Page:192
నిదురిస్తున్న మదపుటేనుగును వేలాది దోమలు ఆశ్రయిస్తున్నట్లు ఆ సమయంలో ఈ భూమండలం అనేక విధములైన జీవులతో నిండి ఉంటుంది. అప్పుడు విచిత్రజీవులతో నిండిన ఈ భూదేవత యొక్క భారాన్ని తగ్గించటానికి దేవతలు అనేక ఉపాయాలతో సంహారకార్యం నిర్వర్తిస్తారు. ఈ విధంగా భూభారం తగ్గించటం కొన్ని వేలసార్లు జరిగింది.
రాబోయే ద్వాపరయుగంలో కూడా సూర్యపుత్రుడు, పితృ నాయకుడు అగు యముడు ప్రాణి హింస వలన కలిగిన సంతాపం పోగొట్టుకోవటానికి 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అప్పుడీలోకంలో మృత్యువు అనేదే ఉండదు. భూమి అంతా చెట్టు, పుట్టలతో నిండి భారవంతం అవుతుంది. అప్పుడు భూమాత భూభారం సహించలేక డస్సిపోతుంది. పరాభూత అయి, దీన అయి తనపతి అగు శ్రీహరిని శరణువేడుతుంది. అప్పుడు శ్రీహరి దేవతల అంశను పరిగ్రహించి నర - -
నారాయణులు అను రెండు రూపాలతో అవతరిస్తాడు. ఆ నర-నారాయణులలో నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడు గాను, నారాయణుడు దేవకీ వసుదేవుల సుతుడు శ్రీకృష్ణుడుగాను భూమిపై అవతరిస్తారు.
పాండవులు పాండురాజు కుమారులు. అందులో పెద్దవాడైన ధర్మనందనుడు యుధిష్ఠిరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఆతడు సముద్రము వంటి రాజ్యమునకు చక్రవర్తి అయి ధర్మవేత్తగా ఖ్యాతి గడిస్తాడు.
‘దుర్యోధనుడు' అనునాతడు పాండవుల పెదతండ్రి అయిన దృతరాష్ట్రుని కుమారుడు. ఆ దుర్యోధనుడు పాండవులలో ద్వితీయుడైన భీమసేనునితో బద్ధవైరం కలిగి ఉంటాడు. కాలక్రమేణా ధృతరాష్ట్రుని నూర్గురు కుమారులు, అతని తమ్ములు పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు భూమండలం కొరకై 18 అక్షౌహిణీల సైన్యం సమకూర్చుకుని యుద్ధానికి సమాయత్తమౌతారు.
యుద్ధం ప్రారంభించే సమయంలో విష్ణు భగవానుని 'అర్జున'శరీరం 'యుద్ధం - జననాశనం’ విషయంలో తర్జన భర్జన పడుతుంది. ప్రాకృతభావం పొందటం చేత హర్షామర్గాన్వితమై అజ్ఞాన యుక్తం అవుతుంది. “బంధువులను సంహరించడం ఉచితమా? యుద్ధము చేయకుండా ఊరుకోవడం ఉచితమా?” – అనే ధర్మసందేహం అతని అంతరంగాన్ని కలచివేస్తుంది. ఇక మహావీరుడగు అర్జునుడు ఇరువైపులా ఉన్న రక్త సంబంధీకులగు బంధువులను గాంచి 'అయ్యో! నా బంధువులను నేను వధించట మేమిటి?” అని తలచి అత్యంత విషాదం పొందుతాడు. అతని మనోదౌర్బల్యమును గమనించిన శ్రీకృష్ణ భగవానుడు ఉభయసేనల మధ్య రథంలో ఈ విధంగా అర్జునునకు బోధిస్తారు.
శ్రీకృష్ణ భగవానుడు: ఓ అర్జునా! ఏమిటి నీ మీమాంస? నీ బంధుజనులు మరణిస్తారేమోననా? “ఇది ధర్మమా? కాదా?” అనునది నీకు పరిశీలనాయోగ్యం కావాలే తప్ప, జనన-మరణములను, బంధు-అబంధుత్వాలను బట్టి కర్తవ్య-అకర్తవ్యములను నిర్ణయించటం ఉచితమనిపించుకోదు సుమా! ఇక్కడ చంపే వారెవ్వరు? చచ్చే వారెవరు? నీవు గాని, నీ బంధువులు గాని, తదితరులు గాని
Page:193
ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు. అంతేగాని, ఈ ఎదురుగా కనిపిస్తున్న పాంచభౌతికదేహములు మనందరి అసలు స్వరూపం కాదు.
ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడే గాని, భౌతికదేహ పరిమితుడు కానే కాదు. ఆత్మకు జనన మరణాలు లేవు. ఈ దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారా లనే ఆరు రకాల భావాలు ఆత్మ యందు లేవు. ఆత్మ అనునది ఇప్పుడు గాని, ఇతఃపూర్వం గాని, ఇకముందు గాని జన్మ పొందటం లేదు. మరణించటం లేదు. అది నిత్యమై, వాస్తవమై, పురాతనమై - సదా వెలుగొందుచున్నది. శరీరాలు రావచ్చు, పోవచ్చు... ఆత్మకు ఏమీ అవదు. ఆత్మను చంపుచున్నామని గాని, తామే చచ్చుచున్నామని గాని తలచేవారు నిర్వికారమగు ఆత్మతత్త్వమేమిటో ఎరుగనివారు మాత్రమే! ఆత్మ ఎవరినీ చంపదు, తాను చావదు. అనంతము, ఏకరూపము, సత్స్వరూపము, ఆకాశము కంటే సూక్ష్మము, సర్వదా అప్రమేయము అగు ఆత్మను ఎవరేం చేయగలరు?
కాబట్టి అర్జునా! నీవు ఆత్మను అఖండముగా, అనంతముగా, ఆదిమధ్యాంత రహితముగా గ్రహించు. నీవు ఎవరనుకుంటున్నావ్? అపరిచ్ఛిన్నము, దోషరహితము, చైతన్యస్వరూపము అగు ఆత్మవే నీవు! అందుచేత, ఇక్కడ పాంచభౌతిక విషయమైన బంధు సంయోగ-వియోగములకు సంబంధించిన సుఖదుఃఖములు నిన్ను ఎట్లా అంటగలవు చెప్పు?
3 కర్మ రహస్యం
శ్రీకృష్ణ భగవానుడు:
అర్జున! త్వం నహన్తా! త్వమ్ అభిమానమలం త్యజ జరామరణనిర్ముక్తః స్వయమాత్మాసి శాశ్వతః ||
ఓ అర్జునా! శాశ్వతము, జరా-మరణములు ఉండనిది అగు ఆత్మవే నీవు. కనుక “నేను చంపబోవువాడను కదా”! మొదలైన స్వల్ప అభిమానములను పరిత్యజించు.
యస్య నాహంకృతో భావో, బుద్ధిర్యస్య న లిప్యతే | హత్వాపి స ఇమాంల్లోకాన్ నహన్తి న నిబధ్యతే ॥
ఎవనికి "నేను దీనికి కర్తను అను” అహంకారం కించిత్ కూడా ఉండదో, ఎవరి బుద్ధి అయితే దోషరహితమై ఉంటుందో... అట్టివాడు ఆయా క్రియలచే బంధింపబడుటలేదు. ఎవడైనా సరే, తన లోపల ఎట్టి జ్ఞానం కలిగి ఉంటాడో, బాహ్యమున అట్టి అనుభవమే పొందుతూ ఉంటాడు. కాబట్టి దేహాభిమానాన్ని త్యజించు. అప్పుడు దేహాలచే స్పర్శించబడనట్టి దేహిని నీవు దర్శించగలుగుతావు. అర్జునుడు: హే కృష్ణా! ఈ బంధువధను తలచుకున్నప్పుడు నేను పరితాపం పొందుచున్నాను. ఇది ఎట్లా తొలిగేది?
Page:194
శ్రీకృష్ణ భగవానుడు: నీ పరితాపమునకు కారణమేమిటి? చెపుతాను... విను. "నేను వీరిని చంపు వాడను” అను హంతకత్వపు అభిమానం నిన్ను ఆవరించింది. ధర్మాధర్మముల విచక్షణను వదలి పాపాదులను స్మరించి సుఖదుఃఖములకు లోను అగుచున్నావు. నిజానికి ఈ ప్రపంచంలో ఆత్మను ఆవరించి ఉన్నట్లు కనిపించే సత్వరజస్తమో గుణములే ఆయా కర్మలను ఆచరిస్తున్నాయి. అది అట్లు జరుగుచుండగా అహంకారముచే విమూఢుడగు ఈ జీవుడు 'ఇదంతా నేనే చేస్తున్నాను' అని అనుకుని భ్రమ పొందుచున్నాడు. అట్టి 'అహంకర్తాస్మి' అనే కర్తృత్వ భావనతో గర్వించుటయో, వాపోవుటయో చేస్తున్నాడు. తాను కర్తృత్వ భోక్తృత్వరహితమగు ఆత్మననే విషయం ఏమరుస్తున్నాడు.
చక్షుః పశ్యతు కర్ణశ్చ శృణోతు, త్వక్ స్పృత్విశదమ్ |
రసనాచ రసం యాతు కాం త కోహమితి స్థితిః? ॥
మహాత్ముల దృష్టి ఇంకోరకంగా ఉన్నది. 'కన్నులు చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి. చర్మం స్పర్శించుచున్నది. నాలుక రుచి చూస్తోంది. వీటితో నాకేమి సంబంధం?” అని వారు భావన చేస్తున్నారు. అంతఃకరణమునకు బహిర్ ఇంద్రియములకు వేరైన విశిష్టమైన ఆత్మస్వరూపులమని, ఆత్మ దేనికి సంబంధించినది కాదని (అప్రమేయమని గ్రహించి ఉంటున్నారు. కాబట్టి "వీరు కష్టం పొందుచున్నారే!’ అనువారి ఆత్మకు ఆ కష్టాలతో ఏమి సంబంధం? అర్జునా! అనేక విశేషాలు ఒకచోట ఒనగూడుటచే జరిగే ఒకానొక కార్యమును చూచి ఈ జీవుడు 'ఇదంతా నా వలననే జరుగుచున్నది' అని అనుకోవటం ఎంతటి హాస్యాస్పదం? అది దురభిమానం కాక మరేమిటి?
కర్మలు అందరూ చేస్తున్నారు. అయితే...
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి | యోగినః కర్మ కుర్వన్తి సంగం త్వక్త్వా “ఆత్మశుద్ధయే” ||
యుక్తాయుక్త వివేకులగు యోగులు కూడా కర్మలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ మనో-బుద్ధి -ఇంద్రియ-శరీరములను ఆయా కార్యములందు నియమించి 'సంగము' అనేది లేకుండా, కేవలం ఆత్మశుద్ధి కొరకు ఆయా నియమిత శాస్త్ర ప్రవచిత కర్మలు లోక కళ్యాణమును, లోకానుకూలతను దృష్టిలో పెట్టుకొని సేవాభావంగా స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఎవరి శరీరమందైతే అహంకారం అనే దుర్గంధం అలముకొని ఉండదో... ఎవ్వరు రాగద్వేష రహితులై ఉంటారో... అట్టివారు ఈ లోక వ్యవహారములు ఆచరిస్తున్నప్పటికీ భోగించని వారే! దుశ్శీలుడైన మానవుడు తెలివి కలవాడైనా, పండితుడైనా శోభించడు కదా! అట్లాగే మమకారం అనేది ఉన్నచోట ఆత్మత్వం భాసించదు.
నిర్మమో, నిరహంకారః, సమదుఃఖసుఖః క్షమి, యః స కార్యమకార్యం వా, కుర్వన్నపి న లిప్యతే ||
అహంకార, మమకారాలు లేనివాడు, సుఖదుఃఖాలను సమంగా గాంచువాడు, క్షమాశీలుడైన వాడు ఆయా కార్యాలను నెరవేరుస్తున్నప్పటికీ లిప్తుడు కాడు. ఓ పాండుసుతా! ఈ క్షాత్రవ కర్మయే ఇప్పటి నీ స్వధర్మమైయున్నది. స్వకర్మ అనునది ఎటువంటిదైనా సరే... అది తప్పక శుభం చేకూరు స్తుంది. ఈ యుద్ధం చేయుట అనే కర్మ కుత్సితం మొదలైన ఆయా దోషాలతో కూడుకుని ఉండవచ్చు
Page:195
గాక. అయినప్పటికీ నీ యొక్క ధర్మ నిర్వహణార్థం నీకు నియమించబడినది. నీవు నిర్వర్తించవలసిందే. అయితే, నీ ఈ శాస్త్రవిహిత స్వధర్మమును సర్వాత్మకుడగు పరమాత్మకు సమర్పిస్తూ ఆరాధనాపూర్వకంగా నిర్వర్తించావా... నీ స్వధర్మం నిన్ను అమృతతుల్యునిగా చేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక మూర్ఖునకు కూడా స్వధర్మమే శ్రేయోదాయకం అవుతోంది. ఇక ధర్మరక్షణ కంకణధారివైన నీవంటి బుద్ధిమంతునకు వేరే చెప్పేదేమున్నది?... అహంకార రాహిత్యుని జయాపజయములు లిప్తం చేయలేవు.
యోగస్థః కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయా!
నిః సంగస్త్వం యథాప్రాప్త కర్మన్న నిబధ్యతే ॥
ఓ ధనంజయా! నీవు బ్రహ్మ పరిపూర్ణమగు బుద్ధితో ఆసక్తిని పరిత్యజించి కర్మలను నిర్వర్తించు. నిస్సంగివై యథాప్రాప్తములైన కర్మలను నిర్వర్తించు. సంగరహితుడవై స్వధర్మ నిరతిపూర్వకంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే, అప్పుడు ఆ కర్మలు నిన్ను బద్ధునిగా చేయజాలవు. కాబట్టి ఆయా సర్వ సందర్భములలో శాంతమగు బ్రహ్మభావముతో కూడుకొని ఉండు. ఉద్వేగరహితుడవై 'ఈ కర్మలన్నీ బ్రహ్మమయములే' అను ఎరుకతో ఆచరించు.
బ్రహ్మపూర్ణమగు ఆచరణ కలవాడు తత్-క్షణంలో బ్రహ్మమే అగుచున్నాడు.
ఒకవేళ ‘బ్రహ్మము' అనబడే సత్ చిత్ ను స్వభావసిద్ధంగా ఆశ్రయించి ఉండటం కష్టమనిపి స్తోందా? నీవు చేస్తున్న సర్వ కర్మలు సమర్పణ చేసి ఆ కర్మలు నిర్వర్తించే నీవు మాత్రం ఈశ్వరాత్ముడవై నిరామయుడవై ఉండుము. “ఈశ్వరుడు సర్వజీవులయందు సమస్థితుడై ఒకే రీతిగా వెలయుచున్నాడు” అని గ్రహించి ఉండటమే ఈశ్వరాత్మత్వం. అట్టి అవగాహనచే నీవు ఈ భూమండలమునకే ఒక అలంకారమై ఉంటావు. క్రమంగా సంకల్పములన్నిటినీ సంపూర్ణంగా త్యజించివేయి. శాంతచిత్తుడవు, సమదర్శివి కమ్ము. అట్టి అభ్యాసం చేత ముక్తి లభించగలదు.
మోహం తొలగాలంటే సత్సాంగత్యము, ఈశ్వరార్పణపూర్వకమైన కర్మనిరతి, బ్రహ్మార్పణము, జ్ఞానయోగము అనునవే మార్గములు.
అర్జునుడు: హే కృష్ణా! నా అజ్ఞాన మోహం తొలగడానికి గాను - 1. సత్సాంగత్యం, 2. ఈశ్వరార్పణం, 3. జ్ఞానయోగం, 4. బ్రహ్మార్పణం - వీటి గురించి సవివరంగా చెప్పండి.
శ్రీకృష్ణు భగవానుడు: ... విను.
1. సత్సాంగత్యము - 'సత్' స్వభావమునకు సంబంధించిన శ్రవణమననాదులు, జ్ఞానులతో స్నేహం, సంభాషణ, శ్రవణం.
2. ఈశ్వరార్పణము - సహజీవులను ఈశ్వరరూపంగా దర్శించటం. ఈశ్వర సేవాభావంతో ప్రేమ, కరుణ మొ॥న సాత్విక గుణములను ప్రవృద్దపరచుకోవటం
3. జ్ఞాన యోగము - - ఉత్తమ బుద్ధిని సంపాదించుకునే ప్రయత్నములే 'జ్ఞానయోగ స్థితి' కి త్రోవ తీస్తున్నాయి.
4. బ్రహ్మార్పణం - “నేను, జగత్తు" మొదలైన వాటి యందు ఏర్పడే అహంభావాన్ని బ్రహ్మానికి సమర్పించటం. అంటే 'అధ్యాస'ను అధిష్టానమైన బ్రహ్మానికి అభిముఖం చేయటం. సర్వం బ్రహ్మమునకు చెందినవిగా భావన కలిగిఉండటం.
Page:196
ఓ అర్జునా! బ్రహ్మం అంతర్శూన్యమై, బహిర్ూన్యమై పాషాణం వలె చిదనమై, పరమశాంతమై, ఆకాశకోశము వలె స్వచ్ఛమై వెలయుచున్నది. అయ్యది ఈ దృశ్యం కంటే, ఈ దృశ్యాన్ని పరికించే ద్రష్ట కంటే కూడా అత్యంత సూక్ష్మము. అయితే ఏం? అట్టి బ్రహ్మము నుండి ఈ స్థూల జగత్తుల అనుభవం ఉత్పన్నమౌతోంది. అట్లు జగత్తుగా తోచుచున్నదంతా స్వప్నసదృశమే!
బ్రహ్మమునందు జగత్తులు ఆరోపించబడుచున్నాయి. అనగా... బ్రహ్మము యొక్క స్వల్పాంశము లోని అత్యంత స్వల్ప విభాగమునందు 'జీవుడు' అనునది భ్రమచే ఆరోపించబడుతోంది.
అట్టి భ్రమయందు (బ్రహ్మము వేరు, ఈ జీవుడు వేరు అను అల్పదృష్టులందు) నీవు మాత్రం చిక్కుకోవద్దు. నిజానికి ఏ వస్తువునందైతే పరిచ్ఛేదము ఏర్పడటానికి ఏమాత్రం వీలే లేదో... అట్టి అపరిచ్ఛేద వస్తువునందు పరిచ్ఛేదము స్వీయ అజ్ఞానముచే దర్శించబడుతోంది. ఏది ఎట్లు ఉన్నప్పటికీ, బ్రహ్మము నందు పరిచ్ఛేద, అపరిచ్ఛేద సంబంధమైన అహంభావం యుక్తియుక్తమే కాదు. అఖండమైన వస్తువునందు అనేకత్వ భావనను ముందు వదలివేయటం అభ్యసించు. 'అహంకారము అనబడేది కూడా బ్రహ్మము నుండి వేరైనది కాదు' అను అవగాహనను పెంపొందించుకో. జలమయమగు సముద్రంలో జలరూపములగు తరంగాలు కనబడుచున్నట్లు బ్రహ్మమునందు అహంకార మమకార, తరంగ-ఉపతరంగాలు స్ఫురిస్తున్నాయి. ఇక దేనిని చూచైనా ఎందుకు దుఃఖించటం చెప్పు? విచిత్రము లైన ‘భిన్న భావాలు’ అనే వైచిత్ర్యాలు జ్ఞానమయమైన ఆత్మయందు భ్రమచే స్ఫురిస్తున్నాయి. ఎందులో అయితే ఈ నానాత్వము, తదితర భావపరంపరలూ స్ఫురిస్తున్నాయో, అది సత్యవస్తువగు ఆత్మయే అయి ఉన్నది. అట్టి ఏకత్వము నందు నీ బుద్ధిని ఎందుకు నిలపరాదో చెప్పు?
ఈ విధంగా ఉత్తమబుద్ధితో విమర్శించి సారాసారములను గ్రహించిన పురుషుని యందు క్రమంగా “అహం-నాది” అనునవి ఉపశమిస్తున్నాయి. అప్పుడు అకృత్రిమమైన కర్మఫలత్యాగం సిద్ధించ గలదు. అట్టి అకృత్రిమ ఫలత్యాగమును సన్యాసము అని పిలువబడుచున్నది.
కర్మఫలత్యాగ పూర్వకమైన సన్న్యాసము వలన సంకల్పత్యాగం అనే అసంగస్థితి నీకు సుసాధ్య మౌతుంది. తద్వారా కర్మల పట్ల ఈశ్వరార్పిత బుద్ధి జనించి, సుదృఢమౌతుంది. కల్పన లన్నీ ఈశ్వరుని యందు ఏకీభూతమొనర్చి, ద్వైతబుద్ధిని విలీనమొనర్చుటే ఈశ్వరార్పణం.
అర్జునుడు: ఈ భేద భావాలన్నీ ఎందుకు ఏర్పడుచున్నాయి?
శ్రీకృష్ణ భగవానుడు: అనేకం అనేది అజ్ఞానం వలన ఏకైక చిదాత్మయందే కల్పించబడుచున్నదని చెప్పాను కదా! జ్ఞానికి బ్రహ్మము, జగత్తు వేరువేరైనవి కావు.
ఓ విజయా! ఈ దిక్కులు, ఈ జగత్తు, ఈ ద్వైతాద్వైతములు, ఇక్కడి కర్మలు, అట్టి కర్మలను ఆశ్రయించి ఉన్న యోచనలు, కాలం, వస్తు సంబంధమైన భ్రాంతులు - ఇవన్నీ నేనే. అందుచేత నాయందు మనస్సు ఉంచుము. నా భక్తుడవు కమ్ము. అప్పుడు నన్నే పొందుతావు.
Page:197
4. పరాపరములు
అర్జునుడు:
ద్వే రూపే తవ, దేవేశ! పరంచ, అపరమేవచ |
కీదృశం తత్కదారూపం తిష్ఠామి ఆశ్రిత్య సిద్ధయే I
హే దేవేశా! మీకు పరము, అపరము అను రెండు రూపములు ఉన్నాయని చెప్పగా విన్నాను. ఆ రెండు ఎట్టివి? ఆ రెండిటిలో దేనిని ఆశ్రయిస్తే త్వరగా సిద్ధిని పొందవచ్చు? శ్రీకృష్ణ భగవానుడు: అవును. నాకు రెండు రూపాలున్నాయి.
1. సామాన్య రూపము - ఈ కాళ్ళుచేతులతో, శంఖచక్రగదాది ఆయుధాలతో కనిపించే రూపం. నీవు ప్రబోధితుడవు కానంత వరకు వేదవిధిని అనుసరించి ఈ సామాన్య (నామ రూపాదులతో కూడిన రూపాన్ని పూజించు.
2. పరరూపం - అది ఆద్యంతరహితమైనది. దీనిని బ్రహ్మం, ఆత్మ, పరమాత్మ మొదలైన శబ్దాలతో వేదోపనిషత్తులు పేర్కొంటున్నాయి. నీవు ప్రబోధితుడవు కానంత వరకూ సామాన్య రూపాన్ని దాటి చూడలేవు. ప్రబోధితుడవైన మరుక్షణం నా పరరూపాన్ని గ్రహిస్తావు. ఆద్యంతరహితమగు నా పర రూపమును గ్రహించావా... ఇక నీవు మరల జన్మించవు. చిత్తశుద్ధిని పొందితే గ్రహించ వలసిన దానిని గ్రహించ గలుగుతావు.
కాబట్టి నీవు సాధన సమయంలో ఈ నా సామాన్య రూపాన్ని (సాకారోపాసన) గ్రహించు. అయితే, సాధన కొనసాగుచుండగా అతిత్వరలో 'విజ్ఞానైక స్వభావమగు బ్రహ్మం సర్వదా విశుద్ధం’ అను వినూత్నమైన అవగాహన పెంపొందుగాక. క్రమంగా విజ్ఞాన దృష్టిచే 'జీవుడనగా ఎవరు? ఈశ్వరుడు అనగా ఎవరు?' అను పరిశీలన నిర్వర్తించు. జీవేశ్వరులను వేదాంత పరిభాషలో త్వమ్, తత్ అను శబ్దాలచే ఉద్దేశిస్తున్నాయి. ఆ రెండిటిని శోధించుచూ పోవుచుండగా ఏకమగు అఖండాత్మ ప్రస్ఫుటం కాగలదు. అదియే నా నిజస్వరూపమని గ్రహించు.
ఇదంచా_హమ్ ఇదం చాహమ్ ఇతి యత్ ప్రవదామ్యహమ్ I
తదేతత్ ఆత్మతత్త్వం తు తుభ్యం హి ఉపదిశామ్యహమ్ ॥
అయితే, 'ఇది నేను, ఇది నేను’ అని నాచే ప్రవచించబడే దానియొక్క ఉద్దేశము ప్రతి ఒక్క జీవుని స్వస్వరూపమగు ఆత్మతత్వమే, అనగా అధిష్ఠానము, సాధకుని స్వస్వరూపమగు ఆత్మతత్త్వాన్నే సూచిస్తున్నాయని సాధకులు మరువకూడదు సుమా! కనుక శంకలన్నీ పరిత్యజించి సర్వదా సత్యమగు ఏకాత్మయందు ప్రకాశించుము.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని |
పశ్య త్వం యోగయుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః ॥
నీవు యోగయుక్తాత్ముడవగుము. సర్వభూతాలలో గల ఆత్మనే దర్శించు. సర్వభూతములను ఆత్మయందే దర్శించు. సర్వత్రా సమదర్శివై ప్రకాశించు!
Page:198
సర్వభూతస్థమాత్మానం, భజత్యేకత్వమాత్మనః | సర్వథా వర్తమానోపి, న స భూ యో భిజాయతే ॥
ఏది ఎట్లు నిర్వర్తిస్తున్నప్పటికీ నీవు ఆత్మైకత్వ దృష్టిని ఆశ్రయించే ఉండు! సర్వభూతములందు ఏకరీతిగా వెలయుచున్న ఆత్మనే గాంచుచున్నచో... ఇక నీవు సర్వవిధ కార్యములు నిర్వర్తిస్తున్నప్పటికీ, నిన్నవి అంటవు. నీవు అందులో మరల తగుల్కొనవు.
సర్వజీవుల, సర్వశబ్దముల అసలైన అర్థం ఏకత్వమే అయి ఉన్నది. అందరి, అన్నిటి, ఏకశబ్దార్థం ఏదైతే ఉన్నదో, అదే ఆత్మ. అయితే, అట్టి ఆత్మ ఇక్కడ కళ్ళకు కనబడే స్థూల భూతములు కాదు. కళ్ళకు కనబడని సూక్ష్మభూతములు కాదు. కళ్ళకు, మనస్సుకు విషయము కాకపోయినప్పటికీ అది క్షణంలో అనుభవమునకు లభ్యం కాగలదు. ఎందుకంటే, మనందరిలో ఉండి సర్వమును పొందుచున్నది అదే సుమా! ఈ ముల్లోకములలో గల చిత్తములన్నిటి లోపల వెలయుచు, ఆ చిత్తములన్నిటినీ ప్రకాశింప జేయుచూ, “నేను” - అను అనుభూతికి కారణమగుచున్నది ఆ ఆత్మయే.
ఈ ముల్లోకాలలో ఆయా పదార్థాలు చూస్తున్నప్పుడు ఇది ఆవు, ఇది కొండ అని తెలుసు కొంటున్న రసానుభవ జ్ఞానమే ఆత్మ. అది సర్వశరీరములలోనూ అనుభవ రూపమై ఉండి కూడా, అది అందరికీ అనుభవవిషయంగా లభ్యమవటం లేదు. సత్-అసత్ వివేకులగు వారికి అది అత్యంత సుస్పష్టంగా ఘనీభూతమై గోచరిస్తోంది.
సమగ్ర పయసామ్ అంతః యథామృతమివ స్థితమ్ |
తథా సర్వపదార్థానాం దేహానాం సంస్థితః పరః ॥
పాలలో అంతటా నెయ్యి ఉన్నది. అయితే అది పాలు తోడేసి చిలికితేనే లభిస్తుంది. అట్లాగే సర్వ శరీరాలలో, సర్వ పదార్థాలలో పరమాత్మ సర్వదా వేంచేసి ఉన్నారు. నిర్మలబుద్ధి సంపాదించుకున్న వారికి అది అత్యంత స్వభావసిద్ధంగా ఇక్కడే, ఇప్పుడే అనుక్షణికమై సర్వే, సర్వత్రా అనుభవమౌతోంది.
రత్నములలోని అంతస్థితమైన కాంతియే ఆ రత్నముల బహిఃప్రకాశము, కాంతి పుంజములుగా వెలయుచున్నది కదా! ఈ సర్వ శరీరములందు అంతర్గతమై ఉన్న ఆత్మయే 'చిత్' అను బహిః ప్రకాశమునకు కారణమగుచున్నది.
ఒకచోట కొన్ని కుండలు పేర్చబడ్డాయనుకో... ఆ కుండలన్నిటి లోపల, వెలుపల ఆకాశం ఏర్పడి ఉన్నది కదా! ఈ ముల్లోకములలోని శరీరములన్నిటిలో 'అహం' రూపమున ఆత్మయే వెలయు చున్నది. అయితే సాంసారిక దృష్టి గలవారికి అది అగుపించటం లేదు. ముత్యాలు గ్రుచ్చబడిన దారం కనిపించక పోయినప్పటికీ... దారమే లేకపోతే ముత్యాలు ఒక వరుసలో నిలువవు కదా! ఈ శరీర సమూహము లన్నిటిలోనూ ఆత్మ అలక్షితమై వెలయుచున్నది.
ఆ బ్రహ్మదేవుని మొదలు ఒక గడ్డిపరక వరకు గల సర్వపదార్థములు ఆత్మయందే అధ్యస్తమై వెలయుచున్నాయి. అట్టి ఆత్మను జన్మరహితమైన దానిగా, విపరిణామ రహితమైన దానిగా జ్ఞానులు
Page:199
ఎరుగుచునే ఉన్నారు. అట్టి ఆత్మయొక్క అధ్యాస యే అహంకారము - జగత్తు మొదలైన భ్రమలు ఏర్పడి ఉండటానికి కారణమైయున్నది. అయినా కూడా ఆత్మ స్వస్వరూపము కోల్పోక సర్వదా యథాతథంగా అఖండమై విషయాతీతమై, నిర్వికల్పమై ఉండనే ఉంటోంది.
ఆత్మైవ ఇదం జగద్రూపం, హన్యతే హన్తివా అత్రకిమ్? I శుభాశుభైః జగదుః ఖైః కిమస్య అర్జున! లిప్యతే? II
ఓ అర్జునా! ఈ జగత్తు యొక్క వికారములన్నీ ఆత్మయే. వంకరటింకర తరంగాలన్నీ జలమే కదా! అట్టి ఏకము, సర్వము అగు ఆత్మ ఎవరిని చంపుతుంది? ఎవరి చేత చస్తుంది చెప్పు? ఇక శుభాశుభములగు ఈ జాగృతిక దుఃఖములచే నీవు దుఃఖితుడవు కావలసిన పనేమున్నది? అనేక వస్తువులను తనయందు ప్రతిబింబించే అద్దమునకు, ఆ వస్తువుల రాకపోకలకు సంబంధమేమైనా ఉన్నదా? వస్తుసంబంధమైన శుభాశుభాలను ఆ దర్పణం పొందుతోందా? లేదు కదా! ఆత్మ సర్వదా సాక్షి అయి ప్రకాశిస్తూ, ఈ నశించు శరీరములందు స్వతహాగా అవినాశి అయి వెలయుచున్నది. అట్టి ఆత్మను దర్శించువాడే యథార్థదర్శి.
“ఈ సర్వము నేనే” అయితే, “ఈ శరీరాలన్నిటిలో ప్రతిబింబించే 'అహం' అను చిదంశయే 'నేను'. అంతే గాని జడంశములగు, ప్రతిబింబిత చిదంశములగు ఈ శరీరాదులు నేను కాదు.”
“దర్పణంలో ప్రతిబింబించే ప్రతిబింబాలను నిషేధించి దర్పణమును నిరూపిస్తున్నట్లు ఈ సర్వమూ నా యందు ప్రతిబింబించవచ్చు గాక!... అయినా, ఈ అహంకారాదులు నా స్వరూపం కాదు”
అనే నా ఉభయవాక్యాలనూ సూక్ష్మబుద్ధితో అర్థం చేసుకో. దర్పణము వలె స్వచ్ఛస్వభావుడను, పదార్థములకు అసంబంధితుడను అద్వయుడను సర్వాత్మకుడను అగు నన్ను ఎరిగినప్పుడు నీవు సర్వ దుఃఖములు అధిగమించగలవు.
5. నేను సర్వదా అకర్తను
ఓ అర్జునా! సముద్రంలో నీరు కదులుచున్నట్లు చిత్తమునందు అభిమానవృత్తులు ప్రవర్తిస్తు న్నాయి. అట్టి అభిమానవృత్తుల ప్రభావం చేతనే ఈ సృష్టి ప్రళయ వికారములన్నీ కలుగుచున్నాయి. వాస్తవానికి నీకు కనబడే ఎత్తైన పర్వతములన్నీ శిలామయమే కదా! వృక్షములన్నీ కొయ్యయే కదా! తరంగములన్నీ జలమే కదా! అలాగే పదార్థములన్నీ ఆత్మయే అయి ఉన్నది.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని |
యఃపశ్యతి తథాత్మానం, అకర్తారం, సపశ్యతి ||
సర్వజీవుల యందు ఆత్మను, సర్వజీవులను ఆత్మయందు గాంచుట అభ్యసిస్తున్నవాడు ఆత్మను దర్పణమువలె అకర్త అని గ్రహించగలుగుతాడు. "నేను ఈ సర్వజీవుల యందు వెలుగొందుచున్నాను. ప్రత్యక్షమై ఉన్నాను. ఈ సర్వజీవులు నాయందే వెలుగొందుచున్నారు. ప్రత్యక్షమై ఉన్నారు. అయితే,
Page:200
అట్టి నేను నిర్విషయుడిని అకర్తను అభోక్తను" - అని ఎవ్వరు స్వస్వరూపము విషయమై ఎరుగుచున్నారో, ...వీరే సత్యమును దర్శించుచున్నవారు... సత్యద్రష్టలు. ఓ పార్థా! మరల చెప్పుచున్నాను –
నానాకార వికారేషు తరంగేషు యథాపయః |
కటకాదిషు వా హేమ, భూతేషు తథా, అర్జున II
నానావిధ ఆకృతులలో కనిపించే తరంగములన్నీ జలం కాక మరింకేమిటి? ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలన్నీ బంగారమే కదా!
అంతయూ ఆత్మయే అయున్నది. ఇందులో నీవు సందేహించవలసినదేమీ లేదు. ఆత్మయే భూతములన్నిటా వెలయుచున్నది. సామాన్యములైన ఈ పదార్థములు, ఈ జీవులు, మహత్తరమగు ఆ బ్రహ్మము ఒక్కటే అని గ్రహించు. వీటికి ఒకదానితో మరొకదానికి భేదమే లేదు. నిర్వికారమగు బ్రహ్మమొక్కటే అన్నివైపులా వెలయుచుండగా ఇక జగత్తు - ఆ జగత్తులోని భావవికారాలకు చోటు ఎక్కడిది చెప్పు? జగత్తు అనేదే బ్రహ్మమునకు వేరుగా లేనప్పుడు, అట్టి జగత్తులో ‘బంధువధ’ అనునదెక్కడ? వృథాగా మోహం చెందవద్దు సుమా! అందుచేత ముందుగా బ్రహ్మం గురించి విను. విని, మననం చేయి. చేసి, చక్కగా బ్రహ్మమును అనుభవమునకు తెచ్చుకో. తెచ్చుకుని సమరసతత్త్వాన్ని ఆనుక్షణికంగా ఆశ్రయించు. అట్లు ఆశ్రయించి అనేకమంది సాధుపురుషులగు జీవన్ముక్తులు ఈ లోకంలో నిశ్చింతులై విహరిస్తున్నారు. వారు మానమోహముల నుండి విడివడుచు న్నారు. సంగ దోషాన్ని జయించి అసంగస్థితిని సంపాదించుకుంటున్నారు. సుఖదుఃఖములనబడే స్వకీయ భ్రమాత్మక నిర్వచనాల నుండి ముక్తిని బడయుచున్నారు. అవ్యయమగు పరమపదాన్ని అధిరోహించుచున్నారు. వారి మార్గమే నీకు శిరోధార్యం. కనుక కర్మలలో నిస్సంగుడవై సర్వసమత్వాన్ని అధిరోహించు.
6. ఆత్మార్పణం
శ్రీకృష్ణ పరమాత్మ : హే మహాబాహో! అర్జునా! నీకు ప్రీతి, హితము చేకూర్చాలనేదే నా ఉద్దేశం. అందుచేత పరమశ్రేయోదాయకము, ఉత్తమము అగు విషయాలు మరికొన్ని చెప్పుచున్నాను. శ్రద్ధగా విను -
ఈ భౌతిక శరీరాంతార్భాగమై ఉంటున్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు బాహ్య విషయాలను స్పర్శిస్తున్నప్పుడు 'ఇది సుఖము కనుక కావాలి. అది అసుఖం. కనుక వద్దు' - అనే భావాలు కలుగజేస్తున్నాయి, సుఖ భావంగాని దుఃఖ భావంగాని స్థిరంగా ఉండవు. సుఖ దుఃఖ భావాలన్నీ వచ్చిపోయే స్వభావం కలిగినవి. ఒకప్పుడు సుఖకరమని అనిపించినది మరొకప్పుడు, “ఎందుకొచ్చిన కర్మరా?”...అనురూపంగా దుఃఖదాయకమౌతోంది. అందుచేత వాటియందు నమ్మకం ఉంచవద్దు. వాటిని సహించగలిగే శక్తిని పెంపొందించుకో. వాటిని ఎదుర్కోవాలంటే సహనానికి మించి వేరే ఉపాయం లేదు.
Page:201
నీవు వాస్తవానికి స్వతఃగా అద్వయ పరిపూర్ణానంద స్వభావుడవు. ఈ తన్మాత్రస్పర్శలు లేవు. సుఖదుఃఖములు లేవు. ఇవన్నీ నీ భావాభావాంతర్గతములు. నీవో? భావాతీతుడవు. నిత్యనిర్మలుడవు. ఆద్యంతరహితుడవు. నిరవయుడవు. పరిపూర్ణుడవు. అట్టి నీకు ఈ బంధుమిత్రుల సంయోగ -
వియోగ - - దుఃఖములు ఎట్లా కలుగుతాయో చెప్పు?
నీ సంపూర్ణత్వమగు స్వస్వరూపమును ఏమరచుటచేతనే ఇదంతా కూడా సంభవిస్తోంది. లేక, ఈ రీతిగా అనుభవమౌతోంది. కాబట్టి 'విషయేంద్రియ సంయోగం' అను భ్రమను నశింపజేయి. ధీరుడవై సుఖదుఃఖములందు సమభావమును కలిగి ఉండుము. అప్పుడే నీవు అమృతత్వానికి అర్హుడవౌతావు. అట్టి అమృతత్వమే నీ సత్యరూపం.
అర్జునుడు: నిజమే. అయినా ఈ సుఖదుఃఖములను సహించటం సులభమా? ఎట్లా?
శ్రీకృష్ణ భగవానుడు: అసద్వస్తువులగు ఈ సుఖదుఃఖాలన్నీ కూడా ఆత్మయందే పరికల్పితాలై వెలయు చున్నాయి. నీవు సర్వదా ఆత్మ స్వరూపుడవే గాని మరేదీ కాదు. వాస్తవానికి ఆత్మలో సుఖదుఃఖ లేశమనునది ఉండజాలదు. అట్టి ఆత్మతత్త్వమొక్కటే సర్వత్రా సమమై అంతయూ వెలయుచుండగా ఇక అనాత్మ అనునది ఎక్కడ ఉండగలుగుతుంది?
నాసతో విద్యతే భావో, నాభావో విద్యతే సతః ।
నాస్త్యేవ సుఖదుఃఖాదిః, పరమాత్మాస్త్రి “సర్వగః” ||
ఈ బంధుమిత్రాది సంబంధములు అనే అసత్తుకు అసలు స్వకీయమైన ఉనికియే లేదు. కల్పనచే అవి ఏర్పడి, కల్పనచే అనుభవమౌతున్నాయి. మరొక కల్పనచే లయమైపోతున్నాయి. ఇక మనందరి స్వరూపమగు సత్తకు ‘లేకపోవటం' అనే వినాశనమే ఉండదు. అందుచేత అసత్యములగు సుఖదుఃఖములనేవి స్వతఃగా ఉన్నవి కావు. అది అట్లు పరికల్పించబడటం చేత మాత్రమే ఆయా రీతిగా తోచుచున్నాయి.
అంతటా సర్వవ్యాపియగు పరమాత్మ ఒక్కటే వెలయుచున్నది.
జగత్తు ఉన్నది - లేదు... జగత్తు - ఇచ్చటి సంబంధాదులు... జగత్తు - ఆత్మ.... జగత్తు - ఆత్మల మధ్య ఏర్పడియున్న మనస్సు... మొదలైన విశేషాలన్నీ అధిగమించు. అప్పటికీ నీ యందు శేషించి ఉండు చిత్స్వరూపమునందు ప్రతిష్ఠితుడవై ఉండుము. ఓ విజయా! ఆత్మ చేతనమైనది. ద్రష్టత్వము అను క్రియా విశేషమును ఆశ్రయించి... ఈ దేహము నందు వెలయుచున్నా కూడా సుఖమును హర్పించదు. దుఃఖమునకు క్రుంగదు. ఆత్మ సర్వదా సర్వత్రాయథాతథం.
మరి దుఃఖములను పొందుచున్నదేది?... జడరూపమగు చిత్తమే వాస్తవానికి దేహరూపం పొందుతోంది. అదియే తనకు తాను సుఖదుఃఖములను తయారు (కల్పించుకుని) చేసుకుని అనుభవిస్తోంది.
ఈ శరీరము ఉప్పొంగవచ్చు. క్షీణించవచ్చు. ఆత్మకు ఎట్టి మార్పుచేర్పులు ఉండవు. ఇక ఈ అనుభవములు సంగతేమిటంటావా? ఇక్కడ తారసపడే అల్ప సామాన్య, ఆశ్చర్యకర, సుఖదుఃఖ
Page:202
అనుభవములన్నీ ఆ ఆ అనుభవములను పొందే మనస్సుతో సహా - - మాయ నుండి భ్రమచేత ఏర్పడి ఉంటున్నాయి. భ్రమ అనునది అజ్ఞానము నుండి బయల్వెడలుతోంది. ఈ శరీరము, ఇంద్రియములు, సుఖ దుఃఖములు మొదలైనవన్నీ ద్రష్టయొక్క కల్పనయే గాని, అవి వేరుగా (స్వయంగా) లేనే లేవు. అసలు ఆత్మకంటే వేరైనదానిని ఎవ్వరు ఎక్కడ కల్పించగలరు చెప
బంధువులను, తదితర సంఘటనలను చూస్తున్నప్పుడు నీకు కలిగే సుఖ-దుఃఖ భ్రాంతి అజ్ఞానం వలననే సంభవిస్తోంది. అజ్ఞానం చేత ఏది సంభవిస్తుందో... అదంతా జ్ఞానంచే మాత్రమే... నశించగలదు. అందుచేత అభ్యాసపూర్వకంగా సమ్యక్బోధను సంపాదించుకో.
అర్జునుడు: జ్ఞానం, అజ్ఞానం, సమ్యక్బోధ - అను వాటి గురించి మరికొంత వివరించి చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు: చెపుతాను... విను.
ఒకడు చీకటి సమయంలో అత్యవసరమైన పనికొరకై బాటలో వస్తూ వస్తూ ఎదురుగా అంత దూరంగా మెలికలుగా పడి ఉన్న దానిని చూచి "అయ్యబాబోయ్! త్రాచుపాము!” - అని పెద్దగా అరిచాడు. వళ్ళు వణకటం ప్రారంభించింది. ముందుకు వెళ్ళక తప్పదు. వెళ్ళాలంటే ఆ పాము బుస్సున మీదికి వస్తుందేమో? ఇప్పుడు ఏం చేయాలి? - అని ఆ బాటసారి భయంతో పరితపిస్తున్నాడు. పాము కాటు వేసినప్పుడు నురుగు కక్కుకోవటం, యమయాతన అనుభవించటం, విషప్రభావం చేత ఒళ్ళు నీలం కావటం, చావటం మొదలైన వినిన, చూచిన వార్తలతో అతని మనస్సంతా నిండిపోయాయి.
ఇంతలో ఆ ప్రక్కగుడిసెలలో ఉండే ఒక అవ్వ ఆ కేకలు విని ఒక దీపం చేతపట్టుకుని అక్కడ కొచ్చింది. దీపపు కాంతి అటువైపు చూపి “ఒరే అబ్బాయ్! ఇక్కడ పాము లేదు, గీము లేదు. అది త్రాడు మాత్రమే. కావాలంటే కొంచెం చూడు నీకే తెలుస్తుంది" అని చెప్పింది. ఆ దీపపు కాంతిలో తాను కూడా కళ్ళు తెరచి బాటసారి చూచాడు. అరె! అది పాము కాదు. “ఏదో చాంతాడు ముక్క. అనవసరంగా భయపడ్డాను" అని గ్రహించాడు. అంతే, ... మరుక్షణం అతని భయాలు, కేకలు అన్నీ ఉపశమించాయి. అట్లాగే, అజ్ఞానజనుల దుఃఖభ్రాంతులు, శరీరతదాప్య భ్రమలు - ఇవన్నీ కూడా, “శాస్త్రములు, జ్ఞానులు" - అందించే సమాచారముచే నశించగలవు.
ఈ శరీరమును అవధరిస్తున్న 'శరీరీ’యొక్క వాస్తవ స్వరూపం బ్రహ్మమే.
విష్వగ్విశ్వమజం బ్రహ్మ న నశ్యతి న జాయతే |
ఇతి సత్యం పరం విద్ధి బోధః పరమ ఏష సః ॥ (శ్లో 15, సర్గ 54)
ఈ విశ్వమంతయు పూర్ణబ్రహ్మమే. బ్రహ్మము జనించుట లేదు, నశించుట లేదు. ఇదియే పరమసత్యము. ఇదియే జ్ఞానము.
బ్రహ్మ మహాసముద్రమునందు 'సంకల్పములు' అనే తరంగాలు ఎప్పుడో లేచి, మరెప్పుడో ఆ బ్రహ్మ మహాసముద్రమునందే లయమౌతున్నాయి. జ్ఞానోదయ కాలమందు అవన్నీ కూడా బ్రహ్మమే అగుచున్నాయి. స్వస్వరూపమగు బ్రహ్మము యొక్క వాస్తవ స్వభావమును సంతరించుకున్న వానికి
Page:203
ఈ దేశ-కాల-క్రియలు, నీవు-నేను అనే ఈ భావవికారములు మొదలైనవన్నీ కూడా బ్రహ్మముగానే తెలియవస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ అనుభవమయ్యే భేదాభేదములు బ్రహ్మమునందు లేవు అనే నిర్మలమైన అవగాహన పరిఢవిల్లుతోంది. స్వస్వరూపమును ఏమరచినప్పటి ఈ దేశ కాల దేహ క్రియాదుల కల్పితానుభవ పరంపరలే అజ్ఞానము యొక్క స్వరూపం.
కాబట్టి, అర్జునా! నీవు ఇప్పటికిప్పుడు సకల భయశోకాలను, మానమదాలను, సుఖదుఃఖ నిర్వచనములను, సర్వ కోర్కెలను వదలి ఉండుట అభ్యాసం చేయి... అసద్రూపమగు ద్వైతభావమును పరిత్యజించే ప్రయత్నం చేయి. సద్రూపుడవు కమ్ము. నీవు ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నీ సర్వ కర్మలను, భావములను బ్రహ్మముతోడ నింపివేయి. నీ యొక్క సుఖ, దుఃఖములను, లాభాలాభాలను, జయాపజయములను శుద్ధబ్రహ్మముతో ఐక్యమొనర్చివేయి. నీవు బ్రహ్మసముద్రుడవే గాని, ఒక తరంగమో, బుడగయో కాదు. హీనములైన 'నేను ఒక జీవుడను' మొదలైన భావములకు తావీయవద్దు, తత్త్వనిశ్చయము చేసుకుని, గుహలోని వాయువువలె నిశ్చలత్వము వహించి, అటుతరువాత ప్రకృత కార్యమగు ఈ యుద్ధమును ఆచరింపుము. "నేను ఆచరించేది, భుజించేది, ఇచ్చేది, వ్రేల్చేది... అంతయూ ఆత్మయే” అను స్థిర నిశ్చయము కలిగియుండుటయే సమ్యకో బోధ. అదియే ఆత్మార్పణము అని కూడా చెప్పబడుతోంది.
ఎవడు తనయందు ఏ భావాన్ని ఆశ్రయించి ఎట్లు నిశ్చయుడై ఉంటాడో... అతడు దానినే పొందటం జరుగుతుంది. అందుచేత సత్యమగు బ్రహ్మమును పొందుటకుగాను నీవు బ్రహ్మాకార స్థిర చిత్తుడవు కమ్ము. అప్పుడు నీవు కార్య కారణాతీతమగు బ్రహ్మమే కాగలవు. ఇందులో సందేహం లేదు.
బ్రహ్మజ్ఞుడైనవాడు కర్మఫలాలను ఆశింపక, ఈ సర్వకర్మలు-పూర్వాపరాలతో సహా బ్రహ్మమే”... అను భావనతో యథాప్రాప్తములైన కర్మలను ఆచరించుచున్నాడు. అందుకు ప్రయోజనంగా బ్రహ్మమే అగుచున్నాడు. ఏ మనుష్యుడైతే సర్వకర్మలయందు నిష్క్రియమగు బ్రహ్మమును, బ్రహ్మమునందే సర్వకర్మలను గాంచుచున్నాడో... అతడే అందరిలోకి బుద్ధిమంతుడు. అతడే పరిపూర్ణకర్మి అని కూడా చెప్పబడుచున్నాడు.
7. అకామకామి
ఓ ధనంజయా! నీవు లాభ - అలాభాదులకు, లభ్య-అలభ్యాదులకు వశీభూతుడవు కావద్దు. యథాప్రాప్తాలైన కర్మలను నిర్వర్తించటమే ఉచితం. అయితే అట్లు నిర్వర్తించే సమయంలో అనాసక్తుడవై ఉండుము. ఆసక్తిని సమూలంగా త్యజించి యోగస్థుడవై కర్మలు ఆచరించుము.
అజ్ఞానము ఆశ్రయించక.... కర్మలయందు ఆసక్తి లేక కర్మల సహిత - రహితత్వములకు అతీతుడవై సర్వదా సముడవై వెలయుము.
Page:204
కర్మ ఫలాసక్తిని విడచి నిత్యతృప్తుడవై - నిరాశ్రయుడవై యథాప్రాప్తములైన కర్మలు ఆచరిస్తూ ఉంటే, అప్పుడాకర్మలు నీపట్ల లేనివే అవుతాయి. 'నేను ఇది చేయుచున్నాను..... అను కర్తృత్వబుద్ధియే ఆసక్తి, అకర్తృత్వ బుద్ధియే అనాసక్తి. మనస్సు అజ్ఞానావృతమైనప్పుడే ఆసక్తి ప్రబలుతుంది. అట్టి కర్తృత్వబుద్ధి విభాగమునకు సంబంధించిన మనస్సును వెంటనే పరిత్యజించుము. పరతత్త్వమును సుస్పష్టముగా ఆకళింపు చేసుకుని అనాసక్తబుద్ధితో స్వధర్మములైన కర్మలను ఒనర్చుచున్న మహాత్మునికి మరింకెన్నడూ కర్తృత్వబుద్ధి కలగదు.
అకర్తృత్వాత్ “అభోక్తృత్వమ్”, అభోక్తృత్వాత్ సమై |
సమైకత్వాత్ “అనంతత్వమ్”, తతో “బ్రహ్మత్వమ్” ఆతతమ్ ||
‘నేను దేనికీ కర్తను కాదు’ అను అభ్యాస యోగముచే 'నేను దేనికీ భోక్తను కూడా కాదు’ అను అవగాహన బలం పుంజుకుంటుంది. అభోక్తృత్వము వలన సమత్వము లభ్యపడుతుంది. సమత్వము నుండి అనంతత్వము, అనంతత్వము వలన బ్రహ్మత్వము సిద్ధించగలవు. ఎట్లాగైనా సరే, నీవు ఇక్కడ నానాత్వమును పరిత్యజించు. పరబ్రహ్మైక్యము పొందు లక్ష్యం గల ఆచరణలను ఆశ్రయించు. అప్పుడు విధ్యుక్తములైనప్పటికీ నీవు ఆ ఈకర్మలకు కర్తవు కావు. ఎవని కార్యములు కామసంకల్ప వర్జితములో అవి ప్రారంభమునందే జ్ఞానాగ్నిచే దగ్ధం కాబడినాయో అట్టి వానిని శాస్త్రములు ‘పండితుడు’ అని పిలుస్తున్నాయి. సముడు, సౌమ్యుడు, స్థిరుడు, స్వస్థుడు, శాంతుడు, విషయనిస్పృహుడు అగువాడు కర్మలు ఆచరించుచున్నప్పటికీ నైష్కర్మియే అగుచున్నాడు.
అందుచేత కిరీటీ! నీవు ద్వంద్వ రహితుడవై ఆత్మవంతుడవై యథాప్రాప్తములైన స్వధర్మానుకూల మగు కర్మలు ఆచరించుచూ, ఈ భూమండలమును అలంకరించుము. ఏ మూఢుడైతే కర్మేంద్రియాలను మాత్రం నిరోధించి ఆయా విషయానుభవములను మనస్సునందు స్మరించుచున్నాడో అట్టివాడు “మిథ్యాచారి” అని పిలవబడుచున్నాడు. ఎవరైతే ఇంద్రియములను ఆయాకర్మలందు నియమించే టప్పుడు మొదలే సంగరహితుడై కేవలం కర్మలను కర్మేంద్రియాల సహాయంతో నిర్వర్తిస్తున్నాడో... అట్టి అనాసక్త కర్మయోగం అత్యంత ప్రాశస్త్యమైనది సుమా!
నదులు సముద్రంలో ప్రవేశించగానే అవి తమ ప్రవాహత్వాన్ని సముద్రజలంతో ఏకం చేసి ఆ సముద్రజలంలో ఉపశమిస్తాయి చూచావా?... ఎవనియందు దృశ్యాదులు ప్రకాశించగానే అవన్నీ నిర్వికారమగు బ్రహ్మమునందు లయమైపోతాయో... అట్టి పురుషుడు పరమశాంతిని పొందుచున్నాడు.
అంతే గాని కోర్కెలు కోరుకొంటూ రోజులు గడుపుచున్నవాడు, ఉపాధులు ధరిస్తున్నవాడు ఎప్పటికీ శాంతిని పొందుటయే లేదు.
Page:205
8. దేహి - దేహము - వాసనలు
-
శ్రీకృష్ణ భగవానుడు: ఓ పార్థా! ఇక్కడ ఇంద్రియములకు తారసబడే ఆయా భోగములపై నమ్మిక కలిగి ఉండవద్దు. అయితే, యథాప్రాప్తములైన కర్మలను మాత్రం సమత్వ - నిర్వికారబుద్ధితో నిర్వర్తిస్తూ ఉండు. ఇక ఈ దేహములంటావా? ఇవి జన్మ - జరా - మరణాది స్వభావయుక్తమై అనాత్మ అయిఉంటున్నాయి.
అనాత్మన్ ఆత్మతాం దేహే మా భావయ భవాత్మని ఆత్మన్యేవాత్మాతం సత్యే భావయా అభవరూపిణి ॥
అనాత్మభూతములగు ఈ శరీరాదులందు ఆత్మభావం కలిగి ఉండకుము. వికార రహితమగు సత్య వస్తువునందే ఆత్మభావము కలిగి ఉండుము.
దేహనాశే, మహాబాహో! న కించిదపి నశ్యతి! |
ఆత్మనాశోహి నాశఃస్యాత్ ! నచాత్మానశ్యతి ధ్రువః ॥
గొప్ప బాహువులు గల ఓ అర్జునా! ఈ శరీరం నశించినంత మాత్రం చేత ఇక్కడేమీ నశించటమే లేదు. ఆత్మ నశించినప్పుడే అది నాశం అని అనిపించుకుంటుంది. అయితే... ఆత్మకు నాశనమనునదే లేదు. ఇది సత్యం. చిత్తం కంటే కూడా అత్యంత సూక్ష్మమైన ఆత్మ జీర్ణమొనర్చ బడజాలదు. కనుక ఆత్మను చిత్తమునుండి వేరు చేసి కర్మలను నిర్వర్తించిన, ఏమియు నిర్వర్తించనివాడవే అగుచున్నావు.
'కర్తృత్వం' అంటే ఏమిటి? ఆసక్తియే కదా!... ఇప్పటికిప్పుడే నీవు 'అజ్ఞానం' అను మూర్ఖత్వాన్ని పరిత్యజించు. అందుకుగాను జ్ఞానులను ఆశ్రయించు. అనాసక్తమతి అయిన మహాత్ముడు కర్తృత్వ అహంకారం పొందనే పొందడు.
ఆత్మ అవినాశి అని, ఆద్యంతరహితమని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. ఆత్మ నశించుచున్నదను భ్రమ నీకు అర్హమే కాదు. అట్టి భ్రమయే అన్ని దుఃఖాలకు మూలకారణం. ఆత్మజ్ఞులు ఆత్మను నశించు దానిగా ఎంచరు. వారు తమయందే ఆత్మను ప్రత్యక్షం చేసుకుని ఉంటారు. ఇక ఈ శరీరాదులందు ఆత్మబుద్ధిని కలిగి ఉండరు.
అర్జునుడు : ఓ జగన్నాథా! శ్రీ కృష్ణా! అట్లా అయితే అజ్ఞానులు శరీరము నశించినప్పటికీ కూడా దాని వలన వారికి కలిగే నష్టమేమీ లేదు కదా?
శ్రీకృష్ణ భగవానుడు : అవును. అజ్ఞానుల విషయమైనా సరే, ఈ దేహం నశించినంతమాత్రంచేత ఎక్కడా నశిస్తున్నదేదీ లేదు. అవినాశియగు ఆత్మ ఒక్కటే సర్వే- సర్వత్రా వెలయుచుండగా ఇక ఈ దేహములు నశించినంత మాత్రంచేత ఎవరికి మాత్రం ఏమి నష్టం?
మోహము వలననే 'ఇది లభించింది - ఇది వినష్టమైనది' అనునదంతా తోచుచున్నది. గొడ్రాలి రెండవ కుమారుడు ఎక్కడైనా తారసపడతాడా? అట్లాగే పరిశీలన సహాయంతో భ్రమను
Page:206
త్యజించిన వానికి ఈ శరీరాలు వాటి వినాశనములు అసలు కనిపించనే కనిపించవు. అసత్తగు “నా దేహము - వారి దేహము” మొదలగు భావములన్నిటికీ స్వతః అయిన ఉనికియే లేదు. సర్వభావములు ఎందులో కలుగుచున్నాయో... అట్టి సమరస వస్తువుకు వినాశనముగాని, అభావము గాని లేవు. జ్ఞానులు సత్ - - అసత్తుల విభాగము విషయంలో నిర్ణయం చేసుకునే వర్తిస్తున్నారు.
అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశం అవ్యయస్యఅస్య! న కశ్చిత్ కర్తుమర్హతి ॥
అర్జునా! సర్వవ్యాపియగు ఆత్మ అవినాశి అని గ్రహించు. అవ్యయమగు ఆత్మను ఎవ్వరూ వినాశనం కావించలేరు.
అన్తవన్త ఇమే దేహా, నిత్యస్యోక్తాః శరీరిణః | |
అనాశినో, అప్రమేయస్య! తస్మాత్ ఉద్యస్వభారత! ॥
నీకు కనబడుచున్న ఈ శరీరాలన్నీ ఒకనాటికి నశించవలసిందే. అయితే ఏం? ఈ శరీరాలను ధరిస్తున్న శరీరి నాశరహితమైనది. అద్దానికి ఈ దేహాదులతో ఏమాత్రం ప్రమేయం లేదు. ఆత్మ (దేహి) యొక్క ఉనికి దేహాదులతో వచ్చేది కాదు, దేహాదులతో పోయేది కాదు. అందుచేత ఈ దేహాదులను దృష్టిలో పెట్టుకుని, వీరంతా నశిస్తారేమోననే శంకతో నీ స్వధర్మమైన యుద్ధం మానవలసిన అవసరం లేదు. అఖండము, సర్వగమము అగు ఆత్మ ఒక్కటే వెలయుచుండగా ఇక అసత్తెనదంతా ఎక్కడ ఎట్లు ఏర్పడగలదో చెప్పు? అవినాశి, అనంతము, సత్స్వరూపము అగు ఆత్మను గురించి ఎవరైనా దుఃఖించవలసినపనేమున్నది?
కారణం, దానికి సంబంధించిన కార్యం, అద్దానిచే కనబడే అనేకత్వం - ఇవన్నీ పరిత్యజించ బడగా అప్పుడు ఆ ఏకత్వ - అనేకత్వముల మధ్య శాంత పరమపద స్వస్వరూప మొక్కటే వాస్తవమైన ఉనికిని కలిగి ఉన్నది. తక్కినదంతా భ్రమయే!
అర్జునుడు: అయితే భగవాన్! నాదొక చిన్న సందేహం. ఆత్మకు 'మరణం' అనే ధర్మమే లేదు కదా! అట్టి ఆత్మ “అయ్యో నేను మరణించబోవుచున్నాను” అని ఎందుకు అనుకుంటోంది? మరొక ప్రశ్న కూడా వినండి. ఈ మానవుల యొక్క ఈ లోకాల యొక్క స్వర్గ, నరకాదుల యొక్క స్థితి గతు లన్నిటికీ కారణం ఏమిటి?
శ్రీకృష్ణ భగవానుడు: బ్రహ్మమే తన యొక్క 'అధ్యాస' అను చమత్కారమును ప్రకటించుచు శరీరము లందు వెలయుచున్నది. "ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, మనస్సు, బుద్ధి" అను తన్మాత్రలతో కూడి జీవుడుగా అగుచున్నది. ఆవుదూడ త్రాడుచే లాగబడునట్లు, పక్షిపిల్ల పంజరంలో చిక్కునట్లు ఈ జీవుడు తనకుతానుగా శరీర బద్ధుడగుచున్నాడు. వాసనానుసారంగా దేహమును ధరిస్తున్నాడు. ప్రస్తుత దేహం శిథిలమైనప్పుడు వాసనలను కొనసాగించిన కారణంగా మరొక దేహం పొంది వేరైన దేశకాలములను గాంచుచున్నాడు. వాయువు ఒక పుష్పముపై ప్రసరించి అక్కడి గంధమును తనవెంట గొనిపోవునట్లు ఈ జీవుడు ఒక దేహము నుండి వాసనలను గొనిపోయి
Page:207
మరొక దేహంతో కొనసాగిస్తున్నాడు. చక్షురాది ఆయా ఇంద్రియముల సంస్కారమును వెంటబెట్టుకుని దేహ-తదనంతర దేహములను పొందుచూ తనయందు తానే సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు.
ఈ శరీరముతో ఏర్పడే సంబంధమంతా కేవలం వాసనలచేతనే ఏర్పడుతోంది. వాసనలే రహితమైతే ఇక అట్టి జీవునకు “నేను ఈ దేహమునకు సంబంధించిన వాడను" ...అను భావన, అనుభవములు ఉండవు. అప్పుడు శేషించేది పరమపదమే అయి ఉంటుంది.
వాసనాయుక్తుడగు జీవుడు అన్న - పాన - మైథునములచే ధ్యాసయుక్తుడగుచు నానావిధ యోనులందు తిరుగాడుచున్నాడు. ''భ్రమ' అను భారమును మోయుచు ఇంద్రియ ధర్మములందు ఆసక్తి కలవాడై తనస్వరూప మెట్టిదో పూర్తిగా ఏమరచుచున్నాడు.
దేహో నిస్పన్దతామేతి, జీవే కౌత్తేయ! నిర్గతే | నిస్పన్దావయవా భోగః శాంతవాతి ఇవ ద్రుమః ॥
ఎప్పుడైతే జీవుడు అను చైతన్యసత్త స్వరూపుడు ప్రాణసంచలనముతో సహా దేహము నుండి బయల్వెడలుతాడో... అప్పుడు ఈ దేహం చలనరహితమౌతోంది. గాలి ఆగిపోతే లత యొక్క కదలిక ఆగిపోతుంది చూచావా? అట్లా దేహి దేహము నుండి బయలు వెడలినప్పుడు ఈ దేహం నిస్పందం (స్పందరహితం) అవుతోంది. అప్పుడు, 'ఈతడు మరణించాడు' అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ దేహి, దేహమును త్యజించాడు. అంతమాత్రమే ఇక్కడి విశేషం.
ఈ జీవుడు శరీరం నుండి బయల్వెడలిన తరువాత అక్కడ ఉన్న ఆకాశమునందు తన వాసనా బలం చేత తన వాసనలన్నీ రూపుదాల్చినట్లు గాంచుచున్నాడు. వాసనల "తీవ్రత దిశ - క్రమము” లను అనుసరించి మరల పాంచ భౌతిక సమ్మేళనములను ఆశ్రయించి ఇతఃపూర్వమునకు వేరైన దేశ కాలాలను గాంచుచున్నాడు. ఈ మహా ప్రయాణం అనంత కాలంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒక శరీరనాశనము-నూతన శరీర ఆవిర్భావం కూడా స్వప్నానుభవం వంటివే. అయితే ఏం? శరీరముతో కూడిన విషయములు సంబంధములన్నీ కూడా ఎప్పటికప్పుడు వాస్తవమైనట్లు అజ్ఞానవశం చేత పరికించుచున్నాడు. నిద్రలో కలకంటున్న వానివలె నీవు ఇదంతా చూచి భ్రమించవలదు.
9. వాసనాక్షయం - - ఆత్మానుభవం
ఏ వస్తువు ఏ రీతిగా ఏర్పడుచున్నదో... దాని వినాశనము కూడా అట్లే జరుగుతోంది. సృష్టి ప్రారంభంలో ఈ సమష్టి సృష్టికర్త (హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు) తన యొక్క పూర్వ కల్ప వాసన లను అనుసరించి గుఱ్ఱము, ఆవు మొదలైన జీవజాతములను కేవలం కల్పన సహాయంతో సృష్టిస్తు న్నాడు. అందుచేత ఇక్కడ దృశ్యజగత్తు, ఇందలి జీవన్-మృత్యువులతో సహా సర్వం కల్పన మాత్రమే.
కుమ్మరివాని రకరకాల కుండలలాగా ఈ వివిధ జీవ జంతు జాతులు కల్పించబడుచున్నాయి. కుమ్మరివానికైతే మట్టిని కుండలుగా మలచటానికి 'సారె’ మొదలైన ఉపకరణాలు కావలసి ఉంటుంది. మరి ఈ దృశ్య జగత్తు విషయమో? సమష్టి సృష్టికర్తకు ఎట్టి ఉపకరణాలు అక్కర్లేదు. ఎందుకంటే
Page:208
ఇదంతా మనోకల్పితమే కదా! ఒక కథారచనవలె కల్పన కల్పనలోనే ఉదయిస్తోంది. కల్పనలోనే కొనసాగుతోంది. కల్పనలోనే లయిస్తోంది. కల్పనయందే ఉపశమిస్తోంది.
జీవునికి-జగత్తుకు గల సంబంధం కథారచయితకు-కథారచనకు గల సంబంధం వంటిదే! ఈ జగత్తు మొదలు – - చివర కూడా కల్పనయే కాబట్టి ఇది వర్తమానంలో కూడా మిథ్యయే. కల్పనతో కూడినది వాస్తవమెట్లా అవుతుంది? జీవుని స్వరూపం జ్ఞానశక్తియే. అట్టి జ్ఞానశక్తి చేతనే పదార్థాల ఉనికి అనుభవమౌతోంది. ఆ అనుభవం యొక్క రూపం కల్పన చేతనే నిర్మించ బడుతోంది. కనుక ఈ జగత్తు ఆరోపితమైన భ్రమతో కూడిన దృష్టి కారణంగా ఘనీభూతమైన సంసార సాగరంగా (ఆత్మానుభవ - - వ్యతిరేకమైనదిగా) తోచుచున్నది.
ఈ జగత్తు ద్రష్ట యొక్క వాసనలను అనుసరించి అనేకానేక విధములుగా స్ఫురించుచున్నది. ఆ వాసనలు ఇతఃపూర్వపు కర్మ, భావనల పరంపరావిశేషము చేతనే ఆయా వర్తమాన రూపములు కలిగి ఉన్నాయి. ఇతఃపూర్వపు పురుషకారముచే ఏర్పడిన వాసనలు వర్తమాన పురుషకారం యొక్క ఉచ్ఛ-నీచములను అనుసరించి ఇక ముందు బలహీనపడటమో, బలపడటమో జరుగుతోంది. నిన్న సంపాదించుకున్న ధనం ఈ రోజు చేసే వినియోగ - సముపార్జనలను అనుసరించి తరగటమో, పెరగటమో జరుగుతుంది కదా! నిన్న తిన్న ఆహారమువలన కలిగిన అజీర్ణమువంటి ఏదైనా అనారోగ్యం ఈ రోజు సేవించే ఔషధంచేత తొలగించబడుతోంది చూచావా! అట్లాగే, వర్తమానంలో నిర్వర్తించే తపస్సు, దానం, ధ్యానం, కర్మఫల సమర్పణ - వంటి ఉత్తమ కర్మలు ఔషధరూపంలో ఇతఃపూర్వపు వాసనలను తగ్గించగలవు. తొలగించగలవు. జీవుడు వాసనలను తొలగించుకొన్నప్పుడు అతని యందు ఆత్మస్వభావం స్వయంసిద్ధంగా ప్రకాశించగలదు. అందుచేత అర్జునా! నీవు ఎంత శ్రమించి అయినా సరే, శాస్త్రవిహిత ధ్యానాది కార్యక్రమములను, నీకు విధించిన కర్మల ఫలసమర్పణను ఏక సమయంలో అత్యంత శ్రద్ధతో నిర్వర్తించు. అంతే గాని, ఇంద్రియాల వెంట మనస్సుతో పరుగు లిడి వెనుక - - ముందు చూచుకోకుండా వాసనలను మరింత మూటగట్టుకోకు. అప్పుడు మానవజన్మ అను అవకాశమును దుర్వినియోగపరచినవాడవే అవుతావు.
ఈ జీవునికి ఎదురుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధములైన పురుషార్ధములు ఉన్నాయి. అయితే ఈతడు దేనిని గ్రహించి విశేషంగా ప్రయత్నించటం జరిగితే... ఆ ప్రయత్న ప్రాబల్యముల ననుసరించి ఆ ఆ పురుషార్థమే సిద్ధించగలదు. ఇది గ్రహించి ఉండుట చేతనే వింధ్యపర్వతం పగులునంతటి ప్రళయవాయువులు వీచుచున్నప్పుడు కూడా ధీమంతులైనవారు తమ యొక్క శాస్త్రవిహిత పురుషకారాన్ని వదలిపెట్టరు.
అర్జునుడు: హే జగత్పతీ! ఈ జగత్ స్థితికి, స్వర్గ నరకములు, సృష్టి మొదలైన కల్పనలకు అసలు కారణమేమిటో చెప్పండి.
శ్రీకృష్ణ భగవానుడు: అర్జునా! అజ్ఞానావృతుడైన జీవుడు తనయొక్క అభ్యాసబలం చేత చిరకాలం నుండి ఈ స్వర్గ నరకాదులను గాంచుచున్నాడు. స్వర్గ నరకాది సంసార సంభ్రమానికంతటికీ కారణం
Page:209
వాసనలే. కాబట్టి వాసనాక్షయం వలననే నీకు నిత్య శ్రేయస్సు సమకూరుతుంది. వాసనలు రహితమైతే ‘జీవుడు’ అనబడునదే ఉండదు. అనగా, ఇదే జీవుడు స్వయముగా శివస్వరూపమై ప్రకాశించగలడు. అర్జునుడు: దేవదేవా! వాసనలు దేనివలన కలుగుచున్నాయి? అవి సమూలంగా నశించేది ఎట్లా? శ్రీకృష్ణ భగవానుడు: అజ్ఞాన భ్రమ నుండి వాసనలు లేచి... అనాత్మ యందు ఆత్మభావాన్ని కలిగిస్తు న్నాయి. ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటేనే అజ్ఞానం నశించి వాసనలు విలీనం కాగలవు. ఓ కౌంతేయా! నీవు ఆత్మ గురించి విన్నావు, విచారించావు, గ్రహించావు. ఇక 'ఇది, నేను, నాది, నా వారు' అను రూపంలో గల వాసనలను త్యజించటంలో జాప్యం ఎందుకు? అభ్యంతరమేమిటి? అర్జునుడు: హే శ్రీ కృష్ణా! నాదొక సందేహం. ఏది దేనిని ఆశ్రయించి ఉంటుందో, అది నశించినప్పుడు ఆ ఆశ్రయించబడేది కూడా నిరాశ్రయమౌతుంది కదా! మీరు వాసనలు రహితమైతే జీవుడనబడేవాడే ఉండడని ప్రవచించారు. జీవుడే లేకపోయినప్పుడు ఇక ఇటు అనర్ధదాయకమగు సంసారాదులు, అటు పరమానందావిర్భావమగు ఆత్మసాక్షాత్కారమును అనుభవించే వాడెవడు?
శ్రీకృష్ణ భగవానుడు: ఓ మహామతీ! వాస్తవానికి ఆత్మయే ఉన్నది. జీవుడనబడే వాడు ఆత్మకు వేరుగా లేడు. ఆత్మసర్వదా అఖండమే గాని అది ఎన్నడూ ఈ ఈ జీవులుగా ఖండితమగుటలేదు. ఆత్మయే వాసనత్వం వహిస్తోంది. అట్టి ఆత్మజ్ఞానం సముపార్జించుకొనుచున్నప్పుడు అకృత్రిమంగా అజ్ఞానాన్ని విసర్జించటం జరుగగలదు. వాసనల నుండి విడివడినప్పుడు ఇంకనూ ఈ జీవుని యొక్క ఏ స్థితి శేషించి ఉంటోందో అద్దానిదే ఆత్మస్థితి అని, మోక్షం అని పిలవటం జరుగుతోంది. ఏ ద్రష్ట అయితే అజ్ఞానదశలో "నేనొక అల్పజీవుడను. ఈ జగత్తు నిండా కష్టాలే! ఇక్కడ దుఃఖములే నా గతి”... అని తలచుచున్నాడో అదే ద్రష్ట (జీవుడు) సర్వ వాసనలూ నశించనప్పుడు 'నేను ఈ సర్వ ఉపాధులకు అతీతమైనట్టి - మునుముందే ఉన్నట్టి నిర్వికార - · ఆత్మ చైతన్యమును' అని అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నాడు. 'నేను ఉపాధిని ఉపయోగించే ప్రజ్ఞను' అని తననుతాను ఎరుగువాడు ఇక ‘ఉపాధి’ - (లేక) 'జీవుడు' అని ఎట్లా అనిపించుకుంటాడు చెప్పు?
ఓ పార్థా! నీవు జీవన్ముక్తుడవగుము. యథార్థమగు ఆత్మతత్త్వమును దర్శించుము. వాసనా జాలం నుండి విడివడినవాడు మాత్రమే 'ముక్తుడు' అని అనిపించుకుంటున్నాడు. వాసనాక్షయం కానంత వరకు ఎంతటి శాస్త్రకోవిదుడు అయినప్పటికీ పంజరమున చిక్కిన పక్షిలాగా బద్ధుడే సుమా!
ఎంతగా బోధించినా మాయయందు కాపురముండే వానికి ఆత్మ దుర్దర్శనము. ఇంద్రజాలంలో కనిపించే భ్రమ విశేషాల వంటి ఈ జగత్ సంబంధాలను నమ్ముకుని కూర్చున్నవానికి ఆత్మ యొక్క దేహాతీతత్వం - అఖండత్వాల గురించి ఎంత చెప్పితే ఏమున్నది?
అందుచేత... శాస్త్రాలలో ప్రవచించబడిన విధివిధానాలను శ్రద్ధగా అనువర్తించు. సాధనాదు లను ప్రవృద్ధం చేసుకో. తద్వారా, వాసనలను నశింపజేసుకో. అప్పుడు నీవు తప్పక ముక్తుడవౌతావు. మరొక్కసారి ప్రకటిస్తున్నాను- వాసనాక్షయమే మోక్షం... వాసనలు కలిగియుండటమే బంధం.
Page:210
10. స్వధర్మ నిరతి
శ్రీకృష్ణ భగవానుడు : ఓ కిరీటీ! ‘వాసనారాహిత్యం' అనేది అమోఘమైన ప్రయోజనం కలిగి ఉంది. వాసనలు రహితమైనప్పుడు నీవు జీవన్ముక్తము, అత్యంత సుఖప్రదము అగు మనశ్శాంతిని పొంద గలుగుతావు. వాసనల ప్రభావంచేతనే 'నేను నా బంధువులను చంపుచున్నానే?'... అనే దుఃఖం నీలో ప్రవేశించి నీ యొక్క స్వధర్మనిరతిని, ధర్మాధర్మ విచక్షణను కించిత్ కప్పిచేసింది. కనుక నీవు 'ఈ బంధువులు నావారు' అనే దుఃఖమాలిన్యమును త్యజించు. జరామరణముల శంక విడిచిపెట్టు. ఆకాశము వలె విశాల హృదయము సంపాదించుకో. 'ఇష్టము - అయిష్టము' ... అను సంకల్పములను దరిజేరనీయ వద్దు. 'ఇది నా అభిలాష కనుక ఇది ఇట్లే ఉండాలి' అను రూపమును దాల్చుచున్న
కామమును వదులము.
ప్రవాహపతితం కార్యమిదం కించిద్యథాగతమ్ |
కురు కార్యాణి కర్మాణి! న కించిదిహ నశ్యతి |
నీకు విధించబడిన ‘యుద్ధం చేయుట' అను ధర్మమును శుభాశుభఫలత్యాగబుద్ధితో నిర్వర్తించుటే ఉచితం. స్వధర్మనిరతి నిష్కామబుద్ధితో నిర్వర్తిస్తున్నప్పుడు అది నీ నీ తత్త్వబోధకు దోహదమే అవుతుంది కాని అంతరాయం కాజాలదని గ్రహించు. ఇక్కడ వాస్తవానికి ఏదీ జనించేది లేదు. నశించేది లేదు.
పారంపర్యంగా, శాస్త్రానుసరణంగా, సంఘనియమానుసారంగా, ప్రవాహపతితంగా వస్తున్న విహిత కర్మలను ఆచరించటమే జీవన్ముక్తుల స్వభావమై ఉంటోంది. ఎవరైనాసరే, విధి - - విహితములైన స్వకర్మలను యోగబుద్ధితో ఆచరించి ఆ సర్వాత్మకునకు సమర్పణ చేయుట చేతనే 'జీవన్ముక్తి’ అనబడు సముద్ధరణ సులభరీతిగా పొందగలడు. అంతేగాని కేవలం కర్మలు త్యజించి ఊరుకున్నంత మాత్రం చేత ఎవరికీ ముక్తి లభించదు.
“ఇదం కర్మ త్యజామి, ఇదం ఆశ్రయామి”—ఇతి నిర్ణయః I మూఢస్య మానసోరూపం! జ్ఞానినస్థు సమాస్థితిః ॥
‘అయ్యో ఈ కర్మ చేయవలసి వస్తోందే? ఆ కర్మ చేస్తే బాగుండునే?' అనే రూపంగల నిర్ణయాలు, భావాలన్నీ అజ్ఞానులందలి మానసిక వికారములు మాత్రమే. జ్ఞానులు సర్వ సమయములందూ సమస్థితియందే వెలయుచున్నారు.
ప్రవాహపతితం కర్మ కుర్వన్తః శాంత చేతసః । |
జీవన్ముక్తాః సుషుప్తస్థాః స్ఫురన్తి అత్ర సుషుప్తవత్॥
వారు యథాప్రాప్తములై నిర్జీవమైయున్న కర్మలను శాంతచిత్తులై సంకల్పరహితులై, నిద్రించుచున్న వారి యందుండు 'ప్రజ్ఞ' వలె మౌనం వహించి స్వయంజ్యోతి స్వభావులై నిర్వర్తిస్తున్నారు. వారి మనన శక్తి స్వాభావికంగానే తాబేలు అంగముల వలె ఇంద్రియ విషయాల నుండి మరలి హృదయం నందు ఏకీకృతమును పొంది శాంతైశ్వర్యమగు స్వస్వరూపము వైపుగా ఎక్కుబెట్టి ఉంటోంది. అట్టి జీవన్ముక్తులైన మహనీయులు పరమాత్మయందే నిత్యము స్థైర్యం పొంది ఉంటున్నారు.
Page:211
ఆహా! ‘చిత్తము’ అనే శిల్పి తనయొక్క అధిష్ఠానమగు పరమాత్మయందు మూలమంటూ ఏదీ లేనట్టి ఈ 'త్రిజగత్తులు’ అనే శిల్పచాతుర్యమును ప్రకటించుచున్నాడు కదా! అందుచేత పరమాత్మ విషయవిశేష రహితమైనప్పటికీ ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమై, పరమాత్మయందే ఉన్నది. అయితే పరిమిత దృష్టి గలవారు శిల్పమునే చూస్తారు గాని, శిలను చూడజాలరు చూచావా? అట్లాగే ఈ త్రిజగత్ ఆకారాది విశేషములన్నీ (అజ్ఞానావగాహనచే) పరిమితజ్ఞాన దృష్టికి పరమాత్మ స్వరూపంగా కానవచ్చుట లేదు. ఇవన్నీ అజ్ఞానాకాశంలో - అంతఃకరణవృత్తులు అనే కుంచెచే చిత్రించబడి అద్భుతంగా విస్తరించి ఉన్నాయి. సమష్టిమనః స్వరూపుడగు హిరణ్యగర్భుడు తన యొక్క సత్యసంకల్ప ప్రభావంచే ఈ త్రిజగత్తులను, వీటికి ఆధారమైన సూక్ష్మాకాశమును పరికల్పన చేస్తున్నాడు. అట్టి ఈ సమష్టి భ్రమ అనాది అయినది. ఇది గడ్డిపరకలచే నిర్మించబడిన గోడ వలె సారశూన్యము. ఇదంతా 'మాయ' లేక 'భ్రమ' అను మూలపదార్థముచే నిర్మించబడుతోంది. దీనిని మూఢులు సత్యమైనదానివలె గాంచుచున్నారు. విజ్ఞులు ఇందలి సారాసారములను ఎరిగి, తమ వివేకమును సర్వదా కాపాడుకుని ఉంటున్నారు. నాటకంలోని సంఘటనలలో తన్మయమై రసానుభవం పొంది అమిత దుఃఖము పొందే ప్రేక్షకునిలాగా ఈ జీవులు తమ విస్తార స్వస్వరూపమును ఏమరచుచున్నారు. రంగుల చిత్రం - రంగులు ఒక్కటే అయినట్లు... 'ఈ జగత్తు - దానిని దర్శించే మనస్సు - - ఈ జగత్తును దర్శించే కర్త' ఈ మూడిటికీ కనిపించే భేదం వాస్తవమైనది కాదు. ఆ మూడిటి ఏకతపిమే (లేక) జగత్తు-మనస్సు-ద్రష్టల సంయోగమే జగదనుభవానికి అసలు కారణం.
11. మనోకల్పన
ఓ పార్థా! మనస్సు చేసే 'త్రిజగత్తులు' అనే చిత్రరచనంతా ఆకాశమువలె అత్యంతశూన్యమైనది. స్వప్నంలో ఉన్నప్పుడు క్షణంలో త్రిజగత్తులను అనుభవించే ఆ మనస్సే జాగ్రత్లో కూడా అనేకానేక కల్పనలను అనుభవిస్తోంది.
కథయే ఒక కల్పన. ఇక అందలి పాత్రలు స్వభావాల గురించి వేరే చెప్పాలా? అట్లాగే, మనస్సే ఒక కల్పన. ఇక దాని సృష్టులమాట వేరే చెప్పేదేముంది? అయితే అట్టి కల్పనలను చిరాభ్యాస వశం చేత జనులు సత్యమని తలుస్తున్నారు. ఈ జగత్ృశ్యం ఏమాత్రం యథార్థం కాదని మరల గుర్తు చేస్తున్నాను. భ్రమయందు సత్యమైనదేమి ఉంటుంది? కానీ ఈ విషయం తత్త్వబోధ సముపార్జించిన వారికి మాత్రమే అవగతమౌతోంది. ఒక సమయంలో సత్యమైనట్లు తోచుచున్న ఈ జగత్తు తత్త్వజ్ఞానము పొందినవారికి - చీకటి తొలగిన తరువాత సుస్పష్టమయ్యే వస్తుజాలంలాగా - కల్పిత మాత్రంగా తెలిసిపోతోంది. జగదృష్టులన్నీ ద్రష్టలో లీనమై రహితమైపోతున్నాయి. అప్పుడు చిత్తశిల్పిచే నిర్మించబడిన భావాభావములన్నీ రూపరహితమై ఆత్మతత్త్వమును సంతరించుకుంటున్నాయి. వాస్తవానికి...
ఈ జగత్తు నీయందు లేదు... నీవు ఈ జగత్తునందు లేవు... నీకు వేరుగా జగత్తు లేదు.
Page:212
ఇప్పుడు చెప్పు! ఎవరి వలన ఎవరు చంపబడుచున్నారు?
రోధ్యరోధక సంమోహం త్యక్త్యా భే విమలోభవః ప్రవృత్తిరేవ న వ్యోమ్నః ప్రవృత్తిశ్చైవ ఖాత్మికా ॥
‘ఈ చచ్చువాడు చంపువాడు' అను వ్యర్థమైన ప్రేలాపనలన్నీ త్యజించు. పవిత్ర భావ సమన్వితుడవై బ్రహ్మాకాశమున వెలయుము.
బ్రహ్మమునకు ఎట్టి ప్రవృత్తి లేదు! ప్రవృత్తి వలె తోచుచున్నదంతా బ్రహ్మమే. అందుచేత కాలము, క్రియలు, వాటి భేదాభేదములు ఇవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే. మనస్సు నందు ఊహచే కల్పించబడే ఊహాప్రపంచం ఏ విధంగా రసానుభూతి కలిగించ గలుగుతోందో... అట్లాగే అదే రీతిగా శూన్యమాత్రమగు ఈ పాదార్థిక జగత్తుకూడా ఊహతో కూడినదై రసానుభూతి కలిగిస్తోంది. స్వతఃగా ఇది శూన్యమాత్రమే!
ఓ అర్జునా! చిత్తములోనే జగత్తుల ఉదయాస్తమయములు జరుగుచున్నాయి. నిర్మాణము క్షయము - - జన్మ - మృత్యువు మొదలైనవన్నీ క్షణిక విషయములై ఉంటున్నాయని గ్రహించు. నీవు కొంచెం మోహం ఆశ్రయించి మోహగ్రస్తుడవై నీ మనోరాజ్యమున 'వీరు నావారు - వీరు చచ్చుచున్నారు’ అనే వ్యధ - ఆఘాతములను గాంచుచున్నావు.
అట్టి అసంగత కల్పనలన్నీ ఉపదేశవశం చేత క్షీణించగలవు సుమా!
ఈ మనస్సు ఆత్మయొక్క సంకల్పమే అవటం చేత ఇది మహత్తరమైన శక్తిని పొంది ఉంటోంది. అది క్షణంలో సువిశాల మనోరాజ్యమును కల్పించగల నిపుణత కలిగి ఉన్నది. దాని శక్తి వలననే మిథ్యయగు ఈ సంసారము 'అనాది - అనంతము' వలె భ్రమింపజేస్తోంది. ఒక్క క్షణాన్ని యుగంగా కల్పన చేయగల ఈ మనస్సే సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా చేయగలదు. భ్రాంతిచే చిత్రవిచిత్రములగు జగత్సమూహములను దర్శిస్తోంది. ఇట్టి ఈ కల్పన నిత్యముక్తమగు ఆత్మయందే అధ్యస్తమైయున్నదని గ్రహించు. స్వతఃగా తుచ్ఛమై, క్షణికమై, కల్పనామాత్రమైన ఈ జగత్తుపట్ల జన్మజన్మల జాడ్యమును ఆశ్రయించిన జీవులు అజ్ఞానముచే గొప్పనమ్మకము కలిగి ఉంటున్నారు. భ్రమయగు ఇదంతా భ్రమ తొలగుటచే తొలగిపోగలదు. కానీ భ్రమచే “అయ్యో! దీనిని ఎట్లా దాటటం?” అని జనులు తలచుచున్నారు. ఇదంతా స్వయంకల్పిత గుణసమన్విత ఊహాప్రదర్శనా చమత్కారమేనని గమనించటం లేదు!... ఎంత ఆశ్చర్యం!
ఓ అర్జునా! మరల ప్రకటిస్తున్నాను. ఆత్మయందు ప్రతిభాసగా కల్పించబడు అజ్ఞాన తత్త్వమగు ప్రవృత్తిగాని, నివృత్తిగాని ఎన్నటికీ వాస్తవం కాదు. చిత్త శిల్పి లేడు. చిత్తం లేదు. ఉన్నట్లు కనబడుచున్న దంతా ప్రతిబింబం మాత్రమే. జలానికి, జలంలో ప్రతిబింబించే దృశ్యానికి ఏమి సంబంధం? ఆహా! ఏమి చిత్రం? ఆధారమే లేని చిత్రం ఉజ్జ్వలమై, భ్రమాసక్తులను కలుగజేస్తూ తాండవిస్తోంది కదా!
Page:213
ఇదంతా కూడా ఒక గొప్ప చిత్రకారునిచేత చిత్రించబడిన కళాఖండంలాగా సంసారజీవుల దృష్టిని చిత్రంగా ఆకర్షిస్తోంది. 'కటిక చీకటి నుండి తేజోమయమైన సూర్యచంద్ర నక్షత్రాలు బయల్వెడలుతాయి' అను చమత్కారవాక్యంలాగా, 'భేదదృష్టులు' అనే విలాసంతో 'నానాత్వము' అను విస్తారముతో వెలయుచున్నది.
'జగత్రయం' అనే దేవనటి (Damsel) బ్రహ్మాకాశమున పరికల్పితమై ఉంటోంది. బుద్ధి ఆ దేవనటి నృత్యం చేసే నాట్యశాల. ఏది ఎచ్చట ఎట్లా గ్రహించబడినప్పటికీ అదంతా బుద్ధి వృత్తుల చమత్కారమే కదా. బుద్ధి యొక్క హావ భావ విలాసములే జగత్ నిర్మాణము యొక్క మూలపదార్థమని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. బుద్ధి యొక్క చపలత్వము ననుసరించి ఆ బుద్ధిని మరింత తనవైపుగా ఆకర్షించటానికి ఎవరో కాముకుడు ఇదంతా పరికల్పిస్తున్నాడు. ధర్మ, అర్థ, కామములను నిర్వచించే ప్రవృత్తి-నివృత్తులు ఆ దేవనటి యొక్క అంగవస్త్రములు.
నానావిధ విలాపములతో గూడిన ఈ త్రిలోకములను మనస్సు అనే కల్పనా చాతుర్యం గల చిత్రకారుడే రచిస్తున్నాడు. మనస్సు యొక్క మూలం కల్పనయే కదా! ఇకమనస్సుతో మనస్సులో పొందబడే ఈ దృశ్యము కూడా కల్పనయే! కనుక అర్జునా! ఇదంతా చూచి నీవు మోహము చెంద వలసిన పనేమీ లేదు. ఇదంతా శూన్యమాత్రము... స్వయం కల్పితమైన భ్రమ మాత్రమే.
12. అసాధ్యం కాదు సుసాధ్యమే
శ్రీకృష్ణ భగవానుడు: ఈ దృశ్య కళాఖండానికి రంగులతో గోడపై నిర్మించిన కళాఖండానికి ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. రంగుల చిత్రంకన్నా ముందు గోడ ఉండాలి కదా! కానీ ఈ మహాశ్చర్యం చూడు! ఈ దృశ్య కళాఖండం విషయంలో మొదట చిత్రము, ఆ తరువాత దానికి ఆధారం నిర్మించ బడుచున్నాయి.
జగత్తు అనబడే నిరర్థకమైన వ్యవహారంలోనికి జీవుడు అనువాడు ప్రవేశించి జగత్తునకు అర్థమును కల్పన చేసి అనుభవిస్తున్నాడు. మొట్టమొదట నిరాధారమగు జగత్తు... ఆ తరువాత జగదనుభవమునకు ఆధారమగు కల్పన ఒనగూడుతున్నాయి. ఆహా! మాయ ఎంత చిత్రమైనది. ‘జలంలో సొరకాయ మునుగుతోంది. బండరాయి తేలుతోంది" అన్న వాక్యంలాగా జీవుడు వచ్చి ఇక్కడ అర్థములను కల్పించి భావాభావములను పరంపరగా పొందుచున్నాడు.
ఓ ఫల్గుణా! నీవు బ్రహ్మజ్ఞానము పొందియే ఉన్నావు కదా! మనోరాజ్యమును బోలు ఈ దేహాది శూన్య పదార్థములపట్ల నీకు ఆసక్తి ఎందుకో చెప్పు? స్వతహాగా శూన్యమగు ఈ జగత్తునందు 'ఇది నాది, వీరు నావారు' అను అనర్థములకు అర్థమేమున్నది?
అంతాకూడా 'ఆకాశమునందు ఆకాశము ఏర్పడి ఆకాశమునందు విలీనమగుచున్నది. ఆకాశము ఆకాశముచే విభాగించబడుచున్నది. (తూర్పు ఆకాశం - పడమర ఆకాశం లాగా?)
Page:214
ఆకాశం ఆకాశము చేతనే ఆవరించబడుతోంది'. అను విచిత్ర వ్యవహారంలా ఇక్కడ ఏర్పడి ఉంటోంది సుమా!.
ఓ అర్జునా! ఈ జగత్తునంతా అనంతము - విస్తృతము అయిన వాసన ఒకానొక చాంతాడువలె చుట్టుకొని ఉన్నది. అనంతమగు ఆకాశమును అల్పమగు మేఘము ఆవరించి ఉన్నట్లు చిదాకాశమును వాసనామేఘము ఆవరించి ఉంటోంది. అద్దంలో దృశ్యం ప్రతిబింబిస్తోంది చూచావా! అట్లా బ్రహ్మం నందు ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది. బ్రహ్మమే ఈ జగత్తుకు అధిష్ఠానం. అందుచేత జగతాడ్యం వదలాలంటే బ్రహ్మజ్ఞానము కాక మరింకే ఉపాయంలేదు. ఇదంతా కూడా బ్రహ్మమునకు అనన్యమై ఉన్నది. ఇక్కడా - అక్కడా కూడా బ్రహ్మమే ప్రకాశిస్తోంది. కాబట్టి ఇక ఇక్కడ ఎవరు ఎవరివలన వినాశనము పొందగలరు చెప్పు?
88
A యొక్క ముఖ్యోద్దేశం... నీవు వాసనారహితుడవగుటకు యత్నించాలనేదే సుమా! ‘వాసనారాహిత్యం’ ఎవడు సంపాదించుకోడో అట్టివాడు సర్వ శాస్త్రకోవిదుడైనప్పటికీ, గొప్ప కార్యదక్షుడు అయినప్పటికీ ఏం లాభం? అతడు పంజరంలోని చిలకలాగా వాసనాపంజరంలో బద్ధుడై ఉంటున్నాడు. చిత్తం అనే భూమిపై స్వల్ప వాసనలు మిగిలి ఉన్నప్పటికీ వాటి వల్ల మరల సంసారారణ్యం విశాలమై విస్తృతి పొందటం జరిగే ప్రమాదమున్నది.
అర్జునుడు : మరి అనేక వాసనలు సంక్షిప్తమైయున్న మనస్సు గల నావంటి వారికి సంసారమును అతిక్రమించటం దుర్లభమే కదా!
శ్రీకృష్ణ భగవానుడు: ఓ అర్జునా! నీవు నిరుత్సాహ పడవద్దు. నీవు మహావీరుడివి కదా! అభ్యాసమును ఆశ్రయించు. అభ్యాసబలం చేత హృదయంలో 'సత్యజ్ఞానం' అనే అగ్నిచే వాసనాబీజాన్ని సంపూర్ణంగా దగ్ధం చేయి. అప్పుడు నీ మనస్సు ఈ సుఖదుఃఖాలు అందించే వస్తుజాలంలో చిక్కుకోదు. సర్వుల స్వరూపం ఆత్మయే అయి ఉండగా ఆత్మను ఆశ్రయించటం అసాధ్యమెట్లా అవుతుంది? సర్వ ఆశలను ఇప్పటికిప్పుడే మొదలంట విడిచివేయి. ప్రతిఒక్కరికీ ఆత్మస్వభావమగు అసంగ - అప్రమేయాదులు సంతరించుకోవటం సుసాధ్యమేనని సిద్ధాంతీకరిస్తున్నాను.
శాన్తాత్మా విగతభయోజ్ఞితామితాశో నిర్వాణో గలితమహామనోవిమోహః |
సమ్యక్త్వం శ్రుతమవగమ్య పావనం తత్తిష్ఠాత్మన్యపహతి రేకశాన్తిరూపః ॥ (శ్లో 12, సర్గ 58)
అందుచేత నీవు శాంతాత్ముడవై, మోహశూన్యుడవై, ప్రశాంతమనస్కుడవై నీకు విధించబడిన ధర్మమును నిశ్చింతగా నిర్వర్తించు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు - లేనప్పుడు కూడా సర్వదా ఆత్మయందు నిర్వికల్ప స్వభావమును అవధరించి ఉండు.
Page:215
13. నేర్చుతో కూడిన ప్రయత్నము
అర్జునుడు :
నష్టో మోహః స్మృతిః లబ్దా త్వత్ప్రసాదాత్ మయా, అచ్యుతా! । స్థితోస్మి గతసందేహః॥ కరిష్యే వచనం తవ ॥
ఓ అచ్యుతా! నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది. 'స్వతః సిద్ధమగు ఆత్మతత్త్వము యొక్క స్మృతి' - అనే బ్రహ్మసాక్షాత్కారం లభించింది. నా సందేహాలన్నీ తొలగినాయి. నీ ఉపదేశాలను అనుసరించి ఇప్పుడు నేను యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నీ వాక్యముల సమీక్ష మరొక్కసారి వినాలని నా కుతూహలం.
శ్రీకృష్ణ భగవానుడు : నాయనా! అర్జునా! నీకు విస్తారంగా చెప్పవలసిన పనేమున్నది? చిత్తము ఉపశమించుట చేతనే జన్మసార్థకమౌతుంది. కామాది వృత్తులు నశిస్తేనే చిత్తం ఉపశమిస్తుంది. వృత్తులన్నిటికీ మూలం వాసనలే. వాసనలు తమ తమ వృత్తులతో సహా రహితం కావాలంటే అభ్యాసం ఒక్కటే ఉపాయం. ఏదైతే వ్యావహారిక సహిత స్థితిలో 'ప్రత్యక్ చేతనము’ అని అనిపించు కుంటుందో... అదియే వాసనారహిత స్థితి సంపాదించుకున్నప్పుడు ఈ ఉపాధికి అతీతమగు - -
సర్వమునకు కేవల నిర్మల సాక్షీభూతమగు బ్రహ్మమే అగుచున్నది. ఆ నిర్మల బ్రహ్మమే సర్వులయందు సర్వత్రా సర్వ వేళలా వ్యాపించి ఉన్నదను దృష్టియే ఉత్తమ దృష్టి.
అయితే... ఎక్కడో ఆకాశములో సుదూరంగా విహరిస్తున్న పక్షిని ఈ కళ్ళు చూడలేవు కదా! అట్లాగే “స్వప్నజాగ్రత్” అనుభవమునకు మాత్రమే పరిమితమైన ఈ భౌతికమైన ఇంద్రియములకు ఆ ఆత్మపదము అవస్తువే అయి ఉంటోంది. చైతన్యమే ఈ ఇంద్రియములన్నిటికీ ఉత్తేజ - విషయ పరిజ్ఞానముల సామర్థ్యము ప్రసాదిస్తున్నది. అయితే ఏం? ఇంద్రియములు ఆత్మను సమీపించలేవు. నిర్వచించలేవు.
అత్యంత శుద్ధము, సర్వసంకల్పవర్జితము అగు ప్రత్యక్చేతనమే ఈ కనబడే వివిధ వస్తువులను ప్రకాశింపజేస్తున్నది. ఆ ప్రత్యక్ చేతనం మాత్రం ఒక వస్తువు వలె కనబడేది కాదు. అతి సూక్ష్మ గ్రాహ్యమైనది. అందుచేత శ్రవణము, మననము మొదలైన శుద్ధవాసనలు లేకపోతే మలినవాసనలు తొలగవు. మహత్తరమైన ప్రయత్నం ఉంటేనే సూక్ష్మతరమగు ఆత్మను గాంచగలవు. ఆత్మజ్ఞానానుభవము పొందబడినప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క ఆభాస నశిస్తోంది.
వాసనా లయం ఆత్మ దర్శనానికి కారణమౌతోంది... ఆత్మ దర్శనం వాసనా లయానికి కారణ మౌతోంది.
ఓ అర్జునా! "అయ్యో ఈ వాసనలు ఎలా తొలగుతాయ్?"... అని అనుకుంటూ మననం చేస్తూ దిగాలుబడి కూర్చుంటే ఏం లాభం? నీవు ప్రయత్నశీలుడవు కావాలి. అగ్నిపర్వతంపై మంచు బిందువులు కురిస్తే ఏమౌతాయి? క్షణంలో రూపుమాసిపోతాయి. అట్లాగే శుద్ధమగు ఆత్మ యొక్క అనుభవం పొందిన తరువాత అవిద్య సమీపించిందా... అది మౌనంగా విలీనం కావలసిందే.
Page:216
అయినా... తుచ్ఛము, భోగధూళి సమన్వితము, అల్పదృష్టి ప్రదాత, బంధప్రదాత - అగు వాసన ఎచ్చట? జగత్తులన్నీ వ్యాపించియున్న చైతన్యమెచట? వాసనలు చైతన్యమును బంధించటమేమిటి?
నాయనా! నీవు బ్రహ్మభావమును శరణువేడు. “కాల బద్ధం కాని బ్రహ్మమును నేనే” అను అనుభూతిని సుస్థిరీకరించుకో. వాసనల గురించిన వేదనను ధ్యాసలను వదిలివేయి.
ఆత్మ వలననే పరిపూర్ణము - శుద్ధము అగు ఆత్మ ఎరుగబడుతోంది! నానావిధ వికారములగు ఈ దృశ్యములన్నీ రాజుగారి ముందు నర్తకి నృత్యంలాగా ఆత్మ సమక్షంలో స్ఫురించి విలీనమవు తున్నాయి. అయినప్పటికీ ఆత్మ ఆకాశమువలె అప్రమేయ తేజోవిరాజితమై వెలుగొందుచున్నది. పూర్ణము - జగద్వివర్జితము - - వాక్కుకు అతీతము అగు ఆ పరవస్తువుతో పోల్చతగినది ఎక్కడా ఏదీ లేదు. కనుక ఫల్గుణా! నీవు సర్వదా హృదయంలోని వాసనల నివృత్తికొరకై నేర్పుతో కూడిన ప్రయత్నంలో ఉండు. క్రమంగా సంసార భయరహితుడవై, భగవంతుడవై ప్రకాశించగలవు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా త్రిలోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించటం ముగించి మౌనం వహిస్తారు.
సూర్యభగవానుని స్పర్శచే కమలములు వికసించినట్లు అర్జునుని హృదయపద్మం శ్రీ కృష్ణుని జ్ఞాన స్పర్శచే వికసిస్తుంది. ఆతడు శోకరహితుడౌతాడు. గాండీవధారి అయి తన విధ్యుక్తమైన యుద్ధమును నిర్వర్తిస్తాడు.
14. ఆత్మయొక్క కృతనిశ్చయం
శ్రీవసిష్ఠ మహర్షి : రాబోయే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అర్జునుని ఎదుట ప్రవచించబోయే నిర్మలాత్మ దృష్టిని నీవుకూడా అవలంబించు. ఈ నామరూపాత్మకమగు జగత్తునంతటినీ బ్రహ్మముతో ఐక్యమొనర్చి నిస్సంగమగు సన్న్యాసమునందు సర్వదా వెలయుము. అసంయోగమే సులభశరణ్యం.
‘పరమాత్మ' అనగా ఎవరు? - పరమాత్మ త్రికాలములందు సత్యము. సర్వదా ప్రకాశించునది. ప్రపంచాతీతం కనుక అత్యంత దూరస్థమైనది. సర్వవ్యాపి అవటం చేత అత్యంత సామీప్యమైనది. అద్దాని యొక్క విశిష్టత ఏమిటంటే.... నీవు అద్దానియందు ప్రతిష్ఠితుడవైన మరుక్షణం నీవే ఆ వస్తువవుతావు. ఇక నీకు అద్దానినుండి భిన్నమైన ఉనికియే సంభవించదు. అదియే చిత్తవృత్తు లన్నిటియందు ప్రతిబింబిస్తోంది. ఈ జ్ఞాతృ - జ్ఞాన - జ్ఞేయములు తమ భేదములు కోల్పోయిన మరుక్షణం ఇక శేషించేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మతత్త్వంలో ఏకత్వమే పరమోత్తమపదమని గ్రహించు. అదియే ఆనందం యొక్క అవధి. అది దృక్కులనన్నిటి కంటే పరమదృక్ (the perceiver of all perceivers). మహత్ విశేషము లన్నిటి కంటే పరమశ్రేష్ఠము. గౌరవనీయము లన్నిటికంటే కూడా గౌరవనీయమైనది.
Page:217
అయితే... విషయములన్నిటికీ అతీతమైనదైనప్పటికీ, ఆత్మ సంవిత్స్వరూపమైనది. (lt has the form of Existence and Knowledge) అది శూన్యం అని మాత్రం అనుకోకు. ఎందుకంటే అది జ్ఞానమయం. మంగళప్రదము. శ్రేయములన్నిటి కంటే శ్రేయోదాయకం కూడా! అద్దాని యందే సర్వదేహములలోని సర్వ అనుభవములు ఉనికి కలిగి ఉన్నాయి. ఇక్కడ నీకు కనబడేదంతా సత్స్వ రూపంగా తోచటానికి కారణం ఆ బ్రహ్మవస్తువు యొక్క ప్రభావమే. 'జగత్' అనే నువ్వులలో నూనె, జగత్ వృక్షము నందలి రసము, జగత్ పశువునకు పాలకుడు అదియే. 'ప్రాణులు’ అనే ముత్యములందు సూత్రమువలె వ్యాపించి ఉన్నది ఆ ఆత్మయే! అదియే 'పంచభూతములు' అను మిరియపు గింజలందు
కారం.
పదార్థములందలి పదార్థత్వము... సద్వస్తువులందు గల సత్త... అసద్వస్తువుల యొక్క మిథ్యాత్వము... ఇవన్నీ కూడా ఆ పరమోత్తమ తత్త్వమేనయ్యా! ఇదంతా ఇట్లా ఉండగా, ఇక్కడ కనబడే జగత్ భావములన్నీ అజ్ఞానము వలననే ప్రకాశిస్తున్నాయి. అయితే ఆత్మతత్త్వము జ్ఞానదార్ధ్యము వలననే ప్రకాశించగలదు.
శ్రీరాముడు: ఈ ఇంద్రియములకు విషయములగు పదార్థములన్నీ ఆత్మజ్ఞానమును మరుగు పరచుచున్నాయి కదా! ఈ అడ్డు జీవునికి తొలిగేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి: ఇక్కడి ఇంద్రియ భావనలన్నీ 'విచారణ' అను వాయువీచికా ప్రభావంచే నశించ గలవు. అహంకారం మొదలుకొని ఇంద్రియాలకు గోచరించే ఒక చిన్న వస్తువు వరకు అన్నీ కూడా ఆత్మయందు పరికల్పించబడిన భ్రమలే కానీ మరింకేమీ కాదు. ఎవరికైతే ఈ కల్పిత పదార్థ - విషయాదులందు నమ్మకం ఏర్పడి ఉంటుందో... వారు మాత్రమే ఇక్కడ బద్ధులగుచున్నారు. ఈ జగత్తు యొక్క మొదలు-చివర కూడా అహంకారము యొక్క పర్యవసానం మాత్రమే.
ఆద్యంతరహితమగు ఆ బ్రహ్మాకాశమును ఎవరు 'ఇట్టిది' అని నిర్వచించగలరు?
ఓ రామచంద్రా! ఆత్మయొక్క కృతనిశ్చయము పొందినవారు కర్మలన్నిటినీ ఆచరించిన వారే అగుచున్నారు. అట్టి సమస్థితిని సంపాదించిన వారి మనస్సు ఇక ఎక్కడా ఎట్టి ఉదయాస్తమయములు పొందటమే లేదు. జగత్ రహితమైనట్టి బ్రహ్మమయ శరీరమును సంపాదించుకున్నవాడు ఒకానొక అనిర్వచనీయమగు అద్వైతభావమును అధిరోహించి ఉంటున్నాడు. నిద్రాసమయంలోని మనస్సువలె నిర్వికారుడై ఉంటున్నాడు. ఒకవేళ వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతడు ఏ సమయంలోనూ ఎట్టి క్షోభ పొందటం లేదు. అతని హృదయం కించిత్ చలనమునకు కూడా లోను కావటం లేదు. అద్దంలో ఏఏ దృశ్యములు ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ అద్దం ఏమన్నా మార్పు చేర్పులు పొందుతోందా? అట్లాగే ఆత్మానుభవజ్ఞుడు ఈ జగత్తుల అనుభవం పొందుచున్నప్పటికీ అదంతా తన స్వస్వరూపమునకు మార్పు చేర్పులు ఏర్పరచలేవని సుస్పష్టంగా గ్రహించియే ఉంటున్నాడు.
ఆ నిశ్చలమగు ఆత్మయే నీ స్వరూపం. తదితరమైనదంతా ప్రతిబింబం మాత్రమే!
Page:218
వాస్తవానికి ఇక్కడగాని, మరెక్కడ గాని 'చిత్' తప్పితే మరింకేదీ లేదు. ఇక ఈ ఏకము అనేకము గురువు - శిష్యుడు ఉపదేశము మొదలైనవన్నీ ఆ 'చిత్' యొక్క ఉపాంగములు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే శాంతమగు ఆత్మ - 1. తన యందు తానే జగత్తుగా వివర్తం పొందటం, 2. జగత్ అతిక్రమించి సర్వశేష్యముగా అనుగమించటం - - అను ఉభయ చిద్విలాసము లను ప్రకటించుచున్నది.
వివర్తము ఉపశమిస్తే జగత్తు కూడా ఉపశమిస్తుంది. ఎందుకంటే, చిత్ యొక్క వివర్తమే ఈ జగత్తు. అట్లు వివర్తం పొందకపోవటమే పరమపదము.
జగత్తు యొక్క ఉపశాంతి - వాసనాక్షయం అనునవి అవిభాజ్యములని గ్రహించు. ఆత్మయొక్క ఈ జగత్ స్పందనమంతా కల్పితం మాత్రమే! అందుకనే... 'అజడమగు స్పంద శూన్యత్వమే బ్రహ్మము’ అని విజ్ఞులు చెప్పుచూ ఉంటారు.
అట్టి బ్రహ్మ స్వభావమే నీవై ఉండగా ఇక కల్పనామాత్రమైన ఈ జగత్తు గురించి నీకు దుః ఖం గాని మోహం గాని ఏర్పడవలసిన అగత్యమేమున్నదో చెప్పు? ఈ జగత్తంతా జడాకృతియే కదా! ఇది ‘అనాత్మదర్శన ప్రభావం' తప్పితే మరింకేమీ కాదు. ఈ జగత్ కల్పనము 'సత్యమే' అని నమ్మిన వారికి ఇది అట్లే సత్యం వలె తోచుచున్నది. "కల్పన నుండి అనుభవం. అనుభవమే జగత్తు. కనుక కల్పన సత్యమెట్లా అవుతుంది?" అను అవగాహన ద్వారా జగత్భావన లయం చేస్తున్న వారికి ఇదంతా సారశూన్యమగుచున్నది. సర్వభావములు చైతన్యములో లయం చేసిన మరుక్షణం చైతన్యమొక్కటే మిగులుతుంది.
చైతన్య వివర్తమే (చైతన్యముయొక్క స్వస్వరూపమునకు సంబంధించిన ఏమరుపే) సంసారభ్రమ అని మనం చెప్పుకున్నాం కదా! ఇంతకు మించి ఇక్కడ మరింకే విశేషం లేదు. “ఇది జ్ఞానుల శాస్త్రముల తుది నిర్ణయం. దృఢనిశ్చయం,” - అని మరొక్కసారి ప్రకటిస్తున్నాను.
శ్రీరాముడు: హే మహర్షీ! ఈ కార్య - - కారణ - - కర్తృత్వాలు ఎదురుగా ఉండగా భావనను లయం చేయటం, ఇద్దాని నుండి బ్రహ్మమును వేరు చేసి ఆశ్రయించటం ఎంతో దుర్లభమైన ప్రక్రియ అని, సులభ సాధ్యం కాదని కొందరి అభిప్రాయం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలు బంగారం కంటే వేరైనవా? కాదు కదా! ఈ కార్య-కారణ-కర్తృత్వాలనేవి బ్రహ్మము నుండి వేరుగా లేవు. చిత్ యొక్క స్పందనయే "సంకల్పించుట, భ్రమించుట...” మొదలైనవన్నీ కూడా. అట్టి చిత్ యొక్క స్పందనమునే మనం ‘చిత్తము' అని అంటున్నాం. 'తరంగము అనబడేది జలమే. అట్లాగే, చిత్తము దాని సర్వచర్యలతో సహా చితే'... అని తెలియకపోవటమే అజ్ఞానం. అజ్ఞాన కారణంగా బ్రహ్మము నుండి జగత్తు వేరైనదైనట్లు అనిపించటం జరుగుతోంది. అజ్ఞానము వలన ఏది ఏర్పడుతుందో అది తొలిగేది ఎట్లా? జ్ఞానము చేతనే. జ్ఞానముచే అజ్ఞానం జ్ఞానమునందు లయం అవగలదు. జ్ఞాన ప్రకాశముచే చిత్తము తొలగి ఆ స్థానంలో 'చిత్' ప్రకాశించగలదు.
Page:219
ఆత్మతత్త్వము గ్రహించిన తరువాత ఇక భోగవాసనలు కూడా స్వయంగా క్షీణిస్తున్నాయి. భోగవాసనల చింతారాహిత్యమే జీవన్ముక్త లక్షణము. జీవన్ముక్తుడు భోగవాసనలను చింతించక పోవటానికి కారణం... ఆ భోగవాసనల కంటే కూడా అత్యంత ప్రియమైన ఆత్మ యొక్క అనుభూతి లభించటమే! తృప్తిగా భుజించినవాడు చిరుతిళ్ళు కోరుకుంటాడా? జీవన్ముక్తుడు అత్యంత స్వాభావికంగా ఇక్కడి భోగవస్తువులు నిస్సారమని, అర్ధరహితమని, అల్పవిషయమని గ్రహిస్తున్నాడు.
15. జీవన్ముక్తుని పరమ లక్షణములు
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! ఇప్పుడు నీకు జీవన్ముక్తుని పరమ లక్షణములు ఎట్లా ఉంటాయో మరొక్కసారి ఇప్పటి సందర్భానుచితంగా చెబుతాను విను.
జీవన్ముక్తుడు స్వాభావికంగానే భోగములను వాంఛించడని అనుకున్నాం కదా! ఆత్మ ఒక్కటే ఈ భోగ్యభోక్తృత్వములు మొదలైన నానావిధ రూపాలుగా ఉన్నదను నిశ్చయజ్ఞానం అతని యందు సర్వదా ఏర్పడి ఉంటోంది. అట్టి నిశ్చయమును అభ్యాసవశంగా అలవర్చుకొనువాడే జీవన్ముక్త శబ్దమునకు అర్హుడగుచున్నాడు. అట్టి బుద్ధిమంతుడు ఆయా యథాప్రాప్తాలైన భోగాలను అనుభవించ వలసివస్తున్నప్పటికీ అనుభవించనివాడుగానే అగుచున్నాడు. ఆకాశాన్ని పిడికిలితో గుద్దితే ఆకాశానికి ఏమౌతుంది? జీవన్ముక్తుని క్రియలు లోకానుకూలత అను ఉద్దేశమును మాత్రమే కలిగి ఉంటాయి కాబట్టి అవన్నీ సంగమునకు ఏమాత్రం కారణం కా కాజాలవు. అతడు కృత్రిమమైన వ్యవహార బుద్ధి కలిగియుండి, "ఈ కృత్రిమ వ్యవహారబుద్ధి కూడా భ్రాంతి రూపమే” అని గ్రహించియే ఉంటాడు. ఇక్కడ ఏది భ్రమమాత్రమో, ఏది భ్రమరహిత త్రికాలాబాధ్యసత్యమో విభాగయోగముచే గ్రహించని వారికి నిరతిశయానందరూపమైన ఆత్మతత్త్వప్రాప్తి లభించటమనేది దుర్లభము.
ఈ కనబడే పదార్థాలన్నీ జీవన్ముక్తుడు ఆత్మతత్త్వానుభవమునందు విలీనం చేసివేస్తున్నాడు. దృష్టి యొక్క సమున్నతిని సాధించటం మాని ఒకడు ఈ భౌతిక దేహాన్ని శుష్కించుకుని ఏం ప్రయోజనం? ఖండించుకుని ఏం లాభం? భ్రమ ఆమాత్రానికి తొలగుతుందా? అజ్ఞానం సమూలంగా తొలగనంత వరకూ ఆ అజ్ఞాన రూపమగు స్పందన కలుగుచూనే ఉంటుంది. పరిపూర్ణజ్ఞానం కలిగిన క్షణంలో ఆరి, దుఃఖం, భ్రమ, ప్రలోభం - వంటి సర్వవికారాలూ వాటంతట అవే తొలగుతాయి. దీపం కొండెక్కగానే దాని ఉష్ణం, ఆకారం, కాంతులు - తమంతట తామే తొలగుతాయి కదా!
అయితే... ‘ప్రశాంత దీపికను బోలిన చిత్తునందు స్పందాస్పందనములు లేవు’... అనునది ఉత్తమ సత్యము, సిద్ధాంతము కూడా!
❖
Page:220
ప్రాణవాయువు స్పందనరహితమైనప్పుడు దానికి 'ఉన్నది - లేదు’ మొదలైనవి ఆపాదించలేం. అలాగే చిత్తము స్పందనరహితమైనప్పుడు 'చిత్' నందు చిత్తం ఉన్నదని గాని, లేదని గాని చెప్పలేం. శుద్ధ చిత్తము కేవల ఆత్మ స్వరూపమే అయి ఉన్నది. చిత్తము చిత్తో ఏకమై ఉన్నప్పుడు బంధ - మోక్షము లనేవి ఆపాదించలేం. అసలీ చిత్ వ్యర్థమగు ఆకృతుల పట్ల గ్రాహ్యత్యాజ్యములు త్యజిస్తే ఇక బంధమోక్షములనబడేవే ఉండేవికావు. కనుక 'నాకు మోక్షం కావాలి' అను ఆవేదన కూడా అంతఃపూర్ణానుభవమునకు హాని కలిగిస్తోందని చెప్పవలసివస్తోంది. 'ఆ మోక్షం నాకు వలదు' అను భావనను ఆశ్రయించినా కూడా అది బంధముగానే ఉండి ఉంటోంది.
అందుచేత బంధమోక్షములు రెండూ స్మరించకుండుటచేత నీకు పరమశ్రేయస్సు లభిస్తుంది.
‘పరమ పదము’ అంటే ఏమిటి? - స్వయం ప్రకాశమై, చైతన్య స్వరూపమై, సర్వాశ్రయమై, విషయవర్జితమైనదే పరమపదము. అది భావనకు ఆవల ఉన్నది. భావనకు ఈవల మాత్రమే ఈ దేహాదులు ఉన్నాయి. సర్వ సంకల్పములు అందులోంచే బయలుదేరుతున్నాయి. మరి సంకల్పములు అద్దానిని బంధించటమేమిటి? కనుక 'బంధము' అనబడేదానికి అర్థం, ఆస్కారం కూడా లేవు. శ్రీరాముడు: మరి బంధమోక్షము లెవరికి?
శ్రీవసిష్ఠ మహర్షి: మహాచైతన్యము యొక్క స్పందనము ఏదైతే ఉన్నదో.... అద్దానికే బంధమోక్షములు ఆపాదించబడుతున్నాయి. అయితే 'ఇదంతా కూడా ఆత్మయొక్క స్పందనము మాత్రమే' అని గ్రహించ బడిన తరువాత ఇక బంధమోక్షములు లేవని స్వభావసిద్ధంగానే తెలియవస్తోంది. ఈ విధంగా ఎరిగినంత మాత్రం చేతనే అహంకారాదులన్నీ శమించి ఆశ్రయరహితమగుచుండగా... ఇక ఎవడు దేనిచేత, ఎక్కడ ఎట్లు బంధితుడౌతాడు చెప్పు?
ఇంద్రియ పరిమితసంబంధమే బంధము... ఇంద్రియములకు సాక్షియగు ఆత్మతోటి ఏకత్వ సిద్ధియే బంధరాహిత్యము.
వివేకి అయినవాడు ‘ఇది నా సంకల్ప విభాగం. ఇది సంకల్పముల నుండి వివర్తమగుచున్న అనుభవం. ఇది సంకల్పాలకు ముందే ఉన్న నా చిత్చైతన్య స్వరూపం'... అని విభాగించి గాంచ గలుగుచున్నాడు. అట్టి స్వనిర్మిత సంకల్ప విభాగమునంతటినీ మిథ్యగా గాంచగలుగుచున్నాడు. ఇకప్పుడు క్రియాత్మక సంకల్పములు ఉండిఉంటున్నప్పటికీ సర్వమును స్పందాతీతమైన తత్త్వముగా గమనించుచున్నాడు. ప్రబుద్ధమైన చైతన్యసమన్వితుడై ఈ దృశ్యప్రపంచమును అదృశ్యమునందు విలీనమొనర్చుచున్నాడు.
చిర్ఘనమగు ఆత్మ సర్వదా స్పందానాతీతమైన స్థితి అవధరించియే ఉన్నది. అద్దాని రూపమే స్పందనారూపమగుచున్నది. ఇట్టి బోధ దృఢపడిన జీవన్ముక్తుడు ఈ జగత్తులను ఆత్మయొక్క ‘నిర్వృత్త తేజము’గా అనుభూతిని పొందుచున్నాడు.
ఓ రామచంద్రా! తదితర సర్వము ముక్షువులారా! ఈ నా వర్తమానం జాగ్రత్తగా వినండి.
Page:221
“చైతన్యము యొక్క ప్రకాశమే చిత్ స్పందనము. ఆ ప్రకాశము యొక్క ఒకానొక కిరణమే ఈ జగత్తు" అను అవగాహనచే మరిక్కడ చైతన్యప్రకాశము తప్పితే ఏదీ ఉండదు. అనేకమంది దేహులు ఇక్కడ సుదీర్ఘమైన ఇంద్రియస్వప్నమును గాంచుచుండగా... ఒక్క జ్ఞాని మాత్రం అందుకు భిన్నమైన దర్శనమును కలిగి ఉంటున్నాడు సుమా! అతడు తన నిజస్వరూపమగు ఆత్మను సర్వవ్యాపిగా, సర్వాంతర్యామిగా, సర్వరసస్వరూపంగా, నామరూపాతీతంగా గాంచగలుగుచున్నాడు. తనకు ఆద్యంతాలు లేవని ఎరిగి ఉంటున్నాడు.
యత్రోదేతి ప్రసభమనిశం సర్వసంవిత్తి సత్తా । యస్మిన్నేతే సకలకలనాకార పంకా గలన్తి | ఉద్యన్యేతే స్వదనుసుభగం యత్ర సర్వోపలమా | ధ్యానేనైవం తమవగమయ ప్రత్యగాత్మానమన్తః |
ఓ ప్రియరామచంద్రా! ఏ పరమాత్మయందు నిరంతరము జగదాకారప్రాప్తి, అద్దానినుండి ప్రీతిపూర్వకమగు విషయానుభవం కూడా అనుభవమౌతోందో, ఎవనిలో సమస్త సృష్టి సమూహాల సత్త జనిస్తోందో అట్టి సాక్షిరూపమగు నీ స్వస్వరూపపరమాత్మను నీ అంతఃకరణంలోనే వీక్షించు.
నీ సాక్షి రూపమే ఆ పరమాత్మ. ఇక కల్పిత జగత్తు నందలి సత్యాసత్యాల గురించి దుఃఖిం చుట మూర్ఖత్వమే అవుతుంది... ఇదియే ఈ బోధ సారం.
16. స్వకంఠాభరణం
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రఘురామా! ఈ ప్రకారంగా ఆత్మపదమే సమస్తమునకు ఆది. బ్రహ్మ - విష్ణు మహేశ్వరాది మహత్స్వరూపులు ఆ పరమపదమునందే నెలకొనియుండి ఈ ముల్లోకములను పరిపాలిస్తూ లోకపూజ్యులై ఉంటున్నారు. స్వర్గవాసులలో కొందరు జ్ఞానులై ఆకాశగమనాది క్రీడలచే స్వర్గమున క్రీడిస్తున్నారు. అదేవిధంగా ఈ మనుష్య, దేవ, గంధర్వ, తిర్యగాది - జాతులలో కూడా కొందరు జీవులు ఆత్మతత్త్వమును ఎరిగినవారై బ్రహ్మానందపూర్వకంగా ఈ లోకంలో విహరిస్తున్నారు. మనుష్యానందము నుండి బ్రహ్మదేవుని ఆనందము వరకు పరికించి చూస్తే, సర్వానందముల కంటే ఆత్మానందమే (లేక) బ్రహ్మానందమే పరాకాష్ఠ. అట్టి బ్రహ్మైక్యానందమును పొందిన జీవుడు ఇక మరణ-జననాది దుఃఖములను పొందడు. అందరూ ప్రాణాధారములనుకొనే విషయాలచే ఆతడు నిరోధించబడజాలడు. ఏ జీవుడైనా సరే, ఆ పరమాత్మ యొక్క 'సర్వవ్యాపక చిన్మాత్రము’ (లేక) 'ఆత్మయొక్క సత్తా సామాన్య రూపము'ను ఏ కొంచెం ఎరిగినప్పటికీ ఆతడు ధన్యుడే. ఒక్క నిమిషం కాలం స్వస్వరూపం అవధరించినప్పటికీ, అట్టివాడు యుక్తచిత్తుడేనని చెప్పబడుచున్నాడు. అతనికిక జన్మమృత్యుజరావ్యాధులుండవు. ఆతడు ఈ దేహము నుండి తన స్వరూపమును విభేదపరచి గాంచగలడు. ఆయా అనివార్య యథాప్రాప్త కార్యక్రమములు అతనిని సంతాపమొనర్చజాలవు.
Page:222
శ్రీరాముడు: మహర్షీ! మీరు 'సత్తా సామాన్యము' గురించి చెబుతూ వస్తున్నారు కదా! అట్టి సత్తా సామాన్యము... 1. ఈ మనస్సు, బుద్ధి, అహంకారాది సమస్తము లీనమైనట్టి నిర్విశేష రూపమని మీ ఉద్దేశమా?... లేక, 2. మనోబుద్ధ్యహంకారాలు ఉండియే ఉన్నట్టి సవిశేషరూపమా?
ఎందుకంటే... మనోబుద్ధ్యహంకారాలు లేకపోతే దానిని వర్ణించటమెట్లా? నిర్ణయించటమెట్లా? మనోబుద్ధ్యహంకారాలు ఉన్నంత వరకు దుఃఖం తొలగదు కదా! అవే కదా సంసారానికి మూలం? శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం అనేక విశేషాలు చర్చించుకున్న తరువాత మరల ఈ ప్రశ్నకు వచ్చామేమిటి?
అయినా కూడా ...ప్రశ్న ఉచితమే. చెబుతాను. విను.
ఏది సమస్త జీవులందూ, ఈశ్వర భావమునందు, ముక్తియందు కూడా అనుగతమై వ్యాపించి ఉన్నదో... ఏదైతే సమస్త దేహములలోనూ తినుట, త్రాగుట, గ్రహించుట మొదలగు సమస్త వ్యవహారములను కావించుచున్నదో... ఏదైతే సుషుప్తి - ప్రళయములందు సమస్తమును తనయందే లయం చేసుకుంటోందో... ఏది తురీయపదమునందు సమస్త విషయములను త్యజించినదై సర్వమునకు అతీతమై ప్రకాశించుచున్నదో... ఏది నీ యొక్క నాయొక్క, సర్వుల యొక్క వాస్తవ స్వస్వరూపమేఅయిన్నదో...
... అద్దానిని 'బ్రహ్మము, సత్తాసామాన్యము' అని కూడా అంటున్నాం. మన ఈ సంవాదము యొక్క ఉపలక్షితము, చర్చనీయాంశము అదే.
అది సర్వవ్యాపి. ఆద్యంతరహితము. ఒక స్త్రీ కంఠాభరణం తన మెడలోనే ఉంచుకొని ఆ విషయం మరచి తన కంఠం తప్ప మిగతా చోట్లంతా ఆ ఆభరణంకోసం వెతుకుచున్నట్లు ఈ జీవుడు ఆ ఆనందమయతత్త్వమును తనయందే ఉంచుకొని ఆ విషయం తెలియక ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. 'అది నీయందే నీ స్వరూపంగా ఇక్కడే ఉన్నదయ్యా' అని శాస్త్రకారులు గుర్తు చేస్తు న్నారు. వేదాంత వాఙ్మయమంతా జీవునకు ఆతని "అప్రమేయ, అనంత, నిర్వికల్ప, అఖండ, వాస్తవ స్వభావ, తత్త్వములను” నిరూపిస్తూ చూపటానికే ఇంతటి విస్తారంగా రచించబడినదై ఉంటోంది.
అట్టి వాస్తవ స్వస్వరూపమే కారణ కారణం అయినప్పటికీ అక్కడ 'సవిశేషమా? నిర్విశేషమా?’ అనే మీమాంస ఉండదు. ఈ విశేషములు ఇట్లే ఉండగా అది అట్లే ఉంటోంది. కాబట్టి ఒకటి తరువాత మరొకటి, ఒకటి లేనప్పుడు మరొకటి... అను భ్రమ త్యజించు.
'ఆ ఆత్మవస్తువు ఇట్టిది' అని నిర్ణయించటానికి ఈ మాటలు, సంజ్ఞలు సరిపోవు. అయినా శిష్యునికి అది చూపుచూ మేం మా పరిమితమగు ప్రవచనాశైలితో వర్ణించి చెప్పుచున్నాం.
ఆత్మస్తోత్రం - ఆ అనంతాత్మ...
ఆకాశమునందు ఆకాశముగాను, శబ్దము నందు శబ్దరూపంగాను, చర్మేంద్రియమునందు స్పర్శరూపంగాను, ఘ్రాణేంద్రియమునందు గంధ రూపంగాను ...ప్రకటి తమౌతోంది.
Page:223
ఆ ఆత్మయే శరీరమునందు శరీరత్వంగా భూమియందు భూసారత్వంగాను, జలమందు రసత్వంగాను, వాయువు నందు వాయుత్వంగాను, తేజము నందు తేజో రూపంగాను, బుద్ధియందు బుద్ధి రూపంగాను, మనస్సునందు మనో రూపంగాను, అహంకారమునందు అహంకార రూపంగాను, సంవిత్ నందు సంవిద్రూపంగాను, చిత్తము నందు చిత్త రూపంగాను, చతుర్విధ ప్రాణులందు చేతన రూపంగాను, దేవతలందు దేవతా రూపంగాను, మనుష్యులందు మనుష్య రూపంగాను, క్రిమికీటకాదులందు కీటక రూపంగాను, యుగ-సంవత్సరములందు కాల రూపంగాను, క్రియాదులందు క్రియా రూపంగాను, నియతి యందు నియమిత రూపంగాను, స్థితియందు స్థిర రూపంగాను, నశించే వస్తువులందు నాశన రూపంగానూ... ప్రకటి తమౌతోంది
బాల్యంలో బాల్యరూపంగాను, యౌవనంలో యౌవనరూపంగాను, వార్ధక్యంలో వృద్ధ రూపంగాను, మరణమునందు మృత్యు రూపంగాను... ఆ పరమాత్మయే స్థితి కలిగి ఉన్నాడు.
సముద్రంలోని తరంగాలు జలముకంటే వేరా? ఈ సమస్త పదార్థములు ఆ పరమేశ్వరునికి భిన్నమైనవి కావు. అయితే, ఈ పదార్దములలో ఏ అనేకత్వము గోచరిస్తోందో... అదంతా అసత్యమే అయున్నది. దృష్టాంతానికి ఒక్కొక్కడు చూచేది ఒక్కొక్క విశేషం అయినప్పటికీ, అందరిలోని ‘చూపు’ ఒక్కటేకదా! చూపు - స్పర్శ - రుచి మొదలైనవి వేరువేరైనప్పటికీ అనుభవములన్నిటి యొక్క అర్థప్రదాత అనుభవస్వరూపుడు అగు దేహి ఒక్కడే కదా!
పిల్లవాడు కొరివిదయ్యమును కల్పన చేసుకుంటున్నట్లు సత్యమగు చిత్స్వభావమే ఈ జగత్తుయొక్క కల్పన గావించుచున్నది.
మహాత్ముడగు ఓ రామచంద్రా! 'ఈ అనుభవమయ్యేదంతా చిద్రూపుడనగు నేనే. నేనే లీలా మాత్రంగా ఇదంతా వ్యాపించి ఉన్నాను'... అను నిశ్చయముతో కూడుకున్నవాడవై ఉండుము. శాంత చిత్తుడవగుము. స్వమహిమయందు వర్తించుము. నీ స్వసంకల్పమహిమవలననే ఏదేది ఎట్లెట్లు తోచుచున్నదో... అట్లట్లు నీయొక్క సత్త ప్రకటనమగుచున్నదని గ్రహించు.
సాయం సమయమైనది. 15వ రోజు సంవాదము ముగించబడింది. శాంతి ప్రవచనములు ప్రవచించబడ్డాయి. సభికులంతా తమ యొక్క నిత్య - అనిత్య కల్పిత వాస్తవ స్వరూప విభాగములను వివేకదృష్టిచే పరికించటం గురించి చింతన చేస్తూ గృహోన్ముఖులయ్యారు.
దశరథుడు, రామచంద్రుడు, మంత్రివరేణ్యులు, తదితర రాజ పరివారం ఆ సంవాద శ్రవణము నకు వేంచేసిన ముఖ్యులందరి వసతి - అతిథి మర్యాదలను పర్యవేక్షించటంలో నిమగ్నులయ్యారు.
అయోధ్యా ప్రజలు తమ ప్రియరాజకుమారుడు రామచంద్రుని నిమిత్తంగా తమకు లభించిన జన్మజన్మల ప్రయోజనమైన శ్రీ వసిష్ఠ - శ్రీరామ సంవాదము గురించి చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. ఆ మరునాడు (16వ రోజు) జరుగబోయే చర్చనీయాంశముల గురించి తమకు తోచిన విధంగా
Page:224
సంభాషించుకోసాగారు. సుదీర్ఘకాలం వర్షాలు లేక నిస్సత్తువగా ఆకాశంవైపు దృష్టి సారించుచూ ఎదురు చూచే వన్యజీవులు ఒక్కసారి తొలకరి వాన కురియగానే ఎంతటి సంరంభంగా ఉంటాయి? అయోధ్యారాజ్యంలోని ప్రజలు అంతటి సందడిగా కన్పట్టసాగారు.
(పదిహేనవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:225
VI. జీవుడు - స్వప్నపరంపరలు
1 స్వషసదృశ సిద్ధాంతం
శ్రీరాముడు: మునీంద్రా! ఈ పాంచభౌతిక సృష్టి అతి చమత్కారంగా తాండవిస్తోంది. ఇదంతా ఒకానొక మహత్తర సంకల్పము అని అనక తప్పదు. అట్టి చమత్కార సృష్టి రచనా వ్యవహారంలో రెండు రకాల సంకల్పాలు గోచరిస్తున్నాయి.
1. వ్యష్టి సంకల్పం - ఇందు 'జీవులు' అనబడు వ్యష్టి సంకల్పులు ఉపాధి సహితులై ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు.
2. సమష్టి సంకల్పం - ఒకానొక సమష్టితత్త్వము ఇక్కడ ఏర్పడి ఉండి, జీవుల ఉపాధులకు ప్రేరణ, సంరక్షణ, సంచారం, కాలం, ఆహారం, సంక్షయం - వంటి కార్యక్రమములకు కారణమగుచూ వ్యవహరిస్తోంది. అట్టి సమష్టితత్త్వమునకు రచయిత అయిన సమష్టి జీవుని 'హిరణ్యగర్భుడు’ అని కొన్ని శాస్త్రములు వర్ణిస్తున్నాయి.
'సమష్టి జీవుడగు హిరణ్యగర్భుని స్వప్నమే ఇదంతా!' - అని ప్రతిపాదించే శాస్త్రాల విషయమై మీ అభిప్రాయములు తెలియజేయ ప్రార్థన. వేదాంత వాఙ్మయంలో ప్రసిద్ధమైయున్న 'స్వప్నసదృశ సిద్ధాంతం' గురించి వివరించమనవి.
శ్రీవసిష్ఠ మహర్షి: "పూర్వకల్పంలో సమష్టి సంకల్పుడగు హిరణ్యగర్భుని స్వప్నమే ఈ వర్తమాన జగత్తు. అతని వాసనల ప్రకటనమే ఈ ప్రపంచం" అనే ఒకానొక సిద్ధాంతం లోక ప్రచారమైయున్నది. ఈ సిద్ధాంతము ననుసరించి "ఆ హిరణ్యగర్భుడు (సమష్టి స్వప్నమాత్ర జగత్తుకు కర్త) అజ్ఞానదశ యందు ఉన్నప్పుడు ఈ జగత్ రచన నిర్వర్తించినాడు. సమష్టి స్వప్నకర్త ఆ స్వప్నమునుండి ముక్తి నొందినాడు. అందుచేత ఈ జగత్తు వాస్తవానికి లేదు” అని సిద్ధాంతీకరించబడుతోంది. దీనిననుసరించి 'ఈ జగత్తు స్పప్నసదృశం మాత్రమే. సమష్టి జీవుడగు హిరణ్యగర్భుని స్వప్నంలో తదనుకూలమైన భ్రమ సమన్వితులగు జీవులు స్వప్న సదృశంగా ఇందులో ప్రవేశించి, సంచరించి, మరొకప్పుడు బహిర్గతులగుచున్నారు. - అని సిద్ధాంతీకరించబడుతోంది. ఆ సిద్ధాంతమును అనుసరించి కూడా 'ఈ జగత్తు వాస్తవానికి లేదు' అనియే నిరూపించబడుతోంది కదా!
చైతన్యము సర్వవ్యాపకమైనది. అట్లా అయి కూడా అయ్యది ఇట్లు సమష్టి జీవునిగా, అటు వ్యష్టి జీవునిగా వ్యవహారము రచించుకుంటోంది. తాను వ్యాపించి, అట్లు వ్యాపించినచోట దృశ్యమును
Page:226
పరికల్పించుకుని తన చుట్టూ ఈ దీర్ఘ సంసారమును అనుభవిస్తోంది. ఈ సంసారము "సమ్యక్ దర్శనము” అను దివ్యౌషధముచే మాత్రమే తొలగగలదు. అజ్ఞాన కారణంగా ఏర్పడిన అసమ్యక్ దర్శనం, లేక సంసారం, విజ్ఞాన కారణంగా తప్పక తొలగగలదు. “ఇక్కడెక్కడా అనేకమనేది లేదు. ఏకత్వమే ఇందలి సత్యం” అను జ్ఞాన ప్రాప్తిచే నిద్రలేచిన వాని స్వప్నంలాగా 'సంసారము' అనబడు దృశ్యపరిమితానుభవం తనంతట తానే పలాయనం చిత్తగిస్తుంది.
“సమష్టి సంకల్పస్వరూపుడు తత్త్వజ్ఞానలాభం పొంది ఉండటం చేత ఈ ప్రపంచం గడచిపోయిన స్వప్నం వంటిది” - అనునది స్వప్నసదృశ సిద్ధాంత సారం.
అందుచేత ఈ జగత్తు ఇప్పటికే గడచిపోయిన ఒక స్వప్న కథనం వలె, ఊహాకల్పిత భావావేశంతో కూడిన సంఘటనానుభవం వలె ద్రష్ట యొక్క స్వయంకల్పితానుభవం. నాశనమాత్రం, సారహీనం అని గ్రహించు. ఇది దర్పణాంతర్గతమైన ప్రతిబింబంలాగా వ్యష్టి - సమష్టి జీవుల సత్స్వరూపం నందు ప్రతిబింబిస్తోంది.
జరిగిపోయిన స్వప్నం - ‘ఇదంతా సమష్టి జీవుని గతించిపోయిన స్వప్నం మాత్రమే’ అనునది ఒక సిద్ధాంతమని అనుకున్నాం కదా! అట్టి స్వప్నం నుండి సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు
- - సమష్టి ఇచ్ఛకు ప్రదాత) సృష్టి స్వప్నం నుండి నిదుర లేచినప్పటికీ, అజ్ఞానముచే ఉదయించిన వ్యక్తిగతాభిమాన రూపమైన “అహం” ఇందు ప్రవేశించి ఇక్కడ కల్పనను కొనసాగిస్తోంది. చమత్కారంగా ఇదంతా స్వప్న సదృశంగా కాకుండా దృఢమైన సత్యం వలె పొందటం జరుగుతోంది. కనుక దృశ్య ప్రపంచం యొక్క నిర్వచనం 'ద్రష్ట యొక్క అజ్ఞాన కారణమైన అపరిపక్వ, పరిమిత దృష్టియే.' శ్రీరాముడు: మహర్షీ! ఈ జగత్తు 'హిరణ్యగర్భుడు' అనబడే సమష్టి ఇచ్ఛారచయిత యొక్క స్వప్నం మాత్రమేనని సెలవిచ్చారు. అట్టి సమష్టి సంకల్పుడు అజ్ఞానమనే స్వప్నం నుండి ఇతఃపూర్వమే నిదుర లేచాడని కూడా చెప్పారు.
ఒకడు నిదురలో స్వప్నం గాంచుచున్నాడనుకోండి. అతడు నిదుర లేవగానే ఆ స్వప్నం కూడా ముగించబడుతుంది. ఒకని యొక్క గతించిన స్వప్నంలో మరొకరు ప్రవేశించటమనేది, దానిని కొనసాగించటమనేది చాలా ఊహాతీత విషయాలు. యుక్తియుక్తం అని అనిపించదు. హిరణ్యగర్భుని అజ్ఞానం తొలగగానే అతని స్వప్నమాత్రమైన ఈ సమష్టి జగత్తు కూడా వైదొలగాలి గదా! ఇది ఎందుకు వినాశనమొందటం లేదు?
శ్రీవసిష్ఠ మహర్షి: స్వప్నము అత్యంత క్షణికమైనది. అయితే ఆ స్వప్న ద్రష్ట యొక్క భోగదృష్టిని అనుసరించి అది ఆ స్వప్న ద్రష్టకు సుదీర్ఘంగా అనుభవమౌతోంది.
ఈ సమష్టి సృష్టి కూడా 'భోగము' అనే వ్యసనం లేక ప్రతిబంధకాన్ని ఆధారంగా చేసుకుని కొనసాగుతోంది. సర్వేసర్వత్రా ప్రసరించుచున్న చైతన్యం సమష్టి జీవునిగా ఒక వైపు కల్పనను ప్రారంభించి వ్యష్టి జీవునిగా మరొకవైపు అనుభవపరంపరను కొనసాగిస్తోంది. ప్రతిభాసవంటి సమష్టి జీవుని జగత్స్వప్నమున జీవజగత్తులు తోచుచు అనంత ప్రవాహరూపమున వెలయుచున్నాయి.
Page:227
ఒకనికి కలలో కనిపించేవన్నీ అంతర్గత భావతరంగాలే కదా! భోగాభిలాషతో కూడిన అంతర్గత భావతరంగాలే జగత్తు యొక్క అనుభవముల రూపమున సమష్టి - వ్యష్టి ద్రష్టలకు ఇద్దరికీ ఘనీభూతమై ఇట్లు ప్రాప్తిస్తున్నాయి.
బీజం ఎటువంటిదైతే చెట్టుకూడా అట్టిదే అవుతుంది కదా! స్వప్న పురుషుని వంటి హిరణ్యగర్భుని (ప్రజాపతి) యొక్క స్వప్నమాత్రమైన ఈ జగత్తు కూడా స్వప్నము వంటిదే. అసత్యమగు మనః సంకల్పము ద్వారా గాంచబడేదంతా అసత్యమే అవుతుంది కదా! ఈ ప్రపంచానుభవం అసత్యమైనదే! ఇక్కడ కల్పన అను ఊహా సంబంధమైన మనో వికారం నిశ్చల స్వస్వరూపం నుండే నిశ్చలజలంలో ఆవిర్భవిస్తోంది. ఇది నిశ్చల నిరాకారజలంలో చిన్న గులకరాయిని వదలినప్పుడు ఏర్పడే చంచల ఆవృత్తముల వంటిది. అదియే జగత్తు యొక్క ఉత్పత్తి. అంతేగానీ కేవలం పంచభూతాల కలయిక మొదలైనవి జగదుత్పత్తి కాదు. ఆ విధంగా ఏర్పడిన కల్పన జన్మ జన్మాంతరాలుగా, స్వర్గ నరకాదులుగా విస్తారం పొందుతోంది. అట్టి దృశ్య వ్యవహారం నందు సత్యత్వబుద్ధి ఉంచవలసిన అవసరమే లేదు.
ఎవరికైనా సరే, ఈ జగత్తు పట్ల పాతుకుపోయి ఉన్న 'ఇది సత్యమే' అను రూపంలో ఏర్పడిన బుద్ధి (లేక) అవగాహన అయుక్తం మాత్రమే. అట్టి భ్రమాత్మకమైన నమ్మికను ఎంత త్వరగా త్యజిస్తే
అంత మంచిది.
కల్పము - సమష్టి జీవుడగు ప్రజాపతి ఒక్క నిమిషంలో గాంచిన త్రిజగత్ స్వప్నం అత్యంత దీర్ఘమై 'కల్పము’ అను శాస్త్రీయనామంచే చెప్పబడుతోంది. ఈ జీవులంతా చూచుచున్నది 'సృష్టి' అనబడు ఆ క్షణకాల స్వప్నాన్నే! చిత్ యొక్క కల్పనలగు ఈ దృశ్య సమూహాలు నీటి యందు అలల లాగా అనుక్షణం లేచి, లయమౌతున్నాయి. ఈ 'కల్పములు - సృష్టులు - స్వర్గములు' అను పేర్లతో చెప్పబడే దృశ్యపరంపరా వ్యవహారములు సత్యము కానే కాదని గుర్తు చేస్తున్నాను.
ఈ దృశ్య ప్రపంచం మిథ్యయేనని గ్రహించు. ఈ జీవులు తమయొక్క సంకల్పముల ద్వారా (లేదా) ‘అంతరంగం నందు కల్పించుకొనిన సమాలోచనలు / భావనాతరంగాలు' అను వాహనం అధిరోహించి ఇద్దాని యందు ప్రవేశించి ఇదంతా వాస్తవమేనని, ఇక్కడ సుఖదుఃఖాలు కలవని ఎంతో నమ్మకం పెంపొందించుకుని వ్యవహరిస్తున్నారు. స్వర్గ నరకాదుల అనుభవం పొందుచున్నారు. క్షణక్షణం మారిపోతూ ఉండే ఈ జగత్తు 'ఇది శాశ్వతం - విస్తారం - సత్యం - అనుసరణీయం - దాటుటకు అశక్యం ...అని గమ్మత్తుగా అనిపించటమే ఇక్కడి చమత్కారం. ఒక స్వప్నం తరువాత మరొక స్వప్నం ఏర్పడుతూ ఉన్నప్పటికీ స్వప్న ద్రష్ట ప్రతిస్వప్నమునూ తనయొక్క పరిమితముగా, అది మాత్రమే వాస్తవమైనట్లు గాంచుతూ ఉంటాడు కదా! ఈ జీవుని బాల్య - యౌవన వార్ధక్యదశలు, సుఖ-దుఃఖ సంఘటనలు, జన్మ-మృత్యు-జన్మాంతరములు ఎప్పటికప్పుడు క్షణికమే అయినప్పటికీ
“నేను బాలుడను - - నేను యువకుణ్ణి - నేను ముసలివాడను - - నేను సుఖిని - నేను దుఃఖిని -
నేను పుట్టుచున్నాను - - నేను చచ్చుచున్నాను” అను ఎంతో ఘనీభూతమైన వర్తమానానుభవ భ్రమకు
Page:228
లోను అవుచున్నాడు. ఈ జగద్విషయములన్నీ కాల ప్రవాహంచే ఎటకో అనుక్షణం కొట్టుకుపోబడు చున్నాయని ఎవరికి తెలియదు? అయినా కూడా ఈ జీవుల సుఖదుఃఖములకు అంతు కనబడుతోందా? ఇక్కడ హిరణ్యగర్భుని స్వప్నం, జీవుని వ్యక్తిగతమైన స్వప్నం - - ఒకచోటికి వచ్చి కాపురం చేస్తున్నాయి. ఇక చూడు, చమత్కారం! ఇదంతా సంసారసాగరం - అనంత దుఃఖమయం - విధి వైపరీత్యం విధి చిద్విలాసం - అధిగమించుటకు అసాధ్యం అను రూపం గల అనేక సమ్మిళితాలతో కూడి అనుభవ పరంపరలు ఎదురుగా ఏర్పడి ఉంటున్నాయి.
శ్రీరాముడు: ఎందుచేత అట్లా ఏర్పడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి: ఎందుచేత అని ఏమున్నది? ఏది ఎట్లా గాంచబడితే అది అట్లే ఉండటం అనేది ఆత్మకు గల ఒకానొక శక్తి. అట్టి శక్తి భ్రమతో కూడి ప్రవర్తిస్తున్నప్పుడు సృష్టి సంభవిస్తోంది. భ్రమ వల్ల సంభవం కానిదేమున్నది? అయితే... స్వప్నంలో అప్పటి భ్రమ అప్పటికి సత్యమే అయినప్పటికీ ఆ స్వప్నం మెళుకువ వచ్చిన తరువాత వ్యవహారయోగ్యం కాగలదా? భ్రమలకు చెందిన జీవుడు వాటితో కూడా తమకము పొందుచున్నాడు. అట్లే ఈ జగత్తు కూడా!
ఈ సృష్టి, దీని కర్తయగు ప్రజాపతితో కూడా... ప్రళయం పొందిన మరుక్షణం... ఆత్మవస్తువు ఒక్కటే శేషించి ఉంటుంది. దృష్టి లయమొందినప్పుడు ఇక శేషించేది ద్రష్ట మాత్రమే కదా! విషయ రహితమగు ద్రష్టయే సత్ - చిత్ - ఆనందస్వరూపుడగు పరమాత్మయొక్క నిర్వచనం. ఆత్మస్వరూపుడగు పరమాత్మ ప్రతిఒక్క జీవుని స్వస్వరూపుడై ఎట్టఎదుట నిలచియే ఉండగా అజ్ఞాన జీవులు ఎక్కడెక్కడో వెతకుచున్నారు.
అజ్ఞానము వలననే భూత భవిష్యత్ వర్తమానములందు త్రిలోకములలో చిత్రవిచిత్రాలైనవన్నీ తోచుచున్నాయి. చైతన్యము వాస్తవానికి నిర్విషయమైనది. నిర్విషయము - సర్వము అగు ద్రష్టయందు ఎందుకో ఆశ్చర్యంగా ఈ త్రికాల, త్రిజగద్విషయాలు ప్రదర్శనమగుచున్నాయి. ఈ ప్రపంచంలోనూ, ఈ మనస్సులోనూ చమత్కారాలకు లోటు ఏమున్నది? అయితే నీటిలో నిప్పు ఉంటుందా? శ్రీరాముడు: ఉండదు కదా!
శ్రీవసిష్ఠ మహర్షి: అయితే ఏం? సముద్ర జలంలోంచి బడబాగ్ని బయలుదేరుతోంది. శూన్యంగా మానవులకు కనబడే ఆకాశంలో విమాన విహారులగు దేవతలకు ఆశ్రయమైన స్వర్గ - మహర్ మొదలైన లోకాలు విస్తరించి ఉన్నాయి. మృత్తికారహితమైన (మట్టి ఏమాత్రం లేనట్టి) కొండ శిఖరంపై మహావృక్షాలు వెల్లివిరుస్తున్నాయి. నిస్సారమగు ఒక గండశిల దేవతా విగ్రహంగా మలచబడగా, ఆ విగ్రహం భక్తులచే పూజింపబడి మహత్తరమైన ప్రయోజనాలు ప్రసాదిస్తోంది. శిలలో ప్రాణులు జీవిస్తున్నాయి. రాతిలో కప్ప బ్రతుకుతోంది కదా! ఒక శిలనుండి నీరు ప్రవహించి అది పొడవైన జీవనదిగా పరిణమిస్తోంది. కొద్ది నిమిషముల నిద్రాసమయంలో సుదీర్ఘమైన కాల
వ్యవహారం స్వప్న ద్రష్ట పొందుచున్నాడు. కల్ప వృక్షం - మణి వంటి జడవస్తువులు ఆరాధకులకు పుంఖానుపుంఖములైన ప్రయోజనములను వరంగా ప్రసాదిస్తున్నాయి. ఒకడు స్వప్నంలో తాను
Page:229
చచ్చినట్లు, తన బంధువుల రోదనను వినుచున్నట్లు పరస్పర వ్యతిరిక్త విషయములను గాంచుచున్నాడు. ఆకస్మికంగా గంగ ఉద్భవించి పాతాళం జేరటం లేదా? జీవుని ప్రయత్నం లేకుండానే ఆ జీవుని పొట్టలో ప్రవేశించిన ఆహారం పచనమై శక్తిరూపం దాలుస్తోంది. పెద్ద పర్వతములు జడమై ఉండి కూడా రెక్కలు దాల్చి గాలిలో లేచి జనావాసంపై వ్రాలి సర్వనాశనం చేస్తున్నాయి. చింతించుచూ ఉండగా కొన్ని కోరికలు ఫలిస్తున్నాయి. మరికొన్ని కోరికలు ఎంత చింతిస్తున్నా ఫలించటమే లేదు. ‘నా బాల్యం, నా యౌవనం ఇట్లాగే ఉండుగాక!" అని కోరుకుంటే అది ఫలిస్తోందా! లేదు. యంత్ర నిర్మితమగు జడవస్తువులు స్వయంనిర్ణయాధికారంతో కర్మలు నిర్వర్విస్తున్నాయి. అతి పెద్దవగు గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు భూమిమీద నుండి చూస్తున్నప్పుడు మిళుకుమిళుకుమంటా అతి చిన్నవై కనిపిస్తున్నాయి. ఇంద్రజాల - గంధర్వ విద్య ప్రదర్శనం చూస్తున్నప్పుడు అదంతా నిజమేనని భ్రమ కలిగి అనుభూతులన్నీ ఏర్పడుచున్నాయి. కల్పితమగు ఆకాశమున విస్తార జీవ - జగత్ అనుభవాలు కనిపిస్తున్నాయి. యంత్ర-ఓషధాల ప్రయోగాల వల్ల ఆశ్చర్యకర ప్రయోజనాలు కలుగు చున్నాయి. భయము నుండి మదము ఉద్భవిస్తోంది.
ఈ విధంగా ఈ జగత్తులో చిత్ర విచిత్రములకు లోటేమున్నది? అందుకే భ్రమలో సంభవం కానిదేమున్నదని మనం అనుకున్నాం కదా! (అఘటనా ఘటనాపటీయసీ మాయా - అని అంటారు కదా!) ఈ జగత్తు గురించి “దీని నుండి నేను తప్పించుకోలేను” అని ఒక సమయంలో అనిపిస్తున్నప్పటికీ జ్ఞానం లభించినప్పుడు 'ఇది అర్థరహితం. కనుక ప్రతిబంధకమయ్యే శక్తి దీనికి లేదు’... అనునది కూడా అనుభవం కాగలదు. అప్పుడీ జీవునికి స్వస్వరూపము నందు పరమవిశ్రాంతి లభించగలదు. ఇక ఈ ఉపాధులంటావా... జ్ఞానుల దృష్టిలో వీటి రాకపోకలు, తదితర వ్యవహారాలు తాము గాంచే ప్రశాంత స్థితికి ప్రతిబంధకమే కాదు.
రసావేశం దృష్ట్యా ఈ జగత్తు భ్రమ మాత్రమే. బ్రహ్మ రూపం దృష్ట్యా ఇక్కడ అసత్యమేదీ లేదు. జగత్ రూపంలో వీక్షిస్తే ఇక్కడ సత్యమేదీ లేదు.
ఈ విధంగా ఈ సృష్టి స్వప్నమున అన్నియు, అంతటా సంభవములే అయి, అట్లట్లు గాంచ బడుచున్నాయి. సృష్టిస్వప్నమునందు ముగ్ధుడగుచున్న జీవుడు ఇదంతా యథార్థమని, ఇది ఇట్లే ఉండబోతోందని భావించుచున్నాడు. ఒక భ్రమ తరువాత వెనువెంటనే మరొక భ్రమ చోటు చేసు కోవటం జరుగుతోంది. 'ఇదంతా అత్యంత స్థిరం' అను స్థిరబుద్ధిని ఆశ్రయించుట చేతనే జీవుడు మోహం చెందుచున్నాడు. లేడి పచ్చిక మేసే ప్రయత్నంలో ఒక గోతిలోంచి బయటబడి మరోగోతిలో పడుచున్నట్లు ఈ జీవుడు సంసారము మీద గల నమ్మికతో ఒక దేహంలోంచి మరొక దేహంలో ప్రవేశిస్తూ దేశ ద్రిమ్మరిలా సంచరిస్తున్నాడు.
Page:230
2. స్వప్నంలో ఇంకొక స్వప్నం
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జీవుడు ఒకటి తరువాత మరొకటిగా అనేక స్వప్నములను గాంచుచున్నాడు. అనేకచోట్ల వేర్వేరు భ్రమలను ఒకేసారి కూడా పొందుచున్నాడు. “స్వప్నంలో ఇంకొక స్వప్నం, ఆ స్వప్నంలో మరొక స్వప్నం” - ఈ విధంగా స్వప్న-స్వపాంతర్గత పరంపరలను గాంచు చున్నాడు. ఈ విషయం నిరూపిస్తూ... 'జీవట స్వప్నదేహపరంపరలు' అని పేరుతోనూ, 'శతరుద్రీయం’ అనే ఒకానొక విశేషం నా దృష్టిపథంలో మెరుస్తోంది. ఆ వృత్తాంతం ఇప్పుడు చెబుతాను... విను.
ఒకానొక సుదూర ప్రాంతంలో 'జీవటుడు' అనే పేరుగల గొప్ప సాధకుడొకడు ఉన్నాడు. అతడు జన్మతః గొప్ప విజ్ఞాని. బాల్యంలోనే గృహమును త్యజించి సన్న్యాసాశ్రమం స్వీకరించాడు. భిక్షాటనంతో దేశసంచారం చేస్తూ ఉండేవాడు. ఆ పరివ్రాజకుడు ఒక ప్రక్క దేశాటనం చేస్తూనే తన తీవ్రమైన సాధన కొనసాగిస్తూ ఉండేవాడు. క్రమంగా శాంతి, ఓర్పు, వైరాగ్యం, తపస్సు, శాస్త్ర పరిజ్ఞానం అతనిని ఆశ్రయించాయి. ఆత్మజ్ఞానంతో ఆతని స్వరూప స్వభావాలు పరమప్రశాంతత్వము సంతరించుకున్నాయి.
అతడు ఒకసారి తనను ఆశ్రయించిన కొద్దిమంది శిష్యులతో ఒక గ్రామప్రాంతం చేరాడు. అక్కడి ప్రశాంత వాతావరణం అతనికి ఎంతో నచ్చింది. ఆ గ్రామంలోని నివాసిత ప్రాంతానికి కొంత దూరంలో ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది. ఒకటి రెండు రోజులలో శిష్యుల సహాయంతో దానిని ఒక ఆశ్రమంగా తీర్చిదిద్దాడు. అక్కడే కొన్ని రోజులు నిరంతర సమాధిని అభ్యసించాడు. క్రమంగా అతని యందు సాంసారిక వాసనలన్నీ వైదొలగాయి. చిత్తము శుద్ధము అతి పవిత్రము అయింది. సత్య సంకల్ప సమన్వితం అయింది. అనగా, చిత్తము పరిశుద్ధం పొంది, తద్వారా ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే సంభవమవగల సంకల్ప సిద్ధిత్వం పొందింది. ఇక అతని చిత్తము మౌనము సర్వత్వము - చంచలరాహిత్యము - - గుణాతీతత్వము వహించి ఉంటోంది.
ఒకరోజు అతడు యథారీతిగా ఆసనము ధరించి సమాధిని అభ్యసిస్తున్నాడు. ప్రశాంతజలంలో తరంగం ఉద్భవించినట్లు అతని అంతరంగంలో "నిర్విషయమగు ఆత్మయందు ఈ ఈ కార్యకారణవ్యవస్థ యొక్క చమత్కారమంతా ఏమిటి?” అను రూపంలో ఒక జిజ్ఞాస ఉద్భవించింది. “ఈ జగత్తంతా ఒక లీలయే కదా! కేవలం వినోదార్థం అధ్యాత్మశాస్త్రజ్ఞులు కూడా కలిగియుండే ఒకానొక చిత్తవృత్తిని అవలంబించి కొద్దిసేపు ఈ జగత్ చమత్కారం చూచి రావాలి"... అని అనుకున్నాడు. అట్టి సంకల్పం ఉత్పత్తి అయి రూపం దిద్దుకుని, బలపడగానే ఆతడు కనులు మూసుకున్నాడు. ఇంతవరకూ అతనికి అనుభవమగుచున్న ఆత్మధర్మమును కొంచెం ఏమరచి చిత్తధర్మమును ఆశ్రయించాడు. అంతవరకూ ఒక క్రమముగా పారుచున్న జలం తన క్రమము కోల్పోయి అకస్మాత్తుగా సుడులు పొందుతుంది చూచావా? అట్లా ఇంతవరకూ నామ రూప- గుణ అతీతత్వమును వహించిన అతని మనస్సు
Page:231
నామ-రూప-గుణ సహితత్వమును ఆశ్రయించింది. అంతే! ఇక యతిధర్మమును కోల్పోయి, ధర్మరహితుడగు ఒక అజ్ఞాని యొక్క స్వభావ - సంకల్పములను లీలగా అవధరించాడు.
‘నేను’ జీవటుడు అనే పేరుగల ఒక మానవుణ్ణి కదా! - అని అనుకోసాగాడు. నిరవయవము అపరిమితము అగు స్వభావము నుండి చ్యుతుడై కేళీవినోదంగా హస్త పాద పరిమితమైన దేహస్వభావం ఆశ్రయించాడు. భిక్షకుని రూపంలో అతని భౌతికదేహము - సమాధి యథాతథంగా ఉండగానే అతని చిత్తము మరొక జీవ-పాంచభౌతిక దేహం కల్పించుకుని అక్కడి నుండి బయలుదేరింది.
‘ఊళ్ళో విశేషాలేమిటో చూచివద్దాం' అని తలచిన అతని చిత్తము నూతన జీవట ద్వితీయ దేహంతో ఊరిలో ప్రవేశించింది. ఆ ద్వితీయ జీవటుడు వీథులలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక చెట్టు తొఱ్ఱలో ఒక తేనెతుట్టె కనిపించింది. ఒడుపుగా ఆ చెట్టు ఎక్కి తేనెతుట్టెను నేలకు దించాడు. ఆ తేనెపట్టులో గల తేనెను శుభ్రంగా త్రాగాడు. ఇక అక్కడి నుండి బయలుదేరాడు. అక్కడి వీధులలో సంచరించే జనులను ఆశ్రయించి కొన్ని డబ్బులు సంపాదించాడు. ఆ సమీపంలో గల ఒక కల్లు దుకాణంలో ప్రవేశించాడు. అక్కడి వారితో సరసాలు ఆడుతూ అర్ధరాత్రి వరకూ మత్తుగా త్రాగాడు. ఒక తాగుబోతు పాడుచున్న తత్త్వపు పాటలు విన్నాడు. అర్ధరాత్రి ఇక అక్కడి నుండి బయలు దేరి తూగుతూ ఒక ఇంటి అరుగుపై నిద్రకు ఉపక్రమించాడు. ఆ నిద్రలో అతను ఒక కలలో ప్రవేశించాడు. తనను ఒక పాఠ్య - అధ్యయనములతో కూడిన సత్కర్మపరుడగు బ్రాహ్మణ బాలకునిగా
గాంచసాగాడు.
ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రాహ్మణగృహంలో ఉంటూ, తండ్రి దగ్గర సంధ్యావందనం, వేదాలు నేర్చుకుంటున్నాడు. చాలాకాలం తదితర విద్యార్థులతో కూడి అనేక శాస్త్ర విషయాలు నేర్చుకుంటు న్నాడు. క్రమంగా యుక్త వయస్సు వచ్చింది. వివాహం చేసుకుని పిల్లలను కన్నాడు. వారి కోసం అనేక శ్రమలకు ఓర్చి, ధనం సంపాదిస్తూ ఉండేవాడు. చాలా రోజులు గడిచాయి. ఒక రోజు నిత్య నైమిత్తిక కర్మలను విశేషపూజలను అర్ధరాత్రి వరకు ఇంటివద్దే నిర్వర్తించాడు. రాత్రి పొద్దుపోయింది. రోజంతా అలసి ఉన్న ఆ బ్రాహ్మణునికి ఆ రాత్రి రాజాశ్రయం గురించి యోచిస్తూ నడుం వాల్చగానే నిద్రపట్టింది. ఆ నిద్రలో తానొక సామంత రాజకుమారుడైనట్లు కలగాంచాడు.
ఆ సామంతరాజ కుమారుడు బాల్యం నుండే ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అతనికి చెందవలసిన సింహాసనం ఆక్రమించటానికి అతని దాయాదులు ఎన్నో కుట్రలు పన్నారు. రాజభక్తులగు కొద్దిమంది మంత్రుల సమాలోచనల సహాయంతో అతడా కుయుక్తులన్నీ పటాపంచలు చేసి సింహాసనం అధిష్ఠించాడు. కొన్ని సంవత్సరాలు రాజ్యం ఏలాడు కూడా!
ఒక రోజు ఆ సామంతరాజు రోజూలాగానే రాచ కార్యములన్నీ ముగించుకుని అంతః పురంలో ప్రవేశించాడు. ఆ మరునాడు తాను వరించిన చక్రవర్తి యొక్క రాజకుమార్తె స్వయంవరానికి వెళ్ళవలసి ఉన్నది. ఆ విషయమై మరునాటి ప్రయాణ సన్నాహాలకు ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి
Page:232
అంతఃపురంలో తీయటి ఆలోచనలలో నిమగ్నమయ్యాడు. అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో అతడు ఒక చక్రవర్తి అయినట్లు కలగాంచాడు.
శ్రీరాముడు: ఆ జీవట భిక్షువు పరివ్రాజకుడై ఆ గృహంలోనే త్రాగుబోతుగా... త్రాగుబోతుగా ఉంటూనే జీవట బ్రాహ్మణుడుగా... జీవట బ్రాహ్మణుడుగా ఉంటూనే ఒక సామంతరాజుగా... సామంతరాజుగా ఉంటూనే ఒక చక్రవర్తిగా... కొనసాగుచున్నాడా? ఇదంతా ఎట్లా జరుగుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి: అవును. భిక్షకుడుగా ఆ గృహంలో ఉండియే త్రాగుబోతుగాను, తదితరులు గాను కొనసాగుచున్నాడు. ఎక్కడికక్కడ నిద్రకు ఉపక్రమించినప్పుడు మరొక నూతన స్వప్నంలో ప్రవేశించి కల్పిత ఉపాధులను అనుభవించుచున్నాడు. “ఇది ఎట్లా?” - అనే విషయాన్ని కొద్దిసేపు తరువాత చర్చిద్దాం. ఇప్పుడు చక్రవర్తి దాకా వచ్చాడు కదా!
ఆ చక్రవర్తి చాలాకాలం నానావిధ భోగములు అనుభవించాడు. అనేక రాచకార్యములు చక్కబెట్టుచూ ఉన్నాడు. శత్రు - - మిత్రులకు సముచితరీతిగా దండన - - సత్కారములను నిర్వర్తించాడు. పట్టపురాణులతో విహరిస్తూ, సామంతరాజులను పరిపాలిస్తూ, మహాసామ్రాజ్యం ఏలాడు. అందమైన రాజపుత్రికలను నయానా, భయానా, తన సొంతం చేసుకొనే వాడు. ఒకసారి ఒక రాజపుత్రిక అతనిని వివాహం చేసుకోవటానికి తిరస్కరించింది. అతనిలో పట్టుదల ఎక్కువైంది. అక్కడి రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని, రాజపుత్రికను కబళించాలని పన్నాగం పన్నసాగాడు. మంత్రులతో, సైనికాధికారు లతో రాజకీయ ఎత్తుగడలు, యుద్ధవ్యూహ రచనలతో 15 రోజులు అవిశ్రాంతంగా గడిపాడు. ఒక రోజు దండయాత్రకు బయలుదేరి త్రోవలో సైనికశిబిరం నిర్మించాడు. ఆ రోజు మంత్రులతో చాలా సేపు సమాలోచనలు చేశాడు. ఆ తరువాత నృత్యవినోదాలతో చాలా రాత్రి గడచిపోయింది. మర్నాడు చాలా కార్యక్రమములు, రాజకీయపు ఎత్తుగడలు నిర్వర్తించవలసి ఉన్నదికదా! ఆ రాత్రి పొద్దుపోయిన తరువాత కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, ప్రియురాలి పట్ల అతని ఆలోచనలను మరుగు చేస్తూ నిద్ర అతనిని ఆక్రమించింది. ఆ నిద్రలో తానొక అప్సర (దేవతాస్త్రీ) అయినట్లు కలగన్నాడు.
ఆ అప్సరస తన ప్రియాతి ప్రియుడగు ఒక దేవతా పురుషునితో కూడి ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉండేది. ఆ దేవతా పురుషుడు తన పట్ల ధ్యాస మరల్చకూడదనే పట్టుదలతో అనేక కుయుక్తులు పన్నుతూండేది. ఒకసారి ఆ దేవతా పురుషుడు తనపై విరక్తి కలిగియుండటం అప్సరస గమనించింది. ఎంతో దుఃఖితురాలైనది. ఏకాంతంలో దుఃఖిస్తూ, కుత్సిత భావాలతో నిండిన మనస్సుతో, రతిక్రీడ యందు డస్సినదై నిదురకు ఉపక్రమించింది. ఆ నిద్రలో తాను ఒక లేడిగా వనంలో సంచరిస్తున్నట్లు కలగన్నది.
88
ఆ లేడి పచ్చికను, చిగురుటాకును నమలుతూ ఒక అడవిలో సంచరించేది. ఒక రోజు ఒక పులిని దూరం నుండి చూచి ఎంతో భయంతో ఒక పొదలో దూరింది. ఆ పొదలో కొన్ని పూతీగలు
Page:233
ఆ లేడి కాళ్ళకు చుట్టుకున్నాయి. ఆ తీగలను విదిలించుకోవటానికి ఎంతో ప్రయత్నించి విఫలమైనది. చివరికి సొలసి అక్కడే కించిత్ నిద్రకు ఉపక్రమించింది. ఆ నిద్రలో తన భయం యొక్క పరిణామంగా ఒక పూల తీగగా అయినట్లు కలగన్నది.
❖
శ్రీరాముడు: అదేమిటి స్వామి! పూర్ణ - శుద్ధ - చైతన్య సమన్వితుడగు ఆ జీవట భిక్షువు ఎక్కడ? ఆతడు అర్ధజడమగు పూతీగగా పరిణమించటమేమిటి? ఆశ్చర్యంగా ఉన్నదే!
శ్రీవసిష్ఠ మహర్షి: ఇందులో ఆశ్చర్యం ఏమున్నది?
తిర్యజ్చో: ప్రహ్యాన్తి స్వప్నం చిత్తస్వభావతః | దృష్టానాం చ శ్రుతానాంచ చేతః స్మరణమక్షతమ్ ||
దేవతలు కావచ్చు. మానవులు కావచ్చు. జంతువులు, వృక్షములు, పూతీగలు కావచ్చు... ఆయా జీవులందరూ తమతమ చిత్తముల స్వభావమును అనుసరించే స్వప్నసదృశ జగత్తులను గాంచుచున్నారు. అఖండము, అప్రమేయమూ, అనిర్దేశము అగు ఆత్మతత్త్వానుభవం తప్ప తదితరమైనదంతా స్వప్నసదృశ్యం కాదా? మరింకేమిటి? ప్రతిఒక్కజీవుని అంతరంగ సంస్కారములే అతడు చూచే, వినే, పొందే - దృశ్య శబ్దార్థ అనుభవములకు అవగాహనలకు ముఖ్య కారణములై ఉంటున్నాయి. జీవునిలో పేరుకునియున్న సంస్కారముల ప్రదర్శనయే వారి వారి జగదనుభవములై ఉన్నాయి. సంస్కారములు, అవగాహనలు ఈ రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావితమవుతూ ఉంటున్నాయని జనులు గమనించెదరు గాక!
శ్రీరాముడు: ఆ పరివ్రాజకుడు పూతీగగా స్వప్నానుభవం పొందుతూ ఇంకా ఏం చేశాడు?
శ్రీవసిష్ఠ మహర్షి: ఆ పూతీగ కొంతకాలానికి పత్ర - పుష్ప - ఫలములతో ఒక పెద్ద లతాగృహంగా విస్తరించింది. ఆ లతా గృహంపై అనేక తుమ్మెదలు ఝంకారం చేస్తూ వ్రాలుతూ ఉండేవి. కొంతకాలం తరువాత ఆ లతలోని సాక్షి చైతన్యం గాఢనిద్రకు ఉపక్రమించింది. ఆ పూలతలోని భావికాలపు అంకుర బుద్ధి మరల స్వప్నోన్ముఖమైనది. సంసారానుగతంగా తాను ఒక తుమ్మెద అయినట్లు కలగాంచింది.
ఆ తుమ్మెద అనేక రకాల పుష్పాలపై వ్రాలుచూ అనేక ప్రదేశాలలో తన సుందరమైన రెక్కలతో విహరిస్తూ ఉండేది. ఒకసారి అది ఒక తామర పుష్పంలో ప్రవేశించింది. పుష్పరసాన్ని గ్రోలింది. అక్కడ మత్తును పొంది మోహవశంగా తామరతూడులో ప్రవేశించి అక్కడ చిక్కుకున్నది. ఈ జడమగు మనస్సు మోహవశం చేత పొందని కష్టాలు, చేరని దుష్ట ప్రదేశాలు ఉంటాయా? తామర తూడులో చిక్కుకున్న ఆ తుమ్మెద ఇట్లా ఆలోచించసాగింది.
అరె! ఈ తామరతూడులో చిక్కుకుని కదలలేని పరిస్థితిలో ఉండిపోయానే? ఇప్పుడేం చేయటం? అయినా ఫరవాలేదులే! తెల్లవారుతుంది. ఈ తామర రెక్కలు విచ్చుకుంటాయి. నేను బయటపడతాను. ఇంకా అనేక పూవులలోని మధువును గ్రోలుతూ హాయిగా ఉంటాను...
Page:234
అని అనుకుంటూ వేచి ఉన్నది. ఇంతలో ఒక మదపుటేనుగు ఆ కొలనులో ప్రవేశించి అల్లకల్లోలం చేసింది. తన మొరటు పాదాలతో సుతిమెత్తని తామరపూలన్నిటినీ నిష్కర్షగా త్రొక్కివేసింది. మూర్ఖులు రమ్యమైన వస్తువులను పాడుచేయటంలో సిద్ధహస్తులై ఉంటారు కదా! అప్పుడా ఏనుగు దంతము యొక్క ఒరిపిడికి తామరపూవు నలిగి ఒడ్డున విసిరి వేయబడింది. తూడులో వున్న తుమ్మెదకు గాయాలై మూర్ఛిల్లింది. అట్లు మూర్చిల్లే ముందు ఏనుగుకు సంబంధించి భయాందోళనలకు సంబంధించిన చాంచల్యమును అనుసరించి తానొక మదపుటేనుగు అయినట్లు స్వప్నం పొందింది.
ఆ మదపుటేనుగు రాజఠీవితో విశాలమైన అరణ్యంలో చాలాకాలం సంచరించింది. ఒక రోజు ఏమరుపాటు చేత రాజభటులు దానిని బంధించటానికి నిర్మించిన ఒక పెద్ద గోతిలో చిక్కుకుంది. రాజభటులు ఆ ఏనుగును బంధించి తమ రాజు దగ్గరకు తీసుకుపోయారు. ఆ రాజు ఏనుగును అనేక యుద్ధాలలో వినియోగిస్తూ ఉండేవాడు. అది దీర్ఘమైన తొండంతో శత్రుసైనికుల దేహాలను ఒడపుగా చుట్టుచుట్టి నేలకేసి బాదటంలో ఎంతో ప్రావీణ్యత కనబరచేది. అందుచేత అక్కడి సేనాపతికి ఆ ఏనుగంటే ఎంతో ఇష్టం. కొంతకాలానికి ఆ ఏనుగు ముసలిది అయింది.
ఒకసారి ఆ రాజ్యమును కబళించటానికి శత్రురాజులు చుట్టుముట్టారు. ఆ యుద్ధంలో ఎంతో మంది శత్రుసైనికులను ఆ ఏనుగు తన పాదఘట్టనలతో నలిపివేసింది. చివరకు కొందరు సైనికులు ఆ ఏనుగును శూలములతో గండస్థలంపై పొడిచారు. అది నేలకూలి మూర్ఛిల్లింది. ఆ ఏనుగు జీవిత కాలమంతా తన గండస్థలంపై వ్రాలే దోమలను త్రోలే ధ్యాస కలిగి ఉండటం చేత, తత్సంబంధమైన సంస్కార ప్రాభవానికి లోనై ఒక దోమ అయినట్లు కల గాంచింది.
ఆ దోమ ఒక కొలనులో అటూ ఇటూ తిరుగుతుండేది. ఆ కొలనులో కొన్ని హంసలు ఉన్నాయి. ఆ హంసలపై వ్రాలే నిరంతర ధ్యాస చేత అది ఒక హంస శరీరంపై నిదురిస్తూ తానొక హంస అయినట్లు మనఃప్రవేశం చేసింది.
హంసగా పరిణమించిన ఆ జీవుడు ఆ తరువాత దీర్ఘకాలం విభిన్నమైన యోనులలో ప్రవేశ నిష్క్రమణములచే పరిభ్రమిస్తూ మరికొన్ని జన్మలు గడిపాడు. ఆ తరువాత ఉపాధిక్రమంగా మరల హంస అయినాడు. ఆ హంస బ్రహ్మదేవుని వాహనమగు రాజహంస గురించి విని 'నేను కూడా బ్రహ్మదేవుని వాహనమగు రాజహంస అయితే ఎంత బాగుంటుంది'... అని నిరంతరం చింతిస్తూ ఉండేది. బ్రహ్మదేవోపాసన నిర్వర్తిస్తూ ఉండేది. కొంతకాలానికి ఒక విషపురుగు కాటుకు గురి అయి ఆ దేహం నిర్వీర్యమైనది. పూర్వవాసనా ప్రభావం చేత బ్రహ్మదేవుని వాహనమగు రాజహంసగా జన్మించింది. జీవట భిక్షువు నుండి చూస్తే అది 99వ జన్మ.
ఆ రాజహంస అత్యంత వినయముతో, శ్రద్ధగా, భక్తి పూర్వకంగా పరతత్త్వ స్వరూపుడగు బ్రహ్మదేవుని సేవిస్తూ ఉండేది. అట్టి సేవాప్రభావంగానూ, తన యొక్క వినయ - విధేయతలకు
Page:235
ప్రతిఫలంగానూ 'వివేకం' పొందింది. భగవానుడగు బ్రహ్మదేవుడు తనను ఆశ్రయించ వచ్చిన దేవ-ముని-ఋషిపుంగవులకు బోధించే బ్రహ్మతత్త్వమును తాను కూడా వినేది. ఆ రాజహంస తన వివేక - వైరాగ్యముల బలం చేత లౌకిక భోగములను ఇంద్రియార్థములను సారశూన్యమని గ్రహించి, లౌకికమైన వస్తుదృష్టిని అధిగమించింది. జీవన్ముక్తి పొందింది. బ్రహ్మదేవునితో సమానంగా ‘తదనంతర విదేహ ముక్తి'కి అన్ని విధముల అర్హత సంపాదించుకున్నది.
3. రాజహంస - - రుద్రుడు
శ్రీవసిష్ఠ మహర్షి: సన్న్యాసి, భిక్షుడు అగు జీవటుడు ఇప్పుడు జీన్ముక్తత్వము అవధరించి హంస అయి భగవంతుడగు బ్రహ్మదేవుని సేవలో నిమగ్నుడై ఉన్నాడని అనుకున్నాం కదా! బ్రహ్మదేవునితో లోకసంచారం చేయగలిగే అవకాశం పొంది ఉండటం చేత ఆ హంస యొక్క పవిత్ర జ్ఞానదృష్టి మరింత ఉత్కృష్టత పొందింది. ఒకసారి బ్రహ్మదేవునితో రుద్రలోకం వెళ్ళటం జరిగింది. రుద్రుని దర్శనం చేసుకుని అర్చించింది.
‘రుద్రుని అర్చించుటచే నేనిప్పుడు రుద్రుడను' అని భావన చేసింది. (నారుద్రో రుద్ర మర్చతి) మరుక్షణం ఆ జీవటుడు అద్దంలో ప్రతిబింబము ప్రవేశించినట్లు యోగజ్ఞానయుక్తమగు రుద్రరూపం దాల్చింది.
శ్రీరాముడు: మహర్షీ! జీవటుడు జీవన్ముక్తుడయ్యాడు కదా! మరల రుద్రుడుగా ఎట్లా జన్మించాడు? అప్పుడాతడు జీవటుడుగా విదేహముక్తి సమన్వితుడని కూడా మీరు చెప్పారు కదా?
శ్రీవసిష్ఠ మహర్షి: సంసార జీవులు ఇంద్రియానుభవములకు సంబంధించిన సంస్కారం కలిగి ఉంటారు. అందుచేత వారు ఒక ఉపాధిని త్యజించినప్పుడు తమ యొక్క అంతర్గతమై ఉన్న సాంసారిక సంస్కారాలచే ప్రభావితులై, తదనుభవానికి అనుకూలమైన ఉపాధి పరంపరలను పొందుతూ ఈ సంసారారణ్యంలో సంచరిస్తున్నారు. వారియందు 'పునరావృత్తి' అను దోషం ఉండి ఉంటోంది. అట్టి పునరావృత్తి దోషం చేత జన్మ - జన్మాంతరములు ఒక పరంపరగా వచ్చిపడుచున్నాయి.
అయితే, జీవటుని వ్యవహారం వేరు. ఆతడు జీవన్ముక్తుడు అవటంచేత 'జీవన్మరణములు' అను జాడ్యం అతనికి లేదు. అతడు సారూప్యముక్తి అనుభవిస్తున్నాడు. ఒకడు ఒక సమయంలో ఒక ఆలోచనను ఆశ్రయించి కొద్దిసేపయిన తరువాత ఆ ఆలోచనను త్యజించి మరొక ఆలోచనను స్వీకరిస్తాడు చూచావా? ఆలోచన - ఆలోచనల మధ్య తన స్వస్వరూపం త్యజించటం లేదు కదా! జీవటుడు కూడా హంస యొక్క అనుభవమును త్యజించి రుద్రుని యొక్క అనుభవం స్వీకరించాడు. 'నేను ఉపాధులకు జన్మ జన్మాంతరాలకు సంబంధించిన వాడను కాను' అను అకృత్రిమ స్వభావంతో కూడిన యోగజ్ఞానములు సంపాదించి ఉండుటచే అతనికి 1. సత్యసంకల్పబలం (సంకల్పించింది సత్యమయి ప్రాప్తించటం) 2. సంకల్పాతీతత్వం రెండూ కూడా ఒనగూడుచున్నాయి.
Page:236
గంధము వాయువును అనుసరిస్తూ తన స్వరూప స్వభావములను త్యజించినట్లు అతడు హంస శరీరం త్యజించటం, రుద్ర శరీరం స్వీకరించటం జరుగుతోంది. యోగులు ప్రారబ్ధశేషానుభవం కొరకై పూర్వ శరీరములను విడవటం, నూతన శరీరం స్వీకరించటం లీలగా నిర్వర్తిస్తారు. తదితర సంసార జీవులు వేదన-ఆవేశములతో కూడిన కౌతుకంచేత ఉపాధులను పొందుచూ, దేహ పరిమితులై అల్పయోచనాపరులై, దృశ్యమునకు దాసులై సంచరిస్తూ ఉంటారు.
ముక్త జీవునకు బద్ధజీవునకు మధ్య ఉన్న భేదం అవగాహనకు సంబంధించినది మాత్రమే.
జీవటుడు రుద్రత్వం స్వీకరించి, రుద్రుడై ప్రధానమైన గణపతిత్వం పొందాడు. శివలోకంలో ఉచితములను, ఆచారములను నిర్వర్తిస్తూ రుద్రపురియందు యథేచ్ఛగా విహరించసాగాడు. అట్లా రుద్రుడుగా ఉండగా ఒక రోజు తన జ్ఞానైశ్వర్య ప్రభావం చేత ఒక్కసారి తనయొక్క సుదీర్ఘమైన పూర్వజన్మలన్నీ అవలోకించసాగాడు. ఆతడప్పుడు ఆవరణశూన్యమైన జ్ఞానశరీరమున వెలయు చున్నాడు. అట్టి జ్ఞానావరణ నుండి తను జీవట ఉపాధికి ముందు - వెనుక ఎత్తిన అనేక పూర్వ జన్మలవైపు ఒక్కసారి దృష్టి సారించి, ఇట్లు తలపోయసాగాడు.
జీవటరుద్రుడు: ఆహా! 'చిత్తవృత్తులను అవలంబించాలి' అని అనుకుని ఎన్ని దేహములలో ప్రయాణించి వచ్చాను. ఈ మాయ ఎంత చిత్రమైనది? జ్ఞానానందమయ స్వరూపుడగు నాకు జన్మ ఏమిటి? మృత్యువేమిటి? ఎండమావులలో జలం ఉండునట్లు ఈ మాయకు వాస్తవమైన ఉనికియే లేదు. కాని, అత్యంత ఘనీభూతమై ఉన్నట్లు అనుభూతిని కలిగించగల శక్తి ఈ మాయ కలిగియున్నది. అట్టి శక్తి ద్వారా ఈ విశ్వమునంతటినీ మోహింపజేయగలుగుతోంది. 'పారమార్థిక చిత్' స్వరూపుడగు నాకు అనేకసార్లు అనేక సంకల్పసమూహములు ఉదయించాయి. ఆ సంకల్పములు ఆయా పంచభూత సముదాయములను నిర్మించుకుంటూ త్యజిస్తూ ఈ సంసారవనంలో పచార్లు చేసి ఇక్కడికి వచ్చాయి. సర్వశక్తిమంతుడనగు నా యొక్క చిదంశము ఒకవైపు చెక్కుచెదరక ఉన్నది. మరొక వైపు నా జడంశమునకు ఈ ఆకాశాది విభాగములు ఒనర్చబడుచున్నాయి. నేను స్వీయస్వేచ్ఛాఉపక్రమమును ఆశ్రయించి చిదాభాసుడనై ఈ స్థూల - సూక్ష్మదేహములలో సమష్టి - వ్యష్టితత్త్వములుగా వెలయటం జరిగింది. నా యొక్క జడంశము సూక్ష్మ - స్థూలములగు తన్మాత్ర విభాగములుగా పరిణామం పొందింది. ఆయా దేహముల వాసనావైచిత్ర్యములను అనుసరించి రంగుల మేళవంలాగా హావ భావ -రూప-గుణ వైచిత్ర్యములను ప్రదర్శించింది. నేను జ్ఞానినై ఉండి కూడా ఆయా సమయ సందర్భాలలో ఆయా ఉపాధి సంబంధితమైన తాదాత్మ్యము ప్రకటించాను. దేహభావమును స్వీకరించిన సమయంలో నా యొక్క అనంత స్వరూపమును కించిత్ ఏమరచినవాడనై ఆయా ఉపాధులలో కునుకులు తీశాను. ప్రతి ఒక్క ఉపాధీ తన చుట్టూ ఒక్కొక్క ప్రత్యేకమైన సృష్టిని పొందింది. కొన్ని కొన్ని సంబంధ-బాంధవ్యములను ఆస్వాదించింది. ఇట్లా అనేక సృష్టులలో ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ నా వెంట ‘విషయములు’ అనే అభ్యాసమును తెచ్చిపెట్టుకున్నాను. అయితే కొన్ని కొన్ని సృష్టులలో
Page:237
(జన్మలలో) నిర్వర్తించిన శమదమాది సాధన సంపత్తి కూడా నా వెంటనంటి వచ్చింది. ఇప్పుడు నేను విషయరహితుడను కావాలి కదా! అందుచేత నా వెంటనంటి ఉన్న సాధన సంపత్తికి తోడుగా మరికొంత సాధనధనాన్ని సంపాదించి తద్వారా మరికొంతగా విషయములను అధిగమిస్తాను.
రుద్రత్వ సంకల్పావరణను ఆశ్రయించి ఉన్న ఆ పరివ్రాజకుడు ఒకచోట పద్మాసనాశీనుడైనాడు. గతించిన ఆవరణలను విజ్ఞానబలంచే పఠించి మహత్తరమైన అవగాహనను పొంది మహాస్థైర్యం పొందాడు. 'ఇక త్యజింవలసినది త్యజిస్తాను' అను నిమగ్నములో ప్రవేశించాడు.
మొట్టమొదట స్థూలదేహావయవములైన ఈ కాళ్ళు, చేతులు మొదలైన వాటిని 'వీటితో నాకు సంబంధమే లేదు’ అను అప్రమేయత్వాన్ని స్వీకరించాడు. ఆ తరువాత సూక్ష్మదేహావయవములైన మనో - ప్రాణాదులను కూడా అధిగమించాడు. బహిరంగ విషయములగు బాహ్యవిషయాలాపన మొదలైన బాహ్య సంసక్తిక స్వభావమును దాటివేశాడు. "అంతర్యామియగు తత్త్వాన్ని ఆరాధిస్తున్నాను” అనురూపంలో ఉండే తత్త్వ - ఆరాధనలను కూడా అధిగమించాడు.
తానే సర్వాత్మకుడయ్యాడు. తక్కిన స్వభావములన్నిటికీ అసంబంధితుడైనాడు.
శ్రీరాముడు: అట్టి విషయత్యాజ్య - అనుభవగ్రాహ్యాలను ఎట్టి మంత్ర తంత్ర - - ఉపాసన -
సాధనలను ఆశ్రయించకుండానే ఆ పరివ్రాజకుడు సంపాదించాడా?
శ్రీవసిష్ఠ మహర్షి: ఈ చిత్తమునకు ఒక లక్షణమున్నది. అది ఎప్పుడు దేనిని దృఢంగా భావన చేస్తే అప్పుడు అట్లే పరిణమిస్తుంది. భావానుగత అనుభవములుగా నూతన భావనలో ప్రవేశిస్తూ క్షణంలో క్రితం భావనను తనయందు విలీనం చేసుకోగలదు. చిత్తంలో ఆ మహత్తర శక్తి పొందుపరచబడి ఉన్నది.
శ్రీరాముడు: ప్రతి ఒక్కరి చిత్తమునకు మీరు చెప్పిన మహత్తర శక్తి ఉన్నది కదా?
శ్రీవసిష్ఠ మహర్షి: అవును ఉన్నది. అయితే అనేక ఇంద్రియ - దృశ్య - భావవిషయాలను ఆశ్రయించే వారి చిత్తము అతిచంచలమై ఉండటంచేత తాను ఉద్దేశించినట్లుగా ఎక్కడా ఏదీ పొందటానికి అశక్తత చెందుతోంది. అందుచేత సాధకులు చిత్తమునకు ఏకాగ్రత అభ్యసింపజేస్తేగాని సంసారమును జయించలేరు. ఈ జీవుడు సాధనచే తన భావాలు తనకు శ్రేయోదాయకులగు సేవకులుగా ప్రవర్తింపజేయగలడు. సాధన కొరవడినప్పుడో, ఈ జీవుడు తానే తన భావాలకు సేవకుడగుచున్నాడు.
చిత్తము యొక్క దేహము చింతనయే కదా! ఒకడు పరస్పర భావములలో ఏది ఎక్కువగా చింతన చేస్తే అదియే ఆ చిత్తమునకు సంప్రాప్తిస్తూ ఉంటోంది.
ఆ జీవటరుద్రుడు ఆత్మసిద్ధిని పొందికూడా కించిత్ శాస్త్ర విరుద్ధమైన లౌకిక వాసన శేషించటం చేత తన గతించిన దేహములందు క్రీడలాగా, లీలాగా మరల పరిభ్రమించాడు.
Page:238
భక్తి సాధనములు, శాస్త్ర అధ్యయనములు నిర్వర్తించే బ్రాహ్మణ దేహమునందు, సామంతరాజ దేహమునందు, అప్సరస, లేడి, తుమ్మెద, ఏనుగు దేహ భావములందు, అట్లాగే తదితర ఉపాధులందు, ...ప్రవేశించటం, అప్పటి వాసనలను ప్రదర్శించటం, బయల్వెడటం... మొదలైనవి క్రీడించాడు. జీవట రుద్రుడు: ఆహా! సత్యము వలె భాసించే ఈ సంసారారణ్యంలో అనేక మానసిక సృష్టులలో ప్రవేశించి అనేక దశలను అనుభవించాను. నా యొక్క బ్రహ్మస్వరూపం నుండి చ్యుతుడనై వేలాది సంవత్సరాలు, వందలాది చాతుర్యుగాలు గడిపాను. భిక్షుకుని ఉపాధి ధరించి ఉండగా బ్రహ్మజ్ఞానానికి కొంచెం అర్హత సంపాదించుకున్నాను. మరల, అక్కడి నుండి కూడా సంసారం మీద ఉత్సుకతచే ప్రమాదవశంగా భావనాసముద్ర తరంగాలలో అనేక జన్మపరంపరలు గడిపాను. రాజహంస - మానసిక జగత్తులో ప్రవేశించినప్పుడు భగవంతుడగు బ్రహ్మదేవునితో ఏర్పడిన సత్సాంగత్యం చేత ఆత్మస్వరూప జ్ఞానం వికసించింది కదా! పూర్వాభ్యాసాలన్నీ జ్ఞానయోగంచే ఫలించగా ఇట్లు రుద్రుడ నయ్యాను. జీవటుడుగా అత్యంత దృఢమైన శాస్త్రీయ సాధనాభ్యాసం నిర్వర్తించాను. అయినా కూడా ఒకింత 'మాయపట్ల అభిలాష' అను చ్యుతి ఘటిల్లినందుకు ఫలితంగా ఇట్లు అత్యంత వివశములైన, విరసములైన యోనులలో పరిభ్రమించవలసి వచ్చింది. ఏదిఏమైనా కూడా శాస్త్ర ప్రవచితాభ్యాసమే జీవుని యందు విజయముగా మార్గప్రదమౌతుంది. 'సత్యమేవ జయతే' అని శాస్త్రకారులు చెప్పియే ఉన్నారు కదా! సత్యము మాత్రమే జీవుని కాపాడగలదు. కాకతాళీయన్యాయం చేత ఈ జీవునకు సాధుజన సంగం లభిస్తోంది. అట్టి సాధుజన సంగం సద్వినియోగ పరచుకున్న జీవుడు దృశ్యాతీతత్వం సాధించగలుగుచున్నాడు. దృశ్యాతీతం యొక్క అభ్యాసబలం చేత వాసనలు జయించబడుచున్నాయి. ఏ అశుభవాసనలైతే ఈ జీవుల అంతరంగంలో దాగి ఉన్నాయో, అవి ప్రయత్నపరుల యందు మాత్రమే క్షీణిస్తున్నాయి. అందుచేత పురుషప్రయత్నమే శ్రేయోదాయకం.
పూర్వ - తత్పూర్వ జన్మలలో ఏదేది నిరంతరంగా అభ్యసించబడుతోందో... అదియే దృష్టికి సత్యముగా తోచటం జరుగుతోంది. శుభచింతనాభ్యాసం వలన అశుభచింతనలు తొలగుతాయి.
ఏదేది జాగ్రత్ - స్వప్నములందు సుదృఢంగా భావిస్తామో అదియే సత్యముగా అనుభూత మవుతోంది. అంతేగాని, ఇందులో మరొకరెవరిదో పాత్ర లేదు. “నన్ను ఎవరో భ్రమింపజేస్తున్నారు” అని అనుకుంటే అది భ్రమ మాత్రమే. తత్త్వ చింతనచేతనే నాకు ఈ పరిశీలనా సామర్థ్యం లభించింది. కల్పితమైన దేవార్చన మొదలైనవే ఫలప్రదాతలగుచుండగా తత్త్వచింతన శుభప్రదం కాకుండా పోతుందా? అయి తీరుతుంది.
నా యొక్క చ్యుతికి కారణమేమిటి? ఆత్మతత్త్వవిచారణను ఏమరచి శాస్త్రములలోని అనాత్మ విభాగపు విషయములకు గ్రుడ్డిగా పరిమితుడనగుట చేతనే. ఫలితంగా, సుఖ - - దుఃఖమిశ్రితములగు ప్రయోజనములచే పరిమితుడనయ్యాను. వాటి వలన అవిచ్ఛిన్నమగు ప్రయోజనం కలుగలేదు.
అసలీ సంసారము యొక్క చింతన - భావనలు కొంచెం ఆశ్రయించినంత మాత్రం చేతనే సుదీర్ఘ ఉపాధిపరంపరా ప్రహసనమంతా వచ్చి పడుతోంది. భావన - చింతన త్యజించటం చేత
Page:239
అనర్థములన్నీ జయించబడుచున్నాయి. భావన - చింతన ఉన్నంత వరకూ దేవతా ఉపాధులు కూడా ఉత్కృష్టతను ప్రసాదించలేవని తేలిపోయింది.
ఎంత ఆశ్చర్యం! తన స్వరూప స్వభావములను ఏమరచిన ఈ జీవుడు 'ఈ శరీరమే నా స్వభావం' అని నమ్ముకుని ఉండటం సంభవిస్తోంది. అసత్యభావములను ఆశ్రయించటంచేత ఆత్మ స్వరూపుడగు ఈ జీవుడు తనను తాను అనేక నీచస్థితులకు, తుచ్ఛ ఉపాధులకు దుఃఖ పరంపరలకు మోసుకెళ్ళుచున్నాడు. తత్త్వదృష్టితో చూస్తే... ఉపాధులూ లేవు, జన్మమృత్యువులూ లేవు. ఈ ఉపాధులు, వాటి సంబంధిత వ్యవహారాదులు మధ్యలో వస్తున్నాయి. మధ్యలోనే పోతున్నాయి. భూత - -
భవిష్యత్ - వర్తమానములచే స్పృశించబడనిదేదైనా ఉంటే అది నా స్వస్వరూపమగు ఆత్మ ఒక్కటే. సత్ - చిత్ స్వరూపుడనగు నాకు ఇట్టి అసత్ అగు ఉపాధులతో సంపర్కం కలగటమేమిటి? నేను ఈ దృశ్య జగత్తుతో అనుబంధం కలిగి ఉండటమేమిటి? ఆకాశంలోని నీలపువర్ణం భ్రమమాత్రమే అయినట్లు... జగత్మ అజ్ఞాన కారణంగానే ఉదయిస్తోంది.
కనుక 'సాధన' అనేది ఆత్మను పొందటానికి అవసరం లేదు. అనాత్మ విషయములందు అభిలాష తొలగటానికి మాత్రమే సాధన యొక్క అవసరం.
ఈ జగత్తు యొక్క వాస్తవరూపం బ్రహ్మమే. ఇద్దాని అసన్మయసత్త పరబ్రహ్మమునందే అకారణంగా బహుశః వినోదార్థమై ఏర్పడి ఉంటోంది. కనుక ఈ కల్పనలు బ్రహ్మమే స్వరూపముగా గల నన్నేం చేస్తాయి? ఇప్పుడు నేను చూచిన (నిద్రకుపక్రమించినప్పటి ) దేహములన్నీ వినోదార్థమై ఏర్పడి సమ్యక్ జ్ఞానప్రకాశము వలన నా స్వరూపమునందే ఏకీకృతం కాగలవు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఈ విధంగా చింతిస్తూ ఆ భిక్షుకుడు “కల్పనారాజ్యము” అనతగిన - తాను నిద్రపొందిన - అనేక ఉపాధులలో మరొకసారి పచార్లు చేసివచ్చి తిరిగి రుద్ర ఉపాధిలో ప్రవేశిం చాడు. అతడు సత్యసంకల్పుడవటం చేత అతని క్రితం 99 జన్మలలోని స్వప్నతుల్య సత్తు ఒక్కసారి అనువృత్తమయింది. అతను జ్ఞానలాభం పొంది ఉండుటచేత తన యొక్క రుద్రత్వం, జీవజటాడి పూర్వదేహములు ఒకేసారి వీక్షించగలిగాడు.
4. వివిధ ఉపాధుల సమావేశం
శ్రీవసిష్ఠ మహర్షి: ఇప్పుడు 'రుద్రుడు' అను ఉపాధి - అనుభవములలో సన్న్యాసి భిక్షువు ఉన్నాడు కదా! అట్టి ఉపాధితో మరల రుద్రలోకమునుండి బయలుదేరాడు. తన యొక్క తాత్వికబలం చేత జీవటుడు ఉన్న బ్రహ్మాండంలో ప్రవేశించాడు. జీవటుడు ఉన్న ప్రదేశం చేరాడు. జీవట భిక్షువును సమాధి నుంచి ఉత్థానపరిచాడు. ఆ ఇద్దరు కలసి త్రాగుబోతును సమీపించారు. జీవట త్రాగుబోతు ఆ సమయంలో సుష్టుగా తేనె, మద్యం త్రాగి నిదురిస్తున్నాడు కదా! రుద్రుడు జీవటభిక్షువు ఆ
Page:240
జీవట త్రాగుబోతును నిదురలేపాడు. ఆ ముగ్గురి చైతన్యం ఒక్కటే అయినప్పటికీ మాయ యొక్క భావావేశం చేత అది ముగ్గురు వ్యక్తులైనట్లుగా ప్రకటన - ప్రవర్తనలు కలిగి ఉన్నది.
భిక్షువు, త్రాగుబోతు, రుద్రుడు - ఒకరితో ఒకరు కొద్దిసేపు సంభాషించుకుని ఇక అక్కడి నుండి బయలుదేరారు. ఆ ముగ్గురూ చిదాకాశమునందు గల మరొక పాంచభౌతిక బ్రహ్మాండంలో ప్రవేశించారు. బ్రాహ్మణ యువకుని సమీపించారు.
ఆ విప్రుడు కూడా జీవటుని మనస్సు యొక్క పరిణామమేకదా! ఆ విప్రుడు ఉన్న ప్రదేశం అనేక ప్రాణుల శబ్దములతో నిండియున్నది. ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఏకశయ్యపై నిదురించి ఉన్నాడు. ఆ విప్రుని భార్య 'ఈ నా భర్త నా బహిర్ ప్రాణం' అను భావనతో, నిదురపోతూనే, తన భర్త యొక్క కంఠమును ఆలింగనమొనర్చుకుని ఉన్నది. రుద్ర, జీవట, భిక్షువులు తమ యొక్క చైతన్యత్వమును ఉపయోగించి ఆ విప్రుని ప్రబుద్ధుని చేశారు. అప్పుడా విప్రుడు ముగ్గురినీ చూచి తనను చూచుకొని కించిత్ విస్మయ పరవశుడైనాడు. రుద్రునితో బోధింపబడి, విషయమంతా గ్రహించి ఉద్వేగరహితుడైనాడు.
ఆ తరువాత ఆ రుద్ర - జీవట - ద్రిమ్మర - విప్రులు నలుగురు అక్కడి నుండి బయలుదేరారు. 'చిదాకాశము యొక్క చిత్త వికృతి' అనతగ్గ మరొక బ్రహ్మాండలో ప్రవేశించారు. అక్కడ గల సామంత రాజు నిద్రించి ఉన్న ద్వీపంలో ప్రవేశించారు. బంగారు ఛాయతో అంతఃపురంలో నిద్రిస్తున్న ఆ సామంతరాజును తమ యొక్క చిత్తచైతన్యం సహాయంతో ప్రబుద్ధుని చేశారు. ఇప్పుడా ఐదుగురు ఐదుగురైనప్పటికీ ఏకభావముననే వెలయుచున్నారు. అదే విధంగా ఆ ఐదుగురు సామ్రాట్టును సమీపించి అతనిని నిదురలేపారు.
అట్లే వారు తమ సూక్ష్మ శరీరంతో తక్కిన ప్రపంచములందు తిరుగుతూ అక్కడక్కడ నిద్రించియున్న తదితర జీవట చైతన్య ఛాయలనన్నిటినీ ప్రబుద్ధం చేశారు. మృతులైన వారిని, నిద్రించే వారిని కూడా మేల్కొలిపారు. వారందరి చిత్తమంతా 'బ్రహ్మహంస'గా పరిణామం పొంది రుద్రభాసమును పొందారు. రుద్రుని చిత్త-చేతనాంశాలు వారి చిత్రాలను చేతనమొనర్చాయి కదా! వారి దేహాలన్నీ జ్ఞానైశ్వర్యంచే ఆశ్రయించబడ్డాయి. వారంతా శతసంఖ్యాక రుద్రులై విరాజిల్లారు.
శ్రీరాముడు : స్వామీ! 'జీవటుడు' అనుపేరుగల జీవుడు ఒక్కడే అయిఉండి వంద ఉపాధులు వేరు వేరుగా ఎట్లా కలిగి ఉన్నాడు. ఒకే సమయంలో ఆ వంద ఉపాధులు వేరు వేరుగా ఎట్లా ఉద్బోధ పొందగలిగాయి? ఇది విచిత్రంగా ఉన్నదే!
శ్రీవసిష్ఠ మహర్షి: చైతన్యము అనంత శక్తియుతము. ఈ 'శతరుద్రీయకథనం' అనబడే జీవటుని చైతన్యము యొక్క శతాది ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం, ఉపక్రమించి ఆ సమయంలో మరొక ఉపాధిని ఉత్తేజపరచటం... ఇదంతా చైతన్యమునందు సాధ్యమే.
పరమేశ్వరుని ఐశ్వర్యము ఇట్టిదే సుమా! అతడు ఏకమే అయి ఉండి అనేకములందు వివిధ రీతులుగా ప్రతిబింబిస్తున్నాడు. 'జ్ఞానము' అనునది ఒక్కటే అయినప్పటికీ అది వివిధ శరీరములందు
Page:241
ఉండి వేరు వేరు జ్ఞేయములను ఆస్వాదిస్తోంది. సూర్యుని ప్రకాశము ఒక్కటే అయినప్పటికీ అందులోంచి బయలుదేరిన వేరువేరు కిరణములు వేరు వేరు వస్తువులపై ప్రసరించి ప్రకాశింపజేస్తున్నాయి. జలం ఒక్కటే అయినా అసంఖ్యాక తరంగాలుగా ప్రకటితమౌతోంది. అగ్ని 'ఒక్కటే' అయిఉండికూడా, అనేకచోట్ల వేరువేరు దీపములను వెలిగించుచు వేరువేరు దృశ్యవిషయములపై కాంతిని ప్రసరింపజేస్తోంది కదా! అట్టి "ఏకము నుండి అనేకము” అను చమత్కారం విశదీకరించటానికే మనం ఇక్కడ ఈ శతరుద్రీయం చెప్పుకుంటున్నాం.
మనం చెప్పుకుంటున్న ఆ శతరుద్రీయమూర్తి ఆవరణ శూన్యమగు చిన్మయ స్వరూపమున విరాజిల్లుచున్నాడు. ఆతడు పరిశుద్ధ స్వరూపమును ఆశ్రయించుట ద్వారా ఈ జగత్తులో అంతర్యామి అయ్యాడు. ఈ ప్రాతిభాసిక జగత్తుకు ఆధారుడయ్యాడు. ఓ రామచంద్రా! ఈ విధంగా చిదాకాశంలో వందలకొలది శతరుద్రమూర్తులు వెలయుచున్నారు. నీకు - నాకు ఇప్పుడు ఇక్కడ అనుభూతమయ్యే ఈ వర్తమాన జగత్తు భిక్ష - రుద్రకల్పితమైన జగత్శతములలో పదకొండవది.
శ్రీరాముడు: మహర్షీ! ఆ జీవటుడు ఏ విధంగా వందలకొలది ఉపాధులలో ప్రవేశించాడో అదే విధంగా ప్రతిజీవుడు తన సుదీర్ఘ సంచారంలో అనేక ఉపాధులలో ప్రవేశించటం, నిష్క్రమించటం చేస్తున్నాడు కదా! అంటే అతనిలో కూడా జీవటుని లాగానే వివిధ అంతర్గత జీవులు వ్యక్తిగతమైన వివిధ ప్రపంచములను దర్శించటం జరుగుచున్నది కదా! ఆ వివిధ జీవులు అంతర్గత జీవులు ఒకరితో మరొకరు కలవటం ఎప్పుడైనా జరుగగలదా?
శ్రీవసిష్ఠ మహర్షి: సంసార జీవుడు తానున్న దానిలో భ్రాంతిచే బద్దుడై ఉంటున్నాడు. అందుచేత తన స్వరూపాలైన తదితర జీవులను కలియలేకపోతున్నాడు. ఈ జీవుడెప్పుడు జ్ఞానంచే ప్రబుద్ధు డవుతాడో, అప్పుడు “నేను ఇన్ని రూపములుగా ఉంటున్నాను' అను నూతనానుభవంలో ప్రవేశించ గలడు. ఈ వేరు వేరుగా కనిపించే జీవులన్నీ జ్ఞానియందే ఉంటాయి. వాటన్నిటిలో తానే ఉంటాడు. జ్ఞాని కానంత వరకు అట్టి అనుభవం దుర్లభం. మనం చెప్పుకున్న ఆ భిక్షుకుడు ప్రబుద్ధుడైనాడు. ఎవ్వరిలో తత్త్వజ్ఞానం ఉదయిస్తుందో అట్టివారు 'సముద్రములోని వేలాది తరంగాలలోని ఒకే జలం' ..లాగా సర్వజీవులలోని ఏకాకారమును అనునిత్యం వీక్షించగలుగుచున్నారు. ఇక అప్రబుద్ధులైన వారంటావా... వారు ఈ దృశ్యములో గల స్థూల విషయములకు బద్ధులై గ్రహించుచు, 'ఆత్మ యొక్క ఏకాకృతిని' గ్రహించలేకపోతున్నారు.
జలం యొక్క ద్రవత్వం చేత ఒక తరంగం, మరొక తరంగంతో పూర్ణంగా కలిసే విధంగా, స్థూలబుద్ధి తొలగుటచే ఇతఃపూర్వపు ఉపాధుల పరస్పర సమ్మేళనం సంభవిస్తోంది. ప్రబుద్ధ జీవులు తమ యొక్క చిన్మాత్రసమైక్యతా స్వభావంచే తదితర జీవులతో పరస్పరత్వం పూర్ణంగా పొందగలుగు చున్నారు.
ఈ ‘సంసృతి’యందు మనకు కనబడుచున్న నానావిధ జీవజాతమంతా నిజానికి కల్పితము, అసత్యం అయి ఉన్నాయి. ఈ జీవులంతా సర్వవ్యాపియగు చితశక్తియందే ఉండి ఉన్నారు. అందుచేత
Page:242
చితశక్తి వలెనే ఇవి కూడా సత్యమువలె తోచుచున్నాయి. ఎప్పుడైతే ఈ జీవుడు సర్వజీవుల తత్త్వమైన ఆ పరబ్రహ్మముతో ఐక్యమొందుతాడో... అప్పుడు, ‘బ్రహ్మము తప్పితే మరింకేమీ లేదు. తదితరంగా అగుపించేదంతా స్వయంకల్పితమైన భ్రమమాత్రమే' అని గ్రహిస్తాడు. అప్పుడట్టి విజ్ఞానం సముపార్జిం చిన ద్రష్టకు తదితర జీవులతో ఒకానొక అంతర్గతమైన పరస్పర సమ్మేళనం లభిస్తోంది. భూమిని ఎక్కడ త్రవ్వితే అక్కడ సర్వవ్యాపకమగు ఆకాశం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా! స్వయమాత్మానుభవులకు సర్వవైపులా స్వస్వరూపమే తాండవిస్తూ ఉంటుంది.
ఓ రామా! సర్వవ్యాపకము, సత్యము అయినట్టి చైతన్యము యొక్క అభ్యాసబలంచే తత్త్వ దర్శనముచే తదితరమైనదంతా లయిస్తుంది. ఏ మనోబుద్ధి - చిత్త - అహంకారములు నిరోధించాలని జనులు అనుకుంటున్నారో, అదంతా కూడా నిర్మల హృదయులగు సర్వజ్ఞులకు చిన్మాత్రము (లేక) నిర్మల చైతన్యముగానే అనుభవమౌతోంది. అనేక బంతులలో నిండి ఉన్న గాలి ఒకే గాలి కదా! వివిధ నదులలో లభించే జలం వాస్తవానికి జలం దృష్ట్యా ఒక్కటే కదా! వేరు వేరు వస్తువులు వేరు వేరు చోట్ల తగలబడుచుండవచ్చు గాక! 'అగ్ని' సర్వదా ఒక్కటే కదా! వివిధ ప్రదేశములలో వివిధ ధర్మములు గల పదార్థజాలం ఉండవచ్చు గాక! కానీ, ఆకాశం ఒక్కటే కదా!
అట్లాగే సర్వభూతములందలి ఆత్మసత్త ఒక్కటే. ఒకే 'ఆత్మసత్తా చైతన్యతత్త్వం’ సర్వత్రా వెలయుచున్నదని అనుభూతమొనర్చుకో.
శిల ఒక్కటే అయినప్పటికీ ఒక శిల్పి అనేక ఆకారాలుగా మలచి చిత్ర విచిత్ర శిల్పాలుగా తయారుచేసి మన ముందు ఉంచుతున్నాడు. మనం వాటినన్నిటినీ చూచి 'ఆహా! గొప్ప కళాకారుడే!’ అని సంతోషిస్తున్నాం. అట్లాగే ఏకైక చిద్రూపమే ఈ విస్తార జగత్తుగా వెలయుచున్నది. శ్రీరాముడు: మహర్షీ! ఈ జగత్తు వస్తుతః ఏమై ఉన్నది?
శ్రీవసిష్ఠ మహర్షి: 'ఇంద్రియాదులకు విషయమే కానట్టి, శుద్ధమైన - - చిదేకరసమైన పరబ్రహ్మమునందు మనస్సుననుసరించి స్ఫురించే విషయరూపమైన అన్యధాజ్ఞానమే జగత్తు'... అనునదే ఈ జగత్తుకు నిర్వచనం. ఈ జగదాకార మనోజడత్వమంతా కారణమంటూ లేనిదే అగుచూ 'ఆకాశము నందు శూన్యము’ అను చమత్కారంలాగా వర్తించుచున్నది. చూచువానిలో కలుగు మిథ్యాజ్ఞానం కాకుండా ఈ జగత్తుకు వేరే కారణమంటూ ఏదీ లేదు.
5. దృశ్య వృత్తి - దృశ్య నిర్వృత్తి
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఇప్పుడు ఒక పరమ సత్యమును ప్రతిపాదిస్తున్నాను.... విను.
ఈ దృశ్యమును గూర్చిన వృత్తియే బంధము. దృశ్యజ్ఞాననిర్వృత్తియే మోక్షము. అంటే... 'ఈ దృశ్యములో నేను ఒకానొక వస్తువును గాని, విషయమును గాని కాను. ఈ దృశ్యము నా యందు విషయము కాదు' అను సర్వ సంబంధాతీతమైన జ్ఞానమునే మోక్షజ్ఞానం అని పిలుస్తున్నారు.
Page:243
1. ఇవేమి నేను కాదు, 2. ఇదంతా నేనే ఈ రెండిటిలో నీకు ఏది నచ్చితే అద్దానిని శీఘ్రంగా దృఢతరం చేసుకో.
అంతేకాదు... సృష్టి-అసృష్టి, బంధం-మోక్షం, జ్ఞానం - జ్ఞానం యొక్క అభావం... ఇవన్నీ కూడా సాక్షి యొక్క జ్ఞానస్వభావాలు మాత్రమే కనుక అవి సాక్షికి అభిన్నాలే. ద్రష్టను బట్టే దృశ్యాలు ఉంటున్నాయి. ద్రష్ట కంటే అవి వేరుగా ఉన్నాయని ఎవరూ నిరూపించలేరు. ఇది స్పష్టంగా తెలుసుకున్నవాడవై ఆ తరువాత ఇక నీ ఇచ్ఛ వచ్చినట్లు ఈ జగత్తులో సంచరించు.
ఈ జగత్తు అనబడేది చూడనంతమాత్రం చేత లేకుండా పోగలదు. అట్టి దీని గురించి ప్రయాస ఎందుకో చెప్పు? ఈ జగత్తును త్యజించినప్పటికీ ఏ స్వసత్త శేషించియే ఉంటోందో... అది ఎప్పటికీ, ఎల్లస్థానము లందూ లభించియే ఉన్నదని గ్రహించు.
ఈ జగత్తు అనేది దీనిని స్మరించుట చేతనే కనబడుతోంది... స్మరించబడనప్పుడు లేకుండా పోతోంది.
ఈ జగత్తుకు సాక్షియగు నీ స్వస్వరూపుడు అట్టి సంస్మరణ - - విస్మరణలకు కర్త అయి కర్తృత్వ - అకర్తృత్వ స్వభావుడై ఉన్నాడు. అతడు జగత్తు ఉన్నప్పుడూ ఉన్నాడు. జగత్తు లేనప్పుడూ ఉన్నాడు. అతనిని స్పష్టీకరించుకున్నవాడవై ఆ తరువాత ఈ జగత్తునందు నీ ఇష్టమైనదానిని ఆశ్రయించు.
తరంగము నీటి యొక్క స్పందమే కదా! ఈ జగత్తు కూడా నీ స్వస్వరూపమగు ‘చిత్తు’ యొక్క హృదయ స్పందన మాత్రమే. స్వస్వరూపభావము నుండి ఏర్పడిన కించిత్ 'చ్యుతి’ మాత్రమే! జల - - తరంగములకు గల భేదమే బ్రహ్మము - జగత్తులకు ఉన్నది.
అనగా, ఏమిటి?... ఈ జగత్తుకు, బ్రహ్మమునకు సత్యదృష్టిలో అసలు భేదమే ఉండి ఉండలేదు. నీటియందు మొట్టమొదట 'తరంగములు' అనేవి లేవు. ఆ తరువాత కూడా లేవు. చూచువాడు నీటి యొక్క చలనవ్యవస్థకు 'తరంగములు' అను పేరు పెట్టి పిలుచుచున్నాడు. 'తరంగములన్నీ జలం మాత్రమే’... అను విషయం మరచుచున్నాడు. అలాగే, బ్రహ్మమునందు మొట్టమొదట ఈ జగత్తు లేదు. ఇప్పుడూ లేదు. తరువాత కూడా లేదు. కానీ అజ్ఞానదృష్టి కలిగియున్న వాడు మాత్రం తన యొక్క ఆరోపణ దృష్టి చే ఈ కార్యభూతమగు జగత్తును పరిగణించుచున్నాడు. కనుక ఈ జగత్తు ‘వేదన’ వలన లభిస్తోందని, 'వేదనాక్షయం' చేత ఇక్కడేమీ లేదని తత్ప్రయత్నపరులు ఎరిగియే ఉన్నారు. ఈ సభలోని అనేకమంది విజ్ఞులు ఈ విషయం తెలుసుకొనియే ఉన్నారు.
కాబట్టి "స్వయం ప్రకాశ ఆత్మరూపము - చైతన్యమాత్రము అగు బ్రహ్మమే అవిద్యావరణము స్వస్వరూపమును ఏమరచి జగత్తు స్వరూపంగా కల్పించుకొనుచున్నది”... అనునదే ఇక్కడ సిద్దాంతము. 'చిత్' రూపమగు పరమాత్మయొక్క పారమార్థిక స్వరూపం జ్ఞానమయమేగాని, జడం కాదు. ఇక ఈ జగత్తు అంటావా?... ఇదంతా ద్రష్ట యొక్క భేదభావము వలన కల్పించబడినది మాత్రమే!
Page:244
ఓ రామచంద్రా! అట్టి భేదభావమును శ్రుతులు చెప్పుచున్న ఉపాయములను అనుసరించి క్రమక్రమంగా ఉపసంహరించుకో. అప్పుడు 'ఈ జగత్తు కేవలం నామమాత్రం’... అని గ్రహించ గలవు. అట్టి నామమాత్రమైనది కూడా బ్రహ్మమున లేదు. అది సర్వదా ప్రశాంతము, శివస్వరూపము, నిష్కళంకము అయి ఉన్నదని గ్రహించు.
ఈ జగత్తంతా సర్వదా ఆత్మచైతన్యమే ఉన్నది. 'జగత్తు యొక్క శబ్ద - అర్థములు బ్రహ్మము కంటే వేరైనదేదో కాదు’... అని మరొక్కసారి ప్రకటిస్తున్నాను. జగత్తు - బ్రహ్మము అనబడే రెండు వస్తువులు ఏనాడూ లేవు. తరంగ జలము లనబడే రెండు వస్తువులు ఏనాడైనా ఉన్నాయా? శ్రీరాముడు: అవట్లా జీవునకు ఎందుకు స్ఫురిస్తున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి: చెప్పాను కదా! కేవలం అజ్ఞానమే అందుకు కారణం. అజ్ఞానమనేది సత్యమును పరిశీలించక పోవటం చేతనే కలుగుతోంది. పరిశీలించక పోవటమనేది ప్రయత్నలోపం వలన, విషయములందు చిక్కిన మనస్సు ప్రబుద్ధం కాకపోవటం చేత సంభవిస్తోంది. అజ్ఞానావస్థలో కనిపించే ద్వైతము జ్ఞానము వికసించగానే తొలగిపోవుచుండగా... ఇక జగత్ - బ్రహ్మములకు ద్వైతము ఎట్లా ఆపాదించగలవు చెప్పు? కాబట్టి జగద్భమ తొలగటం, సంసారమును దాటటం, మోక్షమును పొందటం... ఇవన్నీ శిష్యునిలో సత్యదృష్టిని నిదురలేవటానికే చెప్పుచున్నాం. అంతేగాని, అవన్నీ వాస్తవానికి అసంగతములే.
6. గణపతిత్వం
శ్రీరాముడు: మునీశ్వరా! మనం జీవట భిక్షుకుని స్వప్నోపాధుల గురించి ప్రస్తావించుకుంటున్నాం కదా! ఆతని జీవట - భిక్షు - బ్రాహ్మణ - హంసాది శరీరములకు ఆ తరువాత ఏమి సంభవించింది? శ్రీవసిష్ఠ మహర్షి: రుద్రుని ప్రేరేపణచే నిదురలేచిన జీవట-భిక్షు బ్రాహ్మణ-హంసాదులు రుద్రుని అనుసరించారు కదా! వారంతా పరస్పరములకు సంబంధించిన భూత భవిష్యత్ వర్తమాన వ్యాపారములను వీక్షించి కృతకృత్యులైనారు. నిర్వేదనచే సుఖవంతులైనారు.
అప్పుడు రుద్రుడు ‘నేను కొంతసేపు నిదురించెదను గాక!' అనుకున్నాడు. స్వాంశసంభూతులగు ఆ జీవటుడు, బ్రాహ్మణ యువకుడు, సామంతరాజు మొదలైనవారిని చూచి ఇట్లు ఆజ్ఞాపించాడు. శ్రీరుద్రుడు: ఓ జీవటాదులారా! మీరు మీమీ తావులకు వెళ్ళండి. అక్కడి మీ భార్య - పుత్రాది సహజీవులతో కొంతకాలం ఉండండి. మీ భోగవాసనలు తృప్తి పొందిన తరువాత తిరిగి నా దగ్గిరకు రండి. ఆ తరువాత మీరంతా నా అంశమున రుద్రనగరంలో రుద్రగణరూపాన్ని ధరించెదరు గాక! మహాప్రళయంలో ఈ జగత్తంతా క్షయం కాగానే మనమంతా కలిసి పరమపదమున ప్రవేశిద్దాం.
H H
Page:245
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రాఘవా! భగవంతుడగు రుద్రుడు వారందరినీ అట్లు ఆజ్ఞాపించి అంతర్ధాన మైనాడు. ఇక వారంతా అంతరమున రుద్రగణములుగా వెలయుచు, బాహ్యమునమాత్రం సంసార దర్శనమును చేయు సాక్షి రూపమును ధరించారు. తమ తమ సంసారములలో ప్రవేశించారు. అక్కడక్కడ గాఢనిద్రలో ఉన్న భౌతిక ఉపాధులను నిదురలేపారు. మరల యథాతథంగా 'భార్య ఆహారము - రాజ్యము - అను బంధములు' మొదలైన అనేక విషయములతో కూడిన సంసారమును అనుభవించసాగారు. ఇదీ, ఇప్పటి పరిస్థితి. వారంతా మరికొంతకాలం భోగములను అనుభవించ గలరు. ఆ తరువాత తమ శరీరానంతరం రుద్రలోకం పొందగలరు. ప్రమథగణంలో చేరి రుద్రభక్తులకు సుఖ-శాంతి-ఐశ్వర్యములు కలిగిస్తూ కొన్నాళ్ళు గణత్వము పొందుతారు. ఆకాశంలో దర్శనమిచ్చే నక్షత్ర మండలంలాగా వారు అప్పుడప్పుడూ లోకంలో అక్కడక్కడా భౌతిక రూపమున వెలయుచూ లోక కళ్యాణకారకులై జనులకు సాధన రూపంగా ప్రాప్తించగలరు.
7. సంకల్పిత దేహములు
శ్రీరాముడు: హే గురువర్యా! తమరు చెప్పిన జీవటరుద్రుని కథనం నాకు చాలా ఆశ్చర్యం గొలుపు తోంది. నాకు కొన్ని సందేహాలు కూడా కలుగుచున్నాయి. జీవట - బ్రాహ్మణ - — సామంతరాజాదులన్నీ ఆ భిక్షుకుని నిద్రకుపక్రమించినప్పటి స్వప్నతుల్యమైన సంకల్ప రూపములే కదా! అట్టి సంకల్ప రూపములు సత్యమై ఎట్లా భాసించాయి? సంకల్పము భౌతికంగా ఏర్పడటం, ఆయా బ్రహ్మాండముల లోని సంసారంలో తదితర జీవులతో సంయోగాదులు ఎలా ఒనగూడాయి?
శ్రీవసిష్ఠ మహర్షి: సర్వమునూ సర్వదా ఆక్రమించి ఉన్న (అధిష్ఠానమగు) చిత్ అంశము నందు ఈ భౌతిక-మానసిక జగత్తులు సత్యంవలె భాసిస్తున్నాయి. ఆద్యంత విద్వత్ దృష్టిచే చూస్తే ఈ సత్-అసత్ యుక్తములగు సంకల్పవిషయములకు స్వయంగా అస్థిత్వం లేదు. వాటికి అస్థిత్వం ఉన్నట్లు తోచటానికి కారణం ఏమిటంటావా? అవన్నీ దేనిపై ఆరోపించబడుచున్నాయో... అది నిత్యసత్యమగు బ్రహ్మం అగుట చేతనే!
ఆ సర్వము ఆత్మయే - అయితే జీవుల భోగదృష్టిని అనుసరించి ఈ సంకల్పిత విషయాలు క్రియాసామర్థ్యముతో అగుపడుచున్నాయి. ఈ సంకల్ప మాత్ర విషయములను నీవు వివేక బలంతో పరిత్యజించవలసి ఉన్నదని గ్రహించు.
స్వప్నంలో కనబడేవన్నీ కేవలం మానసిక సంకల్ప తరంగములు మాత్రమే కదా! సర్వకాలము లందూ అధిష్ఠానుభూతము అగు సత్చిత్ స్వరూపం స్వతఃగా స్వచ్ఛమై ఉండికూడా... ఈ దేశ - దేశాంతర ఆగమన - - నిష్క్రమణాది క్రియా వ్యవహారాలన్నీ తోపింపజేస్తోంది. అయితే అట్టి ఆరోపిత సమయంలో కూడా అయ్యది అధిష్ఠానముగానే వెలయుచున్నది సుమా! 'దేశము - దేశాంతరము’ అనబడేవి 1. ఇంద్రియపాటవము, 2. కాలము, 3. మార్గాణ్వేషి అనే మూడు ఒనగూడినప్పుడు మాత్రమే సంభవిస్తాయి కదా! అలాగే చిత్వస్తువు లేకపోతే స్వప్న - జాగ్రత్ సుషుప్తులు సంభవించవు.
Page:246
శ్రీరాముడు: ఓ మహర్షీ! ముక్కుకు సూటిగా అడుగుచున్నాను. ఈ దృశ్యరూపంగా పరిణమించేదంతా ఎట్లు, ఏ ప్రభావం చేత పరిఢవిల్లుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి: బ్రహ్మం సర్వాత్మకమైనది. తత్కారణంగా బ్రహ్మమే స్వరూపంగా గల ఈ అనుభవ స్వరూపుడగు జీవుని సంకల్పములను అనుసరించి పూర్వవాసనానుగతంగా ‘చిత్తము’ అనబడేది రూపుదిద్దుకుంటోంది. అట్టి చిత్తమునకు ఏదేది ఎప్పుడెప్పుడు పర్యాలోచితం అవుతుందో... అప్పుడప్పుడు అదంతా దృశ్యరూపముగా పొందబడుతోంది.
శ్రీరాముడు: ఒకడు ఏది సంకల్పిస్తే అది అట్లే దృశ్యరూపంగా పరిణమించగలదని మీ ఉద్దేశమా? శ్రీవసిష్ఠ మహర్షి: అవును. సంకల్పము ననుసరించే దృశ్యము ఉంటోంది, ఉండగలదు.
శ్రీరాముడు: అయితే, ఒకడు 'ఇది ఇట్లు ఉండుగాక' అని సంకల్పించాడనుకోండి. ఉదాహరణకు ఒకడు ఒక కొండను చూచి 'ఇది పిండి అగు గాక' అని సంకల్పించినంత మాత్రంచేత అది పిండి అయిపోవటంలేదు కదా?
శ్రీవసిష్ఠ మహర్షి: ఎంత సంకల్పించినప్పటికీ అనేకులకు భౌతికమైన విషయములు సంకల్పానుసారం పరిణమించటం లేదు. ఉత్తమమైన అభ్యాసయోగం లేకపోతే పదార్థజాలం సంకల్పానుసారం ఉనికిని పొందజాలదు. యోగ, విజ్ఞానదృష్టి పొందినవారు సర్వత్రా తమ యొక్క సంకల్పానుగతంగా పదార్థాలను నిర్దేశించగలుగుచున్నారు. అదియే 'యోగబలం' అని పిలువబడుతోంది. యోగబలం అనేది ఏకాగ్రత యొక్క సాధనానంతర ప్రయోజనమేనని గ్రహించు. ఏకాగ్రత యొక్క సాధనబలం లేకపోతే ఎవ్వరికైనాసరే, సంకల్పసిద్ధి' అనే ఫలం లభించదు.
అభినివేశము + ధ్యాస ----> చిత్తము.
అట్టి ఈ చిత్తము ఉద్వేగసహితమైన ఒక విషయాన్ని సంస్మరణ పూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఇంతలోనే అతిత్వరలో ఆ విషయాన్ని వదలి మరొక విషయాన్ని స్మరిస్తోంది. ఈ విధంగా అది అనుక్షణం ఉభయభ్రష్టుత్వం పొందుతోంది. చిత్తము యొక్క చాంచల్యం కారణంగా సంకల్పములు బలహీనమై సిద్ధిని కలుగజేయలేక పోతున్నాయి. ఏకనిష్ఠుడగువాని కార్యములు నెరవేరటం లోకవిదితమే కదా! దక్షిణ దిక్కుగా ప్రయాణించేవారు పడమర దిక్కునగల గ్రామములు చేరజాలనట్లు సంకల్పార్ధనిష్ఠులు మాత్రమే సంకల్పిత విషయాలు పొందగలుగుచున్నారు. సంకల్పము యొక్క ఏకాగ్రత - ప్రయోజనం గురించి ఇదివరకే అనేక విషయాలు ప్రస్తావించుకున్నాం కదా!
జనులు ఎట్టెదుటగా ఉన్న విషయములందు మాత్రమే బుద్ధిని నిలిపి, అంతవరకు మాత్రమే పరిమితమైన వివేచననే గ్రహిస్తున్నారు. వారు సంకల్పిత వస్తువును పొందగోరికూడా ఏకనిష్ఠులు కాకపోవటం చేత, ఏకాగ్రత పొందలేకపోతున్నారు. వారు వాస్తవానికి సంకల్పిత వాంఛితములను గాని, ఎదురుగానున్న వస్తువులనుగాని అసంపూర్ణంగా మాత్రమే పొందటం జరుగుతోంది.
అయితే ఆ భిక్షువు ఏకనిష్ఠుడవటం చేత రుద్రత్వం, సర్వాత్మకత్వం, రుద్ర సంబంధమైన సర్వజ్ఞత్వం పొందగలిగాడు. ఏకాగ్రత యొక్క ప్రయోజనంగానే అతనికి 'స్థితి' అనే పరమోన్నత అనుభవం కలిగింది. ఏకాగ్రతే లేకపోతే అనేక మందిలాగానే అతనికీ భావించినది లభించేది
Page:247
కాదు. అంతరాళ వాసులగు జీవటుడు - బ్రాహ్మణుడు సామంతరాజు - చక్రవర్తి మొదలైన
వారు ఆ భిక్షుకుని సంకల్పఫలములగు జీవులే అయినప్పటికీ వారందరు వేరు వేరు లోకములలో ఉన్నప్పుడు ఒకరి గురించిన అనుభవం మరొకరికి కలుగుటలేదు. రుద్ర చైతన్యం యొక్క సమావేశేచ్ఛ వలననే ఆ వివిధ ఉపాధుల ప్రజ్ఞలు ఒకటితో మరొకటి ఒకచోట సమావేశమైనాయి.
శ్రీరాముడు: చైతన్యము దృష్ట్యా భిక్షుకుని మొదలు రుద్రుని వరకు ఒక్కటే అయి ఉన్నది కదా!
ఒకరికి మరొకరు తెలిసి ఉండకపోవటం ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి: మాయ యొక్క వైచిత్ర్యం ఏమని చెప్పమంటావ్? ఈ జీవునికి ఈ ఉపాధికి ముందు విషయాలతో సంబంధమే ఉండటం లేదు కదా! నీవు ఒక స్వప్నాన్ని గాంచుచున్నావనుకో... అప్పుడు జాగ్రత్కు సంబంధించిన విషయముతో గాని, క్రితం రోజు స్వప్నాలతోగాని సంబంధం ఉంటోందా? లేదు. అట్లాగే ఇది కూడా!
ఆ పరమాత్మ యొక్క సంకల్పబలం చేతనే ఈ జీవసృష్టులు, వీటిలో భేదాజ్ఞానయుతులు అప్రబుద్ధులగు జీవులు... మొదలైన వారంతా ఉత్పన్నమవటం జరుగుతోంది. అట్టి ఏక - - అనేక శక్తి యొక్క ప్రకటన చేతనే రుద్రుడు - భిక్షువు మొదలైన వివిధ రూపములు ఏర్పడ్డాయి. అవన్నీ 'సంకల్పము, నిష్ఠ, ధ్యానము' అను త్రివిధత్వము యొక్క చమత్కారమేనని గ్రహించు.
ఈ కనబడు జీవులంతా భిక్షుకుని స్పప్నసదృశ వివిధ జీవుల వంటివారే సుమా! ఈ జీవుడు తన ధ్యానచింతాబలమును అనుసరించి ఏకత్వం, బహుత్వం, విజ్ఞత్వం, మూర్ఖత్వం, పాండిత్యం, నరత్వం, దేవత్వం మొదలైనవన్నీ పొందుచున్నాడు. ఆ వివిధ పరస్పర వ్యతిరిక్త ధ్యానములను... ఒక్కసారి అనేక ధ్యానములను, అనేకసార్లు ఒక్కొక్క ధ్యానమును పొందటం జరుగుతోంది.
ధ్యానమును బట్టి నైజము ఉంటోంది. నైజము (స్వభావము)ను బట్టి ఉపాధులు ఉంటున్నాయి. పరిమిత - అపరిమిత నైజముల నుండి భావనలు, భావనల నుండి నైజము ఏర్పడుచున్నాయి. అయితే ఈ జీవుడు పారమార్థికంగా బ్రహ్మ స్వరూపుడే.
బ్రహ్మస్వరూపుడగు ఈ జీవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు కూడా అయి ఉన్నాడు. అట్లయి కూడా ఒకే శరీరమున అభిమానము వహించి ఉన్నప్పుడు ఒక్క శరీరవ్యవహారమునకు మాత్రమే పరిమితుడై ఉంటున్నాడు. ఆతడు స్వతహాగా అపరిచ్ఛిన్నుడై ఉండటం చేత ఒక్కసారే అనేక శరీరములను ఆశ్రయించ గల అంతర్గతశక్తి ఉన్నవాడేనని యోగులు ఎరిగియే ఉన్నారు. అనేక శరీరములను ఆశ్రయించినప్పుడు ఆ వివిధ వ్యవహారములు ఒక్కసారే నిర్వర్తించగల 'చితశక్తి' ప్రతీజీవుని యందు దాగియే ఉన్నది సుమా! అట్టి అనేక శరీరముల ప్రకటనను అవతార పురుషులలోను, మహాయోగులగు లోకగురువులందు, మంత్రతంత్ర సమన్వితులగు రావణాది కొందరు అసురులందు కూడా మనం గాంచుచూనే ఉన్నాం.
ప్రాణుల యొక్క కర్మలను అనుసరించే సర్వేశ్వరునియందు ఈ పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉపాధులు, ‘భూ-స్వర్గ-నరక-పాతాళాది లోకాలు' అనబడే ఈ సృష్టి అంతా వికసిస్తోంది. వాస్తవానికి
Page:248
పరమేశ్వరుని యందు ఈ హింసాజనిత వైషమ్యాలుగానీ, కష్టసుఖాలు, సుఖదుఃఖాలు’ మొదలైనవి గానీ లేవు. జీవులు ఏది కోరుకుంటున్నారో... అదే చిదాత్మయందు స్పందించి స్వయంగా సుసంపన్నం అవుతున్నది. స్వయంగా ఆపాదించుకున్న దేశ కాల-క్రియా క్రమాలను ఈ జీవులు మోహం జోడించుకొని పొందుచున్నారు. ఇక్కడ 'ఏకాగ్రత - అనేకాగ్రత' అనే రెండు దృష్టులు పోటీపడి, జీవుని అభిలాష, అభ్యాసము, శ్రద్ధ, అవగాహలను అనుసరించి ఒకటి రెండవదానిని ఆక్రమించివేసి ఉండటం జరుగుతోంది. ఏకము, అనేకము మొదలైన అనుభవములన్నీ కూడా జీవుని నుండే బయలుదేరుచున్నాయి.
"ఈ దృశ్యమునకు వేరె, కేవల సాక్షియై, భావ నియామకుడనై ఉన్నాను... అను రూపంగా ఉండే భావౌన్నత్యమును సాధించిన యోగులు తమ ఇచ్ఛానుసారం శరీరములను ధరించగలుగు చున్నారు. యోగౌన్నత్యము లేని జీవులు కర్మల - ఇచ్ఛ - ఉద్వేగములననుసరించి ప్రవాహపతితులై, అస్వతంత్రులై విధివశంగా ఉపాధులను పొందుచున్నారు. సాధన, జ్ఞానములను అనుసరించే జీవునిలో యోగశక్తి రూపుదిద్దుకుంటోంది.
యోగశక్తి యొక్క పాటవమును అనుసరించి యోగి - యోగినులు తమ గృహమునందుగాని, వేరువేరు చోట్లగాని, వేరు వేరు లోకములందుగాని ఒకేసారి ఒకటి - రెండు - - అనేక దేహములను ధరించు శక్తి కలిగి ఉంటున్నారు. అదంతా ధ్యాన - ధారణాఫలితంగా సుసాధ్యమేనని గ్రహించు. అలాగే మరికొందరు యోగులు నిగ్రహ-అనుగ్రహ సమర్థములగు అధికార దేహాలను ధరించి ధర్మ, శాస్త్ర, విధాన సంరక్షణములు నిర్వర్తిస్తున్నారు. ఇంకా కొందరు యోగులు ప్రారబ్ధమును త్వరితంగా పూర్తి చేయటానికి ఇహ పరలోకములలో విభిన్న దేహములను అనుభవించటం కూడా ప్రసిద్ధమే.
ఇక మరికొందరు యోగులు ఉన్న చోట ఉండియే జగత్తులో అనేక చోట్ల అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి తన గృహంలో ఉంటూనే జగత్తులోని అనేక మూలల గల తదితర రాజులను గడగడలాడిస్తూ శాసిస్తూ ఉండేవాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. విష్ణుభగవానుడు లక్ష్మీసమేతుడై క్షీరసాగరంలో ఉండియే, ఇట్లు ఈ పృథివిపై ధర్మరక్షణార్థం అనేకసార్లు అనేక భూచర జలచర అవతారాలు ఎత్తుతున్నాడు. అట్లాగే యోగినులు సువర్లోకంలో యోగిణీగణం మధ్యలో ఉంటూనే ఈ భూలోకంలో అనేకచోట్ల తమకు సమర్పించబడుచున్న బలులను గ్రహిస్తున్నారు. ఇంద్రుడు స్వర్గ సింహాసనమున ఉండి అదే తరుణంలో భూలోకంలోని యజ్ఞశాలలో యజ్ఞభోక్తగా సాక్షాత్కారమౌతున్నాడు. శ్రీమన్నారాయణ అవతారమగు 'శ్రీరామచంద్రుడు' అను ఆరాధ్య స్వరూపుడవగు నీవు ఈ అవతారంలోనే ఒకానొక సందర్భంలో 14,000 రూపములు ధరించి 14,000 మంది రాక్షసులతో ఒకేసారి పోరాడి సంహరించి మరుక్షణం మరల ఒకే రూపం పొందటం చేస్తావు. ఈ మానవ రూపంతో అనేకమంది భక్తులకు ఆరాధ్యదైవమై యుగ-యుగాంతరములందు రామభక్తుల ప్రణామాలు స్వీకరించి వారిని అనుగ్రహిస్తూ ఉంటావు. శ్రీరామావతారమగు ఆ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి దుర్యోధనుని
Page:249
సభలోను, యుద్ధరంగంలో అర్జునుని విషాదం పోగొట్టి అనుగ్రహించటానికి శతసహస్ర విశ్వరూపధారి అయి భక్తులకు ప్రత్యక్షమౌతాడు. మళ్ళీ తన విశ్వరూపాన్ని ఉపసంహరించి మానుషరూపం ప్రకటించి, ఆ తరువాత అనంతకాలం ఆశ్రితవాత్సల్యంతో భక్తులముందు మానవరూపంలో ప్రత్యక్షమై ఉండగలడు.
‘నిమి’ అనే పేరు గల ఒక రాజర్షి విదేహముక్తిని సంపాదించాడు. అట్టి విదేహముక్తి సమన్వితుడై సమస్త దేహాల నేత్రాలతో దర్శన ప్రక్రియారూపంతో వసించుచున్నాడు. ఒకే సమయంలో ఈ భూత-భవిష్యత్-వర్తమాన దేహాల కళ్ళలో ప్రవేశించి ఉంటున్నాడు. భగవంతుడు సర్వదా ఒక్కడే అయినప్పటికీ అసంఖ్యాక అవతారాలతో ఆయా భక్తుల ముందు ప్రత్యక్షమగుచున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణభగవానుడు పదహారువేల రూపములు ధరించి పదహారు వేలమంది గోపికలతో ఒకేసారి క్రీడించగలడు.
ఇట్టి చమత్కారమును అనుసరించే ఆ భిక్షువు జీవటుడు, రాజు, చక్రవర్తి మొదలైన అనేక ఉపాధులను వేరు వేరు జగత్తులలో దాల్చాడు. రుద్రశక్తిచే ఉపాధులను ఒకచోట సమాయత్తపరచాడు కూడా. మరల ఆ ఉపాధులు తమతమ లోకములలో ప్రవర్తించేటట్లు సంకల్పించాడు. వారందరూ తిరిగి రుద్రుని చేరగలరు. వారంతా భూ - - స్వర్గ - - బ్రహ్మ - - - విష్ణు - మహేశ్వర లోకములలో పూజార్హులు కాబోవుచున్నారు కూడా!
8. మోహవశాత్తుగా సుదీర్ఘ పయనం
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఆ భిక్షుకుడు ఒకచోట ఆసీనుడై కొంచెం చింతన చేసి తనయందుతానే తన పూర్వ ప్రారబ్ధమును వేరువేరుగా ఆయా... ఉపాధుల రూపంలో వేరువేరు దేశ-కాలములలో గాంచటం జరుగుతోంది. వాస్తవానికి "అతనికి అనుభవయ్యేది ఆతడు" ఈ రెండూ... కూడా ఆత్మయే కాక మరింకేదీ కాదు.
ఈ జీవులందరి విషయం కూడా ఇట్టిదేనని గ్రహించు. మరణ కాలమున సారభూతమైన స్వకర్మయే ఉత్తరోత్తర జన్మలకు కారణమగుచున్నది. స్వప్నసదృశమైన ఇట్టి జన్మపరంపరలు మోక్షస్థితివరకు భాసిస్తూనే ఉంటాయి. అయినా కూడా ఇదంతా చిదాకాశముకంటే వేరే మరొకటేదీ కాదు. ఆత్మయే ఈ సంసార విభాగములన్నీ తననుండి వేరు చేసుకుని “అనుభవము” అను పరిజ్ఞానం ద్వారా తనయందే ఇదంతా పొందుతోంది. ఇక ఈ వర్తమాన జన్మ విషయానికి వస్తే ఇది ఇతఃపూర్వము మృతించిన జీవుడు పొందుచున్న మరొక స్వప్నం అనికూడా అనవచ్చు. ఓ రఘురామా! ఈ విధంగా స్వతఃగా అపరిచ్ఛిన్నుడగు ఈ జీవుడు పరిచ్ఛిన్నుడై దేహాదులను ఎట్లు పొందుచున్నాడో తెలియజేయటమే ఈ భిక్షుకోపాఖ్యానం యొక్క ఉద్దేశం. ఆ భిక్షుకుడే కాదు ఆత్మ నుండి విచ్యుతులైనట్టి ఈ జీవులందరూ కూడా పైనచెప్పిన విధంగా ఒక మోహమునుండి మరొక మోహం పొందుచున్నారు. ఇదంతా కూడా ప్రతిరోజూ ఒకడు ఒక స్వప్నంలో ప్రవేశించి, ఆ తరువాత ఆ మరునాడు మరొక స్వప్నంలో ప్రవేశించటం వంటిదేనని గ్రహించు.
Page:250
పర్వతాగ్ర పరిభ్రష్టోహ్యధో అధ ఉపలోయధా ॥ పరమాత్మ పరిభ్రష్టో జీవః స్వప్నమిమందృఢమ్ ||
పర్వతశిఖరం పైనున్న ఒక శిల విభాగం క్రిందకు జారి అధఃపతనం అవుతూ ఎక్కడో లోయ లోకి పడిపోతోంది చూచావా? పరమాత్మ నుంచి చ్యుతి పొందిన ఈ జీవుడు 'దేహపరంపరలు' అనే అధఃపతనాన్ని గాంచుచున్నాడు. తన అభ్యంతరమున ఉన్న మాయ వలన శైథిల్యం పొంది 'నేనీ అల్ప శరీరాన్ని' అని భ్రమిస్తున్నాడు. “దేహాల రాక పోకలకు ఆవల అప్రమేయమై వెలుగొందే ఆత్మయే నా స్వరూపం"... అను ఆస్వాదన పెంపొందనంత వరకు ఈ ప్రయాణం ఇట్లే కొనసాగుతోంది. అతనెప్పుడో యథార్థం తెలుసుకుని, అప్పుడు తక్షణం ఈ శరీరములతో భ్రమచే ఏర్పడే సంబంధములను గుర్తెరిగి ఆత్మ యొక్క అనుభవమును పొందగలడు.
శ్రీరాముడు: ఆహా! మునీంద్రా! ఈ జీవుని పట్ల 'విషయము' అనే మోహం ఎన్నెన్ని చిత్రములకు దారి తీస్తోంది! ఈ జీవుడు తానెవరో తన నిజస్వరూపము ఏమిటో గ్రహించకుండా, ఈ విషయ స్వప్నమునందు నిదురిస్తున్నాడు కదా! నానావికారములతో కూడిన తన మనస్సుచే 'మిథ్యాజ్ఞానం' అనే రాత్రియందు సకల భేదదృష్టులతో కూడిన ఈ దృశ్య సమూహములను తనయందు తానే పొందుచున్నాడు. ఇట్టి మాయా జగత్తునందు అన్నియూ సంభవమేనని నేను ఒప్పుకుంటున్నాను. మీరు సంభవయోగ్యమేనని చెప్పినది తప్పక అనుభవసిద్ధమే.
ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న - మీరు చెప్పిన మహాత్ముడగు ఆ భిక్షుకుడు నిజంగా ఉన్నాడా? లేక మా మీద దయతో బోధ కొరకు 'భిక్షుకుడు' అనువాని గురించి, ఆతని ఉపాధి పరంపరల గురించి కల్పించి చెప్పారా? ఈ విషయం తెలియజేయవలసినదిగా నా విన్నపం.
శ్రీవసిష్ఠ మహర్షి: ఇప్పుడు నేను చెప్పిన భిక్షుకుని వృత్తాంతమంతా నేను భౌతికంగా చూచి చెప్పినది కాదు. అదంతా నా అంతర్దృష్టిచే ఈ బోధరూపంగా ఈ సందర్భంలో స్ఫురించింది. అయినా కూడా “అది యాదృచ్ఛికం, అయథార్థం కాజాలదు” అని అనుకుంటున్నాను. నా దివ్యదృష్టి యొక్క బలంతోనే కదా, నేనిదంతా చెప్పుచున్నది!
నీవిప్పుడు అడిగావు కనుక నేను ఈ రోజు రాత్రి సమాధిని అవలంబించి ఈ ముల్లోకాలు సంచరించి వస్తాను. ఆ భిక్షుకుడు నిజంగా ఉన్నదీ, లేనిదీ నీకు రేపు ఉదయం బోధలో వివరిస్తాను.
రాజులు, పౌరులు, తదిర సభికులు శ్రీ వసిష్ఠమహర్షిని సమీపించి ఆయనకు పాదాభి వందనములు సమర్పించారు. సభికులంతా ఆహా! మేము ఈ జన్మ - మృత్యువుల మధ్య పరిమితులమై ఉన్నామని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. మమ్ములను రోదింపజేయుచున్న ఈ మాయ కేవలం స్వకీయమైనదే కదా! ఇంతకీ ఆ భిక్షుకుడు వసిష్ఠ మహర్షికి తారసపడతాడా? ఏమో? రేపు ఆయన ప్రవచించే విశేషాలు వినవలసిందే! అని చెప్పుకుంటూ గృహోన్ముఖులయ్యారు
(పదహారవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:251
పదిహేడవ రోజు
9. సూక్ష్మదేహంతో అన్వేషణ
శ్రీవాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! వింటున్నావుగా! మరునాడు 17వ రోజు సభ పునః ప్రారంభమైంది. ఆకాశంలో నక్షత్రాల లాగా శ్రీరామలక్ష్మణాదులతో, తదితర మహనీయులతో ఆ అయోధ్యలోని సభ ప్రకాశకాంతులు విరజిమ్ముచున్నది. సభికులంతా వసిష్ఠ మహర్షి కనుగొనినదేమిటో వినాలని ఉత్సాహపడుచున్నారు. దయాశాలురగు సాధుపుంగవులు ఈ సంసారజనుల పాట్లు చూచి, వారికి బలవంతంగానైనా సరే బోధ చేస్తూనే ఉంటారు. అట్లాగే శ్రీ వసిష్ఠ మహర్షి ఎవరి ప్రశ్నకై వేచి ఉండకుండానే ఇట్లు బోధ కొనసాగించారు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ సభికులారా! నిన్నటి రోజు చిట్టచివర ఈ రామచంద్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో జరిగిపోయిన రాత్రి నేను సమాధిని ఆశ్రయించాను. సూక్ష్మశరీర ధారినై జ్ఞాననేత్రంతో మూడు లోకాలూ అన్వేషించాను. ఆ భిక్షుకుని కొరకై వెదుకుచూ సప్తద్వీప - సప్తకుల సమన్వితమగు ఈ పృథివిపై అంతటా ధ్యానమార్గంలో పరిభ్రమించాను.
మనోరాజ్యం బయట దొరికేది కాదు కదా! ఆ భిక్షుకుడు కనబడనంత వరకూ నేను అట్లే మారుమూలలా తిరుగాడుచూనే ఉన్నాను.
రాత్రి మూడవ జామున గాలిచే కొట్టబడిన ఒక పెద్ద సముద్రతరంగంవలె నేను ఉత్తరదిక్కుగా వెళ్ళటం జరిగింది. అక్కడ 'వల్మీకం' అనే పేరుతో ప్రసిద్ధి కెక్కిన ఒక ప్రాంతం ఉన్నది. ఆ జనపథం దాటగానే 'జిన’ అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో 'విహారం' అనే పేరు గల ఒక జనసమ్మర్దమైన స్థానం ఉన్నది. అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళకు కొంచెం దూరంగా 'దీర్ఘదృశుడు' అను పేరుతో జనులు పిలిచే ఒక భిక్షుకుడు ఉన్నాడు. ఆతడున్నది పాడుబడిన ఒక కుటీరంలో. సామాన్యంగా ఆతడు ఆ కుటీరం వదలి బయటకు రాడు. అతడు అక్కడ ఎంతకాలంగా ఉంటున్నాడో అక్కడివారి కెవ్వరికీ తెలియదు. అక్కడివారెవ్వరూ అతనిని అంతగా ఏమీ పట్టించుకోరు. అక్కడి పెద్దలు మాత్రం అతనిని 'దీర్ఘదృశుడు' అని పిలుస్తూ ఉంటారు. అతనికి కొద్దిమంది శిష్యులు మాత్రం ఉన్నారు. వారిని గురించిన వివరాలు అక్కడి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ భిక్షుకుడెప్పుడన్నా రాత్రి కొంత పొద్దుపోయిన తరువాత తన భిక్షుపాత్ర పుచ్చుకొని కొన్ని ఇళ్ళకు వెళ్ళుచూ ఉండేవాడు. మౌనంగా నిలబడే ఆతనికి వాళ్ళు కొంచెం ఆహారం ఇవ్వగానే ఊరి చివరి కుటీరం వైపు మౌనంగా నడచి వెళ్ళిపోతూ ఉండేవాడు.
Page:252
ఒక రోజు అతడు ఆ కుటీరానికి గల తలుపు మూసి ధ్యాననిమగ్నుడైనాడు. ధ్యానమునకు ఉపక్రమించే ముందే తన శిష్యులను ఒక నెల వరకూ తన సమాధిని భంగపరచవద్దని ఆజ్ఞాపించాడు. ఇప్పటికి ఆతడు 21రోజులు సమాధిలో ఉన్నాడు. నేను సూక్ష్మదేహినై ఆ కుటీరంలో ప్రవేశించాను. ఆతని ప్రియశిష్యులు తమ గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి బయటనే ఉన్నారు. వారలు ఆ కుటీరంలో ప్రవేశించకపోవటం గమనించాను.
ఆతడు సమాధిలో ఉండి వేలాది సూర్యుల కాంతితో ఒప్పారుచున్నాడు. దీర్ఘ సమాధిలో ఉన్న ఆతనితో సంభాషించటానికి నేను సాహసించనైనా సాహసించ లేకపోయాను. ఆతని శిరోజములు కపిలవర్ణం సంతరించుకున్నాయి. ప్రాణములు నిరుద్ధమై ఉన్నాయి.
ఒక్కసారి అక్కడి నుండి నేను భూత - భవిష్యత్లలోకి తొంగిచూశాను. ఆతడు ధ్యాననిష్ఠలో ఉన్నది 21 రోజుల క్రితమే అయినప్పటికీ, తన చిత్తంతో వేలాది సంవత్సరాలు అనుభవించాడు. ఆతడు ఈ రోజే శరీరమును వదలి విదేహకైవల్యము పొందబోవుచున్నాడు.
ఓ రామచంద్రా! ఆతని విదేహ కైవల్య చమత్కారమంతా గమనించి నేను ఆతనికి నా అతివాహిక దేహంతో సాష్టాంగనమస్కారం సమర్పించి వెనుకకు మరలాను. అప్పుడు నీ ప్రశ్నకు ఉచిత సమాధానం ఇచ్చే ఉద్దేశంతో 'ఇతః పూర్వకల్పంలో కూడా ఇట్టి చరిత్ర-ధారణ-విదేహముక్తి కలిగి ఉన్న భిక్షుకుడెవరైనా ఉన్నాడా? లేడా? గ్రహించాలి' అని అనుకున్నాను. నేనిప్పుడు చూచి వచ్చినది రెండవ భిక్షుకుడని, ఇంతకు ముందు కల్పంలో కూడా ఇట్టి చరిత్ర గల భిక్షుకుడున్నాడని గమనించాను. అప్పుడు నేను ఇంకా ముందు కల్పములు కూడా తరచిచూశాను. ఎంతో చతురతతో అంతకు ముందటి కొన్ని కల్పముల వరకూ వెదకినా కూడా మరి మూడవ భిక్షుకుడు అంతకు క్రిందటి ఆ కల్పములలో నాకు తారసపడలేదు.
తిరిగి ఆశ్రమం ప్రవేశించిన నేను అట్టి భిక్షుకుని వృత్తాంతం గల వారెవరైనా ఇంకా ఉన్నారేమో గ్రహించటానికి మరికొంత ప్రయత్నించాలని అనుకున్నాను. అప్పుడు మరల సూక్ష్మదేహినై ఈ సృష్టి నుండి బయలుదేరి మరొక భవిష్యత్ సృష్టిలో ప్రవేశించాను. చిదాకాశమున వెలయుచున్న ఆ భవిష్యత్ సృష్టిలో 3వ భిక్షుకుడు ఉండి ఉండటం గమనించాను. బ్రహ్మ నిర్మితమైన ఆ సృష్టిలో కూడా మన ఈ వర్తమాన సృష్టి లాగానే అనేక జగత్తులు ఉన్నాయి.
శ్రీరాముడు: మీరు భవిష్యత్తులో ఉండబోయే ఆ సృష్టిలో ఇప్పుడే ఎలా ప్రవేశించగలిగారు? అందులో కూడా ఈ మన సృష్టిలాగానే పదార్థములు మొదలైనవి ఉన్నాయా?
శ్రీవసిష్ఠ మహర్షి: యోగబలంచేతనే నా మనస్సుకు అది సుసాధ్యమయింది. ఆ భవిష్యత్ సృష్టిలో కూడా ఇక్కడ తారసపడే పదార్థములను, ఆకారములను చూశాను. ఇటువంటివే అనేక జగత్తులు ఆ సృష్టిలో కూడా ఉన్నాయి.
Page:253
ఈ సృష్టిలో ఆ భిక్షుకుడు, బ్రాహ్మణుడు, రాజు మొదలైనవి ఉన్నట్లే ఆ భవిష్యత్ సృష్టిలో కూడా అప్పటి భిక్షుకునకు ఆయా ఉపాధి పరంపరలు కల్పితమై ఉండగలవు.
ఓ రామచంద్రా! ఒక్క విషయం ఇక్కడ ప్రకటించదలచుచున్నాను. ఆ భిక్షుకునికి సంభవించినట్లే నాకు, నీకు, ఈ సభికులకు, తదితర జీవులందరికీ ఇట్టివి, ఇందుకు భిన్నమైనవి అయిన అనేక పూర్వ, తత్పూర్వ... భవిష్యత్, తత్భవిష్యత్ వృత్తాంతాలతో కూడిన అనేక కథనాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఆ రాబోయే సృష్టిలో ఈ నారదమహర్షి ఇట్లే ఉండబోవుచున్నారు. ఈ సభలోని కొందరి కొందరి జ్ఞాన చరిత్రలు ఇట్లే ఉండబోవుచున్నాయి. ఈ సభలోని కొందరు ఆ రాబోవు సృష్టిలో అత్యున్నత జ్ఞానులై, మరికొందరు అల్పజ్ఞానులై ఉండబోవుచున్నారు.
ఇదంతా కూడా ఈ మాయ ఉన్నంతవరకూ... ఇలా ఒకసారి కాదు... అనేకసార్లు సంభవించ గలదు. ఇట్లు పూర్వం కూడా సంభవించింది. మరల భవిష్యత్లో సంభవించబోతోంది. సముద్ర తరంగాలను చూచావు కదా? అవి ఒకసారి విస్తరిస్తున్నాయి. మరొకసారి ఉపశమిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒకే తీరైన తరంగాలు మరల మరల వెలువడుచున్నాయి. ఇంతలోనే మరికొంతసేపు వేరు వేరు ఆకారం గల తరంగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. అట్లాగే సృష్టి పరంపరలు మాటిమాటికీ విస్తరిస్తున్నాయి. మరల ఉపశమిస్తున్నాయి. కొన్ని సృష్టులు ఒకదానిలో మరొకటి అత్యంత సాదృశం కలిగి ఉంటున్నాయి. కొన్నిటికి అసలు పోలికయే ఉండటం లేదు. ఆహా! ఈ మాయ ఇట్లు విస్తరించి మహాత్ములగు వారిని కూడా మోహమున ముంచెత్తుతోందే!
శ్రీరాముడు: ఈ మాయ ఎట్లా కల్పించబడుతోంది? మానసిక చింతన చేతనా? లేక ఇదంతా శారీరక యత్నము చేతనేనని అనవచ్చునా?
శ్రీవసిష్ఠ మహర్షి: ఇదంతా ప్రతిభాస చేతనే ఉత్పన్నమౌతోంది. శారీరక - - మానసిక యత్నములు లేకుండానే మాయ పరిఢవిల్లగలదు. మాయయే ఆ భిక్షుకుని విషయంలో 21 రాత్రులు అనేక యుగ - మన్వంతరముల అనుభవం కల్పించటం జరుగుతోంది. ఆయా సమయములందు ఆయా ఆకారములన్నీ దీర్ఘప్రయాణీకుడగు ఈ జీవునిచే మాయయే అనుభవింపజేస్తోంది. స్వస్వరూపసత్యం కించిత్ ఏమరచటమే మాయయొక్క చమత్కార విన్యాసానికి 'నాంది’.
మనస్సు యొక్క గతి ఎంతటి భయంకరమైనదో... గమనిస్తున్నావా?
అంతటికీ కారణం ప్రతిభాసయేనని మరొకసారి ప్రకటిస్తున్నాను. మనస్సు యొక్క అలజడియే ఈ భూత - వర్తమాన వర్తమాన - భవిష్యత్ సృష్టులన్నిటికీ మూలపదార్థం సుమా! కదలుచున్న జలంలో అస్తవ్యస్తంగా బింబం ప్రతిబింబిస్తున్నట్లు, చంచలమగు మనస్సునందు ఆత్మస్వరూపమాత్రమగు ఈ దృశ్యం అస్తవ్యస్తంగా ప్రతిభాసిస్తోంది. ప్రతిభాసఖండములగు ఈ జగత్తులు, అట్టి ప్రతిభాస మాత్రమగు ఈ జగత్తులలోని ఈ జీవులు, వీరి వ్యవహారపరంపరలు - ఇవన్నీ కూడా మాయ యొ కార్యములే అయినప్పటికీ వీటికి వ్యవహార సత్త, కార్య-కారణ వైచిత్ర్యము, ఘనీభూతమైన సుఖ-దుఃఖ అనుభవాలు ఏర్పడి ఉంటున్నాయి. ఇదంతా సర్వవ్యాపకము, సర్వాత్మకము, చిదేకరసము
Page:254
అగు బ్రహ్మమే అయినప్పటికీ మాయా దృష్టి ఉన్నంత వరకు ఇదంతా ఇట్లే ఉంటోంది. ఉండబోతోంది. తత్త్వబోధచే మాయ తొలగిందా... ఇక ఈ సృష్ట్యాదుల భ్రమ దానంతట అదే తొలగగలుదు.
10. బ్రహ్మైక్య ప్రతిపాదన
దశరథ మహారాజు: ఓ మహర్షీ! మీరు ఆ భిక్షుకుని గురించి చెప్పిన విశేషాలన్నీ చాలా చమత్కారంగా ఉన్నాయి. నాదొక చిన్న విన్నపం. ఇది సముచితమేనని మీరు అనుకుంటే మీరు ఆ భిక్షుకుడు ఉన్నచోటికి సూక్ష్మశరీరధారులై సమీపించి అతనిని సమాధి నుండి లేపండి. మనం భటులను, మంత్రులను పంపి ఆయనను ఆ కుటీరం నుండి ఇక్కడికి సాదరంగా ఆహ్వానిద్దాం. ఆతని అంతరంగ వాణి ఏమిటో మేము మరింతగా గ్రహించవచ్చునేమోనని నా ఉద్దేశం.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ మహారాజా! ఆ మహాభిక్షుకుని శరీరం ఇప్పుడు ప్రాణరహితమై ఉన్నది. నేడే ఆతడు ఆ భౌతికదేహం త్యజించవలసి ఉండుట దైవనియతి. ఈ విషయం నేనిదివరకే చెప్పాను కదా!
ప్రాణచలనమునకు ఆధారమైన అన్నరసం ఆతని దేహమునందు పూర్తిగా శుష్కించి ఉన్నదని ఆతనిని చూడగానే నేను గమనించాను. ఇప్పుడాతడు జీవితుడుగా లేడు. ఎందుచేతనంటావా? ఆ దేహమును అనుభవించుటకు కావలసియున్న ప్రారబ్ధం ఆతని యందు ఏమాత్రం శేషించి ఉండలేదు. అట్టి ప్రారబ్ధం ఏమాత్రమైనా మిగిలి ఉంటే నేనే ఆతనిని సమీపించినప్పుడు పునరుజ్జీవితుని చేసి ఉండేవాడిని. ఆ శరీరమునందలి జీవుడు జీవన్ముక్తుడై, బ్రహ్మహంస అయి వెలయుచున్నాడు. ఆతడీ దృశ్య ప్రపంచ విశేషమునకు తిరిగివచ్చి, దేహముచే ఈ భౌతికలోకంలో మనబోటి వారితో ప్రవర్తించుటకు సిద్ధపడే సూచనలు కనిపించుటలేదు.
శ్రీరాముడు: మహాత్మా! ఆతని పాంచభౌతిక దేహమునకు ఏమి కానున్నది?
శ్రీవసిష్ఠ మహర్షి: ఆ భిక్షుకుడు తన శిష్యులకు వీడ్కోలు పలికేటప్పుడు 'ఒక మాసం వరకు ఈ గది తలుపులు తెరువవద్దు' అని నిర్దేశించి ఉన్నాడు కదా! ఆతని భృత్యులు ఆతని దర్శనము కొరకై బయటయే నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు మీ భటులను పంపినప్పటికి ఆ శిష్యులు వారిని లోన ప్రవేశించనివ్వరు.
గురు ఆజ్ఞను అనుసరించి నెలరోజులూ గడచిన తరువాత వాళ్ళు ఆ గది తలుపులు తెరుస్తారు. ప్రియాతిప్రియుడగు తమ గురువు ఆ దేహమును త్యజించినట్లు కనుగొంటారు. ఆ భౌతిక దేహమును శుభ్రపరచి నదీజలంలో వదులుతారు. ఆ తరువాత ఆ సమాధిని ఆశ్రయించినచోట ఒక పూజా మందిరం నిర్మించగలరు. పూజ - భక్తి వ్యవహారార్థమై అక్కడ ఆ భిక్షుకుని ప్రతిమను నెలకొల్పుతారు. ఆ ప్రతిమ ఆ భిక్షుకుని భక్తులందరికీ ప్రియదేవతామూర్తిగా, ఉపాస్యదైవంగా ఆరాధించబడనున్నది. దృఢమనఃకల్పితమగు సర్వాత్మ-పరబ్రహ్మము యొక్క సంజ్ఞారూపంగా వారికి-వారివారి శిష్య పరంపరలకు సాక్షాత్కరిస్తూ మార్గదర్శకమై సుదీర్ఘకాలం పూజింపబడగలదు. కాలక్రమేణా అనేకచోట్ల
Page:255
ఆ ప్రతిమవంటివే అనేకం నిర్మించబడి అనేకమంది సాధకజనులచే జగద్గురుభావంతో ఆరాధించ బడబోతోంది.
ఇట్లు నేను ఆతనిని సమీపించిన క్షణంలో ఆతడు ఆ దేహమునందే ముక్తుడై వెలయుచున్నాడు. ఆతని దేహం వినష్టమైపోయింది. కాబట్టి నాయొక్క పునఃప్రాణస్పందనయత్నం ఆతని పట్ల సఫలం కాలేదు.
ఓ రామచంద్రా!
ఏషా గుణమయి మాయా దుర్బోధేన, దురత్యయా నిత్యం సత్యావబోధేన సుఖేనైవాతివాహ్యతే ॥
త్రిగుణమయమగు ఈ మాయ జీవుని జ్ఞానము వలననే తన యొక్క విక్షేపశక్తిచే అనేక భ్రాంతిపరంపరలను విస్తరింపజేస్తోంది.
అయితే... జ్ఞానం వల్ల ఈ సర్వము ఆకృతిని కోల్పోగలదని గ్రహించు. ఈ మాయ అసత్యమే. అయితే ఏం? ఇది ఈ జగత్తులను ప్రదర్శించుచున్నది. ఆభరణంలో బంగారం దృష్టిన పడకుండా - ఆకారం దృష్టిని ఆకర్షిస్తున్నట్లు ఈ మాయ కూడా సత్యవస్తువును అన్యవిధంగా అనిపించేటట్లు చేస్తోంది. “జలమందు తరంగంలాగా పరమాత్మ యందు ఈ సృష్టులు అవాస్తమైనవి మాత్రమే” అని శ్రుతులు చేతులెత్తి ప్రకటిస్తున్నాయి. ఒక్కసారి మొదలంటా ఈ సర్వమును మాయగా వీక్షించావా... సర్వభ్రమలు మరుక్షణం తొలగిపోతాయి.
ఆ పరమాత్మయే స్వయంకల్పితమైన అవివేకం చేత జీవత్వమును పొంది క్రీడగా స్వప్న. స్వప్నాంతరములను , జన్మ జన్మాంతరాలను పొందుచున్నాడు. ఓ రామచంద్రా! నీవు ఈ సర్వమును ఆత్మగానే అవలోకించు. అప్పుడు 'చిన్మాత్రం' మాత్రమే అన్ని వైపులా శేషించగలదు. ‘బోధ' యొక్క బలం చేత ఏదైతే సర్వమూ ఆత్మగా తెలియవస్తోందో... అదియే అజ్ఞాన సమయంలో ముళ్ళపొదల వలె 'సంసారమండలం’గా ఉదయించి, ఏర్పడి ఉంటోంది. ఆ భిక్షుకుడు గాంచినవన్నీ మనఃతరంగ మాత్రములు, స్వప్నతుల్యములు మాత్రమే.
సమష్టి జీవుడగు హిణ్యగర్భుని మనోసంకల్పనిర్మాణమగు ఈ సృష్టి స్వప్నతుల్యం మాత్రమే. కాబట్టి వ్యష్టిజీవుడు చూచుచున్నది కూడా స్వప్నమే అయి ఉన్నది. ఇదంతా అశుద్ధచిత్తమున ఉదయించి అట్టి చిత్తదోష బలం చేతనే సత్యమైన దానివలె వెలయుచున్నది. చిత్తశుద్ధిని పొందినప్పుడు మాత్రమే ఇదంతా స్వప్నవిలాసము వలె అసత్యమని, అసత్తుల్యమని బోధపడగలదు. అప్పుడు “ఈ ప్రత్యేక జీవుడే కోటానుకోట్లుగా వెలయు బ్రహ్మాండ రూపుడు కూడా!" అని గ్రహించగలుగుతావు. ఈ జీవుడు వ్యష్టి-సమష్టిగా, లేక సాధారణ-అసాధారణ ప్రపంచరూపంగా స్ఫురించుచున్నాడు. ఏది ఎట్లా స్ఫురించినా, స్ఫురించకపోయినా... ఆతడు అదంతా తన హృదయమున ఏర్పడే ప్రతిభాసకు అను రూపములగు విషయములే పొందుచున్నాడు.
Page:256
అనగా ఈ 'జీవుడు’ అనబడే ద్రష్ట తననుతానే తన ఆత్మను జగత్తు రూపంగా - దృశ్యం రూపంగా స్వప్నమునందువలె - దర్శిస్తున్నాడు.
ఆ అనురూపములన్నీ ఒక్కొక్కసారి సుదీర్ఘంగా గాంచుచున్నాడు. అదంతా భ్రమయే కనుక స్వప్నమువలె మిథ్యయే అయున్నది. ఈ జీవుడు 'తత్త్వచ్యుతుడు' అయి చిత్తసత్తను ఆశ్రయించి క్రమక్రమంగా ఈ దేవ, నర, జంతు మొదలైన యోనులలోని ఒకానొకదాని యందు పడి జరామరణ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. దేహములను సమాశ్రయిస్తున్న ఆ చైతన్యము చిత్తస్పందనము వల్ల జగత్ స్వప్నములను గాంచుచున్నది. ఆయా స్వప్నాలలో పాతాళ లోకాన్నో, లేక బ్రహ్మ లోకాన్నో కల్పించుకుని ఆయా భోగాదులచే తన్మయం పొందుచూ వెలయుచున్నది.
ఆ బ్రహ్మ చైతన్యమే ప్రాణకల్పనను ఒనర్చుకొని, ఆ ప్రాణవశమున ఉండు స్పందనరూపమును గ్రహించుచున్నది. అందుకు ఫలితంగా 'జీవుడు' అను పేరును బడయుచున్నది. తద్వారా 'నేను దేహమును’ అనే భ్రమకు వశమగుచున్నది. ఆ దేహం నుండి పంచేంద్రియాల ద్వారా బయటకు వెడలి విషయాకారాన్ని పొంది విషయజ్ఞాన తదాత్మ్యము పొందుతోంది. ఇక ఏం చెప్పాలి? అనేక సంభ్రమములలో పడి పొరలుచున్నది.
ఏది ఎట్లైతే ఏం? ఈ జీవుని వాస్తవరూపం ప్రత్యగాత్మయే కదా! 'చిత్త ఉపాధి’ అనే భ్రాంతి గొనినంత మాత్రం చేత బ్రహ్మం యొక్క స్వభావం మరొకటిగా మారగలదా? మారదు. దర్పణంపై నీటిచుక్కలు పడటంచేత ప్రతిబింబం అస్తవ్యస్తంగా కనబడవచ్చు. అంత మాత్రంచేత నీ ముఖం అస్తవ్యస్తం అవుతుందా? కాదుకదా! బ్రహ్మము ఎల్లప్పుడూ బ్రహ్మముగానే ఉన్నది. బ్రహ్మమునందు గల ఉపాధియోగం చేతనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఉపాధి ఉండుట చేత గాని, లేక... లేకపోవుట చేత గాని పరమాత్మయందు కలిగే మార్పు చేర్పులేమీ ఉండవు. "బ్రహ్మము మునుపటి యోగ్యత పోగొట్టుకొంటోంది” అను వాక్యం ఏ సమయమునందునూ యుక్తియుక్తం కాదు. వేలకొలది అధ్యాసలు ఉండవచ్చు గాక! అధిష్ఠానం స్వస్వరూపాన్ని విడువదు. విడువజాలదు. ఎన్ని భావోద్రేకాలు ఏర్పడినా ఒకడు తన ‘నేను’ను విడచి ఉండకపోవటమే అందుకు తార్కాణం. అందుచేత జీవబ్రహ్మైక్యం చేకూరుటకు ఎట్టి ఆటంకము లేదు. ఇదియే పరమపురుషార్థము.
శుద్ధ ఆకాశము ఆకాశముననే వెలయుచున్నది కదా! జలము జలముననే వెలయుచున్నది. 'తరంగములు పొందుచున్నది కాబట్టి జలం జలత్వం నుండి బయల్వెడలింది.' ... అని ఎవరైనా సిద్ధాంతీకరిస్తారా? లేదు కదా! అట్లాగే వ్యావహారిక దృష్టితో చూచినా సరే, ఈ జగత్తు బ్రహ్మముననే వెలయుచున్నదని గ్రహించు. ఇక పరమార్థ దృష్టితో చూస్తే, వేరుగా చెప్పవలసిన పనేమున్నది?
దర్పణం - ప్రతిబింబం - - బింబం - ఒకింత వేరువేరని తోచవచ్చునేమో. కానీ, ఈ జీవలోకం బ్రహ్మమునకు వేరుగా ప్రతిష్ఠ కలిగి ఉండలేదు. బాలురు అద్దంలో తమ ప్రతిబింబం చూచి భయం, ఉత్సాహం, ఉద్రేకం, ఆవేదన - పొందునట్లు అభయ బ్రహ్మమున వెలయుచున్న తమను
Page:257
తామే చూచుకుని ఈ జీవులు భ్రమచెందుచున్నారు. తమ భావోద్రేకములే తదితరమంతా ప్రవేశించి ఇష్టము, అయిష్టము, కోపము, నిర్లిప్తము - మొదలైనవన్నీ అనుభవరూపాలుగా పరిణమింప జేస్తున్నాయని గమనించలేక పోతున్నారు.
11. పరమ నిశ్శంక స్థితి
శ్రీరాముడు: అట్టి 'అన్యధా' అను బోధ ఎట్లా ఆత్మయందు ఉత్పత్తి అవుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి: (చిరునవ్వు నవ్వుతూ)
స్పందే స్పందీకృతేచ ఇహ స్వతః సంజ్ఞా విలీయతే | సాప్యలం పరిణామేన లీలయే అగ్నౌఘృతం యథా॥ చిత్స్పన్ద ఏవ చిత్స్పన్దే సర్వాత్మని విజృమ్భితః I
స్పన్దాస్పన్హౌ జృంభణాది కల్పితం! నాత్ర వాస్తవం ॥
ఈ ద్వైతభావనకు, ఈ 'అన్యధా' భావనకు కారణం 'బుద్ధి యొక్క స్పందన' మనే చెప్పాలి. సమాధిని అభ్యసించటం ద్వారా ఈ బుద్ధి యొక్క స్పందనను నిలిపివేయటం జరిగితే అప్పుడు మిగిలి ఉండే స్థిరబుద్ధిని 'చరమసాక్షాత్కారం' అని పిలుస్తారు. అగ్నియందు నేయిని వ్రేల్చినట్లు అప్పటి చరమసాక్షాత్కార స్థిరబుద్ధిని కూడా బ్రహ్మమునందు వ్రేల్చితే అది విలీనమై ఆత్మ యొక్క అఖండ - అప్రమేయాది సంపదతో ఈ జీవుడు ప్రకాశించగలడు.
చిత్ స్పందనరూపమగు పరమాత్మయందే చిత్ స్పందనరూపమగు ఈ జగత్తు ప్రకాశించు చున్నది. కానీ, నిజానికి స్పందనము, అస్పందనము, జృంభణము మొదలైనవన్నీ చిదాత్మ పట్ల కల్పిత విషయములే అగుచున్నాయి.
ఓ రామా! ఈ జగదనుభవం వెయ్యి గొడ్డళ్ల వ్రేటులకైనా తెగదేమోనని అనిపించవచ్చు గాక! ఇదంతా కల్పనామాత్రమే కనుక, ఇదంతా కల్పనాత్యాగముచే నశించగలదు. అనగా, ఇప్పుడు 'దాట రానిది’గా అనిపించేదంతా కల్పనలన్నీ నశించినప్పటి దృష్టికి ఇది ఏదీ కాదు.
అందుచేత ఈ జగత్తు ఏదీ కాదు. శుద్ధచిన్మాత్రమగు స్వస్వరూపబ్రహ్మం ఒక్కటే ఒకే రీతిగా వెలయుచుండగా, ఇద్దానిని తత్త్వదృష్టితో పరికించకపోవటం చేత ఇందు “స్పందం, అస్పందం, ఏకం, అనేకం”... మొదలగు భావావేశాలు స్ఫురిస్తున్నాయి. ఇదంతా 'ఏదీ కాని ఒక శిలయందు కల్పించుకున్న ఏవేవో “శిల్ప శిలా సంబంధ ప్రియాప్రియములు” వంటివి మాత్రమే. అందుచేత ఈ జగత్తు కల్పితం మాత్రమేనని గ్రహించు.
శ్రీరాముడు: 1. 'ఈ సర్వము బ్రహ్మమే', 2. 'సర్వమునకు అతీతమైనది బ్రహ్మము'... ఈ రెండు వాక్యములలోని సముచితార్థం విశదపరచమని ప్రార్థన.
Page:258
శ్రీవసిష్ఠ మహర్షి:
సారేణ తు విచారేణ “సర్వ” శబ్దార్థ యోః సమే చిన్మాత్రమేవ జ్ఞాతేయం నాస్తీత్యపి నవిద్యతే॥॥
'సర్వ' శబ్దము యొక్కయు, దాని అర్థము యొక్కయు ఏకస్వభావం విచారణచే తెలియవస్తుంది. అప్పుడు చిన్మాత్రవస్తువు సర్వదా ఒక్కటేనని నీవే గ్రహిస్తావు. ఆ సమయంలో భావాభావరూపము మాత్రమే అగు ఈ ప్రపంచం నీ యొక్క నిర్మలావగాహనచే లేకుండా పోగలదు. ఓ సర్వసభికులారా! ప్రియ ప్రవచన శ్రోతలారా! నా ఈ మాటలు విశ్వసించండి. ఈ ప్రపంచం ఏనాడు మీ కల్పనలకు వేరుగా లేనే లేదు. అవిచారణ యొక్క విస్తృతి చేతనే ప్రకృతికి చిహ్నమగు ఈ భేదమంతా ఉదయి స్తోంది. ఈ కనబడే భేదములన్నీ విలీనమైనప్పుడు ఆ పరవస్తువు ఒక్కటే మిగులుతోంది. మనం ఈ విషయమై అనేక రీతులలో అనేక కోణాలనుండి చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పుకోబోతున్నాం. ఏది ఏమైనా ఉన్న యథార్థ స్థితి ఇది. దీనిని మరెవ్వరూ మరొక విధంగా ఒనర్చజాలరు. అజ్ఞానం (లేక) అబోధ వలన నానాత్వదర్శనమంతా సంభవిస్తోంది. జ్ఞానం వల్ల నానాత్వదర్శనమంతా తొలగి పోగలదు. అప్పుడీ జీవుడు స్వయంగా పూర్ణచిద్రూపుడై ప్రకాశించుచున్నాడు. ఇదియే పరమార్థము.
అట్టి 'పరమ నిశ్శంక స్థితి' యందు సుస్థిరులై ఉన్న మహనీయులెందరో ఈ సభకు వేంచేసి మన ఈ సంవాదమునకు సాక్షులై దీనిని పరమపావనము, లోకకల్యాణపూరితము చేస్తున్నారు. వారంతా ఇప్పటికే ఆశ్రయించి ఉన్న అట్టి నిశ్శంకస్థితి (సందేహ రాహిత్య స్థితి) మరియు అభయస్థితి యొక్క బలం చేత మాత్రమే బంధమోక్షాల కల్పనలు, జాగ్రత్-స్వప్న సుషుప్తాది ఆయా సంక్షుభావస్థలు ఈ జీవులు అధిగమించగలరు. అప్పుడు మాత్రమే ద్వైతభ్రాంతి సంపూర్ణంగా తొలగిపోగలదు.
అజ్ఞానం వల్లే ద్రష్ట, దర్శనం, దృశ్యం - అను త్రిపుటిజ్ఞానంతో కూడిన ఈ జగత్తు అనబడేది ఉపలభ్యమౌతోందని పదే పదే ప్రకటిస్తున్నాను. ఏది అజ్ఞానంచే పొందబడుతోందో... అదంతా అసత్ లేక అసత్యమే సుమా! అట్టి అసత్కు నివృత్తి, లేక శమనం ఏమిటి? 'బ్రహ్మం మాత్రమే సత్యం (బ్రహ్మ సత్యం జగన్మిథ్యా) అనునదే జ్ఞానం! అట్టి శుద్ధాత్మస్వరూపమగు శాంతియే (ఆత్మయే) సర్వే సర్వత్రా వ్యాపించియున్నది. అది అట్లుండగా ఇక అందులో త్రిపుటికి చోటెక్కడిది?
సంకల్పం వలననే చిత్తం, ప్రాణం మొదలైనవన్నీ స్పందించుచున్నాయి. జ్ఞానోదయం అయిన ప్పుడు సర్వ సంకల్పాలు జ్ఞానవస్తువగు స్వస్వరూపమునందు లయించగలవు. సంకల్పాలు తొలగి పోయినప్పుడు స్పందనం అస్పందనమౌతుంది. చైతన్యం సంకల్పాలను వీడిన మరుక్షణం స్పందఅస్పందాలు అనే భేదభావాలు తొలగిపోతాయి. మేఘాల వెనుక ఉన్న సూర్యుడు సర్వదా స్వయం ప్రకాశకుడే అయున్నట్లు సంకల్పాలకు ఆవల ఉన్న చిత్ సర్వదా స్వయంప్రకాశకమే! వాస్తవానికి స్వయంజ్యోతి, స్వయం చైతన్య, స్వయమాత్మ స్వరూపుడగు ఈ జీవుని స్వస్వరూపాన్ని దురవగాహన అనే మేఘాలు ఆవరించి ఉన్నాయి. అట్టి అల్ప-సంకుచిత-పరిమిత భావనా మేఘతరంగాలు అధిగమిస్తేనే చిదన బ్రహ్మము అనుభూతమవగలదు.
Page:259
ఓ రాఘవా! నీవు విశాలమగు చిదనబ్రహ్మపదమును అధిష్ఠించుము. “నేను సర్వదా పూర్ణుడనే” అను భావమునందు వెలయుము. నీవు చేయు సంకల్పాలన్నీ కూడా చిదనబ్రహ్మంతో ఏకరస స్వరూపము పొందియుండు గాక! 'ఇదివేరు... వారువేరు' అను పృథక్భావాన్ని త్యజించి ఉండు. ఓ సర్వజనులారా! 'మోక్షం' అనగా ఎన్నటికో, ఎక్కడో లభించేది కాదని మీరంతా గ్రహించి ఆత్మైక రసమును సంపాదించెదరు గాక! నిర్దోషమగు బోధసారమును గ్రహించెదరుగాక! భావాభావములు తమ యందు లయం చేసి వర్తించు మహనీయులు స్పర్శించు పదార్థములన్నీ అమృతమయం అవుతాయి. సత్యము యొక్క మహిమ అట్టిది సుమా!
భావాభావముల కల్పనకు ఏది కారణమై ఉన్నదో ... అద్దానిని నీవు నీ బుద్ధితో గమనించు. అట్టి కారణాత్మక చైతన్యం నందు సుస్థిరుడవై, ఈ బాహ్య విషయ జగత్తుకు అతీతుడవై చిద్ర్బహ్మం నందు విశ్రాంతి సుఖాన్ని అనుభవించు. పూర్ణాపూర్ణ దశలన్నీ ఏకీకృతమగునది ఏదైతే కలదో ...అదియే నీ స్వస్వరూపం. అంతేగాని, అది ఏదో తొలగిన తరువాత ఎప్పటికో ప్రాప్తించబోయేది కాదు సుమా! అట్టి బాల్యక్రీడలకు తావిచ్చి అజ్ఞుడవు కావద్దు.
12. మౌన ధారణ
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! నీవు చిత్తము యొక్క స్వాభావికమైన ప్రవృత్తులను అనుసరించటం వదిలివేయి. ‘సుషుప్తమౌనము' ను ఆశ్రయించుము. కల్పనా మాలిన్యములన్నిటి నుండి విడివడుము. ఆ పరమపదం మాత్రమే అనుసరణీయం. ఆ పరమపదం నందు ఏది కలదో ... అదే నీవగుము. అదే నీ సత్య స్వరూపమై ఉండటంచేత అక్కడొక్కచోట మాత్రమే అకృత్రిమమైన శాంతి లభిస్తుంది. మరెక్కడా కాదు. అట్టి ఆత్మైక్యస్వరూపం నుండి చ్యుతిపొందకుండా దేదీప్యమానంగా వెలుగొందు! శ్రీరాముడు: మౌనీశా! వాక్ సంయమ రూపమైనట్టి 'వాక్ మౌనం', ఇంద్రియాల సంయమ రూపమైనట్టి ‘ఇంద్రియమౌనం’ ఈ దేహాన్ని క్రియారహితం చేసే 'కాష్ఠమౌనం’ల గురించి నేను విని ఉన్నాను. మీరిప్పుడు ‘సుషుప్తమౌనం అవధరించు' అని ఆజ్ఞాపించారు కదా! అదేమో దయచేసి వివరించండి. శ్రీవసిష్ఠ మహర్షి: శాస్త్రకారులు సాధనపరులగు మునులను రెండు తరగతులుగా విభజించి చెప్పుచున్నారు.
1.కాష్ఠతాపస్యులు: వీరు బ్రహ్మవస్తువును భావన చేయక కేవలశుష్క క్రియలు చాంద్రాయనం, ఇంద్రియ హఠం మొదలైనవి నిర్వర్తించేవారు.
2. జీవన్ముక్తులు : వీరు యథాభూతమగు బ్రహాన్ని వహించి ఉన్నవారు. తమ స్వస్వరూపమును అఖండమైనదిగా, అప్రమేయమైనదిగా, నిత్యమైనదిగా నిర్మలమైనదిగా, సత్యమైనదిగా సర్వమైనదిగా ధారణ వహించి ఉండేవారు. వీరు ఆత్మను ఆత్మయందు భావనాభ్యాసం చేస్తూ ఉంటారు. వీరు తదితరుల వలెనే (లేక) తదితర తపస్యుల వలెనే బాహ్యమున వ్యవహరిస్తూ ఉండవచ్చు గాక! అభ్యంతరమున మాత్రం నిరతిశయానందమును గ్రోలుచూ తృప్తిని వహించి ఉంటారు.
Page:260
శ్రీరాముడు : 'మహామౌనము' అనగా నేమి? అది ఎవరికి లభ్యపడుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి: శాంతిభావమును పొందిన చిత్తనిశ్చయమునే 'మౌనం' అని అంటారు. మౌన విదులగు శాస్త్రకారులు 'ప్రథమ మౌనం నాలుగు రకాలుగా విభజించి చెప్పుచున్నారు.
1. వాక్ మౌనము : వాక్కును నిరోధించటం.
ఈ మూడూ
2. అక్షమౌనము : బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించి ‘కాష్ఠ మౌనం’ అనే ఉంచటం. ఇదే ఇంద్రియ మౌనం అని కూడా అంటారు. అంటారు. కాష్ఠతపస్వియే 3. కాష్ఠ మౌనము : సర్వదేహ ప్రయత్నాలను విడిచిపెట్టి ఉండటం.. వీటిని అవలంబిస్తున్నాడు.
4. సౌషుప్త మౌనము : ఇంద్రియ-మనస్సులకు అతీతము ఇది కాష్ఠమౌనంలోని వహించి విషయ రాహిత్యస్థితిని అభ్యసించటం. వీరు ఈ ఉత్తరోత్తర స్తితి. భౌతిక జగత్తును తిరస్కరించి ఏకాంతులై గాఢనిద్రతో జీవన్ముక్త లక్షణం.
పోల్చదగిన సమాధిని సాధన చేస్తూ ఉంటారు.
❖
ఇక ఐదవది ఒకటుంది. అది మహామనో మౌనం. మనస్సు సంచలనరహితమగు స్థితి అది. ఇది సామాన్యజనులకు మూర్చ, గాఢ నిద్రలందు మాత్రమే ఏర్పడుతుంది. ఇది కాష్ఠ తపస్యులకు సాధ్యకాలంలో ఏకాగ్రత యొక్క తీవ్రతను అనుసరించి కలుగుచున్నది. అందుచేత మనోమౌనమును కాష్ఠమౌనంగానే పరిగణిస్తారు. అయితే, ఒక విధంగా చూస్తే, ఇది నాలుగిటిలోనూ పాల్గొనుచునే ఉన్నది కనుక ఐదవదిగా చెప్పరు.
జీవన్ముక్తులు ఆత్మతత్త్వమును అనుభవించుచున్నప్పుడు ఈ సర్వదృశ్యములలో ఉంటూ కూడా వాటి పట్ల ఒకానొక అతీతస్వభావమున సుస్థిరులై ఉంటారు. అందుచేత వారు మౌనాన్ని 'సుషుప్త మౌనం’ అని పిలుస్తారు. కాష్ఠ తపస్వి మూడు విధములైన మనో, ఇంద్రియ, కాష్ఠమౌనాలను సాధనా పరిణామంగా అనుభవిస్తున్నాడు. సుషుప్తమౌన స్థితియందు 'తురీయావస్థ' అంతర్గతమై ఉంది. అయితే అది జీవన్ముక్తస్థితిలో మాత్రమే కాష్ఠమౌనసాధకులకు అనుభవయోగ్యమౌతుంది. అనగా, అభ్యాసబలం చేత కాలక్రమంగా సౌషుప్తమౌనం లేక జీవన్ముకస్థితి సాధకునకు లభిస్తోంది.
శ్రీరాముడు : మహాత్మా ! మోక్ష సాధకజనులకు వాక్ - అక్ష - - కాష్ఠ మౌనముల అభ్యాసం నిర్వర్తించటం తప్పనిసరి అని మీ ఉద్దేశమా?
శ్రీవసిష్ఠ మహర్షి: జ్ఞాన సముపార్జనమే అన్నిటికంటే పరాకాష్ఠ. వాక్ - అక్ష - కాష్ఠ మౌనములు అభ్యాసపరంగా మౌనములే అయినప్పటికీ, అవి అశుద్ధ చిత్తం యొక్క దృఢనిశ్చయాలే అగుచున్నాయని గ్రహించు. అందుచేత అట్టి నిశ్చయములు జీవునకు జ్ఞానము లక్ష్యమయి ఉండకపోతే బంధమునే కలిగిస్తున్నాయి. జ్ఞాన బలం తోడైతే తప్పక ఉపకరిస్తాయి.
Page:261
కాష్ఠమౌని బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించుచున్నాడు కదా! తద్వారా జరుగుచున్న దేమిటి? లోపల అహంభావము యొక్క స్మృతిని వెలుపల ఆ దృశ్యప్రపంచమును, వాఙ్మయ ప్రపంచముల సంపర్కములను త్యజించటానికి శ్రమతో ప్రయత్నిస్తున్నాడు. అతడు నిరోధ ప్రయత్న శీలుడై ఉంటున్నాడు. నిద్రపోవువాడు కూడా ఈ జాగ్రత్ జగత్ను తిరస్కరించి మౌన - - జడస్థితిని ఆశ్రయించి ఉంటున్నాడు. అది ఈ దేహారోగ్యానికి ఉపయోగిస్తూందేమో గాని, ఈ మాయాజగత్ను అధిగమించటానికి ఉపయోగించదు కదా! అట్లాగే కాష్ఠమౌని జ్ఞానదృష్టిని స్వీకరించకపోతే, సర్వేసర్వత్రా అజ్ఞానముతో కూడి ఆవరించియున్న పరిశుద్ధాత్మత్త్వమును దర్శించజాలడని నా అభిప్రాయం. అయితే జ్ఞానముతో కూడిన సాధన జీవుని జీవన్ముక్తునిగా తీర్చిదిద్దగలదు.“అందుకు ఇది మాత్రమే మార్గం” అని ఏ ఒక్క సాధన విషయంలో కూడా ఎవరమూ నిర్దేశింపజాలమని గ్రహించు.
జీవన్ముక్తుని ఆత్మదృష్టి అనునిత్యం వికల్పరహితమై ఉంటోంది. అతడు నివురుగప్పిన నిప్పు వలె ఆత్మచైతన్య ప్రకాశభావమును అంతటా గాంచుచునే ఉంటాడు. ఇక నిరోధయత్నమునందు నిమగ్నమైయున్న కాష్ఠమౌని, అట్టియత్నమునందు మనసా - కర్మణా నియమితుడై ఉండటం చేత అతని పూర్ణానుభవమునకు 'ప్రయత్నము' అనే ఒక తెర అడ్డుగా ఉండటం గమనార్హం. వాక్ - -
ఇంద్రియ - కాష్ఠములకు సంబంధించిన త్రివిధ మౌనములను ఆశ్రయించినవారు సమాధినుండి లేచినప్పుడు, వారి చిత్తము తగినంతగా నిర్మలం అయి ఉండకపోతే... మరల అది చంచలత్వం పొందుతోంది. ఇక తత్త్వజ్ఞుడై సుషుప్తమౌనము ఆశ్రయించినవాని చిత్తము మొదలంట జయించివేయ బడగలదు. చిత్తమే నశిస్తుంది. కనుక ఇక అట్టి వానిపట్ల చంచలత్వము పొసగదు. అనగా ‘అంతయూ ఆత్మయే’ అను దృష్టిని సుస్థిరపరచుకుంటూ కాష్ఠమౌనమును అభ్యసించేవారు క్రమేపీ కృతకృత్యులై జీవన్ముక్తులై వెలయగలరు.
సుషుప్తమౌనులు జ్ఞానసమన్వితులైనప్పుడు స్వయంగా పూర్ణాత్మయందు వెలయుచున్నారు. అట్టి ఆత్మానుభవస్థితియందు వారు రెండు విధములైన నిర్ణయములు ఆశ్రయించి ఉండటం జరుగుతోంది.
1. కర్మసన్యాసం: “వాక్ - ఇంద్రియ - కాష్ఠ (దేహము)లు బంధములే కనుక వీటి పట్ల పరిత్యాజ్య భావముతో ఉంటాను.” (లేక)
2. కర్మయోగం: “ఈ వాక్-ఇంద్రియ-దేహములు కూడా సచ్చిదానందము యొక్క విలాసములే కదా! అందుచేత అవి వాటి ధర్మములను లోకానుకూలంగా నిర్వర్తించు గాక! కర్మయోగం సమర్పిత భావంతో ప్రవాహపతితమైనదంతా నిర్వర్తిస్తాను.”
ఏది ఎట్లైననూ వారికి 'ఈ ఉభయంలో ఇది మంచిది- అది కాదు, వీళ్ళు గొప్ప వాళ్ళు -
వాళ్ళు కాదు... ఇటువంటి ఉపాధేయబుద్ధి ఉండదు. అట్టి ఉపాధేయాతీత అనుభవం గల యోగులకు సుషుప్తమౌని, జీవన్ముక్తుడు... మొదలైన పేర్లు శాస్త్రకారులు ఇచ్చారు. అట్టి మౌనం ‘నా స్వరూపానికి పునర్జన్మ గాని, ఈ జన్మ గాని లేదు. కనుక నేను సర్వదా జన్మరహితుడను’... అను అవగాహన
Page:262
పెంపొందించుకొన్న వారికి సులభ సాధ్యమౌతుంది సుమా! 'సుషుప్తమౌనం' జీవన్ముక్తులలో జన్మ కర్మలచే స్పృశించబడక నిశ్చలమై, స్వభావసిద్ధియై ఉంటుంది.
శ్రీరాముడు : : ‘సుషుప్త మౌనము’ అనునది జీవన్ముక్తులకు స్వభావసిద్ధమై అంతర్గతంగా ఉంటుందని సెలవిచ్చారు కదా! అట్టి సుషుప్తమౌనము గురించి మరికొన్ని విశేషాలు వినాలని నా అభిలాష. శ్రీవసిష్ఠ మహర్షి: ఆత్మదర్శనం అయితే సుషుప్తమౌనం అత్యంత సహజమై సిద్ధించగలదు. తదితర వాక్-ఇంద్రియ-కాష్ఠ మౌనాల వలె ఇది సిద్ధించటానికి కొత్తగా పడవలసిన కష్టమేమీ ఉండదు. “నేను సత్యమును, సర్వుల స్వరూపుడను" అను ఆత్మానుభూతి పొందుచుండగా ఇక సుషుప్తమౌనం కొరకై ప్రాణనిరోధంతో గాని, పూరక - కుంభక-రేచకములతో గాని పని లేదు. అది సిద్ధించిందా... ఇక విషయాలు లభించుటచే హర్షంతో ఉప్పొంగటం గాని, అవి లభించనప్పుడు కృంగటం గాని ఉండదు. ఆ స్థితియందు నానాత్వ కల్పన ఉదయించదు, శాంతించదు. సుషుప్తమౌని ఈ జగత్ విచిత్ర కల్పనల మధ్య ఉండవలసి వచ్చినపుడు కూడా 'అవన్నీ భ్రమలేకదా'... అని గ్రహించియే ఉంటాడు. ఆత్మజ్ఞాన బలం చేత సుషుప్తమౌనం అకృత్రిమం అవుతుంది.
సాధనా బలిమిచే ఉచిత కాలంలో చిత్తం తన యొక్క చిత్తత్త్వం కోల్పోయి ఆత్మత్వం సంతరించు కుని ఉంటుంది. అనగా చిత్తం చిత్తంగా ఉండక ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అతనికి 'నేను మనస్సును త్యజించాలి. నిరోధించాలి' అనే విభ్రాంతితో అవసరముండదు. అతని మనస్సునందు కర్తృత్వ
భోక్తృత్వాది అభిమానాలు గాని, సత్తు-అసత్తు మొదలైన విభేదాలు గాని ఉండవు. ఆ సుషుప్త మౌనంలో విభాగించునది, విభాగించబడునది - అనేవేవీ స్ఫురించవు. అతని యందు సర్వప్రయత్నాలు విలీనమౌతాయి. ఇచ్చట గాని, మరెచ్చటగాని ఆత్మతత్త్వము గాక మరింకేమి కలదో చెప్పు?
“ధ్యానక్రియ ఉన్నప్పటికీ... లేనట్టి త్రిపుటీ శూన్యస్థితియే అది” అని విజ్ఞులు ప్రకటిస్తున్నారు. ‘నానాత్వభ్రమపూర్ణమగు ఈ జగత్తు ఆత్మతత్త్వముననే వెలయుచున్నది'... అను దృష్టితో కూడిన అభేద నిస్సందేహ స్థితియే సుషుప్తమౌనం అని అనిపించుకుంటోంది. నానాత్వజ్ఞానమునకు ఆశ్రయమైన ఆ పరమ శివమునందే సర్వము వెలయుచున్నాయను అనుభవం సుషుప్తమౌనికి అత్యంత సులభంగా కరతలామలకమౌతుంది.
ఆ తత్త్వానుభవం సర్వవ్యాపకము అయి ఉండుటచే ఆకాశమువంటిది. కాని అది శూన్యము కాదు కాబట్టి, ఆకాశం కానిది. సకలుర స్వస్వరూపి కాబట్టి మిథ్యకానిది, పరతత్త్వాన్ని గ్రహించుటచే చిత్తము ఎవరికి ప్రశమనము పొందుతుందో అట్టివాడే సుషుప్తమౌన సంజ్ఞకు అర్హత పొందుచున్నాడు. అచ్చట సర్వవికల్పములు శూన్యమై, బహిర్విషయజ్ఞానాతీతమై సర్వోపశమన జ్ఞానయుక్తమై, సత్-అసత్ అతిరిక్తమై ఉండగల 'ఉత్తమమౌనస్థితియే' అయిఉంటుంది. భావాభావదశలు ఏర్పడుచున్నప్పుడుకూడా అజ్ఞానము ఏర్పడక, ఆత్మానుభవస్థితి నుండి వివర్తమనునది లేకుండా ఉండుటయే సుషుప్తమౌనం
అనిపించుకుంటుంది.
Page:263
చిత్తవృత్తులు ఉపశమిస్తే వాటి వ్యాపారములగు ఈ జగత్ భేద భావాలు కూడా ఉపశమిస్తాయి. ఆ క్షణమే చిత్తము సమత్వం పొందుతుంది. ఇకప్పుడు జగతు, నీవు, నేను, వారు, మనస్సు - వంటి మనో కల్పనలు ఉండవు. “ఈ జగత్తంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఇక “శబ్దార్థమాత్రమంతా నిర్వికారమగు సత్తాసామాన్యమే” అను అవగాహన అతడు సుస్పష్టంగా కలిగి ఉంటాడు. విషయభావముచే పరిమితుడు కాకపోవుటచే అతడు అపరిమితుడై ఉంటాడు. సుషుప్తమౌనమే తక్కిన మౌనములన్నిటి యొక్క ఆశయసిద్ధి.
అనంతమగు ఆ సుషుప్తమౌనం ప్రబోధము మాత్రమే. ఆ ప్రబోధమే అవిద్యను లేకుండా చేయు తురీయస్థితి. 'అవిద్యను తొలగించుచున్నాను' అను రూపంలో ఉండే వృత్తులు కూడా అక్కడ లేకుండా పోతాయి కాబట్టి అద్దానిని 'తురీయాతీతస్థితి' అని కూడా అంటున్నారు.
1. సుషుప్తరూపసమాధి, 2. తురీయసమాధి, 3. తురీయాతీతసమాధి...ఈ మూడు పేర్లతో చెప్పబడుచున్న ఏకైక ఆత్మస్థితి జ్ఞానికి జాగ్రత్నందు, స్వప్నమునందు కూడా అనుక్షణికమై అనుభూతం కాగలదు.
నాయనా! రామచంద్రా! నీవు బ్రహ్మభూతుడవైతివి. ఇక ఈ భౌతిక దేహమును ఉపయోగించి సర్వత్రా నైపుణ్యముతో ఇక్కడి వ్యవహారార్థమును అనుసరించుము. నీవు ఇప్పటికే జీవన్ముక్తస్థితి పొంది ఉన్నావు. ఆకాశమువలె అత్యంత నిర్మలుడవు, శాంతి మొదలైన పవిత్రవృత్తులచే అలంకృతుడవు అయున్నావు. తురీయమునందే ఈ దేహస్థితిని పొంది ఉన్నావు. స్థూల సూక్ష్మములను పరిత్యజించి ఆకాశమువలె శూన్యుడు కాగలవానికే అట్టి సుషుప్తమౌనం లేక జీవన్ముక్తి ఏర్పడి ఉంటోంది. నీయందు అట్టి లక్షణములు స్వతఃసిద్ధంగా ఉండనే ఉన్నాయి. కాబట్టి నిస్సంశయుడవై, నిర్వికారుడవై, నిర్విచారముగా ప్రకాశించుము. 'ఓం' అను సంజ్ఞచే చెప్పబడిన శబ్దార్థమును గ్రహించినవాడవై సంసారవాసనాశూన్యుడవై తురీయపదమునే అధిష్ఠించి ఉండుము. లీలామాత్రంగా నీవు నిర్వహించ వలసి వస్తున్నవాటియందు పాల్గొనుము. 'ఈ దృశ్యము ఇట్లున్నదేమిటి?' అనునదంతా కూడా కేవలం అంతరానుభూతమగు స్వప్నమువంటిది. ఈ సత్యమును గ్రహించి చిదాకాశకళ యందు చ్యుతిరహితుడవై వెలయుము.
13. ప్రాణ-మనోసంయోగం
శ్రీరాముడు: గురువర్యా! మీరు భిక్షుకోపాఖ్యానం ప్రవచించేటప్పుడు శతరుద్రీయం (100 మంది రుద్రులు) అనుదానిలో నూరవవాడు రుద్రుడు అగుచున్నాడా? లేక గణముల కంటే వేరుగా రుద్రుడు ఒకడు ఉన్నాడా? అనగా రుద్రుడు తదితర జన్మలన్నిటికీ యజమాని, లేక, అధిపతా? లేక అతడు కూడా వంద జన్మలలోని ఒకడా? ఎందుకంటే మీరు ఒకచోట రుద్రుడు - రుద్రగణం అని అన్నారు. మరొకచోట ఆ 'వందమంది రుద్రులు'... అని ప్రయోగించారు.
Page:264
శ్రీవసిష్ఠ మహర్షి: భిక్షుకుడు గాంచిన నూఱు స్వప్నములే నూఱు విధములైన శరీరములు గ్రహించటం జరిగిందని చెప్పుకున్నాం కదా! ఆ స్వప్నశతమూర్తులే... ఈశ్వరుని (ముఖ్యరుద్రుని) పరిచారకులు అని చెప్పునపుడు 'గణములు' అని అనబడినది. ఐశ్వర్య-సామ్యములను పరిగణించినప్పుడు 'శత రుద్రులు’ అని చెప్పబడినది.
'శతరుద్రులు' అని చెప్పబడినది - - రుద్రుని యందు, రుద్రగణం నందు (లేక) శతరుద్రులందు ఆ భిక్షుకుని చైతన్యమే సమముగా విస్తరించి ఉండటం చేతనే.
శ్రీరాముడు: తండ్రీ! ఒక దీపం నుండి అనేక దీపములు వెలిగించినట్లుగా ఆ భిక్షుకుని చిత్తం 100 చిత్తములను కల్పించిందా? ఒకే చిత్తము నుండి అనేక చిత్తములు ఎట్లా కల్పించబడినాయి? శ్రీవసిష్ఠ మహర్షి: ఆ భిక్షుకుడు మాయావరణము లేనివాడు. జ్ఞాని. జ్ఞానైశ్వర్యం కలిగి, మాయావరణం లేనట్టి మహనీయులు ఒకానొక ప్రతిభాసాసంపద కలిగి ఉంటారు. వారు ఏ కల్పన చేయాలను కుంటారో అట్టిది మాయ యందు ప్రతిబింబితమై, అది తదితర జగత్ కల్పన లాగానే వ్యవహార యోగ్యమై భాసిస్తుంది.
ఎందుచేతనంటావా? వారు జ్ఞానబలం చేత “సర్వాత్మకత్వం, సర్వవ్యాపకత్వం” అవధరించి ఉంటారు కాదా ! అందుచేత ఈ బ్రహ్మానుభవులు - సర్వజ్ఞమగు బుద్ధిచే ఏది భావన చేస్తే అది ఈ తీరుగానే ఏర్పడుచూ ప్రాప్తిస్తూ, పరిఢవిస్తూ ఉంటుంది.
శ్రీరాముడు: మహార్షీ! అట్టి జ్ఞానైశ్వర్యము, సత్యసంకల్పము, సర్వాత్మకత్వము అవధరించిన ఆ రుద్రభగవానుడు (కపాలియగు శివుడు) మెడలో కపాలమాలిక ధరించి, ఒళ్ళంతా బూడిద పూసుకుని దిగంబరుడై, శ్మశానవాసి అయి, కాముకుడై ఎందుకు ఉంటున్నాడు. అతడు జ్ఞానైశ్వర్యం కలిగి ఉండి, మాయావరణారహితుడై ఉండి కూడా అట్లు ప్రవర్తిస్తున్నాడేమిటి? మరొక ప్రశ్న. అట్టి జ్ఞానైశ్వర్య పరిపూర్ణులు శాస్త్రాలు వచించే నియమ-నిష్ఠల పట్ల ఎట్టి ఉద్దేశం - ప్రతిస్పందన కలిగి ఉంటారు? శ్రీవసిష్ఠ మహర్షి: సిద్ధిని పొంది, జీవన్ముక్తులై, పరమైశ్వర్యము పొందియున్న మహనీయులు తమ దేహములను శాస్త్రీయ క్రియలందు గాని, భౌతికభోగ ఐశ్వర్యములందు సామాన్యంగా సానుకూల్యత వహించి ఉంటారు. అయితే, వారు "సాంఘికమైన తదితరమైన నియమనిబంధనలకు బద్దులై ఉంటేనే జాన సిద్ధిని పొందినట్లు అని వ్యాఖ్యానించటానికికూడా కుదురునది కదా!
వారు వేదవిధులకు దాసులు కారు. శాస్త్రములు అజ్ఞానులను ఉద్ధరించటానికే విధి విధానాలు ప్రతిపాదిస్తున్నాయి. సుజ్ఞానికి శాస్త్రములు క్రొత్తగా నియమించి చెప్పవలసినదేదీ ఉండదు. అందుచేత అజ్ఞానులకు శుభకరాలుగా తోచే శాస్త్రీయ - లౌకిక కామ్యకర్మాదులు ఆత్మజ్ఞులగు జ్ఞానశీలురకు ఆవశ్యకమని గాని-అనావశ్యకమని గాని అనిపించకపోవచ్చు. ఎందుకంటే వారికి ప్రారబ్ధం యొక్క ఉనికియే ఉండదు. కనుక సామాన్యులకు దుఃఖకరాలుగా తోచే విషయాలు విజ్ఞానులకు అత్యంత సామాన్యమైన విషయాలుగా ఉంటాయి.
క్రియ - నియమము మొదలైనవన్నీ అజ్ఞానుల కొరకే కల్పించబడ్డాయి. ఎందుచేత వారి చిత్తము రాగద్వేషములతో కూడిన వేలాది విషయములతో అనుసంధానమై, ఖండఖండములుగా
Page:265
ఉండి ఉంటుంది కనుక. అంతేకాదు. ఈ సంసారజీవులలో అనేకులు 'పెద్ద చేప చిన్న చేపను హింసించటం సమంజసమే' అను మత్స్యన్యాయముతో కూడిన కుత్సిత - పాపదృష్టులు కలిగి ఉంటున్నారు. వారికి సమరసమగు ఆత్మ యొక్క సమాచారమే తెలియదు. కనుక క్రియ - నియమాలు, చెయ్యవలసినవి - చెయ్యకూడనివి, సవ్య - అపసవ్యముల నిర్దేశము ఎంతో ఆవశ్యకము.
‘ఇవి చేస్తే శుభప్రదం. అవి చేయకుంటే అశుభం. ఇవి చేశారో దుఃఖితులౌతారు' అని ప్రవచిస్తూ సంసారజీవుల ఇష్టానిష్టములను శాస్త్రకారులు నియమం చేస్తున్నారు. అదంతా అత్యంత అవసరం. అయితే, జీవన్ముక్తులగు ప్రాజ్ఞులు ఇష్ట - అయిష్ట విషయములందు చిక్కుకొని ఉండరు. వారు జితేంద్రియులై వాసనాపథమును అతిక్రమించి ఉంటారు. అందుచేత వారు 'ఇది ఇట్లా ఉండాలి... అది అట్లు ఉండకూడదు' అని కోరుకోకుండానే ప్రవాహపతితమై సందర్భమౌతున్న కార్యములను కాకతాళీయ న్యాయమును అనుసరించి ఆచరించుచున్నారు.
కాకతాళీయవద్రూఢాం క్రియాం కుర్వన్తి తే సదా
న కుర్తస్త్వపి వై కించిన్నైషాం క్వచిదపి గ్రహః ॥
క్రియలు నిర్వర్తించినా, లేక నిర్వర్తించకపోయినా వాటన్నింటి యందు వారికి కించిత్ కూడా ఆసక్తి ఉండదు. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు కూడా ఇట్లాగే కాకతాళీయ న్యాయమును అనుసరించి మనుష్యాది జన్మలు స్వీకరించి కార్యములను ఆచరించుచున్నారు.
న నిన్ద్యమస్తి నానిన్ద్యమ్, నోపాదేయమ్, న హేయతా,
న చ ఆత్మీయం, న చ పరం, కర్మ జ్ఞవిషయం క్వచిత్ II
జీవన్ముక్తులగు ఆయా సిద్ధ పురుషులకు నింద్య - అనింద్యములు గాని, గ్రాహ్య - త్యాజ్యములు గాని, స్వ - పర భేదములు గాని ఉండవు. వారిని బంధించగలిగిన కర్మ ఈ భూనభోంతరాలలో ఏదీ లేదు. సృష్టి యొక్క ప్రారంభం నుండి అగ్నికి ఉష్ణము, జలమునకు రుచి - ప్రవాహ స్వభావం మొదలైనవి ఏర్పడియే ఉంటున్నట్లు ఆ ఈశ్వరేచ్ఛను అనుసరించి హరి-హరాది క్రియలు, బ్రాహ్మణ -క్షత్రియాది ధర్మములు లోకంలో వెల్లివిరుస్తున్నాయి.
శ్రీరాముడు: అయితే మహర్షీ! అగ్నికి ఉష్ణము స్వభావసిద్ధమే అయినట్లు అజ్ఞానులకు అజ్ఞానం కూడా స్వభావసిద్ధమేనని అనవచ్చునా ? వారి ఆచరణలు కూడా ఈశ్వరేచ్చేనని తలచవచ్చునా ? శ్రీవసిష్ఠ మహర్షి : కాదు. ఈ అజ్ఞానం సృష్ట్యాది నుండి అభివ్యక్తమైనది కాదు. ఈ జీవుడు అజ్ఞానవిభాగ సంకేతములను అనుసరించి ఐహిక - - పారలౌకిక సుఖ దుఃఖములను కలిగించు స్త్రీ-ధన-జన వ్యవహారములను అన్వయించుకొని అనుసరిస్తున్నాడు. అనగా తన సుఖ దుఃఖములు తానే నిర్వచించుకుంటున్నాడు. అట్టి నిర్వచనముల వెనుక ఉన్న అభ్యాసపూర్వకమైన అజ్ఞానమును తొలగించటానికి ధ్యాన, దాన, పూజాది కార్యక్రమములతో కూడిన విధివిధానములను శాస్త్రములు జనులకు ప్రతిపాదిస్తున్నాయి. సాధనాక్రమము ననుసరించి మనస్సు శుద్ధమగుచుండగా ఈ జీవుడు పవిత్రుడు కాగలడు. ఆత్మత్వమే ఈ జీవుని స్వతః సిద్ధస్వభావంగాని విషయత్వం కాదు. విధ్యుక్తము
Page:266
- - ప్రవాహపతితము అగుచున్నదంతా ఈశ్వరేచ్ఛ అని, ఆసక్త-అనాసక్త, సుఖ-దుఃఖ, హేయఉపాధేయ భావనలంతా అజ్ఞాన కల్పితములని ఎఱుగువాడు సులభంగా ముక్తుడగుచున్నాడు.
14. విదేహముక్తి - మౌనము
-
శ్రీరాముడు : మహాత్మా ! శరీరియగు జీవుని యందు ప్రసిద్ధమై ఉండే 4 విధాలైన మౌనాల గురించి వివరించి చెప్పారు. అట్లాగే 'విదేహముక్తి - మౌనము” ల గురించి కూడా చెప్పమని అర్థిస్తున్నాను. శ్రీవసిష్ఠ మహర్షి: 'విదేహముక్తి' అనునది ఆకాశం కంటే కూడా అత్యంత నిర్మలమైన చిన్మయాత్మాకాశం. “దేహాదులచే గాని, అహంకారాదులచే గాని పరిమితం కాబడనట్టి దృశ్యస్వరూపుడను నేను” ... అని స్వస్వరూపావగాహనకు సంబంధించినది అది. అదియే పరమశ్రేయం, పరం, మోక్షం కూడా. అద్దాని గురించి కూడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. విను.
విచ్ఛిన్న రహితము - విషయరహితము అగు సమాధి యొక్క అభ్యాసం వలనను, వివేక విచారణలతో కూడిన జ్ఞానయోగముననూ “సంపూర్ణ జ్ఞానము” పొందినవారున్నారు. వారిని ‘సాంఖ్య యోగులు' అని శాస్త్రకారులు పిలుస్తున్నారు.
మనం ఇతఃపూర్వం చెప్పుకున్న 'హఠయోగం' అభ్యసిస్తూ, తద్వారా ప్రాణాదులను నిరోధించి క్రమంగా అనామయము, ఆద్యంతరహితము అగు పదమును అధిరోహించేవారు కూడా ఉన్నారు. వారిని “హఠయోగయోగులు' అని పిలుస్తారు. సర్వ కర్మ ఫల సమర్పణ చేయువారు “కర్మయోగులు”. ఈ సాంఖ్యయోగులు, యోగయోగులు... ఇద్దరూ కూడా యోగసాధన ద్వారా పొందాలనుకోతగినది శాంతము-అకృత్రిమము అగు పరమపదమే ! కొందరు కేవలం వివేక - విచారణములతో కూడిన ‘సాంఖ్యము' ద్వారా మరికొందరు 'సర్వకర్మఫలత్యాగం' అను కర్మయోగము వలన, ఇంకొందరు క్రియాయోగ-ధ్యానాల సమాయంచే ఈ జన్మయందే ఆ పరమపదం పొందుచున్నారు. వారు తమ మనోబుద్ధులను సర్వ నియామకుడగు ఆ పరమేశ్వరునికి సాంగపూర్వకంగా సమర్చించి తాము సర్వరహితత్వము సంపాదించుకుంటున్నారు.
అయితే సాంఖ్యము - యోగము ఒక్కటే. ఆ ఆ రెండిటిలోనూ అంతర్లీనమై అనుస్యూతంగా ఉన్నది 'సర్వత్యాగ ఋద్ధియే'... అని ఎవరు గ్రహిస్తారో వారే తత్వాన్ని ఎరిగినవారు ఎందుకంటే సాంఖ్యులు తమ వివేక-విచారణ ద్వారా, యోగులు తమ కర్మఫల సమర్పణ ద్వారా చేరే ఆద్యస్థానం ఒక్కటే. ఎక్కడ ప్రాణము యొక్క వృత్తులు కూడా విషయమే కావో, ఎక్కడ వాసనాజాలం - జన్మకర్మలు అతిక్రమించబడియున్నవో... అట్టి అనుభవైకవేద్య స్థానమే 'పరమపదము' అని గ్రహించు.
నాయనా! వాసనలనే చిత్తము అని అంటాం. అదియే ఈ సంసారమునకు మూల కారణం. ఈ సంసారమునకు వాసనలకు వేరైన మరొక కారణమేదీ లేదు. వాసనలే సంకల్ప పరంపరలను
Page:267
ఉత్పత్తి చేస్తోంది. సంకల్పాలు ఏదో విధంగా సన్నగిల్లితే వాసనలూ సన్నగిల్లుతాయి. దానితో పాటు ఈ సంసారం సన్నగిల్లుతుంది. అట్టి వాసనలు నే చెప్పిన సాంఖ్యం-యోగం రెండిటిలోనూ విలయం పొందుతాయి. రెండిటిలో గల ప్రయత్నం తత్త్వజ్ఞానానుభవ రూపంగా మార్చబడుచుండగా ఇక ఈ సంసారం తన యొక్క కారణత్వం కోల్పోతుంది.
బాలుడు 'బేతాళం (దయ్యం) అను దానిని కల్పించుకుని చూస్తూ ఉంటాడు చూచావా? ఈ మనస్సే శరీరాన్ని ఆత్మగా గాంచుచున్నది. ఇట్లా గాంచుటయే సంసారం కనుక సంసారానికి కారణం మనస్సే. ఎప్పుడైతే ఈ మనస్సు ఆత్మజ్ఞానంచే నింపబడి పునీతమౌతుందో... మరుక్షణం దీనికి శరీరమే కనిపించదు. మనస్సు శాంతించిందా, సంసారం స్వభావ సిద్ధంగానే ఉపశమిస్తోంది. దేహాలు నిర్విషయమై ఉండటమే విదేహముక్తి లక్షణం.
మనస్సు శాంతించాలంటే ఆత్మదర్శనం తప్పితే వేరే ఉపాయం లేదు. నిద్రించే వానికే స్వప్నం. అసత్యమైన స్వప్నంలో "నేను మరణించాను” అను స్వప్న రూపమైన స్వమరణం కలగటం కూడా జరుగునట్లు ఆత్మదర్శనం ఒనర్చనివానికే మనస్సు ఉత్పన్నమౌతోంది. స్వప్నంలో చూచిన స్వమరణం నిదుర లేవగానే ఉండదు కదా ! ఆత్మ దర్శనమైన తరువాత ఆ మనస్సుకు ఏమౌతుందో ఏమీ చెప్పలేం సంసారదృష్టిని కలుగజేస్తున్న మనస్సు జ్ఞానంచే చంచలరహితం అగుచుండగా అప్పుడు మాత్రమే నేను చేస్తున్న ఈ ఆత్మబోధ హృదయంలో ప్రవేశించగలుగుతుంది అప్పుడిక బంధ-మోక్షముల ఛాయలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి.
సాధనాత్రయం -
1. దృఢమగు ఏకత్వము యొక్క అభ్యాసం. (భిన్నత్వంలో ఏకత్వం సందర్శించటం.) 2. ప్రాణనిరోధం (రేచక-కుంభక-పూరకములవంటి ప్రాణయోగోపాసనలను అభ్యసించటం) 3. మనోనిగ్రహం (ఇంద్రియ విషయాలను మననం చేయక, వాటికి అతీతత్వం వహించటం
అభ్యసించటం
...ఈ మూడిటినీ మోక్ష కారణమగు ' సాధనాత్రయం' అని అంటూ ఉంటారు. ఇదియే సర్వ శాస్త్రముల తాత్పర్యం.
880
శ్రీరాముడు : మునీంద్రా! మధ్యమాధికారి అనుసరిస్తూ ఉండే ప్రాణవిలయం మోక్షమునకు కారణం అగుచున్నదని అంటున్నారు కదా ! మరణ సమయంలో కూడా ఈ జీవుని విషయంలో ప్రాణాలు నిరోధించబడుచున్నాయి. మరి, అందుచేత మృతి అనునది కూడా మోక్షార్హత కలిగించగలదని అనవచ్చునా?
శ్రీవసిష్ఠ మహర్షి: 1. ప్రాణ నిరోధము, 2. సాంఖ్యము, 3. కర్మయోగము... ఈ మూడు ఉపాయాలు పరిలక్షితమైనది మనోనిరోధం వైపునకే. మనో నిరోధమే శ్రేష్టాతిశ్రేష్ఠం. అది ఏ ఉపాయం చేతనైనా సరే... ఎంత త్వరితంగా లభిస్తే అంతమంచిది.
Page:268
ఇక మరణం విషయానికి వద్దాం. ఒకడు మరణించినంత మాత్రం చేత అతని మనః ప్రాణములు ఆతనిని విడచివేయవు.
దృష్టాంతానికి ఒకడు మూర్ఛిల్లినాడనుకో, లేక గాఢంగా నిద్రిస్తున్నాడనుకో. అంతమాత్రం చేత ఆతని కోరికలు, ఆశలు, శంకలు, వృత్తులు నశించుచున్నాయా?... లేదు. అవి నీటియందు కరిగిన ఉప్పు వలె వాసనా రూపమున వెలయుచున్నాయి. అట్లాగే ఒకడి ఈ భౌతిక శరీరం మరణించినంత మాత్రంచేత మనోలయం గాని, వాసనావిలయం గాని జరుగుటలేదు. ఆ దేహి మరల మరొక దేహంతో ప్రత్యక్షమైన (లేక) ఆవిర్భవించిన మరుక్షణం ఆ వాసనలు మరల ప్రకోపిస్తు న్నాయి. మరణకాలంలో ప్రాణాలు ఈ భౌతిక దేహాన్ని త్యజిస్తున్నాయి. ఇంతలోనే వాసన - - కామ్య కర్మలచే ఉపస్థాపితమైన భవిష్యత్ దేహాకారమును అనుభూత మొనర్చుకొనుచున్నాయి. బాహ్యాకాశంలో తదనుకూలమైన తన్మాత్ర సమన్వితమైన అనుభూతులను ఆశ్రయించి అనుభవమును కొనసాగిస్తున్నాయి
ఈ భూతతన్మాత్రలు వాసనాత్మకములే గాని మరింకేమీ కాదని గ్రహించు. ఈ వాసనలు తదనుకూలమైన మనోప్రాణములనే ఆశ్రయించుకొని ఉంటాయి. తదితరమైన మనోప్రాణాలను ఈ భూతతన్మాత్రలు తాకజాలవు. ఈ విషయములు వేదములచే చెప్పబడి ఉండటమే కాదు... యుక్తి చేత కూడా గ్రహించవచ్చు. ఈ జీవుని విషయంలో ప్రాణములు భవిష్యత్ దేహవాసనలతో కూడియే పూర్వదేహమును పరిత్యజించుచున్నాయి. అందుచేత తరువాతి దేహముకూడా వాసనల వలననే ఉత్పన్నమగుచున్నది. 'వాసనలు' అనగా సంకల్ప పరంపరల ఉత్పత్తి స్థానమే కదా!
పుష్పములలోని సుగంధమే నువ్వులలో ప్రవేశిస్తోంది. ఆ నువ్వులు గానుగయందు నలుపబడుట అను క్లేశము ననుభవించి నూనెగా పరిణమిస్తోంది. అట్లాగే శరీరమునందున్న హృదయాకాశము తోడను, తదంతర్గతమగు ప్రసరణ స్వభావం గల వాయువుల తోడను కలసి ఈ మనస్సు క్లేశములు పొందుచున్నది. అందుచేత 'మృతి చెందిన వెంటనే ప్రాణములు నిరోధం పొందుతాయి'... అని నీవు అన్నది యుక్తియుక్తం కాదు. జలముతో నిండిన ఒక కుండను తటాకంలో ముంచినంత మాత్రంచేత ఆ కుండలో జలం నశించిందని అనటానికి వీలు లేదు కదా! వాసనాసమన్వితమైన ఈ మనస్సు కూడా అదృశ్యమైపోయేది కాదు. మరణమాత్రం చేత మనస్సు నశించదు. ప్రాణములు నశించవు. ప్రాణములు వర్తమాన భౌతిక దేహమును మాత్రం త్యజిస్తున్నాయి. కిరణరహితుడైన సూర్యుడు ఉండజాలడు కదా! అట్లాగే మనోరహితమైన ప్రాణాలు ఉండజాలవు. అంతేకాదు. తిత్తిరిపక్షి నోట కరచిన గడ్డిపరకను ఉచితాహారం కనబడేవరకు పట్టుకునే ఉంటుంది. మనస్సునందు జ్ఞానోదయం అయిందా, ఇక ఆ మనస్సు వాసనాశూన్యమై తనకు కారణమైయున్న స్వస్వరూపమునందు విలయం పొందుచున్నది. అప్పుడిక మనస్సు, ప్రాణం స్పందనాభావం పొందకుండా ఉంటాయి. అట్లు మనస్సు స్పందనాభావం మానివేస్తే ఇక మిగిలేదేమిటి? కేవలం అఖండశాంతియే. కాబట్టి రామా! జ్ఞానం యొక్క శక్తి వలననే నీ దృష్టిలో ఈ పదార్థముల యొక్క అస్థిత్వం తొలగిపోవుచున్నది. అప్పుడు ప్రాణం - చిత్తం కూడా ప్రశాంతిస్తున్నాయి. ప్రశాంతి పొందిన మనస్సు దేహభావాన్ని ధరింపదు.
❖
Page:269
ఏ వాసనలైతే నాశనం కాగా, పరమపదము లభిస్తుందో ... అట్టి వాసనలనే మనం 'మనస్సు' అని వర్తమానంలో అంటున్నాం. వాసనలే చిత్తము కూడా. అవి లేకుండుటే పరమపదము. జ్ఞానం ఉదయిస్తే అప్పుడు అది వాసనతో కూడిన అన్నిటినీ తిరస్కరించి వేస్తుంది. ఆ జ్ఞానమే ఆత్మతత్త్వముగా పరిణతి పొందుతోంది. ఆత్మతత్త్వము విక్షేపరహిత అనుభవ స్వరూపంగా వెలయుచున్నది. ఈ విషయమునే అనుభవిష్ణులగువారు వేద - ఉపనిషత్ల రూపమున, మరెన్నో శాస్త్ర సిద్ధాంతముల రూపమున స్వస్వరూపాత్మజ్ఞానమును లోకమునకు చాటుచున్నారు.
త్రాడును చూచి 'పాము' అని భ్రమించువాడు 'అది త్రాడే' అని తెలియగానే సర్వవికారములు త్యజించివేస్తాడు కదా! ఈ దృశ్య జగత్పట్ల ఈ జీవునకు ఏర్పడి ఉంటున్న ఆశ - ఆవేశరూపములైన సంసారము వివేకము చేతనే స్వయంగా నశించగలదు. 1. ఏకత్వాభ్యాసము 2. ప్రాణ నిరోధము 3.మనోలయములలో... ఏ ఒక్కటి సిద్ధించినా సరే, తక్కినవన్నీ స్వాభావికంగానే సిద్ధించగలవు. విసనకఱ్ఱ వీచటం ఆగిపోతే, అట్టి వీచుట వలన కలిగే వస్తువుల కదలికలు కూడా ఆగిపోతాయి కదా! ప్రాణవాయుస్పందన నిర్వృత్తం కాగా మనస్సుచే పొందబడే విషయాలు కూడా సశాంతిస్తాయి.
'మృత్యువు' విషయమై మనం కొన్ని విషయాలు ఇక్కడ మననం చేసుకుందాం. ఈ దేహి దేహమును వహించటం మనందరి పట్లా చూస్తున్నాం కదా! అన్నపానాదులచే ప్రవృద్ధమగుచున్న ఈ దేహం వ్యాధుల ప్రబలత్వం చేతనో, వార్ధక్యం చేతనో, యుద్ధము నందు ఖండింపబడటంచేతనో, ఏవైనా ఆకస్మిక సంఘటనల వలననో ఒక రోజున నిరుపయోగ స్థితి పొందుతోంది. శరీరం పతనం కాగానే ఇంతకాలం ఈ శరీరమును ఉత్తేజపరుస్తూ కార్యోన్ముఖం చేస్తున్న ప్రాణవాయువులు ఈ శరీరమును విడచి బాహ్యాకాశమునందలి వాయువుతో లీనమగుచున్నాయి. మనస్సు ప్రాణములను అనుసరిస్తున్నది. నేలకూలి నిరుపయోగమై ఉన్న ఆ జీవుని భౌతిక దేహాన్ని బంధువులు త్యజిస్తున్నారు. ఆతని బంధువులకు తదితరులకు ఆతడు జ్ఞాపకమాత్రుడు అగుచున్నాడు.
ఇక, ఆ మరణించిన జీవుని విషయానికి వద్దాం. ఆతని ఒక విభాగమగు పాంచభౌతిక దేహం నేలకూలింది కదా! ఇంకా ఆతనికి రెండు దేహాలు ఉన్నాయి.
1. మానసిక దేహం (సూక్ష్మదేహం, ఆతివాహికదేహం); 2. చిత్ దేహం (కారణదేహం) ఈ భౌతికదేహం త్యజించిన ఆ జీవుడు అప్పుడే, అచ్చటే తన వాసనలను అనుసరించి స్వకీయ కల్పనారూపమైన సమస్త ప్రపంచాన్ని గాంచుచున్నాడు. ప్రతిజీవుని యొక్క వర్తమాన దృశ్య ప్రపంచ దర్శనం కూడా అటువంటిదే!
మొదటి ఉపాయం : ప్రాణ, మనోనిశ్చలాభ్యాసం - ఇక ప్రాణవాయువుల విషయమంటావా? ఈ జీవులందరి ప్రాణవాయువులు కర్మల చేత శరీరములను విడిచి, మరల కర్మల చేతనే ఆకాశమున ఉద్భవిస్తున్నాయి. ఈ విధంగా జీవులకు ప్రాణవాయువులతో సంయోగ - వియోగములు నిరంతరం ఏర్పడుచున్నాయి. ఈ జీవులు వాసనామయాలై శరీరం ఉన్నప్పుడు - శరీరం లేనప్పుడు కూడా వాసనామయమగు సుర నర పశ్వాది దేహాలను గాంచుచున్నారు. ఈ జీవుడు అతను ఆశ్రయించే ఉపాధిని అనుసరించే ఆచార - వ్యవహారములు పరిరక్షించుకొనుచున్నాడు.
Page:270
గాలివీచటం ఆగిపోయినప్పుడు పుష్పములందు గల సుగంధం కట్టుబడిపోతుంది కదా! అట్లాగే మనస్సు యొక్క స్పందనము శాంతిస్తే ప్రాణవాయువుల చలనము కూడా కట్టుబడిపోతుంది.
ఈ జీవుని ప్రాణం - చిత్తం ... ఇవి వేరుగా ఉండజాలవు. నువ్వులు - - నూనె, పుష్పములు - సువాసన, ప్రాణము మనస్సు ...ఇవి కలిసియే ఉంటాయి కదా!
మనస్సు యొక్క స్పందనయే ప్రాణము... ప్రాణము యొక్క స్పందనయే మనస్సు.
ఇవి రెండూ రథికుడు - - సారథివలె కలిసియే విహరిస్తున్నాయి. అగ్నికి ఉష్ణమునకు పరస్పరం ఆధార ఆధేయ సంబంధం ఉంటోంది కదా! అట్లాగే, మనస్సు - ప్రాణములు ఒకదానిపై మరొకటి ఆధారపడి ప్రదర్శితమగుచున్నాయి. అవి పరస్పరం లయం పొందినప్పుడు మోక్షము అను ఉత్తమ కార్యమును (నిశ్చలస్థితిని - స్థానమును) సంపాదించుకుంటున్నాయి.
ఏకతత్త్వ ఘనాభ్యాసాచ్ఛానం శామ్యత్యలం మనః తల్లీనత్వాత్ స్వభావస్య, తేన ప్రాణో పి శామ్యతి ॥
మనస్సు పూర్ణంగా శమించటం అనేది ఏకత్వం యొక్క దృఢాభ్యాసం వల్ల సుసాధ్యపడుతుంది. అప్పుడు మనస్సు యొక్క అంతర్గతమైన ప్రాణాలు కూడా మనస్సుతో పాటే శమించుచున్నాయి. అంతేగాని శరీరం నిరుపయోగమైనంత మాత్రంచేత (దేహం మరణించినంత మాత్రంచేత) ప్రాణాలు శమించటం లేదని గుర్తు చేస్తున్నాను.
విచార్యయత్ అనన్తాత్మతత్త్వం, తన్మయతాం నయ మనస్తత స్తల్లయేన తదేవ భవతి స్థిరమ్ ॥
ఓ రామచంద్రా! నీవు తత్త్వ విచారణను ఆశ్రయించు. అనంతమగు ఆత్మతత్త్వమునందు నీ మనస్సు తన్మయమయేట్లు చేయి. ఆత్మతత్త్వమునందు లయమొందిన మనస్సు ఆత్మయే అవుతుంది. అప్పుడది తన చంచలత్వం త్యజించి అకృత్రిమమైన స్థిరత్వం పొందుతుంది. అప్పుడు ప్రాణాలతో బంధం సంశాంతిస్తుంది. లేదా...
యదేవాతితరాం శ్రేయో, అనుపలమ్భో, ఉపలమ్భయోః, ద్వయోరప్యసతోస్తత్ర శేషేవాపి స్థిరోభవ I
రెండవ ఉపాయము - ఉపలంభము (perception) అనుపలంభము (Non-perception) అను రెండింటి పట్ల కూడా ఏది నిర్వికారమై సర్వ విషయాతీతమై ఉన్నదో, అట్టి శ్రేయోదాయకమునందు ప్రాణమనస్సులను ధారణమొనర్చి నీవు స్థిరుడవు కమ్ము. ఈ విధంగా తత్త్వభావనావృత్తి కూడా చరమ సాక్షాత్కారము వలన వినష్టమై ఆభావత్వము పొందనంత వరకు నీవు నీ అభ్యాసమును కొనసాగిస్తూనే ఉండు. “నాతో సహా ఈ సర్వము ఆత్మ యొక్క సంప్రదర్శనమే! విన్యాసమే!”... అనునదే తత్వభావనావృత్తి.
ఆహారం లేకపోతే ఈ శరీరం క్షీణిస్తూ ఉంటుంది కదా! అట్లాగే విషయములకు సంబంధించిన సంచయము సన్నగిల్లుతూ ఉంటే మనస్సు సన్నగిల్లుతూ ఉంటుంది. అట్టి మనోరాహిత్యం అత్యంత
Page:271
శుభప్రదం. ప్రత్యాహారపరాయణులు క్రమక్రమంగా నిర్వికల్ప సమాధియందు తమ మనః ప్రాణాలను విలయం చేస్తున్నారు. అప్పుడిక పరమవస్తువు ఒక్కటే శేషిస్తుంది. ధారణాదుల వలన మనస్సు ఏకాగ్రమగుచుండగా ఇక అది బాహ్యవికారములను వీడి ధ్యానలక్ష్యమగు ఏకత్వం సంతరించుకో గలదు. అభ్యాసవశం చేత సర్వత్రా సమదర్శనం సుసాధ్యమేనని నేను అందరికీ మనవి చేస్తున్నాను. అందుచేత ఏకత్వము అను లక్ష్యశుద్ధితో సాధన కొనసాగించవలసినదిగా సాధకులకు నా విన్నపం.
ఓ రామా! అవిద్య యొక్క రూపమే ద్వైతం. అవిద్య అనునది లేని వస్తువై ఉన్నది. నీ స్వరూపమే అగు పరతత్త్వం ఆత్మజ్ఞానం వలననే సంప్రాప్తిస్తోంది. కనుక శాస్త్రీయ యుక్తియుక్తములను గ్రహించిన బుద్ధితో ధారణ - ధ్యానాల ద్వారా జ్ఞానాన్ని జనులు అభ్యసించెదరు గాక! శరత్కాల మేఘం తొలగగానే, ఆ మేఘం నుండి కురుస్తున్న మంచు కూడా తొలగిపోతుంది కదా! సూర్యప్రకాశం అధికమగుచుండగా 'చలి' క్రమంగా దానంతట అదే తొలగుచున్నది. మనస్సు శాంతిస్తూ ఉంటే అద్దాని 'వికార మృగతృష్ణ' యగు ఈ సంసారచపలత్వం దానంతట అదే ఉపశమిస్తుంది.
చిత్తమే అవిద్య అని అనుకున్నాం కదా! ... అందుచేత నీవు తత్త్వ విచారణను ఎల్లప్పుడూ ఆశ్రయించు. మనస్సును బ్రహ్మాంకితం చేయి. పరిణతి పొందిన మనోవిభాగం మాత్రమే చంచల విభాగమైన మనస్సును నిరోధించగలుగుతుంది. మనస్సు కొద్ది క్షణములైనా పరమపదము నందు విశ్రాంతి పొందుతూ ఉండటం అభ్యసిస్తూ ఉంటే, క్రమంగా బ్రహ్మాకార నిరతి తప్పక లభించగలదు. నిరతిశయమగు ఆనందరసాస్వాదనం పొందుచున్న మనస్సు విషయములను ఇచ్చగించమన్నా ఇచ్ఛగించదు. నీవు సాంఖ్యం ఆశ్రయిస్తావా? లేక, యోగం ఆశ్రయిస్తావా? కాక, ఆ రెండూ ఆశ్రయిస్తావా? అది నీ ఇష్టం. మొత్తం మీద మనస్సు బ్రహ్మాకారం పొందాలనే పరిలక్ష్యమును కలిగి ఉండు. అద్దానిని ఏమరవకు. మంచినీటి సరస్సులో స్నానం చేసి వచ్చేవాడు దోవలో కనబడే మురికిగుంటను చూచి ఆకర్షితుడౌతాడా? బ్రహ్మాభ్యాసం చేసేవానికి ఇక మనస్సు ఆత్మతత్త్వమే పొందుతుంది కాని విషయత్వం కాదు.
ఏ చిత్తంలో అవిద్య తొలగుతుందో, దానినే జ్ఞానులు సత్వము అని పిలుస్తున్నారు. ఆ సత్వం సంసారబీజాన్ని దగ్ధం చేసి, ఇక ఆ బీజం యొక్క పునరుత్పాదన స్వభావాన్ని వినష్టం చేసివేయగలదు. అట్టి సత్వం ఉదయించిందా, ...ఇక బ్రహ్మభావం నుండి చ్యుతి ఉండదు. ఆతనిలో అవిద్య, వాసనా బీజం స్వయంగా విచ్ఛిన్నములగుచున్నాయి. అట్టిది అజ్ఞులకు అసంభవమేమో అని అనిపిస్తోంది. కాని సాధన - ప్రయత్నం ఉన్నవారికి మార్గం - లక్ష్యం సులభసాధ్యమేనని ప్రకటిస్తున్నాను. నేను చెప్పిన త్రివిధ ఉపాయాలు ఆశ్రయించుటచే పొందబడు జీవన్ముక్తి స్థితియందు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనబడే మూడు అవస్థలు, భ్రాంతి, ఆ భ్రాంతి యొక్క బీజాలు, మనస్సు కూడా లయించగలవు. అప్పుడు దగ్ధమైన వస్త్రంలాగా సత్వము మాత్రమే మిగులుతుంది. ఇక అద్దానియందు సంసారకారణములైన రాగద్వేషములు ఏర్పడజాలవు. అట్టి సత్వమాత్రశేష్యమే విదేహముక్తి.
Page:272
VII. బేతాళ ప్రశ్నలు
1. ఆరు ప్రశ్నలు
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! తత్త్వ విచారణచే జ్ఞానసముపార్జన అత్యంతావశ్యకం. జ్ఞానోత్పత్తి అయిన తరువాత 'ఇది జీవుడు - ఇది చిత్తము’ అను కల్పనలు ఇక మిగలవు.
విచారణ చేయటమే అవిద్యోపశమనమునకు ఉపాయం. ఎందుకంటే అవిద్యకు మూలం అవిచారణయే కదా! అందుచేత ముముక్షువు జ్ఞానోదయ పర్యంతమూ విచారణ చేస్తూనే ఉండాలి. జ్ఞానోదయమునే 'మోక్షము' అనికూడా అంటున్నాం.
‘మనస్సు - అహంకారము' మొదలైనవాటికి ఎండమావులలోని జలంలాగా అసలు ఉనికియే లేదు. అవి ఉన్నట్లు అనిపించటమంతా భ్రమచేతనే సుమా! కొంచెం విచారణకు ఉపక్రమించటం జరిగినా సరే ...అవి లయం పొందుతాయే! ఇక తాత్సారం ఎందుకు? వేదన చెందవలసిన పనేముంది?
ఈ 'సంసారస్వప్న విభ్రమము' గురించి ఒక సందర్భంలో ఒక బేతాళుడు కొన్ని ప్రశ్నలు ప్రతిపాదించటం జరిగింది. ప్రసంగవశంగా అవిప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి. శుభకరములగు ఆ ప్రశ్నలేమిటో ...విను.
*
వింధ్య పర్వత ప్రాంతంలో అనేక జనపదాలు, మహారణ్యాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో గల ఒకానొక దట్టమైన అడవిలో భీకరమైన శరీరం గల ఒక బేతాళుడు ఉండేవాడు. ఆతనికి జ్ఞాను లంటే మహాయిష్టం, అజ్ఞానులంటే మహాతిరస్కార భావం ఉండేది. ఒకసారి ‘అజ్ఞానులను’ మాత్రమే నేను భక్షిస్తాను... అనే నిర్ణయం తీసుకున్నాడు.
అతడు ఒక కిరాతరాజ్యం ప్రవేశించాడు. మంత్రతంత్రాలపై అత్యంత ప్రవేశము, అభిరుచిగల ఆ కిరాతరాజ్యపు ప్రజలు ఆతనికి బలులు ఇచ్చి సంతోషపెట్టేవారు. ఆతడు కిరాతరాజ్యంలో అడవిలో గల ఒక మఱిచెట్టును నివాసంగా ఏర్పరచుకొని తనకు ఇవ్వబడే బలులను స్వీకరిస్తూ అక్కడి ప్రజలకు రోగవిముక్తి మొదలైన సుఖములను ప్రసాదిస్తూ ఉండేవాడు. తాను మాత్రం జ్ఞాన బలంతో నిత్యతృప్తుడై నిశ్చలమగు సమాధియందు కాలం గడుపుతూ ఉండేవాడు.
ఆతడు ఆకలైనప్పుడు ఆ బాటలో వచ్చే బాటసారులను చంపి స్వాహా చేసేవాడు. అయితే, తాను జ్ఞాని అయి ఉండడంచేత, ఆకలిగా ఉన్నాసరే ... నిష్కారణంగా సుజనులను చంపేవాడు కాదు. దుష్ట - దుర్మార్గ - దురాచారులను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. క్రమంగా బేతాళుని
Page:273
విషయం తెలిసిన అక్కడి ప్రజలు సత్ప్రవర్తనులై భక్తి -జ్ఞానములు పెంపొందించుకున్నారు. అందుచేత ఆతనికి అక్కడ భక్షించుటకు తగినవారే దొరుకుట లేదు. ఆకలిచే ప్రేరితుడై ఆహారమగుటకు అర్హులగు వారికోసం వెతుకుతూ కిరాతరాజ్యానికి దగ్గరలో ఉండే ఒక నగరంలో ప్రవేశించాడు. అర్ధరాత్రి అయింది. అక్కడి రాజు నగరపరిసర ప్రాంతంలోగల దొంగలను, దుష్టులను, దారిదోపిడీ చేసేవారిని పట్టుకోవటానికి బయలుదేరి యాదృచ్ఛికంగా బేతాళునకు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ రాజును చూచిన బేతాళుడు ‘ఆహా! ఈ రోజు నా పంట పండింది. మంచి కండపుష్టి గల ఈ మనుజుడెవ్వడో ఇటువైపే వస్తున్నాడు. ఈ రోజు ఈతడే నాకు ఆహారం' అని అనుకున్నాడు. రాజు వస్తున్న మార్గంలో ఎదురుపడి తన భయంకరరూపం ప్రదర్శించాడు.
బేతాళుడు : ఓయీ! బాటసారీ! నేనెవరో తెలుసా! దిక్కులు పిక్కటిల్లచేసే శక్తిగల బేతాళుడను. ఈ రోజు నీవు నాకు ఆహారమవటానికే ఇటు వచ్చావు. ఇక తప్పించుకోలేవు. నాకు భోజనం కమ్ము. రాజు : ఏం బేతాళా! బాగానే ఉన్నది గాని, మరి నెనెవ్వరో తెలుసా? ఈ దేశపు రాజును. న్యాయ పూర్వకమగు 'క్రూరమృగ వధ' - అనే నా విధ్యుక్తధర్మమును నిర్వర్తించటానికి ఈ నిర్జన ప్రదేశానికి వచ్చాను. నేను నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించ లేదే! అన్యాయంగా నన్ను బలవంతంగా భక్షించటానికి ప్రయత్నించావా?...ఈ ఆయుధాలతో నీ తల వేయిప్రక్కలు చేసివేయగలను. బేతాళుడు : ఓ రాజా! నేనెవరినీ అన్యాయంగా భక్షించనను వ్రతం గలవాడిని. అయితే నిన్ను భక్షించటం న్యాయమో, అన్యాయమో తెలియాలి కదా?
మరొక విషయం. నీవు ఈ దేశపు రాజువు కదా! ధర్మశాస్త్రానుసారం నీ రాజ్యంలో ప్రవేశించి ఉన్న నాకు ఆకలి దప్పికలు తీర్చటం నీ కర్తవ్యమే! నీవు వధించటానికి అర్హుడవైతే మాత్రం నిన్ను ఈ రోజు వదలిపెట్టేది లేదు. వ్యర్థంగా విజ్ఞులను వధించటం నా ప్రవృత్తియే కాదు. అజ్ఞులను వదలిపెట్టే ప్రసక్తి లేదు.
ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీవు సమాధానం చెప్పు. నీ సమాధానమును బట్టి నీ యొక్క జ్ఞానాజ్ఞానాలు గ్రహించి, నీవు నాకు ఆహారమవకుండటానికి తగినవాడవో, కాదో నేను నిర్ణయిస్తాను.
రాజు : నీవు మనుష్యులను భక్షించే ముందు వారు వివేకులో, అవివేకులో ... జ్ఞానులో, అజ్ఞానులో పరిశీలించి అజ్ఞానులను మాత్రమే భక్షిస్తూ ఉంటావా?... చాలా ఆశ్చర్యంగా ఉన్నదే! నీ వంటి బేతాళులకు కూడా సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయా?
బేతాళుడు : (బిగ్గరగా పకపకా నవ్వి) ఇప్పుడు నిన్ను నేను కొన్ని ప్రశ్నలడుగుతాను. ఆ ప్రశ్నలకు నీ సమాధానమేమిటో చెప్పు. ఆ సమాధానాలను అనుసరించి నిన్ను భక్షించవచ్చునో, లేక నమస్కరించి శరణువేడాలో నేను గ్రహిస్తాను.
Page:274
బేతాళ ప్రశ్నలు -
1. ఈ సృష్టిలో అసంఖ్యాక బ్రహ్మాండములున్నాయి కదా! ఇవన్నీ కూడా ఏ సూర్యుని యొక్క సూర్యరశ్మిలోని, సూక్ష్మపరమాణువులు, లేక, త్రసరేణువులు అయి ఉన్నాయి?
2. ఆ బ్రహ్మాండ త్రసరేణువులు ఏ మహాకాశవాయువులో స్ఫురించుచున్నాయి?
3. ఒకాయన ఉన్నాడు. ఆయన అనేక స్వప్నములను నిష్కారణంగా గనుచున్నాడు. ఆ అనేక స్వప్నములలోని ప్రతి ఒక్క స్వప్నములో మరల ఇంకెన్నెన్నో ఉపస్వప్నములను కూడా గనుచు న్నాడు. ఒక స్వప్నం వదలి వెంటనే మరల ఇంకొక స్వప్నంలోకి వెనువెంటనే ప్రవేశిస్తున్నాడు. ఆతడు ఎన్ని స్వప్నాలు కనుచున్నప్పటికీ తన స్వరూపం మాత్రం త్రికాలములలో యథాతథంగానే కలిగి ఉంటున్నాడు. ఆయనను నీవెక్కడైనా చూచావా? ఎవ్వరాయన?
4. అరటి పట్టలను విప్పుకుంటూపోతూ ఉంటే చివరికి బయటనున్న ఆకాశమే లోన కూడా శేషించి ఉంటుంది. అట్లాగే ఈ స్వప్నస్వప్నాంతరములలో బయట-లోపలకూడా అవిచ్ఛిన్నంగా అఖండంగా వెల్లివిరిసి సదా ఉన్నది ఏమిటి? ఎవరు?
5. మనకెదురుగా ఈ దృశ్యప్రపంచం ఉన్నది. దీనిలో విశాల ఆకాశము, భూత సముదాయం, సూర్యమండలము, మేరు పర్వతం ... ఇవన్నీ ఘనీభూతమై ఎదురుగా ఉన్నాయి. ఇవి అత్యంత మహత్వముతో ప్రవర్తిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒకానొకని అణుఅంశమునందు ఒక పరమాణు పరిమాణమై ఇమిడి ఉన్నాయి? ఆతడెవడు? ఆతడెక్కడ ఉంటున్నాడు.
6. అవయవరహితుడగు ఒకానొక పురుషుడున్నాడు. ‘ఆకారము’ అనే వికారము ఆతనియందు లేదు. అయితే ఏం? ఆయనయొక్క ఒక స్వల్పాంశ ఈ రాళ్ళు-మట్టి-పర్వతము-దేహములతో కూడిన పాదార్థిక జగత్తుకు అస్థిత్వం కల్పిస్తోంది. అట్టి అస్థిత్వము కల్పిస్తున్నదెవరు? ఆయనను నీవెక్కడైనా చూచావా?
ఓ రాజా! ఇప్పుడు నిన్నొక ఆరు ప్రశ్నలు అడిగాను. వీటికి నీకు సమాధానం తెలియకపోతే 'ఆత్మద్రోహి'వి అవుతావు. దేహబుద్ధి పరిమితుడవు అవుతావు. యముడు లోకములను మ్రింగుచు న్నాడు చూచావా? నీవు సమాధానాలు చెప్పకపోయావో ...నేను కూడా నిన్ను, నీ ప్రజలను చప్పరించి మ్రింగివేస్తాను. ఇక నీ ఇష్టం.
రాజు ఆ ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆతని పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇక ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వనారంభించాడు :
ఒకటవ ప్రశ్న - ఈ బ్రహ్మాండములు ఏ సూర్యరశ్మిలోని త్రసరేణువులు?
ఒకచోట ఒక ఫలం వ్రేలాడుతూ ఉన్నది. ఆ ఫలమే ఈ బ్రహ్మాండము. ఆ ఫలం (ఈ బ్రహ్మాండము) నీకూ, నాకూ, తదితర అసంఖ్యాక జీవులకు ఆశ్రయభూతమై ఘనము - ద్రవము ఉష్ణము - - వాయువు వాయువు - ఆకాశము అను, పంచభూతములను ఆవరణగా కలిగియున్నది. అది జ్ఞానులకు అత్యంత చంచలంగానూ, అజ్ఞానులకు ఘనీభూతంగానూ, స్థిరంగానూ అగుపిస్తోంది.
Page:275
జీవుల ఆశ - - తృష్ణలు ఆ ఫలమును అనంతరీతులుగా ద్యోతకమయ్యేటట్లు చేస్తున్నాయి. (కనుక
ఆశ - - తృష్ణలే ఆ బ్రహ్మాండము యొక్క నిజాకారం).
అట్టి వేలాది ఫలాలతో కూడిన ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మ కదలుచున్న అనేక చిగుళ్ళు కలిగి ఉంది. ఆ కొమ్మ ఎంతో ఎత్తుగా ఉండి ప్రకాశిస్తోంది. జీవుల భావపరంపరలు, కల్పనయే ఆ కొమ్మ యొక్క వాస్తవాకారం.
అట్టి వేలాది కొమ్మలు కలిగిన ఒక మహావృక్షం ఉన్నది. ఆ మహావృక్షం ఎంతో విశాలంగా వ్యాపించి దుర్నిరీక్ష్యమై ఒప్పుచున్నది. అట్టివేయగు వేలాది వృక్షములు గల ఒక మహారణ్యం ఉన్నది. ఆ మహారణ్యం వృక్షములతోనే కాకుండా ఎత్తైన పొదలతో దట్టంగా వ్యాపించి చొరరాకున్నది.
అట్టివేయగు అనేక మహారణ్యసమూహములతో కూడిన మహోన్నతమగు ఒక పర్వతం ఉన్నది. అట్టి అనేక పర్వతపంక్తులకు ఆకరమైన ఒక సువిస్తార 'దేశం' ఉన్నది. ఆ దేశము ఊహకందనంత సువిస్తారంగా ఏర్పడి ఉన్నది.
అట్టి దేశములు అనేకం గల మహాద్వీపమొకటి ఉన్నది. ఆ ద్వీపమునందు చిత్రవిచిత్రమైన అనేక నదులు-సరస్సులు ఉన్నాయి. ఆ నదీ-సరస్సులు నిరంతరం రకరకాల ఆకారములతో కూడిన పుట్టిన-పుట్టబోవు అనేక ప్రవాహపరంపరలతో ఒప్పుచున్నాయి.
అట్టివేయగు అనేక మహాద్వీపములు తనయందు కలిగియున్న ఒక మహాపీఠం ఉన్నది. ఆ మహాపీఠం అతిచిత్రవిచిత్ర రచనా సమన్వితమై ఉన్నది. అట్టి అనేక మహా పీఠములతో సమన్వితమై ఉన్న ఒక మహాలోకం ఒకటి ఉన్నది.
అట్టి వేలాది లోకములతో గూడిన భయమును గొల్పు ఒక మహాండకోశము ఉన్నది. అట్టి వేలాది మహాండకోశములకు ఆధారమైయున్న ఒక మహాసాగరం ఉన్నది. ఆ మహాసాగరం స్పందనారహితమై విపుల బ్రహ్మాండకోశజలరాశికి నిలయమైయున్నది.
ఓ బేతాళా ! అంతేకాదు. ఆత్మ విలాసమైన 'మహార్ణవం' ఒకటున్నది. మనం చెప్పుకున్న మహాసాగర సమూహములు ఆ మహార్ణవంలో చిన్న చిన్న తరంగముల వలె ఒప్పుచున్నాయి.
అట్టి మహార్ణవములు అనేకం తన ఉదరమున కలిగియున్న మహాపురుషుడొకడున్నాడు. ఆతడు సర్వవ్యాపి అయి మహోన్నతుడై, 'విష్ణువు' అను పురాణ నామముతో కూడా వెలయుచున్నాడు. అట్టి వేలకొలది మహాపురుషుల మాలను తన వక్షస్థలమున ధరించిన పరమపురుషుడొకడున్నాడు. ఆతనిని రుద్రుడు అనే పురాణనామంతో కూడా పిలుస్తూ ఉంటారు.
అట్టివే వేలకొలది పరమపురుషులగు రుద్రులు రోమముల వలె అనాయాసముగా వెలువడు చున్నారో ...అట్టి మహాసూర్యుడొకడు కలడు. సర్వప్రాణులకూ ప్రత్యక్షములగుచున్న ఈ బ్రహ్మాండ
- - రుద్రాది కల్పనలన్నీ మహామండల రూపుడగు ఆ మహాసూర్యుని దీప్తులయి ఉన్నాయి. ఎదురుగా దృశ్యమానమగుచున్న ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ మహాసూర్యకాంతిలో కనిపించే అసంఖ్యాక త్రసరేణువులలో ఒకానొకటి మాత్రమే. చిదాత్మయే ఆ మహా సూర్యుడు.
Page:276
చిదాత్మయే ఈ జగత్తంతటికీ 'తెలియుట, తెలియబడుట' అను వెలుగు, వేడిమిలను ప్రసాదించు చున్నాడు. ప్రతిజీవుని స్వస్వరూపము అట్టి చిదాత్మయే! ఇదే నీ మొదటి ప్రశ్నకు సమాధానంఆ చిదాత్మసూర్యుని రశ్మిలోని సూక్ష్మ పరమాణువులే ఈ బ్రహ్మాండములన్నీ కూడా! విజ్ఞానమే ఈ చిదానంద సూర్యుని ఆత్మ! ఈ జగత్తును ప్రకాశింపజేయటమే ఆయన చేస్తున్న మహత్తర కార్యక్రమం. ఈ విశాలమగు బ్రహ్మాండములన్నీ ఆయన కాంతిపుంజములే!
భౌతికమగు ఆకాశాన కనిపించే సూర్యునిచే ఈ జగత్తంతా శోభిల్లుతోంది చూచావా? అట్లాగే ఆ విజ్ఞాన సూర్యుని చిత్-కాంతుల వలన ఈ జగత్తులు సత్త పొందుచూ, శోభతో ప్రకాశిస్తున్నాయి. ఓయీ! బేతాళుడా! ఆ మహాచిత్ సూర్యునే 'భగవంతుడు' అని, 'పరమాత్మ' అని 'బ్రహ్మము' అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఈ త్రిలోకములు ఆ బ్రహ్మము అనే మణికాంతులలో ప్రకాశిస్తాయి. ఉత్తమాధికారులగు ఆ మహాసూర్యుని పారమార్థికతత్త్వమగు ఆత్మ అఖండాకారమున అన్ని స్థితులందు ప్రత్యక్షమగుచునే ఉన్నది. అనధికారులకో, అది తెలియరావటం లేదు. అగ్నియందు విస్ఫులింగములు వేరువేరు వలె బయల్వెడలుచున్నాయి చూచావా? అలాగే ఆ ప్రత్యగాత్మయందు జీవజగత్తులు వేరువేరుగా తోచుచు, కర్తృత్వం - భోక్తృత్వం మొదలైన అనేక విభ్రమములు కలుగజేస్తున్నాయి.
ఓ బేతాళ మహాశయా! పారమార్థిక దృష్టితో చూస్తే అవేవీ కూడా ఒకింతైనా లేవు. చిదాత్మ ఒక్కటే సర్వదా సర్వత్రా సర్వాత్మకమై ప్రకాశిస్తోంది. అందుచేత నీ ప్రశ్నాడంబరమంతా వదలిపెట్టి సుశాంతుడవు కమ్ము.
రెండవ ప్రశ్న ఈ బ్రహ్మాండములు, ఈ భావాభావములు ఏ మహాగగన వాయువునందు ధూళిరేణువులై స్ఫురిస్తున్నాయి? అని కదా...?
ఒకానొక చోట ధూళి ఉన్నది. ఆ ధూళి కోట్లాదిమైళ్ళ విస్తారం విస్తరించి అత్యంత లోతుగా ఆక్రమించి ఉన్నది. ఆ ధూళిలో రకరకాల రంగుల ధూళికణములు కలిసిపోయి ఉన్నాయి. 1. కాలసత్త (కాలము అనురూపం గల మాయా సత్త).
2. స్పందనసత్త (క్రియాశక్తి ప్రధానమైన సత్త)
3. చిన్మయసత్త (ఎరుగుట అనునది ప్రధానముగాగల సత్త)
4. చిదాభాససత్త (విషయములందు ప్రతిబింబించే చమత్కారం)
ఇవన్నీ అత్యంత సూక్ష్మ పదార్థములవటం చేత వాటిని 'ధూళికణములు' అని వేదములు అభివర్ణిస్తున్నాయి. అట్టి రేణువులన్నీ 'పరమాత్మ' అనే వాయువునందు లేచుచు వివిధ ఆకారములు కల్పించుకొనుచున్నాయి.
పరమాత్మే అన్నిటా వెలుగు సత్త. ఆయన యందే కాలం మొదలైన సత్తలు ప్రతిబింబిస్తున్నాయి. ఆయన నిర్మలుడు, నిర్విషయుడు కదా! ఆయనలో ఆధార, ఆధేయాలు, వ్యపదేశాలు (Misinter pretation) ఎక్కడి నుండి వచ్చాయి? ...అనే సందేహమే అక్కర్లేదు. ఒక పుష్పాంతర్గత రసమే తనలో 1. పుష్పశరీరం, 2. సువాసన ... అనేవి కల్పించుకుని గంధానికి ఆధేయమై వెలయుచున్నది కదా!
Page:277
పరమార్థసత్తయే కాలసత్త మొదలైన భేదములన్నీ తనయందు కల్పించుకుని వాటన్నిటికీ తానే ఒకవైపు ఆధారమై మరొక వైపు అనుభవమునకు కారణభూతమై (ఆధేయమై) వెలయుచున్నది.
ఈ “కాలము-క్రియ -ఎరుక-విషయాస్వాదన" అను వేరు వేరు రంగుల ఇసుకరేణువులను ఒకదానితో మరొకటి అనంతకోట్ల దేహోపాధి పరంపరలను ఆటబొమ్మలవలె పరమాత్మతత్వమే నిర్మించుకుంటోంది. ప్రతి ఆటబొమ్మను ఆశ్రయించి నీవు-నేను-ఇది-అది-అక్కడ-ఇక్కడ-ఇప్పుడుఅప్పుడు-ఏకానేక ఆంతరంగిక స్ఫురణలను జతజేరుస్తోంది. ఇంతలోనే ఆ ఆటబొమ్మలను నిర్మించుకొని ఆటలాడుకొంటోంది. ఆ విధంగా స్ఫురించే అనంతకోటి చమత్కారాలలో నీ దేహం ఒకటి. నా దేహం మరొకటి. ఆత్మతత్వమే అంతటా సత్యం మిగిలినదంతా కల్పన మాత్రమే!
మూడవ ప్రశ్న- ఒక స్వప్నంలో మరొక స్వప్నం, స్వప్నం తరువాత మరొక స్వప్నం ఈ విధంగా స్వప్నాలు, స్వప్నాంతర స్వప్నాలు, స్వప్న తదనంతర స్వప్నాలు గనుచున్నప్పటికీ ఆ స్వప్న స్వప్నాంతరాలతో సంబంధం లేక, తన నిర్మల స్వభావాన్ని ఏ కాలమందూ త్యజించనట్టి ఆ
స్వప్నద్రష్ట స్వరూపుడెవడు?... అని కదా, నీ ప్రశ్న?
నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్కరి వాస్తవ స్వస్వరూపమే ఆ పరమాత్మ. అట్టి పరమాత్మ లేక, బ్రహ్మమే ఈ 'జగత్తు' అను మహాస్వప్నమును, ఆ జగత్స్వప్నంలో 'నేను దేహమును' అను మరొక స్వప్నమును, ఆ దేహతాదాత్మ్య స్వప్నంలో 'జాతి, దేశము, మతము, అయినవారు, కానివారు...” మొదలైన ఇంకెన్నో ఉపస్వప్నములను కల్పించుకొని పొందటం జరుగుతోంది. అయితే అట్టి స్వప్నములు పొందుచున్నప్పుడు, ఆ స్వప్నములలో విస్తరించి ఉన్నది తానే అయినప్పటికీ, తనయొక్క నిజరూపం కోల్పోవటం లేదు. స్వప్నదోషములు స్వప్న ద్రష్టను కళంకితం చేయగలవా? వస్తువుల సంయోగ వియోగములు ఆకాశమును మరొకరీతిగా మలచగలవా?... లేనేలేదు!
ఆత్మ ఆయా స్వప్నముల లోపలా-వెలుపలా విస్తరించి ఉన్నప్పటికీ, ఈ స్వప్న జాగ్రత్ విషయ సముదాయాలు ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని దిగజార్చలేవు. ఆత్మసర్వదా, అన్నిటా నిస్సంగమున, జ్యోతిరూపమున వెలుగుచూనే ఉన్నది. అట్టి శాంతం, మహదానందం, సర్వశక్తిమంతం - అగు ఆత్మను ఏమరచి ఈ జనులు నశ్వరములగు పదార్థముల సమ్మేళన-విభజనములను చూచి ఎందుకో వ్యధలు చెందుచున్నారు. సంసారమంతా స్వప్నతుల్యమే! స్వస్వరూపమే పరమసత్యము! పరమసత్యము మాత్రమే నిత్యము! అనునిత్యము!
నాలుగవ ప్రశ్న - అరటి చెట్టు కాండములో గల అరటిపట్టలను విప్పుచూ పోగా ... లోపల ఇక చిట్టచివరగా ‘ఆకాశము’ కాక మరింకేమీ మిగలదు. ఈ స్వప్న - స్వప్నాంతరములలో ఉన్నదంతా కల్పనను తొలగిస్తూ తరచి చూస్తే ఇక శేషించేదేమిటి?
స్వప్న ద్రష్టయొక్క స్వస్వరూపమే! ద్రష్ట యొక్క స్వరూపమే స్వప్నములో కల్పిత రూపంగా ప్రవేశించి ఉన్నది. కనుక స్వప్నము యొక్క వెలుపల - లోపల ఉన్నది ద్రష్టయే. ఈ విశ్వం యొక్క అంతరాంతరము లందు బ్రహ్మమే వివర్తితమై ఏర్పడి ఉంటోంది. బ్రహ్మము యొక్క అణువులే
Page:278
అంతటా వెలయుచున్నాయి. వివర్తితం అగుచున్న ఈ 'జగతి విస్తృతి'కి ఆ బ్రహ్మమే సత్తయి ఉన్నది. అట్టి స్వస్వరూపమునకు నామరూపములు లేవు!
కాని సర్వజగత్ భావ- అనుభవములకు అది ఆలవాలం కనుక ...దానిని 'ఆత్మ' అను పేరుతో పిలుస్తున్నారు. 'సత్బ్రహ్మం' అని కూడా అది అందుకే పిలువబడుతోంది.
అద్దాని గురించి 'అట్టిది' అని ఎవరమూ చెప్పలేము. ఆ బ్రహ్మము సర్వధర్మ శూన్యము. అందుకని పదార్థ వ్యవహారముల దృష్ట్యా అది శూన్యం అని కూడా వర్ణింపబడుతోంది.
ఈ బుద్ధికి కనబడే వస్తువులలో అది ఏదీ కాదు. ఎందుచేతనంటే బుద్ధిని కూడా గ్రహించునది అదే! దానియందు ఏవీ లేవు. అయినా కూడా, అది తప్పితే ఇక్కడ మరొక్కటేదీ లేదు. మనోబుద్ధులకు అదియే సత్త ప్రసాదిస్తోంది. గుణములు కలవాడు లేకపోతే గుణములు ఉంటాయా? అట్లాగే అదే లేకపోతే జగత్తు లేదు, దాని అనుభవం లేదు. స్వప్నము, స్వప్నకారణము, స్వప్నమునకు ముందు వెనుకల ఉన్నది స్వప్నకర్తయే కదా! జగత్తు విషయములో కూడా ...జగత్తు, జగత్ కారణము, జగత్తుకు ముందు వెనుకల ఉన్నది జగత్ ద్రష్టయే.
వస్త్రమునందలి వస్త్రసత్త దారములోనూ ఉన్నది
దారములోని దారసత్త దూదిలో ఉన్నది
దూదిలోని దూది ప్రత్తికాయయందు ఉన్నది
ప్రత్తికాయలోని ప్రత్తిసత్త ప్రత్తివృక్షమునందున్నది ప్రత్తివృక్షములోని ప్రత్తివృక్షసత్త ప్రత్తి బీజమునందున్నది బీజములోని బీజసత్త మట్టి-జలమునందున్నది
ఈ విధంగా, ఒక విధమైన సత్త మరొకవిధమైన సత్తగా పర్యవసించటం జరుగుతోంది. ఇట్టి సత్తయొక్క క్రమమును పరిశీలించిన విజ్ఞులు... ఇట్లు సిద్ధాంతీకరిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఏఏ క్రమముచే ఏఏ సత్త భావించబడుచున్నదో... అదంతా కాలానుగతంగా ఆయా భావాకృతులను వీడి, అనుభవజ్ఞరూపమగు 'చిన్మాత్రము' గానే పరవశించుచున్నది. అట్టి నిర్మల మగు చిద్వస్తువే ఈ జగద్రూపముగా వ్యాపించి ఉన్నదని జనులు గ్రహించెదరు గాక !” బేతాళుడు : ఓహో ! అద్భుతం చాలా బాగా సమాధానం చెప్పావు.
రాజు : .... ఐదవ ప్రశ్న - ఈ విశాలమగు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత సముదాయమునకు ఈ బ్రహ్మాండమండలమే ఆధారమై ఉన్నది కదా! ఈ బ్రహ్మాండ మండలం, సూర్యమండలం, మేరు పర్వతము ... ఇట్టి అత్యంత విస్తార పదార్థములన్నీ ఏ అణువు నందు పరమాణురూపంగా ఉన్నాయి? ...అని కదా, నీ ప్రశ్న?
ఆ పరమాత్మ సూక్ష్మాతిసూక్ష్మము, ఇంద్రియాలకు అలభ్యము అవటం చేత ‘ఆతడు పరమాణు స్వరూపుడు; అణోరణీయాన్' అని వేదములు ప్రవచిస్తున్నాయి. అనంతగుణవిశిష్టుడు అవటం చేత మేరు పర్వతమునకూ ఆతడే ఆధారుడు కూడా! ఆతడు లింగ స్వరూపభేదములకు సంబంధించని
Page:279
వాడు. కనుక, సులభసాధ్యుడు కాదని కొందరి అభిప్రాయం. అయితే, జ్ఞానుల అనుభవమునకు అత్యంత సులభ ప్రాప్యుడు అగుచున్నాడు. అనేక బ్రహ్మాండములతో కూడిన ఈ జగత్తంతా కూడా ఆత్మదేవుని ఒకానొక అణువు యొక్క ఒకానొక అంశ మాత్రమే.
ఈ కనబడే బ్రహ్మాండములన్నీ సూక్ష్మతరములగు చిత్కణములచే పరిచ్ఛిన్నమై ఇట్లు దృష్టికి ప్రాప్తిస్తోంది. అందుచేత "ఆత్మదేవునియందు పరిచ్ఛిన్నమై ఉంటోంది" అను పాఠ్యాంశములన్నీ మిథ్యా పాఠములే. స్వప్నంలో చూచే వస్తువులన్నీ స్వరూపహీనములే అయినట్లు, ఈ జాగ్రత్ బ్రహ్మాండాదులన్నీ స్వతఃగా చూస్తే (అణువుల సముదాయమే కాబట్టి, భావానుగతమే కాబట్టి) స్వరూపహీనములేనని చెప్పక తప్పదు. కనుక ఆత్మదేవునియందు ఇది ఒక అణువువలె పరిచ్ఛిన్నము... అనునదంతా మిథ్యయే. ఇవన్నీ సూక్ష్మనాడులందు స్వప్నసమయంలో తోచే కల్పిత పదార్థ పరమాణువుల వంటివే. వీటన్నిటి యొక్క అంతిమ స్వభావం 'బ్రహ్మమే' అని జ్ఞానులు దర్శిస్తున్నారు.
కాబట్టి ఆత్మయందే ఈ పంచభూతములు, బ్రహ్మాండములు ఒక స్వల్ప విభాగమునందు అనుభూతమవుతున్నాయి. కాని ఆత్మకు విభాగమూ లేదు. అణువూ లేదు. పరమాణువూ లేదు. ఇదే నీ ఐదవ ప్రశ్నకు సమాధానం
బేతాళుడు: ఓ రాజా! నీ సమాధానం యుక్తియుక్తమే. నీవు పరమసత్యమును ప్రకటించుచున్నావని నాకు స్పష్టంగా తెలియవస్తోంది. నా 6వ ప్రశ్న మరొక్కసారి విన్నవిస్తాను.
శిలలన్నీ ఒకచోట కూడితే పర్వతం అవుతుంది. కనుక శిలలే పర్వతానికి అస్థిత్వం కల్పిస్తున్నా యని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకానొక నిరవయవ పురుషుడు శిలలకు, తదితర సర్వమునకు తానే ఉనికి అయి అస్థిత్వమును ప్రసాదిస్తున్నాడు. అట్టి రాజాధిరాజైన మహత్పురుషుడు ఎవడు? అతనిని నీ వెప్పుడైనా చూచావా?
రాజు : ఓc! చూచాను, చూస్తున్నాను ! అయితే ఈ భౌతికమైన కళ్ళతో కాదు. మనం ఇంతవరకూ వివరించి చెప్పుకున్న ఆ బ్రహ్మమే కళ్ళు-చెవులు మొదలైన వాటికి అగోచరం కాబట్టి 'ఆతడు పరమాణువుకే పరమాణువు'అని మనం ఈ సంభాషణలో గ్రహించియే ఉన్నాం కదా! ఆతడు సర్వ వ్యాపి అవటం చేత 'స్థూలమగు మహాపర్వతము వంటివాడు' అని కూడా విజ్ఞులు అంటున్నారు. అధ్యారోపదృష్టికి అదియే ఆకార అనాకారములన్నిటికీ అవయవము. అపవాద దృష్టికి అది సర్వదా నిరవయవము.
ఆతడే సర్వవ్యాపకుడై నెగడుచున్నాడు. ఓ సాధూ! ఈ జగత్రయం ఆ విజ్ఞాన స్వరూపుని సారమై, ఆతనియందే వెలయుచున్నది. అట్టి స్వస్వరూపుని సామవేదం 'మహత్పురుషుడు’గా గానం చేస్తోంది.
ఓ బేతాళా ! ఈ జగత్రయమును ఆత్మవిజ్ఞాన స్వరూపంగా గ్రహించు. ఆ విజ్ఞానాత్మ దేవుడే నీవు, నేను కూడా! అట్టి నన్ను వినష్ట మొనర్చగలిగిన వారెవరు? నిన్ను స్వస్వరూపందృష్ట్యా వినష్టమొనర్చగలిగినది కూడా ఏదీ లేనేలేదు. కాబట్టి నీవు నా ఈ సమాధానమును అనుసరించి త్వరగా అనుభవపదమును అధిరోహించుము.
Page:280
అట్లు అధిరోహించి సర్వ గర్వాలను విడనాడినవాడిపై స్వస్వరూపమున అనంత శాంత అనుభవుడవు కమ్ము.
2. సర్వసమత్వము
శ్రీవసిష్ఠ మహర్షి : రాజు ఇచ్చిన సమాధానాలు విని బేతాళుడు "ఈతడు తత్త్వజ్ఞుడు" అని గ్రహించాడు. ఆతని సమాధానాలు బేతాళుని మనస్సుకు శాంతిని ప్రసాదించాయి. ఆతడు రాజుకు సాష్టాంగదండప్రణామం చేశాడు. శాంతచిత్తుడై పరమానందవస్తువును మననం చేసుకోవటం చేత, ఆ బేతాళుడు ఆకలిని కూడా మరచి సమాధిని పొందాడు.
ఓ రామచంద్రా ! ఆ రాజు చెప్పినట్లు ఈ జగత్తంతా చిద్రూపపరమాణువు నందే ఉన్నదని గ్రహించు. చిన్నపిల్లవాడు ఒకచోట కూర్చుని "నేనిప్పుడు మా చుట్టాల ఊరు వెళ్ళాను. అక్కడ అక్క-బావ-చెల్లి-అన్న తదితర తోటివారితో ఆడుకుంటున్నాను” ఇటువంటి ఊహలలోకి వెళ్ళుతూ ఉంటాడు. ఇంతలో “ఒరే ఎక్కడున్నావురా? రా ఇంట్లోకి!” అని తండ్రి పిలుపు వినబడగానే ఆ ఊహ నుండి బయల్వెడలి (లేక) ఆ ఊహను వదలి “ఏమిటి నాన్నా”? అంటూ ఇంట్లోకి వస్తాడు. దీనిని 'బాలభ్రాంతి' అంటాం.
ఈ విశ్వమంతా ‘బాలభ్రాంతి'లాగా జ్ఞానవిచారముచే తప్పక ద్రష్టయందు విలీనమైపోతోంది. చివరకు పరమపదమే శేషిస్తోంది. కనుక ఇక నీవు నీ మనస్సును ఈ విషయములనుండి - దృశ్య సమూహముల నుండి త్వరగా వెనుకకు మరల్చుము. నిశ్చలాత్మకమగు ఆత్మబుద్ధిని ఆశ్రయించు. అట్లా ఉంటూనే స్వాభావికంగా నిన్ను సమీపించే కర్మలను వ్యవహారములను నిర్లిప్తుడవై ఆచరించు.
ఓ మననశీలా! మనస్సుచే మనస్సును ఆకాశమువలె నిర్మలం చేయి. ఏకైక వస్తువు అయున్న ఆత్మయందు వృత్తులన్నీ లయం చేసి 'ప్రశాంతచిత్తము' ను సంపాదించుకో. అట్టి ప్రశాంత చిత్తముచే నీవు సర్వత్రా బ్రహ్మభావమును దర్శించి, తద్వారా సమదర్శివి కమ్ము. మోహశూన్యుడవగుము.
యథాప్రాప్తములగు విషయములను నిర్లేపబుద్ధితో అనుసరించువారు భగీరథుని వలె అసాధ్యమగు దానిని కూడా తప్పక సాధించి తీరుతారు.
ఎవడైతే పూర్ణముగా శాంతచిత్తుడై, పరితృప్తాంతఃకరణుడై, ఆత్మయందు ఆత్మచే నిత్యతృప్తుడై వెలయుచున్నాడో ...ఆతనికి అత్యంత దుర్లభమైన అభీష్టములు కూడా సిద్ధించగలవు. గంగావతరణలో భగీరథుడు, సగరుడు మొదలగు వారి చరిత్రలే అందుకు దృష్టాంతం.
కాబట్టి రామా! నిర్విచారుడవై, ఇక ఆపై సర్వక్రియాశీలుడవగుచుండుము. సర్వసమత్వమును అధిరోహించి, యథారీతిగా సర్వకార్యములు నిర్వర్తించుము.
Page:281
VIII. భగీరథ యత్నం
1. శ్రీత్రితల-భగీరథ సంవాదం
శ్రీరాముడు: మహాత్మా! మీరు ప్రసంగవశంగా భగీరధ చక్రవర్తి పేరు చెప్పటం జరిగింది. భగీరథ చక్రవర్తి గురించి మీరు కొన్ని విషయాలు మాకు ఆశ్రమంలో బోధించియే ఉన్నారు. ఆ భగీరథుడు చిత్తపరిపక్వత ఎట్లా సంపాదించాడో చెప్పవలసిందిగా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి: విను ...చెబుతాను.
భగీరథుడు కోసలవంశ తిలకుడై జన్మించి యౌవన ప్రాంగణంలో ప్రవేశించగానే అతి విశాల సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఆతడు చిన్నప్పటి నుండే పరమధార్మికుడు. ఆయనను సమీపించిన ప్రజలు ప్రార్థన అను పరిశ్రమ లేకుండానే తమ అభీప్సితములు పొందేవారు. ఆతని ముఖమండలం ఎల్లప్పుడూ చంద్రమండలంలాగా అతి ప్రసన్నమై ఉండేది. ఆతడు ఒక్క క్షణంలో పాత్రాపాత్రము ఎరిగి సజ్జనులకు ధనములను ఇస్తూ న్యాయమగు దానిని తృణమైనా వదలక తన ప్రజల సుఖశాంతులను దృష్టిలో పెట్టుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. వజ్రవేధ మణి వజ్రమునకు రంధ్రం చేసి ఆ వజ్రమునకు శోభ చేకూరుస్తుంది చూచావా? ఆతడు తన శత్రువులను, దొంగలను, దురాశాపరులను బంధించి వారిని అనేక ఉపాయములచే సచ్చరిత్రులుగా, సద్గుణసమన్వితులుగా తీర్చిదిద్దేవాడు. ప్రజల మధ్య రహస్యంగా సంచరిస్తూ వారిలోని అధర్మప్రవృత్తి గమనించి వారిలోని కార్యవిరతిని, దుష్టాచారములను, ప్రలోభప్రవృత్తులను పోగొట్టుతూ ఉండేవాడు. తన పరాక్రమముచే శత్రురాజులకు సింహస్వప్నమై ఉండేవాడు. బ్రహ్మవేత్తల వద్ద ఆర్దాన్తఃకరణుడై ఎంతో అణకువతో
మెలగేవాడు.
ఆతడొకప్పుడు కపిల ముని శాపంచేత పాతాళగర్భమున చిక్కిన తన పూర్వీకులను ఉద్ధరించదలిచాడు. ఎడతెగని తపః క్లేశములచే బ్రహ్మదేవుని, శంకరుని, జహ్నుమునిని మెప్పించి భూపాతాళములకు గంగాజలము ప్రవహింపజేశాడు.
ఓ రామచంద్రా! ఇక ఆ భగీరథుని యౌవనంలో జరిగిన కొన్ని విశేషాలు ఇచ్చట ముచ్చటించు కుందాం. భగీరథునికి నీలాగే యౌవనంలోనే సంసారాన్ని గూర్చిన 'విచారణ'తో గూడిన చమత్కార బుద్ధి కలిగింది. యౌవ్వనంలోనే అట్టి సమబుద్ధి కలగటం ఈ లోకంంలో కొంత దుర్లభమైన విషయమే. ఆతడొకసారి ఒక ఒంటరి ప్రదేశంలో ఆసీనుడై ఇట్లు చింతించసాగాడు.
భగీరథుడు : (తనలో) ఆహా! ఈ జగత్యాత్ర ఎంత అసమంజసమైనది? ఎంతటి ఉద్వేగములతో కూడి ఉన్నది? తెల్లవారుతోంది. ప్రొద్దుగ్రుంకుతోంది. రాబోయే కాలం రానే వస్తోంది. వర్తమానం ‘గతం’ అనే అగాధంలో పడి మటుమాయమౌతోంది. ఇక దినచర్యలన్నీ నిన్నటి లాగానే ఈ రోజు,
Page:282
రేపు కూడా ఉంటున్నాయి. ఈ కర్మలు, వాటి ఫలములు ... వీటిలో ఏం ప్రత్యేకత ఉన్నది? తిన్నదే మరల తింటున్నాం. ఈ రాజ్య - గృహ - జన వ్యవహారములలో అపూర్వమైనది ఏమున్నది? ఏది పొందితే అన్నీ పొందినట్లే అవుతుందో ... అట్టి దేదైనా పొందాలిగాని, అల్ప విషయాలు ఆశ్రయిస్తూ ఎందుకీ జీవితం? నాకు తారసపడుచున్న ఈ వస్తుసముదాయమంతా నిస్సారమని, అర్థరహితమని, చివరకు దుఃఖకరములేనని తెలిసిపోతోంది. పుట్టుక-చావుల మధ్య గల జీవితం అను అవకాశాన్ని అర్థంపర్థం లేని పనులకు వెచ్చించి ఏం ప్రయోజనం? చర్వితచర్వణంగా, గానుగ ఎద్దులా నిర్వర్తించే ఈ తినటం, త్రాగటం, వాగటం - వంటి నిరర్థక క్రియలలో కాలమంతా వెచ్చించుచున్నందుకు నాకు సిగ్గనిపించటం లేదేం? అల్పప్రతిఫలాలు-దుఃఖ ప్రయోజనాలు అగు విషయేంద్రియ కార్యక్రమాలతో సంతోషించి రోజులు గడపటమనేది కుక్క బొమికను నోటకరచుకొని గొప్ప వస్తువుగా తలచి వీథులందు సగర్వంగా పరుగెత్తటం వంటిది కాక మరేమిటి?
ఇట్లు ఆలోచిస్తూ ఆ భగీరథుడు సంసార వ్యవహారమంతా పరికించి చూశాడు. అజ్ఞానాంధకార పర్యవసానాలను, సంసారం యొక్క విన్యాసాన్ని చూచి మిక్కిలి భీతిచెంది, తన కులగురువగు త్రితల మహర్షి ఆశ్రమానికి అప్పటికప్పుడు బయలుదేరాడు. ఆయనను సమీపించి సాష్టాంగ నమస్కారం సమర్పించాడు.
భగీరధుడు : తండ్రీ! సద్గురూ! మా సంగతి గమనిస్తూనే ఉన్నారు కదా? సారశూన్యమగు ఈ సంసార మహారణ్యంలో చిక్కుకుని మేము బక్కచిక్కిన ఎద్దులాగా అలమటిస్తున్నాం. అంతులేని ‘ఆశలు’ అనే ముళ్ళపొదలలో ఎప్పుడో చిక్కుకున్నాం. అనేక సుఖదుఃఖాల రాకపోకలు మమ్ము అనుక్షణం పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇక్కడ కనిపించే తుచ్ఛ - అల్పకాలిక విషయాల పట్ల మాకు క్షణక్షణం ఏర్పడు చున్న రాగ-ద్వేషాలు కాలమేఘంలా క్రమ్ముకుని మమ్ములను అజ్ఞానంలో కప్పి ఉంచి ఆట ఆడిస్తు న్నాయి. అనేక కర్మలందు ఆసక్తి గలవారమై మేము మా ఉత్తరోత్తర గతులేమిటో గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ గ్రహించినా, మా బుద్ధి మాకు వ్యతిరేకమై ఉండటం చేత నిస్సహాయులమైన కాలయాపనాన్ని, కాల దుర్వినియోగాన్ని నిరోధించలేకపోతున్నాం. ఊరకుక్క నిస్సారంగా వీథివీథికి, ఇంటింటికి తిరిగి, మరల మురికి గుంటకు చేరుతుంది చూచారా? మేము కూడా మతితప్పి స్వర్గ - నరక - మనుష్య లోకాలలో తచ్చాడి తిరిగి అంధకారమయమగు అజ్ఞాన స్థానాలలో చేరుకుంటున్నాం?
హే కరుణా సముద్రా! నా పుణ్యవశం చేత ఈ రోజు మిమ్ములను సమీపించాలని, శరణు వేడాలని బుద్ధి పుట్టింది. ‘జరామరణ మోహాలు' అనే ఆకృతి ధరించిన ఈ దుఃఖాలు ఉపశమించేది ఎట్లా? సంసారహేతువుల నుండి నన్ను నేను ఎట్లా రక్షించుకోవాలి? సెలవివ్వండి.
త్రితల మహర్షి : నాయనా ! ఎందుకీ దిగులు? నీవు నిరుత్సాహపడటమేమిటి? మహాప్రయత్న శీలుడవగు నీవు ‘దుర్లభం - నిస్సహాయం - దుస్సాధ్యం' అంటూ అల్ప శబ్దములు పలుకుచున్నావేం?
1. శుశ్రూష, 2. శ్రవణము, 3. గ్రహణము, 4. ధారణ... ఇవి సాధన చతుష్టయం కదా!
Page:283
వీటిని అవలంబించు. క్రమంగా వైషమ్యరహితుడవు కమ్ము. సామ్యస్థితి సంపాదించుకో. అనాది సిద్ధమైన బ్రహ్మరూపమున ఆవిర్భవించు.
జ్ఞేయం అయినట్టి ప్రత్యక్త్త్వాన్ని గ్రహించటానికి నీకున్న అన్ని మార్గాలను, అవకాశాలను, సాధనలను ఉపయోగించుకో. అప్పుడు తత్త్వజ్ఞానము నందు తప్పకుండా పరిపూర్ణత పొందుతావు. నిర్మలస్వరూపుడా! తత్త్వజ్ఞానివైన మరుక్షణం ఆ దుఃఖాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఇక సంశయాలూ ఉండవు. సంసారగ్రంథులూ ఉండవు.
భగీరథుడు : ‘జ్ఞేయం’ అంటే ఏమిటి?
త్రితల మహర్షి : 'తెలుసుకోవలసినది తెలుసుకోవటం' ... అనే అర్థాన్ని ఉద్దేశించి శాస్త్రకారులు జ్ఞేయం అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నారు. పరమపవిత్రం, సర్వగతం, నిత్యం, జ్ఞాపకములన్నిటికీ ఆధారం - స్థానము అయిన జ్ఞప్తి రూపమగు ఆత్మయే జ్ఞేయము.
'ఆత్మ' అనగా ఏది? ఎక్కడున్నది? నీ యొక్క స్వస్వరూపమే ఆత్మ కదా! అనగా జ్ఞేయము నీ యొక్క వాస్తవ స్వరూపమే! అట్టి ఆత్మకు మాయాబంధం లేదు. దుఃఖం లేదు. అలసత్వం లేదు. భగీరథుడు : మునీశ్వరా ! తమరు ఒకప్పుడు తాత్త్విక విషయాలు బోధిస్తూ రెండు గొప్ప విషయాలు నాకు చెప్పారు1. ఆత్మ నిర్గుణము, నిర్మలము, శాంతము చ్యుతిరహితము.
2. ఆత్మ ఒక్కటే అయి అన్ని కాలములందూ, అందరియందును ఒకే విధంగా వెలయుచున్నది. ఈ దేహాదులకు వాస్తవమైన అస్థిత్వము లేదని, ఆత్మకు మాత్రమే అస్థిత్వము కలదని మీరు బోధించగా నేను శ్రవణం చేశాను. మీరు ప్రవచించింది అత్యంత యుక్తమని కూడా గ్రహించాను. అయితే సత్-అసత్లకు సంబంధించిన ఉభయ బోధలలోని సదాత్మకత్వము తగినంతగా బోధపడ లేదని నా కనిపిస్తోంది. నేనెప్పుడు ఏ ఉపాయం అవలంబించి... తద్వారా విక్షేపం లేని శాంతిని సంపాదించుకోగలను? ఏ మార్గం అనుసరించి ఆత్మ సంవిత్తును ఇప్పుడు నేను పొందాలి? ఈ విషయం నాకు విశదీకరించి చెప్పండి.
త్రితల మహర్షి : ... ఊఁ! ఇంకొంత స్పష్టంగా నీ సందేహమేమిటో చెప్పు.
భగీరథుడు : మహర్షీ! అఖండాకారము, శాంతము, నిర్మలము అని మీచే వర్ణించబడిన ఆత్మ నాకు అనుభూతమగుటలేదు. ఎందుచేత?
త్రితల మహర్షి : ఎందుచేతనంటే... 1. ఈ రాజ్యం పట్ల అభిమానం, 2. అట్టి సంసర్గం వలన ప్రాప్తించే అనేక విషయాలలో నీ చిత్తం తగుల్కోవటం... ఈ రెండు కారణాల వల్ల నీకు ఆత్మ స్పష్టంగా అనుభూతమగుట లేదు.
నీ హృదయాకాశమున అమానిత్వం (గర్వం రహితమై పోవటం) ఉదయించిందా, అప్పుడు నీ యందు ‘అభిమానం' అనే జాడ్యం తొలగిపోతుంది. అభిమానవిరహితమైన చిత్తం మాత్రమే
Page:284
జ్ఞేయమును గ్రహించగలదు. అనగా ...జ్ఞేయానికి - నీకు మధ్య ‘అభిమానం' అనే తెర అడ్డుగా ఉంటోంది. జ్ఞేయమును గ్రహించినప్పుడు నీ చిత్తం ఆ జ్ఞేయమునందు నెలకొని, ఇక తన చిత్తత్వం త్యజించివేయగలదు. అప్పుడు నీవు పూర్ణ స్వభావాన్ని బడయగలవు. ఇక ఆ తరువాత తత్స్వభావం నుండి చ్యుతి ఉండదు. ‘ఈ దేహంచే నేను జన్మిస్తున్నాను. దీనితో మరణిస్తున్నాను. మరొక దేహంతో పునర్జన్మ పొందుచున్నాను' ... అను పునర్జన్మ స్వభావం పొందవు.
ఓ భగీరథా ! ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో ముందుగా తెలుసుకో. భగీరధుడు: ‘జ్ఞానము’ అనుదానికి సవివరమైన నిర్వచనం ప్రసాదించ ప్రార్థన. త్రితల మహర్షి :
అసక్తిం, అనభిష్వంగః పుత్ర-దార గృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్ట-అనిప్టోపపత్తిషు ||
ఆత్మనో అనన్యయోగేన తద్భావనమ్ అనారతమ్ | వివిక్తదేశ సేవిత్వమ్ అరతిః జనసంసది ||
అధ్యాత్మజ్ఞాన నిత్యత్వమ్ తత్త్వ జ్ఞానార్ధదర్శనమ్ | ఏత జ్ఞానమితి ప్రోక్తమ్, అజ్ఞానం తదతో అన్యథా||
'జ్ఞానము' అనగా మా ఉద్దేశంలో ఏమిటో విను1. భార్య, పుత్రులు, గృహములు మొదలైన దృశ్య సంబంధమైన విషయముల పట్ల ఆసక్తిగాని, ‘అవి నావి' అను మమకారము గాని ఉండకపోవటం.
2.నీ ఇంద్రియములకు ఇక్కడ ఇష్ట అయిష్టములు తారసపడుతూ ఉంటాయి కదా! అట్టి
ఉభయ విషయముల పట్ల సమచిత్తుడవై ఉండటం
3. అనన్యమగు ఆత్మ వస్తువును అన్ని వేళలా భావన చేస్తూ ఉండటం.
4. జనులతో ఏర్పడే సంబంధ వ్యవహారములతో అభిరుచి పొందక ఏకాంత స్థానమును సేవిస్తూ ఉండటం.
5. జ్ఞాన విషయమై శ్రవణ మననముల నిరంతరాభ్యాసం.
6. తత్త్వార్థమైన ఆ అఖండ - నిర్మల - నిత్య పరమాత్మ స్థానమును - ఎక్కడికి నీ చూపు వెళ్ళితే అక్కడ - దర్శిస్తూ ఉండటం.
ఇవి 'జ్ఞానం' అని అంటున్నాం. వీటికి సానుకూలం కానివన్నీ 'అజ్ఞానం' అని మా ఉద్దేశం. నాయనా! అహంభావమును ఉపశమింపజేసి, నీ చిత్తం నుండి రాగద్వేషములను వెడలగొట్టావా... మరుక్షణం సంసారమనే వ్యాధికి దివ్యౌషధమైనట్టి జ్ఞానం నీకు తప్పక లభిస్తుంది. శాస్త్రాదులచే, మా వంటి గురువులచే ప్రతిపాదించబడే సర్వసాధనాల ముఖ్యఫలం అనహంకారమేనని గ్రహించు. నీలో అహంకారం ఉన్నంత వరకూ 'అమాన్వితం' మొదలైన దైవీసంపత్తికి చోటెక్కడిది? భగీరథుడు: గురువర్యా! వృక్షము పర్వతముపై అధిరోహించి తిష్టవేసుకుని కూర్చుంటుంది చూచారా?
Page:285
అట్లా అహంభావము నా ఈ శరీరము నందు దృఢంగా పాతుకుపోయి ఉన్నది. దయచేసి, అది ఎట్లా తొలగుతుందో చెప్పండి.
త్రితల మహర్షి : వత్సా ! అందుకు ఉపాయం ఊసురోమంటూ, దుఃఖిస్తూ కూర్చోవటం మాత్రం కానే కాదు. విషయ భోగముల పట్ల 'అభిలాష’ అప్రయత్నశీలునియందు జన్మ-జన్మకూ పేరుకుపోతూ ఉన్నది. అట్టి అభిలాష వ్యసనమై 'వాసనలు'గా అంతరంగమునందు వ్యాపించి ఉంటున్నది. ఆ వాసనలు ఆత్మను ఆవరించి ఉండటంచేతనే పరమానందమయమగు నీ స్వస్వరూపము నీ కనుభవం కావటం లేదు. ఇప్పుడేం చేయాలి? దిగాలుపడి కూర్చుంటే ఎట్లా? లే! లేచి పురుషప్రయత్నమును ఆశ్రయించు. అట్టి పురుషప్రయత్న బలంచే నీ యందు పేరుకొనియున్న భోగవాసనలను పరిత్యజించు. భోగాల గురించి చింతించటం మానివేయి. అప్పుడు అహంకారం కూడా వినాశనం కాక తప్పదు.
అయ్యో! ఈ నా రాజ్యం పోతుందేమో?... కొంతకాలం తరువాత ఏ కారణం చేతైనా ఇప్పట ºవలె నన్నెవరూ గౌరవించరేమో?... అందరూ నన్ను యాచిస్తూ ఉండగా వారికి వీరికి దానధర్మాలు చేస్తున్నాను, అట్టి నేను భిక్షుకుడనై ఇంకొకరిని ఏదైనా యాచించే సమయం రాదుకదా?... నేను గొప్పవాడి నని చాలామంది అనుకుంటున్నారు కదా! రేపు అనేకమంది ప్రజలు, ఆ శత్రురాజులు నన్ను ఎగతాళి చేయరుకదా! నా పట్ల ఏదైనా అసమర్థత వచ్చిపడుతుందా?... ఈ రోజు బాగానే ఉన్నది. మరి రేపు సరి అయిన అన్నపానములు, గృహాదులు ఉండకపోతే రేపు నా గతి ఏమిటి?... నేను వీరి కొరకై ఏదైనా చేస్తే బాగుండు !...
...ఇటువంటి రూపంలో ఉండే అనేకానేక చింతల వల్ల నీకు లజ్జాభిమానాలు కలుగుచున్నాయి. ఇటువంటి చింతలు నీ కొరకై గృహాభిమాన రూపంలో ఒక గొప్ప పంజరం తయారుచేసిపెట్టాయి. అట్టి పంజరమే నీ నిరుత్సాహ - దిగుళ్ళకు కారణమై ఉంటోంది. అట్టి విషయ పంజరం సంపూర్ణంగా భగ్నం కానంత వరకూ నీలో అహంకారం కాపురం చేస్తూనే ఉంటుంది. అహంకారం నీ చిత్తంలో భయాన్ని గొలిపేటట్లు తాండవం చేస్తుంటే నీకు శాంతి ఎక్కడిదయ్యా? వాస్తవానికి 'నావి’ అనుకునే ఏవీ నీవి కావు. 'నావి' అను రూపం గల ఆవేశమే నీ వివేక బుద్ధి వికసించకుండా అడ్డుకుంటోంది.
ఓ రాజా! నీవిప్పుడు ‘వివేకబుద్ధి' అనే స్నేహితుని సహాయం ఆశ్రయించు. నీకిప్పుడు చెప్పిన అజ్ఞాన విషయాలన్నీ పరిత్యజించు. నిశ్చలతను అలవర్చుకో. అప్పుడా ఆత్మపదం నీకు కరతలామలకం అవుతుంది. 'నాది' అనునది అహంకార - మమకారముల జాడ్యంచేతనే నిన్ను పట్టి పీడిస్తోంది. కాబట్టి అహంకార మమకారాలు వదిలేదెట్లాగో యోచించు.
ఇక, అహంకారత్యాగం కొరకై ఏమి చేయాలో చెప్పమంటావా?... నీవిగా నీవు భావిస్తూవస్తున్న రాజోపయుక్తమైన ఛత్ర - చామరాది చిహ్నములను అన్నిటినీ పరిత్యజించు.
ఈ రాజ్యలక్ష్మిని ఎవరికైనా సమర్పించివేయి. శరీరాభిమానం ప్రారత్రోలి, ఎవ్వరికంటే నీవు ఉన్నతుడవని అనుకుంటున్నావో ... వారివారి దగ్గరకు వెళ్ళి భిక్ష ఎత్తు. తద్వారా "నేనే అంతటి వాడినీ - ఇంతటివాడిని" - అనే భ్రమను వదిలించుకో!
Page:286
ఇచ్ఛారాహిత్యం అలవరచుకో! అనగా, సర్వ ఇచ్ఛలను ఆ ఇచ్చలకు సంబంధించిన ప్రయత్నములను వదలివేయి.
'జీవాత్మ ఎవరు? సంసారమేమిటి? మోక్షం ఎప్పుడు వస్తుంది? ... అనే ప్రశ్నలను పరిత్యజించు. “ఇదంతా... నాతో-నీతో సహా... పరమాత్మ విన్యాసమే” - అనే అవగాహనను, అనుభూతిని నిరంతర భావన ద్వారా ఆశ్రయించు.
అట్టి ప్రశ్నలకు అనేక వివరములను ఇస్తున్న నీ గురువైన నన్ను కూడా త్యజించివేయి.
అంతా వదలిన తరువాత ఇకప్పుడు ముముక్షువులకుండవలసిన ఉత్తమగుణములందు మాత్రమే దృష్టిసారించు. భోగ-త్యాగములను జగన్నాటకములోని క్రీడా వినోదములుగా గమనిస్తూ పరిత్యజించు.
జగత్తులో ఉంటూ జగత్తులో లేనివాడగుము. సర్వత్యాగివైన మరుక్షణం నీవు మోక్షస్వరూపుడవే! అప్పుడు సర్వోత్కృష్టమగు బ్రహ్మభావమును పొందగలవు. సంసారభ్రాంతికి నీయందు కొంచెం చోటు కూడా ఇక దొరకదు.
2. సర్వ పరిత్యాగం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా భగీరథుడు కులగురువైన త్రితల మహర్షిచే బోధించ బడ్డాడు. ఆశ్రమం నుండి బయలుదేరి అంతఃపురం చేరాడు. గురువు చెప్పిన విషయాలన్నీ ఒకటి తరువాత మరొకటిగా చాలాసార్లు మననం చేసుకున్నాడు. ప్రతివాక్యాన్ని స్వబుద్ధితో బాగా విచారణ చేశాడు. ఇక తన తరువాత కర్తవ్యమేమిటో దృఢంగా నిశ్చయించుకుని స్థిరసంకల్పుడయ్యాడు.
కొద్దిరోజులు మౌనంగా గడిచిపోయాయి. 'సర్వత్యాగము' అను సంకల్పబలం సిద్ధించాలనే ఉద్దేశంతో సోమయాగము నుండి విశ్వజిత్ యాగము వరకు గల అనేక యజ్ఞములను నిర్వర్తించాడు. అవన్నీ ముగియగానే ఇక తాత్సారం చేయలేదు. పాత్రాపాత్రముల విచారణ చేయకుండా బ్రాహ్మణులకు, బంధువులకు, తదితరులకు అనేక గోవులను అశ్వములను భూమిని, బంగారమును అమితంగా ఇచ్చివేశాడు. అంతఃపురంలోని అమూల్య వస్తువులను అక్కడి పరిచారికలకు, పేదవారికీ
వేయగా, ఇక ఆతడు కట్టుబట్టలతో మిగిలాడు. రాజు చేస్తున్న దానాలన్నీ చూచి "ఏమిటి? ఈతనికి ఏమన్నా పిచ్చి పట్టలేదు కదా?” అని మంత్రులందరు గుసగుసలాడసాగారు.
ఒక రోజు రాజసభ అనేక సంరంభములతో జరుగుచుండగా, భగీరథుడు లేచి నిలుచున్నాడు. “ఓ కోసలదేశ ప్రజలారా! మంత్రులారా! మీ అనుజ్ఞతో నేనీ రాజ సింహాసనాన్ని పరిత్యజించదలిచాను. మీరు ఎరిగియే ఉన్నారు. ఆతడు రాజుగా మీకు సేవలందించుగాక!” అని అభిప్రాయం వెలిబుచ్చి, సభ నుండి వెనువెంటనే బయల్వెడలి అంతఃపురం జేరాడు.
నాలుగు రోజులు పోయిన తరువాత ఒక రోజు ఒక ఆంతరంగికుని పిలిచి ఆ కోసల
రాజ్యాన్ని జయించాలని ఎంతో కాలంగా కలలు కంటున్న శత్రురాజుకు కబురుపెట్టి, తన రాజ
Page:287
సింహాసనాన్ని ఆ శత్రురాజుకు సమర్పించివేశాడు. ఆ ఆ శత్రురాజు ఎంతో సంతోషంగా కోసల రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు.
ఇక భగీరథుడు ఒక గోచీ మాత్రం ధరించి అక్కడి వారందరి కన్నులు కప్పి ఎక్కడో తనకే అప్పటికి తెలియని సుదూర ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు.
ఆ భగీరథుడు తన పేరు ఊరు తెలియని సుదూర గ్రామములందు, అరణ్యములందు ఓపికతో వసించసాగాడు. ఇలా ఆతని జీవితం గడచుచుండగా కొంతకాలానికి ఆతని చిత్తంలోని వాసనలన్నీ తొలగిపోయాయి. అచిరకాలంలోనే పరమశాంతి లభించగా, ఆత్మయందు విశ్రాంతి పొందాడు.
అట్టి నిర్వికార స్థితిని పొందిన భగీరథుడు భూమండలమున గల అనేక ద్వీపాలలో సంచరిస్తూ ఒక రోజు సుదీర్ఘ ప్రయాణవశంగా తాను ఇతఃపూర్వం రాజ్యమేలిన కోసల రాజ్యంలో ప్రవేశించాడు.
'ఇది ఒకప్పుడు నా రాజ్యం, నా నగరం' అనే సంస్కారం లేకుండానే ప్రధాననగరాన్ని (ముఖ్యపట్టణం) యాదృచ్ఛికంగా చేరాడు. అక్కడ వీథులందు తిరుగుతూ పౌరుల వద్ద మంత్రుల వద్ద భిక్ష యాచిస్తూ ఉండేవాడు.
కొందరు పౌరులు, కొందరు మంత్రులు ఆతనిని గుర్తించటం జరిగింది. అయితే ఆతడు అదేమీ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆతనిని చూచిన కొద్దిమంది మంత్రులు పౌరులు భేదచిత్తు లయ్యారు. ‘ఆహా ! ఎంతటి మహారాజు! అంతటివాడు ఈ రోజు ఇక్కడ భిక్షాటనం చేయటమా? మనలను తన కన్న బిడ్డల వలె చూచిన ఈ భగీరథ చక్రవర్తి మనలను యాచించటమా? అరుగులపై, చెట్టు నీడలలో నిద్రించటమా? ఇది అసమంజసం'...అని తలచిన కొందరు పౌరులు ఆతనికి మధురపానీయములు, ఆహారం తెచ్చి ఇవ్వటం ప్రారంభించాడు. ఆతడు తనకు ఆకలి తీరువరకు మాత్రమే ఎవరిచ్చినా ఏమీ అనకుండా స్వీకరించి ‘శుభం’ పలికి ఊరుకునేవాడు. కొందరు ఆయనను తమ గృహములకు ఆహ్వానించారు. 'లేదు. నాకు ఎక్కడున్నా ఒక్కటే. నాకేమీ కష్టమనిపించనప్పుడు మీకెందుకు తాపత్రయం? మీరు యథా విధంగా మీమీ పనులు చూచుకోండి"... అని చెప్పి మరొక వీథికి వెళ్ళిపోతూ ఉండే వాడు, ఆ చక్రవర్తి !
4,5 రోజులు గడిచేటప్పటికి భగీరథుని రాక గురించి కోసల రాజ సింహాసనం అనుభవిస్తున్న రాజుకు ఎవరో చెప్పటం చేత తెలిసింది. ఎవరినో సేవకులను పంపించి భగీరథుని అంతఃపురానికి ఆహ్వానించాడు. కానీ భగీరథుడు ఆ ఆహ్వానం స్వీకరించలేదు.
అప్పుడా శత్రురాజే భగీరథుడున్న ప్రదేశానికి వచ్చి "హే భగీరథ చక్రవర్తీ! మీరు మహత్తర ఉదార స్వభావులు. ప్రజలకు మీరంటే ప్రాణం. మీ పరిపాలనను ఇప్పటికీ వారు మధుర స్వప్నం వలె భావించటం నేను గమనించాను. పరిపాలనాదక్షులగు మీ ముందు నేనెందుకూ కొరగానని గ్రహించాను. రాజులమైనందుకు మనం కోరుకునేది ప్రజల క్షేమమే కదా! నాకు కుమారులు లేరు. మిమ్మల్నే నా కుమారుడుగా తలుస్తాను. దయచేసి మీ సింహాసనం మీరు అలంకరించి ప్రజలకు,
Page:288
నాకు ఆనందం చేకూర్చండి. నేను మీ రాజ్యం మీకు సమర్పించి మీకు భృత్యుడనై ఉండటానికి సంసిద్ధుడను... అని అనేక విధాల బ్రతిమలాడాడు. నచ్చచెప్పజూచాడు. లాభం లేకపోయింది. ఆ రాజు ప్రేమతో ఇచ్చిన ఒక పండు తప్పితే భగీరథుడు ఇంకేమీ ముట్టుకోలేదు. రాజ్యం విషయంగాని, రాజకీయ విషయాలుగాని, బంధువుల విషయంగాని, మరింకెవ్వరి గురించిగాని భగీరథుడు సంభాషించనైనా లేదు. ఏదైనా ఆ శత్రురాజు చెప్పవస్తే వినలేదు కూడా!
మరొక నాలుగు రోజుల తరువాత భగీరథుడు ఆ నగరం నుండి కాలినడకన బయలుదేరాడు. త్రోవలో కోసలదేశ గ్రామాలూ, పట్టణాలూ ఉన్నాయి. అక్కడక్కడి ప్రజలు భగీరథుని గుర్తుపట్టి గౌరవ - ఆశ్చర్య - దుఖాదులు ప్రదర్శించటం చూచి వాటన్నిటికీ చిరునవ్వుతో సమాధానం ఇస్తూ తన ప్రయాణం కొనసాగించి, క్రమంగా త్రితల మహర్షి ఆశ్రమం చేరాడు. ఆయన భగీరథుని సాదరంగా ఆహ్వానించారు. భగీరథుడు మాత్రం తదితర శిష్యుల లాగానే గురుశుశ్రూష చేస్తూ ఆశ్రమంలోనే కొన్ని రోజులు గడిపాడు. అట్లా కొంతకాలం గడిచింది.
త్రితలుడు శిష్యుడగు భగీరథుని త్యాగబలం, ఆత్మావలోకనాభిలాష చూచి ఆశ్చర్యచకితుడైనాడు. ఒక రోజు శిష్యులందరినీ, భగీరథునితో సహా, సమావేశపరిచాడు.
"ఓ ప్రియశిష్యులారా! 'సర్వము త్యజించు' - - అని ఈ భగీరథునికి బోధించాను. ఈతడు సర్వమును త్యజించి గురువగు నాకన్నా కూడా సమున్నతమోక్షస్థానంలో సంస్థితుడైనాడు. ఈ రోజు నుండి ఈతడు నాకు శిష్యుడు కాడు. ఈతనికే నేను శిష్యుడను. ఈతనిని సేవిస్తూ నేను అనుసరించ దలిచాను. మీరందరూ మీమీ ఇచ్ఛానుసారం మరొక గురువును ఆశ్రయించవచ్చు” అని ప్రకటించాడు.
ఆ తరువాత గురుశిష్యులగు త్రితలమౌని భగీరథులు కలసి పాదచారులై అక్కడి నుండి ఏ నిమిత్తం లేకుండానే బయలుదేరారు. వనములందు, గ్రామములందు, పర్వత ప్రాంతములందు, పట్టణములందు సంచరిస్తూ అక్కడక్కడా కొంతకాలం గడిపారు.
వారిరువురు ఈ దేహసంబంధమైన, గ్రహణ - త్యాజ్యముల రెండింటికీ అతీతమగు మానసిక స్వస్థితితో సామ్యభావము పొంది, ఆత్మసుఖ విశ్రాంతి అనుభవిస్తూ ఉండేవారు. అకృత్రిమమగు సుఖ విశ్రాంతిని పొందుతూ ఉండేవారు. ఒక రాజు వెన్నెలకాంతిలో తన ఉద్యానవనంలో సంచరిస్తున్నట్లు వారు నిశ్చింతులై శోక - భయ ఉద్వేగరహితులై, సుఖదుఃఖ ప్రసంగము లేనివారై అనేక ప్రదేశములలో సంచరిస్తూ ఉండేవారు.
ఎద్దాని సమ్ముఖంలో విషయానందములు అర్థరహితములగుచున్నాయో, ఏదైతే సుఖస్ఫురణ గాని, దుఃఖస్ఫురణగాని, మధ్యస్థమైనదిగానీ కాదో ... అట్టి నిర్విషయ పరమానందమును వారు అనునిత్యం అనుభవిస్తూ బాలురు సంచరించే ఆటస్థలంలాగా ఈ భూమిపై గల అనేక ప్రాంతాలలో ప్రవేశించారు. ఈ జన - ధన - - తదితర వైభవములు, బ్రహ్మలోకవాసులవరకూ గల అణిమాదిసిద్ధులు వారి దృష్టికి రహదారి ప్రక్కగా ఉన్న ఎండుగడ్డిపరక వలె స్వల్పమైనవిగా తోచేవి. వారిద్దరూ మనుష్య భోగముల నుండి దివ్యభోగముల వరకు పరమవైరాగ్యము కలిగి ఉండేవారు.
Page:289
ఓ రామచంద్రా! ప్రారబ్ధకర్మ వల్ల ఈ శరీరం లభిస్తోంది. మరల కర్మల చేతనే ఇది క్షీణించ బోతోంది. అయితే ఎవరు ఆత్మయందు అనుక్షణికమైన ధారణ కలిగి ఉంటారో ...అట్టి వారికి ఈ ప్రారబ్ధ - - ఆగామి ఆగామి - - సంచిత క్రమములన్నీ వర్తించవు. ఈ శరీరాలు, తత్సంబంధిత వ్యవహారాలు చిన్న పిల్లల ఆటలుగా తోచేవారికి, స్వస్వరూప అనుభూతియందు, నిశ్చలులై ఉన్నవారికి ఇక ప్రారబ్దం లేదు. ఆగామీ లేదు. అనగా అవన్నీ వారి దృష్టిలో విషయరాహిత్యం సంతరించుకుంటాయి. సర్వస్థితులందు సమవర్తియగు ఆత్మను సర్వదా సందర్శించేవారికి సంసారమెక్కడిది? సంసారమే లేనివారికి కర్మలు-ఫలాలు ఏమి ఉంటాయి?
❖
ఆ మునులిద్దరూ పూర్వ కర్మల వలన లభించే సుఖ-దుఃఖముల రెండిటినీ ఆనందంగానే చూడసాగారు. వారి స్వస్వరూపమే ఆనందమయమయినప్పుడు ఇంక లోటేమున్నది? ఇచ్ఛను పూర్తిగా వదలి ఉండుటచే వారిద్దరికీ స్వాభావికంగానే పరమశాంతి లభించింది.
3. పునః పట్టాభిషేకం - గంగావతరణం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా ! ఆ విధంగా ఆ త్రితల - భగీరథులు శాంతైశ్వర్య మనస్కులై ఒక సారి అయోధ్య రాజ్యం చేరుకున్నారు. ఆ రాజ్యం ఏలే మహారాజు అప్పటికి కొద్దిరోజుల క్రితమే మరణించి ఉండటం జరిగింది. ఆ మహారాజుకు సంతానం లేదు. అక్కడి ప్రజలు ఖిన్నులై తమకు ప్రాప్తించిన అరాజకత్వము పోగొట్టుకోవటానికి ఉత్తమార్హత గల వ్యక్తి కొరకై వెతకుచున్నారు.
అక్కడ వేదజ్ఞులు కొందరు దైవేచ్ఛానుసారం ఆకస్మికంగా భగీరథుని చూడటం జరిగింది. చక్రవర్తికి ఉండే రేఖలు, ముఖవర్చస్సు వారికి భగీరథునిలో కనిపించాయి. వెంటనే వేదపండితుల నిర్ణయం అక్కడి మంత్రులకు చేరవేయబడింది. వారు కలిసికట్టుగా వచ్చి తమకు రాజు కావలసినదిగా భగీరధుని ప్రార్థించారు. హర్షవైషమ్యాలు లేకయే సర్వుల సంక్షేమ సంతోషాలు కోరటం మహనీయుల నైజం. త్రితల మహర్షి అభిప్రాయం కూడా అదే అవడం చేత భగీరథుడు అందుకు కాదనలేదు. అక్కడి సైనికులు అప్పటికప్పుడు భగీరథుని పేరు అడిగి తెలుసుకొని “భగీరథ మహారాజుకు జై” అను నినాదాలు పలికారు. పట్టపు ఏనుగు తేబడింది. ఆ భగీరథుడు భిక్షుకుని రూపంతోనే ఏనుగును అధిరోహించాడు. ఆ రోజు మొదలుకొని కొన్ని రోజులుగా గొప్ప ఆడంబరములతో పట్టాభిషేక మహోత్సవం జరిగింది.
❖
ఆ సమయంలోనే కోసల మహారాజు మరణించియున్నాడు. తమ భగీరథ చక్రవర్తే అయోధ్యకు రాజయ్యాడని కోసలరాజ్యమంత్రి వర్యులకు ప్రజలకు తెలిసింది. వెంటనే సభాప్రముఖులు అయోధ్యకు వెళ్ళి భగీరథుని కలిశారు.
Page:290
"హే మహారాజా! తామే కదా మా ప్రభువులు. పెద్ద చేపవచ్చి చిన్న చేపను గుటుక్కున మ్రింగినట్లు మీరు రాజ్యం ధారబోసిన రాజు మృత్యువుచే మ్రింగివేయబడ్డాడు. ఆతనికి సంతానం లేరు. అందుచేత, మీరు ఈ అయోధ్యతో బాటు కోసల రాజ్యమును కూడా మహాచక్రవర్తి అయి పరిపాలించండి. తమరు యోగులే! ఇందులో సందేహం లేదు. అయితే, యోగులు కూడా తాము కోరకుండా ప్రాప్తించిన ప్రవాహపతితములగు కార్యములను ధర్మబుద్ధితో నిర్వర్తిస్తారు కదా! మన ప్రజల కోరిక మన్నించండి.” అని వేడుకున్నారు. భగీరథుడు చిరునవ్వుతో వారి కోరికను
అంగీకరించాడు.
ఆ విధంగా భగీరథుడు మరల సప్తసాగర చిహ్నితమైన భూమండలమునకు చక్రవర్తి అయ్యాడు. ఆతడిప్పుడు బ్రహ్మజ్ఞానము పొందియున్నాడు కదా! అందుచేత అజ్ఞాని వలె కాక ... సమదర్శి అయి, శాంతమనస్కుడై వీతరాగుడై, మాత్సర్య - విస్మయములు లేనివాడై యథాప్రాప్తములైన కార్యములందు నియమితుడైనాడు.
ఒకప్పుడు ఆ భగీరథుని ముత్తాతలు సగరులు గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞములో నియోగించబడిన యజ్ఞాశ్వం కనబడ లేదు. వారు భూమండలమంతా యజ్ఞాశ్వం కోసం సగరులు వెతికారు. అది పాతాళం జేరినట్లు తెలియరావటంతో, వారు భూమిని త్రవ్వటం ప్రారంభించారు. ఫలితంగా సాగరాలు ఏర్పడ్డాయి. ఆ సగరులు పాతాళం జేరారు. అక్కడ యజ్ఞాశ్వం కోసం వెతక సాగారు. అక్కడ వాళ్ళు కపిలముని ఆశ్రమం ప్రవేశించి ఆయన కోపకారణంగా శపించబడి భస్మీభూతులయ్యారు. వారిని పునీతులను చేయాలి.
ఈ విషయం గరుడుడు చెప్పగా కోసల రాజ్యంలోని కొందలు ప్రజలు విన్నారు.
ఆ వార్త మన భగీరథుని చెవినబడింది. 'మా ముత్తాతలను పునీతులుగా చేయడం ఎట్లా'? అను విషయం ఆతడు విజ్ఞులతో సంప్రదించాడు. శాస్త్రకారులు 'అయ్యా ! అందుకు ఒక్క ఉపాయం ఉన్నది. స్వర్గలోకంలోని మందాకినీ నదిని పాతాళం వరకు తీసుకుపోగలిగితే ఆ నదీజలస్పర్శచే నీ వంశీకులు పవిత్రులౌతారు. అయితే అది అత్యంత దుస్సాధ్యమైన విషయం’... అని రాజుకు తెలియజేశారు.
అప్పటికి ఇంకా గంగానది భూమిపై ప్రవహించ లేదు. అప్పుడు భగీరథుడు తన వంశీయుల సూక్ష్మదేహములను పునీత మొనర్చాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుని కరుణకై గొప్ప తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు.
బ్రహ్మదేవుడు : బిడ్డా! భగీరథా! నీ సుదీర్ఘ తీవ్ర తపస్సుకు మెచ్చాను. నీకు ఏమి కావాలో కోరుకో. భగీరథుడు : తండ్రీ! బ్రహ్మదేవా! మేమంతా మీ భావనాస్వరూపులమే కదా! నా అంతరంగమేమిటో మీకు తెలియదా? స్వర్గంలోని మందాకినీ నదిని పాతాళం వరకు జేర్చి ఆ పవిత్రజలంతో మా ముత్తాతలగు సగరుల సూక్ష్మదేహాలను పునీతం చేయాలనునది నా ఉద్దేశం.
Page:291
బ్రహ్మదేవుడు : నాయనా! నీవు చేపట్టినది పవిత్రము, మహత్తరము అగు లక్ష్యము. కానీ అదంత సులభం కాదు.
భగీరథుడు : కాకపోవచ్చు. కానీ పరమాత్మ స్వరూపులగు మీ దర్శనమైన తరువాత ఇక దుస్సాధ్యాలేమి ఉంటాయి? కనుక నాకు మార్గం ఉపదేశించి ఉద్ధరించండి.
ఆ తరువాత బ్రహ్మదేవుని ఉపదేశానుసారం భగీరథుడు అనేకసార్లు తపస్సు - శ్రమలకు ఓర్చి ప్రయత్నించాడు. ఈశ్వరుని, జహ్నుమునిని తపస్సుచే సంతోషింపజేసి మందాకిని భూమిపై గంగానదిగా అవతరించటానికి కారకుడయ్యాడు. ఆకాశము నుండి జగత్పతియగు చంద్రశేఖరుని శిరముపై ఆకాశగంగ ఒప్పారుటచే సాంబశివుడు గంగాధరుడైనారు. స్వర్గమున ఉండే పవిత్ర మందాకిని భూమిపై గంగగాను, పాతాళంలో భోగవతిగాను అవతరించి త్రిపథగామి అయింది. ఆ నదీజలం యొక్క స్పర్శచే సగరులు పవిత్రులైనారు.
అజ్ఞానమును తొలగించి ధర్మప్రబోధి అయిన గంగామాత తనయొక్క పుణ్యజలముతో, అనంతకాలం ఈ భూమిని, ఆశ్రితులను పవిత్రం చేస్తూనే ఉండగలదు.
చూచావా రామా ! సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు మొదలైన పరాక్రమవంతులకు కూడా దుర్లభమైన గంగావతరణం ఆ వంశమున జన్మించిన భగీరథుడు తన శాంతి-తృప్తిసమదర్శనాది గుణముల బలంతో సాధించాడు. ఆ గంగయే సగర పుత్రులకు, సముద్రమునకు కూడా సంజీవని అయింది.
ఎవరైతే పూర్ణశాంతచిత్తులై ఉంటారో, ఆత్మ తత్త్వమును అలవరచుకుంటారో... అట్టివారికి అసాధ్యములైనవి సుసాధ్యములౌతాయి.