప్పివేస్తున్నట్లు ఈ అవిద్య .. సర్వుల స్వస్వరూపము, దేశ - కాలాతీతము ... అయిన ఆత్మను మరుగున పడవేస్తోంది. తృణప్రాయమై, ఉండి కూడా, వజ్రప్రాయమై ప్రవర్తిస్తోంది. దాని ప్రభావంచేత 'అత్యంత మిథ్య' అయినది కూడా ‘ఎంతో సత్యము' అని అనిపిస్తోంది.
మహాత్మా! ఈ ‘మాయ’ యొక్క స్వరూపమేమిటో మరికొంత గ్రహించాలని ఉన్నది. అందుచేత దీని గురించి ఇంకా కొన్ని వివరాలు చెప్పండి. ఇంతకుముందు లవణమహారాజు యొక్క అనుభవములు గురించి చెప్పుచున్నారు కదా! ఉత్తమజ్ఞాని, భాగ్యశాలి అని అందరిచే కీర్తించబడు
Page:605
ఆ చక్రవర్తికి అట్టి అనుభవం ఎందుకు సంభవించింది? నాకీ విషయంలో ఇంకా సంశయం పోలేదు.
మరొక్క విషయం. లోహము - - కొయ్యవలె పరస్పరం కూడియున్న ఈ దేహము - ఆత్మలందు ముఖ్యంగా శుభ - అశుభ కర్మలను అనుభవించేది ఏది? దేహమా? ఆత్మయా? లవణ మహారాజు యొక్క ఆ సభకు వేంచేసిన ఆ ఐంద్రజాలికుడు ఎవడు? ఎందుకు, ఎక్కడి నుండి వచ్చాడు? మరల ఎక్కడికి వెళ్ళాడు? ఆ సభలో మీరు కూడా ఉన్నానని అన్నారు కదా! ఇదంతా గమనించే ఉంటారు. శ్రీ వసిష్ఠ మహర్షి : : ముందుగా ఈ ఈ “శరీరము - ఆత్మ"లందు అనుభవము స్వీకరించుచున్న విభాగం గురించి కొన్ని విశేషాలు చెప్పుచున్నాను, విను.
కొయ్య, గోడలవలె ఈ దేహము జడమైనది మాత్రమే. స్వప్నంలో కనబడే వస్తువులను ఆ 'స్వప్నద్రష్ట' యే అట్లు కల్పించుకొని దర్శించుచున్నాడు కదా! చిత్తమే ఇదంతా ఇట్లు కల్పించుకొను చున్నది. అయితే, ఈ చిత్తము తనంతట తానే ప్రవర్తిస్తోందా? లేదు. అది స్వయంప్రకాశం కాదు. ఈ చిత్తము చైతన్యముచేతనే ప్రకాశితం అగుచున్నది.
అయితే ఇది చిదాభాసుని (Refractive Awareness Reflective part of Atman) తో ఐక్యము పొందుచున్నదై ఉంటున్నది. ఫలితంగా ప్రపంచమున భోక్తృత్వాభిమానం కలదగుచున్నది. 'వానర సంచారము’ వలె అతి చంచలమైన ఈ చిత్తమే 'నేను జీవుడు' అను భావనకు ఉత్పత్తి స్థానం అగుచున్నది. చిత్తమే అనేక రకములైన దేహములను ధరిస్తోంది కాబట్టి, “జీవుని దేహము ఈ చిత్తమే” అని అనటం కూడా ఉచితమే. ఇదే కర్మ ఫలభోక్త. వాస్తవానికి చిత్తమే జీవుడు. అంతేకాని, ఈ భౌతికదేహం జీవుడుకాదు.
అనంతంగా కనిపించే ఈ సుఖదుఃఖములన్నీ అజ్ఞాని యొక్క చిత్తమునందే ఏర్పడుచున్నాయి. కాని, జ్ఞానియందు కాదు.
జడో దేహో న దుఃఖార్హ! దుఃఖీ 'దేహి' అవిచారతః | అవిచారోఘనాఃజ్ఞానాత్! అజ్ఞానమ్ దుఃఖకారణమ్ ||
"సుఖదుఃఖములు శరీరమునకు సంబంధించిన ధర్మములు” అని అనటానికి వీలులేదు. ఎందుకంటే ఈ శరీరము జడమైనది కదా! శరీరం సుఖమునుగాని, దుఃఖమునుగాని పొందజాలదు.
ఇక శుద్ధస్వరూపమగు ఆత్మకో... సుఖదుఃఖాదులు ఉండజాలవు.
మరి ఈ సుఖదుఃఖాలు అనుభవిస్తున్నది ఎవరు?
అజ్ఞానియొక్క మనస్సు అనేక సంజ్ఞలచే కల్పితములైన భ్రమలను కలిగి ఉంటోంది. చిత్ర - -
విచిత్రములైన వృత్తులందు తగుల్కొనుచు, విచిత్రమైన ఆకృతులను పొందుతోంది. చమత్కారం చూచావా? ఈ మనస్సు తాను ప్రబుద్ధం కానంతవరకు ఇట్లే నిద్రిస్తూ ఉంటుంది. జ్ఞాన విషయమై అజాగ్రత్త వహించి ఉంటోంది. స్వప్నస్థితివలె అజ్ఞానమున ఉన్నదై అవిచారణను ఆశ్రయిస్తోంది.
Page:606
“స్వసత్తాసామాన్యము” (Existence Absolute) ను మరచి దుఃఖాదులను పొందుతోంది. అధికమగు అజ్ఞానముచేతనే “అవిచారము” {Non-Enquiry} అనేది ఉత్పన్నమౌతోంది.
కాబట్టి అజ్ఞానమే సర్వదుఃఖములకు కారణం
పట్టుపురుగు తాను నిర్మించుకొనిన గూటిలో తానే చిక్కుకుంటుంది చూచావా? ఈ జీవుడు తనయొక్క అవివేకము చేతనే శుభాశుభములకు లోను అగుచున్నాడు. తన ఆసక్తి యొక్క ఆడంబరమే తనకు దుఃఖ వ్యవహారముగా పరిణమించుచున్నది. అయితే, ఎంతకాలం గడచిపోయినప్పటికీ, విషయం అతడు గ్రహించుటలేదు. 'అజ్ఞాన నిబిడాంధకారము' లో చిక్కుకొని బాధపడుచున్న ఈ మనస్సు అనేక వృత్తులను కలిగియుండి, వివిధ ఆకారములను పొందుచు, ఒక పెద్ద చక్రంలా పరి భ్రమిస్తోంది...., ఉత్పన్నమగుచున్నది...., దుఃఖించుచున్నది...., వధించుచున్నది..., భుజించు చున్నది..., సంచరించుచున్నది..., విజృంభించుచున్నది..., నిందించుచున్నది. దీని చేతలకు అంతు ఉండుట లేదు. ఇవన్నీ చేస్తున్నది మనస్సే కాని, జడశరీరం కాదు. మనస్సే తాను తెరవెనుక ఉండి, ఈ శరీరమును ప్రవర్తింపచేస్తోంది. లేకుంటే శరీరమే స్వయంగా ఈ పనులు చేయగలదా? ఇంటిలోని సమస్త వ్యవహారములు నిర్వర్తిస్తున్నది ఇల్లాలే గాని, ఇల్లు, ఇంటిలోని వస్తువులు కాదు కదా! అట్లే ఈ శరీరమునందు మనస్సే వర్తిస్తోంది.
సర్వ సుఖదుఃఖములందు, సర్వవిధ కల్పనలందు మనస్సే కర్త, మనస్సే భోక్త. ఇన్ని మాటలెందుకు? “మనస్సే మానవుడు గాని, ఈ శరీరము మానవుడు కాదు”.
సర్వేషు సుఖదుఃఖేషు సర్వాసు కలనాసు చ
మనః కర్తృ మనో భోక్తృ మానసం విద్ధిమానవమ్ ||
ప్రబుద్ధమైన మనస్సు ఆయా కార్యక్రమములకు సంబంధించిన క్రియావిశేషములను నిర్వర్తిస్తున్నప్పటికీ, వాటి పట్ల ‘ఆసక్తి' అను భ్రమ కలిగి యుండదు. 'ఆత్మతత్త్వము’ ను గ్రహించినదై ప్రశాంతమును, మౌనమును అనుభవిస్తూనే ఆయా క్లిష్ట - సాంసారిక విషయములను దర్శించగలదు. అజ్ఞానాంధకారం పటాపంచలైతే, ఇక అట్టి మనస్సే పరమాత్మ స్వరూపమై ఉంటుంది.
ఇప్పుడు నీకు లవణమహారాజు తన సింహాసనముపై కూర్చుని ఉండియే అరువది (60) యేళ్ళ ఆటవిక వ్యక్త్యానుభవం ఎందుకు పొందాడో వివరిస్తాను. ఇది వింటే “శుభాశుభ - కర్మఫలములను అనుభవిస్తున్నది మనస్సే" అని గ్రహిస్తావు.
హరిశ్చంద్రుని వంశములోని వాడైన లవణ మహారాజు ఆ సభాసమావేశమునకు కొద్దిరోజుల క్రిందట ఒక రోజు ఒంటరిగా వ్యాహ్యాళికై సముద్రపు ఒడ్డు చేరాడు. ఒక ఏకాంత ప్రదేశంలో ఇసుక తిన్నెపై సుఖాసీనుడైనాడు. “ఆహాఁ! నా పితామహుడు హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేశాడు కదా! నేను కూడా ఆ యాగం చేస్తే ఎంత బాగుంటుంది! కాని, రాజసూయయాగం చేయాలంటే గొప్ప యజ్ఞసామగ్రి సంపాదించాలి. పైగా తోటి రాజులను, వారి ప్రజలను హింసించటం, బాధించటం వంటి దుష్ట వ్యవహారాలు కూడా చేయవలసివస్తుంది. మంత్ర తంత్రములతో, మహా
Page:607
ప్రయాసతో కూడుకొనియున్న అట్టి యాగము ఎట్లా చేయటం?” అని యోచించసాగాడు. ఇంతలో అతని మస్తిష్క్వంలో ఒక మహత్తరమైన ఆలోచన మెరసింది.
తత్త్వజ్ఞులగు మహాశయులు “ఏ క్రియకుగాని, అనుభవమునకుగాని కారణం మనస్సే. అంతే గాని, ఈ జడశరీరం కాదు 66 “- అని చెప్పటం విన్నాను కదా! అందుచేత రాజసూయయాగమును ఇప్పుడే, ఇక్కడే మానసికముగా చేసెదనుగాక!”
ఇట్లు నిర్ణయించుకొని, అప్పటికప్పుడు అక్కడే 'మానసిక యజ్ఞం' ప్రారంభించాడు. మనస్సుతోనే యజ్ఞసామాగ్రినంతా సమకూర్చుకొన్నాడు. దీక్ష వహించాడు. మనస్సుతో ఋత్విక్కులను ఆహ్వానించాడు. ముందుగా శ్రేష్ఠులైన మునులను, దేవతలను, సంకల్పపుష్పములతో పూజించాడు. హవిస్సు ద్వారా అగ్నిని ప్రజ్వలింపజేశాడు. యజ్ఞవాటికామధ్యంలో మానసిక యజ్ఞ కార్యక్రమం ప్రారంభించాడు. అట్లు ఒక సంవత్సరకాలం ఆయా యజ్ఞవిధులన్నీ నిర్వర్తించబడ్డాయి. అతడు తన సర్వస్వము బ్రాహ్మణులకు, పేదలకు దక్షిణగా ఇచ్చి వేశాడు. మనోకల్పితులగు ఋత్విక్కులు “యజ్ఞపరిసమాప్తి - శాంతి" పలికిన తరువాత అతడు మానసిక - యజ్ఞం నుండి మేల్కొని బాహ్య దృష్టికి వచ్చాడు. సంతుష్టమానసుడై, “నేను రాజసూయయాగము చేశాను కదా!” అను తృప్తిని పొందాడు. అద్దాని ఆయా ఫలితములను అతడు పొందవలసియున్నది కదా! చేసిన కర్మ యొక్క ఆయా ప్రయోజనములు వచ్చి తీరుతాయి.
ఓ రాఘవా! సుఖదుఃఖములన్నిటికీ ఈ మనస్సే కారణమని అనుకున్నాం కదా! అట్టి మనస్సు లేక చిత్తమును “విచారణ(Enquiry as to its real nature)చే నిగ్రహించాలి సుమా! క్రమంగా ఈ చిత్తమును 'పవిత్రము - సత్యవంతము' అయిన వస్తువు యొక్క సామీప్యత పొందేటట్లు చేయాలి. మనస్సే క్రియాశక్తి. కర్త-కరణము-క్రియ కూడా అదే.
ఏ క్రియ యందైతే మనస్సు పాల్గొనుచు, నిర్వర్తించబడుతుందో, అది మాత్రమే సుఖ-దుః ఖాది రూపమున పరిణమించి ఫలదాయకం అగుచున్నది.
ద్రష్ట యొక్క ప్రతిబింబమే ఈ దృశ్యమంతటిలో వ్యాపించియున్నది. దృశ్యములో-దృశ్యముగా ప్రతిబింబించే ద్రష్టయొక్క స్వరూపతత్వమును 'చిదాభాసుడు' అని పిలుస్తున్నారు.
అనగా “చిత్ స్వరూపుడవగు నీవే నీ చేత దర్శించబడుచు, అనుభవించబడుచున్న దానియందు ప్రసరించియుండి, ‘నిన్ను నీవే' అట్లు గాంచుచున్నావు” అనునదే వేదాంత రహస్యం. చూచువానితో సహా సర్వము చితశక్తి యొక్క ప్రసరణమే. ఇట్లు మనస్సే భోక్త - భోగము కూడా అగుచున్నది. కర్తృత్వ - భోక్తృత్వ భావనయే మాయయొక్క స్వరూపము. ఆత్మ సర్వదా నిర్మలం. అసంగము. అప్రమేయము. ఇట్లు 'తత్వమ్' యొక్క తాత్వికార్థం అదే!
‘దేహము ఆత్మ' లలో శుభాశుభ కర్మలను అనుభవించేదేది?
ఈ నీ ప్రశ్నకు మరల సమాధానం చెప్పుచున్నాను. విను. సర్వకర్మల కర్తృత్వముగాని, అనుభవముగాని ఇటు దేహమునకు సంబంధించినవి కావు.
Page:608
అటు నిష్క్రియమగు ఆత్మకు సంబంధించినవి కూడా కావు.
‘పాపము - పుణ్యము’, ‘సుఖము - దుఃఖము’, ‘కర్మ - కర్మ ఫలము' ఇవన్నీ చిత్తమునకు సంబంధించినవి మాత్రమే.
ఓ సభికులారా! ఎప్పుడైతే ఈ మనస్సు దేశ కాల వస్తువులకు అందజాలనట్టి 'ఆత్మతత్త్వము' ను అవలంబిస్తుందో, అందు ప్రతిష్ఠితమౌతుందో, అప్పుడు ఇది 'పరిపూర్ణత్వము' ను పొందుతోంది. అట్లా కాకుండా, పరిచ్ఛిన్నమగు ఈ దేహాదులను, ఈ దృశ్యమును ఆశ్రయించిందా ... ఇక ఫలితం అల్పత్వము, దుఃఖము, అగమ్యత్వమే. కనుక, మీరంతా ఒక్క విషయం గ్రహించండి. “ఈ దేహమే నేను” అను భావము ఎవరు కలిగియుంటారో, అట్టివానికి గాని, లేక వారి వలన ఈ ప్రపంచమునకు గాని ఉత్తమ ప్రయోజనం లభించుటలేదని మనవి చేస్తున్నాను. వారి దుఃఖములు తొలగేదెట్లా?
వివేకులు - - కొందరు ఉత్తములు వేదాంతము ప్రతిపాదిస్తున్న శాస్త్రములను తరచి - తరచి విచారిస్తున్నారు. ఆచార్యులను (విజ్ఞులను) సమీపించి సమ్యక్ విచారణ చేస్తున్నారు. అట్టి వివేకులు ప్రబుద్ధమైన తమ చిత్తమునందు, “అతిత్వరలో నశించబోయే ఈ దేహము నేను కాను. పూర్ణానంద "ప్రకాశరూపమగు బ్రహ్మమే నేనై ఉన్నాను”... అను దృఢనిశ్చయం కలిగి ఉంటున్నారు. అట్టి బ్రహ్మాకార వృత్తి కలిగి, అభ్యాసవశం చేత దృఢంగా ఉండే జీవునికి దుఃఖమంతా పూర్తిగా నశించు చున్నది. సూర్యుడు ఉదయించగానే కమలములు విచ్చుకొనుచున్నట్లు, అట్టివాడు అంతటిని తనయందు, అంతటియందు తనను గాంచుచున్నాడు.
శ్రీరాముడు : మీ ప్రవచనం మహత్తర సత్యమును ప్రతిపాదిస్తోంది. స్వామీ! మీరు లవణ మహారాజు యొక్క మానసికయాగం గురించి ప్రస్తావించారు. అయితే అట్టి మానసిక-రాజసూయ యాగం ఫలితంగానే లవణమహారాజు ఐంద్రజాలికునిచే కల్పించబడిన వివిధ కల్పనామయమగు మాయా జాలం పొందాడంటారా? 'అది రాజసూయ యాగ ఫలితమే' అనటానికి ప్రమాణం ఏమిటి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ ఐంద్రజాలికుడు సభలో ప్రవేశించే సమయంలో నేను అచ్చటనే ఉన్నాను. అక్కడ జరుగుచున్నదంతా ప్రత్యక్షంగా అవలోకించుచున్నాను. ఇంద్రజాలమంతా సమాప్తమైన తరువాత ఐంద్రజాలికుడు అంతర్ధానమైనాడు కదా! అప్పుడు లవణమహారాజు నా వైపు చూచి ఇట్లు పలికాడు.
లవణ మహారాజు : తండ్రీ! వసిష్ఠ మహర్షీ! ఈ చిత్రమంతా ఏమిటి?
అప్పుడు నేను యోగబలంతో అంతా పరిశీలించి, అటు తరువాత ఇట్లు చెప్పానునేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : ఓ లవణమహారాజా! మీరు పది రోజుల క్రితం ఒక సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెపై కూర్చుని మానసికంగా రాజసూయయాగం చేసియున్నారు. గుర్తున్నదా? "రాజ
“సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని” - శ్రీమద్భగవద్గీత (VI.29)
Page:609
సూయము నిర్వర్తించినవారు పండ్రెండు సంవత్సరములు వివిధ ఆపదలను అనుభవిస్తారు. ఆయా దుఃఖములను ఆ 12 ఏళ్ళలో అనుభవించవలసివస్తుంది" అనేది శాస్త్రనిర్ణయం. ఆ దుఃఖములను కలుగజేయటానికే ఇంద్రుడు స్వధర్మనిర్వహణార్థం దేవదూతను ఐంద్రజాలికుని రూపంలో పంపించాడు. శ్రీ లవణ మహారాజు : స్వామీ! అట్లా అయితే నేను చండాలునిగా అరువది సంవత్సరములు జీవించిన అనుభవంపొందానే? ఎందుచేత?
నేను : ఓ అదా! దానికి కారణం విను. శారీరక యజ్ఞము కంటే మానసిక యజ్ఞమునకు ఐదు రెట్లు అధిక ఫలము ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే నీకు 5x12 = 60 సంవత్సరాల ఆధి వ్యాధులతో కూడిన దుర్భర జీవితానుభవం కలిగింది.
శ్రీ లవణ మహారాజు : మరి ఐంద్రజాలికుని రూపంలో వచ్చిన దేవదూత ఎటు వెళ్ళారు? నేను : ఓహో! ఆయనా! ఆయన తనకు నియమించబడిన కార్యమును నెఱవేర్చి, ఆ తరువాత సిద్ధులచే సేవించబడుచు ఆకాశమార్గంలో తిరిగి దేవలోకం చేరారు.
16. సాధన ప్రయోజనం
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఇదంతా నాకు ప్రత్యక్షంగానే జరిగింది. ఇందులో నీవు సందేహించవలసినదంటూ ఏమీ లేదు.
ఈ సర్వ విలక్షణములగు క్రియలకు కర్త, భోక్త కూడా మనస్సే. అందుచేత ఈ మనస్సును శుద్ధి చేసుకోవాలి. అందుకొరకుగాను ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము మొదలగు హఠయోగ క్రియలు కొంచెము ఆశ్రయించు. విధి, నియమములు, రాజయోగములతో కూడిన శ్రమ నుండే ఉత్తమ అవగాహనతో కూడిన ధీశక్తి అలవడుతోంది. అట్లు మనస్సుకు యుక్తులతో ఏకాగ్రత నేర్పి, అటుపై నిర్వికల్పసమాధియందు దానిని లయం చేయాలి. ఆవేశరహితంగా లక్ష్య శుద్ధితో యోగ - విచారణలను నిర్వర్తించటం ఉచితం.
ఈ చిత్తమే జీవులందరిని మోహపరుస్తున్న అవిద్య. అట్టి అవిద్యయే విచిత్రమైన ఇంద్రజాల రచనలాగా ఈ జగత్తునంతా ఉత్పన్నం చేస్తోంది. 'వృక్షము' అన్నప్పుడు, 'చెట్టు' అన్నప్పుడు, ఈ రెండు శబ్దాలు సూచించేది ఒక్కదానినే కదా! అదే విధంగా, - ఈ 'అవిద్య', 'జీవుడు', ‘చిత్తము', 'బుద్ధి', 'మనస్సు' మొదలైన శబ్దముల వాస్తవారంలో భేదమేమీ లేదు. ఇది గ్రహించి నీవు ముందుగా నీ చిత్తమును సంకల్పరహితం చేయి. “చిత్త నిర్మలత్వము” అనే సూర్యుడు ఉదయించాడా.... ఇక అప్పుడు చోటు చేసుకొన్న అజ్ఞానాంధకారమంతా స్వయముగా సమసి పోతుంది. ‘చీకటి’ అంటే ఏమిటి? 'వెలుగు లేకపోవుట' అనియే కదా! అట్లే 'అవిద్య' లేక 'అజ్ఞానము' అంటే జ్ఞానము అసంపూర్ణమై ఉండుటయే. 'స్వస్వరూపము' గురించిన ఎరుక ఏమరుచుటచేతనే ఈ జీవులు జగత్తు అనబడుదానిని, అందలి ఏకానేకత్వములను గాంచుచున్నారు.
Page:610
పురుషేణ జాతమాత్రేణైవ బాల్యాత్ ప్రభృతి
విద్యాగ్రహణమ్ కర్తవ్యమ్ ॥ గురువో అనుగన్తవ్యమ్ II
తాత్సారం చేయరాదు. చిన్నప్పటి నుండే గురువులను సమీపించటం, సత్య వస్తువుకై ప్రయత్నించటం చేయాలి.
"ఈ లౌకిక వ్యవహారముల మధ్య ఉన్నంతకాలం నేను జ్ఞానం కొరకు ప్రయత్నించటం ఎలా సాధ్యం?” ...అని భ్రమించకుండెదవు గాక! చిత్తము లయించగా, అవిద్య శమించగా, అప్పుడు నీ యందు 'అవిద్యా వృత్తి' మాత్రమే నశిస్తుంది. అనగా ఈ దృశ్యమును, ఇందలి సంఘటనలను అర్థం చేసుకొనే రీతి మాత్రం వేరుగా ఉంటుంది.
మేఘములు లయించిపోతే ఆకాశం కోల్పోయేది ఏమైనా ఉంటుందా? లేదు కదా! దృశ్యమునకు సంబంధించిన వృత్తుల సమూహమే చిత్తము యొక్క రూపము. చిత్తము లయించినప్పుడు కూడా, చిత్స్వరూపుడు, ఆత్మాకాశ స్వరూపుడు అగు ఈ ద్రష్ట అట్లే ఉండిఉంటున్నాడు. నిత్యసత్యమైయున్న ‘ఆత్మదృష్టి’ కొరవడుటచేతనే 'అవిద్య' అనేది ఉంటోంది.
శ్రీరాముడు : అవిద్యాకార్యము అయి ఉన్న అవివేకమునకు, లేక, ఈ సంసారానుభవమునకు కారణం చిత్తమేనంటారా, మునీంద్రా?
శ్రీ వసిష్ఠ మహర్షి : కాదు. ఆ చిత్తములోని అజ్ఞానవృత్తులే కారణం. “ఈ చిత్తము నా యందు తొలగుట లేదే?” అని నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. అజ్ఞాన వృత్తి తొలగితే, ఇక శేషించేది పరిశుద్ధమగు "ఆత్మతత్త్వమే”! అప్పుడు ఆ శుద్ధచిత్తము ఆత్మనే అంతటా, సర్వదా గాంచుచున్నది.
భోగింపబడు పదార్థ జాలముల ఉనికి (లేక) అనుభవమునకు కూడా అజ్ఞానమే కారణం.
నాయనా! రాఘవా! 'సర్వాత్మకము' అని ఎలుగెత్తి చాటబడుచున్న 'స్వాత్మదర్శనము' అనునదే అన్ని దోషములకు ఔషధమైయున్నది. ఆత్మవంతము కానిదేదీ అనుభవసిద్ధమై ప్రాప్తింపజాలదు. ఏదేదైతే ఆత్మకు వేరుగా స్వీకరించబడుచున్నదో... అదంతా మరొక సమయంలో త్యజించబడబోవుచున్నదని గ్రహించు. "ఆత్మీయముకానిది, పరకీయముకానిది” అంటూ ఎక్కడా ఏదీ లేదు. ఎప్పుడైతే 'స్వాత్మదర్శనము' ఏర్పడుచున్నదో అప్పటికప్పుడు అంతాకూడా అన్ని లంద సర్వరూపమగు 'ఆత్మ' యే అయి వెలుగొందుచున్నది. ఇదే సత్యము, పరమార్థస్థితి కూడా.
మట్టితో తయారుచేసిన అనేక నామరూపములుగల వస్తువులు ఒకచోట ఉన్నాయనుకో.... వాటినన్నిటినీ జలంలో వేసినప్పుడు ఏకమే అవుతాయికదా! ఈ దృశ్య ప్రపంచము, ఇందలి సర్వజీవులు, ఈ దృశ్యజ్ఞానము... ఇదంతా కూడా ఆత్మజ్ఞాన ప్రభావంచేత “బ్రహ్మైక్యరూపము” నే పొందుతాయి. అందుచేత నీవు బ్రహ్మైక్యదృష్టినే రూఢిపరచుకో.
Page:611
17. బ్రహ్మానుభవం పొందేదెట్లా?
శ్రీరాముడు : హే మహర్షీ! “సర్వము బ్రహ్మ సత్తయే” అని మీరు మీ వాక్యములచే ప్రతిపాదిస్తున్నారు. “మనస్సు నశిస్తే సుఖ-దుఃఖములన్నీ నశిస్తాయి” అని కూడా మీరు సెలవిచ్చారు. అతి చంచలమైన 'చపలవృత్తి' కలిగియున్న ఈ మనస్సుకూడా 'బ్రహ్మసత్త' యే నంటారా? అది ఎట్లా?
మనస్సు శమిస్తే ఆత్మానుభవం శేషిస్తుందని అన్నారు. మనస్సు నశించేదెట్లాగో మరికొంత విశ్లేషణతో వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రఘురామా! నీకు మనోనాశనమునకు ఉపాయం చెపుతాను. విను. నేను చెప్పబోవుచున్న ఉపాయం గ్రహిస్తే ఈ బాహ్యోన్ముఖములు అగుచున్న ఇంద్రియవృత్తులేవీ ఉండజాలనట్టి 'శుద్ధబ్రహ్మము' నందు నీవు నీ మనస్సును జేర్చగలుగుతావు.
ఈ బ్రహ్మాండమున సాత్విక - రాజస - తామస భేదములచే మూడు విధములగు జీవులు బ్రహ్మదేవుని వలన సృష్టించబడుచున్నారు. ఈ గుణముల గురించి కొంత చెప్పియున్నాను. మరికొంత ముందు ముందు మనం చర్చించుకోబోతున్నాం కూడా!
జలమునందు తరంగము లేచునట్లు, సమష్టి ఉపాధిరూపమగు మనస్సు ‘మననము’ రూపమున ఆత్మయందు అనిర్వచనీయచమత్కారంగా ప్రకటితమౌతోంది. అట్టి ప్రథమ మనన స్వభావమే 'సమష్టి రూపము', 'హిరణ్యగర్భము' 'చతుర్ముఖ బ్రహ్మ మొదలైన నామరూపములచే దర్శించ బడుతోంది, అర్చించబడుతోంది.
అట్టి 'సృష్ట్యాది’ యందలి మనస్సే “నేను చతుర్ముఖుడగు బ్రహ్మను అగుదునుగాక! సమష్టి సృష్టిని దర్శించెదనుగాక" అని సంకల్పిస్తోంది. అనగా, స్వతహాగా చైతన్యమే స్వరూపముగా గల ఈ జీవుడు "హిరణ్యగర్భుడు, లేక, సమష్టి సృష్టిని సంకల్పించువాడు”... అని పిలువబడు స్వభావమును ఆశ్రయించి, సృష్టి వ్యవహారమునకు నాంది పలుకుచున్నాడు.
చైతన్యమే ఇట్లు క్రియాశీలకమగుచున్నది, అట్టి క్రియాశీలత్వమే 'మనస్సు'.
మనో-బుద్ధి-చిత్త-అహంకార స్వరూపుడు, సమష్టి మనన స్వరూపుడు అగు ఈ జీవుడు సత్యసంకల్పుడు. అనగా, అతడు తాను ఏది సత్యమని భావించి సంకల్పిస్తాడో, అదే సత్యమై పరిఢవిల్లుతుంది. అందుచేత, జీవుడే ఈ సమస్తలోకములను కల్పన ఒనర్చుచున్నాడు. అతడు తన “సమష్టి మనస్సు” నందు ఈ జనన-మరణములతో కూడిన సంసారమును కల్పించుకొనుచున్నాడు. ఇదంతా సుఖదుఃఖరూపమై, సంస్మరణశీలమై ప్రాప్తిస్తున్నది అతని యొక్క కల్పనా ప్రభావంచేతనే.
సత్ (Existence Absolute) = విష్ణుత్వము (The State of "l exist")
చిత్ (Knowledge Absolute) = బ్రహ్మత్వము (The State of 'I experience')
అతడు "సహస్రకల్పముల పరిమితి” కలిగిన దినములతో గూడిన తన ఆయువునందు
Page:612
ఆయాప్రదేశములకు అనుకూలమైనట్టి దేవ - - అసుర - మనుష్యాది వివిధ జీవులను సృష్టించు చున్నాడు. అట్లు చాలాకాలం ఉండి, ఆ తరువాత తనయొక్క మూలకారణమగు విష్ణుభగవానునియందు లీనమగుచున్నాడు. మంచు బిందువు సూర్యతేజమునందు లీనమగుచున్నట్లు ఇది జరుగుచున్నది. మరల సృష్టికాలమున విష్ణుభగవానుని నాభికమలము నుండి అభివ్యక్తము అగుచున్నాడు. అప్పుడు మరల 'పూర్వకాలపు - సృష్టి సంకల్పము' ఉదయించగా, ఆ సమష్టి - మనస్సుచే సృష్టి ఒనర్చుటకు ఇచ్చగించుచున్నాడు. అనగా సత్ నందు చిత్ ప్రకటితమగుచున్నది.
అప్పుడు మరల చతుర్ముఖ రూపము ధరించి ఈ జగద్రచన కొనసాగించుచున్నాడు. కల్పాంత మున మరల లయం అగుచున్నాడు. అనేకసార్లు ఇట్లు సృష్టి కల్పన ఒనర్చుచు, ఒకానొకప్పుడు తన అధికార సమాప్తికాగానే, ద్విపదార్ధాంతమున (రెండవ పదార్ధము అనుభావనయే త్యజించబడినప్పుడు) పూర్ణముగా శాంతిని పొందుచున్నాడు.
చైతన్యము 'సత్' అస్తిత్వము ‘చిత్' సమష్టిత్వము వ్యష్టిజీవుడు (విష్ణుభగవానుడు) (హిరణ్యగర్భుడు)
మనస్సు
The Nature of becoming many భావన
(ఈ చతుర్ముఖమే జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములుగా కూడా చెప్పబడింది.)
ఈ విధంగా ఈ బ్రహ్మాండమునందు, తదితర బ్రహ్మాండములందు అనేక జగత్తులు ఉత్పన్నములై ఉన్నాయి. ఇప్పుడూ ఉత్పన్నం అవుచున్నాయి. ఇంకనూ ముందుముందు అంతర్గతమైయున్న ఒక్కొక్క పరమాణువు నందు ఇంకా ఎన్నో అసంఖ్యాకములగు జగత్తులు ఉన్నాయి. ఇట్టి విశేషణములు గల పరమాత్మయందు నెలకొనియున్న సమష్టి మనస్సునందు ఈ వ్యష్టి జీవుడు స్థితి కలిగియున్నాడు.
ఈ వ్యష్టి జీవుడు ఏ విధంగా స్థితి కలిగి ఉంటున్నాడు? ఎట్లు ముక్తుడౌతున్నాడు?... ఈ విషయమై వేదప్రవచనమేమిటో చెప్పుచున్నాను. విను.
ప్రళయకాలంలో, ఉపాధులన్నీ నశిస్తున్నాయి. జీవులందరు అవ్యాకృత్యము (Unmanifested state) నందు లీనమై, అప్పుడు మౌనము - అనుభవాతీతము సంస్కారమాత్రులై శేషించుచున్నారు. అట్లు శేషించియున్న మనఃశ్శక్తినుండి మరల సృష్టి ప్రారంభమగుచున్నది. అప్పుడు :
అవ్యాకృత్యము నుండి శబ్దతన్మాత్రకమగు ఆకాశశక్తి ప్రకటితమగుచున్నది. ఆకాశశక్తి నుండి శక్త్యాత్మకమగు వాయుశక్తి ప్రస్ఫుటమౌతోంది.
Page:613
అందలి వాయుత్వమును అనుసరించి కించిత్ చలనయోగ్యమగు రూపమున 'మనస్సు' ను పొంది ‘దృఢసంకల్పత్వము' అనుదానిని కలిగి ఉంటోంది. అట్టి మనస్సు తనకు ఎదురుగా ఉన్న రూప-రస-గంధాత్మకమగు 'తన్మాత్ర' యొక్క అనుభవము (The experience) పొందుచున్నది. ఉత్పత్తి క్రమముచే అదియే 'అపంచీకృత 'భూతము- అని అంటున్నారు. ఎందుకంటే మననమే స్వరూపముగాగల ఈ 'మనస్సు’ అనబడేది శబ్ద-స్పర్శ రూప-రస-గంధములకు స్పందన కలిగి ఉంటున్నప్పటికీ, అది ఆ పంచతన్మాత్రలకు అతీతమై, వాటికి కారణమై కూడా ఉంటోంది.
ఆ అపంచీకృతమే అంతఃకరణదశ (మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము...అనగా... మననము - నిర్ణయము - ఇష్టము - భేదము) పొందుచున్నది. అట్లు క్రమంగా వృద్ధి చెందుచూ, ఆ తరువాత, అది 'పంచీకృత స్థూల పంచభూత ప్రకృతి' అయిన ఆకాశ - వాయు - అగ్ని - జల • పృథివి రూపములను కల్పన ఒనర్చుచున్నది.
వ్యష్టిత్వము - - అట్టి కల్పన కలిగియున్న మనస్సు మంచు - వర్షముల ద్వారా ఔషధులందు ప్రవేశించి అన్న రూపమును పొందుచున్నది. అప్పుడా అన్నము పురుషులచే భక్షించబడినదై, వీర్యరూపమున స్త్రీ గర్భంలో ప్రవేశించి క్రమంగా 'పిండత్వము' ను పొందుచున్నది. అట్లు గర్భము
నుండి జనించిన ఆ శిశువు పెరుగుచు, అనుభవములనుండి అవగాహన, అవగాహనలనుండి అనుభవము పెంపొందించుకొనుచున్నాడు. అతని 'అవగాహన’ను ఆశ్రయించియున్న ఆశ - అ - భ్రమ లను అనుసరించి ఒకదానివెనుక మరొకటి అనేక ఉపాధులు వచ్చిపోతున్నాయి. ఎప్పటి కప్పుడు, ఆ జీవుడు 'ఇది మాత్రమే నేను, ఇంతమాత్రమే అంతా'... అను పరిమితభావనచే, తన స్వరూపమును తానే, నిబంధించుకొనుచున్నాడు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ జీవునకు అనేక సుఖ - దుఃఖములు, జన్మ - మృత్యువులు వస్తున్నాయి, పోతున్నాయి. ఇతనికి 'దుఃఖనివృత్తి' గానవచ్చుట లేదు. దీనికి అంతెక్కడ?
శ్రీ వసిష్ఠ మహర్షి : నివృత్తి ఎందుకు లేదు? తప్పక ఉన్నది. అట్లు జన్మలు పొందుచున్న ఈ జీవుడు, అతని అధిక సుకృతముల (Good deeds) బలంచేత ఒకానొకప్పుడు కర్మ-జ్ఞానములకు తగినవాడగుచున్నాడు. ఉత్తమ కర్మ-జ్ఞానములను ఆశ్రయించుటకు తగియున్న ఉపాధులలో ఈ మానవజన్మ ఎంతో కష్టించి పొందినందుకుగాను, బాల్యమునుండే వివేకాన్ని పెంపొందించుకోవాలి. “సత్యము-అసత్యము, నిత్యము-అనిత్యము, దేహము-దేహి” మొదలైన ద్వంద్వములను విభాగంచేసి పరిశీలించాలి. తత్త్వవేత్తలగు గురువులను ఆశ్రయించాలి. అట్లు ఆశ్రయిస్తూ ఉండగా ఆ జీవుని యందు కూడా నీలాగానే క్రమంగా "సాధనచతుష్టయసంపత్తి” అను చమత్కృతి ఉదయిస్తుంది. అట్టి సాధనములచే క్రమంగా పరిశుద్ధచిత్తుడగుచు, అతడు “ఈ సంసారము అనర్థభూతమైనదే కదా! దీనిని జయించాలి, త్యజించాలి" ... అని గ్రహించి మోక్షమునకు అర్హుడై ఉంటున్నాడు. ఆపై విచారణ – వైరాగ్యాదులచే “నాకు జన్మ - మృత్యువులు గాని, దృశ్యాదులుగాని లేవు. పరమోత్కృష్టమైన ప్రజ్ఞాతత్వమునే నేను” అను జన్మరాహిత్యరూపమగు అవగాహనకు చేరుచున్నాడు. “పరిశుద్ధమూ,
Page:614
సర్వమునకు అంతర్యామీ, కారణ - - కారణమూ, సర్వమూ అయిన ఆత్మనే నేను” అనే జ్ఞానం దృఢ "పడిన తరువాత అతడు బ్రహ్మానందమయుడు అగుచున్నాడు. ఇక అప్పుడు "నేను ఒక కీటకమును అగుదునుగాక! మానవునిగా అగుదునుగాక! దేవతను అగుదునుగాక!” అని భావించుట జరుగదు.
ఈ జీవునియందు ఎట్టి భావన సుస్థిరమై ఉంటుందో, అట్టి భావన యొక్క ఆసక్తి లేక ఆపేక్షలకు అనుగుణంగా ఈ జీవుడు సర్వదా అట్లే అగుచున్నాడు.
కనుక రామా! బ్రహ్మరూపానుభవం పొందాలంటే సర్వభేదములు త్యజించాలి. “సర్వమునకు అధిష్ఠానమై, ఏమియు కాకయే ఉన్నట్టి బ్రహ్మమే నా వాస్తవ స్వరూపం; అదే సర్వదా నా స్వభావం కూడా” అని మననం చేయాలి. అట్లు ఎందుకు మననం చేయరాదో చెప్పు? అట్టి మనన ప్రభావంచే ఇతడు బ్రహ్మముగానే శేషించుచు, ఈ సర్వమును బ్రహ్మముగానే దర్శించుచున్నాడు.
సత్వగుణమును ఆశ్రయిస్తున్న వివేకి ఉత్తమ జన్మలందు స్థితి పొందుచు, క్రమంగా ‘మోక్షము’ అను శ్రేయమును పొందుచున్నాడు. జ్ఞానముచే చిత్తము ప్రకాశించినప్పుడే సత్వగుణ సమన్వితమైన సంస్కారం రూపుదిద్దుకొంటుంది.
ఓ రాఘవా! నీయందు అత్యుత్తమ జ్ఞానం వికసించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నీకు ఈ క్రింది విషయాలు వివరిస్తాను.
1) సప్త అజ్ఞాన - భూమికలు 2) సప్త జ్ఞాన - భూమికలు
18. సప్త “అజ్ఞాన" భూమికలు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! అజ్ఞాన భూమికలు ఏడు, జ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. ఇంకా వీటిలో అవాంతర భేదములు (Sub-divisions) ఎన్నో ఉన్నాయి.
శ్రీరాముడు : మహర్షీ! అసలు ఈ అజ్ఞాన భూమికాస్థితికి కారణం ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
I. అసాధారణ హేతువులు (From Unity towards Diversity) - - అజ్ఞాన భూమికలు
1) స్వాభావికమైన ప్రవృత్తి (tendency) రూపమగు పురుష ప్రయత్నము.
2) విషయభోగములపట్ల ఏర్పడుచున్న దృఢమైన ఆసక్తి
ఇవి బ్రహ్మసత్తకు అధీనమైయున్న “ఆత్మత్త్వం” అను అఖండానుభవం నుండి దూరం చేస్తున్నాయి.
ప్రయోజనం : సంసారము, దుఃఖము
భూమిక = వేషము. నటుడు వేరు, వేషము వేరు అయినట్లే... ఆత్మ వేరు, భూమికలు వేరు. (స్వప్న ద్రష్ట వేరు స్వప్నాంతర్గత విశేషాలు వేరు ..... అయినట్లుగా),
Page:615
II. సాధారణ హేతువులు (From Diversity towards Unity)
-శాస్త్రోచితమైన సాధనములు.
ఇవి ఆత్మ లాభ ప్రాప్తి కలుగజేస్తున్నాయి. అందుచేత 'జ్ఞానభూమికలు' అని పిలువబడుచున్నాయి. ప్రయోజనం : దుఃఖ విముక్తి రూపమగు నిరతిశయానంద ప్రాప్తి.
అధోలోకములు - (అసాధారణ మార్గం-అజ్ఞానభూమికలు): అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము.
ఊర్ధ్వలోకములు (సాధారణ మార్గం-జ్ఞానభూమికలు) : భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము.
ఊర్ధ్వలోకములు ఏడు – - ఒకదానికంటే మరొకటి అధికమైన జ్ఞానముతో నిండి ఉంటున్నాయి. అధోలోకములలో - ఒకదానికంటే మరొకటి అధికమైన అజ్ఞానావరణంచేత దుఃఖప్రదములుగా ఉంటున్నాయి. 'ఈ పదునాలుగు జ్ఞాన - - అజ్ఞాన భూమికలు కూడా' జీవునియొక్క జ్ఞానమును, ప్రయత్నములను అనుసరించియే ఉంటున్నాయి.
ఇక, శుద్ధమగు ఆత్మస్వరూపమునందు స్థితి కలిగియుండుటయే “ముక్తి” అను శబ్దముచే చెప్పబడుతోంది. “అట్టి స్వస్వరూప స్థితి నుండి తొలగుట... తొలగి బాహ్య ప్రవృత్తి కలిగి యుండుట... బాహ్యప్రవృత్తి వలన రక్తమాంసనిర్మితమైన ఈ దేహాదులందు అహంభావము కలిగియుండుట.” ఇదియే అజ్ఞానము. అజ్ఞానమే అన్ని దుఃఖములకు "హేతువు” అగుచున్నది.
సంక్షిప్తంగా చెప్పాలంటే :
జ్ఞానము = “నా యొక్క స్వరూపం ఆత్మయే” అను ఎరుక వైపుగా ప్రయాణించే స్థితి గతులు. అజ్ఞానము = "నేను ఈ భౌతిక శరీరమును” అను ఆత్మయొక్క స్వయంచమత్కారం అనే ఏమరుపు వైపుగా ప్రయాణించే స్థితి గతులు.
ఈ జీవుడు ఏమాత్రం రాగ - ద్వేషములు పొందక, సద్వస్తువగు శుద్ధ - జ్ఞాన స్వరూపము నుండి చలింపకయే ఉన్నాడనుకో.... ఇక అతడు అజ్ఞాని అవటం ఎన్నటికీ సంభవించదు.
స్వస్వరూపమునుండి మరలి విషయములందు మగ్నము అగుటయే 'అజ్ఞానము'. దీనికి మించిన అజ్ఞానమంటూ వేరే ఎక్కడా లేనే లేదు, ఉండబోదు.
స్వస్వరూపస్థితి : ఒక ముఖ్యమైన విషయం చెప్పుచున్నాను. శ్రద్ధగా విను.
ఈ చిత్తము ఒక పదార్థమును ఆశ్రయిస్తూ, మరల ఇంతలోనే మరొక “పదార్థము” లేక “విషయము” వైపు ప్రసరిస్తూ అంతకుముందు విషయాన్ని (లేక పదార్థం) త్యజిస్తూ ఉంటుంది కదా! ఇట్లా అది నిరంతరం ఒక విషయమును వదలి మరొక విషయమువైపు వెళ్ళుచునే ఉంటోంది. అయితే, అట్లు త్యజించబడుచున్న - స్వీకరించబడుచున్న విషయముల మధ్య మననరహితమగు స్థితి ఉన్నది.
Page:616
చిత్తముచే చిత్తము
త్యజించబడుచున్న ఆశ్రయిస్తున్న క్రొత్త విషయం విషయం
విషయరహిత
మననరహిత
స్థితి
పూర్వ విషయము విడిచిన తరువాత, మరియొక విషయము చింతించబడకముందు, ఆ రెండింటి మధ్య సర్వదా ఏర్పడియున్న శుద్ధ చైతన్యము యొక్క స్థితే “స్వస్వరూపస్థితి” అని చెప్ప బడుతోంది. అది అకళంకస్థితి, సర్వ సంకల్పరహితమైన స్థితి, సర్వము కానిది, నిద్ర - జడత్వ రహితమైనది కూడా. అది శిలవలె అచంచలము అయిన చైతన్యస్థితి.
ఈ దేహాదులందు 'అహం' భావము నశించినప్పుడు భేదజ్ఞానమంతా సమసిపోతుంది. అప్పుడు చైతన్యరూపమున ప్రకాశించుచున్నదే ఆత్మయొక్క స్వరూపము. అట్టి భేదవ్యవహార రహితమగు శుద్ధ చైతన్యమే నేను, నీవు, మనందరిలోని ప్రతి ఒక్కరూ కూడా! అయితే, ఈ జీవుడు విషయ రహిత స్థితిని త్యజించి వేరు వేరు జ్ఞాన-అజ్ఞాన భూమికలందు ప్రవేశించటం జరుగుతోంది.
అజ్ఞాన భూమికలు -
సాక్షి చైతన్యమునందు అనాది కాలము నుండి అధ్యస్తమై యున్న అజ్ఞాన భూమికలు ఏడుగా చెప్పబడుచున్నాయి. ఇవన్నీ పరస్పరం మిళితమై అనేక విధములుగా ఉన్నాయి.
1) బీజ జాగ్రత్తు ఇది జాగ్రత్ అవస్థకు ప్రారంభబీజం. సృష్ట్యాదియందు అనగా జాగ్రత్తుకు ప్రప్రథమారంభంగా ... ‘ప్రాణధారణ' అను క్రియారూపమున చిత్తుయే ఆభాసరూపంగాఏర్పడుతోంది. అదియే చిత్తము యొక్క ఆవిర్భావం. నీటిలో ప్రప్రథమ కెరటంలాగా ఏర్పడుచున్న చిత్తముయొక్క ప్రప్రథమ చైతన్య స్ఫురణను 'బీజజాగ్రత్తు' అని అంటున్నారు. చిత్త ప్రప్రథమస్ఫురణయే ‘జీవుడు’, ‘బుద్ధి' మొదలైన సంజ్ఞలచే చెప్పబడుతోంది. ఇద్దానిని “సుషుప్తి అంతరించినప్పటి, జాగ్రత్ అవస్థయొక్క ప్రప్రథమస్ఫురణారంభం”... తో పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు.
2) జాగ్రత్ స్థితి – - ఇది బీజజాగ్రత్ కంటే కొంత సుస్పష్టమైనది, విలక్షణమైనది. ఈ దశలో, “ఈ స్థూలదేహమునకు సంబంధించినవాడనే నేను! ఈ భోగ్యపదార్థములు నావి' అను రూపముగల ఒకానొక ప్రతీతి ఏర్పడుచున్నది. ఈ స్థితియందు, "ఇతఃపూర్వం గురించిన భావన" మరుగునపడుతూ ఉంటుంది. “ఈ దేహమే నేను, దేహసంబంధమున గృహ ధనాదులు నావి” అను రూపముగల అనేక జన్మపరంపరల దృఢసంస్కారంచేత జాగ్రత్శలో క్రమక్రమంగా అనేక సంస్కార సమూహాలు ప్రవృద్ధమౌతున్నాయి.
Page:617
3) మహాజాగ్రత్ · - 'జాగ్రతిస్థితి' అనగా దృశ్యవస్తుజాలమునకు - ద్రష్టకుగల సంబంధమే! ఇక మహాజాగ్రత్ ద్రష్టకు - సంస్కారములకు సంబంధించినది. అనేక జన్మసంస్కారములచే మహాభ్రమరూపంగా 'మహాజాగ్రత్' అనుభవమౌతోంది.
4) జాగ్రత్స్వప్నము - - అదృఢమైన అభ్యాసం చేత ఈ జాగ్రత్ష్ట తన జాగ్రత్లో మనోరాజ్యము (Realm of thought) వీక్షిస్తూ ఉంటాడు. అట్టి మనఃకల్పితమైన దానిని వాస్తవ బుద్ధితో చూడటం, అనుభవించటం ‘జాగ్రత్ స్వప్నం' అని అంటున్నారు. లవణమహారాజు ఒక గంటసేపటిలో అరువది సంవత్సరముల జాగ్రత్ స్వప్నం (జాగ్రత్లో జాగ్రత్ స్వప్నం) అనుభవించటం మనం చూచాముకదా!
కంటి దోషం చేత రెండవ చంద్రుని చూడటం.... ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు చూడటం.... మృగతృష్ణలో స్వచ్ఛమైన నీరు, కెరటములు చూడటం..... ఇవన్నీ జాగ్రత్ - - స్వప్నములోని రకరకాల స్థితులతో పోల్చదగినవిగా చెపుతూ ఉంటారు. స్వప్నంలో అనేక విధములుగా ఉన్న అభ్యాసం చేత క్రమంగా జాగ్రత్ దశ పొందుతుంది. కనుక దీనిని "జాగ్రత్-స్వప్నం” అని అంటున్నాం.
5) స్వప్నము - స్వప్నంలో ఇతఃపూర్వం అనుభవించిన, చూచిన లేక ఊహించిన పదార్థాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. దీనియొక్క బీజము స్వయంకల్పనయే. ఇక్కడ మనస్సు తనకు ప్రీతి అయిన ఊహయందు నివసించుటకు ఉద్యుక్తమౌతూ ఉంటుంది. స్వప్నం జాగ్రత్ స్థితి దృష్ట్యా "స్వల్పకాలం”గా అనిపిస్తూనే, అప్పటికి అత్యంత సత్యమైన దానివలె పొందబడినట్లు ఈ జీవుడు భావిస్తూ ఉంటాడు. ఈ స్వప్నము యొక్క అనుభవము ‘మహాజాగ్రత్ స్థితి’ యందున్న ఈ జీవుని యొక్క స్థూలశరీరంలోని కంఠభాగము హృదయభాగముల మధ్య వ్యాపించియున్న నాడీప్రదేశంలో ఏర్పడుచున్నది.
6) స్వప్న జాగ్రత్తు - ఇది 'చిరకాలపు జాగ్రత్ భావం' చేత ఏర్పడుతుంది. దృఢమైన ‘అభిమానము’ చేతగాని, చిరకాలము ఒకేరీతిగా భావావేశము, కల్పన కలిగియుండుట చేతగాని జాగ్రత్ రూపంగా వృద్ధిపొందుతుంటుంది. జీవునిపట్ల ఇది మహచ్ఛరీరయుతమై ఉంటోంది. 'మహాజాగ్రత్' పొందిన స్వప్నమే 'స్వప్నజాగ్రత్తు'గా ప్రాప్తిస్తోంది.
హరిశ్చంద్రుడు ఒక్క రాత్రిలో పండ్రెండు సంవత్సరముల అనుభవం పొందటం ఈ స్వప్నజాగ్రత్ స్థితికి సంబంధించినదే.
స్వప్న జాగ్రత్ స్థితి ఈ దేహము ఉన్నప్పుడు, నశించినప్పుడు కూడా సంభవిస్తూ ఉండగలదు. 7) సుషుప్తి - స్వప్నజాగ్రత్తు పొందిన ఈ జీవునియొక్క స్థితి కొంత కాలానికి పూర్ణజడస్థితి పొందటం జరుగుతోంది. అప్పటిస్థితిలో ఈ జీవుడు తనకు సంభవిస్తున్న దుఃఖాదులకు ఉపశమన క్రియలను ఏమాత్రం ఆశ్రయించలేడు. (He becomes absolutely and deeply un-responsive). వాసనలు దట్టమై, తద్వారా ప్రాప్తిస్తున్న జడస్థితినే ‘సుషుప్తి’ అని అంటున్నాం.
ఓ రామచంద్రా! ఈ ఏడు భూమికలు అనేక రూపములు వహించి ఉంటున్నాయి. ప్రతి భూమిక అనంతశాఖలుగా విస్తరించి ఉంటున్నది.
Page:618
చిరకాలము రూఢిపడియుండిన 'జాగ్రత్- స్వప్నము' చివరకు జాగ్రత్నందే 'పరిసమాప్తి' పొందుతోంది. ఆహాఁ! నానా ప్రకారములైన పదార్థములతో కూడిన ఈ జాగ్రత్ స్వప్నము విశాలరూపమును ధరించి ఉంటోంది. జాగ్రత్నందు స్వప్నమునందు కూడా 'మహాజాగ్రత్తు’ యొక్క అసంఖ్యాకములైన అనుభవములు స్థితి పొంది ఉంటున్నాయి.
ఈ 'సంసారము' అనబడునది కూడా దీర్ఘకాలపర్యంతము స్వప్న - జాగ్రత్ రూపముననే ఉంటోంది. ఈ జీవులు ఒకరికి మరొకరు వారి యొక్క స్వప్నజాగ్రత్నందు స్వప్న జాగ్రత్ రూపముననే ఉంటున్నారు.
అనేక విధములైన అవాంతర భేదములచే “నింద్యములు (despicable)”... అయి ఉంటున్న ఈ సప్త అజ్ఞాన భూమికల గురించి విన్నావు కదా! అయితే జీవుడు ఈ అజ్ఞాన భూమికలన్నీ తప్పకుండా దాటివేయగలడు. ఉత్తమ విచారణ చేత, జ్ఞానముచేత నిర్మలమగు ఆత్మ స్వరూపమును సాక్షాత్కరించుకోవటమే అందుకు ఉపాయం. ఆత్మజ్ఞానరూపమగు స్వస్వరూపస్థితిని ఆశ్రయించినవారు ఈ ఆజ్ఞాన భూమికలను సులభంగా దాటివేస్తున్నారు. నెట్టివేసినవారై ఉంటున్నారు.
19. సప్త “జ్ఞాన" భూమికలు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! ఇప్పుడు నీకు సప్తజ్ఞానభూమికల గురించి చెపుతాను విను. ఇది వింటే ఇక నీవు 'అజ్ఞానం' అనే బురదలో పడవు. ఆయా ప్రబోధకులు, ప్రవక్తలు ఈ జ్ఞాన భూమికలనే అనేక రకములుగా తమ ప్రవచనములలో నిక్షిప్తం చేస్తూ చెప్పుచున్నారు. అయితే ‘ఇది సునిశ్చయమే’ అని అనిపించినట్టి వేదాంత సిద్ధాంతమును అనుసరించి వివరిస్తున్నాను.
ఈ జ్ఞాన భూమికలలో ప్రవేశించుటయే జీవుడు అజ్ఞానమునుండి నివర్తించగలడు. సహజము, అఖండము అయిన స్వాత్మాకారవృత్తియందు ఆరూఢమై ధరించగలడు. అందుకే ఈ భూమికలకు ఈ పేరు వచ్చింది.
ఈ సప్త భూమికలే జ్ఞానము. వాటికి పరమైన ముక్తియే జ్ఞేయము.
సత్స్వరూపమగు పరమాత్మ గురించిన జ్ఞానము - మోక్షము.... ఈ రెండు పర్యాయపదములే కాని, వేరువేరు కాదు. ఎవడైతే అట్టి సత్యవస్తుజ్ఞానమును పొందుతాడో, అట్టివాడు ఈ సంసారమున మరల జన్మించడు. ఈ చెప్పబోవు సప్త భూమికల చివర ‘ముక్తి' అనబడేది అవస్థితమై ఉన్నది. దానిని పొందినవాడు ఇక ఎప్పటికీ సాంసారిక దుఃఖాలను పొందడు. ఈ జ్ఞాన భూమికల గురించి విను.
1) శుభేచ్ఛ : ‘స్వకీయ వాసనలు' కారణంగా అనేక అజ్ఞాన అనుభవములను పొందుచున్న ఈ జీవుడు ఒకానొకప్పుడు కాకతాళీయ న్యాయంచే వైరాగ్యపూర్వకమైన సత్సంకల్పము (Detachment from falsehood and inquiry into the nature of Truth) పొందుచున్నాడు. అంతే కాక, “ఒక మూఢునిలాగా ఉండిపోతున్నానేమిటి? ఇంతకీ శాస్త్రములు ఏమి ప్రకటిస్తున్నాయి? - వాటిని
Page:619
పరికిస్తాను. సజ్జనులగు మహాత్ములను సమీపిస్తాను. వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అప్పుడు ఉత్తమమైనదేదో చక్కగా నిర్ణయించుకొని, అట్టిదానినే మననం చేస్తాను”... అనే నిర్ణయానికి వస్తున్నాడు. అట్టి భావమునకు (లేక నిర్ణయమునకు) రావటమే 'శుభేచ్ఛ' అని అంటున్నాం.
2) విచారణ : ఈ జీవుని “శుభేచ్ఛ” యొక్క ప్రయోజనంగా శాస్త్రములతోటి, సజ్జనులతోటి సంపర్కము ఏర్పడుతోంది. ఒక నూతన ప్రవృత్తి అతనియందు ఏర్పడుతోంది. అప్పుడాతడు “వినుట
మననముచేయుట”... మొదలైన రూపములలో ఉండే ఆయా సదాచారములందు నిమగ్నమగు చున్నాడు. తాను వినుచున్న గురువాక్యములను, శాస్త్రవిషయములను మననపూర్వకంగా పరిశీలిస్తూ “విచారణభూమిక” (Sphere of Enquiry) లో పరిఢవిల్లుచున్నాడు. క్రమంగా తన వాస్తవ స్వరూప మేమిటో, తదితరులు వాస్తవ స్వరూపమేమిటో పరిశీలించటం ప్రారంభిస్తున్నాడు.
3) తనుమానస : శుభేచ్ఛ - విచారణ ప్రభావంచేత ఈ జీవునకు క్రమంగా ఈ శబ్ద - స్పర్శ రూప గంధములందు ‘అనాసక్తి - తనుమానస (Non-attachment) ప్రారంభం A
అవుతోంది. క్రమంగా ఇది చెదరనిది, భంగపడనిది అగుచున్నది. ఈ అనాసక్తి నిధిధ్యాసలు బల పడేందుకు సహకరిస్తున్నందుచేత దీనిని 'తనుమానస' అని పిలుస్తున్నారు. “దృశ్యము పట్ల ఏర్పడుచున్న అనాసక్తి - - ఆత్మజ్ఞాన - - అనుభవముల విషయములై ఏర్పడుచున్న ఆసక్తి" ఈ రెండూ నాణెము యొక్క రెండు వైపులు వలె, తనుమానస యొక్క స్వరూపములు.
4) సత్త్వాపత్తి : ఇట్లు “శుభేచ్ఛ - విచారణ - తనుమానస"లను అభ్యసింస్తూ రాగా, అట్టివాని చిత్తము బాహ్యవిషయములనుండి వెనుకకు మరలుచున్నది. కొంత విరామము లేక విశ్రాంతి స్థానము పొందుట జరుగుతోంది. అట్టి విరతియొక్క స్థైర్యము పొందుచున్నప్పుడు ఆ ద్రష్ట లేక జీవుడు ఇంకొక నూతన దృష్టిని పొందుచున్నాడు. ఆ నూతన దృష్టికి ఈ మాయగాని, దీని కార్యరూపమైనట్టి జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలుగాని 'లేనివే’ అగుచున్నాయి. అప్పుడాతడు సర్వమునకు అధిష్ఠానమైయున్న ఆత్మయందు స్థితి కలిగి ఉంటున్నాడు. అతడు సత్త్వమగు ఆత్మయందు స్థితి కలిగియుంటాడు కాబట్టి, దీనిని 'సత్త్వాపత్తి' అని పిలుస్తున్నారు. ఇది నిర్వికల్పసమాధి యొక్క బీజం. ఈ భూమికయందు ఉండే వివేకిని బ్రహ్మవిత్తు' అని పిలుస్తారు.
5) అసంసక్తి : పై నాలుగు భూమికలు అభ్యసిస్తూ రాగా, అప్పుడాతడు ఈ బాహ్య అభ్యంతర విషయముల (Outer as well as inner aspects) చేతగాని, వాటియందు అంతర్గతమై యుండే సంస్కారములచేతగాని స్పృశించబడడు. 'అసంగము' అను రూపము గల సమాధి అతని యందు పరిపాకమౌతూ ఉంటుంది. అతడు నిరతిశయానందమగు బ్రహ్మాత్మభావన కలిగి ఉంటాడు. ‘ఆత్మసాక్షాత్కారము’ యొక్క సామీప్యత అనుభవిస్తూ ఉంటాడు. ఇట్టి జ్ఞానిని “బ్రహ్మవిద్వరుడు”
అని అంటారు.
6) పదార్థాభావని : ఈ భూమికలో ఉన్నవానిని 'బ్రహ్మవిద్వరీయుడు' అని కూడా అంటారు. ఈ జీవుడు 'శుభేచ్ఛ విచారణ, తనుమానస, సత్త్వాపత్తి, అసంసక్తి' అను ఐదు భూమికలు బాగా అభ్యసిస్తూ ఉండగా అతనియందు 'ఉపరతి' (withdraw) అనే ప్రక్రియాబలం ఏర్పడుచున్నది.
Page:620
అతడు సదా ఆత్మారాముడై ఉంటాడు. ఇక బాహ్య అభ్యంతరములందు దేనిని భావించవలసిన అవసరం అతనికి కనబడదు. బాహ్య అభ్యంతరములన్నీ ఆత్మయొక్క సంప్రదర్శనంగా దర్శిస్తూ ఉంటాడు. కేవలం దేహయాత్ర కొరకు మాత్రం ఇతరుల బలవంతముచే కొంత ప్రబోధితుడై ఆయా విషయములవైపు కొద్దిగా దృష్టిని మరలిస్తూ ఉంటాడు. అతని అంతరంగము మాత్రం పదార్థరహితం, విషయరహితంగానే ఉంటుంది. ఈ భూమికలో పదార్థములు అభావించబడతాయి. కనుక దీనికి 'పదార్థాభావని' అనే పేరు వచ్చింది. పదార్థముల విషయమై అతనికి ఏమాత్రం రాగయుక్తమైన భావన ఉండదు. "పదార్థములన్నీ ఆత్మయొక్క భావనా చమత్కారమే”.... అనురూపంగా గమనిస్తూ ఉంటాడు.
7) తుర్యగ : ఆరవ భూమిక అయినట్టి 'పదార్థ - అభావన' చే భేదభావన అంతా 'కించిత్' కూడా లేకుండా సమసిపోతుంది. ఇతడు కేవలం 'స్వస్వరూపానుభవము' నందు మాత్రమే స్థితికలిగి ఉంటాడు. ఈ జాగ్రత్ మొదలైన అవస్థల నుండి విముక్తుడై కేవలము, శివము, అద్వైతము అగు తురీయస్థితియందు నిలకడచెంది ఉంటాడు. తానే అంతటా అయిఉంటాడు. అంతటా - అన్నీ తానుగా ఆస్వాదిస్తాడు.
ఇతనిని 'బ్రహ్మవిద్వరిష్టుడు' అని కూడా అంటారు. ఈ తురీయస్థితి జీవన్ముక్తులకు మాత్రమే సిద్ధిస్తుంది. ఈ ఏడవ భూమిక పొందిన మహనీయులే ఆత్మారాములు. అట్టివారు బ్రహ్మరూపమగు నిరతిలను ప్రాప్తించుకొనినట్లే.
ఇక విదేహ ముక్తికి సంబంధించినదగు 'తురీయస్థితి’ దీనికి పరమై ఉంటుంది.
సుఖభావన
సామాన్య జనుల మనస్సు సమభావన
దుఃఖభావన
తుర్యగుల మనస్సు సమభావన
జీవన్ముక్తులగు ఈ ‘తుర్యగులు' అని చెప్పబడుచున్న మహాత్ములు సుఖ దుఃఖములచే చలింపక సర్వదా సమస్థితియందే ఉండి ఉంటారు. సామాన్యజనుల మానసికస్థితి ఉద్వేగ-ఉదాశీనములతో, ఉత్సాహ-నిరుత్సాహములతో, హర్ష-వేదనలతో అల్పాధికములతో ఉండగా, తుర్యగుల మనస్సు ఒకానొక సమస్థితి అవధరించి ఉంటోంది.
తుర్యగులు, కేవలం దేహ రక్షణ కొరకు మాత్రమే స్వల్పంగా వ్యవహారాసక్తి కలిగియుంటారు. 'తాము శరీరము ధరించియుండుటను కూడా 'నదీజలప్రవాహం' లాగా ప్రకృతి చమత్కారంగా యజ్ఞభావనతో దర్శిస్తూ ఉంటారు. లేదా, వ్యవహారాసక్తిని పూర్తిగా త్యజించి అయినా ఉంటారు.
Page:621
ఇతరుల ప్రోద్బలంచేత మాత్రమే శరీరరక్షణ ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు నిర్వర్తిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైతేనేం? గాఢనిద్రలో ఉన్నవాడిని అందమైన స్త్రీ సౌందర్యం లాలించగలదా? సదా ఆత్మారాములై ఉండే జీవన్ముక్తులకు ఈ ప్రపంచములోని ఆయా విశేషములు సుఖమునుగాని, దుఃఖమునుగాని కలిగించలేవు.
ఇట్టి జ్ఞానదశను పొందినవారు మానవ-పశు-మ్లేచ్ఛాది ఉపాధులు కలిగి ఉండవచ్చు. లేదా దేహరహితులై ఉండవచ్చు. వారు ఎప్పటికీ ‘ముక్తులు’ గానే ఉంటారు. విషయములు అప్రభావికంగా, అసత్యములుగా తోచుటయే ఈ 'భూమిక' యొక్క గుర్తు. నిజమేమిటో తెలుసుకొన్న తరువాత మృగతృష్ణలోని నీరు, ముత్యపు చిప్పలోని వెండి ఆకర్షించగలవా? జ్ఞానము పొందినవాని విషయంలో కూడా ఈ దృశ్యము అట్టిదే. ఈ సంసారవస్తు సముదాయమంతా మిథ్యారూపంగానే అతనికి గోచరిస్తుంది. విదేహస్థితికి శుకుడు మొదలైనవారు, సదేహముక్తస్థితికి ప్రహ్లాదుడు మొదలైనవారు మనకు ఈ అభిప్రాయంలో దృష్టాంతములు.
రెండవ భూమిక నుండి నాల్గవ భూమిక వరకు జ్ఞానోదయము కలిగి ఉండవచ్చు. అజ్ఞానము శమిస్తూ ఉండవచ్చు. కాని ప్రబల ప్రారబ్ద విశేషము చేత నిరతిశయమగు పూర్ణానందము మాత్రం
వారు పొంది ఉండరు.
శ్రీరాముడు : మహర్షీ! ఒక జీవుడు ఈ జన్మ - కర్మల దోషమేమిటో గ్రహించినవాడై శుభేచ్ఛను ఇప్పుడే ఆశ్రయించాడనుకోండి. అతడు తుర్యగస్థితి పొందుట ఎప్పటికి సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మస్థితి లేక ఆత్మానుభవము అనేది హృదయము యొక్క నిర్మలత్వము దోషరాహిత్యములను అనుసరించే ఉంటుంది. కొందరు మహాత్ములు ఈ భూమికలన్నీ ఒక జన్మలో పొందగలిగి ఉంటున్నారు. మరికొందరు రెండవ భూమికకుగాని, మూడవ భూమికకుగాని రాగలిగి ఉంటారు. ఇంకొందరు ఆరవభూమికలోగాని, మరే ఇతర భూమికలో నాలుగవవంతు, మూడవవంతు, ఒకటవవంతు పొంది అట్లే సంచరిస్తున్నవారు కూడా ఉన్నారు. మహాత్ములగు సనకుడు, సనందుడు వంటివారు మొదటి జన్మలోనే 'తుర్యగ' స్థితిని అవధరించటం జరిగింది. ఈ విధంగా ఆయా భూమికలకు కాలమానంగాని, కాలయాపనగాని ఆపాదించటం కుదరదు.
చూచావా! వివేకులైనవారు ఈ భూమికలయందు సంచరించుచున్నారు. వారంతా విశాలమగు 'ఆత్మస్థితి' ని కలిగి ఉండటం జరుగుతోంది.
ఈ బాహ్య-అభ్యంతర ఇంద్రియములు..... ఈ ఇంద్రియములందు అంతర్గతమై ఉంటున్న విషయములు.... వీటికి ఆధారభూతమైన ఈ శరీరము..... ఈ శరీరమునకు సంబంధించిన ఆదిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపములు.....
వీటన్నిటివలన ఏర్పడుచున్న అల్పత్వమును నివారించటానికి వారు ఆత్మనిష్ఠ యందు నిమగ్నమై ఉంటున్నారు.
Page:622
ఓ రఘురామా! వాస్తవానికి ఈ భౌతికమైన రాజ్యాలు ఏలే రాజులు ఉత్తమ దృష్టిలో నిజమైన రాజులు కారు. ఎవరైతే ఈ భూమికలను పొంది 'మనస్సు' అనే శత్రువును నిగ్రహిస్తారో, వారే నిజమైన నృపతులు. “ఆత్మజ్ఞానప్రాప్తి' తో పోల్చినప్పుడు ఈ శత్రు పరాజయాలు, సప్తద్వీప సామ్రాజ్యాలు తృణప్రాయమే అవుతాయని గ్రహించు.
ఈ ఏడు భూమికలు పొందిన మహాత్ములు ముక్తస్వరూపులు. వారు మాకుకూడా నిరంతరం వందనీయులు. వారు తమ 'ఇంద్రియములు' అనే శత్రువులనే జయించి వేస్తున్నారు. అనుక్షణికంగా ఆత్మసామ్రాజ్యాధినేతలై వెలుగొందుచున్నారు..... వారికి 'బ్రహ్మపదవి' కూడా స్వల్పమైనదే.
దేవతల ఆనందం గొప్పదైన విషయమే. కానీ, అంతకంటే పరమావధి బ్రహ్మదేవుని ఆనందం. అట్టి బ్రహ్మదేవుని పదవికంటే కూడా పరమైయున్న కైవల్యానందమును ముక్తస్వరూపులు ఇప్పుడే ఇక్కడే పొందుచున్నారు.
ఓ జనులారా! అట్టి కైవల్యానందము లక్ష్యముగా కలిగి, ధర్మనిరతులై ఉండటము శ్రేయోదాయకమని గ్రహించెదరుగాక!
20. బంగారంలో ఉంగరం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రఘువంశతిలకమా! రామచంద్రా! ఒక చమత్కారమైన విషయం చెపుతాను, విను. ఒక స్వచ్ఛమైన బంగారపు ఉంగరం ఉన్నది. అది 'అంగుళీయబుద్ధి' కలిగియున్నదై తనయొక్క ఆకారరాహిత్యమును సహజమైన రంగును మరచి "అయ్యా! నేను సర్వము కోల్పోయి, ఈ ఉంగరాకారమునకు పరిమితమైనాను! ఈ ఆకారత్వము తొలగేదెట్లా? నేను 'నిరాకారమగు బంగారం’ గా ప్రభవించేది ఎన్నటికి?” అని నిష్కారణంగా రోదిస్తుంటే ఎట్లా ఉంటుంది? ఈ జీవుడు కూడా అజ్ఞానజనితమైన అహంకారముచే తన 'యథార్థము, సహజము' అయిన ఆత్మస్వరూపమును మరచి నిష్కారణంగా రోదించుచున్నాడు. తన స్వస్థత కొరకు ఈ దృశ్య వ్యవహారములో ప్రవేశించి అనేక జన్మలుగా ఎక్కడెక్కడో వెతకుచున్నాను.
శ్రీరాముడు : మహాత్మా! బంగారము నందు 'నేను ఉంగరమును' అనే బుద్ధిలాగా, ఆత్మ యందు ఈ అహంభావబుద్ధి ఎందుకు, ఎప్పుడు, ఎట్లా కలిగింది? ఈ విషయం యథారీతిగా చెప్పండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఏదైనా పదార్థం ఉండి ఉంటే, “ఓహో! ఇది ఇప్పుడు ఇట్లా ఇక్కడి నుండి వచ్చింది అను సమాచారమునకు చోటు ఉంటుందేమో! అసత్తెన పదార్థమునకు ఒకప్పుడు రాక ఏమిటి? మరొకప్పుడు పోకడ ఏమిటి? బంగారము నందు అంగుళీయత్వము గాని, ఆత్మ యందు అహంకారము గాని ఏ కాలమందు కూడా లేవు.
నీ మిత్రుడెవడైనా నీతో "రామా! పది గురివింద గింజల బరువుగల బంగారపు ఉంగరం పట్టుకురా!” అని అన్నాడనుకో.... అప్పుడు నీవు అతని కొరకు విక్రయదారుని వద్ద డబ్బు ఇచ్చి
Page:623
పుచ్చుకునేదేది? ఉంగరమైతే అది బంగారము కన్నా వేరు కాదు కదా? అక్కడ "బంగారం సత్యము, ఉంగరం అనేది ఆకారమాత్రం అయి ఉన్నట్లే ఈ జీవుడు పరబ్రహ్మమే కాని మరింకేమీ కాదు.” శ్రీరాముడు : అట్లా అయితే స్వామీ? “ఇది బంగారం, ఇది ఉంగరం, ఇది జీవుడు, ఇది పరబ్రహ్మం” అని అనటందేనికి? ఈ 'బంగారము' 'బంగారపుటుంగరము'ల అర్థమేమిటో మరికొంత వివరించి చెప్పండి. దీని అర్థనిర్ణయం వలన నేను బ్రహ్మరూపమును మరింత బాగా, సునిశ్చయంగా ఎరుగగలను. శ్రీ వసిష్ఠ మహర్షి : అసత్ పదార్థమునకు రూపం ఏమి ఉంటుంది? లేని దాని ఉత్పత్తిని నిర్వచించటం ఎట్లా? అది "గొడ్రాలి రెండవ కుమారుడు - మూడవ కుమార్తెల మధ్యగల తగాదా ఎందుకు వచ్చింది?” అనునది పరిశీలించటం వంటిదే.
'సువర్ణము' నందు 'అంగుళీయత్వము' అనేది కల్పన మాత్రమే. మిథ్యారూపమగు భ్రాంతి వంటిదే. ‘ఉంగరము’ అనబడే వేరైన పదార్థం బంగారమునందుగాని, మరెక్కడాగాని లేనేలేదు. బంగారము బంగారముగానే ఉండిఉండగా, ఒక ఆకారమునకు 'అయ్యా! 'ఇది ఉంగరం' అని నిర్ణయించుకున్నాం. తదితర ఆకారములకు 'ఇది గొలుసు. ఇది గాజు. ఇది వడ్డాణం' ... ఈ విధంగా పేర్లు పెట్టుకున్నాం. అన్నిటిలోను ఉన్నది సర్వదా బంగారమే. “బంగారము ఆ ఆకారమును పొందినది ఎప్పుడు?” అన్నప్రశ్నకు "బంగారము మరొక ఆకారమును ఏనాడూ అవధరించలేదు. బంగారము మరింకేదీ కాకుండానే ఆకారాదుల దృష్టిచేత ఆయా పేర్లకు తగుచున్నది” అని మనం అనక తప్పదు.
ఈ జగత్తు యొక్క కల్పన చేస్తున్న 'మాయ' కూడా మిథ్యయే. ఇది అసత్స్వరూపము మాత్రమే. విచారణా దృష్టిచే దీనికి రూపమే ఉండజాలదు. దీని స్వరూపవ్యవహారమంతా అంతవరకే. శుద్ధాత్మ మరింకేదీ ఏనాడూ పొందుటలేదు. ఏమియు కోల్పోవుట లేదు. కాని "ఆరోపితదృష్టి” (Attributive look) కారణంగా ఈ ‘జగత్తు' అనబడేది కనబడటం జరుగుతోంది. ఇక్కడ కనిపించే అనేకత్వమంతా 'మృగతృష్ణ' లోని చిన్నతరంగం పెద్ద తరంగం వంటిది మాత్రమే. ఈ దృశ్యమంతా యథాతథంగా బ్రహ్మమే! బ్రహ్మమునకు వేరుగా అనిపించేదంతా ఇది మెల్లకన్నువానికి కనబడే ‘రెండవ చంద్రుడు’ వంటిది. అంటే, విచారణ చేసి చూచామా, ఇందు ఏమీ ఉండజాలదని మా ఉద్దేశం.
ముత్యపు చిప్పలోని వెండి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఎలా పోతుంది? అసలు ముత్యపుచిప్పలో వెండి ఎక్కడున్నదయ్యా బాబు? అది చూచేవాని భ్రమసహిత దృష్టియే కారణముగా కలిగి ఉన్నది కదా? తత్త్వవిచారము యొక్క అభావకారణంగా 'మాయ' చే కనిపించటం జరుగుచున్న ఈ జగత్తు, ఇందులోని “నేను-నీవు-అతడు-దృశ్యము" మొదలైనదంతా అట్టిదేనని గ్రహించు. శ్రీ రాముడు : తండ్రీ! ఇవన్నీ మాకు ఉన్నట్లే ఉంటున్నాయి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఏ విషయమైతే, లేక, పదార్థమైతే - యథార్థానికి లేదో, కాని, ఉన్నట్లు కనిపిస్తోందో... అది లేనట్లు తెలిసేది ఎట్లా?
Page:624
“తత్త్వ విచారణ చేతనే! 'తత్-త్వమ్' అను శబ్దార్ధమును నిరంతరం అభ్యసించుటచేతనే! విచారణ లేకపోవుట చేతనే “ఇది నేను. ఇది నాది, ఇది జగత్తు' అనునట్టి రూపము (లేక) అనుభవము ఈ జీవునకు స్ఫురిస్తోంది. ఒక దృష్టాంతము చెపుతాను విను.
'ఒక బాలుడున్నాడు. అతడు అతి పిరికివాడు. బలహీనుడు. ఆ పిల్లవాడి తల్లి ఒకనాడు "ఒరేయ్! బైటకు వెళ్ళకు. అక్కడ దయ్యాలున్నాయి” అని చెప్పి వంటఇంటిలోకిపోయింది. ఆ బాలుడు ‘నిజమా? ఈ కిటికీలోంచి దయ్యం కనబడుతుందేమో చూద్దాం” అని అనుకున్నాడు. ఒక బల్లపై ఎక్కి బయటకు చూస్తున్నాడు. ఆ కిటికీ దగ్గరలో గల పెద్ద చెట్టు గాలియొక్క ఆకస్మికవేగానికి అటు-ఇటు కదలి పెద్దగా శబ్దం చేసింది. “అయ్యబాబోయ్! దయ్యం!" అని పెద్దగా కేక వేసి నేలమీద పడ్డాడు.
ఈ దృష్టాంతంలో ఏ విధంగా అయితే 'దయ్యము' అనబడేది సిద్ధిస్తోందో అట్లాగే అసత్తే అయినట్టి ఈ జగత్ పదార్థములు స్థిరరూపము, కార్యవంతము కాగలుగుచున్నాయి. ఇసుకలో నూనె ఉంటుందా? సువర్ణంలో సువర్ణమే ఉంటుందిగాని ఆభరణం ఎక్కడ ఏ స్థానంలో ఉంటుంది? చైతన్యములో చైతన్యమే ఉంటుంది? ఇక 'నీవు - నేను' అనబడునవి ఎక్కడివి చెప్పు?
మరి అవి ఎందుకున్నాయంటావా?
ఈ నీవు - - నేను అను వాటియొక్క వాస్తవ స్వరూపము విచారించకపోవుటచేతనే.
ఒక ఉత్తమ రహస్యం చెప్పుచున్నాను. ఉద్వేగరహితుడవై విను.
ఈ ప్రపంచంలో సత్యవస్తువు యొక్క, మిథావస్తువులయొక్కగాని 'అర్థక్రియాసామర్థ్యము' నకు ఒక నియమమంటూ ఏదీ లేదు. కాని, అధిష్ఠానమగు 'సత్త' యందు ఏది ఎట్లు ఆరోపించబడుచున్నదో అది అర్ధక్రియాపూర్వకంగా అట్లే అగుచున్నది. బాలుడు తన మనస్సులో కల్పించుకొనిన దయ్యమును ఎదురుగా చీకట్లో చూచుటలేదా? మహచ్ఛక్తియుతమైనట్టి “యద్భావం తద్భవతి” అనునట్టి ఈ 'అవిద్య' యే 'మాయ' లేక 'సంసారము'. అనాత్మ విషయములకు
-
నిజానికి సత్తుగాని, ప్రతిష్ఠగాని లేదు. అట్టి అనాత్మయందు “నేను - నాది” అను భావము ఈ జీవునకు కలుగుతోంది! ఎందుచేత? లేనిది ఉన్నట్లుగా కనిపించుటయే 'మాయ' అనే శబ్దంచే చెప్పబడుతోంది. స్వచ్ఛము, నిర్మలము, శాంతము అగు ఆత్మయందు 'అహంకారము' అనబడేది ఉండజాలదు. ఆత్మకానిదంటూ ఎక్కడా, ఏదీ లేదు. అద్దానియందు 'అసత్తు' అంగీకరించినప్పుడే ‘నేను - నీవు’ అను భ్రమలు ఏర్పడుచున్నాయి. లేని అహంకారమును తొలగించుకోవాలనే ప్రసక్తి ఎక్కడిది? లేనిదానిని లేనిదానిగా చూడటం అభ్యాసం చేస్తూ ఉంటే సరిపోతుంది కదా!
Page:625
21. బ్రహ్మమే ఇదంతా
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'సనాతనత్వము - బ్రహ్మత్వము బ్రహ్మాండము ప్రజాపతిత్వము” ... ఇవన్నీ యథార్థానికి లేవు. అట్లాగే “వేరే లోకములు, స్వర్గాదులు, అమరత్వము, మనస్సు, సత్త్వము, దేహములు, మహాభూతములు, కారణత్వము, త్రిలోకత్వము, వస్తుగతము, భావ-అభావములు, నేను-నాది-నీవు, సత్-అసత్తులు, భేద కల్పనలు, రాగము, ఆసక్తి' ... ఇవన్నీ పరమార్థదృష్టితో చూస్తే లేనేలేవు. ఈ వ్యవహారమంతా నీ దృష్టిలో ఉత్తమోత్తమమగు 'ఆత్మస్థితి - ఆత్మభావన' పొందటానికి ముందు మాత్రమే గాని, ఆ తరువాత కాదు. వాస్తవానికి ఈ జగత్తంతటి యొక్క పారమార్థికస్వరూపము బ్రహ్మమే అయి ఉన్నది.
అట్టి బ్రహ్మము శాంతము, సర్వమునకు అధిష్ఠానము, అభాసవర్జితము (that in which nothing can reflect), నామరహితము, కారణవర్జితము అయి ఉన్నది. దానికి 'ఆది-మధ్యము -అంతము’ అనునవి లేవు. ఉత్పత్తి వినాశనము మొదలైన వికారములు కూడా లేవు. అది వాక్కునకు గాని, మనస్సునకు గాని 'విషయము' అయ్యేది కాదు. ఏదీ అవకుండానే అంతయూ తానే అయి ఉంటున్నది. ఒకతను “తండ్రి-తాత-కొడుకు-మనుమడు-స్నేహితుడు” అనబడునవన్నీ, తాను మాత్రం ఏకించిత్ మార్పు పొందకుండానే.... “తానే” అయి ఉంటున్నాడు కదా!
ఈ సత్స్వరూపమగు ఆత్మ ఆకాశము కంటే కూడా అతిసూక్ష్మమైనది. సుఖములన్నిటికంటే కూడా ఉత్తమోత్తమ సుఖప్రదమైనది.
శ్రీరాముడు : మహాత్మా! అంతటా సమరూపమై వ్యాపించియున్న బ్రహ్మమును నేనిప్పుడు ఎరుగు చున్నాను. నామ రూపములతో కూడిన ఈ జగత్తుకు 'హేతువు' అజ్ఞానము అనేది నిర్వివాదాంశమే. అయితే, అట్టి ఈ జగత్తు జ్ఞానముచే శమించి కూడా, మరల ఏర్పడియే ఉంటోంది కదా? ఎందుచేత? పరబ్రహ్మము తన యందు ఈ జగత్తులను ఎందుకు పొందుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామా! పరబ్రహ్మము సర్వదా తన రూపముననే ఉండి ఉంటోంది. అది స్వస్థానమునుండి ఏమాత్రం, ఏ సమయమందునూ “చ్యుతి” (deviation) పొందుటయే లేదు. కాబట్టి, “సృష్టి” అని, “జగత్తు” అని నీవు దేనిని అంటున్నావో, అది ఆ బ్రహ్మమునకు వేరుగా ఏ సమయమందునూ లేదు. బ్రహ్మమే ఈ కనబడే సర్వముయొక్క స్వరూపము. మహాసముద్రం యొక్క రూపమేమిటి? జలమే కదా! “మహాసముద్రంలో జలము ఉన్నది" అని కూడా ప్రయోగించ బడుతోంది! ఈ సృష్టి కూడా అట్లాగే పరమాత్మయందు ఉన్నది.
కాని - సముద్రజలం ద్రవశీలం కనుక చంచలం. పరమాత్మయో, చలనరహితం. ఆ రెండిటి భేదం అంతే. పరమాత్మయే సృష్టిరూపంగా సందర్శించబడుచున్నారు. అయితే, ఎక్కడైతే ఏ విధమైన మార్పు-చేర్పులు, లేవో; అక్కడ "సుఖ-దుఃఖములు, ప్రాప్త - అప్రాప్తములు” మొ॥
ద్వంద్వములు ఆరోపించబడి, ఆ అనుభూతి అంగీకరించబడుతోంది. ఎంత చమత్కారం!
Page:626
పరమాత్మ సూర్యునివలె ప్రకాశించువాడు కాదు. ఈ సూర్యాదుల ప్రకాశము భౌతిక స్వభావము మాత్రమే కదా! నిష్క్రియుడు, స్వయంజ్యోతి స్వరూపుడు అగు పరమాత్మకు ఈ భౌతికవికారములను ఎట్లా ఆపాదించగలం?
తటాకంలో “ఇది తూర్పువైపు జలము. ఇది పడమరవైపు జలం”, అని అన్నట్లుగా పరబ్రహ్మమున వివిధరూపములు గల ఈ జగత్తు స్ఫురిస్తోంది. అందుచేత సర్వదా, అంతాకూడా పరబ్రహ్మమే. దృఢమైన జ్ఞానం లేనివానికి మాత్రం ఈ జగత్తు పరమాత్మ కంటే భిన్నమైనదానిగాను, విషయ రూపంగాను కనిపిస్తోంది. అందుచేత అతనియందు “ఇది సృష్టి” అనే జ్ఞానం ఉండియే ఉంటోంది. కాని, జ్ఞాన పరిపక్వ స్థితియందు ఇదే సృష్టి “అంతా నిత్య సత్యమైయున్న పరబ్రహ్మమే” అని అనుభూతమౌతోంది.
ఓ మహాప్రజ్ఞానస్వరూపా! ప్రియ రామచంద్రా! అజ్ఞానికి నానావిధములుగా కనబడుచున్న ఈ జగత్తు యథార్థానికి ఏ కాలమందును లేకయే ఉన్నది. ఆకాశంలో ఎక్కడన్నా మరొక ఆకాశం ఉంటుందా? పరమార్థ వస్తువునందు, ఆ పరమార్థమునకు అన్యమైనదేదీ ఉండజాలదు. కనుక ఈ సృష్టి కూడా పరబ్రహ్మము యొక్క 'సంజ్ఞ' యేనని తేలుచున్నది.
“చిత్తమే పరమాత్మను సృష్టిరూపంగా గాంచుచున్నది”. ఈ సృష్టిని ఇట్లు గావించుచున్నది చిత్తమే అని సత్యాన్వేషనానంతరం మునిజనులమగు మేము గ్రహించాము. ఈ చిత్తము బ్రహ్మము నందు పూర్ణముగా లయించినప్పుడు ఈ భ్రమపూర్వకమైన సృష్టి దర్శనమంతా తనంతటతానే లయిస్తుంది. అనగా చిత్తము లయిస్తే ఇదంతా పరబ్రహ్మస్వరూపమే అవుతుంది. చిత్తము ఉదయించి నప్పుడు మాత్రమే ‘అసత్తు' అగు ఈ నామరూపాత్మక జగత్తు 'సత్త' ను పొందటం జరుగుతోంది.
అనేకసార్లు చెప్పాను. మరల చెప్పుచున్నాను, విను. ఈ సృష్టి అంతా 'అభిమానముతో కూడిన చిత్తము” కాక మరింకేమీ కాదు. చిత్తము ఉపశమించినచోట ఇదంతా 'జడము’గా కాకుండా పరబ్రహ్మముగానే అనుభవం కాగలదు.
ఒక శిల్పి ఎంతో చాతుర్యంతో మట్టితో "యుద్ధదృశ్యము”ను తయారు చేశాడనుకో.... మట్టిబొమ్మలతో కూడిన ఈ దృశ్యమునందు "ఇతడు రాజు, ఇతడు సైనికుడు, ఇతడు శత్రురాజు, ఇవి గుఱ్ఱములు, ఇవి ఆయుధములతో కూడిన బండి"... ఇట్టి దృష్టి ఒక చూచువాడు (A spectator) కలిగియుండవచ్చు. అయితే, అందలి అన్ని ఆకారములలో ఉన్నది మట్టియే కదా! రాజు బొమ్మకు, మంత్రి బొమ్మకు భేదము కల్పిత మాత్రమే కదా! జ్ఞానికి కూడా, ఈ దృశ్యమునందు ధృవీకరించబడియున్న ‘నేను - నీవు - అతడు' అనబడునవన్నీ బ్రహ్మ చైతన్యముగానే గోచరిస్తున్నాయి. జ్ఞాని వ్యవహారసరళి కొరకు ఈ భేదములు (వారు - వీరు అనునదంతా దృష్టిలో పెట్టుకున్నప్పటికీ, అంతర్లీనంగా ‘చైతన్య దృష్టినే' కలిగి ఉంటున్నాడు. అతనికి సర్వే - సర్వత్ర శివాత్మకమే గోచరిస్తోంది. అతనియొక్క పరమార్థ దృష్టిలో ఈ జగత్తు, ఉత్పత్తిరహితము, నాశనరహితము, వికారరహితము. ఇదంతా పరమాత్మ యొక్క వ్యాప్తిచే పూర్ణమైనదై, పరమాత్మయందే వెలుగుచున్నది. కనుక సర్వదా
Page:627
పూర్ణమే అయి శేషిస్తోంది. ఇక్కడెక్కడా అపూర్ణత్వమనేది లేశమైనాలేదు. ఆకాశమునందు ఆకాశము శాంతముగా ఉండి ఉంటున్నట్లు శివరూపమగు పరమాత్మయందు, శివరూపమగు ఈ జగత్తు వెలయుచున్నది.
"బ్రహ్మమునందే దూరత్వము - సమీపత్వములు కూడా ఉన్నాయి" అని తెలియజేయటానికి విజ్ఞులు ఒక దృష్టాంతము చెపుతారు. ఇక్కడికి కొద్దిమైళ్ళ దూరంలో ఒక నగరం ఉన్నదనుకో.... ఆ నగరం నీ ప్రక్కనే ఉన్న ఒక నిలువుటద్దంలో ప్రతిబింబిస్తోంది.
అద్దం నీ సమీపంలోనే ఉన్నది కనుక 'నగరం' నీకు దగ్గరలో ఉన్నట్లే కదా! కాని వాస్తవనగరం ఎక్కడో కొద్ది మైళ్ళ ఆవల ఉన్నది కదా!
ఇట్లా బ్రహ్మమునందే ఈ దృశ్యముంటూ, 'బ్రహ్మము - దృశ్యము” లకు ఎట్టి సంబంధము లేకుండానే ఉంటోంది. వాస్తవానికి బ్రహ్మమునందు దృశ్యాదులు ఉండజాలవు. అద్దంలో ఎక్కడన్నా భవనాదులు ఉంటాయా? "మరి కనిపిస్తున్నాయి కదా?”...... అని తర్కించేవారికి ఏం చెప్పగలం?
“అసత్తు మాత్రమే” అయినట్టి ఈ జగత్తు అనబడునది అజ్ఞానదృష్టికి మాత్రమే స్థితికలిగి ఉంటోంది. జ్ఞానుల దృష్టికో, ఇదంతా సత్స్వరూపమగు బ్రహ్మమే. "కొయ్యబొమ్మలన్నీ కొయ్యయే. మట్టి బొమ్మల వాస్తవస్వరూపం స్వరూపరహితమగు మట్టియే” అను విధంగా సత్స్వరూపమగు బ్రహ్మమే ఒకానొక భేదదృష్టికి ఇట్లు ప్రాప్తించుచున్నది. ఇదంతా "బ్రహ్మముకంటే వేరైనదికాదు” అనునది సిద్ధించుచుండుటచేతనే “ఈ జగత్తు సద్రూపమే” అనికూడా చెప్పబడుతోంది. భేదదృష్టితో చూస్తే మాత్రం ఇదంతా అవస్తువే కనుక, “అసన్మయమే”. ఓ రామా! "అద్దంలో ప్రతిబింబించే నగరం” లాగా నీ చిత్తమునందు ప్రతిబింబించే 'అనేకత్వముతో కూడిన జగత్ చమత్కారం' వాస్తమెట్లా అవుతుందయ్యా? ఐంద్రజాలికుడు మాయాచూర్ణమును గాలిలోకి విసిరి, మిథ్యారూపమైన వస్తువులను చూపిస్తూ ఉంటాడు చూచావా? ఇది కూడా అట్టిదే.
ఈ జగత్తు ‘చేతన వస్తువు' నందలి సారము, అసారము కూడా అయిఉన్నది.
అంటే “అధిష్ఠానరూపముగా (As "that concept" which is instrumental for the perception) సత్యము, దానికి వ్యతిరేకంగా చూస్తే మిథ్య" అని కూడా చెప్పబడుతోంది. (All this is one's
own perception. The perception is a form of one's ownself.)
ఓ మానవులారా! ఒక్కసారి మీమీ చిత్తములను శోధించుకోండి. వాటియందు వాసనారూపమైన అవిద్య పేరుకొనియున్నది. మీరు చూచీ చూడక ఉన్నారా, ఉత్తరోత్తర స్థితిగతులు దుష్ఫలిత పూర్వకంగానే ఉండబోతున్నాయి. అందుచేత “ఆత్మవిచారము” అనే అగ్నిలో 'వాసనలు' అనే కట్టెలను సమూలంగా మసి చేసివేయండి. అప్పుడు నాచే ప్రకటించబడుచున్న సత్యము మీకే బోధపడుతుంది.
అట్లుగాక, ఉదాసీనత వహించి ఉన్నారా, ఈ అవిద్య శాఖోపశాఖలుగా విస్తరించి, సుఖ దుఃఖ రూపములైన అసంఖ్యాక జగత్తులను మీ ముంగిట ఉంచగలదని హెచ్చరిక చేస్తున్నాను. అట్టి ‘సుఖ - - దుఃఖ రూపములు' అనబడు 'మాయానృత్యశైలి' కి అంతు అంటూ లేదు. నేను చెప్పిన
Page:628
జ్ఞానభూమికలను చక్కగా విచారించి, ఆపై మీమీ కర్తవ్యములను సముచితంగా నిర్ణయించుకోండి. అంతేకాని, విలువైన ఆయుష్షును స్వల్పవిషయములకొరకు వెచ్చించి, పారవశ్యము పొందకండి.
22. పునః కథాప్రవేశం ప్రదేశము - పరిశీలన
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ రోజు ఆ సభలో ఒక గంట సమయంలో దేవదూత ప్రభావంచేత లవణ మహారాజు అరువది సంవత్సరముల జీవితమును చవిచూచాడుకదా! ఆ రాత్రి సభ చాలించి రోజూలాగే అంతఃపురం జేరాడు. చాలాసేవు నిద్రపట్టలేదు.
“ఎంత ఆశ్చర్యం! మహద్దుఃఖం అనుభవించటం, ఆ ప్రదేశాలు, ఆ పరిచయాలు నా జ్ఞప్తిలో అత్యంత స్థూలంగా ఏర్పడి ఉన్నాయే? మరలమరల ఆ అరణ్యములోని విశేషాలే గుర్తుకొస్తున్నాయి! ఇంతకీ వింధ్యపర్వత సమీపంలోని ఆ ప్రదేశం, ఆ అరణ్యం, ఆ గృహాదులు అసలు ఉన్నాయా? లేవా?
నేను దర్శించినది స్వప్నసదృశ్యమా? వాస్తవమా?”
చాలాసేపు ఆలోచించిన తరువాత ఆ రాజు పెదవులపై ఒక చిరునవ్వు వెల్లివిరిసింది.
“దీనికి ఇంత బుఱ్ఱ పగులగొట్టుకొనవలసిన పనేమున్నది? ఉదయమే వెళ్ళి ఆ ప్రదేశమంతా పరిశీలించి వస్తే సరి కదా!” అని అనుకొన్నాడు. తాను విని, యోచించి, అలవర్చుకొనియున్న ఆత్మ జ్ఞానవిషయాల ప్రభావంచేత ఆలోచనలన్నీ కట్టిపెట్టి నిశ్చింతగా నిద్రాదేవత ఒడిలోకి జారుకొన్నాడు.
ఆ మరునాడు ఒక జాతిగుఱ్ఱమును అధిరోహించి, అతడు మహారణ్యంవైపు బయలుదేరాడు. కొందరు మంత్రులు కూడా అతనిని అనుసరించారు. తాను 'స్వప్నజాగ్రత్తు' లో మొట్టమొదట ప్రయాణించిన త్రోవలోనే ముందుకు పోసాగాడు. త్రోవ అంతా ప్రకృతి సంబంధమైన చిన్నచిన్న మార్పులు కలిగి ఉన్నప్పటికీ, ఇతఃపూర్వం చూచిన విధంగానే ఉన్నట్లు అనిపించింది. కుతూహలంగా ప్రయాణిస్తున్న అతనికి కొంతసేపటికి పూర్వం సంచరించియున్న అరణ్యం కనిపించింది. ఇతః పూర్వం జ్ఞాపకంలో పదిలంగా ఉన్న ఆయావృక్షములను పరిశీలిస్తూ ప్రదేశములను సరిచూచుకొంటూ, 'పుష్కరఘోష' అనే గ్రామంలో ప్రవేశించాడు.
ఆశ్చర్యం! తాను ఇంతకుముందు నివసించిన ఆ కుగ్రామంలోని జనులు, గృహములు, వృక్షాదులు యథాతథంగా తనలోని జ్ఞాపకములవలెనే ఉన్నాయి. చాలాకాలంగా సుపరిచయమై యున్న స్త్రీపురుషులను, ప్రదేశములను చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఆకస్మికంగా ఏర్పడిన కరువుకాటకాల వలన ఎండిపోయిన మహావృక్షములను చూచి తలపంకించసాగాడు. అప్పటి తన సహచరులగు అనేకమంది కిరాతకులు తమ మిత్రులను, పుత్రులను, తదితర బంధువులను పోగొట్టుకొనుటచే రోదిస్తూ తారసపడ్డారు. వారందరి సహచర్యం రాజుకు గుర్తు ఉన్నా, వారుమాత్రం రాజును గుర్తించలేదు. ఇట్లా చూచుకొంటూ క్రమంగా, తన అత్తగారి ఇంట్లో ప్రవేశించాడు. అక్కడి తమ పూర్వగృహంలో అతని అత్తగారు, ఇతర వృద్ధస్త్రీలతో కూడి బిగ్గరగా ఏడ్చుచు ఆర్తనాదములు
చేయటం గమనించాడు.
Page:629
అత్తగారు : హాఁ! నా కూతురా! నీవు నీ పిల్లలను లాలిస్తూ మమ్ములను ఎంతగానో ఆనందింప జేస్తూ ఉండేదానివే? పాపం. ఒకసారి మూడురోజులు అన్నం దొరక్కపోతే ఎంతగా విలవిల్లాడావో! ఎంత కృశించావో? ఈ చేతులతో నా కూతురుకు, నా మనుమళ్ళకు ఇంత అన్నం పెట్టలేకపోయాను. నా జన్మ ఎందుకు? కాల్చనా? మా అల్లుడిని మీరంతా ఎరుగుదురు కదా! మొలలో కత్తి పెట్టుకొని ఈ ఊరిలో ఒక రాజులాగా సంచరిస్తూ ఉంటే, ఎవడైనా బైటకు వచ్చేవాడా? అయ్యయ్యో! మీ రంతా నన్ను వదలి ఎక్కడికెళ్ళారఱ్ఱా? ఆరి దేవుడో?
ఓ అల్లుడుగారూ! నీవు నిమిషంలో ఎత్తైన తాడిచెట్లు ఎక్కి, అక్కడే తాళఫలములను జుట్టేవాడివి. ఒకవేళ, అంత ఎత్తైన తాడిచెట్టు నుండి క్రింద పడితేమాత్రం 'అబ్బా' అనేవాడివా? లేదు. మళ్ళా సాహసంగా ఇంకొకచెట్టు ఎక్కేవాడిని. మాకు నువ్వు కొడుకుకన్నా ఎక్కువ ప్రియంగా ఉండేవాడివి కదయ్యా! ఏమట్టోయ్! మా అల్లుడు పులులను కూడా ఒంటిచేత్తో ఎదుర్కోగలడు తెలుసా! అయ్యా అల్లుడూ? ఇప్పుడెక్కడున్నావో? ఏం చేస్తున్నావో? ఆ అరుపులు, ఆ పెడబొబ్బలు, ఆ గంతులు, ఆ జంతువుల చర్మం ఒలవటం, ఆ నెత్తురు జుఱ్ఱటం ఇవన్నీ మళ్ళా నేను చూడగలనా? అతడు మద్యం త్రాగేటప్పుడు, నా కూతురు నోట్లోంచి మాంసపు ముక్కలను గుంజుకుని తినేవాడు. అప్పటి మా అల్లుడి ముఖం చూస్తుంటే మన్మథుడు ఎందుకూ పనికిరాడు. ఆరి నాయనో! వేగంగా వీచిన గాలి తామరాకును త్రెంచుకుపోతుంది చూచారా? అట్లా ఆ యముడు వచ్చి, నా కూతురుని, అల్లుడిని ఎత్తుకొని పోయాడా? ఓరి యముడో!
గురివిందగింజల మాల ధరించి, విశాలమైన పాలిండ్లతో ఈ ఊళ్లో నా కూతురు తిరుగుతుంటే, అప్పుడందరు ఎంత సంతోషపడేవారు! ఓ నా కూతురా! కాటుక కళ్ళు, నారవస్త్రములు, నల్లని దంతములు గల నువ్వు నన్నొదిలి ఎక్కడికెళ్ళావే? అల్లుడా! నువ్వు ఎక్కడో గొప్ప పట్టణం వదలి మా దగ్గరకు వచ్చి, మా కూతురుని మనువు ఆడావని అనుకుంటూ ఉండేవాళ్ళం. మీ ఇద్దరిది ఎంతటి ప్రేమ? ఒకరినొకరు వదిలి ఎప్పుడైనా ఉండేవారా? నా చిట్టితల్లిని పెళ్ళిచేసుకొన్న నా అల్లుడు చెయ్యని గొప్ప పనులు ఉన్నాయా? అట్లా, లేడికళ్ళు గల నా కూతురు, సింహము వంటి బలం గల నా అల్లుడు ఇద్దరూ క్షణంలో నశించిపోయారే?
అంతా అయిపోయింది. నా మొగుడు పోయాడు. కూతురు పోయింది. అల్లుడు పోయాడు. ఈ అనాగరక దేశంలో ఇంకా నేను మాత్రం మిగిలి ఉన్నాను. ఈ ఆపదలన్నీ అనుభవించటానికే మిగిలాను కాబోలు! ఇవన్నీ చూచినా, ఇంకా నాకు చావురాలేదేం? ఇంకా నేను బ్రతికేది ఎట్లా? బ్రహ్మదేవుడా! ఈ విధంగా, అనాథనై, ఇక్కడి వాళ్ళచేత - వీళ్ళచేత అవమానించబడటానికి,
ఆకలిచే అలమటించటానికి, ఈ జనులకు ఆహారం కావటానికి, ఈ దుఃఖములు అనుభవించటానికి, నన్ను మాత్రం ఇంకా బ్రతికించి ఉంచావా? బంధువులు పోయి, అనేక మానసిక వ్యధలు - ఆపదలు పొందుచున్నట్టి నాకంటే, జీవంలేని ఒకరాయి నయం. స్వజనం లేరు. దుష్టజనం గల ప్రదేశంలో ఉంటున్న నా దుఃఖాలకు అంతు అంటూ ఉన్నదా? నా మొగుడు, నా అల్లుడు, నా
Page:630
కూతురు చిల్లిగవ్వ కూడా మిగల్చకుండా పోయారు. ఓ స్వజనులారా! మీకేం? హాయిగా వెళ్ళిపోయారు.
నా గతి ఏమిటి?
నూరుఏళ్ళు పైబడిన వయసుగల ఆ అత్తగారి రోదనమంతా రాజు విన్నాడు. వాళ్ళను సమీపించాడు. తన మంత్రులతో వాళ్ళకు ధైర్యం కలిగింపజేశాడు. “ఏం అవ్వా! ఇంతగా ఏడుస్తున్నా వేమిటి? నీవెవరు? నీ కూతురు, అల్లుడు ఏమయ్యారు! ఈయన మా లవణ చక్రవర్తి. వీరు నీకు ఈ లోటులేకుండా చేస్తారులే. అసలు విషయమేమిటో చెప్పు” అని ఒక మంత్రి పలికాడు.
అప్పుడు కళ్ళనీరు కారుస్తూ ఆ ఆ వృద్ధస్త్రీ ఇట్లు చెప్పింది.
వృద్ధస్త్రీ : బాబుగారూ! మాది ఈ 'పుష్కరఘోష' అనే ఊరే. నా మొగుడు 'పుష్కరయ్య' ఇక్కడే పుట్టాడు. మా ఇద్దరికి చందమామవంటి ఒక కూతురు ఉండేది. ఒకసారి దైవయోగం చేత ఇక్కడి అడవికి ఒక కుఱ్ఱవాడు వచ్చాడు. అతడిని, నా కూతురు మనువు ఆడింది. నా అల్లుడు, కూతురు చాలాకాలం చిలకా గోరింకలలాగా కాపురం చేస్తూ అనేకమంది సంతానం కూడా కన్నారు. హాయిగానే ఎన్నో రోజులు గడిచాయి. ఇట్లా ఉండగా, కొంత కాలానికి మా కర్మ కాలి, ఇక్కడ ఒక పెద్దక్షామం వచ్చింది. వర్షాలు చాలా కాలంవరకు లేకుండా పోయాయి. తిండి, నీరు లేక ఇక్కడివాళ్ళు ఎంతమంది చచ్చారో చెప్పలేము. ఇక బాధలు పడలేక, ఇక్కడివారు ఎంతోమంది ఈ చోటు వదలి ఎటో దూరంగా పిల్లా - - జల్లాతోసహా వెళ్ళిపోయారు. అట్లా దూరప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో కొందరైతే త్రోవలోనే మరణించారు. దురదృష్టవంతులమగు మేమంతా మా బంధువులను పోగొట్టుకొన్నాం. ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది ఎక్కడ ఇంకా బ్రతికే ఉన్నారో మాకేం తెలియదు. ఈ మధ్యనే మా ఆయన కూడా పోయాడు. ఇట్లా అందరినీ పోగొట్టుకొని శూన్య హృదయులమయ్యాం. మాకిక ఏడుపు గాక, ఇంకేం మిగిలింది? నెలరోజులక్రితం దేశాలు పట్టి పోయిన నా కూతురు - వాళ్ళు ఏమయ్యారో? ఏమో?
రాజు ఈ మాటలు విని విస్మితుడై సాలోచనగా మంత్రివైపు చూచాడు. ఆ తరువాత, తన పూర్వవృత్తాంత విశేషాలు అనేకం అడిగి తెలుసుకొన్నాడు. ఆ సమాధానాలన్నీ తన క్రితం రాత్రి సభలోని దేవదూతచే కల్పించబడిన అనుభవాలకు సరిగ్గా సరిపోతూనే ఉన్నాయి. అట్లు కొంతసేపు సంభాషించి, ఆ ముసలి స్త్రీని కొంత ధనముతో, పదార్థములతో సంతోషపరచి, మంత్రులతో కూడుకొని వెనుతిరిగినాడు. "ఆహాఁ! ఏమి ఈ దైవగతి?" అని యోచిస్తూనే నగరం చేరాడు.
అత్యంత ఆశ్చర్యచకితుడైన రాజు ఆ మరునాడు సభలో నాతో "హే వసిష్ఠమహర్షీ! స్వప్నతుల్యమైన జగత్తులో ప్రవేశించి నేను అనుభవించినదంతా, ప్రత్యక్షమై ఎట్లా ప్రాప్తిస్తోంది? ఈ విషయం నా ౩మీ బోధ పడుటలేదు. దయచేసి, ఇందలి చమత్కారం, తాత్త్వికార్థం నాకు తెలియచేయండి” అని అభ్యర్థించాడు. అప్పుడు నేను అతని ప్రశ్నకు తగిన సమాధానమిచ్చి, అతని సంశయం నివారించాను.
చూచావా రామా? ఈ అవిద్య విశేషమైన 'భ్రమ’ ను కలుగ జేయగలదు సుమా! క్షణంలో సత్తును అసత్తుగాను, అసత్తును సత్తుగాను చూపించగలదు.
Page:631
23. ఒకని మనస్సులో విశేషాలు - మరొకరి మనస్సులో ప్రతిబింబించటం
శ్రీరాముడు : మునీంద్రా! ఆ లవణ మహారాజు లాగానే నాకుకూడా సందేహం వస్తోంది. స్వప్నంలో చూచినది 'జగత్కాలాంతరతం' ఎట్లా అయినది? భ్రమదాయకములైన వాక్యాలు నేను విశ్వసించ
లేకపోతున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్యయందు ఇదంతా సంభవమే. స్వప్నంలో కనిపించే కుండ, వస్త్రము, జనులు మొదలైనవి అప్పటికి సత్యమే అయినట్లు కనబడుచున్నాయా, లేదా? అవిద్యయొక్క కల్పనా ప్రభావంచేత, అద్దంలో ప్రతిబింబించే కొండ, దూరంగా ఎక్కడో ఉన్న కొండకూడా దగ్గరగా సమీపమునే ఉన్నట్లు తోస్తోంది. గాఢంగా రెండు - మూడు రోజులు నిద్రించినవానికి, ఆ మూడు రోజులు అత్యంత అల్పంగా ఒక్కక్షణంలాగా తోచుట జరుగుతోంది. ఒకడు, “రాత్రి ఒక కలవచ్చింది. అందులో నేను చచ్చిపోయాను. నా మిత్రులు, బంధువులు నాపైబడి ఏడుస్తున్నారు” అని అన్నాడనుకో. అతడు మరణించటం జరిగితే కల ఎవరికి? అందలి జనులు ఎక్కడివారు? ఈ విధంగా అవిద్యయందు అసంభవము కూడా సంభవము కాగలదు. అత్యంత అసత్యము కూడా సత్యమువలె ప్రాప్తించగలదు.
ఒకడు కొద్దిసేపు తనచుట్టూ తాను తిరిగాడనుకో ... అప్పుడాతనికి ఎదురుగా ఉన్న వస్తువులు స్థిరంగా ఉన్నప్పటికీ గిఱ్ఱున తిరుగుచున్నట్లు కనిపిస్తాయి కదా! కల్లు మత్తుగా సేవించినవానికి ఇళ్ళు, రహదారులు గాలిలో తేలుచున్నట్లు కనిపించుటలేదా? కదలకుండా ఉన్న వస్తువు కూడా అవిద్య కారణంగా కదలుచున్నట్లు ఒకడు పొందుచున్నాడు.
ఈ ప్రపంచంలో అనేక పదార్థములు తారసపడుచున్నాయికదా! “ఇవి సత్యమైనవా? లేక మిథ్యాభూతములేనా?” అనే విషయం ప్రక్కన ఉంచు. ఒక్కటి మాత్రం అందరు ఒప్పుకోక తప్పదు.
ఈ చిత్తం ఏ పదార్థమును ఎట్లు తీవ్రంగా భావిస్తే అది అట్లే సత్వరం అనుభవానికి రాగలదు. అహంకారముతో కూడిన అవిద్య ఎప్పుడు ఉదయిస్తుందో, మరుక్షణాన ఆదిమధ్యాంతములు లేనట్టి భ్రమయొక్క అనంతత్వముకూడా ఉదయిస్తోంది. వాస్తవానికి పదార్థములన్నిటి యొక్క ‘పరిణామము - అనుభవము' ప్రతిభాసావశంచేతనే (ప్రతిబింబించు స్వభావముచేతనే) కలుగుతోంది. అట్టి ప్రతిభాసావశం చేత ఒక్కక్షణం కల్పంగా, ఒక కల్పకాలం క్షణంగా అనుభవం కాగలదు. విపరీత బుద్ధి గల ఒకానొక మానవుడు “నేను ఒక కోతిని" అని భావించి, నిజంగానే కోతివలె ప్రవర్తనను ప్రకటిస్తూ ఉంటాడు. అట్లాగే, భావనావశంచేత ఒక మేక కూడా సింహత్వము ప్రకటించ వచ్చు. అంతటికీ కారణం అంతరంగమునందలి వాసనలే.
“అవిద్య - మోహము - అహంభావము” ఈ మూడూ తెలుపుచున్నవి ఒక్క విషయాన్నేకాని, వేరువేరు విషయాలను కాదు. ఇవే చిత్తవైపరీత్యము కలిగించటానికి కారణం అవుచున్నాయి. చిత్తమునందలి వాసనలు కారణంగా ఒకనికి ఒక స్వల్పవిషయం కూడా మహత్కార్యంగాను,
Page:632
మరొకడికి అదే మహత్కార్యం అత్యంత స్వల్ప విషయంగాను తోచుట జరుగుతోంది. అట్లాగే, ఒకని మనస్సు నందు ఏది తోచినదో, అదే కాకతాళీయ న్యాయంచే మరొకరి మనస్సునందు కూడా తోచు చుండుట జరుగుతోంది. లవణమహారాజు విషయంలో - ఆ దేవదూత ఐంద్రజాలికుడు మనస్సుద్వారా ఒక జరిగిపోయిన సంఘటన “చండాలకన్యా వివాహం” వృత్తాంతమంతా లవణుని మనస్సులో కూడా భాసించేటట్లు చేశాడు. అనగా, అవన్నీ మరొక జీవుని మనస్సుకు ప్రాప్తించిన అనుభవ పరంపరలు మాత్రమే!
శ్రీరాముడు : అదేమిటి? ఒకని మనస్సులోని అనుభవ విశేషాలు మరొకని మనస్సులో ప్రతిబింబించేటట్లు చేయబడగలవా?
శ్రీవసిష్ఠ మహర్షి : మాయలో చమత్కారములకు అడ్డేమున్నది?
జ్ఞప్తిని అనుసరించి భావము ఏర్పడటం ఒకడు తాను భుజించికూడా, మరొక చోటికి పోయినప్పుడో, లేక స్వప్నములో ప్రవేశించినప్పుడో, “నేను ఈ రోజు ఏమి తినలేదే?” అని మననం చేసి, ఆకలిని అనుభవిస్తాడు. మరల ఎవరో, “నీవు భుజించావుకదా?" అని గుర్తుచేస్తే, “ఓహో ! ఈ విషయం గుర్తులేదు" అని ఆకలిని త్యజిస్తాడు. ఇక్కడ జ్ఞప్తిని అనుసరించి భావన ఉండటం జరుగుతోంది.
భావనను అనుసరించి మనస్సునందు అనుభవం ఏర్పడటం - దృఢంగా ఒక భావపరంపం "వైపు దృష్టిసారించి, తదితర విశేషములన్నీ త్యజించటం జరిగినప్పుడు, అట్టి సమయంలో స్వప్నజాగ్రదనుభవం సిద్ధించగలదు. అట్టిసమయంలో “చేసియున్నట్టి - చేసి ఉండనట్టి” క్రియల గురించి కూడా ఆ భావమే అనుభవముగా పరిణమించుచున్నది. దృఢభావన ఉన్నచోట 'అనుభవం' రూపుదిద్దుకొనగలదు. ఒకానొకని ఊహలో - ఆటలలో ఎదుటివారిపై గెలుస్తున్నట్లు భావించటం.... యుద్ధంలో శత్రువును బాధించుచున్నట్లు భావించటం.... ఇవన్నీ పరధ్యాసచే నిజమైన సంగతుల వలె అనుభూతం కాగలవు.
స్మృతిలో లేని క్రియలు నిష్క్రియలు కావటం - - అట్లే ఒకడు ఒక మహత్కార్యం చేసికూడా, అది పూర్తిగా మరచుటచే, దాని కర్తృత్వము తనయందు ఏమాత్రం కలిగియుండకపోవచ్చు.
ఇక లవణ మహారాజు విషయంలో - స్వప్నమందలి 'అపూర్వానుభవం' లాగా “వింధ్యపర్వత సమీపమున ఉన్న ఒక గ్రామములో ఇట్టి వ్యవహారము జరుగుచున్నది” అనునది రాజు మనస్సులో ప్రతిభాసించింది. ఆ లవణమహారాజు గాంచిన ‘స్వప్నభ్రమ” వంటిదే అక్కడి ఒక చండాలుని చిత్తము నందు స్పురించింది. అనగా, లవణునిచే పొందబడిన వృత్తాంతమే అక్కడి వేరొక ఒక జీవుని హృదయము నందు రూఢిపడి ఉన్నది.
శ్రీరాముడు : స్వామీ! ఒక జీవుని హృదయములోని అనుభవం మరొక జీవునియందు స్ఫురించగలదా? లేక ప్రతిబింబించగలదా?
Page:633
శ్రీవసిష్ఠ మహర్షి : ఎందుకు కాగూడదు? "సమస్యాపూరణము” మొదలైన సందర్భాలలో అనేకమంది కవులలో ఒకే భావన, ఒకే వచనములు ఒకే రీతిగా ఉండటం జరుగుతూ ఉంటుంది కదా! ఇదికూడా అట్టిదే. అనేకమంది స్వప్నములో కూడా ఒక్కొక్కసారి దేశ-కాల-క్రియలు సమముగానే
ఉంటాయి.
శ్రీరాముడు : అంటే ఆ లవణుని యొక్క "నేను చండాలుడనైయున్నాను. ఈమెను వివాహం చేసుకున్నాను. ఇట్లు ఈ అడవిలో ఈ క్రియలు నిర్వర్తిస్తున్నాను. ఈ పిల్లలు నాకు ఇష్టులు. వీరికొరకై ఇవన్నీ చేస్తున్నాను.....” అను వ్యవహారమంతా స్వప్నముతో సమానమైనదేనంటారా? శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అది స్వప్నసదృశమే. కాని ఇక్కడ నీవు మరొక ముఖ్యవిషయం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఒక స్వప్నంలో ఏర్పడిన మరొక స్వప్నము. ఎందుకంటే, “నేను లవణుడను. ఈ దేశపురాజును" అనునది మాత్రం స్వప్నసదృశం కాదా? ప్రతి జీవుని యొక్క ఈ వర్తమాన దర్శనావ్యవహారము కూడా, భావించినదానిని అనుసరించే ఉంటోంది. కనుక, “ఇదంతా చైతన్యము యొక్క ప్రతిభాసచే ఏర్పడుచున్నదే” అని సూక్ష్మబుద్ధితో గ్రహించు. సమస్తవిషయములయొక్క పదార్థములయొక్క సత్త - దానికి అధీనమైయున్న (That in which every thing else finds place) ‘చైతన్యసత్త’ యొక్క స్ఫురణవల్లనే కలుగుతోంది. అట్టి 'అధిష్ఠానము’ అయిఉన్న ‘చేతన సత్త’ యే భూత-భవిష్యత్-వర్తమాన ప్రపంచమున వ్యాప్తమైయున్నది.
అయితే జలములో తరంగములు జలముకంటే విలక్షణమైన (ఆకారములు కలిగియుండుట మొదలైన) కొన్ని విశేషములతో ప్రకటితమౌతున్నాయి కదా!
బీజములో నిబిడీకృతమైన వృక్షం బీజం కంటే వేరైన నామరూపములతో ప్రాప్తిస్తోంది కదా! ‘బంగారపు ఉంగరం' అను వస్తువు బంగారముకంటే వేరైన దృష్టిచే దర్శించబడుతోంది కదా! అధిష్ఠానమగు “చేతన సత్త" కంటే (ద్రష్ట సత్తకంటే) భాసించుచున్న పదార్థముల సత్త (దృశ్యసత్త) వేరైనది కాదు. కాని, వేరైనట్లు అల్పదృష్టికి ప్రాప్తిస్తోంది.
బంగారములో అంగుళీయకిత్వమన్నదా? లేదు. బంగారమునకు ఉంగరాకారం ఎక్కడున్నది? ఉంగరము బంగారముకన్నా వేరా?.... కాదు. బంగారమునకు వేరుగా అక్కడేదీ లేనేలేదు?
అట్లాగే ‘ద్రష్టసత్త’ యందు స్ఫురిస్తున్న ఈ దృశ్యసత్తకూడా సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఆ రెండిటికీ విలక్షణమైనది. (నాసదాసీనోసదాసీత్ : ఈ జగత్తు సత్తుగాని, అసత్తుగాని కాదు.)
అందుచేత, “ఈ జగత్తు 'స్థూలదృష్టి' కి 'సత్తు' గాను, పరమార్థదృష్టికి 'అసన్మయము’ గాను ఉంటోంది. ఎక్కడన్నా ఇసుకలో నూనె ఉంటుందా? వాస్తవానికి 'అవిద్య' అనబడునది కూడా ఏదీ లేదు. ‘ఆభరణం’ అనగా బంగారమేగాని, మరింకేముంటుంది?
శ్రీ రాముడు : మహర్షీ! చేతనవస్తువును ఆశ్రయించి ఉంటోంది కనుక అవిద్య కూడా సత్త కలిగియున్నదని అనుకోవచ్చు కదా?
Page:634
శ్రీ వసిష్ఠ మహర్షి : జడమగు అవిద్యకు, చేతనమగు చైతన్యమునకు సంబంధం ఎట్లా పొసగగలదు చెప్పు? ఎక్కడైనా సమాన వస్తువులకే సంబంధం ఉండటం సహజంగాని, అసమాన వస్తువుల సంబంధం అసహజమే కదా!
శ్రీ రాముడు : ద్రవశీలమగు లక్క, అద్రవశీలమగు కొయ్య ఒకచోట ఒకే వస్తువు నందు అమరిక పొంది ఉంటున్నాయి కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవి రెండు పాంచభౌతిక పదార్థములే! రెండూ అవిద్యయందే అంతర్గతమై ఉంటున్నాయి. కనుక సదృశవస్తువులే అవుతాయి. చైతన్యమో, అనుభవమాత్రం. ఈ జగత్తో, అత్యంత వికారయుక్తమై, ఘనీభూతమై కనిపిస్తోంది.
అనుభవ మాత్రమగు చైతన్యము ఈ 'జగత్తు' యొక్క ఉనికిని అంగీకరించి, అట్టి భావనానంతరం ఇట్లు దృశ్యముగా దర్శిస్తోంది. భావనకు వేరుగా 'జగత్తు' అనబడునది ఎక్కడా ఏ సమయమందు కూడా లేనే లేదు.
సమస్త పదార్థములు చైతన్యమయములే. చైతన్యం వల్లనే, సాదృశ సంబంధం చేత (The relationship that a Perceiver undertakes) అవన్నీ ప్రకాశితములౌచున్నాయి.
ఈ జగత్తులోని పదార్థములన్నీ సత్ + చిత్ మాత్రములే. (Mere combination of Existence and Conscionsness). కనుక 'స్వప్రకాశము' యొక్క బలముచేతనే అవన్నీ ప్రకాశితము అగు చున్నాయి. అంతేగాని, అవి ఎక్కడో ఉన్న మరొక చైతన్యముచే కాదు సుమా! ఒక దీపం ప్రకాశమును ప్రకటించటానికి మరొక దీపం దేనికి?
ఓ రామా! ఒక సిద్ధాంతము చెపుతాను. విను.
1. అసదృశ వస్తువులకు సంబంధం ఎన్నటికీ కలుగదు. ఒకటి ఇంకొక దాని వంటిది అయితేనే “ఆ రెండు సాదృశవస్తువులు" అని అంటాం.
2. పరస్పర సంబంధం లేకపోతే పరస్పర - - అనుభవం ఘటిల్లే ప్రసక్తే లేదు..... కనుక
3. సదృశమగు పరమాత్మయందు సదృశమగు ఈ జగత్తు ఉండి ఉన్నది. ఇదంతా పూర్ణంగా ఏకత్వం పొందినదై, అట్టి ఏకత్వబలంతో, తన రూపమును విస్తరించుచున్నది. అంతేగాని, పరమాత్మ స్వరూపముకంటే వేరుగా ఈ జగత్తు లేదు.
ద్రష్ట-దర్శనము-దృశ్యము (Perceiver - perception - object) చేతన-చేత్యము-చేతయిత్వము (Knower - thing being known knowing) ఈ త్రిపుటీ రూపమంతా అజ్ఞుల దృష్టిలో మాత్రమే ఉదయిస్తోంది. అయితే ఇట్లు ఉదయించేదంతా చిత్ - జడముల అభేద సంబంధం వలననే ఏర్పడుతోంది కాని, కేవలం జడముయొక్క ఉనికి చేతనే అనటం ఏమాత్రం తగదు. ఎందుకంటావా? జడము జడముతో కలిస్తే ఇంకా అధిక జడమే కావాలి కదా!
చిత్ - జడములు పరస్పరం విలక్షణమై ఉన్నాయి. కనుక వాటికి ఐక్యత సంభవించదు. నీవు ఒక పదార్థమును స్పృశిస్తున్నప్పుడు, ఆ అనుభవం పొందుచున్న నీవు, స్పర్శానుభవం కలిగిస్తున్న
Page:635
పదార్థజాలము, 'స్పర్శ' అనబడే అనుభవమూ - ఈ మూడు చైతన్యము యొక్క ప్రసరణశీలత యొక్క ప్రభావం మాత్రమే. సర్వము చైతన్యమునకు సంబంధించినదే అగుటచే, “అసలు ఈ దృశ్యమే లేదు” అనునది సిద్ధించుచున్నది.
శ్రీ రాముడు : గృహము నిర్మించుటలో పనికివచ్చే చెక్క, పాషాణం మొదలైన నామరూపాత్మకమైన పదార్థములు ఏమై ఉన్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవి చిదాత్మకములు కావు. అవన్నీ ఒకటి మరొకటిగా పరిణామం చెందుతూ ప్రాప్తిస్తున్నాయి. అందుచేత “అవి మాయ యొక్క విలాసములే” అని చెప్పబడుతోంది. కాని చైత్యమునకు పరిణామాదులంటూ ఉండవు.
మరొక సమన్వయం కూడా విను: మనం నాలుకతో వివిధ పదార్థములను ఆస్వాదిస్తున్నాం. అట్టి క్రియ 'సజాతివస్తు సంబంధమే' అవుతుంది. "ఎల్లప్పుడు సాదృశ వస్తువులకు మాత్రమే సంబంధము ఏర్పడుచున్నది" అని అనుకొన్నాం కదా! అసదృశములైన (Unequal) జడ - చైతన్యము ఒకదానిని మరొకటి పొందలేవు.
కనుక చైతన్యమే శిల - గోడ మొదలైన రూపములను 'అనుభవము' అను చమత్కారం ద్వారా ధరిస్తోంది.
సద్వస్తువు అయి ఉన్న చైతన్యమే, భావసారూప్యము పొందినదై “ద్రష్ట - దృశ్యము” మొదలైన భ్రమలన్నీ కలుగజేస్తోంది. అందుచేతనే 'ఈ సర్వము చైతన్యమే' అని సిద్ధాంతీకరించబడుతోంది. సత్యద్రష్టలమగు మేము "చిదాత్మతోటి చిదాత్మ యొక్క సంబంధమే కల్పిత దృశ్యరూపమున ఉదయిస్తోంది” అని స్వానుభవ పూర్వకంగా ప్రకటిస్తున్నాం. అనగా, “ఇది కొయ్య, ఇది శిల" మొదలైన రూపత్వమంతా కల్పితమైనది మాత్రమే. అట్టి కల్పన చైతన్యము చేతనే గావించబడుచున్నది. అనంతమగు పరబ్రహ్మమే సర్వవిధముల పరిపూర్ణమై, సర్వరూపములందు సమముగా వెలుగొందుచున్నది.
కనుక, ఉత్తమ తత్త్వజ్ఞుడవగు ఓ రామా! "ఈ విశ్వమంతా సన్మాత్రమే” అని గ్రహించు! ఇక ఈ జగత్తు అంటావా? ఇది పలువిధములైన భ్రమలతో మిథ్యాగ్రహణం (false understanding) అను రూపముతో, చిత్యొక్క చమత్కృతి చేతనే ఒప్పుచున్నది. అట్టి చిత్చమత్కృతి ఈ జగత్తులోని ఏ పదార్థజాలముచేతను పూరింపబడజాలదు. ఒకడు తన స్వప్నంలో ఒక గొప్ప నగరమును చూస్తున్నాడనుకో.... ఆ నగరంలో "ఇది వీథి, ఇది ఇల్లు, ఇది వేరేవారి గృహములు, వీరు బంధువులు, వీరు అపరిచితులు” అనే రూపముగల అనేకత్వ భేదమంతా ఏర్పడుతోంది. కాని అదంతా స్వప్నద్రష్టయొక్క స్వసంకల్పపరంపరల ఘనీభూతస్థితియే కదా! ఈ బాహ్యమున కనిపించే ‘బాహ్యజగత్తు’ కూడా అట్టిదే. “ఇది ఉంగరం” అనే దృష్టి తొలగితే అప్పుడు అందులోనూ, మరొక గొలుసులోనూ కూడా బంగారమే కనిపిస్తుంది. భేదజ్ఞానము చేతనే "సృష్టి అహంకారము” ఇత్యాది భ్రమలన్నీ ఉదయిస్తున్నాయి.
Page:636
అనేక ఆభరణముల ఉత్పత్తి-ఉనికికూడా సువర్ణముయొక్క ఉనికి మీదనే ఆధారపడి ఉన్నాయి కదా? జడ, చేతనముల చమత్కారమంతా ఆత్మయొక్క “భావన”యందే అద్వితీయంగా ప్రదర్శనమగుచున్నాయి.
ఈ జగత్ స్థితి కూడా సద్వస్తువు అగు చైతన్యముపైనే ఆధారపడి ఉన్నది. దృక్ - దర్శనములకు వేరుగా 'అవిద్య' అనబడునదేదీ ఎక్కడా లేదు. చైతన్యపరమాత్మ స్వరూపమే అజ్ఞానదృష్టి కలవారికి జగత్తుగా అనుభవమౌతోంది.
24. పరమాత్మయొక్క నిర్వచనము
అసద్రూపం అయి ఉన్న ఈ జగత్తును తత్త్వజ్ఞానం మాత్రమే సత్స్వరూపమగు పరమాత్మతో ఐక్యపరచుచున్నది. మట్టితో నిర్మించబడిన సైన్యము చిత్రవిచిత్రములుగా, “రాజు-మంత్రి-సైనికులు -గుఱ్ఱములు” మొదలైన విధంగా కనబడుచున్నప్పటికీ, విచారదృష్టికి అంతా మట్టిగానే తెలియవచ్చు చున్నది కదా! జగత్తు కూడా పరమాత్మ స్వరూపము మాత్రమే అయి ఉన్నది. ఇందులో ఎంత మాత్రమూ సందేహం ఉండవలసిన అవసరం లేదు.
తరంగములన్నీ జలమే కదా?.... కొయ్యవిగ్రహములన్నీ కొయ్యమయమే కదా?.... కుండలన్నీ మృత్తికామయమే కదా?.... ఈ ముల్లోకములలో సర్వము బ్రహ్మమయమే! బ్రహ్మమే!.... అందుకు వేరైనట్లుగా తోచుటయే 'అవిద్య'.
ఇప్పుడు పరబ్రహ్మమును గ్రహించుటకు వీలుగా కొన్ని నిర్వచనములు చెపుతాను విను.
I. పరబ్రహ్మము : ఈ దృశ్యము ద్రష్ట యొక్క భావనలను ఆశ్రయించి ఉంటోంది. 'ద్రష్ట దృశ్యము’ ల సంబంధమును వివేకబుద్ధితో పరిశీలిస్తే తేలుచున్నది ఏమంటే
1) ద్రష్టయే దృశ్యమునందు ప్రవేశిస్తూ, స్వకీయసంస్కారములను అనుసరించి ఇదంతా ఆయా రీతులుగా దర్శిస్తున్నాడు.
2) ద్రష్టత్వము వహించుటచే అతనిని 'ద్రష్ట' అని పిలుస్తున్నాం.
3) ద్రష్టత్వము వహించటానికి మునుముందే అతడు ఉండిఉన్నాడు. ద్రష్టయొక్క 'దర్శన - దృశ్య' రహితమగు శుద్ధ స్వరూపము అనుభవమునకు మాత్రమే గోచరించగలదు. అట్టి " సర్వమునకు ఆవల, సర్వమునకు కారణమై” యున్న ద్రష్టయొక్క నిత్యసత్యస్వరూపమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం త్రిపుటియందు అంతటా వ్యాపించియున్నది.
II. మననరహిత శుద్ధచైతన్యము : ఈ చిత్తము ఒక స్థానమునుండి (లేక విషయము నుండి) మరొక స్థానమునకు వెళ్లుచున్నప్పుడు, ఆ రెండిటి మధ్యగల చిత్తము యొక్క జడత్వరహితమగు శుద్ధస్వరూపము ఉన్నది.
Page:637
ఆ శుద్ధ స్వరూపమే చైతన్యము(తెలుసుకొంటున్నది). అదియే చేత్యము (తెలియబడునది) కూడా. బ్రహ్మజ్ఞానులగు మహనీయులు ఎల్లప్పుడు ఆ శుద్ధ చైతన్య స్వరూపులై వెలయుచు, భేద రహితంగా ఆయా కర్మవిషయములను నిర్వర్తిస్తున్నారు. ఓ రామా! నీవు కూడా “నేను సర్వదా అట్టి శుద్ధ చైతన్య స్వరూపుడనే” అనే ఎరుకను వీడకుండా, ఆపై ఏది ఎట్లు ఉచితమో, అది అట్లే నిర్వర్తించు.
III. శుద్ధ చిత్తము : చిత్తము మననరహితం చేయి. లేదా, సర్వమననములకు అతీతమైన దృష్టి, అవగాహన కలిగియుండు. అప్పుడు మిగిలి ఉంటున్న శుద్ధ చిత్తమునకు, 'పరమాత్మ' అనుదానికి భేదమేమీ లేదు. సర్వదా శేషించి ఉంటున్న 'అనుభవాత్మకసత్త'యే పరమాత్మ స్వరూపము.
ఓ రామచంద్రా! జాగ్రత్-స్వప్న సుషుప్త రహితమై, చిత్తవృత్తి రహితమైనట్టి 'శుద్ధచిన్మాత్రమే’ నీ యొక్క నా యొక్క ఈ సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపము. కాబట్టి నీవు సర్వదా అట్టి చిద్వస్తు - స్వరూపుడవై ఉండెదవుగాక! నాయనా! నీవు ఈ జడత్వమంటూ ఏదీ లేనివాడవు. సర్వమును త్యజించి సమాధిని ఆశ్రయిస్తావా? లేక ఈ ప్రాపంచిక ద్వైత వ్యవహారములు నిర్వర్తిస్తూ ఉంటావా? అది నీ ఇష్టం. కాని ఉభయ సమయములందు కూడా "నేను సర్వదా చిదనస్వరూపుడను. నిష్కళంకవృత్తిరహిత - శుద్ధ చైతన్యమే నేను” అను భావనమాత్రం వదలవద్దు. వదలవలసిన
పనేమీ లేదు కూడా!
శ్రీ రాముడు : తండ్రీ! మరి మాకు ఈ దుఃఖాదులు వచ్చిపడుచున్నాయి కదా? వీటిలో తగుల్కొనకుండా ఉండేదెట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : పరమార్థదృష్టితో పరిశీలిస్తే, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏదీ ప్రాప్తించుటలేదు, నశించుటలేదు. మరి ఈ దుఃఖాదులు ఆశ్రయించవలసిన పనేమున్నది? విచారణ లేకపోవుటయే అన్ని అనర్థములకు మూలకారణం. ఆత్మ ఈ దేహమునందు ఏదీ వాంఛించుటలేదు, త్యజించుటలేదు, ద్వేషించుటలేదు. కాబట్టి నీవు ఇచ్ఛారహితుడవై, ప్రశాంత చిత్తుడవై, నశ్వరమగు ఈ దేహాదులందు ఏమాత్రం తగుల్కొనకుండా ఉండు. "నేను ఈ దేహాదులందు, దృశ్యములందు లేను. నా యందు ఇవి లేవు. నేను వ్యవహరించుచున్ననూ, లేక సమాధిని ఆశ్రయిస్తున్ననూ సర్వదా స్వస్థుడనే. నిశ్చింతుడనే” అను మననమును ఆశ్రయించు.
ఒకనికి భవిష్యత్తులో నిర్మించబోయే నగరంలోని ఒక ఇంటిలో చేయవలసినదేమైనా ఇప్పుడుంటుందా? అప్పటి అందలి పదార్థముల గురించి ఆసక్తి అనవసరమైనదే కదా! అదే విధంగా చిత్తవృత్తుల నుండి విడివడి ఉండు. ఈ చిత్తవృత్తులందు నీకు ఎట్టి ఆసక్తి ఉండవలసిన పనేమీ లేదు. సదా, సర్వదా, సత్స్వరూపమగు ఆత్మయందే నీవు నిష్ఠ కలిగి ఉండెదవుగాక! ఎప్పుడో చాలాకాలం క్రితం ఎక్కడో తారసపడి, కొద్దిసేపు నీతో సంభాషించి, తనదారిన తాను వెళ్లిపోయిన ఒక అపరిచిత వ్యక్తి ఇప్పుడు నీ దృష్టికి ఎట్లా ఉంటాడో, ఈ వర్తమాన దృశ్య వ్యవహారము పట్ల ఇప్పటికిప్పుడు కూడా అట్టి దృష్టినే సంతరించుకొనియుండు. ఎందుకంటే ఈ వర్తమానము యొక్క భవిష్యత్ పరిణామము అదే కాబోవుచున్నది. ఇదంతా అసత్తుల్యముగాను, కొయ్య శిలల
Page:638
వలె స్వల్పవిషయములు గాను గాంచుచూ ఉండు. ఈ మానవులు తమ దృష్టిని శుద్ధ పరచుకోకుండా పదార్థజాలములోకి ప్రవేశించుట చేతనే సకల అనర్థములను పొందుచున్నారు. కాస్త ఆత్మదృష్టి కలిగి, వివేచించి చూస్తే ఇక్కడంతా అసారమే శేషిస్తోంది. కనుక అచిత్తత్వమునే బుద్ధిమంతులు అలవాటు చేసుకొంటున్నారు.
రాతియందు జలం ఉంటుందా? జలంలో అగ్నికణం దాక్కోగలదా? అట్లాగే, ఈ జీవాత్మయందు ఆత్మకన్న వేరైనదేదీ ఉండజాలదు. ఇక పరమాత్మయందు 'జగత్తు' అనబడునది ఎట్లా ఉంటుంది చెప్పు? ‘చిత్తము’ అనబడునది కూడా జీవాత్మయందుగాని, పరమాత్మయందుగాని ఆ రెండిటికి వేరుగా లేదు. అవిచారదృష్టితో చూచినప్పుడు మాత్రమే “ఇదియే చిత్తము” అనబడేదొకటి ఆత్మకు వేరైనదాని వలె తోచటం జరుగుతోంది. విచారణాదృష్టితో చూచినపుడు చిత్తమనునదే ఉండజాలదు. “ముగ్గురు రాజకుమారులున్నారు. ఇద్దరింకా పుట్టనే లేదు. ఇక ఒకరింకా ఎప్పటికో తల్లి గర్భంలో ప్రవేశించ వలసి యున్నది .....” అను వర్ణనవలె, మొదలే లేనట్టి చిత్తముచే చేయబడు కార్యమంతా అకృతమే అయి ఉన్నది.
ఓ రాఘవా! నీవు చిత్తము యొక్క అస్థిత్వమును నిష్కారణంగా నమ్మి "అయ్యో! ఇక నేను ఈ చిత్తమును త్యజించేదెట్లా?” అని వాపోవుచూ, అకారణంగా, ఆత్మస్థితి నుండి చ్యుతి పొందకూడదు సుమా! ఈ జనులు దేనినైతే 'చిత్తము' అని పిలుస్తున్నారో, అట్టిదానికి పరమైనట్టి “సుఖస్థితి” (A state beyond) యందు సర్వదా ఉండియుండుము.
ఆత్మను ఏమరచుటచే “చిత్తము” అనేది అనుభవమగుచున్నది కనుక "ఈ చిత్తము మిక్కిలి అనాత్మభూతము" అని విజ్ఞులు అంటూ ఉంటారు. అట్టి చిత్తవృత్తిని అనుసరిస్తూ, “ఇది ఉండనే ఉన్నది. మేము దీనిని తొలగించుకునేది ఎట్లా?” అని తలచుచు రోజులు గడపువారు లేని దయ్యమును ఊహించుకొని గజగజ వణకువారే అవుతారు. మా దృష్టిలో వారు అల్పమైన అవగాహన కలవారు మాత్రమే. నీ చిత్తమును ఇట్లు సంబోధించు"ఓ చిత్తమా! స్వస్వరూపమగు ఆత్మయే అయి ఉన్న నాకు వేరుగా నీవెక్కడున్నావు? మొదలే లేనట్టి నిన్ను నిరోధించటమేమిటి? నేను ప్రియత్వముతో కూడుకొని, సంకల్పములను ఆశ్రయిస్తు న్నప్పుడు అట్టి నా కార్యక్రమమునే ‘చిత్తము' అని అంటున్నారు. నేను సంకల్పించటం జరిగితే నీవు ఉంటావు. నా సంకల్పములకన్నా నీవు వేరు కాదు. కాబట్టి ఓ చిత్తమా! నిన్ను లేనిదానిగా నేను నిర్వచిస్తున్నాను. నిరంతరం ఈ 'చిత్తము' అనుదానిని దూరమునుండే అనాదరిస్తూ ఉండదలిచాను!”
కనుక రామా! ఈ చిత్తము విషయంలో, ఒక 'మట్టి విగ్రహం' లాగా అచంచలంగా ఉండు. సర్వదా ఇచ్ఛారహితుడవై ప్రశాంతముగా ఉండటం అభ్యాసవశంగా నిర్వర్తించు.
ఓ రాఘవా నీవు వైరాగ్యప్రకటన చేస్తున్నప్పుడు ఈ చిత్తము గురించి అనేక విశేషాలు చెప్పావు. బాగానే ఉన్నది. కాని, యథార్థానికి ఈ చిత్తము అనేదేదీ లేదు. “మరి కనిపిస్తోంది కదా?” అంటావా? అపరిపక్వమైన మిథ్యాదృష్టికి మాత్రం అది అట్లా అగుపిస్తోంది. ఆకాశంలో
Page:639
మేఘములు రూపుదిద్దుకొన్న తీరు చూచి "అక్కడ ఒక తోట ఉన్నది. ఆ ప్రక్కనే ముఖద్వారం” అని ఊహను జోడించి గాంచుటవంటిదే ఈ చిత్తము విషయం కూడా! కనుక ఈ చిత్తము యొక్క మిథ్యాత్వము నిశ్చయించుకున్నవాడవై, శిలాపురుషునివలె నిశ్చలంగా ఉండు.
ఆత్మానుభవదృష్టికి చిత్తము లేనేలేదని మరల ఒక్కసారి ప్రకటిస్తున్నాను.
ఓ ప్రియరామచంద్రా! నీవు యథార్థానికి చిత్తరహితుడవే సుమా! ఓ సర్వ జనులారా! మీరంతా ‘చిత్తము' అనే కల్పనకు బద్ధులు కానట్టి చైతన్యాత్మానంద స్వరూపులే! మరి అనర్థములకు హేతుభూతమైన ఈ చిత్తముతో కూడి ఎందుకు దుఃఖించుచున్నారో చెప్పండి?
'అసత్తు’ అయిన ఈ చిత్తమునకు వశీకరణమైపోతున్న ‘అదృఢబుద్ధి” నుండే వజ్రపాతముతో సమానమైన అస్వస్థత’ అంతా వచ్చిపడుతోంది.
ఓ రామా! అట్టి చిత్తమును తొలగించగా, ఇకప్పుడు మిగులుచున్నదేమిటి? నీ యొక్క స్వస్వరూపమే కదా! అట్టి ఆత్మస్వరూపముననే సుస్థిరుడవై ఉండు.
ఇంతమాత్రములో కష్టమేమున్నది చెప్పు? అందులకై "ఆత్మస్వభావమును మననము చేయుట” అను ఉత్తమ ఉపాయమును పొంది ధ్యాననిష్ఠుడవై ఉంటూ ఉండు. కొంతకాలానికి ఆత్మభావన అకృత్రిమముగా, అప్రయత్నంగా సుస్థిరం కాగలదు. "పరమాత్మయే ఈ కనబడే సర్వజీవులుగా, సర్వవిశేషములుగా ప్రదర్శనమగుచున్నారు".... అనే మననమును సర్వదా అవధరించు.
“అసత్తే” అగు చిత్తమును అనుకరించుచు ఆకాశమును భేదించాలని అనుకోవటం మా దృష్టిలో మూర్ఖత్వమే! అట్టి మూర్ఖత్వమునకు ధిక్కారమగుగాక! ఓ జనులారా! మొట్టమొదట మీరంతా తత్త్వబోధయందు కుశలురు కావాలి. తద్వారా మనోనాశనము సంపాదించండి. అనగా అసత్ పదార్థములను మననము చేయటం తగ్గించండి. ఆ తరువాత నిర్మలాత్ములై ఈ సంసారమును దాటివేయండి. నాయనలారా! మేము ఎంతో పరిశీలించిన తరువాతయే ఈ వాక్యములు మీ ముందు ఉంచుచున్నాము. నిర్మలమగు ఆత్మయందు 'మనస్సు' అనబడు మాలిన్యమునకు ఏ మాత్రం చోటులేదు. అందుచేత, నా మాట వినండి. ఈ నా వాక్యములు విశ్వసించి, అనుకరించి ఆత్మ యందే సుస్థిరులై ఉండండి. ఆ తరువాత ఏది ఏట్లో అది అట్లే ఉండుగాక, అగుగాక! మీరు మాత్రం ఆత్మస్థితి నుండి చ్యుతులు కావద్దు. సర్వదా అచ్యుతులై వర్ధిల్లండి!
Page:640
X. ప్రకరణ సమీక్ష 1. సమీక్ష
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! మనం ఈ 'ఉత్పత్తి ప్రకరణము'లో విచారణ చేసిన విశేషాలన్నీ క్లుప్తంగా సమీక్షించుకుందాం! విను.
ఈ మానవులలో అనేకులు జన్మించినది మొదలు మరణించే వరకు తుచ్ఛమైన లక్ష్యములతో, అర్థం లేని ఆశలతో, అల్పమైన జ్ఞానముతో బ్రతికివేయటం జరుగుతోంది. స్వల్ప సంఘటనలకు కూడా విచలితులగుచున్నారు. ఇంద్రియ విషయముల పట్ల వ్యామోహితులగుచున్నారు. అవిచారణచే కాలయాపన చేస్తున్నారు. అందుచేతనే 'సంసారము' అను వృద్ధమాంత్రికురాలు ఈ జీవులను తన వశం చేసుకొని, తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తోంది. ఫలితం? అంతు లేని దుఃఖపరంపరలు. 'పరమాత్మ -ఆనందము’ అనునవే స్వరూప, స్వభావములుగా కలిగి యున్న ఈ జీవుడు దుఃఖించుటయా? ఇతనికి కర్మబంధ మెక్కడిది? మోహ మెక్కడిది?
అవిద్యను నిరోధించటం ఎట్లా? - - పుట్టిన తరువాత, ఈ మానవుడు, కాస్త బుద్ధి వికసించగానే, సత్సంగతత్పరుడై ఉండాలి. "నిరంతర ప్రవాహశీలము" వంటి ఈ అవిద్య అనబడే నదీజలవేగాన్ని నిరోధించాలంటే ఈ రెండూ అవసరమై ఉన్నాయి1) శాస్త్రాభ్యాసం (సాధనలతో సహా) 2) సత్సాంగత్యము
ఈ రెండిటి ప్రభావం చేతనే జీవునకు, "ఏది గ్రహించాలి? ఏది త్యజించాలి?" అనే వివేకం ఉత్పన్నమగుచున్నది.
అప్పుడాతడు “శుభేచ్ఛ” అనబడే మొదటి భూమికను పొందుచున్నాడు.
అట్టి శుభేచ్ఛ వివేకముతో కూడుకొని బలపడగా, క్రమంగా అతడు “విచారణ" అనే రెండవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. సత్కర్మలు, ఉత్తమ ఆత్మజ్ఞానం ... ఈ రెండు బండికి రెండు చక్రముల వంటివి. అట్టి ప్రయత్నశీలుని చిత్తములో జన్మజన్మలుగా పేరుకొని తిష్ఠవేసుకొనియున్న 'దుష్టవాసనలు’ బయటకు పంపివేయబడతాయి. అప్పుడు ఏర్పడే నిరంతర పరమార్థభావనచే మనస్సు సూక్ష్మత్వం పొందుచున్నది. అతడు 'సూక్ష్మగ్రాహి' అవుతాడు.
అప్పుడు ఈ జీవుడు 'తనుమానస' అని చెప్పబడే మూడవ భూమికలో ప్రవేశించుచున్నాడు.
క్రమంగా అతనియందు భేదభావము సన్నగిల్లుచున్నది. "మట్టితో రచించబడిన యుద్ధ దృశ్యములో మన సైన్యమేమిటి? శత్రుసైన్యమేమిటి? అంతా మట్టియే కదా!” అను ఎరుక ఉండనే ఉంటుంది చూచావా? అట్లే ఈ మూడవ భూమికలోని వానికి “నేను-నాది-అతడు-నీవు-నీ
Page:641
గుణములు-నా పదార్థములు”... ఇవన్నీ మొదలంటా లయించిపోతాయి. సమ్యక్ పూర్వకమైన (Unity Oriented) సమగ్రమైన (Comprehensive) అవగాహన ఉదయించి, బలం పుంజుకుంటుంది. అప్పుడాతడు “సత్త్వాపత్తి" అను నాలుగవ భూమికను పొందినవాడగుచున్నాడు.
ఆత్మజ్ఞానం వికసిస్తూరాగా ఆ యోగియందు వాసనలు సన్నగిల్లి, సూక్ష్మత్వాన్ని పొందుతాయి. వాసనలే అన్నిటికీ మూలం. ఈ అసత్యవస్తువులందు ఏర్పడుచున్న ఆసక్తి, ఈ జన్మపరంపరలు ... ఇవన్నీ వాసనల నుండే ఉద్భవిస్తున్నాయి. వాసనల రూపమే ఆసక్తి. కీలుబొమ్మను ఆడించినట్లు, ఆసక్తులు ఈ జీవుని తమ ఇచ్చ వచ్చినట్లు ఆడిస్తున్నాయి. అయితే నాలుగవ భూమికయగు సత్త్వాపత్తిని ఆశ్రయిస్తూ ఉండగా కొంతకాలానికి ఈ జీవుడు అకృత్రిమమైన అనాసక్తిని తనయందు పెంపొందించుకొంటున్నాడు.
అట్టి అనాసక్తుడు ‘అసంసక్తుడు' అను ఐదవ భూమిక యందు ప్రవేశిస్తున్నాడు.
అట్టివాడికి కర్మల చేత గాని, ఆ కర్మల ఫలితముల చేతగాని సంబంధము ఉండదు. అవి అతనిని బంధింపజాలవు. దీర్ఘకాలంగా వాసనలను సూక్ష్మం చేస్తూ, బాహ్యపదార్థములకు సుదూరుడు అగుచూ ఉంటాడు. స్వయంగా, అంతర్ముఖ వృత్తిచే "నేను జీవుడనుగాను. నిర్జీవుడను గాను. సర్వదా బ్రహ్మమునే అయి ఉన్నాను. ఈ శరీరము మొదలైనవి నేను కాదు. ఈ పదార్థ జాలము నా యందు లేదు. నేను ఈ పదార్థజాలమందు లేను. నన్ను బ్రహ్మమునుండి వేరుపరచు కారణము గాని, కార్యముగాని ఏ సమయమందును లేనేలేవు”, అను రూపముగల బ్రహ్మాకార స్వభావమును సంతరించుకొంటున్నాడు. అట్టి భావనా దృఢత్వం చేత అతనియందు బాహ్యపదార్థవిస్మృతి రూపమైన ఒకానొక 'అతీత స్థితి' ఏర్పడుతోంది.
అట్టివాడు సమాధినిష్ఠుడై ఉండవచ్చు. లేదా, 'అసత్యములే' అయి ఉన్న ఈ స్త్రీ పుత్రాది ప్రాపంచక వస్తువుల మధ్య యథాతథంగా తదితరులులాగానే ఉండవచ్చు. “స్నానం, భోజనము” మొదలైన బాహ్యక్రియలు చేస్తూ ఉండవచ్చు లేక మానవచ్చు. ఎప్పుడైతే మనస్సు 'సూక్ష్మత్వం' చెందినదో ఇక అతడు 'బ్రహ్మా హమ్' అను భావన యొక్క అభ్యాసంచే, జన్మమృత్యువులతో సహా సర్వ సంఘటనలకు వేరైన స్వభావసిద్ధ స్థితిలో ఉండి ఉంటాడు. 'స్వధర్మము’ అను ‘ప్రవర్తనను’ తదితరుల అనుకూలతను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించినప్పటికీ, వాటి ప్రయోజనములపట్ల ప్రీతి, మమకారాదులు ఉండవు. వాసనలు సన్నగిల్లినవాడు, ఆయా సంఘటనలను చూస్తున్నప్పుడు ఒక పసిబాలుడు ఈ ప్రపంచమును చూస్తున్నట్లు చూస్తాడు. అప్పుడే మేల్కొన్నవానివలె, నిర్లిప్తమానసిక స్థితిని ఆశ్రయించి ఉంటాడు.
వీరిలో కొందరు తమ దైనందిన సామాన్య విషయములైవున్న స్నాన - అన్నపానాదులను కూడా ఇతరుల ప్రేరణచే మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటారు.
ఏది ఎట్లైనా ఉండవచ్చు. అట్టివానికి దేనిపట్ల కూడా సంగముగాని, అసంగముగాని ఉండదు. “ఒక యంత్రముచే త్రిప్పబడుచున్న చక్రము” వలె ప్రవాహపతితమైన ఆయా క్రియా వ్యవహారములు
Page:642
నిర్వర్తిస్తూ ఉంటాడు లేక ఏదీ నిర్వర్తించక పోవచ్చు! లేక, అన్నీ ఉత్సాహంతో నిర్వర్తిస్తూ ఉండవచ్చు కూడా! కానీ అవి అతనిని స్పృశించజాలవు.
ఏది ఎట్లా జరుగుచున్నప్పటికీ తాను మాత్రం బాహ్యపదార్థవిస్మృతి’ , అను ఒక చమత్కారమైన రూపము గల “ఉపరతి" స్థితియందు ఉంటాడు. అభ్యాసమే దృశ్యము నుండి ఉపరతికి (For withdrawal from involvement) ఉపాయం కదా!
తన 'స్వస్వరూపము' నందు నిలకడ పొందేవరకు ఆ యోగి శాస్త్రవిహితంగానో, లేక ఉత్తమ ఆచరణపూర్వకంగానో అభ్యాసం మాత్రం చేస్తూనే ఉంటాడు. ఇప్పటి అతని లక్ష్యము "స్వస్వరూపము నందు సంస్థితుడై ఉండుట" మాత్రమే. అంతే గాని, బాహ్యము నుండి ఏదియో పొందుట కాదు.
పదార్థాభావని - ఇట్లు సూక్ష్మమగు 'బ్రహ్మము' తో తన చిత్తమును ఐక్యపరచిన యోగి అసంసక్త భావన కలవాడై కొంతకాలానికి "పదార్థములను కించిత్ కూడా భావించకుండుట” అనబడు ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. సర్వ భావములకు అతీతత్వము, మౌనస్థితులను అభ్యసిస్తూ వస్తాడు.
జీవన్ముక్తుడు - ఆ విధంగా పదార్థములను, సంఘటనలను, వివిధ స్వభావులగు జీవులను భావన చేయక, బ్రహ్మము నందు మరల మరల తన చిత్తమును లయంచేస్తూ ఉండగా, కొంత కాలమునకు అతనియందు ఆత్మవిషయమై ఉత్తమమైన ఏకాగ్రత ఏర్పడుచున్నది. ఇతరుల ప్రేరణచే, లేక ఇతరుల శుభము కొరకు మాత్రమే కొన్ని ప్రాపంచిక వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ, అతని అంతరంగము మాత్రం నిర్వికారంగా, ప్రశాంతంగా, ఏదీ కోరకుండానే ఉంటూ ఉంటుంది. చమత్కారం చూడు. ఏదీ తాను కోరకుండానే, ఆయా విషయములందు వ్యవహరిస్తూ ఉంటాడు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతని అతీతస్థితి - - మౌనస్థితి యథాతథమై ఉంటాయి.
దీనిని 'దృశ్య-అభావనస్థితి' అని కూడా అంటూ ఉంటారు.
అట్లు 'దృశ్యాతీత’ స్థితిలో ఉంటూ ఉండగా, ఆ యోగి ఒకానొక తరుణంలో స్వయముగా ‘తురీయుడు’ అగుచున్నాడు. అనగా “నేనే సర్వేసర్వత్ర అందరియందు, అంతట, సర్వదా నిర్వికారముగా వ్యాపించియున్నాను. నేను సర్వమునకు చెందినవాడను. దేనికీ చెందనివాడను కూడా” అను అనుభవంలో ఉంటున్నాడు.
అట్టివానిని మనం “జీవన్ముక్తుడు” అని అంటున్నాం.
అతడు అభిలషితమైన వ్యవహారములు లభించినప్పుడు ప్రసన్నుడుకాడు. “ఇవి ప్రాప్తించలేదు” అని దుఃఖించడు. "నేను జీవించాలి. లేదా, మరణించాలి" అని కోరుకోడు.
“నేను జన్మమృత్యువులు, అద్యంతములు లేనివాడను” అను భావన నుండి ఏమాత్రం ‘చ్యుతి’ పొందడు. ఇచ్ఛారహితుడై ప్రారబ్ధకర్మానుసారంగా ప్రాప్తించిన దానిని మాత్రం అనుభవిస్తూ ఉంటాడు.
దుఃఖాదులు ఏర్పడుచున్నది 'భ్రమ’ చేతనే - - ఓ రామా! నీవు ఇప్పటికే అత్యంత చిత్తనైర్మల్యమును పొందావు. తెలుసుకోవలసిన ప్రత్యగాత్మను తెలుసుకుంటున్నావు. కనుకనే స్థిరాస్థిరములను
Page:643
విభాగింపగలుగుచున్నావు. ఈ ప్రపంచవిషయములను సమగ్రంగా పరిశీలించి ఉన్నావు కాబట్టే వైరాగ్యప్రకటనంలో ఉత్తమమైన అభిప్రాయాలు వెలిబుచ్చగలిగావు. 'వైరాగ్యము' అనేది వాసనలు సన్నగిలుటచేతనే ఏర్పడుచున్నది.
కనుక, ఇక నిరుత్సాహమెందుకు? ఎల్లవేళల సమస్థితుడవై ఉండుము. ఏ వ్యవహారమైనప్పటికీ “లోకహితము” దృష్టిలో పెట్టుకొని నిర్వర్తిస్తూ ఉండు.
నీవు స్వతహాగానే సర్వదుఃఖరహితమగు చిదాత్మ స్వరూపుడవు.
ఇక ఎన్నటికీ, హర్ష-శోకములు పొందకుండెదవుగాక! ఏ ఒక్కక్షణంలోను ఈ భౌతిక శరీరాదులు నీ రూపము అయి ఉండలేదు. స్వయంప్రకాశము, నిర్మలము, సర్వవ్యాపకము, నిత్యము అయిన ఆత్మస్వరూపమే నీవు. ఈ శరీరాదులు ఉన్ననూ, లేకున్ననూ వాటితో నీకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆత్మయే స్వరూపముగా గలిగినట్టి నీకు దుఃఖాదులు గాని, విషయ సుఖములుగాని, జననమరణములుగాని ఎట్లా ఉంటాయి? “నాకు జనన మరణములు లేవు” అనునదే వాస్తవమైన జ్ఞానం.
“లేదు. నేను పుట్టాను. చావబోవుచున్నాను. నాకు ఏవేవో లేవు; ఎన్నో లేనివి నేను పొందవలసి ఉన్నది ; కొన్ని తొలగించుకో వలసియున్నది - ఎప్పటికో, ఏదో పొంది, ఇక ఆపై పూర్ణుడను కావలసి యున్నది:” అను రూపములు గల భ్రమలన్నీ కట్టిపెట్టు.
ఇక, “నా గురించి అట్లా ఉంచు. నేను జ్ఞానము ఆర్జించుటచే జన్మమరణాదుల దుఃఖం నశిస్తుంది. కాని, నా బంధువుల విషయమై దుఃఖము నశించేదెట్లా?”... అని సంశయించకూడదు సుమా! ఎందుకంటావా? నీవు బంధు మిత్ర రహితమగు శుద్ధాత్మస్వరూపుడవు కదా! అట్టి పరిశుద్ధ - ఆత్మ వస్తువుకు బంధువులేమిటి? దుఃఖములేమిటి? మిత్రులేమిటి? చింతలేమిటి? ఈ బాలుర కేరింతలు త్యజించు. అద్వితీయమగు పరమాత్మకు లేనిపోని బంధనవ్యవహారము అజ్ఞానం చేత ఆపాదించవద్దు. ఎవరైతే “నా బంధువులు-నా వాళ్లు" అని నీవు తలచుచున్నావో, వారి శరీరముల గురించి గాని, లేక వారి వాస్తవస్వరూపమగు ఆత్మ గురించిగాని నీవు శోకించవలసినపని ఏ మాత్రం లేదు. ఈ దేహము, పృథివి మొదలైనవి పంచభూతముల పరమాణు సమూహముచే నిర్మించబడినవే కదా! ఇది సర్వదా దేశ కాల భేదములచే 'పరివర్తనశీలము' అయి ఉన్నది. అనుక్షణం పరివర్తనమయ్యేదానికి దుఃఖించటమేమిటి? అట్లాగైతే ఈ శరీరములో ప్రకృతి సిద్ధంగా నిత్యమూ ఏర్పడే మార్పు చేర్పులకు స్పందిస్తూ ప్రతి రోజు ఒక్కొక్క బంధువు పేరు చెప్పి కాసేపు దుఃఖిస్తావా? కాబట్టి అనివార్యమగు శరీరాదుల పరిణామశీలత్వము గురించి దుఃఖించటం ఎందుకు? ఇక ఆత్మ విషయానికి వస్తే, ఇది ఉత్పన్నమగుట లేదు. నశించుటలేదు.
ఓ మిత్రులారా! మీరంతా వాస్తవానికి నాశరహితులై ఉండగా, "నేను మరణించుచున్నాను” అను భావన ఎందుకు పొందుచున్నారో చెప్పండి? మృత్యురహితమగు ఆత్మకు దోషం అంటగట్టకండి.
Page:644
కుండపగిలితే, ఆ కుండలోని ఆకాశం కూడా బ్రద్దలగుచున్నదా? లేదే. ఘటాకాశం (space within the pot) నకు మహాకాశం (Totality of space) నకు తేడా ఏమున్నది? మహాకాశమును ఘటం వేరుపరచగలదా?
“ఘటాకాశము” అని అసలు ఉన్నదెక్కడ?
ఆత్మకు వేరుగా ఈ జీవుడెక్కడ ఉన్నాడు?
లేని విషయం గురించి దుఃఖించుట ఏమిటి?
'దుఃఖము' అనుదానిని మనస్సు ఆశ్రయించుచున్నప్పుడు నిత్య - - అనిత్య, సత్య - అసత్య విభాగము చేయు దృష్టిని అలవరచుకోవటం ఆవశ్యకం.
అభిలాషను త్యజించాలి - సూర్యకాంతి విశాల ప్రదేశము నందు ప్రసరించుటచే, మృగతృష్ణలో జలతరంగముల కదలికలు స్ఫురిస్తున్నాయి కదా! ఆ మృగతృష్ణాస్రవంతి వినాశనమైనంత మాత్రం చేత సూర్యరశ్మి కోల్పోయేది ఏమైనా ఉన్నదా? లేదు. ఈ శరీర నాశనము కూడా ఆత్మకు సంబంధించినదే కాదు.
నాయనలారా! అసలు నిరర్థకమూ, భ్రాంతి రూపకము అయిన పదార్థములందు మీకు అభిలాష ఎందుకు ఉదయిస్తోందో చెప్పండి?
కొంచెము సమాలోచన చేయండి - - ఆత్మయే సర్వవస్తుస్వరూపమై ఉండగా ఇక వాంఛించవలసిన రెండవ పదార్థం ఎక్కడున్నది? వినేది, చూచేది, స్పృశించేది, ఆస్వాదించేది. ఆఘ్రాణించేది ... అంతా ఆత్మయే సుమా! ఆత్మకు అన్యమైన వస్తువంటూ ఎక్కడా ఏదీ లేదు. ఆకాశమునందు శూన్యత్వం ఉన్నట్లే ... సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సుప్రసిద్ధుడు అగు ఆ పరమాత్మయందు ఈ "స్పర్శ” మొదలైన శక్తులన్నీ ఉన్నాయి.
నీ ఈ భౌతిక శరీరము ప్రజ్ఞాస్వభావుడవగు నిన్ను నిర్వచించగలదా? లేదు.
అట్లాగే, ఈ శబ్ద - స్పర్శాది శక్తులన్నీ కలసికూడా పరమాత్మను నిర్వచించలేవు.
జీవుని ఆశ్రయించుకొని మాత్రమే 'శరీరము' ఉంటున్నట్లు ఈ శక్తులన్నీ పరమాత్మ నుండి బయల్వెడలి, పరమాత్మను ఆశ్రయించుకునే ఉంటున్నాయి.
అభిలాషయే ‘వాసన’ యొక్క స్వరూపం. ఈ త్రిలోకాలలో కనిపిస్తున్న ఉపాధులన్నీ సాత్విక - రాజస-తామసముల ఆయామిశ్రమములచే ఏర్పడి ఉన్నాయి. అయితే, ఇదంతా చిత్తము నందే ఉత్పన్నమగుచున్నది.
వాసన క్షయిస్తే మనస్సు నశిస్తోంది - - మనస్సు నశిస్తే, కర్మకు నివాసభూతమైన 'మాయ' కూడా స్వయంగా నశిస్తోంది.
అందుచేత రామా! ఈ సంసారచక్రమును నడుపుచున్న 'వాసన' అనే త్రాడును నీవు ప్రయత్నపూర్వకంగా వివేకబలంచే ఛేదించివేయి. ఎరుగబడనంతవరకు, వాసనారూపమగు ఈ
Page:645
మాయ గొప్పమోహమును కలుగజేయగలదు. ఎరుగబడిందా, ఇది అనంత-సుఖమునే ప్రసాదించ గలదు. అంతేకాకుండా, బ్రహ్మసాక్షాత్కారం కూడా ప్రాప్తింపజేయగలుగుతుంది.
ఈ ‘మాయ’ వచ్చేది ఎక్కడి నుండి? -
ఆగతా బ్రహ్మణోభుక్త్వా సంసారమిహలీలయా
పునర్ద్రహ్మైవసంస్కృత్య బ్రహ్మణ్యేవ విలీయతే |
ఈ ‘మాయ’ బ్రహ్మమునుండి ఉద్భవిస్తోంది. లీలామాత్రంగా 'సంసారము' ను స్మరించుచున్నది. అనుభవించి, మరల స్వలీలయగు బ్రహ్మవిద్యచే సంసారనాశనమొనర్చుచున్నది. బ్రహ్మమును ఎరుగుచు, బ్రహ్మమునందే లీనమగుచున్నది. ఆహాఁ! ఎంతటి చమత్కారం ! మంగళస్వరూపుడు, రూపరహితుడు, అప్రమేయుడు, నిరామయుడు అయి ఉన్న పరబ్రహ్మనుండి, నిప్పు నుండి
నిప్పురవ్వలులాగా ఈ ప్రాణికోట్లు ఉత్పన్నము లౌతున్నాయి.
ఆకులో ఈనెలు
జలంలో తరంగాలు
బంగారంలో ఆభరణాలు
అగ్నియందు ఉష్ణము ప్రకాశము
ఇవన్నీ ఎట్లాగైతే అంతర్భాగంగా ఉన్నాయో, అట్లాగే ధ్యాన రూపమును దాల్చుచున్న ఆ పరమాత్మ యందు ఈ ముల్లోకములు ఉన్నాయి.
ఆయన యందే ఈ జగత్తు ఉత్పన్నమైనది. ఆయన యందే స్థితి కలిగి యున్నది. ఆయన యందే లయిస్తోంది. అయితే ఏం? ఆయనయందు 'జగత్తులు' మొదలైనవేవీ లేవు. ఉండబోవు కూడా!
అందుచేత ఈ జగత్తు పరమాత్మయే అయి ఉన్నది. ఆ పరమాత్మయే సమస్త ప్రాణికోట్ల యొక్క అంతరాత్మయగు 'బ్రహ్మము' అని చెప్పబడుతోంది. ఆతనిని ఎరిగినవాడు ఈ జగత్తంతా ఎరుగుచున్నాడు.
అంతేకాదు, ఎరుగుచున్నది కూడా అతడే - అతనికి నామరూపాలు లేవు. అయినప్పటికీ అనంతాకారము కలిగిన ఆ పరమాత్మకు శాస్త్రములు రచించటానికి, శిష్యులకు బోధించటానికి (వ్యవహారార్థం) “చిత్తు-బ్రహ్మము-శివుడు-విష్ణువు-ఆత్మ-పరమాత్మ ఇత్యాది అనేక పేర్లు తత్త్వజ్ఞులు కల్పించారు. అదంతా అపరిపక్వమైన అవగాహనగల శిష్యజనులను ఉద్ధరించుటకొరకే అయి ఉన్నది. అట్టి కల్పిత నామములు, రూపములు భవిష్యత్తులోకూడా తత్త్వజ్ఞులచే ప్రవచించ బడబోవుచున్నాయి.
శుద్ధసాక్షీతత్త్వము–బుద్ధి-జగత్తు - - జీవన్ముక్తులు సర్వదా “నేను సాక్షితత్త్వమును. నా స్వరూపము సర్వదా నిశ్చలమై, వికార రహితమై ఉన్నది. అది అట్లే ఉండబోవుచున్నది కూడా” అను ఎరుకయే కలిగి ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా దైవకృతంగా ఇంద్రియములకు ప్రియాప్రియములైన సంఘటనలు పొందటం జరిగినా, వాటియందు ఆసక్తిగాని, భావోద్రేకముగాని పొందరు. సర్వదా అవినాశియగు
Page:646
చిదాత్మయొక్క భావనను, అనుభవమును కలిగి ఉంటారు. అంతేగాని, సంసారస్వభావులు అగుటలేదు. వారు 'చ్యుతి' నుండి వెనువెంటనే నిశ్చల స్వరూపమగు 'అచ్యుతి' ని అవధరించుచున్నారు.
ఆకాశము కంటేకూడా అతి సూక్ష్మము, నిర్లిప్తము అయినట్టి ఆ చిదాత్మయందే ఈ జగత్తు ప్రతిబింబితమగుచున్నది. ఇది 'శుద్ధ సాక్షిస్వరూపదృష్టికి వేరుగా “సంకల్పములు-వికల్పములు, అహంకారములు - మమకారములు” మొదలైన చమత్కారములతో ప్రకటితమౌతోంది. అట్లు ప్రకటితమగుచున్నది ఏది? జగత్తా? జగత్తుజడమైనది కదా! -
జగత్తు
చైతన్యము
- బుద్ధి
1) సాక్షిచైతన్యము - జగత్తులమధ్య 'బుద్ధి' ప్రతిబింబించుచున్నది.
2) 'బుద్ధి' అనునది 'ప్రియము - అప్రియము' అను విభాగములు కలిగి ఉంటోంది.
3) ఈ బుద్ధి జగత్తువైపు ప్రసరించుచున్నంత వరకు జడత్వమును పొందుతోంది.
4) సాక్షి చైతన్యముయొక్క అవివేకదృష్టియే జగత్తు ;
“ఇదమ్ సర్వమ్ బ్రహ్మమ్” అనునదే వివేకము.
ఈ ‘బుద్ధి' .... లోభము, మోహము మొదలైన విషయములందు అవిచారణాపూర్వకంగా ప్రవేశించుచున్నది. అయితే బుద్ధి ప్రేరేపిత మాత్రం చేతనే కనిపిస్తున్న ఈ 'లోభమోహాలు’ అనబడేవాటికి స్వకీయమైన అస్థిత్వం లేదు. అందుచేత “అవి యథార్థానికి లేవు” అని చెప్పబడుతోంది. భ్రమచేత మాత్రమే ఉన్నట్లు కనబడుచు, భ్రమతొలగగానే లేకుండా పోయేవాటిని ‘ఉన్నాయి’, అనాలా?, ‘లేవు’ అనాలా? అయినను, అజ్ఞానదృష్టి ఉన్నంతవరకు ఈ లోభమోహాలు ప్రతిబింబించి, దుఃఖాదులు ప్రాప్తించటానికి కారణ భూతములౌతున్నాయి.
మూర్ఖత్వము త్యజించబడుగాక! - ఓ రామచంద్రా! 'దేశ కాల' రహితమైన నిర్వికల్ప స్వరూపమగు చిదాకాశమే నీ-నా రూపము, ఆకారము కూడా. అట్టి చిదాకశము (Pure-Realm of consciousness or awareness) నందు నీకు ఈ లజ్జ-భయ-విషాదములతో కూడిన మోహ మంతా ఎక్కడినుండి దాపురించుచున్నదో చెప్పు? దేహమే లేనట్టి నీవు అసత్యము అయి ఉన్న ఈ దేహమును ఆశ్రయించి ఉత్పన్నములగుచున్న ఆయాస్థితి గతులను చూచి దుఃఖించుటయా? దుర్బుద్ధితో కూడుకొన్న మూర్ఖత్వమే నిన్ను దుఃఖితుని చేయుచున్నదని గుర్తు చేస్తున్నాను.
Page:647
ఆత్మ - - చిత్తము దేహము - నాయనా! రామా! ఈ దేహము ఖండఖండములుగా ఛేదించబడుగాక! అఖండమగు చైతన్యమునకు భేదన-అభేదనములు ఉండనే ఉండవు. ఎవరైనా ఉన్నట్లు చూస్తుంటే, అది అజ్ఞానము చేతనేనని మేము గమనిస్తున్నాము. దేహము నశిస్తే “అజ్ఞాని యొక్క ఆత్మయే నశించుటలేదు” అని జనులు ప్రవర్తనలను ప్రకటించటం చూస్తూనే ఉన్నాము కదా!" ఇక జ్ఞాని గురించి వేరే చెప్పేదేమున్నది? సమ్యక్ దర్శి యగు (One who perceives equality, evenness and sameness everywhere, all times) జ్ఞాని యొక్క ఆత్మకు ఈ దేహ నాశనముచే కలుగు లోటుపాటు లేమి ఉంటాయి?
వాస్తవానికి ఈ చిత్తము స్వతంత్రమైనదేకాని, పరాధీనమైనది కాదు. అనగా? నీ చిత్తము నీ అధీనంలోనే ఉంటుందిగాని, ఎవరో పరాయివారి అధీనంలో కానేకాదు. ఇకదాని చంచలత్వమంతాస్వకీయమైన విషయ మననరూపమగు అభ్యాసవశంచేతనే సుమా!
అనగా, ఇది ఎక్కడినుండో, ఎవరిచేతనో నియమించబడుటలేదు. దాని గమనాగమనములు దాని అధీనంలోనే ఉన్నాయి. “దానిశక్తి 'ఇంతింత' అని చెప్పలేము” అని ఐందవోపాఖ్యానంలో చూచాము కదా! ఏ ఆశ్రయము లభింపజాలని 'సూర్యమార్గము (The orbit of Sun)' లోకూడా అది క్షణంలో పయనించగలదు. అట్టి చిత్తమునే మనం 'పురుషుడు' అని అంటున్నాం. మనం ఎవరినైనా, ఎందుకైనా, సంబోధించేటప్పుడు, దృష్టిలో పెట్టుకుంటున్నది చిత్తమునే గాని, ఈ దేహమును ఏమాత్రం కాదు సుమా! జనులు మాట్లాడుకునేది, వ్యవహరించేది, ప్రేమించేది, ద్వేషించేది ఈ చిత్తమునే. కాబట్టి చిత్తమే జీవుడు. ఈ పాంచభౌతిక - - దేహము జీవుడు కాదు. 'జీవించుట' అను కర్తృత్వమును ఈ శరీరమాత్రమునకు ఆపాదించుట ఉచితం కాదు.
ఆత్మ దేనిచేతనూ స్పృశించబడజాలదు - ఓ రాఘవా! ఒకడు జ్ఞాని కావచ్చు, లేక అజ్ఞాని కావచ్చు, దేహము ఉండవచ్చు, లేక నశింపవచ్చును. ఆత్మమాత్రం యథారీతిగా, ముల్లోకములందు అచంచలంగా ఉండియే ఉంటోంది. అంతేకాదు, స్వస్వరూపాత్మ ఈ ముల్లోకములకు ఈవలఆవల సర్వదా ఆక్రమించుకొని వెలుగొందుచున్నది.
ఈ దేహం నశించినంత మాత్రం చేత ఆత్మ నశించదు. దీనిని సందేహించువారు తమ ఉనికిని తామే సందేహించువారు అగుచున్నారు.
ఇక ఎదురుగా కనిపిస్తున్న ఈ సుఖ-దుఃఖాలన్నీ శరీరమునకే గాని, లేదా మనస్సుకే గాని.... అగ్రాహ్యమగు ఆత్మకు కానేకాదు. చిద్వస్తువగు ఆత్మ మనోమార్గముకంటే కూడా అతీతమైనది. ఆకాశము కంటే కూడా అత్యంత విస్తీర్ణంగా వ్యాపించియున్నది. అట్టి చిద్వస్తువు ప్రాపంచక దుఃఖముల చేత గాని, విషయసుఖముల చేత గాని ఎట్లా ప్రభావితం అవుతుంది చెప్పు?
సోది అడుగుట, ఆత్మశాంతికై ప్రార్థనాదులు చేయడం, చిత్రపటమును ఆవిష్కరించడం, సావత్సరీకములు జరపడం, మానసిక ఆహ్వానాదులు..... ఇవన్నీ ఈ అభిప్రాయము యొక్క దృష్టాంతాలు.
Page:648
“దేహా హమ్ - ఆత్మా హమ్" - - ఈ చైతన్యము అనేక జన్మలుగా అభ్యస్తమై యున్న వాసనలతో కూడుకొని ఉంటున్నది. అయితే ఈ 'వాసనలు' అనునవి “నేను ఈ దేహమును” అను భావన యొక్క పరిధిలో మాత్రమే ఉనికి కలిగి ఉంటాయి. ఒక సమయంలో ఈ చైతన్యము జ్ఞానమును ఆశ్రయించి, ఆ జ్ఞానబలంచేత తననుతాను ఎరుగుచున్నది. అప్పుడీ “దేహాం హమ్” భావనను త్యజించివేస్తోంది. తనయొక్క యథార్థ స్వరూపమైయున్న పరమాత్మ యందే ప్రతిష్ఠిత మగుచున్నది.
అసలు ‘జీవుడు’ అనగా ఎవడు? - - ‘ఉపాధి’ అనే ప్రదేశంలో ఏర్పడి ఉండువాడు మాత్రమేనా? కానేకాదు! అట్లా అయితే, అతనికి ఉపాధికంటే వేరైన సత్తాయే ఉండేది కాదు. ఉపాధి నశిస్తే అతడు కూడా నశించేవాడే. కాబట్టి, ఈ జీవుడు దేహపరిమితుడుకాడు.
కాని, ఆత్మగా జీవుడుగా అగుట ఏమిటి? - ఆత్మను ఉపాధిపరంగా, చిత్తపరంగా చూచు అజ్ఞానదృష్టికి మాత్రమే జీవుడు అనబడువాడు తారసపడుచున్నాడు. ఆత్మకంటే వేరుగా జీవుడు అనబడే వాడే లేడు. ఇందులో సందేహం లేదు. ఆత్మ జీవుడే అగుటలేదు కదా ! ఇక ‘దేహము'గా ఎట్లా అవుతుంది?
జీవుడు ఆత్మయే అయి ఉండుటచే, ఈ 'దేహము' అనే పంజరం నశించినప్పటికీ అతనికి కలుగుచున్న నష్టమేమీ ఉండదు. ఓ రామా! నీవు జీవుడవే కావు. ఆత్మయే అయి ఉన్నావు. అట్లే ప్రతిఒక్కరుకూడా. ఇక దుఃఖము పొందవలసిన పనేమున్నది?
"నేను ఈ శరీరమును కాదు.” “జీవుడు' అనబడునది కూడా నేను కాదు.” "నేను సదా సత్స్వరూపమగు బ్రహ్మమునే అయి ఉన్నాను.”
అని భావిస్తూ ఉండు. అంతేకాని, భ్రాంతి రూపములైన నశ్వరదేహములందు “ఈ దేహమునే నేను” అనునట్టి దేహాత్మభావన చేయటం ఉచితమా? .... కాదు.
ఓ సర్వసభికులారా! సర్వజనులారా! మీలోని ప్రతిఒక్కరు “నేను అఖండుడను, అప్రమేయుడను” అనురూపమైనట్టి “ఆత్మసారూప్య భావనను” నిరభ్యంతరముగా చేయవచ్చు. శుద్ధము, అకళంకము అగు పరమాత్మకు ఏ విధమైన 'ఇచ్ఛ' ఉండదు కదా! 'చిదాత్మ - స్వభావులే' అయి ఉన్నట్టి మీరంతా “నేను ఇచ్ఛారహితుడనే” అని ఎందుకు భావించరాదు?
జగత్తు భావనామాత్రమే - - చిదాత్మ సర్వులయందు సాక్షీభూతమై, సర్వత్రా సమమై, నిర్మలరూపమై, నిర్వికల్ప స్వభావయుతమైయున్నది. అట్టి చిదాత్మయందు, అద్దమునందు వస్తువులు కనబడునట్లు, ఈ బ్రహ్మాండములన్నీ ప్రతిబింబిస్తున్నాయి. స్వచ్ఛమైన మణి అనిచ్ఛాపూర్వకంగానే (Without maintaining intentions) తనయందు సూర్యకిరణములను ప్రకాశింపజేయుటలేదా? ఆత్మకు ఏ ఇచ్ఛ లేకున్నప్పటికీ, వికల్పరహితమగు ఆత్మయందు ఈ జగత్తు ప్రతిబింబించుచున్నది. అద్దం కదలకుండానే తన యందు వస్తువుల కదలికలను చూపుచున్నది కదా! "దర్పణం - ప్రతిబింబం”ల అనిచ్ఛా పూర్వకమైన సంబంధం ఎట్లు సిద్ధిస్తుందో, ఆత్మ - జగత్తుల భేదాభేద సంబంధం సిద్ధిస్తోందని
Page:649
గ్రహించుటయే “జ్ఞానము”. అద్దములోని ప్రతిబింబము అద్దముకంటే వేరా? యథార్థానికి ఆ రెండు ఒక్కటే అయినప్పటికీ, భావనామాత్రంచేత వేరువేరుగా ఉంటున్నాయి. జగత్తుకూడా భావనా మాత్రం చేతనే ఆత్మకు వేరుగా తోచుచున్నది.
సూర్యుని సన్నిధానం చేతనే (Just by mere presence), అతని ఇచ్ఛ లేకుండానే (కిరణజన్య సంయోగము Photosynthesis మొదలైన) జగత్ కార్యములన్నీ సిద్ధిస్తున్నాయికదా! 'చేతనసత్త’ యొక్క ఔన్నత్యమాత్రంచేత ఈ జగత్తు అంతా ఉత్పన్నమగుచున్నది. ఓ రామా! ఎప్పుడైతే నీ దృష్టి నుండి ఈ నామరూపాత్మక జగత్తు నివృత్తిస్తుందో, అప్పుడు నీ చిత్తము నందు 'ఆకాశము' వంటి శుద్ధ చైతన్యస్వరూపము రూఢి కాగలదు. 'దీపము' గదిలో వెలుగుచున్నంత మాత్రంచేత ఆ వెలుగులో ఆయా వస్తువులు, వాటి భేదాభేదములు కనబడుచున్నాయి కదా! "అయితే వస్తువుల భేద వ్యవహారము దీపపు వెలుగుచేతనే కల్పించబడుచున్నది” అని అంటామా? లేదు. ఈ జగత్తులోని భేద వ్యవహారమునకు, భగవంతునికి గల సంబంధము అట్టిదే.
చిద్వస్తు స్వభావ మాత్రంచేత, భావనానుగుణంగా ఈ జగత్తు ఏర్పడి ఉంటోంది. మోహం తొలగితే చాలు! సర్వము విదితము, అనుభవము కాగలదు.
ఆకాశము యొక్క స్వరూపమేమిటి? శూన్యమేకదా! అయినప్పటికీ జనులంతా అక్కడ సుందరము, శోభాయమానము, కాంతియుతము అయిన నీలత్వమును చూస్తున్నారు. అట్లాగే, జనులు ఆత్మయందు జగత్తులను దర్శిస్తున్నారు. భావన అనుభవం... ఒకదానిని రెండవది నిర్మిస్తోంది. భావనలో ఏర్పడుచున్న భ్రమ తొలగితే అంతా విదితమే అవుతుంది.
పరమాత్మ నుండి మనస్సు, మనస్సు నుండి జగత్తు ఉత్పన్నములవుతున్నాయి. ఈ జగదాడంబర మంతా మనస్సు చేస్తున్న పనే! సంకల్పము నశించినంత మాత్రంచేత చిత్తము క్షయించగలదు. మనో-జగత్తుల వాస్తవస్వరూపం ఆత్మయే!
చిత్తము క్షయిస్తే మోహం స్వయంగానే నశిస్తుంది. మేఘాలు తొలగగానే నిర్మలాకాశం స్వయం గానే శోభిస్తుంది కదా! మోహం తొలగగానే అంతఃకరణము నందు, “జన్మవర్ణితుడు, అనాది, అనంతస్వరూపుడు, నిర్మలుడు, చిన్మాత్రస్వరూపుడు” అగు పరమాత్మ స్వయంగానే ప్రకాశిస్తున్నాడు.
2. లఘు సమీక్ష
మరికొంత లఘువుగా సమీక్షిస్తున్నాను. విను - -
సర్వాత్మకమగు చిదాత్మయందు మొట్టమొదట “సమస్తప్రాణుల సమష్టికర్మ” రూపమున సమష్టి క్రియాశక్తి ప్రధానం అయినట్టి “మనస్సు లేక, చిత్తము” ఆవిర్భవిస్తోంది. అట్టి సమష్టిచిత్తరూపునే “బ్రహ్మదేవుడు” అని అంటున్నాం. ఆతని మనోసంకల్పమునుండి 'మనువు' మొదలైన మానసదేహులు ఏర్పడుచున్నారు. వారు దేహమును ధరించి, వివిధనామరూపములతో కూడిన ఈ మిథ్యాజగత్తును
Page:650
విస్తరింపజేస్తున్నారు. బాలుడు బేతాళుని రూపమును మనస్సునందు కల్పించుకొని, అదియే బాహ్యమున చూచుచున్నట్లు, ఇదంతా ఏర్పడుతోంది.
సమష్టి - వ్యష్టి భేదములచే కల్పితమగుచున్న ఈ జగత్తంతా 'మనోమాత్రమే'! మనస్సు కూడా ‘అసత్తే’ అయి ఉన్నది. అజ్ఞానముయొక్క కార్యమే అది. సర్వమునకు అధిష్టానమై వెలుగుచున్న ‘సాక్షిచైతన్యము' యొక్క స్ఫూర్తి చేతనే 'అసత్తు' అగు ఈ జగత్తు స్ఫురిస్తోంది.
అట్లు జగత్తుగా స్ఫురించుటయే దీని “ఉత్పత్తి”. అంతయు విజ్ఞానదృష్టిచే పరిశీలించుచున్న మేము, “ప్రపంచ రహితమైన సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మమే ఈ 'జగత్తు' రూపముగా అజ్ఞానదృష్టికి తోచుచున్నది” అని సిద్ధాంతీకరిస్తున్నాం. వాస్తవానికి 'జగత్తు' అనబడునదేదీ ఉత్పన్నమే అయిఉండలేదు. నిత్యోదిత-పరమానంద స్వరూపమగు ఆత్మయే స్వకీయ-అజ్ఞానకారణంగా జగత్తుగా దర్శించబడుతోంది.
పూర్ణ మహాసముద్రము యొక్క 'సత్తామాత్రము' నందు వలయాకారములగు తరంగముల పంక్తి (Water - ripples) ఉద్భవించి స్థితి పొందుచున్నాయి కదా! నీటిని ఆధారం చేసుకునే వలయాకారములు ఉంటున్నాయి. ఈ మనస్సు తనకు అధిష్ఠానమైయున్న సాక్షి చైతన్యము యొక్క ప్రభావం చేతనే “సద్వస్తువా?” అన్నట్లుగా భాసిస్తోంది.
వాక్కునకు లభ్యమగుచున్న ఈ విచిత్రమైన జగత్తు, ఈ దృశ్యము 'మిథ్యయే' అయి ఉన్నాయి. సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మమే అవికృతరూపమున సదా నెలకొనియున్నది. ఇది గ్రహించటమే- బోధించటమే శాస్త్రములు - సర్వప్రయత్నముల అంతరార్థమైయున్నది.
ఉత్పత్తి ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు
ఓం తత్సత్
మోక్షోపాయమై ఉన్నట్టి ఈ గ్రంథము యొక్క సహాయంచే 'జ్ఞాన కాంతి’ని పొందువారు మోహాంధకారంచేత గ్రుడ్డివారు అవటం జరగదు. 'తృష్ణ' అనేది వివేకము ఉదయించనంత కాలమే ఉంటుంది. తృష్ణ ఉన్నంతకాలం వేదనలు తప్పవు. ఓ జనులారా! లేవండి. ఈ శాస్త్రవిచారణను అనుసరిస్తూ రండి. సంసార బంధమును త్రెంచి వేయుటకు కృతనిశ్చయులు అవండి.
వసిష్ఠ మహర్షి
పుట: 130
శ్రీరాముడు : గురువర్యా! మునీంద్రా! ఇంతకీ ఈ 'మనస్సు’ అనునది జడమా? చేతనమా? ఈ విషయం ఇంకా నాకు బోధపడనేలేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు చిత్ - అచిత్ రూపమైయున్నది. అనగా, ఇది జడముకాదు. చేతనము కాదు. చైతన్యమే సంసార దశ యందు ఉపాధి దోషంతో కూడుకొని ఉన్నప్పుడు 'మనస్సు' అని పిలువబడుతోంది. అనగా, చైతన్యమునకు వేరుగా ‘మనస్సు’ అనబడునది ఏది లేదు. 'ఆలోచన' అనునది ఆలోచించువానికి వేరుగా ఉంటుందా? ఉండదు కదా!
పుట: 522
CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93-83972-14-2 (Set)
దోమలగూడ, హైదరాబాదు-29 మఠం se email : publication@rkmath.org
9789383972142
Vasishta Rama Samvadam : Vol 1 ISBN 93-83972-10-4 1000/- (set) www.rkmath.org