Page:692
మనోనాశనం, తత్వజ్ఞానం అనే మూడిటినీ సదా అభ్యసిస్తూనే ఉండాలి. దృశ్యముపట్ల ఏర్పడే ఆకర్షణ, వికర్షణలను తగ్గించుకుంటూ మరొక వైపునుండి “ప్రాణాయామం” వంటి యోగాభ్యాసాలను ఆశ్రయించునుగాక! వాసనాత్యాగ, ప్రాణనిరోధముల సహాయంతో చిత్తము అచిత్తత్వం పొందుతుంది.
ప్రాణాయామాభ్యాసం చేతను, యోగాభ్యాసకుశలురైన గురువులు మనకు ప్రసాదిస్తున్న తదితరయుక్తులచేతను, హిత - మిత - పవిత్ర భోజనముచేతను, యమ నియమాదుల రూపంలో గల విధి, విధానముల చేతను, ఆసనజయముచేతను ప్రాణచలనం నిరుద్ధం కాగలదు.
నిర్వివాదము, సన్మాత్రము అగు ఆత్మయే సర్వ వస్తువుల ఆద్యంతములందూ ఏర్పడి ఉన్నది - అను యథార్థదర్శనం అభ్యసించుచూ వస్తే అప్పుడు వాసనలు ప్రవర్తించటం సన్నగిల్లగలదు. బహిర్ముఖములగుచున్న జనుల దృష్టులతో సాంగత్యం కొనసాగించకపోవటం చేతనూ, సాంసారిక మనోరథములు వదులుకుంటూ రావటం చేతనూ 'ఆత్మదర్శనజ్ఞానం కలుగుతుంది. దాని చేతనే వాసనాక్షయం కూడా కలుగుతుంది. ఈ శరీరం, దీని తీరు, ఇది పుట్టి, పెరిగి, నశించే విధం - పరికిస్తూ ఉండటంచేత కూడా వాసనలు సంక్షయిస్తూ ఉంటాయి. వాసనల విభవము సన్నగిల్లు చుండగా, ఇక చిత్తము ప్రవర్తించటం మానివేస్తుంది. గాలి వీచటం ఆగితే ఆకాశంలోని ధూళి కూడా శమిస్తుంది! ప్రాణ స్పందనమే చిత్త స్పందనమైయున్నదని అనుకున్నాం కదా!
ధూళి గుట్టల నుండి ధూళి లేస్తున్నట్లు ఈ ప్రాణ సంచలనం కారణంగా ప్రపంచమున అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. అందుకనే ఏకాంతంలో కూర్చుని ప్రాణస్పందననిరోధం కొరకై పలుమార్లు మిక్కిలి ప్రయత్నం చేయాలి. ఇష్టపూర్వకంగా అట్టి ప్రయత్నములు చిరకాలం చేస్తూ ఉండగా, ఆత్మ పదము తప్పక పొందుతావు. అంకుశం లేకపోతే దుష్ట ఏనుగు మాట వింటుందా? ఆధ్యాత్మ శాస్త్రములచే ఉదహరించబడుచున్న ఆయా ఉత్తమ ప్రయత్నములు చేయకపోతే చిత్తమును జయించటం అంత తేలికైన విషయం కాదు. ఏ ఉత్తమ ప్రయత్నాన్ని ఆశ్రయించకుండా మీనమేషాలు లెక్కకట్టుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటుంటే అట్టి జీవుని బ్రహ్మరుద్రాదులు కూడా కాపాడలేరు. కనుక ఓ జనులారా! లేవండి. లేచి నడుంకట్టండి. నడుంకట్టి సత్ప్రయత్నశీలురవండి. అల్పమార్గాలు ఆశ్రయించి. అల్పప్రయోజనములవైపు తరలి వెళ్ళాలనుకోవటం ఉచితమా? కానే కాదు.
1. అధ్యాత్మ విద్యాప్రాప్తి; 2. సాధు, మహాత్ములతో సాంగత్యం; 3. వాసనా త్యాగం; 4.ప్రాణ స్పంద నిరోధం... ఇవే చిత్తమును జయించటానికి ప్రబలమైన ఉపాయాలు.
ఓ సభికులారా! ఈ చిత్తమునకు మించిన శత్రువు భూనభోంతరాళాలలో మరింకేదీ లేదు. దీనిని సరి అయిన రీతిలో నియమించారా... ఇంతకు మించిన మిత్రుడు మరొకడెవ్వడూ ఉండడు. గాలికి ఎగిరిన దుమ్ము జలధారలచే అణిగిపోవునట్లు చక్కటి యుక్తులచే చిత్తము శీఘ్రంగా
జయింపబడగలదు.
శ్రీరాముడు : మహాత్మా! హఠయోగంచే ఈ శరీరమును పరిశ్రమింపజేసి, ఎంతో శ్రమకు ఓర్చి కొందరు చిత్తమును ఉపశమింపజేయటానికి ప్రయత్నిస్తున్నారు కదా! వారు దేహము శుష్కింపజేసి,
Page:693
కష్టతరమగు హస్తపాదాదుల నియమములచే మనోవాక్ ఇంద్రియములను స్వాధీనపరచుకొని, శోషింపజేసి చిత్తమును తమ వశం చేసుకోవాలని ఉద్దేశిస్తున్నారు. అట్టి ఉద్దేశము ఉచితమేనా? మేము కూడా చిత్తశత్రువును జయించటానికి అట్టి హఠయోగం ఆశ్రయించవలెనని మీ అభిప్రాయమా? శ్రీవసిష్ఠ మహర్షి : సద్గురువులగు మార్గదర్శకులచే ఎన్నో సులభమైన ఉపాయాలు ప్రవచించబడ్డాయి. ధ్యానం, ప్రాణాయామం, నామస్మరణ, కర్మ ఫలసమర్పణ, పూజ, దానాదులు - - ఎన్నో సున్నితమైన సరళమైన ఉపాయాలు ఉన్నాయి. అట్టి సుఖకరము, సులభ సాధ్యము అగు ఉపాయాలను వదలి, భగవద్దత్తమగు ఈ ఉపాధిని శుష్కింపజేస్తూ మంత్రతంత్రాదులచే హఠంగా చిత్తమును వశపరచుకోవా లనుకోవటం మా ఉద్దేశంలో ఏమంత ఉచితం కాదు.
ఎవ్వనికైనా, దీపాన్ని వదలి మసితో (కాటుకతో) చీకటిని తుడిచి వేయాలనుకోవటం, పిడికిలి గుద్దులతో మదపుటేనుగును నిలిపి ఉంచాలనుకోవటం తేలికైన పనేనా? చిత్తమును, చిత్తమునకు ఉపకరణమగు ఈ దేహమును స్వస్థపరచి క్రమంగా మనస్సును సుస్థిరీకరించటానికి 'యుక్తి'ని ఆశ్రయించాలి. సర్వ శక్తి సమన్వితమగు చిత్తము ముందు ఏ శక్తి ఎట్లు ఉపయోగిస్తుంది? యుక్తిని వదలి మొండిగా, మూర్ఖంగా హఠం మొదలైన భయమును గొలిపే బలవత్పూర్వక యత్నములు చేయు వారిని ఆత్మ శాస్త్రజ్ఞులు 'శరులు, మొండివారు' అని పిలుస్తున్నారు. అట్టివారు ఒక భయమునుండి మరొక భయమునకూ, ఒక క్లేశము నుండి మరొక క్లేశమునకూ పయనిస్తున్నారని గ్రహించు. వారికి ధైర్యం, విశ్రాంతులు లభించటంలేదు. తాము భయపడుచు, తదితరులను భయపెట్టుచూ, మూర్ఖము, బుద్ధిహీనము అగు లేళ్ళు పరుగులు తీస్తున్నట్లు హఠం కొనసాగిస్తున్నారు. అల్పము, భేదాశ్రయము అగు వారి బుద్ధి ఎక్కడా విశ్వాసం సంపాదించలేక భీతినే పొందుతోంది. జ్ఞానబలిమి లేక వారి చిత్తము అనేక చింతలందు వ్యాప్తమై ఉంటోంది. నదీ జలంలో తృణములు (గడ్డిపరకలు) లాగా వారి మనస్సు రాగద్వేషాదులందు కొట్టుమిట్టాడటమే జరుగుతోంది.
అందుచేత, హఠంచే “నేను వేరు, ఈ తదితర జనులు వేరు. ఆ పరమాత్మ వేరు. క్రూరమైనట్టి ఏమైనా నియమములచేత గాని నేను దైవమును గాంచలేను" - అని అనుకోవటం వేదవేదాంతాల అంతర్లీన గానం పెడచెవిని పెట్టటమేనని మా అభిప్రాయం. ఓ మిత్రులారా! మీరు ఆవేశకావేషాలతో హఠం ఆశ్రయిస్తే తుచ్ఛ విషయములే ఎదురౌతాయి గాని, సర్వసమదృష్టి పూర్వకమగు ఆత్మానుభవం కాకపోవచ్చునని హెచ్చరిక చేస్తున్నాను.
మరికొందరు ఆత్మ విషయ విచారణను ఆశ్రయించక, కేవలం, యజ్ఞ, తప, తీర్థాదులకే తమ యత్నములను పరిమితం చేసుకుంటున్నారు. ఏది ఎందుకు ఉన్నదో గ్రహించలేకపోతున్నారు. తమలో సర్వదా వేంచేసియున్న ఆత్మ భగవానునివైపు తమ దృష్టిని మరల్చుకోవటం లేదు. ఫలితంగా అసలు విషయమేమిటో గ్రహించకుండానే అరణ్యంలో దారితప్పిన జింకలాగా అనేక మానసిక వ్యధలతో చిరకాలం గడిపివేస్తున్నారు. జ్ఞానముచే ఆత్మజ్ఞానము కొరకై సత్ప్రయత్నము లందు
Page:694
నియమితులవటం మంచిది గాని, గుడ్డిఎద్దు చేలో పడ్డట్లు సంకుచిత దర్శనమునకు బద్ధులు కాకూడదని అట్టివారికి గుర్తుచేస్తున్నాను. “నా బాహ్య అభ్యంతరములందు సర్వదా ఆత్మయే సమస్తంగా ఏర్పడి ఉన్నది. అది సర్వ శుద్ధము, అఖండము, అప్రమేయము” - - అను భావమే ఆత్మీభావన. అట్టి ఆత్మీభావనను ఆశ్రయించకుండా, కేవలం కథలకు, వర్ణనలకు, ఆకారాదులకు పరిమితులైతే ఎట్లా? చిత్రపటంలోని పండు ఆకలి తీర్చగలదా? 'త్వమ్' భావనాపరిమితులవటంచేత బహువిధ దుఃఖాల చేతనూ, రాగాది దోషములచేతనూ వారు పలువైపుల నుండి పీడితులగు చున్నారు. తమ చెంతనే తమ స్వరూపమై వెల్లివిరిసియున్న ఆత్మ యొక్క అభేద తత్త్వమును గ్రహించ లేకపోతున్నారు. శ్రీరాముడు : అట్లా ఎందుకు జరుగుతోంది మహర్షీ? వారికి తరుణోపాయమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : వారి ప్రయత్నములు 'వృథా' అని నా ఉద్దేశం కాదు. అయితే దేహాత్మభావన త్యజించ నంతకాలం ఒకప్పుడు స్వర్గమును, మరొకప్పుడు నరకమును పొందవలసిన అగత్యం ఏర్పడుచూనే ఉంటుంది. "అనిత్యము, స్వర్గ - నరక - భవభోగముల నిమిత్తమై పతనోత్పతనములు పొందేది అయినట్టి ఈ దేహం నేను కాదు. నా స్వరూప, స్వభావములు దేహముకంటే విలక్షణమైనవి”
- - అను ఆత్మజ్ఞానం ఆశ్రయిస్తే అన్ని రుగ్మతలు వాటంతట అవే తొలగుతాయి. అందుచేత దేహాత్మభావన విడచుచూ, జ్ఞాన దృష్టితో వారివారి ప్రయత్నములు నిర్వర్తించెదరుగాక! అట్టివారిపై గల అవ్యాజమైన ప్రేమ చేతనే ఆ పరమేశ్వరుడు మనకు ఈ యోగవాసిష్ఠాది ఆత్మ సమాచారాలు, గ్రంథములు ప్రసాదించుచున్నారు. అందుచేత రామా! తటాక జలంలాగా వృత్తులను పొందుచూ, కొనసాగిస్తూ ఉంటే సరిపోదు. వృత్తిరహితము, సర్వసాక్షి, సర్వ సంకల్ప వికల్పములకు ఆవల ఉన్నది, సంవిత్ అని చెప్పబడుచున్నదియు అగు ఆత్మతత్త్వమును దర్శించాలి. అందుకు సదుద్దేశంతో చేసే ఆయా యజ్ఞ, తప, తీర్థాది, ప్రయత్నములు నిర్మల హృదయ సముపార్జన రూపమున తప్పక సహకరిస్తాయి. అందుచేత... తెలియబడుదాని నుండి - - 'తెలివి' లేక తెలుసుకొనుచున్న దానివైపుగా, సంవేద్యము నుండి - - సంవిత్తు వైపుగా, శోధితత్వమ్ (Creation) నుండి-శోధితతత్ (Creator) వైపుగా సాధకులు పురోగమించెదరు గాక!
కాబట్టి రామా! ఆత్మానుభవార్థమై క్రమక్రమంగా సర్వదోష దృష్టులు వదలివేయుము. శుద్ధ సంవిత్తును ఆశ్రయించు. వీతరాగుడవై ఉన్నచోటనే సుస్థితుడవు, స్వస్థుడవు, ఆత్మానుభవ సమన్వితుడవు కమ్ము. ఈ సాంసారిక రుగ్మతలన్నిటికీ రహితస్థానం అదే!
జ్ఞానవానేవ సుఖవాన్! జ్ఞానవానేవ జీవతి! | జ్ఞానవానేవ బలవాన్! తస్మాత్ జ్ఞానమయోభవ ॥
ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడే సుఖిస్తున్నాడు. జ్ఞానవంతుని జీవితమే సఫలం పొందుతోంది. జ్ఞానవంతుడే బలసమన్వితుడు కూడా! అందుచేత నీవు జ్ఞానమయుడవు కమ్ము.
మహాత్మా, రామచంద్రా! విషయవర్జితం, సర్వోత్తమం, అనాది, కల్పనా రహితం, నిర్వికారం అయినట్టి 'సంవిత్’ పదమును నీవు ఆశ్రయిస్తూ ఉండు. కల్పనావర్జితుడవగుము. హృదయాకాశమున
Page:695
ప్రశాంతుడవై సుస్థితుడవు కమ్ము. బ్రహ్మమును సమాధియందు సంభావించు. మరల వ్యుత్థాన కాలంలో (సమాధి నుండి బయల్వెడలినప్పుడు) శమముతో లోన - బయట నింపివేసి, ఆపై యథోచితములగు క్రియలను నిర్వర్తిస్తూ ఉండు. మనం ఇప్పటివరకూ చెప్పుకున్నట్టి జీవన్ముక్తుని గుణసంపదను సంతరించుకున్నవాడివై అకర్తృత్వ పదమును పొందియుండుము.
11. జ్ఞానవానేవ బలవాన్
శ్రీవసిష్ఠమహర్షి : ఎవ్వరైనాసరే.... కాస్తయినా విచారణ చేసి తన చిత్తమును కొంచమైనా నిగ్రహించగలిగితేనే తమ జీవితమును కొంతైనా సఫలం చేసుకున్నట్లు. విచారణ అనే కోమలమైన కల్పవృక్షాంకురం హృదయంలో స్ఫురించిందా - అది త్వరలో అభ్యాసయోగం చేత క్రమంగా అనంత శాఖాయుతం కాగలదు. నిండు సరస్సును పక్షులు, చేపలు స్వయంగానే వచ్చి ఆశ్రయిస్తాయి చూచావా? కొంచెం ప్రౌఢవిచారణ గల వైరాగ్యయుతుడగు మానవుని శమము, దమము, దయ, దాక్షిణ్యము, స్నేహము, సాత్వికము - మొదలైన శుద్ధగుణములు స్వయంగా వచ్చి ఆశ్రయిస్తాయి.
ఉత్తమ విచారవంతులు, యథార్థమగు ఆత్మత్త్వమును గాంచువారు అగు బుద్ధిమంతులు, మహనీయులు ఈ భూమిపై ఎందరో ఉన్నారు. అట్టి జ్ఞానులను బ్రహ్మదేవుని వరకు గల మహదైశ్వర్యములు కూడా ఏమాత్రం ప్రలోభింపజేయలేవు. 'ఆత్మసాక్షాత్కారము' అను సమ్యక్ దర్శనమును సంపాదించుకున్న ఆ మహనీయులను ఇక్కడి ప్రాపంచిక సంఘటనలుగాని, మానసిక వృత్తులుగాని, శారీరక - - మానసిక వ్యధలుగానీ సమీపించవు. వారు తమను - తదితరులను కూడా సర్వాతీతమైనట్టి ఏకైక ఆత్మవస్తువుగా దర్శిస్తూ ఉంటారు.
వాయువేగముతో కూడిన ప్రళయకాల మేఘమును వీథిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు తమ పిడికిళ్ళతో పట్టుకోగలరా? ముగ్ధస్త్రీలు ఆకాశంలో ప్రశాంతంగా ప్రకాశిస్తున్న చంద్రబింబమును పట్టుకొని తమ పేటికలో బంధించగలరా? ఐదు ఆరు దోమలు ఒక చోటికిజేరి మదగజమును నిరోధించగలవా? కొన్ని చిరుకప్పలు ఒకటై కొండచిలువను దిగమ్రింగగలవా? జ్ఞేయమగు ఆత్మ వస్తువును గ్రహించిన వివేకి ఈ ప్రపంచమున సంచరిస్తున్నప్పటికీ, ఇక్కడి పదార్థములు, ఇంద్రియాలకు గోచరించే వస్తుజాలాదులు, సంసార జనుల అభిప్రాయాదులు ఆతనిని ఆకర్షించలేవు. చ్యుతుని చేయలేవు. ఆత్మజ్ఞుని ఆకర్షించగల వస్తువిక్కడేమున్నది? ఆత్మానుభవమునకు మించినదేమున్నది? ఓ రామచంద్రా! దుర్బల విచారణయుక్తుని ఈ విషయ శత్రువులు ఇట్టే నిర్జించివేస్తున్నాయి. ఇక వాయువీచికలచే ఎండుటాకులు ఎగురుచున్నట్లు ఆతడు సంసార ప్రదేశంలో అటూ ఇటూ ఈడ్చుకు పోబడుచున్నాడు. కానీ ప్రౌఢవివేకం గలవానిని ఈ రాగాది వృత్తులు లేశంకూడా బాధించలేవు. పిల్లగాలులు వెళ్ళి మేరుపర్వతాన్ని ఏంచేస్తాయి? అదృఢమైన విచారణ గలవానిని క్రిందు - మీదు
Page:696
చేయటానికి స్వల్ప సంఘటనలు, కొద్దిపాటి చింతలు చాలు. అవే విషయాలు విచారయుక్తుని ముంగిట వ్రాలినప్పుడు, ఆతని జ్ఞానబలాన్ని చూడగానే రాగము-ద్వేషము మొ||వి తోక ముడుస్తున్నాయి. అవి ఎటకో పలాయనం చిత్తగించవలసిందే!
ఎవ్వడైతే నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, నడుచుచున్నప్పుడూ ఆత్మ విచారయుతుడై ఉంటున్నాడో... ఆతని చిత్తము అల్లరిపోకడలకు దూరంగా ఉండి, ఈ మాయాజాల జగత్తును ప్రశాంతంగా గమనిస్తోంది. అట్లాగాకుండా మాయాజాలంలో ప్రవేశించి రాగాదులచే ప్రహర్షితుడైయ్యేవాడు మృతునితో సమానమేనని జ్ఞానుల అభిప్రాయం. ఓ రామా! నీవు సర్వదా అమృత స్వరూపుడవై ఉండెదవుగాక!
"కిమ్ ఇదంస్యాత్ జగత్? కింస్యాత్ దేహమ్?” - ఇత్యనిశం శనైః | విచారయత్ అధ్యాత్మదృశా, స్వయం వా, సజ్జనైః సహ ||
"ఈ ప్రపంచమేమిటి? ఈ దేహమేమిటి?” అని నిరంతరం మరల మరల అధ్యాత్మదృష్టితో తనకు తానుగానో, లేక సజ్జనులతో కూడియో విచారణ చేస్తూ ఉండాలి. దీపం వెలిగించగానే గదిలో ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! 'ప్రమోదము' అనే చీకటిని నశింపజేయగల విచారణచే ఉత్తమ వివేకం ప్రాప్తిస్తుంది. అప్పుడీ జగత్తు ఏమిటో, ఏమై ఉన్నదో, ఏమికాబోతున్నదో... అంతా సుస్పష్టమౌతుంది.
జ్ఞానేన సర్వదుఃఖానాం వినాశ ఉపజాయతే ॥ కృతాలోకవిలాసేన తమసామివ భానునా॥
సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలైపోతోంది చూచావా? జ్ఞానంచే సర్వదుఃఖాలు సంక్షయిస్తాయి. చంద్ర ప్రకాశముచే జగత్తంతా ప్రశాంతమయమగుచున్నట్లు, జ్ఞానము ప్రవృత్తమగు చుండగా జ్ఞేయం స్వయంగా, పూర్ణరీతిగా గ్రహించబడుచూ, హృదయాకాశం ఆహ్లాదమయం
కాగలదు.
ఓ రాఘవా! శాస్త్రవిచారణచేయి. అట్టి శాస్త్రవిచారణ నీకు బ్రహ్మతత్త్వమును ఎరుగజేయగలదు. జ్ఞేయము తోటి అభిన్నత్వం ప్రసాదించేదే జ్ఞానం. విచారణచే జనించే పరమోత్తమమగు అవగాహనను విజ్ఞులు 'జ్ఞానం' అని పిలుస్తున్నారు. కల్లు త్రాగినప్పుడల్లా మత్తు వస్తుంది చూచావా? సమ్యక్ జ్ఞానం సంపాదించినప్పుడు స్వయముగా జ్ఞేయుడై ఉంటాడు. 'జ్ఞేయం’ అంటే- సమం, నిర్మలం అగు బ్రహ్మమే. సాంసారిక జ్ఞేయం (That which is being Known while in wordly ignorance) జ్ఞానసముపార్జనచే స్వయంగా అవిద్యారహితం అగుచున్నది. జ్ఞానవంతుడు దేని యందునూ సంలగ్నం కాక సంగదోష రహితుడై, జీవన్ముక్తుడై పూర్ణమనోరథుడై సమ్రాడాత్మస్వరూపుడై ఉంటాడు.
రామచంద్రా! జ్ఞాన సమన్వితుడైనవాడు మధురధ్వనులందుగాని, విషయభోగములందుగాని, సుందర వనితాది శబ్దములందుగాని, నృత్య, మధుర గీతాదులందుగాని తన చిత్తం లగ్నంచేయడు.
Page:697
కర్కశ శబ్దములు తాను పలుకడు. అవి ఆతని చెవిని సోకవు. విషయములందు, వన క్రీడలందు ప్రీతి కలిగి ఉండడు. హంసకు మరుభూమి యందు ఆసక్తి ఉంటుందా? శాకాహారికి మాంస ఖండములను చూచినప్పుడు నోరూరదు కదా! ఆత్మచే పరితృప్తుడైనవానికి ప్రాపంచిక పదార్థములను చూచినంతమాత్రంచేత లోభ, మోహాలు పుట్టవు. ఆతనికి "యమ, సూర్య, చంద్ర, నక్షత్ర, వాయు, రుద్ర” - మొదలైన స్థానములందు గాని, మందర కైలాసాది పర్వత ప్రదేశములందు గాని, లౌకికమైన కళలందు గాని, సువర్ణరత్నమాణిక్యాదు లందుగాని, రంభ ఊర్వశి మొదలైన దేవతా స్త్రీల దేహ సౌందర్యములందు గాని ఆసక్తి ఉండదు. అవి ఎదురుపడినప్పుడు అపేక్షించడు, ద్వేషించడు. తన ఆత్మ దృష్టిని, మౌనధ్యానమును వీడడు. తన శత్రువులను చూచినప్పుడు కూడా అచలుడై, పరిపూర్ణచిత్తుడై, మౌని అయి ఉంటాడు.
వేదవిహితుడగు విప్రునకు మద్యపు వాసనపై ప్రీతి ఉంటుందా? ఉండదు కదా!
ఆత్మ జ్ఞానియగు మహనీయుడు ప్రియా ప్రియములందు సమబుద్ధిని కలిగి ఉంటాడు. పుష్పములందు, లతలందు, చందన - అగరు - కర్పూర - కస్తూరి - లవంగాది సుగంధములచే ఆతడు ప్రత్యాకర్షితుడు కాడు. సముద్రపు గుడగుడ శబ్దముల హోరు, ఆకాశంలో జనించే ప్రతిధ్వనులు, సింహగర్జనలు, శత్రువుల భేరీ నినాదములు, డమరుక శబ్దములు, కర్ణకఠోరమగు ధనుష్టంకారాలు ఆత్మజ్ఞానిని కొంచంకూడా భీతిల్లజేయలేవు. ఏనుగుల ఘీంకారాలు, బేతాళ కలహాలు, పిశాచ, రాక్షసాదుల హీహీనాదాలు ఆతనిని చలింపజేయలేవు. పిడుగుల శబ్దములచేగాని, పర్వతముల విస్ఫోటకముచేగాని, బాణ, వజ్రఘాతములచేగాని ఆతని అనుక్షణికమగు స్వస్వరూపానుభవము కలతపడదు. అంపపు ఘర్షణలు, తీక్షఖడ్గ ఛేదనపు మెఱుపులు, తీవ్ర పదజాలములు ఆతని నిశ్చల ఆత్మానుభవం ముందు నిష్ప్రయోజనమే అవుతాయి. వనవాటికయందు గాని, మరుభూమియందు గాని, జన సమూహంలో ఉన్నప్పుడుగాని, అనేకమంది వినమ్రులగు జనుల మధ్య పలుకులు పలుకుచున్నప్పుడు గాని, తిరస్కాం, పురస్కారములు అందించబడుచున్నప్పుడు గాని... ఆతనికి ఆనందము, దుఃఖము - - రెండూ ఉండవు.
నిప్పుకణికల వంటి ఇసుక ఎడారులలో అడుగులు వేస్తున్నప్పుడుగాని, మృదువైన పచ్చిక బయళ్ళలో చిరుగాలులు అనుభవిస్తున్నప్పుడు గాని, ఖడ్గ ప్రహారములందు గాని, సుఖ శయ్యలందు గాని, ఎత్తైన పర్వతములపై సంచారం చేస్తున్నప్పుడుగాని, లోతైన బావులందు ఉండవలసి వచ్చినప్పుడు గాని ఆతడు ఒక్క తీరుగానే ఉంటాడు. సంపదలు, ఆపదలు వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు ఆతనికి భయము గాని, ఆనందము గాని ఉండదు. తలపై భారము మోస్తున్నవాడు, ఆ భారాన్ని క్రిందకు త్రోసి వస్త్రముచే ముఖం తుడుచుకుంటూ విశ్రాంతి అనుభవిస్తాడు చూచావా? ఆ జ్ఞానసమన్విత హృదయుడు సర్వవేళలా అంతర్ముఖుడై అట్టి విశ్రాంతి, ఆనందములను ఆస్వాదిస్తూ ఉంటాడు. భీతి, వ్యాకులత, గర్వములుగాని, ధైర్య, అధైర్యములు గాని లేనివాడై సముడై, స్వస్థచిత్తుడై అకృత్రిమ మగు పూర్ణ స్వభావము వహించి ఉంటాడు.
❖
Page:698
ఓ రామచంద్రా! జ్ఞాని యొక్క సర్వ సమత్వమహిమ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆతడు అపవిత్రములు, అపథ్యములు, గోమయముచే తడిసి రసహీనమయి ఉన్న ఆహారమును కూడా మృష్టాన్నమువలె ఆరగించగలడు. తనయొక్క 'అసక్తత' అను బలంచేత రుచికర, అరుచికర పదార్థములను ఆస్వాదిస్తున్నప్పుడు సమచిత్తుడై ఉండగలడు. తృణములు - కేశములు - ఎముకలు రక్తము మొదలైనవి చూస్తున్నప్పుడు కూడా ఆతడు సంతుష్టుడు, కృష్ణుడు కాడు. పురుగులో కూడా ఆతనికి బ్రహ్మదేవుడు కనిపిస్తాడు.
జీవితస్యాపి హర్తారం దాతారంచ ఏకరూపయా |
దృశా ప్రసాద - మాధుర్య శాలిన్యా పరిపశ్యతి ॥
జీవహర్త, జీవదాత - ఈ ఇద్దరినీ ఆతడు ప్రసన్న మాధుర్యములతో కూడిన ఏకదృష్టితో వీక్షించగలడు. దీర్ఘకాలం ఉండే దేవతల శరీరములందుగాని, అల్పకాలస్థమగు ఈ మానవ శరీరములందు గాని, ఈ రెండిటికీ సంబంధించిన భోగ్య - అభోగ్య, రమణీయ - అరమణీయము లందుగాని ఆతడు సర్వసమత్వం వహించి ఉంటాడు. వాటిచే ఆతనికి సంతోషము గాని, దుఃఖం గాని కలుగవు. ...వేద్యమగు ఆత్మను ఎరిగి ఉండుటచే ఆతని చిత్తము రాగరహితమై ఉంటుంది. ఈ జగత్తు యొక్క స్థితియందు ఆతనికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. 'ఇక్కడి విశేషములన్నీ మిథ్యయే కదా?...” అను సునిశ్చయం కలిగి ఉంటాడు. ఇంద్రియములకు విషయస్థితి యొక్క ఆవశ్యకత్వం కలుగజేయక, నిశ్చింత బుద్ధిచే ప్రభవిస్తూ ఉంటాడు.
నాయనా రామా! లేళ్ళు లేచిగుళ్ళను భక్షిస్తాయి చూచావా? తత్త్వజ్ఞుడు కానివానిని... ఆత్మ యందు విశ్రాంతి పొందని వానిని... స్వస్వరూపస్థితి ఎరుగనివానిని ఈ ఇంద్రియములు కబళించి వేస్తున్నాయి. ఇక ఆతడు వాసనాతరంగములచే చుట్టబడి సంసారసముద్రంలో కొట్టుకుపోవుచూ అనేక వేదనలు, రోదనలు ఎదుర్కొంటున్నాడు. ఇంద్రియములనే మొసళ్ళు ఆతనిని గుటుక్కున మ్రింగటానికి సిద్ధపడుచున్నాయి. అందుకే, మానవుడు విచారణయుతుడు కావాలి" అని ఈ ఉపశమన ప్రకరణ సమీక్షలో మరల మరల గుర్తుచేస్తున్నాను. జల ప్రవాహం పర్వతమును పెకలించ గలదా? విచారయుతుడై, భవ్యపదమున స్థితి కలిగి ఆత్మయందు విశ్రాంతి పొందిన బుద్ధిని సంపాదించుకున్న వానిని ఇక్కడ కనబడే వికల్పములు ఏమీ చేయలేవు. సర్వ సంకల్పములకూ సీమాంతరమగు పరమపదమున విశ్రమించేవారు, ఆత్మ పదప్రాప్తి పొందినవారు ధన్యులు. వారికి రాజాధిరాజత్వం కూడా తృణప్రాయమే అవుతుంది. ఎవరి చిత్తమైతే పూర్ణమై, విస్తృతమై, ఆత్మాకారం పొంది ఉంటుందో - - అట్టి వారికి ఈ జగత్తు ఊరికి చివర ఉన్న శిథిల గృహం వంటిది. వారికి క్షణకాలం అనంత కల్పములు కూడా ఒక్కటే అవుతాయి. వారు సర్వదా సమత్వం వహించి ఉంటున్నారు. ఈ ప్రపంచమంతటినీ 'సంవిన్మాత్రము'గా ఎంచుచున్నారు. దీనిని సర్వ సాక్షియగు ఆత్మగానే చూస్తున్నారు. అందుచేత సర్వజగన్మధ్యంలో ఉన్నప్పటికీ ఏదీ పొందటం లేదు. కోల్పోవటం లేదు. జ్ఞానులై విహారం చేస్తున్నారు.
Page:699
సంవిన్మాత్రపరిస్పన్దే జగతే వస్తుపన్జరే
కింహేయం? కిం ఉపాదేయమ్? ఇహ తత్వవిదాం మతమ్||
ఈ జగద్వస్తు పంజమరంతా సంవిత్తు యొక్క స్పందనమే కదా! అందుచేత తత్వవేత్తలకు ఇందు గ్రహించతగినదేముంటుంది? త్యజించతగ్గదేమున్నది? ఎరుగబడుచున్నదంతా సంవిన్మాత్రమగు ఎరుగుచున్నదానిలోనే ఉండగా అది వదలటమేమిటి? పట్టుకోవటమేమిటి? కనుక రామా! నీవు సర్వ భ్రమలూ విడచిపెట్టు.
అజ్ఞాన జీవులకు అభిలషితములగుచున్న వర్తమాన - - భవిష్యత్ విషయజాతమంతా తత్త్వజ్ఞుని దృష్టిలో శూన్యాకాశమువంటిది మాత్రమే. తాను మాత్రం సర్వదా సంవిత్స్వరూపుడై సర్వదా సర్వత్రా ఏర్పడి ఉంటున్నాడు.
ఆదావర్తేచ యన్నాస్తి, వర్తమానే_పి తస్య చ
కంచిత్తాలలవం దృష్టా సత్తాసౌ సంవిదో భ్రమః ||
ఏదైనా ఒక వస్తువు మొదట్లోనూ - చివరలోనూ లేకుండా వర్తమానంలో మాత్రం కొద్దికాలం గోచరిస్తోందనుకో! దానియొక్క ఉనికి సంవిత్తు యొక్క భ్రమ మాత్రమే అయి ఉన్నది. అద్దానికి స్వతఃసిద్ధమైన సత్త లేనట్లే అగుచున్నది. ఈ జగత్తులోని ఆయావిశేషాలు చూస్తున్నప్పుడు ఇట్టి దృఢ నిశ్చయం కలిగి ఉండు. భావాభావములందు కూలుచున్న బుద్దియొక్క విభాగమును పరిత్యజించు. నిస్సంగుడవు, ప్రకాశస్వరూపుడవు, సంవిన్మాత్రుడవు అయి ఉండు, భావాతీతుడవగుము.
ఓ రామచంద్రా! ఎదురుగా ఉన్న ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలనే ఉపకరణములను ఉపయోగించి కర్మలు చేయి. లేదూ... సమాధి వహించి కర్మలను త్యజించు. సంగదోషరహితుడవై ఉంటే ఆ ఉభయ స్థితులు నిన్ను అంటజాలవు. అసంగబుద్ధిచే మనస్సు ద్వారా ఉపకరణమాత్రములగు ఈ అవయవములతో వ్యవహరించావా... ఇక మనోరథదశలు, సుఖదుఃఖదశలు నిన్ను సమీపించ నైనా లేవు.
గత సంగమనా దృష్ట్యా పశ్యన్నపి, న పశ్యతి ఏతదన్యస్థ చిత్తత్వాత్ బాలేనాపి అనుభూయతే ॥
సంగములేని మనస్సు కలవాడు కంటితో చూస్తున్నప్పటికీ చూడనివాడే అవుతాడు. ఒక చిన్న దృష్టాంతం చెపుతాను. మనస్సు, భావన ధ్యాస మరెక్కడో ఉన్నాయనుకో. అప్పుడు మనం బాటలో పోతున్న ఒక వ్యక్తినో, వాహనమునో కళ్ళతో చూస్తున్నా... చూడని వారమే అవుతాము కదా! చిన్న పిల్లవాడినుండి పెద్ద వాళ్ళవరకు ఇట్టిది అనుభూతమగుచున్న విషయమే! అన్యవస్తువుపై దృష్టి కలిగియున్నప్పుడు ఎదురుగా ఉన్నది చూడనివారమే అగుచున్నట్లు సంగము లేకుండా ఇంద్రియములతో క్రియలు నిర్వర్తించినా కూడా... నిర్వర్తించని వాడవే అవుతావు.
కాబట్టి అసంగ చేతస్కుడు (One who has no attachment) అగు మనుజుడు చూచినా చూడని వాడే! వినినా... వినని వాడే! తాకుచున్నా... తాకని వాడే! వాసన చూస్తున్నా... చూడని
Page:700
వాడే! కళ్ళుతెరచినా.. తెరవని వాడే! మూసినా.. మూయని వాడే! ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ కేరింతలు పెట్టుచున్నప్పటికీ ఇంటాయన ధ్యాస ఎక్కడో ఉంటే, ఆ శబ్దములు చెవిన పడుచున్నప్పటికీ ఆతడవి వినకయేపోవటం సభికులందరికీ సుపరిచయమైన విషయమే కదా! ఆత్మలో ధ్యాస కలిగి ఆ రీతిగా ఇంద్రియములను ఉపయోగించటం, ఇక ఇంద్రియ విషయములలో ఆత్మను ప్రవేశింపజేయకుండటం అభ్యాసంచే సుసాధ్యమే!
'సంగము' అంటే ఏమిటి? అభిలాష - - అభినివేశములే కదా!
సంగఃకారణమ్ అర్థానామ్, సంగః సంసారకారణమ్ |
సంగః కారణమ్ ఆశానామ్, సంగః కారణమ్ ఆపదామ్ ॥
ఓ రామయ్యా! సంగమే సర్వ పదార్థములకు కారణం. సంసారమునకు కూడా హేతువదే. సమస్త ఆశలకు, ఆపదలకు అదే మూలం. సంగము వదలగలిగితే మోక్షమే లభిస్తుందయ్యా! సంగము త్యజించిన మరుక్షణం "నేను జన్మించువాడను. కర్మిష్ఠుడను. మరణించువాడను" - అను అల్పభావములన్నీ తొలగిపోతాయి. కనుక నీవు సర్వ పదార్థములందూ సంగమును వదలి జీవన్ముక్తుడవు కమ్ము.
శ్రీరాముడు : సర్వ సంశయములనూ నివృత్తింపజేయగల హే సద్గురూ! ఈ రోజు మన సంవాదము ముగించేముందుగా ... 'సంగము' అనగా ఏమిటో సంక్షిప్తంగా వివరించ ప్రార్థన.
శ్రీవసిష్ఠమహర్షి :
భావాభావే పదార్థానామ్ హర్షామర్షవికారతా । మలినా వాసనాయైషా సాసంగ ఇతి కథ్యతే ||
పదార్థముల సంయోగ - - వియోగములందు (అవి లభిస్తున్నప్పుడూ - తొలగుచున్నప్పుడూ) హర్ష - శోకములు కలుగుచున్నాయి కదా! ఎందుకు కలుగుచున్నాయి? అంతరంగంలో ఉండే - "ఇది నాకు చెందినది. నేను దీనికి చెందినవాడను. అవి నాకు చెందాలి. ఇవి నాకు తొలగాలి” ఇటువంటి రూపములతో ఏర్పడే మలిన వాసనలే సుమా! అట్టి మలిన వాసనలే 'సంగము' అని నిర్వచించబడింది. జీవన్ముక్తులు సర్వదా ఎట్టి సంగమూ లేకుండానే ఈ భూమిపై సంచరిస్తున్నారు. వారి శరీరములలో ఉండే సంస్కారం లేక వాసన శుద్ధవాసన అని అంటాం. ఎందుకంటే వారి వాసనకి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి1. అది హర్ష - శోక వివర్జితమై ఉంటుంది. 2. దానియందు పునర్జన్మ హేతువులు ఉండవు. ప్రారబ్ధక్షయ పర్యతం మాత్రమే ఉండే శుద్ధ వాసన ‘అసంగము’తో సమానం అవుతుంది. అట్టి అసంగము లేక శుద్ధవాసనచే నిర్వర్తించబడే కర్మ బంధమును కలిగింపజాలదు.
ఇక సంసారాసక్తులగు మూఢచిత్తుల సంగము గురించి చెపుతాను విను. వారి వాసనలు హర్ష - శోకములతో కూడి ఉంటాయి. వాసనలతో జన్మ - జీవించుటచే మరికొన్ని వాసనలు - -
Page:701
ఆ వాసనల నుండి మరల పునర్జన్మ ఈ విధంగా ఉంటుంది. వారి తతంగం. పునర్జన్మకు కారణము కాగలవాసనలే 'సంగము' - అని చెప్పబడుతోంది. అట్టి వాసనలతో చేయబడే కర్మలన్నీ చివరికి బంధము కొరకే అగుచున్నాయి. అందుచేత రఘురామా! ఆత్మకు వికారము కలుగజేస్తున్న వాసనా రూపమయినట్టి సంగమును నీవు త్యజించివేయి. సర్వదా స్వస్థుడవైయుండుము.
అప్పుడు కర్మలు చేసినప్పటికీ, జలంలో ఉండే కమలంలాగా, వాటిచే నీవు స్పృశింపబడకయే ఉంటావు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు, “నేను ఏ దృష్టితో ఈ ఈ కర్మలు చేస్తున్నాను?” – అని నీకు నీవే ప్రశ్నించుకో! దృష్టిని శుద్ధ పరచుకొనుటచే... “నేను కర్మాతీతుడను. అకర్తను. శుద్ధమగు ఆత్మ స్వరూపుడను. నిస్సంగుడను” అని గ్రహించగలవు. అట్లు గ్రహించిన తరువాత నిర్వర్తింపబడే కర్మలన్నీ అసంగమే అవుతాయి. హర్షామర్ష విషాదములచే వైరూప్యము పొందక, రాగ భయ క్రోధములు లేనివాడవై ఉంటే, నీవు ఇప్పటికిప్పుడే అసంగుడవౌతావు. దుఃఖముచేగ్లాని పొందక, సుఖముచే ప్రసన్నత పొందక, ఆశాపాశవశ్యముకాక, సర్వవిషయములను త్యజించినవాడవై ఉంటేనే అసంగుడవయినట్లు సుమా!
లోకవ్యవహారములలో ఉన్నప్పుడు, సుఖ - దుఃఖాది దశలు పొందవలసివస్తున్నప్పుడు నీవు బ్రహ్మము తోటి ఏకత్వము త్యజించకపోవటమే అసంగమునకు గుర్తు.
ఎప్పుడైతే నీ చిత్తము ఆత్మ సంవేద్యముతో కూడి ఉంటుందో, ఎరుగబడిన బ్రహ్మముగానే సర్వదా శేషించి ఉంటుందో - - అప్పుడది సర్వ సంగములను అధిగమించినట్లే. అటుపై, యథా ప్రాప్తములైన క్రియలను ఆచరిస్తున్నప్పటికీ అసంగుడవే. ఇందులో సందేహం లేదు.
అనాయాసంగా, అకృత్రిమంగా చేకూరు అసంగత్వమే జీవన్ముక్తుని 'సుస్థిర స్థితి’ అయి ఉన్నది. ఓ దాశరథీ! నీవు అద్దానినే ఆశ్రయించు. స్వస్థుడవై, వీతరాగుడవై, మౌనివై, ఇంద్రియపాశములను నిగ్రహించినవాడవై, ఉత్తమ జ్ఞానివై, ఆర్యుడవై, మాన-మద మాత్సర్యరహితుడవై ఉండుము. మనం పదే పదే చెప్పుకుంటున్న జీవన్ముక్తుల స్వభావమును సంతరించుకో. సంతాపరహితుడవై ఉండు.
భోగ - విక్షేపాదులకు కారణంకాగల వస్తు సముదాయం నీ చుట్టూ చేరవచ్చుగాక! లేక, ఒక్కొక్కటే తొలుగుతూ ఉండుగాక! వాటితో నీకేమి సంబంధం? నీవు జ్ఞానివై, సమచిత్తుడవై ఉంటే, వాటి ప్రాప్తాప్రాప్తములు నిన్నేమి చేయలేవు. అదీన స్వభావుడవై నీకు నియమించబడిన ఆయా ధర్మములను వాటి సహజ సంక్రమిత ప్రాప్తములను బట్టి ఎప్పటికప్పుడు నిర్వర్తించు. అన్యమేమీ ఆచరించని వాడవు, యోచించని వాడవు కమ్ము. అయినప్పటికీ సర్వమునకు అకర్తవై ఉండు. ఫలాభిలాష, క్రియాభినివేశము లేకుండానే జ్ఞాని ప్రవాహపతితము, ప్రకృత క్రమమును అనుసరించి తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అట్లా నిర్వర్తిస్తూనే స్వాత్మయందు క్రీడించుచున్న అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోబోతున్నాం.
పెరుగు చిలకబడినప్పటికీ తన తెలుపుదనం కోల్పోతోందా?... మహామతియగు జ్ఞాని తన యొక్క పూర్వసిద్ధ స్వభావమగు శమ - - దమ - · శాంత - సహకార - సంతోష - సమదర్శనములను Page:702
ఎన్నటికీ వీడడు. ఆతనికి చక్రవర్తి పదవి లభించుగాక! క్రిమికీటక ఉపాధులు లభించుగాక! అకస్మాత్తుగా ఇంద్ర పదవి ప్రాప్తించుగాక! బ్రహ్మదేవుని పదవి వచ్చి తలుపుతట్టుగాక! అందులో ఆతనికి సంతోషించవలసినదిగాని, దుఃఖించవలసినదిగాని ఏదీ కనిపించదు. పున్నమినాటి రాత్రంతా చంద్రుడు ఒకే రీతిగా ప్రకాశిస్తాడు చూచావా? ఆతడు కూడా ఆయా అన్ని స్థితులందూ ఏక రూపంగానే భాసిస్తూ ఉంటాడు. ఓ రామా! హృదయంలోంచి సర్వ క్రోధ, భేదములనూ, తదితర భూతాకారములను బయటకు పారత్రోలివేయుము.
అంతిమ పురుషార్థమైనట్టి 'మోక్షము' అను కార్యమునందు మాత్రమే ప్రతిష్ఠితుడవు, తత్పరుడవు అయి ఉండుము. వాసనలన్నీ క్షయించుగాక!
నీ బుద్ధి శుద్ధమై ఆత్మ పదమును అందింపజేయునదై ఉండుగాక! అవిద్యను, తత్కార్యములను దగ్ధమొనర్చుటలో సమర్థమగు గాక! అట్టి బుద్ధిచే నిరతిశయ పరమానందమున సంస్థితుడవయ్యెదవు
గాక!
అప్పుడు జనన మరణాది బంధములచే నీవు పరిమితుడవు కావు. సర్వదా అపరిమితుడవై ఉంటావు. అట్టి ఆత్మ తేజోమూర్తివైన నీవు సర్వులకూ వందనీయుడవౌతావు.
(14వ రోజు విచారణ పూర్తి అయింది).
ఉపశమన ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు
ఓం తత్సత్
ఓ రామా! మలినము, చంచలము అయిన ‘అహంకారము'ను హృదయము నుండి పారద్రోలివేయి. మరుక్షణం అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వేశుడు, వాసనారహితుడు, శాంత చిత్తుడు అగు ఆ ఆత్మదేవుడు నీ హృదయమున స్వయముగా ప్రభువై విరాజిల్లుతాడు.
‘తత్త్వవిచారణ’చే ‘ఆత్మ’ అను జ్యోతి ప్రాప్తించగా, సమస్తదోషములు తొలగిపోతాయి. అట్టి ఆత్మ స్వరూపుడగు జీవుడు ఈ జననమరణములలో, ఐహిక పారలౌకిక స్థితులలో ఉద్వేగరహితుడై ఉంటున్నాడు. అతడు స్వదేహనగరంలో తాపత్రయరహితుడై విలాసంగా విహరిస్తున్నాడు.
వసిష్ఠ మహర్షి
పుట:176
CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93-83972-14-2 (Set)
దోమలగూడ, హైదరాబాదు-29
రామకృష్ణ email : publication@rkmath.org
మఠం 9789383972142
Vasishta Rama Samvadam : Vol 2 ISBN 93-83972-11-11000/- (set) www.rkmath.org