Page:592

శ్రీవసిష్ఠ మహర్షి దృశ్య దర్శనముల మధ్య గల ఒకానొక అజ్ఞానపూరితమైన సంబంధమునే మనం సంసారము' అనే శబ్దంతో ఉద్దేశిస్తున్నాం. దృశ్య దర్శనముల మధ్య గల అనుభవం అజ్ఞానులకు సంసారముగా ప్రాప్తిస్తోంది.

అదే అనుభవం ద్రష్ట-దర్శనముల సంబంధమేమిటో ఎరిగిన ప్రపంచాతీతులకు మహాభ్యుదయ యుక్తమగు మోక్షము అను అనుభవం చేతికందిస్తోంది.

అనుభవం దృశ్యవృత్తితో కూడి ఉంటే బంధము. వృత్తి రహితమైనప్పుడు, అప్పుడు శేషించే అనుభవమే ముక్తి.

శ్రీరాముడు : ముక్త స్థితిలో 'అనుభవం' అనేది ఉంటుందా? ఉండదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అనుభవమే ఆత్మయొక్క ముఖ్యదేహం. అయితే దేహి దేహము కంటే అత్యంత సూక్ష్ముడు. అనుభవం యొక్క ఉనికి-లేములు ఆత్మను స్పర్శించవు.

ద్రష్ట 7T దృశ్యము

దృశ్యాతీతానుభవం దృశ్యపరిమితానుభవం

ముక్తి బంధము

జ్ఞానము యొక్క బలిమిచే ఈ జీవుని సుఖసంవిత్తు వికారరహితమౌతుంది. అనగా, వృద్ధి క్షయ రహితమౌతుంది. వృద్ధి, క్షయ రహితమగు సుఖానుభవం పూర్ణానందస్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.

కనుక రఘు రామా! నీవు దృశ్య - దర్శన వర్జితమైనట్టి సుఖమును ఆశ్రయించు. దానినే 'కేవలానుభవ దృష్టి' అని కూడా శాస్త్రములు చెప్పుచున్నాయి. అట్టి దృష్టిచే అప్పుడు ఉచిత సమయంలో సంసారబంధ రహితుడవౌతావు.

అట్లు జీవుడు కేవలమగు (That which is Absolute) తన సుఖస్వరూపమును ఆశ్రయిస్తూ ఉండటం చేత ఆతని యందు స్వస్వరూప దృష్టి ప్రకాశించగలదు. దృశ్యం రహితమైనప్పుడు, అప్పటి అనుభవమునకు, ద్రష్టకు భేదమేమీ ఉండదు. ఆ మార్గంలో లభిస్తున్న స్థితియే తురీయావస్థ. అదియే ముక్తి. ఏ జీవుడైనా సరే... దృశ్యదర్శన వర్జితుడై పరమాత్మ బుద్ధిని సంపాదించుకొంటే అది ముక్తస్థితి అవుతుంది.

ముక్తరూపమగు తురీయస్థితి యందు ఆత్మ ఏ తీరుగా ఉంటుంది? అది స్థూలమా? ...కాదు. సూక్ష్మము కూడా కాదు. ప్రత్యక్షముగాని, అప్రత్యక్షముగాని కాదు.

అద్దానిని చైతన్యము, జడము, సత్తు, అసత్తు మొదలైన పేర్లచే నిర్వచించలేం. దాని రూపం అహంకారం గాని, మరింకేదో గాని కాదు. ఏకము, అనేకము, సమీపము, దూరము, ప్రాప్యము,

Page:593

అప్రాప్యము = మొదలైన వాచ్య వాచక శబ్దములు అద్దానికి ఆపాదించలేం. అది స్వరూపమని, సర్వవ్యాపకమని, పదార్థమని, అపదార్థమని, పంచభూతాత్మకమని, అపంచభూత రూపమని చెప్పలేం. అద్దాని గురించి చెప్పటానికి మాటలు లేవు... చాలవు. కానీ అన్ని శబ్ద-అర్ధముల సమగ్ర ఆత్యంతిక సమన్వయం అదే!

శ్రీరాముడు : నామ - రూపాలు లేనట్టిది ఉన్నట్లా? లేనట్లా?

శ్రీవసిష్ఠమహర్షి : ఒక్క విషయం మాత్రం నిస్సంకోచంగా ప్రకటిస్తున్నాను. ఈ జీవునికి ఆరవ ఇంద్రియం మనస్సు. మనస్సుకు రూపమేమున్నది. అయితే, ఈ దృశ్యరూపమున సంతరించుకుని ఉన్నదంతా మనస్సు మాత్రమే. మనస్సుకు పరమై, ఆ మనస్సుకు కారణము, స్థానము, ఆధారము ఆత్మయే కదా! అట్టి ఆత్మతత్త్వమును, "అది ఏదీ కాదు - అనటం కూడా సత్యవాక్కు కాదు. ఈ జగత్తును యథారూపమున గాంచగలుగుచున్న ప్రపంచాతీతులకు ఇదంతా ఆత్మయే అని అనుభవ మగుచున్నది. సర్వం ఆత్మయే!

ఈ జగత్తంతా ఆత్మమయమే అయి ఉన్నది. ఆత్మకు భిన్నంగా ఏదీ ఎక్కడా లేదు. ఆత్మయే పృథివిలో కాఠిన్యంగా, జలంలో ద్రవత్వంగా, తేజస్సులోని ప్రకాశంగా, ఆకాశంలో అవకాశంగా ప్రకాశిస్తోంది. ఒక నటుడు అనేక చోట్ల అనేక వేషాలు వేస్తున్నట్లు, ఆత్మ సర్వరూపములూ తానే అయి, తాను మాత్రం అవేవీ కాకయే ఉంటోంది.

చైతన్యమే లేకపోతే వస్తువుల సత్తా ఏమాత్రం సిద్ధించేది కాదు. అంతేకాదు... ఆత్మకు భిన్నంగా నేను ఉన్నాను అనే మాట ఉన్మత్త ప్రేలాపన మాత్రమే.

ఓ మహాత్మా! రామచంద్రా! సమస్త దేశ కాలములు, అందలి అనంత కోటి కల్పములు, ఆ కల్పముల మధ్య కనిపిస్తున్న అనేక బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండములలోని వివిధ జీవుల గమనాగమనములు ఇవన్నీ ఆత్మయే అయి ఉన్నాయి. ఆత్మకు వేరుగా మరొక కల్పన ఏదీ ఉండ జాలదు. కాబట్టి ఆత్మకు సంబంధించిన నిశ్చయబుద్ధి కలిగి ఉండు. ఆ బుద్ధికి కూడా పరుడవై ఉండు. బిడ్డా! సర్వదా ప్రపంచాతీతుడవై ఉండు. ప్రపంచస్వరూపుడవై ఆస్వాదించు.

3. ఎవరీ రచయిత?

శ్రీరాముడు : హే మహర్షీ! మేము వస్తుదృష్టి నుంచి వైతొలగి ఆత్మ దృష్టికి చేరినప్పుడుకదా ముక్తి! అది సుసాధ్యమేనంటారా? దృష్టిని జ్ఞానమయం చేయటమెట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఇది ఉత్తమోత్తమమైన వజ్రం" - అని తెలిసిన తరువాత ఏదైనా త్యజించి అద్దానిని పొందాలని జనులు అనుకోవటం సహజమే కదా! విచారణదృష్టితో ఈ జగత్తును గమనిస్తున్న ఉత్తమ పరిశీలనపరులు ఇందలి సత్యాసత్యమేమిటో గ్రహిస్తున్నారు. ద్వైతత్యాగం చేసి ఆత్మ స్వరూపమగు ముక్తిని స్వభావంగా ఆకాంక్షిస్తున్నారు. పొందుచున్నారు.

Page:594

నేనే ఆకాశమును. నేనే సూర్యుడను. దైత్యులు, దేవతలు, ఆ దేవతలు ఉండే స్వర్గలోకం నేనే! మేఘమండలం, పృథివి, సముద్రం, ధూళి, అగ్ని కూడా నేనే. వెయ్యి మాటలు అనవసరం. ఈ జగత్తంతా నేనే... ఈ ముల్లోకములందు ఆత్మ అయినట్టి నేను మాత్రమే సత్యమై ఉన్నాను... ఆత్మయే అయి ఉన్న నేను పరిచ్ఛిన్నుడను ఎట్లా అవుతాను నాకు అన్యమైనదంటూ, ఈ దేహంతో సహా ఈ మూడులోకాలలో ఏదీ లేదు...

ఇట్లు విచారణ చేసి నిశ్చింతుడవై ఉండు. జగత్తంతా ఆత్మమయమై ఉండగా... అట్లు గాంచటంలో ఏం కష్టం? అట్టి సంభావనను కించిత్ అలవరచుకుంటే ఇక నీవు హర్షశోకములకు వశుడవు గావు. అవి నిన్ను ఏమాత్రం ఓడించలేవు. కనీసం స్పర్శించనైనా లేవు.

తన్మయే2స్మిన్కిల జగత్యఖిలే సంస్థితే2 నఘ |

కిమాత్మయం పరం కిం స్యాత్కమలేక్షణ కథ్యతామ్ || (శ్లో 7, సర్గ 73)

ఈ జగత్తులో ఏదేది ఎట్లు తారసపడినా సరే, ఆత్మజ్ఞానికి అదంతా తనకు అన్యమైనదిగా అనిపించదు. అందుచేతనే అతడు హర్షశోకాలు పొందడు. అజ్ఞుడు మాత్రమే వాటిని పొందుచున్నాడు.

ఇంతకు ముందే మనం చెప్పుకొనియున్నట్టి మూడురకాల అహంకారదృష్టుల గురించి ... ఈ సందర్భంలో ఉచితం కనుక, మరల ప్రస్తావిస్తున్నాను విను1. నకించిదహమ్ దృష్టి - - "నేను ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనవాడను. ఈ సర్వలోకములలోని ప్రతి ఒక్క పదార్థమునకు పరమైనట్టి చిత్ స్వరూపమగు ఆత్మయే నేను-

అను దృష్టిని న కించిదహమ్ దృష్టి' అని పిలుస్తున్నారు. అట్టి దృష్టిని పెంపొందించుకున్న సాధకుడు "నేను ఒక పదార్థమునే కాదు కదా! ఇక నన్ను ఏది ఎట్లా బంధించగలుగుతుంది?- అను వివేకమును సముపార్జించుకుంటున్నాడు. పదార్థమునకు పరిమితులుంటాయి. పదార్థము లన్నిటికీ పరము, అప్రమేయము అయినట్టి నేను స్వభావసిద్ధంగానే అపరిమితుడను - - అను ఔన్నత్యదృష్టిని తత్త్వజ్ఞాని సంతరించుకుంటున్నాడు.

2. సర్వత్ర సర్వమహమ్ దృష్టి - ఆత్మయే సర్వమై అంతటా వ్యాపించి, అన్నీ తానే అయి ఉంటోంది. నేను ఆత్మను కాబట్టి అన్నిటా వ్యాపించి, అంతయూ అయి ఉన్నది నేనే. నేలపై ఆహారం కొరకై అటూ ఇటూ తిరుగుచున్న ఒక పురుగు దగ్గర నుండి, ఈ మూడు లోకములనూ పరిపాలించి శాసిస్తున్న త్రిమూర్తుల వరకు ప్రసరించియున్నది నేనే. ఇక ఈ దృష్టిని అవలంబిస్తున్న సాధనపరులకు దుఃఖం ఎక్కడి నుండి రాగలదు చెప్పు?

3. “ఇదమ్ దేహమహమ్ దృష్టి - ఈ మూడవది అతి తుచ్ఛమైన దృష్టి. ఈ దేహమే నేను - అను భావన (లేక) దృష్టి (లేక) అహంకారము సర్వదుఃఖములకు, అశాంతులకు కారణమగుచున్నది.

Page:595

ప్రియమైన రామచంద్రా! నీవు ఈ మూడవ అహంకారమును మొదటి రెండిటితో, లేక ఆ రెండిటిని ఒక దాని సహాయంతో మొదలంట్ల త్యజించి వేయాలి. అప్పుడు నీయందు నిరహంభావ రూపమైనట్టి చిన్మాత్రము శేషిస్తుంది. అద్దానినే అవలంబించు. అద్దాని యందు తత్పరుడవై ఉండు.

ఆత్మ సర్వదా సర్వమునకు అతీతమైనదైనప్పటికీ, సర్వసత్తలకు పరమైనప్పటికీ, అయ్యది తనయొక్క మాయా శక్తిచే ఈ జగత్తును స్వీకరించి పొందుచున్నది. దీనిని పరిపూర్ణమొనర్చుచూ, స్వయంప్రకాశరూపమై వెలుగొందుచున్నది. అందుచేత నాయనా! ఇక నీకు సందేహాలు అనవసరం. తాత్సారం చేయవలసిన పనిలేదు. ఇప్పటికిప్పుడే నిత్యోదితమగు ఆత్మయే నేను అనే నిత్యానుభవాన్ని ఇప్పుడే గ్రహించు. అట్టి ఎరుక - దృఢనిశ్చయములచే 'దేహము, దేహసంబంధములు’ మొదలైన వాసనలతో కూడుకునియున్న నీ హృదయగ్రంథిని త్యజించు.

అనుభవం - అయితే ఒక్క విషయం. మనం ఎంతో వివరంగా ఈ 14 రోజులుగా అనేక విషయాలు చెప్పుకుంటున్నాం ఈ మన సంవాదం మరికొన్ని రోజులు కొనసాగబోతోంది. మంచిదే. అయితే, ఆత్మ అనుమాన శబ్దప్రమాణములచే పొందబడేది కాదు మరి! సర్వదా, సర్వవిధములా సర్వరూపమైనట్టి ఆత్మ స్వానుభవము చేతనే ప్రత్యక్షం కాగలదని గ్రహించు. అందుకుగాను ఈ జీవుడు ఈ ఉపాధిచే ఏర్పడే సర్వ సంబంధములను, సర్వసందర్భములను అధిగమించ గల ఒకానొక సమగ్రమైన దృష్టిని సముపార్జించాలి. అదియే ఉపాధిని జయించటం, లేక త్యజించటం కూడా. ఉపాధికి సంబంధించిన కర్తృత్వ వృత్తితో కూడిన అంతఃకరణమును పరిశుద్ధపరచుకోవాలి. అందుకు మార్గం ఉత్తమమైన పరిశీలనయే. అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణముల సహాయంతో ఉదయించగల జ్ఞానం నిన్ను భగవంతుడగు ఆత్మగా శేషింపజేయగలుగుతుంది. ఆ జ్ఞానం అణువణువునా ప్రవేశించి నిరంతరానుభవంగా రూపుదిద్దుకోవాలి సుమా!

దేవదేవుడగు ఆత్మ సత్తు కాదు... అసత్తు కూడా కాదు. అణురూపం కాదు... బృహద్రూపం కూడా కాదు. సదసత్తుల మధ్య గల సత్యాసత్య స్వరూపం కూడా కాదు. కానీ... “సర్వం అదియే.” అదెట్లా అంటావా? ఒక జీవుడు ఒకనికి తండ్రి మరొకరికి కుమారుడు, ఇంకొకరికి భర్త, వేరొకరికి మిత్రుడు... అన్నీ అతనే గాని, వాటిలో ఏ ఒక్కటీ అతనిని నిర్వచించలేవు కదా! ఇది కూడా అట్టిదే.

ఆత్మ గురించి అనేక మాటలలో చెప్పుకుంటున్నాం. కాని యథార్థానికి అది వచించటానికి అలవి అయ్యేది కాదు. దానికి అన్యమైనదేదీ లేదు. కాబట్టి, ఇది గమనిస్తూనే, అత్యంత శ్రద్ధతో కూడిన శ్రోతవై నీవు సర్వత్రా నిర్వికారమగు ఆత్మనే దర్శిస్తూ ఉండు.

శ్రీరాముడు : స్వామి! ఇంతకీ ఈ ఎదురుగా కనబడే అనాత్మ రచయిత ఎవరు?

శ్రీవసిష్ఠ మహర్షి : 'ఇది ఆత్మ - ఇది ఆత్మ కాదు' అనునట్టి ఈ నామరూప విభాగమంతా ఆత్మయే సర్వవ్యాపకమగు తన అజ్ఞానశక్తిచే తనయందు కల్పించుకొనుచున్నది.

Page:596

సంస్థితః స హి సర్వత్ర త్రిషు కాలేషు భాస్కరః | సూక్షత్వాత్సుమహత్వాచ్చ కేవలం న విభావ్యతే ॥ (శ్లో 20, సర్గ 73)

ప్రకాశవంతమగు ఆ ఆత్మ త్రికాలములందు ఎల్లెడలా స్థితి కలిగియే ఉన్నది. అయితే అది అతి సూక్ష్మము, మహత్తరము కదా! అందుచేత స్థూలములగు ఈ దేహాదులందు ఆసక్తబుద్ధి గల మనుజులకు అది భావించటానికి అశక్యమై ఉంటోంది. ప్రయత్నించనివారికి అది అసంగతం గాను, అయోమయం గాను ఉండిపోతోంది. ప్రయత్నించేవానికో... అతిసులభం!

స్వప్న ద్రష్ట స్వప్నాంతర్గత సర్వపదార్థములలోను నిండి ఉన్నాడు కదా! అట్లాగే ఆత్మ సృష్టి సర్వపదార్థములందూ నిండియున్నది. కాని స్వభావ వశంచేత 'బుద్ధి' (లేక) 'లింగశరీరము’ నందు మాత్రమే ప్రతిబింబితమగుచున్నది. నీవు నిట్టనిలువుగా నిలబడ్డావనుకో... ఎదురుగా మరొక చోట చూచేవారికి కనిపించవు. కానీ ఆ ఎదురుగా ఒక నిలువుటద్దం అమర్చినప్పుడు అందులో ప్రతిబింబించుతావు. అనగా, అద్దం అక్కడ లేనప్పుడు కూడా నీ బింబం ప్రసరిస్తున్నప్పటికీ, నిలువుటద్దం లేనప్పుడు నీ రూపం అక్కడ చూడలేం కదా! ఆత్మ కూడా అంతటా ప్రసరించుతూ కూడా పుర్యష్టకము లేక లింగశరీరము (Subtle body) ఉన్న చోటే ప్రతిబింబిస్తోంది. గాలి అంతటా నిండి ఉన్నప్పటికీ, దాని ఉనికి తెలిసిరాదు. కాని వింజామరలు వీచినప్పుడు గాలి యొక్క ఉనికి స్పర్శకు లభ్యమగుచున్నది.

ఆత్మ అంతటా ఉన్నప్పటికి లింగదేహం ఉన్నచోట అహంకార రూపమున వ్యక్తమై అనుభూత మగుచున్నది. చిత్స్వరూపమై, సర్వవ్యాపకమైనట్టి ఆత్మ దేహము లందు మాత్రమే ఉన్నదను మాట సమగ్రం కాదు. అయితే వాయువు వీస్తున్నప్పుడు ధూళి ఎగురుచున్నట్లు, లింగదేహము ఉన్నచోట జీవుడుగా స్ఫురించుచున్నది. ఆకాశంలో సూర్యుడు ఉదయించినంత మాత్రం చేత జనులు నిదురలేచి తమ దైనందిన కార్యక్రమములు ప్రారంభించుకుంటున్నారు. పరమప్రేమాస్పదమై, నిరతిశయానంద రూపమైనట్టి ఆత్మ స్ఫురించినప్పుడే లింగ శరీరమున విషయభోగేచ్ఛ సంభవమగుచున్నది.

సర్వమూ ఉన్నది ఆత్మ యొక్క ప్రీతి కొరకే!

సూర్యోదయానంతరం జనులు ఆయా కార్యక్రమములు ప్రారంభిస్తున్నప్పుడు, ఆ కార్యములు ఫలించటం, విఫలం కావటం సూర్యునికి హాని వృద్ధులు కలిగించవు కదా! ఆత్మ దేవుని సత్తచే స్థితి పొంది ఉంటున్నట్టి ఈ దేహము ప్రవృద్ధమగుచున్నప్పటికీ (లేక) నశించినప్పటికీ ఆత్మకు ఏ హాని వృద్ధులూ ఉండవు.

ప్రాణికోట్లన్నిటి యొక్క ఆత్మ ఏ కాలమందూ కూడా జనించుటలేదు, మరణించుట లేదు. అది దేనినీ గ్రహించదు, వాంఛించదు. దానికి బంధము గాని, ముక్తి గాని లేవు. అది స్వయముగా అవధరించి అనాత్మయందు ఆత్మత్వము దర్శించుచూ, రజ్జు-సర్ప భ్రాంతిలాగా ఈ దేహం మాత్రమే నేను. ఈ దేహము నా ఉనికి అనే భ్రాంతి పొందుతోంది. అట్టి భ్రాంతి పొందుచున్నప్పుడు అది దుఃఖ భాజకము అవుతోంది.

Page:597

ఏది ఏమైనా అనాదియగు ఆత్మ ఎన్నడూ ఉత్పన్నము కాలేదు. కాబట్టి నశించుట కూడా లేదు. అది తనకు భిన్నమైనదేదీ వాంఛించటం లేదు. దానికి భిన్నంగా ఏదైనా ఉంటే కదా... వాంఛించటానికి? అది దేశ కాలములచే అపరిచ్ఛిన్నము. కనుక బంధింపబడజాలదు. బంధమే లేని దానికి ముక్తి ఎక్కడిది? అది స్వస్థానము నుండి చ్యుతి పొందుటయే లేదు. కానీ, అవిచారణవశం చేత మూఢులగు జనులు, పాపం, నిష్కారణంగా దుఃఖం పొందుచున్నారు. ఆత్మ కొరకై ఎక్కడెక్కడో వెతుకుచున్నారు.

ఓ రామా! నీవు చక్కగా ఈ జగత్ క్రమము యొక్క పూర్వాపరములను విచారణచేయి. అంతే గాని, మూఢునిలాగా వ్యర్థంగా దుఃఖం పొందవద్దు.

విజ్ఞుడైనవాడు బంధమోక్షములు అనే రెండుకల్పనలనూ త్యజించివేస్తున్నాడు. ఆత్మస్థుడై అంతరంగంలో ఒక యంత్రంలాగా మౌనముతో వ్యవహరిస్తున్నాడు.

న మోక్షో నభసః పృష్టే న పాతాలే న భూతలే | మోక్షో హి చేతో విమలం సమ్యగ్జానవిబోధితమ్ | || (శ్లో 35, సర్గ 73)

ఓ జనులారా! మోక్షము అనబడేది ఎక్కడో ఆకాశంలో గాని, పాతాళంలో గాని, భూతలమందు గాని లేదు. ఉత్తమ ఆత్మ జ్ఞానముతో బోధితమగుచున్న నిర్మల చిత్తమే మోక్షం. ఒకానొకడు సర్వవాంఛిత పదార్థముల పట్ల ఆసక్తి త్యజించాడనుకో... అట్లు ఆసక్తి మొదలంట తొలగుటచే సంభవించే చిత్తము యొక్క స్వవినాశనం' లేక చిత్తరాహిత్యం 'మోక్షము' అనే శబ్దంతో ఆత్మజ్ఞులు ఉద్దేశిస్తున్నారు.

నిర్మల ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ జీవుడు దీనుడుగానే ఉంటాడు. లేక "నాకు మోక్షము కలుగు గాక!” అను అభిలాషాసక్తుడై ఉంటాడు. చిత్తము బ్రహ్మత్వదశను పొందినప్పుడు, ఇక, ఆతనికి వేరే మోక్షమనబడేదేదీ అవసరమై ఉండదు.

ఓ సంసారాతీతమైన స్వరూపము కలవాడా! రామచంద్రా! 'ఇది బంధము, ఇది మోక్షము' అనే తుచ్ఛకల్పనను నీవు త్యజించు. మహాత్యాగము అవధరించియుండుటచే నీవు మోక్షరూపుడవై ఉంటావు. సర్వ వికల్పములు నశించిపోగా అంతఃసంగరాహిత్యముచే నిత్యోదితమైన శోభ కలిగి ఉండు. యథారీతిగా ఈ భూమండలమున దీప్తించే మణివై వెలుగొందుము.

4. ఆశా రాహిత్యం

శ్రీరాముడు : మహర్షీ! ఈ స్థూల సూక్ష్మ శరీరములన్నీ ఎందుకు, ఎప్పటి నుంచి, ఎట్లు ఉత్పన్న మవుతున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) నీ ప్రశ్నకు ఒకవిధంగా సమాధానం చెప్పాలంటే... కామ్య కర్మ వాసనలే!”

Page:598

ఆత్మ తన ప్రేమాస్పదమగు స్వరూపమును ఏమరచినప్పుడు ఈ కామ్య కర్మ వాసనల క్రమముతో కూడిన సృష్టి అంతా పెంపొందుతోంది. తత్ఫలితంగా ఈ స్థూల-సూక్ష్మ-వ్యష్టి-సమష్టి శరీరములన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కొంచెం కల్లు సేవిస్తే గొప్పమత్తు వచ్చిపడుతుంది చూచావా? ఈ స్థూల-సూక్ష్మ-వ్యష్టి సమష్టి శరీరాలతో కొంచం అహంభావం ఏర్పడితే చాలు... అతి విశాలమగు మాయ తనంతట తానే జనిస్తోంది. ఆత్మ యొక్క 'అన్యధా' భావం చేత మాయ వచ్చిపడుతోంది. ఇక ఆపై పుణ్య, పాపవాసనలతో కూడిన అనర్థ పరంపర ప్రకటితమౌతోంది. ఆ అనర్థము నుండి వికారయుక్తమైన ఈ జగత్తంతా ఉత్పన్నమై ఎదురుగా నిలుస్తోంది. మహాసముద్రంలో కెరటములు, బుడగలు, సుడులు ఏర్పడుచున్నట్లు ఆత్మ మహాసముద్రంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాసన, ఇంద్రియములు మొదలైనవి కల్పిత నామధేయములతో స్ఫురిస్తున్నాయి.

మనస్సు : పదార్థముల గురించి మననం చేయటం. చిత్తము : పదార్థములయొక్క స్ఫురణ కలిగిఉండటం. బుద్ధి : పదార్థములను నిర్వచించటం, నిశ్చయించటం. అహంకారం : పదార్థములను అభిమానించటం.

చిత్తాహంకార యోర్ద్విత్వం వచస్యస్తి న వస్తుతః |

యచ్చిత్తం సహ్యహంకారో యో హంకారో మనోహితత్ II (శ్లో 5, సర్గ 74)

ఇవన్నీ ఒకే అంతఃకరణము యొక్క వివిధ పేర్లే కదా! అయితే, చిత్తము - - అహంకారములకు మాటలోనే గాని భేదమేమీ లేదు. ఏది చిత్తమో, అదే అహంకారం కూడా! మంచు, తెలుపుదనం వేరు వేరైనవా? ఆ రెండిటిని విడదీసి చూడగలమా? అట్లాగే ... మిగతావి కూడా!

వస్త్రం నశిస్తే, దాని రంగు కూడా నశిస్తుంది కదా! ... మనస్సు, అహంకారములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నాశనం పొందుతోంది.

శ్రీరాముడు : మనస్సు, అహంకారం నశిస్తేనే మోక్షం కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : మనస్సు ఉండటం, దానిని వదలటం - అవన్నీ చిన్న పిల్లల ముద్దు మాటల వంటివి మాత్రమే. బిడ్డా! నీ స్వరూపం దేనిచేతా ఎన్నడూ బంధింపబడని ఆత్మయే అయి ఉండగా, మనస్సు అనబడేదేదో నిన్ను బంధించటమేమిటి? నీవు దానినుండి విముక్తికై దేవులాడటమేమిటి? కాబట్టి, నీవు తుచ్ఛమగు "నేను ఈ మనస్సును కట్టేసి ఆపై ఇప్పుడు మోక్షం పొందవలసియున్నది” అను పట్టుదల రూపంలో ఏర్పడుచున్న మోక్షబుద్ధినికూడా నిస్సంకోచంగా వదిలి వేయవయ్యా! నాకు బంధం కలదు’ అనే బంధబుద్ధిని, ధన-ధార పుత్రాదులగురించి ఏర్పడే ఆశ నిరాశలచే బంధించబడే నిస్సహాయ పదార్థమును" అనే నిస్తేజకల్పనలను సుదూరంగా అట్టేబెట్టు. “నాకు మోక్షం కలుగ వలసియున్నది అనే భవిష్యత్ ప్రాప్తబుద్ధి మనస్సులో ఉన్నంత కాలం సంసారమునకు సంబంధించిన ఛాయలు ఏర్పడి ఉన్నట్లేనని గ్రహించు.

Page:599

ఉన్న రహస్యమంతా మనస్సులోనే ఉన్నది. మనస్సు ఉత్కంఠితము (Inquisitively emotional) అగుచూ ఉండగా, క్రమంగా అది ఈ దేహాకారమును ధరించుచున్నది. ఫలితంగా... సర్వ దోషములూ వచ్చిపడుచున్నాయి.

శ్రీరాముడు : అయితే బంధమోక్షములనబడేవి లేవంటారా?

శ్రీవసిష్ఠ మహర్షి : మహత్తరము అద్వితీయమూ అగు ఆత్మ సర్వమునకు అతీతమై ఉండి సర్వమునందు సర్వదా వ్యాపించి ఉండగా, ఇక బంధమెవరికి? మోక్షమెవరికి? అందుచేత మోక్షం విషయం అట్లా ఉంచి, ముందు నీ మనస్సును ఇంద్రియ విషయ మననరహితం, అఖండాత్మమననసహితం చేయి.

ప్రాణవాయువు చలనధర్మం కలిగి ఉన్నది కదా! అది ఈ శరీరమున చలింపజేస్తూ ఉండగా ఈ హస్తపాద నాలుకలు తదితర అంగములు రసభరితమై చలిస్తున్నాయి. అవయవములను ప్రాణవాయువులే చలింపజేస్తున్నాయి. అయితే... సర్వవ్యాపియగు చైతన్యము తాను చలించదు. దేని చేతా చలింపబడదు.

దీపం సర్వపదార్థములను ప్రకాశింపజేస్తూ తాను యథారీతిగానే వుంటున్నట్లు, చైతన్యము సర్వ పదార్థములందు ప్రతిబింబించుచూ తాను స్వస్వరూపమునందే నెలకొని ఉంటోంది. అది జ్ఞానము ద్వారా సర్వమును ప్రకాశింపజేస్తోంది.

ఒకవైపు చైతన్యము అప్రమేయమై, నిత్యమై, జ్ఞానస్వరూపమై, శుద్ధమై వెలుగొందుచుండగా అల్పబుద్ధులగు సంసార జీవులు 'ఈ దేహములే మేము.. ఇవి మా అంగములు. అవి మా ధనములు’ ధనములు మొదలైన దుఃఖదాయకమగు మిథ్యామోహం ఆశ్రయిస్తున్నారు. మా ప్రకటన, నినాదములపట్ల ఏమీ విననట్లే ఉంటున్నారు. ఎందుకోమరి?

కేవలాత్మ (The Absolute self)కు విరుద్ధమైన ధర్మములు గల ఈ దేహము నందు, జలంతో తరంగముల లాగా, రాగము మొదలైనవి ఏర్పడి ఉంటున్నాయి. అట్టి రాగాదులచే ఆవరించబడిన అనిత్యదృష్టిచే క్రమంగా ఎరుగబడేవి, పొందబడేవి, పరిణమించేవి.. మొదలైన క్రియాక్రమములన్నీ సంప్రాప్తిస్తున్నాయి.

మృగతృష్ణ ఎందుకు కనబడుతోంది. ఎండ, వేడిమి, గాలి వీచికల ప్రతిబింబముల కలయిక ధర్మములు తెలియకపోవటం చేతనే కదా! ఆత్మయొక్క ధర్మము తెలియక పోవటం చేతనే 'నేను పుట్టాను, పుట్టేవాడను, కర్తను,. భోక్తను' మొదలైన మిథ్యావాసనలు కలుగుచున్నాయి. శ్రీరాముడు : స్వామి! మనస్సు ఎందుకు మిథ్యావాసన వైపు ఈడ్వబడుతోంది.

శ్రీ వసిష్ఠ మహర్షి: అవిద్యను మిథ్యగాగాక, సత్యముగా తలచటం చేతనే ఆ మార్గంలో మనస్సు ఈడ్వబడుతోంది. మనస్సు ప్రమత్త (Passive & Dull) అయినప్పుడు శబ్ద స్పర్శాది విషయముల వైపు పయనిస్తోంది. విషయాభిలాషితమైన మనస్సు అవిద్యను ఆశ్రయిస్తోంది. ఆ అవిద్యను తనకు అనుభవప్రదాత (Source of experience)గా స్వయముగా తీర్చిదిద్దుకుంటోంది. కాబట్టి స్వయం

Page:600

కల్పితమే అవిద్య. అంతేగాని దానిని మరెవరో ఈ మనస్సుకు అందిస్తున్నది కాదు. ఈ అవిద్య మిథ్యా రూపములుగా ఎరుగబడు గాక! అట్లు ఎరుగబడిన మరుక్షణం అది స్వయంగా నశించి ఎటకో చిత్తగిస్తుంది. అది మృగతృష్ణయే అని తెలిసిపోయిన తరువాత అక్కడకు వెళ్ళి "ఇక్కడ జలం ఉండాలే? ఏమైపోయింది?" అనే వాక్యం ఉత్పన్నం కాదు కదా! తెలుసుకొనబడిన తరువాత అవిద్య మనస్సును ఈడ్వజాలదు.



చీకటి పోవటానికి దీపం వెలిగిస్తే చీకటి స్వయంగానే తొలగుతుంది చూచావా? ఆత్మజ్ఞానం ఉదయించిన మరుక్షణం వాసనలన్నీ వాటంతట అవే తొలగుతాయి.

శ్రీరాముడు : అవిద్య మొదలంటా తొలగాలంటే ఉపాయమేమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : నీవు ఆయా అధ్యాత్మ శాస్త్రములందిస్తున్న యుక్తులచే "అవిద్య లేదు అను నిశ్చయం పొందావనుకో, అప్పుడు అవిద్యను నశింపజేయగలుగుతావు. అందుచేత రామా! సింహము బోనును పగలగొట్టి బయల్వెడలునట్లు - - నీవు అవిద్యా నిర్మూలనం చేయాలి. జడమగు ఈ దేహం కొరకై ఏర్పడి ఉన్న భోగాలతో నాకేమి పని? - అనే నిశ్చయమును పెంపొందించుకోవాలి. అట్టి నిశ్చయం యొక్క బలంతో దృశ్యమునందు నీకు ఏర్పడే ఆశ అను దానిని నశింపజేయాలి. ఆశాపరికరే రామ నూనం పరిహృతే హృదా!

పుమానాగతసౌన్దర్యో హ్లాదమాయాతి చన్ద్రవత్ ॥ || (శ్లో 24, సర్గ 74)

అప్పుడు ఆశ యొక్క పరివారమైన దేహాభిమానం, కామక్రోధాదులు తొలగుతాయి. తన ప్రయత్నముచే సుందరగుణములు సంపాదించుకున్న మనుజుడు తాను ప్రసన్నుడగుచూ, తదితర పరిసరములను కూడా ప్రసన్నం చేయగలుగుతాడు. అట్టి జ్ఞాని అధిక శోభాన్వితుడై మహద్రూపముచే తన యందు తానే ఇముడక... అపరిచ్ఛిన్నుడై ఉంటాడు. స్వాత్మయందు ప్రశాంతుడై, క్షోభావర్జితుడై, సుస్థిరుడై అత్యంత ధైర్యపూర్వకమైన మోక్షలక్ష్మితో శోభిల్లుతూ ఉంటాడు. అమృతము త్రాగిన వాని వలె, కుండలో వెలిగేదీపంలాగా దేదీప్యమానమైన మణిలాగా ఆత్మ జ్ఞాన ప్రకాశంతో శోభిల్లుతాడు. సర్వాత్మకుడై, సర్వవ్యాపకుడై, సర్వేశుడై, సర్వాకారుడై, నిర్వికారుడై ఎల్లప్పుడూ ఆత్మనే వీక్షిస్తూంటాడు. ఆ స్థితిలో ఆతడు ఒక్కసారి తన గడచిపోయిన రోజులలోని చంచల చిత్తమును చూచి నవ్వుకుంటూ ఉంటాడు.

విషయసంగమును వీడుటచే, అభిమాన - సంతాపములను అధిగమించుటచే ఆతడు పవిత్ర చిత్తుడౌతాడు. ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటాడు. 'కామము' అనే బురదను కడిగివేసుకొని ఉంటాడు. ‘బంధము’ అనే భ్రమను మొదలంట్ల నరికి వేస్తాడు. శీతోష్ణ, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విడివడినవాడై, ఈ సంసార సముద్రమును దాటివేస్తాడు. సర్వోత్తమమగు విశ్రాంతిని, సర్వాతీతము, అలభ్యము అగు స్థానమును పొందుతాడు. పునరాగమనరహితుడై మోక్షసామ్రాజ్యమును అలంకరిస్తాడు. మనోవాక్కాయములచే సర్వజనులూ అభిలషించే చరిత్ర కలిగి ఉంటున్నాడు.

Page:601

అట్టి ఆత్మజ్ఞాని దేనినీ ద్వేషించడు. వాంఛించడు. ఆతనికి సుఖ దుఃఖాదులు ఉండవు. దేనినీ గ్రహించడు, తిరస్కరించడు. నిందించడు. స్తుతించడు. స్వస్వరూపము యొక్క ఆవిర్భావము గాని, తిరోభావముగాని పొందడు. ప్రసన్నుడుగాడు. దుఃఖితుడు కాడు. సర్వకార్యములను త్యజించినవాడై, సర్వోపాధివర్జితుడై, సర్వాశలనుండి వినిర్ముక్తుడై ఉంటాడు. అందుకే మనం ఆతనిని 'జీవన్ముక్తుడు’ అని పిలుస్తున్నాం.

#

ఓ రామచంద్రా! సర్వ ఈషణములను (All urges, desire) పరిత్యజించివేయి. జలధారను సంపూర్ణంగా విడచివైచిన మేఘంలాగా నీ చిత్తము మౌనం వహించి ఉండుగాక! ఆశారాహిత్యమును ఆశ్రయించి ఉండు.

ఆశారాహిత్యం గల అంతఃకరణంవలన కలిగే సుఖం ఈ స్వర్గ - మర్త్య - పాతాళములలో మరెక్కడా దొరికేది కాదయ్యా! నీయొక్క నైరాశ్యము (ఆశారాహిత్యం)చే ఈ జగత్తునంతటినీ ప్రశాంతమయం, శీతలం చేసివేయి. 'ఆశించుట' అను దురభ్యాసము నుండి విడివడిన మనస్సు కలిగినవాడవై ఉదారచిత్తుడవై, మౌనివై, జ్ఞానివై శోభించు. ఏదీ కోరనట్టి మనస్సు కలవాడవై, ఉదార - జ్ఞాన - మౌన శోభితుడవై ప్రకాశిస్తూ ఉండగా... అట్టి శోభకు వసంత సౌకుమార్యము కూడా దీటు రాదు సుమా!

ఆశయే లేని మనస్సు ఇచ్చే సుఖం త్రిలోకాధిపత్యంలో కూడా ఉండదు.

ఓ సాధూ! నీకు రెండవరోజు సంవాదంలో చెప్పాను. కోరిక శమించటమే 'శమము' అని అంటాం. అట్టి శమము సంపాదించినవాని అంతఃకరణం శాంతమయమౌతుంది. అప్పుడు నీ పట్ల ఆపదలన్నీ క్షయిస్తాయి. అట్టి శమం, శాంతం, నైరాశ్యం అను పర్యాయపదాలచే అలంకృతుడవై అటుపై ఈ భూమినంతటినీ గోప్పద తుల్యంగా చూడు. లోకముల ఆధిపత్యమును కూడా తృణ ప్రాయంగా దర్శించు.

ఈ మనుజులలో అనేకులు ధన సంచయం, పుత్ర కళత్రాదులతో సమాగమం వస్త్రాలంకరణం, వస్తు సముదాయం, అన్నపానాది క్రియా పరంపరలు - గొప్పగొప్ప విషయాలుగా గాంచుచున్నారు. ఆశలన్నిటినీ అధిగమించియున్న మహనీయులు ఆ వ్యవహారములన్నీ చూచి పకపకా నవ్వుకుంటు న్నారు. ఎవరి హృదయంలో 'ఆశ' అనే ఛాయ ఏర్పడటానికే జంకుతుందో... అట్టి మహనీయులతో మనం పోల్చగలిగినది ఈ ముల్లోకాలలో ఏదీ లేదు. "ఇది నాకు కావాలి,. అది నాకు వద్దు" అను రాగద్వేషములకు ఎవని చిత్తంలో చోటు దొరకదో... అట్టి స్వాధీన చిత్తుని గురించి చెప్పటానికి నా దగ్గరున్న ఉపమాన-ఉపమేయాలన్నీ ఏమాత్రం సరిపోవు సుమా! అట్టివారు మా మహర్షులకు కూడా ప్రాతఃస్మరణీయులగుచున్నారు.



Page:602

అందుచేత రామా! నీకు మరల మరల గుర్తుచేస్తున్నాను. నీవు ఆశారాహిత్యమును అభ్యసించు. ఆశ్రయించు. అది సర్వసంకటవర్జితమని, పూర్ణసుఖస్వరూపమని బుద్ధియొక్క పరమసౌభాగ్యమని మహనీయులు ప్రవచిస్తున్నారు.

ఓ రాఘవా! అసలు ఇక్కడ తారసపడుచున్న ఆశతోగాని, నిరాశతోగాని నీకు (లేక, ఈ జీవునికి) ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏర్పడివుండి ...నీకు ఆకర్షణ వికర్షణ కలుగజేస్తున్న ఈ జగత్తంతా స్వతఃగా మిథ్య మాత్రమే. ఇక నీవు వీటి పట్ల నాకు ఉండు గాక... లేకుండు గాక అను ప్రియాప్రియములకు సంబంధించిన కల్పనలతో ఎందుకు శ్రమించాలి చెప్పు?

ఓ సర్వజనులారా! నేను ఇంతగా బోధించిన తరువాత కూడా "ఈ దేహం, ఈ పదార్థాలు నావి. ఈ దేహము ఏర్పడుచున్న తరువాత సిద్ధిస్తున్న వాటిచే నేను పరిమితుడను అను దృష్టిని వదలటానికి ప్రయత్నించక పోవటం ఉచితమేనా చెప్పండి? సద్వివేచన చేయమని నా ప్రార్థన.

ఆత్మైవేదం జగత్సర్వం నానాతేహ న విద్యతే ॥

ఏకరూపం జగజ్జాత్వా ధీరైర్నామ న ఖద్యతే ॥ (శ్లో 54, సర్గ 74)

ఓ రామా!ఈ ప్రపంచమంతా ఆత్మయే. ఇక్కడ అనేకత్వమనునదే లేదు. మీరు ఏకమైన ఆత్మ రూపంగా ఈ జగత్తును ఎరిగి ఈ జగత్తును ధీరస్వభావులైన వారు ఎలాంటి భేదమొందక ఉన్నారు.

ఓ రాఘవా! "ఈ పదార్థములన్నీ యథార్థదర్శనముచే ఆత్మ రూపంగానే తెలియవస్తున్నాయి అని నీవు నీ బుద్ధికి మరల మరల గుర్తు చేయి. అప్పుడది అకృత్రిమమైన పరమ ధైర్యం పొందుతుంది. నిజమైన ఆశారాహిత్యం ఉదయిస్తుంది. ఇక ఆపై భావాభావకల్పితరహితుడవై... సర్వ వస్తువుల ఆద్యంతములందు ఉన్నట్టి 'సత్ చిన్ మాత్రము' ను మాత్రమే అవలంబించి వుండు. ఇదీ నీవు ఈ జగత్తును గాంచవలసిన విధానం సుమా!

సింహమును చూడగానే లేడి ఏం చేస్తుంది? ఎక్కడికో దూరంగా పారిపోతుంది కదా! వైరాగ్యంచే ధీరమైనట్టి మనస్సు గలవానిని చూచి రాగ-ద్వేష-ఆవేశ-భ్రమ-ఉద్వేగ-ఆశ-నిరాశాది భావనోద్రేక- భరితమైన ఈ సంసారం తోక ముడిచి ఎక్కడికో పారిపోతోంది. ధీరబుద్ధి గల ఆత్మ జ్ఞాని ఒక కామోన్మత్త అయిన అతి సుకుమార స్త్రీని, శిథిలమైన శిలా విగ్రహమును ఒకేరకంగా చూస్తాడు. అందుచేత విషయభోగాలు ఆనందింపజేయటం గాని, ఆపదలు భిన్నపరచటం గాని జరుగదు. ఈ దృశ్య వైభవమంతా కలసి ఏకమై దండయాత్ర చేసినా సరే ....ఆతనిని స్వాత్మ నుండి తొలగించలేవు. ఆతని ఉదార బుద్ధి ఇక్కడి మోహాలను క్షణంలో చూర్ణం చేసివేస్తుంది. రాగ ద్వేషా దులు ఆతనిని ఆక్రమించలేవు. చలింపజేయలేవు, తానే వాటిని ఆక్రమించి అధిగమించి ఉంటాడు. శ్రీరాముడు : మహర్షీ! మీరు మాకు విడమర్చి చెప్పుచున్న ఆత్మజ్ఞుల దృష్టి మాకు ఎంతోసంతోషమును, ఉత్సాహమును కలుగుజేస్తోంది. మేమంతా పూర్ణ జ్ఞానులుగా తీర్చిదిద్దబడటమే ఈ సంసారమును

Page:603

అధిగమించటానికి తరుణోపాయం కదా! అందుచేత జ్ఞానుల దృష్టి అవగాహన కార్యక్రమముల గురించి మీ నుంచి ఎంతైనా మేము వినవలసిందే. అందుచేత, ఆత్మజ్ఞానుల జగత్ సందర్శనం

గురించి మరికొంత వివరించండి.

5. జ్ఞాన సందర్శనం

శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క జగత్ సందర్శనం గురించి మనం అనేక మార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా కూడా మరల మరల విశదీకరించుకోవటం అవసరమే.

ఆతడు దేనిపట్లా ప్రీతి గొనడు. విజ్ఞాన దృష్టిని వదలడు. క్షోభను దరిజేరనీయడు. అనాసక్తతను బలపరుచుకుంటూ ఉంటాడు. దేహాతీతత్వం అవధరిస్తూ ఉంటాడు. వికారరహితుడు, నిరంతర ఆత్మసంలగ్నధ్యానమయుడు అయి ఉంటాడు. సర్వముచే అస్పృశ్యుడై ఉంటాడు.

శ్రీరాముడు : మీరు ఉపయోగించిన విశేషణములు - 1. అప్రీతి 2. విజ్ఞాన దృష్టి 3. అనాసక్తత 4. దేహాతీతత్వం 5. వికారరాహిత్యం 6. అస్పృశ్యత్వం - - గురించి కొంచెం వివరించి చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : సరే. నీవు కోరినట్లు కొంచం వివరించి చెపుతాను విను -

ప్రీతి గొనకపోవటం - జ్ఞాని ఒక లతను సుందర స్త్రీని, మట్టిని-బంగారాన్ని, నచ్చేవాటినినచ్చనివాటిని ఒకే రీతిగా చూస్తాడు. ఉభయ సమయములలోనూ నిర్వికారుడై, నిర్లిప్తుడై ఒక పర్వతంలాగా స్థిరాకృతితో ఉంటాడు. పవిత్రమైన ఆశయం, కార్యక్రమంతో ప్రయాణం చేస్తున్న ఒక బాటసారి రహదారి ప్రక్కన కనబడిన శ్మశానమును చూచినప్పుడు ఆతనికి దానిపట్ల ప్రీతి కలుగుతుందా? జ్ఞాని ఇక్కడ కనబడే సందర్భముల పట్ల, భోగములపట్ల ఏమాత్రం ప్రీతి గొనడు.

విజ్ఞాన దృష్టి కలిగి ఉండటం!- కళ్ళు తెరిచినంత మాత్రం చేత మరే విశేషప్రయత్నం లేకుండానే ఎదురుగా ఉన్న వెలుతురు కనబడుతుంది కదా! ఆత్మజ్ఞాని ప్రవాహపతితంగా వచ్చిపోతున్న ఆయా సంఘనలను, సందర్భములను, భోగసముదాయమును సక్తత లేని చిత్తంతో లీలామాత్రంగా అనుభవిస్తాడు. కాకతాళీయంగా తారస పడే ఈ వనిత, ధనము మొదలైన భోగములు అనుభవించ వలసి వస్తున్నప్పటికీ, ధీరునకు అవి సంతోషమునుగాని, దుఃఖమునుగాని కలిగించలేవు. సముద్ర మధ్యంలో స్థిరంగా ఉన్న పర్వతాన్ని ఓ రెండు కెరటాలువచ్చి తాకినంత మాత్రం చేత అవి పర్వతమును కదిలించగలవా? ఆత్మ యొక్క ప్రత్యక్షమును ఏకాగ్రతతో దర్శించుచున్నట్టి తత్త్వజ్ఞానిని ఈ దృశ్య ప్రపంచములో ఏర్పడుచున్న సుఖ దుఃఖములు తాకజాలవు. తాకినప్పటికీ, ఆతని ఆత్మ సందర్శనాన్ని ఏమాత్రం భంగపరచలేవు. ఆతడు ఎప్పటికి ఏది ప్రస్తుతమో... అదే నిర్వర్తించుచూ... ఆపై ఇక తన దృష్టినంతా ఆత్మజ్ఞాన మార్గంలో నియమించి ఉంచుతాడు.

క్షోభ పొందకపోవటం! - అనేక లోకములు నిర్మించవలసివచ్చుచున్నప్పటికీ ఆత్మ పరాయణుడగు బ్రహ్మదేవుడు వ్యగ్రుడగుచున్నాడా? ఆయా ఋతువులు వచ్చిపోతున్నప్పుడు పర్వతాలు ఏమైనా

Page:604

క్షోభ పొందుచున్నాయా? లేదే! సర్వభూతస్థమై ఉన్న తన ఆత్మస్వరూపమును ఆశ్రయించి ఉన్నట్టి జ్ఞాని కూడా సమయోచితమైన క్రియాదులలో ఏర్పడే సంయోగ - - వియోగములు చూచి వ్యగ్రుడుకాడు, క్షోభ చెందడు.

అందరిలాగానే ఆతడు కూడా నవ్వవలసినచోట నవ్వుతాడు, ఏడవవలసినచోట ఏడుస్తాడు. కాని, సర్వ విషయముల పట్ల 'ఇది మిథ్యయే కదా' అను అవగాహన, దృష్టులను వదలకుండా ఉంటాడు. అంతేకాదు. తదితరజనులకు అది గుర్తుచేస్తూ ఎంతో స్థైర్యం కలుగజేస్తాడు. భోగములను మిథ్యారూపంగా గాంచుచూ, కాఠిన్యం లేకుండా ... జితేంద్రియుడై సంతాప వర్జితుడై ఉంటాడు. దేశ కాల క్రమానుసారంగా సుఖము, దుఃఖము, సంపద, ఆపద - మొదలైన వాటి పట్ల నిర్లిప్తుడై, సాక్షీభూతుడై, అతీతుడై ఉంటాడు.

అనాసక్తుడై ఉండటం! - ఓ ప్రియ దశరథ రామా! ఈ శబ్దస్పర్శాది కర్మేంద్రియ వ్యాపార విషయాలలో పాల్గొనవలసి వచ్చినప్పటికీ, నీవు నిత్యమూ అనాసక్తుడవై ఉండు. వాటి యందు నీ చిత్తము అనాకర్షితమై ఉండు గాక! సంలగ్నం కాకుండు గాక!

అయితే... ఈ బంగారం మలినమైనది" అని ఎప్పుడంటాం? బైట ధూళివంటివి ఉన్నప్పుడా? ...కాదు. లోపల రాగి వంటి అల్పలోహాలు ఉన్నప్పుడు మాత్రమే కదా!... అంతఃకరణంలో ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవుడు సక్తుడు అని అనిపించుకుంటాడుగాని, బాహ్య కార్యక్రమములచే కాదని నీవు గ్రహించు.

దేహముతో అప్రమేయత్వం వహించి ఉండటం! - ఎప్పుడైతే ఈ దేహమును తనకు భిన్నమైనది గానూ, ఆత్మను వివేకదృష్టితోనూ మననపూర్వకంగా సందర్శిస్తూ ఉంటాడో, ఆతడు ఈ అవయవములు ఛేదించబడుచున్నప్పుడు కూడా అంతరంగంలో విక్షేపరహితుడై ఉంటున్నాడు. ఒక్కసారి నిర్మలజ్ఞానం సంపాదించావా.... ఇక ఆ ఆనందమయ వివేక దృష్టి నిన్ను విడచి ఎక్కడికీ పోదు.

తిరోగమనం స్వీకరించకపోవటం! (Non deviation Non distraction) - 'నా స్వరూప స్వభావాలు సర్వదా ఆత్మయే. ఆత్మ ఇట్టిది" అని ఆత్మను ఎరిగినవాడు మరింకెప్పుడూ, ఎన్నటికీ అజ్ఞత్వం పొందడు. వర్షాకాలంలో పర్వతం మీద నుంచి జారి ప్రవహించిన జలం మరల వెనుకకు మరలుతుందా? త్రాడు పట్ల ఏర్పడిన ‘ఇది పామేమో?” అనే భ్రాంతి తొలగిన తరువాత, ఆ త్రాడును చూచినప్పుడు భయం మొదలైన వికారములు ఏర్పడతాయా? అగ్ని యందు స్ఫుటం ఒనర్చబడిన బంగారం తన శుద్ధసహజ ఛాయ పొందిన తరువాత, దానిని నీళ్ళలో ముంచినంత మాత్రం చేత తన బంగారు కాంతులు పోగొట్టుకొంటుందా? చెట్టు నుండి తెగిజారిన పండును మరొకసారి కొమ్మకు అతికించినా కూడా, అతికి ఉండదు కదా? అట్లాగే "ఈ దృశ్యం స్వతఃగా అవాస్తవం" అనే సుజ్ఞానం నిశ్చలమైన తరువాత ఇక గుణములతో బంధం ఏర్పడదు. రాళ్ళగుట్టలోంచి మణిని వేరుచేసి మెడలో ధరించిన తరువాత, మరల ఆ మణిని రాళ్ళగుట్టలోకి విసరివేసే మూర్ఖుడెవడైనా ఉంటాడా? అవిద్య నుండి విద్యను ఎరిగిన తరువాత ఈ దృశ్యమునందు మరల ఎవడు మగ్నుడౌతాడు? సశాస్త్రీయమైన శివ తాండవం చూచిన తరువాత ఒక కోతి కుప్పిగంతులను చూచి ఆనందించేవాడెవ్వడో చెప్పు?

Page:605

దృశ్య వికార రాహిత్యం! - ఇది పాలు కాదు. సున్నపునీరు మాత్రమే" అని ఉత్తమ విచారణచే గ్రహించిన తరువాత "అయ్యో! నేను త్రాగలేకపోయానే? అనే వేదన చెందే మూర్ఖుడెవడు? అట్లాగే ఉత్తమ విచారణచే వాసన నివృత్తి అవుతుంది. ఇక దిగులు పడటానికి, వేదన చెందటానికి ఇక్కడ ఏదీ మిగలదు. ఉత్తములగువారు ఇది మజ్జిగ అని భ్రమించుటచే త్రాగాలని కోరుకుంటారేమో గాని కాదు... తెలిసిపోయింది... ఇది కల్లు అని గ్రహించిన తరువాత త్రాగాలని అనుకుంటారా? తత్త్వజ్ఞుడు “సర్వము ఆత్మయే అను ఎరుకను అవధరించిన తరువాత అందమైన స్త్రీ శరీరమును ఒకానొక లిఖిత చిత్రమువలె చూస్తాడుగాని, వికారాదులు పొందడు.

చిత్రంలో లిఖించబడిన స్త్రీ అంగములన్నీ ఆయా రంగుల సమ్మేళనము మాత్రమే కదా! అట్లాగే స్త్రీ పురుషుల జుట్టు - గోళ్ళు మొదలైన అవయవములన్నీ పంచభూతముల సముదాయమేనని

గ్రహించి ఉంటాడు.

పటికబెల్లం తీపిని ఆస్వాదించిన తరువాత, ఆ తదుపరి త్రాగే నీళ్ళు పటికబెల్లపు తీపిని మరిపింపజాలదు కదా! ఆత్మానందం పొందినవాడు తదితర విషయ సుఖములను చూచినంత మాత్రం చేత ఆత్మను ఏమరువడు.

నిరంతరమైన నిమగ్నం - ఒకానొక ముగ్ధస్త్రీ దూరప్రాంతం వెళ్ళి ఇంకా రావలసియున్న తన భర్తయందు... ఆసక్తి కలిగియున్నదనుకో... ఆమె గృహకృత్యములందు తలమునకలై ఉన్నప్పటికీ తన అంతఃకరణమునందు తన భర్త యొక్క రాకచే ఏర్పడే స్నేహానుభవమునే మననం చేస్తూ ఉంటుంది కదా! శుద్ధ బ్రహ్మముతో సమాగమం, విశ్రాంతి పొందు ప్రయత్నశీలుడగు జీవుడు ఆ బ్రహ్మానందమును అనుభవిస్తూనే ఈ ప్రాపంచిక క్రియలందు పాల్గొంటూ ఉంటాడు. ఇవేవీ ఆతని ఆత్మానుభవమును నిరోధించలేవు. ఇంద్రాది దేవతలంతా కలిసికట్టుగా వచ్చి కూడా ఆతని బ్రహ్మానందానికి ఖేదము కలిగించలేరు. మనస్సును అధిగమించిన ఆత్మజ్ఞానికి చ్యుతి’ కలిగించగలిగే శక్తి ఈ ప్రపంచములోని ఏ పదార్థమునకూ ఉండదు.

విషయములచే స్పర్శించబడకపోవటం! - వివిధ పుష్పరసములన్నీ తేనె యందు ఏకమై పోతున్నాయి. ప్రపంచములోని ఆనందములన్నీ బ్రహ్మానందమునందు సమరసమై పోతున్నాయి. తత్త్వజ్ఞుడగు మనుజుని బుద్ధిని ఎవరు దేనిని చూపించి ఏమరిపించగలరు? తన ప్రియుని పట్ల ఆసక్తమైన బుద్ధిగలస్త్రీ ఎన్ని విఘ్నములు, నిరోధములు కల్పించబడుచున్నాకూడా, అవన్నీ లెక్కచేయక ప్రియునియందే మనస్సు కలిగి ఉంటుంది చూచావా? అవిద్యారహితుడగు జ్ఞాని ఆత్మానందమును అనుభవిస్తూనే ఉంటాడు. కష్టములన్నీ వచ్చి పడుగాక! అవయవములు ఛేదించబడుగాక! విషాద సంఘటనలు తారసపడుగాక! సిరులు వచ్చుగాక.... పోవుగాక! ఆతని ఆత్మానుభవం చెక్కుచెదరదు. "నిష్కళంకము, అత్యున్నతము, అంతర్గతము అగు ఆత్మను నేను" - అనునది ఏమరువడు.

ఆత్మజ్ఞాని ఈ చిత్తమును ఒక బాహ్యమగు ఉపకరణమువలె చూస్తాడు. కనుక ప్రారబ్ధకర్మలందు, దారిద్ర్యాది దశలందు, సంకటములందు ఆతని ఆత్మానుభవ స్రవంతికి అడ్డు ఉండదు. నగరంలో

Page:606

ఉన్నా, అరణ్యంలో ఉన్నా, పర్వతములపై ఉన్నా, తపోవనంలో ఉన్నా, ఊపిరిసలపనన్ని పనులలో ఉన్నా... అవేవీ ఆతనికి హర్షశోకములుగా పరిణమించవు. ఆతడు సర్వదా ఈ సర్వముచే అస్పృశ్యుడై

ఉంటాడు.

6. సోదాహరణములు

శ్రీరాముడు : ఆత్మజ్ఞాని గురించి మీరు చెప్పే విశేషాలన్నీ ఆమోదయోగ్యమేనని ఒప్పుకుంటున్నాను. అయినా కూడా, ఈ రాజ్యాదులు, ఈ ధన జనాది విషయసంపర్కములు ఎదురుగా ఏర్పడి ఉండగా మనస్సు విజ్ఞతను, ఆత్మదృష్టిని ఎట్లా అలవరచుకోగలుగుతుందోనని... నాకు కొంచం అనుమానంగానే ఉన్నది. అనేకులు సంసారదృష్టిని వదలలేకపోవటం మనకు కనబడుతూనే ఉన్నది కదా! శ్రీవసిష్ఠమహర్షి : ఉత్తమ ఉదాహరణలు కొద్దియే కావచ్చు. మనం ఆత్మజ్ఞానుల ప్రేరణాదులనే అనుసరణీయంగా స్వీకరించాలి గాని... సంఖ్యాపరంగా ఎక్కువ మంది కాబట్టి, అజ్ఞానుల సాంసారిక దృష్టిచే ఎందుకు సంక్షోభం పొందాలి?

ఆత్మ జ్ఞానం సంపాదించి కూడా యథాతథంగా ఈ ప్రాపంచిక కార్యక్రమములు నిర్వర్తిస్తున్న మహనీయులు ఎందరో ఉన్నారు. నీకు కొన్ని దృష్టాంతాలు చెపుతాను విను- జనక మహారాజు గురించి మనం చెప్పుకున్నాం. ఆతడు అందరు రాజులు లాగానే రాజ్యకార్యములందు నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ సదా దుఃఖరహితుడై దేనికీ ఏమాత్రం వ్యాకులత పొందక ఉన్నాడు కదా!

మీ పితామహుడు దిలీపుని గురించి తెలుసు కదా! సర్వ కార్యములు నిర్వర్తిస్తూనే అంతః కరణంలో వీతరాగుడై చిరకాలం అయోధ్యను పాలించలేదా? మనువు రాగకళంకం లేని మనసుతో జీవన్ముక్తుడై ప్రజలను ఏలారు. మాంధాత చక్రవర్తి అనేక యుద్ధాలలో పాల్గొనుచూ బ్రహ్మజ్ఞానియై వెలుగొందారే! అట్లాగే, పాతాళంలో బలిచక్రవర్తి “ఇదంతా సమయోచితమే ...అను అవగాహనతో ఏవేవో క్రియావ్యవహారములు నిర్వర్తిస్తూనే తాను మాత్రం సదా త్యాగి అయి, ఆసక్తిరహితుడై, జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. దానవుల ప్రభువైన 'సముచి' అనేకసార్లు దేవతలతో యుద్ధం చేస్తూ వివిధములైన ఆచార విచార తత్పరుడై కూడా ...దేనికీ ఏ మాత్రం ఖిన్నుడగుట లేదు. వృత్రాసురుడు' అనే రాక్షసుడు అత్యంత ఉదారచిత్తుడై, మాననీయుడై, తన దేహంతో అనేకసార్లు దేవతలతో యుద్ధం చేసి చివరికి పిల్లవాడు ఆట బొమ్మను వదిలినట్లు శరీరమును ఇంద్రుని చేతిలో త్యజించాడు. పాతాళాధీసుడైన ప్రహ్లాదుడు వాక్కు అగోచరమైన అక్షయసిద్ధి పొంది కూడా సాంసారిక మాయలో నిశ్చింతగా పాల్గొన్నాడు.

అట్లాగే శంబరాసురుడు కూడా! ఆతడు ఒక వైపు అనేక మాయలను సృష్టిస్తూ దానవుల కొరకు విష్ణువుతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. మరొక వైపు అనాసక్తుడై కుశల బుద్ధితో ఉత్తమజ్ఞానాన్ని ఆశ్రయించి ఉండేవాడు. పరమ చిదాకాశమున ఏకత్వరూపుడై ఉంటూనే సంక్లిష్టమైన యుద్ధసన్నివేశాలు రచిస్తూ ఉండేవాడు.

Page:607

సర్వదేవతాముఖ రూపుడైన అగ్నిదేవుడు ఒక్కసారే అనేక యజ్ఞ, యాగాలలో హవిస్సు స్వీకరిస్తూనే, ముక్తుడై... అప్రమేయుడై ఈ చరాచర సృష్టిని ఆక్రమించియున్నారు. ఆ చంద్రుడు తన యందు అమృతమును ధరించి ఈ భూమిపై ఓషధ రచనకు కారకుడగుచూ తాను నిర్వికారుడై పరమజ్ఞానముతో ప్రకాశిస్తున్నాడు. దేవతల పౌరోహిత్యం, గురుత్వం, భార్య కొరకు చంద్రునితో యుద్ధం... మొదలైనవి నిర్వర్తిస్తున్న బృహస్పతి తాను మాత్రం సర్వదా ముక్తస్వరూపముతో తేజరిల్లు చున్నారు. అట్లాగే శుక్రాచార్యుల విషయం తెలుసుకదా! ఆయన సర్వుల అభీష్టమును పాలించుచూ, తదనుకూలంగా నీతిశాస్త్రరచన చేశారు. అసురులకు గురువై, వారినందరినీ ఒక త్రాటిపై నడిపిస్తు న్నారు. వాళ్ళకు దిక్కు - శ్రేయోభిలాషి ఆతడే. అయితే ఏం? నిర్వికారబుద్ధితో సాక్షిమాత్ర పూర్వకంగా కాలగమనం కొనసాగిస్తున్నారు. వాయుదేవుడు ఊర్ధ్వ అధోలోకాలను, ప్రాణములందలి అవయవాలను చలింపజేస్తూ ఉంటారు. సదా సర్వ ప్రదేశములందూ సంచరిస్తూ, ముక్తుడే అయి ఉంటున్నారు. ఆయనకు ప్రియుడెవ్వరు? అప్రియుడెవ్వరు?

నాయనా! రామా! బ్రహ్మజ్ఞులై కూడా తమకు నియమితములైన కార్యములను ప్రశాంత బుద్ధితో నిస్సంగులై నిర్వర్తించే మహనీయులెందరో ఉన్నారు. పరబ్రహ్మమూర్తియగు బ్రహ్మదేవుని చూడు. ఆయన ఈ లోకములన్నిటి యొక్క ఊర్ధ్వ-అధో-మధ్య గతి పరివర్తనములను రచించి ఉన్నవారే కదా! అయినప్పటికీ సమచిత్తము కలిగి తన సుదీర్ఘమగు ఆయువును గడుపుచున్నారు.

ముక్తుడగు విష్ణుభగవానుడు దేవతల సుఖం కొరకై అనేక యుద్ధములు చేస్తున్నారు. భక్తుల కొరకై మానవ - జంతు ఉపాధులను పొందుచూ బాల్య - యౌవన - వార్ధక్యాలు అనుభవిస్తున్నారు. శిలాకారంగాను, శిల్పాకారంగాను (జడంగా కూడా), స్త్రీ - చేప - తాబేలు వరాహం వంటి జంతు, నర అవతారాలు స్వీకరిస్తూ అనేక కల్పములు భక్తుల హృదయాలలో సంచరిస్తున్నారు. ఇంత వ్యాసంగం నిర్వర్తిస్తూ కూడా తాను అప్రమేయుడై, అఖండుడై వైకుంఠమున వెలయుచున్నారు! ఆయన ఏ క్షణమైనా తన ముక్త స్వరూపమును వదలుచున్నారా? లేనే లేదు.

త్రినేత్రుడగు మహేశ్వరుడు ఒక సామాన్యకాముకుని వలె జగజ్జననియగు పార్వతీదేవితో తాండవ నృత్యం చేస్తున్నారు. గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలైన ప్రమథగణం అందుకు లయపూర్వకంగా తాళం వేస్తూ గానాదులు చేస్తున్నారు. అంతటి తన్మయంతో ఆనంద వైభవంగా నృత్యం చేస్తూనే ఆయన భక్తుల పిలుపు వినగానే వారి ముందు పార్వతీసమేతంగా ప్రశాంతమంగళ స్వరూపంతో ప్రత్యక్షమగుచున్నారు. ఉపయుక్తమైన ఉపాధులు కల్పించుకొని భక్తులు పొందే బెత్తపు దెబ్బలు తాము పొందుచున్నారు. ఆదిశక్తి స్వరూపిణియగు అమ్మవారు పార్వతీదేవి నిత్యముక్త అయి కూడా పరమశివుని శరీరార్దభాగం స్వీకరించి, తన బిడ్డలు భక్తితో ఆక్రందన చేస్తున్నప్పుడు ఆ పరమశివుని ప్రేరేపించి వారికి సకల శుభములు కలుగజేస్తున్నారు కదా! ఇంత తతంగం జరుగుచున్నా, పార్వతీపరమేశ్వరులు ఆత్మతత్త్వమును అవధరించే ఉంటున్నారే!

మహాధీశాలి, వీరుడు, పరమ జ్ఞానసముపేతుడు, జ్ఞానరత్నములకు సముద్రము వంటివాడు అగు ఆ కార్తికేయుడు (కుమారస్వామి) నిత్యముక్తుడైయుండి లోక కళ్యాణార్థం తారకేశ్వరునితో

Page:608

యుద్ధం నిర్వర్తించారే! మహాధైర్యయుక్తుడై, ధ్యానముచే విశుద్ధమైన బుద్ధిని సముపార్జించియున్న భృంగీశ్వరుడు ముక్తత్వము వహిస్తూనే ఒకసారి తన తల్లి పార్వతీదేవి పాదాలకు తన రక్తమాంసములను సమర్పించివేశారే.

అదిగో... అక్కడ చూడు. అక్కడ కోటి సూర్యుల ప్రకాశంతో ఈ సభలో ఆసీనులైన ఆ నారద మహర్షిని చూచావా? ఆయన తన తంబురను మీటుతూ 'నారాయణ, నారాయణ' అని ఉచ్చరిస్తు త్రిలోక సంచారం చేస్తున్నారు. తాను ఎక్కడికి వెళ్ళితే అక్కడ సర్వమూ పవిత్రం చేస్తున్నారు. ఆయన సర్వదా ముక్తుడే! ఆయనకు పొందవలసినదీ, పొందబడనిదీ అంటూ ఏదీ లేదు. ఆయన లోక కళ్యాణార్థం పరమేశ్వర నిర్ణయం అవధరిస్తూ అనేకమంది జనులతో సంభాషిస్తూ ఏవేవో ఉపాయాలు, చెపుతూ ఉంటారు. పురాణద్రష్టలు ఆయనకు 'కలహభోజనుడు' అని బిరుదు ఆపాదించారు. ఆయన ఆయా క్రియాదులు నిర్వర్తించినంతమాత్రంచేత ఏ క్షణంలోనైనా తన జ్ఞాన, ముక్త స్వరూపం ఏమాత్రం ఏమరుచుట లేదుసుమా!

ఇక్కడ చూడు! దీప్యమానతేజస్సుతో వెలుగొందుచూ, ఈ మన సంవాదనకు ప్రారంభకులై, ప్రోత్సాహకులై ఈ సభను పావనం చేస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుని చూస్తున్నాం కదా! ఈయన తన తపోశక్తిచే జ్ఞాన-విజ్ఞాన పరివేష్టితులైనారు. సర్వమునూ ఎరిగిన సర్వమాన్యుడగు ముక్తపురుషుడు ఈయన. అయితే కూడా.... ఇప్పుడు లోకకళ్యాణం కొరకు యాగసంరంభమంతా చేస్తూ యాగరక్షణ కొరకై నీ ఆగమనాన్ని యాచించటానికి అయోధ్యకు వచ్చారు. తానింకా పొందవలసినదంటూ ఏదీ లేక పోయినా కూడా, లోకాలకు 'రామతత్త్వం' ప్రకటితం కావాలనే గొప్ప ఆశయంతో దశరథ మహారాజును ఆశ్రయిస్తున్నారు. ఆయన ముక్తపురుషుడై ఉండి కూడా కర్మలను ఏమైనా తిరస్కరిస్తున్నారా?... లేదే!

జీవన్ముక్తుడగు ఆదిశేషుడు ఈ భూమినంతా ధరిస్తున్నారు. నిర్విషయుడై ఉండి, సూర్య భగవానుడు ఆకాశంలో సంచారం చేస్తూ ఈ భూమిపైగల సకల జీవరాసులకొరకై దివారాత్రములు కల్పిస్తున్నారు. మహాజ్ఞానియగు పరశురాముడు తన ఆత్మస్వరూపమును ఆస్వాదిస్తూనే దుష్టశిక్షణ చేస్తున్నారు.

చూచావా రామా! ఇంకా ఈ ముల్లోకములలో ఎందరో శతాధికసంఖ్యలలో యక్షులు అసురులు, మనుష్యులు, దేవతలు తాము ముక్తులై ఉండి కూడా ఈ జగద్రచనలో వారివారికి నియామకమైన ఆయాకర్మలను ముక్త బుద్ధితో నిర్వర్తిస్తున్నారు. అట్టి మహాత్ములు ఈ భూమిపై ఈ వర్తమానంలో ఎందరో ఉన్నారు.

అట్టి జీవన్ముక్తులలో కొందరు శోక, మోహదాయకములైన దార - పుత్ర - - ధనాది ఐశ్వర్యముల మధ్య ఉన్నారు. యుద్ధము, జాతి సంరక్షణము, వ్యాపారము మొదలైన లౌకిక వ్యాసంగములలో నియమితులైయున్నారు. కానీ, వారి అంతఃకరణం మాత్రం ప్రశాంతతతో నిండిపోయి ఉంటోంది.

Page:609

మరికొందరైతే జడస్వభావులై ఏదీ పట్టించుకోకుండా లౌకిక దృష్టితో చూస్తే పిచ్చివారిలాగా సంచరిస్తున్నారు. వారి దృష్టిలో వారికి దేనివల్లా ఏలోటూ ఉండదు. అట్టివారిలో కొందరి పేర్లు కూడా ఎవ్వరూ విని ఉండకపోవచ్చు.

భృగు, భరద్వాజాది మరికొందరు ఉత్తమజ్ఞానమును ఆశ్రయించి కూడా ఎక్కడో అడవులలో ఆశ్రమం నిర్మించుకొని తమను ఆశ్రయించిన శిష్యులను తీర్చిదిద్దుచున్నారు. మరికొందరు రాజ్యాలు ఏలుతూ వెసులుబాటులేని క్రియా సంరంభములో ఉంటున్నారు. సప్తర్షులు, తదితర మహనీయులు అగు మరికొందరు ఆకాశంలో జ్యోతిశ్చక్రమున నెలకొని ఉన్నారు. అగ్ని, వాయు, తుంబుర, యమ, వరుణాది ఇంకొందరు దేవతా కార్యములను నిర్వర్తిస్తూ బ్రహ్మజ్ఞాన సమన్వితులై ఉన్నారు. బలి, సుహోత్ర, అంధక, ప్రహ్లాదాది మరికొందరు పాతాళంలో వసించుచూ ఆత్మజ్ఞానమును పదిల పరచుకొనియే ఉన్నారు.

అయితే ఒక్క విషయం నీవు ఇక్కడ గమనించాలి.

తిర్యగ్యోనిష్వపి సదా విద్యక్తే కృతబుద్ధయః |

దేవయోనిష్వపి ప్రాజ్ఞా విద్యన్తో మూర్ఖబుద్ధయః II

జంతు ఉపాధులు పొందినప్పటికీ కొందరు మహాజ్ఞానులై వెలయుచున్నారు. తెలివితేటలతో కూడిన దేవయోనులలో జన్మించికూడా మరి కొందరు సంసారాసక్తతతో కూడిన తమ మూర్ఖబుద్ధిని

వదలటమే లేదు.

సర్వరూపమై... సర్వవ్యాపకమైన ఆత్మయందు సర్వమూ, సర్వవిధములా సర్వత్రా సంభవమే అగుచున్నది. ఆహో! అనంత కార్య తత్పరుడగు ఆ పరమాత్మ యందు నీడవలె ఏర్పడుచున్న నియతి ఎంత చిత్ర విచిత్రమైనది! ఇదంతా ఆ పరమాత్మ యొక్క రచనా వైచిత్రమే కాక, మరింకేమిటి?

ఏది ఏమైనప్పటికీ ఆత్మ భగవానుని విన్యాసం సదా యథాతథంగానే ఏర్పడి ఉంటోంది. విధిరైవం విధిర్థాతా సర్వేశః శివ ఈశ్వరః | ఇతి నామభిరాత్మానః ప్రత్యక్చేతన ఉచ్యతే ॥

మనందరి 'ఆత్మ’ అయినట్టి ఆ ప్రత్యక్ చైతన్యమే "బ్రహ్మ - దైవము - విష్ణువు - ధాత - ఈశ్వరుడు - శివుడు - మొదలైన అనేక పేర్లతో చెప్పబడుతోంది.

-

ఈ జగత్తులో అసంఖ్యాకంగా పదార్థాలున్నాయి. ప్రతి పదార్థంలోనూ అనేక తదితర పదార్థాలు ఇమిడి ఉన్నాయి. ఇసుకలో బంగారు రేణువులుంటున్నాయి. ఆ బంగారు రేణువులోని ప్రతిఒక్కదానిలో తదితరమైన సూక్ష్మపదార్థముల అమరిక ఉంటోంది. అనేక పదార్థముల సంయోగ వియోగములచే దృశ్యపాంచ భౌతికజగత్తు ఏర్పడి ఉంటోంది. యుక్తమైన దానిలో అయుక్తత (Wrong aspect in

Page:610

right things) దాగి ఉంటున్నది. అయుక్తమనుకున్నదానిలో కూడా యుక్తితో చూస్తే యుక్తత కనిపిస్తోంది. పాపం అయుక్త మనుకుంటాం. కానీ పాపభీతి చేతనే లోకము ధర్మమున ప్రవృత్తమై ఉంటోంది. అసత్యమైనది ఎదురుగా ఎంతో కాలం కనబడుచుండుటచే, “ఇది సత్యమే కదా!” అని భ్రమ కలుగజేస్తోంది.

'శూన్యధ్యాన యోగం చేత కూడా ఆ "శూన్య సాక్షి" అయిన నిత్యాత్మ పదం ప్రాప్తిస్తోంది. ఇంద్రజాలంలో కుందేటికి కొమ్ములు మొలిపించబడునట్లు... ఇప్పుడు లేని వస్తువులు దేశకాల విలాసములచే ఉత్పన్నమగుచున్నాయి. వజ్రం వలె అత్యంత దృఢంగా కనిపిస్తూ ఉంటున్న వస్తువులు కూడా అకారణంగా నశించుటచే అందలి వివిధ పదార్థములన్నీ రూపాంతరం పొందుచున్నాయి.

ఈ నాశోత్పత్తి సమన్వితమైన అనేక పదార్థములతో కూడిన ఈ జగత్తును చూస్తున్నంత మాత్రంచేత ద్రష్టస్వరూపుడగు ఈ జీవుడు హర్షామర్ష, వినోదవిషాదాది వికారములు ఎందుకు పొందాలి? ఇక్కడ ఎట్టి ఇచ్ఛలేకుండానే ఉండటం ఉచితం సుమా!

ఈ ప్రపంచంలో అసత్తు సత్తువలె ఉంటోంది. ద్రష్టస్వరూపమగు సత్తు అసత్తువలె తోచుతోంది. ఇది గమనిస్తున్న విదిత వేద్యుడు (తెలియవలసినది తెలుసుకున్నవాడు) ఇంత మాత్రం చేత తన శాంతస్థితి నుండి చ్యుతి పొందడు. కనుక రామా! నీవు ఇక్కడ ఏర్పడే ఇచ్ఛ, అనిచ్ఛలను ఎంత శీఘ్రంగా త్యజిస్తే అంతమంచిది.

వివేకం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏమాత్రం ముక్తి లభించదు. ఇక్కడ కోట్ల కొలది జనులు వివేకము కొరకై ప్రయత్నమైనా చేయకుండా "మాకాపని ఉన్నది... ఈ పని ఉన్నది అని ఇక్కడి పంచేంద్రియ విషయ సమూహాలలో మునగటానికే ఇచ్చగించుచున్నారు. ఇక్కడ వివేకము కొరకై ప్రయత్నించే వారికి ముక్తి తప్పకుండా సుసాధ్యమే. ఇదే జగత్తులో ఇవే కార్యక్రమములు నిర్వర్తిస్తూనే మరొక వైపుగా వివేక, విజ్ఞానాదులను ఆశ్రయించి మోక్షస్వరూపులై విరాజిల్లారు... విరాజిల్లుచున్నారు... విరాజిల్లగలరు.

ఓ ప్రియ సహజీవులారా! సర్వశ్రోతలారా! వివేకముచే ముక్తి సుసాధ్యం... సులభం కూడా. అవివేకముచే అది అసాధ్యం... అలభ్యం. ఆ తరువాత మీ ఇష్టం. మీరు సన్మార్గం ఎన్నుకుని నిష్ఠతో ప్రయత్నిస్తూ ఉంటే సర్వాత్మస్వరూపుడగు ఆ భగవానుడు మీకు తప్పక మార్గదర్శకుడు కాగలడు.

అందుచేత ఓ రామచంద్రా! మనస్సును జయించటం ద్వారా నీవు వివేకమును అభివృద్ధి చేసుకోవటం ఉచితం, శుభప్రదం కూడా.

మోక్షమును ఇచ్ఛగించేవారు ఆత్మదర్శనం కొరకు వివేకము'అనే ప్రయత్నం ఆచరించాలి. ఆత్మదర్శనము చేత మాత్రమే సర్వ దుఃఖములు సమూలంగా నశించగలుగుతాయి. రాగవర్జితులు, సంగరహితులు, మహాధీమంతులు, అయినట్టి సుహోత్రుడు, జనకుడు మొదలైనవారు ఇప్పుడు ఈ భూమిపై సంచరిస్తున్నారు. అట్లాగే అన్ని కాలములందూ అట్టి సుజ్ఞానవంతులగు వివేకులు ఈ

Page:611

భూమిపై ఉంటూనే ఉంటారు. వారు ఏ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఈ భూమిని పరమపవిత్రం చేస్తున్నారు.

తస్మాత్త్వమపి వైరాగ్యవివేకోదితధీరధీః |

జీవన్ముక్తో విహర భో సమలోష్టాశ్మకాఞ్చనః|| (శ్లో 48, సర్గ 75)

కనుక రామా! నీవుకూడా వివేక, వైరాగ్యములను ఆశ్రయించు. ధీరబుద్ధిచే సువర్ణమును, మట్టిని సమబుద్ధితో చూడగల మహత్తర దృష్టిని అలవరచుకో. ఆతడు అధికుడు, ఈతడు అధముడు, నేను కొరగాను, నేను గొప్పవాడను, అవి పొందాలి, ఇవి తొలగాలి"... ఈ రూపంలో ఉంటున్న సంసారజాడ్యమును త్యజించు. వివేక సూర్యస్వరూపుడవై సర్వస్థితులందు వర్తించెదవుగాక!

ముక్తి - ఓ నిష్కళంక స్వరూపా! రాఘవా! పదార్థములందలి 'అసంగము' చే కలుగు మనశ్శాంతి యొక్క రూపమే ముక్తి. అట్టి ముక్తి దేహము ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా సంభవమే. ఈ దేహము నేను... ఈ దేహ సంబంధముచే కలుగు గృహములు, బంధువులు మొదలైనవన్నీ నావి”... అను రూపముగా ఉండే భ్రాంతితో కూడిన ప్రీతిని నివారించటమే ముక్తి. ఈ దేహాదులందు ఏమాత్రం ప్రీతి, ఆసక్తి లేకుండానే జీవితం సాగిస్తున్నవానిని 'జీవన్ముక్తుడు’... అని అంటున్నాం. అట్లాగాకుండా, ఈ దేహాదులందు ఆసక్తి కలిగి జీవించేవాడు బద్ధుడు.

రాగద్వేషములు... ఈ రెండూ లేనివాడు ముక్తుడే - మోక్షము కొరకై వినటం, మననం చేయటం, నిధిధ్యాస (అనన్యత్వం - ఏకాగ్రత్వం)... ఆత్మా హమ్భావన అనే సాధన చతుష్టయంతో ప్రయత్నించాలి. 'బ్రహ్మతత్త్వ నిశ్చయం' అనే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. బుద్ధి శుద్ధత్వం పొందేవరకూ అట్టి ప్రయత్నమునుండి విరమించకూడదు.

“దుఃఖము ఉన్నది ...అనునది రాగము ఉన్నది అనటానికి గుర్తే సుమా! రాగద్వేషములు తెలివిగా ఈ మనుజుని తమ వశం చేసుకుంటున్నాయి. అది గమనిస్తూ కూడా ఊరుకొని ఉంటే ఎట్లా? "ఈతడు మభ్యపెట్టి, మోసంచేసి, అంతా దోచుకుంటాడు" - అని తెలిసికూడా, ఒక దొంగకు తాను దాచుకున్న గుప్తధనం చూపిస్తూ వెంటబడతాడా, ఎవడైనా?

జడస్వభావపూర్వకమైన వాదోపవాదములను, మందబుద్ధిని.... ఎట్లాగైనా సరే... వదలిపెట్టి పరమాత్మను ఆశ్రయించాలి. 'యుక్తి, యత్నము'... ఈ రెండూ కూడా ఎంతో అవసరం. ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో ఒక చిన్న పని కూడా చేయలేమని అందరికీ తెలుసు కదా! ఇక, మోక్షం విషయం మాత్రం వేరే చెప్పేదేమున్నది? సన్మార్గపూర్వకమైన ప్రయత్నములను వదలిపెట్టి, కేవలం పిచ్చా పాటి’తో 'మానవ జీవితము' అనే అవకాశం వృథా చేసుకుంటే ఎట్లాగయ్యా...?

కనుక ఓ సర్వజనులారా! మీరంతా ప్రయత్నశీలురయ్యెదరుగాక! ఈ విషయం నేను ఎంతో శ్రమించి మరల మరల గుర్తు చేస్తున్నాను. నాయనలారా! మహాధైర్యమును అవలంబించండి. అవరోధములను చూచి వెనుకాడవద్దు. ఉత్తమ ఫలితం లభించేవరకు ఆత్మ విచారణ చేయండి. దృఢ ప్రయత్నం ఉండాలేగాని... ఈ ప్రపంచంలోని అన్ని సంఘటనలు కలిసి కూడా ... అట్టివానిని

Page:612

ఆ ప్రయత్నము నుండి విరమింపజేయలేవు. అంతేగాని... పరిమిత అవగాహనలతో కూడిన ఏవేవో వాదోపవాదములతో ఆత్మప్రకాశము వైపుగా గల మార్గము నుండి చ్యుతి పొందకూడదు. మీరంతా అచ్యుతలయ్యెదరు గాక! వేదరహస్యము ఎరిగిన మహాత్ములు సత్యజ్ఞానానంద స్వరూపమగు ఆత్మ పదమును పొంది, అద్దానిని మనకు విశదీకరించి చెప్పుచున్నారు.

ప్రయత్నిస్తేనే ఆత్మ పదము లభిస్తుంది గాని, అది ఏదో గాలి వాటుగా లభించేది కాదు” అని నా విన్నపం.

7. పరమ పురుషత్వం

శ్రీరాముడు : స్వామి! ఈ జీవుడు ఏ హేతువు చేత జగత్తులలో ప్రవేశిస్తున్నాడు? ఆతడు ఒక జగత్తును వదలి ఇంతలోనే మరొక జగత్తులోకి ప్రవేశిస్తున్నాడు కదా! ఈ సుదీర్ఘ ప్రయాణానికి అంతెక్కడ?

శ్రీవసిష్ఠ మహర్షి: మనం కొంతసేపటి నుండి వివేకోదయం గురించి చెప్పుకుంటున్నాం కదా! జీవునికి ఎదురుగా నిలిచి ఉన్న ఈ జగత్తులన్నీ బ్రహ్మము నుండే అవివేక ప్రభావం చేత ఉద్భవిస్తున్నాయి. అవివేకముచేతనే స్థితి పొంది ఉంటున్నాయి. మరల వివేకముచే నశిస్తున్నాయి. ‘బ్రహ్మము' అనే సముద్రంలో ఏర్పడే 'జగత్ సమూహములు' అనే తరంగపరంపరలను ఎవరు లెక్కించగలరు? సూర్యకిరణములలో ఉండే త్రసరేణువులను ఎవరు లెక్కించగలుగుతారు?

అసమ్యక్ దర్శనం (Perception of Duality) జగతిస్థితికి హేతువు. సమ్యక్ దర్శనముచే ఈ సంసారజలమంతా వినాశనం పొందగలదు. మిక్కిలి దుష్కరము, అత్యంత భయంకరము అయినట్టి ఈ సంసారసాగరాన్ని అధిగమించాలంటే అందుకు 'ప్రయత్నం - యుక్తి' రెండూ ఉండాలని అనుకున్నాం గదా!

సంసారము అనగా ఏమిటో ఎరిగిన విజ్ఞులు 'జీవితము' అనే సదవకాశమును దుర్వినియోగ పరచుకోరు. ఎందుకంటే, ఈ సంసారము... 'మోహము' అను జలంతో, 'మరణము' అనే సుడులతో 'పుణ్యపాపములు' అనే తరంగములతో, 'నరకము' అనే బడబాగ్నితో, 'తృష్ణ' అను ప్రకంపనములతో, మనస్సు’ అనే సుడిగుండముతో, 'జీవితము' అనే నదీసంగమ స్థానముతో, 'భోగములు' అనే ఎఱలతో, 'రోగములు' అనే క్రూర సర్పాలతో, 'ఇంద్రియములు' అనే మొసళ్ళ ఘర్ఘరనాదంతో, ఆశలు' అనే ఉప్పురసంతో ...ప్రాప్తిస్తోంది.

ఆహా! ఏమి దీని ప్రభావం! ఇందు స్త్రీలు తమ క్రీగంటి చూపులతో బుద్ధిమంతులైన వారిని కూడా కొద్ది క్షణాలలో తమ పాదాక్రాంతం చేసుకుంటున్నారే! ఇందులో ప్రవేశించిన జీవులు క్షణంలో తమ ఉపాధికి ముందే గల స్వస్వరూపం ఏమరుచుచున్నారే! మనస్సులోంచి ఆశలు పుడుతున్నాయి. ఆ ఆశలు ఆ మనస్సునే భ్రమింపజేస్తున్నాయి.

Page:613

ఈ చంచల సంసారం దాటివేయటమే పౌరుషం. అంతేగాని, ఏదో రాజ్యంపై దండయాత్ర చేసి గెలవటం పౌరుషం కాదు. ఉత్తమ బుద్ధి, ఉపాధి, అవకాశములు లభించి కూడా సంసార సముద్రం దాటటానికి పయనించని వారిని ఏమని పిలవాలి?... కొద్దిమంది మాత్రం తమ యొక్క బ్రహ్మజ్ఞాన బలం చేత ఈ సంసార సముద్రమును ఆపోశన పట్టివేస్తున్నారు. ఈ జగత్తునంతటినీ బ్రహ్మమయం చేసి సాక్షీస్వరూపులగుచున్నారు.

ఓ రామా! నీవు అట్టి శ్రేష్ఠులగు బ్రహ్మజ్ఞానులతో కూడి విచారణచేయి. బుద్ధిచే 'ఇదంతా బ్రహ్మమే’ అని గ్రహించు. ఆ తరువాత ఇందు క్రీడించు. అట్లు శోభించటమే ఉచితంగాని, ఇందు బద్ధుడవై ఉండటం ప్రజ్ఞ - - అని అనిపించుకోదు. ఓ రఘుకులతిలకమా! రామచంద్రా! ఈ చిన్న వయస్సులోనే నీవు విచారతత్పరుడవైనావు. ఈ సంసారము గురించి చక్కగా చింతన చేస్తున్నావు. ఈ విషయం నీ గురువైన నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తోంది. నీవు ధన్యుడవు. నీలాగే, ఎవ్వడైనా సరే... ఈ సంసారమును అత్యుత్తమ బుద్ధితో విచారణ చేస్తే ఆతనిని ఇక మోహము సమీపిస్తుందా? దాని వల్ల కాదు.

మొట్టమొదట చక్కగా విచారణ చేయాలి. సర్పమువలె భయమును గొలిపే విషయభోగములను ప్రక్కకు నెట్టివేయాలి. వివేక దృష్టిని అలవరచుకోవాలి. ఆత్మ విషయమై సమాచారం సంపాదించాలి. ఆ తరువాత గరుత్మంతుడు సర్పములను భక్షిస్తున్నట్లు ఈ శబ్ద స్పర్శాది విషయములపై ఆధీనత్వమును చెలాయించాలి. శబ్ద స్పర్శాది విషయములు నీకు దాస్యం చేయాలేగాని, నీవు వాటికి దాసుడవు, బద్ధుడవు అవటం పురుషకారం ఎట్లా అవుతుంది.

ఏదైనా ఒక వస్తువును, పొందాలనుకోవటానికి ముందు ఆ వస్తువు యొక్క తత్వం, ప్రయోజనం పరిశీలించి మాత్రమే స్వీకరిస్తాం. ఎందుకు? దాని ఉత్తరోత్తర ప్రయోజనం ఫలయుక్తంగా ఉండాలని ఉద్దేశ్యం కదా! అట్లా కాకుండా, 'పైకి బాగున్నది', అని అవిచారణ పూర్వకంగా వస్తువును తెచ్చుకున్నా మనుకో! ఏమౌతుంది?

శ్రీరాముడు : చిన్న పిల్లవాడు పెద్దలు చెప్పినా, వినకుండా తిను బండారాలు కావాలని ఏడ్చి తింటే... తెల్లవారే సరికి కడుపు నొప్పితో బాధపడినట్లంటారా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అట్లా అల్పజ్ఞానియగు జీవుడు ఆత్మ విషయం ప్రక్కకు పెట్టి ఇంద్రియ విషయాలను అంటిపెట్టుకొని ఉంటున్నాడు. అందుకే దుఃఖాలు, దిగుళ్ళు ఆతనిని వదలటం లేదు.

వసంతకాలంలో వృక్షములన్నీ రససమృద్ధమై ప్రకాశించునట్లు, ఆత్మతత్వ దర్శనం చేసేవాని బలము, బుద్ధి, తేజము వృద్ధిచెందుతాయి.

రఘునందనా! తెలుసుకోవలసిన ఆత్మ వస్తువును నీవు చక్కగా తెలుసుకున్నావు సుమా! కనుకనే.... నీవు ఆనందామృత పూర్ణుడవై అతి శీతల స్వభావుడవై, తాపత్రయరహితుడవై, స్వచ్ఛుడవై పూర్ణచంద్రునివలె విరాజిల్లుతున్నావు. అందుచేతనే పురుషోత్తముడవగు నిన్ను చూచి ఈ సభకు వేంచేసిన మహనీయులెందరో మహదానందపడుచున్నారయ్యా!

Page:614

8.జీవన్ముక్తుల పవిత్ర దృష్టి

శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జీవుడు తన ఆనంద స్వభావం ఆస్వాదించగలుగుటకు ముక్తి ఒక్కటే ఉపాయం కదా! అట్టి ముక్త పురుషులగు మహనీయులెందరో ఈ సభకు వేంచేసియుండటం ఈ అయోధ్యలోని మా అందరి అనేక పూర్వజన్మల పుణ్యఫలం. దృశ్యం నుండి మొదలంట విడివడియుండి జీవన్ముక్తులై ప్రకాశించే మహనీయులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జీవన్ముక్తులగు నారదుడు, విశ్వామిత్ర మహర్షి మొదలైనవారి 'దృష్టి - అవగాహనలు మేము ఎంతగానో మరల మరల తెలుసుకుని ఉండటం మాకు ఎంతో అవసరమని నేను అనుకుంటున్నాను. అందుచేత జీవన్ముక్తుల పవిత్ర దృష్టి గురించి ఇంకా మరికొన్ని విశేషాలు వివరించమని మిమ్ములను వేడుకుంటున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి : రామా! మనం జీవన్ముక్తుల లక్షణములు, దృష్టులు, అవగాహనల గురించి వేరు వేరు సందర్భాలలో చెప్పుకున్నాం. ఇంకా ముందు ముందు అనేక కోణాల నుండి చెప్పుకోబోతున్నాం. జీవన్ముక్తత్వమే ఈ మన సంవాదం యొక్క అత్యుత్తమ లక్ష్యం. కనుక పదే పదే పునశ్చరణ అవసరమే. పునరావృత్తి దోషంగా సభికులు భావించరనే నా అభిప్రాయం. అందుచేత మరల పునశ్చరణ పూర్వకంగా జీవన్ముక్త స్వరూపం గురించి కొన్ని విశేషాలు సమీక్షిస్తూ ఉదహరిస్తాను, విను.

సర్వేచ్ఛారహితుడగు ఆత్మజ్ఞాని ఈ ప్రపంచమును వ్యవహార దృష్టితో చూస్తున్నప్పుడు ఒక సుషుప్తుని వలె (గాఢనిద్ర పోయే వానివలె) అసంబంధపూర్వకంగా ఉంటాడు. పరమార్థ దృష్టిచే ఇదంతా అసద్రూపమే కదా అని గ్రహించి ఉంటాడు. లయించిపోయినట్టి మనస్సు కలవాడై ఆనందోన్మత్తుడై మెలగుచూ ఉంటాడు. అతని బుద్ధి అంతర్ముఖమగుటచే ఉదారత్వం వహించి ఉంటుంది. తాను అందరిలాగానే ఇంద్రియములను, వస్త్రములను, ధనాదులను కలిగి ఉన్నప్పటికీ తన అంతర్ముఖ దృష్టిచే ఒక స్తంభంలాగా తదితరుల వ్యవహారములను చూస్తూ ఉంటాడు. ప్రశాంత బుద్ధితో అంతా గమనిస్తూ... జనులు పొందే సంరంభమును చూచినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు.

భావిపదార్థములను అభిలషించడు. వర్తమాన పదార్థములపట్ల ప్రీతి కలిగి ఉండడు. గడచిన వస్తువుల గురించి చింతించడు. కానీ... సర్వము ఆచరిస్తూనే ఉంటాడు.

దృశ్య - - (లౌకిక) వ్యవహారములందు తనను తాను సుదూరంగా అట్టేబెట్టుకొని సుప్తప్రాయుడై ఉంటాడు. ఆత్మ విషయంలో మాత్రం అత్యంత జాగరూకుడై ఉంటాడు. వ్యవహారములందు కుశలుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం.... అంతఃపురంలో బాలకుణ్ణి బుజ్జగిస్తున్న దాది తన సొంత ఇంటిలోని బిడ్డ గురించే అదంతా చేస్తున్నట్లు.... ఆత్మ కొరకై వ్యవహారనిరతుడై ఉంటాడు.

అన్తః సర్వపరిత్యాగీ నిత్యమన్తరనేషణః | కుర్వన్నపి బహిః కార్యం సమమేవావతిష్ఠతే ॥ In (శ్లో 9, సర్గ 76)

Page:615

బాహ్యమున అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ అంతరంగంలో ఏమి చేయనివాడుగా ఉంటాడు. సర్వమూ మొదలే పరిత్యజించి, కోర్కెలేమి లేనివాడై, సమరూపుడై ఉంటాడు.

యథా ప్రాప్తములైన క్రియల విషయంలోనూ, వర్ణాశ్రమ ధర్మముల విషయంలోనూ, పితృ పితామహాది క్రమం చేత ప్రాప్తించే ఆస్థి రాజ్యాధికారాల విషయంలోనూ, బంధు మిత్ర సమాగమాది ఆయా సందర్భములలోనూ తాను నిర్వర్తించవలసినది తదనుకూలంగానే నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే ఏం? సర్వ విషయములలోనూ ఆతడు వర్తిస్తున్నప్పటికీ అహమ్ కర్తాస్మి... నేను దీనికి కర్తను... అనే కర్తృత్వాభినం రహితం చేసుకొని, ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖములు సమీపిస్తున్నప్పుడు వాటిని ఆత్మ రూపంగా ఎరిగి ఉంటాడు. అందుచేత ఇష్ట-అయిష్ట ఫలముల పట్ల సమరూపుడై, ఉదాసీనుడై ఉంటాడు.

దేని కొరకూ వాంఛించడు... ద్వేషించడు. శోకించడు... హర్షించడు. అనుకూల, ప్రతికూల కర్మాచరణ సమయములలో అనాసక్త చిత్తంతో వ్యవహరిస్తూ ఉంటాడు.

భక్తులందు భక్తుని వలె, ధీరులందు ధీరుని వలె, దుఃఖితులందు దుఃఖితుని వలె, యౌవన వృత్తాంతములందు యువకుని వలె ఉంటూనే... తాను సర్వదా తన అఖండ, అప్రమేయ స్వస్వరూపమును ఏమరువడు.

ఆతని నోటివెంట పుణ్యప్రదమైన, శుభప్రదమైన మాటలే వస్తాయి. ఆతని వాక్యాలు సమగ్రత్వం, సుదీర్ఘ దృష్టి, సర్వహితము, లోక కళ్యాణము స్వభావసిద్ధంగా సంతరించుకుని ఉంటాయి. అభిమాన రహితంగా ఉంటాయి. కనుక, ఈతడు ఏపాటివాడు? అని చూపరులకు అనిపించవచ్చు. అయితే సూక్ష్మబుద్ధికి మాత్రం ఆతడు ధీరబుద్ధి సహితుడని, ఆందోళనారహితుడని, ఆనందోదయ సమన్వితుడని, కోమలస్వభావుడని తెలిసిపోతుంది. పుణ్యస్వభావుడై, ప్రసన్నముఖుడై పూర్ణప్రజ్ఞాసహితుడై, భేద - -

దుర్దశలు లేనివాడై ఆతడు ఉంటాడు.

సర్వ ప్రాణులను తన స్వరూపముగా గాంచుటచే ఆతడు సర్వులపట్ల అకృత్రిమమైన స్నేహము కలిగియుండి.... లోకబాంధవుడై ఉంటాడు. ఉదారచరితుడై, సర్వావస్థలయందునూ సమరూపుడై, సౌమ్యుడై, సుఖ సాగరుడై, తన సాంగత్యముచే అందరి దుఃఖములనూ హరింపజేసేవాడై ఉంటాడు. తాను ఎక్కడుంటే అక్కడ పూర్ణచంద్రునివలె అమృత కిరణములను, సమగ్రజ్ఞానభావములను ప్రసరిస్తూ ఉంటాడు.

ఆతనికి సుకృతముల చేతగాని, దుష్కృతములచేతగాని, భోగ త్యాగములచేతగాని, బంధు మిత్ర సమాగమములచేతగాని, కర్మ, నైష్కర్మ్యములచేతగాని, స్వర్గ పాతాళాదిలోకముల ప్రాప్తిచేతగాని, బంధ మోక్షములచేతగాని ప్రత్యేకించి క్రొత్తగా వచ్చిపడే ప్రయోజనమంటూ ఏదీ ఉండదు.

ఈ జగత్తంతా ఏకమగు బ్రహ్మముగా, తనకు సర్వదా అనుభవమగుచున్నట్టి, తాను ఇదంతా ఆత్మతత్త్వముగా గాంచుచున్నట్టి ఆ జీవన్ముక్తునికి ఇక బంధమేమిటి? మోక్షమేమిటి? ఈ బంధ

Page:616

మోక్షముల భావనలచే ఆతని మనస్సు ఎన్నటికీ దీనత్వం పొందదు. 'సమ్యక్ జ్ఞానము' అను అగ్నిచే ఆతని సంశయములన్నీ భస్మీభూతం కాగా ఆతని చిత్తము సర్వత్రా ప్రియత్వము, ఆనందత్వము, నిర్మలత్వము, అప్రమేయత్వము, అఖండత్వము అన్ని వైపులా అనుభవిస్తూ ఉంటుంది. ఆతని మనస్సు భ్రమ - విభ్రమ వినిర్ముక్తమై (Having been relieved of all Illusions and fantacies), బ్రహ్మరూపమై, నశించక... ఉదయించక ఉంటుంది.

ఆతడు సర్వావస్థలయందునూ ఆకాశమువలె సమరూపుడై వెలయుచూ ఉంటాడు. ఊయలలో పడుకుని ఉన్న పసిబాలుడు ఎట్టి ఇచ్ఛ - సంకల్పములు లేకుండానే కాళ్ళు - చేతులు కదులుస్తాడు... నవ్వుతాడు చూచావా? ఆత్మజ్ఞాని ఎట్టి రాగాదులు లేకుండానే తన ఈ కాళ్ళు - చేతులను ఆయా చేష్టలలో నియమిస్తాడు. అట్లు నియమిస్తూనే తాను మదిరోన్మత్తుని వలె బ్రహ్మానందంలో ఓలలాడుచూ, పునర్జన్మ భయరహితుడై ఉంటాడు. ఇతఃపూర్వం తాను రాగసహితంగా నిర్వర్తించియున్న కర్మలు గుర్తుకు వస్తున్నప్పుడు, అదంతా చూచి నవ్వుకుంటాడు. వాటి ఊసులన్నీ అధిగమించి ఉంటాడు. ఇతఃపూర్వపు సంఘటనలను స్మరించడు... విస్మరించడు.

సర్వం సర్వప్రకారేణ గృహాతిచ, జహాతిచ |

అనుపాదేయ సర్వార్డ్తో బాలవచ్చ విచేష్టతే

అన్నీ గ్రహిస్తాడు... త్యజిస్తాడు. ఏదీ గ్రహించకయే బాలునివలె చేష్టలు సల్పుచూ ఉంటాడు. జ్ఞాని... అజ్ఞాని - జ్ఞానికి, అజ్ఞానికి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటో చెపుతాను, విను-ఇద్దరు కూడా దేశకాల క్రియాక్రమానుసారం కార్యములందు ప్రవృత్తులగుచున్నారు. అయితే, జ్ఞాని ఆయా క్రియాజనితమైన సుఖదుఃఖములకు వశీభూతుడు కాడు. బాహ్యమందు మనస్సుచే ప్రాప్తించిన కార్యాలను మాత్రం శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. అంతరంగంలో క్రియా వర్ణితుడై ఉంటాడు. ఎందుకంటే బాహ్య పదార్థములన్నీ అసత్తేనని ఆతనికి తెలుసు. అందుకే వాటి ఫలముల కొరకై ఆతడు పరుగెత్తడు. ఆ ఫలములన్నీ అల్పము, సంకుచితము, స్వల్పకాలికము అగు ప్రయోజనములే కలిగి ఉంటాయని తెలుసు. దుఃఖదశలను గాంచడు. సుఖ స్థితిని అపేక్షించడు. కార్యసాఫల్యమునకు సంతోషించడు. కార్యవిఫలత్వముచే దుఃఖించడు. సూర్యగోళము చల్లబడు గాక! చంద్రమండలం అకస్మాత్తుగా అగ్నిజ్వాలలు వెదజల్లు గాక! అగ్ని అధోముఖంగా జ్వలించుగాక! అవన్నీ కూడా ఆత్మ జ్ఞానికి ఆశ్చర్యం కలిగించలేవు. "ఆత్మయందే అవన్నీ స్ఫురిస్తున్నాయి... అను నిశ్చయము కలవాడై విస్మయ జాలమునందు కూడా ఆశ్చర్యచకితుడు కాడు.

దయచే ఆతడు దీనము వహించడు. అట్లని క్రౌర్యము నాశ్రయించడు. అవమానములందు లజ్జితుడు కాడు. దుష్కార్యములచే నిర్లజ్జ కలిగియుండడు. గర్వి, ప్రమత్తుడు, ఖిన్నుడు, హర్షి, ద్వేషి, భయ శోకయుతుడు అవడు. విశాలాకాశము వంటి జ్ఞానము గల ఆతనికి ఎవరిపైనా కోపం ఉండదు. ఆకాశంలో విత్తనం మొలకెత్తుతుందా?

Page:617

ఓ రఘురామా! నిరంతరం జనన మరణములతో కూడియున్న ఈ "జగత్ స్థితి యందు సుఖంగాని, దుఃఖంగాని ఎట్లా ఉంటాయి? ఇక ఎదురుగా ఇక్కడుండేదంతా, ఈ దేహముతో సహా, పంచభూత సమన్వయమే కదా! స్వయముగా చపలము ప్రవర్తించే చోట సుఖ దుఃఖముల ప్రసక్తి ఏమిటో చెప్పు? ఎట్లా ఉండగలవో నాకర్థం కాదు. ఇక్కడ నిరంతరం ప్రాణికోట్లు జన్మిస్తున్నాయి. మరణిస్తున్నాయి. ఈ ఉత్పత్తి వినాశములను చూచి జగదృష్టిగల అజ్ఞానులు మాత్రమే హర్ష శోకములు పొందుచున్నారు. జగత్ రహస్యం తెలిసినట్టి సమర్థులగు జీవన్ముక్తులు ఇక్కడి ఉత్పత్తి వినాశనములను చూచి ఏమాత్రం స్పర్థ చెందరు.

రాత్రియందు కొద్దిక్షణాల నిద్రలో సుదీర్ఘకాలపు స్వప్నములు సంభవమౌతున్నాయి చూచావా? ఉత్పత్తి వినాశనాలతో కూడిన ఈ జగత్ సృష్టులలో ఏది సంభవం? ఏది అసంభవం? క్షణికమైన ఈ తుచ్ఛ ప్రపంచంలో “దీని గురించి సంతోషం... దాని గురించి దుఃఖం అని ప్రసంగించుకోవటంలో అర్థమేముంది? అప్పుడాతనికి సుఖం యొక్క అభావమే సిద్ధిస్తుంది. తత్ప్రయోజనంగా సుఖం యొక్క వ్యతిరేకానుభవమైన ‘దుఃఖము' అనుదానికి రూపం ఏర్పడ జాలదు. అనగా శోక మోహాదులను విస్తరింపజేసే దుఃఖానుభవమే జీవన్ముక్తునకు ఉండదు. సుఖ దుఃఖ సంక్షయము యొక్క ప్రభావంచే 'ఇది త్యాజ్యము - ఇది గ్రాహ్యము అనునది కూడా ఆతనికుండవు. త్యాజ్యగ్రాహ్యములు లేవు కనుక, ఇష్ట, అనిష్టములు ఇంకెక్కడుంటాయి? శుభాశుభ దృష్టి నశించటంచేత భోగేచ్ఛ తొలగి ఆశారాహిత్యం బలంపుంజుకుంటుంది. అప్పుడు మనస్సే విలయమౌతోంది. మనోనాశనకారణంగా సంకల్పముల కల్పన ఉండదు. నువ్వులు బాగుగా వేగిపోయిన తరువాత ఇక నూనె గురించిన ప్రసంగమెక్కడిది?

“నా స్వస్వరూపమగు ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ ఉండజాలదు" అను దృఢ జ్ఞానముచే సంకల్ప, వికల్పములు నశిస్తాయి. ఇక ఈ సర్వ దృశ్య పదార్థములు ఆకాశమువలె స్థితి పొందుతాయి. అప్పుడు పరిచ్ఛిన్నము' అనునదేదీ ఉండదు. అట్టి మహాత్ముడగు ఆత్మజ్ఞాని ఎట్టి పదార్థప్రాప్తికీ సంబంధించనట్టి అకృత్రిమమగు ఆనందప్రాప్తిచే ప్రమోదితుడై ఉంటాడు. ఈ స్వప్నతుల్య జగత్తునందు యథా ప్రాప్తములైన పదార్థములను చిత్తముతో అవలోకించుచూ నిశ్శబ్దత్వము వహించి ఉంటాడు. ఈ ప్రపంచము పట్ల ప్రశాంత, మౌన రూపమగు నిద్ర వంటి స్థితి పొంది ఉంటాడు. అట్లు ప్రారబ్ధక్షయము అయ్యే వరకూ జీవితమును గడుపుచూ నిత్యతృప్తుడై ఉంటాడు. నిర్హేతుక ఆనందమును, అనిర్వచనీయ సంతృప్తిని పొంది ఉంటాడు.

ఏ జీవుడైనా సరే... జ్ఞాన నిర్మలహృదయ సముపార్జనచే 'జీవన్ముక్తుడు' అగుటకు తప్పక అవకాశమున్నదని సర్వజనులకు మనవిచేస్తున్నాను.

Page:618

9. యోగమార్గం

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒక మండుచున్న కొరివిని చేతిలోకి తీసుకొని వర్తులాకారంగా త్రిప్పుచున్నావనుకో... అక్కడ ఒక వర్తులాకారపు వస్తువేదో ఉన్నట్లు భ్రమగొలుపుతుంది కదా! శ్రీరాముడు : అవును మహర్షీ! అట్లా అనిపిస్తుంది.

శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి అక్కడ వర్తులాకారపు వస్తువేమి లేదుకదా! కొరివియే భ్రమచే అట్లా అనిపిస్తోంది. అట్లాగే మనస్సు యొక్క సంచలనము లేక చాంచల్యముచే మిథ్యా రూపమగు ఈ జగత్తు భాసిస్తోంది.

తటాకపునీటిలోకి మట్టి బెడ్డను విసిరితే జలంలో ఆవర్తాలు ఏర్పడతాయి. ఆవర్తాలు జలం కంటే వేరైనవి కావు కదా! ఆత్మయందు ఏర్పడే చిత్తస్పందనము చేతనే ఈ జగత్తు కన్పించటం జరుగుతోంది. ఇది మిథ్య అయి ఉండి కూడా 'సత్యము - నిత్యము' వలే తోచుచున్నది. అవిచారణ కారణంగా ఈ జీవుడు భ్రమపూర్వకమైన ఈ జగత్తును గాంచుచూ ఇందులో సుఖ-దుఃఖ-ఉద్వేగ భావ పరంపరలకు లోను అగుచున్నాడు.

శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! ఈ చిత్తము దేనిచే చలిస్తోంది? ఏ విధంగా దీని చలనం మనం నిరోధించవచ్చు? ఈ మనస్సును దహింపజేయటం చాలా ఆవశ్యకం కనుక... ఈ రెండు ప్రశ్నలకు సమాధానం విశదీకరించండి.

శ్రీవసిష్ఠ మహర్షి : "మంచు - తెల్లదనం ... ఈ రెండూ వేరు వేరు కాదు కదా! 'అగ్ని - ఉష్ణము’ వేరు వేరా? నువ్వులు - నూనె, పుష్పంలోని పుప్పొడి కణాలు - పుష్పసుగంధం... ఈ ద్వంద్వాలు ఒకదాని కన్నా మరొకటి ఎట్లా వేరు, వేరైనవి అవుతాయి?

అట్లాగే చిత్తము, దాని స్పందనము ఒక దాని కంటే మరొకటి వేరు వేరు కానే కాదు. వాటి యందు గల “చిత్తం - స్పందనం అనే భేద శబ్దములు కేవలం భ్రమ చేతనే కల్పించబడుతున్నాయి. గుణి గుణములు (The possesser of attributes & Attributes) ఈ రెండిటిలో ఒకటి లేదంటే రెండవది కూడా లేనట్లే కదా! చిత్తము - స్పందనములలో ఒకటి నశిస్తే రెండవది కూడా నశించి పోతుంది. అట్టి చిత్తము యొక్క నాశనము కొరకు రెండు విధములైన ఉపాయాలు ఉన్నాయి1.యోగము, 2.జ్ఞానము. ... అందు 'యోగము' అనేది చిత్తవృత్తి నిరోధకరూపమైనది. శ్రీరాముడు :యోగము' అనగా ఏమిటో, దాని వలన జీవునకు సుఖము, శాంతి ఎట్లా లభిస్తాయో చెప్పండి.

శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణాపాన నిరోధకమగు యోగయుక్తి గురించి మనం ముందు ముందు నిర్వాణప్రకరణ ప్రారంభంలో "భుశుండోపాఖ్యానంలో కొన్ని, కొన్ని విశేషాలు సంభాషించు కోబోతున్నాం. అయితే ఇక్కడ నీవు అడిగావు కనుక కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.

Page:619

ఈ దేహమును మనం చూస్తున్నాం కదా! దీనిలోని ప్రతి శాఖ యందు అనేక నాడీ సమూహాలు ఉన్నాయి. అట్టి 72000 దాకా ఉండే నాడీ సమూహాలలో నిరంతరం వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. అట్లు శరీరమంతా నిరంతరం ప్రసరిస్తూ ఉండే వాయువునే 'ప్రాణము' అని అంటాం.

ఈ ప్రాణము శరీరంలో అధో - ఊర్ద్వ గమనములు చేస్తూ ఉంటోంది. తన సంచలనముచే వివిధ రకములైన క్రియలను నిర్వర్తించు ప్రాణమును ఆయా చోట్ల నిర్వర్తించే వేరు వేరు క్రియలను అనుసరించి ఐదు పేర్లను శాస్త్రజ్ఞులు కల్పించారు.

సుగంధమునకు ఆధారం పుష్పమే కదా! చిత్తమునకు ప్రాణమే ఆధారం.

అన్తఃప్రాణ పరిస్పన్దాత్సంకల్పకలనోన్ముఖీ |

సంవిత్సంజాయతే యైషా తచ్చిత్తం విద్ధి రాఘవ ॥ (శ్లో 13, సర్గ 78)

లోన ప్రాణచలనము అగుచుండుటచే, సంకల్పోన్ముఖమై జనించునట్టి, జ్ఞానవృత్తే చిత్తము”. అట్టి జ్ఞానవృత్తిని 'సంవిత్తు' అని కూడా అంటారు.

ప్రాణములు స్పందించుట చేతనే జ్ఞాన వృత్తుల (ఎఱుగుచుండుట అను రూపం గల వృత్తుల) స్పందనము కూడా కలుగుచున్నది. జ్ఞానవృత్తులు చిదాభాసుని (Reflection of Absolute Self) ఉనికితో నిండి ఉంటున్నాయి. జలము యొక్క స్పందనముచే తరంగములు ఉత్పత్తి అగుచున్నట్లు జ్ఞానవృత్తుల స్పందము చేత విషయానుభవం కలుగుతోంది. దృశ్యజగత్తు యొక్క వాస్తవరూపం విషయానుభవమే!

ప్రాణ స్పందనమే చిత్తం అని చెప్పుకున్నాం కదా! కనుక ప్రాణములు గనుక నిరోధించబడితే... అప్పుడు చిత్తము కూడా తప్పక ఉపశమించగలదు. అట్లు చిత్తము, లేక, మనస్సు ఉపశమిస్తే 'జగత్తు' అనే అనుభవం కూడా విలయ మొందుచున్నది.

శ్రీరాముడు : మునీంద్రా! ఈ దేహంలో 72000 నాడులున్నాయి కదా! వాటన్నిటి యందు నిరంతరం గమనాగమనములు సలుపుచున్న ప్రాణవాయువులు మొట్టమొదట నాసిక ద్వారా ప్రవేశిస్తున్నాయి కదా! అట్టి నాసిక మొదలైన రంధ్రములందు గల ఆకాశంలో వాయువును నిరోధించటమే ప్రాణాయామమని వినియున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అట్టి 'నిరోధము' అనే యోగములోగల వివిధ మార్గములను విశదీకరిస్తాను... విను.

1. అనేకాగ్రత నుండి ఏకాగ్రతకు - ఆశ్రయించబడుచున్న సాంసారిక వృత్తులందు అవిశ్వాసం దృఢపడాలి. "నేనిప్పుడు ఆశ్రయిస్తూవస్తున్న ఈ పదార్థజాలమంతా వాస్తవం కాదు. ఇదంతా నన్ను భ్రమింపజేసి... దుఃఖమును, మోహమును కలుగ జేస్తోంది. కాబట్టి ఇందుకు తగిన ఉపాయం కొరకై అన్వేషించాలి అనే ప్రయత్నం దృఢపరచుకోవాలి. శాస్త్ర సజ్జన సాంగత్యంతోనూ, వైరాగ్యాభ్యాసం చేతను ఆ అవగాహన బలపడగలదు. అప్పుడు శ్రద్ధ, ఏకాగ్రతలు రూపుదిద్దుకుంటాయి. ప్రియాప్రియ

Page:620

భావములు త్యజించబడతాయి. అట్టి ధ్యానముచేతనూ, అనేకత్వపుజాడ్యము తొలగుచున్నప్పటి ఏకత్వము యొక్క దృఢాభ్యాసంచేతనూ ప్రాణచలనము నియమించబడగలదు.

2. ప్రాణాయామం - - సుఖ పూర్వకంగా క్రమక్రమంగా నివర్తించబడే 'పూరకము - - కుంభకము - రేచకము’ అను విభాగములు గల ప్రాణాయామము యొక్క దృఢమైన అభ్యాసంచేతా, ఏకాంత ధ్యానయోగంచేతా ప్రాణచలనము నిరోధించబడగలదు.

3. ప్రణవోచ్చారణ - ఓం' కారమును సుదీర్ఘంగా ఉచ్చరిస్తూ... అద్దాని యందలి అ-ఉ-మ’ లకు అంతర్లీనమై ఉండే చతుర్థమాత్ర’ను అవలంబించి ... అద్దాని శబ్దార్థము (That which is intended by Om)ను భావన చేయటం మరొక మార్గం. అట్టి పవిత్ర భావనచేస్తుండటంచేత క్రమంగా బాహ్య విషయములకు సంబంధించిన అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. సాంసారిక దృష్టులన్నీ శమిస్తాయి. అప్పుడు ప్రాణస్పందనము నిరుద్ధమౌతుంది.

వివిధ యోగాభ్యాసములు - - ఇప్పుడు వివిధ యోగాభ్యాసముల గురించి, తద్వారా చిత్తము నిరోధించటం గురించి చెప్పుచున్నాను విను1. పూరకము - వాయువును నాసికాపుటముల ద్వారా సుదీర్ఘంగా స్వీకరించటం, మరల క్రమపూర్వకంగా త్యజించటమును 'పూరకము' అని అంటున్నాం. పూరకమును పదే పదే అభ్యసిస్తూ వస్తే ...క్రమంగా అట్టి అభ్యంతర పూరకముచే ప్రాణసంచలనము 'పర్వతంపై నిలచే నిశ్చల మేఘం లాగా' ఉపశమిస్తుంది. క్రమంగా మనస్సు నిశ్చలమౌతుంది.

2. కుంభము - పూరకముచే నాసికాపుటముల ద్వారా స్వీకరించిన వాయువును నిండు కుండలాగా దీర్ఘకాలం శరీరంలో స్థంభింపజేయటం... అట్లు స్థంభించిన తరువాత పూరకంలోలాగానే వాయువును తిరిగి వదలటం. ఈ అభ్యాసం చేత కూడా ప్రాణము స్తంభితమౌతుంది.

3. రేచకము - - వాయువును నాసికారంధ్రముల ద్వారా బహిర్గతం చేసి, మరల వాయువు ప్రవేశించ కుండా కొద్ది క్షణములు నిలువరించటం. అట్టి దృఢాభ్యాసం చేత విశాలమగు ప్రాణము ఆకాశరూపమును పొందుతుంది. అభ్యాససమయంలో, వాయువు నాసపుటములను స్పృశించక పోవుటచే ప్రాణ చలనము, తద్ద్వారా క్రమంగా మనోచంచలత్వము నిరోధించబడతాయి.

4. తాలువు-ఘంటికల యోగముద్ర - నోటిలోపలి దవడ యొక్క మొదటి భాగంలో వ్రేలాడుచుండే ఘంటిక (కొండ నాలుక)ను నాలుక చివరికొసతో అణిచిపెట్టి ప్రాణమును బ్రహ్మ రంధ్రమున ప్రవేశింప జేసి ధారణ ఒనర్చటం చేత ప్రాణస్పందన నిలువరించబడుతోంది. తీవ్ర యోగాభ్యాసులగు కొందరు దీనిని అభ్యాసం చేస్తున్నారు.

5. పరధ్యానం - ఈ జగత్తుకు సంబంధించిన ఏవేవో విశేషాలు తెలుసుకోవాలి, గ్రహించాలి అను రూపం గల ఒకానొక వృత్తి ఈ జీవునిలో అనుక్షణం బయల్వెడలుతోంది. అట్టి వృత్తినే సంవేదన వృత్తి’ అని అంటారు. ఈ జీవుని ఆ ఆ సంవేదనా వృత్తి తన స్వకల్పనా వికారమును త్యజించి నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసం చేత సూక్ష్మ హృదయాకాశంలో లయం చేయబడిందనుకో... అప్పుడు కూడా ఈ ప్రాణస్పందన నిలిపివేయబడుతుంది.

Page:621

6. ఖేచరీ ముద్ర - నాసికాగ్రం వద్ద గల పండ్రెండు అంగుళముల వరకు గల నిర్మలాకాశంలో మనోదృష్టులన్నిటిని తరలించి తెచ్చి నిలిపామనుకో... అప్పుడు కూడా ప్రాణస్పందము నిరోధించ బడుతోంది.

7. బ్రహ్మరంధ్ర లయ ముద్ర - పండ్రెండ్రు అంగుళముల మేర ఉన్న శిరస్సు యొక్క ఉపరి భాగపు ప్రాంతమందు గల బ్రహ్మ రంధ్రమునందు అభ్యాసవశం చేత ప్రాణ వృత్తులను లయింప జేయుటచే ప్రాణస్పందమును నిశ్చలం చేయటం.

8. భ్రూముద్ర - ఈ నేత్రేంద్రియము అభ్యాస వశంచేత భ్రూమధ్య భాగంలో (Space between two eye - brows) చిరకాలం నిరోధించబడినప్పుడు సైతము ప్రాణము ఉపశాంతి పొందగలదు. అట్లు శాంతికి ఉపక్రమించిన ప్రాణము బ్రహ్మ రంధ్రమునందు ప్రవేశపెట్టుటచే ప్రాణము పూర్తిగా నిరోధించబడుతుంది.

9. గురు అనుగ్రహం - ఈశ్వరానుగ్రహం - అనేక జన్మలలో చేసిన, పుణ్యం త్యాగకర్మల ప్రభావంచే పరిశుద్ధుడు సంసిద్ధుడు అయినట్టి జీవుడు ఒకానొక జన్మలో గురువు యొక్క కరస్పర్శాది అనుగ్రహము చేతనో, ఈశ్వరానుగ్రహము చేతనో 'ఆత్మజ్ఞానం' కాకతాళీయంగా పొందుతుంటాడు. లేదా, ఒక్కసారిగా తీవ్ర ప్రయత్నమును స్వీకరించి కొద్దికాలంలో ఆత్మజ్ఞానం పొందటం జరగవచ్చు. అట్టి ఆత్మజ్ఞానం క్రమంగా సమస్త కల్పనలూ, సర్వ ఆశలు అధిగమించినదై ప్రకాశించగలదు. అట్టి స్థితిలో ప్రాణచలనము స్వయముగా నిశ్చలమగుచున్నది.

10. ధ్యానము - ఈ చిత్తమును తన హృదయాకాశంలో చిరకాలం లగ్నంచేస్తూ ఉంటే అట్టి అభ్యాసియగు యోగసాధకుడు స్వయముగా వాసనారహితుడే అవుతాడు. చిత్తమును భగవన్నామ స్మరణం వంటి అభ్యాసాలలో నియమించుటచే కూడా, అదేవిధంగా, క్రమంగా హృదయాకాశంలో ఆచిత్తము సుస్థిరమవగలడు. అట్టి ఆత్మ ధ్యానము చేయుటచే ప్రాణస్పందనము నిరోధించబడుతోంది.

ఇట్టి ఆయా ఉపాయములచే, అభ్యాసములచే ప్రాణము నియమించబడగా, చిన్మాత్ర స్వభావుడగు ఆ పరమాత్మ నా యొక్క స్వాత్మరూపమే”... అని ఎరుగబడగలదు.

శ్రీరాముడు : హే మహాత్మా! నాదొక చిన్న సందేహం. ఈ విశాల దృశ్యమంతా కూడా 'హృదయము’ అనే దర్పణంలో ప్రతిబింబించటం జరుగుతోంది కదా! అట్టి ఈ ప్రాణుల హృదయం ఎట్లు తయారు చేయబడింది? దీని రూపము ఎట్టిది?

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ సమస్త ప్రాణుల హృదయము రెండు విభాగములు కలిగి ఉంటున్నది1. త్యాజ్య (భౌతిక) హృదయం - పరిచ్ఛిన్నమగు ఈ భౌతిక రూపమునందు గల వక్షస్థల ప్రదేశంలో మాంస పిండ రూపంలో ఉన్నది చూచావా? ఇది త్యాజ్య హృదయం. హృదయం యొక్క ఈ విభాగం వాస్తవానికి హృదయమునకు ఉపకరణము వంటిది. ఇది జడమైన శరీరము యొక్క ఒక అవయవమై ఉన్నది.

Page:622

2. గ్రాహ్య (అభౌతిక) హృదయం - ఇది జ్ఞాన మాత్రమగు హృదయ విభాగం. ఇది సర్వుల అంతరమున, బాహ్యమున కూడా ఉన్నది. కానీ రామా! ఇది వాస్తవానికి బయటగాని లోపలగాని లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అది ఒక భౌతిక పదార్థం కాదు కదా! భౌతికం కానిది దేనికి లోపల? దేనికి బయట? ఇదే ప్రధానమగు హృదయం. దీనియందే జగత్తంతా స్థితి నొంది ఉన్నది. ఇది సర్వ పదార్థములకు ఆధారం... సర్వ సంపదలకూ నిలయం కూడా.

ఈ హృదయం యొక్క రూపము ఏమిటంటావా?... దాని రూపము ఎఱుక (Awareness) (లేక) జ్ఞానము (Knowledge Absolute) (లేక) సంవిత్తు. నేను మన సంవాదము యొక్క సౌలభ్యము కొరకు హృదయమును రెండు విభాగములు చేసి చెప్పాను. అయితే, జడము... శిలాసదృశము... మాంసపిండము అయిన త్యాజ్య (భౌతిక) హృదయం వాస్తవమైన హృదయం కాదని, గ్రాహ్య హృదయం అసలైన హృదయమనీ గ్రహించు.

వాసనాత్యాగపూర్వకంగా ఈ చిత్తమును సంవిత్ రూపమగు శుద్ధ - గ్రాహ్య హృదయంలోనికి ప్రవేశింపచేయాలి. అంతేగాని, దానిని శబ్దస్పర్శాది ఇంద్రియ విషయాలలో అట్టేబెట్టి రోజులు జడపూర్వకంగా గడపరాదు. చిత్తం ప్రబలంగా హృదయాకాశంలో... ఏ మార్గము (లేక) ఉపాయం చేతనైనా సరే... నియోగించబడినప్పుడు ప్రాణ చలనం నిరుద్ధమవుతుంది. వివిధ ఆచార్యులు, లోకమునకు వివిధ మార్గాలు, తదితర క్రమములు ప్రసాదించారు. శ్రద్ధగా, లక్ష్యమును ఎరిగి ఆచరించినప్పుడు ప్రాణ స్పందనము నిరోధించబడుతోంది.

మనం పైన చెప్పుకున్న ఆయా యోగయుక్తులన్నీ అభ్యాసవశం చేత.... ఈ సంసారం త్యజించి మోక్షం సముపార్జించాలనుకున్న సాధకులకు ... తప్పకుండా ఉత్తమ ఉపాయములై సహకరిస్తున్నాయి. ప్రాణాయామము మొదలైనవి అభ్యాసముచే దృఢపడుతూ వైరాగ్యమునకు సహకరించి, తద్వారా, వాసనలు నిరోధించబడతాయి. అట్టి వాసనానిరోధము యొక్క సాఫల్యముచే ఈ జీవుడు ఔన్నత్యము సంపాదించి 'ఆత్మతత్త్వము'ను గ్రహించగలడు.

కాలువలో ప్రవహిస్తున్న నీరు గట్టు కట్టినపుడు తన ప్రవాహ వేగమును ఉపసంహరించుకొని వెనుకకు మరలక తప్పదుకదా! మనం ఇంతవరకు చెప్పుకున్నట్టి "భ్రూమధ్యం నుండి, నాసికా ప్రదేశము నుండి, కంఠప్రదేశము నుండి 12 అంగుళముల వరకు గల ప్రదేశంలో చిత్తమును సుస్థిరం చేయటం (ఖేచరీముద్ర) అనే అభ్యాసం చేత మనస్సు యొక్క పరిపరివిధత్వం ఉపశమిస్తుంది. ప్రాణముల నిరంతర సంచలనము శమిస్తుంది. అట్లాగే నాలుక యొక్క చివరిభాగంతో తాలువు (దవడ) నందు వ్రేలాడి ఉండే కొండనాలుకను పలుమార్లు స్పృశించటం అభ్యసించడం చేత కూడా త్వరితగతిలో ప్రాణసంచలనంపై ఆ సాధకునకు అధీనత్వం లభిస్తోంది.

అయితే ఒక ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆయా యోగాభ్యాసాలన్నీ అంతిమ ప్రయోజనమగు "అఖండ - అప్రమేయానుభూతి అను రూపంగల మోక్ష స్థితిని

Page:623

ప్రసాదించుటకు ముందు కొన్ని వికల్పములు ఏర్పడే అవకాశం ఉన్నది. సాధకుడు నిష్కాముడై ఉంటే వికల్పములన్నీ వాటంతటవే తొలగుతాయి. పరమ ఉపశమనము అనే ఫలమును దృశ్య విషయఫలాసక్తి లేని సాధకునకు త్వరితగతిని కలుగచేస్తాయి. అయితే ప్రాణయోగాభ్యాస విధివిధానములను గురుముఖతః ఎరిగి అభ్యసించవలసినదని నా విన్నపం.

అభ్యాసము చేతనే మానవుడు శోకరహితుడై ఆత్మారాముడుగా విరాజిల్లగలడు. కొంచెం శ్రద్ధ, పట్టుదల కలిగియుండి సాధన చేస్తే అంతఃకరణమునందు సుఖి కాగలడు.

అభ్యాసమునకు మించిన గురువు, మిత్రుడు, ఉపాయం, మార్గం వేరే ఉండవు. అభ్యాసముచే క్రమక్రమంగా ప్రాణస్పందనము సన్నగిల్లుతుంది. మనస్సు శాంతి పొందుతుంది. మనస్సు శాంతిస్తే నిర్వాణపదము లేక బ్రహ్మపదము, లేక మోక్షము శేషించగలదు.

ప్రాణస్పందనమే మనస్సు. మనస్సు వల్లనే ఈ సంసారభ్రమ అంతా కలుగుతోంది. కాబట్టి ప్రాణస్పందనము ఉపశమిస్తే సంసార దుఃఖము తనకు తానుగా నశించుచున్నది. అప్పుడు బ్రహ్మము నందు కల్పనాయుక్తమై ఉంటున్న మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, దేహం, ప్రారబ్ధం, బంధం, మోక్షం' మొదలుగా వాక్సముదాయమంతా నివృత్తి చెందుతుంది. బ్రహ్మపదమే శేషిస్తుంది.

యత్రసర్వమ్, యతఃసర్వమ్, యత్సర్వమ్, సర్వతశ్చయత్ I

యత్ర నేదమ్, యతో నే దమ్, యన్నే దమ్, నేదృశం జగత్ ॥

ఈ జగత్తుగా గోచరించేదంతా ఎందులో ఉండి ఉన్నది? దేని నుండి ఇదంతా ఆవిర్భవిస్తోంది? ఏది అంతటా వ్యాపించియున్నది? ఈ సర్వము స్వతఃగా ఏదై ఉన్నది? కానీ...

ఎందులో జగత్తు అనబడేదేదీ ఉండజాలదు? దేనినుండి మరొకటేదీ ఆవిర్భవించజాలదు? దేని రూపమైతే ఈ కనబడే జగత్తు, ఇందలి ఏ వస్తువూ కాదు? ఏ అంశంలోనూ దేనికి ఇది సామ్యము (comparison)కాదు?

అట్టి నిత్యనూతన అకళంక అప్రమేయ బ్రహ్మము, సాధకునికి ఒకానొకదశలో అనుభవమ వుతుంది. ఈ కనబడే జగత్తు నాశవంతమూ, వికల్పమయమూ కదా! ఇక్కడ నిర్గుణపరమాత్మకు సదృశమైనదేది లభిస్తుంది? అందుకే... ఏ దృష్టాంతమైనా బ్రహ్మమును సమగ్రంగా తెలియజెప్ప గలదా?... లేదు. సాధన యొక్క పరిపక్వస్థితిలో ఈ జీవుడు అనబడే చిద్రూపము... గాంచువాడు, గాంచబడుచున్నది, గాంచుట అను త్రిపుటితో సహా సర్వరూపరసాది బాహ్యవృత్తులకూ సాక్షిరూపత్వము అనుభవించ గలదు. నాటకము చూస్తున్న రాజుగారు రంగస్థలంపై ప్రవేశించి పాత్రధారుల రసావేశంలో జోక్యం కలిగించుకొనటం ఎంత రసాభాసయే గదా! యోగి తన సాక్షి స్వరూపము ఎరిగిన తరువాత ఈ జగత్తు అనే కల్పనతో తాదాత్మ్యం చెంది రసాభాస పొందడు. అతడు సర్వదా సాక్షి రూపమునే ఉంటాడు.

అట్టి చిద్రూపమే తేజోవంతములైన అన్ని పదార్థముల కంటేకూడా ప్రకాశవంతమైనది.

Page:624

ఈ కామము మొదలైన సర్వ అభ్యంతర వృత్తులనూ ప్రకాశింపజేస్తున్నది అదే! ‘చైతన్యము’ అనే మహావృక్షము నుండి వివిధ రసయుక్తములగు ఈ జగద్రూపఫలములు నిరంతరం ఉత్పన్నమై నశిస్తున్నాయి. ఏ మహామతి అయితే ఈ సర్వసీమములకు ఆవల ఉన్నట్టి ఆ బ్రహ్మపదమును ఆవలంబించి ఉంటాడో... ధీరుడు, బ్రహ్మజ్ఞుడు అగు ఆతనిని 'జీవన్ముక్తుడు' అని మనం పిలుస్తున్నాం. అట్టి జీవన్ముక్తునకు సర్వభోగాభిలాషలు నశించిపోతాయి. హిత - అహిత కల్పనంతా ఉపశమించి పోతుంది. ఆతడిక ఎట్టి వ్యవహారమునందునూ హర్షముగాని, శోకముగాని పొందడు. ఆతడే ముక్త మానసుడు. ఆతడే పురుషోత్తముడు.

10. జ్ఞాన మార్గం

శ్రీరాముడు : మహాత్మా! యోగయుక్తస్థితి పొందటానికిగాను చిత్తమును నశింపజేయాలి కదా! అట్టి చిత్తనాశనమునకై ఉపాయమగు 'ప్రాణనిరోధం' గురించి చెప్పారు. అట్లాగే మరొక ఉపాయమైనట్టి 'సమ్యక్జ్ఞాన సముపార్జనం గురించి కూడా చెప్పండి.

శ్రీవసిష్ఠ మహర్షి :"ఆద్యంత రహితుడు, అసాధారణుడు అగు పరమాత్మ ఒక్కడే ఈ జగత్తునందు కలడు. ఆతనికి అన్యంగా ఎక్కడా ఏదీ లేదు" .... అను ఏ మహత్తర నిశ్చయం ఉన్నదో... అద్దానినే విజ్ఞులు సమ్యక్ జ్ఞానం’ అని పిలుస్తున్నారు. అట్టి సమ్యక్ జ్ఞాని, "కుండలన్నీ మట్టియే. వస్త్రములన్నీ దూదియే. జీవులన్నీ ఆత్మయే" అను భావన కలిగి ఉంటాడు.

మిథ్యాజ్ఞానముచే జన్మాదులన్నీ కలుగుచున్నాయి. మిథ్యా జ్ఞానము చేతనే కదా, బాటయందు మెలికలు తిరిగిపడియున్న త్రాడును చూచి 'ఇది పాము' అని భ్రమకలగటం! సమ్యక్ జ్ఞానం అనగా, పాము అన్నది నా భ్రమ. ఇక్కడ ఉన్నది త్రాడే అని తెలియవచ్చుట వంటిదే!

సంకల్పాంశ వినిర్ముక్తమైనది, విషయవర్జితమైనది అగు తత్త్వమునకు 'సంవిత్తు' (Absolute Existence & Knowledge)అని పేరు పెట్టారు. అట్టి సంవిత్తు తన యొక్క స్వప్రకాశ స్వభావం చేత సర్వే సర్వత్రా నిండియున్నది. దానికి అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. అదే మోక్ష స్థానమూ... బ్రహ్మమూ కూడా. ఆ సంవిత్తు ఒక చోట శుద్ధరూపంగా ఎరుగబడినప్పుడు ఆ స్థానమును 'పరమాత్మ’ అని అంటున్నాం. అది సర్వ పదార్థరూపమయినప్పటికీ... అశుద్ధ రూపకల్పనచే అదే అవిద్య’గా అగుచున్నది. దృశ్యపరిమిత దృష్టి కలిగిఉన్నప్పుడు పరమాత్మయే జీవాత్మగా పిలువ బడుతోంది.

"లేక అది అవిద్యను గాంచుచున్నది!" అని కూడా అనవచ్చు... ఓ రామచంద్రా! ఏదైతే తెలుసుకొనుచున్నదో అదే తెలియబడవలసినది. ఈ అభిప్రాయాన్నే వేదాంత పరిభాషలో - జ్ఞానమే జ్ఞేయమై ఉన్నది ...సంవిత్తే సంవేద్యము" - అని చెప్పబడుతోంది.

Page:625

నీవు ఆ పరమాత్మగా ఆరాధించు లక్ష్యార్థము ఏమై ఉన్నది?... నీ వాస్తవ శుద్ధరూపమే! అదియే సర్వదేహుల యొక్క శుద్ధ రూపము కూడా! అనగా... నీవే సర్వమై, శుద్ధమై, శాశ్వతమై, అఖండమై, అప్రమేయమై... స్వతఃగా పరమాత్మవే అయి ఉన్నావు.

నేను దేహముచే, ప్రదేశముచే, కాలముచే బద్ధుడను" అను భావన కలిగి ఉన్న సంవిత్తును “జీవుడు” అను పేరుతో పిలుస్తున్నాం. సంవిత్తు వాటికి అతీతమైన భావమును స్వీకరించియున్నప్పుడు, అట్టి సంవిత్తు యొక్క స్థితిని శివము, మోక్షము" మొదలైన శాస్త్రీయ నామములతో చెప్పుకుంటున్నాం. జీవుడు వ్యక్తిగతమైన విశేషముల దృష్ట్యా చూస్తే, భ్రమయుతుడేగాని, “వాస్తవస్వరూపుడు (నిజం) కాదు. ఈ జీవుని యొక్క శివస్వరూపం సర్వదా వాస్తవమై వెలుగొందుతోంది.

కనుక రామా! సంవిత్తు... సంవేద్యము; జ్ఞానము... జ్ఞేయము; తెలుసుకుంటున్నవాడు... తెలియబడుచున్నది - ఇవన్నీ ఒకే అర్థం కలిగియున్నాయి.

ఈ అన్ని ద్వంద్వములమధ్యా ద్వైత కల్పనయే లేదు. అజ్ఞానవశం చేతనే ఆత్మ తనను తాను జగద్రూపంగా సంచయమొనర్చుకొనుచున్నది. ఏది ఏమైనా కావచ్చు.... ఆత్మకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.

ఈ ముల్లోకములలో కనబడేదంతా సత్యమగు ఆత్మయే అయిఉన్నది. ఈ జగత్తంతా ఆత్మయే... అనే నిశ్చయం నీ యందు స్థిరపడిందా, ఇక నీకు పూర్ణ కామత్వము సిద్ధిస్తుంది. సర్వమూ ఆత్మగా దర్శించ బడుచున్నప్పుడు ఇక భావాభావములు ఎక్కడుంటాయి? బంధమోక్షముల ప్రసక్తి ఎక్కడ?... ఎవరికి?

శ్రీరాముడు : మరి శాస్త్రములు బంధమోక్షముల గురించి ప్రస్తావిస్తున్నాయి కదా....?

శ్రీవసిష్ఠ మహర్షి: ముముక్షు విజ్ఞానం విస్తారింపజేయటానికి మాత్రమే శాస్త్రములు బంధమోక్షములు’ అనే కథనమును ప్రతిపాదిస్తున్నాయి. ఇంతకీ ఈ జీవులు ఆత్మ అను ఏ వేరైన దానికై వేచివుండాలో చెప్పు?... కనుక ఇప్పటికి లభించనిదేదో అప్పుడు లభించాలి - అను ఉద్వేగం అనుచితమే అవుతుంది. ఆత్మ లభించి ఉండనిదెప్పుడు? ఆత్మస్వరూపం కానిదేది.

చిత్తము’ అనబడేది ఆత్మకు అన్యంగా ఏదీ ఎక్కడా ఉండజాలదు. బ్రహ్మమే సర్వదా ఈ దృశ్యము రూపమున శోభిస్తోంది. ఈ జగత్తంతా చిదాకాశమే. బంధమోక్షముల ప్రేలాపన వ్యర్థమైనదే సుమా! మహత్తుకు కూడా మహత్తు అయినట్టి బ్రహ్మమే 'విశాలము... విస్తారము’ అయిన ఈ దృశ్యము రూపమున ఉన్నది.

అందుచేత ఓ ప్రియజనులారా! మీ రంతా 'ద్వైతము' అనే భావనను మీయందు రహితం చేయండి. యత్నశీలురై, అట్టి యత్నపూర్వక శ్రద్ధచేఆత్మ అనగా నేనే” అను ఎరుకను సుస్థిర పరచుకోండి. ఆత్మ స్వరూపులు కండి.



Page:626

ఓ రామా! కట్టె, శిల, వస్త్రము, దేహము మొదలైన పదార్థాలన్నీ వాస్తవానికి 'శక్తి' యొక్క వివిధ తత్త్వములే కదా! "అధిష్ఠానమగు సన్మాత్ర దృష్టితో చక్కగా విచారిస్తే వాటియందు లేశమైన భేదం కనిపించదు. వాస్తవం ఇది అయి ఉండగా, ఇక నీవు దేని కొరకు సంకల్పోన్ముఖుడవు అవుచున్నావో చెప్పు? నీవు దేనిని 'వస్తువు’గా చూస్తున్నావో... అది తన యొక్క ఆద్యంతములందు నాశనము లేనిదే అయి ఉన్నది.

వస్తువు యొక్క వాస్తవ తత్త్వమునకు ఉత్పత్తి, వినాశనములు లేవు. వాటి ఆద్యంతముల స్వరూపం ఆత్మయే. కనుక నీవు నిశ్చింతగా ఆత్మమయుడవై ఉండుము.

స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తంతా పరబ్రహ్మరూపమగు చిదాకాశమే అయి ఉండగా ఇక ఇందు సుఖ దుఃఖములెచట? కాబట్టి రామా! నీవు సంతాపం పొందవలసిన పనిలేదు. ఒకే జలం చిత్ర విచిత్ర తరంగముల రూపమున స్ఫురిస్తోంది కదా! ఆత్మయే ఈ ద్వైతాద్వైతములుగా ఉత్పన్నమగుచూ సమూహంగా స్ఫురిస్తోంది. తత్త్వము తెలిసినవానిని ఈ విషయభోగములు ఏమాత్రం తాకనైనాలేవు. బంధించలేవు. పిల్లగాలులు పర్వతమును చలింపజేయగలవా? మహత్తరమగు ఆత్మను గురించిన విచారణ సల్పుచున్నట్టి జ్ఞానియొక్క మనస్సును ఈ తుచ్ఛప్రాపంచిక ఇంద్రియ వ్యవహారములు ఏమాత్రం భిన్నం చేయలేవు. అయితే, అల్పజలం గల తటాకంలో కొంగలు చేపలను పుటుక్కున మ్రింగివేస్తున్నట్లు, అల్పవిచారణతో కూడిన ఆశలతో నిండిన మనస్సు గల మూఢజీవుని దుఃఖములు వచ్చి నిరంతరం మ్రింగివేస్తున్నాయి.

అందుచేత రామా! “ఇదంతా ఆత్మయే! అవిద్య అనబడేదానికి స్వయం ప్రభావం (Independent Existence) లేదు అను దృష్టిని అభ్యాసం చేయి. అప్పుడు పరిశుద్ధమగు పరమాత్మగా శేషిస్తావు. ఆత్మారాముడవై విరాజిల్లుతావు. వివిధ జలాశయములలోని తరంగములు, ఫేనము (నురుగు) బుద్భుదములు (బుడగలు) జలమునకు వేరు వేరు కానట్లే... వివిధ కల్పనలన్నిటిలో ఆత్మ కాక మరేదీ ఎక్కడా లేదు. సర్వ ప్రయత్నములచే, ఉత్తమోత్తమ విచారణ చేసి ఈ విషయం చక్కగా గ్రహించు. ఈ సర్వ ఉపాధులందు స్పురించుచున్న 'నేను... నేను' అను సంవిత్తుతో సహా... ఇక్కడా - - అక్కడా - ఎక్కడా అన్ని వేళలా ఆత్మయే ఉన్నది.

ఆత్మకు అన్యంగా “నేను అనేది లేదు. కనుక... నేను ఆత్మనే.

ఈ మాత్రం గ్రహించటంలో కష్టమేమున్నది చెప్పు? "ఆ భగవంతునికి వేరుగా మరెక్కడో నేను ఉన్నాను" - అను భావన చేతనే సర్వ అనర్థములూ వచ్చి పడుతున్నాయి. ఆత్మ తప్పితే మరింకెక్కడా ఏదీ ఉండదు...అను దృఢనిశ్చయముచే సర్వ అనర్థములూ తొలగిపోతున్నాయి. అందుచేత... సమ్యక్ ఆత్మదర్శివి కమ్ము. అప్పుడు... మనస్సుకు తారసపడుచున్న సర్వబంధముల నుండీ విముక్తుడవౌతావు.

విముక్తుడవై ఇక ఆ తరువాత ముందులాగానే ఏది ఎట్లు ఉచితమో, విధి విధానమో అట్లే వ్యవహరిస్తూ ఉండు. ఇక నీచే చేయబడేదేదీ నిన్ను స్పృశించజాలదు. నీ మనస్సు హానివృద్ధులను

Page:627

అధిగమించగలదు. అట్టి నిత్య - సత్య - అఖండ - అప్రమేయ - సర్వగత ఆత్మ స్వరూపుడవై చెన్నొందుచున్నప్పుడు నీవు సర్వులకూ నమస్కారయోగ్యుడవౌతావు.

ఇట్టి అవగాహనాపూర్వకమైన అనుభవస్థితిని పెంపొందించుకొనుటయే 'జ్ఞానమార్గము’ అను పేరుతో శాస్త్రజ్ఞులు మనకు ప్రతిపాదిస్తున్నారు.

11. దృశ్య - దర్శన సంబంధాతీతత్వం

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీ యొక్క "సమ్యక్ జ్ఞానమార్గం సుగమం కావటానికి ఉపకరించ గల ఒకానొక విచారణను అందిస్తాను. దీని సహాయంతో ఈ భోగములు ఎదురుగా ఉన్నప్పుడు కూడా వాటి కొరకై ప్రీతి గొనవలసిన అగత్యం లేనేలేదని శ్రోతలు గమనించగలరు.

ఎడ్లు బండిని లాగుతూ ఉంటాయి. అయితే ఆ బండిలోని పదార్థములను అనుభవించేది ఎడ్లా?... కాదు. ఆ బండి యజమాని కదా! అట్లాగే... ఈ నేత్రములు కేవలం రూపాన్ని చూస్తాయి. కానీ ఆ రూపము వలన కలిగే సుఖం, దుఃఖం, ఆశ్చర్యం మొదలైనవి అనుభవించేది నేత్రములు కావు. నేత్రములందు ప్రవేశించిన సంవిత్స్వరూపుడగు ఈ జీవుడే సర్వం అనుభవించువాడు సుమా!

ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను విచారించాలి. నేత్రేంద్రియములు రూపమునందు లగ్నమయినప్పుడు ఆత్మకు ఎందుకు క్షోభకలుగుతోంది? తన గాడిద గుంటలో పడినంత మాత్రాన చాకలి దిగులుగా చతికిలపడి కూర్చుంటాడా? బాటలోని బురద పాదాలకు అంటినప్పుడు “ఏమిరా దేముడా! అనుకుని మనం ఊరుకుంటున్నామా? కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటున్నాం. నేత్రం ఒక ఉపకరణము. ఇక దృశ్యము అట్టి ఉపయోగములలోని ఒకానొక సందర్భము'. అందుచేత ఈ జీవులు నేత్రములు సదవగాహనతో, సరిఅయిన మార్గంలో నియమించి ఉపయోగించుకోవటమే వినియోగం. అదియే 'యోగం'. అందుచేత ఈ నేత్రాది ఇంద్రియములను సరి అయిన సమాచారం జోడించి ఆపై ఆయా క్రమములందు ఉపయోగించడం అత్యవసరం. అట్టి సంబోధనను జ్ఞానులు ఎట్లు ఆశ్రయిస్తున్నారో చెపుతాను.... విను.

88

ఓ నా నేత్రములారా! మీరు 'ఎంత బాగు!' అని అనుకుంటూ ఈ మొదలైన ఆయా అందంగా కనిపించే విషయాలలో బురదలో చిక్కుకున్నట్లు చిక్కుకోకండి. ఎందుకంటారా? ఏవేవి అందంగా కనిపిస్తున్నాయి' అని భావించి, శ్రమించి మీరు బయలుదేరుతున్నారో... అవన్నీ కూడా కొద్ది క్షణాలలో తీవ్రమైన మార్పులు చెందబోతున్నాయి. పైగా మిమ్ములనే నశింపజేస్తున్నాయి.

అంతఃస్థితమైయున్న చిదాత్మయే బయట కూడా ఆయా సర్వ పదార్థములందూ ప్రకాశించు చున్నది. అంతఃస్థితమై యుండే అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ –

Page:628

ఆనందమయములు అనబడే పంచకోశములు ఆత్మయొక్క ప్రకాశముచే స్థితి పొంది ఉంటున్నాయి.

అందుచేత అవి “ఆత్మకు అభిన్నములు అయి, అనుగమించబడుచున్నాయి. తీక్ష బుద్ధిగల ప్రాజ్ఞుడు తన కార్యక్రమములలో అధిక భాగం ఆత్మ సంబంధములగు కార్యక్రమములలో ఇంద్రియ, మనస్సులను నియమించి ఉంచుతాడు. ఇక యథాప్రాప్తములైన పదార్థానుభవమునకు సంబంధించిన క్రియలయందు “ఉదాసీనత్వము వహించి నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతేగాని, మూఢుని వలె ఈ రూప నామముల బురదలో తాదత్మ్యం పొందడు. ఈ దృశ్య పదార్థములన్నీ ఉత్పత్తి, వినాశనం కలిగి ఉన్నవేకదా! పైగా, ఇవన్నీ కూడా అవిచారణ చేతనే పైకి రమణీయంగా కనబడి ఆకర్షిస్తున్నాయి. మిథ్యయగు రూపములను ఆశ్రయించి మృత్యుముఖంలో ప్రవేశించవలసిన అగత్యం ఏమిపట్టింది?

ఓ ఇంద్రియములారా! ఆ పరమాత్మ సర్వ పదార్థములనూ ప్రకాశింపజేయుట యందు అతి సమర్థుడై ఉంటున్నాడు. అయినా కూడా, ఈ రూపాది విషయములందు ఉదాసీనుడై సాక్షి స్వరూపుడై ఉంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ దృశ్యముపట్ల సాక్షివలె ఉండండి. సదసద్రూపమగు ఆత్మనే వీక్షిస్తూ ఉండండి. అంతేగాని ఆత్మకు వేరైనట్లు భావనచేసి నిరుపయోగమైన సంతాపమంతా పోగుచేసుకోండి. ఇక్కడ తారసపడుచున్న భార్య, భర్త, కుమారులు, మిత్రులు, అమిత్రులు, ఐనవారు, కానివారు - మొదలైనవారంతా 'ఇదంతా ఆత్మయే' అను దృష్టిని దృఢంగా కలిగి ఉండండి. ఆపై ఇక ఏమి చూడాలనుకుంటే అది చూడండి. భ్రమమాత్రం పొందకండి.

నేత్రాదులు సేకరించే దృశ్యము గ్రహిస్తున్న ఓ చిత్తమా! నదీజలంలోని తరంగము యొక్క ఆకారం ఎంత అనిత్యం? ఈ "జాతి - వస్తు - ప్రదేశ - సందర్భముల... సంబంధాలన్నీ అంతే అనిత్యం. ఆకాశంలో కనిపించే మేఘము యొక్క ఆకారం లాగా మిథ్యయే అయినట్టి ఈ వస్తు సముదాయముల ఆగమన, నిష్క్రమణములలో లాభాలాభములేమి ఉంటాయి? కనుక నీవు ప్రశాంతంగా శమించి ఉండు.

అద్దంలో ప్రతిబింబంలాగా, ప్రళయకాలజలంలో నశించబోయే చేపలాగా చిత్తమునందు ఈ జగత్తు స్ఫురిస్తోంది. మధ్యలో భ్రమలాగా ఏర్పడి, భావోద్వేగాలను ఉత్పత్తి చేస్తోంది.

ఈ పదార్థములన్నీ సూర్య ప్రకాశం ఆశ్రయించుటచేతనూ, పదార్థములను ఆశ్రయించుట చేత సూర్యప్రకాశమూ వ్యక్తమగుచున్నాయి. ఈ విధంగా ఆధార ఆధేయములు జడమై స్ఫురిస్తున్నాయి. ఇక అట్టి సమావేశము చూచి జీవుడు అంత అందంగా ఉన్నది! అని అనుకుంటూ భ్రాంతికి లోనై నిష్కారణంగా కామాదులు ఎందుకు పొందాలి? ఈ జీవునకు వాస్తవానికి ఏ పదార్థంతోనూ ఎట్టి సంబంధం లేనే లేదు. ఇక వ్యధ దేనికి?

1. రూపము, 2. నేత్రాదులచే కలుగుచున్న బాహ్య పదార్థముల దర్శనం' (ప్రకాశము), 3. మనస్సు యొక్క సంకల్పం ... ఈ మూడూ కూడా ఒక దానితో మరొకదానికి సంబంధము లేని మూడు తత్త్వములు, కాని, చిత్రం! 'ముఖము, దర్పణము'వలె ఈ మూడు కలిసిఉంటున్నాయి. అయితే... అజ్ఞానముచే మాత్రమే అవి మూడూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Page:629

జ్ఞానముచే అజ్ఞానము తొలగినప్పుడు ఆ మూడు వేరువేరుగానే కనిపిస్తాయి. అప్పుడా మూడూ శుద్ధ స్వరూపంగా, అధిష్టానమాత్రం (Made up of Absolute Self)గా శేషిస్తాయి. కొయ్య, లక్క కలిసి ఉన్నప్పటికీ వాటికి ఒక దానితో మరొకదానికి సారూప్యత ఏకత్వం ఉండదు కదా! రూపము - ప్రకాశము - సంకల్పము - ఈ మూడూ కూడా మనస్సు యొక్క ఉనికి చేత, చర్య చేత ఒకచోటికి వచ్చి ఒనగూడుచున్నాయి. అజ్ఞానము సంక్షయించుటచే మనస్సు లయించిందనుకో... అప్పుడు ఆ మూడూ కలియజాలవు.

శరీరంలో కళ్లు, చెవులు, ముక్కు నోరు, చర్మము, కాళ్ళు, చేతులు వివిధ ధర్మములను నెరవేరుస్తున్నాయి కదా! అయితే మనస్సే ఇన్ని ఇంద్రియములను ఆయాధర్మములకై ప్రేరేపిస్తోంది. అట్టి మనస్సు ఇంద్రియ ధర్మములవైపుకే ప్రీతిరూపంగా ప్రసరిస్తోందిగాని, ఆత్మను ఎరుగుటలేదు. ఇంటికి అసౌకర్యం కలుగజేసే వస్తువును ఇంటిలోంచి తీసివేస్తాము చూచావా? పిశాచమువలె అల్ప, స్వల్పకాలిక వస్తువులవైపుగా ప్రసరిస్తున్న ఈ మనస్సును సర్వప్రయత్నములచే తన దుష్ట మార్గము నుండి విరమించేటట్లు చేయాలి.

ఓ మనస్సా! నీవు మిథ్యారూపంగానే విజృంభిస్తున్నావు! కానీ ఆత్మ ఇంద్రియవిషయములను మననము చేయుట”యే నీ యొక్క స్వరూపమని నాకు తెలిసిపోయింది. అనగా, నేను మననము చేయుచుండటమే నీ స్వరూపమూ, ఉనికి కూడా! ఇప్పుడిప్పుడే నీ ఆనుపానులు తెలిసిపోతున్నాయి. ఆద్యంతమూ నీవు అసద్రూపమే కనుక నీవు భూత - వర్తమానములందు కూడా మృత ప్రాయుడవే. పంచేంద్రియముల ద్వారా శబ్ద -స్పర్శ - రూప - రస - గంధాలు ఏర్పడుచుండగా, నాకు వాటికి మధ్య నీవు ఎక్కడినుంచి వచ్చావు? ఈ జీవుడు నిన్ను తనవానిగా, తనంతటివానిగా ఎంచుటచేతనే అతని ఉపకరణార్థం నీవు బయల్వెడలుచున్నావు. అంతేగాని, వాస్తవానికి సర్వదా అసంగమగు చైతన్యమునకు నీవు సంబంధించిన దానవు ఏమాత్రం కానేకావు.

ఓ మనస్సా! నీయొక్క విజృంభణం నాకు కొంచంకూడా సంతోషం చేకూర్చటం లేదు. ఒక ఐంద్రజాలకుని మాయచే ప్రేరితమైన దానివలే నీవు క్షణకాలంలో ఉద్భవించి వివిధములైన విషయాకృతులను అవధరిస్తున్నావు. వ్యర్థంగా ఎక్కడెక్కడో తగుల్కొనుచున్నావు ఎందుకు?...

సరే! ఇంతవరకు ఏదైనా జరిగి ఉండనీ. ఇకపై ఏం చేయాలి అనే విషయానికివద్దాం. ఇక నీవు ఉంటే ఉండు. లేదా, తొలగిపో. నాకు మాత్రం నీతో ఏమీ సంబంధంలేదు. మిథ్యారూపుడవగుటచే నీవు ఎప్పుడూ గతించినదానివే అవుతావు. విచారణ దృష్టితో చూస్తే నీకు ఉనికియే లేదు.

ఓ మనస్సా! నిత్యమృతుడా! నీవు తత్త్వరహితుడవు. జడుడవు. భ్రాంతి మయుడవు. శరుడవు అజ్ఞానసహితుడవు. అజ్ఞానికి మాత్రమే నీవు దుఃఖం కలిగించగలవు. విచారవంతుని నీవు ఏమీ చేయలేవు. అజ్ఞానకారణం చేతనే ఇంతకాలం 'ఈ మనస్సును తొలగించేది ఎట్లా?'...అని నేను మథనపడ్డాను. ఇప్పుడో... నేను ఆత్మను దర్శించాను. ఆత్మకు వేరైనదేదీ ఎక్కడా ఉండజాలదు. కనుక నీవు లేవు.

Page:630

మసక చీకట్లో కనబడిన ఏవేవో ఆకృతులన్నీ దీపం వెలగగానే మటుమాయ మౌతాయి చూచావా? జ్ఞానదీపం మాయందు వెలగనంత కాలం రాగ ద్వేష-మోహ-క్రోధ-మద మాత్సర్యాదుల క్రీనీడలతో భ్రమింపజేశావు. నిన్ను చాలాకాలం నిరోధించలేకపోయాను. మా దేహములలోనే ఉన్న ఆత్మవస్తువును ఎంతో కాలం కనుమరుగు చేశావు.

ఇక చాలించు నీ నాటకం. అజ్ఞాన పిశాచం తొలగగా ఈ దేహం శమ, దమాది ఉత్తమ గుణములకు ఆలవాలమై సజ్జనుల సద్వచనములు వినుటకు అర్హమగుచున్నది. ఎంత సంతోషించ వలసిన విషయం!

ఓ ‘మనస్సు’ అనే బేతాళమా! నీవు ఇతఃపూర్వమూ లేవు. ఇప్పుడూ ఉండజాలవు. ఇకముందూ ఏర్పడజాలవు. 'అసత్' స్వరూపమగు నీవు ఇంకా సిగ్గు పడక ...నవ్వుచున్నావా? నా ఈ గృహ దేహం నుండి తృష్ణ-క్రోధము-మోహము మొదలైన నీ పరివారాన్ని తీసుకొని ఇక బయలుదేరు.

అమ్మయ్యా! వివేకము' అనే మంత్రమును ఆశ్రయించుటచే 'మనస్సు' అనే బేతాళుడు బయటకు పంపబడ్డాడు. గుహలోంచి తోడేలును వెడలగొట్టినపుడు ఆ గుహ ఎంత ప్రశాంతంగా ఉంటుంది! మనస్సు సంయమిస్తే అంతటి ప్రశాంతత లభిస్తుంది. ఏ ప్రాణికైతే "నేను ఈ దేహమాత్ర స్వరూపుడను” ...అనే బుద్ధి ఉంటుందో, ఆ ప్రాణిని 'క్షణభంగురము, జడము, శఠరూపము' అయినట్టి ఈ మనస్సు తన వశం చేసుకోగలుగుతోంది. ఆతనిని బంధించి తన ఇష్టం వచ్చినట్లు ఆట ఆడిస్తోంది. అయితే ఆ ప్రతాపము, ఆ ఆశ్రయశక్తి మనస్సుది కాదు. అదంతా అజ్ఞానము యొక్క ప్రతాపం మాత్రమే. “ఈ శరీరమునకు పరము, అద్వితీయము అగు ఆత్మశక్తినే నేను అను ఎరుక గలవాని ముందు ఈ మనస్సు ఒక ఉపకరణం మాత్రంగా ఉండి పోతుంది. అట్టి వానిని అది బాధించజాలదు. ఆత్మసందర్శిని ఈ జగత్తు యొక్క ఉనికి లేములు తన సర్వ సమ స్వరూపం నుండి విఘ్నము కలిగించ లేవు. దీనమగు చిత్తము పూర్ణమగు ఆత్మను వశం చేసుకోవటమేమిటి?

కనుక నేను చిత్తము (మనస్సు)ను అంగీకరించనక్కర్లేదు... తిరస్కరించనక్కర్లేదు. ఆత్మ సందర్శన ప్రభావం చేత అది మృతప్రాయమై నా పూర్ణ స్వభావము నందు ఒక మూల ఒదిగి ఉండు గాక.

“మనస్సు కలదు... నేను దానిని తొలగించుకోవాలి" అనే దుర్వ్యసనం, భ్రమ, ప్రయాస... అన్నీకూడా "స్వయం స్వరూపమగు ఆత్మ ఒక్కటే ఉన్నది" అను అవగాహన సహాయంతో తొలగిపోతున్నాయి. ఇప్పుడు దయ్యం వదలినవానివలె వ్యర్థత్వమంతా వదలి జీవన్ముక్తుడవై ఆత్మయందు ఆత్మచే ప్రశాంతుడనగుచున్నాను.

చిత్తముతో కూడి ఇంతకాలం నేను ప్రదర్శించిన హావభావములు చూచి ఇప్పుడు నవ్వువస్తోంది. నైర్మల్యం తొలగుటచే పరిశుద్ధుడను, సుఖుడను అగుచున్నాను. 'విచారణ' అనే మంత్రస్తవంచే చింతలన్నీ ఉడిగి, విషయవైషమ్యాలు తొలగి శాంతుడనైనాను. అహంకార దుష్టరాక్షసుడు మరణించాడు.

Page:631

అయినా... నాకు మనస్సు ఏమిటి? ఆశ ఏమిటి? తుచ్ఛమైన అహంకార మేమిటి? ఈ పుత్రాదులు నావా? ...కావు. కానప్పుడు వాటి కొరకై నేను రోదించటమేమిటి? నాకు మనస్సు అక్కర్లేదు... ఆశ అక్కర్లేదు. నేను సర్వదా అద్వితీయుడను... కృతార్థుడను, చిత్స్వరూపుడను, నిర్మలుడను, నిర్వికల్పుడను, నిత్యుడను. అట్టి నా ఆత్మకు నేనే పలుమార్లు జేజేలు పలుకుతూ నుతిస్తున్నాను... నమస్కరిస్తున్నాను.

నాయందు శోకముగాని, మోహముగాని లేవు. అహంకారము, అభిమానము మొదలైనవి ఉండవు. అవన్నీ నాకు బాల్య చాపల్యము వంటివి. సర్వమునకు సర్వదా నేను సాక్షిని. నా సాక్షి స్వరూపమునందు ఆశ, కర్మ, సంసారము, కర్తృత్వము, భోక్తృత్వము, దేహములు - మొదలైనవి ఏర్పడజాలవు. సాక్షియగు నన్ను చేరగలిగినది, నాతో సమానమైనది ఏదీ లేదు. 'నేను' అను కల్పనకు ముందే ఉన్నదేదో అదే నా వాస్తవరూపం.

నేను 'ఆత్మ' అనే శబ్దమునకు వాచ్యుడను కాదు. ఏ శబ్దమునకూ నన్ను సంపూర్ణముగా ప్రవచించగల, ప్రకటించగల, నిర్వచించగల సామర్థ్యం లేదు.

అయితే ‘అహం’ అను ప్రత్యయమునకు అన్యమైనదంటూ ఏదీ లేకపోవటం చేత... అంతయూ నేనే. సర్వలోకములకూ ఆదికారణం, ఈ లోకములను వహించేది, ఈ లోకములు స్వరూపంగా కలిగి ఉన్నది, అంతరమున ఈ లోకములేవీ లేనివాడను నేను. అందుచేత 'ఇది తొలగాలి... ఇది ఉండాలి' అనేదేదీ నాకు ఆపాదించబడజాలదు. ఏ దేశ-కాల వస్తువులూ నన్ను పరిచ్ఛిన్నం చేయజాలవు.

నిర్వికారాయ నిత్యాయ నిరంశాయ మహాత్మనే |

సర్వస్మై సర్వకాలాయ మహ్యమేవ నమోనమః ॥ (శ్లో 45, సర్గ 80)

నిర్వికారమై, నిత్యమై, అంశరహితమై, సర్వరూపమై, సర్వకాలస్వరూపమై, రూపరహితమై, నామవర్జితమై, ప్రకాశస్వరూపమై, మహత్తరమై, ఏకమైనట్టి పరమాత్మను నేను.

సమరూపమై, సర్వవ్యాపకమై, సూక్ష్మమై, ఏకమై ఈ జగత్తు నంతటినీ ప్రకాశింపజేయుచున్నట్టి ఓ నా చైతన్య సాక్షి పరతత్వమా! నీవూ నేనూ ఒక్కటే కదా! మరి నీకు నేను నమస్కరించటమెట్లా? నేల, పర్వతము, నది మొదలైన వాటితో కూడిన ఈ పదార్థ సంచయజగత్తు గాని; కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైన అమరికతో కూడిన ఈ దేహం గాని నేను కాదు. ఇవి ఉన్నా లేకున్నా ఫరవాలేదు.

ఇవి నాకు సంబంధించినవి కావు. నేను వీటికి సంబంధించను. లేదా... స్వయంప్రకటనచే అవన్నీ నేనే. ఉన్న చోట ఉంటూనే అంతటా ఉన్నాను. మనోవికల్పరహితుడను... సమత్వముచే శోభించువాడను. విశ్వమును లీలామాత్రంగా ప్రకటించువాడను. జగద్రహితుడను... శరీరములు లేనివాడను. జరాజన్మ రహితుడను. అచ్యుతుడను... చిత్స్వరూపుడను. గుణాతీతుడను.... ఈశ్వరుడను. నమస్కరించువాడిని, ఆ నమస్కారం స్వీకరించువాడను...నేనే!

Page:632

12. తత్త్వవేత్త

శ్రీవసిష్ఠ మహర్షి : హే మహాబాహో! రామచంద్రా! తత్వవేత్తయొక్క నిశ్చయం ఎట్లా ఉంటుందో మనం ఇంతవరకు చెప్పుకున్నాం.

ఎప్పుడైతే జీవుడు “ఈ ప్రపంచమంతా ఆత్మయే. ఆత్మకు ద్వితీయంగా దృశ్యంలేదు అనే నిశ్చయం సంపాదిస్తాడో ... అప్పుడు ఆతనిని శాస్త్రజ్ఞులు 'తత్త్వవేత్త', 'అద్వితీయుడు’ అని పిలుస్తున్నారు. అట్టివానికి తన చిత్తము కూడా ఈ దృశ్యములో అంతర్భూతమై తదితర దృశ్యముల లాగానే మిథ్యగా ఎరుగబడుచున్నది. ఆతనికిక దృశ్యంలో ఉద్భవం సంభవించదు.

ఈ జగత్తంతా అవిద్యయొక్క (లేక) మాయ యొక్క కార్యమే. అన్య చిత్తదృష్టిచే ఇది లేనిదే అవుతుంది. ఎవరికి వారికే వారివారి చిత్తమును అనుసరించి ఈ జగత్తు పరిపరివిధములుగా తోచుచున్నది. 'ఆకాశవృక్షం' అనే ప్రతీతి నీవు విన్నావుకదా! ఆకాశంలో వృక్షం ఎలా ఉంటుంది! ఈ జగదనుభవం కూడా అట్టిదే. వాస్తవానికి ఇదంతా శుద్ధ చిన్మాత్ర స్వరూపమే.

నౌకలో ఉన్న బాలునికి ఒడ్డున ఉన్న వృక్షాలు కదులుతున్నట్లు అనిపిస్తాయి. అవి నిజంగా వర్తులాకారంగా కదులుచున్నాయా?

కదులుచున్న యంత్రం (Giant Wheel)పై కూర్చున్నవానికి ఎదురుగా ఉన్నకొండ గిఱ్ఱున తిరుగుచున్నట్లు అనిపిస్తుంది. క్రింద నిలబడ్డవానికో... ఆ కొండ స్థిరంగానే కనబడుతోంది కదా!

అజ్ఞానికి ఈ చిత్తము వాస్తవమైనదానివలె అనిపిస్తోంది. ఈ బాహ్యాభ్యంతర పదార్థములన్నీ చిత్తము నుండే అసద్రూపంగా ఆవిర్భవిస్తున్నాయి. అందుచేత తత్వవేత్త వాటిని అతిసహజంగా మొదలంట త్యజించి ఉంటాడు. సంశయరహితుడై సంతాపవర్జితుడై తనకు రావలసినది, పోవలసినది ఏదీ లేనివాడై ఉంటాడు. ఈషణారహితుడై స్వానుభవముచే తన పారమార్థిక స్వరూపమునందు శుద్ధ చైతన్య చక్రవర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు.

ఈ ఎదురుగా కనులకు కనబడే దృశ్యమును అభావించినప్పుడు నేత్రముల కార్యక్రమం అజ్ఞానరహితమై, అప్పుడు తృష్ణాచాపల్యం కూడా నశించగలదు. మోహపంజరం విచ్ఛిన్నం కాగా, నిరహంకారం రూపుదిద్దుకొని దృశ్యాసక్తి తొలగుతుంది. అప్పుడిక కర్మలెవరికి? ఆ కర్మల ఫలితములు ఎవరికి సంబంధించినవి? సంచిత ప్రారబ్ధ-ఆగామి కర్మల స్వభావంతోసహా చిత్తము ఉపశమించ గలదు. అజ్ఞాన నిద్ర పటాపంచలౌతుంది. అప్పుడీ జీవుడు ప్రబుద్ధుడు కాగలడు.

ఈ జగత్తంతా కూడా 'శాంతము, ఏకము' అగు బ్రహ్మమే. ఇక్కడ అనేకత్వముగాని, ఆత్మ కంటే భిన్నమైనదిగాని సంభవించజాలదు. ఇక తత్త్వవేత్తకు అంతఃకరణంలో విచారించటానికి ఏముంటుంది? ఆతనికి ఎక్కడ చూచినా ఆత్మయే అనుభవవిశేషమగుచున్నది. ఆతనికి అసత్ విషయమైన దేనితోనూ పనే ఉండదు. ఈ జీవదశలన్నీ అతనికి అసంగతమే అవుతాయి.

Page:633

"ఆద్యంతరహితమగు పరమపదమును నేను అను అనుభవముతో సౌమ్యుడై, సూక్ష్ముడై సర్వవ్యాపకుడై ఆత్మనే ఆస్వాదిస్తూ ఉంటాడు. చిత్తము ఉన్నా లేకున్నా చిత్తముచే తారసపడే సర్వ విషయములకు అతీతుడై, విరక్తుడై ఉంటాడు. ఆతనియందు ఆత్మ యొక్క సర్వసమౌన్నత్యము సర్వదా ఉదయించియే ఉంటుంది. పరిచ్ఛిన్నత్వమును గడచిన కలవలె త్యజించి అపరిచ్ఛిన్నుడై ఉంటాడు. అవిచారణా సమయంలో అడ్డుగోడవలె ఏర్పడియున్న ఇతఃపూర్వపు అహంకారం ఇప్పుడు ఏమైపోయిందో కూడా ఆతనికి తెలియదు. దీపం వెలిగించగానే చీకటి, ఆ చీకటిలో స్ఫురించే క్రీనీడాకారాలూ ఎటు పోతాయో ఎవరు చెప్పగలరు?

చిత్తము నశించిన తరువాత ఇక 'విచారణ చేస్తున్నవాడు ఉన్నవాడా? ఉండనివాడా?' అను మీమాంస అంతా అనవసరమగుచున్నది. అట్టి వికల్పము ఆశ్రయించవలసిన ఆగత్యం ఆతనికుండదు. అట్టి తర్జన భర్జనతో మనస్సును పునరుజ్జీవింపజేయవలసిన ఆవశ్యకత ఆతనికేముంటుంది? అందుచేత అంతఃకరణమునుండి సంకల్పములన్నీ పారత్రోలి, 'ఓం' కారమునకు లక్ష్యమైయున్న తురీయావస్థయందు సంస్థితుడై ఉంటున్నాడు.

వింటున్నావా, రామా! జ్ఞాని ఇట్టి విచారణచే ఉత్తమౌన్నత్యమును అవధరిస్తున్నాడు. అశ్నన్గచ్ఛన్స్వపం స్తిష్ఠన్నితి రాఘవ చేతసా |

సర్వత్ర ప్రజ్ఞయా తజ్ఞః ప్రత్యహం ప్రవిచారయేత్ (శ్లో 17, సర్గ 81)

కాబట్టి నీవు నడుచుచున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ‘ఆత్మ ప్రజ్ఞ'తో కూడి ఉండుము. స్వచిత్తముతో ప్రతిరోజూ ఆత్మ విచారణ కావిస్తూ ఉండు. సాధు చిత్తులగు ఎందరో మహనీయులు ఒక వైపు తమతమ వర్ణాశ్రమ ధర్మములను నిర్వర్తిస్తూ... వేటి చేతా స్పృశించబడక, తమ ఆత్మప్రజ్ఞను కాపాడుకుంటూనే వర్తిస్తున్నారు.

మాన మదరహితులై శరత్కాలంలోని పూర్ణచంద్రునిలాగా ప్రసన్నతతో వెలుగొందుచున్నారు. ప్రవాహపతితములైనట్టి తమకు నియమించిన కార్యముల మధ్య నీటిలోని తామరాకు వలె వ్యవహరిస్తున్నారు. మహా ధీమంతులై, మహా వివేకులై ఈ ప్రపంచమున వెలయుచున్నారు. వారే నీకు సోదాహరణులగు గాక!

వివేకదృష్టి' అను పేరుగల ఈ విభాగంలోని విశేషమంతా ఒకప్పుడు వింధ్య పర్వతంపై బృహస్పతి సోదరుడగు సంవర్తుడు చేసియున్న సంవాదముయొక్క సారాంశమై ఉన్నది. ఆతనిలాగానే విచారణతో కూడిన బుద్ధితో ఆత్మదృష్టిని అవలంబించు. ఆతనిలాగానే ఉత్తరోత్తర భూమికాక్రమంచేత ఈ సంసార సాగరమును అవశ్యం దాటగలుగుతావు.

Page:634

XI. వీతహవ్యుడు - అంతర్మథన యోగము

-

1. సంబోధన

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసారమును యుక్తియుక్తంగా అధిగమించివేసిన మహనీయు లెందరో ఈ భూమిపై ఉన్నారు. 'వీతహవ్యుడు' అనే ఒక ముని తీవ్రమైన విశ్లేషణ విచారణల ద్వారా ఆత్మ పదమునందు దృఢమైన ఆరూఢత సంపాదించారు. ఆయనకూడా ఇంద్రియ ప్రబోధ రూపంగా ఉత్తమ సమాలోచన నాశ్రయించి ఆత్మోన్నతి పొందియున్నారు. నీ యొక్క ఉత్తమ దృష్టి సముపార్జన కొరకై ఆయన సంబోధన, సమాలోచన వివరిస్తాను. అధ్యాత్మ వాఙ్మయంలో ఇది మహత్తరమైనదిగా శ్లాఘించబడుతూ ఉంటుంది.

వీతహవ్యుడు ఒకప్పుడు అనేకమంది మునులుండే ఒక ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఎంతో సాధన చేశాడు. అట్లా కొంతకాలమైన తరువాత సమాధిని సముపార్జించాలని అక్కడినుండి బయలుదేరాడు. చాలాకాలం సరైన ఏకాంత ప్రశాంత ప్రదేశం కొరకై అడవులలోనూ, కొండలలోనూ సంచరించాడు. ఎంతగానో వెతకి వెతకి సొలసి, విరక్తుడయ్యాడు. కాలక్రమంగా అతనిలో వివేకముతో కూడిన పరిజ్ఞానం రూపుదిద్దుకొన్నది.

అరెరే! శారీరక, మానసిక వ్యధాపూర్వకమైన ఈ సంసారము ఎంత భ్రమదాయకమైనది! ఇందులోని ఆయా క్రియా కార్యక్రమాలన్నీ చివరకు 'భయం' అనే ఒడ్డుకు చేరుస్తున్నాయే!”

అని తలచి చకితుడైనాడు. ఇక నేను అసారమగు ఈ సంచార వ్యాసంగం త్యజిస్తాను. ఏదో ఒకచోట ఆసీనుణె స్వకీయమైన విచారణ ప్రారంభిస్తాను" అని తలచాడు ఆ మునీంద్రుడు. తిరిగి పూర్వ ప్రాంతంలో గల తన పర్ణశాల జేరాడు. కాస్త సేద తీర్చుకున్న తరువాత ఆ పర్ణశాలలోనే ఒకచోట శుద్ధమగు మృగ చర్మమును పరచాడు. పద్మాసనం వేసుకున్నాడు. పాదములపై వ్రేళ్ళుంచి స్థిరాసనం స్వీకరించాడు. ఇంద్రియములలోకి మరల మరల ప్రవేశిస్తున్న మనస్సును మెల్లమెల్లగా వెనుకకు మరలుస్తూ ఉపాయములచే నిరోధించి, క్రమంగా మనస్సును ఇట్లు సంబోధించారు.

ఓ మనస్సా! నీవు ఎంత చంచలమైనదానివి! ఎంత నిగ్రహించినా కూడా... మహత్తరంగాలచే కొట్టుకుపోబడుచున్న ఆకులాగా క్షణంలో అస్థిరత్వం పొందుచున్నావే!

ఈ నా నేత్రములు మొదలైన ఇంద్రియములు బహు భ్రమణయుక్తమై ఎన్నెన్నో విషయాలవైపు మరలుచున్నాయే? వాటివెంట ఈ మనస్సు, బుద్ది కూడా 'తగుదునమ్మా' అని బయలుదేరుతున్నాయి. కాలితో తన్నబడుచున్న బంతిలాగా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఈ మనస్సు ఇంద్రియముల

Page:635

నుండి బలం పుంజుకుంటోంది. ఇంద్రియములో?... మనస్సు నుండి బలం పుంజుకుంటున్నాయి. మనస్సు కొన్ని వృత్తులను ఆశ్రయిస్తోంది. ఇంతలోనే ఆ వృత్తులను త్యజించి, మరల నూతన వృత్తులలో ప్రవేశిస్తోంది. నేను దేనిని నిగ్రహించాలని అనుకుంటానో, దాని వైపుకే పరుగులు తీస్తోంది. చెట్ల కొమ్మలపై గంతులు వేసే కోతిలాగా అనేక పదార్థముల పరంపరను ఆశ్రయిస్తోంది. ఈ మనస్సును నియమించాలంటే ముందుగా దీనిని ఇంద్రియములనుండి వెనుకకు మరల్చాలి. ఎట్లా?

ఓ ఇంద్రియములారా! సముద్ర తరంగములవలె అతి చంచలముగా ప్రవర్తిస్తున్నారు కదా! ఆత్మ దర్శనము చేయటానికి మీకు ఇంకా సమయం కుదురుట లేదా? ఆశలతో, అల్ప ఆశయాలతో ఇంకా ఎంతకాలం సంచరిస్తారు? అనర్థదాయకమైన మీ చపలత్వం కొంచెంసేపు ఆపండి! ఒక్కసారి నేను చెప్పేది వినండి! మీరు చేస్తున్న కర్మలను, వాటి పర్యవసానమును కొద్దిసేపు పరిశీలించండి. మీరంతా మనస్సుకు ద్వారములు వంటి వారే కదా! కనుక, మీరు జడరూపము మాత్రమే. జడ స్వరూపులై, జడమాత్రమగు దృశ్యమును ఆశ్రయిస్తున్నారు. జలతరంగాలలో జలం పోస్తున్నట్లు మీరు నాచే దృశ్యముపై ప్రసరింపజేయబడుచున్నారు. మృగతృష్ణలో జలం కోసం వెతికే మృగాల వలె, మీరు దృశ్యము వైపు విజృంభిస్తున్నారు. జ్ఞానరహితులై, దుర్వినయులై కుమార్గము లందు ప్రవృత్తులవుచున్నారు. గుడ్డివాడు ముళ్ళపొదలవైపు వెళ్ళుచున్నట్లు, మీరు నన్ను పతనము వైపుకు నడిపించుచున్నారు.

ఏమి మీ చమత్కారం! చిదాత్మస్వరూపుడనగు నేను సాక్షీమాత్రుడనై సమస్తమును నెఱవేర్చుచున్నాను కదా! మధ్యలో మీరెందుకు వ్యర్థంగా భ్రమింపజేస్తున్నారు?

రజ్జు, సర్పభ్రాంతిలాగా (త్రాడును చూచి పాము అనుకొనునట్లుగా) అసద్రూపములగు ఈ ఇంద్రియములు విజృంభిస్తున్నాయి. ఇవి నా నేత్రములు" అని ఎఱుగుచున్నది ఎవరు? నేను కదా! సర్వప్రకాశకుడు, సర్వసాక్షియగు ఆత్మయే నేను. నాచే ఎఱుగబడుచున్నదానితో నాకేమి సంబంధం? ...కనుక, మీరున్నప్పుడు, లేనప్పుడు నేనున్నాను. మీరు ఏర్పడనప్పుడు, నిర్వికారుడనై, నిర్విషయుడనై, పరమాత్మస్వరూపుడనై, నేనుండియున్నాను. మీరు ఏర్పడినంతమాత్రంచేత, లేక, శిథిలమైనంతమాత్రంచేత నాయొక్క 'ఉనికి' కుంటుబడుతుందా? అసాధ్యం!

సూర్యుడు ఆకాశంలో నిజేచ్ఛచే ఉదయించి ప్రకాశిస్తూ ఉంటే, జనులు తమతమ దైనందిన కార్యక్రమములు నిర్వర్తించుకుంటుంటారు. ఆ కార్యక్రమములతో సూర్యునకు ఏమి సంబంధం ఉంటుంది? అట్లాగే, నా చైతన్య సత్తయొక్క ఉదయముచే మీరు, మీమీ చేష్టలు నిర్వర్తిస్తున్నారు. మీ చేష్టలతో నాకేమి సంబంధం? వాటి పట్ల ఇష్టముగాని, అయిష్టముగాని ఎట్లా ఏర్పడగలవు? చైతన్య స్వరూపుడనైన నేను మీ చర్యలకు దుఃఖించటమేమిటి? సుఖించటమేమిటి?

ఓ చిత్తమా! నీవు ఇంద్రియములను మోసగించి దుఃఖభాజకములగు విషయములలో ప్రవేశింపజేస్తున్నావు. అయితే చమత్కారం చూచావా? ఆ ఇంద్రియ విషయములచే నిజానికి నీవే మోసగించబడుచున్నావు సుమా! దేహాభిమానము' అనే జాడ్యమును నీయందు కలిగియుండి....

Page:636

తత్ప్రభావంచేత ఈ జగత్తులో ఇక్కడా, అక్కడా సంచరిస్తూ, అనర్థములన్నీ మూటగట్టుకుంటున్నావు. కుక్కలాగా నీచపదార్థముల వైపు మూతి సారిస్తున్నావు. భిక్షకుడులాగా క్షణక్షణం ఏదో ఒకటి అర్థిస్తూనే ఉన్నావు.

నేను చేతనుడను... నేను జీవించువాడను... నేను ప్రత్యేకమైన వాడను... అను రూపంలో ఉంటున్న నీయందలి వాసన అత్యంత అసత్యమైనది. అట్టి భావన మిధ్యారూపమున ఉదయించి, దుఃఖమును కలుగ జేస్తోంది. స్వతఃసిద్ధమైన ఉనికి నీకు లేదు. ఇక చపలత్వమెందుకు? నీవు నా స్వరూపము కాదు. ఎందుకంటే, నా స్వరూపము సంవిత్తుకు అన్యమై ఏదీ ఎక్కడా ఉండదు. కనుక చిత్తము' అను పేరుతో చెప్పబడే నీవు దేనికైనా కర్తవా? భోక్తవా? లేక, కర్తృత్వ, భోక్తృత్వముల మధ్య ఉండే ఆశయే నీ స్వరూపమా? మొట్టమొదట తియ్యగా కనిపించి చివరకు చేదును చవి చూపటమేమిటి? దుఃఖాలు ఉండటమేమిటి? యథార్థానికి నీకు స్వరూపమే లేదు. మరి నీకు బంధుమిత్రులు ఎక్కడి నుండి వస్తారు? స్ఫటికానికి ఎదురుగా ఏ రంగు కాగితం ఉంటే ఆస్ఫటికంలో ఆ రంగు ప్రవేశిస్తున్నట్లు... నీవు శుద్ధస్వస్వరూపానికి గుణములను ఆపాదించి చూపుచున్నావు. పోనీ, ఆత్మ నిన్ను కల్పన చేసుకున్నదా? ఆత్మకు కర్తృత్వ - భోక్తృత్వ - అన్యత్వములు ఏ క్షణంలోనూ ఉండవు కదా! నీవు ఆత్మవే అయి ఉంటే నీయందు వికల్పములు ఉండకూడదే? ఆత్మ తనకు తానే పూర్ణమై ఉండగా, ఈ భావాభావములు, సుఖ దుఃఖములు’ సంభవించటమెలా సాధ్యం? కనుక నీయందు కనిపించే కర్తృత్వ, భోక్తృత్వములు మిథ్యాభ్రమ మాత్రమే!

ఇప్పుడు ఒక యుక్తి నాకు తెలియవస్తోంది. ఆకాశంలో సూర్యబింబం ఉంటేనే క్రింద నీళ్ళలో సూర్యప్రతిబింబం లభ్యమౌతోంది. కనుక చైతన్యబింబం ఉన్నప్పుడే మనస్సు’ అనే ప్రతిబింబం ఏర్పడగలుగుతోంది. శిలాప్రతిమ స్వయంగా నాట్యం చేయజాలనట్లు, కత్తిస్వయంగా కూరగాయలను కోయజాలనట్లు... మనస్సు స్వయంగా ఏదీ చేయజాలదు. బింబం కదలకపోయినా, తరంగ విన్యాసముచే ప్రతిబింబం కదలగలదు కదా! కనుక ఓ మనో ప్రతిబింబమా! నీవు నీ బింబమగు ఆత్మను ఆశ్రయించు. అప్పుడు "బింబస్వరూపుడనగు నాకు రాక, పోకలు, చావు, బ్రతుకులు ఉండజాలవు" అని సుగ్రాహ్యం కాగలదు.

ఒక మనుజునిచే ఒక వస్తువు నరకబడిందనుకో... ఇప్పుడా వస్తువును నరికిందెవ్వరు? మనుజుడు నరికాడా? కత్తి నరికిందా? మనుజుని ఇచ్ఛ చేతనే కదా, కత్తి నరికింది! పాత్ర నుండి పాలు గొంతులో ప్రవేశించినా కూడా... త్రాగుచున్నది ఆ వ్యక్తియేగాని... కర్తృత్వం పాలకు, పాత్రకు ఆపాదించం కదా! చిత్తము కూడా ఆత్మయొక్క ఒక ఉపకరణంవంటిదే! చిత్తముచే చేయబడేది ఆత్మకు ఆపాదించవలసిందేగాని... చిత్తమునకు కర్తృత్వం ఆపాదించటం కుదరదు.

కనుక ఓ చిత్తమా! సర్వజ్ఞుడగు పరమాత్మచే నీవు ప్రబోధితుడవై ఆయా యోచనలు నిర్వర్తిస్తున్నావు. యోచనలు ఆత్మవే గాని ...నీవి కావు. ఆత్మయే తన కర్తృత్వ, భోక్తృత్వ, కరణ ఉపకరణాదులచే ఈ జగత్తునంతా సంచయం చేసివేస్తోంది. ఆత్మయగు పరమేశ్వరుడే సర్వమునూ

Page:637

ప్రబోధితం చేస్తున్నాడు. మూఢులైనవారు మాత్రమే మనస్సు - చిత్తములకు కర్తృత్వం ఆపాదిస్తున్నారు. ఆత్మసత్తచే జగత్తు యొక్క సత్త ఏర్పడి ఉంటోంది. “మనస్సు అనబడేది ఏదీ లేదు అని తీక్షమైన జ్ఞానమున్న చోట ప్రస్ఫుటమౌతోంది.

నేను ఆత్మను. భ్రమమాత్రమగు చిత్తమునకే జన్మ, జరా, మరణాది కర్మలు గాని... వాస్తవ రూపుడునగు నాకు అవన్నీ ఉండవు. అందుచేత ఈ చిత్తము యొక్క జాడ్యములగు జన్మ, జరా, మరణాది భావానుభవములు నేను పొందకుండెదనుగాక! ఇంద్రజాలంలో వస్తువుల భ్రమలాగా భ్రమించబడుచున్న తరుణంలో చిత్తమనేది ఏర్పడుతోంది.

విజ్ఞానమాత్రమగు బ్రహ్మముయొక్క సమక్షమున చేత ఈ జగత్తంతా వికాసము పొందుతోంది. ఈ వికాసము చిత్తముది కాదు. సముద్రంలో జలమే అనేక తరంగములగుచున్నట్లు బ్రహ్మము యొక్క చిత్ శక్తియే ఈ దేవ - మనుష్య - జంతు ఆదిగాగల జగద్రూపంగా విజృంభిస్తోంది.

ఓ చిత్తమా! నీవే గనుక చిన్మయుడవైతే నీవు మరొక దానికొరకై దేబరించేదానవు కాదు. భూత -భవిష్యత్తులందు ఏకమై, అనేకమై, సర్వ వ్యాపకమై, సర్వదా ఏర్పడి ఉండే ఆత్మని ఎందుకు దర్శించలేకపోతున్నావు? 'నీవు, నేను' - అను అభాస అంతా స్ఫురిస్తున్నది ఆత్మయందే. ఇక దుఃఖం ఎవరికి? నీడకు ఆకారం కనబడుచున్నా కూడా, దానికి స్వయంభూతమైన ఉనికి లేనట్లు. ఆత్మకు అన్యమైనట్టి దేనికీ ఉనికి లేదు.

కనుక చిత్తము కేవలం జడము, అసద్రూపము, కల్పితము, అభ్యాసవశము మాత్రమే.

సర్వమూ ఆత్మయే అయి ఉండగా... ఈ బాల శరీరం నాది... ఈ వృద్ధ శరీరం నాది... ఈ పుత్ర, కళత్ర, పౌత్రులు, ఈ గృహ, ఆరామాలు నావి" అనుకుంటూ నేను చిత్తమును పెంపొందించు కున్నాను. ఆహా! అదంతా వ్యర్థమైన చింతనగాక మరేమిటి? ఈ దేహమే లేని వస్తువై క్రీడలో ఉపయోగించే క్రీడోపకరణము వంటిదై ఉండగా... అట్టి దేహముతో ఏర్పడే సంబంధాలు వాస్తవమైనవి ఎట్లా అవుతాయి?

ఆత్మకు దేహమే లేదు. కుందేటి కొమ్ముచే ఎవ్వరైనా పొడవబడతారా? ఛాయ వెళ్ళి ఒక గోడను కూల్చగలదా? ఈ దేహము తత్సంబంధములచే ఆత్మ నిరోధింపబడజాలదు. దుఃఖింప

బడజాలదు.

చేతనము, జడము (ఆత్మ - దృశ్యము)ల మధ్య 'చిత్తము’ అనబడే మూడవ వస్తువు ఏర్పడుటకే వీలులేదు. ఆత్మ యొక్క దృశ్యమునకు సంబంధించిన అభ్యాసవ్యసనమే చిత్తము.

కనుక ఇప్పుడు మార్గమేమిటి?... నేను సత్యవస్తుజ్ఞానమును ఆశ్రయించాలి. అప్పుడు చిత్త, జడ దృశ్య దృష్టులన్నీ ఉపశమిస్తాయి. అట్టి ఉపశమన స్థితి యొక్క సాక్షాత్కార వృత్తి నాకు

అలవడు గాక!

అప్పుడిక చిన్మాత్రరూపమే స్వానుభవముగా శేషించగలదు.

Page:638

అట్టి స్వానుభవము యొక్క ఒకానొక చమత్కారమే ఈ చిత్తము - అని అప్పుడు అనుభవం అవక ఏం చేస్తుంది?

ఇట్లు తలచుచు వీతహవ్యముని అంతరంగములో మౌనము, నిశ్చలత్వములను వహించియున్నారు.

2. స్వాత్మ - చిత్తముల సంవాదము

శ్రీవసిష్ఠ మహర్షి : వింటున్నావా రామా! ఆ విధంగా అంతరంగ మౌనం వహించి వీతహవ్యముని కొన్ని గంటలు గడిపారు. ఇతఃపూర్వపు దృశ్యాభ్యాసము యొక్క సంస్కార ప్రభావం చేత కాబోలు... ఆతని యందు కించిత్ ద్వితీయ వాదం పొడచూపింది. ఆ ద్వితీయమైనదే చిత్తము కదా! అప్పుడు ఆతని అంతరంగంలో కొంత వాదోపములు పొడచూపాయి. అట్టి క్రమమేమిటో వివరిస్తాను. వినువీతహవ్యుని చిత్తము: మిత్రమా! వీతహవ్యా! "చిత్తము చేతనే ఆత్మను దర్శించగలం" అని శ్రుతులు చెప్పటం విన్నావు కదా!

వీతహవ్యుడు : అవును... విన్నాను.

చిత్తము : “అన్ని ఉపకరణములలో కెల్లా చిత్తమే (మనస్సే) గొప్పది ...అని కూడా శాస్త్రములచే చెప్పబడింది కదా!

వీతహవ్యుడు : అవును. అట్లా కూడా చెప్పబడింది.

చిత్తము : మరి నీవు ... చిత్తమనునదే లేదు" ...అని నా ఉనికినే ఖండిస్తున్నావే? వీతహవ్యుడు : ఓ... అదా నీ వాదన! ఒకడు తన ముఖమును చూచుకోవటానికి అద్దం ఉపయోగిస్తాడు చూచావా! అంతమాత్రం చేత దర్పణం చైతన్య జీవ సమన్వితమా?

ఆత్మ స్వరూపుడనగు నేను నా స్వరూపమును ఏమరచి అజ్ఞానదశను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు... నా స్వరూపమును నాకు గుర్తుచేయటానికి శాస్త్రములచే, శ్రుతులచే, గురువులచే ‘చిత్తము’ అనబడే నీవు కల్పించబడుచున్నావు. నీకొక ప్రత్యేకమైన ... ఆత్మకు వేరైన... ఉనికి ఉన్నదని వారి ఉద్దేశం కాదమ్మా!

తత్త్వమసి (నీవు అదియే అయి ఉన్నావు...) అనే వాక్యార్థ సిద్ధికొరకు శిష్యుడిని తయారు చేయటానికి ఇది దృశ్యము, ఇది కల్పన, ఇది సంబంధము, ఇది చిత్తము”... మొదలైన మొట్టమొదటి పాఠములలో నీకు చోటు కల్పిస్తున్నారు. అంతమాత్రం చేత నీయొక్క ఆత్మకు అన్యమైన ఉనికి అంగీకరిస్తున్నట్లు కాదు. ఆత్మసాక్షాత్కారమైన తరువాత, ఇక నీకు పాత్రగాని, ఉనికిగాని ఉండదు.

Page:639

మధ్యే మార్గ పాఠ్యవిశేషంగా మాత్రమే కనబడి, విషయం రూఢి అవగానే నీవు ఆ జ్ఞానంలో లయం అవుతావు.

ఓ చిత్తమా! పంచేంద్రియాలు ఉపయోగిస్తున్న జీవుడు ఏ సమాచారంతో వాటిని ఉపయోగిస్తు న్నాడో... ఆ సమాచారమే నీ స్వరూపం. సర్వసమాచారములకు ముందున్న ఆత్మస్వరూపం గ్రహించ బడుచుండగా... ఇక నీకు చోటు కనబడదు. అనగా చైతన్యప్రకాశము యొక్క ఒకానొక దృక్పథమే నీ స్వరూపం కదా! చైతన్య ప్రకాశమును ఎరిగిన తరువాత ఇక నీకేం పాత్ర ఉంటుంది? నీవు దేనిచే... దేని వలన ఏర్పడుచున్నావో... అది ఎరిగిన తరువాత ఇక నీ గురించి తర్జన భర్జనలు

ఎవరికి కావాలి?

కాబట్టి నేస్తం! ఓ చిత్తమా! నీవు దేనికీ కర్తకాదు. అందుచేత దేనికీ దుఃఖ భాజుడవు కావద్దు. “ఈతడు నా వాడు... ఇవి నావి అని క్లేశములు ఆశ్రయించవద్దు. జడమగు నీవు జడములగువాటిని ఆశ్రయిస్తే జడంగానే ఉండిపోతావు. అట్లాకాకుండా, నీ ఉత్పత్తి స్థానమైన చైతన్యమును ఆశ్రయిస్తే చైతన్యముగా రూపుదిద్దుకోగలవు. నీ నియామకుడగు ఈశ్వరునికి ఈ జగత్తునందు చేయబడిన - చేయబడబోవుచున్న - చేయబడియుండిన దేనితోనూ ఏమీ సంబంధం ఉండదు. నీవు కూడా అట్టి అసంబంధమును ఆశ్రయించు.

చిత్తము : నేను భావాభావ స్వరూపుడనే. ఒప్పుకుంటాను. అయితే నన్ను ఉపయోగించి ఉత్తమజీవులు ఆత్మజ్ఞానం సంపాదిస్తున్నారు కనుక. నేను ఆత్మకు ఉపకారినే అని ఎందుకు అనుకోరాదు? వీతహవ్యుడు : నీవు ఆత్మకు ఉపకారం చేసేంతవాడివా? కార్య - - కారణ సంఘాతమునందు ఏర్పడే అభిమానముచే నీవు అప్పుడప్పుడు “నేను ఆత్మకు ఉపకారం చేస్తున్నాను ...అనే భ్రాంతిని పొందుచు న్నావు. పంచప్రాణములు, మనోబుద్ధులు, దశేంద్రియములు... అన్నీ జడాలే కదా! ఇక ఇంద్రియాలచే ఏర్పడే భోగ, యోగములచే ఆత్మకు ఒరిగే నూతన ప్రయోజనమేమున్నది?

చిత్తము : అదేమిటి? ఈశ్వరునకు భోగానుభవం పొందించుట యందు నేను వర్తించుచున్నానని ఎందుకనుకోకూడదు?

వీతహవ్యుడు : అట్లాగా? ఈశ్వరుడు నిత్యతృప్తుడు కదా! ఆయన భోగానుభవం కొరకు నీవు బయలుదేరటమేమిటి?

స్వాభావిక ప్రకాశయుక్తుడు, సర్వవ్యాపి, ఏకరూపుడు అగు చిదాత్మయే ఈ జగత్తంతా సర్వరూపములుగా వ్యాపించి ఉన్నాడు. వానికి అన్యముగా ఏ కల్పనా ఉండదు. ఏకమూ, అనేకమూ కూడా ప్రకాశింపజేయుచున్నట్టి ఆత్మ తన యందు ఈ జగత్తును క్రీడావినోదంగా రచించుకొనుచున్నది. సమస్తము దానియందు సిద్ధించుచుండగా... ఇక దానికి అలభ్యమైనదేమి ఉంటుంది? ఆతడు ఒక దానిని ఇచ్ఛగించటమేమిటి? ఆ ఇచ్ఛను నీవు నెరవేర్చటమేమిటి?

పట్టపురాణి రాజమార్గంలో రథం ఎక్కిపోతుంటే ఒక మూర్ఖయువకునకు మన్మథవికారం జనించినట్లు... సర్వమూ ఈశ్వరస్వరూపమైన ఈ ప్రపంచమును చూస్తున్నప్పుడు నీకు ఇచ్ఛ, క్షోభ జనిస్తున్నాయి.

Page:640

చిత్తము : సరేనయ్యా! నీ మాటలు ఒప్పుకుంటున్నాను. అయితే ఆత్మతో సంబంధం కలిగి నేను ఇట్లాగే ఉంటాను. నన్ను తిరస్కరించటం దేనికి?

వీతహవ్యుడు : అది కూడా సరికాదు... కుదరదు. ఎక్కడైనా ఫలం ప్రాప్తించేటప్పుడు పుష్పం మిగిలి ఉంటుందా? పుష్పము, ఆ పుష్పము యొక్క ఫలం ప్రక్కప్రక్కన ఉండటం ఎలా సాధ్యం? నీవు ఆత్మకు ప్రక్కన ఉండటమనేది అయోగ్యమైనదే.

ఒక రెండిటి యొక్క సంబంధం”.... అంటే ఏమిటి?

1. ఒకదాని యొక్క క్రియతో రెండవదాని క్రియ కలవటం. లేక,

2. ఒకదాని నుండి రెండవది ఆవిర్భావం పొందటం. లేక,

3. రెండిటి యొక్క ఏకత్వం. లేక,

4. సంబంధం ఏర్పడక ముందు ఆ రెండూ వేరు వేరుగా ఉండి. ఇప్పుడు ఏకమగుటకు సంసిద్ధపడుతూ ఉండాలి.

ఈ నాలుగు ప్రక్రియలూ చిత్తమునకు - - ఆత్మకు కుదిరేవి కావు.

చిత్తము : కార్యవ్యవహారం దృష్ట్యా నాకు ఆత్మకు సంబంధం కనబడుతోంది కదా? వీతహవ్యుడు : ఎట్లా కుదురుతుంది? ఆత్మ సర్వదా స్వయంప్రతిపత్తి కలిగినట్టి నిష్క్రియచైతన్యము. నీవేమో స్వయంప్రతిపత్తి లేని జడమువు. మరొకదానిచే నియమించబడితేగానీ, నీవు దేనినీ

నిర్వర్తించలేవు.

ఆత్మ నిర్వికారము... స్వయంభువము... ఆనందస్వరూపమూ...!

నీవేమో సుఖదుఃఖ భరితమూ... క్రియోన్ముఖము... ఉపకరణమాత్రము...!

మీ ఇద్దరికీ ఏకాకారత్వం ఎట్లా పొసగటం?

చిత్తము : పోనీ... పాలు నీరు వేరు వేరైనవై కూడా కలుస్తున్నట్లు, నేను ఆత్మ వేరు వేరై ఉండి కలుస్తున్నామని అనుకోవచ్చు కదా?

వీతహవ్యుడు : నీకు - ఆత్మకు, పాలు-నీరు వలె అర్థసంబంధం కుదరదు. మీ ఇద్దరివీ విరుద్ధ సంబంధములనీ ఇంతకు ముందే అనుకున్నాం కదా!

చిత్తము : లేకపోతే... అగ్ని - జలముల వలె మా ఇద్దరివీ విరుద్ధ సంబంధమని అనుకుందామా? వీతహవ్యుడు : అగ్ని - జలముల వలె ఒకదానిచే మరొకటి నశింపజేయబడటం నీకు, ఆత్మకు ఏర్పడటం లేదు. కనుక ఆ ఉపమానం కూడా కుదరదు.

ఓ చిత్తమా! నీవు సంవిత్తు (ఆత్మ) యొక్క ఛాయవే కదా! ఈ ప్రపంచంలో ఆయా పదార్థాలు ఒకే గుణములు కలిగియున్నప్పుడు కలిసి ఉంటాయి. విరుద్ధగుణములు కలిగినప్పుడు విడిపోతాయి. నీవు ఆత్మనే ఆశ్రయించు. ఆత్మనుండి చ్యుతి పొందనప్పుడు నీవు కూడా ఆత్మవే అవుతావు. చిత్తము : నాకు దృశ్యపదార్థముల ఉనికి కనిపిస్తోంది కదా!

Page:641

వీతహవ్యుడు : అంతర్దృష్టి జ్ఞానంచే దృశ్య పదార్థమంతా లేనిదే అగుచున్నది. దృశ్యం రహితమైతే దుఃఖరహితమగు ఆత్మయే శేషిస్తోంది. అట్టి ఆత్మచే సంతుష్టిపొందు. నిరంతర ధ్యానముచే సమాధి నిష్టుడవై.. ఆత్మదర్శివై ఉండు.

చిత్తము : నేను కూడా సుఖము కొరకే దృశ్యమునందు వెతకుచున్నాను.

వీతహవ్యుడు : ... కదా? నీవు కనుక జడమాత్రములగు దేహ-ఇంద్రియ-దృశ్యములందు 'సంకల్పము' అను రజోగుణమును ఆశ్రయించుటచే 'చ్యుతి' పొందటం ప్రారంభించావా... ఇక అది నీకు, నాకూ కూడా దుఃఖప్రదమే కాగలదు. మిత్రమా! చిత్తమా! ఈ విషయం మనం మరువకూడదు.

చిత్తము : కర్తృత్వమంతా ఆత్మదేనని అంటున్నావుకదా! ఇక నాకు బోధించటమెందుకు? నీవు చెప్పదలచుకొన్నది ఆత్మతోనే విన్నవించుకో....

వీతహవ్యుడు : సంకల్ప - వికల్పములకు చోటు ఉండనట్టి, కల్పన అనే ధూళి ఏర్పడజాలనట్టి ఆత్మయందు కర్తృత్వం సంభవిస్తుందా? ఆకాశమునకు కాళ్ళు - చేతులు ఉంటాయి అని ఎవ్వరైనా అంటే, దానికి అర్థమేమన్నా ఉన్నదా? అట్లాగే ఆత్మకు కర్తృత్వం సంభవించదు. అయితే... ఆత్మయే తనయందు ఏకరూపముగానూ, అనేక రూపముగానూ సంభవిస్తోంది.

చిత్తము : అదెట్లా సంభవం?

వీతహవ్యుడు : నీకొక చిన్న దృష్టాంతం చెపుతాను. నీరే బుడగలుగా, తరంగములుగా, నురుగుగా, ఆవర్తములుగా, సుడులుగా సంభవిస్తోంది. "బుడగ గుండ్రంగా ఉన్నది. కనుక, జలం గుండ్రంగా ఉంటుంది... అని ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? ఆవర్తమునకో, లేక తరంగానికో లేక బుద్బుదమునకో ఆకారం ఉండవచ్చు. జలానికి ఆకారం ఉన్నదా? లేదు. కనుక... ఆత్మయే ఆత్మ యందు ఆభాస మాత్రంగా జగద్రూపమై వెలయుచున్నది. జలం మధ్యలో మండుచున్న బొగ్గు ఉండజాలదు. ఆత్మ యందు రెండవ కల్పనయే సాధ్యం కాదు.

చిత్తము : ‘ఆత్మ యొక్క కల్పనయే చిత్తము’ అని అనవచ్చునేమో?

వీతహవ్యుడు : ఆత్మదేవుడు కల్పనారహితుడు. ఇక మనస్సో.... జడమైనది.

చిత్తము : ఇక ఆత్మ - మనస్సుల మధ్యగా ఇది వేరు... అది వేరు. ఇది శుభము, అది అశుభము... అనే కల్పన ఎక్కడుంటుంది?

వీతహవ్యుడు : ఉండదు. కల్పన చేసే మనస్సే లేదు... అని అనుకుంటున్నప్పుడు. ఇక కల్పన ఎక్కడుంటుంది?... కాబట్టి ఈ సమస్తమూ విషయవర్జితమై, నిత్యనిర్మలమైనట్టి చైతన్యమే అవుతుంది... మరింకేమీ కాదు.

ఇక్కడ కల్పన లేదు.... బంధములేదు. ఆత్మ సంవిత్తు మాత్రమే సర్వదా అన్ని వైపులా వ్యాపించియున్నది.

Page:642

చిత్తము : అయితే 'నేను వేరు - ఇది వేరు' అనే కల్పన ఎక్కడుంటుంది? ఎక్కడి నుండి వస్తోంది? వీతహవ్యుడు : ఎక్కడా ఉండజాలదు. అనాదియై, రూపరహితమై, సర్వవ్యాపకమైనట్టి ఆత్మయందు 'నేను నీవు' మొదలైనవి ఎవరు ఆరోపించగలరు? ఆకాశంలో ఎవ్వరైనా అక్షరాలు వ్రాయగలుగుతారా? కనుక, నేస్తం! చిత్తమా! నీవు ఆత్మదృష్టిని అలవరచుకో.

ఆత్మ నిత్యోదయమైనట్టిది. సర్వవస్తువుల సారభూతమైనది. అది దిక్కులన్నీ వ్యాపించి పరిపూర్ణ మొనర్చుచున్నది. అట్టి ఆత్మను ప్రత్యక్షముగా గ్రహించనంతకాలం మిథ్యారూపమగు మృగ తృష్ణాజలం లాగా ‘చిత్తము - జగత్తు' మొదలైనవి అనుభవం కాగలవు.

ఆత్మను మనం గ్రహించినామా.... దుఃఖములన్ని ఉపశమించిపోతాయి. కనుక, ఓ చిత్తమా! నీవు సుఖ దుఃఖ భ్రాంతిని, మోక్షము పొందాలనే సంచలనమును వదలిపెట్టు.

మనస్సుచే బద్ధులం కావటం... చిత్తముచే నిరోధించబడటం... ఇవన్నీ భ్రాంతియేగానీ యథార్థంకాదు. సత్స్వరూపమగు ఆత్మ ఒక్కటే వాస్తవం.

అంతా విని వీతహవ్యుని చిత్తం కొంత కుదుటపడింది. ప్రశాంతత పొందింది.

3. వీతహవ్యుడు - ఇంద్రియముల సంవాదం

-

శ్రీవసిష్ఠ మహర్షి : ధీరుడు, ముని శ్రేష్ఠుడు అగు ఆ వీతహవ్యుడు తన చిత్తమునకు ఏకాంతంలో బోధించి ప్రశాంతపరచారు. అప్పుడు ఆతని ఇంద్రియములు కొంత సమయం తరువాత కొంత ప్రకోపించటం ప్రారంభించాయి. వాటిని కూడా ఇట్లు సంబోధించారు.

వీతహవ్యుని ఇంద్రియములు : ఓ మునీ! ఈ జీవుని ఉనికికి మాపాత్ర ఎంతో ఉన్నది. కనులు లేనివాడు చూడలేడు. చెవులు లేనివాడు వినలేడు. ఇంద్రియాలు లేకపోతే జగత్తే ఉండదు. జగత్తు లేకపోతే జీవుడు ఉండడు. కనుక ఈ జీవుడు మా వలననే మనగలుగుచున్నాడు.

వీతహవ్యుడు : ఓ ఇంద్రియములారా! అవిద్యాకారణంగా ఆత్మకు వేరుగా మీ యొక్క 'సత్త' అనుభవమౌతోంది. మీరు మీ విషయములను ఆశ్రయిస్తున్నంత కాలం నాకు దుఃఖ పరంపరలే వచ్చిపడుచున్నాయి. కాలక్రమేణా మృత్యువు అనివార్యమే కదా! మిమ్ములను గ్రుడ్డిగా ఉపయోగించి నందుకు ప్రయోజనంగా ఈ జీవునకు ఎన్నో నరకములు వచ్చిపడుచున్నాయి.

అందుచేత మీరు "మేము ఆత్మ కంటే వేరైన 'సత్త' గల వారము... అనే మిథ్యావాదనను కాస్త వదలిపెట్టండి. నేను ఇంతక్రితం చిత్తముతో జరిపిన సంవాదమును మీరు కూడా విన్నారు కదా! జ్ఞానవశం చేతనే ఆత్మోపదేశం లభిస్తుంది.

Page:643

ఇంద్రియములు : మేమంతా ఎక్కడినుండి ఉత్పత్తి అయ్యాం?

వీతహవ్యుడు : మనం నిజం చెప్పుకోవాలంటే మీ ఉత్పత్తి అజ్ఞానవశం చేతనే ఏర్పడుతోంది. అజ్ఞానం క్షయించినప్పుడు మీకు 'సత్త'యే ఉండదు. అనగా మీరు స్వతఃగా లేనివారై, ఉపకరణ మాత్రులై ఉండిపోగలరు.

ఇంద్రియములు : మా వలన జీవునికి సంతోషం కలుగుతోంది కదా! అట్లాగే జీవుని వలన మాకు సంతోషం కలుగుతోంది?...

వీతహవ్యుడు : మీరు కాలంచే ఏర్పడి, కాలంచే బలహీనులై, కాలంచే నశించుచున్నారు కదా! అందుచేత... ఇరువైపులా దహించబడే అగ్నిలాగా మియొక్క రాకపోకలు జీవునకు వాస్తవమైన సుఖం కలిగించుట లేదు చూడండి!

మీరు ఉంటున్నంత కాలం 'భ్రాంత జీవులు' అనే తరంగాలతో కూడిన ఈ సంసార నదీ జలం కాలసాగరంలోకి నిరంతరం 'ఉరుకులు, పరుగులు' ఎత్తుతూ ప్రవేశిస్తోంది. మీ వలననే పరస్పరాహంకారం ఉత్పన్నమౌతోంది. ఫలితమేమిటి? రాగము, ద్వేషము, క్షయము, వధ, పరాజయం, చింత - మొదలైన అపశబ్దాలు వినబడుచున్నాయి. ఇక దుఃఖ పరంపరల వర్షధార గురించి చెప్ప నవసరమే లేదు. "భావాభావములు, హృదయవేదనలు, సంపదలచే, ఆపదలచే ఏర్పడే దుఃఖ వియోగాలు అనే దుర్భరవాసనలన్నీ ఆ కాలసాగర జలంలోంచి నలువైపులా ప్రసరిస్తున్నాయి.

మిమ్ములను ధరించి అటూ ఇటూ సంచరించే ఈ దేహము యొక్క గతులను చూస్తుంటే ఇంకా జాలి వేస్తోంది. అనేక మనోంతర్గతమైన చపల చింతలు మీ మధ్య తిరుగాడుచున్నాయి. లోభము మీ కణ కణములనిండా నిండి ఉంటోంది.

ఇంకేమున్నది....? లోభమున్నచోట శమదమాది ఉత్తమగుణములకు చోటు దొరుకుతుందా? ఒక వేళ, కొంచెం శమం ఏర్పడినా కూడా 'ఉద్వేగం' వచ్చి, దానిని తుడిచిపెట్టి పోతోంది. ఇంద్రియములు : మా వలన జీవునికి క్రియా వ్యవహారములు సుసాధ్యమౌతున్నాయి కదా? వీతహవ్యుడు : నిజమే. కానీ, మిమ్ములను దుర్వినియోగపరచుకొనే జీవుల హృదయాలు దుర్వ్యసనాలు హృదయమంతా విస్తరిస్తున్నాయి. 'మహామోహం' అనే చీకట్లో 'అజ్ఞాన సమాచారములు' అనే గుడ్లగూబలు కాపురాలు చేస్తూ, నివాసాలు కట్టుకొని ఉంటున్నాయి.

ఓ ఇంద్రియములారా! మీ వలన జీవునకు లాభాలు వచ్చిపడుతున్నాయంటారా? ఆహా, ఎంతమాట? మీకు తెలియుట లేదో ఏమో? మీరు వచ్చి చేరటం చేత లెక్కలేనన్ని అనర్థాలు కూడా వచ్చిపడుచున్నాయి. మిమ్ములను అడ్డంపెట్టుకుని పిశాచములవలె అనేక పాపకార్యములు విజృంభిస్తున్నాయి. మీరు గనక పరిశుద్ధులై ఉంటే వివేకము, ఉత్తమగుణములు ఎక్కడో చాటు మాటుగా దాక్కొని ఉండేవా? మోహమనే మంచు ఇట్లా కురుస్తూ ఉండేదా? 'రజోగుణము' అనే ధూళితో హృదయం కప్పబడి ఉండేదా? ఈ విక్షేపములు కలిగించే వికల్ప సమూహములు నాపై

Page:644

దాడి చేసేవా? మీరు మంచి మిత్రులై ఉంటే, హృదయంలో తదితరులపట్ల 'మైత్రి' జనించి, ఆత్మానుభవమునకు విత్తుగా అయ్యేదే! ఈ విధంగా చింతాపరంపరలు నన్ను ఉద్వేగ పరచేవా? అహో! ఇదంతా మీ ప్రభావం కాదా?

ఇంద్రియములు : మా మూలంగా మా సొంతదారగు జీవునికి అనర్థములు కలగటానికి కారణం ఆతడు అజ్ఞానముచే మమ్ములను అజ్ఞాన విషయాలవైపుగా వినియోగించటమే కదా! వీతహవ్యుడు: అవును. ఒప్పుకుంటున్నాను. మేఘములు శమించగా... ఆకాశంలో సూర్యుని వెలుగు ప్రస్ఫుటమగునట్లు, హృదయంలోని అజ్ఞానం తొలగితే అంతః కరణంలో జ్ఞాన ప్రకాశం ప్రత్యక్షమౌతుంది. అప్పుడు హృదయం ప్రసన్నమై, విశాలమై, గంభీరమై, క్షోభావర్జితమై ప్రశాంతత పొందగలదు. వైషమ్యాలచే పరాజితం కాని హృదయం దానంతట అదే ఉపశమించగలదు.

అమృతాపూరపూర్ణేన నిత్యానన్దమయేన॥

స్త్రీయతే పురుషేణాన్తః శీతేన శశినా యథా ॥ (శ్లో 22, సర్గ 83)

అప్పుడు... మనుజుడు ఆత్మానందముచే నిత్యానందమయుడై పరిపూర్ణుడై శీతల చంద్రుని వలె విరాజిల్లగలడు! కనుక.... అజ్ఞానం నశించాలి.

ఓ ఇంద్రియములారా! జ్ఞానసముపార్జనకై మీరు నాచే చక్కగా నియోగించబడిన వారై స్నేహితులవలె ఉభయ శ్రేయస్సుకు కారణమయ్యెదరుగాక!

ఇంద్రియములు : అజ్ఞానముచే వినియోగించబడుచున్నప్పుడు మేము జీవునకు మరింత అజ్ఞానమును మూటకట్టుకొని తెస్తున్నాం. సరే! అజ్ఞాన నాశనమునకై మా యొక్క పాత్ర, ప్రయోజనము, ప్రాముఖ్యము ఎట్టిది?

వీతహవ్యుడు : చాలా గొప్పది. మనం కలిసి ఉన్న 'జీవితము' అనబడే ఈ కొద్ది సమయం సద్వినియోగపరచుకొని మన ఈ కలయికను శుభప్రదం చేసుకొనెదముగాక!

అజ్ఞానం నశిస్తే, అంతఃకరణంలో 'ఆత్మాకారవృత్తి' సుస్పష్టమౌతుంది. అప్పుడు ఈ చరాచర దృశ్య ప్రపంచమంతా మటుమాయమై దీని స్థానంలో 'సంవిత్ చైతన్యము' మాత్రమే మనకు అనుభవమౌతుంది. తత్ఫలితంగా ఆనందముచే పరివ్యాప్తమైన ఆత్మయొక్క పూర్ణ స్వరూపము అనుభూతమౌతుంది. అట్టి అనుభవం, అవగాహన, ఆశాజాలమున బంధించబడి, కేవలం దేహ సంగులై ఇంద్రియసంగులై చరించే వారికి లభించదు. మీ సహకారంతో తప్పకుండా జ్ఞానం ప్రవృద్ధం కాగలదు. మిమ్ములను సముపార్జించుకున్నదే అందుకు కదా! జ్ఞానాగ్నిచే “జర (ముసలి తనం), జన్మ" మొదలైనవి తారసబడే సంసారమార్గం సంక్షయించగలదు. జ్ఞానం ఉన్నచోట తుష్టి, పుష్టి, కాంతి మొదలైనవి వచ్చి చేరుతాయి. వివేకి అయినవాడు అవివేకమున పడకుండా సంస్కృతి (సంసారం) యందు చిక్కకుండా ఆత్మ యందే విశ్రాంతి పొందుతూ ఉంటాడు. కనుక ఓ ఇంద్రియములారా! మీరు చిత్తచాంచల్యముచే ప్రేరితులు కాకండి.

Page:645

దృశ్యము పట్ల మౌనం వహించి ఉండండి. ఆత్మ భగవానునివైపుగా దృష్టిని, ప్రయత్నమును సారించండి. అప్పుడు ఆత్మాకారవృత్తిచే ఏర్పడే ప్రయోజనములన్నీ మనకు కలుగుతాయి. ప్రశాంత దాయకమగు గుణసంపదలు వచ్చి పడతాయి.

ఇంద్రియములు : కానీ– ఇక్కడ అభిరుచులు, అవి నెరవేరినప్పుడు సంతోషం ఏర్పడుచున్నాయి కదా? వీతహవ్యుడు : 'ఆశించుట' అను చిత్తముయొక్క వృత్తిచేత అభిరుచులు ఏర్పడుచున్నాయి. ఆశలకు అడ్డుగోడ పెట్టినప్పుడు మాత్రమే ఉత్తమ గుణసంపదలకు చోటు దొరుకుతోంది. అయితే, ఏదైనా ఆశించేటప్పుడు దాని గుణదోషములను, తదనంతర దుష్ప్రభావములనూ చక్కగా పరిశీలించటమే విజ్ఞత కదా? "ఆత్మ యొక్క సత్త, దృశ్యం యొక్క పరిణామాలు" - ఈ రెండిటిలో ఏది శ్రేయస్సును కలుగజేస్తుందో... దానినే ఎన్నుకోవాలి. అంతేగాని, ఏది ప్రియమో, దానిని కాదు. నాకు మాత్రం అవస్తువగు ఈ ప్రపంచంలోని వస్తుజాలానుభవం, ఈ భూత భవిష్యత్తుల పట్ల ఏర్పడే ఆవేదనల కన్నా ఆత్మ సత్త’యే సుఖదాయకమను అభిప్రాయం కలుగుతోంది. దేనిలో అయితే... ఎట్టి అన్య పదార్థముల సత్త’ ఉండదో... అట్టి ఆత్మనే మనం ఆశ్రయిద్దాం. ఉత్తమ సుఖమగు ఆత్మ మనకు ఎదురుగానే ఉండగా... మనం ఎక్కడెక్కడో ఏదేదో ఆశించి ఎందుకు వెతుక్కుంటూ పోవాలి? నా యందు సత్యమై, ప్రసిద్ధమై ఉన్నట్టి ఆత్మయే మన స్వరూపం" అని ఎరిగి ఆపై ఉభయ శ్రేయస్సు పొందుతూ కలిసి ఉందాం. అప్పుడు చైతన్యమే మన రూపం అవుతుంది. చిత్తచాంచల్యమును తిరస్కరిద్దాం. అంతేగాని, అసద్రూపములను మనం ఆశించవద్దు. భావించవద్దు.

ఓ ప్రియ ఇంద్రియములారా! మనం సద్గురువుల ప్రవచనాలు విన్నాం. వేద - వేదాంగాలు అంతిమసారంగా ప్రతిపాదిస్తున్నదేమిటో గమనించాం. వాటి సారమేమిటి? అసారం ఏమిటి? "దృశ్యము పరిత్యజించబడుగాక. పరిశుద్ధము - అఖండము - - అద్వితీయము అగు ఆత్మయే మనచే మననము చేయబడు గాక! అని కదా!

మిత్రులారా! ఇంద్రియములారా! ఈ నా నిర్ణయమును మీరు శిరసావహించెదరుగాక! ఇంద్రియములు : ఓ వీతహవ్యా! నీవు చెప్పు మార్గంలో మేము జీవించి ఉండమేమో? వీతహవ్యుడు : "మేము జీవనము సాగించువారము... లేక ఈ జీవుని జీవింపజేయువారము” అనే మిథ్యయగు యోచనను, సుఖ భ్రాంతిని మీరు వదలిపెట్టండి. మీరు నా యొక్క సాధనవస్తువులు మాత్రమే. సాధనలు లేనంత మాత్రం చేత సాధకుడు - - సాధ్యము లేకుండా పోతాయా? అది అట్లుండగా... మీ అస్థిత్వము నాకు వేరైనవి కావు. మయావినా (నేను లేకుండా) మీకు అస్థిత్వం అనేది భ్రాంతి మాత్రమే. అట్టి భ్రాంతి ఈ మన విచారణచే పూర్తిగా తొలగిపోగలదు.

విూకంటూ ఏ స్వరూపం లేదు. భావనలేదు. కార్యక్రమం లేదు. మిమ్ములను ఉపయోగిస్తున్న నా వలనే మీకు ‘ఉనికి’ అనే గౌరవం కలుగుతోంది. మీకంటూ ఏదైనా స్వరూపం అనుభవమౌతుంటే, అదంతా ఆత్మ యొక్క అవిచారణా ఫలితమే అయి ఉన్నది. విచారణచే మీ స్వరూపం కూడా వైషమ్య రహితమగు సన్మాత్రముగానే తెలిసిపోతోంది. వెలుతురు లేకపోవటమే చీకటి అయినట్లు...

Page:646

విచారణ లేకపోవుటచేతనే 1. మీరు 2. మీ వలన విషయములు... అనుభవమౌతున్నాయి. ప్రకాశముచే అంధకారం తొలగునట్లు సమగ్రవిచారణచే మీరు స్వతఃగా లేనివారే అగుచున్నారు. ఇంద్రియములు : ఇంతకాలం నీవు మాపైనే ఆధారపడి జీవించావే?

వీతహవ్యుడు : ఇంతకాలం నేను అల్పవివేకమును మాత్రమే కలిగి ఉన్నాను. సంకల్ప మాత్రంచే ఊహలో దయ్యం ఉద్భవమగున్నట్లు, అల్పవివేకంచే మీరంతా స్వల్పాకృతి పొంది చివరికి దుఃఖ కారకులగుచున్నారు. సృష్టికర్తనగు నాయొక్క 'ఆద్యంత సంకల్పము' చే సంకల్పకాలంలోనే మీరు సంక్షయించగలరు...లేక అధిగమించబడగలరు.

ఇదానీముదితం నిత్యం స్వప్రాగ్రూపే క్షయం గతే | వివేకస్య ప్రసాదేన వివేకాయ నమోనయః ॥ (శ్లో 36, సర్గ 83)

వివేకోదయంచే పూర్వపు అవిద్య నశించి మీ యందు, నా యందు, ఈ దృశ్యము నందు ఆత్మ స్వరూపమే ఉదయించగలదు. అట్టి వివేకమునకు ఇదే నమస్కారం.

ఓ ఇంద్రియములారా! మీరు ప్రబుద్ధము పొందితే పరమేశ్వర స్వరూపమే పొందుతారు. చిత్తత్వము నశించితే పరమేశ్వరత్వము ప్రకాశిస్తుంది. ఇతఃపూర్వంకూడా మీ స్వరూపం పరమేశ్వర ప్రకాశమే. ఇప్పుడు దృశ్యమును అధిగమించి, ఆత్మవస్తువును ఆశ్రయించుటకు ఉపకరించుటచే పరమ పవిత్రులౌతున్నారు. దీపం వెలిగిన తరువాత చీకటిలాగా మీలో దోషములు తొలగిపోతు న్నాయి. నిద్ర లేచినవాడు మౌఢ్యమునుండి ప్రబుద్ధుడగుచున్నట్లు, జ్ఞాన - - విజ్ఞాన ప్రభావంచే మీ యందు పరమేశ్వరత్వం ప్రకాశిస్తుంది. ఏదైతే మీ వెంట అవివేకముచే జనించిందో అది వివేకముచే నశిస్తోంది... ప్రకాశముచే చిమ్మచీకటి నశిస్తున్నట్లు...!

‘ఆత్మ విచారణ’ ఉంటే చాలు, మీరు కోరుకున్నాకూడా మీకు సుఖ సిద్ధిలభిస్తుంది. అందుచేత శాస్త్ర సిద్ధాంతయుక్తులచే 'ఇంద్రియములు - ఇంద్రియ విషయములు ఆత్మకు అన్యంగా లేవు అని నాచే మరల మరల నిర్ణయింపబడుగాక!

ఓ ఇంద్రియములారా! ఇప్పుడు మీరు సంసారమును దాటివేసినవారయ్యారు. మీరు పూర్వం ఆత్మకంటే అన్యంగా ఉండి ఉండలేదు. ఇప్పుడు అన్యంగా లేరు. ఇకముందు అన్యంగా ఉండబోరు. మీకు శుభమగు గాక! మిస్వరూపమేమిటో ఎరిగిన తరువాత నేనిప్పుడు దుఃఖరహితుడనగుచున్నాను. పూర్ణతృప్తుడను, శాంతుడను అగుచున్నాను. స్వాత్మయందు స్థితి కలిగి యుండుట" అనే తురీయపదమునందు విశ్రాంతి పొందుచున్నాను. చిత్తమునకు, ఇంద్రియములకు స్థితియే లేదు.

ఆత్మ ఒక్కటే అవశ్యం కలదు! ఆ ఆత్మయే నేను. దానికి అన్యంగా ఎచ్చటా ఏదీ లేదు. బోధ స్వరూపుడనై నేనే సర్వదా అంతటా, అన్నిటా వెలయుచున్నాను.

శుద్ధ చిద్రూపమగు ఆత్మయందు "ఈ ఆత్మయే నేను. అది నేను కాదు అనే కల్పన కూడా ఉండదు. ఇక మరింకే కల్పనలు అసలే ఉండవని వేరే చెప్పాలా?

Page:647

ఏకమై, అద్వితీయమైనట్టి ఆత్మ యందు 'ఆత్మకు వేరుగా ఏదీ లేదు అనే కల్పనమాత్రం ఎట్లా సంభవం?

అందుచేత ‘ఆత్మను నేను’ అనే కల్పనకూడా ఇప్పటికిప్పుడు త్యజిస్తున్నాను. ఏమరొక చింతనకూ చోటివ్వకుండా జల తరంగముల అవినాభావంలాగా మౌనం వహించి ఉంటున్నాను. వాసనారహితుడనై, ప్రాణసంచారమునకు సంబంధించనివాడనై, సర్వదోష వినిర్ముక్తుడనై ఉండెదనుగాక! 'చిదాభాసము' అను ప్రతిబింబాశ్రయం లేనివాడనై, స్వయముగా అఖండము, అప్రమేయము అగు ఆత్మనై ఉంటాను. తటాకంలోని జలంలోను, కుండలోని జలంలోను, సముద్రజలంలోను ప్రతిబింబించే సూర్య ప్రతిబింబములకు సూర్యునితో ఏం సంబంధమున్నది? అన్నిటిలోనూ ప్రకాశిస్తున్నప్పటికీ ఆ ప్రకాశముయొక్క కర్తృత్వము లేనివాడను. ఆకాశంలో ప్రకాశించే సూర్యునిలాగా స్వయం ప్రకాశకుడను. అన్ని ఉపాధులలోని జ్ఞానతత్త్వమును, చిదాత్మస్వరూపుడను. మనశ్చేష్టలకు, ఇంద్రియచేష్టలకు సంబంధించని వాడనగు నేను ఇప్పుడు మౌనమును, విశ్రాంతిని పొందుచున్నాను.

4. మనోజగత్

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ వీతహవ్యుడు వింధ్యపర్వత ప్రాంతంలోని తన పర్ణశాలలో సుఖాసీనుడై సమాధియందు నిశ్చలుడయ్యారు. సర్వ శారీరక, మానసిక చేష్టలు త్యజించారు. సుందరమగు ఆత్మానందమొక్కటే ఇప్పటి ఆతని అనుభవం. సముద్రజలం తరంగత్వం త్యజిస్తే ఆ జలం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అతని మనస్సు ఆ రీతిగా అయింది. కట్టెలన్నీ కాలిపోయిన తరువాత అగ్ని ఉపశమించినట్లు, ఆతని దేహంలో ప్రాణసంచారం ఉడిగిపోయింది. నేత్రములు బాహ్యసంచలనం త్యజించి అర్ధనిమీలిత మయ్యాయి. ఆ కన్నుల మిగతా అర్ధభాగం పూర్తిగా అంతర్ముఖమయ్యాయి. నాసాగ్రం ఉత్తేజమై ఊర్ధ్వస్థితి పొందింది. శిరస్సు, శరీరము, కంఠము సమంగా స్థితి పొందాయి. ఆతడు ఒక కొండపై మలచబడిన శిల్పంలాగా కన్పట్టసాగాడు.

అట్టి మౌన-ప్రశాంత-క్షోభారహిత-చ్యుతిరహిత... ఆనందస్థితిలో ఉండగా 300 సంవత్సరాలు గడచిపోయాయి. అంతదీర్ఘకాలం ఆతనికి అర్ధముహూర్తంలాగా గడిచిపోయింది.

ఆతడు తన జీవన్ముక్త బలం చేత జ్ఞాని, ధ్యాని అయ్యారు. అంతకాలం ఆతడు సమాధి నుండి లేవనే లేదు, దేహమును త్యజించలేదు. అంతటి దీర్ఘకాలంలో ఆ పర్ణశాలకు బయట ఏర్పడే మేఘ గర్జనలు గానీ, సమీపంలోని సామంతరాజుల వేట కోలాహలాలు గాని, కోతుల కిచకిచలు, ఏనుగుల ఘీంకారాలు, సింహముల నాదాలుగాని, పిడుగులశబ్దాలు, భూకంపములచే ఏర్పడిన శిలాపాత శబ్దాలు, దావాగ్ని చిటపటలుగాని ఆతని సమాధికి విఘాతం కల్పించలేకపోయాయి.

ఆ సమయంలో కాలం కేవలం స్వతంత్రంగా, నిష్కారణంగా, మౌనంగా గడిచిపోయింది.

Page:648

జలతరంగాల లాగా అనేక వర్ష, వేసవి కాలాలు వచ్చాయి... పోయాయి. నీళ్ళు అనేకసార్లు పర్ణశాలలో ప్రవేశించాయి. కొద్దికాలంలోనే ఆ వీతహవ్యుని భౌతిక దేహం బురదలో కూరుకు పోయింది. అయినా ఆతనికి ఏమాత్రం వ్యధగాని, ఆతని సమాధి స్థితికి విఘాతంగాని కలుగలేదు.

ఆతని పట్ల 300 సంవత్సరాలు కొద్ది క్షణాలులాగా గతించిపోయాయి. ఆ తరువాత ఆతని ఆత్మప్రభువు స్వయంగా సమాధి నుండి మేలుకొన్నారు.

శ్రీరాముడు : స్వామి! ఆ వీతహవ్యుని దేహం 300 వందల సంవత్సరాల భూమిలో కూరుకుపోయినా, అది చెడకుండా ఎట్లా ఉన్నది? ప్రాణాలు ఎట్లా నిలిచాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : భూమిలో కూరుకుపోయినప్పుడు ఆతని దేహమును రక్షించింది చైతన్యముగాని, ప్రాణములు కాదు. ఎందుకంటే సమాధిని స్వీకరించిన మరుక్షణం ఆతని దేహంలో ప్రాణములు తమ సంచలనము నుండి ఉపశమించి అవి సూక్ష్మత్వం పొందాయి.

శ్రీరాముడు : 300 సంవత్సరముల వరకు శరీరమునందు ప్రసరించకుండా సూక్ష్మత్వం పొందిన ఆతని ప్రాణములు మరల ఎందుకు ఉత్తేజం పొంది పునఃప్రసరణకు ఉపక్రమించాయి? శ్రీవసిష్ఠ మహర్షి : ఆతని హృదయాంతరంగంలో ఎక్కడో ఒక మూల ఇంకా ప్రారబ్ధం శేషించియున్నది. అనగా కార్య - కారణములకు సంబంధించిన దేహసంబంధ కర్తృత్వ సంస్కారం ఎక్కడో రవ్వంత మిగిలియున్నది. అందుకే ఆతని చైతన్యం ప్రబలంగా హృదయంలో ఆవిర్భవించింది. స్వమనోరూపం ధరించింది. అయినా కూడా, ఆతడు స్వవిచారణచే జీవన్ముక్తత్వము అవధరించాడు కదా! కనుక ఆతని హృదయము నిర్మలత్వం కలిగియే ఉన్నది. సమాధి విఘాతానికి కొంత ముందుగా ఆతని మనస్సు ఆ పర్ణశాల నుండి బయల్వెడలింది.

వింధ్యపర్వత ప్రాంతంలో ప్రశాంతముద్రను అవధరిస్తూనే ఆయన తన స్వసత్తమనస్సులతో హిమాలయముల వైపుగా బయలుదేరాడు. అక్కడ గల కైలాసపర్వతం సమీపించాడు. ఆ పర్వతం దగ్గరగా ఉండే ఒక కదంబవృక్షం (కడిమి చెట్టు క్రింద గట్టువంటి ఎత్తు ప్రదేశంలో కూర్చుని ధ్యాన చిత్తంతో కొద్ది సంవత్సరములు గడిపాడు. మరల అక్కడి నుండి బయలుదేరి ఆ ప్రాంతంలోనే విద్యాధరత్వం స్వీకరించి సంచరించాడు. ఆ సమయంలో దేవతలచే ఆరాధింపబడుతూ ఇంద్రత్వం అవధరించి ఐదు యుగముల కాలం గడిపివేశాడు.

శ్రీరాముడు : మహర్షీ! ఆతడు కైలాసపర్వతప్రాంతంలో సంచరిస్తూ ఉండటం, ఇంద్రత్వంతో దేవతలచే ఆరాధింపబడుచూ ఐదు యుగముల కాలం గడపటం - ఇవన్నీ ఆతనికి ఎట్లు తారసపడ్డాయి? ఆతని భౌతిక దేహం వింధ్యపర్వత ప్రాంతంలోనే ఉండిపోయిందిగా? ఆతడు మనస్సుతో కదా, పర్ణశాల నుండి బయల్వెడలింది?

శ్రీవసిష్ఠ మహర్షి : అవన్నీ ఆతడు తన హృదయ ప్రదేశంలోనే పొందాడు. అనుభవించాడు. దేహం మాత్రం వింధ్యపర్వత ఆశ్రమంలోనే 300 సంవత్సరాలు ఉన్నది.

Page:649

శ్రీరాముడు : ఆ విశాల ప్రదేశములను అల్పకాలంలో, అల్పమగు ఆతని హృదయప్రదేశంలో ఎట్లా అనుభవించారు? ఇదంతా జరిగినదని మీరు చెప్పుచున్నప్పుడు దేశకాలముల యొక్క అనియమము’ ఏర్పడుచున్నట్లు అనిపిస్తోందే? ఆతని పట్ల ఈ దేశ కాలాలకు ఒకప్పుడు నియమము, మరొకప్పుడు అనియమము ఏర్పడుతోందా ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : ఒకప్పుడు శక్తి స్వరూపరహితమై ఉంటుంది. మరొకప్పుడు స్వరూపయుక్తమై ఉంటోంది. అది ఎక్కడ ఏ రూపంలో ఉదయిస్తే ఆ రీతిగా అనుభవమౌతుంది. అట్లాగే చైతన్యము కూడా! అది ఎక్కడ ఏ రూపంగా సంకల్పపూర్వకంగా ఆవిర్భవిస్తే అక్కడ ఆ రూపంగానే అనుభవం కాగలదు. చేతనము తన స్వభావమును అనుసరించి శీఘ్రంగా ఆయా రూపములు పొందుతోందని గ్రహించు. ఇక 'నియమం' విషయం అంటావా? చైతన్యప్రభావంచే బుద్దియందు ఎప్పుడు ఎచ్చట నియమం (లేక) ఎట్టి అనుభవం స్వీకరించబడుతుందో... అప్పుడు అచ్చట తదనుకూలమైన నియమమే ఉదితమౌతూ ఉంటుంది.

ఒక ప్రశ్న- ఈ దేశ కాల నియమ క్రమములన్నీ వాస్తవానికి ఎక్కడ ఉన్నాయి? శ్రీరాముడు : అవును... ఎక్కడున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : ఇవన్నీ బుద్ధిమయమగు చిదాత్మయందు అధ్యస్తమై ఉన్నాయి. అంతేగాని దేశ కాల వ్యవహారములన్నీ బయట ఎక్కడో లేవు.

చైతన్యము స్వరూపరహితంగా ఎరుగబడునప్పుడు... అట్టి చైతన్యమునందు అల్ప దేశకాలములు

గాని, వాటిలో విశాల దేశ కాలములుగాని సంభవించవు.

కానీ... చైతన్యము స్వరూపసహితంగా ఎరుగబడినప్పుడు దేశకాలముల అనుభూతులు సంభవిస్తాయి. చైతన్యము యొక్క బుద్ధిపూర్వకమైన అనుభవమును అనుసరించి అల్పదేశకాలముల పరిధిలో విశాల దేశకాలముల అనుభవం సంభవించవచ్చు. లేదా, విశాల దేశ కాలాల పరిధిలో అల్పదేశకాలముల అనుభవం ప్రాప్తించవచ్చు.

ఈ కారణం చేత వాసనారాహిత్యం విజయపూర్వకంగా సాధించినప్పటికీ ఆ వీతహవ్యుడు కించిత్ ప్రారబ్ధ సంస్కారశేషం చేత తన హృదయస్థమైన 'చిదాకాశము'నందు వివిధ జగత్తులు, ఇంద్రత్వం, దేవతలచే పూజలు గాంచటం జరిగింది.

శ్రీరాముడు : జ్ఞానులలో కూడా వాసనలు ఉంటాయా? ఉంటే, ఆ వాసనలకు, ఈ సంసారజీవుల వాసనలకు భేదమేమైనా ఉంటుందా?

శ్రీవసిష్ఠమహర్షి : : భేదం ఉంటుంది. బాగుగా వేయించిన విత్తనం బయటకు చూడటానికి మామూలు విత్తనంలాగానే ఉంటుంది. కానీ, లోన 'అంకురించుట' మనే స్వభావం కలిగి ఉండదు కదా! జ్ఞానులలో శేషించి ఉండే వాసనలు 'తదనంతర జన్మములు - పరిణామములు' కలిగి ఉండవు. వారి ఆయా కార్యక్రమములు వారియందు ఇచ్చ, అభిలాష, అభినివేశము కలిగించవు. సాంసారిక

Page:650

జీవుడు ప్రతి కర్మచేత అద్దాని ప్రయోజనము వైపు తరలించబడుచున్నాడు. నిత్యానిత్య వివేకియగు జ్ఞానిని కర్మలు తాకలేకపోతున్నాయి.

ఇక మనం వీతహవ్యుని తదనంతర వృత్తాంతంలోకి వద్దాం. అటు తరువాత ఆ వీతహవ్యుడు త్రికాలజ్ఞుడయ్యాడు. అనేక విద్యలందు నిపుణుడైయ్యాడు. ఒక కల్పము కాలం నిర్మల జ్ఞానంతో మహేశ్వరగణమునకు నాయకత్వం వహించాడు. ఎవడు ఎట్టి సంస్కారం కలిగి ఉంటాడో... ఆతడు అట్లే ఈ దృశ్య విషయములు పొందుతూ ఉంటాడని అనుకొన్నాం కదా! ప్రారబ్ధకర్మ యొక్క దృఢ సంస్కారం జీవన్ముక్తుడైన వాని యందు కూడా ఆవిర్భవిస్తూ ఉంటుంది. అందుచేతనే వీతహవ్యుడు మనం చెప్పుకొనే అనుభవాలన్నీ పొందటం జరుగుతోంది.

శ్రీరాముడు : మహాత్మా! సందర్భోచితమనుకుని ప్రశ్నిస్తున్నాను. జీవన్ముక్తుని యందు కూడా బంధమోక్షముల దృష్టి ఉంటుందా?

శ్రీవసిష్ఠ మహర్షి : "ఒక జీవుడు ఈ దృశ్యమును ఏ దృష్టితో చూస్తున్నాడు...? అను దానిని బట్టి గదా, బంధమోక్షములు ఉండేవి! అందరికీ ప్రత్యక్షమైయుండే ఈ జగత్తు అంతాకూడా జీవన్ముక్తుని దృష్టి యందు శాంతమై, నిర్మలమై ప్రశాంతాకాశసదృశమై, కేవలం బ్రహ్మమే, అయి ఉంటోంది. ఇక వారికి 'ఇది ఇంతవరకు బంధం, ఇక్కడ నుండి ఇది మోక్షం' అనే అల్ప సంభావనయే ఉండదు. ప్రారబ్దానుగతంగా, లేక, సంస్కారానుగతంగా ఏది ఎట్లు ప్రాప్తించినా కూడా... లేక, ప్రాప్తించకున్నా కూడా వారు దేని పట్లా అభ్యంతర - నిరభ్యంతరములు అనుస్వాదించరు. కలిగి ఉండరు.

జీవన్ముక్తత్వము "1. దృష్టికి, 2. అవగాహనకు, 3. ప్రభావితమగుటకు సంబంధించినది. అంతేగాని అది కర్మలందు పాల్గొనటానికి, పాల్గొనక పోవటానికి సంబంధించినది కాదు. మరల చెపుతున్నాను...

సంవిద్రూపమగు చిదాకాశము ఎచట ఏ విధంగా భావనా పూర్వకంగా భాసిస్తుందో అచట ఆ విధంగానే అంతటా వ్యాప్తిపొందినదై ఉంటోంది.

ఏ అనుభవములు రాక, పోకలు చేస్తున్నప్పటికీ వీతహవ్యుడు మాత్రం స్వస్వరూపధ్యానం (ధ్యాస) వీడటం లేదు. "నేను అఖండము, అప్రమేయము, నిర్గుణము అగు బ్రహ్మమునే అనే స్పష్టాతి స్పష్టమైన నిశ్చయమును కలిగి ఉండుటచే... తదితరంగా తారసపడేదంతా ఆతనికి స్వప్న తుల్యంగానే అనిపిస్తోంది. ఆత్మ స్వభావము నుండి ఏమాత్రం చ్యుతి పొందకుండానే ఆతడు అనేక జగత్తులను క్రీడా మాత్రంగా అనుభవించాడు....!

శ్రీరాముడు : వీతహవ్యుని జగదనుభవములు మనకు తారసపడుచున్న జగదనుభవము వంటిదేనా? ఆతని బ్రహ్మాండానుభవములకు, మన జగద్దర్శనమునకు ఏదైనా భేదముంటుందా?

శ్రీవసిష్ఠ మహర్షి : వీతహవ్యుని హృదయమునందలి చైతన్యము నావంటి - నీవంటి - సర్వజీవుల వంటి హృదయ చైతన్యమే. అయితే ఆత్మతో ఏకీభావం పొందినవానికి తదితర జీవులందరి అనుభవం

Page:651

తనదే కాగలదు. ఓ రామా! అందరి దృశ్యానుభవం వంటిదే ఆతనిది కూడా! ఎటొచ్చీ, ఆయన అభ్యాసవశం చేత ఆత్మతత్త్వమును ఎరిగి ఉన్నారు.

ఆయనకి అనుభవములగుచున్న బ్రహ్మాండములు అసంఖ్యాకములై, రూపరహితములై ఉన్నాయి. ప్రతిభాసాదృష్టిచే అత్యంత సువిశాలములై ఉన్నాయి. ఆతనికి అవన్నీ స్వయం కల్పితంగానే అనుభవమగుచున్నాయి. అట్టి స్వకల్పిత బ్రహ్మాండమునందు ఒక సమయంలో 'నేను ఇంద్రుడను' అను అనుభవం ఆయన పొందారు. ఇంకొక సమయంలో ఇంకొక బ్రహ్మదేవుని కల్పంలో ప్రవేశించి గణపతి అయి, కైలాసమున ఉండేవారు. అవన్నీ కూడా మానసికమైనవే సుమా! అయితే భౌతిక అనుభవములకు - మానసికానుభవములకు నిత్యానిత్య వివేక దృష్టిలో భేదం లేదు.

అజ్ఞానదృష్టి కలవానికి, నాచే దర్శించబడుచున్న ఈ బ్రహ్మాండములు, ఈ దృశ్యపరంపరలు నాకు ఎదురుగా మరెవ్వరో కల్పించి చూపిస్తున్నారు అనే స్వయంకల్పితభ్రమ కొనసాగుతూనే ఉంటుంది.

అజ్ఞాన జీవుల ప్రయాణములు కూడా ఇట్టివే. అయితే వారు జన్మలు... వాటి నుండి వాసనలు... ఆ వాసనల నుండి జన్మలు... ఇట్లా పరంపరలుగా సాగుతూ ఉంటోంది. జీవన్ముక్తుని విషయం అట్లా ఉండుట లేదు. ఆతనిపట్ల సంకల్పములు స్వబుద్ధికి అధీనమై ఉంటున్నాయి. అందుకు కారణం, నేను ఆత్మస్వరూపుడను కదా!"... అను అవగాహనయే!

శ్రీరాముడు : వీతహవ్యుని జగత్తులన్నీ మానసికమైనప్పుడు, అవి బాహ్యమున ఇంద్రుడు అవటం మొదలైన రూపాలుగా సంప్రాప్తిస్తున్నాయా? అవి బాహ్యమైనవైతే... ఆతడు విద్యాధరుడు, ఇంద్రుడు మొదలైన ఉపాధులు ఆశ్రయించాడా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఆతని అనుభవాలన్నీ మానసికమైనవే. అయినా ఆతని వివిధ మనోప్రసరణలలో (విద్యాధరుడు ఇంద్రుడు - గణపతి మొదలైన అనుభవాలలో) తదితర సంబంధిత జీవులు సచేతనులై ప్రాప్తించారు. అట్టి వివిధానుభవముల తరుణంలో 'నేను వీతహవ్యుడను' అను ఎరుకను వదలలేదు. అయితే ఆతని దృష్టి అత్యంత పవిత్రమై ఉండుటచే నేను దేహాదులకు సంబంధించని ఆత్మ సత్తను అను బ్రాహ్మీదృష్టిని ఆయన వహించియే ఉన్నారు.

మనకు కనబడే ఈ సచేతన సృష్టికూడా మనకు భ్రాంతి, స్వప్నమాత్రమై ఆ వీతహవ్యునికి ప్రాప్తించినట్లే ప్రాప్తిస్తోంది. మనచే చూడబడుచున్న ఈ జగత్తు మనకు స్వప్నమువంటిదే అయినా, ఇక్కడ మనకు తదితర సచేతన జీవులు తారసపడుచున్నారు. జ్ఞాన దృష్టి దృఢపడితే నేను, నాకు తారసపడే ఈ సచేతనజీవులు - అంతయూ ఆత్మయే - అను అనుభవం స్పష్టపడి ఉంటూనే, తదితరమంతా యథారీతిగా ఉండగలదు.

బ్రాహ్మీదృష్టి, సాంసారిక దృష్టి - ఈ రెండిటి చమత్కారమును నీవు గ్రహించు. ఇక్కడ నీకు తారసపడే తండ్రీ, గురువులు, సభికులు, సోదరులు, అయోధ్యా ప్రజలు - అంతా ఆత్మానుభవం దృష్ట్యా - - భ్రాంతి మాత్రమే. అనగా అదంతా మనస్సు యొక్క కల్పిత భ్రమ మాత్రమే. అట్లే

Page:652

వీతహవ్యుని విషయంలో కూడా జరుగుతోంది. అయితే ఆతని జగత్తు దీనికి సదృశమైనది (ఈ జగత్తులో ఒకానొక చోటు) కాదు. అయితే, ఈ జగత్తు - ఆతని జగత్తు ... రెండూ లేనివే. కేవలం బ్రహ్మమే ఇక్కడా, అక్కడా కూడా భాసిస్తోందని మాత్రం గ్రహించు.

*

భూత - భవిష్యత్ - వర్తమాన కాలములందలి, ఏఏ జీవునికైనా సరే... దృశ్యమానమయ్యే ‘జగత్తు' అనబడేదంతా మనోమయమైనదేగాని మరింకేమీ కాదు. ఎంతవరకు దీని వాస్తవరూపం ఎరుగబడదో... ఎంతవరకు వజ్రంలాగా, పంజరంలాగా భావానుభవపరిమితమై ఉంటోందో... అంతవరకు చిదాకాశము ఎరుగబడకయే ఉంటోంది.

అజ్ఞానాన్మన ఏవేద మిత్థం సంప్రవిజృమృతే |

ప్రత్యుల్లాసవిలాసాభ్యాం జలమమ్బునిధానివ ॥ (శ్లో 43, సర్గ 85)

సముద్రంలో జలం తరంగాలరూపంలో విస్తరిస్తోంది చూచావా? మనోమయజగత్తు కూడా ఆత్మయందు ఉత్పత్తి-వృద్ధి-క్షయము’ల రూపంలో విస్తరిస్తోంది.

శ్రీరాముడు : ఈ మనోమయజగత్తులను ఎవరు కల్పిస్తున్నారు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఎవరూ కల్పించటం లేదు. నిర్వికారమై నిరాకారమై, చిదాకాశస్వభావమై ఉన్న బ్రహ్మమే స్వయముగా, స్వమాయచే తనయొక్క కించిత్ ప్రదేశంలో మనోమయ జగత్తుల రూపంగా చేష్టితమగుచున్నది. అనగా, తనను తానే చిత్తము రూపమున కల్పించుకొనుచున్నది. అట్టి చిత్తము యొక్క మననశక్తియే మనోరూపం పొందుతోంది. ఆ మనస్సుచే తనయందు ఈ సువిశాల జగత్తును కల్పించుకొనుచున్నది. మనస్సే ఈ దృశ్యమంతా అంతర్లీనంగా వ్యాపించియున్నది. కానీ యథార్థానికి బ్రహ్మము కంటే భిన్నంగా ఇది దేనిచేతా వ్యాపించబడిఉండలేదు.

అనగా రామా! మరొక రీతిగా చెప్పాలంటే... నీకు ఏది జగత్తె కనిపిస్తోందో... అదంతా నీవు నీ స్వకీయ మాయచే అట్లు నిర్మించుకొని అనుభవిస్తున్నావు. నీ స్వరూపవిస్తీర్ణమునే జగత్తుగా గాంచుచున్నావు.

ఆత్మ దృష్టిని గ్రహించినప్పుడు నీవు ఈ నా వాక్యాల సారం గ్రహిస్తావు. ప్రతిజీవుని యొక్క దృశ్యజగత్ చమత్కారమంతా ఇట్టిదే! వీతహవ్యుడు ఆత్మదృష్టిని గ్రహించి, తదితర జగత్తులను గాంచుచున్నాడు.

5. భౌతిక దేహ పునరాశ్రయం

శ్రీరాముడు : హే మహర్షీ! వీతహవ్యముని ఇంద్రత్వం, గణపతిత్వం మొదలైనవన్నీ పొందారని చెప్పారు కదా! అవన్నీ తన భౌతిక దేహంతోనే పొందారా?

Page:653

శ్రీవసిష్ఠ మహర్షి : లేదు... అవన్నీ మనస్సుతోనే పొందారు. అయితే, ఆతని మనోదేహం భౌతికదేహ దృశ్యాది కల్పనంతా మనవలెనే గాంచటం జరిగింది.

శ్రీరాముడు : ఆతని భౌతికదేహం వింధ్యపర్వత ప్రాంతంలో ఆశ్రమంలోనే ఉండిపోయింది కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అక్కడే మట్టిలోనే కూరుకుపోయి ఉన్నది.

శ్రీరాముడు : అయితే ఆయన మరల ఆయా అనుభవాల తరువాత ఆ శరీరంలో ప్రవేశించారా? ఎట్లా ప్రవేశించారు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఆ చమత్కార వైనమేమిటో చెపుతాను, వినుఈ సర్వజగత్తు బ్రహ్మమే అని మరికొంత నిర్ణయించుకున్న తరువాత ఆ వీతహవ్యుని మనస్సు తనకు తాను అనంతాత్మ స్వరూపంగా రూపుదిద్దుకున్నది. ప్రారబ్ధానుసారం ఆ

అక్కడే పర్ణశాలలో ఉంచుకొని విద్యాధరత్వం, ఇంద్రత్వం, గణపతిత్వం పొందింది.

ఒక సమయంలో ఆ వీతహవ్యుడు పరమేశ్వరుని గణనాయకుడై ఉన్నారని అనుకున్నాం కదా! ఆ సమయంలో ఒక రోజు ఆయా కార్యవ్యవహారములు నిర్వర్తించిన తరువాత కైలాసంలోని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆత్మధ్యానం చేయసాగాడు. ఆ సమయంలో కొంతసేపు తాను ఇతఃపూర్వం పొందియున్న అనేక దేహపరంపరల గురించి చమత్కారపూర్వకంగా పునశ్చరణ చేయసాగాడు. నశించినవి ఇంకా నశించనివి అయిన అనేక దేహాలు పరికించాడు. అట్టి నశించని దేహములలో వింధ్యపర్వత ప్రాంతంలో భౌతికస్థితిలో భూమిలో కీటకంలా పాతుకుపోయి ఉన్న వీతహవ్య నామధేయము గల భౌతిక దేహం దివ్యదృష్టిచే గమనించాడు.

ఆ దేహం వర్షాకాలపు ప్రవాహంచే కొట్టుకుపోబడి కొంత దూరప్రాంతంలోని ఒక కాలవ సమీపంలోని మట్టిలో లోపలగా ఎక్కడో కూరుకుపోయి ఉన్నది. వీపు వెనుక భాగమంతా బురదతో కప్పబడి ఉన్నది. శరీరమంతా నీటి ఆకులతో కప్పబడి ఉన్నది. పైన నీటి మొక్కలు మొలచి ఉన్నాయి. బాహ్యానికి అక్కడొక మురికినీటి గుంట మాత్రమే కనబడుతోంది గాని, మట్టిలో జీవఛాయ ఉన్న దేహమున్నదని ఎవరికీ ఏమాత్రం అనిపించే అవకాశమే లేదు.

తన అపంచీకృత గణపతి సూక్ష్మశరీరంతో ఇదంతా దర్శించిన ఆ మునికి తిరిగి ఆ శరీరంలో ప్రవేశించాలని అభిలాష ఏర్పడింది. ఇట్లు తనలో యోచించాడు.

వీతహవ్యుడు : ఇప్పుడు ఈ అపంచీకృత సూక్ష్మశరీరముతో రుద్ర గణమునకు నాయకుడనై ఇన్ని యుగాలు ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు నేను వీతహవ్య నామధేయమైన స్థూలశరీరంలో ప్రవేశించాలి. అయితే ఆ దేహము యొక్క సర్వాంగాలు భౌతికంగా 300 సంవత్సరాలు ప్రాణసంచారం లేక పోవటంచే బిఱుగా బిగదీసుకుని ఉన్నాయి. అందులో ప్రాణసంచలనం ఉద్దరించటమెట్లా? ఈ విషయం తన రుద్రగణంలో ఒక మిత్రుడు, పూర్ణజ్ఞాని అయిన ఒక సహచరుని సమీపించి చర్చించసాగాడు.

Page:654

వీతహవ్యుడు : మిత్రమా! నేను మరల శిథిలమై వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక ప్రదేశంలో బురదలో ఎక్కడో అంతర్భాగములో నిస్తేజంగా పడి ఉన్న వీతహవ్యభౌతిక దేహంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను. నా యొక్క కించిత్ ధ్యాసచే నా ప్రాణశక్తి అప్రసరణరూపంగా ఆ దేహంలో ఇంకా ఏర్పడియే ఉన్నది. ఆ దేహమును ఉత్తేజ పరచటమెట్లా?

రుద్రగణ సహచరుడు : స్నేహితుడా! మీరు ఆయా దేహములందు చేసి ఉన్న ఉత్తమజ్ఞాన సముపార్జనచే అత్యంత నిర్మలాత్మస్వభావులైనారని అందరూ అనుకుంటున్నారు కదా! మరల మీకు ఆ దేహలీలచే వచ్చే ప్రయోజనమేమున్నది?

వీతహవ్యుడు : నిజమే! నాకు ఆ దేహము గ్రహించుట చేతగాని, త్యజించుట చేతగాని క్రొత్తదైన ప్రయోజనమేమిలేదు. అయితే దేహగ్రహణము ఎట్టిదో... దేహత్యాజ్యము అట్టిదే కదా! కొంతకాలం క్రితం నేను ఆ శరీరంలో ప్రాణమును స్తంభింపజేసి, మనో దేహముతో బయల్వెడలి గణపతిత్వం వంటి ఆయా ప్రారబ్ధనియమాకమైన విధులను నిర్వర్తించాను. ప్రాణములు స్తంభన రూపంగా ఆ వీతహవ్య దేహంలో ఇంకనూ నిలచి ఉన్నాయి. కనుక ఆ దేహము పరమాణు రూపం పొందేంత వరకు ఆ దేహము ధరించి ఆ దేహము యొక్క వినాశనముతో బాటే నేను విదేహముక్తుడనౌతాను. స్వాత్మపదమును పొందుతూ నిర్విఘ్నంగా శాంతిని పొందుతాను.

రుద్రగణ సహచరుడు : మంచిది. మీ అభిమతానుసారం అట్లే అగు గాక! ఆ దేహములోని ప్రాణ శక్తిని తిరిగి ఉత్తేజపరచటం మీరు ఎరిగి ఉన్నదే! అయినా, అడిగారు కదా... చెప్పుచున్నాను. సూర్యమండలంలోని సూర్యగణనాయకుడగు పింగళుని ఆశ్రయించండి. ఆతడే దేహముల ప్రాణశక్తికి అధిపతి. మీరు కోరితే ఆయన తప్పక సహకరిస్తారు. దర్పణంలో ప్రతిబింబం ప్రవేశించినట్లు మీరు సూర్యమండలంలో ప్రవేశించండి. మీకు కార్యసిద్ధి కాగలదు.

అపంచీకృతమగు గణపతి స్వరూపుడైన వీతహవ్యుడు అప్పుడు ఆ సహచరునికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నారు. కొలిమితిత్తిలోని అవకాశంలాగా సూక్ష్మమైనట్టి తన లింగదేహముతో సూర్యమండలములోకి ప్రవిష్టుడయ్యారు.

అప్పుడు మననశీలుడు, ఉదారబుద్ధి యగు సూర్యభగవానుడు తన హృదయంలో ప్రవేశించిన వీతహవ్యమునీంద్రుని చూచారు. ఆతని కోరిక ఏమిటో క్షణంలో తెలుసుకొన్నారు. ఆ మునీంద్రుడు తన పూర్వ పర దేహములన్నీ మననం చేయుచూ... వింధ్య పర్వత ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయి ఉన్న వీతహవ్యదేహంలో ప్రవేశించి, దానిని చేష్టాసహితం చేసి, ఆ దేహపతనానంతరం విదేహముక్తిని ఆశ్రయించాలని ఉద్దేశిస్తున్నాడని గమనించారు. ఆకాశమధ్యంలో ఉండే పింగళుడు అనే తన సూర్యగణనాయకుని పిలిచి అర్హమైన రీతిలో ఆజ్ఞాపించారు.

అప్పుడు వాయురూపమగు వీతహవ్యుని సూక్ష్మశరీర సంవిత్తు పూజ్యాతి పూజ్యుడగు సూర్య భగవానునికి సాష్టాంగదండ ప్రణామం ఆచరించింది. సూర్యభగవానునిచే సన్మానపూర్వకంగా

Page:655

ఆశీర్వదించబడిన వాడై, ఆ వీతహవ్యుడు స్వకార్య నిర్వహణకు సంసిద్ధుడైయ్యారు. తన దేహం ఉన్న చోటికి పయనిస్తున్న పింగళుని హృదయంలో ప్రవేశించారు. పింగళుడు ఆకాశమును వీడి ఆ శరీరము కూరుకుపోయి ఉన్న చోటికి ప్రవేశించారు. సారసపక్షి బురదనుండి కమలమును తీయునట్లు పింగళుడు బురదలోంచి వీతహవ్యుని భౌతిక దేహం బయటకు తీశాడు.

అప్పుడాముని సూక్ష్మశరీరం పింగళుని హృదయంలో నుండి ఆ భౌతిక దేహంలో ప్రవేశించింది. పింగళుడు తన సంకల్పశక్తిచే తిరిగి ప్రాణములను యథాతథంగా ప్రకోపింపజేసి ఆ తరువాత స్వస్థానమునకు తిరిగి వెళ్ళిపోయారు.

వీతహవ్యుడు ఆ శరీరముతో అక్కడి నుండి లేచి సమీపంలో గల సరోవరం ప్రవేశించాడు. స్నానం ఆచరించి కృతజ్ఞతలతో, భక్తితో సూర్యస్తవంచేశారు. మనోభూషితమగు తన మునుపటి శరీరంతో ప్రకాశించాడు. జీవన్ముక్తులందు స్వతఃసిద్ధంగా ఉండే సమత్వము, పరమశాంతి, మైత్రి, ప్రసన్నత్వము, కరుణ మొదలైన గుణములతో శోభించారు.

సర్వ సంగవినిర్ముక్తమైన మనస్సుగల ఆ ముని అక్కడ నది ఒడ్డున ఒక రోజు గడిపాడు.

6. ఇంద్రియవర్గ నిరాకరణం

శ్రీవసిష్ఠ మహర్షి : ఆ ముని అక్కడి నుండి బయలుదేరి వింధ్య పర్వత ప్రాంతంలో తనకు ఇతః పూర్వం బాగా పరిచయమైయున్న ఒక గుహలో ప్రవేశించాడు. అక్కడ గల ఒక ఎత్తైన శిలపై సుఖాసీనులైనాడు.

వీతహవ్యుడు : (తన అంతరంగంలో) అమ్మయ్య! ఈ ప్రపంచం యొక్క సారాసారమేమిటో ఎరిగినాను. ఇతఃపూర్వమే ఇంద్రియములను, చిత్తమును సమాధానపరచాను కదా! ఇక దీర్ఘ చింతనలతో నాకేమి పని ఉన్నది? కల్పనలన్నిటినీ మృదువైన తీగ త్రుంచినట్లు త్రుంచివేస్తున్నాను. ఇక ఈ ప్రపంచమును, పదునాలుగు లోకములను నా దృష్టి నుండి త్యజించివేస్తాను. ఏకమగు చిన్మాత్ర స్వరూపుడనౌతాను.

ద్వైతమును స్వీకరించనప్పుడు నాకు ఈ జాగ్రత్ సుషుప్తివంటిదే అవుతుంది కదా! అయితే, జాగ్రత్హితస్థితిలో ఆత్మను దర్శించుటకై మేలుకొని ఉంటాను. కనుక, నా సుషుప్తి జాగ్రత్తో సమానమౌతుంది. తురీయపదమును అవలంబించి, ఈ శరీరం పతనం అయ్యే వరకు ఆ పదమును వీడను. మనస్సుకు పూర్తిగా అతీతుడనై, ఆ మనస్సు యొక్క సాక్షీతత్వమునందు ప్రవేశిస్తాను. అంతటా వ్యాపించి ఏకమైయున్నట్టి వికారరహితమగు పరమాత్మయందు స్థాణువువలె స్థితిపొంది

ఉంటాను.

x

Page:656

ఈ విధంగా వీతహవ్యుడు పూర్ణ నిశ్చయుడయ్యాడు. ఆ గుహలోనే ఆరు రోజులు ధ్యానతత్పరు డయ్యాడు. తదనంతరం ఒక బాటసారి చెట్టు క్రింద కొద్ది క్షణములు విశ్రమించి లేచు విధంగా, మరల ఆ సమాధి నుండి మేల్కాంచాడు. సిద్ధుడై, చాలాకాలం ఈ భూమిపై సంచరించాడు.

అట్టి సంచార సమయంలో ఏ వస్తువునూ ప్రశంసించేవాడు కాదు. దేనినీ నిందించేవాడు కాదు. సదా సర్వదా హర్ష శోక భయ రహితుడై ఉండేవాడు. నడచుచున్నప్పుడు, కదలుచున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు అతని హృదయంలో మనస్సు విషయమై మథనం కొనసాగుతూ ఉండేది.

అంతర్మథనం -

వీతహవ్యుడు : ఓ చపల శ్రేష్ఠ! మనస్సా! ముందు ముందు కూడా నీవు నా వెంటనంటి ఉండదలచుకుంటే... నాకేమీ అభ్యంతరం లేదు. అయితే నీవు నీ చపలత్వం మాత్రం విడిచిపెట్టవలసి ఉంటుంది. సరియే కదా!

ఓ ఆశా పాశములారా! ఓ ఇంద్రియములారా! ఈ ఆత్మ మీది కాదు. మీరు శిథిలమై కాలముచే మ్రింగబడినప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కదా? ఇంక అది మీదెట్లా అవుతుంది? ఆత్మకు మీతో సంబంధము లేదని ఎరిగిన మరుక్షణం మీరు నాచే జయింపబడినవారే అగుచున్నారు. మీరు ఈ ప్రపంచంలో ప్రవేశించి ఆశించేవి, ఆశ్రయించేవీ... అన్నీ కూడా అర్థం లేనివి, వ్యర్థమైనవి అవుతున్నాయి.

మీరు ఆత్మకు చెందరు... ఆత్మ మీకు చెందినది కాదు. విఫలస్వరూపులగు మీరు ఆత్మ స్వరూపుడనగు నాపై దండయాత్ర సలపటమా?... ఎట్లా సాధ్యం? మేమే సత్యం, మేమే ఆత్మ? మేమే లేకపోతే జీవుడి గతి నిర్గతే అనే ప్రలాపములు నాకు ఆత్మవిస్మరణ సమయంలో మాత్రమే వినబడుచున్నాయి. అనాత్మ యందు ఆత్మత్వం' అంటే అదే. 'వస్తువు నందు అవస్తుత్వం' అంటే కూడా అదే. అవిచారణచే జనించేది విచారణచే నశిస్తోంది.

ఓ ఇంద్రియములారా! కరణ భూతములగు మీరు వేరు. మిమ్ములను అభిమానించు స్వభావముగల జీవులు వేరు. ప్రాణప్రేరితమగు క్రియా కారణత్వము వేరు. భోక్తయగు చిదాభాసుడు వేరు. గ్రహించునట్టి మనస్సు వేరు. అద్వైతమగు బ్రహ్మము వేరు ... ఈ ఆరింటిలో దేనికదే తమ తమ స్వభావము కలిగి ఉండగా, ఎవరి పని వారిదే అయి ఉండగా ఒకదానిని మరొకటి ఎట్లా పరిమితం చేస్తుంది?

అడవిలో పెద్ద పెద్ద వృక్షములు లభిస్తున్నాయి. వాటిని ఛేదించటానికి కంసాలిచే తయారు చేయబడిన గొడ్డలి, బాసిక మొదలైన సాధనములు ఇనుముతో తయారవుతున్నాయి. కొట్టిన చెట్టు కొమ్మలను కట్టి నివాసస్థలానికి తేవటానికి వెదురు చర్మపు త్రాళ్ళు ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఏవేవో ఎక్కడెక్కడో లభించే సామాగ్రిని ఉపయోగించగా 'గృహం' తయారవుతోంది. ఈ శరీరం విషయం కూడా అట్టిదే!

Page:657

కార్యకారణ సంఘాతం చేత కళ్ళు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి... నోరు మాట్లాడుతోంది... చేతులు కదులుచున్నాయి... అల్ప దీర్ఘ ఫలప్రదములగు ఆయా ఇంద్రియములు తమతమ జ్ఞానేంద్రియములచే నియమించబడుచున్నాయి.

కాకతాళీయంగా కార్యవ్యవహారమంతా సిద్ధిస్తోంది. ఈ శరీరవ్యవహారమంతా ఇట్లుండగా... దీని ఆగమన నిష్క్రమణములచే ఎవరికి ఏమి లాభం? ఏమి నష్టం?

ఇప్పుడు అవిద్య పూర్తిగా తొలగిపోయింది. ఆత్మవిద్య సుస్పష్టమయింది. సత్తు అనుకున్నది అసత్తుగానూ, అసత్తు అనుకున్నది సత్తుగానూ తెలిసిపోయింది. విఘ్నములన్నీ ఉపశమిస్తున్నాయి. ఎప్పటికీ ఉండతగినదేదో ... అది అప్రమేయమై, ప్రాప్తాప్రాప్తములచే స్పర్శించబడనిదై ఎప్పటికీ

ఉండియే తీరుతోంది.

ఇక, మిగతాదంతా, ఏది ఎట్లుంటోందో... అట్లే ఉండుగాక! నేను సర్వదా ప్రత్యేకమైన స్వరూపం గల వాడినే. ఈ దేహాదులు, తదితర దేహసంబంధములు నాకు సంబంధించినవి కావు.

అంతేకాదు. నాయందు ఏది తేజోరూపమై వెలయుచున్నదో... అదియే అన్ని దేహములందూ అట్లే వెలయుచున్నది. అందుచేత అందరూ, అన్ని జీవులూ, అన్ని లోకాలూ నా వారే! నావే! నేనే! అయితే, నాయందు నేను కానిదేమి ఉంటుంది?... నేను కానిదంతా లేనిదే! కాబట్టి 'నీవు - ఆతడు’ అనునవన్నీ ఒకే సమయంలో 'నేనే' అయి, 'నేనుకానివి' అయిఉంటున్నాయి.

ఇక మౌనమే నా అనుభవం, స్వరూపం, స్వభావం కూడా!

శ్రీవసిష్ఠ మహర్షి : మునిశ్రేష్ఠుడు, మహాతపస్వి అగు ఆ వీతహవ్యుడు ఈ ప్రపంచంలో సంచరిస్తూనే పునరాగమనరహితమగు బ్రహ్మ పదమున స్థితి పొందారు. చింతారహితుడు, అజ్ఞాన వర్జితుడు అయ్యాడు. అప్పుడు కూడా ఆయా పదార్థములనుండి కలిగే అనర్థములు నివారించటానికి ధ్యాన యోగం అవలంబిస్తూ ఉండేవాడు. సదా ఆత్మ సుఖమును చవిచూస్తూ ఉండేవాడు. ఆయా పదార్థములు, స్నేహాదులు తారసపడుచున్నప్పటికీ ఆతనికి వాటిపట్ల 'త్యాజ్య గ్రాహ్య' దృష్టి ఉండేది కాదు. మనస్సునందు జనించే ఇచ్చ, అనిచ్ఛాదులకు ఆతడు అతీతుడై ఉంటూ ఉండేవారు. ఎల్లప్పుడూ కేవలీభావము (A sense of Absoluteness) అవధరించి ఉంటూ ఉండేవారు. నాకు జన్మ కర్మలు ఉండవు అను ఎరుకచే సంసారపరిత్యాగము కాగా, అప్పుడు శేషించియున్న బ్రహ్మానందమునందు తేలియాడుతూ ఉండేవాడు.

అట్లు చాలా రోజులు గడచిన తరువాత ఆయన పర్వతములోగల ఒక గుహలో ప్రవేశించారు. మహనీయులు తమ అభ్యాసమును విడువరు కదా! ఒక్కసారి మరల ఈ జగజ్జాలమంతా వీక్షించ టానికి ఆ గుహలో ఆసీనులై పద్మాసనమువైచుకుని... తనలో తాను ఇట్లు ప్రసంగించుకోసాగారు.

Page:658

వీతహవ్యముని : ఓ రాగమా! నీ విప్పుడు ఆత్మానురాగత్వము పొందుము. ఓ ద్వేషమా! నీవిక నిర్దోషిత్వం పొందుము. మీ ఇద్దరితో ఇప్పటికే చాలాకాలం క్రీడించాను కదా!... ఇక చాలు.

ఓ భోగములారా! మీ అందరికి ఇదే తుది నమస్కారం. తల్లి తండ్రులచే పిల్లవాడు లాలించ బడినట్లు... మీచే కోట్లాది జన్మలుగా లాలించబడ్డాను. ఇక చాలు, మీతో సమాగమం. ఇక

ఉపశమించండి.

ఓ ఇంద్రియ విషయములారా! మీ శబ్ద - - స్పర్శ - రూప - రస - - గంధ స్వరూపములతో పరమ పదమగు ఈ వర్తమాన నిర్వాణ గతిని మరిపించటానికి ప్రయత్నించకండి. మీకో నమస్కారం.

ఓ ప్రియమిత్రమా! దుఃఖమా! నీవు నాకు అనేకసార్లు 'రోదన' కలిగింపజేశావు. అయినా నీవు నాకు ప్రియమిత్రుడవే. ఎందుకంటే, నీచే సంతృప్తుడనైన నేను ఆదరముగా ఆత్మను అన్వేషించాను. ఈ ఆత్మమార్గోపదేశంలోకి నన్ను ప్రేరేపించింది నీవే. నీకు మరల మరల నమస్కరిస్తున్నాను. మేడపైకి వెళ్లువాడు మార్గంలోని మెట్లను వదలునట్లు నేను నిన్ను ఇక్కడే త్యజిస్తున్నాను. నీ కృపచే ఆత్మపదం లభించింది. 'దుఃఖము' అనే పేరుతో పిలువబడుచున్నప్పటికీ, చివరకు సుఖమునే ప్రాప్తింపజేసిన ఓ నేస్తం! నీకు జోహార్లు. కృతజ్ఞతలు.

ఈ ప్రపంచమున అసారమగు జీవితం కలిగియున్న దేహమనే సహచరుడా! - ధ్యానము, యోగసాధన మొదలైనవాటి యందు నీవు నాకు గొప్ప ఉపకరణముపై సహకరించావు. నీ సహాయంతో నాకు ఆత్మ సామీప్యత లభిస్తోంది. నీవు సాధనపరులకు మంచి మిత్రుడుగాను, దుర్వ్యసనపరులగు సత్సాధనరహితులకు చెడ్డ మిత్రుడుగానూ అవుతూ ఉంటావు. నీయొక్క, నాయొక్క వియోగం అనాదియగు నియతియొక్క స్వభావమే అయిఉన్నది కదా! ఒక జీవుడు 'స్వార్థ గతి'ని ఆశ్రయించినా, లేక, పరమార్థగతి’ని అభిలషించినా... ఒకనాటికి నీతో వియోగం తప్పునది కాదు. అనేక జన్మలుగా నీతో సంయోగ, వియోగములు అనుభవిస్తూ వచ్చాను. ఆత్మ జ్ఞానవశంచేత నీతో అవినాభావత్వానికి హాని కలుగుచున్నది.

ఆత్మభావం నాకందించి, తద్వారా, నీకు నీవే సమర్పణ చేసుకుంటున్నావు. నీత్యాగం మరింకెవరికి వస్తుంది? నిన్ను మరింకెవరూ నాశనము చేయుట లేదు. నిన్ను నీవే నాశనమొనర్చు కొనుచున్నావు.

ఓ తృష్ణగారూ! - నేను శాంతిని పొందుచుండగా, నీవిక ఒంటరిదానివై శుష్కించుచున్నావా? నీ వలన ఎవరికీ శాంతి ఉంటుంది? అందుచేత నీవు ఉపశాంతి పొందటంలో లోకమునకు శుభకరమే. కనుక సెలవు.

ఓ కామమా! - నీ వినాశనము కొరకై నేను అభ్యాస - వైరాగ్యాదులను ఆశ్రయించాను. నీవు ఉన్నంతకాలం తదితర జీవులకు నేను అశాంతిని, భేదమును కలిగించాను కదా! నీవు ప్రకోపించుటచే నేను అనేక ఉపాధులు నష్టపరుచుకున్నాను. ఇప్పుడిక మనిద్దరికీ శాశ్వత వియోగం సంభవించబోతోంది. చాలా సంతోషమైన, పవిత్రమైన క్షణములివి. కనుక ఇక శాంతించు.

Page:659

ఓ నా సుకృత దేవతలారా! - మీకు నమస్కారం. మీరు నన్ను అనేక నరకములనుండి లేవనెత్తి తపస్సు, ధ్యానము’ అను స్వర్గలోకమునకు తీసుకొని వచ్చారు. అందుకు కృతజ్ఞతలు. అయితే, నేను సుకృత, దుష్కృతముల పరిధిని అధిగమించి యోగమార్గంలో ఆత్మావలోకనమును సమీపిస్తున్నాను. తద్వారా కృత్యములన్నీ అధిగమించి కృతకృత్యుడనగుచున్నాను. మీకు నా కృతజ్ఞతలు.

ఓ పాపవృక్షమా! - నీవు దుష్క్రియలు అనే క్షేత్రంలో పుట్టావు. "ఇంద్రియ పటాటోపములు” అనే వాయువు ఆస్వాదించావు. 'దుష్ట అపకార బుద్ధి' అనే బురదలో పెరిగావు. కోపం - ఆవేశం - ద్వేషం - దురవగాహన - - అపరిపక్వదృష్టి - మదం మాత్సర్యం మొదలైన బురదసారాన్ని స్వీకరించి ఇంతకింత అయ్యావు. నరకయాతనలు, అధమ ఉపాధులు అనే పూలను పూచావు. 'నీచ జన్మలు - అజ్ఞాన దశలు - అల్ప క్రియలు' అనే కాయలుగల నీతో కూడి అనేక జన్మలు గడిపాను. నేనెపుడైతే కళ్ళు తెరచి గురువులను, జ్ఞానులను, శాస్త్రములను శరణువేడానో మరుక్షణం నీవు ఎండిపోవటం ప్రారంభించావు. ఇప్పుడు నీవు చచ్చి మోడుబారి ఎండిపోయిన చెట్టుగా అయిపోవటం ముదావహం. ఆత్మను దర్శించిన తరువాత నీలో ఉండే కొంచెం చావకూడా చచ్చిపోయింది. ఇక కూకటి వ్రేళ్ళతోసహా నీవు నేలకూలినట్లే.

ఓ మోహమా? - ఆత్మను దర్శించుచున్న ఈ శుభతరుణంలో నీ నీడకూడా కనిపించటం లేదు. వెలుతురు ఉన్నచోట చీకటి ఉండజాలదు కదా! వెలుతురు లేకపోవటమే చీకటి యొక్క నిర్వచనమయినట్లు, అఖండమగు నా ఆత్మయొక్క స్వభావం ఎరుగకపోవటమే నీయొక్క నిర్వచనం. అందుచేత, ఆత్మ సద్విమర్శనామాత్రంచేత నీవు రహితమగుచున్నావు కదా! మంచిది.

తపస్విని వంటి ఓ పర్వత గుహా! - నీవు వీణానాదము వంటి ప్రతి ధ్వనులతో నన్ను మౌనంగా పలకరించేదానివి. నేను సమాధిలో ప్రవేశించియున్నప్పుడు నన్ను సఖిలాగా సేవించావు. ఆకులు నాపై వ్రాలుచున్నప్పుడు నీ పలకరింపుల చిలకరింపులవలె అనిపించేది. పూర్ణానందస్వరూపమగు ఆత్మయందు విశ్రాంతి కలుగజేయుటద్వారా నాకు మహోపకారం చేశావు. నీ సహకారంతో నాలోని లోభమంతా నశించింది. నాకు స్నేహితునివలె సఖివలె ఇంతకాలం ఉన్నావు. అనేక సంకటములచే ఖిన్నుడనై సమాధి విఘ్నములచే ద్రవీభూతుడనై ఉన్న సమయంలో నిన్ను ఆశ్రయించి, సమీపించాను. అర్ధనారీశ్వరుడగు శివుని ఆశ్రయించి భక్తులు ఉత్తమ ఫలితం పొందినట్లు, నేను నిన్ను ఆశ్రయించి మహదానందమగు ఆత్మావలోకనం పొందాను. నీవు చేసిన సహాయం ఏమని వర్ణించగలను? నీకు శుభమగుగాక!

ఓ దండమా (చేతి కబ్జా)! - నేను అడవులలోనూ, గోతులలోనూ సంచరిచేటప్పుడు నాకు ఆలంబనమయ్యావు. వార్ధక్యంలో పరమ మిత్రుని వంటి నీకు కృతజ్ఞతలు.

ఓ దేహమా! - అస్థి పంజరము - రక్తము - రోమములు రోమములు - ప్రేగులు" ఇవే కదా, నీ ముఖ్యతత్త్వమంతా? నీవు వాటిని గ్రహించి ఏ క్షణమైనా నీ ప్రకృతిలో ప్రవేశించవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. నీ నుండి చమట మొదలైన జలప్రకోపములు, మలము మొదలైన దుర్గంధములు

Page:660

బయల్వెడలుచుండగా... నిన్ను పవిత్రం చేస్తూవస్తున్న జలము మొదలైన వాటికి ఇవే కృతజ్ఞతలు. భోజన, శయన క్రియలకు సహకరించిన పదార్థ, ఉపకరణ సమూహములకు కూడా నా కృతజ్ఞతలు. నీకు అందించిన ఆహార పదార్థములను తయారు చేయటంలో శ్రమించిన సకల సహజీవులకూ ఇవే నా కృతజ్ఞతలు. నీవిప్పుడు ఉండినా, ఊడినా నాకొక్కటే!

ఓ ప్రాణములారా! - మీరు నా పూర్వకాలిక సహజమిత్రులు కదా! ఇప్పుడు నేను చేస్తున్న మిత్రుల వందన క్రమమునకు మీరు కూడా అర్హులే. మీతోకూడి నేను అనేక విచిత్రయోనులందు విశ్రమించాను. పర్వత కుంజములలోనూ, లోకాంతరములలోనూ విహరించాను. సిద్ధుల క్షేత్రము లలో ప్రవేశించాను. అనేక కార్యవిలాసములలో పాల్గొన్నాను. వివిధమార్గములలో సంచరించాను. వెయ్యేల? ఈ ప్రపంచంలో మీతో కూడి అనుభవించని పదార్థములేమున్నాయి? ప్రియమిత్రులగు ప్రాణములారా? మిమ్ములను ఎంతో కాలం పట్టి ఉంచాను. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ప్రకృతిలోకి పోయి లీనమగుటకు స్వతంత్రం ఇస్తున్నాను. నేను బ్రహ్మముతో ఐక్యత పొందుచున్నాను కదా!

సమస్తమూ అయి ఉన్న ఓ ప్రాణములారా! ఏది ఎచ్చోట పుట్టినా, చివరికి నశించి స్వస్థానం పొందవలసిందే కదా! ఇప్పుడు ఉన్నతములైనవి మరొకప్పటికి నిమ్నస్థానం చేరుచున్నాయి.

సంయోగముచే ఏర్పడినవన్నీ ఒకనాటికి వియోగంపొంది తీరవలసిందే. ఇక మన వియోగము కొరకు వగచవలసిన పనేమున్నది?

ఓ నేత్రప్రకాశమా! నీ స్వస్థానమగు సూర్యమండలము ప్రవేశించెదవుగాక!

ఓ ఘ్రాణేంద్రియమా! నీవు నీ నిజాశ్రయమగు భూమిని జొచ్చెదవు గాక!

ఓ కర్ణేంద్రియములారా! మీరు మీ ఆకాశబిలమునందు లయమొందెదరుగాక!

ఓ జిహ్వేంద్రియమా! నీయొక్క రసశక్తి జలమయమగు చంద్రమండలమున ప్రవేశించుగాక! పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు వాటివాటి ప్రకృతియందు లీనమగుగాక!

ఆత్మయే అయిఉన్న నేను సూర్యుడులేని వెలుగువలె, తుపాను తాకిడిలేనట్టి సముద్రజలంలాగా, మేఘరహితమగు ఆకాశము చందమున, తైలంలేని దీపం మాదిరి, కల్పాంతమందలి సృష్టినిబోలి, ప్రశాంతమును పొందుచున్నాను. ఓంకారార్ధమాత్ర యొక్క లక్ష్యభూతమైన బ్రహ్మరూపమునందు ఐక్యత సంపాదించుకుంటున్నాను... సర్వకార్యపరంపరా వర్జితుడనగుచున్నాను... సర్వ దృశ్యాతీతుడ నగుచున్నాను.

మనస్సును అధిగమించి ఉచ్చెస్వర్యముతో 'ఓంకారము'ను ఉచ్చరిస్తున్నాను. మనస్సుకు అతీతుడ నగుచున్నాను. బ్రహ్మరంధ్రమున సర్వశాంతిని అనుసరించుచూ బ్రహ్మచారిత్వమును పొందుచున్నాను. శాంతుడనై, మోహరహితుడనై ఆత్మయందు పూర్ణరీతిగా స్థితిని సంపాదించు కొనుచున్నాను.

Page:661

7. నిర్వాణము

శ్రీవసిష్ఠ మహర్షి : ఇట్లు మననవర్జితుడై, సర్వ ఇచ్ఛలు త్యజించినవాడై, ఆ వీతహవ్యమునీంద్రుడు పెద్ద స్వరముతో, ఓంకారం సుదీర్ఘంగా ఉచ్చరించసాగారు. క్రమంగా ఆరవ, ఏడవ భూమికను అధిరోహించారు. స్వహృదయమందే సర్వ సమమగు బ్రహ్మముయొక్క ప్రాప్తిని దర్శించసాగాడు. ఆ వీతహవ్యుడు కార, '' కార, 'మ'కార, 'అర్ధ' మాత్రలకు సంజ్ఞలైనట్టి "స్థూల - సూక్ష్మ -

అవ్యాకృత - తురీయ” పాద భేదములచే ప్రణవమును స్మరిస్తూ ఉన్నారు. విరాట్ - - హిరణ్యగర్భ అవ్యాకృత లక్షణములు గల తురీయమును భావన చేయసాగాడు.

మొట్టమొదటగా - - “జాగరిక స్థానమున బహిర్జ్ఞ కలదు అను అధ్యారోపణ చేతనూ, అంతఃప్రజ్ఞగానీ, బహిర్ప్రజ్ఞగానీ లేదు" అను అపవాదముచేతనూ ...ఈ ముల్లోకములనూ, వాటి ఉత్పత్తి స్థానములతోసహా త్యజించివేశాడు.

సంకల్పములచే కల్పాంతమువరకూ కల్పించబడిన ఈ స్థూల - సూక్ష్మ కారణముల యొక్క బాహ్యాభ్యంతరములన్నీ వీక్షించసాగాడు. ఆయన దర్శించుచున్న శుద్ధతత్త్వమగు ఆత్మ అవ్యయమైనది. ప్రకాశ, అంధకారరహితమైనది. సూర్య - చంద్ర - నక్షత్రములు లేనట్టి నిర్మలాకాశమును పోలి ఉన్నది.

ఆయనిప్పుడు స్వయముగా క్షోభరహితుడై చింతామణి వలె, పూర్ణ చంద్రుని వలె, చలనము ఉడిగిన చక్రము వలె ప్రకాశించుచున్నారు. శాంతి, నిర్మల, పూర్ణ సముద్రము వలె తురీయాత్మ యందు స్థితి కలిగియున్నాడు.

వాయువు గంధమును త్యజించునట్లు ఆతడు ఇంద్రియతన్మాత్రజాలమును త్యజించివేశాడు. క్రమంగా 'దీర్ఘ ప్రణవనాదము' అనే సూత్రమును కూడా త్యజించాడు. ఒక ప్రాజ్ఞుడగు బుద్ధిమంతుడు తననుండి రాగమును త్యజించినట్లు, ఆకాశము చీకటిని త్యజించి వెలుగు సంతరించుకుంటున్నట్లు ఆ మహాముని తనయందలి తమోగుణమునంతటినీ త్యజించివేశాడు.

ఆ తరువాత ఆతని హృదయంలో ఒకానొక ప్రకాశం ఆవిర్భవించింది. అరనిముషకాలంలో ఆయన ఆ ప్రకాశమును కూడా త్యజించివేశాడు.

అప్పుడాతని హృదయంలో తమస్సుగానీ, ప్రకాశముగానీ లేవు. తమఃప్రకాశ రహితమైనట్టి స్థితిని పొందిన ఆతనియందు కల్పనాహేతువైనట్టి కించిత్ మనస్సు స్ఫురించింది. ఆ స్వల్ప ఛాయారూప మనస్సును కూడా ఆతడు అర్ధనిమిషంలో ఛేదించివేశాడు.

అటు తరువాత గాలిలేనిచోట దీపంగా స్ఫుటప్రకాశరూపము పొందాడు. అప్పుడాతని యందు కొద్దినెలల వయసుగల పసిబాలునిలో ఉండేటంతటి పరిజ్ఞానము మాత్రమే శేషించియున్నది. ఆ పరిజ్ఞానమును కూడా మరొక అర్ధనిమిషంలో త్యజించివేశాడు.

Page:662

దీనినే "చైతన్యము విషయదశను పరిత్యజించటం" అనికూడా అంటారు. ఈ విధంగా... సాక్షిమాత్రంగా శేషించు స్థితిని పొందాడు. ఆ పదమునే శాస్త్రములు పశ్యంతి అను శబ్దముచే ఏకీస్థితిగా విశ్లేషించారు. ఆ తరువాత సుషుప్త పదమును అవలంబించి పర్వతమువలె నిశ్చలుడయ్యాడు.

మహాసమర్ధుడగు ఆ ముని అప్పటినుండి జగత్ప్రహితమైన సుషుప్తిపూర్వక జాగ్రత్ను పొందుచూ అచ్చటనే స్థిరంగా ఉండిపోయాడు. ఆ తరువాత తురీయ పదమును పొందాడు. ఆ తురీయపదంలో విషయానందరహితుడైనప్పటికీ, స్వస్వరూపానంద సహితుడైనాడు. అన్యసత్తారహితుడైనప్పటికీ ఆత్మ సత్తాసహితుడైనాడు. వాక్కు అగోచరమగు స్థితి పొందాడు.

ఆ స్థితిలో ప్రకాశ్యవిషయమే ఉండదు కదా! అది 'చిన్మయము’ అని చెపుతారు. ఇది సర్వమునకూ కేవల సాక్షీభూతమైనది. "ఇది కాదు... ఇది కాదు నేతి, నేతి" అనుకుంటూపోగా, చిట్టచివరకు శేషించేది అదే. సమము, విశాలము, పరమపవిత్రము, సర్వజీవులకు అంతర్గతము అదే. ఆయన సర్వ వివర్జితమగు బ్రహ్మరూపుడయ్యాడు.

ఏది శూన్యవాదులకు శూన్యమో, బ్రహ్మవేత్తలకు బ్రహ్మమో, విజ్ఞానవాదులకు విజ్ఞానమో, సాంఖ్యవాదులకు పురుషుడో, యోగవాదులకు ఈశ్వరుడో, శైవులకు శివుడో, వైష్ణవులకు విష్ణువో, ఆత్మవేత్తలకు ఆత్మయో, సౌతాంత్రిక, వైభాషికులకు నైరాత్మ్యమో, మాధ్యమికులకు చిత్ - అచిత్ల మధ్యలోగల నిర్విషయస్థితియో, జీవన్ముక్తులకు సర్వ రూపమో - అట్టి సద్రూపము ఆతడే అయి... చెన్నొందుచున్నాడు. షట్శాస్త్ర సిద్ధాంతసారమై సర్వహృదయస్థమై, స్వస్వరూపమై, సర్వవ్యాపకమై, సర్వరూపమైనట్టి సద్రూపమే ఇప్పుడాతడు. సర్వధా నిష్క్రియమై, సూర్యుడు మొదలైన స్వప్రకాశక వస్తువులను కూడా ప్రకాశింపజేయునదై, నిజానుభవమైనట్టి సద్రూపమే ఆతడు.

ఉపాధి భేదంచేత అనేక రూపుడు కూడా తానే అయ్యాడు.

మాయా భేదం చేత రాగయుక్తుడై ఉంటున్నది కూడా తానే. సర్వరూపుడు, సర్వమునకు భిన్నమైనవాడు తానే అగుచున్నాడు. "సర్వరూపములు తానై, 'సర్వసాక్షి' అను రూపంగా వేరై”.... ఉన్నవాడయ్యాడు.

చూచావా... రామా! ఆ విధంగా ఆ వీతహవ్యమహాముని ముక్తుల దృష్టిలో చూస్తే, మనం చెప్పుకుంటున్నట్లు జన్మ జరావర్జితము, అనాది, ఏకము, విమలము, నిష్కళంకము అయినట్టి ఆత్మ సంస్థితుడే అయ్యాడు.

ఇక బుధుల దృష్టిలో ఈశ్వరుడే ఆతడు. కార్యభేదములచే అనేక రూపులైనదంతా ఆతడే. సర్వకళారహితుడై, సర్వులకు వందనీయుడైనాడు. ఓం నమో వీతహవ్యాయనమః

Page:663

8. విశ్రాంతి

శ్రీవసిష్ఠ మహర్షి : ఆ విధంగా సంసారసీమాంతరమును పొంది, సర్వ దుఃఖములూ దాటివేసిన ఆ వీతహవ్యముని పూర్ణమనో నాశనముచే పరబ్రహ్మమున విలీనుడైనాడు. ప్రశాంతిని, పరమ తృప్తిని పొందాడు. సముద్రంలో జలబిందువు ఉన్నట్లు, పరిణామ రహితమగు స్వాత్మ పదమున స్థానం పొందాడు.

శ్రీరాముడు : మహర్షీ! ఆయన శరీర స్థితి ఎట్లున్నది?

శ్రీవసిష్ఠ మహర్షి : చెపుతాను విను. ఆతడు సంపూర్ణముగా ఆత్మానుభవ సమన్వితుడైనాడు కదా! ఇక ఆతనిచే అంతవరకూ ఉపయోగించబడిన భౌతిక దేహం యజమానిలేని ఇల్లులాగా నీరసం పొందింది. చేష్టారహితమై మ్లానత పొందింది. ఆ దేహము నుండి ప్రాణములు బయల్వెడలి ఆకాశంలో లీనమైనాయి. దేహములో గల పంచభూతములన్నీ పంచమహాభూతములందు విలయం చెందాయి. మాంసము, బొమికలతో కూడిన జీర్ణ శరీరశేషము చైతన్య సాగరమున ప్రవేశించింది. రక్త - మాంస - - మేధ - మజ్జాది ధాతువులు సప్తధాతువులందు విలీనమయ్యాయి. శరీరమునందలి తత్వములన్నీ వాటివాటి కారణములందు లయించాయి. వీతహవ్యుని స్వస్వరూపము స్వయం ప్రకాశరూపమై పరమవిశ్రాంతిని పొందింది.

ఓ రాఘవా! నీవు కూడా వీతహవ్యమహామునిలాగానే విచారణ చేయి. చక్కగా ప్రదీపితమై ఉన్న ఆత్మతత్త్వమును దర్శించి, అద్దాయనిందు ఆరూఢుడవై విశ్రాంతి పొందుము.

ఇప్పటివరకు ఈ వీతహవ్యుని గాథ ఈ 14 రోజులుగా నీకు చెప్పినదీ, చెప్పుచున్నదీ, చెప్పబడబోయేదీ - ఇదంతా నేను స్వయముగా విచారణ చేసి చూచినది సుమా! త్రికాలదర్శిని, చిరంజీవిని అవటం చేత ఇవన్నీ స్వయంగా సందర్శించి, నీకు చెప్పుచున్నాను. నాకు అనుభవమైనదే నీకు చెప్పటం జరుగుతోంది కాని, ఏవో ఊహ, అపోహలపై ఆధారపడి కాదు. నీవు కూడా ఆయా మహనీయులవలె నిర్మల దృష్టిని అవలంబించి జ్ఞానమును పొందుము. జ్ఞానముచే మాత్రమే ముక్తి లభించగలదు.

జ్ఞానాన్నిర్దుఃఖతామేతి జ్ఞానాదజ్ఞానసంక్షయః |

జ్ఞానాదేవ పరాసిద్ధిర్నాన్యస్మాద్రామ వస్తుత ॥ (శ్లో 12, సర్గ 88)

అజ్ఞానం నశించాలంటే జ్ఞాన సముపార్జన ఒక్కటే మార్గం. జ్ఞానము చేతనే పరమసిద్ధి లభించగలదు. యథార్థానికి జ్ఞానముకంటే ఉత్తమమైనది ఇంకొకటేదీ ఉండదు.

మునీశ్వరుడగు వీతహవ్యుడు జ్ఞానముచేతనే ఆశలన్నీ తెగతెంచివేశాడు. జ్ఞానం చేతనే చిత్తమును చూర్ణం చేయగలిగాడు.

Page:664

శ్రీరాముడు : స్వామి ! ఇప్పుడు వీతహవ్యునకు, జగత్తుకూ గల సంబంధమెట్టిది?

శ్రీవసిష్ఠ మహర్షి: ఆ వీతహవ్యుని సంవిత్తు, లేక, శుద్ధజ్ఞానతత్త్వము స్వహృదయమైనట్టి బ్రహ్మమునందే ఈ జగత్తును గాంచుచున్నది. అనగా "జగత్తు అనునది నాయొక్క సంకల్ప ప్రయోజనమేగాని మరింకేమి కాదు అనునట్టి చ్యుతిలేని ఎరుకను కలిగి ఉంటోంది.

శ్రీరాముడు : ఇప్పుడాతనికి తనకు మాత్రమే సంబంధించిన ఒక ప్రత్యేక జగత్తు ఏమైనా ఏర్పడి ఉన్నదా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పుడు వీతహవ్యుడు సర్వదా ఏర్పడియున్న నిత్యసత్యమును అనుభవించుచున్నాడు. ఇక్కడ వాస్తవ, నిత్య సత్యమేమిటి!

నేత్రము మొదలైన ఇంద్రియములకు ఇక్కడ తారసపడుచున్నదంతా మనస్సుయొక్క కల్పనయే కదా! ఈ నేను, నీవు, శరీరము, పదార్థములు అంతా కూడా మనోస్వప్న మాత్రమే. ఈ జగత్తంతా మనో మాత్రమే అయి ఉండగా ఇక దీనియందు స్వకీయమైనదేది? పరకీయమైనదేది? వీతహవ్యునిలో కల్పన అంతా రహితమైపోయింది. పరమార్థమును అతడు పొంది ఉన్నాడు. ఇప్పుడు అతని యందు రాగద్వేషముల ఛాయ కూడా లేదు. అభిమానము, కామ్య కర్మలు మొదలైన మాలిన్యంలేదు. వాటివలన కలిగే ఇంద్రియవికారాలు లేవు. స్థూల - సూక్ష్మ - - కారణ శరీరాలు కూడా లేవు. తజ్జనితమైన సంగమములు లేవు. శోకరహితుడు, వివేకియు అగు ఆతడు స్వస్వరూపభూతమగు నిర్మలాత్మతత్త్వమును సాక్షాత్కరించుకుని మౌనం వహించి ఉన్నాడు. అంతే, ఇక అంతకుమించి చెప్పాలంటే ఆతడు వాక్ అతీతుడని గ్రహించు.

Page:665

XII.ఉపశమన ప్రకరణము - సమీక్ష

1. యోగుల దేహ - మనముల వైచిత్ర్యం

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ ఉపశమన ప్రకరణంలోనూ, ఇంతకు ముందటి ప్రకరణాలలోనూ మనం చెప్పుకున్న అనేకమంది మహనీయుల అంతిమానుభవమును గమనిస్తున్నావు కదా! నీవు కూడా ఆత్మజ్ఞుడవై, రాగ - ద్వేష - భయ వర్జితుడవై ఈ ప్రపంచమున విహరించు.

మహాధీమంతులగు జ్ఞానులు కొందరు రాజులై రాజ్యభారం నిర్వర్తిస్తున్నారు. మరికొందరు మునులై లోక కళ్యాణార్థం అనేక సంరంభములతో కూడి యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తున్నారు.

ఓ రఘురామా! ఇక్కడ కనబడే సుఖదుఃఖ క్రమములచే ఆత్మ ఎన్నడూ వశీభూతం కాదు. అట్టి సర్వవ్యాపియగు ఆత్మయే నీవై ఉండగా ఇక భేదమెందుకు? వ్యర్థంగా దుఃఖములు పొందవలసిన పనేమున్నది? అనేకులగు ఆత్మజ్ఞానులు ఆయాస్థితులందు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. కానీ వారు దేనిని చూచీ దుఃఖం పొందటం లేదు. దేనికొరకూ శోకించుట లేదు. నీవు కూడా స్వస్థుడవై ఉండు. సర్వత్యాగివై, సముడవై, సుఖవంతుడవై ఉండు. ఆత్మవంతుడవగు నీకు ఈ జన్మా లేదు. మరొక జన్మా లేదు. సింహాలు నెమళ్ళకు వశం కావటమేమిటి? జీవన్ముక్తులు, సర్వం ఎరిగినవారూ అగు మహాత్ములు ఏది ఎట్లున్నప్పటికీ హర్ష క్రోధాది వికారాలకు వశులు కారు. కాబట్టి ఖండత్వము త్యజించి అఖండత్వము నాశ్రయించు.

శ్రీరాముడు : ఈ సందర్భంలో నాదొక చిన్న సందేహం. మనం ఇప్పటివరకు చాలా మంది జీవన్ముక్తుల గురించి చెప్పుకున్నాం. వారిలో కొంత మందిలో ఆకాశగమనము మొదలైన దివ్యశక్తులు కనిపించటం లేదు. మరికొందరిలో కనిపిస్తున్నాయి. జీవన్ముక్తులయందు అతీంద్రియశక్తులు

ఉంటాయా? ఉండవా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఆకాశగమనము మొదలైన సిద్ధులు దేనికి సంబంధించినవి? అగ్ని యొక్క ఊర్ధ్వజ్వలనం లాగా అవన్నీ పదార్థములకు సంబంధించిన స్వాభావిక శక్తులే కదా! ఇక్కడ తారసబడే భౌతిక, అతీంద్రియ శక్తుల విచిత్ర వ్యవహారమంతా పదార్థ స్వభావం మాత్రమే! అందుచేత ఆత్మజ్ఞులైనవారికి క్రొత్తవి పొందాలనిగాని, ఉన్నవి తొలగాలని గాని అభినివేశం ఉండదు.

ఒకానొకడు ఆత్మజ్ఞాని కాకపోవచ్చు. ముక్తుడు అవకపోవచ్చు. అయినప్పటికీ మణి, ఔషధము మొదలైన ద్రవ్యశక్తులు కలిగియుండుటచేతనూ, యోగాభ్యాసం మొదలైన ఆయా క్రియాశక్తులచేతనూ ఆకాశగమనము, మాయమవటం, ప్రత్యక్షం కావటం" మొదలైన సిద్ధులు పొందగలుగుతాడు. అంతమాత్రం చేత ఆతడు ఆత్మజ్ఞుడు అని అనిపించుకోడు.

Page:666

ఆత్మజ్ఞుడు’ అంటే ఏమిటి?... "స్వయముగా ఆత్మచే ఆత్మను ఎరిగి, ఆ ఆత్మయందు సంతృప్తుడై ఉండువాడు అని కదా! ఆత్మజ్ఞుడు అవిద్యవైపు పరుగులెందుకు తీస్తాడు? ఈ ప్రపంచంలో పదార్థము లన్నీ అవిద్యామయములే అయిఉన్నాయి. అవిద్యను త్యజించిన ఆత్మజ్ఞాని భౌతిక విషయములగు అతీంద్రియశక్తులలో మునిగి ఉంటాడా! ఊహూ!

శ్రీరాముడు : అతీంద్రియశక్తులు ఎట్టి వారికి లభిస్తాయి? ఆత్మజ్ఞాని వాటిపట్ల ఎట్టి ఉద్దేశం, అభిప్రాయం కలిగి ఉంటాడు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు ఆత్మజ్ఞాని అయిఉండకపోయినప్పటికీ, ద్రవ్య - కాల - క్రియాదులచే శాస్త్రోక్తంగా ప్రయత్నిస్తే 'ఆకాశగమనము' మొదలైన విద్యలు తప్పక లభిస్తాయి.

ఇక ఆత్మజ్ఞాని విషయమంటావా?... ఆతడు సమస్తమునకు అతీతుడై ఇచ్చారహితుడై ఉంటాడు. ఇది కావాలి... పొందితేనే నేను సంపూర్ణుడనైనట్లు" అని సంభ్రమము కలిగియుండడు. ఆతనికి ఆకాశగమనములచే గాని, సిద్ధులచే గాని, తుచ్ఛమగు భోగములచే గానీ, ప్రభవములచే గాని, గౌరవ, ప్రతిష్ఠ, మాన్యాదులచే గాని, జీవన మరణములచే గాని క్రొత్తగా అభిలషించవలసిన ప్రయోజనమేమీ కనబడదు. ఆత్మజ్ఞుడెప్పుడూ నిత్యసంతోషి అయి, శాంతచిత్తుడై, రాగరహితుడై, వాసనావర్జితుడై, నిత్యసంతృప్తుడై ఉంటాడు. ఒకవేళ ఒక ఆత్మ జ్ఞానిలో అతీంద్రియ శక్తులు ఉండటం సంభవించినప్పటికీ వాటిని ఆతడు ప్రారబ్ధవిశేషములు మాత్రంగానే చూస్తాడు. ఆకాశము వలె ఆతడు ఏ భౌతిక వస్తువుచేత పరిమితుడవకుండా మహదాకారము కలిగి, ఆత్మయందే నెలకొని ఉంటాడు. ఆతనికి జీవన్మరణముల పట్ల కూడా సంగము ఉండదు. సంసారస్వభావ యుక్తంగా ఇక్కడ సంభవిస్తూ ఉండే ఆకస్మిక సుఖ దుఃఖములచే ఆతడు తన స్వాభావికమైన తృప్తిని వీడకయే ఉంటాడు. ప్రతికూల-అనుకూల ప్రారబ్ధములు తారసపడుచున్నప్పుడు, వాటిని ఒక వైపు చూస్తూ కూడా... మరొకవైపు “అఖండాకార వృత్తి అనే పుష్పాలతో ఆత్మను పూజిస్తూనే ఉంటాడు. నదుల నుండి వచ్చే నీరు సముద్రంలో లయమైపోవునట్లు, సర్వ అనుభవములూ అతనిని సమీపించి లయమైపోతాయి గాని, పునర్వృత్తులకు కారణం కాజాలవు.

నైవతస్య కృతేనార్ధో నాకృతేనేహకశ్చన |

నచాస్య సర్వభూతేషు కశ్చితర్ధతవ్యపాశ్రయః ||

ఇది నేను చేశాను. నాకొచ్చిన ప్రయోజనమేమున్నది? ఇది చేయలేదా? ఎట్లా? - అనునట్టి ప్రయోజన ప్రత్యవాయువులు (Benefit - Eventualities) ఆతని దృష్టిలో ఉండవు. సర్వభూతములందూ ఆశ్రయించవలసినదంటూ ఆతనికేదీ ఉండదు.

ఓ రామా! ఒకడు ఆత్మజ్ఞానరహితుడైనప్పటికీ సిద్ధులను అపేక్షించి సాధకద్రవ్యాదులతో, మంత్ర నియమాదులతో ప్రయత్నిస్తే ఆతనిని ధనం సంపాదించటంలో నిమగ్నమైనవానితో పోల్చ వచ్చు. ధనికుడైనంత మాత్రంచేత ఒకడు ఆత్మజ్ఞాని అగుచున్నాడా? లేదే! అట్లాగే సిద్ధులు సంపాదించి నంత మాత్రంచేత ఒకనిని ఆత్మజ్ఞానిగా నిర్ధారణ చేయలేం. అందుకే శాస్త్రజ్ఞులు 'సిద్ధులు సంపాదించటం - - ఆత్మజ్ఞానం' ... ఈ రెండూ వేరు వేరు విజ్ఞాన శాఖలుగా చూస్తూ ఉంటారు.

Page:667

మణి, మంత్రము మొదలైన యుక్తుల చేత ఆకాశగమనాది సిద్ధులు లభిస్తాయి - అనేది ఆయా శాస్త్రములలో ప్రసిద్ధమైయున్న నియతిక్రమం అయి ఉన్నది. అట్టి నియతి క్రమమును దేవతలుగాని, మరింకెవ్వరైనా గాని మరొక విధంగా చేయజాలరు. దేవతలకు, పక్షులకు, తదితర కొన్ని జీవ జంతుజాలమునకు ఆకాశగమనాది సిద్ధులు వస్తు స్వభావంగా స్వతఃసిద్ధంగానే ఏర్పడుచూ ఉన్నాయి. చంద్రుడు తన శీతలత్వము త్యజిస్తాడా? సూర్యుడు తన కిరణాలలోని ఉష్ణమును వదలి ఉంటాడా? అవన్నీ కూడా వాటి వాటి నియతిని వదలకయే ఉంటాయి కదా! సర్వజ్ఞుడైనా, మహజ్ఞుడైనా, మరెవ్వరైనా నియతిని అనుసరించే చరిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లంతటివారు కూడా నియతికి లోబడే లోకములను పరిపాలిస్తూ ఉంటారు.

కనుక రామా! నీవు చెప్పిన ఆకాశగమనాదులన్నీ ద్రవ్య, కాల, క్రియా, మంత్రప్రయోగ అభ్యాసముల స్వాభావిక సిద్దులని గ్రహించు. అంటే ఏమిటో చెపుతాను ...విను.

విషం ఉన్నదనుకో, అది 'ప్రాణులను చంపుట' అనే పాదార్థికధర్మం కలిగి ఉంటోంది. మద్యము మత్తు కలిగించుట' అను ధర్మమును కలిగి ఉంటోంది. తేనె 'పైత్యము మొదలైన రస దోషములను నిగ్రహించుట' అనే ధర్మం కలిగియున్నది. అలాగే ఉమ్మెత్త ఫలములు కొన్ని మానవ శరీర దోషములను నివారిస్తాయి. అవన్నీ ఆయా పదార్థముల ధర్మములు.

అట్లాగే ఆ శరీరంలో కొన్ని గూఢ శక్తులు ప్రకృతిచే పదిలపరచబడి ఉన్నాయి. యోగముచే, ద్రవ్య, కాల, క్రియాదుల సహాయంతో ప్రాణములను కేంద్రీకరించుటచే ఆయా సిద్ధులు సాధకునకు లభిస్తాయి. శరీరంలోని కొన్ని కేంద్రస్థానాలలో ప్రాణములను ప్రతిక్షేపించి యోగాభ్యాసం చేయుటచే శరీరం గాలిలో తేలియాడగలదు. దూరశ్రవణము, భవిష్యత్ గ్రహణము, దూరంగా ఉండి ఆశ్రితులకు రోగనివారణం చేయటం మొదలైనవి కూడా అట్టి యోగాభ్యాసకులకు సాధ్యపడగలవు. అయితే...

ఆత్మజ్ఞాని ద్రవ్య, క్రియా, కాల రూపముగల అవిద్యకు పరమైన అభ్యాసం కలిగియుంటాడు. అఖండము. అప్రమేయము, నిత్యము అగు స్వస్వరూపాత్మయే ఆతని సాధనయొక్క సాధ్యము కదా! అందుచేత ఆతడు సిద్ధుల విషయంలో కర్తృత్వాకర్తృత్వములు వహించి ఉండడు. ఎందుకంటే, ఈ ద్రవ్య, దేశ, కాల, క్రియాదులన్నీ కూడా తత్త్వజ్ఞాన జనితమైనట్టి పరమాత్మ పదము”నకు ఉపయోగ పడేవికావు. అయితే, కొందరికి సమగ్ర సృష్టి చమత్కారమును అనుసరించి ప్రకృతిచే సిద్ధులు ప్రసాదించ బడుతూ పరమాత్మకు సంబంధించినవని గమనించి, తాను ఇచ్ఛారహితుడై ఉంటాడు.

ఇక మరికొందరో... అట్టి సిద్దుల పట్ల 'పొందాలి' అను రూపముతో కూడిన ఆవేశం కలిగి ఉంటారు. ఎవనికైతే కోర్కెలు ఉంటాయో, ఆతడు మాత్రమే సిద్దులు సంపాదించటానికి ప్రయత్నపరుడై, ఆవే పరుడై తాపత్రయపడుతూ ఉంటాడు. కోర్కెలే ఆత్మజ్ఞాన సముపార్జనలో విఘ్నకరములు కదా!

ఇక ఆత్మజ్ఞాని ఎల్లప్పుడూ పరిపూర్ణుడై ఉంటాడు. కనుక ఆతనికి ఎట్టి కోర్కెలూ ఉండవు. సర్వ కోర్కెలూ శమించగా, ఆత్మలాభోదయం అయిన తరువాత... ఇక, తద్విరుద్ధమైన అల్పలాభముల పట్ల ఆసక్తిగాని, కోరికగాని ఎవరికుంటుంది? సర్వ సహజీవులను తన ఆత్మ యందు, సర్వ జీవుల యందు తన ఆత్మను సదా సందర్శిస్తూ ఉంటాడు.

Page:668

జ్ఞాని విషయంలో కావచ్చు, ఆజ్ఞాని విషయంలో కావచ్చు... ఒక్క మాట మాత్రం నిజం. ఒకడు తనకు ఎట్టి ఇచ్ఛ జనిస్తుందో, అట్లే ప్రయత్నములు చేస్తూ ఉంటాడు. ప్రయత్నం కొనసాగుతుంటే కాలక్రమేణా అద్దానినే పొందుతాడు. ఇప్పుడే మనం వీతహవ్యమహా ముని విదేహముక్తి గురించి చెప్పుకున్నాం కదా! ఆతడు జ్ఞానాభిలాషి అయి, జ్ఞానము కొరకే ప్రయత్నించాడు. జ్ఞానాభ్యాసం కొరకు వింధ్యారణ్యం ప్రవేశించాడు. జ్ఞానమును పొందాడు. మధ్యలో ఎక్కడా విరమించలేదు. కనుక.... పొందవలసినది పొందాడు. అట్లాగే సిద్ధులు (Supernatural powers) కూడా. అవన్నీ ఆయా జీవులు ఇచ్చతో దేశ, కాల, క్రియాదియుక్తులచే ప్రయత్నించి సముపార్జించుకునేవే. అవన్నీ ప్రయత్నరూప వృక్ష ఫలములే. అయితే, ఆత్మ సుఖం పొందే మహాత్ముల దృష్టిలో అవన్నీ అల్పకాలిక స్వల్పవిషయములే అయి ఉంటున్నాయి.

మహతాం నిత్యతృప్తానాం తజ్ఞానాం భావితాత్మనామ్ |

ఈహితం సంప్రతానాం నోపకుర్వన్తి సిద&ధయః ॥ (శ్లో 38, సర్గ 88)

ఓ రామా! నిత్యతృప్తులును, భావితాత్ములును, అభిలషితమగు ఆత్మసుఖమును పొందినవారును అగు ఆత్మజ్ఞూలైన మహాత్ములకు సిద్ధులేమియు ఉపకరింపవు.

శ్రీరాముడు : హే మహర్షీ! మీ సమాధానంతో నేను ఎంతో తృప్తి పొందాను. మనం 'ఉపశమన ప్రకరణం సమీక్షించుకుంటున్న సందర్భంలో ఇప్పుడే మీరు చెప్పి ఉన్న 'వీతహవ్య అంతర్ మథనం’లో నాకు కలిగిన రెండు సందేహాలు మీ ముందుంచాలని ఉన్నది.

శ్రీవసిష్ఠ మహర్షి : సంతోషం. అడుగు.

శ్రీరాముడు : 1. వీతహవ్యుని దేహం వింధ్య పర్వత ప్రాంతంలోని ఆతని పర్ణశాల సమీపంలో బురదలో చిక్కుకుని 300 సంవత్సరాలు ఉన్నది కదా! అంతకాలం ఆతని దేహం హింసక జీవులచే ఎందుకు భక్షింపబడలేదు?

2. వీతహవ్యుడు దేహభావం విడచి సమాధిలోకి వెళ్ళి, ఆ సమాధి ఉపసంహరించటానికి ముందే మనస్సుతో ఏవేవో అనుభవాలు పొందాడు. శరీరం తిరిగి పొందటానికి ముందే విదేహముక్తి పొందవచ్చు కదా? మరల సూర్యుని ఆరాధించి భౌతిక దేహం ఆశ్రయించటం దేనికి? అట్లాగే దేహంలో ప్రవేశించిన మరుక్షణమే విదేహముక్తి పొందవచ్చు కదా! మరల ఒక గుహలో ప్రవేశించి ఇంద్రియములు, చిత్తము మొదలైన వాటితో సంభాషించి, ఆ తదుపరియే విదేహముక్తిని ఆశ్రయించ వలసిన పనేమున్నది!

శ్రీవసిష్ఠ మహర్షి : అందుకు కారణము లేమిటో చెపుతాను... విను.

యోగాభ్యాసము లేని జీవునియొక్క సంవిత్తు అనేక రాగద్వేషములతో కూడిన మలిన వాసనలు కలిగిఉంటుంది కదా! తత్ఫలితంగా అట్టి జీవుల దేహములు "దుఃఖించుట, ఆవేశకావేషాదులు పొందుట - నీరసించుట” మొదలైన దీనస్థితి పరంపరలన్నీ పొందవలసివస్తోంది. అయితే, ఉత్తమ

- యోగములచే అవిద్యాంశము నశిస్తోంది. యోగముచే ప్రాణములను ఏకాగ్రపరచిన సాధకుల భౌతిక శరీరం వారి సంకల్పానుసారం వజ్రంవలె అభేద్యమౌతూ ఉంటుంది.

Page:669

శ్రీరాముడు : ఎట్టి యుక్తిచే యోగి యొక్క శరీరం 'ఛేదన' మొదలైనవి పొందక, వక్రీభూతమౌతుంది? అట్టి యోగయుక్తి లేక, ప్రాణనిష్ఠ యొక్క రూపమెట్టిది? అది అందరికీ సాధ్యపడుతుందా? లేక, కొందరికి మాత్రమేనా?

శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణశక్తికి మనస్సుకు భౌతిక దేహమునకు ఒకానొక విచిత్రమైన సంబంధం ఉన్నది. ఆ సంబంధమును అనుసరించే వీతహవ్యుని దేహంలో ప్రాణములు సంచలన రహితమైనప్పుడు సూక్ష్మత్వం పొందటం, దేహం దీర్ఘకాలం శిథిలం కాకపోవటం, మనస్సు ప్రారబ్ధ కర్మలు అనుభవించి తిరిగి శరీరంలో ప్రవేశించటం, మనస్సు శరీరంలోకి అడుగుపెట్టగానే ప్రాణాలు పునఃసంచలనం ప్రారంభించటం, శరీరం ఉత్తేజమవటం - ఇవన్నీ జరిగాయి. ప్రాణశక్తిని ఎరిగిన యోగులకు ఈ విషయాలు సుపరిచయాలే. ఈ విశేషాలు మనం ఉత్పత్తి ప్రకరణంలో కొన్ని సందర్భాలలో ప్రస్తావించుకోవటం జరిగింది. ఇప్పుడు సందర్భోచితమే కనుక, ఈ శరీర - - మనో - ప్రాణాలకు ఏర్పడి ఉన్న పరస్పర సంబంధముల విషయమై కొన్ని విశేషాలు చెపుతాను. అప్పుడు నీ మొదటి సందేహం తొలగగలదు.

చిత్తము జీవునిలో ఉండే ప్రియ, అప్రియముల స్వభావం చిత్రీకరిస్తూ ఉంటోంది. మనస్సు మననస్వభావం జీవుని నడిపిస్తూ ఉంటుంది.

చిత్తము ఎప్పుడెప్పుడు ఏ పదార్థములందు సంలగ్నమై ఉంటుందో, అప్పుడప్పుడు అది ఆయా పదార్థముల రూపమే పొందుతూ ఉంటుంది. ఈ చిత్తము, "ఈతడు నాకు అయిష్టుడు అని భావోద్వేగం పొంది ఒకనిని చూస్తున్నప్పుడు ఆతడి అనేక కదలికలు అట్టి అయిష్ట వికారములను మనస్సుకు కలిగిస్తాయి. ఇతడు నాకు స్నేహితుడు, ఇష్టుడు" అని అనుకుంటుంటే అతని అవే కదలికలు, చర్యలు సంతోషమును కలుగజేస్తూ ఉంటాయి. ఈ విషయం అందరికీ అనుభవమయ్యే విషయమే.

ఒక రాగద్వేష రహితుడైన బాటసారి త్రోవలో పొలములను, వృక్షములను చూస్తున్నప్పుడు ఎట్టి మనోవృత్తులకూ లోనుకాడు. అట్లుగాక, ఆయా రాగద్వేష మనోవృత్తులతో సంతప్తమైన చిత్తము గలవాడు ఆ బాట నుండి వెళ్ళుచున్నప్పుడు, “ఈ చెట్లు మావి, ఆ పొలం ఒకప్పుడు మాది, ఈ స్థలం మా ఊరివారిది, ఇక్కడి తోటలు మా బంధువులవే, ఆ తోపులు వేరే వర్గం వారికి చెందినవి” - అను మనోవికారములన్నీ పొందుతాడు. ఇది కూడా అందరికీ ప్రతిరోజూ అనుభూతమయ్యే విషయమే.

అట్లాగే తనకు రుచించే పదార్థములను చూచిన మనస్సు చపలం పొందుతుంది. వెంటనే ఆ చంచల మనస్సు దేహంలో కొన్ని వృత్తులను, భౌతిక సంఘటనలను కలిగిస్తుంది. ఆ దేహం అందుకు ప్రతిస్పందిస్తోంది. ఆ విధంగానే అదేవ్యక్తి తాను ద్వేషించే చూచాడనుకో... ఆతని మనస్సు అరుచి, ఏహ్య వృత్తులు పొందుతుంది. ఆ వృత్తులు ఆతని దేహంలో వికారాదులు

Page:670

కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనస్సుకు, భౌతిక దేహానికి ఏర్పడే పరస్పర ప్రవృత్తి ప్రభావాలు అందరు ఎరిగినవే.

ఇప్పుడు ఈ చిత్తవృత్తులు తదితరులపై ఎట్టి ప్రభావం కలిగిస్తాయో గమనిద్దాం. ఒక జీవుడు 'దయ, ప్రేమ’వంటి ప్రవృత్తులను మరల మరల ప్రకటించుటచే, ఆతడు కాలక్రమేణా తదితరులపై కూడా ఒకానొక ప్రభావము కలిగి ఉంటాడు. అనగా తదితర జీవులు కూడా ఆతనిని దయ, ప్రేమలకు అర్హుడుగా గాంచుతారు. అట్లాకాకుండా, ఈ జీవుడు ద్వేష - ఆవేశ - క్రోధాదులు మరల మరల ప్రకటించుటచే అట్టి జీవుడు అదే రీతి అయిన ప్రతి స్పందనకు అర్హుడగుచున్నాడు. ఈ విధంగా ఆయా వృత్తులు అదేవిధమైన అసంకల్పిత ప్రతిస్పందనలుగా తదితరులపై ప్రభావిత మవుతూ ఉంటాయి. ఎందుచేత?

ఒక చిత్తము యొక్క అంతర్గత వృత్తులు అదేవిధమైన సంస్కారములతో కూడిన తదితర చిత్తములలో ప్రతిబింబపూర్వక ప్రభావమును కలిగి ఉంటూ ఉంటాయి కాబట్టి!

ఇప్పుడు మనం రాగ - ద్వేష - వైషమ్య రహితుడగు యోగి విషయానికి వద్దాం. సంవిద్విలాసం చేత (Presence of Pure - Self) పూర్ణమానసుడగు యోగి శరీరముపై హింసక జీవుల చిత్తము ప్రసరిస్తున్నదనుకో... అప్పుడు తేలు, కీటకం మొదలైన ఆ హింసక జీవుల చిత్తము నందు యోగి యొక్క సంవిత్తు ప్రతిబింబించగానే అవి 'సమత్వము'అనే అనుభవమును పొందుచున్నాయి. అనగా వాటిలో హింసించు స్వభావము ఉపశమించి, 'సాత్వికము, శాంతము' రూపు దిద్దుకుంటున్నాయి. ఒక యాత్రికుడు మార్గ మధ్యంలోని 'దేవాలయం, యోగుల ఆశ్రమం' మొదలైన పవిత్ర విషయాలను చూస్తున్నప్పుడు తన లోని సాంసారిక ఉద్వేగమును మరచి కించిత్ సాత్వికతతో వినమ్రుడగుచున్నాడు. అట్లాగే హింసించు స్వభావం గల జీవులు ఆ యోగి యొక్క సంవిత్తు ప్రభావం చేత దైవీ గుణముల వైపుగా ప్రభావితమై ఉంటాయి. మహనీయులగు ప్రశాంతపురుషుల ఆశ్రమాలలో (పురాణాలలో వర్ణించిన కణ్వమహర్షి ఆశ్రమం మొదలైనవి) సింహము, పులి, పాము, తేలు మొదలైన స్వాభావిక హింసక జీవులు శాంతి, అహింస, ప్రేమలను వహించటానికి ఇదియే హేతువు. సమదర్శియగు యోగి యొక్క సంసర్గముచే అవన్నీ రాగ ద్వేషములనుండి విడివడుచున్నాయి. అట్టి కారణం చేత వీతహవ్యుని శరీరమును సమీపించిన కీటకాదులు కుట్టటం, హింసించటం, భక్షించటం మొదలైన స్వాభావిక క్రియలందు ప్రవృత్తం కాలేకపోయాయి.

ఆ హింసక జీవులు ఆ స్థానం విడచి దూరం వెళ్ళగానే మరల తమ స్వాభావికమగు హింసించు స్వభావమునందు ప్రవృత్తమౌతూ ఉంటాయి.

గమనిస్తున్నావా, రామచంద్రా! ఉదాహరణకు, ఒకడు తన సహజీవులపట్ల అకృత్రిమమైన స్వభావసిద్ధమైన ప్రేమ, కరుణ దైనందికంగా అభ్యసిస్తున్నాడనుకో. ఆతని పట్ల సహజీవులు కూడా అదేరకంగా అకృత్రిమమైన, స్వభావసిద్ధమైన ప్రేమతో అసంకల్పితంగా స్పందిస్తూ ఉంటాయి. కోపంగా ఉండే స్వభావం గలవారు, తిరిగి అసంకల్పితంగా కోపగించబడతారు. ఒకని గుణములే

Page:671

తిరిగి ఆ గుణముల ప్రతిస్పందనకు సహకారికారణములు అగుచూ ఉంటాయి. ఈ రీతిగా ఈ జీవుడు తనకున్నదే తాను పొందుచున్నాడు సుమా!

కారణం?... ఒకే చిత్ శక్తి అన్ని జీవులలోనూ ప్రసరించి ఉన్నది కదా! అందుచేత జీవులన్నీ ఒకదానిచే మరొకటి పరస్పరం స్వస్వభావానుసారం ప్రభావితమవటం సహజమే!

శ్రీరాముడు : జీవమున్నచోటే చిత్ శక్తి అజీవుని మనస్సునందు ప్రతిబింబిస్తుందా? లేక, చిత్ శక్తి (ఆత్మతత్త్వం) జీవం, మనస్సు' లేని చోటకూడా ఏర్పడియే ఉంటుందా?

శ్రీవసిష్ఠ మహర్షి : చిత్ శక్తి అంతటా ఆక్రమించియే ఉన్నది. కొయ్య, మట్టి, శిల, లోహం -అన్నిటి యందూ సత్తా సామాన్యరూపమున చిత్ శక్తి ఏర్పడి ఉండనే ఉన్నది. అయితే కాష్ఠ - లోష్ఠ శిలాదులందు మూగబాలుని వలె మౌనరూపమున ఉంటోంది. సూర్యకాంతి అంతటా ప్రసరించి ఉన్నప్పుటికీ సూర్యబింబం జలంలో మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఆ చిత్ శక్తి కేవలం పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనో, బుద్ధి యుక్తము అగు సూక్ష్మ శరీరమునందు మాత్రమే మనోచంచలనసహితమై, పరిచ్ఛిన్నమై కన్పట్టుచున్నది.

పై కారణాల చేత 'నిర్వికారస్థితి, బ్రహ్మభావన' పొందిన ఆ వీతహవ్యుని దేహం సర్వత్రా సమరూపమున ఉన్న భూజలాదులందలి సంవిత్తు యొక్క ప్రతిభచే, వికారములు పొందక నిశ్చలమై భూమిలో ఉండిపోయింది.

ఓ రామచంద్రా! ఈ విషయంలో నీకు మరొక యుక్తి కూడా చెపుతాను విను. అసలు దేహం శిథిలం అవటానికి కారణమేమిటి?... అంతఃకరణము యొక్క 'చేష్ట'లేక 'స్పందన' దేహ శైథిల్యమునకు, నాశనమునకు కూడా కారణమగుచున్నది.

దానినే మనం 'శరీరము యొక్క చేష్ట' అను అభిప్రాయంతో చూస్తూ ఉంటాం. అట్టి స్పందన రూపమగు 'దేహనాశనము' అనే వికారం ప్రాణజనితములగు జగద్వ్యవహారములలో మనకు ప్రసిద్ధమై కనబడుతోంది.

ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు స్పందమే (చలనమే) దేహచలనము (జీవనము). ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు అస్పందమే దేహనిస్తేజము (మరణము).

అయితే, అట్టి ప్రాణముల చలనము ఉపశమింపబడి, దేహంలో ఒక స్థానంలో యోగుల చేత ఉద్దేశపూర్వకంగా కేంద్రీకరించబడినప్పుడు, సంచలన రాహిత్యం చేత ఆ జీవుని ఆ ప్రాణములు శిల వలె దృఢీభూతమై ఉంటాయి. అట్టి కేంద్రీకృత ప్రాణముల ప్రభావం చేతనే వీతహవ్యుని భౌతిక శరీరం ఎట్టి మార్పు పొందకుండా దీర్ఘకాలం ఉండిపోయింది.

బాహ్యమున హస్తపాదాదులతోనూ, అభ్యంతరమున ప్రాణములతోనూ కూడిన ఈ శరీరం ప్రాణవాయువుల స్పందనచేతనే ప్రవర్తిస్తోంది. ప్రాణవాయువుల స్పందనమే 'చిత్తము యొక్క

Page:672

బీజము' అని కూడా గ్రహించు. ఎవనియందైతే ప్రాణవాయువుల స్పందన యోగాభ్యాసం చేత నిరోధించబడి, సుస్థిరీకరించబడి ఉంటుందో - అట్టివాని దేహమునకు వృద్ధి క్షయాలు ఉండవు. అట్లు ప్రాణముల బాహ్య, అభ్యంతర స్పందనము ఉపశమించినప్పుడు దేహమున ఉన్న చర్మము, మాంసము మొదలైన ధాతువులు తమ స్థితిని ఎన్నడూ వీడకయే ఉంటాయి. అనగా, యోగముచే స్థంభింపబడిన ధాతువులు ప్రాణసంచలనము నిరోధించినప్పుడు మేరువువలె స్థిరత్వం పొందుతాయి. అట్టి ధీరులగు యోగుల శరీరములు కాష్ఠములాగా (కొయ్యలాగా) స్థిరమై, అచంచలత్వం పొందుతాయి. అప్పుడు తదితర ప్రాపంచిక జీవులకు ఆ శరీరం చంచలత్వం లేని మృతదేహపు అవయవములవలె కన్పట్టుచూ ఉంటుంది. కానీ, ఆ యోగి ప్రాణశక్తి యొక్క ప్రత్యుత్సాహం మౌనసంకల్ప రూపంగా దేహము నందు దాగి ఉంటుంది.

ఈ కారణంచేత యోగుల శరీరములు వందల, వేల సంవత్సరములు కూడా నీటిచేత తడవక, భూమియందు శిలలాగా శిధిలముకాక ఉండగలవు.

ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకు వద్దాం. "జ్ఞానశ్రేష్ఠుడగు ఆ వీతహవ్యడు శరీరంలో తిరిగి ప్రవేశించకుండా కైలాసం నుండే విదేహముక్తిని ఆశ్రయించవచ్చు కదా? అని ప్రశ్నించావు కదా?

ఆత్మజ్ఞానులు, వీతరాగులు, మహాధీమంతులు, సర్వసంసారగ్రంథులు ఛిన్నమైనట్టివారు అగు మహాత్ములు తమ దేహం విషయంలో సర్వస్వతంత్రులై ఉంటారు. అట్టి యోగులగు తత్వజ్ఞుల మనస్సు కాకతాళీయ న్యాయముచే ప్రారబ్ధంగా ప్రాప్తించి ఉన్న ఆయా విధులందు భావన కలిగి ఉండటం స్వభావసిద్ధంగా ఏర్పడి ఉంటోంది. ఈశ్వరశక్తి గాని, మరింకే శక్తి గాని ఆ యోగి యొక్క వర్తమాన, పూర్వజన్మల ప్రారబ్ధశేషానుభవమునకు అనుకూలంగానే ప్రవర్తిస్తాయి. దానిని మరింకెవరూ మరొక విధంగా తీర్చిదిద్దలేరు. ఇది ఎట్లా అంటే, సర్వమునకు అతీతత్త్వము సముపార్జించుకున్న జ్ఞాని కూడా ఒక ఉపకారికి ప్రత్యుపకారం చెయ్యాలని అనుకోవటం వంటిది.

వీతహవ్యుని సంవిత్తు కాకతాళీయంగా "నేను నా పూర్వప్రాణ సహిత వీతహవ్యదేహంలో ప్రవేశించి మరికొంత విచారణ చేస్తాను. ఆ తరువాత విదేహముక్తిని ఆశ్రయిస్తాను" అను సంకల్పమును ప్రారబ్దానుసారంగా ఆశ్రయించింది. అందుచేతనే రుద్రగణంలోని సహచరుని సంప్రదించి సూర్య భగవానుని శరణువేడింది. ఆ సంవిత్తు “నాకు నేనుగా శరీరంలో ప్రవేశిస్తాను అని అనుకోకపోవటానికి కారణం కూడా ప్రారబ్ధ శేషమే. సంవిత్తు ఇతఃపూర్వపు స్వయంకల్పితమగు ప్రారబ్ధమును అనుసరించే వర్తించటము ఈ చరాచర సృష్టి నియతి యొక్క చమత్కారమేనని అనుకోవాలి. యోగమును పరాకాష్ట వరకు ఆశ్రయించి ఉండుట చేతనే ఆతడు శరీర త్యాజ్యం విషయంలో సర్వస్వతంత్రుడైనాడు. వాసన సంపూర్తిగా రహితమై ఆతడు సర్వబంధముల నుండి వినిర్ముక్తుడై నేను అఖండము, అప్రమేయము, నిత్య ఆత్మనే అనునట్టి ఆత్మరూపమున ఆవిర్భవించారు. అట్టి స్థితిలో సదేహం, విదేహం' -అన్నీ ఆతని సర్వస్వాతంత్ర్య స్వభావమును అనుసరించే ఉంటాయి.

Page:673

ఆతడు సర్వ శక్తియుతుడగు పరమేశ్వరుడే అయ్యాడు. అందుచేత ఆతడు దేనిని వాంఛించాడో

దానినే శీఘ్రంగా పొందటం జరిగింది. విచారణచే చిత్తము నశించగా మహామైత్రి, మహాకరుణ” - మొదలైన మహత్తర గుణములు ఆతనికి స్వభావసిద్ధం అగుచున్నాయి. ఓం నమో వీతహవ్య పరమేశ్వరాయనమోనమః

2. చిత్తోపశమనం

శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా రామా! మనం ఈ ప్రకరణంలో ముఖ్యంగా గమనించవలసినదేమిటి? చిత్తము ఉపశమిస్తే జీవునకు సర్వ శుభములు కలుగుతాయి. ఎక్కడ చిత్తము నశిస్తే, అక్కడే 'మైత్రి, కరుణ' మొదలైన సద్గుణములన్నీ స్వతఃగా ఉత్పన్నమై ప్రకటితమౌతాయి. అనగా అవి 'స్వాభావ సిద్ధత'ను సంతరించుకుంటూ ఉంటాయి.

శ్రీరాముడు : హే మహర్షీ! ఒకనిలో తీవ్రము, సూక్ష్మము అగు ఆత్మవిచారణచే చిత్తము ఆత్మయందు లయించిందనుకోండి. అప్పుడాజీవుడు నిర్వికారుడు, నిర్విషయుడు అవుతాడు కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును.

శ్రీరాముడు : అప్పుడిక 'మైత్రి, కరుణ' మొదలైన గుణములు ఉత్పన్నమవటానికి చోటు ఉంటుందా? చిత్తమే ఉండనప్పుడు, గుణములెక్కడ ఉంటాయి? మరి అట్టి గుణములు ఉత్పన్నమౌతాయని ఎట్లా చెప్పుచున్నారు?

హే మహావక్తా! మునిశ్రేష్ఠా! ఒకసారి చిత్తము బ్రహ్మమునందు లయమయిన తరువాత ఇక ఆపై మైత్రి కరుణ మొదలైన గుణములు కలిగేది ఎద్దానికి?...

లయించిన చిత్తమునకా? లేక అధిష్ఠానమగు ఆత్మకా? కాక, అధిష్ఠానమగు ఆత్మలోనా? లేదా, బింబరూపమగు చైతన్యమునందా? కాదా, 'చిదాభాసుడు అనబడే చైతన్య ప్రతిబింబమగు జీవాత్మయందా?...

ఈ విషయం దయచేసి విశదపరచండి. ఎందుకంటే... మృగతృష్ణలోని జలం గడ్డకట్టి ఉన్నది, మరొక చోట ప్రవాహపతితమై యున్నది అను వ్యతిరిక్త వాక్యాలులాగా చిత్తమే ఉండనప్పుడు ఇక గుణముల ప్రసక్తి ఎక్కడిది?

శ్రీవసిష్ఠ మహర్షి : పూర్ణము, సుఖ స్వరూపము అగు ఆత్మ సంవిత్తు ఒకానొక సమయంలో ఒక చోట మలిన వాసనాజాలము కలిగి ఉంటోంది. అట్టి మలిన వాసనా జాలము జన్మ సమూహములకు, సుఖదుఃఖ భరిత అధ్యాసలకు కారణమగుచున్నది.

మలినవాసనలు' అంటే ఏమిటి?... నేను ఈ శరీరమును. శరీర పరిమితుడను. ఈ

శరీరంలో గల ఇంద్రియములే నా ఉనికి. ఈ ఇంద్రియ విషయములచే నేను బద్ధుడను. ఇంద్రియాలు

Page:674

లేకుంటే నాకు ఉనికి (సత్) లేదు. ఇంద్రియములు ఉంటే, వాటి విషయములచే నియమితుడ నగుచున్నాను. ...ఇట్టి దృష్టిని ఆత్మ సంవిత్తు కలిగి ఉంటోంది. అదియే అజ్ఞచిత్తము. అదియే మలినమగు మనస్సు. అదియే సంసారము యొక్క రూపము. 'జీవుడు' అనగా అట్టి అజ్ఞాన దృష్టి, మనస్సు గల చిదాత్మయే కదా!

మరల చెప్పుచున్నాను. అజ్ఞాని యగు జీవుని యందు వాసనా జాలముచే ఏదైతే దృఢంగా ప్రతిష్ఠించబడియున్నదో... అద్దానిని మనస్సు అని చెప్పుకుంటున్నాం. అట్టి మనస్సు సమరూపం పొందినప్పుడు అట్టి జీవుని మనం జీవన్ముక్తుడు అని అంటున్నాం. దోషపూరితమగు మనస్సు నశిస్తేనే ఈ జీవుడు బంధభావములనుండి విడివడగలడు.

శ్రీరాముడు : మహాత్మా! నశించే మనస్సేది? నశించని మనస్సేది? అసలు మనస్సు అనేది నశిస్తుందా? మనస్సు నశిస్తే ఆ జీవునకు వ్యవహారసామర్థ్యం ఉంటుందా? మనస్సు నశించిన తరువాత మైత్రి, కరుణ మొదలైనవి ఎట్లా ఏర్పడి ఉంటాయి?

శ్రీవసిష్ఠమహర్షి : ప్రశ్నించువారిలో ఉత్తముడవగు, ఓ రామచంద్రా! ఇప్పుడు నీకు మనో నాశనము’ లేక, చిత్తోపశమనము’ అంటే ఏమిటో విశదపరుస్తాను. అప్పుడు నీ సందేహాలన్నీ పటాపంచలౌతాయి.

ఒకడు ఒక పెద్ద కొండను సమీపించి నోటితో ఊదుతూ ఉంటే... ఆ కొండ రెపరెప లాడుతుందా? ఏ ధీరుడైతే తనకు తారసపడే ఆయా సుఖదుఃఖ దశలు వచ్చిపోతున్నంత మాత్రం చేత తన యొక్క అఖండ - అప్రమేయ, నిత్య, నిర్మల ఆత్మ భావననుండి చ్యుతుడు కాడో - అట్టివాని చిత్తము, లేక మనస్సు నశించినట్లే. ఏ విజ్ఞాన సమన్వితుడినైతే 'ఈ అల్ప దేహమే నేను. తదన్యంగా మరింకేమి గాను' అను రూపంగల దేహాత్మభావన ప్రభావితమై ఉండజాలదో - ఆతనికి చిత్తము లేనట్లే. పునర్జన్మ కారకమగు సాంసారిక భావన ఉన్నప్పుడే దానిని చిత్తం’ అని పిలుస్తాం. ఎప్పుడైతే చిత్తము ఆత్మ స్వభావమును సంతరించుకుంటుందో ఇక అది ఆత్మస్వరూపమే అవుతుంది.

సంసారమున్న చోటే చిత్తము ఉంటుంది. సంసారము రహితమైతే ఇక అది 'చిత్'యే అవుతుంది. దానిని మనం చిత్తము అనిపిలువం. కనుక 'చిత్తం లయించింది' అన్నంత మాత్రంచేత “ఆలోచనలన్నీ అంతమై ఆతడు నిష్క్రియుడు అవుతాడు" - అని అనుకోవద్దు. సర్వ ఆలోచనలకు ఉత్పత్తి స్థానమైన స్వాత్మస్థానము నందు ప్రతిష్ఠితుడౌతాడు" అని గ్రహించు.

చిత్తము నశించినవాని యందు ఆపద, సంపద, విపత్తు, మహోత్సవం' వంటివన్నీ కొండను తాకే పిల్లగాలుల వలె బాహ్యస్థమైపోతాయి. ఈ ప్రపంచ విషయములన్నీ వాటి రాక పోకలతో సహా అప్రభావితమగునప్పుడే 'చిత్తము రహితమైనది' అని శాస్త్రములు అంటున్నాయి.

చిత్తము యొక్క రూపమేమిటి? మూఢత్వం కలిగి ఉండటమే. పరమార్థమును వదలి దృశ్యమును మననం చేస్తూ కార్య కారణములకు అధీనమయి ఉండుటయే దృశ్యతాదాత్మ్యం. మూఢత్వం

Page:675

తొలగితే మేఘాలు తొలగినప్పుటి సూర్యుని వలె సత్స్వభావం పూర్ణంగా ఉదయించగలదు. అట్టి సత్స్వభావము నుండి చ్యుతి పొందనప్పుడు చిత్తము రహితమైనట్లే. జీవన్ముక్తుడు సత్స్వభావమును ఆశ్రయించి ఉంటాడు. ఆతనిలో శేషించే దృశ్యవ్యవహారమును 'శుద్ధ చిత్తము' అని కూడా అంటారు.

శుద్ధ చిత్ స్వభావుడు - “శుద్ధ చిత్ స్వభావుడు (లేక) శుద్ధసంవిత్ స్వరూపుడు అగు జీవన్ముక్తుని యందు అత్యంత అకృత్రిమంగా పరిమిత దృష్టులన్నీ తొలగిపోయి ఉంటాయి. అందుచేతనే ఆతనియందు మైత్రి, కరుణ మొదలైనవి స్వభావసిద్ధంగా ప్రకటితమౌతాయని నేను చెప్పటం జరిగింది. వారు స్వభావసిద్దంగానూ, అకృత్రిమంగానూ ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు. అంతేగాని, పునర్జన్మ కారకమగు ఆశ చేతనో, ప్రతిష్ఠకొరకో కాదు. ఎందుకంటే, 'నేను ఆత్మను' అను అనుభవం గల చిత్స్వభావుడు తన స్వరూపమునే సర్వే సర్వత్రా గాంచుచున్నాడు. అమ్మ ఏ ప్రతిఫలం కోరకుండా పుత్రునియందు అవ్యాజమైన ప్రేమ తన స్వభావంగా కలిగి ఉంటుంది కదా!

జీవన్ముక్తుడు సర్వులను తనవలెనే గాంచుచూ ఉంటాడు. అందుచేత ఆతని అప్పటి 'మైత్రి, కరుణ అసంకల్పితములు, స్వభావసిద్ధములు. అందుచేత, అవి పునర్జన్మ హేతువులు కాజాలవు.

అసలు చిత్తము అంటే ఏమిటి?"... ఈ దేహము కంటే విలక్షణమైనట్టి 'సత్త' స్వరూపుడగు దేహి తన స్వరూప సత్తను ఏమరచి ఈ దేహములో ఏర్పడి ఉన్న ఇంద్రియములకు విషయములు అగుచున్న వాటిలో భావనా పూర్వకంగా ప్రవేశించి, వాటి ప్రభావములగు సుఖ-దుఃఖ భావ పరంపరలను అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా పొందటాన్నే శాస్త్రజ్ఞులు 'చిత్తము' అని పిలుస్తున్నారు. తత్త్వశాస్త్రములు (మోక్ష శాస్త్రములు) జీవునకు విషయముల నుండి వెనుకకు మరలి, స్వస్వరూప సత్త యందు అచ్యుతుడై ఏర్పడి ఉండటం ఉద్బోధిస్తున్నాయి. దానినే 'చిత్త నాశనం అంటున్నాయి.

ప్రతి జీవుని యందు సర్వదా ఏర్పడి ఉన్నది ఏకైక స్వసత్తయే కదా! అందుచేత విషయములచే ఏర్పడిన 'గుణ - కర్మ' భేద విభాగమంతా స్వసత్తయందు ఉద్బోధితుడైనవానికి ఉపశమించిపోతాయి. సత్వము అనే చంద్రకిరణ స్వరూపమగు సంతుష్టి ప్రకటితమగుచుండగా ఆ జీవన్ముక్తునికి సాత్విక గుణములు స్వభావ సిద్ధమైపోతాయి. అంతేగాని అవి ప్రతిఫలాపేక్ష చేతనో, కర్తృత్వాభిమానంతోనో ఏర్పడే గుణ ప్రకటనకాదు. నా బిడ్డకు స్నానం చేయించాను. తుడిచాను. లాలించాను మరి నాకు ప్రతిఫలం ఏమిటి? ఎవరు ఇస్తారు?" అని తల్లి గొప్పలు చెప్పుకోదు కదా! ఆమె ప్రేమ లాగానే జీవన్ముక్తుని ప్రేమ మొదలైనవి అత్యంత స్వతఃసిద్ధమైనవి అవుతాయి.

అరూపమనోనాశనం - ఇది నిష్కళాత్ములగు విదేహముక్తులకు మాత్రమే కలుగుతుంది. అప్పుడు సర్వగుణములు నిర్మలము, పరమపావనము అగు విదేహముక్తపదము నందు లయించి పోతాయి. అనగా... ‘అరూపము’ అనబడే చిత్తనాశస్థితి విదేహముక్తులకు మాత్రమే విషయమౌతుంది. అది రూపరహితం, దృశ్యరహితం అయినది. దానిని మనం మాటలలో చెప్పుకోలేము.

అట్టి అరూప చిత్తనాశనపదము గుణము కాదు. అగుణము కాదు. సమృద్ధిగాని, అసమృద్ధి గాని కాదు. చంచలముగాని, ఉదయముగాని, అస్తమయంగాని, హర్షముగాని, శోకముగాని,

Page:676

తేజ - అంధకారములుగాని, పగలు - రాత్రులుగాని కాదు. దిక్కులు, ఆకాశము, ఊర్ధ్వ అధో విభాగము, రచన, రాగము, విరాగం, సత్త, అసత్త, సత్తఅసత్తల సంధి రూపం ...ఈ శబ్దాలన్నీ అరూపచిత్త నాశనము గురించి ప్రవచించలేవు.

అది అంధకార, తేజోరహితమైనది. సూర్య, చంద్ర, నక్షత్ర వర్జితమైనది. శరత్ కాల ఆకాశం లాగా అది నిర్మల పదమై అలరుచున్నది. ఆకాశము వాయువునకు స్థానమగుచున్నట్లు... బుద్ధిని, సర్వసంసారాడంబరాన్ని అధిగమించిన మహాత్ములకు ఆ 'అరూపసత్త'యే స్థానభూతమై ఒప్పుచున్నది. అజ్ఞానరజ శూన్యమైనట్టి, ఆకాశంవలె విశాలమైనట్టి, చిత్తలేశమైనా లేనట్టి అరూపసత్త యందు విదేహముక్తులు ఏర్పడి ఉంటున్నారు. ఈ జగత్తులలో కనిపించే సమష్టిబుద్ధి, సమష్టి సంచలనము మొదలైనవి విదేహముక్తుల వినోద విహారమే సుమా!

3. శరీర తదాప్యం - నివారణ

శ్రీరాముడు : హే మహాత్మా! మహర్షీ! అనేక సంరంభములచే అలరారుచున్న ఈ జగత్తు ఎదురుగా ఉండి జీవుడు నిర్విశేషమగు బ్రహ్మమును సంతరించుకోకుండా అడ్డగించుచున్నది కదా! అనేక దుః ఖములతో కూడి ఎదురుగా నిలచి ఎంతో భ్రమింపజేస్తున్న 'సంసారము' అనబడే ఈ వృక్షమునకు అసలు బీజమేది? ఆ బీజం ఎక్కడినుండి వచ్చింది? దానికి ఉత్పత్తి స్థానమేది? ఆ స్థానమునకు ఎక్కడి నుండి, ఎట్లా ఉత్పత్తి ఏర్పడింది?

మా బోధ యొక్క అభివృద్ధి కొరకై అసలు ఈ సంసారమంతా ఎక్కడి నుండి వచ్చిపడుతోందో...

ఆ మూలము గురించి విశదీకరించండి.

శ్రీవసిష్ఠ మహర్షి : "ఈ దేహమే సంసారమునకు అసలైన బీజం" అని చెప్పబడుతోంది. నీకు బయటగా కనబడే ఈ దేహము యొక్క అసలైన రూపం జీవుని యొక్క అంతరంగంలో ఏర్పడి ఉన్నది. శుభ, అశుభ భావనలే దీని అంకురం. కాండమునుండి కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు వృద్ధిచెందుతాయి చూచావా? సంసారము అనబడే అంతఃకరణము యొక్క దోషవిభాగము నుండి కార్య, కారణములు, ఆశలు, సుఖ దుఃఖములు, ఉపాధులు అనునవన్నీ ఉత్పన్నమగుచున్నాయి.

సంసారమునకు స్థానం అంతఃకరణమే. శరీరం అనగా నేను ఈ శరీరమును” అను అంతః కరణము యొక్క వ్యవహారమేనని విజ్ఞులు గమనిస్తున్నారు. మనస్సే పదార్థములు అభివృద్ధి, వినాశములకు స్థానమని సుతీక్షమైన అవగాహన గలవారు తప్పక గ్రహిస్తున్నారు. ఆశించేది, ఆ ఆశల వెంట పరుగులు తీసేది, వాటివలన కలిగే సుఖదుఃఖములను నిర్వచించేదీ, వాటిని త్యజించేదీ అంతా మనస్సే. భూత - వర్తమాన - భవిష్యత్ దేహములను, ఆ దేహములచే పొందే దృశ్య పరంపరలనూ, అన్నిటినీ మోస్తున్నది మనస్సే. జాగ్రత్ నుండి స్వప్నంలోకి వెళ్ళిన మనస్సు ఊహానగరమును సృష్టించుకొని, అందులోకి ప్రవేశించి అనేక అనుభవములను పొందుతోంది.

Page:677

మనస్సు సంకల్పించుట' అను ప్రక్రియను తన యొక్క మూలముగా కలిగి ఉన్నది. కుమ్మరి యొక్క ఆలోచనలను అనుసరించి మట్టితో అనేక ఆకారములు గల కుండలన్నీ తయారగుచున్నట్లు, మనస్సుచే దృశ్యత్వము, ఆ దృశ్యమునకు విషయములగు ఈ జగదనుభవములు తయారగుచున్నాయి. వృత్తి అను రూపముగల మనస్సుకు రెండు మూలాస్థానములు ఉన్నాయి –

1. దృఢవాసనలు (Dense Tendencies), 2. ప్రాణస్పందము.

ప్రాణములు చలించి నాడులను స్పృశించటానికి సిద్ధమగుచున్నాయి. మరుక్షణం చిద్వికారమగు మనస్సు లేక చిత్తము కూడా శీఘ్రంగా ప్రకటితమౌతోంది.

నాడీ మార్గ రంధ్రముల గుండా ప్రాణములు చలించకపోతే అప్పుడు ద్రష్టకు ఇంద్రియములు బాహ్యానుభవమే ఉండేది కాదు. కనుక ప్రాణస్పందమే చిత్తము ద్వారా 'జగత్తు' అను పేరిట ప్రసిద్ధి కెక్కుచున్నది. ప్రాణ స్పందము ద్రష్ట యొక్క ప్రభావమే అయి ఉన్నది.

అంతటికీ కారణం? ఆత్మయే తన స్వరూపముగాగల ద్రష్టయే. కనుక ద్రష్టయే ప్రాణస్వరూపుడై తన చిత్తము ద్వారా ఈ జగత్తును గాంచుచున్నాడు.

జగత్ ప్రళయం - ప్రాణ స్పందము యొక్క ఉపశమనము జరిగినప్పుడు చైతన్యము యొక్క నిష్క్రియరూపమగు ప్రశాంత స్థితి ఏర్పడి ఉంటోంది. దానిని వేదజ్ఞులు 'జగత్ప్రళయం’గా వర్ణించి చెప్పుచున్నారు.

జగత్ సృష్టి - నిష్క్రియమగు చైతన్యము ఒకప్పుడు ప్రాణ స్పందమును ఆశ్రయిస్తోంది. అప్పుడు నిశ్చలంగా ఉన్న బంతి నెట్టబడుటచే చలనము పొందుచున్నట్లుగా, చిత్తమున వృత్తులు విజృంభిస్తున్నాయి. అట్టి వృత్తిజ్ఞానం దేహములందు స్ఫురిస్తోంది. అదియే 'జగత్ సృష్టి' అని వేదజ్ఞులచే పిలువబడుతోంది.

ఈ విధంగా జగత్ సృష్టి, జగత్ ప్రళయమనేవి ఆత్మ స్వరూపుడగు ఈ దేహి, లేక, ప్రాణి యొక్క స్పందనకు సంబంధించినవే గాని, పంచభూత సమ్మేళనములగు ఈ ఎదురుగా కనబడే వస్తుజాలముల ఉత్పతి, వినాశనములకు సంబంధించినది కాదని సూక్ష్మదృష్టితో గ్రహించు.

అతి సూక్ష్మమగు గంధము (Smell) సర్వత్రా వ్యాపించి ఉన్న వాయువుచే సంచలనము పొంది నలువైపులా ప్రసరిస్తోంది చూచావా? సర్వత్రా వ్యాపించియున్న సంవిత్తు ప్రాణముల చలనముచే ప్రబోధితమై దేహములందు ప్రతిబింబిస్తోంది.

శ్రీరాముడు : తన స్వరూపమేమిటో ఏమరచిన ఈ జీవుడు చిత్తవృత్తులను ఆశ్రయించి, ఈ జగత్తును పొందుచూ, చమత్కారంగా క్షోభను పొందుచున్నాడు.

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. అందుచేత, చిత్తవృత్తిని నిరోధించటంచేత ఈ జీవునకు పరమ శ్రేయస్సు లభించగలదు. ప్రాణాయామాదుల అభ్యాసంచేత ప్రాణ స్పందనమును నియమించినప్పుడు ఈ జీవునకు క్షోభ తొలగగలదు.

Page:678

చిత్తవృతి, చిత్తమౌనము - చిత్తవృత్తి ఉదయించిన వెంటనే బాహ్యవిషయములందు అనురాగం జనిస్తోంది. ఇక ఆపై అది దేహములను కల్పించుకొని బాహ్యవిషయ భోగములవైపు ఆసక్తిగా వెడలుచున్నది. అందుకు ఫలితమేమిటి? అది అనంత దుఃఖములను తెచ్చిపెట్టుకుంటోంది. చిత్తమే చిత్తమునకు వృత్తుల రూపమున బంధమౌతోంది.

అట్టి చిత్తము బాహ్యవిషయములందు 'మౌనము వహించి అభ్యంతరస్థమైనట్టి ఆత్మజ్ఞానవిషయంలో మేల్కొనినదనుకో... అప్పుడేమౌతుంది? అప్పుడాద్రష్ట, లేక, జీవుడు పొందతగిన విమల పదమును పొందినట్లే.

అందుచేత ఓ సభికులారా! ప్రాణచలనం కారణంగా ఉత్తేజమగుచున్న వాసనల రూపమున ఏర్పడుచున్న అజ్ఞాన చిత్తము వృద్ధికాకుండా చూచుకోవటం ఎట్లాగో కొంచెం యోచించండి. అప్పుడు మాత్రమే ఈ జన్మాది వికారములనుండి (నేను జన్మిస్తున్నాను మొ॥న భ్రమల నుండి) ముక్తులు కాగలుగుతారు. ఎందుకంటే, మలిన సంవిత్తు యొక్క వృద్ధిచే ఈ జీవులకు అనేక ఉపాధిపరంపరలు జనించి, నశిస్తున్నాయి. అజ్ఞాన చిత్తము యొక్క అనర్థజాలములచే ఈ ప్రపంచమంతా వ్యాప్తమై ఉంటోంది.

ఈ తీరునంతా గ్రహించిన యోగులు ప్రాణాయామముచేతనూ, ధ్యానము చేతనూ, శాస్త్రములచే అందింపబడుచున్న తదితర సాధనములచేతనూ, సద్గురువులచే ప్రసాదింపబడిన ఆయా విధి, విధానములతో కూడిన యుక్తుల చేతనూ, సర్వే- సర్వత్రా స్వస్వరూపాత్మ విన్యాసంగా సందర్శించుట చేతనూ, ఈ చిత్తమును విషయములనుండి ఉపశమింపజేయుటకు యత్నములు చేస్తున్నారు.

చిత్తనిరోధం కొరకు ప్రాణ ప్రసరణముల ప్రాణాయామపరాయణులు నిరోధం అభ్యసిస్తూ ఉంటారు. ప్రాణనిరోధం, చిత్తశాంతిని కలిగించగలదు. అది స్వస్థతకు, సమత్వమునకు, సుఖ స్వస్వరూపానుభవమునకు సహకరిస్తోంది.

4. అభావన ద్వారా అమనస్కం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు అడిగిన చిత్తబీజము విషయమై సమాధానంగా జ్ఞానులచే ప్రవచించబడిన మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. నేనిప్పుడు చెప్పే విశేషాలు జీవునకు స్వయంగా అనుభూతం కాగల విషయాలే!

T

ఈ జీవుడు అనేక జన్మల అభ్యాసవశంచేత ఈ దేహమును 'ఇది నేను... ఇది నాది' అను సంస్కారముతో గాంచుచున్నాడు. అట్లా దర్శించేటప్పుడు - ఈ దేహమునకు ముందు ఏమైయున్నది? ఈ దేహానంతరం ఉన్న విశేషమేమిటి? ఈ దేహముకంటే విలక్షణమై నాకు సంబంధించి ఏర్పడి ఉన్నదేది అను పరిశీలనాత్మక దృష్టిని కోల్పోవుచున్నాడు. అనగా...

Page:679

ఆతడు పూర్వా పరములను వదలి, వర్తమానము నందు ఈ దేహముచే అనుభవమయ్యే విషయములందు మాత్రమే పరిశీలన భావనలను కలిగి ఉంటున్నాడు. అట్టి పరిమిత, సంకుచిత దృష్టినే 'వాసన' అని అంటారు. కొన్ని పరిమిత భావనలను స్వీకరించి అభ్యాసవశంగా ఈ దేహాదులు జీవుడు పొందుచున్నాడు. అంటే, ఆతడు ఎట్టి పరిమిత భావనలను ఆశ్రయిస్తున్నాడో, అట్టి ఆకృతినే పొంది, ఆ పరిమిత భావనలందు తనను తాను ఏర్పరచుకొనుచున్నాడు. అట్లు ఏర్పరచుకొను అభ్యాసమే సంసారమునకు బీజము. అట్టి పరిమిత ఆకృతి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆయా వాసనలకు వశీభూతుడై పూర్వాపరములను ఏమరుచుచున్నాడు. తన పరిమిత భావములకు కనబడుదానిని ఇదియే సద్వస్తువు' అని తలచుచూ, వివశుడై ఆ సమయంలో తనయొక్క వాస్తవ స్వరూపమును గాంచటం (లేక మననం చేయటం) మానివేస్తున్నాడు. ఇదియే "స్వస్వరూపం నుండి చ్యుతి పొందటం అని అంటారు. కడుపు నిండా కల్లు త్రాగినవానికి ఈ ఎదురుగా ఉండే పదార్థాలన్నీ మరొకవిధంగా ఆ మత్తులో కనిపిస్తాయి చూచావా? వాసనలందు సంస్థాపితమైన జీవునకు ఈ జగత్తంతా అభినివేశ మయంగా కనిపిస్తోంది. విషం మ్రింగినవాడు ఆ విషమునకు వశీభూతుడై పిచ్చికేకలు వేస్తున్నట్లు, అంతఃకరణంలో ఏర్పడిన వాసనలచే అజ్ఞానయుతుడైన జీవుడు సకల మానసిక వ్యధలచే బాధింప బడుచున్నాడు. విషయములే విషములుగా ప్రాప్తిస్తున్నాయి.

ఎద్దానితో అయితే... ఈ జీవునకు అనాత్మయందు - - ఆత్మబుద్ధి; అవస్తువగు దేహాదులందు వస్తుబుద్ధి ...అనే మిథ్యా జ్ఞానం కలుగుతోందో దానినే 'చిత్తము' అని పిలుస్తున్నాం. అనగా దృఢమైన అభ్యాసం కారణంగా ఈ పదార్థములతో అభేదవాసన పుట్టుకొస్తోంది. అందులోంచే అతి చపలమైన చిత్తము బహిర్గతమౌతోంది. ఆ చిత్తము జీవునకు జన్మ - జరా - మృత్యువులతో కూడిన ఈ ఉపాధి, ఆకార వికారములను సంతరింపజేస్తోంది.

ఎప్పుడైతే జీవుడు త్యజించటం - గ్రహించటం' అనే బుద్ధిని అవలంబించక, వాసనారహితుడై ఉంటాడో - అప్పుడిక ఆతని యందు చిత్తమనేదే జనించదు. ఆతడు భావించకపోవటం, అభావన అభ్యసిస్తాడనుకో... అప్పుడు ఆతనిలో పదార్థములకు సంబంధించిన మననం సన్నగిల్లుతుంది. ఇక లేశమైనా మననం శేషించనప్పుడు 'అమనస్కం' ఉదయిస్తుంది. ఆకాశంలో కమలం ఉదయించ నట్లు అమనస్కస్థితిలో చైతన్యమునందు చిత్తమే ఉదయించదు.

రాగవశం చేత వస్తువును చూచి ఇది వాస్తవము అని అనుకుంటూ ఉండటమే చిత్తము. నాఉద్దేశంలో చిత్తమునకు మరింకే రూపమూ లేదు.

ఏతావన్మాత్రకం మన్యే రూపం చిత్తస్య రాఘవ ॥

యద్భావనం వస్తునోస్తర్వస్తుత్వేన రసేన చ (శ్లో 40, సర్గ 91)

“వాస్తవము, శాశ్వతము అగు దృష్టితో చూస్తే ఇక్కడి పదార్థాలేవీ భావావేశముచే సమర్థించుటకు యోగ్యమే కాదు" - అను భావన (లేక) అవగాహనకు వచ్చిన జీవుని స్వరూపం నిర్మలాకాశంలాగా స్వచ్ఛమై ఉంటుంది. ఇక అందు చిత్తోదయం ఎట్లా అవుతుంది?

Page:680

కాబట్టి రామా! నీవు 'బాహ్యవస్తువిస్మరణ' రూపమగు 'నిరోధయోగము' ను అవలంబించు. అప్పుడు సర్వ దృశ్యమార్జవం (Washing off) లేక దృశ్యరహితత్వం ఏర్పడగలదు. ఈ దేహము పొందినందుకుగాను అంతకు మించిన ప్రయోజనం మరింకేదీ ఉండదు. అభావసంపాదకమైనట్టి అచిత్తత్వమే ఆత్మవస్తు దర్శనం కూడా.

+ +

అంతఃకరణముచే సర్వమూ త్యజించబడగా అప్పుడు శేషించి ఉండే శీతలాశయవర్తియగు వాసనారహిత చిత్తము ఒకవేళ ఈ ప్రపంచంలో వర్తించవలసిన వచ్చినప్పటికీ దానికి సంసార దోషం అంటదు. ఉడకబెట్టిన చిక్కుడు విత్తనంలాగా అది ఆకారం కలిగియున్నప్పటికీ అచిత్తత్వముతో సరిసమానమే అవుతుంది. వాసనావశంచేతనే విషయములు ధ్యానింపబడుచున్నాయి.

దృశ్యమునందు ఏమాత్రం ఆలాపన, అనురాగములు లేనివాని చిత్తం అచిత్తత్వ దశ పొందినట్లే. అదియే ఉపశమనము. అదియే సత్వము.

ఘన వాసనలు మరల మరల జనన మరణములకు కారణములు అగుచున్నాయి. వాసనా రహితుడగు జీవన్ముక్తుడు ఈ ప్రపంచ కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, సదా సత్వమునందే సుస్థిరుడై ఉంటాడు. ఈ ప్రపంచంలో రాగరహితులైనట్టి, పునర్జన్మాంకురము లేనట్టి జీవన్ముక్తులు ఎందరో యథావిధిగా సంచరిస్తూ ఉన్నారు. వారు జ్ఞాన సంపన్నులై, సత్యరూపులై ఈ దేహానంతరం చిదాకాశ స్వరూపం సంతరించుకొనుటకు అర్హులై ఉంటున్నారు. వారంతా చిత్తరహితులని, అమనస్కులని మనం తప్పక గ్రహించవచ్చు.

5. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్నవానియందే! శ్రీవసిష్ఠ మహర్షి : బీజం మొలకెత్తాలంటే నేల, నీరు రెండూ కావాలిగా!

ద్వే బీజే రామ చిత్తస్య ప్రాణస్పన్దనవాసనే |

ఏకస్మింశ్చ తయోః క్షీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః || (శ్లో 48, సర్గ 91)

చిత్తబీజమునకు కూడా రూపం దిద్దుకోవాలంటే -ప్రాణ స్పందనము, వాసన - - అనే రెండు ఉండాలి. ఈ రెండిటిలో ఒకటి శమిస్తే రెండవది తనంతట తానే శమిస్తుంది.

నువ్వులలో నూనె దాగి ఉన్నట్లు, వాసనలలోనే భావిపునర్జన్మ పరంపరలన్నీ దాగి ఉన్నాయి. బీజం-వృక్షంలాగా వాసనలవల్ల జన్మలు, జన్మల వల్ల ఇంకొన్ని వాసనలు ఏర్పడుచున్నాయి. ప్రాణం, వాసనలను సమన్వయపరుస్తూ చిత్తం తనకు తానే ఇంద్రియ సుఖదుఃఖానుభవాలు కల్పించుకుంటోంది.

ప్రాణములు

విషయసమన్వితమగు విషయానందము మరికొన్ని విషయములతో చిత్తము ఇంద్రియములు కూడుకొన్న చిత్తము

Page:681

చిత్తంలోంచి "ప్రాణములు, విషయానందం" ఉత్పన్నమౌతున్నాయి. వాటి నుండి మరల చిత్తము మరింత ప్రోద్బలమౌతోంది. అట్లాగే ప్రాణముచే వాసనాస్పందనము, వాసనాస్పందనముచే ప్రాణములు పరస్పరం ప్రవృద్ధం చేసుకుంటున్నాయి. వాసనలు ప్రాణస్పందనమును ఉద్బోధించటాన్ని 'సంవిత్ ప్రక్షోభము' అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.

ప్రాణములు హృదయగుణములగు రాగద్వేషాదులను ప్రేరేపించుతూ ఉండటం తమ ధర్మంగా కలిగి ఉంటున్నాయి. సంవిత్తు రాగసహితమైనప్పుడు 'చిత్తము' అనే బాలకుడు పుట్టుకొస్తున్నాడు.

ఈ విధంగా ప్రాణ స్పందనము, వాసనలు - ఈ రెండూ కూడా చిత్త రూపమునకు కారణములై ఉంటున్నాయి.

శ్రీరాముడు : మహాప్రభో! చిత్తమే కదా, సర్వ వ్యాపకములకూ మూలం! మరి నిరోధించబడటమెట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ప్రాణ స్పందన, వాసనలలో ఒక్కదానిని నీవు నిరోధించగలిగితే రెండవది తనకు తానే పట్టుబడుతుంది.

చిత్తము మననము’ అనే స్వభావం కలిగి ఉంటోంది. చిత్తమనే వృక్షమునకు కాచిన ఫలమే ఈ శరీరం కూడా. సర్వక్రియలూ చిత్తము చేతనే సంకల్పించబడుచున్నాయి. అది తనయందు తృష్ణ రాగము అనే దోషములను అంతరాంతరంలో పొందుపరచుకుని ఉన్నది. అదే అజ్ఞాన కార్యములకు సాధనములవంటివైన ఇంద్రియములకుకూడా మూలం. అట్టి చిత్తం నశిస్తే క్షణంలో వాసనలూ పోతాయి. ప్రాణ స్పందనా నిరోధించబడుతుంది.

సర్వదిక్కులను మలినపరుచుచున్నది ఈ చిత్తమే. అది సర్వప్రాణుల స్వస్వరూపమగు చిత్ రూపమును ఆవరించుకొని ఉంటోంది. అది ఎట్లా జనించింది? అజ్ఞానకారణం చేతనే! అది వ్యాప్తమై ఉండి, ఈ దేహమునందే నెలకొని ఉంటోంది. అత్యల్పవృత్తులచేకూడా సంక్షుభితమౌతోంది. అన్ని వైపులా కదులుతూ పిచ్చిగంతులు వేయటంలో దానికదే సాటి. ఎంత కాలం గడచిపోతున్నా... ఎన్ని ఉపాధులు మంటగలిసిపోతున్నా... అది తన అంతఃకరణసాక్షి, విషయరహిత స్థానము, ఉపాధిరహితము అగు బ్రహ్మప్రకాశమును గాంచదే?

అట్టి నిత్య సంచలనరూపమగు ఈ చిత్తం ప్రాణ స్పందనిరోధంచే క్షణంలో లయమొందగలదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయములు - ప్రాణస్పందన, వాసనలు... రెండిటికీ కూడా శబ్దస్పర్శాది విషయములు బీజమగుచున్నాయి. శబ్దస్పర్శాది విషయములు పొందవలెనని ఇచ్ఛ, అభినివేశము, పట్టుదల - - జీవునియందు ఏర్పడగానే నాయనా! బయలుదేరు! మేం అందుకు సాయపడతాం అంటూ ఆ జంట (ప్రాణస్పందము-వాసనలు) ముందుకొస్తున్నది.

శ్రీరాముడు : స్వామి! "ఇచ్ఛ, ప్రాణస్పందన, వాసనలు, చిత్తము, శబ్దస్పర్శాది విషయములు - వీటిని మీరు ఉదహరిస్తూ... దీనికి అది బీజమని, దానికి ఇది బీజమని చెప్పుకొస్తున్నారు. ఏది బీజం? ఏది వృక్షం? ఏది ముందు? ఏది వెనుక? మీరు చెప్పే విషయాలలో అది నేను గుర్తించలేక పోతున్నాను.

Page:682

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. ఈ సంవాదం అట్లా ఉన్నమాట నిజమే. అయితే విత్తు ముందా? చెట్టు ముందా? చెట్టులోంచి విత్తు వస్తోంది? విత్తులోంచి చెట్టు వస్తోందా? అక్కడ తేల్చిచెప్పగలదేవి ఉండదు కదా! అయితే...

ఉపాయమేమిటో నేను సుస్పష్టపరచుచున్నాను కదా! ఇక సమాధానం ఉండని ప్రశ్నలతో గాభరాబడవలసిన పనేమున్నది?... శబ్దస్పర్శాది విషయములనుండి విరమించుటచే వాసనలు సన్నగిల్లుతాయి. ప్రాణస్పందం నిరోధించబడుతుంది.

అట్లాగే... ప్రాణనిరోధాభ్యాసంచే వాసనలు సన్నగిల్లుతాయి. శబ్దస్పర్శాది విషయముల ప్రకోపం శమిస్తుంది. క్రమంగా వాసనలు ఉపశమిస్తాయి. అప్పుడు చిత్తం అచిత్తమౌతుంది.

మరొక విషయం. ఆత్మ, సంవితు, ద్రష్ట, శరీరి" అను పేర్లతో జీవుని స్వస్వరూపము పిలువబడుచున్నది అట్టి చైతన్యమే అన్నిటికీ స్థానమై ఉంటున్నది.

నువ్వులు లేకుండా నూనె లభిస్తుందా? సంవిత్తు (The Knower) యే లేకపోతే వృత్తి జ్ఞానం ఎవరికి? శబ్దాది విషయములకు అనుభవరూపమగు సంవేద్యము (Object being known) ఎట్లా ఏర్పడుతుంది?

పైగా... ఈ బాహ్య - అభ్యంతర విషయములన్నీ సంవిత్తుకంటే వేరైనవి అనుకుంటున్నావా?... కానేకాదు. సంవిత్తు స్వప్నమున స్ఫురించుచూ ఆ స్వప్నంలో పదార్థములను, ప్రదేశములను, స్వమరణమును కూడా గాంచుచున్నది చూచావా? (ఒక్కొక్కడు తాను చనిపోయినట్లు కూడా కల గంటాడు కదా!) అదే సంవిత్తు జాగ్రత్లో కూడా ప్రవేశించి అట్టి స్వసంకల్పవశం చేతనే పదార్థముల అనుభవమును గాంచుచున్నది. అంతే కాదు...

ఏ సంవిత్తైతే వివేకోదయం చేత స్వసంకల్పము ద్వారా పదార్థానుభవములన్నీ త్యజించి తనను తానే ఎరుగుచున్నదో... ఆ ఎరుక కూడా స్వప్న, జాగ్రత్లవలెనే స్వప్నతుల్యమేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఎందుకంటే అద్వితీయానుభవం దృష్ట్యా 'ఇది నేను, ఇది స్వరూపం' అనునవి మాత్రం ఎక్కడుంటాయి? కనుక కేవలానుభవస్థితిలో,

స్వప్న సంవిత్తు ఉండదు... జాగ్రత్ సంవిత్తు ఉండదు... సంవిత్ యొక్క సంవిత్తు ఉండదు... స్వసంకల్ప భ్రమచే పసిబాలుడికి గాలిలో భూతాలు కనిపిస్తున్నట్లు, సంవిత్తు యొక్క స్వవ్యసన, సంకల్ప భ్రమచే ఈ జగత్తు ఆ సంవిత్తుకు కనిపిస్తోంది. కనుక జగత్తు యొక్క అసలైన బీజం, స్థానం దీనిని ఎరుగుచున్నవానియందే ఉన్నదని గ్రహించు.

తెలియబడుచున్నదంతా తెలుసుకుంటున్నవానినుండే బయలుదేరి, ఆతనియందే ఏర్పడి ఉండి, మరొకప్పటికి ఆతనియందే ఉపశమిస్తోంది. సంసారము యొక్క జగత్తు యొక్క ఆదిబీజం” తెలుసుకుంటున్నవాడే.

Page:683

6. దృశ్య అదర్శనం

శ్రీవసిష్ఠ మహర్షి : మసక చీకట్లో అంతదూరంగా నిలచియున్న ఒక పెద్ద శిలా స్థంభము భ్రమ కారణంగా ఒక పురుషుని రూపంగా అనుభవమౌతుంది చూచావా? అట్లాగే జీవునికి ఈ దృశ్యం ప్రాప్తిస్తోంది. అట్టి దృశ్యసందర్శనంలో పాల్గొనే వివిధ విశేషాలు ఈ విధంగా ఉంటాయి.

1. సంవిత్తు = The Knower or That Which is Knowing (Knower prior to knowing) 2. విషయసంవిత్తు = The Knower while engaged in material world.

(అట్లాగే స్వప్నసంవిత్తు, జాగ్రత్ సంవిత్తు, సుషుప్త సంవిత్తు కూడా)

3. సంవేద్యము = That Which is being Known

4. సంవేదనము = Knowing

5. ఆత్మ సంవిత్తు = Knower Which is engaged in knowing the Knower's Self. (one's

own self)

సూర్యకిరణములు కిటికీలోంచి ప్రసరిస్తున్నప్పుడు అందు దండాకారంగా పరిభ్రమిస్తున్నట్లు త్రసరేణువులు అగుపిస్తాయి. నావలో పయనించేవానికి అచంచలమగు పర్వతములు, వృక్షములు వెనక్కు వెళ్ళిపోతున్నట్లు కనబడతాయి. చీకట్లో చూచిన త్రాడు పాములాగా భ్రమింపజేస్తుంది. కంటి దోషం చేత ఆకాశంలో రెండు చంద్రబింబాలు అగుపిస్తాయి. ఈ భ్రమలన్ని సరి అయిన దృష్టితో చూస్తే నశిస్తాయి.

అదేవిధంగా సంవిత్తే తెలియబడుచున్నదానివలె విషయరూపమున, దృశ్యరూపమున భాసిస్తోంది. అట్లా కనిపిస్తున్నదంతా సమ్యక్ దృష్టిచే నశించిపోతాయి. అనగా, దృశ్యము - దృశ్యవిషయములు అనబడే సంవేద్యమునకు సంబంధించిన మిథ్యా జ్ఞానమంతా సమ్యక్ జ్ఞానముచే నశించగలదు. సంవేద్యమంతా సంవిత్తుకు వేరైనది కాదు - అని మరొకసారి ప్రకటిస్తున్నాను.

ఓ రామచంద్రా! ఈ కనబడే మూడు లోకములూ శుద్ధ సంవిత్ మాత్రమే అయి ఉన్నది. అంతకు వేరుగా సంవేద్యము (తెలియబడేది) అంటూ ఎక్కడా ఏదీ లేదు.

సమ్యక్ జ్ఞానం - తెలియబడేవాని రూపమే తెలియబడుచున్న దానియందు స్ఫురిస్తోందనీ, ఆతనికి వేరుగా తెలియబడేదంటూ లేదను నిశ్చయం కలిగి ఉండటం.

అందుచేత రామా! నీవు సంసారమును జయించివేయాలనుకుంటే ఇతఃపూర్వం గాంచినవి, ఇప్పుడు గాంచుచున్నవి, ఇకముందు గాంచాలని అనుకుంటున్నవి" - వాటినన్నిటినీ నీ నీ చిత్తము నుండి తొలగించివేయాలి. అనగా, “ఇవన్నీ మిథ్యారూపమైనవే కదా! అను ఎరుకను దృఢపరుచు కోవాలి. అట్లు తొలగించుకోనంతకాలం జీవునకు ఈ జన్మ, కర్మలతోటి సంబంధం ఎప్పటికీ తొలగదు. శుద్ధవిభాగచిత్తము సహాయంతో మలిన విభాగచిత్తమును తొలగించుటయే మోక్షం.

Page:684

దృశ్యము సత్యమని భావన చేయటమే అవిశ్రాంతమగు జననమరణ వ్యసనమునకు లేక సంసారమునకు నాంది, బీజమూనూ.

చిదేకరసం - విషయముల అదర్శనమును 'చిదేకరసం' అని కూడా అంటారు. అట్టి అదర్శనమునకు సంబంధించిన ప్రయత్నం జడరహితమగు ఆత్మస్వభావంగా పరిణతి చెందుతోంది. కనుక... నీవు ‘విషయములను దర్శించుట' అనునది త్యజించివేయుము. విషయ రహిత, స్వయం ప్రబుద్ధమగు ఆత్మయే నీవై ఉన్నావు. కనక పూర్ణానంద స్వరూపుడవై నిశ్చింతగా ఉండుము.

ఓ సభికులారా! ఓ సర్వజనులారా! ఈ మన ప్రియ రామచంద్రునిలాగానే మీలో ప్రతి ఒక్కరూ శుద్ధాత్మ స్వరూపులేగాని, జడమగు ఈ దేహం కాదు. లేక, మరొక వెలుగుచే ప్రకాశింపబడే మనోబుద్ధి అహంకారాదులు కాదు. మీచే దర్శించబడేదంతా మీయొక్క స్వస్వరూప విలాసమే! (ప్రకరణయే! క్రీడయే! ఉల్లాసమే! కుతూహలమే!) ఈ విషయం ప్రపంచమునకు ఘంటాపదంగా ప్రకటించిన ఎందరో మహనీయుల చరిత్రలు మనం చెప్పుకున్నాం. ఇంకా నిర్వాణ ప్రకరణం చిట్టచివరివరకు వారి చరిత్రలు చెప్పుకోబోతున్నాం.

చిత్తమునకు కూడా అతీతులైనట్టి ఓ పరిశుద్ధాత్మ స్వరూపులారా! సర్వజనులారా! మీరంతా అంతటి మహత్తర స్వరూపులై ఉండగా, అబ్బే! నేనొక సామాన్య జీవుడినండి! స్వల్పుడను. ఆ భగవంతుడు ఎక్కడో చొరరాని చోట ఉన్నాడు. నావంటి స్వల్పునకు అది చాలా కష్టం. ఇక ఎప్పటికో ఏదో చేసి ఆ చోటికి వెళ్ళాలి... మొదలైన రూపంగల అల్ప, మూర్ఖ భావాలలో కునుకులు తీస్తూ రోజులు గడపవలసిన పనేమున్నది? ఒద్దు. ఇక నిదుర లేవండి. జాడ్యం వదలండి.

"మీ వాస్తవ స్వరూపతత్త్వమేమిటో గ్రహించండి అని వేడుకుంటున్నాను.

కాబట్టి రామా! నీవు ఈ దృశ్యమును అంతరంగమునందు త్యజించినవాడవై పూర్ణ బ్రహ్మానంద” రూపముగా శేషించి ఉండుము. అట్లు పరిగ్రహించుచు, ఆపై యథావిధిగా ఈ భూప్రదేశంపై విహరించుచూ దీనిని పవిత్రము చేయి.

7. అజడం - జడం

శ్రీరాముడు : ప్రభూ! మా స్వస్వరూపము యొక్క పూర్ణత్వమును చేయి ఎత్తి చూపుచున్న సద్గురు ప్రవచనములకు సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తున్నాను. మన ఈ ప్రస్తుత విచారణ యొక్క నిస్సంశయము కొరకై ఒక చిన్న ప్రశ్న మీ ముందుంచుచున్నాను.

జడత్వం త్యజించినప్పుడు శుద్ధ జ్ఞానస్వరూపం శేషిస్తుంది కదా! అట్లాగే, శుద్ధ జ్ఞానమును ఏమరచినప్పుడు జడప్రాయములగు ఈ దేహాదులు, వాటి అనుభవములు సంక్రమిస్తున్నాయి.

కనుక ఒక జీవుడు ఈ జడశరీరమును ఇట్లే కలిగియుండగా 'శుద్ధ సంవేద్యము’గా, లేక చైతన్య స్వరూపంగా శేషించటం ఎట్లా కుదురుతుంది? శరీరం ఉన్నంతవరకు జడత్వం ఉంటుంది కనుక శరీరం ఉన్నంతకాలం శుద్ధాత్మతత్త్వానుభవం కష్టసాధ్యమేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే

Page:685

జడము - అజడము ఒకేసారి, ఒకే చోట ఏర్పడజాలవుకదా! వెలుగు - - చీకటి ఒకేసారి ఒకే చోట ఏర్పడి ఉండజాలవు కదా!

శ్రీవసిష్ఠ మహర్షి : సంవిత్తు, విషయ సంవిత్తుగా, ఆత్మ సంవిత్తుగా రెండు రూపములను దాల్చుచున్నది.

బాహ్యపదార్థములను సత్యమని నమ్మటమే 'విషయ - సంవిత్తు' అనబడుతోంది. అయితే, జీవన్ముక్తునికి మాత్రం ఈ భూత భవిష్యత్ వర్తమానములందు ఎచ్చటా 'ఇది సత్యమే’ అను రూపంలో ఉండే సత్యత్వబుద్ధి ఉండదు. అనగా, అతడు తన అంతరంగ ప్రదేశంలో విషయసంవేదరహితుడై కాష్ఠశిలాదుల వలె (కొయ్య - రాయిలాగా) ఉంటాడు. స్వయంప్రకాశకుడై జడత్వరహితుడై ఉంటాడు. తాను సర్వ విషయములకు అర్థము(Meaning)ను ప్రసాదిస్తూ, సర్వ అర్థములకు అతీతమైన స్థానము నందు సంస్థితుడై ఉంటాడు.

పదార్థములు అసత్యము' అని ఎరుగుటయే 'శుద్ధసంవిత్తు' అని అంటున్నాం కదా! విషయ సంవిత్తుకు అతీతుడై, శుద్ధ సంవిత్తుని ఆశ్రయించినప్పటికీ, సర్వకార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతడు ఏ విషయములచే పరిమితుడు గాని, విషయములకు ప్రమేయుడు గాని కాదు. విషయము లందు అసత్య బుద్ధి కలిగి ఉండి ఎవని చిత్తము ఈ విషయములందు లేశమైనా తగుల్కొనదో... ఆతడు 'విషయరహితుడు - అజుడు - - జీవన్ముక్తుడు' కూడా అవుతాడు.

బుద్ధిమంతుడగు ఉత్తమజ్ఞాని తన చిత్తమును మొదలంట్ల వాసనారహితం చేసుకునేందుకే సర్వప్రయత్నములు చేస్తాడు. క్రమంగా ఆత్మయందు సర్వ పదార్థ భావనలూ మొదలంటా తొలగించి వేస్తాడు. పసిబాలుడు అన్నీ నావే' అన్న భావనలో ఉంటున్నట్లు అతడు 'అంతయునాదే, అన్నీ నేనే' అన్న పరమజ్ఞానభావన కలిగి యుంటాడు. అదే సమయంలో 'అనాది, అసంగము' తో కూడిన అవగాహన సంపాదించుకుని ఉంటాడు. విజ్ఞానదృష్టిచే అంతా తెలిసి, ఏమీ చెప్పజాలక మూగవాని వలె తదితర జీవులతో కలిసి ఉంటాడు. ప్రజ్ఞాస్వరూపుడు, శుద్ధ జ్ఞాని, బుద్ధిమంతుడు అయిన ఆ మహాత్ముడు జడత్వరహితము, వ్యాపకము, స్వచ్ఛము - - అగు స్థానంలో తనను తాను ప్రతిక్షేపించు కుంటాడు. కనుక విషయములను పొందుతాడేమోగాని, వాటి యందు తగుల్కొనడు. దేహము ఉండీ దేహము లేనివాడై ఉంటాడు. సుఖ-దుఃఖములను గాంచవచ్చునేమోగాని, తన అపరిమిత త్వమును వీడడు. ఆకాశములో అనంతత్వము ఏర్పడి ఉంటుంది చూచావా! సర్వవాసనలూ త్యజించిన వానికి స్వభావసిద్ధమగు అనంతానందము ఏర్పడియే ఉంటుంది. చిత్తరహితులగు అనేకమంది యోగులు ఆ పరమానంద స్వరూపమునందే సంస్థితి కలిగి ఉంటున్నారు. అద్దానియందే ప్రవృత్తులై, తన్మయులై ఉంటున్నారు. వారి సర్వ సంవేదములు (All their Perceptions) బ్రహ్మాకారము, బ్రహ్మ ప్రకాశముల మధ్య విలీనమైపోతున్నాయి. ఓ రామచంద్రా! ఎవ్వడైతే తాను నడుస్తున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఈ దృశ్యసంవేదమునకు సంబంధించిన వృత్తి జ్ఞానం త్యజించివేస్తాడో... అట్టివాడు ఈ శరీరం ఉన్నప్పుడు, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇది లేనప్పుడు కూడా సుఖవంతుడై, అజడుడై, పరమానంద స్వరూపుడై ఉంటాడయ్యా!

Page:686

అపారగుణ సాగరా! రఘురామా! నీవు కూడా అట్టి దృష్టినే అభ్యాసంచే అవలంబించు. కొంచెం శ్రమతో కూడియున్నప్పటికీ ప్రాణాయామాది సాధనలచే ఈ సంసార దుఃఖ సాగరమును దాటివేయి. ఒక చిన్న బీజంనుండి ఆవిర్భవించి మఱివృక్షం విశాల ఆకాశాన్ని ఆక్రమించి ఉంటోంది చూచావా! 'స్వసంకల్పము' అనే చిన్న చోటు నుండి ఆవిర్భవించిన ఈ విషయ ప్రపంచము స్వతః గా మిథ్యయే అయి ఉండి కూడా సువిశాలమగు ఆత్మాకాశాన్ని ఆక్రమించి ఉంటోంది. సంవిత్తు 'మరల మరల సంకల్పించుట' అను గుణమును ఆశ్రయించి, అందుకు ఫలితంగా జన్మ సమూహముల బీజమును తనకు తాను సృష్టించుకుంటోంది.

జనయిత్వాత్మన్ ఆత్మానమ్, మోహయిత్వా పునఃపునః

స్వయం మోక్షం నయత్యన్తః సంవిత్స్వం విద్ధి రాఘవ ॥

ఓ రాఘవా! సంవిత్తును మరింకొకరెవరూ జనింపజేయుట లేదు. అది తనను తానే జనింపజేసుకుంటోంది. మోహింపజేసుకుంటోంది. మరొకప్పుడు హృదయస్థమగు ఆత్మతత్త్వమును గాంచుటచే స్వయంగా తనకు తానే ముక్తిని ప్రసాదించుకొనుచున్నది. అది ఎప్పుడు ఎట్లా భావిస్తే, ఆ క్షణంలో అట్లే అగుచున్నది. అది ఎంతకాలం రాగాదులు కలిగి ఉంటుందో - అంతకాలం తన చిద్రూపమును పొందక, వస్తుతత్వమునందే నిమగ్నమై ఉంటోంది.

ఈ మనకు కనిపించే దేవ, మానవ, అసుర, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష జీవుల రూపములన్నీ కల్పిత రూపములేగాని, వాస్తవరూపములుగావు. ఆత్మయే అనాదిసిద్ధమై ఉన్న మాయతో కూడుకున్నదై ఈ విధంగా జగన్నాటకమంతా ఆడుచున్నది. పట్టుపురుగు తనలోంచి ఉత్పన్నమయ్యే పట్టుదారంచే కట్టుబడి చిక్కిఉంటుంది చూచావా? సంవిత్తు తననుండి బయల్వెడలిన విషయముల పట్ల గల ఉత్సుకతచే బంధింపబడి, దుఃఖించుచు... మరల చిరకాలమునకు స్వయముగా కేవలత్వము స్వీకరిస్తోంది. 'జగత్తులు' అనే సముద్రమునకు సంవిత్తే జలరూపమై కుతూహలం' అను స్వభావంతో అంతటా వ్యాపించి ఉంటోంది. ఈ దిక్కుల రూపంలోను, ఆ పర్వతముల రూపంలోనూ స్ఫురించేది అదే. ఈ ఆకాశం, భూమి, వాయువు, నదులు, దేహములు - ఇవన్నీ సంవిత్ సముద్రములోని అనేక ఆకారములతో కూడిన తరంగములవంటివి మాత్రమే!

8. వేరు వేరు ఉపాయాలు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ ప్రపంచమంతా సంవిన్మాత్రమే! ఇక్కడ రెండవ వేరైన కల్పనయే లేదు. కల్పన చేయుచున్నవాడే కల్పితమైన సర్వముగా ఆవిర్భవిస్తున్నాడని గ్రహించు. అదియే బ్రహ్మజ్ఞానం. అట్టి సత్య జ్ఞానముచే సంవిత్తు అద్వైత బ్రహ్మరూపము పొందుతోంది. అనగా తనయొక్క సర్వ న్యూనాధికములనూ త్యజించి స్వాత్మయందు స్థిరత్వం పొందుతోంది. ఇంక అది దేనియందు తగుల్కొనక సర్వస్థితులందూ స్వస్వరూపముయొక్క సమ్యక్ జ్ఞానం కలిగి ఉంటుంది.

Page:687

శ్రీరాముడు : సంవిత్తు నుండి 'సన్మాత్రము' అనే బీజం ఎలా వెల్లివిరిసి ఏర్పడి ఉంటోందో వివరించ ప్రార్థన!

శ్రీవసిష్ఠ మహర్షి : సంవిత్తు, లేక, బ్రహ్మము నుండే ప్రతిబింబ సంవిత్తు జలంలోంచి తరంగంలాగా ఆవిర్భవిస్తోంది. సూర్యుని నుండి కిరణంలాగా ప్రకటితమయ్యే అట్టి సంవిత్తు రెండు రూపములు కలిగి ఉంటోంది.

1. పలువిధ ఆకారములుగల సంవిత్తు విభాగం జలంలోని అనేక తరంగాలులాగా!

2. ఏకమగు సన్మాత్ర విభాగం - - అనేక తరంగములలోని ఏకైక జలంలాగా!

ఈ నీవు, నేను, కొండలు, కుండ, వస్త్రం - ఇవన్నీ 'సత్త' యొక్క వివిధ రూపములు మాత్రమే. నీవిక ఈ సర్వవిధ విభాగములూ త్యజించి సర్వదా సర్వుల స్వరూపం అయినట్టి ఏకమాత్రసత్తను ఆశ్రయించు. అదియే ఈ చరాచర సర్వజగత్తుకు అధిష్ఠానమైయున్నది. సర్వ విశేషములు త్యజించబడగా... అప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి నిర్లిప్తమగు ఆ 'సన్మాత్ర సత్త' యొక్క ఏకమగు మహద్రూపం అనుభవం కాగలదు. అదియే బ్రహ్మపదము సుమా! శ్రీరాముడు : అరూపమగు ఆత్మయందు రూపసహితమగు ఈ జగత్తు ఎలా ఏర్పడి ఉంటోంది? శ్రీవసిష్ఠ మహర్షి : కుండకు ఆకారం ఉన్నది. దాని మూల పదార్థమగు మట్టికి ఆకారం ఉన్నదా? లేదే! వస్త్రం యొక్క స్వభావము గాని, స్వరూపముగాని దూదిలో కనబడుతోందా? లేదు. అయితే, వస్త్రమంతా తయారయినది దూదితోనే కదా! సన్మాత్రము ప్రకటితమగుచున్నప్పటికీ, అద్దానియందు నేను - నీవు’ అనునవేవీ లేవు.

శ్రీరాముడు : మరి 'కాలము' మాట ఏమిటి?

శ్రీవసిష్ఠ మహర్షి : కాలసత్త కూడా వస్తుసత్తలాగానే ప్రమేయస్వభావముచే కల్పనా పూర్వకమై ఏర్పడి ఉంటోంది. ఆత్మసత్త అప్రమేయమై అవిభక్త రూపమున ఏర్పడి ఉంటూనే వస్తుప్రమేయముచే కాలబద్ధముగా, విభక్తరూపమున కన్పట్టుచున్నది. విభాగము లేనిచోట విభాగము భ్రమచే అనుభవ మగుచున్నదని గ్రహించు.

కనుక రామా! "ఈ దృశ్యమంతా ఏకైక సత్తాయే అను భావన చేయి. "సర్వ దృశ్యవస్తువులందూ ఏర్పడి ఉన్నది ఆ ఏకైక సత్తయే” అను దృష్టిని బలపరచుకో. అట్టి భావనచే సర్వదిశలను, ఆ దిశ లందుగల సర్వ పదార్థములనూ పరిపూర్ణమొనర్చుము. నీయొక్క సత్తయే నీయందును, నీచేగాంచబడే దృశ్యమునందును వెలుగొందుచున్నదయ్యా! సూర్యుని నుండి అనంత కిరణములు బయలుదేరి అసంఖ్యాక వస్తువులను ప్రకాశింపజేయుచున్నట్లు ఏకైక సత్త ఈ సర్వ శరీరములను, చిత్తములను, తదితర అసంఖ్యాకవస్తు సమన్వితమగు జగత్తును ఎరుకచే ప్రకాశింపజేయుచున్నది.

"ధర్మము - ధర్మిష్టి, సత్ - - అద్దాని విషయములు లయమొందినప్పుడు, అప్పటికి ఇంకా శేషించియుండేది ఆ ఏకైక సత్తయే. అద్దానియందు ఉపాధులు మొదలైనవి ఉండకపోయినప్పటికీ భూత, భవిష్యత్తులలో ఏర్పడే సర్వ జీవులు అదే!



Page:688

నిర్వికారమగు అట్టి ఆత్మపదమున స్థిరపడినవాడు అరుచికరమగు ఈ సంసారమునకు తిరిగిరాడు. అదియే 'మోక్షసాధన' అని, 'పురుషోత్తమ ప్రాప్తి' అని చెప్పబడుతోంది.

అట్టి పదమే సర్వకారణములకు కారణమైయున్నది. ఇక దానికి మరో కారణమైనదేదీ ఉండదు. కారణములకు కారణం, సారమునకు సారమగు ఆ శుద్ధ పరబ్రహ్మమే ఈ జీవుని స్వరూపమై ఉండగా... ఈతడు అజ్ఞానదృష్టిచే భేదకల్పనను ఆశ్రయించి "నేను నిస్సారుడను, నిస్సహాయుడను, అల్పమేధస్కుడను... అని వాపోవుచున్నాడు. దానికంతటికీ కారణం స్వస్వరూపాన్ని ఏమరచి దృశ్యవిషయములందు తాదాత్మ్యమొందటమే సుమా! ఈ జీవుడు జ్ఞానాన్ని పెంపొందించుకో నంతకాలం, అప్రమేయమగు తన బ్రాహ్మీస్వరూపమును ఎరిగి ప్రశాంతుడవనంతకాలం ఈ జన్మ · కర్మల ప్రహసనం తప్పేది కాదు. నేను భేదాభేదములకు అతీతుడను. ఆద్యంతములు లేనట్టి నేను ఈ జన్మ - జీవన - మృత్యువుల వంటి అల్ప సంఘటనలచే ఎట్లా పరిమితుడనౌతాను? - -

అని ఈ జీవుడు గ్రహించుగాక! అట్టి సదవగాహనకు ఉపకరించటానికే ఆత్మజ్ఞులైనవారిచే ఈ యోగవాసిష్ఠాది శాస్త్ర ప్రవచనములు జీవునకు అందించబడుచున్నాయి.

తత్త్వమెరిగిన తరువాత రామా, ఇక నీకు బంధమేమిటి? మోక్షమేమిటి? మేఘములు ఆకాశంలో ప్రయాణిస్తున్నంత మాత్రం చేత ఆకాశముయొక్క అనంతత్వానికి వచ్చే లోటేమిటి? కించిత్ అజ్ఞానం వచ్చి ఒకానొక సమయంలో ఆవరించి యున్నంతమాత్రం చేత ఈ జీవుని అనంతత్వానికి వచ్చే లోటేమీ ఉండదు - - అని సర్వజనులు గ్రహించండి. నిశ్చింతులై ఉండండి.

ఒడ్డున ఉన్న చెట్లు తటాకంలో ప్రతిబింబిస్తున్నట్లు నిర్లిప్తము, అసంగము అగు ఆత్మ యందు ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది. ఈ పదార్థములన్నీ తమ యందు ప్రత్యక్ చైతన్యము అంతస్థమై ఉండుట చేతనే ప్రీతివంతమౌతున్నాయి. నాలుకకు రుచులు వ్యక్తమగుచున్నట్లు ఆ ఆత్మసముద్రము నందే సర్వానందములు వ్యక్తమగుచున్నాయి. ఈ విషయములో ఇవి స్వయంగా స్వాదురహితం (Tastless) అయినప్పటికీ, అవి ఆత్మ సంయోగముచేతనే స్వాదుత్వం పొందుచున్నాయి. ప్రియమైన వాటన్నిటి కంటే ప్రియాతిప్రియమైనది ఆత్మవస్తువే.

ఆనందమయమగు ఆ పరమాత్మ నుండే సమస్త బ్రహ్మాండ సమూహములన్నీ ఉత్పన్నము లగుచున్నాయి. అవన్నీ వానియందే స్థితికలిగి ఉంటున్నాయి. ఆ పరమాత్మ తత్వము... గురుతరమైన వాటన్నిటికంటే గురుతరమైనది.

సూక్ష్మతరమైన వాటన్నిటి కంటే సూక్ష్మాతిసూక్ష్మమైనది. స్థూలములైన వాటన్నిటి కంటే అత్యంత స్థూలమైనది. సమీపమైనవాటన్నిటి కంటే సమీపమైనది. జ్యేష్ఠతరములైన వాటన్నిటి కంటే జ్యేష్ఠతరమైనది.

ఆ పరమాత్మ స్థానం సర్వప్రయత్నములకు ఆత్యంతికమైనది. అక్కడ సర్వ శ్రమలు రహిత మౌతాయి. కనుక అన్నిటికంటే సులభమైనది అదే! అదియే తేజమును తేజము. అంధకారములన్నిటి కంటే అంధకారం అదే! దిక్కులన్నిటికీ దిక్కు అది. అది లోకములకు సంబంధించినది కాదు. కాని

Page:689

లోకంలోని సర్వ విషయాలు అదే! భావా భావముల, దృశ్యా దృశ్యముల, చైతన్య అహంకారముల రూపంగా ప్రకాశించేదంతా అదే.

ఓ శుద్ధాంతర్గత స్వరూపుడా! రామచంద్రా! ఏఏ ఉపాయములచే నీవు పరమ పవిత్రమగు ఆ ఆత్మపదమునందు స్థితి పొంది ఉండగలవో, సర్వ ప్రయత్నములచేతనూ అవి ఆచరించు. శ్రీరాముడు : అందుకు వేరు వేరు ఉపాయములు ఉన్నాయి కదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అవును. యోగ, జ్ఞానాది వేరు వేరు ఉపాయాలు ఉన్నాయి. అయితే ఓ సర్వ జనులారా! వేరు వేరు ఉపాయములు ఉన్నంత మాత్రంచేత వారు వేరు.. మేము వేరు” భ్రమలను ఆహ్వానించి, తత్ఫలితంగా ఆత్మ వస్తువును పోగొట్టుకొనకుండెదరు గాక! "ఆ ఆత్మ పదము అతి పవిత్రము, భేదాభేదరహితము, పరమ పదము" - అని గ్రహించి, అటుపై మీకు అనుకూలములైన మార్గములలో మీమీ ప్రయత్నములు కొనసాగించండి. అంతేగాని తదితరులు ఎందుకు ఎంతవరకు తప్పుచేస్తున్నారో లెక్కలు కట్టుకుంటూ మీ పురోభివృద్ధిని ఆటంక పరచుకోకండి. జన్మజరా వర్జితమగు ఆత్మ పదమును వదలి తుచ్ఛ తృణములకై ప్రాకులాడి మహత్తరమైన “మానవ ఉపాధి అనే అవకాశాన్ని వ్యర్థం చేసుకోవాలనుకునేవారికి ఇక నేను చెప్పేదేమున్నది?

ఓ సర్వ సదేహ మిత్రులారా! ఈ సర్వమూ ఆత్మచే ఆక్రమించబడియున్నది. అద్దాని సాక్షాత్కారము కొరకు ప్రయత్నించి ఈ చిత్తమును ఉపశమింపజేయండి.

ఎప్పుడైతే మీరు మీ యొక్క సర్వవ్యాపక, విషయాతీతస్వరూపమును ఎరుగుతారో అప్పుడు సర్వ పునరావృత్తులు శమించి ఈ సంసార భయము నుండి విముక్తులు కాగలరు.

9. మూడు అభ్యాసాలు ఒకేసారి!

శ్రీరాముడు : మహనీయుడగు ఓ వసిష్ఠమహర్షీ! మీ యొక్క ప్రవచనం అమోఘం. ఒక చిన్న ప్రశ్న- "ఈ సంసారమునకు బీజమేమిటి? అను విషయంలో మీరు అనేక విషయాలు ప్రస్తావించారు. ఒక దానికి మరొకటి ఎట్లు బీజమగుచున్నదో కూడా వర్ణించి చెప్పారు. 1. దృశ్యప్రపంచము 2. శరీరము 3. చిత్తము 4. వాసనలు 5. ప్రతిబింబ చైతన్యము 6. బింబ చైతన్యము... మొదలైనవన్నీ సంసార ప్రాప్తికి బీజమగుచున్న వైనమంతా వివరించారు. అయితే, వీటిలో అసలైన దుఃఖబీజమేది? సాధన దృష్ట్యా వీటిలో దేనిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని, ప్రవృత్తింపజేయుటచే, లేదా, నివృత్తింప జేయుటచే.... జీవుడు త్వరగా దుఃఖమును జయించి, సంసారమును నివృత్తింపజేసి ఆత్మ పదమును అధిరోహించగలడో - - అద్దాని గురించి చెప్పండి.

శ్రీవసిష్ఠమహర్షి

ఏతేషాం దుఃఖ బీజానాం ప్రోక్తం యద్యన్మయోత్తరమ్ |

తస్య తస్య ప్రయోగేణ శ్రీఘ్రమాసాద్యతే పదమ్ ॥

Page:690

రామయ్యా! ఏదేది ఎట్లు సంసారమునకు బీజమగుచున్నదో - అద్దాని విషయమై మనం వివరణ సమాధానాల రూపంలో ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఈ జీవుడు యత్నపూర్వకం లాగా దేని స్థానమేమిటో గ్రహించి, వాటిని సద్వినియోగపరచుకొని క్రమంగా అనేక భేదములతోకూడిన సంసారము నుండి భేదరహితమగు సత్తా సామాన్య స్థితి జేరుకోవాలి. సాధన ఏదైనా, శ్రద్ధతో, పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నామా? లేదా? - అనేది ముఖ్యం. పురుషప్రయత్నముచే వాసనలను -

త్యజించి సత్తా సామాన్యము' (Sense of equality) యొక్క పరాకాష్ఠ అయినట్టి చిత్ రూపంతో ఐక్యత పొంది, అక్కడ క్షణమైనా నిశ్చలస్థితి కలిగియున్నావనుకో... తక్షణమే నీవా ఉత్తమ పదము పొందినట్లే. భేదములన్నీ ప్రయత్నం చేసి జయించు. ఇక ఆపై బోధరూపమగు ఆత్మానుభవం కొద్ది ప్రయత్నంతోనే ప్రాప్తించగలదు. 'ఏకము'ను వదలి 'అనేకము'ను అంటిబెట్టుకొని ఎంతకాలం ఏ సాధనల ద్వారా ప్రయత్నిస్తూ పోయినా, ఆ తత్పదము దుర్లభంగానే ఉండిపోతుంది.

మనం ఇతఃపూర్వమే రెండు విభాగాలు గురించి చెప్పుకున్నాం - సంవిత్ (తెలుసుకుంటున్నది); సంవేద్యము (తెలియబడుచున్నది).

“తెలుసుకుంటున్నది” అయినట్టి సంవిత్ తత్వమునందు ధ్యాననిష్ఠతో ప్రయత్నశీలుడవై ఉంటే, ఆ ప్రయత్నము ఆత్మ పదమునకు చేరవేయగలదు.

తెలియబడుచున్నదాని కన్నా ముందే, దానికి ఆవల 'తెలుసుకుంటున్నది' ఉండి ఉన్నది కదా! అందుచేత 'తెలియబడేది సాధనగా తీసుకొని ఎంతకాలం ఎంతగా ప్రయత్నించినా చివరికి సంవిత్తును, ఆశ్రయించకుండా ఆత్మ పదమును అధిరోహించలేవని గ్రహించు.

లేదా, ఒక పని చేయి. “నేను ఏది చింతన చేస్తున్నానో, ఎక్కడ నడుస్తున్నానో, ఎక్కడ ఉన్నానో, ఎక్కడ ఆయా క్రియలు నిర్వర్తిస్తున్నానో - - అచటచట సంవిత్తే ఏర్పడి, ఆక్రమించుకొని ఉన్నది. అనగా సంవేద్యము సంవిత్తును ఆక్రమించుకుని ఉండజాలదు. సంవిత్తే సంవేద్యమును ప్రవర్తింప జేస్తోంది" అని ఆరూఢపరచుకొని, అప్పుడిక నీ సాధన కొనసాగించు. వాసనలను త్యజించడానికి యత్నములుచేయి. అప్పుడు నీ శారీరక, మానసిక దుఃఖములన్నీ తప్పక నశిస్తాయి.

సంవిత్ను ఆశ్రయించటం... శోధిత 'తత్' అంటారు.

సంవేద్యమును ఆశ్రయించటం... శోధిత త్వమ్ అంటారు.

ఉత్తమ పురుష ప్రయత్న ప్రాశస్త్యం గురించి నీకు ముముక్షు ప్రకరణాదిగా చెప్పుకుంటూనే వస్తున్నాను. కనుక ప్రయత్నించటం, అది కొనసాగించటం, ఆత్మ పదమును అధిరోహించటం అనేదే నీ మార్గం.

అయితే అన్ని ప్రయత్నాలకన్నా కష్టమైనదేది?... వాసనలను త్యజించటం. ఒక పెద్ద కొండను మొదలంట లేపి గాలిలోకి విసరటం సుసాధ్యపడవచ్చునేమో గాని, వాసనాత్యాగం అంత తేలిక కాదు.

మనస్సు లయం కానంతవరకూ వాసనలు ఉండనే ఉంటాయి. వాసనలు క్షయించనంతవరకూ

Page:691

చిత్తము శమించదు. తత్త్వజ్ఞానం కలుగనంతవరకు వాసనలు శమించవు. చిత్తము శమించనంతవరకూ వాసనలు ఉంటూనే ఉంటాయి.

1. మనోనాశనం 2. వాసనాక్షయం 3. తత్త్వజ్ఞానం ఈ మూడూ పరస్పర కారణం కలిగి ఉన్నాయి. అందుచేతనే అందులో ఏ ఒక్కటి మాత్రమే సాధించాలన్నా జీవునకు కష్టసాధ్యమే అవుతోంది. అందుచేత రాఘవా! వివేక యుక్తమగు ఉత్తమ ప్రయత్నంచేసి భోగములతో ఏర్పడే ఇచ్ఛను జయించాలి. వాసనా క్షయం, మనో నాశనం, తత్త్వజ్ఞానం - అనే మూడిటిని ఒక్కసారే చక్కగా ఆశ్రయించాలి. పరమ శివుడు త్రిపురాసురిడిని ఒక్కసారే మూడు పురములలో మట్టుబెట్టినట్లు ఈ మూడిటిని జీవుడు సాధించుకోవాలి.

ఈ మూడిటినీ ఒకేసారి మరల మరల అభ్యసించకపోతే ఆ బ్రహ్మపదం ఎన్ని సంవత్సరములు గడచిపోతున్నా లభించదు. చిరకాలం అట్లా అభ్యసిస్తే ఆ ప్రయత్నం తప్పక ఫలప్రదమౌతుంది.

అట్లా కాకుండా, ఆ మూడిటిలో ఒక్కొక్కదానినే తీసుకొని వాసనాక్షయం అయిన తరువాత మనస్సు సంగతి చూస్తాను... అప్పుడు మనస్సును కూడా నశింపజేసి ఆ తరువాత తత్త్వజ్ఞానం సంపాదిస్తాను... అనుకుని ప్రయత్నాలకు ఉపక్రమించావా - దోషభూయిష్టములతో కూడిన మంత్ర సాధనాకార్యక్రమంలాగా, పథ్యమును వదలి ఔషధం సేవించటంలాగా నిష్ప్రయోజనమౌతాయని హెచ్చరిస్తున్నాను. ముగ్గురు శత్రువులు మీద పడుచున్నప్పుడు అందులో ఒక్కొక్క శత్రువుతో మాత్రమే యుద్ధంచేసి శత్రునిర్మూలనం చెయ్యాలంటే ఎట్లా కుదురుతుంది? ముగ్గురితో ఒక్కసారే యుద్ధంచేయటానికి సంసిద్ధుడవు కావాలి కదా! అట్లాగే... వాసనాక్షయం, మనోనాశనం, తత్త్వజ్ఞాన సముపార్జన - అనే మూడిటిలో ఒక్కొక్కదానిని విడివిడిగా ఆశ్రయిస్తే పరమాత్మను పొందలేమని నా అభిప్రాయం. బుద్ధిమంతుడైనవాడు ఆ మూడిటినీ ఒక్కసారే అభ్యసిస్తే తప్పకుండా సంసార సాగరమును విచ్ఛిన్నం చేయగలడు. ఇది సుసాధ్యమే! ఇందులో సందేహం లేదు. నీవావిధంగా ఆచరించి నిస్సంగభావం పెంపొందించుకుని బ్రహ్మపదమున సంస్థితుడవయ్యెదవుగాక! అప్పుడు హృదయ గ్రంథులన్నీ తమంతట తామే తొలగుతాయి.

10. యుక్తి - ఉపాయం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామయ్యా! ఈ జీవుని యొక్క ఇప్పటి సంసార స్థితి ఎక్కడి నుండి వచ్చిపడింది? అనేక జన్మలలో అభ్యసించినదే ఇట్లు ప్రయోజనరూపంలో సంప్రాప్తమౌతోంది. ఇది చిరకాలాభ్యాసం లేనిదే తొలగేది కాదు. అందుచేత ఆతడు నడుస్తున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, వినుచున్నప్పుడు, తాకుచున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు - అన్ని సందర్భములలోనూ పరమ శ్రేయమగు మోక్షసాధనకొరకు వాసనాక్షయం,