Page:292
IX. చూడాలోపాఖ్యానం (మోక్ష నిర్వచనం)
1. శిఖిధ్వజ రాజ్యపాలన
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! స్థిర- సమత్వబుద్ధి అలవరచుకుంటేనే ఆత్మలాభాన్ని ఈ జీవుడు పొందగలడు. ఆయా యథాప్రాప్తములైన కర్మలను నిర్లేపబుద్ధితో ఆచరిస్తూ ఉండేవారికి అవి అధ్యాత్మయానమునకు ఏమాత్రమూ ఇబ్బంది కలిగించలేవు. ఇక ఈ కనబడే వైభవములంటావా... వీటినన్నిటినీ శిఖిధ్వజ మహారాజువలె మనస్సులో పరిత్యజించు. అట్టి మనస్సును విషయముల నుండి ఈవలకు గొని వచ్చి ఆత్మయందు నిలిపి నిశ్చలుడవగుము. ఇక ఈ భౌతికదేహమంటావా? ఇది ఏఏ క్రియలు నిర్వర్తించవలసి ఉంటోందో... అది అట్లే అగుగాక! మనస్సు మాత్రం సర్వమునకు అతీతత్వము సంతరించుకొనును గాక!
శ్రీరాముడు: మహర్షీ! ఆ శిఖిధ్వజుడెవరు? ఆతడు మోక్షమును ఎట్లా బడయగలిగాడు? హే బ్రహ్మజ్ఞా! మా జ్ఞానాభివృద్ధికై ఆ విషయాలు విశదీకరించమని ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! క్రితం కల్పంలోని ద్వాపరయుగంలో 'శిఖిధ్వజుడు' అనే అతను, ఆతని భార్య చూడాల జన్మించియున్నారు. అట్లాగే ఈ కల్పంలో కూడా రాబోయే ద్వాపరయుగంలో కూడా వారిద్దరు జన్మించి వివాహం చేసుకోబోవుచున్నారు.
శ్రీరాముడు : స్వామీ! పూర్వం జరిగింది. ఇప్పుడు జరుగుతుందని, ఇకపై మళ్ళీ అదే జరుగబోతోందని అంటున్నారు కదా! ఈ భూత భవిష్యత్-వర్తమానాలకు కారణమేమిటో ముందుగా చెప్పండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్ సృష్టి విషయంలో బ్రహ్మ మొదలైన సృష్టికర్తల 'సత్య సంకల్ప జ్ఞానము’ యొక్క అనివార్యస్వభావం అంతర్లీనంగా కారణమై ఉంటోంది. ఆ అనివార్య సంకల్ప స్వభావమునే శాస్త్రకారులు నియతి అని పిలుస్తున్నారు. వస్తువులకు కాలగతికి గల ఆ అనివార్య స్వభావమును ఎవరూ నివారించలేరు.
దృష్టాంతానికి... మామిడి చెట్టుకు అనేక ఫలములు కలుగుచున్నాయి. అవన్నీ మామిడి పళ్ళే అయి ఉంటున్నాయి. మరల అట్టివేయగు అనేక ఫలములు ప్రతి సంవత్సరం కలుగుచున్నాయి. ఆ వృక్షము యొక్క ఒకానొక మామిడిటెంక కాలక్రమేణా మరొక మామిడి వృక్షం అవుతోంది. ఆ వృక్షమును ఛిన్నం చేస్తే?... అవన్నీ తొలగుతున్నాయి. అట్లాగే...
పూర్వ సన్నివేశములనేకముల ననుసరించి అట్టివేయగు కొన్ని, వాటికి కొనసాగించు కథనాలతో వేరైన సన్నివేశాలు మరికొన్ని - ఈ వర్తమానంలో ఏర్పడుచున్నాయి. వర్తమానంలో ఏర్పడి ఉన్న కొన్ని సన్నివేశాలు రాబోవు కాలంలో మరల ఏర్పడటమో, లేక ఇక్కడి నుండి కొనసాగటమో జరుగు
Page:293
చున్నాయి. అందుకే 'ఇప్పుడు సాదృశ్యమై ఉన్న కొన్ని సంఘటనలకు పూర్వకర్మలో, తత్పూర్వ సంఘటనలో కారణంగా కలిగియున్నాయి. కనుక ఇదంతా ఒక సుదీర్ఘ కార్యకారణ సంఘాతము’... అని కార్య - కారణాంతరములను పరిశీలించే కార్య కారణ పండితులు (ఉత్తర మీమాంస కోవిదులు) సిద్ధాంతీకరిస్తూ ఉంటారు. అయితే... అజ్ఞానం తొలగిందా... ఈ సాదృశ్యము, ఈ జగదాకారం
కూడా తొలగిపోతాయి.
ఒకే రకమైనవి, అనేక రకాలైనవి అయిన తరంగాలు సరోవరంలో లేచి మరల ఎక్కడో లయిస్తున్నాయి చూచావా? ఈ సంసారంలో కూడా పూర్వం తోచిన విషయములే మరల మరల తోచుచున్నాయి. మనం చెప్పుకున్న శిఖిధ్వజరాజు విషయంలో కూడా ఇట్లే జరుగుతోంది. ఇప్పుడు నేను చెప్పబోవు శిఖిధ్వజ కథనం రాబోవు ఒక ద్వాపర యుగంలో జరుగబోయేది. ఇట్టిదే క్రితం మన్వంతరములోని ద్వాపరయుగంలో కూడా జరిగింది.
నాలుగు యుగాలు గడచిన తరువాత కాలక్రమంగా చతుర్థ సృష్టి ప్రారంభమౌతుంది. అప్పుడు ఏడవ మనువు గతించి, ఎనిమిదవ మనువు అధికారంలోకి వస్తారు. ఆ చతుర్థసృష్టిలో కృత - త్రేతాయుగాలు గడచిపోయి ద్వాపరయుగం వస్తుంది. ఆ కాలంలో ఒకానొకప్పుడు ఈ కథానాయకుడు శిఖిధ్వజుడు జన్మించనున్నాడు. ఇక ఆ చరిత్ర మనం ప్రస్తావించుకుందాం.
జంబూద్వీపంలో గల ఒకానొక భూఖండంలో మాళవరాజ్యం ఉన్నది. ఆ మాళవదేశపు రాజధాని ఉజ్జయిని. ఆ పట్టణంలో శిఖిధ్వజుడు జన్మించి రాజయ్యాడు. ఆతడు గొప్ప ధైర్యశాలి. సదాచారం, శౌర్యం, ధైర్యం, ఔదార్యం, శమాది సంపత్తి, మౌనం - వంటి ఉత్తమ గుణాలతో రాజ్యం ఏలుచున్నాడు. అనేక యజ్ఞములు నిర్వర్తించాడు. అనేకమంది శత్రువీరులను జయించాడు. అయినా కూడా అతడు కోమల మృదుమధుర స్వభావుడు, ప్రేమసాగరుడు, లౌకిక శాస్త్రవేత్త కూడా! అతడు అనేక ప్రజాహిత కార్యక్రమాలు ప్రారంభించి ప్రజాహితుడైనాడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో అక్కడి చుట్టు ప్రక్కల రాజులు ఆతనిని సంప్రదించటం, అనుకరించటం, ఉదాహరణగా తీసుకోవటం చేస్తూ ఉండేవారు. “నేను శ్రమిస్తాను. తద్వారా జనించిన సంపదను అందరికీ పంచి పెడతాను” అనునది ఆతడు సోదాహరణ పూర్వకంగా తదితర జనుల ముందుంచిన గొప్ప సిద్ధాంతం. “శాంతి, వినయం మన రాజు వద్దనే మనం నేర్చుకోవాలి" అని రాజ సేవకులు ఎప్పుడూ సంభాషించు కుంటూ ఉండేవారు. ఆతని పాలనలో దేశ సంపదలు పెరిగాయి. ప్రజలలో పొరపొచ్చాలు ఉండేవి కావు. ఆతని వాక్యములు ఇతరులకు సద్భావనను, ఐకమత్యమును, వినయ - విధేయతలను నేర్పేటట్లుగా ఉండేవి. ప్రజలు ఆ రాజును ప్రాణప్రదంగా ప్రేమించేవారు. ఆతని పాలనలో మాళవ రాజ్య ప్రజలు హాయిగా, ప్రశాంతంగా రోజులు గడుపుతూ ఉండేవారు. ఇటువంటి మహారాజు లభించటం మేము చేసుకున్న పుణ్యఫలం అని ప్రజలు అనుకుంటూ ఉండేవారు.
ఆ శిఖిధ్వజుని బాల్యంలోనే పితృవియోగం సంభవించినప్పటికీ క్రుంగిపోలేదు. రాజభక్త పరాయణులగు మంత్రుల ఉత్తమ యోచనలతో పదహారవ ఏటనే సింహాసనం అధిరోహించాడు.
Page:294
అతి త్వరలో అతని కీర్తి దేశవిదేశాలలో విస్తరించినది. ఆతడు యుక్త వయస్సులో సౌరాష్ట్ర రాజకుమారి అగు చూడాలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యచిత్తులవటం చేత వారి ప్రేమ ప్రవర్ధిల్లింది. ఆ చూడాల మహా సౌందర్యవతి. అంతే కాదు. ఆమె గాన, నృత్య, వాద్యాది కళలలో నిష్ణాతురాలు. అనేక పూజలు, నోములు నిర్వర్తించి, చిన్న వయసులోనే తన హృదయంలో జ్ఞాన బీజాలు పొందిన మహాసాధ్వి. ఆమె శాస్త్రార్థములను గొప్ప వివేకంతో పఠించే
పండితురాలు కూడా.
పార్వతీ పరమేశ్వరుల వలె, లక్ష్మీ నారాయణుల వలె ఆ చూడాల శిఖిధ్వజులు ప్రకాశిస్తూ ఉండేవారు.
ఆ శిఖిధ్వజ మహారాజు రాజసభలో ప్రతిరోజూ దైనందిన కార్యక్రమాలు ముగిసిన తరువాత కొంతసేపు సత్సంగం జరుగుతూ ఉండేది. అందులో అనేక పురాణ కథాకాలక్షేపాలు, ఆధ్యాత్మశాస్త్ర చర్చలు చోటు చేసుకుంటూ ఉండేవి. శ్రుతి వాక్యాలు, వాటిని విశదపరచగల కథలు, చరిత్రలు ఆ సత్సంగంలో వినిపించబడుతూ ఉండటం చేత ప్రజలలో సాత్వికత, ఉత్తమాశయాలు పెంపొందుతూ ఉండేవి. ఒక్కొక్క రోజు రాజే ఆధ్యాత్మికోపన్యాసం చేస్తూ ఉండేవాడు. ఆతనికి అనేక శాస్త్ర విషయములు తెలిసి కూడా నేను 'జ్ఞానిని' అనే కించిత్తు అహంభావం కూడా ఉండేది కాదు.
ఇట్లా చాలా కాలం గడచింది. చిల్లికుండలో నీళ్ళు ఉండేదెంతసేపు? వారి యౌవనం క్రమంగా కాలముచే గ్రసించబడుచుండగా వారిద్దరూ మధ్య వయస్కులయ్యారు.
2. ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క ఆవశ్యకత
శ్రీ వసిష్ఠ మహర్షి : ఒక రోజు చూడాల శిఖిధ్వజ దంపతులు చంద్రకాంతిలో ఉద్యానవిహారం చేస్తూ ఒక పూలపొదల ప్రక్కన ఇసుక తిన్నెపై ఆసీనులై చల్లగా వీచే గాలులు ఆస్వాదిస్తూ ఇట్లు సంభాషించుకోసాగారు.
శిఖిధ్వజుడు : ప్రియసఖి చూడాలా! ఏమి ఈ విచిత్ర జగత్తు! ఈ జీవుడు శరీరమును గైకొని అనేక వ్యవహారములందు పరిభ్రమిస్తున్నాడు, బాగానే ఉన్నది కానీ..... తరంగ సమూహముల వలె ఈ దేహములన్నీ క్షణభంగురములే కదా! అక్కడి మహావృక్షం చూడు! నవనవలాడుతూ పళ్ళు వ్రేలాడుతున్నాయి. ఆ పళ్ళన్నీ పక్వమై ఒకనాటికి రాలిపోవలసిందే! అట్లాగే ఈ దేహము కూడా కొన్నాళికి వినాశనమొందటం అనివార్యమే కదా! అక్కడి తటాకంలో కలువపూలు చూచావా? వాటిపై క్షణక్షణం మంచురాలుటచే అవి ఎంతగా శిథిలమైపోతున్నాయో! అట్లాగే ఈ శరీరముపై ముసలితనం కొంచెంకొంచెంగా వచ్చిపడుతోంది. దోసిలిలోని నీరువలె ఆయుష్షు అనుక్షణం క్షయం అయిపోతోంది. ఒకవైపు ఈ భోగతృష్ణ వర్షాకాలంలోని సొరతీగలాగా పెరుగుతుంటే.... మరొక వైపు యౌవనం పర్వతం మీద నుంచి జారిపడే నదీజలం లాగా ఎచ్చటెచ్చటికో పరుగులు తీస్తోంది.!
Page:295
ఈ జీవుడికి అనుభవించే శక్తి క్షీణిస్తున్నా, అనుభవించాలనే కోరిక తరగకపోవటంచేత ఈ జగద్వ్యవహారమంతా అసంతృప్తిని, దుఃఖపరంపరలను కలుగజేస్తోందే! ఈ శుష్క శరీరము ఇంద్రజాలము వలె అసత్యమైనప్పటికి ఇందులో భ్రమలకు మాత్రం కొదువలేదు.
చూడాల : ఓ ప్రాణనాథా! మీరు చెప్పినదంతా అక్షరాలా నిజం. తృష్ణ హృదయంలో ఆవిర్భవించి, తుచ్ఛ క్రియలందు ఆసక్తిని రగిలింపజేస్తోంది. క్రుళ్ళిన మాంసముపై ఈగలు వ్రాలునట్లు ఈ ఇంద్రియములు అల్ప విషయములపై వ్రాలి వెనుకకు మరలక, మొరాయిస్తున్నాయి. శిఖిధ్వజుడు : అవును. వర్షాకాలంలో జలంపై నీటిబుడగవలె ఈ దేహములు క్షణికమైనవే కదా! వీటిని నిజమని సుదీర్ఘకాలం నిలువబోతున్నాయని నమ్మి, మనం ఏవేవో సంబంధ - బాంధవ్యములతో అనుబంధం కల్పించుకొని రోజులు గడుపుతున్నాం. పర్యవసానం? ఈ శరీరం జీవులమగు మనలను మోసం చేసి ఒక రోజు తన దారి తాను చూసుకుంటోంది.
చూడాల : శరీరంతోబాటే మనస్సు కూడా కృంగి, విరసభావం పొందుతోంది.
శిఖిధ్వజుడు : ఈ సంసారమంతా ఇంతే! ఈ ప్రపంచంలో సుందరమైనదీ, ఎప్పటికీ ఉండేదీ ఒక్కటి కూడా లేదు.
చూడాల : కానీ ఆశ మాత్రం చావటం లేదు.
శిఖిధ్వజుడు : ఓ చూడాలా! మనం ఈ సంసారమును ఎట్లాగైనా సరే... అతిత్వరలో జయించాలి. చూడాల : అందుకు దివ్యౌషధం ఆధ్యాత్మశాస్త్రమే. అనగా ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించే పాఠములే!
ఆ రోజు నుండి వారిద్దరూ ఆధ్యాత్మశాస్త్రం ఆమూలాగ్రం మరింత ఏకాగ్రతతో అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలసి మాళవదేశంలో గల అనేకమంది శాశ్వత శాంతి పరిలక్షితులు, బ్రహ్మగతచిత్తులు, బ్రహ్మనిష్ఠులు - ఆత్మశాస్త్రవేత్తలు అగు మహనీయులను సమీపించి వారివద్ద “ఆత్మవిద్య”, లేక, “భౌమావిద్య" ను వినటం, నేర్చుకోవటం ప్రారంభించారు.
జీవుని యొక్క స్థూల-సూక్ష్మ కారణ దేహాలు; మనస్సు, దాని స్వభావం; బుద్ధి-చిత్తం -అహంకారాల నిర్వచనాలు; ఆత్మ యొక్క తత్త్వం; దేహి-దేహాల సంబంధం, అసంబంధం; ఇంద్రియాలు-విషయాలు విషయాలతో తాదాత్మ్యం; ఈ జీవునిలోని జన్మ జన్మాంతర విభాగం, జన్మరాహిత్య విభాగం; బంధం- మోక్షం; ద్రష్ట-దర్శనం దృశ్యం; కర్త హేతువు -క్రియ; జ్ఞానం -జ్ఞేయం-జ్ఞాని
...ఇటువంటి అనేకమైన ఆధ్యాత్మశాస్త్ర విశేషాలు దృష్టాంతపూర్వకంగా వింటూ ఉండేవారు. మరల అంతఃపురం ప్రవేశించి అనేక అధ్యయన విశేషాలన్నీ చర్చించుకుంటూ ఉండేవారు. పరస్పరం బోధించుకుంటూ, వారిద్దరూ ఆ పరమాత్మ యందే తమ ధ్యాస, ప్రీతి కలిగి ఉండేవారు. కేవలం ఆత్మారాధన యత్నమునందే నిమగ్నమై ఉండేవారు. అయినా కూడా, శిఖిధ్వజుడు రాచకార్యముల కొరకు శత్రురాజులను భయపెట్టుటలో, తమ రాజ్యములోని సంపదలను పెంపొందించుటలో,
Page:296
కీర్తి-ప్రతిష్ఠలను పెంపొందించుటలో ప్రయత్నపరుడై ఉండేవాడు. ఏ కారణాల చేతనోగాని, ఆతనికి ఏకాగ్రత కొంచెం కుంటువడుతూ ఉండేది. చూడాల మాత్రం తాను విన్న ఆధ్యాత్మిక శాస్త్ర విషయాలను ఏకాగ్రచిత్తంతో రాత్రింబవళ్ళు మననం చేస్తూ ఆయా విషయాల యుక్తియుక్తములను స్వబుద్ధితో పరిశోధిస్తూ, పరిశీలిస్తూ ఉండేది. స్వతహాగా సునిశిత బుద్ధి కలిగి ఉండుటచే ఆమె తాను విన్న విషయా లను హృదయస్థం చేసుకుంటూ తన ప్రపంచదర్శనాన్ని పవిత్రం చేసుకుంటూ ఉండేది. మరొకవైపు తన భర్తకు రాచకార్యాలలో అవసరమైన సలహాలు, సహకారాలు అందిస్తూనే ఉండేది. “భర్తను సేవించ టంలో ఈమెకు ఈమే సాటి" అని శిఖిధ్వజుడు తన భార్య చూడాల గురించి అనుకుంటూ ఉండేవాడు.
3. ఆత్మ ప్రబోధం కలిగించేవే అనుసరణీయాలు!
ఒక రోజు చూడాల అంతఃపురంలోని తన ఏకాంత మందిరంలో సుఖాసీనురాలై ఇలా పర్యాలోచించ సాగిందిచూడాల : ఈ శరీరం తన వ్యాపారాలలో ఉండనీ! లేక, ఏ కారణం చేతనో ఎప్పుడో ఒకప్పుడు ఊడనీ! ఇందులో విశేషమేమున్నది? నేను 'విచారణ' అను మార్గాన్ని ఇప్పుడు అవలంబిస్తాను.
ఈ శరీరం కార్య-కారణ సంభూతమైనది. ఇట్టి ఈ దేహంలో ఎక్కడో త్రికాలాల చేత స్పర్శించ బడజాలని మహత్తరము, సత్యము అగునదేదో దాగి ఉన్నది. అది చైతన్యం కావచ్చు, సత్-చిత్ఆనందం కావచ్చు. పరమాత్మ కావచ్చు. 'స్వస్వరూపం' కావచ్చు ...మరింకే పేరుతోనైనా శాస్త్రకారులచే పిలువబడవచ్చు. దానిని యోగాన్ని ఆశ్రయించో (లేక) విచారమార్గాన్ని అనుసరించో, ఎట్లాగైనా సరే అనుభవపూర్వకంగా అతిత్వరలో ఎరుగవలసి ఉన్నది. అది ఎరుగవలసింది నేనే గాని మరెవరో కాదు. శాస్త్రములు, శాస్త్రకారులు, శాస్త్రప్రవచకులు, అనుభవజ్ఞులు... వీళ్ళంతా అది ఏమై ఉన్నదో నాకు గుర్తు చెప్పుచున్నారు. వారంతా మార్గదర్శకులు మాత్రమే! మార్గాన్ని అన్వేషించి, ప్రయాణించి, పొందవలసింది - నేనే గాని వారు కాదు. అట్టి త్రికాలాబాధ్యమగు నా యందలి 'సత్యం' గురించి ఇప్పుడు నేను స్వయంగా నాయందు అన్వేషించి కనుగొన యత్నించెదను గాక!
ఎప్పటి నుండో తెలియదు గాని, ఈ దేహం పట్ల, దేహంలోని ఇంద్రియాలకు విషయాలగు ఈ జగత్ విషయాల పట్ల దురవగాహనతో కూడిన ఒకానొక అనుబంధం ఏర్పడి ఉంటోంది. ఆ అనుబంధం మోహాన్ని కల్పిస్తోంది. కాలక్రమంగా పుట్టి కాలక్రమంగా నశించగల కల్పిత వస్తువుల పట్ల ఆకర్షితురాలిగా చేస్తోంది. నిస్సహాయురాలనై నేను సత్యం-నిత్యం అగుదానిని ఏమరచి ఉంటున్నాను.
కస్యాయమాగతో మోహః? కథ మభ్యుల్దితః క్వ వా?
దేహస్తావజ్జడో మూడో, నా హమిత్యేవ నిశ్చయః ॥
Page:297
అసలు ఈ ‘మోహము’ అనేది ఎందుకు కలుగుతోంది? ఎవరు కల్పిస్తున్నారు. ఎట్లు, ఎచటి నుండి వచ్చిపడుతోంది? నాయందు మోహం కలిగి ఉంటున్నదెవరు? మోహానికి అతీతమై ఉన్నదెవరు? భ్రాంతి తొలగిందా నాయందు భ్రాంతుడు కూడా తొలగుతాడు. స్వస్థత చెందుతాడు. అసలు భ్రాంతికి నిమిత్తం ఏమిటి? మూలమేమిటి? ఏది ఏమైనప్పటికీ, ... మూఢము, జడము అయిన ఈ పాంచభౌతిక దేహం మాత్రం నేను కాదు.
ఎందుకంటే ...'నేను' అని ప్రసిద్ధమై ఉన్నది ఏది కలదో, అది జడంగా మూఢంగా ఉండటం లేదు. కాని, చిన్నప్పటి నుండీ "నేను ఒక స్త్రీని. ఈ రంగు, ముక్కుతీరు, జుట్టుగల ఆకారమును”... అని బుద్ధి వృత్తులు ఆశ్రయించి ఉండటం చేత 'నేను శరీరమును' అనే భావం ఆరూఢమై ఉంటోంది. మారుచున్న ఈ దేహం - మారని నేను’ ...ఈ రెండింటినీ విడదీసి చూడకపోవటం చేత, దేహ ధర్మములను నాపై ఆపాదించుకుంటూ పోతున్నాను. ఇట్లా ఎన్ని ఉపాధులు వచ్చి పోయాయో!
నాలో బుద్ధి వృత్తులు ఉన్నాయి. బుద్ధి వృత్తులే లేకపోతే శరీర జ్ఞానమే కలిగేదికాదు. కాబట్టి శరీరం స్వయంగా జడమైనప్పటికీ బుద్ధి వృత్తులు ఈ శరీరం పట్ల భావాలూ, అభిప్రాయాలు అనుభవాలూ కలుగజేస్తున్నాయి. తద్వారా నాకు వాటితో తాదాత్మ్యం అనే వ్యాపారం ఏర్పడుతోంది.
ఇక ఈ కాళ్ళు, చేతులు, తదితర కర్మేంద్రియాల సంగతేమిటి?... అవన్నీ ఈ దేహానికి వేరు కాని (దేహాంతర్గత) అవయవాలే కదా! అవయవాలకు, అవి చేసే కర్మలకు, వాటిని ఎరుగుచున్న జ్ఞానేంద్రియాలకు భేదం లేదు. అవయవాలు, అవయవాలతో జ్ఞానరూపమై ఉన్న ‘అవయవి’... ఈ రెండు స్వయం ప్రవర్తన కలిగి ఉన్నవి కావు. కనుక రెండూ జడములే. ఈ అవయవాల వంటివే మనోబుద్ధులు కూడా.
“ఒకాయన చేతి కఱ్ఱతో రాయిని దొర్లిస్తున్నాడు” అని అనుకుందాం. కఱ్ఱతో రాయిని కదల్చునట్లు ఈ దేహాన్ని మనస్సే చలింపజేస్తోంది. మనస్సు ఇంద్రియాలన్నిటితో సంయోగం చెందే మరొక పదార్థం మాత్రమే.
అయితే మనస్సుకు స్వయంసంకల్పాత్మక శక్తి లేదు. ఆ చేయి కఱ్ఱను ప్రేరేపిస్తున్నట్లు నిశ్చయాత్మక బుద్ధి చేత మనస్సు ప్రేరేపించబడుతోంది.
చెయ్యికి కూడా స్వయంనిర్ణయాధికారం లేదు. చేయిని కదల్చే మననరూపమగు మనస్సు జడమే! ఎందుకంటే, 'మననం చేయువాడు' - ఉన్నప్పుడే కదా, మననశక్తి ప్రయుక్తమయ్యేది!
అట్లాగే బుద్ధికి కూడా తనను ప్రేరేపించు మరొక తత్త్వం ఉంది. అందుచేత బుద్ధి కూడా జడమే. ఒక పల్లపు ప్రదేశంలో జలం వేగంగా ప్రవహించునట్లు 'అహంకారము' బుద్ధిని చలింపజేస్తోంది.
అయితే, బాగా పరిశీలిస్తే అహంకారానికి కూడా స్వయంకృతమైన ఉనికి లేదు. అహంకారం అనబడేది అంతక్రితమే ఏర్పడి ఉన్న ఏదో తత్త్వంచే ప్రవర్తింపజేయబడుతోంది.
బాలుడు దయ్యమును కల్పించుకొని గాలిలో చూస్తాడు. అలాగే చిదాకాశస్వరూపుడనగు నేను ‘ప్రాణము’ అను ఉపాధిచే శబ్ద స్పర్శ-రూప రస గంధాలు పొందుచున్నాను. అనగా జీవుడే తనకు తాను జీవత్వాన్ని కల్పన చేసుకుంటున్నాడు.
Page:298
కాబట్టి జీవుడు ‘అహంకారం' కంటే ముందే ఉండి ఉన్నాడు. జీవుడు అనగా ‘ప్రాణములు’ అను ఉపాధితో కూడిన చిదాకాశము మాత్రమే.
ఈ “నీవు, నేను, అతడు... అనునవన్నీ చిదాకాశమునందు అనుభవమయ్యే కల్పిత అనుభవాలు మాత్రమే. బింబచైతన్యమే ఈ జీవులందరిలోనూ ప్రతిబింబిస్తోంది. కనుక జీవుని వాస్తవరూపం బింబచైతన్యమే గాని, ప్రతిబింబ ఖండము కాదు. ప్రతి జీవుడు వాస్తవానికి పరిపూర్ణుడే! పరిపూర్ణుడై కూడా ఈ 'జీవితము' అనుదాని యందు పరిమితము వలె తోచుచూ ప్రతిబింబిస్తున్నాడు. 'విషయాలను ప్రకాశింపజేయుట' అను కళంకంచే నిర్మల చైతన్యం కప్పబడి ఉంటోంది. ఆ సాక్షి చైతన్యమే “నేను జీవుడను” అని కూడా తెలుసుకొంటూ ఉంటోంది. అందుచేత నిత్యం - ఆత్మరూపం అగు 'చిత్స్వరూపము' వలననే 'జీవుడు' అనువాడు జీవిస్తున్నాడు. అంతేగాని జీవుడనువాడు స్వయంప్రకాశకుడు కాడు. కనుక జీవుడనబడువాడు కూడా జడమే!
వాయువు వలన సువాసనలు ప్రసరిస్తున్నాయి. పల్లం వలన నీరు ప్రవహిస్తోంది. చిద్రూపమే దృశ్య విషయములందు ప్రసరిస్తూ, భ్రమలను కలిగి ఉంటూ జీవునకు జీవనమైయున్నది. అనగా దాత్మ్యాభ్యాసం చైతన్యమును జడంగా ప్రదర్శిస్తోంది. జీవభ్రాంతిని కల్పిస్తోంది. ఆహాఁ! ఇన్నాళ్లూ నేనెక్కడ నిద్రిస్తున్నానో తెలిసింది. ఏ ఉపాయాలు అవలంబిస్తే అవిద్యావరణం తొలగి దృశ్యస్వప్నం నశించి చైతన్యమునకు ప్రబోధం లభిస్తుందో... అవియే ఇప్పుడు నాకు అనుసరణీయాలు.
4. తనయందు తానై ఉన్న ఆత్మసత్త
శ్రీ వసిష్ఠ మహర్షి: వింటున్నావా రామచంద్రా! ఇట్లా చూడాల చింతించ ప్రారంభించింది. క్రమంగా ఆత్మతత్త్వమును గ్రహించింది.
❖
చూడాల : ఆహా! ఏమి నా అదృష్టం! చాలాకాలం తరువాత నిర్మలమగు జ్ఞానమును నేనిప్పుడు గ్రహించగలిగాను. ఆత్మయోగమును ఆశ్రయించిన తరువాత ఇక చ్యుతికి అవకాశమెక్కడున్నది? ఆత్మ స్వరూపము గ్రహించుటచే సర్వము ప్రాప్తించినట్లే! ఇక కోరుకోవలసినదేమున్నది?
ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ చిద్విలాసం యొక్క పరిచ్ఛేదానికి హేతువైనట్లు కనిపించినప్పటికీ... అసత్తచే ఈ ప్రపంచమంతా ద్వితీయచంద్ర భ్రాంతి వలె కల్పితమాత్రమే కదా! వాస్తవానికి ఇక్కడ సత్తస్వభావమగు ‘మహాచైతన్యం' ఒక్కటి మాత్రమే వెలయుచున్నది. అది కళంక రహితం. ప్రతి ఒక్క జీవుని శుద్ధస్వరూపం. సంవేదన మాత్రం. అది భూమానందస్వరూపం. మంగళ స్వరూపం. అది తనను తానెప్పుడూ త్యజించటం లేదు. కనుక అచ్యుతం. అవిద్య తొలగిన మరుక్షణం ప్రకాశించేది అదే ! అది నిత్యోదితం. 'బ్రహ్మము, పరమాత్మ' అని వేదాంతాది అధ్యాత్మ శాస్త్రములచే పేర్కొనబడుచున్నది అదే.
Page:299
1.చిత్తం, 2. చేత్యం(దృశ్యం), 3.చేతనం - - అనే త్రిపుటి ఆ మహాచైతన్యం కంటే ఎప్పుడూ వేరు కాదు. ఆ సాక్షీభూత మహాచైతన్యమే త్రిపుటికి ఉనికిని, ఉత్తేజాన్ని కలుగజేస్తోంది. మహాచైతన్యం యొక్క పాత్ర లేకపోతే త్రిపుటి తనంతట తానుగా ఏమీ చేయజాలదు. ఒక దానిని మరొకటి స్పర్శించ జాలవు. సాక్షిచైతన్యం త్రిపుటికి మున్ముందుగానే ఉంది. కనుక అది ఆద్యచిత్. అది త్రిపుటి జనితాలగు ప్రమాణాలపై ఆధారపడి ఉన్నది కాదు.
ఆ మహాచైతన్యం యొక్క అక్షయరూపం ఏమిటి? విషయరహితమగు 'చిత్' తత్త్వమే కదా! అదియే మనస్సు-బుద్ధి-ఇంద్రియాలు గాను, ఇంద్రియాలకు గోచరమగుచున్న విషయాలు గాను విస్తరిల్లుచున్నది. ‘మనో-బుద్ధులు' అనే రంగు వేసుకున్న మరుక్షణమే భూత-భౌతిక పదార్థాలతో కూడిన దృశ్యం యొక్క సత్త ఆవిర్భవిస్తోంది. కాబట్టి... 'జగత్సత్త' అను శబ్దార్థాన్ని కలిగి ఉన్న ఈ పదార్థాలన్నీ కూడా మహాచైతన్యం యొక్క రూపాంతరాలే అయి ఉండాలి కదా! స్ఫటికంలో దృశ్యం ప్రతిబింబించవచ్చు గాక! కాని దృశ్యం స్ఫటికాన్ని స్పర్శించలేదు కదా ! ఆ మహాచైతన్యం కూడా తాను నిర్లిప్తంగా ఉంటూనే తన యందు ‘భావపరంపరలు' అను ప్రతిబింబాన్ని కలిగి ఉంటోంది. జగత్ సత్తగా వ్యవహారసత్తగా స్ఫురిస్తోంది. అనగా, మహాసత్తకు రెండు రూపాలున్నాయి.
1. మూర్తము (Form) ; 2. అమూర్తము (Formless)
ఉభయము అయి ఉండటం చేత అద్దానిని 'మూర్తి' అని పిలుస్తూ ఉంటారు.
కాబట్టి ఈ ఎదురుగా కనబడే జగత్తు మహాచైతన్యం యొక్క వివర్తశక్తి వలననే నిలబడి ఉండ గలుగుతోందని చాలా తేలికగా తెలిసిపోతోంది. 'మాయ' కంటే వేరుగా ఈ జగత్తు యొక్క సత్త సంభవించ జాలదని స్పష్టంగా నిరూపణమౌతోంది. ఆభరణాలన్ని బంగారంతో తయారవుతున్నాయి. ఆభరణంలోని ఆకారం వదిలేసి చూస్తే మిగిలేదేది? బంగారమే కదా! దృశ్య సత్త యొక్క నామరూపాలు నశించినప్పుడు (ప్రళయ సమయంలో) బ్రహ్మత్వమే స్వయంగా శేషించుచున్నది. ఇంకొకరకంగా చెప్పాలంటే ...మాయ తొలగగా, ఇక ఆత్మసత్తే ఆనందైక రసస్వరూపంగా తనను తాను అనుభవిస్తోంది.
5. నిర్మలశాంత స్వరూపం
జాగ్రత్లో ఈ మనస్సు ఇంద్రియాలలో ప్రవేశించి అనేక విషయాలు దర్శిస్తోంది, అనుభవి స్తోంది. స్వప్న సమయంలోనో? ఇంద్రియాలు మౌనం వహించి ఉంటున్నాయి. అయితే ఏం? మనస్సు తనకు తానే మహాసముద్రమై 'స్వప్నానుభవాలు' శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ సంబంధమైన భావనా తరంగాలను తనయందు పొందుతోంది. స్వప్నద్రష్ట స్వప్నం కంటే వేరుగా ఉంటున్నాడు, వేరుగా ఉంటూనే... తనకు తానుగా ఇటు స్వప్నంలోనూ, అటు జాగ్రత్లోనూ అనేక భావనా తరంగాలలో ప్రవేశ నిష్క్రమణాలు నిర్వర్తిస్తున్నాడు. అయినా కూడా, ద్రష్ట ద్రష్టగానే ఉంటున్నాడు గాని మరింకొకటిగా అగుచుండుటలేదే !
Page:300
మహాచైతన్యంలో సృష్టి లేదు. అయినా అందు జగత్తు ఉదయించినట్లు (అజ్ఞానదృష్టికి) తోచుచున్నది. చిద్రూపమగు ఆత్మ స్వప్నంలోనూ, జాగ్రత్లోనూ కూడా తన యొక్క కల్పిత రూపాలనే దృశ్యం నందు గాంచుచున్నది. పూర్ణచిదాత్మ కంటే ఎక్కడా ఏదీ లేదు. అహంభావ రహితమగు చిన్మాత్రయే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
న తస్య జన్మమరణే, న తస్య - సదసద్గతీ । |
న నాశః సంభవత్యస్య, చిన్మాత్ర నభసః క్వచిత్||
ఆ మహాచిత్ (లేక) చిన్మాత్రం (లేక) స్వస్వరూపానికి జనన-మరణాలు లేవు. అది ఎక్కడా ఏ మాత్రం పరిచ్ఛిన్నమే అవటం లేదు. ఆ చిన్మాత్రాకాశానికి ధ్వంసం అంటూ లేనే లేదు. అట్టిది అసంభవం అయి ఉన్నది.
అచ్ఛేద్యోయమ్, అదోహ్యోం యమ్ చిదాదిత్యో అతినిర్మలః | అహో ను చిరకాలేన శాన్తాస్మి పరినిర్వృతా ॥
ఆ చిదాదిత్యుడు అత్యంత నిర్మలుడు. ఆతనికి ఛేదన - దహనములు లేవు. ఉండవు. నేను చిత్ సూర్యుడిని. అంతేగాని ఆయన ప్రతిబింబించే 'జీవుడు' అను ప్రతిబింబాన్ని ఎట్లా అవుతాను? సర్వదా స్వప్నద్రష్టనేగాని, స్వప్నంలో కనిపించే అనేకరూపాలుగాని, ఆ అనేక స్వపాంతర్గత రూపములలో ఒకానొకరూపంగాని ఎట్లా అవుతాను? అవను.
సూర్యబింబం సూర్యబింబంగానే ఉంటుంది. “నీటిలో సూర్యబింబం ప్రతిబింబిస్తోంది కాబట్టి ఆకాశంలోని సూర్యుడు నీటిలో ప్రవేశించాడు” అని ఎవరైనా అనగలరా? ...అంటే మాత్రం అది నిజమా?... కాదు. నేను బుద్ధిలోను, మనస్సులోను ప్రతిబింబిస్తున్నంత మాత్రం చేత నా యొక్క మహాచైతన్య స్వరూపం పోగొట్టుకుంటున్నానా? లేనేలేదు.
ఇక జరిగిపోయిన జీవభ్రమల గురించి ఆలోచించవలసిన పని నాకు లేదు. ఆహా! నేడెంత సుదినం! ఇప్పుడు నేను భ్రమరహితమగు నిర్వాణమును పొందుచున్నాను! ఆత్మాకాశమంతా ఆవరించి ఉన్నది నేనే! అట్టి నా వాస్తవ స్వరూపంలో దృశ్యాభాస లేదు. నేను సర్వదా అత్యంత నిర్మలము, అజము, అచ్యుతము అయి ఉన్నాను. నా స్వరూపవిస్తారంచే ఈ పధ్నాలుగు లోకాలు, ఈ చరాచర జగత్తు సర్వదా నింపివేయబడియున్నది.
నా యొక్క నిజస్వరూపము బాధారహితమైనది. నిర్మలమైనది. సర్వదృశ్య పదార్థములకూ పరమైనది. దేశ-కాల-వస్తువులచే అపరిచ్ఛిన్నమైనది. ఈ నా స్వరూపము అనంతము.
బ్రహ్మం నుండి వెలయు ప్రాణులు, వారి కర్మఫలాలు, ఆ ఫలాలను సంపాదించటానికి ఏర్పడి ఉన్న సాధనాలు, ఫలరహిత క్రియలు ... ఇవన్నీ బ్రహ్మం నందు జడమాత్రాలై స్వయంగా ఆత్మాకాశ రూపాలే అయి ఉన్నాయి. ఈ కనబడే దేహాలు, ఇందలి దేహులు, ఈ నా దేహం, ఇందలి ‘చూడాల’ అని చెప్పబడు ఈ దేహి ... ఇవన్నీ ఆత్మాకాశరూపాలే! అందువల్ల ఈ జగత్తంతా అకృత్రిమ చైతన్యమే అయి ఉన్నది. కుమ్మరివాని బొమ్మలు, వాటి కదలికలు అంతా మన్నే కదా !
Page:301
ద్రష్ట-దృశ్యమయీ సత్తా చిన్మాత్రైక్యమయీ తథా,
ఇదమైక్యమ్-ఇదమ్ ద్విత్వమ్ అహం-నా హమితీతి చ ||
క ఇవ భ్రమ సంమోహః? కథం కస్య కుతః క్వ వా? స్వమనస్తమనాయాసం ఉపశాన్తాస్మి సంస్థితా II
అట్లే ద్రష్ట-దృశ్యమయ ఈ జగత్తంతా చిన్మాత్రం మాత్రమే. 'ఇది ఏకం, అది అనేకం, ఇది నేను, అది నేను కాదు'... అను వాటికి ఇంకా ఆయా తదితరములైన భ్రమ సమ్మోహాలకు స్థాన మెక్కడ? ఆ భ్రమలు ఉన్నదెవరికి? అవి ఎందువలన ఎచ్చటి నుండి రాగలవు? ఇక అవన్నీ లేనివే!
ఆత్మ ఒక్కటే సత్యము. లేనివాటిని పొందట మేమిటి? తొలగించుకోవట మేమిటి? నేను ఎప్పటికీ కూడా అనంత పరమార్థస్వరూపాన్నే! కనుక, శాంతియే నా స్వభావమై ఉన్నది.
ఇప్పటికి నేను 'మోక్షసుఖం' అనగా ఏమో గ్రహించాను. నా స్వస్వరూపమున వెలయుచున్నాను. అజ్ఞానకాలంలో కూడా నేను నెలకొని ఉన్నది నా యందే కదా! అయితే నేను నా వాస్తవ స్వరూపాన్ని కించిత్తు ఏమరచాను... అంతే! ఆ కారణం చేత ఇప్పుడొచ్చే లోటేమీ లేదు.
ఈ కనబడుచున్న చేతనాచేతనములు... వాటిని అనుభవించుచున్న భావములు... ఇవన్నీ ఆత్మకు అభిన్నములై ఆత్మాకాశముననే వెలయుచున్నాయి. 'ఇది, నేను, అతడు' మొదలైనవన్నీ భావనా మాత్రములే. ఆత్మయో, భావనకు ముందే ఉన్నది. అది పరమశాంతము, నిరాలంబము, కేవలము, పరస్వరూపము, శుద్ధము, సర్వము - అయి వెలయుచున్నది.
ఆత్మ తప్పితే ఇక్కడగాని, మరెక్కడా గానీ ఏదీ లేదు. నేనే ఆ ఆత్మను!
ఇట్లు చూడాల పరమాత్మతత్త్వమును గ్రహించింది. రాగము, మోహము, తమోవిలాసము... అనే అవస్థాత్రయం నివృతమై, నిర్మలశాంతి స్వరూపమున ఆమె విరాజిల్లింది.
6. చూడాల స్వకీయ విచారణ
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ చూడాల ఒకవైపు తన భర్త శిఖిధ్వజునికి రాజ్యపాలన విషయాలలో చేదోడు వాదోడుగా సహకరిస్తోంది. మరొకవైపు కొంచెం సమయం దొరికినప్పుడల్లా ప్రతీరోజూ తాను ఆత్మ శాస్త్రవేత్తల దగ్గర వినియున్న భౌమావిద్య, లేక ఆధ్యాత్మవిద్యను సునిశితబుద్ధితో పరిశీలిస్తూ ... “నేనే ఆ అఖండము, అప్రమేయము, అగు నిర్మలాత్మను. నాకు అనుభవమయ్యేదంతా నా స్వరూప విస్తారమే!”...అను అనిర్వచనీయానుభవమును, సాక్షీ మహత్త్వమును స్థిరీకరించుకుంటూ ఉండేది. అంతర్వృత్తి చేత తన స్వాభావికమైన 'స్వాత్మారామము'ను ఆశ్రయించి ఆత్మతత్త్వం నందు స్థితి కలిగి ఉండేది. ఆమె యథాప్రాప్తములైన కార్యాలను, దినచర్యలను ఏవీ త్యజించలేదు. అయితే రాగ-ద్వేష-సంగ వర్జితమైన, నిర్ద్వంద్వమైన, ఇచ్ఛారహితమైన, సుసమగ్రమైన అవగాహన - అంతరంగ
Page:302
సంస్థితత్వం మాత్రం పెంపొందించుకుంటూ ఉండేది. సందేహ జాలములను త్యజించివేస్తూ సంసార సముద్రమును ఆత్మస్వభావౌన్నత్యముచే అధిగమించసాగింది. పరమాత్మజ్ఞాన లాభముచే లభించే 'పరమపదము' నందు విశ్రాంతి పొందుతూ ఉండేది.
మనం ఆమె మనోస్థితి గురించి ఎంతగా చెప్పుకున్నప్పటికీ...అది ఉపమానాలన్నిటి కన్నా అతీతమైనది. కనుక ‘అనిర్వచనీయం' అనక తప్పదు. ఈ విధంగా ఆ రాజపత్ని అత్యల్ప కాలంలో 'ఆత్మజ్ఞాన సంయుక్త' అయినది. ఆమెకు అంత స్వల్పకాలంలో అది ఎట్లా సాధ్యపడింది?’...అని శ్రోతలెవరైనా ఆశ్చర్యపడతారేమో! ...అజ్ఞాని యందు అకస్మాత్తుగా ఎట్లా సంసార భ్రమలు ప్రవేశిస్తు న్నాయో ...జ్ఞాని యందు అంతే వేగంగా, అంతే అకస్మాత్తుగా ఆ అజ్ఞాన వీచికలు (శీఘ్ర గతిని) వినాశన మొందుచున్నాయి. ఆ చూడాల 'ప్రతి ఒక్కని స్వగృహమే... అన తగిన ఆత్మపదము నందు విశ్రాంతి పొంది, శరత్కాల మేఘపంక్తి వలె శోభిల్లింది.
ఓ రాఘవా ! ఒక గోవు పచ్చగడ్డి, నీరు గల ఒక విస్తార ఏకాంత ప్రదేశం పొందిన తరువాత ఇక వ్యాకులతకు కారణమేముంటుంది? 'జాగ్రత్’ ఆదిగా అవస్థలన్నిటిలో సాక్షీభూతమై, జాగ్రదాది ఆయా అవస్థలచే బంధింపబడ జాలనిదై, సదా-సర్వత్రా ఏకమై ఉండే ఆత్మతత్త్వము నందు స్థిరులైన వారికి ఇక వ్యాకులత యొక్క అగత్యం ఉంటుందా? ఉండదు. స్వవివేకం యొక్క పూర్ణానంద స్వరూపం ఆమె యందు ఆవిర్భవించింది. ఇక ఆ చూడాల యొక్క స్వభావం నూతన పుష్పలత వలె శోభించింది. ఆమె ముఖంలో బ్రహ్మానందం యొక్క ప్రభావ వీచికలు 'వర్చస్సు'గా ప్రకాశించసాగాయి.
ఒక రోజు శిఖిధ్వజుడు తన భార్య చూడాల ముఖంలో వెల్లివిరుస్తున్న ఆనందశోభను చూచి కించిత్ ఆశ్చర్యచకితుడైనాడు.
శిఖిధ్వజుడు: ఓ ప్రియ లలనా! చూడాలా! ఈ మధ్యగా నీ ముఖాన ఏదో నూతనోత్సాహం, నూతన కాంతులు విరజిమ్ముచున్నవే! మరల లేతయౌవనం పొందిన దాని వలె, పూర్ణచంద్ర శోభతో వెలుగొందుచున్నావే?
అమృతం తాగినప్పుడో, ప్రపంచ మొత్తానికి మహారాణివయినప్పుడో ముఖం ఎట్లుంటుందో... నీ వట్లు కనబడుచున్నావు. నీ శరీరంలో శాంతి, సౌందర్యం, గొప్ప శోభ ప్రకాశిస్తున్నాయి. భోగాశ త్యజించి, 'సమత్వం' పొందిన మునివరేణ్యుల వర్చస్సు నీలో ప్రస్ఫుటమౌతోంది. ఒకానొక గంభీరత్వం, పూర్ణత్వం నీలో ద్యోతకమౌతున్నాయి.
ఓ ప్రియురాలా! పరిహాసంగా అడుగుచున్నాను... నీ మనస్సు ఈ ముల్లోకాలలోని అమృతాన్ని అంతా గ్రోలి, ఆత్మానందశోభచే ముల్లోకాలను తృణప్రాయం చేసివేసిందా ఏమి? నీ కళ్ళలో ప్రపంచం లోని సౌమ్యం, సంతృప్తి, ప్రశాంతత అంతా వచ్చి కాపురం చేస్తున్నట్లుగా ఉందే? ఎండమావుల జలభ్రమ తొలగినప్పటి ఎడారి ప్రదేశంలాగా, క్షీరసాగరం సంతరించుకుని ఉండే పూర్ణత్వంలాగా, ఆనందసారంతో కూడుకుని నీ చిత్తం చమత్కారంగా ప్రభవిస్తున్నట్లు నా కనిపిస్తోంది. ఈ నీ శరీరం
Page:303
ఇతఃపూర్వానిదే అయినప్పటికీ ఇప్పుడు అనిర్వచనీయ చిదానందసమన్వితమై బ్రహ్మానందప్రదమై మా అందరి కళ్ళకు కనిపిస్తోంది.
ఏమిటి విశేషం చెప్పు? దేవతలు ప్రత్యక్షమై అమృత కలశములను నీచే త్రాగించారా? నీ యొక్క హఠయోగసాధనచే మృత్యువుకు కూడా అందజాలనట్టివి అగు అలౌకిక శక్తులేవైనా సంపాదిం చావా? చింతామణిని గాని, త్రైలోక్యములపై ఆధిపత్యాన్ని గాని ఏ విష్ణువో ప్రత్యక్షమై ప్రసాదించ లేదు కదా?... అసలు విశేషమేమిటో నీ నుండి నేను వినాలని కొద్ది రోజులుగా అనుకుంటున్నాను. ఏదీ, చెప్పవూ?
చూడాల: ఓ ప్రియ రాజా! నా యందు మీకు నూతన తేజోసమన్వితమైన వర్చస్సు, ప్రశాంతత ద్యోతకమవటానికి నేనెరిగి నంత వరకూ కారణమేదై ఉండి ఉన్నదో అది చెపుతాను... వినండి.
మూఢత్వం వహించినప్పుడు జీవులకు ప్రియంగా తోచే దేహాత్మభావాన్ని నేను త్యజించాను. నిరాకారం, సంపూర్ణం అయినట్టి బ్రహ్మాత్మభావనను జ్ఞానబలంతో ఆశ్రయించాను. తత్ఫలితంగానే ఈ భౌతిక దేహంలో మీకు ఒకానొక అనిర్వచనీయ వర్చస్సు లేక శోభ కనిపించటం జరుగుతోంది.
ఈ దేహంతో సహా ఈ చరాచర జగత్తులో ఉన్నవన్నీ పరిచ్ఛిన్నం, కాలగతిని అనుసరించి రాక-పోకలు కలవి అయి ఉన్నాయి కదా!
వీటిని మనస్సులో పరిత్యజించాను. అట్టి పరిత్యాజ్యానంతరం శేషించియున్న నిర్మలమనస్సుతో ...భూత-వర్తమాన-భవిష్యత్తులలో ఒకే విధంగా వెలుగుచూ, ఈ మూర్త-అమూర్త ప్రపంచానికి సంబంధించనట్టి 'అపరిచ్ఛిన్న బ్రహ్మం’ ను ఆశ్రయించి ఉన్నాను. ఏ ఆత్మ అయితే ద్రష్ట దృష్టిని అనుసరించి సృష్టి సమయంలో కొంచెం పరిచ్ఛిన్నంగాను, లయకాలంలో పరిచ్ఛిన్న రహితంగానూ కన్పట్టుచున్నదో... కానీ యథార్థానికి సర్వదా నిరాకారము, నిరాలంబమో అట్టి ఆత్మను గాంచు చున్నాను. అనగా నిరాకారకూటస్థ భౌమానందము అగు సుమధుర స్వభావమును అభ్యసిస్తున్నాను.
ఇప్పుడు నేను అనుభవిస్తున్న భోగములచే ఎట్లు సంతుష్టురాలనై ఉంటున్నానో... అట్లాగే అనుభవించని భోగాల పట్ల కూడా సంతుష్టియే కలిగి ఉంటున్నాను. ఎందుకంటే నా స్వరూపం చేతనే నాకు సంతుష్టి కలుగుచుండుటచే, సంతుష్టియే నా స్వరూపమగుచున్నది. దృశ్య విషయాల సంసర్గం కలుగుట చేతగాని, కలుగకుండుట చేతగాని నాకు సుఖ-దుఃఖాలు ఏర్పడవలసిన అగత్యమే లేదని గ్రహించాను. ఆకాశం వలె స్వచ్ఛమై 'కేవల హృదయస్థితి'ని పొందుచున్నాను. దృశ్య సంపర్కం లేని మనస్సుచే ఏకాకినై సర్వమునందు క్రీడించుచున్నాను.
ఈ రాజ్యలీల నందు నేను ఉండియే ఉండలేదు. ఈ దేహమునందు ఉన్నంత మాత్రం చేత నా యొక్క ‘పూర్ణాత్మస్థితి’కి వచ్చే లోటేమీ లేదు. ఈ భోగాలతో గాని, ఇక్కడ తారసపడే తదితర విషయాలతో గాని నాకు ఏనాడూ సంబంధం లేదు. లజ్జ-అభిమానం-కోపం-భయం నాకు లేవు. నాకు సంబంధం లేని వాటిచే నేను బంధింపబడటమేమిటి? కనుక నాకు బంధమూ లేదు, మోక్షమూ లేదు.
Page:304
నేను స్వతహాగా ఆకారరహితుడనైనప్పటికీ ఈ అనేక బ్రహ్మాండములకు ప్రభువునై ఉన్నాను. ఆత్మచే ఆత్మయందు పూర్ణప్రభతో వెలుగొందుచున్నాను.
'అధిష్ఠానదృష్టి’తో చూస్తే... ఈ దేహాదులన్నీ నేనే. నేను నిత్య సత్యమై ఈ దేహాదులందు ప్రసరించి ఉన్నాను. 'అపవాద దృష్టి' ప్రకారం ఇవేమీ నేను కాదు. 'దేహాత్మ దృష్టి’తో ఈ దేహమనో-బుద్ధులేవీ సత్యమే కాదు.
వెయ్యేల?... అంతయూ నేనే! సర్వతత్వాత్మకుడను! ఇదేమియూ నేను కాదు! సర్వతత్వ విదూరుడను! నేనిప్పుడు సుఖాన్ని కోరుటలేదు. దుఃఖానికి వాపోవుట లేదు. అర్థమును వాంఛించుట లేదు. అనర్థమును ద్వేషించుట లేదు. యథాప్రాప్తములైన వస్తువులతో సంతృప్తిని పొందుచున్నాను.
రాగద్వేషము లనేవి లేనట్టి బుద్ధితో 'శాస్త్రదృష్టి' అనే స్నేహితురాలితో కూడి ఈ జగత్తునందు విహరిస్తున్నాను.
ఓ ప్రాణనాథా! ఈ నేత్ర ప్రకాశంచే తదితర ఇంద్రియాలచే, ఈ మనోబుద్ధులచే నేనేమేమి చూస్తున్నానో, పొందుచున్నానో, అనుభవిస్తున్నానో... అదంతా మిథ్య అయి ఉన్నది. అందుచేత ఈ ఇంద్రియ - - మనోబుద్ధుల నుండి వియోగం పొందినదాననై, ఆ 'నిష్ప్రపంచవస్తువు’ను నా యందే గాంచుచున్నాను.
❖
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఆ చూడాల ఆత్మయందు విశ్రాంతి పొందుతూ చెప్పే వాక్యాలలోని అంతర్గత ఆత్మానుభవరసాన్ని శిఖిధ్వజుడు గమనించనే లేదు. చిన్నపిల్లలు పెద్ద పెద్దమాటలు మాట్లాడుచున్నప్పుడు తండ్రి చూపే అవహేళనను మాత్రం ప్రకటించాడు.
శిఖిధ్వజుడు: ఓ ప్రియురాలా! నీవు బాలికవు కనుకనే ఇటువంటి అసందర్భమైన మాటలను, పాఠ్యాంశాల వలె వల్లిస్తున్నట్లు చెప్పుచున్నావు. అటువంటి పిచ్చి ఆలోచనలను కట్టిపెట్టి, ఇంతవరకూ ఏ రాజ్యవ్యవహారంలో నాతోబాటు పాల్గొనుచున్నావో, అట్లే ఈ కార్యక్రమాలను కొనసాగించు.
ఏమిటి నీవన్నది? ప్రత్యక్ష సద్రూపమైనట్టి ఈ ఆకారమును త్యజించి... అప్రత్యక్షమై, ఊహా సంబంధితమైన నిరాకారాన్ని ఆశ్రయిస్తున్నావా? శూన్యంచే శోభిస్తున్నావా? అనుభవించునట్టి భోగాలచే సంతుష్టి పొందుచున్నావా? అనుభవించని వాటిచే కూడా సంతుష్టి పొందుచున్నావా?
మూర్ఖురాలి వలె శయ్య-ఆసనము త్యజించి ఎక్కడో వెతకటమా? ఈ మిత్రభృత్యాది రూపాలను, రాణివాసపు భోగాలను, వాటికి సాధన భూతాలగు ధనాధులను పరిత్యజించి పిశాచి వలె ఎక్కడో సంచారం చేయడం ఉచితమని నీ అభిప్రాయమా? ఎవరు చెప్పారీ మాటలు? జ్ఞానులు ప్రవచనాలన్నీ విని నేర్చుకున్నది ఇదా? 'మోక్షం' అంటే ఏవో ఉబుసుపోని ఆలోచనలనుకున్నావా? ఏదో కోపం వచ్చి వస్త్ర, భోజన, శయ్య, త్యజిస్తేనూ, మొండిగా ఆకలి దప్పికలను సహిస్తేనూ మోక్షం వస్తుందా?
నేను దేహమునకు అన్యమైన విషయమును... ఇవేమీ నేను కాదు... ఇవన్నీ నేనే... ఇవి నాలో లేవు... వీటన్నిటిలో నేనే ఉన్నాను... వీటన్నిటికీ, వేరై నేనెక్కడో ఉన్నాను... ఇటువంటి
Page:305
పరస్పర వ్యతిరేకార్థ వాక్యములు స్వీకరించి ఏం సాధిద్దామనుకుంటున్నావు? నీవు ప్రయాణించేది ఎటో నీకైనా తెలుసా?
'కళ్ళకు కనిపిస్తున్నదంతా మిథ్య. ఇందులో నేను చేస్తున్నది మరొకటి'... ఇట్టి అసద్వాక్యముల ప్రేలాపన ఏ జీవునికైనా శోభ అవుతుందా? ఇన్ని జ్ఞాన విషయాలు విన్నావు. నీతో బాటు నేనూ విన్నాను. జీవించి ఉండగానే శ్రమించి సాధన చేసి ఉత్తమ బుద్ధిని సంపాదించుకోవాలి కదా! అది మానివేసి ‘మనస్సు, బుద్ధి వదిలేశాను. మనో బుద్ధులను త్యజించి మరొకచోటకు చేరుచున్నాను' ...అని అంటున్నావే?
ఓ చూడాలా! నీవు మాట్లాడే మాటలు తాత్త్వికోపన్యాసం వినిన ఐదుసంవత్సరాల బాలిక మాట్లాడుచున్నట్లున్నాయి గాని, నీవంటి ప్రౌఢ మాట్లాడాల్సిన మాటలుగా లేవు. వాక్యాలకు పెడర్థం కల్పించుకొని పిచ్చిదానివి కావద్దు. ఉచితానుచితాలు నాకు తెలియవా? పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నా వలెనే రాజ్యవిషయాలు చూచుకుంటూ తపస్సు, ధ్యానం చేయి. ఇంకా తాత్త్వికోపన్యాసాలు విను. అంతే గాని, మనస్సును చెదరగొట్టుకొని పిచ్చిదానివై వీథుల వెంట తిరుగు మార్గంలోకి వెళ్ళకు.
శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఆ విధంగా శిఖిధ్వజుడు ఆ చూడాల మాటలకు కొంచెం కోపం, అపహాస్యం ప్రకటించి, పకపకా నవ్వుతూ ఆ చూడాల చెయ్యి పట్టుకొని ఆ రోజు అవశ్యం నిర్వర్తించవలసియున్న సభాకార్యక్రమ నిర్వహణకై అక్కడినుండి బయల్వెడలాడు. చూడాల తన ప్రియపతి శిఖిధ్వజుని వెంటనంటి అడుగులు వేస్తూ ఆ సమయంలో ఇట్లా అనుకున్నది.
చూడాల: (తనలో) అయ్యో! నా ప్రియుడైన ఈ రాజు ఆత్మయందు విశ్రాంతి పొందకపోవుటచేతనే నా వాక్యార్థములను గ్రహించలేకపోయాడు కదా! దృశ్యముపై అపేక్ష, అల్పావగాహన, అసమగ్రమైన అభిప్రాయములు ఉన్నంతవరకూ ఆత్మానుభవమునకు సంబంధించిన ఉత్కృష్టవాక్యములు పిచ్చివాని మాటలవలెనే అనిపిస్తాయి కాబోలు. సరే! ఇప్పుడు చేసేదేమున్నది? సముచితమైన సమయం ఆసన్నమైనప్పుడే ఈయనకు చెప్పటం మంచిది కదా!
ఇట్లు చింతించుచూ తాను కూడా భర్త వెంట సభలో ప్రవేశించింది. యథారీతిగా ఆయా రాచకార్యములు నిర్వర్తించుటలో భర్తకు ఉపాయములు, యోచనలు, అభిప్రాయములు అందించింది. ఆ తరువాత కూడా యథావిధంగా తన ఆత్మచింతనావ్యాపారమునందు సంలగ్నచిత్త అయి, రోజులు గడపసాగింది. రెండు వేరు వేరు దృక్పథాలు - ఆశయాలు కలిగి ఉన్న వారిరువురూ తదితర సర్వ విషయాలందూ లోకరీతిగానే (లౌకిక వ్యవహారాలన్నీ) నిర్వర్తిస్తూ ఉన్నారు.
ఒకసారి శిఖిధ్వజ మహారాజు శత్రురాజులను జయించటానికి మూడు సంవత్సరాల కాలం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. ఆ మూడు సంవత్సరాలు చూడాలయే రాజస్థానంలో ఆయా రాచ కార్యములు నిర్వర్తిస్తూ ఉండేది. ఆ సమయంలో నిత్యతృప్త అయి, ఇచ్ఛారహిత అయి అఖండము
Page:306
అప్రమేయము - - నిత్యము అగు ఆత్మాభ్యాసం (“నేనే ఆత్మను” అను సమాధి యొక్క అభ్యాసం) కొనసాగిస్తూ ఉండేది. ఒక రోజు ఆమె మానసికాకాశంలో ఆకాశగమన ఇచ్ఛ స్వయంగా ఉద్భవించింది. అందుచేత ఆ రాజపుత్రి అప్పటికప్పుడే రాజ్యాన్ని వదలి ఒకానొక నిర్జన స్థానం ప్రవేశించింది. ఒక ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం ఎన్నుకున్నది. అచ్చట తనకు అనుకూలమైన ఉచితాసనం వేసి అవయవాలను దృఢపరచుకున్నది. ఆకాశగమన విద్య సిద్ధికొరకై ఊర్ధ్వగామి యగు ప్రాణవాయువులను భ్రూమధ్యంన నిరోధించటమనే అభ్యాసాన్ని చిరకాలం ఆచరించింది. కుండలినీ శక్తిని ఉద్బోధించి క్రమక్రమంగా యోగాభ్యాసంచే ఆకాశగమన శక్తిని ప్రభవింప జేయసాగింది.
7. సుషుమ్నానాడి
శ్రీరాముడు: మహాత్మా! నాదొక సందేహం. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా క్రియా సిద్ధంగా కనిపించుచున్నది కదా! అయితే “క్రియ” అనే స్పందనం యొక్క సిద్ధి దేని వల్ల కలుగుతోంది? ఏదైనా “చలనక్రియ” వలన కలుగుచున్నదంటారా?... లేక ఆత్మ వలననా?
ఏదైనా చలనక్రియ వలననే అయితే, అప్పుడు ఆత్మను 'క్రియావస్థ'గా మార్చగల ఒక దోషం ఏర్పడుచున్నట్లే అవుతోంది. ... పోనీ, 'ఆత్మ వలన' అని అంటారా?...
ఆత్మ నిష్క్రియాత్మకమైనదని చెప్పుచున్నారు కదా? మహాత్మా! ఏ క్రియ యొక్క దృఢాభ్యాసం చేత ప్రయత్నశీలుడగు జీవునకు 'ఆకాశగమనము' మొదలైన విద్యలు లభిస్తున్నాయి? ఒకడు ఆత్మజ్ఞుడు అయినా, కాకపోయినా సిద్ధి కొరకో, లేక విలాసం కొరకో ఆకాశగమనం, ప్రత్యక్షం కావటం, మాయమవటం మొదలైన ఫలాలు ఎట్లు ఏ ప్రయత్నంచే పొందుచున్నాడో చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: ఈ ప్రపంచంలోని సాధ్యవస్తువులన్నీ 3 రకాలుగా విభజించి చెప్పుతూ ఉంటారు. 1. ఉపాధేయములు - ఎట్టి ప్రయత్న ఫలితమైన వస్తువు ఒకని అనుకూల్యమునకు సహకరిస్తు న్నాయో అట్టి ప్రయత్నములను 'ఉపాధేయములు' అని పిలుస్తారు.
2.హేయములు - ఒకనికి ప్రతికూలమైన - ఏ వస్తువులు ప్రయత్నముచే త్యజించబడుచున్నాయో అట్టి వానిని 'హేయములు’ అని అంటారు.
3. ఉపేక్ష -వేటివేటిని ఉపేక్షించుటచే ఒకనికి అనుకూలమౌతుందో అట్టి ప్రయత్నములకు ‘ఉపేక్ష్యములు' అని పేరు పెట్టారు.
సుఖకరమైన పదార్థములు ఏవి కలవో అవే ఉపాధేయములు. తద్విరుద్ధమైనవి... త్యాజ్యములు, లేక, హేయములు. ఈ రెండు విధములు కానివి... మధ్యస్తములు లేక ఉపేక్షములు.
అయితే... సద్బుద్ధియగు జ్ఞానికి ఎప్పుడైతే 'సర్వమూ ఆత్మమయం'గా స్ఫురిస్తుందో, అప్పుడు ఈ మూడూ ఆతని దృష్టిలో ఉండవు.
❖
Page:307
జ్ఞాని ఒకప్పుడు లీలగా ఈ మూడిటినీ ఉపేక్షాభావంతో చూస్తాడు. అనగా, ఈ మూడూ కూడా అతనికి తోచక మటుమాయమౌతాయి. సర్వమూ ఆత్మమయమై ఉండగా, ఇంక వదలవలసిన దేమున్నది? స్వీకరించవలసినది ఏది?
కానీ జ్ఞానికి ఏదైతే ఉపేక్షామాత్రంగా ఉంటుందో, అదంతా మూఢునికి ఉపాధేయం అవుతోంది. గొప్ప వైరాగ్యశీలురకు అది హేయం అవుతోంది.
ఇక నీవు ప్రశ్నించిన సిద్ధుల విషయానికి వద్దాం, వసంత ఋతువు వచ్చి భూతలమును ప్రసన్నంగా చేస్తూ ఉంటుంది కదా! అట్లాగే సిద్ధులన్నీ కూడా యథోచితమైన దేశ కాల-ద్రవ్య రూప సాధనలను అనుసరించి మామిడి ఫలంలో దాగి ఉన్న రుచిలాగా, ఈ జీవుణ్ణి సంతోష పెట్టటానికి వచ్చి చేరుచున్నాయి. ఆ దేశ కాల ద్రవ్యాలలో కూడా దేశకాలాదుల ఉత్తమత్వం చేత "క్రియ” యొక్క ఉత్తమత్వం చేకూరుతోంది. ఉత్తమ క్రియచేతనే ఉత్తమఫలసిద్ధి సంభవిస్తోంది.
'ఆకాశ గమనం' వంటి సిద్ధులు, వాటి సాధనా సామగ్రి సృష్టికర్తచే పొందుపరచబడి ఉన్నాయి. అవి 1. సిద్ధగుటిక, 2. సిద్ధాంజనము, 3. సిద్ధఖడ్గము, 4. సిద్ధపాదుక – మొదలైనవి. వాటిని వివరించి సిద్ధులు సంపాదించటానికి ఉపకరించే శాస్త్రాలు కూడా ఉన్నాయి. 'ఉడ్డామరతంత్ర, యోగినీకల్పం’ మొదలైన కొన్ని శాస్త్రాలలో సిద్ధులకు సంబంధించిన సాధనలు వివరించబడ్డాయి.
ఇప్పుడు నీ ప్రశ్నకు వద్దాం. ఆ క్రియలను నిరూపించటం నీ ప్రశ్న యొక్క ఆశయమా?
నాయనా! జిజ్ఞాసువులగు (ఆత్మను ఎరుగు లక్ష్యముతో వివేకులై ప్రయత్నించువారు), వారికి వాటి యందు ప్రవృత్తి కలిగితే మహాదోషం సంభవించగలదని నా మనవి. హెచ్చరిక కూడా! అది జ్ఞాన నిరూపణకు హాని కనుక ఇక్కడ అప్రస్తుతమనే చెప్పాలి. ఇప్పుడు మనం మణి-మంత్రఓషధాది సిద్ధుల గురించి చెప్పుకోవటం మన ఈ ఆత్మతత్త్వనిరూపణ సందర్భానికి ఉచితం కాదు. అట్లాగే సిద్ధ ప్రదేశాలు, అక్కడ సాధనచే పొందగల సిద్ధులు కూడా అప్రస్తుతమే. అందుచేత వాటిని వదలి ఈ శిఖిధ్వజ కథా విషయ సందర్భంగా వచ్చి ఉన్న ప్రాణాదివాయు నిరోధం, తద్వారా లభించే కొన్ని సిద్ధుల గురించి మాత్రం ప్రస్తావిస్తాను విను.
మామూలుగా ప్రాణవాయువులు సామాన్యజీవుని అధీనంలో ఉండక, తమ ప్రకృతి నియమాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి. సాధనచే అట్టి ప్రాణవాయువులు సాధకుని అధీనంలోకి రాగలవు. 1.ఇతర సాధ్యవస్తువుల వాసనలను వదలి యోగశాస్త్ర ప్రవచితమైన క్రియలచే నవద్వారాలను సంకోచం గావించటం. కాయము, శిరస్సు కంఠములను సమంగా ఉంచటం, నిశ్చలంగా నాసికాగ్రమును అవలోకించటం మొదలైన క్రియలు.
2. భోజన - ఆసనాదుల శుద్ధత్వం
3. ఉత్తమ శాస్త్రార్థభావన చేత
Page:308
ఇట్లాగే ఉత్తమ ఆచారం చేత, సజ్జన సహవాసం చేత, సుఖాసనం చేత కొంతకాలం ప్రాణాయామం అనునిత్యంగా దృఢంగా అభ్యసించటం చేతనూ, కోపలోభాది గుణాలు సుదీర్ఘకాలంగా త్యజించటం చేతనూ ప్రాణవాయువులు అట్టి అభ్యాస జీవుని వశంలో ఉంటాయి. అప్పుడు ప్రాణాది వాయువులు రేచక-కుంభక-పూరక క్రియలందు ఒక అణకువతో కూడిన భృత్యుని వలె ఆ సాధకుని ఆజ్ఞలు నెరవేరుస్తాయి. ఎప్పుడైతే దేహంలో చలిస్తున్న ఆ ప్రాణవాయువులు దేహికి వశీకృతమౌతాయో అప్పుడు ఆ దేహికి విద్య మొదలైన సంపద మొదలుకొని, కోరుకున్న సిద్దులే కాక, మోక్ష సంపద వరకు సమస్త సంపదలు సుఖసాధ్యమౌతాయి. ఈ జీవులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యా లనే ఆరు శత్రువులకు (అరి షడ్వర్గానికి) మనస్సులో స్థానం కల్పించి తద్వారా ప్రాణ వాయువుల నియమించడంలో నిస్సహాయులౌతున్నారు. యోగ కుశలురు ఈ అరి షడ్వర్గాన్ని జయిస్తూ క్రమంగా ప్రాణవాయువులను అత్యంత సులభంగా తమ వశం చేసుకోగలుగుచున్నారు సుమా!
సుషుమ్నానాడి - - ఈ శరీరంలో 'సుషుమ్నా' అని యోగశాస్త్రంచే పిలువబడుచున్న శక్తిరేఖా రూపమైన నాడి ఉన్నది. అది విస్తరించబడిన శాఖలతోనూ, నలువైపులా చుట్టబడి ఉన్నది. ఇది మర్మసానాన్ని ఆశ్రయించుకుని ఉన్నది. అది వందలకొద్ది ఉపనాడులచే సమాశ్రయించబడి ఉన్నది. ప్రేగులచే పరివేష్టించబడి ఉన్నది.
ఆ సుషుమ్నానాడి వీణాతంతువుల మూలభాగంలోని చలనలయలాగా రేఖారూపమైన ఆవర్ణం కలిగి ఉంటోంది. నీటిలోని ప్రవాహ ప్రక్రియ లాగా మౌనంతో కూడిన సంచలన క్రియ కలిగి ఉంటోంది. ‘ఓం’ కారంలోని అర్ధభాగం వలె కుండలంతో సమానమై ఉంటోంది.
ఈ సుషుమ్నానాడి దేవ, అసుర, మనుష్య, మృగం, జలచరం... సమస్త ప్రాణులందు కూడా ఉన్నది. చలిచే పీడించబడేవాడు ముడుచుకుని ఉన్నట్లు, నిద్రిస్తున్నప్పటి పాము వలె ఈ సుషుమ్నానాడి అసాధనపరులలో ముడుచుకుని ఉంటోంది. ప్రళయాగ్నిచే మ్రింగబడుచున్న చంద్రుని వలె కుండలం యొక్క ఆకృతి కలిగి ఉన్నదై, స్వచ్ఛమై ఉంటోంది.
‘శక్తి స్వరూపం’ అని చెప్పతగ్గ ఈ నాడి గుదస్థానం నుండి భ్రూమధ్య పర్యంతం వరకు గల సర్వరంధ్రాలను స్పృశిస్తోంది. బాహ్యానికి ప్రాణవాయువులు స్పందనతో కూడుకొని ఉంటోంది. అభ్యంతరంలో మనోవృత్తుల చంచలం కలిగి ఉన్నదగుచున్నది. అది మూలాధారమున వెన్నెముక చివరగా వీణాశబ్ద వేగం వలె శోభాయుక్తమై ఉన్నది. శబ్దబ్రహ్మ రూపంలో పరాశక్తిని స్ఫురింప జేస్తోంది.
ఇది అరటిబోదెను పోలి కుండలాకారంగా ప్రవహిస్తూ ఉండటంచే దీనినే 'కుండలిని' అని కూడా అంటున్నారు. ఈ కుండలిని ప్రాణ - ఇంద్రియ - మనోబుద్ధుల వంటి దేహాల్లోని సమస్త శక్తులకు హేతుభూతమై ఉండటం చేత ఇది సర్వులకు స్ఫూర్తి ప్రదమైయున్నది. ఈ కుండలినీ శక్తియే తన ఊర్ధ్వకృతమైన ముఖంచే ప్రాణవాయువును పైకి, అపానవాయువును క్రిందకు త్రోయుచూ దేహస్పందనానికి కారణమై ఉంటోంది. శ్వాస గొనుచూ ఆడ త్రాచులాగా చరిస్తోంది.
Page:309
హృదయంలో ఉండే ప్రాణవాయువు ఎప్పుడైతే కుండలిని చేత ఆకర్షించబడి అపాన వృత్తిచే కుండలినీ పదం పొందుతుందో, అప్పుడు పంచీకృతమైన అంతఃకరణంతో అపంచీకృతమైన జ్ఞాపకం, సంకల్పం, ఇష్టం, కార్యకుశలత, ధ్యానం - ఇత్యాది వృత్తి భేదాలతో కూడిన జ్ఞానం పుడుతోంది. ఆ జ్ఞానమే జీవుని దేహసంబంధమైన ఆవిర్భావానికి నాంది. ఆ జ్ఞానమే 'జీవసంవిత్తు’ అని కూడా
అనబడుతోంది.
ఈ విధంగా కమలము నందు భ్రమరం లాగా దేహంలో స్ఫురించే కుండలిని బుద్ధి-ప్రాణాలకు జ్ఞాన-క్రియా శక్తులను ఇస్తోంది. అదే విధంగా అంతఃకరణము నందు ఇంద్రియార్థములకు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములకు) స్ఫూర్తిని కలుగజేస్తోంది. కుండలినియే ఇంద్రియార్థముల నానావిధ రూపములుగా ప్రదర్శితమౌతోంది.
ఈ కుండలిని ఎంతెంత వేగంగా స్ఫురిస్తుందో... అంతంతగా ఈ కళ్ళు మొదలైన ఆయా ఇంద్రియాలకు తటస్థపడు వస్తుజాలం యొక్క స్పష్టమైన జ్ఞానం జనిస్తోంది. అలాగే బుద్ధి-ప్రాణాలకు కూడా అదే స్ఫూర్తి ప్రదాత అని అనుకున్నాం కదా! అట్టి స్ఫూర్తిచే ఈ కార్య-కారణ యంత్రానికి ప్రేరకుడైన 'ప్రమాత’ యొక్క స్పష్టజ్ఞానం కూడా పుడుతోంది. హృదయ కోశంలోని నాడులన్నీ కూడా ఈ కుండలినీ నాడికి సంబంధం కలిగి ఉండి తద్ద్వారా శక్తి - స్ఫూర్తులను పొందుచున్నాయి. అంతే కాదు నదులన్నీ సముద్రంలో ఉత్పన్నమై మరల సముద్రంలోనే లయిస్తున్నాయి చూచావా? దేహంలోని నాడులలోని శక్తితత్వం కుండలినియందు ఉత్పన్నమై మరల కుండలినిలోనే లయిస్తున్నాయి. అది ప్రాణరూపమున ఊర్ధ్వగమన మందు, అపానరూపమున అధోగమనమునందు ఉన్ముఖమవటం చేత సాధారణార్థంలో 'కుండలినియే సమస్త ఇంద్రియ జ్ఞానములకు బీజము'... అని చెప్పబడుతోంది. శ్రీరాముడు: ఓ మునీంద్రా! దేశ-కాల వస్తువులచే పరిచ్ఛిన్నం కానటువంటి చిత్-చైతన్యము మాత్రమే ఈ అంతయు అయి ఉన్నది కదా! మరిప్పుడేమో "కుండలినీ కోశము చేతనే సర్వవిధములైన సంవిత్తు (జ్ఞానము) ఉదయిస్తోంది” అని అంటున్నారు. అసలీ ఇంద్రియ జ్ఞానం ఎందుకు ఎలా ఉదయిస్తోంది? అదంతా ఎలా సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి: వత్సా! రామచంద్రా! సర్వకాలములందు సమస్తము చైతన్యము మాత్రమే అయి ఉన్నది. ఇందులో సందేహించవలసినదేదీ లేదు. అయితే పంచభూత - పంచతన్మాత్రల చమత్కారం చేత ఆ చైతన్యం యొక్క అభివ్యక్తం ఒక్కొక్కచోట అత్యంత విశేషమైన ప్రకటనతో కన్పట్టుచూ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు ఆకాశంలో ఒకే రీతి ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుని ప్రకాశం నీళ్ళలోను, దర్పణంలోనూ విశేషంగా భాసిల్లుతోంది కదా! అట్లాగే చైతన్యం అంతటా విద్యమానమై ఉన్నప్పటికీ అది దేహములందు, బుద్ధులందు విశేషమైన స్పష్టతతో భాసిల్లుతోంది. నీ స్వరూపం యొక్క కాంతి పుంజాలు అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటాయి. అయితే ఎక్కడ దర్పణం ఉంటుందో అక్కడ మాత్రమే నీ రూపం ప్రతిబింబిస్తుంది, అక్కడ మాత్రమే చూడగలుగుతావు. దర్పణం అక్కడ లేనప్పుడు కూడా నీ యొక్క ప్రతిబింబ సంబంధమైన కాంతిపుంజాలు ప్రసరిస్తూనే ఉన్నాయి కదా!
Page:310
ఆత్మ నిర్లిప్తంగా అంతటా ప్రసరించియే ఉంటోంది. మనోబుద్ధులున్న చోట స్పష్టంగా ప్రతిబింబితమగు చున్నది. రాళ్ళయందు, మట్టియందు అస్పష్టమైన మౌనస్వరూపం వహించి ఉంటోంది. దేవ -
మనుష్యాదులలో సుస్పష్టంగా భాసించుచున్నది. ఇక వృక్షాదులందు ఇష్టా-ఇష్టముల వివేకము లేకుండానే ప్రకటనమగుచున్నది. ఆత్మ శక్తిరేఖాదృశమై ఆనువర్తమవటమే కుండలిని యొక్క నిర్వచనం.
8. వాసనలు - ఉపాధులు
శ్రీరాముడు: ఈ దేవతలు - మనుష్యులు - జంతువులు - స్థావరములందు 'సంవిత్తు' ఉదయిస్తున్న క్రమము గురించి మరల ఒక్కసారి సందర్భోచితంగా వివరించమని తమకు నా ప్రార్ధన. శ్రీ వసిష్ఠ మహర్షి: చైతన్యము సర్వదా అవికారము, నిరామయము కూడా! ఈ చేతనాచేతనంగా కనిపించే ప్రపంచమంతా ఆ చిన్మాత్ర - సన్మాత - సూక్ష్మ - విభు - అసంగ - సంగచైతన్యము చేతనే వ్యాపించి ఉన్నది.
నిరాకార నిర్వికల్ప చైతన్యము యొక్క ఒకానొక కల్పితమైన స్వల్పాంశమునందు మాయచే ఆకాశము మొదలైన సూక్ష్మభూతముల అధ్యాస ఏర్పడి ఉంటోంది. అనగా ఆ చైతన్యమే భూత తన్మాత్రల రూపమున వెలయుచున్నది. అట్టి పంచభూతతన్మాత్రలే 1.ప్రాణము, 2. మనస్సు, 3. బుద్ధి, 4. కర్మేంద్రియములు, 5. జ్ఞానేంద్రియములు - అను ఐదు విధాలుగా అభివ్యక్తమౌతున్నాయి. అద్దానినే 'లింగశరీరం’ అంటున్నాం. చైతన్యమే లింగ శరీరమున ప్రతిబింబరూపంగా ప్రవేశించి తన పట్ల తనే అచ్చోట జీవభావమును (నేనొక జీవుడను - అను భావం) కల్పించుకొంటోంది, లేక, ఆపాదించుకుంటోంది.
అయితే, రామా! అట్టి ప్రవేశమేదైతే ఉన్నదో ...అది 'ఒక వస్తువు మరొక దానిలో ప్రవేశించటం వంటిది’... అని తలచవద్దు మరి! చైతన్యము పంచతన్మాత్రల ద్వారా జ్ఞాన క్రియలందు ప్రవేశించటం... అనేది ఒకే అగ్నిదేవుడు నూరు దీపాలుగా వెలుగుతూ ఉండటం వంటిది. ఈ విధంగా ఆ చైతన్యం తన యొక్క వికారాలతోనూ, జాగ్రత్-స్వప్న-సుషుప్త్యాది అవస్థాభేదాలతోనూ గూడినదై జీవభావంగా ప్రస్ఫుటించుకొనుచున్నది.
ఈ విధంగా లింగశరీర నిర్మాణమున పరిశేషించిన కొన్ని తన్మాత్రలు దేవ, మనుష్య, జంతు, స్థావరాది వాసనలను ప్రదర్శిస్తున్నాయి. చైతన్యమే ఒకచోట 'నేను దేవతను' అని, మరొకచోట నేను మనుష్యుడను అని ఇంకొక చోట నేను వృక్షమును అని అనేక చోట్ల అనేక రీతులుగా కల్పనను ఆశ్రయించటం జరుగుతోంది. ఆయా వాసనలను అనుసరించి సంకల్పములతో కూడినదై పంచీకరణము ద్వారా ఈ సకల దేహభావములను పొందుతోంది. ఒకే వ్యక్తి స్వప్న - జాగ్రత్తులలో వేరువేరైన దేహభావములతో వ్యవహరిస్తున్నట్లు ఒకే చైతన్యం ఈ ఏకానేక వివిధ దేహముల భావనలను కలిగి ఉంటోంది. అట్టి వాసనాసహిత భావనాతరంగములలో కొన్ని ద్రవ్య భావములను మరికొన్ని దేశ - కాల విభాగముల భావనను కలిగి ఉంటున్నాయి.
Page:311
ఈ విధంగా ఈ జగత్తంతా కూడా 'శబ్ద - - స్పర్శ - రూప - రస - గంధములు.... అనే భౌతిక భావముచే గమనించబడు పంచన్మాత్రల క్రియయే అయి ఉన్నది. అధిష్ఠానమైన చైతన్యమే అంతటా నిండి ఉన్నది. అది ఈ తతంగమంతటియందూ అవ్యక్తమై పూలదండలోని దారం లాగా సర్వదా ఆధారరూపంగా ప్రసరించి ఉంటోంది.
ఈ మనుష్యాది దేహములందు లింగశరీర ప్రాధాన్యము ద్వారా ముఖ్య చేతనత్వం కలుగు తోంది. ఆ లింగశరీరము ప్రాణము, మనస్సు, బుద్ధి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అను పంచకముచే నిర్మించబడుచున్నదని అనుకున్నాం కదా! ఇక జంతుశరీరాల విషయానికి వస్తే వాటి యందు ఇటు లింగ - అటు స్థూలశరీరముల మధ్య స్థూలత్వము అధికమైన పెత్తనం చెలాయిస్తోంది. అందుచేత తిర్యగాది జంతువులలో 'జడచేతనత్వం' అధికంగా ప్రకటితమౌతోంది.
ఇక స్థావరాదులందు అంతరంగ చైతన్య జ్ఞానం ఉన్నప్పటికీ బాహ్యాన ఘనీభూతమైన అత్యంత జడత్వం ఏర్పడి ఉంటోంది. అనగా చేతనమే స్థావరాదులందు అత్యంత జడత్వం అనుభవిస్తోంది.
దృష్టాంతానికి... ఒక విశాలమైన పాత్రలో నేయి ఉన్నదనుకో. అది మధ్యాహ్నపు ఎండతీవ్రతకు ద్రవీభూతం గాను, కాబట్టి చంచలంగాను, సాయంకాలం శీతలవాయు స్పర్శచే ఘన-ద్రవ సమన్వితం గాను, (కొంత భాగం చంచలంగాను, మరి కొంతభాగం ఘనీభూతంగాను), రాత్రి శీతలత్వం కారణంగా అత్యంత ఘనీభూతమై చంచల రహితంగానూ ఉంటుంది చూచావా?
సముద్రం ఒకచోట చంచలంగా, మరొకచోట కొంత మాత్రమే చంచలంగా, ఇంకొకచోట తరంగరహితమై నిశ్చలంగానూ ఉంటుంది కదా! 'తరంగములున్న చోట సముద్రం, తరంగములు లేనిచోట సముద్రం కాదు'... అని ఎవరైనా అంటున్నారా? అనరు కదా!
అట్లాగే... మహాచైతన్యము దేవతాజీవులందు అత్యుత్తమమైన సుస్పష్టతతోనూ, మానవులందు కొంత స్పష్టతతోను, జంతువులందు కొంత అధికమైన జడత్వముతోను రాళ్ళు - కొండలు
మట్టియందు (స్థావరములందు) అత్యంత జడత్వముతోనూ ఏర్పడి ఉంటోంది. ఆ చైతన్యము యొక్క చంచలమునకు - జడత్వమునకు సంబంధించిన న్యూన - - ఆధిక్యతలు ఎట్లా ఉన్నప్పటికీ... ఇదంతయూ చైతన్యమయమే గాని మరింకేమీ కాదు.
కనుక ఓ రామచంద్రా! దేహము మొదలైన రూపములుగా పరిణతి చెందిన పంచతత్వములు ‘ప్రాణధారణ’ వలన చేష్టితములగుచు చేతనవంతమై ఒప్పుచున్నాయి. ఆ చైతన్యమే శిలాది రూపాలుగా పరిణతి రూపుదాల్చినప్పుడు జడంగా కనిపిస్తోంది. ఈ శిలలు బాహ్యవాయువుల అధీనంలో ఉండి కదలుచు, అంతరాంతరమున చేతనములుగానే ఉన్నాయయ్యా!
ఈ విధంగా స్పర్శ - రూపాది పంచతన్మాత్రల స్వభావవశం చేతనే ఈ అనేక వికల్పములన్నీ చూడబడచున్నాయి. చైతన్యజ్ఞులకు ఇదంతా ప్రశాంత - ' విస్తార - - కల్పనారహిత చైతన్యం చేతనే Page:312
సమాక్రమించబడుచున్నట్లు నిత్యానుభవం అవుతోంది. ఇదంతా స్వాత్మ స్వభావమగు చైతన్యము యొక్క విన్యాసచమత్కారమేనని సభికులంతా గ్రహించెదరు గాక!
శ్రీరాముడు: స్వామి! చైతన్యమే స్వాత్మస్వభావమైయున్నది కదా! అది వికల్పాత్మకం ఎట్లా అవుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి: చైతన్యం సర్వదా స్వాత్మస్వభావముననే పూర్ణత్వం, అఖండత్వం వహించి ఉన్నది. అయితే అది లీలగా వికల్పాన్ని భావన చేస్తోంది. అదంతా వికల్పం కాదు అని కూడా చెప్పవచ్చు. మన ఈ ఆత్మబోధ కొరకు ‘వికల్పం’ అని చెప్పుకుంటున్నాం. ఎట్లా అంటావా? శీతలం - ఉష్ణం - హిమం - అగ్ని.... ఇటువంటి విరుద్ధ శబ్దములన్నీ ఒకానొక ముందుగా నిర్ణయించుకొనిన స్థితి నుండి తత్సంబంధంగా చెప్పుకొనుచున్నవే కదా! ఈ చిత్, జడము మొదలైన శబ్దములన్నీ అటువంటివే! వాసనల యొక్క 'అంశ’తో విరుద్ధ వికల్పభావములు కూడుకొని ఉంటున్నాయి. అట్టి విరుద్ధ వికారాలతో పంచభూతాలు స్ఫురిస్తున్నాయి.
వాసనలు లేకపోతే అప్పుడు విరుద్ధ కల్పనలే ఉండవు. ఇది జడం కదా! అది దేవత కదా! ఆ స్వప్నద్రష్ట నిత్యచైతన్య రూపుడైనప్పటికీ, స్వప్నంలో స్థావర జంగమాది విశేషములుగా ఆ స్వప్నద్రష్టకు అనుభవమవటమే ఈ తతంగమంతటికీ దృష్టాంతం. వచ్చేది దున్నపోతు కదా?' ...అనే అన్ని భావాలకూ వాసనలే అసలు కారణం.
పంచతత్త్వాలు ఒకప్పుడు స్ఫురిస్తాయి. మరొకప్పుడు స్ఫురించవు. వాక్కుకూడా పంచతత్త్వాధీనమే కదా! సత్యమగు చైతన్యము త్రికాలాబాధ్యమై ఉన్నది. మహా చైతన్యమునకు చైతన్యము - జడత్వము మొదలైనవి ఆపాదించటం కుదరనే కుదరదు.
అధవా... ఈ పంచతత్వముల స్థితి వల్ల మహాచైతన్యానికి వచ్చే లోపం గాని, అర్థవ్యతిరిక్తం గానీ ఏమీ లేనే లేవు.
బుద్ధిమంతుడైన వాడు అసలీ చిత్తాన్ని అటూ ఇటూ పరుగెత్తేటట్లు చేస్తున్న వాసనల గురించి ఆక్షేపణ చేసుకోవాలి. వాటిని అరికట్టేటందుకు సరైన ఉపాయం కోసం వెదకాలి. ఈ వాసనలు దేవాది శుభరూపములందు ప్రబుద్ధం గాను, జంతు - స్థావరాది జడాధిక రూపాదులందు సుప్తం గాను, సత్త్వ-జడ ప్రవృత్తమగు మానవ రూపములందు మిశ్రమంగాను ఉంటున్నాయి. అయితే మానవ ఉపాధి కర్మనిర్వహణకు ఉత్తమ ప్రదేశం అయి ఉండటం చేత ఇక్కడ ఉత్తమ ప్రయత్నం కలవారు వాసనలను తమ మనోవీథి నుండి కొంతసులభంగా పారత్రోలి వేయ గలుగుచున్నారు.
వాసనలను అనుసరించే ప్రాణాది పంచకం (ప్రాణులు - మనస్సు - బుద్ధి - కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు) యొక్క ఆయా రూపాలు సంతరించుకుని ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రాణాది పంచకం ఆక్షేపణ చేయబడుతుందో... అప్పుడు వాసనాక్షయమైన రూపఫలం అనుభవ మవుతుంది.
ఓ ముముక్షువులారా! వాసనలను క్షీణింపజేయటం ఆపి స్వభావాదుల గురించి ఎంతగా చింతిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఆకాశంపై ధూళి విసరితే ఎంత ప్రయోజనమో, ఏమి
Page:313
ప్రయోజనమో - - వాసనల గురించి పట్టించుకోకుండా, ఆ వాసనలచే అనుభవమయ్యే స్వభావముల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకోవటం అట్టిదేనని నా ఉద్దేశం. ఎవరికి వాసనలు క్షీణిస్తాయో అట్టి వారికి కొండంత సువర్ణరాశులు కూడా ఎండుగడ్డిపరకలతో కూడిన గుట్టమాత్రంగా కనిపిస్తాయి. వారి దృష్టికి ఈ కనబడే స్థావరజంగమ భోగాలు, వివేకసహితమైన దేవలోక భోగాలు, అక్కడి సుందరదేహాలు... ఒక పురుగు జీవితంలాగానే అతిమామూలై కన్పట్టగలవు. ఎప్పుడు? వాసనలు క్షయించినప్పుడు.
ఓ రఘురామా! నీకు మరింత సుస్పష్టపడటానికి గాను మరొక్కసారి చెప్పుతున్నాను, విను. ఈ ప్రాణులలో... స్థావరాదులు సుషుప్తవాసనలు కలిగి ఉంటున్నాయి. దేవ - మనుష్యాది కొన్ని జాతులు ప్రబుద్ధ వాసనలు కలిగి ఉంటున్నాయి. పశుపక్ష్యాదులేమో కలుషితవాసనలు కలిగి ఉంటున్నాయి. మోక్షగాములగు వారిలో వాసనలు క్షీణిస్తూవస్తున్నాయి. మోక్షస్వరూపులలో వాసనా రాహిత్యం ప్రకాశిస్తోంది.
ఈ స్థావర - జంగమములగు నానావిధ ప్రపంచంలో ఇంతకు మించిన తేడా ఏదీ లేదు. వాసనావైచిత్ర్యము చేతనే పంచతత్వ సమన్వితములు ఏర్పడుచున్నాయి. ఈ ద్రష్టలంతా తమ సంవిత్తులలో వ్యవహారానికి అనుకూలమైన 1. మనస్సు, బుద్ధి మొదలగు అంతరింద్రియములు, 2. కాళ్ళు - చేతులు మొదలైన బాహ్య ఇంద్రియములు - ఆయా సంజ్ఞలతో కూడినదై పొందుచున్నారు. వాసనా చమత్కారం చేతనే ఈ సర్వ సజీవ, సజడ జాతులలోని ఆయా స్వభావములన్నీ చమత్కారంగా ప్రకటితమౌతున్నాయి. ఆవు, గాడిద మొదలైన తిర్యకా జాతి జంతువులకు 4 కాళ్ళు, 2 కొమ్ములు, 1 తోక ఇటువంటి సంజ్ఞలన్నీ వాసనాజాల పర్యవసానమే! మానవులలో కొన్ని సంజ్ఞలు, రాళ్లు మొదలైన స్థావరాలలో వేరొక సంజ్ఞ - ఈ విధంగా తమతమ వాసనలను అనుసరించి వ్యవహార యోగ్యమైన అవయవాది ఆయా సంజ్ఞలు ఏర్పడుచున్నాయి. మధ్య చివరకూడా చంచల జడరూపములై రూపం పొందుచున్నాయి. మరలా అధిష్ఠాన సద్రూపం దృష్ట్యా చూచామనుకో... ఇవన్నీ ఏవీ ఉండిలేవు. శబ్ద-స్పర్శ-రూప రస-గంధాలన్నీ 'సత్చిత్'కు అలంకార మాత్రమై వెలయుచున్నాయి.
శాస్త్రవేత్తలచే ప్రవచించబడే ఒకానొక ఉపమేయం ఇక్కడ ఉదహరిస్తానుఈ ‘సృష్టి’ అనబడే ఆకాశవృక్షానికి సంకల్పరూప పరమాణువే బీజం. ఇంద్రియములు వాటి పుష్పాలు. విషయాలు సుగంధం. ఇచ్ఛయే ఆ సుగంధానికి ఆకర్షించబడుచున్న తుమ్మెద. ఈ చంచల ఇంద్రియ క్రియలు ఆ వృక్షముయొక్క గాలివాటు కదలికలు. స్వర్గాది లోకములు అద్దాని శాఖలు. మేరువు మొదలైన పర్వతాలు అద్దాని మూలం. ఆకాశనగల నీలిమేఘాలు ఈ వృక్షమును చుట్టుకొనియున్న లతలు. భూతభవిష్యత్తు వర్తమాన కాలాలలోని ఈ ఈ ఉపాధులన్నీ, ఈ చతుర్విధ ప్రాణులన్నీ ఆ వృక్షముయొక్క పళ్ళు. ఆకాశాది పంచతత్వాలు ఈ వృక్షముయొక్క బీజాలు. శ్రీరాముడు: హే మహర్షీ! శాస్త్ర ప్రవచితమైన మీరు వర్ణిస్తున్న వృక్షం అసలు ఉన్నదెక్కడ?
Page:314
శ్రీ వసిష్ఠ మహర్షి: (చిరునవ్వు చిందిస్తూ) మంచి ప్రశ్నవేశావు. ఆ మహావృక్షం 'సంసారము’ అనే పేరుతో ప్రసిద్ధి కెక్కినదే! ఇక "కేవలం స్వవివేకశూన్యం చేత స్వయంగా ఆత్మయందే ఉద్భవిస్తోంది. కనుక అది ఆత్మయందే ఏర్పడి ఉన్నది. ఓ భూత-వర్తమాన భవిష్యత్ సర్వజీవులారా! మీరంతా ఆత్మస్వరూపులు మాత్రమే! అంతేగాని సంసారజీవులు కాదు. ఇది ఎంత త్వరగా ఎరిగితే, అనుభవ సమన్వితులైతే... అంత మంచిది!
ఓ రామచంద్రా! నీ వివేకబుద్ధిని సర్వదా నిద్రలేపి ఉంచు. 'జీవ - జడ' ఆదిగా గల వివిధ రూపాలుగా నీకు కనిపిస్తున్నవన్నిటినీ వివేక దృష్టితో ఆత్మగానే చూచావా... సముద్రంలో తరంగాల లాగ సర్వమూ విలయమైపోతాయి. సముద్రంలో ఒకవైపు తరంగాలు పుట్టుచూ, మరొకవైపు లయిస్తూ ఉంటాయి కదా! అలాగే బహిర్ముఖదృష్టి కలవారికి ఇవన్నీ జడత్వ భావనచే ఉన్నాయి. బహిర్ముఖ భావనచే పొందబడుచున్నాయి. అదే సమయంలో... అంతర్ముఖావలోకితమైన దృష్టి కలవారి పట్ల వివేకోదయకారణంగా స్వయంగా శమిస్తున్నాయి. వాసనా ప్రాప్తి రాహిత్యం సంపాదించు కున్న మరుక్షణం ఇక నీవీ సంసారములో స్థితియే పొందవు. వాసనలు లేనివారికి జగత్తుగా కనిపించేదంతా "స్వస్వరూపాంతరంగం" గానే ఆస్వాదించబడుతోంది.
వాసనలు కలిగి ఉన్న జీవులు అనంతకాలం ఈ వస్తుసమన్విత జగత్తులో పరిభ్రమిస్తూనే ఉంటారు. ఇక దిగులు దేనికి చెప్పు?... నీ నీ వివేకాన్ని మరల మరల నిదుర లేపు. అదే అన్నిటికీ పరమౌషధం. తద్వారా వాసనలు జయించు.
9. ఆధి - వ్యాధులు
శ్రీ వసిష్ఠ మహర్షి: నాయనా! రామచంద్రా! ఇప్పుడు మనం కుండలిని విషయమై పరిశీలన కొనసాగిద్దాం.
ఈ స్థూలదేహంలో మూలాధార ప్రదేశంలో, కుండలిని యందలి లోభాగంలో ప్రాణాది పంచకం యొక్క బీజం ప్రాణవాయు రూపంలో సదా స్ఫురిస్తూ ఉంటుంది. అట్టి స్ఫురణ ప్రభావంచే కుండలిని ప్రాణరూపంలో స్ఫురిస్తూ ప్రాణవాయుధర్మం చేత మరియు నిజధర్మం చేత మూడు రూపాలుగా పరికల్పించబడుతోంది - 1.స్పందనము, 2. స్పర్శ, 3. సంవిత్తు
ఈ కుండలినీ శక్తియే...
2. ఎరుక కావించటంచేత 'కళ' అని పిలుస్తున్నారు.
3. చేతితం ఒనర్చటంచేత చిత్తము అంటున్నాం.
4. జీవించటాన్ని ప్రసాదించటంచేత జీవము అని చెప్పుచున్నాం.
5. మననం చేయటం చేత మనస్సు అని అభివర్ణిస్తున్నారు.
6. సంకల్పించటంచేత సంకల్పము అని ప్రవచిస్తున్నారు.
Page:315
7. అదియే అహంకారము యొక్క రూపమునకు ప్రభవస్థానం.
8. తనయందు బోధ కలిగి ఉండుటచే 'బుద్ధి' అనిపించుకుంటోంది.
ఈ విధంగా కుండలినీ శక్తిని పుర్యష్టకం అని కూడా పిలుస్తున్నారు. ఈ కుండలినీ శక్తి దేహములో అత్యుత్తమ జీవస్థానం అయున్నది.
ఈ కుండలిని అధోదిశలో ఉన్నప్పుడు అపాన రూపంగా ఉంటుంది. మధ్యప్రదేశంలో ఎల్లప్పుడు సమానరూపంలో నిశ్చలంగా ఉంటుంది. అపాన - - సమానములచే పరిపోషింపబడు చున్నప్పటికీ దీనికి ఊర్ధ్వవృత్తి ఉదానరూపంగా ఉంటుంది.
ఈ విధంగా ఇది దేహంలో స్వస్థతను పరిపోషిస్తూ ఉంటుంది. కుండలిని కనుక సమానవృత్తి ధరించకపోతే దేహములోని జీవసంవిత్తు సర్వప్రయత్నముల చేత అధోమార్గం గుండా బైటికి పోగలదు. అలా బలంగా బైటకు పోవటం చేత ఆ దేహము మృత్యువునకు లోను కాగలదు.
ప్రాణా - అపాన వృత్తిని నిరోధించటం ద్వారా కుండలిని యొక్క ఊర్ధ్వ - అధోగమనములను సర్వదా త్యజించి, 'సమానవృత్తి' యొక్క ఆశ్రయం చేత జీవసంవిత్తు ఆత్మయందు నెలకొని ఉంటే... అప్పుడు ఆ ప్రాణి యొక్క సమస్త వ్యాధులూ నశిస్తాయి. ఆ జీవి మృత్యువును కూడా జయించివేయగల శక్తిని కలిగి ఉంటాడు.
❖
ఒక్కొక్కసారి సామాన్య నాడుల యొక్క వ్యాపార దోషం చేత శరీరంలో ప్రవేశించిన అన్నరసం పచనం కాదు. అప్పుడు దేహంలో సామాన్య రోగాలు ఉత్పన్నమౌతాయి. క్రమంగా ప్రధాన నాడుల వ్యాపార భాగంలో ప్రధానరోగాలు జనిస్తాయి.
శ్రీరాముడు: స్వామీ! ఈ జీవునికి ఆధి - వ్యాధుల వలననే సర్వదుఃఖాలు వచ్చి పడుచున్నాయని అంటూ ఉంటారు కదా! అవి రెండూ ఎలా ఉత్పన్నమౌతున్నాయి? ఎట్లా తొలగుతాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: ఔను. ఆధి - వ్యాధులు రెండూ జీవుని దుఃఖమునకు కారణభూతములే. వాటి యొక్క నివృత్తి చేత మాత్రమే జీవునికి 'సుఖం’ అనేది లభ్యపడేది. జ్ఞాన ప్రభావం చేత అవి రెండూ సమూలంగా నశించాయా... అప్పుడది 'మోక్షము' అని అంటున్నాం. అవి రెండూ ఒకానొకప్పుడు ఒకదాని కొకటి కారణమై ఈ శరీరంలోనే పుట్టుచున్నాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి తీవ్రతరమై ఉంటోంది. చాలా సందర్భాలలో ఈ రెండూ కూడియే ఉంటున్నాయి. అవి ఒకసారి క్రమక్రమంగాను, మరొకసారి అకస్మాత్తుగాను ఉద్భవిస్తున్నాయి. అజ్ఞానమే రెండిటి యొక్క కారణం.
“వ్యాధి" - శరీరమునకు సంబంధించిన దుఃఖమును 'వ్యాధి' అంటారు. శరీరవ్యాధులు ఎట్లా ఉత్పన్నమౌతున్నాయో విను!
1. కోరికలు మరల మరల స్పురించటం చేత.
2. చిత్తము అనుక్షణం అతిచంచలమై ఏమాత్రం జయింపబడకపోవటంచేత.
Page:316
3. దోషభూయిష్ఠమైన ఆహారం భుజించటంచేత.
4. దుర్వాసన, మురికి, తదితర దోషములతో కూడిన స్థలంలో నివసించటంచేత.
5. కల్మషములతో కూడిన వాయువులను చిరకాలం సేవించటంచేత.
6. అయుక్తమైన కాలములో వ్యవహరించటంచేత.
(ఉదా: వేళ కాని వేళ (లేక) అత్యంత ఆలస్యంగా భుజించటం, మిట్టమధ్యాహ్నం వంటి అయుక్తమైన సమయాలలో నిద్రించటం, ఏదో చూస్తూనో, వింటూనో, జూదం వంటి ఆటలు ఆడుతూ అనేక గంటలుగా నిద్రపోక పోవటం మొదలైనవి.)
7. దురలవాట్లకు ప్రోత్సాహం లభించే దుర్జనసాంగత్యం చేయటంచేత.
8. దుష్ప్రభావాలు భావన చేయటం చేత. (కామ, క్రోధ, అసూయ, ద్వేషాదులు)
9. అన్నరసం ప్రవేశించని కారణంగా నాడీరంధ్రాలు బలహీనపడటం, క్షీణించటం వలన. 10. అన్నరస ప్రవేశం అవసరమైన దాని కంటే ద్విగుణీకృతంగా నాడీరంధ్రములను ప్రపూర్ణం చేయటం చేతనూ, తద్వారా ఆ అన్నరసం దీర్ఘకాలం నాడీ రంధ్రాలలో వేచి ఉండటంచేత. 11. కఫ - పిత్తాది ప్రకోపం కారణంగా ప్రాణములు వ్యాకులమవటంచేత. 12. దెబ్బలు మొదలైనవి తగలటంచేత అవయవాలు, సున్నితవిభాగాలు శిథిలమవటంచేత . ఇటువంటి ఆయా అనేక దోషాల చేత అస్వస్థత సంభవిస్తోంది. వ్యాధి ఈ దేహం యొక్క ఆకారాన్నే మార్చి దౌర్బల్యంగానూ, అపక్రమమైన ఆకారంగానూ తయారుచేసి వేయగలదు.
పూర్వజన్మ యొక్క (లేక) ఈ జన్మ యొక్క శుభ-అశుభ బుద్దులలో ఏది అధికంగా ఉంటుందో అది 'ఈ వ్యాధి’ యొక్క క్రమమును, సుదీర్ఘత్వాదులను నియోగిస్తూ ఉంటుంది.
ఈ విధంగా భూత పంచకమైన ఈ దేహంలో ప్రవేశించే పదార్థ జాలముల ఉచిత - అనుచితములను అనుసరించి ఈ దేహంలోనే వ్యాధి జనిస్తోంది. రసవిభాగముననుసరించి ఉచితము, అధర్వణవేద - ఆయుర్వేదాది శాస్త్ర ప్రవచితము అయిన ఆయా పదార్థముల సేవనం చేత 'వ్యాధి' అనునది ఉపశమించటం జరుగగలదు. ఆహార పరిశుభ్రత, సమయాసమయ విచక్షణ, కాల నియమానుసారమైన లంఖణం మొదలైనవి అర్హమైనంతగా ఆచరించే వారి శరీరంలో ప్రవేశించే ఆహారం అతిత్వరగా పచనమైపోతుంది. అట్లా కాకుండా దేహంలో దీర్ఘకాలం ఆహార పదార్థాలు అపచన స్థితిలో ఉంటే రోగకారకములౌతాయి.
‘వ్యాధి' అనేది రెండు విధములు -
1. సామాన్య వ్యాధి - ఆకలి, దప్పిక... ఇట్టి వ్యవహారములతో ఉత్పన్నమయ్యేది ‘సామాన్యము' అని అంటాం. ఇష్ట - అనుకూల వస్తువుల ప్రాప్తిచే ఆకలి, దాహము మొదలైనవాటి వల్ల పుడుతున్న వ్యవహారిక వ్యాధులు నశిస్తాయి.
2. విరస వ్యాధి - దేహంలోని వివిధ రసముల సంచలనము, క్రియా విశేషంవలన శరీరం మనగలుగుతోంది. అట్టి రసముల ఉత్పత్తి కుంటుపడటం చేతనో, మిక్కిలిగా ఉత్పత్తి అవటం
Page:317
చేతనో దేహంలోని రక్త-మాంస-ప్రేగు-బొమికలు తమ సాధారణ క్రియాతత్త్వాన్ని కోల్పోవటమో, విపరీత ప్రవర్తనమో జరుగుచున్నప్పుడు ఏర్పడు వ్యాధులను 'విరసవ్యాధి' అంటారు.
ఆహారం వలననే ఈ దేహం పరిపుష్టి చెందుతోంది కదా! మరల ఆహారము యొక్క అనియమితాదుల వలననే దేహమునకు సామాన్య విరసాది వ్యాధులు వాటిల్లుచున్నాయి. అయితే సృష్టి కర్త ఆయా వివిధ రసములను ప్రకృతియందు (వృక్షాలందు వ్రేళ్ళయందు, ఫలములందు, ఆకులందు) పొందుపరచారు. అట్టి రసమయ పదార్థముల వినియోగముచే దేహము యొక్క రస సామాన్యత కాపాడబడి వ్యాధి చికిత్స పొందగలదు. అధర్వణవేదం, ఆయుర్వేదంవంటి గ్రంథములలో వాటిని ఉపయోగించు వివరణలు పొందబరచబడి ఉన్నాయి. వైద్యులు చేసే ఆయా చికిత్సా విధానాలచే వ్యాధులు నయమగుచున్నాయి. అట్లాగే మంత్రం, పవిత్ర తీర్థములలో స్నానం చేయటం, ఓషధులున్న ప్రదేశంలో నివసించి అక్కడి గాలి పీల్చడం - ఇటువంటివి దేహారోగ్యాన్ని కాపాడు చున్నాయి. ఇవన్నీ ఆశ్రమ విద్యార్జన సమయంలో నీకు బోధింపబడియే ఉన్నాయి కదా! సాధకుడు తన శరీరంలో సరసము కొనసాగేటట్లు, విరసము ఏర్పడకుండానూ చూచుకోవటం ఉచితం.
ఆధి - వాసనలు కారణంగా పుట్టే మనస్సుకు సంబంధించిన బంధాన్ని 'ఆధి' అంటారు. ఆధికి ముఖ్యకారణం అజ్ఞానముచే అభ్యాసవశంగా ఏర్పడిన సాంసారిక వాసనా జాలములే! తత్త్వ జ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం తొలగుతుంది.
ముఖ్యసేవకుడు అంతఃపురాన్ని కాపాడుచున్నట్లు చిత్తమే ఈ శరీరాన్ని పర్యవేక్షిస్తూ, కాపాడు తోంది. అయితే తత్త్వజ్ఞానం, ఇంద్రియనిగ్రహం లేనప్పుడు నిశ్చలవాయువు వంటి ఈ చిత్తం తన స్థిరత్వాన్ని సూక్ష్మత్వాన్ని కోల్పోయి చంచలాన్ని ఆశ్రయిస్తోంది. "ఇది పొందాలి, అది పొందలేదు, ఇదే ఇష్టం, ఈ రూపం, ఆ శబ్దం, ఈ కథనం, ఆ దూషణం” - ఇలా రాగద్వేషాలచే జడత్వం, చంచలత్వం కలిగి ఉంటోంది. ఇంకేముంది? వర్షాకాలపు మంచులాగా మహామోహ ప్రదాలగు మానసిక రోగాలు (ఆధులు) ఉత్పన్నమౌతున్నాయి.
జన్మాది వికారాలకు కారణమౌతున్నదానిని “సారము” అని అంటారు. సారం వలన మానసిక చాంచల్య కారణంగా కోపం, దుఃఖం, నిరుత్సాహం, దైన్యం, భయం, అనునిత్య చంచలత్వం, ఆవేశ కావేషాలతో కూడిన మనో చపలత్వం (పిచ్చి), దుష్టమైన సంకుచితత్వం - ఇవన్నీ ఏర్పడు చున్నాయి. ఇవన్నీ దేహంపై దుష్ప్రభావం చూపించి విరసత్వానికి క్రమంగానో, ఒక్కసారిగానో దారి తీస్తున్నాయి. మానసిక వ్యాధి నశిస్తే దానికి సంబంధించిన మానసిక వికారాలూ (కోప - తాపాదులు) నశిస్తాయి.
ఆత్మజ్ఞానం లేకపోతే సారం నశించదు. “అది త్రాడు మాత్రమే” అని పూర్తిగా తెలియకపోతే పాము యొక్క భ్రాంతి ఎట్లా నశిస్తుందో చెప్పు?... వర్షాకాలపు నదీ ప్రవాహం ఒడ్డున ఉన్న వృక్షాలను ఏ విధంగా సమూలంగా నశింప జేస్తుందో అట్లాగే ఆత్మజ్ఞాన బలం పుంజుకున్నప్పుడు ఈ జన్మాది వికారరూపమైన ఆధి క్షయిస్తుంది. అప్పుడాజీవుడు ఆధి-వ్యాధులకు అతీత్వం సంతరించు కుంటాడు. ఆధి-వ్యాధుల విలాసం సమూలంగా నశించబడుతుంది.
Page:318
10. ఆధి - - వ్యాధుల ఉపశమనోపాయాలు
శ్రీరాముడు: హే జగద్గురూ! 'ఆధి’ చేత 'వ్యాధి' ఉత్పన్నం కాగలదనునది యుక్తి యుక్తమే. అట్లాగే ఆయా రససమన్వితములగు ప్రకృతిసిద్ధమైన ఓషధులచే దేహ సమరసత్వము పునఃప్రతిష్ఠించబడి, తద్వారా వ్యాధులు ఉపశమించగలవనేది దైనందికానుభవమే.
అయితే నా సందేహం వినండి. వ్యాధి అనేది ఔషధాల చేత ఉపశమిస్తుంది కాని, 'మంత్రాలు, పుణ్యాలు, తీర్థస్నానాలు' - వల్ల ఎలా ఉపశమిస్తుందో మా బోధ కొరకై వివరించండి. శ్రీవసిష్ఠ మహర్షి: విను - మానసిక వ్యాధుల చేత చిత్తం వ్యాకులమైనప్పుడు ఈ శరీరం కూడా వ్యాకులత్వం పొందుతుంది. ఉదాహరణకు తీవ్రకోపంతో ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఉన్నవాటిని యుక్తాయుక్తమైన అవగాహనతో చూడలేడు. అలాగే బాణం దెబ్బ తిన్న జింక తన ముందుగా ఉన్న మార్గం వదలి ఎటో పిచ్చిగా పరుగులు తీస్తుంది. మానసిక వ్యాధిగ్రస్తుడు తనను సమీపించిన బంధువులను గుర్తించలేక ఏవో కుమార్గముల వైపు, కుశబ్దముల ఉచ్చారణతో కదలిపోతూ ఉంటాడు.
సెలయేటి నీరు ఒక క్రమంగా ప్రవహిస్తూ ఉండగా, ఒక ఏనుగు ఏరులో ప్రవేశించిందనుకో ...అప్పుడు సూటిగా ప్రవహిస్తున్న ఏటిజలం ఒడ్డువైపుగా కదులుతుంది కదా! అలాగే మానసిక వ్యాధులచే వ్యాకులమైన ప్రాణవాయువు తన సమత్వాన్ని వదలి అన్యమార్గంగా ప్రవహిస్తుంది. అది అసమ్యక్ స్థితి (Inequal placement) పొందుతుంది. సర్వసమదృష్టి లేని రాజు వలన ఆ పరిపాలనకు సంబంధించిన ప్రజాధర్మాలు, సర్వ సంక్షేమ కార్యక్రమాలూ కుంటువడతాయి చూచావా? అట్లాగే ప్రాణవాయువు గనుక అపసవ్యస్థితిలో ప్రవహిస్తూ ఉంటే, నాడులు విషమం పొందుతాయి. అప్పుడీ శరీరం విహ్వలమౌతుంది. చెదరగొట్టబడిన నీరు విధివిధానం లేకుండా చెదరుమదురై పోతుంది చూచావా? మామూలుగా ప్రాణవాయువుచే నింపబడి స్పందిస్తున్న నవనాడులూ, తదితర ఉపనాడులూ కొన్నిచోట్ల అధికంగానూ, మరికొన్ని చోట్ల అల్పంగానూ ప్రాణవాయువును పొందుతాయి. ప్రాణ సంచారం సరిగ్గా లేకపోతే భుజించబడిన ఆహారములు అల్పజీర్ణత్వంగాని, అజీర్ణత్వంగాని, అతి జీర్ణత్వంగాని పొందుతాయి.
ప్రవాహానుకూలంగా వదలిపెట్టబడిన బంతి సుదీర్ఘంగా ప్రక్కవాటు పొందకుండా వెళ్తుంది కదా! అట్లాగే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము లని పిలువబడే పంచప్రాణాలలో ‘సమాన ప్రాణవాయువు'చే భుజింపబడిన అన్నం చక్కగా రసంగా మార్చబడి శరీరమంతటా ఆయా స్థానములకు సమాన ప్రాణంచే చేర్చబడుతుంది. మనస్సునందు ఉద్వేగం ఉండి ఉన్నప్పుడు శరీరంలో ప్రవేశించిన అన్నం కొన్నిచోట్ల నిరోధం పొందుతూ ఉంటుంది. అట్లు అంతర్గతంగా అధిక సమయం ఉండిపోయిన అరసపరిణామమైన అన్నము ధాతువైషమ్యంగా పరిణమించి స్వభావవశంగా దేహం నందు వ్యాధిత్వం పెంపొందింపజేస్తుంది. దేహాన్ని పెద్దపొట్ట మొదలైన కురూపాలను కూడా
Page:319
కలుగ జేయగలదు. అట్టి ధాతువైషమ్యం మనస్సును వైషమ్యపరచుటలో మరింత వైఖరి చూపుతుంది. ఈ విధంగా మానసిక వ్యాకులత చేత వ్యాధి, వ్యాధి చేత మరింత మానసిక వ్యాకులత ఏర్పడుతూ ఉంటాయి. సర్వసమ 'భావన' ఆశ్రయించనంతకాలం మానసిక వ్యాకులతలకు అంతూ పొంతూ ఉండవు. ఈ విధంగా ... ఆధి చేత వ్యాధి సంభవిస్తోంది. ఆధి లేకపోతే వ్యాధి నశిస్తోంది.
మంత్రములు - - ఇక నీ వడిగిన ప్రశ్నయగు 'మంత్రం' విషయానికి వద్దాం.
బీజాత్మకములైన మంత్రవర్ణములు ఆ సాధకుని భావ - సత్సంకల్పావేశమును అనుసరించి రోగ నివారణ నిర్వర్తించగలవు. శక్తికి - భావనకు పరస్పర సంబంధమున్నది. ప్రాణముగాని, కుండలిని గాని భావేకాగ్రత చేతనే కదా సంచయము పొంది ఉన్నాయి! వాయువు, అగ్ని, భూ, జల, ఆకాశ పంచభూతత్త్వం బీజాక్షరోచ్చారణతో కూడిన భావసమన్వితమైన ఆరాధనచే మంత్రద్రష్టకు కార్యనిర్వహణార్థం సహకరించగలవు. ఈ చరాచర సృష్టియంతా సమష్టితత్త్వమగు హిరణ్యగర్భుని భావనాకల్పనయేనని మనం ఇతఃపూర్వం చాలాసార్లు చెప్పుకున్నాం కదా! ఈ మనస్సు కూడా భావనారూపమే!
అట్లాగే శుద్ధమైనట్టి సేవాభావము - పవిత్ర హృదయముతో కూడిన 'సాధుసేవ’ అనే క్రియ -
మనస్సుకు సుఖత్వం, నిర్మలత్వం ప్రసాదించగలదు. తద్వారా తదితరములైన ఆధి, వ్యాధుల శమనము వంటి శుభప్రయోజనములన్నీ కలుగుతాయి.
అంతఃకరణశుద్ధి చేత ప్రాణవాయువు సక్రమంగా ప్రవహిస్తోంది. రాగ, ద్వేష, లోభముల వంటి వ్యతిరిక్తతత్త్వముల వల్ల అంతఃకరణం అపరిశుద్ధమై దేహం నందలి ప్రాణవాయు ప్రసరణమును అపక్రమం చేస్తోంది.
సాత్వికములగు శాస్త్రప్రవచిత మంత్రోచ్చారణ, భక్తి, శాంతం వంటి అనుకూలతత్వాలు అధికమగుచుండుట చేత అంతఃకరణశుద్ధి ప్రాప్తించగలదు.
పూర్ణచంద్రుడు ఉదయిస్తుంటే ప్రపంచం ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో, అట్లా శుద్ధ చిత్తంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. అంతఃకరణ శుద్ధిచే దేహమంతా ప్రాణవాయువులు సక్రమంగా ప్రవహిస్తూ ఉండగా తద్వారా అన్నం చక్కగా పచనమొనర్చబడి సమస్త వ్యాధులు నశిస్తాయి. మనస్సు నందు సంతోషం-ఉత్సాహం-హాస్యం లను పరిపోషించుకుంటూ ఉంటే, భౌతిక దేహం కూడా సమప్రాణ ప్రసరణ పొందుచున్నదై ఆయురారోగ్యాలను పొందుతూ ఉంటుంది.
ఇవి నన్ను పవిత్రం చేస్తాయి ...అను సాధకుని ఆంతరంగికమైన భావనయే అతనికి సహకారికమగుచున్నది.
ఈ విధంగా కుండలినీ కథా ప్రసంగం సందర్భంలో ఆధి - వ్యాధులు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయో, అవి ఏ విధంగా ఉపవమనములు పొందుచున్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రసంగమైన కుండలినికి వద్దాం.
Page:320
11. యోగశక్తులు
శ్రీ వసిష్ఠ మహర్షి: సుగంధమునకు ఆధారమేమిటి? పుష్పమే కదా? అట్లాగే 'పుర్యష్టకము' అను పేరు గల జీవునకు ప్రాణము అను పేరు గల కుండలినియే ఆధారమైయున్నదని గ్రహించు. ఈ కుండలిని యందు పూరకము అనే ప్రాణాభ్యాసముచే ఎప్పుడైతే జీవుడు సంస్థితుడౌతాడో అప్పుడాతడు మేరువు వంటి స్థిరత్వం పొందుతాడు. ఈ శరీరం యొక్క గురుత్వం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు శరీరమంతా తిన్నగా గాలి నిలుపబడుతుందో... అప్పుడు ప్రాణవాయువు యొక్క ఆకర్షణ వలన కుండలినీ సంవిత్తు పైకి పంపబడుతుంది. అప్పుడు ఆ దేహికి శారీరక - -
మానసిక పరిశ్రమ సహించ గల ఓర్పు, నేర్పులు ప్రాప్తిస్తాయి. ప్రాణవాయువు యొక్క ఆకర్షణ చేత కుండలిని కఱ్ఱ వలె దీర్ఘత్వం పొందుతుంది. నాడులన్నిటినీ తనతో తీసుకొనుచూ దేహాన్ని త్రాళ్ళచే బంధించబడిన పూతీగ వలె శీఘ్రంగా పైకి పోవుచున్నది. బావి యొక్క లోతు నుండి బయటకు లాగబడుచున్న బొక్కెన తనతో బాటు నీటిని కూడా పైకి తీసుకువస్తుంది చూచావా? ఆ విధంగా వాయువుతో పూరించి, నవరంధ్రాలను మూసివేసి, అప్పుడీ శరీరాన్ని కూడా "కుండలినీ సంవిత్తు" పైకి తీసుకుపోగలదు. ఇదియే యోగి యొక్క ఆకాశగమనం.
యోగులైన వారి (కుండలినీ సంవిత్తు యొక్క ఊర్ధ్వగమనాన్ని అభ్యసించిన వారి) ఆకాశగమనం యొక్క అభ్యాసం చేత ఊర్ధ్వ దిశను పొందుచున్నారు. అభ్యాసరహితులగు సామాన్య జనులకు ఇది ఇంద్రపదవి పొందినంతగా తోచుచున్నది.
అశరీరులగు సిద్ధుల దర్శనం - ఆకాశమున అశరీరులై సంచరించు సిద్ధులను కూడా దర్శించ వచ్చు. అది ఎట్లాగో చెబుతాను, విను'ఇతర నాడీ వ్యాపార నిరోధకరూపం’ అయినట్టి 'రేచక ప్రాణాయామ ప్రయోగం' యొక్క సమయ సందర్భాలలో ప్రాణవాయువులను కుండలినీ శక్తిచే బ్రహ్మనాడి యందు (సుషుమ్నానాడి యందు) ప్రవహింపజేయవచ్చు. అప్పుడు శిరస్సు యొక్క రెండు కవాటాల సంధిరూపమైన కవాట ప్రదేశానికి (సహస్రారమునకు) 12 అంగుళముల వెలుపల ఉన్న షోడశాంత స్థానమున ముహూర్త కాలం (12 seconds) ఉంటే అప్పుడు ఆకాశంలో సంచరించే సిద్ధపురుషుల దర్శనం అవుతుంది. శ్రీరాముడు: మహర్షీ! ఈ ఇంద్రియాలు, వీటి పట్ల గల దృష్టి దివ్యత్వం పొందకుండానే షోడశాంత స్థానంలో ప్రాణధారణ ఒనర్చినంతమాత్రం చేత సిద్దుల దర్శనం కాదేమోకదా? ఈ విషయం
దయచేసి వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును. నీవు చెప్పింది నిజమే. భూమిపై చరించే జనులు మలినమైన అజ్ఞానముచే ఆశ్రితమైన ఇంద్రియధ్యాసలు ఉన్నంత వరకూ వాయురూపులైన (ఆకాశంలో సంచరించే) సిద్ధులను చూడలేరు. అయితే, విజ్ఞాన - యోగాభ్యాసములచే శుద్ధమైనట్టి మనస్సుకు ఒకానొక అధికారత ప్రాప్తిస్తోంది. అట్టి మనస్సుచే సుదూర దర్శనం చేయగల బుద్ధి పొందబడుతుంది. అట్లాగే నిర్మల
Page:321
సునిశిత మనోబుద్ధులచే ఆకాశంలో సంచరించే సిద్ధులను తప్పక చూడవచ్చు. అంతేకాదు. ఆ సిద్ధులు స్వప్న సదృశ్యంగా జనులకు వారి అభీష్టములను కూడా నెరవేరుస్తూ ఉంటారు. స్వప్నదర్శనం ఎట్లా ఉంటుందో ఆ సిద్ధుల దర్శనం కూడా అట్లాగే ఉంటుంది. అయితే ఆ సిద్ధులు కరుణతో ప్రసాదించే వర-దానాది ఫలాలు మాత్రం భౌతికప్రపంచంలో సిద్ధించగలుగుతాయి. ఇదే ఇందులోని విశేషం.
పరకాయ ప్రవేశం - రేచకాభ్యాస రూపమైన యుక్తి చేత క్రమంగా ముఖానికి 12 అంగుళాల వెలుపల ప్రాణవాయువును నిలుపవచ్చు. అట్లు నిలపటం చిరకాలం అభ్యసిస్తూ వస్తే మరొక శరీరంలో ప్రవేశించ గల ప్రావీణ్యత, అది కోరుకొను వారికి లభించగలదు. ఇవన్నీ సందర్భం వచ్చింది కనుక పురశ్చరణగా చెప్పటం జరుగుతోంది సుమా!
శ్రీరాముడు: శిష్యుడు శరణువేడుతూ ఒక వేళ అల్పవిషయములకు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పటికీ తమవంటి జగద్గురువులు దయచూపుతారేగాని, కోపగించరు కదా!
ఈ మాయామయ ప్రపంచం స్వతఃగా లేనేలేదని, దృష్టిని బట్టి మాత్రమే అనేక రీతులుగా స్ఫురిస్తోందని అందుచేత ఇదంతా అనియతా స్వభావం కలిగియున్నదని మీరు ఈ సంవాద సమయంలో అనేకసార్లు మాకు ఉద్బోధించటం జరిగింది. అయితే, ఈ ప్రపంచంలో పదార్థములు
- - తదితరములు నియతాబద్ధమై ఉంటున్నాయి. ఇదంతా ఎట్లా సందర్భపడుతోంది? ఈ ప్రశ్న సందర్భానుచిత మనుకుంటే మరొక్కసారి “స్వభావ నియతి” గురించి కొన్ని విశేషాలు ప్రస్తావించండి. శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! సత్యసంకల్పుడైన ఆ పరమాత్మ నిర్ణయమైన 'స్వభావం' లేక 'నియతి’ అనే శక్తి కల్పాదియందు ఏ విధంగా స్ఫురిస్తోందో... అదే కల్పాంతం వరకు ఉంటోంది.
అసలు, అవిద్య అవస్తువే కదా! అట్టి నియతి యందు కొన్ని విశేషమైన తత్త్వాలు ప్రకటనమౌతూ ఉంటాయి. ఇది ఇట్లా ఉండగా, శరద్రుతువులో కొన్ని ప్రదేశాలలో వసంత ఋతుపుష్పాలు ఫలిస్తూ ఉంటాయి చూచావా! వస్తు శక్తి కూడా అక్కడక్కడ కొంత భిన్నత్వంతో గోచరిస్తూ ఉంటుంది.
ఏకంగా, అనేకంగా, నియతస్వభావంగా, అనియతక్వ భావంగా - కన్పట్టుచున్న ఈ జగత్తంతా నిజానికి బ్రహ్మరూపం మాత్రమే అయున్నది. జీవుల కర్మలు, ఆయా ఫలభోగ కార్యక్రమముల కొరకు మాత్రమే బ్రహ్మము యొక్క “అజ్ఞాన - - నియతిల విభాగం” కొంతకాలం వరకు నియతస్థితిని ధరించి విజృంభిస్తోంది.
శ్రీరాముడు: స్వామి! మరొక్క విషయం. యోగులు సూక్ష్మరంధ్రం గుండా ప్రయాణించటానికి అణుత్వాన్ని, ఆకాశమునంతా నింపివేయటానికి బృహతత్వమును అదే దేహమునకు సిద్ధింపజేసుకో గలుగుచున్నారు! అట్టి సూక్ష్మ - సువిశాలత్వములు ఒకే దేహమునకు ఎట్లా ఏర్పడుచున్నాయి?
Page:322
12. చైతన్య - జడముల పరస్పర హేతుత్వం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! దేహమునకు సంబంధించిన సూక్ష్మ - విస్తీర్ణయోగముల గురించి క్రమంగా చెప్పుకుందాం. ముందుగా విజ్ఞాన - జడ విజ్ఞేయాలకు, సత్ - అసత్లకు సంజ్ఞలైనట్టి 1.అగ్ని-శీతలాలు, 2. సూర్య-చంద్రతత్త్వాలు, 3. వెలుగు-చీకట్లు, 4. చైతన్య-జడములు ... ఒకదానితో మరొకటి కార్యకారణత్వం ఎట్లా కలిగి ఉంటున్నాయో, కొన్ని శాస్త్ర ప్రతిపాదిత విషయాలు ప్రస్తావిస్తాను విను, ఆ ప్రమాణములు జడ - - చైతన్య 'పరస్పర కార్యకారణ సంబంధం’ ఎరుగటానికి సహకరిస్తాయి.
జఠరాగ్ని - దేహనిర్మాణం (అగ్ని- స్థూలం) - 'కొయ్య, అంపము’ - ఈ రెండిటి యొక్క సంఘర్షణల వలన కొయ్య రెండుభాగాలుగా అగుచుండగా నిప్పు రవ్వలు జనించి పైకి - క్రిందికి ప్రసరిస్తున్నాయి చూచావా? అట్లాగే సౌమ్య స్వరూపమగు ప్రాణవాయువులు దేహంలో సంచరిస్తూ ఉండగా వాటి ఊర్ధ్వ-అధో గమనాల సంఘర్షణచే (ప్రాణ - అపానాలు ఒకదానితో మరొకటి తాకుచుండుటచే) స్వభావసిద్ధంగా జఠరాగ్ని ఉత్పన్నమౌతోంది. ఈ జఠరాగ్ని 'దేహం' అనే యంత్రంలో మొట్టమొదటగా ఉదరభాగంలో ఉత్పన్నమౌతోంది. ఉదరభాగమున నాభికి పైన, క్రింద కలుస్తూ ఉండే రెండు తోలు తిత్తులచే నిర్మితమైన స్థూలమాంస విభాగంలో ఈ జఠరాగ్ని పుడుతోంది. ఆ స్థూలమాంస విభాగం - క్రింద గల జలం చేత, పైన ప్రసరిస్తున్న వాయువు చేత - - కదలడం జరుగుతోంది. గాలిచే పొదరిల్లు కదలించబడుచున్నట్లుగా, అది వాసనలచే కదిలించబడుతోంది.
ఆ స్థూలమాంస విభాగం యొక్క క్రిందభాగంలో 'మూలాధారం' అను నిజస్థానమున ‘కుండలిని’... ముత్యపు పెట్టెలో ముత్యాలహారం వలె... శక్తి-ప్రజ్ఞ తత్త్వంగా వెలయుచున్నది.
ఈ కుండలిని సర్వులకు ప్రాణప్రదాత అయి ఉండటం చేత ఇది అత్యంత పవిత్రమైనది. అది తిరుగుచున్న రుద్రాక్షల వలె ఎప్పటికప్పుడు మూలాధారం వద్ద సరసరలాడుతూ ఉంటుంది. కఱ్ఱతో కొట్టబడిన ఆడత్రాచుపాము వలె అది ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖమునకు పరివర్తనశీలమై ఉంటోంది. ప్రాణ, అపానముల సంఘర్షణకు, జఠరాగ్ని యొక్క ఉత్పత్తికి ఈ కుండలినియే ప్రేరణ కారణమై ఉన్నది. అనగా, ప్రాణ - అపాన ఊర్ధ్వ - అధోగతులకు ఉత్ప్రేరకం ఇదే.
ఈ కుండలినీ శక్తియే - తుమ్మెద కమలంపై వ్రాలునట్లు - నేత్రాలు మొదలైన ఇంద్రియాలలో ప్రవేశించి స్వతహాగా జడస్వరూపమైన ఆ కళ్ళు, చెవులు మొదలైనవి విషయములను గ్రహించగల ‘బోధ'ను ప్రసాదిస్తోంది. ఈ బయట ప్రపంచంలో గాలి వీస్తున్నప్పుడు చెట్లు కదులుచూ ఉంటాయి చూచావా? అట్లాగే ఈ కుండలినీ శక్తి అభ్యంతరములగు ప్రాణవాయువులకు ఒక క్రమశిక్షణ పూర్వకమైన కదలికను కల్పిస్తూ జ్ఞానేంద్రియశక్తులను, హృదయకమలమును నాడి సమూహములను జడస్థితి నుండి ఉత్తేజపరుస్తూ క్రియాశీలకం చేస్తోంది.
కుండలినీ శక్తిచే కదల్చబడుచున్న ప్రాణవాయువులు భుజించిన అన్నాన్ని జీర్ణం చేస్తూ తద్వారా శరీర నిర్మాణానికి, పరిరక్షణకు కారణమౌతున్నాయి. అది ఎట్లాగో చెపుతాను విను.
Page:323
ప్రాణవాయువులచే స్పర్శించబడటం చేత, (ఉత్తేజపరుపబడటం చేత - - కొట్టబడుట చేత), హృదయం యొక్క నాడులు కంపించటం జరుగుతోంది. అట్టి నాడుల యొక్క కంపనచే శరీరంలో ప్రవేశించిన అన్నం మొట్టమొదట రసంగా మారుతోంది. ఆ రసం క్రమంగా రక్తంగా మారుతోంది. రక్తం క్రమంగా మాంసమగుచున్నది. మాంసం చర్మం అగుచున్నది. చర్మం మేధస్సు అగుచున్నది. మేధస్సు మజ్జగాను, మజ్జ బొమికలుగాను, బొమికలు శుక్లం రేతస్సుగాను... ఇట్లు ఒక పదార్థం విలక్షణమైన మరొక పదార్థంగా పరిణామం చెందటం జరుగుతోంది. ఇదంతా కూడా భూమి నుండి వృక్షంలో ప్రవేశించి రసం పుష్ప-పల్లవ ఫలాదులుగా పరిణమించటం వంటిదని నీవు గ్రహించవచ్చు. 'జడప్రతీతి’ యగు వెదుళ్ళు ఒకదానితో మరొకటి ఒరిపిడి పొందటం చేత అగ్ని పుడుతుంది చూచావా? అట్లాగే ప్రాణ అపానాలు దేహంలో ఒకదానితో మరొకటి కుండలినీ ప్రోత్సాహ బలంచేత ఒరిపిడి పొంది తద్వారా జఠరాగ్ని పుడుతోంది. ఆ జఠరాగ్ని అన్నరసం మొదలు అంతిమధాతువైన శుక్రరసం వరకు పరిణామాన్ని కలిగింపజేస్తోంది. ఉష్ణతత్త్వం ఆహార పదార్థములను రసంగా మారుస్తుంటే, శీతలతత్త్వం తదనంతర కార్యక్రమం నిర్వర్తిస్తోంది.
స్వభావపరంగా ఈ కంటికి కనబడే భూమి శీతల స్వభావంతో కూడి ఉన్నది. అయితే ఇది సూర్యతేజస్సుచే ఉష్ణం పొందుతోంది కదా! అట్లాగే శీతల వాత స్వభావం గల ఈ దేహం, దీని అంగాంగాలలో ప్రసరిస్తున్న జఠరాగ్ని వల్ల ఉష్ణత్వం పొందుతోంది. చూచావా ఆ సర్వేశ్వర శక్తి! ఈ సర్వదేహములలో కుండలినీ శక్తి స్వరూపము దాల్చి ఎంతటి తతంగం నడిపిస్తోందో కదా!
‘ప్రాణ-అపాన’ జనితమైనట్టి జఠరాగ్ని యొక్క తేజం నక్షత్రమండలం వంటి ఆకారం కలిగి ఉన్నదై ఉంటోంది. అది హృదయకమలమున సంచరించే బంగారుతుమ్మెద వలె ప్రకాశిస్తోంది. దేహమంతా ఉత్తేజమానమై ప్రకాశిస్తున్న ఆ జఠరాగ్ని కొందరు యోగిపుంగవులకు ఉపాస్యవస్తువుగా అగుచున్నది. అట్టి జఠరాగ్ని ప్రకాశమును ఆరాధ్య భగవంతుడుగా చిద్రూపంగా చింతన చేస్తూ ఉంటే కాలక్రమేణా అట్టి యోగాభ్యాసపరునికి 'సర్వపదార్థముల అంతరాంతరం వైపుగా దర్శించగల సిద్ధి' లభిస్తోంది. అప్పుడా యోగి లక్ష యోజనాల దూరంలో ఉన్న వస్తువును కూడా అరచేతిలోని అరటిపండును చూచినట్లు చూడగలుగుతాడు.
అగ్ని, శీతలముల ప్రవర్తనం- మాంసరూపము యొక్క ఖండములచే పూర్ణమైయున్న ‘హృదయము' అనే తటాకంలో కమలము వలె ఈ జఠరాగ్ని ప్రకాశిస్తోంది. అగ్నికి కట్టెలు కావాలి కదా! ఆ జఠరాగ్నికి ఈ జీవుడు స్వీకరించే అన్నజలాదులు ఎండుకట్టెల వలె అగుచున్నాయి. శరీరంలోని స్వభావ శీతలత్వం ఎండవేడిమిని ఉపశాంతపరచే చంద్రునిలాగా - ఆ జఠరాగ్నిని తదితర అంతర్దేహ విభాగములను మండించకుండా ఉపశాంతపరుస్తున్నది.
సూర్య - చంద్రాది సంజ్ఞలు
1. సూర్యుడు - తేజోరూప |“సత్” “విద్య” ఉష్ణ స్వభావం “చిత్”లకు సంజ్ఞ
Page:324
2. చంద్రుడు చీకటి రూపం “అసత్” “అవిద్య” శీతల స్వభావం “జడము”లకు సంజ్ఞ
ఈ బాహ్య జగత్తులో ఏఏ ఉష్ణత్వమైతే ప్రసరించి ఉన్నదో అదంతా కూడా సూర్యుని యొక్క ‘తేజోరూపము’ అయి ఉన్నది. చంద్రునియందు భూమియందు స్వభావసిద్ధంగా శీతలత్వం ఏర్పడి ఉన్నది. ఈ రెండిటి చేతనే, భౌతికంగా చూస్తే, ఈ బాహ్యజగత్తంతా నిర్మించబడుతోంది. ప్రతి ఒక్క వస్తువు అగ్ని - - శీతలాల వేరు వేరు పాళ్ళ కలయికయే! ఈ భౌతికమైన అగ్ని- శీతలాల తత్త్వమే సూర్యచంద్రుల (అగ్నిష్టోమ) చమత్కారం. ఇక చైతన్యపరంగా చూస్తే విజ్ఞులగు యోగులు ఈ సూర్యచంద్ర (లేక అగ్ని-శీతల) తత్త్వములను చిత్-జడముల ప్రదర్శనాచమత్కారంగా సంజ్ఞలుగా దర్శిస్తున్నారు. అనగా, ఈ జగత్తంతా 'చిత్, జడము' అనే ఉభయ స్వరూపాలచే సంఘటితమై ఉంటోంది. యోగులు 'సత్ - అసదాత్మక మైనప్పటి బ్రహ్మం యొక్క ఒకానొక అవిద్యాంశయే ఈ జగత్ ఆకారంగా ప్రకాశిస్తోంది. అదియే ఇందు 'అగ్ని, శీతలం' అనే రెండు పరస్పర విరుద్ధ తత్త్వాలుగా ప్రవేశించి ఉంటోంది... అని గ్రహిస్తున్నారు అనగా ఆత్మతత్త్వ పరిలక్షితులగు ఆ బుద్ధి మంతులు (సాధకులు) - జ్ఞాన ప్రకాశం (సంవిత్), ఆత్మజ్ఞానం (విద్య), చైతన్యం - మొదలైనవాటికి 'సూర్యుడు' లేక 'అగ్ని'ని సంజ్ఞలుగా దృష్టాంతీకరిస్తున్నారు.
అదే విధంగా ...అసత్తు, అవిద్య, జడము మొదలైన వాటిని - 'చంద్రుడు’ లేక 'శీతలము’ అనే సంజ్ఞలుగా దృష్టాంతీకరిస్తున్నారు. సూర్య - చంద్రుల, అగ్ని-శీతలముల కలయికయే ఈ -
బాహ్య సృష్టి కదా! “సత్-అసత్ల కలయికే ఈ బాహ్య-అభ్యంతర సృష్టి అయి ఉన్నది” ... అనేదే అట్టి యోగ సాధకులకు ఉపాస్య వస్తువై ఉంటోంది.
అయితే ఓ రామచంద్రా! ఈ జగత్తంతా 'పరమ విజ్ఞానమగు సత్ చిదానంద స్వస్వరూపం యొక్క ఒకానొక తుచ్చాంశం అయి ఉన్నది'... అని నీవు ఇప్పటికిప్పుడు గ్రహించి ఉండు. అనగా “కంటికి కనిపిస్తున్న ఈ జడజగత్తు, జడదేహం మొదలైనవన్నీ చైతన్య-స్వస్వరూపం యొక్క ఒకానొక అంశమే” అనునదే అగ్ని-ష్టోమయోగ సాధన. ఇక ఈ జీవుడో... స్వయంగా చైతన్యస్వరూపుడే!
13. అగ్నిలో శీతలం!
విజ్ఞానం (లేక) ప్రజ్ఞ నుండి జడ వ్యవహారం!
శ్రీరాముడు :మహర్షీ! ఇప్పుడు నాదొక సందేహం ఈ జీవుడు సర్వదా నిత్యోదిత - శుద్ధవిజ్ఞానంతో కూడిన శుద్ధచైతన్య స్వరూపుడే అగ్నిలో శీతలంలాగా అగ్ని, వాయు స్వరూపుడగు సూర్యుని నుండి జడ స్వరూపుడగు చంద్రుని లాగా ... విజ్ఞానంలో (శుద్ధ సంవిత్లో) అజ్ఞానం ఎట్లా ఉదయిస్తోంది? శ్రీ వసిష్ఠ మహర్షి : మంచి ప్రశ్న వేశావు.
Page:325
“అగ్ని వాయు స్వరూపుడగు సర్యుడు ప్రజ్ఞకు, శీతల జడ ప్రకాశమగు చంద్రుడు ఈ జగత్ దర్శనమునకు సంజ్ఞలు” - అని అనుకున్నాం కదా!
1. విజ్ఞానం (శుద్ధ విజ్ఞానం), 2. జడ వ్యవహారం (విజ్ఞానంచే తెలియబడేదైన విజ్ఞాన జడం) ఈ రెండూ కూడా పరస్పరం కార్యవ్యవహారం నెరవేరుస్తూ పరస్పర సంస్థితములై ఉన్నాయి. “చెట్టులోంచి విత్తు. విత్తులోంచి చెట్టు" లాగా ఈ విజ్ఞాన - జడ వ్యవహారములు రెండూ ఒకదానికి మరొకటి ఉపాదాన కారణమై ఉంటున్నాయి.
‘రాత్రి గడచిపోయింది కాబట్టి పగలు; పగలు గడచిపోయింది కాబట్టి రాత్రి' వలె ఒకదానికి రెండవది నిమిత్తకారణమై ఉంటున్నది.
‘వెలుగు-చీకటి’ లాగా ఒకదానితో మరొకటి వ్యతిరిక్త కారణం కలిగి ఉంటున్నది. 'బింబము ' ప్రతిబింబా'ల వలె అవి రెండూ ఒకే సమయంలో ఉండియే ఉంటున్నాయి. ఎండ-నీడల వలె (ఎండ ఒక ఆకారంపై పడినప్పుడు 'నీడ' ఏర్పడియే ఉంటుంది. నీడ కనబడుతోందంటే ఎండ కాస్తున్నట్లే) ... అవి రెండూ పరస్పర అనుమాన కారణములై ఉంటున్నాయి. ఆ విజ్ఞాన- జడ వ్యవహారాల కార్య కారణ పరిణామాలు (భావాలు) రెండు రకాలుగా ఉంటున్నాయి.
1. సద్రూప పరిణామం - తాను తానుగా ఉంటూనే రెండవదిగా పరిణమించటం. దృష్టాంతాలు: బీజాంకుర కార్య-కారణ భావం... విత్తు తాను నశించక తన నుండి వృక్షంగా పరిణమించటం; మట్టి మట్టిగా ఉంటూనే కుండగా పరిణమించటం; బంగారం బంగారంగా ఉంటూనే ఆభరణంగా
అవటం.
జ్ఞాన ప్రకాశము అట్లు జ్ఞాన ప్రకాశంగా ఉంటూనే జడమగు జగదనుభవం పొందుతూ జడ స్వభావ సమన్వితమై ఉండటం.
2. వినాశకరపరిణామం - ఒకటి నిర్వీర్యమగుటచే (లేక, ఏమరవబడుటచే) రెండవది పరిణమించటం. దృష్టాంతాలు : దివారాత్ర కార్య - కారణభావం ... రాత్రి గడచిన తరువాత
పగలు, పగలు గడచిన తరువాత రాత్రి రావటం.
విజ్ఞాన - జడవ్యవహారములలో, లేక (సత్-అసత్లలో) ఒకటి లేకుండా పోయినప్పుడు రెండవది ఏర్పడుచూ ఉండటం.
1. అప్రత్యక్ష ప్రమాణం -
సద్రూప పరిణామస్య మృర్ఘటక్రమ సంస్థితేః |
అక్షోపలమ్ఛాదితరత్ ప్రమాణం నోపయుజ్యతే ॥
“సద్రూపం నుండి - - అసద్రూప జగత్తుగా కనిపించే జడతత్త్వం అను ప్రత్యక్షమునకు ఏదో అప్రత్యక్షమైన ప్రమాణం ఉన్నది" ...అని అనుకుంటూ ఉండటం యుక్తియుక్తం కాదు. మరెక్కడో ఏదో ‘అనిర్వచనీయమైన, తాకరాని, చూడరాని తత్త్వం ఉండి, తనకు అనుకూలంగా ఇక్కడ ఉన్న
Page:326
సర్వమును నడిపిస్తోంది. ఇక్కడ జీవులందరు ఆ అనిర్వచనీయ అప్రత్యక్ష తత్త్వము చేతిలోని జడమగు చదరంగపు పావులు మాత్రమే”... అని కొందరు తమ భావనలను కొనసాగిస్తున్నారు.
అయితే, ఇటువంటి అభిప్రాయాలు పైకి సొగసుగా కనబడవచ్చు గాక! జ్ఞాన విషయంలో అల్పసాధకులకు, బద్ధకస్థులకు ఇట్టి అభిప్రాయాలు అనుకూలంగాను, ప్రియంగాను అనిపించవచ్చు గాక! అట్లాగే సాధన యొక్క కించిత్ ప్రారంభదశలో సాధకులను సన్మార్గ నిరతులుగా చేయటానికి ఇటువంటి అప్రత్యక్షప్రమాణ వాక్యాలు కొంచెము ఉపకరిస్తూ ఉండవచ్చు గాక! ఏది ఏమైనా అట్టి అప్రత్యక్ష ప్రమాణం - చెప్పింది ప్రశ్నించకుండా వినేవారికి - ఊహాజనితమై అంగీకారయోగ్యం కావచ్చునేమో గాని, సత్యశీలురగు యుక్తాయుక్తముల పరిశీలకులకు అట్టి అప్రత్యక్ష ప్రమాణం నిరూపణకు దొరకుట లేదు. పిల్లవాడికి 'బూచి' గురించి కథలు చెప్పి, 'ఎఱ్ఱటి కళ్ళు, రెండు దంతాలు, బారెడు గడ్డం, పది అడుగల నాలుక' ...అను వర్ణనలు ఆపాదించి ఆ పిల్లవాడు అల్లరి చేయకుండా కొంచెం భయపడి చెప్పిన మాట వినటానికి దాది చెప్పుచున్నది. ఆ పిల్లవాడు ఆ బూచిని ఊహించుకుని అట్టి ఊహాబలంచే నిజంగానే ఉన్నట్లు అనుభూతి పొంది, కొంత అల్లరి మానవచ్చు గాక! అంతమాత్రానికి ఆ 'బూచి' అనబడేది సత్య నిరూపణార్హం అవుతుందా?...
ఓ రామచంద్రా! ఈ జీవుడు కల్పిత మధ్యే మార్గగాథలతో కాలయాపన చేయక, 'ఏది ఆత్యంతిక సత్యం? ఏది కల్పితం? నా వాస్తవ స్వరూపమేమిటి? ఆపాదితమాత్రమైన దేమిటి ? నే నెవరు? ఈ జడ జగత్తు ఏమిటి? దేహిగా నా స్వభావమేమిటి? దేహతాదాత్మ్యంచే అనుభవ మవుతున్న దేమిటి...ఇట్టి ప్రశ్నలకు సరియగు అవగాహన ఎంత తొందరగా పెంపొందించుకుంటే
అంత మంచిది.
'ఎక్కడో ఏదో ఉండి దీన్ని నడిపిస్తోంది. మట్టిలోంచి కుండలాగా, ఇది ఏదో తెలియనిదానిచే నిర్మించబడుతోంది. దాని దయ, నా ప్రాప్తి. ఇప్పటికి ఇంతే'...అని సరిపుచ్చుకొని ఉండటం ఉచితం కాదు. శ్రేయస్సు కాదు. తానే ప్రజ్ఞా స్వరూపుడై ఉండగా సత్ స్వరూపుడై ఉండగా ‘మరొక టేదో ఉన్నది' అని అప్రమాణమైన దానిపై (అనుమాన ప్రమాణమైన దానిపై ఆధారపడి ఊరుకుంటే, - - ఈ జీవుడు స్వస్వరూప విషయంలో ఎరుగవలసినది ఎరుగవలసినంతగా ఎరుగుట లేదని, అది జీవుని సమస్యకు పరిపూర్ణమగు సమాధానం కాజాలదని జనులందరికీ మనవి చేస్తున్నాను.
2. అభావ ప్రమాణం లేక అనుపలబ్ధి ప్రమాణం - రాత్రి, పగలు ఉంటున్నాయి కదా. అయితే రాత్రి అయిందా... పగలు ఉండదు. తెల్లవారిందా... రాత్రి మిగలదు, అట్లాగే విజ్ఞాన, జడ వ్యవహారాలలో (సత్-అసత్లలో) ఒకదానిని అభావించుటచే రెండవది ఉండదు. భావనయే ఈ జగత్తు. అభావన చేసినప్పుడు జగత్తు ఉండదు. జగత్తును భావన చేస్తున్నప్పుడు ఒక ద్రష్ట యొక్క నిర్మల ప్రజ్ఞ ఏమరచబడుచున్నది... ఇదియే అభావ అనుపలబ్ధ ప్రమాణం.
ఈ అభావ ప్రమాణం కొంతవరకు యుక్తి యుక్తమనవచ్చు. ఎందుకంటే అసయ్యొక్క అభావన సత్ యొక్క భావనగా పరిణమించగలదు కనుక.
Page:327
3. అకర్తృత్వ ప్రమాణం - కొందరు యుక్తివాదులు 'మట్టిలోంచి కుండ తయారవటానికి మట్టిలో కర్తృత్వం ఉండక్కర్లేదు. అట్లాగే జగత్తుకు కర్త లేడు. అచేతనమగు మట్టిలోంచి చేతనమగు కుండ తయారవుచున్నట్లు అచేతనమగు తత్త్వంలోంచి చేతనమగు ఈ జగత్తు పుడుతోంది. ఇక జగత్ నిర్మాత, దైవము మొదలైనవన్నీ కల్పితమాత్రమేగాని, ఇంతకుమించి ఎక్కడా ఏదీ లేదు ...అను సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే వారి దృష్టిలో ఈ ఎదురుగా కనిపించే వస్తువులను మించి ఇక ఎక్కడా ఏదీ లేదు. ఇట్లా వారు ఆస్తికులను ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలో సాధనాదుల అనావశ్యకత - దేహాత్మ బుద్ధి పొంచి ఉన్నాయి. జీవుని ఈ పదార్థ జగత్ పరిమితునిగా ప్రతిపాదించబడుతోంది. అందుచేత ఇట్టి ప్రతిపాదనలను త్యజించటమే ఉచితం. ఇట్టి ఆయా కల్పనలన్నీ అనవస్థానబుద్ధి వలన అనిపిస్తున్నాయి.
శ్రీరాముడు : మహర్షీ! అప్రత్యక్ష ప్రమాణం కంటే అభావ ప్రమాణం ఉత్తమమని అంటున్నారు కదా! అభావము అనేది ఒకానొక అనుభవ స్థితి కదా! జగత్తును అభావించినప్పుడు ఆత్మానుభూతియే శేషిస్తుంది కదా! ఇక, అభావమును కూడా చీకటి - వెలుగులు, అగ్ని- శీతలముల వలె ఒకానొక ప్రమాణంగా మాత్రమే చెప్పుచున్నారేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
ప్రత్యక్షవత్ అభావో2పి ప్రమైవ రఘునందనా!
అగ్న్యభావోపి శీతాస్య ప్రమాణం సర్వజన్తుషు |
ఓ రఘునందనా! ప్రత్యక్షము లాగానే అభావము కూడా ఒక ప్రమాణమే. ఎందుకంటే ‘నేనిప్పుడు అభావన చేస్తున్నాను' అను ప్రక్రియలో అభావన యొక్క భావన ఉండనే ఉన్నది కదా!
ఉష్ణము యొక్క అభావమే శీతలము యొక్క అనుమానము అగుచున్నది. కొందరు ‘ప్రత్యక్షమైనదంతా అసత్తు. దీనిని అభావించుటయే సత్తు' అని ప్రవచిస్తున్నారు. అయితే అభావించటం కూడా ప్రత్యక్షంలోని ఒక ప్రమాణమే కదా! ప్రమాణం స్వతహాగా సత్యం కాదు. 'అది సత్యవస్తువును నిరూపించటానికి ఆశ్రయించబడే ఒకానొక సహకారిక ఉపాయం వంటిది, లేక దృష్టాంతము వంటిది అని సభికులంతా గ్రహించి ఉండెదరు గాక! ఒకడు శీతలము గురించి చెప్పటానికి గాను ఉష్ణము యొక్క అభావము ప్రమాణంగా తీసుకోవటం వంటిది. విజ్ఞానము యొక్క అభావమే ఈ మాయా జగత్తు యొక్క అంతర్లీన రహస్యం.
14. చిత్ - జడపరిణామ - చమత్కారం
చిత్ యొక్క సద్రూప పరిణామం - చిత్, తన యొక్క 'సద్రూప పరిణామం' అనే భావనకు సంబంధించినట్టి, ఆశ్రయం చేత 'జడమునకు సంబంధించిన అనుభవం' ఏర్పడటానికి కారణ మవుతోంది.
Page:328
చిత్ యొక్క జడరూప వినాశన పరిణామం - అట్టి జడత్వము యొక్క సుదీర్ఘ భావనచే చిత్ తనను తానే ఏమరచుచున్నది. 'చిత్ లేదు జడమే ఉన్నది' - అను రూపంలో ఉండే చిత్ యొక్క వినాశకరపరిణామముచే ఈ జీవునకు మహాజడత్వం, సుదీర్ఘ దృశ్యతాదాత్మ్యం సంప్రాప్తిస్తున్నాయి. ఫలితంగా, ఈ జీవుడు తనయొక్క చిత్ స్వరూపమును పూర్తిగా మరచిపోయి, 'ఈ జడమే నా ఉనికి' అను నిద్రాణస్థితికి వస్తున్నాడు.
జడము యొక్క సద్రూప పరిణామం - దృశ్య విషయ సంబంధమైన ఘనీభూత భావనయందు చిక్కుకున్న జీవుడు ఎప్పుడో తనయొక్క చిత్చైతన్య రూపమును ఏమరచినట్లు గుర్తిస్తున్నాడు. తిరిగి ఇంటికి జేరే గృహయజమాని లాగా, (జడ విషయాలనే సాధనగా గైకొని) “తన చిత్ స్వరూపమునకు తిరిగి మరలటమే దుఃఖశమనోపాయం” అని గుర్తిస్తున్నాడు. ఇదే జడం యొక్క చిత్ వైపుగా ఏర్పడే సద్రూప పరిణామం.
జడము యొక్క వినాశన పరిణామం - జడములకు సంబంధించిన సాధనలను ఉపకరణములుగా తీసుకొని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండగా, ఆ సాధకుడు తన జడ స్వభావమును పూర్తిగా త్యజించి క్రమంగా ‘చిత్ చైత్య స్వరూపుడు' అయి ప్రకాశిస్తున్నాడు. ఇది జడము యొక్క వినాశన పరిణామము.
చిత్ చైతన్యము యొక్క చిత్ ఏమరపు - - జడభావనా పరిణామం; పరిణామం (అసద్రూప
పరిణామం) యొక్క పునః చిదనుభవ - జడభావ వినావన పరిణామం (సద్రూప పరిణామం) (చిత్ = తెలుసుకుంటున్నది. జడము = తెలియబడేది.)
ఈ విధంగా చిత్ చైతన్యము - - జడమునకుజడమునకు, , జడము జడము - · చిత్ చైతన్యమునకు 'సద్రూప - వినాశ' పరిణామ రూపములలో కార్య - కారణములౌతున్నాయి.
అనగా ...చైతన్యంలోంచి భావనా పరిణామంగా జడం వస్తోంది. జడంలోంచి పురశ్చరణ భావనా పరిణామం చేత చైతన్యం లభిస్తోంది.
చైతన్యం జడమునకు కారణమౌతోంది. అట్లాగే జడం - చైతన్యమునకు కారణమై పరిణమిస్తోంది. శ్రీరాముడు : జడం చేతనమునకు కారణమవటమేమిటి స్వామీ?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను జడ వస్తువులను విషయాన్ని, తత్సంబంధమైన విధి విధానాలను ఆశ్రయించి ఒకడు ‘చైతన్యానుభవం’ అనే ఆవలి ఒడ్డు చేరుచున్నాడు కదా! ఇదియే మనకు ఇక్కడ దృష్టాంతం.
ఈ జడ - - - చైతన్యముల పరిణామ - విపరిణామములే ఈ సృష్టి యొక్క చమత్కారం. జడ - చైతన్యముల భావాభావపరిణామములే ఈ వివిధ జీవులలో కనబడే వైవిధ్యం అయి ఉన్నది. ఈ సిద్ధాంతం ఇంకొంచెం సుస్పష్ట పరచటానికి ప్రకృతికి సంబంధించిన రెండు - - మూడు విశేషములను ఇక్కడ దృష్టాంతంగా తీసుకుంటాను.
1. సూర్య (అగ్ని) చంద్రుల (శీతలము) దృష్టాంతం - అగ్ని తన 'ప్రజ్వలనం' అనే సద్రూప పరిణామంచే పొగను వెడల గ్రక్కుతోంది. ఆ పొగ మేఘరూపమును పొందుతోంది. ఆ మేఘముల నుండి శీతలరూపము (చంద్రుని సంజ్ఞ) నిర్మించబడుతోంది. ఇది అగ్ని యొక్క సద్రూప పరిణామం.
Page:329
ఆ అగ్ని తాను నశించుచున్నప్పుడు కూడా శీతలత్వంగా పరిణమిస్తూ వాయురూపము పొందుతోంది. ఆ వాయువు మేఘమునకు, మేఘము శీతలరూప చంద్రునకు కారణమౌతోంది. ఇది అగ్ని యొక్క వినాశన పరిణామం... ఇది చిత్ నుండి జడమునకు సంజ్ఞగా గ్రహించు.
జడమగు సముద్రంలో తరంగాల రాపిడికి బడబాగ్ని పుడుతోంది. ఆ బడబాగ్ని సప్తసముద్రాల లోని జలం ఆవిరి కావటానికి కారణమౌతోంది. ఆ ఆవిరి మేఘాలుగా అగుచున్నాయి. ఆ మేఘాల నుంచి ‘జలరూప చంద్రుడు' నిర్మించబడుచున్నాడు. ఆ చంద్రుని సూర్య తేజస్సు జలరూప చంద్రుని ‘అమావాస్య' వచ్చే సరికి పూర్తిగా మ్రింగి, మరల శుక్లపక్షంలో తన నుండి వెడలగ్రక్కుచున్నది. ఇదంతా జడంలోంచి చైతన్య పరిణామమునకు 'సంజ్ఞ'గా చెప్పబడుతోంది.
చంద్రునితో గూడిన వసంత-గ్రీష్మ ఋతువులలో భూమిపై ఉష్ణవాయువులు జనిస్తున్నాయి. ఆ ఉష్ణ వాయువులు భూమిపై గల శీతల - జలములను పీల్చి మేఘములుగా పరిణమిస్తున్నాయి. ఆ మేఘములు శరత్-వర్ష ఋతువులలో వర్షించటం చేత మరల భూమి జలంలో నిండిపోతోంది. జడంలోంచి చైతన్యం చేసే రాకపోకలకు ఇది కూడా ఒకానొక దృష్టాంతం.
శ్రీరాముడు: మహర్షీ! సూర్యుని కిరణాల చేతనే జలం పానం చేయబడుచున్నది కదా! తద్వారా మేఘాలు... అవి వర్షించటం జరుగుతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి: అవును. అప్పుడు కూడా జలం తనయొక్క సద్రూపపరిణామం చేత సూర్యుని కిరణస్థితి పొందుచున్నది కదా! జలమే ఆవిరి రూపమును పొందుతోంది కనుక జలం అగ్నికి కారణమగుచున్నట్లే కదా! ఉష్ణత్వ కారణంగా వినాశన పరిణామం చేత జలము అగ్నిరూపత్వం పొందుతోంది. అనగా జలము తనయొక్క వినాశకర పరిణామం చేత అగ్నికి కారణమౌతున్నట్లే!
జడము తన వినాశన పరిణామం చేత చైతన్యానుభవం ఏర్పడటానికి కారణమవటమనుదానికి ఇది సంజ్ఞగా శాస్త్రములు ఉద్బోధిస్తున్నాయి. అగ్ని యొక్క నాశనముచే అద్దాని సద్రూప పరిణామం 'శీతలం' శీతలం యొక్క నాశనం చేత అద్దాని సద్రూప పరిణామం ‘అగ్ని’
దీనిని చైతన్యం - జడముల సద్రూప - అసద్రూపముల పరస్పర పరిణామ చమత్కారంగా అన్వయించి గ్రహించవలసినదిగా సభికులకు నా మనవి.
2. దివా రాత్రము దృష్టాంతం - ఓ రాఘవా! మనం ఇప్పుడు చెప్పుకునే దృష్టాంతాలలో... చిద్రూపానికి - అగ్ని, సూర్యుడు, ప్రకాశం; జడానికి - జలం, చంద్రుడు, చీకటి... సంజ్ఞలుగా ఉదహరించుకుంటున్నామని ఇక్కడ మరొక్కసారి గుర్తుచేస్తూ... చైతన్య-జడముల పరస్పర కార్య-కారణాల వ్యవహారాన్ని వివరించే ఉద్దేశంతో పగలు రాత్రులను ఉదహరించుకుంటున్నాం.
అగ్ని (సూర్యుడు) తొలగుటచే శీతలం (చంద్రుడు), శీతలం నశించుటచే అగ్ని పరిణమిస్తున్నట్లే, పగలు గడచిపోయిన తరువాత రాత్రి వస్తోంది. రాత్రి గడచిన తరువాతనో, తిరిగి తెల్లవారుతోంది, పగలు వచ్చిపడుతోంది. ఒక చిన్న ప్రశ్న. పగలు, రాత్రి కానట్టి సమయమంటూ ఏదైనా ఉన్నదా? శ్రీరాముడు : ఉదయ సంధ్యా సమయం, సాయం సంధ్యాసమయం ఉన్నాయి కదా స్వామీ?
Page:330
శ్రీ వసిష్ఠ మహర్షి : ఉన్నాయా? ఎక్కడున్నాయి?
తమః ప్రకాశయోః ఛాయా - - తపయోః దిన రాత్రయోః |
మధ్యే విలక్షణరూపం ప్రాజైరపి న లభ్యతే ॥
1. చీకటి - - ప్రకాశము; 2. నీడ - - వెలుగు; 3. రాత్రి - పగలు ... ఈ మూడు ద్వంద్వములకు
మధ్య తద్విలక్షణమైన స్థితి ఏదైతే 'సంధ్యా సమయం' అనే పేరుతో చెప్పుకుంటున్నామో... అది మహాప్రాజ్ఞులకు కూడా లభ్యపడటం లేదు.
అట్లాగే సత్-అసత్, చైతన్యం-జడముల మధ్య ఆయా రెండిటికీ విలక్షణమైన దేదీ గొప్ప గొప్ప సాధకులకు కూడా అనుభవమవటం లేదు.
అట్టి వెలుగు - - నీడల మధ్య ఏదైనా సంధిరూపం ఉండిఉంటే అది కూడా అశూన్యరూపమే అవుతుంది. ఎందుకంటే అట్టి సంధిరూపం ఆ వెలుగు నీడల రెండిటి రూపం అయి ఉండాలి కదా! అట్లాగే భావ-అభావాలు కూడా! అభావనలో కూడా "అభావనను భావన చేయటం" అనే భావన ఉండనే ఉంటుంది కదా!
ఏ విధంగా అయితే చీకటి - వెలుగులచే ఈ భూమి మీద రాత్రింబవళ్ళు ఏర్పడుచున్నాయో అట్లాగే చిత్-జడములచే వాటి వివిధ పాళ్ళ కలయికచే ...ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణులు స్ఫురిస్తున్నాయి. ఈ జగత్తంతా చిద్రూప జడముల మిశ్రమం మాత్రమే!
జడము నందు కనిపించేదంతా చైతన్యము యొక్క ప్రకాశమే!
రాత్రి చిమ్మచీకటితో నల్లగా ఉండవచ్చు గాక! సూర్యుడు ఉదయించిన మరుక్షణం ఆ చీకటి అంతా పటాపంచలౌతోంది చూచావా! నిర్మలమైన చిత్ సూర్యుడు ఉదయించగానే ఈ సంసారాంధకారమంతా వినాశనమొందుతోంది.
అర్ధరాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అయితే చంద్రుడు జడము, స్వయం ప్రకాశ రహితము కదా! మరి ఎట్లా ప్రకాశిస్తున్నాడు? సూర్య ప్రకాశమే ఆ చంద్రునిలోని వెన్నెల అయి మనకు ప్రాప్తి స్తోంది. అయితే చంద్రప్రకాశము కనబడుతోంది గాని, ఆ చంద్రుని వెలిగించే సూర్యుడు కనబడుటలేదు కదా! జడమగు ఈ దేహమున స్వసత్తయే (స్వయం ప్రకాశమగు సూర్య ప్రకాశమువలె) అసత్త వలె (రాత్రియందు సూర్యుని ఉనికి - - ప్రభావములు లేనట్లుగా అనిపిస్తున్నట్లు)... ప్రకాశిస్తోంది. పరిమితమైన జ్ఞానం కలవారికి చంద్రప్రకాశం వెనుక గల సూర్యుని ఉనికి తెలియరానట్లు, దేహ తాదాత్మ్య దృష్టి కలవారికి చైతన్యం యొక్క ఉనికి తెలిసిరావటం లేదు.
సూర్యుని నుండి బయలుదేరిన సూర్య ప్రకాశరూపమగు అగ్ని చంద్రమండలంలో ప్రవేశిస్తోంది. జడమయమగు ఆ చంద్రమండలమును స్ఫురద్రూపంగా చేస్తోంది. అట్లాగే, చిద్రూపం అనే అగ్ని ఈ దేహంలో ప్రతిష్ఠమౌతోంది. ఆ చిద్రూపాగ్ని జీవితపర్యంతం 'అహం' భావమును ప్రకాశితంగా
Page:331
చేస్తోంది. చంద్రుని చూస్తున్నప్పుడు, "ఆహాఁ! ఈ చంద్రుడు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాడు!” అని అనుకుంటున్నాం. ఆ చంద్రునిలోని వెలుగు సూర్యునిదే కదా! అట్టి సూర్య చంద్రుల ప్రభవాలు అభేదాలే అగుచున్నాయి. అభేదాధ్యాసచే సూర్యునిలో ఉత్పన్నమయ్యే ప్రభామండలము చంద్రునిలోని ప్రభ ఒక్కటే కదా! ఆ చిత్ చైతన్యమే లేక, చిదానందమే స్వసంవిస్మయము పొందినదై 'నేను మనుష్యుడను. సంబంధితుడను, దేహస్వరూపుడను' ఇత్యాది స్వకీయమైన అనుభవములను ఆశ్రయించి, దేహస్థమై ఉంటోంది.
అగ్ని (కాంతి) సర్వే సర్వత్రా ఉండి ఉన్నప్పటికి అది దీపం ఉన్న చోటే ప్రకాశం వెడలగ్రక్కు చున్నట్లు 'క్రియ - ఉపాధి' లేకుండా కేవల చైతన్యము పైకి భాసించదు. దీపము ద్వారా ప్రకాశము ఎరుగబడుచున్నట్లు ...దేహము ద్వారానే ఆ చైతన్యము ఎరుగబడుచున్నది.
చితః - చేత్యో ఉన్ముఖత్వేన లాభః సైవ చ సంసృతిః | నిశ్చేత్యాయాః శుభో లాభో నిర్వాణం వా తదేవ హి |
అజ్ఞానముచే కప్పబడిన చైతన్యము విషయముల వైపు ఉన్ముఖం అవటమే... ‘సంసారము’ అను రూపమైన అనర్థప్రాప్తి కారణం. విషయరహితమగు చైతన్యానుభవమే శుభం, లాభం, మోక్షం కూడా!
ఒకచోట ఒక పెద్ద గోడ ఉన్నది. అయితే దట్టంగా క్రమ్ముకుని ఉన్న చీకటి చేత ఆ గోడ ఏ మాత్రం కనిపించటమే లేదు. ఆలోగా తెల్లవారింది. సూర్యుని ఉదయకాంతులు ఆ గోడపై ప్రసరిం చాయి. ఇప్పుడు ఆ గోడ సుస్పష్టంగా కనిపిస్తుంది కదా! సూర్యకాంతి - గోడ పరస్పరం కలియటం చేత ఆ గోడ యొక్క దర్శనం అవుతోంది. అట్లాగే సూర్యకాంతి చంద్రుల వలె ఈ దేహంలో చైతన్య రూపుడగు దేహి, జడరూపమగు పంచభూత మిశ్రమం (చంద్రుడు - సూర్యకాంతిచే ప్రకాశించబడే గోడ) కలిసి ఉంటున్నాయి. దేహి యొక్క సుదీర్ఘము - ఘనీభూతము అయిన దేహ స్వరూప భావనచే పరమ జడమగు కేవలీ జడస్థితి సంభవిస్తోంది. అట్లా కాకుండా ఈ ఉపాధితో ఏర్పడే తాదాత్మ్యం యొక్క నివృతిచే ఆ దేహికి అత్యంతానందం ఉదయిస్తుంది. అది అగ్ని యొక్క (లేక) చైతన్యము యొక్క ‘కేవలీస్థితి' అవుతుంది.
దేహి
కేవలీ చైతన్య స్థితి ఉపాధి భావన కేవలీ జడస్థితి+ .
(మోక్షం) యొక్క నివృత్తి
జడము | (బంధం, దుఃఖం)
ప్రాణ, అపానవాయువుల సమన్వయం - ఇప్పుడు మనం సంభాషించుకుంటున్న 'చిత్ - జడ’
సూర్యచంద్ర తత్త్వాన్ని దేహము నందలి ప్రాణవాయువుల గతికి అన్వయిద్దాం.
Page:332
ప్రాణవాయువు ఉష్ణ ప్రకృతి కలిగియున్నది. అనగా, అగ్ని రూపమైయున్నది. అపానవాయువు శీతల ప్రకృతి కలిగియున్నది. ఒక ఆకారము - దాని నీడలాగా ఈ రెండు కూడా తమతమ మార్గములలో ప్రవర్తిస్తూనే ఒకదానితో మరొకటి ముఖాముఖి అగు చున్నాయి.
శీతల స్వభావమైనట్టి అపానవాయువు నందు ఉష్ణ స్వభావమై, అగ్ని రూపమగు ప్రాణవాయువు సత్త పొందుచున్నది. వస్తువు అద్దంలో ప్రతిబింబించినట్లుగా అపానవాయువు ప్రాణవాయువునందు సత్త పొందుతోంది. ఈ విధంగా ఆ రెండిటికి అన్యోన్యమైన తాదాత్మ్య స్థితి ఏర్పడుతూ ఉంటోంది.
ఈ బాహ్య జగత్తులో గోడ మొదలైన జడ వస్తువుల ప్రకాశమును జనింపజేస్తున్నదెవరు? సూర్యుడే కదా! సూర్యుడే లేకపోతే ఈ భూమిపై ప్రకాశమే ఉండేది కాదు. అట్లాగే చిద్రూపమగు అగ్ని, లేక కాంతి ఈ దేహమున ఏర్పడి ఉండి మూలాధారం నుండి కంఠం వరకు గల చంద్ర ప్రకాశ శక్తిని ఉత్పన్నం చేస్తోంది. చిద్రూప సూర్యుని నుండి శక్తిని పొందిన ఆ మనోరూపమైన చంద్రశక్తి ఈ దేహంలో వాక్శక్తిగా, దర్శనశక్తిగా, వినికిడి శక్తిగా, స్పర్శగ్రహణ శక్తిగా ప్రదర్శితమౌతోంది.
15. సాధన - - ఉపాసన
ఓ రామచంద్రా! ఇంతవరకు మనం కుండలిని గురించి, ప్రాణ-అపానాల పరస్పర సంయోగం గురించి కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు యోగోపాసన ఎట్లా చేయాలో చెప్పుతాను విను.
ప్రాణ, అపానముల సంధిస్థాన ఉపాసన - ముఖమునకు దాదాపు 12 అంగుళముల దూరమున చంద్రుని యొక్క 16వ కళ సూర్యకళగా అగుచున్నది. అనగా అపానం యొక్క 16వ కళ ప్రాణముగా (అనగా ప్రాణశక్తి యొక్క - బాహ్యం నుండి - దేహములోనికి తిరుగు ప్రయాణ ప్రారంభ స్థానం) రూపం పొందుతోంది. ఆ సంధిస్థానంలో నీవు నీ ధ్యాసను నిలుపు. అట్లాగే హృదయాకాశమున ఎక్కడైతే ప్రాణవాయువు సమాప్తి పొందుచుండగా అపానవాయువు కేవల నిజస్థితియందు ఉన్నదో, అనగా ప్రాణవాయువు సమాప్తి అయి, అపానవాయువు ఇంకను బయల్వెడలవలసి ఉన్నట్టి సంధిస్థానంలో (ప్రాణశక్తిలో) నీ ఏకాగ్రధ్యాసను నిలుపు.
ఈ ప్రాణ అపానముల సంధిస్థానం గురించి మనం ఉపశమన ప్రకరణంలోను, ఈ నిర్వాణప్రకరణంలో భుశుండోపాఖ్యానంలోను చెప్పుకున్నాం.
ఓ రామచంద్రా! చిత్ సూర్యుడు అగ్ని - ఉష్ణరూపుడని, జడ చంద్రుడు శీతలరూపుడని చెప్పుకున్నాం కదా! 1. అర్థరేచక, 2. అర్థ పూరకముల అంతరమున ఈ ప్రాణ-అపానములు ప్రతిబింబ రూపంలో ఉంటాయి. అవియే మనం చెప్పుకున్న సంధిస్థానాలు. అచ్చట నీవు స్థిరుడవై ఉండు. అభ్యాసవశం చేత అట్టి స్థిరత్వపు ఉనికి అనుక్షణికం అవగలదు.
బాహ్య జగత్తులో ఋతువులు, రాసులు, సంక్రాంతి - ఈ బాహ్య జగత్తులో వసంత, గ్రీష్మ, వర్ష, ఋతువులందు (3x2=6 నెలలు) భూమిపై గల ఉష్ణంచే శీతలం స్వీకరించబడుతోంది. దీనిని శీతలం యొక్క (చంద్రుని) అగ్ని సంక్రాంతి అంటున్నారు.
Page:333
ఇక, శరత్, హేమంత, శిశిర ఋతువులందు భూమిపై గల శీతలంచే ఉష్ణం గ్రహించ బడుతోంది. దీనిని అగ్ని యొక్క శీతల (చంద్ర) సంక్రాంతి అంటున్నారు.
ఈ శీతలము యొక్క అగ్ని యొక్క అగ్ని సంక్రాంతి శీతల సంక్రాంతి
సంధికాలమున మేషాది రాసులందు సూర్య సంక్రాంతి సంభవిస్తోంది. అయితే ఈ బాహ్య సంక్రాంతులు తృణప్రాయములు. చాలా స్వల్ప విషయములు.
ఈ దేహాంతర్గతంగా కూడా ప్రాణ అపానములు సూర్య - - చంద్రుల వలె ప్రవర్తిస్తూ ప్రాణ-అపానముల సంక్రాంతులను కలిగి ఉంటున్నాయి. అవి జీవునికి సంబంధించిన ముఖ్య సంక్రాంతులు. వాటి గురించి వివరిస్తాను. విను.
దేహాంతర్గత సంక్రాంతులు -
శీతలం యొక్క అగ్ని సంక్రాంతి - శరీరమునందలి జఠరాగ్నిచే అపానవాయువు యొక్క అంతర్గత శీతలత్వము గ్రహించబడే టప్పుడు శీతలము యొక్క అగ్ని సంక్రాంతి అగుచున్నది.
అగ్ని యొక్క శీతల సంక్రాంతి - ప్రాణవాయువు యొక్క అంతర్గత ఉష్ణత్వముచే బాహ్యమున ఉన్న శీతలత్వము గ్రహించబడుచున్నప్పుడు అగ్ని యొక్క శీతల (లేక చంద్ర) సంక్రాంతి అవుతోంది. ఈ శీతలము యొక్క 1 అగ్ని యొక్క
అగ్ని సంక్రాంతి T శీతల సంక్రాంతి
. మధ్యలో ఏర్పడియున్న సంధియందు అగ్ని సంక్రాంతి సంభవిస్తోంది.
ఓ రామచంద్రా! ఈ విధంగా దేహంలోని అగ్ని - శీతల సంక్రాంతులను ఎరుగుము. ఇవే ప్రాణ అపానాల సంక్రాంతి కూడా అని గ్రహించు. ఇవే ముఖ్య సంక్రాంతులు. బాహ్య ప్రసిద్ధ సంక్రాంతి, ఉత్తరాయనం, దక్షిణాయనం... ఇవన్నీ కూడా ప్రాణ-అపానాల గతి భేదం ద్వారా ఈ దేహభ్యంతరం లోనే ఉన్నాయి. వాటిని ఎరిగినవారు యోగుల సభలో ప్రముఖులై శోభిస్తున్నారు.
16.కుండలిని - అష్టసిద్ధులు - జ్ఞానసాధన క్రమం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'యోగుల దేహాలు ఏ విధంగా అతిచిన్నవి గాను, అతిపెద్దవి గాను అగుచున్నాయి?' ... చెప్పమని అడిగావు కదా! ఇప్పుడా క్రమమేమిటో చెబుతాను, విను.
ఈ హృదయచక్రము యొక్క కోశములోని పై భాగంలో బంగారు తుమ్మెదలాగా, సాయంకాల మేఘములోని మెఱుపులాగా ఒకానొక అగ్నికణం (లేక) విస్ఫులింగం ప్రకాశిస్తోంది. అది అభౌతికం. (శక్తి గురుత్వాకర్షణలతో పోల్చ తగినది.) జ్ఞాన స్ఫురణ... అనతగినది. ప్రజ్ఞా సంబంధమైనది. ఉషోదయంలో సూర్యుడు ఉదయించి ఈ భూమిపై నలువైపులా ప్రసరిస్తూ చిమ్మచీకటిని పటాపంచలు
Page:334
చేస్తాడు చూచావా? ఆ అగ్నికణం కూడా ప్రవర్ధమానమగు సంవిత్ స్వరూపముచే (జ్ఞానస్వరూపముచే) శీఘ్రంగా వృద్ధి చెంది దేహమంతా ప్రసరిస్తోంది. సూర్యభగవానుడు ఆకాశమును ప్రకాశింపజేయు నట్లు ఆ అగ్ని విస్ఫులింగం ఈ దేహమును ప్రకాశింపజేస్తోంది. భౌతికమైన అగ్ని బంగారమును ద్రవింపజేయుచున్నట్లు ఆ విస్ఫులింగం ఈ దేహమునంతటినీ ద్రవింపజేస్తోంది. అది నఖ-శిఖ పర్యంతము దేహమంతా ప్రవహించి ఈ దేహములోని జడత్వమును తొలగించి చైతన్యముతో నింపివేస్తోంది. బాహ్యజగత్తులోని ఉష్ణము వస్తువుల తడిని పీల్చి, ఆ వస్తువులను పొడిగా చేయునట్లు (తడిని తొలగించునట్లు) ఆ ప్రజ్ఞాతత్త్వం అంతరింద్రియములలో ప్రసరించి యోగశక్తిచే అందలి జడత్వమును తొలగించి ఉత్తేజపరుస్తోంది.
ఈ విధంగా అది దేహంలో దేహమునకు వేరైన మనోరూపసూక్ష్మమున ఉండి ఉంటోంది. ఇట్లు పార్థివ, అటు జల దేహాల రెండిటినీ ఉత్తేజపరచి తాను కూడా వాటియందు లీనమై ఉంటోంది.
ఆ విస్ఫులింగం ఉద్భవమై ఇంకనూ దేహమందు ప్రసరించవలసియున్న క్షణములలో కుండలినీ శక్తి సుషుమ్నానాడీ రహితమై, (కానీ) తనయొక్క సంస్కారముచే శోభితమై ఉంటోంది. అగ్నిలో బయల్వె డలటానికి సిద్ధమై ఉన్న పొగలాగా కుండలినీ శక్తి అతివాహిక దేహం నందు స్థితి కలిగి ఉంటోంది.
ఆ అగ్నికణం (విస్ఫులింగం) బాహ్యమున మనస్సు - బుద్ధి - జీవుడు మొదలైనవి కలిగి ఉన్నదై అంతరమున చిత్కళాప్రకాశము కలిగి ఉన్నదై 'పొగపంక్తి' వలె భాసిస్తోంది.
ఆ విస్ఫులింగముతో కూడిన కుండలినీ శక్తి యోగులకు ధ్యాన విషయములగుచున్నది. ఆ శక్తిని ఎక్కడ నియమిస్తే అక్కడికి వెళ్ళి ఆ రూపమును పొందగలదు. ధ్యానాభ్యాసముచే యోగులు ఆ శక్తిని ఆశ్రయించి, ఆరాధించి తమ ఇచ్ఛాంగీకారయోగ్యంగా చేస్తున్నారు. ఆ కుండలినీ శక్తిని ధ్యానాభ్యాసముచే వశం చేసుకున్నప్పుడు ఆ యోగి పర్వత - గోడ - శిల - స్వర్గ - పాతాళాది లోకములలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళగలడు.
ఆ కుండలినీ శక్తి ఒక దేహంలో జడభాగాన్ని విసర్జించి ఇంకొక దేహంలో ప్రవేశించి నూతన దేహాన్ని రసపూర్ణం చేసివేయగలదు అది రసపూర్ణత్వ విభూతిచే ఏ దేహాన్ని భావన చేస్తే ఆ దేహాకారాన్ని శీఘ్రంగా ధరిస్తోంది. ఒక గొప్ప చిత్రకారుని బుద్ధిలో ఏ రేఖాకృతి ఉద్దేశించబడుతుందో, అది ఏ విధంగా చిత్రకళా ఖండమై ప్రకటనమగుచున్నదో, అట్లాగే కుండలినీ శక్తి కూడా యోగి ఇచ్ఛానుసారం ఏ రూపం భావిస్తే ఆ పాంచభౌతిక రూపం ధరిస్తోంది.
తల్లి గర్భంలో ప్రవేశించిన సూక్ష్మమగు బీజశక్తి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు మొదలైన తత్త్వాలు గల దేహాంకుర స్థితి పొందటం కూడా అట్టి ప్రక్రియయే! అయితే అది ప్రవాహపతితమైనదే గాని, బుద్ధిపూర్వకమైనది కాదు. అనగా, యోగ సాధనచే స్వాధీనమైనది కాదు. ఆ కుండలినీ శక్తి తదనంతర దృఢభావనచే బొమికలు చర్మము మొదలైనవి గల వేరైన దేహమును పొందగలుగుతోంది. అదియే క్రమంగా యోగసాధనచే తాను అనుకున్నట్లు దేహపరిణామమును మార్చగలదు. అతివాహిక దేహసహితమైన కుండలినీ శక్తి చిన్నదేహమును, పెద్దదేహమును కూడా ధరించగలుగుతోంది. (కుండలిని = శక్తి + ప్రజ్ఞ + నేను)
Page:335
ఆయా యోగశక్తులు యోగశాస్త్రంలో అష్టసిద్దులుగా ప్రసిద్ధికెక్కాయి
1. అణిమాసిద్ధి - అణు స్వరూపుడవటం
2. గరిమాసిద్ధి - బృహత్ స్వరూపుడవడం
3. లఘిమాసిద్ది - - దూరప్రదేశాలను క్షణంలో జేరటం
4. మహిమాసిద్ధి - ఆయా మహిమలు (వస్తువులను సృష్టించటం వంటిది) ప్రదర్శించటం.
5. ఈశిత్వసిద్ది - - అనేకచోట్ల ఒకేసారి ఏర్పడి ఉండటం
6. వశిత్వసిద్ధి - ఎదుటివారి మనోబుద్ధులను వశం చేసుకోగలగటం
7. ప్రాకామ్యసిద్ధి - కోరినవి నిర్మించుకోగలగటం, కోరగానే పొందటం, ప్రసాదించ గలగటం.
8. ఇచ్ఛాసిద్ధి - సంకల్పించినది సంకల్పించినట్లుగా సిద్ధింపజేయ గలగటం.
కుండలినీ అధ్యాస దేహాంకుర స్థానం నుండి (అనగా, ఈ భౌతికదేహం తల్లిగర్భంలో చైతన్యవంతమగు క్షణమును కూడా) యోగులు సాధన వస్తువుగా ఆరాధిస్తున్నారు. అంతకుముందు కూడా ఏ మనోబుద్ధ్యాది సూక్ష్మదేహాకారమైయున్నదో, ఆ చిత్ శక్తి విస్ఫులింగమును ఆరాధించిన యోగులు ఈ జన్మకర్మల రహస్యమును సాదృశంగా ఎరుగుచున్నారు.
ఇప్పటిదాకా చిదగ్ని కణతత్త్వాన్ని (లేక) కుండలినిని ఆరాధించే యోగులు పొందగల అణిమాది సిద్ధుల గురించి ప్రస్తావించాను. ఇప్పుడు తద్వారా లాభించగల జ్ఞానసాధ్య క్రమాన్ని వివరిస్తాను. విను. జ్ఞానసాధ్య క్రమం -
ఏకం 'చిన్మాత్రం' అస్తి ఇహ శుద్ధం సౌమ్యమ్, అలక్షితమ్, సూక్ష్మాత్ సూక్ష్మతరమ్ శాస్త్రం, న జగత్-న జగత్ క్రియా |
ఈ ప్రపంచమునందంతటా 'చిన్మాత్రవస్తువు’ మాత్రమే ఉన్నది. అది సర్వదా ఏకమై (అనేకంగా అవటమే లేదు), శుద్ధమై (ఏ దోషమూ దానికి అంటటం లేదు), సూక్ష్మం కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది. అయితే అద్దానిలో ఈ జగత్తూ లేదు... ఇందలి క్రియావ్యవహారాలూ లేవు. ఆ చిన్మాత్రం ఎప్పుడైతే తనయొక్క 'అధ్యాసచే తనకు తానే' సంకల్పము వైపు ఉన్ముఖం చేసుకుంటోందో... మరుక్షణం అది కలుషితమైనదానివలె కనబడి 'జీవుడు’ అను నామధేయమునకు అర్హమగుచున్నది.
అసత్యమేవ సంకల్ప, భ్రమేణ ఇదం శరీరకమ్,
జీవం పశ్యతి మూఢాత్మా, బాలో యక్షమివోద్ధతమ్ ||
మూఢుడగు బాలుడు ఇంద్రజాలం - ఐంద్రజాలికులను గాంచునట్లు ఈ జీవుడు తన 'అసత్య భావనావశం' చేత తనయందు ఈ స్థూల-సూక్ష్మ శరీరాలను గాంచుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుని ప్రజ్ఞ-అవగాహన అను జ్ఞానదీపంచే సమ్యక్ ప్రకాశం పొందుచున్నదో... అప్పుడు మేఘ రహితమైన నిర్మలాకాశం లాగా సంకల్పం యొక్క మోక్షాన్ని సంపాదించుకుంటున్నాడు. అనగా, సంకల్ప సహాయంచే సర్వసంకల్పాలకు మునుముందే ఉన్న స్వస్వరూపాన్ని గాంచుచున్నాడు. సంకల్ప క్షయం చేత ఈ స్థూల దేహభావం తైలరహితదీపంలాగా శమిస్తోంది.
Page:336
నిద్రావ్యపగమే జంతుః యథా స్వప్నం న పశ్యతి, జీ_వోపి భావితే సత్యే తథా దేహం న పశ్యతి |
నిద్రిస్తున్న ఒకప్రాణి నిద్ర నుంచి మేల్కొనగానే ఇక ఆ ప్రాణి కంటున్న కల మటుమాయ మవుతుంది కదా! అట్లాగే, మిగలదు కదా! సత్యమును ఎఱిగిన తరువాత ఈ జీవుడు ఇక ఈ దేహ భావమును గాంచడు. నిర్మలాత్మ భావనచే వెలుగొందుతాడు.
అతత్త్వే తత్త్వభావేన జీవో దేహావృతః స్థితః ॥
నిర్దేహో భవతి శ్రీమాన్ సుఖీ తత్వైక భావనా ॥
అతత్త్వములైనట్టి ఈ దేహము మొదలైనవాటియందు 'ఇవియే నా స్వరూపం' అను తత్త్వభావనం చేయటం చేతనే జీవుడు దేహవశుడై ఉండటం జరుగుతోంది. ఏకతత్త్వమగు బ్రహ్మము యొక్క భావన చేయటం చేత అతడు దేహాతీత స్వభావుడై, శ్రీమంతుడు, సుఖి కాగలడు.
ఓ రామచంద్రా! అనాత్మరూపములగు ఈ శరీరాదులందు ఆత్మభావన చేయటం'... అను రూపంలో ఉండే ఒకానొక నిబిడాంధకారం ఈ జీవుని చుట్టూ అలముకొని ఉన్నది. ఆ అంధకారం ఈ భౌతిక సూర్యోదయంచే నశించేది కాదు. సుమా! మరి? ఆత్మ యందు 'నేను నిత్యోదితమైన నిర్మలాత్మ స్వరూపుడను' అను ఆత్మభావన చేయాలి. “సర్వవ్యాపి అయి, నిరంజనమై, నిర్మలమైనట్టి చిన్మాత్రమే నేను” అను ఒక్క జ్ఞాన సూర్యోదయం చేత మాత్రమే ఈ అజ్ఞానజనితమైన అసత్తుల్య జీవత్వాంధకారం నశించగలదు. అంతకు మించి వేరే ఉపాయం లేదు.
మిగతా ఉపాయాలన్నీ అందుకొరకై ఉన్నాయి. మరి అట్టి ఆత్మభావనను సముపాదించటం ఎట్లా? మహాత్ములగు ఆత్మజ్ఞానులు, సత్యసంకల్పులు ఈ భూమిపై ఆయా సర్వజాతులలోను సంచరిస్తూ ఈ భూమిని పావనం చేస్తున్నారు. ఈ జనులు వారెలా భావన చేయుచున్నారో గమనించి శీఘ్రంగా అట్లే అనుసరించెదరు గాక! “దృఢమైన భావన" కు సర్వము సుసాధ్యమేనని అందరూ ఎరిగిన విషయమే. ఒకనికి ఏమీ తెలియకపోవచ్చు గాక! అతని దృఢమైన భావన విషమును అమృతంగానూ, అమృతమును విషంగానూ చేసివేయగలుగుతుంది.
ఏవం యథా యదేవ్ హ భావ్యతే దృఢభావనాత్, భూయతే హి తదేవా శు తదిత్యాలోకితం ముహుః ॥
దృఢభావనచే ఏ పదార్థం ఎట్లు అవలోకించబడుతుందో... అప్పుడది అట్లే అగుచుండుట మనందరం అనేకసార్లు రోజూ చూస్తున్న విషయమే. ఈ “దేహం, దేహ సంబంధిత విషయాలు సత్యమే” అను దీర్ఘాభ్యాసభావనచే చూచుచుండుటచే దేహి దేహసంబంధమాత్రుడుగా అవగతమగు చున్నాడు. ఈ దేహాదులను తత్సంబంధిత విశేషాలను అసత్యభావనచే దర్శించువారికి దేహి యొక్క బ్రహ్మాకాశరూపం అనుభవమగుచున్నది. కుండలినీ ధ్యానం అందుకు సాధకునికి ఉపకరించగలదు. ఉత్తములగు యోగులు కుండలినీ ధ్యానంచే సత్వరమే దేహభావనను జయించి బ్రహ్మతత్త్వభావనను
- బ్రహ్మాత్మాహంభావనను సంతరించుకుంటున్నారు. అల్పపరిలక్షితులగు యోగులు అణిమాది
Page:337
సిద్ధులను ఆశ్రయించి పునః సంసారమునకు వెనుతిరుగుచున్నారు. ప్రజ్ఞావంతులగు యోగులకు అణిమాది అష్టసిద్ధులు ఉన్నప్పటికీ మహదాశయ సంపన్నులై ఉండటం చేత అవి వారికి భూషణాలు అగుచున్నాయే గాని తిరోగనమమునకు కారణములు కాలేవు. మహదాశయుల దృష్టిలో అణిమాది సిద్ధులు బాటలో కనిపించే గడ్డిమొక్కలవంటివి మాత్రమే!
సాధుపుంగవులలో అగ్రగణ్యుడవగు ఓ రామచంద్రా! నీకింతవరకూ చిదగ్నికుండలినీ శక్తుల ఆరాధన, అణిమాది సిద్ధులు, అణిమాది పదప్రాప్తి యందలి జ్ఞానయుక్తి గురించి కొన్ని విశేషాలు విశదీకరించాను. ఇప్పుడు యోగాభ్యాసబలంచే యోగులు నిర్వర్తించే మరొక దేహప్రవేశం గురించి వివరించి ఈ యోగము గురించిన విషయమును ముగిస్తాను.
పరకాయ ప్రవేశం - మనిషి వాయువునుండి పుష్పగంధమును ఆకర్షించి ముక్కును ఉపయోగించి ఘ్రాణము అనుభవిస్తాడు చూచావా? జీవుడు కూడా కుండలినీ శక్తిరూప గృహం నుండి బయల్వెడలి మరొక దేహములో కుండలినీ సమన్వితుడై ప్రవేశించగలుగుతాడు. ఆ యోగి ఆ మరొక దేహమును ఎంతకాలం ఉపయోగిస్తూ ఉంటాడో... అంతకాలం ఆతనిచే అతని పూర్వదేహం త్యజించబడినదై ఉంటుంది. ఆ అన్యదేహంలో తన ఇష్టం వచ్చినంతకాలం ఉన్న తరువాత ఆతడు మరల ఆ దేహాన్ని ఒక రాయి - కొయ్య - చెక్కలను విడచినట్లు విడచిపెట్టేస్తున్నాడు. చెట్లకు నీరుపోయువాడు తాను ఏ చెట్టుకు నీరు పోయాలనుకుంటే ఆ చెట్టుకే పోస్తూ మరల ఆ చెట్టును వదలి తన ఇచ్ఛ వచ్చినట్లు మరొక చెట్టును సమీపిస్తాడు చూచావా? ఆ విధంగా యోగి కూడా తన ఇచ్ఛానుసారంగా ఏ స్థావర జంగమ దేహమును ప్రవేశించాలనుకుంటే ఆ దేహమునందే ప్రవేశించగలుగుచున్నాడు. ఎవరి సంపదను అనుభవించాలనుకుంటే అతని దేహ, మనో, జీవ, బుద్ధులందు తాను ప్రవేశించు చున్నాడు. ప్రతి ఒక్క దేహి ఈ తన దేహమును కూడా అట్టి రీతిగానే మాతృదేహంలో ప్రవేశించి ఆశ్రయించి ఉంటున్నాడని కూడా సూక్ష్మబుద్ధితో గ్రహించు. అయితే అది కర్మజాల కారణమైన ప్రవాహపతిత వ్యవహారం.
ఇట్లు ఆ యోగి అన్యశరీరంలో ప్రవేశించి ఆ అన్యశరీరమునకు సిద్ధించియున్న సంపదను అనుభవించి మరల తన పూర్వదేహం ఇంకా ఉండి ఉంటే, అందులో ప్రవేశించగలడు. లేదా, తన కిష్టమైన మరొక దేహంలోనైనా ప్రవేశించగలడు. కాదా, ఉత్కృష్టులగు యోగులు ఆ అన్యశరీర భోగానంతరం... సమస్త ప్రతిబింబభూతములగు ఉపాధులను, బింబభూతములగు సమస్త దేహులందును, ఈ జగత్తంతటా వ్యాప్తమైయున్న తమ ఆత్మను దర్శించగలరు. ఇట్టి తమ యొక్క ఆత్మ సంవిత్తుచే ఈ సర్వమునూ పరిపూర్ణం ఒనర్చి ఉండగలుగుచున్నారు.
ఓ రామచంద్రా! యోగైశ్వర్యములలో అన్నిటికన్నా ఉత్తమమైనది. ఘనమైనది, పవిత్రమైనది స్వస్వరూపానుభవమే. యోగైశ్వర్యులగు కొందరు మహనీయులు దోషరహితము, నిత్యోదయము అగు తమ స్వరూపమును ఎరిగి, అందు ప్రవేశించినవారై ఉంటున్నారు. అట్టి మహాత్ములు దేనిని వాంఛిస్తారో దానిని శీఘ్రంగా పొందగలుగుతారు.
Page:338
అయితే, తత్త్వజ్ఞాని అయినవాడు ఆయా అల్పసిద్ధులను గొప్పవిగా భావించడు. నిరతిశయానంద రూపమగు ఆత్మనే అన్నిటికన్నా అధికమైన దానిగాను, ప్రియమైనదానిగాను, మహత్తరమైనదానిగాను ఎరిగియే ఉంటాడు.
17. వెతికేది చిల్లిగవ్వ కోసం - దొరికేది చింతామణి
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు అడిగిన రీతిగా ఇప్పటివరకూ కుండలినీ యోగం, సిద్ధులు, యోగముచే జ్ఞానం మొదలైన ఆయావిషయాలు ప్రస్తావించాను. ఇప్పుడు తిరిగి చూడాల - శిఖిద్వజుల కథా ప్రసంగానికి వద్దాం.
రాజపత్ని చూడాల రాజ్యమును వదలి ఒకానొక ఏకాంత ప్రదేశంలో అణిమాది సిద్ధుల కొరకై ప్రాణాయామాదుల దృఢాభ్యాసం ప్రారంభించిందని అనుకున్నాం కదా! ఆత్మ తత్త్వజ్ఞాన బలంచే సంపాదించుకున్న ఏకాగ్రత, పవిత్రతల ప్రభావం వల్ల ఆమె అతి స్వల్పకాలంలో అణిమాది శక్తులచే, తత్సంబంధిత గుణాలచే సుసంపన్నురాలైనది.
ఆమెయందు జ్ఞానము ఇంకా పవిత్రం కాగా, ఇక మోహకాలుష్యం, తాపత్రయాలు ఏ ఏ కొద్ది మిగిలినా, అవి కూడా వినాశనం పొందాయి. ఆమె హృదయం గంగాజలంలాగా నిర్మలము, శీతలత్వము పొందాయి.
ఆమె యథాప్రకారం గృహోన్ముఖురాలై భర్తచే నిర్వర్తించబడవలసిన ఆయా రాజధర్మములను పవిత్ర భావనతో నిర్వర్తిస్తూ 'సహధర్మచారిణి' అను మాటకు పూర్ణార్హత పుణికిపుచ్చుకున్నది.
ఒకవైపు రాజ్యభారాన్ని వహిస్తూనే మరొకవైపు ఆ చూడాల ఒకప్పుడు ఆకాశమార్గమున పోవుచూ, మరొకప్పుడు సముద్రకోటరములలో ప్రవేశిస్తూ, ఇంకొకప్పుడు భూమండలమంతా చుట్టి... సంచారాలు చేసివస్తూ ఉండేది. ఎన్ని సిద్ధులు సంపాదించినప్పటికీ ఆమె తన సహజసిద్ధమగు భావమును వదలలేదు. ఆమె చిత్తం తన పతియొక్క వక్షస్థలం నుండి ఒక్క క్షణం కూడా విముక్తమవలేదు.
ఆమె ఇచ్ఛానుసారం కొన్ని సమయాలలో సమస్త రాజ్యములందూ, సమస్త లోకములందూ ‘లక్ష్మి'వలె నివసించుచూ ఉండేది. ఒకవైపు మహారాణికి సంబంధించిన భూషణాలు ధరిస్తూ సభా కార్యక్రమముల వంటి రాచకార్యములు నిర్వర్తిస్తూనే ఉండేది. కొంచెం సమయానుకూలమైనప్పుడు ముత్యాలలో దారం ప్రవేశించినట్లు, పర్వతాలతో కూడిన భూమిపై మేఘాలు కమ్మినట్లు కాష్ఠ, తృణ, శిలమయ భూ ప్రదేశములందు; ఆకాశ, వాయు, అగ్ని, జలాది భూతజాత ప్రదేశములందు నిర్విఘ్నంగా ప్రవేశిస్తూ ఉండేది. యమ, వరుణ, కుబేర, వరుణ, ఇంద్రాది లోకపాలకుల నగరాల లోను, ఆకాశములోని దశదిశల అంతరాంతరాళములలోనికి వాయుతరంగంలాగా ప్రవేశ,
Page:339
నిష్క్రమణాలను సల్పుతూ ఉండేది. అంతే కాదు. పశుపక్ష్యాదులతోను, పిశాచాదులతోను, నాగ -
దేవ-దైత్యులతోను, విద్యాధర-అప్సరస సిద్ధులతోను, సామీప్య-స్నేహ సంభాషణలు నిర్వరిస్తూ ఆనందిస్తుండేది.
అట్లా అనేక జగత్తులలో పచార్లు చేస్తూ కొన్నిసార్లు తన భర్త అంతరంగంలో కూడా ప్రవేశించింది. అశరీరి అయి అనేక సంజ్ఞలతో జ్ఞానామృతమును వర్షించటానికి, ఉపదేశించటానికి ఏవేవో ప్రయత్నాలు చేసింది కూడా! కాని స్థూలదృష్టిని ఆశ్రయించి ఉండటంచేత ఆమె భర్త శిఖిధ్వజుడు ఆమె యొక్క విజ్ఞానవైభవాన్ని గాని, ఆమె సూక్ష్మ మార్గాలలో చెప్పే జ్ఞానబోధలను గాని ఏమాత్రం తన హృదయంలోకి స్వీకరించనే లేదు. మధ్య మధ్య తన భార్య చూడాల గురించి యోచిస్తున్నప్పుడు ‘నా ప్రియురాలు చూడాల ఉట్టి పిచ్చిది. ఏమీ తెలియనిది. సంగీతం, నృత్యం మొదలైన వాటిలో ప్రావీణ్యురాలే! కానీ ఏం లాభం? ఇంత తెలిసి, ఇంతగా ప్రయత్నిస్తున్నా నాకే ఆత్మవిద్య అలవడలేదు. ఏమీ తెలియకపోయినా, ఏదో ఊహించి ఏదేదో అనుకునే నా భార్య చూడాల వంటి వారికి ఆత్మ విద్య యొక్క ఆనుపానులు కాస్త తెలియాలంటే కూడా ఎన్ని వందలసార్లు జన్మించాలో కదా! 2 సంవత్సరాల చిన్న పిల్లవాడికి అస్త్ర విద్య ఏం తెలుస్తుంది? మా చూడాల కూడా ఏమీ తెలియని అమాయకురాలు, పాపం!” అని తనలో అనుకుంటూ ఉండేవాడు. స్వల్పజ్ఞానులు తదితరులు జ్ఞానాదులపై తమవైఖరికి అనుకూలమైన అభిప్రాయములు కలిగి ఉండి, తమకు తదితరుల జ్ఞానఅజ్ఞానాదులు తెలుసునని అనుకోవటం సాధారణమైన విషయమే కదా!
శ్రీరాముడు : మహర్షీ! ఆ చూడాల తన భర్త సమక్షంలో ప్రత్యక్షమై తన సిద్ధులను చూపి, ఆ తరువాత ఆత్మ విద్యను మరల బోధించవచ్చు కదా! అట్లా అయితే శిఖిధ్వజునకు తన భార్య యొక్క సామర్థ్యముపై గౌరవాదులు ఉండి అప్పుడు ఆమె బోధించేది శ్రద్ధ-యోచనలతో వినేవాడేమో? శ్రీ వసిష్ఠ మహర్షి : యజ్ఞ విధానం, తత్త్వరహస్యం ఎరిగిన మహనీయులు అల్పాధికారులకు ఆయా యజ్ఞక్రియలను విడమరచి చూపరు చూచావా? బహుప్రాచుర్యమైన దేవతా విగ్రహమునకు వస్త్ర విభూషణాది అలంకారాలు చేస్తున్నప్పుడు భక్తులకు అది ప్రదర్శించక తెరకడతారు కదా! అట్లాగే ఆ చూడాల కూడా ఆత్మయందు విశ్రాంతి పొందని ఆ రాజుకు తన ఆకాశగమనాది సిద్ధులను ప్రదర్శించుటకు ఉద్దేశించలేదు.
శ్రీరాముడు : మహర్షీ! ఇప్పుడు నా మానసికాకాశంలో ఒక గొప్ప సందేహం పుట్టుకోస్తోంది. ఆ చూడాల గొప్ప యోగి, సిద్ధురాలు, ఆత్మజ్ఞాన - - అనుభవ సమన్వితురాలు కదా! అంతటి చూడాల ఎంతెంతో ప్రయాసపడినప్పటికీ తన భర్తకు ఆత్మవిద్య నేర్పలేకపోతోందే! ఇక సిద్ధులు మొదలైనవి లేనట్టి గురువులు తమ శిష్యులలో ఆత్మానుభవం ప్రేరేపించటం ఎంతటి దుస్సాధ్యమైన విషయం! శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు చెప్పిన అభిప్రాయముతో నేను ఏకీభవించటం లేదు. ఎందుచేతనంటావా?
ఉపదేశక్రమో, రామ! వ్యవస్థామాత్ర పాలనమ్ । జ్ఞప్తేస్తు కారణం శుద్ధా శిష్యప్రక్షైవ రాఘవ! ॥
Page:340
ఓ రఘురామా! “గురువు, ఉపదేశించటం, ఉపదేశక్రమం'... ఇవన్నీ కూడా ఒకానొక వ్యవస్థాక్రమం, శాస్త్ర మర్యాదను కాపాడటం కోసం మాత్రమే. యథార్థానికి శిష్యునిలో జ్ఞానబోధ జనించటానికి గురువు యొక్క పాఠ్యాంశములు మొదలైనవి అసలైన కారణం కాదు. శిష్యుని జ్ఞానప్రాప్తికి అతని శుద్ధమైన బుద్ధియే అసలైన కారణం.
న శ్రుతేన న పుణ్యేన జ్ఞాయతే జ్ఞేయమాత్మనః |
జానాతి ఆత్మానమ్ ఆత్మైవ సర్పః సర్పపదాన్ ఇవ ॥
ఏదో శ్రవణం చేతనో, శబ్దజ్ఞానం చేతనో, తదితరమైన పరోక్షజ్ఞానంచేతనో, పుణ్యకార్యములు నిర్వర్తించటం చేతనో ఆత్మ తెలియబడదని గ్రహించు. మరి? పాముయొక్క అడుగుజాడలను పామే గ్రహించగలుగుతుంది. అట్లాగే, ఆత్మయే ఆత్మను ఎఱుగగలదు.
“ఆత్మ యొక్క సంకల్ప ఉద్దేశములు” లేకుండా ఆత్మకు ఆత్మ గురించి మరెవరూ
ఎరుకపరచలేరు.
శ్రీరాముడు : మీరు చెప్పేది చమత్కారంగా ఉంది. అట్లా అయితే, గురూపదేశం ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ఎట్లా కారణమౌతుంది? గురూపదేశమే లేకపోతే ఆత్మజ్ఞానం లభించటం దుర్లభమని కొన్ని శాస్త్రములు సిద్ధాంతీకరిస్తున్నాయే?
శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు నవ్వుతూ) నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజ్ఞుల సభలలో ‘చిల్లిగవ్వ కోసం వెతుకుతూ ఉంటే చింతామణి దొరుకుతుంది' అను ఒక దృష్టాంతం చెప్పుతూ ఉంటారు. అది ఇప్పుడు ప్రస్తావిస్తాను విను.
చిల్లిగవ్వకోసం వెతుకుతుంటే చింతామణి దొరకటం - వింధ్య పర్వత ప్రాంతంలో గల బోయజాతి వారు నివసించే ఒక పల్లెలో ఒక ఆటవికుడు (కిరాతకుడు) ఉన్నాడు. అతని దగ్గర చాలా ధనం ఉన్నది. అయితే ఏం? అతను పరమ లోభి. అతని దగ్గర ఎంత ధనం ఉన్నదో అతనికే తెలియదు. కానీ ఆతడు చిల్లిగవ్వ కోల్పోవటానికి కూడా ఎంతమాత్రం సిద్ధపడడు. అంతటి లోభ రాగ సంబంధమైన తుచ్ఛ భావాదులు కలిగి ఉన్నాడు.
ఒకసారి అతను ఏదో అవసరమైన పని ఉండి వింధ్యాచల మార్గంలో ఏదో పట్టణం వైపు వడివడిగా నడచి వెళ్ళుచున్నాడు. ఆ వేగానికి ఒకచోట జేబులోంచి ఒక చిల్లిగవ్వ గాలిలోకి ఎగిరి దట్టంగా ఎదిగి ఉన్న పచ్చగడ్డి దుబ్బులో పడిపోయింది. 'అయ్య బాబోయ్! నా చిల్లిగవ్వ పడిపోయింది నాయనోయ్! అని గంతులేసి ఇక ఆ చిల్లిగవ్వకోసం రెల్లుదుబ్బులలో వెతకటం ప్రారంభించాడు. ఒక గంట గడచిపోయింది. చిల్లిగవ్వ కనబడనే లేదు. అయినా ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఆ మార్గంలో ఆతనికి తెలిసియున్న కొందరు బాటసారులు అటు వెళ్ళుచూ అతనిని పలకరించారు. బాటలో వెళ్ళే ఎవరో జనులు: ఏయ్ కిరాతా! ఏమిటి... వెతుకుతున్నావ్?
కిరాతకుడు: ఒక చిల్లిగవ్వ ఎక్కడో పడిపోయింది. రెండుగంటలుగా వెతికినా ఇంకా కనబడలేదు. అందుకే మళ్ళీ వెతుకుతున్నాను.
Page:341
బాటసారులు : నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్క చిల్లిగవ్వకోసం ఇంతసేపు వెతుకుతున్నావా? పైగా ఇంకా వెతుకుతావా? నీకు బోలెడు డబ్బు ఉన్నది కదా! అంత డబ్బు ఎదురుగా పెట్టుకుని వెతకట మేమిటి? అవతల చీకటి పడిపోతోంది చూచావా? లేదా? చీకటి పడిందంటే ఇక్కడికి ఏవైనా క్రూరమృగాలు వస్తే రావచ్చు.
కిరాతకుడు : డబ్బు ఉంటే ఉండొచ్చు గాక! ఇప్పుడా ఊసు ఎందుకు? ఈ చిల్లిగవ్వను ఎందుకు పోగొట్టుకోవడం? వెతగా-వెతగ్గా ఈ చిల్లిగవ్వ ఇప్పుడు దొరకిందనుకో. అప్పుడు నేను ఆ చిల్లిగవ్వను ఉపయోగించి క్రయవిక్రయాలు చేస్తాను. ఒక చిల్లిగవ్వ పది చిల్లిగవ్వలౌతాయి. ఆ 10 చిల్లిగవ్వలతో మరేదైనా వ్యాపారం చేస్తే 2000 చిల్లిగవ్వలౌతాయి. అప్పుడీ చిన్న చిన్న వ్యాపారాలు మానేసి మా బోయవాళ్ళ దగ్గిర అటవీ సంపదలను కొని వాటిని పట్టణంలో అమ్ముకుంటాను. అవే లక్షలక్షల చిల్లిగవ్వలౌతాయి. ఇక మీరు పదండి. మీకేం తెలుసు డబ్బు విలువ?
కిరాతుని లోభపూరితమైన అమాయకపు వాక్యములు విని ఆ బాటసారులు పకపకా నవ్వుకున్నారు. 'వీడొక మూర్ఖుడు. చెప్పితే వినడు. వీడిగతి ఇంతే. ఇక పదండిరా' ... అని హాస్యం చేస్తూ వాళ్ళంతా వెళ్ళిపోయారు. కిరాతుడు మాత్రం ఆ చిల్లిగవ్వ కోసం వెతుకుతూనే ఉన్నాడు. అప్రమత్తుడై, మరల-మరల ఆ చిల్లిగవ్వ దొరికితే తాను ఏం చేయగలడో ఊహించుకుంటూ ఆ చుట్టు ప్రక్కలంతా చూస్తున్నాడు. మూడు రోజులు గడిచిపోయాయి.
చివరికి అతనికి చిల్లిగవ్వ కనిపించలేదు. కానీ, ఆశ్చర్యం! మూడో రోజు సాయంకాలమౌతూ ఉండగా అతనికి ఆ రెల్లు గడ్డిలో దేదీప్యమానమైన, మహత్తర సమన్వితమైన ఒక 'చింతామణి' దొరికింది. ఏది అభ్యర్ధిస్తే అది ప్రసాదించగల గొప్ప శక్తి ఆ మణికి ఉన్నదని గ్రహించాడు. దానిని చూచి ఆ కిరాతుడు చాలా ఆనందం పొందాడు. ఎంతో సంతోషంగా ఆ చింతామణిని గుప్పెట్లో దాచుకుని ఇంటికి చేరాడు. ప్రపంచంలోని భోగైశ్వర్యములన్నీ ఆ చింతామణి యొక్క ప్రభావం చేత లభించుచుండటంచే హాయిగా ఉన్నాడు.
ఓ రామచంద్రా! ఇదీ కథ. ఇది జ్ఞానుల సభలో ఎందుకు ముచ్చటిస్తారో చెబుతాను విను. చిల్లిగవ్వకోసం వెతుకుతుంటే ఆ బోయవానికి చింతామణి లభించినట్లు శాస్త్రముల ఉపదేశాలు వింటూ ఉండగా కూడా ఆత్మజ్ఞానం లభించటం జరుగుతోంది. గురువులు శబ్దములను ఉపయోగించి ప్రత్యక్ష పరిమితులై (దృశ్యవ్యవహార పరిమితులై) దిక్కు గానక సంచరిస్తూ తమను ఆశ్రయించిన శిష్య జనులకు ‘పరోక్షజ్ఞానం’ అందిస్తున్నారు. ఈ శబ్దజన్యమైన పరోక్షజ్ఞానం గురువాక్యానుసారం అన్వేషిస్తూ ఉండగా ఎప్పుడో నిత్యము అపరోక్షము అయినట్టి 'ఆత్మజ్ఞానం, ఆత్మానుభూతి లభిస్తున్నాయి.
ప్రియ రాఘవా! గురువు యొక్క ఉపదేశంచే 'శబ్దవృత్తులు’ మాత్రమే జనిస్తున్నాయి. అయితే, బ్రహ్మం ఇంద్రియాలన్నిటి కంటే పరం అయినది కదా! ఇంద్రియాలను నియమించేది, ఉపయోగించేది అయిన బ్రహ్మం ఆ ఇంద్రియాలకు విషయం ఎట్లా ఎవుతుందో చెప్పు? ఇక శబ్దబోధల విషయానికి వస్తే అవన్నీ ఇంద్రియజ్ఞానానికి సంబంధించిన చిత్తవృత్తులచే రచించబడినవే కదా! ఇదంతా
Page:342
దృష్టిలో పెట్టుకుంటే, 'నిత్య, అపరోక్ష బ్రహ్మానుభవం శిష్యుని శుద్ధబుద్ధియందే ఉద్భవిస్తోంది. అంతే గాని కేవల ఉపదేశమాత్రంచేత అది ఆత్మతత్త్వోదయమునకు స్వయంగా హేతువు కాజాలదు' ... అని ఎవరైనా గ్రహించవచ్చు.
అయితే మరొక్క విషయం. చిల్లిగవ్వకోసం వెతికి ఉండకపోతే ఆ ఆ బోయవానికి అసలు చింతా మణియే కనబడేది. కాదు కదా! అట్లాగే గురూపదేశం, పురాణాదుల సంసేవనం లేకపోతే ఆత్మతత్త్వం ప్రాప్తించదు. మహదర్థరూపమైనట్టి ఆత్మతత్త్వం ఒకడు పొందటానికి సూటిగా గురూపదేశమే కారణం కాకపోయినప్పటికీ... 'గవ్వకోసం వెతకటమే చింతామణి దొరకటానికి కారణం’ అనునది మనం కాదని అనలేం కదా! గురూపదేశం వింటూ ఉండగా శిష్యుని ప్రజ్ఞను అనుసరించి ఎప్పుడో ఆత్మతత్త్వానుభవం లాభిస్తోంది.
పశ్య రాఘవ! మాయే మం, మోహినీ మహతామపి |
అన్యత్ అన్విష్యయతే యత్నాత్! అన్యత్ ఆసాద్యతే ఫలమ్ ||
చూడు రామా, ఎంత చమత్కారమో! ఈ మాయ మహాత్ములైన వారిని కూడా మోహింప జేస్తోందయ్యా! యత్నశీలురై గురుశిష్య వ్యవహారమునందు, అన్వేషించేదేమో ఒక వస్తువు కోసం. తీరా ఫలితం చూస్తే ఆ దొరికేది మనోవాక్కులకు విషయం కానే కానట్టి వస్తువు!
మనుజుడు ఒక పనికోసం యత్నం కొనసాగిస్తూ ఉండగా, మరొకటైన ఫలితమో, ప్రయోజనమో ఒనగూడటం లోకంలో అందరికీ అనేక సందర్భాలలో అనుభవమయ్యే విషయమే. ఒకదాని కొరకై చూస్తూ ఉండగా, ఇంకొకటేదో కనబడుతుంది. ఒకదాని కొరకై వింటూ ఉండగా ఇంకొకటేదో వినబడుతుంది. అట్లాగే ఈ జీవుడు కూడా దేని కోసమో (దృశ్య-పలముల కోసం) అంతరంగంలో ఉద్దేశించి తీవ్రప్రయత్నం జరుగుచుండగా ఆత్మజ్ఞానమే లభిస్తోంది.
శాస్త్రములు జీవుని ప్రయత్నమునందు అట్టేబెట్టి ఉంచటానికి ఉపకరిస్తున్నాయి. గురువులు పరోక్షస్మృతి కలిగిస్తున్నారు. శిష్యుడు అపరోక్షజ్ఞానం సంపాదిస్తున్నాడు.
ఆత్మజ్ఞానమే నిజమైన సంపాదన. అందరూ దేహం ఉండగానే ఆర్జించవలసినది అదే! అట్టి ఆత్మజ్ఞానం సంపాదించుకుని, ఆ తరువాత ఇక శేషించిన జీవితమున తారసపడే ఈ జగద్భమను అసంగముగాను అనిచ్ఛాపూర్వకంగానూ గడపటం శ్రేయస్కరమని నా ఉద్దేశం.
18. శిఖిధ్వజ వనవాసం
శ్రీ వసిష్ఠ మహర్షి: ఇక శిఖిధ్వజుని విషయానికి వద్దాం! అతడు మూడు సంవత్సరముల జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని మాతృదేశం చేరాడు. అయితే, అతడు తత్త్వజ్ఞానం సంపాదించుకోక పోవటంచేత అనేక మోహాంధాకారములలో చిక్కుకుని ఉన్నాడు. తాను మహారాజు కనుక తనకు అభీష్టమైన వస్తువులకేం కొదువలేదు. కాని... “ఈ రాజ్యభోగాలన్నీ ఆత్మజ్ఞానంముందు తుచ్ఛమైనవే గదా! మరి నాకు ఆత్మజ్ఞానం లభించటమెట్లా?” ...అని ఎప్పుడూ వ్యాకులపడుతూ ఉండేవాడు.
Page:343
అతని మనస్సు ఎక్కడో కొండగుహలలోనో, అరణ్యప్రదేశాలలోనే ఏకాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉండేది. మన ఈ విశ్వామిత్రమహర్షి నిన్ను తీసుకువెళ్ళటానికి వేంచేయకమునుపు నీవు అంతః పురంలో పరధ్యానంగా ఉండేవాడివే! అట్లాగే ఆ శిఖిధ్వజుడు కూడా భృత్యుల సాంత్వన అనునయ వాక్యాలతో బ్రతిమలాడితే గాని దైనందిన క్రియలను కూడా నిర్వర్తించే వాడు కాదు. నిరంతరం వైరాగ్యశీలుడై ఒక సన్న్యాసిలాగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేవాడు. రాజ్య సంపదలను తలచు కున్నప్పుడల్లా ఆతనిలో విరక్తి ఇంకా ఎక్కువ అయ్యేది. ఇక అక్కడి నుండి ఆత్మజ్ఞానోదయం కోరుకున్నవాడై రకరకాల ప్రయత్నాలు ప్రారంభించాడు. బ్రాహ్మణులకు, దేవాలయాలకు, స్వజనులకు అనేక భూ-సువర్ణదానాలు సమర్పించాడు. చాంద్రాయణాది అనేక వ్రతాలు నిర్వర్తించాడు. అనేక పవిత్రక్షేత్రాలను, వనములను, తదితర పవిత్ర ఆశ్రమాలను సందర్శించి, అక్కడక్కడ కొద్ది రోజులు గడిపివచ్చాడు. అంతా బాగానే ఉన్నది కాని, ఏ లాభం? నిధిని కోరుకునే వాడు ఎంతగా త్రవ్వినా నిధి లభించకుంటే ఎంత నిరుత్సాహంగా ఉంటాడో, ఆ రాజు కూడా శోకరాహిత్యము సంపాదించుకోలేక పోయాడు. దైన్యం, నిరుత్సాహం అతని వెంటనంటి ఉండేవి. రాత్రులందు అతనికి నిద్రపట్టేది కాదు. 'నా ఈ సంసారవ్యాధికి ఔషధం ఏమిటిరా?' అని ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం, రాచరికపు మర్యాదలు, తదితరమైన సంరంభాలు ఆతనికి విషం వలె కనిపించేవి. వాటిపట్ల ఆతనికి రోతపుట్టింది. ఎదురుగా ఉన్న మహావిభవములన్నీ ఆతనికి గొప్ప బంధనాలుగా తోచేవి. ఒకరోజు ఒక ఏకాంత స్థలంలో తన ప్రక్కనే కూర్చుని ఉన్న తన ప్రియాతిప్రియ చూడాలతో ఇలా పలికాడు. శిఖిధ్వజుడు : ఓ ప్రేయసీ! చూడాలా! చాలాకాలం ఈ రాజ్యం, రాజ్యవిభవములు అనుభవించాను కదా! ఇప్పుడు నాకు ఎంతో వైరాగ్యం కలుగుతోంది. అందుచేత వీటన్నిటినీ వదలి అడవులలో ఏకాంత ప్రదేశం ఆశ్రయించాలని అనుకుంటున్నాను. వనవాసియగు మునికి ఇక్కడి సంసారంలో ఉండే దుఃఖాలు, సుఖాలు, ఆపదలు, సంపదలు ఉండవు కదా! అందుచేత ఇవి కల్పించే మోహాల నుండి తప్పించుకోవటం తేలిక అవుతుంది. రాజుగా ఉన్నంతవరకూ "అయ్యో! ఈ రాజ్యం ఏమౌతుందో? శత్రురాజులు బలం పుంజుకుంటున్నారేమో! వారితో యుద్ధం చేయగల సామర్థ్యం సంపాదించటం ఎట్లా? ఒకవేళ యుద్ధం చేశామనుకో... అది జన నష్టానికి కారణమై అదంతా పాపంగానే పరిణమిస్తుంది కదా!” ... ఇటువంటి సమస్యలు వనవాసులకు ఉండవు కదా! నా ఉద్దేశంలో ఈ రాజ్యాలు ఏలే వారికంటే వనవాసులదే ఉత్తమమైన సుఖం అయి ఉన్నది. పైగా, అరణ్యాలలోని ప్రకృతి సాధనపరులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏకాంతమగు వనాలలో ఈ మనస్సుకు లభించే సుఖం ఇంద్రలోకంలో గాని, బ్రహ్మలోకంలో గాని, చంద్ర లోకంలో గాని అనేక మంది మధ్య గడిపేవారికి గాని ఏమాత్రం లభించదని నేను గమనించాను. నేను ఏకాంత ప్రదేశం వెతుక్కుంటూ అరణ్యములలో ప్రవేశించదలచాను. అందుకు నీవు అడ్డుచెప్పవనే అనుకుంటు న్నారు. నీవంటి కుల స్త్రీలు భర్త కోరికలకు ప్రతికూలంగా వ్యవహరించరనేది లోకవిదితమే కదా! చూడాల : హే ప్రాణనాథా! ఏ సమయంలో ఏ కార్యం ఉచితమో ఆ సమయానికి ఆ కార్యం నిర్వర్తించటమే 'శోభ'అని అనిపించుకుంటుంది. ఆ ప్రకృతిని చూడండి. వసంతకాలంలో పుష్పాలు
Page:344
పుష్పిస్తాయి. శరత్కాలానికి ఫలములు శోభిస్తాయి. అదే అందం కదా! 'వానప్రస్తం' అనే ఆశ్రమం వార్ధక్యం వచ్చిన వారికి ఉచితం. మీ వంటి యౌవనవంతులకు వనవాసం ఉచితమెట్లా అవుతుంది? అందుచేత వనవాసానికి ఇప్పుడు మీరు వెళ్ళాలనుకోవటం నాకేమాత్రమూ ఇష్టం లేదు.
మనిద్దరం వార్ధక్యచిహ్నాలు వచ్చేవరకు ఈ గృహస్థాశ్రమం నిర్వర్తిద్దాం. వార్ధక్యం పొడచూపగానే ఇద్దరం కలిసి వనవాసానికి వెళ్ళిపోదాం. ఎందుకా? మీరు మహారాజు. ఏదో మామూలు గృహంలో నివసిస్తున్నవారు కాదు. ఇప్పుడు సమయం కాని సమయంలో ప్రజాపాలనను వదలి వనవాసానికి వెళ్ళిపోతే, స్వధర్మమును నిర్వర్తించకపోవటం చేత, అది పాపమే అవుతుంది కదా! ఉచితమైన సమయం ఆసన్నం కాకుండా మీరు రాజ్యపాలనను వదలి అడవులలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే రాజ్యం సంగతి, ప్రజల సంగతి ఏం కావాలి? సేవకుడు చెప్పాపెట్టకుండా యజమానిని విడిచి వెళ్ళితే ఆ యజమాని అనేక విషయాలు తెలియక ఇబ్బంది పడడా? అట్లాగే ఈ మన ప్రజలు కూడా ఇబ్బందులు పాలు అవరా? మీ మంత్రులు, సేనాధిపతులు తప్పక అడ్డుకుంటారని నా ఉద్దేశం. శిఖిధ్వజుడు : ఓ కమలనేత్రీ! నీవు చెప్పిన విషయాలన్నీ నేను ముందుగానే ఆలోచించాను. దయ చేసి నా ఈ వనవాస ప్రయత్నానికి విఘ్నం కలిగించవద్దు. ఇప్పటికే నేను ఏదో సుదూరమగు వనములకు ఏకాంతవాసం కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళినట్లే భావించు. ఈ విషయమును ప్రజలకు తగు సమయంలో తెలియజేసి వారి ఆలన - పాలన నీవు చూస్తూ ఉండు.
చూడాల : పోనీ, మీరు లేని ఈ రాజ్యం నాకెందుకు? నేను కూడా మీ వెంట వనవాసానికి వస్తాను.
కాదనకండి.
శిఖిధ్వజుడు : లేదు చూడాల! నీవింకా చిన్న పిల్లవు. నీవు వనములకు వచ్చి అక్కడి దుర్భరజీవితం గడపటం ఉచితం కాదు. వనవాసమనేది పురుషులకే ఎంతో కష్టసాధ్యమైన విషయం. కఠినమైన అవయవాలు గల వారికే వనవాసం ఎంతో కష్టమనిపిస్తుంది. నీ వంటి అతి సున్నితమైన దేహం కలవారు వనవాసానికి అసలు ఏమాత్రం అర్హులే కాదు. నా మాట విని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ నీవు ఇక్కడే ఉండు. నీవు నా సహధర్మచారిణివి. అర్ధాంగివి కదా! ఇంటి యజమాని ఎటైనా వెళ్ళి నపుడు కుటుంబాన్ని నడిపించటం స్త్రీలకు గొప్ప వ్రతం అవుతుంది. నీవిక్కడే ఉండి నేను నిర్వర్తించ వలసియున్న రాజ్యపాలనను నిర్వహించు. నీ పాలనాసామర్థ్యముపై నాకు-మనప్రజలకు నూటికి నూఱుపాళ్ళు నమ్మకం ఉన్నది.
ఈ శిఖిధ్వజుడు మరింకా ఏమీ మాట్లాడకుండా, జవాబు కోసం వేచి ఉండకుండా అక్కడి నుండి లేచాడు. గబగబా రాజాంతఃపురానికి నడచి వెళ్ళాడు. చూడాలకు అవాక్కవుతూ, ఏం మాట్లాడటానికి పాలుపోక, భర్తను అనుసరించి తాను కూడా అంతఃపురంలో ప్రవేశించింది. ఇంతలో బాగా చీకటి పడింది. ఆ దంపతులిద్దరూ దైనందికమైన స్నానాదులను, సాయం సంధ్యా వందనాది కార్యములను నిర్వర్తించారు. శిఖిధ్వజుడు తనకత్యంత ప్రీతిపాత్రురాలగు చూడాల సహవాసంతో
శయనాగారమున నిదురించాడు.
❖
Page:345
అర్ధరాత్రి అయింది. పట్టణ ప్రజలంతా గాఢ నిద్రకు ఉపక్రమించటం చేత వీధులన్నీ నిర్మానుష్యమై నిశ్శబ్దమును సంతరించుకుని ఉన్నాయి. శిఖిధ్వజుడు మెల్లగా కనులు తెరిచాడు. తన గుండెపై అరచేయి ఉంచి గాఢనిద్రను అనుభవిస్తున్న చూడాల ముఖంవైపు చూచాడు. నెమ్మదిగా ఆమె చేయిని నిద్రాభంగం కాకుండా ప్రక్కకు పెట్టి శయనము నుండి లేచాడు. చిన్న నిట్టూర్పుతో మనస్సులోనే ‘శలవు’ చెప్పాడు. శయనాగారం నుండి బయటకు వచ్చాడు. అక్కడ అంతఃపురంలో సంచరించే అంగరక్షకులతో "నేను ఒంటరిగా దొంగలను, దుష్టాచారపరులను నిగ్రహించటానికి బయలుదేరుచున్నాను. మీరంతా మీమీ నియమితకార్యములలో జాగరూకతతో నిమగ్నులై ఉండండి” అని ఆజ్ఞాపించి నిస్పృహుడగు ఆ రాజు అక్కడి నుండి బయలుదేరాడు. కొద్ది దూరం నడచిన తరువాత ఒక్కసారి వెనుతిరిగి 'ఓ రాజ్యలక్ష్మీ! నీకు నమస్కరిస్తూ శలవు తీసుకుంటున్నాను' అని రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు. ఆతని కళ్ళు చెమర్చాయి. ఆప్యాయతతో అక్కడి రాజ్య పరిసరలములను కళ్ళతో చూచి ఇక ప్రయాణం కొనసాగించసాగాడు.
క్రమంగా నడచుకుంటూ అంధకార బంధురము, భయంకరము అయిన ఒక అరణ్యంలో ప్రవేశించాడు. ఆ మహారణ్యం దాటే సరికి భళ్ళున తెల్లవారింది. అక్కడి నుండి శూన్యారణ్యం వైపుగా పోవుచూ త్రోవలో గల ఒక తటాకం వద్ద సంధ్యాది క్రియలు నిర్వర్తించాడు. మరల ఒక వనం వరకు నడిచే సరికి సాయం సమయమైనది. అక్కడ సాయంసంధ్యా క్రియలు నిర్వర్తించి అక్కడ దొరికే కొన్ని పళ్ళు భుజించి అక్కడనే ఒక అనువైన ప్రదేశంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విధంగా వనాలు, దట్టమైన అడవులు, పురములు, పర్వత ప్రాంతాలు, నదీ ప్రాంతాలు దాటుతూ 12 రోజులు ప్రయాణించి మనుజులెవ్వరూ ప్రవేశించని మందర పర్వతంపై గల ఒక దుర్గమమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ క్షుద్ర జంతువులు సంచరించనట్టి ఒక అందమైన ప్రదేశం కనబడింది. అక్కడ అప్పటికప్పుడు పూలతలను ఉపయోగించి ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఆ ప్రక్కనే ఒక సెలయేరు ప్రవహిస్తూ ఆ ప్రదేశం ధ్యానాదులకు, నివసించటానికి యోగ్యమై ఉన్నది. అక్కడి అడవులలో సంచరించి వెదురు దండం. భోజనపాత్ర, పూజాపాత్ర, పుష్పాల పాత్ర, కమండలం, రుద్రాక్షమాల, చలి కాచుకోవటానికి నారతో తయారు చేసుకున్న ఒక బొంత, ఆసనం, మృగచర్మం మొదలైన వస్తువులను సంపాదించుకున్నాడు. ఆ కుటీరమును నివాసయోగ్యంగానూ, ధ్యానానుకూలం గాను అమర్చుకున్నాడు. ఇక సాధనకు ఉపక్రమించాడు.
తెల్లవారు జామున లేవటం, ప్రాతః సంధ్యాపూర్వకంగా జపం చేయటం, ఆ తరువాత చుట్టు ప్రక్కల వనములలో పూలు కోసుకొని రావటం, పూజ నిర్వర్తించటం, రాత్రిపూట ఫలములను కందమూలములను, ఇంకా, అక్కడే దొరికే సాత్వికాహారవస్తువులను సేవించటం... ఈ విధంగా ఆ పర్ణశాలలో సాధనను కొనసాగిస్తూ ఆ శిఖిధ్వజుడు చాలా రోజులు గడిపాడు. తన రాజ్యం గురించి గాని, అక్కడి తదితర రాజకీయ విశేషాల గురించి గాని, తన ప్రియురాలు చూడాల గురించి గాని అతడు స్మరించేవాడు కూడా కాదు. హృదయంలో వివేకం జనిస్తూ ఉంటే ఇక
Page:346
అల్పవిషయములగు రాజ్య సంపదల గురించి ఇళ్ళు-వాకిళ్ళ గురించి తలచుకొనే వాడెవడు, ఒక్క
మూర్ఖుడు తప్ప?
19. చూడాల - శిఖిధ్వజ పునఃదర్శనం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా మందర పర్వతారణ్యంలో శిఖిధ్వజుడు కుటీరం కట్టుకొని ఉండగా ఇక్కడ చూడాల ఏం చేస్తోందో చూద్దాం.
ఆ అర్ధరాత్రి శిఖిధ్వజుడు శయనాగారం నుండి లేచి రాణిని, రాజ్యాన్ని వదలి వెళ్ళిపోయాడు కదా! తెల్లవారుజామున చూడాలకు మెళుకువ వచ్చింది. ప్రక్కన శిఖిధ్వజుడు ఉండవలసిన చోటు శూన్యమై ఉండటం గమనించింది. ఆమె ముఖం మ్లానమైంది. హృదయములోని భేదం చేత ఆమె అందమైన ముఖం స్వేదబిందువులను వర్షించాయి. వ్యాకులత, నిరుత్సాహం పొంది కొద్ది క్షణాలు ఆ శయ్యమీదనే కూర్చుని ఇట్లు అనుకోసాగింది.
చూడాల : (తనలో) ఆహా! నా పతి నన్ను విడచి వనవాసానికి వెళ్ళినట్లే ఉన్నారే! ఈయన వెళ్లిపోవాలనుకోవటం ఎంతటి దుఃఖకరమైన విషయం! ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? నేను కూడా నా పతి ఉన్న చోటికి వెళ్ళటమే బాగుగదా! ఎందుకంటే పతియే ఏ స్త్రీకైనా శరణ్యస్థానమని శాస్త్రాలు చెప్పుచున్నాయి.
ఇట్లా ఆలోచించి ఆమె భర్తను అనుసరించటానికే నిశ్చయించుకున్నది. యోగశక్తితో శయ్య నుండి పైకి లేచింది. అణిమాదిసిద్ధులను ఉపయోగించి కిటికీ గుండా బయల్వెడలి ఆకాశమార్గాన్ని ఆశ్రయించింది. సిద్ధులకు కూడా ఆశ్చర్యం గొలిపేటట్లుగా ఆకాశమార్గంలో పరిభ్రమించుచు తన భర్త కొరకై అటూ ఇటూ సంచరించింది. ఒక కీకారణ్యంలో ఖడ్గధారి అయి శిఖిధ్వజుడు అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళుచుండటం గాంచింది. ఆకాశకోశముననే ఉండి భర్తను గమనిస్తూ ఒక్కసారి భవిష్యత్తులోకి తొంగిచూసింది. యోగబలం చేత తన భర్త ఎట్లు ఏ నిమిత్తం చేత ఏ దేశ కాలములందు ఎట్టి క్రియలచే అభ్యుదయం పొంది నిరతిశయ బ్రహ్మానందమును సంపాదించుకోబోవుచున్నాడో... అదంతా కొద్ది క్షణాల కాలంలో వీక్షించింది. భవిష్యత్తులో తన భర్త అవశ్యం పొందుబోవు దానిని సుస్పష్టంగా గమనించింది. అట్టి భవిష్యత్తుకు అనుకూలంగా ఉండటమే ఉచితమని భావించి తన గమనాన్ని ఆపింది.
“ఇప్పుడు నేను నా భర్తను సమీపించటం ఉచితం కాదు. చాలా కాలము గడచిన తరువాత మాత్రమే నేను అతనిని సమీపించగలను. ఈశ్వర నియతిని ఎవ్వరు అడ్డుకోగలరు? పైగా, ఆతని నిష్ట నా వలన కుంటుపడటం, అందుకు నేను కారణమై ఉండటం మంచిదా? కానే కాదు. నా భర్త ఆజ్ఞాపించినట్లు నెరవేర్చుట చేతనే అతనికి మరింత ప్రియార్హురాలను కాగలను కదా!”
Page:347
..ఇట్లు యోచించి చూడాల వెనుకకు మరలింది. మరల అంతఃపురంలో ప్రవేశించి శయనస్థానమున నిద్రించింది. ఆ మరునాడు రాజసభలో ప్రసంగిస్తూ 'ఓ సభికులారా! పుర ప్రముఖులారా! మన శిఖిధ్వజ మహారాజు రాజ్యరక్షణ, ప్రజా సంక్షేమం ఉద్దేశించి ప్రవాసం వెళ్ళి ఉన్నారు. వచ్చేసరికి చాలా రోజులు పట్టవచ్చని ఆజ్ఞాపించి ఉన్నారు. ఆయన వచ్చేవరకూ మనందరమూ అత్యంత జాగురూకులమై ధర్మపాలన, రాజ్యవ్యవహారాలు నిర్వర్తించాలని మహారాజు యొక్క నిర్దేశము’ ...అని ప్రకటించింది. ఇక ఆ రోజు నుండి సమదృష్టితో ప్రజాహితంగా రాజ ప్రతినిధిగా రాజకార్యాలను నిర్వర్తిస్తూ ఉండేది. ఆ శిఖిధ్వజ-చూడాల దంపతులు ఒకరు అరణ్యం లోను, రెండవవారు రాజ్యంలోను ఉండి ఆయా ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండగా రోజులు, పక్షాలు, నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి. కాల ప్రవాహం ఎవరికోసం ఆగుతుంది? ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి.
కాలం ఎంత చమత్కారమైనది! ఇది చూస్తూ-అది వింటూ ఉండగానే రోజులు-సంవత్సరాలు గడచిపోతాయి. విజ్ఞులు కాలమును ధనాదులకంటే అధికంగా సద్వినియోగ పరచుకుంటున్నారు.
అజ్ఞులో... కాలం యొక్క గతిని గమనించక ఆహార నిద్రా-మైధునాది దృశ్యవ్యాపకాలలో సమయాన్ని వెచ్చించుచు రిక్తహస్తాలు మిగిల్చుకుంటున్నారు. కాలగతిచే పదే పదే మోసగించబడు చున్నారు.
పద్దెనిమిది సంవత్సరములు గడచిపోయిన తరువాత ఒక రోజు చూడాల ఇట్లు అనుకున్నది. చూడాల : (తనలో) ఇన్ని సంవత్సరములు నా భర్త శిఖిధ్వజుడు సాధన చేసి ఉండటం చేత అతని సర్వ రాగ-ద్వేషములు అంతరించి ఉంటాయి. అప్పటికి ఆత్మతత్త్వజ్ఞాన ప్రాప్తికి అర్హమైన సమయం ఆసన్నమైనట్లే. ఇంకా అలశ్యం దేనికి?
ఆత్మకార్యం యొక్క భవితవ్యం నిర్వర్తించటానికి ఈ రోజే కార్యోన్ముఖురాలనై మందర పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న నా భర్తను సమీపిస్తాను.
ఆ రాత్రే అంతఃపురం నుండి చూడాల బయలుదేరింది. వాయుమార్గంగా పయనిస్తూ ఆ మార్గంలో తారనబడే మహానుభావులగు సిద్ధ పురుషులకు నమస్కరిస్తూ త్రోవలో మేఘమండలమును, విద్యుత్ (మెఱుపు) సమూహాలను చూచింది. అది చూచి తన భర్త ఒడిలో తాను గడిపిన మధుర క్షణములు గుర్తుకొచ్చాయి. స్త్రీ సహజమైన భర్తృ సమక్షానందనము గుర్తుకు వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ ఇట్లు అనుకున్నది.
చూడాల : (తనలో) ఈ జీవిత పర్యంతమూ ఈ ప్రాణుల స్వభావం యధాతధంగానే ఉంటుంది గాని, శమించదు కాబోలు! సింహం వంటి భుజాలతో పరమ ప్రేమాస్పదుడగు నా భర్తను త్వరగా చూడాలని నా మనస్సు ఉత్కంఠత పొందుతోందే! అనేక వివేక విషయాలచే బోధింపబడి కూడా ఈ
Page:348
నా మనస్సు శిఖిధ్వజుని సమక్షం కొరకై ఉవ్విళ్ళూరుతోంది. ఎంత నిరోధించప్రయత్నించినా నా ప్రియుని దర్శనం కొరకు వ్యాకులపడుతోంది. ఈ మెల్లని వాయువులు, ఈ చంద్రకిరణాలు, ఈ మేఘపంక్తితో కాంతులు విరజిమ్మే మెఱుపులు ఇవన్నీ నా మనస్సు యొక్క ఉత్కంఠతను ఇంకా అధికం చేస్తున్నాయి కదా!
ఓ చిత్తం యొక్క అజ్ఞాన విభాగమా! నీవింకా వ్యర్ధ ఆడంబరాలను వదలలేదా? ప్రియచిత్తమా! ఆకాశం వలె నిర్మలమైన నీ వివేకమంతా ఇప్పుడు ఏ చోటికి పోయింది? అయినా చిత్తసఖీ! ఇదీ నీ తప్పు కాదులే! నీ పతి యొక్క ప్రేమను ఎంతగానో పొందినట్టి నీవు అతని కోసం ప్రత్యుత్సాహ పడటంలో ఆశ్చర్యం ఏమున్నది? ఏది ఏమైతేనేం! నీవు నీ చాంచల్యంచే ఎట్లు ప్రవర్తించినా సాక్షి స్వరూపం - నిశ్చలం అగు నా ఆత్మ స్వరూపానికి వచ్చే లోటు ఉండదు. కదా!
ఓ ‘చూడాల’ నామంతో పిలువబడుచున్న పాంచభౌతిక స్త్రీ శరీరమా! నీవు వ్యర్థంగా ఎందుకు దేని కొరకై సముత్సాహపడుచున్నావు? ఎవని కౌగిలింతకై తత్తరపడుచున్నావో ఆ నీ ప్రియసఖుడగు శిఖిధ్వజుని దేహం ఇప్పుడు వృద్ధత్వం సంతరించుకుని ఉంటుంది కదా! పైగా 18 సంవత్సరాలు ఏకాంతంగా తపస్సు చేస్తూ ఉండటం చేత ఎంతో కృశించి ఉంటుంది. ఇక అంతటి తపస్సు ప్రభావం చేత వాసనారహితుడై ఉంటాడు. అతని మనస్సు స్త్రీని లాలించే ఉత్సాహం కలిగి ఉంటుందని ఎట్లా అనుకుంటావు?
ఎక్కడెక్కడో వర్షం కురిస్తే ఆ జలమంతా నదిలోకి ప్రవహించిన తరువాత ఏ నీరు ఎటునుంచి వచ్చిందో భేదమేమైనా నదీజలంలో అగుపిస్తుందా? నా భర్త యొక్క మునుపటి, ఇప్పటి, ముందు ముందు వాసనలన్నీ ఆత్మ కంటే భిన్నం కాదు. ఆతడిప్పుడు ఆత్మానుభవమొక్కటే లక్ష్యంగా కలిగి ఉంటాడు కదా! ఏకాంతంలో అనాసక్తుడై, ఏకాత్మరూపుడై, ఇచ్ఛారహితుడై ఉన్న నా భర్త యొక్క భౌతికమైన కరస్పర్శకు ఈ నా కరాలు ఉత్సుకత పొందటం ఒక చమత్కారమే అవుతుంది.
ఓ నా చిత్తమా! ఇప్పుడా శిఖిధ్వజుడు శుష్కించిన మహావృక్షంలాగా చిక్కిశల్యమై కనబడతాడని నేను ఊహిస్తున్నాను. అయినా కూడా నీతో బాటే నేను కూడా ఆతనిని త్వరగా చూడాలని ఉత్కంఠ పొందుచున్నాను. నేను యోగబలం చేత ఆతనిని ఆత్మజ్ఞానిగా చేస్తాను.
ఆత్మజ్ఞాని అయిన తరువాత ఆతని మనస్సును సంకల్పం వైపు కించిత్ ఉన్ముఖం చేస్తాను. అప్పుడాతనిని ఆలింగనం చేసుకుంటాను. మరల ఆతనిని రాజ్య పట్టాభిషిక్తునిగా చేసి ఇక ఈ శేష జీవితాన్ని ఇద్దరం సుఖంగా గడిపివేస్తాం. ఆహా! చాలా కాలానికి నా మనోరథం సిద్ధిస్తోంది.
అయినా, తత్త్వచింతనలో నా భర్త తక్కువ వాడా? కాదు. గొప్ప మహాసామ్రాజ్యాన్ని, అనేక విజయ పరంపరలచే లభించిన పెద్ద ధనాగారాన్ని నన్ను ... జ్ఞానసముపార్జన కొరకై ఒక్క క్షణంలో విడచి అరణ్యంలో ఏకాంత ప్రదేశం చేరిన గొప్ప జ్ఞానసంపన్నుడు. బాహ్య-అభ్యంతరములలో కూడా గొప్ప విచారణాతత్పరుడు కాబట్టే రాజ్యము యొక్క ఊసైనా ఎత్తకుండా పద్దెనిమిది ఏళ్ళు వనవాసంలోనే ఉన్నాడు. కనుక అంతటి మహనీయుడగు నా భర్తతో పునఃసమాగమం చిన్న
Page:349
విషయమెట్లా అవుతుంది? మా ఇద్దరిదీ జ్ఞానమార్గమే కదా! సమానమైన మనోవృత్తులు కలవారు ఒకరినొకరు కలియటం సమస్త సుఖముల కంటే అత్యంత అధికమైనది కదా!
ఇట్లా ఆలోచనలు చేస్తూ ఆ చూడాల తన భర్త నివసిస్తున్న పర్ణశాలను సమీపించింది. ఏకాంతంగా నివసిస్తున్న తన భర్తను అశరీరి అయి చూసింది. ఆహా! ఆతని శరీరపు తీరే మారిపోయింది కదా! ఒకప్పుడు కిరీటము, కుండలాలు, ఇంకా ఎన్నో దివ్యాభరణాలు ధరించిన శరీరం ఇప్పుడు ఎండుటాకు వలె చిక్కి శల్యమై ఉన్నది. అతడు ఇచ్ఛారహితుడై, నార వస్త్రములు ధరించి ఏకాకిగా ఉన్నాడు. ఆ వనంలో ఒకచోట కూర్చుని పూలతో మాలను కట్టుచున్న తన భర్తను చూసి ఎంతో విషాదం పొందింది. “ఆహా! అజ్ఞానంచే కలుగు మూర్ఖత్వం ఎంత భయంకరమైనది! మూర్ఖత్వం చేతనే కదా, ప్రాణులు అనేక నీచాతినీచ పరిస్థితులు పొందుచున్నారు! ఏది ఏమైతేనేం? నా భర్త రాగద్వేషాల నుండి విడివడి ఉన్నాడు కదా! ఈతని నిర్మల చిత్తంలో ఆత్మతత్త్వం చాలా తేలికగా ప్రతిఫలిస్తుంది”...అని తలచసాగింది. అగ్నిష్టోమ (అగ్ని - చంద్రధారణ) యోగాన్ని కొద్ది క్షణాలు ధ్యానం చేసింది.
20. సుఖ దుఃఖాదులన్నీ - - స్వయంకల్పిత మాత్రములే!
శ్రీ వసిష్ఠ మహర్షి : శిఖిధ్వజుడు తాను ప్రతి రోజూ పూజచేసే ఈశ్వరునికి పుష్పాలంకారం చేయాలని అందమైన ఘుమఘుమలాడే పుష్పాలతో మాల కట్టుచూ ఏదో చిన్నచప్పుడైనట్లు ఉంటే తల ఎత్తి చూచాడు. ఎదురుగా అల్లంత దూరం నుండి చిరునవ్వు చిందిస్తూ ఒక ముని బాలకుడు తాను కూర్చుని ఉన్న వైపుగా నడచి వచ్చుచుండటం గమనించాడు. బాలకుడు విభూతిరేఖలతో, మూర్తీభవించిన తపఃశక్తి వలె ఉన్నాడు. ఆతని దేహం బంగారపు ఛాయతో మెరుస్తోంది. మెడలో తెల్లని ముత్యాలహారం వ్రేలాడుతోంది. తెల్లని జందెం, పట్టు వస్త్రములు ధరించి ఉన్నాడు. రెండు చేతులలోనూ వీణ వ్రేలాడుతోంది. చేతులకు, మెడలోను రుద్రాక్షమాలలు అలంకరించుకొని ఉన్నాడు. ఆతని పాదములు నడుస్తున్నప్పుడు నేలను అంటక భూమికి జానెడు ఎత్తులో ఉన్నాయి. చెవుల కుండలాలు ధగధగాయమానంగా మెరుస్తున్నాయి. ముఖం గొప్ప తేజస్సుతో మెరుస్తోంది. గొప్ప దేహపుష్టితో కనిపిస్తున్నాడు. నుదుటిన తెల్లటి భస్మం తిలకంగా ధరించాడు. ఆ ముని బాలకుడు తనవైపే రావటం గమనించి శిఖిధ్వజుడు తటాలున లేచి నిలుచున్నాడు. “ఎవ్వరో దేవతా కుమారుడు కాబోలు, ఎందుకో ఇటు వస్తున్నాడు” అని తలచాడు. విమమ్రతతో పాదుకలను విసర్జించి రెండు
చేతులూ జోడించి ఆతనికి ఎదురేగాడు.
శిఖిధ్వజుడు : ఓ దేవరాజ కుమారా! శిఖిధ్వజ నామధేయుడగు ఈ వానప్రస్థాశ్రమవాసి మీకు వినమ్రతతో నమస్కరిస్తున్నాడు. దయచేయండి. ఈ పత్రాసనం పై సుఖాసీనులవండి. నాచే అర్పించబడుచున్న ఈ పుష్పాంజలి స్వీకరించండి.
Page:350
ముని బాలకుడు : ఓ రాజర్షీ! తమకు నమస్కారం. మీరు ప్రేమతో ఇస్తున్న పుష్పములు నాకు శిరోధార్యం. నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. మీరు కూడా సుఖాసీనులవండి. శిఖిధ్వజుడు : హే దేవపుత్రా! తమరి దర్శనముచే ఈ రోజు అత్యంత ఫలప్రదమైందని తలచుచున్నాను. ఈ అర్ఘ్యపాద్యములు స్వీకరించండి.
ఇక చెప్పండి. తమకు సర్వదా శుభమగు గాక! తమరు ఎచ్చటి నుండి ఇటువైపుగా వస్తున్నారో, తమ నామధేయాదు లేమిటో, ఏమికోరి ఇటువైపుగా దయచేసారో, మేము మీకు ఎట్టి సేవ చేయ గలమో శలవీయ ప్రార్ధన. ఈ వానప్రస్థాశ్రమ దేహి మిమ్ములను సేవించి తద్వారా మీ దర్శన భాగ్యానికి కృతజ్ఞత తెలుపటానికి సిద్ధంగా ఉన్నాడు.
ముని బాలకుడు : ఓ రాజరీ! ఈ భూతలంపై నేను అనేక ప్రదేశాలలో సంచరించటం జరిగింది. ఎక్కడా కూడా మీ నుండి పొందినంతటి అతిధి పూజాసత్కారాలు పొంది ఉండలేదు. మీరు నిష్కాముడు గాను, పాపరహితుడు గాను కనిపిస్తున్నారు. ఇంతటి వినయం గల మీరు పరమేశ్వర అనుగ్రహంచే దీర్ఘాయుష్కులయ్యెదరు గాక!
ఓ సాధూ! మొట్టమొదట మీ విషయమేమిటో చెప్పండి. సువిశాలమగు సామ్రాజ్యమును వదలి ఈ వనవాసానికి వచ్చారేమిటి? శాంతసమన్వితమగు మనస్సుతో సర్వ కోరికలు త్యజించి మోక్షం కొరకు మాత్రమే ఈ తపస్సు చేస్తున్నట్లు నాకనిపిస్తోంది. అయినా ఖడ్గధారవలె అతి కష్ట మైనది, అత్యంత సౌమ్య-శాంత చిత్తులకు మాత్రమే అర్హమైనది అయిన వానప్రస్థాశ్రమం ఇంత చిన్న వయస్సులోనే ఎందుకు స్వీకరించారు?
శిఖిధ్వజుడు : హే మహాత్మా! మీరు దేవతా స్వరూపులు గదా! అందుచేత చూడగానే అంతా గ్రహించగలగటంలో ఆశ్చర్యమేమున్నది? అవును. మీరన్నట్లు మోక్షమును సంపాదించగోరి ఈ వానప్రస్థాశ్రమం చాలా సంవత్సరాలుగా సేవిస్తున్నాను.
ఓ దేవా! మీయందు నాకు లోకోత్తరమైన శోభ కనిపిస్తోంది. గొప్ప ప్రతిభచే వెలుగొందు చున్నారు. తమ దేహం చంద్రుని యొక్క అమృతమయ కిరణాలచే నిర్మించబడినదా - అన్నట్లున్నది. తమ దర్శనంచే మనస్సు ప్రశాంతత, ఉత్తేజం, అనిర్వచనీయమైన ఆనందం పొందుచున్నాయి. మీ అవయవాలు అతి కోమలం, సుందరం అయి, నేను వదలి వచ్చిన రాజ్యాన్ని పాలిస్తున్న నా ప్రియపత్ని చూడాల దేహాన్ని గుర్తు చేస్తున్నాయి. హే మహాత్మా! శిరం నుండి పాదం వరకు పరమ శాంతం, మహారమణీయం ప్రస్ఫుటిస్తున్న మీ ఈ సుందరదేహానికి ఈ మల్లెపూల దండను కూడా సమర్పించటానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. పుష్పదళముల వలె అత్యంత కోమలంగా కనిపిస్తున్న మీ అంగాలు సూర్యరశ్మి తాకితే కందిపోతాయేమోననిపిస్తోంది. దేవపూజకై నిర్మించిన ఈ తెల్లటి పుష్ప మాల తమ దేహస్పర్శచే సాఫల్యం పొందుచున్నది.
హే మహానుభావా! మీకు తెలియని ధర్మములేమి ఉంటాయి? మనలను సమీపించిన అభ్యాగతి, ఎవ్వరైనాసరే, భగవంతునితో సమానం. అందులోనూ మీ వంటి దేవతామూర్తులు అభ్యాగతి అయి
Page:351
రావటమంటే, అది మా మానవులకు భగవంతుడు ప్రసాదించే గొప్పవరం. స్వామీ! మరల అడుగుచు న్నందుకు ఏమీ అనుకోకండేం! తాము ఎవరి పుత్రులు? ఏ నామధేయం మిమ్ములను అలంకరించి ఉన్నది? ఎక్కడి నుండి ఏ నిమిత్తం ఇటువచ్చి ఈ నా ఆశ్రమం పావనం చేస్తున్నారు?... ఈ సంశయాలు తొలగించమని వేడుకొనుచున్నాను.
ముని బాలకుడు : రాజా! ఇంతటి వినమ్రతతో అడుగుతుంటే చెప్పకుండా ఉంటానా? మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సవివరంగా సమాధానం చెప్పుచున్నాను. వినండి.
ధర్మమూర్తి అయి, భక్తి పారవశ్యంతో నారాయణ జపం చేస్తూ, భక్తులకు ప్రియదర్శనం ప్రసాదిస్తూ ఈ ముల్లోకాలలో సంచరిస్తూ ఉండే నారద మహర్షి గురించి మీరు వినే ఉంటారు కదా! శిఖిధ్వజుడు : నారదమహర్షి గురించి వినకపోవటమేమిటి? వారు మహాభక్త శిఖామణులు. అందరికీ ప్రాతఃస్మరణీయులు. ఆబాలగోపాలం వారి గురించి తెలుసు. వారు లోకకళ్యాణమూర్తులు కదా! మునిబాలకుడు : వారి కుమారుడనే నేను.
శిఖిధ్వజుడు : ఆశ్చర్యం! వారు బ్రహ్మచారులు కదా!
మునిబాలకుడు : అవును. అది లోకవిదితమే. అయితే, ఒక విశేషం చేత నేను పుత్రుడనై జనించాను. ఆ దేవర్షి ఒకానొక సమయంలో మేరు పర్వతం పైగల ఒక గుహ యందు ధ్యాననిష్ఠులై ఉన్నారు. ఆయన తపస్సు చేస్తున్న గుహకు అతి సమీపంగా విశాలమైన తరంగాలతో గంగానది ప్రవహిస్తోంది.
ఒక రోజు ధ్యానము ముగిసిన తరువాత కళ్ళు తెరుస్తూ ఉండగా ఆ మహర్షికి గంగానదీజల ప్రాంతం నుండి జలక్రీడల యొక్క గొప్ప కోలాహలం వినిపించింది. "ఆశ్చర్యంగా ఉన్నదే! ఈ జన దూరమైన ఏకాంత ప్రాంతంలో సందడిగా జలక్రీడలాడుచున్నది ఎవరై ఉంటారు?” ... అనే కుతూహలంతో ఆయన గుహ నుండి బయటకువచ్చి చూచారు. వినోదంగా నది ఒడ్డుకు వచ్చి చూడగా రంభ, తిలోత్తమ మొదలైన అప్సరసలు జలక్రీడలాడుతూ కనిపించారు. పురుషులు లేనట్టిఆ ప్రదేశంలో వివస్త్రలై వారు నగ్న సౌందర్యంతో ప్రకృతినే పరవశింపజేస్తూ స్నానమాడు చున్నారు. అంత్యంతరమణీయమైన ఆ ప్రకృతి సౌందర్యాన్ని నగ్నదేహాలతో పరవశులై జలకాలాడుతున్న సౌందర్యరాసులైన ఆ అప్సరసలను చూస్తున్న ఆ నారదమహర్షి యొక్క మనస్సు అకస్మాత్తుగా వేకరహితమైనది. ప్రమత్తత పొందింది. గ్రీష్మఋతువు యొక్క చివరిలో గాలి తాకిడికి మేఘాలు వర్షించి ఫలాలు నేలవ్రాలినట్లు ఆ మహర్షి వీర్యం స్ఖలితం అయింది. ఆతడు చ్యుతవీర్యుడైనాడు. శిఖిధ్వజుడు : మహాత్మా మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉన్నదే? మహాజ్ఞాని, జీవన్ముక్తుడు, రాగ వర్జితుడు, ఇచ్ఛారహితుడు, పూర్ణస్వభావుడు, బాహ్య అభ్యంతరాలలో నిత్యం ఆకాశస్వరూపపుడై నిర్మలంగా విస్తరించి ఉన్నవాడు కదా, ఆ నారదమహర్షి! అంతటి బ్రహ్మర్షి అప్సరసలను చూచి చ్యుతవీర్యుడు అయినాడా? ఇది ఎట్లా సాధ్యం?
అభ్యాగత బాలుడు : ఓ రాజర్షీ! ఈ మూడు లోకాలలో ఉత్పత్తి అగుచున్న సమస్త ప్రాణులకూ,
Page:352
ఆ మాటకు వస్తే... దేవతలకు కూడా... ఈ దేహ వ్యవహారమంతా స్వభావసిద్ధంగా రెండు విధాలుగా ఉంటోంది - 1. దుఃఖ స్వభావం, 2. సుఖ స్వభావం.
ఒకడు అజ్ఞాని కావచ్చు, జ్ఞాని కావచ్చు. ఈ దేహము ఉన్నంతవరకు ఇది సుఖదుఃఖమయమై ఉంటోంది. 'తృప్తి’ కలిగించే పదార్థాలు లభించినప్పుడేమో సుఖం వృద్ధి చెందుతోంది. 'ఆకలి' మొదలైన వాటిచే దుఃఖం వృద్ధి చెందుతోంది.
అట్లా అవటానికి స్వభావమే కారణం. దేహం యొక్క దేహ-ప్రకృతి స్వభావమే సుఖదుఃఖా దులు వచ్చిపడటానికి కారణమగుచున్నాయి. దేహి తన యొక్క సత్య - నిర్మల-నిత్య-అప్రమేయ దేహి స్వభావాన్ని ఒక్క క్షణం ఏమరచాడా, దేహ స్వభావం ఆతనిని క్రమ్మివేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక వర్షాకాలపు మేఘంలాగా ఆ దేహిపట్ల ఆ దృశ్యం ఉల్లాసం పొందగలదు, అందుచేత మనం నిరంతరం ఆత్మానుసంధానం చేయాలి. క్షణం - క్షణం మధ్య గల సంధిరూపమగు అతి స్వల్పకాలం కూడా ఆత్మను విస్మరించకూడదు.
స్వరూపే నిర్మలే సత్యే నిమేషమపి విస్మృతే ॥
దృశ్యముల్లాసమాప్నోతి ప్రావృషీవ పయోధరః ॥
ఆత్మను (శరీరి స్వభావాన్ని విస్మరించామా, దృశ్య పిశాచం చిత్తం నుండి ఉల్లాసం పొందుతుంది. సముద్రం వలె అన్ని శాస్త్రవిశేషాలు తన యందు కలిగి ఉన్న జ్ఞాని విషయంలోనూ అంతే. అజ్ఞాని విషయంలోనూ అంతే.
చీకటి — ' వెలుగులాగా, రాత్రి - పగలులాగా సుఖదుఃఖముల కలయికచే ఈ శరీరం స్థితి
పొంది ఉంటోంది.
'ఈ దేహాదులే నా స్వరూపం, ఆ దేహాదులు ఆతని రూపం' ఈ విధంగా దేహాదుల పట్ల ఆత్మభావమును దేహి అజ్ఞానముచే దర్శిస్తున్నాడు. ఇంకేమున్నది? సుఖ దుఃఖకారణములు రెండూ ఆతనియందు నాటుకొని ఉంటున్నాయి. తెల్లని వస్త్రమును నల్లని రంగు తాకితే, ఆ రంగు వస్త్రమును అంటుకుంటోంది. అదే ఒక స్ఫటికమును తాకితే అంటుకుంటుందా? తత్త్వజ్ఞానవశం చేత ఈ సుఖ-దుఃఖములు జ్ఞానిని స్పర్శించనైనా లేవు.
అందుచేత, ఈ జీవుడు 'కోపం-ఆవేశం-చెడువిషయాల మననం”... మొదలైన వాటిని దరిజేరనీయక పోవటమే ఉచితం. ఎందుకంటే, అవి నిర్మల మనస్సును కూడా కలుషితం చేయగలవు.
ఒక స్ఫటికమణి ఉన్నదనుకో, దాని సమీపంలో ఎరుపురంగు వస్తువేదైనా ఉంటే ఆ వస్తువు యొక్క సమీపంలో ఉన్నంత వరకూ స్ఫటికమణి కూడా ఎరుపుగా కనిపిస్తుంది. జీవన్ముక్తుని విషయం ఆ స్ఫటికమణి వంటిది కూడా కాదు. ఎందుకంటే జీవన్ముక్తుడు తన యొక్క తత్త్వజ్ఞాన కారణం చేత సుఖదుఃఖములచే కొంచం కూడా ప్రభావితం కాడు.
వస్తునః శ్లేషమాత్రేణ ఘనరంజితమేతి ధీః | గతేపి వస్తుని దృఢం బుద్ధిర్యా పరితాపితా ॥
Page:353
గతాపి కుంకుమే, వస్త్రం తదీయమనురంజనమ్
న జహాతి యధామూఢః తధా విషయ రంజనమ్ ॥
ఒక తెల్లటి రంగుగుడ్డ తీసుకొని కుంకుమజలంలో ముంచామనుకో. ఆ తెల్లటి వస్త్రం కాస్తా ఎఱ్ఱగా ఉంటుంది. ఆ తరువాత మంచినీళ్ళతో కడిగి కుంకుమను తొలగించినా ఎరుపురంగు గుడ్డను అంటియే ఉంటుంది కానీ, తొలిగిపోదు కదా! మూఢుడు వస్తువును సమీపించగానే ఆ వస్తువు యొక్క ఆకర్షణాది ప్రభావం చేత ఆతని బుద్ధి కాస్తా కలుషితమౌతోంది. ఒకవేళ ఆ వస్తువును అక్కడి నుండి తీసివేసినా, ఆ మూఢుని బుద్ధిలోని కాలుష్యం మాత్రం పోదు.
దీనిని బట్టి నీవు గమనించవలసినదేమిటి?... బంధ-మోక్షాలనేవి బుద్ధియందే వ్యవస్థితాలై ఉన్నాయి. విషయాలను దృఢంగా భావన చేయటమే 'బంధం', విషయాలను భావన చేయకపోవటమే 'మోక్షం'. ...మరల చెప్పుచున్నాను. బంధమోక్షాలు వస్తువుల ఉనికి - నాశనాలకు సంబంధించినవి కావు. “దేహం వస్తువులకు దగ్గరగా ఉన్నదా? దూరంగా ఉన్నదా?” ...అను దాని ననుసరించి బంధ-మోక్షాలు ఉండవు. బుద్ధి యొక్క విషయ భావన అభావనలే జీవుని బంధ-మోక్షాలు నిర్ణయిస్తున్నాయి.
శిఖిధ్వజుడు: ప్రభో! తమ వచనములు అతి స్వచ్ఛములై, విశాలమైన అర్థమును ప్రతిపాదిస్తున్నాయి. నెమలి మేఘాల శబ్దం ఒకసారి విన్న తరువాత ఇంకా, ఇంకా వినాలని కోరుకుంటుంది చూచారా! అట్లాగే మీరు చెప్పుచూ ఉంటే ఇంకా, ఇంకా సవిస్తారంగా వినాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. ఈ సందర్భంగా నాదొక చిన్న ప్రశ్న. ఈ పుత్రుడు, రాజ్య సంపద, ధనం, ప్రతిష్ఠలు - మొదలైన ఆయా విషయాల లాభ - - వినాశనాలు జరుగుచున్నప్పుడు ఈ జీవునకు సుఖ-దుఃఖాలు అనుభవ మవుతున్నాయి. అవన్నీ దూరంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు కూడా జీవుని క్షోభింపజేస్తున్నాయి, మరి! అట్టి సుఖ-దుఃఖాలు ఏ క్రమం చేత ఏర్పడుచున్నాయ్?
ముని బాలుడు : ఆ సుఖదుఃఖాలన్నీ ఏర్పడటానికి కారణం ఆ జీవుడు తన యొక్క అనంతమగు సాత్మతత్త్వాన్ని తెలుసుకొని ఉండకపోవటమే.
1. సమీపమున ఉన్న బాహ్య విషయములు,
2. ఈ శరీరము యొక్క నేత్ర, హస్త, స్పర్శాది ఆయా సంఘటిత విషయములు,
3. అనుమాన - ప్రమాణములచే ఆలోచింపబడే దూరస్థమైన, లేక, భవిష్యత్ సంబంధమైన అనుకూల - ప్రతికూల విషయాలు.
వీటినన్నిటినీ ఈ జీవుని యొక్క బుద్ధి స్వీకరిస్తోంది. అవిజ్ఞత కారణంగా బుద్ధియందున్న ‘సుఖ సంవిత్తు’ క్షోభ చెందుతోంది. అట్టి క్షోభ భోక్తయగు జీవుని యొక్క కుండలినీ నాడి యందు స్వయంగా ప్రకటితమౌతోంది.
ఈ జీవుని హృదయంలో ఆతని భోగానుభవం కొరకై వేరువేరు నాడులున్నాయి. అవన్నీ దేహమంతా ప్రసరించి ఉన్నాయి. ప్రాణవాయువులచే పూరితమైన ఈనాడులన్నిటిలో జీవుడు
Page:354
స్వయంగా స్ఫురించుచూ ఆక్రమించుకుని ఉన్నాడు. ఒక వృక్షము యొక్క (లేదా) ఒక లత యొక్క మూలభాగంలో నీరుపోస్తే ఆ నీరు వృక్షమంతటా (లేక లత అంతటా) రసరూపంలో ప్రవేశిస్తోంది కదా! అట్లాగే స్పర్శ మాత్రంచేత జాగృతుడైన ఈ జీవుడు కూడా సుఖ-దుఃఖానుభవాలను వెతుక్కుంటూ శరీరమంతా ప్రాణస్వరూపుడై ప్రసరించి ఉంటున్నాడు.
సుఖాదుల అనుభవము కొరకై వేరు వేరు నాడులున్నాయి. సుఖానుభవమున ప్రవృత్తుడైన జీవునకు శీఘ్రంగా 'స్వస్థత' అనుభవానికి వస్తోంది. దుఃఖానుభవమున ప్రవృత్తుడైనప్పుడో, లేక, సుఖానుభవప్రవృత్తికి నిరోధం కలిగినప్పుడో ఆ జీవుని అనుభవమునకు అస్వస్థత చేకూరుతోంది. ఒకడు 'సువాసనను ఆఘ్రాణించాలి' ... అని అనుకున్నప్పుడు ఆ జీవుని సంవిత్తు సుఖమును వెతుక్కుంటూ ముక్కులోకి వేంచేస్తోంది. అప్పుడు కర్పూర - - చందన - ధూప - పుష్పాది మార్గములు ఆ జీవుని బాహ్య ప్రపంచంలో వెతుకుచున్నాడు. ఘ్రాణము కొరకు సుఖానుభవనాడులు విస్తరిల్లి తెరుచుకుంటున్నాయి. సువాసన లభించకపోవటం దుఃఖమౌతోంది. లభించటం చేత వచ్చే స్వస్థత లేక దుఃఖరాహిత్యం 'సుఖం’ అని అనిపించుకుంటోంది. జీవుని సుఖసంవిత్తు ఘ్రాణములోనికి అసలు ప్రసరించదనుకో! అప్పుడు? ఆ జీవునికి సుఖదుఃఖాలు ఉండేవే కావు. 'సుఖం కావాలి’ అనుకోవటంతో దుఃఖం ప్రారంభమైనది. అయితే విషయ స్పర్శచే ఏర్పడే సుఖం వాస్తవమైన సుఖం కాదు. అది సంవిత్తు యొక్క ప్రతిబింబిత సుఖం మాత్రమే.
ఎంతవరకైతే ఈ జీవుడు అత్యంత చంచలమైన నాడి మార్గంలో ప్రవేశించనే ప్రవేశించడో... అనగా, అతని సంవిత్తు వృత్తులను అనుసరించదో... ఎంతవరకూ తాను ఉన్నచోటే శాంతుడై ఉంటాడో... అంతవరకూ ఆతడు 'ముక్తుడు' అని చెప్పబడుచున్నాడు.
ఎంతవరకైతే ఈ జీవుడు నాడీమార్గంలో ప్రవేశించి అక్కడ ప్రశాంతంగా ప్రసరించి ఉన్న ప్రాణవాయువులను సుఖాభిలాషచే సంక్షోభమొందించుకుంటున్నాడో, అంతవరకు ఆతడు ‘బద్ధుడు’ అని గ్రహించు.
శిఖిధ్వజుడు : అయితే ఈ జీవుని స్వస్వరూపం త్యజించి అట్టి సుఖదుఃఖానుభవము వైపుగా ప్రేరేపిస్తున్నదెవరు? దైవమా? మరింకెవరన్నానా?
ముని బాలకుడు : ఈ జీవుడు స్వయం ప్రకాశస్వరూపుడు. ఆతనిని మరెవ్వరో ఎక్కడి నుండో ప్రేరేపించటం లేదు. ఆతని ప్రేరణకు ఆతడే కారణం. విషయముల గురించిన సుఖదుఃఖాల మనన స్ఫురణచే ఆతనికి బంధం ఏర్పడుతోంది. దీనినే 'చిత్త స్పందన' అని శాస్త్రకారులు పిలుస్తున్నారు.
సుఖము యొక్క అభావనచే దుఃఖం వచ్చి చేరుతోంది. దుఃఖం యొక్క అభావనచే సుఖభావనకు చోటు లభిస్తుంది. సుఖదుఃఖములు అభావనచేతనే ఈ జీవునకు మోక్షం సిద్ధించగలుగుతుంది.
ఈ విధంగా - 1. సుఖ-దుఃఖముల సత్త బంధము, 2. ఆ రెండింటి యొక్క అభావన మోక్షము... అను రెండు నిర్దేశిత మార్గాలనూ ఆత్మశాస్త్రజ్ఞులు ఎత్తి చూపుతున్నారు.
ఈ జీవుడు సర్వదా శాంతస్వరూపుడే. అయితే ప్రజ్ఞను ఏమరచి ఇంద్రియాలు ఉపయోగిస్తు న్నప్పుడు ఏర్పడే అనురాగాదులు శాంతిని భంగపరుస్తున్నాయి. దుష్ట ఇంద్రియాలచే విషయాలకు
Page:355
సంబంధించిన సుఖదుఃఖ దశలు ఎంతవరకు ఏర్పడకుండా ఉంటాయో, అంతవరకు ఈ జీవాత్మ శాంతచిత్తంతో సౌమ్యం వహించి ఉండగలదు.
ఇక్కడ మనం నేర్చుకోవలసినదేమిటి? సుఖదుఃఖాలు తటస్థపడుచున్నప్పుడు సమస్వభావాన్ని అలవరచుకుంటూ ఉంటే, ఈ జీవుడు మోక్షార్హత సంపాదించుకోగలడు.
❖
చంద్రుని చూడగానే మూర్ఖ సముద్రం ఎక్కడ లేని ఉల్లాసం ప్రదర్శిస్తుంది చూచావా? అనేక జన్మలలోని దుష్ట అభ్యాస దురవగాహనల కారణంగా ఈ జీవుడు తనపై అజ్ఞానపు పొరలు తనకు తానే సాలె పురుగు వలె కల్పించుకుంటున్నాడు. స్వతహాగా స్వయం ప్రకాశ - స్వయంచైతన్య స్వరూపుడే అయిన ఈ జీవుడు స్వయం నిర్మిత సంస్కారాల ప్రభావం చేత సుఖవిషయాన్ని గాని, దుఃఖ విషయాన్ని గాని గాంచినపుడు అభ్యంతరమున 'ఉల్లాసం' అను చంచలత్వాన్ని పొందుచున్నాడు. పిల్లి మాంసాన్ని తలచుకుంటూ మాంసం ఎదురుగా ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా 'మ్యావ్ మ్యావ్' అంటూ సంక్షోభం చెందుతుంది చూచావా? జీవుడు కూడా సుఖాల యొక్క తత్సాధన భూతాలైన ధనాదుల యొక్క రాగంచే అనేక ఉత్సాహ - నిరుత్సాహ భావాలను తన చుట్టూ కల్పించుకొని మ్రగ్గుచున్నాడు. క్షోభిస్తున్నాడు. కారణమేమిటి? మూర్ఖత్వమే!
శిఖిధ్వజుడు : ఔను, దేవమునీ! మీరు చెప్పిందంతా పరమ సత్యం. అందుకు నాకు సాక్ష్యం (దృష్టాంతం) నేనే! మరి ఆ జీవుడు బాగుపడే మార్గమేదైనా ఉన్నదా?
ముని బాలకుడు : ఎందుకు లేదు? తప్పక ఉన్నది. స్వాత్మజ్ఞానమగు శుద్ధబోధ యొక్క అభ్యాసం చేత “సుఖ-దుఃఖాదులనేవి లేవు" అనే అనుభవస్థితి సుస్థిరమగు గాక! అట్టి సుస్థిరతచే “స్వస్వరూప చాంచల్య రాహిత్యం” అను అలౌకికమైన దారుఢ్యం ఈ జీవుడు సంపాదించుకోవటమే ఉచితం. సద్గ్రంధ పఠనం వల్ల, గురుబోధ వల్ల 'శుద్ధరూపుడనగు నా యందు ఈ సాంసారిక సుఖాలూ లేవు, దుఃఖాలూ లేవు. నేను వ్యర్ధంగా విషయసుఖాదులందు దురవగాహన, అపభ్రంశమైన నిర్వచనాలు కల్పించుకుంటున్నాను' అని గ్రహిస్తున్నాడు. ప్రబుద్ధుడై పరమశాంతిని, ‘నిర్వాణం' అని పిలుబడే మోక్షానుభవాన్ని సంపాదించుకుంటున్నాడు. 'విషయ జనితసుఖాలు అవస్తువులు' అనే అభ్యంతర జ్ఞానం చేత జీవుడిక వాటి వైపు మరలక, కేవలము శాంతుడై ఒప్పుచున్నాడు. “అంతయూ చిదాకాశమగు బ్రహ్మమే. అనగా నా వాస్తవ స్వరూపమే సర్వే సర్వత్రా వెలయుచున్నది. (మమాత్మా సర్వభూతాత్మా)” అను దృఢ నిశ్చయం తనయందు నెలకొనుచుండగా జీవబ్రహ్మైక్యభావన అనుభూత మవుతుంది. ఈ జగత్తంతా శూన్యమాత్రమే అని ఎరుగుచుండగా ఇక ఆ జీవుడు దేనికీ క్షోభ చెందడు. బ్రహ్మం తోటి ఐక్యం పొందుచుండగా ఇంక క్షోభకు, విభ్రమానికి అవసరమేమిటి? అవకాశమెక్కడ?
“నేనే ప్రథమ సృష్టియందు కల్పితుడనైనట్టి హిరణ్యగర్భుడను. సర్వమునకు అంతర్యామిని. సర్వజీవాత్మల రూపంలో ఈ సంసారవనంలో లీలగా పచార్లు చేస్తున్నాను” అని గ్రహిస్తున్నాడు. ప్రియరాజర్షీ! ఇక్కడ తారసపడుచున్న ప్రతిజీవుడు స్వకీయకల్పన చేతనే స్వయంగా బంధ
Page:356
మోక్షాల మార్గములను కల్పించుకుని అందులో అనువర్తిస్తున్నాడు. తత్త్వబోధచే ముక్తుడగుచున్నాడు. ఇక్కడ గాని, మరెక్కడగాని ఇంతకుమించి మరే విశేషం లేదు.
శిఖధ్వజుడు: ఓ దేవపుత్రా! మీ వివరణ నాకు తృప్తిని కలుగజేసింది. అయితే మరొక్క చిన్నవిషయం కూడా వివరించండి. సుఖసంచార యోగ్యములైన ఆయా నాడులందు ఈ జీవుడు ఎప్పుడు ప్రవేశి స్తున్నాడు? అప్పుడాతని యొక్క వీర్యపతనం ఎట్లా అగుచున్నది?
మునిబాలకుడు : మహారాజు తన సేనలను యుద్ధసమయంలో ఆయా పనులందు చెల్లాచెదురుగా నియమిస్తాడు చూచావా? అట్లాగే స్త్రీ యొక్క స్వరూపాన్ని చూచినప్పుడు తన యొక్క రాగవాసనలచే ఉద్బోధితుడై ఈ జీవుడు స్వభావవశం చేత మౌనంగా తన దేహమంతా ఆక్రమించి ఉన్న ప్రాణ వాయువులను క్షోభితములుగా చేసివేస్తున్నాడు. ఆ సమయంలో ప్రాణవాయువు యొక్క చేష్టచేత మేధస్సు నందలి - మజ్జ యందలి సారం తన యొక్క సుగంధయుక్తమైన రజం లేక సూక్ష్మాంశాన్ని త్యజించుచున్నది. అట్లా బయలుదేరిన ఆ రజం (Minute Particles) నాడి ద్వారా అధోభాగం నుండి శుక్రరూపంలో స్వభావవశం చేత బయటకు పోవుచున్నది.
శిఖిధ్వజుడు : ఓ దేవపుత్రా! మీరు ఆత్మజ్ఞులు. ఈ జగతిస్థితి యొక్క పూర్వాపరాలు ఎరిగి ఉన్న వారు. మీ వచనాలు వింటూ ఉంటే మీరు పరమజ్ఞానులని తెలియవస్తోంది. ఇప్పుడు మీరు 'స్వభావవశం చేత' అనే శబ్దం ప్రయోగించారు. 'స్వభావం' అంటే ఏమిటి?
ముని బాలకుడు : సృష్ట్యాదియందు హిరణ్యగర్భుడు ప్రాణుల కర్మలను అనుసరించి ఆయా జీవుల యొక్క ఏ ధర్మములు తనయందు స్ఫురింపజేసియున్నాడో ఇప్పుడూ కూడా ఆయా పదార్థములు, ప్రాణులు అవే ధర్మములు కలిగి ఉండి ఈ జగత్ ప్రదర్శనకు రచనలుగా ఉండి ఉంటున్నాయి. దీనినే శాస్త్రములు 'స్వభావము' అని పిలుస్తున్నాయి. జలంలో బుద్బుదములు పుట్టి నశిస్తున్నట్లు, కాకతాళీయ న్యాయం చేతను ఘణాక్షర న్యాయం వలె (ఒక చెట్టు యొక్క కాండంపై మసిపురుగు భాష గానీ, అక్షరాలు గానీ ఏమీ తెలియకపోయినా ఏదో అక్షరాన్ని తొలచటం) ఇదంతా కూడా మాయయే. అగ్ని ఉష్ణంగానూ, జలము శీతలంగానూ... ఈ విధంగా, సృష్ట్యాదిగా ఏ పదార్థం ఏ ధర్మములతో కూడి ఉన్నదో దానినే పండితులు 'స్వభావం' అంటున్నారు.
పంచభూతములను ఆయా మిశ్రమంగా ఆయా ధర్మముల వైపుగా ప్రేరేపించుచున్న దెవరు? ఏదో ఒకానొక ప్రజ్ఞయే అయి ఉండాలి కదా! ఆ సమష్టి ప్రజ్ఞనే హిరణ్యగర్భుడు, సమష్టి తత్త్వము, సమష్టి జీవుడు, స్వభావము మొదలైన సంజ్ఞలతో పిలుస్తున్నారు.
స్వభావ కారణం చేతనే ఈ జగత్తు మహావృద్ధిని పొందటం, ఇందులో పలువిధ వికారయుక్తా లగు దేహాలు ప్రాణవాయు సమన్వితమై పరిభ్రమించటం జరుగుతోంది. ఇందులో గల కొన్ని దేహాలు వాసనాక్షయముచే జ్ఞానయుక్తములై మరల ఈ వాసనామయ ప్రపంచంలోకి తిరిగి ప్రవేశించటం లేదు. ఇక మరికొన్ని అజ్ఞాన దేహములైతే ఈ ప్రపంచంలోకి వస్తున్నాయి, పోతున్నాయి. పునః ప్రవేశం చేస్తున్నాయి. (ఇక్కడ దేహం ... అనగా దేహి అనే అర్థం అన్వయించుకోవాలి)
Page:357
21. స్పటిక ఘటంలో జననం
ముని కుమారుడు: ఓ మహారాజా! ఈ జగత్తంతా కూడా ఆత్మ యొక్క ఒకానొక చిత్కళా స్వభావవశం చేత ఉత్పన్నమౌతోంది. వాసనల చేత స్థితి పొందుతోంది. ధర్మాధర్మవశం చేత వెలయుచున్నది. ఎప్పుడైతే వాసనలు క్షయిస్తాయో ఇక ఆపై జీవుడు ధర్మాధర్మములందు తగుల్కొనటం ఉండదు. కాబట్టి ఈ సంసారం మరల ఏర్పడి ఉండదు. ఇక్కడ అనుభవమయ్యేదంతా 'మాయానుభవమే’ అని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను.
శిఖిధ్వజుడు : చాలా చక్కగా ప్రవచించారు. ఓ మహావక్తా! మీరు చెప్పుచున్న మాటలన్నీ కూడా అత్యంత ఉదారంగాను, గొప్ప అర్థాలతో కూడుకొనినవి గాను, అనుభవయోగ్యమైనవి గాను, నిగూఢాలు గాను, పరమార్థ సాధకాలుగాను, నాకు అనిపిస్తున్నాయి. మీ వాక్య వైభవాన్ని వింటున్నప్పుడు అత్యంత తృప్తి, శాంతి కలుగుతున్నాయి. మీ జన్మ వృత్తాంతం సంక్షిప్తంగా చెప్ప ప్రార్థన. ఆ
తరువాత ఆత్మజ్ఞానపూరితమైన తమ ప్రవచనాన్ని అవకాశమున్నంత విస్తారంగా వినాలని నాకున్నది.
బ్రహ్మదేవుని పుత్రుడైన నారదమహర్షి తన వీర్యమును ఎక్కడ, ఏ విధంగా స్థాపన చేశారు? మునికుమారుడు : అప్సరసలను వినోదంతో చూచిన ఆ మహర్షి స్ఖలనానంతరం వెంటనే మనస్సును తిరిగి యథాప్రకారం తన బుద్ధితో వివేక విశుద్ధ సమన్వితం చేశారు.
అంతటి తపశ్శాలి, మహర్షి యొక్క వీర్యము మహత్తర తేజోమయమై ఉంటుంది కదా! అందుచేత ఆయన అక్కడికి దగ్గిరలో కనబడిన స్ఫటిక నిర్మితమై, ప్రకాశమానమైన ఒక ఘటంలో స్థాపన కావించారు. స్వసంకల్పంతో క్షీరమును సృష్టించి ఆ ఘటములో నింపారు. సర్వదా లోకకళ్యాణకారకులగు ఆ మహర్షి ఆ ఘటమును తాను తపస్సు చేసే గుహలోనికి తీసుకువెళ్ళి అగ్ని కార్యములతోను, మంత్రోచ్చారణతోను అతి పవిత్రం చేశారు. ఒక మాసము కాలంలో ఆ ఘటములోని వీర్యము వృద్ధి చెందింది. మాసం గడచిపోగానే ఆ ఘటం లోంచి పరిపూర్ణమయిన అవయవాలతో శోభిస్తున్న ఒక బాలుడు బహిర్గతుడైనాడు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగు చుండగా, నారదమహర్షి జాతకకర్మ, ఉపనయనం మొదలైన సంస్కారాలను నిర్వహించారు. తన వద్ద గల మహత్తర విద్యావైభవమంతా ఆ బాలునికి ప్రసాదించారు. అచిరకాలంలోనే ఆతనిని తనంతటి విద్యాపారంగతునిగా తీర్చిదిద్దారు. ఒక రోజు ఆ మహర్షి ఆ బాలుణ్ణి తన తండ్రి బ్రహ్మ దేవుని దగ్గరకు తీసుకువెళ్ళారు. తనకు భక్తి పారవశ్యంగా సాష్టాంగదండప్రమాణాలు సమర్పిస్తున్న మనుమణ్ణి చూచి బ్రహ్మదేవుడు ఆ బాలకుణ్ణి వేద-వేదాంత విద్యలలో కొద్దిసేపు పరీక్ష చేశారు. ఆ తరువాత తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆతనిని ఆశీర్వాద మాత్రం చేత సర్వజ్ఞునిగా, జ్ఞానసాగరునిగా తీర్చిదిద్దారు. అప్పుడు 'కుంభుడు' అని నామకరణం చేశారు.
ఆ “కుంభుడు” అనబడు నారదపుత్రుడు, బ్రహ్మదేవుని మనుమడు మరెవరో కాదు... నేనే! నేను, నా తండ్రి బ్రహ్మ లోకంలోనే కలసి ఉంటున్నాం. ఇక తదితర బంధువుల విషయమేమిటంటారా?
Page:358
సాధన - ఆరాధనలచే నాకు గాయత్రీదేవి పినతల్లి అవుతుంది. సరస్వతీదేవి నాకు తల్లి. నాలుగు వేదములు నేను ఆడుకునే క్రీడాస్థలం. ఇక నేను చేసే పనేమిటంటారా? లీలా నిర్మిత స్వరూపుడను, పరిపూర్ణుణ్ణి అయి ఉండటంచే నేను నిర్వర్తించవలసిన కార్యమంటూ ఎక్కడా ఏదీ లేదు. ఏ నిమిత్తం లేకపోయినప్పటికి నేను బ్రహ్మాండాలన్నీ స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాను. భూమిపై సంచరించా లని అనుకున్నప్పుడు ఇటు కూడా వస్తూ వుంటాను. నేను భూమిపై సంచరిస్తున్నప్పుడు నా ఈ పాదాలు నేలను తాకవు. ఈ భూమి యొక్క ధూళిరేణువులు నా అంగాలను స్పృశించవు. ఈ శరీరం గ్లాని పొందటమంటూ ఉండదు. ఈ రోజు ఎప్పుడూలాగానే ఆకాశమార్గంలో పోతున్నాను. ఇక్కడ మీరు కనిపించారు. దైవేచ్ఛానుసారం మీతో సంభాషించాలని అనిపించింది. ఇక, ఇక్కడికి వచ్చాను. ఇదీ నా చరిత్ర.
ఓ రాజర్షీ! మిమ్ము ఆకాశంలోంచి చూచాను. వనవాసముచే చిత్తశుద్ధిని సంపాదించినారని గ్రహించి సంతోషమనిపించింది. ఉత్తములైన మీవంటివారితో ప్రశ్న-సమాధానాలు నిర్వర్తించటం నాకు ఒక చక్కటి అవకాశమని, జ్ఞాన విశేషముల పరస్పర సంభాషణం మానవులలో కనిపించే ప్రియసమాగమము వలె ఒక మాధుర్యమైన విశేషమని నా అభిప్రాయం.
ఇట్లు కుంభమహర్షి చెప్పిన వాక్యములతో ఈ 17వ రోజు సంవాదము ఇక్కడ ముగించారు. శాంతి వచనాలు ప్రవచించబడ్డాయి. సభికులంతా గొంతులు కలిపి “జ్ఞానం సర్వదా పరిఢవిల్లు గాక! లోకములు సుఖ — ఐశ్వర్య ఆనంద - పరస్పరానూకూల్యములతో ఉత్తమ సంపద సమన్వితమగు గాక!" - అను అర్థమును ప్రవచించే వేదవాక్యాలు వల్లించారు. సభ
చాలించబడింది.
(పదిహేడవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:359
పద్దెనిమిదవవ రోజు
22. క్రియ - - జ్ఞానములు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నిన్నటి రోజు మనం చెప్పుకుంటున్న కుంభమహర్షి శిఖిధ్వజ సంవాదమును, తదనంతర కథా విశేషాలను కొనసాగిద్దాం.
శిఖిధ్వజుడు : ఓ దేవపుత్రా! కుంభర్షీ! జన్మజరామృత్యురూపమగు ఈ సంసారమున చిక్కుకునిఉన్న నేను ఎప్పుడో, ఏ జన్మలోనో మహత్తరమైన పుణ్యకార్యములు చేసి ఉంటాను. అందుకు ప్రయోజనంగా ఈ రోజు ఆకాశంలో ప్రయాణిస్తున్న మీకు నన్ను చూసి నాతో కొంత సమయం సంభాషించాలని అనిపించి ఉంటుంది. హే మహాత్మా! నేనిప్పుడు భాగ్యవంతులలో కెల్లా గొప్ప భాగ్యవంతుడినని అనుకుంటున్నాను. ఎందుకంటారేమో? అమృతప్రవాహం వంటి మీరు చెప్పే మాటలు, మీ తోటి సాంగత్యము ఏమైనా చిన్న విషయాలా? తమ వంటి మహనీయులతో ఏర్పడే సమాగమం ఈ చిత్తమును ప్రశాంతపరచినట్లుగా రాజ్యలాభం, చక్రవర్తిత్వము మొదలైనవి కలిగించగలవా? లేనేలేదనునది ఘంటాపథం. మీ వంటి సాధువులతో సమాగమం వలన నా వంటి సామాన్యునికి కూడా రాగద్వేషరాహిత్యరూపమగు అపరిచ్ఛిన్న బ్రహ్మానందం లభించగలదు. రాజ్యలాభం మొదలైన కల్పితమాత్రమైన తుచ్ఛసుఖములెక్కడ? మీ సామీప్యతలో ఏర్పడగల ఆత్మానుభవ లాభం ఎక్కడ? ఈ రెండింటికీ కొంచం కూడా పోలిక లేదు.
కుంభర్షి : (శిఖిధ్వజుని వాక్య ప్రవాహమును కించిత్ నిరోధిస్తూ) అదంతా అట్లా ఉండనివ్వండి. నేను నా జన్మ వృత్తాంతమంతా చెప్పాను కదా! ఇప్పుడిక మీ విషయం గురించి చెప్పండి. హే సాధూ! మీరు ఈ పర్వతంపై ఇంతకాలంగా ఏం చేస్తున్నారు? ఏమి సాధించగోరి దుర్భరమైన ఈ ఏకాంత వనవాసాన్ని ఇంత సుదీర్ఘకాలంగా నిర్వర్తిస్తున్నారు? ఇంకా ఎంతకాలం ఈ వనవాసం కొనసాగించాలనుకుంటున్నారు?... మీ వంటి మహాత్ములగు తాపసులు అసత్యం పలుకటమన్నది ఎరుగరు కదా! అందుచేత ఇందుకు అసలైన కారణాలేమిటో వివరించండి.
శిఖిధ్వజుడు : ఓ కుంభమహర్షీ! మీరు సర్వజ్ఞులు. సర్వలోక వృత్తాంతముల యథాస్థితి అంతా ఎరిగియున్నవారు. ఇక మీ దగ్గిర దాయగలిగినది ఏముంటుంది? చెపుతాను. నేనేమీ చెప్పకుండగానే అంతా గ్రహించగలిగినట్టి మహత్తర శక్తి సంపన్నులు మీరు. అయినా అడిగారు కాబట్టి ఉన్నదున్నట్లు అంతా వివరిస్తాను స్వామీ!
ఈ సంసారమును చూచి భీతిల్లినవాడనై నేనీ వనవాసం చేస్తున్నాను. నా పేరు శిఖిధ్వజుడు. మాళవదేశపు రాజును. ‘ఉజ్జయిని' అను పేరుగల రాజధానిని, మాళవదేశ సంపదను త్యజించాను.
Page:360
జనన-జరా-మరణ వృత్తాంతములతో భయమును గొలిపే సంసారవ్యవహారమును గమనించి భీతిల్లినవాడనై దీనిని ఎట్లాగైనా జయించాలని 18 సంవత్సరాలుగా ఈ ఏకాంత వనవాసం ఆశ్రయించాను.
సుఖం పునః పునః దుఃఖం, పునర్మరణ-జన్మనీ । భవతస్తేన తప్యేహం, తత్తజ్ఞ! వనవీథీషు ॥
హే తత్త్వజ్ఞా! ఇక్కడంతా ఉన్నదేమిటి? ఇంతలోనే దుఃఖం, ఇంతలోనే సుఖం! ఇంతలోనే జన్మ, ఇంతలోనే మృత్యువు. ఇకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి గాని వీటికి అంతెక్కడు న్నది? ఇదంతా గమనించిన నేను ఈ సంసారచక్రం నుండి విడివడాలని ఉద్దేశించి వనవాసాన్ని ఆశ్రయించాను. ఇన్నేళ్ళు గడిచాయి. అనేక దిక్కులలో సంచరించాను. ఉగ్రమైన తపస్సు కూడా చేశాను. ఏం లాభం? నా మనస్సుకు కొంచెం కూడా విశ్రాంతి లభించనే లేదు. నా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటం లేదు. ఇంతవరకూ ఏ ఫలితమూ కనబడటం లేదు. ఏ అసంపూర్ణత్వంతో ఈ వనవాసం ప్రారంభించానో... అది ఇంకా కొనసాగుచూనే ఉన్నది. కీటకములచే భక్షించబడే వృక్షంలాగా నిస్సహాయుడనై నేనీ ఏకాంతవనంలో శుష్కిస్తూ ఏం చేయాలో పాలుబోక ఇక్కడే ఇట్లా ఇంకా రోజులు గడపుచున్నాను. సుదీర్ఘమైన తపఃధ్యానాది ఆయా క్రియలను బాగా ఆచరిస్తూనే ఉన్నాను. అయినా కూడా ఫలితం కనబడటం లేదు. ఒక దుఃఖంలోంచి ఇంకొక దుఃఖంలోకి పయనించటమే నా పనిగా అవుతోంది. అమృతతుల్యంగా చెప్పబడే వేదోక్తకర్మలతో గూడిన ఉపాసన నాకు విశ్రాంతి కలిగించకపోవటం చేత నాకు క్రమంగా విషమువలెనే అనిపిస్తోంది? మహర్షీ! నా గురించిన ముఖ్యమైన వివరాలు ఇవి. ఇక తదితర వివరాలు పెద్దగా చెప్పుకోవలసినవేమీ కావు. కుంభమహర్షి : ఓ రాజర్షీ! ఒకసారి పితామహులగు బ్రహ్మదేవునికి ఒక ప్రశ్నవిన్నవించాను. 'తాతగారూ! 1. జ్ఞానము, 2.క్రియ ఈ రెండిటిలో ఏది శ్రేయోదాయకమైనది? దానికి భగవంతుడగు బ్రహ్మదేవుడు ఆశ్రితవాత్సల్యంతో ఇట్లా సమాధానమిచ్చారు.
బ్రహ్మదేవుడు :
జ్ఞానం హి పరమం శ్రేయః కైవల్యం తేనవేత్త్యలమ్ కాలాతివాహనాయైవా వినోదాయోదితా క్రియా||
వత్సా! కుంభా! నీ కింకా సందేహం దేనికి? జ్ఞానమే పరమశ్రేయమైనది. జ్ఞానం చేతనే ఈ జీవుడు మోక్షార్హుడై పూర్ణానుభవాన్ని సంతరించు కుంటున్నాడు. ఇక క్రియల విషయ మేమంటావా? క్రియలన్నీ జ్ఞానం యొక్క అర్హత సంపాదించుకోవటానికి చెప్పబడ్డాయి. లేదా, కేవలం స్వర్గాది భోగాల వినోదం కొరకు, కాలయాపన కొరకు చెప్పబడ్డాయి. అయితే ... ఇక్కడొక విశేషమున్నది.
అలబ్ధజ్ఞానదృష్టినాం క్రియా అత్ర పరాయణమ్ |
యస్య నాస్తి అంబరం పట్టం కంబలం కిం త్యజత్య సౌ ॥
Page:361
ఒకడికి ఇంకా పట్టువస్త్రాలు లభించలేదనుకో. ఉన్న గుడ్డలు, కంబళి తీసిపారవేయడు కదా! ఎవరికి ఇంకా జ్ఞానం లభించలేదో అట్టివారికి క్రియలే (సాధనా కార్యక్రమములే) ఆశ్రయమై ఉన్నాయి. అందుకొరకే శాస్త్రములు క్రియాక్రమములను (పూజ-ధ్యానము అష్టాంగయోగాలుదేవాలయాలు-వ్రతాలు-తీర్థాలు మొ॥) రచించి సాధనపరులకు అందజేస్తున్నాయి.
ప్రతిక్రియకు కొన్ని ప్రయోజనాలుంటాయి. ఆ ప్రయోజనాలు మరికొన్ని క్రియల ఆవశ్యకతను కలిగిస్తూ ఉంటాయి. ఈ క్రియా ప్రయోజనముల వ్యవహారమునకు అంతు ఉన్నట్లు కనబడదు. నేను (కుంభమహర్షి) : తాతగారూ! మీరు చెప్పేది విషయాన్ని మరింత జటిలం చేస్తోందే! క్రియలు తప్పవంటున్నారు. ఆ క్రియల ప్రయోజనములు మరికొన్ని క్రియలకు ఆవశ్యకతను కల్పిస్తాయంటు న్నారు. ఇదంతా... పెద్ద చిక్కు వచ్చి పడుతోంది కదా!
బ్రహ్మదేవుడు : ప్రియ మనుమడా! కుంభా! గాభరాపడకు. ఇక్కడ మరొక విషయం. నీవు గమనించు. అజ్ఞాని వాసనాయుక్తుడై ఉండటం చేత అతని సమస్త క్రియలు ఫలయుక్తములౌతున్నాయి. వాసనలు క్షయిస్తూ ఉండగా జ్ఞానియొక్క సమస్త క్రియలు ఫలరహితములుగా ఉండిపోతున్నాయి.
నీళ్ళు పీల్చనప్పుడు ఫలసహితమైన లత కూడా నిష్ఫలత్వం (ఫలములను పొందకపోవటం) పొందుతుందే! అట్లాగే వాసనల అభావం జ్ఞాన సముపార్జితుని ఫల ప్రదాలగు క్రియలు కూడా నిష్పలత్వం పొందుతాయి. శరద్రుతువు వచ్చిన తరువాత ఇక వర్షాకాలపు మేఘాలు మిగలవు కదా!
వాసన యొక్క నాశనంచే క్రియల యొక్క ఫలదీకరణం కూడా నశించగలదు. రెల్లు తీగకు స్వభావసిద్ధంగానే ఫలాలు కాయనట్లు, వాసనారహితమగు క్రియ ఫలాన్ని ఇవ్వదు.
సయక్షవాసనో బాలో యక్షం పశ్యతి, నా న్యథా | సదుఃఖవాసనో మూడో దుఃఖం పశ్యతి నా న్యథా ||
భూతప్రేతాలకు సంబంధించిన వాసనలు కలిగి ఉన్న బాలునికి చీకట్లో భూతప్రేతాలు తాండవ మాడుచున్నట్లు కనిపిస్తాయి. అదే, అట్టి వాసనయే లేని మరొక బాలుడికో? అక్కడ చీకటి మాత్రమే కనిపి స్తుంది. సుఖదుఃఖాలకు సంబంధించిన వాసనలు కలిగి ఉన్న జీవునికి మాత్రమే సుఖదుఃఖాలు అనుభవ మవుతాయి. అటువంటి వాసనలు అంతరంగంలో లేనివానికి సుఖం ఉండదు. దుఃఖం ఉండదు.
గొప్ప ఆకారం కలిగిన ఒక శుభక్రియ గాని, అశుభక్రియ గాని జ్ఞానికి ఏ ఫలం కలుగజేయలేదు. వాస్తవానికి అహంకారాదుల రూపంగా కనబడే ఈ 'వాసన' అనేది ఒక వస్తువే కాదు. అది అజ్ఞానం యొక్క అభ్యాసం మాత్రమే. అది వస్తుతః మిథ్య మాత్రమే. ఎడారిలో ఎండమావుల మహా సముద్రం ఎట్లా ఉదయిస్తోంది? ఆ చూచేవాడి అసత్యమైన అవగాహన చేతనే కదా! అట్లాగే వాసనలు, క్రియల పట్ల ఏర్పడే ఫలాభిలాష అజ్ఞానం చేతనే ఏర్పడుచున్నాయి. తెలివిగలవాడికి ఎడారిలో జల తరంగాలు కనిపించనట్లు (ఎండమావులే గాని జలం కాదని గ్రహించునట్లు)... “అంతయూ సర్వదా బ్రహ్మమే కదా!”...అను భావనచే ఎవని అజ్ఞానం నశిస్తూ ఉంటుందో, అట్టివాని యందు వాసన ఉదయించదు. వాసనలను పరిత్యజించాడా... ఇక ఆ జీవునికి జరామరణ వర్జితమైన పునర్జన్మానుమానరహితమైన పరమపదము ప్రాప్తిస్తోంది.
Page:362
ఓ కుంభా! అసలు మనస్సుయొక్క రూపం ఏమిటి? వాసనాసహితమగు మననమే మనస్సు యొక్క స్వరూపం. వాసనారహితమైన మనస్సు జ్ఞానరూపమే అవుతుంది. జ్ఞానవస్తువు ప్రాప్తిస్తుంది. అట్టి జీవునకు, “నేను దేహంతో పుట్టుచున్నాను. దేహంతో నశిస్తున్నాను. మరల మరొక దేహంతో పుట్టువాడను” ...అను రూపంలో ఉండే పునర్జన్మ యొక్క భ్రమ ఉండదు.
కుంభమహర్షి : చూచారా శిఖిధ్వజా! బ్రహ్మదేవుడు మొదలైన మహాత్ములంతా 'జ్ఞానమే పరమ శ్రేయోదాయకము' అని నిర్ద్వంద్వంగా ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు కదా! మీరు అజ్ఞానివలె ఇక్కడ ఏవేవో క్రియా వ్యవహారములు కల్పించుకొని కాలక్షేపం చేస్తున్నారేమిటి? "ఇది నా దండము. అది నా కమండలం. ఇవి నా రుద్రాక్షలు. ఇది నా ఆసనం” ఇటువంటి తపోరూపాలైన అనర్థ విలాసాలతో క్రీడిస్తూ రోజులకు రోజులు గడిపివేస్తున్నారే?
కో_హం? కథమిదం జాతం? కథం శామ్యతి? చేతి భోః, రాజన్! ఆవేక్షసే కస్మాత్? కిమజ్ఞ ఇవ తిష్ఠసి?
“కథం బంధః? కథం మోక్షః?” ఇతి ప్రశ్నాన్ ఉదాహరన్ పారావారవిదాన్ పాదాన్ కస్మాత్, రాజన్! న సేవసే?
నేనెవరు?... ఈ ప్రపంచం ఎట్లా ఉత్పన్నమై ఉంటోంది?... ఇది ఏ ప్రకారంగా శ్రమిస్తుంది? ... ఇటువంటి విషయాలను విచారణ చేయకుండా అజ్ఞానివలె ఏవేవో క్రియా వ్యవహారములకు పరిమితులై సంవత్సరాలు జరిగి పోతుంటే చూస్తూ ఊరుకొని ఉంటున్నారేం?
అసలీ బంధం అనేది ఎట్లా కలుగుతోంది? మోక్షం ఏ సమాచారం వల్ల సంపాదించుకోవచ్చు? ఇటువంటి ప్రశ్నలను అఖండ వాక్యార్థాలను వదలి ఊరకే క్రియలు నిర్వహించి ఊరుకుంటే లాభ మేముంటుంది?... అఖండ వాక్యార్థం అయినట్టి ఆత్మపదాన్ని ఎఱిగిన మహనీయులెందరో ఈభూమిపై ఉన్నారు కదా! వారి పాదాలను ఆశ్రయించి, శరణువేడి వారి దగ్గర ఆత్మజ్ఞానం సంపాదించుకోకుండా ఇక్కడ కూర్చుని రోజులు వృథా చేసుకుంటున్నారేమిటి? ఈ తపోకార్యమంతా బహిర్ముఖ వృత్తి రూపమని, శ్రమాదులచే దుఃఖప్రదమని ఇంకా మీరు గమనించనే లేదా? కొండ రాయిపై పురుగు సంచరిస్తున్నట్లు మీరు అమూల్యమైన జీవితాన్ని ఇక్కడ కూర్చుని నశింపజేసు కుంటున్నారే?
అందుచేత సమదృష్టి గల సాధువులకై వెతకి వారిని సమీపించండి. వారిని సేవించి, సంతోషింప జేసి అప్పుడు మీరు చక్కగా ప్రశ్నించి సమాచారం సంపాదించుకోవాలి. వారి సాంగత్యం చేతనే జ్ఞానం, యుక్తి (ఉపాయం లభిస్తున్నాయి. అద్దానిచే జీవుడు ముక్తిని సంపాదించుకుంటున్నాడు. ఆ సాధువులు తమ అనుభవాల సారాన్ని ప్రసాదిస్తూ అండగా వారి లాగానే అభ్యాస - వివేకాల ద్వారా క్లేశదాయకాలగు ఈ బహిర్ముఖ వృత్తులను నిరోధించి అంతర్ముఖుడవు కావాలి. ఆహారం కొరకై నేలపై అటూ-ఇటూ సంచరించే కీటకమునకు త్వరితంగా ఆహారం లభించినట్లు మీరు కోరుకున్న జ్ఞానం అప్పుడు లభిస్తుంది. కొండరాయిపై ఉన్న కీటకంలాగా ఇక్కడ ఒంటరిగా ఎన్ని సంవత్సరాలుంటే ఏమి లాభం?
Page:363
శిఖిధ్వజుడు : (నీళ్ళు నిండిన కళ్ళతో) ఓ కుంభమహర్షీ! ఇంతకాలానికి నేను ఈ రోజు తమ వాక్యాలచే బోధితుడనగుచున్నాను. ఆహా! నా అజ్ఞానంచే జ్ఞాన పురుషుల సాంగత్యం వదలి ఈ మహారణ్యంలో ఏకాంతవాసినై ఆయుష్షు అను అవకాశాన్ని వృథా చేసుకుంటున్నానని గ్రహిస్తున్నాను. అమ్మయ్య! నా పాపమంతా ఇప్పటికి శమించినదని నా కనిపిస్తోంది. ఎందుకంటే బ్రహ్మలోక నివాసులు, సాక్షాత్తు నారదమహర్షి పుత్రులగు మీ వంటి మహాత్ములు నా దగ్గిరకు దయచేసి నాకు జ్ఞానామృతం ప్రసాదిస్తూ పునీతుణ్ణి చేస్తున్నారు.
హే దేవపుత్రా! మీరే నా గురువులు. మీరే నా తండ్రి, మిత్రులు కూడా! నేను తమ శిష్యుణ్ణి. మహానుభావా! తమ పాదపద్మాలకు సాష్టాంగదండ ప్రణామాలు సమర్పిస్తున్న నాపై దయ చూపండి.
ఎద్దానినైతే మీరు సర్వము కంటే శ్రేష్ఠమని అనుకుంటున్నారో, ఏది ఎరిగిన తరువాత ఇక నాకు శోక-మోహాలు ఉండవో, దేనిచే నేను సుఖస్వరూపుడనై విశ్రాంతి పొందగలుగుతానో... అట్టి బ్రహ్మం యొక్క ఉపదేశాన్ని నాకు శీఘ్రంగా ప్రసాదించమని వేడుకొనుచున్నాను. 'జ్ఞానం' ప్రసాదించే చర్చ - పాఠ్యాంశాలలో మట్టి కుండ, దూది-వస్త్రం మొదలైన దృష్టాంతాలు, వెలుగు
- వెలిగించబడునది, జీవాత్మ - పరమాత్మల సమన్వయం మొదలైన అనేక మార్గాలు ఉన్నాయి.
వాటన్నిటిలో ఏది ఉత్తమ మార్గమని మీరనుకుంటే ఆ మార్గంలో నాకు బోధించండి. సంసార దుఃఖాలను ధరింపజేయునట్టి, దాని నుండి ఉద్దరింపజేసే జ్ఞాన విభాగాలను నాకు బోధించమని సవినయుడనై అర్థిస్తున్నాను.
కుంభమహర్షి : ఓ రాజర్షీ ! నా వాక్యాలపై మీకు శ్రద్ధ ఉంటే మంచిదే. మీ ప్రశ్నలన్నిటికి నాకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పటానికి సంతోషంగా సిద్ధంగా ఉన్నాను. అయితే శ్రద్ధ లేక పోతే మాత్రం కొండరాయికి ఎదురుగా కాకి కావు కావు మన్నట్లు నా వాక్యములు వ్యర్థములవుతాయి. కాబట్టి జ్ఞానోపదేశం చేయకపోవటమే ఉచితమవుతుంది. ఏదో వినోదం కోసమో, కాలక్షేపం కోసమో, “ఇది కాదు అది కాదు” అని కేవలం సిద్ధాంత తిరస్కారోద్దేశం తోనో, (లేక) “కొంత విని, తరువాత చూసుకుందా లేఁ!” ఇటువంటి అర్ధ ఆశయాలతోనో సంభాషించాలనుకునే వారికి వక్త యొక్క వాక్కు, ఉద్దేశం అనర్థమై... బయల్వెడలి నిష్ప్రయోజనమౌతాయి. చీకటిగా ఉన్నచోట నేత్రమునకున్న చూచేశక్తి ఎందుకు పనికివస్తుంది? "చూడకూడదు లేఁ!”... అనుకునే వాడి ముందు కాంతి ప్రసరింపజేసి ఏం ప్రయోజనం?”
శిఖిధ్వజుడు : మహాత్మా! మీరు చెప్పే బోధ విషయాలను, మీరు ఎన్నుకునే బోధమార్గాలను వేద వచనాల వలె - ఏ పూర్వాపర చర్చలు ఇప్పటికి లేకుండా - యథాతథంగా స్వీకరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కుంభమహర్షి : తండ్రి చెప్పినది పిల్లవాడు “ఎందుకూ?”. అని ప్రశ్నించకుండా గ్రహిస్తాడు చూచారా? అట్లాగే మీరు కూడా కొంత సమయం వాక్యాల అర్థం శ్రద్ధగా గ్రహించండి. “అంతా విన్న తరువాత ఇది నాకు శ్రేయస్సును కలుగజేస్తుంది" అని ఇప్పటికి భావించండి. హేతువును త్యజించి చెవులకు
Page:364
ఇంపుగా ఉండే పాటలాగా నా వాక్యాలకు వినండి. మన ఈ సంభాషణలో మీ చరిత్రనే దృష్టంగా చేసి చెప్పుతాను. మనం చెప్పకోబోయే ఆయా కథా విశేషాలు, చర్చనీయాంశాలు, బోధనా విధానాలు మంద మతులకు కూడా బోధజనకాలై ఉండగలుగు గాక! ఇక బుద్ధిమంతుల గురించి వేరే చెప్పేదేమున్నది? మన ఈ సంభాషణా సారాంశం సంసారభయం నుండి ఎవరినైనా దాటించ గలదుగాక! ఇక మనం బోధనా విషయంలో ప్రవేశిస్తున్నాం, జాగరూకుడవై, అప్రమత్తుడవై విను!
23. మణి సాధకుడు - గాజుమణి
-
కుంభమహర్షి : ఓ శిఖిధ్వజ మహారాజా! ఒక కథా ప్రసంగంతో మన ఈ బోధ ప్రారంభిద్దాంఒక ఊళ్ళో నాకు ఒక గొప్ప ధనికుడున్నాడు. ఆతని ఇల్లు ఇటు సంపదతోనూ, అటు ఉదార గుణములతోనూ ప్రసిద్ధమై ఉన్నది. అనేక కళలందు ఆతడు నేర్పరి. అస్త్ర విద్యయందు కూడా నిపుణుడు. వ్యవహారదక్షత కలవాడు. అన్నీ బాగున్నాయి కానీ, 'పరమాత్మపదము' గురించి ఆతను తగినంతగా పట్టించుకోలేదు. ఆలోచించనూ లేదు.
ఒకసారి ఆతనికి ‘ప్రపంచంలో అన్నిటికన్నా మహత్తరమైన వస్తువేదైనా సంపాదించాలి' అని అనుకున్నాడు. 'అటువంటి వస్తువు ఏదై ఉన్నది?' అని అనేక మందిని సంప్రదించాడు. ఎవ్వరో సర్వపదార్థ స్వభావాలనూ ఎరిగిన పండితులు, “అటువంటి వస్తువు ఒకటి ఉన్నది. దాని పేరు చింతామణి. అది ఎవరి దగ్గర ఉంటే వారు ఎప్పుడు ఏది కోరుకుంటే అది తక్షణం లభించగలదు. అయితే దానిని సంపాదించటం అంత సులువైన విషయం కాదు. అనేక జన్మల సుకృతఫల భాగ్యంగా అది లభించవలసిందే. కొందరికి అది ఈ జన్మంతా ప్రయత్నించినా లభించదు. కానీ, ఈ జన్మలో చేసిన ప్రయత్నం చేత వచ్చే జన్మలో, లేక రేండు, మూడు జన్మల తరువాతో కొద్ది ప్రయత్నానికే లభిస్తుంది. ఇక మరికొందరికి కొన్ని జన్మలుగా చేసిన ప్రయత్నం చేత ఈ జన్మలో త్వరగా లభిస్తుంది” ... అని శాస్త్రనిక్షిప్తమైన వివరణ ఇచ్చారు.
ఇక ఆ ధనికుడు ఎట్లాగైనా సరే ఆ చింతామణిని సంపాదించి ప్రపంచంలోని కోటీశ్వరు లందరిలోకి ప్రప్రథముణ్ణవాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రజ్ఞులు శాస్త్రాల నుండి చదివి విశదీకరించిన మార్గాలలో చింతామణి కొరకై ధ్యానం-పూజ-నిష్ఠ - మంత్రోచ్చారణ ఉపవాసాదులు ప్రారంభించాడు. సుదీర్ఘకాలం (అనగా, కొన్ని సంవత్సరాలు) ప్రయత్నం కొనసాగించటానికి కావలసిన పదార్థ పరిసరాలన్నీ ఒనగూర్చుకుని ఇక అత్యంత పట్టుదలతో 'చింతామణి' యొక్క ఆరాధన ప్రతి రోజూ అనేక గంటలు నిర్వర్తిస్తూ ఉండేవాడు.
ఇరవై రోజులు గడిచాయి. ఇరవ ఒక్కటవ రోజున మధ్యాహ్నధ్యానం 'పూజ’ నిర్వర్తిస్తూండగా దేదీప్యమానమై, కాంతిపుంజములను నాలుగు దిక్కులకూ వెదజల్లుతూ, ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ, చూపరుల హృదయంలో ఉత్సాహ ఐశ్వర్యాన్ని నింపివేస్తూ చింతామణి ప్రత్యక్షమైంది.
Page:365
ఆ ధనికుడు మూసిన తన కళ్ళపైబడ్డ కాంతి పుంజాలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. తనకు చేయి చాపితే అందేంత దూరంలో గాలిలో నిరాలంబంగా ప్రకాశిస్తూ ఆ చింతామణి కనిపించింది. ఇక చేతులతో దానిని పట్టుకొని సొంతం చేసుకోవటమే తరువాయి. మన ధనికుడు పరమానంద పడిపోయాడు. మంత్రోచ్చారణ ఆపి ఆ చింతామణిని చూచి ఇక దానిని సొంతం చేసుకోవాలని కూర్చున్న చోటి నుండి లేచాడు.
శిఖిధ్వజుడు : ఓ దేవర్షీ! ఆతనికి అంత సులభంగా చింతామణి లభించిందా?
కుంభమహర్షి : ఇందులో ఆశ్చర్యమేమున్నది? ప్రయత్నాన్ని బట్టే కదా, ప్రయోజనం!
తస్య యత్నేన మహతా కాలేన అధ్యవసాయినః
సిద్ధశ్చిన్తామణి కిం వాన సిద్ధతి ఉద్యతాత్మనామ్?
ప్రయత్నశీలుడై ఉండటం చేత ఆతని ఏకాగ్రత - - పట్టుదలల ఫలితంగా ఇరవై ఒక్క రోజులలోనే చింతామణి లభించింది. ఒక్క చింతామణి ఏమిటయ్యా? ఈ మానవుడు ప్రయత్నశీలుడు కావాలే గాని, సాధింపలేని దంటూ ఏది ఉంటుంది?
ప్రవృత్తిమ్ ఉద్యమం ప్రజ్ఞాం ప్రయుంక్తే ఛేద భేదవాన్ అకించనో పి శక్తిత్వం సమవాప్నోతి అవిఘ్నతః॥
ఎవ్వడైతే ప్రజ్ఞ (తెలివితేటలు) ఆశ్రయించి ఖేదరహితుడై ప్రయత్నంనందు ప్రవృత్తుడై ఉంటాడో... అట్టివాడు కొంచెం శక్తితోనే నిర్విఘ్నంగా అనుకున్నది సాధించి తీరుతాడు. త్వరగా కూడా సాధిస్తాడు.
సరే! ఆ ధనికుడు గాలిలో వ్రేలాడుచు ప్రశాంతకాంతి వీచికలు వెదజల్లుచున్న ఆ మణికి ఇంకొంచెం దగ్గిరగా అడుగులు వేసి, ఆ మణిని చూస్తూనే ఒక్కసారి ఆగిపోయాడు. అతని మనస్సులో ఒక సంశయం మొలకెత్తి మహావృక్షంగా రూపం పొందసాగింది. ఏదైనా శీఘ్రంగా లభిస్తుంటే 'ఇందులో ఏదో తిరకాసు ఉన్నది' అనే అనుమానం కలగటం జనులలో పరిపాటియే కదా!
అంతవరకూ అతనిలో ఏర్పడిన ఆశ్చర్య- ఆనందాల మధ్యగా విషాదంతో కూడిన అనుమానం చోటు చేసుకున్నది.
ఆ ధనికుడు : ఏమిటి? ఇది చింతామణే? దీని రూపం, తేజస్సు చూస్తుంటే మంత్రశాస్త్రంలో చెప్పిన చింతామణికి సరిపోతోంది. కానీ...! నా బొంద! సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తే కూడా చింతామణి లభించటం కష్టసాధ్యమని పండితులు అనగా విన్నానే! ఇరవై రోజులలో చింతామణి ప్రత్యక్షం కావటమా? అదీ... నాకు? లాభం లేదు. ఇది కనుక చింతామణి అయితే నాకు ఇంత త్వరగా ప్రత్యక్షం అయ్యేదే కాదు. కచ్చితంగా ఇది చింతామణి కాదు. పోనీ దీనిని తాకి చూద్దామా? తాకగానే ఇది మాయమైపోతుంది కదా! మంత్రశాస్త్రంలో కొన్ని మాయా చింతామణులు (చింతామణి కాకపోయినా చింతామణివలె కనిపించేవి) ఉంటాయని చెప్పారు కదా! ఇంత స్వల్ప ప్రయత్నంతో చింతామణి లభించటమనేది కల్ల. జీవితాంతంగా చేసే మహా ప్రయత్నం చేత మాత్రమే అది లభిస్తుందని ఎందరో అనగా విన్నాను కదా!
Page:366
ఆ! ఇప్పుడు తెలిసిపోయింది. నేను లోభిని. నా లోభకారణం భ్రాంతి చేత నా సంకుచితమైన కళ్ళకు ఈ కల్పితమైన రత్నం కనబడుతోంది. ఇది మణియే కాదు. ఇదేదో నా ఊహమాత్రమే. సర్వ సిద్దులు ప్రసాదించగలిగే మణి అనే భాగ్యం అంత తేలికగా అబ్బేది కాదు. అల్పకాలంలో కూడా చింతామణి వంటి గొప్ప ఐశ్వర్యం పొందగలిగేవారు ఎక్కడో కొందరు ఉంటారు. వాళ్ళంతా గొప్ప తపశ్శక్తి గల మహాభాగ్యశీలురు. నాలాంటి ఒక సామాన్యమైన మానవునికి అది ఇంత స్వల్పకాలంలో ఇంత తేలికగా లభించే ప్రసక్తే లేదు. పది రోజులు ప్రయాణిస్తే గాని కనబడని కాశీ పది నిమిషాలు నడిచేసరికి కనబడిందంటే అది కాశీ కాదు. ప్రక్క ఊరు మాత్రమే.
ఇట్లా ఆలోచిస్తూ ఆ ధనికుడు కళ్ళు మూసుకుని తిరిగి రెండడుగులు వెనక్కివేసి యథాస్థానంలో కూర్చుని రుద్రాక్షమాలతో చింతామణి గురించి జపం కొనసాగించాడు.
న యదా యేన లబ్ధవ్యం న తత్రాప్నోత్యసౌ తదా చిన్తామణిరవాప్తో2పి దుర్ధియా హేలయోజితః
ఎప్పుడు ఎవరికి ఏది లభ్యం కాతగి ఉండదో, అప్పుడాతడు అది పొందడని ఇందుకే అంటారు కాబోలు. ఆతడు చింతామణిని పొందాడు. కాని తన అల్పబుద్ధిచే నిరాదరించాడు. చాలాసేపు వేచి ఉండి ఆ చింతామణి, సాధకుడు స్వీకరించక పోవటం చేత ఎటో వెళ్ళిపోయింది. ఎందుచేతనంటే ఎవరు సిద్ధులను ఆదరించకుండా ఉంటారో వారిని ఆ సిద్ధులు విడచి వెళ్ళిపోతాయని మంత్రశాస్త్ర సిద్ధాంతం. సిద్ధులు వస్తున్నప్పుడు అవి ఆ సాధకుని విచక్షణకు పటుత్వం కలుగజేస్తాయి. అవి విడచి వెళ్ళుచున్నప్పుడు ఆత్మజ్ఞానరహితులగు సాధకుల విచక్షణా జ్ఞానాన్ని కూడా తమవెంట తాయి.
ఆ ధనికుడు చింతామణి యొక్క సిద్ధికై మరల తన ప్రయత్నం కొనసాగించాడు. మరికొంతకాలం గడచింది. ఒకరోజు పరిహాసకులు, వంచకులు అగు కొందరు ఆకాశ సిద్ధులు ఒక గాజుతో నిర్మిత మైన మణి ఆకారాన్ని ఆతని ఎదురుగా గాలిలో వ్రేలాడగట్టారు. మన ధనికుడు కళ్ళు తెరచి ఆ గాజు వస్తువును చూచి, 'అమ్మయ్య! ఇదీ, చింతామణి' అని తలచి పరుగున పోయి దానిని చేతి లోకి తీసుకున్నాడు. మహదానందపడ్డాడు. దానిని భద్రంగా దాచుకుని ఇక అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చాడు. అజ్ఞానంచే మోహితుడైనవాడు త్రాడును చూచి పామనుకోవటం, స్థలాన్ని చూచి జలం అనుకోవటం, ఒక చంద్రుని చూచి రెండు చంద్రులనుకోవటం, అమృతం చూచి మృతమను కోవటం, మృతమును చూచి అమృతమనుకోవటం మామూలే కదా!
ఆతడు ఇంటికి చేరిన తరువాత ఆ మణిని ఎవరికీ కనబడకుండా దాచుకున్నాడు. 'చింతామణి లభించిన తరువాత సమస్తం ప్రాప్తించినట్లే కదా! ఇక నేను ఎక్కడికైనా దూరప్రాంతం వెళ్ళి అక్కడ గొప్ప భవనాలను, సేవకులను, సుఖమయమగు వస్తువులను సృష్టించుకొని ఆనందంగా ఉంటాను'... అని తలచాడు. ఆతనికి ఆతని ఇల్లు, అందులో ఆయా వస్తువులు చాల అల్పమైనవిగా కనిపించాయి. వాటినన్నిటిన వాళ్ళకి వీళ్లకీ ఇచ్చివేశాడు. 'ఈ దేశంలో ఏం సుఖమున్నది? ఇదంతా పాపులచే ఆవరించబడింది. ఈ పాత ఇంటితో నాకేంపని? మా బంధువులలో నన్ను చూచి ఏడ్చేవాళ్ళే గాని
Page:367
ఒక్కడు మంచివాడు లేడు. దూరప్రాంతానికి పోయి సంపదలు కలవాడినై ఇష్టమున్నన్ని సంవత్సరాలు హాయిగా ఉంటాను'... అని అనుకున్నాడు. ఉన్న ఊరును, బంధువులను, ఇంటిని వదిలేసి ఒక్క చింతామణిని మాత్రం తీసుకుని ఇక బయలుదేరాడు. సుదూర ప్రాంతంలోని ఒక అడవిలో ఒక చెట్టు క్రింద కూర్చుని ఇక ఆ గాజుమణిని బయటకు తీశాడు. ఎదురుగా పెట్టి "ఓ చింతామణిగారూ! ఇక్కడ నాకొక నగరం కావాలి. ఆ నగరంలో నాకు సర్వసేవలు చేయటానికి అందమైన స్త్రీలు, విహరించటానికి ఉద్యానవనాలూ, తినటానికి ప్రపంచంలో మరెక్కడా దొరకని మధురపదార్థాలూ ఉండాలి. మా అంతఃపురపు గోడలు ఖరీదైన నవరత్నాలచే పొదగబడి ఉండాలి...” ఇట్లా కళ్ళు మూసుకొని వర్ణిస్తూ పోతున్నాడు. “ఆహా! ఇప్పుడు నేను గొప్ప సింహాసనంపై అధిష్ఠించి ఉంటాను. ప్రపంచంలో మరెక్కడా లేని అతి సౌందర్యవతులగు స్త్రీలు నాకు వింజామరలు వీస్తూ ఉంటారు. ఇక కళ్ళు తెరుస్తాను” ...అని నెమ్మదిగా కళ్ళుతెరిచాడు. కానీ ఏం లాభం! తాను ఆ అడవిలో చెట్టు క్రిందనే ఉన్నాడు. శరీరంపై అందమైన వస్త్రాలు, ఆభరణాలు ఉన్నాయేమోనని చూచుకున్నాడు. ఏమీ లేదు. చిరిగిన బట్టలు, ఆకలి, దాహం, ఎదురుగా గాజుమణి, అడవి - ఇవన్నీ యథాతథంగా ఉన్నాయి. "ఏమిటిరా ఇదీ?” అని అనుకుంటూ ఉండగా ... ఇంతలో నరమాంసం మరిగి అత్యంత ఆకలితో ఉన్న ఒక పులి తనకు అతి దగ్గరగా గాండ్రించటం మాత్రం వినిపించింది.
ఓ శిఖిధ్వజా! ఈ మనుజుడు మూర్ఖత్వం కారణంగా తెచ్చిపెట్టుకునే ఆపదలు, దుఃఖాలు వార్ధక్య - మరణాల వలన కూడా రావు. మానవుని నెత్తిమీద నల్లటి జుట్టు ఉన్నట్లు ప్రపంచంలోని ఆపదలన్నీ మూర్ఖుని నెత్తిమీదే నృత్యం చేస్తూ ఉంటాయి.
24. తప్పించుకుని కూడా మరల చిక్కిన ఏనుగు కుంభమహర్షి : ఇప్పుడు నీకు ధనికుని వృత్తాంతం చెప్పాను కదా! ఇటువంటిదే ఇంకొక వృత్తాంతం చెబుతాను. ఇది ఒక ఏనుగు యొక్క కథ.
కొంతకాలం క్రితం వింధ్యపర్వత ప్రాంతపు అడవులలో ఒక గొప్ప ఏనుగు సంచరిస్తూండేది. దాని రెండు పొడవైన దంతాలు తెల్లగా ప్రకాశిస్తూ చాలా బలంగా ఉండేది. అది తలచుకుంటే మహా వృక్షాలను సైతం కూకటివేళ్ళతో సహా తన దంతములతో పెకలించి వేయగలదు. అది యథేచ్ఛగా అక్కడి అడవులలో సంచరిస్తూ సుఖంగా కాలం గడుపుతోంది.
కొందరు జీవులు ‘అన్ని రోజులు మనవే' అనుకుంటూ రోజులు గడుపుతూ గర్విస్తూ, హూంకరిస్తూ ఉంటారు. ఈ లోగా ఏవేవో కష్టాలు వచ్చిపడుతూ ఉంటాయి. అట్లాగే... ఆ ఏనుగుకు కూడా ఒకసారి ఒక కష్టం వచ్చి పడింది.
ఒక మావటి వాడు అందమైన, పెద్దకాయం గల ఆ ఏనుగును ఎట్లాగైనా సరే బంధించి రాజుగారికి బహుమతిగా ఇచ్చి డబ్బును, హోదాను సంపాదించుకోవాలని యోచించాడు. కొద్దిరోజులు
Page:368
ఆ ఏనుగు సంచరించే అడవులలోని ఆనుపానులన్నీ కనిపెట్టాడు. రకరకాల ఉపాయాలతో, ఎట్లాగై తేనేం, ఆ ఏనుగును ఒక పెద్ద వృక్షం క్రింద గొలుసులతో బంధించాడు. ఇక ఆ ఏనుగును రాజ్యానికి తోలుకు పోవటానికి కావలసిన అంకుశం, మోకు త్రాళ్ళు తేవటానికి గూడెం వెళ్ళాడు.
రెండురోజులు గడచిపోయాయి. మూడవరోజు మావటివాడు పరికరాలన్నీ మూట కట్టుకుని ఏనుగును బంధించిన ప్రదేశం చేరేసరికి చాలా చీకటి పడింది. తెల్లవారి ఏనుగును రాజనగరానికి తీసుకుపోవచ్చునని యోచించి ఆ రాత్రి ఆ మహావృక్షం మీద వసతి చేసుకుని నడుంవాల్చాడు. బాగా కునుకు పట్టింది.
ఇక ఆ ఏనుగు మూడురోజులుగా గొలుసులతో బంధించబడి ఉండటం చేత చాలా వ్యధ చెందింది. దానిలో కసి పెరిగింది. తన ఓపికనంతా కూడదీసుకుని గొలుసులను త్రెంచటానికి ప్రయత్నించసాగింది. మావటివాడికి నిద్రపట్టడం చేత ఇది గమనించటం లేదు. ఒక్కొక్క గొలుసే తెగిపోవటం ప్రారంభమైనది. సరిగ్గా తెలతెల్లవారుతుండగా చివరిగొలుసు కూడా పుటుక్కున తెగిపోయింది. అదే క్షణంలో మరొక చమత్కారమైన సంఘటన జరిగింది.
మహావృక్షముపై నిదురిస్తున్న మావటివాడు నిద్రమత్తులో ఉండి ఒళ్ళు తెలియని స్థితిలో డుబుక్కున ఏనుగు మీదకు ... ఏనుగు మీదనుంచి నేలమీదకు పడ్డాడు. ఆతడు ఏనుగు పాదాల దగ్గర పడటం జరిగింది. తను మూడు రోజులుగా పడిన బాధంతా గుర్తుకు వచ్చి ఆ ఏనుగు కోపంగా పాదం ఎత్తింది. పాదం కనుక మావటి వాని పొట్టమీద ఉంచి నలిపితే ఆ మావటివాడు బొమికలు కూడా మిగలకుండా సుజ్జునుజ్జు అయ్యేవాడే! కానీ తన పాదం మావటి వాని పొట్టను తాకుచుండగా ఆ ఏనుగుకు మావటివానిపై ఏదో జాలి కలిగింది.
ఏనుగు (తనలో) : నా కాళ్ళ దగ్గిర పడిన ఈ మావటి వానిని ఒక్క క్షణంలో మాంసపు ముద్దగా మార్చి వేయగలను. నన్ను మూడు రోజులు బాధించిన ఈతడు అంతటి శిక్షకు అర్హుడే. వీడికి నేను ఏ హానీ చేయకపోయినా నన్ను గొలుసులతో కట్టి పడేసి ఉంచాడు. ఏమైతేనేం? నిద్రమత్తులో నా కాళ్ళ దగ్గిర పడిన వీడిని చంపటం ఏం ఉచితం? ఇక దుర్మార్గుడగు వీడికీ నాకూ తేడా ఏమున్నది? వీడు మనిషి అయి కూడా అజ్ఞానిగా ఉన్నాడు. మూడు రోజులు నన్ను ఈ మహావృక్షానికి గొలుసులతో కట్టి ఉంచాడు, జంతువునైనప్పటికీ నాకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయని, ఆహార-పానీయాలు లేకపోతే కష్టపడతాననీ వాడు గుర్తించనేలేదు. నేను జంతువునే కావచ్చు. వీడి కన్నా ఉత్తమజ్ఞానం కలిగి ఉండటమే గొప్ప. అప్పుడు లోకం నన్ను మెచ్చుకుంటుంది. లేదంటే లోకం నన్ను కూడా నీచునిగా జమ కట్టుతుంది. వీడు చస్తే, అమాయకులగు వీడి భార్య - పిల్లలు పోషించే వారు లేక యాతనలు పొందుతారు కదా! పోనీలే. వీడి కర్మానికి వీడిని వదిలేద్దాంలే.
తం పురః పతితం దృష్ట్వా మత్తేభః కరుణాం యయౌ |
స్ఫురత్స్ఫారగుణాః సన్తః సన్తి తిర్యగతావపి ॥
ఒక ఏనుగు తనను కష్టాలు పాలు చేసినప్పటికీ, తోటి జీవియగు ఆ మావటి వాని పట్ల
Page:369
ఎంతటి కరుణ ప్రకటించిందో! విశాలమైన గుణములు, దృక్పథములు గల మహాత్ములు జంతు దేహములలో కూడా ఉన్నారు.
ఆ విధంగా ఏనుగు మావటి వాని పొట్టపై నుండి తన పాదాన్ని ఉపసంహరించింది. వడి వడిగా యథేచ్ఛగా అడవులలో ప్రవేశించింది.
ఆ ఏనుగు అట్లా వెళ్ళగానే మావటివాడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. క్రింద పడిన పాటుకు దిమ్మరిల్లిన అతని శరీరము, బుద్ధి కొద్దిసేపట్లో స్వస్థత పొందాయి. నెమ్మదిగా మామూలు మనిషి అయ్యాడు. నిందిత కార్యములు ఆచరించే వారికి బలం త్వరగా వృద్ధి చెందుతుందని అంటారు, ఇదే కాబోలు! ఇక ఆతడు ఇట్లా అనుకున్నాడు.
"ఆరి నాయనోయ్! కొద్దిగా ఏనుగు కాలేసి ఉంటే చచ్చేవాడిని! ఎందుకో నన్ను చంపలేదు. ఏం ఏనుగురా ఇది? దీనికి పోయే కాలంరాను! గొలుసులనే తెంచుకున్నదే! దొరికినట్లే దొరికి తప్పించుకున్నది. దీని మొహాన ఇంత పెట్టుబడి పెట్టి ఈ చాంతాళ్ళు పరికరాలు తెచ్చి సొమ్మంతా నాశనం చేసుకున్నాను. తీరా చూస్తే ఈ ఛండాలపు ఏనుగు తప్పించుకున్నది. సరే! దీనిని నేను వదలుతానా? దీని అంతు చూడాల్సిందే! ఇంతకీ ఇది ఉండేదెక్కడో గమనించి ఇంకేదైనా ఉపాయంతో దీనిని పట్టుకుని తీరాలి. దీనిని బంధించిన తరువాతే ఇంటికి పోయేది!”
ఆ దుష్టుడు ప్రాణం దక్కింది కదా అని కొంచం కూడా అనుకోవటం లేదు. పైగా ఆ ఏనుగును అపశబ్దములతో దూషిస్తూ ఇక బయలుదేరాడు. దుష్టులు సాత్వికుల క్షమాగుణం చూచి కసిని పెంచుకుంటారే తప్ప, మంచిని మంచిగా గుర్తించలేరు కాబోలు!
ఆ మావటి వాడు కొద్ది రోజులకు ఏనుగు విశ్రమించే చోటు కనిపెట్టేశాడు. ఆ ఏనుగుకు కనబడకుండా లతల వెనుక దాక్కుంటూ, ఇక ఆ ఏనుగు నడిచే బాటలో తను తెచ్చుకున్న పలుగు, పాఱలతో ఒక పెద్ద కందకం త్రవ్వాడు. ఆ కందకం పైకి కన్పించకుండా పూలతీగలతో కప్పి పలచగా మట్టి కప్పాడు.
మరునాడు ఉదయం ఆ ఏనుగు లేచి అడుగులు వేస్తూ ఆ కందకంలోకి పడిపోయింది. ఇక ఆ కందకంలోనే నిస్సహాయంగా అటూ ఇటూ తిరగసాగింది. మావటివాడు “దీని శిఖతరగా! దొరికిందిరా!” అని అనుకుంటూ ఆ ఏనుగును మరల గొలుసులతో బంధించాడు.
ఆ ఏనుగు ఇప్పటికీ ఆ కందకంలోనే చిక్కి ఉన్నది.
చూచావా శిఖిధ్వజా! మొదలే గనుక ఆ ఏనుగు మావటి వానిని చంపి ఉంటే ఇప్పుడీ దుర్దశ పట్టేదా? కాదు. కందకంలో చిక్కేది కాదు. గొలుసులచే బంధింపబడేది కాదు.
ఆ వింధ్యాచలగజేంద్రునిలాగానే వర్తమాన క్రియలలో మూర్ఖత్వముతో తలమునకలై ఉంటున్న ఈ జీవుడు రాబోయే కాలంలో వచ్చే విషయాలను గమనించటమే లేదాయే! “గొలుసుల బంధాన్ని
Page:370
త్రెంచుకున్నాను కదా! ఇంక నాకేం?” ...అని ఏనుగు అనుకున్నదే గాని, “ఈ మావటివాడు నన్ను వదలుతాడా? మరల బంధించటానికి యత్నిస్తాడేమో?” ... అనే అనుమానమే దానికి రాలేదు. దూరాలోచన లేకుండా మూర్ఖత్వం వహించి ఉండటం చేతనే ఆ ఏనుగుకు ఆ గతి పట్టింది కదా!
మౌర్ఖ్యం హి బన్ధనమేవేహి పరం, మహాత్మన్! బద్దో, న బద్ధ ఇతి చేతసి తద్విముక్యైః ॥ ఆత్మోదయం త్రిజగదాత్మమయం సమస్తం మౌర్థ్యేస్థితస్య సహసా నను సర్వభూమిః ||
ఓ శిఖిధ్వజ మహారాజా! మూర్ఖత్వమే జీవునకు పరమబంధమని గ్రహించు. “నేను బద్ధుడను. ఇంక ఇంతే! ఇంతకుమించి ఏమీ ఎవరూ చేయగలిగింది లేదు” అను రూపం గల ఒకానొక పరమ మూర్ఖత్వాన్ని ఈతడు వహించి ఉంటున్నాడు. ఈతని స్వరూపం సర్వదా ఆత్మయే కదా! బంధం ఎక్కడి నుండి వస్తుంది? “నేను దేహ బద్ధుడను. మనో బద్ధుడను” అని మూర్ఖంగా ఇక ఎవరు ఎంత చెప్పినా వినకుండా, అనుకోవటమే బంధం. "నేను బద్ధుడను కాను. ఆత్మ స్వరూపుడనగు నేను దేనిచే ఎట్లు బంధింపబడతాను?” ...అని భావన చేయటమే ముక్తి. కాబట్టి రాజా! ఈ సర్వం ఆత్మచే నిండి ఉన్నదని, ఇక్కడి త్రివిధ (ఆధిభౌతిక - ఆధిదైవిక - ఆధ్యాత్మిక) బంధనాలతో కూడి సమస్త జగత్తు తదితర సమస్తమూ, ఆత్మయేనని గ్రహించు. ఆత్మ విషయాలన్నిటికీ అతీతమైనదై ఉండగా విషయాలు అద్దానిని ఎట్లా బంధిస్తాయి?
శిఖిధ్వజుడు : మరి దుఃఖమునకు కారణం?
కుంభమహర్షి : సర్వ బంధములకు, తత్ఫలితమైన దుఃఖములకు బీజక్షేత్రం మూర్ఖత్వము వహించి ఉండటమేనని గ్రహించవలసినదిగా నా మనవి.
శిఖిధ్వజుడు : మహర్షీ! ఇప్పుడు మీరు 'మణిసాధకుడు, వింధ్యాచల గజేంద్రుడు’ అని రెండు కథలు చెప్పారు. వాటిని ఏదో తాత్పర్యాన్ని ఉద్దేశించి చెప్పి ఉంటారు. అది ఏమిటో వివరించి చెప్పండి. కుంభమహర్షి : ఇప్పుడు నీ చిత్తఫలకంపై రెండు విచిత్రమైన కథా చిత్రాలు చిత్రించాను కదా! ఇప్పుడా రెండు రేఖాచిత్రములు వ్యాఖ్యానమేమిటో చెప్పుచున్నాను. సావధానంగా విను.
25. ఒక బంధం నుండి మరొక బంధంలోకి
కుంభమహర్షి : ఇప్పుడు రత్నసాధకుని గురించి విచారిద్దాం. శాస్త్రములందు కుశలుడు, కానీ తత్త్వ జ్ఞానం ఎరుగని వాడు అగు ఆ రత్నసాధకుడు మరెవరో కాదు. నా ఉద్దేశంలో నీవే! శిఖిధ్వజుడు : నేనా?
కుంభమహర్షి : అవును. అక్షరాలా నీవే. ఎందుకంటే నీవు శాస్త్రజ్ఞానంలో కుశలుడవే. కానీ, తత్త్వజ్ఞానంలో మాత్రం విశ్రమించలేదు.
Page:371
ఇక “చింతామణి” అనగా స్వాభావికం, సర్వదుఃఖవినాశకం అయినట్టి "సర్వత్యాగం” అనునదే! ఆ సర్వత్యాగాన్ని నీవు ఈ అడవికి రాక ముందే శాస్త్ర ప్రవచనాలు విని సంపాదించావు. శుద్ధమగు సర్వత్యాగంతో సమస్తం లభిస్తుంది. సర్వత్యాగం ముందు చింతామణి ఎంతటిది? దాని ముందు బ్రహ్మదేవుని ఐశ్వర్యం కూడా దిగదుడుపే అవుతుంది. ఆత్మజ్ఞానోదయ కారకమగు సర్వత్యాగం నీకు సిద్ధించింది. అందుచేతనే స్త్రీ-ధన- బాంధవ్య సహితమగు సామ్రాజ్యాన్ని క్షణంలో వదలి ఇక్కడికి రాగలిగావు.
అయితే, అన్నింటినీ త్యజించి ఇక్కడికి వచ్చినా నీవు 'అహంకార, మమకారాలను మాత్రం హృదయం నుండి పారత్రోలలేదు. సంపూర్ణ త్యాగంచే నీకు జగత్తు పూర్ణానందమగు బ్రహ్మస్వరూపంగా అనుభవమయ్యేదే! అయితే, మమకారాన్ని ఇంకా కలిగి ఉండటం చేతనే నీవు ఇంకా త్యాగ అత్యాగ రూపాలగు వికలంచే ఆవరించబడి ఉన్నావు. ఈ కారణం చేత నీ యందు బ్రహ్మానందం ఇంకా భాసించుట లేదు.
సర్వత్యాగరూపమగు ‘ఆత్మానందమణి' తప్ప వేరొక చింతామణితో పనిలేదు.
‘బ్రహ్మానందము’ అంటే ఏమిటి? సర్వమూ త్యజించివేయగా ఆ త్యాగరూపమగు మహోదయమే బ్రహ్మానందం. 'ఊహూ! బ్రహ్మానందం చాలా కాలం సాధన చేసిన తరువాత మరేదో అన్యంగా లభిస్తుంది. అంతేగాని ఇక్కడ అంత తేలికగా దొరికేది కాదు' అను అపోహతో ఉన్నావు గాని, "ఇప్పటికిప్పుడు ఇక్కడ అన్నీ త్యజిస్తే అప్పుడిక శేషించేదే బ్రహ్మానందము" అని గ్రహించుట లేదు. “ఎప్పుడో, ఎప్పటికో, ఎక్కడో, ఎన్నడో”... అనే స్వల్ప అభిప్రాయవీచిక నీలో క్రమంగా దృఢం కాగా నీవు సంపాదించుకున్న సర్వత్యాగబుద్ధి కాస్తా తిరోగతి పొందింది.
గొప్ప గాలి వీచి చెట్లు కదలుతుంటే పక్షులు నిశ్చలతను కోల్పోయి 'కావ్ కావ్ - కీచ్ కీచ్' అంటూ గాలిలోకి లేస్తాయి చూచావా? అనేక శాస్త్ర రహస్యాలు విజ్ఞుల ద్వారా విని కూడా నిశ్చిత అభిప్రాయం కలిగి ఉండకపోవటం చేత నీవు సమకూర్చుకున్న సర్వత్యాగ బుద్ధి కూడా నిశ్చలత్వం త్యజించి, వీధిన పడింది.
త్యాగి అయినవాడికి ఇక చింతలతో పనేముంది? చింతలతో పూర్ణుడైనవాడికి త్యాగం ఎలా సాధ్యపడుతుంది? గాలివేగంగా వీస్తూ ఉంటే, “ఓ వృక్షమా! కాస్త కదలకుండా నిశ్చలంగా ఉండు” అని కేక వేస్తే ఆ వృక్షం నిశ్చలంగా ఉంటుందా?
సంకల్పము అని దేనిని అంటామో అదియే చింత. చింతయే చిత్తము. అంతేగాని చిత్తము అనగా మరింకేదో కాదు. అట్టి చింతలు ఉండియే ఉండగా చిత్తము యొక్క త్యాగము ఎట్లా లభిస్తుంది చెప్పు?
ఈ “ముల్లోకాలు” అను జాలానికి ఆధారభూతం చిత్తమే. అది కొద్దిసేపు ఉన్నా... ఉన్నంతసేపూ చింతచే గ్రస్తమై ఉంటోంది. అట్టి చిత్తం ఉండి ఉండగా ఇక నీకు 'సర్వత్యాగఫలం' ఎక్కడి నుండి వస్తుంది? కాస్త చప్పుడైతే పావురాలు పైకి ఎగిరిపోతాయి చూచావా? నీ అంతఃకరణం సంకల్ప గ్రహణమును కొంచెం నిర్వర్తించగానే నీ 'సర్వత్యాగం' ఎటో ఎగిరిపోయింది.
Page:372
నీవు చేసిన శాస్త్ర పఠనం, సాధనలు, ఆత్మశాస్త్రజ్ఞులు అందించిన సమాచారం, నీ భార్య చూడాలతో కూడి చేసిన తాత్త్విక సంభాషణలు, వివేకముతో స్వయంగా చేసిన పరిశీలన ఇవన్నీ ప్రసాదించిన ప్రయోజనంగా 'సర్వత్యాగం' అనే చింతామణి నిన్ను సమీపించింది. సర్వత్యాగమే పరమ మోక్షస్థానం’ అని విని ఉండి కూడా నీవా సర్వత్యాగాన్ని స్వీకరించి ఉండవలసింది పోయి, “మోక్షమంటే ఈ మాత్రానికే వస్తుంది! గొప్ప తపోధనులకే రావటం లేదు. ఇక నేనెంత? అందుకని ఇంకా తపస్సు చేసి మోక్షానికి అర్హత సంపాదించుకుంటాను” ...అని భావించి సర్వత్యాగమణిని అనాదరించావు. సర్వత్యాగమణినీ సమీపం నుండి వెళ్ళిపోగానే 'సంకల్పాలు' అనే నీ కళ్ళకు ‘తపస్సు’ అనే గాజుమణి కనిపించింది. "ఆహా! ఇదండీ, అసలైన మార్గం" అని అనుకోసాగావు. బాలుడు నీళ్ళలో చంద్రుని చూచి, 'ఈ దాదికి బుద్ధిలేదు. చంద్రుడు నీళ్ళలో ఉన్నాడు. ఈ నీళ్లలో చేతులు పెడితే చేతులకు దొరకుతాడు. చంద్రుని పట్టి ఇవ్వమంటే ఆకాశం వైపు చూపించి ఆ చంద్రుని ఎవరూ చేతులతో పట్టుకోలేరయ్యా! ... అని అంటుందేమిటి? ఆమెకు ఏమీ తెలియదులే” ...అని అనుకున్నట్లు నీవు కూడా ప్రయత్నిస్తున్నావు. “త్యాగేనతు కైవల్యమ్” అని ఆత్మవేత్తలు నీకు చెప్పితే కూడా, త్యాగమంటే ఏమిటో బాగా విని కూడా “ఎక్కడో ఒంటరిగా తపస్సు చేసి అప్పుడు త్యాగం సంపాదిస్తాను” ...అని భావన చేయసాగావు. క్రమంగా దుఃఖహేతువైన ఏకాంత తపస్సుకై ఇక్కడికొచ్చి ఈ దండం, కమండలం, రుద్రాక్షలు, పర్ణశాలను పట్టుకు వ్రేలాడుచున్నావు.
ఓ శిఖిధ్వజా! నీవు తక్కువవాడివా? కాదు. స్వయంగా యుక్తాయుక్త - నిత్యానిత్య విచక్షణ కలవాడివి. మహారాజుగా ఉంటూనే అనునిత్యం ఉదయ - సాయం సంధ్యావిధుల రూపంలో ధ్యానాలను నిర్వర్తించే అభ్యాసపరుడవు. ఆత్మతత్త్వాన్ని పఠనాదులచే గ్రహించినవాడివి. ఆ తరువాత మీ దేశంలోని ఆత్మజ్ఞులను ఆహ్వానించావు. వారు ప్రవచించే ఆయా ఆత్మశాస్త్ర ప్రతిపాదిత విశేషాలను విన్నావు. ఈ దృశ్య విషయాల పట్ల అనాదరణను, వాసనారాహిత్యాన్ని చక్కగా ప్రారంభించావు.
అది మరికొంత వివేకంతో కొనసాగించి ఉంటే సర్వత్యాగఫలం లభించేదే! ఇంతలోనే “అబ్బే! ఇక్కడ కూర్చుంటే కాదు. తపస్సు చేస్తేగాని లాభం లేదు” ... అని క్లేశయుక్తమైన తపస్సు వైపుగా నీ ధ్యాస మళ్ళింది. ఈ ఏకాంతవనవాస తపస్సు వలన ఏం లభించింది? మొదట ఇల్లు, రాజ్యం మొదలైనవి వదలటం చేతను, మధ్యలో శీత-వాతాదులను సహించవలసిరావటం చేతను, చివరికి ఫలసంగం చేతా ఈ కార్యక్రమమంతా నీకు దుఃఖాన్నే కలుగజేయడమే ఇక్కడ జరిగింది.
అమితానందముత్యృజ్య సుసాధ్యం యః ప్రవర్తతే
మితే వస్తుని దుఃసాధ్యే స్వాత్మహా శఠః స్మృతః ॥
ఎవరైతే “ఆత్మానందదాయకము, తేలికైన సాధనము, అపరిమితము” అయినట్టి సర్వత్యాగాన్ని వదలి పరిమితాలైన ఇట్టి తపస్సులందు ప్రవృత్తుడౌతాడో అట్టివాడు తనకు తానే ద్రోహం చేసుకున్నవాడు మొండివాడు, (ఆత్మహంతకః, శరః) అవుతాడే గాని సుఖి అవడు సుమా!
"తపస్సు చేత నేను ఇక్కడ ఆత్మవస్తువుతో ఏకత్వము సంపాదిస్తాను” అని తలచి ఇక్కడ ఈ అజ్ఞానగృహంలో చిక్కుకున్నావు. ఇక్కడ సర్వత్యాగము సంపాదించాలని ప్రయత్నించకుండా
Page:373
విఫలుడవౌతున్నావు. “రాజ్యం దుఃఖపూరితం కదా” అని దానిని వదలి ఇక్కడకి వచ్చి “వనవాసం” అని ఈ దృఢబంధనంలో చిక్కుకున్నావు. ఒక బంధం నుండి బయల్వెడలి ఇంకొక బంధనంలోకి ప్రవేశించినట్లైనది నీ పని! ఇంతకు ముందెప్పుడూ నీకు వనవాసం అనుభవమై ఉండకపోవటం చేత ఇక్కడి శీత-వాత-తాపాలు నీ ఈ సుకుమార దేహాన్ని బాధించి కృశింపజేశాయే గాని, కొత్తగా ఇక్కడ నీవు సాధించినదేదీ లేదు. “ఈ వనవాసానికి వచ్చి నేను చింతామణిని పొందుచున్నాను” అని అనుకుంటున్నావే గాని యథార్థానికి నీవు పట్టుకున్నది గాజుమణి మాత్రమే.
ఓ అందమైన కనులు గల శిఖిధ్వజా! ఈ విధంగా నీ కథను మణిసాధకుని గాజుమణికి అన్వయించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన సమన్వయమును జాగ్రత్తగా పరిశీలించి ఆ తరువాత 1.సర్వత్యాగం, 2. తపస్సులలో ... దేనిని ఎన్నుకోవాలనుకుంటావో, ఇక నీ ఇష్టం. స్వయముగా నీ బుద్ధితో యోచించి అర్హమైన దానిని, ఉపయుక్తమైన దానిని ఆశ్రయించు. ఏది ఉపయుక్తమనుకుంటే అద్దానిని నీ చిత్తకోశములో నెలకొల్పి అప్పుడు ఫలప్రాప్తి పర్యంతము ఆచరించు.
26. జ్ఞానము కొరకు త్యాగం
కుంభమహర్షి : ఇంతవరకూ నీకు చింతామణిల కథలో ఉద్దేశమేమిటో చెప్పాను కదా! ఇక ఇప్పుడు వింధ్యాచలంలో ఒక కందకంలో చిక్కుకున్న గజేంద్రుని కథలోని ఉద్దేశమేమిటో విను.
వింధ్యపర్వత శ్రేణులలో ఆ ఏనుగు సంచరిస్తున్నట్లు నీవీ భూమిపై సంచరిస్తున్నావు. వైరాగ్య వివేకములే నీ దంతములు. ఇక ఆ ఏనుగును పట్టుకోవటానికి ప్రయత్నించిన మావటివాడు ఎవర నుకున్నావ్? దుఃఖప్రదం, శత్రురూపం అయినట్టి నీ అజ్ఞానమే!
ఆ ఏనుగులాగా నీవు కూడా శాస్త్రజ్ఞాన రూపమైన గొప్పబలం కలవాడివే. అయితే ఆత్మవిషయమై ఏర్పడి ఉన్న 'అజ్ఞానం' అనే మావటివాని చేత నీవు ఒక దుఃఖం నుండి మరొక దుఃఖానికి, ఒక భయం నుండి మరొక భయానికి పరిగెత్తించబడుచున్నావు. ఆ ఏనుగు ఇనుపగొలుసులతో బంధింప బడితే, నీవేమో అనేక ఆశాపాశాలచే బంధింపబడ్డావు.
ఆశాహి లోహరజ్జుభ్యో విషమా, విపులా, దృధా |
కాలేన క్షీయతే లోహం! తృష్ణాతు పరివర్ధతే … ॥
ఆశాపాశములతో పోల్చితే ఇనుప గొలుసులు ఎంతటివి? విషంతో సమానమైన ఆశాపాశాలే అతి దృఢమైనవి. ఎందుచేత నంటావా? ఇనుపగొలుసులైతే ఎంతో కొంత కాలానికి త్రుప్పుపట్టి విరుగుతాయి. ఇక ఆశాపాశాలో? కాలం గడుస్తూ ఉంటే ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి!
ఆ ఏనుగు బంధించబడి ఉంటే మావటివాడు చూస్తూ వినోదిస్తున్నట్లు ఏకాంతమున బంధించ బడి ఉన్న నిన్ను చూచి నీ అజ్ఞానం వినోదంగా పరికిస్తోంది. ఆ ఏనుగు గొలుసులను విఱగగొట్టినట్లు, నీవు రాజ్యాది భోగాలను త్యజించావు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ...
Page:374
కదాచిత్ సుకరం శస్త్ర శృంఖలా బంధభేదనమ్, న త్వస్య మననః, సాధో! భోగాశా వినివారణం||
నీవు మనస్సులోని భోగాల గురించిన ఆశను మాత్రం నివారించలేదు. ఆ ఏనుగు బంధాలను త్రెంచివేయు క్షణాలలో మావటివాడు ఆ ఏనుగు మీదపడినట్లు రాజ్యమును త్యజించునప్పుడు అజ్ఞానం నీ కాళ్ళ క్రిందకు వచ్చిపడింది.
శిఖిధ్వజుడు : రాజ్యమును త్యజించటం 'త్యాగం' కాదంటారా?
కుంభమహర్షి : త్యాగమే. అయితే, త్యాగం అనేది రెండు రకాలుగా ఉంటున్నది.
1. విరక్త త్యాగం -
యదా విరక్తః పురుషో భోగాశాం త్యక్తుమిచ్ఛతి,
తదా ప్రకమృతే అజ్ఞానం ఛేద్యే వృక్షే పిశాచవత్ ॥
విరక్తుడగు మనుజుడు భోగాలపై ఆశలను వదలి పెట్టడానికి ప్రయత్నించగానే కొమ్మలు కొట్టినా కూడా ఆ మోడువారిని చెట్టు మీద పిశాచం వ్రాలినట్లు అజ్ఞానం ఆతని నెత్తి మీద వ్రాలి ఆతనిని కంపింపజేస్తుంది.
2. వివేక త్యాగం -
యదా వివేకీ పురుషో భోగాన్ సంత్యజ్య తిష్ఠతి,
తదా పలాయతే అజ్ఞానం ఛిన్నే వృక్షే పిశాచవత్ ॥
వివేకి అగువాడు భోగములు త్యజించటం జరిగిందనుకో ... వృక్షం మొదలంట ఛేదించబడగా పిశాచం పలాయనమగునట్లు ఆతని అజ్ఞానం కూడా పలాయనం చిత్తగిస్తుంది.
❖
ఱంపంతో ఒక వృక్షాన్ని నరికి వేశామనుకో, ఆ వృక్షంపై ఉన్న గూళ్ళు కూడా నేలకూలు తాయిగా. నిశ్చయపూర్వకంగా భోగజాలాలను పరిత్యజించి ఉంటే అప్పుడు అజ్ఞానం కూడా నేల కూలేదే? కానీ నీవు చేసినదేమిటి? రాజ్యాదులైతే వదలిపెట్టావు. ఈ అడవిలోకి వచ్చిపడ్డావు. అజ్ఞానం తొలగగానే నీ యందు జ్ఞానమును ప్రవేశింపజేయాలి కదా? అందుకు చేయవలసినదేమిటి? ఏ మహాత్ముల పాదములనైనా ఆశ్రయించి జ్ఞానమును సంపాదించుకొని ఉండి ఉంటే మనస్సు యొక్క త్యాగమును గుర్తెరిగే వాడివి. అట్టి మనోత్యాగరూప మహాఖడ్గంతో అజ్ఞానమును వినాశనమొనర్చేవాడివే! మనస్సును త్యజించకుండా మనస్సుకు విషయములైన రాజ్యాదులను మాత్రమే త్యజించావు. అందుచేత మనస్సు ఉండనే ఉండి అది మరల ప్రకోపించి నీ కొంపముంచింది. మనోత్యాగం సంపాదించలేదు కనుక అజ్ఞానం నిన్ను మరల ఓడించింది. అది నిన్ను ఈ 'తపస్సు’ అనే మహాకందకంలోకి త్రోసివేసింది. పద్దెనిమిది ఏళ్ళు తపస్సు చేసిన తరువాత ఇప్పుడిక ఏమి చేయాలో నీకు పాలుపోవటం లేదు. ఎందుకంటే రాజ్యాన్ని వదలావేగాని, ఆ రాజ్యమును దేనిచే ధరించావో ఆ మనస్సును ఎలా వదలాలో నీవు గ్రహించయత్నించలేదు. రాజ్యాన్ని వదిలేటప్పుడే ఏ అజ్ఞానం మిగిలి ఉన్నదో, ఆ అజ్ఞానాన్ని జ్ఞానప్రాప్తిచే సమూలంగా నశింపజేసుకొని ఉంటే, అది
Page:375
మరల నిన్ను బాధించేదే కాదు. మావటి వాడు ఏనుగును బంధించటానికి కందకం ఏర్పాటు చేసినట్లు నీ అజ్ఞానమే ఈ తపోదుఃఖాన్ని కలుగజేసింది. ఏనుగును బంధించటానికి ఉపయోగించే పరికరాలు నీ అజ్ఞానం యొక్క అంతరమున సంచరించే 'చింత'. నీవు జ్ఞానవిషయాలు తెలియనివాడవేం కాదు. కానీ లాభమేముంది? 'అజ్ఞానం' అనే శత్రువు కొద్ది క్షణాలకాలంలో 'తపస్సు' అనే కందకం లోకి నిన్ను ఈడ్చుకొచ్చింది. ఆ కందకం బయటకు కోమల పూతీగలచే కప్పిపెట్టినట్లు నీ ఈ తపో దుఃఖం కొంచెం శాంతి, మౌనం మొదలైన గుణ ప్రవృత్తులచే ఆవరించబడింది. ఆ విధంగా తపో కందకంలో ఈ రోజు వరకూ కూడా బద్ధుడవై పడి ఉన్నావు.
ఓ రాజా! ఈ విధంగా నీవే ఆ ఏనుగువు. ఆశయే గొలుసు. నీ అజ్ఞానమే ఆ మావటి వాడు. ఉగ్ర తపస్సు చేయాలనే పట్టుదలే కథలోని కందకం. నీవు సంచరించే ఈ భూతలమే వింధ్యపర్వత ప్రాంతం. ఇదంతా ఎరిగినవాడవై ఇక నీకు ఏది సముచితమో అదియే చక్కగా ఆచరించు.
27. సర్వత్యాగమంటే వస్తు త్యాగమా?
కుంభమహర్షి : ఓ శిఖిధ్వజ మహారాజా! జ్ఞానులగు మహనీయులెందరో గ్రంథస్థంగాను, నీవు ఆహ్వానించగా వచ్చి నీ సభలలోను, మనం చెప్పుకునే అనేక సర్వత్యాగాల గురించి, తదితర జ్ఞాన విషయాల గురించి చెప్పారు. నీవు వినియే ఉన్నావు. అదట్లా ఉంచు.
నీ ప్రియురాలు చూడాల గొప్ప నిపుణత కలిగియున్న ఆత్మజ్ఞాన సంపన్నురాలు కదా! ఆమె ఏ జ్ఞాన - విజ్ఞానములు నీకు చెప్పిందో అవన్నీ నీ వెందుకు స్వీకరించలేదు చెప్పు? ఆత్మజ్ఞానులలో ముఖ్యులైనవారిలో ఆమె ఒకరు కదా! ఆమె ఏదేది చెప్పిందో అదంతా సత్యము, ఆదరింపబడవలసినది, అనుష్ఠానయోగ్యము అయి ఉన్నది. ఆమె ఏమి చెప్పుచున్నదో మనోబుద్ధులను కొంచం ఏకాగ్రపరచి విన్నావా? ఆమె మాటలు వినబడుచుండగానే, అంతకుముందే నీవు ఏర్పరచుకొన్న కొన్ని అభిప్రాయములలో ప్రవేశించి జ్ఞాన సూచనలను పరిశీలించనైనా లేదు. “ఈమె స్త్రీ కదా! ఈమెకేమి తెలుసు?” అని ఉదాసీనంగా ఊరుకున్నావు. చెప్పేవారి భౌతిక, సాంఘిక విషయాలు ముఖ్యమా? చెప్పే విషయం ముఖ్యమా నీకు? పోనీ, ఆమె మాట అలా ఉంచు. “నా భార్య కదా! నాకే తెలియనిది ఈమెకేం తెలుస్తుంది?” అని ఊరుకున్నావు సరే. నీ స్వబుద్ధితో సర్వత్యాగము గురించి విచక్షించి అప్పుడు బుద్ధి స్థిరత్వం సంపాదించుకొని ఉండవలసింది. అదీ నీవు చేయనేలేదు!
శిఖిధ్వజుడు : ఆగండాగండి మహాత్మా! ఒక్కమాట. నేను రాజ్యమును, గృహమును ఆ ప్రాంతమునే త్యజించివేశానే! ప్రాణప్రదయగు భార్యను కూడా వదలిపెట్టి వచ్చేశానే! ఇవన్నీ వదలి ఇక్కడకు వచ్చిన తరువాత కూడా అది 'సర్వత్యాగం' అవదంటారా? అంతకన్నా ఎవరు మాత్రం ఏం త్యజిస్తాడు? కుంభమహర్షి : (చిరునవ్వుతో)
ధనం దారా గృహం రాజ్యం భూమిః ఛత్రంచ బాంస్థవాః |
ఇతి సర్వం న తే రాజా! సర్వత్యాగోహి కస్తవ ॥
Page:376
ఏమి రాజా? నీవు చమత్కారంగా మాట్లాడుచున్నావే! అక్కడి ధనము, భార్య, ఇల్లు, రాజ్యం, భూమి, పదవులు, అధికారులు, బంధువులు... ఇవన్నీ 'నీవి' అని అనుకుంటున్నావా? నీ బాటలో అవి, వాటి బాటలో నీవు కాకతాళీయంగా తారసపడటమే కదా ఇదంతా?
శిఖిధ్వజుడు : ...!
కుంభమహర్షి : ఏమి, మాట్లాడవేం? నీవి కానివి నీవు వదలటమేమిటి? నీవి కానివి వదిలితే నీకు సర్వత్యాగఫలం ఎట్లా లభిస్తుంది?
తవాస్త్యేవాపరత్యక్తః సర్వస్మాద్భాగ ఉత్తమః |
తం పరిత్యజ్య నిః శేషమ్ ఆయాస్యసి విశోకతామ్ ||
నీచే త్యజించబడవలసియున్న సర్వోత్తమ విభాగము ఒకటి ఉన్నది. అద్దానిని వదలనే లేదు. ఆ ముఖ్య విభాగమును పరిత్యజించి దుఃఖరాహిత్యాన్ని పొందు.
శిఖిధ్వజుడు : ఏమిటి! ఇంకా నేను వదలవలసినది ఉన్నదా? తెలిసింది మహాశయా! రాజ్యాదులు వదిలిపెట్టి ఈ వనమునకు వచ్చి “వనం నాది” అని పద్దెనిమిది సంవత్సరాలుగా అనుకొని ఉన్నాను కదా! మీ ఉద్దేశం ఇదే అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి పర్వతవృక్షాదులతో కూడిన ఈ వనము పట్ల నాకు గల ఆపేక్షను ఇప్పటికిప్పుడే త్యజించివేస్తున్నాను చూడండి.
ఓ రామా! కుంభర్షి వాక్యాలచే ప్రేరితుడైన జితేంద్రియుడు, మహావీరుడు అయిన ఆ శిఖిధ్వజుడు కనులు మూసుకున్నాడు. కించిత్ మాత్ర 'స్ఫురణ'చే హృదయంలో స్ఫురించే ఆ పరిసరముల పట్ల ప్రీతిని-ధూళితో కప్పబడిన అద్దమును తుడిచినట్లు తుడిచివేసాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. శిఖిధ్వజుడు : ఇప్పుడు చెప్పండి మహర్షీ! వృక్ష-పర్వత-లతాదులతో అలంకరించబడి ఉన్న ఈ వనం యొక్క పరిసరాల పట్ల గల నాకు ఏర్పడి ఉన్న ప్రియత్వాన్ని, వాటికి సంబంధించిన ఇష్టఅయిష్ట-కోప-తాప-అభిప్రాయ-దురభిప్రాయముల సంబంధమైన సర్వ వాసనలను క్షణంలో త్యజించి వేశాను. కాబట్టి ఇక ఇప్పుడు చెప్పండి! ఇప్పుడు నాకు సర్వత్యాగం సిద్ధించినట్లే కదా! కుంభమహర్షి : (పకాలున నవ్వుతూ) ఏమిటీ! ఇక్కడ గల వృక్షాలను, స్థలాన్ని, లతలను, జల-సరోవరాలను త్యజిస్తున్నావా? బాగున్నదయ్యా! నీవు ఇక్కడికి రాక ముందే ఇవన్నీ ఇక్కడున్నాయి. ఇక్కడి నుండి నీవు వెళ్ళిపోయిన తరువాత కూడా ఇవి ఇక్కడే ఉంటాయే! వీటిని పట్టుకుని "ఇవి నావి” అని ఎట్లా అంటావు?
శిఖిధ్వజుడు : అవును. ఇవి నావి కావు.
కుంభమహర్షి : మరి! “నా మిత్రుడు ధరించిన ఆతని వజ్రపు ఉంగరం నేను త్యాగం చేస్తున్నాను”... అన్నట్లున్నది నీ వాక్యం! ఇవి నీవి కానప్పుడు వీటిని నీవు త్యజించటమేమిటి? తద్వారా సర్వత్యాగసిద్ధిని సంపాదించటమేమిటి, ఏవో పరాచికాలు కాకపోతే? నీవు పరిత్యజించవలసింది ఇది కాదు. ఇంతకన్నా ఉత్తమమైన ఒకానొక నీయందలి విభాగమును నీవు పరిత్యజించనే లేదయ్యా! నీదైనదేదో,
Page:377
అది వదలకుండా ఏవేవో వదలి “వదలాను కదా!" అంటావేమిటి? పరిత్యాజ్యావశ్యకమైనట్టి నీయందు చోటు చేసుకున్న విభాగమును నిశ్శేషంగా త్యజించి అప్పుడు తద్వారా దుఃఖరాహిత్యం
పొందటం గురించి యోచించు.
శిఖిధ్వజుడు : ఓ కుంభ మహాశయా! పోనీ, అవన్నీ కాకపోతే, ఇప్పుడింకా నా దగ్గిర ఉన్న ఈ నా యజ్ఞపాత్ర, అగ్నికార్యము చేసే యజ్ఞవాటిక, ఈ కుటీరం, పులిచర్మము మొదలైనవి కూడా త్యాగం చేసి వస్తాను. చూస్తూ ఉండండి.
ఓ రాఘవా! శాంతుడు, శుద్ధచిత్తుడు అయిన ఆ మహారాజు తను ఆసీనుడైయున్న ఆసనం నుండి తటాలున లేచి నిలబడ్డాడు. కుంభ ఋషి (మునిపుత్ర రూపంలో ఉన్న చూడాల) మాత్రం అసనము మీదే ఉండి శిఖిధ్వజుడు చేస్తున్న చర్యలను మౌనంగా చూస్తున్నాడు. “ఈతడు ఏం చేస్తాడో చూద్దాం - ఇదంతా ఇతనికి శ్రేయమే కాబోవుచున్నది గదా!" ...అనుకుంటూ కుంభుడు ఆతని కదలికలను మాత్రం మెదలకుండా గమనిస్తున్నాడు.
శిఖిధ్వజుడు గంభీరవదనంతో కుటీరంలో ప్రవేశించాడు. యజ్ఞపాత్రలు మొదలైన సామాగ్రిని ఆశ్రమం నుండి బయటకు తీసుకుని వచ్చి ఒకచోటికి చేర్చాడు. అక్కడికి కొద్ది అడుగుల దూరంలో ఎండు కట్టెలను తెచ్చి అగ్ని రగిల్చి మంటచేశాడు. రగులుతున్న మంటలలో ఒక్కొక్క వస్తువును
విడువసాగాడు.
శిఖిధ్వజుడు : ఓ జపమాలా! నీవు గొప్ప స్వామి భక్తపరాయణుడవై నన్ను కొలిచావు. ఇక నేను చేసినదేమిటి? స్వార్థసాధనతత్పరుడనై ఇంతవరకూ నీకెంతో శ్రమ ఇచ్చాను. ఇప్పటికి నీ సేవ పరిసమాప్తమైనది. ఇప్పుడు జపము-తపము మొదలైన కర్తవ్యములకు సంబంధించిన భ్రాంతి నాయందు తొలగింది. ఇక నీతో నాకేమీ పనిలేదు. నీతో కూడా నేను అనేక మంత్రరూప మహారణ్యాలలో సంచారం చేసిచేసి అలసిపోయాను. మనిద్దరం కలసి ఎన్నో సిద్ధక్షేత్రాలు చూచాం. ఇక నేను ఆత్మయందు విశ్రమించే సమయం ఆసన్నమైనది. అందుచేత నీవు ఈ అగ్నిలో ప్రవేశించి నీ మూల ప్రకృతిలో విశ్రమించు.
ఓ పులిచర్మమా! మనుష్య రూప మృగమువంటి నేను ఒక మృగం నుండి ప్రాప్తించిన నిన్ను అనేకసార్లు బాధిస్తూ ధర్మాసనం మీద పరచాను. నిన్ను ధరించిన ఆ మృగదేహి ఇప్పుడు ఎన్నో దేహాలలో ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ ఎక్కడో ఉండి ఉంటాడు. నీ మూల ప్రకృతి యగు ఆకాశం నందు ఎప్పుడో విలీనం కావలసిన నీవు నా వలననే ఇంకా ఈ చర్మాకారం వహించి ఉన్నావు. “ఏకాంతం - తపస్సు” ... అని అనుకుంటూ నిన్ను నీ పుట్టినిల్లు అగు ఆకాశానికి చేరకుండా నేను నిరోధించాను. ఇప్పుడిక నీకు స్వదేశమగు ఆకాశస్థితి ఈ అగ్ని ద్వారా ఒనగూడుగాక!
ఓ దండమా! ఓ కమండలమా! గుండ్రని ఆకృతిగల నీవు ఇంతకాలం నాకోసం జలమును ధరించేదానివి. మీరు చూపిన సౌజన్యమునకు, నేను చేయగల ప్రత్యుపకారమేమున్నది? ఓ జల పాత్రమా! అగ్నిచే శుద్ధిపొంది నన్ను సేవించావు. తిరిగి నిన్ను అగ్నికి అర్పిస్తున్నాను.
Page:378
ఓ రాఘవా! ఈ విధంగా పలుకుచూ ఆ శిఖిధ్వజుడు ఆయా వస్తువులను భోజన సామాగ్రిని కూడా అగ్నికి ఆహుతి చేసివేశాడు. కమండలము వంటి కొన్ని పవిత్ర వస్తువులను ఆ బాటలో పోవుచున్న ఒక బాటసారికి ఇచ్చివేసాడు. అప్పుడు తిరిగి కుంభుని ముందు నిలబడి ఇలా
పలికాడు.
❖
శిఖిధ్వజుడు : ఓ కుంభమహర్షీ! మీరు నేను చేస్తున్నదంతా గమనిస్తున్నారు కదా! నాకు ఈ వస్తువులపై గల ప్రీతిని తొలగించుకోవటానికి, మీరు ప్రవచించినట్లు నిష్క్రియుడను కావటానికీ ఈ వస్తువులన్నీ అగ్నికి వదలివేశాను. ఇదంతా చూచి మీరు భేదమొందకుండెదరు గాక! అయోగ్యమైన వస్తువులను లోకంలో కలిగి ఉండరు కదా! సర్వత్యాగము సంపాదించే సమయం ఆసన్నమగుటచేతనే అవి అగ్నిలో మండి నేడు బూడిద అగుచున్నాయి. ఇంకా చూస్తూ ఉండండి. రెల్లు గడ్డితో నిర్మించిన ఈ ఆశ్రమ మందిరమును కూడా ఇప్పుడే అగ్నికి ఆహుతి ఇచ్చి దీనిని కూడా త్యజించినవాడనవుతాను.
ఇలా పలికి శిఖిధ్వజుడు కణకణమండే రెండు కట్టెపుల్లలను తెచ్చి పర్ణశాలను కాల్చివేసాడు. ఇంకా అక్కడా - - ఇక్కడా ఏవైనా వస్తువులు కనిపిస్తే వాటినన్నిటినీ విసరివేయటమో, విరగగొట్టటమో, అగ్నిలో పడివేయటమో, దారినపోయేవారికి ఇచ్చివేయటమో చేశాడు. నార వస్త్రములన్నీ తగలబడి బూడిద అయినాయి. ఇక శిఖిధ్వజుడు కట్టుబట్టలతో “నావి” అని చెప్పుకోవటానికి వస్తువులేమీ
మిగలకుండా మిగిలాడు.
శిఖిధ్వజుడు : ఆహా! కుంభమహర్షీ! నా జీవితంలో చాలా కాలం గడిచిపోయిన తరువాత ‘సర్వత్యాగము’ అనే మహత్తరమైన సందేశం మీరు నాకు ప్రదర్శించారు. ఇప్పుడు, ఈ గోచీ తప్ప మరే వస్తువు కలిగిలేను. ఈ గోచీని కూడా లోకులకొరకై మాత్రమే ధరించాను గాని, ఈ జీవునకు ఏదో మమకారం ఉండి కాదు.
ఈ సమస్త పదార్థములూ “నావి కావు” అని వాటిపట్ల మమత్వం వదలివేశాను. కాబట్టి నేనిప్పుడు సర్వత్యాగస్థితి పొందినట్లే కదా! ఇప్పుడు నేను శుద్ధుడను. సులభంగా ప్రబోధం పొందాను. ఈ ప్రపంచములోని సర్వపదార్ధములూ ఇవి నావి అను మమత్వం ఏర్పడి ఉండటం చేతనే చివరికి దుఃఖభాజకములుగా పరిణమించటం జరుగుతోందని గ్రహించాను. బంధహేతువులన్నీ ఒక్కొక్కటీ తొలగుచుండగా ఇకనేను పరమశాంతిని పొందుచున్నాను. నేనిపుడు నిర్విషయుడనైనాను. సర్వదా తృప్తుడనగుచున్నాను. మీరు చెప్పిన మార్గంలో సర్వమూ త్యజించటం చేత సుఖవంతుడనై ఒప్పు చున్నాను. వివిధ బంధములన్నీ నశించాయి. కాబట్టి సర్వత్యాగము ఆచరించిన వాడనే కదా!
ఓ దేవపుత్రా! ఇప్పుడు నేను దిగంబరుడనై మిగలటం, సర్వ వస్తువులను వాటి పట్ల అపేక్షను మీ మీ కళ్ళ ముందే త్యజించివేయటం చూచారు. కాబట్టి నేను మహాత్యాగాన్ని సంతరించుకున్నట్లేనని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? లేదా?
Page:379
కుంభమహర్షి : ఏమిటి నీవు సర్వత్యాగివా? కాదు. అర్ధ త్యాగివేకాని నీవు సర్వత్యాగివి మాత్రం కాదు. సర్వత్యాగానికి ఒక ముఖ్యమైన గురుతు ఉన్నది. అది ఏమిటంటే... సర్వత్యాగం వల్ల నిర్హేతుకమైన జహేతువు యొక్క అగత్యం లేకుండానే - పరమానందం స్వభావసిద్ధం అవుతుంది. అందుచేత ఓ రాజా! నీవు సర్వత్యాగం యొక్క అభినయం చెయ్యకయ్యా! నటన కాదు ఇప్పుడు కావలసింది. నిజమైన త్యాగం కావాలి. త్యజించటమవసరమై ఉన్న నీయొక్క అత్యుత్తమ విభాగం ఇంకా కలిగియే ఉన్నావు. దానిని పూర్తిగా త్యజిస్తేగానీ నీకు సర్వత్యాగం సిద్ధించదు. శిఖిధ్వజుడు: (తనలో) ఏమిటీయన ఇట్లా అంటాడు! అన్నీ త్యజించాను కదా! ఇప్పుడు రాజ్యం లేదు, బంధువులు లేరు, ధనాదులు లేవు, రాజవస్త్రాలు, నారవస్త్రాలు కూడా లేవే! కనీసం నివసిం చటానికి... అంతఃపురం మాట దేవుడెరుగు... ఉన్న రెల్లుగడ్డి కుటీరాన్ని కూడా అగ్నికి ఆహుతి చేసి వదిలేశానే! జపమాల, యజ్ఞపాత్రలు అన్నీ వదలి తగులబెట్టటమో, పారవేయటమో, ఇచ్చి వేయటమో చేశానే! ఇంకా నా దగ్గిర ఏమున్నదని ఈ పెద్దమనిషి వదలమంటాడు? ఏదో ముఖ్యమైన విభాగం ఇంకా మిగిలియే ఉన్నది. అది త్యజించు... అని ఇంకా అంటూనే ఉన్నాడే ఈయన! ఏది ఏమైనా ఇప్పుడు నేను సర్వత్యాగిని అయి మోక్షార్హత సంపాదించుకోవలసిందే! ఎట్లాగైనా ఈతని లెక్కకు నేను సర్వత్యాగి అను పదమునకు అర్హుడనని అనిపించుకోవసిందే. లేకుంటే... ఇన్నాళ్ళిక్కడ ముక్కుమూసుకుని ఈ తపస్సు చేయటం ఎందుకు? సరే ఇప్పుడింకా నా దగ్గిర ఏమున్నది?
ఇట్లా ఆలోచిస్తూ శిఖిధ్వజుడు బుఱ్ఱ బద్దలుకొట్టుకుంటూ ఉంటే, ఆ కుంభమహర్షి పరమ ప్రశాంతమైన చిరునవ్వుతో ఆ పరిసరములను అగ్నికి ఆహుతి అగుచున్న ఆయా వస్తు సముదాయాన్ని, ఇటు శిఖిధ్వజుని వైపూ చూస్తూ మౌనం వహించి ఉన్నాడు. శిఖిధ్వజుడు మాత్రం పరీక్షించబడుచున్న విద్యార్థిలాగా బుఱ్ఱగోక్కుంటూ యోచిస్తున్నాడు. కొద్దినిమిషాలు గడిచేసరికి ఆతని మనస్సులో ఒక సమాధానం తళుక్కుమన్నది. తటాలున కూర్చున్న చోటినుంచి లేచాడు.
శిఖిధ్వజుడు: ఓ దేవర్షీ! ఇంతసేపూ "త్యజించటానికి ఇంకా ఏమి మిగిలింది?” అని మూర్ఖుడనై ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తట్టింది. బహుశః ఇంతసేపూ మీరు కూడా ఇదే ఉద్దేశిస్తున్నారని గ్రహించివేశాను. ఇంకా ఈ దేహం మిగిలియే ఉన్నది కదా!
అసలు అన్ని అనర్థాలకూ దేహమే కారణం. దేహము కలిగియుండటమే బంధం భవరోగం కూడా”... అన్న శాస్త్రవాక్యాలు నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. దేహమే దేహికి ఐహికమోహమని చెప్పగా విన్నాను. ఈ దేహంలో కళ్ళు, చెవులు, తదితర ఇంద్రియాలు ఉన్నాయి. సర్వాతీతమైన ఆత్మ స్వభావం నుండి నేను ఇంద్రియార్థములను ఆశ్రయించి, విషయములపై వాలుట చేతనే సర్వ అనర్థములు వచ్చి పడుచున్నాయి. ఈ దేహం త్యజించి దేహరహితుడగు పరిశుద్ధ దేహి (విదేహుడను) అయితేనే నా ఈ సర్వత్యాగం సంపూర్ణమయినట్లు. పరమజ్ఞానులగు మీ సమక్షంలో అన్నీ అగ్నిపరం చేసినట్లు ఈ నా దేహాన్ని కూడా అగ్నికి ఆహుతి ఇచ్చి మీ చేత 'సర్వత్యాగి' అని పిలిపించుకుంటాను.
Page:380
ఇంక కుంభుని అభిప్రాయమునకు ఎదురుచూడకుండా ఆ శిఖిధ్వజుడు గంభీరముగా అగ్నివైపు అడుగులు వేయసాగాడు. ఇంకా అగ్ని కొద్ది అంగుళముల దూరంలో ఉండగా “ఓ రాజా! ఆగు” అని కుంభర్షి కేక పెద్దగా వినబడింది. గురు ఆజ్ఞను తెలివి గలవాడెవడైనా పాటిస్తాడు కదా! రాజు ఆగి ఒక్క అడుగు వెనక్కు వేసి కుంభర్షి వైపు తిరిగాడు.
కుంభమహర్షి : దా! ఇటొచ్చి కూర్చో! ఆ! ఇప్పుడు చెప్పు, ఏమిటి నీవు చేస్తున్నది? సంసారమునకు కారణం నీవా, ఈ దేహమా? నిపరాధియగు ఈ దేహం ఏం పాపం చేసిందని నీవు అగ్నిలోకి త్రోసివేయాలనుకుంటున్నావు? యజమాని ఇంకా మేత వేయలేదని ఒక తెలివి లేని ఎద్దు ప్రక్కనే గల దూడను తన్నినట్లుంది నీవు చేసేపని. ఆటలో ఓడిపోతున్నామని ఉక్రోషంతో ఆటవస్తువును విరగగొట్టితే ఏమిటర్థం? కఱ్ఱతో కొట్టిన వాడిని వదలి కఱ్ఱను పట్టుకుని తగలబెట్టితే ప్రతీకారం చేసినట్లాతుందా? ఇల్లు దోచిన దొంగను వదలి దొంగలు పడ్డ ఇంటిని, గోడలను పగలగొట్టి ఏమి ప్రయోజనం? జడము, దీనము, మూగతపస్వి అయినట్టి ఈ దేహము నీకేం అపరాధం చేయలేదే! దీనిని త్యజించకు. త్యజించవలసింది దేహమును కాదు.
పాప మీ దేహం ఎవరినీ ఏమీ అనకుండా తనయందు తానే మౌనముగా ధ్యానమున నెలకొనియున్నది. కట్టె నీళ్ళలో కొట్టుకుపోతుంటే... ఆ కట్టె బలతరంగాలచే దొర్లించబడుతోంది గానీ, తనకు తానుగా కదలి వెళ్ళటం లేదే! అట్లాగే ఈ దేహము తానుగా ఏమీ చేయటం లేదు. దీనిని మరొకటేదో ఉపయోగిస్తోంది. ఏకాంతవాసంలో ఉన్న ఒక తాపసిని ఒక మదించిన దొంగ బాధించినట్లున్నది నీ వ్యవహారం! శిక్షకు యోగ్యుడైన మరొకడు ఈ దేహంలో ఉండి విషయేచ్చను, అల్పాశయములను ప్రదర్శిస్తూ ఉంటే ఆ దోషిని వదలి, ఈ దేహాన్ని శిక్షిస్తానంటావేమిటయ్యా బాబూ! ఒక తోటమాలి మామిడి వృక్షం దగ్గరకు వెళ్ళి “ఓ వృక్షమా! ఈ పళ్ళు నీవలననే రాలాయి. కనుక నిన్ను ఈ గొడ్డలితో నరికివేస్తాను" అంటే ఏం లాభం, మామిడి పళ్ళు రాలింది, తుపాను గాలికైతే? చేతనైతే గాలిని పట్టుకుని ప్రశ్నించాలి? సుఖదుఃఖములకు ఉత్పత్తి స్థానం దేహము కావచ్చు. కానీ, ఉత్పత్తికి కారణం దేహం కాదు. అది వేరే ఉన్నది. కారణమును వదలి కార్య సాధన మాత్రమగు ఈ దేహమును ప్రశ్నిస్తే అదేం చేస్తుంది చెప్పు? పుష్పాలు, ఫలాలు నేలరాలటానికి గాలి కారణంగాని చెట్టు కారణం కానట్టే శరీరం చలించటానికి కారణమగుచున్నది మరొకటి ఉన్నది. దానిని పట్టుకుని శిక్షించు.
సరే! ఒకవేళ ఈ శరీరాన్ని త్యజిస్తావు. అంతటితో సమస్య తీరుతోందా? అబ్బే, లాభమే లేదు. ఎందుకంటావా, మరణానంతరం మరొకదేహం వస్తుంది. అయితే ఆ దేహం ఈ దేహంతో సమానంగా జ్ఞానార్హమై ఉంటుందని చెప్పగలమా? జ్ఞానార్హతకు మానవ ఉపాధి కన్న ఉత్తమమైనదేది ఉన్నది? సాధనకు, గురుసేవల వంటి ఉత్తమ కార్యక్రమాలకు పఠన, గ్రహణాదులకు ఇంత అవకాశం మరల లభిస్తుందని నమ్మకమేమున్నది? పోనీ ఏదో దేహం లభిస్తుందనుకో, అప్పుడైనా సర్వత్యాగం లభిస్తుందని అనగలమా? లభించాలంటే ప్రయత్నించాలి కదా! అట్టి ప్రయత్నరూపమైన కార్యక్రమం ఇప్పుడే
Page:381
నిర్వర్తించవచ్చు కదా! కనుక ఏ విధంగా చూచినా, దేహమును మంటలో పడవేయడం ఉపాయమే కాదు. మరణించినంత మాత్రం చేత సర్వత్యాగఫలితమగు మోక్షం లభిస్తుందంటే ఇక సాధనలు, గురువులు, విచారణలు ఎందుకు? మరణోపాయాల మీదనే గ్రంథాలు రాసుకోవచ్చు కదా!
"కనుక దేహము త్యజిస్తాను అనే నీ అభిప్రాయం ...నేను చూపు సర్వత్యాగానికి మార్గమే కాదు. దేహాన్ని అగ్నిలో ఆహుతి చేయటం వ్యర్థమైన ఆలోచన. ఒక మదపుటేనుగు వృక్షమును అటూ ఇటూ కలుస్తున్నట్లు... ఈ దేహమును కూడా ఏదైతే సంక్షుభితం చేస్తోందో, అట్టి ఆ పాప వస్తువును త్యజించు. మరుక్షణం మహాత్యాగవంతుడవౌతావు. అద్దానిని త్యజించటం చేత అసలీ దేహములే ఇక ఉత్పన్నం కావు. కాదూ, ఈ దేహమును మాత్రం అగ్నిలోనో జలంలోనో పడవేసి నశింపజేయాలనుకుంటే మరల మరల దేహాలు వచ్చిపడుతూనే ఉంటాయి. కనుక త్యజించటం అత్యవసరమై ఉన్న నీ యందలి సూక్ష్మ విభాగం ఎలా త్యజించాలో యోచించు.
శిఖిధ్వజుడు: హే సద్గురూ! మీరు చెప్పింది అత్యంత యుక్తియుక్తం. ఇప్పటి దాకా అసలు ఏది త్యజించాలో గుర్తించడానికి నా అల్పమైన తెలివితేటలు ఉపయోగించానే గాని, మిమ్మల్ని సంప్రదించనే లేదు. ఇప్పుడు మిమ్ములను శరణువేడి అభ్యర్థిస్తున్నాను.
కేనాయం చాల్యతే దేహః కిం బీజం జన్మకారణామ్? కస్మింస్యక్తే పరిత్యక్తం సర్వం భవతి సుందర!
సుందరరూపుడవగు ఓ దేవఋషీ! వినమ్రుడనై, సాష్టాంగదండప్రణామములు సమర్పిస్తూ మిమ్ములను వేడుకుంటున్నాను. నా ఈ సందేహములు తీర్చండి. ఈ భౌతికదేహం దేనిచే చలించ బడుతోంది? ఈ జన్మ - - కర్మలన్నిటికీ బీజ కారణం ఏమిటి? దేనిని త్యజించటంచే అంతా కూడా త్యజించబడినది (సర్వత్యాగం) అగుచున్నది?
28. మనస్సును అధిగమించటమే “సర్వత్యాగం”
కుంభమహర్షి: ఓ సాధుపుంగవా! శిఖిధ్వజ మహారాజా! ఈ దేహమును, ఇళ్ళు - వాకిళ్ళను, రాజ్యమును, వంటపాత్రలను, కుటీరములను వదలితేనో, లేక, తగలబెడితేనో సర్వత్యాగము కానే కాదని మరొక్కసారి నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను.
మరి ఈ దేహాదుల కార్యక్రమమంతా ఏదై ఉన్నదో, ఏది నాలుగు వైపులా వ్యాపించి ఆయా అనుభవాలన్నిటికీ అసలు కారణమైయున్నదో... అద్దానికి శాస్త్రజ్ఞులు మనస్సు, వాసనలు, అహంకారం మొదలైన పేర్లు పెట్టారు. అదీ... నీవు త్యజించవలసింది.
శిఖిధ్వజుడు:
సర్వం, సర్వగతం, సర్వహేయం-త్యాజ్యం చ సర్వదా । సర్వం కిముచ్యతే? బ్రూహి, సర్వతత్త్వవిదాంవర ||
Page:382
హే సర్వతత్త్వములను ఎఱిగినవారిలో శ్రేష్ఠుడా! “ఇక్కడి రాజ్యము, భార్య, వస్తు సముదాయము మొదలైనవిగా ప్రకటనమగుచు, సర్వమునందు వ్యాపించి ఉన్నదై సర్వదా త్యాజ్యము అయినట్టిది” ...ఏదైతే ఉన్నదో అద్దాని గురించి నాకు తెలియజేయండి.
కుంభఋషి:
సాధో! సర్వగతాకారం జీవప్రాణాది నామకమ్ |
న జడం, నాజడం భ్రాన్తం “చిత్తం” సర్వమితి స్మృతమ్ ||
ఓ సాధూ, వినండి! నీ యొక్క స్వస్వరూపమునందు ఒకానొక విభాగం ఉన్నది. నీ అనుభవ ప్రారంభానికి కించిత్ ముందే ప్రవేశించి ఏర్పడి ఉంటోంది. ఆ స్వల్పవిభాగమే సర్వగతమైన ఆకృతి కలిగి ఉన్నదగుచున్నది. అది ఆయా ప్రదేశములలో జీవం, ప్రాణం మొదలైన నామాలు కలిగినదై ఉంటోంది. అది చేతనం కాదు.
పోనీ, జడం అని అందామా! అది తదితరాలైన బాహ్య విషయాలను ప్రేరేపించుచుండుటచే జడం కూడా కాదు. అయితే అది భ్రమశీలమై ఉన్నది. అది “ఆత్మ యొక్క దృశ్య విషయ మనన” స్వభావ విభాగం అని గ్రహించిన వేదజ్ఞులు దానికి 'చిత్తము' అని పేరుపెట్టారు. మనస్సు మొదలైనవన్నీ అదే. “అదియే ఇక్కడ అనుభవమగుచున్న సర్వం” అని ఆత్మజ్ఞులచే సిద్ధాంతీకరించబడుతోంది.
ఓ రాజా! చిత్తమునే నీవు భ్రమ అని కూడా గ్రహించు. ఇంతెందుకు? అదియే ఈ మనుజుడు సుమా! మనుజుడంటే దేహం కాదు. మనుజుడంటే చిత్తమే. చిత్తమే మనస్సు కూడా! నీవు జగజ్జాలం అని సంబోధించేది కూడా ఆ చిత్తమునే. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తమే సమస్తము. చిత్తమే సంసారము గాని, దృశ్యజగత్తు సంసారం కానే కాదు.
ఒకచోట ఒక మహావృక్షమున్నదనుకో, ఆ వృక్షమునకు పూలు, కొమ్మలు, ఆకులు, కాయలు, కాండము మొదలై ఆయా విభాగములు వెల్లివిరుస్తాయి. “ఆ వృక్షమునకు అసలైన కారణమేమిటి?” అను ప్రశ్నను మథించి వెతికితే “ఒకానొకప్పుడు అక్కడి నేలలో జేరిన బీజమే”... అనే సమాధానం రాక తప్పదు. అలాగే ఈ దేహాదులు, ఈ రాజ్య - రాజ సంబంధములు, ఆశ్రమవాస అభినివేశములు, బంధము, మోక్షము మొదలైనవాటికన్నిటికీ మనోబీజమే (లేక చిత్తబీజమే) అసలైన కారణం.
ఇప్పుడు నీవు రాజ్యమునో, కమండలమునో త్యజిస్తున్నావు. ఏం లాభం? ఒక దయ్యం వదిలితే ఇంకొక దయ్యం పట్టుకుంటుంది. నీవు వదలవలసింది వీటిని కాదు.
సమస్తమునకు బీజమైన మనస్సును లేక చిత్తమును త్యజించవయ్యా! అప్పుడు తదితరమైన సమస్తమూ త్యజించబడినదే అగుచున్నది. మనస్సును త్యజించినప్పుడు మాత్రమే సర్వత్యాగం సంభవ మవుతుంది. మనస్సు కంటే అతీతత్వము సంతరించుకోవటమే మనోత్యాజ్యం. మనస్సును వదలకుండా ఆ మనస్సు పట్టుకునే ఎన్ని వస్తువులను, లేక, విషయాలను వదిలితే ఏం లాభం? మనస్సు ఉండట మంటేనే విషయములను, లేక వస్తువులను ధరించి ఉండటం కదా!
Page:383
సర్వధర్మా అధర్మావా, రాజ్యాది విపినాది వా, “సచిత్తస్య పరందుఃఖమ్! నిశ్చిత్తస్య పరం సుఖమ్!”
ఇప్పుడు దుఃఖం ఎక్కడి నుండి వస్తుందో చెబుతాను విను. చిత్తము కలిగి ఉన్నంత కాలం సమస్త ధర్మాధర్మములు, రాజ్యాదులు, వనవాసం చేయటాలు, తపశ్చర్యలు మొదలైనవన్నీ దుఃఖ రూపాలుగానే పరిణమిస్తాయి. చిత్తరహితునికో... అవన్నీ సుఖ రూపాలుగా అగుచున్నాయి.
ఒక బీజం మహావృక్షం కావటం మనం చూస్తూన్నాం కదా! అట్లాగే చిత్తం (లేక) మనస్సు కూడా ఈ సమస్త జగద్రూపంగాను, ఈ దేహ సమూహములుగానూ పరిణామమొందుచున్నది. గాలి వీచికలచే వృక్షము, భూకంపముచే పర్వతము, కమ్మరివానిచే కొలిమితిత్తి, కదల్చబడుచున్నట్లే చిత్తముచే ఈ శరీరము కూడా చలింపబడుచున్నది. ఈ సమస్త ప్రాణుల భోగముల యొక్క (అట్లాగే) దేహ ధర్మములైనట్టి చావు - పుట్టుకల యొక్క ఇంకా మునుల శమ, దమ, ధారణ మొదలైన సుదృఢభావముల యొక్క పేటిక ఏదయ్యా అంటే ... అది చిత్తమే సుమా!
ఇదం ప్రవర్తతే సర్వం చిత్తమేవ జగత్తయా |
దేహాద్యాకారజాలేన చిత్తం జీవో మనోమయమ్ II
సమస్త దేహముల ఆకారంగా, జగదాకారంగా పరిణమిస్తున్నది, ప్రవర్తిస్తున్నది చిత్తమే. అసలు అంత ఎందుకు? (చిత్తోహి జీవః) ఈ జీవుడే చిత్తమయుడై ఉన్నాడు. అట్టి చిత్తమే ఆయా క్రియారూప వ్యాపారములచే... “అంతఃకరణం, బుద్ధి, మహత్తు, అహంకారం, ప్రాణం, జీవుడు, మనస్సు” మొదలైన పేర్లచే చెప్పబడుతోంది. వేదాంత శాస్త్రం “ఇదంతా చిత్తము యొక్క ప్రవాహ పతిత ఫలమే" అని నొక్కివక్కాణిస్తోంది. కాబట్టి, ఆ చిత్తమును త్యజించావా, సమస్త ఆధి - వ్యాధులకు ‘హద్దు’ అయినట్టి సర్వత్యాగము కావించినట్లే అవుతుంది. త్యాగవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ శిఖిధ్వజ మహారాజా!
చిత్తత్యాగం విదుః సర్వత్యాగం, త్యాగవిదాంవర తస్మిన్ సిద్ధే మహాబాహో! సత్యం కిం నా నుభూయతే?
“ఇంకా ఏదో పొందాలి” అను రూపం గల చిత్తాన్ని త్యజించడమే 'సర్వత్యాగం' అని పేర్కో బడింది. అంతేగాని ఇల్లు, వాకిలి వదిలేసి వస్త్రాల రంగు కాషాయం చేసుకున్నంత మాత్రం చేత
'గృహత్యాగం, బంధుత్యాగం' అనిపించుకుంటుందేమో గాని, సర్వత్యాగం మాత్రం కానే కాదు. చిత్తత్యాగం అనబడే సర్వత్యాగం సిద్ధించిందా, ఇక పరమానంద రూపమగు సత్యపదార్థ అనుభవం ఎందుకు ఈ జీవునికి కలుగదు? తప్పకుండా కలుగుతుంది. చిత్తం త్యజించబడిన తరువాత కార్యవిభాగ పరంపర అయినట్టి ద్వైతమూ ఉండదు, కారణవిభాగమైనట్టి 'ఏకమూ' ఉండదు. ఇక కేవలం పరమశాంతమై, స్వచ్ఛమై, నిరామయమై, ఏకమైనట్టి మన పరమాత్మ తత్త్వమే శేషిస్తుంది.
ఈ 'సంసారము’ అనే విస్తారమైన పంట పండుచున్న క్షేత్రం చిత్తమే గాని బాహ్యమైన ఏదో విషయమో, ప్రదేశమో కాదు. క్షేత్రమే నశిస్తే ఇక ధాన్యరూపమన తగినట్టి ఈ సంసారం ఎందులోంచి
Page:384
మొలచుకొస్తుంది? జలమే పలు ఆకారలైన తరంగాలుగా పరిణమిస్తున్నది కదా! మనస్సే భావాభావాల రూపంలో చిత్రవిచిత్రాలైన క్రియలను నిర్వర్తిస్తూ ప్రవాహపతితంగా ఆయా పదార్థముల ఆకారంగా రూపుదిద్దుకుంటోంది. సర్వత్యాగమును చిత్త త్యాగరూపంలో నిర్వర్తించాలి. అప్పుడు పరమాత్మ సర్వత్రా సంప్రాప్తించినదగుచున్నది. 'ఏదో లేదు' అనే వెలితి కాస్తా కనబడకుండా పూడుకుపోతుంది.
ఓ త్యాగశీలా! మరొక సూక్ష్మగ్రాహ్యమగు విషయం చెప్పుచున్నాను విను. నీవు ఆయా వస్తువులను విశేషములను త్యజించావు. బాగున్నది. అనగా, అవన్నీ నీకు త్యాజ్యవస్తువులు గానూ, నీవేమో త్యజించువాడవు గానూ ఉన్నావు కదా! అట్లాగే ఇన్నిటినీ త్యజిస్తున్న నీవు కూడా (అహంకారం) నిన్ను త్యజించ గల మరొక వస్తువునకు త్యాజ్యవస్తువై ఉన్నావు.
అయితే త్యాజ్యవస్తువును (అహంకారాన్ని) నీవు నీ స్వరూపంగా (లేక) ఆత్మగా అనుకుంటున్నావు ఇంకొక విధంగా చెప్పాలంటే, ఏ అహంకారంతో నేను ఇది వదులుతాను, అది వదులుతాను... అని చిలుక పలుకులు పలుకుచున్నావో ఆ 'నేను, నేను' అనబడు అహంకారమే అసలైన త్యాజ్యవస్తువు. అట్టి అహంకారాన్ని వదలకుండా అహంకారానికి విషయములై ఉంటున్న ఈ దేహాదులను వదిలితే ఏం లాభం? ఈ కారణం చేతనే నీకు సర్వత్యాజ్య ప్రయోజనమైన సర్వాత్మత్వం చేకూరటం లేదు.
ఇంకొక చమత్కారమైన, ఘనీభూతమైన సత్యం చెబుతాను విను. ఎవని చేత ఈ సమస్తం త్యజించబడుతుందో ఆతడు సర్వమునకు అప్రమేయమై ఉన్న ఆత్మ స్వరూపుడే అవుతాడు. ఆత్మ చేతే ఈ జగత్తంతా అవధరించబడుతోంది అనగా భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్నట్టి ఈ జగత్తంతా కూడా ఆయా జగద్విషయములచే అపరిచ్ఛిన్నమగు నీ - నా ఆత్మ చేతనే ధరించబడినదగుచున్నది. చూచావా? సర్వమూ త్యజించినవాడు సర్వమును ఆక్రమించిన వాడే అగుచున్నాడు.
యేన సర్వం పరిత్యక్తం తస్యన్ శూన్యే పి సంస్థితం । | I
జగత్సర్వం త్రికాలస్థం తన్తె ముక్తావలీ యథా
ఆ సమస్తమూ పరిత్యజించిన వారియందు, లేక ఆ విషయ శూన్యరూపుని యందు - ఒకే దారమునకు ముత్యములన్నీ గ్రుచ్చబడినట్లు - ఈ జగత్తులన్నీ కూడా స్థితి నొందియున్నవై ఉంటాయి.
తైలం లేని దీపం ఏ విధంగా వస్తువులన్నీ పరిత్యజిస్తుందో అట్లా ఈ సమస్తమును అహంకారంతో సహా పరిత్యజించావనుకో... అప్పుడు తైలం గల దీపం వలె ఈ సర్వం నీ స్వరూపంచే ప్రకాశమాన మైనదగుచున్నది. అనగా, చిత్తము నందు ఉన్న సర్వ పదార్థములనూ త్యజించి తైలం లేని దీపం వలె ఎవడు శాంతి పొందుతాడో అట్టివాడు సర్వత్యాగ రూపమగు ప్రకాశాత్మగా ఉద్భవిస్తున్నాడు. అప్పుడు తైలం గల దీపం వలె సర్వసమన్వరూపుడై వెలుగొందుచున్నాడు.
శిఖిధ్వజుడు: ఒక గృహం స్తంభాలచే నిలబెట్టబడి ఉంటోంది. స్తంభం కూలిపోతే ఇల్లు పడిపోతుంది కదా! చిత్తం త్యజించబడితే చిత్తం చేత నిలబెట్టబడుచున్న ఈ దేహం కూడా నేల కూలుతుందా?
Page:385
కుంభమహర్షి: నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక దృష్టాంతం చెబుతాను విను. ఇప్పుడు నీవు రాజ్యాన్ని, నీ సతీమణి చూడాలను, ఇక్కడికి నేను వచ్చిన తరువాత ఈ కుటీరాన్ని, తదితర పరికరాలను త్యజించావు. అన్నీ వదలినా కూడా వాటన్నిటినీ వదలుచున్న నీవు ఉండియే ఉన్నావు కదా! శిఖిధ్వజుడు: నేను లేకుండా ఎందుకుపోతాను? వాటిని వదిలేది నేనే కదా! ఆ వదలుచున్నట్టి నేను ఉంటే కదా, వదలటమనేది!
కుంభమహర్షి: బాగా చెప్పావు. అట్లాగే చిత్తమును త్యజించుటచే ఏర్పడే సర్వత్యాగానంతరం కూడా జ్ఞానరూపమగు ఆత్మ శేషించియే ఉంటుంది. ఈ దేహ - - జీవాహంకారం మటుమాయమై తత్థానంలో సర్వాత్మత్వం, అప్రమేయత్వం పరిఢవిల్లుతాయి.
సమస్త వస్తుదాహే పి యధా త్వం నే తరోనృప | సర్వత్యాగత ఏవాఙ్గ యథా నిర్వాణముచ్యతే ॥
రాజా! అన్ని వస్తువులను అగ్నికి ఆహుతి చేశావు. అయినా కూడా నీవు ఉన్నావు. అట్లాగే సర్వత్యాగం చేసిన తరువాత కూడా ఏ ఆత్మగా ఈ దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా శేషిస్తావో - దానినే మోక్ష శాస్త్రం 'నిర్వాణం' అని పిలుస్తోంది. అది నీకంటే అన్యమైనదేదో కాదని గ్రహించు.
గొప్ప ప్రకాశవస్తువులగు సూర్య చంద్ర నక్షత్రాలన్నీ శూన్యమగు ఆకాశాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయి కదా! అట్లాగే పదార్థవిషయ శూన్యమగు చిత్స్వరూపమే సమస్త జ్ఞానానికి ఆశ్రయమై ఉన్నది. ఒకడికి ఆకాశంపై కోపం వచ్చి ఒక ఉలిని తీసుకుని ఆకాశాన్ని బాదనారంభించాడనుకో... అసంగం, ఉదాసీనం అయినట్టి ఆకాశాన్ని ఉలి దెబ్బలు బాధించగలవా? 'సర్వత్యాగం' అను అమృతపానం చేసిన మనుజుని ఈ జన్మ-జర-మరణాది వ్యవహారములు స్పర్శించనైనా లేవు. ఇక బాధించటమనే ప్రసక్తి ఎక్కడిది?
సర్వత్యాగో మహత్త్వస్య కారణం నిర్మలద్యుతేః |
సర్వం త్యజసిచేత్ అస్మాత్ బుద్ధిః స్థైర్యం బృహత్తమమ్ ॥
అన్నిటి కన్నా కూడా సర్వత్యాగం మహత్తరమైనది. ఎందుకంటావేమో? సర్వం త్యజించినప్పుడే నీ బుద్ధి స్థిరత్వం పొందినదై మనో నిర్మలం అనుభవమౌతుంది. తద్వారా బుద్ధికి సర్వోత్తమత్వం ప్రాప్తించగలదు.
సర్వత్యాగమే పరమానందమైనది, దానికి భిన్నమైన సమస్తం దారుణమైన దుఃఖానికి కారణమై
ఉంటోంది.
కనుక చిత్తాన్ని, అహంకారాన్ని ఎలా త్యజించాలో బాగా విచారణ చేసి, గ్రహించి తదనుకూల మైన ఉపాయాలను ఆశ్రయించి ఉండమని నా విన్నపం. వేద వేదాంగాలు ప్రతిపాదించే ‘ఓం’ అను సంజ్ఞ యొక్క అర్థాన్ని అంగీకరించినవాడవై, ఆ అర్థసారాన్ని ఆశ్రయించినవాడవై ఆ తరువాత ఇక నీ ఇచ్ఛానుసారం ఏది ఎట్లు ఉచితమనుకుంటావో అట్లే ఆచరించు. పైగా, మరొక చమత్కారం విను.
Page:386
సముద్రం బడబాగ్నిలోకి జలాన్ని త్యాగం చేస్తోంది. ఆ జలం ఆవిరై ఆకాశంలో మేఘ రూపం పొందుతోంది. ఆ మేఘం వర్షించి నదీనదముల రూపంలో తిరిగి సముద్రంలో ప్రవేశిస్తోంది. ఎవడెంత త్యాగం చేస్తాడో తిరిగి అంతయూ పొందుతాడు. సర్వమూ త్యాగం చేశాడా, సర్వమూ పొందుతాడు. రాజుగారికి రాజ్యంలోని సర్వమూ ప్రాప్తించినదే అయినట్లు చిత్తత్యాగరూపమగు సర్వత్యాగముచే సదా, సర్వత్రా సమస్తము ప్రాప్తించినదే అవుతుంది.
పాత్ర గనుక ఖాళీగా ఉంటే మనం అందులో మధురమగు పళ్ళరసముతో నింపవచ్చు. అట్లాగే మనస్సు నుండి నాది, నాకు కావాలి, నాకు ఉండాలి... అను రూపంలో ఉండే అజ్ఞానమును, తత్సంబంధిత భావపరంపరావ్యవహారములను త్యజిస్తే అట్టి సర్వత్యాగస్థితియందు మాత్రమే ఆత్మప్రసాదకమగు జ్ఞానము వర్ధిల్లుతుంది.
అట్టి సర్వత్యాగమహేశ్వరులగు ఎందరో మహనీయులు ఈ భూమిపై సర్వకాలాల్లో ఉన్నారు. ఉదాహరణకు శాక్యముని (బుద్ధదేవుడు) సంశయరహితుడై మేరుపర్వతం వలె స్థితి కలిగి ఉన్నారు.
సర్వత్యాగో, మహరాజ! సర్వసంపత్సమాశ్రయః I
న గృష్ణాతి హి యత్కించిత్ సర్వం తస్మై ప్రదీయతే ॥
మరల చెప్పుచున్నాను. సర్వత్యాగమే సమస్త సంపదలకు ఆశ్రయమై ఉన్నది. ఎందుకంటే ఎవడు ఏది గైకొనడో, ఆతనికి అది ఇవ్వబడుచున్నది.
అందుచేత మహారాజా! సర్వపరిత్యాగం చేయి, అప్పటికీ “ఏకాంతం, స్వస్థం, ఆకాశం” వంటి ఏ నీ రూపం శేషించియే ఉందో, అట్టి రూపుడవే అయి ఉండు. నీవు అంతా త్యజించావు. మంచిదే. అయితే అంతటితో ఆగకూడదు. ముఖ్యంగా, ఏ మనస్సుతో ఇదంతా త్యజించావో అద్దానిని కూడా త్యజించు. అభిమాన, అహంకారాలను కూడా పరిత్యజించు.
“ఈ రాజ్యము, భార్య, ఈ పరిసరములు మొదలైనవి నావి కావు" అని ఏ విధంగా ఒక్క క్షణంలో నిర్ణయించుకున్నావో... అదేరీతిగా, “ఈ మనస్సు, అభిమానము, అహంకారం - ఇవేవీ నావి కావు ” అనే నిశ్చయాన్ని ఆశ్రయించుకొని ఉండు. అప్పటి నీ స్థితియే ముక్తి, మోక్షం కూడా!
29.బ్రహ్మముకాక మరింకెక్కడా ఏ ఇతరమైనదీ లేదు
శిఖిధ్వజుడు అంతా శ్రద్ధగా వింటూ కొంచెంసేపు మౌనం వహించాడు. తరువాత ప్రశాంత - - సమగ్రత్వములను వహించి ఉన్న కుంభర్షి ముఖం వైపు చూచాడు.
శిఖిధ్వజుడు: మీరు చెప్పినదంతా అత్యంత శ్రద్ధగా జాగరూకుడనై విన్న తరువాత 'ఈ చిత్తమును (లేక) మనస్సును త్యజించటమెట్లా?' అని యోచించాను. ఆకాశంలోని పక్షి, చెట్టుపై గంతులేసే కోతి లాగా ఈ మనస్సును నేను మాటిమాటికీ త్యజించటానికి ప్రయత్నించినప్పటికీ మరల వచ్చి
Page:387
పడుతూనే ఉన్నది. ఈ మనస్సును ఎట్లా పట్టుకోవాలో తెలుసు కాని, ఆయా పదార్థములను త్యజించినట్లు మనస్సును (లేక) చిత్తమును ఎట్లా త్యజించాలో మాత్రం నాకు ఏమాత్రం అవగతం కావటం లేదు. మీరు నాకు రెండు విషయాలు తెలియజేయాలి.
1. ఈ చిత్తం, లేక, మనస్సు స్వరూపం ఏమిటి? 2. దీనిని పరిత్యజించే విధానమేమిటి? కుంభమహర్షి: అనేక జన్మలుగా శబ్ద దృశ్య స్పర్శాది విషయాల పట్ల ఈ జీవునికి అభిమానం, అభిలాష, ఆకాంక్షలతో కూడిన ఒకనొక అనుబంధం ఏర్పడుతోంది. సంకల్పాల నుండి అభిలాష, అభిలాష నుండి అభ్యాసం, సుదీర్ఘ అభ్యాసం నుండి వాసనలు ఏర్పడుచున్నాయి. అట్టి వాసనలే చిత్తం యొక్క రూపం. వాసనలకు పర్యాయపదమే చిత్తం. అంతకుమించి చిత్తమనగా మరింకేమి కాదు. శిఖిధ్వజుడు: అట్టి చిత్తాన్ని జయించటం అంత తేలిక అంటారా, ఏదో మీ బోటి మహత్తర జన్మలను పొందిన వారికి తప్పితే?
కుంభమహర్షి:
త్యాగస్తస్యాతి సుకరః సుసాధ్యః స్పన్దనాదపి,
రాజ్యాదపి అధికానందః కుసుమాదవి సుందరః ॥
రాజర్షీ! నా ఉద్దేశంలో చిత్తత్యాగం చాలా తేలికైన పని. తప్పకుండా సాధ్యమే. ఊపిరి పీల్చు కోవటం కన్నా కూడా తేలికైనది. రాజ్యాధిపత్యం కన్నా పోల్చలేనంత ఆనందకరమైనది. పుష్పం కంటే కూడా అత్యంతరమణీయమైనది.
అయితే మూర్ఖత్వం ఎవరు వహించి ఉంటారో, వారికి నేను చేయగల ఉపకారమేదీ లేదు. ఒక సామాన్య పౌరుడు చక్రవర్తి కాగలడా? ఒక పువ్వుతో వింధ్యపర్వతాన్ని కదల్చగలమా? అట్లాగే ఆత్మజ్ఞులు చెప్పే ఉపాయాలను సంకోచిస్తూ పెడచెవిన పెట్టే మూర్ఖులకు, అల్పమైన ఆశయాలకై తాపత్రయపడే వ్యర్థజీవులకు అది దుస్సాధ్యమని నేననక తప్పదు.
శిఖిధ్వజుడు: మహాత్మా! వాసనలచే వ్యాకులమైనట్టి ఈ చితం యొక్క స్వరూపమేమిటో మీ వచనాల ద్వారా నేను గ్రహించాను. అందుకు మీకు కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేస్తున్నాను. అయితే అట్టి చిత్తత్యాగం విషయానికి వచ్చేసరికి అది వజ్రం మింగటం కంటే కూడా చాలా దుస్సాధ్యమని నా కనిపిస్తోంది. మీరేమో "అబ్బే! అది చాలా తేలికయ్యా"! అని ప్రవచిస్తున్నారు.
మీరంటే నారదమహర్షి పుత్రులు. తపోసంపన్నులు. బ్రహ్మదేవునిచే జ్ఞానం ప్రసాదించబడినట్టి మహామహిమాన్వితులు. మీకు చిత్తాన్ని జయించటం ఒక లెక్కలోనిది కాదు. మరి మా సంగతేమిటి? ఈ చిత్తం మాకు సంసార దుర్గంధాన్ని, దుఃఖదాహాన్ని తప్పించుకోవటానికి వీలు కానట్టి జగద్వ్యవహారా లను, ఏమాత్రం అర్థంకాని మోహాన్ని, విషయాల వైపుగా పతనాన్ని, అనేక దేహపరంపరలను కలుగజేస్తోంది. పైగా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు కదా! రాజాధిరాజులను కూడా పాదాక్రాంతం చేసుకోగల మహావీరుడగు చక్రవర్తి కూడా అంతఃపురంలో మహారాణి ముందు దాసోహమన్నట్లు మేము ఈ చిత్రానికి దాసులమై అనువర్తిస్తున్నాం. మా హృదయంలోనే ఉదయించి
Page:388
ఉన్న ఈ చిత్రాన్ని త్యజించటమెట్లా? బాహ్యవస్తువునైతే ఒక్కక్షణంలో వదలవచ్చు. హృదయంలో తిష్ఠ వేసుకుని ఉన్న చిత్తాన్ని వెడలగొట్టటమెట్లా? అధిగమించటం ఎట్లా కుదురుతుంది? కుంభమహర్షి: చిత్తత్యాగం తేలిక అను, లేక కష్టమను. ఏది ఏమైనా చిత్తం యొక్క సమూల నాశనమే సంసార క్షయం. చిత్తం త్యజిస్తేనే ఈ జీవునికి నిశ్చింత. లేదా తిప్పలు తప్పవు. అంతకు మించి వేరే మార్గం లేదు. చిత్తమును నశింపజేయాలంటే ఆ చిత్తమును త్యజించాలి.
శిఖిధ్వజుడు: మహాత్మా! మీ వాక్యామృతం గ్రోలటం చేత “చిత్తత్యాగం చేతనే చిత్తం యొక్క నాశనం ఒనగూడుతుంది" అనే విషయం నేను బాగా గ్రహించాను. కానీ ఏం లాభం? ఈ చిత్తం యొక్క అభావం ఎట్లా సంపాదించాలో నేను ఏమాత్రం గ్రహించలేకపోతున్నాను. ఈ విషయమై మార్గమేమిటో చెప్పి నన్ను కాపాడండి.
కుంభమహర్షి: శాఖ-ఫల-పల్లవాలుగా విస్తరిల్లిన మహావృక్షం వంటి ఈ చిత్రానికి బీజం 'అహంకారం' అను జ్ఞానమే! అట్టి వృక్షమును సమూలంగా పెల్లగించాలంటే నీవు ఆకాశం వలె సువిస్తార హృదయుడవు కావాలి. అనగా నీ హృదయాన్ని నిరావరణంగా, విక్షేపరహితంగా తీర్చిదిద్దుకోవాలి. శిఖిధ్వజుడు: (కొద్ది నిమిషాలు తనలో యోచన, తర్జన భర్జనలు చేసుకున్న తరువాత) ఓ మునీశ్వరా! ఇప్పుడు నాలో చిత్తవృక్షం గురించి మరికొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఈ చిత్తము యొక్క మూలమేమిటి? దీని ఉత్పత్తి స్థానమేది? ఇది ఎట్లా అంకురిస్తోంది? దీని యొక్క శాఖలు, కాండము ఏమై ఉన్నాయి? దీనిని సమూలంగా పెల్లగించటమెట్లా?... ప్రభో! మీ పాదములంటి ప్రణమిల్లుచున్నాను. ఈ విషయాలన్నీ నాకు తెలియజేయండి.
కుంభమహర్షి: ఈ చిత్త వృక్షమునకు మూలం అజ్ఞానముచే ఉదయించే అభిమానమునకు కర్తయగు జ్ఞాతయే! పరమాత్మను ఆశ్రయించియున్న మాయయే దీని క్షేత్రం.
ప్రప్రథమంగా ఉత్పన్నమైన ఈ చిత్రం నుండే “పరిచ్ఛిన్న అహం” అను నిశ్చయరూపమైనట్టి, అనుభవాత్మకుడైనట్టి చిదాభాసుని అంకురం జనిస్తోంది. నిశ్చయాత్మకమై నిరాకారమైనట్టి చిత్తక్షేత్రంలో వెలసిన దానినే “బుద్ధి” అని పిలుస్తున్నారు. నిజానికి “నిర్వికారం, నాశరహితం” అయిన చైతన్యమే మిథ్యాభూతమై ‘చిత్తం’ అనే ధర్మంతో సంబంధం కల్పించుకున్నదై “జీవుడు" అనే నామధేయానికి అర్హమగుచున్నది. కనుక చిత్తక్షేత్రం ఏర్పడి ఉన్న స్థానం కూడా ఆత్మయే!
ఆ చిత్తం నాడి, బొమికలు, రక్తమాంసాలతో కూడిన ఈ భౌతిక దేహాన్ని నిలబెట్టి ఉంచటానికి గృహస్తంభం వంటిది అగుచున్నది. అనగా ఈ దేహం ఉద్భవమవటానికి మూలం చిత్తం. మధ్యలో అనుభవమయ్యే వాసనలు కూడా చిత్తమే. బాహ్య-అభ్యంతరాలలో కూడా వృక్షరసస్వరూపం వంటిదై ఈ దేహం పడిపోకుండా రక్షిస్తోంది. ఇంద్రియానుభవాలన్నీ చిత్తవిన్యాసం కాక మరింకేమీ కాదు.
ఓ రాజా! చెట్టు కొమ్మలను త్రెంచినట్లుగా మొట్టమొదట చిత్తరూప ప్రసరణములగు విషయ భోగాసక్తులను త్రెంచుకుంటూ పోవాలి. అద్వితీయమగు ఆత్మదర్శనం చేత ఈ చిత్త వృక్షాన్ని సమూలంగా నశింపజేయాలి. ఇదీ నీవు చేయవలసిన పని!
Page:389
శిఖిధ్వజుడు: మహానుభావా! ఇప్పుడు మీరు రెండు విషయాలను ఆజ్ఞాపించారు – 1. చిత్తముచే ఏర్పడుచున్న విషయభోగాసక్తిని ఉపశమింపజేయటం;
2. ఆత్మాసాక్షాత్కారంచే చిత్తమును సమూలంగా నశింపజేయటం.
ఈ రెండు ఇప్పుడు నా కర్తవ్యములై ఉన్నాయని ఒప్పుకుంటున్నాను. అయితే, వీటినిప్పుడు నేను ఎట్లా సాధించగలనో సవివరములతో కూడిన ఉపాయములేమైనా చెప్పండి.
కుంభమహర్షి: క్రమంగా చిత్తము నుండి "కర్మలు-కర్మఫలాలు-కర్తృత్వం-భోక్తృత్వం" అనే భ్రమాత్మక విషయములను బయల్వెడలగొట్టటం అభ్యసించు. అప్పుడు చిత్తము తప్పక స్వాధీనమవగలదు. అటుపై చిత్తము చిత్స్వరూపమై విరాజిల్లుచున్నది.
శిఖిధ్వజుడు : మరి అవశ్యంగా నిర్వర్తించవలసి ఉన్న ఫల - క్రియాదుల విషయమేమిటి? వాటిని త్యజించమంటారా?
కుంభమహర్షి: ఈ చిత్తం ఫల-క్రియాదులతో కూడిన వాసనల రూపంగా ప్రకటితమౌతోంది. అట్టి ఫల-క్రియాదులందు ఆసక్తిని కలిగి ఉండకపోవటమే. (అనాసక్తి కలిగి ఉండటమే) ఈ చిత్తమును జయించే ఉపాయం. అట్టి అనాసక్తి ఎట్లా ఏర్పడుతుంది? అంతర్ముఖ వృత్తిచే సర్వ విషయాల కంటే మధురాతి మధురమైన ఆత్మ యొక్క విచారణ చేస్తూ ఉంటే క్రమంగా ఫల-క్రియాదులందు ఆసక్తి స్వయంగా సన్నగిల్లుతుంది. అట్లు ఫలక్రియాదుల వైపుగా ప్రసరించే ఆసక్తులను త్యజించి మౌనివై, శాంతుడవై సర్వవాదోపవాదాలను త్యజించు. ఆత్మ విచారణలో మాత్రమే తత్పరుడవగుము.
ఓ రాజా! ఈ దృశ్య విషయాల పట్ల అనాసక్త బుద్ధిని పెంపొందించుకో. అట్టి అనాసక్త బుద్ధిచే యథాప్రాప్తాలైన కర్మలను ఆచరిస్తే, అంతరంగంలో తిష్ఠవేసుకున్న ఈ చిత్రాన్ని అతి సులభంగా త్రెంచి వేయవచ్చు. పురుషప్రయత్నంచే విషయాభిముఖ స్వభావాన్ని ఛేదించుచుండగా అప్పుడు ఈ చిత్త వృక్షాన్ని ఛేదించటం సులభతరం అవుతుంది. ఏది ఎట్లా ఐనా సరే, ఈ చిత్తవృక్షాన్ని సమూలంగా పెరికివేయటంలోనే ఈ జీవుడు అధిక ప్రయత్నశీలుడై ఉండాలి. అనగా, చిత్తవృక్ష శాఖయగు విషయాభిలాష త్యజించటం గౌణమైతే, మూలాన్నే ఛేదించటం ప్రధానమైన కార్యక్రమమని గ్రహించు.
ఓ మహారాజా! ఈ విధంగా ఆత్మవిచారణ పరాయణుడవై, ముఖ్యంగా చిత్తవృక్షం యొక్క మూలచ్ఛేదనమునందు తత్పరుడవైతే అప్పుడు శీఘ్రంగా “అచిత్తత్వదశ” ప్రాప్తించగలదు. శిఖిధ్వజుడు: చిత్తవృక్షమును దహింపజేయటంలో నాకు ఉపకరించే 'అగ్ని' ఏది? కుంభమహర్షి : "నేనెవరు? నా వాస్తవమైన స్వభావం ఏమిటి”? అనే ప్రశ్నను చిట్టచివరి వరకు విచారణ చేయి. స్వస్వరూపానుభవ సాక్షాత్కారం వరకు ఆ విచారణ కొనసాగించు. అట్టి విచారణయే చిత్త వృక్షమును మొదలంట దహించి వేయగల అగ్ని.
శిఖిధ్వజుడు : మహర్షీ! “నేను ఎవరు?” అను ప్రశ్నను నా స్వబుద్ధితో చాలాసార్లు విచారణ
చేశాను. అయినా కూడా...
కుంభమహర్షి : చేశావు కదా! మంచిది. అయితే నీ స్వబుద్ధిచే చేసిన విచారణచే నీవెవరో చెప్పు?
Page:390
శిఖిధ్వజుడు : నేనీ ఎదురుగా కనబడే జగత్తును కాదు. జగత్తు నాది కాదు. నేను జగత్తుకు సంబంధించినవాడను కాను. ఈ పృథివి, పర్వతాలు, ఇక్కడి వనాలు, ఆకుల కదలికలు నేను కాదు. ఇవి నాకు సంబంధించినవి కావు. నేను వీటికి సంబంధించినవాడను కాను. అట్లాగే, జడమాత్రములై ఉండటం చేత కాళ్ళు, చేతులతో కూడిన ఈ దేహం మొదలైనవి కూడా నేను కాదు. కుంభమహర్షి బాగు బాగు.
శిఖిధ్వజుడు : కర్మేంద్రియాలు గాని, జ్ఞానేంద్రియాలు గాని నేను కాదు. మనస్సును కాదు. బుద్ధిని
కాదు. జడమే అయి ఉండటం చేత 'అహంకారము' కూడా నేను కాదు.
ఓ దేవఋషీ! బంగారపు ఉంగరంలో బంగారం - ఉంగరం అనునవి వేరు వేరు వస్తువులు కాదు కదా! బంగారంలో ఉంగరం అనబడు మరొకటెక్కడున్నది? అట్లాగే చిదాత్మయందు జడమగు అహంకారం వేరుగా లేదు. మృగతృష్ణ, ముత్యపుచిప్పలో వెండి అసద్రూపాలే అయినప్పటికీ భ్రమ చేతనే ప్రసిద్ధములై ఉంటున్నాయి కదా! అదే విధంగా జడమగు అహంకారం కూడా అసత్తు మాత్రమే. లేక, అది ఆత్మ యొక్క ఆసక్తి రూపం. ఆసక్తికి వేరుగా అహంకారం లేనే లేదు. అట్లాగే - 14 లోకాలకు ఆధారం శబ్దాది విషయాలు. ఆ శబ్దాది విషయాలకు ఆది కారణం ప్రకృతి కదా!... అట్టి ప్రకృతి కూడా చిదాత్మయందు వేరుగా లేదు. మునీశ్వరా! ఈ విధంగా అహంకార మలం యొక్క మార్జనం (Washing off) ఎరిగియే ఉన్నాను. అయితే, ఆ ఆనందైక సాక్షి చైతన్యమును మాత్రం ఎరగలేకపోతున్నాను. బహుశః అందుచేతనే ఇంకా దుఃఖితుడనై మిగిలిపోతున్నాను. కుంభమహర్షి : పాపరహితుడవు, బుద్ధిమంతుడవు అగు ఓ శిఖిధ్వజ మహారాజా! శరీరం దగ్గిర నుండి అహంకారం వరకు నీవు కావని బుద్ధితో గ్రహించానని అంటున్నావు. సంతోషం! నీవు ఏవేవి కావో చెప్పుచున్నది యుక్తి-యుక్తమే! ఇంతకీ నా ప్రశ్న 'నీ వెవరు?' అని కదా! ఇవేవీ నీవు కాకపోతే ఇంతకీ నీవేదై ఉన్నావో, అది చెప్పు.
శిఖిధ్వజుడు : హే దేవపుత్రా! అదీ చెబుతాను వినండి. ఎద్దానియందైతే ఇటు జడరూపాలగు శబ్ద-స్పర్శ-రూప-రసాది విషయాలు... అటు వాటి సంబంధితమైన ఆనందం అనుభూతమగు చున్నాయో, ఎద్దాని యందు ఈ బుద్ధి యొక్క వృత్తులు ఆరూఢమై తద్ద్వారా ఈ సమస్తము యొక్క విభాగం నిర్ణయించబడుచున్నదో, అట్టి శుద్ధ చిన్మాత్ర సాక్షి చైతన్యమునే నేను.
కానీ, అంతటి శుద్ధుడనగు నాకు ఏ కారణం చేతనో ఈ దేహాహంకారమునందు, “దీనికి నేను చెందినవాడను”... అను రూపంతో కూడిన ఆత్మాభిమానం సంలగ్నమై ఉంటోంది. అట్లు నిష్కారణంగా ఎందుకు అట్టి సంలగ్నమేర్పడుతోందో నాకు అర్థమవటం లేదు. అంతేకాదు 'బ్రహ్మపదం' అని దేనిని అంటున్నారో నేను గ్రహించలేకపోతున్నాను. హే మహర్షీ! చాలా కాలంగా ఎంతో ప్రయత్నించి కూడా ‘ఆత్మయొక్క ఆవరణం' అనదగిన అసలైన అనాత్మరూప అహంకారాన్ని నేను రహితం చేయ లేకపోతున్నాను. కాబట్టే మహద్దుఃఖాన్ని అనుభవిస్తున్నాను.
కుంభమహర్షి : అట్లాగా? ఏ మహాదోషము నీయందు సంలగ్నమైనట్లు నీ కనిపిస్తోందో, దేనిచే నీవు సంసారివై పడి ఉంటున్నావో, అట్టిది సత్తయా? లేక అసత్తయా? కొంచెం యోచించి చెప్పు?
Page:391
శిఖిధ్వజుడు : మహాత్మా! అది సత్తయో, అసత్తయో నాకు తెలియదు. “చిత్త వృక్షమునకు బీజము” అని మీరు చెప్పిన అహంకారం గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. దానిని వదలించుకునే ఉపాయమేమిటో నాకు తెలిసిరావటం లేదు. ఒకవేళ ఎలాగో అలా దానిని త్యజించాననుకోండి... మరల ఎటువైపు నుంచో మరింత బలం పుంజుకుని అది కొద్దిసేపట్లో వచ్చిపడుతోంది! కుంభమహర్షి : ఓహో! అదా సంగతి? బాగా ఉన్నది. అయితే ఈ ప్రపంచంలో ఒక కార్యం ఉన్నదీ అంటే, దానికొక కారణం ఉండియే తీరాలన్నది ఒక సుప్రసిద్ధమైన సిద్ధాంతం కదా! ఒకవేళ కారణం లేకనే ఏదైనా కార్యం ఉన్నట్లుంటే అది రెండవ చంద్రుడు (మెల్లకన్నులకు కనబడే రెండు చంద్రబింబాలు) వలె లేనిదే అగుచున్నది. కాబట్టి కారణమనేదే లేకపోతే, అట్టిది బాగా పరిశీలించుట చేత లేనిదిగానే (అసత్తుగానే) అగుచున్నది కదా!
ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే... ఏ అహంభావం కారణంగా కలిగి మనస్సు, జగత్తు మొదలైన అంకురం ఉత్పన్నమైనదో, అట్టి అహంభావం ఏ కారణం చేత ఉత్పన్నమైనదని నీకు అనిపిస్తోందో కొంచెం సేపు స్వబుద్ధితో విచారించి నాకు చెప్పు.
శిఖిధ్వజుడు : (కొంచెంసేపు అంతరంగ మథనం చేసిన తరువాత) ఓ మునీశ్వరా! మీరు చెప్పినట్లు నేను అంతరంగంలో అహంకారం గురించి స్వబుద్ధితో పరిశీలన చేశాను.
ఈ దేహం, తదితర దృశ్య పదార్థములు ఏర్పడి ఉండి, అవి తటస్థించటం చేతనే అహంభావం ప్రస్ఫుటమౌతోంది. కనుక అహంభావం అను దోషానికి కారణం దేహంతో సహా ఏర్పడిన దృశ్యమేనని నాకు అనిపిస్తోంది. అట్టి అహంకారాన్ని ఎట్లా శమింపజేయాలో నాకు చెప్పండి. ఎందుకంటే చిత్తం ఒకవైపు విషయాల వైపు ఉన్ముఖమౌతుంటే అహంభావం దుఃఖములు కలిగించుట కొరకే జనిస్తోంది. విషం ఉపశమించటానికి ఔషధం సేవించినట్లు నేను విషయాల నుండి ఉపశమించటానికి ఏం ఔషధాలు వాడాలో చెప్పండి.
కుంభఋషి : ఓ రాజా! ఎరుగుచున్న ఈ చిత్తం (వేద్యం) ఎరుగబడుచున్న విషయాలు... ఈ రెండిటిలో దృశ్యమే చిత్తం యొక్క ఉన్ముఖమునకు కారణమని నీవు అన్నావు కదా! ఈ విషయమై, అనగా 1. “సంసారానుభావానికి చిత్తం కారణమా? 2. చిత్తమునకు లభిస్తున్న విషయాలు చిత్రాన్ని ప్రలోభపరుచుటచే దృశ్య విషయాలే కారణమా?” అనే విషయం మరికొంత పరిశీలించి నీకేమనిపిస్తు న్నదో చెప్పు? దృశ్యం స్వతహాగా జడమైనప్పటికీ అద్దానికి చిత్తమును తన మార్గంలో స్పందింపజేయ టానికి స్పందనశక్తి ఎట్లా లభిస్తోందో యోచించు.
శిఖిధ్వజుడు : ఓ మునీంద్రా! వేద్యం (చిత్తం), వేదనం (విషయం); మరియు చేత్యం, చేతనం... ఈ ఉభయ ద్వంద్వాలు ఏర్పడటానికి కారణం దేహం, తదితర పదార్థముల ఉనికియేనని నాకు అనిపిస్తోంది. కళ్ళకు కనబడకపోవుటచే అసత్యం వలె అనిపించే వాయు వీచికలే వృక్షం యొక్క కదలికలకు కారణమగుచున్నట్లు జడములే అయినప్పటికీ శరీరాది వస్తువులు ఉన్నాయి కాబట్టి వాటిని గూర్చిన విజ్ఞానం ఉదయిస్తోంది. శరీరమే లేకపోతే ఇంద్రియాలుండేవి కావు. ఇంద్రియాలు