Page:92
ఆశయం సిద్ధించినట్లు. (పరమ్+ఆత్మ = ప్రతిజీవుని యొక్క - ఈ జగన్నాటకములోని పాత్రలకు ఆవల ఉన్నట్టి నిజస్వస్వరూపం)
అపరిచ్ఛిన్నమగు ఆత్మదేవోపాసనవలన లభించే ఆనందం అకృత్రిమము, అనాది, అనంతం, శాశ్వతం కూడా. అకృత్రిమమగు స్వస్వరూపానందముగాక ఏదో కృత్రిమఫలితమును పొందగోరి ఉపాసనకు ఉపక్రమించే వాడు ఆహ్లాదకరమగు మందారపూదోటను వదలి ముళ్ళపొదలవైపు దృష్టి సారిస్తున్నట్లే. వారు అనవసర, నిష్కారణ క్లేశములు ఆహ్వానిస్తున్నట్లే.
పూజ్యవిషయం చక్కగా గ్రహించిన బ్రహ్మజ్ఞులు నిర్మలుడు, మంగళమయుడు, చిన్మాత్ర స్వరూపుడు అగు ఆత్మభగవానునే అర్చిస్తున్నారు, వారి ప్రధానమైన పుష్పాలు ఏమిటో తెలుసా?... 1. సర్వసమత్వము... 2. శాంతి... 3. బోధ.
శమ బోధాదిభిః పుష్పైః దేవ ఆత్మాయదర్చ్యతే |
తత్తు దేవార్చనం విద్ధి, న ఆకారార్చనమర్చనమ్ ॥ (శ్లో 128, సర్గ 29)
వత్సా! ఈ మూడు పుష్పాలతో అన్నిరూపులా అంతయూ నిండి ఉన్న ఆత్మదేవుని అర్చించటమే నిజమైన అర్చనగాని, ఏదో ఒక ఆకారాన్ని తీసుకుని భౌతికమైన పుష్పాలతో పూజించటం నిజమైన పూజ కాదు. పూజారహస్యం ఎరిగినవారు బోధ శాంతి సమత్వ పుష్పములచే దేశ కాల నిమిత్తములను పట్టించుకోకుండా సర్వదా అనుక్షణ-అకృత్రిమ పూజ కొనసాగిస్తున్నారు. శ్రీవసిష్ఠ మహర్షి : తత్త్వము, ఆమూలాగ్రం గ్రహించిన వారిలో కొందరు సమాధినుండి లేచిన తరువాత సాకారమును అర్చిస్తున్నారు కదా! స్వామీ! దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా? శ్రీశివ భగవానుడు : చిన్నపిల్లలు ఆనందం కొరకే ఆటలు ఆడుకుంటారుగాని ఏదో కృత్రిమమైన ప్రయోజనం ఆశించి కాదు కదా! ఆ రీతిగా కొందరు మహనీయులు సమాధి నుండి విడివడినప్పుడు సాకారమును అర్చించటం జరుగుతోంది. అయినా కూడా, ఆ మాత్రానికి 'నిరాకారుడు, మంగళ మయుడు, పరమకారణుడు' అగు ఆత్మయే వారికి పూజ్యవస్తువు కాకుండాపోవుట లేదు. అట్టి నిరాకార పరబ్రహ్మమును ఉద్దేశించి సంజ్ఞగా సాకారమును వారు అర్చిస్తున్నారని నీవు గ్రహించు. అందుచేత పరమకారణమగు ఆత్మయే నిజమైన దేవత.
అట్టి ఆత్మ దేవతను జ్ఞానార్చనతో అనంతరం పూజించాలి. ఆత్మపూజయే ముఖ్యమగు పూజ. ఆయన గాక మరి పూజ్యులెవరూ లేరు.
అవ్యయ చిదాకాశమగు బ్రహ్మమే జీవభావముపొంది ఈ సకల జీవులుగా ప్రకాశిస్తోందని గ్రహించి అటుపై ఆత్మార్చన నిర్వర్తించు. ఆత్మార్చకులకు ఈ కనబడే దృశ్యమంతా ఆత్మదైవమే! సకల ద్రష్టలు ఆత్మసంప్రదర్శనమే!
శ్రీవసిష్ఠ మహర్షి :
చిద్వ్యోమైన కిలాస్తీహ పారావారవివర్జితమ్ । |
సర్వత్రాసంభవచ్చేత్యం యత్కల్పానే వశిష్యతే ॥ II (శ్లో 134, సర్గ 29) Page:93
ప్రభూ! చిదాకాశరూపియగు ఆత్మభగవానుడు ఈ జగద్భావమును, జీవభావమును ఎట్లా పొందుచున్నాడో, ఆ క్రమమును తెలియజేయ ప్రార్థన.
శ్రీశివ భగవానుడు : పారావారవర్జితము (That which does not have limitation) అగు చిదాకాశమొక్కటే వెలయుచున్నది. దానికి పుట్టుకగాని, పరిణామముగాని అసంభవమైయున్నది.
కల్పాదిలో ఉన్నదదే! ఈ ఈ కల్పనా వర్తమానంలో కూడా క్రీడిస్తున్నది అదే! కల్పాంతము నందు మిగిలేది కూడా అది మాత్రమే!
సూర్యకాంతి నలువైపులా ప్రసరిస్తూ ఉండగా 'తీవ్రమైన కాంతి - సగం వెలుగు - క్రీనీడ నీడ' ఏర్పడుతూ ఉంటాయి చూచావా? అట్లాగే అపరిచ్ఛిన్నమగు చిదాకాశం 'మాయ' అను మార్గమున స్పందించుచుండగా త్రిగుణసమన్వితమగు ఈ జగత్తు రూపమున ప్రకాశిస్తోంది. స్వప్నంలోని నగరంలా భాసించే ఈ జగత్తు చిద్రూపమునందే భ్రాంతి చేత అనుభవమవటం జరుగుతోంది. విచారించి చూస్తే ఈ జగత్తుకు మూలమే కనిపించదు. నిర్మలమగు ఆత్మ ఒక్కటే సర్వదా ఏర్పడి ఉంటోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : హే భగవాన్! చైతన్యము జీవరూపమును ధరించి మరల మరొకప్పుడు స్వస్వరూపమును గాంచుచున్నదని అనవచ్చునా?
శ్రీశివ భగవానుడు : అట్లా చెప్పటానికి కూడా వీలులేదు. ఎందుకంటే స్వభావసిద్ధంగానే అద్వయము, అపరిణామియగు ఆత్మవస్తువు అస్వభావమగు జీవత్వం పొందటమేమిటి? ఇక ఈ జగత్తు ఎక్కడిది అంటావా? చూచువాడు స్వయంగా సంకల్పించు 'మాయావరణ’ వల్లే ఇయ్యది జగత్తుగా తోచటం జరుగుతోంది. ఇంత కన్నా వేరే విశేషం ఇక్కడేదీ లేదు. కనుక ఈ జగత్తు అనబడేది వాస్తవానికి అపరిణామియగు చిదాకాశమే అయి ఉన్నది. ఇందు అన్యభావానికి తావే లేదు. కనుక ఈ పర్వతములు, జీవులు, పంచభూతములు మొదలైన భేదవికారమంతా చిన్మాత్రమేనని గ్రహించు.
సర్గ ప్రారంభం నుండి పర్యవలోకించి చూడు. ఈ స్వర్గ - మర్త్య - పాతాళ లోకాదులలో చైతన్యముగాక మరింకేదైనా కలదా చెప్పు?
ద్వైతజగత్తు స్వప్నము వలె 'మాయ', లేక, 'స్వకీయకల్పనావ్యాసంగము' వలననే అనుభవించ బడుతోంది. తత్త్వదృష్టితో పరికించి చూస్తే, చిదాకాశమే 'జగత్తు- చిత్తము - ఆత్మ - నీవు - నేను’ అను రూపములుగా అనుభవమౌతోంది. ఏదైతే ద్వితీయంగా జగత్తురూపమున కనిపిస్తోందో, అదంతా చిదాకాశంకాక మరింకేమీ కాదని గ్రహించు. ఆ చిదాకాశము స్వప్నస్వప్నమున ఎట్లు గోచరిస్తోందో, ఈ జాగ్రత్స్వప్నమునకూడా అట్లే గోచరిస్తోంది. చిదాకాశమును తీసివేస్తే కలకనేవాడు లేని కలలా, చూచేవాడు లేని జగత్తులాగా మరింకేమి మిగలదు. అనగా చిదాకాశమే లేకుంటే ఏదీ ఉండదు. ఏదీ ఏర్పడదు. చూచేవాడు లేకుండా చూడబడేది ఎక్కడైనా ఉంటుందా? ప్రతిజీవుడు చిదాకాశస్వరూపుడే!
Page:94
ఈ ‘జగత్తు’ అని పిలువబడేదంతా నిశ్శేషంగా చిదాకాశమే. అదియే చిన్మాత్రము అగు బ్రహ్మము. అదియే నీ యొక్క, నా యొక్క, పురుగు నుంచి బ్రహ్మదేవుని వరకు గల సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపం.
శ్రీవసిష్ఠ మహర్షి : హే అంబాసమేతుడువగు సాంబశివా! ఈ జగత్తులు ఎక్కడి నుండి ఏర్పడుచున్నాయి? శ్రీశివ భగవానుడు : ఆ పరమాకాశము, లేక, చిదాకాశమునుండే సంకల్పబలంచేత ఈ జగత్తులు లేచి, బ్రహ్మమును ద్వైతరూపమున గోచరింపజేస్తున్నాయి. కాబట్టి నీకు ఏదైతే జగద్రూపంగా గోచరించటం జరుగుతోందో - అదంతా 'స్వస్వరూప-చిదాకాశమున భావనామాత్రంగా ఏర్పడుచున్న స్వప్నం’ అని గుర్తెరుగుము. ఒకని స్పప్నంలో కనిపించే కుండ, వస్త్రము, వ్యక్తులు-అన్నీ కూడా ఆ స్వప్నద్రష్ట యొక్క స్వరూపం గాక మరింకేమిటి? జాగ్రత్తు కూడా జాగ్రత్ష్టయొక్క స్వరూపం తప్పితే మరింకేమి కాదయ్యా! ఒకడు తన స్వప్నంలో హావ భావాలు కల్పించుకొని ప్రేమ కోపతాపాలు అస్వాదిస్తున్నట్లుగానే, జాగ్రత్తులోకూడా, స్వీయకల్పనా పూర్వకంగా ప్రేమ-కోపముతాపము-ఇత్యాది విశేషాలన్నీ ఆస్వాదిస్తున్నాడు.
కనుక మహర్షీ! మరొక్కసారి చెప్పుచున్నాను. ఇక్కడ అగుపించే సృష్టి విశేషాలు, త్రికాలానుగత మగు భావాభావపదార్థములు, దేశకాలాలు, చిత్తం మొదలైనవన్నీ చైతన్యం మాత్రమే. వేదోపనిషత్తులచే పరమార్థ సత్యముగా నిర్దేశింపబడి, నిరూపించబడిన ఆత్మ చైతన్యమే 'నీవు' రూపియు, 'నేను' రూపియు 'జగత్తు' రూపియు అయి ఉన్నదని గ్రహించు. చిదానందమగు శివతత్త్వమే అంతటా, అన్ని వేళలా వెలయుచున్నది.
అట్టి సర్వాత్మకుడగు చిదాత్మయే పరమ పూజ్యమగు దేవత. అంతేగాని, ఒక్క నామమో, రూపమో పరమపూజ్యమెట్లా అవుతుంది? చెప్పు?
సర్వస్య వస్తుజాతస్య జగతో అన్యస్య, తే, మమ, దేహోహి చేతనాకాశం, పరమాత్మైవ, నే తరమ్ ||
పరమపూజ్యమగు చిదాకాశమే నాయొక్క తదితరుల యొక్క దృష్టికి కనబడే జగత్తులలోని సర్వశరీరముల మూలరూపం. అతడిని విడచి వీటికి వేటికీ స్వరూపమే ఉండదు. వత్సా! స్వప్నము సంకల్పముల రూపమేకదా! కలలో కనిపించిన నగరానికి వేరే రూపం ఎక్కడున్నది? సృష్ట్యాది నుండి ఇప్పటిదాకా, ఇకముందు ఏర్పడే రూపములన్నిటికీ, వచ్చిపోయే సర్వ వస్తుజాలములకు చిదాకాశముకాక, వేరే రూపమే లేదు. ఏ నామ రూపాలు నీకు అగుపిస్తున్నాయో, అవన్నీ కల్పిత మాత్రములు. ఆపాదిత మాత్రములు.
Page:95
2. సర్వమయ మహాచిత్
ఏవం సర్వమిదం విశ్వం పమాత్మైవ కేవలమ్ |
బ్రహ్మైవ పరమాకాశమ్ ఏష దేవః పరః స్మృతః ॥
తదేతత్ పూజనం శ్రేయన్ తస్మాత్ సర్వమవాప్యతే ॥
శ్రీశివ భగవానుడు: బిడ్డా! వింటున్నావా? ఈ విధంగా ఈ విశ్వమంతా కేవలం పరమాత్మస్వరూపమై వెలయుచున్నది. పరమాకాశమగు ఆ పరబ్రహ్మమే 'దైవము' అని జనులచే సంబోధించబడుచున్నది. ఆ దేవత పూజ ఒక్కటే సర్వ మంగళకరము. ఆ దేవతయే అన్నిటికీ ఆధారభూతమై వెలుగొందుతోంది. అందుచేత అట్టి పూజ వలన లభించనిదంటూ ఏదీ ఉండదు. ఆ దేవతాపూజకు బాహ్య సాధనములేవీ అక్కర్లేదు. అందువల్ల కలిగే తెంపులేని సుఖంతో పోల్చతగ్గది మరేదీ లేదు.
నాయనా! నీవు ప్రబుద్ధుడవైనావు. తత్త్వజ్ఞానం సముపార్జించావు. సప్తఋషులలో ఒకడవు అగు నీవు ఎంతటి జ్ఞానసంపన్నుడవో నాకు తెలుసు. అందుచేత నీకు, నీ ద్వారా అనేకమంది ముముక్షువులకు అతిరహస్యమైన ఆత్మదేవతార్చనను స్పష్టీకరిస్తున్నాను. విను.
ఆ పరదేవతను పూజించటానికి ఈ పుష్ప - - దీప - - నైవేద్యములతో పనిలేదు. అవ్యుత్పన్నధియో యే హి బాలపేలవచేతసః |
కృతిమార్చామయం తేషాం దేవార్చనముదాహృతమ్ ॥ (శ్లో 5, సర్గ 29)
ఈ కృత్రిమ పుష్పపూజ అనేది సత్యబుద్ధి పూర్తిగా వికసించని, బాలురవంటి అమాయక చిత్తము గలవారికి, అంతరంగంలో దృశ్యవిషయాలపై అభినివేశం కొనసాగుచున్నవారికి, తత్త్వమేమిటో పూర్తిగా తెలియనివారి కొరకు ఆత్మజ్ఞులచే శాస్త్రములచే విధించబడుతోంది. తత్త్వజ్ఞానంచే శమదమాది గుణాలు ఇంకా అలవడవలసి ఉన్నవారిని సన్మార్గపరులుగా చేయటానికి దీప-ధూప-పుష్పాలు సమర్పించటం, మూర్తిని కల్పనచేయటం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభదశలో రచించి శాస్త్రములు అందిస్తున్నాయి. సాధక జనులు మధ్యేమార్గంగా ధూప-పుష్పాదులతో మూర్తిని పూజిస్తున్నారు. అది మంచిదే. అయితే అంతటితో సంతసించి ఊరుకోవడం సరికాదు. అసలు విషయమేమిటో వారు తెలుసుకోవాలి. నిజకల్పిత వస్తువులతో భౌతిక పూజచేసి, ఆపై పరమోన్నతమగు సత్యవస్తువు గురించి విచారణ చేయకుండా... కేవలం స్వప్నతుల్యం, మిథ్యామాత్రం అగు స్వర్గలోకం మొదలైనవి లభిస్తే మాత్రం, ఆ ఫలాలతో తృప్తి చెందితే ఎట్లా? కల్పిత పూజచే కల్పిత ఫలములు పొందినంత మాత్రం చేత అసంతృప్తిరహితమైన స్థానం ప్రాప్తించుటలేదు. అందుకే, పూజ్యితమైనదేదై ఉన్నదో, అద్దాని గురించి సుస్పష్టమైన అవగాహన అత్యావశ్యకం.
దైవము – ఓ జ్ఞాన శ్రేష్ఠా! నిన్ను బోలిన తత్త్వజ్ఞులు చేయ తగిన పూజ ఏమిటో చెపుతున్నాను. విను. ఏ దేవుని గురించి నేను చెప్పుచున్నానో, ఆతడు మాకు కూడా ‘ఆది’.
Page:96
అయితే అతడు ఎక్కడో కనబడనిచోట లేడు. ఈ త్రిభువనములకు ఎవడు సర్వదా ఆధారభూతుడై ఉన్నాడో అతడే ఆ పరమాత్మ. అతడు సర్వసంకల్పములకూ ఆవల అప్రమేయుడై సర్వజీవుల యందు, సర్వము నందు ప్రకాశిస్తున్నాడు. అయినా కూడా, సర్వసంకల్పములకూ ప్రారంభమూ, ఆధారమూ, స్థానమూ ఆతడే!
ఆతడు మంగళమయుడు. సర్వమూ శుభప్రదం చేస్తున్నాడు. సర్వమూ అయినా కూడా ఏదీ కాకుండానే ఉంటున్నాడు. సర్వకార్యములనూ ప్రకాశింపజేసేది ఆతడే. ఈ దిక్కులచే, కాలముచే ఆతడు పరిచ్ఛిన్నుడు కాడు. ఆ నిర్మల - చిన్మాత్ర - సర్వరూప - రూపరహితమూర్తియే 'దైవము' అను శబ్దముచే శాస్త్రాదులచే చెప్పబడుచున్నాడని గ్రహించు. ఈ నామ రూపాదులన్నీ అందుకు ప్రతీక మాత్రమేనని మరువకూడదు.
ఆ చైతన్యం సర్వఫలాలకూ అతీతమై, అన్నిటా ప్రకాశించున్నది. అన్నిటికీ సృష్టి-స్థితి-లయాలకు కారణమై సర్వదా నిష్క్రియమై వెలుగొందుచున్నది. ఆయనకే 'పరమాత్మ' అనే బిరుదు ఉన్నది. ఆయన భావ-అభావముల మధ్య వెలుగొందుచుండు 'బ్రహ్మము' అని కూడా చెప్పబడుతోంది. 'ఓం' 'తత్' 'సత్' 'మహాసత్' స్వభావముచే సర్వత్రా సముడై వెలయుచున్నాడు. 'మహాచిత్' అను పరమార్థముతో కూడిన శబ్దార్థములచే గూడా చెప్పబడుచున్నాడు. లత యందు రసము సర్వత్రా ఏర్పడి ఉన్నట్లు, ఆతని తత్త్వము సత్తా సామాన్యరూపమున, లేక మహాసత్తరూపమున సర్వేసర్వత్రా అనుశ్రుతమై జాజ్వల్యమానంగా వెలుగొందుచున్నది. ఓ పాపరహితుడగు వసిష్ఠ మహర్షీ! నీయందు, నీ ధర్మపత్నియగు ఈ అరుంధతి యందు, నా యందు, ఈ పార్వతి యందు, ప్రమథగణము నందు, నీ శిష్యులందరి యందు సమముగా వెలుగొందుచున్నది ఆ ఆత్మదేవత యొక్క మహాచిత్ తత్త్వమేనయ్యా! ఉత్తమబుద్ధులగు తత్త్వవేత్తలు 'దేవుడు' అని నిర్దేశించి శ్లాఘించుచున్నది ఆయననే! అంతేగాని, హస్తపాదాదులతో కూడిన ఒక ఆకారము దేవదేవుడెట్లా అవుతాడు? ఆ ఆకారంలో కూడా మహాచిత్ యొక్క ప్రత్యక్షమే ఆరాధించబడుచున్నదని జ్ఞప్తియందుండు గాక! ప్రతీకతో తన్మయులై ముఖ్యోద్దేశమును ఏమరుచుట ఉచితమా? కాదు. ఈ సంసారసారం కూడా ఆ చితత్త్వమే. 'అహం' రూపియగు ఆ మహాచిత్ తత్త్వము నుండే అన్నీ కూడా లభిస్తున్నాయి గనుక, అదియే సర్వమయమగు దేవత.
చిదానందస్వరూపుడు - ఓ బ్రహ్మజ్ఞా! మహాచిదానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోనేవద్దు. అది దుష్ప్రప్యవస్తువు కాదు. ఎందుకంటే మన సర్వదేహము లందు, ఆకాశమునందు కూడా విరాజిల్లుచున్నది ఆయనే. ఆయన యొక్క 'చిత్' అను మహిమయే ఈ కార్యములన్నీ ఒనర్చుచున్నది. ఆయన ఆయారూపములతో భోజన - పాన - పాలన - గమన
నిశ్వసన - జ్ఞానాది కృత్యములు ఒకవైపు ఒనర్చుచునే వాస్తవానికి ఏదీ చేయకయే ఉన్నాడు. ఇదిగో, విచిత్ర చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్న ఈ దేహమును చూచావా? ఈ దేహపురి కూడా అతని ఉనికి చేతనే, అతని ఉద్దేశానుసారమే ప్రవర్తించగలుగుతోంది. అతడు ఇందులో (అన్నమయ -
Page:97
ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయములు అనబడే) పంచకోశ సమన్వితుడై బుద్ధి అనే గుహకు మహేశ్వరుడై, రాజాధిరాజై వెలుగొందుచున్నాడు.
అతడు వాక్-మనస్సులకు అతీతుడు. అయితే, ఆ రెండిటినీ వెలిగించుచున్నది ఆతడే! అతడు మనోవాక్కులకు నామరూపములకు ఆవల ఉన్నవాడు. అయినా కూడా సద్గురువరేణ్యులు తమ శిష్యులకు బోధించటానికి 6వ ఇంద్రియమైన మనస్సుకు కూడా అతీతుడు, నిర్మలుడు అయిన ఆ ఆత్మదేవునకు “చిత్ ” అనే సంజ్ఞ ఇస్తున్నారు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ ఆత్మభగవానుని గ్రహించటానికి మరికొన్ని విశేషాలు చెప్పండి?
శ్రీశివ భగవానుడు : అతడు చిన్మయుడు. అన్నిటి కంటే సూక్ష్ముడు. సర్వవ్యాపి. నిర్లేపుడు. ఈ కనబడే రూపాలన్నింటినీ ప్రకాశింపజేయుచూ, సర్వదీపాలలో వెలుగొందుచున్న అగ్ని వలె వెలుగొందుచున్న వాడు తానే' అయి కూడా, సదా సర్వదా నిష్క్రియుడు. అత్యంత నిర్మల చిద్వస్తువగు ఆతడే జగత్సిద్ధికై జగత్రియలన్నీ ఒనర్చుచున్నాడు. ఆయన నుండి 'చైతన్యస్ఫూర్తి' అనే సుందరశక్తి వెలువడి నానావిధ రూప భేదములను ఒనర్చుచూ సర్వవిధ భావ- అర్థములను ప్రకటిస్తోంది. ఆయనచే భావకల్పన చేయబడే అనేక విభేదములలో ఒకదానిపేరు ఆకాశము. మరొకదాని పేరు జీవుడు. అట్లాగే చిత్తు, కల, చిత్తము, క్రియ, ద్రవ్యము - వగైరా కూడా. ఆయన అనుభవ వైచిత్ర్యమును అనుసరించే భావన, వికారము, ప్రకాశము, శైలము, తమస్సు, చంద్రుడు, ఇంద్రుడు, యక్షుడు - మొదలైనవి రూపు దిద్దుకుంటున్నాయి. వసంతకాలం ఇచ్ఛారహితంగానే చెట్లను చిగురింపజేయటం లేదా? ఇదంతా కూడా అట్టిదే.
నిజానికి ఈ మూడు లోకాలలో 'చిత్' తప్పించి ఇంకేమున్నది? చితే ఆత్మభగవానుని శరీరం. (చిత్=ఎఱుక, ఉద్దేశము) చిద్రూపియగు ఆ ఈశ్వరుడు 'శరీరములు` అనే బురద ప్రదేశంలో సంచారం చేస్తూ ‘చిత్తభ్రమలు' అనే సంకల్పపూర్వకమైన మధువును ఆస్వాదిస్తున్నాడు. నదీజలంలో సుడులు ఉన్నట్లు ఆయన యొక్క చిత్ ప్రపంచంలో ఈ దేవ — మనుష్య - రాక్షస - జంతు ఉపాధులు ఉంటున్నాయి. ఈ జగత్తులన్నీ చితత్త నుండే ప్రవహిస్తున్నాయి.
అత్యంతభ్రమలు కలుగజేసే ఈ సంసారమంతా ఆ చిత్ చక్రమున పడి తిరుగాడుతోంది. చిత్తమయములు, బంధహేతువులు అగు కర్తృత్వ - భోక్తృత్వములే సంసార చలనము సుమా!
మేఘములు వచ్చి సూర్య తాపమును పారత్రోలునట్లు ఆ చైతన్యమే చతుర్భుజవిష్ణురూపమును ధరించి శంఖ-చక్ర-గదాధారి అయి అసురులను వధిస్తోంది. వృషభవాహనుడు, త్రినేత్రుడు, చంద్రశేఖరుడు అయి రుద్రరూపమున ఈ గౌరితో కూడి లోకములకు శుభములు చేకూరుస్తోంది. చిధ్యానము రూపంలో విష్ణుమూర్తి నాభికమలంలో జన్మించి వేదములు ధరించి బ్రహ్మగా రూపు దాలుస్తోంది. చెట్టుకు పూలు, కాయలు, ఆకులు కాస్తున్నట్లు అద్దానికే అనంత శరీరములు ఉద్భవి స్తున్నాయి. అదియే సూర్యరూపమై ఈ జీవ -జంతుజాలములకు తన కిరణములచే జీవనము ప్రసాదిస్తోంది. చంద్రుడై ఓషధరూపమున జీవరసమును సంరక్షిస్తోంది.
Page:98
ఆ చిత్తే దర్పణమున ప్రతిబింబించే దృశ్యంగా ఈ జగత్ ప్రతిబింబమును గ్రహించి, తనపై తానే సుఖ-దుఃఖములను ఆపాదించుకుంటోంది. జలశక్తియే జలరూపమున సముద్రముగా అయి అనేక వస్తువులను తనయందు ధరిస్తున్నట్లు ఆ చైతన్యమే తనయందు ఈ ఈ 14 లోకములను కలిగి ఉంటోంది. చిత్తే చిదాకాశమున 'దృశ్యము' అనే పుష్పాలతోను, 'సంకల్పము' అనే పిందెలతోనూ, 'సత్త' అనే ఫలములతోను, సదసత్తులనే ఆకులతోనూ కూడిన సంసారలతగా ఉద్భవిస్తోంది. విచారణ చేసినప్పుడు 'దృశ్యము అనేది లేదు ఉన్నదంతా ఆ చిదానందమే' అని తప్పక తెలియవస్తోంది.
ఈ జీవులందరూ ఆ చిల్లత ఆకులేనయ్యా! వాసనారసమువల్లనే జన్మ కర్మల వ్యవహారమంతా రంజిల్లుతోంది. అనేక సవికల్పములతో, విషయపరంపరలతో, రకరకాల యత్నములతో, త్రిజగత్తులనే రంగస్థలములతో విరాజిల్లుచున్నది చిత్తే. ఋతువులతో కూడిన కాలస్వరూపంగాను, కొండ మొదలైన ఆయా వస్తుజాలముగాను, అండజ - స్వేదజ - బీజ - గర్భజాది చతుర్విధ ప్రాణులతోను, సర్వాంగ ప్రవృత్తులతోనూ, సూర్య - చంద్ర ప్రభలతోనూ ప్రభవిస్తున్నది ఆ చిత్తే.
ఆహా! వసిష్ఠమహర్షీ! ఎంత ఆశ్చర్యం! ఆ చిత్తే సర్వత్రా వస్తువులను కల్పించి, వాటిపట్ల అభిమానమును చేకూర్చుకొని, వాటికి ప్రసిద్ధిని ప్రసాదిస్తోంది. చైతన్యముయొక్క ప్రభావం చేతనే చైతన్యస్వరూపుడగు ఈ జీవునకు జడమగు దేహముల పట్ల ప్రియాప్రియములు కల్పనాపూర్వకంగా దృశ్యదేహమును ధరించి, తమను తాము చైతన్యము నుండి వేరైనట్లుగా భావించుకుని నృత్యం చేస్తున్నాయి. గదిలో దీపం ప్రకాశిస్తూ ఆయా వస్తువులను ప్రకాశింపజేయుచున్నట్లు 'త్రైలోక్య దీపశిఖ’ అగు చైతన్యమే ఈ జగత్తునందలి సర్వకార్యములనూ ప్రకాశింపజేస్తోంది. చైతన్యమే ఈ జాగృతిక పదార్థముల ఆకారమును వహించినదై సర్వసందర్భములలోనూ అందరిచేత పరిలక్షితమై ఉంటోందని గ్రహించు.
కనుక, పుత్రా ! ఈ నామ రూప పదార్థములన్నీ చిత్తే తనయందు ధరిస్తోంది. సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటే, ఇంటిలోని ఒక గదిలో చీకటి ఉన్నట్లుగా ఆ చిత్తు యొక్క నీడయే సకల పదార్థముల జడతను కల్పిస్తోంది. ఈ ముల్లోకాలలో స్థితమై కనబడుచున్న ఈ శరీరజాలాలన్నీ కూడా చిత్ఛాయ తొలగగానే స్పర్శకు కూడా యోగ్యత కోల్పోతున్నాయి. చైతన్యము ఈ దేహగృహంలో నివసిస్తూ ‘సంకల్పములు' అనే పిల్లవాళ్ళను కని పోషించుకుంటోంది.
చైతన్య సంపర్కం లేకపోతే ఈ నాలుక రుచి చూడలేదు. చైతన్యముకంటే వేరైనదేదీ ఎక్కడా ఎవరిచేతా గాంచబడుట లేదు. చైతన్యము వినా - - బొమికలు, చర్మము, వెంట్రుకలు - గల ఈ దేహము ప్రవర్తించగలదా? లేదు.
ఇన్ని మాటలెందుకు? ఓ మునీశ్వరా! ఈ చరాచర సృష్టిలో జన్మ - స్థితి- లయములను పొందుచున్న ప్రతిది చైతన్యమే. అదికాక వేరొకటేదీ లేదు. చైతన్యము యొక్క ఉనికి చేతనే (ఉండటం చేతనే) తదితరమంతా ఏర్పడి ఉండటం జరుగుతోంది.
Page:99
3. చిత్తు: జడి-చైతన్య విభాగములు
శ్రీవసిష్ఠ మహర్షి : తండ్రీ! నాదొక చిన్న సందేహం. ఈ కనబడేదంతా చిద్వ్యాప్తమే అయినప్పటికీ, ఈ శరీరం మరణించినప్పుడు, మూర్ఛిల్లినప్పుడూ ఇది చేష్టావిలీనమై ఒక రాయి-రప్పలాగా అయి ఉంటోంది కదా! అంటే 'ఈ శరీరం మొట్టమొదట చైతన్యవంతమై మరొక్కప్పటికి చిద్రహితమగుచున్నది' అనియే కదా అర్థం? చైతన్యం ఈ విధంగా ఎందుకు ఒకప్పుడు దేహమునందు ప్రత్యక్షమై, మరొకప్పుడు (మరణానంతరం) అంతర్ధానమవుతోంది?
శ్రీశివ భగవానుడు : నాయనా! నీవు అడిగింది చాలా పెద్ద ప్రశ్న. అందుకు సమాధానం వివరిస్తున్నాను. విను.
ఈ శరీరమందు ఏ సర్వభూతమయ చిత్ విరాజిల్లుతోందో, అట్టి చిత్ రెండు విధములు1. కర్తృత్వ - భోక్తృత్వ స్వభావము. ఇదియే 'విజ్ఞానమయము' అను పేరుతో చెప్పబడుతోంది. 2. కూటస్థమగు 'నిర్వికల్పచైతన్యము’ లేక, “నిష్క్రియ కేవల స్వస్వరూపం”.
రెండవదగు నిర్వికల్పచైతన్యమే తన యొక్క సంకల్పబలం చేత 'నేనొక జీవుడను’ అని భావన చేసి విజ్ఞానమయత్వం పొందుతోంది. ఒకడు స్వప్నంలో వేరొక స్త్రీని చూచి దుశ్శీలుడైనట్లు, ఒక బలాఢ్యుడు తన యొక్క ఊహా లోకంలో ఒక మహాబలవంతుని కల్పించుకొని ఆతనితో కుస్తీ పట్టి ఓడి డీలా పడినట్లు... ఆ నిర్వికల్పచైతన్యం వికారాలను సంకల్పించుకుంటోంది. ఒక శాంతస్వరూపుడు అనుకోకుండా, ఆకస్మికంగా క్షణికావేశం చేత గొప్ప కోపం చూపించినట్లు, ఆ నిర్వికల్పచైతన్యం తనను ఒక జడవస్తువుగా భావించి స్వకల్పనాబలం చేత సవికల్పమగు బుద్ధికి విషయమగుచున్నది.
ఆ చిత్ తనకుతానే స్వయంగా ఇటు పరమాణురూపాన్ని, అటు శబ్దస్పర్శాది భోగ్య రూపాన్ని స్వకల్పన చేసుకుంటోంది. మాయతో కూడిన చైతన్యమునకు తాను విషయమగుచున్నది. తరువాత సమష్ఠి ప్రాణరూపాన్ని పొందుతోంది. అదే "హిరణ్యగర్భరూపం" అని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.
ఆ తరువాత పంచీకృతమగు సూక్ష్మభూతములతో కూడి దేశవిభాగమును, కాల విభాగమును పొందుచున్నది. క్రమంగా ప్రాణమును ధరించి జీవత్వమును పొంది మనోబుద్ధులను ధరిస్తోంది. రత్నములను అన్వేషిస్తూ బయలుదేరిన ఒక సాధకుడు త్రోవలో ఒక ఆటవిక స్త్రీని చూసి, మోహించి, ఆటవికులలో ఒకడై బయలుదేరిన పనినే మరచిపోయినట్లు, అది సంసారభావమును పొందుతోంది. అనగా, ఆ బ్రహ్మచైతన్యము అజ్ఞానమునకు చోటిచ్చి తన స్వరూపం విషయమై శరీర-జీవరూపములను సంకల్పించుకుని, అట్టి సంకల్పములచే తన యొక్క సహజత్వమును కప్పివేసుకొని ఉంటోంది. భోగసంపర్కములచే మరల మరల 'సంసారి' అగుచున్నది. చూచావా?
అనన్తసంకల్పమయీ జాడ్యసంకల్పపీవరా ॥
చిజ్జాడ్యాన్మోదమాయాతి పయః పాషాణతామివ ॥ (శ్లో 75, సర్గ 30)
Page:100
అనంత సంకల్పమయమగు ఆ చిత్తు తన యొక్క జడసంకల్ప విభాగముచే స్థూలభావము ధరించి ‘మోహము’ను పొందుతోంది. అతిశీతలత్వం చేత నీరు పాషాణంలాగా గడ్డకట్టి ఆకారాదులను ప్రకటిస్తున్నట్లు, అనంతగుణ గంభీరమగు ఆ చిత్తు పరిమిత విషయములగు జడ సంకల్పములను, స్థూలభావములను ధరించి మోహమును పొందుచున్నది.
మోహగ్రస్తమై ‘తృష్ణ' అనే స్వయంకల్పిత త్రాళ్ళతో కట్టబడినదై కామ, క్రోధములకు లోను అగుచు, భయములచే పీడించబడుచు, భావాభావగ్రస్తమగుచున్నది. తన యొక్క అనంతత్వమును, అప్రమేయత్వమును, నిత్యత్వమును బొత్తిగా మరచి పరిచ్ఛిన్నత్వమును భావన చేస్తూ కునికిపాట్లు పడుతోంది. ‘దుఃఖం’ అనే భయంకర అగ్నిచే దహించబడుచున్నది. అశుభమగు శోకంతో వ్యాకులమై, "అయ్యో! ఇప్పుడీ దుఃఖమోహములే ప్రత్యక్షంగా నా స్వభావమై పోయినాయే? ఇప్పుడింకేం చేయాలి? నన్ను ఎవరు కాపాడుతారు? ఓ దైవమా! ఎక్కడున్నావు?” ... అని వగర్చుచూ, ఈ శరీరాన్ని నమ్మి నానా తిప్పలు తెచ్చుకుంటోంది. 'నాకు అండ, తోడు కావాలి. ఈ శరీరంతో ఏర్పడే బాల్య-యౌవన -వార్ధక్యాలు నాకే చెందినవి' అని అనుకుంటోంది. ఒక గొప్ప అడవి ఏనుగు బురదలో చిక్కుకొనినట్లు మహత్తరమగు చిత్ ఈ 'అపార సంసారవికారములు’ విడువలేక కొండరాళ్ళమధ్య చిక్కుకున్న జింకలాగా దిక్కుతోచక, భ్రష్టమై, బాధాపరితప్తమై గావుకేకలు వేస్తోంది. అనేక సుఖదుఃఖములకు, దీనత్వమునకు తన అంతరంగమే ఉత్పత్తిస్థానమని గమనించలేకపోతోంది. చిన్నపిల్లవాడు బాటలో నడుస్తూ ఎదురుగా ఊహాజనితమైన దయ్యమును గాంచి, ఇక, భయవికారములను పొంది వెనుకకు తిరిగి పరుగులు తీస్తూ గావుకేకలు పెడుతున్నట్లు ఈ చిత్తు ఊహచే ఆపదలను కల్పించుకొని భ్రమ పూర్వకము, స్వయంకల్పితము అగు సంసారారణ్యంలో పరుగులు తీస్తోంది. తుచ్ఛ విషయాలలో క్రిందా, మీదా పడుచూ, దోషజాలములో చిక్కుకుని అధఃపతనం పొందుతోంది.
అయితే మహర్షీ! ఇదంతా చిత్తు యొక్క జడవిభాగం చూపుతున్న జగన్నాటకం మాత్రమే. ఎందుకంటే... ఆ చైతన్యము యొక్క కూటస్థవిభాగం నిర్వికల్పమై, నిర్విభాగమై, నిశ్చింతగా ఎక్కడ ఉండాలో, అక్కడే ఉన్నది. అది తన యొక్క జడ విభాగంలో కర్తృత్వ, భోక్తృత్వ సంకల్పములను లీలగా మాయచే స్వప్నసదృశంగా పొందుతోంది.
4. చిత్తుయొక్క విన్యాసం - వివశత్వం
శ్రీశివ భగవానుడు : ఇంకా ఈ భావాభావ విభాగమగు జడవిభాగపు చిత్తుయొక్క విన్యాసమేమిటో చెపుతాను విను.
స్వయంగా అనంతగుణసాగర స్వరూపి అయిన చిత్తు ఇక్కడ చేస్తున్నదేమిటి? స్వసంకల్పితమైన సంకల్పమాత్ర సంకటంలో పడి అనేక విపత్తులలోనూ, దుఃఖ పరంపరలలోనూ, అనర్థములలోనూ చిక్కుకున్నది. జడావస్థలో చిక్కుకుని నరకాది లోకములలో ప్రవేశించి విశేషకష్టములను చవిచూస్తోంది.
Page:101
వృక్ష-జంతు ఉపాధులను కూడా అనుభవిస్తోంది. ఇంతలోనే మనుష్యత్వమును పొంది, కొంత వ్యవహారకౌశలత్వం సంపాదిస్తోంది. కానీ ఏం లాభం? చాలా చతురతతో బంధహేతువులైనట్టి ధనపుత్రాదులతో లేనిపోని కల్పిత సంబంధములను ఆశ్రయించి అనేక ఆశ - నిరాశ - దురాశల మధ్య చిక్కుకుంటోంది. అనేక విపత్పరిణామములలో సంచారం చేస్తూ అందరి సంశయములకూ కారణమౌతోంది. మోక్ష మార్గంగా స్వస్వరూపధ్యానానందమునకు ఉపయోగించే వివేకమును ఆశ్రయించటమే లేదు. పిదప మృత్యుసమయం రాగానే, అల్పజలంలో చిక్కుకున్న పెద్ద చేపలాగా విలవిల్లాడిపోతోంది. ఒక రోజు ఆ ఉపాధిని కోల్పోతోంది. మరల మరొక ఉపాధిని ఆశ్రయిస్తోంది.
ఆహాఁ! బాల్యము అసమర్థతలోనూ, యౌవనము చింతా దుర్వ్యసనములతోనూ, వార్ధక్యం దుఃఖములతోనూ గడచిపోవుచుండగా చివరికి అవివేకకారణంగా అజ్ఞానవ్యవహారవర్తి అయి నిస్సహాయంగా ‘మరణము' అనే దరిజేరుతోంది.
ఆతడు మరణాంతరం కూడా దృశ్యం నుండి అప్పటికీ ముక్తిని బడయటం లేదు. ఆ జీవుడు కర్మ వైచిత్ర్యాన్ని అనుసరించి స్వర్గంలో అప్సరసగానో, పాతాళంలో నాగకన్యగానో, దైత్యుల భవనంలో అసురిగానో, కులపర్వతంలో కిన్నెరగానో, భూమిపై మానవిగానో, రాక్షసుల రాజ్యంలో రాక్షసిగానో, అడవిలో కోతిగానో, కొండప్రాంతంలో సింహంగానో, మేరు పర్వత ప్రాంతంలో విద్యాధరిగానో, అరణ్యంలో 'వృక్షం-లత-జంతువు' గానో జన్మలు ఎత్తుచున్నాడు. ఎంత చిత్రమో కదా! ఇదంతా కూడా సంకల్ప వికల్ప విభాగమునకు సంబంధించిన చిత్తు యొక్క స్వకీయ సంకల్ప ప్రాభవం చేత జరిగే నిష్కారణ సంచలనమే కదా!
అయితే ...ఆ చైతన్యమే నారాయణుడై క్షీరసాగరమున శయనించుచున్నాడు. కైలాసమున త్రిలోచనుడై అర్ధనారీశ్వర స్వరూపంతో విరాజిల్లుచున్నాడు. దేవతలకు పరిపాలకుడై ఇంద్రసింహాసనం అధిరోహించి మూడులోకములు పాలిస్తున్నాడు. మేఘమై వర్షమును కల్పించుచున్నాడు. వాయురూపుడై ఈ భౌతికదేహము లన్నింటినీ స్పందింపజేయుచున్నాడు.
క్షణాలు, నిమిషాలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు అయి కాలరూపమున సదా ప్రవహిస్తూనే ఉంటున్నాడు. ఒకచోట రసస్వరూపుడై వృక్షాదుల బీజరూపంగా ఉంటున్నాడు.
ఇంకొకచోట పాషాణ స్వరూపుడై మౌన ముద్ర వహిస్తున్నాడు. మరొకచోట నదీనద స్వరూపం గానూ, ఇంకా వికసిత పుష్పాలుగా ... పక్వఫల సమూహంగా ... కాష్ఠ, అగ్ని స్వరూపంగా ...శీతల జలరూపంగా ...ఆకాశవాణి వంటి శూన్యరూపంగా - ఈ విధంగా ఆ చైతన్యం సర్వమయంగా, సర్వగామిగా, సర్వశక్తిమంతంగా ప్రకాశిస్తోంది.
అది ఆకాశంకంటే కూడా ఎంతో నిర్లిప్తమై, అన్ని వస్తువులకంటే భిన్నమై ఉన్నది.
నీరు స్పందించి తరంగములు మొదలైన రూపములను ధరిస్తోంది చూచావా? అట్లాగే చైతన్యము కూడా వివర్తంపొంది తనను ఎచ్చట ఏ రూపంగా భావిస్తోందో, అక్కడ అట్లే అనుభవమునకు గోచరమౌతోంది. భావాలన్నింటికీ నాందీస్థానం అదే!
Page:102
ఆ చైతన్యమే తన వాస్తవస్వరూపంగా గల ఈ జీవుడు ఒకానొక జన్మ-జరా-పునర్జన్మల మార్గంలో పయనిస్తూ అనేక యోనులలో పరిభ్రమిస్తున్నాడు. సుడిగుండములలో పడ్డ గడ్డిపరకలాగా ఎక్కడెక్కడికో వెళ్ళుచున్నాడు. గాడిద తన ఓండ్రకు తానే భయపడునట్లు ఈతడు తన సంకల్పములకు తానే భీతిల్లుచు ఒక అబల, ముగ్ధ, చంచలమగు బాలికవలె ప్రవర్తిల్లుచున్నాడు.
వత్సా! చైతన్యమే ఈ జగత్తు యొక్క జీవశక్తి. అయితే ఏం? అది వివశ అయి పశుధర్మమును పొందుతోంది. కర్మానుసారంగా దీనికి అట్టి దురవస్థలు, దుఃఖసంకటములు, భ్రాంతులు కలుగు చున్నాయి, ధాన్యపుగింజ నశ్వరమగు ఊకను దాల్చి ఉన్నట్లు, అది కూడా సంకల్ప - వికల్ప - ఇచ్ఛా జాడ్యములను ధరిస్తోంది.
చైతన్యమే అల్పకాలం అవిద్యారూపంలో కూడా ఉంటోంది. ఆహా! ఆ చైతన్యం భర్తృహీన అగు నాయికలాగా జీవభావం పొంది దురదృష్టసంతప్తము, వైభవవంచితము అయి శోకిస్తోంది!
జడరూపియగు అవిద్య యొక్క సామర్థ్యం ఎంతటిది? పూర్ణబ్రహ్మ స్వభావమగు చైతన్యం అవిద్యావశం చేత తన నిజస్వభావమును విస్మరించి అధః పతనార్థం ఎటకో అరుగుచున్నది. ఎంత కష్టమైన విషయం
శ్రీవసిష్ఠ మహర్షి : హే మహేశ్వరా ! చైతన్యమే స్వరూపముగా గల ఈ జీవుని జడత్వంవైపు పతనం అతి ఘోరంగా, అత్యంత దుఃఖప్రదంగా ఉంటోంది. నిజమే! దీనికి ఉపాయం ఏమిటి? జీవునికి దుఃఖాలు తొలిగేది ఎట్లా?
5. చైతన్యం సర్వదా సర్వత్రా యథాతథం
శ్రీశివ భగవానుడు : నీ ప్రశ్నకు సమాధానమే మన ఈ సంభాషణ యొక్క ముఖ్యోద్దేశం.
ఒకడు కలకంటూ, ఆ కలలో 'నేను పిచ్చివాణ్ణి' అని భావించి ఎలుగెత్తి ఏడవటంలో అర్థం ఏముంది? ఆ స్వపద్రష్ట 'నేను దుఃఖయుక్తుడను' అని భావించి వ్యాకులపడుచున్నట్లు, చైతన్యము కూడా తనకు వినష్టమనేదే లేకపోయినప్పటికీ, వినష్టమును సమీపించబోవుచున్నట్లు భయపడుతూ మధ్య మధ్య వెట్టికేకలు వేస్తోంది.
కుమ్మరి సారె తీవ్రవేగంగా తిరుగుతూ ఉంటే, అది సుస్థిరంగా ఉన్నట్లు చూచేవాడు భ్రమించు చున్నట్లు చైతన్యము 'అహం' ప్రత్యయ భ్రమవశంచేత ఈ జగత్తును సుస్థిరమైనదానిగా గాంచుచున్నది. శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ! చైతన్యముయొక్క సంసారానుభవమునకు కారణమేమిటి?
శ్రీశివ భగవానుడు : చిత్తమే! అయితే చిత్తము అనేది చిత్రచైతన్యము యొక్క విలాసమేగాని మరింకేమీ కాదు. చిత్ వ్యతిరిక్తమగు వస్తువంటూ వేరే ఎక్కడా ఏదీ లేదు.
Page:103
'చిత్'కు కారణమే లేదు. కనుక చిత్తమునకు విషయమగుచున్న చిత్ పరికల్పితములగు ఈ దృశ్యము, జగత్తులు కూడా కారణరహితమే. కనుక ఈ జగత్తు అసత్యమే అయి ఉన్నది.
అసత్యమైన దానికి కారణమేముంటుంది? 'కథలో మంత్రి రాజును ఎందుకు చంపినాడు?’ అనే ప్రశ్నకు సమాధానం కూడా కథలాగానే కల్పితమే అయి ఉంటుంది కదా!
వత్సా! అసలు విషయమేమిటో విశదీకరిస్తాను విను. పాషాణంలో తైలం ఉంటుందా? చంద్రునిలో నలుపు ఉన్నదా? "సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు" ...అని లోక ప్రతీతి కదా! అయితే సూర్యబింబానికి వాస్తవానికి ఉదయాస్తమయాలు ఉన్నాయా? ఆకాశమునకు అడ్డు, అవధులు ఉంటాయా? ఉండవు. అట్లాగే చైతన్యానికి దృశ్య దర్శనాలు గాని, కర్త-కర్మ-కారణాలు గాని, ప్రమాత-ప్రమేయ-ప్రమాణములు గాని, చిత్తవృత్తి - చేతనము (క్రియ) - చేత్యము (జగత్తు)లు గాని లేవు.
‘ఆకాశము’ అనుదానికి 'దిక్కులు' అనునది ఆరోపితం మాత్రమే కాదా? (సూర్యుడు-భూమి యొక్క స్థితిగతులు లేనప్పుడు తూర్పుపడమరలు ఎక్కడుంటాయి?) చైతన్యము నందు 'నేను, నీవు, అతడు' అను భేదములు, నానాత్వ - అనానాత్వములు, నామరూప సంబంధములు అసంభవం. సూర్యమండలంలో ‘రాత్రి' అనేది ఎలా సాధ్యం? చైతన్యము నందు దృశ్యవస్తు విశేషం ఉండటానికే అవకాశం లేదు. వస్తు-అవస్తు తత్త్వాలకు కుదిరేది కాదు.
ఒక గుండ్రాయి అంతరంలో పుష్పలత ఉంటుందా? అట్లాగే చైతన్యమునందు శూన్య అశూన్య భావాలకు కారణమే ఉండజాలదు.
అటు ఆకాశాన్ని చూడు. అది పైన, క్రింద, ఇటువైపు, అటువైపు ప్రసరించి, 'విశాలత, శూన్యత, అశూన్యత, దిక్కు, కాలము' మొదలైన వాటికి సంబంధించక సర్వదా సర్వత్రా విస్తరించి ఉన్నది. అది అట్లుండగా ‘అందులో అది ఉన్నది. ఇది ఉన్నది' అని మిగతా నాలుగు భూతములను (అగ్ని, వాయు, భూమి, జలము) గురించి ఆపాదిస్తున్నాం. వాటిచే ఆకాశం ఖండితమౌతోందా? లేదు. ఆకాశం సర్వదా దేనికీ సంబంధించక తనయందు తానే కేవలం తన యొక్క స్వచ్ఛభావమున వెలయుచున్నది. అట్లాగే, చైతన్యం కూడా అందులో కనిపించే శూన్యత, అశూన్యతాభావములకు కట్టుబడక సర్వదా సర్వత్రా నిర్మలంగానే ప్రకాశిస్తోంది. ఒకానొక చిత్తం చేత దర్శించబడే 'సంసార కూపము' అనే అనర్థం చైతన్యము యొక్క విలక్షణత్వమును స్పర్శించుటయే లేదు. ఆ చైతన్యం ఎక్కడ ఉండాలో అక్కడే నిర్వికారమై, జ్వరరహితమై ఉన్నది.
మరిక దోషము ఎట్లు కలుగుతోంది? జలంలో తరంగంలాగా చైతన్యము నందు 'చిత్తత్వము' అనే ఒక చమత్కారం ద్యోతకమౌతోంది. దాని పురాణనామమే హిరణ్యగర్భుడు. ఆ 'చిత్తస్రష్ట’ నుండి దేహేంద్రియాదుల పట్ల 'అహంభావం' అను సంసారానర్థమంతా దాపురిస్తోంది. అట్టి అహంభావాన్ని తొలగించి చూడు. ఇక సంసారమనబడేదేదీ అగపడదు. నిత్య - బుద్ధ స్తబ్ద - శివచైతన్యము మొట్టమొదట ఎట్లా ఉన్నదో ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అంతటా అట్లే ఉన్నది. ఇక వగచటం
Page:104
దేని కొరకో చెప్పు? ఈ కనబడేదంతా సమిష్టి సృష్టిక్రియలతో సహా చైతన్యము యొక్క క్రీడ లేదా లీల వంటివే!
ఈ జీవుడు తత్త్వమును వింటూ కూడా, ఈ దేహేంద్రియముల పట్ల అహంభావమును తొలగించుకోకపోయాడా - ఇక ఇందులో చిక్కుకోవటంచేత కథ మొదటికి వస్తుంది. కాక, ఆతడు ఈ శరీరంతో సహా ఈ ముల్లోకములు తృణప్రాయం, నిస్సారం అని గ్రహించాడా, తన యొక్క చైతన్యస్వరూపం కరతలామలకం అవుతుంది.
అయితే... ఈ జీవునకు దృశ్యతాదాత్మ్యం తేలికగా తనంతట తానే పోయేది కాదు. ఈ దృశ్య సంసార అనేకత్వభావన జయించటానికి పురుషకారం ఆశ్రయించాలి. అంతేగాని, అది తనంతట తానే తొలగదు. పురుషకారమే లేకపోతే చైతన్య స్వభావమును ఎవ్వరూ సాధించలేరు. పురుషకారబలం చేత దోషదృష్టి తొలగిందా, ఇక ఈ జీవునికి మరెవరో స్వస్వరూపమును వివరించి చెప్పవలసిన అగత్యం ఉండదు. అందుకే శాస్త్రాలు సాధకజీవుల పురషకారము కొరకై 'పూజ’ మొదలైన ఆయా విధి-విధానములను అందిస్తున్నాయి.
నిర్వికల్పాద్వితీయా చిద్యాసౌ సకలగా సతీ I
పరమైకా పరా సాచ్చా దీపికా తేజసామపి ॥ (శ్లో 16, సర్గ 31)
అహంభావమును త్యజించి. సంసారానర్థమును దూరం చేయగలిగితే, మరుక్షణం ఆ జీవుడు సర్వవ్యాపకము, నిర్వికల్పము, అద్వయము అగు ఆత్మలక్షణాలను పుణికిపుచ్చుకోగలడు. ఇందులో సందేహం లేదు. ఆ ఆత్మచైతన్యమే తేజోపదార్థములన్నింటినీ ప్రకాశింపజేయు నిర్మలవస్తువు.
అయ్యది నిత్యోదితం, నిర్మనస్కం, నిరంజనం, నిర్వికారం, నిత్యనిర్మలం, సర్వప్రకాశకం కూడా! అదియే చలిచీమనుండి బ్రహ్మదేవుని వరకూ (పిపీలికాది బ్రహ్మపర్యంతం) అన్ని రూపములుగా వెలయుచున్నది. సర్వత్రా సాక్షిగా స్పందనారహితంగా ప్రకాశిస్తోంది. దానిని మరింకేదీ ప్రకాశింప జేయుట లేదు. అదిమాత్రమే స్వయంప్రకాశకం.
ఈ జీవుని వాస్తవ స్వరూపమగు చైతన్యం - నిర్మలం, అప్రమేయం, శాంతం - అయినప్పటికీ, అది ఈ దేహములను భావన చేయటం చేత తన స్వస్వభావమును ఏమరచి వికల్పమగుచున్నది. ధూళిమిళితమైన జలం దోషభూయిష్టంగా కనబడినప్పటికీ నీరు స్వయంగా నిర్మలమైనదే కదా! చైతన్యం అజడమై ఉండి కూడా, జడంగా కనబడుతోంది. సర్వగామి అయి కూడా సంకుచితత్వం కనబరుస్తోంది. నిర్వికల్పమగు సూక్ష్మావస్థలో నుండి ప్రాణమయమగు లింగశరీరమున ప్రతిబింబిత మగుచున్నది. సూక్ష్మమగు దారం యంత్రంలో ప్రవేశించి పెద్ద వస్త్రంగా మారుచున్నట్లు, అది హస్త, పాదాది అవయవములను తన ఉపకరణములుగా ప్రకటిస్తోంది.
ఈ జీవుని యొక్క ఏ వాసనామయచిత్తమైతే స్వప్నమున ప్రవేశించి ఆ స్వప్నమును గాంచు చున్నదో, అదియే జాగ్రత్తు నందు- బయట విషయముల రూపముననూ, అంతరమున బోధ రూపముగానూ వెలయుచున్నది.
Page:105
అనగా... ఆ చైతన్యమే జాగ్రత్సమయమందు మనోరూపంతో వెలయుచునే, విషయాకృతిని దాల్చుచూ జ్ఞాన - అజ్ఞానాత్మికమగుచున్నది. ఒక సద్వర్తనుడు సాంగత్యవశంచేత దుర్విషయములను ఆహ్వానించినట్లు, అతినిర్మలమగు చైతన్యము ఈ దేహాది ఆకారములను అవధరించి ఇక తదనుకూల మైన చింతలను పొందుతోంది. రాగి బంగారంలో కలియటం చేత ఆ బంగారం రాగియొక్క రంగు తదితర లక్షణములను సంతరించుకుంటోంది. ఆ మిశ్రమంలోంచి రాగిని తొలగిస్తే బంగారం తన సహజ సిద్ధ ధవళఛాయలను వెదజల్లుతుంది కదా! చైతన్యము కూడా అశాశ్వతము కల్పితము అగు ఇంద్రియ విషయములతో సంయోగ వియోగానుభవములను పొందుతూ, శుద్ధాశుద్ధ భావనలను తెచ్చిపెట్టుకుంటోంది. అద్దం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు ముఖం కనిపించదు చూచావా! ఆ అద్దమును శుభ్రపరిస్తే? ప్రతిబింబం స్వచ్ఛరూపం దాల్చగలదు కదా! అట్లాగే అజ్ఞానము వలన జీవ-జడ భావములను ఒక అనునిత్య స్రవంతివలె కల్పన చేసుకొని, ఆ కల్పనలలో ప్రవేశించి ఆయా స్థితి గతుల భావనచే బంధమోక్షాది దిగ్రమములను పొందుతున్న ఈ చైతన్యము కూడా తత్వబోధచే మరల స్వకీయమగు నిర్మల - సహజ - నిర్వికల్ప స్వభావమును పుణికిపుచ్చుకోగలుగుతోంది.
ఆ చైతన్యము గురించి తెలుసుకొనకపోవటం చేతనే ఈ సంసారసంరంభమంతా ఉదయించి కలవరపెట్టడం జరుగుతోంది. చైతన్యముయొక్క స్వరూపమేమిటో గ్రహించావా... ఇక ఈ సంసారము తుచ్ఛమై, లయమై ‘లేనిది'గా అనుభవమవగలదు. కాదూ... 'అసత్ భావమును ఆశ్రయించటం జరిగితే అప్పుడు స్వతఃగా నిత్యస్వభావి అయికూడా వినాశత్వము ఆపాదించుకోవటం జరుగుతోంది. ఒక పెద్దకొండ చివరగల మహావృక్షం యొక్క పువ్వు అధఃపతనమౌతున్నట్లు, సూక్ష్మమగు చిత్ పదార్థపు అల్పస్పందన ఈ విశాల జీవభావంగా పరిణమిస్తోందని గ్రహించు.
అయితే!... ఈ సర్వము చిత్పదార్థము యొక్క స్పందనయే కదా! కనుక ఈ బాహ్యముగా కనిపిస్తున్న రూపరసాదులసత్త కూడా అద్వితీయమగు చైతన్యమే అయిఉన్నది. ఇక అధ్యస్తములగు భేదాభేదములంటావా? అవి అజ్ఞానదృష్టికి సంభూతములగుచున్నాయి. జ్ఞానబలంచేత అవన్నీ స్వయంగా లయం కాగలవు. అనగా, కల్పితక్రీడలోని అంతర్గతవిశేషములు వంటివి కాగలవు.
ఈ చిత్త - ఇంద్రియములతో అనుభూతమయ్యే ఏ 'సత్త' ఉన్నదో... అది కూడా సాక్షిచైతన్యమే గాని వేరే ఏదో కాదు. సర్వకార్య వ్యవహారములు చైతన్యస్ఫూర్తి చేతనే జరుగుచున్నాయి. ఏ స్థానమైతే చూడటానికి వీలుగా చైతన్యము ప్రకాశిస్తోందో అద్దానిని 'కళ్ళు' అంటున్నాం. అంతర్గత వృత్తియే కన్ను ద్వారా బహిర్గతమై కుండ, వస్త్రము మొదలైన ఆకృతులను దాల్చి, వాటి ఆకృతులను అనుభవించటం జరుగుతోంది.
చర్మము, దానిని స్పృశించే వాయువు - - ఈ రెండూ జడములే. అయితే, ఈ రెండిటి యొక్క సంయోగమగు 'స్పర్శ' అనే అనుభవం 'తత్' జ్ఞానమగు చైతన్యము వలననే సంభవమౌతోంది.
అట్లాగే, గంధతన్మాత్ర కూడా! 'గంధము - దానిని స్పందించే ప్రాణవాయువు' ఈ రెండింటికి ఏర్పడే సంయోగము 'గంధజ్ఞానము'చే గ్రహించబడుతోంది. ఆ గంధజ్ఞానము చిత్తవృత్తికి
Page:106
సంబంధించినది. ఆ చిత్తవృత్తినే 'అంతఃకరణం' అని పిలుస్తున్నాం. అట్టి జ్ఞానమును అంతః కరణమనే పరిచ్ఛిన్న ప్రదేశము నుండి వేరు చేసి, చూస్తే, అది చైతన్యము యొక్క ఉనికి చేతనే ఏర్పడుచున్నదని గ్రహిస్తాం. శబ్దతన్మాత్ర శ్రవణేంద్రియ వాయువుతో కూడటాన్నే 'శబ్ద సంవిత్తు' అంటున్నాం'. అంతఃకరణ వృత్తి రహితంగా చూస్తే అయ్యది కూడా నిర్వికల్పము, సుషుప్తి సదృశము అగు చైతన్యము యొక్క ప్రాశస్త్యమే గాని, మరింకేదో కాదు.
అందుచేత ‘చైతన్యరూపమగు చిదాత్మ ఎచ్చటో, ఎన్నడో, ఏదో నిర్వర్తించిన తరువాత లభించేది’ అని అనటం సరియే కాదు.
కర్మేంద్రియముల 'ప్రవృత్తి' వలన కలుగుచున్న సంకల్ప కాలుష్యమే, “చిత్తము, మనసు, లేక, చింత” అనబడుతోంది. ఆ ప్రవృత్తియే మనోవృత్తి. ఆ మనోవృత్తులకు సాక్షి అగు వృత్తిరహిత చైతన్యమేదైతే ఉన్నదో - అదియే నిర్మలమగు ఆత్మచైతన్యం. ఆహా! వసిష్ఠ మహర్షీ! చూచావా... కాలః కాలమై, అనంతమై అద్వితీయమైన ఆ చైతన్యమునకు మనమందరం ఎంత సమీపంగా ఉన్నామో...! అసలు, అదియే మనమై ఉన్నాము కదా!
ప్రకాశాత్మకమగు ఆ చైతన్యమే తనయందు తాను వెలయుచూ స్పటికమణిలాగా తనయందు ఈ జగత్తులను ధరిస్తోంది.
మరొక్క విషయం...! అద్వితీయమగు ఆ చైతన్యం ఈ జగత్తులను ధరిస్తూ త్యజిస్తూ ఉంటున్న ప్పటికీ అద్దానికి ఉదయాస్తమయాలు గాని, స్థిర-చలనాలు గాని, హాని-వృద్ధులు గాని లేనే లేవు.
ఆ చైతన్యం తన యొక్క సంకల్పబలం చేతనే జీవభావాన్ని దాల్చుచుచున్నది. అది సంకల్ప రహితమైనప్పుడు - “ఈ జగత్తుగా అనుభూతమయ్యేదంతా తానే - అనే వాస్తవం గ్రహిస్తోంది. అట్లు గ్రహించి, స్వస్వరూపమున (లేక) తన యందు తానే వెలయుచున్నది.
ఈ జీవుని రథం అహంకారం; అహంకారం యొక్క రథం బుద్ధి; బుద్దియొక్క రథం మనస్సు; మనస్సు యొక్క రథం ప్రాణం; ప్రాణం యొక్క రథం ఇంద్రియాలు; ఇంద్రియముల రథం ఈ శరీరం; శరీరం యొక్క రథం కర్మేంద్రియాలు... ఇన్ని రథాల యొక్క కార్యం 'స్పందన'. ఇదంతా నిశ్చలమగు ఆత్మస్పందనా చమత్కారమే!
జరామృత్యు మయమై కనిపించే ఈ దేహ పంజరంలో ప్రతిబింబించే జీవవిహంగం ఆ ఆత్మేశ్వరుని విభూతియేగాని మరింకేదో కాదు. నాయనా! ఈ ప్రపంచమంతా ఆత్మ యందు ఒక తుచ్ఛమగు స్వప్నంలాగా ప్రతిభాసిస్తోంది. ఇట్టి జగత్తునందు కొంచెం కూడా సత్యం లేదు. శ్మశాన వాటికలోని మురికి గుంటలలోని నీరులాగా, ఇది అత్యంత త్యాజ్యార్హం.
ప్రాణములు ఎటువైపుకు వెళ్తుంటే, కల్పనల రూపమైన సంకల్పం కూడా అటువైపుకే పరుగు లెత్తుతూ ఉంటుంది. వెలుతురు ఎక్కడ పడుతుంటే అక్కడే రూపములు కనిపిస్తున్నట్లు, బలవంతుడగు
Page:107
ప్రాణములు ఉన్నచోటే సంకల్పసంచలనం అనుభూతమౌతోంది. అరణ్యంలో వాయువు ప్రవేశిస్తేనే చెట్లకదలికలు కలుగుచున్నట్లు మనస్సు ఉన్నచోటే సంసారం. మనస్సు లీనమైనచోట సంసారమునకు తావు ఉండదు.
ప్రకాశము లేకపోతే రూపమే ఉండదు కదా! అట్లాగే ప్రాణవాయువులు లేకపోతే మనస్సనేది బొత్తిగా ఉండదు. గాలి వెంటే దుమారం కూడా వెళ్ళుచున్నట్లు ప్రాణవాయువులు వెళ్ళే వేపుగానే మనస్సు కూడా వెళ్తాంది. రథం ఎటు వెళ్ళితే సారథి కూడా అటే పోతాడు కదా! ప్రాణవాయు చలనస్పర్శ చేత అన్నరసమును వ్యాపింపజేయు నాడులు స్పందిస్తున్నాయి. చక్షురాది ఇంద్రియముల జ్ఞానం కలుగుతోంది. చిత్తము - - మనస్సులతో నిర్మంచబడేదే లింగశరీరం కదా! అది 'ప్రాణము' అను దర్పణంలో ప్రతిబింబిస్తోంది.
ఈ విధంగా ‘చైతన్యం యొక్క వ్యాపకత్వం ప్రాణవాయువు యొక్క కార్యమే' అని అంటూంటారు. శ్రీవసిష్ఠ మహర్షి: స్వామీ! చైతన్యము ప్రాణసహిత పదార్థములలో మాత్రమే ఉన్నదని అనవచ్చునా? శ్రీశివ భగవానుడు : ఆకాశమువలె స్వచ్ఛమగు చైతన్యము జడ - అజడ పదార్థములన్నిటా ఉన్నది. ప్రాణవాయుస్పందనచే స్పష్టంగా అభివ్యక్తమై, అద్దాని సంచలనముచే అనుభవమునకు గోచర మౌతోంది. చైతన్యము ప్రాణవాయువులవలన ఉద్బోధితమై ఎదురుగా అధ్యస్తమైయున్న చైతన్యముతో అభేదత్వం పొందుతోంది.
జీవదశ యందు ప్రాణముండుటచే జడమగు దేహం నానావిధ యత్నములు చేస్తోంది. ఈ శరీరము ప్రాణవాయువులు లేనప్పుడు శూన్యము, నిశ్చలము అగుచున్నది.
పరమచైతన్యం పుర్యష్టకంలో (పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం) ప్రతిబింబిత మవుతోంది. ఒక దృశ్యం అద్దంలో ప్రతిబింబించినట్లుగా రాతిలో ప్రతిబింబించదు కదా! కార్యము లన్నిటికీ కారణమగుచున్న మనస్సే పుర్యష్టకం. అంతేగాని నిస్తేజమగు కాళ్ళు, చేతులు పుర్యష్టకం కాదు.
సంకల్పమయములగు ఈ దృశ్యజాలములన్నీ దేని నుండి ఉదయిస్తున్నాయో, ఎందులో వెలయుచున్నాయో, ఎందులో అనుభూతములగుచున్నాయో, దేనిచే మనస్సు తదితర దేహాకారాలుగా భ్రమించబడుచున్నదో - ఆ పరమ వస్తువే విశ్వము. అదియే పరమాత్మ.
6. అజ్ఞానము యొక్క చమత్కారం!
శ్రీవసిష్ఠ మహర్షి : హే పరమేశ్వరా ! ఆ పరమచైతన్యము జీవుల శరీరములలో ప్రవేశించి కార్యములను ఆచరిస్తున్న విధి గురించి కొన్ని విశేషాలు మీ దగ్గర నుండి తెలుసుకోవాలని ఉన్నది. అది చలనయుక్తమై 'స్నాత - భోక్త - బ్రాహ్మణ -క్షత్రియ' మొదలైన సంజ్ఞలను పొందుచున్న విధానమేమిటో చెప్ప ప్రార్థన.
Page:108
శ్రీశివ భగవానుడు : ఆ చైతన్యమునకు ఒక శక్తి ఉన్నది. అదియే... "ఆవరణ శక్తి”.
ఆ ఆవరణశక్తి తనకు ఆశ్రయమగు బ్రహ్మమును మరుగున పరిచి, లేదనిపించుచూ పూర్వార్జితం, సంస్కారజనితం - అగు వివిధ యత్నాలతో కూడిన మనోభావాలు పొందుతోంది. మనోవాక్కాయాలకు సంబంధించిన ఆయా క్రియా విశేషాలచే చైతన్యము జడమువలె అగుచున్నది. అట్లు వ్యవహారదశను పొందిన బ్రహ్మశక్తి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియములను కూడా పొందుతోంది. మాయ యొక్క ప్రభావం చేత ఆ పరమచైతన్యం తనలో తానే 'జగత్తు' అనే గంధర్వనగరం (ఊహాజనిత అనుభవపూర్వకస్థానం) సృష్టించుకుంటోంది.
ఒకవైపు భావనా సమన్వితమగు ఈ సృష్టిని కల్పించుకుంటూ... అదే సమయంలో మరొకవైపుగా ఏదీ సృష్టించక ‘యప్పటియట్లే' ఉంటోంది. ఆ సమన్వయం జలం - తరంగాకారముల వంటిది.
జడమగు ఈ దేహంలో ‘చిత్తం లేదా మనస్సు' అనేవి లేకపోతే ఇది కట్టె, రాయితో సమానమే. చిత్తము ఉన్నప్పుడు ఆకాశంలో ఎగురవేయబడిన రాయిలాగా చలనము కలిగి ఉంటోంది. అత్యంత జడమగు ఇనుప ముక్క అయస్కాంతము యొక్క సామీప్యతచే చలిస్తున్నట్లు సర్వాంతర్యామియగు ఆత్మదేవుని సామీప్యతవలన ఈ దేహం చలించి ఆయా క్రియలను నిర్వర్తించగలుతోంది.
సర్వవ్యాపియగు ఆ 'చితశక్తి' బలం చేతనే ఈ జీవులందరూ వికాసం పొందుచున్నారు. కాబట్టి... నీతోను, నాతోను సహా ఈ జీవులందరూ చైతన్యము యొక్క ప్రతిబింబమాత్రులే. శ్రీవసిష్ఠ మహర్షి : పంచభూతములచే నిర్మించబడి, కనబడుచున్న ఈ జీవులందరూ నిష్క్రియమగు ఆత్మయందలి ప్రతిబింబములు ఎట్లా అవుతారు?
శ్రీశివ భగవానుడు : నిష్క్రియమగు అద్దంలో వస్తువుల కదలికలు కనబడుచున్నాయి కదా? ఇదీ అట్టిదే. ఈ జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబమే అయి కూడా, తన నిజస్వరూప విస్మరణం వల్ల స్వవ్యతిరిక్త భావపరంపరా రూపమగు పంచభూత సంబంధమైన జడానుభవం పొందుచున్నాడు. అదంతా ఒక సాత్వికజీవుడు ఏదో మోహవశం చేత కుకర్మలను ఆచరించి దురభ్యాసాలకు లోనయి నట్లుగా జరుగుతోంది.
చైతన్యము స్వస్వభావం విస్మరించటం చేతనే చిత్తభావం పొందుతోంది. అన్నీ తెలిసి కూడా ఒకడు మోహవశం చేత వికలత్వం పొందటం ఎంతటి ఆశ్చర్యమో, ఇదికూడా ఆ విధంగా ఆశ్చర్యకర విషయమే! కాని ఇది జరుగుట స్ఫురిస్తోంది. తరంగముల వలన నీరు చలిస్తున్నట్లు ప్రాణవాయువులచే అధ్యస్తమైన ఈ శరీరం చైతన్యానికి చలనమును ఆపాదిస్తోంది. వాయువుల వలన నౌక చలిస్తూ ఉండగా అందులోని వస్తుజాలం కూడా చలిస్తున్నట్లు దేహయంత్రాలన్నీ జీవభావం పొందుచున్నాయి. ఈ దేహం ఆత్మ నుండి మనన క్రియను సంపాదించి ఆత్మదేవుని సామీప్యమాధుర్యం చేత కదలుతూ తానే ఆత్మను స్పందింపజేస్తున్నట్లు ప్రదర్శితమౌతోంది. ప్రజ్ఞానం యొక్క చమత్కారం అంతటిది!
హే బ్రహ్మజ్ఞా! పరమాత్మ ఈ శరీర శకటమును నడిపించగోరి, మనస్సు - ప్రాణము అనే రెండు చక్రములు నిర్మించుకుంటున్నారు. చైతన్య పరమాత్మ జడరూపమును గ్రహించి జీవభావము
Page:109
పొందినవారై ఈ బాహ్య మనో-ప్రాణాలనే గుఱ్ఱములను ఎక్కి, ఎటకో పయనిస్తూ తమ స్వస్వరూపాన్ని ఈషణ్మాత్రంకూడా త్యజించకపోయినప్పటికీ ఈ పంచభూతాత్మిక జగత్తులో సంచారం చేస్తున్నారు. జగత్తులో "నేను జన్మిస్తున్నాను” అను రూపంగానూ, స్వప్నంలో “నేను దర్శిస్తున్నాను” అను రూపంగానూ స్వకీయ మాయచే సంకల్పములు చేసుకుంటున్నారు.
కానీ ఆయన ఏమాత్రం ఎక్కడికీ వెళ్ళుట లేదు. తరంగత్వం జలం నుండి వేరైనదెప్పుడు? ఎప్పుడూ లేదు. చైతన్యము కూడా జగత్తు నుండి భిన్నం కాదు. ఆత్మచైతన్యమును ఆశ్రయించుకొనియే చిత్తవృత్తులు జీవజగత్తులను స్ఫురింపజేయుచున్నాయి. వెలుతురు యొక్క ప్రసరణచే రూపములు ప్రకాశించుచున్న, ఆత్మచైతన్య ప్రకాశము వలననే సర్వము ప్రకాశిస్తోంది.
కనుక పుత్రా! దీపం ఉన్న ఇల్లులాగా నిరామయమగు చైతన్యము ఉండటం చేతనే నీకు కనబడే ఈ జీవులు నీకు ప్రకాశిస్తున్నారు.
ఒకే జలం నుండి అలలు, ఆ అలల నుండి బుడగలు, ఆ బుడగల నుండి నురుగు, ఆ నురుగు నుండి తెల్లటి తెలుపు ప్రకటనమగుచున్నట్లు ఈ జీవుని నుండే ఆధి-వ్యాధులుగా గల దుఃఖాలన్నీ పుట్టి పెరుగుచున్నాయి. 'నేను ఈ శరీరపరిమితుడను' అని సుదీర్ఘంగా అనుకుంటూ ఉండటం చేత ఈ జీవుడు దుఃఖ-దైన్యములతో చివుకుతున్నాడు. చైతన్యమే అన్నిటికీ ఆధారమై కూడా తన సంకల్పపరంపరలతో నిర్మించుకున్న శరీరాలలో ఆ చైతన్యం వివశత్వం పొందుతోంది. శ్రీవసిష్ఠ మహర్షి : ఇది అత్యంత చిత్రం కదా!
శ్రీశివ భగవానుడు : చిత్రమే ! కానీ, ఏం చేయాలి? మత్తుగా కల్లు త్రాగిన మనుజుడు తన శరీరం మురికితో నిండినా గ్రహించలేడు చూచావా? చైతన్యం కూడా వివశత్వం పొంది తన సర్వాధార - స్వప్రకాశక - స్వస్వరూపాన్ని ఏమరిచి బాలునివలె దుఃఖాలను పొందుతోంది. కల్లుతో మత్తెక్కిన వాడు మత్తు దిగిన తరువాత తాను మత్తెక్కి చేసిన పనులను దూరంగా విడచున్నట్లు, చైతన్యము కూడా మోహమును త్యజించినప్పుడు స్వస్వరూపాన్ని గ్రహించి, జగత్తు యొక్క రహితత్వం దర్శిస్తోంది. కుష్టురోగియొక్క శరీరంలోని కొన్ని భాగాలు నిర్వీర్యమై స్పర్శరహితమైనట్లు, సర్వవ్యాపకమగు చైతన్య స్వరూపుడగు ఈ జీవుడు ఒకచోట ఒకానొక శరీర పరిమితమై నట్లు సంకుచితత్వం ఆపాదించు కుంటున్నాడు.
❖
ఈ భౌతికదేహం శిథిలమగుచూ ఉండగా హస్తపాదాది అవయవములు ప్రాణవాయువుల ప్రసరణ కోల్పోతాయి. అప్పుడు హృదయమున హృదయకమలదళం చలనరహితంకాగా, విసనికఱ్ఱ వీచటం ఆపినప్పటి గాలిలాగా అంతరమున జరిగే ప్రాణవాయు సంచలనం ఆగుతుంది. ఆ విధంగా ప్రాణవాయువులు లోన అడిగినప్పుడు జీవుడు నామరూప ఉపాధిరహితుడై కారణస్వరూపుడై వెలయుచున్నాడు. అతని మనస్సు రజోగుణహీనమై, నిరాధారమై, ప్రాణవాయువులతో లీనమై ఉంటుంది. అనగా ‘కారణాత్మకత' పొందుతోంది. మరల విత్తులోంచి చెట్టులాగా మరొక దేహ రూపమున ప్రకాశించటం జరుగుతోంది.
Page:110
ఈ విధంగా వైకల్యం పొందుచున్న మూలకారణంతో పుర్యష్టకం ఏర్పడటం, ఉపశమించటం, మరల ఏర్పడటం జరుగుతోంది.
'స్వస్వరూపమును మరచుట' అను మోహము వలననే చైతన్యము చేత్యాకారం (The form that all being perceive) పొందటం జరుగుతోంది. ఆ చేత్యాకారమునందు వాసనామోహములు స్పందిస్తున్నాయి. ఇక అందులోంచి అనేక కల్పనలు బయలుదేరుతున్నాయి.
హృదయ కమల దళములు వికసిస్తూ ఉండగా పుర్యష్టకం (పంచేంద్రియ వ్యాపారములు మనస్సు - బుద్ధి - జీవాహంకారము) మరలమరల పరిస్పుటమౌతోంది. హృదయకమలదళం నిశ్చలమైనప్పుడు పుర్యష్టకం కూడా వినష్టమౌతోంది. శరీరమధ్యంలో పుర్యష్టకం ఉన్నంతవరకూ ఆ చైతన్యము జీవదశ పొందుతోంది. పుర్యష్టకం క్షీణించిందా ... శరీరం మృతమైనదని చెప్పబడుతోంది.
అట్లాగే కఫ - వాత - పిత్తముల వలనగాని రాగద్వేషాదులనే మలరాసి యొక్క తీవ్రప్రకోపం వల్ల గాని, శస్త్రాదుల చేతగాని ప్రాణవాయు ప్రసరణం నిరోధించబడగా, అప్పుడు కూడా హృత్పద్మ యంత్రం ప్రకోపించదు. అప్పుడు పుర్యష్టకం, వాయుయంత్రం వలన నిరోధించబడి బహిష్కృతమైన గాలివలె, నెమ్మదిగా ఆకాశమున కలిసిపోతుంది.
ఈ జీవుడు కేవలం తన సంకల్పముల వశం చేతనే మరణాది అనేక దుఃఖములను అనుభవించుచున్నాడు. సంస్కారబలంచేతనే శరీరమునందలి పద్మయంత్రం ఎడతెరిపి లేకుండా చరిస్తోంది.
వాసనా విమలా యేషాం హృదయాన్నావసర్పతి | స్థిరైకరూపజీవాస్తే జీవన్ముక్తాశ్చిరాయషః || (శ్లో 35, సర్గ 32)
ఎవరిహృదయంలో అయితే సర్వదా పవిత్రమైన ఆత్మతత్వమునకు సంబంధించిన వాసనలు ఉంటాయో ...అట్టి జీవులు శాశ్వతము, ఏకరూపము, జీవన్ముక్తములతో కూడిన చిరంజీవత్వమునందు వెలయుచున్నారు.
శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ! శరీరం నేలకూలినప్పుడు మనస్సుగతి ఏమౌతోంది?
శ్రీశివ భగవానుడు : హృత్పద్మయంత్రం నిరుద్ధమైనప్పుడు ప్రాణవాయువులు సశాంతిస్తాయని అనుకున్నాం కదా! అప్పుడీ భౌతికశరీరం ధృతిశక్తిని వీడి కట్టె, మట్టితో సమానమై భూమి మీద కూలుతుంది. పుర్యష్టకం ఆకాశంలో లీనమైపోతుంది. మనస్సు కూడా ఆకాశంలో తన ఉనికిని గాంచు తుంది. అనాది కాలం నుండి అభ్యాసబలమును కలిగి ఉన్న వాసనతో నిండిన మనస్సు ఎచ్చటెచ్చట పరిభ్రమిస్తుందో అచ్చటచ్చట స్వర్గ నరకములను గాంచుతూ ఉంటుంది. ఇక ఈ శరీరమంటావా! ఒక గృహస్తు ఇల్లు వదల వెళ్ళినపుడు పాడుపడుచున్నట్లు, ప్రాణములు లేచిపోగానే శరీరం శవరూపం దాల్చి శిథిలమౌతోంది.
సర్వగామియగు బ్రహ్మచైతన్యమే చేత్యభావం పొందుతోంది. అనగా "తెలివి ... తెలుసుకొనుట” అను భావం ఆశ్రయిస్తోంది.
Page:111
చేత్యభావం నుండి ↑ చేతనాభావన
చేతనా భావం నుండి ↑ జీవభావం
జీవభావం నుండి ↑ మనస్సు
మనస్సు నుండి ↑ సూక్ష్మమగు పుర్యష్టకం
పుర్యష్టకం నుండి T శబ్ద, స్పర్శ, రూప, రస గంధము లనెడి విషయాలు.
సూక్ష్మశరీరం (పుర్యష్టకం) సంకల్పములను తన ఒడిలో వేసుకొని భావనాబలం వలన ఒక స్వప్నభ్రమ వలే ఈ స్థూల శరీరములను గాంచుచున్నది. ఆ భావనాదృఢత్వం చేత ఈ శరీరమును సత్యమైన దానిగా తలచి, దీనియందు ఆసక్తిగొన్నదై తన సర్వాంతర్యామిత్వాన్ని, సర్వనియామకత్వాన్ని బొత్తిగా ఏమరుస్తోంది. చైతన్యము సూక్ష్మభూతాత్మకమై, ప్రాణమయమగు ఈ పుర్యష్టక సమన్వితమైన శరీరమును లేవదీయుచుండగ జనులు 'ఈతడు జీవించియే ఉన్నాడురా' అని చెప్పుకుంటున్నారు. ఆ పుర్యష్టకము నశించి చిత్తము ఆకాశమున లీనమైనప్పుడు శరీరము కొయ్య, రాయిలాగా అచేతనమగుచున్నది. అప్పుడు 'ఈ శరీరము మృతమైనది' అని అంటున్నారు. క్రొత్తదగు చిగురుటాకు కాలక్రమంగా ఎండిపోవునట్లు ఈ శరీరం కూడా ఒకనాటికి వాడిపోతోంది.
అయితే ఇక్కడ మరొక చమత్కారం మనం గమనించాలి. చైతన్యము అజ్ఞానవశంచేత చావుగాని, పుట్టుకగాని లేని తన బ్రహ్మస్వరూపమును మరచి వివశత్వం, శక్తిరాహిత్యం అనుభవిస్తోంది. మృత్యు సమయంలో హృత్పద్మయంత్రం జీవస్మృతిని కోల్పోయి చలనరహితమై ఉంటోంది. ప్రాణ వాయువు నిరుద్ధమైనప్పుడు మనిషి మృతి చెందాడని అనుకుంటున్నారు. అంతమాత్రానికి ఆతని కాల్పిక జగత్తు అంతమైనట్లు కాదు. నిదురించునప్పుడు కాల్పిక జగదనుభవం కొంచెం విరామం పొందినట్లు వర్తమాన తదనంతర దేహముల మధ్య కాల్పిక జగత్తు కొంచెం విరామం పొందుతుంది.
యథా జాతాని జాతాని చాన్యాన్యన్యాని కాలతః । వృక్షాత్పర్ణాని శీర్యన్తో శరీరాణి తథా నృణామ్ ॥ (శో 49, సర్గ 32)
జాయన్తో చ మ్రియన్తో చ శరీరాణి శరీరిణామ్ । పాదపానాం చ పర్ణాని కా తత్ర పరిదేవనా ॥ (శో 50, సర్గ 32)
వత్సా! వృక్షం యొక్క ఆకులు యథాసమయంలో పుట్టి, ఎండి రాలిపోతున్నట్లే, ఈ మనుష్యుల శరీరాలు కూడా పుట్టి, పెరిగి నశిస్తున్నాయి. జనన, మరణములు ఈ దేహమునకు స్వాభావికములే కదా! ఇక ఇందుకై దుఃఖం ఎందుకు?
చిత్ సముద్రంలో ఏ ఏ వైపుల నుండి ఎన్నెన్ని శరీరములు బుద్భుదపంక్తుల వలె లేస్తున్నాయో ఎవరు చెప్పగలరు? బుద్ధిమంతులకు వీటి పట్ల శాశ్వతబుద్ధి ఉండదు. ఇక బ్రహ్మచైతన్యం ఆకాశ - అనాకాశములందు ప్రసరించియున్నదై కూడా సర్వదా యథాతథంగా ఉండి ఉన్నది. చిత్తదర్పణంలో
Page:112
ప్రతిబింబిత చైతన్యమే కనబడుతోంది. చిత్తధారులు చిత్తముచే పరిమితమైన చైతన్యమునే చూస్తూ భ్రాంతిని పొందుచున్నారు. చిత్తమును ఒకవస్త్రమువలె, ఒక ఆభరణమువలె ధరిస్తున్నట్టి చైతన్యమును గమనించలేకపోతున్నారు.
పరిపూర్ణం, నిర్మలం అగు చిదాకాశమున శుభాశుభకర్మలు తత్ సంబంధిత సుఖ దుఃఖాలు వాటికి సంబంధించిన కల్పనాపుంజములు, ఆపాతరమణీయ భోగభావనలు, వివిధ జననమరణ పరంపరలు ఆకాశంలో గాలివీచికలులాగా ప్రసరించి ఆత్మను విముగ్ధం చేసి తపింపజేస్తున్నాయి.
ఏది ఏమైనా కావచ్చు. ఆత్మసర్వదా నిర్వికార - నిత్యోదిత - నిష్కళంక సమన్వితమైనది. అది దేనికీ తగిలి ఉండటం లేదు. అన్నిటికీ సాక్షీభూతమై మొట్టమొదట ఎచ్చట ఎట్లున్నదో, ఇప్పటికీ అచ్చటే, అట్లే ఉన్నదని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.
ఆ ఆత్మ భగవానునికి ఈ శరీర జననమరణాలతో ఎప్పుడూ, ఏ మాత్రం సంబంధం లేదు.
7. అపరిమితంలో పరిమితమా ?
శ్రీవసిష్ఠ మహర్షి : హే చంద్రశేఖరా! ఇప్పుడు నాకు కలిగే కొన్ని సందేహాలను మీ ముందు
ఉంచుతాను.
1. అనంతం, ఏకరసం, అద్వైతం - అగు చిద్వస్తువునందు 'చిత్తం' అనే ద్వితీయ వస్తువు ఎట్లా ఏర్పడింది?
2. అచిత్తంలో ద్వైతం ఎట్లా అరూఢమౌతోంది.
3. చిదాత్మకు దుఃఖజాడ్యం ఎట్లా కలుగుతోంది?
4. జ్ఞానం సంపాదించేది ఎట్లా? ఆ దుఃఖజాడ్యం ఎట్లా తొలిగేది?
ఈ విషయాలు వివరించవలసినదిగా నా విన్నపం
శ్రీశివ భగవానుడు : నాయనా! వసిష్ఠా! 'సర్వశక్తియుతము - ఏకత్వము' అయి ఉన్నదొక్కటే అన్ని వైపులా, అన్ని వేళలా వెలియుచున్నదని ముందే చెప్పాను కదా! నిజానికి పారమార్థిక దృష్టిలో దానియందు ఏ సమయంలోనూ ద్వైతాద్వైత భావాలూ, విషయాలూ లేనేలేవు.
ద్వైతభావం ఉంటే ఏకత్వమనేది మరొకటి ఉంటుంది. ఒకటేదో రెండు అవటమే ద్వైతం కదా! ఈ రెండూ కూడా చిన్మాత్రమగు బ్రహ్మము పట్ల సత్యం కాదు.
'రెండు' అనే భావం 'ఒకటి' అనుదాని లోంచే కలుగుతోంది. వాస్తవానికి బ్రహ్మమును ద్వైతమని గాని, అద్వైతమని గాని వర్ణించలేం. బ్రహ్మ ద్వైతాద్వైత వివర్జితం.
అయితే ...వ్యావహారిక పరమార్థ బోధ అది 'అద్వైతం' అని ప్రతిపాదించబడుతోంది. అదంతా తెలిపేవాడు ఔత్సాహికులగు తెలుసుకునేవారి వర్తమాన సమాచారం, సౌలభ్యములను అనుసరించి
Page:113
చేస్తున్న మధ్యేమార్గమని గ్రహించు. లోకవ్యవహార సిద్ధికై ఆ విధంగా ద్వివిధ బోధ ఒనర్చబడి నప్పటికీ... పరమార్థ వస్తువు నందు చిత్తము అనబడే ద్వితీయం ఉండటం అసంభవం.
కానీ, భావనచే ద్వితీయమైనదైన చిత్తము, అద్దాని నుండి తదితరమైనదంతా అనుభవమవటం జరుగుతోంది. అదెట్లా అంటావా?... బీజము ఒక్కటే అయినప్పటికీ అది వృక్షశాఖ, ఫల, పత్ర, పుష్ప, పల్లవాది వివిధ నామరూపాత్మకమై వ్యవహరించబడుతోంది కదా! అట్టి వ్యవహారసత్తా అంగీకరించటానికి ఇష్టం లేకపోయినప్పటికీ కీడేమిటి? బీజములోని రస శక్తియే ఆ విధంగా రూపం దిద్దుకొంటోందని ఎందుకు జ్ఞాపకముంచుకోరాదు?
ఎందుకంటే, చిత్తో చేత్యాది రూపంగా స్ఫురిస్తోంది. దాని సారమే అన్నిటా నిండి ఉన్నది. ఈ నామరూపాది వికారజాలమంతా ఆ చిద్వస్తువు నుండే లేచి కార్యకారణ భేదములతో వస్తు రూపమున సార్థకమగుచూ వ్యవహరించబడుతోంది.
అనగా... 1. పారమార్థిక, 2. వ్యావహారిక, 3. ప్రాతిభాసిక - ములగు సర్వ పదార్థములు కూడా బ్రహ్మసత్త చేతనే ఆవరించబడి ఉన్నాయని గ్రహించు. కనుక ఈ కనబడే సర్వమూ బ్రహ్మసత్తయే కాబట్టి సత్యమే కదా! కాని ద్రష్ట స్వకీయ సంస్కారానుసారం కొంత భ్రాంతిని జోడించి పరికిస్తున్నాడు. అట్టి అజ్ఞానం తొలగాలి. "పటిక బెల్లం యొక్క రుచి గురించి వర్ణన కన్నా అనుభవం మిన్న” అన్నట్టుగా, “వస్తు పరిశీలనాత్మక సాక్షాత్కారం" ఒక్కటే సర్వమునూ స్పష్టం చేయగలదు. జలకణములు, తరంగములు, బుద్బుదములు మొదలైనవన్నీ జలంనుండి ఏమాత్రం వేరైనవి కానట్లు... సర్వశక్తిత్వము కూడా బ్రహ్మము నుండి వేరుకాదు.
సర్వశక్తిత్వములోనే వస్తుశక్తి ఏర్పడి ఉంటోంది. కనుక ఈ కనబడుచున్నదంతా బ్రహ్మమునకు వేరు కాదు. బ్రహ్మము సత్యమే కదా! తత్త్వదృష్టితో చూస్తే బ్రహ్మమునకు శక్తికి అభేదమే ఉంటుంది. ఫుష్ప-ఫల-పల్లవాదులు లత నుండి వేరా? లత బీజములో ఉండి ఉన్న బీజశక్తి కంటే వేరా?
ఈ ద్విత్వము, ఏకత్వము, జగత్తు, అహం, త్వం ఆదిగాగల భావములన్నీ కూడా చిద్వస్తువు నుండి ...అనగా, తెలుసుకుంటున్న వానియొక్క 'తెలివి' అను స్వరూపమునుండి బయలుదేరుచున్నాయి. కనుక అవి అద్దాని నుండి వేరైనవి కావు. ఈ విధంగా ఈ దేశ కాలాది భేదములు చిద్వస్తువు నుండి వేరు కాదు.
ఇప్పుడు 'ద్వైతం ఎట్లా వచ్చిపడుతోంది?' అనే విషయానికి వద్దాం. నీ ఈ ప్రశ్న 'చైతన్యము లేక చిద్వస్తువు కంటే అన్యమైనదేదో ఉన్నది' అను ఆశంక నుండి బయలుదేరుతోంది. చిద్వస్తువు గాక వేరొకటేదీ లేనే లేదు. కనుక, నీ ప్రశ్న మొదలే అనుచితం. చిదాత్మ సత్త యొక్క ఉనికి చేతనే సంకల్పమాత్రముగా దేశ-కాల-క్రియ-నియతి మొదలైనవన్నీ ఆ చిదాత్మకే అనుభవమౌతున్నాయి. కనుక అవన్నీ చిదాత్మ యొక్క స్వయంకల్పిత స్వీయానుభవములే! చిదాత్మ స్వరూపములే!
జల తరంగములనే మనం ప్రవాహం - కెరటాలు మొదలైన పేర్లతో కూడా ఉద్దేశిస్తున్నాం
Page:114
కదా! అట్లాగే చిదాత్మ ఒక్కటే బ్రహ్మమని, జడమని, చైతన్యమని, చిత్తమని, చేత్యమని పేర్కొనబడుచున్నదని జ్ఞానదృష్టికి, నిర్మల దృష్టికి తప్పక తెలియవస్తోంది.
జలం తరంగములు అనబడు మరొకటిగా మారుతోందా? లేదు. బ్రహ్మము స్వయముగా నిర్వికారమే. జలము మరొకటిగా ఉదయించటం అసంభవమే అయినప్పటికీ, తరంగం కనిపిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మమునే 'తెలుసుకొనబడుచున్నది' లేక చేద్యము అని కూడా అంటున్నాం. ఆ పరబ్రహ్మమే వివిధ ద్రష్టలచే సత్యము, ఈశ్వరుడు, శివము, శూన్యము - - మొదలైన వివిధ నామములచే పేర్కొనబడుతోంది.
అయితే ...ఆ పరమాత్మ నామరూపములకు అతీతమైనది. వాక్కుకు అగోచరమైనది. ఇక ఎదురుగా కనిపిస్తున్న ఈ జగత్తు 'చిత్త యొక్క ఫల పుష్పములు' అని అనవచ్చును.
ఆ చైతన్యము 'అవిద్య' అనబడే ఉపనేత్రములను ధరించి 'జీవుడు' అనబడే రెండవచంద్రుని (రెండవ చంద్రుడు వాస్తవానికి లేడు కదా!) దర్శిస్తోంది. మరొకరకంగా చెప్పాలంటే ... ఆ చైతన్యము తనంతట తానే తనను జడముగాను, బ్రహ్మము నుండి వేరుగాను భావించుకుని వికల్పమయములగు వివిధ భావములను దాల్చుచున్నది.
అయితే, బిడ్డా! ఆ చైతన్యము సర్వదా నిష్కళంక రూపముననే వెలయుచున్నదయ్యా! తత్సమయముననే కల్పితమగు కళంకరూపమున సంసారనదియందు మునిగి ఔపాధిక చైతన్యముతో (ఉపాధితో కనిపించే స్వరూపంతో) ఇటూ అటూ సంచరిస్తోంది. మనస్సు, బుద్ధి, దేహాహంకారములకు నిలయమైన ఈ ‘శరీరం’ అనే పుర్యష్టకమునందు ఐక్యత కల్పించుకుని జీవరూపములను పొందుతోంది.
ఈ జీవుడు చిత్స్వరూప ప్రకాశం వల్లే చిన్మయుడై జీవిస్తున్నాడు. సూక్ష్మశరీర ధారి అయి, ఇక ఈ జీవుడు 'నేను పంచభూతాత్మక స్థూల దేహమును' అని భావించి, భావించి, అట్టి ద్రవ్యత్వంతో కూడి, వీర్యంగా స్త్రీ గర్భంలో చేరుతున్నాడు. 'చూడు, చూడు... నేను పుట్టాను, నాకు ప్రాణము లున్నాయి' అని తలపోయుచున్నాడు.
ఈ జీవుని ఆది-మధ్య-అంతం కూడా బ్రహ్మమే. అయినా కూడా పైన మనం చెప్పుకున్నట్లుగా భావించుకుంటూ, స్థూలదేహాన్ని అనుభవిస్తూ, స్థావరజంగమాది పదార్థాలను తనకు ఎదురుగా గాంచు చున్నాడు. ఇంకా చెప్పాలంటే, ఆయా వాసనల వలన ఆయా వస్తువుల రూపంగా మారుచున్నాడు.
సూక్ష్మం నుండి స్థూలానికి - సూక్ష్మ శరీరమునందు ఉన్నట్టి చైతన్యము నందు మాయచే సూక్ష్మ శరీర భావన యొక్క దార్థ్యం తగ్గి స్థూలశరీర వాసనలు ప్రబలటం జరుగుతోంది. అందుకు ఫలితంగా అకస్మాత్తుగా, కాకతాళీయంగా చైతన్యము తన సూక్ష్మశరీరం పరిత్యజించి స్థూలదేహం ఆశ్రయించి ఉంటోంది. ఒక “పిరికివాడు, మందబుద్ధి" - తన ఎదురుగా మసక చీకట్లో ఎఱ్ఱటి కనుగుడ్లు, జుట్టు విరగబోసుకున్న బేతాళుణ్ణి ఊహచే గాంచుతూ ఉంటాడు చూచావా? ఈ చైతన్యము అద్వితీయమై ఉండి కూడా తన యొక్క ద్వితీయ సంకల్పముచేత ద్వైతమును గాంచుచున్నది.
Page:115
8. సంకల్ప రాహిత్యం
అయితే ...‘నేనేమీ చేయుటలేదు' (నా హంకర్తా) ...అని భావించినంత మాత్రం చేత పురుషునకు ఆ జరుగుచున్న క్రియా విశేషములపట్ల కర్తృత్వం తొలగుతుంది చూచావా? అట్లాగే, తిరిగి చైతన్యము అద్వైతభావమును ఆశ్రయించగానే ద్వైతభావన స్వభావసిద్ధంగానే ఉపశమిస్తోంది. ద్విత్వసంకల్పతో ద్విత్వమేకస్యైవ ప్రవర్తతే |
అద్విత్వసంవిదా ద్విత్వమనేకస్యాపి నశ్యతి || (శ్లో 30, సర్గ 33)
ఈ విధంగా ఆ అద్వితీయవస్తువు ద్విత్వసంకల్పమువలన ద్వైతభావన పొందుతూ, మరల మరొకప్పుడు అద్వైత భావము వలన నానాత్వమును నశింపజేసుకుంటూ ఉంటోంది. నానాత్వమునే మనం ‘జగత్తు’ అని అంటున్నాం. ఇదంతా ఇంత మాత్రమే అయి ఉన్నది.
అవికారుడు, సర్వగతుడు, నిత్యోదయుడు, వృత్తి జాడ్యము లేనివాడు అగు పరమాత్మయందు రెండవదంటూ ఏదీ లేదు. ఉండజాలదు. ఇక ఈ జగత్తులు, మనోరాజ్యములు, గంధర్వనగరములు అంటావా ... ఇవన్నీ చైతన్యము యొక్క సంకల్పపరంపరలచే రచించబడినవి మాత్రమే. సంకల్పములు ఉన్నప్పుడు అవి ఉంటున్నాయి. సంకల్పములు క్షీణించిన మరుక్షణం అవి లేకుండా పోతున్నాయి. సంకల్పములు లేనప్పుడు మిగులునదేదో... అదియే నీవు, నేను, అంతయు కూడా.
సంకల్పశ్రమ! – ఓ మునీశ్వరా! సంకల్పాలు కలిగి ఉండటమే శ్రమతో కూడుకున్న వ్యవహారం. సంకల్పములు లేకపోతే ఎట్టి కష్టమూ ఉండదు. సంకల్పయక్షుడే ఈ సంసారాన్ని రచిస్తున్నాడు. అయితే, సంకల్ప వ్యవహారం తనంత తానుగా క్షయించదు. దానికి సాధన అవసరమౌతోంది. 'సంకల్పించక పోవటం' అనే అభ్యాసం దానికి సరి అయిన మందు.
శ్రీవసిష్ఠ మహర్షి: అయితే ఈ జీవుడు స్వసంకల్పవశం చేతనే దుఃఖితుడౌతున్నా డంటారా? శ్రీశివ భగవానుడు: అవును. ప్రబలమగు సంకల్పవశం చేత వచ్చి చేరుతున్న ఆ దుఃఖం మరల తిరోమార్గంలో సహకరించగల సంకల్పముల వలననే క్షీణించ గలదు. సంకల్పరాహిత్యం చేత జీవుడు దుఃఖరహితుడౌతున్నాడు. 'సంకల్పములు చేయక పోవటం' అనేది అంతతేలిక కాదని జనులు భావిస్తున్నారు కాని సంకల్పములు చేయడంతోనే క్రియాశ్రమ ఉన్నది. ఎంత కొద్దిగా సంకల్పించినా సరే, చివరికి మనుష్యుడు దుఃఖజాలంలోనే పడుతున్నాడని హెచ్చరిస్తున్నాను. అసంకల్పం (సంకల్ప రాహిత్యం) వైపుగా కొంచం ప్రయత్నిస్తూ ఉన్నా... అవి కొంతకొంత తగ్గుతూ రాగలవు. సంకల్పించక పోవటం చేత అట్టి మనుజుడు అక్షయ సుఖమును పొందుచున్నాడు.
కనుక, పుత్రకా! ఈ మనుజుడు 'సంకల్ప సర్పము' నుండి విడివడనంతవరకూ రమణీయమగు నందనవనం కూడా ఈతనికి సుఖం కలిగించలేదు. ఇది గ్రహించి నీవు స్వకీయమైన 'వివేకము' అను వాయువును వేగంగా ప్రవహింపజేయి. ఈ 'సంకల్పములు' అనే మేఘపుంజములను చెదరగొట్టివేయి. శరత్కాల ఆకాశంలాగా పరమోత్తమ నిర్మలత్వం పొందెదవు గాక!
Page:116
అంతేగాని, సంకల్పోన్మత్తుడవై సంకల్పనదీజలంలో తెలియరానిచోట్లకు కొట్టుకుపోవద్దు. శ్రీవసిష్ఠ మహర్షి : ఈ సంకల్పించు దురభ్యాసమును అధిగమించటం ఎట్లా?
శ్రీశివ భగవానుడు : ‘శుభకార్యక్రమములు, భగవత్ స్తోత్రములు' మొదలైన వాటిచే ఈ సంకల్పనదీ జలమును శుష్కింపజేయాలి. సంకల్పములతో తేలిపోయే మనస్సును నెమ్మదిగా ఓదార్చి క్రమంగా నిర్మల మనస్కుడవు కమ్ము.
నాయనలారా! నీ చిదాత్మ సంకల్ప సుడిగాలులచే ఎగురగొట్టబడి ఎండిన ఆకులాగా, ధూళి కణంలాగా భూతాకాశంలో నిష్కారణంగా పరిభ్రమిస్తోంది. నీవు నీ చిదాత్మయొక్క యథార్థరూపమును వీక్షించు.
స్వసంకల్పానకాలుష్యం వినివార్యాత్మనాత్మనః |
పరం ప్రసాదమాసాద్య పరమానన్దవాన్భవ ॥ (శ్లో 40, సర్గ 33)
స్వయంగా నీకు నీవే ఆత్మను ఆవరించి ఉండే సంకల్ప కాలుష్యాన్ని దూరం చేయి. పరమనిర్మల భావమును పొంది పరమానందయుక్తుడవు కమ్ము.
పరమశక్తియుతమగు ఈ ఆత్మ దేనిని ఎట్లు భావించుచున్నదో అద్దానిని అట్లే తన సంకల్పవశం చేత గాంచుచున్నది. కనుక 'ఈ జగత్తులు ఎక్కడినుండి పుడుతున్నాయి?' అన్న నీ ప్రశ్నకు సమాధానం 'ఇదంతా సంకల్ప వశంగానే జనిస్తున్నది' అని చెప్పవలసి వస్తోంది. అంతకుమించి ఇందుకు వేరే కారణమేదీ వాస్తవానికి లేదు.
ఎందుకంటే ఇదంతా 'శివము' అని సంకల్పిస్తే శివమే అగుచున్నది. కాదూ... ‘బంధం' అని సంకల్పిస్తే బంధమే అవుతోంది. ఈ జగత్తు ఏదైనా ఒక్కటి అయి ఉంటే మరి అందరికీ అట్లాగే అనిపించాలి కదా! అట్లాలేదే? కొందరికి బంధమని మరికొందరికి శివమని ఎందుకనిపిస్తోంది? అందుచేత బ్రహ్మజ్ఞా! సంకల్పములు క్షీణించాయా ... ఇదంతా ఎచ్చటనో విలీనమైపోతోంది. సంకల్పములచే అనుక్షణం నిర్మించబడుచున్న అనేక జన్మపరంపరలు నిస్సంకల్పబలంచే ఉష్ణము వలన మంచుగడ్డ యొక్క ఆకారాలులాగా - పరమపదమున విలీనమైపోతున్నాయి.
ఈ సంకల్పములకు మూలం తృష్ణ. కర్మోత్సాహము అందుకు ఫలితం.
తృష్ణను మొదలంట పెకలించినవానికి సంకల్పత్యాజ్యం అతి సులభం. సత్యదృష్టి, దూరదృష్టి, ఉత్తమదృష్టి పెంపొందించుకున్నవాడు తృష్ణను విషతుల్యంగా దూరంగా త్యజించగలడు. చూచావా నాయనా! ఈ సంసారబంధ - దుఃఖ వ్యవహారములన్నిటికీ అసలు కీలకం ఈ వస్తు-విషయములను దుష్టబుద్ధితో కూడి సంకల్పించుచుండుటయే.
శ్రీవసిష్ఠ మహర్షి : సంకల్పాలు తొలగినప్పటికీ జగత్తు ఉండియే ఉన్నదనుకోండి? అప్పుడేం చేయాలి? శ్రీశివ భగవానుడు : అప్పుడీ జగత్తును అభాసముగా, ప్రతిభాసగా గ్రహించు. ఇది సంపూర్ణంగా తమ యందు తొలిగేంత వరకు జ్ఞానులు దీనిని గంధర్వనగరంగా స్వప్నభావంతో గాంచుచున్నారు. ఒకానొక రాజు 'నేను రాజును' అనే విషయం మరచిపోయి నిష్కారణంగా మనోకల్పితమైన
Page:117
శోక - దారిద్ర్యములను అనుభవిస్తున్నాడు. ఆ దుఃఖం తొలిగేది ఎట్లా? ఆ మనోకల్పన నుండి మెళుకువ తెచ్చుకున్నవాడై - తాను రాజు అనే విషయం జ్ఞాపకానికి రావటంచేతనేకదా! ‘స్వస్వరూపస్మృతి' అనే సూర్యుడు ఉదయించగానే సర్వ సంసారాంధకారాలూ ఎచటికో ఎగిరిపోతాయి. స్మృతిభ్రంశమైన రాజుకు ఆప్తులు పూర్వస్మృతి కలుగ జేస్తున్నట్లు తన స్వస్వరూపమును ఎరుగుటకు ఉద్యమించిన జీవునకు గురువులు, శాస్త్రములు ఆప్తవాక్యాలు ప్రసాదిస్తున్నాయి. అవి గ్రహించినప్పుడాతడు ఆత్మారాముడై నిరామయుడై, వెలయగలడు.
1. తన ఇతఃపూర్వపు ఆత్మైక్య స్వభావస్థితి, 2. వర్తమాన సంసార మోహం ... ఈ రెండింటిలో ఏ ప్రయత్నం బలవత్తరమైనదైతే అదే రాణిస్తోంది. అందుచేత ఈ వర్తమాన ‘దృశ్యతదాత్య్మం’ అనే సంసార మోహం నశించాలంటే, (లేక) దానిచే ఆక్రమితమైన స్మృతి తొలగాలంటే, “శుభేచ్చ, శ్రవణ, మనన, నిధిధ్యాస” లనే సాధన చతుష్టయం అత్యావశ్యకం. అట్టి ప్రయత్నం లేకపోతే ఈ నా ఆప్తవాక్యాలు ఒంటబట్టవు. వీణతంతువులలో ఏది పెద్దధ్వని చేస్తుంటే, అదియే వినబడుతూ
ఉంటుంది కదా!
కనుక వసిష్ఠా! నీవు 'నేను అద్వితీయమగు ఆత్మను' అను ఏకత్వ భావనకు ఉపక్రమిస్తూ ఉంటే నా ఈ ఆప్తవాక్యాలు నీకు ఎంతగానో ఉపకరించి, నిన్ను సంసారముయొక్క ఆవలి ఒడ్డుకు జేరుస్తాయి. అట్టి భావనతో యుక్తుడవైతే నీవు బ్రహ్మమే కాగలవు. నిన్ను పోలిన వారు కేవల బాహ్యపూజకు పరిమితులు అవటం ఉచితం కాదు.
నీకు పూజనీయమగు దేవత ఆ 'పరమార్థసత్' ఒక్కటే. ఇది అదిగాక తక్కిన అర్చనాయత్నాలు – అనగా ప్రతిమానిర్మాణం, పూజాద్రవ్యాలు మొదలైనవన్నీ మనోకల్పనామాత్రంగా తెలుసుకున్నవాడవై అనవరతం చిదాత్మ పూజయందు ఉపక్రమించు. ప్రతిమాదులు ఆత్మయొక్క సంజ్ఞలు. అంతేగాని అట్టి కార్యక్రమమంతా ప్రతిమాపరిమితం కాదు. అందుచేత ముఖ్యంగా ప్రతిమపూజ చేస్తున్నప్పుడు అద్వైత నిర్వృత్త భావనలతో పూజ సలుపుతూ ఉండు.
9. చైతన్యము - - విశ్వము
శ్రీశివ భగవానుడు : హే మహర్షీ ! ఇప్పటి వరకు నాచే వర్ణించి చెప్పబడుచున్న ‘ఆత్మదేవపూజ’ అనుదానిచే నిజానికి విశ్వమే పూజించబడుతోంది. ఈ విశ్వము1. బాధిత దృష్టికి ... అసత్తు. 2. అధిష్టాన దృష్టికి ... సత్తు.
3. వ్యవహారదృష్టికి ... ఇందులో ఏకత్వ - ద్విత్వములు ఉన్నాయి.
4. పారమార్థిక దృష్టికి ... ఇందులో ఏదీ లేదు. చూచువాడే చూడబడేదాని యందు అణువణువూ ప్రసరించి, ఏర్పడి ఉన్నాడు.
...ఈ 4 విషయాలూ యుక్తియుక్తములే.
Page:118
చైతన్యము యొక్క మోహచమత్కారమే ఈ సంసారం. తత్త్వ దృష్టికి ... దృక్స్వరూపుడు, ద్రష, దృశ్యముల - సమన్వయమగు చైతన్యము సర్వదా నిష్కళంకము, అసంసారి, అన్నిటి కంటే మునుముందుగానే ఏర్పడి ఉన్నది, భేదరహితము కూడా.
“ఈ దేహాదులే నేను” అనే కళంకం ఆ నిర్మలచైతన్యాన్ని బంధించినట్లు అనుభవాన్ని కల్పిస్తోంది. “ఈ కనబడేదంతా సర్వకర్తయగు నాకంటే వేరుకాదు' అని గ్రహించబడిందా” ... మరుక్షణం చైతన్యము ఈ సర్వము నుండి విడివడుచున్నది.
ఆహా! సర్వవ్యాపితమైన నిష్కళంకచైతన్యం బాహ్యపదార్థములను భావించి ద్విత్వమును పొంది, తన అఖండసత్తను చిత్రముగా ఏమరుచుచున్నదే! అది ఈ శారీరక సుఖ దుఃఖములతో కూడినదై, కల్పిత అసత్యపదార్థములను సత్యమైనవిగా గ్రహిస్తోంది. వ్యావహారిక దృష్టికి నామరూపాత్మకముగా తోచు ఈ దృశ్యమునకు ఎట్టి ధర్మమూ లేదు. ఇది సత్య - అసత్య సమన్విత వికల్పములు గానీ, స్వతఃసిద్ధ సుఖదుఃఖదాయకము గానీ ఏదీ కాదు. వాస్తవానికి ఇదంతా కూడా నిరవయవమువిశుద్ధము-పూర్ణము-నిర్హేతుకము అగు బ్రహ్మమే అయిఉన్నది. అది ఆకాశము వలె వికాసముపొంది జాగృత-స్వప్న-సుషుప్తులతో కూడి సంసారాన్ని కల్పించుకుంటోంది. “ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము” అను మార్గముల గుండా ఈ జగత్తును తన స్వశక్తిచే వికసింపజేస్తోంది. అయితే తన ఇంద్రియములలో ఒకటైన మనస్సు వలననే మనస్సు నిర్జింపబడగా అప్పుడు సత్యమేమిటో స్వయముగా ప్రకాశిస్తోంది. ఈ జగత్తులన్నీ ఆ సత్యంలో విలీనమైపోతున్నాయి. ఒకప్పటి కల్పనయగు ఈ క్షుద్రసంసారం భంగపడుతోంది.
ఇట్టి స్థితిని సంపాదించు మహనీయుని ఉపనిషత్తు మొదలైన శాస్త్రములు 'ఇతి' అను శబ్దం చేత నిర్వచిస్తున్నాయి. ఆ మహనీయుడు మరల సంసారంలో జన్మించనట్టి కృతనిశ్చయంతో ఉంటు న్నాడు. అతని సత్తాను వేయించబడిన (మరల మొలకెత్తని) విత్తనంతో బుధులు పోలుస్తూ ఉంటారు.
దృశ్య పదార్థములన్నీ అకృత్రిమంగా బాధింపబడటం చేత .. సత్తా అప్పుడు 'దృక్' స్వరూపంగా మారిపోతోంది. కనుక ఆత్మానుభవి 'పశ్యంతి - ద్రష్ట - చూచువాడు' అను పేర్లతో పిలవబడుచున్నాడు. అట్టి మహత్పురుషుడు చిత్త విషయములను ఇక స్మరించడు. 'మనోమోహములు' అనే మేఘముల నుండి విడివడినవాడై, అతీతుడై నిర్మలాకాశము వలె విరాజిల్లుతాడు.
ఇంతకు ముందు అతడు అనేక విషయ వస్తువుల గురించి అనేక చిత్త చాంచల్యములను పొంది ఉండవచ్చు గాక... ఇప్పుడీ జీవన్ముక్తియందు అవన్నీ తొలగిపోతున్నాయి. ఆతడు భౌతికంగా చూస్తే ఈ సంసారసాగరంలో దేహి అయి ఉన్నట్లే ఉంటాడు. అయితే ఏం? అంతరంగము నందు ఈ జీవదశయందు ఉత్తీర్ణుడై నిఖిల పదార్థములందు లేనివాడై ఉంటున్నాడు. ఆతనిని వర్ణించటానికి మాటలు చాలవు. ఆతడు పునర్జన్మ బీజరహితమైన నిరతిశయానంద స్వరూపం అపరిమితంగా పొంది నిశ్చింతగా విశ్రమించియే ఆయా ప్రవాహపతిత కార్యక్రమములందు పాల్గొనుచున్నాడు. అది మనోక్షయమైనప్పటి నిర్వికల్పచైతన్య స్థితి. చైతన్యముయొక్క ప్రప్రథమ స్థితి.
Page:119
మనోదశ నుండి విడివడిన చైతన్యమే సూర్యచంద్రాది జ్యోతిష్య పదార్థాల నుండి, అజ్ఞానాది సకల అంధకారముల నుండి వేరై విశాలమగు ఆకాశము వలె స్వచ్ఛ స్వభావమున వెలయుచున్నదని చెప్పుకున్నాం కదా! అనంతరం కాలక్రమంగా సకల బాహ్య విషయ ఔత్సుకతను విడచి, వాయువుచే కదల్చబడని నీరు వలె నిశ్చలభావంలో వెలయుచున్నది. చైతన్యస్థానం స్పందనను త్యజించిన వాయువు వలె ఒకానొక నిర్వికల్ప స్థితికి సంబంధించినది. ఇక ఇందు కనిపించే జ్ఞానశక్తి లేక ‘ఎరుక’ అను విన్యాసం ఒకానొక నిర్వికల్ప స్థితికి చైతన్యమునకు చెందినది. అట్టి జ్ఞానశక్తి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
జ్ఞానశక్తి - ఈ జ్ఞానశక్తి యొక్క రూపం ఆకాశం కంటే అత్యంత నిర్మలం. సద్వస్తువు యొక్క ఉనికియే జ్ఞానశక్తి యొక్క అస్థిత్వమునకు కారణం. జ్ఞానశక్తి యొక్క రూపం, కారణం, చిదాత్మయే. స్పందన శక్తికి కారణమగు ప్రాణము ఈ శరీరం లేకపోయినప్పటికీ సామాన్య వాయురూపమున ఉంటుంది. అట్టి ప్రాణశక్తి కంటే అత్యంత నిర్మలము, సూక్ష్మము అగు చిదాత్మకు వినాశనమనేది ఉండదు. ఇక జనన మరణములు ఎవరికి? అటువంటి భ్రమయే ఉండవలసిన అవసరం లేదు.
ఈ జీవులంతా ఎవరు? చైతన్య స్వరూపులే! మనో ప్రాణములతో నిండి ఉన్న ఈ శరీరములన్నిటి యందూ చైతన్యం అభివ్యక్తం అవుతోంది. వాస్తవానికి చైతన్యము సర్వదా సర్వము నందూ బాహ్యఅభ్యంతరములలో ఆక్రమించుకొనియే ఉన్నది.
పరమ రహస్యమగు చమత్కారం నీవు గ్రహించటానికి వీలుగా నీకొక చిన్న దృష్టాంతం చెపుతాను విను. ఒకచోట ఒక దర్పణం అమర్చామనుకో. అందులో దృశ్యం ప్రతిబింబిస్తోంది. దర్పణం లేకపోతే కూడా బింబం ఉన్నది గాని, ప్రతిబింబించటం జరుగదు. ఈ చైతన్యం విషయం కూడా అట్టిదే. అది సర్వేసర్వత్రా ఉండి కూడా మనోప్రాణములు ఉన్న చోటే 'జీవుడు’అను రూపంలో ప్రతిబింబిస్తోంది. ఒక దర్పణంపై దట్టంగా ధూళి పేరుకుని ఉంటే, అందులో ప్రతిబింబం కనబడదు కదా! అట్లాగే ప్రాణము లేని చోట చిత్ ప్రతిబింబించటం లేదు. సర్వవ్యాపియగు ఈ చైతన్యం బాహ్యవస్తు ఆకారితమగు చిత్తవృత్తులతో కూడి ఈ శరీరమును స్పందింపజేస్తోంది. అది అచ్చోట ఒక్కొక్కప్పుడు తన గురించి తానే పరిమితత్వమును ఆపాదించుకుంటోంది.
ఆ చైతన్యము తత్త్వబోధను పొందుచున్నప్పుడు పరమ పదకళ్యాణ ప్రదమగు కైవల్య రూపమున విరాజిల్లుతోంది. ఆ చైతన్యము వస్తువులను ప్రకాశింపజేయుచూ, వాటికి 'సత్త'ను ప్రసాదిస్తోంది. చైతన్యం నుండి సత్తను పొందిన ఈ వస్తుజాలం దేశ శబ్ద-వాచ్యములను సంపాదించుకుంటున్నాయి.
ఇక అది సుఖములన్నిటి యొక్క పరమావధి... శుభములన్నిటిలోకి అత్యంత శుభప్రదము.. వినాశనము లేని ఈ పవిత్ర స్థితియే చైతన్యము యొక్క ఆత్మైక్యావస్థ.
వత్సా! ఈ భూమిక యందు వసించటమే ఇన్నిన్ని జన్మల యొక్క ఏకైక లక్ష్యము. అన్ని మార్గములలోని అందరి పథికులకు అదియే చేరవలసిన గమ్యమై ఉన్నది.
Page:120
అది నీ స్వస్వరూపమే కదా! అందుచేత అందు ఏర్పడి ఉన్నప్పుడు గాని జీవునిలో అంతర్గతంగా దాగి ఉన్న అసంతృప్తి తొలగదు. లోకములలో కనిపిస్తున్న అన్ని ఆరాటముల యొక్క అంతర్లీన సత్యమైన గమ్యం అదే. ప్రయాణం చేయువాడు ఇల్లు చేరితే గాని మానసిక విశ్రాంతి పొందనట్లు అప్రమేయ స్వస్వరూపం జేరిన జీవుని ఆనందము, విశ్రాంతి వర్ణనాతీతం.
అందుకు మార్గం ‘సంకల్ప త్యాగమే'! అది నీ రూపం నీవు పొందటమే! కనుక, అద్దానిని కష్ట సాధ్యం అని ఎవరూ అనటానికి వీలు లేదు.
ఆ స్థితి నా వాక్కుకు కూడా అతీతమై, అభివర్ణించటానికి అశక్యమై, అనుభవముతో కలిగే ఐక్యమై ఉన్నది. మౌనమే అద్దాని గురించిన వ్యాఖ్య. అది నీకు నీవు పొందవలసినదే! కాబట్టి ఏమి చెప్పినా వాక్యములు ఒకచోట ఆగవలసినదే. ఆ తురీయాతీత అకళంక స్థితి జాగ్రత్-స్వప్నసుషుప్తులకు అతీతమైయున్నది.
అదియే సనాతన దైవము. నీవు పూజించవలసిన దైవము ఆతడే. అందు నీవు నిత్యము అఖండుడవై వెలయుము.
88
నాయనా! ‘ఈ విశ్వము యొక్క ఉపాదాన కారణం ఆ చైతన్యమే'... అని భావన చేస్తూ ఉంటే, నీ పట్ల ఈ విశ్వమంతా చిన్మయమే అగుచున్నది. లేదా, “ఈ విశ్వము దీని ఉపాదానకారణం కంటే వేరు కాదు”... అని భావిస్తే అప్పుడు కూడా ఆ విజ్ఞుడు ఇందులో తన్మయుడు కాడు. శ్రీవసిష్ఠ మహర్షి : ఈ విశ్వమే మీరు ఇప్పుడు నిర్వచిస్తున్నట్టి చైతన్యమా? కాదా?
శ్రీశివ భగవానుడు : చైతన్యము ‘ఉపాదానకారణము - కార్యము'లకు అతీతమైనది. వాస్తవానికి ‘విశ్వము’ అనబడేదేదీ లేదు. అది ఉత్పత్తి అవటంలేదు. వినష్టం కావటంలేదు. ఈ బ్రహ్మాండమంతా కూడా ఏకాకారమగు ఆకాశకోశము వలె శూన్యము. కేవలం చైతన్యం ఒక్కటే అద్వైత ఘనచేతన రూపమున వెలయుచున్నది. నిర్వికారమగు ఆ చైతన్యము సమక్షంలో సాపేక్షిక నిత్యములగు ఆకాశ-కాలాదులు కూడా అనిత్యములే, శూన్యములే. పసిబాలుడు ఆట బొమ్మతో కల్పిత దృష్టిచే ఆడుకుంటున్నట్లే ఈ ఆకాశము, శిల, ఇల్లు మొదలైనవి.
భేదభావనలే జగత్తు గాని, అది మరింకేమో కాదు. చైతన్యమే సత్యము అయి ఉండి, అసత్యమువలె భ్రమింపబడుతోంది. ఇదంతా కూడా వాక్కునకు అతీతమగు శాంతి, శివ స్వరూపము, ప్రణవ తురీయ మాత్రము అగు బ్రహ్మమే సుమా!
ఇట్లు పలికి ఆ సాంబశివుడు మౌనం వహించాడు. సర్వసంసార ఉపశమనమగు అనిర్వచనీయ తురీయాతీత పదమున విశ్రాంతి పొందాడు. అప్పుడాయన చిత్తవృత్తి పరమానంద చిదేకరూపమున పరిణతి పొందింది. మనస్సు తన స్వరూపమును వీడి అనంత నిశ్చలత్వము పొందింది.
❖
Page:121
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ ప్రియ సభికులారా! తురీయానంద స్వరూపులారా! మీ మీ స్వస్వరూపం గురించి మూర్ఖత్వమును ఆపాదించుకుని స్వల్పత్వము పొందవలసిన పనేమున్నది? లెండి మీ స్వస్వరూప మాతృగృహమున ప్రవేశించి శాంతమును పొందండి.
10. నిజాత్మ భగవానుడు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా పరమేశ్వరుడు ముహూర్తకాలం నిర్విషయకమైన సర్వాత్మక చిదానందంలో చిద్విలాసులై గడిపాడు. మరల కళ్ళు తెరిచాడు. నాపై వాత్సల్యం కురిపిస్తూ చిరునవ్వు ప్రకటించారు. ఆయన పెదవుల నుండి మరల జ్ఞానవాక్యామృతం ఇట్లు నా పై వర్షించింది.
శ్రీశివ భగవానుడు : ఓ మునిసత్తమా! మహర్షి వసిష్ఠ శిష్యజనులారా! మొట్టమొదటగా విచారణ చేసి మీ స్వస్వరూపమేమిటో గ్రహించండి. అంతేగాని గాలి తనకు తానుగా వీచి, ధూళిని లేపి, తెలివి తక్కువగా ఆ ధూళిని తన యందు నింపుకుంటున్నట్లు నీవు అనర్థజాలమును పనిగట్టుకొని ఆశ్రయించి అవి నీ మనస్సును నింపివేయునట్లు చేసుకోవద్దు.
నాయనా! వసిష్ఠా! నీవు చూడతగ్గ బాహ్యవిషయాలన్నీ చూచావు. వినవలసిందంతా విన్నావు. ఇంకనూ భ్రాంతితో పని ఏముంది? తత్త్వవేత్తలగు వారు ఈ సంసారములో వదలవలసినవి గాని, ఆశ్రయించవలసినవి గాని గాంచరు. శాంతి-అశాంతిమయ సంసార విశేషములను నీవు ఇత పూర్వమే ‘విజ్ఞానం’ అను చురకత్తితో కత్తిరించివేశావు. కాబట్టే ధీరుడవయ్యావు. ఇప్పుడిక నిర్మలాత్మ దర్శనమును కాదనేవారెవరు? సమస్త ప్రపంచమునకూ లోపల వెలుపల వెలయుచూ, ఆత్మదర్శివి అయి ఉంటూనే, ఈ దృశ్యదశలో ప్రవచించబడుచున్న నా ఈ ఉపదేశాలు ప్రస్తుతం విను. అటు తరువాత ఈ దృశ్యజగత్తులో సంచరించేటప్పుడు ఈ బోధ యొక్క సారాన్ని అనుకరిస్తూ ఆచరించు.
నీవంటి నిర్మల హృదయుడు దృశ్యదశలో ఉన్నప్పటికీ వచ్చే లోటేమీ ఉండదు. అఖండం, అప్రమేయం, నిత్యం, నిర్మలం - అగు ఆత్మార్థ లాభం కొరకు శ్రవణ మననాదులచే పదే పదే ప్రయత్నించవలసిందే. ప్రయత్నించని వారికి ఎక్కడైనా ఏదైనా లభిస్తుందా?... లభించదు కదా! శ్రీవసిష్ఠ మహర్షి : హే ఆశ్రితవత్సలా! పరమేశ్వరా! బాహ్యదేహాదు లందు ఆత్మబుద్ధిని అనునిత్యం పరిత్యజించాలని చెప్పారు కదా! ఈ దేహాత్మ బుద్ధినుండి విడివడటానికి ఉపాయాలు చెప్పవలసినదిగా నా ప్రార్థన.
శ్రీశివ భగవానుడు : ఈ శరీరం ప్రాణవాయువు వలన ఒక యంత్రంలాగా చలిస్తోంది. ఆ ప్రాణవాయువు యొక్క చలనమే లేకపోతే ఇది స్పందనారహితమై మూగదానిలాగా ఉండిపోయేది. ప్రాణాయామ (ప్రాణచలన) ఉపాసకులు ప్రాణచలనమునకు సాక్షిత్వమును 'సాధన' గా ఎన్నుకొను చున్నారు. క్రమంగా వారి బుద్ధి నిర్మలమై ప్రాణముల చలన స్వభావం నుండి విడివడి నిశ్చలత్వం
Page:122
సముపార్జించుకుంటోంది. నిర్మల, నిశ్చలబుద్ధి స్వభావసిద్ధంగా పరమాత్మ యొక్క ఆస్వాదన యందు ప్రవేశిస్తోంది. దేశకాలములను, సమస్త దృశ్యవస్తు అనుభవమును త్యజించి విడివడుతోంది. జడ భావాల నుండి విముక్తిని పొంది, అపరిచ్ఛిన్నత్వంతో కూడిన ఒకానొక అనిర్వచనీయసత్తను సంతరించు కుంటోంది. ఆ సత్తయందు దిక్కులు, కాలము అనే పరిచ్ఛిన్నత ఉండదు. అట్లాగే, భక్తి-జ్ఞానకర్మోపాసకులు కూడా వారి వారి ఆయా శాస్త్రోచిత మార్గములలో బుద్ధిని నిర్మలం చేసుకుంటున్నారు. శ్రీవసిష్ఠ మహర్షి : మహాదేవా! ఈ దేహం ఉన్నంత వరకు జీవునకు అట్టి అపరిచ్ఛిన్న సత్త లభించదు కదా! ఎందుకంటే దేహం ఉన్నంతవరకూ దిక్కులు, కాలము ఉండియే తీరుతాయి కనుక! శ్రీశివ భగవానుడు : నాయనా! ఈ దేహం ఉండటం చేతగాని, ఏవో చేయవలసిన పనులు ఉండటం వలన గాని అట్టి అపరిచ్ఛిన్న సత్తా యొక్క అనుభవం ఇబ్బంది పడుతుంది - అని మూర్ఖత్వముచే మాత్రమే జీవులు కొందరు భావిస్తున్నారు. అది సత్యం కాదు. శరీరధారులై అనేక కార్యక్రమములందు నియమితులై కూడా ‘తురీయము, అకలంకము, అనామయము అగు ఆ అఖండ, అప్రమేయానుభవం ఆవరిస్తున్న మహనీయులెందరో ఉన్నారు. ఆ స్థితియందలి ఆనందము అన్ని వస్తువుల నుండి, అన్ని కాలముల నుండి లభించే ఆనందముకంటే కూడా మహత్తరమైనది. అతీతమైనది.
చూచావా! ఎట్టి ప్రయాస లేని సంకల్పత్యాజ్యం ఎట్టి స్థితికి జీవుని తీసుకురాగలుగుతుందో! ఆ ఆనందమును గాంచుచూ జీవన్ముక్తుడు అనంతశాంతిని అనుభవిస్తూ వెలయుచున్నాడు. సంకల్ప స్వరూపమైన మనస్సు ‘ఆత్మానంద సంకల్పము' సంధించబడగా ... అప్పుడు మనస్సునందే మనస్సు లయించు 'సర్వప్రయత్న రహిత స్థితి' అది.
x
చైతన్యము బ్రహ్మాకార అఖండ చిత్తవృత్తిని చేబట్టుచున్నప్పుడు 'బ్రహ్మము అనగా నేనే' అను బ్రహ్మైక్య భావము పొందుతోంది. తత్ఫలితంగా నామ రూపాత్మకమగు 'బ్రహ్మము-ఆత్మ' మొదలైన సంజ్ఞలను అతిక్రమించి కేవల స్వరూపమున వెలయుచున్నది. అప్పుడు అది మనస్సుతో పంచ ఇంద్రియాలతో సహా ఆరు విధములైన భావవికారముల నుండి విడివడి తమస్సుకు పరమున ఉన్న స్వస్వరూపమున వెలుగొందుచున్నది. నిష్కళంకమై, తురీయాది నామములకు కూడా అతీతమై, కాలం కంటే కూడా శాశ్వతమైనట్టి ఏ తన నిజస్వరూపం గలదో, అట్టి 'పురుషార్థరూపం’ పొందుతోంది.
హరి - హర - - - బ్రహ్మ - ఇంద్రులు కూడా ఆ చైతన్యమే. నిఖిలాకృతియు, సర్వగామియు, నిత్యోదితము అగు ఆ చైతన్యం అగ్ని, నీరు, చంద్రుడు, సూర్యుడు మొదలైన రూపములన్నీ దాల్చు చున్నది. ఆ చైతన్యమే ప్రతి జీవుని ఆత్మకూడా. ఆ చైతన్యమును ఎరిగినవారు శోకరహితులగుచున్నారు.
కాల్చబడిన లోహము నుండి అగ్ని రవ్వలు వెలువడుచున్నట్లు, మహాసముద్ర జలం నుండి నీటి తుంపరలు వెదజల్లబడుచున్నట్లు ఆ చైతన్యము నుండి వెలువడుతున్న బ్రహ్మాదులు కూడా భ్రాంతిమయులే. వారు ఈ కల్పనాజాలాన్ని విస్తరింపజేస్తున్నారు. అనగా అవిద్య బ్రహ్మ మొదలుకొని ఈ ప్రపంచము వరకూ శాఖోపశాఖలుగ వ్యాప్తమై విస్తృతమౌతోంది. వేదములు, వేదార్థములు,
Page:123
క్రియా కలాపములు, జీవులు - ఇవన్నీ అవిద్యా ప్రాంగణంలో చిక్కుబడి ఉంటున్నాయి. ఈ అవిద్య అనంతమై ఎన్ని విధములైన దేశకాలములుగా విస్తరించి ఉంటోందో చెప్పనలవి కాదు.
ఓ మునిసత్తమా ! ఆ చైతన్యమే బ్రహ్మ విష్ణు శివాదులకు కూడా పరమపిత అని గ్రహించు. కాయలన్నిటికీ చెట్టే కారణమై ఉన్నట్లు ఆ నిఖిలాత్మమహాశయుడే మనందరికీ మూలం అగుచున్నాడు. మన స్వరూపమగు ఆ చిదాత్మయే అన్నిటి యొక్క సత్త కూడా. ఆతడే వివిధములగు జ్ఞానములను కూడా కలుగజేయుచున్నాడు. ఆతడు అన్ని వస్తువులందూ, అన్ని జీవులందూ, అన్ని ఇంద్రియము లందూ వ్యక్తమై ఉంటున్నాడు. సర్వతేజోవంతమై సదా సర్వత్రా ఉదయించుచూ, తత్వవేత్తలచే వందనార్చనములు స్వీకరించుచున్నాడు.
సంవేదనాత్మకతయా గతయా సర్వగోచరమ్ |
న తస్యాహ్వానమన్రాది కించిదేవోపయుజ్యతే ॥ (శ్లో 24, సర్గ 35)
ఇప్పుడు చెప్పు. సర్వత్రా వెలయుచున్న ఆ చైతన్య భగవానుని అర్చించటానికి సామాన్యమైన పూలతో చేసే పూజ, ఆవాహనాది మంత్రములు ఎందుకు? అన్నిటా ఉండి ఉన్నవానిని ఎక్కడికి ఆహ్వానిస్తావు?
నాయనా! ఆయన నిత్యాహ్వానమును గ్రహించి జ్ఞాన స్వరూపమున అన్నివైపులా అన్ని వేళలా లభ్యుడగుచున్నాడు. ఆయనయే స్వీకరించబడు వస్తువుల రూపమున, వాటికి మననం చేసే మనస్సు రూపమున, ఆ మనస్సున సంకల్పించే ద్రష్టరూపమున ప్రకాశిస్తున్నారు. ఓ మునీశ్వరా! సురేశ్వరుడగు ఆ చిదాత్మనే అన్నిటికీ ఆర్యునిగా, పూజ్యునిగా, నమస్యునిగా, స్తుతార్హునిగా... గ్రహించు. ఆతడే మహద్వస్తువులన్నిటి యొక్క పరాకాష్ఠ. వాస్తవానికి ప్రతిఒక్కరియొక్క ఇష్టదైవం ఆసర్వాత్మకుడే! సర్వాంతర్యామియే! సర్వతత్వస్వరూపుడే!
జరాశోకభయవినాశకరమగు ఆ ఆత్మతత్త్వమేమిటో తెలుసుకున్న జీవునకు - - వేయించిన విత్తు మరల మొలకెత్తని రీతిగా జన్మలు ఉండవు. ఎందుకంటే, "నేను ఇప్పటికీ, మరెప్పటికీ నిత్యోదిత చైతన్యస్వరూపమే! నాకు వర్తమాన జన్మగాని, ఇతఃపూర్వపు జన్మలుగాని, ఇక ముందటి జన్మలు గాని మొదలే లేవు" - అని గ్రహిస్తున్నాడు.
మనందరి యొక్క జ్ఞాన రూపమై వెలయుచున్న సర్వాభయప్రదాతయగు ఆ దేవదేవుని ఉపాసన అత్యంత సులభం. జన్మయే లేని ఆ ఆత్మతత్త్వము నిజానికి నీ సత్యరూపమే అయి ఉన్నది కదా! ఇక వ్యర్థమగు బాహ్య దృష్టులకు ముగ్ధుడవగుచున్నావేమిటి?
Page:124
11. తస్మై సర్వాత్మనే నమః
శ్రీశివ భగవానుడు : కుమారా! వసిష్ఠా! చిద్రూపుడగు ఆ ఆత్మదేవుని సాక్షాత్కారం చేసుకుంటే ఇక పునర్జన్మలకు సంబంధించిన మనోవృత్తులన్నీ స్వయంగా తొలగుతాయి. 'విశుద్ధమై, స్వానుభూతి నుండి వేరొకటి కానట్టి ఆ ఆత్మజ్ఞానమే సంసారరోగ నివారణి' అని బ్రహ్మవేత్తలగు మహనీయులు నిర్దేశిస్తున్నారు. నిర్మలచిత్సారమైన ఆ ఆత్మయే బీజములన్నిటికీ బీజము. కారణములన్నిటికీ కారణము. ఈ సంసారసాగరంలో తారసపడే కర్మలన్నీ అద్దాని ఆరాధనయే. అది అన్నిటికీ తానే కారణమై, తాను సర్వదా అకారణమై ఉంటోంది. అది ఎల్లప్పుడూ నిష్కళంకమైనది. అది నీ స్వరూపమే
సుమా! ఇక మోహమెందుకు?
అది భావించబడుచున్న సర్వ పదార్థములందలి భావనా స్వరూపమైయున్నది. అట్లై కూడా అభావనీయ - జన్మరహితమగు అభావ స్వరూపముననే వెలయుచున్నది.
అదియే అందరి బుద్ధి వృత్తులనూ ప్రకాశింపజేస్తోంది. జీవుల అంతరమున చిత్సారరూపమును వెలయుచున్నది. అది తన ప్రత్యక్ స్వరూపమున ఏర్పడి ఉంటూనే అదే సమయమున ఈ జీవుల బుద్ధివృత్తులందు వ్యాపించి ఆ బుద్ధి యొక్క ప్రసరణముచే బాహ్యవస్తువుల ఎరుకకు కారణమౌతోంది.
ఒకవైపు నిర్విషయమై ఉంటూ, మరొకవైపు సర్వ విషయములకూ తానే స్థానమగుచున్నది. అది ఎట్లా అంటావా? బంగారము వాస్తవానికి ఆకార రహితమై, అదే తరుణంలో తానే గాజులుగా, గొలుసులుగా, ఉంగరంగా అగుచున్నది కదా! ఆ రీతిగా ఆత్మభగవానుడు సర్వవేద్య వస్తుజాతము (తెలియబడే అన్ని వస్తువుల) అంతర్హితస్వరూపమై ఒప్పుచున్నాడు. వాస్తవానికి ఏకరూపుడై ఉండి కూడా మాయ వలన బహురూపములుగా భావించబడుచున్నాడు.
ఆతడు సకల జ్యోతుల జ్యోతి స్వరూపం (జ్యోతిర్జ్యోతిః మహర్జ్యోతిః). అలౌకికం, నిర్మలం - అగు ఆ ఆత్మను ప్రకాశింపజేయగలిగేది మరొక్కటేదీ లేదు. అదొక్కటే ప్రకాశములన్నిటికీ మూల స్థానం. అదియే నానావిధ బీజస్వరూపములుగా వెలయుచున్నది. బ్రహ్మజ్ఞులు ఈ విషయం సుస్పష్టంగా దర్శిస్తున్నారు, ప్రవచిస్తున్నారు.
❖
వత్సా! ఈ భూమి, ఈ ఆకాశము మొదలైన పంచభూతములు ఆత్మయందు వెలయుచున్నాయని అనుకుంటున్నావేమో! లేదు. ఈ వ్యావహారిక విషయములుగాని, ప్రాతిభాసికములగు వ్యష్టి సమష్టి జీవులు గాని ఆత్మ యందు లేవు. ఎందుకంటే ఈ జగత్సత్త, అవ్యాకృతమగు కారణసత్త లయించగా, అప్పుడు శేషిస్తున్న చిన్మాత్రసత్తయే అది కదా! అయితే ఆ ఆత్మదేవుడు నిర్విశేషస్వరూపుడు అయికూడా, ఆ ‘చిత్తవికృతులు’ అనే దోషములకు అవ్యాకృతకారణము బాహ్యకారణము రజోరూపము కూడా అగుచున్నాడు. రూపరహితమగు ఆకాశస్వరూపుడై ఉండి దేహములు మొదలైన రూపాలతో కర్తృత్వ భోక్తృత్వములను వహిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన నిష్క్రియుడు, నిర్లిప్తుడు. చిత్తరూపమున
Page:125
నాయనా! చమత్కారం చూచావా? స్వయం ప్రకాశమగు ఆ చిదాత్మయందు ఈ జగత్తు తన సత్తను పొందుపరచుకొని ఉన్నప్పటికీ 'చిదాత్మయందు జగత్తులనేవి ఉండజాలవు' అని అనవలసి వస్తోంది. అగ్ని యందు విస్ఫులింగము, రంగు కాంతి, రవ్వలు, ప్రకాశము - - మొదలైన అనేక వైచిత్ర్యములు బయల్వెడలుచున్నప్పటికీ అది తన ఉష్ణస్వభావం వీడటం లేదు కదా! ఆత్మయందు సర్వవిరుద్ధ ధర్మములు సమావేశమౌతున్నాయి. ఆయన మహామేరువులను తన గర్భమునందు ధరించి దానిని ఆచ్ఛాదనమొనర్చుచున్నప్పటికీ ఆతడు అణుస్వరూపుడు. కల్పమును ధరిస్తూ కూడా తన నిమేష స్వరూపమును ఏమాత్రం త్యజించటం లేదు. ఆహా! వెంట్రుకయొక్క చివరిభాగంలోని అల్పకణము యొక్క ఒక లక్షవ వంతు వలె అతిసూక్ష్ముడై కూడా భూమ్యాకాశము లందు అంతటా వ్యాపించియున్నాడు. ఈ భూమి, నక్షత్రమండలములు అన్నీ కలసి కూడా ఆయన యొక్క పరాకాష్ఠను ఊహించనైనా లేవు. ఆయన స్వయంగా సంసారమును రచించకపోయినప్పటికీ... కర్తృత్వమంతా ఆయనదే. మహత్కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆయనకు కర్తృత్వమును ఆపాదించటమే కుదరని పని. ఆయన ద్రవ్యములన్నీ అయి కూడా ఈ ద్రవ్యములేవీ ఆయన కాదు. ప్రాతఃకాలము ఆయన వలననే ఏర్పడుచున్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ఉషోదయస్వరూపుడే. ఒక దృష్టాంతం. 'సూర్యుడు ఉదయిస్తున్నాడు'... అని జనులు అనవచ్చు గాక! నిత్య ప్రకాశమానుడగు సూర్యునికి ఉదయించటం, అస్తమించటం ఉంటాయా? ఉండవు. (అయినా కూడా ఉదయం, సాయంకాలం సూర్యుని వలననే ఏర్పడుచున్నాయి కదా! "ఉషోదయ సూర్యుడు - మధ్యాహ్న ప్రచండ సూర్యుడు అస్తమయ పసుపుపచ్చని సూర్యుడు”... అని జనులు వ్యవహరిస్తున్నారు కదా!
ఆ పరమాత్మను అనేకులు అనేక కల్పనలతో ఆరాధిస్తున్నారు. 'భిండి - - భిండి - - భిడిండి... ఖిలేమత్త -పుపిచ్ఛాలి ...సాలఘ ... వివిత్ ... చలిత్ ...సదాలో ... కాలాసో ...గులుగులు ...శిలి' ఇట్టి అర్థరహిత, అర్థ ఆపాదిత శబ్దాలు కూడా ఆయన పట్ల వేదమంత్రాలై కూర్చుంటున్నాయి. ‘ఆకాశ కుసుమం' వంటి ఊహామాత్ర శబ్దాలు కూడా ఆయనకు సరిపోతున్నాయి. ఆయన కానిది,
ఆయనకు ఆపాదించజాలనిది ఏదీ లేదు.
యస్మిన్ సర్వమ్, యతః సర్వమ్, యః సర్వమ్, సర్వతశ్చ యః |
యశ్చ సర్వమయో నిత్యం, తస్మై సర్వాత్మనే నమః ॥
ఎవని యందు సర్వము ఉన్నదో ...ఎవ్వని నుండి అంతా ఏర్పడుతుందో, ఎవడు సర్వము అయి ఉన్నాడో ...సర్వము నందు ఎవడు సారమై ఉన్నాడో ...ఎవడు ఎల్లప్పుడూ సర్వమయుడై ఉంటున్నాడో ... అట్టి సర్వాత్మకునకు ఇదే నా నమస్కారం.
Page:126
ఏ ఆత్మ పురుషుడు సుకుమారములగు తత్త్వాత్మ పుష్పములను ధరించినవాడై, ఈ జగత్తును మోహింపజేయు స్వరూపము కలిగి ఉంటున్నాడో, 'సంకల్పములు' అనే తన పిడికిలిని బిగించి, ఈ మాయానాటకమంతా ఆడిస్తూ, ఆడుతున్నాడో ... ఆయనను ఏమని పిలవాలి? ఎట్లా నిర్వచించాలి? అయితే అతడు అనుభవమునకు లభించడని అనుకోవద్దు సుమా! నిత్యము, అనుక్షణికంగా, అన్ని సందర్భములలోను అంతటా, అన్నిటా, అన్నియుగా, ఇక్కడ, అక్కడ సర్వదా అనుభవమగుచున్నదంతా పరమాత్మయే! ఆయన అద్వితీయుడు కదా! కనుక ఇదంతా పరమాత్మ విన్యాసమే!
12. చిదాత్మ యొక్క దర్శన ప్రదర్శనములు
శ్రీశివ భగవానుడు : ఆ సర్వేశ్వరుని యందు అనేక అర్థవిహీన వాక్యములు కూడా సత్యమే అగు చున్నాయని అనుకున్నాం కదా! ఈ 'జగత్సత్త' అను మణికి ఆయన పేటిక వంటివాడు. మాయా యుక్తుడగు ఆ చైతన్యభగవానుని యందు వికసింపజాలని శక్తి అంటూ ఏదీ లేదు. ఈ విచిత్ర జగత్తు ప్రకాశించటమే అందుకు నిదర్శనం. ఈశ్వర సంబంధమగు 'చిత్సత్త'యే ధాన్యాది బీజము లందు దాగుకొని ఉన్నది. తరువాత వివిధ క్రియలు, మట్టి, నీరు, కాలం మొదలైనవాటి సహాయంతో అంకురోత్పాదనం సంతరించుకుంటోంది. క్రమంగా ధాన్యమగుచున్నది. ఆ తరువాత అన్నమగు చున్నది. ఆ అంకురశక్తియే నీటియందు రసస్వరూపంగా, దేహమునందు సంయోగశక్తి స్వరూపంగా దాగి ఉంటోంది. ఆ ఈశ్వరశక్తి నీరు, నాలుక యొక్క సంయోగముచే ఉదరమున ప్రవేశించి శరీరమును ఉత్తేజపరుస్తోంది. ఆ చిత్సత్త పుష్పములందలి ఆఘ్రాణంగా వెలయుచు ఘ్రాణేంద్రియాన్ని వికాసమొనర్చి ముక్కురంధ్రములకు ఉల్లాసం కలిగిస్తోంది. అది శిలయందు ప్రవేశించి ఆ శిల యొక్క శూన్యభావమును తొలగించి, అద్దానికి వ్యవహారసత్తా కల్పిస్తోంది. ఆ చిత్ సత్తా తాను తానుగా ఉంటూనే తన స్వరూపాన్ని వీడకుండా సర్వమును కల్పిస్తోంది. అందుకు దృష్టాంతంగా... ఒక యువకుడు, “ఆహాఁ! ఆ ఆ స్త్రీ అంత అందంగా ఉన్నది కదా!" అను భావన కల్పన చేస్తూండగా, ఆ సమయంలో ఆతడు తన స్వస్వరూపము కోల్పోవటం లేదు కదా! ఇది కూడా అట్టిదే ! తండ్రి తన కుమారుని స్వకార్యనిర్వహణం కొరకు నియమిస్తాడు చూచావా? అట్లాగే ఆ చితత్త సమస్త చలనాలకూ ఆలవాలమగు వాయురూపమును ధరించి, చర్మమును స్పర్శించి స్పర్శజ్ఞానోత్పత్తికి కారణమౌతోంది.
ఒక సమయంలో ఆ చిత్సత్త తనను తానే ఏమరచి జగత్తులో ప్రవేశించి శబ, స్పర్శ, రూప, రస, గంధాల అనుభవ కల్పనలలో తేలియాడుతోంది. అది మరొక సమయంలో తన యొక్క వాస్తవ స్వరూపసిద్ధి కొరకు... అనగా మోక్షార్ధం ... తన్ను తాను 'నిఖిల జగత్తు యొక్క సమ్మిళిత సత్తారూపం’ అగు ఏకాత్మగా గాంచుచున్నది. అప్పుడు ఈ జగత్తునంతటినీ ఆకాశము వలె శూన్యంగా చేసివేస్తోంది.
అదియే కాలతత్త్వంలో కూడా ప్రతిబింబిస్తోంది. సర్వమునకూ మార్పు చేర్పులను కలిగిస్తోంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ, ఈశాది తత్త్వాలతో ఆరంభమైన ఈ జగత్తు అంతా పరివర్తనశీలమే కదా!
Page:127
కార్యములన్నిటినీ సరిజూస్తూ ఉండే ‘నియతి’ యే ఆ మూలశక్తి 'అది ఇట్టిది. అట్టిది కాదు' అని చెప్పటానికి కూడా వీలు లేదు. ఆ చైతన్యసత్త తనంతట తానే స్వయంగా సిద్ధించి ఉంటోంది. దానిని మరొకటేదీ సిద్ధింపజేయటం లేదు. చీకటిలో ఉన్న ఇంట్లో దీపం వెలిగించగానే ఆ ఇంట్లోని వస్తువులన్నీ అగుపిస్తాయి కదా! ఆ 'చైతన్యభగవానుడు' అనబడే అపరిచ్ఛిన్నజ్యోతి వలననే జగత్తులు అనే వస్తుపరంపరలు అనుభవమౌతున్నాయి. అదియే 'పరమాకాశము' అనే నాట్యశాలలో స్వశక్తి సంపాదిత మగు 'సంసారము' అనే నాటకమును ఒకవైపు ప్రదర్శించుచూ, మరొకవైపు దర్శించుచూ తాను మాత్రం ఉభయములకూ సాక్షియై వెలయుచున్నది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ జగన్నాథా! చిదాత్మయగు ఆ సదాశివుని శక్తులు ఎట్టివి? అవి ఎట్లా వెలయు చున్నాయి? ‘సాక్షిభావం’ అంటే ఏమిటి? ఆయన శక్తి సమూహం ఏ కార్యములు చేస్తూ ఉంటుంది? అవి ఎన్ని? ఈ విశేషాలు చెప్ప ప్రార్థన.
శ్రీశివ భగవానుడు : ఓ సౌమ్యా ! ఆ చిదాత్మ భగవానుడు అప్రమేయుడు. దేనితోనూ ప్రమేయం లేని వాడు. దేనికీ సంబంధించనివాడు. పరమశాంతిమయుడు. మంగళమయుడు. పరమసౌమ్యుడు. చిన్మాత్రరూపుడు. అయితే కొన్ని చమత్కారమైన శక్తులు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి. అవి ఇచ్ఛాశక్తి... ఆకాశసత్త... కాలసత్త... మహాసత్త... జ్ఞానశక్తి... క్రియాశక్తి... కర్తృత్వశక్తి... మొదలైనవి అవి. ఇట్లా అంటే, ఆ శక్తులకు అంతు లేదని కూడా చెప్పబడుతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ ! అవన్నీ పరమాత్మను వెంటనంటి ఉన్నాయా? పరమాత్మలో ఉన్నాయా? ఆ శక్తులకు ఆ బహుత్వమంతా ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మకు ఆ శక్తులకు భేదం ఏమైనా ఉన్నదా? లేక పరమాత్మ, ఆయన శక్తులు అభేదమా?
శ్రీశివ భగవానుడు : నాయనా! అనంతరూపుడు మంగళమయుడు అగు ఆ చిదాత్మయందు ఆయా వికల్పములన్నీ ఆపాదించబడుతున్నాయి. మనం దేనికి ఒకానొక విశేషం ఆపాదిస్తున్నామో... అట్టి ఆపాదిత విశేషానికి ఆ వస్తువుకు భేదమేమున్నది? అట్లాగే పరమాత్మకు ఆయన మాయా విశేషమునకు కొంచెం కూడా భేదం లేదు. ఆ మాయాశక్తి 'తెలుసుకొనువాడు - కర్మలు నిర్వర్తించు వాడు - అనుభవించువాడు - సాక్షీభూతుడు' అగు జ్ఞాతృత్వ - కర్తృత్వ - భోక్తృత్వాది లక్షణములతో గూడి వివిధ ఆకృతులను ధరిస్తోంది. జలం బుద్బుద తరంగాదుల రూపం పొందుచున్నట్లు అది అట్లా జరుగుతోంది.
ఆ చిదాత్మ యొక్క మాయాశక్తి 'కాలము' అను ఆశ్రమంలో శిక్షణ పొందిన ‘బ్రహ్మాండము’ అనే నృత్యమండపమునందు ఈ జగత నృత్యం సాగిస్తోంది. 'పరము - అపరము’అను సంజ్ఞలతో ఒప్పుచూ ఆ కాలమే 'నియతి' అని పిలువబడుతోంది. 'క్రియ, కృతి, ఇచ్ఛ, కాలము' మొదలైనవి నియతి అనుదానికి పర్యాయపదములే !
శ్రీవసిష్ఠ మహర్షి : మహాత్మా ! నియతి అంటే ఏమిటి?
Page:128
శ్రీశివ భగవానుడు : 'నియతి' అనగా నియమించునది అను అర్ధాన్ని సూచిస్తుంది. పరమాత్మ యొక్క మాయాశక్తియే గడ్డిపరక నుండి బ్రహ్మదేవుని వరకు కల్పనచే అనుభవజ్ఞానం ప్రతిపాదిస్తోంది. వందలాది కల్పనలే మాయ యొక్క రూపం. తత్త్వబోధ కలుగనంతవరకు ఆ మాయ సత్యాన్వేషణ లేని ఆత్మను ఆవరించుకుని ఉండి, ఈ జగన్నాటకమును నిర్వర్తిస్తోంది. ఈ జగన్నృత్యం వివిధ రసములతో నిండి 'వివర్తము' అను ఆంగిక అభినయంతో చిత్తమును ఆకర్షిస్తోంది. ఆ అభినయం అయిపోయిన తరువాత ప్రళయంలో సర్వం రహితమై ఉంటోంది. మరల, ప్రళయానంతరం ఇతః పూర్వపు మాయానాటకం కొనసాగుతోంది. గాఢనిద్రా సమయంలో జ్ఞాపకాలన్నీ మౌన ముద్ర వహించి మరల నిదుర లేవగానే పేట్రేగుతాయి చూచావా? అట్లాగే ప్రళయకాలంలో జగత్-కాల దృష్టులన్నీ దాగి యుండి, మరల సృష్టి సమయంలో ప్రదర్శించబడుతున్నాయి.
ఈ బ్రహ్మాండమంతా నియతి యొక్క నాట్యశాల అని అనుకున్నాం కదా! ఈ మాయాజీవులే 'నియతి' అను జాణ యొక్క అంగభూషణములు. సుఖ దుఃఖ దశలే ఆ మాయావ్యవహారము యొక్క హావభావములు. ఈ సంసారనాటకాభినయమంతా వివిధ వికారభంగిమలతో నిండి ఉంటోంది. ఒకవైపు ఈ మాయ ఇట్లుండగా, మరొకవైపు ఈ జీవుని వాస్తవస్వరూపమగు ఆ పరమేశ్వరుడు అనునిత్యం ఏకరసస్వరూపమున సర్వమునకు కేవలసాక్షి అయి ఒప్పారుచున్నాడు.
ఆయన వలననే, ఆయనకొరకే, ఆయన చేతనే ఈ తతంగ విన్యాసమంతా జరుగుతోంది. ఒకానొకడు చేసేపని వేరు, ఆ చేయువాడు వేరు కదా! అయినా కూడా చేసే పనిని బట్టే చేయువాడు అనుభవమౌతున్నాడు. పరమాత్మ ఈ జగత్ నటన - నాట్యముల నుండి విభిన్నుడైనప్పటికి, వ్యావహారికంగా మాత్రం ఆతడు ఈ విశ్వమునకు అభిన్నుడనియే చెప్పవలసి వస్తోంది.
బంగారం ‘ఉంగరం' అనబడు ఒకానొకటిగా మారినదా?... లేదు. ఉంగరం ఆకార రహిత మగు బంగారం యొక్క ఆకారదృష్టియే. బంగారం కాక, ఉంగరంలో ఇంకేమీ లేదు కదా! కనుక ఉంగరమంతా బంగారమే. ఉంగరానికి వేరుగా బంగారం మరెక్కడో ఉన్నదని అనలేం కదా! ఇదంతా కూడా అట్టిదే. సర్వమూ చూచువానిలో నిబిడీకృతమై ఉన్నది. ఈ విశ్వం చూచుచున్నవాడిచ్చే అర్థం మాత్రమే! ఈ విశ్వం యొక్క పరమార్థం చూచువాడే! చూచువాడు విశ్వమునకు అర్థము ఇచ్చేవాడు కనుక, ఆతడు విశ్వములో లేడు. విశ్వం కంటే అత్యంత సూక్ష్ముడైయున్నాడు. ఆ చూచువాడు (ద్రష్టయే) ఆ పరమ చైతన్యం యొక్క స్వరూపం. ఎందుకంటే ఆతని వాస్తవతత్త్వం చైతన్యమే కనుక!
13.బాహ్యపూజ - అంతర్ పూజ
శ్రీశివ భగవానుడు : వత్సా ! వసిష్ఠా ! వింటున్నావుకదా ! సర్వస్వరూపుడగు ఆ చైతన్య భగవానుడే దేవాదిదేవుడు. ఆతడు అనుభూతి స్వరూపుడు. సర్వులకు, సర్వమునకు అంతర్యామి. సర్వమునకు ఆశ్రయమైన ఆ దేవాదిదేవుడే సాధుపురుషులకు పూజ్యాతి పూజ్యుడు సుమా! ఆయనయే కుండ
Page:129
యందు, వస్త్రమునందు, శకటమందు మనుష్యులయందు దేవతలయందు వెలయుచున్నాడు. ఆయనయే శివుడు, విష్ణువు, బ్రహ్మ కూడా. ఇంద్ర-కుబేర-యమాది ఆయా అనేక రూపము తోనే గాక, నామరూప రహితముగా, శూన్యముగా కూడా ఆతడు ఆరాధించబడుచున్నాడు. సర్వాత్మకుడై స్వస్వరూపమున కూడా వెలయుచున్న ఆ మహాదేవునే సర్వము ఎరిగిన జ్ఞానులు ఆరాధిస్తున్నారు.
ఓ మహామతీ! ఆ మహాదేవునికి ఈ లోకమున బాహ్యమున అంతరమునకూడా పూజలు సమర్పించబడు చున్నాయి.
1. బాహ్యపూజ - ఈ దేహంతో చేసే పూజలు జనులు శాస్త్రోక్తములగు స్నానములతో, ఆచమనాది క్రియలతో ఈ బాహ్య పూజలు చేస్తున్నారు. మంచిదే కానీ, నా దొక ప్రశ్న. దేహాత్మ బుద్ధితో చేసే బాహ్యపూజలు నిరాకారము-నిర్మలము-అనంతము అగు ఉత్కృష్ట వస్తువు లభించాలంటే మధ్యే మార్గంగా కొంతవరకే ఉపయోగిస్తాయి. కాబట్టి సాధకుడు అంతటితో తృప్తిపొందితే ఎట్లా?
2. అంతర పూజ - పూజింపబడుతున్న వస్తువు ఎటువంటిది? దేహములన్నిటిలో సాక్షీభూతుడై వెలుగు చిద్రూపుడు. ప్రతి జీవునియందు “ఎరుక - అను జ్యోతిస్వరూపమున వెలుగొందుచున్నవాడు. సత్-చిత్-ఆనందం స్వరూపుడగు ఆతనియందే ఈ సర్వం ఉంది. ఆతడే ఈ సర్వమునందు వేంచేసి ఉన్నాడు. ఆ చిద్రూపునికి సంబంధించిన జ్ఞానార్చనే అంతరపూజ. ఆ చిద్రూపమును ప్రయత్న పూర్వకంగా గ్రహించటం, దర్శించటం, సర్వదా ధ్యానిస్తూ ఉండటం ఆ పూజయొక్క విధానం.
నిజానికి ఈ అంతరపూజకు ఒక క్రమం అంటూ లేదు. నియమ నిష్ఠల శ్రమ ఉండదు. కనుక ఓ వసిష్ఠా ! త్రిభువనధారుడగు ఆ సర్వేశ్వరుని నీకు కనబడుచున్న జీవుల వాస్తవ స్వరూపంగా (అట్టి ఎరుకచే) పూజించు. అట్టి 'ధ్యాస' అంతరమున కలిగి ఉండటమే ఆత్మ దేవునికి పూజాపుష్పాలు. ఈ జగత్తులోని సర్వ జీవులకూ ఆతడే ప్రకాశస్వరూపుడై, 'ప్రకాశము'లన్నింటికీ నియామకుడై ఉన్నాడు. అత్యంత సునిశిత విమర్శనా బలంతో "అహం యొక్క సారవంతమైన విభాగం పరమ పరిశుద్ధమగు చిత్ప్రకాశమే” - అని గ్రహించు. ఇక నీ మనస్సును, దృష్టిని సర్వదోష వివర్జితం చేయి. ఎప్పుడు, ఎక్కడ, ఎవ్వరు తారసబడినాసరే ...“ఈ సహజీవి యొక్క స్వరూపం నా యొక్క నిర్మల చిత్స్వరూపమే!” అను ధర్మమును అభ్యసించు.
పరమేష్ఠి వర్ణనాతీతుడు. అయినా కూడా కేవలం నీ యొక్క లక్ష్యశుద్ధి కొరకు ఆ పరమాత్మను వేదములు ఎట్లా వర్ణనచేస్తున్నాయో చెపుతాను, విను.
అపార పరమాకాశము యొక్క విశాల వైశాల్యము ఆయన కంఠభాగం. క్రిందనున్న అనంత ఆకాశకోశం ఆయన పాదపద్మములు. ఈ దిఙ్మండలములు ఆయన భుజస్కంధములు. ఈ బ్రహ్మాండములన్నీ కలిసినా కూడా ఆయన యొక్క హృదయకోశంలో ఒకానొక మూల మాత్రమే ఒదిగి ఉంటున్నాయి. ఆతడు పరమాకాశములకు ఆవల - ఈవల కూడా విస్తరించి ఉన్నాడు.
ఆయన శరీరముయొక్క నలువైపులా బ్రహ్మ - ఇంద్ర - హరి - హరాదులు కల్పనామాత్రులై వెలయుచూ ఆయనకు శోభ కలుగజేస్తున్నారు.
Page:130
ఈ చతుర్విధ జీవరాసులూ జలచరములు, భూచరములు, ఆకాశచరములు, వాయు చరములు ఆయన దేహంలోని రోమముల వంటివారు.
ఈ అనేకానేక ఇచ్ఛాదులతో కూడిన త్రిజగత్తులు ఆయన దేహంలోని నాడీ మండలములు. ఆయన ప్రతిఒక్కరికీ సంబంధించినవారే! ప్రతిఒక్కరికి చెందినవారే! ప్రతి ఒక్కరికీ, తమ తమ స్వరూపమే అయి ఉన్న ఆ దేవదేవుడే సర్వులకూ పరమపూజ్యుడై వెలయుచున్నాడు. ఆ చిన్మాత్రుని నిజరూపం అనుభూతియే.
అనుభూతి స్వరూపుడగు ఆయన సర్వవ్యాపియై, సర్వాశ్రయుడై, సర్వమునందు ఎల్లప్పుడూ జాజ్వల్యమానంగా వెలుగుచున్నాడు.
శివ, బ్రహ్మ, హరి, కుబేం, ఇంద్రాది దేవతలు ఆయనే. వివిధ రూపములు ఒకే సమయంలో ధరించుచుండుట చేత విద్వత్కవులు 'అనంతుడు' అను బిరుదును ఆయనకు ఇచ్చారు.
ఎట్టి భేదానికీ ఎప్పుడూ లోను కానట్టి 'అద్వితీయ సత్త'యే ఆయన శరీరం. అంతేగాని ఆయనకు వేరే భౌతికప్రదమైన, ఆకార వికారములకు సంబంధించిన రూపమేదో ఉన్నదని భ్రమపడ వద్దు.
ఈ జగత్తులను వివర్తింపజేసే కాలము ఆయనకు ద్వారపాలకుడు. ఈ నదీ - సముద్ర - మహాసముద్ర పర్వతాదులతో నిండిన లోకములతో కూడుకున్న బ్రహ్మాండములన్నీ ఆయన బృహత్ శరీరములోని ఒక చిన్న విభాగం. ఓ మహర్షీ! ఓ తదితర ప్రియ జీవులారా! సహస్ర చక్షుడు, సహస్ర శిరుడు, సహస్ర హస్తుడు, శాంతుడు, స్వస్వరూపుడగు ఆ ఆత్మదేవుడు అత్యంత సామీప్యమున ఉండి ఉండగా, ఇక ఆయనను మీరు ఎట్లా ఏమరుస్తున్నారు? ఆ దేవదేవుని గురించి చింతించటం సర్వదా అలవాటు చేసుకోండి. “సర్వ స్పందనలు, సర్వ వాక్-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు ఆ ఆత్మ భగవానుని చిద్విలాసములే!” ...అని అనుస్మరణ పూర్వకంగా సందర్శిస్తూ, ఈ దృశ్యమును ఆస్వాదించటం అలవరచుకోండి.
ఆయన దర్శన-ఆఘ్రాణ-స్పర్శన-రసన-శ్రవణ మనన శక్తులు సర్వేసర్వత్రా వ్యాప్తములై వెలయుచుండుటయే ఈ జగత్తుకు నిర్వచనం. వాటన్నిటి యందు ఆయన విస్తరించి ఉన్నాడు. కాబట్టి, ఆయన 'సర్వవ్యాపి' అని పిలిపించుకుంటున్నాడు.
మననమునకు కర్త ఆయనే! అందుచేత... 'మననమునకు ముందే ఉన్నవాడు, అతీతుడు' అని ఆయనను అనక తప్పదు. ఆయన సర్వకాలములందూ సర్వమునకూ కర్తయై ఈ సంకల్పిత విషయములన్నీ ఆయనే అనుగ్రహిస్తున్నారు.
సర్వమయుడగు ఆ పరమాత్మ ఎక్కడో ఆకాశంనందో, భూమియందో దాగిలేరు. సర్వదా నిఖిలభూతముల మధ్య నిశ్శబ్దంగాను, సర్వశబ్దమయుడుగాను మహాప్రకాశమానుడై ఉంటున్నారు. పరమమంగళ స్వరూపుడగు ఆతడొక్కడే అన్నిటినీ అనుగ్రహించగల సాధనభూతుడు. ఆయనను అట్లని గ్రహించి శ్రద్ధాసక్తులతో పూజించండి.
Page:131
ఆత్మదేవుని పూజ - ఓ బ్రహ్మవిత్ శ్రేష్టా ! ఇక ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఆర్చించటం ఎట్లాగో చెపుతాను ...విను.
స్వసంవిద్రూపుడగు ఆ ఆత్మదేవుని పుష్ప, ధూప, దీప, కుంకుమ, నైవేద్యాదులతో పూజించటం ప్రారంభమున మనోనైర్మల్యము కొరకు మాత్రమే అవుతుంది. అంతమాత్రం చేత 'నేను సంపూర్ణమగు పూజ నిర్వర్తించాను' అని అనుకుని ఊరుకోకూడదు. అవి ఉన్నా, లేకున్నా కూడా... 'ఈ ఎదురుగా కనబడే వారంతా ఆత్మస్వరూపులే' అను భావనను అభివృద్ధి పొందింపజేయటమే వాస్తవమైన పూజ. అట్టి ఆత్మబోధ అనాయాస లబ్ధము, శాంతిమయము, నిరంతరసుసాధ్యము, సులభము కూడా. ‘నాకు తారసపడే ఈ ప్రతిఒక్క జీవుని వాస్తవ స్వరూపం నిత్యము - - అఖండము - అప్రమేయము అగు పరమాత్మయే’ అను నిరంతర ధ్యానమే 'పరధ్యాస', 'పరమధ్యాస' అని పిలువబడుతోంది. అదియే పరాపూజ కూడా. అట్టి పరాత్పరతత్త్వము అభ్యసించకుండా చేసే ఈ భౌతిక పుష్పముల పూజ అల్పప్రయోజకారే సుమా!
పూజ చేస్తున్నప్పుడు ‘నాచే పూజించబడే ఆ పూజాలక్ష్యం ఏమై ఉన్నది?' అని గ్రహించి ఉండాలి కదా! ఆకారమును పూజిస్తున్నప్పటికీ పూజాలక్ష్యము ఆకారపరిమితమైనది కాదని గుర్తుంచుకోవాలి. అది ఏమరిస్తే మనం పూజించే నామరూప ప్రతీక దేని యొక్క ఉద్దేశమో అది ఏమరిచినట్లే అవుతుంది కదా! మరి అజ్ఞానశిల ద్రవించేది ఎన్నటికీ?
పూజాలక్ష్యమగు ఆ పరమాత్మ మన అంతరమున విశుద్ధ చిన్మాత్రస్వరూపంగా ఉన్నారు. ‘అంతరహృదయ అభ్యాంతరంగ - హృదయాంతరంగుడు' అయి ఉంటూనే బాహ్యామును వెలిగిస్తున్నారు. బాహ్య ప్రదర్శనరూపంగా ఈ దర్శన - శ్రవణ - స్పర్శన - ఆఘ్రాణ - భోజన - శయన - స్వప్న - నిశ్వాసన - సంభాషణ - త్యాగాదులందు ఆక్రమించుకొని ఉంటున్నాడు. అట్టి వానిని 'ధ్యానము’ అనే పుష్పముతో పూజించాలి.
ఆయన తత్త్వమును అంతటా గాంచటమే ధ్యాన విధానం. ధ్యాసయే ధ్యానము. ధ్యానము లేకపోతే ఆత్మదేవుని పొందజాలం. ధ్యానబలం చేత ఆత్మ తప్పక ఎవరికైనా సరే అనుభూతమౌతుంది. ఆత్మ భగవానుడు ధ్యానించే వారిని ప్రసన్నుడై సమీపిస్తున్నాడు.
మూఢుడగువాడు కూడా 13 రెప్పపాట్లకాలం (13 seconds) సర్వాత్మకుని స్వస్వరూప అనుసంధాన పూర్వకంగా అర్చిస్తే గోదానఫలం లభిస్తుంది. 100 రెప్పపాట్ల కాలం అర్చిస్తే అశ్వమేధ యజ్ఞఫలం లభించగలదు. కొన్ని నిమిషాలు సర్వభూతమయుని ఆత్మ సమర్పణ పూర్వకంగా అర్చిస్తే, ఎన్నో రాజసూయ యాగాల ఫలములు లభిస్తాయి.
ఒకరోజంతా అర్పిస్తే పరమకైవల్యము లభించగలదు.
నాయనా! ఈ భౌతిక పరిమిత పూజ కన్నా ఆ ఆత్మదేవుని ధ్యానార్చనం ఎంత సమున్నతమైనదో చెప్పటానికి మాత్రమే ఇది చెప్పాను. ఆ పరమదేవుని ధ్యానమే 'పరమయోగం'. అదియే సులభము, సర్వోత్తమము అగు క్రియ.
Page:132
సర్వాత్మధ్యాననిరతియే ఆత్మదేవుని బాహ్యాభ్యంతరపూజ. ఏ మనుజుడైతే నిఖిల పాపహరము, పరమపవిత్రము అగు ఆ పూజను శాంతమనస్కుడై నిర్వర్తిస్తూ ఉంటాడో ... అతడు నా వలెనే ముక్తుడై ఆత్మ పదమును పొందుతాడు. ఓ మహర్షీ ! సురాసుర శ్రేష్ఠులలో అనేకులు దైనందికంగా, అనుక్షణికంగా నిర్వర్తిస్తున్న ఆ ఆత్మపూజను నీవు కూడా నిర్వర్తించు.
14. ఆత్మాభిషేకం
శ్రీశివ భగవానుడు : ఇప్పుడు 'అంతరపూజ' గురించి మరికొన్ని విశేషాలు చెపుతాను. శ్రద్ధగా విను. 'అంతరపూజ’ అనేది ధ్యానాత్మకమైనది. అది శయన సంచార క్రియాది సర్వ అవస్థలలో తెంపు లేకుండా నిర్వర్తించవచ్చు.
ఈ పూజలో సర్వస్థితుడు సర్వస్వరూపుడు, రూపనామరహితుడు అగు పరమశివ శబ్దము యొక్క అర్థాన్ని ధ్యానించాలి.
పురాణకల్పితమైన పరమశివ రూపం సాధన కొరకై గ్రహించవచ్చు. అయితే ధ్యాసను రూప పరిమితం చేసి ఊరుకోకూడదు సుమా! సకల బోధనలను తన సాన్నిధ్య మాత్రంచేత ప్రసాదిస్తున్న ఆత్మస్థితునిగా ఆ సాధ్యవస్తువును గ్రహించు.
ఇక నీ సాధన అనునిత్యం చేయి. పయనిస్తున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోగ సమూహములను అనుభవిస్తున్నప్పుడు వాటిని విడుస్తున్నప్పుడు అతడే అన్ని వేళలా అన్ని వైపులా నిర్వికల్ప శాంతరూపమున వెలయుచున్నాడని గ్రహించు. నీ స్వస్వరూపుడే అగు ఆ ఆత్మస్వామిని యథా ప్రాప్తములగు స్వరూపజ్ఞానములతో అనుక్షణం పూజించు.
ఆత్మ ప్రారబ్ధ కర్మ భోగాల ప్రవాహంలో పడి మాలిన్యం పొందినట్లు అజ్ఞాన దృష్టికి మాత్రమే గోచరిస్తుందని ఎరిగి ఉండు. నీ స్వభావమును 'విశుద్ధాత్మబోధ' అను జలంతో స్నానం చేయించి బోధోపచారములలో బోధలింగమును పూజించి ధన్యుడవు కమ్ము.
శ్రీవసిష్ఠ మహర్షి : అంతటికీ ఆత్మయగు ఆతనిని ఎట్లా పూజించటం? ఎట్లా అభిషేకించటం? ‘బోధోపచారములు' అంటే ఏమిటి?
శ్రీశివ భగవానుడు : ‘బోధోపచారములు' అంటే ఏమిటో, వాటితో ఆత్మ భగవానుని ఎట్లా పూజించాలో చెపుతాను విను.
ఆకాశమండలమును ప్రకాశింపజేయు ప్రచండ కిరణస్వరూపుడగు సూర్యుడు ఆతడే! చల్లని కిరణములు ప్రసరింపజేయు చంద్రుడు కూడా ఆతడే!
ఆ ఆత్మదేవుడు ఈ సర్వ ప్రతిభాసిక పదార్థములందూ సంవిత్స్వరూపుడై వెలయుచున్నాడు. శరీరద్వారములందూ, ముఖములందూ, ప్రాణస్వరూపుడై ప్రవహించుచున్నాడు. ఈ శబ్ద-స్పర్శ-రూప
Page:133
-రసాది విషయములను తన ఆనందస్వభావంతో కలిపి వాటిని మధురంచేసి ఆస్వాదిస్తున్నాడు. కనుక నీవు శబ్ద స్పర్శాది విషయములను పొందుతున్న సమయంలో ఆత్మమాధుర్యమును జోడించి భావిస్తూ వాటియందు పాల్గొనుము.
ఆయన ‘ప్రాణ-అపానములు' అను చక్రాలు గల రథమును అధిరోహించి గూఢుడై నాయందు, నీయందు నీకు తారసపడుచున్న సర్వజీవరాసులయందును హృదయాంతరమున విశ్రమిస్తున్నట్లు గుర్తించి ఆరాధించు. జ్ఞానములన్నీ గ్రహించే “మహాజ్ఞాని”, కర్మలన్నిటి యొక్క “మహాకర్త”, భోగములన్నిటినీ భోగించు “మహాభోక్త”, స్మృతులన్నిటినీ స్మరించు “మహాస్మర్త”, భావాభావములన్నీ ధరించు “మహాభావకుడు", ఎట్టి చింతలూ లేనప్పుడు పరిశేషించు “మహానిర్వికల్పస్వరూపుడు”, సర్వమునూ తన ఉనికిచే పవిత్రం చేస్తున్న “మహామంగళ స్వరూపుడు" ఆయనయేనని ఆరాధించు. నీవు చేస్తున్న సర్వక్రియలకూ కారణభూతుడు ఆతడేనని భావన, చింతన చేయి.
ఆయన వాస్తవానికి కళారహితుడు. కానీ ఉపాధివశంచేత నీకు ఎదురుగా కళాసహితుడై నీ యొక్క తదితర ఉపాధులయొక్క రూపంలోనూ, పైన ఆకాశంలోనూ, నేలలోనూ ఆయా రూప-రస -భావనా సమన్వితుడై సంచరిస్తున్నాడు. అరంజితుడై కూడా రంజితునివలె కన్పట్టుచున్నాడు.
ఆతడు మరెక్కడో లేడయ్యా! నీ శరీరమునందు అంతటా వ్యాపించియున్న బోధస్వరూపుడు ఆతడే! ఆయన నీ మనస్సు యొక్క మననశక్తి యందు వెలయుచున్నాడు. ప్రాణాపానము లందు సదా ఉదయిస్తున్నాడు. నీ హృదయంలోను, కంఠంలోను నాసాపుటములందు తేజోరాశి అయి ఒప్పారుచున్నాడు.
శైవ శాస్త్రంలో చెప్పబడిన 36 తత్త్వములందు, వాటికి ఆవల ఈవల కూడా ఆక్రమించుకుని ఉన్నాడు.
కల - వికలనము మొదలుగా 'ఉన్మనీ- మనోన్మనీ' అనబడు సవికల్పసమాధి స్థితులందు, వాటినన్నిటినీ దాటినట్టి స్థితులందు కూడా కళాప్రపూర్ణుడై ప్రకాశిస్తున్నాడు. నీ యొక్క శబ్ద స్పర్శాది విషయములన్నీ సృష్టిస్తూ నీ మనస్సు అనే పక్షిని అటూ ఇటూ ఎగురవేస్తున్నాడు. నీ యొక్క వాక్పథము నందు, వాచ్య, లక్ష్యములందూ యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. నువ్వుగింజలన్నిటిలో నూనె ఉన్నట్లు, ఆయన సర్వ శరీరములందూ ‘తెలుసుకోవటం' అను రూపముతో ప్రత్యక్షమై ఉంటున్నాడు. తనకు కళంక మనేదేదీ లేకుండానే ఈ పంచభూత సమ్మిళితమైన స్థూలదేహములన్నీ దాల్చుచూ కాఠిన్యమగు మూర్తిత్వము వహిస్తున్నాడు. సకల హృత్పద్మములలోనూ మధుర రసరూపుడై అచింత్యమానుడై ఉంటున్నాడు. ఆయనను ఎక్కడో ఎన్నడో చూడాలని భ్రమించనక్కర్లేదు. అనుభూతి స్వరూపమున నలువైపులా ప్రత్యక్షమయ్యే ఉన్నాడు. ఆహా! ఆయన ఆయా దేహములలో స్వస్వరూపాన్ని మరచి, జీవభావమును ధరించటమేమిటి? భోగ మోక్షముల కొరకై ఆరాటపడటమేమిటి? అనేక చోట్ల అనేక చిత్రవిచిత్ర స్వయంకల్పిత మాయా ప్రతిబంధకములను కల్పించుకొనటమేమిటి? స్వ - అతిరిక్తములగు పదార్థ రూపములను ధరించి క్షణంలో ద్వైతభావములు పొందటమేమిటి?...
Page:134
ఎంతటి చమత్కారం! మేము ఈ మాయ కావల దాగిన ఆయన అప్రమేయ - నిష్కళంక - నిత్య - నిరుపమ - చిదానంద స్వరూపం సర్వదా గాంచుచున్నాం. నీవు కూడా అయ్యది దర్శనాభ్యాసంచే సర్వత్రా దర్శించటం నిర్వర్తించెదవు గాక!
శ్రీవసిష్ఠ మహర్షి : తండ్రీ ! ఆయనను సర్వదా, సర్వత్రా, సదా ధ్యానించటం ఎట్లాగో చెప్పండి. శ్రీశివ భగవానుడు : “ఈ కాళ్ళు, చేతులు మొదలైన అవయములతోనూ, జుట్టు, గోళ్ళతోను ఉన్న ఈ దేహము నందున్న నేనే ఆ పరమశివుడను" అని భావించుకోవటమే చిదానందరూపం : శివో హమ్ : శివో హమ్ ఆ ధ్యానము యొక్క పరాకాష్ఠ.
"భార్యలు అత్యంతప్రియుడగు భర్తను సేవిస్తున్నట్లు ఈ వివిధ మనఃశక్తులన్నీ సర్వదా శివ స్వరూపుడనగు నన్ను ఉపాసిస్తున్నాయి. ఈ మనస్సనేది నా స్వస్వరూప గృహానికి ద్వారపాలకుడు. ఈతడు జగత్రయములలోని వివరణలను నాకు సర్వదా విన్నవించుకుంటున్నాడు. ఆలోచనయే నా ఆంతరంగిక వార్తా విశ్లేషనుడగు ప్రతిహారి (Messenger). విశుద్ధమగు బుద్ధి నా భుజశక్తి. క్రియాకలాపాలన్నీ నా మెడలో ధరించిన మణిహారం. సర్వజ్ఞాన విశేషములు నా శరీరానికి ఒప్పే ఆభరణములు. కర్మేంద్రియ-జ్ఞానేంద్రియములు నా గృహద్వారములు.
ఇక నేనో...? అనంతుడనగు, ఆత్మను ! శివానంద స్వరూపుడను. శివో హమ్! శివో హమ్!
నా ఆకృతికి పరిమితమంటూ లేదు. పూర్ణము, ఏకము, ఆద్యము అగు ఆత్మస్వరూపమున వెలయుచూ వస్తువులన్నీ పరిపూర్ణం చేస్తున్నాను.”
ఇట్లు ఆత్మదేవ భావమును చింతన చేస్తూరాగా, అప్పుడు నీ హృదయం ఆత్మదేవత్వంతో పూర్ణమగుచున్నది. అట్టి అంతరపూజచే నీ యందలి దీనత్వమంతా పారత్రోలి వేయగలుగుతావు. అప్పుడిక నీకు ఉదయాస్తమయములు గాని, జనన మరణములుగాని, సంతోష - విరాగములుగాని, వాంఛా అసంతృప్తులు గాని, గ్రహణ త్యాగములు గాని ఉండవు. హృదయం సర్వసమ భావముతో నిండిపోతుంది.
నాయనా! వసిష్ఠా! ఆకృతి, ఆచరణలతో నిత్యం నిస్సంకోచంగా జీవన్ముక్తత్వము వహించటం అభ్యాసం చేయి. అంతేగాని, “నేను దుర్భలుడను. పాపిని, స్వల్పుడను. దేనిపైననో ఆధారపడి ఉన్న వాడను” ...మొదలైన వాటికి అంతరంగంలో స్థానాలు కేటాయించ వద్దు. ఆత్మదృష్ట్యా నీవు ఎట్టి వాడవో ఎంతటివాడవో గ్రహించి ఉంటూనే కార్యములను, ఉచితానుచితమును అనుసరించి నిర్వర్తిస్తూ ఉండు. ఆత్మ దృష్ట్యా సహజీవులు ఎట్టివారో ... అది కూడా ఏమరువవద్దు. “అంతా శివమయమే” - అను అనుభూతిని, ఆస్వాదనను, స్వావలంబనమును ఏమాత్రం విడువనే వద్దు.
సమదర్శియగు మహామతి సంపూర్ణంగా సౌమ్యభావం పొంది, సుందరమగు మనస్సుతో శరీరం ఉన్నంతవరకు సమరసపూర్వకమైన ఏకాత్మభావనయందే వెలయుచున్నాడు. అదియే ఆతని
Page:135
అంతర్దేవ పూజ. నీవు చేయు అట్టి పూజకు అధి దేవత నీవే! నీ ఆత్మ స్వరూపమే! నీ సర్వస్వముతో, సమత్వము పొందిన బుద్ధితో, అనాయాసంగా లభించే క్రియా - కర్మ - వస్తుజాలంతో చిన్మయదేవుడగు స్వస్వరూపమును ఉపాసించు ... ఆరాధించు. ఈ జగత్తంతా నీయందే దర్శించు నిన్నే ఈ జగత్తునంతా సందర్శిస్తూ ఆస్వాదించు.
+
ఆ ఆత్మదేవుని పూజించటానికి గంధము పుష్పము మొదలైన బాహ్య వస్తువులను సమకూర్చుకో వలసిన అగత్యం కూడా లేదని నీవు ఇప్పటికే గ్రహించి ఉంటావు. ఎట్ట ఎదుట కాకతాళీయంగా లభిస్తున్న ఆయా సర్వవస్తువులతోనూ నీకు అభిన్నమైన ఆ దేవదేవుని పూజించవచ్చు. అట్టి పూజా కార్యక్రమం అకృత్రిమంగా, ప్రయాసరహితంగా జరిగిపోతూ ఉండుగాక! ఏ ఏ జాతివారికి వారి శాస్త్రములందు ఎట్టి విధి విధానములు కర్తవ్యములుగా చెప్పబడ్డాయో... ఆయా రీతులను అనుసరించి తమకిష్టమైన విధానములతో, వస్తువులతో, క్రియలతో సర్వసమభావి అయి ఆ ఆత్మదేవుని పూజించ వచ్చు. నీయందు, నాయందు తదితర సర్వజీవులయందు ఏక-సమ రూపమున వెలయుచున్న ఆ ఆత్మ భగవానుని జనులు తమ తమ ఐశ్వర్యాదులను అనుసరించు భక్ష్య - - భోజ్యములను సమర్పిస్తూ కూడా పూజించెదరు గాక! శయన, ఆసన, గమనాది సర్వావస్థలయందు తత్క్రియలచే ఆ శుభ స్వరూపుని ఆరాధించవచ్చు.
నాయనా ! కాంతా సంగమ, అన్న పానాది సర్వ విధ భోగములను - ఆ ఆత్మదేవునికి సమర్పిస్తూ ...ఆయన యొక్క తత్త్వమును సంపూర్ణంగా గ్రహించి ఆయన్ను అవిచ్ఛిన్నంగా పూజించండి. ఆత్మ జ్ఞానార్థమై వేటినైనా త్యజిస్తుంటే, ఆ త్యాజ్యము ద్వారా ఆత్మదేవ పూజ చేయి. ఎప్పుడైనా ఆధి వ్యాధులు అనుభవించవలసి వచ్చాయనుకో... తద్వారా జనించే మోహాలను, తదితర ఉపద్రవాలను, దుఃఖ పారవశ్యములను ఆ ఆత్మదేవునికే సమర్పించు. వాటి రాకపోకలకు క్రుంగిపోక, వాటియందు పూజా భావాన్ని జతచేర్చాలి. ఈ జగత్తులో తారసపడుచున్న సర్వప్రయత్నాలను, జాగ్రత్-స్వప్నాలు ఏర్పడుచున్న తీరులను ఆ ఆత్మభగవానునికే అర్పించి అర్చించాలి. ఇందు ఇక ఏ దోషం నీకుండదు.
సంసార ప్రవాహమున పడిన జీవుడు తాను దరిద్రుడైనపుడు ఆ దారిద్య్రమును ఆయనకు సమర్పించాలి. రాజైనప్పుడు రాజుగా తాను చేయవలసియున్నదంతా ఆయా క్రియా పుష్పముల రూపమున శుద్ధుడు - స్వస్వరూపుడు అగు పరమాత్మను పూజించాలి. సంసారి అయినప్పుడు ఆ సంసారిత్వమును ఆయనకే సమర్పించాలి. నానా విధములగు సందర్భానుచితములైన యుద్ధ సంరంభముల తోడను, సంతోషం యొక్క చాంచల్యము తోడను, రాగద్వేషముల విలాసము తోడను, సౌమ్యుడగు ఆ ఆత్మదేవుని ఆరాధించాలి. ఆ ఆత్మదేవుని సాన్నిధ్యం చేతనే సత్పురుషులు పూజార్హులగు చున్నారు. ఆ సర్వాత్మ చంద్రునివలె చల్లనిది. మాధుర్యమగు మైత్రితో సర్వ హృదయములందూ వెలుగొందే ఆయనను సేవించాలి. మైత్రి, కరుణ, ఉపేక్ష, ముది, క్రోధనిగ్రహ సామర్థ్యములన్నీ తన స్వరూపమైన ఆత్మ దొర పాదాలపై ఉంచే పుష్పాలుగా భావించబడుగాక! ఆకస్మికంగా లభించేవి,
Page:136
ప్రయత్నం చేసిన తరువాత ప్రాప్తించేవి, అనుభవించేవి, "క్షణిక భోగభాగ్యములు అన్నీ కూడా ఆయనకు వినయముతో సమర్పించబడుగాక. విహిత నిషిద్ధములగు భోగ అనురాగ, త్యాగములతోను, కోరబడిన - కోరబడని యుక్తాయుక్త క్రియల చేతను, త్యజించి - త్యజించని భోగ - - స్నేహ, సంబంధముల చేతను, ఆ సర్వాత్మకుని పూజయే నాచే జరుగుచున్నది" - అను భావ, అనుభవములు పొంది ఉండెదవుగాక!
ఆత్మదేవుని పూజలో విజ్ఞులు 3 రకాల పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటారు. 1. గతించిపోతున్న విషయాలను ఉపేక్షించటం.
2. లభ్యపడుతున్న విషయాలను ఉద్విగ్నరహితంగా, రాగద్వేషరహితంగా ధర్మాధర్మ విచక్షణతో నిర్వర్తించటం.
3. ఉభయ సమయములలో నిర్వికారులై, సమత్వ సమన్వితులై ఉండటం. ... వీటిని ఆత్మస్వరూపుడగు శివపూజాయత్నములు అని పిలుస్తూ ఉంటారు.
కాబట్టి కుమారా ! ఇష్ట - అనిష్టములగు సర్వ విషయములందునూ సంపూర్ణమగు 'అకృత్రిమ సమత్వం’ సంపాదించుకో. సదా ఆత్మార్చనావ్రతం నిర్వర్తించు.
'సర్వం బ్రహ్మమే’ అను దృష్టి వలన స్వతఃసిద్ధంగా సర్వశుభాలు ఒనగూడగలవు. "బ్రహ్మం, మాయ”అను రెండు వేరు వేరు విషయములు కలిసి ఉన్నాయను దృష్టి వలననే ఇక్కడ శుభాశుభములు సంభవిస్తున్నాయి. ఆత్మార్చనా వ్రతుడు 'సర్వము ఆత్మయే' అని దృఢంగా గ్రహించి ఉండటం చేత వైషమ్యములు తొలగుతాయి. సర్వసమత్వం స్వభావసిద్ధమౌతుంది. 'ఆపాతరమణీయాలు, ఆపాత దుస్సహాలు - అగు విషయములన్నిటి యందూ సమత్వబుద్ధి కలిగి ఉండేవాడు స్వతఃసిద్ధంగా ఆత్మార్చనావ్రతుడు అయినట్లే!
నిత్యాత్మవ్రతం - అందుచేత మహర్షీ ! “అదియే నేను, ఇది నేను కాదు” మొదలైన భేదవిభాగ సంబంధాలగు కల్పనలను కూడా పరిత్యజించు. “సర్వం బ్రహ్మమే”అను అభేధ దృష్టి అవలంబించటమే నిత్యాత్మ వ్రతం.
“ఆత్మయే నానావిధ రూపములు గాను, నానా విధములగు వికారములు గాను ఈ నా దేహంగాను ప్రకటితమగుచున్నది. సర్వే సర్వత్రా ఆత్మ ఉపలభ్యమగుచున్నది” అను అభ్యాసమును “నిత్యాత్మ వ్రతము” అని పిలుస్తున్నారు. ఇష్ట-అయిష్టములను, మిథ్యాత్మబుద్ధిని పరిత్యజించి, వీటినన్నిటినీ స్వాత్మ మాత్రంగా గ్రహించటమే ఆత్మదేవుని కొరకు చేసే సర్వకైంకర్యము. సముద్రము నదీ సమూహములను వాంఛించక, త్యజించక, తాను కారణము గాక ప్రవాహపతిత మాత్రంగా స్వీకరిస్తుంది కదా! ఆత్మార్చకుడు సుఖదుఃఖ హేతువులగు జగద్విషయములను యథాతథంగా గాంచుచూ, క్రుంగక - పొంగక ఉంటాడు. అవమానాది దుఃఖకర పరిస్థితులందు, ప్రాణాపాయాది ఘోరసంకటము లందు, రాజ్య - పూజ్యాది పురస్కార సందర్భములందు, ఉద్వేగ - ఉత్సాహ -
Page:137
నిరుత్సాహాలు పొందక నిర్లిప్తంగా - ఆత్మార్పణ బుద్ధితో గాంచుచూ ఉంటాడు. తన యొక్క ప్రతిక్రియ - ఉదాసీనతలు కూడా ఆత్మదేవుని పాదాలకు సమర్పించే పూజాపుష్పాలుగా దర్శిస్తున్నాడు.
దేశ, కాల, క్రియలవలన సంభవించే శుభాశుభములను నిర్వికారబుద్ధితో గ్రహించటం అనేది ...ప్రత్యేకంగా ఉద్దేశించకపోయినప్పటికీ ఆత్మార్చనయే అవుతుంది. ఆత్మార్చనావిధానం అత్యంత సులభ సాధ్యం. సమతారసమే ఈ బోధ యొక్క సారం. సమతా మధురా రస్యా రసశక్తిరతీన్డ్రియా |
తయా యద్భావితం చేత్యమమృతం తత్క్షణాద్భవేత్ ॥ || (శ్లో 56, సర్గ 39)
సమతారసము అత్యంత మధురము, ఇంద్రియా తీతమునునై యున్నది. అట్టి సమతా రస సమన్వితమైన బుద్ధిచే పొందబడే ఇంద్రియ విషయాలు కూడా క్షణంలో అత్యంత సుమధురమౌతాయి. అట్టి బుద్ధి క్రమంగా నిర్వికారంపొంది భూతరహిత (భూ-జల-అగ్ని-వాయు రహిత) ఆకాశంలాగా ప్రశాంతత పొందగలదు. మనస్సు స్వస్వరూపమున విలీనమౌతుంది. అదే అనాయాసమగు దేవార్చన. ఆ ఆత్మార్చన చేయువాడు బహిర్ప్రకృతి సంబంధములగు సంసారకార్యములను ఒనర్చుచున్నప్పటికీ, అంతరమున పరిపూర్ణుడై ఉంటాడు. అజ్ఞాన పరిభ్రమణం క్షీణిస్తుంది. అహంకార మేఘం తొలగి శరత్కాలాకాశం లాగా స్వస్వరూపం పరిఢవిల్లుతుంది.
ఓ వసిష్ఠా! జీవద్దర్శనం చేస్తూనే, ఏతత్ క్షణంలో కూడా బ్రహ్మపదమున వెలయుము. అప్పుడే పుట్టిన బిడ్డలాగా వికల్పరహితుడవై ఉండుము. చిత్తమునకు చిదాభాసునకు కూడా మూలకారణమగు సర్వమంగళమయ ఆత్మనే గాంచుచుండు. నీ స్వరూపమునకు మనోవృత్తి రూపమగు స్వల్పత్వమును ఆపాదించవలసిన అవసరం నీకు గాని, మరెవరికి గానీ లేదు. అట్టి ఆరోపణ ఆత్మోపాసనారాహిత్యం వలననే జరుగుతోంది. ప్రపంచ వస్తు ఆకారములను వాటిని ప్రకాశింపజేసే సూర్యతేజస్సుకు ఆపాదించటం ఉచితమెట్లా అవుతుంది? తుచ్ఛ మనోవృత్తులు నీపట్ల ఉపశమించుగాక! "పుట్టువాడను, సంబంధితుడను” మొదలైన భేదభావములన్నీ నీపట్ల అస్తమించి, ఇక నీవు స్వప్రకాశరూపుడవై వెలుగొందెదవు గాక! స్వయంగా నీవే అయి ఉన్న (తత్వమ్) ఆ ఆత్మదేవునికి ఈ దేశ, కాల, క్రియాదు లన్నీ అప్రయత్నంగా, అనాసక్తి పూర్వకంగా సమర్పించివేయి. అప్రయత్నంగా లభించే సర్వ సంఘటనలను అర్పించి అర్చించు. వాంఛారహితమగు బుద్ధితో ఆత్మారాముడవై వెలుగొందు!
15. అనంత స్వస్వరూపమునకు అల్పత్వం ఆపాదించటమా?
శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ! సాంబశివా! మీరు పూజాసంరంభముగాని, ప్రతిమా నిర్మాణం గాని అవసరం లేని చిదాత్మశివుని పూజ గురించి చెప్పి నన్ను తరింపజేస్తున్నారు. అట్టి పూజ అత్యంత అనాయాసమని, నేను చేసే యథాక్రమములైన కృతాకృతములను ఆత్మదేవుని పరంగా సమర్పించి ఉండటమేనని గ్రహిస్తున్నాను. ప్రతిమాదులు కూడా అవసరం లేని అట్టి పూజ వలన ఆత్మదేవుడు
Page:138
సంతసించి నా యొక్కరూపానుభూతిగా సాక్షాత్కరించగలరని ఎరుగుచున్నాను. అయితే, అట్టి పూజకు ప్రయోజనము, ఫలితము ఎట్టివో మరికొంత వివరించమని నా విన్నపం. అంతేకాదు, నాది మరొక చిన్న సందేహం. రాగద్వేషము లనేవి సర్వానర్థములకు కారణం కదా! అట్టి రాగ ద్వేషములతో కూడా ఆత్మదేవుని పూజించవచ్చని మీరు ప్రకటిస్తున్నారేమిటి?
శ్రీశివ భగవానుడు : నేను వర్ణిస్తున్న ఆత్మశివుని సర్వవిధ సమర్పణతో కూడిన పూజకు ప్రతిఫలం పారమార్థికానందమును, మాయాభంగమును స్వతఃసిద్ధమైన రీతిలో నీ స్వస్వరూపుడైన ఆత్మదేవుడు ప్రసాదిస్తారు. సర్వము ఆత్మభగవానుని చమత్కారంగా దర్శించటమే ఆత్మోపాసన! అదియే ప్రపత్తి అనగా! ఇక రాగద్వేషముల విషయమై విను.
నిప్పురవ్వలు నిప్పు నుండి బహిర్గతమైనంత మాత్రంచేత అవి నిప్పుకంటే వేరైనవి కాదు కదా! అట్లాగే రాగ ద్వేషములని పిలువబడుచున్నవి కూడా వాస్తవానికి ఆత్మకంటే వేరైనవి కావు. నిత్యమగు ఆత్మను నవరసాలతో కూడిన జగత్రూపముగా గ్రహించుటే ఆయనయొక్క పూజ. సుఖభోగములను, దారిద్య్ర దీనత్వములను సమముగా చూచుటయే ఆత్మార్చన.
ఆత్మయే ఆకాశము మొదలుకొని ఘటము వరకు, జాగ్రత్ మొదలుకొని స్వప్నసుషుప్తుల వరకు సర్వఅవస్థలను అలంకరించియున్నదయ్యా! ఈ జగత్తు ఆ ఆత్మశివుని వలననే, ఆయన యందే ఇందలి సర్వకళలతో సహా ప్రకాశిస్తోంది. “నా స్వరూపము కూడా మౌన, ప్రశాంత, పరమానంద కళాస్వరూపమగు ఆ ఆత్మ శివుడే!" అని గ్రహించు.
ఆత్మయొక్క ‘సత్త’ లేకుంటే ఒక పరమాణువు కూడా ప్రకాశించజాలదు. అందుచేత “ఇదంతా ఆత్మరూపమై వెలయుచున్నది" - అనే విషయం నీవు ఒక్క క్షణం కూడా మరువకూడదు. అట్టి పరమసత్యము మాత్రమే ఈ జీవుని సర్వ అజ్ఞానములనుండి - అన్నివేదనలనుండి రక్షించగలదు. శ్రీవసిష్ఠ మహర్షి : అవశ్యం స్వామీ! అయితే, ఎంత ఆశ్చర్యం! ఎంత విచిత్రం! నిష్క్రియుడు, వృత్తిరహితుడు అగు ఆత్మశివుడు ఈ నానా విధపదార్థములుగా జీవుడు బుద్ధి మొదలైన తత్త్వములుగా విస్తరించుచున్నాడు. ఆయా జీవులతో ఉంటూ స్వస్వరూపమును ఏమరచుచున్నాడే? స్వయం కల్పిత మగు స్వమాయచే అసంపూర్ణత్వమును గాంచుచున్నాడే! సర్వాత్మకము, అనంతము, మంగళ మయము అగు ఆత్మయందు పూజ్య - పూజక - పూజాది విభ్రమములన్నీ ఎక్కడ నుండి వచ్చాయో కదా! అవన్నీ పరిచ్ఛిన్నాకారముననే సంకల్పితములగుచున్నాయి కదా!
శ్రీశివ భగవానుడు : శాంతుడగు ఆత్మేశ్వరునియందు పరిచ్ఛిన్నములగు ఈ వికల్పములు సంభవించ టానికి వీలే లేదు. నిత్యము, నిర్మలము, సర్వశక్తిమయము, అనంతము అగు ఆ ఈశ్వరతత్త్వము ఈ పరిచ్ఛిన్న రూపనామములతో పూజ్య-పూజకాది భారముతో కుదించుకుపోవటమనేది కుదరనే కుదరదు. అత్యంత నిర్మలమగు ఏ చిద్రూపమునుండి ఈ జగత్తులన్నీ క్షణంలో పుట్టి, పెరిగి, లయ మవుతున్నాయో... అట్టి భగవంతుని ఒకానొక ఆకృతిగాగాని, రూపనామములుగా గాని పరిమితం చేయటం అనుచితమే అవుతుంది. ఇక, రూప - నామములను శ్రద్దకొరకై సంజ్ఞగా స్వీకరించటం ఉచితమే గాని “అది మాత్రమే దైవం” అని భావించటం ... అనంతునకు అల్పత్వం ఆపాదిస్తున్నట్లే
Page:139
అవుతుంది కదా! తత్త్వజ్ఞులగు మహనీయులంతా ఈ విషయం ఎరిగియే తమ తమ ఇష్టదైవానికి సంబంధించిన సాధనలు కొనసాగిస్తున్నారు.
ఇక పరమేశ్వరుని దేశకాల పరిచ్ఛిన్నునిగా తలచుచూ అట్టి స్వల్పానుభూతి వీడని వారికి నేను ప్రవచిస్తున్నట్టి ఈ చెప్పబడిన ఆత్మదేవపూజా విధానం ఉచితమార్గంలో ఉపయోగించును గాక!
ఓ వసిష్ఠా! నీవు ఇప్పుడే, ఇక్కడే సర్వపరిచ్ఛిన్న దృష్టులనూ పరిత్యజించు. నీతో సహా కనబడే ఈ సర్వమును ఏకాత్మకుడవై స్పష్టీకరించుకో. తత్త్వభావాన్ని (“ఈ కనబడే ‘నీవు’ అనబడునది సర్వాత్మకుని కిరణపుంజమే” అను భావం) అవలంబించి సముడవై, శాంతుడవై విషయాసక్త శూన్యుడవై, నిరామయుడవై ఉండుము. "ఆత్మతత్త్వమును విశదపరచుట" అను యథాప్రాప్తమైన ధర్మమును అకర్తృత్వబుద్ధితో నిర్వర్తించు. శుభాశుభములన్నీ ఉపాహారంగా సమర్పించి ఆత్మేశ్వరుని అర్చించు.
మహర్షీ ! ఎప్పుడైతే నీవు ఈ దేహమును - దేహిని వేరుపరచి మర్మగర్భమగు సత్యమును దర్శించటం ప్రారంభిస్తావో ... అప్పుడు నీవు సాధుపురుషులగు వారి గుణములను పొందినట్లే. అప్పటి నుండి “తత్త్వమును వేరుగా సంపాదించటం” అనేది ఉండదు. అతిత్వరలో మాయాకళంకం తనంతట తానే సంపూర్ణంగా తొలగగలదు. ఆపై ఈ బాహ్య జగత్తు నీయందు సంలగ్నం కాజాలదు. ఒక స్ఫటికంలో దృశ్యము ప్రతిబింబించినప్పటికీ, అయ్యది దానికి అంటుతుందా?
ఈ జన్మ - - జర - - మరణ - పునఃజన్మాదులు నీకు అంటవు. కనుక లే లెమ్ము. ఆత్మదేవుని పట్ల బహిరపూజ, అంతర్పూజ ప్రారంభించు.
16. అవిద్య నుండి ... విద్యకు !
శ్రీవసిష్ఠ మహర్షి : హే పరమశివా! పరమోత్కృష్టమగు ఆత్మదేవుని పూజ బోధించినందుకు మేమంతా మీకు ఎంతో కృతజ్ఞులం. మీరు కురిపిస్తున్న కరుణారసవీక్షణ భక్తసులబత్వం వర్ణించి చెప్ప గల భాషాసామర్ధ్యం నా వద్ద లేదు. స్వామీ ! సర్వసందేహాలు నివర్తించగల మీ వంటి సద్గురువుల దర్శనం లభించటం ఎన్నో జన్మలలో మేం చేసుకున్న పుణ్యఫలమే అవుతుంది.
సవినయుడనై ఒక ప్రశ్నను మీకు నివేదించుకుంటున్నాను. మహాత్మా! బ్రహ్మము సర్వ ధర్మములకు, సర్వ మనోబుద్ధులకు, సర్వవాక్యములకూ అతీతము కదా! అట్టి సర్వాతీతమైనదానికి 'శివుడు' అని గాని, 'పరమాత్మ' అని గాని శబ్దములతో చెప్పుకోవటమెందుకు? ఆయన ఏ వర్ణమునకూ అలభ్యుడుకదా! ఇక “సత్త, శూన్యం, విజ్ఞానం” మొదలైన పిలుపులకు అర్హమెట్లా అవుతోంది ? శ్రీశివ భగవానుడు : నాయనా! ఇచ్చట ఆద్యంతరహితము, స్వయం జ్యోతియు అగు 'సద్వస్తువు' ఒక్కటే ఉన్నది. అది నామ రూప రహితమైనప్పటికీ అద్దాని బోధ కొరకు, సాధన కొరకు అనేక నామరూపములు ఉపయోగించబడుచున్నాయి. అంతేకాదు. అది ఈ ఇంద్రియములకు అలభ్యమవటం చేత ‘శూన్యము' వలె కూడా తోచుచున్నది.
Page:140
శ్రీవసిష్ఠ మహర్షి : అది ఇంద్రియములకు, మనస్సు మొదలైన యుక్తులకు కూడా గోచరించనిదై నప్పుడు ఈ ఇంద్రియ మనోబుద్ధులతో చేసే ఏ క్రియలైనా దానిపట్ల నిష్ప్రయోజనమే అవుతాయి కదా? ఇక అద్దానిని ఆయా కార్యక్రమముల సహాయంతో, భౌతికమైన విధులతో చేరగలమను నిశ్చయమేమున్నది?
శ్రీశివ భగవానుడు : మనస్సు యొక్క ఎట్టి వృత్తులూ ఆ ఆత్మవస్తువును ప్రకాశింపజేయలేని మాట నిజమే. అయితే సాత్వికము, బ్రహ్మాకారము అగు బుద్ధివృత్తియొక్క బలంచేత అవిద్యయొక్క ఆవరణం తొలగించబడుతోంది. అవిద్యావరణం తొలగిందా - బ్రహ్మము తనంతట తానే ప్రకాశించుచున్నది. అట్టి స్వయంప్రకాశానుభవమును బోధకులు 'ఆత్మసాక్షాత్కారం' అని పిలుస్తున్నారు. అట్టి తన స్వరూప అనుభవ స్థిరత్వమును అనుభవించటానికి ఈ ఇంద్రియ, ఇంద్రియార్థములతో అవసరమే లేదు. ఎందుకంటే అది ఇంద్రియములకు విషయమే కాదు కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : అట్టి స్వీయస్వరూప అనుభవ స్థిరత్వమునకు క్రమక్రమమైన మార్గమేదైనా చెప్పి, మమ్ము తరింపజేయ ప్రార్థన.
శ్రీశివ భగవానుడు :
1. మొదట “ఇంద్రియాతీతం, అనిర్వచనీయం అగు నా స్వరూపం ఎప్పటి నుంచో 'ఇంద్రియ విషయాలు’అనే బురదలో నిష్కారణంగా ఇరుక్కున్నది. అందుకు ఫలితంగా అజ్ఞాన భావవీచికలు, అల్పలక్ష్యాలు నన్ను కప్పి ఉంచుతున్నాయి. ఇప్పుడు నేను నా స్వరూపాన్ని సముద్ధరించు కోవటం ఆవశ్యకం" - అని జీవుడు గ్రహించాలి. పట్టుదలతో కూడిన కార్యక్రమానికి ఉద్యుక్తుడు కావాలి.
2. అట్టి ముక్తి నొందతలచినవాడు శమదమాదులను (Control of Internal & External Senses) పెంపొందించుకోవాలి. క్రమంగా సాత్విక అవిద్యాంశములు బలపరచుకోవాలి.
3. “సత్సంగము - - సద్గురువులు - - శాస్త్రవచనములు" అను సాత్విక అవిద్యాంశ సహాయంతో బ్రహ్మాకార చిత్తవృత్తులను అనుసరిస్తూ రావాలి.
4. క్రమంగా తానే పూర్ణ బ్రహ్మస్వరూపంగా వెలయు గాక! అది మాత్రమే విద్యాంశ. శ్రీవసిష్ఠ మహర్షి : సత్సంగము, గురువులు, శాస్త్రము, బ్రహ్మాకారవృత్తి అవలంబించటం - అనేవి కూడా అవిద్యాంశలోనివేనా ఏమిటి?
శ్రీశివ భగవానుడు : అవును. అవన్నీ 'సాత్విక అవిద్యాంశ విభాగాలు' అని అంటున్నారు. చాకలి వాడు చవుడుతో వస్త్రములోని మురికిని వదలించి, ఆ తరువాత ఆచవుడును, వస్త్రములోని మురికిని ఉతకటం ద్వారా వదిలిస్తున్నాడు కదా! మంచినీటితో ఆ వస్త్రాన్ని మొత్తంగా పరిశుభ్రపరచి ఆర వేస్తున్నాడు.
జనులు కాలిలో ముల్లు విరిగినపుడు మరొక ముల్లుతో కాలిలోని ముల్లును తొలగించి... ఆ తరువాత రెండు ముళ్లనూ తొక్కరాని చోట పారవేసి వస్తున్నారు. అట్లాగే సాధకుడు సత్సంగమును, తదనుకూలమైన చిత్తవృత్తులను ఆశ్రయిస్తూ... ఆత్మస్వరూప ప్రాప్తి వరకూ కొనసాగిస్తున్నాడు.
Page:141
కాబట్టి బ్రహ్మము తప్ప తక్కినవన్నీ అవిద్యాంశములేనని గ్రహించు.
బ్రహ్మము అనగా తత్ ప్రయత్నశీలుడగు ద్రష్టయే కదా! నీ స్వరూపానుభవ పర్యంతమే ప్రయత్నమనే దాని యొక్క అవసరం ఉంటుంది. చిరాభ్యాస ఫలంగా సౌభాగ్యవశంగా పూర్ణబ్రహ్మాకార వృత్తి లభిస్తుంది. అవిద్య నశిస్తుంది. అప్పుడాతడు తనను తాను సర్వత్రా అవలోకించగలుగుతాడు. అట్టి ఐక్యతావలోకనమునే శాస్త్రములు 'ఆత్మప్రాప్తి' అని 'మోక్షము' అని, 'మనోవాక్ అగోచర స్వస్థితి’ అని, ‘శివైక్యము' అని 'శివసాన్నిధ్యము' అని చెప్పుచున్నాయి.
ఒకడు అపరిశుభ్రమగు అరచేతులను పరిశుభ్రపరచడానికి బొగ్గుపొడిని తెచ్చి రుద్ది, ఆపై శుభ్రమగు నీటిలో ఉభయమురుకులను తొలగించి శుభ్రపరుస్తున్నాడు కదా! శాస్త్ర, సత్సాంగత్యాది సాత్విక అవిద్యాంశతో అంతరంగంలోని రాజసిక, తామసిక అవిద్యాంశను తొలగించి, 'విచారణ’ అను ప్రయత్నమనే మనస్సును జతచేర్చి ప్రయత్నం కొనసాగిస్తుంటే... ఆ పై క్రమంగా అన్ని విధాల అవిద్యాంశను తొలగించటం జరుగగలదు. అప్పుడు స్వయం ప్రకాశకమగు ఆత్మ ఒక్కటే నిర్మలమై ప్రకాశిస్తుంది. అట్టి నిర్మలమగు ఆత్మయే నీ యొక్క నా యొక్క, తదితర సర్వజీవులయొక్క వాస్తవ స్వరూపం. చిత్రమేమిటంటే... ఆత్మయే ఆత్మవలన ఆత్మగురించి ఆత్మవిచారణ మొనర్చుచున్నది. చివరకి తాను ఆత్మగానే శేషించుచున్నది. అంతేగాని ఒకటినుండి మరొకటేదో ఎప్పుడో బయల్వెడలటం లేదు, ప్రవేశించుటలేదు. ఇక ఇందు "బుద్ధి-మనస్సు వాటి వృత్తులు” మొదలైన అవిద్యకు ప్రమేయం ఏమున్నది చెప్పు? కనుక "అవిద్యాక్షయమే ఆత్మరూప సుస్థిరత” అని నిత్యానిత్య వివేకులు స్పష్టాతి స్పష్టముగా ఎరిగియే ఉన్నారు.
సంకల్ప పరంపరలు ఉన్నంతవరకూ ఆత్మ తెలియబడజాలకున్నదని చెప్పవలసివస్తోంది. అయితే గురూపదేశములు, శాస్త్ర పఠనం, శాస్త్ర ప్రతిపాదిత నియమాదుల అనుసరణం... ఇవన్నీ దుస్సంకల్పములతో ఆవరించబడినట్టి ఈ జీవుని సత్ సంకల్పములవైపు మరల్చుచున్నాయి. సత్ సంకల్పములు మోహరాహిత్యమునకు, నిశ్చలత్వానికి... ఆపై క్రమంగా ఆత్మానుభవానికి దారి తీస్తున్నాయి. గురూపదేశాదులు స్వయంగా తామే ఆత్మానుభవం అవటం లేదు. ఎందుకంటావా? 'గురూపదేశాదుల ద్వారా ఆత్మజ్ఞానం పొందుదును గాక'... అని సంకల్పించునది ఇంద్రియ సమష్టి ద్వారానే కదా! కానీ పరబ్రహ్మమో, ఈ ఇంద్రియములన్నిటికి కూడా అతీతమై ఆ ప్రయత్నించు వాడే అయి ఉన్నదని ఏమరవకుండబడుగాక! ఈ ఇంద్రియ విషయములన్నీ తిరస్కరించబడగా అప్పటికీ ప్రకాశించుచున్నది అది. కనుక గురూపదేశాదులు సహకారిక కారణాలు మాత్రమే. ఆత్మ పదప్రాప్తికి అసలైన కారణం ఆత్మ వస్తువే. సర్వకారణ కారణం ఆత్మయే.
యద్వస్తుః యత్యేప్రాప్తం తత్తస్మిన్ సతి నావాప్యతే ||
ఏ అవిద్య లేకున్నప్పుడు మాత్రమే సత్యవస్తువు లభిస్తుందో ... అట్టి అవిద్య మిగిలి ఉండగా ఆత్మ ఎట్లు అనుభూతమౌతుంది చెప్పు?
❖
Page:142
కనుక సాధకభక్తజనులకు నేను గుర్తు చేస్తున్నదేమిటంటే... వారి సాధనల యొక్క అంతిమ సాధ్యము వారి ఆత్మయే అయున్నది. ఆత్మ సర్వదా నిత్యము, స్వయం ప్రకాశకము, అఖండము, అప్రమేయము అయి ఉన్నది.
ఒకావిడ పండుగరోజు పెట్టిలోంచి బంగారపు గొలుసు తీసి ధరించింది. కొద్దిసేపైన తరువాత ఆ విషయం మరచి ఏమరు పాటుగా పెట్టె తెరచి ఆ బంగారు గొలుసు వెతకటం ప్రారంభించింది. కనపడలేదు. ఇల్లంతా వెతుకుతూనే ఉన్నది. దుఃఖిస్తోంది. మరల మరల, మూల మూలలా వెతికి వెతికి నీరసంగా చతికిలపడి రోదిస్తోంది. ఇంతలో కాకతాళీయంగా ఆ పక్కింటావిడ వచ్చి 'ఒదినగారూ! మీ మెడలో గొలుసు చాలా బాగున్నదండీ !' అని పలకరించింది. వెంటనే ఆ ఇల్లాలు, “అయ్యో దాని కోసమేనండీ, ఈ ఏడుపు. అది కనబడటం లేదు!" అని గొల్లున ఏడవసాగింది. అప్పుడా పక్కింటామె, “అదేమిటండీ? మీ మెడలోనే ఉన్నది కదా” ... అనగానే ఆ ఇల్లాలు మెడ తడిమి చూచు కుని ‘అరె ! ఈ గొలుసు ఇక్కడే ఉన్నదా!' అని మహదానందపడి ఆ ప్రక్కింటామెకు సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకున్నది. శిష్యుడు సద్గురువుకు కృతజ్ఞతలు చెప్పుకోవటం ఇటువంటిదే సుమా!
ఈ సంఘటనలో "ప్రక్కింటావిడ వచ్చి గొలుసు ఇచ్చింది" అని అనటం సమంజసమా! అట్లాగే గురూపదేశాదులు ఆత్మవస్తువును ప్రసాదించుట లేదు. 'ఆత్మ - ఆత్మజ్ఞానం' కూడా ప్రతి జీవుని యందు స్వతఃగా సర్వదా ఉండియే ఉన్నాయి. అయితే గురూపదేశ, శాస్త్రానుకరణాదులు ఆత్మజ్ఞాన ప్రాప్తికి మహత్తరమైన సహకారం అందిస్తున్నాయనుటలో సందేహం లేదు.
శిష్యుని అజ్ఞాన వినాశనము కొరకే గురూపదేశాలు అవసరమగుచున్నాయి. అజ్ఞాన ఆవరణ నశించిందా - అంతవరకూ అనిర్దేశ్యమూ, అదృశ్యమూ అయున్న ఆత్మ శివుడు ప్రసన్నుడై తన యందు, సర్వమునందూ అనుభవమగుచున్నాడు. శాస్త్రములు, గురుప్రవచనములు ఆత్మను విశదీ కరిస్తున్నాయే గాని, ఆత్మను క్రొత్తగా ప్రతిపాదించుట లేదు. ప్రసాదించుట లేదు. ఆత్మానుభవమనేది శిష్యుని (సాధకుని) అంతరంగ అనుభవస్థితియే గాని అది మరొకరు ఎక్కడి నుండో ప్రసాదించగలిగేది కాదు. గురువే స్వయంగా ఆత్మానుభవం ప్రసాదించగలిగితే ఇక, ఒక ఉత్తమ గురువు యొక్క శిష్యులందరూ ఆత్మానుభవం పొందాలి కదా? పొందుచున్నారా? కొందరు మాత్రమే పరమోన్నతమైన అఖండానుభూతి పొందుచున్నారేం? అది శాస్త్రముల గురువుల లోపం కాదు. సాధకుని లక్ష్యశుద్ధికి అద్దానిని ఆపాదించక తప్పదు. బడిలో ఒకే ఉపాధ్యాయునిచే బోధింపబడే విద్యార్థులలో ఉత్తమ
మధ్యమ - అధములు ఉన్నట్లే, శాస్త్రకారులు ప్రవచిస్తున్న స్వయంప్రకాశిక స్వస్వరూపాత్మ కథనం విషయంలో కూడా! వారివారి శ్రద్ధ హృదయ నైర్మల్యములను అనుసరించి ఉత్తమ - మధ్యమ - - అధమ అవగాహనలతో కూడిన శిష్యులు లేక సాధకులు ఉంటూ ఉంటారు.
కాబట్టి ఆత్మ స్వయముగా స్వయంబోధ వలననే గ్రహించబడుతోంది.
అది అట్లుండగా కూడా, గురూపదేశ - శాస్త్రార్థ విచారణలు లేకపోతే ఆత్మబోధ సులభంగా లభించటం లేదు. వాటి సంయోగము వలననే ఆత్మబోధ జీవులకు సుసాధ్యమగుచున్నది. అది
Page:143
దృష్టిలో పెట్టుకొనే సృష్టికర్తయగు బ్రహ్మ భగవానుడు నిన్ను నియమించి ఉన్నారు. లోక కళ్యాణార్థమై
నేనీ సమాచారం నీకు అందించటం అందుకే జరుగుతోంది.
మరొక దృష్టాంతం చెపుతాను ...విను. సూర్యుని కాంతిలో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. అయితే ఆ కనబడే వాటిని గుర్తించే వాడెవడు? నీవే కదా! పగటివేళ సూర్యకాంతిలో జనులు వస్తువులు గుర్తిస్తున్నట్లే... 'గురు శాస్త్రార్థ నిరంతర సంయోగం" అను వెలుగులో ఆత్మానుభూతి సంతరించుకోవలసింది సాధకుడే సుమా!
17. గురువులు
ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటికి సంబంధించిన సుఖ దుఃఖాలు... వీటి నన్నిటినీ దాటి వేయగా, అప్పటి అతీత దృష్టికి ఇంకా శేషించి ఉండేదేమిటో ...అదియే "శివుడు - తత్ - సత్ - ఆత్మ - స్వస్వరూపము” మొదలైన శాస్త్రీయ నామాలతో వ్యవహరించబడుతోంది. ఇక ఈ జాగ్రత్ స్వప్నాదులంటావా? దీనిని మాయగా దర్శిస్తున్నప్పుడు 'ఇది లేనే లేదు' అని తెలియవస్తోంది. ఆత్మగా దర్శించామా ... ఇది ‘నిత్యసత్త'గా అనుభవం కాగలదు. ఆత్మ ఆకాశము కంటే నిర్మలం. అంతే కాకుండా "అది అనుభూతిపరునికంటే వేరే ఏదో కాదు” అని గ్రహించు. “అది అనంతము, అనిర్దేశము. అదొక్కటే సత్ ... మిగతాదంతా అసత్" అనునది సునిర్ణయమై ఉన్నది.
శిష్యుల మనో అవగాహన స్థితులను అనుసరించి వారికి మార్గమును చూపటానికి గాను వివిధ తరగతులకు సంబంధించిన గురువులు ఉండటం జరుగుతోంది. వారిని మూడు విధములుగా విభజించవచ్చు1. కేవల తాత్త్విక గురువులు : వీరు విశుద్ధమగు ఆత్మైక్యమును ప్రతిపాదించుచున్నారు. 'సాక్షాత్ తత్త్వమ్ అసి” అను వాక్యార్థముచే మహత్తరమగు ఉత్కృష్ట సత్యము వీరిచే బోధింప బడుతోంది. వారు స్వయముగా విచిత్రమగు ఈ జగత్తును విశుద్ధమగు తత్త్వమును ఐక్యమొనర్చి ఆత్మస్వరూపమునను సుస్పష్టపరచుచున్నారు. ఆ అనుభవమును శిష్యులకు అందించ ప్రయత్నిస్తున్నారు.
2. పండిత గురువులు : వీరు సత్యాసత్య విమర్శకు చెందిన వాఙ్మయమును, సంవిధానములను కల్పనచేసి శిష్యులకు జీవన్ముక్తత్వ మార్గంలో సహకరిస్తున్నారు. వీరు అనేక సిద్దాంతములను ప్రతిపాదిస్తూ శిష్యులను పరమార్థమునకు కడు దగ్గరగా కొనిపోవుచున్నారు. విధి-విధానములను రచించి సాధన మార్గమును అందిస్తున్నారు. “ఈ జగత్తు అసత్యము, బ్రహ్మమే సత్యము” అను అవగాహనను పెంపొందించ ప్రయత్నిస్తున్నారు.
3. ప్రతిపాదన గురువులు : వీరు ఈశ్వరునకు అనేక గుణములను, నామ రూపములను ఆపాదించి, చిత్ర - - విచిత్ర కథనములను కల్పించి శిష్యులను ఉపాసకులుగా తీర్చిదిద్దుతున్నారు.
Page:144
అనేక గుణములను, సంగతులను రచించి ఉపాసకుల దృష్టిని దృశ్యము నుండి మరల్చి ఉత్తమ సాధకులుగా మలుస్తున్నారు. చిన్న పిల్లలకు కథలు కల్పించి చెప్పి వారిని అల్లరి నుండి మరల్చి చదువుకోవటానికి సిద్ధం చేస్తాం చూచావా? వీరు కూడా నామరూపాతీతమగు ఆత్మతత్త్వమునకు నామరూపములు కల్పనచేసి అందిస్తున్నారు. “అవిద్యాంశ” సహాయంతో అవిద్యను తొలగించు యత్నము చేయుచున్నారు.
ఈ ముగ్గురు బోధకులు మహనీయులే. ఎందుకంటే అవిద్యా సముద్రంలో కొట్టుకుపోతున్న జీవులను వీరు ఆదుకుని జ్ఞాన - - విచారణ విచారణ - సన్మార్గము వైపుగా నడిపిస్తున్నారు కదా!.
అయితే సర్వ విద్యల యొక్క అంతిమ ప్రయోజనం ఆత్మతత్త్వమే. ఈ జీవుడు తన్ను తాను ఎరిగినప్పుడు బోధకుల రచనలన్నీ ప్రయోజనం పొందినవై ఇక ఉపశమిస్తాయి. ఆత్మతత్త్వమే అత్యాంతికమైన సారం.
ఇది గ్రహించి జనులు చింతారహితులయ్యెదరు గాక! ఈ లోకంలో తత్త్వవేత్తలు అనేకులు ఉన్నారు. ఎచ్చటైతే మా వంటి దేవతలు కూడా భృత్యులై ఉంటారో ... అట్టి పరమపదమును కూలంకషంగా ఎరిగి అఖండ - - అప్రమేయ - నిత్య - సర్వాతీత - సర్వసమన్విత స్వభావమునందు ఆ తత్త్వవేత్తలు ప్రతిష్ఠితులై ఉన్నారు.
18. జగత్తుకు మూలం భావనయే!
శ్రీవసిష్ఠ మహర్షి : హే భక్తవశంకరా! ఈ జగత్తు అనబడేది ఆత్మయందు వాస్తవానికి లేదు. అయినాకూడా ఉన్నట్లుగా భ్రమింపజేస్తోంది. ఇది ఎట్లా జరుగుతోంది?
శ్రీశివ భగవానుడు : బిడ్డా ! "బ్రహ్మము - శివము - - దైవము - భగవాన్ - తత్త్వము - విష్ణు”... మొదలైన అనేక శబ్దములచే చెప్పబడుచున్న అర్థమగు వస్తువు ఒక్కటే.
అది చిత్తు (ఎఱుక) అయి ఉన్నది. ఇందులో సంశయం పెట్టుకోవలసిన ఆగత్యం ఏమాత్రమూ లేదు. అట్టి శుద్ధచిత్ గురించి ఏమని చెప్పాలి? ఎట్లా చెప్పాలి? ఆకాశం అనేది పంచభూతాలలో ఒకటి కదా! అది ఊహకే అందదు. అంతటి సూక్ష్మభూతమగు ఆకాశం కూడా ఆ ఏకైక చిద్వస్తువు ముందు కొండంత ఘనీభూతమని గ్రహించు. అది నాయందు, నీయందు తదితర సర్వజీవులయందు సర్వదా సమరసభావమున నెలకొని ఉన్నది. "తెలుసుకొనుచున్నవాడు” అను రూపమున వెలయుచున్న ఆ చిత్తు ఒకానొకప్పుడు “తెలియబడుచున్నది ... చేత్యము”గా స్వయంగా అగుచున్నది. ఒకడు తన స్వప్నంలో ఎక్కడో ఉన్న గ్రామం ప్రవేశించి అక్కడి జనులతో ఒకడిగా నివసించుచున్నట్లు... చైతన్యము “తెలుసుకొనుచున్నాను” అను భావనద్వారా అహంభావమును అనుసరించుచున్నది. అట్టి 'అహం' కల్పన నుండి క్రమంగా దేశకాల కల్పనలు ఉదయిస్తున్నాయి. శూన్యరూపముగ అట్టి తత్సంబంధిత శతాధిక కల్పనలన్నీ అహంభావమునకు మిత్రులగుచున్నాయి. అహంభావము
Page:145
స్పంద విజ్ఞానమును సంపాదించుకుని క్రమంగా ప్రాణస్పందనమును పొంది 'జీవశక్తి' అను పేరును పొందుచున్నది. ఆ జీవశక్తి “నేను” అను నిశ్చయం చేసుకొని అజ్ఞాన మార్గమున నిలబడు చున్నది. ఆ జీవశక్తిలో శబ్దశక్తులు, జ్ఞానశక్తులు, క్రియాశక్తులు ఏర్పడి తమతమ రూపములను విస్తరింపజేసుకుని ఈ జగత్తు అనబడు దానిని కల్పించుకుంటున్నాయి. ఈ శక్తులన్నీ సంకల్పము, స్మృతి అను రెండింటితో కూడి "అపంచీకృతమగు మనస్సు” అను సంజ్ఞను పొందుచున్నాయి. పండితులు ఈ మనస్సును ఆత్మరాజుయొక్క బాహ్య కవచముగా చెబుతూ ఉంటారు.
ఈ మనస్సు అంతస్థమగు బ్రహ్మశక్తితో కూడుకుని "జ్ఞాత” అని పిలువబడుతోంది. ‘జ్ఞాతృత్వము’ అనబడేది ఆత్మయొక్క స్వయంప్రకాశ శక్తివలననే కలుగుతోంది. అట్టి సందర్భంలో చైతన్యము కొన్ని శక్తులు ప్రకటిస్తోంది. ఆ శక్తులు అంతస్థమగు కల్పనావ్యవస్థ నుండి బహిర్గతమై బాహ్యమున ప్రకటనమగుచున్నాయి. కనుక 'జగత్తు' అనునది చిత్ స్వరూపజీవుని స్వయంకల్పిత భావాభావ స్వరూపమే అయున్నది.
దృశ్య ప్రపంచం
1. వాయుసత్త స్పందసత్త
2. స్పర్శసత్త త్వక్సత్త
3. తేజసతా రూపసత్త
4. జలసత్త స్వాదుసత్త
5.రససత్త గంధసత్త
6.భూమిసత్త ఖనిజసత్త
7.జగత్సత్త దేశసత్త
8. కాలసత్త పరిణామసత్త
బీజము పుష్ప ఫల శాఖాది అనేక తత్త్వములు తనయందు నిశ్శబ్దంగా దాచుకుని ఉంటుంది చూచావా? మనస్సు కూడా ఆకారవర్జితములగు ఈ సత్తలన్నీ తనకు అభిన్నమైన రూపంలో తన యందు నిక్షిప్తం చేసుకొని దేశ కాలానుగతంగా బాహ్యమున అనుభవరూపంలో పొందుతోంది.
అపరిచ్ఛిన్న బోధ స్వరూపమగు బ్రహ్మమే పై 8 విధముల స్ఫురిస్తూ "పుర్యష్టకం” అని అనిపించుకుంటోంది. అంతమాత్రం చేత ఆ బ్రహ్మం తన యొక్క స్వస్థితిని కోల్పోతోందని మాత్రం భ్రమించవద్దు. ఎందుచేతనంటావా? అజ్ఞానదృష్టికి పరిణామం, పర్యవసానాలు తోచుచుండవచ్చు గాక! తత్త్వదృష్టికి మాత్రం అవన్నీ అసంపన్నములగు విషయములే,
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తు అనబడేది అసలు ఏదై ఉన్నది?
శ్రీశివ భగవానుడు : ఇది జ్ఞానరూపము కాదు. జ్ఞేయరూపము కూడా కాదు. ఇది చిదా భాసము నందలి చేతనం అని కూడా అనలేం. శాస్త్రములు ఈ జగత్తుకు 'మాయ' అనే బిరుదును ప్రసాదించాయి ...ఇది స్వతహాగా లేదు. అయితే భావనను ఆశ్రయించి అనుభూతం అవుతోంది. సముద్రమునకు
Page:146
ఆధారం జలమే కదా! ఆ జలం కెరటములు, మంచు మొదలైన మరెన్నో విలాసములతో తోచుచున్నది. అట్లాగే పరబ్రహ్మమునందు పుర్యష్టకం సత్స్వరూపమున గోచరిస్తోంది. కారణం? భావనాపర్యవసానమే!
ఈ దృశ్యప్రపంచము ఆత్మ చైతన్యదృష్టితో పరికించి చూచినవారికి ఇందు కనబడే సర్వమూ సంవిదాత్మ (సత్ (ఉనికి) + విత్ (ఎఱుక) + ఆత్మస్వరూపంగా ) స్వరూపముగా కన్పట్టగలదు. ఈ సర్వము సంకల్పనగరం వలె, పరిజ్ఞాతమగుచుండవచ్చుగాక! సత్యము గ్రహించువారికి ఇదంతా శివభావము పొందుతోంది.
గ్రహింపబడినప్పుడే ఇదంతా ఉన్నది. అజ్ఞాతమై తెలియబడనప్పుడు ఇది వస్తువే కాదుకదా! కాబట్టి 'దృశ్యం స్వతహాగా లేదు. కాని సంకల్పించబడుచున్న కారణంగా ఉన్నట్లు తోచుచున్నది' అని సమీక్షించవలసి వస్తోంది. జ్ఞాన దృష్టిచే ఈ జీవుడు “ఈ జగత్తు నా యొక్క చిదానందరూప చమత్కారమే" అని గ్రహిస్తున్నాడు.
శ్రీవసిష్ఠ మహర్షి : చిన్మాత్ర స్వభావమగు ఆత్మ వస్తువు తనంతటతాను తన యందు దృశ్యభావమును పొందుచున్నది' అని ఈ జగత్తును నిర్వచించవచ్చునా?
శ్రీశివ భగవానుడు : ఆత్మ యొక్క ఒకానొక విభాగమునందు భావనారూపమైన శబ్ద - స్పర్శాది అనుభవ స్వరూపమైన తన్మాత్రసత్త ఏర్పడి ఉంటోంది. అదియే ఆత్మ యొక్క సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మశరీరముచే ఈ స్థూలమైనదంతా ఆత్మ చేతనే దర్శించబడుచున్నదని శాస్త్ర ప్రవచనం. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ జగత్తంతా ఆత్మ యొక్క సంకల్ప- వికల్పముల స్వరూపం మాత్రమే. కనుక మిథ్యయే కదా!
బ్రహ్మము తన యందు సూక్ష్మ - - స్థూలభావములను కల్పించుకొని దేనినైతే పొందుతోందో ...అదియే ఈ స్థూలజగత్తుకు మూలకారణం. ఆత్మయందు 'నేను స్థూలమునకు సంబంధించిన వాడను’ అను అభిప్రాయం రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే జగత్తు యొక్క అనుభూతి, అనుభవములు రూపం పొందటం జరుగుతోంది. అప్పుడు కళ్ళు మొదలైన ఇంద్రియార్ధములు ఆయా కల్పిత విషయాలు గాంచుచున్నాయి. ఆ తరువాత క్రమంగా 'నేను పురుషుడను' అని సంకల్పించుకుని కాకతాళీయంగా జీవరూపం ధరించి 'అమ్మయ్య' అనుకుంటోంది. క్రమంగా కలకంటున్న మనిషి వలె స్థూలదేహము నుండి ఈ దృశ్య స్థూల విషయములలో ప్రవేశించి తన సుఖ దుఃఖములన్నీ తనకు తానే నిర్వచించుకుంటోంది. ఆ సుఖ దుఃఖ, సామాన్య ప్రత్యేక విషయ సమూహమునకే ‘జగత్తు' అని పేరు.
శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ! సాంబసదాశివా! మీరు చెప్పినట్లు దృశ్యజగత్తు స్వప్నసదృశమే అయి ఉండవచ్చు గాక! మొత్తం మీద ఇది జీవునకు దుఃఖ భాజకమౌతోందని అనటంలో సందేహం లేదు. దుఃఖ క్షయం అవటానికి ఉపాయాలు అత్యవసరమైయున్నాయి.
శ్రీశివ భగవానుడు : అందుచేతనే కదా, మన ఈ సంవాదం ! లోకగురువై నీవు తత్త్వశాస్త్ర ప్రబోధ నిర్వర్తించవలసి ఉన్నదయ్యా!
Page:147
అనేకసార్లు 'కావలెను, పొందవలెను, చేరవలెను' ...అను రూపములో ఉండే అధ్యాసలచే జీవుడు వర్తమాన స్వస్థితి నుండి చ్యుతుడౌతున్నాడు. సంకల్పపరంపరలకు ఉద్యమిస్తున్న తరుణంలో వాసనలు రూపుదిద్దుకుంటున్నాయి. అట్టి అంతరంగవాసనలే సర్వదుఃఖములకూ మూలం.
ఈ జగత్తు ఒకని దృష్టిలో ఉన్నదా? ... అయితే ఆతని వాసనలే ఆ జగదనుభవానికి మూల కారణం. 'ఎండమావులు' అని ఎరుగబడిన తరువాత ఆ ఎండమావులలోని జలం ఇక భ్రమింప జేయదు కదా! అట్లాగే, ఈ జగత్తు స్వకల్పనా మాత్రంగా, స్వవాసనానుసారంగా ప్రతిఫలించే అనుభూతి, అనుభవ చమత్కారంగా సుస్పష్టమైతే... ఇకప్పుడు అట్టి ఈ జగత్తు ఎవ్వరిని దుఃఖింప జేయగలదు చెప్పు?
స్వప్నంలో చూచిన పదార్దములు నిదురలేవగానే కనబడటం లేదని ఒక బాలుడు మారాం చేస్తూ ఉంటే ఆ బాలుడికి ఏం చెబుతాం? 'నాయనా అవన్నీ కల్పితమాత్రములు, ఊహా జనితములు. అవి వాస్తవం కాదు' అనునదే వాస్తవమైన సమాధానం కదా! ఈ జగద్విషయములు ఆత్మ యందు అట్టివే! ఈ పదార్థానుభవములలో స్వప్నత్వమే ఉన్నది కాని, సత్యము లేదను ఎరుకయే వీటిని
జయించటం సుమా!
‘చూచువాడు, మనస్సు, మనన ధర్మము, అహంభావం చేత అనుభవమగుచున్న ఈ జగత్తు’ ... ఇవన్నీ లయిస్తే, అప్పుడు, సన్మాత్రయుతమగు పరబ్రహ్మమొక్కటే పరిదృష్టమై అనుభూతమౌతుంది. యత్ర నో వాసనా నైవ వాసకో నైవ వాస్యతా |
కేవలం కేవలీభావః సంశాన్తకలనభ్రమః || (శ్లో 55, సర్గ 41)
ఎద్దానిలో అయితే 'వాసనలు, కోరబడునవి, కోరువాడు' అనునవన్నీ మూగబోయి అర్థ రహితత్వమును సంతరించుకుని ఉంటున్నాయో ... అయ్యదియే కేవలీభావం. అట్టి కేవలీభావమును ఆశ్రయించి ఉండటం కైవల్యం. అట్టి కైవల్యమొక్కటే సర్వదుఃఖములు శమించగల చోటు.
కుమారా! ఈ జగత్తు సత్యమవనీ! అసత్యమవనీ! కల్పనను తొలగిస్తే మరుక్షణం ఇక్కడ ఏమీ మిగలదు. జగత్తు తొలగితే ఇక దుఃఖమునకు కారణమేముంటుంది? ఊహామాత్రమగు బేతాళకల్పన వలె ఈ జగత్తు భ్రమింపజేస్తోందేకాని, ఇది ఆత్మవస్తువును ఆక్రమించగలిగినది కాదు, అతిక్రమించ జాలదు. స్వకీయ కల్పనచే ఏర్పడిన భ్రమ తొలగిందా ... ఇక ఈ జీవునకు అక్షయమైన శాంతి లభించ గలదు. ఏ జీవుడైతే ఈ జగత్తుపై, అహంకారంపై 'ఇవి సత్యమైనవే' అను నమ్మిక కలిగి ఉన్నాడో ...ఆతనికి బోధించటమెట్లాగో నాకు తెలియదు.
అందుచేత తత్త్వవేత్తలు వివేకవంతునికి మాత్రమే ఉపదేశం చేయగలుగుతారు. బహువిధములైన భ్రమలందు చిక్కి, మిథ్యయగు దేహములందు అభిమానము కలవారై మూర్ఖత్వము వహించేవారికి ఇక గురూపదేశం ఎట్లా చేయటం? అట్టి వానికి బోధించటం ఒకడు స్వప్నంలో కనిపించిన కుమార్తెకు జాగ్రత్లో సంబంధం వెతకటం వంటిది. అట్టి వారి పట్ల తత్త్వబోధ నిష్ప్రయోజనమై, వ్యర్థమై వాదప్రతివాదనలతో ముగుస్తోంది.
Page:148
19. దృష్టియే సృష్టి
శ్రీవసిష్ఠ మహర్షి : హే భగవాన్ ! ఇంతకుముందు 'ఈ జీవుడు నిష్కారణంగా దేహభ్రమను (ఈ దేహమే నేను. దేహపరిమితుడను - అనురూపంగా ఏర్పడే భ్రాంతిని) గాంచుచున్నాడు'... అని చెప్పారు కదా! సృష్ట్యాదిలో చిదాకాశస్వరూపుడగు ఈ జీవుడు ఈ దేహస్థితిని ఎట్లు కొనితెచ్చు కుంటున్నాడు? దాని మర్మమేమిటి?
శ్రీశివ భగవానుడు : ఒకడు స్వప్నం కల్పించుకుని అందులో ప్రవేశించి, ఆ స్వప్నంలో వస్తువులను, దేహములను, సంఘటనలను గాంచుచున్నాడేఁ! అదేవిధంగా, ఈ జీవుడు 'తానే' అయున్న పరబ్రహ్మం నుండి తనకుతానే భావనాజగత్తును కల్పించుకొని, ఆ కల్పిత భావనాప్రదేశంలో ప్రవేశించి, ఆ తరువాత ఈ అనేక జగత్తులను గాంచుచున్నాడు. చిన్మయబ్రహ్మం సర్వవ్యాపి కదా! స్వప్నంలో దూర ప్రాంతం వెళ్ళి అనేక పనులు చేసివస్తున్నట్లు ఈ జీవుడు దేహధారి అయి అనుక్షణం ఆకాశాదులకు సంబంధించిన అనేక భావపరంపరలను ఆస్వాదిస్తున్నాడు. అతడు ఆ మార్గంలో పయనిస్తూ... తన స్వరూపమేమిటో తానే ఏమరుచుచున్నాడు. నామరూపరహితుడై ఉండి కూడా ఇక్కడి నామ రూపములను తనపై ఆపాదించుకొనుచున్నాడు. 'నేను అవ్యక్తము... అనిర్దేశము అగు సనాతనుడను కదా' ...అనే అనుభవం ఏమరచి 'నేను నిన్న-మొన్న ఈ దేహంలో పుట్టాను. దీనితోనే ఏదో అగుచున్నాను. ఎటకో పోతున్నాను' అని సంకుచితభావనను స్వీకరించి ఉంటున్నాడు. ప్రప్రథమమున సమష్ఠికల్పనా స్వరూపుడై, హిరణ్యగర్భుడై ఇక తదితరమైన వ్యవహారమంతటికీ కారణభూతుడగు చున్నాడు. అనగా, “నాలోని ఒకానొక సంకల్పిత స్వస్వరూపమే సృష్టికర్తయగు హిరణ్యగర్భుడు కూడా” - అని గ్రహించు. ఈ సంకల్పమయములైన పదార్థములు, విశేషములు అన్నీ ‘బూచి’ అను శబ్దంలాగా శూన్యమాత్రములే అయినప్పటికీ అజ్ఞానదృష్టికి సత్యమువలె గోచరిస్తున్నాయి.
ఇట్లు ప్రప్రథమున ఏర్పడిన జలంలోని ప్రథమతరంగం వంటి 'అహం' భావన నుండి తదితర జగత్తు ఏర్పడుతోంది. అదియే సృష్ట్యాది.
ప్రథమ సంకల్పమే ప్రథమ పురుషుడు. ఆతడు తన సృష్టికి తానే ద్రష్టయగుచున్నాడు. క్రీనీడ వంటి తన ద్వితీయ స్వరూపము యొక్క పరిచయంచే చిదాకాశమాత్రమగు స్వస్వరూపము యొక్క విస్మృతిచే అనంత సంసారముగా ఏర్పడుచున్నాడు.
నిమేష ఏవ కల్పో యో మహాకల్పపరమ్పరామ్ । ప్రతిభాసవిపర్యాసమాత్రేణానుభవత్యలమ్ ॥ (శ్లో 10, సర్గ 42)
కల్పనాపటుత్వ సమర్థుడగు ఆతడు ప్రతిభాస యొక్క విపర్యయమును అనుసరించి నిమేష కాలంలో మహాకల్ప పరంపరలను అనుభవించుచున్నాడు.
అంతేకాదు ... ప్రతి పరమాణువు నందు, ప్రతి ఆకాశ విభాగమునందు ప్రతిక్షణంలోనూ సృష్టి, మహాసృష్టి, కల్ప, మహాకల్ప, భావ - అభావాలు నిరంతరం ఉదయిస్తూనే ఉన్నాయి. వాసనా
Page:149
సామాన్యము అనుసరించి ఈ అనేక సృష్టులు కొందరు జీవులకు సమాన రూపములుగా కనబడు చున్నాయి. అట్టి ఈ సృష్టులందు స్వసంస్కార కారణంగా ఎవరెవరైతే అంతర్గతులగుచున్నారో... వారి వారికి ఆ సంస్కారములను అనుసరించి ఇవన్నీ వివిధ రూపములుగా కన్పట్టుచున్నాయి.
ఇక సదాత్మక దృష్టి కలవారికి ఈ సృష్టులన్నీ శూన్యమాత్రంగా తెలియవస్తున్నాయి. పరమవ్యోమమగు శివము నందు ఇవన్నీ వాస్తవానికి లేనే లేవు. అద్దాని యందు ఇవి స్వస్వరూపాకాశత్వమే పొందుచున్నాయి. కలలో ఒక పెద్ద కొండను చూచి ఎక్కనారంభించావనుకో ...అనేక శ్రమలకు, భయములకు లోనగుచున్నావనుకో...నిదుర లేవగానే ఆ కొండ, ఆ శ్రమ, ఆ భయం ఏమౌతున్నాయి? మటుమాయమై రహితం (శూన్యం) అవుతున్నాయి కదా! అట్లాగే అజ్ఞానం తొలగిన మరుక్షణం ఈ అసత్ - సత్ రూపములగు సృష్టులన్నీ మటుమాయమై పోతున్నాయి. ‘ప్రథమ సృష్టికర్త నుండి పురుగువరకు సృష్టులన్నీ ఎట్టి దేశకాలములను ఆక్రమించుకొని ఉండనే లేదు’ ...అనే విషయం అప్పుడే తేటతెల్లమౌతోంది.
ఈ సృష్టి పరంపరలన్నీ స్వతఃగా ఆత్మ స్వరూపములే కదా! కనుక వాటికి 'కల్పించబడిన సత్త’ అనునది ఏదీ లేదు. 'క్షణికసత్త' కూడా లేదు. అవన్నీ జనించుట లేదు. నశించుట లేదు. శ్రీవసిష్ఠ మహర్షి : మరిదంతా?
శ్రీశివ భగవానుడు : (చిరునవ్వు చిందిస్తూ) చైతన్యమే తనయందు తాను సంకల్పరూపమున ఈ విస్తార ప్రపంచవైచిత్ర్యమును విస్తరింపజేసుకుంటోందని చెప్పాను కదా! స్వప్నంలో కనిపించే ఒక నగరంలాగా ఇవన్నీ పుట్టుచూ గిట్టుచున్నాయి. స్వప్నంలో ఎదురుగా కనిపించే పెద్ద కొండ కదల్చటం అసాధ్యమైనట్లు ఘనీభూతమై అగుపించవచ్చు గాక! కానీ, అది స్వప్న స్వభావమును అధిగమించి ఉండజాలదు కదా! అట్లాగే ఈ జగత్తు కూడా దేశకాలముచే పరిపుష్టమై అగుపించవచ్చు గాక! ఈ జగత్తు ద్రష్ట యొక్క సంస్కారములను అనుసరించి సంస్కార పరిమిత మాత్రమై ఉంటోంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అనుభూతమౌతోంది. ఒకనికి సుందరముగా తోచువ్యక్తిగాని, వస్తువుగాని మరొకరికి తద్వ్యతిరిక్తంగా ఉంటోంది. ఒకనికి సామాన్యమైనట్లు తోచే ఒక వస్తువో, సంఘటనయో మరొకరికి మహత్తరమైన దానివలె అనుభూతమౌతోంది. ఇక ఇందులో ఏది సత్యం? ఏది కాదు? వస్తువులు, వ్యక్తులు లాగానే దేశకాలములు కూడా భావనామాత్రములై, భావనను ఆశ్రయించి, అనుసరించి ఉంటున్నాయి. జీవభావం ఉత్పన్నమైన క్షణం నుండి ఈ కార్యక్రమములన్నీ జన్మ-జీవన్-మృత్యువు లతో సహా ఇట్లే జరుగుచున్నాయి. కీటకం మొదలైన క్షుద్రజీవుల నుండి సర్వసృష్టికర్త యగు బ్రహ్మదేవుని వరకు సర్వజన్మ-కర్మలూ సంకల్పములను అనుసరించే, సంకల్పం చేతనే ఏర్పడు చున్నాయి. ఈ జగత్తు యొక్క అంతర్గతమైన కారణం సంకల్పమే. ఈ సృష్టిలో కొన్ని విషయములు పరమాణు ప్రమాణములు. మరికొన్ని విషయములు మహాప్రమాణములుగా ఉన్నాయి కదా! ఆ భేదం కూడా సంకల్పము చేతనే ఏర్పరుచబడుచున్నది. గతించిన, గతిస్తున్న, గతించబోవుచున్న సృష్టులన్నీ సంకల్ప మాత్రాలేనయ్యా!
∞
Page:150
ఏది ఏమైనా పరమార్థసాక్షాత్కారము వలన ఈ సంసార వైచిత్రములన్నీ తప్పక నశించగలవు. ఇందేమీ సందేహం లేదు. దృష్టియే సృష్టి. దృష్టి పరమాత్మమయం అయితే ... సృష్టి పరమాత్మమయమే అవుతుంది. దృష్టి పదార్థమయమైతే సృష్టి కూడా పదార్థమయంగానే తోచుచున్నది. ఇంతకు మించి ఇక్కడ మరే విశేషం లేదు.
శ్రీవసిష్ఠ మహర్షి : మహాదేవా! జీవుడు తిరిగి శాంతమయమగు బ్రహ్మమునందు ప్రతిష్ఠ పొందటానికి దగ్గర త్రోవ ఏది?
శ్రీశివ భగవానుడు : భేదదృష్టులు ఉపశమించటమే ఉపాయం. అభ్యాసమే అందుకు మార్గం. ఇందులో నిరుత్సాహపడవలసిన అవసరం ఎవరికీ లేదు. శాస్త్రాలు అందుకు అనేక మార్గాలు ప్రబోధిస్తున్నాయి. శ్రద్ధగా లక్ష్యశుద్ధితో సర్వసమత్వం అభ్యసిస్తూ వస్తే అది తప్పక ప్రతి జీవునకు సులభ సాధ్యమౌతుంది. కనుక జనులు దిగులు, బద్ధకము, అశ్రద్ధ, ఆలస్యములను దూరంగా ఉంచి సాధనకు ఉపక్రమించెదరు గాక! బ్రహ్మభావనను అనుక్షణికం చేయాలి. నిమిషంలో నూఱవ భాగం బ్రహ్మవ్యతిరక్తమగు దృష్టి వైపుగా చ్యుతిపొందటం జరిగిందా ...ఇక మరుక్షణం సంసారము ఉదయించగలదు. 'చిల్డ్రన రూపమున ప్రతిష్ఠితమగుటయే బ్రహ్మజ్ఞానము' - అని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు.
ఓ మునీశ్వరా! 'ఎరుగుట' అను క్రియకు కర్తయగు నీవే వేదములచే 'బ్రహ్మము' అని చెప్పబడుచున్నావు. భావాతీతము, త్రిగుణాతీతము అగు ప్రతిఒక్కరి స్వస్వరూపమే 'బ్రహ్మము' అని, 'పరమాత్మ' అని - శాస్త్రకారులచే, వేదద్రష్టలచే వ్యవహరించబడుతోంది.
నీ దృష్టి యందు దృశ్యస్వభావమగు ఈ సృష్టి సత్యమువలె ఏర్పడి ఉన్నంత వరకు నీవు చిద్వస్తువుగా వికసించజాలకున్నావు. నీవు ఎప్పుడైనా సరే... దృశ్యమునకు సాక్షిమాత్రుడవే గాని, దృశ్యములోని ఒకానొకటివి కావు. స్వప్నద్రష్ట స్వప్నవస్తువులకంటే సర్వదా విశిష్టమైనవాడే కదా! అంతేగాని, స్వప్నాంతర్గత పరిమితుడు కాదుకదా!
అసత్యాలగు దిక్-దేశ-కాల పరిచ్ఛేదాల వల్ల ఆత్మ తన పట్ల తానే నిష్కారణంగా క్షుద్రత్వాన్ని ఆపాదించుకుంటోది. శబ్దస్పర్శాది తన్మాత్రలతో తాదాత్మ్యం చేత జీవభావాన్ని పొందుతోంది. ఇక దేవ, దానవ, మానవ, జంతు, కీటక, లత - ఆదిగా అనేక బాహ్యరూపాలను దాల్చుతోంది. ఒక చమత్కార మేమంటే ...నిజానికి ఇదంతా సర్వదా అనంతం, నిత్యం అగు బ్రహ్మానికి పుష్పమాల వలె ఉన్నది.
సత్-అసత్లుగా గ్రహించబడుచున్న ఈ విశ్వమంతా విశ్వకర్మయందు ఒదిగి ఉంది. ఇక ఆ విశ్వకర్మ ఎక్కడున్నాడు? ఆయన దూరంగా లేడు. దగ్గిర కాదు. ఊర్ధ్వ - అధో భాగాలలో ఎక్కడో లేడు. ఆయన నా వాడు - నీ వాడు కాదు. ఆయన పూర్వం వాడు కాదు. భవిష్యత్ కాలం వాడు కాదు. ప్రాతఃకాలముననో, మరెప్పుడో లేడు. ఆతడు సత్-అసత్తులు కాదు. ఆ రెండింటి అంతరాళమున లేడు.
అయినా కూడా ...ఈ మిథ్యా పరంపరములన్నిటికీ ప్రమాత (One who is the subject)ఆ బ్రహ్మచైతన్యమే గాని మరింకొకరెవరో కాదు. ఎవరి ఆధిపత్యంలో బహిర్ వ్యవహారాలన్నీ ఫలరూప మగుచున్నాయో ...ఆయన పట్ల సర్వ ప్రమాణములు, సోదాహరణములు, వాక్యపరంపరలు
Page:151
పూర్తిగా సుస్పష్టీకరించటానికి ప్రయత్నించి కూడా అందుకు అసమర్థములే అగుచున్నాయి. ఆయన ప్రమాణ-ప్రమేయములకు అతీతుడు.
నాయనా! వసిష్ఠా! నీవు అడిగినదానికి సమాధానం చెప్పాను. నీకివే నా ఆశీస్సులు. పార్వతీ! ఇక మనం అభిమత స్థానమునకు పోయెదము గాక!
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వింటున్నావు కదా! సర్వశుభంకరుడగు ఆ నీలకంఠుడు అట్లా తన ప్రసంగాన్ని ముగించి జలతరంగంలాగా పార్వతీ జగన్మాతాసమేతుడై అంతర్ధానమైనారు. నేను ఆ ఆది మాతాపితలు పాదపద్మములు నేలతాకిన చోట పుష్పాంజలి సమర్పించాను.
త్రిలోకాధిపతియగు ఉమావల్లభుడు అంతర్ధానమైన తరువాత నేనప్పుడు అక్కడే ప్రశాంతంగా ఆసీనుడనై ఆయన చేసిన ఉపదేశములను చింతించసాగాను. క్రమంగా విశుద్ధినొందాను. ఇక అప్పటి నుండి పవిత్ర బుద్ధియందు ఆత్మదేవుని ‘బాహ్య - అంతర్పూజ' నిర్వర్తించసాగాను.
దాని వలన పరమ శాంతిని పొందినవాడనయ్యాను. ఇక జడోపాసనతో నాకు అగత్యం లేకపోయింది. అయితే ఏం? సర్వాంతర్యామి, సర్వతత్వ స్వరూపుడు, సర్వతత్వ విదూరుడు అగు ఆ పరమాత్మను నామ, రూపసహితంగా కూడా నామనో తృప్తికొరకు పూజిస్తూ, ఆరాధిస్తున్నాను. ఆయన నామరూప పరిమితుడు కాదని గ్రహించియే ఉంటున్నాను.
20. అనుక్షణిక పూజాభావం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, దయాకరుడు అగు సాంబశివుడు జగత్ రహస్యమును, బాహ్యపూజ, అంతర పూజలు గురించి నాకు విశదపరచారు. నేను వారు చెప్పినదానిని అంతరంగంలో మననం చేసుకుని తదనుసారం ఈ జగత్తును దర్శించటం అభ్యసిస్తూ ఉన్నాను. నీవు కూడా అట్లే ఈ జగత్తు యొక్క వాస్తవ-అవాస్తములేమిటో సాంబశివుల ప్రవచనానుసారం గ్రహించి ఆపై యథావిధిగా కార్యాకార్యములను నిర్వర్తించు. భ్రాంతి చేతనూ, స్వయంకల్పితమైన అభిలాషోద్వేగంచేతనూ ఆత్మయందు ప్రతిబింబిస్తున్న ఈ జగత్తునందు సత్యమేమున్నది? ఒక జమీందారుని "అయ్యా! తమది ఏమి అందం! ఏమి గుణం! ఏమి బలం! ... కల్పవృక్షము వంటివారు” ... అని స్తోత్రం చేస్తుంటే ఇక ఆయన తనను అట్లే భావించి ఆ యాచకునకు అవీ ఇవీ దానం చేయునట్లు ఆత్మస్వరూపుడగు ఈ ద్రష్ట కూడా కల్పితములైన వానిని నిజమేనను రీతిగా ప్రవర్తిస్తున్నాడు. తత్ఫలితమే ఈ జీవుడు, జగత్తు మొదలైనవి.
శ్రీ సాంబశివుడు బోధించిన అంతర్ - బహిర్ ఆత్మ దేవార్చనయందు నిరతుడనైన నేను బాహ్యమునందు ఆయా కార్యములను నిర్విర్తించుచూ వ్యధారహితుడనై రోజులు గడుపుచున్నాను.
Page:152
'యథా ప్రాప్తములగు క్రియలు, ఆచారములు' అను పుష్పములతో అవిచ్ఛిన్నంగా నాయందు, సర్వులయందు ఏకస్థుడై ఉన్న ఆ ఆత్మభగవానునికి అవిచ్ఛిన్నంగా అనుక్షణికంగా పూజ సల్పుచున్నాను. ‘సుఖముగా నిద్రించుటకు ఉపక్రమిస్తున్నాను' అను అనుభవపుష్పం కూడా ఆత్మశివునికి అర్పించి నిద్రకు ఉపక్రమించటం చేత గాఢ నిద్రయందు కూడా నా శివపూజ కొనసాగుచున్నట్లే అగుచున్నది.
నేను శివ బోధామృతానుసారం చేసే నిరంతర పూజ సర్వ శరీరధారులూ సర్వదా చేస్తూనే ఉన్నారు. కానీ, వాటియొక్క ఉత్తమలాభం పొందకున్నారు. అజ్ఞానముచేత అనుక్షణికమైన పూజాభావం అలవడడంలేదు. అందుచేత 'నేను ఈ కర్మను ఇందుకొరకై చేస్తున్నాను' అను కర్మరత, కర్మఫలసంగ భావనను అతిక్రమించలేకపోతున్నారు. ఇక జ్ఞాననిష్ఠులగు యోగులో, సావధానచిత్తులై తాము నిర్వర్తించే సర్వకార్యములందూ పూజాబుద్ధిని కలిగి ఉంటున్నారు. కనుక రామా! నీవు సర్వ క్రియ, సర్వభావ, సర్వఅనుభవములతో శివపూజా బుద్ది సంపన్నుడవై నీ చిత్తమును 'నిస్సంగము' చేసివేయి. అట్టి చిత్తముతో ఈ సంసారారణ్యంలో నిశ్చింతస్వభావుడవై విహరించు. అప్పుడు నీవు ఇక దుఃఖములను పొందే ప్రసక్తే ఉండదు.
యథాద్రవత్వం పయసి, యథా స్పందో నభస్వతి |
యథా నభసి శూన్యత్వం, తథా సర్గత్వం ఆత్మని II
నీటి యందు ద్రవత్వం, గాలి - ఆకాశములందు వీచికా - శూన్యత్వములు ఎట్లా సహజములే అయి ఉన్నాయో, అట్లా ఆత్మయందు ఈ సృష్టి - స్థితి - - లయ కల్పనలు సహజమై ఉంటున్నాయి. రామా! ఈ ధన-జన-సంయోగ వియోగాదు లప్పుడు కూడా నీవు ఆత్మదృష్టిని అవలంబిస్తూ విచారణ చేయి. అంతేగాని 'లభించినప్పుడు ఉబ్బిపోవటం, కోల్పోయినప్పుడు దుఃఖితుడవు కావటం’ నీవెందుకు చేయాలి? సంసారముయొక్క తీరే అది కదా! ఈ జగత్తునందలి వ్యవహారములన్నీ ఇట్లు వచ్చి అట్లుపోవుచు అజ్ఞానులైనవారిని మరల మరల పరాభవిస్తున్నాయి. సరియైన తర్కముతో కూడిన పరిశీలన లేకపోవటంచేతనే ఈ ధన జన సంబంధములన్నీ జడములు, కల్పితములై ఉండి కూడా ఆత్మస్వభావ, స్వరూపుడగు జీవుని దుఃఖితుని చేయగలుగుచున్నాయి.
ఓ నిర్మలమతీ! ఈ జగత్తు నీది కాదు. నీవు ఇందులో లేవు. ఈ జగత్తు అసలు ఏమీ కాదు. ఇక నీవు ఎందుకు, దేనికొరకై పరితపించాలి?
'ఈ జగత్తు తుచ్ఛమైనది' అనే దృష్టి నీకు నచ్చకపోయిందనుకో... అప్పుడు 'ఆత్మ దృష్ట్యా ఈ జగత్తంతా నేనే' అను లక్ష్యార్థమును అనుసరించు. ఈ జగత్తు దృశ్యంగా చూస్తే తప్పక పరిణామయుత మైనదే కదా! ఇక దుఃఖమెందుకు? శోకమెందుకు? నీవో, మార్పు చేర్పులు ఉండనట్టి చిన్మాత్ర రూపుడవు కదా!
ఈ జగత్తు స్వయంప్రతిపత్తి లేని జడస్వభావమైనది. జగత్తు అను రూపం పొందబడేది నీ కంటే భిన్నమైనది కాదు. కనుక ఇందులో ఆశ్రయించవలసినదేది? విసర్జించవలసినదేది? తరంగములు కూడా సముద్రమే కదా! సముద్రం తన తరంగములను వదలటమనేది ఎక్కడా
Page:153
ఉండదు కదా! ఈ జగత్తు ఆత్మస్పందనమందలి భావనా తరంగములే! ఇక ఇక్కడ హర్ష శోకములకు ఆస్కారమెక్కడిది?
అందుచేత రామచంద్రా! నీవు అనునిత్యం చిదేకత్వమును ఆశ్రయించి ఉండు. జగత్తుకు కారణమై ఏర్పడి ఉంటున్న చిత్తవృత్తులన్నిటినీ గాఢ నిద్రా పరవశునివలే గాంచుచూ ఉండు. ఈ క్షణంలోనే తురీయావస్థ యందు వెలయుము. జగత్తు అను వైషమ్యమునుండి విడివడుము. ఈ జగత్తును కూడా ప్రకాశింపజేయుటకు కారణమగుచున్న బ్రహ్మంతో ఐక్యము స్థాపించుకొని ఉండు. నిత్యము ఉదారబుద్ధితో ‘ఆత్మ దేవార్చనము' చేయుచూ పరిపూర్ణమగు సముద్రమువలె వెలయుము.
రఘునందనా! నీవు, ఈ జగత్ స్వభావం గురించి విన్నావు కదా! గ్రహించవలసినదేమిటో గ్రహించి పరిపూర్ణబుద్ధి సమన్వితుడవయ్యావు. వైరాగ్యప్రకరణంలో నీవు ప్రశ్నించినవాటిలో ఇంకనూ దేనికైనా సమాధానాలు కావాలా? చెప్పు.
శ్రీరాముడు : బ్రహ్మజ్ఞా! ఇప్పుడు నా అనుమానాలన్నీ సంపూర్ణంగా తొలగినాయి. తెలుసుకోవలసిన దానినంతా తెలుసుకున్నాను. అకృత్రిమమైన ఆనందం లభించింది.
ఇప్పుడు నాకు 'ఏది జీవుడు - - ఏది బ్రహ్మం' అనే ప్రశ్నలు లేవు. మనోకల్పితాలైన పదార్థములు కూడా లేవు. అప్పుడు (14 రోజుల క్రితం) అజ్ఞానం చేత ఆత్మయందు కళంకం అగుపించింది. ఆ భ్రాంతి ఇప్పుడు తొలగిపోయింది. ఇదంతా తమ అనుగ్రహం వల్లే సాధ్యపడింది. ఆత్మ స్వరూపుడనైన నేను పుట్టడం లేదు. చావటం లేదు. ఎట్టి కళంకాలూ పొందటం లేదు. సర్వం బ్రహ్మమయమే కదా!
కనుక హే సద్గురూ! నాకిక ఎట్టి సంశయములుగాని, ప్రశ్నలుగాని కోరికలు గాని, నిరుత్సాహ కారణాలు గాని లేవు. విశ్వకర్మ యొక్క యంత్రం చేత త్రిప్పబడుచున్న సూర్యమండలం వలె నా చిత్తం అంధకార రహితమైనది. మహాపర్వతం ఒక చిన్న గులకరాయిని కోరుకుంటుందా? దేశ కాలాదులు క్రొత్తగా ఇవ్వగలిగినదేదీ లేదు. ఎట్టి వాంఛలు లేక, ఆశారహితుడనై వెలయుచున్నాను. 'ఇది విడువవలసినది, ఇది స్వీకరించవలసినది, ఇది ఉన్నది, ఇది లేదు' - అను శ్రమలన్నీ నశించాయి. ఇక నేను స్వర్గమును కోరను, నరకమును ద్వేషించను.
మందర పర్వతంలాగా ధీరుడనై ఆత్మయందే నిశ్చల ప్రతిష్ఠితుడనై ఉన్నాను. 'సంసారము' అనే మహాసముద్రం నుండి 'జగత్తులు' అనే నీటి తుంపరలు - అటూ - ఇటూ వెదజల్లుబడుగాక! నాకు అవి భ్రమను కలిగించలేవు.
ఓ మునిసత్తమా! 'రాముడు' అనే పర్వతం 'సంసారము' అనే పిల్లగాలికి చంచలించడం మానివేసి, భ్రమరహితమై విశ్రాంతిని పొందుచున్నది. ఆత్మారాముడనై చెన్నొందుచున్నాను.
'ఇది వస్తువు, ఇది అవస్తువు' అంటూ కల్పనలు చేసుకుంటూ ఉండేవారి హృదయములు మాత్రమే ఈ సంసారముచే భయంకరంగా పీడింపబడుచున్నాయి. మూఢత్వముచే మహత్తరంగా తోచే ధన, జన, యౌవనాదులు ఇప్పుడు విషయార్హతను కోల్పోయాయి.
Page:154
హే భగవంతుడా! తమ ప్రవచనాప్రవాహముచే నా యందలి అరిషడ్వర్గములు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) అనే పిల్ల కెరటాలు అస్మదానందజలంలో ముంచివేయబడి, మ్రింగివేయబడ్డాయి. నేను వృత్తి రహితుడను అవటం చేత జడమైన ఈ సంసారం తల ఒంచుతోంది. సర్వ సంపదలకు పరాకాష్ఠ సర్వ ఆపదలకు పరిసమాప్తి స్వస్వరూపచిదాకాశధ్యానమేనని గ్రహించాను. హే పరమేశ్వరా! 'సంసారసాగరము' అని చెప్పబడుచున్నదానిని నేను జయించబడిన రాజ్యము వంటిదిగా గాంచగలుగుచున్నాను.
భూమానందమును పొంది పూర్ణుడనయ్యాను. సర్వ ఆశలు హరించిపోయాయి. ఈ నా పూర్ణత్వమును ఎవ్వరూ ఛేదించలేరు.
పరిగలితవికల్పితాముపేతం ప్రగలితవాఞ్ఛమదీనసారసత్త్వమ్ । |
త్రిజగతి యదతిప్రసన్నరూపం ప్రముదితమన్తరనుత్తమం మనోమే ॥ (శ్లో 36, సర్గ 43) నా మనస్సు ఎట్టి ఇంద్రియ విషయములూ, వికల్పములూ లేక సుదృఢమైన స్థిరత్వం పొందింది. సర్వ వస్తువులనూ అధిగమించి నిరతిశయమైన ఆనందం పొందుతూ నా మనస్సు సర్వోత్తమమైన పదమున వెలయుచున్నది.
21. కల్పనాజగత్తు - జీవబాటసారులు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఈ ఇంద్రియాలు తమ తమ విషయము లందు ప్రవర్తిల్లుచున్నంత మాత్రం చేత బంధం ఏర్పడదు. సంగం, కర్తృత్వాభిమానం ఉన్న చోట మాత్రమే బంధం ఏర్పడుతుంది. ఈ ఇంద్రియాలకు గోచరించే విషయాలు ప్రాప్తిస్తున్నప్పుడు వాటి యందు ఏర్పడే అభినివేశమే దుఃఖములు కలిగిస్తున్నాయనే విషయం ఎవరికి తెలియదు? బాలురవంటి జీవులు మాత్రమే ఈ దృశ్య విషయములందు సంతోషం కలుగజేసే విశేషాలను వెతకుచూ, వాటి ప్రాప్తిప్రాప్తముల కొరకై తాపత్రయపడుచున్నారు. నిత్యానిత్యమును ఎరుగుచున్న ప్రౌఢులు ఈ దృశ్యవిషయములపై ఏమాత్రం విశ్వాసము, ఆశ పెంపొందించుకోరు. బాలురు మాత్రమే లభిస్తున్న సంతోషం కలుగజేసే మూర్ఖులే తప్ప ...
క్షణికసుఖాభినివేశానికి అసలు కారణమేమిటి?... వాంఛలు.
అవన్నీ దుఃఖదాయకాలుగా పరిణమించునవే సుమా! అఖండానందం కొరకై స్వల్పానందాలను అధిగమించక తప్పదు. ఒకసారి ఆ బ్రహ్మపదం పొందిన వారికి ఇక అహంభావం బాధించదు. అది స్ఫురించదు. ఆత్మజ్ఞాన శైల శిఖరంపై విశ్రాంతి తీసుకుంటున్న ఈ బుద్ధి ఇక 'స్వల్పత్వము' అనే అవరోహణం ఆశ్రయించకుండు గాక!
ఎవరి మనస్సులో 'అనంత బ్రాహ్మీదృష్టి’ ఉదయించిందో... జ్ఞానమేరు శిఖరం అధిరోహించినట్టి అట్టివారు “నేను - నాది" అనే పాతాళ లోకమున పడరు.
Page:155
ఓ రామచంద్రా! నీ స్వభావము సమత్వము, సత్యములకు ఆలవాలమైనట్లు నాకు అగుపిస్తోంది.
ఆత్మ వస్తువు నందు ప్రతిష్ఠితుడవగుట నాకు తెలియవస్తోంది. నీ యందలి ఆశ, భావన, మనస్సులు సర్వదా ఆశారాహిత్యం - అభావన - అమనస్కం పొందు గాక! ఏ ఏ ఏ వస్తువులు నీవు పొందుచున్నావో ఆయా వస్తువులన్నీ పరిపూర్ణమగు చిన్మయసత్తగానే గాంచుము.
అజ్ఞాతాత్మా నిబద్ధాసి, విజ్ఞాతాత్మా న బధ్యసే ॥
రామ! త్వం స్వాత్మన్ ఆత్మానం బోధయస్వ బలాదతః ||
రామా! ఆత్మజ్ఞానం లేకపోయిందా, బద్ధుడవవుతావు. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే ముక్తుడవు కాగలవు. కనుక మననము మొదలైన అభ్యాసములచేత స్వయంగా ఆత్మబోధనను సంపాదించుకో. అవాసనత్వం సంపాదించు. ఏ స్థితియందైతే భోగసుఖములందు ఆశ అనునది ఉండదో... ఎప్పుడు ఆయా వస్తువులు తారసపడుచున్నప్పుడు నిరపేక్షగా ఉండగలుగుతావో ... ఆ స్థితి అవాసనత్వం అనిపించుకుంటుంది. అట్టి స్థితి ఆకాశము వలె నిర్మలమైనది.
వాసనారహితమైన చిత్తముతో సందర్భానుచితకర్మలు ఆచరించు. అనుకూల ప్రతికూలాదులు వందలకొలది వచ్చినా సరే, నిర్వికారుడవై ఉండు. ‘తెలుసుకొనువాడు - తెలియబడునది'
ఈ మూడిటిని ఆత్మయందు ఒక్కటిగా చేసివేయి. దుఃఖాదులను కూడా ఆత్మ భావనమునందు లయింపజేయి. అప్పుడు మరల సంసారమును పొందటానికి కారణమే ఉండదు.
చిత్తోన్మేషనిమేషాభ్యాం సంసారప్రలయోదయౌ |
వాసనాప్రాణసంరోధాదనిమేషం మనః కురు ॥ (శ్లో 16, సర్గ 44)
మనస్సు వికసిస్తే జగత్తు ఉంటుంది. మనస్సు లయిస్తే జగత్తు లేకుండా పోతుంది. కాబట్టి మనస్సును ప్రాణాయామాది నిర్దుష్ఠ కార్యక్రమముల సహాయంతో వాసనానిరోధం, విషయశూన్యం చేయి.
అభ్యాస, సంయమనాలతో ప్రాణాలను ఉద్విగ్నరహితం చేయి. ప్రాణం యొక్క ఉదయము వలననే 'సంసారం' అనేది పుట్టి పెరుగుతోంది. ప్రాణశక్తి యొక్క సద్వినియోగ ప్రభావంచే ఈ సంసారము లయింపజేయవచ్చు కూడా!
కర్మలంటావా! అవి అజ్ఞానము ఉన్నప్పుడు ఉన్నట్లే ఉంటాయి. అజ్ఞాన లయం జరిగిన మరుక్షణం కర్మలు, వాటి ప్రభావములు లేనివే అవుతాయి.
జగత్తు నిర్వచనం - గాలిచే లేవబడిన ధూళి వలన ఆకాశము మలినమైనట్లు కనబడుతుంది కదా! చిత్త స్పందనము వలన ఈ సంసారము అనే అనర్థం అనుభవమవటం జరుగుతోంది.
జగత్తు అంటే చూచేవాడు, చూడబడేది అను రెండిటి మధ్యగల సంబంధం మాత్రమే!
అనగా ...ఈ జగత్తు నీకేవిధంగా గోచరిస్తోందో... అట్లా గోచరించటానికి కారణం నీవు అద్దానితో స్వయంగా ఏర్పరచుకొంటున్న సంబంధమే అయి ఉన్నది. కాబట్టి నీ జగత్తుకు పరమకారణం
Page:156
నీవే గాని మరింకెవ్వరో కాదు. ఒక చిత్రం లోని పురుషుడి హృదయంలో భావాలు అనేవి ఉండవు కదా! అట్లాగే ఒకవేళ నీ అంతరంగంలో దృశ్య దర్శనములకు సంబంధించిన సంకల్పమే లేకపోతే, నీలో జగత్తుగా అనుభవమౌతున్న దానియొక్క భావనయే ఉండేదికాదు.
కాబట్టి భావనయే జగత్తు. నీవో?... భావమునకు ఆవల ఉన్న వాడవు. భావించువాడవు. భావాతీతుడవు. ‘మాయ’ అనేది కూడా చిత్తం యొక్క స్పందన నుండే పుడుతోంది. నీటిలో కదలికలు లేకుంటే అలలు ఉంటాయా? చిత్తం స్పందించటం మానివేస్తే మాయ కూడా లేకుండా పోతుంది. శ్రీరాముడు : మాయ లేకపోతే 'జీవుడు' అనబడే వాడు కూడా ఉండడు కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అలలు నీరు కానిదెప్పుడు? నీటిలో అలలు లేకపోతే నీరు లేకుండా పోతోందా? మాయ రహితమైనప్పుడు సర్వము - నిత్యము - నిర్లిప్తము - అగు స్వస్వరూపం ఉండనే ఉంటుంది. 'సత్'అని వేదములచే ప్రతిపాదించబడే నినాదము యొక్క అర్థం అదే. జీవుడు శివస్వరూపుడే! కనుక జీవుడు రహితుడై శివస్వరూపుడవటమెక్కడున్నది.
చిత్తము యొక్క అచిత్తస్థితి -
శ్రీరాముడు : చిత్తము యొక్క స్పందన ఉపశమించేదెట్లా? మరెన్నటికీ చిత్తము ప్రకోపించకుండేదెట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జీవుడు తత్త్వమును పొంది వాసనలు త్యజించినాడా ...లేక ప్రాణాభ్యాసముచే చిత్త స్పందన సుస్థీకరించబడినదా ... ఇకప్పుడు ఈ జీవునకు చిత్తము యొక్క నిస్పందము ప్రాప్తిస్తుంది. అట్టి చిత్తము యొక్క అచిత్తస్థితిని 'పరమపదము' అని చెప్పుచున్నారు.
=
ఓ రామచంద్రా! ఈ విషయేంద్రియములతో ఏర్పడే సంబంధం వలన లభిస్తున్న సుఖం బ్రహ్మానందము యొక్క అత్యంత స్వల్పాంశము మాత్రమే.
‘సర్వము బ్రహ్మమే’ అనునది బ్రహ్మానందము యొక్క బాహ్యస్వరూపం. అట్టి పూర్ణానుభవం మనోక్షయము వలననే, లేక, చిత్తము యొక్క అస్పందన వలననే సాధ్యం. సంకల్పములన్నీ సంకల్పించువానియందు లయించుటయే బ్రహ్మానందమునకు నాంది. చమత్కారం చూచావా? ఆ బ్రహ్మదేవుని కల్పనలో ప్రవేశించిన ఈ జీవులు అనే బాటసారులు అనేకమంది 'స్వస్వరూపసుఖము’ అనేది అసలు గుర్తించటమే లేదే!
చిత్తము ద్వారా లభించే సుఖము కృత్రిమము, దేశ కాల పరిమితము, దుష్ఫలిత సమన్వితము అయి ఉంటుంది. ఇక చిత్త వినాశనంచే అవధరించబడే సుఖం అనంతమైనది. అది మాటలకందనిది. అట్టి సుఖమునకు తరుగు ఉండదు. కనుక అద్దానిని 'నిర్హేతుకసుఖం’ అనికూడా అంటారు. శ్రీరాముడు : చిత్తము ఎక్కడి నుండి వచ్చి పడుతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : బాలుడు దయ్యమును ఊహించుకుని ఉలిక్కిపడతాడు చూచావా? భ్రాంతి చేతనే చిత్తం యొక్క అస్థిత్వం ఉపలభ్యమౌతోంది. తత్త్వబోధ వలన భ్రాంతి తప్పక తొలగగలదు.
Page:157
ఉన్నట్లుగా అగపడుచున్న చిత్తము లేనట్లు తెలియబడుచున్నప్పుడు అది లయం పొందుచున్నది. సత్తుగా తోస్తున్న చిత్తము జ్ఞానముచే అసత్తుగా అగుచున్నది.
ఈ ప్రపంచములోని నామ, అర్థ భేదములన్నీ చిత్తమే కల్పిస్తోంది. చిత్తము ‘బోధ'చే 'సత్యము' అగు నిజాత్మరూపం సంతరించుకుంటోంది. అని అనిపించుకొంటోంది. జ్ఞాని వివిధ కార్యములు నిర్వర్తించుచున్నప్పటికీ ఆతని చిత్తము జ్ఞాన సమన్వితమై ఉండడటం చేత దానిని ‘సత్వము’ అని అంటారు. జ్ఞానము దృఢపడినచోట చిత్తము ఉండనట్లే.
భ్రాంతియే బీజముగా గల చిత్తము జ్ఞానార్జనకు నియమించబడినప్పుడు ఆ చిత్తము తనయందుతానే లయమగుచున్నది. చిత్తముతో బాటు భ్రమకూడా మటుమాయమౌతోంది.
బాహ్య విషయములు అభ్యాసపూర్వకంగా కౌతుకంతో కూడి సంకల్పిస్తున్నప్పుడు అట్టి తతంగమే చిత్తము అను పేరుతో పిలువబడుతోంది. అంతకుమించి చిత్తమనగా మరింకేదో కాదు.
ఈ జీవుడు అపరోక్ష జ్ఞాన మార్గంగా తన సత్స్వరూపమునే (ఉనికినే) తాను స్మరిస్తున్నప్పుడు అట్లు స్మరిస్తూ, అనుభవిస్తూ ఉండగా బాహ్య జగత్తుకు రాహిత్యము ఏర్పడుచున్నది. అప్పటి స్థితిని ‘చిత్త రాహిత్యము’ అని పిలుస్తున్నాం. చిత్తము ఉన్నా, ఉండకపోయినా సత్తుకు అభావమనేదే లేదు
కదా!
1. వికల్పమయమైన చిత్తము, 2. అద్దానిచే కల్పించబడే సర్వ పదార్థానుభవములు
ఈ రెండు అవస్తువులేనని ఆత్మబోధాసమన్వితులగు జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఈ చిత్తము స్వస్వరూపమును ఎరిగినదా ... ఇక ఆ తరువాత కొంతకాలం తురీయమున విహరించి, ఆపై తురీయాతీతమగు పదమునందు ప్రకాశిస్తోంది.
బ్రహ్మమే ఈ విశాలమగు జగదమయందు విలాసంగా సంచరిస్తోంది. ఏక-అనేకములందు సర్వదా ప్రసరించి ఉన్నది, సర్వుల నిత్య సత్యస్వరూపము అదియే.
బ్రహ్మమొక్కటే ఉన్నది.
అదియే సర్వులస్వస్వరూపం! సత్స్వరూపం!
తదితరమైనదేదీ లేదు.
Page:158
పదహారవ రోజు
IV. బిల్వఫలం - శిల - మృగతృష్ణ -
ఉపమానాలు
1. బిల్వఫల ఉపమానం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఆత్మతత్త్వబోధకులు కొందరు బిల్వఫలము (మారేడు పండు) ను ఉపమానంగా చేసుకొని తమ అనుయాయులకు ఆత్మతత్త్వము బోధిస్తూ ఉంటారు. రమణీయము, విస్మయోల్లాసకరము, సంక్షిప్తము అగు ఆ బిల్వోపమానం అనే చమత్కారం చెపుతాను. ఇది జ్ఞానప్రదమని లోకప్రతీతి.
❖
ఒక పెద్ద బిల్వఫలం ఉన్నది. అది విమలము, విపులము, ప్రస్ఫుటము కూడా. ఆ ఫలం యొక్క సత్తా అసంఖ్యాక యోజనాలు విస్తరించి ఉన్నది. వందలవేల మహాయుగాలు గడచిపోతున్నప్పటి ఆ ఫలం క్షయం కావటం లేదు. అవదు. దాని రసము అక్షయము. దాని సారయుక్తమగు రసము అమృతము వలె అత్యంత మధురం. ఆ బిల్వఫలం అతి పురాతనమైనది. అది ఎంతటి పురాతనమో ఎవరమూ చెప్పలేం. అయితే ఏం? బాలచంద్రుని కళల వలె అది ఎప్పటికప్పుడు నూతనము, కోమలమూ కూడా! అది అత్యంత శోభతో అచలంగా, దృఢంగా ఉన్నది. మహాప్రళయ వాయువులు కూడా దానినేమీ కదల్చలేకున్నాయి. దాని వైశాల్యము ఇన్ని కోట్ల యోజనములని చెప్పజాలము. ఈ జగత్తు యొక్క స్థితికి అదే కారణం. అయితే దాని మూలమేమిటో కారణమేమిటో ఎవరికీ తెలియదు.
ఈ కనబడే బ్రహ్మాండ సమూహములన్నీ ఒక కొండ మీద వెదజల్లబడిన ఆవగింజల వలె ఆ బిల్వఫలం లోపలే వెదజల్లబడి ఉన్నాయి.
ఈ పంచేంద్రియ-మనస్సులకు విషయమగుచున్నదేదైనా సరే... ఆ ఫల రసమును అతిక్రమించ జాలదు. అది రాలటానికి చోటే లేదు. ఎందుకంటే అది అంతటా, అన్నిటా ఆక్రమించుకొని, అంతయూ తన యందే కలిగి ఉంటోంది. ఆ ఫలరసమును అతిక్రమించినది, అతిక్రమించగలిగినది ఎవరూ, ఏదీ లేదు. లేవు. ఈ జన్మ - జర - మరణము లనేవి దానిని స్పర్శించక, దాని యందే భ్రమాత్మకమై ఒదిగి ఉంటున్నాయి.
బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇంద్రాదులు గాని, మరెవ్వరైనా గాని దాని 'ఉత్పత్తి' అనే మూలం కనుగొన లేకపోతున్నారు.
శ్రీరాముడు : మహర్షీ! ఆ బిల్వఫలం ఏ వృక్షమునకు కాసింది? ఆ వృక్షం ఎక్కడుంది.
Page:159
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ ఫలమునకు వృక్షముగాని, అంకురముగాని, తత్సంబంధితమైన కొమ్మలు గాని ఏమీ లేవు. అది ఏకపిండ ఘానాకారమై తోచుచున్నది. ఏకరసమై ఉన్న అద్దానికి ఉత్పత్తి పెరుగుట - తరుగుట అనే పరిణామ లక్షణాలేవి అగుపడుటలేదు. అది సమస్త ఫలాల సారమా... అని అనిపిస్తోంది. మహాకృతి కలిగిన అద్దాని యందు గుజ్జు - గింజలు లేక ...అది నిర్వికారమై, నిరంజనమై ఉన్నది.
అది శిలవలె నిర్లిప్తమై ఉన్నది. చంద్రబింబము వలె అద్దాని నుండి అమృతానందం నిత్యమూ స్రవిస్తోంది. స్వసంవేద్యమగు నిరతిశయానందమున ప్రకాశిస్తోంది. శీతలమగు, వినీలమగు స్వయంప్రకాశముచే వెలుగొందుచూ సకల సౌఖ్యములకు ఆలవాలమై ఉన్నది. అద్దానిని చూచి ‘అది పర్వతము వంటి ఒక జడమగు మట్టి ముద్ద' అని కొందరు భ్రమిస్తున్నారు. ఈ జనులంతా అద్దాని యందే ఇమిడి ఉండి కూడా అద్దాని స్వరూప స్వభావములేమిటో గ్రహించలేకపోతున్నారు. అనేకులు అద్దాని ఉనికి గురించి కూడా తెలియకయే వందల, వేల ఉపాధులలో సుఖదుఃఖ భావములు కల్పించుకొని అతిదీర్ఘకాలం గడిపివేస్తున్నారు.
అది అగోచరములగు సర్వ ఆనందముల సారస్వరూపమైయున్నది. అది అనంతమై, త్రివిధ (సృష్టి, స్థితి, లయ - త్రికాల) పరిచ్ఛేదరహితమై ఉన్నది. నిత్యమై, అనునిత్యమై స్వాత్మచమత్కృతి చేత ప్రభవించుచున్నది. ఆత్మచమత్కృతి యొక్క అధ్యాసయే ఆ బిల్వఫలం యొక్క అనుభవం. బుద్ధికి ఆవల ఉన్నదై, ఆ బుద్ధి యొక్క సన్నివేశ వైచిత్రానికి తానే కారణమై ఉంటోంది. అది బుద్ధిని కల్పించు కుంటూనే బుద్ధికి ఆవల, ఈవల కూడా ప్రసరించి ఉంటోంది. తన స్వరూపాన్ని ఒక వైపు ఏమాత్రం వదలకుండానే మరొకవైపు స్థూల - సూక్ష్మ అణు కార్య - కారణములను వ్యక్తీకరిస్తోంది. అది సనాతనము. అయితే ఏం? దానికి వార్ధక్యము మొదలైన దశలు లేవు. అది తన యందు ‘స్త్రీ, పురుష, జడ, జంతు’ అనే కల్పనలు నిర్వర్తించుతూ ఆ కాల్పనికాలకు సంబంధించక స్పృశించబడక ఉంటోంది. 'ఇది అన్యము, ఇది భిన్నము' - అనే కల్పనాతరంగం ఆ నిశ్చల ఫల రసము నందే ఏర్పడటం జరుగుతోంది.
ఆ బిల్వఫలం వాస్తవానికి ఏమిటి?
ఏదీ కాదు. స్వప్రకాశకుడగు చిన్మయము దృష్ట్యా అది అవిద్యాదులకు ముందే ఉన్న ఆత్మ చమత్కృతియే. అద్దానికి ద్వైతము అనేది పొసగదు. దానికి బాహ్యము ఉంటే కదా... ద్వితీయం
గురించి యోచన?
ఆ బిల్వఫలం స్వశక్తిచే తనయందు కావాలని అహంకారాదులను కల్పించుకుంటోంది. అక్కడి నుండి ఆకాశ కాలములకు సంస్థానమగుచున్నది. అది సంకల్పములను వికసింపజేయటం ద్వారా రాగద్వేష హేయ ఉపాధేయాదులను తనపట్ల ఆపాదించుకుంటోంది. ఆశలు, నిరాశలను తనకు తానే కారణమై రచించుకుంటోంది. 'ఇది, అది, నాది, నీది' మొదలైనవి తనకు అంతర్విభాగ మైనప్పటికీ తనకు ద్వితీయమైనట్లు కల్పన చేసుకుంటోంది.
Page:160
ఓ రాఘవా! ఆ బిల్వఫలంలోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అయితే 'బ్రహ్మాండాలు ఉన్నాయి' - అనేది కూడా కల్పన మాత్రమే. అంతేకాదు. 'ఎదుట, వెనుక, దూరం, దగ్గిర, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్కాలం’ - అనునవన్నీ కూడా ఆ బిల్వ ఫలము నందలి అనుభూతిపరమైన కల్పిత విషయాలు మాత్రమే. కల్పనలకు ఆటపట్టైన ఆ ఫలము జీవులతోకూడిన బ్రహ్మాండ మండలములకు క్రీడామండపము వలె గోచరిస్తోంది.
ఆ ఫలము యొక్క చమత్కృతిచే అందు వేలాదిజీవులు వర్షపుంజంలోని బుడగల వలె క్షణ క్షణం శరీర ధారణం, శరీర త్యాగం చేస్తున్నారు. అందులోంచి రుద్రగణం బయలుదేరి, వారు ఈ సృష్టి యందు ఆశగొనిన విషయబద్ధులను 'ప్రళయం' అను ఒకానొక కాలవిభాగంలో కలిపివేసి వినాశనం చేసివేస్తున్నారు. సృష్టిసంహారాలు, స్వర్గ వైభవాలు, నరక దుఃఖాగ్నులు, జగత్భావ, అభావాలు ... అన్నీ కూడా తెరపై క్రీనీడలలాగా ఆ ఫలమునందే కల్పిత ఆరోపిత దృష్టులచే దర్శించబడుతున్నాయి.
ఆ బిల్వఫలములోని ఒకానొక చిన్నమూల గల ఒక బిందువులో ఈ అసంఖ్యాక పాలపుంతలతో కూడిన నక్షత్రాల సమూహమంతా విరాజిల్లుతోంది. అది బ్రహ్మము అనే మహాసముద్రపు ఒడ్డున అంతు లేకుండా వెలయుచున్నది. ఆకాశమే దానికి ఆశ్రయం. కానీ ఆకాశమంతా ఉన్నది అందులోనే!
ఆ ఫల మధ్యంలోగల మహాసముద్రాలలో జలం బదులుగా 'క్రియలు, వాటి నుండి ఫలితములు, ఆ ఫలితముల నుండి మరికొన్ని క్రియలు" అనే భీకర తరంగాలు అవిశ్రాంతంగా ఘోషణ శబ్దములతో ప్రవహిస్తున్నాయి. ఆ తరంగాలలో 'జీవులు' అనే నీటిచుక్కలు చిందరవందరగా ప్రతిబింబిస్తున్నారు.
ఆ జలంతో 'కాలము' అనే ఉపరితలవాయువీచికల ప్రభావంచే ప్రళయము, మహాప్రళయము అనే సుడిగుండాలు ఏర్పడి ఉంటున్నాయి.
కాలము - గాలి ఆకాశంలో అటూ ఇటూ వీస్తున్నట్లు ఆ నిశ్చల బిల్వఫలంలో కాల వీచికలు వీస్తున్నాయి. ఈ చంద్రుడు మొదలైన జోతిష్పదార్థాలన్నీ ఆ కాల ప్రవాహంలోని చిన్న చిన్న చారలు. అది బయటకు క్షణ, విఘడియ ఘడియ, దిన, మాస, సంవత్సర, యుగ, చాతుర్యుగ, మన్వంతర, అయనముల - రూపంలో ఉంటోంది. దాని యొక్క మరొక విశిష్టమైన వైపు 'కాలాతీతమైనది'. ఈ జరా, మృత్యు, విద్య, అవిద్య, సమృద్ధ, అసమృద్ధాది - విశేషములన్నీ కాలబద్ధం మాత్రమే. ఆ బిల్వఫలమో... కాలమునకు అతీతమైనది.
88
అయితే... ఆ బిల్వఫలం సంకల్పమాత్రం చేతనే ఇన్ని విశేషములతో, వర్ణింపశక్యం గాని మరెన్నో రీతులుగా వెలయుచున్నది. అది ఏకమే అయి ఉండి ద్వైతమును ధరిస్తోంది. మరి, దానిని ఏకం అనాలో, ద్వైతం అనాలో, మరింకేమనాలో తెలియని అద్దాని పరిశీలకులు అద్దాని గురించి అనేక సిద్ధాంతపరమైన వాగ్వివాదములు చేసుకుంటున్నారు.
Page:161
‘అది వివిధాత్మికము కాదు సర్వదా ఏకాత్మికమే' అనేది వేదాంత శాస్త్ర పరిశోధన యొక్క సమాధానం. ఎందుకంటావా? అద్దానిలో స్వజాతి విజాతీయములు, స్వపరములు లేనే లేవు. ఉన్నట్లు అనిపించేదంతా వాస్తవం కాదు.
దానికి ఉనికి ఉన్నది. కానీ స్వరూపం లేదు. అది అంతా తెలుసుకొనుచున్నది... కానీ, అది తెలియబడుట లేదు. అది స్వయంగా ఆనందస్వరూపం... కానీ సుఖదుఃఖాల కల్పనలన్నీ దానివే. అది సకల ద్వైత వికల్పములకూ 'ఉపశాంతి'యగు ఏకైక సమరూపము.
అదియే ‘చిచ్ఛక్తి' అనబడే ఆదిశక్తి. అది సర్వాత్మకమైన 'మహదృహ్మ బిల్వఫలం’.
శ్రీరాముడు : భగవంతుడా! సర్వసారజ్ఞా! ఆత్మానుభవులు ఉపయోగించే బిల్వఫల ఉపమేయం (Metaphor) ‘చిదనబ్రహ్మసత్త' గురించేనని నాకు అర్థమయింది. ఈ 'నీవు - నేను’ అహంకారాలన్నీ ఆ చిత్ యొక్క రూపాలేనని, ఇక ఇందు ద్వైత ఐక్య కల్పనా భేదాలు లేవని గ్రహిస్తున్నాను. అయితే ... ఒక బిల్వఫలం ఎప్పటికైనా వాడిపోతుంది కదా...?
శ్రీవసిష్ఠ మహర్షి : ఏ ఉపమానమైనా బ్రహ్మతత్త్వాన్ని సంపూర్ణంగా విశదీకరించలేదు. విజ్ఞులు ఒక్కొక్క ఉపమానాన్ని ఒక్కొక్క విషయ పరిజ్ఞానం కొరకై వాడుతూ మనకు అందిస్తూ ఉంటారు. ఉపమానా లనేవి ఆశ్రితుడగు శిష్యుని సామాన్య, దైనందికానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి సుమా!
కనుక “బిల్వఫలంలోని గుజ్జు నాశనమైతే బిల్వఫలం కూడా నశిస్తుంది కదా! అట్లాగే బ్రహ్మాండాలు (జగత్తులు) నశిస్తే బ్రహ్మము కూడా నశిస్తుంది”...అని అనుకోకు. బ్రహ్మమునకు పెరుగు-తరుగులు ఉండవు. అది ఏ క్షణంలోనూ మరొకటిగా అగుటలేదు ...అవదు. మిరియపు గింజలో కారం అంతర్లీనమై ఉన్నట్లు జగత్తులలో బ్రహ్మము సారం-రసం అయి, అంతర్లీనంగా అనునిత్యమై ఉంది.
2. శిల - - శిల్పి - - శిల్పము
శ్రీవసిష్ఠ మహర్షి : ఆధ్యాత్మ వాఙ్మయంలో ఆత్మతత్వమును ప్రవచించే బహు ప్రచారమై ఉన్న మరొక ఉపమానం కూడా చెప్పుతాను ...విను.
ఒకచోట ఒక గొప్ప శిల ఉన్నది. అది అతి నునుపుగాను, స్పష్టంగాను, ప్రకాశవంతం గాను, మృదువైన స్పర్శతో కూడి మహావిస్తారమై ఉన్నది. ఆ మహావిశాల శిలపై అనేక పద్మాలు నగిషీ చేయబడి ఉన్నాయి. ఆ పద్మముల దళాలు ఒకదానినొకటి తాకుతూ ఉన్నాయి. ఆ శిల్పి ఎవరో కానీ... అందులో కొన్ని పద్మములు బాగా వికసించి ఉన్నాయి. మరికొన్ని కొంత వికసించి ఉన్నాయి. కొన్ని పైకి లేచి ఉన్నాయి. ఇంకొన్ని ముడుచుకుని ఉన్నాయి. కొన్ని క్రిందకు వ్రేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంకొన్ని పడుకొనిన భంగిమలో కనిపిస్తున్నాయి. అయితే అన్ని పద్మముల మొదళ్ళు కలిసియే ఉన్నాయి. వాటిలో కొన్ని పద్మముఖములు పరస్పర సంలగ్నములై ఉన్నాయి.
కొన్ని ఊర్ధ్వ, అధో మూలములు కలిగి ఉన్నాయి. కొన్నిటికి మూలములే కనిపించటం లేదు.
Page:162
శ్రీరాముడు : గురువర్యా ! నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు సాలగ్రామ క్షేత్రంలో (ఒక విష్ణుక్షేత్రం) ఒక పెద్ద కొండరాయిని చూచాను. ఆ శిల మీరు వర్ణించినట్లు పద్మములచే అలంకారితమైన వనం సుదీర్ఘంగా చిత్రీకరించబడి ఉంది. మీరు చెప్పేది వింటుంటే ఆ గండశిల గుర్తుకు వచ్చింది. ఒక ఘడియకాలం ఆ శిల్పచాతుర్యం గమనిస్తూ ఉన్నాను కూడా ... ఇంక చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ...మంచిది. నేను దృష్టాంతంగా తీసుకుని వర్ణించి చెప్పే పెద్ద శిల శిల్పచాతుర్యం తీర్థయాత్రలు చేస్తూ చూచావు కదా! పద్మవన చిత్రీకరణను, శిలను ఒకే చూపుతో చూడటం
జరిగింది కదా!
శ్రీరాముడు : అవును. చూడకేం! శిల - - శిల్పములు ఒక్కచోటే ఒక్కటిగానే ఉన్నాయి కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అదే రీతిగా ... ‘దృష్టమయమైన బ్రహ్మము'ను నీవు అనుక్షణం చూస్తూనే ఉన్నావు. శిల్పరచనలో కనిపించేదానికంతటికీ శిలయే స్థానము, మూలము, వాస్తవరూపము, ఆలంబనము, అధిష్ఠానము కదా! బ్రహ్మమే ఈ సర్వజీవులకు అట్టి ఆలంబనము అయి ఉన్నది. బ్రహ్మము ప్రాణమునకే ప్రాణమగు "చిదన ఆనందం” అయి ఉన్నది.
శ్రీరాముడు : ఈ “శిల - దానిపై చెక్కబడిన పద్మవనం" అనే దృష్టాంతం చెప్పుటలో మీ ఆంతర్య మేమిటో వివరంగా చెప్పమని నా విన్నపం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రఘుకుల తిలకమా! నేను ఉదహరిస్తున్న ఆ అపూర్వమగు శిల బ్రహ్మమే అయి ఉన్నది. ఆ బ్రహ్మ శిలపై ఈ జగద్విశేషములన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఏం? శిల్పముపై కనిపించేవన్నీ శిలయే అయినట్లు, ఇక్కడ పరిపరి విశేషములతో కూడిన జగత్తు అనబడేది లేదు. బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మమునందు బ్రహ్మమునకు వేరైనదేదీ లేదు... ఉండదు.
శిలలో ప్రతి అణువూ శిలాతత్త్వమే కదా! "ఘనత్వము, ఏకాత్మకము” అనునవి 'చిత్' నందు ఉన్నాయి గదా! అందుచేత ఆ చితన్ను శిలతో పోలుస్తున్నారు.
అత్యంత విశాలము, సూక్ష్మము అగు ఆకాశమునందు వాయువు ఉన్నట్లు ఆ చిత్ శిలయందు దృశ్యము ఉన్నది. ఈ ఆకాశము, భూమి, వాయువు, పర్వతములు, దిక్కులు . ఇక్కడ జగత్తులో వెలయుచున్నాయి. ఇక్కడ చిన్న రంధ్రంలో కూడా ఖాళీ లేదు. అయితే, ఈ జగత్తు వేరే ఏదో వస్తువై ఉన్నట్లు అనిపిస్తోంది. శిలపై పద్మవనం చూస్తున్న వానికి రకరకాల భంగిమలలో పద్మములు కనిపిస్తూ ఉన్నాయి. “సరోవరం... అందులో పద్మములు” అనే పరిశీలనతో చూచేవారి దృష్టిపథంలో శిల గురించిన దృష్టి ఏమరువబడుతుంది కదా!
'చిత్' నుండి ఈ జగత్తు వేరు కాదు. సర్వమూ శుద్ధ చిదాత్మకమే! వేరుగా అనిపించేదంతా కల్పన... లేక... మాయ మాత్రమే.
శ్రీరాముడు : అయితే, మహర్షీ! చిత్ శిలయందు చెక్కబడే ఈ జగత్ శిల్పానికి తన ఊహ - - తెలివి - కల్పనచే కర్తృత్వం వహించే శిల్పి ఎవరు?
Page:163
శ్రీవసిష్ఠ మహర్షి : ఇంకెవరు? ద్రష్టయే (చూచువాడే!) ద్రష్ట తన సంకల్పస్వరూపమైన మనస్సుచే ఈ చిత్ శిలయందు భూత - వర్తమాన - భవిష్యత్ 'అనుభవములు' అను చిత్రములను చిత్రిస్తున్నాడు.
ఇక ఈ కాల భంజకములు (Compartments of Time) వాస్తవములుగా తోచుచున్నప్పటికీ, వాస్తవములు కాదు. బ్రహ్మశిలయందు విభిన్నములగు పదార్థములు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి బ్రహ్మము ఏకమగు ఘనపిండమే.
ఈ నీకు కనబడే సృష్టి చిత్ శిలయే అయి ఉన్నది. ఇప్పటి ఒక శిల్పము ఆ రూపము పొందక ముందు అంతవరకూ ఎక్కడ దాగి ఉన్నది?
శ్రీరాముడు : అంతకు ముందు ఆ శిల్పం శిలలోనే మౌనంగా దాగి ఉండి ఉంటుంది కదా? శిలా విభాగంలో శిల్పం చెక్కబడింది.
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లాగే సుషుప్తి దశలో ఈ జగత్తుకు సంబంధించిన అనుభవ సంస్కారం ద్రష్ట యందే నిశ్శబ్దమై ఇమిడి ఉంటోంది. శిలయందు చిత్రించబడిన పద్మమునకు (ఆ శిలకు వేరుగా) ఉత్పత్తి ఏముంటుంది? వినాశనమేమి? ఆ రీతిగానే చితనందు చిత్రించబడే ఈ జగత్తులకు కూడా ఉత్పత్తి లేదు... వినాశనమూ లేదు. శిలయందు శిల్పంలాగా ఆ ఆత్మయందు జగదృశ్యం సందర్శించ బడుతోంది.
సాధ్వియగు ఒక స్త్రీ హృదయంలో సుదీర్ఘ కాలం దూర ప్రాంతంలో ఉండిపోయిన ఆమె భర్త యొక్క రూపము, సంభాషణా చమత్కారాలు, కరస్పర్శాది అనుభవాలు, హాస్య-లాస్యాలు ఉన్నట్లు, అనంత వికారములు కలిగిఉన్న ఈ ఈ బ్రహ్మాండములు కూడా ద్రష్టలోనే రూపము కలిగిఉన్నాయి కాని, బాహ్యమున కాదు.
శ్రీరాముడు : మహర్షీ ! 'వికారములతో కూడిన ఈ బ్రహ్మాండములు, వీటి భేదములన్నీ దర్శిస్తున్న ద్రష్ట... ఉభయములు చిన్మాత్రమే' అను యుక్తి యుక్తియుక్తమే కదా? ఉచితమే కదా? శ్రీవసిష్ఠ మహర్షి : బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మాండములు మనోకల్పనా వైచిత్ర్యము మాత్రమే! నీటియందు నీటి బొట్టు విలీనమైనట్లు ఈ జగత్తుకు సంబంధించిన వర్తమానానుభవ వికారములన్నీ చిన్మాత్ర దర్శనము (Perceiving Absolute self) నందు విలీనమైపోగలవు.
చిత్ అనంతం కదా! దాని వికారాలు కూడా అనంతమే. అయితే, నామరూపాలుగా ఆవిర్భవించే వన్నీ కాలానుగతంగా ఆ రూపనామాలు కోల్పోతాయి కదా! ఈ జగత్తులో ప్రతిదీ రూపాదులు పొంది, కొంత సమయం తరువాత కోల్పోతున్నది. వాటి అనుభవం ద్రష్ట యొక్క అవగాహనను అనుసరించి మాత్రమే ఉంటున్నది.
కవులచే వర్ణించబడే గంధర్వనగరం నామమాత్రమే అయినట్లు, ఈ జగత్సృష్టులు కూడా నామ మాత్రములే! ఒక కవి యొక్క రచనలో తారసపడే పాత్రల మధ్య తీవ్రము, సంచలనయుక్తము,
Page:164
భాషా ప్రయుక్తము అయినట్టి భావావేశాలు ఏమౌతున్నాయి. కథతోనే ముగుస్తున్నాయి కదా! సృష్టి అనబడే ఒకానొక దృష్టిని మొట్టమొదట చైతన్యమే గ్రహిస్తోంది. ఆ గ్రహించబడేదంతా కాలానుగతంగా చైతన్యమునందే లయం అగుచున్నది. జలం అనేక తరంగాకారాలు ధరించి, ఆ తరువాత ఆ తరంగాకారాలను తనయందు లీనం చేసుకోవటం లేదా!
దృశ్యజగత్తు నందు స్ఫురించుచున్న ఈ వస్తు వికారములన్నీ వాస్తవానికి అర్థశూన్యములు. అన్నీ చైతన్యమునందు ప్రతిభాసించి ఆ ప్రతిభాసక చైతన్యమునందే లయిస్తున్నాయి. శ్రీరాముడు : ఈ వస్తు వికారాలు జీవుని ఆశ్రయించటానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంటుందా? శ్రీవసిష్ఠ మహర్షి : ఇక్కడి వస్తువికారాదులకు స్వతంత్రమైన ఉనికిలేదు. వాటిని దర్శిస్తున్న చైతన్యము అట్లు సంకల్పించుట చేతనే అవి ఆ విధంగా తారసపడుచూ, అనుభవమౌతున్నాయి. కనుక ఈ సర్వం సంకల్ప మాత్రమే. ఆత్మ విచారణా సమన్వితమగు అత్యుత్తమ సంకల్పం నందు అనగా స్వస్వరూపం యొక్క అఖండ అప్రమేయ నిత్యత్వములు సంకల్పించుచున్న సమయంలో తదితరమైన సంకల్పములు తమ రూపము కోల్పోతాయి. అప్పుడు “నిర్విషయ - నిర్విశేష - అనిర్వచనీయ” స్వస్వరూపానందానుభవం సంభవించగలదు. అదియే ఈ సంసారమునకు సముచిత సమాధానం.
బ్రహ్మము అనంతము. నిరర్థకమైన క్రియలు - - వర్ణన, గ్రహణములు కూడా బ్రహ్మమే! ఈ వికారాదులన్నీ బ్రహ్మమునందే ఉదయిస్తున్నాయి. బ్రహ్మమునందే అస్తమిస్తున్నాయి. కనుక సర్వదా, సర్వము పట్ల నిశ్చింతుడవై, అనంత స్వభావుడవై ఉండుము.
మృగతృష్ణ - ఈ సృష్టిని మృగతృష్ణతో పోల్చవచ్చు. మృగతృష్ణలో గల చిన్నతరంగం, పెద్దతరంగం -అన్నీ భ్రమాత్మకములైనవే కదా? పెద్దతరంగం పెద్దగా, భ్రమాత్మకమనీ, చిన్నతరంగం చిన్నగా భ్రమాత్మకమనీ అనం కదా? ఈ జగత్తు భ్రమచే దర్శించబడుచూ, స్వస్వరూప జ్ఞానముచే ‘రాహిత్యము’ వహిస్తోంది.
పుష్పం, ఫలం మొదలైన వృక్ష విభాగములన్నీ బీజము యొక్క అనువృత్తములే కదా! అట్లాగే ఈ సమస్తం చిత్ సత్త యొక్క అనువృత్తియే. అనగా... విత్తనంలోని సత్త 'అంకురం, శాఖ, పల్లవంమొదలైన రూపములుగా క్రమంగా వికృతిని పొంది వాటికి తానే కారణమౌతోంది కదా!
చిత్ నందలి సత్తయే ఈ తదితర జగత్తుగా ప్రభవిస్తోంది. కనుకనే 'ఈ జగత్తుకు కారణం చిత్ సత్తయే’... అని సిద్ధాంతీకరించ బడుతోంది. చిత్ సత్తా సర్వదా ఏకమే అయి ఉండి కూడా, ద్వైత భావమునకు కారణమయి ఉంటోంది.
ఈ జగత్తు ఎక్కడినుండి కలిగింది? ఆత్మవిషయమై ఏమఱుపుకు సంబంధించిన జాడ్యకల్పన నుండే కలిగింది.
అయితే... చిత్తు జడముగా మారుతోందా? ..లేనేలేదు. అది అట్లు మారదు. మారజాలదు. తెలుసుకొనుచున్న వాని ఉనికి, విస్తారముల చేతనే 'తెలియబడుచున్నది' అనేది మనగలుగుతోంది.
Page:165
అయితే, తెలుసుకొనుచున్నదేదో, అది తెలియబడుచున్నదానిగా, ఘనీభవించటం లేదు. 'చిత్ - అచిత్' అనబడే రెండు వస్తువుల ఉనికియే లేదు. ఏకో సత్...! ఉన్నది ఒక్కటే. రెండవదగు దానికి స్వయం సంబంధమైన ఉనికి లేదు.
మహాశిలయందు చెక్కబడిన అనేక రూపములు శిలయే అయినట్లు, ఈ జగత్తు బ్రహ్మమునకు వేరుగా లేదు. రేఖలు, ఉపరేఖలతో గూడిన మహాశిలవలె బ్రహ్మమే ఈ మూడు లోకములకు ఆలవాలమైయున్నది.
శ్రీరాముడు : స్వామీ! ఈ నేను - నీవు అనునవన్నీ ఎప్పుడు, ఎక్కడ ఆరంభమౌతున్నాయి? శ్రీవసిష్ఠ మహర్షి : శిలయందు పద్మవనం శిల్పిచే చెక్కబడింది కదా! శిల్పి తన కల్పనాచాతుర్యం అనుసరించి శిల్పం తయారు చేస్తున్నాడు. కల్పన యోచన నుండి, యోచన వాసనల నుండి ఉద్భవిస్తు న్నాయి. జనుల అభిరుచిని అనుసరించియే శిల్పి శిల్పములో దృశ్యవిశేషాలను చిత్రీకరించుచున్నాడు కదా! అట్లాగే, ఈ దృశ్యజగత్తు కూడా జనుల సంస్కారాలను అభిరుచులను అనుసరించే కల్పించ బడుతోంది.
శిల్పి యందలి కల్పనా సమూహములకు పుట్టుక ఏమి? చావు ఏమి? అట్లాగే చిత్ నుండి కల్పనచే బహిర్గతమగుచున్న 'నేను' 'నీవు' అనునవన్నిటికి జన్మలేదు. క్షయమూ లేదు.
అజ్ఞానముచే 'నేను', 'నీవు'తో సహా ఈ తదితర జగత్తులు ఉన్నట్లు తోచుచున్నది. జ్ఞానముచే ఈ ‘నేను’ ‘నీవు’, త్రివిధ కర్మలు - - ఇంద్రియగోచర జగత్తులు భావనామాత్రమని తెలియవస్తోంది. కనుక, 'నేను’, ‘నీవు’ మొదలైనవాటికి ఉత్పత్తికి కారణం స్వస్వరూపము యొక్క వాస్తవ స్వభావము ఏమరుచుటయే. ఆ ఏమరుచుటనే 'అజ్ఞానం' అని పిలుస్తున్నాం. స్వస్వరూపము యొక్క ఏమరుపే ‘తెలియక పోవటం’ అని విజ్ఞులు పిలుస్తున్నారు. అట్లు తెలియకపోవుటచేతనే కొందరు జీవులు ఈ జగత్తుని వస్తుసమూహములను ఎప్పటికప్పుడు సంకల్పదర్పణము ద్వారా దర్శించుచూ ఇవన్నీ నిత్యమని భావిస్తున్నారు.
శిలలోని శిల్పవిభాగం, శిల్పరహిత విభాగం అంతా కూడా శిలకు ఏమాత్రం వేరు కాదు కదా?... అట్లాగే ఇక్కడ తోచుచున్న జగత్కర్త, ఆయన కర్తృత్వం, తత్కార్యమగు ఈ జగత్తు ...అంతా కూడా చిత్స్వరూపం (ఎరుక స్వరూపం) మాత్రమే! ఆత్మ దర్శనమైనదా... ఈ జగత్తు, దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. దీనినే వేదాంత వాఙ్మయ రచయితలు 'కేవలీస్థితి' అని జగత్ రాహిత్యం అని వర్ణిస్తున్నారు.
ఒక చమత్కారమేమంటే... ఈ జగత్తు గాని, ఆ బ్రహ్మము గాని ఎవరి చేతా సృష్టించబడుట లేదు...! నాశనము చేయబడుట లేదు!
పర్వత శిఖరం పర్వతం నుండి వేరు కాదు కదా. శిఖరం పర్వతం యొక్క వికారం కూడా కాదు. పర్వతము సదా శిలామయము మాత్రమే. బ్రహ్మము, సృష్టి కేవలం ఉల్లాస విలాసాలను (లీల) సూచిస్తున్నాయి.
Page:166
ఆయా శిల్పుల వివిధములైన - విరుద్ధములైన మనో కల్పనా భేదముల వలన శిలలో వివిధ రీతులుగా శిల్పాలు అనబడే ఆకారాలు గోచరిస్తున్నాయి. అట్లాగే ప్రకృతి సిద్ధంగా కూడా శిలలు అనేక రూపాలను (ఆకారాలను) దాల్చుచూ ఉండటం జరుగుతోంది కదా! అంతమాత్రం చేత ఆయా శిల్పా లన్నీ శిల కంటే వేరుగా ఉంటున్నాయా? ఈ జగత్తు నానావిధ జీవుల విరుద్ధ కల్పనా భేదాలతో కూడి ఉన్నది. ఏది ఏమైనా బ్రహ్మం సర్వదా స్వస్వరూపం నందే స్వస్వరూపం గానే వెలయుచ్నుది.
ఇక్కడి వైచిత్ర్యం ఏమంటే... ఎచ్చట ఏ ఆకృతి కల్పించబడుచున్నదో, అచ్చట ఆ ఆకృతియే వెలయుచున్నది. ఇందు వస్తుగతమైన భేదమేమీ లేదు. కనబడుచున్న వస్తువులన్నిటిలో బ్రహ్మ స్తతయే వెలయుచున్నది. బ్రహ్మ సత్తయే పదార్థముల సత్త. నిద్రించేవాడు స్వప్నంలో చూచే వస్తువులకు, ఆ స్వప్నమునకు సంబంధించిన కల్పనకు భేదమేమైనా ఉన్నదా? లేదు. అయినా కూడా ఆ స్వప్న సమయంలో అభేదాన్ని గుర్తించక అప్పటికి మాత్రం ఆ స్వప్నద్రష్ట వివిధములైన అనేకానుభూతులు పొందుచున్నాడు కదా! అటువంటిదే జాగ్రదవస్థ కూడా! ఈ జాగ్రత్ద్రష్ట తాను చూచే పదార్థములకు తన కల్పనలకు అభేదం తెలియక ఇక్కడ అనేకత్వానుభూతి అనుభవిస్తున్నాడు. ఈ జగత్తు వికసించినా ...ఇది నామమాత్రమే! బ్రహ్మసత్త మాత్రమే వాస్తవము. ఇదంతా వాసనామాత్రమే! స్వతహాగా ఇది చిల్డ్రనప్రకాశమవటం చేత, నిత్య ప్రశాంతము. ఈ సృష్టి బ్రహ్మమందు తోచుచున్నప్పటికీ ఎక్కడా 'ద్వైతము' అనేది ఉండజాలదు.
3. ఇక భేదమెక్కడిది?
శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చిత్ను అచేతనమగు బిల్వఫలంతోను, శిలతోను పోల్చారు కదా! దాని తాత్పర్యమేమిటో కూడా కొంచెం వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : ‘చిత్’ తత్త్వము స్వరూపమునకు సంబంధించిన ఉత్సుకతను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ సృష్టి సంభవిస్తోంది. సృష్టి అంటే స్వసత్త “యుగ - సంవత్సరములు - వస్తు సంబంధ అనుభూతి విశేషాలు” అను స్వప్నమునందు తన ప్రవృత్తిని ప్రవేశింపజేయుటయే.
వాస్తవానికి ఇక్కడ స్వగత భేదములకు తావు లేవు. దేశకాలాదులు బ్రహ్మము యొక్క కల్పనయే కాబట్టి, అవి కూడా చిన్మయములేనని చెప్పటానికి అర్హమగుచున్నాయి. కనుక ఇక్కడ 'ఇది చిత్-ఇది అచిత్' అనే విభేదం చేయజాలము.
'శబ్దములు, శబ్దార్దములు, వాసనలు, సంకల్ప వికల్పములు - - వాటినన్నిటినీ అట్లు గ్రహిస్తున్న జ్ఞాత మొదలైనవన్నీ ఏకాత్మకములే' అని సూక్ష్మబుద్ధితో గ్రహించు. ఇక 'అసత్తు' అని దేనిని చెప్పవలె? ఫలం, అందలిగుజ్జు, రసం - ఇవన్నీ ఒకే వస్తువు అయినప్పటికీ 'ఇది రసం, ఇది గుజ్జు' అని వ్యవహరించబడుతోంది కదా! చిత్తు కూడా ఒకే విధమైన సర్జనమైనప్పటికీ వివిధ నామరూపాలతో వ్యవహరించబడుచున్నదని స్పష్టీకరించుకో. వాస్తవమైన ఏకైక స్వసత్తను ఏమరచి ఉండటమే అసత్తు!
Page:167
1. ఈ సృష్టి వైచిత్ర్యములన్నీ పెక్కు కాక పోయినప్పటికీ పెక్కుగానూ, అవికృతము గాకున్నను వికృతముగా కనిపించుచున్నాయి.
2. అయితే రాతితో మలచబడిన పద్మంలాగా, అద్దంలో ప్రతిబింబించే జంతు వృక్షాదులతో కూడిన అరణ్యంలాగా ఈ జగత్తు చిత్ నందు ప్రతిఫలిస్తోంది.
3. నిజానికి ఈ జగత్తు బాహ్యమున లేదు. మరి ఎక్కడున్నది? ద్రష్టయగు నీయందే... నీ వల్ల... నీ యొక్క సంకల్పప్రతిపాదితంగా ప్రకాశిస్తోంది. చిత్ నందు చిత్చే కోరుకోబడే జగత్తులన్నీ ఇచ్ఛానుసారంగా స్ఫురిస్తున్నాయి.
ముత్యపుచిప్పలో ముత్యాలు ఉన్నట్లు 'చితశక్తి' అనే పేటికలో జగత్తులు అనే ముత్యాలు ఉన్నాయి. సరియైన విచక్షణ, విమర్శన లేకుండా చూడటంచేత ఈ జగత్తులు ద్రష్టయొక్క దృష్టిచే నిర్మించ బడినవైనట్లు కాకుండా ...మరింకెవరి చేతనో ఎన్నడో ఎందుకో నిర్మించబడియున్నట్లు అనిపిస్తోంది. సూర్యభగవానుడు తన ఉదయాస్తమయములచే రాత్రింబవళ్ళు కల్పిస్తున్నట్లు, ఆ చిత్ సూర్యుడు కూడా తన యొక్క సంకల్ప, వికల్పములచే ఈ జగత్తులను తోపింపజేయటం, ఇంతలోనే తనయందు విలీనమొనర్చటం చేస్తున్నాడు.
ద్రష్ట ప్రసరించని దృశ్యము లేదు. దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే! దృశ్యము ‘ద్రష్ట యొక్క కల్పన' అను ముడిపదార్థంతో తయారయి ఉంటోంది.
సముద్రంలో కనిపిస్తున్న తరంగాలకు ఆధారం ఏమిటి? సముద్రజలమే కదా! ఆ తరంగాలు జలం నుండి వేరైనవా? నిరాకారమైన జలం తరంగాల రూపం సంతరించుకుంటున్నప్పటికీ, జలం సర్వదా తన నిరాకారత్వం కోల్పోతుందా? లేదే! అట్లాగే ఈ జగత్తులు చిత్ సత్తనుండి తన అఖండ - అప్రమేయ - నిత్యసాక్షీస్వభావాన్ని కోల్పోవటం లేదు. కోల్పోబోదు. ఓ రామచంద్రా! “ఇప్పుడు ఉన్నవి ఇతఃపూర్వం ఉండి నశించినవి, ఇక ముందు రాబోయేవి అయిన జగత్తులన్నీ కూడా చిత్ శిలయందు చెక్కబడిన శిల్పములు వంటివే. చిత్ జలంలోని తరంగముల వంటివే”... అని ఆత్మసద్విమర్శకులమగు మేమంతా గ్రహించి ఉన్నాము.
భావపదార్ధములన్నీ అభావ పదార్థముయొక్క చమత్కారమైన ఒక అంశ మాత్రమే! అట్టి పదార్థసారంతోనే (నేను చెప్పిన దృష్టాంతంలోని) బిల్వఫలం నిండి ఉన్నది. కాబట్టి, సర్వపదార్థములూ 'బిల్వఫలంలోని రససారమే' అని రూఢి చేసుకో. ఈ తెలియబడుచున్నవన్నీ మృణ్మయములు కాదు. చిన్మయములే! భావనలలోంచి ఉదితములగుచున్న అనుభవములే! ఆ చిన్మయములైనవాటి యొక్క తత్త్వము చిత్తేగాని, మరింకేమీ కాదు.
శిలను విడచి 'ఈ శిలయందు అనేక పద్మములు ఉన్నాయే!' అనునది ఏదో మాటవరుసకే అవుతుందిగాని, శిల నుండి బయటగా ... మరొకటిగా పద్మములు ఉన్నట్లు అవదే! చిత్ నుండి వేరు చేసి చూస్తే ఈ జగత్తు 'అసత్తు' అవుతుంది. శిలానిర్మితపద్మంలో శిల లేకుండా చూడు... అక్కడ
Page:168
పద్మమెక్కడున్నది? ఇక్కడ తారసపడే నానాత్వమంతా ఒకే శిలపై చెక్కబడిన ఆకారములవంటిది మాత్రమే. ఇందులో సందేహించవలసినపనేమీ లేదు.
శిల గురించి పూర్తిగా ఏమరిచినప్పుడు 'ఇది పువ్వు, ఇది కాయ, ఇది మనిషితల, ఇది జంతువు, ఇది మిత్రుడు, ఇది మనసైన్యం, ఇది శత్రుసైన్యం' - అనబడు శిల్పకళా విశేషాలన్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి కదా. 'సర్వమూ శిలామయమే' అనే దృష్టితో చూస్తున్నప్పుడు ... ఆ విభేదాలు ఏమౌతాయి? అర్థరహితమౌతాయి కదా! ఈ జగత్తుల ఉత్పత్తి, క్షయాలు అట్టివే! ద్రష్ట యొక్క స్వస్వరూప, స్వస్వభావముల దృష్ట్యా పరిశీలిస్తే ఇక్కడ సర్వదా అవిభక్తమైన (Indivisible) చిదనజ్ఞానమే లభిస్తుంది. శ్రీరాముడు : అసలు 'అనేకత్వము' అనే భ్రమ ఎందుకు ఏర్పడుతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : దాహముచే పరితపిస్తున్న కొందరు మూర్ఖ, అవిజ్ఞాత జీవులు జలం కొరకై అటూ ఇటూ చూస్తున్నారు. వారిలో ఒకడికి మృగతృష్ణ, అందులో జలం కనిపించాయి. ‘అదిగోరోయ్! అక్కడ జలం ఉన్నట్లే ఉన్నది’ ...అని పొలికేక వేసి పరుగులు తీస్తున్నాడు. ఇక తదితర అమాయక జీవులు ‘అక్కడ జలం లేకపోతే మనవాడు కేక ఎందుకు వేస్తాడులే'- అని అనుకుంటూ పరుగులు తీస్తున్నారు. 'ఈ ఎండలో ఈ ఎడారి ఇసుకమయమే కదా! ఇక్కడ నీరు ఎట్లా ఉంటుంది? మెరుస్తున్నంత మాత్రం చేత అది జలమే అవవలసిన పనిలేదు కదా?' అని వారు విమర్శించటం లేదు. వారి ఆర్తి అలాంటిది.
అయితే ...“ఆ సువిశాల ఎడారి, ఇసుక ప్రాంతంలో నీరు ఉండటానికి అవకాశం లేదు” అని గ్రహించినవారు, “అది గాలి వీచికలు, సూర్యకిరణముల మేళవింపు మాత్రమే...” అని గ్రహించి తదితర అమాయకజనుల వలె నిష్ఫలమైన శ్రమకు లోనుకాకుండా 'అసలు, నిజమైన జలం ఎక్కడ లభిస్తుంది' అని వెతికి వాస్తవమైన జలం ఉండే స్థానం వైపు పయనిస్తున్నారు.
ఈ జీవుడు తనను సత్ - అసత్మయమగు శరీరమాత్రుడుగా తలచుచున్నాడు. కాని ఆతడు వాస్తవానికి చిన్మాత్రుడు. తెలియబడుచున్న సర్వమునకు ఆధారభూతుడు. పరస్వరూపుడు.
యథా సమ్యక్ పయోరాశిః కోటరే కలనోన్ముఖమ్ |
ద్రవత్వాత్స్పన్దతే స్పన్దం తథేదం చిల్డ్రనాన్తరమ్ ॥ (శ్లో॥ 16, సర్గ 47)
జలము స్వతహాగా స్పందనరహితమైనప్పటికీ ద్రవత్వస్వభావం చేత పల్ల ప్రదేశములందు కదిలే స్వభావం కలిగి ఉన్నట్లు తోచుచున్నది కదా! అదేవిధంగా చితనము తనయందు స్వతహాగా చలన - సంచలనములు కలిగి ఉండనప్పటికీ, జగత్తును స్వీకరించుచున్నప్పుడు స్పందనసహితము వలె తోచుచున్నది.
శిలయందు ఉన్న (చిత్రంచబడిన) శంఖము వాస్తవానికి శిలయే అయినట్లు, చిత్ శిలయందు ప్రకటితమగుచున్న ఈ జగత్తు అనబడేది చిన్మయస్వరూపముకాక మరింకేదీ కాదు. అయినప్పటికీ, సాధారణ బుద్ధికి ఇదంతా మరింకేదోగా కానవస్తోంది. ప్రియశిష్యా! రామచంద్రా! నీవు మాత్రం ఈ దృశ్యమునంతటినీ - స్వశరీర - మనో - బుద్ధి - - చిత్త - అహంకారములతో సహా, సర్వదా చిన్మాత్రంగానే దర్శించు. దీని యందు ఏ సమయమందూ ఎట్టి వికారములూ లేనే లేవు.
Page:169
ఈ జగత్తు వాసనామాత్రమగుట చేత అనిత్యం... ఇది బ్రహ్మం నందే ఉండుట చేత నిత్యం.
నిజమైన పద్మము యొక్క తీవ్రధ్యాస గలవారికి శిలలోని పద్మము, పద్మమునకు సంబంధించిన అనుభూతిని కలుగజేస్తోంది. శిలను ఏమరచేటట్లు చేస్తుంది. శిలాప్రతిమలపై చిత్రించిన శృంగార చిత్రం కాముకుడగు వానికి తదనుగుణమైన స్ఫురణోత్సాహం కలుగజేస్తోంది. అయితే, అది వాస్తవానికి శిలే కదా...! ఈ జగత్తు ద్రష్ట యొక్క భావన, అవగాహన, ఉద్దేశము, అనుభూతులను అనుసరించి తదనుగుణంగా అనుభవమౌతుంది. అఖండము, నిత్యము, నిర్మలము, అప్రమేయము - అగు బ్రహ్మానుభూతి సమన్వితునికి ఇదంతా స్వచ్ఛం, అద్వితీయం అగు బ్రహ్మముగానే అనుభవమౌతోంది. శిలచే చిత్రించబడిన ఎలుగుబంటి దూరంగా ఉండి చూచే బాలురవంటి వారికి 'అరె! ఆ ఎలుగుబంటి నా వైపే గుఱ్ఱున చూస్తోందే!" అని అనిపించవచ్చు. దగ్గరకు వెళ్ళి చూస్తేనో... అది నిష్క్రియమగు శిలయేనని తెలిసిపోతోంది కదా! బ్రహ్మభావాభ్యాస ప్రభావంచే ప్రకాశించే ప్రశాంత హృదయులకు ఈ జగత్తు అనుద్వేగకరమగు మౌనతత్త్వముగా తెలియవస్తోంది.
శిల యందు శిలత్వము, శిల్పత్వము, శిల్పాంతర్గత కథనము - ఉన్నట్లు బ్రహ్మమున బ్రహ్మత్వము, ఈ జగత్తు కూడా ఉన్నాయి.
చెట్టు, చెట్టు యొక్క ఆకారము 'ఒక్కటే' అయినట్లు ... బ్రహ్మము, జగత్తు వేరు వేరు కాదు. రెండు చిన్మయములే! ఈ కనబడేదంతా మృణ్మయదృష్టి కలవారికి మృణ్మయంగాను, చిన్మయ దృష్టి కలవారికి చిన్మయంగాను అనుభూతమౌతోంది.
ఓ రాఘవా! మరొకసారి ప్రకటిస్తున్నాను. 'చిత్తు'లాగానే ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి వినాశనాలు లేవు. ఎండమావులను ప్రకాశింపజేస్తున్నది ఆకాశంలోని సూర్యుడే కదా! బ్రహ్మమే ఈ జగత్ప్రకాశానికి కారణమగుచున్నది. ఒకే జలం ఎండ వేడిమిచే ఆవిరి, మేఘాలు, వడగళ్ళుగా అగుచున్నది కదా! తత్త్వజ్ఞులకు ఈ సర్వ పదార్థముల మూలం బ్రహ్మమేనని తెలుసు. వారు గొప్ప పర్వతం నుండి ఒక గడ్డిపరక వరకు సర్వమూ బ్రహ్మమయమేనని గ్రహించియే సంచరిస్తున్నారు.
జలపరమాణువునందు ఏ రసశక్తికలదో ... స్థూలమగు జలమునందు కూడా అదే గోచరిస్తుంది కదా! ఆ చితశక్తియే పంచీకృత అపంచీకృతములగు స్థూలసూక్ష్మ భూతములందు నిండి ఉన్నది. ఒకే విధమైన 'శక్తి' గడ్డిలోను, ఆకులలోను, లతలలోను, ఈ కనబడే నానావిధపదార్థములందూ దాగి ఉన్నది కదా! (సర్వమ్ శక్తిమయమే!) బ్రహ్మమే ఈ నానా విధములుగా తోచుచున్న వివిధ వస్తువులతో పరివ్యాప్తమైయున్నది. నెమలి గుడ్డులో నెమలి పింఛము యొక్క రంగురంగులు దాగి ఉన్నవి కదా! పరమాణువు నందు పదార్ధస్వభావమంతా ఒదిగి ఉంటోంది. బ్రహ్మమునందు
Page:170
గుణములు, ఆ గుణములకు ఆధారమగు ఆవిర్భావ, తిరోభావములు, వాటిని అనుభూతి పొందే గుణి...అన్నీ కూడా రసస్వరూపమై ఒదిగి ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ బ్రహ్మమునందు ఆపాదితములైనవేనని గ్రహించు.
వివేకదృష్టితో పరికించి చూచేవానికి “ఈ నానాత్వమునకు కారణమైన బ్రహ్మము అద్వయము” అని తెలిసిపోతోంది. వాస్తవానికి అది ద్వైత - అద్వైతములకు కూడా అతీతమైనది. సత్ - -
అసత్తులయందు సమత్వమున ఏదైతే సర్వదా వెలయుచున్నదో... అదియే బ్రహ్మము. అనుభూతములన్నీ బ్రహ్మమునందే, బ్రహ్మముచేతనే ఉదయిస్తున్నాయి. అద్దాని సమక్షమునందు అనుభూతి ఉంటోంది. లయిస్తోంది.
ఈ జగత్తు చిద్రసముతో నిండిఉన్నదై, తనకు తానే ఉనికిని కల్పించుకుంటోంది. జగత్తు అనే రసము బ్రహ్మము నందే ప్రకాశిస్తోంది. బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. జగత్తంతా బ్రహ్మరసముచే నింపివేయబడి ఉన్నది. ఇక భేదమెక్కడికి?
4.స్వస్వరూపానంద సుస్థిరత్వం
శ్రీవసిష్ఠ మహర్షి : ఒక నెమలి గ్రుడ్డులో - నెమలి యొక్క రూపం, పింఛం, ఆ పింఛంలోని రంగుల వలయాలు, జూలు, పెద్ద రెక్కలు, సన్నటి పొడవైన కాళ్ళు, గోళ్ళు- మొదలైనవన్నీ దాగి ఉన్నాయి కదా! అట్లాగే విశుద్ధమగు చిత్ అండముతో అహంకారము-బుద్ధి-చిత్తము మొదలైన వాటితో కూడిన అంతర్ జగత్తు ...దిక్కులు - ఆకాశం మొదలైన వాటితో కూడిన బాహ్యజగత్తు అనభ్యుతములై (As non-Provoked) వెలయుచున్నాయి.
ఆ చిదనానందమే ఈ సర్వ శరీరావయవాలకు రసమై - “ప్రాణంగాను - - విషయసుఖసారాలైన చిత్తవృత్తి భేదాలుగాను, భోగ్య - భోగాది వస్తువులుగాను" - అద్దంలోలాగా ప్రతిబింబిస్తున్నది.
మనం ప్రతిబింబితమైన విషయానందమును చూస్తున్నప్పుడు ...ఆ ప్రతిబింబమునకు మూలమైన చిదనరూప నిరతిశయానందము యొక్క ఉనికిని ఒప్పుకోక తప్పదు. ఆ నిరతిశయానందం స్వాత్మానుభవ రూపమే సుమా! స్వాత్మానుభవరూపమునే తురీయమని కూడా అంటున్నారు. అట్టి నిరతిశయానందాన్ని మునులు, దేవతలు, గణములు, సిద్ధులు, మహర్షులు అగు వారిలో అనేకులు అనుభవిస్తూనే ఉన్నారు. నిర్నిమేషులై స్థిరపడిన దృష్టిని అధిరోహించి, దృశ్యదర్శన రహితులై నట్టి మహనీయులెందరో ఆ స్వస్వరూపానందమున తేలియాడుచున్నారు. అట్టి దృశ్యదర్శనరహిత మైనట్టి స్వస్వరూపంలో నిలకడ పొందలేక ప్రాణ చలన చిత్త విక్షేపములకు చోటిచ్చుటచేతనే ఈ జీవులలో అనేకులకు ఆ ఆనందం అనుభవానికి రావటం లేదు. ఇంతకు మించి వేరే కారణమేదీ లేదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు ఉదహరిస్తున్న “స్వస్వరూపానంద సుస్థిరత్వం” మరికొంత విస్తారంగా వివరించండి.
Page:171
శ్రీవసిష్ఠ మహర్షి : స్వస్వరూపము యొక్క మహత్తరానుభవమనునది ఎరిగి ఉన్న ఆత్మజ్ఞులు ఈ కర్మలలో నిమగ్నమగుచున్నప్పటికీ...వారు బాహ్య వస్తువులు చింతనలో ఒక్క నిమిషం కూడా నిమగ్నమవటం లేదు. జ్ఞానజ్ఞేయములను సర్వదా త్యజించివేసి ఉంటున్నారు. అనగా 'తెలుసుకునేది, తెలియబడేది’ అను ద్వంద్వమునకు ఆవల తమ స్వరూపమును ప్రతిక్షేపించుకుని ఉంటున్నారు. అట్టి దృష్టి-అవగాహన-భావన-అనుభవములను శాస్త్ర పరిభాషలో 'సమాధి' అని పిలుస్తున్నారు. ఒక చిత్రంలోని మనిషికి స్పందనాస్పందనములు ఉండవు కదా! స్వస్వరూపానుభవి యొక్క అంతరంగం స్పందనాస్పందరహితంగా ఉంటుంది. వారు చిత్తమును, చిత్తమునకు ఆశ్రయమై ఉంటున్న విషయములను సదా త్యజించినవారై ... తత్ఫలితంగా 'భూమానందము' అని చెప్పబడే 'సర్వ సమభావన’ను పొందుచున్నారు.
ఆ పరమేశ్వరుడు అంతరమున స్వస్వరూపానందమయుడై ఉండి కూడా బాహ్యమున ‘మాయ’ అగు ఈ జగత్తును నడిపిస్తున్నారు కదా! అదే రీతిగా ... జ్ఞానోదయమై, స్థిర స్వభావులైన మహానుభావులు అంతరమున స్వస్వరూపమును ప్రతిక్షేపించుకుని, ఇక బాహ్యమున వ్యవహారములు సలుపుచూ ఉన్నారు. ఓ రామా! నీవు కూడా నిరభ్యంతరంగా ఇప్పటికిప్పుడే అజ్ఞానమయములైన ద్వైత భావములను వదలివేయి.
శ్రీరాముడు : అప్పుడు కర్మలు నిర్వర్తించటం సులువు కాదేమో!
శ్రీవసిష్ఠ మహర్షి : కాలానుగుణంగా సంప్రాప్తించే కర్మలలో పాల్గొనుచూ భూమానందము, లేక సమాధిని అవధరిస్తున్న వారెందరో ఉన్నారయ్యా! నీ అంతరంగ సునిశ్చితబుద్ధిని బయటనుండి నిన్ను అడ్డుకోగలిగేది ఈ చరాచర సృష్టిలో ఏదీ లేదు.
చంద్రకిరణములు వృక్షములందు, ఆకులందు, చిగుళ్ళయందు ప్రవేశించి వాటిని రసభరితం చేస్తూనే తన ప్రశాంత తత్త్వమును కొనసాగిస్తున్నాయి కదా! చంద్రకిరణములు ఒకానొక చోట అగ్నిగుండముపై ప్రసరించినంత మాత్రం చేత చంద్రమండలం తన చల్లదనం కోల్పోతుందా?... లేదు కదా! మహాత్ముల బుద్ధి - 'చిత్తవృత్తులు, బాహ్యవిషయముల’తో కూడుకుని ఉన్నప్పటికీ సర్వదా నిరతిశయానందమును అభివ్యక్తం చేస్తూనే ఉంటోంది. వారి వాక్కు, యోచన - అన్నీ కూడా ‘ఇచ్ఛ, ఆశయ, ద్వేష, ఉద్వేగ, నిరుత్సాహములను' అధిగమించి ఉంటున్నాయి. అందుచేత అన్నివేళల, అన్ని స్థితులందు విక్షేపరహితమైన ఆహ్లాదమును వారు ప్రాప్తించుకుని ఉంటున్నారు.
చంద్రుని వెన్నెలకు రూపమేముంది?... అదేవిధంగా శుద్ధసంవిత్తుకు ఎట్టి రూపమూ లేదు. స్వస్వరూపానుభవజ్ఞులు రూపాతీతమైన అనుభవమునందు వెలయుచున్నారు.
అట్టి స్వస్వరూపానుభవం చూడబడజాలదు. ఉపదేశించబడజాలదు. అది దూరం కాదు. దగ్గర కాదు. అది కేవలం అనుభవయోగ్యం అని చెప్పాలి. దానికి దేహేంద్రియ మనోప్రాణములు లేవు. సంకల్ప-వాసనలు లేవు. అది జీవుడు కాదు. స్పందన కాదు. సంవిత్తు కాదు. జగత్తు కాదు. అత్యంత సన్నిహితం-దూరం-మధ్యం కాదు. శూన్యం- అశూన్యం- శూన్యాశూన్యాలు కూడా కాదు. శ్రీరాముడు : మరి అట్టి స్వస్వరూపమును గుర్తించటం, అధిరోహించటం ఎట్లా?
Page:172
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ నా వాక్యములు ఉత్తమవివేకంతో విచక్షించుకో. అది అధిరోహించవలసినది నీవేగాని, నేను గురువుగా ఇంతకు మించి స్పష్టపరచలేను.
ఇక్కడి దేశకాలాదులచే 'స్వస్వరూపానందప్రతిష్ఠ'ను నిర్వచించలేం. ఎందుకంటే అది దేశకాలాదు లందలి పదార్థమేదీ కాదు. అయితే ఏం? దేశకాలాదులుగా పరిచ్ఛిన్న స్వభావం ప్రదర్శిస్తున్నది అదే! అది విషయములన్నింటికీ వేరయి కూడా, తానే అనంతములగు వాసనలతో గూడిన హృదయ కోశమును కలిగి ఉంటోంది. అద్దాని స్వస్వరూపమహిమ వలననే దృశ్యవస్తువులు ఆవిర్భవించి విలయమొందుతున్నాయి. స్వస్వరూపసత్తకు శాస్త్రములు 'ఆత్మ' అను పేరుపెట్టాయి. అది నిష్కారణమై, కారణములన్నిటికీ కారణమై చెన్నొందుచున్నది. ఈ వాయువు, అగ్ని మొదలైనవన్నీ దాని రూపమును మార్చలేవు. ఇహలోక, పరలోకములు ఆ స్వస్వరూప సద్రూపమును మరొక తీరుగా చేయజాలవు. వేలకొలది దేహములు ఉత్పన్నమై, వినాశమగుచుండగా ఆ స్వస్వరూపం మాత్రం స్వస్థానముననే ఉండి వాటన్నిటికీ సాక్షి మాత్రమై వెలుగొందుతోంది. అద్దాని వెలుగుచేత ... అద్దాని సమక్షంలో ఈ వేలాది దేహములు వస్తున్నాయి, పోతున్నాయి.
ఆత్మాకాశము యొక్క బయటగాని, లోపలగాని ఎట్టి వికారములు మార్పు చేర్పులు లేవు. ఈ దేహములకు స్ఫురిస్తున్న వికారములేవీ ఆత్మకు ఉండజాలవు. అట్లని ఈ దేహములు ఆత్మ కాక మరొకటేదో నని అనుకోవద్దు. ఇక్కడ వికారములు స్ఫురించటానికి కారణం 'బోధ’ యొక్క వికృతియే గాని మరొకటేదీ కాదు. అందుచేత పరిపక్వమైన స్వబుద్ధిని సంపాదించిన జ్ఞానులు ఈ విశ్వమును 'ఆత్మ'గానే గ్రహిస్తున్నారు.
శ్రీరాముడు : అట్టి అఖండమగు స్వస్వరూపసమేతుడనగు నాకు ఇక్కడ కర్తవ్యమేమిటి? అకర్తవ్యమేమిటి? శ్రీవసిష్ఠ మహర్షి
ప్రజ్వలన్నపి కార్యేషు నిర్వాణో నిర్మమో భవ |
యదిదం దృశ్యతే కించిజ్జగత్థావరజంగమమ్ || (శ్లో 18, సర్గ 48)
తత్సర్వం బ్రహ్మ నిర్ధర్మ నిర్గుణం నిర్మలాత్మకమ్ |
నిర్వికారమనాద్యన్తం నిత్యం శాస్త్రం సమాత్మకమ్ ॥ (శ్లో 19, సర్గ 49)
ఇక్కడ అవిశ్రాంతంగా కార్యములు ఒనర్చుచున్నప్పటికీ, నీవు నిర్వికారమగు ఆత్మను ఇక్కడ దర్శిస్తూ ఉండు. ముక్తాత్మ స్వరూపుడవై సర్వప్రకాశకమగు స్వీయ కాంతితో ప్రకాశించు.
కనులకు కనబడుచున్న ఈ స్థావరజంగమాత్మక జగత్తు అంతా నిర్గుణము, నిర్మలాత్మకము ఉపాధిధర్మ విరహితము అగు బ్రహ్మమేనయ్యా! అది ఆద్యంతహీనము, నిత్యము, శాంతము, సన్మాత్రము అయి ఉన్నది ఇక నీకు సందేహమెందుకు?... వికారాదులెందుకు?
వత్సా! ఈ కాల-కర్మ-కారణ-కర్మ-క్రియ-నిదాన-సృష్టి-స్థితి-లయ-స్మరణ-విస్మరణాదులన్నీ కూడా బ్రహ్మమేనని గ్రహించు. బ్రహ్మముతో మాత్రమే ఐక్యము సంపాదించుకో. అప్పుడిక ఈ సంసారచక్రములో పడి పరిభ్రమించటం జరగనే జరగదు.
Page:173
5. ఆత్మ సర్వదా నిర్మలమే!
శ్రీరాముడు : హే పరమ బ్రహ్మజ్ఞా! గురుదేవా ! "నిరతిశయము మహోత్తమము”అగు బ్రహ్మవస్తువు నందు దేశ-కాల-నిమిత్తములు అనే పరిచ్ఛేదమే లేదని మనం అనుకుంటున్నాం కదా! అట్టి వికారాలకు తావు లేనపుడు మరి అది భావ-అభావముల రూపంలో ఎట్లు, ఎందుకు ప్రకాశిస్తోంది? శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మకు భూత భవిష్యత్తు వర్తమానములతో పరివర్తనమంటూ లేదు. అది కాలముచే బద్ధమైనది కాదు.
పాలు పెరుగుగా మారుతున్నప్పడు 'పాలు పెరుగుగా పరివర్తనమౌతోంది' అని అంటున్నాం. ఆ పరివర్తనమునే 'వికారం, పరిణామం' అనే మాటలతో వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఇక పెరుగు తిరిగి పాలుగా మారే ప్రసక్తి ఉండదు కదా! బ్రహ్మం-జగత్తు అట్టి పాలు- పెరుగు వంటివి కాదు. బ్రహ్మమునకు పరివర్తనం లేదు. అది జగత్తుగా మొదలే మారటం లేదు.
అయితే ... ఈ జగత్తు యొక్క ఆదిమధ్యాంతము లందు కేవల నిర్మల బ్రహ్మమే వెలయుచున్నది.
పాలకు ఉండే వికృతి బ్రహ్మానికి లేదు. బ్రహ్మం 'అనాది, అనంతం' - అగు వస్తువు. అందుచేత అవయవసంయోగం, అన్యద్రవ్య సంబంధం మొదలైనవి బ్రహ్మమునకు సంబంధించి లేవు. ఇక సర్వసమమగు బ్రహ్మమునందు ఒకనికి కనిపించే ఈ జగత్తు స్వయంకృతభ్రమకు సంబంధించిన వివర్తం మాత్రమే. బ్రహ్మమును భావన చేసేవానికి భావ - అభావ జగత్తు మిథ్యగానే తెలియవస్తోంది. బ్రహ్మము అనగా సంస్పర్శరహితమగు చిదాత్మయే కదా! అద్దానిలో జ్ఞానజ్ఞేయములు లేవు.
బ్రహ్మమునందు జ్ఞానజ్ఞేయములు కూడా లేవు. అది సృష్టికి పూర్వమున, పరమున కూడా ఉన్నది. అద్దాని యందు జగత్తు మొదలైన భ్రమలు లేనేలేవని గ్రహించు. పూర్వమున, పరమున ఒకే తీరుగా ఉన్న బ్రహ్మము మధ్యలో మాత్రం మరొక తీరుగా అగుచున్నదా? లేదు. లేనే లేదు. మధ్యకాలంలో ఇంకొక రీతిగా తోచటం కేవలం భ్రమ మాత్రమే.
“ఆత్మ ఆది-అంతము లందు, మధ్యలోను సర్వత్రా సర్వవైపులా సమస్వరూపమున వెలయు చున్నది.” ఇక ఈ దృశ్య దర్శన వివర్తము ఉంది చూచావు?... ఇది ఆత్మ సంబంధీయమే కాని, ‘ఆత్మతత్త్వం మాత్రం కాదు. ఆత్మ సంబంధీయమైన దానితో ఆత్మ వికారం పొందుట లేదు.
సర్వశక్తిమంతమగు బ్రహ్మము లేక ఆత్మ రూపరహితము... ఏకము... నిత్యము కూడా. అందుచేత ఈ భావవికారాలకు అది ఎన్నడూ వశమగుటలేదు.
శ్రీరాముడు: మరి పరిపూర్ణము - నిర్మలము — సద్రూపము ఏకము అగు బ్రహ్మమున
‘అజ్ఞానం' అనతగ్గ అవిద్య ఎక్కడ నుండి వస్తోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు 'బ్రహ్మతత్త్వం'
ఒక్కటే వెలయుచున్నదని మరొక్కసారి చేతులెత్తి ప్రకటిస్తున్నాను అది అనాది ... అనంతము! ఇక అవిద్య ఏమంటావా?... అవిద్య అనునదే లేదు. ఇది నిశ్చయమగు సత్యము.
Page:174
ఇక బ్రహ్మము యొక్క సద్భావం గురించి, అసత్ విభాగం గురించి వేరువేరుగా చెప్పుకోవటం కేవలం ఉపదేశ సౌలభ్యం కొరకు మాత్రమే. 'ఇది బ్రహ్మతత్త్వము'... అని అనుభవజ్ఞుడగు గురువు శిష్యులకు ప్రతిపాదించి చెప్పుకొస్తున్నప్పుడు, ఆ శిష్యులకు అవగతమవటానికి వీలుగా అనేక వాచ్య-వాచక శబ్దములన్నీ కల్పించబడుచున్నాయి. అంతేకాని, అదంతాకూడా బ్రహ్మమునుండి వేరైన మరొకదానిని వర్ణించడం కానే కాదు. నీవు, నేను, జగత్తు, భూ, దేవలోకములు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు -1 అన్నీ కూడా ఆద్యంతరహితమగు బ్రహ్మము కాక మరింకేమౌతాయి? అవిద్య అనేది ఒకించుక కూడా లేదు. ఇక వివర్తము, అవిద్య, భ్రమ... అనునవన్నీ నామమాత్రమే. అవన్నీ ఆత్మ యొక్క ఏమరుపును ఉద్దేశిస్తున్నాయని గ్రహించు. అవిద్య అనునది సత్యం యొక్క అభావం మాత్రమే నని ఈ సభలోని, తదితర ప్రపంచంలోని అనేకమంది తత్త్వజ్ఞులు ఎరిగియే ఉన్నారు.
ఓ రాఘవా! ‘లేనిదే’ అగు అవిద్య ఎట్లా ఉదయిస్తుంది? ...అది సత్యమెట్లా అవుతుందయ్యా! శ్రీరాముడు : ప్రభూ ! మరి మీరు ఉపశమన (ప్రకరణ) ప్రవచన సందర్భంలో "అవిద్యను ఎట్లా సంబోధించాలి?" - అను విషయంలో అనేక విశేషాలు చెప్పారు కదా! దాని మాట ఏమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : అవును, చెప్పాను. అప్పుడు కొంత అజ్ఞానదశలో ఉండటం చేత నీకు అలా కల్పించి చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు క్రమేపీ సంభాషణలు ఆత్యంతిక జ్ఞాన విషయాన్ని సమీపిస్తున్నాయి. ఇప్పుడు నీవు ప్రబోధితుడవు అయ్యావు. ఇక నీకు అట్లు చెప్పవలసిన పని లేదు.
అవిద్య జీవుడు మొదలైన కల్పనలన్నీ అజ్ఞానదశలో శిష్యులకు ఉపదేశించటానికి పండితులచే కల్పించబడ్డాయని నీకు ముందే చెప్పాను కదా!
మనస్సు అజ్ఞానదశలో ఉన్నప్పుడు శాస్త్రోక్తము అయిన 'అవిద్యా ఉపదేశము' లేకుండా ఎన్ని విధములుగా “తత్త్వమ్, సో హమ్" వంటి మహావాక్యాల పరమార్థటం ఉపదేశించినప్పటికీ ఆ మనస్సులో ప్రబోధము ఉదయించటం లేదు. ఒక విద్యార్థికి అతని దశను అనుసరించి అతని పరిభాషలో విషయాన్ని బోధించవలసి ఉంటుంది. ఉత్తరోత్తరా ప్రారంభంలో ఉపయోగించే యుక్తులు
అవసరం ఉండదు కదా!
శిష్యుడు యుక్తులతో బోధింపబడి ఆత్మతత్త్వం విశదీకరించబడి, ఆ తరువాత 'తత్ త్వమ్ - ఆ అఖండమగు ఆత్మయే నీవు'... నీవు చూస్తున్న నీవు, కూడా - అని సుస్పష్టీకరించబడుతోంది.
నూరురకాలుగా ప్రయత్నించి కూడా సాధించబడని ఒక కార్యం యుక్తిచే సాధించబడుతోంది కదా! అజ్ఞానికి సందేహములు తొలగని వారిని సమీపించి 'అంతయూ ఆత్మయేనయ్యా' అను సిద్ధాంతం చెప్పితే లాభమేమిటి? అది ఒక శిలను-మిత్రునిగా భావించి తన కష్టములు చెప్పుకొని ఉపాయాలకు సంప్రతించటం వంటిదే అవుతుంది.
మూఢుడు యుక్తి వలన, ప్రాజ్ఞుడు తత్త్వము వలన బోధించబడుచున్నారు. యుక్తి సహాయంతో బోధించకపోతే మూర్ఖుడు ప్రాజ్ఞుడు అయ్యేదెట్లా?... నీవు ప్రబోధం పొందే వరకు ‘యుక్తి’తో బోధించాను. ఇప్పుడు ప్రబుద్ధుడవటం చేత సూటిగా తత్త్వమునే చెప్పుచున్నాను.
Page:175
నాయనా! ఇక వినుబ్రహ్మాహం త్రిజగద్భహ్మ త్వం బ్రహ్మఖలు దృశ్యభూః | ద్వితీయా కలనా నాస్తి యథేచ్ఛసి తథా కురు ॥ (23, 849)
నీవు, నేను, త్రిజగత్తులు, దృశ్యములు -మొదలైనవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే! ఇక్కడ ఇంకొక వస్తువన్నది లేదు. ఇది గ్రహించి ఆపై, నీ ఇష్టానుసారం వ్యవహరించు. గ్రహించిన తరువాత యథారీతిగా వ్యవహరిస్తుంటే బ్రహ్మము యొక్క వాస్తవ తత్త్వమునకు వచ్చే హాని ఏమీ ఉండదు. అసంవేద్యమహాసంవిత్కోటిమాత్రం జగత్ప్రయమ్ | ఏకప్రత్యయవాన్తః కుర్వన్నపి న లిప్యతే ॥ (శ్లో॥ 24, సర్గ 24)
'సర్వవిధ భ్రాంతులు లేనట్టి - జ్ఞేయము కాజాలనట్టి చైతన్య బ్రహ్మమొక్కటే సర్వే సర్వత్రా అనుశ్రుతమైయున్నది'... అని గ్రహించి కార్యములను నిర్వర్తించే వానిని ఆ కర్మసంగ దోషములుగాని, దుఃఖ దోషములుగాని అంటవు.
ఓ రాఘవా! “కూర్చుని ఉన్నప్పుడు ఊపిరి పీల్చుచున్నప్పుడు, నిద్రించుచున్నప్పుడు, చదువునపుడు, వ్రాయునపుడు కూడా "నేను సర్వదా ప్రకాశరూపుడు, చేతనుడు, సర్వవ్యాపియగు పరమాత్మనే” అనియే భావించు. నీవు కనుక మమకారము కించిత్ కూడా లేక, నిరహంకారుడవై, ప్రాజ్ఞుడవై ఉంటే తక్షణమే సర్వ జీవులూ ఎందులో వెలయుచున్నారో ... అట్టి శాంత చిదేకరసమగు బ్రహ్మము
అవుతావు.
సత్యం, ఆద్యంతరహితం, ప్రకాశమయం - అగు ఆ పరమపదమే నీవు. నీవు సర్వదా సర్వ వ్యాపివయి, ఏకాత్మకుడవై, శుద్ధచైతన్య స్వరూపుడవై వెలయుచునే ఉన్నావు. ప్రపంచంలోని కుండలన్నీ కూడా మట్టికి అభిన్నమైనవే కదా! బ్రహ్మ మొదలుగా సర్వమునందు సదాత్మ ఒక్కటే వెలయుచున్నది.
ప్రకృతి ఆత్మ కంటే వేరు కాదు. ఘటం (కుండ) యందు మట్టి యొక్క మృణ్మయతే వెలయు చున్నది కదా! ఆత్మయే ప్రకృతియందు వెలయుచున్నది.
ఒకచోట నిశ్చలమైన నీరే మరొకచోట సుడిగుండాలు ప్రదర్శిస్తోంది కదా! ఆత్మ యొక్క ఒకానొక స్పందనయే ఈ ప్రకృతి. కనుకనే ప్రకృతి ఆత్మయే అవుతుంది. 'వాయువు-వాయువు యొక్క స్పందనం’ పేరుకు మాత్రమే వేరు కదా! ఆత్మ - ప్రకృతులు వేరు వేరుగా అగుపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి వేరు వేరు కాదు. అట్టిది రజ్జు- సర్ప భ్రాంతి వలె అజ్ఞానము చేత ఉదయించి, మరల జ్ఞానముచే తొలగిపోతోంది.
చిత్రక్షేత్రంలో 'కల్పన' అనే బీజం ఉదయించి 'చిత్తం' అను అంకురమునకు త్రోవతీస్తోంది. అదే సంసారం. అది భూత - భవిష్యత్తుల కల్పనకు కారణమౌతోంది. ఆ కల్పనా బీజం 'ఆత్మ విజ్ఞానం' అనే అగ్నిలో దగ్ధమైతే ఆపై ‘వాసనలు' అనే నీరు పోసినాకూడా, కారణరూపమైన చిత్తాంకురం చిగురించదు.
ఓ రామా! నీవు ఆత్మబోధను పొందావు. పొందిన బోధనను ఆకళింపు చేసుకుని అజ్ఞాన ప్రసూతము, భ్రమయుక్తము అగు ద్వైతభావమును పరిత్యజించివేయి.
Page:176
ఆత్మైక్యభావరూపమైన నిరతిశయానంద వైభవమునందు పరిపూర్ణుడవగుము. అభయాత్ముడవు కమ్ము. త్రికాలములందూ కూడా 'దుఃఖము' అనునది స్వతహాగా లేదు... ఇదియే మేము చెప్పు పరమార్థసారము.
6. శరీరముయొక్క రాకపోకలు
శ్రీరాముడు : హే మహర్షీ!
జ్ఞాతం జ్ఞాతవ్యమఖిలమ్, దృష్టం ద్రష్టవ్యమక్షతమ్ | పరేణ పరిపూర్ణాః స్మో బ్రహ్మజ్ఞానామృతేన తే ॥
తప్పకుండా తెలుసుకోవలసి ఉన్నదానిని నేను తెలుసుకున్నాను. చూడవలసినది చూస్తున్నాను. మీరు ప్రసాదించిన జ్ఞానామృతం గ్రోలి పరిపూర్ణుడనయ్యాను.
పూర్ణాత్పూర్ణమిదం పూర్ణం పూర్ణాత్పూర్ణం ప్రసూయతే |
పూర్ణేనాపూరితం పూర్ణం స్థితా పూర్ణే చ పూర్ణతా ॥ (శ్లో॥ 2, సర్ద 50)
పూర్ణము నుండి పూర్ణము పూర్ణ స్వరూపమున వెలయుచూ వెలువడుచున్నది. పూర్ణము పూర్ణమున ప్రకాశిస్తోంది.
హే బ్రహ్మజ్ఞా! పిల్లలు తండ్రిని వేడుకతో ప్రశ్నిస్తారు చూచారా! అట్లా మిమ్ములను మరల ప్రశ్నిస్తున్నాను. దయచేసి కోపగించుకోకండి! ఇట్లా పదే పదే ఆయా కోణముల నుండి ప్రశ్నించటం చేత మీ నుండి జాలువారే అమృతవచనములు నా తదితరుల జ్ఞాన విజ్ఞానములను పెంపొందిస్తాయి అనునదే నా సదుద్దేశం. హే మహాత్మా ! ఇప్పుడు నా ప్రశ్న వినండి
ఒక మృతుని యొక్క కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం - మొదలైన ఇంద్రియాలు కనబడు చున్నప్పటికీ అవి ఎందుచేత విషయములను గ్రహించలేకపోతున్నాయి? సజీవుని ఇంద్రియాలు ఎందుచేత విషయాలను గ్రహించగలుగుచున్నాయి? ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి తెచ్చిన విషయాల సమాచారం హృదయంలో “అనుభవం” అను రూపంలో ఎలా రూపం పొందగలుగు చున్నాయి?... 1. ఇంద్రియం, 2. విషయం - ఇవి రెండూ వేరు వేరైనవి కదా! అవి పరస్పరం ఆకర్షించ గలగటం ఎట్లా జరుగుతోంది? దృశ్యం యొక్క పరిజ్ఞానం హృదయంలో ఎలా ప్రకటితమౌతోంది?
హే పరమేశ్వరా! వసిష్ఠమహర్షీ! ఇప్పటి వరకూ జరిగిన ప్రసంగంలో మీరు ఈ విషయాలు వివరించి ఉండవచ్చు. అయినా, మళ్ళా మీ నుండి ఈ విశ్లేషణా ప్రవచనాలు వినాలని అనిపిస్తోంది. ఒకే విషయం అనేక సోదాహరణాలతో చెప్పటం, వినటం చేత ఈ మీ ప్రవచనం ఆత్మతత్త్వమును మరింతగా విశదపరచగలదని నా ఉద్దేశం! నా అభ్యర్థన!
శ్రీవసిష్ఠ మహర్షి : ప్రత్యక్ష ప్రమాణములైనట్టి 'ఇక్కడి వస్తు సముదాయాలు, ఇంద్రియాలు, ఆ
Page:177
ఇంద్రియ ద్వారాలలో కాపురముంటున్న చిత్తం' వీటి అసలు రూప - - తత్త్వ - స్వభావము లేమిటో విశేషంగా విచారణ చేసిన వారికి 'ఇవన్నీ చైతన్యము కంటే వేరు కానే కాదు' అని తెలియవస్తోంది
ఆకాశము వలె అత్యంత శుద్ధమైన చైతన్యము మాయతో కూడినదై పూర్వ - - పరవాసనలను (ఇంద్రియ వ్యవహార పరంపరలను) నిరంతరం భావన చేస్తోంది. అట్టి వాసనల యొక్క ఆవరణను వేదాంత పరిభాషలో 'పుర్యష్టకం' అని పిలుస్తున్నారు.
ఆ బ్రహ్మమే 'ఇంద్రియాల యొక్క విషయాలు, ఇంద్రియాలు, చిత్తం'... అనే ప్రకృతి లేక పుర్యష్టకంగా స్వయంగా... స్వయం కల్పన (లేక) మాయచే... వివర్తము చెందుతోంది. పుర్యష్టకంగా వివర్తం చెందిన చిత్ చిత్తవృత్తులను దాల్చుచు తన యొక్క అజ్ఞానానికి తానే కారణమై ఉంటోంది.
ఇక మృత్యువు విషయానికి వద్దాం. మృత్యు సమయంలో ఏం జరుగుతోంది?... ప్రాణశక్తి ప్రసరణచే చరించే ఈ దేహం కాలానుగతంగా శిథిలత్వం సంతరించుకుంటోంది. అనగా, ఉపకరణ మాత్రమైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు గల ఈ జడదేహం నిర్వీర్యమై నిరుపయోగమై పోతోంది. మృత్యు సమయంలో పుర్యష్టక సమన్వితమైన సూక్ష్మదేహం ఈ స్థూల దేహం నుండి వెలువడటం చేత ఈ ఇంద్రియాలు సామర్థ్యం కోల్పోతున్నాయి. యంత్రశక్తి కోల్పోయిన యంత్రంలాగా ఇది నిస్తేజమై పోతోంది. శరీరం నిరుపయోగమైనప్పటికీ వేలకొలది జగత్తులను ప్రతిఫలించగల ‘దర్పణం’ వంటిదగు పుర్యష్టకం (5 ఇంద్రియార్థాలు, మనస్సు, బుద్ధి, చిత్తం) ఉండియే ఉంటోంది. శ్రీరాముడు: అట్టి 'పుర్యష్టకం' గురించి మరికొన్ని విశేషాలు చెప్పవలసినదిగా ప్రార్థన. శ్రీవసిష్ఠ మహర్షి : బ్రహ్మము ఆద్యంతరహితము, నిరామయము, తేజోమయము కదా! అట్టి బ్రహ్మము తనయొక్క చిద్విలాసంచేత తన కొరకై తాను ఆకాశము మొదలైన సూక్ష్మభూతములను సృష్టించుకుంటోంది. అది స్వయంగా కల్పనారహితమే! అయినప్పటికీ, అది జగత్తుకు బీజమై అపంచీకృత భూతపంచకము కలిగియున్న దగుచున్నది. తద్వారా బ్రహ్మాండమును సృష్టించి, అందు ప్రతిబింబిస్తోంది. సూత్రప్రాణమై శరీరమధ్యమున సూక్ష్మరూపంతో ప్రవేశిస్తోంది. అట్లు ప్రవేశించిన చైతన్యమును 'జీవుడు' అని అంటున్నాం.
ఆ జీవుడు వాసనల వలన అవయవములను కల్పించుకుంటున్నాడు. ఆ అవయవములతో కలిగిన సంబంధం చేత భౌతికమైన పుష్టిని పొంది బాహ్య అభ్యంతరములకు 'స్పందితుడు' అగుచున్నాడు. 'అహం' భావము వలన అహంకారమును,
మననము వలన మనస్సును,
నిశ్చయము వలన బుద్ధిని
ఇంద్రియ స్నేహము వలన పదార్థజగత్తును,
దేహభావము వలన దేహమును
ఇట్లే తదితర విషయములన్నీ పొందుచూ పుర్యష్టకము (శబ్ద స్పర్శ-రూప రస గంధ-మనోబుద్ధిచిత్తముల సమ్మేళణం) అని పిలువబడుటకు అర్హుడగుచున్నాడు.
Page:178
జ్ఞానేంద్రియ వ్యాపారములు ప్రవర్తిస్తున్నప్పుడు జ్ఞాతృత్వముగాను,
కర్మేంద్రియ వ్యాపారములతో ప్రవర్తితమైనప్పుడు కర్తృత్వముగాను
వాటి ఫలములను పొందునట్లు భావిస్తున్నప్పుడు భోక్తృత్వముగాను
వాటన్నిటా ఉదాసీనము పూనినప్పుడు సాక్షిత్వముగాను,
భోగములందు అధ్యస్థమౌతున్నప్పుడు చిత్ప్రధానముగాను
విషయములను పర్యాలోచించినప్పుడు జీవుడుగాను,
జడప్రధానంగా యోచిస్తున్నప్పుడు పుర్యష్టకంగాను,
... చెప్పబడటం, స్వీకరించటం జరుగుతోంది.
❖
ఇట్లు శరీరమున ప్రవేశించిన జీవుడు కాలక్రమంగా తాదాత్మ్యబుద్ధిని పొంది ఆయా కాల సంభవములగు సుఖదుఃఖములను పొందుచున్నాడు. పుర్యష్టకము యొక్క స్వభావమును అనుసరించి అనంతవాసనాకల్పితములగు రూపములను ఆతడు ధరిస్తున్నాడు. నేలపై ఉంచబడిన బీజము ... నీళ్ళు చల్లినప్పుడు... అది చిగురించి ఒక మహావృక్షమవుతోంది చూచావా? ఈ జీవుడు కూడా వాసనా సేవితుడై జగత్ రూపాన్ని ధరిస్తున్నాడు. మిథ్యాజ్ఞాన కారణంగా తన యొక్క ఆద్యరూపాన్ని ఏమరచి తనను ఈ శరీరాదులుగా భావించుకుంటున్నాడు. సముద్ర తరంగాలలో పడిన చెక్క ముక్క పైకి క్రిందికి తేలియాడుచూ ఎక్కడెక్కడికో తీసుకుపోబడుతుంది. అట్లాగే వాసనాక్రాంతుడగు జీవుడు కూడా సంసార సముద్రంలో పడి ఉత్కృష్ట, నికృష్ట జన్మల వైపు బలవంతంగా ఈడ్వబడుచున్నాడు.
అయితే ...సనకుడు, సనందనుడు మొదలైన మహనీయుల వంటి శుద్ధాత్మలు తమ ఇతః పూర్వపు సాధనాబలం చేత ఈ కల్పంలో తమ ప్రథమ జన్మయందే 'బోధ’ను పొందుచున్నాడు. భవబంధ విముక్తుడై పరమపదమున వెలయుచున్నాడు. మరికొందరు జీవులు కొద్దిజన్మల తరువాత, ఇంకా కొందరు జీవులు చాలా జన్మలు ఎత్తి చాలా కాలం శ్రమించిన తరువాత ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నారు. క్రమక్రమానుసారం పరమపదమును పొందుచున్నారు.
ఇదీ ...శరీరం దాల్చే విధానం.
ఇంద్రియముల సాయంతో వస్తువులను గ్రహించటం, చిత్తము యొక్క శరీరముగా వివర్తమొందిన చైతన్యం ‘పంచేంద్రియములు, మనస్సు’తో కూడి ప్రవర్తించటం ఆరంభిస్తోంది. ఆయా వస్తువులతో కూడిన బాహ్యదృశ్యము తన వద్దకు అరుదెంచుచుండగా తాను ఈ చక్షువులు ఆక్రమించియున్న ఆకాశమునందు ప్రవేశించి అందలి చైతన్యముతో ఏకమగుచున్నది.
ఇంకొక రకంగా చెప్పాలంటే ... ఆ జీవుడు 'చైతన్యస్పర్శ' అను అధ్యాసతో వస్తువునకు సంబంధించిన ఒకానొక ఏకత్వము పొందుచున్నాడు. ఆయా విషయములన్నీ అజ్ఞానము చేత అట్లట్లు లభిస్తున్నాయి. అట్టి బాహ్య విషయములతో సంపర్కం జీవచైతన్యముతో కూడిన శరీరములోని
Page:179
ఇంద్రియములకు మాత్రమే ఏర్పడటం జరుగుతోంది. మృతుని దేహంలో చైతన్యం ప్రసరించక పోవటంచేత కేవల జడ ఇంద్రియములకు 'అనుభవం' అనేది ఉండటం లేదు.
'బయట వస్తువు
స్వచ్చతరమగు అంతఃకరణ
లందు అనుభవం
నేత్రరశ్మి + వృత్తులు
ప్రతిబింబించడం
‘ధ్యాస' అను ప్రతిబింబం తిరిగి వచ్చి కల్పనలకు కర్త అయిన జీవుని అంతరంగంలో ప్రవేశించి ‘అనుభవము’ అనబడుదానికి యోగ్యమగుచున్నది. ఇక జీవుడు ఎట్టి కల్పన చేస్తున్నాడో ... అట్టి అనుభవాన్నే పొందుచున్నాడు. అంతేగాని... 'అనుభవం' అనేది బయట ఎచ్చటనో లేదు.
❖
ఈ నేత్రగోళములు నియమించబడినప్పుడు బాహ్యమైన గోడ కుండ మొదలైన చిత్తవృత్తులు అందులో ప్రవేశిస్తున్నాయి. అటు కన్ను గోళాలలో ప్రవేశించిన ప్రతిబింబంతో జీవుడు తన ధ్యాస అను శక్తితో కూడినప్పుడు మాత్రమే ఇది 'కుండ, గోడ' మొదలైన దృశ్యానుభవం ఏర్పడటం జరుగుతోంది. ఇట్టి సంయోగసంజనితానుభవం ఒక బాలునకు, పశువుకు, లతకు కూడా ఏర్పడుతోంది.
జీవుని లోపల ఎక్కడో ఉన్న దివ్యకిరణములు బాహ్యంగా దూరమున ఉన్న విషయములను ఆలింగనం చేసుకుని ఆ విషయమునకు సంబంధించిన జ్ఞానమును జీవునికి అందిస్తోంది. దానికి జీవుడు స్వసంస్కారానుసారంగా అనుభవంగా గ్రహిస్తున్నాడు. అట్లాగే ఆకాశం నుండి శబ్దం చెవి యందు ప్రవేశించుట చేత, గంధము వాయువు నుండి నాశికా పుటములలో ప్రవేశించుట చేత వాటి వాటి జ్ఞానాన్ని జీవుడు 'అనుభవం' అను రూపాన్ని ఇస్తున్నాడు. కనుక దృశ్యం పట్ల ఏర్పడే అనుభవ అభినివేశ, తిరస్కార, నిర్లిప్తాదులకు అసలైన కారణం జీవుడే (ద్రష్టయే).
జీవుని యందు ఏదైతే ప్రతిబింబిస్తోందో... అద్దానినే 'జగత్తు' అనే పేరుతో పిలుస్తున్నారు. అంతేగాని, 'జగత్తు' అనగా, - ఈ ఎదురుగా కనిపించే చెట్లు - ఇళ్ళు - వాకిళ్లు - ఊళ్ళు కాదు. శ్రీరాముడు : హే జ్ఞానశ్రేష్ఠా! అత్యంత జడమైన అద్దంనందు, నీటియందు, లేత చిగురాకులయందు ప్రతిబింబము వలె కనిపించేదేమిటి? ...ఆ ప్రతిబింబానికీ, ఈ జీవునిలో ప్రతిబింబించు 'జగత్తు' అనుదానికి భేదమేమైనా ఉన్నదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అత్యంత జడములైన అద్దం-ప్రతిబింబం, చిత్త వృత్తులు-వస్తువు యొక్క అనుభవం ఒక్క తీరైనవే. అయితే ఈ జీవుని ద్రష్టత్వం, ఈ జీవుడు చూస్తున్న జగత్తు ...రెండు భ్రాంతియే.
ఈ జగత్తునందు నీకు విశ్వాసం కలుగకుండు గాక! వాస్తవానికి ఉన్నది చిత్సాగరం ఒక్కటే. ఈ అహంకారములన్నీ అనంత చిత్సాగరంలో చిన్నచిన్న తరంగాల వంటివి మాత్రమే.
అట్టి చిత్సాగరంలో దేశ కాలాదులనేవే లేవు. తరంగములన్నిటిలో జలం అనుశ్రుతమై ఉన్నది
Page:180
కదా...! అట్లాగే ఆత్మ అహంకారములన్నిటిలో అనుశ్రుతమై ఉన్నది. ఉన్న సత్యం ఇది. కాబట్టి ఎల్లవేళలా తదితరములపట్ల అనాసక్తచిత్తుడవై వెలయుము.
'ఈ సుఖదుఃఖములన్నీ మిథ్య' అని నీ బుద్ధి గ్రహించి శాంతియుతమై ఉండుగాక! భవమాయ అను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండెదవు గాక! ఏకాగ్రచిత్తంతో ఆనందమయమైన సామ్యభావమును అవలంబించు. బ్రహ్మభావమున నివిష్ణుడవు కమ్ము.
7. భ్రమలు తొలగాలంటే జ్ఞానోదయం కావాలి
శ్రీరాముడు : స్వామీ వసిష్ఠ మహర్షీ ! మీ వంటి ఉత్తమోత్తమ భవరోగ వైద్యుని సమీపించినట్టి రోగికి ఇక భయమెక్కడిది? మీరు చెప్పేది పరమసత్యం. మాకు వేరుగా ఏ ఆధారాలు అక్కర్లేదు.
అయినా సవినయంగా ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను - ఆత్మయే స్వరూపంగా గల జీవునకు-కల్పనయే మూలంగా గల పుర్యష్టకమునకు సంబంధం ఎట్లా, ఎందుకు, ఏ కారణంగా, ఏ ప్రయోజనం కొరకు ఏర్పడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : శుద్ధ బ్రహ్మం నందు ఈ చక్షురాది ఇంద్రియాలు గాని వాటికి విషయాలైనవి గాని లేవు. అవన్నీ మొట్టమొదట సమష్ఠి జీవుని యందు (హిరణ్యగర్భుడు, పద్మజుడు, బ్రహ్మదేవుడు మొదలైనవి ఆ సమష్ఠి జీవుని పురాణనామాలు) అనుభూత మగుచున్నాయి. అవే ఈ వ్యష్టిజీవుని యందు కూడా అనుభవమౌతున్నాయి.
ఆ హిరణ్యగర్భుని యందు భావనాబలంచే పుర్యష్టకం, విషయాలను గ్రహించు శక్తి ద్యోతకమౌతున్నట్లే వ్యష్టిజీవుని యందు కూడా అవి ఉదయిస్తున్నాయి.
#
ఇక్కడ వ్యష్టిజీవుడు, దేహముల గురించి కొన్ని విశేషాలు ప్రస్తావిస్తానుమాతృగర్భమున ఉన్న వ్యష్టిజీవుని (పిండానికి) 6వ మాసంలో పుర్యష్టకం, కళ్ళు మొదలైన ఇంద్రియాలు ఆవిర్భవిస్తున్నాయి. ఇక అప్పటి నుండి ఆ పుర్యష్టకానికి సంబంధించిన మాధ్యమం ద్వారా గాంచుచున్నాడు. సర్వప్రథముడగు సమష్టి జీవుని మనస్సులో లాగానే వ్యష్టిలో కూడా సంవేదన (The act of knowing) ఇంద్రియాలు సుసంపన్నమౌతున్నాయి. ఇక సంవిత్తు (The Knower) అంటావా? వ్యష్టిలో సంవిత్తు, సమష్టి జీవుని (హిరణ్యగర్భుని) సంవిత్తు ఒక్కటే. అనగా సృష్టికి ముందు సంవిత్తు నందు 'వ్యష్టి - సమష్టి' అనే భేదం లేదు.
సంవిత్తు సర్వదా విశుద్ధమే. అద్దాని యందు జలతరంగంలాగా 'అహం' అనే అభిమానం పునాదిగా గల పుర్యష్టకం బయల్వెడలుతోంది.
సంవిత్తు సర్వదా ఏకమాత్రము, అనంతము, విశుద్ధము అఖండము, అనిర్దేశమూ కూడా!
Page:181
నిర్దోషము, నిర్మలము అగు సంవిత్తు నందు మరొకదాని ఉనికి అసంభవం. అద్దాని యందు గుణదోషములు గాని, మనస్సు గాని, మరింకేమియు గాని లేవు.
సంవిత్తు ఒక్కటే సత్యం. మిగిలినవన్నీ అసత్యములు. ఈ స్థూలములు, ఈ దేశకాలములు, ఈ వ్యష్టి - సమష్టి... ఇవన్ని పరిచ్ఛిన్నములు.
సంవిత్తు మనస్సు యొక్క రూపం, మనస్సుకు ఉద్భవస్థానం. మనస్సు అనగా - మననమునకు గోచరమగు ‘బుద్ధి’ వృత్తి ... యొక్క అధ్యాసయే కదా!
వాస్తవానికి ఆ సంవిత్తు మనస్సు కాదు. బుద్ధికాదు. జీవుడు కాదు. పుర్యష్టకం కాదు. జ్ఞానప్రకాశమే సంవిత్ తత్త్వం యొక్క స్వరూపం - అని గ్రహించు. మూఢులు అద్దానిని ‘లేదు’ అనివచిస్తున్నారు. కాని అదియే మనస్సు, ఇంద్రియాలకు అతీతమై వెలయుచు “పరమాత్మ” అనబడుచున్నది. 'ఆ బ్రహ్మము లేక సంవిత్ నుండి చిన్మూర్తియు, మననాత్మకుడు అగు జీవుడు ఉద్భవిస్తున్నాడు' ...అనుమాట కూడా భ్రమయే అయినప్పటికీ, ఉపదేశ సౌకర్యార్థం అట్లని విజ్ఞులచే శిష్యపాఠంగా చెప్పబడుతోంది.
శ్రీరాముడు : స్వామీ! అత్యంత విశుద్ధుడు, సంవిత్ స్వరూపుడు అగు ఈ జీవునికి మరి ఈ ఆవరణ భూతమైన 'సంసారం’ అనే వ్యాధి ఎక్కడి నుండి ఎట్లా వచ్చింది? ముందుగా ఈ విషయం చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! ఒకనికి వ్యాధి వచ్చి గొప్ప బాధపడుచున్నాడు. ఇప్పుడు 'ఈ వ్యాధి ఇతనికి ఏమి తింటే వచ్చింది? ఏం చేస్తే వచ్చేది కాదు?' అను మీమాంస ముఖ్యమా?... చికిత్స ముఖ్యమా?... చెప్పు!
శ్రీరాముడు : చికిత్స చేసి వ్యాధిని రూపుమాపటం ముఖ్యం...!
శ్రీవసిష్ఠ మహర్షి : అవును కదా! ఇప్పుడీ జీవుని అవిద్య వచ్చి బాధిస్తోంది. “ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఏం చేస్తే వచ్చింది?" అను ప్రశ్నలకన్నా, ...ఇప్పుడేం చేయాలి? అవిద్య ఎట్లా తొలగుతుంది? ఏ ఏ విచారణాది ప్రయత్నములకు ఉపక్రమించాలి?"... అనునది ముఖ్యం. ఈ విషయం మన సంవాదంలో మనం చెప్పుకొనియే ఉన్నాం. ఇప్పుడు “అవిద్య అంటే ఏమిటి? విద్య ఏమిటి?” అనునది విచారణ చేయటం అత్యంతావశ్యకం. అట్లా విచారణ చేస్తూరాగా... స్వస్వరూపం పరిశేషించగలదు. తత్సంబంధమైన తదితర విషయాలన్నీ వాటంతట అవే అవగతమౌతాయి.
'సంవిత్'- జ్ఞానస్వరూపం. అట్టి జ్ఞానము ప్రశాంతమైనది. అదియే నిఖిల వస్తువులలో నిండి ఉన్నది. ఒక చిన్న మణిలో పెద్ద పర్వతం ప్రతిబింబిస్తున్నట్లు జ్ఞానమునందే ఈ ఆకాశము మొదలైనవి ప్రతిబింబిస్తున్నాయి. వ్యవహారరీత్యా సత్యములని అనిపిస్తున్నప్పటికీ ఈ పదార్థాలన్నీ వాస్తవం కాదు. అయితే ఇవన్నీ జ్ఞానమునందే వెలయుచున్నాయి. అట్టి సంవిత్థానము కొరకు నీవు జగత్ సంబంధ మైన సర్వ విషయములు సమర్పించి వేయి. జీవన్ముక్తమున వెలయుచూ నిర్మలుడవై ప్రకాశించు. శ్రీరాముడు : ఈ దృశ్యజగత్తులో కనిపించే పదార్థముల అసలు రూపం ఏమిటి?
Page:182
శ్రీవసిష్ఠ మహర్షి : దృశ్య జగత్తులో కనిపించే పదార్థాలన్నీ అవిద్య చేతనే అట్లు పదార్థరూపంలో కనిపిస్తున్నాయి. వాటియొక్క అసలురూపం అవిద్యయే! ఒక్కసారి అవిద్యనే పరికించి చూచావా వీటన్నిటి యొక్క అవిద్యారూపం తొలగిపోయి, ఇక మరల ఉదయించదు.
శ్రీరాముడు : హే ఆప్తబంధూ ! కనులకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వస్తుజాలమును అసత్తుగా అంగీకరించటం ...ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓహో! అదా నీ సందేహం! అట్లా అయితే ఈ కనబడే వస్తువులన్నీ అందరికీ ఒకే తీరుగా కనిపిస్తూ ఉండాలి కదా! అది అట్లా జరుగుతోందా? ఒక గడ్డిపరక ఆవుకు మృష్టాన్న భోజనంలా కనిపిస్తోంది. మరి మనిషికో? అట్లా కనిపిస్తోందా?...లేదు.
వస్తువులన్నీ కూడా ఎండమావులలాగా భ్రమాత్మకములే! అవి అసత్తు అయి ఉండి కూడా అజ్ఞానం వల్ల సత్స్వరూపంగా తోచుచున్నాయి. నాయనా! భ్రమ తొలగాలంటే జ్ఞానోదయం కావాలి. అప్పుడే వాటి వాస్తవ స్వరూపం గోచరిస్తుంది.
'జీవుడు' 'పుర్యష్టకం' మొదలైనవన్నీ అవిద్యా భ్రమలేనయ్యా! అయితే సత్యమగు ఆత్మ యొక్క సాన్నిధ్యంలోనే అవిద్య యొక్క కల్పన కలుగుతోంది. అట్టి కల్పనావిభాగమును మనం అసత్ అని అంటున్నాం. 'అవిద్య చేతనే ఈ జీవుడు తదితరజీవులు' మొదలుగా గల కల్పనలు దర్శించబడు చున్నాయి ...అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి.
శ్రీరాముడు : అవిద్య అంటే ఏమిటో, దాని ఆనుపానులు ఎట్లు ఉంటాయో మరల ఈ సందర్భమునకు ఉచితమగునట్లు వివరించండి.
8. అవిద్యయొక్క ఆనుపానులు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! విషయ రహితం, వ్యాపకరహితమగు చిత్ తత్త్వం ఒకానొకప్పుడు నిశ్చల జలంలోని తరంగంలాగా “అంతరంగ బాహ్యత్వములు" అనే విభాగమునకు సంబంధించిన ఒకానొక ఉత్సుకత పొందుతోంది. 'బాహ్యకళ' అను కళంకముచే పుర్యష్టకాదులుగా ప్రభవిస్తోంది. అనగా చిత్ చిత్తత్వమును స్వీకరించడం జరుగుతోంది. అట్టి చిత్తత్వముతో ఏ వస్తువును ఏ రూపంగా భావిస్తున్నదో ...అది అట్లే ప్రాప్తింపజేసుకుంటోంది. బాలుడు మనస్సులో భూతమును కల్పించుకొని రాత్రిపూట కనబడే మోడువారిన చెట్టును ఒక భూతంలాగా భావించి అనుభూతి పొందుతాడు చూచావా? జీవచైతన్యము కూడా స్వయంగా పంచతన్మాత్ర (శబ, స్పర్శ, రూప, రస, గంధముల) కల్పనను సత్యమైనట్లు భావనను ఆశ్రయించి జీవరూపమును పొందుతోంది. ఆ తరువాత తన యందు ఇంద్రియాలు ఏర్పడుటను కూడా గాంచుచున్నది. అంకురం నుండి వృక్షశాఖలు ఏర్పడి ... ఆ వృక్షశాఖలు అంకురము కంటే వేరైనట్లు తోచుచున్నాయి కదా! అట్లాగే ఈ దృశ్య జగత్తు చిత్ కంటే వేరుగా తోచుచున్నది. చిత్ స్వరూపుడగు ఈ జీవుడు మనస్సు-కుండ మొదలైన బాహ్య
Page:183
వస్తువులను తన వాసనానుసారంగా సత్యములే అని భావిస్తున్నాడు. చంద్ర కిరణములుగా గాంచ బడుచున్నది చంద్రప్రకాశమేగాని మరొకటి కాదు కదా! ... విషయేంద్రియ సంబంధం వలన కలుగుచున్న విషయసుఖములు ఆ చైతన్యము యొక్క ఆత్మానందమే!
మిరియం యొక్క కారం మిరియం నుండి వేరు కాదు. శూన్యం అనేది ఆకాశం నుండి వేరు కాదు. విషయ విజ్ఞానాలన్నీ ఆత్మనుండి వేరు కాదు. “సంసార విషయాలు భోగించాలి” అనేది ఆత్మ యొక్క ‘సంకల్పం’ అను ఆవరణ నుండే బయలుదేరుచున్నాయి. ఆ తరువాత “అట్టి బంధ నియమం నుండి వైతొలగాలి” అను పురుషార్థం ఆశ్రయించబడినప్పుడు ఆ భ్రమేచ్ఛ తొలగి స్వస్వరూపప్రకాశం అనుభవమౌతోంది. ఈ రెండవ పురుషార్థం కొరకు శాస్త్రాలు పారలౌకిక కర్మలు, కార్యక్రమాలు ప్రతిపాదిస్తున్నాయి. ఖండసారి పానకమే పటిక బెల్లం అవుచున్నది చూచావా? ఆత్మయే ప్రవృత్తిని వదలి నివృత్తి మార్గం కొరకై శాస్త్రాలను అనుసరించుట, తద్వారా నివృత్తి ఫలాన్ని పొందటం జరుగు తోంది. ఒకటి మరొకదాని ప్రయత్న దార్ద్యం వలన ఓడింపబడుతోంది. ఈ విధంగా ఈ ప్రవృత్తినివృత్తి అను రెండు మార్గములు అనంతకాలంగా వెలయుచున్నాయి. కానీ...
సంనివేశవికారాదిదేశకాలాదిసంభవాత్ |
సంభవత్యత్ర సత్వీశే దేశకాలాద్యసంభవాత్ ॥ (శ్లో॥ 28, సర్గ 51)
ఆత్మ ఆకాశము వలె పరివర్తనను కలిగిఉన్నది కాదు. ఎందుకంటే దేశకాలాది పరిచ్ఛిన్నములు, సంయోగ వియోగాలు, తదితర వికారాలు ఉన్న చోట మాత్రమే పరివర్తనం అనేది సంభవిస్తుంది. ఆత్మ యందు అవన్నీ ఏవీ లేవు. కనుక ఆత్మకు పరివర్తనం అసంభవం.
వసంతకాల రసం వనంలో ప్రవేశించినప్పుడు అది ఒకచోట పుష్పం గాను, మరోచోట లేచిగురు రెమ్మలుగాను మారుచున్నది. ఏది ఎట్లు ఏర్పడుచున్నా రసం ఒక్కటే! కాని ఆ రసం వివిధమైన ప్రకటన లను కలిగి ఉంటోంది. వాటి నుండి వివిధ కార్యాలు నెరవేర్చబడుచున్నాయి. అట్లే ఆత్మ తనయందు “ఇది కుండ, ఇది గోడ” అను రూపంలో ద్వైతభావం పొందుతోంది. వాస్తవానికి అద్దాని సత్త అద్వితీయ మైనది. మేఘము మొట్టమొదట సూర్యకిరణ రూపముననే ఉండి ఆ తరువాత తన కిరణ ప్రభావంతో జలాన్ని స్వీకరించి మేఘ స్వరూపం సంతరించుకొని ... మరల వర్షించి తరువాత యథారూపంగా సూర్యకిరణ తత్త్వంగా శేషిస్తోంది కదా! సదసద్రూపమగు ఆత్మ కూడా జగత్తుగా మారి ఆ తరువాత వచ్చే జగత్తులకు తానే కారణకారణమై ఉంటోంది. సర్వేశ్వరుడగు ఆత్మయందు “ఇది ఇట్లు అవుతుంది ... అది అట్లు కాదు” అను రూపముగల భావనలన్నీ విస్తరించి ఉన్నాయి. ఈ క్రమమును ఖండించటం ఎవరి వల్ల అవుతుంది?
పరిశీలించి చూస్తే స్వచ్ఛమగు ఆకాశమునకు మార్పు చేర్పులు ఏమి ఉంటాయి? ఆకాశమునందు ఆకాశమే ఏర్పడి ఉన్నట్లు ఆత్మ యందు ఆత్మయే సర్వదా నెలకొని ఉన్నది. ఆత్మ యందు ఆత్మయే ఎల్లప్పుడు ప్రకాశిస్తోంది కాని ... అందు మరొకటేదీ ఏర్పడటం లేదు, ప్రకాశించటం లేదు.
Page:184
9. జన్మ - జన్మాంతరములు
కానీ... ఏకము, అద్వితీయము అగు చిన్మయము స్వాభావికంగా భావనలు పొందుతోంది. అట్లు భావననుండే ద్వైతము అనుభూతమౌతోంది. అట్లు పొందుచున్నప్పుడు వస్తువులు శక్తిగను, జీవుడుగను ప్రతిబింబిస్తోంది. బంగారం చేత తయారయిన ఆభరణాలు బంగారం యొక్క ఉనికి చేతనే పచ్చటి ఛాయలు వెదజల్లుచున్నాయి కదా! బంగారం, ఆభరణం లాగా మనస్సు నందు చైతన్యము, జడము కలసి ఉంటున్నాయి.
ఈ ఆత్మను ఎవరు ఎట్లు గ్రహిస్తున్నారో ... అది అసత్యమైనప్పటికీ అట్లే జరుగుతోంది. ఇక అద్దానికి తిరుగు లేకుండా పోతోంది. బంగారము అన్ని ఆభరణములలోనూ ఉన్నది కదా!
చిత్తు సర్వవ్యాపకము!... అద్దాని చైతన్యము మనస్సులో కూడా ఉన్నది.
చిత్త-దేహాలకు కారణమైన ఈ చైతన్యం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా భావించుకుంటోందో... అప్పుడు అక్కడ ఆ రీతిగా దేవ, నం, స్థావరాది భావాలను పొందుతోంది. ఈ చిత్తం తన యందలి వాసనావికాస వైచిత్రాన్ని అనుసరించి నానావిధ ఆకారాలను, కాలనియమాలను “ఉపాధుల ఆగమన, నిష్క్రమణములను” పొందుతోంది. అదంతా స్వప్నంలాగా భాసిస్తోంది. స్వప్నంలో “నగరంపూతోట-జనులను” చూస్తున్నట్లే జీవుడు ఒక ఉపాధికి సంబంధించిన శబ్ద, స్పర్శ, రూపాది విషయాలు, తదితర ఉపాధులతో సంబంధ బాంధవ్యాలు పొందుతోంది. ఆ ఉపాధి తరువాత వేరే మరొక ఉపాధి, దానితో వేరే మరికొన్ని సంబంధాలు ... ఈ విధంగా ఈ వ్యవహారం జీవుని పట్ల చర్విత చర్వణంలాగా జరిగిపోతోంది. మెళుకువతో ఉన్నవాడు నిదురపోవటం, ఆ నిదురలో స్వప్నం, ఆ స్వప్నంలో ఏవేవో విశేషాలు గాంచడం, ఆ గాంచుచున్నప్పుడు మెళుకువ (జాగ్రత్) కు సంబంధించి ఏ విషయమూ దృష్టి - జ్ఞప్తులందు ఉండకపోవడం మరల మెళుకువకు వచ్చినప్పుడు యథాతథంగా ఉండి ఉండటం జరుగుతోంది చూచావా? ఈ జీవుడు కూడా ఒక ఉపాధితో ప్రవేశించటం, ఉపాధి సహితుడై చరిస్తూ కొంతకాలం తరువాత ఉపాధిరహిత యథాతథస్థితి పొందటం జరుగుతోంది. ఏ స్వప్నమూ శాశ్వతం కాదు. కాని స్వప్న ద్రష్ట మాత్రం శాశ్వతం కదా! అట్లాగే ఏ ఉపాధీ శాశ్వతం కాదు. ఉపాధులద్రష్టగా తానుమాత్రం శాశ్వతం!
శ్రీరాముడు : ఈ జనన మరణాలు జీవుని పట్ల ఎందుకు ఏర్పడుచున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్య వలన జీవుడు ప్రతిభాసను గాంచుచున్నాడయ్యా! నిజానికి జన్మించటం, మరణించటం కూడా వాస్తవములు కావు.
శ్రీరాముడు : మరణానంతర ప్రతిభాస కూడా ఈ జీవించి ఉన్నప్పటి ప్రతిభాస వంటిదేనా?... ఆ రెండిటికీ గల సంబంధమేమిటి? విభేదమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : మరణానంతర ప్రతిభాస ఈ దేహం ఉన్నప్పటి వంటి ప్రతిభాస వంటిది కాదు. ఎందుకంటే ఈ దేహం ఉన్నప్పుడు జీవుడు బాల్య యౌవన - వార్ధక్యములు తదనుగుణమైన
Page:185
సంబంధ బాంధవ్యములు, అనుభవములు పొందుతున్నాడు కదా! అవన్నీ కాలానుగతంగా కాలబద్దమై ఏర్పడుతున్నాయి.
ఇక మరణాంతర ప్రతిభాసకు వస్తే ... ఆ స్థితి కాలబద్ధమైనది కాదు. కానీ వాసనాబద్ధమైనది. వాసనలు శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు ఈ జీవుని ప్రభావితం చేస్తూ తదనంతర స్థితిగతులను నిర్ణయిస్తున్నాయి. అనగా “మరొక శరీరం పొందటం” అనేది కేవలం వాసనలవలననే జరుగుతోంది గాని, కాలం వలన జరగటం లేదు.
అలాగే స్వప్నమునకు - – జీవజాగ్రత్ జగత్తుకు మరొక తేడా ఉన్నది. స్వప్నంలో చూడబడుచున్న జగత్తు ఆ సమయమందలి ఊహ - - వాసనల సమ్మేళనముచే ఏర్పడుచున్నది. ఆ స్వప్నంలోంచి ఆ స్వప్న ద్రష్ట అటు ‘గాఢనిద్ర' అను జడస్థితికో, (లేక) 'మెళుకువ' అను జాగ్రత్తికో పయనించి అప్పటి వరకూ గాంచుచున్న స్వప్నాన్ని అంతటితో అక్కడే త్యజిస్తున్నాడు. అది ఊహ యొక్క రాక పోకల వంటిది.
ఇక... జాగ్రత్ విషయానికి వస్తే... ఆ జీవుడు అనంతకాలంనుండి కలిగి ఉంటున్నట్టి వాసనలలో ఏవేవైతే మరణసమయంలో గోచరమౌతాయో... అవి భావి శరీరానికి కారణమౌతున్నాయి. శ్రీరాముడు : మరణ సమయంలో గోచరించే వాసనలకు ఏదైనా ప్రత్యేకమైన కారణమున్నదా? శ్రీవసిష్ఠ మహర్షి : అట్టి మృత్యు సమయ వాసనాదార్ధ్యం అనేదానికి కారణం అనేక జన్మ పరంపరల అభ్యాసమేగాని ... దానికి మరొకటేదీ కారణం కాదు. జీవితాంతం ఆశ్రయిస్తూ వస్తున్న వివశత వలన “నేను అస్వాతంత్రుడను" అనే భావన గట్టిపడి అది పునర్జన్మకు మూలకారణమౌతోంది. శ్రీరాముడు : తండ్రీ! మరి అందుకు ఉపాయమేమిటి? ఇక గత్యంతరం లేదా? ఈ జన్మ మృత్యు పునర్జన్మల పంజరంలో జీవుడు కొట్టుకుంటూ ఉండాల్సిందేనా?
శ్రీవసిష్ఠ మహర్షి : మార్గాంతరం (గత్యంతరం) ఎందుకు లేదు? ఉండబట్టే మనం ఈ సంవాదమునకు ఉద్యుక్తులమయ్యాం కదా! శాస్త్రాలు ఈ జీవునకు కొన్ని మహావాక్యాలు ప్రసాదిస్తున్నాయి. (అహమ్ బ్రహ్మాం స్మి...తత్త్వమ్... సోహమ్... సర్వమ్ ఖల్విదమ్ (బ్రహ్మ) ఇట్టి మహావాక్యార్థం యొక్క నిరంతర మననం వలన “ నేను అఖండ-అప్రమేయమైన బ్రహ్మాన్ని; సర్వతత్వ స్వరూపుడను” ...అను సదవగాహన సుస్థిరమౌతుంది. అదే బ్రహ్మభావన. దానిని బ్రహ్మసాక్షాత్కారం అని కూడా పిలుస్తున్నారు.
అట్టి బ్రహ్మభావన మాత్రం వాసనామయస్వప్నం వంటిది కాదు. దానినే వివిధ శాస్త్రాలు "చిత్బ్రహ్మము, శివము, అద్వైతము, చతుర్థము” మొదలైన శబ్దములతో ప్రవచిస్తున్నాయి. ఆ చిత్ భగవానుడు "తత్ జాగ్రత్" దృష్టిచే, లేక, “తురీయ దృష్టి" చేత గాంచబడుచున్నాడు.
ఓ రాఘవా! ఇక్కడ ఏ జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు కనిపిస్తున్నాయో... ఇవన్నీ ఆ బ్రాహ్మీ స్థితి సముపార్జించిన యోగి దృష్టిలో లేవు. అందుచేత ఆ మూడిటిచే ఆతడు లభ్యుడు, అనుభవ గమ్యుడు కాడని గ్రహించు. అట్టి మహనీయుడు వాసనారహితుడవటంచేత ఆతడు వాసనా సహితులగు వారిచే గుర్తించబడుట లేదు.
Page:186
ఈ కనబడే జీవులంతా కూడా అట్టి నిర్మల, నిరంజన చైతన్యమేగాని మరింకొకటేదీ కాదు. అట్టి అద్వితీయుడగు చిదాత్మయే ఇక్కడ మనకు జీవుడుగా ప్రకటితుడగుచున్నాడు. తన యొక్క చిత్స్వభావం వల్ల ఇక్కడ పూర్వపు “దృష్ట - అదృష్ట” వస్తువులను విషయాలను గుర్తు ఉండి, గుర్తు లేక కూడా స్వప్నమునందు లాగా గాంచుచున్నాడు.
నిరంతర భావనాపరంపరల విశేషం చేత ఈ సంసారజీవునికి ఇంతవరకూ చూడబడిన విషయాలు, అభిప్రాయాలు, అనుభవాలు, అభిరుచులు క్రమంగా సన్నగిల్లి ఆ స్థానంలో కాలక్రమేణా కొత్తవి వచ్చి చేరుతున్నాయి. కొన్ని కొద్దికాలంలో లుప్తమైపోతున్నాయి. మరికొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి. జలంలో తరంగంలాగా పుట్టిన ప్రతిభావన ఒక రోజుకు లయించ వలసిందే! కానీ ఇంతలో నూతన తరంగంలాగా వాసనానుసారంగా నూతన భావనలు వచ్చిపడుతున్నాయి. దీని కంతటికీ ఒక క్రమముగాని, నియమము గాని ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే, అవన్నీ ఆపాదితాలైనవే కదా! పైగా, పురుష ప్రయత్నం వాసనలను జయించగలుగుతుంది - అని మనం అనుకున్నాం కదా!
ప్రాక్తనీ వాసనాద్యాపి, పౌరుషేనైవ జీయతే |
హ్యః కుకర్మాద్యయత్నేన ప్రయాతి హి సుకర్మతామ్ ||
నిన్న చేయబడిన ఒక అపక్రమమైన కార్యము ఈ రోజు ఆచరించబడే సుకర్మయొక్క ప్రభావంచేత సక్రమమమైపోగలదుగా! ఉత్తమ ప్రయత్నశీలురు వాసనలు తప్పక జయించగలుగుతారు.
10. మోక్ష తత్త్వము
ఈ జీవుడు, దేహము మొదలైనవన్నీ వాసనల యొక్క పరిణామమే సుమా! ఇవన్నీ ఉపశమించాలంటే ఉపాయం ఒక్కటే. ఆ ఉపాయము, లేక లక్ష్య స్థానమునకు శాస్త్రకారులు ‘మోక్షము' అను పేరు పెట్టారు. మోక్షము అంటే 'నేను - ఈ జగత్తు కూడా సర్వ వాసనలకు సంబంధం లేనట్టి అప్రమేయమగు శివము లేక ఆత్మత్తత్వమే' అను అచంచల దృఢ నిశ్చయం.
మోక్షము లభించే వరకు ఈ జీవుడు - జన్మ - పునర్జన్మలు తప్పునవి కావు. ఈ ఇంద్రియములు - దేశకాలములు వికసించటం, ముకుళించటం మోక్ష పర్యంతమూ కొనసాగుతూనే ఉంటుంది. వాసనలు శేషించునంతవరకూ దీనిని నిరోధించటం ఎవరితరం కాదు. బాలుని స్వకీయ కల్పనలే భూతములను సృష్టిస్తున్నాయి. అట్లాగా, వాసనయే పంచభూత పరికల్పితమైన ఈ శరీరములను తోపింపజేస్తున్నాయి. శరీరంగా కల్పించబడుచున్న వాసనలు మోక్ష పర్యంతమూ ఉంటూనే ఉంటాయి.
'పుర్యష్టకం' అంటే ఏమిటి? 'మనస్సు, బుది, అహంకారము, పంచతన్మాత్రలు’ ...అను వాటితో గూడిన ఆతివాహికమైన సూక్ష్మ శరీరమే కదా! అయితే, చిదాత్మ యొక్క స్వరూపం అమూర్తం (formless) - అపంచీకృతం (భూమి, అగ్ని మొదలైన పంచభూతములచే తయారు కాబడినది
కాదు) కూడా!
Page:187
ఈ భౌతికమైన ఆకాశం పంచీకృతం. చిత్యా? అది దేనితోనూ తయారుకాబడినది కాదు. ఈ జీవుని లింగదేహం (సూక్ష్మదేహం, అతివాహిక దేహం) భావనామయం మాత్రమే! అందులో పంచభూతాలు లేవు. కాల, ఆకాశాలు లేవు. కనుక మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో కూడిన సూక్ష్మదేహం కూడా అపంచీకృతమే!
శ్రీరాముడు : “మోక్షము” అనునది స్థూల దేహానికా? సూక్ష్మదేహానికా?
శ్రీవసిష్ఠ మహర్షి : స్థూలమైన దానికి ముక్తి లేదు. బంధమూ లేదు. అసలు ముక్తి అంటే ఏమిటని అనుకుంటున్నావ్? వైరాగ్యాదులు అభ్యసిస్తూ రాగా... కల్పనలన్నీ తొలగిపోతాయి. కల్పనలున్నది ఆతివాహిక (లేక, లింగ) దేహంలోనేగాని స్థూల దేహంలోకాదు. కల్పనలన్నీ అతిక్రమించబడగా నీ కల్పనారహిత స్వస్వరూపం నీకు అవగాహన కావటమే, అనుభవ లభ్యమగుచుండుటమే ముక్తి
మోక్షం కూడా! కల్పనలకు ఆది మూలము అయిన నీవే ఆ సద్వస్తువు కదా! జడ కల్పనలన్నీ స్వస్వరూపంలో విలీనమొనర్చబడగా అప్పుడు సుషుప్తినిబోలిన చైతన్యం యొక్క అనుభవమాత్రమైన ముక్తిస్థితి ఈ జీవునకు లభిస్తుంది.
చూచావా? అది లభించటం, లభించకపోవటం ఈ జీవుని చేతిలోనే ఉన్నది. 'అది నాకెట్లా లభిస్తుంది? అది సులభమా?' అనే మీమాంస ఈ జీవుడు ఎంతగా త్యజించవలసియున్నదో నీవు గమనిస్తున్నావు కదా!
స్వప్నంతో పోల్చతగ్గ ఈ సూక్ష్మ శరీరం మోక్షం లభించనంత వరకు స్థావర జంగమాత్మక యోనులలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఒకే దేహం ఒకప్పుడు జాగ్రత్ను, మరొకప్పుడు స్వప్నమును, ఇంకొకప్పుడు సుషుప్తిని పొందటం చూస్తూనే ఉన్నాం కదా! సుషుప్తిలో మనస్సు ఈ జాగ్రత్ - స్వప్నములను విలీనం చేసుకుని బీజభావమున దీపిస్తోంది.
స్థావరాది యోనులలో సుషుప్తి అత్యంత ఘనీభూతమై ఉన్నది. కించిత్ జాగ్రత్తో కూడి వృక్షయోనులలో కొంత తక్కువగా, కొంచెం ప్రబోధము ఉన్నది. అట్టి ప్రబోధం మనుష్యులలో మరింత జాగృతంగాను, ఉత్సాహంగాను ఉన్నది. సుషుప్తి కూడా కొంత చోటు చేసుకునియే ఉన్నది. అదియే గాఢనిద్రా పరవశస్థితి.
చిత్తము యొక్క జాడ్యప్రకర్షణయే సుషుప్తి... చిత్త భ్రమణమే సంసృతి... తత్వబోధయే విముక్తి.
ఇక తురీయావస్థ స్వస్వరూపమునందు జాగృత్ వంటిది - అని శాస్త్రములు మనకు బోధిస్తున్నవి. ఆత్మశాస్త్ర ప్రవచనముల ప్రబోధము వలన జీవుడు నిర్మలుడై విశుద్ధుడై 'పరమాత్మ' అగుచున్నాడు. జీవుడు స్వస్వరూపము విషయమై ప్రబోధితుడవటమే ముక్తి అని అనబడుతోంది. అట్టి ముక్తి జీవన్ముక్తి అని, విదేహముక్తి అని రెండు విధములుగా చెప్పబడుతోంది. దేహపరిమితమైన సర్వ స్పృహలు జయించి... అనంత దేహత్వము - సర్వ దేహాతీతత్వములను సంతరించుకున్నప్పటి నిశ్చల స్వస్వరూపానుభవమే విదేహ ముక్తిగా చెప్పుచున్నారు.
Page:188
ఏదైతే జాగృత్ - స్వప్న - సుషుప్తులలో మార్పు చేర్పులు లేక, నిర్విషయమై నిరాధారమై, అస్పృశ్యమై అనునిత్యం అనుశ్రుతంగా ప్రసరించి ఉన్నదో ... అట్టి ఈ జీవుని వాస్తవ స్వరూపమును 'తురీయ’ మంటున్నారు. దానినే బోధ అని కూడా పిలుస్తున్నారు. తనను తాను తురీయముగా అవగాహన చేసుకొను అవస్థ తురీయావస్థ. తురీయావస్థ నుండి జీవుడు తురీయాతీతమును సంపాదించు కుంటున్నాడు. అదియే 'చిన్మాత్రము, బ్రహ్మ స్వరూపం పొందటం!’
బుద్ధి యొక్క పురుషకార ప్రయత్నము వలన “బోధ” లేక, “తురీయము” అనునవి లభించటం జరుగుతోంది. అట్టి పురుషకారబలంచేత, తత్త్వజ్ఞానబలం చేత పరమాత్మను గురించిన ప్రమాణములన్నీ ఈ శరీరము కలిగియున్నప్పుడే గ్రహించి తన్మయుడౌతున్నాడు. “ఇంతవరకు సత్యమని నమ్మిన శరీరములు - భయములు - అన్నీ కూడా దీర్ఘమైన స్వప్నవిభ్రమం" - అని గ్రహిస్తాడు.
ఎందుకంటే జీవుని అంతరమున చిత్కళ కాక మరింకేమీ లేదు. ఆ చిత్కళనే అన్యభావంగా గాంచి ఈ జీవుడు నిష్కారణంగా శోకిస్తున్నాడు. ఈ జీవునిలో ఆ పరమాత్మగాక ఇంకేమీ లేదు. ఇక, ఇక్కడ అక్కడ కనబడే జగత్తు ఏమిటంటావా?
యత్రయత్ర జగత్ దృష్టమ్, అహో! మాయావిజృంభితమ్! స్థాల్యన్తః క్వధత్ అంబూనాం, యథానానా భ్రమోదయః జీవాణూనాం తథైవాంతః మిథ్యా సంసరణోదయః బన్గోస్య - “వాసనాబద్ధో”, మోక్షస్యాతొ వాసనాలయః” II
ఇక్కడ ఏ ఏ జగత్తు కనబడుచున్నదో ... ఇదంతా వాసనావిజృంభణము మాత్రమే. మూకుడులో మరుగుచున్న నీరు రకరకాల రూపవిన్యాసములను దాలుస్తూ కనబడుతుంది చూచావ్? అట్లా చిత్ చైతన్యము సంసారమునందు అనేకానేక జీవుల రూపంలో వారి అంతరంగముల రూపంలో కనబడుతోంది.
వాసనల చేతనే అట్లా కనిపిస్తోంది. జీవునకు వాసనా బంధమే బంధము. ఆ వాసనలు లయించుటయే మోక్షం. జడమగు సుషుప్తి వాసనలకు పరమావధి.
తురీయాతీతమో ... వాసనారాహిత్యం ...! జీవుని నిజస్వరూపం వాసనారహితమైన తురీయమే అయున్నది. అది మరచి వాసనల ననుసరించటం చేతనే స్వప్నంలోలాగా స్థావరాది వివిధ భావనలు జీవుడు పరిగ్రహిస్తున్నాడు.
వాసనలు తీవ్రంగా ఉన్నప్పుడు స్థావరయోనులు పొందుచున్నాడు. వాసనలు మధ్యస్థాయిలో ఉన్నప్పుడు జంతుయోనులను పొందుచున్నాడు. వాసనలు తక్కువగా ఉంటే మనుష్య, గంధర్వ రూపములు పొందుచున్నాడు.
వాసనల పెరుగు తరుగులే తదనంతర ఉపాధులను నిర్ణయిస్తున్నాయి. సుషుప్తి తొలగి, ఆపాదమస్తకం ప్రాణాహంకారము ప్రసరించినప్పుడు 'నేను ఇట్టి శరీరమును కలిగి ఉన్నాను. ఇది నా బాహ్యమైన జగత్తు' అను భావనకు బద్ధుడగుచున్నాడు.
Page:189
ఓ రామచంద్రా! ఇదంతా స్వప్నంలో కనిపించిన తటాకంలో జలతరంగం వంటిది మాత్రమే! వృత్తులచే వాస్తవానికి విచ్ఛిన్నుడు కానట్టి ఈ జీవుని అంతఃకరణం నుంచి కళ్ళు మొదలైన ఇంద్రియముల ద్వారా 'ఎరుక' అను స్రవంతి ఈ కుండ - - గోడ మొదలైన వస్తువులపై ప్రసరించి వాటిని ‘ఎరుగుట' అను రసముతో నింపివేస్తోంది. అప్పుడు 'గ్రహించునది - గ్రహించబడునది' అను
రూపంలో వాసనల యొక్క సత్త విచిత్రంగా స్ఫురిస్తోంది.
ఇట్లు అంతఃస్థితమగు ఆత్మచైతన్యమే గ్రాహ్య - గ్రాహక - వాసనా రూపమున 'దృశ్యము' అనబడు మృగతృష్ణగా ప్రకాశిస్తోంది. సకల గ్రాహ్య - గ్రాహక సంబంధములు వాసనాధ్యస్తములైన భ్రమలు మాత్రమే. మరింకేమీ కాదు. ఇక ఈ దృశ్యము వాస్తవమెట్లా అవుతుంది చెప్పు? నిజానికి ఇక్కడ ఆత్మ గ్రహించునది గాని, త్యజించునది గాని ఏదీ లేదు. చిదాత్మ ఒక్కటే బయట - లోపల కూడా ప్రకాశిస్తోంది. ఈ త్రిజగత్తులు చిత్ చమత్కృతియే.
నిజంగా, అవలోకిస్తే సముద్రంలో తరంగాలు, సుడులు, బుడగలు, జలమునకు వేరుగా ఉన్నాయా? లేదు. సముద్రమంతా జలమయమే కదా! ఈ జగత్తునందు వాసనలు అవస్థలు దృష్టి యొక్క అవస్థలు మాత్రమే.
అనాద్యము, ఆద్యము కూడా అయినట్టి అయిన పరమపదమే ఇదంతానయ్యా!
Page:190
V. శ్రీకృష్ణార్జున సంవాదం
1 అనాసక్తి యోగం
శ్రీరాముడు: హే సద్గురూ! మీరు ఈ జాగ్రత్ను స్వప్నం వంటిది మాత్రమేనని సిద్ధాంతీకరిస్తున్నారు కదా! స్వప్నం విషయానికి వస్తే ప్రతి ఒక్క జీవుని స్వప్నం ప్రత్యేకమై, ప్రక్కన ఉన్నవానికి సంబంధించనిదై ఉంటోంది. జాగ్రత్ అట్లా ఉండటం లేదు. ఒక గోడ - కొండలవలెనే ప్రాప్తిస్తోంది. అనేకులందరికీ ఒకే విధంగా ఉంటున్న ఈ జాగ్రదావస్థ స్పప్నం వంటిదని అనటం ఎంతవరకు కుదురుతుంది?
ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇతఃపూర్వపు ప్రకరణంలో ప్రవచించటం జరిగింది. అయితే ఈ నిర్వాణ ప్రకరణం సందర్భంలో ఈ విషయమై మీ విశ్లేషణ, ప్రవచనాలను వినాలని ఉంది. శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'ఈ జాగ్రత్ సమష్టి జీవుని స్వప్నము మాత్రమే' అని వేదాంత వాఙ్మయం ప్రకటిస్తోంది. ఇదంతా కల్పిత సంసారం. ఇది సత్యం కాదు. అసత్యం కాదు. సమష్టిజీవుని స్వప్నం ఈ వ్యష్టి జీవుని స్వప్నం కంటే విశిష్టమైనది. అయితే ప్రతి ఒక్క జీవుని జాగ్రత్ భావాలు ఆ జీవుని ‘జాగ్రత్స్వప్నం’ మాత్రమే! ఒక జీవుని నిద్రా సంబంధమైన స్వప్నం ఊహాసంబంధమై కొన్ని క్షణాలలో పుట్టి, కొద్ది క్షణాలలోనే నశిస్తోంది. సమష్టిజీవుని స్వప్నం కూడా "అసత్యము, అవస్తువు” అయి ఉన్నది. అయితే, కాలమానం దృష్ట్యా కొంత సుదీర్ఘకాలం వెలయుచున్నది. అట్లాగే, ఈ జాగ్రత్ స్వప్నం కంటే మరికొంత అధికంగా సత్యము వలె తోచుచున్నది. అయినా రెండూ సత్యం కాదు.
ఈ జీవుడు ఒక స్వప్నం గాంచిన తరువాత అందుకు భిన్నమైన మరొక స్వప్నం గాంచుచున్నాడు కదా! అట్లాగే సమష్టి జీవుని కల్పనలో ఈ వ్యక్తిగత జీవుడు ప్రవేశించి ఒక్కొక్క ఉపాధితో ఒక్కొక్క విభిన్నమైన స్వప్నకాలిక సుదీర్ఘానుభవం పొందుతున్నాడు. ప్రతి ఒక్కని ప్రతిఒక్క జాగ్రత్ అనుభవంలో స్వప్న సదృశ్యమైన అసత్యం రాజ్యం ఏలుతోంది. సమష్టి జీవుని (హిరణ్యగర్భుని) కల్పనామహిమ ఇట్టిది మరి!
ఈ జీవుని పట్ల, “ఒక దేహం, తదనంతరం మరొక దేహం” అను రూపంగా కనిపించే ప్రహసనం కూడా, “ఒక స్వప్నం, మరునాడు కనిపించే మరొక స్వప్నం” - - అను వ్యవహారం వంటిదే!
అజడమైనట్టి బ్రహ్మవస్తువు... సమష్టి జీవుని 'అంశ' అయినట్టి ఈ వ్యక్తిగత జీవుని మోహవశమై జడంగా గాంచబడుచున్నది. స్వయంజ్యోతి అయిన ఆత్మప్రకాశం ఈ సమష్టి-వ్యష్టి కల్పనల రూపంలో ‘స్వప్నభ్రమ’ అనే జగన్నాటకం ప్రదర్శిస్తోంది. ఆత్మ ప్రకాశమే లేకపోతే సమష్టి జీవుడు లేడు... వ్యక్తిగత జీవుడు ఉండడు ...జగత్తు ఉండజాలదు. స్వప్న ద్రష్ట లేకపోతే స్వప్నం ఎవరికి?
అయితే, ఆత్మ యథాతథం. ఈ జగత్తు ఆత్మ యొక్క భావనా చమత్కారం మాత్రమే! ఇక దేని గురించైనా దిగులుదేనికి? వేదన ఎందుకు?
Page:191
సూర్యుని వలన ప్రకాశించే ఈ త్రిజగత్తులలోనికి జీవులు పరస్పర భేదకల్పనలు ఒనర్చుకొని భ్రమిస్తున్నారు. ఈ వ్యక్తిగత భ్రమలకు మూలకారణమైన సమష్టి జీవుడు అనంతుడు. ఆత్మ సర్వగతం అవటం చేత అది ఎక్కడ ఏ కల్పనకు ఉపక్రమిస్తే అక్కడ ఆ కల్పన అట్లే పరిఢవిల్లుతోంది. ఇటువంటి మాయా కల్పితమైన దృశ్యమునందు ఏర్పడి ఉన్న కల్పనపట్ల ఆసక్తి అనవసరం. ఆసక్తియే బంధము. అనాసక్తియే ముక్తి. రాబోయే ద్వాపర యుగంలో మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించినప్పుడు ఈ అనాసక్తియోగం గురించి ఆయన అర్జునునకు ఉపదేశించటం జరుగుతుంది. పాండునందనుడగు అర్జునుడు యుద్ధమునకు ఉపక్రమించే ముందు శ్రీకృష్ణభగవానుడు ప్రవచించబోయే "దృశ్య అనాసక్తి, యోగాభ్యాసంచే పెంపొందగల ఆత్మయోగం” విని తరిస్తాడు.
శ్రీరాముడు: స్వామి! రాబోయే యుగంలో జరగబోయే మహత్తరమగు ఆ శ్రీకృష్ణార్జున సంవాదంలోని కొన్ని ముఖ్య విశేషాలు విశదీకరించమని ప్రార్థిస్తున్నాను. శ్రీవసిష్ఠ మహర్షి : విను ...చెపుతాను.
2 ఆత్మకు జననమరణాలు లేవు
ఆకాశమును ఆశ్రయించుకొని ఆకాశము వెలయుచున్నట్లు... కేవల ఆత్మను ఆశ్రయించుకుని ఆద్యంతరహితమైన అస్తి - సన్మాత్రము అనునది ఆత్మచే పరికల్పించబడి అనంతమై వెలయుచున్నది.
నిర్వికారమగు ఆత్మయందు వికారరూపమగు ఈ సంసారభ్రమ అంతా గాంచబడుచున్నది. బంగారంలోనే రకరకాల ఆభరణాలు, జలంలోనే రకరకాల తరంగాలు ఉంటున్నాయి కదా! ఆత్మ యందే ఈ 14 విధములైన జీవజాలాలు (చతుర్దశభువనాలు) వలలో చిక్కుకున్న పక్షులలాగా చిక్కి ఉంటున్నాయి. ఇక శ్రుతి, స్మృతులలో వర్ణించబడిన యమ, ఇంద్ర, చంద్ర, సూర్యాది లోక పాలకులు ఈ భూత పంచకంతో కూడిన సంసారానికీ, ఇందలి లోకాలకూ నాయకత్వం వహిస్తూ ఉంటున్నారు. ఆ లోకపాలకులు ధర్మాధర్మములను, సుకృత దుష్కృతాలను అనుసరించి జీవులకు శుభాశుభప్రదాతలై లోకాలు పాలిస్తున్నారు.
లోకపాలకులలో ఒకడైన యమభగవానుడు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ కర్మఫల ప్రదాతగా నిగ్రహ-అనుగ్రహముల రూపంలో ధర్మాధర్మప్రవృత్తులను అనుసరించి జీవులకు అధమ ఉత్తమ ఉపాధులు ప్రసాదిస్తూ ఉంటున్నారు. తాను మాత్రం స్థిరచిత్తుడై ఆత్మానుభవి అయి, నిశ్చలుడై తన నియమిత విధులను నిర్వర్తిస్తున్నాడు.
ఆ యముడు ప్రాణులను హింసించుట వలన కలిగే వికలములను తొలగించుకొనుటకు ప్రతి ద్వాపర యుగాంతంలోనూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన ఒకప్పుడు 8 ఏళ్ళు, మరొకప్పుడు 10 ఏళ్ళు, ఇంకొకప్పుడు 12-14 సంవత్సరాలు ... తపస్సు చేస్తూ ఉంటారు. అట్లా తపోనియమితులై ఔదార్యం వహించి ఉన్నప్పుడు మృత్యువు ఈ జగత్తునందలి ఏ ప్రాణినీ స్వయంగా హింసించదు.