Page:192
అందుచేత 'అప్రబుద్ధుడు', అర్ధప్రబుద్ధుడు అయిన శిష్యునకు మొట్టమొదట శమము, దమము (Discipline of one's own internal and external Avocations) అభ్యసించేటట్లు చేయాలి. అప్పుడు అతని దృష్టి, అవగాహన, ఆర్తి, పరిలక్ష్యములు... ఇవన్నీ పరిశుద్ధత పొందుతాయి. అటుపై 'తత్ త్వమ్' 'జీవోబ్రహ్మేతినాపర” మొదలైన ఆత్మతత్వప్రతిపాదకమగు వాక్యాలు సోదాహరణ పూర్వకంగా విశ్లేషించి చెప్పాలి. అర్ధప్రబుద్ధుడగు శిష్యునికి 'ఈ జగత్తు లేదు... అందుచేత దీనిని నీ హృదయమునందు రహితం చేయి... అందుకుగాను ఉత్తమ ఆచరణ పరుడవు. స్వధర్మపరుడవు కావాలి”... అని చెప్పుచూపోతే, అతనిని తికమకపరచినట్లే అవుతుంది. అపరిపక్వ దృష్టిగల శిష్యుడు గురువు చెప్పినదానికి పెడార్థం ఇచ్చి, చివరకు మహాజాలంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. శిష్యులలో కొందరు ప్రబుద్ధులై ఉంటారు. ఉత్తమమైన అర్థమును అనుద్వేగపూర్వకంగా గ్రహించి ఆకళింపు చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు. 'భోగేచ్ఛ - లోభ మోహములు’... మొదలైన దుష్ప్రవృత్తిని త్యజించి ఉంటారు. అతడి ముందు ప్రతిపాదించబడిన 'పరమసత్యము' గురించిన సమాధానం పవిత్రత పొందుతోంది. “నాయనా! ఈ నేను నీవు ఈ జగత్తు, ఇందలి జన్మ కర్మలు ఇదంతా బ్రహ్మము కంటే వేరైనవి కాదు. దీనంతటికి బ్రహ్మమే మూలము. ఇకముందు కూడా పరమేశ్వర తత్త్వమునకు వేరుగా ఏదీ ఎక్కడా ఉండజాలదు”... అని అర్హుడగు శిష్యునికి మాత్రమే బోధించటం సాధ్యపడుతుంది. అనింద్యమైన అవగాహన గల శిష్యుడు అది వింటున్నప్పుడు “నేను ఇది కాదు.. నేను ఇది”... అను సత్యమునకు సంబంధించిన అనుభవమును పొందుతాడు. మిక్కిలి మూఢబుద్ధిగల శిష్యుని సరిగ్గా పరీక్షించకుండానే “జగత్తు మిథ్య... సర్వము కల్పనయే.. బంధ మోక్షములు లేవు"... అని చెప్పటం చేత అల్పమేధస్సుగల శిష్యుడు అప్రతిష్ఠాకరమగు మార్గమును ఎంచుకొనుటకు, కొంచెం అవకాశం ఉండవచ్చు. “నీ ఇష్టం వచ్చినట్లు సంచరించవచ్చు" అని బోధసారమైనట్లు అనుకోవటానికి అది దోహదం చేయవచ్చు. ఎందుకంటే అట్టి శిష్యుడు తన ఉత్తమ అభ్యాసం నుండి విరమించు అవకాశం ఉన్నది.
సరే, ఉత్తముడగు ఈ నా శిష్యుడు రామచంద్రునికి అజ్ఞానాంధకారం నశింపజేసే పరమోత్కృష్ట సత్యము బోధిస్తాను.
88
ఇట్లు యోచించి శ్రీ వసిష్ఠ మహర్షి రామచంద్రుని సంబోధించటం మరల కొనసాగించారు.
Page:193
8. ఆత్మయొక్క ఔన్నత్యం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ జగత్తు దోషభూయిష్ఠమైనది. ఈ జగత్తే బ్రహ్మము.
ఈ విధంగా సిద్ధాంతాలు వేరు వేరు కోణాల నుండి ప్రవచించబడుచున్నాయి కదా! ఇదంతా కూడా, గురువు శిష్యునికి, భగవంతుని నిర్వచనము బోధించేటప్పుడు ప్రతిపాదించబడుచున్నది. ఈ అనేక విశేషములతో కూడిన రెండు రకములైన సిద్ధాంతములను విమర్శిస్తూ పోగా... ఈ జగత్తు వాస్తవానికి ఏది అయివున్నదో... శిష్యుడు దోషరహితమైన 'స్వబుద్ధి'తో గ్రహించ గలుగుతాడు. లోకంలో గురు-శిష్యవ్యవహారమంతా ఇట్లే ఒనగూడుతోంది.
బ్రహ్మము... “సర్వశక్తిమంతము, సర్వవ్యాపకము, సర్వవస్తువులందు ప్రత్యక్షము”... అయి ఉన్నది. నీవు ఐంద్రజాలికులను చూచే ఉంటావు. వారు మాయచే అనేక క్రియల ద్వారా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆత్మ వాస్తవానికి మాయారహితము అయిఉన్నది. కానీ, మాయామయముగా అగుచున్నది. గొప్ప ఐంద్రజాలికుని వలె మట్టిని కుండగా, ప్రత్తిని వస్త్రముగా చేసి చూపుతున్నది. ఆకాశమునందు పూలతోటను, కొండపై జలాశయమును కల్పించగల ఈ ఆత్మయొక్క అపూర్వశక్తిని నిర్వచించి నిర్ధేశించేదెవ్వరు?
కల్పనావిశేషం చేత తాను ఉన్నచోటే భవిష్యత్ ఆకాశంలోని నగర నిర్మాణం చేస్తోంది. ఆకాశంలో నీలత్వం తొలగించి అక్కడ పృథ్వీతలమును నిర్మిస్తోంది. భూతలములో ఆకాశమును స్థాపిస్తోంది.
ఎఱ్ఱటి పద్మరాగమణిలో ప్రతిబింబించే ఆకాశం ఎఱుపురంగుతోనే ప్రకాశిస్తూ ఉంటుంది కదా! అట్లే ఈ జగత్తులో “ఉత్పన్నం అయినది,... ఉత్పన్నం కానున్నది” అంతా కూడా స్వతహాగా అసత్తే అయి ఉన్నది. బ్రహ్మము యొక్క సత్తచేతనే ఈ జగత్తు సత్తువలె అనుభూత మగుచున్నది.
ఈశ్వరుడు (లేక, ఈశ్వరస్వరూపుడగు జీవుడు) స్వతహాగా అవ్యక్తరూపుడే అయినప్పటికీ విచిత్ర రూపమున తనను తాను ప్రదర్శించుచున్నాడు. ఎట్లా అంటావా?... స్వప్నంలో వస్తుజాలం అనుభవమవడం మనం చూస్తున్నాము కదా! స్వప్నద్రష్ట స్వయంకల్పితము, ఊహాజనితము అగు వస్తువులను, మనుష్యులను కల్పన చేసుకొని “ఇదంతా వాస్తవమే” అని తలచి, ఆ స్వప్నంలో సుఖ దుఃఖాదులన్నీ అనుభవిస్తున్నాడు.
అసలు ఈ జీవుడెవడు? "నేను...ఇది... శరీరము” మొదలైనవన్నీ తెలుసుకుంటున్నట్టి అవ్యక్తమగు ప్రజ్ఞరూపమే ఇతడు కదా! అయినప్పటికీ, ఇతడు కాళ్ళు - చేతులు కన్నులు
మొదలైనవాటితో కనబడుచున్నాడు.
ఇదే రీతిగా సర్వాత్మకమగు ఆత్మవస్తువు సర్వకాలములందు, సర్వత్రా, సర్వరూపమున సంభవత్వము పొందుతోంది. ఒకే ఆత్మ వస్తువు ఇంతకు ముందు జన్మించిన సర్వుల రూపమున,
Page:194
ఇప్పుడు నీవు, నేను, ఈ సభికులు, తదితరులు రూపమున, ఇకముందు ఇట్లే అనేక భవిష్యత్ జీవుల రూపమున ప్రకటితమగుచున్నది.
ఇక హర్షామర్షములకు తావెక్కడిది? ఎవరికి?.... సమత్వమును అధిరోహించిన జ్ఞాని ఎన్నటికీ విస్మయమునుగాని, గర్వముగాని, సమ్మోహమును గాని, హర్ష-శోక-వికారములను గాని పొందడు. ధీరుడైనవాడు సర్వదా సమరూపమును ఆశ్రయించి ఉంటున్నాడు.
అనంత దేశ, కాల యుక్తమగు ఆత్మయందు విచిత్రమగు దృశ్యరచనాశక్తి కనిపిస్తోంది. ఆత్మయే యత్నపూర్వకంగా అనేక ఫలితములతో, ప్రయోజనములతో కూడిన రచన యొక్క కల్పన సాగిస్తోంది. సముద్రము తనయందలి తరంగములను తిరస్కరిస్తోందా...? లేదు కదా! ఆత్మ కూడా తన ఈ అద్భుతమైన సృష్టి రచనను తిరస్కరించుటలేదు.
ఆత్మయందు ఈ జగశ్శక్తులు ఎట్లా ఉండి ఉంటున్నాయి?... పాలలో నేయిలాగా... మట్టిలో భవిష్యత్ లో ఏర్పడగల కుండలాగా... దారమునందు వస్త్రములాగా... ఒక చిన్న మఱివిత్తనంలో మహావృక్షంలాగా... ఆత్మయందు సర్వశక్తులు వ్యక్తావ్యక్తంగా స్థితి కలిగి ఉంటూ, ఒకప్పుడు వ్యవహారవంతము అగుచున్నాయి. వ్యక్తమగుచున్నాయి.
నీరు ఒకప్పుడు నిశ్చలంగా ఉంటోంది. ఎప్పుడో ఆ నీటిలో తరంగాలు ఏర్పడుచున్నాయి. మరొకప్పుడు అదే నీరు తిరిగి నిశ్చలత్వం పొందుతోంది. అయితే అనేక ఆకారాలతో కనిపిస్తున్న తరంగాలు జలం కంటే వేరైనది ఎప్పుడు? ఎప్పుడూ లేదు. అట్లాగే, బ్రహ్మం కంటే ఈ 'నేను-నీవు -ఆకాశం-పృథివి-కాలం-దూరం'... మొదలైన వాటితో కూడిన ఈ జగత్ రచన వేరైనది
కానేకాదు.
“నాత్ర కశ్చిత్ కర్తా, నభోక్తా, నవినాశమేతి”
ఈ ప్రపంచమునకు కర్త గాని, భోక్త గాని ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏమాత్రం వినాశనము పొందుటయే లేదు. కేవలం సాక్షిస్వరూపము, నిరామయము, సమరూపము, నిత్యము, సంక్షోభ రహితము అయినట్టి ‘ఆత్మతత్వము' నందే ఈ విధంగా అంతా సిద్ధించుచున్నది.
దీపం ఉంటే చాలు, ప్రకాశం ఉంటుంది. సూర్యుడు ఉంటే చాలు, పగలు ఏర్పడుతోంది. పుష్పం ఉంటే చాలు, సుగంధం ఉంటోంది. అధిష్ఠానమగు చైతన్యము ఉండుటచేతనే ఈ జగత్తు స్వయంగా ఉత్పన్నమగుచున్నది.
వాయువు నందు స్పందన ఉన్నది. అయితే ఆ స్పందనకు వాయువు కంటే వేరైన ఉనికి ఉన్నదా? లేదు. అట్లాగే నీకు ఎదురుగా కనబడుచున్న “ఈ జగత్తు బ్రహ్మము యొక్క అభాస మాత్రమే”... అని గ్రహించు. అనగా, బ్రహ్మమే స్వకీయకల్పనచే ఇంద్రియాత్మకమైన తాదాత్మ్యం యొక్క ప్రయోజనంగా ఇట్లు, జగత్తు లేక దృశ్యముగా ప్రాప్తిస్తున్నది. ఇంద్రియ మాత్ర భావన యందు ఆరూఢుమైవున్నవాడు ఇక్కడ అనేక వస్తు సమూహములను జన సమూహములను
Page:195
గాంచుచున్నాడు. "ప్రియము-అప్రియము”లతో కూడిన భావనయే “సత్యం అసత్యం”ల మధ్య సుఖ దుఃఖానుభవాలుగా ప్రకటితం అగుచున్నది. ఇక్కడ కనబడుచున్నదంతా సత్తు కాదు. అసత్తు
కూడా కాదు.
T
ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గ్రహించు. ఈ అనేక జగద్భావనలు వాయువీచికల వలె వచ్చి పోతూ ఉండవచ్చు గాక! అయితే, ఆత్మయొక్క సన్నిధాన ప్రభావంచేతనే ఈ జగద్దోషములు కూడా ఉనికిని కలిగి ఉంటున్నాయి. ఏది ఏమైనా, ఆత్మను ఇవేవీ స్పృశించుట లేదు. భగవానుడగు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సర్వమునకు వేరుగా, సర్వమునకు సాక్షీభూతుడై పరమాత్మస్థితి యందే శాశ్వతతత్వమై ఉండి ఉంటున్నాడు. అతనికి ఏ కర్తవ్యాకర్తవ్యములు లేవు. “నా స్వరూపము అట్టి సాక్షీభూతమగు పరమాత్మతత్త్వము కాదు. మరింకేదో అయివున్నది"... అని భావించుట చేతనే సర్వ రకములైన దోషములు వచ్చి పడుచున్నాయి.
లయమైన దానిని సృష్టించేది, సృష్టించినదానిని లయం చేసేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యందు ఈ జగత్ శక్తి ఒకప్పుడు పరిపూర్ణముగా, మరొకప్పుడు అల్పముగా వ్యక్తం అగుచూ ఉంటోంది. ఇంకొకప్పుడు అసలు వ్యక్తమే అగుటలేదు.
శ్రీరాముడు: హే మహర్షీ! ఇక్కడ నశించుచున్నదేది? స్థితి కలిగి వుంటున్నదేది? ఈ వస్తుజాల మంతా ఆత్మనుండే ఉత్పన్నము అగుచున్నదా? లేక, మరెక్కడి నుంచోనా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఆత్మస్వరూపము కాని వస్తువే నశిస్తుంది... ఆత్మస్వరూపము అయినది ఎట్లా నశిస్తుంది?... ఆత్మ స్వరూపమైనది మాత్రమే స్థితి కలిగి ఉంటుంది... ఆత్మ స్వరూపము కానిది స్థితి ఎట్లా కలిగి ఉంటుంది?
జీవుడు స్వకీయమైన అజ్ఞానముచే (బుద్ధి యొక్క అకుశలత్వం కారణంగా ఆ తత్వమును అనేక వస్తుజాలము వలె దర్శించుచున్నాడు. ఈ వస్తుజాలమంతా ఆత్మ యొక్క స్వరూపమే అయి ఉండగా, ఇక "ఆత్మ నుండి ఇవి ఎట్లా ఉత్పన్నమైనాయి?” - అనే ప్రశ్నయే ఉదయించదుకదా!
ఓ రామా! "సమ్యక్ జ్ఞానము” అనే శక్తిని ముందుగా సంపాదించు. అప్పుడు "బ్రహ్మము నుండే ఈ సర్వము ఉత్పన్నమౌతున్నాయి” అని గ్రహిస్తావు. సూర్యకిరణములు అనేకమైనప్పటికీ, అవి సూర్యుని నుండి వేరు కాదు కదా! ఒక కిరణము ఒక వస్తువుపై, మరొక కిరణము కొండపై, వేరొక కిరణము జంతువుపై, ఇంకొక కిరణము గోడపై... ఇట్లు వేరు వేరు కిరణములు వేరు వేరు చోట్ల ప్రసరిస్తూ ఉండవచ్చు గాక! సర్వకిరణములకు సూర్యుడే ఉత్పత్తి స్థానమైనట్లు, ఈ 'సర్వము, సర్వులు’ బ్రహ్మమునే ఉత్పత్తి స్థానంగా కలిగి ఉంటున్నారు.
పరామర్థ సత్యమగు "చిత్స్వరూపబలం ఎరుక యొక్క అభినివేశము (The dynamics of knowing)” చేతనే ఈ జగత్తు దృశ్యమానమౌతోంది.
Page:196
అవిద్య, పదార్థములు... ఈ రెండూ ఒకే క్షణంలో బ్రహ్మమునందు ఉదయిస్తున్నాయి. అట్లు ఉదయించి ఆ రెండూ కూడా వేలాది శాఖలతో విచిత్రములైన శుభ, అశుభ ఫలములచే ఒప్పుచున్నాయి.
చూచావా రాఘవా! సంసారం అనేక ఆశలతో, భయంకర దుఃఖకరాలైన ప్రయోజనాలతో, భోగ, వృద్ధ అవస్థలతో కూడి ఉంటోంది. ఫలితంగా ఇది ఆత్మకు బంధస్థానమగుచున్నది.
ఈ సంసార వృక్షమును 'వివేకము' అనే ఖడ్గముతో ఖండించివేయాలి. "సంసారముగా అనుభవమయ్యేదంతా స్వస్వరూప విన్యాస చమత్కారమే!”.... అను అవగాహనచే సందర్శిం చటమే ఇప్పుడు ఉపాయం. ఎందుకంటే, ఉన్న సత్యం అదే కాబట్టి!
తాళ్ళు తెంచుకున్న గజరాజు ఏంచేస్తాడు? హాయిగా సువిశాలమగు వనం వైపు పరుగులు తీస్తాడు కదా! నీవు కూడా ఈ సంసారము నుండి 'వివేకము' యొక్క సహాయం చేత విడువడుము. ప్రశాంతముగా, గంభీరముగా సర్వము గ్రహించినవాడవై నిశ్చింతుడవగుము.
9. ఇదంతా కూడా బ్రహ్మమే
శ్రీరాముడు: మునీంద్రా! "బ్రహ్మపదమే” ఈ సర్వజీవుల యొక్క వాస్తవ స్థితి కదా! అసలు “జీవత్వము”, “విచిత్రజీవుల ఉత్పత్తి” అనునవి బ్రహ్మపదమునందు ఎట్లు, ఏ ప్రకారంగా, ఎన్ని విధములుగా ఎందుకు సంభవిస్తోందో సవిస్తరంగా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి ఈ చిత్ర విచిత్రములైన జీవజాతులన్నీ... ఎట్లు ఉత్పన్నమౌతున్నాయో, స్థితి కలిగి ఉంటున్నాయో, నశిస్తున్నాయో, ముక్తిని పొందుచున్నాయో సంక్షిప్తంగా చెపుతాను... వినుబ్రహ్మం స్వతహాగా విషయరహితమైనది. అయ్యది సర్వశక్తి స్వరూపం, నిర్మలం కూడా! అట్టి బ్రహ్మం నందు జలంలో ఆవర్తం వలె 'చిత్శక్తి' రూపం పొందుతోంది. ఆవర్తంచే ఏర్పడిన ఆకారాదులు జలం కంటే వేరు కానట్లు, ఈ 'చిత్శక్తి' బ్రహ్మం కంటే వేరు కాదు. బ్రహ్మమునకు చెందినదే అయివున్నది.
అట్టి 'చితశక్తి' తన యొక్క 'సంకల్పించుట' అను స్వభావముచే మొట్టమొదట కించిత్ స్ఫురణను ఆశ్రయించి బ్రహ్మమొదలగు ప్రారంభ సృష్టికర్తల దేహరూపమును పొందుచున్నది. అనగా, స్వల్పముగా విషయాకారము పొందుచున్నది. అట్టి 'సంకల్పముల సమూహము' యొక్క బలముచే చైతన్యము ఘనత్వము చెందుచున్నది. అట్టి ఘనత్వముచే...“జీవము - మనస్సు” అను ఉపాధిరూపములుగా భావన చెందుచున్నది.
ఈ విధంగా బ్రహ్మము మనస్సు యొక్క సంకల్పమాత్రం చేత తన యొక్క బ్రహ్మస్వరూప మగు “దృక్’ రూపమును త్యజించి 'ద్రష్ట" అను కర్తృత్వముతో కూడిన స్థితిని ఆశ్రయిస్తోంది.
Page:197
“నేను ద్రష్టను”... “ఇది దృశ్యం”... “ఇది నాకు చెందినది”... వంటి భావాలు బ్రహ్మం పొందుతోంది. అయితే అది సంకల్పములు పొందుతూ ఉన్నప్పటికీ అంతమాత్రం చేత సంకల్పము లకు ఆవల ఉన్న తన స్వరూపమగు ఆత్మను పోగొట్టుకొనుచున్నదా? లేనేలేదు. అది తనను తాను ఏ క్షణమందు త్యజించుటలేదు. కాని త్యజించినదానివలె, “అసత్తే”.... అయినట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తోంది.
చిత్స్వరూపము అంతటా ప్రకాశిస్తూనే ఉన్నది. కాని బాహ్యదృష్టి కలిగియున్నప్పుడు శూన్యం వలె అగుచున్నది. యథార్థానికి కనబడే దృశ్యమంతా చిన్మయ రూపమే సుమా! కాని సాంసారిక దృష్టి గలవారికి మాత్రం ఇది భూతాకాశ మాత్రంగా (పంచ భూతాల సమ్మేళనం మాత్రమేగా) కనబడుతోంది.
చైతన్యము దేనిని ఎట్లు సంకల్పిస్తే అట్లే పరిణమించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అది బ్రహ్మదేవుని స్వభావ - స్వరూపములను సంకల్పించిందనుకో... అప్పుడు అది తనను బ్రహ్మ దేవుని రూపముగానే గాంచుచున్నది. అనగా, “ఈ త్రిలోకముల రూపమున అనేక జీవరాసులతో కూడి ప్రకాశించుచున్నది నేనే... నా యొక్క స్వరూపమే” అను భావన ఎక్కడ ఆశ్రయిస్తుందో, అది అట్టి అనుభవమునే అక్కడ పొందుచున్నది. అట్టి భావనకు ఉపక్రమించిన జీవునే 'హిరణ్యగర్భుడు’ అను పేరుతో కూడా చెప్పుకుంటున్నాం. ఆ హిరణ్యగర్భుడే తదితర పదిమంది ప్రజాపతులతో కూడిన ఈ జగత్కల్పన కంతటికీ కారణమగుచున్నాడు.
చతుర్దశ విధానన్త భూతజాత నఘుంఘుమా | సృష్టిరేవమియం రామ చిత్తనిర్మితమాగతా ॥ (సర్గ 40, శ్లో 9)
పదునాలుగు లోకములందలి అనంతప్రాణికోట్ల రూపమున ఉన్న ఈ 'సృష్టి' అంతా చిత్తము నుండే ఏర్పడుతుంది. అందుచేత “చిత్తమే సృష్టి. చిత్తమునకు వేరుగా సృష్టిలేదు”... అని చెప్పబడుతోంది.
చిత్తము యొక్క రెండు భాగములు
సృష్టిని ఏర్పరుచుచున్న సృష్టి యొక్క అనుభవాన్ని చిత్తం పొందుచున్న చిత్తం
స్వతఃగా చూస్తే మాత్రం, ఈ సృష్టి ఆకాశమువలె శూన్యమైనది. ఇదంతా సంకల్పములోని నగరము వంటిది. కేవలము భ్రాంతి చేత మాత్రమే ఏర్పడి ఉంటోంది.
శ్రీరాముడు: బ్రహ్మము, జగత్తు వేరువేరైన లక్షణములు కలిగి ఉంటున్నాయి కదా?
Page:198
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము మహాశక్తియుతము. సర్వ లక్షణ విలక్షణము. బ్రహ్మములోనే ఈ బ్రహ్మాండాలున్నాయి. ఈ బ్రహ్మాండములో కొన్ని జీవరాసులు కేవలం అజ్ఞానము నందు ఉండి ఉంటున్నాయి. మరికొన్ని జ్ఞానయుక్తమై ఉంటున్నాయి. ఇంకొన్ని విఘ్నములు కారణంగా మధ్యమధ్యలో 'చ్యుతి' పొందుచున్నాయి.
ప్రపంచముతోటి సంబంధం ఉన్న జీవులలో కొందరు మాత్రమే ఉత్తమ వైరాగ్యము ఆశ్రయించి ఉండుటచే, వారు తదితరులకు ఉపదేశించటానికి అర్హులై ఉంటున్నారు. విషయ వాసనలచే జీవులలో అనేకులు ఎన్నో మానసిక వ్యాధులకు గురౌతున్నారు. ఫలితంగా దుఃఖం, పిరికితనం, భయం, ఉద్వేగం మొదలైనవాటిని పదే పదే స్వల్ప కారణాల వలన కూడా పొందుచున్నారు. క్షణంలో రాగ-ద్వేష భయ-మోహాదులచే వ్యాకులపడుచున్నారు. ఈ జీవుల లోని రాజసిక-తామసిక-సాత్విక జాతులు గురించి ముందు ముందు సవివరంగా చెప్పుకోబోవు చున్నాము. ఇప్పటికి మాత్రం... నాశరహితము, సర్వవ్యాపితము, నిరామయము, చిదాభాస స్వరూపము, భ్రమరహితము, అనాది అనంతము... అయి ఉన్న బ్రహ్మము గురించే వివరిస్తాను.
నిశ్చల సముద్రంలో తరంగముల చంచలత్వం కానవస్తోంది కదా! అట్లాగే స్పంద రహితమగు ఆ పరమాత్మ యందు క్రియావిశేషము ప్రస్ఫుటమౌతోంది. ఆ క్రియావిశేషమే ఈ విధంగా జీవభావముగా ఘనత్వం పొందుతోంది. అట్టి క్రియావిశేషము యొక్క ప్రయోజనమే ‘జగత్తు' అనబడు అనుభవం.
శ్రీరాముడు: మహాత్మా! అనంతమగు 'ఆత్మతత్త్వం' నందు 'ప్రదేశం' అనునది ఎట్లు ఏర్పడుతోంది? అందు "క్రియావిశేషము' ఉత్పన్నమవటమేమిటి? అవి ఎట్లు సంభవిస్తున్నాయి? ఆత్మయందు అసలు ఈ వికారములు ఎట్లు ఏర్పడుచున్నాయి? అద్వితీయమగు ఆత్మ యందు స్పంద ఎట్లా కలుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ “జీవుడు - బ్రహ్మం - మనస్సు - - బుద్ధి - అహంకారం - దృశ్యం మొదలై నవన్నీ పరమాత్మచేతనే, లేక, పరమాత్మయందే ఏర్పడుచున్నాయని గ్రహించు. అయితే ఈ వాక్ రచనలన్నీ శాస్త్రవ్యవహారం కొరకే కల్పించబడుచున్నాయి. వాస్తవానికి ఇవేవీ ఎక్కడా లేవు. అనగా పరమార్ధమున ఇవి ఆత్మకు వేరుగా ఉండుటలేదు. ఈ వికారములు, ఈ అవయవత్వము, ఈ దిక్కు, కాలముల సత్త, ఈ ప్రదేశభేదముల అనుభవం... ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నపటికీ, ఇవి పరమాత్మ యందు ఏ మాత్రం సంభవించునవి కావు.
ఆ చిత్ ప్రకాశానికి, లేక, పరమాత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. అందులో అన్యమైన ఎట్టి కల్పన లేదు, ఉండబోదు, ఉండజాలదు కూడా! ఇక శబ్ద, అర్థక్రమాలు ఎచట? కార్య, కారణత్వ మెచట? వ్యవహారదృష్ట్యా ఉత్పన్నమయ్యే వాక్యరచనకు ఆత్మయందు నిజమైన స్థానం లేనేలేదు.
అయితే, ఈ ప్రపంచమున ఏ ఏ కల్పనలు, శబ్ధార్థములు, వాక్యసమూహములు ఉన్నాయో, అవన్నీ పరమాత్మ నుండే ఉత్పన్నమౌతున్నాయి. మట్టి బొమ్మలన్నీ మట్టియే అయినట్లు అవన్నీ
Page:199
ఆత్మమయం, సద్వస్తురూపం అయి వున్నాయి. ఓ సూక్ష్మగ్రాహీ! రామచంద్రా! అగ్ని నుండి ఉత్పన్న మయ్యేవన్నీ అగ్నికాక మరింకేమౌతాయి చెప్పు? నిప్పురవ్వలన్నీ నిప్పే కదా! పరమాత్మ నుండి ఉత్పన్నమయ్యేవన్నీ పరమాత్మ స్వరూపమే అవుతాయి. ఇక ఈ 'జనించునది, జనింపజేయునది’... అను 'భేదకల్పన’ అంతా మిథ్యయే అయివున్నది. ఈ జగత్తు యొక్క స్థితి అంతా మాయచేతనే సంభవిస్తోంది. ఇక పదార్థముల ఉత్పత్తి, వినాశనములు...” అనునదంతా ఒక కల్పన నుండి వేరొక కల్పనను ఉద్భవింపజేయుట మాత్రమే అయి ఉంటున్నది.
నీటి యందు కదలికలాగా ఆత్మయందు క్రియాశక్తి యొక్క ఆధిక్యతచేతనే “జనించునది జనింపజేయునది’... అను రూపముగల వేరు వేరు విషయాలు (జగత్తు-పరమాత్మ అనునవి) దర్శించబడుచున్నాయి.
ఒక పెద్ద రాయి నుండి ఖండింపబడిన మరొక చిన్న రాయి ఆ పెద్దరాయికంటే వేరైనది కాదు కదా! పెద్దరాయిలో, చిన్నరాయిలో పదార్థమొక్కటే. కానీ, ఆకారాదుల దృష్ట్యా వేరుగా కనబడుచున్నవి. అట్లే ఆత్మయందు కనబడే వేరు జీవులనబడే చమత్కారములన్నీ ఆత్మ ప్రసరణమే అయి వున్నది. “ఇది వేరు, అది వేరు. ఇతడు వేరు, అతడు వేరు.. నేను వేరు, నీవు వేరు” అనునట్టి ఈ శబ్దార్థవ్యవహార క్రమమంతా నామ మాత్రమే అయివున్నది. "వేరైనది-వేరుకానిది” అనేదంతా పరమాత్మ యందు లేదు.
ఎందుకంటావా? 'పరిచ్ఛేదము' అనేది ఉంటే కదా, భిన్నత్వము సంభవించేది! బ్రహ్మము నుండి ఉత్పన్నమైన 'మనస్సు' యొక్క శక్తి ద్వారా స్వభావపూర్వకంగానే ఈ నామ రూప కల్పన అంతా ప్రవృత్తమగుచున్నది. అంతే కాదు, మనస్సు యొక్క దృఢభావనచేతనే జగద్వ్యవహార మంతా సంభవిస్తోంది.
శ్రీరాముడు: అయితే “పరమాత్మ నుండి ఈ జగత్తు ఏర్పడుచున్నది" - అను వాక్యం అసమగ్రమైన అర్థమేనని అంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి: “ఒక అగ్ని శిఖ నుండి ఇంకొక అగ్ని శిఖ ఉత్పన్నమగుచున్నది”... అనునదంతా ‘వాక్కు’ యొక్క వైచిత్ర్యమేగాని, యథార్థం కాదు. ఎందుకంటే, ఆ రెండు అగ్నిశిఖలు ఒకే అగ్ని యొక్క రూపములే. పరమాత్మయందు 'జనింపజేయునది - జనించునది' ఎట్లా సంభవిస్తాయి చెప్పు? సర్వదా ఏకమై ఉంటున్న పరమాత్మ ఎట్లు, దేనిని, ఎందుకొరకు ఉత్పన్నం చేస్తున్నాడు?
ఒక మాట ఉన్నప్పుడు, దానికి విరుద్ధమైనది, భిన్నమైనది, రెండవది అయిన మరొకమాట ఉండటం ఆ మాట (లేక వాక్యము) యొక్క స్వభావం.
అయితే బ్రహ్మమునందు వచనాదులే ఉండవు కదా! ఇక ఈ శబ్ద అర్థ కల్పముల రూప మంటావా... ఇదంతా సముద్రములోని తరంగములకు ఒకదానికి మరొకదానికి ఉన్న భేదము వంటిదే. చిన్న పెద్ద తరంగములన్నీ జలమయమే కదా! తరంగదృష్టిని ఆశ్రయించి తద్వారా సముద్రమును, సముద్ర జలమును నిర్వచించగలమా? లేదు.
Page:200
ఈ సర్వజగత్తు బ్రహ్మమే అయి వున్నది. ఇది మేము గాంచుచున్న శాస్త్రముల సారం. ‘ప్రత్యగాత్మ’ కూడా బ్రహ్మమే అయివున్నది. 'మనస్సు-బుద్ధి' అనునవి కూడా బ్రహ్మమే. ఈశ్వరుడు అనుదాని శబ్ద-అర్థములు బ్రహ్మమే. సర్వ వస్తువులందలి సారము బ్రహ్మమే.
బ్రహ్మసర్వమిదం విశ్వం విశ్వాతీతం చ తత్పదమ్|
వస్తుతస్తు జగన్నాస్తి సర్వం బ్రహ్మైవ కేవలమ్ ॥ (సర్గ 40, శ్లో 30)
ఈ విశ్వమంతా బ్రహ్మము యొక్క స్వరూపమే. అయితే బ్రహ్మం ఈ విశ్వమునకు పరమైనది కూడా. ఈ జగత్తు వాస్తవానికి లేనేలేదు. అంతయు కేవల బ్రహ్మస్వరూపమే అయివున్నది.
కొద్ది క్షణముల మౌనం తరువాత -
శ్రీరాముడు: మరి ఈ విలక్షణములతో కూడిన వస్తుతత్వము మాటేమిటి? వివిధ జీవులు వివిధములైన లక్ష్యములను, ఆర్తులను కలిగి ఉంటున్నారే?
శ్రీ వసిష్ఠ మహర్షి: తరంగములు, సుడులు, బుడగలు, ఆవర్తములు - అంతా జలమే అయినట్లు... ఉంగరము, వడ్డాణం, గాజులు, గొలుసు - అంతా బంగారమే అయినట్లు... నీవు-నేను-అదిఇది-లోకములు-పదార్థములు సర్వము బ్రహ్మమే. ఈ జగత్తు సంకల్పము ఉన్నచోట అనేకముగా, శుద్ధస్వరూపము ఆశ్రయించబడినప్పుడు బ్రహ్మముగా ద్యోతకమగుచున్నది.
ఓ రాఘవా! అటు ఆకాశం వైపు చూడు. తూర్పు వైపు ఆకాశం, పడమర వైపు ఆకాశం ఒక్కటా? వేరు వేరా? "ఈ ఆకాశ విభాగము వేరు... ఆ ఆకాశ విభాగము వేరు” అనునది ఆకాశమునకు ఉంటుందా? విశాలమగు పరమాత్మయందు కూడా ఈ విభాగకల్పన లేనేలేదు. ఇక ఇది తూర్పు ఆకాశం, ఇది పడమర ఆకాశం అనునదంతా వికల్పోక్తితో కూడిన వాక్కు మాత్రమే.“నీవు-నేను-వాడు-వీడు-జన్మలు-మృత్యువు-దేవతలు-రాక్షసులు-మానవులు”....ఇవి కూడా అట్టివే. ఇవన్నీ సాపేక్షదృష్టి (Relative perception) ని ఆశ్రయించి మాత్రమే ఉంటున్నాయి. వీటి యందు అర్థవిచారణ చేసినప్పుడు 'సత్యము'నకు లభించునదేదీ ఉండుటలేదు.
ఒకచోట ఉన్నవానికి మాత్రమే “దిక్కులు, కాలము”... అను సాపేక్షతో కూడిన అనుభవం ఏర్పడి ఉంటోంది. ఆత్మయో, సర్వత్రా వ్యవస్థితమై ఉండగా, “ఆత్మయే సర్వదా నేనై ఉన్నాను” అను ఉత్తమార్థం గ్రహించినవానికి ఈ సాపేక్షత (Relativity) ఎక్కడ ఉంటుంది? ఉండదు. శ్రీరాముడు: హే మహాత్మా! ఈ మనస్సు బ్రహ్మము నుండే ఉత్పన్నమగుచున్నది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి: "బ్రహ్మము నుండి మనస్సు ఉత్పత్తి అగుచున్నది"... అనబడు వికల్పోక్తి అసత్యమైనదే సుమా! ఉదాహరణగా ఒక ప్రశ్న అడుగుతాను.
నీవు, నీ మనోరథములు వేరువేరా? నీ నుండి నీ భావనలు వేరైనవిగా చెప్పగలమా? వాటికి నీకన్నా వేరైన అస్థిత్వమున్నదా? 'గుణి' కంటే గుణములు వేరుగా ఎక్కడైనా ఉంటాయా?
Page:201
లేదు.... లేనప్పుడు “ఆ గుణములు, భావములు, మనోరథములు నీ నుండి ఉత్పన్న మగుచున్నాయి”... అని అనటం ఎట్లా? "అదిగో రెండవ చంద్రుడు" - ' అని ఒక పిల్లవాడు అంటు న్నాడనుకో... ఆ రెండవ చంద్రుడు ఆతనికి ఆకాశంలో కనిపించటానికి కారణమేమిటి? ఆ చూచు వాని దృష్టిదోషమే కదా! సత్యమునకు సంబంధించిన జ్ఞానము అల్పమగుచున్నప్పుడే బ్రహ్మము నందు ఈ వికల్పములన్నీ అగుపిస్తూ ఉంటున్నాయి. “ఈ వికల్పమంతా 'మనో చాపల్యము' చేతనే ఉత్పన్నమగుచున్నది” అనుటలో సందేహమే లేదు. ఆత్మ యొక్క సాన్నిధ్యము చేతనే మనస్సు స్థితి - స్పందనలు పొందగలుగుతోంది. అయినప్పటికీ, “ఆత్మ ఇట్లు మనస్సుగా పరిణమిస్తోంది"... అని అనవీలులేదు. ఎందుకంటావా? ఏ క్షణ మందు కూడా ఆత్మ తన శుద్ధత్వం, నిర్మలత్వం, సాక్షిత్వం, అఖండత్వములను త్యజింపకయే ఉంటోంది. అజ్ఞానదృష్టికి మాత్రం - స్వయంకృతమైన సంకల్పములు ఘనీభూతమగుచున్నాయి. ఆ కారణంగా ఆత్మయే, 'ఇది జీవము, ఇది జగత్తు' అనునట్లుగా తోచుచున్నది.
సర్వస్వరూపము, సర్వవ్యాపియగు ఆ “అనంత బ్రహ్మపదము" నుండి మరింకేదీ ఎన్నడైనా సంభవించటానికే వీలులేదు. దాని నుండి ఆవిర్భవిస్తున్నట్లు తోచుచున్నదంతా బ్రహ్మమే అయి వుంది. బ్రహ్మతత్త్వము లేనిచోట ఏదీ అగుపించదు, ఉత్పన్నము కాదు. బ్రహ్మము వలననే బ్రహ్మమునకు ఇదంతా తెలియవచ్చుట జరుగుతోంది.
ఒకే వ్యక్తిని చూస్తున్న మరి కొందరు “ఇతడు నా తండ్రి... నా కుమారుడు... నా అల్లుడు... నా మనుమడు... నా మిత్రుడు...” ఇట్లా అనేక రీతులుగా అతనితో తమకు గల స్థితి, సంబంధా లను బట్టి భావిస్తున్నారు కదా! అందరూ చూస్తున్నది ఆ ఒకడినే కదా! అట్లాగే, ఒకే బ్రహ్మము అనేక నామరూపములతో ద్రష్టయొక్క స్థితిగతులను అనుసరించి కనబడుచున్నది. “ఇదంతా బ్రహ్మమే (సర్వంఖిల్విదమ్ బ్రహ్మ)” అనునది వేదవాక్యసారమే అయివున్నది. ఈ విషయమునే మనం ఈ గ్రంథంలో అనేక కోణముల నుండి సుస్థీకరణ పూర్వకంగా నిరూపిస్తున్నాం.
“పరమార్థతత్త్వము” అయి వున్న ఆ పరబ్రహ్మము నందు 'అవిద్యాదులు' అనబడే సంసార దోషం ఈషన్మాత్రం కూడా లేదు.
శ్రీరాముడు: స్వామి! మరి జీవునికి కనిపిస్తున్న ఈ విషయ వ్యవహారముల మాట ఏమిటి? శ్రీ వసిష్ఠ మహర్షి: ఇవన్నీ జీవునకు అసమగ్రదృష్టి, అజ్ఞానములచే దోషముల చేతనే అనుభవ మగుచున్నాయి. కనుక, అజ్ఞానం నశించిందా... ఇక ఆపై ఈ కనబడే సర్వమందలి “శుద్ధ పరమాత్మ బ్రహ్మతత్వము”... నీవు దర్శించగలవు సుమా! ఒక పాత్ర బాగా మాలిన్యముతో కప్ప బడి ఉన్నదనుకో... ఆ మాలిన్యమును శుభ్రం చేసి తొలగిస్తే పాత్ర యొక్క వాస్తవమైన మెరుపు గోచరిస్తుంది కదా! అట్లే, అజ్ఞానము నశించగానే బ్రహ్మపదము ప్రత్యక్షము కాగలదు.
దీపం వెలిగించటంచేత గదిలోని చీకటి తొలగితే, అప్పుడు గదిలోగల వస్తువులన్నీ చక్కగా
కనబడతాయి కదా!
Page:202
ముందుగా అజ్ఞానముచే కలుషితమైయున్న ఈ దృష్టిని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు ఈ విశాలదృశ్య జగత్తు సర్వ వికల్పములతో సహా దృష్టి నుండి ఉపశమించగలదు. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబము ఎంతో స్పష్టంగా చూడగలం. సత్యస్వరూపమగు బ్రహ్మము నిర్మలమైన బుద్ధి యందు నిశ్చయత్వము, స్థిరత్వము పొందగలుగుచున్నది. అప్పుడు ఆ ద్రష్ట తన యొక్క పరిశుద్ధ స్వస్వరూపమునే సర్వేసర్వత్రా, సర్వదా, సర్వముగా గాంచుచున్నాడు. ఇదే జ్ఞానానుభవం యొక్క పరాకాష్ఠ.
10. అవిద్య - ఆత్మజ్ఞానానుభవం
శ్రీరాముడు: అహో మహర్షీ! మీ వాక్యములు అత్యంత శీతలములు, నిర్మలములు, ప్రకాశ యుక్తములై, మాపై అమృతవర్షం కురిపిస్తున్నాయి. ఎన్ని సుకృతముల ఫలితంగానో "మీ ఈ ప్రవచనమును వినగలుగుట, పొందుట” అను వరం మీ నుండి పొందుచున్నాం!
హే ప్రభో! మీ వాక్యములు మహాప్రభావములు కలిగి ఉంటున్నాయి. మహోత్కృష్టమగు సత్యమునే ప్రతిపాదిస్తున్నాయని మేము గ్రహిస్తున్నాం. అయితే మా యందు అనేక జన్మలుగా పేరుకొని యున్న అజ్ఞాన దోషము చేత కాబోలు... గంభీరార్థం సంతరించుకొని యున్న మీ వాక్యములు వినుచుండగా క్షణకాలం జ్ఞానప్రకాశం బయల్వెడలుతోంది. ఇంతలోనే మరొక క్షణంలో ఎక్కడి నుండో అజ్ఞానం వచ్చిపడుతోంది. ఈ విధంగా జ్ఞాన - అజ్ఞానముల మధ్య కొట్టు మిట్టాడుచున్నాం. ఆకాశంలో మేఘముల రాకపోకలచే ఎండ - నీడలు ఏర్పడుచున్నట్లు మేము క్షణకాల జ్ఞానం, మరల ఏదో అనిర్వచనీయ అసమగ్రత్వం పొందుచున్నాం.
ఓ దేవా! ఆ పరమాత్మ అనంతము, అప్రమేయము, పరిపూర్ణము, సదా ప్రకాశవంతము, ఏక రసము, నిత్యోదితము పరమార్థస్వరూపము కదా..! అట్టి పరమాత్మయందు జన్మ కర్మలతో కూడిన ఈ వికారకల్పనంతా ఎందుకు సంభవిస్తోంది? "ఈ సృష్టి బ్రహ్మము నందు లేదు.. ఇది అయోగ్యమైయున్నది... ఈ సృష్టిబ్రహ్మమే”... మొదలైన విరోధవాక్యముల ఉద్దేశమేమిటి? ఈ విషయాలపట్ల ఆత్మ ఉన్ముఖమగుట ఏమిటి? ఈ మోహాదులు ఎక్కడి నుండి వచ్చి పడుచున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! నేను చెప్పు సత్యార్థము ఒక్కటే. దీనిలో అయోగ్యత గాని, పూర్వాపర విరోధముగాని లేవు. వేదములచే ప్రపంచమునకు చాటబడిన మహావాక్యమలనే (అహం బ్రహ్మాస్మి, జీవోబ్రహ్మేతి నాపరః మొదలైనవి) ఇక్కడ అర్థయుక్తంగా మనం చెప్పుకుంటున్నాం. అంతే. అయితే నీవు బోధ యొక్క మధ్యలో "తితిక్ష ప్రసన్నత ఉత్తమ అవగాహన” ఈ మూడిటిని విడువవద్దు. ఈ మన సంభాషణ అనేక కోణముల నుండి పరిశీలిస్తూ ఉండగా నీ యందు పూర్వార్థరూ 'జ్ఞానదృష్టి' తప్పక ఉదయించగలదు. పూర్ణార్థప్రబోధము పొందగలవు. స్వస్థ చిత్తుడవు కాగలవు. అప్పుడు ఇతఃపూర్వం వింటూ వస్తున్న వ్యవహార వాక్యముల కంటే ఉత్తమమైన సత్యపదోన్నతిని నీ అంతరంగమునందే దర్శిస్తావు.
Page:203
పూజ్యులు, ఆత్మద్రష్టలు, సద్గురువరేణ్యులు అగు మహనీయులు తాము గ్రహించిన “వాక్ అతీత... అనుభవమాత్ర"... సత్యమును సర్వజనులను ఉద్దరించే నిమిత్తం వేదాంత సిద్ధాంతముల రూపంలో ప్రతిపాదిస్తున్నారు. అట్టి ప్రయత్నములో కొంత శబ్దార్థయుక్తమగు వాక్యరచన అవసర మగుచున్నది.
ఉత్తమార్థము దృష్ట్యా చూస్తే, ఆ శబ్దములు (Jargons) కొంత భ్రమ సమన్వితములైన మాట వాస్తవమే కాని, ముల్లును ముల్లుతోనే తొలగిస్తున్నట్లు “మాయ” యొక్క దుర్వ్యసనమును మాయతో కూడిన శబ్ధార్థములచేతనే తొలగించటం జరుగుతోంది. “జీవుడు - బ్రహ్మము - ఆత్మ పరమాత్మ - మనస్సు - - బుద్ధి - జగత్తు - అహంకారము”... అను శబ్దములు అట్టివే. అయితే ఈ పదజాలము సత్యార్థజ్ఞానమునకు (బోధకు) తప్పక హేతువు అగుచున్నది. కాబట్టి "ఉపదేశ్య వస్తువగు ఆత్మజ్ఞానము బోధించటానికే ఇదంతా ఇట్లు రచించబడుచున్నది" అని గ్రహించు. “వాగ్జాలము సద్గురువులు" ఈ రెండిటి సమన్వయమును వివేకముతో గ్రహించాలి.
"వివేకదృష్టి - మహత్తర ఆశయము - అసలు ఉద్దేశం గ్రహించటం"... ఈ మూడూ ఏ సమయంలోనూ ఏమరచరాదు. మిథ్యా భ్రమలందు పడకూడదు సుమా! మన ఈ సంభాషణ శ్రద్ధగా వింటూ ఉండగా, వాచ్య వాచక శబ్దార్థమును నీవే గ్రహిస్తావు.
అజ్ఞానుల కొరకు 'బ్రహ్మము'ను ఉపదేశించటానికి లేక “సత్యశాస్త్రార్థబోధ” నిమిత్తం జ్ఞానులచే వాక్రపంచమంతా కల్పించబడినది. అయితే ఎవ్వరైతే ఇప్పటికే పరమార్థస్థితియందు ఉంటారో, అట్టివారి అనుభవమే ఉపదేశ్యవస్తువు అగుచున్నది. కనుక ఇక ఆపై ఈ వాక్రపంచంతో పనేమున్నది?
ఆత్మ వాస్తవానికి పరమశుద్ధమైనది. అందు విషయోన్ముఖత్వం గాని, కర్మగాని, మోహాదులు గాని, రాగద్వేషములు గాని లేనే లేవు. అట్టి పరమార్థమగు ఆత్మయందే ఈ జగత్తు అంతా స్థితి కలిగియున్నది. ఆత్మయొక్క భావనా ప్రభవమే ఈ సర్వం యొక్క ఉనికి స్థానం అయి ఉన్నది. ఇదే విషయం అనేక యుక్తులతో అనేక కోణముల నుండి ఈ గ్రంధము నిరూపించి, వివరించి చెప్పుచున్నది.
శ్రీరాముడు: స్వామి! మరి ఈ జీవులలో అనేకమంది యొక్క అనుభవం అందుకు వ్యతిరిక్తంగా ఉంటోంది. “ఆత్మయే స్వరూపముగా గల నేను సర్వదా పరిశుద్ధుడను... విషయరహితుడను”... అను అనుభవం చాటున పడిపోతోంది. "నేను అల్పుడను, దీనుడను, పరిమితుడను, బాధితుడను, స్వల్పుడను”.... అను భావనయే అధికమైన ప్రచారం కలిగి ఉంటోంది. కారణమేమిటి?
శ్రీ వసిష్ఠమహర్షి: నిజమే, ఈ జీవుడు తగినంత సాధనను ఆశ్రయించకపోవుటచేతనే, ఎన్ని రోజులు గడచిపోతున్నప్పటికీ ఆత్మయొక్క శుద్ధత్వము గాంచలేకపోవుచున్నాడు. “మూల అజ్ఞాన రూపము” (Causal Ignorance) అయినట్టి తమస్సు, అప్రయత్నశీలత్వము... ఈ రెండు పరస్పరం సహకరించుకుంటూ మోహమును అనేక శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తున్నాయి.
Page:204
వాక్రపంచం లేకపోతే అట్టి “మూల అజ్ఞానము” గుర్తించబడజాలదు, తొలగించ
బడజాలదు.
అవిద్యయైవోత్తమయా స్వాత్మనాశోద్యమేచ్ఛయా ॥ |
విద్యా సా ప్రార్థ్యతే రామ సర్వదోషాపహారిణీ ॥ (సర్గ 41, శ్లో 13)
అనేక జన్మలలోని ‘సుకృతము' ఫలిస్తూ ఉండగా అంతఃకరణం శుద్ధత్వము పొందుచున్నది. అనేక జన్మలుగా స్వీకరించడిన ఉపదేశములకు సంబంధించిన వాక్రపంచం జీవుని జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేసి ఆత్మయొక్క సామీప్యత ప్రసాదిస్తోంది. "ఉపదేశక్రమము, వాక్రపంచము”... అను అవిద్య ద్వారా సర్వదోషనివారిణియగు విద్య ప్రకాశించుచున్నది.
అస్త్రము అస్త్రముచేతనే జయింపబడుతుంది కదా! పాత్రకు మాలిన్యము అంటినప్పుడు, మాలిన్యముతోనే ఆ పాత్రను తోమి, ఆపై నీటితో కడిగి రెండు మాలిన్యములను తొలగించి వేస్తున్నాం. విషము విషముతోనే శమిస్తుంది. శత్రువును శత్రువే నశింపజేస్తున్నాడు. అట్లే అవిద్య చేతనే అవిద్య నశిస్తోంది. “శాస్త్రపదజాలం" అను మాయసహాయంతో “దృశ్యం” అను మాయను ఎదుర్కొనుచుండగా, సర్వము అవగతం అవుతూ వస్తోంది. అట్టి స్థితిలో ఉభయమాయలు తమంతట తామే తొలగుచున్నాయి. అనగా శాస్త్రరచనారూపమైన మాయ స్వవినాశనము నందే ఆనందము పొందుచున్నది. మాయ యొక్క స్వభావం అత్యంత దుర్లభమైనదే... కాని, అది క్షణంలో మటుమాయ మగుచున్నది.
మాయ, విచారణ (Illussion & Enquiry) మాయయొక్క స్వరూపము, స్వభావము అనిర్వచనీయములు. అది వివేకమును ఆచ్చాదించి ఉంటోంది. అనేక జగత్తులను ఉత్పత్తి చేస్తోంది. మాయ వాస్తవానికి లేనిదే కదా! అయినా కూడా ఈ దృశ్యము యొక్క ప్రాప్తికి, ఖండితమైన భావనాపరంపరలకు కారణము మాయయొక్క రూపమే.
ఈ మాయయొక్క రూపమేమిటి? ఇది ఎంతకాలంగా కలుగుతోంది? ఈ రెండు ప్రశ్నలు సమాధానరహితంగానే ఉంటున్నాయి. కాని, ఈ మాయ ఎట్లు తొలగించబడగలదో శాస్త్రములు, గురువులు మనకు విశదపరచుచున్నారు. ఆహాఁ! మాయయొక్క కార్యమే అయినట్టి ఈ దృశ్య జగత్తు ఏ విధంగా ప్రత్యక్షమై తాండవిస్తోందో చూస్తూనే ఉన్నావు కదా! ఎంత ఆశ్చర్యం!
“అవలోకించకపోవటచేతనే... (లేక, విచారించకపోవటం చేతనే) ఈ మాయ స్ఫురించు చున్నది"... అని విజ్ఞులు ప్రవచించుచున్నారు. అవలోకించి చూచామా... తప్పక క్షణంలో నశించిపోతోంది. అపరిజ్ఞాత రూపముననే (because of not verifying the reality / fact) అది స్ఫురించటం, విజృంభించటం జరుగుతోంది. ఈ విచిత్ర సంసార బంధమును కలుగజేస్తున్నట్టి మాయ ఎంతటి ఆశ్చర్యకరం? 'అసత్యమే' అయినప్పటికీ ఇది సత్యమువలెనే భాసిస్తున్నదే! ఇది ఎంతటి మిథ్యా వ్యవహారంగా రచించబడుచున్నదో... ఏమని చెప్పగలం! "అభిన్నము, పరమ పదము" అగు పరమాత్మ యందు ఈ మాయ సుదీర్ఘమైన ఒక స్రవంతిగా ఏర్పడి ఉంటోంది.
Page:205
క్షరము, విశాలము అయిన ఈ భేదమంతా నిరంతరం విస్తరింపజేస్తోంది. అందుచేత “ఈ మాయ క్షర అక్షర స్వరూపమగు పురుషునికంటే అతీతుడైన పురుషోత్తముని ఆశ్రయించి ఉన్నది”... అని చెప్పబడుతోంది.
ఓ ప్రియ రామా! నీవు మాత్రం “పరమార్థ స్థితియందు ఈ మాయకు స్థానమే లేదు”.... అను నిశ్చయమునే సర్వదా కలిగియుండుము. నీవు జ్ఞానివి కావాలంటే నీ యొక్క అవగాహన భావనలను 1) సత్యనిష్ఠుల వాక్యములు 2) వేదవేదాంత పాఠాల సారం 3) స్వకీయమైన తర్కం 4) స్వానుభవం... ఈ నాలుగిటిచేత ఉద్దీప్తం చేసుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే జ్ఞేయమగు మాయను తెలుసుకుంటావో, అప్పుడు నా ఈ వాక్యములోని అంతర్లీనమైయున్న మహత్తర ఆశయమును చక్కగా దర్శించగలవు.
ఇప్పటికీ మాత్రం నీవు పూర్ణంగా ప్రబుద్ధడవు కావలసియున్నది కదా! అందుచేత, నా వాక్యములపై విశ్వాసముంచు. గురు, శాస్త్ర వాక్యానుసారం విశ్వాసముతో “అవిద్య లేదు”... అను కొండంత బలము కలిగి యుండు. అట్టి నిశ్చయముతో సునిశితమైన బుద్ధి కలవాడవై, పరిశీలనాత్మకము, వివేచనాపూర్వకము అయిన దృష్టితో నా ఈ వాక్యాలు వింటూ వింటూ ఉండు. క్రమంగా అంతా నీకే విశదం కాగలదు.
“ఇప్పుడు మాకు ఈ దృశ్యము ప్రాప్తిస్తోంది. కాని ఈయన 'లేదు' అని సిద్ధాంతీకరించు చున్నారు. మరి విశ్వసించటం ఎట్లా?"... అని భావించి ఈ మన ప్రస్తుతం విచారణ వినుట విరమించావా... ఇక నీవు నీ సందేహ ప్రపంచమునందే జన్మలు, అనుభవములు, అజ్ఞాన భూమికలు పొందుతూనే ఉంటావు.
ఓ సర్వజనులారా! ఈ జీవుడు అనేక జన్మలుగా 'అవగాహనారాహిత్యము' తో కూడిన బుద్ధితో ఈ దృశ్యవ్యవహారంలోకి మరల మరల ప్రవేశిస్తున్నాడు. అట్టి అనేక సాంసారిక దుఃఖా లను పొందుచున్నట్టి ఈ మాయబద్ధ జీవుని దృష్టిలో పెట్టుకుని మా అనేక సంవత్సరముల పరిశ్రమను, శాస్త్రజ్ఞానమును, అనుభవమును రంగరించి ఈ యోగ వాసిష్ఠరామాయణ శాస్త్రమును ప్రతిపాదించుచున్నాము.
ఇప్పటి జీవుని స్థితిగతులు ఏమిటి? బ్రహ్మజ్ఞులచే ప్రవచించబడిన శాస్త్రములలోని అంతర్గత సారము ఎట్టిది?.... ఇవన్నీ గ్రహించిన తరువాతే ఈ విచారణను మీ ముందు ఉంచుటకు యత్నిస్తున్నాం. ఈ సంసార జీవునకు దుఃఖవిముక్తి కలగాలంటే జ్ఞానమొక్కటే సరి అయిన ఔషధం. అట్టి జ్ఞానం భక్తి, విచారణ, సత్ప్రవర్తన మొదలైన వాటిచే మాత్రమే దృఢపడుతోంది. ఈ మాచే చెప్పబడుచున్న వాక్యములు ఓర్పుతో, ఋషులపై విశ్వాసంతో, నిర్మల మైన బుద్ధితో, సూక్ష్మగ్రాహ్యపూర్వకమైన అవగాహనతో విచక్షణాసహితంగా వినండి. దీని ప్రయోజనమేమిటో క్రమంగా మీరే గ్రహించటం జరుగగలదు.
Page:206
యదిదం దృశ్యతాం యాతం మానసం మననం మహత్ అసన్మాత్రమిదం యస్మాన్మనోమాత్ర విజృంభితమ్|| (సర్గ 41, శ్లో 22)
ఈ కనబడే విశాల దృశ్యమంతా మనఃసంబంధమైనది మాత్రమే. అనగా, ఇదంతా మనస్సు యొక్క మననముచే విశాలరూపమున ఉదయించుచున్నది. మనో విలాసమాత్రమే అగుటచే ఇదంతా అసద్రూపమే అయి వున్నది. ఎవరి అంతఃకరణమునందైతే “ ఈ జగత్తంతా మాయామయము... మిథ్య"... అను నిశ్చయం కలుగుతుందో, అట్టివాడు మాత్రమే మోక్ష భావమునకు అర్హుడగుచున్నాడు.
దృష్టియొక్క చంచలత్వమే సర్వ అనర్థములకు మూలము. “బాహ్యార్థభావన... ఇంద్రియ లోలత్వము.. భ్రమపూర్వకమైన సంబంధముపట్ల నమ్మిక”... అనువాటి వలననే జీవుడు ఈ సంసార బంధములందు మరల మరల చిక్కుకుంటున్నాడు. అయితే కొందరు మహనీయులు ఈ భూత వర్తమాన భవిష్యత్తు జగద్విషయములపట్ల వివేకపూర్వకమైన అవగాహనను ముందుగా సంపాదించుకుంటున్నారు. తద్వారా ఈ దృశ్యమును అనాసక్తబుద్ధిచే, “ఎప్పుడో, ఎక్కడో, ఎవరి పట్లనో జరిగిన ఏదో సంఘటన” వలె చూడటాన్ని అభ్యసిస్తున్నారు. ఈ దృశ్యము సద్రూపము కావచ్చు. లేక అసద్రూపము కావచ్చు... దృశ్యమంతటి పట్లా 'అనాసక్త బుద్ధి' కలిగియుండేవానిని ఇందలి సుఖదుఃఖములు, తదితర సంఘటనలు ఏమి చేయగలవు చెప్పు?
కిం అహమ్ దేహమస్మి? నేను ఈ దేహ మాత్రుడనా?... ఎవడైతే 'ఈ దేహాదులే నేను” అను భావనచే ఈ దేహేంద్రియాదులను చూస్తూ ఉంటాడో.... అతడు తన యొక్క “శుద్ధ ఏక -
అఖండ”.... భావనను గాంచలేకపోవుచున్నాడు. అందుచేతనే అతడు 'అవిద్యావంతుడు’ అగుచున్నాడు. ఫలితంగా దుఃఖములన్నీ వచ్చిపడుచున్నాయి. పరమ పదమగు ఆత్మయందు “నేను జీవుడను, దేహిని, మనుజుడను, స్త్రీని, అధికారిని, రాజును”... మొదలైన వికారములు ఉండగలవా? ఉండలేవు. ఒక స్ఫటికంలో ఎదురుగా ఉన్న దృశ్యం ప్రతిబింబిస్తోందనుకో... “ఈ స్ఫటికంలో వృక్షములు, జంతువులు, తదితరరూపములు ఉన్నాయి. అవి కదులుచున్నాయి... ప్రవర్తిస్తున్నాయి” అని అనగలమా? లేదు కదా! కాని అవన్నీ ప్రతిబింబ మాత్రంగా స్ఫటికంలో కనిపిస్తున్నాయి. చిద్రూపమునందు ఈ నామరూపముల వ్యవహారమంతా స్ఫటికంలో ప్రతిబింబించే దృశ్యం వంటిది మాత్రమే.
ఓ రామా! వాస్తవమేమిటో చెప్పుచున్నాను, విను. ఈ నామ రూపములతో కూడిన దృశ్య జగత్తునందు నీవు లేవు. నీయందు అవి కూడా లేవు. ఏదైతే దోషభూయిష్టమైన దృశ్యరూపమున ఎదురుగా కనబడుతోందో అదంతా 'ఆత్మకు' వేరైనది కాదు.
శాస్త్రములు మాయ యొక్క సహాయం తీసుకొని మాయను తొలగించటానికి సహకరిస్తు న్నాయి. అవి మాయకు సంబంధించిన కార్యక్రమములతో కూడుకొని, ఉన్నప్పటికీ, ఆత్మజ్ఞానము సముపార్జించుటలో తప్పక సహకరిస్తున్నాయి.
Page:207
అవిద్యాప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ జీవుడు శాస్త్రములచే ప్రసాదింపబడుచున్న ఆత్మజ్ఞానం లేకపోతే స్వాత్మానుభవం పొందజాలకున్నాడు.
ఆత్మజ్ఞానానుభవం శాస్త్రార్థములు గ్రహించుటచే తప్పక లభించగలదు. ఆత్మజ్ఞానం లేకపోతే 'సంసారము' లేక 'అవిద్య'ను ఎవ్వరూ దాటలేరు. ఆత్మలాభమే అక్షయమైన పదము.
శ్రీరాముడు: మహాత్మా! తదితర విషయములన్నిటికన్నా కూడా "ఈ అవిద్య ఎక్కడి నుండి వచ్చి పడింది?”... అనే ప్రశ్న నన్ను ఆశ్చర్యచకితునిగా, సమాధానరహితునిగా చేస్తోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి: "ఈ అవిద్య ఎక్కడి నుండి వచ్చింది”.... అనే ప్రశ్న ప్రక్కకు పెట్టు. ఎందుకంటే మాయ అనిర్వచనీయం. “ఈ రోగము సంభవించటానికి ఏ ఏ కారణములు ఉండి ఉండవచ్చు?” అను ప్రశ్నను సుదీర్ఘంగా తర్కించటంకన్నా కూడా, “ఇప్పుడు ఈ రోగం తొలిగేది ఎట్లా?" అనునది ఉచితమైన ప్రశ్న అని విజ్ఞుల ఉద్దేశం. అసత్యమైన ఒక భావనను మనం అసత్యమైనదానిగా గుర్తిం చటమే అన్నిటికన్నా ముఖ్యం కదా! అవిద్య వలననే హృదయ మాలిన్యమంతా వచ్చిపడుతోంది. అది హృదయస్థానమంతా ఆక్రమించి ఉంటోంది. అట్లు హృదయంలోనే తిష్ట వేసుకొని యున్న ఈ సాంసారికదృష్టిని తొలగించుకొనుట ఎట్లో జనులు శ్రద్ధతో పరిశీలించెదరుగాక!
ఇప్పటికి “అవిద్య ఎందుచేత ఉంటోంది?" అనే ప్రసంగం వదలి “ఇది తొలగేదెట్లా” అను విషయం గురించే ప్రయత్నించవలసినదిగా శాస్త్రకారులు కూడా ప్రబోధిస్తున్నారు. “తాడు యందు పాము యొక్క ‘స్ఫురణ' ఏర్పడటం ఎంతకాలంగా, ఎందుచేత, ఎట్లా ఏర్పడింది?” అనునది వీక్షించుచు కాలయాపన చేసే బదులు, "ఇది త్రాడు... నిష్కారణంగా ఇది పాము యొక్క భ్రమ కలిగిస్తోంది... కనుక త్రాడును త్రాడుగా మాత్రమే గ్రహించుట ఎట్లు?” అనునది సముచితమైన ప్రయత్నం.
కాబట్టి రామా! " “ ఈ అవిద్యను నేను ఎట్లా నశింపజేస్తాను?”... అనే విషయం పరిశీలించు. యోచించు. ప్రయత్నించు. అవిద్య నశించునప్పుడే యథార్థతత్వమంతా నీకు బోధపడగలదు. అవిద్య నశించిందా... ఇక “ఇదెక్కడి నుండి వచ్చింది? ఏ రూపమున ఉన్నది? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటోంది?”... అనే విషయాలు వాటంతట అవే విశదమౌతాయి.
"శాస్త్ర పరిశీలన, ఉత్తమ ఆచరణ”... ఇప్పటికి ఈ రెండూ అవసరం సుమా! ఇంద్రియాల పట్ల ఏర్పడుచున్న వ్యామోహాన్ని ఆ రెండింటితో నిరోధించు. దృశ్యం పట్ల ఏర్పడుచున్న ఆకర్షణను 'అసంగము' అను ఆయుధముతో ఎదుర్కో! అప్పుడు అంతా క్రమంగా నీకే తెలిసిపోతుంది.
పరమోత్కృష్టములగు సత్యము, భ్రమల దృష్ట్యా చూచినప్పుడు ఈ “అవిద్య” అనునది “లేనిదే” అని తెలియవస్తోంది. జ్ఞానము యొక్క అభావమే అవిద్య. లేక, చక్కటి పరిశీలనాత్మక బుద్దిని వినియోగించనప్పుడే అవిద్య ప్రభవిస్తోంది. అట్లు ప్రభవించి, ఆపై అది ఈ జీవుని తన ఇచ్ఛ వచ్చినట్లు శాసిస్తోంది.
Page:208
అయినా రామా! నాదొక ప్రశ్న. “ఇది అసత్య వస్తువు... ఇందు నేను పదే పదే భ్రాంతిని పొందుచున్నాను. అట్టి భ్రాంతియే నన్ను సత్యమైనదాని నుండి దూరంగా ఉంచుతోంది...” అని ఒకడు గ్రహించాడనుకో.... అప్పుడు అసత్యవస్తువులందలి భ్రాంతిత్వము, సత్యవస్తువు నందలి వాస్తవత్వములను అనుభవానికి తెచ్చుకోవటం ఎట్లా చెప్పు?
శ్రీరాముడు: నిత్యానిత్యములను క్షుణ్ణముగా పరిశీలించుటచేతనే.
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును కదా! ఈ అవిద్య ఉత్పన్నమై, అనేక దోషములు కలిగియున్నదై, విశాలమైన ఆకృతిని ప్రదర్శించుచున్నది. ఈ జీవుని క్షణంలో అజ్ఞానాంధకారంలోకి త్రోసి వేస్తుంది. అట్టి 'అవిద్య' ను నిరోధించటానికి ప్రయత్నించకుండా వర్తమానమును వ్యర్థ కాలయాపనతో వెళ్ళబుచ్చు మానవులకు ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి?
అందుచేత రామా! నీవు ఈ అవిద్యను బలవంతంగా, ధీరత్వంతో నశింపజేయాలి సుమా! అప్పుడు సత్యమును నీవే ఎరుగగలవు. ఒకడు గొప్ప శూరుడో ధీమంతుడో అయితే అయి ఉండ వచ్చు గాక... కాని అతడు అవిద్యకు లోబడినాడా, ఇక అతనిని కాపాడగలిగిన వారు ఎవరు?
అందుచేతనే మరల మరల హెచ్చరిస్తున్నాను. రోగరూపములో దాపురిస్తున్న అవిద్యను నశింపజేయటానికై నీవు యత్నశీలుడవు కావాల్సిందే! అట్లు చేసితివా, ఇక నీవు ఈ సంసారదుః ఖములన్నీ క్రమంగా తప్పక జయిస్తావు. అవిద్యయే సర్వ ఆపదలకు మూలం. అనర్థములన్నిటికీ అవిద్యయే తల్లి. అవిచారణ, అవిశ్లేషణ, అశ్రద్ధలచే జ్ఞానవిజ్ఞానములు కప్పబడియుండుటవలన ఏర్పడే అల్పమైన అవగాహనలే ఈ అవిద్య యొక్క రూపము, విన్యాసము కూడా.
ఇంకా, ఆ అవిద్య ఏమేమి చేస్తోందో చెప్పమంటావా? అది భయమును, విషాదమును దుష్టమానసిక చింతలను, విపత్తులను, ఇతరులపట్ల క్రూరము, నింద్యము అగు ప్రవర్తనలను తెచ్చిపెడుతోంది.
హృదయములో ఏర్పడగల మాయామోహములన్నిటికీ అది అంకురము వంటిదే. అట్టి ‘కుదృష్టి' రూపమగు అవిద్య ‘హృదయం' అనే స్వగృహంలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లు తిరుగాడుతుంటే, వివేకి అయిన మానవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు... ఊరుకోకూడదు. “నేను ఈ సంసార సముద్రమును దాటుటకు ఉపాయాలేమిటి?”... అనునదే చింతిస్తూ ఉండాలి.
11. క్షేత్రము - క్షేత్రజ్ఞుడు
-
శ్రీరాముడు: హే మహర్షీ! ఈ "అవిద్య" అనే జాడ్యము అనేక అనర్థములను కలుగజేస్తూ పోతోంది కదా! ఎట్లు మేము దానిని మొదలంట తొలగించుకోగలుగుతాం చెప్పండి?
శ్రీ వసిష్ఠ మహర్షి: నిజమే, ఒక క్రూరుడు బలవంతుడూ అయిన శత్రువుగా ఈ అవిద్య వచ్చి ముంగిట వ్రాలియున్నది. అయితే ఈ అవిద్య విచారణ చేసినంత మాత్రంచేత తప్పక
Page:209
తొలగిపోగలదు. అతి విస్తృతంగా ప్రసరించి ఉంటున్న అవిద్యారోగమునకు ఔషధరూపంగా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను... వినుబ్రహ్మము స్వతహాగా అమృతస్వరూపము, సర్వవ్యాపి, నిరామయము, అనాది, అనంతము, భ్రమరహితము అయివున్నది. అట్టి బ్రహ్మమునందు "నేను శరీరము ధరించి ఉండువాడను”.. అను స్పందన లేక చలనాత్మకమైన క్రియా విశేషము ఏర్పడుతోంది. సముద్రంలో జలం ఉన్నది కదా! ఆ జలము తరంగరూపమును పొంది సముద్రమునందే ఒకచోటి నుండి మరొకచోటికి పోవుచున్నది. అట్లే ఉపాధులతో కూడుకొని యున్న బ్రహ్మము కూడా బ్రహ్మమునకు బాహ్యము కానట్టి ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు పోవుచున్నట్లగుచున్నది. చంచలత్వమంతా తనయందు తానే పొందుచున్నది.
సముద్రంలోని జలంపైకి స్పందనసహితంగానూ, లోపల స్పందనరహితంగా ఉంటోంది కదా! సర్వశక్తిమంతమగు బ్రహ్మము తనకు వేరే కానట్టి ఒకానొక చోట క్రియాశీలత్వము పొంది ఉంటోంది. అంతర్గతంగానో, సర్వదా యథాతథంగానే ఉంటోంది.
ఆకాశంలోని వాయువును చూడు. అది తనయందు తానే చలనము పొందుచున్నది కదా! దాని చలనమునకు మరొకటేదీ కారణమగుట లేదు. అదేవిధంగా స్వతహాగా కూటస్థ స్వరూప మైన ఆత్మ తనయందు తానే బాహ్యధ్యాసను పొందుచున్నది. దీపం ఎల్లప్పుడూ పైకే ప్రసరిస్తుంది కదా! ఆత్మ కూడా స్వశక్తిచే స్వస్వరూపమునందే ఈ "జగత్తు-జీవులు" అను రూపమున ప్రకాశించుచున్నది. విశాలమైన తటాకంలో ఒక ప్రదేశమందు మాత్రమే సుడిగుండములు కనిపిస్తూ ఉంటాయి. అట్టి సుడులు ఏర్పడుచోటనే జలం అతివేగంగా వృత్తాకారంగా ప్రవృత్తమౌతూ ఉంటుంది. సర్వతత్వ స్వరూపము, మహాశక్తివంతము అగు ఆత్మ కూడా తన స్వరూపము నందు కల్పించబడిన ఒకానొక ప్రదేశంలో క్రియాశక్తివిలాసయుక్తమై ఒప్పుచున్నది. జలమధ్యంలో అగ్నిశిఖలు (బడబాగ్ని) కనబడునట్లు చిద్రూప మహాసముద్రంలో ఇంద్రియ ప్రకాశమంతా స్ఫురిస్తోంది.
నిర్మల చిత్ శక్తి - చిద్రూపము స్వతహాగా నిర్మల స్వరూపము. అది ఇంద్రియములకు అతీతమైనది. కాని ఈ ఇంద్రియాలను వెలిగిస్తున్నది, పొందుచున్నది, ఉపయోగిస్తున్నది కూడా అదియే సుమా! కించిత్ క్షుభితరూపా సా చిచ్ఛక్తిశ్చిన్మహార్ణవే | తన్మయీచిత్స్ఫురత్యచ్ఛా తత్రైవోర్మిరివార్ణవే ॥ … (సర్గ 42, శ్లో 11)
అట్టి నిర్మల చిద్రూప మహాసముద్రంలో 'జగత్భావన' అనబడు స్వల్పవిక్షోభము ఏర్పడు తోంది. అప్పుడు అది సముద్రమందు తరంగంవలె, ఆ స్పందనతో తన్మయమగుచున్నది. ఫలితమే ఇంద్రియ సంబంధమగు చిత్-శక్తి యొక్క ప్రకటన. అయితే ఇంద్రియ సంబంధమగు చిత్శక్తి, ఆత్మచిత్-శక్తికంటే వేరైనది కాదు. కాని, వేరైన దానివలె కనిపిస్తోంది. కాల్చబడి, అగ్నిప్రకాశము వెదజల్లుచున్న ఒక ఇనుపతీగను అతి వేగంగా గాలిలో ఒక ఆకారంగా త్రిప్పుచున్నామనుకో...
Page:210
అప్పుడు ఆ స్థానంలో ఒక స్థిరమైన ఆకారం గోచరిస్తుంది. అట్లే చిత్-శక్తి ఉపాధి పారవశ్యంచేత "దృశ్యము వాస్తవము, స్థిరము” అను అనుభవం పొందుతోంది. ఆ చిత్-శక్తియే తనయొక్క సర్వశక్తిత్వ కారణం చేత ‘కాలము' అను రూపమున కూడా స్ఫురించుతోంది. అనగా, స్వయముగా తన కాలశక్తిని ప్రదర్శించుచున్నది. దేశము, కాలము ఆ చితశక్తి నుండి బహిర్గతములగు నిప్పురవ్వలవంటివే.
భావన ఎట్లా ఉంటే ఈ జగత్తు కూడా అట్లే - ఆ చిత్ శక్తి తనయొక్క స్వస్వభావమును ఒక సమయంలో ఎరుగుచున్నది. అప్పుడు ఆద్యంతరహితమైనట్టి పరమాత్మ పదమున స్థితి పొంది ఉంటోంది. అయినా కూడా, మరొకప్పుడు విచారణను వదలియుంటున్న కారణంగా భ్రాంతి వశంచేత కల్పితరూపమే తన స్వభావముగా ఎంచుచు, “నేను పరిచ్ఛిన్నుడను”... అను భావన తన యందు దృఢపరచుకొనుచున్నది. ఆ పరమసత్త “నేను పరిచ్ఛిన్నమైనట్టి విషయమును” అను నిశ్చయమును ఆశ్రయించిన మరుక్షణం ఇక ప్రాణేంద్రియములను, నామరూపములను తన రూపములైనట్లు గాంచుచున్నది. అందుచేత “చిద్వస్తువునందు ఈ సర్వము కల్పించబడుచున్నది. అట్లు కల్పించబడుచున్న సర్వపదార్థములు చైతన్యమాత్రమే అయివున్నాయి” అని గ్రహించు. "సద్రూపమగు ఆత్మకంటే వేరైనది” అని స్ఫురించుచున్నదంతా అవస్తువేగాని, సత్యము కాదు. గాజులు, ఉంగరము మొదలగు పేర్లతో చెప్పబడుచున్న ఆభరణమునకు, బంగారమునకు గల బేధమేమున్నది చెప్పు? ఆభరణమంతా బంగారమే అయి వున్నది కదా!
చిదంశమగు ఆత్మ “భావన” చేయుచున్న సమయంలో ఈ జగత్తు యొక్క ఉనికి ఏర్పడటం జరుగుతోంది. అయితే, ఈ జగత్తు, చైతన్యము... 1) ఒక్కటే 2) వేరు వేరు... అను రెండింటి కన్నా కూడా విలక్షణమైన ఒక అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి.
దీపములు, అగ్ని : జగత్పదార్ధములు, చైతన్యము - ఒక దీపంతో అనేక దీపములు వెలిగించ బడ్డాయనుకో... అప్పుడు వేరు వేరు దీపపు వత్తులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్క దీపము తదితర దీపములకంటే వేరైనదే కదా! కాని దీపాగ్ని దృష్ట్యా చూస్తేనో? వేరు వేరు దేశ కాలములలో ఉన్న దీపములన్నిటిలోని దీపాగ్ని ఒక్కటే అయివున్నదికదా! అట్లే దేశ-కాలఉపాధుల దృష్ట్యా అనేక చైతన్యములు ఉన్నాయి. అనేక స్వరూప స్వభావములు ఉన్నాయి. కాని భూతభవిష్యత్తు వర్తమానములందలి సర్వ ఉపాధులలోని చైతన్యమంతా ఒక్కటే అయివున్నది. అయితే, దేశము, కాలము మొదలైన స్పందనశక్తితో కూడుకొని యున్న చైతన్యము "సంకల్పము” వైపునకు పరుగులు తీస్తూ, మలిన రూపమును పొందుచున్నది.
ఈ దేశ కాలాదులన్నీ ఉండి ఉన్నది ఆ చిద్రూపము నందే.
క్షేత్రజ్ఞుడు - ఈ సర్వ ఉపాధులను ఆశ్రయించి ఉంటూ సర్వ అనుభవములకు స్థానభూతమైనదేదో, అదే 'క్షేత్రజ్ఞుడు'. ఈ శరీరము యొక్క బాహ్యాభ్యంతరములను తెలుసుకొనుచూ, తన పూర్ణరూపమును ఎరుగువాడు కనుక “క్షేత్రజ్ఞుడు” అని అంటున్నాం. రైతు యొక్క పొలము రైతు కంటే వేరుగా ఊరికి
Page:211
బయటగా ఉంటుంది కదా! క్షేత్రజ్ఞుడు ఈ శరీరాదులకు, విలక్షణమైయున్నాడు. సర్వదీపములలోను ఒకే అగ్నివలె నాలోను, నీలోను ఇంద్రునిలోను, త్రిమూర్తులలోను క్షేత్రజ్ఞుని దృష్ట్యా భేదమేమీ లేదు. అతడే శరీరి అంటే కూడా. క్షేత్రజ్ఞుడే జీవుడు.
క్షేత్రము - ఈ శరీరమే క్షేత్రము. ఈ క్షేత్రమునకు బాహ్యంగా ఇంద్రియార్థములు, దృశ్యము మొదలైనవి ఉన్నాయి. అంతరమున మనస్సు బుద్ధి మొదలైనవన్నీ ఉన్నాయి. అట్టి బాహ్య, అంతరములన్నీ ఆ క్షేత్రజ్ఞుడి చేతనే ప్రవర్తింపబడుచున్నాయి.
జ్ఞానము = క్షేత్రజ్ఞునితో 'ఏకత్వము' లేక 'తాదాత్మ్యము'. 'నేను క్షేత్రజ్ఞుడను' అను దృఢమైన అనుభవముతో కూడిన ఎరుక.
అజ్ఞానము = క్షేత్రము (శరీరము) తోటి ఏకత్వము పొందుట. "నేను ఈ శరీరమును” అను
భావన కలిగి ఉండుట.
'క్షేత్రజ్ఞుడు' వాసనల గురించి కల్పనలను ఒనర్చుచూ, 'అహంకారము' అను రూపమును పొందుచున్నాడు. ఆ అహంకారమే పదార్థాదులను నిశ్చయించుటచేతను, తదితర కల్పనలకు హేతువు అగుట చేతను “బుద్ధి” అని చెప్పబడుతోంది. చైతన్యము కంటే జీవుడు వేరు కాదు. జీవుని కంటే అహంకారము వేరు కాదు. అహంకారము కంటే బుద్ధి వేరు కాదు... అని గ్రహించబడు గాక! సంకల్పములచే కలుషితమై నప్పుడు బుద్ధియే మననం చేయు స్వభావంచే, మనోరూపాన్ని పొందుచున్నది. ఘన వికల్పాలను ఆశ్రయించుటచే ఈ మనస్సు ఇంద్రియాల రూపాన్ని పొందు చున్నది. ఈ దేహం ప్రపంచంన ఉత్పన్నమౌతోంది. జీవధారణ చేస్తోంది. ప్రత్యక్షమై తెలియ వస్తోంది. తదితరమైన దృశ్యమంతా అనుభవంగా దేహధారుడగు జీవునిచే పొందబడుతోంది.
తెలుసుకొనుట అను వాసనలకు సంబంధించిన శుద్ధ చైతన్యము వ్యవహారదృష్టి కల్పన వాసనలను అహంకార చైతన్యము
ఆశ్రయించు తత్వము
1 1
క్షేత్రజ్ఞుడు జీవుడు
అహంకారము → నిశ్చయమునకు సంబంధించిన కల్పన బుద్ధి
బుద్ధి →→ఇంద్రియ విషయములను మననము చేయు స్వభావము (భావనాపరంపర) మనస్సు మనస్సు → తీవ్రమైన వికల్పనలు ఘనీభూతమైన శబ్ద స్పర్శాది భావనలు → ఇంద్రియాలు ఇంద్రియాలు → కాళ్ళు చేతులు మొ॥ అవయవాలతో సంబంధము →>> దేహము
దేహము → దృశ్యం తెలియవచ్చుట →>> దృశ్య జగత్తు
Page:212
ఇలా జీవుడు 'సంకల్పములు' అనే పాశములచే బంధింపబడుచున్నాడు. ‘దుఃఖమయాలే’ అయిన బాహ్యాభ్యంతరములందలి పదార్థజాలములందు తనకు తానే చిక్కుకొనుచున్నాడు.
అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ క్షేత్రజ్ఞుడు లేక జీవాత్మ అవిద్యా పరిణామవశం చేతనే 'శరీరము, దృశ్యము' మొదలైన విలక్షణత్వమంతా పొందుచున్నాడు. వాస్తవానికి అతని చిత్స్వభావము పరిణామరహితమైనది.
రేగు కాయ పక్వమై రేగు పండుగా పరిణమించినంత మాత్రం చేత, అద్దాని సజాతిత్వము మార్పుపొందుట లేదు కదా!
ఈ విధంగా చైతన్యము జీవరూపమును, జీవుడు అహంకారరూపమును, అహంకారము బుద్ధి రూపమును, బుద్ధి సంకల్పపరంపరలచే కలుషితమై మనోరూపమును పొందుచున్నాయి. అప్పుడు ఈ మనస్సు సఫలవిఫల (satisfied-unsatisfied) మనోరథాలతో కూడుకుని ఉంటోంది. “ఈమె నా స్త్రీ, వీరు నా పుత్రులు,. వీరు నా వారు, వారు తదితరులు"... మొదలైన శరీరాకార వృత్తులను స్వీకరించుచు, తన యందు ఆ వృత్తుల దృష్టిని పొందుతోంది. పరిచ్ఛిన్నములు, తుచ్ఛములు అయిన అనేక విషయములందు ఆసక్తి పొంది ఉంటోంది.
సముద్రము వైపు నదులు వెళ్లుచూ ఉంటాయి. మదించిన ఎద్దు ఉన్నవైపుగా ఆవు పరుగులు తీస్తూ ఉంటుంది. చిత్తమునందలి 'ఇచ్ఛ' అను దోషమే ఈ జీవుణ్ణి విషయములవైపు పరుగులు తీయించుటకు కారణము అగుచున్నది. ఈ చిత్తము తన యందలి ఘనాహంకారముచే చమత్కారముగా ప్రవృద్ధమగుచున్నది. పట్టుపురుగులాగా తన కోర్కెలచే తానే 'బంధితురాలు’ అగుచున్నది. చేపలు ఎఱ కోసం స్వయముగా గాలమునకు చిక్కుకుని మృత్యువాతపడతాయి చూచావా? ఈ మనస్సు కూడా "స్వసంకల్ప అనుసంధానము”చే స్వయముగా బంధమునందు తగుల్కొనుచున్నది. ఆహాఁ! ఇది ఎంతటి హాస్యాస్పదం! ఎంతటి విచారకరమైన విషయం!
"నేను బద్ధుడను”... ??? చైతన్యము తన పారమార్థిక శుద్ధరూపమును క్రమముగా త్యజించుచు “నేను బద్ధుడను" అని భావించుచున్నది. “ఆశ, సంబంధము”... ఈ రెండే అద్దానిని బద్ధునిగా చేస్తున్నాయి.
శ్రీరాముడు: జన్మ-జరా మరణముల రూపమును మరల మరల సంతరించుకుంటున్న ఈ ‘అవిద్య’ అనే జగజ్జాలం ఎక్కడ నుండి ఉత్పన్నమౌతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి: అది ఆ జీవుని యొక్క అంతఃకరణమునందే ఉత్పన్నమౌతోంది. ఈ మనస్సే తన యొక్క సంకల్పముచే శబ్దము, స్పర్శ మొదలైన విషయములకు రచయిత. విషయములే మనస్సుకు ‘అగ్నిజ్వాల' అగుచున్నది.
అవిద్యాయుక్తమైన మనస్సు “బోనులో బంధింపబడిన సింహం"లాగా మిక్కిలి అవ్యవస్థ పొందుతోంది. క్రమంగా ఈ మనస్సు అనేక విహిత, నిషిద్ద కార్యములకు కర్తృత్వము వహించు
Page:213
చున్నది. తన ఇచ్ఛా మాత్రంచేత కల్పించబడిన బహువిధములైన కర్మలందు, జన్మలందు ఇరుకు కొనుచున్నది. ఇంకేముంది? సకల దుర్దశలను ఒకటి తరువాత మరొకటిగా పొందుతూనే ఉన్నది.
మనస్సు... మనో నిగ్రహం - ఈ మనస్సు ఒకప్పుడు మనన శక్తిచే మనోరూపమును, మరొకప్పుడు నిర్ణయాత్మక శక్తిచే బుద్ధిరూపమును సంతరించుకుంటోంది. అదియే ఇంకొకప్పుడు జ్ఞానరూపమును, క్రియారూపమును, అహంకారరూపమును, శరీరరూపమును పొందుచున్నది. ఒకే నటుడు వేరు నాటకములలో వేరు పాత్రలలో నటిస్తున్నాడు కదా! అట్లాగే మనస్సు ఒకచోట 'మాయ' అను రూపము వహించి ఈ జీవుని భావములను సంకుచితపరుస్తోంది. ఒకచోట మూర్ఖరూపమున, మరొకచోట త్యాగరూపమున స్థితి కలిగి ఉంటోంది. ఒక సమయంలో ‘చిత్తము’ రూపమున, ‘అవిద్య' రూపమున ఇచ్ఛ రూపమున... ఈ విధంగా ఆ మనస్సు ఎత్తుతున్న అవతారములకు అంతు ఎక్కడ? ఈ ప్రపంచమంతా సంచరిస్తున్నది మనస్సే. అదియే పలువైపులా బంధించబడి, తృష్ణ, శోకములచే పరిపూర్ణమై, రాగద్వేషములకు విశాలస్థానమై ఒప్పుచున్నది.
ఈ మనస్సు యొక్క గతి గురించి ఇంకేం చెప్పమంటావు? ఇది జరామరణమూర్ఛలకు సంబంధించిన అనేక భవభావనలచేత మరల మరల క్షోభను పొందుతోంది. ఇష్టానిష్టములైన విషయములచే తరుమబడుతోంది. తదితరులపట్ల ఏర్పడు దుష్టమైన అభిప్రాయాదులచే దూషిత మగుచున్నది. దాని ఆకృతి ఇచ్ఛయే. సంక్షోభమే దాని ప్రతాపము. ఈ అనేక రకములైన కర్మలన్నీ చిగురిస్తున్నది మనస్సు నుండే. అది అనేక అనర్థములను కల్పన చేసుకుంటూ తన యొక్క ఉత్పత్తి స్థానము, నిలయస్థానము అగు పరమాత్మ పదమునే విస్మరించి వేస్తోంది. నాలుగు వైపుల నుండి బంధింపబడుచు, అనేక దుఃఖములను అనుభవిస్తోంది.
“ఎందుచేత”... అనునది మనకు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి మా సమాధానం విను. “ఆత్మకంటే భిన్నమైన దాని వలె ప్రాప్తిస్తున్న దృశ్యరూపము గూర్చిన యథార్థ జ్ఞానం సముపార్జిం చకపోవుట చేతనే. తన భారముచే తనకు తానే భయోత్పాతములు, జరామరణభావములు పొందుచున్న ఈ దుష్ట మనస్సు సంసారారణ్యంలో సంచరిస్తూ ఉండటానికి కారణం, విచారణ చేయక పోవటమే అయి వున్నది”.
సంసారము అనబడునది ఎక్కడో లేదు. ఈ మనస్సు ఆశాపాశములను తన చుట్టూ నిర్మించుకొని, పురుషార్థహీనమై ఉంటోంది చూచావా...? అదియే సంసారము యొక్క స్వరూపము. అది చింతల చేత, క్రోధము చేత, కామము చేత అత్యంత బంధనము పొందుతోంది. ఆత్మ స్వరూపమును పొందలేకపోతోంది.
అట్టి దుర్భరమైన మనస్సును పొందిన ఈ మానవుడు చూస్తూ ఊరుకోవటం ఉచితమా? కానే కాదు. అద్దానికి వర్తమానంలోనే ఉత్తమ పురుషప్రయత్నం, అధ్యయనము, విచారణ మొదలైన ఔషధములను అందించాలి. అదియే జీవుని కర్తవ్యం.
Page:214
చూచావా రామచంద్రా! జింకల గుంపును వీడిన జింకలాగా ఈ మనస్సు ఎంతో దుఃఖా క్రాంతమగుచున్నది. ఇది, పాపం, విషజ్వాలలచే దహించబడుతోంది. “ఈ జన్మ మృత్యువులు సత్యమైనవే” అని అనుకొని 'తెగిన కమలం' లాగా ఎంతో బాధపడుతోంది. ఇతఃపూర్వపు అనేక దేహముల పట్ల గల అభిమానముచే ఎంతగానో వియోగము అనుభవించి... అనుభవించి అలసి పోయివున్నది. ఇప్పటి ఈ దేహపతనమును ఒక 'పీడకల' వలె దర్శిస్తోంది. "అయ్యో! ఈ నా ప్రియమైన దేహము కొద్దిరోజులలో అకస్మాత్తుగా నేలకూలనున్నది కదా! ఇక నా గతి ఏమిటి?” అని వాపోవుచు భిన్నరాలై ఉన్నది. "ఓయీ! జీవుడా! నీ యొక్క ఉత్తమ ప్రయత్నముచే నన్ను సముద్ధరించవచ్చును కదా?" అని ఈ మనస్సు అభ్యర్థన చేస్తోంది. ఓ రామా! ఇట్లు అనేక దుఃఖ ములు పొంది యుండుటచే తన 'ధృతి-ఉత్సాహము'లను కోల్పోయి సంచరించుచున్న ఈ మనస్సును నీవు, ఎట్లైనా సరే, కాపాడి జ్ఞానమయం చేయాలి. సముద్రంలో కూలిపోయి విలవిల లాడుచున్న పక్షిలాగా, బురదలో ఇరుక్కుని ఉన్న దున్నపోతులాగా ఈ మనస్సు 'జగజ్జాలము' అనే శూన్యనగరంలో పడికొట్టుకొంటోంది.
ఓ జనులారా! బంధ హేతువులు, బంధసాధనాలు అయిన ఈ దేహం, గృహం, స్వజనం మొదలైనవాటి యందు అత్యంత ప్రీతిని కలిగియుండి తేనెలో ఇరుక్కున్న గండుచీమలాగా బాధ పడుచున్న ఈ మీ మనస్సును మీరే ఉద్ధరించాలి సుమా! లేకుంటే ఎవరు ఉద్ధరిస్తారు చెప్పండి!
ఓ సర్వజనులారా! మీకు తత్త్వజ్ఞానములందు, తత్సాధనములందు తగినంత ఆదరణ ఉండటం ఎంతైనా అవసరం. “ఆత్మజ్ఞానవిషయమై అనాదరణ” అనే సముద్రంలో మీ మనస్సులు కొట్టుకుపోవుచున్నాయే! విషయములందు నిమగ్నమగుటచే అది కుంచించుకుపోతోందే! చైతన్య రూపులగు మీరు ఈ మనస్సు యొక్క రోదనను వినండి. విని ఆదుకోండి. 'అవిచారణ’చే ఇంకా ఇంకా దానిని బాధించకండి. అప్రయత్నశీలురై ఉండకండి.
‘విషయములు' అనే బురదలో ఇరుక్కున్న...“మనస్సు” అనే ముసలి దున్నపోతును... ‘ఉత్తమ కర్మలు’ అనే త్రాళ్ళ సహాయంచే... 'అనాసక్తి' అనే ప్రయత్నముచే... 'విచారణ' అనే శక్తిచే బయటకు లాగండి! "శుద్ధజ్ఞానము” అనే నీటితో కడగండి! "సాత్విక స్వస్థతలు” అనే వస్త్రముచే పరిశుభ్రం చేయండి! “మోక్షము” అనే ఉత్తమ స్థలంలో విశ్రాంతి పొందనివ్వండి.
నాయనలారా! అల్ప జలము, అధికమైన బురద గల ఒక దుర్వాసనపూరితమైన తటాకం ఉన్నది. ఆ తటాకమే కామము, రాగములతో కూడిన ఆపేక్ష. అందులో ఛిన్నాభిన్నములైన అంగములతో కూడిన ఈ మనస్సు చిక్కుకున్నది. శుభ, అశుభ క్రియలతో బహుమలినమై ఆ మనస్సు సంచరిస్తోంది.
అట్టి ఆ మనస్సుకు "అకర్తృత్వం' నేర్పాలి. ఎవడైతే జరామరణములవంటి అనేక విపత్తులతో కూడిన దృశ్యజగత్తు నుండి తన మనస్సును కాపాడుకొనుటకు యత్నించడో... ఆతడు'నరుడు' అనిపించుకోడు; నరుని రూపంలోగల మూఢమృగమే అతడు.
Page:215
12. వివిధ జీవోత్పత్తులు
శ్రీరాముడు: దేవా! ఈ అనేకులగు జీవులయొక్క ఉత్పత్తి స్వభావమేమిటో.. బహువిచిత్రంగాను, భయమును గొలిపేటట్లుగాను ఉన్నదే! ఆహా! ఏమి భ్రమాత్మకమైన వ్యవహారం!
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును, నిజమే. ఈ అసంఖ్యాకములగు కల్పితాకారముగల జీవులు ఉపాధిచేత మాత్రమే 'వేరువేరు' రూపములుగా విభాగములుగా తోచుచున్నారు. వీరంతా ఈ విధంగా సంసార వాసనా ప్రవాహంలో తగుల్కొని చేతలను, మాటలు ప్రదర్శిస్తున్నారు. అయితే, జల కణములన్నీ సెలయేరు నుండే ఉత్పన్నములగుచున్నట్లు, వీరంతా బ్రహ్మము నుండే ఉత్పన్నమై ఉన్నారు... ఇప్పుడు ఉత్పన్నమగుచున్నారు... ఇకముందు కూడా ఇట్లే ఉత్పన్నం కాబోవుచున్నారు. ఇట్టి జగత్తు గురించి నీవు భ్రమించవలసిన పనేమున్నదో చెప్పు?
శ్రీరాముడు: ఆత్మస్వరూపులే అయి ఉండి కూడా వీరంతా ఇట్లు ఎందుకు, ఎవరి కారణంగా వివశత్వం పొందుచున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి: వీరంతా స్వవాసనావశం చేతనే వివశత్వం పొందటం జరుగుతోంది. వీరి అంతఃకరణములు సుఖ-దుఃఖములగు అనేకమైన విచిత్ర దశలందు 'నిబద్ధం' అగుచున్నాయి.
అట్టి ఈ జీవులు వివిధ భూప్రదేశములందు, జలములందు, స్థలములందు, కాలము లందు... నీటిలో బుద్భుదములు వలె.... ఉత్పన్నమగుచున్నారు... నశిస్తున్నారు. అట్టివారిలో కొందరు ఈ వర్తమాన కల్పమునందే అసంఖ్యాకంగా అనేక జన్మలు పొందినవారు ఉన్నారు.
మరికొందరు ఈ కల్పంలో కొద్ది జన్మలు మాత్రమే ఎత్తియున్నారు. ఇంకొందరు రెండు, మూడు జన్మలు మాత్రమే ఎత్తారు. కొందరు కొందరైతే, ఇంకా ఈ కల్పమునందు జన్మించియే ఉండలేదు. క్రిందటి 'కల్పము'లోని ఒక జన్మ నుండి ఇంకా తేరుకొనలేదు.
మరికొందరు జీవన్ముక్తులకు ఇదే ఆఖరి జన్మ అగుచున్నది. కొందరికి ఈ జన్మపరంపరల పరిసమాప్తి అగుటచేత, వారు 'కైవల్యప్రాప్తి' పొందియున్నారు.
కొందరు వేలకొలది జన్మల వరకు మరల మరల ఉద్భవిస్తూ, ఒకే ‘దేహజాతి’ యందు స్థితి పొందియున్నారు. ఇంకా కొందరు రెండు, మూడు దేహజాతులందు మాత్రమే మరల మరల జన్మలు పొందుచున్నారు.
కొందరు భిన్న భిన్న దేహములను 'ఒక క్రమము' అంటూ ఏదీ లేకుండా లెక్కింపలేనంతగా పొందుచున్నారు. కొందరు జీవులు నరకము నందు దీర్ఘకాలంగా గొప్ప యాతనలు పొందుచున్నారు. కొందరు అల్పసుఖము కొరకు ఎంతో ప్రయాసలు పడుతూ మనోవ్యసన రూపముతో సంచరిస్తున్నారు.
మరికొందరు దైవస్వరూపులై, మిక్కిలి ప్రసన్నులై ఉన్నారు. కొంతమంది జీవులు ‘కిన్నర-గంధర్వ-విద్యాధరుల’ వంటి మనోహరమైన రూపమును పొందియున్నారు.
Page:216
కొందరు సత్యలోకనివాసులై దివ్యశరీరములతో, ఆత్మజ్ఞాన శబ్దార్థములతో విరాజిల్లు చున్నారు. కొంతమంది “సూర్య, ఇంద్ర, వరుణ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు"గా ఉన్నారు.
కొందరు కూష్మాండ (దేవతలలో ఒక తెగ), బేతాళ, యక్ష, రాక్షస, పిశాచాదుల రూపమున ఉండి ఉన్నారు. మరికొందరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూపమున స్థితి పొందియున్నారు.
ఇందులో కొందరు తుచ్ఛ విషయములపట్ల ఆసక్తి పూరితులై స్వభావరీత్యా చంఢాల, కిరాత జన్మలు పొందుచూ, ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు క్రూరత్వమును ప్రదర్శించుచున్నారు. కొందరు పక్షి రూపమును పొందియున్నారు. అట్లే తృణము, ఓషధుల, ఫలముల, ఆకుల రూపమున కూడా కొందరు జీవులు ఉంటున్నారు.
ఇట్లా ఎంతైనా వర్ణించవచ్చు సుమా! కొందరు సంసారవైభవమును పొందుచున్నారు. “నేను రాజును కావాలి... మంత్రిని కావాలి... సంఘనాయకుడను కావాలి... ఫలానా చోట ఇళ్ళు కట్టి, వాటికి యజమానిని కావాలి... అందరూ నా అధికారం అంగీకరించాలి...” ఈ విధంగా ఉంటున్నాయి, వారి వారి సాంసారిక భావనలు!
కొందరు నారబట్టలు కట్టుకుని మునులవలె మౌనము వహించి అంతా చూస్తూ కూడా, ఏమీ పట్టనట్లు ఉంటున్నారు.
కొందరు రాగముతో మమకారముతో వేటివేటినో ప్రోగు చేసి దాచుకుంటున్నారు.
కొందరు సర్పము, కొండచిలువ, క్రిమి, కీటకములు, పురుగులు మొదలైన ఉపాధులను ఆశ్రయించి స్వల్పము, తుచ్ఛము అగు పదార్థములను మహత్తరమైన వాటివలె దర్శిస్తున్నారు.
కొందరు సింహము, మేక, ఎద్దు మొదలైన మృగరూపములు ధరించి ఆహారము పొందుట, నిద్ర, మైథునము అను రెండు మూడు కార్యక్రమములందే నిమగ్నమై ఉంటున్నారు. కొందరు ఆపదలకు వశము అగుచున్నారు. మరికొందరు సంపదలను పొందుచున్నారు.
కొందరు స్వర్గపురములలో, నరకములో, నక్షత్రమండలంలో వృక్షము యొక్క ఛిద్రంలో, వాయువులో, ఆకాశంలో స్థానములు పొంది ఉంటున్నారు.
కొందరు సూర్యకిరణములలోని రసమును గ్రహించుటకు అధికారం పొంది ఉంటున్నారు. మరి కొందరు చంద్ర కిరణములలోని ఓషధత్వము యొక్క పరిపక్వత కొరకై తమ తమ ఉపాధులను నియోగించుచున్నారు.
అన్యజనుల పట్ల శ్రేయోభిలాష కలిగియున్నట్టి కొందరు, తత్సంబంధమైన ప్రయత్నము లందే మనోవాక్కులను నియమించి సంచారం సలుపుచున్నారు. మరికొందరు చిరకాలంగా జీవన్ముక్తత్వము అనుభవించి ఇక విదేహముక్తిని సమీపించు అభిలాషతో ఉంటున్నారు.
మరి కొందరు “మాకు ముక్తి కంటే తదితర జనుల సుఖశాంతులందే మక్కువ” అను భావన కలిగియుండి, తదనుకూలంగా ఏవేవో కార్యక్రమములు ఏర్పరచుకొని వర్తిస్తున్నారు. సద్గురువులు అవతారములను ధారణచేస్తూ శిష్యలను సువిజ్ఞానులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంటున్నారు.
Page:217
భోగ లంపటంలో పడిన మరికొందరు “విదేహముక్తి” “ఆత్మ సమాచారం” మొదలైన వాటిని పరమద్వేషభావంతో పరికిస్తున్నారు.
కొందరు తీవ్రవేగంతో ప్రవహించే నదులయొక్క అధిష్టాన దేవతారూపులై ఉంటున్నారు. కొందరు ఉత్తమ స్త్రీ రూపమున, పురుషరూపమున, నపుంసకరూపమున ఉంటున్నారు.
కొందరు ప్రబుద్ధమైన 'మతి'ని కలిగి ఉంటున్నారు. మరికొందరు మిక్కిలి జడమైన అంతః కరణము కలిగి ఉంటున్నారు.
కొందరు తదితరజనులకు జ్ఞానం ఉపదేశించే 'నిష్ఠ' కలిగి ఉంటున్నారు. ఇక కొందరు మరెవ్వరితోనూ సంభాషించటానికి ఇష్టపడక, సమాధినే ఆశ్రయించి దీర్ఘకాలం గడిపివేస్తున్నారు.
ఇదంతా ఏమిటంటావా? ఈ జనులు తమ తమ వాసనలకు వివశులై, అవిద్యాబుద్ధులై అనేక భావావేశములను ఆశ్రయించి, ఇదంతా ఇట్లు పొందుచున్నారు. ఇదంతా ఆయా భావ దశలందు స్థితి పొందియుండుటే అయివున్నది. ఇంకా...
విహరన్తి జగత్కేచిన్నిపతన్యుత్పతన్తి చ |
కన్దుకా ఇవ హస్తేన మృత్యున్నా విరతం హతాః || (సర్గ 43, శ్లో 25)
ఇంకొందరు ఈ భూమిపై ఉన్నారు. కొందరు నరకంలో పడుచున్నారు. ఇంకొందరు స్వర్గమునకు ఎగురుచున్నారు. విసరబడుచున్న బంతిలాగా కొందరు ఒక శరీరము నుండి మరొక శరీరమునకు వెళ్ళుచున్నారు.
ఆశాపాశశతాబద్ధా వాసనాభావ ధారిణః ।
కాయాత్కాయముపాయాన్తి వృక్షాదృక్షమినాండజాః ॥ (సర్గ 43, శ్లో 26)
పక్షి ఒక చెట్టు నుండి లేచి మరొక చెట్టుపై వ్రాలుచున్నట్లు ఈ జీవులలో అనేకులు అనేక ఆశాపాశములకు బద్ధులై అనేక భవిష్యత్ దేహములను ధరించుటకు ఇప్పటికిప్పటి నుండే సిద్ధము అగుచున్నారు.
❖
ఈ జీవుడు అత్యుత్తమమగు తన ఆత్మను దర్శించనంతవరకు ఇట్లే అనేక ఉపాధి పరంపరలను అనుభవిస్తూనే ఉంటాడు. అసంఖ్యాకములగు విషయములకు, సంకల్పములకు బద్ధులై 'మాయ' లేక 'అవిద్య' ను ఆశ్రయిస్తూ, ఈ విస్తారమైన విశ్వంలో సంచారం చేస్తూ ఉంటారు. జలంలో కెరటంలాగా, ఆవృత్తములులాగా ఇట్లే తిరుగాడుతూ ఉంటారు.
ఓ రాఘవా! ఈ జనులలో కొందరు అసద్వస్తువును త్యజించి సత్యజ్ఞానమును పొంది ఉంటున్నారు. జ్ఞాన భూమికాక్రమమున ఆత్మపదమునందు స్థిరత్వము బడయుచున్నారు. అట్టి జీవులు మరల ఈ ప్రపంచమున జన్మించుట లేదు.
ఇక మరికొందరు జీవుల విషయానికి వద్దాం. వారు వివేకమును పొంది కూడా, విషయ లంపటులై ఉంటున్నారు. అందుచేత వేలకొలది జన్మలు అనుభవించి ప్రశ్నార్థకంగా మరల మరల సంసార సంకటమున పడుచున్నారు.
Page:218
ఉత్తమ సంస్కారములను ఆశ్రయించుచున్న ఇంకొందరు ఉత్తమ ప్రదేశములందు, ఉత్తమ కాలములందు జన్మలు పొందుచున్నారు. సత్సమాగమమును పొందుచున్నారు. అట్టి వారు “దేవత -గంధర్వ –ఋషి” మొదలైన విభవమంతా పొందుచున్నారు. వారిలో కొందరు గర్వితులై, సాంసారిక దృష్టిని మరల ఆశ్రయించుటచే తమ మార్గముల నుండి మరల వెనుకకు మరలు చున్నారు. కొంత వెనుకకు, మరల ముందుకు చనుచున్నారు. వారిలో కొందరైతే పక్షి, మృగము మొదలైన స్థితిగతులను కూడా కొని తెచ్చుకుంటున్నారు. తుచ్చమగు విషయములపట్ల గల ఆశచే మరల జంతువుల యోనులను పొంది నరకమునకు పోవుచున్నారు.
కొందరు మహాబుద్ధిశాలురు బ్రహ్మదేవుని మనస్సు నుండి ఉత్పన్నమగుచున్నారు. (బ్రహ్మ మానస పుత్రులగు నారదుడు, వసిష్ఠుడు, సనత్కుమారుడు మొ॥ అందుకు ఉదాహరణ). అట్టి మొదటి జన్మ యందే "బ్రహ్మము” అను మోక్షపదమున ప్రకాశించుచున్నారు. మరికొందరు తమ ఉత్పత్తి స్థానమున బ్రహ్మాండమునందో, లేక వేరొక బ్రహ్మాండమునందో... బ్రహ్మదేవునిగానో, విష్ణువు గానో, మహేశ్వరుడు గానో అగుచున్నారు. కొందరు ఉత్తమ జన్మల నుండి చ్యుతి పొంది, ధర్మవ్యతిరేకులవటం చేత స్వల్ప వ్యవధిలో పశు, పక్షి, మృగ, సర్ప ఉపాధులను పొందుచున్నారు.
ఓ రామా! ఈ ఉత్పత్తి క్రమమంతా ఈ బ్రహ్మాండములో ఏ విధంగా ఉన్నదో, తక్కిన బ్రహ్మాండములలో కూడా అట్లే ఉన్నది. అవన్నీ కూడా ఇట్లే విస్తారంగాను, సువిశాలంగాను ఉండి ఉంటున్నాయి. ఇతఃపూర్వం అసంఖ్యాకంగా బ్రహ్మాండములు నిర్మించబడ్డాయి. వాటిలో కొన్ని నశించిపోయాయి. కొన్ని ఇంకా ఉన్నాయి. ఇక ముందు కూడా ఇట్లే అనేక బ్రహ్మాండములు రచించబడబోతున్నాయి. ఇవి కాక, ఏవో కొన్ని కారణాల వలన కొన్ని సందర్భములలో ఆయా జీవుల నిమిత్తం అనేక చిత్ర విచిత్రమైన అవాంతర జగత్తులు ఆవిర్భవించుతున్నాయి. ఇంతలోనే విలయం పొందుచున్నాయి. వాటిలో కొందరు గంధర్వత్వము, కొందరు యక్షత్వము, కొందరు దేవత్వము, కొందరు దైత్యత్వము పొందుచున్నారు.
ఈ బ్రహ్మాండములో మనుష్యులు, వారి వారికి యోగ్యములైన వ్యవహారములు నిర్వర్తిస్తూ సంచరిస్తున్నారు కదా! అట్లే తక్కిన బ్రహ్మాండములలో కూడా ఉన్నారు. ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క విలక్షణముతో కూడి ఉంటోంది. ఈ జీవసృష్టులన్నీ వారి వారి స్వభావమును అనుసరించి నదిలో తరంగాలవలె పరివర్తనం చెందుచున్నాయి.
ఉత్పత్తి, వినాశనము అను రెండు చుక్కల మధ్య ఈ సృష్టులన్నీ అనుక్షణం పరివర్తనం చెందుతూనే ఉన్నాయి. ఇందులోని జీవులు తమ తమ గుణములకు అధీనులై అనిర్వచనీయులై, అనిర్దేశ్యులై ఉంటున్నారు. స్వయంసంబంధమైన ఎరుక అంతఃకరణములు కలిగి ఉండి ఉత్పత్తి వినాశనముల మధ్య అనేక భావాభావములను ప్రకటించుచున్నారు.
Page:219
అయితే రామా! వీరంతా ఉత్పన్నమగుచున్నది పరమపదమగు బ్రహ్మమునుండే సుమా! బ్రహ్మము నందే వీరు ప్రత్యక్షముగా వ్యవహరించుచున్నారు. స్వస్వరూపమగు పరబ్రహ్మత్వమును ఏఒక్కరూ ఏక్షణమందూ ఏమాత్రం త్యజించుటయే లేదు.
ప్రకాశము దీపములోనుంచే వస్తోంది. కిరణాలన్నీ సూర్యుడి నుండే వస్తున్నాయి. కాల్చబడిన ఇనుము నుండే అగ్ని కణాలు వెదజల్లబడుచున్నాయి. పువ్వు నుండే వాసన వస్తోంది. వర్షము నుండే జల బిందువులు బయల్వెడలుచున్నాయి. సముద్రం నుండే తరంగాలు వస్తున్నాయి.
అదే విధంగా ఈ జీవరాశి అంతా కాలానుగతంగా బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతున్నది. అనేక దేహపరంపరలు ధరించి భోగానుభవం పొందుచున్నది. ఆ తరువాత మరొక సమయంలో (ప్రళయకాలంలో) బ్రహ్మము నందే స్వయముగా విలీనమగుచున్నది.
అవిరతమియమాతతా తథోచ్చైర్భవత వినశ్యతి వర్ధతే ముధైవ । |
త్రిభువన రచనాది మోహమాయా పరమపదే లహరీవ వారిరాశౌ ॥ (సర్గ 43, శ్లో 45) ఈ మాయ 'త్రిలోకములు' అను రచనారూపమున భ్రాంతిగా ప్రాప్తిస్తోంది కదా...! ఇదంతా ఇట్లు 'మిథ్య' రూపమున విస్తరిస్తున్నది ఎక్కడ? ఎక్కడో కాదు... ఆత్మయందే.
సముద్రంలోని జలంలో తరంగాలు అనేకం లేచి, కొంత సంచారం చేసిన తరువాత మరల సముద్రజలంలోనే లయిస్తున్నాయి కదా! ఇది కూడా అట్టిదే.
అయితే రాఘవా! నీవు సర్వదా ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు. "మిథ్యావ్యవహారం మాత్రమే’ అయివున్న ఈ 'సృష్టి-స్థితి-లయ'లు శుద్ధ చైతన్య స్వరూపుడవగు నీయందు లేవు. నీవు వాటి యందు లేవు. కనుక నిశ్చింతుడవై 'శాంతి' వహించి ఉండుము.
13. పునఃశరీర ప్రాప్తులు - - పుర్యష్టకము
(సంసారావతరణము)
శ్రీరాముడు: మునీంద్రా! ప్రళయకాలంలో ఈ జీవుడు ఆత్మయందు లయించుచున్నాడని మీరు చెప్పుచున్నారు కదా! మరి అట్లా అయితే, అతడు మరల ‘ఆస్థి పంజరం' రూపంలో గల ఈ భౌతిక దేహమును ఎట్లా ఎందుకు ఎప్పుడు ధరించుచున్నాడు?
శ్రీ వసిష్ఠమహర్షి: మనం ఈ విషయం ఇతఃపూర్వమే విచారించాం. మరి నీవు ఇంకా గ్రహించుట లేదేమిటి? పూర్వాపరములను అత్యంత సునిశితంగా విచారించగల నీ బుద్ధి ఇప్పుడు ఏమి చేయుచున్నది?
ఓ రామయ్యా! ఈ దేహములతో సహా... స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కూడా... ‘అసత్తే’ అయి వున్నదయ్యా. ఇదంతా స్వప్నంలో లాగా అభాసమాత్రంగా ఉదయిస్తోంది.
Page:220
దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ లోకములు, ఈ బ్రహ్మాండములు మొదలైనవన్నీ ఒక దీర్ఘ స్వప్నంలోలాగా మిథ్యారూపముగానే కనపడుచున్నాయి. ఈ జగత్తులో అనుభవమగుచున్న ఆకృతి అంతా... “ఒకతనికి తన కంటి దోషం చేత ఆకాశంలో రెండవ చంద్రుడు కనిపించడం” వంటిది మాత్రమే.
అజ్ఞానికి ఈ దృశ్యం, ఈ ప్రపంచం వస్తుమయంగానూ, ప్రాప్త-అప్రాప్తములతోనూ, రకరకాల పరిస్థితులతో నిండినదిగా కనిపిస్తోంది. సాంసారిక వాసనలు నశించినట్టి జ్ఞానికో...? అతడు ఈ సంసారస్వప్నమును చూస్తున్నప్పటికీ, పరమార్థదృష్టిచే ఏమాత్రం మార్పు చేర్పులూ చూడకయే ఉంటున్నాడు. అందుకని, అతనికి ఇంకొక విధంగా కనిపిస్తోంది.
ఈ సంసారము అజ్ఞానాత్మయందే ఆయా జీవుల స్వభావమును అనుసరించి పరికల్పించ బడి, దర్శింపబడుచూ... మోక్షపర్యంతము ఇట్లే ఉంటోంది. జలంలో ఆవర్తం పొందు స్వభావం ఉన్నట్లు, బీజము నందు అంకురించు స్వభావం దాగి ఉన్నట్లు జీవుని యందు చంచలమైన ఈ 'శరీరములు పొందుట' అను స్వభావం ఉండి ఉంటోంది.
కల్పనయే... వాస్తవరూపముగాగల ఈ దేహము, దేహభావము మనస్సునందే ఉండి ఉన్నది. మనసు అనేక రూపములు కలిగియున్నది. 'వాసనారూపముచే దాని యందు అనేక దేహములు దాగి ఉన్నాయి. అట్టి అనేక దేహములలో 'కర్మపరిపాకము'చే ఏ శరీరము అభివ్యక్త మవుతుందో... ఆ శరీరపు ‘ప్రతిభాస'యే ఈ జీవునకు కాలక్రమంగా సంభవిస్తోంది. అంతేగాని అన్నిటి యొక్క ప్రతిభాస ఒక్కసారే జరుగదు. మట్టియే కుండయొక్క ఆకారముగా అగుచున్నట్లు కర్మలు, భావనలు... ఇవే శరీరముల రూపమున ప్రదర్శితం అగుచున్నాయి.
ఈ సమష్టి దేహముల కర్తయే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవత్వము కూడా ఈ జీవుని స్వభావము యొక్క ప్రవాహానుగుణమైన ఒక సంప్రాప్తియేనని గ్రహించు. ఎందుకంటే అది కూడా అతని వాస్తవతత్త్వమైయుండలేదు. అయితే సర్వక్రియా సమర్థుడు, సమష్టి సృష్టిభావకుడూ అగు బ్రహ్మదేవునియొక్క సంకల్పమాత్రముచే ఈ అపారదృష్టి అంతా స్థితి పొంది ఉంటోంది. ఆయన తన సంకల్పనా సామర్థ్యముచే వస్తు ధర్మచమత్కారమంతా రచిస్తున్నారుకదా!
శ్రీరాముడు: మహాత్మా! మొట్టమొదట జీవచైతన్యము ఉండి ఉన్నది... అది మనోరూపమును పొందుతోంది. ఆ తరువాత అది సమష్టి సృష్టి స్వరూపుడగు 'హిరణ్యగర్భుడు' అను 'స్థితి' లేక 'పదము' పొందుచున్నది కదా! అసలు శుద్ధ చైతన్యమునకు హిరణ్యగర్భుని రూపము పొందవలసిన అగత్యమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి: అట్టి పరిణతి యొక్క క్రమమేమిటో వివరిస్తాను. శ్రద్ధగా వినుఆత్మతత్త్వమునకు వాస్తవానికి దేశకాలపరిచ్ఛిన్నత్వమనేదే లేదు. అయితే అది స్వశక్తిచే లీలామాత్రంగా 'భావనచేయటం’ అను వ్యవహారమును ఎందుకో పొందుతోంది. ప్రశాంత జలంలో తరంగమునకు సంబంధించిన స్పందన వలె ఆ భావనయే ఈ పరిచ్ఛిన్న దేహ అనుభవమునకు, కలుషితమైన దేశకాలములు అనుభవమునకు ప్రారంభస్థానం.
Page:221
వాసనావేశమే మనస్సు యొక్క రూపం. భావనయే వాసనలకు బీజం. అట్టి మనస్సు కల్పన అకల్పనలతో చంచలమై ఉంటోంది. 'జీవుడు' అనగా మనస్సే అయి ఉన్నది. పుష్పము నందు గంధం వలే బ్రహ్మము నందు 'మనఃశ్శక్తి' అంతర్లీనమైయున్నది. అట్టి మననశక్తి యొక్క ఆవిర్భావమే “సృష్ట్యాది”.
పుర్యష్టకము - ఈ దేహమే పుర్యష్టకము అంటున్నాం. ఒక పురమునకు ఎనిమిది దిక్కులు ఉన్నట్లు, ఈ దేహమునందు ఎనిమిది తత్త్వములు నిర్వచించబడుచున్నాయి.
1. జ్ఞానేంద్రియ పంచకము : చెవులు చర్మము - కళ్ళు - నాలుక - ముక్కు, (+) వాటి కార్యక్రమములగు... శబ్దము - స్పర్శ రూపము - రసము గంధములు.
2. కర్మేంద్రియ పంచకము: వాక్కు - కాళ్ళు - చేతులు - పాయువు - ఉపస్థ.
3. వాయు పంచకము : ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు సమానవాయువు.
4. భూత పంచకము : భూమి వాయువు అగ్ని - జలము · ఆకాశము.
5. అంతఃకరణ చతుష్టయం: మనస్సు - బుద్ధి - - చిత్తము - అహంకారము.
6. అవిద్య “ఆత్మదృష్టి” లేక “ఆత్మ స్వభావము” నుండి విక్షేపము. బాహ్యాపాదార్థికదృష్టి యొక్క ఆశ్రయము.
7. కామము : “మరింకేదో కావాలి”... అను కోరుకొను ప్రవృత్తి.
8. కర్మము : క్రియావ్యాసంగము.
ఈ “పుర్యష్టకము” సర్వప్రాణుల హృదయమునందు ఒక తుమ్మెదనుబోలి ఉంటున్నది.
ఆత్మయందలి మనఃశక్తి యొక్క అత్యంత ప్రారంభస్థితియే సృష్ట్యాది. అట్టి సృష్ట్యాది యందు ఇట్లు భావనాక్రమము జరుగుచున్నది:
1. శబ్ద తన్మాత్ర - సర్వశబ్దములకు బీజభూతము శబ్దతన్మాత. ఇట్టి శబ్దతన్మాత్రము, ఆ శబ్దము యొక్క అనుభవమునకు స్థానమగు శ్రోత్రింద్రియము (చెవులు)ను భావన చేయుచున్నది. ఆత్మ అట్టి శబ్దస్థానమగు నిర్మలాకాశమును పొందుచున్నది.
2. స్పర్శ తన్మాత్ర - - తరువాత క్రమంగా 'స్పందన'ను అనుసరించి మనస్సు ఘనత్వం పొందుతోంది. అప్పుడు ఆ మనస్సు స్పర్శకు బీజభూతమైన 'స్పర్శతన్మాత్ర' వైపుకు ఉన్ముఖ మగుచున్నది. అనగా 'స్పర్శ' వైపు చలించు వాయువు యొక్క భావనను ఆత్మయే ఆశ్రయిస్తోంది. అట్టి స్పర్శ పొందు స్థానము లేక ఆకాశమే చర్మము.
3. రూపతన్మాత్ర - శబ్ద, స్పర్శ తత్త్వములైన ఆకాశ వాయువు సంఘాతముచే 'రూపము' యొక్క భావన ఏర్పడుతోంది. అదియే 'కన్ను' స్థానమునకు కారణమై 'చూచుట' అను ప్రక్రియగా కార్యసిద్ధి పొందుతోంది.
Page:222
4. రస తన్మాత్ర - ఇట్లు శబ్ద, స్పర్శ, రూపముల పరిణామంచేత మనస్సు మరికొంత ఘనత్వం పొందుతోంది. అప్పుడామనస్సు క్షణంలో నిర్మలప్రకాశం యొక్క భావన పొందుతోంది. ఆకాశ-వాయు-అగ్ని గుణాలచే వృద్ధి చెందిన మనస్సు రసమునకు బీజమైనట్టి “రసతన్మాత్ర”ను పొందుతోంది. రసేంద్రియమును భావించి వెంటనే రసతన్మాత్ర దశను ఆ మనస్సు పొందుతోంది.
5. గంధ తన్మాత్ర - అట్లే ఆ రసతన్మాత్ర గంధయుక్తమగు స్థూలరూపమును పొంది గంధతన్మాత్రగా ప్రకటించుకొనుచున్నది.
ఆ తరువాత ఆత్మయే స్వయం నిర్మితమైన మనస్సు సహాయంచేత ఈ దేహము నుండి దృశ్యజగత్తును వీక్షిస్తోంది. పంచభూతములు తమతమ సూక్ష్మదశలను త్యజించుచు, ఆకృతిని కలిగినవిగా అగుచున్నాయి. అనగా స్థూలత్వమును పొందుచున్నాయి. అనుభవము యొక్క స్థూల స్వరూపమే ఈ మనోబుద్ధుల సంచయమైయున్నది.
తీవ్రమైన వాసనలతో కూడిన మనస్సు, పుర్యష్టకముతో ప్రకటితమగుచున్న ఈ దేహమును భావనచేయుచున్నది. “నా యొక్క స్వరూపము పుర్యష్టకముతో కూడిన ఈ దేహమే కదా...” అని భావించుచు, తదనుకూలంగానే ఆయా క్రియావ్యవహారమునకు ఉద్యుక్తురాలగుచున్నది.
కర్మపరిపాకముచే మనస్సు స్థూలత్వం పొందుతోంది. అప్పుడు బాహ్యమున, అంతరమున 'స్థూల, సూక్ష్మ' దేహములతో ప్రకాశించుచున్నది.
పుర్యష్టక రూపమైన భావనాతత్వమునే 'లింగదేహము' అని అంటున్నాం. అట్టి ఆ లింగదేహము అనేక విచిత్రములైన రచనలతో కూడిన ఈ స్థూలదేహమును స్వభావసిద్ధంగానే స్వీకరించుచున్నది.
ఈ మనస్సు తన యొక్క వాసనల వలన పొందిన దేహమును ఆకాశమున వ్యాప్తమై ఉన్నదానివలె గాంచుచున్నది. “ఇది నా దేహము”. “ఇది విశాలమై వ్యాపించి యున్నది.” “నేను ఈ శరీరంలో ప్రసరించియున్నాను.” “ఊర్ధ్వభాగంలో శిరస్సుగాను, అధోభాగంలో పాదములు గాను, ఇటు అటు చేతులుగాను, మధ్యభాగంలో పొట్టగాను రూపం కలిగి ఉన్నాను" అని ఈ జీవుడు భావిస్తున్నాడు. “జ్వాలాసమూహం” వంటి ఆకృతి గల ఈ జీవుడు వ్రేళ్ళు మొదలైన అవయవములతో ప్రకటితమగుచున్న ఈ దేహమును ఎందుకు గ్రహించుచున్నాడు? తనయందలి 'మనోరథము' అనుదానికి వశమగుటచేతనే. మననశీలమగు ఈ మనస్సు స్వవాసనావశం అగుచూ కల్పితమగు శరీరము కలిగి వర్తిస్తోంది.
మనుజునకు ఈ దేహము కాలము యొక్క 'గతి', లేక, పరిపాకము చేత ప్రత్యక్షరూపమున ఉదయిస్తోంది కదా! అదే విధంగా ఈ మనస్సు కూడా “స్వశరీరవృద్ధి" పొందుతోంది. అనగా విస్తారత్వమును ఆశ్రయించుచున్నది. అట్టి విస్తారత్వ ప్రభావంచేత “నేనే ఈ సర్వమునందు
Page:223
విస్తరించి విరాజిల్లుతున్నాను. నా సంకల్పమే ఇదంతా. ఇక్కడ నాది కానిది, నేను కానిది లేదు” అను భావనాదార్ద్యంచే ఈ జీవుడే బ్రహ్మదేవుని పదమును పొందుచున్నాడు.
సర్వలోక పితామహుడు, బ్రహ్మదేవుడు మొదలైన పేర్లతో పిలువబడుచున్న ఆ సమష్టిజీవుడు బుద్ధి-సత్వము-బలము-విజ్ఞానము ఐశ్వర్యములను ధరించినవాడై విరాజిల్లుచున్నాడు.
(సమష్టి తత్వాహంకారి = A 'will' that is operating the cosmic aspect of creation. వ్యష్టి తత్వాహంకారి = A will that is operating the individual.
నిర్మల మనస్సుతో కూడిన ఈ సమష్టి తత్త్వస్వరూపుడు కూడా చిదాకాశము నుండి సంభవించినవాడే...! అట్టి 'సత్త'చే, అతడు ఈ అజ్ఞానరూపములను, ఈ పంచీకృత వ్యవహా రములను సృష్టించుచున్నాడు. తన మనస్సు యొక్క నిర్మలత్వముచే అతడు సత్యసంకల్పుడై ఉంటున్నాడు. అతడు దేనిని ఎట్లు సంకల్పిస్తాడో, అది అట్లే పంచీకృత సమన్వితమై ప్రభవిస్తోంది.
ఈ ఆకాశము - - భూమి మొదలైన పంచీకృతములు, ఆయా అనుభవములు కూడా.. ఆత్మ యందే స్థితి కలిగినవి అయివున్నాయి. ఇవన్నీ అతడు లీలా మాత్రంగా సృష్టిస్తున్నాడు. రచిస్తున్నాడు. అతడు ఒకప్పుడు ఆద్యంత రహితమైన విశాలాకాశమును సృష్టిస్తున్నాడు. మరొకప్పుడు నిర్మల జలమును ఉత్పన్నం చేస్తున్నాడు. ఇంకొకప్పుడు ప్రళయాగ్ని జ్వాలలచే ప్రకాశమయమగు మండలమును రచించుచున్నాడు.
అట్లే భూమి, వృక్షములు, దేహములు కూడా అతని సంకల్పానుసారమే రూపము పొందుచున్నాయి. ఆ ప్రభువు జన్మ పొందిన క్షణం నుండి లోకములను సృష్టించుచు పోతున్నాడు. అతడు విష్ణువు (సృష్టించిన దాని యొక్క ఉనికి - స్థితులకు సంబంధించిన ప్రజ్ఞ) మొదలైన అనేక రూపములను ధరించి తాను సృష్టించినది తానే 'పాలన' చేస్తూ ఉంటాడు. అతని దేహం కూడా బ్రహ్మపదము నుండే సంకల్పబలంచేత ఉత్పన్నమగుచున్నది.
ఇట్లు ‘మనస్సు’ అనేది బ్రహ్మము నుండే ఉత్పన్నమౌతోంది. ఒక సమయంలో అజాన ఆవృతమైనట్టి ఆ మనస్సు విష్ణుభగవానుని కుక్షియందు ఉంటోంది. అప్పుడు పూర్వ సంస్కారము లన్నీ మరచి, ఆదమరచి సుషుప్తి దశను పొంది ఉంటోంది. నిద్రలేచిన తరువాత అప్పుడు ప్రకాశమయమగు తన దేహమును అవలోకించుచున్నది.
దేహము - ఈ కనబడే దేహం పంచభూతముల (భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం) యొక్క శుద్ధ విభాగములచే రచించబడుచున్నది. కోట్ల కొలది రోమములచే వ్యాప్తమై ఉంటోంది. నవద్వారములు కలిగినదై, చర్మముచే సుందరముగా అలంకరించబడి ఉంటోంది.
ఆ భగవానుడగు బ్రహ్మదేవుడు తన ఇచ్ఛానుసారమే ఈ శరీరములను, తృష్ణలను, జీవులను, చిత్తములను తన చిత్త - శరీరమునందు కలిగి ఉంటున్నాడు.
❖
Page:224
ఇట్లు సమష్టి - సంకల్పుని ఇచ్ఛాలీలయే ఈ సర్వము అయి ఉంటోంది. నిర్మల దృష్టి గల అతడే “ఆకాశమును రచించెదనుగాక” అని చింతించినపుడు ఆకాశము ఏర్పడి ఉంటోంది.
బ్రహ్మదేవుడను పేరుగల అతడే భూత భవిష్యత్తు-వర్తమానములన్నీ ఎరుగుచున్నాడు. ఇప్పటికే అతడు ఎన్నో సృష్టి సమూహములను దర్శించాడు. “నాయందు అస్థిత్వము కలిగియున్న ఈఈ జీవుల ధర్మాధర్మములు ఇట్టివి" అని క్రమముగా అతడు స్మరించుచున్నాడు.
అట్లే వేదములను, జీవోత్పత్తిని, తదితరములను చిత్ర విచిత్రములగు సంకల్పములచే రచించుచున్నాడు. ఈ ప్రాణులకు స్వర్గమోక్షములు, ధర్మకామములు సిద్ధించటానికి అనేక విధము లైన ఆచారములను, శాస్త్రములను రచించింది ఆయనే.
ఆ సమష్టి సంకల్పుని లేక హిరణ్యగర్భుని లేక బ్రహ్మదేవుని స్వరూపము, స్వభావము కూడా మనస్సే. దృశ్యమానమైయున్న ఈ 'సృష్టిశోభ' అంతా మనస్సు నుండే స్థితి పొందియున్నది. హిరణ్యగర్భుని పదము పొందిన మనస్సే వివిధ రచనలచేత, క్రియావిలాసములచేత, శోభాయ మంతములగు ఈ జగత్తులను కల్పన చేయున్నది.
14. జగత్తులు - దేశకాలములు
శ్రీరామచంద్రుడు: ఈ జగత్తు దేశకాలములు... ఎప్పుడు ఏర్పడి, ఎప్పుడు అంతమౌతున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: “ఈ జగత్తు ద్రష్ట సిద్దించుకొన్నదే. అంతేగాని, నిర్మితమైనది కాదు”... అని విజ్ఞులచే గ్రహించబడుచున్నది. అనగా ఇదంతా మనోవిలాసము, ప్రతిభాసమాత్రము అయి
వున్నది. ప్రతిభాసకంటే వేరుగా ఇక్కడెక్కడా ఏదీ లేనే లేదు.
‘దేశ కాలములు’ - దేశకాలనబడేవి ఈ బ్రహ్మాండం, ఒక్కదానిలోనే వ్యాప్తమై ఉన్నాయి... అని అనుకోకూడదు సుమా! కోట్లకొలది బ్రహ్మాండాలు వర్తమానంలో ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండము ఒక్కొక్క రీతిగా స్థితిగతులు కలిగిఉన్నది. కోట్లకొలది బ్రహ్మాండాలు భూతకాలంలో లయించిపోయాయి. కోట్లకొలది బ్రహ్మాండాలు భవిష్యత్తులో ఉద్భవించబోవుచున్నాయి. ప్రతి జీవుని హృదయము నందు అద్దంలో ప్రతిబింబిస్తున్న వస్తువుల వలె కోట్ల కొలది బ్రహ్మాండాలు ప్రతిభాసమాత్రంగా స్ఫురించుచున్నాయి. ఇంతలోనే అదృశ్యమగుచున్నాయి.
వెయ్యి మాటలెందుకు? ఒక్కసారి పైకి చూడు. అనంతపరిమాణంగల ఆకాశం కనబడు చున్నది కదా! ఇదంతా కలిసికూడా 'దేశకాలములు' అనబడుదానిలో ఒక్క స్వల్ప భాగమును కూడా పూరించలేకపోతున్నాయని గ్రహించు.
జగత్తు - స్వప్నద్రష్ట తన స్వప్నంలో చూచే నగరంవలె ఈ జగత్తు సంకల్పమాత్రమే అయివున్నది. "గోడ గాని, తెరగాని లేకుండానే రంగులచే లిఖించబడిన గొప్ప కళాఖండం కనబడు తోంది...” ” అను వాక్యములోని విచిత్రార్థంలాగా ఈ 'అసత్తే' అయిన జగత్తు ద్రష్టకు ప్రాప్తిస్తోంది.
Page:225
అయితే ఏ దేశ- కాలములలో ఈ జగత్తు ప్రతిభాసమౌతోందో, అదంతా చైతన్యమే అట్లు దర్శింప బడుచున్నదని సూక్ష్మబుద్ధితో గ్రహించు. "ఈ కనబడే సర్వమునకు అధిష్ఠానము అయినట్టి, ద్రష్టస్వరూపమునకు ద్వితీయము కానట్టి"... ఆ చైతన్యమే అంతా కూడా!
వాస్తవానికి ఈ జగత్తు శూన్యాకాశమాత్రమే. ఇదంతా నిర్మితమైన దానివలె కనిపిస్తున్నది. కానీ, అంతా కూడా అకృతమే. అనగా ఇది ఎవ్వరిచేతనూ నిర్మించబడలేదు. ఆకాశంలోని మేఘ నిర్మిత ఉద్యానవన దృశ్యం వంటిదే ఈ జగత్తు. యాదృచ్ఛికంగా ఏర్పడే సంయోగ వియోగము లచే ఆయా ఆకార వికారములు ఏర్పడుచున్నాయి. ఆపై ఇక తదితరమైనదంతా ద్రష్ట యొక్క భావనచే చోటు చేసుకుంటోంది.
ఈ దేహాదులు, ఈ త్రిలోకములు... ఇవన్నీ కూడా మనస్సు చేతనే కల్పించబడ్డాయి. ‘చూచుట’ అనే క్రియలో నేత్రముల కర్తృత్వము ఎట్టిదో, ఆ రీతిగా, ఇదంతా మనస్సు యొక్క కేవలం ‘ఊహాదృశ్యము'తో సమానమైనది గాని, సత్యము కాదు.
పదార్థయుక్తమగు ఈ జగత్తు భ్రమచేతనే గాంచబడుచున్నది. ఎందుకంటావా? “సత్తు”నకు వేరుగా ఈ పదార్థములు ఎక్కడ ఉన్నాయి?
పట్టుపురుగు తన కొరకు గూటిని నిర్మించుకొనుచున్నట్లు, ఈ మనస్సు కూడా తన నివాసము కొరకు శరీరమును కల్పించుకొనుచున్నది. సత్యదృష్టితో పరిశీలనాత్మకంగా చూస్తే ఈ మనస్సు అర్థశూన్యము, సంకల్పమాత్రమే సుమా! అయితే ఏం...? మనస్సు రచించలేనిది లేదు. ఇది ప్రాప్తించజేసుకోలేని దుష్కరవస్తువంటూ ఎక్కడా ఏదీ ఉండజాలదు. ఆశ్రయించికూడా, అది పొందజాలనట్టి శక్తులు ఆ ఫాలాక్షుని వద్ద కూడా లేవు. సర్వశక్తులు మనస్సులోనే ఉన్నాయి. ఈ సత్-అసత్ స్వరూపములగు సమస్తపదార్థములు సర్వశక్తిమంతమగు మనస్సు చేతనే సదా స్థితివంతములు అగుచున్నాయి. ఈ శరీరము కూడా మనోభావమును అనుసరించే ప్రాప్తిస్తోంది. ఈ మనస్సుకు ఏ మనఃకల్పన, వర్ణనలకూ ఏమాత్రం అందనంతటి శక్తి ఉండి ఉన్నది.
దీర్ఘస్వప్నము - “ఈ దేవతలు, అసురులు, మనుష్యులు, జంతువులు - వీరంతా ఎవరు?” అను ప్రశ్న వచ్చినప్పుడు “వీరంతా మనస్సు యొక్క సంకల్ప శక్తిచేతనే రచించబడుచున్నారు.” అను సమాధానము లభించుచున్నది. మనస్సు యొక్క సంకల్పరూప సంచలనమే నశించిం దనుకో... అప్పుడు నూనె క్షీణించుచున్న దీపంలాగా ఈ అనేక విధములైన సృష్టి దర్శనమంతా శమించి పోతోంది. కాబట్టి రామా! ఈ జగత్తు అంతటినీ ఒక దీర్ఘ స్వప్నమును చూస్తున్నట్లే, గమనిస్తూ ఉండు. “ఆకాశము" అను శబ్దమునకు గల అర్థమువలెనే ఇదంతా కల్పనా మాత్రంగా మనోవిలాసమాత్రంగా ఎరుగుము.
న జాయతే న మ్రియతే ఇహకించిత్కదాచన I పరమార్థేన సుమతే మిథ్యాసర్వం తు విద్యతే ॥ (సర్గ 45, శ్లో 14)
Page:226
అల్ప అర్థములను త్యజించి పరమార్థమును ఆశ్రయించినప్పుడు "ఈ జగత్తునందు ఏదీ ఉత్పన్నమగుటలేదు, నశించలేదు”... అనియే గ్రహించబడుతోంది. వాస్తవానికి ఇదంతా మిథ్యయే అయివున్నది. ఎందుకంటావా? ఆత్మ ఏ కాలమందు గాని వృద్ధి క్షయములు పొందుతోందా? అప్రమేయమగు ఆత్మ మనో-బుద్ధి-చిత్త అహంకారాలుగా పరిణమించటం జరుగుతుందా? ఆత్మ స్వతహాగా వస్తురహితమైయుండగా అందు సూక్ష్మ శరీరాదులు ఎట్లా ఏర్పడతాయి చెప్పు? అఖండమగు ఆత్మ వస్తువునందు 'జీవుడు’ తదితరులు వంటి ఖండత్వమంతా ఎట్లా సంభవించ గలదు? సంభవించదు.
అసలు ఒక మాట చెప్పు? నీవు సర్వదా ఈ దేహమునకు విలక్షణమైనయున్న అపరిచ్ఛిన్న మగు అనంతాత్మను వీక్షించాలి. అట్టి అపరిచ్ఛిన్న అనంతాత్మను వీక్షించకుండా ఈ అహంకార రూపమగు పరిచ్ఛిన్నమును పొందవలసిన అవసరమేముంది? అందుకు ప్రయోజనంగా ఎంతగానో విమోహితుడవే అగుచున్నావు కదా! అట్లు ఎందుకు అల్పత్వము ఆశ్రయించాలి? ఎడారిలో తరంగములకు సంబంధించిన భావన, దాహము - ఈ రెండూ కలసి మృగములకు మృగతృష్ణలో నీరు కనబడేటట్లు చేస్తాయి. అట్లే ఈ బ్రహ్మ మొదలైన సృష్టికర్తలు, తదితరములు మిథ్యగానే గోచరిస్తున్నాయి. పదార్థదృష్టిచే ఆకాశం ఏదీ కాకున్నప్పటికీ ఏదో లేత నీలిరంగు పదార్థం అయివున్నట్లు కనిపిస్తుంది. ఈ జగత్తులోని సర్వవస్తువులు 'మిథ్యారూపమే’ అయి వుండి, 'ఘనమగు అజ్ఞానము’ చేతనే ఆవృతమై ఉంటున్నాయి. నౌకలో ప్రయాణం చేస్తున్న యాత్రికునకి ఒడ్డున ఉన్న చెట్లు కదలుచున్నట్లు కనిపిస్తూ ఉంటుంది కదా! అందుచేతనే, “ఈ సమస్తం మనః కల్పితము మాత్రమే. ఇదంతా 'ఉంది, లేదు' అను రెండింటి కంటే విలక్షణమై, అనిర్వచనీయమై ఉన్నది”... అని శాస్త్రకారులు మనకు మరల మరల గుర్తు చేస్తున్నారు.
“ప్రపంచరహితమగు ఆత్మ" యొక్క భావన - ఓ రాఘవా! ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది కదా! ఇక దీని యందు 'భిన్నత్వము’నకు సంబంధించిన ప్రసంగం ఎందుకు చెప్పు? అనేక తరంగములలో జలము యొక్క అధిష్ఠానముచే అభేదమే సిద్ధిస్తుంది కదా! "ఇది పర్వతము -స్థాణువు. ఇది నగరము-సంచలనయుక్తము”... ఇటువంటి ఆడంబరమంతా అసద్రూపము, స్వప్నతుల్యమే అయినప్పటికీ, మనస్సు యొక్క భావనాబలంచేత “ఇదంతా స్వరూపమే” (ఏర్పడి ఉన్నదే) అను విధంగా పరిలక్షితమై ప్రాప్తిస్తోంది. తత్త్వవిచారణ లేనివానికి ఈ జగత్తంతా కామ వాసనాసహితము, తృష్ణారూపము, స్వర్గనరకములవంటి అనేక విషయములతో కూడినదిగా కనబడుతోంది. అతనికి ఇందులో అనేక జన్మపరంపరలు మరల మరల ప్రాప్తిస్తున్నాయి.
అందుచేత రామా! నీవు ప్రపంచరహితమగు ఆత్మవస్తువునే సర్వదా భావిస్తూ ఉండాలి. ఆత్మనే చూడాలి.
స్వప్నతుల్య జగత్తు -
యథా స్వప్నో మహారంభో భ్రాంతిరేవ నవస్తుతః ధీర్ఘ స్వప్నం తథైవేదం విద్ధి చిత్తోపపాదితమ్ ॥ (సర్గ 45, శ్లో 20)
Page:227
స్వప్నంలోని పదార్థజాతమంతా భ్రాంతి మాత్రమే గాని వాస్తవం కాదు కదా! చిత్తముచే నిర్మించబడిన ఈ దృశ్యానుభవం అట్టిదే. ఈ సంసారము అనేక భోగములకు ఆటపట్టై, విశాలం గాను, రమణీయముగాను తోచుచున్నది. కొందరికి అత్యంత దుఃఖభరితంగానూ, మరికొందరికి మోదభరితంగానూ అనుభవమౌతోంది. కాని సత్యదృష్టిచే పరిశీలిస్తే... ఇదంతా తుచ్ఛము, క్షణ భంగురము అని తెలిసిపోతోంది. ఆహాఁ! ఇదంతా ఎన్నో ఆశలకు నిలయమై ఈ జీవుని భ్రమింప జేయటానికి అనుక్షణం సిద్ధపడుచున్నది కదా...! అందుచేత రామా! ఈ దృశ్యం నిన్ను ఆక్రమించ కుండా నీవు నిరోధించాలి. అందుకు గాను ముందుగా అంతరంగమునందు దీనిని త్యజించి ఉండు. అట్లు గాక 'ఇది అసత్తు' అని తెలిసికూడా దీనియందు అనురాగమో లేక ఆశ నిరాశలో కలిగియుండే వారికి ఇక నేను ఏం చెప్పగలను?” “మృగతృష్ణలో నీరు ఉండదు” అని తెలిసి కూడా “పోనీలే... అయినా చూద్దాం, ఈ తరంగాలు చూచి ఆనందిద్దాం”... అని మృగతృష్ణ వైపుకు పరుగులు తీయుటలో అర్థమేమున్నది?
కనుక నీవు దేనిపట్లా ఆసక్తిగాని, అనురాగముగాని కలిగిఉండవలసిన పనేమీ లేదు. సంకల్పముల స్వరూపము, మనోరథమయము అయినట్టి ఈ 'మాయావైభవము’ వెంట పరుగులు తీస్తున్న మూఢుని తిప్పలు వర్ణనాతీతం. అతడు అనంతకాలంగా దుఃఖమునే పొందుచున్నాడు.
'ఆత్మ' అనబడు మహత్తరమైన వస్తువు స్వస్వరూపమునకు అద్వితీయమై ఏర్పడి ఉండనే ఉన్నది. అట్టి ఆత్మ వస్తువు సర్వదా వేంచేసి ఉండగా, అసత్తే అయినట్టి ఈ దృశ్యప్రపంచముచే ఆకర్షణ-వికర్షణలు పొందుతూ పరుగులు తీయవలసిన పనేమున్నదో చెప్పు? ఆత్మవస్తువును వదలి మరింకేదో పొందాలని తాపత్రయపడుతూ వచ్చుచున్నవాడు పరమ పురుషార్థమును పొందలేకయే పోతున్నాడు. అనేక నీచమార్గములలో అనేకసార్లు ప్రయాణించి శ్రమచే దారిగానక దుఃఖితుడగుచున్నాడు. 'త్రాడు’ను చూచి 'పాము' అని అనుకొని భయపడునట్లు, ఈ జగత్తు వ్యామోహమాత్రమే అయివున్నది. భావనావైచిత్ర్యము గొలిపేదిగా తోచుచున్నది. చంచలమగు తటాకజలంలో చంద్రప్రతిబింబం "చూచారా! చంద్రబింబము ఎంతగా నీళ్ళలో ఇరికిపోయి, వంకరటింకరగా ఉన్నదో?”... అని కలవరించేది బాలుడే గాని విచక్షణాజ్ఞాని కాదు. మిథ్యా భూతములగు అసత్ పదార్థములచే అజ్ఞాని మోసగించబడవచ్చుగాక! తత్త్వజ్ఞాని దేనిస్థానము ఏమిటో, ఎట్టిదో గ్రహించియే ఇందు క్రీడా మాత్రంగా సంచారం సలుపుచున్నాడు.
ఓ సర్వజనులారా! "శబ్దము-స్పర్శ - రూపము" మొదలైన గుణ సంఘాతమునకు చోటు అగుచున్న ఈ దేహమును చూచుకొని, “ఈ దేహమే నేను”... అను అహంభావమును ఆశ్రయించి, ఈ దృశ్యమునందు “సుఖం” అను స్థానం కొరకు వెతకుచుండెడివాడు జ్ఞానుల దృష్టిలో 'మూర్ఖుడు’ అని అనిపించుకుంటున్నాడని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎవడైనా ఊహ కల్పించబడిన అగ్నిచే చలికాచుకోగలడా? లేడు. మనస్సు యొక్క మననశక్తిచే ఒకడు తన ఊహలోనే గొప్ప
Page:228
నగరం, ఆ నగరంలో విశాలమైన వీథులు, ఆ వీథులలో ఒక ముఖ్యమైన ప్రదేశంలో తన మూడంతస్తుల మేడ, ఆ మేడలో అనేక గదులు, పరిచారికలను చూడగలడు కదా! అదే రీతిగా విశాలము, జడము, పంచభూతాత్మికము అగు ఈ దేహాదులు ఎదురుగా అనుభవమగు చున్నాయి. ఈ జగత్తు చిత్తము యొక్క ఇచ్ఛచేతనే ఉదయించుచున్నది. ఇచ్ఛ లేనప్పుడు అదృశ్యమై పోవుచున్నది. సంకల్పంలోచూడబడు ఒక ప్రియవస్తువులాగా ఈ నిర్మల దృశ్యమంతా మిథ్యా రూపముననే దృశ్యమానమగుచున్నది.
ఓ రామచంద్రా! ఈ జగత్తు నశించినంత మాత్రం చేత ఇక్కడ నశించేదంటూ ఏదీ లేదు. లేక ఇది వృద్ధి పొందినప్పటికీ అధికమయ్యేదేదీ లేదు. హృదయంలో మనస్సుచే నిర్మించ బడి ఏది నశిస్తోంది? ఏది వృద్ధి చెందుతోంది? స్వప్నంలో కనబడిన ఒక చెట్టు ఖండింపబడితే నశించేదేమి ఉంటుంది? చిన్నపిల్లలు తమ ఆటలలో అనేక కల్పనలు చేసుకుంటూ ఉంటారు చూచావా? ఆటలలో పిల్లలు పొందే కేరింత భేదముల వంటివే అజ్ఞానజీవుల సాంసారిక అనుభవాలు.
ఈ జగత్తు నిరంతరం మనస్సుచే కల్పించబడుచున్నది. ఇంద్రజాలంలో కనిపించే వస్తువులు నశించినా ఏదీ నశించనట్లు, ఇంద్రజాల తుల్యమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావ తిరోభావాలచే ఏవరికి ఏమి హాని ఉంటుంది చెప్పు? ఏదైతే యథార్థానికి లేదో, అట్టిది ప్రకటితమైతే ఏమున్నది? కాకపోతే ఏమున్నది?
కనుక ఇప్పుడు చెప్పు...! ఈ ప్రపంచమున “హర్షము-శోకము”లకు తావు ఎచట?
అసదేవ యదత్యస్తం తస్మాత్కిం నామ నశ్యతి |
నాశాభావే హి దుఃఖస్య కః ప్రసంగో మహామతే ॥ (సర్గ 45, శ్లో 39)
ఎల్లప్పుడు అసత్తైనట్టి దానికి నాశనమేమిటి? 'నాశనము' అనేదే లేకపోతే ఇక అసలు దేని గురించైనా ఎందుకు దుఃఖించాలి? సర్వదా సద్వస్తువై ఉన్న దానికి నాశనమే లేదు కదా! అవినాశియగు సద్వస్తువే నీవై ఉండగా, ఇక నీవు దుఃఖించేది దేని కొరకు? ఈ జగత్తంతా బ్రహ్మమే అయివుండగా, ఇక సుఖ దుఃఖములు కలుగవలసిన పనేమున్నది?
విజ్ఞానదృష్టి - ఇప్పుడు విజ్ఞులయొక్క అవగాహనను క్రోఢీకరించి చెపుతాను, విను‘అసత్తే' అయి ఉన్నదానికి హాని వృద్ధులు ఆపాదించి హర్షశోకములు పొందటం బాలురు క్రీడలలో గెలుపు-ఓటముల, ఉత్సాహ-నిరుత్సాహాల అనుభవం పొందటం వంటిది మాత్రమే. అసత్యము, నిరంతర జనన మరణ స్థానము అయివున్న ఈ దృశ్యజగత్తులో విజ్ఞులైనవారికి అభిలషించవలసినదేదీ ఉండజాలదు. లేదా "ఇదంతా బ్రహ్మమే కదా!" అను అవగాహన పొందుటచే వారు దేనినీ త్యజించవలయునను సంఘర్షణ కూడా పొందకయే ఉంటున్నారు.
"ఇది గ్రహించాలి... ఇది త్యజించాలి" అనుటకు తగినదేదీ వారికి ఇక్కడ లభించుటలేదు. "ఈ నామరూపాత్మకమగు విశ్వము అసత్తు. ఇద్దాని అధిష్ఠానమగు బ్రహ్మము సత్తు" అని గ్రహించిన ప్రాజ్ఞుడు ఇదంతా చూస్తూ కూడా ఎట్టి సుఖ దుఃఖములకు లోను అగుటలేదు. ఒక్క
Page:229
అజ్ఞానియే ఈ జగత్తునందు “ఇది వాస్తవమే” అను బుద్ధికలిగియుండుటచే, ఇందలి పదార్దముల వినాశనములను చూచి అంతులేకుండా దుఃఖములను పొందుచున్నాడు.
సునిశితమైన బుద్ధితో ఈ చెప్పే విషయం గురించి యోచించు! ఏ వస్తువైతే మొదటగాని, చివరగాని ఉండుటలేదో, అది ఈ వర్తమానమునందు కూడా 'లేనిదే’ అగుచున్నది.
అసత్తును ఇష్టపడేవానికి సర్వత్రా అసత్తే కనిపిస్తుంది. సత్తు మరుగునపడి ఉంటోంది. జలంలో ప్రతిబింబించే ఆకాశమును, నక్షత్రములను, చంద్రమండలమును చూచి, “ఈ ఆకాశము, చంద్రుడు మొదలైనవన్నీ జలంలోనే ఉండి ఉన్నాయి.... అని తలచి, వాటిని పట్టుకొనుటకు గజ ఈతగాళ్ళను పిలిపిస్తారా.... ఎవరైనా...? ఒక్క అమాయక బాలుడు తప్ప! ప్రాజ్ఞులకు జలంలో ఏది ఉన్నదో ఏది లేదో తెలుసు. విజ్ఞులు ఆత్మయందు ఉన్నదానిని, లేనిదానిని వేరు చేయగలుగుచున్నారు.
ఈ ప్రాపంచిక వస్తువులు, 'అర్థశూన్యం'. ఇవి సుఖము అను అభాస మాత్రం కలిగి వున్నాయి. అట్టి వస్తువులచే సంతుష్టిపొందుచూ, ఆయుస్సును గడిపివేయు మానవుడు చివరకు దుఃఖములనే పొందుచున్నాడుగాని, సుఖములను కాదు.
కనుక, రామా! నీవు సత్యమును మాయను విడదీసి ఉంచాలి. విడదీసి దర్శించాలి. విడదీసి ఆస్వాదించాలి. సుస్థిరపదమునే నిరంతరం ఆశ్రయించి ఉండు.
అజ్ఞానదృష్టిచే ప్రాప్తించుదానికి కలత చెందవలదు. దానియందు అనురాగముగాని, నైరాశ్యముగాని కలిగియుండవద్దు.
అజ్ఞానరహితంగా స్వస్వరూపాధిక్యత వహించియుండు. “ఇదంతా సత్యమగు బ్రహ్మమే” అని ఎరిగిన తరువాత, మౌనమును ప్రశాంతతను వీడకుండెదవు గాక!
దామ వ్యాళ కటోపాఖ్యానం - విషయ విచారణ సమాప్తం (తొమ్మిదవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:230
పదవ రోజు
VI. దాశూరోపాఖ్యానము
(ప్రారంభ విచారణ)
1. జీవన్ముక్తుడు - స్థితి, గుణములు, గతులు
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ పదవ రోజు విచారణ ప్రారంభంలో, దాశూరోపాఖ్యానంలో ప్రవేశించే ముందు ఈ 'స్థితిప్రకరణము'లో ఇప్పటివరకు మనం చర్చించిన విషయము ఒక్కసారి ఇంకొక కోణం నుంచి సమీక్షిద్దాం.
❖
ఓ రామచంద్రా! పైకి ఎంతో రమణీయంగాను, అత్యంత వాస్తవంగాను కనిపించే ఈ 'నాకు చెందినవి' అని చెప్పబడు "ధనము, వస్తుజాలము, పుత్రులు, స్వజనులు" మొదలైనవన్నీ 'సంకల్ప నగరము’* నందలి పదార్థములవంటివి. ఊహలు వచ్చిపోతున్నట్లే అవి కూడా వచ్చిపోతూ ఉంటున్నాయి. క్షణకాలంలో కనిపించే ఇంద్రజాలంలాగా, 'మృగతృష్ణ'లోని తరంగములలోని విభేదవ్యవహారంలాగా ఈ ధన-పుత్ర-స్వజన-గృహ-వస్తుజాలాదులపట్ల సంబంధములన్నీ ఏర్పడుచున్నాయి. అట్టి స్వప్న సదృశ విషయాలు ఉంటే ఏముంది? లేకుంటే ఏముంది? స్వప్నం లోని సంఘటనలను బాలురు మాత్రమే మననం చేసుకుంటూ దుఃఖము పొందుతారేమో గాని, విజ్ఞులు మాత్రం కాదు. “మాయామోహం” చేత ఏవేవో చమత్కార విషయాలు అతిశయించుటచే ఎవరు సుఖించగలరు చెప్పు? 'విషయభోగముల పట్ల, 'నాది' అను రూపం గల మమకారాదుల పట్ల అనురాగము కలిగి ఉండుట'... అనునది చివరకు మూఢత్వము వైపుకే దారితీస్తోంది.
ఈ భోగములను, వీటి పర్యవసానములను గమనిస్తున్నప్పుడు జ్ఞానికి వైరాగ్యమే కలుగు చున్నది. అజ్ఞానిని అవన్నీ క్షణంలో వశం చేసుకొని, అతిత్వరలో దుఃఖితునిగా చేసివేస్తున్నాయి.
ఓ జనులారా! ధనాదులు మొదలైనవి నశించుచున్న సమయంలో సుఖదుఃఖాలను పొంద వలసిన పనిలేదని గుర్తుచేస్తున్నాను. ఇవన్నీ ఈ రోజు కాకపోయినా, ఏదో ఒక రోజు ‘నాశనం' అను స్థితిని తప్పక పొందబోవుచున్నాయి. భ్రమ కలిగియున్న వారికి అవి నరక హేతువులే అగు చున్నాయి. కాబట్టే సాధుపుంగవులగు మహాత్ములు వాటిపట్ల సర్వదా విరక్తి కలిగి వర్తిస్తున్నారు.
"సంకల్ప నగరము : ఒకడు తన ఊహయందు ఒక నగరమును కల్పించి, అందు వస్తుజాలమును, జనులను తన సంచారమును ఊహిస్తూ అనుభవమును పొందుట.
Page:231
కనుక మీరంతా ‘తత్త్వజ్ఞులు' కావాలి. అందుకు ప్రయత్నమును ఆశ్రయించి ఉండండి. ఈ ప్రపంచంలో ఏ పదార్థములు వినష్టములగుచున్నాయో, వాటిపట్ల 'ఉపేక్ష' కలిగి ఉండండి. అంతేగాని ‘అపేక్ష’ కాదు.
కామము - ప్రాప్తించినవాటిని మాత్రం సేవిస్తూ ఉండండి. జ్ఞానులు స్వభావసిద్ధంగానే “అప్రాప్తములైన వాటిపట్ల ఇచ్ఛలేకుండుట - ప్రాప్తించిన వాటిపట్ల అనురాగ - విద్వేషములు కలిగి యుండకుండుట”... అనునది సాధన చేస్తూ ఉంటారు. అప్రాప్తములపట్ల ఏర్పడుచున్న ఇచ్ఛయే ‘కామము’ - అదే గొప్ప శత్రువు. అది ఈ ప్రపంచమున జీవులను తన ఇచ్ఛ వచ్చినట్లు భ్రమింపజేస్తోంది. ప్రచ్ఛన్నరూపమున "నిర్దయగా వధించే శత్రువు" వలె తారసపడుతోంది. మీరంతా ఈ 'కామము' విషయంలో అత్యంత జాగరూకులై ఉండాలి సుమా!
జ్ఞానవంతులు కావాలి. అజ్ఞానమునకు చోటు ఇవ్వకూడదు.
ఈ జనులలో కొందరు "ప్రపంచరహితమగు బ్రహ్మము" గూర్చి సమాచారం కలిగి ఉంటున్నప్పటికీ, పాపం, అప్రమత్తులై ఉండకపోవటం చేత ఈ 'సంసారాడంబరము' యొక్క వంచనను గుర్తెరుగుటలేదు. అట్టి ప్రమత్తతచే వారు దుర్భర భావనలను, దీనదశలను, వినాశనమును పొందుచున్నారు. అందుచేత ముందుగా ముముక్షువు అయినవాడు ఈ దృశ్య ప్రపంచములోని సంఘటనల పట్ల, పదార్థముల పట్ల 'ప్రీతి’ని నివర్తింపజేసుకోవాలి. అందుకు యుక్తి ఏదైనా ఫరవాలేదు. “పరమార్థతత్వము’తో కూడియున్న నిర్మలబుద్ధి"ని సంపాదించుకున్న వాడు మాత్రమే ఇక్కడ మోహసముద్రంలో క్రుంగకుండా తనను తాను రక్షించుకుంటున్నాడు. ఎవడైతే “ఈ జగత్తంతా అసత్యము” అని ఎరిగినవాడై సమస్త పదార్థముల నుండి “ఉపరతి” (withdrawal) పొందుతాడో, అట్టి వివేకిని మిథ్యయే అయివున్న ఈ అవిద్య ఏమీ చెయ్యదు, చెయ్యలేదు కూడా. "ఈ సమస్తమైన జగత్తూ, చివరికి నేను కూడా ఒకే పరబ్రహ్మమును స్వరూపముగా కలిగియున్నాము”... అని నిశ్చయించుకొనువాని బుద్ధి, ఇక ఇచ్ఛ-అనిచ్ఛలను స్వయంగానూ, స్వభావసిద్ధంగానూ, అప్రయత్నంగానూ త్యజించి వేస్తోంది. అట్టి బుద్ధిని సంపాదించుకున్నవాడు ఈ సంసార సముద్రమున మునుగడు.
ఓ రాఘవా! 'వ్యక్తము-అవ్యక్తము’ల రెండింటి మధ్య వ్యాపించియున్న శుద్ధ బ్రహ్మ పదమును ముందుగా ఎరుగుము. అట్టి ప్రత్మగాత్మస్వరూపమునే సర్వదా ఆశ్రయించి ఉండు. ఇక ఈ బాహ్య- అభ్యంతర జగత్తులంటావా... వీటిని గ్రహించవద్దు, త్యజించవద్దు. శుద్ధ పరబ్రహ్మ స్వరూపమే నీవు... నేను... ఈ జగత్తు కూడా. అట్లయి ఉండగా, ఈ 'గ్రహించుట-త్యజించుట' అను వేదనలతో పని ఏమున్నది?
పూర్ణవిరక్తి, సంతుష్టి, అభిమానరాహిత్యము కలిగియుండుము. 'ఆకాశము' వలె దేని యందునూ ‘ఆసక్తి' లేకయే ఉండు. అటుపై ఈ ప్రపంచంలో యథాతథంగా వ్యవహరిస్తూ ఉండు.
Page:232
'ఇచ్ఛ, అనిచ్ఛ' ఈ రెండూ కూడా లేనట్టి తత్త్వజ్ఞాని వ్యవహారములు సలుపుచూ ఉన్నప్పటికీ, అతని బుద్ధి ఏ మాత్రం 'లిప్తము’ అవటం లేదు. కమలము నీళ్ళలో ఉన్నప్పటికీ ఆ నీరు కమలమును అంటుతోందా? పడవ నీళ్ళలో ఉన్నా కూడా, నీటిని పడవలోకి రానిస్తున్నామా? లేదు కదా!
ఆసక్తి రహితమైన నీ మనస్సు ఇంద్రియసహితముగా “దర్శించుట-వినుట-స్పృశించుట” మొదలైన క్రియలందు పాల్గొనుచున్నదా? అయితే కానీ. నీవు మాత్రం ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడవై ఉండు. అంతరంగమున, ఇచ్ఛారహితుడవై వెలుగొందుచుండుము. “ఇది నాది”... అను భావన ఏర్పడుచున్నప్పుడు “ఇది అసత్తే కదా” అను అవగాహనతో ఈ సర్వమును దర్శిస్తూ ఉండు. ఒకవేళ ఏ సమయందైనా 'శబ్దము-స్పర్శ' మొదలైన ఇంద్రియార్థములపట్ల అభిముఖం కావలసిన అవసరం ఏర్పడినదనుకో... వాటియందు నీ మనస్సు తగుల్కొనకూడదు. నీవు వాటియందు నిమగ్నుడవు కాకుండెదవు గాక!
ఇచ్ఛ-అభిమానము-భావావేశము మొదలైనవి లేకుండా ఉండటమే వాస్తవమైన అభ్యాసం. ఇంద్రియవ్యాపారములను నిర్వర్తిస్తూ ఉండు... లేదా చేయకయే ఉండు. ఏది ఏమైనా... “ఇదంతా జీవుని స్వకీయ కల్పనయే. అట్టి కల్పనకు కర్త - భోక్త అగుచున్న ఈ జీవుడు సర్వదా నిష్క్రియుడు, శుద్ధుడు అగు పరబ్రహ్మమే అయివున్నాడు" అను దృష్టిని సుస్థిరపరచుకోవాలి! ఎప్పుడైతే ‘ఇంద్రియార్థములు’ అయినట్టి ఈ శబ్ద - స్పర్శ-రూప - - రస - - గంధములు నీకు రుచికరములు కాకయే ఉంటాయో, అప్పుడు నీవిక జ్ఞాన - విజ్ఞానసంపన్నుడవై ఈ సంసార సముద్రమును దాటి వేస్తున్నట్లే అవుతుంది. అట్టి స్థితిలో నీవు ఈ జగత్తులో తదితరులవలె సంచరిస్తున్నా..., లేక సర్వం త్యజించి సమాధినిష్ఠుడవైయున్నా... ఫరవాలేదు. అట్టి అవగాహన పొందిన తరువాత ఇక ఆపై నీవు నీవుగా కోరుకొనకపోయినప్పటికీ, 'ముక్తి' అనునది అనాయాసంగా నిన్ను సమీపించగలదు.
కాబట్టి రామా! “సర్వోత్తమ పదప్రాప్తి" కొరకు జ్ఞానవైరాగ్యములను ఆశ్రయించు. ఉత్తమ ప్రజ్ఞచే వాసనాసమూహముల నుండి నీ చిత్తమును వేరు చేయి.
ఒక నదిని దాటాలంటే 'నావ' కావాలి కదా! అట్లాగే 'ప్రజ్ఞ' అనే నౌకను ఎక్కి ‘వాసనలు' అను జలముతో నిండియున్న ఈ సంసారసాగరమును దాటివేయవచ్చు. అట్లు ప్రజ్ఞను ఆశ్రయించనివారు సంసారసాగరంలో మునిగిపోతున్నారు.
ముందుగా నీ బుద్ధిని వివేక- వైరాగ్యయుక్తం చేయి. తీక్షవంతం చేయి. పరమ ధైర్యోపేతము, ఉత్సాహవంతము అయిన బుద్ధితో ఆత్మతత్త్వమును విచారించు. ఆ తరువాత 'స్వాత్మపదము' నందు ప్రవేశించు. జ్ఞానముచే 'పరివర్ధితము' అయిన చిత్తము కలవాడవగుము. బుద్ధిమంతులు, తత్వవేత్తలు అగు మహాత్ములు ఎట్లు విహరిస్తున్నారో అట్టి అవగాహనతో కూడుకొని నీవు కూడా విహరించాలి గాని, ఒక మూర్ఖునివలె కాదు సుమా! నిత్యతృప్తులు, మహాధీశాలురు, జీవన్ముక్తులు ఎట్లు పలుకుచున్నారో, ఏ ఉద్దేశము కలిగి ఉంటున్నారో, ఏ అర్థములను గ్రహిస్తున్నారో నీవు పరిశీలించు, గమనించు.
Page:233
అంతేగాని, స్వ-పర వంచకులగు (Those who are deceptive towards themselves as well as towards others) అల్పదృష్టిగలవారి ఆచరణ నీకు తగదు.
ఈ ప్రపంచంలో 'జగత్తు-బ్రహ్మము'ల యథార్థమేమిటో ఎరిగినట్టి మహాత్ములు ఉన్నారు. వారు విద్య, తపస్సు మొదలైన ఉత్కర్షలతో కూడిన ప్రభవములను గాని, అభిమానముగాని, కుల శీలాదులతో కూడిన కీర్తి ప్రతిష్ఠలను గాని వాంఛించరు, ఇచ్ఛగించరు, త్యజించరు. ప్రాప్తాలైన వాటిని మాత్రం అనుసరిస్తూ ఉంటారు. “ఇవన్నీ మిథ్యారూపాలే”... అని సుస్పష్టంగా ఎరిగియే ఉంటున్నారు. మిధ్యారూపమైనవి పరమపురుషార్థమును ఎక్కడైనా తెచ్చి పెట్టగలవా?... లేదు. అట్టి మహాత్ములు సర్వము నశించినప్పుడు కూడా భిన్నులు కాకయే ఉంటున్నారు. ఇంద్రుని ఉద్యానవనమునకు కూడా వారిని ఆకర్షించగల శక్తి లేదు. సూర్యభగవానునివలె వారు శాస్త్ర ప్రసిద్ధమై ఉన్నట్టి తమ నియతిని త్యజింపకయే ఉంటున్నారు. అనగా తమకు విధించినది అంగీక రిస్తూ నిర్వరిస్తున్నారు. “విజ్ఞానము” అను మంచి సారథిని నియమిం చుకున్నవారై స్వస్థచిత్తులై, దేహము అను రథమును అధిరోహించి లీలామాత్రంగా ప్రపంచమంతటా విహరిస్తునారు.
ఓ రామచంద్రా! అట్టి మహత్తర విజ్ఞానము నీకు ఇప్పటికే ప్రాప్తించియున్నది సుమా! కనుక చక్కటి నిశ్చయముతో బుద్ధిబలముచే 'జ్ఞానము'నందు సుస్థితుడవై యుండుము. ప్రత్యక్షమగు 'ఆత్మదృష్టి'ని అవలంబించియుండుము. అభిమాన మాత్సర్యములు లేనివాడవై ఈ భూమిపై విహరించు. అదియే సర్వోత్తమమగు 'సిద్ధి' అని చెప్పబడుతోంది. స్వస్థచిత్తుడవై సర్వక్రియలకు అతీతుడవగుము. "విషయకౌతుకముచే వీక్షించాలి" అను కోరిక లేనివాడవై ఉండు. అంతఃకరణం నందు పరమశాంతిని పొందినవాడవై, లోకానుకూలంగా, శాస్త్రానుకూలంగా వ్యవహరించు.
ఈ వాక్యములు శ్రీరాముని అంతఃకరణమును నిర్మలతచే శోభిరపజేశాయి. అతని హృదయము అతి మధురమగు 'జ్ఞానము' అను అమృతముచే నిండిపోయింది. అతడు పూర్ణ చంద్రునివలె శాంతమును పొందాడు.
2. బ్రహ్మాండముల చమత్కారం
శ్రీరాముడు మహాత్మా! సర్వధర్మజ్ఞా! వేదవేదాంగముల సారమైనట్టి తమయొక్క నిర్మల వచనములచే ప్రభావితుడనగుచున్న నేను ఇప్పుడు పూర్ణరూపమున స్వస్థుడనైయున్నాను. అనేక ఉపమానములు - యుక్తుల సహాయంతో మీరు మా హృదయములందు పరమార్థ యుక్తమగు ‘ఆత్మతత్త్వము’ను ప్రకాశింపజేస్తున్నారు. తమ శ్రేష్ఠవాక్యములు ఎంతగా విన్నప్పటికీ నాకు తనివి
తీరటం లేదు.
Page:234
మీరు ఇతఃపూర్వము రాజస-సాత్విక తామసిక జీవజాతుల ప్రసంగంలో "బ్రహ్మాండముల ఉత్పత్తి" గురించి కొన్ని విశేషాలు చెప్పారు. వేద, పురాణములను ప్రమాణంగా తీసుకొని మీరు చెప్పిన విషయాలు కాక, మరికొన్ని విషయాలు మరికొంత సుస్పష్టత కొరకై చెప్పండి.
ఈ బ్రహ్మాండాలన్నీ ఎవరు ఎవరి కొరకు ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారు? వీటిపై సర్వ అధికారాలు కలిగి ఉంటున్నది ఎవరు? ఇవన్నీ ఉన్నదెక్కడ? ఎందులో? ఈ బ్రహ్మాండాలకు ఆవల ఉన్నది ఏమిటి? ఈ కాలగతి అంతా నడుపుచున్నది, ఈ సర్వక్రియలను శాసిస్తున్నది ఎవరు? ఇదంతా ఎప్పటికి వినాశనము కానున్నది. ఇక్కడి సృష్టి, ప్రళయములకు మూలకారణమేమిటి? అసలు ఈ జగత్తులో సత్యమైనదేది? అసత్యమైనదేది?
ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బ్రహ్మాండముల రచనా చమత్కృతి గురించి సంక్షిప్తంగా చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
శ్రీ వసిష్ఠమహర్షి: అనేక బ్రహ్మాండములు ఉద్భవించాయి... గతించాయి. నేటికి అనేక లక్షల మంది బ్రహ్మలు, వేలకొలది నారాయణులు, శంకరులు గతించారు. ఇప్పుడీ బ్రహ్మాండమునందు అనేక విధములైన ఆచార విచారాదులు కలిగిన దేవ-రాక్షసాదులు విహరిస్తున్నారు. అట్లే ప్రతి ఒక్క బ్రహ్మాండములో అనేక రీతులుగా వ్యవహారసరళి జరుగుచున్నది. ఒకే కాలమునందు మరియు వివిధకాలము లందు ఏర్పడుచున్నట్టి అనేక బ్రహ్మాండములలో అనేక జీవులు జన్మించారు. బ్రహ్మ మొదలగు సమష్టి సృష్టికర్తలచే నిర్మించబడిన బ్రహ్మాండములలో ఈ జీవుల ఉత్పత్తి ఒక విచిత్రమైన ఇంద్రజాలములవలె ఒప్పుచున్నది.
ఈ సృష్టులన్నీ ఒకప్పుడు మహేశ్వరునిచే నిర్మించబడుచున్నాయి. మరొకప్పుడు బ్రహ్మదేవుడే వీటిని రచించుకుంటూ పోతున్నాడు. వేరొకప్పుడు మునుల చేతను, విష్ణువు చేతను ఇవన్నీ రచించబడుచున్నాయి.
కొన్ని బ్రహ్మాండములలో బ్రహ్మదేవుడు కమలమునుండి ఉద్భవిస్తున్నారు. మరొకప్పుడు జలములోంచి బయల్వెడలుచున్నారు. అట్లాగే అండము నుండి, ఆకాశము నుండి కూడా కొన్ని బ్రహ్మాండములు ఉద్భవించటం జరుగుతోంది. ఒక బ్రహ్మాండములో మహేశ్వరుడు, మరొక దానిలో సూర్యుడు, ఇంకొక దానిలో ఇంద్రుడు అట్లే విష్ణువు మరియు తదితరులు ఆ బ్రహ్మాండము లోని తదితర దేవతలపై ఆధిపత్యం వహించి ఉండటం జరుగుతోంది.
ఒక 'సృష్టి' యందు ఈ భూమి అంతా మొట్టమొదటగా వృక్షములచే వ్యాప్తమై ఉంటోంది. మరొకప్పుడు మనుష్యులచేత, పర్వతములచేత ఆక్రమించబడుతోంది. ఒక భూమండలము మట్టిమయం, మరొకటి శిలామయం, ఇంకొకటి రాగిమయం, అట్లే స్వర్ణమయంగాను ఉంటున్నాయి. ఓ రామా! అంతదాకా దేనికి...? మన ఈ బ్రహ్మాండమే తీసుకో... ఇందులో ఎన్నో ఆశ్చర్యకరమైన జగత్తులు ఉన్నాయి. అట్లే తదితర బ్రహ్మాండముల విషయం కూడా. కొన్ని జగత్తులలో ఒక్క సూర్యుని ప్రకాశము మాత్రమే కలదు, మరింకేదీ ఏ మాత్రం లేదు. కొన్నిటిలో
Page:235
అసలు 'ప్రకాశము' అనునదే లేదు. ఆహాఁ! బ్రహ్మమే రూపముగా గల ఈ మహాకాశంలో సముద్రజలంలోని తరంగాలలాగా ఎన్ని బ్రహ్మాండములు ఉత్పన్నమౌతున్నాయి! ఎన్ని లయిస్తు న్నాయి! సముద్రంలోని కెరటాలకు అంతు ఎక్కడ? ఎడారిలో ఎన్ని మృగతృష్ణలు ఉన్నాయో లెక్కించి చెప్పేదెవరు? తంగేడు చెట్టుకు కాచే పూలు ఎన్నని, ఎన్నిసార్లని చెప్పమంటావు? పరమాత్మయందు ఈ ప్రపంచముల శోభ అనంతసంఖ్యలో ప్రకటితమౌతున్నాయి. ఇంకా... సూర్యకిరణములలోని త్రసరేణువులను (ధూళిరేణువులను) లెక్కపెట్టవచ్చునేమో! పరబ్రహ్మమున గల ఈ చంచల జగత్ సమూహములను మాత్రం ఎవరు లెక్కబెట్టగలరు? వర్షాకాలంలో అనంత సంఖ్యలో దోమలు, రెక్కపురుగులు పుట్టి, సంచరించి, నశిస్తాయి చూచావా? నిరంతరం ఉత్పన్నం అవుతూ, నశించుచున్నట్టి ఈ సృష్టి సమూహములు ఎప్పటినుండి కొనసాగుతున్నాయో చెప్పటం ఎవరి తరం? అయితే, “ఈ అనంత జగత్ - ప్రవాహరూప వ్యవహారమంతా అనాది, ఈ సర్వము పరబ్రహ్మమే”... అని గ్రహించు. శాస్త్రాదులచే మనకు అందజేయబడుచున్న వివరణ అదే. ఆద్యంతరహితమైన ఈ సృష్టి నిరంతరం తరంగమువలె స్ఫురిస్తూనే ఉన్నది.
ఈ సృష్టికి ముందు పూర్వసృష్టి ఉన్నది... ఆ పూర్వసృష్టికన్నా ముందు ఇంకొక సృష్టి ఉన్నది... ఆ ఇంకొక సృష్టికన్నా ముందు వేరొక సృష్టి ఉన్నది... ఆ వేరొక సృష్టి కంటే ముందు మరొకటి ఉండనే ఉన్నది...
ఇట్లు ఈ వ్యవహారమునకు అంతులేదు, ఉండబోదు, నదిలో తరంగాల లాగానే ఈ సురఅసుర-మనుష్యాది ప్రాణికోట్ల వివిధజాతులన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి. బ్రహ్మదేవుని యొక్క ఈ బ్రహ్మాండం వంటివే, ఒక సంవత్సరములోని క్షణములవలె, వేలాది బ్రహ్మాండాలు పుట్టి ఇతఃపూర్వమే కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ బ్రహ్మాండాలన్నీ స్థితి కలిగియున్నది ఎక్కడ?
అన్యాః సంప్రతి విద్యన్తో వర్తమానశరీరకాః
ప్రాన్తో బ్రహ్మవురస్యాస్య వితతే బ్రహ్మణఃపదే. (శ్లో 22, సర్గ 47)
ఓ రామచంద్రా! సర్వుల అంతరంగమున అతి సూక్ష్మంగా 'బ్రహ్మపదము' అనునది వ్యాపించియున్నది. అట్టి ఆత్మపదము లేక బ్రహ్మమునందే ఇవన్నీ స్థితి పొందియున్నాయి. అట్టి హృదయాంతరంగమే... "హృదయపుండరీకము, బ్రహ్మపురము, బ్రహ్మపట్టణము’... అని కూడా శాస్త్రకారులు పిలుస్తున్నారు.
అనగా, 'హృదయమే బ్రహ్మాండముల స్థితి స్థానము' అని గ్రహిస్తున్నావు కదా! ఇవన్నీ బ్రహ్మపురంలో దృశ్యమానమై ఉంటున్న శోభలే సుమా! ఆకాశమందు శబ్దం పుట్టి, నశించు చున్నట్లు, ఈ బ్రహ్మాండములు కూడా ఉత్పన్నమై, స్థితిపొంది, నశించి పోవటం జరుగుతోంది.
మట్టిలోనే 'కుండ’ అనునది ఉన్నది కదా...! విత్తు యొక్క అంకురమునందే చిగురు దాగి ఉన్నది కదా...! అదే విధంగా బ్రహ్మమునందే భూత-వర్తమాన-భవిష్యత్ కాల సృష్టి పరంపర లన్నీ ఉన్నాయి.
❖
Page:236
అయితే ఒక చమత్కారం. విశాలాకారయుక్తాలైన ఈ సృష్టి పరంపరలు, ఈ త్రిలోకాలు... ఇవన్నీ తత్త్వజ్ఞానం పొందనంతవరకు మాత్రమే బ్రహ్మమునందు ఇట్లు దృశ్యమానమౌతూ ఉంటున్నాయి. అసలు 'బ్రహ్మాండము' అనగా ఏమిటి?
‘అజ్ఞులచే, బ్రహ్మమునందు 'అధ్యాస' చేయబడి, దర్శించబడుచున్నది. అనిర్వచనీయము, మిథ్యా రూపము అయినదే ఈ బ్రహ్మాండ వ్యవహారము”... అని చెప్పబడుతోంది. అజ్ఞానము శేషించి ఉన్నంతవరకు ఆ అజ్ఞానమును అనుసరించియే ఈ జగత్తులన్నీ పెంచబడుతూ, పోషింప బడుచూ త్యజించబడుచున్నాయి. తత్త్వజ్ఞానుల దృష్టిలో ఇవి ఏ కాలమందునూ లేనే లేవు. 'ఊహ'లో కనిపించే మహాసౌధాలకు స్థితి ఎక్కడ? అంతు ఎక్కడ?
3. జ్ఞాని ఇదంతా ఎట్లా చూస్తున్నాడు?
ఆహాఁ! ఏమి విచిత్రం! తరంగాలు లాగానే క్షణభంగురమైన ఆకృతి గల ఈ సృష్టి సమూహాలు చిత్ర విచిత్రములైన రూపములతో, ప్రాణుల విచిత్రమైన చేష్టలతో కూడి ఉన్నాయి కదా! అయితే జ్ఞాని వీటన్నిటినీ మరొక విశిష్టమైన దృష్టితో చూస్తున్నాడు. ఆతని అవగాహనను అనుసరించి ఇవన్నీ పరమాత్మ కంటే వేరైనవి కావు. పరమాత్మయే ఇదంతా!
‘పరమాత్మ నుండే ఈ సృష్టి పరంపరలు ప్రాదుర్భవిస్తున్నాయి”... అనే వాక్యం అజ్ఞానులచే తమ అసంపూర్ణ అవగాహన కారణంగా మాత్రమే ఏర్పడుతోంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ మైనది ఏదైనా ఉంటే కదా, ఒకదాని నుండి మరొకటి ఉద్భవించటం!
జలముకంటే వర్షధారలు వేరా? ఆలోచించే వానికంటే 'ఆలోచన' వేరైనదా? మేఘములు జలముకంటే వేరైనవా? భావించేవానికంటే భావన వేరా? వృక్షము కంటే దాని కొమ్మలు, ఆకులు, పుష్పములు, కాండము మొదలైనవన్నీ వేరు అని అనటం ఎట్లా?
యథార్థానికి జ్ఞానికిగాని, అజ్ఞానికి గాని... ఈ సృష్టి బ్రహ్మము కంటే వేరుగా ఇంకెక్కడా, మరింకే విధంగానూ లభించేది కాదు.
అవ్యాకృత ఆకాశము నుండే ఈ స్థూలభూత నిర్మితములైన “శరీరము” మొదలైనవి, మరియు సూక్ష్మభూత నిర్మితములైన 'ఇంద్రియములు' మొదలైనవి, తక్కిన సమస్త పదార్థములు ఉత్పన్నములౌతున్నాయి. ఇవన్నీ కూడా సూక్ష్మతత్త్వములతో (శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం - తన్మాత్రలు) అవినాభావ సంబంధం కలిగినవై ఉంటున్నాయి. ఆ అవినాభావ సంబంధమే సృష్టి.
ఇక్కడ సృష్టికి సంబంధించి చెప్పబడిన కొన్ని శాస్త్ర, పురాణ ప్రవచనములు ఉదహరిస్తాను. విను. అన్నిటికన్నా ముందుగా ఒక సమయంలో ఆకాశము స్థూలభావం పొందుతోంది. అందు లోంచి 'సమష్టిసృష్టి' అను స్వభావము గల 'బ్రహ్మదేవుడు' అను తత్త్వము ఉదయిస్తోంది. “అనేక
Page:237
పదార్థాలతో కూడిన ఈ సృష్టి అను స్వరూపం కలవాడను నేనే" అను అహంభావమే బ్రహ్మదేవుని యొక్క నిజస్వరూపం. అతడే 'ప్రజాపతి' అని, 'ఆకాశజుడు' అని కూడా పిలువబడుచున్నాడు.
ఒకప్పుడు వాయువునందు ఏర్పడుచున్న స్థూలభావముచే సమష్టి సృష్టి అహంకారియగు ప్రజాపతి ఆవిర్భవించుచున్నాడు. అందుచేత, అతడు 'వాయుజుడు' అని చెప్పబడుచున్నాడు. అట్లాగే అగ్ని నుండి స్థూలభావం పొందుటచే ఆ ప్రజాపతిని 'తేజసుడు' అని, పృథివి నుండి స్థూలభావం పొదు ప్రజాపతికి ‘పార్థిపుడు' అని, జలము నుండి స్థూలభావము పొందిన ప్రజాపతికి ‘వారిజుడు’ అని పౌరాణికంగా చెప్పబడుచున్నారు. ఈ ఆకాశము - వాయువు - జలము - అగ్ని - పృథివి అనబడు ఐదు భూతములు రెండేసిగా విభజించబడి, మరల వాటిలో ఒకొక్కటి నాలుగు విభాగములుగా చేయబడింది. అట్లు విభక్తములైన ఒక్కొక్క భాగము (5x2x4=40 లో ఒక్కొక్కటి అర్ధభాగం నాలుగు భాగములందు చేర్చబడగా అప్పటి మిగతా అర్ధభాగము నుండి బ్రహ్మదేవుడు ఉత్పన్నమగుచున్నాడు అతడే సమష్టి - సృష్టి ఇచ్ఛాస్వరూపుడు (The form of universal will). అతడే భవిష్యత్తు కాలంలోని జగత్రియలన్నీ ఒనర్చుచున్నాడు.
నారాయణుడు - ఇతడు స్వయంభువు. ఇతని జన్మకు మరింకేదీ కారణం కాదు. వాస్తవానికి జన్మరహితుడగు ఈతడు జలంలో ప్రథమ తరంగంలాగా ఆవిర్భవిస్తున్నాడు. స్వకీయ మాయచే ఇతడే సర్వ తదితర వ్యవహారములకు కారణము. కాబట్టి, ఇతడు 'ఆదికారణుడు’గా వేద వేదాంగాలచే స్తుతింపబడుచున్నాడు. ఈ జీవుని యొక్క ఆది స్వరూపమే అతడని గ్రహించు. అతడి హృదయమే “ఆకాశజుడు, వాయుజుడు, తైజసుడు, వారిజుడు, పార్థివుడు"... అను ప్రజాపతు లకు జన్మస్థానమైయున్నది. నారాయణుని ముఖము నుండో, పాదముల నుండో, వెనుక భాగం నుండో, పృష్టముల నుండో, నేత్రముల నుండో, హస్తాదుల నుండో... ఇట్లా ఏదో ఒక భాగము నుండి ఈ నామ రూప శబ్దాదులన్నీ ఉదయిస్తున్నాయి.
ఆ నాయణుడు అనబడు ఆది పురుషుని యొక్క నాభిప్రదేశం నుండి ఒక కమలము ఉత్పన్నమగుచున్నది. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తున్నాడు. అందుచేత అతడు 'పద్మజుడు' అను పేరుతో శ్లాఘించబడుచున్నాడు.
శ్రీరాముడు: స్వామి "జీవుని యొక్క శుద్ధ స్వరూపమే” అయి ఉన్నట్టి ఆ నారాయణుని యొక్క నాభికమలము నుండి 'సమష్టి సృష్టి'... అను స్వరూపంగల బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తున్నాడు కదా! అట్లు ఆవిర్భవించేది ఎవరు? నారాయణుడేనా? లేక మరింకొకరా?
శ్రీ వసిష్ఠ మహర్షి: (పకాలున నవ్వుతూ...) ఓ రాఘవా! “నారాయణుడు బ్రహ్మదేవునిగా పరిణతి చెందుచున్నాడు”... అని తలచకూడదు సుమా! ఎందుచేతనంటావా? ఒక్క ప్రథమ తత్వమగు స్వస్వరూపము తప్ప తక్కినదంతా స్వప్నభ్రాంతి వంటిదే. ఇది మిథ్యారచనాచక్రము, మనోకల్పిత రాజ్యములవలె 'మాయ'యే అయివున్నది.
Page:238
నారాయణుడు = జీవుని సర్వసంకల్పములకు ముందే ఉన్నట్టి శుద్ధ స్వస్వరూపము. బ్రహ్మదేవుడు = అనేక ఉపాధులను సంకల్పిస్తున్నట్టి ఆ నారాయణుని (లేక ఈ జీవుని) సమష్టి సృష్టి సంకల్పము.
వాస్తవానికి పరమాత్మ దేనితోనూ ఎట్టి సంగమమూ ఏ సమయమందునూ లేనివాడు. అతడు అద్వితీయుడు (ఈ జీవుని శుద్ధస్వరూపమునకు అతడు వేరుగా మరెక్కడా లేదు). మరి, అట్టి ఆ శుద్ధతత్వము (నారాయణుడు) నందు ఆశ్చర్యజనకమూ, ద్వితీయమూ అయినట్టి ఈ సృష్టి జనించుట ఏమిటి? లేదు. 'మాయ' యొక్క కార్యము మాత్రమే కనుక 'పురుషుని నాభికమలము నుండి పురుషుడు ఉద్భవించెను” అను వ్యవహారమంతా బాలుని మనోరాజ్యము వంటిదే. ఈ విషయము గ్రహించి, ఆపై నాచే చెప్పబడు సృష్టి విశేషాలు వినుమరొకప్పుడు నిర్మలాకాశంలో మనస్సు యొక్క శక్తిచే ఏదో విభాగము (ఉదా: బంగారు రంగులు విరజిమ్ము వనములు మొ॥) సంకల్పించబడగా, అందులోంచి సృష్టికర్తయగు బ్రహ్మ దేవుడు ఆవిర్భవిస్తున్నాడు. ఇంకొకప్పుడు మహాపురుషులగువారు జలమునందు వీర్యము ఉంచగా ఆ వీర్యము నుండి భూమి అను పద్మమో లేక విశాలమగు బ్రహ్మాండమో బహిర్గతమౌతున్నది. అట్టి ‘భూపద్మము’ నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు 'పద్మజుడు' అని చెప్పబడుచున్నాడు.
ఒకప్పుడు పూర్వకల్పములోని ఒక భక్తుడు ఈ కల్పంలో 'బ్రహ్మ' అగుచున్నాడు. మరొక సారి పూర్వకల్పములోని వరుణుడు గాని, వాయువుగాని ఈ కల్పంలో సృష్టికర్తయగు 'బ్రహ్మ' గా అగుచున్నారు.
ఇదంతా అట్లు ఉండనిమ్ము, మరొకకోణం నుంచి అసలు ప్రశ్నకు వస్తే, అనగా, పరమార్థంగా చూస్తే, బ్రహ్మము నందు “బ్రహ్మలు” ఎక్కడ? బ్రహ్మము బ్రహ్మముగానే ఉంటోంది గాని మరింకేదీ ఎన్నడూ బ్రహ్మమునందు ఉత్పన్నమగుటలేదు.
ఈ విధంగా శాస్త్రకారులచే వివిధ రీతులుగా బ్రహ్మదేవుని విచిత్రమైన ఉత్పత్తుల గురించి చెప్పబడినది వర్ణించి చెప్పాను. అంతా విన్నావు కదా! అయితే వారల ఉత్పత్తి యందు ‘నియమము” అనునదేదీ లేనేలేదు. బ్రహ్మదేవుని సృష్టిలాగానే తదితరమగు సర్వము యొక్క సృష్టి కూడా ‘నియమము’ అనునది లేకుండానే ఏర్పడుతోంది.
మనోవిలాసమాత్రము - అంతా విన్న తరువాత ముఖ్యంగా ఒక్క విషయం గ్రహించు : మనోవిజృంభణమిదం యాశ్చ జాతయశ్చేతమాగతాః |
సంబోధనాయ భవతః సృష్టిక్రమ ఉదాహృతః (శ్లో 48, సర్గ 47)
ఈ “ప్రపంచము” అనబడేది మనస్సు యొక్క విలాసము మాత్రమే. ఇదియే ఇక్కడ ముఖ్యమైన సిద్ధాంతము. ఈ విషయం నీవు చక్కగా గ్రహించటానికే వివిధ సృష్టుల క్రమమంతా చెప్పాను. ఈ సాత్విక, రాజసిక, తామసిక జీవజాతులు కూడా మనోవిలాస మాత్రం చేతనే
Page:239
సంభవిస్తున్నాయని గ్రహించు. ఎంతవరకైతే ఈ మనస్సు సమూలంగా నశించకుండా ఉంటోందో, అంతవరకు ఈ సృష్టి-వినాశనములు, సుఖ-దుఃఖములు, జ్ఞాన-అజ్ఞానములు, బంధ-మోక్షాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ సృష్టికర్తలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ప్రియ-అప్రియ వస్తువులు, వాటి పట్ల స్నేహ- శత్రుభావనలు మరల మరల ఉత్పన్నవటం, శమించటం జరుగుతూనే ఉంటుంది.
మనస్సే అన్నిటికీ మూలం. దీపం వెలగటం ప్రారంభించి, అస్థిరమగు ఆకారము కలిగి యుండి మరల ఎప్పుడో శమిస్తుంది చూచావా? అట్లే బ్రహ్మదేవుడు మొదలగు చతుర్ముఖ ఆకారములు ఏర్పడటం, శమించటం... ఇదంతా కాలము యొక్క ప్రవాహగతిత స్వభావమే కాని మరింకేమి కాదు.
దీపం స్వల్ప కాలంలోనే లయిస్తోంది. ఇక బ్రహ్మదేవుడో... ద్విపదార్ధంతమున అంతర్థాన మగుచున్నాడు. అనగా “ద్వైతప్రకృతి” లయించగా ఆతడు కూడా శమించుచున్నాడు. ఈ ఇద్దరి భేదం కాలహరణమే గాని మరింకేమీ కాదు.
కాలన్యాయము - “కృత-త్రేత-ద్వాపర కలి” యుగాలు మరలమరల సంభవిస్తున్నాయి. -
అట్లాగే చక్రభ్రమణంలాగా ఈ జగత్తులు వస్తున్నాయి... పోతున్నాయి... రోజులు యుగములు కల్పములు... మన్వంతరములు - వీటి పరంపరలు ఒకదాని వెనుక మరొకటిగా మరల మరల ఏర్పడుచున్నాయి. రోజులు దొర్లుచున్నట్లే కార్యసమూహమంతా మరల మరల సంభవిస్తోంది. ఈ జగత్తంతా పరిచ్ఛిన్నములగు అనేక పదార్థములతో కూడి ఉంటోంది. జీవులు 'ఆయువు' అను గాలివాలుకు మరల మరల ఈ జగత్తులోకి వచ్చిపోవుచున్నారు.
బాగుగా కాల్చబడగా కణకణలాడే 'ఇనుపముద్ద'లో స్వభావ సిద్ధంగానే అగ్నికణములు ఉండి ఉంటాయి కదాకదా! ! చిదాకాశమున ఈ సమస్త పదార్థములు స్వభావంగానే స్థితి కలిగియున్నాయి. ఒక వృక్షములో "ఫలములు కాయుట, పూలు పూయుట” అను స్వభావం రసరూపమున అవ్యక్తంగా ఉండి, ఆయా ఋతువుల సమయంలో ప్రకటితమౌతూ ఉంటున్నట్లే ఈ జగత్తంతా పరమాత్మయందు స్వతహాగా ఉండి ఉంటోంది.
4. ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చింది? చిత్స్పన్ద ఏవ సర్వాత్మా సర్వదై వేదృశాకృతిః |
యదస్మాజ్జాయతే సర్గో ద్వీస్టుత్వమివ లోచనాత్ ॥ (శ్లో 58, సర్గ 47)
సర్వాత్మకమగు చైతన్యం నుండి ఏదేది వివర్తమగుచున్నదో (బయల్వెడలుచున్నదో) అదంతా చిద్రూపమే అవుతుంది కాని, మరింకేమీ కాదు. “పరమాత్మ నుండి సృష్టులు ఏర్పడుచున్నాయి”... అనునదంతా "కంటి దోషముచే వినీలాకాశంలో రెండవ చంద్రుని చూడటం” వంటిది మాత్రమే.
Page:240
ఈ సృష్టి అంతా చైతన్యము నుండే ఆవిర్భవిస్తోంది. అట్టి చైతన్యమునందే అది 'స్థితి' కలిగి ఉంటోంది. చంద్రకిరణములు చంద్రునికంటే వేరుగా కనిపించినంత మాత్రంచేత “చంద్రుడు వేరు, చంద్రకిరణములు వేరు” అని అనగలమా? లేదు. ఈ కనబడే సృష్టి కూడా చైతన్యము కంటే వేరైనది కాదు. అయితే సర్వశక్తిమంతుడగు పరమాత్మ స్వభావం 'అసంగము, అద్వితీయము అయి ఉన్నది కదా! అట్టి పరమాత్మ యందు కనబడుచున్న ఈ ప్రపంచము వాస్తవము కాదు. స్వకీయ భ్రమచే ద్రష్టయే ఇదంతా ఇట్లు దర్శించుచున్నాడు.
అందుచేత, “ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చినది?"... అను ప్రశ్న ముఖ్యం కాదు. “ఇట్లు భేద దృష్టిచే బ్రహ్మమునకు బదులుగా ద్వితముతో కూడిన జగదనుభవమునకు మాత్రమే నేను ఎందుకు పరిమితుడనగుచున్నాను?” అనునది ముఖ్యమైన ప్రశ్న.
“జగత్తు” అనబడేది చిత్స్వభావమునకు భిన్నమైనది కానేకాదు. అనేక జన్మల దురభ్యాసము యొక్క ప్రభావముచేతనే ఈ జీవుడు దోషసహితమగు "జగత్తు వేరు, నేను వేరు, బ్రహ్మము వేరు” అను దృష్టితో గాంచటం జరుగుతోంది.
సర్వశక్తిమంతుడగు పరమాత్మ తనయందుతానే ఇట్లు మాయాసమేతుడై “జగత్ప్రష్ట” అను కర్తృత్వమునకు స్వయముగా ఒడిగట్టుచున్నాడు. అతడు అట్లు గాంచటం బహుచమత్కారమైన విషయమే. అది చిద్విలాసము, అనిర్వచనీయము అని చెప్పబడుతోంది. అయితే ఈ జగత్తు, ఇందలి చిత్రవిచిత్రములైన వస్తుజాలానుభవం ఇవన్నీ కూడా ప్రళయము అనబడు స్థితికి ఈవల మాత్రమే ఉంటాయి. ఆవల ఉండవు. ఏ జీవుని దృష్టిలో ప్రపంచభావమంతా లయించి పోతున్నదో అతనికి 'ప్రపంచము' అనునదే లేని విషయమగుచున్నది.
ఎవ్వరి దృష్టిలో ఈ జగత్తు లేదో, అతనికి బంధమెక్కడిది? బంధం లేనిచోట, ఇక 'మోక్షము' యొక్క ప్రసక్తి కూడా ఉండదు కదా!
❖
ఓ మహామతీ! రామచంద్రా! జ్ఞాని యొక్క దృష్టిలో ఈ జగత్తంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఏ విధంగా చూచినా సరే 'ప్రపంచం లేనిదే' అని సుస్పష్టపడుతూనే ఉన్నది. అయితే అజ్ఞాని యొక్క దృష్టికి మాత్రం ఈ ప్రపంచం 'ప్రవాహము' రూపములో నిరంతరం ఉండియే ఉంటోంది. ‘మిథ్యయే’ అయినప్పటికీ ఈ సాంసారికమాయ నిత్యమైనదానివలె అజ్ఞానులకు అనుభూత మౌతోంది. ఇక్కడ ఆత్మయే దృష్టితోకూడినదై ఉంటోంది. 'దృష్టి' ఉన్నంతకాలం మాయ ఉంటోంది. జగత్తు ఉంటోంది. కనుక ఒక రకంగా ఇదంతా నిత్యమైనదే కదా! నిత్యమైన దానికి సృష్టి ఏమిటి? స్థితి ఏమిటి? లయమేమిటి?
జగత్తు యొక్క ఉత్పత్తి-వినాశనముల గురించి కొన్ని అభిప్రాయాలు :
1. మీమాంసకుల యొక్క అభిప్రాయం (పునరుత్పత్తి వాదం) - - 'ఈ జగత్తు ఉదయిస్తోంది. కొంతకాలం తరువాత నశిస్తోంది. మరల పుడుతోంది. కనుక ఇదంతా ఉత్పత్తి - - వినాశనము -
Page:241
పునరుత్పత్తి కలిగి ఉంటోంది. ప్రవాహంలో ముందుకుపోతున్న జలం స్థానంలో వెనుకటి నీరు క్షణంలో ప్రవేశిస్తోంది.”
ఆ విధంగా తరంగతత్వంగా శాశ్వతంగా కనబడుచున్నట్లు ఈ ప్రపంచం కూడా, ఒక విషయం తొలగిన క్షణమే మరొక విషయం 'దృష్టి' యందు ప్రవేశించుచుండుటచే, 'ఉత్పత్తి - -
వినాశన సహితం’ అనునదీ వాస్తవమే. దృశ్యము యొక్క ఉనికి' దృష్ట్యా చూస్తేనేమో, 'జగత్తు' ఏదో రూపమున ద్రష్టపట్ల ఉండనే ఉంటూ, 'నిత్యము' అనునది కూడా వాస్తవమే అగుచున్నది.
2. క్షణికవాదుల అభిప్రాయం (క్షణికం) - "ఈ జగత్తు అనుక్షణం నశించిపోతోంది. క్షణక్షణం మార్పుచెందని వస్తువంటూ ఇక్కడ ఏదీ లేదు. నశ్వరములై, క్షణంలో విధ్వంసమొందే 'విద్యుత్' వంటి పదార్థములే ఇవన్నీ.” ఇట్లు తమ తదితర ప్రవచనములు నిర్వాహణార్థం అనేక వాదోపవాదములతో ప్రతిపాదించబడు క్షణిక సిద్ధాంతం కూడా ఉచితమే.
ప్రవహించు నీటిలో జలబిందువులు క్షణకాల మాత్రమే 'ద్రష్ట' కు ఎదురుగా ఉంటాయి కదా! ఒకానొక జలబిందువేమో క్షణికం. జలతరంగం అనుక్షణికం. అట్లాగే ఒకానొకదృశ్యంగా క్షణికమే అయినప్పటికీ దృశ్యపరంపరగా అనుక్షణికమే!
3. సాంఖ్యులు మొదలైన వారి అభిప్రాయం (స్థిరవాదం") - “ఇక్కడ చంద్రుడు - సూర్యుడు - కొండలు మొదలగునవి స్థిరంగానే ఉంటున్నాయి కదా! కాబట్టి ఇదంతా స్థిరమే. ఈ జీవుడు సుస్థిరస్వరూపుడే గాని, ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు ఉండనివాడు కాదు.”
'స్వసత్త' దృష్ట్యా చూచామనుకో, ఇక్కడ ఎవరైనా ఏదైనా మార్పుగాని, చేర్పుగాని పొందుచున్నారా? లేదే! ఒకడు బాల్యంలో ఏ 'సత్త' అయి ఉన్నాడో, ఇక, నలుబది ఏండ్ల తరువాత, ఏబది ఏండ్ల తరువాత కూడా అదే 'సత్త' అయి ఉంటున్నాడు కదా! కనుక 'స్థిరవాదము' కూడా మరొక కోణము నుండి ఉచితమే అగుచున్నది.
‘స్వసత్త’ స్థిరమే అయినట్లు, అద్దాని దృశ్యసందర్శనా చమత్కారమూ స్థిరమే!
స్థిరము, కల్పితము - ఇక మరొక విశ్లేషణ విను.
యథార్థానికి పరమాత్మ ఏకము, అనంతము, అనిర్వచనీయము అయి ఉన్నది. అట్టి సమున్నతమగు పరమాత్మయందు సంకల్పితమగు వస్తు జాలమంతా ఎట్లా ఉంటుంది చెప్పు? ఎక్కడ ఉంటుంది? కనుక బ్రహ్మం నందు పదార్థజాలము ఉండజాలదు. అట్టి శుద్ధ పరబ్రహ్మమే నీ యొక్క నా యొక్క ఈ సర్వుల యొక్క వాస్తవ స్వరూపమైయున్నది.
ఇక ఈ దృశ్యవ్యవహారమంటావా... ఈ సమస్తము మరల మరల సంభవిస్తూనే ఉంటుంది. ఈ జనన-మరణములు, సుఖ-దుఃఖములు, కరణ-కర్మములు, ఇవన్నీ ఆత్మ దృష్ట్యా లేవు. కాని శరీరము-మనస్సుల దృష్ట్యా ఇవి ఉంటూనే ఉంటున్నాయి. మరల మరల కలుగుచున్నాయి. ఆకాశంలో సూర్యుడు మరల మరల ఉదయిస్తున్నట్లే ఈ జీవుని హృదయంలో ఆశలు మరల
Page:242
మరల చిగురిస్తున్నాయి. ఈ ఆకాశం, పర్వతములు, సముద్రములు, తదితర సృష్టి... ఇవన్నీ గతిస్తూ మరల మరల ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. అదే రీతిగా దేవతలు, దైత్యులు, ఇంద్రుడు, వరుణ-వాయువులు మొదలైనవారంతా మరల మరల ఉత్పన్నమౌతూనే ఉన్నారు. లోకములు, లోకాంతరములు, సంగముమోక్షము మొదలగు క్రియలు మరల మరల సంభవిస్తూనే ఉన్నాయి. ఈ పృథివి కూడా అనేకసార్లు నశిస్తూ మరల ఉత్పన్నమగుచున్నది. సూర్య చంద్రులు మరల మరల ఉద్భవిస్తున్నారు. కొందరు జీవులు స్వర్గము నుండి తమ యొక్క పుణ్యం క్షయమగుటచే మరల భూమిపై పడుచున్నారు. భూమిపై నివసించే కొందరు జీవులు పుణ్యఫలంగా స్వర్గాదులు చేరుచున్నారు. ఈ సృష్టి వ్యవహారమంతా మరల మరల వస్తోంది, పోతోంది. అనేకమంది ఇంద్రుల అధికారం పూర్తి అగుటచే క్రొత్త వారు ఎందరో వచ్చి ఇంద్రసింహాసనం అధిష్ఠిస్తున్నారు. అనేకసార్లు కృతయుగపు స్థితిగతులు కలియుగంచే కలుషితం చేయబడుచున్నాయి. అనేక కల్పములు దొర్లిపోతున్నాయి.
5. ప్రాప్తించేదంతా ఇతఃపూర్వపు అభాసానుగతమే!
ఎవనికి ఏ ఇతఃపూర్వపు అభ్యాసం ఏర్పడి ఉన్నదో ఆ అభ్యాసము ననుసరించే అతని సంకల్పములు ఉంటున్నాయి. సంకల్పములను అనుసరించే అనుభవములు పదే పదే ఏర్పడు చున్నాయి. ఒక సమయంలో ఇదంతా రసవిహీనంగాను, అత్యంత భారంగాను, త్యజించుటకు అర్హమైనదిగాను ఉంటోంది. మరొకప్పుడు ఇదే జగత్తు అనేక ఆశలతో, సుందరమైన విషయము లతో ఉన్నట్లు దర్శించబడుతోంది. విషయపరంపరారూపమగు ఈ మనస్సు ఒకానొకప్పుడు శిథిలమైన ఆకృతిని ధరించి తన యొక్క జన్మస్థానమగు సాక్షితత్వమునందు విలీనమగుచున్నది. మరల మనస్సే జగత్ సమూహములను విస్తరింపజేస్తోంది.
ప్రళయం అయిన తరువాత మరల సృష్టి ప్రారంభం అవుతోంది. అప్పుడు మరల సమస్త పదార్థములు ఉత్పన్నమౌతున్నాయి. మరల ఈ జగత్తు చక్రము వలె పరిభ్రమించటం ప్రారంబి స్తోంది. దీర్ఘభ్రమరూపమైనట్టి ఈ‘మహామాయ' యొక్క ఆడంబరంలో 'ఇది ఇట్లు నిర్ణయించ వచ్చును...’ అనదగిన సత్యవస్తువుగాని, అసత్యవస్తువుగాని ఏది ఎక్కడ ఉన్నది? కల్పనచే రచింప బడినట్టి ఆకారం కలిగిన ఈ సంసార చక్రం భ్రమ వంటిదే సుమా! యథార్థానికి ఇదంతా ‘లేనిదే’ అగుచున్నది.
ఓ రాఘవా! ఈ జగత్తంతా అజ్ఞానము చేతనే అవిర్భూతమగుచున్నది. నేత్రదోషం చేత ఆకాశంలో ఎందరో చంద్రులు కనిపిస్తున్నట్లు ఈ జగత్తు ఇందలి సంఘటనలు, జనులు అనేక రీతులుగా ద్రష్టకు ప్రాప్తిస్తున్నారు.
అనేక వికల్పములచే ఈ జగత్తు నిరంతరం వ్యాప్తమైయున్నది.
Page:243
అవిద్యామానమగు కర్తృత్వముచే నిర్మించబడిన ఇదంతా అధిష్ఠానమగు బ్రహ్మము కంటే వేరే కాదు. కాబట్టి నీవు 'జగత్తు' రూపంగా చూస్తే ఇదంతా అసత్యమే.
ఓ రామచంద్రా! అసలు ‘ఈ జగత్తు సత్యము' అనే మూఢబుద్ధి నీకు ఎందుకు కలిగిందో చెప్పు? శ్మశాన సదృశమై, రుద్రునిచే ఏదో ఒకప్పటికి సర్వము మ్రింగబడబోవుచున్నదే కదా! అట్టి ఈ జగద్విన్యాసము చూచి భ్రమ పొందవలసిన పనేమీ లేదు.
Page:244
VII. దాశూర కథనం
1. దాశూరుడు - - చిత్త సువిశాలత్వం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జనులలో కొందరు అనేక క్రియావ్యవహారములలో తలమునకలై ఉంటున్నారు. భోగైశ్వర్యములచే వారి బుద్ధి నశించి ఉంటోంది. ఫలితమేమిటి? వారు తమను తామే వంచన చేసుకొంటున్నారు. అంతేకాదు ఇతరులను కూడా 'వంచనదృష్టి'తోనే గాంచుచున్నారు. మరి, అట్టి వారు సత్యవస్తువగు పరమాత్మను దర్శించుట ఎట్లో చెప్పు? వారికి ప్రశాంతత - ఆనందములు అనుక్షణం సుదూరమే అగుచున్నాయే!
యే తు పారంగతాబుద్ధేరింద్రియైర్న వశీకృతాః |
త ఏనాం జాగతీం మాయాం పశ్యన్తి కరబిల్వవత్ II (శ్లో 2, సర్గ 48)
ఎవరైతే ఈ బుద్ధిని కూడా అతిక్రమించివేస్తున్నారో, ఈ ఇంద్రియములకు వశీభూతులు కాకుండా ఉంటున్నారో... అట్టి మహాత్ములు ఈ జగన్మాయను అరచేతిలోని పండువలె స్పష్టంగా గాంచుచున్నారు. ఎవరు శ్రద్ధగా, సమగ్రంగా, మహాపరాక్రమవంతులై విచారణను ఆశ్రయించి ఉంటున్నారో, అట్టి వారు ఈ జగన్మాయను, బాగుగా ఎరుగగలుగుచున్నారు. పాము కుబుసాన్ని వదలి వేస్తున్నట్లు, వారు ఈ సర్వమును సర్వదా త్యజించియే ఉంటున్నారు. వారికి ఈ జగత్తు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ప్రాపంచిక క్షేత్రంలో వ్యవహరిస్తున్నప్పటికీ వారు ఏమాత్రం బంధమున తగుల్కొనరు. అగ్ని చేత దగ్ధమైన బీజము మరల మొలకెత్తుతుందా? వారి యొక్క 'మనస్సు-బుద్ధి -చిత్తము-అహంకారములు' (అంతరంగ చతుష్టయం) అంతా జ్ఞానముచే దగ్ధమై ఉంటున్నాయి.
ఇక అజ్ఞాని ఏం చేస్తున్నాడు?... శారీరక, మానసిక వ్యధలతో పూర్ణమై, నేడో రేపో నశించ బోయే ఈ దేహం కోసం మాత్రమే అతడు ప్రయత్నాలు సలుపుచున్నాడు. అంతేగాని, ఆత్మోద్ధరణ కొరకు ప్రయత్నమే చేయడాయె? అతడది గ్రహించి ఆత్మోద్దరణ కొరకై యత్నించు గాక!
ఈ సంసార చక్రము విషయముల పట్ల ప్రీతిగొనియున్న వారిని సంతోషింపజేయటానికే కల్పింపబడుచున్నది. “దాశూర కథనం' లోలాగా వాస్తవానికి ఇదంతా శూన్యమే. శ్రీరాముడు: స్వామీ! “ఇదంతా దాశూర కథనంలాగా” అని శలవిచ్చారు కదా! అనగా? దాశూరుని కథనమంటే ఏమిటో దయచేసి వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: సరే, నీ కిప్పుడు 'దాశూరోఖ్యాయిక' సవివరంగా చెపుతాను. వినుమగధ దేశంలోని ఒక ఏకాంత పర్వత ప్రదేశంలో 'శరలోముడు' అనే పేరుగల ఒక మహాత్ముడున్నాడు. ఆయన తన భార్యపుత్రులతో ఒక ఆశ్రమంలో ఉంటూ నిరంతరం తపో ధ్యానాదులను నిర్వర్తిస్తూ ఉండేవారు.
Page:245
అతని ఏకైక కుమారుడు దాశూరుడు. ఆ కుటుంబంలోనివారు వాళ్ళంతా ఎంతోకాలం అన్యోన్యంగా కలిసి ఉన్నారు. పక్షులు గూటిని వదలి వెళ్ళునట్లు శరలోముడు, ఆతని భార్య కాలక్రమంగా తమ శరీరాలను త్యజించి ఎటో వెళ్ళారు. ఇక దాశూరుడు తల్లిదండ్రుల వియోగం చేత పరమదుఃఖక్రాంతుడై, దిక్కుతోచక ఆ పర్వతముపై గల వనము లందు, గుహ లందు పిచ్చిపిచ్చిగా సంచరించసాగాడు. చాలా రోజులు ఆ విధంగా గడచిపోయాయి. అదృశ్య శరీరులగు అక్కడి వనదేవతలు ఆ యువకుని దీన చిత్తమును గమనించారు. "ఏమిటబ్బా! ఈ పిల్లవాడు దుఃఖిస్తూ ఎన్నో రోజులుగా పిచ్చివాడై తిరుగుచూనే ఉన్నాడు.!...' అనుకుని, జాలి పడసాగారు. తమ మధ్య రాత్రిబగళ్ళు నిస్తేజంగా, వెట్టిచూపులతో వగరుస్తూ తిరుగుచున్న ఆ బాలుని మనస్సు మార్చాలని అనుకున్నారు. పరుల దుఃఖం తమదిగా భావించే వారికి సర్వేశ్వరుడు సర్వదా అభ్యున్నతిని ప్రసాదిస్తూ ఉంటాడు కదా!
ఒక ఉత్తమ క్షణంలో వనదేవతలు ఆ కుర్రవానితో అదృశ్య శరీరులై యిట్లు సంబోధించారు. వనదేవతలు: ఓ మహా ప్రాజ్ఞుడవగు మునికుమారా! దాశూరా! ఇదేమిటయ్యా? అజ్ఞానివలె నీవు ఎందుకు దుఃఖిస్తున్నావో చెప్పు? ఈ ప్రపంచము యొక్క చంచలస్వభావమేమిటో నీవు ఇంకా గుర్తించలేదా ఏమిటి? ఇక్కడికి అనేకమంది జీవులు వచ్చి జన్మలు పొంది, కొంతకాలము అటు ఇటూ సంచరించి, మరల ఎటో వెళ్ళిపోవుచున్నారు. ఇది అనుదినం, అనుక్షణం జరుగుతున్న తతంగమే కదా! ఇక్కడి ప్రతిపదార్థం 'నశించుట' అను స్వభావంతోనే పుట్టుచున్నది. ఇక్కడ జరుగు చున్న వ్యవహారమంతా సూక్ష్మదృష్టితో, వివేకదృష్టితో పరిశీలించాలి గాని, మూర్ఖదృష్టితో కాదే!
ముందుగా నీ యొక్క వ్యవహారబుద్ధిని పరిశుద్ధపరచుకో. ఆ తరువాత ఆయా బాహ్య సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ మహాప్రసిద్ధులగు 'బ్రహ్మ' మొదలైన లోక పాలకులే వినాశనమొందుచున్నారే? ఏదైతే పుట్టుచున్నదో అది ఒకనాటికి నశించక తప్పదు'... అనుటలో నీకైమనా సందేహం ఉన్నదా? అక్కరలేదు. నీ తండ్రి మరణ విషయమై నీవు వ్యర్థంగా ఎందుకు శోకిస్తున్నావో చెప్పు? అసలు, జన్మిస్తున్నదెవరు? మరణిస్తున్నదెవరు? ఈ శరీరములు, తత్సంబంధములు స్వప్నతుల్యం కాక మరింకేమిటి? సూర్యుని లాగా ఉదయించిన ప్రతీది అస్తమించవలసినదే! అయితే,
విజ్ఞులు ఈ ప్రాప్తించిన ఆయుఃకాలమును ఎట్లు సద్వినియోగపరచుకొనుచున్నారు?... అజ్ఞానులు దీనిని "పిల్లవాని చేతిలోని సూది" వలె ఎట్లు అపవిత్ర పరచుకొని వేసట చెందుచున్నారు? ఈ విషయాలు, గమనించు. మొట్టమొదట నీ దృష్టిని పరిశుద్ధపరచుకో...! 'వివేక దృష్టి, ఉత్తమాశయా'లతో కూడిన సత్ప్రయత్నములతో దైవప్రసాదితమైన ఈ ఆయుష్షుని సద్వినియోగపరచుకో.
దాశూరుడు ఆ వనదేవతల స్నేహవాక్యములు విని ఊరట చెందాడు. ఇకప్పుడు లేచి, పితృ మరణానంతరం నిర్వర్తించవలసిన క్రియలన్నిటినీ పూర్తి చేశాడు. ఆ తరువాత బ్రాహ్మణ ధర్మమగు
Page:246
తపస్సు చేయటం ప్రారంభించాడు. వేదములను అధ్యయనం చెయ్యటం, వాటి యొక్క అర్థ విచారణ చేయటం, నిష్ఠతో అందలి ఉత్తమ ప్రవచనములను సదవగాహనతో ఆకళింపు చేసు కోవటం - మొదలైన ప్రయత్నములచే అతనియందు క్రమక్రమంగా పవిత్రమగు 'శ్రోత్రియత్వం' సిద్ధించింది.
అయితే అతడు ఇంకను జ్ఞేయమగు బ్రహ్మమును విశ్రాంతి, అనుభవముల పూర్వకంగా ఎరిగియుండకపోవటచే అతని చిత్తము 'శుద్ధ - అశుద్ధ' వికల్పములను కలిగి ఉండేది. పరమ పవిత్రమగు 'విశ్రాంతి’ అతనికి అల్లంత దూరంగానే ఉండేది. ఈ దృశ్యము స్వతహాగా 'శుద్ధమే’ అయినప్పటికీ అతనికి మాత్రం 'అశుద్ధము' గా తోచుచూ ఉండేది.
ఉత్తముడు తన ఉత్తమ ప్రయత్నముల నుండి విరమిస్తాడా? లేదు. ఆ దాశూరుడు కూడా స్వసంకల్పముచే ఒక చెట్టుపైన ఒక మూల చేరాడు. ఒక పక్షిలాగా ఆసీనుడై మరల తపస్సు చేయటం ప్రారంభించాడు. కొంతకాలం గడిచింది. ఆ తపస్సు కూడా అతనికి 'పరిశుద్ధధర్మము”* అను పవిత్ర స్థితిని ప్రసాదించనే లేదు.
అయితే అతడు ఎంతగానో మనస్సును 'తపస్సు' నందు నియమిస్తున్నప్పటికీ ప్రాపంచికమైన విషయాలు, సంఘటనలు, వ్యక్తులు అతని బుద్ధిని ఆక్రమించియే ఉండటం జరుగుతోంది.
“ఇప్పుడు నేను ఏం చేయాలి? నా మనస్సు నందు ఆక్రమించియున్న ఈ దృశ్యముతో ఏర్పడిన సంబంధము... అనే దోషం సన్నగిల్లేదెట్లా? సరే. సర్వత్యాగము చేతనే పవిత్రత్వము సముపార్జించబడగలదని వేదవాక్యసారం కదా! అందుచేత ఈ నా శరీరమునే అగ్నికి తర్పణం చేస్తాను. అప్పుడు అగ్నిదేవుడు కనికరించి నా మనస్సు యొక్క క్షోభను, దోషమును తొలగించ వచ్చు. ఈ భూపదార్థములపై నాయందు ఏర్పడుచున్న 'ఆకర్షణ'కు అగ్నిదేవుడే వైద్యుడై నన్ను రక్షించగలడు”... అని యోచించాడు. చెట్టు నుండి క్రిందకు దిగి ఒకచోట అగ్నిని ప్రజ్వలింప జేసాడు. తన భుజముల నుండి మాంసమును కోసి హోమం చేయటం ప్రారంభించాడు.
అప్పుడు అగ్నిదేవుడు 'ఇదేమిటి? ఈ బాలకుడు ఇంతకు తెగించాడేమి? సరే, దేవతల కంఠప్రదేశమైనట్టి అగ్నిరూపమగు నాయందు పడుచున్న ఈతని శరీర ఖండములు భస్మము కాకుండు గాక! ఇతడు మునపటి వలె పూర్ణశరీరుడై యుండుగాక!" అని సంకల్పించాడు. బృహస్పతి ముందు సూర్యభగవానుడు ప్రత్యక్షమయినట్లు అగ్నిదేవుడు ఆ దాశూరుని ముందు కల్పిత శరీరములో ప్రత్యక్షమైనారు.
అగ్నిదేవుడు : ఓ సాధూ! దాశూరా! నీ త్యాగనిరతికి, పట్టుదలకు మెచ్చుకుంటున్నానయ్యా! ఏమి కోరి ఇంతటి సాహసం చేస్తున్నావో చెప్పు, నీకు అభిమతమైన వరం కోరుకో.
ఏదేది మనం చేయవలసివస్తోందో అవన్నీ భగవదర్పిత బుద్ధితో 'ఇది ధర్మమైయున్నది' అను భావనతో రాగ-కౌతుక రహితంగా నిర్వర్తించుటయే “పరిశుద్ధ ధర్మభావన’ అగుచున్నది.
Page:247
దాశూరుడు: తండ్రీ! పరమపవిత్ర స్వరూపులగు తమ యొక్క కనికరము చేతనే లోకములు మనగలుగుతున్నాయి. మావంటి అల్పజీవులకు దేవతల కటాక్షవీక్షణలను ప్రసాదింపజేసే మహనీయులు మీరు. మీ పాదములు అంటి మ్రొక్కుచున్నాను. సాష్టాంగదండ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి.
మహానుభావా! ప్రాణులతోను, అనేక పదార్థములతోను నిండియున్న ఈ 'పృథివి' నన్ను ఆకర్షితుణ్ణి చేస్తోంది. నా బుద్ధి క్షణకాలంలో కలుషితమౌతోంది. అట్టి ఈ ఎదురుగా కనబడుచు న్నట్టి పృథివిని త్యజించివేయగలుగు బుద్ధిని, శక్తిని వరంగా ప్రసాదించండి. ఈ సర్వము త్యజించి వృక్షము పైననే స్థితి పొందగలిగేటట్లు అనుగ్రహించండి.
అగ్నిదేవుడు: (చిరునవ్వుతో) పుత్రకా! సరే, అట్లే అగు గాక! నీ మనోరథము సిద్ధించు గాక! అందుకుగాను, నీ వర్తమాన తపస్సుయజ్ఞం మొదలైన ప్రయత్నాలను కొనసాగించు. నియమిత కాలంలో నీ మనస్సు పరిశుద్ధమౌతుంది.
ఇట్లు ఆశీర్వదించి అంతర్థానమైనాడు. అప్పుడు దాశూరుడు ఒకచోట అశీనుడై 'నేను పృథివిని త్యజించిన వాడనయ్యాను. ఇందలి ఏ పదార్థము నాకు సంబంధించి లేదు. నేను ఇందలి ఏ పదార్థమునకు సంబంధించినవాడను కాను...” అని మననం చేయసాగాడు. అయినా కూడా తృప్తి లభించలేదు.
అప్పుడు ఎత్తైన ఒక కదంబవృక్షమును ఎన్నుకున్నాడు. ఆ వృక్షము ఆకాశమును అంటుచు, ఫలయుక్తమై తన కొమ్మలచే 'ఛాయ'చే అనేక ప్రాణులకు ఆహ్లాదం కలుగజేస్తూ ఉండేది. భూమిపై అపవిత్రమైన బుద్ధిగల అతడు మఱిచెట్టుపై విష్ణుభగవానుని వలె ఏకాగ్ర చిత్తంతో ఆ కదంబ వృక్షపు కొమ్మపై ఆత్మశుద్ధి కొరకు మరల తపస్సు చేయటానికి ఆసీనుడైనాడు. మరల ఒక్క క్షణం తన చుట్టు పట్ల పరికించి చూచాడు. ఆ క్షణంలో అతని దృష్టి మరల చంచలత్వం పొందింది. కౌతుకంతో చుట్టూ పరికిస్తున్న అతని దృష్టికి అక్కడ నదులు, పర్వతములు, నిర్మలాకాశం, నీలి మేఘములు, పల్లవములు, పుష్పసమూహములు, పక్షుల కలకలారావములు, సెలయేళ్ళ శబ్దములు, అరణ్యము, స్వర్గము, భూమి మొదలైన వాటితో కూడిన వ్యవహారమంతా దిక్కులన్నీ నిండి కనిపించాయి. వాటిచే ఆతని బుద్ధి దృష్టి ఆకర్షించబడటం కొనసాగనారంభించింది.
ఒక్క క్షణం అదంతా పరికించి చూస్తూ 'ఆహాఁ! మాయ ఎంత చమత్కారమైనది! నా దృష్టి పరిశుద్ధమవనంతవరకు ఏ మూల వెళ్ళి కూర్చుంటే ఏం ప్రయోజనం? ఈ విషయమే వనదేవతలు నాకు గుర్తు చేశారు కదా...!” అని ఆలోచించి కొంత ప్రశాంత చిత్తముతో నవ్వుకొన్నాడు. ఆ దిక్కుల నుండి తన దృష్టిని వెనుకకు మరల్చి మరల ఘోరతపస్సు ప్రారంభించాడు.
కాని ఏం లాభం? కేవలం కర్మకాండ యందు మాత్రమే తత్పరుడయ్యాడు. పరమార్థజ్ఞాని కాలేకపోయాడు. 'స్వర్గమును పొందుట' వంటి స్వల్ప ఫలములకు మాత్రమే అర్హుడు కాగలిగాడు.
మానసిక యజ్ఞం - అప్పుడు దాశూరుడు ఇట్లు యోచించాడు. "ఎంత కాలం తపస్సు చేస్తే ఏం ప్రయోజనం? బాహ్య కార్యక్రమముల వలన ఉత్తమ ప్రయోజనమేదీ నాకు కనిపించుట
Page:248
లేదు. ఇంకేమి ఉపాయం? అన్నిటికీ కారణం మనస్సే కదా! కనుక ఇక నుండి మానసిక యజ్ఞం ప్రారంభిస్తాను” అని అనుకున్నాడు. మనస్సుతోనే అగ్ని యొక్క ఉపాసన ప్రారంభించాడు. ‘అశ్వమేధయాగం’ వరకు గల అనేక యజ్ఞక్రియలన్నిటినీ క్రమంగా ఆచరించాడు. ఆ వృక్షపు కొమ్మ మీదనే ఆసీనుడై పది సంవత్సరాల కాలం దేవతా ప్రీత్యర్థం ఒక దాని తరువాత మరొకటిగా అనేక మానసిక యజ్ఞములను నిర్వర్తించాడు. అప్పటికి అతని చిత్తము క్రమంగా రాగద్వేషరహితం కాసాగింది. సువిశాలత్వం పొందింది. ప్రతిబంధకములన్నీ క్షయిం చాయి. సంస్కారములు పవిత్రత పొందాయి. చిత్తము నిర్మలం కాగా, అతనికి జ్ఞానోదయమ యింది. జ్ఞానముచే అజ్ఞానావరణమంతా ఛిన్నమైపోయింది. వాసనామలమంతా నశించింది.
2. వనదేవత - పుత్రాభిలాష్
ప్రశాంతచిత్తుడగు ఆ దాశూరుడు ఆ కదంబ వృక్షపు కొమ్మపై మౌనం వహించియున్నాడు. ఒక రోజు ఒక వనదేవత గొప్ప సౌందర్యముతో కూడిన శరీరము ధరించి అతని ఎదురుగా నిలచినది. మనోహరమగు వచనములతో తన అభ్యర్థనను ఇట్లు తెలిపింది.
వనదేవత: పరిశుద్ధుడవు, మోక్షస్వరూపడవు అగు ఓ మునికుమారా! మీకు జయమగుగాక! దాశూరుడు: ఓ కమలాక్షీ! నీ యొక్క శోభాతిశయం చేత మన్మథుని కూడా విచలితుని చేయ గలిగినట్లు ఉన్నావు. అంతటి సౌందర్యరాశివగు నీ వెవరవు? ఈ లతపై కూర్చుని నా ఎదుట ఎందుకు సాక్షాత్కరించావు?
వనదేవత: హే మునీ! "ప్రాప్తించనిదంటూ ఏదైనా ఉంటే, అదంతా మహాత్ములను సమీపించి అర్థించితే చాలు, తప్పక ప్రాప్తిస్తుంది"... అని పెద్దలు అంటూ ఉంటారు. ముందుగా నేనెవరో చెపుతాను, వినండి. అనేక కదంబవృక్షములతోను, అందమైన పూతీగలతోను శోభిస్తున్న ఈ వనంలోని వనదేవతను నేను. లతల సమూహమే నా నివాసస్థానం. ఈ మధ్య కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి యాచిస్తున్నాను.
శ్రీ దాశూరుడు: ఏమా సంఘటన? నీ అభిలాష ఏమిటి?
వనదేవత: మొన్నటి చైత్రశుక్ల త్రయోదశినాడు దేవలోకంలోని నందనవనంలో ఒక ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అనేక ప్రదేశముల నుండి వనదేవతలు వచ్చి సమావేశ మయ్యారు. ముల్లోకములందలి వనదేవతలను పరామర్శించుచు, వేడుకలలో పాల్గొనుటకు గాను నేను కూడా వెళ్ళాను. ఆ 'కామోత్సవం'లో అనేకమంది వనదేవతలు తమ పుత్రులను కూడా వెంటబెట్టుకొని అటూ ఇటూ తిరగటం చూచాను. వారు తమ బిడ్డలను ముద్దు ముద్దు మాటలతో లాలించటం నాకెంతో ముచ్చట గొలిపింది. నేను పుత్రహీనను. అందుచేత నా మనస్సు ఎంతగా క్షోభించిందో మాటలతో చెప్పలేను. వాళ్ళు తమ పుత్రుల అల్లరి చిలిపి మాటలను వింటూ కళ్ళలో
Page:249
ఆనందం ప్రకటించటం చూచాను. "ఏనాటికైనా నేను అట్లు పుత్రులను పొందగలనా?' అను ఆలోచన నన్ను వేధించసాగింది. "ఏమి చేయాలి?” అని తీవ్రంగా యోచిస్తూ ఉండగా, మీరు గుర్తుకు వచ్చారు. “ఆ ముని సమస్త పురుషార్థములకు కల్పవృక్షము వంటివారు... ఇక నీకేం లోటు... పోయి అభ్యర్థించు”... అని తోటి వనదేవతలు నన్ను ఉత్సాహపరిచారు. ఇక నేను పుత్రహీననని దుఃఖించవలసిన పనేమున్నది?
ఓ మహాత్మా! నాకు ఒక కుమారుని ప్రసాదించండి. ఒకవేళ మీరు నా విన్నపమును తిరస్కరిస్తారా? అందుకు నేను తగిన నిర్ణయమే చేసుకుని వచ్చాను. ఇప్పటికిప్పుడు ఇక్కడ 'అగ్ని' ని సృష్టించి అందులో ఈ నా దేహమును ఆహుతి చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే, “నాకు ఇతర దేవతల వలె పుత్రులు లేరే?” అనే దుఃఖం భరించలేను. ఇంతకన్నా మరణించటమే ఉచితమని నేను నిశ్చయించుకున్నాను.
ఆ ముని ప్రశాంతంగా అంతా విన్నారు. మహాత్ముల హృదయం నవనీతంలా సుతిమెత్తగా ఉంటుంది కదా! ఆయన జాలి పొంది ఇట్లు పలికారు.
శ్రీ దాశూరుడు: ఓ వనదేవతా! పుత్రుని కొరకై నీవు స్వశరీర త్యాగానికి కూడా సిద్ధపడ్డావు కదా! సంతోషం. ఇదిగో, ఈ పుష్పమును స్వీకరించు. నెల రోజులలో నీకు ఒక చక్కటి కుమారుడు కలుగుతాడు. నీ త్యాగనిరతికి తార్కాణంగా అతడు మహాసౌందర్యవంతుడు జగత్పూజ్యుడు అయి ఉంటాడు. మహాజ్ఞాన సంపన్నుడగు అతనిని పొందినందుకు నీ జన్మసార్ధకమౌతుంది.
వనదేవత ఆ మాటలు విని ఎంతో సంతోషించింది. ఆ ఋషి పాదాలు స్పృషించి నిజస్థాన మునకు మరలింది. క్రమంగా మాసాలు, ఋతువులు, సంవత్సరములు గడచిపోసాగాయి. ఒక నాడు ఆ వనదేవత పండ్రెండేళ్ళ వయసుగల కుమారుని వెంటబెట్టుకుని ఆ మునిని సమీపించింది. వనదేవత: హే మహాత్మా! ఈ పిల్లవాడే మన కుమారుడు. నేను ఇతనిని సర్వవిద్యాసంపన్నునిగా తీర్చిదిద్దాను.
దాశూరుడు: చాలా సంతోషం. విద్యలన్నీ చక్కగా నేర్చినాడు కదా?
వనదేవతః నేర్చాడు. కాని 'ఆత్మజ్ఞానం' మాత్రం ఇతడింకా పొందనేలేదు. ఏది గ్రహించిన తరువాత ఇక జీవుడు ఈ సంసారచక్రంలో తగుల్కొనడో... అట్టి దివ్యము, నిత్యోదిత అమృతానందమయము అగు 'ఆత్మస్వరూపానుభవం’ ఇతనికి బోధించ వలసియున్నది. 'ఇతడు జ్ఞాని అవుతాడు' అను మీ ఒకప్పటి ఆశీర్వాదవాక్యం సిద్ధింపజేయ ప్రార్ధన. ఇతనికి మీరే దయతో జ్ఞానోపదేశం చెయ్యండి. మీ అంశయే అయిన ఇతడు జ్ఞాని కావటం మీకు కూడా సంతోషకరమైన
విషయమే కదా!
దాశూరుడు: అట్లాగే అగుగాక! ఇతడు ఇక్కడే ఉంటాడు. ఇక నీవు యథాస్థానికి వెళ్ళవచ్చు. నీకు
శుభమగుగాక!
x
Page:250
తన తండ్రి, గురువు అగు ఆ మహామునిని సేవించుకుంటూ ఆ బాలుడు రోజులు గడుప సాగాడు. అనేక క్లేశములను భరిస్తూ తండ్రి వద్ద అనేక జ్ఞాన విషయాలు వినేవాడు. అనేక యుక్తులను ఉపయోగించి దాశూరుడు ఆత్మవస్తుతత్త్వాన్ని విశదపరుస్తూ ఉండేవాడు. 'ప్రత్యగాత్మ యందు నిరంతరస్థితి కలిగియుండుటకు ఉపాయములేమిటి...' అను విషయము అనేక కథల, యుక్తుల సహాయంతో కూలంకషంగా చర్చిస్తూ ఉండేవాడు.
కల్పితములైన అనేక దృష్టాంతములు... లోకప్రసిద్ధమైన ఇతిహాసములు... పూజ్యులగు మహనీయుల ప్రవచనాలు, అభిప్రాయాలు... వేద వేదాంతాలలోని ఆయా సిద్ధాంతములు.., వ్యాఖ్యానాలు... అనేక అర్థములను సూచించు కథలు... స్వానుభవాలు, అవగాహనలు... ఈ విధంగా అనేక చమత్కృతులను క్రోడీకరించి ఉత్తమవచనముల ద్వారా ఆత్మ గురించిన
సమాచారం ప్రసాదించసాగారు.
ఒకరోజు నేను అయోధ్య నుండి కైలాసములోని మందాకినీ నదిలో స్నానం చేయటానికి బయలుదేరాను. అదృశ్యరూపంలో ఆకాశమార్గంలో పయనిస్తున్నాను. సప్త ఋషి మండలము లోని 'స్వర్గలోకాకాశం’ దాటి, వెళ్ళుచున్నాను. కాకతాళీయంగా ఆ దాశూరుడు, అతని కుమారుడు ఉన్న భూగోళంలో ప్రవేశించాను. రాత్రి అగుటచే కొంచము విశ్రమించాలని ఆ వృక్షమధ్య భాగంలో ప్రవేశించాను. ప్రశాంతమౌన చిత్తుడనగు నాకు వారిద్దరి సంభాషణ వినిపించింది. ఆ సంభాషణను నీకు వివరించి చెపుతాను, విను.
3. ఖోష్ఠుడు - మూడు శరీరాలు
దాశూరుడు: ఓ కుమారా...! ఇట్టిదే అయినట్టి మరొక విశ్వం ఉన్నది. అక్కడ ఒక ప్రదేశంలో ఒక ఆశ్చర్యజనకమైన సంఘటన జరిగింది. అది చెపుతాను, విను...
విశ్వంలో ఒక భూపాలుడు ఉన్నాడు. అతని పేరు ఖోష్ఠుడు" అతడు ముల్లోకాలలోను సుప్రసిద్ధుడు. గొప్ప శ్రీమంతుడు. జగత్తులన్నీ జయించగలిగినంతటి సామర్థ్యం కలవాడు. అతడు మహాజ్ఞాని కూడా. కాబట్టి అతని ఆజ్ఞలు బ్రహ్మ, ఇంద్రుడు మొదలగువారికి కూడా శిరోధార్య మగుచున్నాయి. అతడు మహాసాహసి అని, గొప్ప పరాక్రమవంతుడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ ముల్లోకాలలో ఎవరికీ అతనిని వశం చేసుకోవటం అంత తేలికైన పని కాదు. అయితే అతనిలోనే అసంఖ్యాకంగా 'ప్రవృత్తులు' ఉన్నాయి. అవన్నీ సుఖప్రదాలై ఉంటున్నాయి.
ఎవరైనా తమ పిడికిలితో ఆకాశమును జయించగలరా? ఉత్తమ పరాక్రమశీలుడగు అతనిని తమ శస్త్రాస్త్రబలంచే ఎవ్వరూ జయించలేరు. దివ్యమగు అతని లీలలు మహాగంభీరముగా
ఖః = ఆకాశము ; ఖోత్థుడు = అవ్యాకృతాకాశం నుండి జనించినవాడు.
Page:251
ఉంటున్నాయి. అతడు తనకు తానే “స్వప్నము - - మనోరథము’ లకు సంబంధించిన స్వీయరచనలు చేస్తూ ఉన్నాడు. “అతని ఊహా కల్పిత రచనా చమత్కృతులు ఆ ఇంద్ర-విష్ణు-శంకరులు కూడా ఊహించలేరా”...? అన్నట్లు ఉంటున్నాయి.
అతడు సర్వవేళల మూడు శరీరములు కలిగి ఉంటున్నాడు. అందులో ఒక్కటి ఉత్తమమైనది, ఒకటి మధ్యమము, ఒకటి అధమమైనది. ఆ శరీరములు సర్వవ్యవహారములు నిర్వర్తించగల సామర్థ్యము కలిగి ఉన్నవి. వింటున్నావా కుమారా?
దాశూరుని పుత్రుడు: తండ్రీ! వింటున్నాను. ఇంతకీ అతడు ఉన్నది ఎక్కడ? ఈ జగత్తు లోనా? లేక, బైట ఇంకెక్కడన్నానా?
శ్రీ దాశూరుడు : విశాలమగు 'అవ్యాకృతాకాశం'లోనే అతడు త్రిశరీరధారి అయి ఉద్భవించాడు. అతడు ఉన్నది, అతని సంచనలము అవ్యాకృతాకాశంలోనే. అయితే ఏం? అతడు తుచ్ఛ విషయము లందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు. ఏవేవో విధి-నిషేధములను ఆశ్రయించి అనేక స్థితిగతులను దర్శించుచున్నాడు.
అతడు 'అవ్యాకృతాకాశం’లోనే "బ్రహ్మాండము" అనే నగరం స్వయంగా మనోకల్పితంగా నిర్మించాడు. ఆ బ్రహ్మాండనగరం 14 భువనములచేత, 3 లోకముల రూపంగా, 3 వేదములతో కూడినదై శోభిస్తోంది. అందులో చంద్రసూర్యులు తరగని దీపాలవలె వెలుగుచున్నారు. ఆ బ్రహ్మాండంలో అనేక రకరకాలైన శాస్త్రీయ-అశాస్త్రీయ ప్రవర్తనామార్గాలు ఉండి ఉన్నాయి. అవన్నీ ఊర్ధ్వ-అధోగతి రూపములతో విలసిల్లి ఉంటున్నాయి. అతి విశాలమైనట్టి ఆ బ్రహ్మాండనగరంలో అనేకమంది దేవతలను, మనుష్యులను, తదితర జీవులను అతడు సృష్టించాడు. వారంతా జంగమాత్మకమై (జన్మించు స్వభావం గల) స్వరూపం కలిగి ఉన్నారు. విషయముల పట్ల ధ్యాస కలిగియుండుటచే వారు విమూఢులు, ఆత్మాకాశపరిచ్ఛేదకులు అయి ఉన్నారు. వారిలో కొందరు ఊర్ధ్వ భాగమున నియమించబడ్డారు. కొందరు మధ్యభాగమున, మరికొందరు అధోభాగమున నియోగించబడ్డారు.
అందులో కొందరు చాలా శీఘ్రంగా నశించిపోతున్నారు. ఇక మరికొందరో, చాలా కాలానికి గాని నాశనం పొందుటలేదు. ఆ జీవులంతా నల్లటికేశములతో, నవ ద్వారములతో, ప్రాణ-అపాన వాయు చలనములతో, పంచ జ్ఞానేంద్రియములతో, రక్త మాంస-బొమికలతో నిర్మించబడే ఈ భౌతిక ఉపాధులతో కనిపిస్తున్నారు.
మహాత్ముడగు ఆ రాజు తన యొక్క మహత్తర మాయాశక్తిచే 'యక్షసమూహము’ను కూడా రచించాడు. ఆ యక్షులు ఆత్మాకాశమున 'ఆఛాదన' రూపంలో ఉన్నారు. వారు 'ఆత్మజ్ఞాన ప్రకాశము' పట్ల నిత్యము భయభీతులై ఉంటున్నారు. అట్టి ఆత్మాఛాదకులు కార్యప్రవృత్తులగు చున్నారు. వారు కార్య ప్రవృత్తులైనందుకు ప్రయోజనంగా అనేక విధములైన క్రీడా విషయములు ఉత్పన్నమగుచున్నాయి.
Page:252
తానే బ్రహ్మాండనగరమునకు 'సృష్టికర్త' అయినప్పటికీ ఆ రాజు సంకల్పములచే నడిపించ బడి అనేక స్థూల సూక్ష్మ-కారణ శరీరములందు యక్షులతో కూడి విహరిస్తున్నాడు. ఒక శరీరంలో ప్రవేశించి కొంచెము సేపు విహరించి, ఇంతలోనే ఆ శరీరమును విడచి వేస్తున్నాడు. అక్కడి నుండి బయలుదేరి మరల ఇంకొక దేహమును ఆశ్రయిస్తున్నాడు.
అతని చిత్తము ఎంతో చంచలమైనది. అది ఒక్కొక్కప్పుడు 'భవిష్యత్తు నగరము'ను తన యందు సృష్టించుకొని అందులో ప్రవేశించి, అక్కడ అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటోంది. అతని చిత్తము జాగ్రత్తు, సుషుప్తులను త్యజించి స్వవిరచితమైన స్వప్నలోకంలో ప్రవేశించుచు విహారం చేయుచుండెడిది. ఇంతలోనే అతని ఆ చపల చిత్తము ఇంకొక సమయంలో క్షణంలో సర్వ జాగ్రత్-స్వప్న సంకల్పములన్నీ త్యజించి వేసి సర్వభావనలు విలయించునట్టి సుషుప్తిలో ప్రవేశించాలనే కోర్కె పొందేది.
అప్పుడు ఆ ఖోతునిచిత్తంలో కర్మ బీజములు సంస్కార రూపంలో ఉండేవి. అవన్నీ ‘మూఢత్వము' అను అవిద్యయందు దాగి ఉండేవి. ఇంతలోనే, మరల అతనిపట్ల చిత్తము ఉత్పన్నమైనదై, సుషుప్తి నుండి లేచి కూర్చుని క్రమంగా మరల జాగ్రత్-స్వప్న దశలను పొందుతూ ఉండేది. ఆ సమయంలో మరల అనేక విస్టార కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఉండేది.
ఆ ఖోతుని ఓడించగలిగిన వారెవ్వరూ లేరు. అయితే ఏం? అతని చిత్తము ఒక్కొక్కసారి తన చేతులలో తానే ఓడిపోతూ ఉండేది. 'అయ్యో! నేనొక అజ్ఞానిని. నాకేమీ తెలియదు. భృత్యుడను. పరమ దుఃఖితుడను’ అను భావనలు స్వీకరించి అతడు ఎంతగానో దుఃఖిస్తూ, వాపోతూ ఉంటాడు. మరొకప్పుడు ఇతఃపూర్వం అనుభూతమైన సుఖములను స్మరిస్తూ 'ఇప్పుడవన్నీ నాకు లేవే?' అను దీనత్వము సంతరించుకొంటాడు. 'ఇతడే ప్రపంచంలోని దుఃఖాలన్నీ కాపురం ఉండే వృక్ష రాజమా...!' అన్నట్లు కనబడతాడు. నవరసాలు పోషించే నటునిలాగా ఆ వ్యవహారమంతా ఆ భోతుని చిత్తము వేస్తున్న వేషములే.
❖
మహాత్ముడగు ఆ భోష్ఠుడు తక్కువవాడేమీ కాదు. తలచుకుంటే, వాయువు సముద్రమును కదలించుచున్నట్లు, అతడు దేనినైనా జయించివేయగలడు. అందుచేత కొన్ని సమయములలో అతడు జాగ్రత్-స్వప్న-సుషుప్తులలోని శత్రువులందరినీ ఆక్రమించివేస్తున్నాడు. ఆ సమయంలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులు అతనికి సంపదలుగానూ, సామంత రాజ్యములుగానూ ప్రకాశి స్తున్నాయి గాని భారంగా కాదు. దుఃఖపూరితంగా కాదు. అంతయు జయించి, అంతయు గ్రహించి అతడు ఒక సమయంలో అత్యంత ప్రసన్నుడై సుఖిస్తూ ఉంటున్నాడు.
అతడు అంతరంగమందలి జ్యోతి చేతనే ప్రకాశితుడగుచున్నాడు. అయినప్పటికీ వ్యవహార దృష్టిలో అనేక మౌఢ్యతలచే పరివేష్టింపబడుచున్నాడు. ఎందుకో అనంత సంఖ్యలో అతనిని అనేక వేదనలు సమీపిస్తున్నాయి.
Page:253
4. సంసార సాగరము - వికల్ప వ్యవహారము
దాశూరుని కుమారుడు: హే తండ్రీ! పవిత్రాంతఃకరణమూర్తీ ! మీరు పరోక్షంగా, ఏదో సత్యమును ప్రతిపాదిస్తున్నట్లు నా కనిపిస్తోంది. ఖోష్ఠుడు అనే పేరుతో మీరు చెప్పుచున్న ఆ రాజు ఎవరు? యథార్థానికి మీరు ఏమి చెప్పదలచారు? భవిష్యత్ నగర నిర్మాణం అనే పదప్రయోగానికి అర్థమేమిటి? ఈ వర్తమానకాలంలో కూడా అతడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? అతని బ్రహ్మాండము ఎటువైపు ఉన్నది?
'వర్తమాన-భవిష్యత్ నగరములు'... అని మీరు అనటం కొంత పరస్పర విరుద్ధంగాను, వ్యామోహజనితంగాను ఉన్నదని నాకనిపిస్తోంది.
దాశూరుడు: కుమారా! ఆ విషయాలన్నీ యథార్థరూపంగా చెపుతాను. శ్రద్ధగా వింటే, ఈ సంసారము యొక్క తత్త్వమేమిటో నీవే గ్రహిస్తావు. ఈ ప్రపంచము అసత్యమని, 'పరమార్థ సత్త'చే పరిశీలిస్తే ఈ జగత్తు లేనేలేదనీ తెలియజేయటానికే నిగూడార్థ రూపంలో ఉన్న ఖోతుడి గురించి విశేషములు వర్ణించి చెప్పాను. ఇక అసలు విషయం వినుఖోష్ణుడు: అవ్యాకృతాకాశము (A space where there tends to be no matter) నుండి ఉత్పన్నమైన సంకల్పాత్మకమగు మనస్సే ఆ పేరుతో మనం చెప్పుకున్నాం. అతడు (అనగా మనస్సు) స్వసంకల్పములచే జనించిన వాసనల చేతనే రూపము పొందుచున్నాడు. వాసనలే మనస్సు, వాసనారాహిత్యమే మనోరాహిత్యం.
తత్స్వరూవమిదం సర్వం జగదాభోగి విద్యతే ॥
జాయతే తత్ర జాతే తు తస్మిన్నష్టే వినశ్యతి ॥ (సర్గ 53, శ్లో 7)
ఈ కనబడే విశాల జగత్తు అంతా సంకల్పమయమగు మనస్సేగాని, మరింకేమి కాదు. మనస్సు యొక్క స్వరూపమే సంసారము A - ఈ శరీరాదులు కూడా. మనస్సు ఉత్పన్నమైనప్పుడే జగత్తు ఉత్పన్నమౌతోంది. మనస్సు నశిస్తే జగత్తు కూడా నశిస్తోంది.
వృక్షమునకు శాఖలు ఉంటాయి కదా! పర్వతమునకు శిఖరములు ఉంటాయి.... అలాగే ‘బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు ఇంద్రుడు' మొదలైనవారంతా మనస్సు యొక్క అవయవములే అయి ఉన్నారు.
వాస్తవానికి బ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందు జగత్ సత్తరహితమే అయి ఉన్నది. అనగా బ్రహ్మము (అవ్యాకృత, ఆకాశము) నందు జగత్తులు, పదార్థములు, అహమ్, త్వమ్ సుఖ-దుఃఖ సంఘటనలు మొదలైనవేవీ లేవు. అత్యుత్తమమైన దృష్టిచే మనస్సు అనబడేది కూడా లేదు. అయితే, అట్టి బ్రహ్మము నందు 'చైతన్యప్రతిభాస' చేత 'సమష్టి సృష్టి' అను ఒకానొక స్వభావము ఉదయిస్తోంది. అది నీటియందు కెరటములు ఉదయించుట వంటిది. నేను 'సమష్టి
Page:254
సృష్టికి కర్తను' అనే తత్త్వమే సమష్టిజీవుడు, విరించి, బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు... ఇత్యాది పేర్లతో చెప్పబడుతోంది.
ఇట్లు సంకల్పమయమగు మనస్సు ఈ త్రిలోకములను రచించుచున్నది. ఈ సూర్య చంద్రులు, 14 లోకములు, సుందరపర్వతములు, సముద్రములు, అందలి తరంగములు, భూమి, ఆకాశం మొదలైనవన్నీ సంకల్పము చేతనే రచించబడి విరాజిల్లుచున్నాయి. ఊర్ధ్వ-అధో లోకాలు, పుణ్య-పాపములు ఇవన్నీ ఉంటున్నది 'మనస్సు' అనే నగరంలోనే. ఈ దేవమనుజ-కిరాతక -పిపిలీకాది జీవులన్నీ పచార్లు చేస్తున్నది మనస్సు అనే మైదానంలోనే.
సంకల్పత్మాకమగు 'మనస్సు’ అనే రాజు యొక్క క్రీడ కొరకే ఈ 'జగత్తు' అను రూపంగల నగరంలో 'అహంకారము - - దేహము - - దేహమును రక్షించు శక్తులు '... ఇవన్నీ నిర్మించబడు చున్నాయి. అహంకారము చేత అనేక దేహములు నిర్మించబడగా, అందులో కొందరు ఊర్ధ్వమున దేవతలుగాను, మరికొందరు మధ్యగా మానవులుగాను, ఇంకొందరు పాతాళమున నాగులు మొదలైనవారు గాను నెలకొలుపబడుచున్నారు. వారంతా చెవులు-కళ్ళు-ముక్కు మొదలైన నవద్వారములతో, మాంసం-అస్థులు తదితర సరంజామాతో, వేరు వేరు ప్రాణవాయు సంచనలములతో సుఖ-దుఃఖసహితులై ఉంటున్నారు. పంచేంద్రియదేహులగు వీరందరు సంకల్పముచే నిర్మించబడిన నగరంలో నివసించేవారే సుమా! మనస్సే యక్షుని ప్రదర్శన వలె ఇట్లు అనేక రూపములను ధరిస్తోంది.
ధాన్యం కొట్టులో పిల్లి దాగి ఉన్నట్లు, కొలిమి తిత్తిలో పాముపిల్ల దాగినట్లు, ముత్యపు చిప్పలో ముత్యము ఉంటున్నట్లు ఈ శరీరములలో అహంకారము దాగి ఉంటోంది. దీపం క్షణంలో విజృంభించి క్షణంలో నశించునట్లు ఈ అహంకారం కూడా ఆయా ఉపాధులలో క్షణ కాలం విజృంభిస్తోంది. క్షణంలో ఆ ఉపాధులను త్యజిస్తోంది.
సముద్రములో తరంగాలు ఏర్పడుచున్నట్లు మనస్సులో అనేక సంకల్పాలు ఏర్పడు చున్నాయి. ఈ సంకల్పమయాత్మకమగు మనస్సు నిజసంకల్పిత వస్తువులను గాంచటం, అట్లు గాంచినవి భవిష్యత్తులో పొందటం జరుగుతోంది. అది సంకల్పించనిదేదీ పొందదు. ఆయా బాహ్య వస్తుజాలముతోను, తదితర ఉపాధులతోను సంబంధము వహించి, 'ఇవి నాకు చెందినవి... వీటిని నేను పొందుటచే మాత్రమే సంతోషించగలను... ఇవి నేను ఎప్పటికీ కలిగి ఉండాలి.... వీరు నా వారు... వీరు పరాయి వారు...' అను రీతిగా అది స్వప్నత్వము పొందుచున్నది. 'భవిష్యత్ లో పొందవలసినవి... త్యజించవలసినవి'... అను రూపము గల ఉద్వేగము ఈ మనస్సు ఊహ-అపోహలను పొందుటచేతనే, మనం కథలో 'భవిష్యత్ నూతన నగరమును పొందుచున్నాడు' అని చెప్పుకున్నాం. ఈ మనస్సు ఇట్లు మొదట మాయాచక్రంలో తగుల్కొనుచున్నది. ఇక ఆపై జాగ్రత్ - స్వప్నములు పొందుచున్నది. ఎప్పుడో ఒకప్పుడు మౌన
Page:255
సుఖమును అపేక్షించి, సుషుప్తి యందు ప్రవేశిస్తోంది. అనగా ఈ మనస్సు 'అసంకల్పస్థితి’ వహించి భావరాహిత్యము అవధరిస్తోంది. కాని అది జడమగు స్థితే గాని మనోరాహిత్యస్థితి కాదు కదా! ఎందుకంటే జాగ్రత్-స్వప్నములలోని సంస్కారములు సుషుప్తి దశలో అప్రకటితంగా, అవ్యక్తంగా ఉండనే ఉంటున్నాయి. జాగ్రత్లో వ్యక్తం కావటానికి సంబంధించిన తహతహ అంతర్లీనంగా ఉండే ఉంటోంది.
ఒకదానివెనుక ఒకటిగా అనేక ఉపాధులందు తిరుగాడుచున్న ఈ మనస్సు ఒక సమయంలో సుఖవిశ్రాంతి కొరకు సమాధిని అపేక్షిస్తోంది. అట్లు సమాధిని ఆశ్రయిస్తూ, ఈ జన్మ పరంపరా వ్యవహారమును త్యజిస్తోంది. అప్పుడు మనస్సు యొక్క పరిభ్రమణమునకు ఆట విడుపు కలుగుచున్నది.
5. సంకల్పరాహిత్యం-ఆత్మాశ్రయం
దాశూరుడు: ప్రియకుమారా! బాలుడు క్షణంలో సంకల్పించి భ్రమాత్మకమైన పిశాచాదులను ఎదురుగా చూస్తూ కెవ్వున ఏడుస్తాడు చూచావా? ఈ మనస్సు కూడా స్వకల్పనామాత్రం చేత అనంతంగా దుఃఖములను ఏర్పాటు చేసుకుంటోంది. సంకల్పమయాత్మకమగు 'మనస్సు' అనే రాజు ఈ 'విశాల ప్రపంచం' రూపంగా తన దుఃఖమును విస్తరింప జేసుకుంటున్నాడు. సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలగుతాయి కదా! ఎప్పుడైతే ఈ మనస్సు 'ఖండితమగుసత్త' యొక్క అభావన ఆశ్రయిస్తుందో, అప్పుడు అది క్రమంగా తన 'జగత్తు రూపవిస్తరణ'ను కూడా నశింప జేసుకొంటుంది, లేక ఉపసంహరించుకుంటుంది.
ప్రాపంచిక సుఖ విశేషాలు ఎట్లాంటివి? మనస్సు యొక్క కోతి చేష్ట మాత్రమే!
కోతి చేష్ట - ఈ మనస్సు యొక్క పరితాపములకు అంతు ఎక్కడ? ఇందుకు పెద్దలు ఒక దృష్టాంతం చెపుతూ ఉంటారు. ఒక వడ్రంగి పెద్ద దుంగను అంపముతో మధ్యకు చీలుస్తూ ఉన్నాడు. ఇంతలో భోజనమునకు సమయం అయింది. అందుచేత రెండుగా విభాగించబడుచున్న దూలం మధ్యలో ఒక పుల్లను ఇరికించి భోజనానికి వెళ్ళాడు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చింది. స్వకీయమైన చపలచిత్తంతో, ఆకతాయితనంగా నిరర్థకమైన కుప్పిగంతులు, పరుగులు, లాగడం, పీకడం చేస్తూ, చేస్తూ ఆ దుంగ మధ్య తన కాలుపెట్టి పుల్లను పెరకనారంభించింది. ఇంకేముంది? కొద్ది క్షణాలలో పుల్ల జారిపోయింది. ఆ కోతి యొక్క కాలు దుంగ యొక్క చీలికలో ఇరుకుకొన్నది. ఇక ఆ కోతి బాధచే పెద్దగా కేకలు వేయనారంభించింది.... ఈ మనస్సు యొక్క చర్యలు కూడా అట్టివే. ఇది తన చపలచిత్తముచే స్వకల్పనలయందు చిక్కుకుని మహాపరితాపం పొందుతోంది.
కుక్క, బొమిక (ఇంకొక దృష్టాంతం) - ఒక కుక్కకు ఒక బొమిక ఎక్కడో దొరికింది. ఆకలితో నకనకలాడుచున్న ఆ కుక్కకు ఆ బొమికను చూడగానే రుచికరమైన మాంసము లభించి నట్లు
Page:256
భావన ఏర్పడింది. ఆవురావురమంటూ బొమికను నమలసాగింది. పాపం, ఆ నములుచున్న వేగానికి పంటి నుండి రక్తం కారసాగింది. అప్పుడు ఆ కుక్క ఇట్లా అనుకుంటోంది... "ఈ బొమిక నిస్సారమైనదని మూర్ఖులు అనుకుంటున్నారు. నాకు ఇందులోంచి రక్తం లభిస్తోంది. నేను తెలివి గలదానను కాబట్టి ఇందులోంచి రక్తం పొందుచున్నాను కదా...!” ఇక ఆ రక్తమును చప్పరించ సాగింది. ఈ మనస్సు యొక్క సుఖవేదన కూడా అట్లే ఉంటోంది.
గాడిద, తేనెతుట్టె (ఇంకొక దృష్టాంతం) - ఒక గాడిద నిస్సత్తువగా నడుస్తోంది. ఒక చోట నేలపై పడ్డ తేనెతుట్ట కనబడింది. అందులో తేనె చుక్క కూడా లేదు. అయినా ఆ గాడిద నిస్సార మగు తుట్టెను నములుతూనే ఉన్నది. దానికి మిగులుచున్నది పంటిబాధ మాత్రమే. ఆ తుట్టెను వదిలితే తేనె లభించలేదని దుఃఖం. నములుతూ ఉంటే, కళ్ళవెంట నీరు కారేంత శ్రమ.
అట్లాగే ఈ మనస్సు కూడా విషయభోగములందు తగుల్కొని ఉంటోంది. ఈ మనస్సు యొక్క చేష్టలు గురించి ఏమని చెప్పాలి? క్షణంలో ఆసక్తి. మరుక్షణం విరక్తి. బాలుని చేతలు లాగా క్షణక్షణం ఏవేవో వికారములను పొందుతోంది. విషయాలు లేకపోతే లేనందుకు దుఃఖం విషయాలు ఉంటే, విషయాల వలన దుఃఖం.
దాశూరుని కుమారుడు: తండ్రీ! మీరు చెప్పుచున్నది అక్షరాలా నిజం. 'భోత్తుడు' అను శబ్దార్ధంతో మీరు వర్ణించి చెబుతూన్న ఈ మనస్సు నన్ను క్షోభింపజేస్తోంది. నేనిప్పుడు ఏం చేయాలి? దాశూరుడు: ఈ మనస్సు ఏ ఏ విషయములలో, వస్తువులలో తగుల్కొనుచున్నదో సుతీక్షమైన దృష్టితో పరిశీలించు- ఇది దేనిని 'ప్రియము' అని భావిస్తోంది?... దేనిని ద్వేషిస్తోంది?... వేటి వల్ల కామం, క్రోధం, మాత్సర్యం కలిగి ఉంటోంది?... దేనిని మమకార దృష్టితో చూస్తోంది?... కాస్త గమనించు, క్రోడీకరించి, పర్యవేక్షించు.
ఇప్పుడు, సంకల్పాత్మకమగు ఈ మనస్సును అట్టి బాహ్య విషయముల నుండి వెనుకకు మరల్చు. అనగా, క్రమంగా వాటి గురించి సంకల్పించటం సన్నగిల్లాలి. అందుకు సమాధిని, మౌనమును అవలంబించు. 'ఆత్మజ్ఞానం' అనే తరుణోపాయంచే ఈ మననం చేయు స్వభావమును యుక్తియుక్తంగా నిర్మూలించు. బ్రహ్మము యొక్క స్వభావమును ఆశ్రయించు. నీచే ఆత్మ విశ్రాంతి స్వీకరించబడుగాక!
అందుకుగాను మన ఈ వర్తమాన చర్చవంటి ప్రయత్నములు తప్పక ఉపకరించగలవు. దాశూరుని కుమారుడు: పితృదేవా! మీరు జీవుని యొక్క మూడు శరీరముల గురించి ప్రస్తావనకు తెచ్చారు. ఆ మూడు శరీరముల యొక్క విశేషములేమిటో వివరించండి.
దాశూరుడు: 'సంకల్పించుట' అనునదే తన యొక్క రూపముగా గల ఈ మనస్సుకు మూడు స్వభావములు ఉన్నాయి. ఆ మూడు స్వభావములు ఉత్తమ మధ్యమ-అధమ రూపములు కలిగి యున్నవై, ఈ జగత్ స్థితికి కారణమగుచున్నాయి. ఈ మూడు శరీరములే 'సత్వ-రజ-తమో గుణములు' గా సంజ్ఞాపూర్వకంగా చెప్పబడ్డాయి.
Page:257
మనస్సు యొక్క తమోరూపం - ఈ ప్రకృతికి సంబంధించిన స్వాభావిక క్రియలచే నిత్యం అజాగ్రత్త, సోమరితనం, నిద్ర, బద్ధకం, ఆలస్యం వంటి సంకల్పాలు ఉదయిస్తూ ఉంటున్నాయి. అట్టి సంకల్పముల కారణంగా ఈ జీవుడు ఎంతో దీనత్వం పొందుచున్నాడు. ఫలితంగా ‘క్రిములు, కీటకములు, స్థావరములు' మొదలైన యోనులు ప్రాప్తించటం జరుగుతోంది.
మనస్సు యొక్క రజోరూపం - ఈ స్వభావంచేత రాగము, తృష్ణ, కర్మలతో వస్తువుతో సంగము, లోభము, ఆలోచనల నుండి క్రియల నుండి విరమించలేకపోవటం వంటి సంకల్ప స్థితులు కలుగుతూ ఉంటాయి. రజోగుణ రూపమైన సంకల్పములచే ఈ జీవుడు 'మానవజన్మ' కు యోగ్యమైన వ్యవహారములు ఆచరించటం జరుగుతోంది. అయితే, కార్యసాధకమగు మానవ ఉపాధి పొందిన తరువాత ఉత్తమ కార్యక్రమంతో సమున్నతి కొరకై సమయాన్ని, అవకాశాలను సద్వినియోగపరచుకొనే బదులుగా, ఈ మానవ ఉపాధి ధరించియున్న సమయమంతా ఈ జీవులలో కొందరు ఈ లోకంలో 'పుత్రులు-ధనం- గృహాలు' మొదలైనవి పొందుటకు మాత్రమే యత్నిస్తున్నారు. వాటి యందు సంతోషమును వెతకటం చేస్తున్నారు. ఈ విధంగా అజాగ్రత్తపరులు అథమ స్థితులవైపు ఆకర్షితులగుచున్నారు.
మనస్సు యొక్క సత్వరూపం - ఈ స్వభావం చేత మనస్సు 'జ్ఞానం-శాశ్వతసుఖం -అప్రమేయత్వము' వంటి సంకల్పములను ఆశ్రయిస్తోంది. ఆ జీవుడు సత్వరూప సంకల్పములచే ‘ధర్మము-జ్ఞానము' మొదలైన వాటి యందు ప్రియమును పొందుచున్నాడు. ఆ మనస్సు అట్టి ధర్మ-జ్ఞానములను ఆశ్రయిస్తూ క్రమంగా అచిరకాలంలో 'కేవలీభావము'ను ఆశ్రయిస్తున్నది. శాస్త్రములచే వర్ణించి చెప్పబడుచున్న 'స్వారాజ్యస్థితి'ని పొందుచున్నది. సత్వగుణానుకరణం కారణంగా ఈ దృశ్యమునకు సంబంధించిన సర్వ ప్రతిబంధకములను క్రమంగా త్యజిస్తోంది. 'దృశ్యపారతంత్ర్యము' (దృశ్యానికి వశం అగుట) అనుదాని నుండి స్వాతంత్ర్యం పొందుచున్నది. ‘బ్రహ్మపదము' లేక 'మోక్షము'... అనగా సర్వసంకల్పముల రహితత్వమని గ్రహించు. సర్వాదృష్టీః పరిత్యజ్య నియమ్య మనసా మనః । |
సబాహ్యాభ్యన్తరార్థస్య సంకల్పస్య క్షయం కురు ॥ (సర్గ 53, శ్లో 38) కాబట్టి కుమారా! బాహ్యదృష్టులన్నీ త్యజించు. మనస్సు నందు ఈ బాహ్య అభ్యంతరములలోని సర్వపదార్థముల గురించిన సంకల్పములను రహితం చేయి.
మనస్సు చేతనే మనస్సును నిగ్రహించాలి. సంకల్పరాహిత్యమే బంధవిముక్తి.
ఒకడు వేలకొలది సంవత్సరముల తపస్సు చేయవచ్చు గాక! లేక, ఈ దేహమును నేలపై ఘర్షింపజేస్తూ చూర్ణం చేయవచ్చు..., అగ్నిలోనో, బడబాగ్నిలోనో ప్రవేశించవచ్చు..., భయంకర మైన గుంటలలోనో, కత్తుల సమూహంపైననో దూకి ఈ శరీరమును ఖండఖండములుగా చేసుకొనవచ్చు...! ఏ త్రిమూర్తులనో, లేక కరుణా సముద్రులగు దుర్వాస దత్తాత్రేయ-బుద్ధుడు మొదలైనవారిని 'ఉపదేష్ట'లుగా కలిగియుండవచ్చు...! స్వర్గ-మర్త్య-పాతాళ భూలోకములలోని
Page:258
ఏవైనా ప్రత్యేకతలు గల ప్రదేశాలలో వసించవచ్చు గాక...! కాని ఏం ప్రయోజనం? ఏం లాభం? జరుగునదేమిటి? చివరికి 'సంకల్పానాశనం' ఆశ్రయించి, తద్వారా మాత్రమే సంకల్పములను జయించగలడు గానీ, వేరే త్రోవ లేదు. సంకల్పరాహిత్యం చేతనే మోక్షం లభించగలదని మాత్రం గ్రహించు. 'పరిశుద్ధ స్థితి’ అయినట్టి మోక్షము లేక 'బంధవిముక్తి'కి సంకల్పరాహిత్యమే ఆత్యంతిక మైన ఉపాయం.
తదితరములైన అనేక చోట్లకు పోవుచున్న మనస్సును వెనుకకు మరల్చి ఆత్మభగవానుని కరచరణముల వద్దకు చేర్చాలి. ఆ తరువాత ఆత్మవస్తువుకు వేరైన సంకల్పపరంపరలు త్యజించాలి. సర్వము ఆత్మస్వరూపంగా సందర్శించాలి.
“ఇక్కడ ఆత్మకు వేరైనదేదీ లేనేలేదు” అను అఖండానుభవము దృఢీకరణమగుగాక!
అందుచేత చిరంజీవీ! నీకు నీవే సంకల్పనాశనమునకై ప్రయత్నించు. నీ సంకల్పములు నీస్వస్వరూప-స్వస్వభావమునందు విలయించుచుండగా, అప్పటి సంకల్పించు సంస్కారమునకు ఆవల ఉన్నట్టి నీయొక్క అనిర్వచనీయస్థితి-బాధారహితమైనదీ, పరమపవిత్రమైనదీ, సుఖమయ మైనదీ అని నీవే గ్రహించగలవు. అయితే అట్టి సంకల్పానాశనము అప్రయత్నశీలునికి ఎలా లభిస్తుంది చెప్పు? అందుచేత సంకల్పముల అతీతత్వము కొరకై అందుకు 'శ్రవణ మనన -నిధిధ్యాస' రూపములతో కూడిన ఉత్తమ ప్రయత్నములను నీవు ఆశ్రయించాల్సిందే.
ఓ పాపరహితుడా! కుమారా! నీచే అనుక్షణికంగా 'సంకల్పములు' అను సూత్రపు దారానికి ఈ సమస్త పదార్థములు గ్రుచ్చబడి ఉన్నాయి. అట్టి సంకల్పదారం త్రెంచబడిందా... క్షణ భంగురమగు ఈ ప్రాపంచిక పదార్థములన్నీ నీ నీ సమక్షమునుండి మటుమాయం అవుతాయి. సత్-అసత్ మయమైనట్టి వికల్పములన్నీ నీయొక్క సంకల్పమునుండే ఉత్పన్నమౌతున్నాయి గాని, మరింకెక్కడినుండీ కాదు. అన్నిటికీ కారణం 'నీవు సంకల్పించుట'యే! సర్వమునకు కారణమైయున్న సంకల్పము ద్వారా 'ఇది సత్తా? అసత్తా?' అనే చర్చలు ఆశ్రయించినంత మాత్రం చేత ఉత్తమ ప్రయోజనం లభించుటలేదని విజ్ఞుల యొక్క అనుభవం. వికల్పములగు ఈ పదార్థములు... సత్యవస్తువు... సర్వసంకల్పములకు అతీతము, పరిశుద్ధము... పరమార్థము... అయిఉన్న బ్రహ్మమును స్పృశించగలవా? లేదు.
అందుచేత, “నీ సర్వ సంకల్పములు లయించగా అప్పుడు “నీ సమక్షంలో శేషించునదే బ్రహ్మము' అని గ్రహించు. నీవు ఇక బ్రహ్మవేత్త మాత్రుడవు కాదు. బ్రహ్మమే అవుతావు. కార్య రూపమున ఉన్న ఈ దృశ్యవ్యవహారమంతా కూడా కారణరూపమగు 'స్వసంగము, (one's own attachment) లేక 'స్వసంకల్పములు'. (one's own perceptions...) అను వాటియందే ప్రవర్తించు చున్నది సుమా! స్వసంకల్పరాహిత్యము చేతనే ఈ 'జగత్తు లేకుండా పోవుట' జరుగగలదు. సంకల్పరహిత శుద్ధ స్వస్వరూపమే పరబ్రహ్మము.
Page:259
పుత్రా! నీకు మరల గుర్తు చేస్తున్నాను. నీ మనస్సు దేనిని ఏ విధంగా స్థితిపూర్వకంగా (As a form of) చింతిస్తుందో అది అట్లే పరిణమించటం, ప్రాప్తించటం జరుగుతోంది. అందుచేత నీవు సర్వవేళల సంకల్పములకు ఆవల ప్రశాంతుడవై ఉండుటను అభ్యాసం చేయి. “నేను సంకల్పించుట - అను ప్రక్రియ కంటే ముందే శుద్ధుడనై ఉన్నాను... కనుక వాస్తవానికి సంకల్పరహితుడనే” అను ఎఱుకను గ్రహించి ఉండు. అటుపై ప్రాప్తించిన వ్యవహారములను ఆచరిస్తూ ఉండు. సంకల్పాలు త్యజించుచుండుటచే క్రమంగా అభ్యాసవశంచేత చిదాత్మ ఈ విషయముల నుండి (శబ్ద-స్పర్శ - రూప-రస-గంధాదుల నుండి) స్వయముగా వెనుకకు మరల గలదు.
ఆహాఁ! చమత్కారం గమనించావా! కేవలం సత్యస్వరూపము, బ్రహ్మమయము అగు ఆత్మ అసత్యమగు 'మాయ'కు వశమై ఈ దేవ మనుష్య జంతు ఆదిగా గల భిన్న యోనులలో జన్మి స్తోంది. వ్యర్థంగా ఈ జగత్తు రూపంలో గల దుఃఖములన్నీ అనుభవిస్తోంది. ఇదంతా శుద్ధమగు ఆత్మకు యోగ్యమైనదేనా? ... కానే కాదు. అనేక యోనులలో, ఉపాధులలో ప్రవేశిస్తూ మృతి చెందుతూ... ఈ విధంగా దుఃఖములన్నీ అనుభవిస్తూ ఉండటం వలన ఏం ప్రయోజనం చెప్పు? అందుచేతనే బుద్ధిమంతులగు వారు అన్నిటిని ప్రక్కకు పెట్టి దుఃఖరహితమగు ఆత్మనే ఆశ్రయిస్తున్నారు. ఇక బుద్ధిహీనుల వ్యవహార మంటావా... అది మనకు అనుసరణీయం కాదు కాబట్టి అప్రస్తుతమే అవుతుంది. దాని వలన కలిగే ఉత్తమ ప్రయోజనం ఏమున్నది? బుద్ధి హీనత్వం అనేక దుఃఖములకే దారితీస్తోందని గుర్తు చేస్తున్నాను. అందుచేత నీవు తత్త్వజ్ఞానం కొరకే ప్రయత్నించు. ఈ వికల్పజాలమంతా బలత్కారంగా దూరీకరింపజేయి.
నిరతిశయానంద ప్రాప్తి కొరకు అద్వితీయమగు మోక్షపదము కొరకు యత్నించు. అట్లా కాకుండా, స్వల్ప లక్ష్యాలతో దృశ్యవ్యవహారం నందు బద్ధుడవు అయితివా... నిబిడాంధకార రూపములగు అనేక దుఃఖపరంపరలు నీ కొరకు వేచి ఉంటాయి. ఇప్పుడు నీ ఎదురుగా రెండు మార్గములు ఉన్నాయి- 1) సంకల్పించుట అను స్వభావము ఆశ్రయించి ఉండుట 2) సంకల్ప రాహిత్యమును అభ్యసించుట. ఈ రెండింటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకో. సమన్వయం చేయి. ఆపై నీ ప్రయత్నములను తదనుకూలంగా తీర్చిదిద్దుకో.
6. సంకల్ప విచికిత్స
దాశూర పుత్రుడు: తండ్రీ! ఈ సంకల్పము అనేది ఏ విధంగా ఉంటోంది? అసలు అది ఎట్లా ఉత్పన్నమౌతోంది? ఎట్లా వృద్ధి చెందుతోంది? ఎట్లా నశిస్తోంది? ఎలా, ఎక్కడి నుండి, ఎప్పటి నుండి, ఎవరి ప్రోద్బలంచేత ఎవరి కొరకు బయల్వెడలుతోంది?
దాశూరుడు: అనంతము - సత్తాసామాన్యము - ఆత్మస్వరూపము అగు చైతన్యము నిర్వచించబడ లేనట్టి కారణంగా ఒకానొకప్పుడు విషయములవైపు ఉన్ముఖమగుచున్నది. అట్లు విషయములవైపు
Page:260
ఉన్ముఖం అగుటయే సంకల్పము యొక్క అంకురము. ఆ అంకురం అల్పమాత్రమే అయినప్పటికీఅ , అది సత్తను పొందినదై చిదాకాశము యొక్క నలువైపుల వ్యాపించుచున్నది. ఆ సంకల్పాంకురము తన అధిష్ఠానమగు 'చిత్ స్వరూపము’ నే మరుగుపరచుచున్నది. అటుపై జడమగు ప్రపంచాకారం పొందుటకు గాను క్రమంగా ఘనత్వం పొందుతోంది. అట్లు ప్రాప్తిస్తున్న విషయ రూప జగత్తును 'ఇదంతా నాకంటే వేరుగా బాహ్యమున ఏర్పడి ఉన్నది.. అను భావన చేస్తోంది. ఒక బీజము ‘మొలుచుట' అను క్రమమును పొందుచున్నది చూచావా? అట్లాగే, ఆ చిత్ శక్తి సంకల్పత్వము పొందుతోంది. అటుపై ఒక సంకల్పము నుండి మరొక సంకల్పము ఉదయిస్తోంది. ఇక ఆపై ఈ సుదీర్ఘమైన సంకల్ప వ్యవహారమంతా విస్తరిస్తోంది. సంకల్పముల వెంట నిష్కారణంగా దుఃఖ పరంపరలు వచ్చి పడుచున్నాయి. అయితే సముద్రములో ఎన్ని తరంగాలు ఉదయిస్తే ఏమున్నది? అవన్నీ జలమే అయి ఉన్నాయి కదా! ఈ జగత్తంతా సంకల్పమాత్రమే. సంకల్పము తప్ప వేరుగా ఈ ప్రపంచంలో దుఃఖ-సుఖములంటూ ఎవరికీ ఏవీ లేవు.
ఈ మనస్సు కాకతాళీయన్యాయం చేత వివర్తభావము ఆశ్రయిస్తోంది. ఇది మిథ్యా రూపముననే ఉత్పన్నమౌతోంది. మృగతృష్ణవలె, రెండవ చంద్రుని భ్రాంతివలె ఇది అసత్యమైనదే! కాని దీని వృద్ధిని మాత్రం మనం చూస్తున్నాం. ప్రకృతి శాస్త్రంలో 'మాతులుంగము' అను పేరుగల చెట్టు గురించి చెబుతారు. ఆ చెట్టు పళ్ళు తిన్నవారికి అంతఃకరణంలో తెల్లటి పదార్థముల పట్ల భ్రాంతిపూర్వకమైన ప్రీతి ఏర్పడుతుంది. ఫలితంగా తెల్లటి పదార్థములు అత్యంత రుచికరమైనవిగా అనుభవమౌతుంది. ఆ ప్రీతి అసత్యమే అయినప్పటికీ తెల్లటి పదార్థములు తింటున్నప్పుడు అతనికి ప్రశస్తమైన రుచి మాత్రం అనుభవమౌతుంది. అదే విధంగా, మత్తు పదార్థములు సేవించువారికి చుట్టూ ఉన్న వస్తువులన్నీ గాలిలో తేలియాడుచున్నట్లు అనుభవమౌతాయి. ఈ వస్తువులు ఎగిరి పడటం అవాస్తమే అయినప్పటికీ అతనికి సత్యముగానే అగుచున్నది. ఈ జీవునియందు ‘సంకల్పించుట' అను ప్రవృత్తి ఉద్భవించి, ఈ పదార్థములతోటి... వ్యక్తులతోటి సంబంధము వాస్తవమైన అనుభవముగా అతనికి ప్రాప్తించుచున్నది. కానీ అవన్నీ ఈ జీవుని యొక్క ఇష్ట-అయిష్టములను ఆశ్రయించే ఉంటున్నాయి.
దాశూరుని కుమారుడు: పితృదేవా! ఈ జన్మ-కర్మలకు, ఈ సంబంధాదుల భ్రమలకు కారణం అంతరమైనదా? బాహ్యమైనదా? నేను తదితరులు ఎట్లా ఉత్పన్నమగుచున్నాము?
దాశూరుడు: నీవు మిథ్యారూపముననే ఉత్పన్నమైనావు. అట్లే నేను కూడా. 'ఈ శరీరము - దృశ్యము తదితర సంబంధ బాంధవ్యములు’... దృష్ట్యా చూచినప్పుడు మనమందరం మిథ్యారూపులమే. ఇక నిత్య-సత్య-శుద్ధమగు మన స్వస్వరూపము దృష్ట్యా మనం సర్వదా సత్స్వరూపులమే. మన యొక్క 'సత్' స్వరూపమున ఏ క్షణమందు ఎట్టి మిథ్యాత్వము లేనేలేదు. నేను బోధిస్తున్న ఈ మన ఆధ్యాత్మ శాస్త్రాన్ని తెలుసుకున్నావా - ఇక మిథ్యాత్వము నీ దృష్టి నుండి పూర్తిగా తొలగిపోగలదు.
ఈ దుఃఖజాలమంతా నీకు ఎందుకు ప్రాప్తిస్తోంది...? చెప్పమంటావా! 'వేద వేదాంతాలచే సుస్పష్టపరచబడుచున్నట్టి పూర్ణాత్మ అనగా... నేనే! అట్టి ఆత్మకు గాని, ఆత్మయే స్వరూపముగా గల
Page:261
నాకు గాని, 'నేను' 'నాది' అనునదంతా ఉండజాలదు. తదితర పదార్థములగు వస్తువులు -
సుఖము-దుఃఖము-జన్మలు-మొదలైనవన్నీ మిథ్యారూపమే అయి ఉన్నాయి...’ అనునట్టి ఎరుకకు సంబంధించిన విశ్వాసం ఏర్పడకపోవుట చేతనే.
ఇదే ‘ఆత్మ విశ్వాసం’ సుమా! అట్టి ఆత్మ విశ్వాసము దృఢపడిన తరువాత ఇక అజ్ఞానమునకు కారణం ఏం ఉంటుంది? 'నేను ఆత్మను... శరీరమును కాను'... అను విశ్వాసం లేకపోవటచేతనే ఈతడు అజ్ఞానమునకు చోటిచ్చుచున్నాడు. క్షణంలో స్వల్పవిషయాలు కూడా అతనిని విచలితుణ్ణి చేస్తున్నాయి. ఎక్కడ విచారణ చేసిన తరువాత ఇక దుఃఖము ఉండదో, అక్కడ విచారణ చేయటం మానివేసి ఈ జీవుడు దుఃఖితుడై చతికిలపడుచున్నాడు.
కుమారా! వాస్తవానికి ఈ జన్మాదులతో గాని, ఈ దృశ్యములోని ఆయా పదార్థములతో గాని నీకు ఏ సమయమందు కూడా సంబంధం లేదు. అయినప్పటికీ భ్రాంతిచే నీకు నీవే అట్టి సంబంధమును కల్పించుకొనుచున్నావు. కాస్త యథార్థ దృష్టితో చూచి, ఈ ఆత్మకు జన్మలు ఎక్కడ ఉన్నాయో చెప్పు? శరీరము కంటే ముందు కూడా నీవు ఉన్నావు. అనగా, ఈ శరీరముతో నీవు పుట్టుట లేదు - ఇతఃపూర్వమే ఉన్నావు. శరీరము నేలకూలిన తరువాత కూడా నీవు ఉంటున్నావు. అనగా శరీరపతనంతో బాటు నీవు రహితం అగుటలేదు. ఈ శరీరము ఉన్నప్పుడో, నీ ఉనికి గురించి వేరే చెప్పేదేమున్నది? మనో-బుద్ధి-అహంకారములతో కూడిన సూక్ష్మశరీరముతో ఈ శరీరమును ఉపయోగించుకుంటూ సంచారము సలుపుచూ ఉండనే ఉన్నావు కదా! సూక్ష్మశరీరం యొక్క చావు పుట్టుకలను ఎవరైనా గాంచుచున్నారా? లేదే. లేనప్పుడు 'నేను చచ్చాను... ఆతడు చచ్చాడు’... అనునదంతా భ్రమ కాక మరేమిటి?
వాస్తవానికి నీవు ఒక్కడివే సత్యము. సూక్ష్మశరీరము కూడా అసత్యము మాత్రమే. జలమే సర్వదా సత్యము. జలము కంటే వేరైనది జలము కానిది - అగు 'తరంగములు' అనబడేది. ఎక్కడైనా లభిస్తుందా? అందుచేత, 'నేను జ్ఞానం పొందియున్న - - పొందియుండని సమయాలలో కూడా శుద్ధ చైతన్యస్వరూపుడనే అయి ఉంటున్నాను'... అని గ్రహించు. దోషపూరితమైన సంకల్పములకు వశీభూతుడవగుటచేతనే ఇట్లు మూఢుడివి, సంసారివి అగుచున్నావు.
పుత్రా! ఇప్పుడు చెప్పేది విను. ఇతఃపూర్వం అనుభూతములైన సుఖ-దుఃఖాది పదార్థముల గురించి 'సంస్మరించుట-సంకల్పించుట-సమాశ్రయించుట'లను క్రమంగా సన్నగిల్లచేయి. ఎట్లా? కేవలం అఖండము, నిర్మలము, నిత్యము అగు ఆత్మను భావన చేయుట చేతనే. అట్టి భావనామాత్రంచేత ‘ఆత్మసిద్ధి' అనే ఐశ్వర్యం పొంది ఈ జీవుడు భవ్యజీవుడు కాగలడు. “నేను జన్మ మృత్యు రహితుడను... శుద్ధుడను... శాశ్వతమగు అమృతస్వరూపుడను”... అని భావన చేయుటలో ఏమి కష్టమున్నదో నాకు చెప్పు? మరి జనులు 'మోక్షము దుర్లభము' అని ఎందుకు అంటున్నారో నేను గ్రహించలేకపోవుచున్నాను. 'మోక్షమనేది చాలా కష్టమైన విషయం' అని బాలురు మాత్రమే అంటున్నారు.
Page:262
‘ఎందుకని అట్లు అనిపిస్తోంది?'... అనేది మేము పరిశీలించాం. కారణం...? 'వారి స్వస్వరూపమునందు వారికి తగినంత విశ్వాసం ఏర్పడకపోవుట చేతనే'... అని అనక తప్పదు.
స్వస్వరూపము పట్ల అట్టి విశ్వాసము కలిగించి, తదితర పదార్థముల పట్ల, విషయముల పట్ల అనాసక్తి-దుఃఖరాహిత్యం కలుగజేయటానికే ఈ వేద వేదాంత క్రియా-జ్ఞాన వ్యవహారాలన్నీ ఉన్నాయి. "దృశ్యఅనాసక్తి-ఆత్మవస్తువును ఎఱుగుటలో ఆసక్తి" కలిగించునంతవరకే ఈ విధి నియమాదుల పాత్ర. ఎప్పుడైతే స్వస్వరూపమగు ఆత్మయందు పూర్ణవిశ్వాసము సుస్థిరమౌతుందో, అట్టి అప్పటి ఉత్తమస్థితి 'మోక్షస్థితి’ కంటే వేరైనదేదీ కాదు సుమా!
అభావించటం - ఎప్పుడైతే నీవు సంకల్పనాశనము కొరకు యత్నిస్తావో, ఇకప్పుడు ఈ జనన-మరణాది భయమును పొందవు. 'భావన' చేయకున్నంత మాత్రంచేత సంకల్ప ప్రవాహం క్రమంగా క్షీణించగలదు.
ఒక పువ్వు యొక్క దళములు మర్ధించాలంటే కొంత శ్రముంటుందేమో, చేతులు మర్దించాలి. ‘భావించక పోవుట' యందు క్రియకు సంబంధించిన శ్రమయే ఉండదు కదా! ఇక ఇందులో కష్టమేమి ఉంటుంది? కల్పనావినాశనము... అను మోక్షస్థితి కష్టమైనదనుట భావ్యం కాదు. చేతుల మర్దన అనే శ్రమ కూడా ఉండనట్టిది మోక్షభావన.
కేవలం భావనా విస్మరణ మాత్రం చేత అరక్షణంలో సంకల్పవినాశనం సిద్ధిస్తుంది. అయితే, ఎటొచ్చీ అట్టి 'సంకల్పరాహిత్యస్థితి' లో సుస్థిరుడవై ఉంటే చాలు. భావాతీతమైనదే తత్పదం.
నిరంతరం ఆత్మ యొక్క పూర్ణానందరూపమును చింతనచేస్తూ ఉండు. ఆత్మయందే స్థితి కలిగియుండు. అప్పుడు అసాధ్యమగు వస్తువు కూడా సిద్ధించగలదు. ఇందులో సందేహం లేదు. ఆత్మ దేనిచేతను హరింపబడుటగాని, నశింపజేయబడుట గాని, సంభవింపజాలదు. అందుచేత ఉత్తమ సంకల్పంచే అధమ సంకల్పాన్ని త్యజించివేయి. “ఈ కనబడే ఈతడు మమాత్మ స్వరూపుడే కదా!” అను భావనతో వ్యవహరిస్తూ ఉండు. 'నేను పూర్ణమగు ఆత్మనే' అనేదే ఆ ఉత్తమ సంకల్పం.
మనస్సుతో మనస్సును విచ్ఛిన్నం చేయి. స్వాత్మయందు సుస్థిరుడవై ఉండు. 'నిస్సంకల్ప మాత్రము, సులభసాధ్యము'... అయినట్టి ఈ మాత్రం ప్రశాంతబుద్ధిచే గ్రహించటంలో, ఆచరించటంలో ఏమి కష్టమున్నదో చెప్పు?
❖
'అట్లా ఎట్లా? మోక్షము అంత సులభమా? అంత తేలికగా నాకు లభించుటయా? లేదు... అది మాకు ఎన్ని జన్మలకో గాని లభించదు...' అని నీవు సంకల్పించటం జరిగితే, ఇక ఆ తరువాత ఆ తదనంతర ప్రాప్తి కూడా అట్లే అయి ఉంటున్నది.
'నేను ఇప్పటికే పూర్ణుడను, మోక్షస్వరూపుడను, ఈ మనో-బుద్ధి-చిత్త-అహంకారాదులకు సంబంధించనట్టి శుద్ధస్వరూపడను'... అని భావన చేశావనుకో.. నీ అనుభవం తదనుకూలంగానే ఉంటోంది. భావన యొక్క అనుసంధాన తీవ్రతను అనుసరించి అది అట్లే సత్యమై నీవు ఈ క్షణమందే మోక్షస్వరూపుడవు, పూర్ణుడవు కాగలవు.
Page:263
సంకల్పము మొత్తముగా శమించిందా... ఈ జగత్తంతా శమించగలదు. ఓ మహామతీ! సంకల్పము యొక్క అభావమాత్రం చేత సంసారదుఃఖమంతా సమూలంగా తొలగిపోతుంది. సంకల్పో హి మనోజీవచ్చిత్తం బుద్ధిః నవాసనా |
నామ్నైవాన్యత్వమేతేషాం నార్థేనార్థవిదాంవర ॥ (సర్గ 54, శ్లో 20)
సంకల్పమే మనస్సు. అదియే "జీవుడు, చిత్తము, వాసనాసహితమగు బుద్ధి" కూడా. ఈ మనస్సు-బుద్ధి-అహంకారము చిత్తము మొదలైన వాటియందలి భేదమంతా నామమాత్రమే గాని వాస్తవం కాదు. సంకల్పమునకు అన్యముగా ప్రపంచమున ఏదీ కించిత్ కూడా లేదు.
అట్టి సంకల్పము అనబడుదానిని నీ హృదయంలోనే, “నీ చేతిలో ఓడిపోయిన నీ సామంత రాజు” వలె స్వవశం చేసుకోవాలి. అట్లు చేయకుండా ఊరకే ఎందుకు పరితపిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు.
7. ఆరోపితం
దాశూరుడు: ఈ జగత్తు “ఆకాశము” వలె శూన్యమైనది మాత్రమే.
దాశూరపుత్రుడు: ఈ జగత్తు శూన్యమైనప్పుడు ద్రష్ట కూడా శూన్యుడే అవుతాడా? "జగత్తు లేదు” అనుకుంటే, జగద్వ్యవహారములే కుదరవు కదా? అప్పుడు అట్టి అవగాహనగల జీవులతో నిండిన జగత్తు జడమే అయిపోతుందేమో?
దాశూరుడు: విశాలమైన ఎడారిలో ఒకడు 'మృగతృష్ణ'ను చూచాడనుకో... విశ్లేషణచే “మృగ తృష్ణలో జలము ఉండదు" అని గ్రహించబడినప్పుడు ఆ ఎడారి పొందే నష్టమేమిటో చెప్పు? ఈ జగత్తు, జీవుడు మొదలైనవన్నీ నీ పట్ల తొలగిపోయినప్పటికీ “దృక్” రూపుడవగు నీకు, (లేక ఆత్మకు) ఏ మాత్రం లోటు ఉండదు. అది ఏ మాత్రం శూన్యత్వం పొందదు. యథారీతిగా పూర్ణమయ్యే ఉంటుంది.
మృగతృష్ణతో సమానమైన ఈ జగత్తు 'అసత్' స్వరూపములగు వికల్పముల చేతనే ఆవిర్భూతమగుచున్నది. ఈ “జగత్తు” అనునది ఆరోపిత వ్యవహారం మాత్రమే. ఆరోపించబడింది తొలగిస్తే పోయేదేమున్నది?
మిథ్యాభూతమగు సంకల్పమే స్వయంగా మిథ్యాభూతమగు ఈ మొత్తం జగత్ వ్యవహారాన్ని ప్రకటితమొనర్చుచున్నది. అట్టి సంకల్ప వ్యవహారం నిరోధించబడగా, నీవు సంకల్ప రహితుడవ గుచున్నావు. నీ దృష్టిలో 'లేనివే' అని తెలియవచ్చిన పదార్థములచే నీవు బాధింప బడవు. జగత్తు పట్ల “ఇది సత్యమైనదే” అనే బుద్ధి తొలగుచుండగా, ఇక నీయందు వాసనలు సంభవించవు.
భావనాక్షయమే వాసనాక్షయం కూడా. సర్వభావనలూ తొలగినప్పటికీ, ఇక తొలగింప జాలనిదేదో... అదే నీవు. వాసనాక్షయమే మోక్షస్థితి యొక్క సంప్రాప్తము.
Page:264
కాబట్టి నాయనా! దృఢమైన అభ్యాసముచే 'ఈ దృశ్యము లేదు... ఈ జగత్తంతా అసత్యము’ అని గ్రహించు! ఎప్పుడైతే నీవు 'దృశ్యరాహిత్యం' అవధరిస్తావో, ఈ దేహాదులందు ఆత్మ భావము లేకుండా ఉంటావో - - అప్పుడు నీవు ఈ సుఖ-దుఃఖములలో తగుల్కొనే ప్రసక్తే ఉండదు. ‘ఈ దేహం, ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ వస్తుసముదాయము మిథ్యారూపములే కదా...” అని నిశ్చయించుటచే వానియందు నీకు ఆసక్తి-అభినివేశములు జనించవు. ఆసక్తి నశించిందా, ఇక 'హర్షం-దుఃఖం', 'జననం-మరణం' మొదలైనవన్నీ నీపట్ల అసంభవములే అవుతాయి. కాబట్టి సుఖ దుఃఖాది విభ్రమమలు నీకెప్పుడైనా ప్రాప్తిస్తుంటే 'ఇదంతా అసత్తుయే” అను నిశ్చయమును కలిగియే ఉండు. ఆపై ఎట్లు ఉచితమో అట్లే వ్యవహరించు.
విషయ విస్మరణం - ఈ మనస్సే చిద్వస్తువు యొక్క ప్రతిబింబమువంటి 'జీవుడు' అను రూపమును ధరిస్తోంది. ఈ జగత్తు రూపమైనట్టి భూత భవిష్యత్తు-వర్తమాన జగత్తునంతటినీ మనస్సే నిర్మించుకుంటూపోతోంది. అదే సర్వమును ఉద్భవింపజేస్తోంది. పరివర్తింపజేస్తోంది. నశింపజేస్తోంది. అది ఒక సమయంలో విషయములతో సంబంధమును పొందినదై వాసనలచే ఆచ్ఛాదితమగుచున్నది.
అయితే ఒక ప్రశ్న. ఇంతటి వ్యవహారమును నిర్వర్తిస్ను ఈ మనస్సు స్వయంశక్తి కలిగి యున్నదా? లేదు. అది వాస్తవానికి జడమైనది. అది అధిష్ఠానమగు 'శుద్ధ చైతన్యం' యొక్క సంబంధం చేతనే స్ఫురణ శక్తియుతమై యున్నది. అట్టి శుద్ధ చైతన్యమే నీ వాస్తవ స్వరూపం గాని, ఈ శరీర మనస్సులు నీవు కావు. అయితే మలినము-చంచలము అగు 'ఇచ్ఛ'చే ప్రేరేపించబడుట చేతనే మనస్సు ఈ 'జగత్తు రచన' అను వ్యవస్థను నిర్వర్తించుచున్నది. 'హృదయం' అనే వనంలో 'కోతి’ వంటి ఈ జీవుని మనస్సు స్వ-ఇచ్ఛానుసారంగా, స్వయంకల్పిత కార్యక్రమానుసారంగా ఈ జగత్తులో లీలలు నిర్వరిస్తోంది.
ఈ జీవుడు (లేక మనస్సు) ఒకప్పుడు విశాలాకారయుతుడగుచున్నాడు. మరొకప్పుడు అత్యంత సంకుచితరూపం పొందుచున్నాడు.
ఒకప్పుడు జాగ్రత్-స్వప్న సంసక్తతచే “నేను పరాధీనుడను” అను భావం పొందుచున్నాడు. మరొకప్పుడు “నేను సర్వమునకు అసంబంధితుడను” అను రీతిగా భావనను ఆశ్రయిస్తున్నాడు. సంబంధమే లేని చోట, యిక బంధమంటూ ఎక్కడిది?
ఈ ‘సంకల్పములు’ అను తరంగాలు ఎప్పటి నుండి పుడుచున్నాయో దేశకాలముల దృష్ట్యా గ్రహింప శక్యము కాకయే ఉన్నాయి. అయితే, “సంకల్పములు విషయముల పట్ల ఏర్పడు 'ధ్యాస' చేతనే ఉద్భోధితమై, వృద్ధి చెందుచున్నాయి”... అని మాత్రం తప్పక చెప్పవచ్చు. దేశ కాలములు సలకల్పార్గతములే! 'విషయవిస్మరణం' అను ఒక వజ్రాయుధంచేత మాత్రమే ఈ సంకల్ప వ్యవహారమంతా సమూలంగా నశించగలదు.
Page:265
8. ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది - లేనిది ఏనాడు లేదు.
-
ఈ జీవునియందలి సంకల్పించు స్వభావం అల్పవిషయం చేత కూడా ప్రజ్వరిల్లుతోంది. క్షణభంగురములు, జడత్వమును ఆశ్రయించి ఉన్నట్టివి, అప్రకటితరూపములు అయినట్టి సంకల్పములే ఈ జగత్తులో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి.
ఓ ప్రియకుమారా! ఈ ప్రపంచంలో ఏదైతే అసత్యమైయున్నదో, అదంతా శీఘ్రంగా నివారించబడుటయే ఉచితం కదా!
అసత్ వస్తువు సత్ అవుతుందా? ఎన్నటికీ కాదు. ఇందులో సందేహం లేదు.
'సత్' అను వివేచనను 'సంకల్పాలు' అను వాటికి అన్వయించి చూద్దాం. ఒకవేళ 'సంకల్పం' అనునది సత్స్వరూపమే అయి ఉంటే ఇక దానిని నిగ్రహించటం ఎవరి తరం చెప్పు? అది స్వతహాగా అట్లే ఉండగలదు. అది “సత్స్వరూపము” కాదు కాబట్టే, కొందరు మహనీయులు దివ్య మగు ఆత్మజ్ఞానంచే సంకల్పరహితులై, స్వసత్తచే స్వయంప్రకాశంగా వెలుగొందుచున్నారు.
‘సంకల్పము’ అనునది అసత్తే కనుక దానిని దమింపజేయడం తప్పక సుసాధ్యమే. ఈ ‘ప్రపంచము' రూపములో నీకు సంప్రాప్తించుచున్న మాలిన్యము సత్యమే అయితే ఇక దానిని తొలగించుట ఎట్లు? బొగ్గుకు ఉన్న నలుపును ఎంత శుభ్రపరచినా తొలగించగలమా? దాని నలుపును తొలగించుటకు యత్నించువాడు మూర్ఖుడే అవుతాడు కదా!
ఈ జగత్తు, ఇందు జీవునకు స్ఫురించుచున్న సంకల్ప వ్యవహారంతో సహా సత్యం కానే కాదు.
9. ప్రయత్నించినవాడే గ్రహిస్తున్నాడు.
ప్రియపుత్రకా! ఈ ప్రపంచము యొక్క స్థితి అనిర్వచనీయము. ఇది అనాదికాలంగా సిద్ధించి ఉంటోంది. 'జ్ఞానము' అనే పరమార్థం చేత ఇది తప్పక సంపూర్ణముగా తొలగగలదు. జ్ఞాని మాత్రమే అతి విస్తారమగు ఈ సంసారమాలిన్యమును విచ్ఛిన్నం చేయగలుగుతున్నాడు. ధాన్యము యొక్క పొట్టు ఎట్లా పోతుంది? దంచుట చేతనే కదా! రాగిపై చిలుము తొలగుతుందా? ‘తోముట' అను క్రియచే తప్పక తొలగుతుంది కదా! ఈ సంసారమాలిన్యము కూడా 'జ్ఞాన భూమికల అభ్యాసం' అనే ప్రయత్నముచే తప్పక తొలగుతుంది. పురుష ప్రయత్నము తప్పక ఫలదాయకమవుతుంది. ఇందులో సందేహం లేదు. అందుచేత అభ్యాసక్రమముచే నీవు ‘శుద్ధము-అఖండము-నిష్కళంకము-నిత్యము' అగు నీయొక్క స్వస్వరూపాత్మను గాంచగలవు. అట్లు గాంచుట జరుగుచుండగా సర్వవ్యధలు, వేదనలు, భేదభావనలు వాటంతట అవే తొలగుతాయి. ఓ బిడ్డా! నీవు సరి అయిన ఉపాయములను ఆశ్రయించకపోవుట చేతనే మిథ్యా వికల్పయుక్తమగు ఈ సంసారమంతా ఇంతవరకు జయించబడక పోవటం జరుగుతోంది. అట్లే
Page:266
తదితరులగు సర్వజీవుల విషయం కూడా, 'అసంకల్పము' అను యత్నముచే ఇది శీఘ్రముగా విలయమొందుచున్నది. ఈ విషయంలో ఎవ్వరికీ సందేహాలు అక్కర్లేదు.
అసద్వస్తువు ఎక్కడైనా చిరకాలం స్థిరంగా ఉంటోందా?... లేదు. చీకట్లో ఉన్నవాడు దీపం వెలిగించుకుంటే ఇక ఆ చీకటి ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడికి పోతోందని చెప్పాలి? దృఢమైన దృష్టితో చూస్తే ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఇక కనిపిస్తారా? ఈ సంసారము కూడా తత్త్వ విచారముచే మిథ్యాత్వము పొందుతోంది. ఓ ప్రియకుమారా! సర్వదా ఒక్క విషయం గుర్తుంచుకో. నీవు ఈ సంసారమునకు చెందినవాడవు కావు. అట్లాగే ఈ సంసారము కూడా నీకు చెందినది కాదు. కనుక నిశ్చింతగా ఈ సంసార భ్రాంతిని విడిచిపెట్టు. "ఈ సంసారము మిథ్యయే” అని తెలిసిన తరువాత కూడా ఇక నీకీ చింతనలు ఎందుకు చెప్పు? కనుక సర్వ విషాదపూరిత చింతలు క్రమక్రమంగానో, ఒక్కసారిగానో త్యజించివేయి.
“నేనొక జీవుడను. అనేక విభవములతో కూడిన ఈ భోగవిలాసాలు యుక్తమే. ఇందులో కొన్ని వస్తువులు, వ్యవహారములు పొందుటచే నేను ఆనందించగలను. కొన్నిటిని నేను వదల్చుకో వలసియున్నది.” - ఇవన్నీ సాంసారిక వీచికలేనని గ్రహించు.
నీ రూపమున, మరియు ఈ దృశ్యము రూపమున ప్రకటితమగుచున్నదేది? సర్వ విధములా ప్రకాశించుచున్నది ఆత్మయే కదా! సర్వము ఆత్మయే అయి ఉండగా నీకు దిగుళ్ళు, రంధులు ఎందుకు కలగాలి? వాటి ప్రమేయమును నీవు ఎందుకు ఆశ్రయించాలి?... అందుచేత సర్వదా నిశ్చింతుడవై ఉండు.
❖
శ్రీ వసిష్ఠ మహర్షి: వింటున్నావా రామచంద్రా! వారి సంభాషణ అట్లు ముగిసింది. ఆపై నేను వారి ముందు భౌతిక రూపుడనై ప్రదర్శించుకున్నాను. వారిద్దరు వినమ్రతతో నన్ను ఆహ్వానించి, పూజించారు. దాశూరుడు చెప్పిన ఆప్తవాక్యములను అభినందించాను. అందలి సారవిశేషాలను పునఃసమీక్షిస్తూ ప్రసంగించాను. సంసారము నుండి ఈ జీవుని తరింపజేయగల అనేక గాథలు వినిపించాను. మేం ముగ్గురం ఆత్మవిషయమై అనేక దృక్పథముల నుండి అనేక విషయాలు చెప్పుకున్నాం.
ఆ రాత్రి ఉల్లాసంగా గడచిపోయింది. ఆ మరునాడు ఆ తండ్రీకొడుకులు నన్ను భక్తి పూర్వకంగా సాగనంపారు. నేను నా కార్యక్రమము ననుసరించి ఆకాశంలో ప్రవేశించి మునులు వేచియున్నచోటికి పయనించాను.
ఇప్పుడీ 'దాశూరాఖ్యాక’ విన్నావు కదా! దీనిని అనుసరించి “ఈ జగత్తు ప్రతిబింబము వలె అసత్యమైనది” అని గ్రహించు. ఈ సంభాషణను అనుసరించి ప్రజలలో "ఇది దాశూరాఖ్యాయిక వంటిది" అనునది ప్రచారంలోకి వచ్చింది.
Page:267
10. దాశూరాఖ్యాయిక: విజ్ఞాన సారాంశము
ఈ 'నేను-నీవు' అనునదంతా ఆత్మయే. కనుక 'అధిష్ఠాన చైతన్యం' దృష్ట్యా చూచినప్పుడు ఇవి వాస్తవమే. ఆరోపితం దృష్ట్యా ఇవి అవాస్తములేనని కూడా గ్రహించు.
“నేను-నాది” ఇత్యాది అధ్యాసలను త్యజించివేయి. దాశూరమహాముని తన కుమారునికి చెప్పిన సిద్ధాంతాలలోని అంతర్లీనగానాన్ని గమనించు. ఉదారచిత్తుడవు, ఆత్మనిష్ఠుడవు అగుము. వికల్పాత్మకమగు 'మనస్సు’కు హేతువు అగుచున్న అజ్ఞాన మాలిన్యమును 'నేను ఆత్మ తేజమునే” అను ప్రస్తావనచే కడిగివేయి.
ఆత్మతత్త్వమును అవలోకించుచూ ఉన్నావా... ఇక నీవు అతి శీఘ్రముగా మోక్షపదమును పొందగలవు. ఈ పదునాలుగు లోకములలో పూజ్యుడవు కాగలవు.
ఇట్టి పరిశుద్ధ "స్వస్వరూపాత్మదర్శనము”చే మావంటి ఋషులకు కూడా నీవు నమస్కరింప తగిన వాడవగుచున్నావు.
Page:268
VIII. కచోపాఖ్యానము - ఉపోద్ఘాత చర్చ
1. ఈ సృష్టికి కర్త ఎవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! జడాత్మకమగు ఈ ప్రపంచం 'లేదు' అనే నిశ్చయం కలిగి ఉండటమే ఉచితం. ఈ 'నేను-నాది' మొదలైన భేద అధ్యాసల పట్ల విశ్వాసం త్యజించివేయి. వివేకులకు ఎక్కడైనా లేనిదానియందు విశ్వాసముంటుందా? అవివేకులకు మాత్రమే అసత్యమైన దాని యందు ఉద్వేగము, రాగము, సంరంభము ఉంటాయి.
నీవు వివేకివి కావాలి. అంతేగాని అవివేకమును ఆశ్రయించి దుఃఖించటమేమిటి చెప్పు? ఈ ‘దేహాలు’ మొదలైన వాటితో కూడియున్న దృశ్యజగత్తు ఆత్మ కంటే వేరుగా సత్తను పొందివుందా?.. లేదు కదా! ... అందుచేత నీవు అపేక్షా రహితుడవు అవ్వాలి. అసంగం, ఉదాసీనం, చిద్రూపం అయినట్టి ‘స్వాత్మ’ యందే సుస్థిరుడవై ఉండు. అజ్ఞాని 'అధ్యాస' అను స్వభావం కలిగి ఉంటున్నాడు. ఫలితమేమిటి? ఆత్మకంటే వేరుగా ఈ దేహాదులందు ఆత్మతత్త్వమును ఆపాదించుకొంటున్నాడు. పరితపిస్తున్నాడు. “నేను ఈ దేహమునే, నేను చచ్చుచున్నాను, పుట్టుచున్నాను' అని అనుకుంటు న్నాడు. ఈ శరీరము-దృశ్యము మొదలైనవాటిపట్ల సత్యత్వబుద్ధి సమంజసము కాదు సుమా!
ఈ జగత్తే సదసత్తు (Truely as well as falsely exists) అని, దీనికి ఒక నియతి అంటూ ఏదీ లేదని నీవు ఎరుగుదువు కదా! మరి దేహము మొదలుగా అనేక పదార్థములతో కూడుకొని ప్రాప్తిస్తున్న ఇక్కడి సంబంధ బాంధవ్యములపై మాత్రం విశ్వాసం ఎందుకు? ఈ జగత్తే “లేదు”... అని నిశ్చయించిన తరువాత ఇక సంబంధమేమిటి? బంధమేమిటి? ఎవరికి? ఎక్కడ? కేవలం ఆత్మ ఒక్కటే సర్వదా సిద్ధించి ఉన్నది, ఉంటున్నది. అది సర్వదా, నిర్మలము, వ్యాపకము, అనంతము, సర్వప్రమాణములు అందుకోలేనిది అయి ఉన్నది.
శ్రీరాముడు: బాగున్నది స్వామీ! అయితే, ఒక సందేహం. మీ ఉద్దేశము ననుసరించి ఈ జగత్తుకు కర్త ఎవరు? కారకులు, ప్రేరకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నుండి దీనినంతటినీ నడుపుచున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ జగత్తు విషయంలో ఇప్పటికే అనేక విశేషాలు చెప్పుకున్నాం. నీ ప్రశ్నకు సమాధానంగా ఈ జగత్తు విషయంలో మా అభిప్రాయములు మరికొన్ని విశేషాలు చెప్పుచున్నాను వినుఓ రామచంద్రా! ఈ జగత్తు ఎవ్వరిచేతనూ నిర్మించబడి ఉండలేదు. అనగా దీనికి 'కర్త' అంటూ ఎవ్వరూ లేరు. అట్లే “ఈ విధమైన క్రమము”... అంటూ ఏదీ లేదు. "కర్త ఇట్టి విధానము
Page:269
నకు బద్ధుడు"-అనునది చెప్పుటకు వీలుగా కూడా లేదు. విజ్ఞుల అవగాహనను అనుసరించి ఏర్పడియున్న భిన్నాభిప్రాయములు ఇక్కడ ఉదహరిస్తారు.
1. దృశ్యముచే ద్రష్ట ఏర్పడుచున్నాడు! (దృశ్యము కర్త - ద్రష్ట అకర్త) - "దృశ్యమును బట్టే ద్రష్టయొక్క అనుభవం ఉంటోంది. కనుక 'అనుభవము' అనబడుదానికి జగత్తే కర్త. ఆ అనుభవం ఏర్పడు ప్రదేశమే ద్రష్ట యొక్క బాహ్యము. కనుక దృశ్యమును అనుసరించి ద్రష్ట ఉంటున్నాడు.”
2. ద్రష్టచే దృశ్యము కల్పించబడుచున్నది! (దృశ్యము అకర్త-ద్రష్ట కర్త) - ద్రష్ట యొక్క భావనయే దృశ్యానుభవం కనుక జగత్తు అకర్త. ద్రష్టయే కర్త. ద్రష్ట యొక్క అంతరంగమే అనుభవములకు స్థానం. ఆత్మసన్నిధానం చేతనే జగత్తు భాసిస్తోంది కనుక, ద్రష్టను అనుసరించే దృశ్యము ఉంటోంది.
8
ఈ 'జగత్తు' అనే జాలం కర్తృసహితం కావచ్చు గాక! లేక కర్తృరహితం కావచ్చు గాక! మరింకేదన్నా కానీ! నీవు మాత్రం 'ద్రష్ట-దృశ్యము పరస్పరం అభేదమైనవే” అను అధ్యాస కలిగి ఉండు. పరస్పర 'భేదధ్యాస’ చేతనే ఈ దేహములపట్ల “ఈ దేహమే నేను” అను దేహాత్మభావన సంభవించటం జరుగుతోంది. అట్టి భావనను జీవుడు మొదటగా త్యజించాలి.
కనుక రామా! నీ బుద్ధిని సునిశితం చేసుకో. పరిచ్ఛిన్నములగు ఈ దేహాదులందు స్థితి కలిగి ఉండవద్దు. అట్లు స్థితి పొందకుండానే యథారీతిగా వర్తిస్తూ ఉండు.
'ఈ జగత్తుకు కర్త ఆత్మయే'... అని అనవచ్చా? ఈ ప్రశ్నకు మా సమాధానం విను.
ఆత్మ సర్వదా సర్వేంద్రియ రహితమైనట్టిది. అది ఏ క్షణమందు ఎట్టి మార్పు చేర్పులు పొందుటయే లేదు. కనుక 'అది జడమువంటిది' అని కూడా చెప్పబడుతోంది. ఆత్మ తన స్వసత్త మాత్రంచేత ఈ జగత్తు ఉనికిని పొందుతోంది. అందుచేత అజ్ఞాన దృష్టికి “ఆత్మ ఈ జగత్తుకు కర్త” అయినట్లు కనిపిస్తోంది.
‘కాకతాళీయ న్యాయం’చే 'ఈ జగత్తుకు కర్త అనువాడే లేడు" అని మేము ఎంచుచున్నాం.
కాకతాళీయ న్యాయం అనగా - ఒకచోట ఒక ఎత్తైన తాటి చెట్టు ఉన్నది. అప్పుడే వసంత కాలం ప్రవేశించుటచే ఆ చెట్టుకు తాటిపళ్ళు చక్కగా మ్రగ్గి, ఘుమఘుమలాడుతూ వ్రేలాడు చున్నాయి. ఒక కాకి ఎక్కడి నుండో ఎందుకో వచ్చి ఆ చెట్టు యొక్క తాటిపళ్ళ గుత్తిపై వ్రాలింది. అప్పుడు, ఆ గుత్తిలోని ఒక పండు బాగా మగ్గి ఉండి, గుత్తి నుండి విడివడి నేలపై పడింది. అప్పుడే నీడలో సేదతీర్చుకుందామని ఒక నక్క ఆ చెట్టు క్రిందకు వచ్చి నిలిచింది. నీడను, గాలి వీచికలను పొందుతూ ఉన్న ఆ నక్కపై తాటిపండు జారిపడింది. ఫలితంగా, ఆ నక్కకు గాయం అయింది. ఇప్పుడు చెప్పు. ఆ నక్కకు గాయము అగుటకు కారణమేమిటి? తాటిచెట్టా? కాకియా? వసంతకాలమా? తాటిపండా? నక్క చెట్టు క్రిందకు వచ్చుట చేతనా? చెట్టు నీడకు కారణమైన సూర్యుడా? గాలియొక్క వేగముతో కూడిన వీచికలా?
Page:270
ఎవ్వరు ఏదైనా అనవచ్చు. కాని "కాకతాళీయ న్యాయముచే ఉత్పన్నమైనదానికి కర్త లేడు” అనునది ఈ దృష్టాంతము యొక్క పాఠం.
ఈ జగత్తు ఏదై ఉన్నది - అనే విషయానికి వస్తే, 6 ' ఈ జగత్తు అనిర్వచనీయం' అని అనేక మంది ఆత్మజ్ఞానులగు వారిచే చెప్పబడుతోంది. “ఈ జగత్తు ఇందలి పదార్థ వ్యవహారములు గురించి అజ్ఞులే మరల మరల వితర్కించటం, విచారించటం చేస్తున్నారు. వివేకులు అట్లు చేయరు.” అనునదే మా అభిప్రాయం కూడా. ఎందుకంటే తర్కవితర్కములు ఒక పరిధిని, పరిమితత్వమును కలిగియుండి, అనంతమగు ఆత్మతత్వమును నిర్వచించలేకపోతున్నాయి. ఇట్లు ఆత్మ అనుభవైకవేద్యము మాత్రమే అగుచున్నది.
ఈ జగత్తు ‘భావనారూపము' అని కొందరంటున్నారు. “ఇది క్షణక్షణం నశించుచూ, శూన్యమే అయి ఉన్నది” అని మరికొందరు చెప్పుచున్నారు. “ఇది ప్రవాహరూపమున కనిపిస్తూ మరల మరల ఉత్పన్నమగుచున్నది"... అని ఇంకొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా చమత్కారమేమంటే దీనిని నీవు ఏ ఏ సంకల్పముల ధారణ చేత మరల మరల దర్శిస్తావో, ఆ ధారణలను అనుసరించే ప్రయోజన సిద్ధిని పొందుచున్నది.
శ్రీరాముడు: “ఇది నిత్య సత్తా స్వభావం కలది" అని చెప్పవచ్చని? అందామా? అంటే, ఇది ఎప్పటికీ ఏర్పడి ఉండియే ఉంటుందని” అని అనవచ్చునా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఇక్కడ ప్రతిదీ ఒకప్పుడు ఒక విధంగా మరొకప్పుడు మరొకవిధంగా ఉంటోంది. ఇక్కడ పరిణామం చెందనిదేది చెప్పు? అందుచేత ఇక్కడ ఇప్పుడు కనబడుచున్నదంతా ‘అసత్' స్వభావయుతమని చెప్పబడుతోంది. అంటే, అది ఇప్పటికే స్వతహాగా 'ఉనికి' ని కలిగి ఉండలేదు.
పోనీ... ‘ఇది క్షణిక సత్త శీలమైనది' అందామా? ఈ శరీరములోని సంకల్పించువాడు, లేక దర్శించువాడు ఉన్నాడు చూచావ్! అతడు ఆయా పదార్థముల, భావముల మార్పుచే స్పృశించ బడకయే ఉంటున్నాడు. భావనను అనుసరించే జగత్తు ఉంటోంది.
ఆత్మ వాస్తవానికి సర్వ ఇంద్రియములకు అతీతము, ఆధిభౌతిక-ఆధిదైవిక-ఆధ్యాత్మిక తాపములచే తాకబడనిది. అది ఈ జగత్కార్యమును నిరంతరం చేయుచున్నప్పటికీ అది ఏమాత్రం భేదముగాని, మోదము గాని పొందదు.
ఒక గదిలో దీపం ఉన్నది. ఆ దీపపు వెలుగు సహాయంచేత ఆ గదిలో “వంట చేయుటసంభాషించుట-చదువుట" మొదలగు కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. దీపపు వెలుగు లేకుంటే అవన్నీ ఆ ఆ విధంగా జరుగజాలవు. కాని దీపపు వెలుగే అవన్నీ చేయిస్తోందని అనలేము. దీపపు వెలుగు దేనికీ కారణం కాదు.
Page:271
ఇక్కడ మనకు రెండు వాక్యాలు సిద్ధిస్తున్నాయి1. ఆత్మయొక్క 'సమక్షం’ చేతనే జగత్తు ఉంటోంది - ఆత్మ యొక్క సన్నిధానం మాత్రం చేత ఈ జగత్తు వ్యవహార ప్రకటనలు కలిగి ఉండగలుగుతోంది. కనుక జగత్తుకు కారణం ఆత్మయే.
2. ఆత్మ సర్వదా నిర్వికారం, నిర్విశేషం- ఆత్మ స్వతహాగా నిరవయవము, పదార్థరహితము కదా! కనుక ఆత్మ జగత్తుకు కారణమగుట లేదు.
అందుచేతనే... “ఈ జగత్తు సత్-అసత్ రూపము, అనిర్వచనీయము అయి ఉన్నది”... అని చెప్పబడటం జరిగింది. ఆత్మ కాకుండా వేరుగా ఈ జగత్తు యొక్క ఉనికికి మరింకేదీ కారణ మగుట లేదు. నిరంతరం ఈ దృశ్యము భావనానుసారం ఇట్టి స్థితే కలిగి ఉంటోంది. ఇది మిథ్యా రూపమున ఇంద్రజాలంలో లాగా ఆవిర్భవించినట్లు దృశ్యమానమై ఉంటోంది. దృశ్యానికి అతీత మగు ఆత్మత్వము వహించువారికి, ఈ దృశ్యము ఎదురుగా ఉండి కూడా 'లేనిదే' అగుచున్నది.
2. నిరపేక్ష-నిస్సంగము
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జనుల వ్యవహారముల సంరంభము గమనిస్తున్నావా? అవర్యన్తస్య కాలస్య కశ్చిదంశః శరచ్ఛతమ్ |
తావన్మాత్రమహాశ్చర్యః కిమర్థం సో సుధావతి ॥ (సర్గ 56, శ్లో 13)
ఈ శరీరంతో కూడినప్పటి జీవితం అనంత దేశకాలముల దృష్ట్యా అత్యంత పరిమితమైనది కదా! ఇది అనంత కాలప్రవాహంలో ఎంతటి స్వల్పాంశమైనది! ఈ స్వల్పకాలం, సదవకాశంలా లభించిన ఈ మానవ ఉపాధి ఏర్పడియున్న సమయమంతా కూడా అతడు దేహాత్మ బుద్ధినే ఆశ్రయి స్తున్నాడే! సర్వేంద్రియములకు అతీతమైయున్న ఆత్మవైపు అభిముఖుడవటమే లేదే! ఎంత ఆశ్చర్యం!
ఈ జగత్తుకు స్వకీయమైన కర్తృత్వమే లేదు. అట్టి ఈ జగత్తునందలి ఈ దేహములతో సహా సమస్త పదార్థములు 'ఇవి స్థిరములు’... అనిపించటం మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడి స్వల్ప వస్తువులను ఆపేక్షించుచు, దూరదృష్టి లేకుండా దినములు గడపటం ఉచితమెట్లాగా?
ఓయీ జీవుడా! ఎక్కడైనా 'అసంగము' అగు చైతన్యమునకు, జడమగు పదార్థములకు సంబంధం ఉంటుందా చెప్పు? నీవు శుద్ధమగు చైతన్యమువే గానీ, జడమగు శరీరములు కావు, ఇంద్రియాలు కావు. ఇంద్రియానుభవాలు కావు. అట్టి ఆత్మస్వరూపుడవగు నీకు ఈ శరీరాదులతో సంయోగం ఏర్పడటమేమిటి?
కనుక; "నేను శరీరరూపుడను గాను. నా యందు శరీరాదులు లేవు. నేను ఈ శరీరపరిమితుడను కాను. శరీరం కంటే ముందే ఉన్నట్టి నేను శరీరానికి మాత్రమే పరిమితుడనై ఉండేదెట్లా?"... అని ఎందుకు భావించరాదు? అట్లు భావించినప్పుడే నీవు ఇంద్రియాతీతమగు
Page:272
స్వస్వరూపమును గాంచగలుగుతావు. అట్లా కాకుండా, ఇంద్రియానుభవ మాత్రమైనట్టి ఈ దృశ్యములోని పదార్థములు, ఇవి కలుగజేయగల సుఖదుఃఖములు... వీటన్నిటిపై నమ్మకం కలిగి ఉంటే "అసంబంధితము - దివ్యము పరిశుద్ధము - నిత్యోదితము”... అగు నీ వాస్తవ స్వరూపమును నీవు ఎట్లు గాంచగలవో మాకు అర్థమగుటలేదు. ఈ శరీరాదులు, తదితర దృశ్య పదార్ధములు స్థిరములయినా, కాకున్నా నీవు వీటి పట్ల 'అపేక్ష' పొందవలసిన పనేముంది? నీవు ఒక జడవస్తువు కాదే! సంకల్పములను కూడా రచించగల చైతన్యమూర్తివి కదా! బుద్బుదము వలె చంచలములైన ఈ దేహములు నశించిపోయేవే కనుక, వాటి యందు ఆసక్తి దుఃఖములనే కలుగజేస్తున్నాయి.
1) “ఉత్పత్తి-వినాశనము” అను రెండిటితో కూడుకొన్న ఈ దృశ్యజగత్తునందు “ఇవియే నేను, లేక ఇవి నావి" అను దోషముతో భావావేశము పొందటం;
2) ఆత్మను జగత్ స్వభావయుక్తంగా చూడటం... (లేక, ఆత్మయే వాస్తవ స్వరూపంగా గల సహజీవుని భౌతిక పరిమిత దృష్టితో చూడటం)...
ఈ రెండూ కూడా బంధము కలిగించుటకే కారణమగుచున్నాయని సర్వజనులకు గుర్తు చేస్తున్నాను. స్థిర-అస్థిర స్వభావయుక్తములైనట్టి ఆత్మ-జగత్తులకు "కొండ-నురుగు”ల వంటి సంబంధము మాత్రమే కలదు.
సమస్తమునకు కర్తయగు ఆత్మ అకర్తయే అయి ఉన్నది. అది ఏమీ చేయుట లేదు. నాటక రంగంలోని దీపంలాగ అన్నిటినీ ప్రకాశింపజేస్తూ కూడా ఉదాసీనంగా ఉంటోంది. సూర్యుడు ఉదయించిన తరువాత, ఇక ప్రాణులు నిదురలేచి, తమ దినచర్యలు ప్రారంభించు చున్నారు కదా! కాని దినచర్యలకూ సూర్యునికి సంబంధం ఏమి ఉన్నది? ఉదయం నుండి సాయంకాలం దాకా జరిగిపోతున్న ఆయా రోజువారీ కార్యక్రమముల దృష్ట్యా సూర్యుడు సర్వదా అకర్తయే కదా! ఆత్మ కూడా ఏమీ ఒనర్చుట లేదు. అది అన్నిటికీ కారణమగుచూ కూడా, సర్వదా 'స్వయంప్రతిభ' యందు ప్రతిష్టితమై ఉండి ఉంటోంది. అది చలింపకయే ఉంటూ సర్వమును చలింపజేస్తోంది.
3. భ్రమచేతనే జగదుత్పత్తి
నదీతీరం స్వభావయుక్తంగానే ఇసుకతో ఉంటుంది కదా! ఈ జగత్తు కూడా స్వభావంగానే జీవుని పట్ల ప్రకటితమగుచున్నది. ఎటు పల్లం ఉంటే నీరు అటు ప్రవహించటం సహజం. అట్లాగే జడ-చేతనముల సంయోగమాత్రం చేత ఈ జగత్తు ఆకస్మికంగా ఉత్పన్నమైనది అగుచున్నది. అంతేగాని, దీనికి కర్త అంటూ ఎవరూ లేరు.
ఆత్మయొక్క సన్నిధానం చేతనే దీనికి ఉనికి ప్రాప్తిస్తోంది. లేదా సర్వప్రమాణములకు అతీత మగు శుద్ధచిత్తము దృష్ట్యా ఇది లేదని కూడా గ్రహించబడగలదు.
Page:273
ఓ రామచంద్రా! ఏది ఏమైనప్పటికీ ఈ 'దేహము' మొదలైన పదార్థములందు “ఇదియే ఆత్మ” అని తలచటం ఎవ్వరికీ ఏమాత్రం తగదు. వేగంగా గాలిలో వృత్తాకారంగా త్రిప్పునప్పుడు ఏర్పడు వృత్తముపై లేక, స్వప్నములోని కొండ, మనిషి మొదలైన వాటిపై అపేక్ష కలిగి ఉన్నామనుకో, చీకట్లో ఏదో ఆకారం చూచి "అది దయ్యము యొక్క కదలికలే” అని తలచా మనుకో... అవన్నీ అర్థంలేని పనులే కదా! ఆకస్మికంగా ఎక్కడో దూరదేశంలో కొద్దిక్షణములు నీ ప్రక్కన నిలబడి, అటుపై ఎటో వెళ్ళిపోవుచున్న నూతన వ్యక్తితో నీకు స్నేహం ఎట్లా కుదురుతుంది? భ్రమచే ఉత్పన్నమైన ఈ జగత్తు విశ్వాసపాత్రం కాదు. అట్లే ఈ శరీర విషయం కూడా. శ్రీ రాముడు: స్వామీ! ఈ జగత్తు యొక్క అభావన జీవమాత్రులమగు మాకు సాధ్యమే నంటారా? శ్రీ వసిష్ఠ మహర్షి: “చంద్రునిలో ఉష్ణత్వము, సూర్యునిలోని శీతలత్వము, మృగతృష్ణలో జలత్వము వాస్తవము కావు” అను భావన ఎంత సహజమో, ఈ జగత్తునందు భావనారహితుడై ఉండటం కూడా అట్లే సహజం. భావనలు కలిగియుండుటయే 'శ్రమ' కాని, కలిగి యుండకుండుట శ్రమ కాదు. కనుక భావనారహితుడవై ఉండటం అభ్యాసపరుడవగు నీకు తప్పక సుసాధ్యమే!
ఇక ఈ జగత్తులోని పదార్థజాలమంటావా?... దీనిని 'ఊహ'లోని కట్టడములవలె, స్వప్నములోని జనసమూహమువలె, ఇంద్రజాలములోని సంఘటనలవలె ఉద్వేగరహితుడవై, అంతయు తెలిసియే ఉన్నవాడై ప్రశాంతచిత్తముతో వీక్షిస్తూ ఉండు. అంతేగాని భావనామయమగు ఈ ప్రాపంచిక విషయములందు విశ్వాసము కలిగియుండవద్దు. ఏదైతే నీయొక్క 'పరమార్థ స్వస్వరూపము’ అయి ఉన్నదో... అద్దానినే సర్వదా భావించుచు, ఈ జగత్తునందు లీలామాత్రంగా విహరిస్తూ ఉండు.
4. సన్నిధాన మాత్రం (Mere presence)
సమస్త పదార్థముల అభ్యంతరమయిన ఆత్మవస్తువే నిత్యసత్యమై యున్నది. సర్వ కర్తృత్వ అకర్తృత్వ భావనలను, సర్వ ఇచ్ఛలను తొలగించుకో! అప్పుడు శేషించు పారమార్థిక రూపమును గ్రహించు. అటుపై యథారీతిగా ఈ జగత్తులో విహరించు. ఉదాసీనుడవై, ఇచ్ఛారహితుడవై, వ్యధారహితుడవై వ్యవహరించు.
ఇదం సన్నిధిమాత్రేణ నియతిః పరిజృంభతే ॥ దీపసన్నిమాత్రేణ నిరిచ్చైవ ప్రకాశతే || (సర్గ 56, శ్లో 27)
“ఆత్మచైతన్యమే” అయి ఉన్న నీ యొక్క 'సన్నిధానం’ మాత్రం చేత నియతి ఈ జగద్వ్యవహార రూపంలో ప్రవర్తిస్తోంది. దీపము యొక్క ప్రభావము చేత ప్రకాశము దశదిశల విస్తరిస్తోంది! ఆకాశంలో మేఘమును చూచినంత మాత్రం చేత కొండమల్లెపూవు వర్షధారల భావనచే స్వయంగా వికసిస్తోంది. ఆత్మసన్నిధానమాత్రం చేతనే ముల్లోకములు ఉత్పన్నమౌతున్నాయి.
Page:274
సర్వేచ్ఛారహితే భానౌ యధా వ్యోమని తిష్ఠతి | జాయతే వ్యవహారశ్చ సతిదేవేతథాక్రియా ॥
అదిగో, సూర్యభగవానుని చూడు. అతడు ఏ 'ఇచ్ఛ' లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తున్నంత మాత్రం చేత ఈ జగత్తులో పూలు-చెట్లు-జీవులు అనేక ప్రయోజనములు పొందుతూ జీవిస్తు న్నారు కదా! పరమాత్మ నిష్క్రియుడై ఉండి ఉండగా, అతని సత్తామాత్రం చేత ఈ జగత్తు, ఇందలి వ్యవహారములు సంభవిస్తున్నాయి.
ఓ రామా! నీవు పరమాత్మయే స్వరూపముగా కలిగి ఉన్నావు. ఈ శరీరాదులు, పదార్థముల నీవు కావు. రత్నం ప్రకాశిస్తూ ఇచ్చారహితంగా తన కిరణపుంజములను తదితర వస్తువులవైపు ప్రసరింపజేస్తోంది. అయితే, “నేను ఈ వస్తువులను మాత్రమే ప్రకాశింపజేస్తాను... ఈ ప్రక్క వస్తువులపై కిరణములు పంపను”... అని అనుకుంటోందా? లేదు, నిర్లిప్తుడు, నిత్యుడు అగు పరమాత్మ యొక్క సత్తచేతనే జగత్సమూహములు ఉత్పన్నమౌతున్నాయి.
ఆత్మయందు కర్తృత్వ, అకర్తృత్వములు రెండూ ఉన్నాయి. ఇది ఇచ్ఛారహితం కాబట్టి “అకర్తయే”. ఆత్మ సన్నిధానంలో మాత్రమే ఇదంతా జరుగుతోంది కాబట్టి "కర్తయే” కూడా!
5. ఆత్మ అన్నివేళల అకర్తయే
ఇంద్రియములకు విషయము గానందువలన సత్యస్వరూపమగు పరమాత్మ దేనికీ కూడా కర్తగాని, భోక్తగాని కానేరదు. అయితే, ఇంద్రియములందు అంతర్గతంగా 'సత్త' కలిగియున్నదేది? అదియే కదా! అందుచేతనే “కర్త-భోక్త కూడా ఆ పరమాత్మయే”... అని శాస్త్రకారులు కొన్నిచోట్ల నిర్ద్వంద్వంగా నిర్ణయించి చెప్పుచున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని సాధనకొరకు రెండు మార్గాలు ఏర్పడి ఉంటున్నాయి.
1. మహాకర్త - “సర్వమునకు కర్త ఆత్మయే. అట్టి ఆత్మయే నేను”
2. మహాఅకర్త - "ఆత్మకు ఏ క్షణమందును కర్తృత్వ-భోక్తృత్వములు లేవు. అట్టి పరిశుద్ధ స్వరూపమగు ఆత్మచైతన్యమునే నేను.”
ఈ రెండిటిలో నీకు ఏది శ్రేయమని, అనుకూలమని బాగున్నదనీ అనిపిస్తే అట్టి భావనను దృఢంగా ఆశ్రయించు. “సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నట్టి చిత్స్వరూపుడనగు నేను సర్వదా అకర్తనే”... అను భావన కలిగి, ప్రాప్తించిన కార్యములను నిర్వర్తిస్తూ ఉండు. అప్పుడిక కర్మలు చేస్తున్నప్పటికీ నిర్మలుడవై, కర్మలచే దోషము పొందక ఉంటావు. "శుద్ధ స్వరూపుడనగు నేను ఏమియు ఒనర్చుటలేదు” అనే నిశ్చయము కలవాని చిత్తము ప్రవృత్తిరహితం అవుతుంది. ప్రవృత్తి రాహిత్యము కారణంగా చిత్తము వైరాగ్యం పొందుతుంది. భోగముల పట్ల అపేక్ష లేనప్పుడు అట్టి జీవుడు అకర్మపరుడే అవుతాడు.
Page:275
“నేనెప్పుడూ అకర్తనే కదా...” అను దృఢభావనచే పరమ అమృతమువంటి సర్వసమత్వమే శేషించగలదు. లేక “అంతయు నేనే ఒనర్చుచున్నాను” అను మహాకర్తృత్వాభిమానమునందు స్థితి పొంది ఉంటావా...! అది కూడా మంచిదే.
శ్రీరాముడు: ఈ లోకంలో జ్ఞానులగు ఉత్తముల భావన మరియు అవగాహన ఏ రూపంలో ఉంటున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి: "శుద్ధ స్వరూపుడనగు నేను ఈ జగద్భమను పొందవలసిన పనేమున్నది? నాకంటే వేరైనదేదీ ఎక్కడా సంభవించటమే లేదు కదా! ఇక నాకు రాగమేమిటి? ద్వేషము దేని మీద?” అను భావనయందు వారు ఉంటున్నారు. ఇక “ఈ సర్వమునకు కారకుడు ఎవరు?”... అను ప్రశ్నకు వచ్చినప్పుడు, “తదితర జనులచే దగ్ధం కావించబడిన నా పూర్వశరీరములకు, ఈ జనులచే లాలించబడుచున్న ఈ వర్తమాన శరీరమునకు కూడా నేను మునుముందుగానే ఉన్నాను. సంకల్పములకు ముందే ఉండియుండి, సర్వసంకల్పములను అంగీకరించువాడను, ఆశ్రయించువాడను నేనే!”... అని గ్రహిస్తున్నాడు. అప్పుడు సర్వదుఃఖములు శమించుచున్నాయి. “నా ఈ సుఖదుఃఖముల విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశనములకు కర్తను నేనే” అని నిశ్చయించుకొనుటచే అతడి సుఖ-దుఃఖములు శమించుచున్నాయి. “నా ఈ సుఖదుఃఖములు విస్తారమునకు హేతువగుచున్న ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశములకు కర్తను నేను” అని నిశ్చయించుకొనుటచే అతడు సుఖ-దుఃఖములను రహితం చేసుకోగలుగుచున్నాడు.
భావనయొక్క ఆరంభమే జగత్తు యొక్క ఉత్పత్తి. భావనను అధిగమించినప్పుడు జగత్తు రహితమగుచున్నది.
6. ఆత్మ సమష్టిరూప కర్తృత్వము
వసిష్ఠ మహర్షి:
అయం కర్తేతి మత్వాన్తః కః ఖేదోల్లాసయోః క్రమః | భేదోల్లాసవిలాసేషు స్వాత్మకర్తృతయైతయా ॥ (శ్లో 41, సర్గ 56)
స్వయమేవ లయం యాతే సమతైవావశిష్యతే | సమతా సర్వభూతేషు యాసౌ సత్యావరాస్థితిః ॥ (శ్లో 42, సర్గ 57)
ఓ రామచంద్రా! నీవు ఎల్లప్పుడూ సమష్టి రూప కర్తృత్వము స్వీకరించుట చేతనే పవిత్రుడవు కాగలవు. అట్టి కర్తృత్వముచే సుఖదుఃఖములు స్వయముగా విలీనమైపోతాయి. ఆపై సమత్వమే శేషిస్తుంది. సర్వభూతములపట్ల సమభావమే సర్వోత్తమ స్థితి అయి ఉన్నది.
Page:276
అట్టి సమత్వము నందు స్థితి పొందువాడు ఇక మరల ఎన్నటికీ జన్మలు పొందడు. అనగా అతని యందు "నేను జన్మించాను, మరణించుచున్నాను” వంటి భావాలు ఉండవు. 'పుడుతున్నాను - పెరుగుచున్నాను - చచ్చుచున్నాను'... అను భావాలన్నీ శరీరముతో తాదాత్మ్యం పొందువారికి మాత్రమే ఉంటోందని గుర్తు చేస్తున్నాను.
కాబట్టి రామచంద్రా! క్రమంగా కర్తృత్వ-అకర్తృత్వములన్నిటినీ త్యజించివేయి. మనస్సును కూడా నశింపజేయి. ఇకప్పుడు ఏ శుద్ధతత్వముంటుందో అద్దాని యందు సుస్థిరుడవుకమ్ము.
అహంకారం, దేహం, ఇంద్రియాలు నేను కాదు. వీటి వేటికీ నేను సంబంధించిన వాడను కాను. వాటి క్రియలు నాకు సంబంధించినవి కావు. అందుచేత నేను సర్వదా నిష్క్రియుడనే”... అని గ్రహిస్తూ "ఆత్మ" కు ఆపాదించబడుచున్న కర్తృత్వములను నిషేధించు.
శ్రీరాముడు: మహర్షీ! ఈ దృశ్యపదార్థము త్యజించబడగా అప్పుడిక ఆత్మలాభము స్వయముగానే
చేకూరుతుంది కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి: ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉన్నది. ఈ దృశ్యవస్తువులను నిరసించిన మాత్రం చేత సరిపోదు. అదే తరుణంలో ఆత్మను భావనచేస్తూ ఉండాలి. అప్పుడే తృప్తికరమగు పూర్ణత్వము లభిస్తుంది.
“తత్వమసి” భావన చేయటం - 'త్వమ్'(you)ను “ఇది లేదు, ఆత్మ మాత్రమే ఉన్నది” అను నిషేధంతో బాటుగా..., 'తత్' అను శబ్దమును లక్ష్యమై ఉన్నట్టి 'ఆత్మ' భావించబడుతూ ఉండాలి.
ఆత్మను భావించటమంటే ఏమిటి? - "నేను ఆత్మనే అయి ఉన్నాను... కనుక స్వతహాగానే నిత్యుడను, పూర్ణుడను, అఖండుడను, శుద్ధుడను” ...అను భావనను క్రమంగా ఆశ్రయించుటయే ఆత్మను భావన చేయటం సుమా! అంతేకాదు. ఎదురుగా కనిపించే ప్రతిజీవిని చూస్తూ ఉండగానే, “నీవు పరమాత్మ స్వరూపుడవే-తత్వమసి” ...అను భావనను అనుక్షణికంగా అభ్యసిస్తూ రావటం.
ఆకాశం మేఘాలచే కప్పబడినప్పటికీ, స్వతహాగా శుద్ధమైనదైనట్లుగానే... ఈ సంకల్పాలు ఏర్పడినంత మాత్రంచేత అతడు అశుద్ధుడగుట లేదు. 'నేను-నీవు-జగత్తు అనునదంతా ఆత్మయే. ఇట్లు ఈ జగత్తుగా ప్రాప్తిస్తున్నదంతా నేనే' అనునట్టి సర్వాత్మకభావము కలిగి ఉండాలి.
దేహాత్మబుద్ధి, దేహభావా-స్పృశ్యం "నేను ఈ శరీరమును... శరీరపరిమితుడను... శరీరముతో ప్రారంభమగుచున్నాను... శరీరం నశించుటచే నేను నశించుచున్నాను”... అను ఈ జీవుని యొక్క బుద్ధియే దేహాత్మ బుద్ధి. ఈ దేహాత్మబుద్ధియే సర్వనరకముల స్వరూపమైయున్నది.
* నిత్యుడు = ఎల్లప్పుడూ ఉండేవాడు; పూర్ణుడు = ఇక క్రొత్తగా పొందవలసినదేదీ లేనివాడు.
అఖండుడు = వేరువేరు జీవులుగా విభాగించబడనివాడు; శుద్దుడు = స్వతహాగానే దోషరహితుడు.
Page:277
అందుచేత, ఏ ప్రయత్నంచేసి అయినా సరే, “నేను ఈ పాంచభౌతికదేహమును”... అను భావనను త్యజించివేయాలి. ఉత్తముడు, పవిత్రుడు అగు ఒక గృహస్థుడు ఏవో తళుకు బెళుకులను చూచి, ఆ మాత్రానికి ఒక పరాయి స్త్రీతో సాన్నిహిత్యం కోరుకుంటాడా? లేదు కదా! అట్లు కోరుకోక పోవుటయే అతనికి సహజమైన విషయం. అట్లాగే, సర్వనాశనం చేకూరనీ; మృత్యువు వాటిల్లనీ... ఈ దేహాత్మ బుద్ధిని ఎన్నడూ, ఎట్టి పరిస్థితులలోనూ స్పృశించరాదు. దేహాత్మభావనయే (లేక) దేహాత్మదృష్టియే విశుద్ధాత్మను కప్పిపెట్టి ఉంచుచున్నదని గ్రహించు.
ఉదేతి పరమాదృష్టిర్ణ్యోత్స్నేవ విగతాంబుదా |
యయాభ్యుదితయా రామ తీర్యతే భవసాగరః ॥ (శ్లో 48, సర్గ 56)
దేహాత్మబుద్ధిని త్యజించివేసిన మరుక్షణం మేఘరహితమగు చంద్రుని చంద్రికవలె సర్వోత్తమ మగు ఆత్మదృష్టి ఉదయిస్తోంది. అప్పుడీ జీవుడు సంసారసాగరము నుండి తరించగలుగుచున్నాడు.
ఆత్మయందు స్థితి - ఓ రఘురామా! ఇప్పుడే, ఇక్కడే రెండు విషయాలు సుస్పష్టంగా, నిర్దుష్టంగా, ఎట్టి అనుమానాలకు తావివ్వకుండా ఎరుగుము.
1) ఈ దేహాదులు నేను కాదు; 2) జడము భావానుసరణము అగు దృశ్యము నేను కాదు. తద్ద్వారా, పరిచ్ఛిన్నములగు సుఖదుఃఖములను ఆశ్రయించనివాడవు అవుతావు. అదే సమయంలో ఇట్లు నిర్ణయం చేసుకొని ఉండు:
1) ఈ దృశ్యముకంటే విలక్షణమై, లోకసిద్ధమై, స్వస్వరూపమునకు వేరు కానట్టిదయిన “శుద్ధచైతన్యము” నే నేను. నేనైన వస్తువంటూ ఈ దృశ్యజగత్తులో ఎక్కడా లేదు.
2) ఈ బ్రహ్మాండమంతా నేనే. దృశ్యముగా కనిపిస్తున్న సమస్తమునకు కర్తను నేనే.
ఇట్లు తిరస్కరించవలసిన ‘దేహాత్మభావన'ను తిరస్కరిస్తూ అభ్యసించాలి. స్వీకరించవలసిన ‘అహమాత్మా’ భావనను స్వీకరిస్తూ అభ్యసించాలి. ఈ రెండింటినీ మేళవించుకుంటూ ఈ భూమిపై సంచరించు. లేదా, ఈ జగత్వ్యాహ్యాళి త్యజించి ఒక ప్రదేశంలో సమాధి నిష్ఠుడవై యుండు. అది నీ ఇష్టం. ఎందుకంటే, ఉత్తమ భావన అవధరించిన తరువాత ఆ రెండిటియందు భేదముండదు.
ఉత్తమ నిశ్చయము కలవాడవై బ్రహ్మపదమున సర్వదా స్థితి కలిగియుండుము. ఉత్తమ సాధువులగు బ్రహ్మవేత్తలు ఆ విధంగా 'ఆత్మస్థితి'ని ఆశ్రయించి, ఆపై తమ సంచారముచే ఈ ముల్లోకములను పావనం చేస్తున్నారు. అట్టివారు వందనీయులు అగుచున్నారు.
7. పూర్ణాశయస్వరూపము
శ్రీరాముడు: మహాత్మా! ఉత్తమ యుక్తులచే మీరు చెప్పుచున్నదంతా సత్యమైనదని, అత్యుత్తమోత్తమ మైనదనీ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. మీరు చెప్పినట్లు “పరమాత్మ కర్త అయినప్పటికీ అకర్త, భోక్త అయినప్పటికీ అభోక్త”... అయి ఉన్నాడు. అతడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, చిన్మాత్రమే స్వరూపముగా కలవాడు కూడా.
Page:278
అతడే నిర్మలపదము! సర్వలక్షణముల సారము కూడా అతడే! ఈ భూమి మీద చతుర్విధ ప్రాణులు నివసించుచున్నట్లే ఆ దేవదేవుడు సర్వభూతముల అంతరంగమున నెలకొనియున్న వాడై సమస్తము అగుచున్నాడు. నాయందు, మీయందు, సర్వులయందు ఉన్నది అతడే. అతడు నాకంటే వేరుగా లేడు. లేదా, నేను ఆయనకంటే వేరుగా లేను. కనుక, నేనే సర్వదా అన్ని జీవరాసులందును సమముగా ఉండియున్నాను.
హే మహాత్మా! మీ వాక్యామృత ప్రభావం చేత నా హృదయమందు ఇప్పుడు బ్రహ్మము ప్రకాశించుచున్నది. తమ వచనములచే నేను దుఃఖరహితుడనయ్యాను. దేవదేవుడగు ఆ పరమాత్మ ఇచ్చారహితుడు. ఉదాసీనుడు కదా! ఆయన దేనికైనా కర్తగాని, భోక్తగాని ఎట్లా అవుతాడు? కాడు. కాని తనయొక్క సత్తామాత్రం చేత సర్వలోకాలకు అస్థిత్వము ప్రసాదిస్తున్నాడు. అతని సంకల్పమే ఈ సృష్టి. కనుక, దీనికి కారకుడు, కర్త, భోక్త కూడా అతడే. ఇక ఈ దృశ్యమో, ఇచ్ఛారహితుడు, ఉదాసీనుడు అగు పరమాత్మ యొక్క చమత్కారమే!
88
హే మహర్షీ! గురువర్యా! నాకు ఎందుకో ఇంకా ఒక్క గొప్ప సందేహం తొలగుటయే లేదు. అత్యంత వినమ్రుడనై ఆ సంశయమును మీ ముందు ఉంచుచున్నాను.
1. ఈ జగత్తు సత్-అసత్ రూపమైనది.
2. సమిష్టిరూపమగు జగత్తే నేను. అంతేగానీ, ఒక వ్యష్టిరూపమాత్రుడను కాను.
ఈ రెండూ మనకు నిర్వివాదాంశమే. ఇక ఈ ప్రపంచం విషయానికి వస్తే ఇది 'సమదృష్టిచే ఏకం - వ్యష్టిదృష్టిచే అనేకం'... అయి ఉన్నది. ఇటువంటి 'వ్యష్టి-సమష్టి'... అనబడు 'అనియతం, కల్పనామయం’ అగు సృష్టి పరమాత్మయందు ఎట్లా ఉన్నది? ఎందుచేత ఉన్నది? ఎవరి కొరకు ఉన్నది?
పరమాత్మ అద్వితీయము, స్వయంప్రకాశకము, మోహాంధకారరహితము, నిర్మలము కదా! సూర్యుని యందు అంధకారం ఎట్లా ఉంటుంది?... పరిశుద్ధతత్వమగు పరమాత్మ యందు ఈ జగత్తు ఉండుట ఏమిటి? ఏ రూపంగా ఉంటోంది?
“మాయతో కూడిన బ్రహ్మము నందు మొట్టమొదట అవ్యక్తరూపమున ఈ జగత్తు ఉండి ఉన్నది. ఆ తరువాత వ్యక్తరూపమున కనపడుచున్నది”... అని అంటారా? అట్లా అయితే ‘అద్వితీయం’గా నిర్వచించబడుచున్న పరమాత్మయందు అప్రకటన స్థితిమయంగా ఈ జగత్తు ఏ రూపంలో ఎట్లు దాగి ఉన్నది?
ఈ విషయం ఎంత ఆలోచించినా నాకు అర్థమగుటలేదు. దయచేసి వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! నీ ప్రశ్నకు సరి అయిన సమాధానం ముందు ముందు నిర్వాణ ప్రకరణంలో విశ్లేషణ పూర్వకంగా వివరించబడబోవుచున్నది. నిర్వాణ ప్రకరణ సమాచారం వినుచున్నప్పుడు ఈ జగత్తు యొక్క యథార్థ రూపమేమిటో నీవే తప్పక గ్రహిస్తావు. అప్పుడు
Page:279
“మోక్షోపదేశం” మనకు విషయము అవుతుంది. అఖండాకారమగు ఆత్మ గురించిన విశేషములన్నీ గ్రహిస్తే గాని, మోక్షము గురించిన సిద్ధాంతాలు శిష్యుని ముందు ఉంచటానికి కుదరదు. అతడు సిద్ధాంతాలు స్వీకరించాలంటే మనస్సులోని సంకుచితత్త్వమునకు సంబంధించిన అనేక పరిమిత దృష్టులు తొలగాలి. ప్రస్తుతం మనం పరిమిత దృష్టులను తొలగించగల విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం.
వయసులో ఉన్నవాడు మాత్రమే స్త్రీల విరహమయ గీతములను విని అర్థం చేసుకో గలడు గాని, ఒక ఆరేళ్ళ బాలుడు ఏం అర్థం చేసుకోగలడు? అందుచేత, మరికొంత అవగాహన తరువాత గాని నేను నీకా విషయం ప్రతిపాదించి చెప్పకూడదు. "ఉత్తమ ఆత్మ సాక్షాత్కార జ్ఞానము"నకు సంబంధించిన నిర్దుష్టప్రవచనాలు అల్పబోధనగలవారికి ముందు గానే చెప్ప కూడదు”... అను నియమమును గురువులం మేము పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే అపరిపక్వ దృష్టి, సమాచారము గలవారి పట్ల మా సిద్ధాంత ప్రవచనాలు వ్యర్థం కావటమో, లేక విపరీతార్థములకు దారి తీయటమో జరుగవచ్చు కదా!
సరైన ఋతుకాలంలో ఫల పుష్పాలు శోభిస్తున్నట్లు, సరైన కాలంలో సరైన బోధ చేయుటమే ఉచితం. శుభ్రమైన వస్త్రమునకు రంగు వేస్తే ఆ రంగు చక్కగా హత్తుకుంటుంది. వివేకము, వైరాగ్యము... ఉత్తమ వస్తువుపట్ల లక్ష్యశుద్ధి, విచారణ ఉన్నవారి విషయంలోనే ‘ఆత్మజ్ఞానము' యొక్క పరాకాష్ఠ వాక్యాలు సఫలీకృతం అవుతాయి.
అయినా కొంచెము చూచాయగా ఆయాచోట్ల నీ ప్రశ్నకు సమాధానం చెప్పుచూనే వస్తున్నాను. ఉదాహరణకు "భార్గవోపాఖ్యానం’లో కొంతవరకు 'బ్రహ్మమునందు ఈ జగత్తు ప్రకటన, అప్రకటన సమయములందు ఎట్లు ఉన్నది... అన్నది వివరించాను. అయితే సర్వ సంశయములు తొలగునంతటి విస్తారంగా చెప్పియుండలేదు. అందుచేతనే కాబోలు, ఈ విషయమై తగినంత స్పష్టంగా నీవు ఎరుగలేదు.
ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం. నీవు నీ ఆత్మ యొక్క పరిశుద్ధత్వమును, అప్రమేయత్వమును, తదితర లక్షణములను గ్రహించిన తరువాత నీయందు అఖండాత్మబోధ స్వయంగా కలుగుతుంది. ఆ తరువాత నేను చెప్పకపోయినా కూడా నీ ప్రశ్నకు సమాధానం నీవే ఎఱుగగలిగి ఉంటావు. ఇందు సంశయమేమీ లేదు.
ఒకటి అజ్ఞాన విషయం గాని, లేక సుజ్ఞాన విషయం గాని... ఆ విషయమును ఎరుగు చున్నది ఎవరు? ఆత్మయే కదా! అందుచేత జ్ఞానస్థితి యందు ఆత్మబోధచే ఆత్మయే సుప్రసన్నమై ఆత్మ గురించి ఎరుగుచున్నది.
❖
నీకు ఇంతవరకు 'కర్తృత్వం-అకర్తృత్వం' ల గురించి 'భోక్తృత్వం-అభోక్తృత్వం' ల గురించి కూడా చెప్పియున్నాను కదా! నీ ప్రశ్నకు సమాధానం ఆ చర్చలోనే కొంత చూచాయగా అయినా
Page:280
గ్రహించవలసియున్నది. అయినప్పటికీ ఎందుకో నీవు అఖండాత్మ స్వరూపాన్ని ఎరుగకయే ఉన్నావు. ఎందుచేత?... దీనిని బట్టి ఇంకా దృశ్యవాసన శమించవలసి ఉన్నదనియే తెలుస్తోంది.
ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. వాసనలచే ఆక్రమించబడువాడే ‘బద్ధుడు’. వాసనాక్షయమే ‘మోక్షము”. “నేను మరొకటి పొందవలసి యున్నది...” అని భావన చేయటయే వాసన యొక్క వృత్తిరూపం. అందుచేత నీవు "మోక్షేచ్ఛ'ను కూడా విడిచిపెట్టు. బంధం ఉన్నప్పుడే 'మోక్షము’ అనే ప్రసక్తి ఉంటుంది. “నాకు బంధము లేదు” అని ఎవరు గ్రహిస్తారో వారికి ఇక ‘మోక్షము’ యొక్క ప్రసక్తి ఎక్కడిది?
అందుకుగాను మొట్టమొదటగా ఈ దృశ్య విషయములచే పరిపూర్ణమైనట్టి రాజసిక తామసిక వాసనలను క్రమక్రమంగా వదలుకొంటూ రావాలి. ఆ సమయంలోనే 'మైత్రి' మొదలైన శుభవాసనలు గ్రహించు. శుభవాసనలు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయిస్తూనే, కాలక్రమంగా వాసనారాహిత్యము వైపు దృష్టి సారించు. అంతఃకరణంలో ఏ విధమైన 'ఇచ్ఛ' లేనివాడవై క్రమ క్రమంగా 'సమ్యక్ జ్ఞానయుక్తము' అయినట్టి స్థితిని అభ్యసించుచూ రమ్ము. దృశ్యవాసనా స్థానంలో “చిన్మాత్రము” అనే వాసనచే పూరించు. “అంతఃశాంతము”తో కూడిన పరిపూర్ణభావముచే “నేను ఈ దేహమంతా ఆత్మరూపుడనై నిండి ఉన్నాను... అదేరీతిగా, ఎవరెవరితో సంభాషించుచున్నానో, అట్టి ఈ సర్వజీవులందు నేనే మమాత్మ స్వరూపముచే పరిపూర్ణుడనై ఉన్నాను... అను మాధుర్యమును ఆస్వాదిస్తూ ఉండు. 'మనస్సు-బుద్ధి' ల సంచలనరూపమగు వాసనల పట్ల ఉపేక్ష, మౌనములను అభ్యాసం చేస్తూ ఉండు. క్రమంగా మనోబుద్ధులు పరిత్యజించబడగా అప్పుడు శేషించు ఆత్మ స్వరూపం నందు సుస్థిర సమాధానం కలిగియుండు. ఆ తరువాత ఏ అహంకారం చేత... “నేను వాసనలు పరిత్యజిస్తున్నాను" అను నిమగ్నం కలిగియున్నావో... అట్టి ఆ అహం కారాన్ని కూడా పరిత్యజించు. ఎందుకంటే అది కూడా ద్వైత కల్పన నుండే ఏర్పడుతుంది కదా!
8. తాత్సారం చేయవద్దు
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ మహామతీ! రామచంద్రా! ఓ సర్వశ్రోతలారా! తాత్సారం మాత్రం చేయవద్దు. ఈ మానవజన్మ అత్యంత ఉత్కృష్టమైనదని, ఇది అత్యంత దుర్లభంగా మాత్రమే లభిస్తుందని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఈ అవకాశమును తగురీతి ఉపయోగించుకోవటమే ఉచితం.
జీవుని యొక్క ఈ అంతరంగంలో ఒక నిబిడాంధకారము చోటు చేసుకుని ఉంటోంది. అందులో "ప్రాణస్పందన - కాలకల్పన వాసనలు విషయములు, వాటికి ద్వారము వంటి అహంకారము” మొదలైన దుష్టపిశాచాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వాటిని నిరోధించాలి, నాశనం చేయాలి. అందుకుగాను “అఖండబ్రహ్మాకారము” అయిన బుద్ధిని పొందాలి.
Page:281
ఎప్పుడైతే నీవు.. 'విశ్వమునకు అతీతము, కేవల చిన్మయము”... అయినట్టి నీ యొక్క పారమార్థిక స్వరూపమునందు సుస్థిరుడవై ఉంటావో, మరుక్షణం నీయొక్క 'అద్వితీయ బ్రహ్మానంద స్వరూపము’ చే ఈ వర్తమాన భవిష్యత్తు లోకములను సర్వదా పావనమే చేయగలవు. అట్టి ముక్త స్వరూపుడవగు నీకు ఈ లోకములు అత్యంత సహజంగానే నీరాజనం పట్టగలవు.
9. ‘ముక్తుడు’ అంటే?
శ్రీ వసిష్ఠ మహర్షి: వాసనలన్నీ హృదయము నుండి పారత్రోలి, ఎవడైతే సర్వస్థితులందు చింతారహితుడై ఉంటాడో, అతడే ముక్తుడు. అతడే 'పరమేశ్వరుడు' అని కూడా చెప్పబడుచున్నాడు. సమస్త ఆశలు అంతఃకరణం నుండి పారత్రోలబడగా, అట్టి 'శుద్ధాతఃకరణం'తో కూడిన మనుజుడే విముక్తుడు. అట్టివాడు సర్వలౌకిక వ్యవహారములు త్యజించి 'సమాధి'ని అభ్యసించు చుండు గాక! లేక ఈ ప్రపంచమున వ్యవహరించుచుండు గాక! అతని ముక్తిత్వమునకు వచ్చే లోటేమీ లేదు. నైష్కర్యేణ న తస్యార్ధ, న తస్యార్థో 2 స్థి కర్మభిః |
న సమాధాన జప్యాభ్యాం, యస్య నిర్వాసనం మనః ॥
ఈ చిత్తము వాసనారహితమైన తరువాత ఆపై ఇక నైప్యర్మ్యములచేగాని, సమాధిచేగాని, జపముచేగాని క్రొత్తగా సంపాదించవలసినదేదీ ఉండదు.
ఓ లోకకళ్యాణస్వరూపా! రామచంద్రా! మేము సమస్త శాస్త్రములను అతి నిపుణతతో విచారించాం... చాలాకాలం ఒకరితో మరొకరం ఆధ్మాత్యశాస్త్రం గురించి పదే పదే సంభాషిం చుకున్నాం... ఇట్లా ఎన్నోసార్లు శాస్త్రసారములను, పూజ్యుల ప్రవచనములను, స్వానుభవములను బాగుగా వితర్కించి, ఈ ఉత్తమ నిర్ణయానికి వచ్చాం - “వాసనాత్యాగం అవలంబించి ఆత్మస్థితి యందు సుస్థిరులం కావటం... అను పదము కంటే ఉత్తమమైన పదము మరెక్కడా ఏదీ లేదు.”
అనేకసార్లు మేము దశదిశలా సంచరిస్తూ అనేకుల తరగతుల వ్యక్తులతో సంభాషించాం. యథార్థ వస్తువగు బ్రహ్మంను ఎరిగినవారు కొందరు మాత్రమే తారసపడుచున్నారు. వారు వాసనా రహితులై ప్రశాంతతతో సంతోషంతో పరిసరాలను ఆనందపరుస్తూ సంచరిస్తున్నారు. వాసనా రాహిత్యమే ముక్తి.
10. ఇక్కడ అభిలషింపతగినదేది?
శ్రీ వసిష్ఠ మహర్షి: అసలు ఈ ప్రపంచమునందు 'ఇష్టము- అయిష్టము' అయిన దానికంటే వేరుగా ఏమున్నది? ఇష్ట-అనిష్టముల కొరకే ఈ సర్వజీవులు యత్నించుచున్నారు. చిత్రమేమిటంటే ఈ ఇష్టానిష్టములకంటే భిన్నమైనట్టి 'ఆత్మతత్త్వము' కొరకు అనేకులు యత్నించుటయే లేదు.
Page:282
ఈ లౌకిక-వైదిక క్రియలు కూడా అనాత్మభూతమగు దేహాదుల కొరకే చేస్తున్నారు కాని, ఆత్మ కొరకై అనేకమంది యోచించుటయే లేదు.
పాతాలే బ్రహ్మలోకే చ స్వర్గే చ వసుధాతలే ॥
వ్యోమ్ని కతివయా ఏవ దృశ్యన్తో దృష్టదృష్టయః … (శ్లో 32, సర్గ 57)
చిదేకరసమగు బ్రహ్మమును సాక్షాత్కరించుకొనిన మహాత్ములు... ఈ బ్రహ్మ-స్వర్గ-భూపాతాళలోకములలో... ఎక్కడో గాని తారసపపడుట లేదు.
ఈ జనులలో అనేకులు "ఇది త్యజించాలి... ఇది గ్రహించాలి”... అను వ్యసనముతో కూడుకొనిన త్యాజ్య గ్రాహ్య బుద్ధినే కలిగి ఉంటున్నారే? త్యాజ్య గ్రాహ్య బుద్ధి శమించినట్టి జ్ఞానులగు మహాత్ముల సంఖ్య అల్పంగానే ఉంటోందే! ఒకడు చక్రవర్తి అయి, ఈ భూమండల మంతా ఏలవచ్చు గాక! లేదా ఇంద్రపదము పొంది 'వృష్టి’కి అధికారి అయి, మేఘములందు ప్రవేశించ వచ్చు గాక! లేక వరుణపదమును పొంది జలమును ఆక్రమించి ఉండవచ్చు గాక! కాదా, యోగసిద్ధులన్నీ పొంది హాయిగా అటూ ఇటూ విహరిస్తూ ఉండవచ్చు గాక...! అయితే మాత్రం ఏం? ఆ జీవునికి శాంతి కరువే అగుచున్నది. ఆత్మప్రాప్తిచే తప్ప మరింక దేనిచేతా కూడా ఈ జీవుడు విశ్రాంతి పొందజాలడు. ఆత్మానుభవం ఇంద్రియధ్యాసను నిశ్శబ్దపరచినవారికే లభిస్తోంది. ఇంద్రియములు అనే శత్రువులను జయించినవారే శూరులు. వారే మహాధీమంతులు.
ఓ జనులారా! ఈ జనన-మరణ రూప జ్వరమును ఉపశమింపజేయ దలచుకున్నారా? అయితే మీరు ఆత్మజ్ఞానులగు మహాత్ములను సమీపించండి. సేవించండి. ఆత్మ సమాచారం సేకరించండి. తరించండి. అంతే గాని ఈ పదార్థముల పట్ల ఏర్పడు ఇష్టాయిష్టములను నెమఱు వేస్తూ చతికిలపడి కూర్చుని ఉండవద్దు. నాయనలారా! ఈ పాతాళ భూ-స్వర్గ లోకములన్నిటి లోనూ ఉన్నది పంచభూతములే కదా! ఇందలి పదార్థములన్నీ పంచభూతముల సమ్మేళనం మాత్రమే. ఇంక ఆరవ వస్తువు ఏది ఉన్నది? మరి బుద్ధిమంతుడు, ధీరుడు అయినవానికి ఎక్కడకు వెళ్ళినా క్రొత్తగా పొందేదేముంటుంది?
అభిలషింప తగినదంటూ ఇక్కడెక్కడా ఏదీ లేదు. ఏది ఎట్లో - అది అట్లే జరుగుచుండగా, ఇక త్యజించవలసినది మాత్రం ఎక్కడ ఏమున్నది?
ఆత్మజ్ఞానమే మహాశయముగా గలిగినట్టి మహనీయులు ఇక్కడ ఊరకే కాలం వ్యర్థ పరచుకోరు. వారు వేదములందు ప్రవచించబడిన 'బ్రహ్మము' యొక్క స్వభావాదులు ఏమిటో గ్రహిస్తున్నారు. క్రమక్రమంగా బ్రహ్మముతో 'అభేదము' సాక్షాత్కరించుకుంటున్నారు. అందుచేత వారికి ఈ ప్రపంచమంతా గోష్పాదజలం (ఆవు కాలిగిట్ట నేలను తాకుతుంటే ఏర్పడిన స్వల్ప గుంటలోని జలం) వలె అత్యంత సులభంగా తోచుచున్నది. ఎవరైతే బ్రహ్మజ్ఞులచే, శాస్త్రములచే చెప్పబడుచున్న యుక్తులను దూరంగా విడనాడి, విషయానుకూలంగా మాత్రమే వర్తిస్తున్నారో, అట్టివారికి ఈ సంసారము ప్రళయకాల మహాసముద్రము వలె అతి విస్తారంగా కనపడుచున్నది.
Page:283
విశాలచిత్తులై కొందరు సర్వభేదాభేదభావములను ప్రక్కకు నెట్టి ఆత్మానందమునే అనుభవిస్తూ ఉంటున్నారు. అట్టివారికి ఈ బ్రహ్మాండమంతా చేతికందించినా సరే, ఇందులో ప్రత్యేకత ఏదీ వారికి కనిపించుటలేదు. నూతనమైన ప్రయోజనములేవీ వారికి ఉండుటలేదు. “భావనానుసారంగానే అనుభవం ఉంటోంది... ఇక ఈ వస్తుజాలంలో ఏర్పడే క్రొత్తతన మేమున్నది?”... అని వారు మనలను ప్రశ్నిస్తున్నారు. మరి, మూఢులో... ఇట్టి ఈ అల్ప జగత్తులో రాజ్యము మొదలైన సుఖములు కొరకై లక్షలాది జనుల వినాశనమునకు హేతుభూతములగు “యుద్ధము, మోసము” మొదలైన క్రియలందు ప్రీతిగొని ఉంటున్నారు. మానవజన్మ యొక్క అర్థ, తాత్పర్యాలు ఇవా? కాదు. తత్త్వజ్ఞాని సహజంగానే 'దయాళువు' అగుచున్నాడు. దురహంకారం, దురాశ మొదలైనవి అతనికి తుచ్ఛములుగా, అతి నింద్యములుగా తోచుచున్నాయి.
జ్ఞానుల దృష్టిలో ఈ దృశ్యము లోపల మహత్తర పదార్థమంటూ ఏదీ లేదు. అత్యంత ఉత్కృష్టమైనదిగా భావించబడే బ్రహ్మదేవుని పదమే తీసుకో... అది కూడా మహాకల్పాంతమున నశించబోతోంది, కనుక అల్పమైనదే కదా! "సమస్త ప్రాణులు విలయం కావటానికి, ఉత్పత్తి కావటానికి హేతుభూతమగుచున్న బ్రహ్మపదము కూడా మానసిక వ్యధతో కూడుకొనినదే” అని చెప్పబడుతోంది. అట్టి పదవి అజ్ఞానుల దృష్టిలో గొప్పది కావచ్చునేమో గాని, జ్ఞానులు దృష్టిలో కాదు. జ్ఞానుల దృష్టిలో, “నిత్య-శుద్ధ-ముక్త- అఖండము, అతిసులభము అగు స్వస్వరూపమున సుస్థిరులై ఉండటం” అనేదే అన్నిటికీ మించియున్న పదము. అందుచేత జ్ఞానికి బ్రహ్మదేవుని పదమునందు కూడా 'ఆకాంక్ష' ఉండదు.
తత్వవేత్తల దృష్టిలో ఈ సృష్ట్యాదులచే ఏమీ ఉత్పన్నము కాకయే ఉంటోంది. కనుక, ఈ ముల్లోకములు సంప్రాప్తిస్తే మాత్రం ఆత్మకు క్రొత్తగా వచ్చి చేరేది ఏమి ఉంటుంది? కోల్పోయేదేమి ఉంటుంది? ఇదిగో... ఈ భూభాగం చూచావా? ఇది ఒక వైపు పర్వతములతోను, మరొక వైపు జలముతోను నిండి ఉన్నది కదా! మధ్యలో ఉన్న ఈ భూభాగములోని 'రాజ్యము' అను ఒక స్వల్పస్థలము క్రొత్తగా చేరి జ్ఞానిని పూర్ణునిగా చేస్తుందా? సర్వము ఎరిగిన తరువాత రాజ్యములు ఎంతటివి? భూభాగములు ఎంతటివి? అసలు ఈ శరీరము ఎంతటిది? శుద్ధము, నిత్యము అగు చైతన్యమునకు, అజ్ఞానజనితములైన “నా రాజ్యం - నా భూభాగం - నా వారు"... అనువాటికి సంబంధమెక్కడ? అందుచేత ఆత్మజ్ఞానికి ఈ పాతాళ భూ-స్వర్గ విభాగములలో ఎక్కడా కూడా అవశ్యం కర్తవ్యమైనదీ - అవశ్యం పొందవలసినదీ ఏదీ లేనేలేదు. సర్వదా సర్వత్రా ఏకత్వమే అతనికి కనబడుచున్నది. అతడు తనకుతానే ఆకాశం వలె విశాలమైన రూపం కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడు స్వస్థచిత్తుడై ఉంటున్నాడు. దేహసమూహములచే, అనేక పరస్పర వ్యతిరిక్త విషయాలచే నిండియున్న ఈ త్రిలోకములు అతనికి మృగతృష్ణా జలంలాగా, నిర్మలాకాశంలాగా శూన్య రూపంగా ఉంటున్నాయి. అతనికి వీటియందు శాంతము, రమణీయతలు మాత్రమే గోచరిస్తు న్నాయి. అతడు వాటికన్నిటికీ అతీతుడై, ఆపై వాటిని చూస్తున్నాడు. 'ఈ జగత్తులోని పదార్థ జాల మంతా తుచ్ఛము, స్వల్పకాలికము'... అని గ్రహించి అతడు వర్తించుచున్నాడు. సూర్యుని దృష్టి ఏ
Page:284
పదార్థమునందూ 'సంకుచితము-పరిమితము' అవదు కదా! జ్ఞాని దృష్టి ఏ మాత్రం ఆకర్షణ వికర్షణలు పొందుట లేదు.
‘బ్రహ్మం’ అనే నిర్మల సముద్రంలో ఈ 'దృశ్యవ్యవస్థ' అంతా నురుగు-బుడగలు-కెరటాలు వంటిది మాత్రమే. బ్రహ్మము ఆకాశంలోని సూర్యుడై యుండగా, ఈ జగత్తు 'మృగతృష్ణ'లోని
జలము వంటిది.
ఆత్మతత్త్వమహాంభోధివీచయః సర్గరాజయః |
అనుత్తమవదాంభోద వృష్టయః శాస్త్రదృష్టయః | (శ్లో 47, సర్గ 57)
ఈ కనబడే సృష్టులన్నీ ఆత్మమహాసముద్రంలోని తరంగాల వంటివి. ఇక్కడ కనబడే వివిధ శాస్త్రసారములు సర్వోత్తమమగు 'పరబ్రహ్మం' అను మేఘం నుండి వర్షించు వర్షధారుల వంటివే.
ఇక్కడ ఏవేవి కనబడుచున్నాయో, అవన్నీ కూడా 'ఆత్మ' చేతనే ప్రకాశితములగుచున్నాయి. చమత్కారం చూచావా? ఆత్మయే వాస్తవస్వరూపంగా కలిగియుండి కూడా ఈ జీవులలో అనేకులు పరిచ్ఛిన్న దేహభావమును కలిగి ఉంటున్నారు. హింసాస్వభావయుతులై, 'కామభోగాలు' అనే గడ్డి పరకలను సేవిస్తూన్నారు. జ్ఞానసముపార్జనకు అర్హమైన ఉపాధులు సంపాదించుకొని కూడా మృగతుల్యంగా రాత్రి-పగలు గడుపుచున్నారు. ఇది ఉత్తమమా? సార్థకమనిపించుకుంటుందా? శ్రీరాముడు: స్వామీ! ఈ దేహములన్నిటి యొక్క ప్రయోజనమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ దేవ-మనుష్య తదితర అస్థి-మాంససహిత దేహములన్నీ అజ్ఞానమును ఆశ్రయించిన అభాగ్యజీవుల వ్యాహ్యాళి కొరకే నిర్మించబడుచున్నాయి. ఈ అనేక జీవుల అస్థిపంజరాలన్నీ అల్పజ్ఞాన జీవులను బంధించటానికి అమర్చబడిన ఎలుకల బోను వంటివే. బంధనము కొరకే సంసారారణ్యంలో ఇవి ఏర్పడి ఉంటున్నాయి. చర్మముచే కప్పబడిన తోలు బొమ్మలవంటి ఈ రక్తమాంస దేహములను భోగభూములందు ఏర్పరచి ఉంచినది అజ్ఞాన బాలురవంటి జీవుల వినోదార్థమే సుమా!
ఇక్కడి విషయాలు బహుదుఃఖపూరితమే అగుచున్నాయి. అయితే మందమైన వాయు వీచికలు పర్వతాన్ని కదల్చగలవా? సర్వత్యాగియగు వివేకిని ఈ సంసారాడంబరమంతా తాకనైనా తాకలేదు. ఇక్కడి విషయాలు, విశేషాలు అతనిని ఏ మాత్రం కదల్చలేవు.
జ్ఞాని సర్వదా సర్వోత్తమమగు బ్రహ్మపదమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అతడు దీని నంతా క్రీడామాత్రంగా సందర్శిస్తూ, సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తత్త్వజ్ఞానము యొక్క చిత్ప్రకాశం చేతనే 'బ్రహ్మ' మొదలగు లోకపాలకులు ఈ జగత్తునంతటినీ ప్రకాశింప జేయుచున్నారు. చిత్ప్రకాశము యొక్క ప్రభావంచేతనే ఈ నేత్రములు మొ॥ ఇంద్రియములు, ఈ బుద్ధీ, ఈ బాహ్యప్రదేశములు ఇవన్నీ కూడా ప్రవర్తించగలుగుచున్నాయి. లోకపాలకులగు బ్రహ్మ మొదలైన వారు ఒకవైపు దేహరహితమగు ఆత్మను వివేచించి చూస్తున్నారు. మరొకవైపు దేహాత్మభావముచే ఈ దేహాదులను రక్షించు ధర్మమును నిర్వర్తిస్తున్నారు.
Page:285
జ్ఞాని ఈ దేహములు పొందినందుకు ప్రయోజనంగా తనయందలి భోగవాసనలను సంక్షయింప జేసుకోవటానికి ప్రయత్నములు చేస్తున్నాడు. విశాలమైన హృదయం, శుద్ధము పవిత్రము అయినట్టి అంతఃకరణములను పొందుచూ, ఈ సర్వపదార్థములందు ఆసక్తిని త్యజించి వేస్తున్నాడు.
పరమశివుడు పార్వతీదేవి నృత్యమునే అభిలషిస్తాడు గాని, కోతుల నృత్యమును కాదు కదా! పవిత్రాతఃకరణుడికి దేనిపట్లా అభిలాష ఉండదు. ఇక్కడి నృత్య గీతాదులన్నీ అతనికి చిలుక పలుకుల వలె అర్థరహితమై ఉంటాయి. ఒక రత్నము తన యందు ప్రతిబింబించే వాటిపట్ల 'వీటిని నేను సర్వదా కలిగి ఉండాలి" అని భావన చేస్తుందా? తనయందు ప్రతిబింబిత వస్తువుల పొందుటచే తనకు లాభమేమున్నది? నష్టమేమున్నది? అనురక్తి ఏమున్నది? విరక్తి ఏమున్నది? జ్ఞాని ఈ జగత్పదార్థములను, సంఘటనలను అపరిచిత గ్రామంలోని అపరిచితుల ఇంట్లో జరిగే పెళ్ళి సందడిలాగా దూరంగా తాను ఉండి చూస్తూ ఉంటాడు.
అజ్ఞాని దృష్టిలో ఇక్కడ ఒక గడ్డిపరక నుండి బ్రహ్మలోకము వరకు ఈ పదార్థములన్నీ సుస్థిరంగాను, దుర్భేద్యంగాను ఉన్నాయి. జ్ఞానికో... ఇవి, నీటియందు ప్రతిబింబించే 'ఆకాశముచంద్రుడు-నక్షత్రములు” లాగా... అస్థిరములు, అసత్యములు, అతి చంచలములు అయి ఉన్నాయి. ఎందుకంటే, అతడు తత్త్వదృష్టిచే ఇదంతా మిథ్యారూపంగా దర్శించుచున్నాడు.
ఇక్కడి అల్ప తుచ్ఛ విషయసుఖములు, తదితర వ్యవహారములు అతనికి ప్రీతిని కలిగించుట లేదు. బంధము కలిగించుట లేదు. స్వీకార తిరస్కార భావాలకు అతీతంగా వీటిని అతడు మౌనస్వరూపుడై చూస్తున్నాడు.
అతడు దేనినీ కలిగియుండుట లేదు, త్యజించుట లేదు. అతడు అంగీకరించడు, తిరస్కరించడు. తదితర అజ్ఞానులతో తాను కూడా ఉంటున్నప్పటికీ వారి అవగాహనలు, ఆర్తులు, ఆశలు మొదలైనవి అతనికి అలవోకతో కూడిన చిరునవ్వు మాత్రమే పుట్టిస్తున్నాయి.
ఓ రామచంద్రా! ఈ విషయమై ఒకప్పుడు బృహస్పతి కుమారుడగు కచుడు చెప్పిన ఒక పవిత్రమైన వృత్తాంతమును వినిపిస్తాను.
Page:286
IX. కచుని గానం
1. కచుని స్వవిచారణ
శ్రీ వసిష్ఠ మహర్షి: దేవతల గురువు బృహస్పతి. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే కచుడు. ఆ కచుడు ‘బ్రహ్మవిద్య'ను ఒకప్పుడు 'మననము’ చేత, నిధిద్యాసచేత బాగా అభ్యసించి ఉన్నాడు. అట్టి అభ్యాసం యొక్క పరిపాకం చేత ఆత్మయందు విశ్రాంతి పొందాడు. 'సమ్యక్ జ్ఞానం' (Equality towards everything everywhere, all times) అనే అమృతం పానం చేశాడు. ఇక అతని బుద్ధిలో... పంచభూతములచే తయారు చేయబడిన - అతి నికృష్టము... అగు ఈ దృశ్యము నందు ఏమాత్రం అనురాగముగాని, విరాగముగాని లేకుండా పోయింది. ఉదాసీనుడయ్యాడు. ఆత్మ కంటే వేరుగా పొందవలసినదేదీ అతనికి కనిపించుటలేదు. అప్పుడు ఆతడు ఈ విధంగా ఆత్మతత్వాన్ని గానం చేయనారంభించాడు.
❖
కిం కరోమి క్వ గచ్ఛామి కిం గృష్ణామి త్యజామికిం |
ఆత్మనా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా || (శ్లో 5, సర్గ 58)
శ్రీ కచుడు: ఆహాఁ! ఇప్పుడు నేనేమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేనిని గ్రహించాలి? మహా ప్రళయంలో ఈ బ్రహ్మాండమంతా జలంతో నిండిపోవుచున్నట్లు, ఈ విశ్వమంతా ఆత్మచే పరిపూర్ణమై ఒప్పుచున్నది కదా!
సమస్తము ఆత్మమయమేనని నేను తెలుసుకున్నాను. తత్త్వజ్ఞానోదయం కానంతవరకే దుః ఖములు నన్ను సమీపించాయి. జ్ఞానం ఉదయించిందా, దుఃఖములు... ఆ దుఃఖములను అనుభవించే జీవులు... ఆ జీవులకు ఇష్టమగుచున్న సుఖము... అంతా కూడా కేవలం 'శూన్యము మాత్రమే' అని తోచుచున్నది. “సమస్తము ఆత్మమయమే”... అని గ్రహించుచుండగా ఇక కోల్పో యేది ఏముంది? పొందేదేముంది? ఆత్మచేతనే సర్వదుఃఖరహితుడనగుచున్నాను. ఆత్మకు వేరైన వస్తువు ఎక్కడా ఏదీ లేదు కాబట్టి, ఇక నాకు దేనివలనకూడా ఏ ప్రత్యేకమైన ప్రాప్తి ఉండదు.
స్వర్గమా? మర్త్యలోకమా? పాతాళలోకమా? అవన్నీ కూడా ఆత్మతోనే నిండి ఉన్నాయి. ఇక వాటిలో భేదమెక్కడ? ఆత్మయే అయిఉండుటచే, భేదమెక్కడ? ఈ శరీరము యొక్క బైట, లోపల, సర్వ దిక్కులందు, పైన, క్రింద... అంతటా సర్వత్రా ఆత్మయే వ్యాపించియున్నది. ఆత్మ లేనిది, ఆత్మ కానిది అయిన చోటు ఏది? ఏదీ లేనే లేదు.
Page:287
‘కుండ’ యొక్క ఆకారము ఉన్నదెందులో? మట్టిలోనే కదా! ఈ జగత్తు అంతా సర్వదా అట్లే ఆత్మయందే ఉన్నది. మట్టి, "అయ్యో! నేను కుండనయ్యానే?” అని వేదన చెందుతుందా? లేదు కదా! మట్టి సర్వదా మట్టియేకదా!
సర్వత్రైవస్థితోహ్యాత్మా సర్వమాత్మమయంస్థితమ్ । |
సర్వమేవేదమాత్వైవ మాత్మన్యేవభవామ్యహమ్ ॥ (శ్లో 8, సర్గ 58)
అనగా ఈ జగత్తుకు అధిష్ఠానం ఆత్మయే. ఇక వివర్తభావంగా చూస్తే... ఆత్మయే ఈ జగత్తు రూపమున ప్రకాశిస్తోంది. తత్త్వదృష్టిచే ఇదంతా ఆత్మయే అయి ఉన్నది. ఈ విధంగా నేను ఎల్లవేళల పరమాత్మ స్వరూపమగు ఆత్మయందే నెలకొనియున్నాను. కాబట్టి పరిశుద్ధమగు పరమాత్మయే నేను. బ్రహ్మము-బ్రహ్మదేవుడు అనబడేదంతా నేనే.
"పరమాత్మకంటే వేరుగా 'జీవుడు' అనబడేవాడు ఒకడు ఉన్నాడు" అని అంటే... అది మిథ్యతో కూడిన ప్రతిపాదన మాత్రమే. పరమాత్మకంటే అన్యంగా ఖండరూపమున నేను లేను. అందుచేత నేను ఈ చేతన-అచేతన రూపములందు అంతటా కూడా ఆత్మస్వరూపుడనై వ్యాపించి ఉంటున్నాను.
“సన్మయము” (Absolute Existence) అయినట్టి ఆత్మయే ఆకాశమండలమును కూడా పూర్ణం చేసివేస్తూ సర్వత్రా వెలయుచున్నది. నిర్మలము, నిత్యోదితము, అఖండము అయినట్టి ఆత్మయే స్వరూపముగా గల నేను ఆ విశేషణములన్నింటికీ సర్వదా, సర్వస్థితులలోనూ తగియే
ఉన్నాను కదా...!
కనుక మంచిది! ఇప్పుడు... “నేను పరిపూర్ణుడనై ఆనందస్వరూపుడనై, సుఖమయుడనై ఏకమగు ఆత్మ మహాసముద్రమునందు అంతటా సర్వదా సుస్థితుడనైయున్నాను”... అని నాచే గ్రహించబడుచున్నది.
ఈ విధంగా ఆ కచుడు గానం చేస్తూ ఉన్నాడు. ఇట్టి భావనకు 'సంజ్ఞ' అయినట్టి 'ఓం' కారమును ఉచ్చరించ ఆరంభించాడు. ఓంకారము యొక్క 'అర్థమాత్రము” నందు సమస్తము లయం చేసివేశాడు. ఇప్పుడు అతడు అభ్యంతరమగు 'కారణము' నందులేడు. బాహ్యము అయినట్టి 'కార్యము' నందు కూడా స్థితి కలిగియుండలేదు. కేవలం పరమాత్మ స్వరూపము మాత్రం భావన చేస్తున్నాడు. సమస్త కల్పనాకళంకములు రహితం చేసుకున్నాడు. శుద్ధుడయ్యాడు. 'ప్రాణగతి'ని కూడా హృదయమునందు విలయం చేశాడు. మేఘరహితమగు నిర్మలాకాశంలాగా “నిర్మలాంతఃకరుణుడు”... అయ్యాడు.
Page:288
2. ఆత్మాశ్రయం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! “సర్వము ఆత్మయే” అను దర్శనము పొందిన తరువాత, అట్టి జీవుని యొక్క అవగాహనను నీకు తెలియజేయటానికే ఈ కచుని సమాలోచనను వర్ణించి చెప్పాను. భోగములను నమ్మి ఉండరాదు. ఆత్మనే ఆశ్రయించి ఉండటం ఉచితం.
ఈ ప్రపంచములో కనబడుచున్నవన్నీ సమీక్షిస్తే ఇవి... "అన్నము-పానము-స్త్రీ సంగమము' ... ఇంత మాత్రమే కదా! ఇంతకు మించి ఇక్కడి ఆయా పదార్థములలో ఏమి పురుషార్ధం ఉన్నది? వివేకి అయినవాడు ఈ విషయాన్ని శ్రుతి-స్మృతుల సహాయంతో, సద్గురువులు చెప్పుచున్న ఉపదేశములచేత, స్వానుభవంచేత నిశ్చయించుకుంటున్నాడు. ఇక ఆతడు భోగములను ఏమాత్రం ఆశించుట లేదు.
ఓ జనులారా! మీరు పశు, పక్ష్యాదులలాగా మూఢులై, "నీచము, నశించే స్వభావము కలిగినవి”... అయినట్టి విషయభోగముల పట్ల విశ్వాసం కలిగి ఉండటం ఉచితమా? అయ్యో! గాడిదల వలె నివసిస్తూ ఉత్తమమగు ఈ మానవజన్మను వృథాపరచుకోవటం మంచిదా? “రక్తమాంసములు మాత్రమే" అయిన ఈ తుచ్చ శరీరాదులపై మీకు అహంకార మమకారములు (నేను, నాది-అను భావములు) ఎందుకు ఏర్పడుచున్నాయి? వీటిలో 'కేశములు, బొమికలు' తప్ప ఇంకేమీ ఉత్తమ విషయాలు లభిస్తున్నాయి చెప్పండి? ఆహారనిద్రామైథునాలకే పరిమితులు కాదలచుకొన్నవారు జంతు ఉపాధులను మించి ఏం గొప్ప ప్రయోజనం పొందుచున్నారు?
ఈ భూమి అంతా మట్టిమయమే...! వృక్షములన్నీ కొయ్యతోనే నిండి ఉన్నాయి...! “పైన ఆకాశం క్రింద భూమి” గల ఈ ప్రపంచంలో సుఖప్రదమగు అపూర్వ వస్తువు ఏమి ఉన్నది? ఈ ఇంద్రియములను గమనిస్తే, ఇవి ఎప్పటికప్పుడు అల్పమైన విషయాలు పొందటానికే ఆరాట పడుచున్నాయి. అవి ఎంత చూచినా, వినినా, పొందినా వివేకము పొందటానికి ఏమాత్రం సమాయత్తమగుటయే లేదు.
నాయనా! రామా! ఈ 'సంసారారణ్యం'లో సంచరించే జనులయొక్క వ్యవహారములన్నీ విచారించబడనంతసేపు మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. కాని అవన్నీ చివరకు మోహ హేతువులుగానే పరిణమిస్తున్నాయి. పాపం, ఈ మానవుడు సుఖమును గూర్చిన అనేక ఆశలు కలిగి ఉంటున్నాడు. వేటి వేటి కొరకై 'ముందు ముందు సుఖించగలను' అని అనుకుంటూ ప్రయాసతో ప్రయత్నములు చేస్తున్నాడో, అవన్నీ దుఃఖప్రదములే అవుతున్నాయి. ఇక్కడ గల పాప భావములకు పాప విషయకాలుష్యమునకు, వియోగ విషాదాదులకు అంతు ఉండుట లేదు కదా!
ఈ పంచేంద్రియములు, ఈ మనస్సు ప్రతి క్షణం ఏవేవో వస్తువులను పొందటం, కోల్పోవటం చేస్తున్నాయి. ఈ విషయసంపదలను చూచుకొని మురిసినంతసేపు పట్టదు. మన ఈ గొప్ప గొప్ప శరీరములు ఏ క్షణమైనా పతనం కావటానికి సిద్ధపడియే ఉంటున్నాయి.
Page:289
ఎంతటి చిత్రమైన విషయం! ఈ జీవుడు, రక్తం, మాంసం, చర్మముల సంఘాతములచే ఏర్పడుచున్న బొమ్మవంటి స్త్రీ దేహమును చూచి "ఆహాఁ! ఈమె నా ప్రియురాలు... ఈమె ఎంత అందంగా ఉన్నది...!” అని తలచుచు మురిసిపోవుచున్నాడు. అట్టి మాంస బొమికల అమరికను ఆలింగనం చేసుకొని 'ఇంతకుమించి ఇంకేమి కావాలి?' అని తలచి విజ్ఞాన, వివేకముల మార్గము నుండి వైదొలగుచున్నాడే...! ఓ రామా! ఇదంతా అజ్ఞానికి సంతోషప్రదమైతే అగుగాక! జ్ఞానికి ఇదంతా అత్యంత చోద్యం, అస్థిరం, అసత్యము కూడా. సరైన అవగాహన లేకుంటే ఇది దుఃఖ ప్రదమే. ఈ విషయభోగములను అల్లంత దూరంలోనే చూచిన వివేకి వాటిలోని విషత్వమును గమనిస్తున్నాడు. విషయములు పొందినంత మాత్రంచేత 'భోగతృష్ణ' క్షీణించగలదా? లేదు. తాంపరిత్యజ్యభోగాస్థాం స్వామైకత్వగతింభజ |
అనాత్మమయభావేన చిత్తంస్థితిముపాగతమ్ ॥ (శ్లో. 11, సర్గ 59)
ఇట్టి భోగములందు విశ్వాసము త్యజించుటయే మంచిది. నీవు కేవలం ఆత్మనే ఆశ్రయించు. శరణువేడు, భావించు. అంతే గాని భోగవాసనలను అధికం చేసుకుంటూ అనాత్మ స్వరూపమగు దేహాదులు గురించి భావనను చేయనేవద్దు. అట్టి నీచభావనలయందు నీ చిత్తము స్థితి పొందిందా... మరుక్షణము నుండి అసన్మయమగు ఈ జగజ్జాలమంతా వచ్చి ఎదురుగా నిలచి ఉంటోంది.
3. బ్రహ్మము : బ్రహ్మదేవుడు - చైతన్యము - : సృష్టి
శ్రీ రాముడు మహర్షీ! బ్రహ్మము నుండి “బ్రహ్మదేవుడు” అను సమష్టిజీవుడు ఎట్లు ప్రకటితమగుచున్నాడో వివరించండి. అతని యొక్క మనస్సుచే ఈ జగత్తు ఎట్లా ఉత్పత్తి చేయబడుతోందో కూడా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మము నుండి మొట్టమొదట 'సంకల్పించుట” అను విశేషముతో కూడుకొన్న మనస్సు రూపంలో ఒక భావకెరటం ఉత్పన్నమగుచున్నది. 'ఎఱుగుట' అను తత్వము నుండి బయల్వెడలిన ఆ ప్రథమక్రియాచైతన్యమే ప్రథమ జీవుడు. ఆతడే హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు కూడా. అట్టి "సంకల్పాత్మక మనోరూపము, కల్పితము అయిన ఆకృతి గల చైతన్య స్రవంతి” యే భావిసృష్టికి సంబంధించిన యత్నము ఒనర్చుచున్నది.
అతని అట్టి సంకల్పమే మహాప్రకాశయుక్తమైన తేజమును రచించుచున్నది. ఆ సంకల్ప పరంపరావ్యవహారం తన తేజస్సుచే దిక్కులన్నీ వ్యాపించుచున్నది. అపరిచ్ఛిన్నమై, ఆవరణ రహితమై ఒప్పుచున్నది.
అట్టి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై వెలుగొందుచున్నాడు. ఈ మనో-బుద్ధి-చిత్తఅహంకారములే అతని చతుర్ముఖములు. అట్టి చతుర్ముఖముల ప్రసరణచే (తన మనో తేజముచే)
Page:290
“స్వసదృశమే” (Not different from his own self) అయినట్టి ఈ కనబడే దృశ్యజగత్తును నిర్మించుచున్నాడు. అనగా... మనస్సే హిరణ్యగర్భుడు. ఆ మనస్సుచే గాంచబడేదే దృశ్యజగత్తు.
నేను, నీవు తదితరులు కూడా మనస్సునందే మనస్సుచే మనస్సు కొరకు ఈ జగత్తును ఇట్లు పొందుచున్నాం. అట్లు “స్వకల్పనాసామర్థ్యము” చే సృష్టించబడ్డ తేజోమండలము నందలి తేజము నుండి సూర్యమండలం ఉద్భవించింది. ఆ సూర్యమండలం అగ్నిజ్వాలల వంటి తన కిరణములచే ఆకాశమును నింపివేస్తోంది.
అట్లు సూర్యుడు నిర్మించబడిన తరువాత శేషించిన కళారూపమును తొమ్మిది విధాలుగా విభజించబడ్డాయి. అట్లు తొమ్మిదిమంది ప్రజాపతులు ఏర్పడ్డారు. వారు బ్రహ్మదేవుని సంకల్పంచే సమస్త సిద్ధులు పొందినవారై స్వసంకల్పములను అనుసరించారు. తదనుసారంగా తమ ఎదుట మాయా పదార్దములను చూడసాగారు. “మరీచి" మొదలైన ఈ ప్రజాపతులచేతనే దేవతలు, దానవులు మొదలైన వివిధములైన జీవరాశులు ఏర్పడినాయి. వారింకా అనేక స్వభావములతో, తత్త్వములతో, శక్తులతో కూడిన జనులను, వస్తువులను సృష్టించారు. కాలక్రమంగా పుత్రులు, పౌత్రులు మొదలైన పరంపరచే ఈ సృష్టి అంతా పరివర్ధమానమగుచున్నది.
ఆ తరువాత సమష్టి సృష్టి అహంకారియగు బ్రహ్మదేవుడు వేదసంస్మరణం చేయుట ద్వారా ఈ జగతియందు 'నియతి' ని కల్పించుచున్నాడు.
ఇక్కడ నీవు గ్రహించవలసినదేమిటి? మనస్సే ఆ విధంగా విశాలమగు బ్రహ్మదేవుని రూపం ధరిస్తోంది. అట్లు ధరించి “భూతసంతతిచే పరివ్యాప్తమైయున్న ఈ సంకల్పమయ సృష్టి”ని విస్తరింపజేస్తోంది. ఇక ఈ సృష్టి 'సముద్రం-పర్వతాలు-వృక్షాలు దిక్కులు' మొదలైన అనేక పదార్థములచే పూర్ణమై ఉంటోంది. అన్ని దిక్కులను ఆక్రమించిన ఉదరభాగం కలిగి ఉంటోంది.
క్రమంగా ఈ 'సృష్టి’ అనబడు జగదృశ్యము అనేక శారీరక సుఖదుఃఖములతోను, మానసిక వ్యధలతోను, జరా, జన్మమరణములతోను కూడినదై ఉంటోంది. అందుచేతనే "ఈ దృశ్యమును త్యజించినవారై ఉండండి" అని ఆత్మతత్త్వము ప్రవచించే శాస్త్రములు మనకు చెప్పు చున్నాయి. “మనస్సుచే కల్పించబడినది మాత్రమే”... అయినట్టి ఈ సృష్టి వ్యవహారమంతా రాగ ద్వేష మయమగు దృష్టిచే గాంచబడిందా... ఇదంతా 'ఉద్విగ్నత'కు కారణమగుచున్నది. అట్టి మనో కల్పన యందు సాత్విక రాజసిక తామసాలనే త్రిగుణాలు నిండుగా ఆక్రమించుకొని ఉంటున్నాయి.
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ప్రతిపాదిస్తున్నాను. హిరణ్యగర్భుడు అదిగా ప్రారంభ మైన ఈ మనోమయ సృష్టి అంతా ఆత్మదృష్ట్యా 'లేనిదే' అగుచున్నది. అందుచేత 'స్వస్వరూపాత్మ' యొక్క ఆత్యంతికానుభవము కొరకై ఆ మనోమయసృష్టి మొదలంటా త్యజించబడాల్సిందే.
❖
Page:291
బ్రహ్మదేవుని నుండీ ఈ మనస్సు ఆవిర్భవిస్తోంది కదా! ఈ మనస్సు ఇతఃపూర్వపు కల్పంలో ఏ వస్తువును ఎట్లు దృశ్యమానంగా పొందిందో, ఈ కల్పమునందు నేటి వరకు అట్లే పొందుచున్నది.
ఈ మనస్సు, దీని యొక్క 'సమష్టిత్వము' దృష్ట్యా సర్వభూతములందు ఉన్నది. వ్యష్టి దృ ఇది కొన్ని భూతములందు మాత్రమే మననము కలిగియుంటోంది.
ఈ ప్రపంచమును సంకల్పించుచు, తదనుసారంగా తనకు తానే వీక్షించుచున్నది ఈ మనస్సే కదా! ఇక్కడ లభిస్తున్న 'జగన్మోహము' అంతా మనస్సుచే అకస్మాత్తుగా కల్పించబడి స్థిరత్వం పొందుతోంది.
అంతా సంకల్పబలమే - సంకల్పబలం చేతనే జగత్రియలన్నీ ఉత్పన్నములౌతున్నాయి. సంకల్పబలం చేతనే దేవతలు నియతికి వశులై వెలువడుచున్నారు. సంకల్పముచే జనించిన సృష్టిలో దేవ దానవాది చక్రవర్తులు తమ తమ స్వభావములైనట్టి సాత్విక రాజసిక తామసిక వృత్తులను ప్రకటిస్తూ ప్రేరేపణ పొందుచున్నారు. ఇక్కడి జన్మ- జరా-బంధ-మరణాదులన్నీ సంకల్పమాత్రములే.
4. సృష్టి - - ఉపసంహారం
ఒక్కొక్కప్పుడు సాత్విక-రాజసిక తామసిక వృత్తులచే ఈ సృష్టి మరల మరల బాగుగా పీడించబడుచున్నది. అప్పుడు మనోమయజనితుడు అగు బ్రహ్మదేవుడు పద్మాసనము వైచుకుని ఉండి, ఇట్లు సంకల్పిస్తున్నాడు...
"ఆహాఁ! ఈ పాతాళము, భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గమార్గములు, రుద్రులు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, పర్వతములు, సాగరములు మొదలైన ఆయా పదార్థములతో కూడిన వ్యష్టి జగత్తంతా మనస్సు యొక్క స్పందనచేతనే ఏర్పరచబడుచున్నాయి కదా!
మనస్సు యొక్క క్రియాశీలత్వమే ఇదంతా. మనస్సు నా నుండే ప్రభవిస్తోంది. కనుక, ఈ వ్యవహారమయ సృష్టి అంతా నా నుండే ఉద్భవించుచున్నది. ఇదంతా నా సంకల్పమే. దీనిని నలువైపులా వెదజల్లింది నేనే. అట్టి ఈ సంకల్పములను ఇప్పుడు విరమించెదనుగాక!” - ఇట్లు నిశ్చయం చేసుకుంటున్నాడు. శాంతుడగుచున్నాడు. 'కల్పనలు' అను అనర్థసంకటముల నుండి విరతి (withdrawl) చెందుచున్నాడు.
అట్టి సమయంలో అనాదిగా సర్వదా సిద్ధించియే ఉన్న బ్రహ్మమును మనస్సుచే స్మరించ ప్రారంభించుచున్నాడు. అంతే... ఇకపై స్మరణ మాత్రం చేతనే అతడు పరమాత్మను పొందుచు న్నాడు. వ్యవహారములలో పాల్గొనుచున్న ఒక వ్యక్తి ఎంతో అలసిపోవుటచే, ఆ వ్యవహారములు ముగిసిన తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు సుఖవిశ్రాంతిని పొందుచున్నాడు చూచావా? ఆ బ్రహ్మ