Page:492

4. సుజ్ఞానప్రాప్తి

విష్ణుభగవానుడు అంతర్ధానమైన తరువాత గాధి తనకు కలిగిన 'సమ్మోహనము' గురించి మరల విశ్లేషించటం ప్రారంభించాడు.

గాధి (తనలో) : ఇదేమిటి? అంతా మోహము చేతనే గాంచినావు" - అని నారాయణుడు వ్యాఖ్యా నిస్తున్నాడు? అసలు అతిథి, ఈ భూమండపము - - ఇవన్నీ ఉన్నాయా? లేవా?

ఆతడు మరికొన్ని చిన్న - పెద్ద సందేహాలు పొందాడే గాని, సంశయములు తొలగనే లేదు. ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందనే లేదు. ఇక అక్కడి నుండి లేచి ఆకాశంలోని మేఘంలాగా అటూ ఇటూ సంచరించసాగాడు. మరల ఒకసారి ఆటవిక గ్రామం, కీరదేశం వెళ్ళి తిరిగి నిజాశ్రమమైన గిరి ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమం చేరిన రోజు నుండి మరల విష్ణుభగవానుని ఆరాధించసాగాడు. అతి స్వల్పకాలంలో జనార్థనుడు మరల ప్రత్యక్షమైనారు. ఎవరికి ఆ విష్ణుదేవుడు ఒకసారి దర్శనమిస్తారో, అట్టివారికి ఆతడు బంధువు అవుతాడు. స్వామి చిరునవ్వుతో గాధిని సమీపించి ఆతని ప్రక్కనే చేరి కూర్చున్నారు.

శ్రీమన్నారాయణుడు : ఏమిటయ్యా? మరల నా దర్శనం కోరుకున్నావు? మళ్ళీ ఏమైంది? గాధి : స్వామి! సుస్వాగతం! మీకు శ్రమనుకలిగించి నందుకు క్షమించండి. ఏం చేయమంటారు మరి? ఈ మాయ యొక్క చమత్కారం నన్ను అత్యంత ఆశ్చర్యపరుస్తోంది.

హే శ్రీమన్నారాయణా! మీ దర్శనమైన తరువాత నేను కీరదేశం తదితర స్వప్న భావిత ప్రదేశములలో ఒక ఆరు నెలల పాటు తిరిగి వచ్చాను. క్రితంసారి వెళ్ళినప్పటి సమాచారం ఈసారి సమాచారంలో ఏమీ భేదం లేదు. ప్రభూ! "భూమండల ప్రదేశమంతా మాయ చేతనే చూచావు అని మీరు అన్నారు కదా? మాయావశం చేత నేను గాంచినది మరొకచోట - మరొక సమయంలో ఎట్లు ఏర్పడి ఉన్నాయో నాకు బోధ పడుటలేదు.

ఇక రెండవ ప్రశ్న. నేను చూచిన మాయ నాకు సంబంధించినది మాత్రమే కదా! మరి కొందరు జనులు కూడా నేను చూచిన మాయలో భాగస్వాములై ఇప్పటికీ భౌతిక ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారే? ఆ ఆటవికుని వృత్తాంతమంతా ఈ ఇంద్రియములకు లభిస్తూ ఉండటం జరుగుతోందే? మీరు నాకు “ఇది మాయయే” - అని చెప్పారు. సరే, బాగానే ఉన్నది. మాయచే అంతరంగమున చూడబడినవి జగత్తులోనికి ఎలా "ఇతర జీవుల స్వతంత్ర రూపాలుగా ఉన్నాయో నేను గ్రహించలేకపోతున్నాను. 1. అది మాయయే, 2. అక్కడి జనులు పూర్వాపరాలు ఈ రెండు విషయాలు సమన్వయ మగుటయేలేదు. పైగా అక్కడ అంతా చూచిన తరువాత నా మోహము మరింత అధికమైనది.

అయితే, సత్యస్వరూపులగు నోటివెంట 'అయథార్థం' అయినదేదీ రాదని నేను ఎఱుగుదును. మహాత్ముల వచనములు మోహమును తొలగిస్తాయేగాని, వృద్ధిచేయవు. అయితే నాలో తెలియరాని

Page:493

అజ్ఞానం పేరుకొని ఉన్నది. మీ కృపచేత మాత్రమే అది తొలగగలదు. అందుకే మీ ముందు మరల ప్రస్తావిస్తున్నాను.

కీరరాజ్యం మొదలైనవన్నీ అక్కడ ఏర్పడి ఉండగా, అదంతా భ్రమయే నయ్యా!" అని చెప్పుచున్నారు. ఎందుచేత?

శ్రీమన్నారాయణుడు : ఓహో! అదా? ఆ విషయం కొంత చూచాయగా చెప్పే ఉన్నాను. మరికొంత వివరంగా చెపుతాను విను.

కీరదేశవాసులు - భూతమండలమున ఉన్న కీరదేశ వాసులు అందరి చిత్తము నందు కూడా నీ చిత్తమునందు లాగానే - కటంజుని ఆటవిక వృత్తాంతం అంతా కాకతాళీయన్యాయముచే ప్రతి భాసించటం జరుగుతోంది. అయితే... ఒక వ్యక్తి నందు, లేదా ఒక సమూహమునందు... ఏదైతే మిథ్యారూపంగా ప్రతిభాసిస్తోందో - అట్టి ప్రతిభాస మొదలంట తొలగే వరకు అట్లాగే ప్రతిభాసిస్తుంది. జ్ఞానం వెల్లివిరిసినప్పుడు అదంతా మటుమాయమౌతుంది.

ఆ ఆటవికశ్వపచుల కీకారణ్యగ్రామంలో ఒకానొక శ్వపచజాతివాడు ఒక గుడిసె నిర్మించు కున్నాడు. అక్కడికి ఇప్పుడు వెళ్ళిన నీవు, "ఈ గుడిసె నేను నిర్మించుకున్నదే అని అనుకుంటున్నావు. "ఈ గుడిసె కటంజునిది" - అని అక్కడివారు తలచుచున్నారు. ఒక తాటిచెట్టుపై కొన్ని కాకులు వ్రాలినప్పుడు దూరంగా ఉన్న ఏదో వస్తువు ఆ చోట నుండి తినే వస్తువు" లాగా ఆ కాకులన్నిటికీ అనిపించవచ్చు. వాటన్నిటిలోని ఆకలి, దప్పికల సంస్కారం చేత అది అట్లా అనిపిస్తోంది. అంతమాత్రం చేత ఆ చూడబడేది ఆహారపదార్థమే అవవలసిన పని లేదు.

అనేకులు ఒక చోట చేరి కల్లు సేవించారనుకో... వారందరికి పరిసరాలన్నీ తేలియాడుచున్నట్లు కనిపించవచ్చు గాక. అంత మాత్రంచేత అక్కడివన్నీ ఎందులోనో తేలియాడుచున్నట్లా? అట్లే ఒక్కొక్కసారి అనేకులు ఈ స్వప్నమాత్ర జగత్తును ఒకే భ్రాంతితో గాంచుచున్నారు. ఒకడు “నీవు నా తండ్రివి” అను భ్రాంతిని పొందుచుంటే, అవును, నీవు నా ప్రియమైన కుమారుడివి అని మరొకరు గాంచు చున్నారు. అంతమాత్రం చేత తండ్రి-కొడుకుల సంబంధంలో భ్రాంతి యొక్క విభాగము, పాత్ర లేదా? ఉన్నది. గడ్డి మొలచిన ప్రాంతంలో అనేక లేళ్ళు విశ్రమిస్తున్నట్లు, ఈ జీవులు ఒకే విధమైన భ్రాంతి విశేషంలో పాల్గొనుచున్నారు. ఒకే ఆటలో అనేకమంది బాలురు క్రీడించుచున్నారు చూచావా? ఒకే యుద్ధంలో అనేకమంది సైనికులు కలిసి "వీరు మన శత్రువులు... మేమంతా ఈ దేశం వాళ్ళం అని తలచుచు వధించటం, బంధించటం, జయించటం, పారిపోవటం, ఓడిపోవటం సామూహికంగా పొందుతూ ఉంటారే! ఓ గాధీ! ఈ సంసార జీవులంతా ఆ విధంగా పరస్పరం స్వప్నానుభవం వంటిది పొందుచున్నారు. ఒక కాలదృష్టితో మరొక కాలగమనాన్ని అల్పంగానో, అధికంగానో భావించటంకూడా మాయలోని విభాగమే. అఖండ పరమాత్మరూపమగు 'కాలము' అనబడునది ఆత్మ యందే స్థితి కలిగియున్నది. అయినప్పటికీ కాలము దేనికీ ప్రతిబంధకము

Page:494

కాదు, ఉత్పాదకమూ కాదు... కాలస్వరూపుడగు భగవంతునికి రూపమంటూ ఏదీ లేనే లేదు. ఆతడు అఖండుడు. ఆతనినే జన్మ, కర్మ - రహితమగు బ్రహ్మము అని కూడా పెద్దలు చెప్పుచున్నారు. గాధి : కాలము యొక్క రూపము ఈ సంవత్సర, యుగ కల్పములే కదా!

శ్రీమన్నారాయణుడు : నిజమే. అయితే కాలము సూర్య - చంద్ర గమనములచే కల్పితమైనదే. ఒక భావస్థిరత్వము అంగీకరించిన తరువాత కాలము పొందబడుచున్నది. ఉత్పాతరూపమగు కాలముచేత తదితర సర్వ పదార్థములు పరికల్పితమగుచున్నాయి.

“భ్రాంతి చిత్తులగు జీవులు ఒకే విధమైన ప్రతిభాస (లేక) భ్రమచే ఒకే విధమైన సంభ్రమము పొందుతూ ఉంటారు- అనునది ఇక్కడ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమును అనుసరించే కీరదేశవాసులు ఆటవికుడు రాజగుట" - అనుదానిని గాంచినారు. నీవుకూడా ఆ రీతిగానే అదంతా పొందావు. అందుకే అదంతా 'మాయయే' అని చెప్పాను.

సరే! అయినదేమో అయింది. ఇప్పుడు చిత్తనైర్మల్యము నీవు సంపాదించాలి. మనస్సును అధిగమించి స్వబుద్ధిచే ఆత్మవిచారణ చేయి. అందుకు నీ ఆశ్రమవాసానికి సంబంధించిన తపోధ్యానములను నిర్వర్తిస్తూ ఉండు. మరి ఇక నాకు సెలవా?

ఇట్లు పలికి విష్ణు భగవానుడు అంతర్ధానమైనారు. గాధి మాత్రం మోహముతో కూడిన మనోవ్యాధి నుండి బయటకు రాలేకపోయాడు. ఇంకా అధికమైన స్థూలబుద్ధికలవాడై ఏవేవో అనుమానాలతో సతమతమవసాగాడు. కొద్దిరోజులు గడచిన తరువాత మరల విష్ణు భగవానుని ఆరాధించటం ప్రారంభించాడు. మరల విష్ణుదేవుడు ఆతని యందు ప్రత్యక్షమైనారు. ఆతడు ప్రణామం చేసి, మనోవాక్కాయములచే పూజించి మరల ఇట్లు పలుకసాగాడు.

గాధి : దేవాదిదేవా! మీరు అదంతా మోహమే’ అని చెప్పివెళ్ళారు, బాగానే ఉంది. కానీ, ఆ ఆటవిక జీవితం, చావు, పుట్టుక మొదలైన అనేక అనర్థములతో కూడిన ఆ సాంసారిక వ్యవహారమంతా తలచుకుంటేనే ఇప్పటికీ ఎంతో భయం వేస్తోంది. నా చిత్తము విషాదముతో విమోహితమౌతోంది. ఇప్పుడు ఈ మోహబుద్ధి తొలిగేది ఎట్లా? హే భగవాన్! భక్త సులభుడా! నాలోని మోహం నివృత్తి చేయమని చెప్పి, మీరు వెళ్ళిపోతే చాలదు. నివృత్తి అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి. నన్ను ఏదైనా పవిత్ర కార్యక్రమము నందు నియమించండి. నన్ను కాపాడండి.

శ్రీమన్నారాయణుడు : (పకపకానవ్వుచూ) శంభరాశురుని ఆడంబరంలాగా ఈ జగత్తంతా మాయా మయమైనదే! అట్టి ఆశ్చర్యకరమైన 'కల్పన అంతా ఆత్మతత్త్వవిస్మరణ చేతనే ఉద్భవించింది. ఆటవిక గ్రామం, ఆ కీరదేశ రాజరికం, తదితర వృత్తాంతములు అజ్ఞానవశంచేత తప్పక సంభవమే. స్వప్నంలో ముందుగా అనుకోని ఏవేవో విషయాలు, ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు స్వప్నద్రష్టకు సత్యమువలే అనుభవమగుచున్నాయి కదా?

Page:495

భూత మండలములోని కీరదేశవాసులు కూడా నీలాగానే భ్రమను పొందుచున్నారు. నీవు వారి దగ్గిరకు పోయి సంభాషించినప్పుడు వారు తమ భ్రమలనే వల్లించిచెప్పారు. అవి విని నీవు నీ భ్రమచే “ఇట్లా ఎట్లా అయినది?" అని వేదన పొందుచున్నావు. నీ సుస్పష్టత కొరకు నీ అనుభవములోని మరికొన్ని విశేషాలు చెప్పుతాను. ఇవి వింటే నీ చింతలు తొలగుతాయి.

కటంజుడు అను ఒకానొక జీవుడు ఇప్పుడు నీచే గాంచబడిన శరీరము, గ్రామము, గృహము కలిగి పూర్వము భూత మండలమున (In the zone of matter) జనించి ఉన్నాడు. ఆతడు అదే విధంగా తన కుటుంబసభ్యులను పోగొట్టుకుని ఆ తరువాత కీర రాజ్యానికి ప్రభువు అయినాడు. ఆ తరువాత జనులకు తన జన్మరహస్యం తెలియుటచే అగ్ని ప్రవేశం చేశాడు.

నీవు తటాకంలో ప్రవేశించి అఘమర్షణ మంత్రం జపిస్తూ ఉండగా, నా సంకల్పవశం చేత ఆ కటంజుని (ఆటవికుని) వృత్తాంతము (లేక) అనుభవమంతా నీ అంతఃకరణంలో ప్రకాశించింది. అట్లా ప్రకాశిస్తున్న దానినంతా పొందుతూ, నేను కటంజుడను" అని నీవు అందలి అనుభవ పరంపరలన్నీ పొందావు.

ఈ చిత్తము బహుమచత్కారమైనది. అది ఒకప్పుడు తాను చూచినది విన్నది క్షణంలో త్యజిస్తుంది. మరొకప్పుడు, సుదీర్ఘ కాలం కలిగి ఉంటుంది. చూస్తూనే, చూడకుండా ఉండిపోతుంది. అసలు ఏ మాత్రం ఎన్నడూ చూడనివి పొందుతూ పోతుంది. ఒకడు స్వప్నంలోను, మనోరాజ్యంలోను, సన్నిపాత సమయము నందు రకరకాలైన అనేక దృశ్యవ్యవహారములను గాంచటం తెలుసు కదా! ఆ విధంగానే జాగ్రత్తులో కూడా స్వయముగా భ్రమను వీక్షించగలదు.

ఇందుకు దృష్టాంతాలు అనేకం చెప్పుకోవచ్చు. త్రికాలజ్ఞుడైన ఒక యోగి దృష్టి యందు భవిష్యత్ కాలము నందలి సమస్తమూ భూతకాలస్థము వలే తెలియుచున్నది కదా! అట్లాగే గడచి పోయిన కటంజుని చరిత్ర వర్తమాన కాలమైన నీ బుద్ధియందు నా సంకల్పముచే కనిపింపజేయటం జరిగింది. అయితే ఇక్కడొక చిత్రం! అప్పటి ఆయా అనుభవాలలో నిమగ్నమైనది నీవేగాని, అట్లు నిమగ్నమవటానికి నేను చేసింది ఏమీ లేదు. నేనల్లా, నీ మనోదర్పణంలో కొన్ని అనుభవ పరంపరలను ప్రతిబింబింప జేసాను. అంతేఁ!

“ఈ శరీరాదులు నేను... ఈ కుంటుంబము, ఇల్లు, వాకిలి నావి... వీరు నా వారు... ఇది నా ఊరు... ఇవి నా కులగోత్రములు - అనునట్టి అనేక భ్రమలందు అజ్ఞాని నిమగ్నుడగుచున్నాడు. వాటిని మహత్తరమైనవిగా గాంచుచు తాదాత్మ్యము చెందుచున్నాడు. కానీ జ్ఞాని అవే సంఘటనలను పొందుచున్నప్పటికీ, గాంచుచున్నప్పటికీ, వాటియందు ఏమాత్రం నిమగ్నుడు అగుటలేదు. ఎవ్వడైతే సమస్తమూ ఆత్మయే” - అను సర్వా హమ్ భావనను కలిగి ఉంటాడో ఆతడు వాటియందు ఏ మాత్రం నిమగ్నుడు కాడు. అందుచేత, ఆతడు ఈ పదార్థవిభాగముచే కలుగు అనర్థభావమును అతడు పొందకుండానే ఉంటాడు. పరిచ్ఛిన్న పదార్థములందు కలుగుచుండే అహంభావనయే

Page:496

బంధకారణమగుచున్నది. అంతకుమించి ఈ జీవునకు వేరుగా బంధమెక్కడిది? ఈ జీవుడు వాస్తవానికి అమృతతుల్యమగు శుద్ధ చైతన్యస్వరూపమే కదా! ఎండు సొరకాయ బుఱ్ఱ నీటిలో పడినా నీటిలో మునుగదు చూచావా? సత్యాసత్యవివేకి అయినట్టి జ్ఞాని భ్రమలలో, సుఖ దుఃఖాలలో మునుగడు.

నీవు ఇంతకు ముందు వాసనాజాలగ్రస్థుడవు, విచేతసుడవు (one who adopted ignorance and illusion) అయ్యావు. అందుచేతనే నీ అంతరంగము నందు ఆ కటంజుని వృత్తాంతమంతా దోషబుద్ధిచే పొడమినది. అనగా 'అజ్ఞానము' అనే మనోవ్యాధి నీయందు ప్రవర్తించటం జరిగింది. అజ్ఞానము తొలగకపోవుట చేత ఇంకా నీ ఆత్మస్వరూపమును నీవు దర్శించుటలేదు. వర్షం పడుతుంటే ప్రయత్నం చేసి ఇంటిలోకి పరుగులు తీసేవాడే జడివాన నుండి తప్పించుకోగలడు. నిలబడి వర్షం పడే చోటే ఉండేవాడు తడవక ఏంచేస్తాడు? పూర్ణజ్ఞానము లేకపోవుట చేత నీవు చిత్తభ్రమను తొలగించుకో లేకపోయావు. అందుచేతనే నీ చిత్తంలో ఏదేది భాసిస్తుందో అద్దాని యందలి

అభిమాన కారణంగా వెంటనే దానికి వశీభూతుడవగుచున్నావు.

మాయ నాలుగువైపులా విస్తరించి ఉన్నది. అట్టి ఈ మాయ యొక్క నాభిస్థానము (It's Root) చిత్తము నందు ఉన్నది. అట్టి చిత్తము లేక మనస్సును ఎదుర్కొని పోరాడాలి. మనస్సును ఆత్మ యందు లయింప జేసి, దానిని రహితం చేయాలి. అట్టి వారిని మాయాచక్రం ఇక ఏమీ చేయలేదు, ఏమాత్రం బాధించలేదు. కనుక ఓ గాధీ! నీవిక లెమ్ము. మనోనిరోధకమగు తపస్సును ఇక్కడే పది సంవత్సరాలు ఆచరించు. అంతేగాని నిష్ఫలమైన వేదన, అభిలాషలతో కాలం వృథా చేసుకోకు. నిర్మలహృదయం సంపాదించావా... అనంత - అఖండ జ్ఞానం పొందగలవు.

ఇట్లు పలికి విష్ణుభగవానుడు అంతర్థానమైనాడు.

భగవానుడు చెప్పినదంతా ఆ గాధి మరల మరల విచారణ చేశాడు. ఇతఃపూర్వపు కటంజుని భావపరంపరలను పరిశీలించి విచారణ చేశాడు. భావప్రదర్శనరూపమైనట్టి విచిత్రమైన దైవగతి - జగత్తిని విశ్లేషించి చూచాడు. వివేక వైరాగ్యములు పొందాడు. "అహో! నా చిత్తము నందు ప్రతిబింబించిన కొన్ని క్రియా విశేషములను నేను చేస్తున్నట్లు భావించి భ్రమించాను కదా! ... వాస్తవానికి సర్వవేళలా నేను విజ్ఞానస్వరూపుడనే! అని గ్రహించాడు. చిత్త నిరోధము కొరకు, జ్ఞానలక్ష్మిని సంపాదించటానికి ఆతడు ఋష్యమూకపర్వతంపైకి వెళ్ళాడు. విష్ణుభగవానుడు ఆజ్ఞాపించినట్లు అక్కడ పదేళ్ళు తపస్సు చేశాడు. క్రమంగా భయ, క్రోధములను విసర్జించి పారమార్థిక సత్తను అవధరించాడు. జీవన్ముక్తస్వరూపుడైనాడు.

బ్రహ్మానందనిమగ్నుడై, పరిపూర్ణచిత్తుడై, పూర్ణ చంద్రుని వలె అనంత బ్రహ్మాకాశము నందు

విహరించసాగాడు.

Page:497

5. విచారణ యొక్క ఆవశ్యకత (The need of Analysing) శ్రీవసిష్ఠమహర్షి : చూచావా రఘనందనా? ఈ విధంగా 'మాయ' అతివిశాలము, అచింత్యము, మహా మోహమయము, భయంకరము కూడా అయి ఉన్నది. అది పరమాత్మను ఆశ్రయించుకొనియే ఉన్నది. లేకపోతే 4,5 నిమిషాల పరధ్యానం ఎక్కడ? '60' సంవత్సరాల ఆటవిక జీవుని అనుభవం ఎక్కడ? అసత్యమైనదేది? సందిగ్ధరహితమైన సత్యమేది? అందుకే ఈ 'మాయ' మహామోసకారి అని చెబుతారు. అసావధానచిత్తుని అది క్షణంలో సంకటములందు పడవేయగలదు.

శ్రీరాముడు : అవును స్వామి! మీరన్నట్లు మాయ అతిచమత్కారమైనదే! వేగంగా తిరుగుచూ, సర్వాంగాలను ఛేదించ గల ఈ మాయను విజ్ఞులగువారు ఎట్లా నిరోధించగలుగుచున్నారో చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : నాయనా! ఈ సంసారరూప మాయాచక్రం నలువైపులా విస్తరించియున్నది. ఇట్టి సంసార చక్రము యొక్క ఇరుసు (Inner - wheel) ఈ మనస్సేనని గ్రహించు. పురుషప్రయత్నం చేత, ధీరబుద్ధి చేత ఈ మనస్సు (లేక) చిత్తమును నిరోధించామా... మాయ యొక్క చక్రభ్రమణం కూడా దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు ఆడుకునే త్రాడుతో చుట్టబడిన చక్రం యొక్క భ్రమణం ఆ త్రాడును పట్టుకుంటే ఆగిపోతుంది కదా? ఈ మనస్సును నిరోధించాలి. ఇక మోహం ఉండదు.

ఓ రామా! నీవు చక్రయుద్ధంలో కుశలుడవే కదా! ఈ మాయాచక్రం నిరోధించటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? నాభిస్థానం పట్టుకుంటే, చక్రం ఆగిపోతుంది. కాక ఆ చక్రం యొక్క తదితర భాగములను పట్టుకోబోయామా... చేతికి గాయం కాగలదు. ఈ మనస్సును నిరోధించాలి.

ఇక మోహము ఉండదు.

ఈ మనస్సు ‘జన్మజరామరణములు' అనే సంసారచక్రంలో ఇరుసులాగా ఉంటోంది. మనస్సును మనస్సుతోనే నిరోధించాలి. ఉద్ధరించాలి, పరిభ్రమణము నుండి ఈ మనస్సును మళ్ళించు. ఆత్మయే తన స్వరూపముగా కలిగియుండి కూడా ఈ జీవుడు ఎందుకు దుఃఖములు పొందుచున్నాడు?

ఎందుకో విను- ఈ జీవుడు తన దేహభృతి కొరకై చాలా ఉపాయములను అందిపుచ్చు కుంటున్నాడు. మరి చిత్తము గురించో? ... చిత్తమును నిరోధించ గల ఉపాయములు ఆశ్రయించక పోవుట చేతనే అనేక దుఃఖపరంపరలను ఒకటి తరువాత మరొకటిగా పొందుతూ పోతున్నాడు. చిత్తము నిరోధించబడితే, ఇక కృత్రిమమగు దీనస్థితులన్నీ తొలగిపోయినట్లే. ఈ సంసార మహారోగం ఉపశమించాలంటే చిత్తనిరోధము తప్ప వేరే ఔషధం లేనే లేదు. మరి, తపో-దాన-తీర్థ క్రియాదులంటావా... అవన్నీ చిత్తనిరోధము కొరకే ఉన్నాయి.

అందుకని, 'పరమశ్రేయమైనట్టి చిత్తమును వశపరచుకొనుట' అనుదాని గురించి యోచించు. ఆ పని వదలి చిన్నపిల్లల ఆటల లాగా ఏవేవో కార్యక్రమాల వల్ల ఏం ప్రయోజనం? కుండ యొక్క ఆకాశం కుండలోనే ఉన్నట్లుగా, చిత్తము నందే ఈ సంసారమంతా ఉన్నదని పదే పదే ప్రకటిస్తున్నాను. కుండపగిలితే 'ఘటాకాశం' (Space belonging to the pot) అనేది ఉంటుందా? ఎక్కడుంటుంది?

Page:498

చిత్తము నశించిందా - సంసారము కూడా నశిస్తుంది. నీవు 'చిత్తము' అనే కుండను 'ఆత్మ తత్త్వ జ్ఞానము' అనే ఉపకరణముచే పగులగొట్టి బ్రహ్మకాశములో ప్రవేశించు. శ్రీరాముడు : అచిత్తత్వదశ ఎలా పొందటం?

శ్రీవసిష్ఠమహర్షి : అందుకు రెండు ఉపాయాలను చెపుతాను.

1. వర్తమానంలో ప్రాప్తించే విషయములను బాహ్యబుద్ధితో మాత్రమే సేవించటం. 2. భూత - భవిష్యత్తుల గురించి అనుసంధానమే చేయకపోవటం.

ఈ రెండు ఉపాయాలను అనుసరించు. అప్పుడు చిత్తము అచిత్తత్వదశను తప్పక పొందగలదు. భవిష్యత్ - భవిష్యత్తు గురించి సంకల్పములను, సంబంధములను, పదార్థభావములను క్రమంగా త్యజిస్తూ వచ్చావా... అప్పుడు పరమపావనమగు చిత్తరహితస్థితిని తప్పక పొందగలవు. చిత్తము అంటే సంకల్పములే!

సంకల్పములు ఉన్నంతవరకూ సంకల్పవిభూతులు (Effects of Perceptions) ఉండియే ఉంటాయి. అవి ఉంటే చిత్తము కొనసాగుచూనే ఉంటుంది. సంకల్పములు కాకుండా చిత్తమునకు వేరే రూపమెక్కడిది? కనుక రామా! నీవు నీ అంతరంగమునందు సర్వసంకల్పములు త్యజించివేయి. ఆత్మ చిత్తరహితమై ఉంటే, ఆత్మ తన కూటస్థ రూపమున ఉన్నది" అని అంటాం. అప్పుడు ఈ సంసారమునకు మూలభూతమైన కామ, కర్మ, వాసనలు" మూలజ్ఞానంతో సహా పటాపంచలవు తాయి. ఇదియే మహాసిద్ధ మంత్రం.

ప్రత్యక్ చైతన్యము - చిత్తరహితమగు ఆత్మను ప్రత్యక్ చైతన్యము అని అంటూ ఉంటారు. స్వస్వభావయుతము, మనోరహితము అయిన ఆత్మయందు కల్పనారూపమైన మాలిన్యమే ఉండదు. ఆత్మ యొక్క మహత్తర స్థితి ఏమిటో గ్రహిస్తే - అది వాస్తవానికి చిత్తము లేనట్టి పరమార్థ స్థితియే అవుతుంది. మనందరి స్వస్వరూపమగు ఆత్మ స్వతఃగా నిరతిశయానంద స్వరూపము, పరమాత్మ స్వభావము, సర్వజ్ఞము, సమ్యకృష్టిమయము అయి ఉన్నది.

ఆశల నుండి దుఃఖం - శ్మశానంలో కాకులు ఉన్నట్లు ఎక్కడ ధ్యాస - ఆసక్తి ఉంటే, అక్కడ ఆశలు ఉంటాయి. ఎక్కడ ఆశలు ఉంటే అక్కడికి సుఖ, దుఃఖములన్నీ వచ్చి చేరుతాయి. ఆశ నుండే మిగతా సంసారమంతా పరిఢవిల్లుతోంది. స్వస్వరూపాత్మ యొక్క 'ఏమఱపు' చేతనే బాహ్యత్వ పూర్వకమైన “ధ్యాస” ప్రభవించి ప్రవృద్ధమౌతోంది. వస్తుతత్వమేమిటో గ్రహించిన జ్ఞానుల మనస్సు నందు ‘ఆశలు’ అనేవే ఉండవు. ఇదంతా మిథ్యయేనని వారికి తెలుసు.

శ్రీరాముడు : పదార్థములలోని మిథ్యాత్వము జీవుడు గ్రహించేది ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి : శాస్త్ర - సజ్జన సాంగత్యముల సహాయంచేత మనోనిరోధం’ నిరంతరం అభ్యసిస్తూ రాగా, అప్పుడు ఈ వస్తువులందలి అవస్తుతత్వమేమిటో ఎరుగబడుతూ ఉంటుంది. అందుచేత, ఓ సభికులారా! దృఢ ప్రయత్నములచే, సునిశ్చియములచే, శాస్త్ర సత్సాంగత్యాదులచే క్రమంగా ఈ చిత్తములోని అవివేకమును తొలగించండి. బలవంతంగా అయినా సరే, ఆ మనస్సును ఆత్మ

Page:499

యందు ప్రవేశపెట్టండి. ముల్లును ముల్లుతోనే తీయగలం. వజ్రమును వజ్రముతోనే సానపెట్టగలం. పరమాత్మ దర్శనమునకు ఆత్మజ్ఞానమే ముఖ్య కారణమగుచున్నది.

శ్రీరాముడు : మహర్షీ! ఆత్మజ్ఞానమునకు ముఖ్యకారణమగుచున్నదేది? మరొక్కసారి చెప్పండి. శ్రీవసిష్ఠమహర్షి : స్వానుభూతములగు సుఖ - దుఃఖములను ఆత్మయే త్యజించుటకు ఇచ్ఛగించుచున్నది కదా! కనుక ఆత్మజ్ఞానమునకు ఆత్మయే ముఖ్యకారణం. అందుచేతనే, బద్ధుడనై ఉన్న నేను ఉద్ధరించ బడేది ఎట్లా?" - అని తలచువానికి మాత్రమే శాస్త్రములు, గురువులు మార్గము చూపగలుగుతాయి.

మనోరహితం - ఓ రామచంద్రా! నీవు మాట్లాడుచున్నప్పుడూ, ఇచ్చుచున్నప్పుడూ, పుచ్చుకొను చున్నప్పుడూ, కనులు మూసినప్పుడూ, తెరచినప్పుడూ, అన్ని సమయములలో మనోరహితుడవై ఉండు. లేక, ఆత్మవస్తువును మాత్రమే మననం చేస్తూ ఉండు. కేవలం చైతన్యమును మాత్రమే పారాయణం చేస్తూ ఉండు. నిరంతరం ఆత్మచింతనచే ఆత్మయొక్క నిర్మలత్వం అనుభవం కాగలదు.

నాయనా! నీవు జన్మిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, మరణిస్తున్నప్పుడు, తదితర మహర్దశ - దుర్దశ లందు, నిష్క్రియుడవైనప్పుడు, క్రియాతత్పరుడవైనప్పుడు, అన్ని వేళలా నేను శుద్ధమగు ఆత్మ సత్తయే కదా” అనునట్టి కేవల చైతన్యాంశమునందే సుస్థిరుడవై ఉండు. “నాది, నాకు చెందినది, నా దేహము, నాకు సంబంధించినవారు అను రూపము గల సర్వవాసనలూ త్యజించు. సర్వదా తదేక నిష్ఠతో చైతన్య మాత్ర తత్పరుడవగుము. వర్తమానంలో, భూతకాలపు యోచనలలో, రాబోవు వార్ధక్యాది దశలలో, రాజత్వాది స్థితులలో, దేహం ఉన్నప్పుడు, లేనప్పుడు - - అన్ని వేళలా చైతన్య మాత్రము నందే ఏకైక 'నిష్ఠ' కలిగి ఉండు. అద్దానినే భావించు, అనుసంధానం చేయి. సమాధి తత్పరుడవగుము.

సర్వకాల, సర్వావస్థల యందు నేను ఆత్మ స్వరూపమగు చైతన్యమును. అదియే ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు కూడా - అను ఎఱుకను వదలనే వద్దు. బాల్య, యౌవన, వార్ధక్యాల లోనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తులలోనూ కేవల చైతన్యమునే ఆశ్రయించు. అద్దాని యందే నీ నిష్ఠ అంతా ప్రతిష్ఠించబడు గాక! బాహ్య విషయాలు' అనే మాలిన్యం నీచే త్యజించబడు గాక!

మనస్సును ఆత్మ యందు విలయమొనర్చుచూ, ఆశాపాశములను త్వరత్వరగా విచ్ఛేదన మొనర్చుచుండుము. అప్పుడు కేవలం విజ్ఞాన స్వరూపము నందు సంస్థితుడవగుటలో నీకేమి కష్టముండదు.

సంబంధమే లేదు.... నీయందు శుభ, అశుభములు, ఇష్ట అయిష్టములు, ఆశ నిరాశలు శమించు గాక! ప్రతిజీవుడు తాను కోరుకుంటున్న ఉత్తమశాంతి, ఆనందములను ఆత్మ చైతన్యమును ఆశ్రయించినప్పుడే పొందగలడు. కర్మ-కర్తృ-కరణ సహితుడవై ఉన్నప్పటికీ, నీవు మాత్రం వాటన్నిటి కంటే వేరైన వాడివై ఉండుము. విజ్ఞానమయ బుద్ధి కలిగి ఉండు.

ఈ ఇంద్రియములు, ఇంద్రియవిషయములు నిన్ను స్పృశించనట్టి సాక్షిరూపమును వహించు. ఒక అద్దంలో ప్రతిబింబించే వ్యవహారంలాగా ఈ సర్వదృశ్యవ్యవహారములను గాంచుచుండుము.

Page:500

అద్దమునకు అందులో ప్రతిబింబించే దృశ్యమునకు సంబంధమే ఉండదు కదా! ఆ అద్దం 'ఇవి నా వస్తువులు' అనే మమకారం ఏమైనా కలిగి ఉంటుందా?

నీకు కూడా (దర్పణము - దర్పణాంతర్గత ప్రతిబింబిత వస్తువు వలె) ఈ సంసారముతో ఏమాత్రం సంబంధమే లేదు. ఉండవలసిన పని లేదు. సాక్షిరూపమున సర్వ వ్యవహారములు గాంచు చుండుము. 'నిర్వికల్పము నిరాలంబము’ అయినట్టి కేవల నిజరూపము (one's own absolute form) అగు చిన్మాత్రము నందు స్వరూపస్థితి కలిగి ఉండు.

ఓ రఘువీరా! నీవు ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు సంబంధించినవాడవే కావు. అట్లాగే, సృష్టి-స్థితి-ప్రళయములు కూడా నీకు లేవు. అందుచేత ముక్తిరూపమున వీటన్నిటికీ ఆవల ఉన్న పరబ్రహ్మమే నీవై ఉండు.

నీవు సర్వ దృశ్యములను కేవలం ప్రకాశింపజేయువాడవు. గదిలో దీపముచే ప్రకాశించబడే వస్తువులకు దీపము యొక్క ప్రకాశమునకు సంబంధమేమున్నది? నీచే ప్రకాశింపజేయబడుచున్న

- - అనగా గాంచబడుచున్న - వస్తుజాలమునకూ, నీకూ సంబంధము లేదు. అట్టి బుద్ధి వృత్తులకు ఆవల ఉంటూ, “బుద్ధి వృత్తులను కూడా ప్రకాశింపచేయుచున్న చిన్మాత్రమునే నేను” అని గ్రహించి, అచ్చట స్థిరుడవై ఉండు.

నిజచైతన్యం - 'స్వ-పర ధ్యాసలను త్యజించివేయి. ఈ జగత్తు ఉన్నా, లేకున్నా నీవు మాత్రం 'విభాగ రహితమైన వజ్రస్తంభం' లాగా ఆత్మను ఆశ్రయించి స్థిరంగా ఉండు. సంకల్ప మయములే అయినట్టి లౌకిక విషయాల మధ్య ఉండవలసి వస్తున్నప్పుడు 'ధీరత్వ - ధార్మిక' భావాలు కలిగి ఉండి, అదే సమయంలో 'ధర్మాధర్మ రహిత స్థితి' ని పొంది ఉండు.

ఓ రాజీవలోచనా! రఘుపుంగవా! ఎవడైతే జ్ఞానమాత్రము - - సాక్షీరూపము అగు తన ఆత్మ తత్త్వమును అనుభూతమొనర్చుకుంటాడో అట్టివానికి హాలహల విషం కూడా అమృతతుల్యమే అవుతుంది. ఈ జీవులలో అనేకులు 'నిర్మలము - నిరవయవము' అగు తమయొక్క శుద్ధచైతన్యమును విస్మరించటం చేతనే అజ్ఞానం ఉదయిస్తోంది. అజ్ఞానం చేత సంసారభయమునకు సంబంధించిన మహామోహము పుట్టుకొస్తోంది. అదంతా సర్వ అనర్థములను ఉత్పత్తి చేస్తోంది.

కనుక నిర్మలమగు నిజచైతన్యమును జపిస్తూ ఆరాధిస్తూ మననం చేస్తూ రాగా, ఈ సంసార భ్రమకు కారణమగుచున్న మహామోహం దానంతట అదే తొలగిపోతుంది. ఇందులో సందేహించ వలసిన పనేమీ లేదు.

ఆశ క్ష్మీ జ్ఞానం - ఎవడైతే స్వస్వరూపమును అవధరించి 'ఆశ' అనే మహాసముద్రాన్ని దాటివేస్తాడో, అప్పుడు జ్ఞానభాస్కరుని కిరణాలు ఆతడున్నచోట నలువైపులా ప్రసరిస్తాయి. జ్ఞానమున్న చోట ఆశ ఉండదు. ఆశ ఉన్నచోట జ్ఞానము పెంపొందదు.

Page:501

స్వాత్మభావమును అవలోకిస్తూ, అద్వైత బ్రహ్మానందమున సంస్థితుడైన మనుజునకు మిక్కిలి రుచికరమైన అమృతం కూడా ఎక్కడబడితే అక్కడ ఉండే నీరులాగా గోచరిస్తుంది. ప్రత్యగాత్మ భావం పొందిన అట్టి జీవన్ముక్తులతో మునులమగు మేము ఎల్లప్పుడూ మైత్రి కలిగి ఉంటాం.

ఇక ఈ విషయం ఎరుగని మనుజుల విషయమంటావా... మా దృష్టిలో వారు మనుజాకారంలో ఉండే జంతుజీవుల వంటివారే. 'స్వజ్ఞానం' కారణంగా 'సర్వోతీత సర్వ స్వరూప స్థితి - సర్వోన్నత స్థితి’ ని పొందిన తత్త్వజ్ఞాని వద్దకు తదితర జ్ఞానార్తులు, యోగులు జ్ఞానం కొరకై సమీపిస్తూంటారు.

తత్త్వజ్ఞుడు - 'దివ్యజ్ఞాన నేత్రయుతుడు' అగు తత్వవేత్త ఏది ఎట్లు దర్శిస్తున్నాడో అది తత్త్వజ్ఞులు కాని వారిచే ఇంతవరకూ దర్శించబడుటలేదు. ఇక ముందు దర్శింపబడజాలదు. ఈ సూర్యప్రకాశం సహాయం లేకుండానే వారు అంతర్లీన సత్యాన్ని సుస్పష్టంగా చూస్తున్నారు.

ఏ జీవుడైనా సరే, స్వజ్ఞాన వశం చేతనే సర్వోన్నత స్థితిని పొంది ఉంటున్నాడు. మిట్టమధ్యాహ్నం దీపపు వెలుగు ఒక అవస్తువే కదా! బ్రహ్మవిద్యచే ఆత్మను ఎఱిగిన వానికి సూర్య, ఇంద్రాది ఆయా మహా లోకములన్నీ అవస్తువులే అవుతాయి. ఓ రామా! మహాతేజస్సు కలవారి లోనూ, యోగ వశిత్యాది సిద్దులు పొందిన వారిలోనూ, బలవంతులలోనూ, ఆయురైశ్వర్యములు కలవారి లోనూ, గొప్ప విద్వత్తు, వక్తృత్వములు కలవారి లోనూ - వీరందరిలో తత్త్వజ్ఞానము ఉన్నవాడే అత్యంత ఉన్నతుడై వెలయుచున్నాడు.

ఆత్మజ్ఞాని ఔన్నత్యం - పరమేశ్వరుని నిజరూపం ఆత్మయే. ఆత్మరూపుడగు పరమేశ్వరుని ప్రకాశం చేతనే ఈ సూర్య, చంద్ర, అగ్ని, మణి, తారలు ప్రకాశిస్తున్నాయి. జ్ఞేయులగు - జ్ఞాత (తెలిసికొను దానిని తెలిసియున్న వారగు) తత్త్వజ్ఞుల ప్రభావం చేతనే ఈ జగత్తులో ఆనందవీచికలు ప్రభవిస్తున్నాయి.

ఆత్మజ్ఞాన రహితులగు మానవులు నేలలో పురుగుల కంటే, కీటకముల కంటే, జంతువుల కంటే అధికులేమీ కాదు. ఎందుకంటే, ఒకడు ఆత్మజ్ఞుడు అవనంత వరకూ మోహము’ అనే పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. తత్త్వవేత్తల దృష్టిలో ఆత్మజ్ఞుడు మాత్రమే సచేతనుడు. అతడు మాత్రమే స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆత్మజ్ఞుడు కానివాడు దేనికీ స్వతంత్రుడు కాదు. అందుచేత అచేతనుడే. ఆతడు దుఃఖము కొరకే అనేక ఆశలు, ఉద్వేగములు, తాత్సారములు కలిగి ఉంటున్నాడు.

అజ్ఞాని సర్వదా మృతుడే. ఆత్మజ్ఞుడే సజీవుడు.

ఆత్మానుభవ ప్రభావం - ఆకాశంలో దట్టంగా మేఘములు అలుముకున్నప్పుడు నాలుగు వైపులా ప్రకాశము సన్నగిల్లుతుంది కదా!... ఈ చిత్తము స్థూలపదార్థములను రాగయుక్తముగా భావిస్తూ ఉన్నప్పుడు స్థూలమగుచున్నది. అట్టి సమయంలో ఆత్మజ్ఞానం పలాయనం చిత్తగించుచున్నది. అయితే జ్ఞాని తన మనస్సులోంచి క్రమంగా విషయభోగాలందలి అభిలాషను తొలగిస్తూ ఉంటాడు. ప్రాప్తించిన వాటి పట్ల లోభము గాని, ప్రాప్తించని వాటి పట్ల ఆశ గాని ఆతనికి ఉండదు. తన మనస్సును ఎండుటాకు వలె కృశింపజేస్తాడు. సర్వకాల సర్వావస్థల యందును 'ఆత్మజ్ఞానము'

Page:502

అనే అమృతమును సేవిస్తూ సంతృప్తిగా, ప్రశాంతంగా ఉంటాడు. ఆతనికి ఈ జన్మ, జరా, మృత్యువులు గానీ, వాటి మధ్య సంఘటితమయ్యే ఆయా వ్యవహారములు గానీ ఒక లెఖ్కలోనికిరావు. ఆతడు అనాత్మ యందు ఆత్మభావము కలిగి ఉండడు. ప్రతి అనుభవమును ఆత్మభావముచే పునీతం చేసి మహాప్రభావ సంపన్నుడై ఉంటాడు.

అనాత్మభావం - ఓ రామచంద్రా! స్వతహాగా సూక్ష్మమే అయిన ఈ చిత్తము చమత్కారంగా స్థూలత్వం పొందుతోంది. ఈ దేహము పట్ల ఆశచేతను, పుత్ర, దార, ధనాది విషయాలపై ఏర్పడే మమకారము చేతనూ చిత్తము స్థూలపడుతోంది. అదంతా భ్రాంతి చేతనే. అహంకారము యొక్క వికారమే మమకారభ్రాంతి! దృశ్యము నందు ఏర్పడుచున్న భ్రాంతి పూర్వకమైన ఆసక్తి 'ఈ శరీరమే నేను’ అను ఒకానొక అజ్ఞానవృత్తిని వృద్ధి చేస్తోంది. వ్యర్థమైన పదార్థములను ఇచ్చగించుట చేత, దోషభావముల చేత, జరామరణముల పట్ల గల దురవగాహనల చేత బుద్ధి అనారోగ్యమగుచున్నది. బాహ్య వస్తుజాలం రమణీయమైనది" - అనే వికల్పభావం చేత, ఇవి స్థిరంగా ఉండగలవు” అనే తుచ్ఛవిశ్వాసం చేత ఈ జీవుడు త్యాజ్యగ్రాహ్య వ్యవహారములన్నీ శ్రమించి మరీ స్వీకరిస్తున్నాడు. ఫలితం? ఆతని ఆ చిత్తమౌఢ్యమే శారీరక మానసిక వ్యధల రూపమున విస్తరిస్తోంది. ఇక ఆపై ఉన్మత్త క్రియా వ్యవహారాలు, అంతు లేని దుఃఖాలూ, అనేక జన్మ పరంపరలు వచ్చి కూర్చుంటున్నాయి.

ఓయీ! జీవుడా! నీవు అవిచారణ చేతనే తుచ్ఛములైన ధన, మణి, స్త్రీ (శృంగారం) వంటి స్వల్ప విషయాలు గొప్పవైనట్లు భావించి తుచ్ఛమైన ప్రలోభంలో పడుచున్నావు. నీ మనస్సు స్థూల మగుచున్నది. అందుచేతనే ఆత్మబోధ తగినంతగా గ్రహించలేకపోతున్నావు.

కనుక, దృశ్యము పట్ల ఏర్పడే ఆశను త్యజించు. అధిష్ఠానమైయున్న స్వస్వరూపమగు ఆత్మ యొక్క విస్తారతను, ప్రసన్నతను, కాలః కాలత్వమును గ్రహించు. ఆనందించు. అంతేగాని, ఉత్పత్తి - - వినాశన స్వభావయుతాలైన ఈ పదార్థములు నీకేం ఉత్తమ వస్తువును చేకూరుస్తాయి చెప్పు? అవన్నీ నీకు చివరికి విషయ వైషమ్యత్వమును తెచ్చి పెడుచున్నాయి. భయంకరములైన విషయ భోగములను సేవిస్తూ పుండుపై వ్రాలే ఈగ లాగా తుచ్ఛత్వం కొనితెచ్చుకుంటే ఎట్లా? సునిశిత - సుతీక్ష దృష్టిని వదలి, స్థూలత్వం పొంది ఏం ప్రయోజనం?

అందుచేత ఈ చిత్తం వికాసవంతమగు చైతన్యాన్ని ఆశ్రయించి స్వతంత్రం పొందు గాక!

ఓ రామచంద్రా! చిత్తము అనే వృక్షం శరీరము అనే ప్రదేశంలో నెలకొని ఉంటోంది. అనేక చింతలు ఈ చిత్తవృక్షమును పర్యవేక్షించి ఉన్నాయి. ఆ వృక్షం నుంచి 'పుట్టటం పెరగటం చావటం’ అనే పళ్ళు నిరంతరం కాస్తున్నాయి. అది 'ఆశలు' అనే పొడవాటి కొమ్మలతో, వికల్పములు (Misconceptions) అనే ఆకులతో విస్తరించి ఉన్నది. అట్టి చిత్తవృక్షము గురించి తాత్సారం చేయటం ఉచితం కాదు. ఇక ఏమాత్రం శంకించకుండా 'ఆత్మ విచారణ అనే అంపముతో ఆ వృక్షమును మొదలంట వ్రేళ్ళతో సహా నరికి, పెకలించి వేయాలి.

Page:503

మనస్సు, సూక్ష్మబుద్ధి - ఈ మనస్సు అనేక అనుమానాలకు తావు. ఇది సర్వదా బహిర్ముఖం అగుటకే ఉత్సుకత చూపుతోంది. ఎన్ని అనుభవములు పొందుతున్నా, ఎంతకాలం గడచిపోతున్నా కూడా ఇది అంతర్ముఖం అవటమే లేదు. అరె! ఏమాత్రం విశ్రాంతి పొందటానికి ప్రయత్నించదే? ద్వేషములను, అసూయలను ఆశ్రయిస్తుందే గానీ, 'శమ, దమ, తితిక్ష' మొదలైన ఉత్తమ ఉపకరణాల ఊసే ఎత్తదేం? అన్ని వేళలా క్రోధమునూ, సుఖ, దుఃఖాలను మాత్రం పొందుతోంది. తన విశ్రాంతి స్థానమేదో తానే గ్రహించలేకపోతోంది. ఇట్టి మనస్సు అనే ఏనుగును 'అతి సూక్ష్మ బుద్ధి' అనే సింహం యొక్క గోళ్ళు ఉపయోగించి నిరోధించాలి.

ఓ మనస్సా! ఇక నీవు శమించు. ఆత్మజ్ఞాన వివేకం కలుగనంతసేపే నీ ప్రతాపం.

ఓ రాఘవా! చిత్తము అనే పిశాచం తనకు వీలున్నంత వరకూ తృష్ణ (Passion)నే సేవిస్తోందయ్యా! అజ్ఞానం' అనే వటవృక్షం క్రింద విశ్రమిస్తోంది. నిత్యం 'అనంతకోటి జన్మలు’ అనే మహారణ్యంలో సంచరిస్తోంది. అజ్ఞానులలోని చాంచల్యమే దాని రూపం. ఏమి దాని విన్యాసం! ఏమి దాని ఎత్తుగడలు! అట్టి చిత్తమును వివేక - వైరాగ్యములతో నిరోధించాలి. స్వాత్మ గృహం నుండి దానిని వెడలగొట్టనంత వరకు ఆత్మకు ‘ముక్తి' అనుమాట కల్ల.

ఈ మనస్సును ఒక విషసర్పంతో పెద్దలు పోలుస్తూ ఉంటారు. దీనికి "శుభ- అశుభ కర్మలు” అనే రెండు కోరలున్నాయి. ఇది 'దేహము' అనే కుబుసమును కలిగి ఉండి, విశ్రాంతి లేకుండా ప్రాణవాయువులను భక్షిస్తోంది. 'భయములు' అనే మృత్యువును తెచ్చిపెడుతోంది. అట్టి ఈ మనో - విషసర్పాన్ని 'అభ్యాస, వైరాగ్యములు' అనే గరుడ మంత్రముచే నిర్జించాలి. లేకపోతే, ఇది అనేక దేహరూప శవములను భక్షిస్తూ అమంగళస్వరూపంతో దిక్కులన్నీ సంచరిస్తూనే ఉంటుంది. 'అవమానము, శోకము, భయము' అనే దుర్వ్యసనములను కలుగజేసుకుంటూ ఇట్లు బిగ్గరగా రోదిస్తూనే ఉంటుంది.

ఈ మనస్సు ఒక కోతి వంటిది. ఇది జన సమూహమును, వారితో సంబంధములను గాంచుచూ, పిచ్చిపట్టిన దానివలె గంతులేస్తోంది. దీనిని నాలుగు వైపుల నుండీ బంధించాలి. లేకపోతే ఆత్మసిద్ధి ప్రాప్తించదు.

అభావము - నాయనా! రామా! నీవు అభావమును ఆశ్రయించి వాసనలను, సంకల్పములను, తదితర సర్వ కల్పనలను బుద్ధిపూర్వకంగా నిరోధించెదవు గాక! తద్వారా జీవన్ముక్త ఫలమును పరిపూర్ణముగా పొందెదవు గాక!

అసంకల్పముచే సుకృత - దుష్కృత ఉభయవిషయములను పరిత్యజించు. ఈ జన్మ - జాతి భేదములన్నిటినీ మనస్సులో రహితం చేయి. శంకారహితంగా స్వస్వరూపమునందు యథాతథంగా విహరిస్తూ ఉండు.



Page:504

ఈ మనస్సు కోపము - అసూయ - - ఆశ - ఉద్వేగము మొదలైన రూపంతో ఆ పరబ్రహ్మమును కప్పి ఉంచుతోంది. తృష్ణ అనే నోరు తెరచి 'విషయములు' అనే మాంసపు ముక్కలను నములునట్లు చేస్తోంది. మోక్షము విషయంలో నిద్ర - ఆలశ్యములను కలుగజేస్తోంది.

ఇట్టి మనస్సు పట్ల నీవు దయ చూపవద్దు. నిర్దయగా దీనిని నియమించి నీ యొక్క వైరాగ్య మహాప్రయత్నమునకు మనస్సు వల్ల కలుగుచున్న విఘాతములను, అడ్డులను తొలగించుకో!

అప్పుడు నీవు పూర్ణానందైశ్వర్యుడవు కాగలవు. శుద్ధ చిత్తముచే మలిన చిత్తమును పూర్ణముగా శమింపజేసి అఖండ శోభాయమానుడవు కమ్ము.

తత్త్వజ్ఞానం చేత మనస్సును మలినరహితం చేసి ప్రత్యగాత్మ యందు నియమించు.

ఇక ఆపై ఈ స్థూల - - సూక్ష్మ - కారణ శరీరసహితమగు సమస్త జగత్తును అనాదరంతో తృణప్రాయంగా చూడు. క్రమంగా ఈ సంసారము నుండి తరించు. శాస్త్రములకు అవిరుద్ధంగా మెలగుచూ ఉండు. లోకములకు శుభం కలుగజేసే దృష్టితో లీలాపూర్వకంగా ఈ ప్రపంచమున వ్యవహరించెదవు గాక!

Page:505

VII. ఉద్దాలకుని అంతరంగాన్వేషణ

1. చిత్తవృత్తులు

శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ చిత్తవృత్తులను గమనిస్తున్నావా? ఇవి ఇహ - పరలోకముల పట్ల గల ఆసక్తిచే అతిదీర్ఘమై ఉంటున్నాయి. అవి తమ యందు అనేక వాసనలు కలిగి ఉండి కంటికి (పైకి) కనబడకుండానే, సూక్ష్మమై ప్రవర్తిస్తున్నాయి. ఇవి క్షణక్షణం జీవుని సమాధి నుండి నివర్తింపజేస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్తవృత్తులను ఆత్మ యొక్క తత్త్వమును స్వీకరించుట యందు నియమించగలిగామా, అప్పుడిక నిర్మలత్వమును ప్రకటించగలవు. పదునైన కత్తి యొక్క అంచు వంటి ఈ చిత్తవృత్తుల గురించి, ఏమాత్రం, 'పోనీలే' అనే తాత్సారం కూడదు. చక్కటి ఈ మానవజన్మ పొందిన తరువాత ఇక నిదానం పనికిరాదు. శ్రవణము, మననము మొదలైన ఉపాయాలచే ఈ బుద్ధి పరమాత్మపై లగ్నమయ్యేట్లు చేయాలి. వివేకం సహాయంతో బాహ్యవృత్తులను నిరోధిస్తూ క్రమంగా ‘అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలము' అగు ఆత్మవస్తువుతో స్నేహం పెంపొందిం చుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి కదా! ఈ శరీరము పుష్టి, దీప్తి కలిగి ఉన్నప్పుడే గురు శుశ్రూష, వినటం, యోచించటం, ఉపశమనము వంటి ఉత్తమ ప్రయత్నములను స్వీకరించాలి. సద్భుద్ధిని చక్కగా పెంచి, పరిపోషించుకోవాలి. అట్లా కాకుండా, శరీరం వృద్ధాప్యంలో ప్రవేశించిన తరువాత అప్పుడిక ఈ జీవుడు ఏమిచేయగలడో నాకేమీ అర్థం కావటంలేదు.

నా వాక్యాలలోని అంతరార్థం చక్కగా గ్రహించ గలిగినట్టి ఓ రాఘవా! నేను చెప్పు వాక్యార్థమును భావన చేయుటచే ఈ జీవుడు తప్పకుండా ఉత్తమ సుఖమును పొందగలడు. 'ఉద్దాలకుడు' అను మహర్షి ఏ విధంగా అయితే సర్వపదార్థములనూ పరిశోధిస్తూ క్రమంగా పంచ కోశములను, వాటి కారణము లందు లయింప జేసి అధిష్ఠానమగు సన్మాత్రము కొరకై అన్వేషణ సాగించాడో నీవు కూడా అట్లాగే ధీరబుద్ధిచే అంతఃకరణమును మాటి మాటికీ శోధించు. ఆత్మ కొరకై అంతరంగము నందు అన్వేషణ కొనసాగించు. అప్పుడు అంతా నీకే విదితమౌతుంది.

శ్రీరాముడు : హే మహావక్తా! నేను ఉద్దాలక మహర్షి గురించి విని ఉన్నాను. కానీ, ఆయన అంతరంగ శోధన అన్వేషణ గురించి విని ఉండలేదు. ఆ మహానుభావుని కథనమేమిటో

వివరించండి.

శ్రీవసిష్ఠమహర్షి : పంచభూతముల పరిశోధనచే ఉద్దాలక మహాముని ఏ విధంగా పరమజ్ఞాన దృష్టిని పొందారో - అదంతా వివరించి చెపుతాను విను.

Page:506

2. ప్రయత్నము - సంఘర్షణ

గంధమాదన పర్వతంపై గల ఒక వనప్రదేశంలో ఒక తటాకం ఉన్నది. ఆ తటాకం ప్రక్కనే గల ఒక కొండశిఖరం పై ఉద్దాలకుడు' అనే పేరుగల ఒక మునిబాలుడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి నేను నా పురుషప్రయత్నంచే తప్పకుండా శాస్త్రప్రవచితమైన ఉత్తమ పురుషార్థం సాధించగలను” అనే కొండంత ఆత్మవిశ్వాసం ఉండేది.

మొట్టమొదట ఆతడు తాను విన్న, చదివిన శాస్త్రవిషయ సారమును పరిశీలించసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆతని బుద్ధి తన ప్రకంపనములను వదలనే లేదు. ఇక ఇట్లా కాదు. నేను మునుముందుగా శుద్ధమైన అంతఃకరణం సంపాదించాలి. ఆ తరువాతే మిగతా విషయాలు” - అని అనుకున్నాడు. ఇక శ్రద్దగా తపస్సు, అధ్యయనము మొదలైన తీవ్రప్రయత్నములతో కొంత కాలం గడిపాడు. క్రమంగా ఆతనియందు వివేకము ప్రవేశించింది. ఒక్కసారి ఈ సంసార ప్రహసన మంతా గమనించిన తరువాత ఆతనికి ఎంతో భయమనిపించింది.

ఒక రోజు ఒక ప్రదేశంలో ఏకాంతంగా ఆసీనుడై శుద్ధ చిత్తముతో ఇట్లు యోచించసాగాడు.

ఉద్దాలకుడు (తనలో) : దేని యందైతే విశ్రాంతి పొందిన తరువాత ఇక మనుజుడు మరల దుఃఖించడో, జన్మతో సంబంధమే ఉండదో అట్టి వస్తువు ఏది? మనస్సు లేని చోట దేనితోనూ సంబంధం ఉండదు కదా! మనోవ్యాపారమంటూ ఉండనట్టి పవిత్రమైన ఉత్తమ పదము నందు నేను విశ్రమించెదను గాక! అయితే అది ఎలా సాధ్యం? అది సాధ్యపడాలంటే, “ఏదో పొందాలి” అనే భోగతృష్ణను జయించివేయాలి. "ఈ పని, తరువాత ఆ పని, ఇవి పొందాలి, ఇందుకు ఏదో చేయాలి" ... అనేదంతా కల్పనతో కూడినదే. ఆత్మ పదమునందు విశ్రాంతి తీసుకుంటూ అట్టి కాల్పిక వ్యవహారములు చూచి ఎప్పటికి పకపకా నవ్వుకుంటానో! కమల పుష్పదళంపై నీటి బిందువులు ఉండవచ్చు గాక.

కదా వికల్పజాలం మే న లగిష్యతి చేతసి |

స్థితమప్యుజ్ఞితాసఙ్గం పయః పద్మదలే యథా ॥ (శ్లో 21, సర్గ 51)

కమలం ఆ నీటి బిందువులను స్వీకరించదు కదా! ఆ విధంగా అభాసమాత్రమైన ఈ దృశ్య వికల్పములు నన్ను ఎప్పటికి స్పృశించకుండా ఉంటాయో! ఉత్తమబుద్ధితో అతి కల్లోలమైన తృష్ణను ఎప్పటికి అధిగమిస్తానో? ఈ లోకములోని ప్రాణుల సంసార క్రియలను పిల్లవాళ్ళు ఆడుకుంటున్న ఆట లాగా ఎన్నటికి చూస్తానో? నా చిత్తము ఇప్పటికిమాత్రం క్షణక్షణం చంచలమై ఉంటోంది. వికల్పములు కలిగి ఉన్నదై, ఊయలలాగా చంచలత్వం వహిస్తోంది. ఒక పిచ్చిపట్టినవాని వలె భ్రమతో కూడుకుని ఉండే నా మనస్సు ఎన్నటికి శమిస్తుందో?

Page:507

ఓ నా అంతఃకరణమా! నీవు ఎప్పటికి ఆత్మస్వరూపమును పొందుతావు? ఎప్పటికి ఈ తుచ్ఛ దృశ్య ప్రపంచమును చూచి ఎగతాళి చేయగలవు? పూర్ణబుద్ధిని పొంది ఏనాటికి బ్రహ్మాండ శరీరధారి అగు విరాట్పురుషుని వలె హాయిని, సంతుష్టిని పొందుతావో కాస్త తెలియజేస్తావా? నేను అంతఃకరణము నందు 'సమరూపము' కలిగి ఉన్నవాడనై పరమాత్మతో ఐక్యమవ్వాలి. ప్రశాంత - సౌమ్య-సమగ్ర స్వరూపుడను కావాలి. అమృతము, కౌస్తుభమణి మొదలైనవాటి యందు, ధర్మఅర్థ-కామ విషయము లందు నిస్పృహుడను కావాలి. వేలాది ఆశలతో నిండి ఉన్న ఈ అతిచంచల దృశ్య శోభను నిద్రపోతున్నవాని వలె పొందాలి, అది ఎట్లా సాధ్యం? కల్పనలన్నీ శమిస్తే, అప్పటి నా బుద్ధి మాత్రమే ఈ బాహ్య అభ్యంతర జగత్తును “చిన్మాత్రమయం”గా వీక్షించగలదు. అట్టి వీక్షణ యందు సుస్థిరుడనై ఉండాలి. ఇది ఇప్పటి నా కార్యక్రమం.

చిత్తము శాంతించు గాక! గుడ్డివానికి చూపు వచ్చినట్లుగా నేను 'చిదేకరసము' అనబడు పరమ ప్రకాశమును పొందాలి. అభ్యాస వశంచే అట్టి ఉత్తమ ప్రకాశము సమృద్ధమగుచుండగా కాల కళలన్నీ దూరంగా త్యజించి వేయబడాలి!

ఇష్టం-అయిష్టం, హేయం-ఉపాధేయం (something to get rid of - something to get) తొలగి నా అంతఃకరణము శుద్ధం కావాలి. స్వప్రకాశపదము నందు సుస్థితుడనై ఆనందమును సాధించాలి.

దురాశ - కానీ, ఇప్పటి నా స్థితి అందుకు అనుకూలంగా లేదే? ఈ వర్తమాన అజ్ఞానాంధకారపు కాళరాత్రి దురాశలతో, అవిద్యతో, జడత్వంతో, అనేక దోషాలతో నిండి ఉన్నది. అన్నిటికీ కారణం మనస్సే కదా!

ఈ మనస్సును ఎందుచేత జయించలేక పోతున్నాను? ఒక పర్వత గుహలోని అంతర్భాగంలోని శిలలాగా మనోవ్యాపార రహితుడనై నిర్వికల్ప సమాధి యందు ఎందుకు ఉండలేక పోతున్నాను? అహంకారమే నన్ను మోసగిస్తోంది. 'స్వాభిమానము' అనే మహామదం గల ఈ అహంకారమును ‘జ్ఞానము’ అనే ఆయుధంతో నిర్మూలించాలి.

నిర్వికల్ప ధ్యానము నందు విశ్రాంతి పొందాలి. నా మనస్సు మౌనవ్రతం అవలంబించి ఉండగా తలపై పక్షులు గూడుకట్టుకునే స్థితి నేను ఎందుకు పొందగూడదు? ధ్యానము నందు స్థిర బుద్ధి కలవాడనై స్థాణువువలె నిశ్చలంగా ఉండెదను గాక! "తృష్ణ కామాదులతో కూడి జన్మించటం” అనే అలవాటును త్యజించి సంసార పటాటోపాన్ని చిత్తు చేసెదను గాక!

విషయైర్నీయమానే తు చిత్తే మర్కట చఞ్చలే |

న స లేభే సమాధానప్రతిష్ఠాం ప్రీతిదాయినీం | (శ్లో 39, సర్గ 51)

ఈ విధంగా యోచన చేసిన ఆ ఉద్దాలకుడు మరల మరల ఆసీనుడై ధ్యానం అభ్యసించసాగాడు. అయితే, ఆతని చిత్తంమాత్రం కోతిలాగా విషయముల వైపుకే ఆకర్షించబడుతూ ఉండేది. ఆతను

Page:508

కోరుకొన్నట్లు సంతోష దాయకమగు స్థిరప్రతిష్ఠ (సమాధి) పొందనే లేదు. కొద్దిసేపు బాహ్య విషయాలు బాహ్యము నందే త్యజించి సత్వగుణ ప్రధానమగు సమాధి యందు స్థితిని పొందేవాడు. ఇంతలోనే రజోగుణం వచ్చి ఆక్రమించేది. చిత్తము భయమును, ఆలశ్యమును, ఉద్వేగమును పొందేది. కొద్ది నిముషాలలో ఆతని మనోమర్కటం సమాధి సుఖమును త్యజించి కల్లు త్రాగినవాడు వీథిలోనికి వెళ్ళినట్లు ఎక్కడెక్కడికో పరుగులు తీసేది.

కొంతసేపు హృదయాకాశంలో సూర్యుని వంటి జ్యోతిని చూస్తూ ఉండటం.... ఇంతలోనే బహిర్ముఖం కావటం.... మరికొంతసేపటికి అరే ... ఈ విషయములు నన్ను ఆక్రమిస్తున్నాయే” అని గుర్తుకు రావటం... మరల సంఘర్షణ మరల ప్రయత్నించి సమాధి వైపుగా సిద్ధం కావటం... ఇంకొంచెం సేపు ఇటు విషయములను, అటు సమాధిని కూడా త్యజించి అజ్ఞాన ఆత్మజ్యోతుల మధ్యగా ఒకానొక 'సన్నిద్రాస్థితి' యందు చిక్కుకుని ఉండి పోవటం...

ఈ విధంగా ఉద్దాలకుడు ప్రతి రోజూ ధ్యానం కొరకు ప్రయత్నిస్తూ ధ్యానవృత్తు లందు వ్యాకులం పొందుతూ ఉండేవాడు. మొత్తం మీద, తృష్ణ శేషించియే ఉండేది. తృష్ణా తరంగములచే సంకటములు పొందుతూనే ఉండేవాడు. ఎక్కడో దోవతప్పిన బాటసారిలాగా ఏకాకి అయి ఆ పర్వతముపై వ్యాకుల చిత్తంతో అటూ ఇటూ తిరుగుతుండే వాడు.

కొంతకాలం గడచింది. ఇక ఇట్లా కాదని, ఒక రోజు ఒక కొండగుహలో ప్రవేశించాడు. ఆకులతో ఒక ఆసనం తయారుచేసుకొన్నాడు. దాని పైన మృగచర్మం పరచాడు. క్రమంగా చిత్త వృత్తులను సూక్ష్మపరచుకున్నాడు. విషయములు సమీపించకుండా మనస్సును కట్టడి చేశాడు. ఉత్తర దిక్కుగా కూర్చుని కాలిమడమలచే వృషణములను తొక్కిపట్టి, బ్రహ్మ మొదలైన గురుపరంపరా ప్రాప్తమైన 'పద్మాసనం’ వేసి కూర్చున్నాడు. ఇక ఏకాగ్రతతో ఇట్లు చింతన చేయసాగాడు.

3. ఓ మనస్సా! ఇక ఆపవయ్యా నీ పరుగులు! ఉద్దాలకుడు : ఇప్పుడు నేను బాహ్య ప్రపంచంలోంచి అంతరంగములోనికి ప్రవేశిస్తున్నాను.

ఓ మూర్ఖమనసా! కొంచెం ఆగు, ఎటు పోతున్నావ్? ఈ సంసారవృత్తుల వలన మనకేం ప్రయోజనం? చివ్వరికి దుఃఖమునే కలిగించబోయే కార్యక్రమములను ఎవరైనా చేబడతారా? దుష్ట స్థితి గతులకు తీసుకుపోయే మార్గంలో ఎవరైనా తెలివి గలవారు ఆసక్తి కలిగి ఉంటారా? మనం శాంతి’ అనే అమృతం వదలిపెట్టటమేమిటి? కల్పవృక్షం వదలి ముళ్ళకంపలోకి దూరట మేమిటి? అందుకని నా ప్రియాతి ప్రియమైన మనస్సా! కాస్త యోచించు. నీవు బ్రహ్మ లోకానికి వెళ్ళినా, (లేక) పాతాళ లోకానికి వెళ్ళినా, ఏం ప్రయోజనం? మనం నిరతిశయానంద రూపమైన నిర్వాణం సంపాదించాలి గాని ..కాకి లాగా, పిచ్చుక లాగా పీచు వంటి విషయపరంపరలను కాదు. నీవు చెప్పినట్లుగా ఇన్నాళ్ళూ ఆశలవెంట పరుగులు తీశాను. ఏమైంది? ఆశలు తీరనప్పుడల్లా దుఃఖం

Page:509

వచ్చిపడింది. ఒక ఆశ తీరగానే మరొక ఆశ వచ్చి పడింది. ఆశలు తీరనంతకాలం అపూర్ణత్వము వచ్చి పడుతూనే ఉన్నది కదా!

కనుక, నీవు భోగములందలి ఆశను త్యజించు. నిరతిశయానంద రూపమైనట్టి సుందరమైనట్టి, శ్రేయమైనట్టి మోక్షము కొరకే ప్రయత్నించు. ఈ 'ఇష్టములైనట్టివి చేకూర్చుకోవటం - ఇష్టం లేని వాటిని వదలించుకోవటం" అనే వ్యవహారమంతా నీకు దుఃఖమునే కలుగజేస్తోంది సుమా! ఏమి సుఖం? ఎక్కడి సుఖం? నూతిలో కప్పలాగా ఈ శబ్ద, స్పర్శ, రూపాది ఇంద్రియ విషయములలో నిరర్ధకంగా నీవు ఎందుకు చిక్కుకుంటున్నావ్? సరే, ఇంతకాలం తిరిగావు. ఇప్పటి వరకూ ఏమి పొందామో చెప్పు? సర్వ వృత్తుల యొక్క ఉపరమము (Withdrawal) కొరకై మనం ఎందుకు ప్రయత్నించ కూడదు? అదొక్కటే సదేహ - విదేహ కైవల్యములకు మార్గమైయున్నది.

ఓ చెవులారా ! వ్యర్థముగా భేదము పొందవద్దు. మరల మరల బహిర్ముఖం అవుతూ, గీతములకై, ఘంటానాదములకై పరుగులు తీసి చివరికి మూర్ఖ మృగముల వలె క్షయం పొందటం భావ్యమా? ఆటవికులు చేసే ఆడ ఏనుగుల ఘీంకార శబ్దానుకరణను విని పరుగులు తీస్తూపోయి వాళ్ళు పన్నిన వలలో పడిపోయే మగ ఏనుగులాగా ఉన్నది మన విన్యాసం!

ఓ రసేంద్రియమా! ఎఱను చూచి లొట్టలు వేస్తూ పరుగులు తీసి గాలమునకు చిక్కుకునే చేపలాగా నాశనమును తెచ్చిపెట్టుకోవద్దు.

ఓ నేత్రములారా! 'నేత్రవృత్తి'తో ఏకత్వము పొంది రూపలోభముచే ఎగిరెగిరి, నిప్పులోనికి పయనించి దగ్ధం అయ్యే మిడతలాగా మీరు రూపాకర్షణలకు లోను కాకండి.

ఓ నాశికమా! సువాసనచే ఆకర్షించబడి పువ్వులో ప్రవేశించి, అక్కడనుండి బయటకు రాలేక శల్యమయ్యే తేనెటీగలాగా కడతేరకు.

కురఙ్గలిపతఙ్గభమీనాస్త్వేకైకశో హతాః |

సర్వైర్యుకైరనర్థేస్తు వ్యాప్తస్యాజ్ఞ కుతః సుఖమ్ || (శ్లో 21, సర్గ 51)

ఓ అజ్ఞాన మానసమా! ఏనుగు, చేప, మిడుత, తేనెటీగ - ఇవన్నీ ఒక్కొక్క ఇంద్రియమునకే వశీభూతమై వినాశనము తెచ్చిపెట్టుకుంటున్నాయి. ఇక పంచేంద్రియములు గల ఈ మానవునకు సుఖమెక్కడిది?

ఓ మనస్సా! నీవు పట్టుపురుగును చూచావా? అది తన నుండి సహజంగా వెలువడే ‘చొంగ' చేత తన్ను తానే బంధించుకొనుచున్నది. ఆ బంధమును బహుగట్టిగా, సువిశాలంగా నిర్మించుకుని, మధ్యగా తాను విశ్రమించుచున్నది. ఇక ఆపై ఆ బంధనము నుండి బయల్వెడలలేక కృంగిపోతోంది. దిక్కు తోచక అలమటిస్తోంది. నీవు కూడా నిన్ను నీవు బంధించుకోవటానికే ఈ విషయవాసనలను నీ యందు కలిగి ఉంటున్నావు. ఏదేదో వినాలి, చూడాలి, స్పర్శించాలి, ఆఘ్రాణించాలి, రుచిచూడాలి” అనుకుంటూ బయలుదేరుతున్నావు.

Page:510

ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏవేవో కల్పనలలో ప్రవేశిస్తున్నావు. కళ్ళు మూసినా తెరచినా పరుగులు మాత్రం ఆపవు కదా! కొంచెం సేపు నీ ఇంద్రియ తాదాత్మ్యము ఆపు. నే చెప్పేది శ్రద్ధగా

విను.

'పుట్టటం - చావటం మొదలైన రూపములలో ఉన్న ఈ సంసారరోగమును మనం రహితం’ చేయాలి. అందుచేత 'కర్మ - ఉపాసన'లచే నీవు శుద్ధిపడు. జ్ఞానవిషయాలు మరలమరల విను. అజ్ఞానం సమూలంగా నశించిందా - - ఇక నీకు అనంత విజయం ప్రాప్తించగలదు.

దేనినైనా ఆశ్రయించే ముందు, ఇది మనకు యోగ్యమా? అయోగ్యమా? యుక్తమా? అయుక్తమా? శ్రేయమా? ప్రేయమా? అర్హమా? అనర్హమా? ఉచితమా? అనుచితమా? ...అని పరిశీలించాలి. అంతేగాని గుడ్డిగా దుఃఖంలోనో, ఆవేశంలోనో, భయంలోనో, అనుభవంలోనో ప్రవేశించరాదు. ఈ 'జగత్ ప్రవృత్తి' ని కించిత్ పరిశీలించు. ఇదంతా మరణ, దారిద్ర్య, నీరస, యౌవన, వార్ధక్యాలు కలిగి అగమ్యంలోనికి పరిగెత్తుకుపోతున్నది. అశ్రద్ధగా ఉన్నామా మరణానంతర ప్రవృత్తి నరక-స్థావర’ గతులకు దారి తీస్తున్నది. 'జగత్ ప్రవృత్తి ఇట్టిది' అని మనకు తెలిసి కూడా వాటిని త్యజించకుండా ఎందుకు లీనమై ఉండాలి? మనం అధమత్వాన్ని ఎందుకు ఆశించటం? ఎంత చెప్పినా వినవా? నీవు హితం లేని దానివి కనుకనే నేను చెప్పే హితోపదేశం వ్యర్థమవుతోంది.

సర్వమును విచారించిచూచినవాడు చూస్తూ ఊరుకోడు. చిత్తమును పూర్తిగా నాశనం చేయ వలసిందే. శీతకాలంలో మంచు ఎక్కువగా ఉంటున్నట్లు, అజ్ఞానాధిక్యత ఉన్నంతవరకూ చిత్ర యొక్క ఆధిక్యత ఉండి తీరుతోంది.

వసంతకాలం రాగానే మంచు కరిగిపోతుంది. వివేకము వర్ధిల్లుతుండగా ఈ చిత్తము, ఇది కల్పించే న్యూనత, ఆధిక్యతలు, సుఖ దుఃఖములు తొలగిపోతాయి. వాసనాక్షయం అగుచుండగా చిత్తము తన రూపమునే కోల్పోవుచున్నది.

చిత్తము నందు అవివేకము పేరుకుని ఉన్నప్పుడు ఆ అసద్రూప చిత్తమునకు ఎంత బోధిస్తే మాత్రం ఏం లాభం? వివేకి విషయంలో మాత్రమే శాస్త్రబోధ మహా ప్రభావితమౌతోంది.

అవివేకికి శాస్త్ర శ్రవణం చేసినప్పటికీ చిత్తములో మార్పు ఉండదు. వివేకికి క్రమ క్రమంగా చిత్తమే ఉండదు.

అందుచేత ఓ మనస్సా! నీవు వివేకముచే నశించుటయే స్వభావముగా గలిగి ఉన్నావు. అసద్రూపం అయి ఉన్న నిన్ను ఎందుకు త్యజించరాదు? నీకు బోధించి, క్రమంగా నిన్ను త్యజించటమే మంచిది. లేకుంటే నిన్ను ఊరకే వదిలితే, ఇక నేను కూడా తెలివి తక్కువవాడిని అవవలసి వస్తోందే గాని, ప్రయోజనం ఉండటం లేదే?

Page:511

4. నేనెవడను? ఈ శరీరమునా? ఒక జీవాత్మనా?

నేనెవడను?... సర్వ వికల్పములకు ఆవల ఉన్నవాడను. నిర్వికల్పుడను. చిత్ రూపము చేత ప్రత్యక్షమై ఉన్నవాడను. అహంకార వాసనా రహితుడను. అహంకారమునకు బీజభూతమైనట్టి చిత్తముతో నాకు ఎట్టి సంబంధం లేదు. అజ్ఞానుల దృష్టికి ఈ శరీరం నేను. అనేక ఆత్మలలో ఒక ఆత్మను నేను అనునట్లుగా తోచుచున్నది. అనేక దుఃఖముల కొరకే మనస్సు అట్టి భావనలను ఆశ్రయిస్తోంది. ఒక మారేడు పిందెలో ఏనుగు ఉన్నదంటే ఎవరు నమ్ముతారు? అనంతమగు ఆత్మ తత్త్వము పరిచ్చిన్నత్వమును భావన చేసి, ఆ తదుపరి అధిగమించలేకపోతోంది.

మనస్సు ‘దుఃఖ ప్రదములగు వాసనలు అనే బురదలో ఇరుక్కొనుట చేతనే తదితర యాతనలన్నీ వచ్చి పడుతున్నాయి. వాసనలను ఎల్లప్పుడూ ఆశ్రయించాలనుకొనే ఈ మనస్సును నేను దూరంగా త్యజించివేస్తున్నాను.

“ఈ దేహమే నేను, ఒక ఆత్మను నేను,. వేరువేరు ఆత్మలు తదితరులు" - అనునది మిథ్యాభ్రాంతి నుండి పుడుతోంది. విచారణ శూన్యులగు బాలుర వంటి వారికి అట్టి యోచన వస్తోంది. అదే అహంకారం. అది మహామోహము గాక మరింకేమీ కాదు. విచారణ పరుడగు నాకు అట్టి దుర్య్వసన పూర్వకమైన అహంకారంతో పని లేదు.

జ్ఞానమే నా స్వరూపం!... కాలు బొటనవేలునుండి శిరస్సు వరకు గల ఈ శరీరము యొక్క అణువణువూ చాలా బాగా విచారించాను. నేను జ్ఞానమాత్రమును. మరింకేదీ కాదు. జ్ఞానమే బాహ్యమున ఈ దిక్కులన్నిటినీ పరిపూర్ణం చేసి ఉంటోంది. అదియే ముల్లోకము లందు ఏకరూపమై వెలయుచున్నది. దాని యందు దేశ - కాల - దేహ పరిచ్ఛేదం అంటూ ఏదీ లేనే లేదు. అందు మరొక పదార్ధం అంటూ ఏదీ ఉండజాలదు.

దేనికైతే పరిచ్ఛిన్నరూపము గానీ, నామవికల్పముగానీ, ఏకత్వముగానీ, అనేకత్వముగానీ, మహత్వముగానీ, అణుత్వముగానీ ఉండనే ఉండవో... అట్టి జ్ఞానస్వరూపమే నేను.

జ్ఞానస్వరూపుడనగు నేను నా సాక్షిరూపముచే ఈ మనస్సు అనబడుదానిని ఎదురుగా గాంచు చున్నాను. వివేకంచే జనించిన జ్ఞానంచే మనస్సును ఇప్పుడు నా యందు లయం చేసివేస్తున్నాను.

శరీరం - ఇక్కడ మాంసము, ఇక్కడ రక్తము, ఇక్కడ బొమికలు, ఇక్కడ ప్రాణవాయువులు ఇంతేకదా ఈ శరీరం? ఇక ఇందులో 'అహంకారం' అనబడేది ఎక్కడున్నది? ఈ దేహము యొక్క సంచలనాత్మక శక్తి ప్రాణవాయువులకు సంబంధించినది.

ఇందలి జ్ఞానము మహాచైతన్యమునకు సంబంధించినది. 'జన్మ-జర-మరణము' మొదలైనవన్నీ శరీరమునకు సంబంధించినవి. ఇందులో అహంభావముగా ఉన్నదేది?

Page:512

మాంసము, రక్తము, ఎముకలు, చలనశీలమగు ఇంద్రియములు, ఎఱుగుట (జ్ఞానము) ఇవన్నీ నేను’ అను పదమునకు భిన్నమైనవే కదా! కాని ఏమి చమత్కారం! 'నేను' అనునది వాటన్ని టిని 'నావి' అనుచున్నది. ఏది ఏమైనా అవి మాత్రం 'నేను' కాలేవు. మరి ఈ ఉపాధిరూపమున 'నేను' అను అహంభావరూపమున ఉన్నదేది?

చెవులు, ముక్కు నాలుక, చర్మము, కళ్ళు - వీటన్నిటికీ వేరై, వీటి యందు ఉండి, అనుభవమును పొందుచున్నది ఏది? ఎక్కడిది?

నేను - ఈ మనస్సు 'నేను' అను పదముచే ఉద్దేశించబడటానికి వీలులేదు. ఇందు గల వాసనలు కూడా “నేను” అనబడునది అయి ఉండటానికి కుదరదు. కనుక, చిన్మాత్రమగు ఆత్మయే అహంభావరూపమున, లేక 'నేను' అను రూపమున ప్రకాశించుచున్నది.

ఆరోపిత దృష్టి - ఇక ఆరోపిత దృష్టితో చూద్దాం. ఈ వినటం, చూడటం, స్పర్శించటం, ఆఘ్రాణించటం, రుచి చూడటం - ఇవన్నీ 'నేను' చేతనే పొందబడుచున్నాయి. అనుభవములన్నీ అనుభవజ్ఞుని ప్రదర్శనలే కనుక అవన్నీ నేనే.

అపవాద దృష్టి - నేను ఏదై ఉన్నాను?" అను ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు, అపవాద దృష్టి (Attributive perception)చే చూస్తే ఇవేమి నేను కాదు.

'నేను సర్వమును ఎఱుగుచున్నవాడను' అనునదే సత్యము. ఈ దేహము నేను. దీని తోనే ఉంటాను. దీని తోనే పోతాను" - అనునది మాత్రం సత్యదృష్టి కాదు.

ఆహా! పిచ్చికుక్క వెంటబడినప్పుడు ఒక పిల్లవాడు అనేక వికారములు ప్రదర్శిస్తున్నట్లు, నేను ఇంతకాలం నేను కాని వాటిచేత వికారములు పొందాను. ఎంతో బాధించబడ్డాను. అమ్మయ్యా! సౌభాగ్య వశం చేత ఇంతకాలానికి 'అజ్ఞానము' అనే దొంగను కనిపెట్టాను. పరమార్థమగు 'ఆత్మ జ్ఞానము’ అనే సొత్తును అపహరించిన ఆ దొంగ ఆట ఇక సాగనివ్వను.

ఎందుకంటే, నేను స్వతహాగా దుఃఖరహితుడనే. అట్టి నేను దుఃఖములు పొందటమేమిటి? ఆకాశమునకు, మేఘములకు సంబంధముంటుందా? అవి రెండూ ఒక్కటి అవుతాయా? లేదు అట్లాగే ఈ దుఃఖములకూ, నాకూ సంబంధం లేదు.

నవరసాలు పోషించే నటునిలాగా 'అహంకారం' అనే వేషం ధరించి నేను నా మనస్సుకు ఉపదేశాలు చేస్తున్నాను. ఈ శరీరం ధరించి, శరీర సంబంధ మాత్రములైన 'తెలుసుకోవటం, ఉండటం, రావటం, పోవటం' మొదలైనవి నిర్వర్తిస్తున్నాను. అయితే, ఆత్మ సందర్శనం చేత నేను అసలు అహంకారవిషయుడనే కాను. నటుడు తాను వేసే వేషం కంటే వేరైన వాడే కదా!

నేను లేకపోతే ఈ కళ్ళు ఉండవు, చూపు ఉండదు, చూడబడేవీ ఉండవు. నా కంటే వేరుగా చూస్తే వాటికి ఉనికి లేదు. అవన్నీ ఈ దేహము నందో, లేక, మరెక్కడనో ఉంటే ఏమున్నది? లేక పోతే ఏమున్నది? నేను వాటన్నిటికీ సంబంధించినవాడను కాను.

Page:513

ఏమి చమత్కారం! చెట్టు మీద భూతంలాగా ఈ జగత్తు నందు పచార్లు చేసే ఈ 'అహమ్’ అనునది ఎవరు? ఎవనిచే, ఎప్పుడు, ఎట్లు, ఎందుకు కల్పించబడుచున్నది? -ఈ ప్రశ్నకు రాకుండానే నేను ఇంతకాలం గోతిలో చిక్కిన లేడిలాగా పడిఉన్నానేమిటి?

ఈ కన్ను ఏదో 'రూపము' అనే విషయాన్ని చూస్తోంది. అది ఆ రూపమును గాంచుట యందు నిమగ్నమై ఉండగా, ఇక ఆ దృశ్య విషయమును 'ఇది దుఃఖ విషయము' అను అర్థమును ఇచ్చి తదనుభవం పొందుచున్న నేనెవడిని?

ఈ త్వక్ (చర్మము) స్పర్శయందు ఉన్ముఖమగు చుండగా, ఆహా! బాగుగదా! అని చెప్పుచూ దుష్ట పిశాచంలాగా పాల్గొనుచున్న అహమ్ ఎవరు?

నాలుక రుచిని స్వీకరిస్తూ ఉండగా ఇప్పుడు భుజిస్తున్నాను. ఇవి ఎంత రుచిగా ఉన్నాయి! అనే దుష్టభ్రమ కలుగుచున్న దెవరికి? చెవుల శబ్దమును పొందుతూ ఉండగా అయ్యో! ఈ మాటలచే నన్ను ఇంతగా అవమానిస్తున్నారా?” అనే దుఃఖమును పొందుతూ, అతి దీనంగా స్పందిస్తున్నది ఎవరు? ఈ ముక్కు ఏదో వాసన పొందుచుండగా "అబ్బే! ఏం బాగోలేదు అనుకుంటూ చెప్పుచున్నదెవరు?

అహంకార కల్పన! - ఈ ఇంద్రియములు తమ పనులు చేస్తూ ఉంటే, వాటి యందు, మృగతృష్ణా జలం లాగా అహంకారం వచ్చి తేలియాడుచున్నది. కనుక... “ఈ దేహేంద్రియాదులే నేను” అనే “భావన” భ్రాంతి నుండి, బూటకపు కల్పన నుండి బయలుదేరుతోంది. ఈ దేహేంద్రియాదుల పట్ల గల అహంభావము ఇప్పుడు నాచే పరిత్యజించబడుగాక!

ఈ దేహమును కదల్చుచున్న దెవరు? వాసనలా?...లేదు. ఎందుకంటే, ఒకడు సదభ్యాసం చేత వాసనా రహితుడైనప్పటికీ ఈ దేహము తన జీవన హేతువగు కర్మయందు ప్రవర్తన కలిగియే ఉంటోంది. 'కనుక శరీరవ్యాపారమునకు వాసనలు కారణం' అనటానికి వీలులేదు. వాసనలు దేనికి సంబంధించినవో ఈ దేహకర్తృత్వం అద్దానిది అవుతుంది.

ఓ మలిన చిత్తమా! నేనిప్పుడు చేస్తున్న విచారణ అంతా నీవు గమనిస్తున్నావు కదా! ఒక్క విషయం గ్రహించు. వాసనారహితంగా జరుగుచున్న కర్మ వ్యవహారము లందు 'నేను దుఃఖిని’ అనే అనుభవం ఉండజాలదు. వర్తమాన కర్మలు ఎప్పుడైతే వాసనారహితమౌతాయో, ఇక భవిష్యత్తులోని సుఖ - దుఃఖానుభవములు కూడా ఉండజాలవు.

అదియే వాసనాత్యాగం. మూర్ఖులగు ఓ ఇంద్రియములారా! మీరు మీ వాసనలను త్యజించి, అటుపై యథాతథంగా మీ పనులను నిర్వర్తించారా - - ఇక మీరూ, నేనూ దుఃఖం పొందము. ఒక బాలుడు మట్టితో బొమ్మ తయారు చేసుకొని, ఆడుకుంటూ, అది పగిలిపోతే పెద్దపెట్టున ఏడుస్తాడు చూచారా? మీరు కూడా విషయ సముపార్జన యందు శ్రమిస్తున్నారు. కోల్పోతున్నప్పుడు దుఃఖం పొందుతున్నారు. ... అందుకు వాసనలు కలిగి ఉండుటే కారణం.

Page:514

ఓ ప్రియమైన శుద్ధ చిత్తమా! అదిగో, ఆ తటాకంలో తరంగములు అగుపిస్తున్నాయి కదా! ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ తరంగములు జలము కంటే వేరా? కాదు. ఈ వాసనాదృష్టులు కూడా జ్ఞానదృష్టితో చూస్తే ఆత్మ కంటే వేరు కాదు - అని గ్రహించు.

ఓ ఇంద్రియములనే పిల్లవాళ్ళల్లారా! పట్టుపురుగు తన దారములో చిక్కుకొని నశించునట్లు మీరు మీయందు బయలుదేరే తృష్ణ యందు చిక్కుకొని వ్యర్థముగా పరితపించకండి.

కొండను ఎక్కుచున్న బాటసారి వడదెబ్బకు క్రిందబడి కొట్టుకొంటున్నట్టు మీరు 'సంసారం' అనే ముళ్ళ ప్రదేశంలో పడి కొట్టుకోకండి. పూలను దారం బంధించి ఉంచుతున్నట్లు మీరు బంధింపబడి ఉండుటకు వాసనలే కారణం.

వాసనలు' అనబడేవి ఎక్కడి నుండి వచ్చాయి? భ్రాంతి నుండే! భ్రాంతిచే కల్పించబడేవి యథార్థం కాదు. అవి 'సంకల్పించకపోవటం' అనే శస్త్రం చేత సులభంగా ఛేదించబడగలవు. గాలి వాటుకు దీపం ఆరిపోవుచున్నట్లు వాసనలే అజ్ఞానానికి, వినాశనానికి హేతువులు అగుచున్నాయి. చిత్తము అనగా వాసనలే.

88

హే చిత్త సర్వేన్డ్రియకోశ తస్మాత్స ర్వేన్టియైరైక్యముపేత్య నూనమ్ |

ఆలోక్య చాత్మానమసత్స్వరూపం నిర్వాణమేవామలబోధమాస్స్వ (శ్లో 69, సర్గ 52)

సర్వ ఇంద్రియములను ఆయా పనులకు పురమాయిస్తూ క్రింద - మీద చేసే ఓ చిత్తమా! ఇప్పటి దాకా మనం చెప్పుకున్న విచారణలోని ఆయాకారణాల వలన ఒక క్రొత్త విషయం వెలికివస్తోంది.

నీవు కూడా తదితర ఇంద్రియములలాగానే అసత్తువు, ఉపకరణ మాత్రము అయి ఉన్నావు. ఇక నుండి సాక్షిరూపమైన 'ఇంద్రియరూప మాత్రము' అయి ఉండు. వేద శాస్త్రజ్ఞులు మనకేం చెప్పుచున్నారు? "ఏకమేవాద్వితీయం బ్రహ్మద్వితీయమైనదంటూ మరొక్కటేదీ స్వయం ఉనికి కలిగి ఉండలేదు" - అని కదా! మనం దీనిని చక్కగా గ్రహిద్దాం. అంతేగాని భ్రమను కలిగి ఉండవద్దు. భ్రమ అనే విషూచి అనంత దుఃఖదాయకమైయున్నది. 'అహంకారము కలిగి ఉండుట’ అను అలవాటే ఆ భ్రమ, లేక, వాసన యొక్క స్వరూపం. అదే అనేక సార్లు అజ్ఞాన ప్రేరితమైన విషయ అభిలాషలను కలుగజేస్తోంది. ఆత్మతో సంబంధమును, ఏకత్వమును అనుబంధమును దూరం చేస్తోంది.

‘ద్వైతము / ద్వితీయము’ అనే విషూచిని మనం అతి నిపుణతతో అధిగమిద్దాం... త్యజిద్దాం. ఓ మిత్రమా! చిత్తమా! నీవు సంసారరహితుడవు కమ్ము. ఈ జనన - మరణాది సర్వభయములను త్యజించు. పూర్ణానంద స్వరూపుడవు కమ్ము.

Page:515

5. నిర్లిప్తుడను - అప్రమేయుడను - అసంగుడను ఉద్దాలకుడు : "అనంతాకారయుతము, అత్యంత సూక్ష్మము, విషయరహితము అగు నా ఆత్మ స్వరూపమును ఈ వాసనలు కొంచమైనా స్పృశించగలవా? లేదు.

బాలుని దృష్టిలో 'బేతాళుడు' అనే లేని ఆకారం కల్పించబడుచున్నదే! అట్లాగే బుద్ధి యందు అహంకారము, సూక్ష్మవాసనలు కల్పించబడుచున్నాయి. అట్టి వాసనల సహాయంతో మనస్సు జడములను ఉపయోగించి తదితర జగత్తును పొందుతోంది. మనస్సు జాగ్రత్తు నందు, ఇంద్రియ విషయము లందు పాల్గొనుచూ అనేక జాగృతృశ్యానుభవములు సంపాదించుకుంటోంది. అదే మనస్సు స్వప్న సమయంలో భావనచే వాసనామయ విషయములను నాడీ ప్రదేశంలో పొందుతోంది.

మనస్సు యొక్క 'జాగ్రత్, స్వప్న' - - అనుభవములు నా సమక్షంలో జరుగుచున్నాయి. నేనో... చిత్వ్సరూపుడనై, నిర్లిప్తుడనై అంతా వీక్షిస్తూ ఉన్నాను.

నా స్వరూపమైనట్టి ‘చిత్తు'నకు జనన మరణములు లేవు. 'సర్వవ్యాపి, నిరాకారము' అయిన చైతన్యము నందు ఉద్భవించేదేది? నశించేదేది?... కాబట్టి, జీవుడు దేని యందు నశిస్తాడు? జీవుని యందు ఏది నశిస్తుంది?... స్వస్వరూపమగు 'చిత్తు' నకు ఈ శరీరాదుల యొక్క రాక పోకలచే క్రొత్తగా వచ్చేదేమున్నది? కోల్పోయేదేమున్నది?...

ఎందుకంటే... 'సర్వాత్మ' యగు చైతన్యమే అందరి యొక్క జీవనము. అట్టి చైతన్యమే నేను. సమస్త దేశ కాలము లందూ, సర్వ వస్తువులందూ చిత్ స్వరూపమే వ్యాపించియున్నది. మరప్పుడు 'జీవించు కాలము, జీవించని కాలము' అనేవి ఎక్కడున్నాయి? అనగా, నా స్వస్వరూపమగు చిత్తునకు జీవన - - నిర్జీవనములు లేవు. ఏ కాలంలోనూ ఏదీ అభిలషించ వలసిన పనే లేదు. "ఇది మరణించుచున్నది, ఇది జీవించుచున్నది - ఇట్టి అనేక వికల్ప కల్పనలన్నీ కేవలం మనస్సుకే గానీ, నిర్మలమగు ఆత్మకు కావు. ఏ అంతరంగమైతే ఈ దేహాదులే నేను అను దురహంభావనను తన యందు ఏర్పరుచుకొని ఉంటోందో... అట్టి అంతరంగము మాత్రమే తన యందు జనన మరణాదులను పొందుతోంది. ఆత్మ యందు మాత్రం 'అహమ్' భావన గాని, మరే భావన గానీ ఉండవు. ఇక దానికి జనన మరణాదులు ఎక్కడుంటాయి? మృగతృష్ణ మిథ్యాభ్రమ అయినట్లు; దేహము, మనస్సూ - ఈ రెండూ మిథ్యయే. వాటి యందు ప్రతిబింబించే ‘అహంకారము’ మాత్రం సత్యమైనదెట్లా అవుతుంది? ...జడమే కదా ... అభిమానం దేనికి?

ఈ కనబడే పదార్థముల విషయానికి వస్తే ... ఇవన్నీ కూడా జడమైనవే కదా! ఈ శరీరం కూడా ఒక జడపదార్థం మాత్రమే. ఇది స్వయముగా ఏదీ చేయుటలేదు.

చైతన్యస్వరూపుడనగు నేను ఈ దేహము మొదలైన జడపదార్థములపట్ల అభిమానం ఎందుకు

కలిగి ఉండాలి?



Page:516

ఈ పదార్దములన్నీ ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా నేను ఉన్నాను. ఈ రక్తమాంసమయ దేహమునందు లీనమగుచూ, 'ఇది నాది' అని తలచుచున్న మనస్సును చూస్తే నాకు జాలివేస్తోంది. అట్టి అభిమానము విచారణ చేసినప్పుడు తప్పక నశించుచున్నది.

మనస్సు - చిత్తము - బుద్ధి అనునవి స్వయంగా చైతన్యములు కావు. జడములు మాత్రమే! అవి మరొక దానిచే ప్రవర్తింపజేయబడుచున్నాయి. అవి కల్పనలోని విభాగములు. కనుక అవి అహంకారము అను దానిని తామే సృష్టించగలవా? ...లేదు. ఇక ఈ దేహంలో ఇంద్రియములున్నాయి కదా!... ఇవి ఉపకరణములు మాత్రమే. ఇవి 'రూపము' మొదలైన విషయములను సాక్షాత్కరింప జేయుటలో నిమగ్నమై ఉన్నాయి.

ఈ బాహ్యపదార్థములు తమ తమ పదార్థత్వమును వ్యక్తపరచుట యందు స్థితి కలిగి ఉన్నాయి. వాటన్నిటి యందూ 'నేను' అనునది ఎక్కడున్నది? ఇవన్నీ నాచే ఉపయోగించబడుచూ, తెలుసుకోబడుచున్నవి' అయి ఉన్నాయి.

ఇక గుణములు’ విషయం!... శాస్త్రకారులు గుణములను సత్వము రజము తమము అను మూడు విధాలుగా విభజించారు. ఈ సత్వరజోతమస్సులు ప్రకాశము (తెలివి) పొందుట, ప్రవృత్తిని పొందుట, మోహము పొందుట" - - అను మూడు రకాలుగా ఏర్పడి ఉంటున్నాయి. ఈ త్రిగుణముల రకరకాల పాళ్ళకలయికయే ప్రకృతి. మాయ, ప్రధానము అని కూడా దీనిని పిలుస్తారు.

గుణములు ఎవరివి? ... గుణివి (one who is exhibiting qualities). గుణి లేకుంటే గుణాలు ఉండవు. కనుక గుణములు స్వయంగా జడములు మాత్రమే. గుణి గుణములకు ముందే, గుణాల కంటే సూక్ష్ముడై, గుణములకు స్థానమై, కారణమై ఉంటున్నాడు. అతడు గుణములకు అప్రమేయుడు.

గుణి యొక్క స్వరూపము 'సత్ బ్రహ్మము'. అది సర్వదా తన స్వాత్మభావన యందు నెలకొని ఉన్నది. అది అఖండము. అహంకారము అనబడేది అఖండమగు సత్ బ్రహ్మము నందు చోటు పొందజాలదు. అనగా 'అహంకారం' అనేది ఎక్కడా, ఏ రూపంలోనూ ఉండజాలదు.

బాగున్నది!... అయితే, ఈ 'జీవుడు' అని తారసపడేవాడెవడు? ఒకే సూర్యుడు అద్దం లోనూ, తటాకం లోనూ, కళ్ళ యందు ప్రతిబింబిస్తున్నాడు కదా! ... అదేవిధంగా ఒకే చిత్తు ఈ దేహము లన్నిటి యందూ ప్రతిబింబిస్తోంది.

అనగా... ఈ దేహమున కనిపించే చిదాభాసుడు పరమానంద చిదాత్మయే. సర్వవ్యాపి, సర్వకాలమయుడు, మహత్తరరూపుడు అగు చిదాత్మ సర్వదేహము లందూ 'దేహి' గా వెలయుచున్నాడు. అట్టి మహత్తర రూపునకు 'ఈ దేహము నాది' అను దేహాభిమానము, అహంకారము ఎట్లా కలుగుతాయి. కనుక అట్టి అల్పభావము ఆపాదితమే గానీ, వాస్తవం కాదు.

దేహి - ఈ దేహము నందు దేహిగా అభిమానం కలిగి ఉంటున్నవాడెవడు? వాని ఆకారము ఎట్టిది? ఆతడు ఎట్లా ఏమని నిరూపించబడతాడు? ఆతని రంగేమిటి? రూపేమిటి? ఏ పదార్ధముచే ఆతడు తయారగుచున్నాడు?

Page:517

అహం భావము ప్రదర్శిస్తున్న నేనెవరిని? నేను అహంభావమునా? అందుకు వేరైన వాడినా? అహంభావము నాచే గ్రహించబడుచున్నదా? లేక, నేను అహంభావముచే గ్రహించబడుచున్నావా? అహంభావము నన్ను కల్పిస్తోందా? నేను అహంభావమును కల్పించుకుంటున్నానా?

భావాతీతం! - ఇట్లు యోచించినప్పుడు 'నేను అహం భావమునకు మునుముందే ఉండి ఉన్నాను అని తెలిసిపోతోంది. ఈ భావాభావములు నా యందు గానీ, భావాభావములు యందు నేను గానీ లేము.

అవును. ఈ ప్రపంచమున 'అహంభావాభిమాని అనువాడెవ్వడూ యథార్ధానికి లేడు. కనుక నేను అహంకార రహితమగు చిదాత్మ స్వరూపుడను. అట్టి నాకు ఎద్దానితోనూ ఏ సంబంధమూ లేదు. అహంకారము అసత్తేనని నిరూపించబడుతోంది కదా! ఇక ఎవనికి దేనితో ఏమి సంబంధం? అట్టి సంబంధము యొక్క అభావము సిద్ధిస్తున్నప్పుడు సర్వద్వైతకల్పనలూ వాటంతట అవే నశిస్తున్నాయి. మరి నేను నిర్లిప్తుడను, అప్రమేయుడను, అసంగుడను కదా!

6. ఇక శోకం దేనికి?

ఈ విధంగా ఈ జగత్తంతా బ్రహ్మాత్మకమే అయి ఉన్నది. సత్వరూపుడనగు నేను ఎందుకు వ్యర్థంగా శోకించాలి? అన్ని సమయాలలోనూ నేను అద్వైత సామ్రాజ్యమున స్థితుడనై ఉన్నానని

నిరూపించబడుతోంది కదా!

ఈ జీవుడు చేరతగ్గ అన్నిటికన్నా ఉత్తమోత్తమ స్థితి ఏది? ...ఏకమై, నిర్మలమై, సర్వవ్యాపకమై శుద్ధమై ఉన్నట్టి ఆత్మపదమే - అన్ని రూపు లందు, అన్ని దిక్కులందూ, అన్ని వేళలందూ వెలయుచున్నది. మరి 'అహంకారము’ అనే కళంకమే అసంభవం. అహంకారమనేది లేనే లేనప్పుడు, ఇక దానిని తొలగించుకోవాలి' - అనేది ఎక్కడుంది? అట్టి ప్రసక్తి అక్కర్లేదు.

పదార్థములు లేవు ఆత్మ మాత్రమే ఉన్నది - యథార్థానికి పదార్థజాలమంటూ ఎక్కడా ఏదీ లేదు. సర్వవ్యాపియగు ఆత్మ మాత్రమే ఉన్నది. ఒకవేళ అభాస మాత్రం చేత ఎప్పుడైనా పదార్థముల ఉనికి సంభవించినా, ఆత్మతోటి వాటికి ఎట్టి సంబంధమూ లేదు. బాహ్యపదార్థములు - ఆత్మదృష్ట్యా చూస్తే - అవన్నీ ఆత్మచే కల్పించబడి, భావించబడుచున్నవే! ఆత్మ నిర్వర్తించే మననమే తన రూపముగా గల ఈ మనస్సు ఇంద్రియములతో గూడి, స్వప్న దృష్టాంతములాగా విజృంభిస్తోంది. అది పొందుచున్న భావన అంతా తనకు తానే కల్పించుకొనుచున్నది. అది తనకు బాహ్యమైన పదార్థములేవీ సాక్షాత్కరించు కోలేదు. బాహ్యపదార్థము లేవీ దానిని స్పృశించజాలవు. కల్పనయే మనస్సును - పదార్థములను ఒక చోటికి తెచ్చుచున్నది. కనుక ఈ జగత్తు యొక్క అసలు రూపం కల్పన మాత్రమే.

ఇక చిత్ ఎల్లప్పుడూ నిర్లిప్తమైనది. అది మనస్సుతో గానీ, ఇంద్రియములతో గాని, బాహ్య పదార్థములతో గానీ సక్తము (Attached / Involved) అగుటలేదు. వాటన్నిటికీ అది అతీతమై, అనిర్వచనీయమై ఉంటోంది. వాస్తవానికి - 1. బాహ్యపదార్థములు, 2. ఇంద్రియములు, 3.

Page:518

మనస్సు, 4.చిత్ - - ఈ నాలుగు ఒక దానితో మరొకటి కలియకుండానే తమ తమ స్థానములలో ఏర్పడి ఉంటున్నాయి. రాయి, మణి, లోహము, త్రాడు (సూత్రము) ఒకచోట ఆభరణ రూపంలో ఉన్నా అవి ఒకదానికి మరొకటి వేరే కదా!

అజ్ఞానము నుండి అహంకారము అజ్ఞానము చేతనే మహాభ్రమ ఉదయిస్తోంది. అట్టి మహాభ్రమ వలన 'ఇది నాది, ఇవి ఇంకా పొందాలి' అనే వ్యవహారం ఏర్పడుతోంది. వాస్తవం ఎరుగక పోవటమే అజ్ఞానం. అది జగత్య్రాంతిగా పరిణమిస్తోంది.

ఆత్మతత్త్వము ఏమరుస్తున్నప్పుడు 'అహంకారము' అనే చమత్కృతి ఉదయిస్తోంది. వేడి ఉన్నచోట మంచు ఉంటుందా? ఆత్మను దర్శించగానే - అహంకారము, పదార్థభావనా, - రెండూ తొలగిపోతాయి. అనగా అవి లేనివిగా తెలియవస్తాయి.

ఆత్మకు భిన్నమైనదేదీ లేదు. అంతయు బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి బ్రహ్మమునే భావనచేస్తాను.

అహంకారభ్రమస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ |

అపునః స్మరణం మన్యే నూనం విస్మరణం వరమ్ || (శ్లో 25, సర్గ 53)

ఆకాశంలో కనిపిస్తున్న నీలపు రంగులాగా మిథ్యారూపంగా కనిపిస్తున్న ఈ అహంకారం నా స్మృతి పథంలో పూర్తిగా తొలగేంత వరకు అధిగమించివేస్తాను. అట్లు అధిగమించిన తరువాత, శేషించుచున్న ఆత్మస్వరూపము నందు ఆత్మ స్వరూపుడనై ఉంటాను. శాంతాత్ముడనై, నిర్మలాకాశమువలె అనంతత్వము, అఖండత్వము, శుద్ధత్వము, శాశ్వతత్వము వహిస్తాను. మూల అవిద్య సహితంగా అహంకార భ్రమను సర్వదా త్యజించివేస్తూ ఆ భ్రమకు కూడా సర్వదా సాక్షిమాత్రుడనై ఉంటాను.

లాభం, నష్టం - వృద్ధి, క్షయములు తమ స్వభావముగా గల ఈ దేహాదులపట్ల 'ఇది నేను, ఇది నాది' అను అహంభావము ఎన్ని అనర్థాలు కలుగ జేస్తోంది! ఎన్నెన్ని తాప, సంతాపములకు కారణమగుచున్నది! అవును. హృదయాకాశంలో 'అహంకారము' అనే మేఘం స్పురించగానే, ఇక దుర్వాసనలతో గూడిన ఈ దేహాదులు మరల మరల ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. దేహములను అనుసరించినంత కాలం ఇహ పరలోకములు, మరణములు, పునర్జన్మలు, దుఃఖములు కలుగుతూనే

ఉంటాయి.

అహంకారము అనే గ్రద్దకు కనబడుచున్న భోగ్యపదార్థములన్నీ ఎప్పటికో అప్పటికి నాశన మయ్యేవే కదా! పాపం, అజ్ఞానులగు అనేకమంది జీవులు, ఇంత వరకూ ఇది పొందాను. ఇహ ఇక్కడి నుండి ఇది పొందబోవుచున్నాను" అను రూపంలో అంతరంగంలో అవిశ్రాంత భావోద్రేకం కలిగి ఉంటున్నారు. అట్టి అంతఃకరణము జ్ఞానాగ్ని చేత దగ్ధమొనర్చబడు గాక! "ఇది ఉన్నది, ఇది లేదు” - అనునట్టి చింతలన్నీ భ్రమకల్పితమగు అహంకారము వైపుగానే సారించబడుచున్నాయనీ, ఆత్మ వైపునకు కాదనీ జనులంతా గుర్తించెదరు గాక!

Page:519

7. ఈ జీవుడు గమనించడం? అహంభావే పరిక్షీణే శుష్కః సంసారపాదపః |

భూయః ప్రయచ్ఛత్యరసో న పాషాణవదఙ్కురమ్ || (శ్లో 32, సర్గ 53)

ఉద్దాలకుడు : ఈ దేహాదులందు ఎప్పుడైతే అహంభావము క్షయిస్తుందో, అప్పుడిక సంసారవృక్షము ఎండి నీరసించగలదు. ఆత్మజ్ఞానం ఉన్నచోట రాగము గాని, ద్వేషము గాని, తృష్ణ గాని ఉండవు. మనస్సు నందు ఈ ప్రపంచం మిథ్యయే" అను ఉన్నతమైన నిశ్చయం దృఢపడిందా ... ఇక భోగ వాసనలు సన్నగిల్లుతాయి. మనస్సు చిత్ ప్రతిబింబమును నిర్మలస్వభావముతో కూడి గ్రహిస్తూండగా, క్రమంగా సంకల్ప వికల్పములను త్యజించగలుగుతుంది. రాగరహితమైనప్పుడు శుద్ధమగుచున్నది. ఆత్మను దర్శించినప్పుడు స్వస్థత పొందగలుగుచున్నది.

ఈ చిత్తము తన అవయవరూపములైనట్టి ఈ ఇంద్రియములను బహిర్ముఖము నుండి అంతర్ముఖము వైపుగా తరలించినప్పుడు తత్త్వజ్ఞానం ఉదయిస్తోంది. జ్ఞానాగ్నిలో తనకు తానే దగ్ధమై, ఆత్మ ప్రకాశంచే నిర్మలత్వం పొందుతోంది. "ఆహా! ఈ దేహం నా కంటే భిన్నమైనది కదా! అని గ్రహించినదై విషయవాసనలను త్యజిస్తోంది. స్వవినాశనమును కూడా అంగీకరించి గొప్ప దేశభక్తి గల యుద్ధవీరుని వలె 'బ్రహ్మతత్త్వము' అనే సామ్రాజ్యమునకు తన సేవలను అందిస్తోంది.

ఈ మనస్సును శుద్ధపరచటంలో అశ్రద్ధగా ఉన్నామా... ఇది దేహానికి సంతాపం కలుగ జేస్తూ ఉంటుంది. అట్లాగే, దేహము మనస్సునకు సంతాపకరము అగుచున్నది. కుండ పగిలితే అందులోని నీళ్ళు తొలగుతాయి కదా! అలాగే ఈ మనో దేహములలో ఒకదాని వాసనలు నశిస్తే, రెండూ నశిస్తాయి. కుండలోని నీరు కుండను ఆశ్రయించుకుని ఉన్నట్లు శరీరము, మనస్సు ఒకదాని కొకటి కాస్త సహకరించుకుంటున్నాయి. అయితే, ఇంతలోనే, పరస్పరం సంతాపకారణమయి, ద్వేషించుకుంటున్నాయి. అవిద్య నశిస్తే, ఆ రెండూ 'లేనివి' అగుచున్నాయి. ఆ రెండూ రహితత్వమును సంతరించుకున్నప్పుడు ఈ జీవునకు పరమసుఖము లభించగలదు. ఆ రెండిటిలో ఏ ఒక్కటి ఉన్నా ఈ జీవునకు దుఃఖము శమించటమనేది కల్ల. విరుద్ధ స్వభావం కలిగిన ఈ మనోదేహములు ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖపరంపరలు వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ రెండిటి సంబంధము వలననే జీవునకు విషయసుఖము లందు ఆసక్తి జనించుచున్నది. అట్టి దౌర్భాగ్యం తప్పక గమనించ వలసిన విషయం.

బాలుడు పిశాచముల యొక్క కల్పన చేసుకుంటూ ఉంటాడే!... అట్లాగే ఈ మనస్సు తన సంకల్పముల చేతనే ఈ దేహమును కల్పించుకొనుచున్నది. ఈ శరీరమును ఒక వైపు నుండి భోజనము మొదలైన వాటిచే పుష్టిచేస్తూ, మరొకవైపు నుండి తన దుఃఖములన్నీ ఈ దేహమునకు అంటగట్టుచున్నది. మనస్సుచే దుఃఖములను అందుకున్న ఈ శరీరం దుర్వ్యసనములను సేవిస్తూ,

Page:520

రాగ-ద్వేష-శోక-మోహ-లోభ-పాపాదులను ఉత్పన్నం చేస్తూ, తద్వారా జనించిన కుసంస్కారాలను మనసులోనికి నెట్టుచున్నది. అనగా, మనస్సుకే ద్రోహం తలబెట్టుచున్నది. కన్నకొడుకే తండ్రిని బాధించునట్లు ఈ శరీరము మనస్సు యొక్క భ్రమను అధికం చేస్తోంది.

*

ఇక ఈ అనేక జీవుల పరస్పర సంబంధం ఇంకా చమత్కారంగా ఉంటోంది. స్వతఃగా చూస్తే ఒకడు మరొకనికి మిత్రుడు కాడు, శత్రువూ కాడు. కాని సుఖకల్పనచే 'మిత్రుడు', దుఃఖ, భయకల్పనచే 'శత్రువు'లను మనస్సు పొందుచున్నది.

నాస్తి శత్రుఃప్రకృత్యైవ, నచమిత్రం కదాచన,

సుఖదం మిత్రమిత్యుక్తమ్, దుఃఖదా శత్రువత్కృతాః ॥

ఎవరి వలన సుఖం లభిస్తుంటే ఆతడు మిత్రుడని, ఎవరి వలన దుఃఖం సంభవిస్తుందో ఆతడు శత్రువని మనస్సుచే ప్రతీతి ఏర్పరచబడుచున్నది.

ఈ శరీరం దుఃఖములను అనుభవిస్తూ మనస్సును హింసిస్తోంది. ఇక మనస్సు కూడా తన సంకల్పములచే ఈ దేహమును దుఃఖానుభవ స్థానంలో కూల్చివేస్తోందాయె! ఇట్టి పరస్పర దుఃఖ దాయకము, స్వభావ విరుద్ధములైన దేహమనస్సుల పోకడలను ఈ జీవుడు గుర్తించకున్నాడేం?

మనస్సు నశిస్తే శరీరము దుఃఖం పొందదు. అందుచేత శ్రద్ధ - అసక్తి - అత్యవసరము” లతో కూడిన ప్రయత్నం చేసి జ్ఞానమును, తత్సాధనములను సమకూర్చుకొనెదనుగాక! మనస్సునకు ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ దేహం ఉండి ఏం లాభం? లేకపోయి ఏం లాభం? అనర్థములు తప్పునవి కావు.

ఓ మనోదేహములారా? మీరిద్దరూ పైకి ఒకరికొకరు సహకరించుకున్నట్లు ఉన్నా, లోలోన ఒకరిని మరొకరు హింసించుకుంటున్నారు. అయితే 'అభేదాధ్యాస' (A Sense beyond all differences)చే ఏకరూపులగుచున్నారు. వంట చేసేటప్పుడు అగ్ని, జలము సహకరిస్తున్నట్లు మీరిద్దరూ మోక్షోపాయ సాధనల విషయంలో నాకు సముచితంగా సహకరించండి.

మనస్సు నశిస్తే దేహము వాసనారహితమగుచున్నది. అప్పుడు దేహరాహిత్యము అనుభవమౌతోంది. కానీ, దేహం నశించినా మనస్సు నశించటంలేదు. అందుచేత వివేకముతో ముందుగా మనస్సును నశింపజేస్తాను. 'సంకల్పము - తృష్ణ' అను రెండు చక్రములు గల ఈ మనస్సును త్యజించి, తత్ఫలితంగా ప్రాప్తించే 'పరమాత్మ' అనే విశాలభూమిలో ప్రవేశించి ప్రశాంతంగా, సుఖంగా ఉంచుతాను. క్షయిస్తున్న మనస్సు క్రమంగా తన స్వభావమైన వాసనాపరంపరలను కూడా క్షయింపజేస్తుంది కదా! ఇక నాకు దుఃఖించుటకు విషయములేమి ఉంటాయి?

చర్మ - రక్త - మాంస - బొమికలతో కూడిన ఈ శరీరం అల్పాశయునకు శత్రువు వంటిదే. అయితే, మనస్సు ఉంటే ఇది శత్రువులా ప్రవర్తిస్తుంది. మనస్సు ఉపశమిస్తే ఇది ఉన్నా ఒక్కటే,

Page:521

లేకున్నా ఒక్కటే. దానితో నాకు సంబంధమే ఉండదు కదా! అజ్ఞానదశలో ఉన్నప్పుడు ఏఏ భోగములను ఆకాంక్షించానో - అట్టి భోగములతో నాకేమి సంబంధం లేదు. ఈ శరీరమునకు సంబంధించిన సుఖావేశములతో నాకేమి పని?

xX

ఉద్గాలకుడు’ అను పేరుచే ఆరోపించబడినవాడా! నేను దేహమును గాని, నామమును గాని, మనస్సును గానీ కాదు. నా యందు స్ఫురించే ఈ నామ రూపముల కంటే ఆత్మ అత్యంత విశిష్టమైనది.

ఒక ఉక్తి చెపుతాను... విను. ఈ శరీరం మరణించినప్పుడు, ఇక్కడ కాళ్ళు - చేతులు తదితర దేహము ఉన్నప్పటికీ అది కదలగలదా? లేదు. కానీ, ఈ దేహంతోబాటే నేను లేకుండాపోయే వాడను కాదు. ఈ దేహమునకు అతీతమైన వాడను. ఇచ్ఛాశక్తిచే ఈ దేహమును కదిలించేవాడను. అదలించేవాడను. నిత్యుడను. నిరంతర ప్రకాశ శీలుడను. వ్యాపక స్వరూపుడను. సూర్యమండలమందలి సూర్యునితో కూడా సాంగత్యం పొంది, అట్టి ఆకాశములోని సూర్యుని ఎరుగుచున్నట్టివాడను. అంతేగాని, కేవలం అజ్ఞుడను, దుఃఖిని కాదు. నాకు దుఃఖము గానీ, దుఃఖత్వము గానీ, అనర్థత్వము గానీ లేవు. దేహం ఉన్నా, పోయినా నేనెప్పుడూ సంతాపరహితుడనే.

యత్రాత్మ తత్ర న మనో నేద్రియాణి న వాసనాః పామరాః పరితిష్ఠన్తి నికటే న మహీభృతః ॥ (శ్లో 74, సర్గ 53)

ఆత్మ ఎప్పుడైతే వికసిస్తుందో ఆ స్థానం, లేక, స్థితిలో మనస్సు గానీ, ఇంద్రియములు గాని, వాసనలు గాని ఉండజాలవు. రాజుగారు నివసించే అంతఃపురంలో భిక్షగాళ్ళు ఉంటారా?

ఓ శరీర మనస్సులారా! మీ ఇద్దరికంటే విలక్షణమైన నేను బ్రహ్మ పదమును ఎల్లప్పుడూ పొందియే ఉన్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ అది పొందబడియే ఉన్నది.

నేను కేవలుడను! ...ఇట్లు సమస్త దృశ్య వ్యవహారముపై విజయము పొందాను. శాంతుడను, నిరవయవుడను అయ్యాను. నాకు ఇచ్ఛలు గానీ, క్రియలు గానీ లేవు. నువ్వుల నుండి నూనె వేరు పడిన తరువాత, ఆ నూనె, నువ్వులు సంబంధం గాని, సమాన లక్షణాలు గానీ కలిగి ఉండవుకదా!

నాకిప్పుడు దేహ - ఇంద్రియ - - మనస్సులు మొదలైన వాటితో ఏమాత్రం సంబంధం లేదు. ఇక ఈ దేహేంద్రియ మనస్సులు ఉంటే ఉండనీ. అదీ వినోదమే. ఆత్మ పదము నుండి అభాస మాత్రంగా ప్రకటితమగుచున్న బుద్ధి నా సమక్షంలో ఏదైనా 'శేషించిన ప్రారబ్ధకర్మ' ను పొందవలసి వస్తే, పొందనీ. కర్మలే లేనివానికి ప్రారబ్ధకర్మలు ఎక్కడివి?

సర్వమునకు సాక్షి అయిన నాకు ఈ దేహాదులతో ఈ దేహాదుల అనుభవంగానీ, అభిమానంగానీ ఉండాలనిగానీ, ఉండకుండాలనిగానీ లేదు.

Page:522

ఓ సహ ఆత్మజ్ఞానులారా! అత్యుత్తమమగు ఏకాత్మ బుద్ధితో సంచరించే మీరే నాకు బంధువులు, స్నేహితులు కూడా. మీరంతా నిరంతర ఆత్మోదయం కలిగి, సములై, స్వస్థులై, సౌభాగ్యయుతులై ఉంటున్నారు కదా! నా మీద దయతో మీ జట్టుతో నన్ను కూడా చేర్చుకోండి.

ఉద్దాలకుడు’ అను పేరుతో పిలువబడుచున్న ఆత్మదేవా! నీవు ఏ ప్రమేయం లేకుండానే, స్వతహాగానే అత్యంత స్వచ్ఛులై ప్రకాశిస్తున్నావు. పూర్ణకాములై, ఆత్మసత్త స్వరూపులై రమణీయ ఆనందం, ఉపశమనములచే వెలుగొందుచున్నావు. సదాచారము, మృదుభాషణము, పూర్ణత్వము, అబాధిత్వము మీ భావములలోని అకృత్రిమ లక్షణములై ఉంటాయి. ప్రకాశము, ద్వైతరాహిత్యము, వికల్పరాహిత్యము మీ స్వభావములే అగుచున్నాయి. ఓ ఉద్దాలకనామధేయ ఆత్మదేవా! నీకు నమస్కారం.

సమస్తమూ కల్పన చేతనే ఆవిర్భవిస్తోంది. ఆ సర్వకల్పనలకూ ఆవల, సమస్త కల్పనలకు కారణభూతుడనై, స్థానమై, ఆధారభూతుడనై నేను ఉన్నాను.

ఇప్పుడు అజ్ఞాన మనస్సు రహితమైపోయింది. వికల్పయుక్తమగు చిత్తము మచ్చుకైనా దొరకుటలేదు. ప్రత్యక్షముగా కళ్ళకు కనిపించే ఈ దృశ్యజాలమంతా త్యజించివేయబడింది. నేను బ్రహ్మానందస్వరూపుడనై పరమాత్మయందు అనిర్వచనీయము, ఆద్యంత రహితము అయిన శాంతిని, విశ్రాంతిని పొందుచున్నాను.

ఈ విధంగా విచారణ చేస్తూ ఉద్దాలకుడు నిర్మలమైన, ఉదారమైన బుద్ధితో కనులు సగం మూసుకొన్నారు.

8. శాంతి - విశ్రాంతి

అర్ధ ఉన్మీలిత నేత్రుడు అయి, ఉద్దాలకుడు 'పరబ్రహ్మము' అను పదములో సంస్థితుడగుటకు ఉద్యుక్తుడయ్యాడు. ఓంకారమే పరమపదము యొక్క సంజ్ఞ కదా! ఇక ఘంటానాదం లాగా ఓంకారం ఉచ్చరించ ప్రారంభించాడు. 'ఓం'కారానికి శిరస్సు వంటిదైన 'అర్ధమాత్ర'ను ఆశ్రయించాడు. ఓంకార వృత్తికి శబ్దార్థముల వలె ఉపహితమైన చైతన్యమును అనుసరించుచూ, సుషుమ్నానాడిని సమీపించాడు. "కూటస్థ జీవచైతన్యము ఇక బాహ్యమునకు ఏమాత్రం అభిముఖం కాదు అను స్థితి వరకూ ఓంకారము ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఆ ప్రణవము ‘అ’కారము - ·'ఉ' కారము ''

కారము - అర్ధమాత్ర - అను నాలుగు పాదములు కలిగి ఉన్నది.

'అ'కారం ... రేచకం - ప్రణవము యొక్క 'ప్రథమాంశ' యగు అకారమును ఉచ్ఛ స్వరముతో ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆతని దేహం అప్పుడు సంక్షుభ్రమై, బాహ్య ప్రదేశములకు వెళ్ళుచుండే

Page:523

ఉత్సాహం చూపుచుండే వాయువు చేస్తున్న శబ్దంతో నిండిపోయింది. 'రేచకము' అను పేరుతో చెప్పబడే ప్రాణ నిష్క్రమణ క్రియ' ఆతని శరీరమును ఖాళీ చేయసాగింది.

అట్లు ఆతని దేహము నుండి వెలువడిన వాయువులు చిత్ రస పూరితమై, గూడును వదిలిన పక్షి లాగా బాహ్యాకాశంలో ప్రవేశించాయి. అప్పుడు ఆతని హృదయంలోని జ్వాజ్వల్యమానమగు అగ్ని దేహాన్నంతటినీ ఆక్రమించింది. ఆతని భౌతికదేహం భస్మమైనది. అయితే రామా! ఉద్దాలకునకు, అట్టి స్థితి ప్రణవముయొక్క ప్రథమక్రమభావన చేతనే అనుద్వేగకరంగా కలిగింది. అంతేగానీ, హఠయోగం చేత కాదు. ఎందుకంటే బలవంతంగా చేసే హఠయోగం శ్రమ, దుఃఖములనే కలుగజేస్తుంది సుమా!

ఉ'కారం ...కుంబకం - క్రమంగా ఉద్దాలకుడు 'అ'కారోచ్చారణ నుండి 'ఉ'కారోచ్ఛారణ సమారంభించాడు. అప్పుడు 'ఉ'కారోచ్చారణ క్రమంలో ప్రాణముల సమస్థితి ఏర్పడింది. 'నిశ్చల కుంభము' అను పేరుతో ప్రసిద్ధమైన ప్రాణక్రియ జరిగింది. నాసికారంధ్రములలో వాయువు నిరోధించబడింది. ఆ వాయువు పైకిగానీ, క్రిందకుగానీ, బయటకుగానీ, లోపలికిగానీ పోజాలక చలనరహితమైనది. శరీరమును భస్మమొనర్చగల అగ్ని మెరుపువలె క్షణంలో శాంతించింది. అప్పుడు ఎఱ్ఱటి శరీరభస్మము మాత్రమే కనిపించింది. తెల్లటి బొమికలు చేష్టారహితమై కనిపించాయి. మహా వాయువుచే ఊర్ధ్వమునకు కొనిపోబడిన ఆ అస్థిసహిత భస్మము క్షణంలో ఆకాశము నందు వ్యాపించి అదృశ్యమైపోయింది.

ఈ స్థితి కూడా ప్రణవముయొక్క ద్వితీయ క్రమంచే ఏర్పడింది. అంతేగాని, బలవంతంగా చేసే హఠయోగం వలన కాదు.

'' కారం ...పూరకం - ఆ తరువాత ఉద్దాలకుడు శాంతిదాయకమగు ప్రణవము యొక్క తృతీయ క్రమము నందు వాయువును పూరించాడు. అదియే 'పూరకము' అను ప్రాణక్రియగా అప్పుడు 'జీవ చైతన్యము' అనే అమృతము యొక్క మధ్య గల ప్రాణసమూహం మంచు యొక్క స్పర్శలాగా బాహ్యాకాశంలో శీతలత్వం పొందింది.

క్రమంగా ఆ జీవ చైతన్యము గగన మండలత్వం పొందింది. ఆతని ప్రాణవాయువులు చంద్రుని చల్లటి కిరణములు లాగా అమృత తుల్యములయ్యాయి. వాయువుచే కొనిపోబడగా మిగిలిన దేహభస్మముపై ఆతని ప్రాణవాయువుల యొక్క అమృతధార కురిసింది. అప్పుడు చంద్ర బింబమువలె శోభాయమానమైన ఒక క్రొత్త శరీరం ప్రకటితమైనది. చతుర్భుజములతో విష్ణుభగవానుని ఆకృతి వలె నూతనశరీరం ఉదయించింది.

ఆ ఉద్దాలకుని నూతన శరీరం వికసిత నేత్రములతో, ముఖముతో, అతి దీప్తితో శోభను పొందింది. జలప్రవాహం తటాకమును నింపునట్లు, వసంత కాలం వచ్చి వృక్షములలో రసమును నింపునట్లు అమృతమయమగు ప్రాణములు ఆ శరీరాన్ని నింపాయి. నిర్మలస్వరూపము, దోష రహితమగు ఆతని నూతన శరీరం ప్రస్తుతం చేయబోయే కార్యక్రమములకు తగినట్లుగా ఉన్నది.

Page:524

అటు తరువాత ఉద్దాలకుడు ఒకచోట పద్మాసనమున శరీరమును 'సుదృఢం చేశాడు. ఏనుగును కట్టుకంబళమును కట్టినట్లు పంచేంద్రియములనూ బంధించాడు.

‘నిర్వికల్ప సమాధి’ నిమిత్తం తన మనన స్వభావమును వినిర్మలం చేయటానికి ప్రయత్నించ సాగాడు. “ఆశ - - తృష్ణ - విసుగు - ఆలశ్యము లవైపుగా వెళ్ళుచున్న తన స్వభావము (మనస్సు)ను, ప్రాణయుక్తమైన చిత్తమును శుద్ధ పరచి, మరలించుటకు అనేక విధములుగా ప్రయత్నించాడు. దున్నపోతు త్రాళ్ళచే లాగబడునట్లు ఆతనిని చిత్తము సుదూరంగా 'బంధువులు - గృహములు సుపరిచితులు” వైపుగా లాగబడుచూ ఉండటం గమనించాడు. అట్లు విషయములవైపుగా పరుగులెత్తే వ్యాకుల చిత్తమును మరల మరల సునిర్మలమొనర్చి బలపూర్వకంగా నిరోధించేవాడు.

క్రమంగా ఆతని ప్రయత్నం ఫలించింది. రెండుకళ్ళు అర్ధనిమీలితం చేశాడు. మౌనవ్రతధారి అయి, ప్రాణాపాన నిశ్చలాభ్యాసంచే ముఖము నందు 'శీతలసుగంధము'తో పోల్చతగిన ఒకానొక ప్రశాంతతను పొందాడు. అట్టి ప్రశాంత స్థితిలో ఇంద్రియములను విషయముల నుండి వేరుచేసి తన ప్రశాంత స్వభావమునందు ఇముడ్చుకున్నాడు. సూర్యభగవానుడు లోకములను త్యజించుచున్నట్లు ఆయన బాహ్య విషయధ్యాసను త్యజించివేశాడు. ఆత్మతత్త్వదర్శనము వృద్ధిపొందుచుం చుండగా మనో వాక్కులు మొదలైన విషయములన్నీ తన యందే లయం చేసివేశాడు.

అప్పుడు కాలిమడముచే 'గుదస్తంభనం' చేసి నవద్వారములందలి వాయువును నిరోధించారు. ఆతని కంఠము ఇప్పుడు ఆత్మరస ప్రపూర్ణమై రజోగుణ, తమోగుణములను అభావించుచు స్వచ్ఛమైనది. మనస్సును ధారణా యుక్తులచే సమాధికి అభిముఖం చేశాడు. ఆ మనస్సును తన హృదయాకాశంలోనే ధరించి ఉన్నాడు. అప్పుడది నిర్మలాకాశంలాగా నిర్మలత్వమును, సౌమ్యత్వమును పొందింది.

మధ్య మధ్యలో మందంగా విచ్ఛేదకరములగు విపరీత భావాలు పొడచూపేవి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ బ్రహ్మాకార వృత్తిచే ఆ వికల్ప సమూహం తనను సమీపించకుండా జాగరూకుడ య్యేవాడు. క్రమంగా వికల్పజాలములన్నీ నశించాయి.

ఆ తరువాత తన హృదయాకాశంలోకి దృష్టినంతా సారించాడు. తమోగుణ ప్రేరితమైన అంధకారముచే ఆచ్ఛాదితమైన వివేకసూర్యుని (అస్పష్ట వివేకానుభవమును) చూచాడు. వెనువెంటనే ‘సత్వగుణాభివృద్ధి’ ని ఆశ్రయించి, తద్వారా ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానము, మనస్సులచే తమోగుణ ప్రేరితమైన అంధకారమును నశింపజేశాడు. అప్పుడు ఒకానొక రమణీయమైన 'తేజః పుంజము' ను దర్శించాడు. అట్టి దర్శనములో పాత్ర వహిస్తున్న రజోగుణమును గమనించి, దానిని మ్రింగివేసి సత్వగుణ సమృద్ధుడైనాడు. క్రమంగా ఆ తేజఃపుంజము ఉపశమించింది.

అప్పుడు ఆ మునీంద్రుని మనస్సు నిద్రా తరంగములచే చంచలమై, భ్రమణశీలమై ఉండసాగింది. మద్యపానముచే మత్తెక్కిన మనిషిలాగా ఆతడు నిద్రను పొందాడు. కానీ వివేక

Page:525

ప్రబోధచే ఆ నిద్రను వినష్టం చేశాడు. నిద్ర నశించిన తరువాత మనస్సు 'వివిధ వాసనలతో పరికల్పితమైన రూపముగల ఆకాశము' ను భావన చేయసాగింది. ఆతడు ఆ ఆకాశమును కూడా తొలగించి వేశారు. ఆ విధంగా ఆకాశానుభూతికూడా నశించిన తరువాత 'మత్తు దిగుచున్నప్పటి తాగుబోతు' లాగా కొంచం విమోహితుడైనాడు.

ఆ మనోమోహాన్ని కూడా పారద్రోలిన తరువాత ఆతని అప్పటి మనస్సు క్షణకాలం నిర్వికల్ప సమాధిలో విశ్రమించింది. అప్పటి స్థితి 'తేజస్సు, తమము, నిద్ర, మోహము' - అనేవి లేనట్టిది. వాక్కుకు అగోచరమైనది.

ఆతని చిత్తము అట్లు విశ్రమించి, మరల ఇంతలోనే ప్రపంచ వృత్తికి మరలింది. కాసేపు ప్రవృత్తిలోనూ, మరికొంచెం సేపు నివృత్తిలోనూ ప్రవర్తిస్తూ ఆతని చిత్తము త్వరలోనే చిత్తత్వము వదలి చిద్రూపత్వమును పొందింది. అతిశీఘ్రంగా సర్వప్రపంచము కంటే అన్యమైన ఆకారమును పొందింది. వృత్తిగత చైతన్యము తన విషయాకారమును త్యజించి సర్వవృత్తులకూ సాక్షి అయినట్టి కేవల చిద్రూపత్వమును సంతరించుకొని ప్రకాశించింది.

తత్త్వసాక్షాత్కారం - క్రమంగా ఉద్దాలకుడు సమాధిద్వారా తత్త్వసాక్షాత్కారం యొక్క ప్రబోధం

పొందాడు.

శ్రీరాముడు : తత్త్వసాక్షాత్కారం అనగా?

శ్రీవసిష్ఠమహర్షి :సర్వ ప్రపంచమునకు అధిష్ఠానం, ద్వైతరహితము, శుద్ధము, మహత్తరము అగు చిదాకాశమే నేను అని ఎరుగుటయే - తత్వసాక్షాత్కారము యొక్క ప్రబోధమని అంటాం. “నీవుగా కనిపించేది నేనే" అనబడు స్వభావసిద్ధమైన, అకృత్రిమమైన ఎఱుక ఆస్వాదనయే తత్త్వ సాక్షాత్కార ప్రబోధం.

అట్టి స్థితిలో ఆతడు దృశ్య, దర్శన వర్జితుడైనాడు. ఏదైతే సర్వవిషయ లేశములకు ఆధార భూతమో, సముద్రతుల్యమో, బ్రహ్మాది మహాత్ములచే సర్వదా ఆస్వాదించబడుచున్నదో అట్టి ఆనందాన్ని పొందాడు. ఆనందసాగరం అన దగినట్టి పరమాత్మ యొక్క సత్తాసామాన్య రూపమును అవధరించాడు. ఉద్దాలకుని 'జీవచైతన్యము' అనే హంస ఆనందసరోవరంలో స్థితి కలిగి పూర్ణచంద్రుని వలె గాలి వీచని ప్రదేశంలో దీపంలాగా, గోడపై లిఖించబడిన కళాఖండంలాగా, తరంగాలే లేనట్టి సముద్రం లాగా, శరత్కాలంలోని మేఘములలాగా నిశ్చలత్వం పొందింది.

అట్టి మహాప్రకాశమునందు ఆతడు చిరకాలం ఉన్నాడు. అతడు ఆ స్థితిలో ఉంటూ ఉండగా మనోమార్గంలో అనేక మంది ఆకాశసంచారులను, సిద్ధులను, అనేక మంది దేవతలనూ చూచాడు. 'ఇంద్రుడు, సూర్యుడు' మొదలైన అనేక పదవులను ప్రసాదించగల విచిత్రమైన అనేక సిద్ధులు ఆతనిని సమీపించాయి. ఒక ఉదార చిత్తుడగు యువకుడు తనదారిన పోతూ పిల్లలు ఆడుకొనే ఆటలను పట్టించుకుంటాడా? అలాగే ఉద్దాలకుడు కూడా ఆతడు ఆ సిద్ధులను ఆదరించనేలేదు.

Page:526

9. పరమపదము

అట్లు సిద్ధులను నిరాకరించిన తరువాత ఆతడు 'సమాధి' అను ఆనందమందిరంలో ఆరు నెలల కాలం ఉన్నాడు. సిద్ధ, సాధ్య, బ్రహ్మాదులకు మాత్రమే సాధ్యం అగుచూ ఉండే సర్వోత్కృష్టమగు ‘జీవన్ముక్తము’ అను పదము నందు ప్రతిష్ఠితుడైనాడు. అక్కడ పూర్ణమగు ఆత్మానందమును పొందాడు.

ఆతని ఆత్మచైతన్యము క్షుద్రమైన విషయానందము గాని, విషయసుఖము గాని లేనిదై స్వప్రకాశమగు తన పూర్ణస్వరూపము నందే ఉండి శోభించింది.

ఎవ్వడైనా సరే, ఎవరైనా కొంత సమయం మనస్సుచే అట్టి సమాధియందు స్థిమితము పొందితే, ఇక ఆతని మనస్సు స్వర్గసుఖములు గానీ, విషయసుఖములు గానీ చూచి ప్రీతిని పొందే ప్రసక్తియే ఉండదు. అట్టి నిర్వికల్పసమాధిలో ఏర్పడే ఆనందమే బ్రహ్మానందమనీ, ఆత్మైక్యస్థితి అని చెప్పబడుతోంది. అచ్చట ఉండే స్థితియే శాంతి యొక్క ఆత్యంతికము, నిత్య శ్రేయము కూడా. అక్కడ విశ్రమించే వానిని ఇక ఎట్టి భ్రమ బాధించదు. అట్టి అఖండ అప్రమేయ దృష్టి కలవాడు ఇక 'దృశ్యదృష్టి’ యందు ప్రవేశం చేయడు.

అనగా... శ్రవణ, మనన, సమాధుల సహాయంతో శుద్ధచిత్తమును పొందినవారు ఆ మహదానంద పదమును పొంది, ఇక ఆపై ఈ దృశ్యప్రపంచమును ఒక విషయంగానే చూడరు. చక్రవర్తి పదవి అధిష్ఠించినవాడు ఒక పెంకుటిల్లును చూచి "ఇట్టి ఇల్లు కలిగి ఉండటం ఎంతో సంతోషం కలుగజేస్తుంది కదా! అని తలుస్తాడా? లేదు కదా!

శ్రీరాముడు : అట్టివాడు ఇక ఈ ప్రపంచమువైపు ఎప్పటికీ దృష్టి సారించడా?

శ్రీవసిష్ఠమహర్షి : అట్టి 'ఆత్మ పదము' నందు విశ్రాంతి పొందినవానిని 'ప్రబుద్ధచేతస్కుడు' - అని అంటారు. అట్టి స్థితిలో సమాధిని అవధరించినవాడు ఇతరులు ఎంతో ప్రయత్నిస్తే గానీ మరల 'వ్యుత్థానదశ'కు రాడు. ఆరవ భూమిక దశలో బాహ్యప్రయత్నం చేత వ్యుత్థానదశకు తిరిగిరావచ్చు.

- ఇక ఏడవ భూమికలో ప్రవేశించినవాడు తనకు తానుగా వెనుకకు మరల వలసిందే.

మహాత్ముడగు ఉద్దాలకుడు ఆ విధంగా ఆరునెలలు సమాధి స్థితియందుండి, మరల తనకు తానే ఉత్థానదిశగా ప్రబుద్ధుడైనాడు. మధ్యే మార్గంలో మహాతేజఃసంపన్నులను, చామరములను వీస్తూ సేవించే దేవతాస్త్రీలను, పతాకములు అమర్చబడిన దేవతా విమానములను, మునులను, విద్యాధరులను చూచాడు.

అక్కడి కొందరు దేవతలు ఆతనిని పలకరిస్తూ ఇట్లు సంబోధించారు. ఓ మహానుభావా! ఉద్దాలకా! మీకు ప్రణామం చేస్తున్న మమ్ములను అనుగ్రహిస్తూ, గమనించండి. ఈ విమానం ఎక్కి దేవలోకం రండి. ఈ మొత్తం ప్రపంచంలో ఉండే భోగములన్నిటి కన్నా కూడా స్వర్గలోకమే అధికమైనది కదా! మీరు ఏభోగములను కోరుకుంటే అవన్నీ కల్పాంతమువరకు అనుభవించవచ్చు.

Page:527

ప్రపంచంలో తపస్సు, యజ్ఞము మొదలైన కార్యక్రమములన్నీ స్వర్గభోగములు అనుభవించటం కోసమే నిర్ణయించబడ్డాయి కదా! ఈ విద్యాధరుల వైపు చూస్తున్నారా! వీరంతా మిమ్ములను ఉపాసిస్తున్నారు. ధర్మ, అర్థ, కామములలో ముఖ్యఫలం కామమే కదా! అట్టి కామానందం ప్రసాదించ గల ఉత్తమ స్త్రీలు స్వర్గంలోనే ఉంటారు.

ఆ మాటలు విని, ఉద్దాలకుడు చిరునవ్వుతో వినమ్రంగా వారికి అతిథి సన్మానపూర్వకంగా నమస్కరించాడు. కానీ, భ్రమరహితుడై వారు చెప్పిన మాటలు పట్ల మౌనం వహించాడు. వారి పట్ల అభినందన గానీ, త్యాజ్యము గానీ ప్రకటించలేదు. ఓ సిద్ధులారా! నా నమస్కారం స్వీకరించి సెలవు ఇప్పించండి" అని పలికి యథాతథంగా సమాధి వ్యాపారం కొనసాగించాడు. విషయభోగ విరక్తుడైన ఆ ఋషీశ్వరుని సేవిస్తూ సిద్ధులు కొద్దిరోజులు వేచి ఉండి మరల ఎటో వెళ్ళిపోయారు.

అది మొదలుకొని జీవన్ముక్తిని పొందిన ఉద్దాలకుడు తన ఇచ్ఛాపూర్వకంగా వనములందూ, ఆశ్రమములందూ సంచారం చేస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఒక చోట ఆసీనుడై ధ్యాననిష్ఠలో ప్రవేశిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఒక్క రోజు, కొన్నిరోజులు, సంవత్సరం, కొన్ని సంవత్సరములు సమాధియందు ఉంటూ, మరల మేల్కొంటూ ఉండేవాడు.

క్రమంగా పొందిన జ్ఞాన తేజస్సుచే అతడు ఒకవైపు చైతన్యముతో ఐక్యమై ఉంటూనే మరొకవైపు వ్యవహార తత్పరుడై ఉండేవాడు. ఉభయములోని ఏకత్వము పొందేవాడేగాని, అజ్ఞానివలె విక్షేపం పొందేవాడుకాదు. సర్వకాల సర్వావస్థలలోనూ సమాధియొక్క అభ్యాసం వదిలేవాడు కాడు. శ్రీరాముడు : మహర్షీ! అంటే, ఉద్దాలకుడు ప్రపంచమును పొందుచున్నప్పుడు, ప్రపంచరహితుడు అగుచున్నప్పుడూ సమాధి యొక్క అభ్యాసం కొనసాగిస్తున్నాడని చెప్పుచున్నారు కదా! ఆతని ఇప్పటి సమాధి యొక్క అభ్యాసం నిర్వచించి చెప్పండి.

శ్రీవసిష్ఠ మహర్షి : చెపుతాను విను - - 1. అంతఃకరణము, 2. ఆ అంతఃకరణములో ఏర్పడే వృత్తులకు సాక్షియగు చైతన్యము - ఈ రెండిటినీ ఆతడు వేరు పరచి, పరిశీలించే వాడు. అదే ఆతని వర్తమానపు సమాధి యొక్క అభ్యాసము. అట్టి అభ్యాసముచే అపరిచ్ఛిన్నమగు చిద్భావమును పొందేవాడు.

ఇక ఆతని యందు రాగ ద్వేషాదులు లేవు. అహంకార, మమకారాలు; పరిచ్ఛిన్న, అపరిచ్ఛిన్నములు, ఉద్వేగ, ఉదాసీనములు లేవు. సూర్యకాంతి భూమిపై సమరూపమున వ్యాపించు చున్నట్లు ఆతడు సర్వభూతము లందూ సమరూపుడై వర్తిస్తూ ఉండేవాడు. అంతటా బ్రహ్మమునే గాంచుచూ ఉండేవాడు. ఎవరైనా సరే, 'సాక్షిచైతన్యము' అను సమాధి యందు భావన చేయటం చిరకాలం అభ్యసిస్తూ రాగా, అప్పుడు స్వప్రకాశమైనట్టి 'నిరతిశయానంద చిద్రూపము' తప్పక పొందుతారు. ఉద్దాలకుడు సంపాదించిన నిర్ద్వంద్వ, అద్వైత, అప్రమేయ సుస్థితిని అభ్యాసంచే ఎవరైనా తప్పక పొందవచ్చు.

Page:528

ఒక కళాఖండంలో లిఖించబడిన సూర్యుడు ఉదయించడు అస్తమించడు కదా! ఆతడు ఈ దృశ్యవ్యవస్థలో ఉదయించటం లేదు... అస్తమించటం లేదు. సర్వత్రా శాంతిమయుడై ఉన్నాడు. ఆతని చిత్తము నిరతిశయానంద ప్రాప్తిచే ఉపశమించింది. కర్మ బీజములన్నీ క్షయించుటచే, ఆతనిపట్ల జననమరణ పాశములన్నీ విచ్ఛిత్తి పొందాయి.

"ఈ జన్మ - జరా - మరణాలు దేహపరిమితములే గాని, నన్ను స్పృశించేవి కావు-

అనునది అతని వర్తమానానుభవం. ఆతడు అపరిచ్ఛిన్నమగు 'సత్తాస్ఫూర్తి' అనే ఉత్కర్ష (Sense)చే మహాభావయుతుడైనాడు.

ఇక ఆతని వర్తమాన నూతన దేహం ప్రత్యక్షరూపమై, నిర్మలమై, పూర్వదశా విస్మరణచే చిత్త రహితమై, బ్రహ్మస్వభావమై వెలుగొందింది. కనుక, ఇది ఆతని భావ, అనుభవముల దృష్ట్యా ఆతని పూర్వదేహము వంటిది కాదని గ్రహించు. ఆతని స్వభావము 'సత్తాసామాన్యము' ను సంతరించుకుని ఉన్నది.

10. స్వస్వరూప చైతన్యముతో ఏకత్వం - ధారణ శ్రీరాముడు : హే బ్రహ్మర్షీ! 'సత్తా సామాన్యము' అని అన్నారు కదా! అంటే ఏమిటి? శ్రీవసిష్ఠమహర్షి : ఒకనిలో విషయ సంస్కారములన్నీ సంపూర్ణంగా రహితమైనాయనుకో... అప్పుడు చిత్తము నశించినదే అవుతుంది. అప్పుడు శేషించే దానిని చిత్ సామాన్యస్వరూపము అంటారు.

ఎప్పుడైతే చిత్తు వృత్తిరహితమై ప్రతిబింబత్వము నుండి తన బింబరూపమగు చైతన్యమున లీనమౌతుందో - అప్పటి బింబము యొక్క ఆకాశసదృశమగు నిర్మల సత్తయే సత్తా సామాన్యము.’ శ్రీరాముడు : అది ఎట్లా, ఎప్పుడు సిద్ధిస్తుంది?

శ్రీవసిష్ఠమహర్షి : చిత్తవృత్తి యందు అభివ్యక్తమగుచున్న చైతన్యము ఈ బాహ్య - - అభ్యంతర జగత్తు నంతా నిరాకరించి, కేవలం స్వస్వరూపమున ఎప్పుడు ఉంటుందో అప్పుడు సత్తా సామాన్యము సిద్ధించినట్లు. అట్టివాడు సర్వభూతములపట్ల పారమార్థికమైనట్టి 'స్వస్వరూప చిన్మాత్రానుభవం’ కలిగి ఉంటాడు. ఒక దృష్టాంతం చెపుతాను. తాబేలు కొంచెం ప్రమాదం గమనించగానే తన అవయవాలను స్వయంగా, అసంకల్పితంగా తనలోకి లీనం చేసుకుంటుంది చూచావా! ఈ సామాన్య సత్త సంపాదించిన యోగి ఈ ఎదురుగా ఉండే సమస్తమును ప్రత్యేకమైన భావనాయత్నం లేకుండానే స్వభావ సిద్ధంగా ఆత్మ యందు లయం చేసుకుంటాడు. సమస్తమును తన ఆత్మగా దర్శిస్తాడు. అదియే సప్తమ భూమికకు సంబంధించిన ప్రరూఢ దృష్టి.

ఈ స్థితిలో 'సదేహముక్తి - విదేహముక్తి' అనే భేదం ఉండదు. ఈ విషయం ఒకటి రెండు సార్లు ముముక్షు వ్యవహారప్రకరణలో, ఆ తరువాత కూడా గుర్తు చేశాను.

Page:529

అట్టి దృష్టి 4,5 భూమికలలో కూడా కలుగుతుంది. అయితే అది సప్తమభూమికలో రూఢి చెందుతుంది. అట్టివానికి వ్యుత్థాన దశయందు కూడా వెంటనంటే ఉంటుంది. బోధచే అట్టి దృష్టి జ్ఞానికి తప్పక కలుగుతుంది. అజ్ఞానికి ఎంత విన్నా కలుగదు.

జీవన్ముక్తులగు మహాత్ములంతా అట్టి దృష్టి యందే ఉండి, ఈ భూమిపై పాదరసంలాగా, ఆకాశంలో వాయువులాగా నిర్లిప్తంగా ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. మేమంతా అట్టి దృష్టి అభ్యసిస్తూ ఈ భూతలంపై ఉంటున్నాం. ఆకాశంలో నారదుడు మొదలైనవారు, ఊర్ధ్వలోకాలలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలైనవారు అట్టి దృష్టినే కలిగి ఉంటున్నారు.

ఇక ఉద్దాలకుని విషయం కొనసాగిద్దాం. ఆతడు సర్వభయ వినాశకరమగు సత్తా సామాన్యము’ లేక 'జీవన్ముక్తము' ను ఆశ్రయించి ప్రారబ్ధక్షయం అయ్యే వరకు ఈ 'జగత్' అను రూపం గల గృహంలో వసించాడు. కొంతకాలం జరిగిపోయింది. ఆ తరువాత ఆతడు 'నేనీ దేహమును త్యజించి విదేహముక్తుడను అగుదును గాక!' అనే దృఢబుద్ధిని పొందాడు. ఆశ్రమం నుండి బయలుదేరి ఒక పర్వతప్రాంతం చేరాడు. అక్కడ గల ఒక సెలయేటి ఒడ్డున పద్మాసనం అవధరించాడు. కళ్ళు సగం మూశాడు. కాలిమడమతో గుదమును నిరోధించి తొమ్మిది ఇంద్రియద్వారములను సంయమనం చేశాడు. చిత్తముచే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏకం చేసి హృదయంలో చేర్చాడు.

హృదయగత వృత్తులను స్వస్వరూప చైతన్యములో ఏకం చేశాడు. క్రమంగా చిదనరూపుడైనాడు. సమముగా ఉన్న కంఠంతో శోభించాడు. నాలుకను కంఠము యొక్క ఊర్ధ్వ ప్రదేశంలో ప్రవేశపెట్టాడు. నెమ్మదిగా ప్రాణవాయువులను నిరోధించుచూ వచ్చాడు. ఆతడు ఇప్పుడు దంతములతో దంతములను స్పృశించటం లేదు. తన మనోదృష్టిని బాహ్య, అభ్యంతరములందు గానీ, ఊర్ధ్వ, అధోభాగములందు గానీ, రూపము మొదలైన విషయములందుగానీ, శూన్యము నందుగానీ ఉంచుటలేదు. కేవలం చిన్మాత్రము నందే స్థితుడై ఉన్నాడు.

11. ప్రశమనం

ప్రాణప్రవాహ నిరోధం చేత ఆతని దేహము మనస్సు మొదలైనవి తమ చంచలత్వమును వదలిపెట్టాయి. ఇక ఆతడు సమరూపుడై, ప్రసన్నముఖుడై, చిద్రూపుడై బ్రహ్మానందానుభవం పొందాడు. ఆతని శరీరం గగుర్పొడిచింది. రోమములు నిక్కబొడుచుకున్నాయి. క్రమంగా అంతఃకరణ వృత్తి విలయం అను అభ్యాసంచేత చిత్ సామాన్యరూపమున ప్రవేశించాడు. ప్రతి బింబమును వదలి, బింబభూతమగు చిన్మాత్రమును అభ్యసించటం చేత హృదయము నందు బ్రహ్మానందమును అనుభవించాడు. అట్టి 'చిత్ సత్త' ను అనుభవించటం చేత, కొంత సమయానికి తన యొక్క ఉద్దాలక రూపమును మరచి, క్రమంగా తన యొక్క స్వానుగతమైన నిత్య ప్రకాశరూపము లేక చిత్ సామాన్య రూపమును పొందాడు. అనగా, ఈ జగత్తు కంతటికీ ఆశ్రయభూతమై సర్వదా అపరిచ్ఛిన్న

Page:530

మైనట్టి ఆత్మ సత్తాయే నేను. అను ఏకత్వానుభవం పొందాడు. విక్షేపమంతా సంపూర్ణంగా నశించగా, సమరూపుడై సర్వోత్తమానంద ప్రాప్తి పొందాడు. అతి సుందరమగు ముఖకాంతితో పరమ విశ్రాంతి పొందాడు. ప్రారబ్ధముల వినాశనముచే, జీవించి ఉండగానే సర్వోత్కృష్టమగు నిర్మల పదము అవధరించాడు. ఇక ఆతనియందు చిరకాలానుగతమైన సంసారభ్రమ మొదలంటా రహితమైనది.

చిత్రంలో లిఖించబడిన చిత్రంలాగా, పూర్ణచంద్రుని లాగా శోభించాడు. స్వనిర్మల పదమున ప్రశమనం పొందాడు. సర్వవికల్పరహితుడు, నిర్వికారుడు, అతిసౌందర్య స్వభావుడు అయ్యాడు. బ్రహ్మలోక పర్యంతము గల సర్వసుఖములను త్యజించివేసినవాడయ్యాడు. ఏ బాహ్యమైన ఐశ్వర్యమైనా సరే ఎక్కడ ఒక గడ్డిపరక వంటిదౌతుందో - అట్టి వాక్ అగోచరమగు పరమానందమును పొందాడు.

ఆ ఆనందం ఎట్టిది? మనం మాటలలో ఏం చెప్పుకోగలం? ఆ ఉద్దాలకుడు ఇప్పుడు పొందిన బ్రహ్మానందము అవధులు లేనిదని చెప్పవచ్చు. ఓ రామా! సర్వజీవరాసుల యొక్క ఉత్తమోత్తమ లక్ష్యం అదే. ఈ అంతులేని బ్రహ్మాండములన్నీ దాని యందే ఉన్నాయి. అందుచేత అది అపరిమితము. అది ఈ అనంతాకాశమును కూడా తన పొట్టలో వ్యాప్తం చేసుకొని ఉంచుకొనగలదు. అదియే దిక్కులన్నీ ఎల్లప్పుడూ వ్యాపించి ఉన్నది. సర్వమునకు ఆధారభూతమూ, పరిపోషకమూ అదే! ఎంతో భాగ్యం చేత మాత్రమే ఉత్తమ జీవులచే అది సేవించబడుతోంది.

సర్వవాక్-ప్రవృత్తి-నివృత్తి-నిమిత్త-ఉపాదాన ధర్మములకు అది అతీతమైయున్నది. దానినే సత్యజ్ఞానానందము అని వేదజ్ఞులు పిలుస్తున్నారు. ఎప్పుడైనా సరే, ఇది సుఖము' అనుటకు

కారణము అదే.

ఉద్దాలకుడు అట్టి శుద్ధ బ్రహ్మము లేక బ్రహ్మానందరూపము పొందాడు. ఆతని జీవము ఆ రీతిగా విదేహత్వము నిర్మల, అనాది బ్రహ్మభావము పొంది అక్కడే ఆరు నెలల వరకు ఉన్నది. ఆ తరువాత ఆతనిచే పరిత్యజించబడిన భౌతికదేహము ఆ పర్వత ప్రదేశంలో నాడులు అనే తంతువులు కలిగి వీణవలె ఒప్పుచున్నది.

అనంతరం కొంతకాలానికి పర్వతకన్యలతో కూడిన బ్రాహ్మి మొదలైన మాతృగణం ఒకానొక భక్తుని కోర్కెలు తీర్చటానికి ఆకాశము నుండి ఆ ప్రదేశానికి వచ్చారు. ఆ మాతృగణంలో ఒకరైన ఖింఖిణీదేవి ఆ ఉద్దాలకునిచే పరిత్యజించబడిన భౌతిక దేహాన్ని తనకు కిరీట హారంగా చేసుకొన్నది. మహాభగవతియగు ఖింఖిణీదేవి శిరోమాల యందు ఆ ఉద్దాలకుని దేహం శయనించింది.

ఓ రాఘవా! ఈ దృశ్యమంతటికీ సంబంధించిన వివేకము జనించగా స్ఫురించే ఆత్మానందమే ఇందలి సారం. ఆరంభం నుండి, ఉద్దాలకుని విదేహముక్తి వరకు గల కథనం విన్నావుకదా! ఎవని హృదయంలో అయితే ఇందలి కథనం ఉత్పన్నమై 'ఉత్తరోత్తర భూమికలను అవధరించుట' అను రూపమున విస్తరిస్తుందో - అట్టివాడు ధన్యుడు. అట్టివాడు త్రివిధ తాపములచే తపించడు.

Page:531

అట్టివాడు ఈ ప్రాపంచిక విషయములందు సంచరిస్తే సంచరించుగాక! అయినప్పటికీ సత్యము, శాంతము, సహజ సంతోషము" - అనే సుగంధములను వీడడు. సర్వోత్తమమగు మోక్ష ఫలమును తప్పక పొందుతాడు.

12. ధ్యానము - విశ్లేషణ

శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామా! మనం 'ఉద్దాలకుని విదేహముక్తి' ప్రసంగంలో చెప్పుకొన్న విధంగా నీవు వివేకము, వైరాగ్యము, సమాధుల అభ్యాసంతో కూడిన వాడవై ఎప్పటియట్లే విహరించు. ఆత్మతో ఆత్మ గురించి చక్కగా విచారణచేసి 'వ్యాపక పరబ్రహ్మము' నందు విశ్రాంతి పొందు. ఈ దృశ్యమంతా ఉపశమించబడి ఆత్మపదము యొక్క అనుభవం సుస్థిరపడే వరకు పదే పదే అనేక

కోణముల నుండి విచారణ కొనసాగించాలి.

శ్రీరాముడు : మహాత్మా! 'విచారణ' అనగా మీ నిర్వచన మేమిటో సంక్షిప్తంగా చెప్పండి. శ్రీవసిష్ఠమహర్షి :విచారణ' అంటే - శాస్త్రములను ఉత్తమ బుద్ధితో వినటం... చిత్త శోధనము, ఆత్మతత్త్వ పరిశీలన... గురువాక్యములందు విశ్వాసం... ఆత్మవస్తువుపై నమ్మకము, సదవగాహనను పెంపొందించుకోవటం... ఇంద్రియములను నిరోధించి ఆత్మానుభవంవైపు తరలించటం

ఎవ్వరికైనా సరే, వైరాగ్యము, ఆత్మ చింతనాభ్యాసము, వేదాంత శాస్త్ర శ్రవణము, ఆత్మ పరీక్ష, గురువాక్య విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, ప్రజ్ఞ - అను క్రమముచే బ్రహ్మపదము తప్పక చేకూరగలదు.

ఒకడు సర్వమును త్యజించి కేవలం ప్రజ్ఞను మాత్రమే ఆశ్రయిస్తే, ఒక్క ప్రజ్ఞచే కూడా బ్రహ్మపదము లభిస్తుంది.

నీ బుద్ధి జ్ఞానయుక్తమై, అతి తీక్షమై అవిద్యాకళంకరహితమై ఉండటానికి సర్వవిధ ఉపాయాలు ఆశ్రయించు. ఒకవేళ 'వైరాగ్యము' మొదలైన సామాగ్రి లేకపోవచ్చు గాక - అయినా కూడా సుతీక్షమైన బుద్ధిని సంపాదిస్తే అందు నిత్యమగు బ్రహ్మము సుస్పష్టముగా ప్రకటన కాగలదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు భూత, భవిష్యత్, వర్తమానములకు ఈశ్వరుడై ఉన్నారు. మీకు నమస్కరిస్తూ రెండు ప్రశ్నలు అడుగుచున్నాను.

1. ఒక వైపు వ్యవహార తత్పరుడై ఉంటూనే, మరొకవైపు సమాధిస్థితుని వలె, విశ్రాంతి పొందుచున్నట్టి జ్ఞాని ఎవరైనా ఉన్నారా?

2. ఒకడు ఒక ఏకాంత స్థలంలో సమాధి నియమమును అనుష్ఠించుచున్నాడనుకోండి. మరొకడు సమాధినిష్ఠుడై కూడా, వ్యవహారతత్పరుడై ఈ జనావళి మధ్య సంచరిస్తున్నాడనుకోండి. ఈ ఇద్దరిలో శ్రేష్ఠుడెవడౌతాడు?

Page:532

శ్రీవసిష్ఠమహర్షి : రామా! అసలు 'సమాధి' అంటే ఏమిటని నీవనుకుంటున్నావో చెప్పు. శ్రీరాముడు : "గుణ సముదాయ రూపమైన ఈ దృశ్యప్రపంచమంతా అనాత్మయే" - అని గ్రహించటం. అట్లు పరికించుట చేత అంతఃకరణం శీతలత్వం పొందుతుంది. అట్టి స్థితియే 'సమాధి' అని చెప్ప బడుతోందని నా అభిప్రాయం.

శ్రీవసిష్ఠమహర్షి : ఈ దృశ్యముతో మనకు సంబంధం ఎందుకు ఏర్పడుతోంది? మనస్సు ఉండుట చేతనే కదా! "అట్టి మనోసంబంధమైన దేదీ ఆత్మయగు నాకు లేదు" - అని నిర్ణయించుకొన్న తరువాత, పూర్ణకాముడై కూడా ఒకడు వ్యవహారపరుడగుచున్నాడు. మరొకడు ఏకాంతము నందు సంస్థితుడగుచున్నాడు.

వారిద్దరూ అంతఃకరణంలో పూర్ణకాములే. కనుక ఇద్దరూ సుఖవంతులే! ఎందుకంటే, సర్వ తపోధ్యానాదుల అంతిమ ఫలితం ఏమిటి?... అంతఃకరణ శీతలత్వమే!

ఒకడు ఒక ఏకాంత ప్రదేశంలో సమాధిని ఆశ్రయించాడనుకుందాం!... కానీ ఆతని అంతః కరణం మాత్రం అనేక అంతఃకరణ వృత్తులచే చంచలమగుచున్నదనుకో . ఆ సమాధి పిచ్చివాని గంతుల వంటిదే కదా! అట్లాకాకుండా మరొకడు అనేక విషయపరంపరల మధ్య తాండవనృత్యం చేస్తూ ఉండగా ఆతని చిత్తము మాత్రం వాసనారహితమై ఉంటూ ఉంటే - ఆతని మనఃస్థితి ఒక ప్రబుద్ధుని ఏకాంత సమాధిస్థితితో సమానమే అవుతుంది.

అందుచేత రామా! వ్యవహారతత్పరుడగు జ్ఞాని, అరణ్యంలో ఏకాంతాన్ని ఆశ్రయించిన జ్ఞాని - ఇద్దరూ ఒక్కటేనయ్యా! వారిరువురు సంశయరహితమగు బ్రహ్మమును పొందినవారే అగుచున్నారు.

ఒకానొకడు ఒక కథ వింటున్నాడనుకో... కానీ, ఆతని అంతరంగ లక్ష్య - ఉద్దేశములకు సంబంధించిన ముఖ్యచిత్త విభాగం మరెక్కడో సంలగ్నమైయున్నదని అనుకుందాం... అప్పుడాతడు ఆ కథకు సంబంధించిన పాత్రల సుఖదుఃఖములను తాను పొందుతాడా? లేదు. అట్లాగే, వాసనలు నశించిన తరువాత ఈ చిత్తము క్రియలు నిర్వర్తిస్తూనే, 'నిర్వర్తించనిది'గా, అనగా, అకర్తగా

ఉండిపోగలుగుతుంది.

ఇంకొక దృష్టాంతం విను. ఒకడు తన అంగములను కదల్చకుండా చేష్టారహితుడై శయ్యపై నిదురిస్తున్నాడనుకో... కానీ, అతని చిత్తము గోతిలో పడిపోతున్నట్లుగా కల కంటోందనుకుందాం

అప్పుడాతని చిత్తము భయాందోళలనతో 'పడిపోవుట' అను కర్తృత్వము అనుభవిస్తూ ఉంటుంది... కాళ్ళూ చేతులు పదిలంగా శయ్యపై విశ్రమిస్తున్నప్పటికి కూడా... ఘన వాసనలతో కూడిన చిత్తము భావనలచే ఏర్పడిన సంసక్తతలకు కర్తయే అగుచున్నది.

చిత్తము యొక్క అకర్తృత్వమే చిత్తము యొక్క సమాధి. అదియే కేవలీభావముకూడా. అదియే పరమసుఖము. విశ్రాంతి.

Page:533

అయినా ఒక ప్రశ్న. "ధ్యానము - అధ్యానము, సమాధి-అసమాధి ... అను శబ్దములను దేనిని దృష్టిలో పెట్టుకుని చెప్పుచున్నారు? శరీరమును దృష్టిలో ఉంచుకొనా? కానే కాదు. శరీరము కదల వచ్చు, కదలక పోవచ్చు. చిత్తం యొక్క చంచలత్వ-అచంచలత్వములనే అసమాధి-సమాధి’ అని పిలుస్తున్నారు. కాబట్టి రాఘవా! నీవు వాసనారాహిత్యముచే అట్టి చిత్తమును అంకురరహితం చేయాలి. వాసనారాహిత్యముతో కూడిన మనస్సునే స్థిరత్వము యొక్క అనుభవంగా గ్రహించు. అదియే ధ్యానము, కేవలీ భావము, సమాధి కూడా. వాసనారహితమగు మనస్సు అత్యున్నతమగు బ్రహ్మ పదమునకు దారి తీయగలదు. ఆ బ్రాహ్మీస్థితియే మోక్షం. ఘనవాసనలతో కూడిన చిత్తము రకరకాల కర్తృత్వములను కలిగియున్నదగుచున్నది. ఆ కర్తృత్వముల ద్వారా దుఃఖములన్నీ వచ్చి ముంగిట వాలుచున్నాయి. ఇది గ్రహించి నీవు వాసనలను సూక్ష్మతరము చేయి.

'సమాధి' అను దానికి మరొక వైపు నుండి నిర్వచనం వినుజగత్తు దేహము మొదలైనవాటితో సమావేశమైయున్న ఈ దృశ్యము నందు ఇది నేను, ఇది నాది అను రూపము గల అహంకార మమకారములు ఏర్పడుచున్నాయి. వాటి నుండి ఇచ్ఛ, భయము, శోకము ఉత్పత్తి అవుచున్నాయి. నాది అనునది చిత్తము నుండి మొదలంట తొలగించ బడితే, అట్టివాని ఆత్మ ప్రశాంతపడుతుంది. అట్టి ప్రశాంతస్థితియే సమాధి.

కనుక రామా! అట్టి సమాధి యొక్క అనుభవము నందు, ఈ కర్మలు చేయటం, చేయకపోవటం ఒక ప్రత్యేకమైన విషయమే కాదని నీవు గ్రహించాలి. సమస్త పదార్థముల పట్ల ‘అహమ్ - మమ’ అను అభిమానములను త్యజించి, ఆ తరువాత ఇక నీ అభిమతాసారం చరించు.

ఒక కొండపై ఏకాంతంగా ఉండు. లేదా... గృహస్థుడవై వ్యవహారములను నిర్వర్తించు. రెండూ నీకు ఒక్కటే అవుతాయి.

ఏ గృహస్థుడైతే అహంకారాది దోషములను నశింపజేసి సమాహిత చిత్తం సంపాదించు కుంటాడో - అట్టి గృహం అతనికి నిర్జనప్రదేశంలోని ఆశ్రమంతో సమానమే అవుతుంది. సమాహిత దృష్టి కలిగి, నిత్య - అపరోక్షస్థితి పొందినట్టి నీవంటి మహాత్ములకు గృహమూ ఒక్కటే, అరణ్యమూ ఒక్కటే. ఆకాశము మొదలైన పంచభూతముల దృష్ట్యా 'ఇది గృహము ఇది అరణ్యము' అన్న తేడా ఎక్కడున్నది? 'చిత్తము' అనే మహాకాశంలో 'శాంతము' అను స్వస్థత సంపాదించుకొని ఉన్నవానికి జన సమూహముచే వ్యాప్తమైన నగరం కూడా నిర్జన వనమే. రాగాది వృత్తులచే విక్షేపము పొందుచున్న చిత్తము గల మూఢునకు నిర్జన వనం కూడా అనేక జన సమ్మర్దములు - సమాచారములతో నిండిన నగరమగుచున్నది.

Page:534

13. చిత్త విచికిత్స

ఈ సంసార జీవుని చిత్తము నిండా అనేక రాగ, ద్వేష, భయములతో కూడిన విషయపరంపరలు నిక్షిప్తమై ఉన్నాయి. విషయములన్నీ లయిస్తే, అప్పుడు వాసనాబీజము మాత్రమే మిగిలి, చిత్తము సుషుప్త దశను పొందుతుంది. ఇక వాసనా బీజం కూడా తొలగితే, ఆపై చిత్తము శాంతమయమై ఉంటుంది. ఆ శాంతమయచిత్తమే మోక్షం పొందుతుంది. అంతే గానీ, విషయ సహిత చిత్తము ఎట్లా పొందుతుంది?

ఇది గ్రహించి, రామా! ఆపై ఏది, ఎట్లు ఉచితమనుకుంటావో అట్లాగే ఆచరించు. సమాధి యందున్నట్టి ద్రష్ట ఆత్మను సర్వపదార్థములకు, విషయములకు, సంఘటనలకు అతీతమైనదిగా గాంచుచున్నాడు. తాను వ్యవహారమునందు ఉన్నప్పుడు ఆత్మయే సర్వ పదార్థముల రూపముగా ఉన్నట్లు గాంచుచున్నాడు. ఎవనిపట్ల రాగ - ద్వేషములు నశించిపోతాయో, ఎవనికి సమస్త పదార్థములు బ్రహ్మముగా, సమరూపముగా కనిపిస్తాయో - అట్టి విశాలాకారయుతుడే 'సమాధి స్థితుడు’ అనబడతాడు.

వింటున్నావా రామా! మరల ఒకసారి ప్రకటిస్తున్నాను. సమాహిత చిత్తము జాగ్రత్తులోని - -

స్వప్నములోని ఆయా సమావేశములను, సర్వ దృశ్య వ్యవహారములను బ్రహ్మరూపము గానే వీక్షించుచున్నది. స్వప్న ద్రష్ట స్వప్నంలో చూచేవి స్వప్నద్రష్ట కంటే వేరైనది కానట్లే, జాగ్రత్ ద్రష్ట కూడా జాగ్రత్లో చూచేది ఆ జాగ్రత్ ద్రష్టకు వేరైనదేదీ కాదు. జ్ఞాని అంతర్ముఖమైన మనస్సు కలవాడై తాను నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడు, తెలిసిన తెలియని ప్రదేశాలలో ఉన్నప్పుడు "ఈ తటస్థ బడుచున్నదంతా ఆత్మస్వరూపుడనగు నా స్వరూపమే - అని గ్రహించి ఉంటున్నాడు. ఎందుకంటావా? ప్రాణికోట్ల చేత, పృథివి మొదలైన పంచభూతముల చేత నింపబడి ఉన్న ఈ దృశ్యజగత్తు అంతర్ముఖదృష్టి గలవానికి విషయమే కాదు. ఇదంతా ఆతనికి ఎందుకూ ఉపకరించక, సదా శూన్యరూపమునే పొందుచున్నది.

దృశ్యమునకు సంబంధించిన సర్వధ్యాసలు, (వాటికి సంబంధించిన కామ, క్రోధ, లోభములు) ఉపశమించినప్పుడు అంతఃకరణంలో శీతలత్వం (Calmness & Tranquility) చోటుచేసుకుంటుంది. అట్టివాడు సర్వేసర్వత్రా ప్రశాంతతను దర్శించగలడు.

అన్తస్తృష్ణోపతప్తానాం దావదాహమయం జగత్ I

భవత్యఖిలజన్తూనాం యదన్తస్తద్బహిః స్థితమ్ (శ్లో 34, సర్గ 56)

ఇక తదితర సంసారజీవుల అంతరంగంలో 'తృష్ణ' అనే అగ్నిజ్వాల ఏర్పడి ఉండటం చేత వారికి ఈ జగత్తంతా దావాగ్నిచే నిండి ఉన్నట్లుగా మరియు, దాహమయమై ప్రాప్తిస్తోంది. అంతః కరణం ఏ విధంగా ఉంటే బాహ్యజగత్తు ఆ రీతిగానే అనుభవమౌతోంది.

Page:535

చిత్తమే బాహ్యమున జగత్తుగా ప్రాప్తించుచున్నదని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఈ అంతరిక్షం,

పృథివి, వాయువు, ఆకాశము, పర్వతము, నదులు, దిక్కులు - - ఇవన్నీ అంతఃకరణము యొక్క వివిధ రకములైన స్పందన విభాగములే అయిఉండి, బాహ్యమున తోచుచున్నాయి. చిత్తము లేనిదే బాహ్యమే ఉండదు.

మఱిచెట్టు నుండే మట్టి విత్తులు బయలుదేరుచున్నట్లు సత్స్వరూపమగు ఆత్మ యందు గల ఈ జగత్తు బాహ్యముగా గోచరిస్తోంది. యథార్థానికి ఏవీకూడా బాహ్యమున గాని, అంతరమున గానీ లేవు. అంతా పూర్వవాసనలను అనుసరించే జీవునకు అనుభవమవటం జరుగుతోంది. ఒక చిన్న డబ్బీలో ఉంచబడ్డ కస్తూరియొక్క సువాసన ఆ చుట్టుప్రక్కల వ్యాపించి ఉంటున్నట్లు, లోన గల ఆత్మ తత్త్వమే బాహ్యమున జగదాకారముగా భాసించుచున్నది. అనగా ఆత్మయే విశాలత్వముచే బాహ్యమున జగద్రూపముగానూ, అంతరమున అహంకారరూపముగానూ స్ఫురించుచున్నది.

అయితే, ఒక ముఖ్యవిషయం. బాహ్యమున ఈ జగత్తు గాని, అంతరమున అహంకారం గానీ, ఆత్మ కాదు. అది స్థూలమైన ఏ రూపమూ కాదు. ఆ రెండిటి యందూ అనుస్యూతమై ఉన్న విభు స్వరూపమగు సన్మాత్రమే అది. ఆత్మ తన యొక్క ఆంతరికమగు చిత్తము ఏ పూర్వవాసనలతో కలిగి ఉన్నదో తదనుసారమే బహిర్ముఖంగా తదితర జగత్తును గాంచుచున్నది. ఈ జాగ్రత్ వాసనలచే హృదయంలో స్వప్నమనో రాజ్యములను కూడా గాంచుచున్నది. బాహ్యము నందూ, అంతరం నందు కూడా అనుస్యూతమై ఉన్న సద్రూపమగు ఆత్మ నుండి ఈ జగత్తు అనుదాన్ని మనం వేరు చేశామా, అప్పుడీ జగత్తు అనబడేది మృతప్రాయమే అవుతుంది. అట్లు వేరు చేయనంత కాలం ఈ బాహ్య, అభ్యంతరములు తొలగనే తొలగవు. అహంకార, మమకారముల 'అధ్యాస' చే పదార్థాల అల్ప, అధిక భేదము గురించిన భయము కలుగుతూనే ఉంటుంది. అందుచేత సర్వ భేదాలకు అతీత్వము అభ్యాసం చేస్తూ ఉండాలి.

మనోవ్యాధిచే నిహతుడగుచున్న జీవునకు ఈ ఆకాశం, భూమి, పర్వతము, నదులు, దిశలు ...ఇవన్నీ ఆధిభౌతిక - ఆధిదైవిక - ఆధ్యాత్మిక తాపములను కలుగజేస్తూనే ఉంటున్నాయి. మనో వ్యాధి తొలగేది ఎట్లా?

యస్త్వాత్మరతిరేవాన్తః కుర్వన్కర్మేన్ధియైః క్రియాః I న వశో హర్షశోకాభ్యాం స సమాహిత ఉచ్యతే ॥ (శ్లో 43, సర్గ 56)

ఎవ్వడైతే అంతరమున ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడో, అంతటా సన్మాత్రమగు ఆత్మనే వీక్షిస్తూ ఉంటాడో - అట్టివాడు ఈ దృశ్యమునకు పట్టుబడడు. అట్టివాడు కర్మేంద్రియములచే క్రియలు ఒనర్చుచున్నప్పటికీ హర్ష - శోకములకు వశుడుకాడు. ఇక, అతడు 'సమాధిస్థితుడు’ అని అనిపించుకుంటాడు. ప్రశాంతబుద్ధికలిగి, అంతటా ఆత్మను గాంచుచూ, ఇక ప్రాపంచిక పదార్థముల గురించి శోకించక, వాటిని తలచక ఉండేవాడు సమాధిపరుడు. అట్టి సుస్థితికి చేరినట్టి మహనీయుడు ఉత్పత్తి - - వినాశనయుక్తమగు ఈ జగత్తుయొక్క గతిని వీక్షిస్తూ, అజ్ఞులందు ప్రసిద్ధమై ఉంటున్న ఈ అహంమమత్వాది దృష్టులను చూచి నవ్వుకుంటూ ఉంటాడు.

Page:536

సమాధి బుద్ధి - "సూర్యకిరణములు కెరటములలో ప్రతిబింబించటం జరుగుచున్నప్పుడు అక్కడ వెండితీగలు ఉన్నట్లు భ్రమ కలుగవచ్చు గాక! అవి మెఱుపులే గానీ వెండితీగలు ఎలా అవుతాయి? ప్రత్యగాత్మయే వాస్తవ స్వరూపముగా గల నా యందు ఈ అహంకార, మమకారములు గానీ, తదితర జనన మరణాది వికారములు గానీ ఉండజాలవు. నేను సర్వదా అసంగుడను. అద్వైత స్వరూపుడను. కూటస్థుడను. సమరూపమగు బ్రహ్మమునే నేను. అనునదే సమాధి బుద్ధి. కాబట్టి ఆతని పట్ల జీవస్థితి, అహంకారము, దృశ్యము, జగత్తు మొదలైన విభాగములు ఉండవు. మనస్సు ఉండదు. ఆ మనస్సు చేసే కల్పనలూ ఉండవు. సర్వాత్మ స్వరూపుడగు అట్టి జ్ఞాని మాత్రమే ఉనికి కలిగినవాడు అగుచున్నాడు. ఇక తక్కినవారు లేనివారే అవుతారు. అట్టి సమదర్శి ఆకాశము వలె స్వచ్ఛుడై ఉంటాడు.

శ్రీరాముడు : మహర్షీ! సమదర్శియొక్క శాస్త్రవిహిత విశేషాలు ఎట్లా ఉంటాయి?

శ్రీవసిష్ఠమహర్షి : అట్టి సమదర్శి ఆకాశము వలె స్వచ్ఛుడై ఉంటాడు. సహజం గాను, స్వభావసిద్ధం గాను లోకానుకూలము కొరకై శాస్త్ర, శిష్టాచారములకు అవిరుద్ధమైన బాహ్యక్రియలు ఒనర్చుచూ ఉంటాడు. హర్ష, క్రోధ - వికారములు ఎదురు పడినప్పుడు శిల, కొయ్యల వలె చలించక శాంత స్వభావుడై ఉంటాడు. సర్వజీవులనూ తనవలె చూస్తూ ఉంటాడు. స్వభావంగానే పరుల ద్రవ్యములను మట్టిగడ్డల వలె చూస్తాడు. అట్టివాని దృష్టే సరి అయిన దృష్టి.

అజ్ఞాని - అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుందో కూడా చెపుతాను. ఇక్కడి సువర్ణము, ఐశ్వర్యము మొదలైన వాటిని ఆతడు మిథ్యారూపములుగా గాంచడు. పోనీ, సద్రూపములుగా గాంచుతాడా... అదీ లేదు. ఆతనికి సద్రూపానుభవమే లేనప్పుడు సద్రూపముగా ఎట్లా గాంచుతాడు? జ్ఞాని మాత్రమే ఈ పదార్థ జాలమును మిథ్యారూపముగానూ, సద్రూపముగానూ కూడా గాంచగలడు.

ఉత్తమాశయము కలిగి, బ్రహ్మపదమును పొందినవాడు ధనహీనుడు కావచ్చు. లేక ఐశ్వర్య వంతుడు కావచ్చు. ఆతనికి పుత్రులు, బంధువులు ఉండవచ్చు ... ఉండకపోవచ్చు. ప్రాపంచికమైన అభ్యుదయ స్థితి పొందవచ్చు ... పొందకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆతడు మాత్రం సమరూపుడై, హర్షశోకములచే, ప్రాప్తాప్రాప్తములచే ఆటంకపరచబడజాలక యథాతథంగా ఏర్పడి ఉంటూ ఉంటాడు. అట్టివాడు అనేక భోగములతో స్వజనులతో నిండి ఉన్న గృహము నందు ఉన్నా... లేక సర్వ భోగవిరతుడై జనరహితమైన కీకారణ్యంలో ఏకాంతంగా ఉన్నా... కాక, మన్మథుని తీవ్రవేగమును పొందుతూ మద్యపానరతుడై ఉన్నా... బహిరంగ ప్రదేశంలో నృత్యం చేస్తూ ఉన్నా... లేదా, సర్వమును పరిత్యజించి జటాధారి అయి పర్వతగుహలో తపస్సు చేస్తూ మౌనవ్రతుడై ఉన్నా... సదా, చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు ఒంటికి అలదుకొని స్త్రీలను లాలిస్తూ ఉన్నా... ఆయా లౌకిక కార్యములందు నిమగ్నమై ఉన్నా... తన జ్ఞానము యొక్క బలిమిచే దేని చేతా తాకబడకుండా ఉంటాడు. ఎందుకంటే, ఆతడు మనస్సును వికార రహితంగా ఉంచుకుంటాడు.

Page:537

మనో-దేహము లందు ఆతడు అహంకారమును ఆశ్రయించకపోవటం చేత, ఆతడు ఏది ఒనర్చు చున్నప్పటికీ ఒనర్చనివాడు అయి ఉంటున్నాడు. బంగారము బురదలో పడినంత మాత్రం చేత అది తన సహజసిద్ధమగు స్వప్రకాశమును వదులుకుంటుందా? లేదేఁ!

ఇక అజ్ఞానులంటావా? వాళ్ళు విషయములు సేవిస్తున్నప్పుడల్లా వాసనలు పెంపొందించు కుంటున్నారు. అజ్ఞాన వాసనలతో ఇంద్రియములను అజ్ఞాన మార్గంలో ఉపయోగిస్తూ ... ఇంకా ఇంకా సాంసారిక దృష్టులను, సంస్కారాలను అధికం చేసుకుంటున్నారు. భోగ్యములైనట్టి శబ, స్పర్శ, రూప, రస, గంధములు వారి మనస్తత్వములపై పెత్తనం చెలాయిస్తున్నాయి.

కాబట్టి, విజ్ఞుడైనవాడు ఈ కనబడే వస్తువుల గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు ఆతని పట్ల సర్వవస్తువులు తమంతట తామే కాలక్రమంగా శమిస్తాయి. “అనేక వస్తువుల సత్త" - యొక్క అభావముచే చిత్తము నందలి కళంకములన్నీ స్వయంగా నశిస్తాయి. శ్రీరాముడు : స్వామి! అసలు వాసనలు ఎలా ఏర్పడుచున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : అహంకార, మమకారముల అధ్యాస చేతనే 'వాసన' అనబడే అనర్థం ఏర్పడుతోంది. ఫలితమేమిటి? ఆనందమే స్వస్వరూపముగా గల ఈ జీవుని జీవితమంతా అనేక రీతులైన దుః ఖములకు ఆలవాలమైపోతోందే! అహంకారం నశించిందా... జ్ఞానం తనంతటతానే స్వయంగా వికసిస్తుంది. అట్టి జ్ఞాన ప్రభావంచేత అంతఃకరణంలో సమత్వం ఉదయిస్తోంది. ఒకడు చీకట్లో మెత్తటి త్రాడును తాకి 'అమ్మబాబోయ్' అని అరచి, గడగడ వణుకుచున్నాడనుకో.... అది పాము కాదు, త్రాడే అని తెలిసిపోతే వికారాలన్నీ మటుమాయమౌతాయికదా!

కాబట్టి రామా! జ్ఞానము సంపాదించి, తద్వారా దేనితోనూ సంబంధము లేనివాడవై ఉండు.

యత్కరోతి యదశ్నాతి యద్దదాతి జుహోతివా | నతజ్ఞస్య నతత్రజ్ఞో మాకరోతు కరోతువా ॥

ఏది చేస్తున్నా, భుజిస్తున్నా, ఇస్తున్నా, హోమం చేస్తున్నా, జ్ఞానికి వాటితో గాని, వాటికి జ్ఞానితో గాని సంబంధమే ఉండదు. అదీ చమత్కారం! ఆతనికి ఆ కర్మలు చేయటం, చేయక పోవటం ఒక్కటే. పూర్ణజ్ఞానికి కర్మలచే గానీ, కర్మల యొక్క అభావంచే గానీ, ప్రయోజనమేముంటుంది చెప్పు? ఆతడు అన్ని స్థితులందూ ఆత్మ జ్ఞానముచే ఆత్మ యందే సంస్థితుడై ఉంటాడు. గండశిలపై పడిన విత్తు మొలుస్తుందా? జ్ఞాని యొక్క అంతఃకరణము నందు కోర్కెలు జనించవు. ఆతని యందు ఏదేది జనిస్తుందో అదంతా జలమందలి తరంగముల వలె ఆతని రూపమే (ఆత్మ రూపమే) అయి ఉంటుంది? ఇంక స్పర్ధకు చోటెక్కడ? ఓ రాఘవా! ఈ బ్రహ్మాండమంతా జ్ఞాని యొక్క స్వరూపమే. ఆతడూ బ్రహ్మాండస్వరూపమే అవుతాడు. ఎందుకంటే ... యథార్థానికి ఈ జగత్తులో దేశ, కాల, వస్తు కృతమగు విభాగమంటూ ఏదీ లేదు. ఇక్కడ అనుభవము మాటేమిటంటావా? స్వకీయమగు కల్పనయే ఇట్లు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నదని గ్రహించు. జ్ఞానియగు ఉత్తమ పురుషుడు అతిపావనము, ఏకరూపము, సర్వాద్వైత బంధరహితము అగు సన్మాత్రరూపుడై ఉంటాడు.

Page:538

జ్ఞానికి, పరమాత్మకు భేదమేమీ లేదు. అజ్ఞానము అనబడేది భ్రమ మాత్రమే. కనుక అజ్ఞాని "ఎఱుకను ఏమరచిన పరమాత్మ" కాక మరింకేమీ కాదు.

14. అభేద నిర్ణయం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘురామా! ఆత్మ స్వప్రకాశయుక్తమై అంతటా వెలయుచున్నది. అదియే అజ్ఞాన కారణం చేత “అహంకారము - వస్తుజాలము - దేశకాలములు".. మొదలైన విశేషములతో కూడిన జగత్తుగా విస్తారత సంతరించుకుంటోంది.

‘అనుభవం’ - అనునది ఆత్మయొక్క విన్యాసమే. లవణము యొక్క లవణత్వానుభవం చెఱుకు యొక్క మాధుర్యానుభవం... శిల యొక్క కాఠిన్యానుభవం.... పర్వతము యొక్క గురుత్వానుభవం... జిహ్వము యొక్క రుచిత్వానుభవం... వృక్షము యొక్క శాఖత్వానుభవం... ఆకాశము యొక్క శూన్యత్వానుభవం... అహంకారం, కుండ, గోడ, శరీరము, ఆవర్తము మొదలైన రూపత్వానుభవం... అంతా కూడా ఆత్మ యొక్క 'అనుభవము' అనబడు స్వవిస్తారమే

సుమా!

జ్ఞాన దృష్టిచే చిద్ర్బహ్మము తోటి సర్వపదార్ధములు అభేదమే సిద్ధిస్తోంది. ఆత్మ యొక్క ఘనత్వానుభవం అహంకారం గానూ, ఆ అహంకారముచే సిద్ధిస్తున్న పదార్థజాలం గాను ప్రకటిత మౌతోంది. అజ్ఞాన దృష్టికి మాత్రమే చిత్తము చిత్తు కంటే వేరైన దాని వలె దృశ్యమానమౌతోంది. ఆత్మ యొక్క చైతన్యము ద్వారా కలిగే సత్తా రూపానుభవమే స్వయముగా అహంకారరూపంగా ఏర్పడుతోంది. ఆ కనబడేదానిని మనం 'చిదాభాసుడు' అని అంటున్నాం.

చూచావా! అంతరాత్మ తన స్వప్రకాశము యొక్క అనుభవముచే వృత్తిభేదం చేత భిన్న వస్తు జాలములుగా చిదాభాసము లందు అనుగతమై ఉంటోంది. స్వయముగా తాను విస్తరించి, తనచే ఏర్పడి ఉన్న చోటును తనకు అన్యమైనదాని వలె గాంచుచున్నది. అహంకారముగా ఆవిర్భవిస్తున్నది. అది ఆత్మ యందు ఆత్మ యొక్క చిత్ (Awareness) రూపమే! అదియే 'అంతఃకరణము’ అను మరొకటిగా కవులు వర్ణిస్తున్నారు. అంతఃకరణమంతా ఆత్మయే.

యథార్థానికి ఆత్మ పదార్థరూపంగా ఏదీ అగుటలేదు. నీరు తరంగంగానూ, ఆవర్తంగానూ, బుద్బుదం గానూ, ఏమైనా మారిపోతోందా! నీరు సర్వదా నీరుగానే ఉంటోంది కదా! ... అట్లాగే, ఆత్మ కన్నా భిన్నంగా మరొక పదార్థమేదీ సంభవించదు.

ఆత్మ ఆస్వాదించ తగినట్టి మరొక్కటేదీ ఎక్కడా ఏర్పడజాలదు. వికారము పొందటానికై ఆత్మకు భిన్నమై వేరొక్కటేదీ ఎక్కడా లేదు. "ఆత్మచే పొందబడుచున్నది అనునదంతా గొడ్రాలి రెండవ కుమారుని వలె పొంతనకు దొరకని వాక్యం.

Page:539

ఆత్మ జన్మించదు. మరణించదు. అది శరీరాంతర్గతమై, శరీరములకు ముందు వెనుక, శరీరసమయంలోను - బయట - లోపలా అంతటా ఒకే తీరుగా సర్వదా వెలయుచున్నది. అసత్తు అగు ఈ జగత్తంతా ఆత్మయందే భాసించుచున్నది. అనంతపరిపూర్ణజ్ఞాన స్వరూపమగు పరమాత్మ ఏకరూపముననే ఉన్నాడు. తనయందు తానే జగతూపంగాను, తదితర సర్వరూప - నామతత్వములుగాను స్థితి కలిగియున్నాడు.

8

ఓ రాఘవా! ఇప్పటివరకూ నేను చెప్పుచున్న దానిని అనుసరించి "అహంకారమునకు, జగత్తునకూ భేదమేమీ లేదు" - అని నిరూపించబడుతోంది కదా!

-

ఒక అత్యుత్తమ సత్యం ప్రకటిస్తున్నాను. విను. వాస్తవానికి చిత్తముగానీ, చిత్తము కలవాడుగానీ, జగత్తు అనబడు విభ్రమముగాని లేవు. వస్తూ ఉన్న వర్షం ఒక్కసారి ఆగిపోవునట్లు, శుద్ధ సన్మాత్ర జ్ఞానము చే ఈ జగత్తు ప్రశమనము పొందగలదు. అనగా నీవు జ్ఞానివైనావా.... నీ దృష్టిలో ఈ జగత్తు ఒక్కక్షణంలో లేకుండా పోగలదు. జలంలో తరంగాలు ఎందుకుంటున్నాయి? జలమే తరంగాలుగా అగుపించటం జరుగుతోంది కదా!

ఆ జలము యొక్క ద్రవత్వస్వభావంచేతనే కదా! మాయావియగు ఈశ్వరుడు స్వమాయచే ఆవృతమైన జ్ఞప్తిరూపనిజాత్మ యందు ఈ జీవదశలను పొందుచున్నాడు. అనగా ఏమిటి? “నేను జీవుడను ... ఇది జగత్తు" అను రూపముగల భావము ఆ ఈశ్వరుడే తనకుతాను తనయందు కల్పించుకొనిన మాయచే గాంచి, అనుభవించుచున్నాడు. అట్టి అనుభవమును గాంచుచున్నట్టి సమయంలో నేను ఈ దృశ్యవ్యవహారమునకు స్వయముగా రచయితనైయున్నాను. కనుక ఈ కనబడే సర్వమునకు నేనే ఈశ్వరుడను. సర్వదా పూర్ణుడను" అనే విషయం పూర్తిగా ఏమరుచుచున్నాడు.

ఎంతటి చమత్కారం! ఏ విధంగా అయితే జలమునందు ద్రవత్వమూ, వాయువునందు చంచలత్వమూ ఉన్నాయో, అదేవిధంగా జ్ఞప్తిమాత్రుడగు ఈశ్వరునియందు అహంకారము - దేశము - కాలము మొదలైనవన్నీ ఉన్నాయి. ఈశ్వరస్వరూపుడు అగు ఈ జీవుడు ఒక వైపునుండి 'నేను ఈశ్వరుడను' అను భావముచే ఆవరణము (Limitation)గానీ, పరిచ్ఛేదము (Partition)గానీ లేనట్టి తన నిరతిశయానంద జ్ఞానమును ఎరుగుచునే ఉన్నాడు. అయితే, మరొకచోట మరొకవైపున, అహంకారవశంచేత 'నేను జీవుడను' అను రూపముగల జీవభావము పొందుచున్నాడు. అట్టి జీవభావముచే ఈ పంచభూత, ప్రాణ, ఇంద్రియాదులందు విషయసంబంధమగు 'అధ్యాస' కలిగి ఉంటున్నాడు. అట్టి సమయంలో ఈ దేహమే నేను. ఈ దేహమునకు అనుభవమగుచున్నవే నా పరిధి”... అని భావించుచున్నాడు. అయితే, ఈ స్వయంకల్పిత పరిమితులు యథార్థమా? కానేకాదు.

అగుటకు వీలు లేదు కూడా.

అజ్ఞాని ఆయా కర్మవాసనల చేతనూ, దర్శన, లాభాది భోగ వైచిత్రములచేతనూ ప్రియ - మోద - ప్రమోద వ్యవహారముల చేతనూ అనేక దృష్టిపరంపరలను తనయందు కలిగి ఉంటున్నాడు.

Page:540

తృప్తి పొందాలని తపిస్తూ ఎచ్చటెచ్చటికో వెళ్ళి వెతుకుచున్నాడు. అయితే ఒకడు జ్ఞాని కావచ్చు... అజ్ఞాని కావచ్చు. ఎరుగబడుచున్న వైచిత్ర్యమంతా అభిన్నమగు ఆత్మచేతనే నిర్వర్తించబడుచున్నదని గ్రహించు. ఈశ్వరుడే ఇచ్ఛాకామములకు అనుగుణంగా తన అంగములను ఆయారూపములుగా పరిణమింపజేస్తున్నాడని గమనించు.

పరమార్థస్థితి - ఓ రామచంద్రా! ఈ జగత్తంతటికీ అధిష్టానమైయున్న పరమాత్మ యొక్క జ్ఞానమే పరమార్థ స్థితి. సర్వజీవుల జీవనము దేనియొక్క అధీనమైయున్నదో.... అట్టి పరమానంద రూపమే ఈ జీవుని స్వరూపం. సచ్ఛాస్త్రములు, గురూపదేశములు సహకరించుచుండగా ఎప్పుడైతే జీవుడు ఈ సత్యం గ్రహిస్తాడో అప్పుడిక ఈ భోక్త - భోగ్యముల రెండిటి యొక్క అధిష్ఠానం చిద్రూపమగు ఆత్మయే ... అని తప్పక గ్రహిస్తున్నాడు. ఇకప్పుడు జీవ, ఈశ్వరులకు భేదమేమున్నది? ఎక్కడున్నది?

ఈశ్వరుడే సంకల్పముల ఆధిక్యత చేత జీవుడగుచున్నాడు. జీవుడే సంకల్ప, ఆసక్తి క్షయం చేత ఈశ్వరుడగుచున్నాడు. జీవ, ఈశ్వరుల భేదం లేనట్లే, ఈశ్వరుడు, బ్రహ్మమునకు భేదం లేదు. అనగా, శాంతమై... అఖండమై, పరిపూర్ణమై బ్రహ్మము మాత్రమే శేషించుచు.... అది సర్వుల వాస్తవరూపమై ప్రకాశించుచున్నది.

బోధప్రయోజనం... సాక్షాత్ ప్రయోజనం కాబట్టి రామా! ఈ జగత్తంతా బ్రహ్మమే. అట్టి బ్రహ్మము ప్రశాంతము జననరహితము... ఏకము ... అనాది... పూర్ణప్రకాశస్వరూపము ఆనందైకరసము... విషయచిహ్నరహితము అనునది మన ఇప్పటి వరకు జరిగిన చర్చ యొక్క సారాంశము. ఈ జగత్తు యొక్క ప్రశాంతరూపమును బోధించుట కొరకు బోధించువారమగు మేము కొన్ని భేదరూపములగు శబ్దజాలమును ఆశ్రయించటం తప్పటం లేదు.

శాస్త్రకారులచే బోధ యొక్క ప్రయోజనము కొరకు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, జీవుడు, ఈశ్వరుడు"... మొదలైన శబ్దజాలం కల్పించబడుతోందికదా! ఈ శబ్దజాలమంతా బోద ప్రయోజనము కొరకే గాని, సాక్షాత్ ప్రయోజనముకొరకు కాదని నీవు గ్రహించు. నీవు ఇవన్నీ వింటూనే, భోగత్యాగలక్షణం ద్వారా అఖండార్థరూపమైనట్టి 'ఓం' కారము యొక్క లక్ష్యార్థమును గ్రహించు.

ఆ లక్ష్యార్థం నిత్య, అపరోక్ష చిన్మాత్రమే అయి ఉన్నది. అదియే మనందరి వాస్తవ రూపమని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. అదే సమస్తం అయి, ముందు, వెనుక, మధ్యల యందు ఆక్రమించియున్నది.

Page:541

VIII. సురఘు-మాండవ్య-పర్ణాదుల

సంవాదం

1. సురఘు అంతర్మథనం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! శాస్త్రములచే, గురువులచే ఉపయోగించబడుచున్న జీవుడు

- ఈశ్వరుడు - మనస్సు - బుద్ధి - అహంకారము - మొదలైన శబ్దమయ దృష్టి అంతా శిష్యులకు

అద్వితీయము - ఏకము - అఖండము అగు ఆత్మ విషయం బోధించటానికై కల్పించబడుచున్నది. ఈ విషయం విశదీకరించ గల సురఘురాజు, మాండవ్య మహర్షి, పర్ణాదుడు - అను ముగ్గురి మధ్య జరిగిన ఒక పురాతనమైన సంవాదము చెపుతాను .....విను.

'కైలాసము' అను ప్రసిద్ధ హిమాలయ శిఖరం శంకరభగవానుని నివాసమై ఒప్పుచున్నది. ఆ పర్వత ప్రాంతంలో ఒక చోట ఒక కిరాత రాజ్యం ఉన్నది. అక్కడి ఆటవికులు అడవులలో సంచరిస్తూ రుద్రాక్షమాలలు, ఇంధనము (కట్టెలు), ఫలములు సంపాదించి, తదితర ప్రదేశములలో విక్రయిస్తూ జీవితాలు గడుపుతూ ఉంటారు. ఆ రాజ్యమును ఒకప్పుడు 'సురఘుడు' అనేవాడు పాలిస్తూ ఉండే వాడు. హేమజట’ అనునది ఆతని మరొక పేరు. సురఘుడు విభవాలలో కుబేరునితోనూ, జ్ఞానములో బృహస్పతితోనూ, కావ్య సాహిత్యాదులలో శుక్రాచార్యునితోనూ సమానుడని జనులు అనుకుంటూ ఉండేవారు. ఆతడు ప్రజలను కన్నబిడ్డలవలే పాలిస్తూ ఉండేవాడు. దుష్టజనుల విషయంలో మాత్రం కాలయముని వలె సింహస్వప్నంగా ఉండేవాడు. అక్కడి రాజ్యాంగాన్ని అనుసరించి దొంగల విషయంలో, తదితర సంఘవిద్రోహుల విషయంలో అతిక్రూరంగా శిక్షలు అమలు పరుస్తూ ఉండే వాడు. నిగ్రహ అనుగ్రహాలకు ఆతనికి అతడే సాటి" అని అందరూ అనుకుంటూ ఉండేవారు.

ఆ సురఘు చాలాకాలం ఆ కిరాతరాజ్యం ఏలాడు. కొంతకాలానికి జ్ఞానసంపన్నుడగు ఆతని హృదయంలో ఒక నూతన వేదన ప్రారంభమైనది. అయ్యో! నేను నిర్దయగా శిక్షలు అమలుపరుస్తున్నానే! ఇది హింసయే అవుతుంది కదా! శిక్షలు అమలుపరచేటప్పుడు వారి రోదనం కర్ణకఠోరంగా ఉంటున్నదే! సర్వజీవరాశులు ఆ భగవంతుని స్వరూపులే కదా! ఈ బాధించటం ఎంత వరకూ ఉచితం?" అని తనలో తాను మథనపడుతూ ఉండేవాడు. కొన్ని రోజులు అట్లా గడిచాయి. ఒకరోజు రాత్రి విశ్రాంతి గృహంలో పవళించి ఉండగా ఆతని అంతర్ మథనం ఇంకా అధికమైనది.

సురఘు (తనలో) : అయ్యో! నేను అధికారం ఉన్నది కదా అని, అనేక మందిని దుఃఖితులనుగా చేస్తున్నానా? సర్వప్రాణుల దుఃఖమూ నావంటిదే కదా! అందుచేత నా దగ్గర ఉన్న ధనమంతా అందరికి పంచివేస్తే - అప్పుడు పేదరికం ఉండదు. అప్పుడు సంఘవిద్రోహులే ఉండక పోవచ్చుకదా! ఉట్టి దండనతో ఏం ప్రయోజనం?

Page:542

అయ్యో! నిర్దయగా శిక్షలు అమలు పరచకపోతే జనులలో అధర్మప్రవృత్తి నశించదు. అమలు పరిచితే జీవులను హింసించటమే అవుతుంది. ఏం చేయాలి? ఈ రాజ్యం ఏలే పని ఎంత నీచమైనది? రాజుగా ఉన్నంత కాలం వధ - బంధనాది వ్యవహారం తప్పేటట్లులేదు. పోనీ రాజ్యం వదిలేద్దామా! రాజ్యం అరాచకమౌతుందను కారణంగా ఈ మంత్రులు, నా జాతి ఆటవిక ప్రజలు నన్ను వదిలేటట్లు లేరు? వీళ్ళందరినీ తప్పించుకొని నేనెక్కడికి వెళ్ళగలను? నా కుమారులు ఎదిగేవరకు రాజవంశంలో పుట్టటం చేత ఈ ధర్మం అనివార్యం. ధనం పంచటానికి మంత్రులు ఒప్పుకోరు. నా ఆలోచన విని వాళ్ళు పకాలున నవ్వుచున్నారు. ఇప్పుడు నాకు త్రోవ ఏమిటి?... ఇట్లా ఆలోచిస్తూ ఆ రాత్రంతా కునుకు లేకుండా గడిపాడు.

అతని పూర్వజన్మ పుణ్యవశం చేత కాబోలు, ఆ మర్నాడు ఉదయం మాండవ్య మహర్షి ఆ త్రోవలో పయనిస్తూ శిష్యులతోసహా ఆ ప్రాంతానికి రావటం జరిగింది. మహాజ్ఞాని, శాస్త్రకోవిదుడు అగు ఆ మహర్షి గురించి వినటం చేత సురఘురాజు వాళ్ళని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ

మహర్షిని, వారి శిష్యులను తన సేవలతో సంతోషపెట్టాడు. మహర్షిని తన మందిరానికి ఆహ్వానించి ఏకాంతంగా ఆయనతో సంభాషించసాగాడు.

సురఘు రాజు : హే మహర్షీ! మాండవ్యా! తమ రాకచే నేను అనిర్వచనీయమైన పరమశాంతిని పొందుచున్నాను. పేదవానికి రాజు కనికరంలాగా మీ సాన్నిధ్యం నాకు లభించింది. మీలాంటి మహనీయుల కృపారసవృష్టి ప్రసరించటానికి గాను, నేను ఎప్పుడు ఏం పుణ్యం చేశానో ఏమో!

దేవా! సర్వధర్మజ్ఞా! మీకు శ్రమ అనుకోకపోతే నాకున్న ఒక సంశయమును నివృత్తి చేయమని వేడుకొంటున్నాను. మీవంటి మహనీయులతో సంసర్గం ప్రాప్తించిన తరువాత మావంటి సంసార జీవులకు దుఃఖశమనం తప్పక కలుగగలదని పెద్దల వాక్యం. దుఃఖము యొక్క తత్త్వము ఎరిగిన పండితులు "సంశయమే దుఃఖము యొక్క మూలస్థానం" అని చెప్పుతారు కదా! స్వామీ! నా

సంశయమేమిటో వినండి.

నేను రాజుగా దోషులను క్రూరంగా దండించ వలసివస్తోంది. మరికొందరిని అనుగ్రహించ వలసి వస్తోంది. ఈ దండన, అనుగ్రహములను నిర్వర్తించే విధినిర్వహణలో నాకు విషమ దృష్టే సంప్రాప్తిస్తోంది కానీ సమదృష్టి కాదు. సమదృష్టిచే మాత్రమే జీవుడు మోక్షమార్గానికి అర్హుడౌతాడని మోక్షశాస్త్రములు ఘోషిస్తున్నాయి. మరి ఇట్టి పరిస్థితులలో నాయందు సమదృష్టి యొక్క ఛాయలైనా ఎట్లా ఉద్భవించగలవో నాకర్థమవటం లేదు. అనేక రోజుల నుండి ఈ విషయమై నాలో అంతర్ సంఘర్షణ జరుగుతోంది. నాకు దిక్కుతోచటం లేదు. ఈ రాజ్యం వదలి ఎచ్చటకో పారిపోవాలని, సమదృష్టికై ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలని అనేకసార్లు అనుకున్నాను. అయితే ఇక్కడి రాజవంశంలో పెద్ద కొడుకునై పుట్టినందుకు నేను రాజుగా ఉండక తప్పుటలేదు. ఎక్కడికో పారిపోతే, అప్పుడు నేను ధర్మము తప్పినవాడనే అవుతానేమోనని కూడా నా సందేహం!

ఇప్పుడు ఏమిచేయటం ఉచితమో తమరు ఆనతివ్వండి. మీరు ఉచితమని అంటే, ఇప్పటికిప్పుడు మీకు శిష్యుడనై సర్వము పరిత్యజించి వచ్చేయటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు

Page:543

ఏది ఉచితమో, అది మీరు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాను. నాపై దయతో సముచితమైన మార్గం చూపండి. ఈ రాజదండన' వంటి క్రూర క్రియలను నేను కొనసాగించలేను. నాపై దయతో నన్ను ఆజ్ఞాపించండి.

మాండవ్యమహర్షి : ఓ రాజా! నీ మనస్సు అలసత్వం చేత అల్పత్వం పొందిందయ్యా. ఈ శరీరాన్ని స్నానాదులు ఏ విధంగా ధూళి మొదలైనవాటిని తొలగిస్తాయో, మనస్సును కూడా ఆత్మసమాచారము, నిర్మల పర (ఆత్మ) ధ్యానము వంటి ప్రయత్నములచే ప్రతిరోజు నిర్మలస్నానం చేయించాలి. నీవు త్యజించవలసినది త్యజించవలసినంతగా త్యజించలేదు. ఆశ్రయించి ఉండవలసినది తగినంతగా ఆశ్రయించటం లేదు. అందుచేతనే నీ మనస్సు అల్పభూములలో చిక్కుకొని వేదన చెందుతోంది. నిస్తేజం అనుభవిస్తోంది.

సురఘు : స్వామి! ఈ మనస్సు యొక్క అల్పత్వం తొలగేది ఎట్లా?

మాండవ్యమహర్షి : అందుకు ఎల్లప్పుడూ మూడు విధములైన ప్రయత్నములను ఆశ్రయించాలిమనస్సు ఏర్పరచుకొంటున్న రాగమును తొలగించి ఎప్పటికప్పుడు వైరాగ్యంతో నింపాలి. 2. కర్మల ప్రయోజనముల పట్ల ఏర్పడే 'ఆశ్రయము' ను నిరోధించి, కర్మఫల త్యాగము” లేక "కర్మఫలములను భగవంతునికి సమర్పణ చేయుట" అను త్యాగమును అభ్యసించాలి. 3. ఆత్మజ్ఞానపర్యంతము ‘శ్రవణము, మననము’ మొదలైన ఉపాయాలను అనుసరిస్తూండాలి. మనస్సులో ఏర్పడే సంతాపం 'స్వవిచారణ' చే శీఘ్రంగా ఉపశమించగలదు.

ఈ పుత్ర, స్త్రీ, జన, ధనాదులు ఏమై ఉన్నాయి?... నా శరీరంలో చోటుచేసుకొని ప్రవర్తించుచున్న ఈ ఇంద్రియములతో నాకు ఏర్పడుచున్న సంబంధము ఎట్టిది?... ఈ మనో-బుద్ధి-అహంకారముల స్వరూపం ఎట్టిది?... ఇంతకీ నే నెవరిని?... ఈ జగత్తు ఎక్కడినుంచి ఏ విధంగా నాకు ప్రాప్తిస్తోంది?... ఎట్లా ఉపశమిస్తోంది?... ఈ జనన మరణములు ఎట్లా కలుగుచున్నాయి?

ఓ రాజా! స్వమనస్సుచే పై విషయాలు బాగుగా విచారణ చేయాలి. అట్టి తీవ్ర, దీర్ఘవిచారణ చేత నీవు 'పూర్ణమహత్వము' ను పొందుతావు. నీయొక్క సత్ స్వభావమును ఎఱుగుటచే ఇక ఈ సుఖ, దుఃఖాది దశలు నీ చిత్తమును డోలాయమానం చేయలేవు. అప్పుడు నీ మనస్సు జగత్ స్వరూపమును విడచి సర్వదా సిద్ధించియే ఉన్న దుఃఖ రహితమగు బ్రహ్మ స్వరూపము" ను సంతరించుకుంటుంది. అప్పుడది జలమందు తరంగంలాగా తనకు తానే శమించగలదు. అది జీవన్ముక్త వ్యవహారమునందు సమర్థత పొందగలిగినప్పుడు మలినరూపము వదలి పూర్వఃపూర్వ తత్పూర్వరూపం పొందగలుగుతుంది.

నీవిప్పుడు దృశ్యమును సందర్శిస్తున్నావు కదా! ఎప్పుడైతే నీవు ఆత్మను సందర్శిస్తావో, ఇకప్పుడు లోకపాలకులగు బ్రహ్మమొదలైనవారు కూడా, బిడ్డలు తండ్రికృప కోరుకొంటున్నట్లు, నీ కృపను కోరుకుంటారు. అందుచేత వివేకజనితమైన జ్ఞానముచే నీవు ఆత్మను అవలోకించు. అప్పుడు ‘ఆకాశము

Page:544

- సముద్రము - - మేరుపర్వతము' వంటి మహత్తర పదార్థములకు కూడా అర్థ ప్రదాతవు నీవే అవుతావు. ఎందుకంటే మహత్తంతా ఆత్మసత్త యొక్క ఆధీనమే అయి ఉన్నది. ఆత్మజ్ఞానముచే మహత్వము నొందిన తరువాత ఇక చిత్తము ఈ సంసారము నందు మునుగదు.

గోష్పాదజలం (ఆవు గిట్టచే ఏర్పడిన గుంటలోని జలం)లో ఏనుగు మునుగుతుందా? ఎలా మునుగుతుంది? ...కానీ, ఆ గోష్పాదజలంలో శిథిలమైన అంగములు గల ఒక దోమ లాగా నీ మనస్సు ‘దృశ్య సంపర్కము’ అనే సంసార గోష్పాదజలంలో చిక్కుకుంటోంది. అది అనేక నీచదృష్టులను, అవగాహనలను, అభిప్రాయములను కలిగి ఉండి దృశ్య వ్యవహారంలో ప్రవేశిస్తోంది.

ఈ మనస్సు తన యందు వాసనలను కలిగి ఉంటోంది. అందుచేతనే దృశ్యము నందు ఆకర్షణ-వికర్షణల తాడనం పొందుతోంది. అందుచేత ఓ రాజా! 'స్వయం జ్యోతిస్వరూపం' అయినట్టి ‘ఆత్మమాత్రానుభవం’ శేషించే వరకూ నీవు అంతయూ త్యజిస్తూ పోవలసిందే.

బంగారపు గనిలో పనిచేసేవాడు బంగారం లభించే వరకూ గనిని శోధిస్తూనే ఉంటాడు కదా! ఆత్మలాభం కలిగేంత వరకూ ఆధ్యాత్మ శాస్త్రములను విచారణ చేస్తూనే ఉండాలి.

వస్తు రూప బుద్ధి... ఆత్మబుద్ధి" - వస్తురూప బుద్ధియే సర్వ అనర్థములకూ కారణమగు చున్నది. అట్టి వస్తురూప బుద్ధిని ఉత్తమ బుద్ధిచే పరిశుభ్రపరచాలి. నిర్మలమగుచున్న బుద్ధి సాయంతో క్రమంగా ఈ దృశ్యము నంతటినీ పరిత్యజించి వేయాలి. అప్పుడు నీ చేతనే నీకు 'ఆత్మ' అను పూర్ణ లాభం చేకూరుతుంది. అట్లా కాకుండా ఏదో ఒక చోట కొన్ని విషయములు మాత్రం త్యజిస్తే ఆత్మలాభం ఎలా చేకూరుతుంది?

నీవు కొన్ని విషయములను వదులుతూ, మరికొన్ని విషయములను ఆదరిస్తూ ఉండుట చేతనే నీకు ఇప్పటి డోలాయమానస్థితి ఏర్పడుతోంది. నాయనా! మరల చెప్పుచున్నాను - యావత్సర్వం న సంత్యక్తం తావదాత్మా న లభ్యతే | సర్వావస్థాపరిత్యాగే శేష ఆత్మేతి కథ్యతే ॥ (శ్లో 44, సర్గ 58)

సమస్త పదార్థములు త్యజించబడనంత వరకూ ఆత్మానుభవప్రాప్తి కలుగదు. సర్వావస్థలను పరిత్యజించుటచే, అప్పుడు నీయందు ఏది శేషిస్తుందో - అదే 'ఆత్మ' అని చెప్పబడుతోంది.

ఈ మామూలు లౌకిక జీవితమే చూడు...! ఇక్కడ ఒక ఉత్తమ వస్తువును పొందాలంటే కొన్ని స్వల్పవస్తువులను త్యజించవలసి వస్తోంది. సామాన్య ప్రాపంచిక వస్తువుల విషయమే ఇట్లా ఉంటే, ఇక ఆత్మలాభం గురించి వేరే చెప్పాలా? సర్వ త్యాగం కాకుండా, కొన్ని వదలి మరికొన్నిటిని పట్టుకుని ఉంటే ఆత్మ ఎట్లా లభిస్తుంది? అందుచేత సర్వ, అన్య విషయముల కొరకై కార్యములను నిర్వర్తించటం - అనేది పరిత్యజించి, "సర్వయత్నములూ ఆత్మలాభము కొరకే చేయాలి. అప్పుడు మనుజుడు అద్దానిని తప్పక పొందుతాడు. అట్లా కాకపోతే... పొందడు.

అందుచేత, స్వాత్మావలోకనము' కొరకు సర్వస్వము త్యజించాలి. ఉపాయం అదొక్కటే.

Page:545

జగత్తు - (జ...గత్) జనిస్తూ ... గతిస్తూ ఉండేదంతా 'జగత్తు' అను పేరుతో వ్యవహరించ బడుతోంది. ఈ జగత్తులో వర్తమానంగా నీవు పొందుచున్న సర్వమును... అది గతించే లోపల నీవే దానిని త్యజించినవాడవై ఉండు.

నీకున్న సర్వము త్యజించుచూ పో!... సర్వము త్యజించిన తరువాత కూడా ఏదైతే ఇక నీవు త్యజించుటకు వీలు కాదో, అదే పరమపదమని ఇంకొకసారి ప్రకటిస్తున్నాను. అట్టి పరమపదమును అధిరోహించి, అటుపై ఈ జగత్తులో లీలావినోదిగా, క్రీడావిహారిగా వినోదించు.

సురఘుడు : మహర్షీ! అసలీ జగత్తు అనబడేది ఏ మూలపదార్ధముచే తయారుచేయబడుతోంది? శ్రీమాండవ్యమహర్షి : ఈ జగత్తంతా కార్య - కారణ మయమైయున్నది. ఇదంతా కూడా సన్మాత్రాత్మ యందు స్వకల్పనచే ఏర్పడి ఉంటోంది. 'సత్' నుండి బయల్వెడలి, ఆ సత్తుకు భిన్నమైన దాని వలె రూపం కలిగి ఉంటోంది.

నీవు సత్ స్వరూపుడవు. కనుక, నీచే చూడబడేదంతా నీస్వరూపమే అయి, నీకు భిన్నమైన దాని వలె నీకు సంప్రాప్తిస్తోంది. వాస్తవానికి ఇదంతా నీకు అభిన్నం. అట్టి నీకు భిన్నమై ప్రాప్తించేదంతా (అనిపించేదంతా) నీవు త్యజించు. అందుకు కారణమగుచున్న నీయందలి మూల ఆజ్ఞానాన్ని కూడా నాశనం చేయి.

నీ మనోరూపమైనదంతా నీచే నీయందే లయించివేయబడు గాక! లయం కాబడుచున్న మనస్సు సత్-చిత్ రూపమును పొందుచున్నది. నీ మనస్సు లయించేది నీ రూపము నందే సుమా! మనస్సు లయించగా శేషించేది ఏది? ఏకరస బ్రహ్మమే.

ఏకరస బ్రహ్మము ఇక అనుభవమాత్రమే కాని, అది ద్రష్టత్వము కాదు. ద్రష్టత్వము లేని చోట ద్రష్ట లేడు, దృశ్యం లేదు. సుఖదుఃఖాలు, కార్య - అకార్యము లనబడేవన్నీ ఉండనే ఉండవు. నీ అశాంతి తొలగిపోవుటకు అది అత్యుత్తమ మార్గం.

నేను చెపుతూ, ఉద్దేశించుచున్నదేమిటో అది స్వవిచారణచే నీవు తప్పక గ్రహించగలవు. యోచన చేయి. విచారణచేయి. ఇక మేము వెళ్ళివస్తాం. శలవా?

ఇట్లు పలికి మాండవ్యమహర్షి సురఘు రాజును, అతని ప్రజలను ఆశీర్వదించి, అక్కడి నుండి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. సురఘ రాజు వారికి వీడ్కోలు చెప్పి, ఆ తరువాత ఒకానొక ఏకాంత ప్రదేశం చేరాడు.

అక్కడ పద్మాసనాసీనుడై ఏకాగ్రచిత్తంతో స్వవిచారణ ప్రారంభించాడు.

Page:546

2. ఇంతకీ నే నెవరు?

సురఘురాజు (అంతరంగంలో) త్యజించవలసినది త్యజించవలసినంతగా త్యజించలేదని మహర్షి నాకు గుర్తు చేశారు. విచారణ ఇంకా కొనసాగించమని ఆజ్ఞాపించారు. దీనిని గురించి విచారణ? ఈ గ్రాహ్య - త్యాజ్యములు నిర్వర్తిస్తున్న 'నేను' గురించి కదా!

ఇంతకీ నేనెవడను? - కిరాతరాజ్యం ఏర్పడి ఉన్న ఈ పర్వతము, పర్వత ప్రాంతం నేనా? కాదు. ఇవన్నీ బాహ్యమున ఉన్నాయి కదా! ...నేను ఈ పర్వతమును కాదు. ఈ పర్వతము నాది కాదు. అట్లాగే ఈ జగత్తు నేను కాదు. ఈ జగత్తు కూడా నాది కాదు. నేను ఈ నేలను కాదు... ఈ నేల నాది కాదు.

ఈ కిరాత రాజ్యము కూడా నేను కాదు. ఎందరో రాజులు ఈ రాజ్యమును పాలించారు. మరింకెందరో పాలించనున్నారు. కనుక 'ఈ రాజ్యము నాది' అనునది అవాస్తవమే. కేవలం సర్వ జనులు సమ్మతించుటచేత మాత్రమే నేనీ రాజ్యానికి రాజయ్యాను. కల్పనా మాత్రం చేతనే 'రాజుగా ఈ రాజ్యం నాదే' - అనే భ్రమపూర్వకమైన భావన కలుగుతోంది. ఈ 'రాజు' అనే సంకేతం త్యజిస్తే అప్పుడు నేను ఇక్కడ దేనికీ సంబంధించనివాడను అవుతాను. ఇక్కడి రాజుతో ఏర్పడే మంత్రి - ప్రజ - - - సేవకజన - శత్రు రాజ్యసంబంధములకు కూడా నేను సంబంధించని వాడను అవుతాను.

అమ్మయ్యా! సంకేతముచే ఇంతవరకూ ఏర్పడియున్న, కల్పించుకొనియున్న 'సంకేత సంబంధం’ క్రమంగా నా దృష్టి పథం నుండి తొలగుతోంది.

కుటుంబముచే నేను పరిమితుడైనవాడనా?- సరే, ఇక ఈ 'భోగజాలము, కుటుంబము’ విషయానికి వద్దాం. ఇవన్నీ నావా? కావు. ఇందలి సభ్యులందరికీ వేరువేరు ఆశలు, జీవిత లక్ష్యములు ఉండి ఉండగా, 'వీరు నావారు' అని నేను భ్రమించటమేమిటి? నా కుటుంబసభ్యులు, భృత్యులు నాతో కల్పితసంబంధం కలిగి ఉంటున్నారు. అదంతా వాస్తవమెట్లా అవుతుంది? సందర్భానుచితంగా ఇవన్నీ మార్పు, చేర్పులు చెందుచున్నాయి కదా?

నేను శరీరమునా? - చేతులు, కాళ్ళు మొదలైనవాటితో కూడిన ఈ దేహంలో జడములైనట్టి మాంసము, ఎముకలు మొదలైనవి కూడా ఉన్నాయి. కానీ నేను ఈ దేహములోని తదితర విభాగముల వలె ఒక జడవస్తువునా?

‘ఇది ఇట్లు’ అని గ్రహించగలుగుచున్న నేను జడమెట్లా అవుతాను? నీళ్లలో కమలం ఉన్నప్పటికీ నీళ్లు వేరు, కమలం వేరు కదా! జడమగు రక్త-మాంస-అస్థులతో కూడిన ఈ శరీరమునకు, చైతన్యమగు నాకు సంబంధమెట్లా ఉంటుంది? ఇవి ఎన్నటికీ నావి కావు. ఈ కర్మేంద్రియములు నేను కాదు.

నేను భోగములకు సంబంధించినవాడినా? ఈ భోగములు నేనా? ఎట్లా ? భోగములు బాహ్యములైన అనుభవములే కదా? ఈ భోగములు చవిచూస్తున్న ఇంద్రియములు కూడా నేను

Page:547

కాను. అవి నావి కావు. అట్లాగే జడమాత్రములై మిథ్యా రూపంగా కనిపించే బుద్ధి మొదలైనవి కూడా నేను కాదు.

నేను మనోరూపుడనా? - సర్వ సంసార దోషములకూ మూలమైనట్టి మనస్సును నేనా? అసలు, మనస్సు అంటే ఏమిటి? మననము అను ప్రక్రియయేకదా! మనస్సు అను దానికి స్వకీయమైన ఉనికి ఎక్కడున్నది? కాబట్టి మనస్సు గాని, బుద్ధిగానీ, అహంకారము గానీ, నేను కాదు. ఈ మూడూ అంతఃకరణము యొక్క భౌతికరూపములు.

ఈ విధంగా విచారించగా ఈ దేహము మొదలుకొని ఇంద్రియములు మనస్సు -

బుద్ధివరకూ గల ఏవీ నేను కాదని అతిస్పష్టంగా తేలిపోతోంది.

నేను ప్రమేయుడనా? - ఇక మిగిలింది ఈ ప్రమేయము (Relationship)తో కూడుకొని ఉన్న చేతనుడగు ఈ జీవుడే కదా? అయితే 'నేను ఒక జీవుడను' అని అనుకొనుచున్న నేను అట్టి జీవ భావము ప్రారంభం కావటానికి ముందే ఉండివున్నాను.

త్రిపుటి (Three - Dimensions) - 1. తెలుసుకొనుచున్నవాడు (Perceiver), 2. తెలియబడు చున్నది (Object), 3. తెలివి / తెలుసుకొనుట (Perceiving) ... త్రిపుటికి సాక్షి అయిన మరొకదానిచే త్రిపుటి ఎరుగబడుచున్నది. అందుచేత వ్యక్తిగత ప్రమాత (The Perceiver or Knower) ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కానేరదు.

మాండవ్య మహర్షి సర్వమును త్యజించవయ్యా!" అని ఆజ్ఞాపించారు కదా! కనుక సాక్షిచే ఎఱుగబడుచున్న ప్రమాత ప్రమేయములను కూడా త్యజించివేస్తున్నాను. అవి నేను కానప్పుడు వాటిని త్యజిస్తే నాకేమి నష్టం? ఏమి కష్టం?... 'ఇవన్నీ నావి కావు, నేను కాదు' అని గమనిస్తే చాలుకదా! అవును.. ఇప్పుడు శేషించిన వికల్ప, సంకల్ప రహితమగు విశుద్ధచైతన్యమగు ఆత్మనే నేను.

ఆహా! ఎంత ఆశ్చర్యం! నేను ఇతఃపూర్వం కూడా ఆత్మను సర్వదా పొందియే ఉన్నాను! కానీ, నిత్యసాక్షిత్వమును వదిలి నేను జీవుడను... నేను భోక్తను అని అనుకుంటూ దయ్యం పట్టిన వాని వలె ఇంతకాలం ప్రవర్తిస్తున్నాను.

ఎప్పుడైతే సర్వమునకు సాక్షి రూపుడను నేను' అని గుర్తు చేసుకొన్నానో, మరుక్షణం ఉత్తమమగు పురుషార్థలాభుడను అగుచున్నాను. ఇది నాకు ఎంత సుఖప్రదమైన విషయం! అనంతరూపుడగు ఆత్మయే నేనైయున్నాను. అట్టి నా పరమాత్మత్వమునకు అంతమే లేదు.

నా యందు ఏ పరమాత్మ ఉన్నదో అదే పరమాత్మ బ్రహ్మదేవుని యందు ఇంద్రుని యందు, యముని యందు, వాయువు నందు, సర్వభూతజాలము నందూ సమముగా అవతరించినదై ఉన్నది. ముత్యపుమాల యందు దారం లాగా సర్వుల యందూ అనుగతమై ఉన్నది.

నా యొక్క, సర్వుల యొక్క 'స్వానుభవమాత్రం' అగు చితశక్తి అతి నిర్మలమైనది. అది విషయ వ్యవహార వివర్జితమైనది. అది సర్వ దిక్కులనూ సర్వదా పూర్ణమొనర్చుచున్నది. అత్యంత మధురమైనది.

Page:548

అయితే అజ్ఞానులకు మాత్రం అది భయంకరాకృతిగానే తోచుచున్నది. సర్వపదార్ధము లందూ వ్యాపించి ఉన్న ఆ చితశక్తి అతిసూక్ష్మమై ఉండుటచే, ప్రజ్ఞానదశ యందు ఏర్పడి ఉన్న స్థూలదృష్టి కారణం చేత నేను గుర్తించలేకపోయాను.

అట్టి ఉత్పత్తి వినాశనరహితమగు చితశక్తినే నేను. చితశక్తి స్వరూపుడనగు నేను పాతాళము నుండి బ్రహ్మలోకము వరకూ సమస్త భువనము లందూ స్థితి కలిగి ఉన్నాను. సర్వశక్తి నిలయం ఆ చితశక్తియే. అయ్యది నిరతిశయానందముచే పరిపూర్ణమైయున్నది. సూర్యుడు మొదలైన ప్రకాశింప జేసే వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసేది అదే. 'బ్రహ్మాండములు అనే ముత్యములను ధరించిన

దారం అది.

అది సర్వాకార-వికారయుక్తమై కూడా సర్వాకార వికార వివర్జితమై ఉన్నది. భూతకోట్ల అన్నిటి రూపమూ అదే. కనుక సర్వ రూపత్వము ఆ చిత్ శక్తికే ఆపాదయోగ్యము. పదునాలుగు లోకములందలి పదునాలుగు విధములైన జీవరాసులను తన ఉదరమున ధరిస్తున్నది అదే.

జగత్తు అనబడు అనుభవరూపమంతా ఆత్మయే కానీ మరింకేమీ కాదు. ఆ ఆత్మయే సమస్తము అయి ఉండుటచే సుఖ దుఃఖ దశలన్నీ మిథ్యారూపములు మాత్రమే!

పరాచైతన్యము’ అను వేద ప్రసాదిత నామధేయమునకు అది ఒప్పుచున్నది. చైతన్య రూపమై ఉన్న నా ఆత్మ జగత్తంతా వ్యాపించియున్నది. మరొక వైపుగా, ఇచ్చట ప్రవేశించి నాట్యం చేస్తోంది.

యథార్థానికి ఈ మనోదేహాదులు లేవు. తుచ్ఛములైనట్టి ఈ దేహము, దాని ద్వారా ప్రాప్తిస్తున్న దృశ్యం నశిస్తున్నప్పటికీ, ఆత్మ ఏమాత్రం నశించుటలేదు... మరి ఈ జగజ్జాల నాటకమంతా ఏమిటి? అవును.... తెలిసింది. ఇదంతా 'చిత్తము' అను నటుడే తన నటనా చాతుర్యంతో రచిస్తున్నాడు. ఎప్పుడైతే బుద్ధి జగద్విశేషాలతో తన్మయత్వము పొందకుండా సాక్షిత్వము పొందుతుందో, అప్పుడు ఇందలి నాటకీయత్వమంతా తెలిసిపోతోంది. దీపం వెలుగుతుంటేకదా, గదిలోని వస్తువులు ఏమై ఉన్నాయో తెలిసేది!

ఆహా! నేను నిగ్రహ, అనుగ్రహములతో ప్రజలను శిక్షిస్తున్నప్పుడూ, సన్మానిస్తున్నప్పుడూ నా మనస్సు ఎందుకు వ్యాకులత పొందిందో ఇప్పుడు తెలుస్తోంది. నాకు వ్యర్థంగా దేహబుద్ధి కలగటం చేతనే, అట్లు భ్రమ పొందాను. అందుకే దుఃఖించాను. యథార్ధానికి అసలు ఈ దేహమే లేని పదార్థం కదా!

అమ్మయ్య! ఇప్పటికి నేను జ్ఞానవంతుడనయ్యాను. శరీరాదు లందు 'ఈ శరీరమే నేను... ఆ శరీరమే ఆతడు' అను రూపంలో ఏర్పడిన దేహాత్మదృష్టి' అనే దుర్దశ తొలగింది. మరుక్షణం చూడ వలసినది చూస్తున్నాను. పొందతగినది పొందుచున్నాను.

ఈ కనబడే జగద్గతమైన దృశ్య వ్యవహారమంతా 'మాయ’ చే చిత్తు నందు స్వప్నసదృశ్యంగా సంభవించుచున్నది. ఈ జగత్తు నందు 'ఆత్మ' లేక 'చిత్తు'కు అన్యమై ఏర్పడేదంటూ ఎక్కడా ఏదీ

Page:549

లేదు. ఇక అందులో నిగ్రహమేమిటి? అనుగ్రహమేమిటి? అవన్నీ ఎక్కడున్నాయి? ఎట్లా ఉన్నాయి? సుఖం, దుఃఖం, మానం, అవమానం ... ఇవన్నీ స్వయంకల్పితం, ఊహాజనితం అయిన కథా సన్నివేశాల వంటివి కాక మరింకేమిటి? కాబట్టి 'నేను వీరిని శిక్షిస్తున్నాను, వారిని సంతోష పెడుతున్నాను'... అను భావన కూడా స్వప్న జనితమగు భ్రమ వంటిదే. అంతా కూడా వ్యాపకబ్రహ్మమే అయిఉండగా సుఖమేమిటి? దుఃఖమేమిటి? నేను ఇంతకాలం మూఢుడనై దోషదృష్టితో జగద్దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు సౌభాగ్య వశం చేత మాండవ్యమహర్షి గుర్తు చేయటంతో, జ్ఞానిని కావటం

జరిగింది.



ఆనంద స్వరూపం, పరిపూర్ణం అగు ఆత్మ యొక్క అనుభవం కలిగిన తరువాత ఇక దేనికై శోకించాలి? దేనికి మోహితుణ్ణి కావాలి? 'ఇంకనూ చూడాలి? ఇంకా పొందాలి' అని ఎందుకు అనుకోవాలి? ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆగమ-సంచిత-ప్రారబ్ధ కర్మలు ఎవరికి? ఎందుకంటే అలౌకిక చమత్కారం' అగు చిదాకాశ మొక్కటే విద్యమానమై ఉన్నది కదా!

కిం చిదేవమిదం నామ చిదాకాశం విరాజతే |

నమో నమస్తే నిస్తత్త్వ దిష్ట్వా దృష్టో సి సున్దర II (శ్లో 36, సర్గ 50)

భౌతికత్వమే లేనట్టి ఓ స్వస్వరూప పరమాత్మా! నీకు నమస్కరింస్తున్నానయ్యా! మహద్భాగ్యం చేతనే నీవిప్పటికి నాయందు నేనుగా కనిపించావు. కదయ్యా!

ఆహా! ఇప్పటికి నేను ప్రబుద్ధుడనై సర్వము చక్కగా ఎరుగగలిగాను. గురుదేవుడగు మాండవ్య మహామునికి, ఆయన వాక్యములకు నమస్కారం. సమ్యక్ జ్ఞానం ఉదయించిన కారణంచేత నేను అనంత రూపుడనయ్యాను. అనంతరూపమగు ఓ నా ఆత్మస్వరూపమా! నీకు నేను చేతులెత్తి మ్రొక్కుచున్నాను. అహో! నా స్వస్వరూపమే అయిన ఆత్మ గురించిన జ్ఞానం ఎంత మహత్తరమైనది! అట్టి జ్ఞానముచే అత్యంత సహజంగా, అకృత్రిమంగా రాగ ద్వేషముల అభావం ఏర్పడుతోంది. తద్ద్వారా జాగ్రత్ - స్వప్న సుషుప్తులలోని విషయ స్థితి నశిస్తోంది. నన్ను నేను ఉపాధిరహితునిగా గాంచుచున్నాను. 'బ్రహ్మమునందు ఏకీభావము' అను ఒకానొక నిశ్శబ్ద పూర్ణానుభవం తారస పడుతోంది. సంసార భ్రమరహితుడునగుచున్నాను. అహమ్, మమ (నేను, నాది) అను వృత్తులు లేనివాడనగుచున్నాను. సర్వమునకు సాక్షీభూతమగు ఆత్మ లేక శుద్ధబ్రహ్మము నందు సమరూపుడనై ప్రకాశించుచున్నాను.

వింటున్నావుకదా, రామచంద్రా! మన ఈ విశ్వామిత్రుడు రాజర్షిత్వమునుండి బ్రహ్మర్షిత్వము పొందారు చూచావా! అట్లాగే ఆ హేమజట (లేక సురఘురాజు) తన వివేకముచే సంపాదించిన సునిశ్చయముచే పరమోత్తమమగు 'బ్రహ్మపదము' ను పొందాడు. రాత్రింబవళ్ళు కలుగజేస్తున్నప్పుడు సూర్యభగవానుడేమన్నా భేదముగానీ, మోదముగానీ పొందుచున్నాడా? లేదే! ఆ విధంగానే ఆ

Page:550

రాజు కూడా తాను అనుష్టించుచున్న ధర్మార్థముల వలన ప్రాప్తించే క్రియలచే గానీ, దైవగతిచే అనివార్యంగా ప్రాప్తించే అనర్థములు, దుఃఖప్రదములగు ప్రవాహపతిత వ్యవహారములచే గానీ, ఏమాత్రం భేద మోదములు పొందటం లేదు. జల ప్రవాహముచే అనునిత్యంగా తాడనం పొందే పర్వతం యథాతథంగా, నిర్వికారంగా ఉంటున్నట్లు తాను నిర్వర్తించే రాజోచితమైన నిగ్రహ (punishing) - అనుగ్రహ (Awarding) విషయముల పట్ల అచంచలుడై, దుఃఖరహితుడై ఉంటున్నాడు. దైనందినక వ్యవహారములు సలుపుచున్నప్పుడు హర్షామర్షములను (Happiness and unhappiness) పొందనివాడై తన ఉదార, గంభీర స్వభావంతో సముద్రమును కూడా మించిపోయాడు. సుషుప్తిచే నిశ్చలము, చైతన్యముచే ప్రకాశవంతము అగు చిత్తవృత్తిచే నిశ్చల ప్రకాశమయమగు అగ్నిశిఖ

వలె ప్రకాశించాడు.

ఆతడిప్పుడు నిర్దయుడు కాడు. దయావంతుడు కాడు. ద్వంద్వము, మత్సరము లేవు. అనర్థిగాని, అర్థిగాని, అతిబుద్ధిసహితుడుగానీ కాకుండానే యథారీతిగా ప్రాప్తించిన కార్యములను ఆచరిస్తూ సమదర్శియై ఒప్పుచున్నాడు. అతని అంతఃకరణం ఇప్పుడు సమదర్శనశీలమై చపలరహితమై, ధీరత్వ సమన్వితమై, వృత్తిరహితమై, పూర్ణ చంద్రుని వలె సంపూర్ణత్వము సంతరించుకొని ఉన్నది.

ఎవడైతే, ఈ జగత్తంతా చిత్తము యొక్క కల్పన మాత్రమే ... అని నిశ్చయించుకుని ఉంటాడో, ఆతని బుద్ధి ఇక ఈ భౌతిక సుఖదుఃఖములు లేనిదే అగుచున్నది.

ప్రబుద్ధుడై, నిరంతరం సమాధినిష్ఠుడై ఉన్నవాడు ఈ శరీరాదులను బాహ్యవస్తువుగా చూస్తూ, సర్వదా ఉల్లాసముతో ఉంటాడు. ఆతని చిత్తం ఆతనికి వికాసమును ప్రసాదిస్తూ ఉంటుంది. ఆతడు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు నిదురిస్తున్నప్పుడు సర్వదా చైతన్యమునందు లయం పొంది

ఉంటాడు.

ఆ రాజు కూడా అట్లే చైతన్యము నందు ఐక్యత పొందియున్నాడు. రాజ్యపాలనను నిర్వర్తిస్తూ కూడా, అత్యంతాసక్తి రహితుడై ఉన్నాడు. అఖండాకారయుతుడై ప్రకాశించాడు. నదీజలం పూర్ణ సముద్రంలో కలియునట్లు, మంచుగడ్డ కరుగుటచే తన ఆకృతిని వీడునట్లు అతడు సర్వమును స్వస్వరూపము నందు లయింపజేసుకొని 'నేను సర్వమునకు సాక్షిని' అను సాక్షీరూపంలో ప్రవేశించాడు. బ్రహ్మాండములన్నిటికీ ఉత్పత్తి స్థానము, బ్రహ్మాదులకు కూడా నియంత అయినట్టి పరబ్రహ్మమునందు ప్రవేశించాడు. స్వబుద్ధిచే నిర్మలము దుఃఖరహితము ఆనంద పరిపూర్ణము అగు ఆత్మను పొందాడు. అట్టి ఆత్మప్రాప్తిచే ఈ జన్మ మొదలైన దశలను మనస్సులో అధిగమించివేశాడు.

కుండ పగిలితే కుండలోని ఆకాశం మహాకాశంలో లీనమగుచున్నట్లు ఆతని భావన పూర్ణత్వం పొందగా ఆతడు పరబ్రహ్మస్వరూపుడైనాడు.

ఓ దశరథరామా! నీవు కూడా హర్షశోకాదులకు కారణమగుచున్న 'పాపదృష్టి'ని నశింప జేసుకొని ద్వంద్వరహితుడవై అత్యంత శ్రేయోదాయకమగు మోక్షపదమును ఆశ్రయించు. అప్పుడు

Page:551

నీవు తప్పక దుఃఖరహితుడవౌతావు. చీకట్లో కదులుతుంటే ఏదైనా తగలటంచేత బాలుడు క్రింద పడవచ్చు. దీపం ఉంటే ఆ ఇబ్బంది ఉండదు కదా! ఆ సురఘు మహారాజు 'జ్ఞానదృష్టి' అనే దీపం చేబూనటం చేతనే ఆతని మనస్సు అజ్ఞానాంధకారంలో పడకుండా కాపాడుకోగలిగాడు.

ఒకడు గోతిలో పడినప్పుడు ఏం చేస్తాడు? ఒడ్డున ఉండే వేటినైనా ఆలంబనంగా పట్టుకుని బయటకు రావటానికి ప్రయత్నిస్తాడు కదా!

వివేకమును, వివేకులను ఆశ్రయించి తద్వారా తన చిత్తమునకు శాంతిని ప్రసాదించాలి. ఆ సురఘు మాటిమాటికీ పవిత్రదృష్టిని అభ్యసించాడు. ఇతరులకు కూడా అద్దానిని ఉపదేశించాడు. క్రమంగా ఏకము అయినట్టి బ్రహ్మమునందు సమాధితత్పరుడైనాడు.

శ్రీరాముడు : మునీంద్రా! మీరు ద్వంద్వరహితం అవాలి" అని ఆజ్ఞాపిస్తున్నారు. అయితే మా మనస్సు గురించి గమనిస్తున్నారా? గాలి వీచే చోట నిలబెట్టబడి ఉన్న నెమలి పింఛంలాగా ఈ మనస్సు స్థిరంగా ఉండటమే లేదే! దీనిని స్థిరీకరించేది ఎట్లా? ఎంతగా మరల మరల విన్నా కూడా ఇది బ్రహ్మపదము నందు ఏకాగ్రనిష్ఠ పొందుట లేదు. దీనిని సుస్థిరీకరించటం ఎట్లాగో చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : మనస్సు విషయంలో ఇప్పటికే 13 రోజులుగా మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. సరే ...జ్ఞానియగు సురఘు ఆతని చిన్ననాటి స్నేహితుడగు పరిఘుడి మధ్య ఒక అద్భుతమైన సంవాదం జరిగింది. ఆ తరువాత ఆ ఇద్దరూ కూడా 'ఏకరూపసమాధి' యందు తమ తమ చిత్తములను సంలగ్నం చేసియున్నారు. తమ చిత్త, ఇంద్రియముల విషయంలో అత్యంత ప్రబుద్ధులై ఉన్నారు. అందుచేత వారిరువురి పరస్పర సంవాదము ఈ సమయంలో ప్రస్తావించటానికి సముచితంగా ఉంటుంది. వీనులకు విందై, హృదయములను పవిత్ర పరచగలదు. అది నీ ప్రశ్నకు సమాధానంగా చెపుతాను. విను.

3. సురఘు - పరిఘ సంవాదము

శ్రీవసిష్ఠ మహర్షి : పారశీక దేశాధిపతి 'పరిఘ' అనునాతడు మన సురఘు రాజుకు చిన్ననాటి స్నేహితుడు. ఒకప్పుడు పారశీక దేశంలో అనావృష్టి సంభవించింది. అక్కడి ప్రజలు అనేకమంది ఆకలి బాధకు తాళలేక మరణించటం జరిగింది. అది చూచి పరిఘరాజు తట్టుకోలేకపోయాడు. 'అయ్యో! నా ప్రజల కష్టమును తొలగించ లేకపోయానే! ఇక నేను రాజుగా అనర్హుడను' అని తలచాడు. బహుదూరపు బాటసారి ఒక చోట మార్గమధ్యంలో తగలబడుచున్న గ్రామం చూచి కూడా తన దీర్ఘ ప్రయాణం కొనసాగించునట్లు ఆతడు ఆ రాజ్యమును త్యజించి అక్కడి నుండి బయలుదేరాడు. విరాగి అయి, అరణ్యంలోని ఒకానొక ఏకాంత ప్రదేశంలోని ఒక గృహంలో ప్రవేశించాడు. అక్కడ తపస్సు చేయటం ప్రారంభించాడు. శాంతిని, ఇంద్రియదమమును ఆశ్రయించి

Page:552

చాలా కాలం తపస్సును కొనసాగించాడు. ఆ దీర్ఘకాలంలో అక్కడ గల ఒక వృక్షము నుండి తమకు తాముగా వ్రాలిన ఆకులను తింటూ ఉండేవాడు. అక్కడికి కొంతదూరంలో ఉంటున్న ఆటవిక గ్రామ జనులు ఆకులు తింటూ తపస్సు చేసే ఆతనికి 'పర్ణాదుడు' అను పేరు పెట్టి చెప్పుకునేవారు.

అనేక సంవత్సరములు ఏకాగ్రతతో తపస్సు చేయటంచేత, సమాధిని అభ్యసించటం చేత ఈశ్వరానుగ్రహం ఆతనిపై ప్రసరించింది. చిత్తము శుద్ధి పొంది ఆతడు రాజర్షి అయ్యాడు. క్రమ క్రమంగా జ్ఞానయుక్తుడై, సద్బుద్ధియుతుడై, శీతోష్ణాది ద్వంద్వరహితుడై, ఆశావర్జితుడై, శాంతచిత్తుడై, రాగ, ద్వేష, క్రోధరహితుడై జీవన్ముక్తుడుగా ప్రసిద్ధికెక్కాడు.

ఆ విధంగా తపస్సు యొక్క ప్రభావంచే పరమ పవిత్రమైన మనస్సును సంపాదించుకొన్న ఆ పరిఘుడు కొన్నాళ్ళ తరువాత లోకసంచారం చేయటానికి బయలుదేరాడు. ఒకసారి కాకతాళీయంగా సురఘుడు రాజ్యమేలుతున్న కిరాత రాజ్యం ప్రవేశించాడు. చిన్ననాటి పరిచయం చేత సురఘుని కలిశాడు. జీవన్ముక్తులు అయిన ఆ ఇద్దరూ ఏం సంభాషించుకున్నారో శ్రద్ధగా విను.

సురఘురాజు : మిత్రమా! బహుకాలం తరువాత కలిశాం. మీరు ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేస్తూ ఉంటారని వింటూనే ఉన్నాను. జనులు 'పర్ణాదముని' అను పేరుతో మీ సుదీర్ఘ ఏకాగ్ర తపస్సు గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. పరమపవిత్రమగు సుకృతం చేతనే మీరు ఇక్కడికి రావటం, నేను మీ సమక్షమును ఆస్వాదించటం జరుగుతోంది. మీ సందర్శనముచే చిత్తము పరమానందభరితమౌతోంది. మనస్సు శీతలత్వం పొందుతోంది. వియోగం ప్రేమను ద్విగుణీకృతం చేస్తుందని పెద్దలు అంటారు. మన చిన్ననాటి సంభాషణలు లీలలు, చేష్టలు స్మరించు కుంటుంటే గొప్ప వినోదంగా ఉంటుంది.

పర్ణాదుడు : మిత్రమా! మాండవ్య మహర్షి కృప చేత మీరు ఆత్మజ్ఞానం పొందారని నేను కూడా విన్నాను. నేను తపస్సుచే ఈశ్వరుని ఆరాధించి ఆయన కృపచే ఆత్మజ్ఞానం పొందాను.

సరే! మీరిప్పుడు దుఃఖరహితుడవై పరమకారణమగు బ్రహ్మము నందు విశ్రాంతిని పొందారు కదా? ఆత్మారాముడవగుటచేత మీ చిత్తముతో ప్రసన్నత్వం ఉదయించిందా? ప్రసన్న గంభీరములతో కూడిన సమదృష్టిచే సర్వజనహితంగా రాజ్యపాలన చేస్తున్నారు కదా? మీ రాజ్యంలో ప్రజలు ధన ధాన్య సంపన్నులై, శారీరక, మానసిక బాధలు లేకుండా సంతాపవర్జితులై జీవిస్తున్నారు కదా? ప్రజలు ఎట్లా కోరుకుంటారో అట్లే పాలన జరుగుతోంది కదా? ధర్మరక్షణలో అధర్మశిక్షణలో మీ యశస్సు అన్ని వైపులా విస్తరిస్తోందా? ధాన్యం కళ్లెంలో పని చేసేవారు మీ యశస్సు గురించి ఆనందంగా పాటల రూపంలో పాడుకుంటున్నారా? మీ ధన-ధాన్య-ఐశ్వర్య-భృత్య-కుటుంబ-పుత్ర -నగరాదులు క్షేమంగా ఉన్నాయి కదా? మీ ఈ భౌతిక శరీరం మానసిక వ్యధారహితమై ఇహ-పర లోకము లందు ఉత్తమ ఫలములను ప్రసాదించ గల పుణ్యకార్యము లందు నియోగించబడుతోంది కదా? ఈ విషయములు అనేవి అమాయక జీవులకు రమణీయంగా తోచుచూ, అజ్ఞాన క్రియలచే

Page:553

చివరికి శత్రువులుగా పరిణమిస్తున్నాయి. అట్టి విష సర్పములను నిరోధించటానికి మీరు వైరాగ్యం” అనే గరుడ మంత్రం మననం చేస్తున్నారు కదా?

ఆహా! మిత్రమా! మనిద్దరం చాలాకాలం వియోగం అనుభవించాం. కాలవశం చేత ఈ రోజు కలుసుకున్నాం. ఈ శరీరధారులగు జీవులకు ప్రతిరోజూ ఇష్ట- అనిష్టములు, సంయోగవియోగములు, సుఖ-దుఃఖములు కలుగుతూ ఉంటాయి. నా ప్రియ స్నేహితులైన మిమ్ము కలవటం ప్రీతికరం అయిన విషయం. ఈ దీర్ఘజీవదశలో ఎన్నడో విడిపోయి ఈ రోజు కలిశాం. ప్రాణుల కర్మానుసారంగా నడచే ఈశ్వరేచ్ఛ యొక్క విలాసం ఎంత చిత్రమైనది!

సురఘు : ఔను మిత్రమా! ఈశ్వరేచ్ఛారూపమగు నియతియొక్క ఆశ్చర్యకరమైన 'గతి'ని ఎవరు ఎరుగగలరు? మనిద్దరం ఎంతోకాలం ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు కలుసుకున్నాం. ఈశ్వరేచ్ఛే ఈ రోజు మనిద్దరినీ కలిపింది. నాకైతే ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నదయ్యా! మిమ్ము చూచుట చేత పాపము క్షయించగా పుణ్య వృక్షం ఫలిస్తోంది. నేను వ్యాకులరహితుడను కృతకృత్యుడను అయ్యాను. మీ రాకచే మా నగరం, మా ప్రజలు పరమ పవిత్రమగుచున్నాము.

"మహాత్ములతో సమాగమం మోక్షముతో సమానం అని పెద్దలు అంటారు కదా! ఇప్పుడు ఆత్మానుభవం విషయంలో మీ నుంచి కొన్ని విశేషాలు వినాలనుకుంటున్నాను.

4. సమాధి - సమాహిత చిత్తము

పరిఘముని : నాకూ మీ నుంచి వినాలని ఉన్నది. ఈ సంసారజాలము నందు ఏఏ క్రియలు నిర్వర్తించబడుచున్నాయో... అవన్నీ కూడా సమాహిత చిత్తునకు మాత్రమే సుఖప్రదమౌతున్నాయి. తదితరులంతా అనుక్షణికమైన సుఖదుఃఖ భావపరంపరలచే తాడనం పొందుచున్నారు. సాంసారిక విషయములలో ఎక్కడో ఏదో సుఖం ఉన్నట్లు మినుకుమినుకుమంటూ భ్రమ కలుగజేస్తోంది. అసలు సంకల్పములే లేకపోయాయా .. సమాధి సుఖం లభిస్తుంది. అట్టి పరమ శాంతిమయమగు సమాధి సుఖం ముందు ఈ సాంసారిక సుఖములు ఎంతటి అల్పమైనవి! జ్ఞాని అయినవానికి సమాహిత చిత్తం అవసరం. సమాహితచిత్తం సంపాదించటానికి సమాధి అనుష్ఠానం తప్పితే వేరే మార్గమేముంటుంది? కనుక ఈ సాంసారిక విశేషములను త్యజించి మనస్సుతో వ్యవహార రహిత సమాధిని మీరు దినచర్యలో కొంత సమయం కేటాయించి అనుష్ఠించుచున్నారు కదా! సురఘురాజు : అదేమిటి మిత్రమా... అట్లా అడుగుచున్నారు? సంకల్పవర్జితము - శాంతియుతము శ్రేష్ఠము - శ్రేయోదాయకము అయినట్టి పరమానందమును అనుభవిస్తున్నావా? అని అడగకుండా, మనస్సుతో మధ్యమధ్యలో వ్యవహారరహిత సమాధిని అనుష్ఠిస్తున్నావా? అని అడుగు చున్నారే! ఎందుకంటే జ్ఞాని వ్యవహారములలో ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కూడా అసమాహిత చిత్తుడై ఉంటాడా? ఉండడు కదా! అసమాహిత చిత్తుడైనవాడు జ్ఞానియే కాదు కదా!

Page:554

జ్ఞాన సహితులైనవారు నిత్య ప్రబుద్ధ చిత్తులై ఉంటారు. వారు ఈ ప్రాపంచిక క్రియలు నిర్వర్తిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ సదా ఏకత్వనిష్ఠులై ఉంటారు. అనగా, ఆత్మనిష్ఠులై ఉంటారు. అట్టి ఏకత్వ నిష్ఠయే వారి సమాధి. వారు వేరుగా అవశ్యమైన భౌతికసమాధిని ఆశ్రయించవలసిన పనేముంటుంది? పరిఘమని : జ్ఞానమంటే ఏమిటి? సమాధి ఎప్పుడవసరం?

సురఘు : జ్ఞానము సమాధి యొక్క అభ్యాసము గురించి నా మరికొన్ని అభిప్రాయములు వివరిస్తాను. వినండి. ఒకడు ప్రపంచమునంతా త్యజించి ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి, అక్కడ పద్మాసనం వేసుకుని "బ్రహ్మాంజలి ని సమర్పిస్తున్నాడనుకోండి. ఆతని చిత్తం ఆత్మ స్వభావమునందు విశ్రాంతి పొందకపోతే, ఇక, ఆతని సమాధి ఎట్టిది? ఆతని స్థితి సమాధి అని ఎట్లా అనిపించు కుంటుంది చెప్పండి?

అందుచేత ఆత్మతత్త్వబోధ' అనే అగ్నిచే సమస్త ఆశలు అనే గడ్డిపరకలు ఆహుతి అవటమే సమాధికాని, ప్రపంచం పట్ల తూష్ఠీభావం కలిగి, ఇంద్రియములకు పని చెప్పనంతమాత్రం చేత అది సమాధి అని అనిపించుకుంటుందా? ఏకాగ్రము నిత్యతృప్తము, అబాధితము అయిన ఆత్మ వస్తువును దర్శించటమే సమాధి. అట్టి సత్యవస్తు అవలోకనమే పరాప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞయే పరాకాష్ఠ.

ఎవ్వడైతే క్షోభ, అహంకార రహితుడై ద్వంద్వములలో తగులుకోకుండా ఒక కొండలాగా స్థిరమైన ఆకృతి కలిగి ఉంటాడో అట్టివాడే సమాధి స్థితుడు. అట్టివాడు నిశ్చింతను స్వభావపూర్వకంగా కలిగి ఉంటాడు. ఆతడు పొందవలసినది పొందినట్లే. ఆతనికిక త్యజించవలసినది గాని, స్వీకరించ వలసినదిగాని, ప్రాప్తించినదిగాని, ప్రాప్తించనిదిగాని ఉండవు. పరిపూర్ణ మనోగతుడై ఉంటాడు.

అట్టి జ్ఞానయుక్త మనస్కునకు నిరంతర సమాధి సిద్ధించినట్లే! పిల్లలు వ్రేళ్ళతో పట్టుకున్న దారం కొంచం గట్టిగా లాగగానే తెగుతుంది. సమగ్రము జ్ఞానయుతము అగు అవగాహన లేకుండా కేవలం మనస్సును బలవంతంగా భౌతికమైన సమాధిలో కూర్చోబెడితే, అది ఎప్పుడో విచ్ఛిన్నం అవుతుంది. జ్ఞాని యొక్క సమాధి విచ్ఛిన్నం కాదు. ప్రాపంచిక విషయములతో వ్యవహరించ వలసి వచ్చినప్పటికీ ఆతని సమాధి (లేక) సమాహిత చిత్తము యథాతథంగానే ఉంటుంది.

సూర్యుడు రోజంతా లోకములను ప్రకాశింపజేస్తున్నాడు. ఆ సమయంలో ఏమైనా విరామం కోరుకుంటున్నాడా? లేదు. దృఢ సంస్కారబలంచేత జ్ఞాని యొక్క బుద్ది కూడా ఆత్మతత్త్వావలోకనంలో ప్రవేశించి, ఇక మరింకెక్కడో విశ్రాంతి విరామములను కోరుకోదు. జలం ప్రవహిస్తూ ఉండగా ఒక్కక్షణమైనా ఆగుతుందా? ఆవరణ నాశనముచే విజ్ఞాన దృష్టి (లేక, బోధ స్థితి లేక ఆత్మజ్ఞానం) ఏర్పడే వరకు జ్ఞానమార్గంలో పయనించేవాడు ఆగడు.

న విస్మరత్యవిరతం యథా కాలః కలాగతిమ్ న విస్మరత్యవిరతం స్వాత్మానం ప్రాజ్ఞధీస్తథా || (శ్లో 16, సర్గ 62)

కాలము తనయొక్క గతి' అను కళను వీడనట్లు, జ్ఞాని యొక్క బుద్ధి ప్రేమాస్పదమగు ఆత్మను ఎన్నటికినీ మరువదు. నడిచేటప్పుడు కాళ్ళకదలిక ఆపనట్లు ఆతని బుద్ధి నిశ్చయస్వరూపమగు

Page:555

చిన్మాత్రమును ఏమరువదు. మిత్రమా! ఆవరణము నశించగానే చైతన్యస్ఫూర్తి విషయరహితమౌతుంది. ఆ చైతన్యస్ఫూర్తి ఇక ఎల్లప్పుడూ ఆత్మాకారవృత్తి కలిగి ఉంటుంది.

ఏ పదార్థమైనా 'సత్త' లేకుండా ఉంటుందా? జ్ఞానికి "ఆత్మాకార వర్జితమగు సమయం అంటూ ఏదీ ఉండదు. నేను లేను. కానీ ఈ పదార్థములు ఉన్నాయి అన్న ప్రసక్తి ఎక్కడన్నా ఉంటుందా? సద్గుణవంతుని నీచపనులు అనునది ఉండదు కదా! నీచపనులు చేసేవాడు సద్గుణ

వంతుడెలా అవుతాడు?

ఆత్మజ్ఞానికి ఆత్మను ఉపాసించని సమయమంటూ ఏదీ ఉండదు. ఆతని ఆత్మోపాసన అనుక్షణికం. పరిస్థితులు ఎలా ఉన్నా అవి ఆత్మజ్ఞానిని స్పృశించలేవు.

సర్వదా స్వస్వరూపముచే నేను ఆత్మనే. కనుక నిర్మలుడనై శాంతాత్ముడనై ఉన్నాను. అనగా సమాధి నిష్ఠుడనై ఉన్నట్లే. ఎద్దానితోనూ ఏ భేదమూ నాకు కనిపించుటలేదు. నా సత్త ఎల్లప్పుడూ ఆత్మయందే, అఖండమగు ఆత్మగానే సిద్ధిస్తోంది. నాసత్త యొక్క ఒక కళమాత్రమే ఈ మనస్సు.

మనస్సు ఉన్నదంటే సమాధిరాహిత్యం ఉన్నట్లే. అందుచేత 'మనస్సుతో సమాధిని అభ్యసించటం’ అనేది ఎక్కడుంటుంది? మనస్సుకు స్వకీయమైన ఉనికి-రూప గుణములు ఎక్కడున్నాయి.

మనస్సుకు సమాధినిష్ఠ కలగటమనేదే ఉండదు... సర్వదా నిత్యమగు ఆత్మతత్త్వమొక్కటే ఉన్నది... ఆత్మ ఒక్కటే సర్వవ్యాపకమై సర్వరూపములుగా ప్రసరించుచున్నది... ఆ అఖండ, అప్రమేయ ఆత్మయే నేను... ఆత్మకు వేరుగా 'మనస్సు' అనబడేదేదీ లేదు.

ఇక నాకు సమాధి ఏమిటి? అసమాధి ఏమిటి? మనస్సు ఏమిటి? దానిని నియోగించట మేమిటి? నియోగించలేకపోవటమేమిటి?... నా దృష్టిలో మనోబుద్ధులనబడేవి ఉండుటయే లేదు.

కార్య కారణ పరిణామ విభాగరహితులగు మహాత్ములు నిత్యం సర్వస్థితు లందు సమాహితత్వం కలిగి ఉండగలుగుచున్నారు. ఇక అక్కడ సమాధి, అసమాధి భేదములను కల్పించే వాక్యములకు చోటు ఉండటం లేదు.

నిర్మొహమాటమైన నా అభిప్రాయం మరొక్కసారి వినండి. సర్వభేదములు చేరలేని ఆత్మయే నా స్వరూపం, స్వభావం, స్వస్థానం కూడా! నేను ఇప్పుడూ, అప్పుడూ, ఎప్పుడూ ఉపాధి రహితుడనే, ఇక, నేను-నీవు-మనస్సు మొదలైనదంతా నా చిత్కళయే.

5. సునిశ్చయం

పరిఘ మునీంద్రుడు : ఓ నేస్తం! మీరు నిజంగా జ్ఞానవంతులే! పరమమగు బ్రహ్మపదమును పొందారు. తత్ఫలితంగా పూర్ణచంద్రుని వలె శీతలాంతఃకరణము కలిగి వెలుగొందుచున్నారు. మధుర రసపూర్ణులై 'ఆనందము' అనే సంపదచే సేవించబడుచున్నారు. శీతల, లేత, సుందర కమలము

Page:556

వలె విరాజిల్లుచున్నారు. మీ పలుకులు నిర్మలంగా, విశాలంగా, పూర్ణంగా గంభీరప్రకటాశయ యుక్తంగా ప్రభవిస్తున్నాయి.

ఆహా! స్నేహితుడా! మీరిప్పుడు స్వచ్ఛంగా ఆనందపూర్ణంగా, అహంకారమేఘరహితంగా, ప్రత్యక్షంగా, విశాలంగా, గంభీరంగా, ఉండే శరత్కాల ఆకాశంలాగా విరాజిల్లుచున్నారు. ఇష్ట, అనిష్ట సర్వవిషయములందు సమరూపులై కన్పట్టుచున్నారు.

సారాసార పరిచ్ఛేద పారగస్త్వం మహాధియా |

జానాసి సర్వమేవేదం యథాస్థిత మఖణ్ణితమ్ ॥ II (శ్లో 6, సర్గ 63)

ఉత్తమ బుద్ధిచే సార, అసారములను నిర్ణయించి పారంగతులయ్యారు. "ఈ దృశ్య జగత్తంతా అఖండపూరమై బ్రహ్మముగానే, యథారీతిగా ఉన్నది" - అనునట్టి ఉత్తమోత్తమజ్ఞానం పొందారు.

ఇక్కడ కనబడే ఉత్పత్తి. నాశనముల రహస్యమేమిటో గ్రహించారు.

ఇక్కడి ఆరోహ, అవరోహములచే (ups & downs) ప్రేరితమగుచున్న 'చంచలరాగ దశలు' మీ యందు చోటు చేసుకోలేక పోతున్నాయి. దేని కంటే ఇక ఉత్తమమైన వస్తువు ఈ ప్రపంచం మొత్తంలో ఇంకొకటేదీ లేదో, ఉండబోదో, అట్టి నిజాత్మ వస్తువు పొందినవారై స్వమహిమ యందు పరితృప్తులై ఉన్నారు.

ఆత్మ - పరమాత్మయగు మీ కిదే నమస్కరిస్తున్నాను. మీ అవగాహన విషయమై మరికొంత వినాలని నా అభిలాష.

సురఘురాజు : మునీంద్రా! ఈ దృశ్యప్రపంచ మంతా మిథ్యయే కదా! కనుక మనకిక్కడ గ్రహించ దగ్గ పదార్థ మంటూ ఏదీ లేదు. గ్రహించ వలసినదే లేనప్పుడు, త్యజించ వలసినది మాత్రం

ఏముంటుంది?

గ్రహిస్తే కదా... త్యజించేది! ఇది ఉత్తమము... ఇది తుచ్ఛము - అను వ్యవహారమంతా కేవలం దేశ కాలముల వలననే సంభవిస్తోంది. విజ్ఞుల అభిప్రాయం ప్రకారం, తుచ్ఛాతుచ్ఛములకు సంబంధించిన నిందా-స్తుతులను త్యజించివేయాలని కదా! దేశ కాలవశం చేత ఇప్పుడు ప్రాముఖ్య మైనది మరొకప్పటికి, ఒక నాటికి తుచ్ఛంగా కనిపిస్తోంది. ఈ విషయం ప్రతి ఒక్క జీవునికి అనుభవమగుచున్న విషయమే.

అసలు నిందాస్తుతులు ఎందుకు కలుగుచున్నాయి?" అని మనం విచారణ చేస్తే రాగము చేతనే అని సమాధానం లభిస్తోంది. రాగము ఎట్లు ఉద్భవిస్తోంది?... ఇచ్ఛ వలననే.

ఇచ్ఛయో? ...అజ్ఞానంలోంచి, అజ్ఞానంచేత బయలుదేరుతోంది. కనుక బుద్ధిమంతుడైనవాడు మహోదారమగు బ్రహ్మపదార్థముచే ఇచ్ఛగించుతాడు. ఇంకదేనినీ కాదు.

ఈ ముల్లోకములందూ గల స్త్రీ-పర్వత-సముద్ర-వనములు, సమస్త ప్రాణులు, పృథివి, పంచ భూతములు ఇవన్నీ వాస్తవరహితములే. వీటన్నిటి యందు సారమంటూ ఏదీ లేదు.

Page:557

ఈ పురాతన శూన్యజగత్తునందు ఉన్నదంతా మాంస - అస్థి - కాష్ఠ - మట్టి - శిలామయమైనది మాత్రమే. ఇందులో మనం ఇచ్చగించవలసిందీ, వాంఛించవలసిందీ ఏముంటుంది? ఇచ్ఛ నివృత్తి కాగా, రాగద్వేషములు సంక్షయిస్తాయి. ఇంక అనేక మాటలెందుకు? ఎప్పుడైతే ఈ మనస్సు సర్వత్రా రాగద్వేషరహితమై శాంతమై, ఆత్మైకరసమై తన ఆత్మయందు కేవలం పరితృప్తి పొందుతుందో - అదియే ఉత్తమ ప్రతిష్ఠ. అదియే విశ్రాంతి. అదియే సమాధి. అదియే యోగము, జ్ఞానముకూడా.

వారిద్దరు ఒకరినొకరు ఆత్మదృష్టితో సందర్శించుకుంటూ తెల్లవార్లూ సంభాషించుకున్నారు. మరునాడు వారు ఒకరి వద్ద మరొకరు సెలవు తీసుకుని, తమ తమ నియతిని అనుసరించి మార్గ పరాయణులయ్యారు.

6. కేవలీ తత్త్వధ్యానం

శ్రీవసిష్ఠ మహర్షి : రాఘవా! మాండవ్యుల బోధ, సురఘు, పరిఘ (పర్ణాదముని)ల సంభాషణ విన్నావు కదా! వారి సంభాషణలోని అంతర్లీనగానమును విను. నీవు కూడా అట్టి జ్ఞానముచే ఇక్కడే పరమపదలాభమును సంపాదించు. అందుకొరకై ధీరులగు విజ్ఞులతో కలిసి చక్కగా విచారణ చేయి. ఉత్తమమైన 'సుతీక్షబుద్ధి'చే హృదయాకాశంనుండి 'అహంకారము' అనే కాలమేఘమును నశింపజేయి. సకలలోకాతీత ప్రాప్తము, ఆనందకరము, నిర్మలము అయిన చిత్తము నీయందు ప్రవేశించుగాక!

సర్వులలో అంతర్హితుడై ఉంటున్న ఆ పరమాత్మ ఒక్కడే ధ్యానయోగ్యుడు! ... అతడే శరణువేడ తగినవాడు! ...ఆతడే మన స్వస్వరూపుడవటంచేత ఆతనిని ఆరాధించటం అత్యంతతేలికైన విషయమే! ...అదే సర్వానంద సంపత్తి స్వరూపం! ...సుప్రసన్నం. చిదాకాశస్వరూపం!

అట్టి పరమాత్మ యందే స్థితి కలిగియుండు. నిత్యము ఆత్మవిచారణ తత్పరుడవై ఉండు. అంతర్ముఖుడవై, సుఖరూపుడవై చిదాస్వాదనపరుడవై ఉండు. అప్పుడిక నీ చిత్తము దుఃఖములచే పీడించబడే ప్రసక్తే ఉండదు. బాహ్యంలో కనబడే వ్యవహారతత్పరత, రాగద్వేషములు, జలము పద్మమును తాకనట్లు నీ అంతఃకరణమును కలుషితం చేయలేవు. నీవు వాటన్నిటికంటే మహత్తర స్వరూపుడవని గ్రహించు. ఏనుగు సింహమును బాధించగలదా? ఉత్తమ జ్ఞానంతో శాంతచిత్తుడవై ఉంటే, ఈ మనస్సు నిన్నేం చేస్తుంది? ఎట్లా బాధిస్తుంది.

నందనవనంలో ముళ్ళ చెట్లు ఉంటాయా? జ్ఞానియొక్క చిత్తములో భోగలంపటం ఉండదు. ఆతడు అనేక దీనదశలను పొందవచ్చుగాక! ఆతని చిత్తం మాత్రం తన విశాలరూపమును త్యజించదు. క్షుద్రమగు విషయ సుఖములను కాంక్షించక, కేవలం ఆత్మ వైపునకే అభిముఖమై ఉంటుంది. ఇక్కడి ఇంద్రియవిషయములకు ఎవడైతే అనురక్తుడై ఉంటాడో, ఆతడే ఇక్కడి జనన-మరణాదులను

Page:558

చూచి దుఃఖములను పొందుతాడు. ఏ చిత్తమైతే సమస్తమును విచారించి, ఈ ఇంద్రియాలు, విషయాలు, శరీరాలు, తదితర దృశ్యములు అవిద్యయే! మిథ్యాభ్రాంతియే" - అని ఎరుగుచున్నదో, అద్దానికి ఇక దుఃఖం ఎక్కడినుండి వస్తుంది?

శ్రీరాముడు : మహర్షీ! మనస్సుకు 'కర్తృత్వం (నేను కర్తను) అనుదోషం తొలగాలంటే ఏం చేయాలి? శ్రీవసిష్ఠ మహర్షి : రామా! ముందుగా ఈ మనస్సు పొందుచున్న మోహం, భ్రమల గురించి గమనించు. క్రమక్రమంగా అప్రమేయత్వమును అలవరచుకో. చక్కగా ఈ మనస్సు పొందుచున్న భావాభావములను గమనించావా... కర్తృత్వాభిమానం తనంతటతానే తొలగుతుంది. అది నిన్ను స్పృశించనైనా లేదు.

'అవిద్య' అనే చీకటిలో దీపం ఒక్కటే....! అది, ఈ జగత్తు అవిద్య చేతనే అనుభవమగు చున్నది.” అనే ఉత్తమ జ్ఞానం ఉదయించటమే! స్వప్నంలో పులులు, గండు పిల్లులు నిన్ను భయపెడు చున్నాయి అనుకో!... ఆ భయం పోయేదెట్లా? ఇది స్వప్నం అని గ్రహించుట చేతనే కదా! అవిద్య కూడా అంతే. ‘ఇది అవిద్య' అని గ్రహిస్తే చాలు... అది తొలగిపోతుంది, తొలగిపోయినట్లే!

చేపలు నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఆ నీళ్ళు చేపల కళ్ళను స్పృశించలేవు చూచావా! నీవు వ్యవహార పరుడవై ఉన్నప్పటికీ అంతరమున సంసారాసక్తుడవు కావద్దు. కేవలం బ్రహ్మమునందే నిమగ్నమైన బుద్ధిని కలిగి ఉండు. అప్పుడు కర్తృత్వ దోషములు, దుఃఖములు నిన్ను స్పృశించలేవు. ప్రదీప్తమగు చైతన్యమయ ప్రకాశం ప్రసరించుచుండగా అజ్ఞానాంధకారం క్షయించక ఏం చేస్తుంది?

తత్వజ్ఞాని యొక్క బుద్ధి స్వతహాగా పరమానందమును పొంది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జీవుడు జ్ఞాన సూర్యునిచే ప్రబోధితుడైనాడా, ఇక మరెప్పుడూ మోహము పొందడు. ఏ రోజులలో హృదయాకాశంలో ఆత్మచిత్భావన విస్తరిస్తుందో ఆ రోజులే జీవసహితములు. అట్టి క్రియలే ఆనంద యుక్తములు. నిరంతరాత్మచింతనచే మోహము తొలగి అంతఃకరణము శీతలత్వం పొందుచున్నది.

తాని మిత్రాణి శాస్త్రాణితాని తాని దినాని చ

విరాగోల్లాసవాన్యేభ్య ఆత్మచిత్తోదయః స్ఫుటమ్ ॥ (శ్లో 19, సర్గ 63)

ఎవరివల్లనైతే ఈ చిత్తము వైరాగ్యోల్లాసయుతమై ఆత్మాకారవృత్తిచే అభ్యుదయం పొందుతుందో, అట్టి వారే ఈ జీవునకు నిజమైన మిత్రులు. అట్టి శాస్త్రములే ఆప్తశాస్త్రములు. ఆ రోజులే రోజులు.

ఆత్మ దర్శనము నందు అనాదరణ కలిగి ఉన్న జీవులు దీనులు. ఎందుకంటే వారు ఈ జనన-మరణ చక్రము నందు అనేక దుఃఖములను పొందుచున్నారు.

ఈ జీవుడు అనేక విధములైన ఆశాపాశములచే నిరంతరం బంధింపబడుచున్నాడు. భోగ తృణములను అపేక్షిస్తూ అనేకసార్లు వార్ధక్యముచే కురూపుడగుచున్నాడు. శోకములు, దుఃఖములు పొందుచున్నాడు. దుష్కర్మలచేత, మోహంచేత, రాగం చేత, తృష్ణలచేత ఈడ్వబడుచూ, ‘మనస్సు’ అనే గృహంలో బంధితుడగుచున్నాడు. పుత్ర, స్త్రీ, బంధువులతో ఏర్పడే 'నావి, నావి' అను దురవగాహన లన్నీ చివరికి అతనికి బంధనములు అవుచున్నాయి. వార్ధక్యము - దుష్కర్మలు ఆతని విశ్రాంతిని

Page:559

అనుక్షణం దూరం చేస్తున్నాయి. అతడు ఇహ - - పరలోకములకు రాకపోకలు సాగిస్తూ అలసిపోయి తీవ్ర మనఃతాపముచే తప్తమగుచున్నాడు. పైకి పచ్చగా కనబడుచున్నాకూడా, అంతఃకరణంలో మాత్రం అతిదీనుడై ఉంటున్నాడు. భూత భవిష్యత్తుల గురించి అనేక చింతనలతో సతమతమగు చున్నాడు. తన ఇంద్రియములచే తానే పరాజితుడగుచున్నాడు. నిత్యం కామ్యకర్మలచే ఆకర్షితుడ గుచున్నాడు. ఆవిర్భావ - తిరోభావములను మోస్తూ అజ్ఞానమహారణ్యంలో సొమ్మసిల్లి నేల కూలుచు న్నాడు. అనర్థములు - దుఃఖములు - దారిద్ర్యములు మరలమరల పొందుచున్నాడు. కర్మభారములచే శిథిలశరీరములతో ఆక్రందనం చేస్తున్నాడు.

ఎద్దువంటి ఈ జీవుని మనస్సు 'సంసారము' అనే బురదలో కుతిక్కాయ వరకు లేవలేనంతగా చిక్కుకుని ఉన్నది. ఉత్తమ ప్రయత్నముచే జ్ఞానబలం సంపాదించి ఆ మనస్సును బురద నుండి బహిర్గతం చేసినప్పుడు మాత్రమే మానవజన్మకు ప్రయోజనమున్నట్లు.

ఆత్మను దర్శించినప్పుడు మాత్రమే చిత్తము క్షయిస్తుంది. అప్పుడు భ్రమలన్నీ పోతాయి. జ్ఞానముచే ఆత్మ దర్శించబడగలదు. అయితే జ్ఞానం ఎలా లభిస్తుంది? నావికుని వలన నౌకాయానం లభించునట్లు మహానుభావుడగు జ్ఞాని యొక్క సాంగత్యముచే ఈ సంసారసాగరాన్ని దాటటానికి యుక్తి లభిస్తుంది. ఎక్కడ జ్ఞానిలేడో... ఆ ప్రదేశం నివాసయోగ్యమే కాదు. జ్ఞాని యొక్క వచనముల చేత, అభిప్రాయములచేత, భావతరంగాలచేత అతడు ఉన్నచోటు పరమ పవిత్రం అవుతుంది. సజ్జనులగు జ్ఞానులవలన ప్రపంచమునకు ప్రశాంతత, జీవులకు విశ్రాంతి లభించగలదు.

కొంచెము వివేకము ఆవిర్భవించినట్టి ధీమంతుడు ఇక నిదురపోకూడదు. ఏది ఏమైనా సరే, మహామోహదాయకము, సంతాపదాయకము అయినట్టి ఈ ప్రపంచము నందు ఆదమరచి ఉండరాదు. ఆత్మలాభం ప్రాప్తించేవరకూ నిరంతరం యత్నశీలుడై ఉండాలి. అంతేకాని, దేహాభి మానంతో మాన-మద-గర్వాదులతో 'జన్మలు' అను బురదలోకి తనను తాను త్రోసివేసుకోరాదు.

కిమిదం కథమాయాతం కింమూలమితి కింక్షయమ్ | దేహదుఃఖమితి ప్రాజ్ఞః ప్రేక్షణీయం ప్రయత్నతః ॥ (శ్లో 36, సర్గ 64)

ఈ దేహమేమిటి? దేహ సంబంధములగు దుఃఖాదులేమిటి? ఇవన్నీ ఎట్లా కలుగుచున్నాయి? వీటికి మూలమేమిటి? ఇవి ఎట్లా తొలగుతాయి? ... బుద్ధిమంతులు ఈ విధమైన ప్రశ్నలకు రావాలి. వచ్చి ప్రయత్నపూర్వకంగా విచారణ చేయాలి.

ఆత్మజ్ఞానులను సమీపించి సమాచారం సేకరించాలి. ఓ మిత్రులారా! శ్రోతలారా! ధనము గాని, మిత్రులుగాని, ఆత్మజ్ఞానమునకు వేరైన శాస్త్రములుగాని అజ్ఞాన సాగరమున నిమగ్నమైన జీవుని ఉద్ధరించగలవని అనుకుంటున్నారా? లేదు.

నిరంతర సహవాసంతో శుద్ధమనస్సును ఆశ్రయించండి. అట్టి శుద్ధమనస్సుతో కొంచెం పరామర్శించి చూడండి. ఈ మాత్రం చేత ఆత్మోద్ధరణ సంభవమగుచుండగా అట్టి ప్రయత్నం

Page:560

చేయరెందుచేత? అరె! ఉత్తమమగు మానవజన్మచే లభిస్తున్న అనేక అవకాశములను బూడిద చేసుకుంటున్నారే! అది సరికాదు. అభ్యాస, వైరాగ్యములతో యత్నం చేయండి. తత్త్వజ్ఞానం సంపాదించటంలో తాత్సారం చేయవద్దని అందరికీ మనవి చేస్తున్నాను. దురాశచే ఏర్పడే శోక మోహముల విన్యాసమేమిటో గమనిస్తూ కూడా, ఉపేక్షిస్తూ ఉంటే ఎట్లా? అందుచేత ఆదరణపూర్వకంగా ఆత్మోద్ధరణకు నడుం కట్టండి. సన్మార్గంలో అహంకారం నశించేవరకూ విచారణను ఆశ్రయించండి. ఈ దేహమును మట్టి - కొయ్య శిల వంటిది”గా చూడటం అభ్యసిస్తూ ఉంటే చాలు... క్రమంగా సర్వదేవేశుడగు ఆ పరమాత్మ గూర్చిన జ్ఞానం లభ్యం కాగలదు. అహంకారం నశిస్తూ ఉండగా, చిద్రూపము ప్రకటితమగుచూ రాగలదు. వెలుగు రాగానే చీకటి ఎక్కడికో వెళ్ళిపోవుచున్నట్లు, అహంకారం నశిస్తూ ఉంటే ఆత్మదర్శనం స్వయంగా సిద్ధించగలదు. అప్పటి నిరతిశయానందంచే ఏర్పడే విశ్రాంత, నిర్వికల్పస్థితియే పరిపూర్ణస్థితి. అందుకు మనం అందరం అర్హులమే. అయ్యది మన స్వస్వరూపస్థితియే అయిఉన్నది కదా! ఇక అనర్హత ఎందుకుంటుంది? ... అందుకు ప్రయత్నించనప్పుడు మానవునికి ఇక జంతువుకు భేదమేమున్నట్లు?

విషయరహితమగు మనస్సుతో సాటివచ్చేదేదీ ఈ మూడు లోకాలలోనూ లేదు. అందు దృశ్యం కొరకై రాగం ఉండటానికి చోటే ఉండదు. కేవలం చిత్ప్రకాశం మాత్రమే అంతటా ఆక్రమించు కొని ఉంటుంది. ఇక నిర్వికల్పసమాధి అయినట్టి తురీయదృష్టి పొందావా... దానితో పోల్చతగినది మరేదీ ఉండదు. దానికదే సాటి. ఆ స్థితిలో విక్షేపములేవీ ఉండవు కనుక సుషుప్తితో పోల్చవచ్చు. అయితే సుషుప్తిలో జడత్వం (ఎరుక లేకపోవటం) ఉంటుంది. అదిమాత్రమే భేదం. ఆ అవస్థ ఆకాశమువలె సర్వవ్యాపకమైనది.

ఒక చోట ఒక కుండ ఉన్నదనుకో! ఆ కుండ పగిలితే కుండలోని ఆకాశం ఏమౌతుంది? మహాకాశంతో ఏకత్వం పొందుతుంది. అయితే, కుండలోని ఆకాశము మహాకాశము నుండి వేరు పడినదెప్పుడు? ఎప్పుడూ లేదు. అట్లాగే ఏ జీవునియందు మనోహంకారాలు తొలగుతాయో, ఆతనికి సర్వపదార్థములలోని అంతరమున ఉన్న పరమసత్యము గోచరించగలదు. ఆ పరమసత్యమే తత్'. ఆ తత్రే'త్వమ్’. అదియే నీవు. రామా! అట్టి స్థితి స్వయముగా యోగముచే సిద్ధించగలదు. అది సుషుప్తికి దూరాతి దూరమేమీ కాదు. కానీ సుషుప్తి కానే కాదు. అయితే అది వాక్కుకు అతీతమైనది. అది ఈ జీవునికి హృదయములోనే అనుభూతమగుచున్నది సుమా!

అనుభూతిం వినా తత్త్వం ఖణ్ణాదేరానుభూయతే

అనుభూతిం వినా రూపం నాత్మనశానుభూయతే ॥ (శ్లో 53, సర్గ 64)

అనుభవం అనేది లేకపోతే సామాన్యములైన చక్కెర, పటికబెల్లం మొదలైనవాటి తత్వమే గోచరించదు. ఇక ఆత్మానుభవం గురించి వేరుగా చెప్పాలా? 'అనుభవం' అనేది లేకపోతే ఆత్మస్వరూపం కూడా గోచరించదు.

Page:561

ఈ జగత్తంతా అనంతాత్మ స్వరూపమే. ఇక చిత్తముయొక్క బాహ్యవిషయములంటావా, ఇవన్నీ పరిణామయుతములు. కొంతకాలం గడచిన తరువాత ఇవి ఇట్లా ఉండవు. ఇట్టి దృశ్యమును పట్టుకుని వ్రేళ్ళాడవలసిన పనేమున్నది? అందుచేత రామా! ఈ బాహ్యవిషయములు నీచే శమించి వేయబడుగాక! సర్వత్రా దీప్తమై, బ్రహ్మాది దేవతలకు దేవదేవుడై వెలయుచున్న ఆత్మ నీపట్ల అనుభూతమగుచు, ప్రకటితమగుగాక!

పంచమ భూమికయందు విషయవాసన నశిస్తుంది. ఆరవ భూమికయందు పరమపురుషార్థమగు ఆత్మప్రకాశము ఉదయిస్తుంది.

ఏడవ భూమికలో సమాధి, అసమాధులు ఏకత్వాన్ని సంతరించుకుంటాయి. అట్టి సమత్వ కారణంచేత బ్రహ్మాదులకుకూడా అచింన్యమైనట్టి 'కేవలానందైక స్వరూపం' అను ఆత్మానుభవం శేషిస్తోంది.

Page:562

IX. భాస - విలాస సంవాదం

1. అభిమాన త్యాజ్యం

శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఆధ్యాత్మికయానం సుమార్గం కావాలంటే అభిమానత్యాజ్యం ఎంతో ఆవశ్యకం సుమా!

శ్రీరాముడు :అభిమానం' అంటే తమ ఉద్దేశం?

శ్రీవసిష్ఠమహర్షి : "ఈ ధనము, గృహము, బంధు జనము మొదలైనవి నావి. ఈ శరీరమే నేను” అని అనుకోవటమే అభిమానం. మనస్సుతో అభిమానమనే మనో విభాగమును జయించి, ఆ మనస్సుతో ఆత్మదర్శనం చేయాలి. అభిమానమును జయించకుండా, దానిని కలిగియుండి ఎంతగా శాస్త్రాలు చదివినా, ఏమి విన్నా... ఏం ప్రయోజనం? చిత్రపటంలోని సూర్యుడు కిరణములను ప్రసరింపజేయగలడా? లేదు కదా! అహమ్, మమ అను భ్రమాత్మకమగు అభిమానం త్యజించకపోతే ఈ జగత్ దుఃఖం అస్తమించదు. అది ఉన్నంత వరకు ఆపత్తులు, వ్యాకులతలు, అజ్ఞాన బీజాంధకారాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఈ విషయమే నిరూపిస్తూ ' 6 భాస - విలాస సంవాదం' అనే ఒక ప్రాచీన ఇతిహాసం ఉన్నది. అది వింటే అభిమాన త్యాజ్యము యొక్క ఆవశ్యకత ఏమిటో మరికొంత సుస్పష్టమౌతుంది. చెపుతాను. విను.

సహ్యపర్వత ప్రాంతం అతి సుందరమై ఒప్పుతూ ఉంటుంది. ఆ పర్వత ప్రాంతంలో మానవ - కిన్నెర - సిద్ధ - విద్యాధర - సాధువులకు నివాసయోగ్యమై, అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఆ పర్వత ప్రాంతంలో ఒక చోట అత్రిమహాముని ఆశ్రమమున్నది. ఆ ఆశ్రమానికి కొంచెం దగ్గరలో శుక్రుడు, బృహస్పతి అను పేరు గల ఇద్దరు తాపసులు నివసిస్తూ ఉండేవారు. పేరుచే మాత్రమే గాని, వీరివురు దేవ, దానవ గురువులు కారు. ఆ ఇద్దరూ ఆప్తమిత్రులు. ఇద్దరూ శాస్త్ర విషయాలలోను, తపస్సు, ధ్యాననిష్ఠలందు గొప్పనిష్ణాతులు. వాళ్ళిద్దరికి విలాసుడు, భాసుడు అనే పేరుగల కుమారులు ఉండేవారు. ఆ భాస, విలాసులిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతూ ఏకమనస్కులై, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. చిన్నప్పటి నుండి అక్కడి ఆశ్రమధర్మములైన తపోధ్యానములు కలిసి నిర్వర్తిస్తూ ధ్యానవిషయములు వింటూ తమ తండ్రులకు అత్యంత ప్రీతిపాత్రులై ఉంటూ ఉండేవారు.

కొంతకాలం గడిచింది. భాస, విలాసులు యౌవనంలో ప్రవేశించారు. అంతా కాలముయొక్క మహిమయే కదా! కాలగతిని ఎవరు నిరోధించగలరు? అనుక్షణిక గమనశీలం అగుకాలం మౌనంగా, ఏది ఎట్లున్నా, తాను మాత్రం గతిస్తూ, స్థితి గతులను తన రీతిలో మార్చివేసుకుంటూ పోతుంది కదా! ఆ శుక్ర బృహస్పతులు కొంతకాలానికి వార్ధక్యము పొంది గూటిని విడిచిన పక్షుల వలె

Page:563

భౌతిక దేహములను త్యజించి స్వర్గస్థులైనారు. తండ్రులు మరణించడంచేత భాస, విలాసులు జలము నుండి పెరికి వేయబడిన కమలద్వయమువలె దీనులు, ఉత్సాహరహితులు, సంతప్త హృదయులు అయ్యారు. తండ్రులకు దహనక్రియలు యథారీతిగా నిర్వర్తించారు. మహాత్ములు లోకరీతిని ఉల్లంఘించరు కదా!

వారిద్దరూ చింతాగ్రస్థులై పెద్ద పెట్టున దుఃఖిస్తూ చేష్టారహితంగా అక్కడక్కడే కొద్దిరోజులు గడిపారు. తమ తండ్రులతో ఏర్పడిన అనుబంధం చేత, వారు విరక్తి, అనురక్తి, వేదనల నుండి ముక్తులు కాలేకపోయారు. ఒక రోజు వారిట్లు సంభాషించుకున్నారు

భాసుడు : మిత్రమా! చూచావా! మనం తండ్రులను కోల్పోయాము. అయితే శరీరధారులందరికీ ఎప్పటికో అప్పటికి మృత్యువు అనివార్యమే కదా! అయినా వారినుండి వియోగం మనం భరించలేక పోతున్నామే! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించు.

విలాసుడు : ఔను. తేనెటీగ ఒక పుష్పము వదిలి మరొక పుష్పమును ఆస్వాదించునట్లు ఈ జీవుడు ఆత్మజ్ఞాని కానంతవరకూ, ఒక శరీరమును వదలి మరొక శరీరమును గ్రహిస్తూ ఉంటాడు. కనుక మృత్యువు అనునది అత్యంత సామాన్యమైన దినచర్య వంటిది. ఈ విషయం మన తండ్రుల నుండి మనం అనేకసార్లు విన్నాం. అయినా, మన తండ్రుల నుండి మనకు కలిగిన ఈ వియోగం అత్యంత దుర్భరంగా ఉన్నది. ఎందుచేతనో మరి?

భాసుడు : ఎందుచేతనంటే, మనం ఎన్నో జ్ఞానవిషయాలు విన్నాం కాని, మనకు అనుభవజ్ఞానం లేదు. ఇక్కడ ఎంతకాలంవున్నా, మన మనస్సులు కుదుటపడవేమో!

విలాసుడు : అవును నీవు చెప్పింది నిజం. ఇక ఇక్కడ మనం ఉండటం ఉచితం కాదు. ఉండి చేసే దేమీ లేదు. మనం దేశాటన చేసి లోకాన్ని చూసి అనుభవజ్ఞానం సంపాదిద్దాం.

భాసుడు : మనం వేర్వేరుగా రెండు దిక్కులుగా పోదాం. పదేళ్ళ తర్వాత ఇద్దరం మరల ఇక్కడే కలుద్దాం.

ఇట్లు నిర్ణయించుకొని ఇద్దరూ ఎవరి త్రోవలో వారు అక్కడ నుండి బయలుదేరారు. రోజులు, మాసములు, సంవత్సరములు గడిచిపోయాయి. అనుకున్నట్లుగానే పదేళ్ళ తర్వాత అదే రోజు ఆ ఆశ్రమ ప్రాంతంలో ఒకరినొకరు కలిశారు. ఇట్లు సంభాషించుకున్నారు.

2. ఏమి క్షేమ సమాచారం?

విలాసుడు : నా ఉత్తమ బంధువగు భాసుడా! స్వాగతం. మన వియోగం తరువాత నీవు ఇంతకాలం ఎక్కడెక్కడ సంచరించావు? నీ తపస్సు ఫలించిందా? బుద్ధి సంతాపరహితం అయినదా? విద్య సఫలీకృతమైనదా? ఆత్మజ్ఞానివైనావా? సర్వదా క్షేమమే కదా?

Page:564

భాసుడు : మాననీయుడగు విలాసుడా! నీకు నేను కూడా సుస్వాగతం పలుకుచున్నాను. అమ్మయ్య! సౌభాగ్యవశం చేత నిన్ను మరల కలుసుకోగలిగాను. ఇక నా క్షేమ సమాచారాలు ప్రశ్నిస్తున్నావా? ఈ సంసారము ఏర్పడి ఉన్నంతకాలం నాకు క్షేమం కూడానా? అయ్యో నా రాత!

యావన్నాధిగతం జ్ఞేయం యావతీజ్ఞాన చిత్తభూః | యావతీర్ణో న సంసారస్తావన్మే కుశలం కుతః ॥ (శ్లో 10, సర్గ 66)

జ్ఞేయమగు బ్రహ్మమును ఎరుగనంతవరకూ, కామసంకల్పములు నశించనంతవరకూ, సంసార సముద్రం దాటనంతవరకూ ఈ జీవునకు క్షేమమనే మాటెక్కడిది చెప్పు?

గొడ్డలితో వృక్షమును నఱుకునట్లు చిత్తమునుండి పుట్టే ఆశావృక్షమును మరల చిగురించకుండా మొదలంటా నరికినప్పుడే సౌఖ్యమనే మాట. జ్ఞానము కలుగనంతకాలం సమత్వం ఉదయించదు. సమత్వం లేనంతవరకు ఆత్మబోధ హృదయంలో ప్రవేశించదు. ఆత్మబోధ అనే ఔషధం సేవించకపోతే ఈ సంసారము అనే మహమ్మారి మరలమరల రకరకాల రూపాలలో పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక, ఈ శరీరములు పుట్టటం, బాల్యయౌవనవార్ధక్యమరణములు పొందటం, మధ్యేమార్గంలో ఏర్పడి ఉండే బంధు, సంపదల కొరకై రోదన - వేదనలు ఈ విధంగా చర్వితచరణంగా జరిగిపోతూనే

ఉంటుంది.

జీవించి ఉన్నంతకాలం ఈ విధంగా అనేక మనోవ్యాకులతలతో కాలం గడచిపోతోంది. ఇక మరణించిన తరువాతనో, పశువు మొదలైన యోనులందు జన్మించి పాపకర్మల ఫలితం అనుభవించ వలసిందే కదా! కాదంటావా, స్వర్గాదులను చేరి పూర్వసంచితమైన పుణ్యకర్మల ఫలితం అనుభవించాలి. నా దృష్టిలో ఈ రెండూకూడా విరసములూ, నీరసప్రాయములే అయి ఉన్నాయి. అదంతా దీర్ఘకాలంగా ఏర్పడి ఉండగల వ్యర్థ ప్రయాసయేనని నా కనిపిస్తోంది. ఒక అనుభవం తరువాత మరొక అనుభవం.... ఈ ప్రయాసకు అంతు ఎక్కడ? విశ్రాంతి ఎక్కడ? శాంతి ఎక్కడ?

అయ్యో! ఈ జీవులు అజ్ఞానభావములు, తృష్ణ అనే సర్పములను ప్రక్కనే ఉంచుకొని విషయ భోగక్రియలందు మరల మరల పొరలుచున్నారే! శుభాశుభముల చేత, న్యూనాధిక దుఃఖముల చేత, అల్పసుఖములచేత అనేక రాత్రింబవళ్ళు గడచిపోతున్నాయి! మిథ్యాక్రియాకారకులగు ఈ జీవులు మిథ్య అయిన క్రియలను, వాటి ఫలములను, దురాశలను, తదనుగుణమైన కర్మలను మరల మరల ఆశ్రయిస్తూ తమ ఆయువును నశింపజేసుకుంటున్నారు. ఈ మనస్సు తన ఉత్పత్తి స్థానమైన పరమాత్మను త్యజించి, వివేకం పోగొట్టుకుని 'ఆసక్తి' తృష్ణ' అనే మత్తు పదార్థములను సేవించి, తూలుతూ ఎటో పరుగులు తీయుచున్నది. పిచ్చి అరుపులు అరుస్తోంది. 'అభిలాష' అనే ఒక దుష్టవ్యాధి పొందిన ఈ జీవుడు వ్యర్థంగా పరమ పురుషార్థమును పోగొట్టుకొనుచున్నాడే! మనోచాపల్యం చేత కాబోలు అల్పము, నీరసము అగు విశేషముల వెంట తాను చేసే పరుగులు ఆపలేకపోతున్నాడు.

Page:565

మిత్రమా! ఇక ఈ దేహం గురించి ఏం చెప్పమంటావు? ఇది నిష్ఫలమగు క్రియలచే నీరసం పొందుతోంది. అల్పత్వము, శ్రమ, రోగము, దౌర్బల్యము ఇందులో దాగిఉన్నాయి. ఎండుటాకులాగా ఎప్పుడు నేలకూలుదామా అని ఎదురుచూస్తోంది. ఈ దేహము యొక్క ముఖము రజో గుణముచే కొట్టబడుచున్నదై, పుత్రకళత్రాదుల దురుసువచనములచే అవమానించబడుచున్నదై, కాంతిని పోగొట్టుకొని ధూసరమగుచున్నది. యౌవనకాలంలో మిసమిసలాడుచున్నప్పటికీ ఆ యౌవనం గడచిపోగానే రసవిహీనమై ఎండుటాకువలె మిగులుతోంది. కాలక్రమేణా శుష్కిస్తోంది. వయసు చెల్లుతున్నకొద్దీ ఈ దేహవృక్షం నుండి ఒక్కొక్క భోగశక్తి నేల రాలుతోంది. ఆ యౌవనపు శోభలూ, ఆ పటాటోపాలూ వార్థక్యం వచ్చేసరికి ఎక్కడికి పోతాయో?... రోజులు గడుస్తున్న కొద్దీ బ్రతుకు దీనమగుచున్నదే!

ఒక్కసారి ఈ మనస్సును గమనించండి మిత్రమా! ఇది 'భోగములు' అనే విషసర్పములచే పూర్ణమై పైకి పెదవి విప్పలేనట్టి అనేక అంతర్ దుఃఖములను కలిగి ఉంటోంది. ఎందుకో... కారణాలు ఏమిటో ఈ మనస్సుకే తెలియదాయె! చివరికి ఇది 'మోహాంధకారము' అనే నూతిలో బావురు కప్పలాగా మిగిలిపోతోంది. నీచ వస్తువులను, తుచ్ఛవిషయక్రమములను ఆశ్రయించటంలో దీనిని కుక్కలతోను గ్రద్దలతోనూ, పందులతోనూ కూడా పోల్చటానికి వీలులేదు. 'తృష్ణ - - అనురాగము' అను వాయువీచికలు ఈ మనస్సు అనే పతాకమును క్షణకాలం కూడా స్థిరత్వం లేకుండా రెపరెపలాడేట్లు చేస్తున్నాయి.

ఈ జీవుడు ఎన్నెన్నో ఆశాపరంపరలు కలిగిఉంటున్నాడు. ఆ ఆశల వెనుక ఏవో ఆశయములు ...ఆ ఆశయములన్నీ దుఃఖములవైపు, అజ్ఞాన భూముల వైపు అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కర్మలు, వాటిచే ప్రయోజనములు, వాటి నుండి ఏవేవో దుఃఖములు, అవి తొలగటానికి మరల కర్మలు... ఈలోగా పాపము, అల్పము అయిన దృష్టులు... ఏమిటిదంతా? అవిశ్రాంతంగా శరీరం తోనూ మనస్సుతోనూ అనేక కర్మవ్యవహారములలో చిక్కుకున్న ఈ జీవునికి శాంతి కరువు అవుతోంది. ఇవి నేను చేయవలసినవి... ఇది సంపాదించవలసినవి... ఇవి దాచవలసినవి" అనుకుంటూ ఈతడు రోజులు గడుపుచున్నాడు. ఇంతలో శరీరం వార్ధక్యమునకు, రోగములకు గురి అవుతోంది. ఒక అనుకోని క్షణంలో మృత్యువు అనే గ్రద్ద వచ్చి వాలుతోంది. గ్రద్ద కోడిపిల్లను నోటకరుచుకొని పోవునట్లు ఈ శరీరమును నోట కరచుకొని వెళ్ళిపోతోంది. ఈ జీవుని తెలియని లోకాలలో త్రోసివేస్తోంది.

జీవితము అనే దుష్టనది యౌవనోత్సాహాలు అనే తరంగములతో, కామక్రోధములు అనే సుడులతో ఎటువైపుకో ప్రవహిస్తోంది. అట్టి జీవితము అను దానికి కర్త, భోక్త కూడా అయినట్టి ఈ జీవుడు ఆశ నిరాశల మధ్య మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ తనకు తెలియకుండానే ఎచ్చటెచ్చటికో దొర్లింపబడుచున్నాడు. ‘ధనము, జనము, బాంధవ్యము, ఇళ్ళు, వాకిళ్ళు' మొదలైన వాటిని చూపించి ఈ జీవితము జీవుని తన వశం చేసుకొని, క్షణకాలం అలరించి చివరికి ఏది ఏమిటో తెలిసే లోపలే దుఃఖమహాసముద్రంలోకి తీసుకొని వెళ్ళి పడవేస్తోంది. ఈ అనంత బంధు మిత్ర సమాగమం,

Page:566

ఆశాపరంపరలు, కాలక్షేపాలూ ఇవన్నీ జీవునిలో సత్యదృష్టిని కకావికలు చేస్తున్నాయి. కాల సాగరంలోకి పోయి కలిగియున్నవన్నీ కలిసిపోతున్నాయి. ఎక్కడా ఏదీ మిగలటంలేదు. అసలీ తతంగమంతా ఏమిటో, ఎక్కడికో, ఎందుకో, ఎప్పటివరకో, ఎవరు ఎవరికొరకు ఎంతకాలంగా కల్పిస్తున్నారో ఏమాత్రం అర్థం కావటం లేదు. అర్థవంతమైనవనుకున్నవన్నీ అనర్ధంగా అయిపోతు న్నాయి. అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఇక ఏమి శాంతి? ఎక్కడి శాంతి? అంతా కూడా అగమ్యగోచరంగా ఉన్నది. "అహా! ఇవన్నీ నా సంపదలు అనుకున్నవన్నీ క్షణంలో విడచి వెళ్ళు చున్నాయి. లేదా కొద్ది క్షణాల తరువాత ఈ జీవుడే వాటిని విడచి ఎటకో వెళ్ళిపోతున్నాడు.

ఈ జన్మ మృత్యువులు, ఈ చింతలు, ఈ దుష్ట క్రియాచారములు జీవుణ్ణి మలయమారుతంలోని ఎండుగడ్డి పరకలాగా దొర్లించుకుపోతున్నాయే! ఇక్కడి కార్యసముదాయములు చింతలను, ఆర్తులను, ఆందోళనలను కలుగజేయటంచేత ఈ జీవునికి ఒక్కక్షణమైనా విశ్రాంతి ఉన్నదా? లేదు. ఇది చేశాను, ఇది చేస్తున్నాను, ఇది చేయబోతున్నాను అను ఒకానొక మానసిక వ్యసనముచే, చింతలచే బంధింపబడిన ఈ ఈ జీవుడు 'నావారు - కానివారు' అని తలచుచూ తద్వారా పొందుచున్న రోదన -- భేదములకు ఎక్కడైనా అంతు ఉన్నదా? అతిచంచలమగు ఈ మనస్సు క్షణంలో వృద్ధి చెందుతోంది. మరొక క్షణంలో ఏవేవో దీనాలాపనలు ప్రారంభిస్తోంది.

చూచావా సోదరా! ఈ విధంగా ఈ జీవుడు దేహాదులందు ఆత్మబుద్ధి కలిగి ఉంటున్నాడు. అనాత్మరూపములగు అనేక దుఃఖములను తనకుతానే సేకరిస్తున్నాడు. దీనత్వం పొందుచున్నాడు. అనేకసార్లు సుఖదుఃఖములచే జరామరణములచే కొట్టబడుచున్నాడు. ఈ జగత్తు నందు పొరలుచున్న ఈ జనులు రసశూన్యులై, ఎండిన ఆకులవలె చివరికి శైథిల్యమును పొందుచున్నారు. అయినా కూడా కుక్క దాలిగుంటలో కునుకులు తీస్తూ ఏమీ తెలియక ఏదీ గమనించనట్లు వారు ముందూ వెనకా చూచుకోకుండా బ్రతికివేస్తూ అనేక దుర్గతులకు ఎర అగుచున్నారు. అట్టి అసంఖ్యాక అమాయక సంసార జీవులలో ఈ నీ బాల్య స్నేహితుడగు ఈ భాసుడు అనబడే నేను కూడా ఒకడిని. ఇంకేం సుఖం? ఏమి శాంతి?

3. అయితే, ఇప్పుడేం చేయాలి?

విలాసుడు : స్నేహితుడా! ఈ జీవుడు - - జీవనములను చాలా చక్కగా విశ్లేషించావు. ఈ సంసార దుఃఖములకు అంతులేని మాట నిజమే. నీవు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం విచారణ ప్రారంభిద్దాం.

మనకు కలుగుచున్న బంధములకు హేతువేమిటి? చిత్తమే కదా! ఒక పాశము వలె బంధ హేతువగుచున్న ఈ చిత్తమును ఖండింపగలిగామా మరింకేమీ అవసరం లేదు. ఒక చిన్న పిట్ట సముద్రమును దాటలేకపోవచ్చు. కాని గరుడపక్షి సప్తసముద్రాలను కూడా దాటివేయగలదు

Page:567

కదా! ‘వివేకం’ అనే బలం సంపాదిస్తే మనకీ సంసారసాగరం చాలా తేలికగా దాటివేసే గోప్పదజలం కాగలదు. ఇదే జగత్తులో దేహాతీతులు, చిన్మాత్రమునందు స్థితిని సంపాదించినవారు కూడా ఉన్నారు. వారు ఒకబాటసారి జనసమూహమును చూస్తున్నట్లు - ఈ శరీరమును తదితర జగత్తును గాంచగలుగుచున్నారు. మనం ఆ మార్గంలో ఎందుకు ప్రయత్నించకూడదు?

ఈ శరీరం అభివృద్ధి చెందవచ్చు. లేదా, సంక్షోభం పొందవచ్చు. శిథిలం కావచ్చు. అయితే ఏం? చిన్మాత్రస్వరూపులం అయినట్టి మనకు వచ్చే లోటేముంటుంది చెప్పు? రథం చెడినంత మాత్రం చేత రథసారథి చెడతాడా? మనస్సు బాగుండవచ్చు. చెడవచ్చు. చైతన్యమునకు ఏమి నష్టం? సముద్ర జలం తరంగముల రూపంలో విస్తరిస్తుందనుకో... ఆ మాత్రానికి సముద్రము యొక్క పూర్ణత్వానికి ఏమి హానియో చెప్పు?

కమలం, జలం కలిసి ఉండవచ్చు. వృక్షం (కొయ్య), జలం కలిసి ఉండవచ్చు. అయినా కూడా కమలము - జలములకు, వృక్షము - జలము ఏమాత్రం సంబంధం లేదు కదా! అట్లాగే మనలోని పరమాత్మ స్వరూపమునకు, ఈ భోగములకూ ఏ మాత్రమైనా సంబంధం ఉన్నదా? లేదు. సముద్రానికి, అందులోని పర్వతానికి సంబంధం లేనట్లే చైతన్యమునకు బంధహేతువగు సంసారమునకు సంబంధమెక్కడిది?

కనుక నేస్తం! ఆత్మకు ఈ దేహమునకు ఏమాత్రం సంబంధం లేదు. నేను, నీవు ఆత్మస్వరూపులం కాని దేహమాత్రులం కాదే! నా స్వరూపం ఈ దేహమే అను దేహాత్మ బుద్ధియే నీవు చెప్పిన అనర్థాలన్నిటికీ కారణం. ఆత్మ, దేహముల పట్ల అజ్ఞానం చేత ఏర్పడుచున్న అభేద బుద్ధి కారణంగా సుఖ దుఃఖాది చిత్తవృత్తులు వృద్ధి చెందుచున్నాయి. ఒక దృష్టాంతం విను. ఒక నది ఉన్నది. ఆ నది యొక్క ఒడ్డున ఒక పెద్ద మఱి వృక్షం ఉన్నది. ఆ పెద్ద చెట్టు నదీ జలంలో ప్రతిబింబిస్తోంది. అంత మాత్రంచే ఆ వృక్షానికి నదీజలానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అవి రెండూ ఒక్కటే అవుతాయా? లేదు కదా! అట్లాగే ఆత్మ యందు ఈ దేహాదుల ఉనికి ప్రతిబింబిస్తోంది. అయినా కూడా ఆత్మకు దేహమునకు సంబంధం లేదు. ఆత్మయే మనిద్దరి స్వరూపంగానీ ఈ దేహాదులు కాదు కదా! ఈ దేహము, బుది, ఆలోచన, దృశ్యము మొదలైనవి ఆత్మదేహులగు మనం ఉపయోగించే ‘ఉపకరణాలు' మాత్రమే కదా!

ఒక దర్పణములో కనబడే, ప్రతిబింబములు సత్యములా? కాదు దర్పణంలో వస్తువు లేదు కదా! పోని అసత్యములా! వస్తువు యొక్క కదలిక ఆ దర్పణంలో కనిపిస్తోంది కదా! "కనబడుతోంది. కాబట్టి అసత్యము అని అనలేం. అందుచేత దర్పణంలో కనబడే వస్తుజాలం సత్యం కాదు. అసత్యం కాదు. అనిర్వచనీయం. ఆత్మయందు ప్రతిబింబిస్తున్న ఈ శరీరము, దృశ్యము, అనుభవము, మనస్సు - - మొదలైనవన్నీ అనిర్వచనీయం" అని ఆత్మజ్ఞుల అభిప్రాయం. దృశ్యములో ఏది మారినా, మారకున్నా కూడా అది ప్రతిబింబిస్తున్న దర్పణం ఏ మార్పు చేర్పులూ పొందదు కదా! దృశ్యము యొక్క కలిమిలేములచే ద్రష్టలేక, ఆత్మ ఏమీ పొందడు, కోల్పోడు. కొయ్య, శిల, జలము ఛేదించబడి నప్పటికీ దుఃఖములు పొందుచున్నాయా? లేదు. ఈ దేహము కూడా పృథివి మొదలైన పంచభూత

Page:568

పరిణతియే కదా! దాని సంయోగ వియోగములచే గానీ, అది పునాదిగా కలిగి ఉన్న పుత్ర మిత్రాదులతో ఏర్పడే సంబంధ, బాంధవ్యములచేగానీ హాని, ఆహ్లాదం ఎందుకు ఏర్పడాలి? భాసుడు : ఔను. ఏర్పడవలసిన పనిలేదు. కానీ మిత్రమా! ఈ సుఖ దుఃఖాలు పరిగెత్తుకుని వచ్చి మీద పడుచున్నాయి కదా!

విలాసుడు : ఒక కట్టెతో సంయోగం (తాడనం) పొందినప్పుడు జలంలో చలనం, శబ్దము మొదలైనవి కలుగుచున్నాయి. అట్లాగే చేతనముతో ఏర్పడిన సామీప్యత చేత జడమగు ఈ దేహము నుండి శబ్దము, చలనము మొదలైన క్రియలు సంభవిస్తున్నాయి. సుఖ దుఃఖాది వృత్తులు, అనుభవములు ఏర్పడుచున్నాయి. అయితే సుఖ-దుఃఖానుభవములు జడశరీరమునకు సంబంధించినవా? జడమైన దానికి అనుభవమే ఉండదు కదా! కనుక అవి శరీరానివి కావు. పోనీ ఆత్మకు సంబంధించినవా? ఆత్మ సర్వదా నిత్యము, నిర్మలము, శుద్ధము, అప్రమేయము కదా! మరి సుఖ దుఃఖములు ఎవరికి, ఎట్లు ఎందుకు కలుగుచున్నాయి?... అజ్ఞానము చేతనే, అజ్ఞానము కలిగియున్న జనులకు కలుగు చున్నాయి. అజ్ఞానం తొలగిన మరుక్షణం సుఖ దుఃఖాదులు ఉండవు. సర్వము చిన్మాత్రము నందు లయించగా, చిన్మాత్రానుభవమే సర్వత్రా గోచరిస్తుంది. అనగా ఈ దేహం, దేహాన్ని అభిమానించు వాడు ఇద్దరూ సంయోగముచే ఒకచోట ఒనగూడినా ఇద్దరూ సుఖ-దుఃఖములకు అనర్హులే. మధ్యలో అజ్ఞానం వచ్చి, సుఖ దుఃఖములను ఏర్పరచి ఉంచుతోంది. అజ్ఞానము అనగా? సత్యాసత్యము లను, నిత్యానిత్యములను వివేకదృష్టితో చూడకపోవటమే.

అజ్ఞాని యొక్క దృష్టికి ఈ ప్రపంచము సత్యమైనదానివలె గోచరిస్తోంది. జ్ఞాని యొక్క దృష్టికో, ఇది స్వప్నతుల్యంగా అసత్యంగానే ఉంటోంది. ఇద్దరూ ఇదే ప్రపంచంలో సంచరిస్తూ ఒకే విధంగా కార్యక్రమములు నిర్వర్తిస్తూ, ప్రక్కప్రక్కనే ఉంటున్నా కూడా... వారిద్దరూ వేరువేరు దృష్టి అవగాహనలు కలిగి ఉంటున్నారు. ఎంత చమత్కారం!

గొడ్డలిలో కాష్ఠము (Wood), లోహము బాహ్య సంయోగంచే కలిసియే ఉంటున్నాయి. ఆ రెండిటికీ అభ్యంతర సంయోగం జరుగుతోందా? ...లేదే! జ్ఞాని ఈ జగత్తులో సంచరిస్తున్నప్పుడు అభిమానశూన్యుడై, ఆసక్తిరహితుడై ఉంటున్నాడు. మనోవృత్తి దృష్ట్యా చూస్తే ఆతనికి సుఖ దుఃఖా దులు కలిగి ఉండవచ్చు గాక! అభ్యంతరంలో (In the inner Recess) తాను ఆయా అనుభవము లన్నిటికీ వేరై ఉంటున్నాడు. మిత్రమా! భాసుడా! మరల ఒకసారి ఒక ప్రకటన చేస్తున్నాను.

జలం జలంలోని ప్రతిబింబమువలె ఆత్మకు, దేహమునకు ఏమాత్రం సంబంధం లేదు.

విషయ రహితమగు శుద్ధ జ్ఞానం అంతటా, అన్నిటా సర్వదా వ్యాపించియున్నది. ఇక ద్వైత భావముచే కళంకితమైన తదితర జ్ఞానం అంటావా? అదంతా సత్యమే కాదు.

భాసుడు : కాకపోవచ్చు. కాని మనకు తదితరజ్ఞానం అనుక్షణికమై సత్యం వలె సంప్రాప్తిస్తోంది కదా! విలాసుడు : ఎందుచేతనో మనం గ్రహించాలి. బాలుడు అదిగో! ఆ చీకట్లో పెద్ద దయ్యం ఉన్నది.

Page:569

నాకు కనిపిస్తోంది అని తండ్రితో పలికాడనుకో. ఎంతో భయపడుచున్న ఆ బాలునికి ఆ తండ్రి ఏం చెపుతాడు? "బిడ్డా! నీవు పగలు ఆడుకునేటప్పుడు మట్టిచెట్టు చూచావే! అదే ఆ ఆకారం. అక్కడ దయ్యం లేదు, గియ్యం లేదు. నీకేం భయం అక్కర్లేదు అని చెపుతాడు కదా! ఆ బాలుడు దయ్యం గురించి భావన చేసినట్లు, దుఃఖరహితమగు ఆత్మ తనయందు దుఃఖములకు సంబంధించి భావన చేస్తోంది. ఒకడికి స్వప్నంలో ఎక్కడో ఉన్న, లేదా, ఎప్పుడో గతించిన బంధువులు కనిపిస్తారు. వారితో ఆ స్వప్నంలో ఏర్పడే సమాగమం వాస్తవమా? ... కాదు కదా! ఆత్మకు, దృశ్యమునకు గల సంబంధం కూడా అట్టిదే!

స్థాణువును చూచి 'భూతం' అని అనుకుంటే స్థాణువు భూతం అవుతుందా? కాదు. కానీ ఆ దుష్టభూతము యొక్క అనుభూతిని అమాయక బాలుడు పొందుచున్నాడు. ఆత్మకు విషయములతో సంబంధం లేనప్పటికీ అంతఃకరణము యొక్క నిశ్చయముచే సంబంధం ఏర్పడుతోంది.

కనుక, దేహములకు ఆత్మకు ఏ సంబంధం మనకు తోచుచున్నదో... అదంతా మిథ్యయే. ఒక కొయ్యబొమ్మ నీళ్ళలో పడినంత మాత్రం చేత నీరు ఆ బొమ్మలో ప్రవేశిస్తుందా? అట్లాగే దేహ ధ్యాస లేనట్టి ఆత్మ కూడా దుఃఖములచే బాధించబడదు.

భాసుడు : అంటే అర్థం ఏమిటి? దేహధ్యాస చేతనే దుఃఖము ఉండటం జరుగుతోందనా? విలాసుడు : అక్షరాలా అంతే. దేహభావన చేతనే ఆత్మ దుఃఖం పొందుతోంది. కాబట్టి దేహాత్మ భావన త్యజించుటచే ఆత్మ ముక్తి నొందగలదని విజ్ఞుల స్పష్టమైన అభిప్రాయం. అదే అనుసరణీయం కూడా!

ఒక తటాకంలో ఉన్నట్టి నాచు, ఆకులు, కాష్ఠము, జలము - పరస్పరం ఒకచోట ఉన్నప్పటికీ, వాటిలో ఒకదానితో మరొక దానికి అంతరంగ సంబంధం లేదు. కనుక అవి ఒకదాని పట్ల మరొకటి దుఃఖరహితంగానే ఉంటాయి. ఈ దేహ-ఇంద్రియ-మనస్సు-ఆత్మలు ఒక్కచోటే ఉన్నప్పటికీ అంతరంగ సంబంధం లేకపోతే దుఃఖరాహిత్యమును పొందగలం.

వృక్షమునకు కారణం బీజమే అయినట్లు, ప్రపంచంలోని సర్వప్రాణులకూ "అంతరంగంలో గల సంగము ఈ జరా మరణ మోహములకు కారణమగుచున్నది. ఏ జీవుని యందు అంతః సంగము (Attachement inwardly) ఉంటుందో ఆతడు మాత్రమే ఈ సంసార సాగరమున మగ్నుడు అగుచున్నాడు. అంతఃసంగ రహితుడో... సంసార సాగరమును దాటిన వాడగుచున్నాడు. అంతః సంగము గల చిత్తము అనంతశాఖాయుతమై ప్రకటితమౌతోంది. అంతఃసంగము లేని చిత్తము సంగరహితమై తనకు తానే వినష్టమగుచూ అచిత్తముగా, చితస్వరూపంగా పరిణమిస్తోంది.

విషయాసక్తము కాని చిత్తము సంసారమున ఉన్నప్పటికీ ఇబ్బందేం లేదు. అట్టి చిత్తము స్ఫటికమణిలింగమువలె అతి పవిత్రమైనది. అది విముక్తమే అవుతుంది. అట్లా కాకుండా చిత్తము విషయాసక్తమై ఉన్నదా ... అది గొప్పతపస్సు చేస్తున్నదైనా దృఢబంధము కలదిగానే ఉంటుంది.

Page:570

అన్తఃసక్తం మనో బద్ధం ముక్తం సక్తివివర్జితమ్ | అన్తఃసంసక్తిరేవైకం కారణం బన్ధమోక్షయోః II (శ్లో 34, సర్గ 67)

అంతఃసంసక్తియుతమైన మనస్సు బద్ధము. అంతఃసంసక్తిరహితమైన మనస్సు ముక్తము. కనుక, అంతఃసంగమే బంధ మోక్షములకు కారణం.

ఒక నౌక కొన్ని పదార్థములను తీసుకుపోతున్నదనుకో... అందులోని పదార్థములు దోషములు, ఆ నౌక పయనిస్తున్న జలంలోని తత్వాదులు వేరు వేరు కదా! ...అంతఃసంగము లేనివానికి కార్యములు ఆచరిస్తున్నప్పటికీ, కర్తృత్వము ఉండదు.

ఒకడు సుఖంగా పట్టు పరుపులపై పరుండికూడా స్వప్నంలో పులి, అరణ్యము మొదలైనవి చూచినప్పుడు అవన్నీ అనుభవించుచున్నవాడే అవుతాడు. కొండమీదనుంచి దూకటం, పులి మీద బడటం వాస్తవం కాకపోయినా, అనుభవంమాత్రం సిద్ధిస్తోంది. అనగా, ఇక్కడ జరుగుచున్నదేమిటి? చిత్తము తాను ఒక అనుభవమునకు కర్త అయినప్పుడు ఇంద్రియములు పని చేయకపోయినా, కర్తృత్వము, భోక్తృత్వము సిద్ధిస్తోందా!

కనుక మనం చిత్తమును అకర్తృత్వమునకు అలవాటు చేయాలి. చిత్తముయొక్క అకర్తృత్వముచే అభిమానరాహిత్యము సిద్ధించగలదు. చిత్తమును సర్వకార్యక్రమములకు అతీతస్థితిలో ప్రస్థానం చేయాలి. అప్పుడు జడపదార్థమాత్రమైన ఈ దేహం మననేం చేయగలదో చెప్పు?

అకర్తయగు మనస్సు - మనం ఈ మనస్సును సక్తత (Attachment) లేనిదానిగా సిద్ధింపజేద్దాం. అది క్రమంగా సర్వక్రియలకు 'నా హమ్ కర్తా! (నేను కర్తను కాదు' అను అభ్యాసం ఆశ్రయిస్తూ ఉండుగాక! అప్పుడు మన మనస్సు అకర్తయే అవుతుంది. కర్తగాని మనస్సు కర్మఫలభోక్తకూడా కాదు. కర్తృత్వ, భోక్తృత్వములు తొలగినప్పుడు 'సంచిత-ప్రారబ్ధ-ఆగామి కర్మలు స్పృశించజాలవు. అప్పుడది తన యొక్క అధిష్ఠానమగు శుద్ధ చైతన్యముగా శేషించగలదు. తరంగములు శమిస్తే ప్రశాంతజలమే శేషిస్తుంది కదా!

భాసుడు : నీవు చెప్పేదంతా బాగానే ఉన్నది. కానీ, మనస్సు ఎదురుగా ఉన్న వస్తువులను పొందకుండా ఎట్లా ఉంటుంది? ఎదురుగా జగత్తు ఉండగా అకర్తృత్వం, అసంగం ఎట్లా సాధ్యం? విలాసుడు : ఒకానొకని మనస్సు దూరంగా ఉన్న ఏదో ఉత్సాహభరితమైన దృశ్యమును చూడటంలో లగ్నమై ఉన్నదనుకో... అప్పుడతడు సమీపంలోని శబ్ద, స్పర్శలు గుర్తించలేకపోవటం మనకు అనుభవ మగుచున్న విషయమే కదా! అనగా, దీని అర్థం ఏమిటి? మనస్సు ఎక్కడ లగ్నమైతే అక్కడ అనుభవం ప్రాప్తిస్తోందిగాని, శరీరం ఉన్నచోట కాదు - అని కదా! ఈ చిన్న అనుభవాన్ని ఆసరాగా తీసుకుంటే, అసంసక్తుడు (Non - Attached) అయినట్టివాడు ఈ ప్రపంచంలో ఏకార్యంచేసినా, లేక జనులను సంహరించినా లిప్తుడు కాడు - అనే మహత్తరమైన సిద్ధాంతం మనం గ్రహించగలుగుతాం.

సంసక్తి లేని మనుజుడు విక్షేపరహితమైన సుఖమును పొందుతాడు. ఇందులో నాకేం సందేహం లేదు. ఆతడు బాహ్యమున క్రియలు ఆచరించ వచ్చు. లేదా ఆచరించక పోవచ్చు. అట్టి వానికి

Page:571

కర్తృత్వ, భోక్తృత్వములు ఉండవు. అంతఃసంగము లేని మనస్సు అకర్త. అదియే ముక్తము, శాంతము, ఉక్తము, నిర్లిప్తము కూడా.

ప్రియనేస్తం! సర్వపదార్థముల అంతరమున ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మకు బాహ్యంగా పరస్పర సమ్మిళితమైనట్టి పంచకోశములు (అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ కోశాలు) ఇంద్రియార్థాలు (శబ్ద-స్పర్శ-రూప - రస గంధములు), భోగ్య పదార్థాలు గోచరిస్తున్నాయి.

జీవుడు పంచకోశముల సమ్మేళణముచే బాహ్యపదార్థములను ఆశ్రయించటమే సంసారము. ఈ జీవుని స్వరూపం, స్వభావం, ఆనందమయమే అయినప్పటికీ, సంసారమును ఆశ్రయించుటచే ఆత్మానందము నుండి విడివడుచున్నాడు. పూర్ణుడై కూడా అసంపూర్ణానుభవం తెచ్చిపెట్టుకుంటున్నాడు. అట్టి బాహ్యపదార్థ ధ్యానం నిరసించాలంటే ఒక్కటే ఉపాయం, అది సర్వదుఃఖప్రదమగు అంతరంగ విభాగమును మొదలంటా జయించటమే”.

అందుకొరకై మనం ప్రయత్నిద్దాం. నదీజలం సముద్రజలంలో ప్రవేశించినప్పుడు ఆ సముద్ర జలంతో ఏకత్వం పొందుచున్నట్లు ఈ చిత్తము కూడా తనలోని అంతర్సంగదోషం త్యజించినప్పుడు ఇప్పటి సంసారదశనుండి విడివడినదై ఇతఃపూర్వపు శాంతరూపమును పొందుచున్నది. ఆకాశమువలె సునిర్మలమైనదా ....ఇక అప్పుడు ముక్తరూపమగు ఆత్మతో ఐక్యమొందుచున్నది.

4. సంసక్తత - - అసంసక్తత

(Attachment - Non Attachment)

భాసుడు : అత్యుత్తమ శ్రేయోభిలాషియగు ఓ సచివుడా! "సంగమే అంతటికీ కారణం" - అనే నీ వాక్యం నా కళ్ళు తెరిపిస్తున్నాయి. అయితే జీవునకు అసలు 'సంగము' అనే బంధం ఎట్లా కలుగుతోంది? మరల, మోక్షం ఎట్లా ఏర్పడగలదు? సంగమును నివారించటమెట్లా?

విలాసుడు : ఈ జీవుడు విచారణ చేయకపోవుటచేతనే అనర్థములన్నీ వచ్చిపడుతున్నాయి. ఆతడు ఎందుకో “ఇది దేహము, ఇది దేహి - అను విభాగం చేసి విచారణ చేయటానికి ఉపక్రమించటమే లేదు. పైగా, ఇక్కడ ఏర్పడి ఉండే పరస్పరధర్మములు గురించి కొన్ని విపరీత భావాలను పొందుచూ, ఈ దేహమే నేను, ఆ దేహమే ఆతడు అను దృష్టిని, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు. అదే సంసక్తి. ఆ సంసక్తియే జీవుని బద్ధునిగా చేస్తోంది. మనం దానిని తొలగించుకోవటానికి ఉపక్రమించాలి.

ఇందు తారసపడే ప్రతి శరీరధారీ అనంతాత్మస్వరూపుడే. అట్టి అనంతాత్మ తత్త్వమును దురభ్యాసవశం చేత దేశ కాల వస్తు పరిచ్ఛేదమగు సంకుచిత దృష్టితో గాంచుచున్నాం. భాసుడు : అట్టి దురభ్యాసం ఎట్లా మనకు అలవడింది? దాని యొక్క రూపమేమిటి?

Page:572

విలాసుడు : అపరిచ్ఛిన్న సుఖస్వరూపమగు ఆత్మను విస్మరించి మనం విషయసుఖము కొరకై ఏర్పడి ఉండే అభ్యంతర సంసక్తి వైపుగా అభిముఖమవుతున్నాం. అట్టి అభిముఖత్వమే బంధానికి కారణమ గుచున్నది. ఇక జీవన్ముక్తుడో, ఇదంతా కూడా ఆత్మయే కదా! ఇక నేను దేనిని కోరాలి? దేనిని త్యజించాలి? అట్టి శ్రమ నాకు అనవసరం ...అను అసందిగ్ధమైన (Beyond doubt) అసంగ స్థితిని కలిగి ఉంటున్నాడు.

అసంసక్తుడు -

భాసుడు : అసంసక్తుని మనఃస్థితి, కార్యక్రమములు ఎట్లా ఉంటాయో చెప్పు. విలాసుడు : ఆతని అవగాహన ఇట్లా ఉంటుందిపరిచ్ఛిన్నమగు అహంకారానికి నేను విషయమే కాదు. నాకు భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి, మిథ్యారూపములు మాత్రమే అయిన ఈ దేహాదులు ఉండు గాక! ఉండకుండు గాక! నేను మాత్రం వీటన్నిటికీ వేరైన వాడను. సర్వదా అసంగుడను.”

అట్టి దృఢ నిశ్చయము కలిగిన అంతఃకరణము గలవాడు ముక్తభాజుడే అవుతాడు. ఆతనికి "అయ్యో! ఈ కర్మలు చేయవలసి వస్తోందే! వీటిని త్యజించాలి కదా అను కర్మత్యాజ్యాసక్తి ఉండదు. ఫలేచ్ఛ లేకపోవడం చేత కర్మలందు ప్రవేశించడు. కర్మలు సిద్ధించినా, సిద్ధించకపోయినా సమభావము కలిగి ఉంటాడు. హర్షశోకములకు వశుడు కాకుండా ఆత్మ తత్త్వము నందు మాత్రమే నిష్ఠ కలిగి

ఉంటాడు.

సర్వకర్మఫలాదీనాం మనసైవ న కర్మణా |

నిపుణం యః పరిత్యాగీ సో సంసక్త ఇతి స్మృతః II (శ్లో 8, సర్గ 68)

నేర్పుతో సర్వకర్మలను ఆయా క్రియలతో కాక మనస్సుతో త్యజించివేసి ఉంటాడు. ఆతని యొక్క ఆత్మజ్ఞాన ప్రభావం చేత సర్వ దుశ్చేష్టలు స్వయంగా, అకృత్రిమంగా అడగి పోతాయి. ఆత్మ శ్రేయస్సు కొరకై శ్రవణ-మననాది సత్రియలందు మాత్రమే శ్రద్ధాసక్తులు కలిగి ఉంటాడు.

సంసక్తి - మిత్రమా! భాసా! సంసక్తి వలననే దుఃఖరాశి అంతా విస్తరించి, వేలాది శాఖలుగా ప్రకటితమౌతోంది.

“ఒక గాడిద పెద్ద బరువు మోస్తూ త్రాడుచే ఈడ్వబడటం... ఒక వృక్షం శీత-వాత-తాపాలను మౌనంగా అనుభవిస్తూ కదలక మెదలక ఉండటం... ఒక పురుగు అనేక శరీరబాధలకు లోనగుచున్న ప్పటికీ కూడా భూరంధ్రంలో కాలం గడపటం... ఒక పక్షి బాణ, శిలాదుల ప్రహారమునకు భయ పడుతూ చెట్టుపై ఉండి ఆకలితో అలమటించటం... ఒక లేడి గడ్డి పరకలు కొరుక్కు తింటూ ఎప్పుడు ఏ కిరాతకుడు బాణం వేస్తాడోనని భయంతో వెనుకకు, ముందుకు బెదురుచూపులు చూడటం... పుణ్య పాపాధికారులగు జనులు పదే పదే అంగములను పోగొట్టుకుంటూ మృగ-క్రిమికీటక ఉపాధులను పొందటం, తృణములుగా స్థావరముగా పుట్టి జరామరణ పరంపరలను రుచి చూడటం.”

Page:573

. ఇవన్నీ కూడా సంసక్తి యొక్క ప్రభావం చేత ఏర్పడుచున్న ఫలవిస్తారమే. అది అనేక అనర్థములతో కూడి ఉన్నదై, బయట, లోపల కూడా అనేక పదార్థములవైపుగా విస్తరించి ప్రవర్ధమాన మగుచున్నది. 'సంసారము' అనునది సంసక్తి యొక్క రూపమే.

అయితే ఈ సంసక్తి రెండు రకాలుగా ఉంటూ రెండు వ్యతిరిక్త దిశలలో నియమించబడి ఉంటోంది.

1. వంద్య (ప్రశంసింపతగిన) సంసక్తి - ఇది వందనీయులగు తత్వవేత్తలలో ఉండే సంసక్తి. సంసారవర్జితమై, వివేకము చేత, ఆత్మతత్త్వబోధ చేత జనిస్తుంది. దీని ప్రభావం చేతనే శంఖ-చక్ర -గదాధారుడగు విష్ణువు వివిధ క్రియలచే ముల్లోకములనూ పాలిస్తున్నారు. నిరాలంబుడగు సూర్య భగవానుడు ప్రతిరోజూ గగనమార్గంలో యాత్ర సలుపునది ఈ వంద్యసంసక్తి చేతనే. అట్లాగే బ్రహ్మదేవుడు సృష్టికల్పన చేస్తున్నది, మహాకల్పాంతము తరువాత విదేహముక్తి వైపుగా పయనిస్తున్నది ఈ వంద్యసంసక్తి ప్రాభవం చేతనే. దీనిచేతనే విభూతిభూషితుడగు శివుడు గౌరి’అను బంధమున ఆసక్తుడై స్వశరీరమున స్థితి కలిగి ఉండి భక్తుల పాలిటి కొంగుబంగారం అగుచున్నారు. దీని ప్రభావం చేతనే బ్రహ్మాండమున సిద్ధలోకములు, తదితర పాతాళలోకములు జరామరణ వర్జితములైన మహర్లోకం, జనోలోకం, తపోలోకం, చరాచర ప్రకృతి రచన, స్థితి కలిగి ఉన్నాయి.

2. వంధ్య (సంకుచితమైన ప్రయోజనం కలిగి ఉండే) సంసక్తి - ఇది అజ్ఞానులలో ఉంటుంది. పరమపురుషార్థ రహితమైనది. ఆత్మతత్త్వ జ్ఞానరహితము. దేహధారులు దేహధారణ వైపుగా ఆకర్షించబడుటకు ఇది కారణం. దీని యొక్క రూపం సంసార దృఢసక్తియే. గ్రద్ద ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ క్రింద ఉన్న మాంసపు ముక్కపై ధ్యాస కలిగి ఉన్నట్లు వంధ్యసంసక్తి వశం చేత మనస్సు నందు వ్యర్ధసౌందర్యాభిలాష కలిగి జీవుడు 'భోగములు' అనే లంపటంలో పడుచున్నాడు.

మిత్రమా! భాసుడా! “సంసక్తి యొక్క ప్రాభవం ఏమని చెప్పమంటావయ్యా! సంసక్తి వశం చేతనే గాలి వీస్తోంది. పంచభూతాలూ స్థితి పొంది ఉంటున్నాయి. ఈ చరాచర జగత్తంతా ప్రవృత్త మౌతోంది. స్వర్గంలో దేవతలు, భూమిపై మనుజులు, పాతాళంలో సర్పములు, అసురులు, మేడి పండులో పురుగులు సంసక్తి చేతనే స్థితి కలిగి ఉండటం జరుగుతోంది. దాని వశం చేతనే జలాశయ తరంగాలలో అసంఖ్యాకమైన ప్రాణికోట్లు ఉత్పన్నమగుచున్నాయి, చస్తున్నాయి లేస్తున్నాయి,

పడుచున్నాయి. సంసక్తత చేతనే దేశసంచారం తరువాత కూడా నీకు సందేహాలు కలిగి ఉండటం జరుగుతోంది. మత్సన్యాయానుసారం బలవంతుడు బలహీనుని బాధించటం, శుష్కప్రతాపాలు జనులు ప్రకటించటం, నక్షత్ర మండలముల ఉదయాస్తమయాలు, చంద్రుని శీతల ప్రకాశం, ఇంద్రాది దేవతల సాంసారిక చర్యలు - అన్నిటికీ మూలం ఆయా జీవుల సంసక్తత వలననే.

నేస్తమా! అంతేకాదు. చిత్ర విచిత్ర వస్తుజాలముతో కూడిన ఈ ఎదురుగా ఉండే దృశ్య జగత్తును చూస్తున్నావు కదా! ఇదంతా వాసనా వశం చేత ఎవ్వరో చిదాకాశమున లిఖించారు. వాసనకి గల మరో పేరు సంసక్తత.

Page:574

భాసుడు : అవును. ఈ జగత్తు బహుచమత్కారములైన విశేషాలతో కూడుకుని ఉన్నది. ఆసక్తి గల ఎవ్వరో దీనిని రచించారు.

మనఃసబ్జెకరన్గేణ శూన్యే వ్యోమ్ని జగన్మయమ్ | యదిదం రచితం చిత్రం తత్సత్యం న కదాచన (శ్లో 40, సర్గ 68)

విలాసుడు : శూన్యాకాశంలో మనఃసంసక్తి అనే రంగుతో లిఖించబడిన ఈ జగతిచిత్రము సత్యమైనది ఎన్నటికీ కాదు.

భాసుడు : కాదా?

విలాసుడు : కానే కాదు. ఎందుకంటే ఇదంతా సంసక్తత గల జీవునిచే కల్పించబడి, సంసక్తత గల జీవగణముచే పొందబడుచున్నది. తృష్ణయే సంసక్తతకు నాంది.

సంసక్తత బహు ప్రమాదభరితమైనది కూడా అని గ్రహించు. అగ్నిశిఖచే తృణములుగా భక్షింపబడుచున్నట్లు ఆసక్త చిత్తుడు దుఃఖములచే శుష్కించుచు జ్వలించుచున్న నరకాగ్నులకు ఎండుకట్టె వలె అగుచున్నాడు. అనగా నరకాగ్నులన్నీ అట్టి ఆసక్తిసహిత జీవుల చేత, వారి కొరకే జ్వలిస్తున్నాయి. ఆతడు పొందని దుఃఖమంటూ ఎక్కడా ఉండదు. ఈ ప్రపంచంలోని దుఃఖజాలమంతా సక్తచిత్తుని కొరకు విస్తరిస్తూ రారమ్మని ఆహ్వానిస్తోంది. అవిద్య అంటే మరేమో కాదు. మనఃసంగమే అవిద్య. అదియే ఈ భారభూతములగు జరామరణములను కలుగజేసి కాలువ నీళ్ళులాగా విస్తరింపజేస్తోంది.

మనం ఇంతసేపూ చెప్పుకున్నది ఒక్క వాక్యంలో చెప్పాలంటే... అంతర సంసక్తియే అసలైన బంధం. దాని పరిత్యాగమే విమోచనం.

ఆసక్తి రహితమైన మనస్సు అనంతాకాశం వలె ప్రశాంతంగా ఉంటుంది. అట్టి మనస్సు ఉన్నట్లు కనబడుచున్నప్పటికీ లేనిదే కనుక, మనం జ్ఞానదృష్టిని సంపాదించాలి. జ్ఞానముచే విషయ వినాశనం సిద్ధిస్తుంది. విషయ రాహిత్యముచే మనస్సు సంసక్తి రహితంగా ఉంటుంది. సంసక్త రహితమైన మనస్సును సంపాదిస్తే... అదియే ముక్తి. అట్టివాడే ముక్తుడు.

5. ఆత్మదృష్టి - - ఆసక్తి రాహిత్యం

విలాసుడు : కనుక స్నేహితుడా! మనం సర్వదా సర్వ వ్యవహారములు ఆచరించుచున్నప్పటికీ, సర్వులతో కూడి ఉంటున్నప్పటికీ, నిషిద్ధములైన, అనిషిద్ధములైన లౌకిక, శాస్త్రీయ కర్మలను నిర్వర్తించ వలసి వస్తున్నప్పటికీ వివేకవంతులమై ఉండాలి. మనస్సును అసంసక్తమైన దానిగా ఉంచటం అభ్యసించాలి.

భాసుడు : అనగా మనస్సును ఏం చేయాలి?

విలాసుడు : మనం మనస్సును ...సాధ్య-అసాధ్యముల గూర్చిన క్రియలందు గాని, గతించిన సంఘటన (లేక) అనుభవములందు గాని ఉంచవద్దు. అట్లాగే దానిని వర్తమాన పదార్థములందు

Page:575

గాని, ఆకాశమునందు గాని, దిక్కులందు గాని, వృక్ష జంతు జీవులందు గాని, తదితర ఆధిభౌతిక పదార్థము లందు గాని నిలుపవద్దు. అదే విధంగా, స్త్రీ పుత్రాదులందు గాని, ఇంద్రియవిషయ వృత్తులందు గాని, ఆధ్యాత్మిక వస్తుసముదాయమునందు గాని, భ్రూమధ్యమున గాని, నాశికాగ్రశమునందు గాని, ముఖమునందు గాని, కంటియందు గాని... నియమించవద్దు.

అంతేకాదు. మన మనస్సును అంధకారమునందు గాని, ప్రకాశమునందు గాని, హృదయాకాశమున గాని, జాగ్రత్ స్వప్న సుషుప్తులందు గాని, సత్వ-రజః-తమో గుణములందు గాని, గుణసమ్మేళనములందు గాని, కార్యవర్గమునందు గాని, కారణమగు అవ్యక్తమునందు గాని, సృష్టి యొక్క ఆదిమధ్యాంతములందు గాని, దగ్గిరలో గాని, దూరంగా గాని, నామరూపాత్మకమగు పదార్థ సమూహములందు గాని, శబ్ద- స్పర్శ- రూప రస గంధములందు గాని, భూతభవిష్యత్ జ్ఞానమునందు గాని, చిరంజీవాది సిద్ధులందు గాని మనం ఆసక్తం చేయరాదని నా సూచన, ప్రతిపాదన కూడా. 'సర్వాసక్తి రాహిత్యం' అంటే అదే.

భాసుడు : బాగానే ఉన్నది కాని, మరి ఈ మనస్సును ఎక్కడ ఉంచాలి. అనుక్షణం ప్రాప్తిస్తున్న క్రియా వ్యవహారముల మాటేమిటి? మనం వీటిని నిర్వర్తించుదామా! వద్దా?

విలాసుడు : మనం బ్రహ్మమున మాత్రమే స్థితికలిగి ఉందాం. సంగరహితులమై బ్రహ్మభావమును పొందిన తరువాత ఇక ఈ ప్రాప్తించే వ్యవహారములు నిర్వహించవలసి వచ్చినా ఒక్కటే? అక్కర్లేక పోయినా ఒక్కటే. మేఘములకు ఆకాశమునకు సంబంధం లేనట్లు ఆత్మరతులమగు మనకు "ఈ కర్మలు - వాటిని నిర్వర్తించుటచే ఏర్పడే ఫలితములు మొదలైన విశేషములతో ఏమాత్రము సంబంధం ఉండదు... ఏర్పడదు.

భాసుడు : అంటే మనం బుద్ధికి కూడా సాక్షిత్వం వహించి ఉంటామా?

విలాసుడు :నేను బుద్ధికి సాక్షిత్వం వహిస్తున్నాను" అను రూపమున ఉండే ప్రయత్నపూర్వక ప్రయాసను కూడా వదలివేద్దాం. శాంతులమై, చిదనరూపులమై దేదీప్యమానమగు మణి వలె స్వాత్మ యందు స్థితికలిగి ఉందాం. క్రియాఫలేచ్ఛా రహితులమై ఉందాం. నిరంతరాత్మోదయం

కలవారల మగుదాం.

సంసక్తి కారణమగు అవిద్యాకామవాసనలకు మనయందు ప్రవేశార్హత ఉండకుండు గాక! ఇక క్రియలంటావా, అవి మనం ఒనర్చుచున్నప్పటికీ వాటి ఫలితములను మనం పొందవద్దు. ప్రారబ్దం క్షయం అయ్యేవరకూ ఈ దేహం ఉంటే ఉండనీ. దీని యొక్క ఉనికి గాని, లేమి గాని మనకు సంబంధించని విషయాలై ఉండు గాక! ఈ దేహమును, దీనితో ఏర్పడే విశేషాలను ఆత్మదృష్టితోనే చూస్తూ ఉందాం.

Page:576

6. ఆత్మారామం

విలాసుడు : మిత్రమా! భాసా! నేను అనేక ప్రదేశాలు సంచరించాను. నాకు విశాలాంతఃకరణులగు కొందరు మహనీయులు తారసపడ్డారు. వారంతా అసంసక్తి సుఖము (The pleasantness of non - attachment or non - relatedness)ను పొందుచూ, ఇదే ప్రపంచమున వ్యవహరిస్తూ కూడా భయ శోక వర్జితులై ఉంటున్నారు. మహాప్రక్షోభం కలిగించగల “ధనం నశించటం, దుర్బలత్వం, అవమానాలు వచ్చి పడటం మొదలైన సందర్భాలలో కూడా ఏమాత్రం క్షోభను కలిగి ఉండకుండా ఉంటున్నారు. పరమార్థ సుఖముచే అంతఃకరణమునందు పూర్ణులై, ముఖంలో పూర్ణచంద్రశోభ వీడకుండా ప్రశాంతచిత్తులై ఇదంతా దర్శిస్తున్నారు. చిల్లగింజలు నీళ్ళలో వేస్తే నీరు నిర్మలం అయి ప్రకాశిస్తున్నట్లు, ఈ ఉపాధిని ఉపయోగించి సునిర్మలత్వాన్ని సంపాదించి సంచరిస్తున్నారు. విషయాసక్త రహితులు, సంతాపరహితులు, ఉత్తమమనస్సు గలవారు అగు మహనీయులు ఎక్కడుంటారో ఆ పరిసరాలు కూడా పరమ పవిత్రమౌతాయి.

జ్ఞాని నిత్యమూ ఆత్మయందే లీనమై ఉంటాడు. కనుక తదితర సర్వవిషయములూ చలిస్తున్నప్పటికీ తాను మాత్రము సర్వసమయము లందూ స్వస్థుడై ఉంటాడు. బాహ్యంలో కనిపించే సంచలనములు, క్షుభితమైన స్థితి - గతుల విన్యాసములు ఇక అతనిలోనికి ప్రవేశించలేవు.

భాసుడు : అంటే, ఇక్కడ ఉండే ఆయా పరిస్థితులకు ఆతడు స్పందించడంటావా?

విలాసుడు : జలంలో ప్రతిబింబించే సూర్యుడు తరంగముల అస్త వ్యస్తములకు సంక్షుభితమగుచున్నట్లు కనిపించినా కూడా, బింబ స్వరూపుడగు ఆకాశ సూర్యుడు ఆ ప్రతిబింబ సంబంధమైన అస్తవ్యస్తములచే స్పర్శించబడతాడా?

భాసుడు : లేదు. ఎట్లా స్పర్శించబడతాడు? ఆకాశంలో వెలుగుచున్న సూర్యునకు, జలంలో ప్రతి బింబించే ప్రతిబింబమునకు స్పర్శసంబంధం ఏమి ఉంటుంది?

విలాసుడు : బాగా చెప్పావు. తరంగములలోని సూర్య ప్రతిబింబము పొందే చిందరవందరలకు వాస్తవ సూర్యునికి ఏమాత్రం చెందనట్లు, వ్యవహారతత్పరుడు కావలసివచ్చిన జ్ఞానికి ఆ వ్యవహారా లలోని ప్రియాప్రియములు, సఫల విఫలములు, కార్య కారణములు - తనకు సంబంధించనివై ఉంటాయి. వ్యవహార తత్పరుడై ఉంటూనే నేను నిత్యము, సత్యము, నిష్కళంకము అగు ఆత్మను. ఈ కర్మలు, తత్ఫలములు, సంబంధములు నన్నెట్లా అంటుతాయి? అనే ప్రజ్ఞను కలిగి ఉంటాడు. ఆతనిని స్పృశించ గలిగేదీ, ఆశ్చర్యపరచ గలిగేదీ, మృత్యువుతో సహా... ఈ భూనభోంతరాళాలలో ఏదీ ఉండదు... ఉండజాలదు. మనం జ్ఞానులం కావటానికి ప్రయత్నించడమే ఉచితం కదా! మనం ప్రబుద్ధులం కావాలి.

భాసుడు : ప్రబుద్ధులు అనగా ఎవరు? ఎట్లా ఉంటారు? సంసారంలో చరించేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది?

Page:577

విలాసుడు : జ్ఞానభరితము, నిర్మలము అగు బుద్ధిని సంపాదించినవారిని ప్రబుద్ధులు అనే పేరుతో చెప్పుకుంటున్నాం. అట్టి "ప్రబుద్ధులు ఆత్మోదయ సమన్వితులు" అగు మహనీయులు ఎల్లప్పుడూ ఆత్మ యందే రమిస్తూ ఉంటారు. వారు బాహ్యానికి నెమలి పింఛము యొక్క చివరి భాగంలాగా చంచలంగా ఉండవచ్చు గాక! అంతరమున మాత్రం మేరు పర్వతంలాగా అచంచలంగా ఉంటారు. తెల్లగా ప్రకాశిస్తున్న మణిలో ఎదురుగావున్న ఎఱ్ఱటి వస్తువులు ప్రతిబింబిస్తుంటే, అంతమాత్రం చేత, ఆ ఎఱుపు మణికి అంటుతుందా?

ఆత్మదశ పొందిన చిత్తము సుఖ దుఃఖములచే రంజితం కాదు. కమలం జలంలో ఉన్నప్పటికీ జలం కమలమును అంటదు కదా! ఏ జీవుడైతే జీవేశ్వర తత్త్వమును ఎఱిగి, సచ్చిదానందమగు ఆ పరమాత్మ యందు సంలగ్నమైన చిత్తము కలవాడై ఉంటాడో అట్టివానిని ఈ సంసార విషయాలు, విశేషాలు ఏమాత్రం కలుషితం చెయ్యలేవు. పరమాత్మ జ్ఞానం పొంది, సర్వకల్పనా వర్జితుడై ధ్యానం యొక్క భావ-అభావము లందు కూడా ఆత్మానుభవమగ్నుడై ఉండే వానిని 'ఆత్మారాముడు, స్వసక్తుడు’ అని కూడా పిలుస్తూ ఉంటారు. అట్టి వాడు భగవంతుడే అవుతాడు.

భాసుడు : మనం అసంగత్వం పొందేదెట్లా?

విలాసుడు : ఆత్మారాములము (ఆత్మ యందు రమించువారు) అయినప్పుడే ఈ ప్రపంచంతో మనం అసంగత్వం పొందగలుగుతాం. ఆత్మజ్ఞానోత్కర్ష చేత మాత్రమే సంసక్తి నశిస్తుంది. దానికి వేరే మరింకో మార్గమేదీ లేదు.

మనం ఈ జాగ్రత్ స్వప్నములలో తోచుచున్న ద్రష్టత్వమునకు కూడా అతీత భావులమవుదాం. భావాతీతమై ఉన్నట్టి మన యొక్క రూపం ద్వంద్వరహితం, నిత్యం, ఆత్మోదయాన్వితం అని శాస్త్రములచే అభివర్ణింపబడింది కదా! మనం శాస్త్రములు సూచిస్తున్న ఆత్మ యొక్క విశేషణముల పట్ల దృఢమైన భావనను ఆశ్రయించి ఉంటే ఆత్మ ప్రకాశరూపులమై వెలుగొందగలం. చంద్రబింబం క్రమంగా తన కళలను త్యజిస్తూ అమావాస్య వచ్చేసరికి తన యొక్క బింబ భూతమగు సూర్యుని యందు ఐక్య మవుతుంది చూచావా? (ఇక్కడ సూర్యుడు బింబంగాను చంద్రునియందు కనబడే ప్రకాశము ప్రతిబింబ వశంగా ఉద్దేశించబడింది).

మనం నేను నిత్యుడను. ద్వంద్వరహితుడను. ఆత్మయోగాన్వితుడను. జన్మ మృత్యువులకు కూడా సాక్షి మాత్రుడను. ఇవి నా సమక్షంలో జరిగేవి. నేను వీటికి సంబంధించినవాడను కాను. అఖండుడనగు నాకు ఆద్యంతాలు లేవు" అనునట్టి బ్రహ్మభావమును పొందుదాం.

మన చిత్తము తన చిత్త దశను వదలగా, మనం చిత్తరహితులమౌదాం. సర్వకల్పనా రహితమైనట్టి ప్రశాంత స్థితిని పొందుదాం. జాగ్రత్ నందు సుషుప్తి అంటే అదే. అప్పుడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సుఖదుఃఖములు అనే త్రాటిచే బంధించబడం. ఆ విధంగా సర్వాతీతులమైన మనను వేధించ గల, ఆశ్చర్యపరచ గలదేదీ పదునాలుగు లోకాలలో ఉండజాలనప్పుడే మనిద్దరి జన్మలు సార్థకత పొందినట్లు.

Page:578

భాసుడు : మిత్రమా! ఇంతకీ చిత్తమునకు సంతాపం కలుగజేస్తున్నట్టి అసలైన కారణమేమిటి? విలాసుడు : ఇష్ట-అనిష్టములు, లాభ-అలాభములకు సంబంధించిన ఆశ నిరాశలు అనునవి జీవాహంకారమునకు కారణమగుచున్నాయి. జీవాహంకారమే చిత్తమునకు సంతాపం కలుగజేస్తోంది. భాసుడు : నిజమే! ఐతే ఇప్పుడీ జీవాహంకారం తొలగాలంటే మనం ఏం చేస్తే ఉపాయం? విలాసుడు : "నేను బ్రహ్మమును. సర్వమును. పూర్ణమును అనునట్టి ఆత్మదశను మన చిత్తము పొందేట్లు మనం చేయాలి. ఎందుకంటే, అట్లు పొందిన చిత్తమును మరింకేదీ ఏ విధంగానూ బాధించలేదు. ఆత్మశాస్త్రజ్ఞులు అట్టి చిత్తము యొక్క స్థితిని జాగ్రత్సుషుప్తి అని పిలుస్తూ ఉంటారు. అది నిరహంకృతమైన స్థితి. విజ్ఞుడు అట్టి చిత్తముతో హృదయ నిర్మల లక్ష్యముతో ఆయా కర్మలు (కర్తవ్యములను) నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే, ఆ కర్తవ్యములచే కూడా ఆతడు బంధించబడడు.

మనం కూడా అట్టి జాగ్రత్ సుషుప్త వృత్తిని అవలంబించి, ఆపై ప్రారబ్ధ పరిపాకముచే సంప్రాప్తించే మన వర్ణాశ్రమోచితమైన కర్మలు ఆచరిద్దాం. కానీ దేనినీ ఆచరించని వారుగానే ఉందాం. జ్ఞానులు కర్మగ్రహణం కానీ, కర్మత్యాజ్యం గానీ కోరరు. ప్రారబ్ధానుసారంగా ఏది ఎట్లు ఉచితమో, సందర్భమో అది అంతవరకు ఆచరించుచూ అకర్తవ్య భావమును అవధరిస్తూ ఉంటారు. మన మార్గం కూడా అదియే అగుగాక!

ఇష్టానిష్టముల విషయంలో సుషుప్తబుద్ధి కలిగియుండి మనం కార్యములు ఆచరిద్దాం. అప్పుడు మనం దేనికీ కర్తలం కాము. "అకర్తృత్వ స్వభావం గ్రహించి ఆపై యథాతథంగా చేయవలసినవి చేద్దాం. చేయగూడనివి మానుదాం. సంకల్ప వికల్పరహితులమై ఉందాం.

మూడు నెలల పసిబిడ్డ ఊయలలో ఊగుతూ ఏ సంకల్పం లేకుండానే నవ్వటం, కేరింతలు కొట్టటం, కాళ్ళు చేతులు విదల్చటం చేస్తుంది చూచావా? మనం కూడా ఫలములను చింతించకుండానే క్రియలు ఆచరిద్దాం. విషయవర్జితులమై, విషయాతీతులమై, చైతన్యపదము నందు సంస్థితులమై ఉండటం అభ్యసిద్దాం.

ఆత్మజ్ఞానం పొందిన తరువాత జీవుడు ఏ కర్మలు నిర్వర్తిస్తాడో... వాటి యందు ఆతడు 'నేను కర్తను' అనే భావం పొందడు. అకర్తృత్వం ఆతనికి స్వభావమే అవుతుంది. చిత్తము నందు వాసనలు లేకపోవటం చేత ఆతని అంతఃకరణము శీతలత్వం పొంది ఉంటుంది. సర్వ అవస్థలందూ సమరూపుడై, పరిపూర్ణుడై మహాతేజస్వి అయి ఉంటాడు. అన్ని ఋతువులలోనూ కొండ ఒకే తీరుగా ఉంటుంది కదా!

వృక్షములు, పచ్చిగరిక మొక్కలు గల పర్వతం గాలి వీస్తున్నప్పుడు ఆకుల కదలికచే కదలుచు న్నట్లు కనబడుతుంది. ఆకులు కదలవచ్చునేమో గాని, పర్వతం కదులుతుందా? ధీరాత్ముడు బాహ్యము నందు లౌకికక్రియలచే చంచలము పొందినప్పటికీ అంతరమున అచంచలుడై ఉంటున్నాడు. అట్టి చంచల రహితమైన అంతరంగస్థితి మనం సంపాదించాలి. ఆపై ఈ శరీరములు ఉన్నా, లేకున్నా లేక, మరి ఏదైనా ఎట్లా ఉన్నా మన కేమి నష్టం?

Page:579

జగత్తు యొక్క రాహిత్యము అనునది మనుజునకు అభ్యాసవశం చేతనే దృఢపడుతుంది. మొట్టమొదట జగత్ రహితమైనట్టి ఒకకానొక సుషుప్తస్థితిని అభ్యసించాలి. అట్టి స్థితి అభ్యాసయోగంచే దృఢపడినప్పుడు దానినే తత్త్వజ్ఞులైన మహాత్ములు 'తురీయ స్థితి' అని పిలుస్తారు. మనం అందుకు ప్రయత్నిద్దాం. సర్వ విఘ్నములనూ దూరీకరించి మహాభ్యుదయం పొందుచూ, జ్ఞానానందమయులమై ఆపై ఈ జగద్రచనను ఒక లీలవలె దర్శించటం అభ్యాసం చేద్దాం. భయ-శోక-ఆయాసములు లేని వారమై, సంసార భ్రమరహితులం అగుచూ, అట్టి తురీయావస్థలో సంస్థితులమై ఇక ఈ సంసారమున మనం పడవద్దు.

భాసుడు : పవిత్రమన స్వాత్మ పదవి' ని పొందినవాడు ఇక ఈ జగత్తులో ఏం చేస్తూంటాడు? విలాసుడు : అట్టి ధీరబుద్ధి కలవాడు ఈ ప్రపంచమును చూచి, అజ్ఞానకారణం చేత ప్రకటిత మగుచున్న ఇందలి జీవుల ఉద్వేగాదులను గమనిస్తూ నవ్వుకుంటున్నాడు. ఒక ఎత్తైన మేడపై చివరి భాగంలో నిలబడి ఉన్నప్పుడు క్రింద రహదారిలో చరించు జనులను, రథాలను చూస్తున్నట్లు .... మనం కూడా దూరంగా ఉంటూ, ఈ సంసార విన్యాసమును దర్శిద్దాం. క్రొత్త ప్రదేశంలోని జన సమూహం లాగా అసంబంధీకులమై గాంచుదాం. బ్రాహ్మీస్థితిని ఆశ్రయించి జాగృత్-స్పప్న-సుషుప్తుల కంటేకూడా అతీతమైన మహదానందమైన స్థితిని పొందుదాం. యోగులు ఆశ్రయించే తురీయమును కూడా అధిగమించి అనిర్వచనీయము, శబ్దములకు అందనిది అగు అఖండ, అప్రమేయ స్వభావులం అవుదాం. తురీయాతీతు లమవుదాం.

పరిగలితసమస్త జన్మపాశః సకల లీనతమోమయాభిమానః

పరమరసమయీం ప్రయాతి సత్తాం జలగతసైన్ధవఖణ్ణవన్మహాత్మా ॥ (శ్లో 33, సర్గ 70)

అలా తురీయాతీతుడైన వ్యక్తికి తమోగుణాత్మకమగు అభిమానమంతా రహితమవుతుంది. లెక్కలేనన్ని జన్మలకు హేతుభూతములగు వాసనలు సన్నగిల్లు తాయి! కర్మపాశములు తొలగిపోతాయి. నీళ్ళలో పడ్డ ఉప్పులాగా మనస్సు స్వస్వరూపమునందు లయమయి, పరమానందమగు ఆత్మ సత్తను అవధరిస్తుంది! ... అందువలన మనం ఉత్తమ ప్రయత్నం వదలకుందుము గాక!

7. ఆత్మ అప్రమేయమైనది

శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా, రామా! ఆ విధంగా వారిద్దరూ మొట్టమొదట కుశల ప్రశ్నలతో ప్రారంభించి పరమోత్తమగు సన్మార్గమును విచారణ చేశారు. కాలక్రమంగా నిర్మల జ్ఞానం పొంది నిర్మలులయ్యారు. ముక్త స్వరూపులయ్యారు.

కనుక, జీవుడు ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే అవస్థాత్రయం యొక్క వాస్తవ స్వరూపం చక్కగా విచారిస్తూ ఉండాలి సుమా! వాటిని సాక్షిస్వరూపమగు 'చిన్మాత్రము' నందు సర్వ భావాభావములను లయం చేయాలి. అప్పుడు శేషించేది 'తురీయము' లేక కేవలీపదము.

Page:580

శ్రీ రాముడు : భాస - - విలాసుల సంవాదం వినిపించేటప్పుడు మీరు 'తురీయాతీత స్థితి' అనే పదం వాడారు. అది విదేహమైనదా? సదేహమైనదా? ఆతడు జీవన్ముక్తుడా? ఏ వేద వాక్యం ఆతనికి అన్వయిస్తుంది?

శ్రీవసిష్ఠ మహర్షి : తురీయమునకు ఆవల ఉన్న తురీయాతీత పదం, ఈ విదేహ, సదేహముక్తులకు, వేదవాక్యాలకు విషయమే కాదు. మనుజులకు ఆకాశము విషయమే కాదు కదా! అయితే అన్నీ కూడా ఉపశమించేది అందులోనే. వాయువునకు ఆకాశమే గమ్యస్థానమైనట్లు, విదేహముక్తులకు కూడా ఆ తురీయాతీతమే గమ్యస్థానం. పూర్ణమగు జ్ఞానమును పొందిన జీవుడు ఈ జాగ్రత్-స్వప్న -సుషుప్తులలోని జగత్తును కొంతకాలం క్రీడాపూర్వకంగా గాంచుచూ, ఒకానొకప్పుడు ద్వంద్వాతీతుడై పరమానంద భరితుడై తుర్యాతీతత్త్వము అవధరిస్తున్నాడు.

శ్రీరాముడు : ఈ శరీరం ఆ స్థితిలో ఉంటుందా? ఉండదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇట్టి ప్రశ్నకు మనం కొన్నిసార్లు సమాధానం చెప్పుకున్నాం. అయినా మరల సమాధానమిస్తున్నాను. విను.

ఈ దేహం క్షయం పొందినప్పుడు, లేక వృద్ధి పొందినప్పుడు... తదనుగుణంగా జ్ఞానం క్షయం పొందుతుందని గాని, వృద్ధి పొందుతుందని గాని అనుకుంటున్నావా? లేదు. అది భ్రమ మాత్రమే. వృద్ధి క్షయాలు అనేవి శరీరమువే గాని, అవి జ్ఞానమునకు లేదా మనస్సుకు సంబంధించిన ధర్మాలు కావు. మరి ఈ భౌతికదేహం యొక్క వృద్ది క్షయాల విషయం నీకెందుకు? అందువల్ల ఏం ప్రయోజనం? దేహం ఏ అవస్థలో ఉన్నప్పటికీ నీవు మాత్రం కేవలం ఆత్మబోధ యొక్క స్థిరత్వం గురించే యోచించు, ప్రయత్నించు. ఈ ప్రకృతికి మునుముందుగా నీవు ఎట్లున్నావో.... అట్లే ఉండు.

ఓ రాఘవా! నీవు జ్ఞానివేనయ్యా! ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్త అవస్థల గురించి, వీటిచే స్పర్శింపబడజాలని సత్య స్వరూపమగు బ్రహ్మము గురించి నీవు ఎరిగియే ఉన్నావు సుమా! శ్రీరాముడు : ఎరిగి ఉన్నదానిని పొందవలసి ఉన్నది కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : "సో హం - తత్వమ్ - అహమ్ బ్రహ్మాస్మి - జీవోబ్రహ్మేతి నాపరః - సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ - ఆత్మ సత్యం జగత్ మిథ్యా - - ఏకమేవా ద్వితీయమ్ బ్రహ్మ మొదలగు అఖండ వాక్యార్థముల స్వరూపమగు ఆత్మను నీవు పొందియే ఉన్నావు. 'క్రొత్తగా ఆత్మను పొందాలి' అనే మోహమును దూరంగా ఉంచు. ఈ వాక్యములు నేను సర్వ దేహధారులను ఉద్దేశించి చెప్పుచున్నాను. "భౌతిక ధర్మములగు జన్మ, జరా, మృత్యువులను నేను పొందుచున్నాను అను పేలవమైన భావనను మీరంతా వదలివేయండి. "నేను పూర్ణుడను, అఖండుడను, శాశ్వతుడను, ముక్తుడను అను రూపము గల దుఃఖరహితమగు మహదైశ్వర్యమును సంపాదించండి. అంధకారం గానీ, మేఘములు గానీ లేనట్టి నిర్మలాకాశంలా శోభించండి. ఇష్టానిష్టములను త్యజించి, శీతలాత్మ ప్రకాశముచే పరిఢవిల్లండి.

Page:581

శ్రీరాముడు : మనస్సులో నుండి దృశ్యమునకు సంబంధించిన భ్రమలు ఎట్లా తొలగించుకోవటం? అది అంత తేలికైన విషయమా?

శ్రీవసిష్ఠ మహర్షి : మంత్ర ప్రభావం చేత ఆకాశగమన సిద్ధిని పొందిన ఒక యోగి నేలపై నిలబడి ఒక చోటి నుండి ఇంకో చోటికి దూర సుదూర ప్రాంతాలకు నడచి వెళ్ళే శ్రమను కోరుకుంటాడా? లేదు కదా! ఆత్మభావనచే సుసంపన్నమైన నీ మనస్సు నీచ వస్తువులను ఆశ్రయించ వలసిన పనేముంది? ఈ బ్రహ్మాండమంతా దేశ కాల వస్తుపరిచ్ఛేద రహితమగు 'శుద్ధ చిన్మాత్రము’ చే పరిపూర్ణమై ఉండగా, “ఈ శరీరాదులు నేను. ఈ ధనము రాజ్యము మొదలైనవి నావి, నా వారు, కాని వారు అనుకుంటూ భ్రమలకు చోటివ్వవలసిన పనేమున్నదో చెప్పు?

వ్యాపకమగు పరమాత్మకు 'ఆత్మ' అనే పేరు కల్పించుకున్నాం. యథార్థానికి ఆతడు నామ రూప భేదములకు అతీతము, అత్యంత దూరము అయినవాడు. అతనిని మనస్సే సమీపించలేదు. ఇక గుణ, నిర్గుణములు ఎట్లా ఆతనికి వర్తిస్తాయి చెప్పు? నాటకంలో ఒకడు నిర్వర్తిస్తున్న పాత్ర యొక్క లక్షణములు మొదలైనవి ఆ పాత్ర ధరిస్తున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత విశేషాలు నిర్వచించి చెప్పగలవా?

ఇక నీకు కనబడుచున్న వేర్వేరు భేదముల మాటేమిటంటావా? సముద్రము అనగా జలమే కదా! జలమునకు 'పెద్ద తరంగాలు చిన్న తరంగాలు' అనే భేదమెక్కడిదయ్యా! అద్దంలో ప్రతిబింబం కనబడుచున్నంత మాత్రం చేత అద్దంలో అద్దమునకు వేరైనదేదో పదార్థం ప్రవేశించిందంటావా? ఇక్కడి వేరువేరు లక్షణ విలక్షణములన్నీ జగన్నాటకాంతర్గత కల్పిత విశేషాలే!

సముద్రమంతా జలమే అయినట్లు, దర్పణంలో కనిపించేదంతా దర్పణమే అయినట్లు ఈ జగదాకారంగా విస్తరించి కనబడేదంతా పరమాత్మకు ఒక్క క్షణం కూడా భిన్నమైనది కాదు. పరమాత్మకు భిన్నమైన జగత్తునందు దేహములు, అనుబంధములు, నావి, నీవి అను భావనలకు చోటెక్కడ? అట్లాగే "నేను జీవుడను, అజ్ఞుడను, పాపిని, కర్మబద్ధుడను" అనునదంతా స్వస్వరూపజ్ఞానం లేనప్పుడు ఏర్పడే ప్రేలాపనలు మాత్రమే.

ఈ దేహాదులందు కనిపిస్తున్న నీ వెవడవు? వాటియందు నీకు చెందినదేది? చెందనిదేది? ఈ చెందిన చెందని విషయాల యొక్క తత్త్వమేమిటి? కొంచం యోచిస్తే భ్రమలు వాటంతట అవే

తొలగుతాయి.

యథార్థానికి ద్వైతం గాని, దేహాలు గాని లేవు. సూర్యుడున్న చోట అంధకారం పొసగదు కదా! ఆత్మతో "నీవు, నేను, ఆతడు, నీది, నాది, జన్మించుట, చచ్చుట, వృది, క్షయము అను వ్యవహారమంతా ఏమాత్రం పొసగదు. ఒకవేళ 'ద్వైతము కలదు' అని ఎవ్వరైనా ప్రతిపాదించినా, ఆ ద్వైతముతో ఆత్మకు సంబంధం లేదు. శీతోష్ణములవలె, చీకటి వెలుగుల వలె అవి రెండూ పరస్పర విరుద్ధములైన విషయాలు. ఒకటి దర్శించుచున్నవానికి రెండవది అగుపించదు. అయితే 'ఉనికి' అనునది స్ఫురించే ప్రతిచోటా జడ చేతనాలు కలసి ఏర్పడి ఉంటాయి. ఆ రెండిటికీ ఒకానొక అవినాభావం ఉంటోంది.

Page:582

అంతమాత్రం చేత చిన్మాత్రమగు ఆత్మకు దేహముతోటి తాదాత్మ్యము కలదు అని ఎవరైనా వాదిస్తారేమో. అటువంటి అభిప్రాయం దావాగ్నిలో మంచు ముక్క రూపుదిద్దుకుంటోంది అని అనుకోవడం లాంటిది సుమా! ఒకానొకడు మృగతృష్ణను దూరంగా ఉండి చూస్తున్నాడనుకో... "సూర్యుని తేజస్సు గాలివీచికలపై ప్రసరించినప్పుడు నాకు అట్లు జలతరంగములవలె భ్రమచేత అనిపిస్తోంది అను జ్ఞానము యొక్క ప్రభావం చేత అక్కడ తటాకం ఉన్నది అను భావము నశిస్తుంది కదా! ఒక్క సత్య వస్తువు దర్శనముచే మాత్రమే మిథ్యా దృష్టి నశిస్తుంది.

ఓ రామా! ఒక్క విషయం మాత్రం నీ “జ్ఞప్తి - ఎఱుక పథం నుండి ఏ మాత్రం కోల్పోవద్దు. అదేమిటంటే... చిత్స్వరూపమగు ఆత్మ నిర్మలమై, నిత్యమై, స్వయంప్రకాశకమై, వికారరహితమై, అఖండమై, అప్రమేయమై సర్వదా వెలుగొందుచున్నది. అదియే నీయొక్క నా యొక్క వాస్తవ స్వరూపం.

నా ఈ వాక్యాలు వినటం జరుగుచున్న ఈ సభలోని, ఈ సభకు బాహ్యములోని అందరి స్వరూపం అదే! ప్రతి ఒక్కని వాస్తవ స్వరూపం అదే! నీవు గాని, నేను గాని, ఇక్కడి ప్రియ సభికులు గాని, భూత-భవిష్యత్-వర్తమానములలో తదితరులు గాని... ఆత్మకు వేరుగా మరేదీ అయి ఉండలేదు. అయి ఉండబోము. మనమందరమూ ఆత్మస్వరూపులమే అయి ఉన్నాము.

ఇక ఈ దేహానికి వస్తే ఇది అనిత్యము, మలయుతము. ఈ దేహం స్వయం ప్రకాశకం కాదు. ఇది మరొకదానిచే ప్రకాశింపబడుచున్నది. ఆత్మయగు నేను వికారరహితుడను. ఈ శరీరమో... వికారసహితమైనది. అట్టి ఈ శరీరంతో ఆత్మకు సంబంధమెట్లా కలుగుతుంది చెప్పు?

ఈ దేహము ప్రాణవాయువుచే చేష్టితమగుచున్నది. అన్నము, జలము మొదలైన వాటిచే వర్ధితమగుచున్నది... ఇంతలోనే ఎప్పుడో కృశించుచున్నది. దీనితో నేను వర్ధిల్లను, కృశించను... కనుక ఈ విధంగా దేహముతోటి జీవునకు సంబంధం పొసగనే పొసగదు.

పోనీ, ద్వైత దృష్టితో ఈ శరీర, ఆత్మలను పరిశీలించామనుకో... ద్వైత సిద్ధి అనగా జీవునకు వేరైన మరొక సత్త కలదు అని కదా? మరి ఆ రెండవ సత్త ఏమిటి? ...అది కూడా చైతన్యమే కదా! చైతన్యము, జీవునకు గాని; చైతన్యము, ఆ రెండవ సత్తకు గాని భేదం ఉండదు.

పంజరంలో సింహం - చూచావా రామయ్యా! ఈ శరీరము, ఆత్మలను విచారణ దృష్టితో చూడకపోవడం చేతనే సర్వ అనర్థములు వచ్చి పడుతున్నాయి.

శ్రీరాముడు : జగత్ృష్టి అంతటికీ సారభూతమైనట్టి ఈ అంతఃకరణమునకు కారణమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రశ్నకు సమాధానం పెద్దలు అజ్ఞానమే, మూఢత్వమే, అవిచారణయే అని చెప్పుచున్నారు. ఆత్మయే విపరీత సంస్కారములను గ్రహించుట అను మోహముచే తన స్వసత్త యొక్క జ్ఞానమును త్యజించి భ్రమ బీజసహితమగు చిత్తాకార పరిణామమును ధరిస్తోంది.

స్వయం ప్రకాశమానుడు, స్వయం జ్యోతి స్వరూపుడు అగు సూర్యభగవానుని చూడు. గ్రహణసమయంలో ఆతని పట్ల 'రాహువు' అను తమస్సు ఏర్పడుతోంది చూచావా? వాస్తవానికి

Page:583

సూర్యునిలో తమస్సు (Darkness) ఎట్లా ఉంటుందయ్యా? "సూర్యగ్రహణము అనునది భూమిపై చరించే జీవుల యొక్క దృశ్యచమత్కారమే కదా!

అట్లాగే, మిక్కిలి అసంభవమైనప్పటికీ ఆత్మను జనన-మరణాదులు అనే అజ్ఞానం కప్పి ఉంచుతోంది. అనర్థహేతువులైన ఈ చిత్తం సత్యమగు ఆత్మతత్త్వం యొక్క ఎరుకచే, లేక, జ్ఞానముచే... గదిలో దీపం వెలిగించిన తరువాత చీకటి లాగా... క్షణంలో నశించగలదు. చిత్తమును పరిశుద్ధ పరచనంత కాలం అజ్ఞానం జనిస్తూనే ఉంటుంది.

ఓ జనులారా! మీరంతా ఈ చిత్తము గురించి, ఇందులో ఏర్పడివున్న దోషదృష్టుల గురించి బాగా విచారణ చేయండి. ఈ చిత్తమునకే 'జీవుడు, మనస్సు, అంతఃకరణము' మొదలైన పేర్లు కూడా ఉంటున్నాయని గ్రహించండి.

శ్రీరాముడు : ప్రభూ! మనం కొనసాగిస్తున్న ఈ విచారణ యొక్క ఆరూఢత కొరకు ఒక విషయం ముందుగా చెప్పండి. ఈ చిత్తమునకు 'జీవుడు అంతఃకరణము’ మొదలైన సంజ్ఞలన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయి. ఎట్లా రూఢి పొందుచున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : అనేక తరంగాలు ఎక్కడినుండి వచ్చాయి? జలం నుంచే కదా! అట్లాగే సమస్త పదార్థములు సమష్ఠిచిత్తము నుండే ప్రాదుర్భవిస్తున్నాయి. ఆత్మతత్వముతోటి ఏకత్వధ్యాస' చే ఇది నీవు తప్పక గ్రహిస్తావు.

ఒక్కసారి సముద్రమును చూడు. అందు జలం ఒకచోట చంచలములైన అసంఖ్యాక తరంగాలు కలిగి ఉంటోంది. ఇంకొకచోట స్పందనరహితంగా, తరంగాలు లేకుండా ప్రశాంతంగా ఉంటోంది. స్పందనరూపమగు ఆత్మ ఒకచోట నిర్మలంగా, శుద్ధంగా, మరొక చోట ప్రతిబింబరూపంగా ఉంటోంది. శిల మొదలైనవి చలన రహితంగా తమ యందు తామే స్థితి కలిగిఉన్నాయి. కాని మానవుడు, తదితర జంతువులు చేష్టాయుతులై చలనము కలిగి ఉన్నారు. శరీరములన్నిటి యందూ ఆయా వివిధ రూపములలో పరమాత్మయొక్క శక్తి ఉండియున్నది. అయితే ఆ శక్తి కొన్ని దేహములలో కల్పితరూపమైన అజ్ఞానం కలిగి ఉంటోంది. ఆ పరమాత్మయే కల్పితమగు అజ్ఞానమును ఆశ్రయించి, ప్రసిద్ధుడై అట్లు ఉంటున్నాడని గ్రహించు.

ప్రతిబింబ దశను పొందిన పరమాత్మయే ఆజ్ఞానావరణను కలిగి ఉన్నప్పుడు జీవుడు” అను పేరుతో మనం పిలుస్తున్నాం. వాస్తవానికి ఈ జీవుడు 'సంసారము' అను మాయాత్మకమైన పంజరంలోని సింహమని గ్రహించు.

8. ఆత్మయే అంతా... అన్నిటా

ఆత్మ ఒకచోట తన ప్రతిబింబిత మోహకళచే జీవధారణ చేస్తోంది. ప్రాణములను ప్రీతిగా భావించి వాటిని పొంది 'జీవుడు' - అని అనిపించుకుంటోంది. ఆత్మయే 'జీవుడు గా అగుపిస్తోంది.

Page:584

“నేను, నేను అని అనుకొనుచు అహంకారముగా అగుచున్నది. అహంకారము ఆత్మయే. 'నిశ్చయించెదను గాక' అను వ్యవహారములో ప్రవేశించి 'బుద్ధి'గా అగుచున్నది. బుద్ధి ఆత్మస్వరూపమే! సంకల్ప, వికల్పములను ఒనర్చుటనే మనస్సు’ అనుపేరుకు అర్హమగుచున్నది. మనస్సు ఆత్మ చమత్కారమే! ఆత్మయే!

మనోదేహములకు కారణమగుటచే 'ప్రకృతి' అగుచున్నది. ప్రకృతి ఆత్మయొక్క ఐశ్వర్యమే! ఆత్మయే! వర్ధిల్లుటచే దేహము'గా అగుచున్నది. దేహతత్వం కూడా ఆత్మయే!

అజ్ఞానాధిక్యతచే ‘జడము' అని, చైతన్య ప్రాధాన్యము ప్రకటించినప్పుడు 'చేతనము' అని వచించబడుతోంది. జడ, చేతనములు ఆత్మవిన్యాసములే! ఆత్మయే!

శ్రీరాముడు : అసలు మనసు అనగా ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : రామయ్యా! మనం అనేక కోణాల నుండి ఇప్పటివరకు చెప్పుకున్న తరువాత మరల “మనస్సు అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తుంటే నాకు కొంచం నవ్వు వస్తోంది. అయినా నీవు అడగటం సముచితమే. విను. మరొక కోణం నుండి చెపుతాను.

"అజ్ఞానము - దానికి సాక్షి" ...మధ్య గల స్థితే పరమాత్మాభాసితమగు మనస్సు. ఆ మనస్సు అనేకత్వము పొంది "జీవుడు, బుద్ధి, చిత్తము, అహంకారము... మొదలైన వేషములను, సంజ్ఞలను ధరిస్తోంది. నవరసాలు పోషించే నటుడు ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్కరస సమన్వితమైన వేషం వేస్తున్నట్లు, మనస్సు అనేక ధర్మములను అవధరించి ప్రవర్తిస్తోంది.

మనస్సు యొక్క స్వరూపం ఆత్మయే. అయితే రామా! నీవిక్కడ ఒక విషయం అత్యంత సూక్ష్మ బుద్ధితో గ్రహించాలని మనవి చేస్తున్నాను. హెచ్చరిస్తున్నాను. అజ్ఞానులు, దుర్బుద్ధులు, మూఢులు అగు కొందరు తార్కికులు "ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది చిత్తము, ఇది జీవుడు, ఇది దేవుడు" అని అనేక నిర్వచనములలో ప్రవేశించి ఆయా సంజ్ఞలలో వ్యర్థంగా అభినివేశం కలిగి ఉంటున్నారు. విజ్ఞులు వాటిని సాధనములులాగా, ఉపకరణములుగా, సోపానములుగా చూస్తారేగాని, సాధ్యముగా కాదు. సాధకుడు సాధనములు ఎక్కడ పరిమితమౌతాయో గ్రహిస్తు ఉండాలని నా మనవి. శ్రీరాముడు : మీ హెచ్చరికలో నాకు అత్యున్నతమైన పరమార్థమే గోచరిస్తోంది. అయితే మరొక సందేహం. శరీరం ఉన్నంత వరకు సంసారము ఉండియే తీరుతుంది కదా! సంసారం ఉన్నంత వరకు అజ్ఞానం ఉంటుందికనుక, సంజ్ఞల అవసరం ఉండియే ఉంటుంది కాదా? కాబట్టి సంసారమునకు కారణం ఈ దేహమేనని అనవచ్చా?

శ్రీవసిష్ఠ మహర్షి : జీవుడే సంసారమునకు కారణమగుచున్నాడుగాని, మూగము, దీనము అయిన ఈ దేహం సంసారమునకు ఏమాత్రం కారణం కాదు. కవిత్వం పెల్లుబికేది కవిలోంచిగాని, కలంలోంచి కాదే!

ఒక కుండలో నీళ్ళు ఉన్నాయనుకో... కుండపగిలితే నీళ్ళు నశిస్తాయా? ఆధారము, ఆధేయము - ఈ రెండిటిలో ఒకటి నశించినంత మాత్రం చేత రెండవది నశించదు. ఒక ఆకు ఎండిపోయిందనుకో

Page:585

...అప్పుడు అందులోని రసం ఏమయింది? నశించిందా?... లేదు! అది సూర్యకిరణములలో ప్రవేశించింది. మరొక రూపుదిద్దుకున్నది. అంతే.

శరీరం నశించినా ఆత్మ నశించదు. ఆత్మను ఆశ్రయించి, ఆత్మేచ్ఛచే నిర్మితమై ఈ శరీరాదులు ఏర్పడి ఉంటున్నాయి.

అందుచేత... ఆత్మ వాసనా సహితమైతే ఈ శరీరం వాసన యందే ఉంటుంది. ఆత్మ యందు వాసనలు రహితమైతే ఈ శరీరం చిదాకాశంలో ఉంటుంది.

ఏ దుర్బుద్ధి అయితే ఈ శరీరం నశించిందా ... నా పని అయిపోయినట్లే. నేను నశించినట్లే అని అనుకుంటాడో, అట్టివానికి తల్లి స్తనంలో బేతాళం అనుభవమౌతుందని నా అభిప్రాయం.

మననముచే బంధం ఏర్పడుతోంది. ఎప్పుడైతే ఉపాధులకు, సంస్కారములకు సంబంధించిన మననము తొలగుతుందో ... అప్పుడు అట్టి జీవుడు స్వతఃసిద్ధంగా తనయొక్క బ్రహ్మస్వభావమును సంస్మరిస్తాడు. నిరతిశయానందమును పొందుతాడు.

అయితే... శరీరం నశించినా చిత్తం ఉంటుంది. చిత్తమే జీవుని సూక్ష్మదేహం. చిత్తములో వేటి వేటి గురించి ధ్యాసలు, మననములు ఆధిక్యత కలిగి ఉంటాయో... ఆ అనుభవములకు అనుకూలంగా తరువాతి ఉపాధులు ఏర్పడుచున్నాయి.

శ్రీరాముడు : ఒకవేళ చిత్తమే నశించిందనుకోండి....? అప్పుడే మౌతుంది?

శ్రీవసిష్ఠ మహర్షి : అప్పుడింకేమున్నది? స్వస్వరూపమగు ఆత్మయే శేషించటమే పరమానంద దాయకమగు 'మోక్షము' అయి ఉన్నది.

కనుక... దేహము నశించుటచే ఏదీ నశించుటయే లేదు! ...ఇక చిత్తము నశించినప్పుడు స్వస్థానమే లభించగలదు. మరింక చింత దేనికో చెప్పు.

ఈతడు మరణించాడు, నశించాడు" - అను కథనమంతా మిథ్యా కథనమే. అదంతా కూడా అసత్ కల్పన మాత్రమే.

ఈ జీవుడు స్వస్వరూపము విషయమై అజ్ఞానము ఏర్పడి ఉన్నంతవరకూ వేర్వేరు ఉపాధులను, దేశ కాలములను, స్థితి గతులను గ్రహించుచూనే ఉన్నాడు. ఒకానొకప్పుడు శాస్త్రపరిశీలనచే, స్వప్రయత్నముచే తన స్వరూపమేమిటో గ్రహించి ఈ జన్మ, కర్మల, చక్రమును నిరోధిస్తున్నాడు... లేక త్యజిస్తున్నాడు. లేనివిగా చూస్తున్నాడు. మోక్షము అనగా అదే!

మరణము’ అనే నదిలోని తరంగములచే కొట్టుకుని పోవుచున్న గడ్డిపరకలవలె కొందరు జీవులు దేశకాలముల కల్పనాపరంపరలలో అనేకసార్లు ప్రవేశ - నిష్క్రమణములను నిర్వర్తించుకుంటూ పోతున్నారు. ఒక దేశ కాలములలో ప్రవేశమే తన జన్మ అని, దాని నుండి నిష్క్రమణమే తన మరణమని భ్రమలను స్వీకరిస్తూ అనేకసార్లు నేను దుఃఖిని, సుఖిని, నీచుణ్ణి, గొప్పవాడిని ఇత్యాది యోచనా లంపటంలో మ్రగ్గుచున్నాడు. కొండముచ్చు ఒక చెట్టు వదలి మరొక చెట్టును ఎక్కుచున్నట్లు ఆతడు ఒక శరీరం వదలి మరొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. కొంతకాలానికి అది వదలి ఇంకొకటి...

Page:586

చర్వితచరణంగా బహుదూరపు బాటసారిలాగా పయనం సాగిస్తూనే ఉన్నాడు. విస్తృతమైన వేరొక దేశ కాలములలో ప్రవేశించి నేను ఇప్పుడే పుట్టాను అని తలచుచూ ఉన్నాడు. పిల్లి తన కూనలను ఒక ఇంటిలోంచి మరొక ఇంటిలోకి చేరుస్తున్నట్లు అతడు తన వాసనలు ఒకచోట నుండి మరొక దేశకాలములకు గొనిపోవుచున్నాడు.

శ్రీరాముడు : ఈ జీవునికి ప్రయాసతో కూడిన ఈ ప్రయాణం ఎంత కాలం?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అది జన్మ, మృత్యు, వార్ధక్య, వ్యాధుల ప్రయాసతో కూడిన ప్రయాణమే. వాసనలతో కూడి ఉన్నంతవరకు ఆప్రయాస కొనసాగుతూనే ఉంటుంది. దున్నపోతుకు ముక్కు త్రాడు వలె వాసనలచే కట్టుబడిన ఈ జీవుడు ఉపాధి-దేశము-కాలము ...అను మూడు పదార్థములు గల అనేక స్థానాలకు ఈడ్వబడి అనేకసార్లు దుఃఖాలను, శిథిలత్వాన్ని పొందుచున్నాడు. వారి వాసనలే వారినట్లా బాధిస్తున్నాయి. అంతేగాని వారిని మరింకెవరో బాధించుట లేదు.

అజ్ఞాన ధోరణులు, కుమార్గములు ఆశ్రయించుటచే ఆతడు అనేక జీవితములను వృథా చేసుకుంటున్నాడు. వెట్టివాడు చేత సంచిని భుజాన వేసుకొని చెత్త చెదారమును నింపుకుంటూ భారంగా అడుగులు వేస్తూ దుఃఖితుడగుచున్నట్లు, ఈ జీవుడు తెలివిగా వాసనలు తొలగించుకో వలసింది పోయి, మరింకా పెంచుకుంటున్నాడు.

చూచావా! ఆతడు తన హృదయంలో జనిస్తున్న వాసనలచే పట్టుపురుగులాగా బంధితుడై దారిద్ర, వియోగాది దుఃఖముల భారం వహిస్తూ, వివిధ యోనులలో అవిశ్రాంతగా సంచారం చేస్తున్నాడు. అనేక దుర్దశలచే జర్జరీతుడగుచున్నాడు. చిరకాలం నరక సమూహములలో పడి లేస్తున్నాడు.



సభ ముగించబడింది. శాంతి మంత్రాలు ప్రవచించబడ్డాయి.

ఆ సభలో ప్రతి ఒక్కరు “ఆహా! మూఢులమై మూర్ఖులమై మేము సంసారారణ్యంలో ఎంతటి సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తున్నాం! మహర్షి గుర్తుచేయకపోతే మా గతి ఏమిటి? ఇది ఎంతటి సుదినం! ఇక్కడి సంయోగ - వియోగాలలో ధ్యాసంతా కలిగియుండి ఉత్తరోత్తర విషయాలే యోచించటం లేదే! ధ్యాసను స్వస్వరూపం వైపు మరలించకపోతే ప్రయాస తప్పదుకదా! ఓ మహర్షులారా! ఓ రామచంద్రా! మీకు ధన్యవాదాలు. మాకు గుర్తుచేయవలసింది గుర్తుచేశారు! సర్వదా కృతజ్ఞులం అని తమలో తాము చెప్పుకుంటూ గృహోన్ముఖులైయ్యారు.

(పదమూడవ రోజు విచారణ పూర్తి అయింది)

Page:587

పదునాల్గవ రోజు

X. వివేక దృష్టి

1. ఆత్మ - దేహముల సంబంధం

-

పదునాల్గవ రోజు యథావిధిగా సభ ప్రారంభమైనది.

శ్రీరాముడు : తండ్రీ! మహర్షీ! నిన్నటి రోజు చివరిలో ఈ జీవుడు దేహముతో కూడి అనేక దేశ

- కాలములలో ప్రవేశ - నిష్క్రమణములను నిర్వర్తించటం గురించి మీరు ప్రసంగిస్తున్నారు.

శ్రీవసిష్ఠ మహర్షి : మంచిది. మనం ఈ దేహం విషయమై మరికొన్ని విశేషాలు విచారణ చేద్దాం.

ఓ రామచంద్రా! ఒక్క విషయం మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.

దేహేజాతే న జాతో2 సి! దేహనష్టే న నశ్యసి | త్వమాత్మన్యకలంకాత్మా! దేహస్తవ నకశ్చన ॥

1. ఈ దేహం జనించుటచే నీవు జనించుట లేదు. దేహం కంటే ముందుగానే నీవు ఉన్నావు.

2. దేహము ఉన్నంతకాలం దేహాశ్రయుడిగా ఉండనే ఉన్నావు.

3. దేహం నశించినంత మాత్రం చేత నీవు నశించవు. దేహత్యాగిగా నీవు ఉండనే ఉంటావు. నీ విషయం, నా విషయం, ఈ సభలోని ప్రతి ఒక్కరి విషయం, భవిష్యత్లోని సర్వజీవుల విషయం ఇట్టిదే.

నీవు వాస్తవానికి స్వాత్మ యందు అకళంకరూపుడవై వెలయుచున్నావు. ఈ దేహంతో నీకేమి సంబంధమే లేదు. మనందరిలోని ప్రతిఒక్కరి విషయం ఇట్టిదే!. కుండ పగిలినా కుండలోని రేగు పండుకు ఏమీ కానట్లు (కుండ బదర న్యాయం) ఈ శరీరం నశిస్తే జీవుడు నశిస్తాడనుకోవటం కేవలం కల్పన, భ్రమ మాత్రమే. నశ్వరమగు ఈ దేహం నశిస్తే అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోతోంది. నేను ఈ శరీరంతో నశించుచున్నాను అని తలచే మూఢ చిత్తునకు ధిక్కారమగు గాక!

దృష్టాంతంగా ఒక రథం తీసుకుని చెప్పుకుందాం. రథచోదకుడు, వెళ్ళవలసిన ప్రదేశం గురించి ఇష్ట, అనిష్టములు లేనట్టి గుఱ్ఱములు, రథము, త్రాళ్లు - ఒకదాని వంటిది మరొకటి కాకపోయినప్పటికీ - అన్నీ ఒక చోటికి చేరి ప్రవర్తిస్తున్నాయి కదా! అట్లాగే దేహి, ఇంద్రియములు, దేహము, మనస్సు ... ఇవన్నీ ఒక చోటికి వచ్చి ఆయా కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాయి. తటాకంలోని స్వచ్ఛమైన నీటికి, బురదకూ ఉన్న సంబంధమే ఆత్మకు, ఈ దేహేంద్రియములకూ

Page:588

గల సంబంధమని గ్రహించు. సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్న ఒక బాటసారి మార్గమధ్యంలో ఒక సత్రంలో బస చేస్తున్నాడనుకో... ఆతనికి ఆ రాత్రి శయనించే గదిలోని వస్తుజాలముతో ఏర్పడే 'నావి' అను మమత్వాభిమానం వంటిదే ఈ శరీరమునకు సంబంధించిన మమకారములు సుమా! ఆ గదిలోని వస్తువులతో ఏర్పడే "సంయోగముచే సుఖము, వియోగముచే దుఃఖములకు ఏమి అర్థమున్నది చెప్పు? ఆ బాటసారి అజ్ఞుడైతే సత్రంలో ప్రవేశించి, "ఆహా! ఇవి నావి, ఆ గది ఆతనిది, వీటిపై నాకే హక్కు? అయ్యో! ఇక తెల్లవారబోతోంది. వెళ్లి పోవలసి వస్తుందేమోగదా! ఎట్లా? నే వెళ్ళిన తరువాత ఇవన్నీ ఏమౌతాయి? ఏమో మరి!... అని భ్రమించి అనేక దుఃఖాలు పొందుతాడు. ఆ బాటసారి కనుక జ్ఞాని అయితే ఈ సత్రంలోని గది గాని, ఇందులోని సామగ్రి గాని ఈ సత్రం యజమానివి గాని, నావి కావు. నేను ఇక్కడ బస చేస్తూ, ఇక్కడి వాతావరణమునకు అనుకూలుడనై ఉంటాను. వీటిని సొంతమనుకొని మమకారం నే నెందుకు కలిగి ఉండాలి? ఇవి నావి కానప్పుడు వీటిని త్యజించటమేమిటి? కోల్పోవటమేమిటి? అని గ్రహించి ఉంటాడు. వాటిని ఉపయోగిస్తూనే తాను వాటికి వేరై ఉంటాడు. ఆతనికి, అక్కడి వస్తువులకు గల సంబంధమే ఆత్మకు ఈ దేహాదులతో గల సంబంధం సుమా!

ఒక బాలుడు బాగా అల్లరిచేస్తున్నాడనుకో... ఆతని దాది ఆతనిని సమీపించి "ఓయీ! బాలుడా! నీవు ఇట్లాగే అల్లరి కొనసాగించావా... ఆ చీకటిలో నుంచి ఒక బేతాళుడొచ్చి నిన్ను పట్టుకుపోతాడు. ఆతనికి పెద్ద పెద్ద దంతములు, చింతనిప్పుల్లాటి ఎఱ్ఱటి కళ్ళు ఉంటాయి. తలపై రెండు కొమ్ములు కూడా ఉంటాయి. మరి ఆతనిని పిలవమంటావా? అని భయపెట్టుచున్నదనుకో. ఆ బాలుడు చీకటి వైపు చూచి అక్కడి ఆ విశేషణములు గల ఒక ఆకారమును ఊహించుకుని వద్దులే! నేను అల్లరి చేయను అని ఊరుకుంటాడు చూచావా? ఆ బాలుని కళ్ళకు కల్పిత బేతాళుడు అగుపించినట్లు జీవునకు "ప్రీతి, అందము, సుఖము, దుఃఖము, గ్రాహ్యము, త్యాజ్యము మొదలైనవన్నీ మిథ్యారూపంగా ఏర్పడుచున్నాయి. అయితే, వాటికి, ఆత్మకు సంబంధమే లేదు. ఆ కలుగుచున్నదంతా కల్పిత బంధమే.



ఒక మహావృక్షము నుండి లభించిన కొయ్య నుండి వేరు వేరు విగ్రహములు తయారు చేయబడుచున్నట్లు, సమ్మిళితములైన పంచ భూతముల నుండి ఈ జనసమూహమంతా వేర్వేరుగా నిర్మించబడుచున్నారు. అందుచేత ఈ అనేక శరీరములను చూచి నీవు భ్రమ పొందవద్దు. ఒక పెద్దకట్టెల మోపులో ఉన్నవన్నీ కట్టెయే (కొయ్యయే) కాని, మరింకేమి కాదు కదా! ఈ దేహం కూడా మనం పరిశీలించి చూస్తే ఇందు పంచభూతములు తప్పించి మరింకేమీ లేదు.

ఓ జనులారా! ఈ పంచభూతములు ఉత్పత్తి-క్షోభ-వినాశనము' లందు మీరు ఎందుచేత హర్ష శోకవశులగుచున్నారో కాస్త చెపుతారా?... అగ్ని యందు పడి, మిడత భస్మమౌతున్నట్లు మీరు కూడా పాంచభౌతిక సంఘాతమైన 'కామము' అను పేరు గల విషయాగ్నియందు ఎందుకు పడుచున్నారు? అందు ఏ గొప్ప, శాశ్వత విశేషం మీకు కనబడుతోంది?

Page:589

ఇవన్నీ అజ్ఞానుల యందు మాత్రమే ప్రీతి జనింపజేస్తున్నాయి, కాని జ్ఞానులకు పంచభూత రూపములుగానే కనిపిస్తున్నాయి.

పరస్పర సంబంధం లేని రెండు వేర్వేరు వస్తువులను ఒకచోటికి తీసుకువచ్చి ఉంచామనుకో... ఆ రెండు వస్తువులకు ఒకదానిపై మరొక దానికి రాగము ఏర్పడుతోందా? లేదే! అలాగే 'చిత్తము - శరీరము' లకు ఒక చోట ఉన్నా ఒకదాని పట్ల మరొకదానికి రాగము ఏర్పడవలసిన పనేమున్నది? పనిలేదు. అయినా కల్పనచే ఏర్పడుచున్నది. అట్లాగే మట్టితో చేసిన అనేక సైనికుల బొమ్మలతో ఒక యుద్ధరంగమును నిర్మించి ఆట బొమ్మలలో ఉంచామనుకో... ఆ సైనికుల బొమ్మలన్నీ ఒకే మట్టితో తయారు చేయబడినప్పటికీ “ఇటు సైన్యం మన రాజ్యానిది... అటు సైన్యం శత్రు రాజులది... అనే విశేషణము ఆపాదించబడుచున్నది కల్పన చేతనే కదా! ఈ బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, ఆత్మల సంసర్గము మమత్వరహితంగా గాంచబడు గాక! శిలా విగ్రహములకు పరస్పరానుబంధం ఉండనట్లు ఆత్మకు ఈ దేహ, ఇంద్రియాల పట్ల రాగం ఉండకుండు గాక! వాటి కొరకు విలపించటం అత్యంత అసంగతమైన విషయమని ఆత్మ స్వరూపుడవగు నీవు గ్రహించు. తరంగం ఎక్కడెక్కడివో కొన్ని గడ్డిపరకలను ఒక చోటికి జేర్చునట్లు ఆత్మ పంచభూతములను ఒక చోటికి జేర్చి, తద్వారా ఈ జగత్తును గాంచుచున్నది. కెరటముల ప్రభావం చేత కొట్టుకురాబడుచున్న కొన్ని గడ్డిపరకలు కలుస్తున్నప్పుడూ, విడిపోతున్నప్పుడూ రాగ ద్వేషాలు, హర్ష- శోకాలూ పొందుతాయా? లేదు కదా! ఈ పుత్రులు, పశువులు, అయినవాళ్ళు, కానివాళ్ళు అన్నరూపంలో ఏర్పడివున్న ప్రాణులన్నీ పంచభూత మాత్రములై ఆత్మ మహాసముద్రంలో కలవటం, విడిపోవటం చేస్తున్నాయి. ఇందులో శోకించటానికి గాని, సంతోషించటానికి గాని, ఏ విశేషమున్నది? జలంలో ఆవర్తములవలెనే 'చిత్తములు అనురూపం పొందిన ఆత్మ పంచభూతములను ఒక చోటికి చేర్చి వినోదిస్తోంది.

సంచలనముచే మాలిన్యము పొందిన జలం క్రమంగా సంచలన రహితమగుచున్నప్పుడు ఆ మాలిన్యమును వదిలి శుద్ధరూపం పొందుతుంది చూచావా? జ్ఞానము యొక్క సహాయంచే విషయ రూపమును త్యజించుచున్న జీవుడు స్వయముగా బ్రహ్మరూపమును పొందుచున్నాడు. ఆకాశమున సంచరించే సిద్ధపురుషులు, దేవతలు వాయుమండలము నుండి భూమండలమును చూస్తూ ఉంటారు చూచావా! జ్ఞానము పొందిన జీవులు ఈ పంచభూతసముదాయమునుండి విడివడినవారై, తమ దేహముతో సహా సర్వబాహ్యవస్తు సముదాయమును తమ స్వస్వరూపముకంటే వేరైనదిగా గాంచు చున్నారు. దేహాతీతులైన జ్ఞానులు పంచభూతములను తమకు వేరైనదిగా, అసంబంధమైనదిగా గాంచుచుండుటచే తమయొక్క జన్మరాహిత్యమును ప్రత్యక్షముగా గాంచగలుగుచున్నారు. లేదా, ఇదంతా మమాత్మవిన్యాసమే అనురూపంగా ఆస్వాదిస్తున్నారు. సూర్యకాంతి మణి వలె స్వయం ప్రకాశమును అవధరిస్తున్నారు.

మద్యము త్రాగి మత్తులో ఉన్నవాడు తన యొక్క పూర్వస్థితులను, తదితర పరిచయములను, తన ఎదురుగా ఉన్న వస్తుజాలమును అస్పష్టంగా గాంచుతూ ఉంటాడు. ఆ మత్తు దిగిపోయిన తరువాత

Page:590

మరల ఇతఃపూర్వజ్ఞానమును సుస్పష్టంగా తిరిగి పొందుతాడు. అట్లాగే దేహాతీతత్వము అవధరించిన మహనీయుడు ప్రమాణ, ప్రమేయముల నుండి విడివడి వికారరహితుడై తన ఆత్మను గాంచుచున్నాడు.

ఓ రామా! వివిధ సముద్రజలములు తరంగముల కల్లోలంచేత తేలియాడే గడ్డి పరకలతో సంయోగ - వియోగములు చేస్తున్నట్లుగానే... ఆత్మయే సమస్త వస్తు సంయోగ - వియోగాది క్రియా విశేషములను స్వయంకల్పితంగా నిర్వర్తిస్తోంది.

2. ప్రపంచాతీతులు

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో కొందరు నేను వర్ణిస్తూవస్తున్న విశేషాలతో శరీరాతీతులై, ఆత్మతో ఏకత్వం పొందినవారై ఉన్నారు. వారు వీతరాగులై, పాపరహితులై బ్రహ్మపదమున వెలుగొందు చున్నారు. అట్టి వారిలో కొందరు బోధకులై బ్రహ్మతత్త్వ ప్రవచనం చేస్తున్నారు. అట్టి మహనీయులకు దిగ్విజయమగు గాక!

సముద్రంలోని మహాతరంగములు తమ యందు అమూల్యమైన రత్నములు కలిగి ఉండి కూడా, వాటి యందు ఆశ లేకుండానే యథాతథసంచలనంతో సంచరిస్తూ ఉంటాయి కదా! ఆ మహాత్ములు కూడా జ్ఞానులై, వాసనారహితులై అనాసక్త చిత్తముతో వ్యవహారములు ఆచరిస్తున్నారు.

తీరమున ఉన్న భవనం చూచి సముద్రం క్షోభ చెందుతుందా? మోదం పొందుతుందా?... గాలికి దుమారం లేచినంత మాత్రం చేత ఆకాశం మలినమై పోతుందా?... ఈ ప్రపంచ వ్యవహారములచే ఆత్మజ్ఞాని మలినం పొందడు, మార్పు పొందడు. చేర్పు పొందడు.

శ్రీరాముడు : అట్టి మహనీయులు అందరిలాగానే ఈ ప్రాపంచిక రాగ ద్వేషముల మధ్య

మనగలుగుతారా?

శ్రీవసిష్ఠ మహర్షి : స్వచ్ఛమైనట్టి, మలినమైనట్టి చంచల జలతరంగములచే సముద్రము రాగము గానీ, ద్వేషము గాని పొందుతోందా? లేదు. ఆత్మజ్ఞాని కూడా భోగములచే రాగము గాని, ధన, జనాదుల రాకపోకలచే ద్వేషము గాని పొందుట లేదు.

యన్మనో మననం కించిత్సమగ్రం జగతి స్థితమ్ | తచ్చేత్యోన్ముఖచిత్తత్వవిలాసోల్లసనం విదుః || (శ్లో 28, సర్గ 72)

"ఈ జగత్తులో ఉన్నది. ఉండబోయేది మనస్సు యొక్క సంకల్ప - వికల్పములు మాత్రమే - అని అతనికి తెలుసు. ఇదంతా విషయోన్ముఖమైన చైతన్యము యొక్క విలాసము మాత్రమే" అని ఆత్మజ్ఞాని ఎరిగియే ఉంటాడు.

ఈ అహంకారము, ఈ త్రికాలస్థమగు విషయములు, ఈ దృశ్య, దర్శన సంబంధములు - సర్వమూ మనోవిజృంభణము మాత్రమే!

Page:591

దృశ్య - - దర్శనముల మధ్య దృక్ (That which is seeing) ఉన్నది. దృశ్యము దృక్ యొక్క ఆధీనంలో ఉన్నది. దృక్ ఈ దృశ్యమును ఎట్లు చూస్తే అట్లే ప్రాప్తిస్తూ ఉంటుంది. దృక్ యొక్క అధీనంలో ఉండే ఈ దృశ్యము సత్తయా?... కాదు! అసత్తయా?... కాదు!

ఇట్లు సత్త అని గాని, అసత్త అని గాని నిర్ణయించబడజాలనిది, హర్షశోకములకు అర్థమెట్లా అవుతుందో చెప్పు? కనుక ఈ దృశ్యము స్వయంసిద్ధము కానే కాదు. స్వయంసిద్ధమైనది 'దృక్ మాత్రమే. అదియే ఆత్మ! ఆత్మ సర్వదా అసంగమైనది.

శ్రీరాముడు : అయితే ఈ జీవులకు హర్ష శోకములు ఎందుచేత కలుగుచున్నాయి?

శ్రీవసిష్ఠమహర్షి : రామా! ఇప్పుడు నీకు కొన్ని కొన్ని సందర్భములలో హర్ష శోకములు కలుగుచున్నాయి. కదా! నిన్నొక చిన్న ప్రశ్నవేస్తాను - అట్లా ఏర్పడే హర్ష శోకములు సత్యమైనదాని గురించా? లేక... అసత్యమైనదాని గురించా? కాక సత్యాసత్యమైన దాని గురించా?

అసత్యమైనది మిథ్యయే కదా! మిథ్య, అవాస్తవం అయినదాని గురించి హర్షమెందుకు? శోకమెందుకు?

శ్రీరాముడు : ...!

శ్రీవసిష్ఠ మహర్షి : ఇక సత్యమైనదాని గురించి అంటావా? అది ఎల్లప్పుడూ సత్యమై నిత్యమై లభించియే ఉన్నది కదా! ...మరి హర్షమెందుకు? శోకమెందుకు? ...ఎందుకంటే నిత్యమైనది మాత్రమే సత్యము కదా!

ఇక "సత్యా సత్యమైనదాని గురించి అని అంటావా?... ఎక్కడైనా విరుద్ధ ధర్మములు ఒక చోట ఒనగూడుతాయా? ఒకే చోట, ఒకేసారి వెలుగు చీకటి ఏర్పడినవై ఉంటాయా? అందుచేత 'సత్యాసత్యమైనది' అనే మాటయే మిథ్య. మరి నీవు దేనికైనా సరే, ఎందుకు విమోహితుడవు కావాలి చెప్పు?

ఉత్తమ నేత్రములు గల ఓ రామచంద్రా! నీవు మొట్టమొదట మిథ్య అయినట్టి అసమ్యక్ దర్శనం (The illusion of seeing the variety and missing the unity) త్యజించు. సమ్యక్ దర్శనమును అవలంబించు. సమ్యక్ దర్శనమునందు సుస్థిరుడైనవాడు ఇక్కడెక్కడా ఏ స్థితిగతులలోనూ మోహం

చెందడు.

ఆత్మ తన యొక్క దృశ్య దర్శన సంబంధమైన విస్తారముచే తనకు తానే మనస్సు అను రూపంగా ప్రకటించుకొనుచున్నది. అందుకే విజ్ఞులు "దృశ్య దర్శనములకు సంబంధించిన అనుభవ రూపమగు సుఖవృత్తి కూడా బ్రహ్మము యొక్క రూపమే అని చమత్కారంగా విశ్లేషిస్తూ ఉంటారు. అలాగే, ఈ ఉపాధి కృతమైన భేద దృష్టి తొలగిపోయినప్పుడు... అప్పుడు ఏర్పడే సుఖము శివము, లేక, అఖండ బ్రహ్మమే. ... కాబట్టి 'బ్రహ్మము' అంటే ఏదో, ఎక్కడో ఉన్నట్టిది కాదు. శ్రీరాముడు : సంసారము అనగా ఏమిటి?