వసిష్ఠ రామ సంవాదం

(యోగ వాసిష్ఠమ్)

Egge

రెండవ సంపుటం స్థితి, ఉపశమన ప్రకరణములు

Page:1

శ్రీ వసిష్ఠ - రామ సంవాదము

(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)

రెండవ సంపుటం

స్థితి, ఉపశమన ప్రకరణములు

అనుసృజన: వై.హెచ్. రామకృష్ణ

రామ तज्ञोसः प्रचोदयात

మఠం

రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాదు - 500029

Page:2

Published by Adhyaksha Ramakrishna Math

Domalguda, Hyderabad - 29

O Ramakrishna Math, Hyderabad All rights reserved

I 1M -08-2010

12025

12028 (Set)

Printed at: RP Printers, Hyderabad.

Bound at Pridhvi Binders, Hyderabad.

Page:3

ప్రవేశిక

మొదటి సంపుటంలో వైరాగ్య-ముముక్షు ఉత్పత్తి ప్రకరణాలను అధ్యయనం చేశాము. ప్రపంచం అనిత్యం, అసుఖం అంటే మనకు అర్థం అవుతుంది. దృశ్య జగత్తు మూడు కాలాలలోనూ లేనే లేదు; ఉన్నదంతా ఒకే పరబ్రహ్మ చైతన్యం అంటే మనకు అంత తొందరగా అర్థమవదు. మనం అనాదిగా ఈ జగత్తు నిజమని భావిస్తూ వివిధ కర్మలనొనరిస్తూ, ఆ కర్మఫలాలను అనుభవిస్తూ వస్తున్నాము. కర్మాచరణం వలన ఏర్పడే సంస్కారాలు, మరల మరల ఆ కర్మల నొనరించే దిశగా మనల్ని ప్రేరేపిస్తుంటాయి. ఈ వాసనలు మనచే శరీరాలను ధరింపచేస్తూనే ఉన్నాయి. వాసనామయ మనోదేహాలే తన నిజస్వరూపం అన్న మిథ్యావగాహనతో సంసార యాత్రలో అనేక మజిలీలు చేస్తున్న జీవుడు ఎప్పటికో గమ్యం చేరుకుంటాడు. అజ్ఞానజనిత దృశ్య ప్రపంచంతో పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉన్న జీవుడికి తాను అనుభవిస్తున్న జగత్తు మిథ్య అని వెంటనే బోధించటం వలన ప్రయోజనం ఉండదు. అందుకని వసిష్ఠ గురువరేణ్యులు ప్రపంచానికి జ్ఞానం గరపే నిమిత్తం దశరథాత్మజుడి మూలకంగా చేసిన బోధ ఐన ఈ కావ్యంలో ముందుగా వైరాగ్య భావనను ఉద్దీపింపచేయటానికి ప్రయత్నించారు; రామచంద్రుడికి కలిగిన వైరాగ్యాన్ని ప్రశంసిస్తూ, ఆ భావనే స్వస్వరూపాన్ని గ్రహించటానికి ప్రథమ సోపానం అని తెలియజేశారు. ప్రపంచం అనిత్యం, అశాశ్వతం, అపరిపూర్ణం, దుఃఖమయం కనుక విజ్ఞుడైనవాడు వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

తరువాతి ప్రకరణమైన ముముక్షు ప్రకరణంలో కేవలం పురుషప్రయత్నం ద్వారానే సాధకుడు జన్మ మృత్యు సంసార చక్రంనుంచి బయటపడగలడని, అంతకు మించి మార్గంలేదని నొక్కి వక్కాణిం చారు. వివిధ దృష్టాంతాలతో, ఇతఃపూర్వం ఎవరెవరు అలా పురుష ప్రయత్నంతో జగదవిద్యా వల నుంచి తప్పించుకున్నారో వారి జీవితగాథల ద్వారా జిజ్ఞాసువును తీవ్ర ప్రయత్నిన్ముఖుడిగా చేశారు.

ఇక మూడవదైన ఉత్పత్తి ప్రకరణంలో దృశ్య ప్రపంచం యావత్తూ మనోకల్పితమని, మనస్సుకు ఆవలగా జగత్తులేదని నిరూపించటానికి ప్రయత్నించారు. ఈ జగద్భావనను పునః పునః ధ్యానించటం వలన అసత్తు ఐన దృశ్యం, అవిద్య వలన రజ్జువులో సర్పాన్ని దర్శించే తీరున, సత్తుగా కనబడుతుందని బోధించారు.

ఈ రెండవ సంపుటంలో నాల్గవదైన స్థితి ప్రకరణము, ఐదవదైన ఉపశమన ప్రకరణములను అధ్యయనం చేయబోతున్నాం.

స్థితి ప్రకరణంలో అజ్ఞానం, భ్రాంతి గురించి ఎక్కువగా చెప్పకుండా సృష్టి అనేది నిజానికి ఏదీ లేదనీ, అది కేవలం ఒక పదం, ఒక శబ్దం మాత్రమేనని తెలుపుతూ దృశ్యం ఇంద్రధనుస్సు లాగా శూన్యంపై వేసిన చిత్రం అని సాధకుడి మనస్సు నుంచి దృశ్య భావనను ఉన్మూలించటానికి

Page:4

ప్రయత్నించారు. పగటి కలలాగా, జగదనుభవం కూడా ఒక కలే అని ఇంద్రియగోచర దృశ్య అవాస్తవికతను చాటుతూ, అహంకార జనిత మనస్సుకు సంబంధించిన ఎరుక వలననే ఈ అనుభవం కలుగుతుందని అంతకు మించి ఈ జగత్తుకు ఉనికి లేదని చాటారు.

ఐదవదైన ఉపశమన ప్రకరణంలో మనో మాలిన్యాలైన రజో తమస్సులను తొలగించుకొని, సత్త్వం వృద్ధి చెంది, ద్రష్ట దర్శన దృశ్య భేదం తొలగి కేవాలానంద స్వరూపమైన చిన్మాత్ర చైతన్యాన్ని అనుభూత మొనర్చుకోవచ్చని వసిష్ఠ మహర్షి వచిస్తారు. విచారణ ద్వారా అవిద్యాజనిత దృశ్యానుభూతిని తొలగించుకొని మనోరాహిత్యాన్ని పొందవచ్చునని ఈ ప్రకరణంలో తెలియజేస్తారు. శాస్త్రాధ్యయనం, సత్సాంగత్యం, సద్గురువును ఆశ్రయించటం ద్వారా మోక్షం కరతలామలకం అవుతుందని బోధ. దేహ భావన వలన ఆత్మ మలినమవదు. మనస్సు స్వభావాన్ని అర్థంచేసుకొని కోరికలను, సంకల్పాలను త్యజించినవారు ఉన్నత భూమికలను చేరుకుంటారు.

'ద్వంద్వ భావనను వదిలి ఆత్మోపస్థితులవండి' అని సర్వులను ఉద్దేశించి ఎలుగెత్తి చాటుతుంది ఈ ప్రకరణం.

- ప్రకాశకులు

Page:5

విషయ సూచిక

IV. స్థితి ప్రకరణం 1

1. జగత్ స్థితి 3

1.ఈ జగత్తు ఏర్పడి ఉన్నదెక్కడ?...3; 2. అసంభవం ... కాని ప్రత్యక్షం!... 8; 3. జగత్తు - వివిధ నిర్వచనములు... 10; 4.బీజము - అంకురము-బ్రహ్మము-జగత్తు... 12; 5. ఈ జగత్తుకు కర్త ఎవరు?...17; 6.స్మరణ-విస్మరణ... 19; 7.స్మృతి...23; 8. ఆత్మదృష్టి సృష్టిదృష్టి...26; 9. మనస్సే ఇదంతా !...27

II. భృగు = యమ సంవాదము 31

1.శుక్రుడు - ఇంద్ర సభాప్రవేశము... 31; 2. భావావేశము - జన్మపరంపరలు...34; 3.భౌతికం - కల్పితం...37; 4. స్వయంకృతం...38; 5. స్వీయ - మనోరథ మార్గం...44; 6.సంసార ప్రవృత్తి చమత్కారం...45; 7. ఈ జగత్తు బ్రహ్మమే... 51; 8. సంసారోత్పత్తి విస్తారము...56; తొమ్మిదవ రోజు 9. గడిచిన జన్మల స్మరణ...60; 10.జ్ఞానులు దేహములు...65; 11.శుక్రుని పునరుజ్జీవనము... 69

III. భృగు - యమ సంవాదము తదనంతర చర్చ 73

1.చిత్తము - ప్రాప్తాప్రాప్తములు...73; 2. సత్యవస్తు విచారణ... 75; 3. సంస్కారములు అనుభవములు... 77; 4. పరస్పరం...80; 5.జీవుడు - ఖండత్వము, అఖండత్వము...81; 6. శరీరము - జీవుడు - దృశ్యము - బ్రహ్మము... 83; 7. బ్రహ్మము - జగత్తు రూపంగా ప్రాప్తించటం...86; 8. చిత్తము - జగత్తులు... 91; 9. శుద్ధ చైతన్యము - ప్రాపంచిక

క్లేశములు...97; 10. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి తురీయములు- ...98; 11. మనస్సు

యొక్క రూపము...104; 12. విజ్ఞానవాదము... 106; 13. ఆత్మబోధ ఎట్టి వారికి?...113;

14.సాక్షి చైతన్యము - జగద్వ్యవహారము... 116; 15. జ్ఞానుల అజ్ఞానుల

అనుభవాలు...120; 16. శరీరము - నగరము - శరీరి రాజు...124; 17. మనోనిగ్రహం - ఇంద్రియ నిగ్రహం... 128; 18. ఉపేక్ష పనికి రాదు...130

IV. దామ = వ్యాళ = కటన్యాయం 134

1.శంబరాసుర సృష్టి... 134; 2. మమకారావిష్కరణ...137; 3. పునః యుద్ధం...142; 4.‘అహమ్’కారము దేనికి సంబంధించినది?...144; 5. సదాచారము ప్రయోజనము 151; 6.శ్రద్ధ - ప్రయత్నములు... 153; 7. దృశ్యము యొక్క అత్యంత - అభావము... 156; 8. అహంకారము యొక్క రూపము... 157; 9. అహంకారము నివారణోపాయం... 160; 10.త్రివిధ అహంకారములు... 161; 11.భీమ - భాస - దృఢ న్యాయం... 164; 12.వాసనా రాహిత్యము... 166

Page:6

V. దామవ్యాళకటోపాఖ్యానం : విషయ విచారణ (మనస్సు) 169

1.మనస్సు ఉపశమనము... 169; 2. మనస్సు యొక్క రూప విశ్లేషణము...174; 3.‘చిత్’ ఆదిత్యుడు - స్వరూప స్వభావములు... 176; 4. విముక్తి... 180; 5. అనాసక్తబుద్ధి... 182; 6.మోక్షసన్న్యాసం... 188; 7. నిత్యము నందు అనిత్యం...189; 8. ఆత్మయొక్క ఔన్నత్యం ...193; 9. ఇదంతా కూడా బ్రహ్మమే... 196; 10. అవిద్య - ఆత్మజ్ఞానానుభవం... 202; 11.క్షేత్రము - క్షేత్రజ్ఞుడు... 208; 12. వివిధ జీవోత్పత్తులు... 215; 13. పునఃశరీర ప్రాప్తులు పుర్యష్టకము... 219; 14. జగత్తులు - దేశకాలములు...224

VI. దాశూరోపాఖ్యానము(ప్రారంభ విచారణ) పదవ రోజు 230

1.జీవన్ముక్తుడు - స్థితి, గుణములు, గతులు...230; 2. బ్రహ్మాండముల చమత్కారం... 233; 3. జ్ఞాని ఇదంతా ఎట్లా చూస్తున్నాడు?...236; 4.ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చింది?... 239; 5. ప్రాప్తించేదంతా ఇతఃపూర్వపు అభాసానుగతమే!...242

VII. దాశూర కథనం 244

1.దాశూరుడు - చిత్త సువిశాలత్వం... 244; 2. వనదేవత - పుత్రాభిలాష...248; 3.భోత్తుడు - మూడు శరీరాలు...250; 4. సంసార సాగరము - వికల్ప వ్యవహారము... 253; 5.సంకల్పరాహిత్యం-ఆత్మాశ్రయం... 255; 6. సంకల్ప విచికిత్స... 259; 7. ఆరోపితం... 263; 8. ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది - లేనిది ఏనాడు లేదు... 265; 9. ప్రయత్నించినవాడే గ్రహిస్తున్నాడు...265; 10. దాశూరాఖ్యాయిక: విజ్ఞాన సారాంశము... 267

VIII. కచోపాఖ్యానము - - ఉపోద్ఘాత చర్చ 268

1.ఈ సృష్టికి కర్త ఎవరు?... 268; 2. నిరపేక్ష-నిస్సంగము...271; 3.భ్రమచేతనే జగదుత్పత్తి...272; 4. సన్నిధాన మాత్రం... 273; 5. ఆత్మ అన్నివేళల అకర్తయే...274; 6. ఆత్మ సమష్టిరూప కర్తృత్వము... 275; 7.పూర్ణాశయస్వరూపము... 277; 8. తాత్సారం చేయవద్దు... 280; 9. 'ముక్తుడు' అంటే?... 281; 10. ఇక్కడ అభిలషింప తగినదేది?...281 IX. కచుని గానం 286

1.కచుని స్వవిచారణ...286; 2. ఆత్మాశ్రయం... 288; 3.బ్రహ్మము : బ్రహ్మదేవుడు -

చైతన్యము : సృష్టి... 289; 4. సృష్టి - ఉపసంహారం... 291; 5. సృష్టి-జీవుడు" - పరిణామ చమత్కారం... 293; 6. సృష్టికి మూలం ఇచ్ఛయే!... 294; 7. జీవోత్పత్తి - జీవపతనము ...295; 8. తత్పదము...297

X. స్థితి ప్రకరణము - విషయ సమీక్ష 298

V. ఉపశమన ప్రకరణం 307

I. ప్రకరణ పరిచయం 309

1.పదవ రోజు రాత్రి... పునశ్చరణ... 309; పదకొండవ రోజు 2. ఎఱుగబడటమే ప్రాప్తించటం

Page:7

...313; 3. ఇప్పటికి లేనిది? ఇంకనూ పొందవలసియున్నది?... 317; 4. కర్మబద్దులు విముక్తులు...322

II. జనకోపాఖ్యానము 325

1.సిద్ధగీతాగానం...325; 2. విచిత్ర ప్రపంచం స్థితిగతులు ముందువెనుకలు... 331; 3.సునిశ్చయం...341; 4. చిత్తమును శాసించటం... 344; 5. భూత భవిష్యత్లను జయించడం వర్తమానంలో ఏర్పడి ఉండడం... 348; 6. మనోవిచారణ... 351; 7. స్వయం విచారణ... 353; 8.మనస్సు-ప్రశాంతత... 356; 9.ప్రమత్తత-పరిభ్రమణం... 357; 10.'జలము’ ఉపమానం - చైతన్యము... 361; 11. అజ్ఞానవశం చేత... 363; 12. ఉపదేశములకు అర్హులు అనర్హులు... 365; 13. మనోనాశనం... 369; 14. తృష్ణ... 372; 15. చికిత్స...374; 16.జీవన్ముక్తుడు...376

III. పుణ్యుడు - పావనుడు సంవాదం పన్నెండవ రోజు 381

1.మహాత్ముల అవగాహన-సంచారం-స్వభావం... 381; 2. నదుఃఖార్హం... 388; 3. సంబంధ బాంధవ్యముల అతీతత్వము... 390; 4. ధ్యేయవాసన చికిత్స... 395

IV. బలి చక్రవర్తి 398

1. చర్విత చర్వణం... 398; 2. ఒకప్పటి బలి విరోచనుల సంవాదం... 399; 3. మంత్రి వశం అయిపోతున్న రాజుగారు...400; 4. ఆ మంత్రి మనవశమయ్యేదెట్లా?...403; 5. ముగ్గురు మిత్రులు - అప్రీతి, వివేకము, అభ్యాసము... 409; 6. మనోరచన - మనోవ్యాధి ...410; 7.నీ-నా స్వరూపం చితే...413; 8. నేనెవడను? ఎంతటి వాడను?...414; 9.కేవల సమరూపం...418; 10. సన్మార్గావిష్కరణ... 422

V. ప్రహ్లాద - - నారాయణ సంవాదం 425

1.హిరణ్యకశిప సంహారం...425; 2. నారాయణీకరణం...426; 3. విష్ణు స్తవనం...429; 4. దేవతలలో కలకలం-ఊరట...430; 5. తరుణోపాయం... 432; 6. తత్త్వ విచారణ 435; 7.వర్తమాన-భూత-భవిష్యత్తులను నిషేధించటం : దృశ్యము యొక్క అభావ స్థితి ...442; 8.సుఖ విశ్రాంతి... 445; 9. ఇంద్రియాతీతజాగృత్...448; 10. ఆత్మ సూర్యో దయం - అహంకార, మమకార అస్తమయం...450; 11.మనస్సుతో మనోజయం ... 452; 12.ఆత్మ స్తవనం...453; 13. నాకు ... నేనే నమస్కారం!... 455; 14.ఓ స్వస్వరూపాత్మ దేవా!...457; 15.దానవులు-దీనత్వము...460; 16. సృష్టికే ఎసరు... 461; 17. నారాయణోపన్యాసము ...462; 18.దేహము - జీవము జీవుడు...465; 19.ప్రహ్లాద పట్టాభిషేకము ... 468;

20.సమీక్ష...470

VI. మనోదర్పణం గాధి వృతాంతం పదమూడవ రోజు 476

1.మాయాదర్శన కుతూహలం... 476; 2. శాస్త్ర విరుద్ధం...480; 3. సుదీర్ఘ మనో పరిభ్రమణం... 483; 4. సుజ్ఞానప్రాప్తి...492; 5. విచారణ యొక్క ఆవశ్యకత...497

Page:8

VII. ఉద్దాలకుని అంతరంగాన్వేషణ 505

1.చిత్తవృత్తులు...505; 2. ప్రయత్నము-సంఘర్షణ... 506; 3.ఓ మనస్సా! ఇక ఆపవయ్యా నీ పరుగులు!... 508; 4. నేనెవడను? ఈ శరీరమునా? ఒక జీవాత్మనా?... 511; 5. నిర్లిప్తుడనుఅప్రమేయుడను-అసంగుడను...515; 6.ఇక శోకం దేనికి?...517; 7.ఈ జీవుడు గమనిం చడేం?...519; 8. శాంతి విశ్రాంతి...522; 9. పరమపదము... 526; 10.స్వస్వరూప చైతన్యముతో ఏకత్వం-ధారణ...528; 11.ప్రశమనం...529; 12. ధ్యానము-విశ్లేషణ ...531; 13.చిత్త విచికిత్స...534; 14. అభేద నిర్ణయం... 538

VIII. సురఘు-మాండవ్య-పర్ణాదుల సంవాదం 541

1.సురఘు అంతర్మథనం... 541; 2. ఇంతకీ నే నెవరు?... 546; 3. సురఘు పరిఘ సంవాదము... 551; 4. సమాధి సమాహిత చిత్తము...553; 5. సునిశ్చయం... 555; 6. కేవలీ తత్త్వధ్యానం... 557

IX. భాస విలాస సంవాదం 562

1.అభిమాన త్యాజ్యం...562; 2. ఏమి క్షేమసమాచారం?... 563; 3. అయితే, ఇప్పుడేంచేయాలి? ...566; 4.సంసక్తత-అసంసక్తత... 571; 5. ఆత్మదృష్టి-ఆసక్తిరాహిత్యం... 574;6. ఆత్మారామం ...576; 7.ఆత్మ అప్రమేయమైనది... 579; 8. ఆత్మయే అంతా.... అన్నిటా... 583

X. వివేక దృష్టి పదునాల్గవ రోజు 587

1.ఆత్మ - దేహముల సంబంధం... 587; 2.ప్రపంచాతీతులు... 590; 3.ఎవరీ రచయిత? ...593; 4. ఆశా రాహిత్యం... 597; 5. జ్ఞాన సందర్శనం 603; 6. సోదాహరణములు ...606; 7.పరమ పురుషత్వం...612; 8.జీవన్ముక్తుల పవిత్ర దృష్టి... 614; 9. యోగ మార్గం...618; 10.జ్ఞాన మార్గం...624; 11. దృశ్య - దర్శన సంబంధాతీతత్వం... 627; 12.తత్త్వవేత్త... 632

XI. వీతహవ్యుడు - అంతర్మథన యోగము 634

1.సంబోధన...634; 2. స్వాత్మ - చిత్తముల సంవాదము... 638; 3. వీతహవ్యుడు ఇంద్రియముల సంవాదం... 642; 4. మనోజగత్...647; 5. భౌతిక దేహ పునరాశ్రయం ... 652; 6. ఇంద్రియవర్గ నిరాకరణం... 655; 7. నిర్వాణము... 661; 8. విశ్రాంతి...663 XII. ఉపశమన ప్రకరణము - సమీక్ష 665

1.యోగుల దేహ మనముల వైచిత్ర్యం...665; 2. చిత్తోపశమనం...673; 3. శరీర తదాప్యం - నివారణ... 676; 4. అభావన ద్వారా అమనస్కం...678; 5. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్నవాని యందే!...680; 6. దృశ్య అదర్శనం...683; 7. అజడం జడం... 684; 8. వేరు వేరు ఉపాయాలు... 686; 9. మూడు అభ్యాసాలు ఒకేసారి!...689; 10.యుక్తి - ఉపాయం... 691; 11.జ్ఞానవానేవ బలవాన్...695

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

వసిష్ఠ - రామ సంవాదము IV. స్థితి ప్రకరణం

స్థితి ప్రకరణం

I. జగత్ స్థితి

1. ఈ జగత్తు ఏర్పడి ఉన్నదెక్కడ?

శ్రీరాముడు: తండ్రీ! ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపము అనంతగుణ గంభీరమగు చిదాకాశమేనని అనుకున్నాముకదా! మరి ఈ జన్మ-కర్మ-బంధ-మోక్ష పరంపరల చమత్కారం అంతా ఏమిటి? ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి: మహా ప్రభావవంతమైనట్టి చిదాకాశము ఒక సమయంలో రజోగుణముచే కప్పబడిన దవుతోంది. ఆకాశము మేఘావృతము అవుతూ ఉంటుంది చూచావా? ఇది కూడా అట్టిదే. అట్లు రజోగుణముచే కప్పబడినప్పుడు అహంకారము అనబడే పరిమిత త్వమును, లేక ఆచ్ఛాదనను పొందుతోంది. మేఘములు కారణంగా ఆకాశము ఇంత మాత్రమే... అది పరిమిత మైనదే... అని బాలుడు అనుకుంటాడు చూశావా! బాలునితో సమానమైన ఈ జీవుడు నేను పరిమితుడను అను భావన పొందుచున్నాడు. ఆకాశము తన అనంతత్వమును త్యజించ కుండానే పరిమితత్వము పొందినదానివలె అగుపిస్తున్నట్లు, చిదాకాశము కూడా తన యొక్క ప్రకాశ రూపమును, అఖండత్వమును త్యజించకుండానే అహంకార-ప్రాణ-ఇంద్రియాలను అనుభవిస్తూ, తనపై తానే పరిమితత్వమును ఆపాదించుకుంటోంది!

మృగతృష్ణ అసత్తే. కానీ అందులో జలము కనిపిస్తున్నది కదా!

భ్రాంతి (Illusion) రూపముగా గల వాసనచే చిదాకాశము తన చిద్రూపము నుండి భావనా మాత్రంగా విడివడుచున్నది. ఒక వైపు ఈ పతనము ఇట్లు ఉండగా, మరొకవైపు విజ్ఞులైనవారు ఉత్తమ బుద్ధిని సంపాదిస్తున్నారు. ఇట్టి నిర్మల-సునిశిత బుద్ధి యొక్క ప్రభావం చేత ప్రత్యగాత్మ వైపుకు అభిముఖమగు అవగాహన సముపార్జించుచున్నారు. జీవో బ్రహ్మేతి నాపరః ( ఈ జీవుడు బ్రహ్మమే కాని, మరింకేమీ కాదు), సర్వం ఖల్విదం బ్రహ్మ (ఇదంతా ఇప్పటికీ, ఎప్పటికీ బ్రహ్మమే అయి ఉన్నది), అహం బ్రహ్మాస్మి (నేను బ్రహ్మమే అయి ఉన్నాను). తత్త్వమసి (నీవు బ్రహ్మమే అయి ఉన్నావు) సో హం (నేను ఆ బ్రహ్మమే) ఇత్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్ర జ్ఞానముచే, ఈ దృశ్యము అసత్తు అని ఎరుగుచున్నారు. ఇట్టి దృశ్యమును తమయందు రహితం చేసివేస్తున్నారు. తద్వారా సంసార సాగరమును దాటి వేసి నిర్వాణపదమును పొందుచున్నారు. ఈ విధంగా ఈ జీవులు రెండు వేరువేరు మార్గములలో ప్రవృత్తులగుచున్నారు.

ఏది ఏమైనా, వారంతా చిదాకాశమే స్వరూపముగా కలిగి ఉన్నారు కదా! కనుక మనలోని

ప్రతి ఒక్కరియొక్క చిదాకాశత్వమునకు ఏక్షణంలోనూ ఏమాత్రమూ హాని కలుగుట లేదు.

Page:4

ఓ రామచంద్రా! ఒక విషయం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. మోక్షమునకు దారి చూపగల అట్టి వేదాంత శాస్త్రమే సత్యము, సుఖప్రదము, అనుసరణీయము కూడా! అందుకు వేరైనట్టి శుష్క మైన తర్కములన్నీ దుఃఖ-భయ-అసత్యమయములే అయి ఉన్నాయి. అట్టివన్నీ అనేక విధములైన వికారములకు కారణమగుచున్నాయి.

తర్కము, ఆత్మానుభవము - కేవలం తర్కశాస్త్రమును ఆశ్రయించదలిచేవారు పరమపురుషార్థ రూపమగు 'ఆత్మలాభము'ను పొందలేకపోవచ్చునని మా అభిప్రాయం. అట్లు కాకుండా, స్వానుభవము జోడిస్తూ, శ్రుతులచే ప్రసిద్ధముగా ప్రకటించబడుచున్న దానిని అనుసరించుచూ, ఉత్తమగతిని పొందుటకు సిద్ధపడేవానికి వినాశనము చేకూరు ప్రసక్తి ఉండదు. ఇది ఒక గొప్ప సిద్ధాంతము - దీనిని విజయవంతముగా ప్రతిపాదించుట మాత్రమే మా లక్ష్యం. ఇంత మాత్రమే సత్యము ఇంకేమీ వినము విననీయము అనునది సంకుచితత్వమునకే -- దారి తీస్తోంది. సత్యము సర్వదా నిర్దుష్టము, అనుభవమాత్రమే అయివున్నది. 'తర్కము' అనునది అనేక సందర్భములలో 'పరిమితదృష్టి' అను జాడ్యముచే బాధింపబడుచూ ఉంటోంది.

ఈ జీవుడు “ఇది నాకు ఉండుగాక... ఇది నేను పొందనుగాక! వీరు నా వారు... వారు తదితరులు... ఈ శరీరమునందే నేను ఉన్నాను... ఈ శరీర శిథిలత్వముచే నేను శిథిలమగు చున్నాను...” అగు రూపముగల లోభ మోహములచే బాధింపబడుచున్నాడు. అట్టి భావనచే దీనత్వమును ఆశ్రయిస్తున్నాడు. మహావాక్యముల అర్థసారమును తిరస్కరిస్తూ తనను తానే దౌర్భాగ్యమునకు సమర్పించుకొనుచున్నాడు. అట్టివారు రక్షించబడేది ఎట్లా? వారు పొందే పురుషార్థము ఏమున్నది?

శ్రీరాముడు: హే సద్గురూ! అట్టి ఈ జీవుని గతి ఏమిటి? ఇతడు అనేక దుఃఖాదులను భరిస్తూ ముల్లోకములందు ప్రయాసతో సంచరిస్తూ ఉండవలసిందేనా?

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! నిరుత్సాహపడవలసిన పనేమీలేదయ్యా! ఏ ఉదార చరితుడైతే ఈ ముల్లోకములను 'తృణప్రాయం'గా చూస్తాడో, అట్టి మహాత్మునిచే సమస్త ఆపదలు కూడా - సర్పముచే కుబుసము విడవబడినట్లుగా విడువబడుతాయి. ఎవని అంతఃకరణమునందు సర్వ వేళల సాత్వికత్వం స్ఫురిస్తూ, ఉట్టిపడుతూ ఉంటుందో అట్టివానిని ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా, తమకు ఆధారమైన బ్రహ్మాండములను కాపాడుకుంటున్నట్లు పాలించి రక్షించుకుంటూ

ఉంటారు.

సన్మార్గము, అసన్మార్గము - ఓ ప్రియ రాఘవా! ఎట్టి ఘోరవిపత్తు నందు కూడా ... అసన్మార్గము నందు ప్రవేశించకుండుటయే ఉత్తమము సుమా! అసన్మార్గము అవలంబించుట చేతనే రాహువు అమృతపానం చేసి కూడా 'కురూపము - మృత్యువు' - ఈ రెండింటినీ మరల మరల పొందుచున్నాడు.

స్థితి ప్రకరణం

ఓ జనులారా! మీరంతా సద్వస్తువును ప్రతిపాదిస్తున్న శాస్త్రములను అభ్యసించండి. సాధువులగు వారిని సేవించండి. ప్రేమ - సాత్విక - నిరహంకారములను ఆశ్రయించండి. మీకు తప్పక శుభము కలుగుతుంది. తదితర జీవులపట్ల ప్రేమ ఆప్యాయతలు అభ్యాసపూర్వకంగా ప్రకటించే వారియందు జగత్సంహారకారకుడు, ఉగ్రస్వరూపుడు అగు ఆ శివభగవానుడు ఆత్మ వస్తువును ప్రకాశింపజేస్తాడు.

సదాచారం (Good Conduct) సదాచారవంతులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారమును ప్రకాశింపజేసుకో గలుగుచున్నారు. సచ్ఛాస్త్రములను, సాధువులను సేవించువారు మరల ఇంకెన్నటికీ మోహాంధకారమున చిక్కుకోరు. అట్టివారికి అవశములైనవి కూడా వశము అవుతూ ఉంటాయి. సమస్తమైన ఆపదలు తమంతట తామే శమిస్తాయి. 'శమము-దమము' మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయించే సత్పురుషులకు నాశరహితమైనట్టి 'పరమోత్తమశ్రేయస్సు' లభిస్తోంది. శమదమాదులే ఉత్తరోత్తర ప్రయోజనకరములౌతాయని మీరంతా నమ్మకం కలిగి ఉండండి. ఆధ్యాత్మ శాస్త్రములను వినుటయందును, సత్యమునందును మిక్కిలి ప్రీతి కలిగి ఉండండి. ఉత్తమ ఆశయమును, ప్రయత్నమును కలిగియున్నవారే 'మనుష్యులు' అని అనిపించు కుంటారు. ఇక తక్కినవారి గురించి నన్ను అడుగవద్దు. వారు పశుతుల్యులే.

ఎవరి ప్రవర్తన’ అయితే ఇతర జీవుల హృదయసరోవరములను ఆహ్లాదపరుస్తూ ఉంటుందో అట్టి క్షీరసముద్రము వంటి పవిత్రమూర్తులందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తియే నివసిస్తూ ఉంటారు. వారు మాత్రమే చూడవలసినది చూడటం, పొందవలసినది పొందటం జరుగుతోంది.

ఓ జనులారా! ఈ ప్రాపంచిక విషయభోగములు మీ నుండి ఆత్మతత్త్వమును దూరంగా ఉంచుచున్నాయి. భవిష్యత్తులో అనేక దుర్భరమైన జన్మపరంపరలకు కారణం అగుచున్నాయి. విషయముల పట్ల, పేరు ప్రతిష్ఠలు మొదలైనవాటిపట్ల ఆసక్తి యుక్తం కాదు. ఉచితం కాదు. పైగా, దుఃఖప్రదము" - అని మీరు దామ - - వ్యాళ - కటుల జీవితల చరిత్రలను చూచి ఈ స్థితి ప్రకరణములో గ్రహిస్తారు.

కాబట్టి మీ అధికారమును అనుసరించి శాస్త్రానుకూలంగా ప్రవర్తించండి.

ఆచార్యులచే మీ క్షేమము కోరి నియమించబడిన సదాచారములను జ్ఞానపూర్వకముగా, రాగద్వేషరహితులై శ్రద్ధతో ఆశ్రయించండి. ఏ భూమికయందు ఎంతకాలం 'స్థితి' కలిగి ఉండాలో, ఆ భూమికను అంతకాలం అభ్యసిస్తూ ఉండండి. క్రమంగా మీ అంతఃకరణము నుండి మిథ్యా భోగాల పట్ల భావన పూర్తిగా తొలగించుకోండి. మీ ఉత్తమగుణాలు, మహాశయాలు, యశో మహిమ స్వర్గపర్యంతము వ్యాపించు గాక! మీ సత్ప్రవర్తనచే సత్పురుషులను సంతోషింపజేయండి.

ప్రయత్నము - నాయనలారా! తుచ్ఛములైన ఈ ప్రాపంచిక భోగములు మృత్యువుతో ‘అంతము’ అయ్యేవే కదా! ఆ తరువాత గతి ఏమిటో చెప్పండి? ఒక ఉపమానం చెపుతాను. పైకి రుచికరంగా కనబడి, అర్ధరాత్రివేళకు భయంకరమైన అజీర్ణమును కలుగజేయగల పదార్థములను

Page:6

ఎవరైనా “ఆహా బాగున్నాయి... బాగున్నాయి అని అనుకుంటూ తింటుంటే ఏమౌతుంది? అతి త్వరలో "అయ్యో! నేను ఎందుకు తిన్నాను? అని పశ్చాత్తాపపడవలసి వస్తుంది కదా! ఈ అహంకార - మమకారములు (l & Mine) మీకు కలుగచేయగల శ్రేయస్సు ఏమున్నది చెప్పండి? ఎవని సుందర గుణములైతే వర్తమానము నందు, భవిష్యత్తు నందు శ్రేయస్సు కలుగజేస్తాయో, అట్టివారు ఈ భూమిని తమ ఉనికిచే ఆనందమయం చేస్తున్నారు. వారే జీవించి ఉన్నట్లు. ఇక తక్కినవారో, మృతప్రాయులే. నాయనలారా! మునులమైన మేము లోకశ్రేయస్సు, ఈ జీవుని శ్రేయస్సు కోరి ఈ సత్ప్రవర్తన - - సదాచారము - ఉత్తమప్రయత్నముల గురించిన వాక్యాలు చెప్పు చున్నాము. మీరంతా ఉత్తమమైన శుభప్రయత్నములందే ఉద్యుక్తులు అవండి. తదనుకూలమైన ఉద్యమమునే ఆశ్రయించండి. ఎవరు శాస్త్రానుసారం ఉద్వేగరహితంగా ప్రయత్నశీలుడౌతారో, అట్టివారు మోక్షసిద్ధిని ఎందుకు పొందరు? తప్పక పొందుతారు.

ఏమరుపు - చిరకాలము చేయబడిన ప్రయత్నముచే పరిపాకము పొందిన మనస్సు గల వ్యక్తి యొక్క సిద్ధి, దాని ప్రయోజనములు దృఢతరంగా ఉంటాయి. అందుచేత అవరోధములను, కష్టములను చూచి దిగులు చెందరాదు. పట్టుదలను ద్విగుణీకృతం చేయాలి. ఎట్టి లక్ష్యముల కొరకు పరిశ్రమిస్తున్నామో, అట్టి లక్ష్యములను పరిశుద్ధపరచుకోవాలి. ఓ ప్రియజనులారా! మీరంతా శోకమును, భయమును, క్రోధమును, పారుష్యమును దరిజేరనీయకండి. దైన్య-దుఃఖ ములను ఆశ్రయించి, తద్వారా విలువైన కాలమును వృథా చేసుకోకండి. మూర్ఖత్వము, పరిశీలనా రాహిత్యములను ఆశ్రయించి విషయములను సేవిస్తూ రోజులు గడపటం ఉచితమా? ఫలితంగా ఈ జీవుడు 'సంసారము' అను అంధకూపమున పడి వినాశనమే పొందుచున్నాడు కదా! అనేక పదార్థములందు ఆసక్తుడై ఉంటున్న ఈ జీవుడు 'ఇంద్రియములు' అనే త్రాళ్ళతో బంధించ బడినవాడై, 'నేను చచ్చుచున్నాను' అను అనుభవమును మరల మరల పొందుచున్నాడు. నిష్కారణముగా మృత్యువుకు అనేకసార్లు వశమగుచున్నాడు.

“ఎందుచేత? అనే ప్రశ్నను మేము పరిశీలించాం.

“అతడు తన యొక్క చిదాకాశ స్వరూపమును ఏమరచుట చేతనే అని కనుగొన్నాం.

'సంసారము' అను నిబిడాంధకారంలో కొట్టుమిట్టాడుతూ, సరిఅయిన మార్గములలో తన ప్రయత్నములను నియమించకపోవటం మానవుడైన వాడికి ఉచితం కాదు. ఈ శరీరముతో తాదాత్మ్యము 'నా అంతటి వాడు లేడు.....' వంటి మూర్ఖపు కేకలు అధమాధమ గతికే దారి తీస్తున్నాయని గ్రహింపబడుగాక!

వేదాంతము’ను ప్రబోధించు శాస్త్రములు ఆత్మవస్తువు గురించి అనేక విశేషాలు ప్రతిపాది స్తున్నాయి. స్వస్వరూపమును గుర్తు చేస్తున్నాయి. ఈ జీవుని ఘోరములైన 'మృత్యువు' మొదలైన భయముల నుండి రక్షిస్తున్నాయి. నాశరహితము, నిత్యము అయినట్టి నిరతిశయానందము”ను ప్రసాదిస్తున్నాయి.

స్థితి ప్రకరణం

"ఈ ప్రాపంచిక జీవితము ఎట్టిది?" అనునది ఒకసారి సునిశిత బుద్ధితో పరిశీలించండి. ఇదంతా వేసవికాలంలో ఉష్ణత్వముచే నీరు ఇంకిపోవుచుండగా, మిక్కిలి దుర్గంధయుక్తమై యున్న బురద నీటిలోని కప్ప యొక్క జీవితము వంటిదే - అని విజ్ఞులు గ్రహిస్తున్నారు. ఇదంతా పరమ తుచ్ఛమై ప్రవర్తిస్తోంది.

అందుచేతనే "హృదయము నుండి భోగాశను ముందుగా పారద్రోలండి" అని మేము హెచ్చరిస్తున్నాం. అనర్థప్రదములైన భోగముల కొరకు మాత్రమే ఉపయోగపడే ద్రవ్యలేశములను ఎంతో కష్టపడి సంపాదిస్తూ జీవించుటలో ఏమీ ఉత్తమత్వమున్నది? కాబట్టి, మీరు ఏదేది చేస్తున్నారో అదంతా "స్వధర్మము అను అవగాహనచే ప్రక్షాళన చేసి ఉంచండి. ఓ మా స్వరూపమునకు వేరు కానట్టి సహజీవులారా! శ్రేష్ఠ బుద్ధి కలిగివున్న మీరందరూ మేము ప్రేమచే చెప్పుచున్న ఈ వాక్యములు ఆలకించండి. మోక్షప్రదములగు శాస్త్రములను అవలోకించండి. ఈ కనబడేదంతా పరమాత్మ యొక్క సంప్రదర్శనమే! నీకునీవే ఇదంతా అయి ఆస్వాదిస్తున్నావు! సర్వతత్వాత్మవు-సర్వతత్వ విదూరకుడవు నీవే!... అని బోధిస్తున్న తత్త్వశాస్త్రాన్ని అవలోకించండి, పఠించండి, ఆస్వాదించండి.

చైతన్యము, జీవుడు ... బింబము, ప్రతిబింబము - ఎట్టి పరిచ్ఛిన్నము లేని చైతన్యమే బింబము. ఆ చైతన్యం అంతఃకరణం నుండి విషయాకారవృత్తులందు ప్రతిబింబించుచున్నది. అట్టి చిదాభాసుడే ఈ జీవుడు. వాస్తవానికి చైతన్యము (లేక) శుద్ధ బ్రహ్మమునకు జన్మ-కర్మ- ఉపాధి-మొదలైన వాటితో ఏమాత్రం సంబంధం లేదు. బింబము - ప్రతిబింబముల సంబంధమే - 'బ్రహ్మము - జీవుడు లకు ఉన్న సంబంధము. అయితే, అంతఃకరణంలో ప్రతిబింబించే చిదాభాస ప్రతిబింబం, దానికి సంబంధించిన ఉపాధులు కూడా మిథ్యారూపాలే అయివున్నాయి. సర్వదా సర్వత్రా అభిన్నమైయున్న బింబము (లేక శుద్ధ చైతన్యపరమాత్మ) మాత్రమే సత్యమైనది.

ఓ సభికులారా! సర్వజనులారా! ఈ విధంగా తత్త్వవిచారణ చేయండి. ఇది మీకు శాంతిని కలుగజేస్తుంది. “నామ రూపములచే ఎదురుగా ప్రాప్తిస్తున్న జగత్తు, అట్టి జగత్తును నిర్విరామంగా పొందుచున్న అహంకారము - - ఈ రెండు కూడా స్వతహాగా ఈ వర్తమాన క్షణంలోనే (ఇప్పటికే) లేవు మరెప్పటికీ ఉండ - అను భావనను ఆశ్రయించి, అభ్యాసం చేయండి. అట్లు భావించుటచే మీరు కోల్పోయేదేమీ ఉండదని మనవి చేస్తున్నాను. అలా కాకుండా 66 ఈ శరీరమే ఉన్నది... మరింకేమీ లేదు"... అనునట్టి బుద్దిని ఆశ్రయించారా, ఈ మనస్సు పశుత్వమును పొందగలదు. దౌర్భాగ్యజనకము, అతి దీనము అయిన ధన-గృహ-స్వజనాదులకు సంబంధించిన సంకుచితదృష్టిని వహించి, తద్వారా ఆత్మవిషయంలో (లేక) మీ యొక్క స్వస్వరూపం విషయంలో గాఢనిద్ర వహించి వర్తమానమును వృథాపరచుకుంటే ఎట్లా? దీర్ఘనిద్ర నుండి లేవండి. మూఢత్వమును త్యజించి మోక్షమార్గమునందు జాగరూకులు కండి. ఒక అల్ప తటాకంలో ముసలి ఎద్దు వలె కునుకులు తీయవద్దు. బద్ధకము' అను జాడ్యమును ప్రయత్న

Page:8

పూర్వకంగా జయించండి. ఇప్పటికిప్పుడే జరామరణములను అధిగమించిన స్థితిని

ఆక్రమించుటకు సంసిద్ధులు కండి.

ఈ ధన-బంధుజన-వస్తువాహనాదులను చూచి మురిసిపోతున్నారా? లేదు. ఇవన్నీ అనర్థదాయకములుగానే పరిణమిస్తున్నాయి. ధనాదులు సొంతం చేసుకొనుటచే ఉత్తమోత్తమమైన సంతృప్తి కలుగుతోందా? జీవితలక్ష్యము నెరవేరుతోందా?... అనే విషయాలు ఇప్పటికే ఎంతో ధనవంతులై ఉన్నవారి మానసిక స్థితి గతులను సత్యదృష్టితో పరిశీలిస్తూ యోచించండి.

భోగములు భవరోగకారకములే అగుచున్నాయి. సంపదలన్నీ విపత్తులనే కలుగజేస్తున్నాయి. వాటిని మీరు ఏ విధంగానూ ఆదరించకున్నారా, అప్పుడు వాటిని మీరు జయించి వేస్తున్నట్లే. అసలు ధనాదులు "మీరు జీవించియుండుట" అను కార్యక్రమమునకు లక్ష్యమై ఉన్నాయా? అందుకొరకే బ్రతుకుచున్నారా? అవి మిమ్ములను నిజంగా రక్షించగలవా? తాను సంపాదించిన ధనాదులను తన మరణానంతరం తన వెంట తీసుకుపోయిన వారినెవ్వరినైనా మీరు చూచారా? బిడ్డలారా! ఇదంతా అవిచారణ చేతనే మిమ్ములను ఈ విధంగా భ్రమింపజేస్తోందని మీకు గుర్తు చేస్తున్నాను.

విచారణ, విశ్లేషణ - కనుక మీరు వెంటనే విచారణపరులు కండి. తదితర జనులకు, ప్రాణులకు అవిరోధముగా వ్యవహరిస్తూ, మీ స్వబుద్ధిని సునిశితం చేసుకునే ప్రయత్నంలో ఉండండి. శాస్త్రములను, శిష్టాచారములను అనుసరించి సత్కర్మలను అనుష్ఠించండి. సత్ఫలములను పొందుటలో సావధానులై ఉండండి.

ఉత్తమ ఆచరణ, పవిత్ర భావన, సునిశిత బుద్ధి - - ఈ మూడు విస్తృత పరచుకుంటున్నవారు ధన్యులు. వారు అతి స్వల్పకాలంలో "ఈ ప్రాపంచిక సౌఖ్యములు కేవలం దుఃఖప్రదములే అని గ్రహించగలుగుచున్నారు. శాస్త్రరూపంలో ప్రకటించబడిన పెద్దల అనుభవజ్ఞానమును వారు అనుద్వేగపూరితంగా గ్రహిస్తున్నారు. సత్యమేమిటో వారికి తెలిసిపోతోంది.

అట్టివారి యశస్సు, ఆయుష్షు, గుణములు మొదలైనవన్నీ లోకములకు సౌభాగ్యప్రదం అవుచున్నాయి. అట్టి సత్ఫలమే మేము శిష్యుల నుండి కోరుకొను ప్రయోజనమని ప్రకటిస్తున్నాను.

2. అసంభవం ... కాని ప్రత్యక్షం!

శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం ఇప్పటివరకు జగత్తు యొక్క ఉత్పత్తి గురించి విచారించాము కదా! ఇక మనం 'స్థితిప్రకరణం’లో ప్రవేశిస్తున్నాము. ఇది వింటే, అభ్యసిస్తూఉంటే

తప్పక స్వయముగా మోక్షము చేకూరగలదు. శ్రద్ధగా విను.

ఒక్కసారి క్రితం ప్రకరణంలోకి తొంగిచూచి, ఆపై ముందుకు పోదాము.

స్థితి ప్రకరణం

ఇప్పటివరకు అనేక యుక్తులచే, న్యాయ నిర్ణయంచే నేను-నీవు మొదలైన ప్రత్యయములతో కూడి ఈ దృశ్య జగత్తు ఆకారరహితము, శూన్యము, భ్రాంతి మాత్రము, అసత్మయము అని మనం చెప్పుకున్నాం. ఇది నీవు స్పష్టీకరించుకున్నావనే అనుకుంటున్నాను.

కొందరు మహాజ్ఞానులగు పెద్దలు, విలక్షణమైన ఈ జగత్తును చమత్కారంగా కనబడే ఒక చిత్రపటంతో పోలుస్తూ ఉంటారు. అయితే, ఈ 'జగత్తు' అనే చిత్ర పటమునకు చిత్రకారుడంటూ ఎవరూ లేరు. అనగా, దీనికి 'కర్త' అంటూ ఎవరూ లేరు. హేతువు లేకుండా... కుంచెలురంగులు-చిత్ర కారుడు లేకుండా ఈ 'జగత్తు' అనే చిత్రం బ్రహ్మాండంగా భాసిస్తోంది.

శ్రీరాముడు : అదేమిటి స్వామీ! చిత్రకారుడే లేకుండా చిత్రపటం ఉండటమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును అందుకు స్వప్నమే మనకు దృష్టాంతము. స్వప్నద్రష్టయే తన స్వప్నమును రచించుకొనుచున్నాడు కదా! అట్టి స్వప్నద్రష్ట ఆ స్వప్నంలో విభాగంగా ఉన్నాడా? స్వప్నమునకు ఆవల ఉన్నాడా? స్వప్నం అతని కంటే వేరైనదా? అందులోని వ్యవహారమంతా అతని ఇచ్ఛ యొక్క నిర్ణయమేనా? కాదా? ఏం చెప్పగలం? ఈ జగత్ చిత్రం కూడా - · ద్రష్ట రహితం (అనగా దృశ్యమును చూచువాడు దృశ్యములో ఉండలేదు). నిద్రావర్జితం, అనుభవరూపం అగు ఒక సుదీర్ఘమైన స్వప్నంలాగా ఆకాశంలో ఉదయిస్తోంది. "భవిష్యత్తులో ఎప్పటికో ఏర్పడబోవుచున్నట్లున్న నగరంలోని వీథులలో విహారమునకు ఇప్పుడు వెళ్ళటం అను అనుభవంలాగా చిత్తము నందే ఆవిర్భావం పొందుతోంది. ఒక చమత్కారమైన దృష్టాంతం చెపుతాను. కొన్ని కోతులు ఒక రోజు కొన్ని గురువిందగింజలను తెచ్చి ఒకచోట పోశాయట. ఎందుకో తెలుసా? అందలి ఎరుపును చూచి "ఇది అగ్నియే. అందుచేత మనం చలికాచుకోవచ్చు" అని భావించి, ఉపశాంతి పొందటానికి! వాటికి ఆ గురువిందగింజలను చూస్తున్నంతసేపు నిజంగానే చలికాచుకుంటున్నట్టి అనుభవం కలుగుతూ ఉన్నదట!

ఆ విధంగానే అసత్తు, అర్థరహితం అయినప్పటికీ, ఈ జగత్తు 'అర్థసాధకం' అగుచున్నది. జలంలోని ఆవర్తం జలం కంటే వేరు అని అనగలమా? ఈ జగత్తు కూడా బ్రహ్మం కంటే భిన్నం కాదు. కాని, భిన్నంగా తోచుట మాత్రం జరుగుతోంది. ఈ కనబడే ‘జగచ్ఛిత్రం’ సద్రూప మగు పరమాత్మయే అయి, మరొకవైపుగా ఆకాశంలోని నీలత్వం వలె ఉనికిని పొందుతోంది.

రత్నము మధ్యలో కిరణసమూహముల సమన్వయం ఏదో చమత్కారమైన 'దృశ్యం’లాగా కనబడుతుంది. ఈ దృశ్యము కూడా ద్రష్ట యొక్క హృదయములోనే చమత్కారంగా రూపు దిద్దుకుంటోంది.

మృగతృష్ణలోని జలంలాగా, ఇదంతా అసత్యమై ఉండి కూడా సత్యం వలె అనుభవమౌతుంది.

ఒకడు తనయొక్క దృఢ-దీర్ఘ-తీవ్ర సంకల్పము (Zone of Visualisation) నందు చూచే భవనములు" వలె... ఇదంతా కూడా విస్తారమై ప్రాప్తిస్తోంది. అయితే ఏం? వాస్తవానికి అసద్రూపమే (actually not existant) అయివున్నది.

Page:10

ఒక కవిచే కల్పించబడిన కథలోని పాత్రలు, ప్రదేశములు, సంఘటనలు పాఠకునికి ఆహా! అయ్యోఁ! అనురూపంగా ఆశ్చర్య-సంతోష-దుఃఖ-కోపాదులను కలిగిస్తూ ఉంటాయి చూచావా? ఇదంతా కూడా అట్లే కల్పనామాత్ర స్వరూపం కలిగియున్నది.

స్వప్నంలో చూడబడిన పర్వతంలో సారమేమున్నది? లేదు. కానీ, స్వప్నసమయంలో అది దృఢంగానే ప్రాప్తిస్తుంది కదా! ఇదంతా కూడా, అట్లే, భూతాకాశరూపమున వెలుగొందుచున్నది.

మేఘములు ఆకాశమును కప్పివేసి ఆకాశం కనబడకుండా, కేవలం అంతా మేఘమయం గానే ఉంటుంది చూచావా? ఈ జగదృశ్యము కూడా ఆత్మ సత్తను కప్పివేసినదై ఉంటోంది. ఇదంతా అక్షయంగా ప్రాప్తించటానికి కారణం జ్ఞానము యొక్క అభావమే.

స్వప్నములోని సుందరస్త్రీతో ఏర్పడే సమాగమం లాగా ఇక్కడ ఒకరికొకరికి సంబంధ - బాంధవ్యములు, ప్రియ-అప్రియములు, సుఖ-దుఃఖములు ఏర్పడుచున్నాయి. ఇదంతా నిరర్థకమై, వైచిత్రమై, ‘జగత్తు' అను పేరుతో ఏర్పడి ఉంటోంది.

మనోరాజ్యము యొక్క 'అనుభూతము' వలె ఇదంతా అసత్యము, అవస్తువు అయి ఉన్నది. చిత్రంలోని కమలమునకు సువాసన ఉంటుందా? ఈ దృశ్య విషయం కూడా అంతే.

అనుభూతం మనోరాజ్య మివాసత్యమవాస్తవమ్ |

చిత్ర పద్మాకర ఇవ సార సౌంగధ్య వర్జితమ్ ॥

'కల్పనామయంమాత్రమే' అయివుండి కూడా ఇదంతా శూన్యమునందు వికశితమై, అనేక విధములైన వర్ణనలతో ఒప్పుచున్నది.

'ఇది మాత్రమే దీని ఆకృతి" అని చెప్పగలిగేదేదీ ఇక్కడెక్కడా లేదు. కనుక ఇదంతా మిథ్యారూపమే.

ఎందుచేత ఈ జగత్తు ప్రాప్తిస్తోంది?

పరామర్శ విచారణ లేనంతవరకు మాత్రమే ఈ జగత్తు ఇట్లు అనేక సత్య సంఘటనలు కలిగియున్న దాని వలె ప్రవర్తిస్తూ పోతుంది. ఎప్పుడైతే 'పరమాత్మ' గురించి సద్విచారణ చేస్తామో... మరుక్షణం, ఇదంతా శుష్కించి, 'స్వస్వరూపానుభవము' నందు లయించిపోతోంది. అత్యంత అసంభవమైనప్పటికీ, ప్రత్యక్షమై తోచుచుండుటయే ఈ జగత్తు యొక్క చమత్కారం!

3. జగత్తు - వివిధ నిర్వచనములు

జలములో ఏర్పడిన బుద్భుదముల (Bubbles) యొక్క ఆకారం కల్పితమైనదే కదా! లేకుంటే జలము బుద్బుదములుగా మార్పు చెందుచున్నదా? లేదు. చివరకు ఇదంతా శూన్యమే అయినప్పటికీ దీర్ఘము - ప్రకాశవంతము అయిన శరీరం కలిగి ఉంటోంది.

శ్రీరాముడు : తండ్రీ ఈ జగత్తులో కొంత మనోహరత్వము కూడా మనకు కనబడుతోంది కదా?

Page:11

శ్రీ వసిష్ఠ మహర్షి : నిజమే. కాని, 'సుదీర్ఘ దృష్టి, తత్త్వ విచారణ' లేకపోవుటచేతనే ఇది స్వల్ప సమయములలో ఈ జీవుని దృష్టికి 'మనోహరంగా కనిపించటం జరుగుతోంది. 'మనోహరము’ అని వర్తమానంలో చెప్పబడుచున్న అనేక విషయముల (వ్యవహారముల) పరిణామం అనేక సందర్భములలో 'కటు' ప్రదం (Soarness), దుఃఖ ప్రదంగానే ఉంటోంది. జనన మరణములతో కూడినదై, జీవులను భ్రమింపజేయుటలో ఈ జగత్తును మించినదేమున్నది? పరిశీలించి, గ్రహించటం జరిగితే మాత్రం, ఈ జగచ్చిత్రంలో ఏమీ లేదు అనియే తెలియవస్తోంది. 'రంగుల మేళనము’ అయినట్టి చిత్రపటంలో నిజమైన సూర్యుడు, కొండలు, పక్షులు ఉంటాయా? ఉండవు. కానీ, ఉన్నట్లు ఆ చిత్రపటం చూచే కొందరు ప్రేక్షకులు ఆ అనుభూతిని పొందుచున్నారే!

వివిధ శాస్త్రకారులు ఈ జగత్తును రకరకాలుగా నిర్వచించుచున్నారు. సాంఖ్యులు - ఇదంతా కేవలం జడాత్మకం. వేదాంతులు - ఇదంతా అవిద్యారూపమే.

పదార్థవాదులు - ఇదంతా కాలానుగుణంగా పరమాణువుల కలయిక విడిపోవుట" అను ప్రక్రియచే ఏర్పడుతోంది. కనుక ఇదంతా రూపరహితం. నామరహితం.

కణాదగౌతములు - దీనికి "ఇది" అనబడు నియతి ఏదీ లేదు. ప్రతిదీ ఎప్పటికప్పుడు మరొక రూపాంతరం చెందుతుంది. కనుక ఈ జగత్తు లేదు. పరమాణువులు మాత్రం ఉన్నాయి.

ఇవన్నీ నిజమే కావచ్చు లేదా కాకపోవచ్చు. ఏది ఏమైనా, ఈ ద్రష్ట యొక్క అంతరంగము మాట ఏమిటి? ఈ చూచు, గ్రహించు, అర్థము చేసుకొను ద్రష్ట ఎవరు? ఈ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఎట్టిది?

బాహ్య అభ్యంతర న్యాయం - ఒకడు బాహ్య జగత్తును ఏ అభిప్రాయంతో అవగాహన చేసుకుంటాడో అంతరంగమున తన స్వరూపము గురించి అట్టి అవగాహనయే కలిగి ఉంటాడు. బాహ్య జగత్తు గురించిన న్యాయమే అంతరంగమునకు కూడా వర్తిస్తూ ఉంటుంది. అందుచేత, నాచే, బాహ్య దృష్టిచే చూడబడుచున్న ఈ తదితర జీవులు భౌతికమాత్ర శరీరులు కాదు.... అను అవగాహనయే క్రమేపీ స్వస్వరూపము గురించిన ఔన్నత్యమును ధృవీకరించగలదు.

నేను పంచభూతమయుడను. శరీర పరిమితుడను అను అనుభవం ఈ జీవునకు ప్రత్యక్షంగా ఉండిఉండవచ్చుగాక! కాని, యదార్థానికి ఇతడు భౌతిక ధర్మరహితుడు. (He is never bound by physical barriers) ఆకారము లేనివాడు. వాని రూపము ఒక నిశాచరుని వలె, చీకట్లో కదులుచున్నట్లు భ్రమచే కనిపించే రూపాల వలె ఆవిర్భవిస్తోంది. ఈ రూపాదులు అవాస్తవములు. ఈ విషయం సమగ్రమైన, సమున్నతమైన అవగాహనచే మాత్రమే అర్థమై, అనుభవమగుచున్నది.

వాస్తవానికి ఈ జీవుడు రూపరహితుడు.

Page:12

4. బీజము-అంకురము-బ్రహ్మము-జగత్తు

శ్రీరాముడు :ఒక విత్తనములో మహావృక్షము యొక్క స్వభావములన్నీ నిద్రాణంగా దాగి వున్నాయి కదా!* అట్లాగే 'మహాప్రళయం - సమయంలో ఈ జగదృశ్యమంతా పరమాత్మయందే ఉండి ఉంటోంది. మరలా సృష్టికాలంలో ఆ పరమాత్మ నుండే ఉత్పన్నమై పరిఢవిల్లుతోంది... అని మనకు శ్రుతులలోని కొన్ని సూత్ర వాక్యాలు చెప్పుచున్నాయి. అయితే, పరమాత్మ నిరాకారుడని, నిస్సంగుడని, జగద్రహితుడని మీరు ప్రతిపాదించారు. మరి ఈ రెండు అభిప్రాయాలకు, పొంతన ఎట్లా ఏర్పడుతుంది? మహా ప్రళయంలో ఈ జగత్తు 'స్వస్తత'తో కూడినదై తన కారణము నందు లయించి ఉంటోంది. ఇంతలోనే ఎప్పుడో విజృంభించి బహిర్గతమౌతోంది. మరల ఆ కారణము నందే లయించబోవుచున్నది" - అని కొందరి అభిప్రాయమై యున్నది కదా! అట్లు భావించేవారు మీ దృష్టిలో జ్ఞానులా? అజ్ఞానులా? మా అనుమానాలన్నీ తొలగాలనే ఉద్దేశంతో మిమ్ములను ఇట్లు ప్రశ్నిస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో చెప్పప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి : విత్తనంలో 'అంకురించటం' అనే స్వభావం దాగివున్నట్లు, మహాప్రళయ సమయంలో స్వసత్తతో కూడిన పరమాత్మయందు ఈ జగత్తు దాగి వుంటోంది, అనేది నిర్వధికమైన సత్యం కాదని, మరి అది మధ్యేమార్గంలోని అభిప్రాయమేనని మేము అనుకుంటున్నాం. ఎందుచేతనంటావా? ఇది నీవు గ్రహించటానికి నీకొక యుక్తి చెపుతాను. విను.

ఆత్మయందు 'జగత్తు' అనబడేది ఏదైనా అసలు ఉన్నదా?

ఉత్పత్తికి ముందే కారణము నందు కార్యము ఉండి ఉంటుంది" అని చెప్పువారిని ఒక చిన్న ప్రశ్నవేద్దాం. అట్టి కారణము నందు కార్యము (అనగా, బ్రహ్మము నందు జగత్తు)... ఏ

రూపంలో ఉంటోంది?

1. సత్త...? సత్త రూపంగా ఉంటోందా? (లేక)

2. సంస్కారం...? నిద్రాణమైయున్న 'సంస్కారం' రూపంలో ఉంటోందా?

దృష్టాంతానికి, విత్తులో భవిష్యత్తులో ప్రకటన కాబోయే మహావృక్షం, ఆకులు, కాయలు లాగా! గాలి, నీరు తగలగానే విత్తు మొలకెత్తునట్లుగానే... ఏదైనా పరిస్థితులచేత ఆత్మయందు జగత్తు ప్రకటితమగుచున్నదా? (లేక)

3. మరి ఇంకొక తత్త్వంగా ? ఆత్మయందు ఆత్మకు వేరైనట్టి మరొక తత్వంగా ఉండి ఉందా? ఉదా: బీజము నందు, ఆ బీజము కంటే వేరైన అంకురము ఉన్నట్లు.

సదేవ సోమ్యే_దమగ్ర అసీత్ : ఈ జగత్తు మొట్టమొదట పరమాత్మ యందే ఉన్నది - వేదవాక్యం

Page:13

ఒక విత్తనం తగిన నేలలోనే, గాలి-నీరు లభిస్తూ ఉన్నప్పుడే మొలకెత్తుచున్నది అట్లా కాకుండా, ఆ విత్తును కఠిన శిలపైననో, లేక, నాటకుండా మరెక్కడో ఉంచితే మొలకెత్తుతుందా? లేదు. మరి, పరమాత్మయందు ఈ జగత్తు ఎట్లా ఉద్భవిస్తోంది? "ఏ సారవంతమైన నేల, నీరు, గాలి మొదలైన బాహ్యకారణములచే జగత్తు యొక్క ఆవిర్భావం సాధ్యపడుతోంది? ఒకవేళ ఏదో సహకారి కారణములు ఉన్నాయనే అనుకుందాం. ఆ బాహ్య కారణములకు కర్త ఎవరు? పరమాత్మయేనా? మరెవరైనానా?

మరొక ప్రశ్న? ఒక బీజమున ఉండి ఉంటున్న సత్తా సామాన్యమే సర్వవస్తువులందు కూడా ఉండి ఉన్నది కదా! మరి ఒక విత్తనమును ఇనుముపై ఉంచినపుడు కూడా మొలవటం జరగాలి కదా? అట్లా మొలుస్తుందా? లేదే! పరమాత్మయందు ఏ అనుకూల స్థలప్రాప్తిచే ఈ జగత్తు ఉద్భవిస్తుంది? ఏ ప్రతికూల స్థలములందు ఇది ఉద్భవించదు?

పరమాత్మ ద్వితీయమా? అద్వితీయమా?

పోనీ... బీజము వేరు. అంకురసత్త (మొలుచుట అను ధర్మము నిర్వర్తించు తత్త్వము) వేరు. బీజము' అను దాని యందు 'అంకురము' అనబడు వేరొక ధర్మము లేక తత్త్వము లేక స్వభావ-సత్త' ఉన్నది. ఆ విధంగానే పరమాత్మ వేరు... జగత్తు వేరు. కానీ, ఈ జగత్తు పరమాత్మయందే ఉన్నది... అని అనవచ్చునా? అప్పుడు బీజము - అంకురముల సంబంధము, -

మరియూ, ఆత్మ - జగత్తుల సంబంధము ఈ రెండూ కూడా వస్త్రము - కుండలవంటి వేరు వేరు వస్తువుల సంబంధము వంటిదే అవుతుంది. "పరమాత్మ యందు జగత్తు వేరుగా ఉన్నది" అని అనదలచుకుంటే, పరమాత్మకు ద్వితీయమైనది కలదనీ, అది అద్వితీయం కాదనీ... నిర్ణయించవలసివస్తుంది...!

శ్రీరాముడు: అట్లా అనలేము కదా! అట్లా అంటే పరమాత్మకు వేరైనదేదీ లేదు, అద్వితీయుడు. మరియు పరమాత్మ వస్తురహితము అను ఉభయ వేదములు అభిప్రాయానికి భంగం వస్తుంది. ఆ తరువాత ఇంకా అనేక సమాధానాలు లేని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి.

శ్రీవసిష్ఠుడు: అవును. నీవు అన్నది వాస్తవమే. విత్తనము కంటే అంకురము వేరైనది, అట్లే జగత్తు వేరు. పరమాత్మ వేరు... అందామంటే వాటి ఆద్యంతాల కొరకు, ఆవిర్భావ తిరోభావాల కొరకు, ఆ రెండింటికీ సంబంధం కలుగజేయుచున్న మరొకదాని కొరకు వెతకాలి. పైగా, నీవు చెప్పినట్లు... అద్వితీయం' అను వేదవాక్కు తిరస్కరించబడినట్లే అవుతుంది.

బీజము-అంకురముల న్యాయము; పరమాత్మ-జగత్తుల న్యాయము -

మూడు సిద్ధాంతాలు మన ముందు ఉన్నాయి.

1. ఆత్మ చేత జగత్తు...! (సామాన్యసత్తచే అసమాన్యమగు అంకురాదులు కలుగుచున్నట్లు) నిష్క్రియమగు ఆత్మచే జగత్తు నిర్మించబడటం

Page:14

2. ఆత్మయందు జగత్తు...! (అంకురము బీజసత్త" రూపమున ఉన్నట్లు) జడజగత్తు అజడమగు పరమాత్మ యందు ఉండటం

3. ఆత్మయే జగత్తు...! (అంకురమే బీజము రూపమున, వృక్షము రూపమున ఉన్నట్లు) పరమాత్మయే జగత్తు రూపమున, అనేకత్వము వహించి ఉండటం.

ఈ మూడింటిలో కొంత లోపం కనబడుతోంది.

కార్యము 'స్వసత్త' రూపమున తన కారణము నందు ఉండి ఉంటుంది (The effect that is manifesting here was earlier hiding in its cause) అను బోధ వాస్తవం కాదు. "జగత్తు బ్రహ్మం నందు ఒకప్పుడు ఉండి ఇప్పుడు బయల్వెడలుచున్నది అనేది సరికాదు. భగవంతుని యందు ఈ జగత్తు కలదు అనే బోధ విపరీత భావనయే అని అనక తప్పదు. ఇట్టి బోధ చెప్పేవాడిని, వినే వాడిని కూడా మోహంలో ముంచుతుంది.

చూచావా రామా! మరల చెప్పుచున్నాను. ప్రళయ సమయంలో ఈ జగత్తు సత్స్వరూపమగు పరమాత్మయందు దాగి ఉన్నది. బీజంలో అంకురంలాగా పరమాత్మలో ఈ జగత్తు ఉన్నది"... అనునదంతా అనుచితమేనని మా అభిప్రాయం. అట్టి ఉపమాన దృష్టాంతముల కూడిన పాఠాలను ఆశ్రయిస్తే, అట్టి బుద్ధి భ్రాంతిరూపమునే పొందుతుంది. ఎందుకంటావేమో? బీజం ఇంద్రియాలకు గోచరిస్తుంది. కంటికి కనబడుతోంది. అట్లాగే దానియందలి అంకురము, ఆకులు, పూలు, పళ్ళు, కాయలు కూడా కళ్ళకు కనబడుచున్నాయి. కాని పరమాత్మ విషయమో?

పరమాత్మ మనస్సుకు ఇంద్రియములకు అతీతుడు కదా! మనస్సు లయించినప్పుడు మాత్రమే 'పరమాత్మ' యొక్క అనుభవం అవుతుంది. అతి సూక్ష్మము, స్వయం ప్రకాశకము, అసంగము అయిన పరమాత్మ స్థూలము, కార్యకారణ జనితము (something that is bound by cause and effect) అయినట్టి ఈ బ్రహ్మాండములకు, ఇందలి పదార్థములకు బీజమెట్లా అవుతాడు?

అసలు - ఆకాశము కంటే సూక్ష్ముడు (more subtle than even space), వాక్కులన్నిటికీ అతీతుడు, నామరూప రహితుడైన పరమాత్మ యందు “జగత్తు అనబడే బీజమెట్లా సంభవిస్తుంది? పరమాత్మ సదా ఏకరసమై సత్స్వరూపమై ఉంటాడు కదా! అతడు అతి సూక్ష్ముడు. కాబట్టే స్థూల దృష్టిగల అజ్ఞానులు అనుభవమునకు 'అసత్తుల్యుడు - అగమ్యము అయి ఉంటున్నాడు.

కొందరు ద్రష్టలు తమయొక్క స్థూల దృష్టి చేతనే, “ఈ జగత్తు ఒకప్పుడు ఒక రూపమున పరమాత్మ యందు కలదు అని దర్శించటం జరుగుతోంది. బుద్ధి సూక్ష్మత్వము చెందగా, తత్ఫలితంగా ఈ జగత్తు యొక్క భ్రమ తొలగిపోతుంది. భ్రమలను ఆశ్రయించుటచేతనే ఏర్పడి ఉండి ఉంటున్న జగత్తు భ్రమ 'రహితస్థితి’లో స్వతహాగా లేనిదే అగుచున్నది.

పరమాత్మ యందు బీజత్వమెచ్చట? బీజమే లేని చోట అంకురం ఎచ్చట?

ఆకాశము కంటే నిర్మలమై, అజ్ఞానుల దృష్టియందు శూన్యమువంటిదై ఉంటున్నట్టి పరమ పదమున జగత్తుగాని, జగత్-పదార్థములు గాని ఎట్లా ఉంటాయి? పరమాత్మ యందు దృశ్య

Page:15

మానమగు అవయవమే లేదే! ఇక అందులో బ్రహ్మాండము అనబడు వస్తువు ఎక్కడ ఉండ గలదు? ఒకవేళ ఉంటే, అది ఎక్కడి నుండి వచ్చిందో మనకు ఎందుకు లభించుట లేదు? రూపమే లేనట్టి దాని యందు ఏ పదార్థమైనా ఎట్లా వచ్చి చేరుతుంది? ఎక్కడి నుండి వస్తుంది? శూన్యం లోంచి పర్వతాలు వస్తాయా?

ఆకార రహితమగు పరమాత్మ యందు ఏదీ ఉండజాలదు. ఈ 'జీవుడు' అనబడేవాడు కూడా సదా-సర్వదా నిరాకారుడేగాని, సాకారుడు కానేకాదు.

శ్రీరామచంద్రుడు : మహర్షీ! 'బ్రహ్మము-జగత్తు... ఇవి రెండూ భేదరూపమున లేవు. ఏకత్వ రూపముననే ఉన్నాయి' అని అనవచ్చా?

శ్రీవసిష్ఠ మహర్షి : చిత్స్వరూపమగు పరమాత్మకు, జడరూపమగు జగత్తుకు ఏకత్వమెట్లా ఘటిల్లగలదయ్యా? ఒక మఱివిత్తు ఒక ఆకారము కలిగి ఉన్నది. 'అందు అంకురము కలదు' అంటే ఒప్పుకోవచ్చు. అంతేకాని, 'నిరాకారమగు పరమాత్మయందు విశాలాకారమగు ఈ జగత్తు ఉన్నది' అనునది అసంగతమే కదా!

'ప్రళయసమయంలో ఈ జగత్తు 'స్వసత్త' రూపమున పరమాత్మయందు ఉన్నది' అను సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుతోంది. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు1. ఆ విధంగా లౌకిక ప్రమాణములచే నిశ్చయిస్తున్నామా? లేక

2. శ్రుతి వాక్యములను (ఉదా: సదేవసౌమ్యే దమగ్ర అసీత్) అనుసరించి అట్లా నిర్ణయానికి వస్తున్నామా?

ఈ రెండు విధానములను మనం విమర్శించవచ్చు.

లౌకిక ప్రమాణముల దృష్ట్యా - మనం ఈ దృశ్యమును చూస్తున్నాం. దేని సహాయంతో 'బుద్ధి మొదలుగాగల ఈ సమస్త ఇంద్రియ శక్తుల సహాయం చేతనే కదా? ఈ బుద్ధి, ఇంద్రియాలచే, వాటిని అనుసరించి అనుభవమయ్యే పదార్థజాలం 'ఇంద్రియాతీతస్థితి'కి సంబంధించనిదే

అవుతుంది కదా?

"ఈ పదార్థములు ప్రళయంలో లయించిపోయి, మరల ఆ తరువాత ఉద్భవిస్తున్నాయి.” అని ఇంకొక అభిప్రాయం.

బాగానే ఉన్నది. కానీ, అవి బుద్ధి వృత్తులను అనుసరించి ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరొక విధంగా (అందంగాను సామాన్యంగాను, ఇష్టంగాను అయిష్టంగాను, ముఖ్యంగాను -స్వల్పంగాను.... ) తోచుచుండవలసిన పనేమున్నది? 'ప్రత్యక్షము-అనుమానము' అనబడు ఆయా బుద్ధి వృత్తులచే దర్శనము వేరు వేరుగా ప్రభావితం ఎందుకు అవుతోంది?

ఈ దృశ్యము ఒకప్పుడు కనిపిస్తుంది. మరొకప్పుడు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోయేది వాస్తవమెట్లా అవుతుంది? లౌకిక ప్రమాణములందు సమగ్రమైన అవగాహన ఉన్న కుశలురు ఈ విషయం గ్రహిస్తూనే ఉన్నారు.

Page:16

ఎందుచేతనంటే...

ఏ దృశ్యము జాగ్రత్తులో చూస్తున్నామో, అది స్వప్నసమయంలో ఏర్పడి ఉండుటయే లేదు. స్వప్న సమయంలో మరొక రంగము ఏర్పడి ఉంటోంది.

శ్రుతి వాక్యముల దృష్ట్యా - ఇది పరమాత్మయందు ఉన్నదై పరిఢవిల్లుతోంది." - అని కదా శ్రుతి యొక్క అభిప్రాయం! (సదేవసౌమ్యే దమగ్ర అసీత్) ను అనుసరించి 'కార్యము కారణమూలకు రెండు వేరైన సత్తలు లేవనియే తెలియవస్తోంది. మా ఉద్దేశ్యం ప్రకారం ఈ వాక్యం ... ఏకమేవాద్వితీయం బ్రహ్మ - కేవలం అద్వితీయమగు బ్రహ్మము ఒక్కటే ఉన్నది ... అను వాక్యమునకు గల అర్థం అనే లక్ష్యానికి మార్గమధ్యంగా అందించబడిన మధ్యేమార్గవాక్యమే గాని అందుకు వేరైన సిద్ధాంతం మాత్రం కాదు.

కార్య - కారణ సంబంధములు - ఇక్కడ సాంఖ్య సిద్ధాంతములో కనబడే ఒక అభిప్రాయం

గురించి చెపుతాను, విను.

కార్యమే (దృశ్యము) సత్యమా? - - పై వాక్యములను అనుసరించి కార్యమే సత్యమై అట్టి కార్యసత్యమే కారణత్వముగా రూపొందించుచున్నదా? లేక

కారణమే (ద్రష్టయే) సత్యమా? - కారణమే సత్యమై, ఆ కారణమే కార్యము నందు ఆరోపించబడుచున్నది అనాలా? లేక

కార్య - కారణములకు ఆవల ఉన్నట్టి పరమాత్మయే సత్యమా? - పరమాత్మయే సత్యమై, అద్దాని సత్తయే కార్య-కారణములందు ఆరోపించబడుచున్నదా?

ఈ మూడు ప్రశ్నలను సాంఖ్య సిద్ధాంతాలు బాగా తర్కించి విచారించాయి. చివరికి ఇలా నిర్ణయింపబడినదికార్యసత్యమే ఒకానొకప్పుడు కారణత్వము పొందుతోంది.

(అనగా బ్రహ్మమే ఒకానొకప్పుడు జగత్తుగా పరిణమిస్తోంది.)

మరల మరొకప్పుడు ఆ కారణత్వమంతా కార్యత్వములోనే లయిస్తోంది. (మరల ఈ జగత్తు మరొకప్పుడు బ్రహ్మమునందే లయిస్తోంది?)

ఇక మా అభిప్రాయం విను- ఆయా 'బోధ’లలో మాకు కొంత భ్రాంతి కనబడుతోంది. వాచారంభమ్, వికారో నామధేయమ్ అన్నట్లుగా మట్టివలన కలిగిన కుండ-గోడ'... ఇవన్నీ కేవలం పేరుకు మాత్రమే వేరు వేరుగా ఉన్నాయి. 'మట్టిగోడ' అనునది మట్టికంటే వేరా? మట్టిగోడ అవటం, కుండ అవటం ఎక్కడున్నది? మట్టిలో గోడగా ఏర్పడవలసిన కారణమే ఉండదు కదా! బ్రహ్మమునందు కారణమే మిథ్య. కారణమే మిథ్య అయినప్పుడు కార్యము కూడా మిథ్యయే కదా! బ్రహ్మము నందు జగత్తు ఏర్పడటానికి ఏ సహకారి కారణం లభించుటయే లేదు. కారణమే అసత్యమైన చోట ఇక కార్యము ఉత్పన్నంకాజాలదు.

Page:17

"సత్యమగు కారణము కార్యత్వమును పొందుచుచున్నది బ్రహ్మమే జగత్తుగా

పరిణమిస్తోంది అనునది ఆత్యంతిక సత్యము కాజాలదు. అందుచేతసద్వస్తువగు పరమాత్మ యందు కార్య కారణములు ఏ క్షణంలో కూడా లేవు. అద్దాని సత్త యందే “కార్య - కారణములు ఆరోపించబడుచున్నాయి. తదనంతరం, జాగ్రత్తుగా భ్రమ యందు వలె దర్శించబడుతోంది.”

ఈ అవగాహనయే జీవుని తన సత్యత్వము వైపు నిత్యత్వము వైపు నడిపిస్తుందని మా అభిప్రాయం. ఆరోపణ బుద్ధి కారణంగా ఆత్మయందు ఈ జగత్తు యొక్క కారణము, జగత్తు అనబడే కార్యము అసమగ్రమైన అవగాహన కలవారికి కనబడుచున్నది.

ఈ జగత్తు పరమాత్మ నుండి ఆవిర్భవిస్తోంది" అనే మాట శిష్యులకు బోధించుట కొరకై గురువులచే కల్పించబడిన ఒక మాధ్యే మార్గ విధానంగానో, లేక అసంపూర్ణమైన అవగాహన చేతనో ఏర్పడుచున్నది. అదంతా మిథ్య మాత్రమే...! అందుచేత ఈ జగత్తు అనబడు ఒకానొకటి ఏర్పడింది అనే అసత్యత్వపు భావనయే నీ నుండి తొలగించి వేయి. జగద్భావన త్యజించివేయ బడుగాక! అప్పుడు ఆదిమధ్యాంత రహితము, సత్స్వరూపము" అగు పరమాత్మయే శేషిస్తోంది.

అదియే నీ యొక్క వాస్తవ స్వరూపం. 'దానికి మించి వేరుగా ఎక్కడా ఏదీ ('జగత్తు' అనే పేరుతో) లేనే లేదు' అని గ్రహించు.

5. ఈ జగత్తుకు కర్త ఎవరు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ ప్రియ రామచంద్రా! సర్వదా తెలుసుకొనబడవలసిన వస్తువైయున్న ఆత్మను ఎరుగుటలో శ్రేష్ఠుడవు. ఇప్పుడు ప్రళయ సమయంలో ఈశ్వరుని యందు ఈశ్వరునికంటే వేరైన జగత్తు ఉన్నదనుట దోషయుక్తము అని నిరూపించబోవుచున్నాను. విను.

సృష్టి ఉంటే జగత్తు ఉంటుంది. మరి జగత్తే లేకపోతే...? సృష్టి ఉండజాలదు కదా! “ఉత్పత్తి” అనే క్రియ, కర్త ఉంటేనే సాధ్యపడుతుంది.

ఈ జగత్తుకు కర్త ఎవరు? ఒకవేళ "సద్రూపమగు పరబ్రహ్మమే జగత్తుకు కర్త" అని అంటామనుకో... అప్పుడాతను కర్తృత్వ, భోక్తృత్వములు కలవాడౌతాడు. ఈ జగత్తు ఒకప్పుడు ఉండటం, మరొకప్పుడు లేకపోవటం (ఉదా : జాగ్రత్ - సుషుప్తులు) అందరికీ అనుభవమే కదా! జగత్తును సృష్టిస్తున్న కర్తను సృష్టించుచున్న వేరొక 'మహాకర్త' ఉండి ఉండాలి.

(ఈ జగత్తును ఎవరో సృష్టించుచున్నాడని అనుకుంటే, ఆ వ్యక్తిని సృష్టించుచున్నదెవరు? అను ప్రశ్న ఉదయిస్తుంది)

Page:18

'కాని కూటస్థమగు పరబ్రహ్మమునకు కర్త లేడు' అనునది వేదవచనం. బ్రహ్మము ఉత్పత్తి రహితమైనది. ఉత్పత్తి అనబడు ప్రసక్తియే లేని పరబ్రహ్మమునందు 'జగత్తు యొక్క సత్త' మహాప్రళయ సమయంలో (జగత్తు రహితమైన స్థితియందు) ఎట్లు, ఎచ్చట, దాగి ఉండగలదు? కల్పనారహితమైన చిదాకాశము నందు 'కర్త'ను గురించి కల్పన చేయాలనుకుంటే, ఆ కర్తను సృష్టించునట్టి సహకారి కారణము ఏమిటో కూడా మనం గుర్తించగలగాలి.

బ్రహ్మమే కర్తయా? బ్రహ్మము సర్వదా 'అకర్త' కదా!

అసలు ఏ సహకారి కారణాలు లేకుండా జగత్తు తనంతట తానే బ్రహ్మము నందు ఉత్పత్తి పొందుచున్నదా? నీరు, గాలి, నేల వంటి సహకారి కారణాలు లేకుండా విత్తనం ఎక్కడన్నా మొలకెత్తుతుందా? 'గొడ్రాలి రెండవ కూతురు గడుసుది' అనేది ఎట్లా ఏర్పడగలదు? అట్లు ఎవ్వడూ, ఎక్కడా, ఏదీ గాంచుచుండుట లేదు కదా?

సర్ప రజ్జు భ్రాంతి - కనుక, 'సహకారి కారణము' లేకుండా ఎవరికైనా ఏదైనా కనిపిస్తుంటే, అది త్రాడులో కనబడే పాము వంటిది" అని అనక తప్పదు.

త్రాడు పాముగా కనిపించుటంలో త్రాడు పాత్ర ఉన్నదా? - ఉన్నది.

త్రాడు స్వయముగా పాముగా అగుచున్నదా? - లేదు.

పాముగా కనబడవలెనను ఇచ్చ త్రాడు కలిగియున్నదా? లేదు.

ద్రష్టయే అట్లు త్రాడునందు పామును ఆరోపించుచున్నాడా? - అవును.

ద్రష్ట "పామును చూచెదనుగాక అను ఇచ్ఛ కలిగియున్నాడా? అట్లని అనలేము. కానీ, అతని సంస్కారములే త్రాడును పాముగా చూచుటకు తెరవెనుక నుండి ప్రోత్సాహక కారణాలు అగుచున్నాయని అనవచ్చు. అయినప్పటికీ, త్రాడే లేకుంటే పాము స్ఫురించేదే కాదు కదా! పాము త్రాడునే ఆశ్రయించుకొనియున్నదా? అవును. కానీ, పాము' అనబడునది మొదలే లేదుకదా! ఈ పాము’ అనునది ఇతఃపూర్వం త్రాడునందే దాగి వున్నదా? లేని పాము త్రాడులో దాగి ఉండట మేమిటి? ఈ పాము త్రాడు కన్నా వేరా? కాదు. ఇదియే 'సర్పరజ్ఞు భ్రాంతి’.

సృష్ట్యాది యందు ఈ జగత్తు" లేక "సృష్టి రూపమున బ్రహ్మమే తనయందు స్థితి పొంది ఉంటోంది. ఆ బ్రహ్మం ఇప్పటికీ (సృష్టి సమయంలో కూడా) ఆకారరహితమై, తన స్వస్వరూపం నందే సర్వదా నెలకొనియే ఉంటోంది. అట్టి బ్రహ్మమునందు మరి ఇది జనించునది. ఇది జనింపజేయునది - అను భేదమెక్కడిది చెప్పు? అట్టి భావమునకు చోటే లేదు.

అట్లా కాకుండా, ప్రళయము నందు 'జగత్తు' అనబడుదాని ఉనికిని అంగీకరించామనుకో... అప్పుడు "బ్రహ్మములో ఉన్నట్టి 'జగత్ సత్త', జగత్తుగా పరిణామం చెందటానికి, ఎక్కడి నుండో సహకారి కారణాలు వచ్చి చేరుతున్నాయి అని అనవలసి ఉంటుంది. (అంటే "బ్రహ్మమునకు వేరుగా వేరొకచోట ఏదో ఉన్నది. అక్కడి నుండి ఈ సహకారి కారణాలు బయలుదేరుచున్నాయి”

Page:19

అనాలి.) అట్లా అనలేము కదా? బ్రహ్మమునకు బాహ్యమంటూ ఏదీ లేదని 'వేద ద్రష్టల' యొక్క

అనుభవం కదా!

శ్రీరాముడు : మట్టి కుండ కావడానికి కుమ్మరి చక్రం, కుమ్మరివాడు సహకారి కారణాలు. అట్లాగే బంగారు ఆభరణం కావటానికి కొలిమి, వివిధ ఆకారములతో కూడిన లోహపాత్రలు, కంసాలి సహకారి కారణాలు. ఇక్కడి సహకారి కారణాలు బాహ్యము నుండి వస్తున్నాయి. అయితే, బ్రహ్మము నందు జగత్తు ఉద్భవించటానికి కారణమగుచున్న ఆ సహకారి కారణాలు "బ్రహ్మము నుండే వస్తున్నాయి అని అనవచ్చు కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అట్లా అయితే... బ్రహ్మము-జగత్ సత్త - - సహకారి కారణాలు ... ఇవన్నీ ఒక్క బ్రహ్మమే అయివున్నాయని నిరూపించబడుచున్నట్లే కదా!

బ్రహ్మమే అయివున్న ఈ జగత్తు బ్రహ్మమే కారణంగా బ్రహ్మమునందే స్ఫురించుచు, మరల బ్రహ్మమునందే లీనమగుచున్నది - అను ప్రవచనమునకు అర్హమగుచున్నది.

శ్రీరాముడు : మీరు చెప్పేది వాస్తవమే స్వామి! "ప్రళయములో ప్రకృతితో కూడుకొనిన పరమాత్మ యందు సహకారి కారణసహితమైన ఈ జగత్తు తిరోహితమై (having been withdrawn) నిశ్శబ్ద అప్రకటిత రూపమున ఉంటోంది అని చెప్పబడేదంతా చిన్న పిల్లలు చెప్పుకొనేదే కాని, బుద్ధి మంతులు అట్లు గాంచరని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి: చూచావా? రామా? దీనిని బట్టి తేలేదేమిటి? ఈ జగత్తు సత్యమైన రూప మంటూ ఏదీ కలిగియుండలేదు. కలిగియుండుట లేదు. కలిగియుండబోవుట లేదు. శుద్ధమగు చిదాకాశమే భావనామాత్రంచేత శీఘ్రంగా తనయందు ఈ 'జగత్ అనుభవం' అను రూపమున వికసించుచున్నది. ఎప్పుడైతే ఈ విధంగా విచారణచే జగత్తు యొక్క అభావమే సిద్ధిస్తోందో అప్పుడిదంతా బ్రహ్మమే అవుతుంది కాని, మరింకేమి కాదు.

6. స్మరణ-విస్మరణ

ఈ బ్రహ్మము "తనను తాను స్మరించుచున్నప్పుడు (పూర్ణముగా ఎరుగుచున్నప్పుడు) బ్రహ్మానుభవమే పొందుతోంది. అప్పుడిక జగత్తు యొక్క అనుభవం ఉండుటలేదు. తనను తాను విస్మరించినప్పుడో, ఈ జగత్తులోని అనేకత్వమును ఆశ్రయించి ఉంటోంది. జగత్సంబంధమైన సంస్కారముల ప్రభావం చేత ఇంద్రియములచే పొందబడుచున్నదే 'జగత్తు'గా చెప్పబడుతోంది. తనను తాను అంతటా దర్శించునట్టి అనుభవమే బ్రహ్మానుభవం సుమా!

మట్టికి రూపం లేదు. కాని కుండకు రూపం ఉన్నది. కుండ మట్టి కంటే వేరైనది కాదు. రూపము పొందుట' అను చమత్కారం మట్టి యందు సర్వదా ఉండియే ఉన్నది. అదే బ్రహ్మం నందు గల చిచ్ఛక్తి. కుండ పగిలినప్పుడు మట్టి-మట్టియే అగుచున్నది.

Page:20

శ్రీరాముడు : అంటే, ఈ జీవుడు గాఢ నిద్రాపరవశుడు అయినప్పుడో, లేక మరణించినప్పుడో జగత్తు యొక్క రాహిత్యమును అనుభవించుచున్నాడు కదా. కుండపగిలితే మట్టి అగుచున్నట్లు ఈ జీవుడు దేహము తొలగినప్పుడు పరబ్రహ్మమే అగుచున్నాడా?

శ్రీవసిష్ఠ మహర్షి : లేదు. అది సరి కాదు. ఈ జీవుడు గాఢనిద్రాపరవశుడైనప్పుడో, లేక మరణించినప్పుడో ఈ పదార్థ వ్యవహారము అతని నేత్రములకు గోచరించకపోవచ్చు. అంత మాత్రం చేత జగత్ సంస్కారం చిత్తమునందు 'నివృత్తి' చెందదు సుమా! ఈ చిత్తము మరల తదుపరి శరీరములను తనయందలి 'మననత్వము' అను కారణంచేత పొందుతూ పోతూనే ఉన్నది. సంకల్పవశంచేతనే అదంతా ప్రాప్తించటం జరుగుతోంది. అనగా మరణానంతరం కూడా ఈ జీవుడు పదార్థ పూరితమైన జగత్తును దర్శిస్తూ పోతూనే ఉన్నాడు. ఓ రామా! "ఈ దృశ్యమును పొందుట అనబడునది శరీరప్రాప్తితోనే ప్రారంభమగుచున్నదని అనుకొంటున్నావా? లేదు. అట్లే శరీరము నశించిన మాత్రం చేత చిత్తము శమించుట లేదు. అసలీ దృశ్యమును ఇట్లు చూస్తున్నది ఎవరు? శరీరమా? చిత్తమా?... చిత్తమే చూస్తూన్నది గాని, శరీరము కాదు సుమా!

చిత్తం’ అంటే ఏమిటి?... "కామ్యకర్మలకు సంబంధించిన వాసనల యొక్క బీజమే చిత్తం”. దృశ్య శమనము అంటే అట్టి బీజము (చిత్తం) శమించుట.

అంతేగాని, 'దృశ్యము శమించుట' అంటే 'పదార్థములు తొలగించుట' - అని కాదు సుమా! పదార్థములు ప్రక్కకు పెట్టినంత మాత్రంచేత 'దృష్టి - భావన' తొలగుతాయని అనలేం. పదార్థములు శమిస్తే ఏమియు శమించనట్లే. చిత్తము శమించటమే నిజమైన శమము. జ్ఞానము లేకపోతే చిత్తము శమించదు. చిత్తం శమించకపోతే దృశ్యం ఉండియే తీరుతుంది. కనుక రామా! దృశ్యం నాకుండకూడదు" అని భావించి, రాజ్యాదులను త్యజించినంతమాత్రంచేత ఏం లాభం? చిత్తములో సంస్కారవృత్తులు ఉన్నంతవరకు దృశ్యానుభవం యథారీతిగా ఉండనే ఉంటుంది.

మనస్సులో అజ్ఞానము ఉండి ఉన్నది" అని గుర్తించబడాలి. అట్టి మూల అజ్ఞానం సహితంగా మనస్సును సంపూర్ణంగా అధిగమించివేయాలి.

అదే (లేక, అప్పుడే) మోక్షం. అంటే 'దృశ్య' మనే అనర్థమును సంక్షయింపజేయటమే మోక్షం. ఒకడు తనలోని అజ్ఞానపూర్వకమైన పదార్థ - - సంస్కారములను ఎదుర్కోకుండా, “ఈ జగత్తు ప్రళయంలో ఏమౌతుంది? ప్రళయానంతరం ఎక్కడి నుండి వస్తుంది?" అని వాదోపవాదములు ఎన్ని జన్మల వరకు చేసినా మనకు లభించేదేమీ ఉండదు. ఏది స్వతహాగా లేదో “అది లేదు” అను జ్ఞానమే ముక్తికి సాధనము గాని, ఉన్నట్లు ఎంత కాలం ఉంటుంది? నిద్రాణంగా మరెంత కాల ముంటుంది? అని నిరుపయోగంగా కాలం వృథా చేసుకోవద్దని సత్యాన్వేషకులందరికి మా మనవి. "పదార్థములు ఉండవచ్చు, లేకుండవచ్చు. ఈ రెండింటియందు అభేదమే సర్వదా సత్యం. కాబట్టి నా చిత్తం నుండి 'పదార్థములను స్మరించటం తొలగించి, బ్రహ్మమును స్మరించటంతో నింపివేస్తాను అని లక్ష్యము కలిగియుండి, ఆ తరువాత ఏది ఎట్లు ఉచితమో అట్లే ఆచరించు.

Page:21

అజ్ఞానము' అనబడు జాడ్యమునకు "ఆత్మ సాక్షాత్కారము అనునదే ఔషధం. ఆత్మ సాక్షాత్కారముచే చిదాకాశము అనబడు రూపముగల ప్రబోధం కలుగుతుంది. అనగా, ఈ జగత్తంతా చిన్మాత్రమగు బ్రహ్మమే అయి ఉన్నది. చిన్మయ రూపము కానిదంటూ లేశం కూడా ఎక్కడా లేదు - అను జ్ఞానం పరిపక్వత పొందుతుంది. "ఇతని పేరు ఇది, వీరు నా వారు, ఇవి నావి, నేను పుట్టాను, చచ్చాను... అను భ్రమలు హృదయాంత రంగములలో ఉండజాలవు.

ఒక గోడపై చిత్రించబడిన చిత్రము వాస్తవమా? అందులో కనబడే పులి, మనుష్యులు మొదలైనవి బాలునకు భావావేశం కలిగించవచ్చునేమో! గోడపై చిత్రించబడిన కథా చిత్రంలోని సంఘటనను చూచి దుఃఖించటం అజ్ఞులు వ్యవహారమేకదా! గోడపై చిత్రముతో తాదాత్మ్యము’ తొలగితే 'గోడ’ యొక్క అనుభవము మాత్రమే సిద్ధించునట్లు, ఆత్మజ్ఞానానుభవం సముపార్జించు వారికి ఈ జగత్తు అంతా కూడా తనయొక్క మరొక స్వరూపం గానూ, స్వకీయమైన దర్శన చమత్కారం గానూ గోచరించటం జరుగుతోంది.

చిత్రకథా న్యాయము -

1. గోడపై చిత్రించబడిన ఒక కథా దృశ్యం.

2. గోడ

3. ఆ గోడనూ, ఆ రంగుల కథా దృశ్యములను చూస్తున్నవాడు

ఈ మూడింటి సంబంధమునే 'చిత్రకథాన్యాయం' అని అంటూ ఉంటాము. ఈ కనబడే పర్వతాలు, భూములు, వర్షాలు, కాలము, జన్మ, మరణములు మొదలైనవన్నీ చిత్రకథా న్యాయమును అనుసరించే ఉన్నాయి. అట్లే కల్ప-మహాకల్పములు, ఈ సృష్టి, వేదావాజ్ఞయములో చెప్పబడిన "సృష్ట్యాది (సృష్టి యొక్క ఆరంభము) మొదలైనవన్నీ కూడా సుమా! అంతే కాదు. ఈ ఆకాశాదుల సృష్టి క్రమము, కోట్ల కొలది బ్రహ్మాండములు, భూత - భవిష్యత్ - వర్తమానములోని సంబంధ బాంధవ్యములు, దేవతలు మనుష్యులు, చతుర్దశ భువనములు, సప్తద్వీపములు ఇవన్నీ చిత్రకథాన్యాయమును అనుసరించే ఉన్నాయి. ఇవన్నీ అల్పదృష్టికి వాస్తవముగానూ, ఉపాధి పరంపరల దృష్ట్యా స్వప్నతుల్యంగానూ, ఆత్మ దృష్ట్యా భ్రమగానూ ప్రాప్తిస్తున్నాయి. అనగా ఇవన్నీ “ఈ జీవుడు అనబడు ద్రష్టయొక్క స్వస్వరూపమే” అయివున్న 'సర్వాత్మ' అను గోడపై చిత్రించబడిన చిత్రకథ వంటిది.

ఆత్మకు వీటన్నిటితో సంబంధము లేనేలేదు. ఆత్మ యందు ఇవి లేవు.

శ్రీరాముడు : మరి ఇవన్నీ ఎందుకు కనబడుచున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : నీవు ఆత్మదృష్టిని దృఢీకరించుకోక పోవుటచేతనే 'జగదృష్టి' అనునది ఏర్పడి ఉంటోంది. అట్టి జగదృష్టికి అవాస్తవమగు ఇవన్నీ దృశ్యమానమౌతున్నాయి.

పైన చెప్పిన దృశ్య వ్యవహారమంతా ఆవరణ రహితమే.

ఒక సత్యమును ప్రకటిస్తున్నాను, విను.

Page:22

అనంతమగు చిదాకాశమున ఏ చిత్స్వరూపము ఉండి ఉన్నదో అది ఇతఃపూర్వం ఎట్లున్నదో, ఇప్పుడు కూడా అట్లే స్ఫురించుచున్నది.

'కిటికీ' లోంచి సూర్యకిరణాలు గదిలోకి ప్రసరిస్తూ ఉంటే, ఆ కిరణాలలో కనబడే పరిచ్ఛిన్నములైన పరమాణువులన్నిటిలోను ప్రకాశించే సూర్యకాంతి ఒక్కటే కదా! ఈ సర్వ పదార్థములు 'మహాచైతన్యము' యొక్క ప్రభవములే అయివున్నాయి.

అయితే గోడపై చిత్రమునకు, ఈ జగత్తుకు ఒక భేదము ఉన్నది. గోడపై చిత్రం సాకారమైనది. ఈ సృష్టియో, రూపరహితము.

మనస్సుచే 'క్షుభితం అగుచున్న చైతన్యము తనయందలి చిత్-చమత్కారమైనట్టి ఈ జగద్రూపమంతా మననము చేయుచు (అనగా, భావన చేయుచు) అనుభవించుచున్నది.

మరొకప్పుడు అది మననమునకు అతీతమైయున్న తన స్వస్వరూపమగు ఆత్మవస్తువుతో ఏకీభావము’ పొందుచున్నది.

'చిత్రములోని కథ'ను చూచువాడు 'గోడ'ను, 'గోడ'ను చూచువాడు 'చిత్రము' లోని సంఘటనలను చూడరు కదా! చైతన్యమే స్వరూపముగాగల ఈ జీవుడు ఆత్మను ఏమరచి ఉండు నప్పుడు జగత్తును గాంచుచున్నాడు. అట్లు జగత్తును గాంచుట ప్రారంభించుటయే కల్పారంభం”. జగత్ రాహిత్యం” అను అనుభవమే కల్పాంతం లేద జగద్రాహిత్యం.

దృష్టి’ యొక్క దోషం చేత ఒకనికి పెద్ద 'స్ఫటికశిల' యందు ఏవేవో రేఖలు చలనరహితంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మయొక్క వాస్తవమైన స్వరూపమునందు ఈ బ్రహ్మాండములు ఉత్పన్నమగుట లేదు. నశించుటలేదు. అవి వచ్చుట లేదు, పోవుట లేదు. నిరాకారమగు ఆకాశం’ నందు నిరాకారమే’ అయివున్న 'ఆకాశ విభాగము' ప్రాప్తిస్తూ ఉన్నట్లు నిర్మలమగు ఆత్మ యందు, ఆత్మయే రూపముగా గల ఈ సృష్టులన్నీ స్ఫురించుచున్నాయి.

నీటి యందు ద్రవత్వము, వాయువు నందు చలనము, సముద్రము నందు కెరటములు, గుణవంతుని యందు గుణములు ఉన్నట్లే ఆత్మయందు ఈ జగత్తు ఉంటోంది. శాంతము, ఏకరసము, విజ్ఞానఘనము అయినట్టి బ్రహ్మమే స్వయముతో 'ఉత్పత్తి నాశనములు అను వ్యవహారముగా కూడుకొనిన ఈ జగత్తు రూపమున వ్యాప్తమైయున్నది.

శ్రీరాముడు : స్వామి! ఈ 'జగత్తు' ఆత్మనుండియే ఉద్భవిస్తోందనునది మీరు ఒప్పుకుంటున్నారు కదా? లేక ఇవి ప్రకృతి నుండి ఉత్పన్నమౌతున్నాయా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మనుండి ఏదైనా ఉత్పన్నం కావటానికి సహకారి కారణమనేది ఏదీ లభించుటయే లేదని మనం చెప్పుకున్నాం కదా! అందుచేత “జగత్తు ఆత్మ నుండి ఉత్పన్నమౌతోంది “ప్రకృతి నుండి ఆత్మయే రూపముగా గల ఈ జగత్తులు ఉదయిస్తున్నాయి.” మొదలైన భావాలన్నీ పిచ్చి పిచ్చి వాక్యాలూ, మధ్యేమార్గ వాక్యాలేగాని, 'పూర్ణార్థవాక్యాలు' కావు.

Page:23

ఆత్మ నుండి ఏదీ ఉద్భవించుటలేదు. స్వసంకల్పముచే ఆ ఆ చైతన్యమే జగదృష్టి కలిగియుండి, తన స్వరూపమునే ఇట్లు జగత్తుగా గాంచుచున్నది.

నాయనా! రాఘవా! ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని వాక్యముల సారమేమిటో మరొక్కసారి సమీక్షిస్తూ వివరిస్తాను. ఈ సంక్షిప్త వాక్యాలు విను -

1. నిత్యోదిత స్వస్వరూపం - నీవు సర్వదా నిత్యోదయ స్వరూపముగల చైతన్యమువే గాని ఈ జడదేహమువు కాదు. నీవు భావనలుగా పరిణమించుటలేదు. అనగా, సర్వ భావములకు ఆవల స్వస్వరూపమునందే సర్వదా ఉండి ఉన్నావు.

2. సర్వమునకూ ముందుగానే...! సర్వ కల్పనలకు ముందే ఉన్న శుద్ధ స్వరూపమువే నీవు. కల్పనారూపములగు కళంకములేవీ నీ పట్ల ఉండజాలవు. అందుచేత ఇప్పటికిప్పుడే సర్వవేదనలు త్యజించి నిశ్చింతుడవై ఉండు.

3. సదవగాహన, నిస్సంగముల అభ్యాసం - స్వప్నరూపములతో పోల్చతగ్గ ఈ దృశ్యవస్తువులకు సంబంధించిన వికల్పములన్నీ నీనుండే బయల్వె డలుచున్నాయి. కనుక, అట్టి వికల్పములన్నీ సదవగాహన నిస్సంగముల సహాయంతో తొలగించుకో.

4. స్వస్వరూపంలో జాగరుడవు కావటం - 'అవిద్య' అనబడే సుదీర్ఘమైన గాఢనిద్ర నుండి మేలుకో. నీ యొక్క పరమాకాశ స్వరూపమును గ్రహించి ప్రశాంతుడవు కమ్ము.

5. జ్ఞానమును జ్ఞాన మార్గాలను ఆశ్రయించటం - నిర్భయుడవై ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తూ జాగృతి పొందు.

6. “సర్వమునందు నన్ను, నాయందు సర్వమును గాంచటం" . బ్రహ్మవిత్ స్వభావుడవై వెలుగొందుము. అన్ని భేదభావములను త్యజించివేయి. సర్వమును నీయందు, నిన్ను సర్వము నందు గాంచుచుండు. అప్పుడు నీ ఉనికి, సంచారం ఈ భూమండలమును భూషితం’ చేగలదు.

7. స్మృతి

శ్రీరాముడు : ఓ మునీందా! మీరు మమ్ములను ఉత్తమోత్తమమైన భావనవైపుకే నడిపించు చున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు నాదొక సందేహం.

మహాకల్పాంతము, సృష్ట్యాది - మహాకల్పాంతము తరువాత, సృష్ట్యాదియందు, ప్రథమ ప్రజాపతి (బ్రహ్మ) స్మృతి లేక “సంస్కారం రూపముగా కలిగియుండి, జన్మించుచున్నాడని నేను అనుకుంటున్నాను. అట్టి ఆ ప్రజాపతి యొక్క స్మృతి లేక మనస్సే ఈ జాగ్రత్ రూపమున ఉత్పన్నమగుచున్నది కదా? అంతేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. నీవు చెప్పినట్లు మహాప్రళయం గతించిన తరువాత మరల సృష్ట్యాది యందు ప్రథమ ప్రజాపతి 'స్మృతి' రూపముననే ఉత్పన్నమగుచున్నాడు. కనుక

Page:24

స్మృతి" యందే ఈ జగత్తు భాసిస్తోంది. అనగా, స్మృతి యందే ఈ జగత్తు యొక్క అనుభవం సంకల్పరూపమున స్థితి కలిగియున్నది.

అయితే, మట్టితో కొన్ని బొమ్మలు తయారయ్యాయనుకో... 'మట్టి ఆకారములుగా మారుచున్నది' అన వచ్చునా? ఆత్మ స్మృతి రూపమును పొందటం ఉంటుందా? ఒక మహా వృక్షమును చూపించి, 'దీని వ్రేళ్ళు ఆకాశంలో ఉన్నాయి. ఆకులు మాత్రం ఇక్కడ చేయికి అందుతున్నాయి’ అనటం ఎంత అసమంజసమో అదీ అంతే.

పరమాత్మ యందు స్మృతి లేదు. 'జన్మ' మొదలైన వికారములు లేవు.

'స్మృతియే జన్మలకు కారణం' అనేది మధ్యేమార్గవాక్యం మాత్రమే. ఈ వాక్యం, 'జీవుడు ఆత్మస్వరూపుడే కనుక జన్మరహితుడు' అను వాక్యాలు రెండూ ఒకేసారి ఒనగూడుచున్నాయి. నదీ జలం-తటాకజలం-జలం”; బొమ్మలోనికుండలోని మట్టి - మట్టి ఒనగూడుచున్నట్లే ఆ రెండూ ఏర్పడుచున్నాయి.

శ్రీరాముడు : స్వామి! 'ప్రళయం' అంటే ప్రతి రోజు ఈ జీవుడు అనుభవించే సుషుప్తి’ వంటిదే కదా! మనమందరం రాత్రిపూట గాఢనిద్ర అనుభవిస్తున్నాం. మరల మేల్కొన్నపుడు పూర్వ స్మృతులన్నీ యథాతథంగా ఉండి ఉంటున్నాయి.

అట్లాగే సృష్ట్యాదియందు ప్రజాపతి తనయందు స్మృతి కలిగి ఉంటున్నాడు అని అనవచ్చు కదా! 'మహా ప్రళయము యొక్క ప్రబల మోహము కారణంగా పూర్వకల్పములోని సంస్కారము లచే జనించిన స్మృతి అంతా నశిస్తుంది" అని కొందరు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. అట్లా ఎందుకు అనుకోవాలి? గాఢనిద్రలో లాగా మహాప్రళయంలో కూడా జగత్తుకు సంబంధించిన స్మృతులు దాగియే ఉంటాయని అనుకోవచ్చునంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : "ఈ జన్మకు సంబంధించినవాడను మాత్రమే నేను అను దృఢమైన

అహంకారము కలవాడు 'జీవుడు'

" ఈ అనేక సర్వఉపాధులను ధరించువాడను నేనే అను సమష్టి అహంకారము గలవాడు - "ప్రజాపతి (లేక) బ్రహ్మదేవుడు.

ఓ రాఘవా! వినుపూర్వము జనించియున్న బ్రహ్మలందరు (సమష్టి సృష్టికర్తలందరు జ్ఞానులే కదా! అందుచేత వారంతా మహాప్రళయ సమయంలో దృశ్యాన్ని త్యజించివేస్తున్నారు. అనగా ముక్తులే అగుచున్నారు. అంటే అవశ్యము నిర్విషయ పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నారు. అప్పుడిక... పూర్వ కాలమున ఉత్పన్నమైన 'స్మృతి'ని కలిగియుండి మరల కల్పారంభమున ప్రకటితం చేయటం అనే క్రియకు కర్త ఎవ్వరో చెప్పు?

కర్త ముక్తుడు అయినప్పుడు, ఇక స్మృతి కూడా ముక్తిపొందినదై నిర్మూలనమగుట

జరుగుతుంది కదా!

Page:25

ఒకడు ఒక దీర్ఘ స్వప్నమును గాంచుచూ, మేలుకొన్నాడనుకో... అప్పుడాతని స్వప్నములోని వ్యవహారమును మరొకడు వచ్చి కొనసాగించగలడా? లేదుకదా! అతఃస్మర్తురభావేన స్మృతిర్వోదేతికిం కథమ్ | అవశ్యంహిమహాకల్పే సర్వేమోక్షైకభాగినః (సర్గ. 3; శ్లో. 8)

కర్మయే లేనప్పుడు, స్మృతి ఎట్లా సంభవిస్తుంది? ఏ విధానమును అనుసరించి సంభవిస్తుంది? ‘మహాకల్పము' నందు సర్వము మోక్షము పొందుచుండును కదా! సర్వులు మోక్ష భాగులే అవుతారు. 'మోక్షము' పొందటం జరిగిన తరువాత ఇక ఇచ్చ - సంస్కారము - స్మృతి అనునవన్నీ నిష్ఫలములే అవుతాయి.

శ్రీరాముడు : మరి మీరు "స్మృతియే కల్పారంభమున ప్రవర్తిస్తోంది" అని అన్నారు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, అన్నాను. కల్పారంభ వ్యవహారంలో 'స్మృతి' ప్రవర్తిస్తోందని చెప్పటంలో నా ఉద్దేశమేమిటో చెపుతాను, వినుచిదాకాశము' అనబడునది ఒకటి ఉన్నది. అది అనుభూతమా? కాదు. పోనీ అననుభూతమా కాదు. అట్టి చిదాకాశమందలి ఏ 'స్మృతి' అయితే ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి హేతువు అగుచున్నదో అయ్యది చిదాకాశము యొక్క కళయే గాని వేరేమీ కాదు. సూర్యుని నుండి సూర్యకిరణములు వేరు కానట్లు 'స్మృతి' అనేది చిదాకాశమునకు వేరైనదేదీ కాదు. శ్రుతులు ఈ ఆశయమునే ప్రకటిస్తున్నాయి. ఈ జగదనుభవం అనబడే "స్మృతి కల్పిత చిత్కళ" అనునది అనంతము కూడా! చిదాకాశమే దాని స్వరూపము.

అంటే అర్థమేమిటి?... స్వయంభువు అగు పరమాత్మయే జగద్రూపమున ఉన్నాడని గ్రహించెదవు గాక! అతడే ఈ జగములను. మరల లోపలికి గొనుచున్నాడు. సూర్యకిరణములు ఒక గోపురంపై ప్రసరించటం, మరల ఆ ప్రసరణ ఉపసంహారం కావటం సహజమే కదా!

అనాదికాలంగా సిద్ధించియున్న బ్రహ్మము యొక్క నిజప్రకాశరూపమే ఈ 'జగత్తు'కు సూక్ష్మదేహం. ఈ బ్రహ్మాండ దేహమునకు ఉపాదాన కారణం పరమాత్మయే. కనుక, ఈ బ్రహ్మాండము కూడా పరమాత్మయే" అని సిద్ధాంతీకరించబడుతోంది.

ఓ రామా! "దేశము, కాలము, క్రియ, ద్రవ్యము, రాత్రింబవళ్ళు, ఆకాశము, మేఘములు” మొదలైన అనేక విశేషములతో కూడి ఈ సువిశాల జగత్తు అంతా కనిపిస్తోంది కదా! అట్టి ఈ త్రిలోకములతో కూడిన జగత్తుఅంతా ఒక్క పరమాణువునందే భాసించుచున్నది. మరల ఈ త్రిలోకములలోని పరమాణువులందు ఈ త్రిలోకములంత విశాల సృష్టులు అసంఖ్యాకంగా భాసిస్తున్నాయి. మరల ఆ ఆ సృష్టులలో అసంఖ్యాకములైన పరమాణువులు - ఈ విధంగా వ్యవస్థ అవ్యవస్థారూపంగా ఒకదానియందు మరొకటి గ్రుచ్చబడి ఉన్నాయి. ఆయా దృష్టులకు అవన్నీ దృశ్యమానమగుచున్నాయి. అయితే రామా! అవన్నీ సత్యమని అనగలమా! కానే కాదు. ఇవన్నీ ద్రష్ట యొక్క చిత్కళాభావనా వైచిత్ర్యములే!

Page:26

ఈ విధంగా జ్ఞానుల దృష్టి సర్వదా జాగృతమై ఉంటోంది. వారికి ఇదంతా ఒక మొదలుగాని, చివరగాని లేని వ్యవహారంగా, సత్-అసత్స్వరూపంగా ప్రాప్తిస్తోంది. అజ్ఞానుల దృష్టి మిథ్యా రూపముగా అనుక్షణం గతించిపోతున్న వ్యవహారంగా అంతులేకుండా ఉండి ఉంటోంది. జ్ఞానుల దృష్టిలో ఈ ప్రపంచమంతా, నాశరహితము, శాంతము అగు కేవల పరబ్రహ్మమే అయి ఉన్నది. అదే ప్రపంచము అజ్ఞానుల దృష్టికి పదు నాలుగు లోకముల రూపమున ఉంటోంది.

యథేదంభాసురంభాతి జగదండకజృంభితమ్ | యథాకోటి సహస్రాణి భాంత్యన్యాన్యప్యణావణా || (సర్గ.3; శ్లో. 17)

ఈ బ్రహ్మాండము ఎట్లా భాసిస్తోందో, అదే విధంగా ఒక్క పరమాణువులో ఇటువంటి కోట్ల కొలది బ్రహ్మాండములు భాసించుచున్నాయి. స్తంభములో విగ్రహం, ఆ విగ్రహంలోని కాళ్ళు, చేతులలో మరి కొన్ని చిత్రములు లిఖించబడుచున్నట్లు, జగత్తులోని ప్రతి పరమాణువులో ముల్లోకముల విగ్రహము ఉన్నది.

ఆ ముల్లోకములలోని ప్రతి అణువులోను జగత్తులు ఉన్నాయి. ఈ వ్యవహారము అజ్ఞానము ఉన్నంతవరకు ఇట్లే ఉండి తీరుతుంది.

ఒక పర్వతము ఉన్నదనుకో... అందుగల అసంఖ్యాకములైన పరమాణువులు ఆ

పర్వతముకంటే వేరు కాదు కదా! అలాగే, 'బ్రహ్మము' అనే మహాపర్వతములో ఆ బ్రహ్మమునకు వేరు కానట్టి బ్రహ్మాండములు అనబడే పరమాణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి.

సూర్యకిరణాలలో కనిపించే సూక్ష్మ పరమాణువులను (త్రసరేణువులను లెక్కించగలమా? చిత్ అను సూర్యునిలో త్రిలోకముల రూపమున ప్రకాశించే బ్రహ్మాండ పరంపరలను లెక్కించ గలిగే వారెవ్వరు?

జలంలోను, ధూళిలోను అనేక పరమాణువులు పరిభ్రమించుచున్నట్లు చిదాకాశములో ‘ప్రపంచములు అనబడే అనేక పరమాణువుల పరిభ్రమణం చేస్తున్నాయి.

8. ఆత్మదృష్టి - - సృష్టిదృష్టి

శ్రీరాముడు : స్వామీ! ఆ విధంగా చిదాకాశములో ప్రపంచముల రూపమున ప్రకాశించేదంతా ఏమిటి? అది బాహ్యము నుండి వస్తోందా? అంతకుముందే బ్రహ్మమున ఉండి ఉన్నదా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! 'శూన్యము, నిరాకారము' అయివున్న ఆ కనబడే ‘భౌతిక-ఆకాశము’ వైపు చూడు... అది నీలముగా కనబడుతోంది... అయినప్పటికీ ఆ నీలత్వము యథార్థానికి శూన్యరూపమే అయి ఉన్నది కదా! అట్లాగే, సృష్టి రూపంగా మనకు ఇక్కడ అనుభూతమగుచున్నదంతా చిదాకాశమే అయివున్నది.

Page:27

దీనిని 'బ్రహ్మం' రూపంగా ఎరిగితివా, ఆ దృష్టి 'మోక్ష'మను ఉత్తమ శ్రేయస్సును ప్రసాదిస్తుంది. అట్లా కాకుండా సృష్టి" అనబడు ద్వైతభావనగా చూచావా, ఇది 'నరకము' మొదలైన అనేక అథోస్థితులను రుచి చూపిస్తుంది.

ఈ రెండు దృష్టులు నీ ఎదురుగానే ఉన్నాయి.

'సృష్టి - దృష్టి' అనుసరిస్తావా? 'ఆత్మ-దృష్టి' లేక 'బ్రాహ్మీదృష్టి' అనుసరిస్తావా? - నీ ఇష్టం. వాటి పర్యవసానం మాత్రం రెండు వేరైన త్రోవలుగా... ఒకటి సంసారము వైపూ, మరొకటి మోక్షము లేక దుఃఖ రాహిత్యమువైపు... ఉన్నాయి.

ఓ రామచంద్రా! ఇప్పటి వరకు అనేకసార్లు చెప్పిన వాక్యమునే మరొకసారి చెప్పుచున్నాను. ఈ జీవుడు మరింకేదో కాదు. ఇతడు సాక్షాత్, స్వయముగా ప్రత్యగాత్మ స్వరూపుడే. సూర్యకిరణాలన్నీ సూర్యుని ప్రతిభా విశేషాలే అయినట్లు, - ఈ బ్రహ్మాండాంతర్గత జీవులంతా చిదానంద సూర్యుని ప్రజ్ఞాకిరణపుంజాలే!

ప్రపంచము యొక్క ఉనికికి కారణభూతుడైన ఈశ్వరుడు - - ఈ జీవుడు ... వీరిద్దరు కూడా పరమార్థ దృష్టితో చూసినప్పుడు పరిపూర్ణము, ఏకరసము అయిన పరబ్రహ్మమే అయి ఉన్నారు. అందుకు ప్రమాణం వేద వాక్యాలే. (పూర్ణమదః పూర్ణమిదమ్ - ఋగ్వేదము) ఈ బాహ్య

- అభ్యంతరములు (The external & internal zones) రెండూ ఉపాధి భేదం చేత బ్రహ్మము నుండే

ఉత్పన్నమౌతున్నాయి - అని శ్రుతులు ప్రవచిస్తున్నాయి. ఏది ఎందులోంచి వస్తోందో అది అద్దాని

రూపమే అయి ఉంటుంది. ఇందులో సందేహించవలసినదేమీ లేదు.

జ్ఞానోదయము - ఈ తెలియబడుచున్న 'వేద్య వస్తు సముదాయము' అంతా, ఈ 'నీవు-నేను `అతడు మొదలైన వాటితో సహా శుద్ధము, చిన్మాత్రము జ్ఞాన స్వరూపము అయిన ఆ స్వస్వరూప బ్రహ్మమే. అనగా, ఈ 'జీవుడు గా కనబడుచున్న ద్రష్టయే దృశ్యము రూపముగా విస్తరిస్తూ, అద్దానిని ఆస్వాదిస్తున్నాడు.

అనేక కోణముల నుండి ఈ సర్వమును దీర్ఘకాలంగా పరిశీలించిన మాకు ఈ విషయం నిస్సందేహంగా గ్రాహ్యమగుచున్నది. బ్రహ్మము తప్పితే మరింకెక్కడా ఏదీ లేనే లేదు.

9. మనస్సే ఇదంతా !

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇంద్రియ సమూహములను జయించుట అను వంతెన చేతచే ఈ భవసాగరము దాటబడుచున్నది. మరింకే ఇతర కర్మల వలన గాని, వ్యవహారముల వలన గాని అది సాధ్యపడేది కాదు. 'శాస్త్రము-సజ్జన సాంగత్యము సాధన ... వీటి సహాయం చేత జీవుడు జితేంద్రియుడు, వివేకవంతుడు కాగలుగుచున్నాడు. జితేంద్రియుడు (ఇంద్రియముల

Page:28

ప్రభావమును అధిగమించినవాడు) మాత్రమే ఈ దృశ్యం యొక్క అత్యంత అభావమును ఎరుగగలడు. ఇంద్రియ జయమే సంసార భేదనము. ఇంద్రియవశత్వమే సంసారబంధనము.

చూచావా! రామా! ఇదీ, సంసార స్వరూపము. ఈ సంసార సాగరములు ఎట్లా ప్రాప్తిస్తున్నాయో, ఎట్లా నిర్వర్తిస్తున్నాయో ఈ విచారణల సహాయం చేత నీకు నీవే గ్రహించు. నిష్కామభావమును అవధరించు. ఆ పై ఏది ఎట్లు ఉచితమని భావిస్తావో, అట్లే నిర్వర్తించు.

ఇక ఎక్కువగా చెప్పవలసిన పనేమున్నది? ఈ మనస్సే 'కర్మ' అను వృక్షము యొక్క అంకుర మని గ్రహించు. ఈ మనస్సును ఉత్తమ అవగాహనతో నియమించితివా, ఇక విహిత - నిషిద్ధ (must do - must not do) కర్మల రూపమగు ఈ జగద్యృక్షము స్వయముగానే భిన్నమైపోతుంది. అంతా ఈ మనస్సే అయివున్నదని మరల మరల ప్రకటింస్తున్నాను. ఈ మనస్సుకు ఇక్కడే, ఇప్పుడే సరి అయిన చికిత్స చేయాలి. మరి ఇంకెప్పుడు ఏమి చేయగలవు చెప్పు?

మనః సర్వమిదం రామ, తస్మిన్ అంతఃచికిత్సి తే ॥ చికిత్సితోవై సకలో జగజ్జాలామయో భవేత్ ॥ (సర్గ. 4; శ్లో. 5)

ఈ మనస్సుకు ఇక్కడ సరి అయిన చికిత్స చేశావా, ఇది శమించిపోగలదు. అప్పుడు “జగత్సమూహము” అనబడే దృశ్యజాడ్యము మొదలంట్ల తొలగిపోగలదు.

మనస్సే ఈ దేహాకారముగా స్ఫురిస్తూ స్వప్నంలోలాగా 'క్రియాసమర్థం' అగుచున్నది. మనస్సుకంటే వేరుగా ఈ జడదేహం కార్యసమర్థమగుచున్నదెక్కడ? ఈ భౌతిక దేహం మనస్సుకన్న వేరైన లక్ష్యములు కలిగియుంటున్నదా? లేదు.

దృశ్యాత్యంతాసంభవేన ఋతేనాన్యేన హేతునా

మనఃపిశాచః ప్రశమం యాతికల్పశతైరపి ॥ (సర్గ. 4; శ్లో. 7)

అసలు ఈ 'సంసారము' అనబడే జాడ్యమునకు మూలకారణమేమిటి? విను, చెపుతాను. ఎప్పటి నుంచో తెలియదు గాని, ఈ జీవుణ్ణి దృశ్యము అనబడే ఒకానొక పిశాచము పట్టి పీడిస్తోంది. ఎందుకో, అతడు అది గుర్తించుట లేదు.

నా ఈ మాటలు జనులు శ్రద్ధగా ఆలకించెదరు గాక! జ్ఞానముచే ఈ దృశ్యమును పూర్తిగా రహితం చెయ్యాలి. అనగా, మొత్తము దృశ్యమునకు అతీతంగా వెళ్ళాలి. అదియే సర్వ

ప్రయత్నముల యొక్క ఉత్తమ ప్రయోజనం.

మరింకే వ్యవహారం ఎంతగా ఆశ్రయించినా సరే, ఈ దృశ్యము శమించేది కాదు సుమా!

మనోరోగమునకు పరమోత్తమమైన ఔషధం "దృశ్యము యొక్క పూర్ణ రాహిత్యం లేక సంపూర్ణమైన 'అతీతత్వం' 22 అయివున్నది. ఇందుకు వేరే మందేమీ లేదు.

ఈ మనస్సే దేహాదులందు ఆత్మభావనమును కలుగజేసి, మోహమును ఉత్పత్తి చేసి అంది స్తోంది. జన్మించేదీ అదే. మరణించేదీ కూడా అది మాత్రమే. ఈ మనస్సు యొక్క ప్రభావం చేతనే

Page:29

జీవుడు బంధంలో తగుల్కోవటం జరుగుతోంది. ఎవడైతే ఈ మనస్సును ఆత్మజ్ఞానంవైపుగా ఉన్ముఖం చేస్తాడో, అట్టివాడు స్వయంగా విముక్తిని పొందుచున్నాడు. “ఓ దృశ్యమా! నీవు నా మనస్సు యొక్క ప్రదర్శనమే!" అని గానం చేసే వాని మనస్సు దృశ్యంలో తగుల్కొనే ప్రసక్తి ఎక్కడిది?

ఓ జనులారా! మీరంతా చూస్తున్న ఈ జగత్తు మరెక్కడో లేదు సుమా! ఇది మీ చిత్తము లందు ఇట్లు సంకల్పాదుల బలంచే జగత్తుగా ఏర్పడుచున్నది. 'శూన్యం'లో విశాల గంధర్వ నగరంలాగా స్వప్నంలో చమత్కారములైన అనేక వస్తుజాలమువలె ఇదంతా ప్రాప్తిస్తోంది. అవస్తువే అయి వుండి కూడా ఎంతో సత్యముగా తోచుచున్నది. నాయనలారా! మీరంతా వాస్తవానికి సత్య-నిత్య-నిరుపమానంద స్వరూపులే అయివున్నారు. కాని ఏం లాభం? నిష్కారణంగా మనస్సుచే ప్రభావితులై 'అసత్యము'ను అత్యంత సత్యముగాను, నిత్యసత్యమగు 'నిర్మల చైతన్య తత్త్వము'ను లేనట్టిదానిగాను గాంచుచున్నారని మనవి చేస్తున్నాను.

ఒక్కసారి మీ మనస్సులను నిలదీసి ప్రశ్నించండి. నిరోధించండి. ఆత్మవైపు ఉన్ముఖులు కండి. అప్పుడు ఈ జగత్తు సత్యమో, అసత్యమో నన్ను ఏమాత్రం అడగవలసిన పని ఉండదు.

ఒక పూలగుత్తిలోంచి వస్తున్న సుగంధం ఆ పూలగుత్తికి వేరైన దానిలాగా గోచరిస్తూ ఉంటుంది కదా! మనస్సు నందే స్థితించియున్న ఈ జగత్తు కూడా, మనస్సుకు వేరైన దానివలె గోచరిస్తూ ఉండటం జరుగుతోంది. ఎందుచేత? ఆత్మజ్ఞాన లేమి చేతనే సుమా!

“ఒక నువ్వు గింజలో నూనె, “ఒక గుణిలో గుణములు" (చెడ్డవానిలో చెడుతనం, మంచివానిలో మంచితనం, అందగానిలో అందం, ధర్మపరునియందు ధర్మము మొ॥) ఎట్లా అంతర్లీనంగా ఉంటున్నాయో, ఈ చిత్తమునందే 'జగత్తును గాంచుట' అనబడు వాసనలతో కూడిన 'ప్రవృత్తి' ఉండి ఉంటోంది. సూర్యునియందు కిరణములు, తేజమునందు ప్రకాశము, అగ్ని యందు ఉష్ణత్వము ఉన్నట్లే -మనస్సునందు ఈ జగత్తు ఉన్నది. మంచునందు చల్లదనం లేదా? ఆకాశంలో శూన్యత్వం ఇమిడి ఉంటోంది కదా! వాయువు నందు చంచలత్వం అత్యంత సహజమై ఉంటోందే! అట్లాగే ఈ మనస్సునందు దృశ్య భావము ఉండి ఉన్నది.

ఇట్లు మనస్సే “జగదనుభవము అను సుఖ-దుఃఖ-ఆశ్చర్య-తిరస్కార-స్వ-పర” ఆదిగా గల చమత్కారములకు కారణమగుచున్నది. కాబట్టి రామచంద్రా!

మనస్సే ఈ సమస్త జగత్తు -

మరొక చమత్కారమైన విషయం :

మనస్సు నశిస్తే ఈ దృశ్య జాతమంతా స్వయంగా నశిస్తుంది. కాని, ఈ జగత్తు నశించినంతమాత్రంచేత మనస్సు నశించదు.

Page:30

అందుచేత రామా! ఈ జగత్తు విషయం కొంత సేపు ప్రక్కకు పెట్టు, మనస్సును ఎట్లా లంపజేయాలో ఆలోచించు.

సర్వ సంకల్పముల రహిత స్థితియగు 'స్వసత్త'ను అన్నివేళల ఆశ్రయించటం అలవరచుకో. అట్టి నిష్ఠను బలపరచగల కర్మ - జ్ఞానాదులను సముపార్జించు.

Page:31

II. భృగు - యమ సంవాదము

1. శుక్రుడు - ఇంద్ర సభాప్రవేశము

-

శ్రీరాముడు : ఓ మనీంద్రా! సర్వధర్మజ్ఞా! మా మీద అవ్యాజమైన ప్రేమతో మీరు మీ తపోధ్యానాదుల ప్రభావముచే గ్రహిస్తున్నదంతా చెప్పుకొస్తున్నారు. దోషరహిత మనోబలముచే, నిర్మలజ్ఞానంతో దర్శించుచున్న విశేషమంతా మాకు బోధించడం మా పూర్వజన్మల సుకృతమే! మీ వాక్యములు ప్రతిపాదిస్తున్న విచారణ విషయం చేత మమ్ములను మేము ఈ 'దృశ్యము' అనబడుదాని నుండి వేరు చేసుకొని పరిశీలించగలుగుచున్నాము.

మీరు సవివరంగా చెప్పుచున్నప్పటికీ, ఎక్కడో హృదయకుహరంలో ఇంకా ఏవేవో, ఎనెన్నో సందేహాలు దాగి ఉండటం చేత, మరల ఒక సందేహం ప్రకటిస్తున్నాను.

సువిశాలమైన ఆకారం కలిగియున్న ఈ ప్రపంచమంతా మనస్సునందే స్థితి కలిగి ఉన్నదని మీరు చెప్పుచున్నారు కదా! అది ఆ విధంగా ఎలా ఉండగలదు? మనస్సు నందు స్పురిస్తూ బాహ్యమున ఎట్లా తారసపడుతోంది? మేము తాకుట; చూచుట మొదలైన అనుభవములచే ఎదురుగా చూస్తున్నాం కదా? స్వామి! ఏదైనా ఉత్తమ దృష్టాంతం ద్వారా చెప్పితే మరికొంత సుస్పష్టం కాగలదని నా విన్నపము.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! ఇంతకుముందే ప్రవచించియున్న ఉపాఖ్యానాలలో మనం ఈ విషయం చూచాము. ఐందవులు (ఉత్పత్తిప్రకరణం) స్థూల శరీరరహితులైనప్పటికీ తమ యొక్క సమాధిస్థితిలో తమచే ఆశ్రయించిన భావావేశం చేత అనేక జగత్తులను నిర్మించుకుని అనుభవించారు కదా! ఆ జగత్తులన్నీ మనస్సులోంచే వచ్చాయి కదా! లవణ మహారాజు యొక్క మనస్సు (ఉత్పత్తి ప్రకరణం) ఇంద్రజాలముచే వ్యాకులము పొందినదై చండాలత్వానుభవం అత్యంత స్థూలభావంతో పొందింది.

అవన్నీ “మనస్సు నందే ఈ జగత్తు కలదు అని నిరూపిస్తున్నాయి.

నీవు మరొక దృష్టాంతం వినాలని కోరినప్పుడు నాకు భృగుమహర్షి యొక్క పుత్రుడు శుక్రుడు అప్సరసను చూచి సంసారస్థితులను పొందటం, భృగు - యమ సంవాదము గుర్తుకు వస్తున్నాయి.

మహాజ్ఞానియగు శుక్రుడు తన బాల్యంలో బాల్యచాపల్యంగా ఎట్లా సంసారిత్వము పొందాడో, కాలదేవుడు ఏ విధంగా ఈ సంసార వ్యవహారమును, మనస్సు యొక్క స్వభావ - స్వరూపములను భృగువుకు వివరించి చెప్పటం జరిగిందో చెపుతాను, విను.

Page:32

భృగువు అనే ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన ఋషులలో ఉత్తమోత్తముడని శ్లాఘించ బడుతూ ఉంటాడు. ఆయన ఒకప్పుడు మందరపర్వతముపై గల ఒక శిఖరంపై ఒక ప్రశాంతప్రదేశంలో ధ్యాన నిష్ఠలో ఉన్నారు. ఆయన కుమారుడే శుక్రాచార్యుడు. బాలుడైన ఆ శుక్రుడు తన తండ్రి సేవలో రాత్రింబవళ్ళు గడుపుతూ ఉండేవాడు. ఆ పిల్లవాడు మహా తేజః సంపన్నుడై, పూర్ణచంద్రుని వలె గొప్ప సౌందర్యముతో అక్కడ సంచరిస్తూ ఆ శిఖరమును పావనం చేస్తూ ఉండేవాడు.

ఒక రోజు భృగువు నిర్వికల్పన సమాధి యందు ప్రవేశించాడు. నిర్విషయ-మౌనము” వహించుటచే అచంచలుడై 'శిల'వలె ఉండియున్నారు. శుక్రుడు తన తండ్రిసేవలో ఉంటూనే ఆ వనంలో అటూ ఇటూ సంచరించేవాడు. కొంతసేపు ప్రకృతిచే నిర్మించబడిన పుష్పశయ్యలపై, మరికొంతసేపు పర్వత-వనములందు ఆహ్లాదంగా పవళించి, చల్లటి గాలులు, పుష్పాసువాసనలు ఆస్వాదిస్తూ ఉండేవాడు.

శ్రీరాముడు : మహర్షీ! శుక్రాచార్యులు 'మహాజ్ఞాని' యని చెప్పబడుతోంది కదా...!

శ్రీ వసిష్ఠ మహర్షి : కాని ఆ బాల్యస్థితిలో అప్పటికి మాత్రం విద్య - అవిద్యల మధ్య స్థితి కలిగి ఉండేవాడు. అనగా, అప్పటికాతడు పూర్ణమగు ఆత్మజ్ఞానమును ఇంకా పొందియుండలేదు. అట్లా అని, కేవలం అవిద్యయందు కూడా తగుల్కొనియుండలేదు. మన ఈ విశ్వామిత్ర మహర్షి శిష్యునిపైగల వాత్సల్యం చేత 'త్రిశంకు స్వర్గం' నిర్మించి ఇచ్చారు కదా! అట్టి భూ-ఆకాశముల మధ్య ఊగిసలాడే త్రిశంక స్వర్గంలాగానే జ్ఞాన - అజ్ఞానముల మధ్య ఊగిసలాడుతూ ఉండేవాడు.

ఇట్లా అనేక రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం అతడు అత్యంత ప్రశాంతమైన చిత్తము కలవాడై, శత్రురాజులందరినీ జయించి, అతఃపురంలో విశ్రాంతి పొందుతున్న ఒక రాజువలె... ఒక ఏకాంత ప్రదేశంలో నడుమువాల్చి ఉన్నాడు. ఆకాశమును చూస్తూ క్షణములు, నిమిషములు గడుపుచున్నాడు.

ఆ సమయంలో ఒక బహుసుందరమైన అప్సరస ఆకాశంలో కనిపించింది.

సుకుమారమైన ఆమె శరీరము, అందమైన కెరటములను గుర్తు చేయు కురులు, ఆ హంసవంటి నడక - ఇవన్నీ ఆమె ఉండియున్న స్థానమును అమృతమయం చేస్తున్నాయి. అప్సరస ఆకాశంలో ఎటునుంచో వచ్చి ఎచటకో వెళ్ళుచుండటం మన శుక్రుడు చూచాడు.

అంతేఁ! నిశ్చలమైన జలంపై ఒక బరువైన రాయిని విసరితే ఆ జలము యొక్క ఉపరితలం ఏమౌతుంది? ఆవృత్తములు ఏర్పడుచూ, నీరంతా సంక్షుభితం అవుతుంది కదా! ఆ అప్సరసను చూస్తున్న శుక్రుని మనస్సు కూడా ఎంతో క్షుభితం అయింది.

ఆ అప్సరస ఎందుకో వెనుకకు చూచింది. కాకతాళీయంగా ఆమె కళ్ళు శుక్రుని కళ్ళలోకి చూస్తూ నాలుగు ఐదు క్షణాలు 'అలాగే' ఉండిపోయాయి. ఆమె అలా చూస్తూ చూస్తూ మోహ పరవశం చేత చిరునవ్వు నవ్వింది.

Page:33

ఆమె సౌందర్యమునకు, ప్రేమతో చూచిన చూపులకు అతడు ఎంతో ముగ్ధుడయ్యాడు. కరిగిపోతున్న ఒక మధురస్వప్నంలాగా ఆమె క్రమక్రమంగా దృష్టి పథం నుండి వెళ్ళిపోయింది.

అతడు అప్పటికప్పుడు ఆకాశగమనం ద్వారా ఆమెను అనుసరించాలనే అనుకొన్నాడు. అప్పటికి మాత్రం ఎట్లాగో అతి కష్టం మీద తన వివేకాదుల సహాయం చేత కొంత నిగ్రహించు కున్నాడు. కాని ఏం లాభం? ఆ క్షణం నుండి అతని మనస్సును ఆ అప్సరస సౌందర్యము, ఆమె చిరునవ్వూ ఆక్రమించివేశాయి. అప్పటి నుండి అన్ని సమయములందూ ఆ అప్సరస యొక్క సౌందర్యమును, నడకను భావన చేస్తూ ఉండేవాడు. సకల ఇతర వృత్తులను వదలివేసి, కేవలం ఆమెనే మననం చేస్తూ ఉండుటచే అతడు అప్సరసామయుడు' అయ్యాడు.

అత్యంత మోహావేశంతో ఒక రోజు ఒకచోట కూర్చుని తన మనోరాజ్యంలో ఆమె యొక్క రాక పోకలను కల్పన చేసుకొని, ఇట్లు చింతన చేయసాగాడు.

శుక్రుడు (హృదయాకాశంలో....) :

ఆహాఁ! ఈ కనబడే అప్సరస సౌందర్యము ఏమని చెప్పాలి? అయ్యో! ఈమె వెళ్ళిపోతోందే? ఓహో! ఆకాశమార్గంగా ఆమె స్వస్థానమైనట్టి ఇంద్రలోకం వెళ్ళుచున్నది కాబోలు. ఆమె వెళ్ళిపోయిన తరువాత "చంద్రుని పోగొట్టుకున్న రాత్రి" లాగా ఈ ప్రకృతి ఎంత నిస్తేజమై పోయింది!... సరే, ఆమె వెళ్ళే మార్గంలోనే నేను కూడా వెళ్తాను. నా మనస్సు యొక్క 'మననశక్తి - ఊహాశక్తి'లను ఉపయోగించి బయలుదేరుచున్నాను....

ఇప్పుడు నేను దేవతల అధివాసమైన అత్యంత మనోహరమగు 'స్వర్గలోకము' చేరాను. ఇదిగో, ఇదే అమరావతి. ఇక్కడ ఎవరెవరో అనేక శిరోభూషణములతో, పట్టువస్త్రములతో ఆహ్లాదంగా కనిపిస్తున్నారేఁ? వీరంతా ఎవరు? ఓహో! పురాణములలో వర్ణించబడిన దేవతలు’ అంటే వీరే కాబోలు ... వీరే దేవతా స్త్రీలు కదా...! వీరందరినీ తమ మనోదృష్టిచే వీక్షించి కవులు తమ రచనలలో వర్ణించటం గుర్తుకు వస్తోంది. ఆ మహాకవులను మెచ్చుకోక తప్పదు. వారంతా ఎక్కడో ఉండి ఇక్కడి చమత్కారమంతా కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెపుతున్నారే! వారి వర్ణనములు అతిశయోక్తులు (hyperboles) కానేకావు!

ఇక్కడి వారంతా అత్యంత ఘుమఘుమలాడే అద్భుతమైన ఏవో పుష్పములను ధరించియున్నారు. పారిజాత పుష్పమాలలు ఇవే కాబోలు! ఆహాఁ వీరంతా విశ్వరూపుడగు విష్ణువు వంటి ఆకృతి కలవారై సంతోషంగా సంచరించుచున్నారు. ఈ వినబడే సంగీతమే దేవగీతికలు. ఇదే మందాకిని’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆకాశగంగ. ఈ మందాకినిలో బ్రహ్మదేవుని వాహన మైన హంస విలాసముగా సంచరిస్తూ ఉంటుందని విన్నాము. ఇంద్రుడు విశ్రాంతి తీసుకునే వనవాటికలు ఈ నది ఒడ్డునే ఉన్నాయి.

ఇవే కాబోలు, యమ-చంద్ర-సూర్య-ఇంద్ర-అగ్ని-జల-వాయు మొదలైన లోకపాలకుల వసతిగృహాలు.

Page:34

తన దంతములచే క్రూర రాక్షసులను ముక్కలు చేయగల ఐరావతం ఇదిగో.

ఈ వైమానిక దేవతలు ఎంతగా శోభించుచున్నారు...! అప్సరసలు ఉండే ఇంద్రుని ఉపవనాలు ఇవేనా? ఈ పిల్లగాలులు - పారిజాత వృక్షము నుండి వచ్చుటచే కాబోలు - ఎంత ఆహ్లాదం కలుగజేస్తున్నాయి!... ఈ నందనవనం గురించి చెప్పుకోవటానికి మాటలు చాలవు.... ఆహాఁ! దేవతా స్త్రీలు తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉంటే, తదనుగుణంగా వీణ మీటి మధుర స్వరముతో పాడే తుంబురులు వీరే కాబోలు...! అనేక అలంకారములతో విమానములలో సంచరించే ఈ దేవతలు ఎంతటి పుణ్యకార్యములు చేసి ఉంటారో కదా...! 'అందము' అనబడుదానికి ప్రతీకయే ఈ ఇంద్రసభ.

ఈ విధంగా నేను ఈ స్వర్గంలో ప్రవేశించాను... అదిగో... ఇంద్రుడు సింహాసనం అధిష్ఠించి విరాజిల్లుచున్నాడు... రెండవ బ్రహ్మవలె శోభిల్లుచున్నాడు... ఆయనను సమీపించి ప్రణామం చేస్తాను.”

ఈ విధంగా చింతన చేస్తూ శుక్రుడు ఇంద్రునకు ప్రణామం చేశాడు. ఇంద్రుడు సాదరణ పూర్వకంగా ఆహ్వానించి ఉచితమైన ఆసనం చూపాడు. పూలతో, ప్రశంసలతో అతిథి మర్యాదలన్నీ సమర్పించాడు.

ఇంద్రభగవానుడు: ఓ భృగుకుమారా! శుక్రాచార్యా! స్వాగతం. మీ ఆగమన కారణంగా స్వర్గము ధన్యతను పొంది శోభించుచున్నది. మీరిక్కడ మీ ఇష్టమొచ్చినంతకాలం నిరభ్యంతరంగా ఉండవచ్చు.

శుక్రుడు అతిథి మర్యాదలు స్వీకరిస్తూ రెండు గంటలకాలం సభలోనే గడిపాడు. ఆ తరువాత స్వర్గంలో సంచరించే ఉద్దేశంతో అక్కడి నుండి బయలుదేరాడు. అక్కడి వారిలో కొందరైతే అతనిని ఇంద్రుని కుమారుడుగా భావించసాగారు.

2. భావావేశము - జన్మపరంపరలు

ఆ విధంగా తన యొక్క పుణ్యప్రభావంచేత శుక్రాచార్యుడు స్వర్గమును పొందాడు. ఇప్పుడాతనికి మరణదుఃఖము అనునదే లేదు. అయితే అతడు నేను భృగుమహర్షి కుమారుణ్ణి. నా తండ్రి సేవలో ఉన్నాను" అనే విషయమును దృష్టిపథంలోంచి పూర్తిగా కోల్పోయాడు. క్రమంగా అప్సరస గణమును వీక్షించాడు. వారి మధ్యలో తాను ఇతఃపూర్వం చూచిన అప్సరసను కనుగొన్నాడు. ఆ 'విశ్వాచి' అను పేరుగల అప్సరస కూడా శుక్రుని చూచి పరవశురాలైనది. వారిద్దరు ఒకరిపై మరొకరు ప్రీతిపూర్వకమైన చిత్తము కలిగియుండటం జరిగింది. పరస్పర ప్రేమాధిక్యతచే ఒకరినొకరు సమీపించారు.

Page:35

వారిరువురు ఉన్న ఆ నందనవనం సంకల్పించినంత మాత్రంచేతనే ఏ పదార్థమునైనా ప్రసాదించగలదు. అప్పటికప్పుడు అక్కడ వారిద్దరూ తమ ఇరువురి కొరకు ఒక గొప్ప ఉద్యాన వనం నిర్మించుకున్నారు. ఆ వనం మధ్యలో ధవళకాంతులు విరజిమ్మే గొప్ప మందిరం వెలిసింది. ఆ అప్సరస శుక్రాచార్యుని చెయ్యి పట్టుకొని, నాథా! మీ సౌందర్యం నన్ను వివశురాల్ని చేస్తోంది. అబలనైన నేను మిమ్ము శరణువేడుచున్నాను. సత్పురుషులగు మీరు నావంటి దీనురాలిని రక్షించకుండా ఉంటారా? 'ప్రేమదృష్టి' అంటే ఏమిటో ఎరుగని మూఢులు మాత్రమే ప్రేమను తిరస్కరిస్తారు. అనురక్త చిత్తులగు స్త్రీ పురుషుల పరస్పర ప్రేమకంటే ఉత్సాహభరిత వస్తువు ఈ సృష్టిలో ఇంకేమున్నది? మీ కరస్పర్శచే నేను ఇప్పుడు ఎంతో ఉపశాంతిని పొందుచున్నాను. మీరు నా ప్రక్కన ఉంటేనే నేను జీవించగలను. పద్మము తుమ్మెదను ఆదరించినట్లు మీరు నన్ను ఆలింగనం చేసుకోండి. రండి, మనం ఆ భవనంలో ప్రవేశిద్దాం' అంది.

ఆ తరువాత వారిద్దరు ఆ ఉద్యానవనంలో యథేచ్ఛగా సంచరించసాగారు. వారి సమాగమం, ఆ చిత్తవిలాసములు, చిరకాల కల్పితమైన 'ప్రేమ భావావేశం చేత చమత్కారంగా పెంపొందసాగాయి. అతి ప్రసన్నత పొందిన వారిద్దరు ఒకరి సాన్నిధ్యం మరొకరు ఆస్వాదిస్తూ చాలా కాలం గడిపారు. వారిద్దరు మందరపర్వతంపై ఎన్నో ఏండ్లు గడిపారు. శ్వేతద్వీపంపై మరికొంత దీర్ఘకాలం గడిచింది. శుక్రుడు గంధర్వనగరములను, ఉద్యానవనములను నిర్మిస్తూ, "ఇతడు కాలస్వరూపునితో సమానుడా అన్నంత ఠీవిగా ఆ అప్సరసతో సంచరించసాగాడు.

ఆ విధంగా ఎనిమిది చాతుర్యుగములు గడిచిపోయాయి.

అంతా కాలమహిమయే కదా! వస్తువు-భావన-సుఖము-దుఃఖము” ఇవన్నీ కూడా ...

కాలముచే పుట్టి, కాలముచే నశించవలసిందే!

వారిద్దరు కొంతకాలానికి "మేము అధఃపతనం పొందవలసి ఉంటుందేమో? అను సందేహం పొందసాగారు. పుణ్యము యొక్క క్షయానుసంధానం కారణంగా వారి దివ్యశరీరాలు క్రమక్రమంగా నశించసాగాయి.

క్రమంగా వస్త్రాలు, విమానాలు, భూషణాలు, నందనవనాలు మటుమాయం కాసాగాయి. ఆ ఇద్దరు భూమండలముపైకి వచ్చిపడ్డారు. అప్పుడు వారిద్దరూ యుద్ధంలో నేలకూలిన శూరుల వలె ఉన్నారు. నేలపై పడుటచే వారి దేహాలు ఛిన్నాభిన్నమైనాయి. గూటిని విడచిన పక్షిద్వయంలాగా వారిద్దరు సూక్ష్మ శరీరులై దుఃఖమయ చిత్తముతో సంచరించసాగారు. వారి రెండు లింగశరీరాలు ఆకాశమున గల చంద్రకిరణాలలో ప్రవేశించాయి. ఆ కిరణాలలో నుండి మంచు బిందువులలోకి ప్రవేశించాయి. అక్కడి నుండి ధాన్యరూపమును పొందాయి.

'దశార్ణవము' అను పేరుతో పిలువబడే గ్రామంలో నివశిస్తూ ఉండే ఒక బ్రాహ్మణుడు శుక్రచైతన్యముచే పరిపక్వమైన ధాన్యమును భుజించాడు. అప్పుడు శుక్రాచార్యుడు వీర్య రూపమును పొంది, ఆ బ్రాహ్మణునకు పుత్రుడై జన్మించాడు. అప్పుడాతనికి కొందరు మునులతో

Page:36

శుశ్రూష సాంగత్యము లభించింది. ఆ మునుల వద్ద నుండి తగినంత ఉత్తమ సంస్కారము పొందినవాడై, కొంతకాలానికి మేరు పర్వతం చేరాడు. ఒక ప్రదేశంలో ఆశ్రమం ఏర్పరచుకొని ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు.

అట్లు చాలా కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఏదో సందర్భంలో ఒక మృగమును చూచాడు. తన ప్రియురాలగు అప్సరసయే అట్లు ఏదో శాపవశంచేత మృగముగా జన్మించి సంచరిస్తున్నట్లు గ్రహించాడు. పూర్వ సంస్కారబలం కారణంగా అతనియందు ఆ అప్సరసపట్ల అత్యంత ఆకర్షణ ఏర్పడింది. తన తపస్సులో కొంతభాగం వెచ్చించి ఆ మృగానికి స్త్రీ రూపం కలిగించాడు. ఆ అప్సరసతో సంగమించి, మనుజాకారము గల ఒక పుత్రుని పొందాడు. ఆ పుత్రునిపైగల వాత్సల్యభావంతో అతడు మరికొంత మోహం, మమకారం పొందాడు. ఇంకే మున్నది... జ్ఞానవిషయంలో మరల మొదటికి వచ్చాడు. ఈ పుత్రుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. ఇతడు నా ప్రక్కన లేకపోతే నేను బ్రతుకగలనా? లేదు. నా పుత్రునకు బాగా డబ్బు, గుణములు, దీర్ఘమైన ఆయువు కలుగుగాక!" అను రూపముగల నిరంత చింతనకు బద్ధుడై పోయాడు. పాపం, వేద విహితములైన సత్యము, తపస్సు, దానము మొదలైన సన్మార్గములన్నీ క్షణంలో త్యజించివేశాడు. ధర్మ మార్గముల నుండి పతితుడై పుత్రుని భోగముల గురించి మాత్రమే ఎల్లపుడు చింతించుచు ఉండేవాడు. ధనాదుల సంపాదన, పరిరక్షణలకు సంబంధించిన అనేక కార్యక్రమములలో నిమగ్నమై సంచరించసాగాడు. ఫలితంగా అతని శరీరం కృంగి కృశించ సాగింది. సర్పము గాలిని పీల్చునట్లు, ఒక రోజు మృత్యువు అతనిని మ్రింగనే మ్రింగింది.

మరణదశను చేరే సమయానికి అతని లింగశరీరము ఏవేవో భోగములకు సంబంధించిన ఇచ్ఛలను, భావావేశములను (వృత్తులు) కలిగి ఉండినది. మనోవృత్తుల తీవ్రత కారణంగా అనేక జన్మలు పొందాడు. అటు తరువాత అతడు మద్రదేశపురాజుకు పుత్రుడై జన్మించాడు. కాలక్రమేణా 'రాజు' అయ్యాడు. అనేకమంది శత్రువులతో యుద్ధాలు చేస్తూ చాలాకాలం గడిచి పోయింది. కొంతకాలానికి ముసలివాడయ్యాడు. ఉత్తమ ధర్మమును ఆశ్రయించి, కాలక్రమేణా 'వానప్రస్థాశ్రమము'ను స్వీకరించాడు. వాస్తవానికి అతని యొక్క ఇతఃపూర్వపు తపస్సు చేయు బుద్ధి యే అతనిని ఆశ్రమజీవనం వైపు నడిపించింది. రాజ్యమును త్యజించి, రాగాదులు లేనివాడై బుద్ధిమంతుడైనాడు. అతడు పరిజన్మలో సమంగానది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేయ ప్రారంభించాడు.

చూచావా రామా! ఆ విధంగా భృగుమహర్షి కుమారుడైన శుక్రాచార్యుడు అనేక వాసనలతో అనేక గతులను అనుభవించాడు. అనేక చిత్రవిచిత్ర జన్మలన్నీ పొందాడు. చివరికి, సమంగా నది ఒడ్డున ఆశ్రమంలో ఆసీనుడై ధ్యానమగ్నుడై యున్నాడు.

ఈ మాయ యొక్క ప్రభావం ఏమని వర్ణించాలి చెప్పు?

Page:37

3. భౌతికం - కల్పితం

ఓ రామచంద్రా! వింటున్నావుగా! మన శుక్రాచార్యుడు తండ్రియగు భృగుమహర్షి ఎదుటనే ఉండి, పైవిధంగా చింతన చేయుచుండగా అనేక వేల సంవత్సరములు గడచిపోయాయి. అతని దృష్టి ఎక్కడెక్కడో సంచరిస్తోంది కదా! చాలా కాలమైన తరువాత అతని భౌతిక దేహం వాయువు, ధూళి, కీటకములు’ మొదలైన వాటిచే శిథిలం కావించబడి నేలకూలింది. కాని, చంచలమగు అతని మనస్సు మాత్రం వనములోని 'లేడి' లాగా అనేక చిత్ర విచిత్ర దశలను పొందుచూ పరిభ్రమిస్తూనే ఉన్నది. అది భోగముల అనుభవమునకు అఱ్ఱులుచాచుచూ, అనేక ఆకర్షణ వికర్షణలు పొందుచూ, అలసిపోయి ఉన్నది. ఒక చక్రములో చిక్కుకున్న పదార్థంలాగా జనన మరణములు, ఊర్ధ్వ అధోలోకములు మోసి మోసి చివరికి ఒకానొక ఉపాధితో సమంగానదీతీరం చేరి తపోనిష్ఠచే విశ్రాంతి పొందుతోంది.

తపస్సు ఉత్తమమైన మనో విశ్రాంతిని ప్రసాదించగలదు కదా!

ఆహాఁ! ఒక లోభి ధనసంపదల కొరకై పరుగులు తీస్తూ ఉంటాడు చూచావా? మన శుక్రుడు కూడా మనోసంకల్పమార్గం"లో హుటాహుటిగా ప్రయాణాలు చేస్తూ,... తన శుక్రాచర్య ఉపాధిని విస్మరించాడు. తుచ్ఛము, వివిధ వృత్తాంత సంకలితము అయిన సంసారదశలను పొందాడు. అట్లు పొందినదంతా అత్యంత దృఢమైన దృష్టితో అనుభవించాడు.

శుక్రుని భౌతికదేహం భృగువు యొక్క ఆశ్రమంలో సూర్యతాపమునకు ఎంతగానో శుష్కించింది. చర్మం మాత్రం మిగిలిందా... అని అనిపిస్తోంది. ఆ దేహము యొక్క రంధ్రముల నుండి గాలి ప్రసరించుచున్నప్పుడు 'సీ'...త్కారధ్వని వినిపిస్తూ ఉన్నది. అభిమానము దుఃఖము” మొదలైనవి కల్పించుకొని అనుభవిస్తూ ఆ శరీరంలో ఉండే జీవుడు ఇప్పుడు ఆ శరీరమునందు దృష్టి కలిగిలేడు కదా! "అభిమానం, దుఃఖం లేకపోవటం ఎంత ఆహ్లాదమైన విషయం...” అనే అర్థం వచ్చే ఈలపాట ఏదో ఆ శరీరం పాడుచున్నదా - అని వినేవారికి అనిపిస్తోంది. ఆ ఆ శరీరపు తెల్లటి దంతములు చూస్తే “ఈ దీనమైన మనసు సంసారారణ్యంలో ఎంతటి మూర్ఖురాలై సంచరిస్తోంది!" అని మనస్సును చూచి ఎగతాళి చేస్తున్నట్లున్నది. జనరహిత ప్రదేశంలో ఉండే నూతులను గుర్తుచేస్తున్న ఆ శరీరము యొక్క ముక్కుపుటములు, లోతు కళ్ళు మానవాళిని ఉద్దేశించి, "ఓ జనులారా! స్వభావపరంగానే శూన్యరూపమగు శూన్యరూపమగు ఈ ఈ జగత్తు యొక్క అసద్రూపమును ఇప్పటికైనా, మమ్ములను చూచైనా...గ్రహించండి. వివేకం పొందండి. మూర్ఖులై మోహపరవశులు కాకండి" అని బోధిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఆ శుక్రుని దేహం మొట్టమొదట సూర్యకాంతిచే ఎండిపోయింది. ఆ తరువాత వర్షజలముచే తడుపబడింది. వర్షజల బిందువులచే మిలమిలలాడుచున్న ఆ చర్మమాత్ర శరీరం బంధు

Page:38

రూపములగు తన యొక్క అనేక పూర్వ శరీరముల సంబంధములను తలచుకుంటూ అవి వస్తున్నందుకు, పోతున్నందుకు ఆనందోల్లాసముచేతనో, లేక, దుఃఖాతిశయంచేతనో బాష్పములు రాల్చుచున్నదా? అని అనిపిస్తోంది. ఆ విధంగా వర్షంలో తడుస్తూ శీతల వాయువులచే స్పృశించ బడుచు, ఎండకు ఎండుచూ పడివున్నది. ఆ దగ్గరలోని కొండల మీద నుంచి గాలికి ఎగిరిన ధూళి ఆ శరీరమును కప్పివేస్తూ ఉంది. మరల వర్షజలం ఆ ధూళిని తొలగించివేస్తూ ఉంది. ఫలితంగా చిత్రమైన ధూళి పొరలు ఆ శరీరంపై ఏర్పడ్డాయి. ఆ పొరలు ఒక పాపదూషితుని హృదయంలో పేరుకొని ఉండే అల్ప, తుచ్ఛ ఆశయపరంపరలను గుర్తు చేస్తున్నాయి. మరొకసారి ఎండగాలి వేగంగా ఆ శరీరమును తాకుతుంటే, ఏదో శబ్దం చేస్తూ అది ఎండు కట్టెవలె ఉండేది. ఇంతలోనే శరీర రంధ్రములు ద్వారా ప్రసరించు ఆ గాలిచేయు శబ్దము 'ఓంకార నినాదం చేయుచున్నది కాబోలు' అని భావింపచేస్తోంది. శుష్కించినట్టి వంకర టింకర ప్రేగులను ఆ శరీరము వీణగా మలచుకొని గానం చేస్తూ, ప్రాణులను భయపెట్టుచున్నట్టున్నది. లేదా, ఆ

గానంచే వనలక్ష్మిని సంతోషింపచేసే ప్రయత్నంలో ఉన్నట్లున్నది.

భృగుమహర్షి తపస్సు చేస్తున్న ఆ పుణ్యాశ్రమ ప్రదేశం రాగద్వేషరహితం. అతని తపః ప్రభావం ఆ పరిసరమంతా వ్యాపించియున్నది. ఆ కారణం చేత శుక్రుని దేహమును మృగములు గాని, పక్షులుగాని, సూక్ష్మకీటకములుగాని భక్షించుట జరుగనేలేదు. ఈ శరీరము ఇక్కడ ఇట్లు ఉండగానే శుక్రుడు తన మరొక కల్పిత శరీరంతో యమనియమాదులు ఆశ్రయిస్తూ సమంగానదీ తీరంలో ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు.

వాయువుచే శుష్కించిన అతని శుక్రదేహం యథాతథంగా శిలపై చిరకాలంగా పొర్లుతూ ఉండిపోయింది.

4. స్వయంకృతం

ఆ విధంగా శుక్రుని దేహం ఎండకు ఎండుచూ, వానకు తడుస్తూ ఉండగా చాలా కాలం గడచిపోయింది కదా! ఒక రోజు మహాత్ముడగు భృగుమహర్షి పరమాత్మావబోధకమగు నిర్వికల్ప సమాధి నుండి లేచాడు. ఎదురుగా కుమారుని కోసం చూచాడు. అతడు కనిపించలేదు. "ఇది ఏమిటి? వినయముతో, నమ్రతతో సర్వగుణ సంపన్నుడైన నా కుమారుడు ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడు కదా! ఇప్పుడు కనబడడేం? అని కాస్త విచలితుడైనాడు. ఆశ్రమం నుండి బయటకు వచ్చి అటూ ఇటూ చూచాడు. అభాగ్యమా!" అన్నట్లు, ఒక గండశిలపై కేవలం తన కుమారుని భౌతికదేహం మాత్రం కనిపించింది. ఆ మృతశరీరం మూర్తివంతమైన దారిద్య్రమువలె శుష్కించి యున్నది. ఆ దేహము యొక్క రంధ్రములందు తిత్తిరిపక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి.

Page:39

శుష్కించిన ప్రేగులుగల అతని పొట్టభాగం యొక్క ముడతలలో కప్పపిల్లలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. కనురెప్పచుట్టు క్రిమి కీటకాదులు తమ పిల్ల పాపలతో కాపురం చేస్తున్నాయి. వీటి నుండి ఇంకా ఇంకెన్నో కీటకములు ఉత్పన్నమై అభివృద్ధి పొందుతున్నాయి. పార్శ్వమువైపు ఎముకల మధ్య పట్టుపురుగులు గూళ్ళు కట్టుకొని, విస్తరింపజేస్తున్నాయి. జలధారలతో ధూళి యుక్తమైన ప్రేగులు శుష్కించిన ఎముకలను మాలగా ధరించియున్నట్లు అనిపిస్తున్నాయి. ఆ ప్రేగులలోని పొరలు జన్మజన్మలుగా జీవుని యందు పేరుకొని యుండే వాసనలను గుర్తుచేస్తున్నాయి. ముఖం తెల్లగా పాలిపోయింది. ముక్కు గోడకు దిగగొట్టబడిన మేకులా ఉంది. కంఠము ఊర్ధ్వముఖము కలిగి, తన ప్రాణములు ఆకాశంలో ఎక్కడ సంచరిస్తున్నాయో వెతుకుచున్నట్లున్నది. చర్మం మాత్రమే శేషించియున్న అతని పొట్ట అజ్ఞానియొక్క హృదయంలాగా శూన్యంగా కనబడుతోంది.

ఆ మృతదేహాన్ని చూచిన భృగుమహర్షి పుత్రశోకం పొందారు. ఒక్క క్షణంలో పూర్వాపరాలన్నీ మరచిపోయి లేచి నిలుచున్నారు. ఏమిటిది? నా కుమారుడు మరణించి చాలా కాలమయినదా? అని పెద్ద గొంతుకతో పలికాడు. 'నేను నా బిడ్డను కోల్పోయానా...' అనే భావం అతని హృదయమంతా వ్యాపించింది. మనసంతా వర్ణనాతీతమైన క్షోభకు లోను అయింది. మహాజ్ఞాని అయివుండి కూడా, పూర్వాపరము లను, ముందు వెనుకలను ఒక్కసారి మరచాడు.

ఆహాఁ! పుత్రవ్యామోహం ఎంతటిది! మహర్షి అంతటివాడిని కూడా కొద్ది క్షణాలు ముంచివేసిందే? ఆయన లేచి నిలబడి ఇట్లు ఎలుగెట్టి పలికాడు.

"ఓయీ! కాలపురుషా! యమధర్మరాజా! నా పుత్రుని ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు తీసుకొని పోయావయ్యా? అతడు నా కుమారుడని నీవు ఎరుగవా? సరే. ఈ భృగువు యొక్క తపోశక్తి ఏమిటో రుచి చూచెదవు గాక...” అని పలుకుచు శపించుటకు ఉద్యక్తుడయ్యాడు.

రూపరహితుడు, ప్రజలందరిని కాలానుగుణంగా మ్రింగివేయువాడు, కాలమే స్వరూపంగా గలవాడు అయిన కాలుడు ఇది గమనించాడు. అతడు స్వతహాగా రూపము లేనివాడే. అయిన ప్పటికీ, భృగుమహర్షి యొక్క సంతాపమును గమనించి భౌతిక రూపం ధరించాడు. ఖడ్గము, ఉరిత్రాడు ధరించి, శోభాయుక్తుడై కవచకుండలములచే ఒప్పుచూ ఆ కొండపై ప్రత్యక్షమైనాడు. పండ్రెండు నెలలు అతని భుజములుగా రూపము పొందాయి. ఆరు ఋతువులు అతని ముఖముగా మారాయి. దినములు అనే సేనతో అతడు సేవించబడుచు ఉన్నాడు.

అతని జ్వాలామయ దేహం ఆ పర్వతమును శోభింపజేసింది. అతని చేతిలోగల త్రిశూలపు అగ్రభాగము నుండి బయలుదేరిన అగ్ని సమూహాలు దిక్కులన్నింటినీ నింపివేస్తున్నాయి. అతని రాకచే గండశిలలు కంపించిపోయాయి. దిక్కులు పిక్కటిల్లాయి. అతని ఖడ్గము యొక్క ప్రకాశంచే సూర్యబింబమే శ్యామల వర్ణమయినది.

Page:40

కోపంతో ఊగిసలాడుచున్న భృగువును సర్వసమవర్తి అయిన కాలుడు సమీపించాడు. ప్రళయానంతర ప్రశాంతసాగరమువలె గంభీర స్వరంతో శాంతియుతంగా ఇట్లు పలుకసాగాడు. కాలుడు : హే భృగుమహర్షీ! మీరు స్వయముగా మహాజ్ఞానులు. ఈ లోకముల యొక్క యథార్థ స్థితి అంతా ఎరిగినవారు. 'పరము-అపరము'లను సంపూర్ణంగా దర్శించి యున్నారు. మీ సమగ్ర అవగాహనా స్వభావము వల్ల, ఒకవేళ ఇతరులు అజ్ఞానం చేత అపరాధం చేసి యున్నప్పటికీ, మీరు విమోహితులు కారు. ఇక ఏ అపరాధము చెయ్యనివారిపై కోపగించటమా? మహత్తరమైన తపస్సు చేస్తూ బ్రహ్మవర్చస్సుచే వెలుగొందువారు మీరు.

ఇక మేమంటారా 'నియతి'ని పాలించువారము మాత్రమే కదా! అందుచేత మీరు మాకు పూజ్యులు. మీకు నమస్కరించుచున్నాను. నా మనవిని శాంతంగా వినండి!

నిర్వికల్ప సమాధినిష్ఠులగు మీరు మీ ఉత్తమ కర్మాచరణముచే మాకు వందనీయులగు చున్నారు. అంతే గాని, ఈ నా సంభాషణ మీ శాపాదులకు భయపడి కాదు. మీరు ఒక్క క్షణం ఆగండి. కోపము, ఆవేశము, ఉద్వేగములను వదలి శాంతమును ఆశ్రయించండి. నేను చెప్పేది కాస్త వినండి.

మీరు మీ బుద్ధిని అల్పత్వమువైపు ప్రసరింపజేయుచున్నారు. అది ఉచితం కాదు. నిష్కారణంగా శపించి తద్వారా మీ తపస్సును వ్యర్థం చేసుకోకండి. ఎందుకంటారా? కాల స్వరూపుడనగు నన్ను ప్రళయకాల భీషణాగ్నులు కూడా దహించలేవు. ఇక మీ శాపం నన్నేం చేయగలదు చెప్పండి? ఇప్పటికే నేను అనేక జగత్తులను భక్షించాను. కోట్లకొలది రుద్రులను మ్రింగివైచాను. అనేక మంది విష్ణువులు నాచే గ్రసించివేయబడ్డారు. నాకు అవశ్యకమైనదేమి? అక్కర్లేనిదేది? ఓ మహాత్మా! మేము భోక్తలం. సర్వజీవుల అసంఖ్యాక ఉపాధులు మాకు భోజనము.

అయితే ఒక్క విషయం. ఇదంతా స్వభావసిద్ధమగు నియతి మాత్రమే అయివున్నది. అంతే గాని, మేము ఇచ్ఛచేతనో, ద్వేషముచేతనో ఏదీ చేయుట లేదు. 'నియతి'కి వేరుగా ఇంకే నిమిత్తం నాచే ఏదీ చేయబడదు.

స్వయమూర్ధ్వంప్రయాత్యగ్నిః స్వయంయాంతిపయాంస్యధః |

భోక్తారంభోజనంయాతి సృష్టించాప్యంతకః స్వయమ్ II (సర్గ.10; శ్లో. 29)

అగ్ని సహజంగానే ఊర్ధ్వముఖంగా జ్వలిస్తుంది. నీరు పల్లమువైపు ప్రవహిస్తుంది. భోక్త వద్దకు భోజనం వచ్చిచేరుతోంది. నాశనశీలుడగు ఈ కాలుడు కూడా సృష్టి వద్దకు స్వయముగా వచ్చి చేరుకున్నాడు. నేను సమీపించని వస్తువంటూ ఎక్కడా ఏదీ లేదు. దీనికి ఇది అనుశాసనం. ఎవ్వరిని ఏమనగలం?

అయినా, మీకన్నీ తెలుసును కదా! మాయాకళంక రహితమైన దృష్టితో చూస్తే, దేనికి ఎవడు కర్త? ఎవడు భోక్త? మాయా దోషము నశించనట్టి దృష్టి కలవారికి మాత్రమే అనేకమంది కర్తలు,

Page:41

అనేకమంది భోక్తలు కనిపిస్తున్నారు. మహాత్మా! "కర్తృత్వము, అకర్తృత్వము ... ఈరెండూ కూడా కల్పితములే కదా! సమ్యక్ దృష్టి లేనివారికి మాత్రమే అవి స్వయంకల్పితమై ప్రాప్తిస్తున్నాయి.

సమ్యక్ దృష్టి గలవాని దృష్టిలో కర్తృత్వమెక్కడ? భోక్తృత్వమెక్కడ? ఆ రెండిటి నీడ కూడా వారికి కనబడుటలేదు.

చెట్లకు పూలు పూస్తున్నాయి, నశిస్తున్నాయి. అట్లాగే, లోకంలో ప్రాణికోట్లు అసంఖ్యాకంగా ఉత్పత్తి వినాశనములు పొందుచున్నాయి. ప్రతి ఒక్క ఉత్పత్తి వినాశనములు మధ్య ఏవేవో సంఘటనలు, అనుభవములు, మార్పు చేర్పులు ప్రదర్శితమగుచున్నాయి. అయితే ఈ జనులు అజ్ఞానం చేత కాల స్వరూపుడనగు నన్ను తప్పు పట్టుచున్నారు కాని, నిజానికి ఈ జీవుల ఆయా స్వయం కర్మవ్యవహారములే తమ వైచిత్ర్యమును ప్రదర్శిస్తున్నాయి. కర్మగతిని అనుసరించి ఆయా ప్రయోజనములు పర్యవసానంగా ప్రాప్తిస్తున్నాయి, సిద్ధిస్తున్నాయి. ప్రతి పర్యవసానము (Eventuality) వెనుక ఆయా శారీరక, మానసిక ప్రయత్నములే అంతర్లీనంగా దాగి ఉన్నాయి.

ఇప్పుడు చెప్పండి మీ కోపం ఉచితమేనా?

ఒకచోట తటాకం ఉన్నది. ఆ తటాకంలోని జలంలో నక్షత్రాదులతో కూడి 'ఆకాశం' ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబాకాశంలో చంద్రుడు కదులుచూ కనిపిస్తున్నాడు. నీటిలో కనిపిస్తున్న ఆ చంద్రుని చలనం సత్యమంటామా? అసత్యమంటామా? సత్యమనదలచుకుంటే, జలంలో చంద్రుడెక్కడున్నాడు? అసత్యమనదలచుకుంటే, చంద్రుని కదలికలు కనబడుచున్నాయే? "రెండూ కాదు. అది అనిర్వచనీయమనే చెప్పాలి" అని కూడా చెప్పబడుతోంది. భగవంతుడగు ఈ కాలుని సృష్టియందు, పరమార్థస్థితి దృష్ట్యా ఈ కర్తృత్వ, అకర్తృత్వములనబడే రెండూ కూడా సత్యములు కావు. కాని, వ్యవహార దృష్టిని రచిస్తున్నదెవరు? నేనా?... కానే కాదు. ఇదంతా నిర్వహిస్తున్నది మనస్సే. ఈ మనస్సే మిథ్యాభ్రమయందు తగులుకొని భ్రాంతి కారణంగా కర్తృత్వ, అకర్తృత్వములనబడే అనర్థకల్పనలు తనకు తానుగా నిర్మించుకుంటోంది. ఇదంతా కూడా ఒక చోట ఒక త్రాడు దారికి అడ్డంగా పడి ఉంటే, ఆ త్రాడునందు పామును దర్శించుట వంటిదే... అని అనక తప్పదు.

కనుక మహర్షీ! నేను దేనికీ కారణం కాదు. ఈ జీవుని యొక్క మనస్సే అన్నివేళలా, అంతటికీ కారణం. పదార్థ దృష్టిని ఆశ్రయిస్తున్న మనస్సు పదార్థత్వమునే పొందుతోంది. మహతత్త్వమును ఆశ్రయిస్తే మహతత్త్వము అనుభవమగుచున్నది. నేను కాలానుగుణంగా, కార్య - కారణ వ్యవహారము నడిపించుట, ఇచ్చ ప్రయత్నములను అనుసరించి ప్రయోజనములను ప్రసాదించుట మాత్రం చేస్తూ ఉంటాను. మీరు వ్యాకులమైన చిత్తము పొందినవారై, ఎట్టి అపరాధం చెయ్యనట్టి నాపై ఎందుకు కోపగిస్తారు చెప్పండి? అట్లు కోపగించటం ఉచితమే నంటారా? అట్లు చేయటం ఆపదలకు హేతువే అవుతుంది. అందుచేత, మరికొంత ఓపికపట్టి, విషయమంతా సమగ్రదృష్టితో, సత్యదృష్టితో చక్కగా ఇంకొక్కసారి అవలోకించమని ప్రార్థిస్తున్నాను. అంతేగాని, చెప్పునది పరిశీలించకుండా ఆవేశపూరితులు మాత్రం కావద్దు.

Page:42

నియతి, దృష్టి పూజ్యుడవగు ఓ మునిసత్తమా! మేము చేస్తున్న ఈ సృష్టి-స్థితి-లయ మొ|| కార్యములు ప్రతిష్ఠ కొరకో, లేక ఇష్టము అనుసరించో చేస్తున్నామా? లేదు. దురహంకారులమై మేము ఏదీ చేయుటలేదు. ఎట్టి 'అభిమానము' అనునది లేకుండానే, కేవలం నియతిని పాలించుచు, స్వవశముననే ఉండి ఉన్నాము. ఇప్పుడు ఈ భౌతిక - దేహం స్వీకరించటం, మీ వద్దకు ఇట్లు రావటం, ఈ విషయ విచారణ చేయటం... ఇదంతా “తాపసులను సన్మానించుట” అను నియతి’ని పాలించటానికే అయివున్నది. అంతేగాని కోప శాపాదులకు భయపడో, లేక కీర్తి మొదలైనవాటి కొరకో మాత్రం కాదు. బుద్ధిమంతులైన వారు జగన్నియామకుడగు ఈశ్వరుని ఇచ్ఛారూపమైనట్టి 'పరమోత్తమ నియతి'ని అనుసరించే వ్యవహరిస్తారు. ఇక అజ్ఞానులగు జనులో, అభిమానగ్రస్థులై మరల మరల తమోగుణములను ఆశ్రయిస్తూ, అట్టి 'నియతి’ని దూషించటానికో, అపరిపక్వ దృష్టిచే దుఃఖాదులు ఆశ్రయించటానికో వృథాప్రయాసపడుచూ ఉంటారు. కాని ఏం లాభం? ఎవరేమి నిరోధించగలరు చెప్పండి!

మహర్షీ! మీరు సర్వజ్ఞులు. ఇప్పుడు జ్ఞానదృష్టితోనే అంతా పరిశీలించండి! మహాత్ములగు వారిచే సర్వవేళల సేవించబడే సుప్రసిద్ధ మార్గమున ఉన్నట్టి మీ అంతటివారు అజ్ఞులవలె ఏల మోహితులగుచున్నారు? కర్మపరిపాకముచే సువ్యక్తమగుచూ కనిపిస్తూ ఉన్న స్థితి గతులను విచారించకుండా మూఢునివలె నన్ను శపించాలని మీకెందుకు అనిపిస్తోందో చెప్పండి.

ద్వితీయ దేహం - మీరు ఎరిగియున్న విషయాలే అయినప్పటికీ, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుచున్నాను.

ఈ ప్రాణి కోట్లలోని ప్రతి ఒక్కరికి రెండు దేహాలు ఉన్నాయి1. స్థూలదేహము 2. మనోదేహము

ఈ రెండింటిలో స్థూలదేహము జడమైనది. ఇది స్వల్పకారణంచేత కూడా నశించే స్వభావం కలిగి ఉన్నది. ఇక ఈ మనస్సు ప్రాతిభాసిక స్వభావము కలిగియున్నది. ఒక దర్పణము ఆయా దృశ్యములను తనయందు ప్రతిబింబింపజేయు లక్షణము కలిగియున్నట్లే, ఈ మనస్సు కూడా తన యందలి భావనను అనుసరించి విషయములను కలిగి ఉంటోంది. అట్టి ప్రతిబింబ స్వభావ మాత్ర మగు (merely Reflective by nature) ఈ మనస్సు స్థూలదేహ నాశన మాత్రం చేత నశిస్తుందా?... లేదు. ఈ జీవుడు మోక్షము పొందనంతవరకు మనస్సు నశించకయే ఉంటోంది.

ఇప్పుడు చెప్పండి. మీరు కోపగించటానికి కారణం మీ కుమారుని స్థూలదేహం పొందిన మార్పులకా? లేక మనోదేహము పొందిన స్థితిగతులకా? అతని మనోవ్యాపారము ఆశ్రయించిన ఆయా దుష్ట విషయములకు కారకుడను నేనా చెప్పండి? ఓ సాధు పుంగవా! మంచి చతురత గల సారథికి ఒక రథము ఇస్తే ఆ రథమును అతడు తన రకరకాల విన్యాసములతో నడుపుచుండగా, ఆ రథములోని సారథిని చూడని ఒక అమాయక బాలుడు, 'ఈ రథమే ఇట్లు చమత్కారంగా కుడి ఎడమలకు తిరుగుతోంది" అని అనుకొంటాడు... చూచారా? అట్లాగే ఈ జీవునియందు వాక్కుకు

Page:43

అగోచరమై, అభిమానముతో కూడినదై ఒక అంతరంగ వ్యాపారము (Inner - Activity) ఉండి ఉన్నది. అట్టి అంతరంగ వ్యాపారమే ఈ మనస్సు. ఒక బాలుడు మట్టితో బొమ్మ తయారు చేసి, ఆయా అలంకారాలు అమర్చి ఇంతలోనే దానిని మట్టి ముద్దగా చేసి మరొక బొమ్మను చేస్తూ ఉంటాడు చూచారా? ఈ మనస్సు కూడా భవిష్యత్ శరీరములను సంకల్పించుచు పూర్వ శరీరములను నశింపజేయుచున్నది.

"ఇష్టము-మననము-క్రియ'ల సమన్వయమే చిత్తము.”

చిత్తమే పురుషుడు, అంతేగాని ఈ స్థూలదేహము పురుషుడు కాదు.

చిత్తం చేత ఏది నిర్వర్తించబడుచున్నదో, అది మాత్రమే “కార్యం అని అనిపించుకుంటోంది. ఈ చిత్తము అవిచారణ కారణంగా అసద్వస్తువులను గూర్చిన సంకల్పముచే బంధించబడుతోంది.

అట్లు సంకల్పించకుండా, 'మౌనం' వహించి యుండుటయే (సంకల్పరాహిత్యమే) ముక్తి' యొక్క స్వరూపం.

ఈ జీవునిపట్ల "ఇది నా దేహము. ఈ దేహమే నేను. ఇందులో ఈ అవయవములు ఇక్కడ ఉన్నాయి. నేను ఈ అవయములచే పరిమితుడను... ఇలా వికారవంతములైన అనేక కల్పనలను చేస్తూ పోతున్నది ఎవరు? నేనా?... కానేకాదు. ఈ మనస్సే సుమా! మనస్సే ఒక 'జీవ శరీరము నుండి మరొక 'జీవశరీరము'ను పొందుచున్నది. మనస్సుచే ఏ వస్తువు సంకల్పించ బడితే, దానికి అనుకూలంగా బుద్ధి (Discriminative faculty) ఉదయించుచున్నది. అదే మార్గంలో “నేను చేయుచున్నాను” అను రూపముగల అహంకారము కూడా ఏర్పడుచున్నది. ఇట్లు మనస్సే వివిధ రూపములను ధరించుట జరుగుతోంది.

నేను అఖండుడను - అంతరంగమున ఏర్పరచుకొనియున్న దేహమునకు సంబంధించిన వాసనలు కారణంగా ఈ చిత్తము తన ఇచ్చానుసారం అవిద్యాపూర్వకంగా నేను - నా శరీరం నీవు - నీ శరీరం-నా వారు నాకు సంబంధించిన శరీరములు - పరాయివారు, శత్రువులు... వారి వారి శరీరములు" ఈ రీతిగా ఏదేదో స్వప్న సదృశ దృశంగా ఆస్వాదిస్తూపోతోంది. ఇట్లు వేరు వేరైన పార్థివ శరీరములను గాంచుచున్నది చిత్తము (లేక) మనస్సే. ఈ మనస్సే మరొకప్పుడు సత్యవస్తు సాక్షాత్కారంచే అసత్యమగు ఈ దేహభావమును త్యజించి పరమశాంతిని పొందుతోంది. మనస్సు యొక్క ఈ దేహాదులను గురించిన కల్పన" - - ఆత్మసాక్షాత్కార ప్రాప్తి పొందనప్పటి సమయంలో మాత్రమే అనుభవమవుతోంది.

ఆత్మసాక్షాత్కారం, ప్రాప్తించిందా.... ఇక నేను దేహమును, మానవుడను, జీవుడను...” అను రూపము గల తుచ్చ మననము ఉండదు.

"నేను ఈ దేహములో స్ఫురించే ప్రజ్ఞాతత్వమునే గాని, దేహమాత్రమును కాదు. బాహ్యమున (by perceiving things and matters) అంతరంగమున (మననము, బుద్ధి మొదలైన వాటి రూపమున) కూడా ప్రసరించియున్నది నేనే. ఈ పంచభూతములకు అతీతమైన రూపము కలవాడనగు నన్ను ఒక దేహము పరిమితము చేయగలదా?... లేదు.

Page:44

ఈ శరీరము పరిమితమైనది కావచ్చు.... నేను అపరిమితుడను. ఈ శరీరం ఖండమైనది కావచ్చు.... నేను అఖండుడను.

సర్వ దేహములందు ఒకే రీతిగా ప్రజ్జ్వలించుచు తాను ఏ క్షణమందును “మరొకటి” కాకుండానే ఉండి ఉంటున్నట్టి 'ఆత్మవస్తువు’ను నేను. ఆత్మయే నా నిజస్వరూపం. నిత్యాత్మ స్వరూపడనగు నాకీ బంధమేమి? మోక్షమేమి? ఇవన్నీ ఎప్పుడూ లేవు!" ... ఇట్టి మననము స్వీకరించబడినప్పుడు అతడు మననరహితమగు 'స్వసత్త'గానే శేషించుచున్నాడు.

5. స్వీయ - మనోరథ మార్గం

కాలుడు: హే మహర్షీ! ఇప్పుడు మీకుమారుడగు శుక్రుని మనోవినోద సంచారం గురించి వినండి. మీరు నిర్వికల్ప సమాధి యందు ఉండగా మీ కుమారుడు శుక్రాచార్యుడు మనస్సునందే 'స్వమనోరథ మార్గంలో అత్యంతదూరం పయనించియున్నాడు. ఈ స్థూల దేహమును ఇక్కడే వదలి, మనోదేహముతో, ఒక గూడు విడచిన పక్షిలాగా దేవతా నివాసమగు స్వర్గమునకు చేరాడు. అక్కడ విశ్వాచి’ అనే పేరుగల అప్సరసతో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతడు విశ్వాచి తో కూడుకొని పర్వతములందు, పూలతలమధ్య ఉద్యానవనములందు, లోకపాలుర నగరము లందు విహరించాడు. చాలా కాలం గడిపోయింది. వాసనలతో కూడుకొనిన తీవ్ర సంకల్పముల ప్రభావంచే, ఇప్పటికే నా పుణ్యమంతా క్షయించిపోయింది అను రూపంగల భావనాపటిమ అతని యందు రూపుదిద్దుకొన్నది. పండిన పండు చెట్టు నుండి నేల రాలే విధంగా అతడు కూడా ‘అప్సరస’తో సహా ఛిన్నాభిన్నములయిన చేతులు కాళ్ళు కలవాడై భూమిపై పడ్డాడు.

ఆ విధంగా దేవశరీరమును ఆ దేవలోకంలోనే త్యజించి, 'భూతాకాశము' ను పొంది భూమిపై జన్మించాడు. మొట్టమొదట దశార్ణవదేశంలో బ్రాహ్మణుడుగాను, ఆ తరువాత కోసల దేశానికి రాజుగాను, అటుపై ఒక మహారణ్యంలో బోయవాడుగాను, ఆపై, గంగా నదీతటంలో హంసగాను జన్మించాడు. సూర్యవంశంలో జన్మించి పుండ్రదేశానికి రాజు అయ్యాడు. తదనంతరం శాల్వదేశంలో మంత్రోపాసకుడగు 'ఉపదేష్ఠ'గా జన్మించాడు. అట్టి మంత్రములను ఆశ్రయించుట చేత ఏర్పడిన ఔన్నత్యముచే ఆ తరువాతి జన్మలో విద్యాధరుడైనాడు.

ఆ తరువాత మద్ర’దేశమునకు రాజై పుట్టాడు; వానప్రస్తాశ్రమం స్వీకరించాడు. ఆ తరువాత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 'వసుదేవుడు' అనే పేరుతో సమంగానదీ తీరంలోగల ఒక ప్రదేశం జేరాడు.

ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా నీ పుత్రుడు వాసనావశంచేత అనేక భయదాయకమైన జన్మలలో పరిభ్రమించాడు. ఒకసారి కైకటదేశంలో కిరాతకుడుగాను, తరువాత సౌవీర దేశానికి

Page:45

అధిపతిగాను జన్మించాడు. ఆ రాజజన్మలో అనేక పాపకార్యములు చేసియుండటం చేత త్రిగర్త దేశంలో ఒక గాడిదగాను, కిరాతదేశంలో ఒక లతగా కూడా పుట్టాడు. 'జలగల' అనే పేరుగల మరొక దేశంలో మృగమై జన్మించాడు. ఇంకా, ఒక తాడిచెట్టులో పసిరిక పాముగాను, తామల పాకులతోటలో ఒక ఉడుతగాను జన్మలు పొందాడు.

ఒకసారి మీ కుమారుడు మంత్రవేత్తలలో మహాశ్రేష్ఠుడై జన్మించాడు. 'విద్యాధరనగరం'ను పొందింపజేయగల విద్యను మననం చేసి, తద్వారా విద్యాధరుడు అయ్యాడు. అక్కడ ఒక ఉత్తమ మైన విద్యాధరుడుగా ప్రకాశించుచుండగా, కొంతకాలానికి కల్పాంతమునందు ద్వాదశాదిత్యులు లోకములను తపింపజేయుచుండగా, ఆ ప్రళయాగ్నిలో అతడు భస్మీభూతుడైనాడు. అప్పట్లో మన శుక్రుని యొక్క వాసన గూడు విడచిన పక్షిలాగా 'జగద్రచన' అనునదే లేనట్టి శూన్యమగు విశాలాకాశంలో పరిభ్రమిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ ఆ "బ్రాహ్మీరాత్రి గడచిపోయింది. విచిత్రకార్యారంభంతో జగత్ నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు మీ కొడుకు సూక్ష్మవాసనలచే ప్రేరితుడైనాడు. మరల ఏవేవో జన్మలు పొందాడు. ఇప్పుడిక...,

భూమిపై ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. వేదములు మొదలైనవి బాగా అర్థ సమన్వితముగా అధ్యయనం చేసి బుద్ధిమంతులలో ఉత్తముడుగా ప్రసిద్ధి పొందాడు. 'వాసు దేవుడు' అను పేరుతో పిలువబడుచూ, అతడు బంధుమిత్రులను త్యజించి పూర్వ సంస్కారముల ప్రోద్బలం చేత సమంగా నదీతీరం చేరాడు. ఒక ఆశ్రమం నిర్మించుకొని ఏమీ తెలియనట్లే, హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు.

చూచారా మునీంద్రా! మీ ప్రియపుత్రుడు శుక్రాచార్యుడు అనేక రకములైన విషయ వాసనలచే ప్రేరితుడై భిన్న లోకాలలో, పర్వత స్థలాలలో, వనాలలో భిన్న ఉపాధులు పొందాడు. అతి భీకరములైన అరణ్యములలో వృక్షము లత మొదలైన జన్మలు అనుభవించాడు. ఇప్పటికి ప్రశాంతుడై సమంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. జటాధారియై రుద్రాక్షమాలను ధరించి, సర్వ ఇంద్రియములకు సంబంధించి భ్రమలన్నీ త్యజించి వేసి స్థిరచిత్తముతో ధ్యానం చేస్తున్నాడు. అయితే, అతడు ఈ శుక్రాచార్య ఉపాధికి సంబంధించిన 'తండ్రి'యగు మిమ్ములను ఏమాత్రం స్మరించటం లేదు. ఇప్పుడు, మీరు ఆ జీవుని దృష్టిపథం లోనే లేరు.

6. సంసార ప్రవృత్తి చమత్కారం

సర్వలోకములకు ఈశ్వరుడు, సమదృష్టి కలవాడు అయినట్టి కాలభగవానుడు అట్లు పలికి మౌనం వహించాడు. అప్పుడు భృగు మునీంద్రుడు తన జ్ఞాననేత్రంతో పుత్రుని వ్యవహారమంతా పరిశీలన చేయసాగాడు. విశుద్ధమైన తన బుద్ధి" అను దర్పణమునందు తన యొక్క ధ్యాన ప్రభావం చేత, యోగమహిమ చేత ప్రతిబింబించినట్టి తన పుత్రుని సమాచారమంతా

Page:46

కొద్దిక్షణములలో ప్రత్యక్షంగా చూచాడు. శరీరదృష్టిని వీడి, సూక్ష్మశరీరంతో సమంగా నదీతీరం వెళ్ళి పుత్రుని స్వయంగా చూచి, తిరిగి కాలుని సమ్ముఖంలోగల స్వశరీరంలో ప్రవేశించారు. క్షణంలో పుత్ర వ్యామోహం అతనిని వీడిపోయింది. అత్యంత ఆశ్చర్యంతో చిరునవ్వు నవ్వుచూ, ఉత్తమ దృష్టితో కూడుకున్నవాడై వీతరాగుడగు కాలునితో ఇట్లు పలుకసాగాడు. భృగుమహర్షి : భూత-భవిష్యత్ వర్తమానములకు ప్రభువగు ఓ మహాత్మా! కాలదేవా! మేము మలినచిత్తులం, బాలురవంటివారం. చూచారా! ఒక్క క్షణంలో అజ్ఞానం నన్ను ఆవరించివేసింది కదా! మీవంటి మహాత్ముల దృష్టి త్రికాలములందలి వృత్తాంతమంతా స్పష్టముగా గాంచుచూ, మౌనము, సమగ్రము అయిన అవగాహన కలిగి ఉంటోంది. ఇక మేమో, తపో ధ్యానాదుల వలన కలిగిన శక్తిచే అంతా గ్రహించగలం. కాని ఏం లాభం? అన్ని వైపులా దృష్టి సారించలేక పోతున్నాం. కించిత్కే (కొంచెమునకే) మా దృష్టి చాంచల్యమును పొందుతోంది. ఈ జగత్ స్థితి అంతా మిథ్యారూపమే అయినప్పటికీ ఇదంతా అనేక విధాలైన వికారములతో కూడి “నిజమేనా!” అన్నట్లుగా ప్రాప్తిస్తోంది. మా యందు ఒక్కొక్క సమయంలో అనేక భ్రమలను ఉత్పత్తి చేస్తోంది.

ఓ కాలస్వరూపా! మీ అంతరంగమున ఏమున్నదో మీకే తెలుస్తుంది గాని, మరింకెవ్వరికీ తెలియదు. ఇక మా విషయానికి వస్తే, ఈ మనస్సు అనేక వృత్తిరూపములను పొందుతూ, మాయ చేత విమోహితం అగుచున్నది. నా కుమారుడు శుక్రాచార్యుడు ఈ కల్పాంతము వరకు జీవించ వలసియున్నది. ఈ విషయం నాకు తెలుసు. కాని అతడు మరణించటం గమనించగానే నేను విచలితుడనై భ్రమను పొందాను. "జీవితం పరిసమాప్తి కాకపోయినప్పటికీ ఈ కాలుడు నా కుమారుని తన వెంట తీసుకొనిపోయాడే? అను అల్పబుద్ధి ఎందుకో నాకు కలిగింది. అనేక "మంది గురువులచే బోధించబడి, స్వవిచారణాదుల ప్రభావంచే ఈ ప్రపంచము యొక్క స్థితి గతులను ఎరిగియే ఉన్నప్పటికీ, కించిత్ 'ప్రమత్తత' కారణంగా మేము ఈ సంపద, ఆపదలు కలుగజేసే హర్ష, శోకములకు వశీభూతమై పోతున్నాం.

మీకు తెలియనిదేమున్నది? 'అయుక్తం ఆచరించువాని వల్ల కోపం, 'యుక్తం' ఆచరించు వాని పట్ల ప్రసన్నత్వము కలిగియుండుట అయినట్టి ఒక స్వభావం, లేక, నియతి లోకంలో ఉండి ఉన్నది కదా!

"ఇది చెయ్యాలి. ఇది చేయకూడదు" అను ఇష్ట - అయిష్ట - నిర్దేశ్య - అనిర్దేశ్యముల పట్ల సత్యత్వబుద్ధి ... ఉన్నంతవరకూ 'స్వభావం' అనబడేది దృఢంగా ఉండియే తీరుతుంది.

హే జగద్గురూ! హేయమగు అట్టి భ్రమను ఇప్పుడు త్యజించి వేయుచున్నాను. మీ అభిప్రాయములన్నీ పరిశీలించిన తరువాత నా కోపం పటాపంచలైంది. ఏది ఏమైనా, భగవత్ స్వరూపులగు మీ పట్ల దురుసుగా ప్రవర్తించటం తప్పే. మీరు చెప్పినదంతా విన్న తరువాత నేను సూక్ష్మదేహంతో నా కుమారుని సమంగానది ఒడ్డున చూచివచ్చాను.

మహాత్మా! ఈ లోకమున సమస్త ప్రాణులకు మనస్సే రెండు శరీరములను ఉత్పన్నము చేయుచున్నది. వాస్తవానికి ఈ మనస్సునందే జగత్తు అంతా ఉత్పన్నమగుచున్నది.

Page:47

కాలుడు : మహర్షీ! మీరు చెప్పినది అక్షరాలా నిజం. మనస్సే జీవునకు ముఖ్యదేహం కాని, ఈ భౌతికమైన రక్త-మాంస నిర్మిత శరీరం ముఖ్యమైన విభాగం కాదు. కుమ్మరివాడు తనలోని ఆలోచనలకు ఒక రూపమును ఇచ్చి అనేక ఆకారములలో కుండలను, మూతలను తయారు చేస్తున్నాడు కదా! ఈ మనస్సు కూడా అట్లే తన సంకల్పముచే ఈ భౌతిక దేహములను నిర్మించుకొనుచున్నది.

అజ్ఞానవశంచేత బాలుడు 'భూతము' అనబడుదానిని కల్పించుకొని, మరల పెద్దల తోడు పొందినప్పుడు ఆ భూతము అను భావనను, భయాదులను నిర్మూలించుకుంటూ ఏడ్చుచూ

ఉంటాడు చూచారా?

తనకంటూ ఎట్టి ఆకారమూ లేకపోయినప్పటికీ, ఈ మనస్సు తనయొక్క “సంకల్పించుట” అను వ్యవహారదక్షతచే ఈ భౌతిక దేహములను, లోకములను సంబంధ బాంధవ్యములను, ప్రియాప్రియములను, ఆశ్చర్య-సామాన్యములను నిర్మించుకుంటోంది. మరల ఇంతలోనే నశింప జేయుచున్నది. ఎంత చమత్కారమైన క్రీడ ఇది!

ముందుగా అనుకోకపోయినప్పటికీ, స్వప్నంలో అనేక దృశ్యాలు ప్రాప్తిస్తున్నాయి చూచారా? మిథ్యాజ్ఞానము కలిగియున్నపుడు ఏవేవో అభిప్రాయాలు ఆక్రమించివేయుటచే అసత్యములు సత్యములవలె భ్రమింపజేస్తూ ఉన్నట్లు,! 'సంభ్రమం'లో ఉన్నవాడు ఎదుటివాడు చెప్పే విశ్లేషణను వినిపించుకోనట్లు, ఈ మనస్సు తనయందు మిథ్యారచన చేయుట అను ఒక విచిత్రమైన స్వభావము కలిగి ఉంటోంది. అట్టి స్వభావమే సత్యమును మరుగుపరుస్తోంది.

ఓ మునీంద్రా! ఈ జీవుడు “మనస్సు”, “భౌతికదేహము అను రెండు వేరువేరైన విషయ ములు కలిగి ఉంటున్నాడు. ఈ రెండు తత్త్వములు ఉండి ఉంటున్నాయనే విషయం లౌకిక పరిశీలనా మాత్రం చేత (అనగా, గొప్ప వేద వేదాంత జ్ఞానం లేకుండా కూడా) గమనించవచ్చు. ఈ విషయం స్థూలదృష్టికి కూడా సుస్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అయితే అట్టి స్థూలదృష్టిని ప్రక్కకు పెట్టి సూక్ష్మ దృష్టితో కనుక చూస్తే స్ఫురణరూపమగు మనస్సు మాత్రమే కలదు అనే విషయం స్పష్టమగుచున్నది. ఏ సమయంలోనైనా సరే, సత్, అసత్ల రెండింటికీ విలక్షణమై మహా విశాలమైనట్టి ఈ మనస్సే ఆవిర్భావం చెందుతోంది. అటూ ఇటూ సంచరిస్తూ మరొకప్పటికి తన లోనికి తానే తిరోగమిస్తుంది. ఈ ముల్లోకములు మనస్సు యొక్క రచనా చమత్కారమే. చాలా దూరం ప్రసరించియున్న కొమ్మలు, ఆకులు మొదలైనవన్నీ మట్టి వృక్షముయొక్క అవయవములే కదా! ఈ పలువిధాలుగా కనిపించుచున్న భేదవ్యవహారసరళి అంతా చిత్తం యొక్క అవయవాలే. మనస్సు తనయందు భేదవాసనల ప్రభావంచేతనే ఈ పదార్దముల సమూహమునంతా ఈ విధాలుగా గాంచుచున్నది.

దూదియే వస్త్రము అగుచున్నది. వస్త్రములో దూదికి వేరైనదంటూ ఏమున్నది? తరంగమునందు నీటికి వేరుగా ఇక ఉన్నదేది?

Page:48

మట్టి - మట్టి కుండ వేఱు వేతా? కాదు. అయితే అనేక కుండలను చూస్తూ, చిన్న, పెద్ద కుండలు దర్శించటం మట్టిదృష్టిని వదలి ఆకారదృష్టిని ఆశ్రయించుట చేతనే కదా!

ఈ మనస్సు కూడా సరిఅయిన అవగాహన పొందనంతకాలం భిన్నత్వమునే దర్శిస్తోంది. “ఆహాఁ! నేను దుర్బలుడను, దుఃఖిని, అజ్ఞానిని అని భావించుచున్నది. తన వికల్పముల వలన ఉదయించి భావనలచే నియమించబడి, ఈ మనస్సు జీవత్వమును పొందుతోంది.

భృగుమహర్షి : అవును. ఈ మనస్సు యొక్క భావనలకు, స్వయంకల్పితమైన రుగ్మతలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది.

కాలుడు : అయితే మహర్షీ! ఈ మనస్సుకు ప్రాప్తించేదంతా స్ఫురణ' లేక 'భావన' మాత్రమే కదా! భావించుట చేత మాత్రమే (లేక, ఊహించుట చేత మాత్రమే) స్ఫురించేది సత్యమెట్లా అవుతుంది? "ఈ మనస్సును త్యజించుట లేక జయించుట ఎట్లా? అను ప్రశ్నకు ఉపాయం ఏమిటో చెపుతాను. నేనీ రూపమునే కాదు. మనస్సు యొక్క స్పురణ కూడా నేను సర్వ స్ఫురణలకు ఆవలఉన్న నిత్యోదితచైతన్యతత్వమే నేను అనునట్టి నిరంతర ఉత్తమభావనచే ఈ తుచ్ఛ మనస్సు జయించివేయబడగలదు. అల్పత్వమును ఆశ్రయించు మనోవిభాగము త్యజించ బడగా, అప్పుడు శేషించు మనన శీలత్వమునకు నియామకమైన 'మహామనస్సు’ సనాతనము, శాంతము, అఖండము అని మేము గ్రహించుచున్నాము.

ఈ మనస్సు గురించి దృష్టాంతపూర్వకంగా మరికొన్ని విశేషాలు చెపుతాను. వినండి.

సముద్రము, తరంగాలు - ఒక సుప్రసిద్ధమైన మహాసముద్రం ఉన్నది. అది అసంఖ్యాకమైన తరంగములతో శోభాయమానమైయున్నది. ఆ తరంగాలు లేస్తున్నాయి. శమిస్తున్నాయి. అయితే ఏం? ఆ సముద్రం ఎచ్చట నుండి వచ్చుటలేదు. ఎచ్చటికీ పోవుటలేదు.

ఆ మహాసముద్రం అన్నివైపులా ఒకే జలం కలిగియున్నది. సమము, శుద్దరూపము, స్వచ్ఛము, స్వాదుజలమయము కూడా అయివున్నది.

కల్పాంతము వరకు ఆ సముద్రం అట్లే ఉండి ఉంటోంది. ఆ సముద్రం అక్కడ ఉండి ఉండటానికి ఎవ్వరూ కారణం కాదు. అది స్వమహిమ యొక్క అతిశయం చేతనే అచ్చట ప్రతిష్ఠితమైయున్నది.

అట్టి మహాసముద్రంలో అనేక తరంగాలు ఉన్నాయి. అందులో కొన్ని చిన్న తరంగాలు. ఆ చిన్న తరంగాలు, తమయొక్క స్వభావవశంచేత నేను చిన్న తరంగమును హ్రస్వమును ఎత్తు పల్లములే నా స్వరూపం," అను భావనచే నిజరూపమును ఏమరచుచున్నాయి.

మరికొన్ని అతి దీర్ఘమైన తరంగాలు. అవి తమ స్వభావాన్ని అనుసరించి "మేము చాలా పొడవైన తరంగాలము" అని వికల్పన చేస్తున్నాయి.

కొన్ని కెరటాలు అదిగో, ఇక నా వినాశనం దగ్గరపడినట్లే అని తలంచుచు పతన భయం

Page:49

వల్ల పతనమునే భావించుచు అట్టి భావనచే తీరప్రదేశంవైపు పోవుచున్నాయి. స్వల్ప కాలమైన తరువాత మరల ఆవిర్భవించి అవును ఇప్పుడు మేము భోగములు పొందుటకు అనుకూలమైన స్థానములను, స్థితిగతులను పొందుచున్నాము అని అభిమానించుచున్నాయి.

ఈ వ్యవహారమంతా దైవవశం చేత మహావిశాలమై, దేదీప్యమానమై శోభించటం జరుగుతోంది.

కెరటములతో పోల్చదగిన అనేక ఉపాధులందు కనిపించే అహంభావమే ఈ జగత్తు యొక్క రూపం. అట్టి అహంభావ మహాసముద్రంలోని ఒక కెరటం చంద్ర బింబమున ఉపాధి రూపంలో ఉండి ఇప్పుడు నేను శీతలముగా ఉన్నాను అని అభిమానిస్తోంది. మరొక అహంకార కెరటం దావాగ్ని యందు ప్రకాశవంతమగు దేహము కలిగి, ప్రతిబింబముతో కూడినదై, నేను దహించ బడుచున్నాను అని తలచుచు భయమును పొందుచున్నది. మరల ఎప్పుడో మౌనము వహించి

ఉంటోంది.

ఒక జలకెరటం ఒకచోట తనలో చంద్రుని, నక్షత్రములను ప్రతిబింబింపజేస్తోంది. మరో కెరటం మరొకచోట పర్వతాలను, వృక్షాలను, వాటి ఫలాలను తనలో ప్రతిబింబింపచేస్తోంది.

ఈ అహంకారము ఒక ఉపాధియందు ప్రవేశించి, ఒక సమయంలో "నేను ఇప్పుడు రాజు నయ్యాను. కనుక కృతార్థుడను అని సంతోషము పొందుతోంది. గాలి వీచగా తరంగం విధ్వంస మగుచున్నట్లు, ఆ భ్రమవంతమైనట్టి ఉపాది, తదితర సంబంధిత విషయములు విధ్వంసమగు చుండగా, ఆ జీవుడు “అయ్యో! నేను ఖండ ఖండములయ్యానే!" అని అరచుచు రోదించుచున్నాడు.

ఓ మహర్షీ! ఈ కెరటములలో ఎంతటి తతంగమంతా జరిగిపోతోంది! ఎక్కడో లేస్తున్నాయి. ఒకదానితో మరొకటి కలిసి ప్రయాణిస్తున్నాయి. ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఛిన్నాభిన్నమై పోతున్నాయి. అయితే యథార్థానికి ఈ తరంగములన్నీ జలముకంటే వేరు కాదు కదా! 'తరంగములు’ అనబడునవి జలమునకు వేరుగా బాహ్యము నుండి ప్రాప్తించుటలేదే! అందుచేత, ఈ తరంగములు జలసమూహరూపమైనట్టి మహాసముద్రము కంటే వేరైనవని అనటం ఎట్లా?

అందుకే, తరంగములకు 'సత్' మయమైన, (లేక) 'అసత్' మయమైన ముఖ్యరూపమే లేదు”

అని అంటూ ఉంటారు.

కాని, సముద్రంలో తరంగములనునవి లేవు. జలమే ఉన్నది" అని అనవచ్చునా? మరి తరంగములు లేస్తున్నాయి. కనబడుచున్నాయి కదా!

భృగుమహర్షి : హే కాలస్వరూపా! మీరు మహత్తరమైన విషయమునే విశదీకరిస్తున్నారు. జ్ఞానదృష్టి యొక్క సువ్యక్తతకొరకు అడుగుచున్నాను. ఇంతకీ జలంలో తరంగాలు ఉన్నాయి అని అంటారా? లేవని అంటారా?

Page:50

లేక 'బ్రహ్మము-జీవులు' దృష్ట్యా చెప్పాలంటే, బ్రహ్మమునందు కనబడే ఈ 'నీవు-నేను -అతడు అను రూపములుగా తోచే ఖండితాహంకారలు వేరువేరుగా ఉన్నాయా? లేవా? కాలుడు : బ్రహ్మర్షీ! మీకు సర్వము విదితమై యుండి కూడా అడుగుచున్నారు. అయినప్పటికీ, పునశ్చరణ యొక్క బలం కొరకు చెప్పుచున్నాను.

సముద్రమును తరంగముల దృష్టి"తో కూడుకుని చూస్తున్నామనుకోండి... అవి ఉండనిదెప్పుడు? లేక జలదృష్టితో చూస్తే తరంగములన్నీ జలమయమే కదా!

"ఈ జగత్తు ఇందలినానాత్వము కూడా అట్టిదే... అని గ్రహించండి. అయితే ఈ జీవులు వారివారి స్వభావము-స్థితి-సంకల్పముల కారణంగా పరిచ్ఛిన్నములగు ఈ భేద వికల్పములు అన్నీ స్వయంకల్పితానుసారమే గాంచుచున్నారు.

మరల విషయసారమును సమీక్షిస్తున్నాను. వినండి

ఈ తరంగములు ఉత్పన్నమౌతున్నాయి. నశిస్తున్నాయి. మరొకప్పుడు నశించకుండా దీర్ఘ కాలం ఉండి ఉంటున్నాయి. ఇట్లు మరల మరల ఉత్పన్నమగుచు, నశించుచుండే ఈ తరంగాల పరస్పర సమ్మేళనము కంటే సముద్రము వేరు కాదు. సముద్రము కంటే తరంగములు వేరు కాదు.

ఈ జీవులు కూడా 'పరమాత్మ' కంటే వేరుగా లేరు. పరమాత్మ వీరికంటే వేరు కాదు.

అయితే, జ్ఞానులగు జీవులు... నేను పరమాత్మనే. వేర్వేరు జీవాత్మలవలె కనిపించే ఈ విశాలదృశ్య జగత్తంతా నాయొక్క చిత్కళయే. కాని వాస్తవానికి నాయందు ఇవేమి లేవు - అని సర్వదా గమనిస్తూనే ఉంటున్నారు. జలములో తరంగమున్నది అని అనటం అసమంజసము కదా! తరంగమనునది జలమువలె ఒక పదార్థమే కాదు”... అని గ్రహించుచున్నారు. అట్టి సమగ్ర - సర్వసమత్వ- ఏకీభావన గల జీవుణ్ణి మోక్ష స్వరూపుడు" అని అంటున్నాం.

దానికి వేరైన భావన కల వానిని "జీవుడు" అంటున్నాం.

వేరైన భావన:నేను ఈ శరీరమును, తదితర శరీరములు నాకంటే వేరుగా బాహ్యమున ఉంటున్నాయి. వారి చిత్తములు వేరు. నా చిత్తము వేరు. అందుచేత వారు వేరు. నేను వేరు. ఇవి నావి. ఈ కొద్ది మంది నా వారు. వీరు తదితరులు అను మననము చేయు జీవుడు 'బద్ధ స్వరూపుడు’ అని చెప్పబడుతోంది. బద్ద స్వరూప మననముచే అనేక దుఃఖములు అనుభవిస్తున్న ఈ జీవునకు అతని అఖండ స్వరూపము గుర్తుచేసి ప్రశాంతపరచటానికే ఆత్మవిషయమై శాస్త్రములు విచారణ ప్రతిపాదించటం జరుగుతోంది.

ఎందుకంటే, వాస్తవమగు ఆత్మకు బంధ - - మోక్షములు ఉంటాయా? ఉండనే ఉండవు.

తరంగములన్నీ అన్ని సమయములందూ ఏకైక రూపమగు జలమయమే అయి

Page:51

వుంటున్నట్లు, ఈ చిత్ర విచిత్రక్రియలతో కూడి చంచలమైయున్న ఈ జగత్ శక్తులన్నీ బ్రహ్మము కంటే భిన్నముగా కనిపించుచున్నను, అభిన్నములే సుమా!

బ్రహ్మము... తరంగములలోని జలం వలె.. వ్యాపకమై, నిత్యమై, శుద్ధమై, నిరామయమై, చిన్మాత్ర స్వరూపమై, అనాదియై, అనంతమై, సర్వశక్తిమంతమై ఉన్నది. సర్వశక్తిమంతుడగు పరమాత్మ తన స్వస్వరూపము నుండి చ్యుతి పొందకుండానే ఈ వివిధ రూపములన్నీ పొందుచున్నాడు.

జలము నందు జలమే తరంగరూపముగా అవతరిస్తున్నట్లు, బ్రహ్మము నందు బ్రహ్మమే నానావిధ రూపములుగా విస్తరిస్తోంది.

త్రాడు నందు పాము కనబడుచున్నట్లు, ఆ బ్రహ్మము నందే ఈ స్త్రీ-పురుష-లింగరహిత రూపములన్నీ వివర్తభావము పొందుచున్నాయి.

7. ఈ జగత్తు బ్రహ్మమే

భృగు మహర్షి : కాలదేవా! బ్రహ్మము నందు ఈ ‘జగత్తు' అను వివర్తవ్యవహారం ఎట్లా, ఎప్పుడు, ఎందుకు ఏర్పడుచున్నదని మీ అభిప్రాయం?

కాలుడు : ఓ భృగుమహర్షీ! మీ ప్రశ్నకు సమాధానం వినండి -

'జగత్తు' అనునట్టి కల్పన ఏదీ ఎప్పుడూ ఉండియే ఉండలేదు. ఇప్పుడు కూడా లేదు. ఇకముందు కూడా ఉండబోదు. ఎందుకంటారా? ఈ జగత్తు-బ్రహ్మము అనబడు రెండింటిలో కొంచెం కూడా భేదం లేనేలేదు. తరంగమునకు, జలమునకు భేదమేమిటి చెప్పండి.

ఆ బ్రహ్మము నిశ్చయముగా పూర్ణమై, సర్వమైయున్నది. "ఈ జగత్తు కూడా కేవలం బ్రహ్మము మాత్రమే. అను "భావన అనుక్షణం చేయబడుచున్నదనుకోండి... అప్పుడు, అలాంటి ప్రయత్నంతో తదితరములైన ఆడంబరములన్నీ త్యజించబడటమే సర్వదోషములకు ఉపశమనం.

ఆ ఆత్మసత్తయే 'నియతి' రూపము కూడా అయి ఉన్నది. సమస్త పదార్థముల యొక్క అధిష్ఠానము కూడా అదియే. అది అనేక రూపములుగా ఉన్నప్పటికీ, ఏకరూపమై ఉన్నది. అసంఖ్యాకములుగా విరుద్ధ రూపము కలదైవున్నప్పటికీ, సర్వత్రా ఒకే ఆకారము కలిగియున్నది.

అట్టి ఆత్మ తనయందు తానే వేరైన భావనను ఆశ్రయించి మనస్సు. అనే ఉపకరణం ద్వారా ఈ పటాటోపమంతా పొందుచున్నది. అట్టి భావనా స్వరూపమే ఈ చిత్తము. అట్లు, ‘ప్రతిబింబత్వము' లేక 'చిదాభాసత్వము' పొందిన తరువాత ఈ చిత్తము ఆయా ఉపాధులందు వ్యాపకమైయున్న అహంకారమును చూస్తూ "ఈ అహంకారములే ఆత్మ యొక్క స్వరూప, స్వభావములు" అని భ్రమ పొందుచున్నది. అనగా ఈ జగత్తు యొక్క దర్శనమంతా సాంసారిక

Page:52

దృష్టిచేత ఏర్పడిన చిత్తభ్రమ మాత్రమే అని అనక తప్పదు. అయితే ఈ అహంకారముఅహంకారమునకు ఆవల, అహంకారముకంటే వేరైన-సన్మాత్రము (Absolute Self-Existence) ను లేని దానిలాగా గాంచుచున్నది. అనగా ఈ చిత్తము ఉన్న దానిని లేనిదిగా, లేని దానిని ఉండినట్లుగా గాంచుచున్నది.

x

మనం ఇంతవరకు చెప్పుకున్న జల-తరంగముల దృష్టాంతం సహాయంతో ఆత్మ-జగత్తుల చమత్కారం గురించి మరికొంత వివరిస్తాను -

ఒకద్రష్ట వేరువేరుగా దర్శిస్తున్న నామ, రూపాలన్నీ చిత్తం యొక్క వేరువేరు సందర్శనాలే! ఈ చిత్తము వేరు వేరైన తరంగములను మాత్రమే గాంచుచున్నది.

అన్ని తరంగములలోనూ ఒకే రీతిగా ఉండియున్న జలమును గాంచుట లేదు.

ఈ విధంగా ఈ చిత్తము "ఆధ్యాత్మికము కానట్టి జడము, ఆధ్యాత్మికము అయినట్టి చైతన్యము”ల విభేదమును గ్రహించుచున్నది.

అయితే చిత్తం యొక్క ఈ 'భేదవాసనా రూపమగు శక్తి' ఆత్మయొక్క నిజరూపముననే చమత్కారంగా ఉండి ఉంటోందని చెప్పక తప్పదు. దేని నుండైతే ఎట్టి బాహ్యకారణము లేకుండానే ఒకటి వివర్తిస్తోందో, అది ఆ మూలవస్తువుకంటే వేరైనది కాదు” అనునది సిద్ధాంతమై ఉన్నది.

చిత్తము చేతనే “ఇది జడం - ఇది చైతన్యం అను భేదకల్పన అంతా చేయబడుతోంది కదా! అయితే... ఈ చిత్తము యొక్క విన్యాసమాత్రం చేత ఆత్మయొక్క ఏకరూపత్వమునకు ఏర్పడే హాని ఏమీ ఉండదు. అనేక తరంగముల యొక్క గతి భేదం ఉండి ఉన్నప్పటికీ, పరిపూర్ణమై ఉన్న సముద్రజలం శోభిస్తూనే ఉన్నది కదా! సముద్రజలం తనయందు తానే ఈ తరంగములు మొదలైన భేదం పొందుతోంది. అట్లాగే... పరబ్రహ్మమే విశాల జగదాకారముగా వికాసమును పొందుచున్నది.” అనునదే సిద్ధిస్తోంది. ఆత్మయే ఆత్మచే ఆత్మయందు నానా ప్రకారములగు వికారములను స్వయముగా గ్రహించుచున్నది. మరల తనకు తానే త్యజించుచున్నది. శాస్త్ర కారులు ఆ రెండింటికీ బంధము-మోక్షము” అను పేర్లు పెట్టారు.

అవిచిత్రం నుండి విచిత్రం - హే మహర్షీ! ఒకే విషయము అనేక కోణములలో వినటం జరిగితే ఉత్తమ భావన దృఢపడుతుంది కదా! అందుచేత మరల చెప్పుచున్నాను... వినండిచిత్ర విచిత్రములైన తరంగములు జలముకంటే వేరు కానట్లు, సర్వలోకములకు ఈశుడైనట్టి ఆ పరమాత్మకంటే నీవు-నేను-జగత్తు" అనబడు ఈ మొత్తం జగత్కల్పన వేరు కాదు. ఒకే బీజంలో కాండము, శాఖలు, ఫలములు, పుష్పములు, ఆకులు వగైరా ఉన్నాయి కదా! ఆ పరమాత్మ యందే ఎల్లప్పుడు ఈ సృష్టి-స్థితి-లయ పరిణామ శక్తులన్నీ అంతర్లీనంగా దాగి

ఉన్నాయి.

Page:53

భృగువు : అసంగుడు, నిష్క్రియుడు అని చెప్పబడుచూ సర్వస్వభావములకు అతీతుడైన ఆ శుద్ధపరబ్రహ్మ భగవానుని యందు ఈ వికారాలన్నీ ఉండి ఉన్నాయా?

కాలుడు : అక్షరాలా... ఉండవు. “దేవేశుడు, సర్వమునందు సాక్షిస్వభావుడై అంతర్లీనంగా ఉండి ఉన్నవాడు... అయినట్టి ఆ పరమాత్మయందు ఎట్టి వికారములకు చోటే లేదు. తీవ్రజ్వరంతో బాధపడేవానికి విచిత్ర వర్ణములు కనిపిస్తూ ఉంటాయి చూచారా! అట్లాగే దేవేశుడగు ఆ పరమాత్మ యందు ద్రష్టత్వ విశేషంచేత సత్-అసత్ మయమగు ఈ 'నేను - నీవు' మొ॥ వాటితో కూడిన జగత్ చమత్కార వ్యవహారమంతా దృగ్గోచరమగుచున్నది. ఒక నల్లని మేఘము నుండి సప్త రంగులతో కూడిన విచిత్రమైన ఇంద్రధనుస్సు ఉద్భవించుచున్నది. అట్లాగే, ఏకరసము మంగళ స్వరూపము, అవిచిత్రము అగు పరమాత్మ నుండి విచిత్రమైనట్టి ఈ 'జగత్స్థితి' ఉదయించటం అనుభవమౌతోంది.

సాలెపురుగు నుండి దారం బయల్వెడలి, సాలెగూడుగా అయి, సాలె పురుగును చుట్టి ఉంటోంది కదా! స్వప్నంలో ఆ 'స్వప్నద్రష్ట' యొక్క చైతన్యముకంటే వేరుగా ఉన్నట్లు తోచే వస్తు జాలం కనబడుచున్నది. చేతనమగు పరమాత్మ నుండి జడభావనను ఆశ్రయించుట అను రూపము గల జడత్వము ఉత్పన్నమగుచున్నది.

పట్టుపురుగు తన బంధము కొరకు తనకుతానే దారపుగూడును విస్తరింపజేసుకుంటోంది. ఆత్మ కూడా స్వీయబంధముకొరకే తన యొక్క చిత్త శక్తిని విస్తరింపచేసుకుంటోంది. చిత్త శక్తియే వాసనావైచిత్ర్యము కూడా.

భృగుమహర్షి : ఈ వాసనా బంధమంతా నిష్కల్మష స్వరూపమగు ఆత్మకు ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది?

కాలుడు : ఓ మహర్షీ! ఈ వాసనా బంధమంతా ఆత్మకు బాహ్యము నుండి మరెవ్వరూ కలిగించుట లేదు సుమా! ఆత్మయే స్వయముగా తన ఇచ్ఛానుసారంగా తనయొక్క 'స్వరూపవిస్తృతి (The extending of its own form) ను భావించుచున్నది. పట్టుపురుగులాగా తన కొరకు తానే కఠినమైన బంధమును నిర్మించుకొనుచున్నది.

ఈ ఆత్మయే మరొక సమయంలో తన ఇచ్ఛచే ఆత్మసాక్షాత్కారం పొందుతోంది. స్వస్వరూపం యొక్క ప్రభావం చేత - ఒక ఏనుగు కట్టుత్రాడు త్రెంచుకొనునట్లు - ఈ ఆత్మ తనకుతానే సంసార బంధము నుండి తొలగి, మోక్షమును పొందుచున్నది. అనగా, బాహ్యమననము త్యజించి, స్వస్థతతో కూడిన "స్వయమాత్మానుభవము (A sense of experience that 'I' am the all pervading

Self) ను సంతరించుకొంటోంది.

ఈ ఆత్మ దేని గురించి ఎట్లు భావించటం జరుగుతుందో, అది నిరంతరం అట్లే అగుచున్నది. చూచారా? ఆత్మ సర్వదా మహద్వస్తువే. సందేహం లేదు. అయితే ఏం? అది తనయొక్క చిత్తశక్తి’ చే ఏది ఎట్లా భావిస్తే, అట్లే శీఘ్రంగా తద్రూపమగుచున్నది. ఈ చిత్తశక్తి అనంత-అఖండ

Page:54

స్వరూపమగు ఆత్మాకాశమునే కప్పివేస్తోందే! గొప్ప వర్షాకాలమేఘం అనంతాకాశమును కప్పివేసి ఉంచి... ఇక ఆపై ... ఆకాశమంతా తన రూపమే అయిపోయినట్లు చూపుతుంది చూచారా? చిరకాల భావనచే దృఢీభూతమైయున్న ఈ వాసన అనునది క్షణంలో ఆత్మను తనవంటివాని లాగానే చూపుతున్నది. తనయందు ఏయే భావనలు ఉత్పన్నమగుచున్నాయో, ఆయా రూపము గానే ఆత్మ శీఘ్రముగా ప్రకటించుకొనుచున్నది.

ఆత్మకు బంధముగాని, మోక్షముగాని లేవు, ఇక మనస్సంటారా,... దీనికి స్వకీయమైన అస్థిత్వమే లేదు.

ఆత్మయొక్క మననశీలత్వమే మనస్సు. అదియే చిత్తము కూడా!

ఈ మనస్సు అనబడేది అవాస్తవమైనది. దీనికి స్వయమైన 'సత్త' అంటూ ఏదీ లేదు. స్వయంకృతమైన ఉనికియే లేనట్టి మనస్సుకు బంధమేమిటి? "స్వప్నంలో ఒక పంజరమున్నది. ఆ పంజరంలో ఒక రామచిలుక ఉంది. దానికి బంధ విముక్తి ఎప్పుడు?" అనే ప్రశ్నకు అర్థమేమున్నది? స్వప్నమే ఒక ఊహ. అందులో పంజరము, చిలుక మొదలైన పదార్థజాలమంతా కూడా ఊహయే. ఎప్పుడైతే ఈ 'ఊహ' ఉపసంహరించబడుతుందో,... మరుక్షణం ఆ ఊహ లేక స్వప్నంలోని విశేషములన్నీ లేనివే అగుచున్నాయి.

ఆత్మకు, మనస్సుకు కూడా బంధ మోక్షములు ఉండజాలవు.

మరి ఈ ప్రపంచంలోకి బంధ-మోక్షముల దృష్టి ఎక్కడి నుండి వచ్చింది? ఈ బంధ - మోక్షములు మనం ఆపాదిస్తున్నది ఎవరికి?..... ఈ విషయాలు తరచి తరచి చూచినపుడు అవిచారణ చేతనే ఈ బంధ-మోక్ష వ్యవహార మంతా ఎదురుగా తాండవిస్తూ ప్రాప్తిస్తోంది" అని చెప్పబడుతోంది.

‘బంధ-మోక్షములు అనబడేవి యథార్థానికి లేవు. కాని, ఆత్మయే బంధ-మోక్ష రూపమై వికారయుక్తంగా భాసించుచున్నది. ఆహాఁ! చిత్రం చూచారా? నిత్యము, పూర్ణము అయిన ఆత్మయొక్క స్వరూపమును, అత్యంత అనిత్యమైనట్టి 'భోక్త-భోగ్యము-భోగము' మొదలైన వాసనల అధ్యాస కప్పివేయుచున్నదే! చిత్తము సంకల్పములను ఆశ్రయించుట ప్రారంభించిన మరుక్షణం, పట్టు పురుగువలె, ఆత్మ ఈ చిత్తము ద్వారా ఆ బంధమునందు తగుల్కొనుచున్నది. పరస్పర మిళితములు, అత్యంత వికల్పయుక్తములు అయిన కోట్లకొలది మనఃశక్తులు ఈ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి. అటూ ఇటూ సంచారం చేస్తున్నాయి.

సముద్రంలో నుండే తరంగములు ఉద్భవించి, ఆ సముద్రము వలన సముద్రమునందే స్థితిపొందియున్నాయి. ఆ సముద్రమునే సంక్షుభితమయంగా చేసి చూపిస్తున్నాయి కదా!

చంద్రుని కిరణాలు చంద్రుని నుండి బయలుదేరి మనకు ప్రాప్తిస్తున్నాయి. అయితే చంద్ర కిరణాలు చంద్రుని కంటే వేరా?

Page:55

ఈ మనశ్శక్తులు కూడా పరమాత్మకు భిన్నమైనవి కాకపోయినప్పటికీ, భిన్నముగా ఉన్నట్లు అపరిపక్వ దృష్టిచేత అనిపిస్తోంది.

ఆత్మయందు చిత్తజల తరంగాలు - ఆత్మ” అను మహాసముద్రము 'చిత్తము' అనే జలమును కలిగి యున్నది. 'చిన్మాత్రము' అను తరంగములతో కూడినదై మహావిశాలంగా ఉండియున్నది. అట్టి స్పందనామయమగు ఆత్మమహాసముద్రంలో "బ్రహ్మ-విష్ణు మహేశ్వరులు అనబడేవి కూడా కొన్ని పెద్ద కెరటాలు. ఇక మరికొన్ని చిన్నకెరటాలు మనుజరూపంలోను, దేవతల రూపములోను, నాగ-యక్ష మొదలైన అనంతసంఖ్యలో అనేక రూపాలుగా ప్రాప్తిని పొందుచు న్నాయి. ఈ తరంగములన్నీ కూడా స్వభావము చేతనే కల్పించబడి, స్ఫురించు చున్నాయి. వీటిలో కొన్ని "యముడు, మహేంద్రుడు, కుబేరుడు" మొదలైన రూపాలతో అష్టదిక్పాలకులు” గా వ్యవహరించబడుచున్నాయి. కొన్ని పరస్పరం వధించుకుంటున్నాయి. మరికొన్ని ఉపకారం చేసుకుంటున్నాయి. కొన్ని హాస్యం ప్రదర్శిస్తున్నాయి. మరికొన్ని అత్యంత తీవ్రము, చపలము అయిన 'ఇచ్ఛ’తో కూడుకొని ఉన్నాయి.

కొన్ని ఉత్తమ తరంగాలు గర్జిస్తూ పైకి ఎగురుచున్నాయి. (ఊర్థ్వలోకాలకు పయనిస్తున్నాయి). మరికొన్ని క్రిందకు వెళ్ళుచున్నాయి. (అధోలోకములకు తిరోగమిస్తున్నాయి).

ఆ తరంగములోని 'బ్రహ్మ' 'ఇంద్రుడు' మొదలైన కొన్ని కొంచెము దీర్ఘకాలము ఒక స్థిరమైన ఆకారం పొంది ఉంటున్నాయి. ఈ 'మనుష్యులు' అనబడు తరంగాలు అత్యంత అస్థిరమైన అతి స్వల్పకాలం స్ఫురించి ఉంటున్నాయి. అతి శీఘ్రంగా నశించుచున్నాయి. ఆత్మమహాసముద్రంలో క్రిమి - కీటక - పతంగ - - సర్ప - - మశక - జంతు జాతులన్నీ చిన్న కెరటముల, జలబిందువుల రూపంలో ప్రకటితమౌతున్నాయి. మరికొన్ని పర్వతములందు గుహలందు, కారుచీకటులందు పుట్టి, అక్కడే సంచరిస్తూ, అక్కడే నశిస్తున్నాయి.

ఈ మానవులలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారు. ఒకని జీవితం అతి దీర్ఘంగానూ, మరొకని జీవితం అల్పకాలముగానూ ఉంటోంది. ఒకని దేహం విశాలంగాను, సుందరంగాను; మరొకని దేహం అతితుచ్ఛంగాను ఉంటున్నాయి. ఈ సంసార స్వప్న కార్యక్రమం నందు ఒకరికి ఒక్కొక్కరు చిరకాలం వరకు స్థిరంగా ఉంటున్నట్లు కల్పించబడుచున్నారు. కొందరు దృఢవికల్పములచే ఎంతగానో మోహితులై, ఈ కనబడే జగత్తు అత్యంత స్థిరమైనది కదా అని భావించుచున్నారు. అతి తుచ్ఛ భావములుగల కొందరు నేను పుట్టాను, పెరుగుచున్నాను. ఇంతటితోనే నేను పరిమితుడను. ఈ శరీరమునకు హాని జరిగితే నా పని అయిపోయినట్లే, అయ్యో! ఈ శరీరంతోపాటు నేను కూడా కృశించుచున్నాను. అతి దుఃఖితుడనగు నాకు గతి లేదు. నేను ఎంతటి మూఢుడను! అని తలపోయుచున్నారు. ఫలితం? 'దీనత్వము' అను దోషమునకు వశీభూతులై, దుఃఖాదుల ప్రకంపనములు నిరంతరం పొందుచున్నారు.

Page:56

ఆత్మ మహాసముద్రంలో జడ చిత్త తరంగరూపమున ఉన్న మరికొందరు నేను ఒక జడమగు రాయిని. అను జడ భావము కలిగి ఉంటున్నారు. ఇంకొందరు, మేము సర్వుల సానుకూల్యము కొరకు ఇవన్నీ ఇట్లు ప్రసాదిస్తూ ఉంటాము అని దృఢంగా భావించినవారై దేవభావమును పొంది ఉంటున్నారు. తరంగములు ఆకారములు మార్చుకుంటున్నట్లు కొందరు జంతు ఉపాధి నుండి మానవ ఉపాధికి, మానవ ఉపాధుల నుండి ఆయా జంతువుల ఉపాధులకు చిత్తానుసారంగా తరలి వెళ్ళుచున్నారు. ఇంకొందరు 'సుషుప్తి-ప్రళయముల’లో లాగా

అవ్యక్తమగు, వాసనా రూపమైనట్టి 'మహాంధకారము పొందుచున్నారు.

హే మహాత్మా! భృగుమహర్షీ! మీకు కనబడుచున్న ఈ జీవులు, ఈ నీ కుమారుడు, అతని ఇప్పటి జన్మ పరంపరలు, నీవు-నేను... ఇవన్నీ కూడా 'బ్రహ్మము' అను మహాసముద్రము నుండి ఆవిర్భవించిన తరంగములవంటివి. అట్టి ఈ తరంగములకు స్ఫురణరూపమగు మనస్సు” అనే పేరు విజ్ఞులు పెట్టారు.

ఇవన్నీ చంచల ఉపాధులతో కూడిన చైతన్యము యొక్క భేదములే.

చైతన్యము దృష్ట్యా వీటన్నియందు భేదం లేదు.

వీటిలో కొన్ని ఈ జగత్తులో అనేక కల్పముల వరకు, స్థిరత్వమును పొంది ఉంటున్నాయి. మరికొన్ని జ్ఞానామృతం చేత శుద్ధము, పరమపదము" అగు మోక్ష ప్రాప్తిని పొందుచున్నాయి. ఏది ఏమైతేనేం? ఆత్మయొక్క చిత్కళా చమత్కారమే ఇదంతా.

8. సంసారోత్పత్తి B - విస్తారము

భృగుమహర్షి : ఓ కాలదేవా! ఈ ముల్లోకముల 'సృష్టి'లో చిత్ర విచిత్ర జీవరాసులన్నీ ప్రభవిస్తున్నాయి కదా! వీటన్నిటిలో ఉత్తమమైన, 'కృతార్థులు' అని చెప్పతగినవారు ఎవరు? ఈ జీవజాతులన్నీ ఎక్కడి నుండి ఎందుకు ఆవిర్భవిస్తున్నాయి?

కాలుడు : సముద్రములోని తరంగాలలాగా, వసంత ఋతువులోని లతలలాగా ప్రభవిస్తున్న ఈ అనేక చిత్ర విచిత్రములైన జీవజాతులన్నీ పరమాత్మ నుండే ఆవిర్భవిస్తున్నాయి. అయితే వీరందరిలో కూడా ఎవరైతే మనస్సు యొక్క మోహమును జయించివేసి, ఇహ-పరములను సుస్పష్టముగా ఎరిగి ఉంటారో, వారు మాత్రమే కృతార్థులు. అట్టి కృతార్థులు యక్షులలోను, గంధర్వులలోను, మనుష్యులలోను, జంతువులలోను కూడా ఉండియే ఉన్నారు. 'జీవన్ముక్తులు’ అని చెప్పబడే అట్టి జీవులు తమ యొక్క రాక పోకలచే ఈ ధరాతలమును పునీతం చేస్తూ ఉంటారు. వారు విహరించుచుండగా అట్టి ప్రభావంచేత వర్తమాన భవిష్యత్తులలో అనేకమంది తదితర సంసారజీవులు కూడా సముద్ధరించబడుతూ ఉంటారు.

Page:57

ఇక ఈ సాంసారిక భావములకు తమని తాము పరిమితం చేసుకున్నవారి గతి ఏమి టంటావా! వారంతా "కట్టె, గోడల వలె మూఢులై అనేకసార్లు స్థావరత్వమును, జంగమత్వమును పొందుచూనే ఉంటారు. అందుకే... ఓ సర్వజనులారా! ఈ మానవ ఉపాధి అత్యంత ఉత్కృష్టమైనది, దుర్లభమైనది. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన విజ్ఞానములు ఆశ్రయించటానికి కావలసిన సాధన సంపత్తి లభిస్తున్నది. అందుచేత ఈ అవకాశమును వృథాపరచుకోకండి... అని గురువుల స్థానంలో విధులను నిర్వర్తిస్తున్నట్టి మహనీయులు ఈ ప్రపంచజనులకు మరల మరల గుర్తు చేస్తున్నారు. ఘోషిస్తున్నారు.

శాస్త్రములచే వచించబడుచున్న తపస్సు, ధ్యానము మొదలైన సర్వప్రయత్నముల అంతిమ గమ్యమేమిటి? మోహమును నశింపజేసుకొనుటయే సుమా! మోహము పూర్తిగా నశించితే... అట్టి తత్వజ్ఞానులకు శాస్త్ర విచారణ మొదలైనవి క్రొత్తగా ప్రసాదించేవి ఏమి ఉంటాయి? ఈ సాధనములు, ఈ విధి నియమములు,... ఈ చర్చలు ఇవన్నీ అజ్ఞానము వీడని వారి కొరకు మాత్రమే జ్ఞానులచే ప్రతిపాదించబడుచున్నాయి. ఈ లోకంలో కొందరు 'ఆత్మజ్ఞానము' పట్ల జాగరూకులై, ప్రయత్నశీలురై ఉంటున్నారు. వారి కొరకే, జ్ఞానులగు మహాత్ములచే శాస్త్రములు రచించబడ్డాయి. అయితే ప్రయత్నము, శ్రద్ధ, ఆసక్తి, ఉత్తమ ఆశయము కలవారి పట్ల మాత్రమే శాస్త్రములు ప్రయోజనవంతమౌతున్నాయి. జ్ఞానులు ఈ విధంగా ప్రయత్నశీలురగు అజ్ఞానులకు తమ సహాయం అందజేస్తున్నారు. పూర్ణ జ్ఞానులు (అవతారపురుషులు) ఈ శరీరధారణను అంగీకరించుటలో ఉద్దేశము, ప్రయోజనము అదే అయి ఉంటోంది.

'హే భృగుమహర్షీ! ఇక్కడ మీరు ఒక చమత్కారం గమనిస్తున్నారా? తమకు ఎదురుగా శాస్త్రములు ఉండి ఉన్నప్పటికీ, అందలి 'ఉత్తమ విచారణ' యందు కొందరి బుద్ధి ఏమాత్రం ప్రవేశించుటలేదు. “ఈ శాస్త్రములు వివి. అవి మావి" అని మాత్రం అనుకుంటూ సాంసారిక దృష్టులనే అవలంబిస్తున్నారు. ఫలితంగా అట్టివారియందు అభేదదృష్టిగానీ, ఆత్మను గురించిన అవగాహన గానీ ఏ మాత్రం ఏర్పడుట లేదు. పాపదృష్టి నశించనంతకాలం అంతఃకరణము దోష భరితమై ఉంటుంది. పాపములు నశించినప్పుడే అంతఃకరణము శుద్ధమగుచున్నది. పరిశుభ్రమైన దర్పణంలో ప్రతిబింబము స్పష్టముగా కనబడుచున్నట్లు, సజ్జనుల యొక్క నిర్మల బుద్ధియందు మాత్రమే శాస్త్రసారము, ఉత్తమ అవగాహన ప్రవృత్తమౌతున్నాయి.

ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే అంధకారమంతా మటుమాయమౌతుంది చూచారా? సచ్ఛాస్త్రముల యొక్క విచారణచే మనస్సునందలి మోహమంతా నశించిపోగలదు. అనేకమంది జీవుల మనస్సులలో అజ్ఞానము గూడుకట్టుకుని కాపురం చేస్తోంది. వారు నిష్కారణంగా అవిచారణ, అజ్ఞానములను స్వీకరించి తద్వారా దుర్భర స్థితిగతులను ఆశ్రయించిన వారు అగుచున్నారు. కాల నియామకుడనగు నేను వారి వారి ఆశయము, ప్రయత్నములను

Page:58

అనుసరించి ఆయా ఉత్తరోత్తర స్థితులను, ఉపాధులను కలుగజేస్తున్నాను. ఇందు నన్ను దూషించి ఏం ప్రయోజనం? మనస్సులో మోహం నశించకపోతే, అట్టి జీవుడు అల్పవస్తువులకై ప్రయత్నాలు చేస్తాడు. ఫలితంగా అల్పవిషయాలే మరల మరల పొందుతూ ఉంటాడు. హృదయమును అజ్ఞానము కప్పివేస్తున్నంతకాలం "మోక్షసిద్ధి" అనే ఊసు ఉండజాలదు. దీనికి మరొకరిని ఎట్లా దూషిస్తారు చెప్పండి? ఆకాశమును మంచు కప్పివేసినప్పుడు ఆ ఆకాశము యొక్క రూపమే వేరు విధంగా కనబడటం జరుగుతుంది. అట్లాగే, మోహం అంతఃకరణమును కప్పివేసి విజృంభిస్తోంది.

88

అంతటికీ కారణం మనస్సే. ఈ మనస్సే భౌతికదేహంతో గొప్పస్నేహం చేస్తూ, ఆత్మయొక్క ఉనికి ఏమరుస్తోంది. నేనీ మాంసమయ దేహమును అనునట్టి దృఢభావనను మననం చేస్తోంది. ఫలితంగా అనేక సుఖదుఃఖములను అనుక్షణం పొందుతోంది. సుఖదుఃఖాలు కల్పించుకునేదీ, ఆ కల్పనను అనుభవించేదీ ఈ మనస్సే. అంతేకాని, సుఖ-దుఃఖములు అనుభవించేది జడరూపమగు ఈ మాంసమయ దేహం మాత్రం కాదు.

మనస్సుచే ఏది చేయబడితే అది నిర్వర్తించబడినది" అను శబ్దమునకు తగి ఉంటుంది. మనస్సుచేత నీ పుత్రుడు ఏది చెయ్యాలని భావన చేశాడో, భావనాపటిమచే అవన్నీ అట్లే శీఘ్రంగా పొందాడు. పొందుచున్నాడు. అతని ఒక భౌతిక దేహం ఇక్కడే మీ ఎదురుగా ఉన్నప్పటికీ అతడు మాత్రం తన మనస్సుచే అనేక యోనులందు ఆగమన నిష్క్రమణములు (రాక పోకలు) నిర్వహించాడు. ఆహాఁ! ఏమి విచిత్రం! వాసనాయుక్తమగు మనస్సు అనుసంధానమాత్రం చేత క్షణంలో చేసేది ఆ బ్రహ్మదేవుడు దీర్ఘకాలంగా ప్రయత్నించి కూడా ఆ జీవుని పట్ల నిర్వర్తించ

గలడా? లేడు.

ఈ సృష్టి - - లోకము, జనన-మరణాదుల గూర్చిన ఇచ్చ... ఇవన్నీ కూడా మనస్సు యొక్క స్ఫురణచేతనే కలుగుచున్నాయి. హే బ్రహ్మజ్ఞా! ఈ మనస్సు కొంచెము చలనము కలిగి ఉన్నప్పటికీ, అట్టి చలనము మహాదుఃఖ ప్రదమగుచున్నదనే విషయం కాలస్వరూపుడనగు నేను సాక్షీభూతుడనై గాంచుచున్నాను.

ఇక ఈ మనస్సు యొక్క విశేషాలు గొప్ప గొప్ప శబ్దజాలంతో రచించి చెప్పవలసిన పనేమున్నది? కనుక లేవండి. మనం మీ పుత్రుడున్న చోటికి వెళ్లాం. అంతా మీరే స్వయముగా

గమనించగలరు.

భృగుమహర్షి నా ప్రియపుత్రుడు శుక్రుడు అనేక ప్రదేశములలో సంచరించి, అలసిపోయి సమంగానదీ తీరం చేరాడు కదా!

కాలుడు : అవును. మీ పిల్లవాడు మనోశరీరంలో స్వర్గంలో అనేక భోగాలు అనుభవించాడు. అక్కడి నుండి, చంద్ర కిరణ సంబంధముచే ఓషధులలో ప్రవేశించాడు. ఓషధుల ద్వారా గర్భమున

Page:59

ప్రవేశించాడు. అనేక జన్మలైన తరువాత ఒక 'తాపసి అయినాడు. ఏమీ తెలియని అమాయకునివలె ఇప్పుడు సమంగా నదీ తీరంలో మౌనంగా తపస్సు చేస్తున్నాడు.

అనేకసార్లు 'ప్రాణవాయువు' అను చేతన శక్తి నుండి వినిర్ముక్తమైనాడు.

చంద్రుని సంపర్కముచే మంచుద్వారా ధాన్యాదులందు ప్రవేశించాడు. పురుషుని వీర్య రూపమును పొంది అనేక ఉపాధులను పొందాడు.

ఈ భగవత్ విరచితమైన 'నియతి’ని గాని, ఈ విచిత్ర మాయావ్యవహారములనుగాని ఆత్మజ్ఞానులగు మహాత్ములు మాత్రమే తాము తగుల్కొనకుండా, తేలియాడగలుగుచున్నారు.

“ఔను! ఈ దైవ విరచితమగు జన్మ-కర్మల వ్యవస్థ ఎంత విచిత్రమైనది! అని అనుకుంటూ భృగు మహర్షి తన ఆసనము నుండి లేచి, కాలదేవుని అనుసరించి వెళ్ళసాగాడు.

ఆనాటి సభ చాలించబడింది.

(ఎనిమిదవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:60

తొమ్మిదవ రోజు

9. గడిచిన జన్మల స్మరణ

వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇక మనం తొమ్మిదవ రోజు విచారణలో ప్రవేశిస్తున్నాం. నిన్నటి రోజు కాలుడు భృగుమహర్షికి చెప్పిన తత్త్వబోధ విన్నావు కదా! వినినదానిలోని విషయసారాన్ని చక్కగా విజ్ఞాన దృష్టితో మరల మరల పరిశీలిస్తూ ఉండాలి సుమా! ఇప్పుడు మనం ఆ తరువాతి విశేషాలను పరిశీలించబోతున్నాం. సావధానచిత్తుడవై విను.

ఆ కాలదేవుడు, భృగువు... ఇద్దరూ ఆశ్రమ ప్రదేశం నుంచి బయలుదేరారు. "దేవత -

అప్సరస-సిద్ధ-కిన్నర-జన ప్రదేశములను దాటుకుంటూ సమంగా నదీ తీరం చేరారు. అక్కడ గల ఒక ప్రదేశంలోని ఒక వృక్షం క్రింద శుక్రుని చూచారు. అయితే అతడు మరొక శరీరమును ధరించి ఉన్నాడు కదా! అందుచేత ఇతఃపూర్వపు స్థితికంటే విలక్షణమైన రూపం, భావము కలిగి యున్నాడు. అతని ఇంద్రియములన్నీ ప్రశాంతస్థితిని పొందియున్నాయి. మనస్సు సమాధిని అవధరించియుండుటచే తన చంచలత్వమంతా వీడియున్నది. పాపం, ఎంతో కాలంగా అనేక ఉపాధులలో ప్రవేశించటం - ప్రవర్తించటం - నివర్తించటం చేత కాబోలు, బాగా అలసిపోయి, ఇప్పటికి శాంతి కొరకై విశ్రాంతిని ఆశ్రయించుచున్నట్లున్నాడు. తాను చిరకాలం అనుభవించి ఇప్పటికి త్యజించివేసిన 'సంసారసాగరము' యొక్క గతిని గురించి విచారించుటచేత కాబోలు... అతడు మౌనంగా తీవ్రవైరాగ్యం ఆశ్రయించి యున్నాడు. అందుకు ఫలితంగా అనంతమగు ఈ జగత్తు యొక్క వ్యవహారమంతా గ్రహించాడు. కదలకుండా బిగించబడిన చక్రం ఎట్లాగైతే నిశ్చలంగా కనబడుతోందో... ఆ విధంగా అతడు నిశ్చలత్వం పొందియున్నాడు. 'ఏకాంతము'ను నిర్విషయత్వము'ను బైట, లోపల కూడా పొంది ఉంటున్నాడు. చిత్తము నశించి, భ్రమరహితుడై, ప్రశాంతంగా ఉండి ఉన్నాడు. చిత్తవృత్తులన్నీ అత్యంత సహజభావంతో నిరశించివేశాడు. నిర్వికల్ప సమాధి’ యందు ప్రవేశించాడు. అట్టి అనిర్వచనీయ నిశ్శబ్దస్థితియందు నిర్మలబుద్ధితో కూడుకున్నవాడై, ఈ జగత్తు యొక్క గతిని అంతా చూస్తూ నవ్వుకుంటున్నట్లుగా ఉన్నాడు. సర్వ లోక వృత్తాంతమంతా సుస్పష్టంగా గ్రహించిన వాడయ్యాడు. అతనియందు ఇక కర్తృత్వముగాని, భోక్తృత్వముగాని ఏమాత్రం శేషించిలేదు. సమస్త కల్పనా వ్యవహారములను 'ఆత్మాస్మి' అనబడు దానియందు లయం చేసివేసి, ఉత్తమమైన బ్రహ్మపదమును ఆశ్రయించి ఉన్నాడు.

వ్యాపకమగు ఆత్మయందు విశ్రమించుచున్నవాడై, విశ్రాంతిని పొందుచున్నాడు. ఒక నిర్మలమైన దర్పణంలో ఎదురుగా ఉండే దృశ్యం ప్రతిబింబిస్తుంది. అయితే, ఆ

ప్రతిబింబిస్తున్న వస్తువులు అటూ ఇటూ కదులుచున్నంత మాత్రం చేత ఆ అద్దం కదులుతుందా?

Page:61

లేదు కదా! ప్రతిబింబం గ్రహిస్తున్నపటికీ, ఆ దర్పణము యొక్క 'సుస్థిరత' అనే శోభకు వచ్చే లోటేమున్నది? ఇంద్రియాలకు తారసపడే విశేషలన్నీ కూడా అతని నిశ్చల మనస్సులో ఆ విధంగా ప్రతిబింబిస్తున్నాయి.

ఇప్పుడతనికి హేయమైనదంటూ (త్యజించవలసినదంటూ) ఏదీ లేదు. ఉపాదేయమైన దంటూ కూడా (స్వీకరించవలసినది, కోర తగినది) ఏమాత్రం ఏదీ లేదు. సంకల్ప-వికల్పములన్నీ వదలి, జ్ఞానయుక్తుడై, ధీరుడైయున్నాడు.

భగవానుడగు కాలుడు భృగుమహర్షిని కళ్లతోనే ఆప్యాయంగా సంబోధిస్తూ మరొక జన్మయొక్క అనుభవము నందు తన్మయుడైయున్న శుక్రాచార్యుని చూపాడు.

కాలుడు : ఓ భృగుమహర్షీ! 'వాసుదేవుడు' అనబడే ఈ మీ కుమారుణ్ణి చూచారా? ఇప్పటికి ప్రశాంతుడైనాడు. నిర్వికల్పసమాధిని పొందియున్నాడు. బ్రహ్మ ఋషిసత్తములైన మిమ్ములను సంతోషింపజేయుటయే మావంటి నియతి స్వభావులకు కర్తృత్వమైన విషయం కదా! అందుచేత ఇతనిని సమాధి నుండి మేల్కొలుపుటకు ప్రయత్నం చేస్తాను.

ఇట్లు పలికి, కాలుడు శుక్రాచార్యుని సమీపించాడు. "ఓయీ! ప్రియ శుక్రాచార్య! లెమ్ము” అని గంభీరస్వరంతో పలికాడు. ఆ శబ్దం వినగానే శుక్రుడు సమాధి నుండి మేల్కొన్నాడు. నెమ్మదిగా కనులు తెరిచాడు. సూర్యచంద్రులవలె ప్రకాశించుచున్న కాలభగవానుని, భృగువుని చూచాడు. తటాలున ఆసనము నుండి లేచి, "అయ్యలారా! శివ కేశవులవలె దర్శనమును ప్రసాదించిన మీ ఇద్దరికి సాష్ఠాంగదండప్రమాణం చేస్తున్నాను" అని వినమ్రతతో పలికాడు. వారికి స్వాగత సత్కారాలు ముగిసిన తరువాత ఆ ముగ్గురు ఒక శిలపై సుఖాసీనులయ్యారు. శుక్రాచార్యుడు : మహాత్ములారా! మీ ఇరువురిని చూచిన తరువాత నాకు అనిర్వచనీయమైన శాంతి లభిస్తోంది. ఇప్పుడు నేను పొందుచున్న ప్రశాంతతో కూడిన ఆనందమును మాటలలో వర్ణించలేకపోతున్నాను. ఏ మోహమైతే శాస్త్రజ్ఞానముచే గాని, తపస్సుచేగాని, ఆయా విద్యా సముపార్జనలచే గాని నశించదో అట్టి మాయామయత్వమంతా మీ ఇద్దరిని దర్శించినంత మాత్రంచేత తొలగిపోతుంది. నిర్మలమైన అమృతం వర్షించినప్పుడు కూడా మీవంటి మహాత్ముల దృష్టిప్రసరణ వలె సుఖము కలుగుతుందా?... లేదు. తమ పాదపద్మముల దర్శనంచే నన్ను పావనం చేస్తున్న అతి తేజో సంపన్నులగు మీరిద్దరు ఎవరు? నాపై కరుణతో తెలియజేయండి. భృగువు : నాయనా! ఇప్పుడు నీవు జ్ఞానివేగాని అజ్ఞానివి కావు. అందుచేత నిన్ను నీవే స్ఫురణకు తెచ్చుకొనుటకు ప్రయత్నించు. నీ ఉత్తమ తపస్సు యొక్క ప్రభావంచేత అంతా నీకే విదితం

కాగలదు.

అట్లు బోధింపబడినవాడై, శుక్రుడు ధ్యానినిష్ఠుడైనాడు. దివ్య దృష్టిచే రెండు గంటల వరకు తన వివిధ జన్మల దశలను స్మరించాడు. ఆశ్చర్యముతో కొంచెము హాస్యయుక్తమగు ముఖము

Page:62

కలవాడయ్యాడు. ప్రసన్నచిత్తము వీడకుండానే తనలో విషయమంతా తర్కించుకున్నాడు. అటు తరువాత ఇట్లు పలుకసాగాడు.

శుక్రాచార్యుడు : ఆహాఁ! పరమాత్మ యొక్క మాయాశక్తి నియతి ఎంతటి ప్రబలమైనది! దాని యొక్క ఆరంభము ఎక్కడో, ఎప్పుడో, ఎవ్వరైనా ఊహించగలరా? చెప్పగలరా? ఆ మాయాశక్తియే కర్మవ్యవస్థకు కూడా కారణభూతమగుచున్నది. అద్దానికి వశమై ఈ విశాలమగు 'జగత్తు' అను చక్రం పరిభ్రమించుచున్నది. ప్రళయకాల సమయంలో అగ్ని - వాయు- జల" సమ్మేళనం గొప్ప దుఃఖ మోహాలను జీవులకు తెచ్చిపెడతాయి చూచారా? అలాగే, నేను అనేక జన్మల అవసాన సమయాలలో మరణము-మోహము-మూర్ఛ యొక్క సమ్మేళనము పొందాను. రాజు గా జన్మించిన సందర్భాలలో ధనోపార్జన, వందిమాగధుల పొగడ్తలు, శత్రుదేశ ప్రజల వినాశనానికై ఎత్తుగడలు వేయటం వంటి ఏవేవో తుచ్ఛమైన భ్రమలన్నీ పొందాను. దేవతారూపము ధరించినప్పుడు సుమేరు పర్వత ప్రాంతంలో సంచరించుచు, అక్కడగల నదులలోని జలం పానం చేశాను. పర్వత శిఖరముపైగల మనోహర ప్రదేశములలో విహరించాను.

అయ్యలారా! ఏమని చెప్పమంటారు? నేను చూడని వస్తువు లేదు. చేయని క్రియ లేదు. ఆయా ఇష్ట అయిష్ట దశలందు ఒకే వస్తువును, వ్యక్తిని, అనుభవమును ప్రేమించటం, ద్వేషించటం కూడా చేశాను. అనేక జంతు - పక్షి జన్మలలో ఆహార - నివాస - మైథునముల కొరకు ఎంతగానో గావుకేకలు వేశాను. అమ్మయ్యా! ఇప్పటికి 'పరమాత్మ స్వరూప జ్ఞానము' పొందాను. ఎరుగ వలసినది ఎరిగాను. అట్టి పరమాత్మ స్వరూపమునే మననం చేస్తూ కాలం వెళ్ళబుచ్చుచున్నాను.

ఏది చూచిన తరువాతైతే ఇక చూడవలసినదంటూ ఏదీ శేషించదో... అట్టి ఆత్మ వస్తువును నాయందు, సర్వులయందు, సర్వమునందు ఒకే తీరుగా గాంచుచున్నాను.

ఈ సంసార వాసనావశంచేత ఎంతో కాలంగా సుదీర్ఘమైన భ్రమ విభ్రమ వృత్తాంతములను పొందాను. ఇప్పటికి విశ్రాంతి లభించింది. నా భ్రమంతా పూర్తిగా నశించుచున్నది. నాయందు భ్రమ శేషించి ఉన్నంతకాలం నేను ఇంద్రపదవి పొందినా లేక విష్ణుపదవి పొందినా ఈ నా మనస్సుకు విశ్రాంతి లభించదని గ్రహించాను.

ఎద్దానితో అయితే నాకు ఏమాత్రం సంబంధం లేదో, అట్టి అవాస్తవమైన వాటి యందు భ్రమ-విభ్రమములను ఆశ్రయించాను. స్వసత్తను మరచి... సత్యస్వరూపుడనగు నేను... అట్లు ఏవేవో భ్రమలలో సంచరించటమేమిటి? ఎంతటి విచిత్రము? ఎంత అర్థరహితము?

ఆ విధంగా నేను ఎందుకు అంత దీర్ఘకాలం పరిభ్రమించానో నాకే అర్థమగుటలేదు. అందుకే కాబోలు, “మాయ అనిర్వచనీయమైనది" అని పెద్దలు అంటూ ఉంటారు.

తండ్రీ! ఇక లేవండి. మందరపర్వతంపై శుష్కించియున్న 'శుక్రుడు' అను పేరుతో పిలువ బడుచున్న ఉపాధిని మనమిప్పుడు సమీపిద్దాం. ఇక ఇప్పుడు ఈ ప్రపంచమునందు నాకు

Page:63

పొందతగినట్టిదిగాని, త్యజించవలసినది గాని ఎక్కడా ఏదీ కనబడటం లేదు. కేవలం ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి రచనను, అందలి చమత్కారమును ఒక లీలావ్యవహారముగా గాంచుచూ, సాక్షీభూతుడనై ఉండుటయే నేను చేయదగినది. ఇక భావనలోగాని, సంచారములో గాని, వేరే సమయంలోగాని ఎక్కడా ఏదీ పొందవలసినది లేదు. ఆత్మ సామీప్యతను పొందిన తరువాత, ఇంకేముంటున్నది? ఉండదు. కానీ, ఏం లాభం? చంకనున్న బిడ్డను మరచి దూరంగా ఎక్కడో ఏదో ఏడుపు వినిపిస్తుంటే, అయ్యో! అక్కడ నా బిడ్డ ఏ బాధ చేత అట్లు రోదిస్తున్నాడో? అని పరుగులు తీసే వెర్రి తల్లిలాగా అయినది నా సంచారమంతా!

ఓ భగవత్స్వరూపులారా! ఇతరులను సముద్ధరించుటలో మీరిద్దరు బహుప్రావీణ్యులు. అందుకే నా మనస్సులోని మాట బైట పెట్టుచున్నాను. ఇప్పుడు నాకు ఒకే ఒక్క పని ఎదురుగా ఉన్నది..... పరమాత్మ గురించి దృఢనిశ్చయం కలిగి ఉండటం.

జీవన్ముక్తులగు మీవంటి మహనీయులచే సర్వదా సేవించబడుచున్న ఆత్మపదము’ను అనుసరించి, తద్వారా ఈ జన్మ-కర్మలను పవిత్రం చేసుకోవటం ఎప్పటికైనా ఉపాయం కదా! అట్టి శుభదాయకమగు ప్రయత్నమే సర్వకళంకములకు ఏకైక ఔషధం. పూజ్యులైనట్టి మీ యొక్క అభిప్రాయమును అనుసరించి నాకు ఇప్పటి నుండి 'శుక్రాచార్య ఉపాధి' యందే జీవనవృత్తి సంభవించు గాక! వాస్తవానికి నాకిప్పుడు ఆ దేహమందుగాని లేక ఈ దేహమందుగాని ఎట్టి అభినివేశము ఏర్పడుటలేదు. ఎట్టి ఆసక్తి-పట్టుదలలు నేను పొందుటలేదు. కేవలం ప్రారబ్ధకర్మను అనుసరించి, నాపట్ల శేషించియున్న సాంసారిక వ్యవహారమును నిర్వర్తించుటకే ఈ ఇతఃపూర్వపు ఉపాధిని ఆశ్రయిస్తున్నాను.

బాల్యంలో ఆటబొమ్మలు, ఇసుకతో నిర్మించబడిన పిచ్చుక గూళ్ళు గొప్ప గొప్ప విషయాలుగా కనిపించవచ్చు. కాని ప్రౌఢ వయస్సులో... అట్టి వాటిపట్ల ఆసక్తి ఉంటుందా?

ఉండదు కదా!

ఇప్పుడు నాకు 'అప్సరస' మొదలైన పదార్థములపట్ల ఆసక్తిగాని, రాగద్వేషములుగాని లేవు. వెలుతురు ప్రసరించేచోట చీకటికి స్థానమెక్కడిది? తత్త్వజ్ఞానదృష్టితో అభ్యసించబడేచోట ఇక 'సంసార వస్తువుల పట్ల ప్రియత్వము పెరుగుట' అనునది స్వయంగా నిరోధించబడుతుంది కదా!

అప్పుడా ముగ్గురు తత్త్వజ్ఞులు తమయొక్క భావన ఏకాగ్రతల ప్రభావంచేత సూక్ష్మ రూపమును దాల్చారు. ఆ క్షణంలో వారు ప్రాణవాయు సంచార మాత్రంచే ఏర్పడు క్రియా రూపముతో భాసించారు. ఈ జగత్తు యొక్క చిత్ర విచిత్ర గతుల గురించి సంభాషించుకుంటూ సమంగానదీ తీర ప్రదేశం నుంచి బయలుదేరారు. సిద్ధ మార్గం గుండా మందర పర్వతంపై భృగు మహర్షి ఆశ్రమం చేరారు. ఆ ప్రదేశంలో గల ఒక శిలపై శుక్రుడు తన శరీరం ఉండటం గమనించాడు. ఆ దేహము ఎంతో శుష్కించి, తడిసిన ఆకులతో కప్పబడి ఉన్నది.

Page:64

శుక్రాచార్యుడు : నాకు అత్యంత ప్రియులైన తండ్రీ! అనేక సుఖభోగములచే ఒకప్పుడు నేను ఎంతో ప్రేమగా చూచుకున్నది... ఈ రక్త మాంస-బొమికల సముదాయమునే కదా? ఈ శరీరము ఒక సమయంలో స్నేహభావముగల 'దాది' చే కర్పూర చందనములతో చాలా కాలం లాలించ బడింది. ఇక్కడ గల కొన్ని ప్రదేశాలలో పూతీగలతోను, పూలతోను ఊయలలు తయారుచేసుకొని, ఆ ఊయలలో పవళించి పిల్లగాలులు ఆస్వాదిస్తూ ఉండేది. వివిధ స్త్రీ-పురుషులచే వివిధ రీతులుగా చూడబడిన ఈ శరీరం ఇప్పుడు పాము లేళ్ళచే ఛిద్రం గావించబడి, నేలపై మూగగా, మౌనంగా నిద్రిస్తోంది. అనేక సుగంధములను ఆస్వాదించి, అనుభవించిన దీనికి ఎట్టి గతి పట్టింది? ఆ శోభలన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఇది శుష్కించి మృతప్రాయమై మిగిలి ఉన్నదే! ఒకప్పుడు దేవకాంత పట్ల 'భోగేచ్ఛ' ను కలిగించిన ఈ శరీరం ఇప్పుడు శవావతారం ధరించి, పడి ఉన్నది! ఇప్పటి ఈ దేహము యొక్క నోరు ఒక బిలంలాగా ఉన్నది. సూర్యతాపంచే చర్మం కరడు కట్టి ఉన్నది. ఈ ఎండిన దేహం చూచి వనములోని మృగములు కూడా భయపడి దూరంగా నిలబడి చూస్తున్నాయి గమనించారా? వివేకము కలిగియున్న జీవుని దేహము, వాక్యము ఒక వర్చస్సు కలిగి ఉంటాయి చూచారా! అలాగే ఈ నా పొట్టభాగము సూర్యకిరణములు పడుచు న్నప్పుడు మిలమిల మెరుస్తోంది. శుష్కించిన నా భౌతిక దేహం ధరించియున్న ఈ గండశిల కూడా తుచ్ఛమైన కురూపత్వమునే ప్రదర్శిస్తున్నట్లుగా ఉన్నది. ఎండిన దేహము కలిగియున్న ఈ పర్వత శిఖరం మూగగా మౌనంగా మానవాళిని సంబోధిస్తూ ఏదో ప్రకటన చేస్తున్నట్లున్నది. ఈ దేహం పెద్ద గొంతుకతో "ఓ జనులారా! మీమీ తుచ్ఛ భౌతిక శరీరములు చూచుకుంటూ, ‘ఆహాఁ! మేమెంత అందంగా ఉన్నామో!' అని భ్రమిస్తూ మురిసి పోతున్నారా? నన్ను చూడండి. మీ మీ శరీరములన్నీ కూడా నావంటివే కదా! స్వల్పకాలంలో ఎండి దుర్భరమైన అవతారం పొంద బోతున్నాయి... అని గుర్తు చేస్తున్నట్లున్నది. శరీరము కలిగియున్నందుకు ఉత్తమ వివేకమునకై ప్రయత్నించకుండా కంచరగాడిదలవలె కాలయాపన చేస్తున్నందుకు ఈ జీవునిపై జాలితో తాను క్రుంగుచున్నట్లున్నది.

ఓ నా పాంచభౌతిక శరీరమా! నేను నీయందు కొంతకాలంగా ఉండకపోవుటచే నీవు

శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు లేనిదానివయ్యావు. నీయందు ఎట్టి లోభము లేకపోవుటచే నిశ్చింతగా నిర్వికల్పసమాధిని అవలంబించి తీవ్రతపస్సు చేస్తున్నట్లుగా కనబడుచున్నావు. మహాత్ములారా! చిత్తము' అనే పిశాచం నుండి ముక్తి పొందియుండుటచే ఈ దేహం నిశ్చయంగా సుఖంగా కాలయాపన చేస్తోంది. "అయ్యో! దైవవశాత్తు ఎప్పుడు ఏ విపత్తులు వచ్చి పడ బోతున్నాయో? అని ఈ జీవుడు సర్వదా అనుభవిస్తూ ఉండే తెలియరాని భయం ఈ దేహానికి లేదు. ‘చిత్తము’ అనే బేతాళుడు శమించుటచే ఇది 'ఆనందకళ'ను అనుభవిస్తోంది. ఇట్టి ఆనందకళ విశ్వవ్యాపకమైన సామ్రాజ్యం ఏలే చక్రవర్తికి మాత్రం చేకూరబోతోందా? లేనేలేదు. ఈ దేహము యొక్క సంశయాలన్నీ నశించాయి. ఓ మహాజ్ఞానులగు సద్గురువులారా! ఈ దేహమును చూస్తున్నారు కదా! ఇది ఎట్టి కౌతుకము లేకుండా, సర్వ కల్పనాజాలములను రహితం చేసుకొని, ఈ వనమందు ఎంత ప్రశాంతంగా చక్కగా పవళించి ఉన్నదో కదా!

Page:65

చిత్త చాంచల్యము - అనేక కామ క్రోధ మోహములచే చాపల్యము పొంది అత్యంత సంక్షుభితమై ఉన్న చిత్తము' అనే కోతి 'శరీరము' అనే వృక్షంలో విచ్చలవిడిగా సంచరిస్తోంది. ఇక ఈ జీవుడికి శాంతి ఎక్కడిది? అట్టి చిత్తము ఇతనిని అనంతసంఖ్యలో స్థావర జంగమ యోనులలో పడవేస్తోంది కదా! అయితే ఈ శుక్రాచార్యదేహం మాత్రం చిత్తము చేసే పిచ్చిపనుల నుండి తప్పించుకొని ఇక్కడ విశ్రమిస్తోంది. దూరంగా జరుగుచున్న సింహము-ఏనుగుల గుంపుల యూ దీనిని భయపెట్టుట లేదు. యువతుల చర్మసౌందర్యం గాని, ధన దాహాదులు గాని, స్వలాభాదులు గాని, స్వాధిక్యతలు గాని ఈ దేహం మననం చేయటం లేదు. అందుచేతనే దుఃఖ రహితంగాను, బ్రహ్మానందము నందు మునిగి తేలుచున్నట్లుగానూ నాకు కనిపిస్తోంది. సమస్త ఆశలకు, హృదయ పరివేదనలకు, జ్వరములకు హేతువు కేవలం అజ్ఞానమే కదా! అట్టి అజ్ఞానాంధకారం పటా పంచలు కావాలంటే 'మనోరహితత్త్వము' అనే చేతి దీపం చక్కగా వెలుగుతూ ఉండాలి. సర్వ సాధనల యొక్క పవిత్ర లక్ష్యం మనోరాహిత్యమేనని జ్ఞానులు అంటూ ఉంటారు. అట్టి అమనస్కం తప్ప, ఈ జీవులకు నిజమైన శ్రేయస్సు కలుగజేసేది ఈ జగత్తులో ఇంకేమున్నది? "గొప్ప తపస్సుల యొక్క అంతిమ ఫలితమా? అన్నట్లుగా ఈ దేహం గొప్ప అమనస్కం అనుభవిస్తోంది.

అయ్యలారా! మనోరాహిత్యము సంపాదించినట్టి గొప్ప బుద్ధిమంతులు సుఖము యొక్క పరాకాష్ఠను దర్శించుచూ ఉంటారు. సౌభాగ్యవశంచేత కాబోలు... ఈ దేహము ఏ దుఃఖమూ, సంతోషమూ లేకుండా మనస్సును వదిలించుకొని శాంతంగా ఉన్నది.

10. జ్ఞానులు - దేహములు

శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ! ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది. ఆ శుక్రాచార్యుడు అంతకుముందే ఎన్నో దేహములను మరల మరల అనుభవించివుంటాడు కదా! మరి ఆయనకి ఈ భృగుమహర్షి కుమారుని దేహం మీద అంతటి స్నేహభావం ఎందుకు ఉన్నది? అతడు చెప్పే మాటలుబట్టి, ఆ దేహమును అతడు కొంత అవిచారణ పూర్వకంగా... మమకారయుక్తంగా చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అతడు దేహం కొరకు ఎందుకు విలపిస్తున్నాడు? అతడు జ్ఞాని కదా! జ్ఞానులు కూడా దేహాదులకు సంబంధించిన సుఖ-దుఃఖాలు అనుభవిస్తారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకు సమాధానమును చాలా కోణముల నుండి పరిశీలించవలసి ఉంటుంది.

ఈ శుక్రాచార్యుని చైతన్యము ఇతఃపూర్వపు కల్పమునందే తన యొక్క స్వయం ప్రయత్నముల బలంచేత ఒక మహర్షియొక్క కుమారుడు అవటానికి, ఆశ్రమజీవనం, యోగదీక్ష మొదలైనవి పొందటానికి అర్హత సంపాదించుకొన్నది. ఈ జీవుల సమాగమాలన్నీ సంస్కారములు -ఋణములు-యోగ్యతలను అనుసరించి ఉంటూ ఉంటాయి. ఇతఃపూర్వపు కల్పము ముగిసి

Page:66

నప్పుడు, అనగా అప్పటి ప్రళయము నందు ఈ శుక్రునకు సంబంధించిన దేహాకార కల్పన సంస్కార రూపమున శేషించియున్నది. అట్టి సంస్కారశేషము ఈ కల్పము యొక్క ఆరంభము నందు ప్రథమ శరీర భావము (The beginning identity of'SELF' with the 'BODY)చే భూతకోటితో సమత్వము పొందింది. అట్టి "దేహాకార - భావరూప చైతన్యము ప్రాణక్రియా విశేషమును ఆశ్రయించింది. ఆ క్రియా విశేష ప్రభావంచేత 'సంస్కార శేషము', ఆ సంస్కార శేషం అన్నమును గ్రహించునట్టి అపాన వాయువునందు ప్రవేశించింది. అపానవాయు ప్రవాహం ద్వారా భావత్వముగా ఘనీభవించింది. 'హృదయము' అనబడుదానియందు ప్రవేశించి, క్రమంగా వీర్య దశను పొంది, తల్లి గర్భంలో శుక్రాచార్యుని దేహంగా రూపుదిద్దుకున్నది. అతనికి తండ్రియగు భృగువుచే బ్రాహ్మణోచితమగు ఉపనయనము, ధ్యాననిష్ఠ మొదలగు సంస్కారములు నిర్వర్తించ బడ్డాయి. ఆ దేహమే అక్కడ ఇప్పుడు శుష్కించి పడియున్నది.

ఈ కల్పము యొక్క మొట్ట మొదటయే (లేక ప్రథమ కల్పము నందే) మాయచే స్వయముగా 'చితస్ఫురణ' నుండి ఈ 'శుక్ర శరీర సంభావన' కలిగింది కదా! అందుచేత అతనికి శుక్రదేహము నందు అధికమైన ప్రీతి-స్నేహం కలిగి ఉండటం, దాని కొరకు అతడు విలపించడం జరుగుతోంది.

మరొక విషయం. ఈ జీవుడు కొన్నిటిపట్ల ఇచ్ఛ-భావనలను కలిగియుండటం, మరికొన్నిటి పట్ల విముఖత-తాత్సారం కలిగియుండటం చేస్తూ ఉంటాడు. చిత్ స్వభావమగు ఈ జీవుడు స్వీయకల్పనాచాతుర్యమును అనుసరించే కొన్నిటిపట్ల రాగదృష్టి ఏర్పడి ఉంటోంది. అట్టి జీవుల యొక్క ఇష్టాయిష్టములను అనుసరించే బ్రహ్మదేవుడు ఈ సృష్టిరచన అంతా సాగిస్తున్నాడు. సమంగానదీ తీరంలో ఒక ముని కుమారుడుగా తపస్సు చేస్తున్న శుక్రుని చిత్-చైతన్యము మాత్రం “నాకు ఏ దేహము పట్ల రాగాదులతో పనిలేదు. నేను ఇచ్చా-క్రోధ రహితుడను. నిర్లిప్తుడను అని భావిస్తూ ఉన్నది. అయితే ఆ చైతన్యము యొక్క అంతరాంతరాలలో, నేను భృగుమహర్షి యొక్క కుమారుడను. నా తండ్రి నిర్వికల్ప సమాధియందుండగా, నేను ఆయనను సేవించుచున్నాను” అను రూపముగల భావన శేషించియే యున్నది. అందుకే శుక్రాచార్యదేహమును అతనికి గుర్తు చేసినప్పుడు, అద్దానిని అతడు చూచి కొంత విలపించటం జరుగుతోంది. దేహముపై దృష్టి కలిగి యుండటమనేది దేహియొక్క స్వభావం అయివున్నది. ఒకడు జ్ఞాని కావచ్చు. అజ్ఞాని కావచ్చు. ఈ దేహము ఉన్నంతవరకు సదా అతని లోకవ్యవహారం ఈ రూపంలోనే ఉంటూ ఉంటుంది.

వాస్తవానికి, సమంగా నదీతీరంలో ఉన్నట్టి తపస్వి దేహము... శుక్రాచార్య దేహము... ఈ రెండింటి యొక్క భేదము కేవలం ఆసక్తి - అనాసక్తి'ల భేదం మాత్రమే.

జ్ఞానులు, అజ్ఞానులు: వారి వారి లోకవ్యవహారములు -

శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఈ జగత్తు యొక్క గతిని ఎరిగిన 'జ్ఞానులు', పశుధర్మము మాత్రమే కలిగి వర్తించుచుండే 'అజ్ఞానులు'... ఈ ఇద్దరూ కూడా ప్రవృత్తి విషయంలో లోకవ్యవహారములలో సమానంగానే ఉంటూ ఉంటారు. జ్ఞాని కూడా అజ్ఞానిలాగానే

Page:67

ప్రవృత్తి-నివృత్తి ధర్మం కలిగి ఉంటాడు. ఇక వారిద్దరిలో భేదమేమిటంటావా?... జ్ఞానియందు వాసనలు సన్నగిల్లి ఉంటాయి. వాసనయొక్క ఉనికి-లేములే బంధ మోక్షములకు కారణ మౌతోంది. అంతేగాని, శరీర ప్రాప్తాప్రాప్తములను బట్టి బంధమోక్షములు ఉండవు.

ఆసక్తి అనునది ఏమాత్రం లేనట్టి గొప్ప బుద్ధి-ధీరత్వముగల మహాత్ములు కూడా ఈ దేహం ఉన్నంతవరకు తదితరులవలెనే దుఃఖ - సమయములందు దుఃఖమును, సుఖ సమయము లందు సుఖమును పొందుచున్నట్లు కనిపిస్తూ ఉంటారు. జలంలో కనిపించే సూర్య ప్రతిబింబము జలకదలికలను అనుసరించి తానే కదులుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కాని ఆకాశంలోని వాస్తవ సూర్యుడు ఈ జలతరంగాలతో సంబంధమే లేకుండా, కదలికలు పొందకుండా ఉండియే ఉంటున్నాడు కదా! జలము యొక్క క్షుభితత్వము (Perturbance) ప్రతిబింబ సూర్యుని కదలుచున్నట్లు చూపుచుండవచ్చు. కాని, ఆ విచలత్వము ఆకాశ సూర్యుని స్పర్శించగలదా? లేదు. అదేవిధంగా జ్ఞాని కూడా బాహ్యవృత్తిచే లోక వ్యవహారములందు పాల్గొనుచూ ఉంటాడు. తదితరులవలెనే ఆయా స్పందనలు కలిగియే ఉండవచ్చు.... అయితే, అంతరంగమున మాత్రం, నేను నిత్యుడను. సర్వమునకు సాక్షిస్వరూపుడను. సర్వదా అచలుడను. ఈ శరీరాదులు, భావాదులు నన్ను బంధించలేవు. స్పృశించలేవు" అను ఎరుక కలిగి ఉంటాడు.

యథార్థ సూర్యుడు స్వస్థుడుగా ఉంటున్నప్పటికీ, జలంలో ప్రతిబింబించే సూర్యుడు అస్తవ్యస్థుడుగా, చంచలుడుగా కనిపిస్తాడు కదా!

జ్ఞాని వాస్తవానికి లోకవ్యవహారములన్నీ విమర్శ - అవగాహన సహాయంతో ఎప్పుడో త్యజించి వేసి ఉంటాడు. అయినప్పటికీ, బాహ్యమునకు మాత్రం తదితరులవలెనే ప్రపంచ వ్యవహారములందు నిమగ్నుడై ఉంటున్నట్లు ఇతరుల దృష్టికి కనిపిస్తాడు.

ఒకడు జ్ఞానేంద్రియముల దృష్ట్యా ఎట్టి ఆసక్తి ఏ మాత్రం కలిగియుండకుండా, కేవలం కర్మేంద్రియములచే ఆయా ప్రవాహపతితమైన కార్యములు నిర్వర్తిస్తున్నాడనుకో... అప్పుడు ఆసక్తి రహితుడగు అట్టివానిని ముక్తుడు అని అంటున్నాం. అట్లా కాకుండా, ఒకరి జ్ఞానేంద్రియములు ఆసక్తితో నిండి ఉంటాయనుకో... అప్పుడు కర్మేంద్రియములు కర్మలయందు పాల్గొనక పోయినప్పటికీ, అతడు బద్ధుడు' అనియే చెప్పబడుచున్నాడు. జ్ఞాన దృష్టితో ఈ విభాగం గ్రహించటం చాలా అవసరం. ప్రకాశం కలిగించటానికి కారణం అగ్నియే కదా! అట్లాగే ఈ ప్రపంచంలో 'సుఖ-దుఃఖ-బంధ-మోక్షములు' కలుగజేయటానికి కారణం జ్ఞానేంద్రియములే కాని, కర్మేంద్రియములు కానేకావు... అని కూడా గ్రహించు.

అందుచేత రామా! నీవు బాహ్యమునకు ఎప్పుడు ఎక్కడ ఏది ఎట్లా" ఉచితమో అది అట్లే నిర్వర్తిస్తూ ఉండు. కర్మలను త్యజించటం కంటే, నీకు నియమించబడిన ఆయా కర్మలను నిర్వర్తించటమే ఉచితం. ఎందుకంటే తదితరుల వ్యవహారసరళి నీ ప్రయత్నములపై కార్యక్రమములపై ఆధారపడి ఉంటూ ఉంటుంది కదా! ఇక, అంతరంగమున మాత్రం వ్యవహార

Page:68

రహితుడవై ఉండు. అనగా కూటస్థమగు ఆత్మయందు, నేను ఈ శరీర-మనో-బుద్ధి -అహంకారా లను కాదు. వీటన్నిటికి పరమై ఉంటున్న జ్ఞాన-చైతన్య స్వరూపమగు ఆత్మయే నేను. అన్నిటా, అంతా అయి ఉంటున్నది నేనే. అట్టి ఆత్మ స్వరూపము అవధరించి ఉంటూనే ఈ శరీరమున ప్రవర్తనశీలత్వము ప్రకటిస్తూ ఉంటున్నాను. అను అవగాహనతో దృఢభావన కలిగి ఉండు. సర్వ వైషమ్యములు, సర్వకోరికలు, త్యజించివేసి నిశ్చింతుడవై ఉండు. అభిలాష-ఆసక్తి-ప్రియాప్రియ సంకల్ప పరంపరలు... వీటన్నిటినీ విడనాడివేసి, ఆత్మచే ఆత్మయందే స్థితి కలిగి ఉండు. ఇక ఆపై వర్తమాన కర్తవ్యములగు ఆయా కర్మలను ఎట్టి ఫలాసక్తి లేకుండా నిర్వర్తిస్తూ ఉండు. దేహం ఉన్నంతవరకూ ఏవేవి కర్తవ్యములో అట్టి కర్మలు నిర్వర్తించటం నిశ్చయంగా దేహ స్వభావమే అయి ఉన్నది. దేహమున్నంతవరకు దేహస్వభావమును ఎవరు త్యజించగలరు చెప్పు? అట్లు త్యజించాలి' అనే పట్టుదలను, త్యజించలేకపోయానే అనే నైరాశ్యాన్ని కూడా అధిగమించివేయి.

ఆధి వ్యాధి - ఓ రాఘవా! ఈ 'సంసారము' అనే సాగరంలో 'ఆధి-వ్యాధి' (మానసిక- శారీరక రుగ్మతలు) అనే విశాల కెరటాలు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నాయి. అయితే వివేకులైన వారు ఈ సంసార మార్గంలో పడుటలేదు. ఈ మార్గము మమత్వము అనే అంధకార కూపము లోనికి తీసుకునిపోయి దుఃఖము-నిరుత్సాహము-భ్రమ అనే ఉప్పునీటిలో ముంచి తేల్చగలదని వారు అల్లంత దూరం నుంచే గమనిస్తున్నారు. నీవు కూడా వివేకివై ఉండు. అంతేగాని నేనుమేము-నాది-మాది అనే జాడ్యాన్ని ఆశ్రయించకు. 'యథార్థదృష్టి’తో గమనిస్తే నీవు ఈ దేహాదుల ధర్మమునందు లేవు. ఇవేవీ కూడా నీవు కావు. ఇవి నీకు సంబంధించినవి కావు. సదా, సర్వదా, సర్వత్రా వెలుగొందుచున్నట్టి నిత్య శుద్ధ బుద్ధ స్వభావముగల ఆత్మయే నీవు. కాబట్టి “అంతర్వృత్తి” యొక్క ప్రభచే అట్టి ఆత్మయొక్క విలక్షణత్వమునందే సుస్థిరుడవై ఉండు.

నిర్మలము, శుద్ధము, సర్వాత్మకము, సర్వకర్త అయినట్టి బ్రహ్మమే నీవు సుమా!

ఇదే అర్థమును తత్త్వము (తత్+త్వమ్) అను మహాపదముచే వేదోపనిషత్తులు ప్రపంచమునకు చాటి చెప్పుచున్నాయి.

సర్వ ప్రశాంతుడను, జన్మ-మృత్యు రహితుడను, విశ్వస్వరూపుడను అగు పరమాత్మను నేనే అయి ఉన్నాను అను భావన అలవర్చుకోవటం అభ్యాసం చేత తప్పక సుసాధ్యమే.

సర్వ అభిలాషలను విస్తరింపజేసేది, అవిద్యాదోషరహితమూ అయినట్టి నిర్మలమగు ఆత్మపధము”ను అవధరించు. 'మమత్వము' (నాకు చెందినవి, నాకు సంబంధించినవి) అను ఘోరాంధకారమును “జ్ఞానదృష్టి" అనే దీపపు వెలుగు సహాయం చేత పారద్రోలి వేయి.

చిత్తమును నశింపజేయుటయందు సమర్థుడవై ఉండు. చిత్తము జయించబడిందా, మరు క్షణం అనంతబుద్ధియుక్తము, పరమార్థస్వరూపము అగు బ్రహ్మము నీకంటే వేరైనది కాదని నీవే గ్రహించగలవు.

ఇక ఆపై 'జీవుడు అనబడే అప్రతిష్ఠ నీయందు ఆపాదించబడజాలదు. ఎందుకంటే, అజ్ఞానము' తప్ప, జీవుడు అనబడేవాడు వేరుగా ఎక్కడా లేడు.

Page:69

ఎప్పుడైతే నిన్ను నీవు సర్వాత్మకమగు నిష్కళంక పరబ్రహ్మముగా దర్శించుచూ ఉంటావో, అప్పుడు అట్టి జ్ఞానయోగమును ప్రదర్శించుచున్న నీకు ఋషులమగు మేము కూడా నమస్కరిస్తూ

ఉంటాము.

అట్టి పరబ్రహ్మస్వరూపుడవగు నీవు ఈ జగత్తుకు వందనీయుడవగుచున్నావు.

11. శుక్రుని పునరుజ్జీవనము

ఓ రామచంద్రా! ఇక మనం ప్రస్తుత కథావ్యవహారానికి వద్దాం.

ఆ విధంగా శుక్రాచార్యుడు తన ఇతఃపూర్వపు దేహమును చూచి కొంత వేదన పొందాడు కదా! ఆ ప్రక్కనే ఉన్న కాలభగవానుడు శుక్రుని విలాపమంతా విన్నాడు. అతనికి శుక్రుని వాక్యము లలో కొంత అయోగ్యత కనిపించింది. సుజ్ఞానయుతులగువారు, ఆశ్రితులయందలి అజ్ఞానము తొలగించుటయే కర్తవ్యముగా కలిగియుంటారు కదా! అందుచేత ఆ కాలుడు మేఘ- గంభీర స్వరముతో ఇట్లు పలుకసాగాడు.

కాలుడు : ఓ శుక్రుడా! తెలుసుకొనవలసినదంతా తెలుసుకొనినవాడా, ఈ శరీరమును చూచి ఇట్లు పరవశుడగుచున్నావేమిటి? అజ్ఞానముచే జనించుచున్న సర్వవేదనలను నిశ్చింతగా త్యజించివేయి. ఒక రాజు ఒక నగరం త్యజించి మరొక నగరం ప్రవేశిస్తాడు చూచావా? ఆ రీతిగా, నీవు ఈ తాపసుని శరీరం త్యజించు. భృగువు కుమారునిగా ప్రసిద్ధికెక్కిన ఈ శుక్రదేహమున ప్రవేశించు. నాయనా! ఈ సృష్టినంతటినీ పరిపాలించున్నట్టి 'నియతి'ని అనుసరించి నీవు ముందుముందు అనేక కార్యక్రమములు నిర్వర్తించవలసియున్నది.

ప్రారబ్ధము' యొక్క ఉద్బోధను అనుసరించి ఈ శరీరముతో కూడి, ముందుగా గొప్ప తపస్సు ఆచరిస్తావు. ఆ తరువాత దైత్యులకు కులగురుత్వము నిర్వర్తిస్తావు.

మహాకల్పాంతమువరకు రాక్షసులకు గురువుగా స్వధర్మము నిర్వర్తిస్తూ ఉంటావు. ఆ

తరువాత దేహత్వము’ అనబడుదానిని త్యజించివేసి విదేహముక్తుడవు అవుతావు. ఈ శరీరమును ఆ సమయంలో స్వయముగా ఎండిన పూలమాలను త్యజించినట్లు, త్యజించివేయగలవు. ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితమైన ఈ దేహముతో బలి, హిరణ్యకశిపుడు మొదలైన గొప్ప రాక్షసరాజులకు గురుత్వము వహించి తద్వారా లోకములకు పూజనీయుడవు అవుతావు.

ఓ భృగు-శుక్రాచార్యులారా! మీ ఇద్దరికి శుభమగు గాక! ఇప్పుడు నేను నా అభిమతమై యున్నట్టి ఆత్మస్థానమునకు పోవుచున్నాను. అట్టి స్వయం నివృత్తి స్వరూపమగు 'ఆత్మస్థితి’యే పరమ ప్రేమ స్వరూపము కదా!

భృగుమహర్షి : పరమేశ్వరా! కాలదేవా! ఈ రోజు మాకు సుదినం. సుహృద్భావ ప్రసంగముచే మీరు అనేక విషయములు విశదపరచారు. మీకు మేమిద్దరం కృతజ్ఞులం. చిత్తముచే

Page:70

పరిమితత్వము పొందుచున్న మేము మాయచే ప్రభావితులమై, సంసారదృష్టి కలిగియుండటం, మిమ్ములను దూషించబోవటం చేసినందుకు క్షమించ ప్రార్థిస్తున్నాను. కాలుడు : చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్పుచున్నాను. వినండిపరమాత్మయందు ఇది అభిమతము”, “ఇది అభిమతము కాదు అను రూపము గల ఒక వికల్పము ఏర్పడుచున్నది. అప్పుడు అభిమతమగుచున్నదానిని గ్రహించటం, అభిమతం కాని దానిని త్యజించటం ఆ పరమాత్మయే స్వయముగా నిర్వర్తిస్తున్నాడు. అట్టి నిర్వహణయే చిత్తము యొక్క రూపము సుమా! అట్టి ప్రియము అనబడు చిత్తత్వమును ఆత్మయందు లయింపజేసి అఖండభావన యందు నిశ్చలత్వము వహించి ఉండువారు ధన్యులు. అందుచేత గురువులు ఆ చిత్త చికిత్సను దృష్టిలో పెట్టుకొని బోధిస్తూ ఉంటారు. మీరు కూడా లోకశుభం కొరకు గురువులై ప్రకాశించెదరు గాక! మీకు సర్వదా శుభమగుగాక!

కాలదేవుడు ఇట్లు పలుకుచుండగా వారిరువురు కాలదేవునితో ఏర్పడిన స్నేహాధిక్యతచేత కంటతడి పెట్టారు. భూమ్యాకాశములు రక్తవర్ణంలో తప్తమై ఉంటూ ఉండగానే సూర్యుడు తన కిరణజాలములతో సహా అస్తమిస్తాడు చూచావా? సముద్రంలో పెద్ద కెరటం లేచి, చూస్తూ ఉండగానే జలంలో లయించుతుంది చూచావా! అదేవిధంగా ఆ కాలభగవానుడు అంతర్ధాన మైనాడు. అప్పుడు శుక్రుడు కించిత్ ఆశ్చర్యపడుతూ, కాలదేవునికి చేతులతోను, హృదయము తోను, కళ్ళతోను నమస్కారం పూర్తి చేసి శుక్రదేహము ఉన్నవైపు తలత్రిప్పాడు. ఆవశ్యం ఆచరించ వలసియున్న భావికర్మలగతిని, 'ఈశ్వరేచ్ఛ' యొక్క అనివార్యత్వమును గమనించి కొన్ని క్షణాలు యోచన గడిపాడు. తాను తపోధ్యానాదులచే సంపాదించియున్న యోగబలం చేత 'వేదన' అను దానిని పూర్తిగా త్యజించి, చిరునవ్వుతో చుట్టూ కలియజూచాడు. తండ్రియొక్క అనుజ్ఞను ఆశీర్వాదమును స్వీకరించి ఒక చోట స్థిరాసనం స్వీకరించాడు.

'వాసుదేవుడు' అనే పేరుతో పిలువబడే 'సమంగానదీతీర తాపసి'కి సంబంధించిన మననము అధిగమించాడు. మెల్లగా కనులు మూసుకొని యోగ సమాధులను అవధరించాడు. వాసుదేవ శరీరం చైతన్యముచే త్యజించబడుటచే నీలవర్ణము పొందింది. క్షణాలలో నిర్జీవమై నేలకూలింది. వనంలో వసంత ఋతువు ప్రవేశించునట్లు శుక్రుని చైతన్యసత్త శుక్రదేహములో ప్రవేశించింది.

తన పుత్రుడు శుక్ర-దేహంలో జీవుడు ప్రవేశించగానే మహామునియగు భృగువు తన కమండలములోని జలమును మంత్రసహితంగా ఆ శరీరముపై సంప్రోక్షం చేశాడు. మరుక్షణం ఆ దేహం వికాసం పొందనారంభించింది. వెంట్రుకలు, గోళ్ళ క్రమంగా చైతన్యవంతం కాసాగాయి. ప్రాణవాయువు శరీరమంతా ప్రవహించసాగింది. జల-వాయుసంయోగంచే సముద్రం పొంగినట్లు శుక్రాచార్యుడు లేచి నిలబడ్డాడు. ఉల్లాసము పొందినవాడై నామ-గోత్ర -కీర్తన పూర్వకంగా పరమపవిత్రుడగు తన జనకునికి సాష్టాంగ నమస్కారము చేశాడు.

Page:71

ఇతఃపూర్వంలాగానే సౌందర్యం' 'అలంకారము'లతో శోభిస్తున్న తన కుమారుని శరీరమును భృగువు ప్రేమగా చూచి, స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. మరల ఒక్కసారి పుత్రుని చూచి జ్ఞానయోగ దృష్టిచే, తన అంతరంగంలో, ఆహాఁ! ఇదే కదా, 'నాకు చెందిన దేహము' అను భావనచే భ్రమలో పడ్డాను! అనుకున్నాడు. తత్త్వదృష్టిచే ఈ భావన ఉచితం కాదని అతనికి తెలిసియుండుటచే అతని పెదవులు చిరునవ్వు వీడలేదు.

శ్రీరాముడు : "ఇతడు నా పుత్రుడు" అను స్నేహపూర్వకభావం భృగుని చిత్తము కొంచెము ఆక్రమించుకునే ఉన్నదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును మరి. శరీరం ఉన్నంత వరకు ప్రారబ్ధవేగము చేత ఆ శరీరం పట్ల మమత్వము ఉదయిస్తూనే ఉంటుంది. ఇది దేహధర్మమే అయి వున్నది. అయితే, జ్ఞానులు అన్ని పరిస్థితులలోనూ సమగ్రమైన అవగాహనను ఏమాత్రం వదలరు. అందుచేత 'మమత్వము' అను దాని యందు తాదాత్మ్యము చెందరు. అనగా, 'నేను ఆత్మయే స్వరూపముగా కలవాడను. ఇదంతా ఆత్మ యొక్క విన్యాసమే...! అను రూపంలో ఉండే ఆత్మతోటి అనుసంధానము కోల్పోరు. ఇక అజ్ఞానులలో, ఈ సంబంధములే సత్యములని, సర్వస్వమని భావించి వీటితో స్నేహ-ద్వేష భావములను మరల మరల పొందుచూ ఉంటారు. ఫలితం? ఆత్మస్థితికి అత్యంత దూరంలో విన్యాసాలు చేస్తూ, కుంటికులాసాలు ఉంటారు.

ఇప్పుడు ఆ తండ్రీ - కొడుకులిద్దరు ఒకరి వలన మరొకరు శోభను పొందారు. చిరకాలపు -

వియోగం చేత దంపతులు ఒకరిపట్ల మరొకరు అత్యంత స్నేహబద్ధులై ఉంటారు చూచావా! అట్లా వారి సమాగమము అత్యంత ప్రీతి గొల్పుచుండేది. వారు ఒకరి కోసం మరొకరు ఎంతగానో తపించి ఉన్నారు కదా! అందుచేత కొద్దిసేపు ఆనందప్రవాహంలో జడీభూతులైనారు. అక్కడి నుండి లేచారు. అక్కడి వాసుదేవ శరీరమును భస్మీభూతం చేశారు. మంత్రపూర్వకంగా 'విధి'ని నిర్వర్తించారు. సజ్జనులు వారికి నిర్ణయించబడిన సదాచారములను త్యజించరు సుమా!

ఆ తరువాత వారిద్దరు ఆ మందరపర్వతంపై ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ, ఆకాశంలో సూర్య చంద్రుల వలె ప్రకాశించారు. ఎరుగవలసిన బ్రహ్మవస్తువును అనుభవము, అనుభూతి” రూపంగా గ్రహించారు. జీవన్ముక్తులు, జగద్గురువులు అయినట్టి ఆ ఇద్దరు మహాత్ములూ అక్కడ చాలా కాలం విహరిస్తూ ఉండేవారు. దేశ కాలములచే అందించబడే హర్ష-విషాదములు వారిని తాకలేకపోయేవి. ఆత్మ స్వరూపమున స్థితి పొందినవారికి హర్ష విషాదములు, శుభాశుభములు, కలిమిలేములు స్వల్పవిషయములుగానే కనబడతాయి కదా!

కొంతకాలానికి శుక్రాచార్యునికి అసురగురుత్వము, గ్రహాధికారము లభించాయి. భృగువు తనకు యోగ్యమైనట్టి నిరామయమగు 'ప్రజాపతిదినము’ నందు సుస్థిరుడై ఉన్నారు.

Page:72

చూచావా రామా! ఆ శుక్రాచార్యుడు మొట్టమొదట పరమపదమగు పరమాత్మ యందు సుస్థిరుడై ఉండేవాడు. ప్రశాంతంగా తండ్రి సేవలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ తరువాత తన "స్మృతి పథము నందు ఆరూఢమైయున్న అప్సరస కొరకై మనోరాజ్య విభ్రమము పొందాడు. దశదిశల పరిభ్రమించాడు. మరల కాలభగవానుని యొక్క భృగుమహర్షి యొక్క, కటాక్షముచే స్వస్థమగు 'ఆత్మ స్థితి'ని పొంది ప్రకాశించాడు.

Page:73

III. భృగు - యమ సంవాదము - -

తదనంతర చర్చ

1. చిత్తము - ప్రాప్తాప్రాప్తములు

శ్రీరాముడు : మునీంద్రా! భృగుని కుమారుడైన ఆ శుక్రునికి తన యొక్క మనోరథ ప్రతిభ (force of his own wish) చేతనే స్వర్గలోక సంచారం, దేవకన్యతో సాంగత్యం మొదలైనవి ప్రాప్తించాయి కదా! ఈ విషయంలో నాదొక సందేహం. ఈ జీవులలో ఎందరో ఏవేవో మనోరథములు కలిగి ఉంటున్నారు కదా! మరి, అనేకుల యొక్క "నేను ఇది పొందుతాను. ఇవి చేస్తాను అను ప్రతిభ సఫలం ఎందుకు అగుటలేదు?నేనిప్పుడు స్వర్గము చేరి సర్వ సుఖములు అనుభవించెదను గాక” అని సంకల్పించగానే ఎవ్వరికైనా అట్లే ప్రాప్తించాలి కదా? ప్రాప్తించుటలేదేం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఏదైనా ప్రాప్తించాలంటే భావనయొక్క పరిశుద్ధత, ఏకాగ్రత అవసరం. శుక్రాచార్యుడు తాను పొందాలని కోరుకొన్నది తన మనోరాజ్యంలో సఫలమై పొందటానికి కారణం ఇతఃపూర్వపు కల్పమునందలి అతని ప్రయత్నాదుల ఔన్నత్యమే. పూర్వ కల్పమునందలి అతని అంతిమ జన్మయందు గొప్ప ఉపాసనాదులచే ఏకాగ్రతను, లక్ష్యశుద్ధిని, సాధించటంలో ప్రావీణ్యతను అలవరచుకుని ఉన్నాడు. ఉత్తమ సంస్కారములు, ఆత్మతో తాదాత్మ్యము కొరకై ఆశయము పొంది ఉన్నాడు. అందుకు ఫలితంగానే 'బ్రహ్మఋషి’కి పుత్రుడై కళంకరహితమైన జన్మను పొందాడు. ఈ కల్పము యొక్క ప్రారంభంలో సత్యాత్మ యొక్క భావనను పొందుటకు అర్హమైన మానవ-మునికుమార విద్య-సమృద్ధిలతో కూడిన జన్మను సంపాదించాడు. శ్రీరాముడు : తండ్రీ! 'సత్యాత్మ భావన' అనగా ఏమిటో... మరికొంత వివరించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వకోర్కెలు నశించినప్పుడు అట్టి స్థితిలో శేషించే చిత్తము యొక్క స్థితియే సత్యాత్మభావన’ అను పేరుతో చెప్పబడుతోంది. దానినే "నిర్మల చిత్స్వరూపము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ చిత్తము నిర్మలము, సత్యాత్మ స్వరూపము అవుతుందో - అట్టి చిత్తము ఎల్లా భావన చేస్తుందో అది ఆ విధంగానే శీఘ్రంగా అవుతూ ఉంటుంది.

శుక్రుని చిత్తములో ఒక చమత్కారమైన విభ్రమము ఏర్పడినట్లు మనం కథలో చెప్పుకున్నాం కదా! ఏ విధంగా స్వయంగానే అతని చిత్తమునందు విభ్రమము ఉత్పన్నమైనదో, అదే విధంగా ప్రతి జీవునియందు చిత్త విభ్రమము ఉత్పన్నమౌతోంది. 'ఆత్మస్వరూపభావన' నుండి చ్యుతి పొంది బాహ్యదృష్టిని ఆశ్రయించి చైతన్య సత్తయే శాస్త్రకారులచే 'జీవుడు' అనే పేరుతో పిలువబడుతోంది. ఒక విత్తనమే - అంకురము, కాండము, ఆకులు, కాయలు, కొమ్మలు - మొదలైన రూపములుగా అగుచున్నది. అలాగే, సమస్త ప్రాణుల యొక్క స్వయం కల్పిత భ్రాంతియే ఈ ద్వైతవిభాగమును ఏర్పరచుచున్నది. అది స్వస్వరూపవిస్తారం అయి, ఇట్లు, తనను తానే ప్రకటించుకొనుచున్నది.

Page:74

ఈ ఎదురుగా ఉండి, 'ప్రపంచము' అని చెప్పబడుచున్న దృశ్యవ్యవహారమంతా ప్రతి జీవుని చిత్తము నందు మిథ్యారూపముగా ఉదయిస్తోంది. మిథ్యారూపముగా ఉనికిని కొనసాగిస్తూ... ఎప్పుడో మిథ్యారూపముగానే లయం పొందుచున్నది.

కాని, యథార్థానికి ఈ జగత్తు ఉత్పన్నమగుట లేదు, నశించుటలేదు. మాయచే ఉన్మత్త స్త్రీలాగా ఈ జగత్తు రూపంగా తనయొక్క ప్రభావమును ప్రకటించుచున్నది.

నాస్తమేతినచోదేతి జగత్కించన కస్యచిత్ |

భ్రాంతి మాత్రమిదం మాయా ముగ్దేవ పరిజృంభతే ॥ || (సర్గ 17, శ్లో. 8.)

ఇప్పుడు మన అనుభవములలో వేరువేరు విధములుగా ఈ జగత్తు ప్రత్యక్షమై ఉంటోంది. అనగా, ఒక ముని అయినట్టి నాకు ఒక రీతిగా, ఒక రాజు అయినట్టి నీకు మరొక రీతిగా స్వయంకృతమైన కార్యక్రమాలను అనుసరించి ప్రాప్తిస్తోంది కదా!

అట్లాగే తక్కిన జీవులకు కూడా మిథ్యారూపములైన వేరు వేరు జగత్తులు ప్రత్యక్షముగా కనిపించుచున్నాయి. వేరు వేరు విషయములు వేరు వేరుగా "ఇది దుఃఖకరము, ఇది సుఖకరము, ఇది అవశ్యము, ఇది అసంగతము, ఇది సవ్యము, ఇది అపసవ్యము”.... అని నిర్వచించబడి దర్శించబడుచున్నాయి. అయితే ఒకనికి కనబడే 'జగద్భమ' యొక్క రీతి మరొకరికి కనిపించుట లేదు. ఎవరి భ్రమ, సుఖ-దుఃఖములు, భావాభావములు - వారివే అగుచున్నాయి. ఒకడు తన స్వప్నంలోనో, సంకల్పనగరంలోనో చూచుచున్న వ్యవహారం ప్రక్కనేవున్న మరొకనికి కనిపిస్తోందా? లేదు కదా! అదే విధంగా ఒక జీవుని యొక్క భ్రమతో కూడిన జగద్దర్శనము మరొక జీవునికి అట్లుగాక వేరొక విధంగా ఉంటోంది. "సంకల్పము" అనబడే బహువిస్తీర్ణమైన ప్రదేశంలో జగద్రూపములు' అనే అసంఖ్యాకములైన నగర సమూహములు ఏర్పడుచున్నాయి. ఇవన్నీ మిథ్యయే అనే అవగాహన ఒక్క జ్ఞానదృష్టి కలవానికి మాత్రమే నిర్దుష్టముగా ఏర్పడుచున్నది. మాయచే ఆశ్రయించబడిన జీవుడు ఇదంతా వాస్తవమే అను రూపం గల భ్రాంతిని పొందుచూ, అనుభవించుచున్నాడు. ఒక్క మానవులే కాదు. దేవత-రాక్షస జీవులు, పిశాచ-యక్ష జీవులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు.

అంతే కాదు. మనమందరం కూడా శుక్రుని లాగానే సంకల్పమాత్ర శరీరులమే! 'మిథ్య' అయిన దానిని సత్యముగా తలచుచు ఇట్లు ఉత్పన్నమైనాము.

ఈ వ్యష్టియే కాదు. వ్యష్టి (Individual) కి పరమైనట్టి సమష్టి సృష్టి అహంకారియగు హిరణ్యగర్భ రూపుడు' కూడా 'ఈ జగత్ సృష్టి పరంపరలు' ఈ విధంగానే మిథ్యారూపంగా పొందటం జరుగుతోంది. ఈ అనేక ఉపాధి - వస్తు జాలముల నిర్మాణము వెనుక ఏర్పడి ఉన్న ఇచ్ఛాశక్తియే హిరణ్యగర్భుని ప్రదర్శన.

వాస్తవానికి ఈ వ్యష్టి-సమష్టి జీవులిరువురు ఆత్మస్వరూపులే అయివున్నారు. 'అవస్తువు’ అయినట్టి ఆత్మ యందు జగత్తు-శరీరము మొదలైన వస్తుత్వమంతా ఎట్లా ఉంటుంది? ఎట్లా

Page:75

ప్రవేశిస్తుంది? ఎక్కడినుండి ప్రవేశిస్తుంది? లేదు. కనుక శరీరాదుల రూపంలో స్ఫురించేదంతా మిథ్యయే అయివున్నది.

ప్రతి చిత్తము నందు మిథ్యారూపమగు జగత్తు ఉంటూనే ఉన్నది. ఆత్మచే ఆత్మయందు ప్రథమ సంకల్పము" ఏర్పడుచున్నది. అట్టి ప్రథమ సంకల్పం 'ఆత్మయందు ఈశ్వరత్వము' అని శాస్త్రాలచే (వేదాలచే) చెప్పబడుతోంది. సంకల్పము చేతనే ఈ జగత్తు వ్యవస్థితి పొందియున్నది. తత్త్వజ్ఞానము పొందుటచే ఈ జగద్రూపస్థితి ఏ విధంగా ఏర్పడినదో తప్పక గ్రహించబడగలదు. ఉత్తమ ప్రయత్నము, అవగాహనలను ఆశ్రయించుచున్నవారు, "అనాదియగు అజ్ఞానమునందు స్థితిపొంది యున్న ఈ చిత్తమే అనేక విధములుగా కార్యయుక్తమగుచున్నది అని జ్ఞానులు ఎఱుగు చున్నారు. అట్లు ఏర్పడు 'ఎఱుక' యొక్క ప్రభావంచే ఈ చిత్తము తనంతట తానే నశించుచున్నది.

2. సత్యవస్తు విచారణ

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీటి కదలికలను అనుసరించి నీటిలో ప్రతిబింబిస్తున్న సూర్య బింబము పైకి-క్రిందికి కదులుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నీటిలోని సూర్యుని చూడటం మానేసి, ఆకాశంలోని సూర్యుని చూచామనుకో... అప్పుడు నిశ్చల స్వభావుడగు సూర్యుడు కనబడతాడు. కదులుచున్న మేఘాలతో కలిపి చంద్రబింబమును చూస్తూ ఉంటే, చంద్రబింబం మేఘకదలికలను అనుసరిస్తూ ఉన్నట్లుంటుంది. మేఘాలు మన 'దృష్టి'ని ఆకర్షించకపోతే అప్పుడు నిశ్చల చంద్రుడు అగుపిస్తాడు. అదేవిధంగా 'ప్రతిభాస' (reflective) అనబడు ద్వితీయ విశేషముతో కూడిన అవగాహనాదులు ఉన్నపుడు మాత్రమే 'జగత్తు' అనబడేది అనుభవమవటం జరుగుతోంది. సత్య వస్తువగు బ్రహ్మము సాక్షాత్కరించిన తరువాత ఇక 'జగత్తు' అనేది ఉండదు. ఒక ఏనుగు కట్టుకంబమునకు కట్టివేయబడుతూ ఉంటుంది కదా! అట్లాగే 'చిత్తము' అనబడే ఏనుగుకు ఈ జగత్తే కట్టుకంబము సుమా!

చిత్తము యొక్క ఉనికియే జగత్తు. జగత్తు యొక్క ఉనికియే చిత్తము.

చిత్తమును అనుసరించే జగత్తు ఉంటుంది. చిత్తము లేని చోట జగత్తు కూడా లేదు.

చిత్తము - జగత్తులలో ఒకటి నశిస్తే, రెండవది కూడా తనంతట తానే నశించుచున్నదని గ్రహించు. అయితే అట్టి ఈ "జగత్తు యొక్క లేదా, చిత్తము యొక్క"... నాశనము 'సత్యవస్తువును గురించిన విచారణ చేత మాత్రమే సాధ్యం.

చిత్సత్తైవ జగత్సత్తా జగత్సత్తెవ చిత్తకమ్

ఏకాభావాద్ద్వయోర్నాశః స చ సత్యవిచారణాత్ (సర్గ 17 శ్లో.19)

మట్టిచే దోషయుక్తంగా ఉన్న మణిని శుభ్రమైన నీటిలో కడిగినప్పుడు ప్రకాశవంతంగా స్వచ్ఛంగా కనబడుతుంది కదా! ఈ చిత్తములోని దోషములు రహితం చేయబడినప్పుడు, అట్టి శుద్ధ చిత్తమే పరమాత్మ యొక్క స్వరూపము! లేక అదియే పరమాత్మ! అదియే సత్యస్వరూపము!

Page:76

శుద్ధ చిత్తం, విశేషములు - శుద్ధ చిత్తం తన యందు దేనిని ప్రతిభాసింప చేసుకుంటుందో, అది 'సత్యమే అయి ప్రాప్తిస్తుంది. అనగా, శుద్ధచిత్తము దేనిని స్వయముగా ఎట్లా సంకల్పించటం జరుగుతుందో, అది అట్లే సత్యమైన అనుభవంగా రూపము పొందుతోంది. శుద్ధ చిత్తము యొక్క ఏకాగ్రత స్వల్ప సమయంలో సఫలం అవుతుంది.

“చిత్తము శుద్ధ పరచుట” అనునది ఒక్కటే ఈ జన్మల - కర్మల యొక్క ఉత్తమోత్తమమైన ఆశయము. ఇక తదితరములన్నీ తత్సంబంధమైన - తదుచితమైన ఆశయములు మాత్రమే.

అయితే, ఈ చిత్తం శుద్ధం కావాలంటే ఏమి చేయాలి? చిరకాలంగా ఏకాగ్రత అభ్యసించుటే అందుకు మార్గం. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆకాశములోని ఆయా విశేషములు తటాకంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి కదా! అదే విధంగా, ఈ చిత్తము వివిధ సంకల్పములచే కలుషితం అవకపోతే, అద్దానియందు అత్యంత సులభంగా అద్వైత రూపముతో కూడిన ఆత్మ జ్ఞానము, ఆత్మ విజ్ఞానము ప్రతిభాసిస్తాయి.

చిరమేక దృఢాభ్యాసా చ్ఛుద్ధిర్భవతి చేతసః | |

అనాక్రాన్తస్య సంకల్పైః ప్రతిభోదేత చేతసః ॥ (సర్గ 17, శ్లో. 21)

మలిన వస్త్రమునకు రంగు వేస్తే నిలుస్తుందా? లేదు కదా! అదే విధంగా అనేక జగద్విషయములకు సంబంధించిన భావావేశ వృత్తులు తనయందు చంచలశీలంగా కలిగియున్న చిత్తములో అద్వైతతత్త్వ ప్రతిపాదికమగు ఆత్మజ్ఞానము నిలకడ పొందకుండానే పోతుంది.

ఈ సాంసారిక జీవుడు “ఇప్పుడు నేను స్వర్గం పొందాలి, విష్ణు లోకం పొందాలి”, మొదలైన భావనలు చేస్తున్నప్పటికీ అతడు శుక్రాచార్యునివలె వాటిని సత్యమై పొందలేకపోతున్నాడు. దానికి కారణం, అతడు తదితరములైన (వేరైన) అనేక సంకల్పములు కూడా కలిగి ఉండటమే. అందుచేత ఈ జీవుని యందు ఏకాగ్రత కొరవడుతోంది. అసంఖ్యాకములైన అనేక సంకల్పములు ఒక్కసారే చిత్తములో కాపురం ఉండి ఉండటం చేత అతనికి "నేను స్వర్గము చేరెదను అనే సంకల్పం వాస్తవత్వం పొందకముందే మరొక సంకల్పమేదో వచ్చి మొదటి సంకల్పమును త్రోసివేస్తోంది. శుక్రాచార్యుని చిత్తమునందు అనేక విశేషములు” లేక “అనేక జగత్తులు" అను రూపముగల వేరు వేరు సంకల్పములు లేవు. ఏకైక సంకల్ప నిష్ఠుడై నేను ఇప్పుడు స్వర్గము చేరుచున్నాను... ఇంద్ర సభలో ప్రవేశించాను... ఇంద్ర భగవానునితో సంభాషించుచున్నాను... ఇట్లు భావన చేశాడు. ఏకాగ్రత యొక్క ప్రభావంచేత అవన్నీ సత్యంగానే పొందాడు. అందుచేతనే అతడు స్వర్గము చేరుట, దేవతా స్త్రీతో విహారము చేయుట... ఇవన్నీ వాస్తవత్వము పొందాయి.

ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా విశేషము కలిగియున్నారంటే, అట్టి విశేషము వెనుక ఏకాగ్రతయే దాగి ఉండి ఉంటుంది సుమా!

శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పినదానిని బట్టి ఆ శుక్రుడు తన యొక్క కల్పనా జగత్తులో ప్రవేశించి, అందులో ఇంద్రుడు, దేవతాస్త్రీ, ఆయా ఉపాధులు మొదలైనవి పొందాడని నేను

Page:77

గ్రహిస్తున్నాను. అయితే, నా సందేహమేమంటే, ఆ శుక్రుని చిత్తములోని కల్పనాత్మకమైన జగత్తులో ఈ సూర్యుడు, చంద్రుడు - ఉదయాస్తమయములు మొదలైన కాలక్రమమంతా ఎట్లా ఏర్పడింది? అతని చిత్తమునందు ప్రతిభాస అనునది ఏర్పడేటప్పుడు ఈ ఉదయాస్తమయములు మొదలైనవి గ్రహించబడవు కదా! అతనికి అనేక విశేషములతో కూడిన జగత్తులు ఎట్లా లభించాయి? ఆ జగత్తులకు కర్తలు ఎవరు? అవన్నీ అట్లా ఎందుకు కల్పించబడ్డాయి? అతనికి కనిపించినదంతా మన ఈ జగత్తు వంటిదేనా?

3. సంస్కారములు - అనుభవములు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! శుక్రుడుగాని, నీవు గాని, నేను గాని, మరింకెవరైనా గాని, పురుగు మొదలైన జీవులుగాని... మనమంతా "ఉత్పత్తి, వినాశనములతో కూడిన ఈ దృశ్యజగత్తును ఎట్లా చూస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం చెపుతాను విను. అది విన్న తరువాత, నీ ప్రశ్నకు సులభంగా సమాధానం వస్తుంది.... ఈ చిత్తం ఏ విధంగా రూపు దిద్దుకుంటోంది?

స్వకీయ విశ్లేషణ / అవగాహన

One's own

శ్రేష్ఠులైనట్టి తదితరుల జ్ఞానేంద్రియ శక్తులు ప్రేరణ Activation of Impulses Others As Inspiration & Example

శాస్త్ర పాఠములు

Dictations showered by Scriptures etc.,

1. జ్ఞానేంద్రియశక్తులు - తల్లితండ్రుల నుండి ఈ జీవుని కొరకై సంక్రమిస్తున్నట్టి ఈ కంటికి కనబడుచున్న భౌతికదేహం నందు చూచుట-వినుట-ఆఘ్రాణించుట-రుచి-స్పర్శ”... అనబడే 'జ్ఞానేంద్రియశక్తులు' క్రియాశీలకమౌతున్నాయి. ఇవియే ప్రకృతి సంబంధమైన ఉపకరణములు. అట్టి జ్ఞానేంద్రియములతో, ఈ జీవుడు ఆయా విషయములను సమీపిస్తున్నప్పుడు అనుభవములు ఏర్పడుచున్నాయి. అట్టివి కొన్ని ఇష్టమైనవి, మరికొన్ని అయిష్టమైనవి ఇంకొన్ని మిశ్రమమైనవి అగుచున్నాయి. అవి చిత్తము నిర్మించబడు విధమునకు దోహదపడుచున్నాయి.

2. శ్రేష్ఠులైనట్టి తదితరుల ప్రేరణ - శ్రేష్ఠులగు ఇతరుల అభిప్రాయములు, అనుభవములు, చింతనలు, పాఠములు, బోధలు, వారి వారి ప్రవర్తన మొ||నవి ఈ చిత్తము యొక్క రూపమును ప్రభావితం చేస్తూ ఉంటాయి.

Page:78

3. శాస్త్రపాఠములు - గ్రంథాలు, శాస్త్రములు ప్రతిపాదిస్తున్నది పఠిస్తూ ఉన్నప్పుడు, అందలి విశేషములను గ్రహిస్తూ ఉన్నప్పుడు.... అట్టి జీవునియొక్క దృష్టి-అవగాహన - భావన పరిణతి చెందుతూ ఉంటాయి. అవి చిత్తం యొక్క రూపురేఖలలోని మార్పుకు కారణమవుతూ ఉంటాయి.

4. స్వకీయమైన విశ్లేషణ అవగాహన - ఈ జీవుని స్వకీయమైన విచారణ, పరిశీలన, అవగాహన, పరిశోధన ఈ చిత్తము యొక్క తదనంతర స్థితి గతులను నిర్ణయిస్తూ ఉంటాయి.

ఈ నాలుగు విధములైన ప్రయత్నములచేతనే మనమంతా కూడా మన చిత్త సంస్కారాలను సముపార్జిస్తున్నాం. అట్టి మన చిత్తములను అనుసరించి ఈ జగత్తును చూస్తున్నాం. అనుభ విస్తున్నాం, భావిస్తున్నాం. అట్లే శుక్రుని విషయం కూడా. ఒకని చిత్తము అతని యొక్క కర్మ ఎరుకలను అనుసరించి ఎప్పటికప్పుడు క్రొత్త రూపములను సంతరించుకొంటోంది. ఇక ఆపై అతని యొక్క లౌకిక - పారలౌకిక జగత్తులన్నీ సంస్కార రూపంలో అతని చిత్తము నందే స్థితి పొంది ఉంటున్నాయి.

ఎవరైనా సరే, జీవించియున్నప్పుడు గాని, మరణించినప్పుడు గాని, స్వప్నము నందు గాని, సంకల్పనగరము నందు గాని... తన చిత్తమునందు సంస్కార రూపమున ఉన్నదే అనుభవముగా పొందుచున్నారు. ఎవ్వడూ కూడా, తన చిత్తములో లేనిదేదీ ఏ క్షణంలోనూ ఏమాత్రమూ పొందడు. చిత్తమే అనుభవం.

బీజము - దృష్టాంతానికి ఒక బీజాన్ని తీసుకుందాం. గాలి, సూర్యరశ్మి, నేల వంటి సహకారి కారణములు లభించినప్పుడు, ఆ బీజమే 'కాలము-క్రియ'ల క్రమమును అనుసరించి ఒక “మహా వృక్షంగా పరిణమిస్తోంది. మహావృక్షం యొక్క సంస్కారమంతా ఆ బీజంలో దాగియే ఉంది కదా!

జీవుడు - అదే విధంగా, చైతన్యమే తన వాస్తవస్వరూపమైనట్టి ఈ జీవుని యందు “అవిద్య” అనే సంస్కారం ఉన్నది. అట్టి 'అవిద్య' జీవునియందు బీజమువలె ఉంటోంది. ఇక తల్లిదండ్రుల చేత ప్రసాదించబడిన ఈ పాంచభౌతిక శరీరం, 'శాస్త్ర-పితృ-బోధలు'... ఇవన్నీ ఒనగూడు చున్నప్పుడు ఇవి సహకారి కారణములౌతున్నాయి. ఈ జగత్తును ఇట్లు దర్శించుట అనునదే సంసారమహావృక్షముగా పరిణమిస్తోంది. ఓ రాఘవా! ఈ జీవుడు ఇట్లు జగత్తుగా చూస్తున్నదంతా వాస్తవానికి తన చిత్తమునందే, చిత్తము యొక్క మహిమ చేతనేనని గ్రహించు. ఈ జీవుడు ఎట్టి వాసనకు బద్ధుడో, అట్టి వాసనను అనుసరించి తనయందు సర్వమును గాంచుచున్నాడు. శ్రీరాముడు : “నా చిత్తమే ఇట్లు విస్తరించి ఈ జగత్తు యొక్క దర్శనము (perception of this world) గా పరిణమిస్తోంది... అనే అభిప్రాయం చమత్కారమైన విషయమే.

శ్రీ వసిష్ఠమహర్షి : అవును ఇందుకు దృష్టాంతము మనం పొందుచున్న స్వప్నములే. ఒకనికి తన స్వప్నంలో కనబడే శరీరములు భవనములు మొదలైనవన్నీ స్వయం కల్పితములే కదా! మనస్సు యొక్క భావనయే అట్లు పరిణమిస్తోంది. అలాగే, ఈ జగద్దర్శనము కూడా ఒక దీర్ఘమైన స్వప్నము

Page:79

వంటిది మాత్రమే. మనస్సు యొక్క భావనా పరంపరలే జగద్రూపంగా పరిణమించినవై ఉంటున్నాయి.

శ్రీరాముడు : ఈ 'జగత్తు ఎవరికి వారికే వారియొక్క స్వప్నము వంటిది అయినప్పుడు, “ఇది ఈ వస్తువు... ఇది సరియైనది... ఇది సుందరము” వంటి అనేక అనుభవములు అనేకులకు ఒకే …….

తీరుగా ప్రాప్తిస్తున్నాయి కదా! ఇది గోడ అనే విషయం నేనూ, మరొకరు కూడా అనుభవిస్తున్నాం. అదే స్వప్నదృశ్యం విషయానికి వస్తే నేను పొందే స్వప్నము (కల) నా ప్రక్కనే ఉన్నవాడు పొందుట లేదు. అందుచేత “ఇది స్వప్నము వంటిది అనటం ఎంతవరకూ ఉచితం...?

శ్రీ వసిష్ఠ మహర్షి : "అనేకులకు ఒకే తీరుగా కనబడుచున్నది కదా?... అనునది నీ సందేహమా? సరే, దృష్టాంతము సహాయంతో వివరిస్తాను విను. ఒక చోట కొందరు సైనికులు ఉన్నారు. వారంతా పగలు యుద్ధంలో పాల్గొన్నారు. రాత్రి అయినది. వారంతా నిదురిస్తున్నారు. వారందరు తెల్లవారి తాము యుద్ధము చేయవలసియున్న శత్రు సైన్యము గురించి కలలు కంటున్నారు. ఇప్పుడు చెప్పు.... వారంతా, తమ స్వప్నములో చూచినది ఒకే శత్రుసైన్యం కదా!

వారు ఒక్కొక్కరుగా తలుస్తున్నది ఒకే శత్రుసైన్యం గురించి ఐనప్పటికీ, వారంతా వారి వారి ధైర్య - స్థైర్యములను, భావన, రాజభక్తి, బంధువులకు సంబంధించిన మమకారములు మొదలైన ఆయా విషయాలను అనుసరించి అనేక రీతులుగా ఆయా స్వప్న సంఘటనలు పొందుచున్నారు. ఈ జగత్తు విషయం కూడా అంతే. అవిద్యచేత ప్రతి జీవుడు కూడా "ద్వైతవిభాగం అను రూపం గల తన స్వప్నంలో ఈ 'జగత్తు' అనబడు దృశ్యమును గాంచుచున్నాడు. ఈ దృశ్యమానం అయ్యేదంతా వాస్తవానికి ఒక్కొక్క జీవునికి, అతని వాసనలను అనుసరించి ఒక్కొక్క రకంగా సంప్రాప్తిస్తోంది. కాని అతడు నాకిదంతా ఎట్లా కనబడుతుందో అందరికీ అట్లే కనబడుతోంది అని మాత్రం భావన చేస్తున్నాడు. “నాకు ఏదేది కనబడుటలేదో, మిగతావారికీ అట్లాగే కనబడుట లేదు అను భ్రమ ఏర్పడటం జరుగుతోంది. ఒకవేళ అందరికీ ఒకే తీరుగా కనబడటం జరుగు తుంటే, అప్పుడు ఇన్ని భావావేశాలు - అభిప్రాయభేదాలు, ఇన్ని రకాల దృష్టులు, అవగాహనలు ఎందుకు ఉంటున్నాయి చెప్పు? జనులలో ఏర్పడే స్పర్థలకు కారణం వేఱువేఱు దృష్టులే కదా!

అందుచేత, మనం ఈ "ద్రష్ట దృశ్యత్వము అను వ్యవహారమంతా సునిశితంగా పరిశీలించటం జరిగితే మనకు ఇట్లు తెలియవస్తోంది.... ప్రతిజీవుడు తన చిత్తము నందే ఆ చిత్త సంస్కారములను అనుసరించి, ఒక స్వప్న వ్యవహారంలాగా ఈ జగత్తును తన రీతిలో గాంచుచున్నాడు.”

అదియే 'జగత్తు' అనబడు పేరుతో విరాజిల్లుతోంది సుమా! కనుక, జగత్తు ఎక్కడి నుండి బయల్వెడలుతోంది? అనునది సముచితమైన సమాధానమే!

Page:80

4. పరస్పరం

శ్రీరాముడు : మహాత్మా! ఈ 'జగత్తు' అనబడునది ఎవరికి వారికే తమ యొక్క స్వప్నం వలె భావనానుసారం ఏర్పడుట, ప్రాప్తించుట జరగుతోంది కదా! ఈ జగత్తులు ఆయా జీవులు పరస్పరం కలిసియే ఉంటున్నాయా? విడివిడిగా ఉంటున్నాయా? ఈ విషయం నాకు వివరించి చెప్పండి. నా చిత్తము నందు నేను చూచు జగత్తు - మీ చిత్తమునందు మీరు చూచుచున్న జగత్తు వేరువేరా? అట్లా అయితే ఒకరి భావాలతో, అనుభవములతో మరొకరికి సమన్వయం ఎట్లా ఏర్పడుతోంది?

శిష్యులను సముద్ధరించాలనే ఉద్దేశంతో గురువులు దీనిని ఇట్లా ఆచరించండి" అనే రూపం గల ప్రవృత్తి’ని సూచించే శాస్త్ర విషయాలు రచిస్తున్నారు కదా! అట్టి శాస్త్ర విషయాలు శిష్యులపై ప్రభావం చూపుతున్నాయి. మరి ఎందుకు చూపుచున్నాయి? మీరు చెప్పుచున్నట్లు " ఈ జగత్తు - దర్శించే ద్రష్ట యొక్క స్వప్నము మాత్రమే”... అనునదే వాస్తవమైతే, మరి ఒక గురువు యొక్క స్వప్న విషయమాత్రములే అయినట్టి అతని శాస్త్రావలోకనం, శాస్త్ర ప్రవచనం అతని శిష్యుని (స్వప్నజగత్తు అనదగ్గ) జాగ్రత్లో ఎట్లా ప్రవేశించి, ప్రభావితమౌతున్నాయి? జగత్తు స్వచిత్త మందలి ప్రకటనమే అయినప్పుడు గురువు చెప్పటమేమిటి? శిష్యుడు విని ఉద్ధరించబడట మేమిటి? మీరు చెప్పే స్వప్న దర్శనం" అను సిద్ధాంతం ప్రకారం గురువు శిష్యుల సమ్మేళనం గాని, 'మోక్షం’ అనే స్థితి గాని సిద్దించవు కదా! ఎందుకంటే, ఒకరి మనస్సు ఇంకొకరి మనస్సుతో కలియటం అనేది జరుగదు కదా?

నా స్వప్నం - మీ స్వప్నం ఒకదాని కెదురుగా మరొకటి తారసపడుతున్నాయా? లేదే? శ్రీ వసిష్ఠ మహర్షి : మనస్సు రెండు విధాలుగా ఉంటోంది- 1) 'శుద్ధ మనస్సు’ ; 2)దృశ్య వ్యవ హారాలతో ఇష్ట అయిష్టాలనే సాంసారిక సంబంధం ఏర్పరచుకొని ప్రవర్తిస్తున్న 'మలిన మనస్సు'.

మలిన మనస్సు శుద్ధ మనస్సుతో కలియటం అశక్యమే.

శుద్ధ చిత్తములు పరస్పరం కలుస్తాయి. అట్లాగే, ఒకే విధమైన సాంసారిక దోషము, ఆర్తి పరామర్శగల దోష మనస్సులు పరస్పరం కలుస్తున్నాయి.

ఒకే విధమైన చిత్త సంస్కారదోషము కలిగినవారి యొక్క 'స్వప్నభావన' కాకతాళీయంగా మరికొన్ని మనస్సులందు కూడా ఉండి ఉంటోంది. అనేక మనస్సులు ఒకేవిధమైన దోషదృష్టి’తో ఈ జగత్తును చూస్తున్నాయి (లేక) పొందుచున్నాయి. అంటే కొన్ని విషయాలు అనేక మనస్సులకు ఒకే విధంగా అనుభవమౌతున్నాయి. తత్ఫలితంగా "ఈ జగత్తు బాహ్యమున కలదు" అను భావన చైతన్యం నందు రూఢిపడి ఉంటోంది. ఇదియే మాయ యొక్క చమత్కారం. అవాస్తవాన్ని వాస్తవం వలె చూపించుటయే ఇందులోని గమ్మత్తు.

ఏకరూపము గల జలములే కలుస్తున్నాయి.

Page:81

ఒక శుద్ధ చిత్తమునకు ఏది కనబడుతోందో మరొక సమానమైన శుద్ధ చిత్తమునకు అదే దర్శనమగుచున్నది. ఒక విధమైన దోషముగల చిత్తము దేనిని ఎట్లు గాంచుచున్నదో, అదే విధమైన దోషము ఉన్నట్టి మరొక చిత్తము దానిని అట్లే గాంచుట జరుగుతోంది.

అయితే ఈ జీవులు ఇదంతా ఇలా చూడటం వాటి వాటి వాసనా ప్రభావంచేతనే సుమా! వాసనలు క్షయిస్తే, ఈ భూతప్రపంచమునకు అందజాలని 'ఏకరూపతత్వజ్ఞానం' కలుగుతోంది.

విషయ వాసనలు ఉన్నంతవరకు జగత్తు కనబడుతోంది. వాసనలతో కూడుకొని చూడబడుచున్నదంతా స్వప్నతుల్యమే. ఎందుకంటే, వాసనలు మార్పు చెందినప్పుడు, ఇదే జగత్తు వేరొక రీతిగా అనుభవమౌతోంది కదా!

భ్రమాత్మకమైన దృష్టి ఉన్నంత వరకే అతని అనుభవం, నా అనుభవం వంటి కల్పిత భావాలన్నీ ఉంటున్నాయి. వాసనలు తొలగినప్పుడు ఈ నేను-నీవు-జగత్తు అనేవన్నీ 'స్వస్వరూప జ్ఞానాగ్ని' యందు భస్మీభూతమైపోతున్నాయి. సర్వవిషయాలకు అతీతత్వం నిర్మల మనస్సునకు మాత్రమే సాధ్యమగుచున్నది. అట్టి శుద్ధ చిత్త స్థితియే "చిన్మాత్ర పరిశేషత్వము (The ultimate essence of absolute self) అను పేరుతో కూడా పిలువబడుతోంది.

అప్పుడీ జీవుడు 'పరమ కైవల్యపదము' అయినట్టి మోక్షమును పొందుచున్నాడు. అనేకంలో అంతర్లీనంగా సర్వదా ఏర్పడియున్నట్టి 'ఏకము అద్వితీయము'ను దర్శించుచున్నాడు.

5. జీవుడు - - ఖండత్వము, అఖండత్వము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవులందరూ కూడా తమ తమ కల్పిత ప్రపంచములందు "స్థూలసూక్ష్మ-కారణ శరీరాలతో సంబంధం కలిగి ఉంటున్నారు. వాటితో తాదాత్మ్యం పొందుచున్నారు. ఫలితం? ఆయా జగత్తులన్నీ అనేక భిన్నత్వములతో వారికి ప్రాప్తిస్తున్నాయి. అట్టి భిన్నత్వమంతా ‘శబ్ద-స్పర్శరూప-రస-గంధములు'... అను తన్మాత్రల యొక్క 'ప్రతిభాస' (Reflection) చేతనే సంభవిస్తోంది. ఈ ప్రతి దేహములోని ఆత్మ వాస్తవానికి సర్వదా స్వయంప్రకాశ స్వరూపము (self luminious), చిదేకరసము (Indivisible consciousness) అయి వున్నది. అట్టి 'నిర్వివాదాంశము అఖండము’ అగు ఆత్మయే ఆయా విధములుగా, భిన్నములుగా కల్పించబడుచున్నది. అయితే ఈ కల్పనా వ్యవహారమంతా వాస్తవము కాదు.

ఒకే చైతన్యము సర్వవ్యాప్తమైయున్నది. సర్వప్రాణులు గాఢనిద్ర నుంచి మేల్కొనగానే ఈ ద్వైత వ్యవహార ప్రవృత్తి పొందుచున్నారు. అయితే, స్వప్నమునందు, జాగ్రతునందు కూడా ఆయా వస్తు జాలమునందు ఏర్పడుచున్న ప్రవృత్తి - నివృత్తులన్నీ... ఏకరసమైన చైతన్యము యొక్క “సర్వ వ్యాప్తి చేతనే సిద్ధించుచున్నది. ఏకైక చైతన్యజ్యోతి వలననే, ప్రవృత్తియందు వ్యవహరిస్తున్నట్టి ఈ జీవులంతా... “ఇది కుండ, ఇది వస్త్రము" అనునట్టి అనుభవములన్నీ పొందగలుగుచున్నారు.

Page:82

ప్రవృత్తిర్వా నివృత్తిర్వా తన్మాత్రావృత్త పూర్వకమ్ | సర్వస్య జీవజాతస్య సుషుప్త త్వాదన్తరమ్ ॥ (సర్గ 18 శ్లో.2)

1. సాక్షిచైతన్యము యొక్క 'సంకుచిత, పరిమిత' భావన - 'సాక్షి చైతన్యము' ఈ ఉపాధితో తాదాత్మ్యము చెందటం జరుగుతోంది. అనగా 'నేను ఈ పాంచభౌతిక దేహమాత్రుడనే' అనే ఖండభావన కలిగి ఉంటోంది. ఇంద్రియములందు ప్రజ్ఞను ప్రవేశింపజేసుకొని, తత్ఫలితమైన ఆయా అనుభవములందు అధ్యాస (Avocation) కలిగి ఉంటోంది.

2. ద్వితీయమైనదంటూ లేనట్టి ఏకైక బ్రహ్మము - సర్వజీవులందు ఏకైక బ్రహ్మమే ప్రసరించి సర్వదా ఉండి ఉంటోంది. చూచేవాడు, చూడబడేవాడూ బ్రహ్మమే.

ఈ రెండు కారణముల సమన్వయంచేత ఒకరు మరొకరిచే కల్పించబడిన దృష్టులను సృష్టులను అటువంటి దృష్టితో చూచుచున్నారు. ఏకత్వము - అల్పదృష్టి" ఈ రెండు ఒకేసారి ఉండియే ఉంటున్నాయి. చిన్మాత్రము... ఏకత్వము... ఈ రెండింటి యొక్క ప్రభావం చేత చిత్రవిచిత్రములైన (సృష్టికి సంబంధించిన) సంకల్ప రచనలు పరస్పరం మిళితం అగుచూ, అనుభవమౌతున్నాయి. ఘనీభూతమై ప్రవర్తిస్తున్నాయి.

మరికొన్ని జగత్తుల కల్పనలు పరస్పరం మిళితం కాకుండానే వేరువేరుగా ఉండి, అట్లే వేరువేరుగా లయం పొందుచున్నాయి. ఇక ఇంకొన్ని జగత్తులు పరస్పరం తారసపడినప్పుడు నాశనం పొందుచున్నాయి. అనగా ఒకడు ఒక జగత్తును పొందుట ద్వారా రెండవ జగత్తును త్యజించివేస్తున్నాడు. అట్లాగే ఒకని ఈ రోజు స్వప్నదృశ్యం - రేపటి స్వప్న దృశ్యం ఒకదానితో మరొకటి కలియటం లేదు కదా! కానీ, స్వప్నద్రష్టమాత్రం? ఒక్కడేకదా!

అయితే ఈ జగత్తులన్నీ కలియటం- లయించటం విడిపోవడం... ఇదంతా జరుగుచున్నది ఎందులో? ఇవన్నీ జనిస్తున్నదీ, ఉంటున్నదీ, లయిస్తున్నది బ్రహ్మము నందే సుమా! బ్రహ్మం ఏకం, సద్రూపం (One and True) అయివున్నది. ఈ జగద్రూపములన్నీ బ్రహ్మము యొక్క ప్రభావం చేతనే ఒక దానితో మరొకటి కలుస్తున్నాయి. వ్యవహార యోగ్యత్వమును సంతరించుకుంటున్నాయి. శ్రీరాముడు : ఈ 'జీవుడు' అనబడువాడెవ్వడు? అతనికి అనుభవములు, పరిమితులు ఏర్పరచు చున్నది ఎవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : చైతన్యము లేక బ్రహ్మము స్వరూపముగా కలిగియున్న ఈ జీవుడు తన యొక్క స్వయంకల్పితము... స్వయంభావన ద్వారానే ఈ పరిమితత్వమంతా పొందుచున్నాడు. ఈ లోకంలో ఏ జీవుని తన భోగానికి అనుకూలమైనట్టి ఏ కర్మలు ఎచట వేడుకచే ఆకర్షిస్తున్నాయో, అతడు అద్దానిని పరిమితదృష్టిచే అందుకు అనుకూలంగా మాత్రమే దర్శిస్తున్నాడు. ఇంతకు మించి అధికంగా అతడు చూచుట లేదు.

శ్రీరాముడు : అతడు తన భోగానుకూలమైన భావనను అనుసరించే ఈ జగత్తులోని వస్తువులకు, సంఘటనలకు ఆయా అర్థములు ఇస్తూ, తదనుకూలంగానే అనుభవాన్ని పొందుచున్నాడంటారా?

Page:83

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అందుకు ఫలితంగా అతడు పరిమితమైన దృష్టి - - దృక్పథములను ఆశ్రయిస్తూ, తనకు తాను పరిమితత్వాన్ని ఆపాదించుకుంటున్నాడు.

శ్రీరాముడు : మహాత్మా! ఈ సర్వజీవులు బ్రహ్మమే అయి వున్నారు కదా! ఈ వేరు వేరు భావనలు, అభిప్రాయాదులు మొదలైనవి ఎట్లా, ఎందుకు, ఎప్పటి నుండి ఏర్పడి ఉంటున్నాయి? వీటి నన్నింటినీ ఎట్లా అవగాహన చేసుకోవాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : "బ్రహ్మము-జీవులు"... అనే తతంగమంతా "జలము-తరంగములుగా అభివర్ణించబడ్డాయి. అంతా జలమే అయినప్పటికీ, ఒక కెరటము యొక్క ఆకారము, సంభ్రమము మరొక కెరటమునకు ... ఏర్పడుచున్నదా? లేదు కదా! ఒక చిత్తము మరొక చిత్తము యొక్క మనో రాజ్యాన్ని కూడా అట్లే పొందుటలేదు. బంగారమంతా ఒక్కటే అయినా, వేరు వేరు ఆభరణాలు వేరు వేరుగా కనబడుట, ఉపయోగపడుట జరుగుతోంది. ఒక చిత్తము ఒక విధంగా, మరొక చిత్తము మరొక విధంగా ఈ జగత్తును దర్శించుచున్నది. ఒక చిత్తమునకు ఏర్పడుచున్న భోగానుభవం మరొక చిత్తమునకు ఏర్పడుట లేదు. కనుకనే, ఇది మనో - జీవభేదములకు కారణమగుచున్నది. ఒక కెరటము యొక్క ఆకారము, వేగము మరొక కెరటముతో పోల్చినప్పుడు ఇవి రెండూ వేరు వేరు అని అనిపిస్తుంది కదా! అదే రీతిగా 'ఈ జీవులు వేరు' అని తోచుచున్నది. ఇదంతా అజ్ఞాన దృష్టిచేతనే ఏర్పడటం జరుగుతోందని నీవు గ్రహించు. కెరటములన్నింటిలోను ఉన్నది జలమే అయివున్నట్లు... జీవులన్నింటిలో ఉన్నది చైతన్యస్వరూపమగు బ్రహ్మమే. ఆ అద్వితీయ- నిర్మల - నిర్లిప్త - నిత్యోదిత - - అఖండ చైతన్యమే జాగృతమై ఈ సర్వఉపాధులందునూ వెలయుచున్నది. వేరు-వేరు గదులలో వెలుగుచున్నట్టి దీపశిఖలు వేరువేరు విశేషములను వస్తుసముదాయమును వెలిగిస్తున్నప్పటికీ, అగ్ని ఒక్కటేకదా!

6. శరీరము - జీవుడు - -- దృశ్యము - బ్రహ్మము

శ్రీరాముడు : మహర్షీ! ఈ వేరు వేరు శరీరములన్నీ కనబడుతున్నాయి కదా! ఈ శరీరములను, ఈ జీవజాతులను, వీటిలోని భిన్నత్వములను, ఏకత్వములను, వ్యష్టి సమష్టులను ఎలా

అవగాహన చేసుకోవాలి?

శ్రీ వసిష్ఠ మహర్షి : భిన్న మనోరాజ్యరూపములగు సృష్టుల గూర్చిన కర్మవాసనలు... జలములోని తరంగముల వలె.. బ్రహ్మమునందు ఏర్పడుచున్నాయి. ఈ వేరు వేరు కర్మవాసనలు ఒక్కొక్కప్పుడు కొంత సమత్వమును కలిగి ఉంటున్నాయి. ఒకే సమయంలో ఫలోన్ముఖములవటం, ఒక దానితో మరొకటి సంబంధం కలిగి ఉండటం కూడా జరుగుతోంది. అట్టి సమయంలో ఇది వ్యష్టి (Unit)

- ఇది సమష్టి (Collective)", ఇది వ్యష్టిస్థూలదేహం - - ఇది సమష్టి పాంచభౌతిక సృష్టి”... అను రూపము గల సత్త ఎరుగబడుచూ, అనుభవించబడుతోంది. నేను - నాది - మావి - మేము

Page:84

మనము - మనది -నీవు నీది - వారు - వారిది "... అనునదంతా వాసనలచేత ఏర్పడి

అఖండము, అప్రమేయము అగు వాస్తవమును కప్పి ఉంచుతున్నాయి. అట్టి సమష్టి - వ్యష్టి స్థూలసత్త అధిగమించబడినదనుకో... లేక అమనఃస్థితి - అమనస్కస్థితి దృఢాభ్యాసముచే పొందబడినదనుకో... అప్పుడు...

ఈ దేహం యొక్క అభావం అత్యంత స్వాభావికంగానే సిద్ధిస్తుంది. అనగా, నేను దేహాన్ని కాదు. ఇందలి అనుభవముల 'కర్త-భోక్త' అయివున్న ప్రజ్ఞాతత్వమే నేను. దేహముల రాక పోకలకు వేరుగా చైతన్యమూర్తిత్వంతో వెలుగొందుచున్నాను. ఆ ప్రజ్ఞాతత్వమే 'నీవు, 'అతడు' కూడా-” అను అనిర్వచనీయమైన ఒక ఉత్తమ అవగాహన సిద్ధిస్తోంది.

శుద్ధ బంగారం తన యొక్క సువర్ణత్వమును విస్మరించి ఆభరణత్వమును తనపై ఆపాదించు కుంటున్నట్లు, శుద్ధ ప్రజ్ఞాస్వరూపుడగు జీవుడు తనపట్ల శరీరత్వాన్ని, ఖండత్వంను ఆపాదించు కుంటున్నాడు. అనగా, చిద్రూపము (The absolute form of wisdom) ఒక సమయంలో "నేను నిత్య, నిర్వివాదాంశ అఖండ సత్యమును" అను రూపమున ఉండే తన స్వాభావిక ఆత్మ స్థితిని ఏమరుస్తోంది. ఈకాళ్ళు, చేతులు, తదితరములైన ఆకారములు గల దేహమే నేను. దీనితో పుట్టుచున్నాను. దీనితోనే వృద్ధి పొందుచున్నాను - శిథిలమగుచున్నాను అని అత్యంత దృఢంగా భావన చేయుచున్నది.

ఇక ఈ జీవులు యొక్క తదితర జీవుల ఉపాధులు అనే అనుభవం ఎట్టిది? వినుయోగులు హఠ యోగాభ్యాసం' చేత తమ యొక్క శుద్ధ ప్రాణవాయువును మరొకరి భౌతిక శరీరంలో ప్రవేశింపజేసి ఆ వేరైన దేహ-ప్రాణములను తమ వశం చేసుకొని ఆ వేరైన శరీరం లోంచి శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుభవించటం గురించి విన్నావు కదా! మంత్రశాస్త్రము లోని పరకాయ ప్రవేశము ఇట్టిదే. అదే విధంగా ఒక శుద్ధ మనస్సు కూడా మరొక సృష్టికి ఆశ్రయ భూతమైన మనోరాజ్యమును ఎరుగుచున్నది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి...

సర్వేషాం జీవ రాశీనా మాత్మా వస్థా త్రయం శ్రితః

జాగ్రత్స్వప్న సుఘప్త్యాఖ్య మత్ర దేహోన కారణమ్ (సర్గ 18, శ్లో. 12)

ఈ జీవులందరి యొక్క 'జాగ్రత్-స్వప్న-సుషుప్తి" అవస్థలన్నిటికీ ఆశ్రయం 'ఆత్మ'యే అయివున్నది. అంతేగాని, ఈ అవస్థలన్నిటికీ ఆశ్రయం దేహం కాదు సుమా! కాని, ఈ ‘జాగ్రత్కల్పన’ అనునది దేహము లేనిచో సిద్ధించుటలేదు.

జీవాత్మ ఉంటేనే దేహం. దేహం ఉంటేనే జీవాత్మ.

ఈ విధంగా జీవాత్మకు, దేహమునకు 'అన్యోన్యాశ్రయ దోషం' సంభవిస్తోంది. అనగా జీవాత్మయే అవస్థలు.

Page:85

జీవాత్మ అంటే జాగ్రత్-స్వప్న సుషుప్తి అవస్థలు.

తరంగము కంటే జలము వేరు కానట్లు ఈ దేహము జీవాత్మకంటే భిన్నమైనది కాజాలదు. జీవాత్మ బ్రహ్మమునకు భిన్నం కాదు.

శ్రీరాముడు : తండ్రీ! తత్త్వజ్ఞాని ఇదంతా ఎట్లా దర్శిస్తున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : అతడు సుషుప్తికి ఆవల ఉన్నట్టి నిత్యనిర్లిప్త మౌనస్థితిని సర్వదా అన్ని స్థితు లందు, అన్ని వేళలందు గాంచుచున్నాడు. అట్టి స్థితికే "తురీయము అనే శాస్త్రీయనామం ఇవ్వ బడింది. అతడు అవస్థాత్రయం"లో కేవల సాక్షిత్వాన్ని తన స్వరూపంగా వహించి ఉంటున్నాడు. తన యొక్క జ్ఞానముచే చైతన్యకరమగు ఆత్మభావమును పొందుచున్నాడు. నేను జీవుడను" అను భావన నుండి సంపూర్ణముగా నివృత్తి పొందుచున్నాడు. ఇక అజ్ఞానియో, స్వకల్పనచే దేహము లందు, అట్టిదేహమునకు తారసపడే కల్పనా రూప ప్రపంచమునందు ప్రవృత్తుడగుచున్నాడు.

ద్వయోరేక స్వరూపైవ స్వసౌహర్ద నిదర్శనాత్

అజ్ఞః సుఘప్తో సంబద్దో జీవః కశ్చిత్స సర్గ భాక్ ॥ (సర్గ 18, శ్లో 15)

సుషుప్తస్థితి” అనునది మౌనం, శాంతం, ఆనందం కలిగి ఉంటోంది. మోక్షస్థితి కూడా అట్టిదే. కాని, మోక్షము నందు నిరతిశయానందము ప్రాప్తించుచున్నది. సుషుప్తస్థితి అనేది జ్ఞానికి, అజ్ఞానికి కూడా సమానమే. అయితే జ్ఞానము పొందనట్టి సుషుప్తి సహితుడైన అజ్ఞాని ఆ సుషుప్తి గతించిన తరువాత స్వప్న, జాగ్రత్తు లందు సంసారమును అనుభవిస్తున్నాడు.

ఇక జ్ఞానియో... “ఈ సంసారానుభవమంతా మొదలే అసత్యమైనది అను ఎరుక కలిగి ఉంటున్నాడు. ఇదంతా ఒక స్వప్నంలాగా అసత్తుల్యమేనని అతనికి సుస్పష్టంగా తెలిసిపోతోంది. నేను సర్వదా అఖండమగు స్వస్వరూప స్థితిలో ఉండి ఉంటున్నాను అని అతడు గ్రహిస్తున్నాడు.

జ్ఞాని స్వస్వరూపస్థితి భావనను త్యజించుటలేదు... అజ్ఞాని దృశ్యవ్యవహారంతో ఏకత్వం పొందుతూ స్వస్వరూపస్థితిని ఏమరచుచున్నాడు.

ఈ జ్ఞాని - అజ్ఞానుల భేదం ఇంతవరకే. ఇక మిగతా విషయలన్నీ యథాతథమే.

చిద్వస్తువు (Consciousness) సర్వవ్యాపియు, సర్వరూపము అయి ఉన్నది. ఆ కారణం చేతనే ఒక జీవుడు మరొకని సృష్టిలోకి ప్రవేశించగలుగుతున్నాడు. ఒక్కొక్క సృష్టియందు విభిన్నము లైనట్టి అనేక సృష్టులు ఉండగలుచున్నాయి. అనేక సృష్టులలోని ఒక్కొక్కదానిలో ఇంకెన్నో అవాంతర సృష్టి రచనలు... అరటి పువ్వులోని దళములవలె... ఏర్పడి ఉంటున్నాయి. విశాలరూపమగు బ్రహ్మము స్వభావసిద్ధంగానే ఈ సృష్టులన్నిటి యొక్క బాహ్య అభ్యంతరము లందు వ్యాపించి యున్నది. ఈ వివిధ సృష్టులలో ప్రవేశించి ఉన్నప్పటికీ, బ్రహ్మమునందు మాత్రం ఏ ఏ క్షణమందు

Page:86

ఎట్టి భేదము ఏర్పడుట లేదు. అద్దాని నిర్మలత్వము, విశుద్ధత్వము, అప్రమేయత్వము సర్వదా నిరాటంకముగానే ఏర్పడి ఉంటున్నాయి.

ఒక బీజము 'జలము సూర్యరశ్మి నేలసారము మొదలైన వాటితో సమన్వయము పొందినప్పుడు గొప్ప వృక్షమగుచున్నది. మరల ఫలాదుల ద్వారా పూర్వకాలపు బీజభావమును పొందుచున్నది. బ్రహ్మము కూడా కామ్యకర్మాదుల యొక్క సంబంధంచే మనస్సు' అను రూపము పొందుతోంది. ఫలితంగా ఈ "పుట్టుట-చచ్చుట" అను కల్పనను తనపట్ల తానే కల్పించుకుని, అనుభవించుచున్నది. మరల ఏదో సమయంలో ఆధికారమైనట్టి దేహము (Body which can be very useful instrument in attaining highest knowledge) పొందుతోంది. 'జ్ఞానార్త్' కారణంగా 'వినుట మననం చేయుట - గ్రహించుట' అను రూపము గల జ్ఞాన సంస్కారములను ఆశ్రయిస్తోంది. అట్టి ప్రయత్నముల ఉత్కృష్ట ప్రయోజనంగా ఇతఃపూర్వమే సర్వదా సిద్ధించియే ఉన్నట్టి 'బ్రహ్మస్వరూపము' మరల పొందుచున్నది.

7. బ్రహ్మము - - జగత్తు రూపంగా ప్రాప్తించటం

శ్రీ రాముడు : మహర్షీ! బ్రహ్మమే కారణముగా కలిగినట్టి ఈ జీవుడే జగత్తు రూపముగా విజృంభించుచున్నాడు కదా! అయితే అట్లు బ్రహ్మము ఖండత్వముతో కూడిన 'నేను జీవుడను' అను భావావేశం ఎందుకు ఎప్పుడు ఎట్లా పొందుచున్నది? బ్రహ్మము 'నేను బ్రహ్మమునే... నిత్యమునే... సత్యమునే...” అను స్వస్వభావమును కోల్పోయి ఈ జన్మపరంపరంలన్నింటినీ ఎందుకు తెచ్చిపెట్టుకుంటోంది? అందుకు మూలకారణమేదైనా ఒకటి ఉన్నదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మం ఈ 'జీవుడు అను భావన ఎందుకు పొందుతోంది? అనే ప్రశ్నకు "స్వయముగా ఆశ్రయించుట' అని కాక ఇంకే సమాధానం చెప్పలేం. 'మూలము అనుదానికి మూలమే లేదు’ అని మాత్రం పరిశీలనచే తప్పక తెలియ వచ్చుచున్నది. అందుచేత సర్వమునకు మూలమై, సర్వమునకు కారణమైన 'ఆత్మ' ఎట్లు కారణరహితమో, మాయ అనబడే ఈ స్వస్వరూపం నుండి ఏర్పడిన 'చ్యుతి' కూడా కారణ వర్జితమే. ఒకడు వినోదం కొరకై నాటకం దర్శిస్తున్నాడు... అనే విశేషంలో, వినోదం ఎందుకు జనించింది? అంటే ఏం చెప్పగలం? మూలమగు బ్రహ్మమునకు మూలమే లేదు.

శ్రీరాముడు : బ్రహ్మమే జగత్తు యొక్క ఉనికికి కారణము, స్థానము కూడా! అందుచేత 'జీవుడు

అగుట - జగత్తులను గాంచుట - - జ్ఞాన సముపార్జనచే పూర్ణత్వమును తిరిగి అధిరోహించుట” ఇదంతా బ్రహ్మము యొక్క స్వభావమే అయి ఉన్నదని మనం అనుకోవచ్చా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మము నందు కార్యకారణములు, జన్మకర్మలు ఎట్లా ఆపాదిస్తాం? బ్రహ్మము నందు ఏకారణత్వమునూ సిద్ధింపజేయలేం. అందుచేత 'బ్రహ్మం యొక్క స్వభావం ఇది'

Page:87

అనునదంతా కొంత సాపేక్షకతను (comparison) దృష్టిలో పెట్టుకుని, గురుశిష్య బోధ కొరకు మాత్రమే కల్పించబడుతోంది. ఎందుకంటావా? శిష్యునియొక్క "స్థితి, గతి"లను బట్టి కదా, గురువు బోధను రచించేది! బ్రహ్మము ఎల్లప్పుడూ కూడా...

1. నిర్విశేషము - అందు శేషించినదంటూ ఏదీ ఇక ఉండదు. సర్వము అధిగమించబడగా శేషించేదే బ్రహ్మము.

2. నిరాకారము - దానికి ఎట్టి ఆకార, విశేషములు ఆపాదించలేం.

3. నిర్వికారము - అద్దానియందు జీవుడు-నీవు-నేను మొదలైన వికారములు లేవు. తరంగమునకో, ఆవర్తమునకో ఆకారము ఉండవచ్చు గాని, జలమునకు ఆకారమెక్కడిది? అందుచేత "బ్రహ్మం నందు ఈ ‘కారణం’చే ఈ 'కార్యం' రూపమగు జగత్తు యొక్క ఉత్పత్తి జరుగుతోంది.... అను అసాధారణ ధర్మరూపంతో కూడిన 'ధర్మము'ను నిర్వచించలేం. ప్రతిపాదించలేం.

బ్రహ్మము నిర్వికారము, అద్వితీయము, అసంగము కదా! అందుచేత యదార్థానికి అది అకారణమే అయివున్నది. అందుచేత ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అని ప్రతిపాదించినంత మాత్రంచేత "బ్రహ్మము నందు కారణము - నిమిత్తము... సంభవిస్తున్నాయి... అను ఆరోపణ సరి కాదు. అట్లు కారణ నిమిత్తాదులు బ్రహ్మమునందు సంభవించుట అనేది బ్రహ్మము యొక్క స్వభావమునకే విరుద్ధం.

కాబట్టి ఆ కారణము, వివర్త రూపము అయినట్టి ఈ జగత్తు మిథ్యయే! అకారణమే అయివున్నది సుమా!

శ్రీరాముడు : మరిక సారరహితము, జడము, దుఃఖమయము అయిన ఈ జగత్తు గురించి విచారించి ఏం లాభం?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అందుచేతనే మనం సారభూతమగు బ్రహ్మము గురించే

విచారించటం ఉచితం.

"బ్రహ్మము నందు ఖండత్వరూపమగు 'నేను జీవుడను' అను భావన ఎందుకు ఏర్పడుతోంది? అనే ప్రశ్నను ఇప్పుడు పరిశీలిస్తున్నాం కదా! ఒకనికి ఒక వ్యాధి వచ్చింది. ఎంతో బాధను అనుభవిస్తూ, అతడు ఒక వైద్యుని సమీపించాడు. ఇతనికే ఈ వ్యాధి ఎందుకొచ్చింది? ప్రక్కవానికి రాలేదేం? ఎప్పుడు ఏమేమి ఎంతెంత తిన్నాడు? ఎందుకు తిన్నాడు... అని ఆ వైద్యుడు తాత్సారం చేస్తూ ఉంటాడా? చికిత్స వెంటనే ప్రారంభించకపోతే ఆ రోగి వ్యాధి అనుభవిస్తూనే ఉంటాడు కదా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? సరి అయిన ఔషధం రోగికి ఇవ్వటం... తద్వారా రోగనివారణ, ఉపశమనం కలగటం... ఇవి కదా ముఖ్యం! అదే విధంగా శాస్త్రములు, గురువులు కూడా "బ్రహ్మతత్వమునందు ఈ జగద్భావన ఎప్పుడు వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది... అను తర్జన - భర్జనలకన్నా కూడా...

Page:88

జీవుడు బ్రహ్మమే స్వరూపముగా కలిగియున్నాడు, కాని భ్రమ చేత జగద్భావమును తీవ్రముగా పొంది దుఃఖాదుల అనుభవపరంపరలు పొందుచున్నాడు. బ్రహ్మమే స్వరూపముగాగల ఈ జీవుని యందు 'నేను జనన-మరణ రహితుడను' అను ఎరుక ఏర్పరచుట ఎట్లు? ఇతడు తనను బ్రహ్మముగా గ్రహించుట ఎట్లు?... అను విషయమునే తరచు పరిశీలించి, ఉపనిషత్తుల వంటి ఉత్కృష్ట శాస్త్రముల ద్వారా ఆయా ఉపాయాదులను ప్రతిపాదించటం జరుగుతోంది. అందుచేత, బ్రహ్మమే సదా విచారించబడు గాక!

విత్తనం మహావృక్షమవటం, బ్రహ్మము జీవుడుగా అవటం -

1. బీజము దేశకాలాదుల సహాయంచే మహావృక్షమగుచున్నది.

2. బ్రహ్మము దేశకాలాదులను అంగీకరించి జీవుడుగా భాసిస్తోంది.

ఈ రెండింటినీ ఉపమాన, ఉపమేయాలుగా ఉదహరించేటప్పుడు, ఒక భేదం గమనించాలి. బీజం తన ఆకారాన్ని కోల్పోయి ఆయా 'ఆకులు, కొమ్మలు' మొదలైన రూపములన్నీ పొందుతోంది కదా! కానీ, బ్రహ్మం తన స్వరూపాన్ని త్యజించకుండానే ఈ "జగత్ దృశ్యము... అను రూపంగా ప్రకటితమౌతుంది. అయితే, బీజమే 'అంకురము" అగుచున్నట్లు బ్రహ్మమే ఈ ద్రష్ట - దర్శనం -దృశ్యం అను వ్యవహారంగా రూపుదిద్దుకుంటోంది. కాబట్టి బీజాంకురన్యాయము "బ్రహ్మము - జీవుడు-దృశ్యములకు తగియే ఉంటోంది.

శ్రీరాముడు : బీజములో ఉన్నదంతా ఆకారసహితమైయున్నది. కాని బ్రహ్మమో, 'ఆకారము' అనబడే వికారమే కలిగియుండలేదు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, అందుచేత "బ్రహ్మము బీజము వంటిదే అనే ఉత్ప్రేక్ష సమగ్రం కాదని మనం అనుకున్నాం. బ్రహ్మముతోటి పోల్చతగినదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు.

బీజస్యాకృతి మత్సర్వం తేనానాకృతిమత్సదమ్ | నీయుజ్యతే సమాకర్తుం తస్మాన్నాస్త్యుపమాశివే ॥ (సర్గ 18, శ్లో. 25)

బ్రహ్మము తనకు సమానము తానే అగుచున్నది. అది మరింకే వస్తువువంటిది కాదు.

సూక్ష్మదృష్టితో చూచినప్పుడు ఈ జగత్తు ఉత్పన్నమైనది కాదు" అని తెలియవస్తోంది. అట్లాగే “ఇది ఉత్పన్నము కానేలేదు అని కూడా అనలేము. అయితే భావన ఏర్పడిన తరువాతనే జగత్తు ఉనికిని సంతరించుకుంటోంది. దృశ్యము అనబడేది అనిర్వచనీయమై, జీవునిచే (లేక) బ్రహ్మముచే స్వయంకల్పితమై ఏర్పడుచున్నదని గ్రహించు.

కల్పన ఉంటే... జగత్తు కూడా ఉంటోంది. కల్పన లేనప్పుడో... జగత్తు కూడా సర్వదా “లేనిదే” అగుచున్నది.

దృశ్యమ్ పశ్చన్, శ్వమాత్మానం న ద్రష్టా సంప్రపశ్యతి| ప్రపంచాక్రాంత సంవిత్తే, కస్య ఉదేతి నిజాస్థితిః? (సర్గ 18, శ్లో. 27)

Page:89

ఒక ద్రష్ట ఈ దృశ్యమును చూడటం జరుగుచున్నప్పుడు తన యొక్క ఆత్మ స్వరూపమును గాంచుటలేదు. ఎందుకంటే, ఆ సమయంలో అతని జ్ఞానము ప్రాపంచిక విషయ వాసనలచే ఆక్రమించబడటం జరుగుతోంది. అందుచేత స్వస్వరూపమునందు 'స్థితి, నిష్టలు ఏర్పడుట లేదు. ఫలితం ఏమిటి? ఏదైతే ఏ క్షణంలో కూడా కాకయే ఉన్నాడో, దేనికైతే ఏ మాత్రం సంబంధించకయే ఉన్నాడో... అట్టి దాని యందు (దృశ్య వ్యవహారము నందు) అతనికి నిమగ్న పూర్వకమైన అనుభవం కలుగుతోంది. ఇక నిజస్థితిలో ఉండగలిగేది ఎట్లు? ఎన్నటికీ?

ఒక ప్రశ్న. ఒకడు మృగతృష్ణను చూస్తున్నప్పుడు జలము యొక్క భ్రాంతిని పొందుచున్నాడు కదా! ఆ క్షణాలలో, "ఈ విశాల ప్రదేశంలో అకస్మాత్తుగా ఈ సమయంలో జలం ఎక్కడి నుండి వస్తుంది? సూర్యరశ్మి గాలివీచికలు - - క్రీనీడలు - ఈ మూడిటి సమన్వయమే ఇట్లు జల తరంగముల వలె నాకు కనబడుతోంది... అనే సత్యజ్ఞానం ఏ మూలకో వెళ్తుంది.

ఎండమావులు గురించి “క్రీనీడే కదా...” అనే పరిజ్ఞానం ఉండి ఉన్నప్పుడు, “ఇది జలం” అనే దృష్టి ఏమౌతోంది? వికర్షితమైపోతోంది కదా! భ్రమలో ఉన్నప్పుడు ఇది మృగతృష్ణ మాత్రమే. ఇక్కడ తటాకము ఉండజాలదు... అనే విషయం జ్ఞాపకానికి రావటం లేదు.

ఒకటి రెండవ దానిని కనబడకుండా చేస్తోంది కదా!

మాయాదృష్టిచే ఆత్మ”, సత్యదృష్టిచే జగత్తు... లేనివే అగుచున్నాయి.

ద్రష్ట యొక్క కళ్ళే (దృష్టిత్వమే) ఆకాశము వలె విశాలమైన స్వరూపము కలిగినవై ఉంటున్నాయి. సర్వత్రా వ్యాపించినదై సర్వమును ప్రకాశింపజేయుచున్నాయి. ఈ చూపు సర్వ పదార్ధములను గాంచగలుగుచున్నది. అయితే ఇన్ని విషయములను చూచుచు, గుర్తించుచున్నట్టి ఆ చూపు తనను తాను మాత్రం దర్శించలేకపోతోంది. ఏమి చమత్కారం? మాయాభ్రమ ఎంతటి ప్రబలమైనదో కదా! చూచేవాని యొక్క చూపుకు ఆ చూచేవాడు కనిపించటంలేదు. కానీ, చూడబడేదంతా కనిపిస్తున్నది చూచే వానిలోనే!

తన యందు తాను ఎట్టి భ్రమను కలిగి యుండనట్టి జీవుణ్ణి మనం ముక్తపురుషుడు” అని పిలుస్తున్నాం. అట్టి ముక్తపురుషుడు దృశ్యరూపమైనట్టి ఈ ద్వైతమును కాకుండా, సర్వేసర్వత్రా ఆత్మనే గాంచుచున్నాడు. దృశ్యమును స్వస్వరూపాత్మ విశేషంగా సందర్శిస్తున్నాడు. కాని తన యందు మాయను పొందుచున్న ద్రష్టకో, ఈ జగత్తు బాహ్యమున ఇంద్రియ విషయమాత్రమై ఘనీభూతమై ప్రాప్తిస్తోంది.

ఆకాశము వలె సర్వవ్యాపకమైనట్టి ఈ ద్రష్ట తన యొక్క పరమార్థ స్వరూపమును గాని, తన వంటిదే అయి వున్న ఇతరుల పరమార్థ స్వరూపమును గాని గాంచుట లేదు. బ్రహ్మం ఆకాశం వలె అన్నివైపుల, సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ జీవులు ఎంతో ప్రయత్నం చేసిన తరువాత కూడా అట్టి బ్రహ్మమును దర్శించలేకపోతున్నారు. ఎందుచేత? ఈ దృశ్యమును దృశ్యరూపముగా చూచునంతవరకు బ్రహ్మ స్వరూపప్రాప్తి అత్యంత దూరముగా ఉన్నదే అగుచున్నది.

Page:90

ఇందుకు ఒక లౌకికమైన దృష్టాంతము చెపుతాను విను. ఒకచోట, 'కుండ' మొదలైన కొన్ని పదార్థాలు ఉన్నాయి... ఒక వ్యక్తి చూపు అటు పడింది. కంటిపాపలో వస్తువులు ప్రతిబింబించి నంత మాత్రం చేత ఆ వ్యక్తి వాటిని చూడగలడా? లేదు. ఆ కనుల వెనుక ద్రష్ట ఉన్నాడు. ద్రష్ట వృత్తిని పొందితేనే దృశ్యము పొందబడుతోంది. అయితే, ఆ ద్రష్ట ఆయా వృత్తులను పొందినంత మాత్రంచేత విచ్ఛిన్నుడు అయ్యేవాడు కాదు. అతడు వాస్తవానికి సాక్షితత్వమై, దృష్టిని కూడా వెలిగించుచున్నవాడై ఉంటున్నాడు. అట్టి ద్రష్ట దృశ్య విషయస్వరూపము పొందినప్పుడు మాత్రమే కుండ మొదలైనవి తనయందు ప్రకాశింపజేస్తున్నాడు. ఆ ద్రష్ట విషయరూపత్వమే పొందుట లేదనుకో... అప్పుడేమౌతుంది...? ఆ పదార్థముల అనుభవం ద్రష్టకు సాక్షాత్కారం కాదు. అప్పుడు “ఈ పదార్థము ఇది, ఇట్టిది"... అను అనుభవమే ఉండదు. ఈ దృశ్యము, బ్రహ్మము ఈ రెండిటి యొక్క అనుభవప్రాప్తి ఇట్టివే!

జీవుని యందు వృత్తి' మరల మరల విషయరూపత్వము పొందుతోంది. అట్టి ఆ వృత్తిని విషయత్వము నుండి వేరు చేసి సూక్ష్మమైన బుద్ధి సహాయంతో కేవల పరమాత్మ స్వరూపము” నందు లయింపజేయాలి. ఇది కష్టతరమైన విషయమైనప్పటికీ అభ్యాసముచే ఈ ప్రపంచములో అన్నీ సులభం అవుతాయి కదా! ఈ జగత్తులో తారసపడుచున్న 'నేను - నీవు - అది - ఇది... మొదలైనవన్నీ స్వస్వరూపమే అయివున్న ఆత్మకంటే వేరైనవి కావు... అని నిరంతర నిశ్చయము కలిగియుండటమనేది క్రమక్రమంగా చేసే అభ్యాసంచేత తప్పక సాధ్యమే. ఎందుకంటే, సత్యము అదియే కదా! సత్యమేవ జయతే!

శ్రీరాముడు : అనేక లౌకిక వ్యవహారములు నిర్వర్తించుటలో నిమగ్నమై యున్న మాకు అట్టి అభ్యాసం సాధ్యమేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రవాహపతితములగు ఆయా కార్యములను ఆసక్తిరహితంగా (without attachment) నిర్వర్తిస్తూ ఉండే వారికి అట్టి ఆత్మ దృష్టి సులభమే అవుతుంది. ఓ సర్వ సభికులారా! సర్వజనులారా! మీరంతా అట్టి మహత్తరమగు ఆత్మదృష్టి కలిగియుండుటకే ప్రయత్నం చేయండి. “అఖండము, నిత్యము అగు ఆత్మయే నేను" అను భావన కలిగి యుండుటలో ఏమి కష్టమున్నది? అట్టి భావనను మననపూర్వకంగా ధరించి, ఆపై లౌకిక జగత్తులో ఏది ఎట్లు ఉచితమో, అట్లే నిర్వర్తించండి. దీని వలన మీకు శుభమే జరుగుతుంది. అన్ని వేసటలు తొలగిపోతాయి.

ఓ రామచంద్రా! ఈ దృశ్యమైతే కనిపిస్తోంది. కాని ద్రష్ట కనిపిస్తున్నాడా? లేదు కదా! ఈ భౌతిక శరీరము ద్రష్టచే వెలిగించబడుచున్నది మాత్రమే కాని, స్వయముగా ద్రష్ట కాదు. దృశ్యంచ దృశ్యతే తేన, ద్రష్టా? రామ! నపశ్యతే

ద్రద్దైవ సంభవతి ఏకో! నతు దృశ్యమ్ ఇహ అస్తిహి ||

యథార్థానికి 'ద్రష్ట' మాత్రమే ఉన్నాడు. దృశ్యము ఏ మాత్రము లేనే లేదు. ద్రష్ట ఈ దృశ్యములో దేనిని ఎట్లు సంభావన చేస్తాడో, అది ఆ రూపముగానే సంప్రాప్తిస్తూ ఉంటోంది.

Page:91

స్వయముగా "సర్వస్వరూపుడు అయి ఉండుటచే 'ద్రష్ట'యే దృశ్యరూపముగా ప్రసరించి ఉంటున్నాడు.

శ్రీరాముడు : ఈ దృశ్యములో కనబడుచున్న ద్రష్టలు ఇందలి ఏ కారణంగా ఏర్పడుచున్నారు? శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దృశ్యమంతా స్వస్వరూపానుభూతమే సుమా! అట్టి ఆ దృశ్యంలో ఏదో క్రియలచే ద్రష్ట ఏర్పడటం అనేది అత్యంత అసంగతం.

దృశ్యము స్వతహాగా, నీ కంటే వేరుగా లేనే లేదు. ఇక 'ద్రష్టత్వము' నీ కంటే వేరుగా ఎక్కడుంటుంది.

కాబట్టి దృశ్యము ఎట్లు అవాస్తవమో, ద్రష్టత్వము కూడా అట్లే అవాస్తవము. ఈ దృశ్య -

ద్రష్టత్వములకు ఆవల రెండింటికీ అతీతమై నీ యొక్క స్వస్వరూపము నిశ్చలమై ఉన్నది. ఆ స్వస్వరూపమే అఖండమై, అద్వితీయమై, సర్వత్రా వ్యాపించినదైయున్నది. అయితే, పదార్థదృష్టిని (perception of matter), తద్వారా ద్రష్టత్వము (the stance of perceiver) ను విడనాడక పోవుట చేతనే ఈ జీవునకు నిత్యసత్యమగు ఆత్మతత్త్వము అనుభవమగుటలేదు. ద్రష్టత్వము, దృశ్యములను అధిగమించిన అవగాహన పెంపొందించుకొనువారికి దృశ్యము నా స్వరూపమే” అను భావన సులభమే అగుచున్నది.

8. చిత్తము - జగత్తులు

శ్రీరాముడు : అయితే మునీంద్రా! 'సర్వశక్తిమంతుడగు రాజు' లాగా ఈ ఆత్మయే దృశ్యమును సంపాదించి, అట్టి దృశ్యమునకు తనకుతానై ద్రష్టత్వము వహించుచున్నదని అనవచ్చునా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అంతాకూడా ఆత్మచే తనకొరకు తానే నిర్మించుకొనుచున్నదే అని అనక తప్పదు. ఆత్మ తన యొక్క ఇతరములైన అపేక్షలన్నీ లేకుండా కేవలం ఒక పదార్థమును (విషయమును ఆశ్రయించినప్పుడు ఆ పదార్థమునే అనుభవించుచు, అట్టి రూపముగానే ఉదయించుచున్నది.

ప్రకృతిలోని 'మాధుర్యము' అను రసము యొక్క ఉల్లాసమే పటికబెల్లం రూపమును పొందుతోంది. అదే మాధుర్యము తనయొక్క రసరూపత్వము త్యజించకుండానే "ఫలములుపుష్పములు-లతలు మొదలైనవాటియందు అంతర్లీనమై ఉంటోంది. అదే విధంగా...

చిత్ (Awareness) అను ఉల్లాసము రూపముగాగల ఈ జీవుడు ఈ 'దేహములు’ మొదలైన రూపమును పొందుచున్నాడు. ఈ ద్రష్ట తనయొక్క చిత్స్వరూపమును త్యజించకుండానే, ద్రష్ట-దర్శనము”లుగా అగుచున్నాడు. తనయందు 'జాగ్రత్తు' అను స్వప్నమును గాంచుచున్నాడు.

“ఈ ‘ఉప్పు ఖండములు' ఇతఃపూర్వం ఎక్కడ ఉండి ఉన్నాయి?" అను ప్రశ్నకు సమాధానం ఇవి 'లవణము' అను రసము రూపమున జలమునందే ఉండి ఉండేవి అని చెప్పాలి కదా! అదే విధంగా ఆత్మయందే అహంకారము మొదలైనవి ఉండి ఉన్నాయి.