Page:392
లేకపోయినా, వాటికి విషయమగుచున్న పదార్థాదులు లేకపోయినా వేదన, బంధం (తెలియబడుటచే ఏర్పడే సాంసారిక వ్యవహారం) ఉండేది కాదు. అయితే, ఈ దేహాది వస్తువుల ‘అభావము’ను నేను సంపాదించుకుని ఉంటే అప్పుడు విషయముల సంబంధ - బంధనములు నాకు ఉండేవి కాదేమో! అభావం ఎట్లా సంపాదించుకోవాలో నాకర్థమగుట లేదు.
కుంభమహర్షి : ఓ రాజా! ఈ దేహాది పదార్థముల సత్త యథార్థంగా ఉండి ఉంటే నీవు చెప్పినట్లు వాటి యొక్క జ్ఞానమునకు అవియే కారణమని మనం అనవచ్చు. దేహాదుల సత్తయే లేదు కదా! మరి ఈ దేహాదులకు అనుభవాన్ని కలిగింపజేసే మనస్సును స్పందింపజేసే స్వయంశక్తి ఎక్కడున్నది? శిఖిధ్వజుడు : దేవమునీ! ఏ వస్తువు యొక్క స్వరూపం, ఆకారం, తదితర లక్షణాలు ప్రత్యక్షంగా లభ్యమగుచున్నాయో, ఇక అది ‘అసద్రూపం' అని మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? “అది వెలుగునిస్తు న్నప్పటికీ వాస్తవానికి అది చీకటి”... అనటం కుదరదు కదా!
కాళ్ళు, చేతులు మొదలైనవన్నీ కలదై, క్రియాఫలయుక్తమై స్పష్టంగా ఉన్నట్లు సత్తుగా అనుభూత మగుచున్న ఈ దేహం 'లేనిది' ఎట్లా అవుతుంది?
కుంభమహర్షి : మనం ఇప్పుడు ఒకసారి అనుకున్నట్లు ఒక వస్తువు యొక్క ‘కారణం' లేనిదే అయినప్పుడు, ఇక ఆ కార్యవస్తువు కూడా లేనిదే అవుతుంది. అద్దాని జ్ఞానమేదైతే ఉన్నదో అదంతా భ్రమ మాత్రమే అవుతుంది. ఇప్పుడీ శరీరం విషయానికి వద్దాం. శరీరముండటం చేతనే బంధనం ఉంటోందని నీవు అన్నావు కదా! ఈ శరీరం ఏ కారణం చేత ఏర్పడి ఉంటోంది? బీజమే లేకపోతే వృక్షం కూడా లేనిదే అయినట్లు కారణం లేకపోవుటచే ఈ 'దేహం' అనబడే కార్యం కూడా లేనిదే అగుచున్నది. ఎండమావులలోని జలం యొక్క అనుభవం ద్రష్ట యొక్క భ్రమ వల్లే కలుగుచున్నట్లు... ఏ కార్యమైనా సరే కారణం లేకపోతే అది లేనట్లే. అందుచేత ఓ మహారాజా! ఈ శరీరం, తదితర దృశ్య వ్యవహారం అసత్తు అయి ఉన్నాయి. అనగా, ఈ శరీరం, ఈ దృశ్యం మొదలైవి ద్రష్ట యొక్క మిథ్యాభ్రమచే ఉదయించినవిగా ఎరుగుము.
ముత్యపు చిప్ప మిలమిల మెరుస్తోంది కాబట్టి అందులో వెండి లభిస్తుందంటే ఒప్పుకుంటావా? ‘ఆకాశంలో రెండవ చంద్రుడు నాకు కనిపిస్తున్నాడు' అని ఒక మెల్లకన్నువాడు అంటే, నీవు రెండవ చంద్రుని ఉనికి అంగీకరిస్తావా?... 'గొడ్రాలి రెండవ కుమార్తె చాలా అందంగా ఉంటుంది' అని ఎవరైనా అంటే ఆ సౌందర్యవర్థనం నీకు నమ్మదగినదౌతుందా?... వాటన్నిటికీ కారణం అలభ్యం. కాబట్టి కార్యం కూడా లేదు. అట్లాగే 'ఈ శరీరాదులు కారణ రహితమగుటచే లేవు... అని గ్రహించు. అది అసద్రూపమే.
శిఖిధ్వజుడు : కళ్ళకు కనబడే శరీరము, దృశ్యము లేవంటున్నారే? దేహమునకు కారణం లేదని ఎందుకనుకోవాలి? “ఈ దేహోత్పత్తికి తండ్రియే కారణం" అని ఎందుకనరాదు?
కుంభమహర్షి : వాస్తవానికి తండ్రి అనబడువాడు, అతని దేహాదులు కారణరహితమైయున్నాయి. అసత్తు నుండి ఉత్పన్నమైనదంతా అసత్తేనని చెప్పక తప్పదు కదా! బీజం లేకుండా వృక్షం సంభవించనట్లు
Page:393
... పదార్థములకు కార్యములకు కారణం ఉండాలి. ఆ కారణమును 'బీజము' అని పిలుస్తున్నారు. బీజకారణం లేనిదే అయినప్పుడు అట్టి దాని గురించిన జ్ఞానము కూడా భ్రమయే అవుతుంది. నిర్భీజమైన వృక్షము భ్రమమాత్రమే అయినట్లు ఈ దేహములు, వాటితో కల్పన చేసుకోబడే బాంధవ్యములు ఇవన్నీ మతి యొక్క భ్రమయేనని సిద్ధాంతీకరించబడుతోంది.
శిఖిధ్వజుడు : ఈ దేహంలాగానే, తండ్రిదేహం, ఆ తండ్రి దేహమునకు కారణమైన తాతదేహం కూడా అకారణమవటం చేత అసత్ దృశ్యం అని తేలుస్తున్నారు. ఒక దేహం అసత్ కనుక, ఆ అసత్ నుండి వచ్చిన మరొక దేహం కూడా అసత్తేనని మీరు నిర్ణయిస్తున్నారు. ఇంతవరకు, పోనీ, మీరు చెప్పినదే కాసేపు ఒప్పుకుందాం. ఈ ముల్లోకాలలోని ప్రజాసృష్టిస్రష్టలగు ఋషులున్నారు కదా! మనువు, దక్షుడు, మరీచి మొదలైన ఋషులు ఆదిపురుషులని, వారే ఈ పుత్ర - పిత్ర - పితామహాది సమస్త ప్రాణికోట్ల సంతతికి కారణమని పురాణములలో చెప్పబడినది కదా! కాబట్టి ఈ దేహానికి పూర్వాతి పూర్వమైన కారణం ఉన్నట్లే కదా! మరి అకారణమని ఎందుకనుకోవాలి? ఈ సృష్టి జీవుల దేహాలన్నిటికీ ఆదికారణం ఆది పితామహుడగు హిరణ్యగర్భుడేనని మనం నిర్ణయించవచ్చు కదా! కుంభఋషి: కారణం యొక్క అభావం (లేక) అలభ్యం చేత అది పితామహుడు కూడా ఈ జీవదేహాల వల్లే లేనివాడై ఉన్నాడు. ఎందుకంటే కారణం లేనప్పుడు ఇక ఏ పదార్థాల ఉనికి లేనట్లే! శిఖిధ్వజుడు : సముద్ర జలంలోని మొట్టమొదటి తరంగం వలె చిత్ సాగరంలోని ప్రప్రథమ విజ్ఞాన తరంగమే ఈ హిరణ్యగర్భుడు అని వేదజ్ఞులు ప్రవచిస్తున్నారు. అతని సంకల్పమే ఈ జడ - చేతన జగత్తు. అట్టి సమష్టి సృష్టి విజ్ఞానం (లేక) ప్రజ్ఞ యొక్క కార్యమగు ఈ జగత్తు మనకు ఎదురుగా ఉన్నది కదా! కార్యం ఉన్నది కనుక కారణమగు సృష్టి ప్రజ్ఞకు యజమానియగు (కర్తయగు హిరణ్యగర్భుడు ఉండి తీరాలి. మీరు 'హిరణ్యగర్భుడు కూడా కారణం లభించని కారణంగా లేనే లేడు’ అని ఎట్లా నిర్ణయిస్తున్నారో నాకు అర్థమగుటలేదు. "సృష్టి ఉన్నది గాని, సృష్టికి కర్తలేడు” అని మీరు అంటుంటే ‘కుండ ఉన్నది గాని, మట్టి లేదు, వస్త్రం ఉన్నది గాని దూది లేదు, గోడ ఉన్నది గాని ఇటుకలు లేవు”... అన్న వాక్యాల వలె అర్థరహితం కాదంటారా?
కుంభఋషి : ఓహో...అదా నీ సందేహం? కొన్ని సిద్ధాంతాల ద్వారా పితామహుడగు హిరణ్యగర్భుడు లేనివాడేనని భ్రమచే ఉన్నట్లు దర్శించబడుచున్నదని మనం నిరూపించుకోవచ్చు.
1. కాలమునకు అతీతమైనదే సత్యం! - ఏది సత్యమో, సత్తయో అది త్రికాలాబాధ్యమై ఉండాలి. కాలమునకు లోబడినవన్నీ భ్రమ మాత్రమే! లేక అసద్వస్తువులే! లేక అసత్యమే!
ఏదైనా ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోతూ ఉంటే దానిని త్రికాల బాధితము అంటాం. కాలము చేత వచ్చి కాలము చేత పోయేది సద్వస్తువు కాదు. “నిన్న లేదు. కానీ ఈ రోజున ఉన్నది. మరి రేపటి రోజుకు లేకుండా పోతోంది" అనునదేదైనా సరే, వాస్తవానికి లేనిది. మరి ఉన్నట్లు అనిపిస్తోందే? అట్లా అనిపించటానికి కారణం అసత్ప్రృష్టి, అల్పమైన (లేక) సంకుచితమైన అవగాహన, నిత్యానిత్యముల అవివేకము అని అనక తప్పదు.
Page:394
“సమష్టి సృష్టి ప్రజ్ఞాస్వరూపుడగు పితామహుడు (హిరణ్యగర్భుడు) బ్రహ్మం నుండి లేక చిత్ సాగరం నుండి ప్రకటితమయిన మొదటి తరంగం వంటివాడు”... అని నీవే అన్నావు కదా! అంటే ఆ సమష్టి సృష్టి ప్రజ్ఞకు ముందు ఏమున్నది? బ్రహ్మం లేక చిత్ సాగరం కదా! కనుక సృష్టి కర్త కూడా సర్వదా వస్తుతః బ్రహ్మమే అయి ఉన్నారు. చిద్వస్తువే సర్వదా ఉన్నది. భ్రమ చేతనే హిరణ్యగర్భుని యొక్క ద్వితీయమైన ఉనికి అనుభవమౌతోంది.
2. ఈ సృష్టి భ్రమయే - సమష్టి సృష్టి ప్రజ్ఞ బ్రహ్మానికి వేరుగా లేదని, ఏది ఉన్నట్లుగా కనబడుతోందో -
అది భ్రమతో కూడిన దృష్టిచే అట్లనిపిస్తోందని అనుకున్నాం కదా! కనుక ఆ పితామహుని సంకల్పమగు ఈ సృష్టి, ఇందలి వ్యష్టి ప్రజ్ఞలు, సమష్టి ప్రజ్ఞలు భ్రమయే! సదా, సర్వదా ప్రజ్ఞయే ఉన్నది కాని, ఆ ప్రజ్ఞకు విషయాలగు ఈ దేహాలు, జీవులు, ఆ జీవుల జన్మ, కర్మఫలములు, ఆ జీవులకు బంధ మోక్షాలు ఏర్పడటం ఇవన్నీ భ్రమ మాత్రమే! భ్రమ కారణంగా గల తదనంతర విశేషాలన్నీ భ్రమయే కదా! కల్పనచే ఏర్పడియున్నవన్నీ కూడా కల్పనా విశేషాలే కదా! ఈ శరీరం, ఈ శరీరాన్ని ధరించే వ్యక్తిగత జీవుడు, ఆతని ప్రారబ్ధ-సంచిత-ఆగామి కర్మలు, జన్మమృత్యువులు, వ్యక్తికి వ్యక్తికి మధ్య కనబడే సంబంధ బాంధవ్యములు, మనవారు కానివారు, మనజాతి-వేరుజాతులు, భాషా-ప్రదేశ సంబంధమైన మానవ దేవత జంతు తదితర విభాగాలు ఇవన్నీ భ్రమయే. ఎండమావులే భ్రమ అయినప్పుడు ఆ భ్రమలోని ఒక తరంగానికి, మరొక తరంగానికి గల భౌతికపరమైన విభేదములు భ్రమ కాదా? కనుక హిరణ్యగర్భుని నుండి పురుగు వరకు ఉన్నది సద్వస్తువగు నిర్మల ప్రజ్ఞయే. అదియే బ్రహ్మం. విషయరహిత ప్రజ్ఞయే బ్రహ్మం. విషయ సహితమైనదంతా భ్రమయే.
3. ఈ సృష్టి అంతా బ్రహ్మమే! - ఒక వస్తువు నుండి ఏ కారణం లేకుండానే మరొక వస్తువు బయల్వెడలుతోందంటే ఆ రెండవ వస్తువు మొదటి వస్తువుకు భిన్నమైనది కాదు. జలంలోంచి ఏర్పడే తరంగం జలానికి భిన్నం కాదు. ఒక తరంగానికి, మరొక తరంగానికి మధ్య కనిపించే పొడవు, వెడల్పుల తేడా భ్రమయే. ఆ రెండు తరంగాలు జలమే కదా! జలానికి "తరంగం అను మరొకటి అగుట” అనే ధర్మం లేదు. తరంగంగా కనిపించేదంతే జలమే. అగ్నిజ్వాలలు అగ్ని నుండి వేరైనవి కావు.
అట్లాగే... నీవు చెప్పినట్లు చిత్ సాగరం నుండి ప్రప్రథమంగా బయలుదేరిన 'హిరణ్యగర్భుడు, పితామహుడు' అను పేర్లతో పిలువబడే సమష్టి సృష్టిప్రజ్ఞ (బ్రహ్మదేవుడు) ఆకాశంలోని ద్వితీయ చంద్రుని వలె, మట్టిని ఏమరచినట్టి కుండ వలె, బంగారాన్ని గమనించనప్పటి ఆభరణం వలె అసత్ దృష్టి ఫలితమే! లేక, భ్రమచే ఏర్పడిన అవగాహన, మరియు కల్పన మాత్రమే! ఈ విధంగా ఈ దేహ-జీవాదులంతా కల్పితానుభవములే!
ఈ విధంగా పితామహుడగు హిరణ్యగర్భుడు బ్రహ్మము కంటే వేరు కాదు. భ్రమ (లేక) అవిద్య విద్యచే మాసిపోతుంది. అజ్ఞానం తొలగితే బ్రహ్మమే సమష్టి సృష్టి ప్రజ్ఞగా తెలియవస్తుంది. ఈ కారణం చేత ఆ బ్రహ్మమే స్వరూపంగా గల సమష్టి ప్రజ్ఞా స్వరూపుని సంకల్పం నుండి ఏర్పడిన ఈ జీవ జడ సృష్టి కూడా బ్రహ్మమే. బ్రహ్మానికి ఎక్కడైనా వేరుగా అనిపిస్తే అది భ్రాంతి మాత్రమే.
Page:395
భూత-భవిష్యత్-వర్తమానాలలో ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం నిర్విషయమైనట్లే ఈ సృష్టి కూడా నిర్విషయమైనప్పటికీ భ్రమచే విషయ సమన్వితమైనట్లుగా గోచరిస్తోంది.
ఓ శిఖిధ్వజా! ఈ విధంగా సత్ (పౌరాణికంగా విష్ణువు యొక్క నాభి నుండి ఏర్పడిన హిరణ్యగర్భుడు, ఆ హిరణ్యగర్భుడు కారణం నుండి ఏర్పడిన మనువు, దక్షుడు, మరీచి మొదలైన ఋషులు, వారిచే కల్పన చేయబడిన ఈ సృష్టి అనే కార్యం - ఇవన్నీ కూడా బ్రాహ్మీ దృష్టిచే బ్రహ్మం, ద్వితీయ దృష్టిచే భ్రమ అయి ఉన్నాయి.
సృష్టి, జీవుడు, బంధం, మనస్సు, బుద్ధి ఇటువంటి ఏ దృఢప్రతీతి నీకు ఉండి ఉన్నాయో వాటిని త్యజించటమే సర్వత్యాగం. బ్రహ్మమునకు సంబంధించిన ద్వితీయత్వం నీ యందు - మన ఈ సంభాషణా బలిమిచే - నివృత్తమైనదని నేను తలచుచున్నాను. ఇక ప్రతిభాస మాత్రం చేత ఏ కొంచెంగాని ఇంకా శేషించి ఉన్నదో, అద్దానిని తత్త్వసాక్షాత్కారంచే రహితమొనర్చుకో.
ఓ రాజా! చైతన్యం కంటే భిన్నంగా కనిపించేదంతా అసత్త మాత్రమే. హిరణ్యగర్భుని దగ్గర నుండి ఒక గడ్డి వరకు కూడా ఆ సర్వస్వరూప దేవదేవుడే కార్య కారణ పరంపరా రూపంగా వికసితుడై ఉంటున్నాడు. సర్వాత్మకుడు, అనునిత్య చైతన్యమూర్తి అగు ఆ ఈశ్వరుడు తన యందు తానే హిరణ్యగర్భుడు వ్యక్తిగత జీవుడు మొదలైన నామరూపాలతో స్వయంగా ప్రదర్శితుడై ఉంటున్నాడు. కాబట్టి సమస్త ద్వైతం కూడా శాంతమగు బ్రహ్మరూపమే అయి ఉన్నది.
30. ‘అహంకారం’ అనేది ఒక భ్రమ మాత్రమే
శిఖిధ్వజుడు :
ఆబ్రహ్మ స్తంభపర్యంతం యద్యయం భాసతే భ్రమః, అర్థక్రియా2_సమరర్థశ్చ తత్కథం దుఃఖ కారణమ్?
మహాత్మా! మీరు చెప్పినట్లు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి గడ్డిపరక వరకు ఈ జగత్తంతా మృగతృష్ణాజలం వలె మిథ్యగానే భాసిస్తోందని కొద్దిసేపు అనుకుందాం. ఇప్పుడు మృగతృష్ణా జలంలో నీరు త్రాగటం చేత ఎవరికైనా దాహం సమసిపోతుందా? లేదు కదా! కానీ ఈ జగత్ పదార్థాల విషయం అట్లా లేదే! ఇవన్నీ క్రియా సామర్థ్యాలై ఉన్నాయి. ఇక్కడి ఆహారం తింటే ఆకలి తీరుతోంది. జలం త్రాగితే దాహం పోతోంది. ఇవన్నీ ఎట్లా జరుగుచున్నాయి? ఈ వస్తు సముదాయం జీవునికి దుఃఖకారణం కూడా అగుచున్నది కదా? ఈ సుఖ దుఃఖాలు జీవునికి వస్తువు యొక్క ప్రాప్తాప్రాప్తాలచే కలుగుచున్నాయనేది మీరు కాదనటానికి వీలు లేదు కదా?
కుంభమహర్షి : ఓ రాజర్షీ! జలానికి భౌతికంగా కొన్ని ధర్మాలు కనిపిస్తున్నాయి. దానికి ఆకారం లేదు. అది చలిస్తుంది. త్రాగితే దాహం తీరుస్తుంది. స్పర్శిస్తే సుతిమెత్తగా స్పర్శాస్పర్శంగా అనుభవ
Page:396
మవుతుంది. అయితే, అది జలం శీతలత్వం చేత గడ్డ కట్టిందనుకో. మంచుగడ్డగా ఘనీభూతమై ఆవిర్భవించిన ఆ జలానికి ఇప్పుడు ఆకారం ఏర్పడుతోంది. పొడవు, వెడల్పులు కనబడుచున్నాయి. బాగా దాహంగా ఉన్నవాడు మంచుగడ్డను మ్రింగటం అనుకూల విషయం కాదు కదా! ఆ ఘనీభూతమైన మంచుగడ్డలో కత్తి ఆకారం నిర్మించబడితే, అట్టి మంచు ఖడ్గంతో ఒక అరిటి చెట్టును నఱకవచ్చు. అనగా మంచుతో నిర్మించిన వస్తువుకు జలమునకు లేని ధర్మాలు అగుపిస్తున్నాయి. ఆ నీరు ఆవిరి అయినప్పుడు వేఱువేతైన ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. కాని కఠినమగు మంచుగడ్డతో నిర్మించబడిన వస్తువు జలముకన్నా వేరా? నీటికన్నా నీటి ఆవిరి వేరా?
సత్య సంకల్పుడగు ఈశ్వరుని భావనయే ఈ జగత్తు. భ్రమ రూపమగు ఈ జగత్తు ఆయా అర్థక్రియాదులచే వ్యాపించి ఉన్నది. అట్టి అర్థక్రియాదుల పరిమిత దృష్టిగల వారికి జగద్భావన వెనుక గల భావనారాయణుడు అగుపించటం లేదు.
ఈ ఎదురుగా ఉన్నదంతా అజ్ఞానముచేతనే అనేక అజ్ఞాన విషయ పరంపరా సమనిత్వమై అగుపిస్తోంది. అజ్ఞానం శిథిలం అవుతూ ఉంటే క్రమంగా జగదనుభవం కూడా శిథిలమై వస్తూ ఉంటుంది. మూల అజ్ఞాన నాశనంచే ఈ జగత్తు యొక్క రాహిత్యం అనుభవం కాగలదు.
నేను చెప్పే ఈ విషయం అనేక మంది విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. (ఉపనిషదాది) వేదాంత వాఙ్మయంలో గ్రంథస్తమయ్యే ఉన్నది. కనుక ఇది నేను క్రొత్తగా చెప్పుచున్నది కాదు. నీవు నీ ప్రియురాలు చూడాల కూడా అనేకసార్లు ఆత్మజ్ఞానం వినియే ఉన్నారు.
అజ్ఞానం ఉన్నంతవరకూ ఈ జగత్తు ఉండియే ఉన్నట్లు అనుభవమై తీరుతుంది. అజ్ఞానం తొలగినదా, నీ దృష్టిలో ఈ జగత్తు లేనిదని తెలిసిపోతోంది.
అజ్ఞానం తొలగేది ఎట్లా? “నేతి, నేతి” ...అను అవాస్తవత్యాగరూపమై నిరోధాభ్యాసంచే నీ యొక్క బాహ్యాకారవృత్తి స్థూలత్వం నుండి వైదొలగి సూక్ష్మత్వం సంచరించుకుంటుంది. అట్టి దృష్టి యొక్క సూక్ష్మత్వంచే అజ్ఞానం వైదొలగి నీ అంతరంగమందలి ఆ ప్రదేశంలో జ్ఞానం వెల్లివిరుస్తుంది. అట్టి జ్ఞానం యొక్క ప్రకాశంచే పరమపదం లేక, 'ఆత్మయొక్క సాక్షాత్కారం లభిస్తోంది. అప్పుడు జగత్తు యొక్క సంపూర్ణ విలయం లభిస్తోంది. ఈ జగత్తులో ఏ వస్తువైనా సరే... సూక్ష్మత్వం పొందుతూ ఉంటే క్రమంగా అద్దాని వర్తమాన స్థూలత్వం వైదొలగగా క్రమంగా అది అకారాదుల యొక్క సంపూర్ణ రాహిత్యమును పొందుతుంది. ఏ జీవుడైతే వర్తమానంలో ఈ దేహాన్ని ఉపయోగించి స్థూలానుభవాలైన శబ్ద స్పర్శరూపాదులను, సంబంధ-బాంధవ్య-అసంబంధ-అబాంధవ్యములను, సంచిత-ఆగామి -ప్రారబ్దాది కర్మవాసనలను దర్శిస్తున్నాడో... అట్టి ఆతడి దృష్టి స్వస్వరూపజ్ఞానబలిమిచే సూక్ష్మత్వం పొందగా అప్పుడు 'నేను జీవుడను- ఇది సాధన- అది లక్ష్యం' మొదలైనవన్నీ పోయి 'అఖండం - అప్రమేయం అగు ఆత్మయే నా స్వరూపం' అనే నూతనానుభవం సర్వే సర్వత్రా వెల్లివిరుస్తోంది.
అనేనైవ క్రమేణైవం త్వమాదిపురుషో నృపః భ్రమాకారోదయం విద్ధి మృగతృష్ణాంబువత్ స్థితమ్ II ॥
Page:397
ఓ ప్రియమహారాజా! క్రమక్రమంగా అట్టి అజ్ఞానం యొక్క శైథిల్యం చేత చివరికి నీవే శుద్ధ చిన్మాత్రమగు ఆది పురుషుడవై, హిరణ్యగర్భుని ఉత్పత్తికి కూడా ముందే ఉన్న శుద్ధ చిత్ చైతన్యమై శేషించగలవు. ఇకప్పుడు నీ అనుభవం ఈ జగత్తు విషయంలో మరొకటిగా ఉంటుంది. అనగా చైతన్యం కంటే భిన్నంగా కనబడుచున్న ఈ దృశ్యజగత్తు మృగతృష్ణలోని జలతరంగాల గురించి అంతయూ ఎరిగిన వానివలె మిథ్యారూపమై అనుభవం కాగలదు. బ్రహ్మదేవుడే (సమష్టిసృష్టి అను కర్తృత్వమే) స్వతహాగా లేడని, తద్వారా ఈ ప్రాణిసమూహమంతా కూడా ఆ రీతిగానే భ్రమచే దర్శన మిస్తున్నాయని అప్పుడు నీవు ఒప్పుకుంటావు. స్వయంగా ఏదైతే ప్రసిద్ధమైలేదో, అద్దానిచే ఏ కార్యం సిద్ధించగలదు చెప్పు? మృగతృష్ణాజలంలాగా ఉదయించిన ఈ ప్రాణి కోట్ల యొక్క ఏ బాహ్య రూపం నీకిప్పుడు అనుభవమౌతోందో, అదంతా కూడా తత్త్వవిచారణచే ముత్యపు చిప్పలోని వెండి లాగా ‘అకారణం కనుక ఇవి లేవు. ఉన్నదల్లా సర్వాత్మకమగు చైతన్య మొక్కటే' అని ఎవరూ కొత్తగా చెప్పకుండానే గ్రహిస్తావు. మరల సిద్ధాంత పరంగా ఒక వాక్యం చెప్పుచున్నాను.
కారణాభావతః కార్యమభూత్వా భవతీతి యత్
మిథ్యాజ్ఞానాదృతే తస్య నరూపముపపద్యతే
కారణం లేకుండానే ఎక్కడైనా ఏదైనా కార్యం ఉన్నట్లనిపిస్తే అట్టిదాని రూపం మిథ్య మాత్రమే. మిథ్యాదృష్టి ప్రేక్షితం తు న కదాచనవిద్యతే మృగతృష్ణాంబసా కేన ఘటకేః పరిపూరితాః?
ఎవడైనా మృగతృష్ణలో ప్రవేశించి కుండ నిండా మంచినీళ్ళు నింపుకొని ఇంటికి తీసికెళ్ళగలడా? మిథ్యా దృష్టిచే మిథ్యయే లభిస్తుంది. మిథ్యాదృష్టిచే ఉదయించిన దేహి దేహ సంబంధాది పదార్థములన్నీ వివేక దృష్టితో వీక్షించామా, ఇక వాటికి ఎక్కడా ఉనికి ఉండజాలదు. శిఖిధ్వజుడు : మీరు చెప్పే యుక్తాయుక్త వాక్యాలు మహత్తరమైన అర్థం ప్రసాదిస్తున్నప్పటికీ ఇంకా నాకు ఒక అనుమానం కొంచెం శేషించియే ఉన్నది. అది ఏమిటంటే?... "ఆదిస్రష్ట అయినట్టి బ్రహ్మదేవునికి అజం - అవ్యక్తం - శాంతం, అచ్యుతం... అయినట్టి పరబ్రహ్మం కారణమై ఉన్నది" అని మనం ఎందుకు అనుకోకూడదు? అప్పుడు ఈ సృష్టికి కారణం ఉన్నట్లే అవుతుంది కదా! కుంభమహర్షి : ఓ రాజా! నీవు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉన్నది. అయినా, నీకు సమాధానం చెప్పుచున్నాను విను. నీవు వేద వేదాంతోపన్యాసాలు నీ ప్రియురాలు చూడాలతో కూడి విన్నావు కదా! శ్రుతి వాక్యాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.
నేహ నానా స్తి కించన (ఇక్కడ నానాత్వమనేది కించిత్ కూడా లేదు); తదేదత్ బ్రహ్మపూర్వ మతఃపరమ్ (ఇప్పుడు, మరొకప్పుడు కూడా బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది); అసంగోహి అయం పురుషః (ఈ జీవుడు వాస్తవానికి దేనితోనూ సంగము లేనివాడు)... ఇటువంటి వాక్యముల నిర్వచనము, విశ్లేషణము నీవు విని ఉన్నావు. వాటి గురించి నీ భార్య చూడాలతో సంభాషించావు కదా! వీటిని బట్టి గ్రహించవలసిన దేమిటి?
Page:398
కూటస్థమగు బ్రహ్మము పరిణామరహితం, అద్వయం, ప్రపంచాతీతం, సదా నిర్వికల్పం, నిర్గుణం కదా! అట్టి బ్రహ్మమునందు కార్యకారణ కల్పన ఎక్కడున్నది? అది సమష్టి ఇచ్ఛాజ్ఞాన స్వరూపమగు (లేక, సమష్టి సృష్టి కర్తయగు) బ్రహ్మదేవుని సృష్టికి కారణమై ఉండటమేమిటి?
ఓ రాజా! బ్రహ్మము సర్వదా కార్యకారణ భావవర్జితమైయున్నది. శుద్ధ బ్రహ్మము లేక ఆత్మ దేనికీ కార్యముగాని కారణముగాని అవదు, అవజాలదు. ఒక నాటకంలోని ఒక పాత్ర యొక్క గుణగణాలకు ఆ పాత్రధారి కారణమా? కార్యమా? ఏదీ కాదు కదా!
కర్త - కర్మ - కారణ రహితమైన, ఉపాదాన - నిమిత్తకారణ వర్జితమైన, అప్రతర్క్యమైన తర్కముచే పొందుటకు, నిరూపించుటకు విషయము కానట్టి అవిజ్ఞేయమైనట్టి బ్రహ్మము ‘హిరణ్యగర్భుడు' అను సృష్టికర్తను సృష్టించుటకు కారణమెట్లా అవుతుంది?
ఇంద్రియములను వెలిగించేది ఇంద్రియములకు విషయం కాజాలదు. కన్నును పనిచేయింపజేసే విషయ విజ్ఞానశక్తి ఆ కళ్ళకు కనబడే నామరూపాత్మక వస్తువు ఎట్లా అవుతుంది? అందుకే అది 'అవిజ్ఞేయము' అనే బిరుదుకు అర్హమగుచున్నది.
బ్రహ్మం దేనికీ కారణం కాదు. కాబట్టి అది సర్వదా కర్తృత్వ రహితమై ఉన్నది. ఒకవేళ ‘కార్య కారణాత్మకమైన ఈ జగత్తు ఉన్నది” అని నీవు ఇంకా అనుకుంటున్నావనుకో... అప్పుడు, “ఈ జగత్తు అంతా ద్వైత-ఐక్య లక్షణ వర్జితం, దేశ కాల వస్తు పరిచ్ఛేదశూన్యం, అనాది, అనంతం, అయినట్టి బ్రహ్మమేగాని మరింకొకటేమీ కాదు” అను భావనను ప్రారంభించి దృఢపరచుకో.
అప్రతర్క్యం, అవిజ్ఞేయం, యచ్ఛివం, శాస్త్రమవ్యయమ్, తత్కథం కస్య కేనైవ కర్తృ భోక్తృ కథా భవేత్?
మనందరి వాస్తవ స్వరూపమగు బ్రహ్మము:
1. అప్రతర్క్యమైనది (IT IS NOT OBTAINABLE BY LONG ARGUMENTS) 2. అవిజ్ఞేయమైనది (IT CANNOT BE KNOWN BECAUSE IT ITSELF IS THE KNOWER) 3. శివం (శుభప్రదమైనది) 4. శాంతము 5. అవ్యయమైనది (IT IS IMPERISHABLE) ... అట్టి సర్వాత్మక బ్రహ్మము దేనికి కర్త అవుతుంది? దేనికి భోక్త అవుతుంది?
కనుక ఈ జగత్తు, ఇందలి పుత్ర - మిత్ర - - కళత్రాది సంబంధములు, తదితర జగద్విషయములు దేనిచేతనూ నిర్వర్తించబడలేదు. కనుక అవన్నీ లేనివే అవుతాయి.
ఆత్మయే స్వరూపముగా గల నీవు ఇందు దేనికీ కర్తవు కావు. భోక్తవూ కావు. ఇదంతా కూడా జన్మరహితమై, శాంతమై, శివమై ఒప్పుచున్నది. ఈ జగత్తు దేని యొక్క కార్యమూ కాదు.
ఈ జగద్రూపమంతా మనం ఇంతవరకూ చెప్పుకున్నట్లు భ్రమ చేతనే సిద్ధించుచున్నదగుచున్నది. ఇదంతా దేని యొక్క కార్యమూ కానందున ఈ ఆవిర్భూతమై కనబడు సృష్టి లేనిదే అని మరల నిర్ణయించి చెప్పుచున్నాను. ఇక్కడి పదార్థాల అభావమే వాస్తవమైన సిద్ధి. ఆ పదార్థాల భావనయో... అవాస్తవమైన
Page:399
సిద్ధి. పదార్థాలే లేనప్పుడు, ఇక వాటి యొక్క జ్ఞానం మాత్రం ఎక్కడున్నది? ఆ జ్ఞానాన్ని ప్రకటించే అహంకారం మాత్రం ఎక్కడున్నది. కాబట్టి నీయందు 'అహంకారం' అను దోషం ఉండటానికే వీలు లేదు. ఒకవేళ ఉంటే అది భ్రమ యొక్క విన్యాసం మాత్రమే. అనగా, తెలియబడే ఈ జగత్తు భ్రమ అయినట్లే, అహంకారం కూడా భ్రమయే. కాబట్టి నీవు శుద్ధుడవు. సదా విముక్తుడవు. ఆత్మరూపుడవగు నీకు బంధమోక్షాలు ఉండటానికి ఎప్పుడూ వీలులేదు.
శిఖిధ్వజుడు : ఓ దేవర్షీ! తమరు యుక్తియుక్తంగా ఉత్తమమైన కథనం ప్రవచించారు. ఔను. మీరు సెలవిచ్చినదంతా అక్షరసత్యం.
1. బ్రహ్మము దేహ-జగత్తులుగా పరిణమించటానికి కారణమే లేదు. 2. బ్రహ్మం ఈ జగత్తుకు కర్త కాదు. 3. కర్త అనేవాడే లేడు కనుక ఈ జగత్తు స్వతహాగా లేనిదే అయి ఉన్నది. 4. జగత్తే లేదు కనుక నామరూపాత్మకమైనదంతా భ్రమచేతనే అనుభవమవటం జరుగుతోంది. 5. భ్రమ తొలగటం చేత "బ్రహ్మమే సర్వదా బ్రహ్మం నందు నెలకొని ఉన్నది"... అని నిర్మల దృష్టిచే తెలియవచ్చుచున్నది. పై ఐదు ఉత్తమ వాక్యాలు నాకు ప్రస్ఫుటమౌతున్నాయి.
కనుక ఈ నామరూపాత్మక జగత్తుకు మాతాపితలు చిత్తహంకారాలే. అయితే చిత్త - -
అహంకారాలు ఏ క్షణమందునూ కొంచెం కూడా లేవు. ఈ విధంగా 1.జగత్తు, 2. చిత్తం, 3. అహంకారం – మొదలైనవి “లేనివే” అవటంచేత నేను శుద్ధుడను, విబుద్ధుడను, శివస్వరూపుడను అయి ఉన్నాను.
చైతన్యానికి వేరైన విషయ సమూహాలు ఏమాత్రం లేవని మీరు బోధించారు. మీరు చెప్పుచుండగా ఒకవైపు వింటూనే, మరొక వైపుగా పదార్థాల గురించి మీరు చెప్పిన కోణం నుండి విచారణ చేస్తూనే ఉన్నాను.
అధ్యారోపం (లేనిది ఆరోపించటం); అపవాదం (ఉన్నది సరిగ్గా గుర్తించకపోవటం)... ఈ రెండు మార్గములలో నేను ఇంతకాలంగా మత్తుడనై భ్రమిస్తూ సుదీర్ఘకాలం గడిపివేశాను. ఈ రెండు మార్గాలను మీ వాక్యాలు ప్రసాదించిన జ్ఞాన కాంతిచే పరిశీలించగా ఇప్పుడు అహంకారం మొదలుకొని ఈ దృశ్యప్రపంచం వరకు సమస్త పదార్థాలు అసత్యాలుగా, బాలుని వినోద విషాదాల వలె, భ్రమ లీలా మాత్రంగా తెలిసిపోతున్నాయి. తత్ఫలితంగా సమస్తం బోధించబడుటచే ఇక నేను ఆకాశకోశం వలె విక్షేపరహితుడనై ఉన్నాను.
అట్టి నా స్వరూపానికి నేనే నమస్కరిస్తున్నాను. చిరకాలానికి దేశ-కాల-క్రియా సమూహ సహితమైన పదార్థ దృష్టి శమించింది. ఇప్పుడిక నేను అవినాశినై, నిర్వికారుడనై, బ్రహ్మాత్ముడనై స్థితి నొంది ఉన్నాను. శాంతుడను, తృప్తుడను అయి సర్వత్రా వెలయుచున్నవాడనని నన్ను నేను దర్శిస్తున్నాను. నేను ఎక్కడికీ పోవటం లేదు. ఎక్కడి నుండీ వచ్చుట లేదు. ఉదయించటం లేదు. అస్తమించటం లేదు. ఎప్పుడూ ఎట్లున్నానో ఎప్పటికీ అట్లే ఉండి ఉంటున్నాను. తమరు కూడా అట్లే ఆనందైక రస స్వరూపులై సర్వదా ఉండండి.
నేను ఆత్మస్వరూపుడను. శుద్ధుడను. శివస్వరూపుడను. పవిత్రుడను. మౌన స్వరూపుడను.
Page:400
ఇట్లు అఖండ బ్రహ్మాకారం ఉదయించటం చేత ఆ శిఖిధ్వజుడు బ్రహ్మము నందు ఘనీభూత మౌనస్వరూపుడై, శాంతిస్వరూపుడై ప్రకాశించాడు. గాలి వీచని చోట నిశ్చలంగా ప్రకాశించే దీపం లాగా రెండు ఘడియల కాలం నిశ్చలుడై ఉండిపోయాడు.
31. బ్రహ్మము యథాతథంగా ఉండి ఇక్కడ వినోదిస్తోంది! శ్రీవసిష్ఠ మహర్షి : కుంభఋషి రాజు వైపు చూచాడు. ఆతడు శీఘ్రంగా నిర్వికల్ప సమాధి వైపు అభిముఖం అవుతున్నట్లు గమనించాడు. తన యొక్క స్వలీలచే ఆతనిని త్వరితంగా ప్రబోధితం చేశాడు. కుంభుడు సంకల్పశక్తిచే పిలిచిన ఆ పిలుపును అందుకుని శిఖిధ్వజుడు మెల్లగా సమాధి నుండి బహిర్ముఖుడైనాడు. కుంభుని వైపు కృతజ్ఞతలను తెలుపుచూ కనులు తెరిచి చూచాడు.
కుంభర్షి : ఓ రాజా! నీవిప్పుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నావు. శివరూపుడవై చెన్నొందుచున్నావు. ఇంతలోనే నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తుండటం గమనించి నిన్ను ఈ భౌతిక ప్రపంచం వైపుగా అభిముఖం చేశాను.
అమృతానంద స్వస్వరూపాన్ని గ్రహించిన తరువాత ఇక ఈ దృశ్యాన్ని అస్తమింపజేయుట చేత గాని, అస్తమింపజేయక పోవుటచేత గాని వచ్చే ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమూ లేదు. ఒక్క పర్యాయం ఆత్మను దర్శించిన తరువాత నీ ఇష్టానిష్టాలన్నీ నశించాయి. నీవు ఇప్పుడు సమస్త కల్పనల నుండి విముక్తుడవై వెలయుచున్నావు. జీవన్ముక్తుడవయ్యావు. ఇక మోహకారణాలు నీయందు లేవు.
శిఖిధ్వజుడు ఆ కొద్ది క్షణాలలోనే విశ్రాంతి చిత్తుడై, ముక్తాత్ముడయ్యాడు. కుంభఋషిచే మేలుకొలుప బడ్డాడు కదా! లీలామాత్రంగా దృశ్యవస్తువు యొక్క సత్తను గాంచుచు కుంభుని వైపు చూచి ఇట్లు పలికాడు.
శిఖిధ్వజుడు : హే పరమజ్ఞాతా! కుంభ మునీంద్రా! మీరు ఇప్పటిదాకా వచించిన దానిని అనుసరించి నాకు అంతా సుబోధకమైనది. అయినప్పటికీ బోధ యొక్క సుదృఢత కొరకై మరల ఒక చిన్న ప్రశ్న అడగాలని అనిపిస్తోంది.
శివే శాంతే నిరాభాసే పదే అనుల్లసితాత్మని,
ద్రష్ట్ర దర్శన దృశ్యాఖ్యో విశ్వాత్మా ప్రత్యయః కుతః?
శివమై, శాంతమై, నిరాభాసితమై సర్వదా అప్రకటితమైన ఆత్మయందు 1. ద్రష్ట, 2. దర్శనం, 3. దృశ్యాల – సమావేశమగు ఈ దృశ్య ప్రపంచ ప్రతీతి ఎట్లా, ఎక్కడి నుండి, ఎందుకు ఏర్పడుతోంది? కుంభమహర్షి : మహారాజా! నీవు చక్కటి ప్రశ్న వేశావు. వాస్తవానికి అజ్ఞానావరణము తొలగుటచే నీవు స్వయంప్రకాశకుడగు సూర్య భగవానునివలె ప్రకాశిస్తున్నావు. నీ కింక ఏ శంకలూ లేవని
Page:401
నాకు తెలుసు. అయినా కూడా నీ ప్రశ్నకు సంబంధించిన విషయం మనం ఇంకా చర్చించలేదు కనుక, నీ ప్రశ్న వర్తమానానికి సముచితమే. విను, చెపుతాను.
అనేక పదార్థములచే పూర్ణమైనట్టి ఈ చరాచర ప్రపంచం నీకు కనిపిస్తోంది కదా! ఇదంతా కూడా ఒకానొకప్పుడు కల్పాంతంలో నశించబోవుచున్నది. ఆ మహాకల్పాంతమున అంతా నశించిన తరువాత ఇంకా శేషించేదేమైనా ఉన్నదా? నాశనానికి విషయమే కాని ఒకానొకటి ఉన్నది. అద్దానినే శాస్త్రజ్ఞులు ఆత్మ, సన్మాత్రం, చిన్మాత్రం మొదలైన పేర్లతో సంబోధిస్తున్నారు. అది వాక్యాలకు అందనిది. అయినప్పటికీ శిష్యవాత్సల్యంతో అది మాచే ఏవో ఆయా శబ్దాలతో వర్ణించబడుతోంది.
అప్రతర్క్యమ్, అవిజ్ఞేయమ్, సమమ్, శివమ్, అనిందితమ్ |
బ్రహ్మ నిర్వాణమాపూర్ణమాపూర్ణోదిత సంవిదా ॥
ఈ విధంగా వాచాతీతమగు మనలోని ప్రతి ఒక్కరి స్వస్వరూపమే అగు ఆ బ్రహ్మము అనేక ఉత్తమ వచనములచే అద్దానిని దర్శించేవారిచే, వేదోపనిషత్ ఆదిగా గల ఆయా గ్రంథములచే ప్రవచించబడుతోంది. ఆత్మానుభవజ్ఞులు తమ వాక్కులచే మనకు ఇట్లు చెప్పుచున్నారు.
అప్రతర్క్యం, అవిజ్ఞేయం, సమం, సర్వత్రా ఏకరసము, శివము, నిర్వాణరూపం, నర్వత్రా ఉదయించినది, నిజబోధచే పూర్ణమైఒప్పునది ఆ బ్రహ్మము సూక్ష్మతర పదార్థముల కంటే సూక్ష్మమైనది. స్థూలతరపదర్థాములకంటే స్థూలమైనది. గురుతరములన్నిటి కంటే గురుతరమైనది. శ్రేష్ఠతర పదార్థములన్నిటి కంటే శ్రేష్ఠతరమైనది.
ఒక పరమాణువు కూడా మహా సూక్ష్మమగు ఆత్మయందు కొండంత స్థూలమనిపించుకుంటుంది. ఆ ఆత్మ ఎదుట ఆకాశము కూడా అత్యంత స్థూలమైనదే అవుతుంది. అది ఎంత స్థూలమైనదంటే, అద్దాని ఎదుట ఈ సమస్త బ్రహ్మాండము ఒక అణువు వలె గోచరిస్తుంది.
ఓ రాజా! పూర్వ – - తత్ పూర్వ కర్మానుసారం, అధ్యాసానుసారం కనిపించే అనేక ప్రాణికోట్లతో కూడిన ఈ జగత్తు యొక్క ఏ స్ఫురణ అనుభూతమౌతోందో, అదంతా కూడా 'పరమాత్మ నుండి ఉత్పన్నమైన బ్రహ్మదేవుని (సమష్టిగతమైన ప్రజ్ఞ యొక్క) అహంభావ రూపమగు జ్ఞానధ్యానము’... అని నీవు ఎఱిగి ఉండుము. ఆ బ్రహ్మదేవుని అహంభావమునందే ఈ జగత్తు విషయరూపమున స్థితి నొందియున్నది. అట్టి జగత్తినే 'విరాడ్రూపం' అని కూడా పిలుస్తున్నారు.
వాయువుకు, వాయు వీచికలకు భేదం లేనట్లు; శూన్యత్వం, ఆకాశాలు ఒక్కటే అయినట్లు; చిన్మాత్రం, అందులోంచి బయలుదేరిన అహంభావ స్ఫురణకు - ఏమాత్రమూ భేదం లేదు.
దేశకాలాలకు అసంబంధితమైన జలం వివిధ రీతులైన పేర్లతో (నదీనద నామధేయాలతో) అకారణంగా ఉన్నట్లే దేశ - కాల వస్తువులచే అపరిచ్ఛిన్నమగు పరమాత్మయందు అకారణంగా ఈ
Page:402
జగత్తు స్థితి కలిగి ఉంటోంది. ఆకారరహితమగు బంగారం రకరకాల ఆకారాలచే రకరకాల ఆభరణ నామాలను (గాజులు, గొలుసు, ఉంగరం మొదలైన పేర్లను) పొందుతోంది చూచావా? తాను నిరాకారమై ఉండి కూడా బ్రహ్మం అకారణంగా వివిధ దేశ కాల వస్తు పరిచ్ఛిన్నమైన ఈ జగత్తును తనయందు ప్రకటీకరిస్తోంది. ఈ జగద్రూప రాజ్యానికి బ్రహ్మమే చక్రవర్తి. సర్వశ్రేష్ఠం, నాశరహితం, ద్వైతవర్జితం, నిర్మలం, శాంతం - అయినట్టి బ్రహ్మం యొక్క సమక్షంలో ఈ జగత్తు ఒక తృణం వలె అతి తుచ్ఛమై తోచుచున్నది. పరమ శ్రేయోదాయకమగు బ్రహ్మం ఉండటం చేతనే ఈ జగత్తు శోభను, సత్తను ప్రదర్శించగలుగుతోంది. ఇందలి సారం బ్రహ్మమే! బ్రహ్మమొక్కటే సర్వత్రా వ్యాపించి చిన్మాత్ర స్వరూపమై, నిరుపాధిక ప్రేమపదమై, అద్వితీయమై, ద్వైత - ఐక్యరహితమై సర్వదా ఉండి ఉంటోంది.
పైన మనం ఇప్పటిదాకా వర్ణించుకున్న శాస్త్ర ప్రవచిత విశేషముల కారణంగా ‘ద్వితీయమైన కల్పన’ అనేది ఎక్కడా లేదు. సర్వదా పూర్ణమై, అక్షయమై, నిర్మలమైనట్టి ఆత్మతత్త్వమే ప్రకాశించుచున్నది. అది సదా సర్వరూపమై, సర్వాకారముగా ఉదయిస్తూ ఒప్పుచున్నది.
అయినా కూడా అది కళ్ళకు కనబడేది కాదు. చేతులచే నిర్వర్తించబడే కర్మ సంబంధితమైనది కాదు. అది వాటన్నిటికీ కార్యమూ కాదు, కారణమూ కాదు. ఆ బ్రహ్మము ప్రత్యక్ష - అనుమానములచే ఎక్కడో పొందబడేది కాదు. అయితే అది ఎవరికి వారే తమ అనుభవముగా ధ్రువీకరించుకోవలసినది.
ప్రపంచంలో ఏది పొందితే ఏం లాభం? నిరతిశయానంద స్వరూపం, సర్వశ్రేష్ఠం, సర్వరూపం, సర్వాత్మకం, అతి సూక్ష్మం, స్వచ్ఛం, అనుభవమాత్రం - - అగు ఆ బ్రహ్మం ఒక్కటే మహత్తరసాధ్యమైన వస్తువు. 'చిన్మాత్రం, పరమాత్మ స్వరూపం' ఇత్యాది శబ్ద, తదర్థ రూపమై వ్యక్తావ్యక్త స్వరూపమై, నిరాభాసమై, దృక్ మాత్రమైనది ఆ బ్రహ్మం.
పరమార్థ దృష్టికి అది మాత్రమే సత్తు. వ్యవహారదృష్టికో అది అసత్తుగా అనిపించటమే ఇక్కడి చమత్కారం! ఇట్లు సత్ - అసత్ రూపంగా భాసించే బ్రహ్మమునకు కారణత్వం ఎట్లా సంభవిస్తుందో చెప్పు రాజా?
ఆ బ్రహ్మం నామ రూపరహితం. కాబట్టి దేనికీ బీజం కాదు, కారణం కాదు. కనుక, వ్యాపక రూపమగు ఆ పరమాత్మ నుండి ప్రమాణ, ప్రమేయాల రూపమగు ఈ జగత్తు కించిత్ కూడా జనించజాలదు. ఈ జీవుని అనుభవం ఎట్లా ఉన్నాసరే సర్వుల స్వరూపమగు ఆత్మ కర్త-కర్మ-కరణాది రహితమై ఉన్నది. సత్యమై, నాశనరహితమై, చిదనమాత్రమై, నిరాభాసమైయున్నది. ఆ ఆత్మస్వరూపం స్వయంగా అనుభవమాత్రమై ఉన్నదని మాత్రం తప్పకుండా సిద్ధాంతీకరించవచ్చు.
కాబట్టి ఓ రాజర్షీ! మనం నీ ప్రశ్నకు సమాధానరూపంగా ఇప్పటి వరకూ చెప్పుకున్న దానిని అనుసరించి ఆ పరబ్రహ్మం నుండి ఏదీ ఉత్పన్నమగుట లేదు. ఎందుకంటే జలంలో
Page:403
సకారణంగా పుట్టిన తరంగాలు జలం కంటే వేరని ఎవ్వరంటారు? ఇక బ్రహ్మం నుండి నిష్కారణంగా ఉత్పన్నమైన ఈ జగత్తు ఎట్లు ఎవనికి, ఎందుకు దేనికంటే భిన్నంగా లభించగలదు చెప్పు? ద్రష్ట లందరి స్వరూపం బ్రహ్మమే అయి ఉండగా ఒక ద్రష్టకు వేరొక ద్రష్ట నుండి అనుభవమయ్యేది బ్రహ్మం కాక మరేమిటి? 'దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నమగు పరబ్రహ్మమున అకారణంగా ఈ జగత్తు ప్రదర్శితమౌతోంది'... అని ఇతఃపూర్వమే అనేక చోట్ల శాస్త్రకారులు నిర్ణయించి చెప్పారు. నీవు మీ రాజసభలో జరిగిన అనేక సత్సంగములలో ఈ విషయాలు - శాస్త్రజ్ఞుల ప్రవచనాలను వినియే ఉన్నావు కదా!
శిఖిధ్వజుడు : మహాత్మా! "జలములో తరంగాలు సకారణమై ఉన్నాయి. బ్రహ్మమున ఈ అహంకార - జగదాదులు అకారణమై ఉన్నాయి” అని మీరు చెప్పినప్పుడు ఈ సకారణ - అకారణ వ్యవహార మేమిటో నేను గ్రహించలేకపోతున్నాను.
కుంభమహర్షి రాజా! విను.
పంచ భూతాల సమ్మేళనంచే జలం ఏర్పడుతోంది. ఆ జలంచే సముద్రం తయారగుచున్నది. బాహ్యమున వాయు ప్రసరణ కారణంగా జలం తరంగాల రూపంగా ప్రసరిస్తోంది. అందుచేత ‘జల తరంగాలు సకారణమై ఉన్నాయి' - అవి మనం అంటున్నాం. బ్రహ్మం నుండి అహంకారం పుట్టుకకు కారణమేదైనా ఉన్నదా? ఎవరైనా చెప్పగలరా? లేదు. అందుచేత “బ్రహ్మం నుండి అహంకారం పుట్టటానికి సహకారిక కారణం లేదు' అని అనవలసివస్తోంది. కనుక 'బ్రహ్మం అహంకారంగానూ, జగత్తుగానూ పరిణమిస్తోంది' అని అనటానికి కుదరదు” అని చెప్పటానికే సకారణ - అకారణ పదాలను ప్రయోగించాను. అయితే 'బ్రహ్మం నందు అకారణంగా ప్రకటనమయ్యే అహంకార, జగదాదులు బ్రహ్మముకంటే వేరుకాదు' అనే సిద్ధాంతమును తత్త్వజ్ఞానం లేకపోతే ఎవ్వరూ ఎరుగ జాలరు. ఇక నీ విషయానికి వస్తే నీవు 'తత్త్వజ్ఞానం' (లేక) 'అద్వైతజ్ఞానం' ఎరిగియే ఉన్నావు కదా! కాబట్టి ఈ సిద్ధాంతం నీకు అత్యంత సులభంగా సుబోధకం కాగలదనే ఉద్దేశంతో అట్లా చెప్పాను.
ఓ రాజా! ఈ 'జగత్తు' గానీ, 'అహం' మొదలైనవిగానీ పరమాత్మయందు లేవు. కనుక ఈ జగత్తు జగత్ శబ్దార్థరహితమైన శివమే (లేక) బ్రహ్మమే అయి ఉన్నది.
ఆకాశమునందు ఆకాశముకంటే సూక్ష్మమైన సంకల్పమయ ఊహానిర్మిత గంధర్వనగర రచన ఎట్లున్నదో, ఆకాశమునందు నిత్యశాంతమగు శూన్య సత్త ఎట్లు ఏర్పడి ఉన్నదో, ఈ జగత్తు కూడా ఆ విధంగానే ఈశ్వరుని యందు శూన్య సత్తారూపమై మౌనముగా ఏర్పడియున్నదని గ్రహించు.
ఈ జగత్తును చైతన్యరూపంగా గాని, లేక శూన్యరూపంగా గాని లెస్సగా ఎఱిగానా, అప్పుడిది బ్రహ్మరూపమే కాగలదు. సమ్యక్ జ్ఞాన ప్రభావంచే ఈ జగత్తు అమృతతుల్యము కాగలదు. అట్లా కాకుండా, అసమ్యక్ జ్ఞానముచే చూచావా, ఈ జగత్తంతా కూడా అమంగళకరమై, మహాదుఃఖ ప్రదమై సంప్రాప్తించగలదు సుమా!
ఒకడు ఏ భావంతో ఏ అనుభవమును దర్శిస్తాడో, ఆతనికి అది అట్లే అనుభూతమవగలదు. మాయతో కూడిన ఈశ్వరుడు కూడా భావనను అనుసరించియే తత్సంబంధిత పదార్థ రూపమును
Page:404
సంతరించుకుంటున్నాడు. (యద్భావమ్ తత్భవతి). ఒకడు అమృతమును 'ఇది విషము' అను భావనచే భుజిస్తే అది అట్లే అనుభవమవగలదు.
'జ్వాలా తిమిరము' (కంటికి వచ్చే ఒకానొక జబ్బు)చే ఆకాశంలో వెంట్రుకలు ముత్యములు ఉన్నట్లు అగుపిస్తాయి. అట్టి రూపములెన్ని కనిపించినా వాస్తవానికి అవన్నీ ఆకాశము మాత్రమే కదా! ఈ జగత్తు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది బ్రహ్మ సత్తయే అయి ఉన్నది. ఎందుచేత ఈ జగత్తు స్ఫురిస్తోందంటావా? చిత్స్వరూపమగు పరబ్రహ్మము తనయందు ఎందుకో ఒకప్పుడు మందప్రబోధయుక్తమై ఉంటోంది. అప్పుడు అది తనయందు ‘దేహము - దేహి' మొదలైన జగత్స్వరూపములను గాంచుచున్నది. అది మరొకప్పుడు దృఢజ్ఞానయుక్తము కాగా, అప్పుడు తన పట్ల తానే పరమశాంతమగు కేవల శివరూపముగా భాసించుచున్నది.
శిఖిధ్వజుడు : ఓ దేవర్షీ! మీరు చెప్పేదంతా వింటుంటే నాకు “అహం - అనేది కూడా బ్రహ్మమేనా? ఎట్లా?" అనే ప్రశ్న ఇంకా కొంత కొనసాగుచునే ఉన్నది.
కుంభఋషి : అట్టి నీ ప్రశ్న అనుచితమేనని చెప్పక తప్పదు. ఎందుకంటావేమో? ఏదైనా వాస్తవంగా ఉన్నదైతే, 'అది బ్రహ్మమా లేక మరొకటియా?' అనే ప్రశ్న - దానికి ఒక సమాధానం ఉండవచ్చునేమో! ఏ వస్తువైతే వాస్తవంగా విద్యమానమై లేదో, ఇకది “బ్రహ్మమా? కాదా?” అని అడగటమెందుకు? "కలలో సంపాదించిన ధనం ధనం కాదంటారా? ఎట్లా?”... అన్నట్లున్నది నీ ప్రశ్న.
ఏది విచారణ చేయగా 'అట్టిది లేనేలేదు!' అని నిరూపించబడుతోందో, అద్దాని లాభ నష్టముల గురించి, నిత్యానిత్యాదుల గురించి విచారణచే గాని, తరచి తరచి ప్రశ్నించటం చేతగాని ఏం ప్రయోజనం?
బంగారానికి ‘దీని ఆకారం ఇట్టిది' అనునదేమీ ఉండక పోయినా.... సువర్ణం అన్న తరువాత... ఏదో ఒక ఆకారం ఉండి ఉంటుంది కదా! అట్లాగే 'జగత్తు - - అహంభావాలు' ...అనేవి లేకపోతే 'ఏది బ్రహ్మం? ఏది కాదు?' అనే ప్రశ్నార్హత కూడా ఈశ్వరునియందు ఉండదు.
కారణము అనేది లేనందువలన జగత్తు యథార్థమునకు 'లేనిదే' అగుచున్నది. కాబట్టి బ్రహ్మమే జగద్రూపంగా, అహంరూపంగా విజృంభించుచున్నదగుచున్నది. అయితే, ఆ బ్రహ్మము తన స్వరూపం యొక్క 'పరిణామం' అనేది కించిత్తు కూడా గావించకయే, యథాతథంగా తాను ఉంటూనే... ఈ విధంగా జగద్రూపమున, అహం రూపమున ఉంటోంది.
దంపతులు కామప్రేరితులై యథాతథస్వరూపులై ఉంటూనే పుత్రుడు జన్మించటానికి కారణమగు చున్నట్లు 'మాయ' అను ఆవరణంతో కూడిన ఈశ్వరమయములగు ఈ సమస్త పదార్థాలూ ఆ ఈశ్వరుని ప్రేరణచే అనుభవానికి అర్హత పొందుచున్నాయి. అట్టి ప్రేరణ కొరకై ద్రష్ట - దృశ్యం అను రెండూ పరస్పరం ప్రేరితములై తత్ప్రయోజనంగా ఈ పంచభూతాత్మక సమూహమును, వాటి కార్యచమత్కారాన్ని గావించుచున్నాయి. అనగా చిన్మాత్రమే మాయాసమేత చిన్మాత్రము ద్వారా ఆయా వివిధ రూపములు ధరించి ఆయా కార్యాకార్యముల రూపమున పరిచ్ఛిన్నమై ఉంటోంది. చిన్మాత్రమే మాయా సమన్వితమై సృష్టి రూప చమత్కారంగా సాక్షాత్కారవైభవం ప్రదర్శిస్తోంది.
Page:405
పూర్ణాత్ పూర్ణాన్యుద్ధరన్తి, పూర్ణాత్పూర్ణాని చక్రిరే భవన్తి, పూర్ణాత్ పూర్ణాని పూర్ణమేవావశిష్యతే ॥
పూర్ణరూపమగు బ్రహ్మము నుండి పూర్ణరూపములే అగు ఈ జగత్ - అహంకారాలు, వాటిని ధరించినట్లు కనిపించే ఈ జీవులు మాయచే ప్రకటితమగుచున్నారు. పూర్ణమునుండి బయల్వెడలినట్టి వాటి యొక్క క్రియాదుల చమత్కారములన్నీ పూర్ణములే.
ఈ జీవులంతా పూర్ణమునుండే బయలుదేరి, పూర్ణములోనే ఉంటూ, తిరిగి పూర్ణరూపులే అగుచున్నారు. మాయతో కూడుకున్నప్పుడు కూడా ఈ జీవుల రూపం బ్రహ్మమే! మాయావరణము తొలగినప్పుడు శేషించేదీ బ్రహ్మమే! చిన్మాత్రమగు ఆత్మయందు చిన్మాత్రరూపమగు జగత్తు స్ఫురిస్తోంది. యథార్థానికి బ్రహ్మము సృష్టిరూపరచనగా స్ఫురించకయే స్ఫురిస్తున్నట్లు తోచుచున్నది.
ఓ రాజర్షీ! మరల ప్రకటిస్తున్నాను. ఇక్కడ గానీ, మరెక్కడగానీ, చిన్మాత్రమగు ఆత్మయందు చిన్మాత్రమే స్ఫురిస్తోంది. ఆ స్ఫురణయే జగదృష్టికి జగత్తుగా ప్రసిద్ధమగుచున్నది. ప్రత్యగాత్మకమగు చైతన్యము తన యొక్క నిరామయ - తేజోమయ - ఆద్యంతరహిత చిత్స్వరూపమును ఏమాత్రం వదలకయే, సృష్ట్యాదియందు అనేక విధములైన మనోరూపములను పొంది వినోదిస్తోంది. పరమాత్మ తన యొక్క స్థూలరూపకల్పనచే ప్రకాశశీలుడై స్వయంగా విరాట్ స్వరూపమును (సమష్టి సృష్టికర్త స్వరూపం, సృష్టి ప్రజ్ఞా స్వరూపం) ధరిస్తున్నాడు. ఆ పరమాత్మయే మరల వ్యష్టిజీవభావముచే జగద్ర్భాంతికి కారణముగా అగుచున్నాడు. ఈ జగత్తును సత్యముగా చూచుచున్నాడు. మరొకప్పుడు పరమార్థదృష్టిచే దానిని సత్తుగా పరమాత్మరూపంగా గాంచుచున్నాడు. అతడే భావన యొక్క దార్ధ్యములే చేత అండజ - స్వేదజ - బీజజాది చతుర్విధ ప్రాణుల రూపత్వమును, ఇటు దృశ్యరూపత్వమును క్షణంలో పొందుచున్నాడు.
‘జగత్తు' అని పిలువబడే ఈ శాంతరూప బ్రహ్మము స్వభావముగానే నామరూపరహితమై అనిర్వచనీయమై ఒప్పుచున్నది. ప్రకాశరూపమై, అనుభవాత్మకమై, సదా - - సర్వదా ఏకమైనట్టి పరబ్రహ్మము స్వమాయచే నిజచమత్కృతి ద్వారా అహంకార - జగత్తుల వలె దృశ్య - దర్శనరూపమై వెలయుచున్నది. ఉన్న సత్యమిదియే! తదితరమైనదంతా కల్పన మాత్రమే!
32. భావనయొక్క అభావన
కుంభమహర్షి : ఓ రాజర్షీ! ఈ చమత్కారమంతా గమనిస్తున్నావు కదా! ఆకారరహితమైన బంగారం తన సువర్ణత్వం కోల్పోకుండానే దేశ - కాల పరిచ్ఛిన్నమగు ఆభరణముల రూపముగా అకారణంగా ఉంటోంది చూచావా? అట్లాగే పరమాత్మయందు నిష్కారణంగా ఈ జగత్తు జనింపజేయునది - జనించునది – సృష్టికర్త - సృష్టి అను భావక్రమంచే ఏర్పడి ఉంటోంది. ఆభరణమైనా, చతురస్రాకార మైనా, మరొక రూపమైనా బంగారం సర్వదా బంగారమే కదా!
Page:406
పరమాత్మ నుండి ఏదీ ఉత్పన్నమవటం లేదు. మరేదీ లయించటం లేదు.
స్వసత్తాయాం స్థితం బ్రహ్మ నబీజం, న చ కారణం, శుద్ధానుభవమాత్రం తత్ తస్మాత్ అన్యత్ న విద్యతే కించిత్ జగదహనాది తదేవానన్తమస్తి హి |
బ్రహ్మము తన సత్తయందే తానున్నది. అది దేనికీ బీజము కాదు, కారణమూ కాదు. అది శుద్ధము, అనుభవమాత్రము అయి ఉన్నది. అది మరింకేమీ కాదు, అవదు. కనుక మరొక దేనితోనో దానిని ఎరగటమనేది లేదు. ఇక ఈ జగత్ - అహంభావాదులంటావా? ఇవేవీ ఎప్పుడూ లేవు. ఆ బ్రహ్మమే అనంతమై, సమస్తమై ఉన్నది.
శిఖిధ్వజుడు : హే మహర్షీ! 'ఆ పరమాత్మయందు జగత్తు - అహంకారము మొదలైనవి లేవు' అనే మీ నిర్ద్వంద్వమైన ప్రకటనను నేనిప్పుడు గ్రహించాను. అయితే, అసలీ సృష్టియొక్క జ్ఞానం ఎట్లా భాసిస్తోందో...... ఆ విషయం నాకు తెలియజేయండి. తద్వారా అజ్ఞానమును నిరోధిస్తాను. కుంభఋషి : ప్రియమిత్రమా! శిఖిధ్వజా! ఏ అనాది అయిన అనంతమైన సమస్తమైన సర్వాధిష్ఠానమైన సన్మాత్రము ఈ సృష్టిని విస్తరింపజేస్తోందో... అదియే సృష్టిజ్ఞానముగా కూడా భాసిస్తోంది.
అందుచేతనే 1. అధ్వస్తములైనట్టి ఈ జగత్ అహంకారాదులు, 2. అధిష్ఠానమగు సచ్చిన్మాత్ర బ్రహ్మము... ఈ రెండు అభేదములైనవై ఉన్నాయి. ఇదంతా సచ్చిన్మాత్రమే అయి, జగత్తుగా భాసిస్తోంది. ఇక వేరు వేరు సిద్ధాంతములు కూడా ఉన్నాయి.
విజ్ఞానవాదులు = ఈ జగత్పదార్థములన్నీ విజ్ఞానము యొక్క పరిణామము మాత్రమే. గౌతమవాదులు = బాహ్యములగు పంచభూతముల సత్తయే ఈ జగత్పదార్థములు.
గౌతములు = శూన్యం మాత్రమే ఉంది. అంతకుమించి ఏదీ లేదు. ఇతరమైనదంతా భ్రమయే. ...ఈ వాదాల అంతర్గతాన్వేషణచే 'బ్రహ్మమే ఇదంతా' అను ఉత్కృష్టానుభవమే సిద్ధించగలదు. ద్రష్టయే దృశ్యానుభవంగా ప్రతిబింబిస్తున్నాడనునది సూక్ష్మదృష్టికి ప్రస్ఫుటం కాగలదని గ్రహించు.
ఎవరైనా ఏదైనా సిద్ధాంతం ప్రతిపాదించవచ్చు గాక! సర్వవాదాలలోను అంతర్లీనమై ఉన్నది జ్ఞానమే కదా! జ్ఞానమే లేకపోతే వస్తు సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది? కాబట్టి జలమందు ద్రవత్వం లాగా సమస్త పదార్థములందూ ద్రష్ట యొక్క జ్ఞానమే విస్తరించి ఉన్నది. అట్టి జ్ఞానమునే 'చిన్మాత్రం' అని అంటున్నాం. ప్రతి అనుభవము వెనుక జ్ఞానం మూల పదార్థమై దాగియున్నది సుమా! చిత్తు జ్ఞానస్వరూపమే. ఇక 'చిత్తు జడజగద్రూపంగా భాసిస్తోంది' అనేది 'ముత్యపు చిప్పలో వెండి వెల్లివిరుస్తోంది' అను అనుభవంలాగా కారణరహితం, అనిర్వచనీయం కూడా!
ఆ చిన్మాత్రం సాత్విక భావాలలోనూ, దానికి విరుద్ధ భావాలలోనూ కూడా ప్రతిబింబిస్తోంది. పరస్పర వ్యతిరిక్త - అనుయుక్తములైన భావ- అభావాలలో ప్రత్యక్షమై ఉంటూనే మరొకవైపు ఆ భావాదులకు సంబంధించక తన అనంత చిన్మాత్రం కొనసాగిస్తూనే ఉంటోంది. అది ఇటు జగదాకారం గాను, అటు చిన్మాత్రరూపంగాను ఒకే సమయంలో ఏర్పడి ఉండగల సామర్థ్యం కలిగియే ఉంటోంది.
Page:407
వాస్తవానికి మన స్వస్వరూపము ఒకప్పుడు తానెట్లు ఉన్నదో, ఇప్పుడు ఇంకొకప్పుడు ఇట్లే ఉండటం జరుగుచున్నదని గ్రహించుటచేతనే మోక్ష స్వరూపానుభవం లభ్యమగుచున్నది. 'చిత్' స్వరూపమునకు విరుద్ధములైన అసత్య - అస్వచ్ఛ భావములు అసత్యములు కాబట్టే అవి చిన్మాత్రమగు పరమ పదమునకు నిరోధములుగా ఉంటున్నాయి.
శిఖిధ్వజుడు : మహాత్మా! స్వచ్ఛమగు చిద్రూపమే అస్వచ్ఛమగు జగద్భావమునకు కారణమగుచున్నదని మనం అనుకొనవచ్చునా?
కుంభమహర్షి : అట్లా సిద్ధాంతీకరించటం ఎట్లా కుదురుతుంది? విజ్ఞుల అనుభవం, శ్రుతి-స్మృతి వాక్యములను అనుసరించి 'స్వస్వరూపమగు బ్రహ్మం చేష్టా- స్ఫురణ రహితము, అప్రతర్క్యము, అవిజ్ఞేయము, అప్రమేయము, అకర్తృత్వము' అని మనం వింటున్నాం. కాబట్టి బ్రహ్మము ఏ కారణమునకు, తనకుతానుగా కారణం కాదు. అనగా ఈ సృష్టికి బీజమే లేదు. అందుచేత ఈ సృష్టి కూడా యథార్థానికి లేనిదే అగుచున్నది. ఓ మహారాజా! ఈ సృష్టి అనబడునది 'చైతన్యము యొక్క ఒక అధ్యాస' అనటం తప్పించి దీనికి మరొక ఏ యుక్తి కూడా కుదరదు.
చిన్మాత్రమొక్కటే ఉన్నది. ఈ జడమైన సృష్టి కొంచెం కూడా లేదు. ఇక, అహంభావము - జగత్తు... అనబడేవేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా చిన్మాత్రము ఆయా రూపములుగా స్వయముగా స్వయం శక్తిచే ఏర్పడే చమత్కృతి విన్యాసము మాత్రమే! జలము జరజర ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడే మెలికలతో కూడిన ఆకారంలాగా చైతన్యము చైతన్యంగా ఉంటూనే ఒక సమయంలో స్వయంకల్పిత జగత్తును గాంచుచూ తన నిత్యత్వ - నిర్మలత్వ అప్రమేయత్వాదులను ఏమరుచుచున్నది. శిఖిధ్వజుడు : దేవర్షీ! యాదృచ్ఛికవాదుల అభిప్రాయం అనుసరించి “ఈ జగత్తు యాదృచ్ఛికంగా, లేక, ఆకస్మికంగా ఉదయించింది” అని కదా! మరి ఆ వాదన విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? కుంభమహర్షి : ‘యాదృచ్ఛికంగా ఎందుకు ఉదయించింది?'... అనే ప్రశ్నకు వారు సమాధానం అందించలేకపోతున్నారు. కారణం ఉంటే కదా, కార్యం ఉండేది? కారణం లేకుండానే కార్యము ఉన్నదంటే అది యుక్తియుక్తమెట్లా!
8
ఓ శిఖిధ్వజ మహారాజా! ఆ పరమాత్మ ద్విత్వ - ఏకత్వాతీతుడై, కార్య కారణములకు సంబంధించిన సర్వభావముల రహితుడై ఉన్నాడు. ఇక ఈ ప్రపంచమున కంటికి తోచే జడాంశము సంగతేమింటంటావా? ఇది "ఆకాశంలో వికసించిన పుష్పం" అను మాటలాగా కల్పనా మాత్రమే! ఈ దృశ్యమంతా నశ్వర స్వభావము కలిగియున్నదవటం చేత ఈ జగత్తు ఆత్మను ఎరిగిన పండితుల దృష్టిచే సర్వదా లేనిదే... అని గ్రహించబడుతోంది. ద్రష్ట మాత్రమే ఉన్నాడు. ద్రష్ట జగత్తు కన్నా ముందే చిన్మాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఆ చిన్మాత్ర స్వరూపుడు తన అనంత తత్త్వంలో ఒకానొక మూల జగత్తు అనబడు చమత్కారమును స్వయంగా ఎవరి ప్రమేయమూ లేకుండానే కలిగి ఉంటున్నాడు. అనంతమగు ఆకాశంలో ఒక చిన్న ప్రదేశంలో ప్రకాశమానమగు సూర్యబింబం, ఆ సూర్యబింబంచే
Page:408
ప్రకాశించబడే చంద్రబింబం ఉన్నట్లు... నిత్య - అద్వితీయ - అఖండ స్వరూపమునందు కించిత్ ప్రదేశంలో ఈ దృశ్యవ్యవహారం ప్రతిబింబిస్తోంది. ఆకాశమును ఏ పదార్థమైనా సంకుచిత పరచ గలదా? ఏదైతే నీ వాస్తవతత్త్వము, లేక, స్వరూపము అయి ఉన్నదో... అద్దానిని ఈ ద్రష్ట - దృశ్య వ్యవహారములు ఎట్లా పరిమితపరుస్తాయని అనుకుంటున్నావో, నా కర్దం కావటం లేదు? చిద్రూపానికే 'నాశనం కలదు' అని నీవు అనదలచుకుంటే అద్దానిని జనింపజేసేది, నశింపజేసేది ఇంకొకటి ఉండాలి కదా, ఏది? చిత్తు యొక్క ఈ జన్మ - నాశనముల అనుభవం చిత్తుకే గాని మరెవ్వరికో కాదు కదా! మనం చిద్రూపం అని పిలిచేది అహంకార-జగదాదుల ఉనికి లేములకు కూడా సాక్షీభూతమై, అసంబంధితమై ఉంటున్న దానిని కదా! అహంకార - జగదాదులకు సంబంధించినది మాత్రమే. ఈ జన్మ మృత్యు కర్మ - అకర్మ, ధ్యాన - పరధ్యాన వ్యవహారాలు. మట్టికి - మట్టిబొమ్మకు ఆకాశంతో ఏం సంబంధమున్నది?
శిఖిధ్వజుడు : అవును! మీరు చెప్పేది అక్షరాలా నిజం. ఎద్దాని సమక్షంలో కారణకారణమే వాస్తవానికి అకారణమైయున్నదో, అట్టిచిదాకాశ స్వరూపుడనే నేను. మరొకటేదీ అవటానికే వీలులేదు. నా అనంత అప్రమేయ స్వరూపం యథాతథంగా ఎప్పటియట్లే ఏర్పడి ఉండగా నా యందు కల్పిత మాత్రమై ఈ శిఖిధ్వజ నామధేయం, దేహ, మహారాజాది ఆపాదిత విషయాలు, జన్మమృత్యు ఇత్యాది ప్రసంగాలు భ్రమ దృష్టి గలవానికి మాత్రమే దర్శనమౌతున్నాయి. అవన్నీ లేవు. అప్రమేయమగు చిన్మాత్రం మాత్రమే ఉన్నది. నా చిదాకాశ స్వరూపం మరింకొకటేదీ అగుటలేదు. సమస్తానికీ నేనే ఆదిని. నాకు ఎక్కడ ఏది అనిపిస్తోందో అదంతా నా యొక్క చిత్ ప్రకాశమునకు సంబంధించిన ఒకానొక కాంతిపుంజం మాత్రమే!
అయితే ఓ ఆత్మబంధూ! మన ఈ సంవాదము యొక్క ప్రాశస్త్యము కొరకు, మహనీయమగు మీ అమృతవాక్కులను గ్రోలటానికి మాత్రమే ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుచున్నాను.
స్వభావవాదులు చిత్తు నిత్యము ఉత్పన్నమౌతోంది. నిత్యము నశిస్తోంది"... అని ప్రతిపాదిస్తు న్నారు కదా! ఈ విషయమై తమ అభిప్రాయం?
కుంభమహర్షి : వారు ప్రతిపాదించే స్వభావవాదం వేద వాక్యములకు సరిపోవుట లేదని అభిప్రాయం. 'ఆత్మ సర్వదా అఖండమై చిదేకరసరూపమై వెల్లివిరుస్తోంది' అని శ్రుతులు గానం చేస్తుంటే ఇక నీవు అనుమానం కలిగి ఉండవలసిన పనేమున్నది? ఈ ప్రపంచంలో ఈ అనేక పదార్థముల ప్రాప్తి రూపంగా ఏదైతే సంభవిస్తోందో, అట్టి అనుభవమంతా, ఈ దేహాదులతో సహా కేవలం చిత్తు యొక్క ఒకానొక చమత్కారం మాత్రమే.
చిత్తత్త్వమాత్ర సత్తాస్తి ద్విత్వం -ఐక్యంచ నాస్తి అలమ్, అతః పదార్ధ సత్తాయా అభావే సతి! భూపతే!
ఓ భూపతీ! కేవలం చిన్మాత్ర ఒక్కదానికే 'సత్త' ఉన్నది. ఇక ద్విత్వ ఏకత్వములంటావా, అవన్నీ ఎప్పుడూ లేవు.
Page:409
యథార్థానికి పదార్థముల సత్త లేనే లేదు. 'పదార్థములకు సత్త ఉండటం అసంభవం' అను భావనను దృఢంగా ఆశ్రయించావా... అప్పుడు 'అహంభావం' కూడా తనంతట తానే రహితమై పోతుంది. ఇక అహంభావాన్ని జయించటానికి వేరే మరో ప్రయత్నం అవసరమే ఉండదు. అసంభవ భావనచే ఇక చిత్తుకు అన్యంగా చిత్తము అనునది ఎక్కడుంటుంది? చిత్తమే లేకపోతే జన్మ మృత్యువుల అనుభవం ఎవరికి? ఈ దేహానుభవమే యోచన యొక్క మహాసముద్రంలో ఒక చిన్న తరంగము వంటిది అవుతుంది. నీవో, మహాసముద్ర స్వరూపుడవై ఉన్నావు.
ఈ విధంగా చిత్తము ఉండదు, అహంకారం ఉండదు, వాటి భిన్నత్వము ఉండదు. జీవ-బ్రహ్మ భేదం ఉండదు. చిత్-అచిత్ భేదం గాని, దృశ్యానుభవభేదం గాని ఉండజాలవు. కాబట్టి రాజా! మొదట వాసనారాహిత్యం అభ్యసించు. అంతే! ఇక శాంతమనస్కుడవై, మౌనివై, చిదాకాశమయుడవై లు
ఆత్మమాత్రుడవై శేషించగలవు. “శుద్ధచైతన్యదృష్టి”ని అవలంబించటం చేత జడ పదార్థముల అభావం స్వయంగా సిద్ధించగలదు. అప్పుడు నీవు సదేహుడవైనా, విదేహుడవైనా, సమస్త పదార్థములందున్నను వాటి కంటే భిన్నంగా ఉన్నావు... అను ఒక నిశ్చలమైన కొండవలె, స్థిరంగా, శుద్ధాత్మ స్వరూపుడవై ఉండగలవు. అట్టి మోక్ష స్వరూపాన్ని నీవు ఆశ్రయించ వలసి ఉండగా, 'నాకు ఎప్పటికైనా మోక్షం లభించకూడదా?” అని ఎటో ఆకాశంలోకి చూస్తూ మీనమేషాలు లెక్కపెట్టుకోవటమేమిటో చెప్పు?
“భావన యొక్క అభావన” అను చిన్న ప్రయత్నం చేత చిత్తంలోంచి అహంకారం శమిస్తుంది. వేదార్థము యొక్క భావన చేతను, విద్వాంసుల అనుభవమును విని హృదయస్థం చేయుటచేతను సత్య జ్ఞానానందమైన బ్రహ్మమే శేషిస్తోంది. అనుభూతమయ్యే బ్రహ్మమొక్కటే సత్యము. అట్టి స్వబోధచే చింతాది వృత్తులు తప్పక బాధితమౌతాయి. ఇక బ్రహ్మమునకు వ్యతిరిక్తమైనదంటూ ఏదీ మిగలదు. ఇకప్పుడు చింతలకు కారణం కనబడదు.
ఓ రాజా! మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కారణాల చేత నీవు పదార్థ- దేహాదుల స్వరూపం అయి ఉండలేదు. నిర్మలమై, అకారణమై, సమస్తమునకు ఆదియై, ముక్తమై, నిత్యమై, అనేక రూపమై నప్పటికీ ఏకరూపమే అయి, శూన్యమై, నిరామయమై, అసత్పదార్థములన్నిటికీ అధిష్ఠానమై, సర్వజగద్రూపమై నప్పటికీ అవికారమై, శ్రుతులచే ప్రతిపాదించబడే ఏ బ్రహ్మం గలదో... అదే నీవై ఉన్నావు. “అది ఇంకా పొందవలసి ఉన్నదేమో?” అను నీ సంశయాన్ని ఇక త్యజించమని నా ప్రార్థన.
33. చిత్తమనేది లేదు!
శిఖిధ్వజుడు : అందరి స్వస్వరూపం విషయమై దేవఋషియగు మీ నిర్వచనం అమోఘమని, తప్పకుండా యుక్తి యుక్తమని, పరమశ్రేయోదాయకమని నేను ఒప్పుకుంటున్నాను. మీరు నాకు చేస్తున్న మేలుకు మీకు ఎట్లా, ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటమే లేదు.
Page:410
ఇదంతా, బ్రహ్మలోకం నుండి ఈ నారదపుత్రుల రూపంలో మా జనులందరిపై వర్షిస్తున్న బ్రహ్మానంద వర్షమని నాకు అనిపిస్తోంది.
హే దేవర్షీ! ఇంతవరకు బాధిస్తూ ఏమి చేయాలో తెలియని పరిస్థితులలోకి త్రోసివేసిన ఈ చిత్త-అహంకార-జగత్తులకు సంబంధించిన నా అవగాహనను మీరు పరమ పవిత్రం చేస్తున్నారు. హే మహానుభావా! ఈ చిత్తము గురించి మరికొన్ని విశేషాలు మీ దగ్గర నుండి వినాలని ఉన్నది. “చిత్తము లేదు” అని నిరూపిస్తూ ఏఏ యుక్తులు ఇంకా చెప్పబడినాయో, అవేమన్నా నా బోధ కొరకై విశదీకరించవలసినదిగా నా మనవి. అట్టి పూర్వోక్తమైన యుక్తులు క్లుప్తంగానో, విస్తారంగానో చెప్పమని పాదాక్రాంతుడనై వేడుకొనుచున్నాను. ఎందుకంటే చిత్తము యొక్క అభావమును నేను ఇంకా సంపాదించుకొనవలసియున్నదని అనుకుంటున్నాను.
కుంభమహర్షి :
చిత్తం నా స్యేవ, హే రాజన్! కదాచిత్, కించన, క్వచిత్! యచ్చే—దం చిత్తవత్ భాతి, తద్భహ్మభిదమవ్యయమ్ ||
హే రాజన్! నీకు ఇంకా సందేహం దేనికి? చిత్తము ఏ సమయంలోనూ లేదు. ఇక నీకు చిత్తమువలె భాసించేది ఏదైతే ఉన్నదో... అది స్వయముగా అవ్యయమగు బ్రహ్మమే అయున్నది. జ్ఞానము యొక్క బలిమిచే ఎప్పుడైతే జ్ఞేయ రూపమగు జగత్తే లేదని మనం అనుకున్నామో, ఇకప్పుడు 'నీవు - నేను' ...మొదలైన కల్పిత రూపములు ఎక్కడుంటాయి? ఎక్కడి నుండి వస్తాయి?
ఈ జగత్తు యథార్థానికి లేదయ్యా! ఈ వాక్యం చాలాసార్లు చెప్పుకున్నాం కదా! "ఇక్కడ ఏదైతే ఉదయిస్తున్నట్లు మనకు అనిపిస్తోందో, అదంతా బ్రహ్మమే” అను జ్ఞానం కలిగిన తరువాత ఇక ఎవనికి ‘చిత్తము' అనబడేది గోచరిస్తుంది? ఏ స్థితిలో 'అంతయు బ్రహ్మమే' అని అనుభవమౌతోందో, అట్టి స్థితియందు ఇక ఎవడు దేనిని ఎఱుగుచున్నాడు
మహాప్రళయానంతరం సృష్ట్యాదియందు ఈ జగత్తు అనబడేది యథార్థానికి ఉత్పన్నమే కాలేదు. ఇక 'చిత్తము ఉదయించింది' అని శాస్త్రములు చెప్పటమంతా నిర్విషయమగు దానిని విషయభావనతో ఆశ్రయించినట్టి ఈ జీవుని అట్టి భావననుండి విరమింపజేయటానికి చెప్పు మధ్యేమార్గ పాఠం మాత్రమే. ఎందుకంటే, సృష్ట్యాదియందు చిత్తము అనబడేది ఆత్మకంటే వేరుగా రూపుదిద్దుకోవటానికి ఉపాదానకారణం ఎక్కడున్నది? లేదు. అందుచేత, మునుముందుగా ఆత్మ మాత్రమే ఉన్నట్లు ఇప్పుడు కూడా ఆత్మయే ఉన్నది. కారణరహితముగా ఆత్మమాత్రమే ఉన్నట్లు ఇప్పుడు కూడా ఆత్మయే ఉన్నది. కారణరహితమగు అజ్ఞానబుద్ధిగాని, చిత్రాత్మకమగు జగత్తు గాని ఆత్మనుండి వేరుగా జనించటానికి అవకాశమే లేదు. 'తస్మాత్ యదిదమాభాతి భాసనం బ్రహ్మనేతరమ్', కనుక ఇక్కడ జగదాకారంగా భాసించేదంతా బ్రహ్మమే కాని, మరింకొకటేది కాదు. శిఖిధ్వజుడు : హే మహాత్మా! నామరూపరహితుడగు పరమాత్మ గురించి వేదాదులు కొంచెం విరుద్ధమైన పదజాలంతో ఆయా చోట్ల వచించటం జరుగుతోంది.
Page:411
1. సర్వభూతాంతరాత్ముడై ఒకే పరమాత్మ వెల్లివిరిసి ఉన్నాడు (ఏకో వశీ సర్వభూతాంతరాత్మా) 2. ఒకే రూపము అనేక విధములుగా చేస్తున్నాడు (ఏకం రూపం బహుధా యః కరోతి) ...ఈ వాక్యములు 'పరమాత్మయే ఈ సర్వము రచిస్తున్నాడు' అని చెప్పుచున్నాయి కదా! మరి మనం పరమాత్మ 'అకర్మ' అని 'అభోక్త' అని 'అప్రమేయుడు' అని ఎట్లా అనగలుగుతాం? కుంభర్షి : నీవు చెప్పిన ఇత్యాది వాక్యాలన్నీ ఈశ్వరుని విషయంలో అర్థారూపవాదాలు మాత్రమే. ద్రష్ట యొక్క అనుభవ జ్ఞానం, నిర్ణయాత్మక స్వభావాన్ని అనుసరించి అవి ఆయా అర్థములను ప్రతిబింబించటం, అవి వాస్తవత్వానుభవమును కలుగజేయటం జరుగుతోంది. కారణరహితమగు ఆత్మ విషయంలో ఉత్తమార్థమును ప్రతిపాదించే 'నిష్కలమ్ - - నిష్క్రియమ్' అని కూడా అవే శాస్త్రములు పదప్రయోగం చేశాయి కదా! కనుక "ఆత్మ ఆయా రూపములుగా పరిణమిస్తోంది” అనునది
విద్వదనుభవమునకు విరుద్ధములైనది. అంతేగాని, పరిణామము అనేది ఆత్మకు ఆపాదించ వీల్లేదు. ఇక 'నామరూపరహితుడు, ద్వంద్వ వర్జితుడు, శీత-వాతాది దోషరహితుడు, నిరాకారుడు అగు ఈశ్వరుడు ఈ జగత్తును రచించుచున్నాడు - ఇటువంటివన్నీ తాత్పర్యరహితమైన వాక్యాలు. అవి అర్థారోపవాదములు మాత్రమే! ఇంకా చెప్పాలంటే, అవి హాస్యాస్పదమైన వాక్యాలని అనక తప్పదు.
ఈ విధంగా ఎటుచూచినా కూడా చిత్తము అనేది లేదు. ఈ జగత్తే వాస్తవం కానప్పుడు ఇక ఇద్దానికి అంతర్గతమై ఉన్న చిత్తము మొదలైనవి ఎక్కడుంటాయి?
శిఖిధ్వజుడు: చిత్తము గురించి చాలా విశేషాలు మీరు చెప్పియే ఉన్నారు. అసలీ చిత్తము దేనిచే నిర్మించబడి సంసిద్ధమౌతోంది?
కుంభమహర్షి : చిత్తము వాసనల రూపమే అయి ఉన్నది. వాసనలకు విషయమగు ఈ జగత్తే లేదు - అని మనం అనుకున్నాం కదా! జగత్తుకే అస్తిత్వం లేకపోతే, ఇక చిత్తమునకు మాత్రం అస్తిత్వం ఎక్కడున్నది? ఎట్లా ఉంటుంది?
మాయా సమన్వితమైన బ్రహ్మము తనయందు తానే నిర్మించుకునే కల్పనలనే మనం 'చిత్తం జగత్తు' అను పేర్లతో పిలుస్తున్నాం. నీవు ఒక కల గంటుంటే ఆ స్వప్నములోనిదంతా నీ ఊహే కాబట్టి, అందులో ఉన్నదంతా నీ స్వరూపం గాక, మరొకరి మరొక స్వరూపం నీ ఊహలోకి ఎట్లా వస్తుంది? అట్లాగే బ్రహ్మం యొక్క ఊహయే ఈ చిత్తు - జగదనుభవాలు కాబట్టి అవి రెండూ, తదితర అహంకారాదులు బ్రహ్మం కంటే వేరు అవటానికి వీలులేదు. ఆ బ్రహ్మం యొక్క అనుభవం మరొకరెవరో ఉద్దేశించినదను ప్రతిపాదనయే మిథ్య.
బ్రహ్మము కంటే వేరొక సత్త ఉంటే, లేక, నిరూపించగలిగితేనే, అట్టి ప్రతిపాదన యుక్తియుక్త మౌతుంది. లేకుంటే కాదు.
స్వప్నద్రష్ట సగం నిద్రలో తన అంతర్గత వాసనలను అనుసరించి ఊహానిర్మితంగా సుఖ దుఃఖాదులను, ఆశ్చర్యక - అసహ్యాది ఏవేవో వస్తు - జీవ - దృశ్యాదులను పొందుచున్నాడు కదా! అట్లాగే, వాసనలను అనుసరించి ఈ జాగృత్ ద్రష్ట కూడా సుఖ-దుఃఖాదులను, ఆశ్చర్యక-అసహ్యాది
Page:412
విషయములను గాంచుచున్నాడు. ఉభయ ద్రష్టలు "మేము బాహ్యమున ఇవి పొందుచున్నాం” అనియే భ్రమిస్తున్నారు. వాసనా విషయకమగు ఈ జాగ్రత్ దృశ్య జగత్తు గాని, స్వప్న దృశ్య జగత్తు గాని అసలు ఉత్పన్నమే కాలేదు... అని నీవు నిస్సంకోచంగా గ్రహించి ఉండు. "అబ్బే! నాకు ఉత్పన్న మైనట్లు కనబడుతోంది!"... అంటావా? అది నీ బ్రాహ్మీ స్వరూపమును ఏమరచినపుడు ఏర్పడి ఉన్న భ్రమ మాత్రమే”... అని మా అనుభవమును రంగరించి ప్రకటిస్తున్నాం. అందుకు అనుభవజ్ఞులమగు మేము, శాస్త్రకారుల ప్రవచనములు, శాస్త్ర వాక్యములే ప్రమాణం.
ఇక చిత్తము విషయానికి వస్తే దృశ్యము ఏ విధంగా ఉత్పన్నమే కాలేదని అనుకుంటున్నామో, అట్లాగే చిత్తము కూడా కారణము ఉండజాలనందువల్ల మొదలే ఉత్పన్నం కాలేదు.
భ్రమను వీడి బ్రహ్మమును ఎంత త్వరగా దర్శించటం ఆరంభిస్తే అంత మంచిది. పరమాకాశం (పరబ్రహ్మం) అను పేరుగల చిదాకాశం మాత్రమే విశాలరూపమున సర్వేసర్వత్రా అనుభవమౌతోంది. ఇక నీ జగత్తు అనేది ఎక్కడున్నది?
దర్పణంలో కనిపించేదంతా దర్పణం యొక్క విభాగమేగాని, దర్పణంలో దర్పణమునకు సంబంధించనిదేదో ప్రవేశించి ఆ దర్పణమును మరొక దానిగా పరిణమింపజేయటం లేదే!
అట్లాగే ‘చిత్ స్వరూపము' అనే అద్దంలో అనిర్వచనీయ రూపముచే ఏ కొంచెము ‘చిత్తము’ అను పేరుతో పిలువబడుతూ భాసిస్తోందో... అదంతా చిదాకాశమే అయి ఉన్నదని మరొక్కసారి చేతులెత్తి ప్రకటిస్తున్నాను.
ఓ రాజా! పునరావృత్తి దోషం అయినప్పటికీ నీ యొక్క ఆరూఢత కొరకు మరల మరల నేను ప్రకటించక తప్పదు. యథార్థానికి చిత్తము గాని, జగత్ అనబడు క్రియగాని ఈనాడు లేదు, ఎన్నడూ లేదు. భ్రమను వీడక, భ్రమలోనే ఉండదలచిన వారికి అవి ఉంటున్నాయి. నిన్ను నీవే యుక్తి యుక్త వాక్యబలాన్ని ఆశ్రయించి భ్రమ నుండి బయల్వెడలజేసుకోవాలి గాని “ఎవరో వస్తారు! ఎప్పుడో ఏదో అవుతుంది! అప్పుడు ఈ భ్రమ పోతుంది" అని తలస్తూ ఈ విధంగా అడవు లందో, ఆరామములందో సంచరిస్తూ జ్ఞాన సమాచారమును పొందక కేవలం కమండలమును ఆశ్రయించటమో, గడ్డములను పెంచటమో, దూరంగా ఎక్కడికో వెళ్ళటమో చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం?
ఓ రాజా! “సర్వానర్థకారకమగు నేను, నీవు, జగత్తు, చిత్తము అను వ్యవహారమంతా వాస్తవం కాదు. “సాక్షియగు నా కిదంతా స్వప్నమువలె భాసిస్తోంది" అని నీవు శీఘ్రంగా గ్రహించి ఉండటం ఉచితం, ఆవశ్యకం కూడా!
ఈ జగత్తు వాసన యొక్క విషయభూతము మాత్రమే. వాసన యొక్క అభావనను ఆశ్రయించి చూడు. అప్పుడు వాసన లేనిదే అగుచున్నది. వాసనతో బాటు వాసనారూపమైన చిత్తము, చిత్తరూపమైన జగత్తు మటుమాయమౌతాయి. అప్పుడు చిదాకాశమే శేషిస్తుంది. అనగా, ఏది అజ్ఞాన సమయంలో
Page:413
జగత్తు, వాడు, వీడు, నేను, నీవు, నా మతం, ఈ వర్గం, ఆ దేశం, ఈ రాజ్యం, ఈ అడవి -
మొదలైన జగద్విషయాలు అనుభవమౌతున్నాయో... అవన్నీ లేవని, చిదాకాశమే ఉన్నదని, ఈ కనబడేవన్నీ చిదాకాశ ఆపాదితములనీ జ్ఞానదృష్టికి తేటతెల్లమౌతోంది. అజ్ఞానిగా ఉన్నంతకాలం నీవు ఈ భూ ప్రపంచంలోని ప్రతి కీకారణ్యంలోనూ వందల వేల యేళ్ళ తరబడి తపస్సు చేసినా లాభం లేదు. అంతరంగసార దర్శనం అను జ్ఞానంచే కల కలగా, అసత్యం అసత్యంగా, కల్పితం కల్పితంగా, నిత్యమైనది నిత్యంగా ఎఱుగబడగలదు.
ఓ రాజా! మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.
అప్రబుధ్ధః అవగతం చిత్తం దృశ్యమిదం జగత్, అసచ్చిత్తం నిరాకారం పూర్వముత్పన్నమేవ నో॥
అజ్ఞాన దృష్టికి ఏ చిత్తము - తద్వారా - జగత్తు - దృశ్యము మొదలైనవన్నీ అగుపిస్తున్నాయో అట్టి అసత్తెన, నిరాకారమైన చిత్తము మొదటే ఉత్పన్నం కాలేదు. స్వప్నానికి స్వప్నద్రష్టకన్నా వేరే కారణం లేనట్లే జగదనుభవమునకు జాగ్రత్ ద్రష్టకన్నా వేరే ఎవరూ కారణం కాదు.
కనుక, “కారణము యొక్క అభావముచే సృష్ట్యాదిలోనే ఈ జగత్తు ఉత్పన్నం కాలేదు. ఇదంతా చైతన్యము నందు స్వయంకృతమై జలతరంగంలాగా ఏర్పడిన చైతన్యరూపమే అయినట్టి జగద్భావన యొక్క మాహాత్మ్యం అనునది మాత్రమే ఉత్తమోత్తమమైన సత్యం.
"సాకారము, స్థూలము, ప్రతిఘాతయోగ్యము అగు ఆకృతి కలిగినట్టిది అయిన ఈ దృశ్య వస్తువు అనాదియు, స్థిరము, జన్మవికారసహితము”... అని అనటం ఉచితం కాదు. అది ఆత్మజ్ఞులు అనుభవమునకు అనుకూలంగా లేదు. “ద్రష్ట యొక్క కల్పనయే ఈ జగత్తు" అనటానికి ఒక దృష్టాంతం, “ఇదంతా ఎవరికి ఎట్టి చిత్తం ఉంటుందో వారికి తదనుసారమే అనుభవమవటం” అనునదే సుమా!
అయితే, ఇక్కడొక చమత్కారం గమనార్హం. ఇక్కడ జగత్తు వికారాలైనట్టి ప్రళయ - మహా ప్రళయాదులు ఉన్నాయని శాస్త్రములు ప్రవచిస్తున్నాయి కదా! అట్టి ప్రళయ - మహాప్రళయాదులు కారణ అభావం చేతనో, లేక శాస్త్రానుభవం చేతనో నిరాకరించటానికి వీలు ఎట్లా కుదురుతుంది? “శాస్త్ర, అనుభవ, వేదార్థ, సిద్ధాంతాలచే చెప్పబడే ప్రళయాలు లేవు" అని గాని, శాస్త్ర - వేదానుభవాలే లేవని అనటం నా ఉద్దేశం కాదు. ప్రత్యక్షంగా జరుగుచున్న దానిని లేవు అన్నంత మాత్రాన ఏం లాభం? మనం సంభాషించుకునేదంతా 1. లోకానుభవ ప్రమాణం, 2. శాస్త్ర ప్రమాణం, 3. వేద ప్రమాణం... ఈ మూడింటికి సరిపోవుచూ ఉండాల్సిందే! అట్లా కాకుండా కేవలం లోక ప్రమాణం మాత్రమే తీసుకుంటే అట్లు ప్రతిపాదించేది "పదార్థములు మాత్రమే ఉన్నాయి. ఇంకేమీ లేవు. ఇంక తెలుసుకోవలసినది మరింకేమీ లేదు” అనే చార్వాకసిద్ధాంతం కన్నా ఉన్నతమైనది కాదు. అట్టి వానిని సజ్జనులు ఆశ్రయించరు.
అందుచేత మనం ప్రతిపాదించే అకారణ సిద్ధాంతం (కారణమే లేదు కనుక చిత్త - జగత్తులు లేవు - అనే సిద్ధాంతం) కొన్ని వాక్య పరంపరగా సమీక్షిస్తాను.
Page:414
1. జీవునకు సాకార - ప్రతిఘాతయోగ్యమైన ఈ దృశ్య జగత్తు అనుభవమౌతోంది.
2. ఈ వస్తువు జగత్తుకు ఒకప్పుడు ఉత్పత్తి ఉన్నట్లే మరొకప్పుడు వినాశనము (ప్రళయ -
మహా ప్రళయములు) అనివార్యం.
3. ఇట్టి సాకార - ప్రతిఘాతయోగ్య దృశ్య జగత్తునకు కారణం నిరాకార - అప్రతిఘతమైనట్టి బ్రహ్మము కాజాలదు.
4. పదార్థముల అనుభవం దృష్టిని బట్టి ఉంటోంది. దృష్టియే సృష్టి. దృష్టియే చిత్తము.
5. వ్యవహార దృష్టిచే సాకారము పొందుచున్న ఈ జగత్తు అట్టి వ్యవహారదృష్టికి మాత్రమే అర్థ క్రియా సామర్థ్యము కలిగి ఉంటోంది
6. పరమార్థమున బ్రాహ్మీదృష్టిచే (బ్రహ్మము యొక్క అఖండ అప్రమేయ దృష్టిచే) ఈ జగత్తు నిత్యము అలక్ష్యమై, అవిషయమై ఉంటోంది.
కాబట్టి మనందరి ఏ బ్రాహ్మీ స్వస్వరూపమున్నదో ...అది సర్వదా నిరంశమై, ప్రతిఘాతయోగ్య మగు రూపం లేనిదై, నిరాకారమై, పూర్వము కంటే కూడా పూర్వమై, పూర్ణ స్వభావ యుక్తమై, శాంతమై, చిదాకాశమై, సర్వత్రా వర్తించునదై, ఉన్నది. అట్టి బ్రహ్మం యొక్క సమమగు ఆత్మప్రకాశం అను నిజస్వరూపం స్వయంగా ఈ "ప్రళయ - - మహా ప్రళయాలు" అను జగద్వికారాలను ధరిస్తోంది.
ఆత్మస్వరూపము - అజ్ఞానదశయందు క్షణకాలంలోనే జగద్రూపంగా భాసిస్తోంది. మరొక క్షణంలో అదే ఆత్మస్వరూపము “తత్త్వమసి” వంటి అఖండార్థప్రదమగు వాక్యములను ఆశ్రయించి తద్ద్వారా తన యొక్క ద్వైతరహితమగు నిజబ్రహ్మరూపంగా ప్రకాశిస్తోంది. వీటినే మనం బంధము అని, మోక్షము అని శాస్త్ర రచన కొరకు చెప్పుకుంటున్నాం.
బ్రహ్మైవేదమతః సర్వం, క్వచిన్న జగదాది ధీః?
క్వాచిత్తాదిః? క్వచిత్తాది? క్వద్వైత్యైక్యాది కల్పనా?
శాస్త్రీయమగు బోధచే అంతయూ బ్రహ్మమే అగుచున్నది. ఇక ఈ జగదాదులకు సంబంధించిన బుద్ధి ఎచట? చిత్తాదులెచట? అచిత్తాదులు ఎచట? ద్వైత - ఐక్య కల్పనలు ఎక్కడున్నాయి? ఇట్లు జ్ఞానం కలుగగా, ఈ జగత్తంతాకూడా ప్రశాంత రూపమై, నిరాలంబమై, జన్మరహితమై, అనాది అయి, యథాస్థితమైనట్టి (ఎప్పటియట్లే ఉన్నట్టి) బ్రహ్మమే అగుచున్నది. కానీ, అజ్ఞానుల దృష్టికి మాత్రం ఈ జగత్తు, ఇందలి సారాసారములన్నీ కూడా అసత్తుగా బ్రహ్మమునకు వేరైనదిగా ఎరుగబడుట చేతనే అటు నానారూపాలుగాగాని ఇటు ఏకరూపంగా గానీ కాకుండానే ఉన్నాయి.
కాబట్టి ఓ ప్రియమిత్రమా! శిఖిధ్వజ మహారాజా! నీవు... వ్యవహార దృష్టిచే యథాప్రాప్తములైన వ్యవహారములను ఆచరించు. తత్త్వ దృష్టిచే కాష్ఠమౌనమును అవలంబించి ఉండు. ఈ వాక్ మొదలైన ఇంద్రియ వ్యాపారరహితుడవై, ప్రశాంత స్వరూపుడవై ఏర్పడి ఉండు.
Page:415
34. ఈ జగత్తే బ్రహ్మము
శిఖిధ్వజుడు: హే బ్రహ్మన్! నేను మీ రాకచే ఎంతటి ధన్యుడనైనాను!
నష్టో మోహః స్మృతిః లబ్దా త్వత్ప్రసాదాత్, మహామునే! స్థితోస్మి గత సందేహో విశ్రాంతమతిరాత్మవాన్ II
తమ అనుగ్రహం చేత నా అజ్ఞానం నశించింది. ఆత్మ స్వరూపం ఇప్పుడు స్మృతికి (జ్ఞాపకానికి) వచ్చింది. ఇప్పుడు సంశయరహితుడనై ఆత్మయందు అనిర్వచనీయమైన విశ్రాంతిని పొందుచున్నాను. ఏది తెలుసుకోవాలో... అది తెలుసుకున్నాను. మాయారూపమగు మహాసముద్రమును దాటివేశాను. నేనిప్పుడు మహామౌనినై పరమశాంతుడనై, అహంకారవర్జితుడనై, ఆత్మజ్ఞాన సంపన్నుడనై ఉన్నాను.
ఆహాఁ! ఇంతకాలం ఈ సంసారారణ్యంలో మార్గం తెలియక తిరిగి తిరిగి అలసిపోయానే! ఇప్పటికి మార్గం చూపించే మీరు అనేక జన్మల పుణ్యఫలంగా లభించారు. ఇప్పటికి దుఃఖరహితమైనట్టి అక్షయ స్థానమును పొందాను. మీరు చెప్పినట్లు అజ్ఞానదశలో తెలియవచ్చే అహంకార సహితమైన ఈ స్వర్గ - మర్త్య - - పాతాళములనబడే మూడు లోకములు లేవు. ఏదేది ఎక్కడెక్కడ భాసిస్తోందో అదంతా బ్రహ్మముగానే ఎరుగుచున్నాను. 'అహంకారం' విషయమై మీరు చెప్పే యుక్తియుక్తమైన ఆప్తవాక్యాలు వింటుంటే ‘బ్రహ్మానందం' అని శాస్త్రకారులు చెప్పే అనుభవం యొక్క ఔన్నత్యం నిజంగా ఇప్పుడు అవగతమౌతోంది. ఏ దేవతలు నా ప్రపత్తికి సంతసించి ఈ రోజు మీ వాక్యామృతాన్ని వినే అవకాశాన్ని ప్రసాదించారో, వారికి కృతజ్ఞతలు చెప్పటానికి నాకు మాటలు రావడం లేదు. మీ వాక్య బలంచే ‘అహంకారం లేదు' అని గ్రహిస్తున్నాను. ఎంతటి ఆశ్చర్యం!
కుంభమహర్షి: ఔను నిజమే! ఈ జగత్తే లేకపోతే ఇక అహంకారం ఎట్లు ఎవరికి భాసిస్తుంది? మాంత్రికుని మాయాకల్పన వంటి ఈ జగత్తుకు ఎక్కడా కారణం లేదు. ఇది సత్యమెట్లా అవుతుంది? ఇది గ్రహించి నీవు యథాప్రాప్తములైన ఆయా వ్యవహారములను నిర్వర్తిస్తూనే మౌనిపై శాంత మనస్కుడవై, ఆత్మ మననశీలుడవై ఉండు.
శాంతమగు సముద్రంలో శాంతమగు కెరటమువలె ఏర్పడి ఉండు. ఇదంతా కూడా యథాస్థిత మైనట్టి శాంతపరబ్రహ్మమే అయి ఉన్నది. ఇక నేను, ఇది, జగత్తు మొదలైన శబ్దార్థముల వాస్తవ స్వరూపం శూన్యమే సుమా! ఆత్మరూపమగు ఆద్యంత రహితమైన చిదాకాశమే తనయొక్క చిత్ (ఎఱుక) అను చమత్కారం చేత చాకచక్యంగా ఈ జగద్రూపమున ప్రకాశిస్తోంది. బంగారు గొలుసులో గొలుసు ఆకారాన్ని ప్రక్కకు పెట్టామనుకో, ఇక అందులో బంగారం కాక మరింకేమున్నది? అట్లాగే, ఈ జగత్తు యొక్క నామరూపాలు ప్రక్కకు పెట్టామా ...ఇక ఇదంతా బ్రహ్మం మాత్రంగానే
మిగిలి ఉంటుంది.
“సమష్టి అహంకారాత్మకుడు" అయిన బ్రహ్మదేవుడు స్వయంగా సంకల్పమాత్రుడే కదా! అట్లాగే 'వ్యష్టి అహంకారాత్మకుడు' అగు ఈ జీవుడు కూడా స్వయంగా సంకల్పమాత్రుడే అయి ఉన్నాడు.
Page:416
సంకల్పరూపమే ఈ జగత్తు. సంకల్పము వల్లే బంధం కలుగుతోంది. అహంకారం కూడా సంకల్పం యొక్క ఒక ప్రకటన మాత్రమే. సంకల్ప త్యాగమునందు మోక్షం వ్యవస్థితమై ఉంటోంది. అహమిత్యేవ సంకల్పో బంధోయాతి వినాశినే
నా_హమ్ ఇత్యేవ సంకల్పో మోక్షాయ విమలాత్మనే ॥
‘ఈ దేహాదులే నేను’ అను సంకల్పము జ్ఞాన వినాశనకరమగు బంధమును కలుగజేస్తోంది. "ఈ దేహాదులు నేను ఏ క్షణంలోనూ కాదు” అను సంకల్పం నిర్మలమగు మోక్షమును కలుగజేస్తోంది. ఆత్మ సర్వదా ఈ బంధ మోక్ష విపర్యయపదాలకు సంకల్పాది శబ్దార్థములకు సాక్షీభూతమై ఉన్నది. అట్టి ఆత్మ స్వరూపం యొక్క సాక్షాత్కారజ్ఞానమును 'సద్భహ్మం' అని, 'కైవల్యం' అని చెప్పుచున్నారు.
భావనయే బంధ-మోక్షాలను నిర్ణయిస్తోంది. 'అహంభావన' అను అజ్ఞానం లేకపోతే మోక్షం. ‘అహంభావన’ అను అజ్ఞానం కలిగి ఉంటే బంధం. కాబట్టి మహారాజా! నీవు దేహాహంభావనను ఇప్పుడే ఇక్కడే నిస్సందేహంగా త్యజించు. "నేను సద్రూపుడను. అహంభావరహితుడను" అనే జ్ఞానాన్ని అత్యంత అవశ్యంగా శీఘ్రంగా ఆశ్రయించి తద్వారా 'శుద్ధాత్మబోధి’వి కమ్ము. నిస్సంకల్పం (లేక) సంకల్పరాహిత్యం అను చిన్న ప్రయత్నం నీకు సమ్యక్ జ్ఞానాన్ని అతి త్వరగా ప్రసాదించగలదు. అప్పుడు క్రమంగా నీ నుండి అసద్రూప సంకల్పం స్వయంగా తనంతట తానే నశిస్తుంది.
సర్వ తర్కములకు అతీతమైన (అప్రతర్క్యమైన) పరమాత్మయందు కారణత్వం ఎట్లా సంభవిస్తుంది? కారణమే ఉద్భవించజాలనప్పుడు కార్యరూపమగు ఈ పదార్థములు ఎట్లా ఉంటాయి? పదార్థముల అభావనచే ఇక దానిలో అహంభావం ఎన్నటికీ ఉదయించజాలదు. అహంభావమే ఉదయించకపోతే ఇక ఈ ప్రపంచం ఎవరికి ఉన్నట్లు? ప్రపంచం యొక్క అభావనచే సమస్తం కేవలం పరబ్రహ్మ మాత్రమై శేషించగలదు.
యదిదం భాసతే తత్సత్పరమేవాత్మని స్థితం
పరంపరే పరాపూర్ణం సమమేవ విజృంభతే ॥
జ్ఞాన సముపార్జనకు పూర్వం ఏదైతే జగత్తుగా భాసిస్తోందో, అదంతా జ్ఞాన సమన్వితుడవైన తరువాత ఆత్మప్రసరణ సమన్వితమై అనుభవమౌతోంది, పరమార్థమున చూస్తే, - “సద్రూపమగు పరమాత్మ తన ఆత్మయందు తానే సర్వదా సంస్థితమైయున్నది” - - అని గ్రహించబడుచున్నది. సమస్వరూపమగు పరమాత్మయే సమస్వరూపమగు జగత్తును తన చిత్కళతో నింపివేసి అదే సమయంలో తన పరస్వభావమును యథాతథంగా కలిగియే ఉంటున్నాడని జ్ఞాని ఎరుగుచున్నాడు.
వజ్రం అంతరమున నిశ్చలంగా ఉన్నది. కాని బాహ్యమున ఆ వజ్రం యొక్క కాంతి ఆయా సమీప వస్తువులను ప్రకాశింపజేయుచున్నది. “పరమాత్మ” అను వజ్రమణి యొక్క కిరణసమూహ ప్రతిబింబాకారమే పరమాత్మయందు ప్రకటితమయ్యే జగత్తు - అని గ్రహించి ఉండు.
సంకల్పములన్నీ (లేక ఊహలన్నీ) నశించగా, ఇక సంకల్ప నిర్మిత నగరానికి (లేక, ఊహానిర్మిత నగరానికి) స్వరూపం ఏముంటుంది? ఆకాశము కంటేకూడా స్వచ్ఛమైన, సదసన్మయమైయున్న ఈ జగత్తు కూడా నిర్మల - నిర్విషయాకాశముగానే గ్రహించు.
Page:417
వస్తువులు కదులుచున్నప్పటికీ, ఆ వస్తువులు ఏ వజ్రశిలయందు ప్రతిబింబిస్తున్నాయో అది నిశ్చలం కదా! ఈ జగత్తును ఎవడు శాంత మననరహిత మౌనతత్త్వముగా గాంచుచున్నాడో అట్టి వాడు మాత్రమే దీనిని సరిగ్గా దర్శిస్తున్నవాడౌతాడు.
ఓ రాజా! నీయందు సమ్యక్ జ్ఞానోదయం అగుగాక! అప్పుడు బాహ్యరూపాలగు ఈ లోకాలు, ఆంతరికములైన మనో బుద్ధి అహంకారాలు ఇవన్నీ నిస్సారమని, నామమాత్రా వశిష్టములని ఎవరూ చెప్పకుండానే గ్రహిస్తావు. అట్టి స్థితినే విజ్ఞులు “మోక్షం” అనే పేరుతో పిలుస్తున్నారు.
వాయువు చలిస్తోంది. అయితే చలనము లేకపోయినప్పుడు కూడా వాయువు ఉన్నది కదా! దీపం వెలిగిస్తే వెలుగు వస్తోంది. దీపం వెలిగించనప్పుడు ఆ కాంతి ఆకాశంలో దాగి ఉన్నది కదా! ఆభరణం యొక్క రూపం ధరించనప్పుడు కూడా బంగారం ఉన్నది కదా! అట్లాగే జగత్తు యొక్క సన్నివేశం లేకపోయినప్పుడు కూడా బ్రహ్మము ఉన్నది. బ్రహ్మమునకు ‘లేకపోవడం’ అనేది ఉండదు. జగత్తు యొక్క ఈ జగత్ ప్రత్యయాకారములు, ఇందులోని నామరూపాదులు, వీటి యొక్క కల్పనను ప్రదర్శించే మనోబుద్ధ్యాదులు - ఇవన్నీ మిథ్యాభాసములు మాత్రమే! అయితే, ఇవన్నీ బ్రహ్మమునందే ఉండి, బ్రహ్మము నందే ప్రతిబింబిస్తున్నాయి.
సముద్రంలో వేలాది తరంగాలు ఉండవచ్చు గాక తరంగాలన్నిటిలో ఉన్నది జలమే కదా! జలాన్ని గ్రహించిన తరువాత తరంగాల యొక్క శబ్దార్థాలు ఎక్కడ మిగులుతాయి? అట్లాగే బ్రహ్మమున అనేక సృష్టులు ఉండవచ్చు గాక! అవన్నీ కూడా బ్రహ్మమును గ్రహించిన తరువాత అర్థరహితములగు శబ్దాదులకు కూడా అనర్హములు కాగలవు. వాస్తవానికి ఈ సృష్టి నుండి శబ్దార్థములను వేరు చేస్తే అప్పుడీ సృష్టియే బ్రహ్మము. బ్రహ్మమే సృష్టి. 'ఇదంతయు బ్రహ్మమే (సర్వం ఖల్విదం(బ్రహ్మ)' అను శ్రుతి వాక్యము యొక్క అర్థం ఇదే కదా! 'బ్రహ్మము' అను శబ్దమునకు అర్థం ‘వృద్ధి కలిగించునది’ అని కదా! కనుక ‘బ్రహ్మము' అను శబ్దమునందు సర్గము లేక సృష్టి అనే అర్థం కూడా ప్రతిక్షేపించబడియే ఉన్నది. అట్లాగే 'సర్గము’ అను శబ్దమునకు అర్థము 'త్యాగము' అని కూడా కదా! కాబట్టి 'సర్గము' అను శబ్దంలో త్రివిధ పరిఛేదాత్యాగరూపములగు "త్యాగము (బ్రహ్మము” అనే అర్థం సంక్షిప్త పరిచియే ఉన్నది. అనగా బ్రహ్మమునకు, సర్గమునకు ఉన్న అర్థం ఒక్కటే ఆగుచున్నది. ఇట్టు సృష్టియే బ్రహ్మము, బ్రహ్మమే సృష్టి అని గ్రహించు.
"సమస్త శబ్దములు, ఆ శబ్దముల అర్థములు, వాటి భావనలు, ఆ భావనల ఉదయము” ఇట్టి సర్వరూపంగా వర్తించే చిదాకాశమేదైతే ఉన్నదో అద్దానినే 'బ్రహ్మము' అని పిలుస్తున్నారు.
మనం సమ్యక్ దర్శనం సిద్ధింపజేసుకుంటే అప్పుడు జగత్తు - బ్రహ్మము అనబడు ఉభయ శబ్దముల వాచ్యార్థం నివృత్తమౌతుంది. అప్పుడు వాటి లక్షణావృత్తి శేషిస్తుంది. ఇకప్పుడు మిగిలేది అనుభవం మాత్రమే! అజరమై, అమరమై, శాంతమైనట్టి ఏ పరబ్రహ్మము కలదో - అద్దాని నుండి బ్రహ్మ-జగదాది వాక్కులన్నీ వెనుకకు మరలుతాయి. (యతో వాచోనివర్తంతే అప్రాప్యమనసా సహా
Page:418
- తతోవాగ్వినివర్తతే). యథాస్థితమైన ఏ ఈ జగత్తేదైతే ఉన్నదో, ఇది అతి దృఢమగు శిలారూపము వంటిదై పరబ్రహ్మస్వరూపమే అయున్నది.
ఈ జగత్తును నీవు మార్చటమో, వదలటమో, పట్టుకోవటమో మోక్షం కాదు. దీని వాస్తవ స్వరూపం గ్రహించి ఉండటమే మోక్షమనబడుచున్నది.
సర్వాత్మక జ్ఞానముచే బ్రహ్మము శేషించగలదు. అజ్ఞానముచే ఒక జీవుడు సర్వాత్మక జ్ఞానము కలిగి ఉండకపోవచ్చు గాక! అయినప్పటికీ ఇక్కడ సర్వదా ఏకాత్మక స్వరూపమగు బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమే తాండవించుచున్నది. బ్రహ్మమునకు జగత్తుకు వేరు వేరు సత్త లేదు.
35. దృశ్యము ద్రష్టను పరిమితం చేయలేదు
శిఖిధ్వజుడు : మీరు ఇంతవరకు ఒక నూతన సిద్ధాంతమును ప్రతిపాదిస్తున్నారు. 'బ్రహ్మమే జగత్తు, జగత్తే బ్రహ్మము' అని ప్రవచిస్తున్నారు. ఈ బ్రహ్మము - - జగత్తులకు మీరు చెప్పినట్లు ఒకే సత్త ఉన్నట్లైతే - పరబ్రహ్మమునకు కారణము సత్యమైనది, జగద్రూపమునకు కార్యము సత్యమైనది ' అని నేను అనుకుంటున్నాను. అట్టి “కార్య-కారణన్యాయం” అను అవగాహన యుక్తియుక్తమే
నంటారా?
కుంభ మహర్షి : ఓ రాజర్షీ! బ్రహ్మము సర్వదా ఏకమే అయినప్పటికీ ఆశ్రితులగు శిష్యులను ఉద్ధరించే ఉద్దేశంతో మహనీయులగు ఆత్మజ్ఞులు బ్రహ్మమును రెండు విధములుగా విభాగించి చెప్పుచున్నారు- 1. మాయతో కూడినట్టి బ్రహ్మము. 2. నిష్కళంక బ్రహ్మము.
మాయతో కూడిన బ్రహ్మమునకు జగత్తు యొక్క కారణత్వం ఉన్నదని బోధకొరకై చెప్పుకోవచ్చు. కాబట్టి అద్దానికి 'జగత్తు' అనే కార్యము ఏర్పడి ఉంటోంది. కానీ నిర్గుణ - శుద్ధ బ్రహ్మమునకు కారణం లేదు. కారణం లేదు కాబట్టి కార్యము కూడా లేదు.
నేహా స్తి కారణం కించిత్ న చ కార్యం కదాచన I విద్యమానమిదం సర్వం సర్వం శాస్తమయం జగత్ ॥
నిర్విషయమగు బ్రహ్మమునకు కార్యము గాని, కారణం గానీ లేవని ఇతఃపూర్వమే అనుకున్నాం కదా! అయితే మాయాదృష్టిచే ఈ కార్య - కారణ వ్యవహారం స్వీకరించబడుతోంది. యథార్థానికి విద్యమానమై కనిపిస్తున్న ఈ జగత్తంతా శాంతము, అజము అయినట్టి బ్రహ్మమే అయిఉన్నది.
ఒక కారణం నుండి ఏది ఉత్పన్నమౌతుందో, అట్టి కార్యం ఆ కారణమును పోలియే ఉంటుంది. ఏది ఉత్పన్నమే కాలేదో, అద్దానియందు ఇక సాదృశభావమెచ్చట? "ఇక్కడ ఈ చెట్టు ఉన్నది చూచారా! దీనికి కొమ్మలు, ఆకులు అన్నీ ఉన్నాయి. అయితే దీనికి బీజము మాత్రమే లేదు” అనే వాక్యం నిరర్థకమే కదా! అట్లాగే తర్కములకు లభించనిది, నామరూపరహితమగు ఆత్మయందు నామ
Page:419
రూపాత్మకమైన జగత్తు యొక్క బీజం ఉండటానికే వీలులేదు. బీజం లేదు కనుక జగత్తు కూడా నిర్హేతుకమనే చెప్పాలి. అయితే భావనామాత్రమగు ఆత్మయందు భావనాత్మక జగద్భావం ఏర్పడు తుంది. అట్టి దేశ కాల వస్తువశం చేత సమస్త కారణములు, ప్రమాణములు సిద్ధిస్తున్నాయి. అయినా అకర్త విభాగమగు బ్రహ్మం ప్రమాణానికి గానీ, కారణానికి గానీ విషయం ఎట్లా అవుతుంది?
బ్రహ్మైవ త్వం స్వరూపం సద్యత్ సిద్ధితం ధారయస్వ తత్, అసమ్యక్ దర్శి విషయం తదేవ జగదాచితమ్
ఓ మహారాజా! నీ స్వరూపం బ్రహ్మం కానిదెప్పుడు చెప్పు? "సద్రూపమై శుద్ధాకాశం వలె నిర్విశేషమయినట్టి బ్రహ్మమే నేను” అను భావనను నీ హృదయంలో అవధరించు. అజ్ఞానుల దృష్టి యందు బ్రహ్మమే జగతూపంగా వ్యాప్తమైయున్నది.
1. ఏకమై, శాంతమై, అజరమై, చిన్మాత్రమైనట్టి “ప్రమ” (బ్రహ్మజ్ఞానం)చే జగత్తు బ్రహ్మ రూపంగా ప్రమాణితం ఒనర్చబడుచున్నది; 2. బ్రహ్మాకారవృత్తి రహితమైన ఈ మనస్సు యొక్క భ్రాంతిచే అశాంతంగా దర్శించబడే సద్బ్రహ్మం ఈ జగద్రూపంగా ఎఱుగబడుచున్నది... ఈ రెండు దృష్టులు ఇక్కడ ఉన్నాయి.
ఈ చిత్తం స్వయంగా ‘అన్యధా' అను భావన ధరించుట చేతనే తాను ఏకమగు బ్రహ్మస్వరూపాన్ని ఏమరచి ఇక్కడ అనేకమును దర్శిస్తోంది. అయితే ఈ చిత్తమును నమ్ముకొని జగత్తులో అనేకములో ఎంతవెతికినా బ్రహ్మం అనుభవం కాదు. పైగా ఇది నాశనస్వభావం కలది. కనుక నాశనస్వభావం గల వస్తువులనే ఆశ్రయించి క్రింది - మీద అగుచున్నది. అదియే ఆత్మానుభవమునకు అడ్డంకి అయి కూర్చుంటోంది. క్షణకాలం ఆత్మస్వరూపం యొక్క విస్మరణమే ... కల్పకాలం వరకు 'చిత్తం' అను శబ్దంగా చెప్పబడుతోంది. కనుక ఇప్పుడు సమ్యక్ జ్ఞానం అత్యావశ్యకం.
సమ్యక్ జ్ఞానం వలన నిస్సంకల్పం లభించగలదు. నిస్సంకల్ప బలంచే అసత్యమయినట్టి సంకల్పరూప చిత్తం క్షయించి మోక్షం సిద్ధించగలదు.
విశ్వము - ‘విశ్వము' అనే శబ్దానికి అర్థం? "ఏవమ్ విశతీతి విశ్వమ్ - ఏదైతే అధిష్ఠానమున ప్రవేశిస్తోందో, అదియే విశ్వము”... అని కదా! ఈ విశ్వము తనయొక్క అభావమును స్వీకరిస్తోంది. ఇక అది స్వయంగా విద్యమానమై ఎట్లా ఉండగలదు?
ఎవడైతే రెండు చేతులెత్తి “నేనొక పరమదరిద్రుడను” అని ప్రకటిస్తున్నాడో, అతడు దరిద్రుడు గానే ఉంటాడుగాని ధనికుడని ఎట్లా అనిపించుకుంటాడు? సన్నిపాత జ్వరముచే ఒకడు 'నేను చచ్చినట్లేరా నాయనోయ్!” అని గోలపెట్టుచుండగా అతడిక చచ్చినవాడే అవుతాడు గాని, జీవనము
గురించిన అనుభవం కలవాడు కాదు కదా!
ఒకడు కొరివిని పట్టుకుని '8' అను ఆకారంలో త్రిప్పుతూ ఉంటే అక్కడ గాలిలో '8' ఆకారం ఏర్పడి ఉన్నట్లు కనబడుతుంది చూచావా? మృగతృష్ణలో జలం మిలమిలమెరుస్తూ ఉన్నట్లే అగుపడుతుంది కదా! బాలునికి గాలిలో దయ్యము ఉన్నట్లే అనిపిస్తుంది కదా!
Page:420
అట్లాగే ఈ జగత్ - చిత్తాదులు భ్రమచే మాత్రమే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఏది సర్వదా భ్రాంతి పుంజమే అయున్నదో అది సత్యమెట్లా అవుతుంది? అజ్ఞానజనితమైన భ్రమయే 'అంతః కరణం, చిత్తము’ మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుచున్నది.
సత్తువలె ఉన్నట్టి అసత్తగు అజ్ఞానమే 'చిత్తము' అను శబ్దమునకు నిర్వచనం.
‘అసంవేదనం అజ్ఞానం, జ్ఞానం సంవేదనం భవేత్' - బ్రహ్మం యొక్క అనుభవం లేకపోతే అజ్ఞానమని, అట్టి అనుభవం ఉంటే జ్ఞానమని చెప్పబడుతోంది. 'అజ్ఞానసత్త' యొక్క అజ్ఞానం జ్ఞానానుభవ మాత్రం చేత తప్పకుండా నశించగలదు. ఎండమావులలోని జలం భ్రమయే అయినట్లు ఆత్మకు వ్యతిరిక్తమైన అనుభవాలన్నీ భ్రమమాత్రమే! “ఎండమావులలో జలం ఉండదు” అను జ్ఞానంచే జల భ్రాంతి నశిస్తుంది కదా! "భ్రాంతి కాకుండా చిత్తమనేది ఉండదు" అను జ్ఞానముచే చిత్త భ్రాంతి తప్పక తొలగగలదు. అజ్ఞాన భ్రమచే త్రాడును చూచినప్పటి పాము యొక్క భ్రమ భావన “ఇది త్రాడు మాత్రమే” అని ఎరిగిన తరువాత ఇంకా ఉంటుందా?
అట్లాగే ఆత్మయందు ఉదితమైనట్లు కనబడే ‘మనస్సు’ అనబడేది 1. ‘మనస్సనేది భ్రమయే’ అను ఎరుకచే, 2. 'ఆత్మయొక్క స్వభావం' అను జ్ఞానముచే తప్పక రహితమౌతోంది. శిఖిధ్వజుడు : ఆత్మ నిర్విషయము, అప్రమేయము కదా! మరి చిత్తము, మనస్సు మొదలైనవన్నీ అసలు ఎందుకుంటున్నాయి? ఎందుచేత ఏర్పడుచున్నాయి?
కుంభమహర్షి : హే శిఖిధ్వజా! ఈ ప్రశ్నకు మన ఈ సంవాదములో ఇప్పటికే సమాధానం చెప్పుకున్నాం? అయినా కూడా నీవు అదే ప్రశ్న ప్రశ్నించటం జరుగుచున్నది సుమా! సరే, మరల ముక్కుకు సూటిగా సమాధానం చెప్పుచున్నాను.
చిత్తము, మనస్సు, అహంకారము మొదలగు సమస్తమూ కూడా అజ్ఞానము వలననే ఉన్నట్లుగా అనుభూతమగుచున్నాయి. ఆత్మజ్ఞానముచే లేనివిగా తెలియవస్తున్నాయి.
ఆత్మ తనను తానే ఏమరిచి, వ్యవహారసత్తను ఆశ్రయించటమే మనోబుధ్యహంకారాదుల శబ్దములతో సూచించబడుతోంది. అంతకు మించి వాటికి వేరే రూపముగాని, ఉనికి గాని లేవు. యథార్థానికి ఈ ప్రపంచంలో చిత్తం లేదు. అహంకారం లేదు. మనస్సు లేదు. వాటికి విషయాలగు ఈ దేహాదులు లేవు. కేవలం శుద్ధమగు బ్రహ్మ సంవిత్తు మాత్రమే ఉన్నదని మరల ప్రకటిస్తున్నాను.
చిన్మాత్ర సంవిత్తు స్వయం కల్పితంగా, అనిర్వచనీయ కారణంగా అజ్ఞానయుక్తమై చిత్తమును ప్రదర్శిస్తోంది. అదియే జ్ఞానయుక్తమైనప్పుడు చిత్త సంబంధితమైన సంకల్పములను త్యజిస్తోంది. సంకల్పముల అభావముచే ఇక సమస్తం పరిత్యజించబడుతోంది. గాలి వీచుటచే అగ్నిలో జ్వాలలు ప్రకటనమౌతాయి. గాలి వీచటం ఆగిపోతే? అగ్నిజ్వాలలుకూడా ఉపశమిస్తాయి. సంకల్పములచే ఏది (చిత్తాదులు) ఉత్పన్నమగుచున్నదో, అది సంకల్పం యొక్క అభావంచే నశిస్తోంది. సముద్రమంతా జలం చేతనే ఆక్రమించబడుచున్నట్లు ఈ జగత్తంతా కూడా బ్రహ్మసత్త చేతనే, లేక ద్రష్ట యొక్క అనుభవసత్త చేతనే వ్యాపించబడియున్నది.
Page:421
నా_హమస్తి, నచాఅన్యోస్తి, న త్వం, నై తే, న చిత్తకమ్ నే౨ శ్రియాణి, నచాకాశమ్ “ఆత్మా-ఆత్మేకో2స్తి నిర్మల:”
ఓ రాజా! ఈ ప్రపంచమున నేనుగాని, మరొకరు గాని, నీవు గాని, ఈ చిత్రాదులు గాని, ఇంద్రియాలు గాని, ఆకాశాలు గాని లేవు. ఒకవేళ ఇవి అనుభవమౌతూ ఉంటే అది మాయతో కూడిన ఆత్మ యొక్క అభ్యాస చమత్కారం మాత్రమే. కేవలం నిర్మలమైన ఆత్మ మాత్రమే, త్రికాలాలలోను ఉన్నది. ఒక దేహి చూచేవాడు, వినేవాడు, ఆఘ్రాణించేవాడు మొదలైన ఆయా సర్వవిషయాలలోనూ ఏకస్థుడై ఉన్నట్లే - ఆత్మ సర్వవస్తు రూపంగా కనిపించుచున్నది. అటువంటివే చిత్తము, నేను, నీవు, జీవ, జాతి, దేవ, తిర్యక్, మానవాది విభాగములు కూడా!
న జాయతే న మ్రియతే కించిత్ ఆస్మిన్ జగత్తయే,
కేవలో2_యం “చిత్-ఉల్లాసః” సత్-అసత్ భావనాత్మనా ॥
ఈ మూడు లోకములలో ఏదీ మరణించటం లేదు. ఏదీ కూడా జన్మించటమూ లేదు. మరి? సత్ - అసత్ భావనా రూపమగు ఇదంతా కూడా కేవలం చైతన్యము యొక్క ఉల్లాసమువిలాసము మాత్రమే అయున్నది.
సర్వమాత్మా పరంబ్రహ్మా సకృత్ ప్రకటమాతతమ్
ద్విత్వ-ఏకత్వేన విద్యతే న భ్రాంతిః న చ సంభ్రమః ॥
పరబ్రహ్మమగు ఆత్మయే ఏకకాలమున సర్వరూపముగా ప్రకటనమగుచున్నది. ఇక ద్విత్వము గాని, ఏకత్వము గానీ, భ్రాంతిగాని, మరణాది భయములు గానీ ఏవీ కూడా లేవు. సఖుడా! శిఖిధ్వజా! నీవు ఈ సమస్త ఇంద్రియములలోను, ఈ ఇంద్రియములకు విషయములగు పంచభూత సమన్విత సృష్టి (లేక) దృశ్యములోను, సత్తామాత్రస్వరూపుడవై వ్యాపించి ఉన్నావు. సత్త స్వరూపుడవైన నీవు దేనిచేతా దహించబడజాలవు. నిన్ను లిప్తము చేయగలిగేదేదీ ఇక్కడ లేదు. ఎక్కడా లేదు.
న తే వినశ్యతి, సఖే! న చ కించిత్ వివర్ధతే |
నిర్మలాకాశ రూపస్య కైవల్యానన్తరూపిణః ||
ప్రియ సఖుడా! నీ వాస్తవ రూపం నిర్మాలాకాశము వంటిది. స్వతహాగానే అనంతము, మోక్ష రూపమూ అయి ఉన్నది. అట్టి నీ స్వస్వరూపం కించిత్ కూడా నశించదు, వృద్ధి చెందదు. నీయందు ప్రస్ఫుటమగుచున్న ఇచ్ఛ, అనిచ్ఛ, క్రియ మొదలైన శక్తులన్నీ - సూర్యకిరణములన్నీ సూర్యబింబమే అయినట్లు - నీవే అయి ఉన్నాయి.
కిరణములు లేకుండా సూర్యబింబం ఉంటుందా? సూర్య కిరణాలు ఏ వస్తువుపై ప్రసరించినా, ఆయా వస్తువులు సూర్యకిరణాలను గాని, కిరణ స్వరూపుడగు సూర్యభగవానుని గాని బంధించగలవా? అట్లాగే చిత్ స్వరూపుడవగు నిన్ను చిత్త విషయాలు ఎట్లా పరిమితం చేస్తాయి? ఎట్లా బంధిస్తాయి?
...సర్వ వ్యవహారముల కంటే మునుముందుగానే సిద్ధమై, జన్మ-జరా-మృత్యురహితమై, అనాది అయి, వృద్ధి - పరిణామాది వికారాలు లేనిదై, సదా నిర్మలమై, ప్రకాశరూపమై, సద్రూపమై,
Page:422
ఏకమై, కల్పనారహితమై, సర్వదా, 'స్వస్వరూప పరిచయము' అనునది లీలగా కలిగినదై ... ఏదైతే ఉన్నదో అట్టిది ఆత్మయే అయి ఉన్నది. అట్టి ఆత్మయే నేను, నీవు, ఒక చీమ, దోమ కూడా. మనమెవరం ఎన్నడూ ఈ దేహ, మనో, బుద్ధి, చిత్త, అహంకారాదులు కానేకాము. అవము.
36. తరంగాలన్నీ జలమే! చిత్తములన్నీ చిత్తే!
శ్రీవసిష్ఠ మహర్షి : వింటున్నావు కదా, రామచంద్రా! ఆ విధంగా శిఖిధ్వజుడు కుంభుని అకృత్రిమమగు వాక్యార్థములు విన్నాడు. ఆ వాక్యాలు ప్రతిపాదిస్తున్న తన యొక్క ఆత్మ స్వరూపాన్ని మననం చేస్తూ క్రమంగా తన పూర్వభావాలను, తత్సంబంధమైన సంశయాలను త్యజించాడు. "శాశ్వతం, నిర్మలం అగు ఆత్మయే నా స్వరూపం కదా!” అను దర్శనంచే కనులు మూసుకున్నాడు. మనస్సు, వాక్కు తమ వ్యాపారాలు ఉపశమింపజేసుకున్నాయి. అతడు శిలయందు చెక్కబడిన ఒక విగ్రహంలాగా చేష్టా రహితుడైనాడు. ఒక ముహూర్తకాలం నిర్విషయ స్వయమాత్మానుభవం పొంది అప్పుడు కళ్ళు తెరిచాడు.
కుంభఋషి: ఓ రాజా! యోగుల విశ్రాంతి స్థానము, మహత్తరము, శుద్ధము, వ్యాపకము, నిర్మలము, నిర్వికల్పము అగు సమాధియందు ప్రవేశించినట్లున్నావు. నిరతిశయానందదాయకమగు ఆత్మపదము నందు నీకు విశ్రాంతి లభించింది కదా? నీ అంతఃకరణం ప్రబోధమైనదా? భ్రాంతులను వదలివేశావు కదా? ఏది 'జ్ఞేయము' అని వేదాంత ప్రవచనాలు నిర్వచిస్తున్నాయో, అద్దానిని తెలుసుకున్నావు కదా! చూడవలసినది చూచావు కదా?
శిఖిధ్వజుడు : హే మహాత్మా! తమ అనుగ్రహం చేత మహావిభవరూపమగు భూమికను పొందాను. మహత్తరమైన ఆత్మ పదమును నాయందే దర్శించాను. విషయానందము నుండి బ్రహ్మదేవుని ఆనందము వరకు గల సర్వానందముల ఆవల స్థితిని పొందాను.
ఆహాఁ! ఈనాడెంత సుదినం! వేద్య పదార్థమును ఎఱిగిన తమతో సాంగత్యం మహత్తరమై లభించింది. నాకీనాడు అపూర్వము, అమృతమయము, సారయుక్తము అయినట్టి ఫలం మీరు ప్రసాదించడం జరిగింది. ఏ అమృతతత్త్వమైతే నేను నా జీవితపర్యంతం ఇప్పటి వరకూ త్రాగకయే ఉన్నానో, అయ్యది మీ వాక్యములను విన్నంత మాత్రం చేత స్వయంగా లభించింది. ఒక చిన్న విషయం మాత్రం నాకు చమత్కారంగా అనిపిస్తోంది. అనేక సందర్భాలలో ఆత్మ గురించి విజ్ఞులు చెప్పిన విషయాలను విన్నాను. అయినా కూడా, "అనంతము, ఆద్యము, అమృత స్వరూపము అయిన ఆత్మపదము యొక్క అనుభవం ఈనాడే లభించింది. మరి, ఇతఃపూర్వమే ఎందుకు లభించలేదా?'... అని కించిత్ ఆశ్చర్యంగా ఉన్నది.
కుంభఋషి : ఓ రాజా! దానికి కారణం నీ మనస్సు శమించటమే. ఈషణములు (ఈషణత్రయం) దారేషణ, పుత్రేషణ, ధనేషణ - అనే కషాయములు నివృత్తమైనాయి. తెల్లని, శుభ్రంగా ఉతికిన
Page:423
వస్త్రంపై రంగు చక్కగా అంటుతుంది. మురికి గుడ్డపై రంగు అంటదు కదా! చిత్తము నిర్మలమైనప్పుడు మాత్రమే గురూపదేశ వాక్యములు అందులో ప్రవేశిస్తాయి. చిత్తము నిండా అనేక దోషములు ఉంటే, లౌకిక వాక్యముల పట్లే ఆ చిత్తము స్పందిస్తుందిగాని, ఆత్మ నిర్వచన పూర్వకమగు శాస్త్ర వాక్యములు ఆస్వాదించటానికి అట్టి చిత్తము సిద్ధమయి ఉండదు. అనేక జన్మలందు స్వయంగా ఆశ్రయిస్తూ ప్రోగుచేసుకొన్న స్వవాసనా స్వరూపములైన దోషములు దృష్టిని కలుషితం చేసి ఉంచాయి. నీవు చేసిన సాధనకు ప్రయోజనంగా, చెట్టునుంచి పరిపక్వమైన పళ్ళు నేలకు రాలినట్లు, లింగదేహం నుండి రాగద్వేషాది కషాయాలు, పాపభావనలు పూర్తిగా శమించాయి. ప్రవేశించిన గురు వాక్యములు మహత్తరమైన ప్రభావమును కలిగించాయి. తపస్సుచే నీ హృదయం నిర్మలత్వం సంతరించుకొన్నది కాబట్టే ఆకాశమున సంచరిస్తున్న నాకు నిన్ను సమీపించి జ్ఞాన విశేషాలు బోధించాలనే సంకల్పం కలిగింది. ఫలితంగా నీ యందు గల అజ్ఞానపూర్వకమైన అవగాహనలు శమించటం జరిగింది. జ్ఞాన పూర్వకమైన ప్రసంగములు రుచించాయి. ఉపదేశించిన అర్థములను ఇప్పటికిప్పుడే నీవు హృదయమున అవధరించావు. ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానము యొక్క ప్రభావముచే ముక్తుడవైనావు. ‘సత్సంగము' అను మిషచే నేడు నీ యొక్క సమస్త శుభాశుభ కర్మలు సంక్షయించాయి.
‘చూచావా రాజా! ఈ రోజు మధ్యాహ్నం నేను నీ ముందుకు వచ్చేటప్పటికి నీ యందు చిత్తం, అహంకారం, మమకారం మొదలైన వాటితో కూడిన అజ్ఞానసత్త ఏర్పడి ఉన్నది. ఆ తరువాత నా వాక్యాల బోధచే నీ హృదయం ఆ అజ్ఞాన సత్తను త్యజించింది. చిత్తము క్షయం పొందగా, ఇక నీవు ప్రబుద్ధుడవైనావు. ఆత్మజ్ఞానము నీ యందు ప్రకాశమానమై కాంతి పుంజములను వెదజల్లుచున్నది.
ప్రియశిఖిధ్వజా! హృదయంలో ఎంతవరకు మనస్సు యొక్క సత్త ఉంటుందో, అంతవరకు అజ్ఞానం యొక్క స్థితి ఉండియే తీరుతుంది. చిత్తము చిత్తరూపాన్ని త్యజించిన మరుక్షణం జ్ఞానోదయం అవుతుంది. అసలు 'చిత్తము' అనగా ఏమిటి?
ద్విత్వ-ఏకత్వదృశౌ చిత్తం తదేవ అజ్ఞానముచ్యతే ఏతయోర్యో లయో దృష్టేస్తజ్ఞానం సా పరా గతిః ||
ద్విత్వ - ఏకత్వముల దృష్టియే చిత్తం. దానినే 'అజ్ఞానం' అని కూడా అంటున్నాం. పరమాత్మ సాక్షాత్కారం చేత ఈ ద్విత్వ - ఏకత్వములు రెండూ నశిస్తాయి. అట్టి నాశనమునే 'జ్ఞానము’ అని, ‘పరాగతి' అని పిలుస్తూ ఉంటారు.
ఓ రాజా! ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు పరమ సంతోషంగా ఉన్నది. నీవు ప్రబుద్ధుడవు. విముక్తుడవు అయ్యావు. చిత్తం చేతనే అసత్ దృశం, సత్-అసత్మయము అగు జగత్తు యొక్క కల్పన ధరించబడుతోంది కదా! అట్టి చిత్తమును నీవు త్యజించావు. ఇక నీవు దుఃఖరహితుడవు, ఆయాస వర్జితుడవై ఉండుము. నిస్సంగిగా ఈ జగత్తులో తీర్థయాత్రాస్థలంతో సంచరిస్తున్నట్లు వ్యవహరించెదవు గాక! అద్వైతాత్మజ్ఞాన సంపన్నుడవై, మహోదయయుక్తుడవై మునివై, మౌనివై, నిర్మలమగు ఆత్మ స్వరూపమున స్థితి కలిగి ఉండు.
Page:424
శిఖిధ్వజుడు : మహాత్మా! మీరు చెప్పినట్లు చిత్తభూమి మూర్ఖుని కొరకే రచించబడి ఉంటోంది. అయితే ఒక్క విషయం మిమ్ములను అడగాలని అనుకుంటున్నాను. ప్రబుద్ధుడు ఆత్మజ్ఞాని అయినవానికి చిత్తమే ఉండదు కదా! మరి అమనస్కులై కూడా మీ వంటి జీవన్ముక్తులు ఈ ప్రపంచంలో ఎట్లా వ్యవహరిస్తున్నారు? మనోరహితులై కూడా మనో విషయములగు లౌకిక కార్యములు ఎట్లా నిర్వర్తిస్తూ ఉంటారో వివరించ ప్రార్థన. ఈ విషయంలో నాకు కొన్ని దురభిప్రాయములే ఉన్నాయని నా కనిపిస్తోంది. అట్టి వాటిని మీ బోధ తుడిచివేయగలదనే ఉద్దేశంతో మిమ్ములను అర్థిస్తున్నాను. కుంభ మహర్షి: ఔను! నీవు అన్నది నిజమే.
శిలలు ఎక్కడన్నా మొలకెలెత్తుతాయా? జీవన్ముక్తులయందు చిత్తమే ఉండదు. అయితే, 'చిత్తము' అంటే ఏమిటి? ఏ ఘనీభూతమైన వాసనలు మరల మరల ఉత్పన్నమయ్యే స్వభావం కలిగి ఉంటాయో, అది ‘చిత్తము' అను శబ్దముచే చెప్పబడుతోంది. జ్ఞానికి అట్టిది ఉండదు.
జనులు ఏఏ వాసనలతో గూడి ఈ సంసారములో మరల మరల ప్రవేశిస్తున్నారో, అద్దానిని చిత్తము అంటున్నారు కదా! ఇక జ్ఞానులలో వాసనలు జగత్త్రియ నిర్వహణము వరకే కార్యక్రమము కలిగి ఉంటాయి. అవి పునఃపునః జనించే శక్తిని, స్వభావమును కలిగి ఉండవు. అందుచేత జ్ఞానియొక్క వ్యావహారిక చిత్తమును “సత్వము” అను పేరుతో పిలుస్తారు. జీవన్ముక్తులు, జితేంద్రియులు అగు మహాత్ములు సత్వము నందు ఉనికిని కలిగి ఉంటారు గాని చిత్తము నందు కాదు.
కనుక, మూఢ చిత్తమే, చిత్తము అని అనిపించుకుంటోంది. జ్ఞానయుక్తమగు చిత్తము సత్వము అవుతుంది. అజ్ఞానులకు చిత్తము ఉనికి స్థానమైతే, జ్ఞానులకు సత్వమే సర్వానుకూల స్థానం అవుతోంది. భూయః ప్రజాయతే చిత్తం, సత్వం భుయో న జాయతే
అప్రబుద్ధస్య బంధోస్తి, న ప్రబుద్ధస్య, భూపతే!
చూచావా రాజా! మూఢత్వంతో కూడిన సంస్కారాలు లేక వాసనలు గల చిత్తమునే ‘చిత్తం’ అని అంటున్నారు గాని, జ్ఞానంతో కూడిన చిత్తమును 'చిత్తం' అనరు. అది 'సత్వం' అవుతుంది. సత్వం కూడా చిత్తం వలెనే ప్రవాహ పతిత వ్యవహార సామర్థ్యం కలిగియున్నప్పటికీ అద్దానిలో పునర్జన్మ యోగ్యత ఉండదు. “ఇది పొందుతాను, దీని తరువాత అది చేస్తాను. ఆ తరువాత ఇక చూచుకో, నేను ఇట్లా ఉండను, ఇకప్పుడు నాకేం!”... చిత్తం యొక్క క్రియా విషయాల స్వభావం ఇట్లా ఉంటుంది.
ఇక సత్వము యొక్క క్రియలో... నిత్యజాగరూకమై, నిత్య ప్రశాంత - సంతృప్త సమన్వితమై, అసంతృప్తి - ఆశాదులకు కారణమే కలిగి ఉండక ఉంటుంది. అది తాను అకర్తవ్య స్వరూపమై అవశ్యమైన దానిని స్వభావయుతంగా నిర్వర్తిస్తుంది.
చిత్తము ప్రతిఫలం వైపు ఉన్ముఖమై ఉంటుంది. సత్వము యొక్క స్వరూపమే సమాధాన స్థితి కనుక కర్మల సిద్ధాసిద్ధములపై అద్దాని సమస్థితి ఆధారపడి ఉండదు.
ఓ రాజా! ఈ జగత్తులో అప్రబుద్ధుడు మాత్రమే బంధమును గాంచుచున్నాడు. ప్రబుద్ధుడు సర్వదా నిర్వికారుడై, సత్వమునందు ఏర్పడి ఉండి, ప్రక్కింటివారి ఇంటిలో జరిగే వివాహాది
Page:425
కార్యక్రమాలకు సహకరించే సద్గుణుడగు గృహస్థుని వలె ఈ జగత్తులో సర్వకార్యములు నెరవేరుస్తున్నాడు. కాబట్టి అజ్ఞానికి బంధముంటోంది. జ్ఞానికి బంధమునకు కారణమే అగుపించటం లేదు. చిత్తము మరల మరల ఉత్పన్నమౌతూ ఉంటుంది. సత్వము సర్వదా యథాతథంగా ఉంటుంది. అద్దాని మార్పు చేర్పులకు కారణముండజాలదు.
ఓ ప్రియా సఖుడవగు శిఖిధ్వజ మహారాజా! నీవు సత్వమయుడవై, మహాత్యాగివై ఉండుము. ఎందుకంటే, నీవు చేసిన ఆయా ప్రయత్నముల బలంతో చిత్తమును జయించివేశావని నాకు తెలుసు. నీవిప్పుడు వాసనలన్నీ త్యజించినవాడవై శోభిస్తున్నావు. నీ మనస్సు ఇప్పుడు నిర్మలాకాశముతో సామ్యము పొందుచున్నదని నేను గమనిస్తూనే ఉన్నాను. ఏది తదితరమైనట్టి సర్వరూపమై ఉన్నదో అట్టి చిత్తమును త్యజించుటచేతనే నీవు మహాత్యాగిని అగుచున్నావు. నీ విప్పుడు సమస్థితిని, ఉత్తమశమమును పొందుచున్నావు.
ఇప్పటికే నీవు రాజ్యాదులను, ధనాదులను, తపో - దాన ఫలాదులను, స్వర్గ - - మోక్షములను ప్రబుద్ధమైన మేధాశక్తితోడను, పరమ జ్ఞానయుక్తమైన బుద్ధితోడను త్యజించివేశావు.
తపో నామ క్రియన్ మ అత్ర దుఃఖ క్షయకరంభవేత్ క్షయాతిశయ నిర్ముక్తం యత్సుఖం సమతామయమ్ ||
ఓ రాజా! వాస్తవానికి తపస్సు మొదలైనవి స్వయంగా దుఃఖమును క్షయింపజేయలేవు. అవి నీ మనో నైర్మల్యమునకు ఉపకరించే సాధనలు మాత్రమే. మనస్సు నిర్మలమైనప్పుడు జ్ఞానము ప్రవేశించుటచే ఏర్పడిన అవగాహన చేతనే దుఃఖములు క్షయించి, స్వభావసిద్ధమగు ఆనందము వెల్లివిరుస్తుంది. ఆనంద ప్రదమగు ఆత్మయే నీవై ఉండగా, నీకు ఆనందం ఇచ్చుటకై మరొక వస్తువు గాని, విషయం గాని ఎందుకు అగత్యమౌతాయి చెప్పు? మరి “ఏదో లభిస్తేగాని నా ఆనందం రూపు దిద్దుకోదు”... అని ఎందుకు అనిపిస్తోంది? అది మనస్సు చేసే కోతిపని. సమత్వమును సాధించామా, అప్పుడు మనస్సు త్యజించబడినది అయినట్లే, మనోత్యాగరూపమగు సమత్వముచే ‘జ్ఞానము’ అనే ఫలం ప్రత్యక్షంగా లభించగలదు. అట్టి జ్ఞానం యొక్క సమృద్ధిచే ఆత్మసుఖం అనుభవమౌతుంది. ఆత్మసుఖం సంపాదించుకున్న ద్రష్టకు క్షయ - అతిశయాలు (హాని - వృద్ధులు) ఉండవు. జ్ఞానముచే ఉత్పన్నమైన ఫలమే సత్యవస్తువు అయి ఉన్నది. అంతేగాని తపస్సు మొదలైన వాటిచే వచ్చే ఫలములు స్వయంగా సత్యవస్తువులు కావు. తపోయాగాదుల వలన స్వర్గలోకాదుల వంటి కొంత సుఖమయ ప్రయోజనములు కలుగవచ్చుగాక! ఆ ప్రయత్నములు జ్ఞాన దిశగా సంధించబడకపోతే ఉత్తమ ప్రయోజనం పొందనట్లే. తపో-యజ్ఞ దాన, తదితర ఆచారాదులు మనస్సు యొక్క త్యాగం వైపుగా, జ్ఞాన సముపార్జనాలక్ష్యంతో నిర్వర్తించటమే ఉచితం. ఎందుకంటే స్వర్గాదిఫలాలు కూడా క్షణ భంగురాలే. వాటికి కూడా ఉత్పతి, నాశనములు ఉన్నాయి. అవన్నీ వర్తమానమునందు మాత్రమే అనుభూత సుఖమును ఇస్తాయేమోగాని, భవిష్యత్తును సానుకూల్యం చేయజాలవు సుమా!
Page:426
స్వర్లో నామ కిమానందః? సోపి సందేహ సంస్థితః । అప్రాప్తస్వాత్మ సంసిద్ధేః క్రియాకాండః న శుభోభవేత్ ॥
ఆత్మజ్ఞానానందం ముందు స్వర్గాదులవి అత్యంత స్వల్పానందాలు మాత్రమే! ఎందుకంటే అట్టి స్వర్గానందాలు కూడా అనేక అపరాధములతో కూడి కాలక్రమేణా నశించునవై, సందేహాస్పదంగానే ఉంటున్నాయి. ఇక క్రియాకాండ అంటావా? అదంతా ఆత్మజ్ఞాన ప్రాప్తికి ముందు మాత్రమే శుభప్రదం. ఆ తరువాత వాటికి ప్రాముఖ్యమే లేదు. ఎవడికి ఇంకా బంగారం లభించలేదో, అతడే ఇత్తడి వస్తువులను కలిగి ఉంటాడు. బంగారపు వస్తువులు లభించిన తరువాత ఇత్తడి ముక్కలను జాగ్రత్త పరచుకోవలసిన పనేముంటుంది?
జ్ఞానియగు నీ ప్రియురాలు చూడాల సాంగత్యంలో నీకు జ్ఞానము సులభంగా లభించేదే. అయితే ఆమె వాక్యాలలోని అంతరార్థాన్ని నీవు అప్పుడు చూడలేకపోయావు. నిర్మలమైన వివేకంతో జ్ఞాన విషయాలను పరిశీలించటానికి బదులుగా హృదయములోని తపస్సుకు సంబంధించిన విక్షేపముల కారణంగా నీవు ఇట్లు అడవుల పాలయ్యావు. ఈ వానప్రస్థాశ్రమమునకు సంబంధించిన శ్రమ, తపోక్లేశము పొందవలసిన అవసరమేమున్నది? ఇంతకాలం నిమగ్నమైన తరువాత ఇప్పుడు కూడా జ్ఞానోపదేశమే అగత్యమై ఉన్నది కదా! ఓ రాజా! తపస్సు యొక్క ప్రయోజనమేమైతే ఉన్నదో, అట్టి ఫలము యొక్క ఆద్యంతములలో సుఖం లేదు. ఆ ఫలము యొక్క అనుభవకాలంలో మాత్రమే సుఖవంతమై ఉండగలదు. అయితే నీవు భౌతిక ప్రయోజనములను ఆశించక తపస్సు చేశావు. అందుచేత ఆ తపోప్రభావం చేత నీ చిత్త దోషాలు నేలరాలాయి. అందుచేతనే తత్త్వబోధకు సమయం సానుకూల్యమైనది. తపోరూప వికల్పాంశములన్నీ నీ పట్ల తత్త్వజ్ఞానము వినుటకు, గ్రహించుటకు కావలసిన పరిణతిని సంపాదించిపెట్టాయి. ఇక నీవు తత్త్వజ్ఞాన ఫలమును ఆస్వాదిస్తూ, ఆత్మజ్ఞానమున సంస్థితుడవై నిరభ్యంతరంగా ఉండవచ్చు. ఇప్పుడు నీవు నీ శ్రద్దను చిదాకాశ తత్త్వమును ఎఱగటానికే వినియోగించమని నా ముఖ్యోపదేశం. ఎందుకంటే నీవు - నేనుతో సహా సమస్త పదార్థములు అట్టి అతిస్వచ్ఛమగు చిదాకాశమునుండే ఆవిర్భవిస్తున్నాయి. అద్దానియందే ఏర్పడి ఉంటున్నాయి. అద్దానిలోనే విలీనం కాబోతున్నాయి. ఇది గ్రహించిన తరువాత ఏవేవో కర్మ వ్యవహారముల ఆవశ్యకత ఏమున్నది?
ఇదం కార్యమ్, ఇదంనేతి సంకల్పా బ్రహ్మబిన్దవః,
వస్ధ్యం, శిఖిధ్వజ! త్యక్త్వా, పూర్ణమేవ సమాశ్రయ II
హే శిఖిధ్వజా! "ఇది ఇంకా, చేయాలి! అది ఎట్లాగైనా సరే, చేయకూడదు” ...ఇటువంటి ఇష్ట - అనిష్టారూపమైన ఏ సంకల్పములు నీకు ఏర్పడుచున్నాయో, అవన్నీ బ్రహ్మ మహాసముద్రము యొక్క నిష్ఫల బిందువులు మాత్రమే అయి ఉన్నాయి. జల బిందువులను త్యజించి సముద్రమును ఆశ్రయించటమే ఉత్తమం కదా! ఇష్టానిష్ట సంకల్పములను త్యజించి నీవు ఆత్మ రూప పూర్ణ మహాసముద్రమునే ఆశ్రయించు. ప్రియుడు కనబడనంతవరకూ ఒక ప్రియురాలు ఆ ప్రియునికి
Page:427
సంబంధించిన ఏవైనా వస్తువులనో, చిత్రపటమునో కోరుకోవడం జరగవచ్చు గాక! ఒకానొక రోజు ప్రియుడే స్వయంగా వచ్చి నిలబడితే, ప్రియుని ప్రేమను అర్థించటమే ఉచితం. అంతేగాని, ప్రియుని చిత్రపటమును అభ్యర్థించవలసిన పనేమున్నది? ప్రియుని అభ్యర్థించుటచేతనే అతనిని పొందటమనే మనోరథం తీరుతుంది కదా! ఏవేవో ఇష్ట పదార్థముల కొరకు ప్రార్థించటం కంటే నిరతిశయ ఆనందరూపమగు ఆత్మ లాభమును ప్రార్థించటమే శ్రేష్ఠమని నా ఉద్దేశం. ప్రజ్ఞావంతులు బింబసూర్యుణ్ణి వదలి ప్రతిబింబ సూర్యుణ్ణి ఆశ్రయిస్తారా? లేదు. ఈ ప్రాపంచిక పదార్థములన్నీ సంకల్పవిరచితములు మాత్రమే. అంతేకాదు, ఇవి 'విపత్తి’ లాగా అరమణీయాలై ఉన్నాయి. అటువంటి ఈ పదార్థములను, తత్సంబంధిత విషయ పరంపరలను మహాత్ములు లెక్కలోకి తీసుకోనే తీసుకోరు. అందుచేత ఓ ప్రియరాజా! నీవు జ్ఞాన లాభం సంపాదించుకో. క్రమంగా స్వర్గ - మోక్షదాయకములగు కర్మలన్నీ త్యజించు. అంతటా సమరూపముగా భాసించే ఆత్మయొక్క రూపము కలవాడవగుము.
సర్వ పదార్థములలోనూ రెండు అంశలు ఏర్పడి ఉన్నాయి- 1. సదంశము (Absolute
presence), 2. అసదంశము (Relative presence).
సదంశమును సత్యరూపంగానూ, అసదంశమును నాశనరూపంగానూ... గ్రహించాలి. నీవు ఇచ్ఛారహితుడవై ఈ సమస్త పదార్థ సమూహములనూ అచంచల చిత్తంతో దర్శిస్తూ ఉండు.
వివేకము ఉదయించనంతకాలం స్వాభావిక ప్రవృత్తి చేత అపరాధపూర్వక పురుషకారం ఉత్పన్నమౌతూనే ఉంటుంది. అది ఈ మనిషిని సమీపించి సర్వ అనర్థములను కలుగజేస్తూనే పోతుంది. చిత్త చాంచల్యము లేనివానికి సంసారము అనబడేది సమీపించను కూడా లేదు. ఈ లోకంలో ఏఏ దుఃఖములు కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా చిత్తచాంచల్యము చేతనే ఉత్పన్నమౌతున్నాయి. ఎవనియొక్క చిత్తమైతే స్థిరమై, శాంతమై, చేష్టారహితమై, అచంచలమై ఉంటుందో, అతడు మాత్రమే మహానంద సామ్రాజ్యమునకు అర్హుడగుచున్నాడు.
కనుక ఓ రాజా! నీవు స్పందన - అస్పందనాలను, చేష్ట - - నిశ్చేష్టములను ఏకము చేయి. ఉభయ ద్వంద్వములను 'సాక్షిమాత్రుడై ఉండుట' అను స్థితియొక్క అభ్యాసముచే ఐక్యపరచివేయి. అట్టి సాక్షిత్వమును కూడా బ్రహ్మాత్మైక్యమును పొందింపజేయి. భూమానందభావముతో కూడి, పూర్ణకాముడవై ఉండు.
శిఖిధ్వజుడు : హే మహానుభావా! చేష్ట-అచేష్టల (స్పంద-అస్పందముల) అభావం ఎట్లా సాధ్యం? ఏకత్వం పొందటం ఎట్లా?
కుంభఋషి : ఒక తరంగానికి, ఇంకొక తరంగానికి రూపభేదం ఉంటే ఉండవచ్చుగాక! తరంగములన్నీ జలము చేత నిర్మించబడినవే కదా! అంతా ఒకే సముద్రం కదా! చిన్మాత్రము దృష్ట్యా సమస్తమూ ఏకవస్తువే అయున్నది. తరంగములచే నిశ్చలజలం చేష్టితమగుచున్నట్లు, చిన్మాత్రము బుద్ధి వృత్తులచే చేష్టితమగుచున్నది. ఆత్మజ్ఞాన శాస్త్రము దేనినైతే సత్యము, జ్ఞానము, అనంతము అని వర్ణిస్తున్నదో,
Page:428
అట్టి నిర్మలమగు చిన్మాత్ర బ్రహ్మమే ఈ సర్వము అయున్నది. అనగా ఆ ఆ బ్రహ్మమే మూఢుల దృష్టికి జగత్తు రూపముగా కనబడటం జరుగుతోంది. చైతన్యము యొక్క స్పందనమే ఈ విశ్వము యొక్క సర్వస్వము. అట్టి స్పందనము నామము, రూపము అను రెండు చమత్కారములతో కూడినదై ఈ ప్రపంచంగా భాసిస్తోంది.
ఓ మునివరా! చైతన్యము యొక్క స్పందనాస్పందనాలు కూడా వాస్తవానికి చైతన్యమునకు అభిన్నమని, ఈ కనబడేదంతా ఆత్మయొక్క విన్యాసమేనని భావన చేస్తూ ఉండు. అప్పుడు అత్యంత శ్రీఘ్రంగా ఆత్మరూపమగు నిర్మలమైన శివబ్రహ్మమే నీవుగా శేషిస్తావు.
'చిత్ యొక్క స్పందనమే ఈ సృష్టి' అను సమ్యక్ దృష్టిని నీవు ఆశ్రయించావా... అప్పుడు ‘సృష్టి’ అనబడునదంతా స్వయంగా, నీ నీ పట్ల నశించగలదు. సమ్యక్ దృష్టి లేనివారికి మాత్రం సర్ప రజ్జు భ్రాంతి వలె, ఈ జగత్తు పరిపరివిధములుగా తోచటం జరుగుతోంది.
ఓ రాజా! 'సమ్యకృష్టి' యొక్క అభ్యాసము కొరకై మరొక్కసారి ‘జలము'ను దృష్టాంతంగా తీసుకుని సమీక్షిస్తున్నాను.
తరంగాలతో కూడి ఉన్న జలాన్ని చంచల జలం అనీ, తరంగాలు లేనప్పటి జలాన్ని నిశ్చల జలం అనీ అంటాం. ఉభయ సందర్భములలోనూ జలం జలంగానే ఉన్నది. అంతేకాదు, యథాతథం గానే ఉన్నది! తరంగం ఏర్పడినంతమాత్రాన జలం యొక్క స్వాభావిక ధర్మాలు మారిపోయినాయా? శిఖిధ్వజుడు : ఎట్లా మారుతాయి! “దాహం తీర్చుట" మొదలైన ఆయా ధర్మాలు ఎప్పటిలానే ఉంటాయి. కుంభఋషి : అట్లాగే చిత్తు (చైతన్యం) స్పందన కలిగి ఉన్నప్పుడు, స్పందన కలిగి ఉండనప్పుడు కూడా ఆ చైతన్యం యొక్క నిర్మల-నిత్య-అఖండ-అప్రమేయాది స్వభావాలు యథాతథంగానే ఉంటున్నాయి.
సస్పన్దా చిత్తదభిదా, నిఃస్పన్దా త్వియమాతతా,
తుర్యాతీతపదారూఢా, వాచావక్తుం న పార్యతే ॥
స్పంసహితమగు చిత్తు (చైతన్యము) సృష్టి అనే పేరుచే పిలువబడుతోంది. అట్టి చిత్ స్పందన చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. స్పందనరహితమైన చిత్తో... ‘తురీయాతీతపదము’ నందు ఆరూఢమై ఉంటోంది. అయితే, తురీయాతీత చైతన్యము వాక్కునకు లభించేది కాదు. అది అనుభవైకవేద్యము మాత్రమే.
నేత్రములలోని తిమిరదోషం తొలగుతూ ఉంటే ఆకాశంలో 'రెండవచంద్రుడు’గా కనిపించేది మటుమాయమౌతుంది కదా! శాస్త్ర సజ్జన సాంగత్యములు నిరంతరం అభ్యసిస్తూ రాగా, కాలక్రమంగా చిత్తము నిర్మలమై, తన సాక్షియగు చైతన్యముతో ఏకత్వం పొందగలదు. అప్పుడు జగత్తంతా ప్రసరించియున్న, తాండవిస్తున్న ఏకత్వము తప్పక అనుభవమవగలదు. అట్టి 'సాక్షియగు చైతన్యముతో సమస్తము యొక్క ఏకత్వము' కేవలం అనుభవమాత్రమేగాని అది గురువు వాక్యాలతో చెప్పగలిగేది కాదు. ఆ వాక్యాలు వినినంతనే శిష్యుడు అందుకోగలిగేది కాదు. అది ఎవరికి వారే
Page:429
తమ జ్ఞానబలిమిచే నిర్మించుకొనవలసిన కైవల్య సామ్రాజ్యము. అయితే అట్టి అనుభవజ్ఞులు చెప్పే స్వానుభవములగు (ఉపనిషత్తు మొదలైన) శాస్త్రాలు మార్గదర్శకం, నిరూపణములు కాగలుగు చున్నాయి. అట్టి తురీయాతీత అనుభవజ్ఞులు తదితరులకు చెప్పే పరిమిత ఉపకరణములగు ‘వాక్కులు' నిరూపణ అగుచున్నాయి. అవి తప్పితే వేరే నిరూపణ ఎట్లా?
ఓ సాధూ! నీవు ఇప్పుడు సత్య విషయమును గ్రహించావు. సమస్తమునకు సారభూతమైనట్టి, ఆదిమధ్యాంతరహితమైనట్టి స్వాత్మపదమునందే నిస్సందేహముగా స్థిరముగా నెలకొనియుండుము. ఈ శరీరాదుల భేదమంతా మిథ్య మాత్రమే. కనుక నిస్సంకోచంగా మహాచిత్స్వరూపుడవై, ప్రాదుర్భవించి ఉండుము. నిన్నిక శోకము యొక్క ఛాయ అయినాసరే సమీపింప జాలదు.
37. ఋషి వాక్య మననం
కుంభ ఋషి : ఓ శిఖిధ్వజ మహారాజా! ఈ విధంగా ఈ సాయంకాలం మనం ఈ ప్రపంచం ఎట్లా ఉత్పన్నమౌతోంది? (అధ్యారోపం); ఇది ఎట్లా లయిస్తోంది? (అపవాదం)... అను ఉభయ విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దీనినంతా గ్రహించు. మననం చేయి. స్పష్ట పరచుకో. ఆపై నీకు వానప్రస్థం ఇష్టమనిపిస్తే ఇక్కడే ఉండు. లేదూ, రాజసింహాసనం అధిష్ఠించదలుచుకుంటే అట్లే చేయి. ఏది ఎట్లైనా ఫరవాలేదు, సర్వసాక్షిగా స్వభావించుకున్నవానికి ఎక్కడుంటే ఏమున్నది?
ఓహోఁ! మరచాను! ఇప్పుడు నేను అవశ్యం స్వర్గలోకం వెళ్ళవలసి ఉన్నది. ఈ రోజు మహా పవిత్రమైన పర్వదినం. బ్రహ్మలోకం నుండి స్వర్గలోకం పోతూ మార్గమధ్యంలో నిన్ను చూచి ఇటు వచ్చాను కదా! నా తండ్రి నారదమహర్షి ఇప్పటికే ఇంద్ర సభకు వేంచేసి ఉంటారు. ఆయన యొక్క ఇంతఃపూర్వపు ఆజ్ఞను అనుసరించి ఆయన వచ్చేసరికి నేను ఇంద్రసభలో ఉండి తీరాలి. ఉత్తములగు గురువులకు మనం ఉద్వేగం కలిగించటం ఏమాత్రం ఉచితమే కాదు కదా! ఇక నేను వెళ్ళి వస్తాను!
నీవు మాత్రం సంకల్పమును, ఇచ్ఛను సదా పరిత్యజించి నాచే చెప్పబడిన 'ఆత్మదృష్టి' యందు స్థితి కలిగి ఉండు.
శిఖిధ్వజుడు : అటులనే మహర్షీ! మీరు ఆజ్ఞాపించినట్లే ఆచరిస్తాను. అయితే, ఇప్పుడే వెళ్ళిపోతారా? వెళ్ళక తప్పదా?... సరే, మహామహితాత్ములగు మిమ్ములను ఉండమని అనగలిగేశక్తి నాకెక్కడున్నది? ఒక్క నిమిషం. మీ పాద పద్మములకు ప్రేమతో పుష్పాంజలి సమర్పించుటకు అనుజ్ఞ ఇవ్వండి.
ఓ రామా! ఇట్లు పలికి శిఖిధ్వజుడు తటాలున లేచి నిలబడ్డాడు. పరుగులు తీస్తూ ఒక పూలమొక్కను సమీపించి నాలుగు క్షణాలలో దోసిలి నిండా సుకుమారమగు పుష్పములు కోసి కుంభఋషి ఉన్న స్థలానికి వస్తున్నాడు. అతడు అలా అడుగులు వేస్తూ కుంభుని సమీపిస్తున్నాడు. ఇంతలో శిఖిధ్వజుడు చూస్తూ ఉండగానే కుంభఋషి అంతర్థానమైనాడు. కలలో చూస్తూ ఉన్న
Page:430
ధనరాశులు హఠాత్తుగా మాయమైతే ఆ స్నప్న ద్రష్టకు ఎట్లా అనిపిస్తుంది? మన శిఖిధ్వజుడు కూడా అంతటి చకితుడైనాడు. అతనినే ధ్యానిస్తూ శిల్పంలాగా కాసేపు నిలబడి ఉండిపోయాడు. చాలాసేపటికి గాని పూర్తిగా తేరుకోలేదు.
శిఖిధ్వజుడు : (తనలో) సర్వాంతర్యామియగు హే పరమాత్మా! ఏమి మీ లీలా చమత్కారములు! సర్వదా ప్రకాశమానమై ఉన్న బ్రహ్మము యొక్క జ్ఞాపకమును 'ఈ కుంభ ఋషి ఆగమనము’ అను మిషతో నాకు కలిగించారా! బ్రహ్మలోకం నుండి స్వర్గలోకానికి ఆకాశమార్గంగా వెళ్ళుచున్న ఈయన చల్లటి చూపులు నాపై ప్రసరించటం ఎంతటి సౌభాగ్యం!
నారదపుత్రుడైన ఈ కుంభు డెక్కడ? కమండలధారినై ఏవేవో క్రియావ్యవహారపరిమితుడనైన ఈ శిఖిధ్వజు డెక్కడ? ఇదంతా భాగ్యోదయ సమయం కాక మరింకేమిటి?
ఈయన చెప్పిన యుక్తుయుక్తవాక్యాల ప్రభావం చేత నాకు ఎంతటి శోభ అబ్బింది! మోహనిద్ర యందు ఉండి చాలా కాలంగా వ్యాకులుడనై ఉన్న నేను ఇప్పటికి ప్రబుద్ధుడనైనాను. ఇంతకాలం ‘ఇది చెయ్యకూడదు - - అది చెయ్యాలి' ఇటువంటి మిథ్యాభ్రమమయ చక్రంలో చిక్కుకుని వాక్కుచేత చెప్పనలవిగాని క్లేశములన్నీ అనుభవించానే! అప్పటి అజ్ఞానపు బురదలో చిక్కుకున్న స్థితి ఎచ్చట!... ఇప్పటి ఈ నా స్వాత్మ సామ్రాజ్యమెచట! ... పొంతనే కుదరదు. ఈ మహనీయుని దయవల్ల అమృతం నుండి ఉత్పన్నమైన ఆకృతిని ధరించాను. నా మనస్సు శీతలం, శుద్ధం, వాసనారహితం అయినది. ఇప్పటికి శాంతుడను, తృప్తుడను అయ్యాను. సుఖపూర్వకంగా ఉండి ఉన్నాను. ఇక ఈ చరాచర దృశ్యజగత్తు నుండి ఒక గడ్డిపరకకూడా నాకు అక్కర్లేదు.
ఇప్పుడు నేను ఈ జగత్తులో లేను. ఇది నాయందు లేదు. మరి? యథాస్థితంగా నా
స్వరూపమున నేను సర్వదా ఏర్పడి ఉన్నాను. సర్వకార్యములకు ఆది కారణమై, కానీ, సర్వదా కారణరహితుడనై, స్వయం తత్త్వస్వరూపమున విరాజిల్లుచున్నాను. అజ్ఞాన - విజ్ఞాన ఉభయ సందర్భములలో నా స్వరూపము అప్రమేయ స్వయం ప్రకాశకముగానే ప్రభవిస్తోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! వాసనారహితమగు అంతఃకరణం గల ఆ శిఖిధ్వజుడు ఇట్లు చింతన చేయసాగాడు. క్రమంగా మనస్సు విషయరహిత స్థితి పొందసాగింది. “భావాలకు అతీతమైన, ప్రశాంతమగు సాక్షిమాత్రమైన” అనుభవం సంతరించుకోసాగాడు. ఒక శిలయందు చెక్కబడిన శిల్పం లాగా మౌనం ధరించు సమాధినిష్ఠుడు అయ్యాడు. సంకల్ప వర్జితం, ఆశ్రయరహితం అగు ఆ మౌన సమాధిలో పర్వతశిఖరం వలె స్థిరప్రతిష్ఠితుడయ్యాడు. ఆ సమాధిలో సమరసమగు ఆత్మస్వరూపాన్ని పొందుచుండుటచే విశ్రాంతిచిత్తుడై, నిర్భయుడై, సంయోగ-వియోగద్వంద్వాలను అధిగమించిన వాడయ్యాడు. అట్టి నిర్ద్వంద్వయోగాభ్యాసబలం చేత అఖండ స్వభావం పొందాడు. విషయాల దృష్ట్యా గాఢనిద్రకు ఉపక్రమించిన వానిలా, ఆత్మానుభవం దృష్ట్యా నిత్యోదయ జాగ్రత్ అనుభవిగా ప్రకాశించాడు.
Page:431
38. కుంభ పునరాగమనం
శ్రీరాముడు : మహర్షీ! కుంభ ఋషి ఇంద్రసభకు బయలుదేరాడు కదా! ఆ తరువాత ఏం జరిగింది? శ్రీవసిష్ఠ మహర్షి (చిరునవ్వుతో) : కుంభ ఋషి వేషము ధరించిన చూడాల శిఖిధ్వజునికి తత్త్వబోధ చేసిన తరువాత, ఆతని సమక్షము నుండి అంతర్ధానమై ఆకాశమార్గంలో ప్రవేశించింది. అక్కడ తన మాయారచితమైన దేవపుత్రుని రూపం త్యజించి సౌందర్యరాశియగు చూడాల రూపమును ధరించింది. ఆకాశమార్గంగా కొద్ది క్షణముల కాలంలో అంతఃపురంలో ప్రవేశించింది. అతి కొద్ది సమయంలో రాచకార్యములకు సంబంధించిన విధులను నిర్వర్తించసాగింది. మంత్రులతో సమాలోచనలు, వ్యవహార నిర్ణయములు యథారీతి ప్రారంభించింది.
మూడు రోజులు గడిచాయి. మూడు రోజుల తరువాత మరల కుంభ ఋషి రూపము ధరించి శిఖిధ్వజుడు ఉన్న వన ప్రదేశమును ఆకాశ మార్గంలో సమీపించింది. శిఖిధ్వజుడు మౌన ప్రశాంత - నిర్విషయ స్వరూపమగు సమాధిని అవధరించి ఉండటం చూచింది.
కుంభఋషి (చూడాల) : ఆహా! ఎంతో సౌభాగ్యవశం చేత ఇంతకాలానికి ఈ ప్రియ శిఖిధ్వజుడు స్వస్థుడై, శాంతుడై, సమదృష్టి కలిగి ఆత్మయందు విశ్రమించుచున్నాడు. అయితే ఈతడు ఇట్లాగే ఉంటే కొంతకాలానికి తైలరహిత దీపం లాగా దేహత్యాగం చేయటం జరుగవచ్చు. అటువంటి దేహత్యాగంతో ఈతనికి ఇప్పుడేమిపని? మరికొంతకాలం ఈ వనంలోనో, లేక రాజ్యములోనో దేహసహితుడై ఉంటూనే ఆత్మైక్యమును కూడా అనుభవించవచ్చును కదా! అందుచేత ఈతనిని ఈ సమాధి స్థితి నుండి నిదురలేపుతాను. కొంతకాలం ఈ భూమిపై సంచరించిన తరువాత ఉచిత సమయంలో ఇద్దరం విదేహకైవల్యమును ఆశ్రయించవచ్చు. నేను ఇంతవరకు ఈతనికి చేసిన ఉపదేశ ప్రభావం చేత ఇప్పుడీతడు సప్తమ భూమికలో ప్రవేశించకుండుగాక!
ఈ విధంగా నిశ్చయించుకున్న ఆ చూడాల తన భర్త శిఖిధ్వజుని ఎదురుగా నిలబడి భీకర మైన సింహనాదాలు చేయసాగింది. ఆ శబ్దాలకు పర్వతాలు కంపించాయి. అక్కడి ఆరణ్యంలోని వన్యమృగాలు భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి. ఆకాశమంతా ధ్వని, ప్రతిధ్వనులతో నిండిపోయింది. అయితే ఏం? ఆ శబ్దములు శిఖిధ్వజుని చెవులను తాకినట్లు కూడా లేవు. అతను అట్లాగే నిశ్చలంగా ఉండటం చూచి చూడాల ఆయన భుజములను చేతులతో పట్టుకొని అటూ ఇటూ చాలాసార్లు కదిల్చింది. అయినా లాభం లేకపోయింది.
కుంభఋషి : ఆహా! ఈ సాధు మహాత్ముడు సప్తమ భూమికా ప్రవేశము వరకు పరిణతి చెందాడే! ఈ 18 సంవత్సరాలుగా ఈతడు చేసిన తపస్సు అంతటి ఏకాగ్రత - నిష్ఠ కలిగి ఉన్నాయన్నమాట!
Page:432
అయినా... ఈ మహాత్ముని ఇప్పుడు సమాధి నుండి లేపటం ఎందుకు? పోనీ, విదేహముక్తిని పొంది అక్కడే ఉండనిస్తే పోలేదా? నేను కూడా ఈ స్త్రీ శరీరమును పరిత్యజించి, ఇక మరల జన్మ లేనిదాననై నా పతితో కూడా పరమపదమును పొందితే సరిపోతుంది కదా!
ఇట్లా తలచి విదేహముక్తికి సంసిద్ధపడుచూ ఉండగా, ఆమెలో ఏదో మరొక ఆలోచన తళ్ళుక్కుమన్నది. అట్లాగే చేస్తాను. అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం సరిచూచు కోవలసియున్నది. ఈ మహారాజు ఇప్పుడు నిర్విషయ సమాధిని అత్యంత తీవ్రంగా ఆశ్రయించి ఉన్నాడు. ఈతని అంతఃకరణంలో జాగ్రత్తుకు సంబంధించిన బీజభూత విషయమేమైనా ఇంకా మిగిలి ఉన్నదా, లేదా? బీజంలో కొంచెం అంకురశక్తి మిగిలి ఉన్నా, మరల, తడి తగిలితే అంకురించటం ఆరంభించి ఎప్పుడో మహావృక్షంగా పరిణమిస్తుంది. అట్లాగే ఈతని అంతరంగంలో జాగ్రత్కు సంబంధించిన సంస్కార లవశేషం ఏ కొంచెం మిగిలినా సరే, ఈతడు మరల జాగ్రతుడౌతాడు. అట్లా జాగ్రతుడైనప్పటికీ ఈతడు జీవన్ముక్తుడే కాబట్టి నిశ్చింతుడై ఈ భూమిపై విహరించ గలడు.
ఒక వేళ ఈతడు లౌకిక సంబంధిత సంస్కారం కించిత్తు కూడా కలిగి ఉండకపోతే అప్పుడు నేను కూడా ఈ భౌతిక దేహం త్యజించి, నిర్వికల్ప సమాధిని అవలంబించి సప్తమ భూమికలో ఇప్పటికిప్పుడే ప్రవేశిస్తాను.
ఇట్లా యోచిస్తూ కుంభఋషిరూపియగు చూడాల మరల భర్త దేహమును సమీపించింది. ఒక వైద్యుని వలె శిఖిధ్వజుని దేహమును స్పర్శచేతను, కళ్ళతోనూ నఖశిఖపర్యంతము పరిశీలించింది. ఆ శిఖిధ్వజుడు దేహమునందలి ముఖ్య నాడీ ప్రదేశములలో చేతి స్పర్శకు కించిత్తు స్పందిస్తున్నట్లు గమనించింది. ఉహూ! ఈతని దేహంలో జాగ్రత్తుకు సంబంధించిన, మనో సంబంధమైన, కించిత్తు శేషము ఇంకా ఉన్నది. ఎందుకంటే ఈతని దేహము నందు కొన్ని నాడీ మండలములలో ఉష్ణత్వము మొదలైన కొన్ని చిహ్నాలు ఇంకా ఉన్నాయి. కనుక ఎప్పుడో ఈతడు మరల మనస్సును ఉత్తేజపరచి జాగ్రత్తుకు తిరిగి రాగల అవకాశాలు లేకపోలేదు... అని తలచినది.
శ్రీరాముడు : మహాత్మా! ఒక సాధకుడు చిత్తమును శమింపజేసి కొయ్య - మట్టిలాగా అచంచల స్థితి పొంది ఉన్నప్పుడు, అట్టి ధ్యానశీలుడగువానిలో మనస్సు ఇంకా శేషించి ఉన్నదో-లేదో ఎట్లా తెలుసుకోవచ్చు? ఆ దేహము గ్లాని పొందదా? ఎందుచేత?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒక బీజంలో భవిష్యత్ సంబంధమైన పుష్ప-ఫలములకు సంబంధించిన సంవిత్తు మౌనంగా దాగి ఉంటుంది చూచావా? అట్లాగే సూక్ష్మదృష్టిని, జ్ఞానదృష్టిని అవలంబించిన హృదయంలో కూడా ఒక్కొక్కప్పుడు ఎక్కడో ఒక మూల ప్రబోధ కారణమైన మనస్సు యొక్క ఒక శేషం ఉండవచ్చు. అయితే అట్టి సమాధి నిష్ఠుడగు యోగి దేహం మాత్రం యథాతథంగానే ఉంటుంది. ఏ మనుజుడైతే చేష్టరహిత చిత్తం కలవాడై, ద్విత్వ ఏకత్వరహితుడై, సచ్చిదాత్మ స్వరూపుడై, నిశ్చలంగా ఉంటాడో... అట్టి సమరూప అచంచలస్థితి పొందినవాని దేహం గ్లాని పొందదు, ప్రసన్నం కాదు,
Page:433
అస్తమించదు, ఉదయించదు. ఆ దేహము సమరూపము కలిగి ఉంటుంది. అట్లా కాకుండా ఆ సాధకుడు ఇంకా ద్విత్వజ్ఞానయుక్తుడై, చేష్టలు నిర్వర్తించే మనస్సు కలవాడై ఉంటే ఆ దేహము వృద్ధి - క్షయములు పొందటం జరుగుతుంది. నిర్విషయ నిశ్చల సమాధియందున్న వాని దేహమునకు వృద్ధి క్షయములు ఉండవు. ఆ సాధకుడు నిశ్చల - నిశ్చితమనస్కుడై ఆ దేహమును త్యజిస్తేనే అది ఇక పంచభూతములందు ప్రవేశిస్తుంది.
చిత్తస్పందోహి సర్వేషాం కారణం జగతః స్థితేః!
రామ! భావవికారాణాం కుసుమానాం యథామధుః ॥
ఓ రామచంద్రా! పుష్పములకు వసంతకాలము కారణమగుచున్నట్లు సమస్త భావవికారములతో కూడియున్న ‘ఈ జగత్తు యొక్క - - ఈ దేహము యొక్క స్థితికి చిత్తము యొక్క చేష్టలే కారణమై ఉంటున్నాయి. ఈ కారణం చేత చిత్తము ఇంకా శేషించియే ఉన్నప్పుడు ఈ దేహమును బలవంతంగా నిర్జీవింపజేసినప్పటికి, హర్ష - కోప సంమోహములు ఇంకా ఉండియే ఉంటాయి. కాబట్టి మరియొక దేహము ఆ జీవుని కొరకు వేచియే ఉంటోంది. చిత్తము పూర్తిగా ప్రశాంతత పొందినప్పుడు అట్టి నిర్వాసనా చిత్తముచే దేహము త్యజించబడుచున్నప్పుడు భావవికారములకు స్థానమైన ఈ దేహము అట్టి దేహిని బాధింపజాలదు. జలము యొక్క సమస్థితి యందు తరంగాలు ఉండవు కదా! చిత్తము యొక్క సమస్థితియందు అద్దానిలో వృద్ధ - - క్షయాది వికారములు గాని, రాగ - -
ద్వేషములుగాని కనిపించవు. ప్రారబ్ధకర్మ సంపూర్ణంగా క్షయించనంతవరకూ జీవన్ముక్తులకుండే సత్వము (విషయరహిత చిత్తము) అభావత్వం పొందకుండానే ఉంటుంది. ప్రారబ్ధ కర్మలు నివృత్తం కాగానే ఆ సత్వము అభావత్వం పొంది పూర్తిగా శమించటం జరుగుతుంది.
ఏ దేహమునందైతే ఇటు చిత్తము గాని, అటు సత్వము గాని ఏర్పడి ఉండదో, అట్టి దేహము ఎండయందు ఉంచబడిన మంచుగడ్డలాగా మృత్యువునందు విలీనమైపోతుంది.
ఆ శిఖిధ్వజుని దేహం విషయానికి వస్తే... అతడు నిర్విశేషసమాధిని ఆశ్రయించటంచేత, చిత్తరహితమైనప్పటికీ, అది తేజముతోను, సత్వాంశతోను కూడియే ఉన్నది. అందుచేత అది గ్లాని పొందలేదు. ఆ విషయం యోగాభ్యాసకురాలగు చూడాల ఆయా దేహనాడులలో స్పర్శకు లభించిన ఉష్ణమును బట్టి గ్రహించింది. యోగాభ్యాసకులకు అట్టి విజ్ఞానము సులభసాధ్యమే.
ఉత్తమ స్త్రీయగు చూడాల భర్త దేహము నందు జాగ్రత్ వ్యవహార సంబంధమైన సత్వాంశమును గమనించి, తాను దేహత్యాజ్య ప్రయత్నమును ఉపసంహరించుకున్నది.
కుంభఋషి రూప చూడాల: ఈతనిని సమాధి నుండి విరమింపజేయటానికే ప్రయత్నిస్తాను. సూక్ష్మదేహాన్ని ఆశ్రయించి - సర్వవ్యాపకము, శుద్ధము అయినట్టి ఈతని చిత్తములో ప్రవేశిస్తాను. ఎప్పుడో అతి దీర్ఘకాలం తరువాత జాగృతం కావలసిన ఈతనిని ఇప్పుడే సమాధి నుండి మేలుకొలుపుతాను. లేకపోతే ఈతడు జాగృతమయ్యే వరకు ఒంటరికి ఉండటం ఉచితం కాదు.
Page:434
ఇట్లు విచారణ చేసి ఆ చూడాల ఇంద్రియ పంజర రూపమైనట్టి నిజదేహాన్ని వీడింది. భర్త దేహంలో ప్రవేశించింది. అతని యొక్క ఆద్యంతరహితమైన చితతత్త్వంలో స్థితిని పొందింది. హంస క్షీరం నుండి జలమును వేరు చేస్తుందే!
అట్లా నిర్వికల్ప సమాధియందు చైతన్యముతో ఏకత్వము పొందియున్న తన భర్త యొక్క ‘బుద్ధి’ని వేరుపరచింది. అదే తీరుగా దేహంలో ఆ బుద్ధిచే స్పందన క్రియను ఉత్తేజపరచింది. మరల పక్షిగూటిలో ప్రవేశించినట్లు తన నిజకల్పిత కుంభఋషి దేహంలో ప్రవేశించింది. ఇతఃపూర్వం ఆసీన మైన ఎత్తైన శిలాసనంపై కూర్చుని ఏమీ తెలియనట్లు సామవేదం గానం చేయటం ప్రారంభించింది. సామవేదగానం చెవులకు చేరుచుండగా ఆ రాజు యొక్క దేహం క్రమంగా సత్వగుణంతో శోభించసాగింది. అతని చిత్ ప్రబుద్ధమయి, జాగ్రత్ దేహవ్యవహారము వైపు ప్రసరించసాగింది. క్రమంగా అతడు సమాధి నుండి మేల్కొనుచూ కనులు తెరచి దృష్టిని వికసింపజేశాడు. ఎదురుగా కుంభఋషి ఆసీనుడై ఉండటం చూచాడు.
‘అహా! మేం ధన్యులం. ఈ దేవఋషి స్వయంగా ఇక్కడికి విజయం జేశారు... అని అనుకుంటూ లేచి నిలబడ్డాడు. పరమానందంగా దోసిలినిండా పూలు తీసుకుని కుంభఋషి పాదాలపై ఉంచి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించాడు. కుంభఋషి చిరునవ్వుతో అదంతా గమనిస్తున్నాడు. శిఖిధ్వజుడు : హే మహాత్మా! తమ పవిత్రమైన చిత్తముచే నా బుద్ధి ప్రేరేపించబడటం నా సౌభాగ్యం. మహాత్ములు ఇతరులను అనుగ్రహించే సమయంలో వారి చల్లటి చూపులు ప్రసరించేచోటనే కొంతసేపు ఏర్పడి ఉండటం నిజంగా గొప్ప ఫలప్రదమైన విషయం. మహాత్మా! మీ ఈ రాకకు కారణం నన్ను పవిత్రుణ్ణి చేయటానికేనని నేను అనుకుంటున్నాను. అంతకు వేరైన ఏదైనా కారణముంటే మిమ్ములను సేవించి, సంతోషింపజేసి, తరించటానికి ఈ శిఖిధ్వజుడు వినమ్రుడై సంసిద్ధంగా ఉన్నాడు. కుంభమహర్షి : ఓ రాజా! నేను మొట్టమొదట వచ్చినప్పటి నుండి పరమ పవిత్రుడవగు నీ సామీప్యాన్ని నా చిత్తం విడువనే లేదు. స్వర్గలోకం రమణీయమైనదైతే కావవచ్చుగాక. నీ సమక్షం గుర్తుకు రాగానే నాకు అక్కడ నిలవాలని అనిపించలేదు. అందుకే మరల వచ్చేశాను. ఈ చిత్తము దేనిని రమ్యమనుకుంటే అద్దాని సమక్షమే ఆనందం కలిగిస్తుంది. ఏది రమ్యమని అనుకోకపోతే... అది ఎంతటి స్థానమైనా కూడా స్వల్పమాత్రంగానే ఉంటుంది. ఓ సాధూ! శిఖిధ్వజ మహారాజా! నీతో సమానమైన బంధువుగాని, ఆప్తుడు గాని, సుహృత్గాని, మిత్రుడు గాని, సఖుడు గాని, విశ్వాసపాత్రుడుగాని, శిష్యుడు గాని, ఈ భూ - నభోంతరాలలో మరెక్కడా లేడని నేను నమ్ముచున్నాను. అందుకే నీ చెంతకు వచ్చి ఇక్కడ కూర్చున్నాను.
శిఖిధ్వజుడు :
అహో! ను ఫలితం పుణ్యపాదపైరః కులాచలే,
యస్మాత్ భవాన్ అసంగోపి, వాంఛతి అస్మత్ సమాగమమ్ ॥
ఆహా! ఏమి నా అదృష్టం! ఆ మందర పర్వతంపై గల పవిత్ర వృక్షాలకు సుందరమైన పుష్పాల మధురమైన ఫలాలు వెల్లివిరుస్తున్నట్లు నా అనేక జన్మల పుణ్యము ఫలప్రదమౌతోంది.
Page:435
లేకుంటే అసంగులైన మీరు నా యొక్క స్నేహాన్ని కోరి స్వర్గాన్ని వీడి ఇక్కడికి రావటమా! హే ప్రభో! ఇదిగో ఉత్తమమైన వనం, అవిగో, రమణీయమైన పుష్ప-ఫల సంపదతో కూడిన వృక్షాలు, పిల్లగాలులు ఎంత సువాసనతో చల్లగా వీస్తున్నాయో గమనిస్తున్నారు కదా! ఇక మిమ్ములను సేవలచే సత్కరించటానికి ఈ శిఖిధ్వజ నామధేయుడగు మీ ఈ సేవకుడు ఉండనే ఉన్నాడు. కాబట్టి మీకు స్వర్గ-బ్రహ్మలోకాలు రుచించకపోతే నిస్సంకోచంగా ఇక్కడే ఉండండి. హే మహానుభావా! మీరు చెప్పిన యోగయుక్తిచే నేను ఏ విశ్రాంతిని పొందానో, అద్దాని ముందు స్వర్గాదులు కూడా రుచించ వనుటలో అతిశయోక్తి ఏముంది? అట్టి స్వచ్ఛమైన ప్రకాశయుక్తమైన స్థితిని ఆశ్రయించి ఇక్కడ ఉండండి. ఎప్పుడు స్వర్గాన్ని దర్శించాలని మీకనిపిస్తే అప్పుడే వెళ్ళండి. మీ ఇష్టానుసారం చరించండి. కుంభ ఋషి : ఓ రాజా! మహత్తరమైన పరమపదంలో నీవు విశ్రాంతి పొందావు కదా! దుఃఖ పూర్ణమై, భేదమయమైనట్టి ఈ సంసారమును నీవు త్యజించినట్లే కదా? విచారణ చేయని కారణంగా మాత్రమే రమణీయంగా తోచే సంకల్పములయందు నీరసములగు భోగములయందు నీకు ఉండి ఉన్న ప్రీతి నిర్మూలనమయిందా? త్యజించటం, ఆశ్రయించటం (హేయ ఉపాధేయములు) అనే దశకు అతీతమైన, స్వయముగా పరమశాంతమైన సమస్థితి కలిగి ఉన్న స్థానమును నీ చిత్తము సంపాదించుకున్నదా? యథాప్రాప్తములగువాటిపట్ల రాగద్వేషరాహిత్యము సంతరించుకున్నదా? శిఖిధ్వజుడు : హే మహాత్మా! తమ అనుగ్రహం చేత ఈ సర్వదృశ్య వ్యవహారములకు పరమైనట్టి “నా యొక్క, ప్రతి ఒక్క జీవుని యొక్క ఒకానొక మహత్తర స్థానాన్ని దర్శించాను. ఈ సంసారమునకు అక్కడ చోటే లేదు. పొందవలసినది అదే! మీ దయచే పొందవలసిన స్థితిని పొందాను. చాలాకాలం అర్థరహితంగా గడపిన తరువాత ఇప్పటికి నిర్విఘ్న విశ్రాంతిని పొందాను. ఇప్పటికి శాశ్వతమగు అకారణతృప్తిని పొందాను. ఇక నాకు ఉపదేశము యొక్క అవసరమంతా తీరిపోయింది. అంతటా, సర్వధా తృప్తుడనై, దుఃఖరహితుడనై ఉన్నాను... తెలుసుకొనవలసిన దాన్ని తెలుసుకున్నాను. పొందవలసినది పొందాను. త్యజించవలసినది త్యజించాను.
ఇప్పుడు ఆత్మపరతత్త్వాన్ని ఆశ్రయించియున్నాను. ఇక నాకు ఆత్మకు భిన్నమైనదేదీ ఎక్కడా కనిపించటమే లేదు. ఇప్పటికి మీ ప్రవచనమాహాత్మ్యంచేత సంసారం, మోహం, భయం, రాగం, మొదలైన దోషాలు లేనివాడనయ్యాను. నిత్యోదయరూపుడనయ్యాను. సముడను, సర్వసమమగు అంతఃకరణం కలవాడను అయ్యాను. సర్వము పట్లా సౌమ్యం వహించి ఉంటున్నాను. సర్వరూపుడనై, సర్వ కల్పనావినిర్ముక్తుడనై, ఆకాశకోశం వలె నిర్మలుడనై, సర్వత్రా ఏకరూపుడనై ఉన్నాను.
39. లోక సంచారం
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ శిఖిధ్వజ - చూడాలలిద్దరూ అక్కడే కొద్ది గంటలు ఆధ్యాత్మిక కథలు పరస్పరం చెప్పుకుంటూ ఉన్నారు. తరువాత అక్కడి నుండి ఒక పర్వత శిఖరంపై చేరారు. అక్కడ జీవన్ముక్తుల ఆచారములతో కూడినవారై ఆధ్యాత్మిక విషయాలు సంభాషించుకుంటూ, అక్కడే విహరిస్తూ
Page:436
8 రోజులు గడిపారు. అక్కడి నుండి ఇంకా ఎన్నో ప్రదేశాలు సంచరించసాగారు. పరస్పరం సమానమైన స్నేహం, సమానమైన ధైర్యోత్సాహములు కలిగియున్నవారై పరస్పరం ప్రశంసించుకుంటూ సదా కూడియే ఉండేవారు. కలిసియే భుజించేవారు. కలిసియే శీతోష్ణాదులను పొందుచూ సమబుద్ధిని కలిగి ఉండేవారు. కలిసియే దేవతలను, మహనీయులగు ఆత్మజ్ఞులను పూజిస్తూ ఉండేవారు. 'ఇది ఇలు, అది గ్రామం, ఇది అడవి, అది పట్టణం, ఇది మనదేశం, అది వారి ప్రాంతం' - - మొదలైన వికల్పములకు వాళ్ళ మనస్సునందు గాని, సంభాషణయందు గాని చోటు దొరికేదే కాదు.
స్నేహితులిద్దరూ ఒక్కొక్కప్పుడు ధూళిచే కప్పబడిన దేహములతో గ్రామములలోనూ, పట్టణ వీథులలోనూ సంభాషించుకుంటూ సంచరించేవారు. మరొకప్పుడు నిర్జన ప్రదేశాలలో తిరుగుతూ ఉండేవారు. ఒకప్పుడు మంచి వస్త్రాలు ధరించేవారు. మరొకప్పుడు దిగంబరులై, ఆకులతో ఒళ్ళు కప్పుకొని తిరిగేవారు.
కొద్దిరోజులు ఏకచిత్తులై వారిరువురూ సంచరించటం చేత స్వయముగానే వాసనారహితమైన శిఖిధ్వజుని చిత్తము కుంభుని చిత్తమువలెనే పరమపవిత్రమై, ఉత్తమజ్ఞాన సమన్వితమై ప్రకాశించింది.
40. నియతిని పాలించటమే ఉచితం!
శ్రీవసిష్ఠ మహర్షి : వింటున్నావా! రామచంద్రా! ఆ కుంభ - శిఖిధ్వజులిద్దరూ ఆత్మను ఎరిగినవారై, ఆత్మమాత్రనిష్ఠులై, లీలగా అనేక వనములు, తీర్థయాత్రా స్థలములు, నదీ నద ప్రాంతములు సంచరిస్తున్నారు కదా! ఒక రోజు వారిద్దరూ ఒక అతి సుందరమైన వనంలో యాదృచ్ఛికంగా ప్రవేశించారు. అచ్చటి మధురరసమైన ఫల పుష్పములు, కోయిలల కూహూరాగాలు, పూతీగలచే ప్రకృతి సిద్ధంగా - ఎవరి ప్రమేయం లేకుండా నిర్మించబడిన లతాగృహములు, నిర్మల జలం పారే సెలయేర్లు మొదలైవన్నీ ఆ ఇరువురినీ ఎంతో ఆహ్లాదపరిచాయి.
శిఖిధ్వజుడు : మహర్షీ! ఏమి ఈ ప్రకృతి సౌందర్యం! ఇక్కడ మునులకు గొప్ప తపో ఏకాగ్రత, ప్రేమికులకు పరమోల్లాసభరితమైన ఏకాంతము ఈ రెండిటినీ ప్రసాదించగల గొప్ప ప్రావీణ్యత ఈ వనమునకు కనిపించటం లేదా? ఈ వనదేవత చూపరులకు అందిస్తున్న ఆహ్లాదమును అభినందించక తప్పదు.
కుంభ ఋషి : ప్రియసఖా! నీవు చెప్పిన దానిలో అనుమానమే లేదు. పద! ఈ వనంలోనే మనం కొద్దిరోజులు ఉందాం. ఈ వనదేవత ప్రదర్శించే ఈ పవిత్ర - పరమాహ్లాద ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడి ఏదైనా చక్కటి ఒక లతాగృహమును ఎన్నుకుందాం. ధ్యానాదులకు ఇది ఎంతో సానుకూల్య ప్రదేశమనిపిస్తోంది.
శిఖిధ్వజుడు : తప్పకుండా! మీరు భావించినట్లే అగుగాక!
Page:437
ఆ ఇద్దరూ చేతులు కలుపుకుని ఆ వనంలోని సుందరవాతావరణం ఆస్వాదిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. కుంభుని మనస్సు మరింతగా పరవశించసాగింది. కుంభరూప చూడాల (తనలో): ఆహాఁ! ఏమి ఈ వన సౌందర్యం! వసంతకాలపు అందాలు చూడాలంటే ఈ వనమునే చూడాలి. పైగా ఈ ప్రదేశమంతా చాలావరకూ నిర్మానుష్యంగా ఉన్నది. ఇక్కడి లతా గృహాల సౌందర్యం వర్ణించాలంటే మాటలు చాలవు. ప్రక్కనే ఈ సెలయేరు. నా ప్రక్కనే చూస్తేనేమో ఉదారచరితుడైన నా ప్రియ ప్రాణసఖుడు. అరాగరంజితమైన ఈ స్థితి నేను కోరుకోకుండానే నాకు లభించింది.
యథాప్రాప్తములైన భోగముల పట్ల 'తిరస్కారబుద్ధి' అనే పట్టుదల నాకెందుకుండాలి? అట్టి పట్టుదల కూడా జీవన్ముక్తులకు మూఢత్వమనే అనిపిస్తుంది కదా! నా ఈ పతి నవవయస్కుడే కదా! ఇట్టి ప్రియసఖుడు ప్రక్కన ఉండగా ఈ సుందరవాతావరణంలో భర్తతో సమాగమం పొందకపోతే ప్రకృతి ప్రసాదించిన ఈ స్త్రీత్వమునకు అర్థమేమున్నది? వివాహితయగు స్త్రీ తన భర్తతో ఏకాంతం లభించినప్పటికీ భర్తతో పొందు వాంఛించకపోతే ఆమె ఉత్తమ స్త్రీ ఎట్లా అవుతుంది? జ్ఞాని కూడా యథాప్రాప్తములైన ధర్మవిహితములైన భోగములను త్యజించడు కదా!
అయితే, ఈ నా ప్రియపతి ఇప్పుడు నన్ను నారదపుత్రుడగు కుంభఋషి అనియే తలుస్తున్నాడు. నన్ను ఆత్మజ్ఞానం ప్రసాదించిన పరమగురువుగా గౌరవిస్తున్నాడు. పైగా, సర్వత్యాజ్యము చేత ఆత్మానుభవాన్ని పొంది ఉన్నాడు. ఒకవేళ చూడాల రూపంలో ఈతనికి కనిపించినప్పటికీ ఈతడు నాతో రమించుటకు సిద్ధమవుతాడని నేననుకోను. మరిప్పుడేం చేయాలి?
కుంభఋషి రూపంలో తన భర్తతో చేతులు కలిపి అడుగులు వేస్తున్న చూడాల కొంచెం యోచనలో పడింది. ఆమె ఏకాగ్రతతో గొప్ప తపస్సు చేసి ఉన్న మహాయోగి కదా! కొద్ది క్షణములలో ఒక ఉపాయం ఆమెకు స్పురించింది.
కుంభఋషి : మహారాజా! హరెరేఁ! మరచాను! ఈ వనం చూస్తే గుర్తుకొచ్చింది. ఈ రోజే వసంత ఋతువు ప్రవేశిస్తోంది కదా! నేడు చైత్రశుద్ధపాడ్యమి. కనుక చాలా గొప్ప రోజు. ఈ రోజు స్వర్గంలో ఇంద్రసభ జరుగుతుంది. ఈ విషయం నాకు ఇంతవరకూ ఎందుకు గుర్తుకురాలేదబ్బా? శిఖిధ్వజుడు : ఏమి దేవఋషీ! నేటి ప్రత్యేకత ఏమిటి?
కుంభఋషి : చిన్నగా ‘ప్రత్యేకత'... అంటావేమిటి? నేడు అనేక మంది దేవతలు, ఋషులు ఇంద్ర 'సభలో సమావేశం కానున్నారు. నా తండ్రిగారు నారదమహర్షి కూడా వేంచేయనున్నారు. ఆయన సమ్ముఖమునకు నేను అవశ్యం వెళ్ళవలసి ఉన్నది. యథాస్థితమైన మర్యాదలను ఎప్పుడూ అతిక్రమించ కూడదు కదా! కనుక నిన్ను విడచి నేను వెళ్ళిరాక తప్పదు.
శిఖిధ్వజుడు : అదేమిటి గురువర్యా! తప్పక వెళ్ళిరండి.
Page:438
కుంభ ఋషి : అట్లాగే వెళ్ళివస్తాను. నూతన పుష్పములతో కూడిన ఈ వనంలో విహరిస్తూ నీవు నా కొరకై ఉద్వేగరహితంగా ప్రతీక్షిస్తూ ఉండు. మరల సాయంకాలానికి తిరిగి వస్తాను. నాకు నీ సాన్నిధ్యం కలిగించే సుఖం ఆ స్వర్గలోకంలో ఏమాత్రం ఉండదు సుమా!
ఇట్లా పలికి కుంభుడు సువాసనా భరితమైన పూలగుత్తులను మర్యాదపూర్వకంగా శిఖిధ్వజుని చేతికి అందించాడు. రాజు చూస్తూ ఉండగానే ఆకాశంలో పయనిస్తూనే దోసిలినిండా మల్లె పుష్పములను కల్పించి శిఖిధ్వజునిపై పూలవర్షం కురిపించాడు. కనుచూపుమేర రాజు కుంభుని చూస్తూనే నిలుచున్నాడు.
ఆకాశంలో ప్రవేశించిన చూడాల తన నిజ స్త్రీ రూపం ధరించింది. కొద్ది క్షణములలో అంతఃపురం ప్రవేశించింది. ముఖ్యులగు మంత్రులను పిలిపించి అవశ్యమైన రాజకార్యములు నిర్వహించింది. ఆయా ముఖ్య విషయములన్నీ పర్యవేక్షించింది. సాయంకాలానికల్లా మరల కుంభ ఋషి రూపంలో శిఖిధ్వజుని సమక్షంలో నిలచింది.
శిఖిధ్వజుడు కుంభ ఋషి ఆగమనాన్ని చూచి సంతోషించాడు. గబగబా అతనిని సమీపించి సుస్వాగతం పలికాడు. ఆతని ముఖంలోకి చూచి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది... కుంభ ఋషి ముఖంలో దైన్యము, విషాదము తాండవిస్తున్నాయి.
శిఖిధ్వజుడు: హే దేవఋషీ! ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు కదా! అత్యంత సూక్ష్మమైన తాత్త్విక విషయాలు చెప్పేటప్పుడు కూడా మీ ముఖంలో ఆటల గురించి మాట్లాడుకునే చిన్నపిల్లల కేరింతల వంటి ఆనందం ఎప్పుడూ ద్యోతకమయ్యేది. మరి ఈ రోజేమిటి ఇట్లా ఉన్నారు? మరి నా దృష్టి దోషమేమో తెలియదు గాని, మీ ముఖంలో ఏదో విషాదము, నైరాశ్యము కొట్టొచ్చినట్లు కనబడుచున్నాయి. తమరు సర్వసంగపరిత్యాగులు కదా! మీ యొక్క జ్ఞానదృష్టిచే ఈ దుఃఖకవళికలు త్యజించి ఇటు రండి.
ఈ ఆసనముపై కూర్చోండి. మహాత్మా! కమలాలు నీటిలో ఉన్నప్పటికీ జలం యొక్క తడిని స్వీకరించవు కదా! తమవంటి తత్త్వవేత్తలు సుఖ-దుఃఖాల వలన కలిగే స్థితిని ఆశ్రయించరు. ఒకవేళ ఏదో యాదృచ్ఛికంగా సుఖ-దుఃఖ సంఘటనలకు స్పందించవలసివచ్చినప్పటికీ, వాటిని హృదయంలో ప్రవేశింపనీయరు. అసలేం జరిగింది? మీరు ఇంత నిరుత్సాహంగా ఉండటానికి కారణమేమిటి? కుంభఋషి : (విచారయుక్తమైన గద్గద స్వరంతో) హే రాజన్! ఈ 'దేహము' అనేది ఉన్నదీ అంటే, దీనితో పాటే కర్మేంద్రియాలు కూడా ఉంటాయి కదా! కర్మేంద్రియాలతో బాటే యథాప్రాప్తములైన ఆయా అనుభవాలూ ఉంటాయి. ఇట్టి దేహావస్థయందు కర్మేంద్రియాలచే ప్రాప్తములగు భోగాలను సమచిత్తులై అనుభవించాలి. అట్లా కాకుండా, కర్మేంద్రియాలను నిరుపయోగంగా ఉంచాలనుకోవటం ఒక రకమైన మొండితనమే అవుతుంది గాని, అది తత్త్వవేత్తల లక్షణం కాదు. ఈ శరీరానికి స్వభావ సిద్ధంగా ప్రాప్తించే ఆయా అవస్థల నుండి పారిపోవాలనుకుంటే అది తత్త్వవేత్తలు కానివారు
Page:439
మాత్రమే తమ మూర్ఖత్వం చేత అట్లా అనుకుంటున్నారని మనం అనక తప్పదు. నువ్వులు ఎంతవరకు ఉంటాయో, అంతవరకు నూనె కూడా ఉంటుంది. ఎంతవరకు ఈ శరీరం ఉంటుందో, అంతవరకు కర్మేంద్రియాల హర్ష-శోక వ్యవస్థలు కూడా ఉంటాయి. 'నేను ఈ కర్మేంద్రియ వ్యవస్థను త్రెంచివేసి అప్పుడు శేషజీవితాన్ని గడుపుతాను'... అని ఎవడైనా అన్నాడనుకో, అది ఒక కత్తి తీసుకొని ఆకాశాన్ని త్రెంచటానికి ప్రయత్నించటం వంటిదే అవుతుంది. అనగా మూర్ఖత్వమే అనిపించు కుంటుంది. అవునంటారా? కాదంటారా?
‘దేహమును జయించటం' అంటే కర్మేంద్రియములను నిరుపయోగంగాను, నిర్వీర్యంగాను ఉంచటం మాత్రం కాదని నా ఉద్దేశం. మరి? ఈ దేహదశయందు ఏ సుఖ-దుఃఖాదులు ఉన్నాయో వాటన్నిటిపట్ల అంతరంగంలో ఒకానొక 'అతీతత్వము' అను యోగ స్థితిని సంతరించుకుని ఉండటం - ఇదీ దేహమును జయించటమంటే. అద్దానిని యోగబలమని, సమాధి యొక్క అనుసంధానమని అంటారు. అట్టి సంయోగ వియోగాతీతమగు యోగస్థితిని స్వభావసిద్ధం చేసుకొనే అభ్యాసం ఉత్తమంగాని, కర్మేంద్రియములను హఠయోగం చేత నిగ్రహించి, అట్టి మూర్ఖచర్యలచే ప్రాప్తించే దుఃఖమును సహించటం దేహభావత్యాగం అవదు, అవజాలదు. కనుక జ్ఞాని కూడా దేహం ఉన్నంత వరకు కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియములను, చూపు - వినికిడి మొదలైన జ్ఞానేంద్రియములను ఆయా యథా ప్రాప్తములైన ఆచారములందు నియమిస్తూనే ఉంటాడు. ఉండాలి కూడా! అయితే అతడు మనోబుద్ధులందు సర్వదా సమత్వము వహించి ఉంటాడు. బ్రహ్మదేవుడు మొదలుకొని తదితర జ్ఞానులు, తత్త్వవేత్తలు అందరూ ఈ విధంగానే దేహస్థితియందు నెలకొనియున్నారు. ఎవ్వరైనా సరే ఈశ్వరేచ్ఛను పాటించి తీరవలసిందే కదా!
అజ్ఞ - తత్త్వజ్ఞ భూతాని దృశ్యజాతమిదం హి యత్
తత్సర్వమేవ నియతిం ధావత్యమ్బు యథా అంబుధిమ్ ॥
ఎక్కడ ఏ జలమున్నా చివరికి సముద్రం వైపుగానే పరుగులు తీస్తున్నట్లు, జ్ఞాని అయినా, లేక అజ్ఞాని అయినా జగత్తులోని ప్రాణులందరూ ఈశ్వర నియతినే పాటిస్తున్నారు. ఈశ్వర నియతిని అనుసరించే పరుగులు తీస్తున్నారు.
అయితే జ్ఞానులగువారు తమ తమ మనోబుద్ధులను పరిశుభ్రంగా ఉంచుకుని అంతరంగంలో సామ్యత్వం అవధరిస్తూ ఈ దేహము ఉన్నంతవరకు ఈశ్వర నియతిని పూర్ణముగా పాలిస్తున్నారు. ధర్మాధర్మములను ఈశ్వరానుకూలంగా నిర్ణయించి అనువర్తిస్తున్నారు.
ఇక అజ్ఞానుల విషయమో... వారు చేయవలసివస్తున్న వాటిని, చేయలేకపోతున్న వాటిని తలచుకుని క్షోభ చెందుతున్నారు. 'నేను ఈశ్వర నియతిని పాటిస్తున్నాను కదా'... అనే విషయం ఏమరచి సుఖదుఃఖ దశలకు వశులై, హతాశులై లక్షల కొద్ది దేహాలను ధరిస్తున్నారు. 'మాకు ఇది బాగు, అది కాదు. ఇట్లాగే ఉండాలి, అట్లా ఉండటం ఇష్టముండదు. ఇది మాకు సుఖం, అది దుః ఖం'... అని స్వకీయ నిర్వచన పరంపరలను ఆశ్రయించి ఈశ్వరనియతి యొక్క ప్రభావమేమిటో
Page:440
ఏమరచుచున్నారు. ఫలితం? దేహస్థితి పర్యంతమూ బలవంతంగానూ, అపూర్ణముగానూ ఈశ్వర నియతిని పాలిస్తున్నారు.
ఇత్థం సుభేషు, నను దుఃఖ-దశాసు చేష్ఠం స్థాతవ్యమితి అధిగతం యదిహాఙ్గ జీవైః అజ్ఞజ్ఞభూత నివహస్ఫురితస్తదేవం “దుర్లంఘ్య ఏష నియతో నియతేర్విలాసః” ॥
ఓ రాజా! 'ఈ ప్రాణి ఈ జన్మలో ఈ సుఖస్థితులలో ఉండాలి - - ఆ ప్రాణి ఆ సుఖ-దుఃఖ స్థితులలో ఉండాలి' - అని ఈ ప్రకారంగా ప్రతి ప్రాణి నుదుట ఆయా స్థితి - - గతి విశేషాలన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. నుదుటి వ్రాతను ఎవరు తప్పించగలరు? జ్ఞానికైనా సరే, అజ్ఞాని కైనా సరే, 'నియతి' లేక 'పారబ్ధకర్మ యొక్క విలాసము'ను తప్పించటం ఎవరి తరం?
41. దుర్వాస మహర్షి శాపం
శిఖిధ్వజుడు: హే మహానుభావా! వేదవిద్వరా! మీరు చెప్పినట్లే 'నియతి' లేక ప్రారబ్ద విలాసాన్ని అనుసరించే ఈ ప్రాణులు తెలిసో, తెలియకో అనువర్తిస్తున్నాయి. ఇందులో క్షోభ చెందవలసిన పనేమున్నది? జన్మ - మృత్యువుల మధ్య మాత్రమే కనబడే ఆయా ప్రాప్తాప్రాప్త సంఘటనలను చూచి అజ్ఞాని అంతకుముందే అంతరంగంలో కలిగి ఉన్న సుఖదుఃఖాది నిర్వచనాల ప్రభావం చేత సుఖ-దుఃఖ భావపూరితంగా దర్శిస్తున్నాడు. జ్ఞాని ఈశ్వరేచ్ఛగా దర్శిస్తున్నాడు.
మీరు చెప్పినదంతా యుక్తియుక్తమే. ఇంతకీ ప్రశాంత సమన్వితమగు మీ ముఖంలో కనిపించే ఈ ఉద్వేగమునకు విషాదమునకు కారణమేమిటో వివరించకపోతిరి?
కుంభ ఋషి: తప్పకుండా! ఈ రోజు స్వర్గలోకంలో జరిగిన వృత్తాంతమంతా చెబుతాను. సావధాన చిత్తుడవై విను. నీ వంటి స్నేహితునితో వచ్చిన కష్టమంతా మనస్సు విప్పి చెప్పుకుంటే సగం బాధ తీరిపోతుంది. నిష్కపటియగు నీ ముందు ఉన్నదంతా చెబితేనే ఈ మనస్సు ప్రసన్నత్వం పొందగలదని ఎరిగియే శీఘ్రంగా ఇక్కడికి వచ్చాను. ఇక విను.
నీకు ఈ ఉదయమే ప్రేమపూర్వకంగా పుష్పగుచ్ఛములను సమర్పించి ఇక్కడి నుండి బయలుదేరాను కదా! ఆకాశమార్గమును దాటి స్వర్గలోకంలో ప్రవేశించాను. అమరావతీ నగరంలో నా తండ్రిని దర్శనం చేసుకొని ఆయన వాత్సల్య - ఆశీర్వాదాలు పొందాను. ఇంద్రసభలో అనేక జ్ఞానసంవాదములు విని మరింత పవిత్రుడనయ్యాను. అయితే ఏం? నాలో ఇంకా బాల్యచాపల్యం వదలలేదు కాబోలు... సరే ఈ సంగతికి తరువాత వద్దాం.
సభ శాంతి ప్రవచనాలతో ముగిసింది. ఎందరో ఋషులు, వక్తలు నన్ను ప్రేమపూర్వకంగా పలకరించారు. పెద్దలనేకులికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించి వారి వద్ద ఆశీర్వాదం పొందాను. మరల నా తండ్రి నారదమహర్షిని సమీపించి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం
Page:441
కూడా పొందాను. సభలోని వారందరూ వారి వారి స్థానాలకు బయలుదేరారు. నేను కూడా ఇక మరొక మార్గంలో బయలుదేరాను. క్రమంగా వాయు మార్గంగా మేఘములను స్పృశిస్తూ వస్తున్నాను. వస్తూ వస్తూ ఉండగా నా ఈ దుఃఖమునకు కారణమైన ఒక చమత్కారమైన సంఘటన జరిగింది. శిఖిధ్వజుడు: చెప్పండి మహాత్మా! ఏమిటది?
కుంభ ఋషి: జలపూరితమైన మేఘాల మధ్య నుండి దుర్వాస మహాముని వేగంగా వస్తూ ఉండటాన్ని చూచాను. ఆయనతో నాకు బాల్యం నుండి పరిచయం. నా తండ్రిగారు నారదమహర్షి, ఆ దుర్వాస మహర్షి అనేక భక్తి - జ్ఞాన విషయాలు సంభాషించుకోవడం నేను చాలాసార్లు విన్నాను. ఆయన నన్ను ఎంతో ప్రేమతో ఎప్పుడూ పలుకరిస్తూ ఉండేవారు కూడా!
ఆయన మేఘాల మధ్య నుండి వస్తూ ఉంటే మేఘాలలోని జల బిందువులు నుదిటి పై తాకాయి కాబోలు. ముఖంపై గల గంధం, విభూదిచారల రూపంగా ఏర్పడ్డాయి. తెల్లటి ఛాయగల ఆయన అల్పవస్త్ర సహితదేహం నీలి మేఘాలు ప్రతిబింబంచే నీలపు చీర ధరించిన అభిసారిక (వ్యభిచారిణి)ను గుర్తుచేస్తున్నట్లున్నది.
ఆయనపై నా చూపులు పడీపడకముందే నన్ను చూచి పకపకా నవ్వుతూ పలకరించారు. 'ఏమి కుంభ ఋషీ! భూలోకానికి పోవుచున్నట్లున్నావే? నిన్ను చూచి చాలాకాలమయిందయ్యా'... అని ఆప్యాయంగా పలికారు. నేను ఆయనను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాను. నెమ్మదిగా కళ్ళు తెరచి చూచి తటాలున నవ్వాను. నన్ను ఆయన ఆశీర్వదిస్తూనే, 'ఏమిటి నవ్వుచున్నావు?” అని కించిత్ హాస్యరసపూరితంగా అడిగారు. ఆయన మహానుభావుడని తపోలక్ష్మి యొక్క ముద్దుబిడ్డ అని నాకు తెలుసు. ఆగ్రహ-అనుగ్రహములలో ఆయన ఎంతటివాడో పురాణములను ఎఱిగిన నీకు వేరే చెప్పేదేమున్నది? అన్నీ తెలిసి కూడా బాల్యము నుండి ఆయనతో గల సంభాషణా స్వాతంత్ర్యమును పురస్కరించుకొని యౌవన పరిహాస చాపల్యంచేత మనస్సులో ఏర్పడిన చిలిపి ఆలోచనను అనాలోచితంగా మాటలలో పలికాను.
శిఖిధ్వజుడు: ప్రసంగవశంగా మహానుభావుడగు దుర్వాసమహాముని గురించి వినటం నాకు ఆనందంగా ఉన్నది. మహా తపస్వి, పరమజ్ఞానియగు ఆయనకు సర్వదా శుభమగుగాక! చెప్పండి. అప్పుడేమైనది? మీరు ఆయనతో ఏమన్నారు?
కుంభ ఋషి: నేను ఆయనతో 'ధవళఛాయతో మెరిసే మహా తపస్విని అగు మీ దేహాన్ని చూస్తున్నప్పుడు ఈ రోజు ఏమనిపిస్తోందో చెప్పమన్నారా? నీటి బిందువులు జాలువారుతూ, వాటిలో నీలి మేఘములు ప్రతిబింబించటం చేత మీరు నీలమేఘశ్యాములు అయ్యారు. అంతేగాదు, ఇంకా ఏమని పిస్తుందంటే!” అని కొంచెం వెనుకాటుగా ఊరుకున్నాను. అప్పుడా దుర్వాస మహర్షి చిరునవ్వుతో “ఊ! చెప్పవయ్యా ఏమనిపిస్తోందో?” అని చిరునవ్వు నవ్వారు.
ఇక నేను మనస్సులో మాట ఆపుకోలేక 'జలబిందువులతో కూడి జాలువారే నుదురుపైగల గంధ - విబూదులు, దేహముపై కప్పబడిన నీటి బిందువులలో ప్రతిబింబించే నీలమేఘచ్ఛాయ
Page:442
లోంచి కనిపించే తెల్లటి దేహం అప్పుడే రతిలో పాల్గొనిన అతి సుందరమైన అభిసారికను (వేశ్య స్త్రీని) గుర్తుచేస్తున్నాయి” అని నోరు జారాను.
ఇక ఆ దుర్వాసముని ముఖ కవళికలు మారటం గమనించాను. కొంపమునిగిందని కనిపెట్టేశాను. 'మహర్షీ! క్షమించండి. కోపగించకండి' అని అంటూనే ఉన్నాను.
ఆయన అవేవి వినిపించుకోనేలేదు. 'నారదమహర్షి పుత్రుడవనే గర్వంతో ఏది ఏ దృష్టితో చూడాలో గ్రహించక పెద్దలు, పూజ్యుల పట్ల ఇటువంటి దుర్వాక్యాలు పలుకుతావా! సరే. ఇదే నా శాపం. నీవు ఈ రోజు నుండి ప్రతిరాత్రీ పాలిండ్లతోను, కేశాలతోను, కామభావాలతోను, విలాసపూరిత మైన హావభావాలతోనూ కూడిన స్త్రీ రూపం పొందెదవు గాక!" అని మంత్రజలం సంప్రోక్షించారు.
నేనిక "అయ్యా! స్వామి మునివర్యా! మహర్షీ! ఇదేమి?”...అనే లోపల ఆ ఆ మునివరేణ్యులు అంతర్ధానమైనారు.
ఓ శిఖిధ్వజా! ఈ కారణం చేత నేను ఖిన్నుడనై ఏం చేయాలో తెలియక ఆకాశం నుండి ఇటువచ్చాను. ఆ మహర్షి అమోఘమైన శాపం ఊరికేపోదు కదా! ఇక ఈ రోజు నుండి రాత్రులందు కామభావాలతో కూడిన స్త్రీ రూపం పొందబోవుచున్నాను. ఆ దుర్దశను అనుభవించేదెట్లా? ఎప్పుడైనా రాత్రులందు నా తండ్రికి కనబడితే నేను ఏమని సమాధానం చెప్పాలి?
ఆహా! ఈ సంసారంలో ఉండునట్టి ప్రాణులగతి అతి భయంకరమైనది కదా! ఇక నేను కూడా 'గృధ్రమాంసన్యాయం' వలె (స్నేహంగా ఉన్న గ్రద్దలు మాంసాన్ని చూడగానే ఒకదానికొకటి హింసించుకుంటున్నట్లు) యువకులు చేసే అల్లరి పనులకు ఎఱ కావలసిందేనా? నన్ను అపహరించుకు పోవటానికి ఇప్పుడొక యువకుల సంఘం పుట్టుకొస్తుందేమో? స్వర్గంలో దేవగురువుల ఎదుట, ద్విజుల ఎదుట నిలబడి ముఖం చూపేదెట్లా? రాత్రులందు స్త్రీ దేహంతో నేను ఎక్కడ నివసించాలి?
ఇట్లు పలికిన ఆ కుంభఋషి కొన్ని క్షణాలు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ దుఃఖం ఆపి కళ్ళు తుడుచుకున్నాడు. కొంచెంసేపు ప్రశాంతంగా యోచించి మరల ఇలా అన్నాడు.
కుంభ ఋషి: అయినా మహారాజా! నేనెందుకు ఈ విధంగా దుఃఖిస్తున్నాను? ఈ దేహం రూపమైతే ఏమున్నది? పురుషరూపమైతే ఏమున్నది? ఆత్మకు కలిగే హాని ఏమీ లేదు కదా! ఆయా సందర్భానుచితములైన కర్మలన్నీ ఈ దేహమే పొందుతోంది గాని, నిర్విషయాత్మస్వరూపుడనగు నేను పొందుటలేదు కదా! ఇంకెందుకు దిగులు?
శిఖిధ్వజుడు:
పరిదేవనయాకోర్థో, దేవపుత్ర! తథైతయా?
హే దేవపుత్రా! అదంతా సరేగానీ, ఇప్పుడు విలపించి ఏం ప్రయోజనం? జరగనున్నది జరుగక మానుతుందా? అంతా ఈశ్వరచ్చే కదా!
Page:443
యదాయాతి తదాయాతు దేహస్య, ఆత్మా న లిప్యతే
కాని చిద్యాని దుఃఖాని సుఖాని విహతాని చ తాని సర్వాణి దేహస్య, దేహినో నతు కానిచిత్ ॥
ఈ దేహానికి ఏది కావాలని ఉంటే అదే కానివ్వండి. మీరు చెప్పినట్లు ఆత్మకు దేనితోనూ సంబంధమే లేదు కదా! ఇక ఈ సుఖదుఃఖములంటారా... ఇవన్నీ ఏ నియతిచే విధించబడ్డాయో, అవన్నీ దేహముకొరకే గాని ఆత్మ స్వరూపుడగు 'దేహి' కొరకు కానే కాదు.
హే కుంభమహర్షీ! ఈ ప్రపంచ వ్యవహారాలు చూచి మీరా, భేదం పొందటం? మీరే భేదం పొందితే ఇక ఈ ప్రపంచంలో గల తత్త్వాన్వేషకులకు దిక్కెవరు? శాస్త్ర విషయాలను, స్వానుభవాలను రంగరించి ఆత్మతత్త్వమును ప్రకటించగల ఒక గొప్ప వైద్యునివంటి మీరే ఆత్మ్యానుభవచ్యుతిని పొందితే ఇక మాకు చికిత్సకులు, ఎవరు? మేము ఎవరిని శరణువేడాలి? కనుక ఈ దైన్యత్వం మీకు ఉచితం కాదేమో గమనించండి. అయినా మీరు ఏదో సందర్భానుచితం కాబట్టి ఈ అనుకోని విషాద సంఘటనకు విషాద రసపూర్వకంగా బాహ్యస్పందనం ప్రకటించటం జరిగింది. ఇక యథాస్థితమైయున్న సర్వసమత్వమును, దుఃఖరాహిత్యమును ఎప్పటిలాగే అవధరించెదరు గాక!
ఇటువంటి అనేక వాక్యములచే వారిరువురు పరస్పరం సమాధానపరచుకొంటున్నారు. ఇంతలో “కుంభునకు స్త్రీత్వ ధర్మము కలుగజేయటానికేనా?” అన్నట్లు జగద్దీపకుడగు సూర్యుడు అస్తమాద్రిని సమీపించసాగాడు. క్రమంగా బాటసారులకు మార్గములు కనబడకుండా పోనారంభించాయి. పక్షులు కిలకిల శబ్దాలు చేస్తూ గూటికి చేరనారంభించాయి. ఆత్మ సర్వదా ఏర్పడియే ఉండగా సాంసారిక దృష్టికి అగుపించక, జ్ఞానదృష్టి ఒనగూరుచుండగా స్వయంగా దర్శనమౌతుంది చూచావా? అట్లా నక్షత్రాల ఉనికిని దృష్టికి తెస్తూ కాంతి పుంజాలు ప్రసరించసాగాయి. ఒకవైపు సూర్యుడు అస్తమించుచుండగా మరొకవైపు ఇక్కడ కుంభుని భౌతికదేహం మెల్లమెల్లగా స్త్రీత్వమును ప్రకటించ ప్రారంభించింది. ముందుగా ఆమె కంఠనాదము సున్నితమవసాగింది.
కుంభ ఋషి : ఓ రాజా! చూస్తున్నావు కదా! ఈ వనమంతా వసంతగాలులు వీస్తున్నట్లు ఈ దేహమంతా సిగ్గుతో నిండిపోతోంది. చేతికఱ్ఱ వలె ఈ అవయవములు తోచుచున్నాయి. నీ ఎదుట ఇప్పుడే ఈ దేహం స్త్రీత్వం పొందుతోంది. ఈ కేశములు ఎట్లా వృద్ధి చెందుచున్నాయో చూస్తున్నావా? తామరమొగ్గలు వికసిస్తున్నట్లు నా ఈ వక్షస్థలముపై స్తనద్వయం స్వోన్ముఖమై వృద్ధి చెందుతున్నది. ఈ వస్త్రములు కూడా చీలమండలము వరకు విస్తరిస్తున్నాయే! మహర్షి శాపం ఎంతటి మహత్తరమైనది? ఏమిటిది? స్త్రీలకు యోగ్యమైన ఆభరణములు కూడా తమంతట తామే ఈ దేహముపై వెలువడుచున్నాయే! ఇవి శ్రీదూర్వాస మహర్షి యొక్క శాపసౌందర్య చిహ్నాలు కాబోలు! ఇప్పుడు స్త్రీ చిహ్నములన్నీ కలిగాయి. అయ్యో! ఎంత కష్టతరం! ఇప్పుడు నేను పూర్తిగా అయ్యాను. పిరుదులు, మొల... ఇంతెందుకు, నా అంతఃకరణమే స్త్రీత్వం సంతరించుకున్నది.
Page:444
శిఖిధ్వజుడు కూడా కుంభుడు స్త్రీగా మారటం చూచి కళ్ళ తడిపెట్టుకున్నాడు. ఒక ఘడియ సేపు ఆ ఇద్దరి మధ్య దుఃఖముతో కూడిన మౌనము తాండవించింది... ముందుగా శిఖిధ్వజుడే కొంచెం తేరుకున్నాడు.
శిఖిధ్వజుడు : మహాత్మా! ఇదంతా మీరు చెప్పినట్లు దుఃఖకరమైన పరిణామమే. ఏదన్నా కానివ్వండి. మహాసత్వసంపన్నులగు మీరు తమ జ్ఞానౌన్నత్యమును వీడకుండానే ఈ దేహం విషయంలో స్త్రీగా మారారు. అయితే కానివ్వండి. జ్ఞానానికి దేహానికి సంబంధమేముంటుంది? మీరు ఆత్మవేత్తలు కాబట్టి 'నియతి’ యొక్క అనివార్యత గురించి వేరుగా చెప్పేదేమున్నది? అవశ్యం జరగబోయే విషయాల గురించి మీరు భిన్నచిత్తులు కావద్దు. బుద్ధిమంతులు ఆయా సుఖ-దుఃఖ దశలు ఈ శరీరానికి సంబంధించినవే గాని, తమకు సంబంధించినవి కావని ఎఱిగియే ఉంటున్నారు కదా! మీరు కూడా అట్లాగే ఉండండి. ఇటువంటి ఆయా సుఖదుఃఖానుభవాలను అజ్ఞానులు మాత్రమే చిత్తంలో ప్రవేశించ నిస్తారు. నిత్యానిత్య వివేకజ్ఞానం కలిగిన మీవంటివారు వాటిని దేహ పరిమితమైన వాటిగా చూస్తారు. కుంభ ఋషి : (చిరునవ్వుతో) ఓ రాజా! మీరు చెప్పినట్లే అగుగాక! రాత్రులందు దుర్వాసమహాముని నిర్ణయించినట్లు ఈ స్త్రీత్వమునే ధరిస్తూ ఉంటాను. ఇక దుఃఖం ఎందుకు? ఈశ్వర నియతిని నేను గాని, మరెవ్వరు గాని ఉల్లంఘించగలరా?
ఇట్లా సంభాషించుకుంటూ ఉండగా వారిద్దరి మనస్సులు దుఃఖరహితమైనాయి. ఇక యథా ప్రకారం ఆయా తాత్త్విక విషయాలు చర్చించుకుంటూ అర్ధరాత్రిదాకా గడిపారు. ఉద్వేగరహితులై ఆ రాత్రి గాఢనిద్రకు ఉపక్రమించారు.
చూచావా రామా! ఈ విధంగా ఆ పట్టపు దేవియగు చూడాల పగలు పురుషరూపంలో ఆ శిఖిధ్వజునితో ఆ వనంలో సంచరించేది. రాత్రిపూట అవివాహితయగు కన్యాధర్మమును పాటిస్తూ తన పతికి మిత్రురాలై సంచరించేది. అక్కడినుండి అనేక వనములలో వారిద్దరూ అదే రీతిగా సంచరించేవారు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు సాయంకాలం కుంభరూపంలో చూడాల శిఖిధ్వజునితో ఇట్లా పలికినది.
42. గాంధర్వ వివాహం
కుంభ ఋషి రూప చూడాల: హే శిఖిధ్వజ మహారాజా! ఇప్పుడు నాకొక క్రొత్త ఆలోచన వస్తోంది. నా ఈ వాక్యములు కాస్త ఓపికతో వినండి. నేను ప్రతి రోజు చీకటి పడేసరికి స్త్రీగా మారుచున్నాను కదా! అట్టి స్త్రీరూపమును సఫలం చేయటానికి ఒకానొక పతికి వివాహముద్వారా నన్ను సమర్పణ చేయాలనే ఇచ్చ జనిస్తోంది. ఈ ముల్లోకములలోను నీ ఒక్కడివే భర్తగా నా కిష్టమైనవాడవగుచున్నావు. కాబట్టి నన్ను వివాహం చేసుకొని రాత్రులందు భార్యగా స్వీకరించు. ఎట్టి పరిశ్రమ లేకుండానే ప్రాప్తించిన నీ వంటి మిత్రునితో స్త్రీపురుష సమాగమ సుఖము అనుభవించదలిచాను. దయచేసి
Page:445
ఈ ఆలోచనను అంగీకరించవలసిందని, అడ్డుచెప్ప వద్దని నా మనవి. ఈ 'వివాహం' అనేది సృష్ట్యాది నుండి ఇప్పటి వరకూ ఒక వ్యవస్థగా ఏర్పడియే ఉన్నది కదా! అట్టి మనువు వంటి మహానీయులచే నిర్ణయించబడిన సాంఘిక విధానం, సర్వజనులకు శ్రేయము అయిన ‘వివాహం’ మనం చేసుకుంటే తప్పేమున్నది? పైగా, మనిద్దరి స్వభావం ఒకే తీరుగా ఉన్నది. ఇద్దరమూ కూడా సమస్త వస్తువుల యందు ఇచ్ఛ - అనిచ్ఛలను, వాటికి సంబంధించిన ఆయా ప్రయోజనములను త్యజించియున్నాము. అనగా, ఇచ్ఛానిచ్ఛరహితులమై ఉన్నాం. ఒకరినొకరం దీర్ఘకాలంగా స్వభావపూర్వకంగా ఎరిగి ఉన్నాం. స్నేహితులం. దంపతులం కావటానికి ఇంతకు మించిన అర్హత ఏమి కావాలి? కనుక నా అభీష్టాన్ని చెల్లించమని నా మనవి. ఈ విషయమై నీ ఉద్దేశమేమిటో వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. శిఖిధ్వజుడు : మహాబుద్ధిమంతుడవగు ఓ దేవర్షీ! మీరు ప్రతిపాదించిన దానిలో నాకు శుభంగాని, అశుభముగాని ఏదీ కనబడటం లేదు. మీకు ఎట్లు సమ్మతియో, అట్లే అగుగాక! ఈ నా చిత్తంనందు మీరు బోధించిన వాక్యబలం చేత సమత్వము సుస్థీకరణమయింది. అందుచేత నాకు సర్వము స్వాత్మగానే అనుభవమగుచున్నది. ఇక మీకు ఎట్లా ఇష్టమైతే అట్లే ఆచరించబడుగాక!
కుంభ ఋషి : అట్లా అయితే నేడే శుభలగ్నం. ఈ రోజు శ్రావణపూర్ణిమ కదా! నిన్ననే నేను వివాహ లగ్నాన్ని గణించి నిర్ణయించాను. నేటి రాత్రి పూర్ణచంద్రుడు ఉదయించగానే ప్రారంభపు అమృత ఘడియలలో మనిద్దరికీ గాంధర్వ వివాహం జరుగుతుంది. మన వివాహానికి కావలసిన సరంజామా, ప్రదేశాన్ని నిర్ణయించి అంతా సిద్ధం చేసుంచాను. ఈ పుష్పలతను, ఆ పర్వతశిఖరాలు, ఇక్కడి సెలయేళ్ళు, ఆకాశంలోని పాలపుంతలు మన ఈ వివాహానికి సాక్షులు, బంధువులు అగుగాక! ఇక లేద్దాం. మనం వివాహవేదిక కొరకై ఇంకా కొన్ని ఉత్తమ పుష్పాలు, చందనాది ద్రవ్యాలు ప్రోగుచేసుకో వలసి ఉంది.
ఓ రామచంద్రా! ఈలోగా పూర్తిగా పొద్దుగూకింది. కుంభుడు ప్రతిరోజులాగానే సుందర స్త్రీగా రూపం పొందాడు. ఆ ఇద్దరూ కలసి ఒక ఘడియకాలంలో దేవత, అధిదేవత, ప్రత్యధిదేవతలను పూజించటానికి కావలసిన ఫలపుష్పాలన్నీ సేకరించి వివాహ వేదికాస్థానం జేరారు. ఆ ఇద్దరూ ఆ ప్రక్కనే గల సరస్సులో చక్కగా స్నానాలు ఆచరించారు.
తరువాత వివాహ వేదికను సమీపించి ఆసీనులైనారు. మనోవాక్కులచే దేవత-పితృఋష్యాదులను ప్రతిమాహ్వానం చేసి పూజించారు. ఆ ఇద్దరూ కూడా క్రియా ఫలముల పట్ల ఎట్లు ఇచ్ఛారహితులో, అట్లాగే క్రియాత్యాగము పట్ల కూడా ఇచ్ఛారహితులై ఉన్నారు. సంధ్యావందన -
అఘమర్షణ మంత్రములను సమాప్తం చేసుకున్నారు.
అప్పుడు దేవఋష్యాది పూజానంతరం శాస్త్రోక్త విధిగా వివాహం చేసుకున్నారు. పరస్పరం హృదయసమర్పణ చేసుకున్నారు. లౌకిక మర్యాద పూర్వకమైన ఉత్తమ భోజనములను భుజించారు. ఇంతలో దంపతులకు ప్రధాన సఖియగు ఉత్తరరాత్రి ప్రారంభమైనది. ఉదయించిన సూర్యుని వలె తెల్లని వస్త్రములను ధరించిన స్త్రీ రూపియగు కుంభుడు శిఖిధ్వజుని సమీపించాడు.
రూపిణి యగు కుంభుడు : మానప్రదుడవగుస్వామి! ‘మదనిక' అనే పేరుగల ఈ నీ భార్య నీ కరచరణములకు ప్రీతిపూర్వకంగా నమస్కరిస్తోంది. సిగ్గుతో నిండిన ఈ ఉత్తమ శరీరంతో, చంచల
Page:446
కేశములతో నా అభ్యర్థనపై నన్ను స్వీకరించటానికి అంగీకరించుటచే పరమ ఆప్తుడవైనావు. అంతేకాదు ఉత్తమ భుజాలు గల నీ గంభీరమైన సుందరరూపం నన్ను ఈ సమయంలో కామపీడితగా చేస్తోంది.
ఓ రామచంద్రా! ఆ విధంగా పలికి మదనిక శిఖిధ్వజుని పాదములు స్పృశించింది. శిఖిధ్వజుడు చిరునవ్వుతో ఆమె భుజములను స్పృశించి లేపి ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు మదనిక అక్కడి అనేక సుగంధలేపనాలతో భర్తను మరింత అలంకృతునిగా చేసింది. సుదీర్ఘకాలం దూరమైన ఆ దంపతులిరువురి ప్రణయవాగ్విలాసంతో నాటి రాత్రి కొద్ది క్షణముల వలె గడిచిపోయింది.
ఎప్పుడు తెల్లవారిందో వారికే తెలియలేదు. సూర్యుడుదయించేసరి కల్లా మదనిక మరల కుంభుని రూపం పొందింది. ఆ రోజు నుండి వారిద్దరు పగటి పూట ప్రియమిత్రులుగానూ, రాత్రి యందు ప్రయాతిప్రియులగు దంపతులుగానూ రోజులు గడపసాగారు. అయితే చూడాల మాత్రం 3 రోజుల కొకసారి భర్త నిదురిస్తున్న సమయంలో రాజనగరం ప్రవేశించి, అక్కడి రాచకార్యములన్నీ చక్కబెట్టి మరల ఆ వనంలో భర్త సమక్షం చేరుతూ ఉండేది.
ఆ దంపతులు మహేంద్ర పర్వతముపై ఒక నెల రోజులు గడిపారు. ఆ తరువాత శక్తిమాన్ పర్వతముపైన, మైనాక పర్వతపు దక్షిణ భాగంలోను కొన్ని రోజులు గడిపారు. ఆ తరువాత ఉత్తరకురుదేశంలో 10 రోజులు, ఉత్తర కోసల దేశంలో 27 రోజులు గడిపారు. ఆ తరువాత అనేక ప్రదేశాలు సందర్శిస్తూ పగటిపూట మిత్రులుగానూ, రాత్రిపూట దంపతులుగాను విహరించసాగారు.
ఆ విధంగా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒక రోజు దేవతాపుత్రరూపియగు చూడాల ఇట్లా అనుకున్నది.
చూడాల : (తనలో) ఈ శిఖిధ్వజుడు పరమజ్ఞానియే. ఇందులో సందేహం లేదు. నాతో స్నేహ దాంపత్యాదులు నిర్వర్తిస్తూ కూడా ఏమాత్రం కించిత్ కూడా అజ్ఞాన దృష్టిని గాని, జ్ఞానవ్యతిరిక్తమగు ప్రవర్తన - అభిప్రాయములను కలిగి ఉండటమే లేదు. స్త్రీ సాంగత్యము వలన ఈతనికి ఎట్టి దోష - సాంసారిక దృష్టి ఏర్పడుట లేదంటే ఈతడు మహాజ్ఞానులలో ఒకడుగా రూపుదిద్దుకుంటున్నట్లే! అయితే ఈతని చిత్తములో భోగములకు సంబంధించి ఆశాదులేమైనా ఉన్నాయా? లేవా? ఈ విషయం ఇప్పుడు పరీక్ష చేయాలి.
43. ఇంద్రుని ఆహ్వానం
ఒక రోజు శిఖిధ్వజుడు ఒంటరిగా ఒక నది ఒడ్డున సుఖాసీనుడై కనులు మూసుకుని ఉన్నాడు. కుంభుడు సమీపవనంలోని ఫలపుష్పాలు తేవటానికి అంతకుముందే ఆతని అంగీకారమును తీసుకొని వెళ్ళి ఉన్నాడు.
Page:447
ఇంతలో ఉత్తర దిక్కున గల తెల్లటి మేఘములవైపు నుండి ఏదో నూతన - అత్యాహ్లాదమైన కాంతి పుంజం తన నుదుటిని తాకినట్లు అనిపించింది. “ఆహా! ఏమిటిది?” అనుకొని కనులు తెరచి ఉత్తరం వైపుగా చూచాడు. ఆశ్చర్యం! అతి సున్నితమైన, ధవళఛాయతో ప్రకాశిస్తూ మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకారములను ధరించి ఎవరో దివ్యపురుషుడు తను ఉన్న వైపుగా వస్తున్నట్లు గమనించాడు. 'ఎవరా?'... అని అనుకుంటూ లేచి నిలబడుచుండగా అగ్ని-వరుణ-వాయువు మొ||న అష్టదిక్పాలకులు ఐరావతము మొ॥న చిహ్నములను అనుసరించి ఆ దివ్య పురుషుడు ఇంద్రభగవానుడని ఎవరూ ప్రత్యేకంగా చెప్పకుండానే రాజు గ్రహించాడు. గబగబా కొద్ది అడుగులు వేసి ఆయనకు సుస్వాగతం పలుకుచూ సాష్టాంగదండప్రణామం చేశాడు.
శిఖిధ్వజుడు : హే ఇంద్ర భగవాన్! మీకు జయమగు గాక! మీ పాదాలకు పదే పదే ప్రణామాలు. దివ్య పురుషులు, పరమాత్మయగు మీరు ఈ రోజు ఈ మానవప్రాణికి దర్శనమివ్వటం చేత ఈ శిఖిధ్వజుడు పునీతుడైనాడు. మహాత్ములగు మీవంటి వారి దర్శనం లభించటమనేది మా వంటి వారికి ఊహకందని విషయం. ఈ సేవకుడు మిమ్ములను సేవించి తరించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయినా దేవరాజేంద్రా! తాము స్వయంగా ఇంతదూరం వచ్చే శ్రమ ఎందుకు తీసుకున్నారు? ములోకాలను ఏలే మీరు ఆజ్ఞాపించి ఉంటే నేనే వచ్చేవాడిని. తమ రాకకు కారణమేమిటో ఆజ్ఞాపించెదరు గాక! మీ పాదపద్మాలను సర్వసమర్పణ పూర్వకంగా సేవించటానికి ఈ మీ భృత్యుడు సర్వదా సంసిద్ధుడై ఉన్నాడు. ఇంద్రదేవుడు (చిరునవ్వుతో) : హే శిఖిధ్వజ మహారాజా! సుందర సరోవరం చేత హంసలు ఆకర్షించ బడునట్లు నీ యొక్క ఉన్నతం, పవిత్రం అగు గుణ సంపదచే మేమంతా ఆకర్షించబడి నీ సమక్షానికి వచ్చాం. ఇక లే! స్వర్గమునకు పోవుదము. అక్కడ దేవతాస్త్రీలు నీయొక్క పుణ్యగుణ సంపదకు ఆకర్షితులై, ఉత్కంఠతో నీ రాకకై ఎదురు చూస్తున్నారు. నీ కోసం దేవదూతలు సిద్ధపాదుకలు, సిద్ధ గుటిక, సిద్ధ ఖడ్గము, రసాదులు తెచ్చియున్నారు. నీవు వాటిని స్వీకరించి సిద్ధమార్గం గుండా స్వర్గ మండలం చేరుటకు అంగీకరించు. నిన్ను ఆహ్వానించటానికే మేమందరం వచ్చాం. నీవు ఈ జీవన్ముక్త రూపంలో దేవతల నివాసములందు అనేక భోగాలు నీకు ఇష్టమున్నంతకాలం అనుభవించవచ్చు. నీ వంటి సాధుమహాత్ములు స్వయంగా ప్రాప్తించే ఐశ్వర్యాలను తిరస్కరించరు కదా! అట్లాగే ప్రాప్తించని ఐశ్వర్యాలను కాంక్షించరు. విష్ణుమూర్తి యొక్క సంచారంచే ముల్లోకాలు పవిత్రమైనట్లు నీరాకచే మేమంతా ఎంతో ఆనందించబోతున్నాం. ఇదిగో దివ్యరథం. అధిరోహించు. నీకు స్వర్గానికి సుస్వాగతం. శిఖిధ్వజుడు : దేవేంద్రా! నన్ను స్వర్గమునకు ఆహ్వానిస్తున్నందుకు, అందుకు అంతటి మీరే స్వయముగా వచ్చినందుకు మీకు కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నాను. అయితే నాపై దయతో నేను చెప్పేది ఆలకించవలసినదిగా సమర్పించుకుంటున్నాను. నా ఈ హృదయ పూర్వక పుష్పాంజలులు, వినమ్రపూర్వక పాదస్పర్శ ప్రణామములు మరలమరల స్వీకరించ ప్రార్థన.
నాకు అన్ని స్థానములు సర్వ సంపదలతో కూడిన స్వర్గంతో సమానంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు నేను గాంచుచున్న పరమానందయుక్తమగు 'చిదాత్మతత్త్వము' అనే స్వర్గము అంతటా
Page:448
విస్తరించి ఉన్నదేగాని అది ఒకచోట పరిచ్ఛిన్నమై ఉన్నది కాదు. నేను దర్శించే, ఉపాసించే ఆత్మానందం సర్వలోకాలకు - సర్వప్రదేశాలకు సర్వదా విస్తరించి, వేంచేసియే ఉన్నది. కాబట్టి హే ప్రభూ! నేను ఎక్కడున్నప్పటికీ సంతుష్టుడనై ఉన్నాను. సర్వత్రా క్రీడించుచునే ఉన్నాను. నా మనస్సు ఇచ్ఛారహితమై ఉండటం చేత సర్వత్రా ఆనందమయంగా కనిపిస్తోంది. ఆత్మానందాన్ని ఆస్వాదిస్తోంది. సర్వత్రా సర్వదా ఆక్రమించుకున్న బ్రహ్మానంద సాగరము కొరకై ఒకానొక పరిచ్ఛిన్నమైన ప్రదేశమునకు వెళ్ళవలసిన పనేమున్నది? కాబట్టి స్వర్గమును జేరి అక్కడ క్రొత్తగా పొందవలసినదేదీ కనిపించటం లేదు. కనుక నన్ను క్షమించవేడుకొనుచున్నాను. మీ ఆజ్ఞను నెరవేర్చనందుకు నన్ను క్షమించ ప్రార్థన. ఇంద్రదేవుడు : ఓ శిఖిధ్వజా! మరొక్కసారి ఆలోచించు. ఇట్టి అవకాశం అత్యంత దుర్లభం. నీ వంటి విదితవేద్యులు పరిపూర్ణబుద్ధి సమన్వితులు అగు మహాత్ములు భోగాలను సేవించటం, సేవించక పోవటం ఒకే తీరుగా చూస్తారు కదా! సజ్జనులు ప్రారబ్ధకర్మ అనుభవించి క్షయింపజేసు కోవటమే యోగ్యమని అనుకుంటూ ఉంటారు. నీవు కోరకయే విధివిలాసంగా ఈ ఆహ్వానం లభించింది. కనుక స్వీకరించటమే ఉచితమని నేను అనుకుంటున్నాను.
శిఖిధ్వజుడు : ... (మౌనంగా ప్రశాంతతను వహించియే వినమ్రుడై నిలుచున్నాడు)
ఇంద్రదేవుడు: ఓ శిఖిధ్వజ మహారాజా! మీరు మౌనం వహించి స్వర్గమును స్వీకరించుటకు ఇచ్ఛగించకుంటే నేనిక వెడలుటయే యుక్తం కదా!
శిఖిధ్వజుడు : "ఇప్పుడు కాదు. మరొకసారి మీ దర్శనం ఆశ్రయించి వస్తాను'... అని మర్యాద క్రమమును అనుసరించి అంటూ ఉండగా, ఇంతలో ఇంద్రదేవుడు ఆ వాక్యములను చివరి కల్లా వినకుండానే సాంగ-సపరివారసమేతంగా అంతర్థానమైనాడు.
"కుంభుడా! నీకు శుభమగు గాక!" ...అను వాక్యం మాత్రం ఆ దేవతలు విచ్చేసిన మార్గం నుండి పదే పదే మృదుమధుర స్వరంతో గానరూపంగా వినిపించింది. కొద్ది క్షణముల తరువాత కుంభుడు శిఖిధ్వజుని సమీపించాడు. శిఖిధ్వజుడు చెప్పుచుండగా జరిగినదంతా విని, ఆ కుంభుడు రాజు భుజములను మెచ్చుకోలుగా తట్టాడు.
చూడాల తన అంతరాంతరంలో తన భర్త స్వర్గ సుఖాదుల పట్ల చూపిన ఉదాసీనతను, ఆతని మనస్సు భోగేచ్ఛల పట్ల వశీభూతం కాకపోవటాన్ని చూచి చాలాచాలా సంతోషించింది. చూడాల(తనలో) : ఈ రాజు మనస్సు ఇంద్రుని ఆగమనమును క్షోభరహితంగాంచింది. ఈతని బుద్ధి ఉత్తమ నిర్ణయాన్ని, నిశ్చయాన్ని ఆశ్రయించి ఉన్నది. ఇంద్రుని పూజించుట మొదలైన లౌకిక కర్మలను పాటిస్తున్నప్పుడు శ్రద్ధను కూడా వీడలేదు. కనుక ఈతడు “భోగములు” అను మనస్సు యొక్క విభాగాన్ని పూర్తిగా జయించినట్లే! అయితే ఇంకొక ముఖ్యమైన పరీక్ష చేయవలసి ఉన్నది. ఈ జీవుని హృదయం లోంచి ఎందుకో 'ఇది నాది... నాకే చెందినది' అనే ఒకానొక అజ్ఞాన నిర్మిత మైన లోభగుణం పుట్టుకొస్తోంది. ఇక అక్కడి నుండి అతి విలువైన జీవితమనే అవకాశాన్ని అల్ప
Page:449
వస్తువుల కొరకై అల్పచింతనలతో వృథా చేసివేసుకుంటున్నాడు. సత్యము - నిత్యము అగుదానిని ఏమరచి నిష్కారణంగా దుఃఖమహా సముద్రంలోనికి తనను తానే త్రోసివేసుకుంటున్నాడు. దుష్ట గుణములు కలవాడు సాత్వికుని వేషం వేసినట్లు, లోభగుణం - లోపల విషమును కలిగి ఉండి - -
పైకి మాత్రం విజ్ఞులను కూడా "అవును! అవసరం కదా! లేకపోతే ఎట్లా?... ఆ మాత్రం ఎవరికైనా అనిపిస్తుంది”... ఇత్యాది రూపంగా మోసగిస్తోంది.
లోభం నుండి క్రోధం, క్రోధం నుండి మోహం పుట్టుకొస్తున్నాయి. ఆత్మానుభవానికి ఈ లోభ - క్రోధ - మోహాలు రెండు గొప్ప అడ్డులు కదా! మరి నా భర్త ఈ లోభ-క్రోధ-మోహాలను జయించాడో, లేదో ఒక చివరి పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో నెగ్గాడా, ఇక ఈయనకు నేను చెప్ప వలసినదేమీ లేదు. అప్పుడు చూడాల రూపంలో ఈయనను సమీపించి చేసినదంతా చెప్పివేస్తాను. ఇక ఈ ఉపాధికి శేషించియున్న కాలమంతా ఈయన సేవలో-సాంగత్యంలో గడిపి, ఆ తరువాత విదేహముక్తిని ఆశ్రయిస్తాను. ఈయనతో ఉండటమనేది అడవులలోనైనా ఫరవాలేదు, లేక, రాజ్యంలో నైనా ఫరవాలేదు.
ఈ జగత్తులోని బాహ్య శత్రువులైతే దూషణ - - తిరస్కారాదుల ద్వారా అహంకార జాడ్యం, మదం ప్రకోపించకుండా ఉండటానికి సహకరించి ఒక విధంగా మహోపకారమే చేస్తున్నారు. వారి వలన మహా అయితే, కొంచెం అవమానమో, లేక, ఒక్క ఉపాధికి హానియో మాత్రమే కలుగుతుంది. అదే అంతర్ శత్రువుల విషయమేమిటి?
ఓయీ! జీవుడా! “కామ-క్రోధ-మోహ-లోభ-మద-మాత్సర్యములచే 6 గురు అంతర్ శత్రువుల గురించి పట్టించుకోకుండా ఎక్కడో బాహ్య శత్రువుల పేర్లు మననం చేసి గంతులు వేస్తావేం? పరమానందము, ప్రతి జీవుని సొత్తు అగు ఆత్మానుభవమును నీకు కాకుండా చేస్తున్నది బాహ్య శత్రువులు కాదు. నీ అంతరంగంలో మారు వేషాలలో తిష్ట వేసుకున్న ఈ “అరిషడ్వర్గములు (6 శత్రువర్గములు) గురించి ఏం చేయాలో యోచిస్తున్నావా?” అని శాస్త్రకారులు నిలదీసి ప్రశ్నిస్తున్నారు.
కనుక జ్ఞాన సమన్వితుడు, మహాత్యాగి, జగద్విషయములకు అలభ్యుడు అగు నా భర్త శిఖిధ్వజుని శ్రేయస్సు కోరి ఈ చివరి పరీక్ష పెడతాను.
44. తుది పరీక్ష
ఇంద్రుని ఆగమన - - నిష్క్రమణముల తరువాత కొద్దిరోజులు ఎప్పటిలాగానే కాలగర్భంలో కలిసిపోయాయి. చూడాల పగటిపూట కుంభుని రూపంలోనూ, రాత్రిపూట మదనిక రూపంలోను శిఖిధ్వజునితో ఇటు తాత్త్విక చింతనలు, అటు ఉత్తమ దాంపత్యమును కూడా నిర్వర్తిస్తోంది.
ఒక రోజు సాయంకాలం అయినది. క్రమంగా సూర్యుడు అస్తమించుచుండగా కుంభుడు పరమేశ్వర పూజ కొరకై పూలు, పళ్ళు తదితర సరంజామా తేవటానికి వన ప్రదేశాలలో ప్రవేశించాడు. శిఖిధ్వజుడు అతని రాకకై వేచి ఉన్నాడు.
Page:450
ఎంతసేపటికీ కుంభుడు రాకపోయేసరికి సాయం సంధ్యాసమయం అగుటచే సాయం సంధ్యావందనం నిర్వర్తించటానికి శిఖిధ్వజుడు సమీపంలోగల ఒక నదీ తటమును సమీపించాడు.
ఎప్పటిలాగానే భక్తి ప్రవత్తులతో సంధ్యావందనాన్ని, అఘమర్షణ జపాన్ని నిర్వర్తించి ప్రశాంత చిత్తంతో అడుగులు వేస్తూ తాము అక్కడ నివసిస్తున్న వసతి ప్రదేశం వైపుగా వస్తున్నాడు. త్రోవలో ఒక కొండ శిల ప్రక్కగా వస్తూ ఉండగా బాటకు సమీపాన గల ఒక లతా గృహం నుండి ఏవో పకపకలు వినిపించాయి. యాదృచ్ఛికంగా అటు చూస్తే అక్కడ మదనిక కనిపించింది. 'ఓహో! ఇక్కడున్నావా! ఇంత ఆలస్యమేమిటి?'... అని అంటూ అటువైపుగా నాలుగైదు అడుగులు వేశాడు.
అక్కడ కనబడిన దృశ్యం చూచి కొంచెంసేపు ఆగాడు. అక్కడ లతా గృహ ప్రవేశ ప్రాంతంలోగల ఒక పూల శయ్యపై పుష్పాలంకృతుడైన ఎవరో పురుషుని తొడలపై తల ఉంచి మదనిక సరససల్లాపాలు ఆడుతోంది. ఆ వ్యభిచార పురుషుడు, ఆ మదనిక లోకములను మరచి పరస్పర హాస్యయుక్తములగు ముఖాలతో సంలగ్నులైయున్నారు. ఒకరి కరస్పర్శతో మరొకరు ప్రేమానందమును అనుభవిస్తున్నారు. ఆ పరస్పర కామపీడిత చర్యలను కొద్ది క్షణములు గమనించిన రాజు కించిత్ కూడా ఉద్వేగం పొందలేదు. పైగా ప్రసన్నతతో కూడిన ముఖకవళికలతో 'ఆహా! ఈ వ్యభిచార స్త్రీ - పురుషులిద్దరూ ఎంత సుఖవంతులై ఉన్నారు!' అని తలచుచూ వెనుతిరిగాడు.
ఈలోగా ఆ వ్యభిచారులిద్దరి చూపు రాజుపై పడింది. రాజును గమనించిన మదనిక ఒక్కసారి ఉలిక్కిపడింది. పైట సర్దుకుంటూ ఆ విటుని భుజములపై నుంచి చేతులు వెనక్కు తీసుకున్నది. తటాలున అతనిని విడచి, పూశయ్య నుండి నేలపైకి దిగి నిలబడింది. అప్పుడు శిఖిధ్వజుడు అది గమనించి, వెనుకకు పోవుచూ, అడుగులు వేస్తూనే ' ఓ ప్రియురాలా! మదనికా! మీరిద్దరూ సుఖ వంతులై ఉండండి. నన్ను చూచి భీతిల్లవలసిన పని లేదు. నేను మీకు విఘ్నమును కలిగించను’... అని పలికాడు. కొంచెం వేగంగా కూడా నడవటం ప్రారంభించాడు. అప్పుడు మదనిక ముఖంలో విటుని సమాగమం చేత ఏర్పడిన ప్రసన్నత, 'రాజు మనస్సును వ్యాకులపరచాను కదా' అనే వ్యాకులత - రెండు ఒక్కసారే అత్యధికంగా ప్రస్ఫుటమయ్యాయి. ఒక చేతితో పైట, చీరకుచ్చెళ్ళు సర్దుకుంటూనే రాజు వెళుచున్న వైపుగా వేగంగా పరుగులు తీసింది. "రాజా! ఎక్కడున్నారు? ఈ మదనిక మీ మనస్సుకు కష్టం కలిగించింది కదా! మీరు ఈ నీచురాలిని క్షమించకండి. మీ చేతుల మీదుగా తుదముట్టించండి! మీరంటే నాకు ప్రేమ తగ్గలేదు. మీరు ఎటు వెళ్ళారో నేను గుర్తించలేకపోతున్నాను. దయచేసి బదులు పలకండి. నేను మీకు చెప్పుకోవలసినది ఒక ముఖ్యమైన మాట ఉన్నది. ఆ తరువాత మిమ్ములను ఇంకేమీ కోరను. ఓ రాజా! ఓ రాజా! నా అరుపులకు బదులు ఇవ్వరూ! నేను చెప్పుకునేదేమిటో ఒక్కసారి వినే అవకాశం ఇవ్వరూర? మీ వంటి చక్రవర్తి నేరం ఆపాదించ బడినవాడు చెప్పుకునేదేమిటో వినకుండా శిక్షను ఖరారు చేయరు కదా!" అని పెద్దగా కేకలు పెట్టుచూ అటూ ఇటూ తిరగసాగింది. రాజు జాడ కనిపించనే లేదు. అయినా అక్కడ గల రెండు మూడు బాట-ఉపబాటలలో వేగంతో కూడిన అడుగులతో తిరుగసాగింది. ఒక అరగంట గడచిన తరువాత ఒకచోట శిఖిధ్వజుడు కనిపించాడు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో బంగారు ఛాయతో
Page:451
మెరిసే శిలా ఖండముపై కూర్చుని సమాధి తత్పరుడైయున్నాడు. చంద్రుని చల్లటి కాంతులతో ఆతని దేహ కాంతి ఏకత్వము పొందినదా - - అని అనిపిస్తోంది.
మదనిక నెమ్మదిగా శిఖిధ్వజుని సమీపించింది. ఆమె వెక్కివెక్కి ఏడ్చు సన్నటి శబ్దములు మాత్రం ఆపుకోలేకపోతోంది. కొద్ది క్షణములకు ఆ శబ్దములు శిఖిధ్వజుని చెవిని సోకుటచే నెమ్మదిగా కనులు తెరచి చూచాడు. ఎదురుగా మదనిక నిలబడి ఉన్నది. ప్రశాంతంగా నాలుగు వైపులకు ఒక్కసారి కలియజూశాడు.
శిఖిధ్వజుడు : ఏమి మదనికా! ఇంత త్వరలో ఇక్కడున్నావేమిటి? మీ పరస్పర ప్రేమాభిలాషకు ఎవరైనా విఘ్నం కలిగించారా ఏమిటి?
మదనిక : .హూ!
శిఖిధ్వజుడు : ఈ జగత్తులో ప్రతిప్రాణి కూడా ఆనందము కొరకే అఱ్ఱులు చాచుచున్నది. పోయి ఆ వ్యభిచార పురుషుని నీ ప్రణయవృత్తులతో సంతుష్టిపరచిరా.
మదనిక : హే రాజన్!...
శిఖిధ్వజుడు : ...? ఓహో! నీ కృత్యమును చూచి నాకేమైనా క్షోభ కలిగిందేమోనని దుఃఖిస్తున్నావా? లేనేలేదు. ప్రపంచంలో ఏఏ ప్రియమైన వస్తువులున్నాయో... అవన్నీ కూడా అందరి ఆనందము కొరకేనని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. అందుచేత, నాకు ఏమాత్రం మనఃస్తాపం కలుగనే లేదు. కనుక, నీవు బిడియపడక ప్రారంభించిన ప్రేమకార్యమును నిర్వర్తించియే రా.
నీ వంటి సుందర స్త్రీని చూచి ఈ ప్రమోదవాతావరణంలో ఆ విటుడు ఆకర్షించబడటం నాకు ఆశ్చర్యం కలిగించటం లేదు.
ఏమిటి నీ సందేహం? ఓ! నాతోటి స్నేహం గురించా? నా మిత్రుడు కుంభుడు వీతరాగుడు. సర్వానికి అతీతత్వం, సాక్షీమాత్రం అనువర్తించే మహాయోగి. ఇక నీవో, దుర్వాసమహాముని శాప సంకల్పంచే కల్పించబడిన చంచలస్వభావంతో గూడిన స్త్రీవి. కుంభర్షి సాన్నిధ్యముచే ఏర్పడిన విజ్ఞానానుభవం నాకు చెక్కుచెదరుట లేదు. కనుక 'మదనిక' అను స్త్రీ ఉపాధి ధరించిన ఇప్పటి నీవు ఏది చేయదలచుకుంటే అదియే నిస్సందేహంగా నిర్వర్తించవచ్చు. కాబట్టి వెళ్ళిరా. ఆ నీ విటుని కామ పీడితుని చేసి తద్వారా దుఃఖింపజేయడం విషయంలో ఉచితానుచితాలను నీకే వదిలివేస్తున్నాను.
ఇట్లు పలికి శిఖిధ్వజుడు మౌనమును వహించాడు. ఆ మాటలు విన్న మదనిక కొంచెం కుదుటపడి దుఃఖము నుండి ఉపశమనం పొందింది.
మదనిక : మహాత్మా! మీరు చెప్పినమాట నిజమే. స్త్రీ స్వభావము అతి చంచలమైనది. పైగా స్త్రీకి పురుషుని కంటే 8 రెట్లు అధికంగా కామం ఉంటుందని కామశాస్త్రములు అంటూ ఉంటాయి. శిఖిధ్వజుడు : (మౌనంగా, నిర్లిప్తంగా, నిర్వికారంగా ముఖ ప్రదర్శనం చేస్తూ మర్యాద కొరకు మాత్రమే అన్నట్లుగా కొంచెం ముఖకవళికను ప్రదర్శించాడు).
Page:452
మదనిక : అందుచేత నాపై ఏమాత్రం కినుక వహించటం మీ వంటి జ్ఞానులకు భావ్యం కాదు. నాపై కోపం లేకుండా నేను చెప్పేది వినవలసిందిగా నా మనవి.
నేను మీకు చెప్పే, పూలకొరకై వనంలోకి వెళ్లాను కదా! తిరిగి వచ్చి చూచేసరికి మీరు కనబడలేదు. అప్పుడు మీరు సాయంసంధ్యావందనానికి నదీతటం వైపుగా వెళ్ళి ఉంటారని అనుకుంటూ... అటువైపుగా నేను కూడా వద్దామని బయలుదేరాను. ఈలోగా, ఎక్కడినుండి వచ్చాడో, ఆ కాముకుడు నన్ను సమీపించి సమాగమం కొరకై అతిదీనంగా ప్రార్థన చేశాడు. నా సౌందర్యమును శృంగారపరిభాషలో వర్ణించనారంభించాడు. అబలనైనట్టి నేను ఆ పరిస్థితులలో ఏమి చేయగలను చెప్పండి?
ఒక స్త్రీ వివాహిత కావచ్చు, అవివాహిత కావచ్చు. అటువంటి ఏకాంత ప్రదేశంలో అంతటి రసికావేశం గల కాముకుడు ఎదురుపడినప్పుడు చేయగలిగినదేమైనా ఉంటుందా, కాస్త ఆలోచించండి! భౌతికంగా బలవంతుడగు అట్టి జారుని ప్రేమావేశాన్ని నిరోధించటమెట్లా?
శిఖిధ్వజుడు : (అత్యంత సౌమ్యంగా గడ్డంపై చేతులు పెట్టుకుని ఎటువంటి భావన ప్రదర్శించకుండానే వింటున్నాడు. కళ్ళు మాత్రం అపరిచయస్తుని చూస్తున్నట్లు ఏ భావనా లేకుండా ఉన్నాయి)... మదనిక : ఈ సమయంలో మరొకమాట కూడా చెప్పాలి. స్త్రీలో సౌందర్యం లేకపోవటమే పురుషుల అసంగమమునకు హేతువు కావచ్చుగాని, ఏ స్త్రీలో కామశాస్త్ర ప్రవచనములగు శృంగార లక్షణములు ఉంటాయో, అట్టి స్త్రీని ఏకాంతములో చూచినప్పుడు ఎవరికైనా సరే, కామోద్రేకం తప్పక కలుగగలదు. అందుచేత ఆ విటుని దూషించటం కూడా సందర్భానుచితం కాదని నా మనవి.
పైగా, ఏకాంత ప్రదేశంలో స్త్రీ పురుషులు తారసపడినప్పుడు వారిలో కామభావాలు కలుగ కుండా ఉంటాయా? అట్టి సమయంలో క్రోధ, నిషేధ, ఆక్రందనములు గాని, పాతివ్రత్యాది సాంఘిక వాదుల ప్రవచనాలు గాని జరుగవలసినదానిని నిరోధించలేవని నేను అనుకుంటున్నాను.
హే నాథా! అయినదేమో అయినది. నేను అబలను. చిన్నదానిని. మూఢురాలిని, అపరాధిని. కాబట్టి నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ అటువంటి తప్పు చేయను. 'కామం', 'కామచాంచల్యం' అను వికారాన్ని ఇప్పటికిప్పుడు త్యజించివేస్తున్నాను. సాధుజనులు క్షమాశీలురు కదా! అందుచేత మీ సాంగత్యం నుండి నన్ను దూరం చేయకండి. మరింకేదైనా శిక్ష మీరు విధిస్తే అది నాకు శిరోధార్యం. శిఖిధ్వజుడు : ఓ బాలికా! ఆకాశంలో వృక్షం ఉండదు కదా! అట్లాగే నా అంతః కరణంలో కించిత్ కూడా ఎవరి విూదా ఏ కోపం లేదు. అయితే సాధుజననింద్యమై ఉండటం చేత నేను నిన్నిక భార్యగా మాత్రం స్వీకరించదలచలేదు. పూర్వంలాగానే వీతరాగులగు మిత్రులుగా ఉండటానికి మాత్రం నేను నిస్సందేహంగా సంసిద్ధుడనే.
Page:453
45. చూడాల - - శిఖిధ్వజ సమాగమం
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా ! అప్పుడు చూడాల తనలో ఇట్లా అనుకోసాగింది.
చూడాల : (తనలో) ఆహా ! నా భర్తయగు ఈ శిఖిధ్వజుడు అత్యుత్తమమగు ఆత్మ పదమును ఇంత త్వరగా సంపాదించుకోవటం ఎంతటి పవిత్రమైన విషయం. ఈ మహాత్ముడు పూర్ణకాముడైనాడు. గొప్ప గొప్ప భోగములుగాని, మహత్తరమైన సిద్ధులు గాని, ఇంద్రలోకవాసం వంటి సుఖ సంపదలు గాని, సుఖదుఃఖములు గాని, సంపద- ఆపదలు గాని, ఈతని చిత్తమును హరించలేకపోతున్నాయే! నారాయణుని లక్ష్మీదేవి ఆశ్రయించినట్లు శాంతి, ధైర్యము, క్షమ, తృప్తి మొదలైన సమస్త జీవన్ముక్త లక్షణాలు ఈతని యందు వచ్చి చేరాయి.
కాబట్టి ఇప్పుడు నా వృత్తాంతమంతా స్మరింపజేయటానికి ఉచితసమయం ఆసన్నమయినట్లే. ఇక నేను కుంభరూపము కొనసాగించవలసిన అవసరమే లేదు.
ఇట్లా తలచి పరమజ్ఞానియగు ఆ చూడాల అప్పటికప్పుడే మదనిక రూపమును త్యజించి చూడాల రూపం ధరించి ఆ రాజు ఎదుట నిలచింది. రాజు చూడాలను చూచాడు. వికసితనేత్రుడై కొంచెం ఆశ్చర్యమును ప్రకటించాడు.
శిఖిధ్వజుడు: ఓ సుందరీ! నీ వెవరు? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? నీవు వచ్చి ఎంతసేపైనది? ఈ ప్రదేశంలో నిన్నెపుడూ చూడలేదే ! ఈ ప్రాంతం చాలావరకు నిర్జనమైనది కదా! జన ప్రదేశం నుండి ఇంతదూరం ఎందుకు వచ్చావు? నిన్ను ఎక్కడో చూచినట్లు, నాకు బాగా పరిచయమున్నట్లు అనిపిస్తోంది. నిజానికి మాళవదేశాన్ని ఏలుతున్న రాణి చూడాలలా ఉన్నావు?
చూడాల: ప్రభూ ! నేను నిజంగా చూడాలనే. నేడు నా స్వాభావిక దేహంతో మీ సమక్షంలో నిలబడ్డాను. మీకు బోధించటానికి వచ్చిన కుంభుడను నేనే. అదంతా నా మాయా రచన మాత్రమే. కొద్ది క్షణాల క్రితం మీరు చూచిన మదనిక ఎవరనుకుంటున్నారు ? నేనే ఆ రూపమును మీ ముందు ప్రకటించాను. “ఇంద్రుడు పరివారసమేతంగా మీ దగ్గరకు రావటం” అనేదంతా మీముందు ప్రదర్శించింది నేను సముపార్జించిన యోగశక్తి యొక్క కల్పితమాయ మాత్రమే. మీ దగ్గర నుండి కుంభునిరూపంలో సెలవు తీసుకుని వెళ్ళినది ఇంద్రసభకు కాదు. మన రాజధానికి వెళ్ళి రాచకార్యాలు చక్కబెట్టటం కోసమే.
మీరు మోహవశం చేత రాజ్యమును వదలి ఒంటరిగా వనములోని ఏకాంత ప్రదేశం చేరి తపస్సు ప్రారంభించారు. పద్దెనిమిది ఏళ్ళు గడచినా రాలేదు. మరి నేనేంచేయాలి ? రాజ్యపాలనా ధర్మం మీది కాని, నాది కాదు కదా ! నేను మిమ్ములను సేవించి తరించుట కొరకే ధర్మవశముగా
Page:454
నియమించబడ్డదానను. మీ సహధర్మచారిణిని అవటం చేత మీ రాజ్యపాలనాధర్మాన్ని నేను నిర్వర్తించాను. అయితే మీ సహచర్యమునకు నేను అర్హురాలనై ఉన్నాను కదా! పైగా, అన్ని సంవత్సరములు గడిచినా మీరు సూక్ష్మము - - అనునిత్యము అగు అప్రమేయాత్మతత్త్వమును గ్రహించటం లేదు. మీరు రాజ్యమును త్యజించియున్న సమయంలో యోగాభ్యాసంచే సంపాదించిన సిద్ధులను ఉపయోగించి మీకు మహాత్యాగ రూపమగు సంసారాతీతత్వమును విశదీకరించి మీ జ్ఞానానుభవమునకు సహకరించాలని నాకు అనిపించింది. మనిద్దరి దాంపత్యము పరిఢవిల్లుచుండగా, మన జ్ఞానము పరమపవిత్రము కాగా... ప్రారబ్ధమును పరిపూర్ణం చేసి ఉచితమైన సమయంలో మీతోబాటే విదేహముక్తిని ఆశ్రయించాలనేది నా ఉద్దేశం. అందుకే ఈ మాయా రచనను కొనసాగించి ఇప్పటిదాకా ఆ తంత్రాన్ని నడిపాను. ఇప్పుడు మీరు పరిపూర్ణ జ్ఞానులైనారు. ఆత్మానాత్మ వివేక సమన్వితులైనారు. పరోక్షజ్ఞాన దశ నుండి సర్వ రాగద్వేషములను జయించి అపరోక్ష జ్ఞానార్హత పొందారు. ఇప్పుడు మీరు అనుభవసమన్వితులగు జ్ఞానులలో అగ్రగణ్యులైనవారిలో ఒకరైనారు. మాయా రచన యొక్క ఉద్దేశమైనట్టి ఆత్మజ్ఞానాన్ని పొందారు. అందుకే నేను కల్పించిన మాయనంతా ఉపసంహరించి మీ ముందు వినమ్రురాలినై నిలబడ్డాను.
శ్రీవసిష్ఠ మహర్షి : శ్రద్ధగా ఆలకిస్తున్నావా రామచంద్రా ! ఆ శిఖిధ్వజ మహారాజు అకస్మాత్తుగా చూడాల కనబడటం, కుంభ-ఇంద్ర-మదనికాదులు తన మాయా కల్పన మాత్రమేనని చెప్పటం... ఇవన్నీ విని ఆశ్చర్యపోయాడు. అప్పటికప్పుడే కనులు మూసుకొని ధ్యాననిష్ఠుడైనాడు. యోగనేత్రంతో పద్దెనిమిది సంవత్సరాల కాలంగా వర్తమాన క్షణం వరకు చూడాల నిర్వర్తించిన కార్యపరంపరలన్నీ కొద్ది నిమిషాలలో దర్శించాడు.
సమాధి నుండి మేల్కొన్నాడు. హర్షాతిశయంతో కనులు తెరిచాడు. అతిస్నేహభావయుతుడై ఆనందబాష్పాలు వదలుచు చూడాలను సమీపించి ఆమెను కౌగిలించుకున్నాడు. అప్పటి ఆ ఇరువురి పరస్పరానురాగం వర్ణించాలంటే వేయి నాల్కలుగల ఆ ఆదిశేషునికి మాత్రమే సాధ్యమేమో! ఆ దంపతులిరువురు పులకాంకిత శరీరులై ఒకరి కౌగిలిలో మరొకరు చాలా సేపు ఉండిపోయారు. ఆ తరువాత ఒకరి నుండి మరొకరు విడివడి మౌనభాష కళ్ళలో ప్రదర్శిస్తూ ఒకరినొకరు చూచుకుంటూ ఉండిపోయారు. మాటల కందని మధురభావాలు ఒకరినుండి మరొకరిని ముంచెత్తాయి.
శిఖిధ్వజుడు : హే ప్రియురాలా! చూడాలా! ముగ్ధవు, బాలికవు అగు నీవు నీ మాయా రచనాది శ్రమలచే ఇంతటి అనురాగ ప్రవాహం వర్షిస్తావనేది నేను ఊహించనైనా లేదు. ఈ నీ పతి కొరకు ఇన్ని సుదీర్ఘ సంవత్సరాలు ఎన్నో క్లేశములు అనుభవించావు! దుస్సహమైనట్టి సంసార ప్రవాహంలో పడిన నన్ను ఏ మహోన్నత బుద్ధితో రక్షించావో అట్టి బుద్ధి - తెలివిలతో పోల్చగలిగినదేదీ నేను చూడలేదు, వినలేదు, ఊహించటం కూడా నా వల్ల కాదు. అరుంధతి, శచి, గౌరి, గాయత్రి, లక్ష్మి, సరస్వతి - వారి భర్తృప్రేమ ఈ నీ ప్రేమ ముందు వెలవెలపోతున్నది. వారంతా గొప్ప సేవలు చేశారు. అయితే నీవు నీ భర్తకు ఆత్మజ్ఞానమే ప్రసాదించావు.
Page:455
ఎన్ని ఉపాయాలతో నీవు నన్ను పూర్ణజ్ఞానిగా తీర్చిదిద్దావు ! ఆశ్చర్యం! ఏ ప్రత్యుపకారం చేసి నిన్ను నేను సంతోషపెట్టగలను?
'కులస్త్రీ గనుక జ్ఞాని అయితే, ఇక ఆ పురుషుని పంటపండినట్లే, శిఖిధ్వజుని యథాశిఖిధ్వజ! కులస్త్రీ తన భర్తను అనాది అనంతము అగు మోహ సాగరం నుండి కాపాడినట్లు శాస్త్రముల చేత, గురువుల చేతకూడా సమర్థము కాదు. కులస్తీయే పతికి సఖుడు, ఆప్తుడు, సోదరుడు, గురువు, సుహృత్, భృత్యువు, స్నేహితుడు, ధనము, సుఖము, శాస్త్రము, గృహము... సమస్తము కాగలదు. ...అను ఒక నూతన సిద్ధాంతమును నీవు నీ మహోన్నత సేవా నిరతిచే ఈ ప్రపంచంలో ప్రవేశింపజేశావు. కులస్త్రీలందరికీ తలమానికమయ్యావు.
అట్టి కులస్త్రీలను సర్వ ప్రయత్నముల ద్వారా, సర్వ విధములా పూజించాలి. పురుషుల సముద్ధరణ కులస్త్రీలపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, పురుషులు తమభార్యలను అన్ని విధముల సత్కరించటం అత్యవసరమని భావికాల జనులందరికి ఇదే నా ప్రబోధం.
ఇచ్ఛారహితవు, సంసార సముద్రమును దాటివేసినదానపు అగు నీవు నన్ను కూడా సముద్ధరిం చాలనే కంకణం కట్టుకున్నావు. నాకు చేసిన ఉపకారమునకు ఋణం ఎట్లా తీర్చుకోగలను? నీవు మహాపతివ్రతవని నేను ప్రశంసించుచున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోని పతివ్రత లందరినీ నీవు జయించావు. ఇక నుంచి స్త్రీల సౌజన్యము చర్చనీయాంశమయినప్పుడల్లా నీ పేరు మార్మోగుగాక! సమస్తసద్గుణ సమన్వితమగు నిన్ను సృష్టి చేసినందుకు ఆ బ్రహ్మదేవునిపై అరుంధతి మొదలైన మహాసాధ్వులకు కొంచెం కోపం వస్తుందేమో కూడా! ఓ సతీ! మహాపతివ్రతవగు నిన్ను చూస్తే కించిత్ మరల ఉత్కంఠితుడనగుచున్నాను. రమ్ము. నిన్ను మరల ఆలింగనం చేసుకొనెదను గాక!
శ్రీవసిష్ఠ మహర్షి : ఇట్లు పలికి శిఖిధ్వజుడు పరమసాధ్వియగు ఆ చూడాలన్లు ఆలింగనం చేసుకున్నాడు.
చూడాల : దేవా! మీరు వ్యాకులచిత్తులై, శుష్కక్రియాతత్పరులై సూక్ష్మము సులభము అగు సత్యమును గ్రహించక పోవడం చూచి నేను ఒకప్పుడు దుఃఖితురాలనయ్యాను. అట్టి నా దుఃఖాన్ని తొలగించుకోవటానికే మీకు తాత్త్విక సత్యము బోధించటానికై ఉద్యుక్తురాలనయ్యాను. కనుక ఒక విధంగా నేను నిర్వర్తించినదంతా నా స్వార్థం కొరకే గదా! ఇక ఇందులో నన్ను పొగడవలసినదేమి ఉన్నది?
శఖిధ్వజుడు :
త్వయా యథా వరారోహే! స్వార్ధః సంపాద్యతే శుభః |
తమిదానీం తథా సర్వాః సాధయన్తు కులాంగనాః ॥
ప్రియ చూడాలా! నన్ను సముద్ధరించి శుభప్రదునిగా తీర్చిదిద్దటమే స్వార్థమనుకుంటే,
ప్రపంచంలోని భార్యలందరు ఇట్టి స్వార్థమును కలిగి ఉండుటకు ప్రయత్నించెదరు గాక!
Page:456
చూడాల : ఇప్పుడు చెప్పండి స్వామీ! ఇప్పుడు ఈ జగజ్జాలము యొక్క ఆవల విశ్రాంతి పొందుచున్నారా? తత్త్వపదార్థమును ఎఱిగినారా? పూర్వకాలపు అజ్ఞానము ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదా? "ఇది చేయాలి. అక్కడికి వెళ్ళాలి. అదేదో పొందాలి” ...ఇటువంటి పూర్వకాలపు స్థితులు జ్ఞాపకమునకు వచ్చినపుడు అట్టి అపరిపక్వ తుచ్ఛస్థితులను చూచి ఇప్పుడు పకపకా నవ్వుకుంటున్నారు కదా! తుచ్ఛమగు సంకల్పములు, తృష్ణ మొ॥న కుకల్పములు మీ చిత్తము నుండి పలాయనం పుచ్చుకున్నాయి కదా!
ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు? దేని యందు నిష్ఠ కలిగియున్నారు? దేనిని కోరుకుంటున్నారు? పూర్వకాలపు తపస్సు మొదలైన దేహక్రియలను చూచి ఇప్పుడు మీకేమనిపిస్తోంది? ఏదీ? కొద్ది
విషయాలు చెబుతారా ?
శిఖిధ్వజుడు : ఓ ప్రియ చూడాలా ! నీవు ఏ వివేకం యొక్క అంతఃప్రకాశ రూపంచే స్థితి కలిగి ఉన్నావో గ్రహించాను. నేను కూడా అట్టి వివేకమునందే ప్రకాశ సాక్షీరూపంచే స్థితి కలిగి ఉన్నాను.
తత్త్వదర్శనం అనునది బాహ్యదర్శనమయ్యే విషయం కాదని, అది 'కేవలం స్వానుభవం’మాత్రమే నని గ్రహించాను. ఇప్పుడు నేను ఇచ్ఛారహితుడను. ఈ సర్వ జగద్విషయముల పట్ల నిస్పృహుడను. అంశ వర్ణితుడను. ఆకాశమువలె స్వచ్ఛుడను. శాంతుడను, పరమార్థ సద్రూపుడను కూడా!
చాలాకాలం తరువాత నాయందు 'అహంకారము' అనే భ్రమ తొలగింది. నేను చిదాత్మనే అయి తద్రూపముననే వెలయుచున్నాను. హరిహరాదులు అడ్డం వచ్చినా నిషేధింపజాలనట్టి ఆత్మానుభవ మార్గాన్ని అధిరోహించి నిరతిశయానంద దశను పొందాను. ఒక్క చిన్మాత్రమునందు తప్ప మరింకే అన్యమైన దానియందును ఏ మాత్రం నిష్ఠ నాకు లేదు.
ఈ సంసార భ్రమ నుండి విముక్తుడనైనాను. పరమ సంతుష్టుడనైనాను. ఇక నాకు దేని గురించీ ఏ దిగులు లేదు.
భ్రమేణ అహం విముక్తో స్మి సంసారే, నీలిలోచనే,
న తుష్టో స్మి! న భిన్నో స్మి! నాయమస్మి! నచే తరత్ II
ఓ నీలి నేత్రాలు కలదానా! నేను కార్యవర్గమగు దృశ్యమును కాను, కారణమగు ద్రష్టత్వమునకు సంబంధించినవాడను గాను. ఈ సుఖ దుఃఖాలుగాని, ఇది గాని, మరొకటిగాని నేను కాదు. న స్థూలో2 స్మి! న సూక్ష్మోస్మి! సత్యమస్మి చ సుందరీ! తేజోబింబాత్ ప్రయాతేన భిత్తావపతితేనచ॥
క్షయ - అతిశయ ముక్తేన ప్రకాశేన అస్మి వై సమః శాన్తోస్మి! సామ్యనేతా స్మి! స్వస్తోస్మి, విగతాశయః
నేను స్థూలరూపుడను గాను. సూక్ష్మరూపుడను కూడా కాదు. ఏది నా వాస్తవ రూపమైయున్నదో అది సర్వదా సత్యము, అబాధితం అయి ఉన్నది. సూర్యమండలము నుండి బయలుదేరిన కొన్ని కిరణములు ఒక గోడపై పడుతున్నాయనుకో! అంతమాత్రం చేత గోడకు సంబంధించిన లక్షణములు
Page:457
కిరణములకు ఆపాదించటానికి వీలులేదు కదా! గోడ పడిపోతే కిరణములు నశిస్తాయా? లేదు. సూర్యగోళమునుండి బయలుదేరే కిరణములు క్షయము గాని, అతిశయము గాని లేనట్టి తేజోరూపం. మరి గోడయో? కొన్ని జడ పదార్థముల సమ్మేళనం. సూర్య ప్రకాశము సర్వదా సమరూపముననే ఉన్నది. దానికి హెచ్చుతగ్గులు లేవు. కాని వస్తువు యొక్క స్థితి - గతులు, ఆకార - - కోణాదులు, ప్రతి బహిర్గత స్వభావము (Counter- emitting of light waves) మొదలైన వాటిని అనుసరించి ఆ వస్తువు దృశ్యమానమౌతుంది.
నేను ప్రకాశమువలె సర్వదా సమస్వరూపుడను. శాంతుడను. ఈ ప్రపంచము యొక్క విషమత్వ - సృష్టి - వినాశనాదులతో నా స్వరూపమునకు ఏమాత్రం సంబంధము లేదు. ఈ మనో బుద్ధి - అహంకారాదులు నా స్వరూపము పట్ల నిర్వర్తించబడే అసత్యమగు ఆరోపణలు మాత్రమే! సూర్యగోళమునకు ఉదయ-మధ్యాహ్న సాయంకాలములు ఉన్నాయా? అది నిత్య ప్రకాశమై ఉండగా అట్టి దానికి ఉదయ - మధ్యాహ్న - సాయంకాల - రాత్రులు ఎట్లా ఉండగలవు? పోనీ, అవి భూమికి సంబంధించినవా? భూమి సర్వదా ప్రకాశరహితమగు జడ పదార్థం కదా ! మరి అవి ఎవరికి సంబంధించినవి ? 'భూమి' అను వస్తువు ఉన్న స్థానము ననుసరించి ఏర్పడిన కాంతి యొక్క అల్ప-అధిక ప్రసరణలే రాత్రింబవళ్ళుగా అనుభవమౌతున్నాయి. అంతకు మించి రాత్రింబవళ్ళకు వేరుగా ఉనికి లేదు. సూర్యతేజస్సుకు రాత్రింబవళ్ళు లేనట్లు నేను మనోబుద్ధ్యాది
విషయరహితుడను.
ఓ సాధ్వీ ! నేను ఏదై ఉన్నానో, అదియే నీవు కూడా అయి ఉన్నావు. అదియే సమస్త ప్రాణులు కూడా! అద్దానినే శాస్త్రములు 'బ్రహ్మము' అని పిలుస్తున్నాయి. నీవు నిర్వాణరూపమున ఈ దేహాదులు ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా ఏ స్థితి పొంది ఉన్నావో, అదే నిర్వాణరూపమున నేను కూడా సర్వదా స్థితి పొంది ఉన్నాను. ఇంతకుమించి మౌనం వహించటం తప్పించి ఏమీ చెప్పజాలను. ఓ చూడాలా ! నీవు నా కొరకై ఎంతో శ్రమ తీసుకున్నావు. నారద పుత్రుడు మొదలైన మాయలన్నీ కల్పించి చూపించావు. నా భార్య రూపంలో వచ్చి ఉంటే నీ జ్ఞాన వాక్యములను యుక్తయుక్తమైనప్పటికీ “ఆ ! ఈ చూడాల చిన్నపిల్ల ! ఈమెకేం తెలుసు?” అని ఉపేక్షయే
చేసి ఉండేవాడిని. అసత్యమగు కల్పనల ద్వారా మహత్తర సత్యమును అతి సులభశైలితో ప్రత్యక్షపరచిన నీ బుద్ధిని వర్ణించటానికి నాకు నోట మాట రావటం లేదు.
నీవే నా గురువువు. నా జ్ఞాననేత్రమును తెరచి అజ్ఞానాంధకారముతో కూడిన అంతరంగ స్థితిని ఉద్ధరించావు కదా! నీకు నమస్కరిస్తున్నాను. నీ అనుగ్రహము చేతనే ఈ సంసారసాగరమును నేను దాటగలిగాను. అగ్నియందు పదిసార్లు పుటం ఒనర్చబడిన బంగారంలో ఇక మాలిన్యము ఉండదు కదా ! అనేక సంఘటనలను కల్పించి తద్వారా నన్ను నీవు మలరహితునిగా చేశావు.
ఇప్పుడు నేను శాంతుడనై, స్వస్థుడనై, కోమలుడనై, సర్వవ్యాపినై ఉన్నాను. ఆకాశమువలె అంతటా స్థితి పొందియున్నాను.
Page:458
చూడాల : అయితే ఓ ప్రాణేశా! నా హృదయ ప్రియా! ప్రభో! ఇప్పుడిక మీకు ఏది ఇష్టమని అనిపిస్తోంది? ఈ అరణ్యవాసమా? లేక రాజ్యపాలనయా?
శిఖిధ్వజుడు : ఇప్పుడు ఇది చేయాలన్న ఉద్దేశము గాని, అది చేయకూడదన్న ప్రతి నిషేధము గాని నాకు లేవు. నీకు ఏది అభిమతమైతే నాకూ అదే. ఏదేది చేయవలసి వచ్చినా అది 'సమాధి యొక్క వ్యుత్థానకాలంలో సర్వమును ఆక్రమించుకొనియున్న నా స్వస్వరూపం ఒకచోట వ్యవహారమునందు ప్రతిబింబించటం’ ...అనియే గ్రహిస్తున్నాను. అందుచేత నీకు ఏది ఇష్టమో! అదియే నాకూ ఇష్టం. అట్లే జరుగుగాక! దేనిపట్ల కావాలని గాని, అక్కర్లేదని గాని నాకు భావన ఏర్పడుట లేదు. నీకు ఏది ఎట్లు అనిపిస్తే అట్లే నిర్వర్తించు. నాకు దేనికీ అభ్యంతరం లేదు. మణి ప్రతిబింబమును m
అనిచ్ఛాపూర్వకంగా గ్రహిస్తుంది చూచావా ? ఇచ్ఛారహితమగు చిత్తముచే అనిందితమగు యథాప్రాప్త వస్తువును ధరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను.
నేనెవరినీ, దేనినీ స్తుతించటం లేదు...... నిందించటం లేదు. నీ వెట్లు అనుకుంటావో అట్లాగే చేయి. తదనుకూలంగా చరించుటకు నాకేమి నిషేధం లేదు.
చూడాల : హే మహాబాహూ! జీవన్ముక్తా! అట్లా అయితే నా అభిప్రాయమేమిటో చెబుతాను. విన్న తరువాత మికేది అంగీకారమో అట్లే నిర్వహిద్దాం. మనిద్దరం సర్వత్రా ఏకత్వజ్ఞానం కలిగియున్నాం. రాజ్యపాలన అయినా, వనవాసమైనా మనకు రెండూ ఒక్కటే. ఇద్దరం అజ్ఞానముయొక్క ఆనుపానులను ఎఱిగాం కదా. ఇచ్ఛారహితులమై అకాశమువలె స్వచ్ఛముగా వెలయుచున్నాం. కనుక మనకు రాజ్యభోగముల పట్ల అపేక్షగాని, అనపేక్షగాని లేవు. ఎందుకంటే ఈ నేత్రేంద్రియములు తమకు ఏమి యోగ్యమో - ఆ విషయములను సేవించటం చేత 'చిన్మాత్రము' అగు ఆత్మకు క్రొత్తగా కలిగే విశేషమేముంటుంది? ఇది గ్రహించిన తత్త్వవేత్త ప్రవాహపతితమగు ఆయా విషయాలను సేవిస్తూ ఉంటాడు. ఓ పురుషోత్తమా! ఆద్యంతములలో మనం ఏ స్వభావం కలిగియున్నామో అట్టి దానినే స్వీకరిద్దాం. 'ప్రారబ్ధ కర్మ' అను దానిని అనుభవము ద్వారానే నశింపచేయాలి’........ అనునది శాస్త్ర సిద్ధాంతము కదా! కాబట్టి మనకు ఇప్పటికే ప్రాప్తించియున్న ' రాజ్యపాలన' అను ధర్మమును నిర్వహిస్తూ శేషించియున్న ఈ దేహము యొక్క ఆయువును గడిపివేద్దాం. ఆ తరువాత ఉచితమైన సమయంలో విదేహముక్తులమౌదాం.
శిఖిధ్వజుడు : ఓ ప్రియా చూడాలా! ఏదీ, చెప్పు! ఆద్యంతములలో మనం ఏ స్వభావంతో కూడుకొనియున్నాం? ప్రారబ్ధమును అనుభవించి ఆపై ఎట్లా ఉండబోతున్నాం?
చూడాల : మీరు మోహము చేతనే ఈ వనవాసం స్వీకరించారు కదా! అంతకు ముందో? రాజు కదా!ఒక్క మోహాన్ని మాత్రం త్యజించి మరల యథావిధంగా రాజుగానే అవండి. రాజసింహసనంపై ఆసీనులై ప్రజాభీష్టానుసారం ధర్మనిరతులై రాజ్యపాలన చేయండి! 'మా రాజుగారు ఎప్పుడో వస్తారు! ఆ తరువాత ఇంకా సానుకూలమౌతుంది!' అని మాళవ రాజ్య ప్రజలు, మంత్రులు ఎదురుచూస్తున్నారు. ఏ ఏ పరిస్థితులలో ఉండి ఏవేవి నిర్వర్తించటం శాస్త్రానుకూలమో, లోకానుకూలమో ఆయా
Page:459
నిర్వర్తించవలసియున్న వ్యావహారిక ధర్మములే జ్ఞానుల దృష్టిలో ప్రారబ్ధము. అంతకు మించి ప్రారబ్ధమనేదేదీ వారికి లేదు.
కాబట్టి మీ సింహాసనం మీరు అధిష్ఠించి ఎప్పటిలాగానే రాజ్యాన్ని పరిపాలించండి.
ఇక నేనో! మీ పట్టమహిషిగా రాజాంతఃపురంలో ఉంటూ మీ సాంగత్యముచే శోభను పొందుతాను. ఎప్పటిలాగానే ఉచితానుచితములగు ఆయా రాచకార్యములందు నా యోచనలను అందిస్తూ, “సహధర్మచారిణి" అను శబ్దమును అర్థప్రదం చేస్తాను. జ్ఞానులమగు మనిద్దరం అత్మజ్ఞాన విషయమై ఆప్తవాక్యములను ప్రసంగించుకుంటూ విశ్రాంతి కాలాన్ని గడిపివేద్దాం. మనకు అవగతము - అనుభవము అగుచున్న ఆత్మానుభవమును తదితర జ్ఞానాన్వేషకులతో పంచుకుందాం. శిఖిధ్వజుడు : ఓ ఓ విశాలనేత్రీ! అట్లా అయితే, మనిద్దరం స్వర్గములో నివసించటానికి కూడా స్వతంత్రులమై ఉన్నాము కదా ! ఎచ్చట సిద్ధులగు దేవతల భోగైశ్వర్యములు ఉన్నాయో అట్టి స్వర్గలోకంలోనే మనం ఎందుకు నివసించకూడదు?
చూడాల : అటు స్వర్గలోకంలో గాని, ఇటు ఈ రాజ్యపాలనలో గాని క్రొత్తగా లభించే సుఖమేదీ లేదు. అఖండమగు స్వస్వరూపాత్మను గ్రహించటంచేత క్షోభ లేనివారమై, స్వస్థచిత్తముతో యథారీతిగా స్థితిని కలిగియున్నాము. “ఇది సుఖము - ఇది కాదు” - అనే ద్వంద్వం మనపట్ల నశించిపోయింది. ఇప్పుడు మనం సమరూపముచే శాంతపదమున సుఖముగా ఏర్పడియున్నాము కదా! శిఖిధ్వజుడు : ఆహాఁ! చూడాలా! సమబుద్ధితో నీవు యుక్తియుక్తిమైనదానినే చెప్పావు. ఈ రాజ్యమును కలిగియుండుట చేతగాని,త్యజించుటచేతగాని మనకు క్రొత్తగా వచ్చే ప్రయోజనమేమున్నది?
సుఖ దుఃఖ దశా చిన్తాం త్యక్త్వా విగత మత్సరమ్. యథా సంస్ధానమేవేమౌ తిష్ఠావః స్వస్ధతాంగతౌ॥
ఇక మనం సుఖ దుఃఖ దశలకు సంబంధించిన సర్వ చింతనలు వదలివేద్దాం. మాత్సర్యరహితులమై స్వస్థత పొంది ఇతఃపూర్వంలాగానే స్థితి పొంది ఉందాం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఇటువంటి జ్ఞాన - విజ్ఞానయుక్తమగు సంభాషణలో ఆ రాత్రి తెల్లవారవచ్చింది. వారిద్దరు పరస్పర సమాగమమునందు అత్యంత ఉత్కంఠ కలవారైనప్పటికీ, వాసనారహితులై ఉండటం చేత ఉత్కంఠరహితులు కూడా! ఆ మరునాడు కూడా సంధ్యావందనాది దైనందిన దేవకార్యములను నిర్వర్తించి పగలంతా అనేక జ్ఞాన విషయాలు సంభాషించుకున్నారు. సాయంసంధ్య అయిన తరువాత తటాకం సమీపించి సాయం సంధ్యోపాసనాకార్యక్రమాలు నిర్వర్తించారు. స్వర్గస్థితిని కూడా నిరాదరించి ఆ ఇరువురు పూర్ణచిత్తులై ఒకే శయ్యపై ప్రణయచేష్టలతో ఆ రాత్రంతా గడిపారు. భోగలక్ష్మి, మోక్షలక్ష్మిల సేవలో వారిద్దరికీ ఆ రాత్రి ఒక క్షణంలాగా గడచిపోయింది.
Page:460
46. పునః రాజ్య ప్రవేశం
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ రాత్రి గడచిన తరువాత మరునాడు ఆ దంపతులిద్దరూ ఒకరినొకరు అభిషిక్తులనుగా చేసుకున్నారు. "ఓ రాజా! మునులకు యోగ్యమైన శాంతతేజమును కొంచెం ఉపసంహరించి మాళవ రాజ్యపాలనకు అవసరమైయున్న శాసన తేజమును అవధరించెదరు గాక” అని చూడాల ఛలోక్తులు ఆడుచుండగా, ఇక అక్కడి నుండి ఆ దంపతులిద్దరూ బయలుదేరారు. మధ్య మధ్యలో ఆయా ప్రదేశములు తారసపడుచున్నప్పుడు ఇతఃపూర్వపు ఆయా అనుభవములను సంభాషించుకుంటూ క్రమంగా మాళవదేశం ప్రవేశించారు.
రాజదంపతుల పునరాగమనం గురించిన వార్త రాజధానియగు ఉజ్జయినీపట్టణం చేరింది. మంత్రులు, సామంతరాజులు మొదలైన వారంతా రాజు శిఖిధ్వజుని అనేక సంవత్సరాల తరువాత దర్శించటానికి, సుస్వాగతం పలకటానికి సమాయత్తమైనారు. ఉజ్జయినీ నగరమంతా అత్యంత సుందరంగా అప్పటికప్పుడే అలంకరించబడింది. శిఖిధ్వజుడు నగరంలో ప్రవేశించాడు. అప్పటికప్పుడే సమావేశమైన గొప్ప ప్రజానీకాన్ని చూచి రాజు సుదీర్ఘంగా ప్రసంగించాడు. తాను కార్యార్థి అయి వెళ్ళి తిరిగి వచ్చిన ఈ 18 సంవత్సరాల కాలం రాజ్యాన్ని తమ మంత్రాగంతో కాపాడిన మంత్రులను, తదితర సేనానాయకులను పేరు పేరునా పిలిచి సన్మానించాడు. ముఖ్యంగా చూడాలను మెచ్చుకోలుతో, పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రజలందరికి తనపై గల వాత్యల్య ఆప్యాయతలకు కృతజ్ఞతలు పలికాడు. అనేక మంది ప్రజలు సుదీర్ఘకాలం తరువాత తమ రాజు శిఖిధ్వజుని చూచిన ఆనందంతో కంట తడిపెట్టారు. రాజుగారి రాకను పురస్కరించుకొని ఉజ్జయినీ పట్టణంలోను, మాళవ రాజ్యమంతటా అనేక ప్రదేశాలలోను, సామంతరాజ్యాలలోను 7 రోజులు గొప్ప ఉత్సవం జరిగింది.
ఆ తరువాత శిఖిధ్వజుడు చాలాకాలం రాజ్యపాలన ప్రజానురంజకంగానూ, ధర్మ నిరతితోను, లోక కళ్యాణ దీక్షతోను నిర్వర్తించాడు. భయ - - విషాద - - అభిమాన - మాత్సర్యరహితుడై ప్రాప్తించిన కర్మలను రాగవర్జిత బుద్ధితో నిర్వర్తించాడు.
సుదీర్ఘకాలం రాజ్యపాలన నిర్వర్తించిన ఆ రాజు ఆ తరువాత ఒకానొక సమయంలో రాజ్యపాలనపై విరక్తుడై రాజ్యమును పుత్రునకు సమర్పించాడు. ఒకానొక ఉచితకాలంలో భార్య చూడాలతో సహా విదేహముక్తిని ఆశ్రయించి 'సన్మాత్రము' నందు శేషించాడు. ఆ దంపతులిరువురు ‘పరమపదము' అను అమృతమును పొందారు.
ఓ రామచంద్రా! నీవు కూడా ఈ శిఖిధ్వజ - చూడాలల వలె యథా ప్రాప్తములైన కార్య సమూహములను నిర్వర్తించు. మరొకవైపు సమాధియందు తత్పరుడవై ఉండు. భోగమోక్ష జ్ఞానైశ్వర్యమును అనుభవిస్తూ లోకపావనుడవై ఉండెదవు గాక! నీ ఈ రామావతారము మహత్తరమై, జనులందరికీ ఇహపరములందు మార్గదర్శకమగుగాక!
Page:461
X. బృహస్పతి - కచ సంవాదం
1. సర్వ త్యాగం అంటే ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ విధంగా శిఖిధ్వజుని మోక్ష కథను విన్నావు కదా! అందులో చెప్పబడిన మార్గంలో పయనిస్తే నీవు ఎన్నటికీ ఖిన్నుడవు కావు. అందులో అంతర్లీనంగా ప్రకటించ బడిన రాగద్వేషవినాశకారకమగు దృష్టిని అవలంబించి పూర్ణానందపథమున సుదృఢముగా నెలకొని ఉండు. శిఖిధ్వజుని లాగానే నీవు కూడా వ్యవహారం ఆచరిస్తూనే భోగమోక్షాలచే పూర్ణుడవై ఉండు.
ఆ శిఖిధ్వజుని లాగానే “పూర్వం ఒకప్పుడు బృహస్పతి కుమారుడైన కచుడు జ్ఞానిగా తీర్చిదిద్ద బడటం” అనే ఒక దృశ్యం నా మస్తిష్కంలో మెరుస్తోంది. సందర్భానుచితం కనుక ఆ సంఘటనను కూడా ఇక్కడ ప్రస్తావించుకుందాం.
#
శ్రీమంతుడు, మహాజ్ఞాని, దేవ గురువు అగు బృహస్పతి గురించి నీవు వినే ఉన్నావు కదా! ఆయన కుమారుడు కచుడు. ఆతడు బాల్యంలోనే సర్వవిద్యా పారంగతుడైనాడు. యౌవనం ప్రవేశించే సరికి అఖండాత్మానుభవమునకు అనేక అర్హతలు సంపాదించుకున్నాడు. ఒక రోజు తండ్రి బృహస్పతి ప్రశాంతంగాను, ఆహ్లాదంగాను ఉన్న సమయంలో కచుడు సమీపించి ఒక ప్రశ్న అడిగాడు. కచుడు : పితృదేవుల వారికి సాష్టాంగదండ ప్రణామములు.
బృహస్పతి : పుత్రా! పూర్ణజ్ఞానివయ్యెదవు గాక! ఏమిటి విశేషం? ఏదో అడగాలని వచ్చినట్లున్నావు! నిస్సంకోచంగా నీ సందేహమేమిటో చెప్పు.
కచుడు : తండ్రీ! ఈ జీవుడు ఎప్పుడూ సంసారపంజరంలో చిక్కుకుని నానా అగచాట్లు పడుచున్నాడే! అట్టి బంధనం నుండి విముక్తుడు కావటం ఎట్లా?
బృహస్పతి : కుమారా! అనేక మొసళ్ళకు ఆలవాలమైన ఈ సంసారసాగరం అతి దుర్భరమైనదే. అయితే 'సర్వత్యాగము' అను బలం నీకు ఉంటే ఆ మొసళ్ళు నిన్ను ఏమీ చేయలేవు. అప్పుడు నీవు నిర్భయంగా సంసారమును దాటి వేయవచ్చు.
కచుడు : అయితే నేను సర్వమును త్యజించి ఎటకో వెళ్ళిపోతాను. బృహస్పతి : ...
బృహస్పతి మౌనం వహించాడు. 'అవును-కాదు' అనలేదు. 'సర్వత్యాగము' అను శబ్దమునకు కచుడు గ్రహించిన అర్థం అత్యంత అసంపూర్ణమైనదైనప్పటికీ అప్పటికి మాత్రం ఇంకేమీ పలుకలేదు. పుత్రుడు ఎటకో వెళ్ళుచున్నప్పటికీ బృహస్పతికి దుఃఖమేమి కలుగలేదు. మహాత్ములు సంయోగ వియోగములందు మేరుపర్వతంలాగా స్థిరబుద్ధి కలిగి ఉంటారు కదా!
Page:462
కచుడు అక్కడి నుండి బయలుదేరాడు. ఇల్లు-వాకిలి విడిచి మహారణ్యాలలో ప్రవేశించాడు. ఆ విధంగా 8 సంవత్సరాలు గడచిపోయాయి. ఒక రోజు ఒక మహారణ్యంలో ఒకచోట కాకతాళీయంగా కచుడు తండ్రిని కలుసుకున్నాడు. ప్రణామములు అర్పించాడు.
బృహస్పతి : పుత్రా! క్షేమమే కదా?
కచుడు : తండ్రీ! మీరు నన్ను సర్వత్యాగం చేయమన్నారు కదా! ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచాయి. బృహస్పతి : ఊ!
కచుడు : సర్వత్యాగం చేసి ఇన్నాళ్ళైనా నేనింకా అనిందితమైన విశ్రాంతిని పొందనే లేదు. ఎందుచేత? నన్నిప్పుడు ఏం చేయమన్నారు? అతిదీనుడనై మిమ్ములను వేడుకుంటున్నాను, చెప్పండి. బృహస్పతి : చెప్పాను కదా! కొంత త్యజించి, కొంతపట్టుకుని ఉంటే సరిపోదు. సమస్తము త్యజించు. అప్పుడు విశ్రాంతి దానంతట అదే లభిస్తుంది.
ఇట్లా అని బృహస్పతి ఇంకేమీ మాట్లాడకుండా అంతర్ధానమై నిజమార్గంగా వెళ్ళిపోయాడు.
తండ్రి అంతర్ధానమైన తరువాత కచుడు కొంచం సేపు యోచించాడు. 'ఏమిటి? నాన్నగారు సమస్తం త్యజించమంటున్నారు! అన్నీ వదిలాను కదా! అన్నీ వదలిన తరువాత ఇంకేమి త్యజించాలి?... అని ఆలోచించగా, అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. "ఓహో! అదా! ఈ వస్త్రములు, బొంత, చేతికఱ్ఱ ఇవి కూడా త్యజించమని ఆయన ఉద్దేశం కదా! మంచిదే. వీటిని కూడా ఇప్పుడే త్యజిస్తాను” – అని అనుకున్నాడు. శరత్కాలాకాశం మేఘములను త్యజించునట్లు అతను తన వస్త్రములను, బొంతను, చేతి కఱ్ఱను అక్కడే వదిలేసి దిగంబరుడై బయలుదేరాడు. 3 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు అతను ఒక కొండగుహలో దిగంబరుడై ఉండగా తండ్రి, గురువు అయిన బృహస్పతి మరల తారసపడటం జరిగింది. భక్తితో తండ్రిని పూజించాడు. చాలా రోజులైన తరువాత చూడటం చేత బృహస్పతి ప్రేమగా అతనిని కౌగలించుకున్నాడు.
కొద్ది క్షణములైన తరువాత భేదచిత్తుడైన కచుడు గద్గదస్వరంతో ఇట్లా పలికాడు.
కచుడు : నేను బొంత, దండం, వస్త్రం అన్నీ త్యజించాను. సమస్తం త్యజించమని మూడు సంవత్సరాల క్రితం మీరు అన్నారు. అట్లాగే చేశాను. అయినప్పటికీ ఆత్మపదంలో విశ్రాంతి లభించనే లేదు. బృహస్పతి : 'సమస్తం’ అనగా ఏమిటి? వస్త్రాలా? కాదే. ఈ సమస్తం చిత్తమే అయి ఉన్నదని నీవు శాస్త్రకారులు వాక్యములు వినియే ఉన్నావు కదా! కనుక చిత్తమును త్యజించినప్పుడే సమస్తం త్యజించినట్లాతుంది. చిత్తము ఉన్నంతవరకూ ఏదీ త్యజించనట్లే.
ఇట్లు పలికి బృహస్పతి వేగంగా ఆకాశమునకు ఎగిరి మరల ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు కచుడు భేదరహితమైన బుద్ధితో మరికొంత యోచించసాగాడు.
“అవును ! నా తండ్రి అన్నది నిజమే. ఈ వస్తువులను ధరిస్తున్నది చిత్తం చేతనే కదా! చిత్తాన్నే త్యజించాలి. అయితే చిత్తమును త్యజించటమంటే ఏమిటి? ఎట్లా?” - అని తీవ్రంగా చింతన
Page:463
చేయసాగాడు. “ఒక వస్తువునైతే త్యజించవచ్చు. మరి, చిత్తమును ఎట్లా త్యజించటం?” అని చాలాసేపు యోచించాడు. అతనికి ఆ వాక్యములోని అర్థము గాని, ఉద్దేశము గాని ఏమాత్రం అవగాహనకు రాలేదు. 'పోనీ, ఈ దేహమును త్యజిద్దామా? ఇదొక్కటేగా నాకు మిగిలి ఉన్నది!’ అని యోచించసాగాడు. 'లాభం లేదు. పదార్థమయమగు ఈ దేహం చిత్తం యెట్లా అవుతుంది? స్వయం ప్రతిపత్తి లేని దేహాన్ని త్యజించినంత మాత్రంచేత పితృదేవులు ఉద్దేశించిన చిత్తం యొక్క త్యాజ్యం అవదు’... అనుకున్నాడు.
మరిప్పుడేం చేయాలి? “ఎందుకు? మహాశత్రువగు చిత్తం గురించి నాన్నగారినే ప్రశ్నిస్తే పోతుంది కదా!” అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఏమాత్రం తాత్సారం చేయలేదు. తండ్రిని దర్శించ టానికి బయలుదేరాడు. దేవలోకంలో ఒకానొక ఏకాంత ప్రదేశంలో బృహస్పతి ఆసీనులై ఉన్నాడు.
కచుడు : మహాత్మ ! పితృదేవా! మీరు చిత్తమును త్యజించమని ఆజ్ఞాపించారు. నేను ఈ దేవలోకాన్ని త్యజించాను. చివరికి వస్త్రాలు కూడా త్యజించాను. అంతేకాదు ఈ పాంచభౌతికదేహం త్యజించటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అయితే చిత్తమును త్యజించటం ఎట్లాగో నేను గ్రహించలేకపోతున్నాను. అది ఒక వస్తువా? దాని స్వరూపమేమిటో, ఎక్కడుంటుందో, ఎలా త్యజించాలో చెప్పండి. అది విని మీరు చెప్పినట్లే చిత్తమును త్యజించివేస్తాను.
బృహస్పతి : కుమారా! 'మనుజునికి గల అహంకారమే చిత్తము' అని చిత్తము గురించి ఎరిగిన విజ్ఞులు చెప్పుతూ ఉంటారు. ఈ జీవుని అంతరంలో ఏ అహంకారమేదై ఉన్నదో... అదే చిత్తము. కచుడు : 33 కోట్ల దేవతలకు గురువగు ఓ బృహస్పతి గురువర్యా! 'అహంభావం’ అనేది చిత్తము ఎట్లా అవుతుంది. అది అట్లా ఉంచి, నా దృష్టిలో అహంకారం త్యజించటమనేది దుష్కరమైన విషయమనిపిస్తోంది. అట్టి త్యాగం నేను ఎంత ప్రయత్నించినా కూడా సిద్ధించటమే లేదు. కాబట్టి ఈ అహంకారం ఎట్లా త్యజించాలో తెలుప ప్రార్థన.
బృహస్పతి : ఈ అహంకారం త్యజించటం కష్టతరమైన విషయమే. అయితే దీనికొక ఉపాయం ఉన్నది. ఆ ఉపాయాన్ని ఆశ్రయించావా, అహంకారాన్ని త్యజించటం పూవును నలిపినంత తేలిక అవుతుంది.
ఆ అహంకారమునకు ఏదైతే 'నిత్య - నిర్లిప్తసాక్షి' అయున్నదో... అట్టి సాక్షిమాత్రమును ఆశ్రయించావా అప్పుడు కనులు మూయుటకంటే కూడా అహంకారమును త్యజించటం సులభమని నీవు గ్రహించగలవు. ఇందులో అనుమానమే లేదు.
ఈ అహంకారం ఎట్లా పుడుతోందో ముందుగా గ్రహించు. అది ఎట్లాగో చెబుతాను, వినుసాక్షియగు ఆత్మ యొక్క స్వరూప స్వభావములు ఏమరచుటచేతనే, లేక ఆత్మ గురించి అజ్ఞానమాత్రం చేత అహంకారము అనబడే భ్రమ వస్తువు సిద్ధిస్తోంది. కనుక అహంకారము ఆత్మజ్ఞానముచే తప్పకుండా నశిస్తుంది.
Page:464
మిథ్య అయి కూడా భ్రమచే ఉన్నట్లు తోచుటచేత 'అహంకారము’ అనబడేది యథార్థానికి లేదు. యథార్థానికి లేకపోయినా ఉన్నట్లు అనిపించటానికి ఈ ప్రపంచంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఒక పిల్లవాడి బుద్దిలో భూతమునకు సంబంధించిన సమాచారం ఏర్పడి ఉండటం చేత, ఆ బాలునికి మసక చీకట్లో భూతము ఉన్నట్లే కనిపిస్తుంది.
మిథ్యాజ్ఞానానుభవం -
1. "ఏమిరా అబ్బాయ్! నీకు భూతం కనిపిస్తోందా?” అంటే, ఆ పిల్లవాడు "ఆహాఁ! ఉన్నది. చూచాను” అంటాడు. “ఎట్లా ఉంటుంది, నీవు చూచిన భూతం?” అని అడిగితే 'కొమ్ములు పిల్లికళ్ళు చారెడు ముక్కు - బారెడు నోరు" ... అని తాను ఎవరి దగ్గరో విన్న వర్ణనలన్నీ చెపుతాడు. అతను చూస్తున్న భూతం ఆతని బుద్ధిలోనే ఉన్నది కాని, బాహ్యమున కాదు కదా!
2. ఒకాయన ఏదో మసక చీకట్లో ఒక పెద్ద త్రాడును చూచి, 'నీకేం తెలుసు! ఆ పాము చుట్టలు చుట్టుకుని బారెడంత ఉన్నది. అది కాటువేసిందా, చచ్చామే ! ఆ మధ్య ఎవరినో ఇట్లాగే పాము కరచి వాడు చచ్చాడట కూడా! దానికి నోరు తెరచినప్పుడు మిరమిర మెరిసే కోరలు ఉంటాయి. అది ఊదిందా, ఆ విషం శరీరానికి తగిలి, ఇక మనం పుళ్ళు వచ్చి చావవలసిందే’ ...ఇలా చెప్పుకుంటూ పోతాడు. ఆ పాముకు సంబంధించిన అనుభవ జ్ఞానమంతా ఉన్నదెక్కడ? ఆ భ్రమించేవాని బుఱ్ఱలోనే కదా! అది పాము కాకపోయినా, పాముకు సంబంధించిన వికారాలన్నీ ఆతని ఆలోచనలను కలచివేస్తూ ఉంటాయి.
3. ఎండమావులలో తరంగాలు చూచి "అదిగో! అక్కడ నీళ్ళు మిలమిల మెరుస్తుంటే నీళ్ళులేవని అంటారేం?” అని ఒక బాటసారి తోటివారిపై మండిపడతాడు. అక్కడ నీళ్ళు లేవు. అయినా ఆ బాటసారి బుద్ధిలో గల నీళ్ళకు సంబంధించిన సమాచారమంతా ఏకమై జలమునకు సంబంధించిన భ్రమను బలపరుస్తోంది కదా!
4. ఒక మెల్లకన్ను వానికి నిజంగానే రెండవ చంద్రబింబం కనిపిస్తుంది. 'అరేఁ! నాకు రెండవ చంద్రుడు స్పష్టంగా కనిపిస్తుంటే వీడెవడో రెండవ చంద్రుడు ఉండడమే అసంభవమని దబాయిస్తాడేమిటి?’... అని కొఱకొఱ చూస్తాడు.
ఈ నాలుగు దృష్టాంతాలులాగానే అహంకారం మిథ్యయే అయి ఉండి కూడా స్ఫురిస్తోంది. అజ్ఞానముచే అవన్నీ ఎట్లా కనబడుచున్నాయో, సత్తుగాని, అసత్తుగాని కానట్టి అహంకారము కూడా అట్లాగే ఉన్నట్లే అనిపిస్తోంది.
వాస్తవానికి ఆత్మ అంశరహితమైనది. అది సంకల్ప వర్జితమైనది. అంతేకాదు. ఈ సమస్తము సర్వదా అదే అయి ఉన్నది. సర్వవ్యాపకమగు అయ్యది పరమాణువు కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. అట్టి చిన్మాత్రము అగు ఆత్మ ఒక్కటే సత్యమై వెలయుచున్నది.
సర్వత్ర, సర్వదా, సర్వప్రకాశం, సర్వజన్తుషు | తదేవైకం కచత్యమ్చు విలోలా స్వబ్ది వీచిషు ॥
Page:465
సముద్రంలో అనేక తరంగాలున్నాయి. నిరంతరం ఎన్నో లయిస్తున్నాయి. మరికొన్ని పుట్టుకొస్తున్నాయి. అయితే తరంగాలన్నిటిలోనూ ఉన్నది ఒకే జలం కదా! సర్వదా, సర్వత్రా సర్వజీవుల రూపంగా - సర్వ జీవులందూ ఆ ఆత్మ ఒక్కటే ప్రకాశరూపమై స్ఫురిస్తోంది. అటువంటి ఆత్మయందు అహంభావం అనునది ఏ రూపంలో ఎట్లా ఉత్పన్నమౌతుంది చెప్పు? దీపంలో ఉండే నీలఛాయా విభాగం జలమంటే మనం ఒప్పుకుంటామా? అట్లాగే జలంలో చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయా? ఆత్మయందు అహంకారమనునది ఉండజాలదు. కాబట్టి కుమారా, కచుడా! నీకు వ్యర్థముగా అనుభవమగుచున్న 'నేను-వాడు-నీవు' అను పరిమితాహంకార స్వరూపములపై నీవు విశ్వాసమును తొలగించుకో. ఎందుకంటావా? నీవు ఆత్మవు మాత్రమే. అట్టి ఆత్మయందు దేశ-కాల పరిచ్ఛేదములు ఎట్లా ఏర్పడతాయి? అది సర్వదా స్వచ్ఛమై నిత్యోదిత తత్త్వమై సర్వవ్యాపకమై సమస్తమునకు అధిష్ఠానమై ఉన్నది. సమస్త బ్రహ్మాండములకు ఆధారము, సారము కూడా ! అట్టి నిర్మలము, నిత్యము, అనంతరము, నిత్యానంద స్వరూపమే నీవు కూడా!
అఖండము, అద్వయము, సన్మాత్ర రూపము అయినట్టి నీ యందు ఇక పరిచ్ఛిన్నమగు “నేను” “నీవు” అను వాటికి ఉనికి ఉండటమే కుదరదు. ఒకే రసము వనమంతా విస్తరించి ఫలములుగాను, పుష్పములుగాను, ఆకులుగాను అగుచున్నది చూచావా! నీవే నీకు దర్శనమగు ఈ చరాచర జగద్విషయములుగా విస్తరిస్తున్నావు. ఇది గమనించి, స్వస్వరూప ఔన్నత్యమును గ్రహించి స్వస్థుడివి కమ్ము.
శ్రీవసిష్ఠ మహర్షి : చూచావా రామా! ఈ విధంగా 'ప్రత్యగాత్మ-పరమాత్మ' ఈ ఇరువురి 'ఐక్యము' అనే పరమయోగమును దేవగురువగు బృహస్పతి తన కుమారుడగు కచునకు ఉపదేశించాడు. అది విని, మరల మరల తాను అంతకు ముందే వినిన యుక్తుల చేత, స్వకీయ విచక్షణ చేత విచారణ చేసిన వాడై, ఆ కచుడు క్రమంగా 'లేనివస్తువే’ అయిన అహంకారమును రహితం చేసుకున్నాడు. హృదయగ్రంథులు ఛిన్నమొనర్చుకుని, ప్రశాంత బుద్ధికలవాడై, ఏ వికారములు లేనివాడై స్వయంప్రకాశకమగు మణివలె వెలుగొందాడు. నీవు కూడా అట్లే స్వయమాత్మజ్యోతి స్వరూపుడవై వెలుగొందుము.
అహంకారమును అసత్తుగా ఎరుగుము
అహంకారమ్ అసత్ విద్ధి, ఏన మా ఆశ్రయ మాత్యజ । అసతః శశ్వ శృంగస్య కిలత్యాగ గ్రహౌ కుతః ॥
“ఈయనేమో కుందేటికొమ్మును ఆశ్రయిస్తున్నాడు. ఆయనేమో త్యజిస్తున్నాడు"...అనే వాక్యానికి అర్థమేమన్నా ఉన్నదా? కుందేలుకు కొమ్మే ఉండదు కదా! అట్లాగే 'అహంకారము అనేది మిథ్య' అని తెలుసుకొని ఉండు. ఇక నీవు దానిని ఆశ్రయించనూ వద్దు, త్యజించనూ వద్దు. మిథ్య అయిన దానిని పట్టుకోవటం గాని, వదలటం గాని ఉంటాయా?
Page:466
అసంభవత్యహంకారే, క్వతే మరణ-జన్మనీ ।
నభః క్షేత్రే తథా వ్యుప్తం కేన సంగృహ్యతే ఫలమ్ II
“ఒకాయనకు ఆకాశంలో గొప్ప పొలం ఉన్నది. ఆ పొలంలో మామిడి వృక్షాలు ఉన్నాయి ఆ మామిడి వృక్షాలకు కాచినవే ఈ ఫలములు" ... అనే వాక్యం ఒప్పుకుంటామా? ఆకాశంలో పొలం ఎట్లా ఉంటుంది? అహంకారమే అసంభవమైనప్పుడు ఇక అహంకారం పుట్టటం చావటం అనేది ఎవరికి? ఎచ్చట?
నిరంశం శాంతసంకల్పం, సర్వభావాత్మకమ్ తతమ్ |
పరమాదప్యణోః సూక్ష్మం చిన్మాత్రం, త్వమ్ అమనోమయమ్ ||
సర్వ అంశలకు అతీతమై, శాంతమై సర్వభావాత్మకమై, పరమాణువు కంటే కూడా సూక్ష్మమై మనోరహితమై ఏ చిన్మాత్రము సర్వదా ఉండి ఉన్నదో.... ఓ రామా! అదియే నీవు.
యథా అంబస తరంగాది, యధా హేమే అంగదాది చ |
తదేవ తదివా భాసం తథా అహంభావ భావితః ॥
ఒకడు సముద్రం ఒడ్డున కూర్చుని 'ఇది చిన్నతరంగం, అది పెద్ద తరంగం'... అని అనుకుంటున్నాడు గాని, తరంగాలన్నిటిలోనూ ఉన్నది ఒకే జలం అని ఏమరచుచున్నాడు. 'ఇది ఉంగరం, అది గాజు, ఆ ప్రక్కది వడ్డాణం'... అని అనుకుంటున్నాడు గాని 'ఇదంతా ఒకే బంగారం' ...అని ఏమరచుచున్నాడు చాచావా ? అట్లాగే చిన్మాత్రుడైన ఈ జీవుడు 'అహంభావమును భావించ బడుచున్నాడు. ఓ రామా! మాయామమయమగు ఈ జగత్తంతా కూడా అజ్ఞానము చేతనే స్థితి పొందియున్నది. అయితే జ్ఞానముచే ఇదంతా కూడా బ్రహ్మరూపంగా అనుభవం కాగలదు. కనుక నీవు ద్వైత ఏకత్వబుద్ధిని త్యజించు. అప్పటికీ శేషించియుండే దానియందు సుఖంగా స్థితి కలిగియుండు. అంతేగాని మిథ్యాపురుషుని వలె వ్యర్థంగా దుఃఖితుడవు కావద్దని నా మనవి.
ఈ సంసారము మహాసాగరమువలె దాటుటకు అత్యంత దుర్భరంగా అనిపించవచ్చు గాక! అయితే ఏం? ఎండకు మంచుకరిగిపోవునట్లు, జ్ఞానముచే ఇది పటాపంచలు కాగలదు.
Page:467
XI. మిథ్యా పురుషుడు
1. ఆకాశాన్ని భద్రపరచుకోవటమెట్లా?
శ్రీరాముడు : మునీంద్రా! ఒక చాతక పక్షి చాలాకాలంగా వర్షపు జలం కోసం ఎదురుచూస్తూ ఉండగా, ఒక రోజు అనుకోకుండా దైవవశంగా కుంభపోతవర్షం పడితే ఎంత ఆనందిస్తుంది? మీరు కురిపించే జ్ఞానామృతంచే జ్ఞానామృతంచే నా అంతరంగం అంతటి తృప్తిని శీతలత్వమును అనుభవిస్తోంది. సమస్త - అసమాన సంపదలకు ఆవల నేనిప్పుడు స్థితి కలిగియున్నాను.
అయితే, బాగా దాహంగా ఉన్న ఒక చకోరపక్షి ఎంతగా చంద్రకిరణాలు గ్రోలినా తృప్తి పొందనట్లు మీ వాక్యాలు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది. 'చాలు' అను తృప్తి కలగటమే లేదు.
మీ వాక్యములచే తృప్తుడనైనప్పటికీ మిమ్ములను మరల అడుగుచున్నాను. ఎంత తృప్తిచెందినా అమృతాన్ని వద్దు అని ఎవడూ అనడు గదా!
ఇప్పుడు మీరు "మిథ్యా పురుషుడు" అనువాని గురించి ప్రస్తావించారు. అవస్తువగు ఈ జగత్తును వస్తురూపంలో ప్రదర్శించే ఆ మిథ్యా పురుషుడెవడు? ఆతని కథ ఏమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : హాస్య సన్నివేశం వంటి ఆ మిథ్యా పురుషుని గురించి చెబుతాను విను.
అందరికీ తెలిసియే ఉన్న ఒకానొక పురుషుడున్నాడు. ఆతను మాయాయంత్ర మయుడు. చిన్న పిల్లవాడిలాగా అల్పమైన బుద్ధిగలవాడు. మూఢత్వంలోను, మూర్ఖత్వంలోను ఆతనికి ఆతడే సాటి. ఆతడు ఒకానొక ప్రదేశంలో నివసిస్తున్నాడు. బాగానే ఉన్నదా...?
అయితే, అతడు పుట్టింది, పెరిగింది ఒక ఏకాంత ప్రదేశంలో. ఇప్పటికీ ఆతడు ఆ ఏకాంత ప్రదేశంలోనే ఉన్నాడు. అక్కడ ఆ మిథ్యా పురుషుడు తప్పితే మరింకెవరూ లేరు. ఆ ప్రదేశంలో ఏదేది ఉన్నదో అదంతా ఆతడి విన్యాసమే. అనేక దర్పణాలలో ఒకే మనిషి అనేక కోణాలలో ప్రతిబింబిస్తాడు, చూచావా? ఆ మిథ్యా పురుషుడే అనేక విశేషాలుగా అక్కడ (ఆతడు ఉన్న ప్రదేశంలో) ప్రతిబింబిస్తున్నాడు. ఆతనికి అనుభవమయ్యేదంతా ఆతని ఆభాస మాత్రమే!
అయితే ఏం ? 'ఇన్నిట్లో నేనే ఈ వివిధ రూపాలుగా ప్రతిబింబిస్తున్నాను'... అనే విషయం ఆ దుర్బుద్దికి తెలియటం లేదు.
ఆతడు ఈ విధంగా ఆ ఏకాంత ప్రదేశంలో ఎదుగుచూ ఉండగా ఏం జరిగిందో విను. ఒక రోజు “నేనెవరినబ్బా?” అనే ప్రశ్న వచ్చింది. 'నేను నా చుట్టుప్రక్కల ఉండే ప్రదేశ ఆకాశమునకు చెందిన వాడను. అసలు నేను ఆకాశమునే. కాబట్టి నా ఈ ప్రదేశమును సర్వదా రక్షించుకోవటమే నా పని. - అనే సంకల్పం ఆతనిలో పుట్టింది.
Page:468
మరి ఈ ప్రదేశాకాశమును రక్షించటానికి ఏం చేయాలి? "ఇది ఎటూ పోకుండా గోడలతో ఇల్లు కట్టిస్తే పోలా?” అని అనుకున్నాడు. ఇంకేముంది? తానున్న ఆ ప్రదేశంలో చుట్టూ ఓ పెద్ద ప్రహరీ గోడ కట్టి, దాన్ని పెద్ద గృహంగా తీర్చిదిద్దాడు. “తనది. తన రూపమే” అని అనుకున్న ఆ ప్రదేశాకాశాన్ని గృహాకాశంగా మార్చివేశాడు. ఆ గృహము యొక్క అంతర్భాగాకాశంలో కూర్చుని 'ఇక నాకేమి ఫరవాలేదు. ఈ నాలుగు గోడల మధ్య నేను రక్షించబడినట్లే. దీనిని ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండటమే నా పని. ఇక నాకేం అవసరం లేదు'... అని అనుకుంటూ సంతుష్టుడైనాడు.
రోజులు దొర్లుతున్నాయి. మాసాలు, ఋతువులు గడచి పోతున్నాయి. ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షం వస్తున్నాయి. గతిస్తున్నాయి. ఏదైనా సరే, కాలగతికి హరించవలసినదే కదా! ఆ ఇల్లు కాస్తా, కాలగతిచే శిథిలమైపోయింది. గోడలు నేలకూలాయి. అప్పుడా మిథ్యా పురుషుడు ఇట్లా అనుకున్నాడు.
"అయ్య బాబోయ్! కొంపమునిగింది. ఈ గోడలు కాస్తా నేలకూలాయ్! ఓ గృహాకాశమా! నీవు నశించిపోయావా? అయ్యో! కొద్ది రోజులలో అంతు దొరక్కుండా పోయావే? ఇప్పుడేమిటి చేయాలి?”... అని దుఃఖించసాగాడు. తనదనుకున్న గృహాకాశాన్ని రక్షించటానికి అక్కడే ఒక నుయ్యి ఒకటి త్రవ్వుకున్నాడు. 'నా ఆకాశాన్ని ఈ నుయ్యిలో జాగ్రత్తగా పదిలపరచుకుంటాను’ అని అనుకున్నాడు. ఇక ఆ కూపాకాశాన్ని రక్షించుకుంటూ రోజులు గడుపుచున్నాడు.
ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. 'ఈ నుయ్యి నాది' అని అనుకుంటూ ఉన్నంత మాత్రంచేత కాలగతి ఊరకుంటుందా? కాలక్రమంగా కొన్నాళ్లికి గాలి - ధూళి ఏకమై ఆ నూతిని క్రమక్రమంగా పూడ్చి వేయసాగాయి. అట్లా ఆ కూపమంతా పూడిపోయేసరికి ఆ మిథ్యా పురుషునికి ఎక్కడ లేని దుఃఖాలన్నీ మళ్ళీ వచ్చిపడ్డాయి. 'అయ్యో! నేను నా ఆకాశమును తీసుకువచ్చి ఈ నుయ్యిలో కూపాకాశంగా మార్చి దాచుకున్నానా! ఈ పాడు ధూళి గాలికి లేచి నూతిలోకి పడటంతో ఈ నుయ్యి కాస్తా పూడుకుపోయింది. ఇప్పుడు నా ఈ ఆకాశాన్ని ఎక్కడ దాచుకోవాలి? సరే ఇక్కడ మట్టితో ఒకపెద్ద కుంభమును తయారుచేసి ఆ కుంభము (కుండ) ఆకాశాన్ని జాగ్రత్తగా దాచుకుంటాను”... అని అనుకున్నాడు.
క్రిందా - మీదా పడి ఒక కుంభాన్ని తయారు చేసుకున్నాడు. కుపాకాశాన్ని కుంభాకాశముగా మలచుకొన్న అనుభూతితో సంతోషం పొందాడు. 'అమ్మయ్య! ఇక ఫరవాలేదు. ఈ కుంభములో నా ఆకాశాన్ని కాపాడుకుంటాను. ఇంతే! ఇక ఎంతకాలమైనా కానీ!” ... అని సంతోషించాడు. అట్లా ఆ కుంభమును, అందులోని ఆకాశాన్ని చూచుకుంటూ కొద్ది నెలలు గడిపాడు. కొంతకాలానికి ఈ కుంభముకాస్తా చెత్త, మట్టి కూరుకుపోయి క్రమంగా ఎప్పుడో నామరూపాలు కనబడకుండా పోయింది. 'ఇదేంటిరా నాయనా! కుంభము కాస్తా నశించిపోయింది ? ఇప్పుడేం చేయాలి?' అని కొంతకాలం దుఃఖించాడు.
సరే! అప్పుడు అక్కడా-ఇక్కడా తిరిగి కొన్ని వాసాలు, రెల్లుగడ్డి, తాటాకులు సంపాదించి ఒక
Page:469
పాకను నిర్మించాడు. ఈ పాకలో నాలుగు గదులున్నాయి. ఆ గొప్ప పాకశాలపై ఎంతో ఆసక్తి కలవాడై, తన్మయుడై తన ఆకాశాన్ని ప్రతిక్షేపించుకున్నాడు. మరికొంత కాలం తరువాత ఆ పాక కూడా నేలకూలింది. ఆకులు, రెల్లుగడ్డి ఎండి నశించిపోయాయి. మన మిథ్యా పురుషుని దుఃఖ స్థితి మరల పునరావృతమైనది. ఆ నాలుగు గదుల పాకశాల గురించి ఏడ్చి, ఏడ్చి కొన్నాళ్ళైన తరువాత గోగు పుల్లలు తెచ్చి ఒక ధాన్యపు కొట్టు (కుసూలము) నిర్మించాడు. అతి కొద్ది కాలంలో ఆ కుసూలము కూడా నేలమట్టమై హరించుకుపోయింది. అది నశించినప్పుడు అతని దుఃఖం వర్ణనాతీతం.
ఓ రామచంద్రా! ఈ విధంగా ఆతడు ఇల్లు, నుయ్యి, కుండ, పాకశాల, ధాన్యపు కొట్టు మొదలైనవి నిర్మించుకోవటం... అవి కాస్తా నశించటం - ఈ విధంగా అనంతకాలం గడచిపోతోంది. అతను ఎంతో అభిమానంతో ఏదో ఒకటి నిర్మించుకోవటం, అది కాస్తా కాల ప్రవాహముచే నశించటం, అది నశించినప్పుడల్లా ఆ మిథ్యా పురుషుడు గొప్ప దుఃఖం పొందుతూ కొంతకాలం గడపటం-ఈ తతంగం సాగిపోతూనే ఉన్నది. అట్లా వేల కొలది రచనలు చేసుకుంటూనే ఉన్నాడు. అవన్నీ మరికొంత కాలానికి నశించటం జరుగుచూనే ఉన్నది.
ఇక ఆ మిథ్యా పురుషుడు ఒకప్పుడు 'నేను సుఖంగా ఉన్నాను. ఎందుకంటే నీ ఆకాశం ఇక్కడ పదిలపరచాను కదా!” ...అనుకోవటం, ఆ నిర్మించుకున్నది శిథిలం కాగానే భోరున ఏడవటం... ఇదంతా చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. కానీ ఏం చేయాలి? మేము చెప్పుచున్న దేమో అతడు వినడాయె!
2. అహంకారమే ఆ మిథ్యా పురుషుడు!
శ్రీరాముడు : స్వామీ! మీరు ఇంతవరకు వర్ణించి చెప్పిన ఆ మిథ్యా పురుషుడెవడు? ఆతడు ఆకాశ సంరక్షణ చేసుకొంటున్న తాపత్రయమంతా ఏమై ఉన్నది? ఆ మాయా పురుషుడు తను పుట్టిన తనదనుకొన్న స్థానమును (స్థలమును) కాపాడుకోవటానికి గృహాదులను నిర్మించుకోవటంలోను అవి నశిస్తున్నప్పుడు భోరున ఏడవటంలోను తాత్పర్యమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ మాయా యంత్రమయుడగు పురుషుని గురించి మనం చెప్పుకున్న విశేషాలకు సంబంధించిన తాత్త్వికార్థం ఏమిటో చెపుతాను విను.
అతడు మరెవరో కాదు. ఆతడు శూన్యాకాశమునుండి ఆవిర్భవించిన ఈ 'అహంకారము' అనునదే! ఏ ఆకాశకోశమునందైతే ఈ జగత్తంతా అనంతమై భాసిస్తోందో... అదియే అహంకారము. అయితే అట్టి అహంకారం సృష్టికి పూర్వం స్వయంగా అసత్తై, శూన్యమాత్రమై ఉన్నది. ఏ మాయాకాశం
Page:470
నుండి అహంకారమనునది ఉత్పన్నమౌతోందో అట్టి ఆ మాయాకాశము యొక్క ఉనికి - - అధిష్ఠాన రూపముచే బ్రహ్మమునందే ఉండి ఉన్నది. అనగా, చిదాకాశమునందు ఆధ్యస్తమైన మాయాకాశము నుండి 'అహంకారము' అనేది ఉదయిస్తోంది సుమా!
అనాత్మయే అయినప్పటికీ 'ఆత్మత్వం' పొందిన ఈ అహంకారం మాయాకాశముననే (తాను జన్మించిన స్థానమునందే) వృద్ధి పొందుతోంది. అక్కడే 'ఇదిగో, ఇది నాకు ఇష్టం. అది ఇష్టం ఉండదు’ ...మొదలైన అనేక రకములైన కల్పనలన్నీ కల్పించుకుంటోంది. ఇక ఆ అహంకారం ఇష్టమైన వాటిని సంపాదించుకోవటం కోసం, అయిష్టమైన వాటిని తొలగించుకోవటం కోసం సుదీర్ఘ కాలంగా మహాప్రయత్నముల సంరంభంలో మునిగి ఉంటోంది. అనాత్మయగు ఈ పాంచ భౌతికమైన దేహ పంజరమును అద్దాని సంబంధమైన ఆశావిశేషాలను చూచుకుని 'ఇదే నా సర్వస్వం. ఇదే నా స్వరూపం. ఇంత మాత్రమే నేను' అని అనుకుని దేహాన్ని ఆశలను రక్షించుకోవటానికి ప్రవృత్తమౌతోంది. అట్టి ఈ పాంచభౌతిక దేహం కాలంచే నిర్మించబడింది కనుక తప్పకుండా అయితే, కాలము చేత పొందబడేదంతా హరించబడవలసినదే కదా!
ఈ దేహం ఆయా అవస్థలలో కృంగిపోతూ ఉంటే ఇక ఆ అహంకారం 'గోవిందా! ఇక నా పని అయిపోతోంది. ఇక గతి లేదు. చేయగలిగినది లేదు'... అంటూ వాపోతున్నది. దేహమును ఆశ్రయించినంత కాలం దేహరంధ్రముల వంటి ఇంద్రియములకు విషయములగుచున్నవాటి పట్ల ప్రీతి-అప్రీతులను కల్పించుకొని ఉంటోంది. ఇక దేహము శిథిలమగుచున్నప్పుడు 'నా సర్వస్వము పోతుంది నేను ఇట్లా శిథిలమౌతున్నాను... అని గావుకేకలు పెట్టుచున్నది. ఆ విధంగా పూర్వ దేహములు నశించుచుండగా క్రొత్త క్రొత్తవగు ఉత్తరోత్తర దేహములను సృష్టించుకుంటోంది.
ఈ అహంకారమే మాయాపురుషుడు అదియే మిథ్యా పురుషుడు స్వతహాగా అసత్తే అయినప్పటికీ ఈ అహంకారము (నేను-నాది అను ఆవేశం) మాయచే వ్యర్థంగా ఉదయిస్తోంది. ఈ భూచర-జలచర ఆకాశచరాది అనేక దేహములను ఇష్టానిష్టముల కారణంగా ఆశ్రయిస్తోంది. ఎప్పుడు ఏ దేహమును ఆశ్రయించటం జరిగితే అదే తన పరిమితము, అవధులు అని సంకుచితత్వము సంతరించుకుంటోంది 'ఈ దేహాన్ని నేను ఏం చేసి రక్షించుకోవాలి?' అని అగచాట్లన్నీ తెచ్చిపెట్టుకుంటోంది.
అయితే ఏఏ జగదాకార విభ్రమములు అహంకారమును మోహింపజేస్తున్నాయో చెబుతాను విను- 1. జీవుడు 2. బుద్ధి 3. మనస్సు 4. చిత్తము 5. మాయ
6. ప్రకృతి 7.సంకల్పము 8. కల్పన 9. కాలము 10. కలన...
ఇటువంటి పేర్లన్నీ అహంకారము ఆశ్రయించే మోహ వేషములే! ఇటువంటి అనేక నామరూపములచే అనేకత్వము పొంది, వేలకొలది రూపములు ధరించి, తనచే కల్పించబడిన పదార్థములచే తానే విజృంభిస్తోంది.
అనగా, 'పూర్ణబ్రహ్మము' న 'అహంకారము' అనే మిథ్యాపురుషుడు భ్రమ (లేక మాయ, కల్పన)... అనతగిన కారణంగా ఉదయిస్తున్నాడు. అతడు భూతాకాశము యొక్క కల్పన కావించుకొనుచున్నాడు. మట్టి రాయి లేని గోడలాగా ఈ జగత్తు యొక్క రచనాచమత్కృతిని
Page:471
నిశ్చయిస్తున్నాడు. తనంతట తానే జగజ్జలంలో కష్టాలను, చెప్పలేనన్ని చిక్కులను, దుఃఖములను, సుదీర్ఘకాలగతిని పొందుచున్నాడు.
ఓ రామచంద్రా! ఆ మిథ్యా పురుషుడు ఘటాకాశములను "తనది తన స్వరూపము" అను శంకతో ప్రవర్తిస్తున్నట్లుగా నీవు మాత్రం అట్టి క్లేశావస్థలకు చోటు ఇవ్వవద్దు. వాస్తవానికి నీ స్వరూపం. నా స్వరూపం. తదితరులందరి స్వరూపం ఆత్మయే కదా! ఆకాశము కంటే విస్తృతమై, శుద్ధమై, శివమై, శుభమైనట్టి ఆత్మను స్వీకరించటమేమిటి? రక్షించటమేమిటి ఎక్కడో ఏ దేహాదులందో ఉంచి కాపాడటమేమిటి? సర్వవ్యాపక మగు స్వస్వరూపమును ఈ దేహాదులచే కాపాడుచున్నామనుకొనేవారు కేవలం భ్రమ చేత, అవగాహనారాహిత్యం చేత అట్లా పలుకుచున్నారని గ్రహించు. ఈ శరీరము స్వభావవశం చేత నశిస్తే ఆత్మయే నశిస్తోందనే శంకచే కొందరు జనులు నిష్కారణంగా, వ్యర్థంగా దుఃఖిస్తున్నారు. అది వాస్తవం కాదు. కుండ పగిలితే లోన ఉన్న ఆకాశం నశిస్తుందా?... లేదు.
అట్లాగే... దేహములు నశించనప్పటికీ దేహి నశించడు. ఆ దేహినే మనం 'ఆత్మ' అని అంటున్నాం. ఏ జీవుడైనా 'దేహి'యే స్వరూపంగా కలిగి ఉన్నాడు గాని, ఈ దేహము అతని స్వరూపమే కాదు. ఆత్మయగు దేహి నిత్యమై, నిశ్లేషమై అవినాశి అయి వెలుగొందుచున్నాడు.
ఓ రామచంద్రా! ఆత్మ సర్వదా శుద్ధ చిన్మాత్రమై, ఆకాశము కంటేకూడా అత్యంత సూక్ష్మమై, స్వానుభవమాత్రమై ఉన్నది. ఆకాశంలాగానే ఆత్మ కూడా ఏ సమయమందును నశించటం లేదు. న జాయతే న మ్రియతే క్వచిత్ కించిత్ కదాచన జగద్వివర్తరూపేణ కేవలం బ్రహ్మ జృంభతే || ॥
ఆత్మ ఎప్పుడూ, ఎక్కడా ఉత్పన్నం కాదు నశించదు. అయితే. ఈ 'జగత్తు' అను వివర్త రూపంగా ప్రదర్శితమయ్యేదంతా ఆత్మయే గాని మరింకేదీ కాదు.
సత్యమ్, ఏకమ్ పదమ్, శాంతం, ఆదిమధ్యాన్త వర్జితమ్ | భావాభావవినిర్ముక్తమ్ - ఇతి మత్వా సుఖీభవ ॥
ఓ రాఘవా ! ఆ ఆత్మపదము సత్యమై, ఏకమై, శాంతమై, ఆదిమధ్యాంతరహితమై, భావ - అభావ వినిర్ముక్తమై ఉన్నదయ్యా ! ఇది సర్వదా గ్రహించి సుఖవంతుడవు కమ్ము.
ఇక అజ్ఞానమంటావా?... అది సమస్త ఆపదలకు స్థానం. అద్దానిలో ధ్రువము అంటూ ఏదీ లేదు. పైగా, అది జీవునిపట్ల అస్వాతత్ర జనకమైనది. జీవుని వివేకమునకు అది శత్రువు వంటిది. మిథ్యమైనది. అందులో అంతర్గతమై ఉన్న విశేషాలన్నీ అజ్ఞానసమన్వితమగు దేహాభిమానమునకు సంబంధించినవి మాత్రమే! అటువంటి 'అహంకారము' అనే భూతాన్ని వదించుకోవాలంటే జ్ఞానమే శరణ్యం. నీవు సర్వదా జ్ఞానమును ఆశ్రయించి, ఆపై, అజ్ఞానమగు అహంకారమును త్యజించగా శేషించియున్న ఆత్మ పదమున దృఢంగా స్థితి కలిగిఉండెదవు గాక!
Page:472
3. అహంకారము ఆత్మకు అన్యమైనది కాదు
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ సృష్టికి ముందే పరబ్రహ్మమునందు మొట్టమొదట ‘మనస్సు’ అనేది బయల్వెడలుతోంది. దాని రూపము మననమే గాని మరింకేదో కాదు. ఈ మననమే సువిశాలమగు జగద్రచనగా అనుభవమౌతోంది. అది ఇప్పటికీ పరమాత్మయందే ఉన్నది. పరమాత్మయందు ఉంటూనే తదితర కల్పనలన్నిటికీ హేతువుగాకూడా అయి ఉంటోంది. తరంగాలు ఎక్కడున్నాయి? సముద్రంలోనే కదా! కిరణ సమూహాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయ్? సూర్య బింబము నుండే కదా! సువాసన ఎక్కడి నుండి వస్తోంది? పుష్పకోశము నుండే కదా! అట్లాగే మనస్సు కూడా బ్రహ్మమునందే ఉండి, బ్రహ్మము నందే వర్తిస్తోంది. అయితే చమత్కారం చూస్తున్నావా? ఈ మనస్సు అదృశ్యమగు ఆత్మను ఏమరచి జగత్తు యొక్క కల్పనలందు ఉపక్రమిస్తోంది. క్రమంగా దృశ్యజగత్తును తనయందు గాంచుచున్నది.
ఒకడు ఒక త్రాడును చూచి ‘పాము ' అని బెంబేలెత్తుచున్నాడనుకో. 'పాము' అనేది ఎక్కడినుండి వచ్చింది? త్రాడును చూచినప్పుడే కదా! కనుక పాము త్రాడులోంచే వచ్చినట్టు కదా! అట్లాగే అత్మయందు మనస్సు బహిర్గతమౌతోంది. వాస్తవానికి త్రాడులో పామూలేదు. ఆత్మయందు మనోఅహంకారాలు లేవు.
శ్రీరాముడు : నిర్లిప్తము, నిర్విషయము అగు అత్మ నుండి విషయరూపమగు మనస్సు ఉద్భవించటం చమత్కారమే కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : ఎవడైతే 'సూర్య కిరణములు సూర్యుని కంటే వేరు'... అని అనుకుంటాడో, వానికి ఆ సూర్య కిరణములు అన్యమైనట్లే భాసిస్తాయి. 'బంగారము కంటే ఆభరణములు వేరైనవి'... అనుకునే వాని అనుభవం అట్లే (వేరైనట్లుగానే) ఉంటుంది గాని, అది 'బంగారం కదా' అని అతను అనుకోవటం లేదు. కానీ, 'సూర్యబింబము నుంచే బయలుదేరిన కిరణములు సూర్యునికి వేరైనవి ఎట్లా అవుతాయి? బంగారము కంటే ఆభరణం వేరైనదని అనటం ఎట్లా?'... అని భావించావనుకో? అప్పుడు మొదటి వానికంటే వ్యతిరిక్తమైన అనుభవమే ఉంటుంది.
తరంగములు చూచేవానికి తరంగబుద్ధియే ఉంటుందిగాని, జలబుద్ధి ఉండదు. “తరంగములు జలము కంటే వేరు కాదు” అని తలచేవాడికో? ఇతనికి జలబుద్ధియే ఉంటుంది గాని, తరంగ బుద్ధి ఉండదు. "బంగారము యొక్క ఆకారములైన ఆభరణములందు కూడా ఉన్నది బంగారమే”... గ్రహించేవాడు మహాబుద్ధిమంతుడై ఉంటాడు. అట్టివాడు “నిర్వికల్పుడు” అని చెప్పబడతాడు. "త్రిగుణాత్మకమైన కనిపించే ఈ దృశ్యాంతర్గత జీవులంతా త్రిగుణాతీతమగు పరమాత్మ యొక్క సంప్రదర్శనా విన్యాసమే” - అని గమనించడాన్నే 'నిర్వికల్పము' అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.
“అగ్ని జ్వాలలు అగ్ని కంటే వేరు” అని భావించేవానికి అగ్నిబుద్ధి నశించి జ్వాలాబుద్ధియే ఉంటుంది. “ఈ జ్వాలలు ఆకారసమన్వితాలు” అని కల్పన చేస్తే, అవి అట్లే గోచరిస్తాయి.
Page:473
ఆకాశంలో పొగపంక్తిపోతుంటే “ఇవి మేఘములే” అని అనుకుంటాడేగాని, “ఇవి బయలు దేరినవి అగ్నిలోంచే" అనేది దృష్టికి రాదు. జ్వాలల యొక్క ఊర్ధ్వ వక్ర గమనములను మేఘముల లాగానే చూస్తాడు. 'అగ్నిజ్వాల అగ్ని కంటే వేరు కాదు' అనే బుద్ధి (లేక, భావన) కలవానికి అగ్నిబుద్దియే సర్వదా కొనసాగుతుంది.
అంతయూ ఆత్మగా దర్శించువాడు వికల్పరహితుడని చెప్పబడుచున్నాడు. అట్టి వికల్పరహితుడైనవాడు 'మహాపురుషుడు' అనిపించుకుంటాడు. ఎవరికి సర్వసంశయములు సంక్షయించి ఉంటాయో... అతడే మహామతి. అట్టివాడు ఏది పొందాలో, అది పొందినట్లే. ఇక అతడు కల్పిత వస్తువులను, విషయములను, వ్యవహారములను చూచి కలత చెందడు. ఎందుకంటే అతడు సర్వదా సత్యత్వబుద్ది చేతనే నిమగ్నుడై ఉంటాడు కదా!
ఓ రామచంద్రా! నీవు “ఇది మనస్సు - ఇది చిత్తము - ఇది బుద్ధి" ... ఇటువంటి అనేకత్వమంతా ఈ క్షణమే త్యజించు. 1. సంవేద్యరహితమై 2. శుద్ధచిన్మాత్రమై, 3. సాక్షి రూపమై, 4. అభ్యంతరవస్తువు మొదలుగా గల మహత్తర స్వభావయుక్తమై ఆత్మయందు స్థిరుడవై ఉండుము.
ఒక చిన్న దృష్టాంతం చెబుతాను విను. వాయువు ఉన్నది. అది అంతటా ఏర్పడి వ్యాపించి ఉన్నది. అట్టి వాయువు నందు ఒకానొక చలనశక్తి (ప్రసరించు స్వభావము) ఉన్నది. ఫలితంగా వాయుతరంగాలు ఏర్పడుచున్నాయి. వాయువుయొక్క తరంగత్వము అకారణమనే చెప్పాలి. అయితే ఆ తరంగత్వము "జీవులను జీవింపజేయుట” మొదలుగా గల అనేక వ్యవహారములకు కారణ మగుచు, తాను మాత్రం నిష్కారణమై ఉంటోంది. అట్లాగే ఆత్మ కూడా స్వయంగా అకారణమైనప్పటికీ తనయందు సంకల్పాత్మక శక్తి కలిగి ఉంటోంది. అట్టి స్వయంకృతమగు సంకల్పాత్మకత్వం చేత 'జగత్తు' అను అనుభవమును తాను పొందుతూ, ఇద్దానికి కారణమగుచున్నది. అట్టి సంకల్ప వ్యవహార సందర్భంగా అది తననుండి ఏర్పడిన మనస్సును. అందలి భావాలను, ఆ భావాలకు విషయమగుచున్న ఈ సర్వమును అనుభవరూపంగా పొందుతోంది. సంకల్పకల్పనామయమై, ప్రపంచరూపమైనట్టి ఆ మనస్సు తన ఆకృతిని తానే భావన చేయుచు స్వయముగా ఉత్పన్న మగుచున్నది. సంకల్పాత్మకమైన సమష్టి చిత్తము సమస్త ప్రపంచమును గూర్చి సంకల్పించుచుండగా, ఈ సమస్త ప్రపంచరూపము పరికల్పించబడుతోంది. అది ఎట్లు దేనిని సంకల్పిస్తుంటే ୧୨
సంకల్పములను అనుసరించి - క్షణకాలంలో అట్లే అగుచున్నది. ఆ సమష్టి చిత్తమే ఒక కీటకంగాను, బ్రహ్మదేవునిగాను, మేరు పర్వతంగాను, మనస్సు - - జీవుడు - అహంకారం - చిత్తము మొదలైన వ్యవహారములుగాను స్వసంకల్పముచే ధరిస్తోంది.
ఈ చిత్తము ‘సంకల్పము’ అను మూల పదార్థముచే నిర్మించబడినదై, ద్వైత ఏకత్వరూపమగు జగతిస్థితిని పొందుతోంది. ఇక ఆ తరువాత ఇద్దానియందు తనకు తానే స్వయంగా అనేకత్వమును సుదీర్ఘకాలం అనుభవిస్తోంది.
+
Page:474
కనుక రామా! సంకల్పముచేతనే ఈ విశాల జగత్తు కన్పిస్తోంది. ఈ కారణం చేత ఇది సత్యం కాదు. ఎందుకంటే, ఏదీ ఎట్లు అనుభవమౌతోందో... అదంతాకూడా సంకల్పమాత్రం మరియు సంకల్ప నిర్మితమే కదా!
ఈ జగత్తు మిథ్య కూడా కాదు. స్వప్నజాలము వలె ఇది అనిర్వచనీయమై ఉన్నది. స్వప్నము అసత్యమందామా... ‘అనుభవం' అనేది ఉన్నది కదా! కాదు, సత్యమందామా?
స్వప్నం కల్పనామాత్రమే కదా! నిద్రకొనసాగిస్తున్నంతవరకు స్వప్నం సర్వ వికారములు కలిగిస్తూ, ఒక సందర్భ- అసందర్భ సంఘటనల కలయిక వలె కొనసాగుతూనే ఉంటుంది. సుఖదుఃఖాది రసాభావములు గాలి కెరటముల వలె ఉంటాయి. స్వప్న సంఘటనకు ఆ స్వప్న సమయంలో దుఃఖం ఉంటుంది కనుక వాస్తవముగా అది ఉన్నట్లే కదా! ఆ ప్రాణి నిదుర లేవగానే స్వప్నం లేదు. స్వప్న సంఘటనలు లేవు. అట్లాగే ఈ జాగ్రదనుభవం కూడా! నిద్రపోయినవాని జాగ్రదనుభవం నిద్రలేవగానే కొనసాగుచున్నట్లు, దేహము పోయిన తరువాత మౌనం వహించే జాగ్రదనుభవపరంపరలు మరల దేహము ప్రాప్తించగానే సంస్కార రూపములతో కొనసాగుచూనే ఉన్నాయి. అయితే ఆత్మస్వభావం జ్ఞానపూర్వకంగా సంతరించుకున్న మరుక్షణం ఈ దృశ్యము పట్ల - దేహదుల పట్ల ఏర్పడియున్న సర్వ సందేహాలు తొలగుతాయి.
ఈ జీవుని మనోరాజ్యం 'ప్రేమ - ద్వేషము - అభిమానము - ఆశ - నిరాశ - - అజ్ఞానము
- విజ్ఞానసాధనలు’... మొదలైన వాటితో కూడినదై వివిధ కార్యకలాపములతో భాసిస్తోంది కదా!
అట్లాగే బ్రహ్మదేవుని [సమష్టితత్త్వము యొక్క (లేక) హిరణ్యగర్భుని] సువిశాల - సుదీర్ఘ మనోరాజ్యం కూడా 'కల్పితము - భావనామాత్రము' అగు చమత్కారములతో భాసిస్తోంది.
యధా భూతార్ధభావిత్వాత్ తదేవత్ ప్రవిలీయతే ॥ పరమార్ధన దృష్టంచేత్ తదిదం నైవ కించన ॥
యథార్థరూపంలో భావించేవానికి దీని మాయారూపమంతా లయించిపోతోంది. ఎందుకంటే బ్రహ్మరూపముగా భావించే వానికి ఇక్కడ మాయారూపమైనదేదీ ఉండియే ఉండదు.
దృశ్యంత్వ పరమార్ధన ప్రయాతి శతశాఖతామ్ | జలమ్ ఊర్మి–తరంగాది కలనార్హం పరిస్ఫురన్ II
‘సముద్రం’ అంటే ఏమిటి? జలం మాత్రమే కదా! అయితే అందులో తరంగాలు, ఆవృత్తాలు, నురుగు మొదలైనవన్నీ వివిధ కల్పనా రూపాలుగా స్ఫురిస్తున్నాయి. జలదృష్టిచే అవన్నీ జలమే కదా! పరమార్థమగు ఆత్మతత్త్వమే అపరమార్థ దృష్టిచే ఈ వందలాది సృష్టిశాఖల రూపంలో స్ఫురిస్తోంది.
సముద్రం తరంగములు మొదలైన రూపములన్నీ ధరిస్తున్నప్పటికీ సముద్రం సర్వదా జలమాత్రంగానే ఉంటోంది కదా! అట్లాగే ఈ జీవుడు ‘దేహభావన' అను వ్యవహారమును ఆశ్రయించి వేలకొలది కర్మలు ఆచరించుచుండవచ్చు గాక! అనేక దేహములు పొంది ఉండవచ్చు, పొందబోవవచ్చుగాక! అదంతా కూడా 'మనస్సు యొక్క చలనము’ మాత్రమే. 'కూటస్థమగు
Page:475
చైతన్యము’ అను ఆ జీవుని వాస్తవ స్వరూపమునందు అపూర్వమగు వికారమేదీ కించిత్తు కూడా కలగటం లేదు. కలుగదు. అందుచేత రామా! నీవు తుచ్ఛములగు సర్వభేదములను త్యజించు. ఇక నీవు నడుస్తున్నప్పుడైనా, వింటున్నప్పుడైనా, తాకుచున్నప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, నిద్రిస్తున్నప్పుడైనా, వ్యవహరిస్తున్నప్పుడైనా 'నా ఆత్మ స్వరూపమునందు అపూర్వమైనదీ ఎక్కడా ఉండజాలదు’ అని గ్రహించియే ఉండు. ఏ నీ వాస్తవ స్వరూపము అఖండమై, నిర్మలమై, అప్రమేయమై, సత్యమైయున్నదో, అద్దానినే భావన చేయుచూ ఇక ఏది ఎట్లో అట్లే నిర్వర్తించు. నీవు ఏది చేసినా, చూచినా, అదంతా కూడా నిర్మలమై, వ్యాపకమైనట్టి చిన్మాత్రమేనని' ఎఱుగుము. ఈ సర్వజీవుల, సర్వ పదార్థముల నిజస్థితి సారభూతమగు సత్చిత్ స్వరూపమే అయి ఉన్నది. ఆ 'సత్చిత్' కు అన్యంగా ఎక్కడా ఏదీ లేదు.
ఈ విశాల రూపంగా భాసించేదంతా బ్రహ్మము మాత్రమే ఈ జగత్తంతా సంవితామాత్రమే! ఇక్కడ మరొక కల్పన లేనే లేదు. సంవిత్ యొక్క స్ఫురణ మాత్రమైన 'జగజ్జాలము' అను పేరుగల ఇద్దానిలో 'అది వేరు - ఇది వేరు' అనేది. ఎట్లా ఏర్పడగలదు చెప్పు? సత్లో మిథ్యాగ్రహణం భ్రమమాత్రమే. మరియు... అంతటా ఒకే 'సంవిత్తు అను చైతన్యమై ఉండియున్నది కనుక, ఇక సంవేద్యము (తెలియబడునది) అను దాని యొక్క తెలుసుకొనుదానికంటే వేరైన) ఉనికి ఎక్కడున్నది? దేనికైతే ఉనికియే లేదో అది ఉనికిగలదానిని ఎట్లా బంధించిగలదో చెప్పు? 'స్వప్నం ఎక్కడి నుండో బయలుదేరివచ్చి స్వప్నద్రష్టను బంధించి ఉంచుతోంది' అనేది అర్థరహిత వాక్యంగాక మరేమిటి? స్వప్నం స్వప్నద్రష్టలోంచే బయల్వెడలుతోంది కదా! కాబట్టి 'ఉనికి-ఎరుక' అను స్వరూపముగల నీకు నీ కల్పనచే ఎరుగబడే ఈ జగత్తు వలన బంధమోక్షములు ఏర్పడుతాయని ఎవరైనా అంటే అది పరిహాసవాక్యం మాత్రమే.
కనుక రామా!
మోక్షోయమేష ఖల బంధ ఇతి ప్రసహ్య చిన్తాం నిరస్య సకలాం విఫలాభిమానాం మౌని, వశీ, విగతమానమదో, మహాత్మా! కుర్వన్స్వకార్యమనహంకృతిరేవ తిష్ఠ ॥
ఓ రామచంద్రా! "ఇది బంధము, ఇది మోక్షము” అనబడే వ్యర్థాభిమానము గురించిన చింతను సర్వప్రయత్నములచే వదిలివేయి. ఈ వాక్కు మొదలైన సర్వ ఇంద్రియములను అధిగమించివేయి. నీకు ప్రవాహపతితంగా ప్రాప్తమైన ఈ రాజ్యపాలనము మొదలైన ఆయా కార్యక్రమములను ఉచితరీతిగా నిర్వర్తించు. అట్లు నిర్వర్తిస్తూనే మౌనివై, సంయమివై అభిమానమదాదులు లేనివాడవై, అహంకార - మమకార వర్జితుడవై వెలయుము.
సంశయములన్నీ పారత్రోలి నిర్భయుడవై ఉండు. శాశ్వతమైనట్టి కూటస్తభావనను అవలంబించి ఉండు. మహాకర్తవు, మహాభోక్తవు, మహాత్యాగివి కమ్ము.
Page:476
XII. శ్రీ శివ - భృంగీశ్వర సంవాదం
(మహాకర్త - మహాభోక్త మహాత్యాగి)
- -
1. జీవన్ముక్త లక్షణములు
శ్రీరాముడు : హే మహర్షీ! 'మహాకర్త' 'మహాభోక్త' 'మహాత్యాగి' అను మూడు మహావ్రతాలు వేదాంత వాఙ్మయంలో ప్రసిద్ధమై ఉన్నాయి కదా! ఆ మూడిటి గురించి మీ ప్రవచనాన్ని వినాలని నా అభిలాష! శ్రీవసిష్ఠ మహర్షి : ఓ! తప్పకుండా. ఒకప్పుడు ఈ మహాకర్తది మూడు వ్రతముల గురించి భృంగీశ్వరునకు జగత్ప్రభువగు శివభగవానుడు ఒక సందర్భంలో బోధించటం జరిగింది. ఆ బోధను ఇప్పుడు ప్రస్తావించుకుందాం.
ఒకసారి లోకపావనుడగు శివభగవానుడు ఏదో సందర్భంలో పరివార సమేతంగా మేరు శిఖరం యొక్క ఉత్తర భాగంలోని ఒక ప్రదేశంలో విడిది చేయడం జరిగింది. ఆ విడిది చేసియున్న రోజులలో ఒక సమయంలో మహా తేజస్వియగు భృంగీశుడు తనకు గల జీవన్ముక్తికి సంబంధించిన కొన్ని సందేహాలు నివారించుకోవటానికి భక్తజన వాత్సల్యుడగు స్వామిని సమీపించాడు. భృంగీశుడు : హే భగవాన్! దేవ దేవేశా! సర్వజ్ఞా! పరమేశ్వరా! జీవన్ముక్తి విషయమై నా సందేహనివృత్తి కొరకు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలని ఉంది. నా పై దయతో నన్ను అనుగ్రహించండి. ఈశ్వరుడు : రా నాయనా! ఇటొచ్చి కూర్చో. అడుగు ఏమిటి నీ సందేహం!
భృంగీశుడు : స్వామి! అంతరంగ స్వామి అయిన మీకు నా గురించి అన్నీ తెలుసు. అయినా వైద్యుని దగ్గిరకు భవరోగమునకు గొప్ప వైద్యులు కదా! ఇక వినండి.
సంసార రచనాం, నాధ! తరంగ తరలామిమామ్ । అవలోక్య విముహ్యామి, తత్త్వ విశ్రాంతి వర్జితః ॥
మహాత్మా! నా ఎదురుగా ఏర్పడి ఉన్న ఈ చంచల సంసార రచనను చూస్తూంటే నాకు భయమేస్తోంది. నేను అనుక్షణం విమోహితుణ్ణి అవుతున్నానే గాని, ఆత్మతత్త్వంలో విశ్రాంతి మాత్రం పొందలేకపోతున్నాను. అప్పుడు నా కనిపించింది, నేను అపరిపక్వమైన నిర్ణయాలు కలిగియుండుట చేతనే సంసారసాగరంలో కొట్టుకుపోతున్నానేమో? అందుకే సద్గురువులు, సర్వ సాక్షిస్వరూపులు, పుత్రవాత్సల్య సమన్వితులగు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను.
ఇప్పుడు నేను ఎటువంటి నిశ్చయం కలిగి ఉంటే ఈ జగద్రూప జీర్ణ గృహంలో దుఃఖ రహితుడనై ఉంటానో అట్టి ఉత్తమ - - ప్రియవిషయమును నాకు బోధించండి.
Page:477
ఈశ్వరుడు : పుత్రా! భృంగీశా! ఈ సంసారము గురించి నీకెందుకయ్యా భయం? సంశయములన్నీ వదిలిపెట్టి, నిర్భయమైన శాశ్వతమైన 'కూటస్థాత్మ'ను అవలంబించు. మహాకర్తవు... మహాభోక్తవు... మహాత్యాగివి కమ్ము.
భృంగీశుడు : అయ్యా! 'మహాకర్త' 'మహాభోక్త' 'మహాత్యాగి' అవటమంటే మీ ఉద్దేశ మేమిటో సవివరంగా దయచేసి చెప్పండి.
ఈశ్వరుడు : వత్సా! ఆ మూడింటిని నిర్వచిస్తూ చెబుతాను. విను.
2. మహాకర్త
ఈశ్వరుడు : మహాకర్త అయినవాడు ఎట్లా ఉంటాడో ముందుగా వివరిస్తాను.
1. అసంశయుడు - (ధర్మాధర్మౌ శంకా విరహితాక్షయః, యః కరోతి యధా ప్రాప్తా) ‘ఆత్మయందు కర్తృత్వం - అనే ధర్మమే లేదు' అను నిశ్చయం కలిగి ఉంటాడు. ఇక యథా ప్రాప్తాలైన ధర్మాధర్మాలను, 'ఇది చెయ్యవచ్చా? అది చేయవలసియున్నదేమో?' అనే సంశయములను మొదలే విడిచిపెట్టి ఉంటాడు. అనివార్యమగు ఆయా కర్మవ్యాసంగముల పట్ల నేను చేయవలసి ఉన్నదే ఇదంతా. చెయ్యవలసింది చేయవలసిందే! సందేహించవలసినది లేదు ...అను అవగాహన కలిగి ఉంటాడు.
2. అపేక్షారహితుడు - (రాగ-ద్వేషౌ, సుఖం-దుఃఖం, ధర్మ-అధర్మౌ, ఫలా-అఫలే అనపేక్షణమ్ యః కరోతి) అతనికి రాగద్వేషాలు ఉండవు. “దీని వలన సుఖం రావాలే! అది దుఃఖం కదా! ఇదే నేనెందుకు చేయాలి? అది వాడెందుకు చేయకూడదు? ఇది చేస్తే ప్రయోజనం దానివలన ఏం లాభం?”...ఇటువంటి అపేక్షతో కూడిన భావాలు కలిగి ఉండడు. ఇక ఆతని రాగద్వేష - సుఖ దుఃఖ ధర్మాధర్మ - ఫలాఫల కార్యాలన్నీ లోకానుకూలత కొరకు మాత్రమే ఉద్దేశించబడి ఉంటాయి గాని తన యొక్క అభిప్రాయం కొరకో, అపేక్ష, కొరకో కాదు.
3. ఉద్వేగ రహితుడు - (మౌనవన్, నిరహంభావో, నిర్మలో, ముక్తమత్సరఃగతోద్వేగం యః కరోతి) “ఏం, నేను ఎందుకు చేయాలట?... నేనింత చేస్తున్నానే! మరి జనం చూస్తున్నారా?... నీ తోటి వారు చేసేదంతా తప్పే!... నేను కాకపోతే ఇంకెవ్వడయ్యా చేయగలిగేది?... అసలు వీళ్ళందరి సంగతి చూడాలి!” ... ఇటువంటి ఉద్వేగ భావాలు ఆ మహాకర్తకు ఉండవు. సాంసారికమైన భావావేశాల పట్ల అంతరంగంలో మౌనం వహించి ఉంటాడు. కొండపైన చెట్టు కదులుతుందేగాని కొండ కదలదుకదా! "నేను అంతటివాడిని. ఈ పని ఇంతటిది"... అనే అహంకారం వహించడు. నిరహంకారం అభ్యసిస్తూ ఉంటాడు. ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టే దోషము ఆశ్రయించకుండా నిర్మలుడై ఉంటాడు. మాత్సర్యం దరిజేరనివ్వడు. సర్వ ఉద్వేగములను జయించినవాడై విధివశాత్తు తాను చేయవలసినది నిర్వర్తిస్తాడు.
Page:478
4. శంకారహితుడు - (శుభాశుభేషు కార్యేషు ధర్మాధర్మైః యస్యమనః కుశంకయా న లిప్యతే) ఆయా శుభ-అశుభ కార్యవ్యవహారములందు ఎవని బుద్ధి అయితే అనుమానాలతో దోషభూయిష్ఠం కాదో, అతడే మహాకర్త. బుద్ధి నిశ్చలత కలవాడై ఎప్పటికి ఏది ప్రస్తుతమైనదో అద్దానిని ధర్మనిరతుడై నిర్వర్తిస్తూ ఉంటాడు.
5. నిర్ ఇచ్ఛిన్నుడు - (యః సర్వత్ర విగత స్నేహో, సాక్షివత్ స్థితః - కార్యే నిరిచ్చం వర్తతే) అతనికి 'ఇది నాకు ఇష్టం. అది నాకు ఇష్టం కాదు' అనబడేదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే అతడు సర్వత్రా రాగరహితుడై ఉంటాడు. సర్వమునకు సాక్షిమాత్రుడై ఉంటాడు. ఇచ్ఛారహితుడై నిజాశ్రమధర్మములను నిర్వర్తిస్తూ ఉంటాడు.
6. ఆవేశ - ఆనందరహితుడు - - (ఉద్వేగానంద రహితః, సమయా, స్వచ్ఛయా, ధియా, యో న శోచతో, యో నోదేతి) దేనికీ ఉద్వేగంగాని, ఆనందంగాని చెందడు. సమమైన - స్వచ్ఛమైన బుద్ధిని కలిగి ఉంటాడు. ఈ సుఖదుఃఖాలన్నిటికీ అతీతుడై నిర్మలమైన హృదయంతో ఈ 'జీవితం' అనుదానిని తన అనంత స్వరూపమునందలి ఒకానొక చిన్నచమత్కారముగా, ఒక కళగా గాంచుతూ ఉంటాడు.
7. అసంసక్త మనస్కుడు - (యః యధార్థకాలే మతిమానః, అసంసక్తమనాః, మునిః, కార్యానురూపవృత్తస్తో) అతడు ఆయా కాలాలో సంప్రాప్తించే విధి విధానాలను అసంసక్తంగా నిర్వర్తిస్తూ ఉంటాడు.కార్యానుకూలంగా ప్రవర్తిస్తూనే మహాబుద్ధిమంతుడై నిత్యానిత్యవివేకి అయి ఉంటాడు.
8. సమదర్శి - (యః కర్తృతాం చ, కర్మ - అకర్మాచరంశ్చ ఉదాశీనః, యః అంతరః అత్యంతమ్ సమం యాతి) ఉదాసీనుడై ఉంటూనే దైవికంగా ప్రాప్తించే విహితి-అవిహిత కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు. అయినా కూడా కర్తృత్వము లేనివాడై ఉంటాడు. “ఇక్కడ తోచే కర్తృత్వమంతా అన్యప్రేరితమే కదా” అని ఎరిగియే ఉంటాడు. అత్యంత సమభావంతో ప్రకాశిస్తూ అందరితో వ్యవహరిస్తూ ఉంటాడు.
9. స్వభావశాంతుడు - (యః స్వభావేనైవ శాంతః, యః హి శుభాశుభం ఆచరన్యో సమతాం వై నజహాతి) స్వభావంగానే శాంతి స్వరూపుడై ఉంటాడు. ప్రాప్తించే ఆయా శుభాశుభ కర్మలు ఆచరిస్తూనే సమత్వమును, అంతరంగశాంతిని ఏమాత్రం వదులుకోడు.
10. సర్వదా సమమనస్కుడు - (యస్య మనః జన్మస్థితి వినాశేషు, ఇదమ్ దేహాది ఉదయాస్తమయేషు చ సమమేవ యాతి) ఈ శరీరం యొక్క పంచ వికారములయినట్టి జన్మ - స్థితి - వృద్ధి - క్షయ - వినాశన సమయములందు కూడా ఎవని మనస్సు సమత్వం కోల్పోదో... అతడే మహాకర్త.
భృంగీశుడు : ప్రభూ! కర్మలను నిర్వర్తించేటప్పుడు ఎట్లు మహాకర్తృత్వం వహించి ఉండాలో 10 విశేషణములతో వివరించారు. అద్భుతం. ఇప్పుడు కర్మ యొక్క ఫల భోక్తా సమయంలో మహాభోక్తృత్వం వహించి ఉండడమంటే ఏమిటో సవివరంగా చెప్పండి.
Page:479
3. మహాభోక్త
ఈశ్వరుడు అట్లాగే, 'మహాభోక్త' గురించి చెబుతాను విను1. ద్వేష - కాంక్షారహితుడు - (యః ప్రకృతం సర్వమ్ భుంక్తేచ, నకించిన ద్వేష్టి, తధా, నకించిత్ అభికాంక్షతి) యథా ప్రాప్తములైన సమస్తమూ అనుభవిస్తున్నప్పుడు అతడు ఎవరినీ ద్వేషించడు. ఎవరి మీదా ఎట్టి కోపం అంతరంగంలో కలిగి ఉండడు. 'ఇది నేను ఎప్పటికి పొందుతానో?'... అని దేనినీ కాంక్షించడు.
2. పొందుతూ కూడా పొందని వాడు - (యః ఆదదానశ్చపి చ నాదత్తే, ఆచరన్నపి చ నాచరత్యాత్, భుంజానోపి చ న భుక్తే) ఈ ఇంద్రియాలు విషయాలను గ్రహిస్తూ ఉండవచ్చు గాక. అతను అసంగమగు ఆత్మను గురించిన బుద్ధిచే ఏదీ గ్రహింపనివాడుగానే ఉంటాడు. కాళ్ళు-చేతులతో అనుభవములందు ఆచరణ కలిగియున్నప్పటికీ నిష్క్రియమగు ఆత్మబుద్ధినే ఆశ్రయించుకొని ఉంటాడు. సమస్తమును అనుభవిస్తున్నప్పటికీ నిత్యతృప్తమగు ఆత్మబుద్ధి యొక్క బలంతో ఏదీ అనుభవించని వాడుగానే ఉంటాడు.
3. అనుభవములన్నిటికీ సాక్షిమాత్రుడు - (యః అభిన్నఃత ధీః యో సకలం సాక్షివత్ పశ్యతి, అవగతేచ్చతి) కేవలం సాక్షిమాత్రుడై సర్వ అనుభవములను దర్శిస్తూ ఉంటాడు. ఇచ్ఛారహితుడై భిన్నము లేనట్టి బుద్ధితో లోక వ్యవహారములన్నీ గాంచుతూ ఉంటాడు.
4.విక్షేపరహితుడు, భ్రమరహితుడు - (యస్య మతిః సుభైః దుఃఖైః క్రియాయోగైః భ్రమప్రదైః భావాభావైః నోత్రామతి) ఇక్కడి సుఖ - దుఃఖములను, సంయోగ - వియోగ సమన్వితములగు కార్య వ్యవహారములను, భ్రమదాయకములగు లాభ - వ్యయాది విషయములను పొందుచున్నప్పుడు ఎవని బుద్ధి విక్షేపము పొందదో, ఆయా సర్వస్థితి - - గతులందు మేధావి అయి ఉత్తమ అవగాహనను వీడడో... అప్పుడు అతడు మహాభోక్త అనిపించుకుంటాడు.
5.బ్రాహ్మీదృష్టి సమన్వితుడు - (యో జరామరణమ్, ఆపదః రాజ్యం, దారిద్ర్యమేవచరమ్యమిత్యేవ వేత్తి) ఆ మహాభోక్తకు వార్ధక్యము, మరణము, ఆపదలు, రాజ్యం దారిద్య్రం ఇటువంటివన్నీ కూడా రమణీయంగానే ఉంటాయి గాని, దుఃఖదాయకం కాదు. ఎవడు ఈ సంసారరూప ప్రపంచం పై నమ్మిక, ప్రియత్వం ఏర్పరచుకుని ఉంటాడో... అట్టి వానికి మాత్రమే వార్ధక్యమరణాదులు దుఃఖ కారకములై ఉంటాయి. ఈ సంసారమునకు ఎట్టి స్థానం ఇవ్వాలో అట్టి స్థానమే ఇస్తే ఇక ఇవన్నీ అట్టివానిని చలింపజేయలేవు సుమా!
6. సర్వ సమబుద్ధిమంతుడు - (యః మహాన్తి సుఖదుఃఖాని సమం పయాంసీవ సాగరః సముపగృష్ణాతి) మహాసముద్రం ఉన్నది. అందులోని జలంలో చిన్న పెద్ద కెరటాలు ఏర్పడుచున్నాయి. కెరటాల అల్పాధిక్యములవలన మహాసముద్రమునకు అల్పాధిక్యములు ఏర్పడగలవా? అట్లాగే, సూర్యకిరణములచే నీరు ఆవిరి అవుతోంది. సముద్రజలం తరిగిపోతోందా? నదుల ద్వారా నీరు
Page:480
వచ్చి చేరుతోంది. సముద్రం ఉప్పొంగి పోతోందా? లేదు కదా ! మహాభోక్త కూడా మహాసముద్రం లాగా మహాశుభములు గాని, మహాదుఃఖములు గాని, వచ్చి పోతున్నప్పుడు పొంగడు, క్రుంగడు. వాటినన్నిటినీ సమబుద్ధితోనే గ్రహిస్తూ ఉంటాడు. అవన్నీ జీవతః ఆస్వాదిస్తూనే పరతః ఆస్వాదించని వాడై, స్పర్శించబడనివాడై ఉంటాడు.
7. సహజ సాత్వికగుణస్వభావుడు - (యస్మాత్ అహింసా, సమత, తుష్టి, ఉపయాతి చ నో - పయాతిః) చంద్రబింబము నుంచి సహజంగానే చల్లని కిరణాలు బయలుదేరుచున్నాయి కదా! అట్లాగే ఆ మహాభోక్త నుండి అత్యంత స్వభావ సిద్ధంగా అహింస, సమత్వము, సంతుష్టి మొదలైన ఉత్తమగుణములు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే సహజ సాత్విక గుణములు అకృత్రిమమై ఉండటంచేత అవన్నీ, బయల్వెడలనట్లే అతడా అనుభవం పొందుతూ ఉంటాడు. అనగా అవి సహజసిద్ధము, అప్రయత్నపూర్వకము అయి ఉంటాయి.
8. సామ్యబుద్ధి సమన్వితుడు - (యో కరుః, ఆమ్లమ్, లవణమ్, తిక్తం, అమృష్టమ్, ఉత్తమమ్ మృష్టిమ్, అధమమ్ సామ్యేన వేత్తి) అతను కారం, పులుపు ఉప్పదనం, చేదు, అరుచికరమైనవి, రుచికరమైనవి, నికృష్టమైనవి - అన్ని పదార్థాలను సమబుద్ధితో చూడగలడు. స్వీకరించగలడుకూడా. రసములచే అతడు సంబంధితుడు, బంధితుడు కాడు. రసములను జయించి వాటికి అతీత స్థానమున నెలకొని ఉండుటచే అతడు వాటి పట్ల ఆశ - - నిరాశలను కలిగి ఉండడు. జీవించుటకై తింటాడుగాని, తినటానికి జీవించడు. ఏది ఎట్లున్నా అతని సామ్యబుద్ధి చలించదు.
9. సమ - - సౌమ్యద్రష్ట - (యః సరసం, నీరసం, సురతం, విరతం, సౌమ్యౌ సమం, పశ్యతి) రస సమన్వితమైనవి, రసవిహీనమైనవి. సుఖ ప్రదమైనవి, సుఖ విఘాతమైనవి... ఇటువంటి పరస్పరానుకూల - ప్రతికూల వ్యవహారాలు తారసపడుచున్నప్పుడు వాటినన్నిటినీ అతడు సమదృష్టితో, సౌమ్యదృష్టితో చూడగల శక్తి కలిగి ఉంటాడు. అతని సౌమ్య స్థితి వాటిచే చంచలం పొందదు. అతని సమదృష్టి ముందు అవన్నీ స్వల్ప విషయాలై ఉంటాయి.
10. సమత సుస్థిర సమన్వితుడు - (యస్య మనః క్షారేచ, ఖండప్రకారేచ, శుభేచ, అశుభేచ సమతా సుస్థిరా భవతి) “ఇదా, కారంగా ఉన్నది అది తియ్యగా ఉన్నది. ఇది శుభప్రదం. అది అశుభప్రదం - ఇటువంటి స్పర్ధభావాలు అతనికి ఉండవు. మనస్సు సమతాభావంతో సుస్థిరమై ఉంటుంది. “ఒకనికి ఒకటి శుభప్రదంగాను, అదే మరొకటి అశుభప్రదంగాను ఉండటం సృష్టి చమత్కారమైయున్నది” అని అతడు గ్రహించియుండుటచే వాటిని అనుభవించవలసి వస్తున్నప్పుడు అతనికి స్పర్ధ ఉండదు.
11. అభిలాషారహితుడు - (యో భుంక్తే అభిలాషమ్ త్యక్త్వా, ఇదం భోజ్యం, ఇదం అభోజ్యమితి ఏవం వికల్పితమ్ త్యక్త్వా గతాభిలాషం భవతి) “నా మటుకు నాకు ఇవి అనుభవించవలసినవి, అవి అనుభవించకూడనివి, కనుక ఇవి లభించాలి. అవి తొలగాలి"... ఇటువంటి అభిలాషలన్నీ, వికల్పములన్నీ దరికి రానీయడు. అభిలాష చేతనే ఈ జీవుడు నిబద్ధుడౌతున్నాడు. లేకపోతే ... సత్
Page:481
స్వరూపుడగు ఇతడు అసత్తగు ఈ దేహ - - ఇంద్రియ - విషయములచే నిబద్ధుడు అవటమేమిటి? ఏది ఎక్కడ- ఎట్లు పొందవలసివచ్చినా కూడా, అవన్నీ వికల్పములే కాబట్టి, మహాభోక్తకు అవి అభ్యంతర- నిరభ్యంతరములు కాజాలవు.
12. సర్వసమస్వీకారుడు - (యో బుద్ద్యా భుక్తే ఆపదం, సంపందం, మోహమ్, ఆనందం, అపరమ్, ఇత్యాదినమయా యాతి) ఒక రోజు సంపద - - మరొక రోజు ఆపద, ఒక సమయంలో ఆనందం - మరొక సమయంలో దుఃఖమోహాలు- , కొన్ని రోజులు ఉత్కృష్టత - - మరికొన్ని రోజులు నికృష్టత ...జీవితమంతా ఇంతేకదా! చిన్న పిల్లల వంటి ఈ జీవులు వీటిని చూచి కేరింతలు కొట్టటమో, కెవ్వున ఏడ్వటమో చేస్తున్నారు. మహాభోక్తకు వాటి రాకపోకల చమత్కారం తెలుసు కనుక సమబుద్ధితో చూస్తూ ఉండగలడు. అతడే మహాభోక్త.
4. మహాత్యాగి
1. ధియాసంత్యక్తుడు:బుద్ధితో సర్వము బాగుగా త్యజించినవాడు - (యేనేతి ధర్మాధర్మౌ, సుఖం దుఃఖం, మరణ-జన్మని ఇత్యాది ధియా సంత్యక్తం) ఉత్తమమైన బుద్ధి (లేక) తెలివితేటలు సంపాదించుకొని ఉంటాడు. అట్టి ఉత్తమ బుద్ధిచే ధర్మాధర్మములను, సుఖ - దుఃఖములను, జన్మ
- - మరణములను స్వతఃగా మొదలంట త్యజించివేసినవాడై ఉంటాడు. “ 66 ఆయా విశేషములచే నేను బద్ధుడనైనాను”.. అను మీమాంస ఆ మహాత్యాగికి ఉండదు.
2. ఇచ్ఛ - - శంక - వ్యవహార - నిశ్చయ పరిత్యక్తుడు - (యేన ధియా సర్వేచ్ఛా: సకలాః శంకాః సర్వేహాః, సర్వనిశ్చయాః, పరిత్యక్తా) ఈ ఇంద్రియములు, వాటి విషయములు ఎట్టివో, స్వభావమేమిటో ఎరిగి ఉంటాడు. అందుచేత సర్వ ఇచ్ఛలు త్యజించియే ఉంటాడు, “దీనివలన ఏది పొందుతామో? మళ్ళా అ తరువాత ఏమి కానున్నదో?”... ఇటువంటి అనుమానాలకు చోటివ్వడు. సమస్త శారీరక, వాచిక, మానసిక చేష్టలను దూరస్తమగు అసంబంధిత విషయాలుగా గాంచుతూ ఉంటాడు. సమస్త నిశ్చయములచేతను కట్టుబడక పూర్ణాత్మ స్వరూపమునందు స్వభావమును అనుభవమును ఏర్పరచుకుని ఉంటాడు.
3. దేహేంద్రియసత్తత్యాగి - (దేహస్య, మనసః ఇంద్రియాణాంహి - తత్ుఃఖత్యాగి, తత్ సత్తత్యాగి) ఈ దేహ, ఇంద్రియ, మనస్సుల సత్తను వాటి వాటి దుఃఖ స్వభావంతో సహా మొదలే త్యజించి వేసి ఉంటాడు. ఏది త్యజించబడినదో అది దుఃఖమును కలిగింపజాలదు. తాను శుద్ధచైతన్య స్వరూపుడై ఉండగా ఈ దేహేంద్రియ మనస్సులు ఎట్లా పరిమితం చేస్తాయి? ఎట్లా బంధితుణ్ణి చేయగలవు చెప్పు?
4. నదేహ - - నజన్మ - నకర్మ నిశ్చయుడు - (న మే దేహో, న జన్మాసి, న యుక్తే, అయుక్తే కర్మణి - ఇతి అంతర్ నిశ్చయవాన్ :) “ఈ దేహం నేను ఉపయోగించే ఒక బాహ్యవస్తువు, అంతేగాని ఇది
Page:482
నేను కాదు, దీనికంటే ముందే ఉన్న నేను దేహంతో జన్మించేవాడిని కాదు. దేహంతో మరణించేవాడిని కాదు. ఏది నేనై ఉన్నానో అద్దానికి జనన - మరణ ధర్మాలు లేవు. ఒక ఉపకరణ మాత్రమగు ఈ దేహము యొక్క చేష్టలు దేహ ధర్మములే గాని నా ధర్మములు కావు. నాకు వాస్తవానికి దేహములేదు. విహిత - నిషిద్ధకర్మలులేవు. ఇష్టానిష్ట చేష్టలు లేవు”.. ఇట్టి అంతఃకరణ నిశ్చయమును ఆ మహాత్యాగి కలిగి ఉంటాడు. ‘ఇట్టి త్యజించియుండుట' అను స్వస్వరూప ధర్మమును సర్వదా వహించి ఉండుటచే అవన్నీ అతనికి అసంబంధిత విషయములే అవుతాయి.
5. మనో మనన పరిత్యక్తుడు - (యేన ధర్మాధర్మమ్ మనో మననవిహితమ్ సర్వమ్ అస్తః పరిత్యక్తం) అతడు శారీరకమైన ధర్మాధర్మములను, మనస్సు యొక్క మానసిక చేష్టలను, వాక్కు మొదలైన క్రియలను అంతరంగంలో పరిత్యజించి ఉంటాడు. సత్-చిత్- ఆనందమనబడు స్వభావమొక్కటే అతని పట్ల ఏర్పడి ఉండి ఉంటుంది. అట్టి అనుభవము ద్వారా సర్వమునకు అందజాలని అప్రమేయ స్వరూపస్వస్థుడై ఉంటాడు. సర్వధర్మములు, సర్వ చేష్టలు త్యజించివేసి ఉంటాడు. ఆయా దేహ మనోధర్మాలచే ఎవరూ ఆతనిని సంకుచితపరచలేదు. అతడు ఎవరినీ దేహ మనోధర్మా ధర్మ బద్ధునిగా గాంచడు. సదా అప్రమేయమగు ఆత్మగానే దర్శిస్తాడు.
6. సమ్యక్ దర్శి : ( సాయేన యావతీ దృశ్యకలనా సకలేయం సుషుట సంతక్తా విలోక్యతే) ఈ కనిపించే దృశ్య కల్పననంతటినీ అతడు 'సమ్యక్ దర్శనము' అనే పవిత్ర దృష్టిచే, “మిథ్యయే కదా!”... అని ఎఱిగి, సర్వమును త్యజించివేసి ఉంటాడు.
నాయనా! భృంగీశా! ఈ విధంగా త్రయీవ్రతము అవలంబించు.
కర్మనిర్వర్తిస్తున్నప్పుడు: 1.అసంశయుడవు, 2.అపేక్షారహితుడవు, 3. ఉద్వేగరహితుడవు, 4. శంకా రహితుడవు, 5. ఇచ్ఛారహితుడవు, 6. ఆవేశ ఆనందరహితుడవు, 7. అసంసక్త మనస్కుడవు, 8. సమదర్శివి, 9. స్వభావ శాంతుడవు, 10. సర్వదా సమమనస్కుడవు ...అయి ఉండు.
కర్మల భోక్తవైయున్నప్పుడు : 1.ద్వేష కాంక్షారహితుడవు, 2. పొందుతూ కూడా పొందనివాడవు, 3. అనుభవములన్నిటికి సాక్షి మాత్రుడవు, 4. విక్షేపరహితుడవు, 5. బ్రాహ్మీదృష్టి సమన్వితుడవు. 6.సర్వ సమబుద్ధిమంతుడవు, 7. సహజ సాత్విక గుణ స్వభావుడవు, 8. సామ్యబుద్ధి సమన్వితుడవు. 9. సమ - సౌమ్యద్రష్టవు, 10. సమత - సుస్థిర సమన్వితుడవు, 11. అభిలాషారహితుడవు, 12. సమస్వీకారుడవు కమ్ము.
ఈ జగత్తులో ఏర్పడే సంబంధముల విషయంలో : 1.ధియా సంత్యక్తుడవు, 2. ఇచ్ఛ - శంక - వ్యవహార- నిశ్చయ పరిరత్యక్తుడవు, 3. దేహేంద్రియ సత్తత్యాగివి, 4. నాకు దేహ జన్మకర్మలు ఉండ జాలవు అను నిశ్చయం కలవాడవు, 5. మనోమనన పరిత్యక్తుడవు, 6. సమ్యక్ దర్శివి ... అయి ఉండు.
త్యజించుటచే త్యాగివవుతావు. ఎవరు ఏది త్యజించరో అది మాత్రమే వారిని దుఃఖింప జేయ గలదు. అది మాత్రమే అతనికి సంసార విభాగమగుచున్నది,. ఏది త్యజించబడదగినదో
Page:483
అది జయించబడినట్లే. కనుక భృంగీశా! నీవు మనం వివరించి చెప్పుకున్నట్లు మహాకర్తవు మహాభోక్తవు మహాత్యాగివి అగుచూ ఈ భూమిపై నిశ్చింతగా సంచరించు. ఇక ఈ సంసార దుఃఖాదులు నిన్ను సమీపించనైనా లేవు.
#
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భక్తజన సులభుడగు సాంబశివునికి భృంగీశునికి మధ్య జరిగిన సంవాదము విన్నావు కదా! ఆ పరమశివుడు బోధించియున్న దృష్టిని నీవు కూడా అవలంబించు. అన్నమయ - - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - - ఆనందమయములనబడే పంచకోశములకు అతీతమైయున్న నీ స్వస్వరూపమును ఆశ్రయించు. అది జాగ్రత్ - స్వప్న -
సుషుప్తములనబడే అవస్థాత్రయరహితమై ఉన్నదని గ్రహించియుండు.
ఏ ఆత్మ అయితే నిరంజనమై (దోషరహితమై) నిత్యోదితమై, విమలరూపమై, అనంతమై, ఆద్యమైయున్నదో..అట్టి బ్రహ్మమే నేను - అను నిశ్చయముతో సమస్త కల్పనారూపములను శమింపజేసినవాడవై, నిర్వాణ పదమును పొందియుండు. సమస్తకల్పములందు ప్రసిద్ధములైయున్న కార్యములన్నిటి యొక్క బీజభూతము, నిరామయము - - పరమాత్మ రూపమగు బ్రహ్మమే అయి ఉన్నదని విజ్ఞులు ఎరిగియే ఉంటున్నారు. విశాల సృష్టి భేదంతో వృద్ధి చెంది భాసిస్తున్న ఈ కనబడేదంతా చిదాకాశమే అయి ఉన్నది.
ఓ రామా! "బ్రహ్మము కంటే భిన్నంగా సత్తుగాని అసత్తు గాని ఎక్కడాకూడా కొంచమైనా సంభవించజాలదు" అని అంతఃకరణంలో దృఢనిశ్చయము కలిగియుండుము. సంశయములన్నీ త్యజించి సుఖముగా నిశ్చింతగా ఉండు.
అంతర్ముఖః సన్సతతం సమస్తం, కుర్వన్ బహిష్ఠం ఖలు కార్యజాతమ్. నభేద మాయాసి కదాచిదేవ, నిరాకృతాహంకృతితాము పైషి॥
ఓ ప్రియ రామచంద్రా! నీవు అంతర్ముఖుడవై 'నిరహంకృతి' పొందావా... అప్పుడిక బహిర్ముఖములగు ఈ సమస్త కార్యములు నెరవేరుస్తున్నప్పటికీ, ఎన్నటికీ భేదం పొందవు. భేదముల ఛాయ కూడా నిన్ను ఆవరించజాలదు.
5. చిత్త శామ్య స్థితి
శ్రీరాముడు: హే భగవాన్! హే సర్వధర్మజ్ఞా! అహంకారము అనే పేరు కూడా కలిగి ఉన్న ఈ చిత్తం ఎప్పుడు ఏ పరిస్థితులలో శమిస్తుంది? లేక శమించనారంభిస్తుంది? వాసనారహితమగు చిత్తం ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటుంది?
శ్రీవసిష్ఠ మహర్షి : బలాత్కారంగా జలం పద్మదళములను తాకినప్పటికీ జలబిందువులు పద్మదళములో ప్రవేశించలేవు కదా? ఎప్పుడైతే అహంకారమయమగు చిత్తము ప్రశమిస్తూ ఉంటుందో. ఎప్పుడైతే
Page:484
జ్ఞానాగ్నిచే పాప సంకల్పాదులు ఉపశమిస్తూ ఉంటాయో అప్పుడు బలాత్కారముగా సమీపించే లోభమోహాలు కూడా శుద్ధచిత్తమును స్పృశించజాలవు. అట్టి వాని ముఖంలో అకృత్రిమమైన ప్రసన్నత, మైత్రి, కరుణ మొదలైన ఉత్తమగుణాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. చిత్తము శమిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాసనాగ్రంథులు ఛిన్నాభిన్నమై పోతూ ఉంటాయి. కోపము సన్నగిల్లుతూ ఉంటుంది. ఇంద్రియముల ప్రబలత్వం అల్పమౌతుంది. అట్టివానిని క్రమక్రమంగా దుఃఖము - భేదము దరిజేరలేకపోతాయి. అనగా అతని దుఃఖములు వృద్ధి చెందుటకు కారణమును కోల్పోతాయి. సుఖములు అభిమానమును కల్పించలేకపోతాయి. హృదయమునందు సర్వత్రా (ఆధి భౌతిక - ఆధిదైవిక - ఆధ్యాత్మిక) తాపత్రయ నివారకమగు సమత్వము ఉదయిస్తూ ఉంటుంది. ఒకవేళ ముఖంలో సుఖ-దుఃఖాదుల చిహ్నములు ఎప్పుడైనా కనిపించినా. ఎండలోని జలకణంలా అవి అల్పకాలం మాత్రమే ఉంటాయి. ఆ తరువాత 'ఇవి మిథ్యయే కదా” అను బుద్ధి కలుగుటచే అవి మనస్సును స్పృశించలేవు.
చిత్తము శమించినప్పుడు, అట్టి మనుజుడు దేవతాగణమునకుకూడా వాంఛనీయుడౌతాడు. ఆ సమయంలో 'సర్వసత్వము' అనే శీతల చంద్రిక వాని యందు ఉదయించి ఉంటుంది. అతడు స్వభావ సిద్ధంగా శాంతము - ప్రియము - - సేవాతత్వము - అవిరోధి - నమ్రత - — - తేజోయుక్తముస్వచ్ఛము అయినట్టి మహత్తర స్వరూపమును, స్వభావమును సంతరించుకొని ఉంటాడు.
ఈ సంసారభ్రమ జనుల విషయంలో విభవ - దారిద్ర్యములచే విచిత్రము, అవగాహనకు అందనిది. దుర్భరము అయి ఉంటోంది కదా! అహంకారరహితులగు మహాత్ములకు అది దుఃఖమును గాని,
ఆనందమును గాని కలిగించజాలదు.
ఎవడైతే “బుద్ధి యొక్క ప్రకాశమాత్రము - సమస్త ఆపదలను నశింపజేయునది” అగు అత్మజ్ఞానమును మోహవశంచే అశ్రయించటానికి సిద్ధపడడో, అతడు నరులలో అధమతరగతికి చెందినవాడగుచున్నాడని శాస్త్రజ్ఞులు ప్రవచిస్తున్నారు. అనేక దుఃఖములకు నెలవై, జనన - మరణ రూపముతో ఏర్పడియున్న సంసారసాగరమును దాటాలనుకునే పురుషుడు నిరతిశయానందమగు ఆత్మ విశ్రాంతి పొందుటకు ప్రయత్నించుటే ఉపాయం. అట్టి విశ్రాంతి లభించాలంటే "నేనెవరు! ఈ ప్రపంచమేమిటి! అత్మతత్త్వమనగా ఎట్టిది! తుచ్ఛభోగములతో ప్రయోజనమేమిటి!?”...ఈ విధంగా అభ్యసిస్తూ క్రమంగా విచార - వైరాగ్య సమన్వితమైన బుద్ధిని సంపాదించుకోవటమే అన్నిటికంటే ముఖ్యమైన ఉపాయం.
Page:485
XIII. మను - ఇక్ష్వాకు సంవాదము
(నే నెవరు!)
1ఈ కనిపించేదంతా ఏమిటి!
శ్రీవసిష్ఠ మహార్షి : ఇక్ష్వాకు వంశజుడవగు ఓ రామచంద్రా! మీ వంశమునకు ఆదిపురుషుడైన ఇక్ష్వాకు చక్రవర్తి ఏ విధంగా ముక్తుడైనాడో ...ఆ వృత్తాంతం చెబుతాను. విను.
ఈ అయోధ్యా నగరాన్ని చాలా కాలం క్రితం ఇక్ష్వాకు చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలాకాలం రాజ్యం ఏలిన తరువాత ఒకసారి ఈ రాజ్యాదులందు విరక్తుడైనాడు. ఒక ఏకాంత ప్రదేశం చేరి మనస్సులో ఇట్లు చింతించసాగాడు.
ఇక్ష్వాకు చక్రవర్తి: (మనస్సులో) : ఈ దృశ్య ప్రపంచమంతా జన్మ - - వార్ధక్యము- మరణము - -
సంక్షోభము - దుఃఖము మొదలైన అనేక భ్రమలకు స్థానభూతమై ఉన్నది కదా! ఇట్టి ఈ దృశ్య ప్రపంచమునకు అసలైన కారణమేమిటి!
అతడు చాలా రోజులు అలోచిస్తూనే ఉన్నాడు కాని, కారణం అతనికి తెలియరాలేదు. అప్పుడు, "లాభం లేదు! ఎంత యోచించినా నా బుద్ధికి తోచటమే లేదు. మరి ఈ దృశ్య ప్రపంచమునకు కారణమేమైయున్నదో తప్పక తెలుసు కోవలసినదే”... అని నిశ్చయించుకున్నాడు.
అతని పంట పండి ఒక రోజు భగవంతుడగు మనుప్రజాపతి అనుకోకుండా సభకు రావటం జరిగింది. కుశల ప్రశ్నానంతరం ఇక్ష్వాకువు ఇట్లు ప్రశ్నించాడు.
ఇక్ష్వాకువు: హే మనుప్రజాపతి! అనేక జన్మలలో చేసిన పుణ్యంచే ఈ రోజు మీ దర్శనం లభించింది. బ్రహ్మలోకం నుంచి మీ రాకచే మేమంతా పరమ పవిత్రులమైనాం. మహాత్మా! కొంతకాలంగా కొన్ని సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. అటువంటి కష్టసమయంలో లోకపాలకులు లోకగురువులగు మీరు దర్శనమిచ్చారు. మిమ్ములను కొన్ని సందేహాలు అడిగి తెలుసుకోవటానికి అనుజ్ఞ ఇవ్వండి. మనుప్రజాపతి : సందేహములా! ఊఁ! అడుగు.
ఇక్ష్వాకువు : స్వామి! సవినయుడనై నా సందేహాలు మీ ముందు ఉంచుతున్నానుఈ సృష్టంతా ఎక్కడినుండి ఇక్కడికి వచ్చింది? దీని బాహ్య స్వరూపమిట్లుండగా ఇద్దాని అసలు స్వరూపం వేరే ఏదన్నా అయి ఉన్నదా? ఉంటే దీని అసలు స్వరూపమేమిటి? దీని సంఖ్య ఎంత? పరిణామమెంత? ఇందులోని జీవులెంతమంది? దీనిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు నిర్మించారు?
Page:486
విశాలమైన వలలో ఒక పక్షి చిక్కుకుని గిలగిలలాడే విధంగా, నేను కూడా ఈ సువిశాల సంసారంలో ఎప్పుడో ఎందుకో చిక్కుకుని ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ భయంకరమైన సంసార విభ్రమమునుండి నేను విముక్తుడను అయ్యేదెట్లా?
మను ప్రజాపతి: ఇక్ష్వాకా! ఇప్పుడు నీ ప్రశ్నలు, వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది! జన్మ ఎత్తినందుకు ఏది సారభూతమై ఉన్నదో, ఏ ప్రశ్నలకు సమాధానం గొప్ప అనర్థములన్నీ ఛేదించి వేయగలదో... అటువంటి ప్రశ్నలను వివేకం యొక్క ఉత్కృష్టత చేతనే సమీపించగలిగావు.
నీ ప్రశ్నలకు సూటి అయిన సమాధానం చెబుతాను. ఉద్వేగరహిత ప్రశాంత చిత్తంతో విను. మేము మా అనుభవాలు రంగరించి ఈ సమాధానాలను నీ ముందు ఉంచుచున్నాం -
యదిదం దృశ్యతే కించిత్ నాస్తినృప, కించన యథా గంధర్వనగరం | యథా వారి మరుస్తలే యత్త నో దృశ్యతే కించిత్ తన్ నకించిదివ స్థితమ్ ॥
ఏ దృశ్యమైతే నీకు ఎదురుగా కనబడుతూ “దీనిని అధిగమించటం నా వలన అవుతుందా?”... అనే గొప్ప సమస్యను ఉదయింపజేస్తోందో, అటువంటి ఈ దృశ్యం యథార్థానికి ఏమాత్రం లేదు. కొంచెం కూడా లేదు. “మరి, నాకు కనబడుతోంది కదా?” అని అంటావా? ఎండమావులలో (మృగ తృష్ణలో) రకరకాల ఆకారాలు గల తరంగాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మాయా సంబంధమైన గంధర్వ నగరంలో సుందరమైన వస్తువులు, కన్యలు కనిపిస్తారు. అవన్నీ యథార్థమా? అవెంత వాస్తవమో, ఈ కనబడేవీ అంతే!
ఇక్ష్వాకువు : మరి ఇక్కడ యథార్థమైనదంటూ ఏమైనా ఉన్నదా?
మను ప్రజాపతి : ఏది పంచేంద్రియముల కంటే మనస్సు కంటే కూడా అతీతమైయున్నదో, దేని గురించైతే సంభావన మహత్తర ప్రయోజనకారకమై ఉన్నదో, ఏది నాశరహితమై ఉన్నదో, అది మాత్రమే ఇక్కడ ఉన్నది. అదియే "సద్రూపమగు ఆత్మ అని చెప్పబడుతోంది. ఒక పెద్ద అద్దంలో కనిపించే ప్రతిబింబంలాగా అసంఖ్యాక దృశ్యములచే పూర్ణమై ఉన్న ఈ సృష్టిపరంపర చిదాత్మయందలి ప్రతిబింబం మాత్రమే. ఆ పరమాత్మ నుండి స్వభావంగా కొన్ని స్ఫురణ శక్తులు బయల్వెడలుచున్నాయి. అవి చిదాభాసాలు” అని పిలువబడుచున్నాయి. ఆ స్ఫురణశక్తులే బ్రహ్మాండ రూపాన్ని పొందుచు న్నాయి. వాటిలో మరికొన్ని శక్తులు భూమ్యాకాశాది పంచభూత రూపత్వం పొందుచున్నాయి. తక్కినవి తక్కిన చతుర్విధ ప్రాణుల రూపము పొందినాయి.
ఇదియే జగత్తు యొక్క స్థితి ఇంతకు మించి ఇక్కడ బంధము లేదు, మోక్షమూ లేదు. న బంధోస్తి నమోక్షో స్తి, బ్రహ్మైవాస్తి నిరామయమ్ |
నైక్యమస్తి న చ ద్విత్వం సంవిత్సారం విజృంభతే॥
ఓ ప్రియా ఇక్ష్వాకూ! ఇక్కడ బంధం గాని, మోక్షం గాని, ఎవరికీ లేదు. నిర్వికారమగు బ్రహ్మం మాత్రమే కలదు. ఇందులో ఏకత్వమూ లేదు, ద్వైతమూ లేదు. చిదాత్మయే సంవిత్ సారంగా విజృంభిస్తోంది.
Page:487
జలమంతా ఒక్కటే అయినప్పటికీ అనేక తరంగ భేదములచే విజృంభిస్తోంది కదా! ఒక తరంగానికి మరొక తరంగానికి ఉన్న భేదమేమిటి? రెండూ జలమే కదా! అయితే ఏం? జలం జలంగా ఉంటూ ఉండగానే అనేక తరంగాలుగా కనిపిస్తున్నది.
అట్లాగే ఒకే బ్రహ్మము అనేక జగత్ భేదములుగా కనిపిస్తోంది. ఏ భేదం కనిపిస్తోందో అది అవాస్తవం. కనుక దానిని 'మాయ (యా మా, ఏదీ స్వతఃగా లేదో!)... అని పిలువబడుతోంది. మాయామాత్రములే అగుటచే జీవునికి జీవునికి, నీకు, నాకు, ఆత్మకు భేదములు లేనివే అగుచున్నాయి. కాబట్టి నాయనా! నీవు ముందుగా బంధమోక్షములకు సంబంధించిన ఆశలను, భయమును దూరంగా త్యజించు.
సంసారభయ రహితుడవై ఉండుము. అభయ సారభూతమగు బ్రహ్మరూపుడవై ఉండు.
2. కొంగు క్రింద బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికొచ్చినట్లు!
మను ప్రజాపతి : జలం తరంగాల రూపం పొందుతోంది చూచావా? చిన్మాత్ర సంవిత్తు స్వతహాగా విషయరహితమైనది. అయితే అది స్వయంగా ఎందుకో ఆయా సంస్కారాలచే అతి విచిత్రమై ఉన్న అవిద్య యందు ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబిత సంవిత్తు సంకల్పాల వైపుగా ఎందుకో ఉన్ముఖ మౌతోంది. ఫలితం ఈ జీవభావమును పొందుతోంది. అట్టి కారణ స్వరూపులగు ఈ జీవులు ఇతః పూర్వమే ఆవిర్భూతమైన సృష్టియందు తిరుగాడుచున్నారు. సృష్టి-దృశ్యము అనబడేవి ఇది ఇట్లుండగా వాస్తవానికి “జీవులు - వారి సుఖదుఃఖ దశలు” అనే మోహం మనస్సునందే ఉన్నదిగాని, ఆత్మయందు కాదు. నిర్మలజలంలో దృశ్యం ప్రతిబింబించినంత మాత్రంచేత దృశ్యం జలంలో ఉన్నట్లైతుందా? కాదు.
అయితే... రాహువు అదృశ్యరూపుడైనప్పటికీ, ఒకానొక నీడ మాత్రమే అయినప్పటికీ చంద్రుని యందు కనబడే ‘గ్రహణం'చే రాహువు అదృశ్యరూపం కనిపిస్తోంది కదా! అట్లాగే ఆత్మ అదృశ్యరూపం, అనుభవమాత్రం అయి ఉన్నది. అట్టి ఆత్మ దర్శనమవటం ఎట్లా? ఎట్లా అంటే ... ఆత్మ సాక్షాత్కారం ఒనర్చుటయందు అభిముఖమైన అంతఃకరణంచే మాత్రమే అది అనుభవైక వేద్యం అగుచున్నది. ఇక్ష్వాకువు : అయితే నిర్మలాంతఃకరణులగు తమవంటి గురువులు అట్టి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించ గలరని లోకప్రతీతి కదా! స్వామి! మహానుభావా! నన్ను రక్షించి, నాకు ఆత్మసాక్షాత్కారం ప్రసాదించండి. మను ప్రజాపతి : తప్పకుండా ప్రసాదించేవాడినే! అయితే ఇందులో ఒక చిక్కు ఉన్నది.
నశాస్త్రైః, నా౧పిగురుణా దృశ్యతే పరమేశ్వరః,
దృశ్యతే స్వాత్మనైవ ఆత్మా స్వయా సత్వస్థయా ధియా॥
ఆ పరమేశ్వరుడు (లేక 'స్వాత్మ') శాస్త్రములచే గాని, గురువులచే గాని కనిపించేవాడు కాదు. మరి? అహంకార - మమకారరహితమగు బుద్ధిచే తనచేతనే తాను కనిపిస్తున్నాడు. నీవు
Page:488
పరమాత్మను దర్శించదలిచావా? అయితే త్రోవలో నడుస్తూ ఉండగా తారసపడే అపరిచిత బాటసారులను రాగద్వేష రహితబుద్ధితో చూస్తున్నట్లు ఈ ఇంద్రియాలను ఈ ఇంద్రియ విషయ ప్రపంచాన్ని కూడా చూడు. బుద్ధిమంతుడైనవాడు ఈ ఇంద్రియాలను గాని, వీటి విషయాలను గాని ఆదరించడు, అనాదరించడు. ప్రాప్తించిన పదార్థములతో కూడినవై ఈ దేహేంద్రియాలు సుఖంగానే ఉండుగాక! లేదూ ప్రాప్తించని పదార్థములచే పేదరికం పొందుగాక! ఓ మానవా! నీవు మాత్రం బుద్ధితో పదార్థమాత్రాలు అగు ఈ దేహాదులను మానసికంగా దూరంగా త్యజించు. పూర్ణ శీతలాంతఃకరుణుడవై ఉండు. నిత్యం ఆత్మమయుడవై ఉండు.
‘దేహో హమ్' ఇతియా బుద్ధిః, సా సంసార నిబంధనీ,
న కదాచిత్ ఇయం బుద్ధిరాదేయా హి ముముక్షుభిః||
'నేను దేహమును' అని ఏ బుద్ధి యొక్క విభాగం ఈ జీవుని సంసారమునందు బంధిస్తోందో గమనించబడు గాక. ముముక్షువైనవాడు అట్టి బుద్ధిని గ్రహించనే కూడదు. 'నేను సూక్ష్మమైన ఆకారం కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మమైన చిన్మాత్రంనే గాని, మరింకేమీ కాదు'... అను బుద్ధి జీవుని సంసారం నుండి విముక్తుని చేస్తోంది. అట్టి 'నిరంతరం - అచ్యుతం' అయిన బుద్ధిని నీవు సంపాదించుకో. అట్టి బుద్ధిబలంతో మాత్రమే నీవు సంసార బంధం నుండి విడివడగలవు.
నిర్మల జలం యొక్క లోపల, వెలుపల అంతటా సూర్యకాంతి ప్రసరించి ఉంటున్నట్లు, ఆత్మ సర్వ వస్తువుల యొక్క బాహ్య అభ్యంతరములందు నిండి ఉన్నది. ఆయా ఆభరణములు రూపముల దృష్ట్యా వేరు వేరుగా ఉంటున్నప్పటికీ, ఆభరణములన్నిటిలో ఒకే బంగారము ఉండి ఉన్నది కదా! ఇక వివిధత్వమనేది కేవలం ఆకార వైచిత్ర్యము తప్పితే మరింకేమీ కాదు. అట్లాగే ఈ సర్వ జగత్ పదార్థములందంతటా ఆత్మయే ఉన్నది. మాయా రచనాచమత్కారంచేత ఒక్కటే అయినప్పటికీ అసంఖ్యాక తరంగాలు తమంతట తామే ఎక్కడో పుట్టి మరెక్కడో లయిస్తున్నాయి. తరంగాలు కనబడుచున్నంత సేపు 'ఇది పెద్ద తరంగం 'అది చిన్నది, ఇవి తరంగం - తరంగం ఢీకొనుటచే ఏర్పడే జలకణములు’... మొదలైన వర్ణనలకు సముద్రం అర్హమగుచున్నది. ఎన్ని అసంఖ్యాక తరంగాలు ఒకచోట లేస్తున్నా, ఆ తరంగాలు ఎన్నిచోట్ల కనిపిస్తున్నా, తిరిగి ఆ తరంగాలు ఎక్కడ లయిస్తున్నా, అన్ని తరంగాలలోనూ ఉన్నది - వాస్తమైనది జలమే కదా!
కామము అనే ఈ సంసార మహా సముద్రంలో 'ప్రాణికోట్లు' అనే అసంఖ్యాక తరంగాలు అటూ - - ఇటూ వర్తిస్తున్నాయి. 'జగత్సమూహాములు' అనే నదులు ఈ సంసార మహాసముద్రంలో నిరంతరం ప్రవేశిస్తున్నాయి.
ఈ జీవులు ‘వినాశనము' అనే బడబాగ్నిలో ప్రవేశించి జగత్తునుంచి నిష్క్రమిస్తున్నారు. మరల మరొకవైపు నుండి - నిరంతరం ప్రవేశిస్తున్నారు.
అగస్త్య మహాముని సముద్ర జలాన్నంతా త్రాగి కూడా ఇంకా తృప్తి చెందనట్లు, 'కాలము’ అనే మహత్తరతత్త్వము ఈ జగత్తులను అసంఖ్యాకంగా తనయందు లయం చేసుకుంటూ కూడా
Page:489
ఏమాత్రం తృప్తి పొందటంలేదు. ఏ ఆత్మయందైతే అట్టి మహత్తర మహాకాలము కేవలము ప్రతిబింబితమాత్రమై ఉన్నదో అట్టి ఆత్మను నీవు నిరంతరం భావన చేయి. అంతేగాని అనాత్మభూతమగు ఈ దేహము మొదలైన దృశ్యజాలమును వందల - వేల జన్మలుగా భావన చేస్తూ పోతున్నా కలిగే ప్రయోజనం? ప్రవాహపతితములగు జన్మ - కర్మపరంపరలే తప్పించి మరింకేమీ కాదు. కనుక నీవు 'నిర్వాసనా భావన' యందు ఆరూఢుడవగుము. గూఢరూపమగు ఆత్మభావనను ఆశ్రయించి సుఖపూర్వకంగా ఉండు.
ఇక్ష్వాకువు : అట్టి ఆత్మను ఆశ్రయించటం, ఆత్మానుభవంలో ఆరూఢత పొందటం ఎట్లా? అందుకు మార్గాలేమిటి? ఎంతకాలం ఎట్లు శ్రమిస్తే నిర్వాసనాభావప్రాప్తి, ఆత్మానుభూతి కలుగుతాయి? అసలు ఆత్మ లభిస్తుందా? మిమ్ములను అట్టి ఆత్మానుభవం ప్రసాదించవలసినదిగా నా విన్నపం! మను ప్రజాపతి: వెనుకటికి ఒక గొప్ప తెలివిగల స్త్రీ "అయ్యో ! నా బిడ్డ ఎక్కడ?” అని గాభరా
పడసాగిందట.
కుచకోటర సంసుప్తం విస్మృత్య జననీ సుతం ॥
యధారోదిత పుత్రార్థం తథాత్మార్ధమ్ అయం జనః॥
ఆవిడ పసిపిల్లవాడికి పైట క్రింద పాలిస్తూ ప్రక్కింటావిడతో ఆకశ- పోకశ కబుర్లు చెబుతోంది. ఈలోగా ఇంటాయన వచ్చి “ఏమే! పిల్లవాడేడీ? నిద్రపోతున్నాడా?”అన్నాడు. ఆ మహాతల్లి, “అవునండీ నిద్రపోతున్నాడు!" అని చెప్పి ఉబుసుపోక కబుర్లు కొనసాగిస్తోంది. ఈలోగా ఇంటాయన ఇంట్లో పిల్లవాడి కోసం చూస్తే కనబడలేదు. “ఏమే పిల్లవాడేడీ? ఇక్కడ లేడే?” అని గావుకేక వేశాడు. ఇక ఆ స్త్రీ ప్రాణాలు ఝల్లుమన్నాయి. “నెలల బాలుడు కదా! నా బిడ్డ ఎటూ వెళ్ళలేడే! మరెవరైనా ఎత్తుకుపోలేదు కదా?” అని అనుకొన్నది. ఆ ఆలోచన రాగానే ఇక పెద్ద పెట్టున ఏడవటం ప్రారంభించింది. ఇంటాయన ఇంట్లో చిందులేస్తున్నాడు. ఈ తతంగమంతా చూచిన ప్రక్కింటావిడ “ఏమిటి ఒదినగారూ?" అన్నది. అప్పుడా ఇల్లాలు “ఇంకా ఏమిటంటారేమిటండీ! నా కొంప మునిగింది. పసిపిల్లవాడు కనిపించటం లేదు. ఇక నేనేం చెయ్యాలి బాబోయ్? నా పిల్లవాడు ఎక్కడున్నాడు నాయనోయ్? ఏం పోయే కాలం వచ్చి ఇక్కడ పెత్తనాలు నేను చేస్తున్నానో? ఏమిటి నా గతి? ఎక్కడని వెతకాలి?”... అని భోరున ఏడవసాగింది.
ఈ జీవుడు కూడా ఆ మహాతల్లి లాగానే ఆత్మ కొరకే ఏడ్చుచున్నాడు. ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. ఎందుచేత? అంతఃకరణమునందే నిత్యలబ్ధమైయున్న ఆత్మను ఏమరుచుటచేతనే! కనుక అతని దుఃఖం భ్రాంతిచే ఏర్పడినది మాత్రమే. పైట క్రింద గల పిల్లవాడిని తల్లి ఏమరచినట్లు తన అఖండ-అప్రమేయ స్వభావమగు ఆత్మను ఏమరచిన ఈ జీవునికి గుర్తు చేయటానికే శాస్త్రములు పరికల్పించబడ్డాయి.
అజరామరమ్ ఆత్మానమ్ అబుద్ధ్వా పరిరోదితి । |
హా హతో హమ్! అనాధో హమ్! నష్టోస్మి ఇతి వపుర్వ్యయే ॥
Page:490
స్వస్వరూపమగు ఆత్మ సర్వదా జరామరణ రహితమైనది. ఇది ఏమరచిన ఈ జీవుడు దేహమును మాత్రమే చూస్తూ “నేను ముసలివాడనయ్యాను. నా పని అయిపోయింది. అయ్యో! నేను చచ్చుచున్నాను! నాకు దిక్కెవరూ లేరు, నేను అనాథుడను”... ఇటువంటి బాల్య చాపల్యమువంటి ప్రేలాపనలు చేస్తూ నిష్కారణంగా దుఃఖిస్తున్నాడు. కనుక ఓ ఇక్ష్వాకా! ఆత్మ లభించటమేమిటి? దానిని మరొకరు నీ కివ్వటమేమిటి? అది సర్వదా నీ రూపమే అయి, నీచే పొందబడియే ఉన్నది. ప్రతి జీవుడు అదియే అయి ఉన్నాడు. ఇక, వివిధ కార్యరూపములతో కూడిన ఈ జగత్తేమి టంటావా...? జలము తన యొక్క చలనము వలననే తరంగములు మొదలైన అనేక రూపములుగా కనిపిస్తున్నట్లు, సంకల్పవశంచేత చిద్రహ్మమే వివిధ కార్యపరంపరా రూపంగా వృద్ధి చెందుతోంది.
ఓ కుమారా! ముందుగా నీ చిత్తమునందలి సంకల్ప వ్యవహారమును శమింపజేయి. సంకల్పాలు లయించగా, అప్పుడు శేషించి ఉన్న కళంకరహిత చిత్రాన్ని ఆత్మయందు సంస్థాపన మొనర్చివేయి. ఇక ఈ లౌకికమైన రాజ్యాది వ్యవహారములంటావా? వ్యవహారార్థం ఈ శరీరాదులతో ఆయా క్రియలు ఆచరించుచున్నప్పటికీ వీటినన్నిటినీ అభాస మాత్రంగా చూడు. అభాసమాత్రమే అయిన ఈ కర్మలు ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మచే ఏదీ ఆచరించనివాడవై (నిష్క్రియుడవై), స్వస్థుడవై, సుఖివై ... ఇక ప్రాప్తించిన ఆయా ధర్మములను నిశ్చింతగా, నిర్వికారంగా నిర్వర్తించు.
3. జగత్తు చిత్ దర్పణంలోని ప్రతిబింబము మాత్రమే
మను ప్రజాపతి : ఓ ఇక్ష్వాకు మహారాజు! ఒక బాలుడు అనేక కల్పనలతో కూడిన ఆటలను ఆశ్రయించి ఆడుకుంటూ ఉంటాడు చూచావా? పరమాత్మ అస్పష్టరూపమగు తన “అవిద్యాశక్తి”చే ఆయా సృష్టి రూప క్రియలను ఆశ్రయించుచూ చిన్నపిల్లవాడివలే స్వయముగా క్రీడించుచున్నాడు. ఆటలు ఆడుకొంటున్న బాలుడు కొద్దిసేపైన తరువాత ఆ ఆటను, అందలి కల్పిత విశేషములను త్యజించి ఇంట్లోకి వెళ్ళిపోతున్నట్లు ఆ పరమాత్మ మరొక తరుణంలో తన జ్ఞాన దృష్టిచే 'విద్య' అను సంహారకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. అట్టి సంహారశక్తిచే సర్వమును ఉపసంహరించి స్వాత్మయందు పునఃప్రవేశం చేస్తున్నాడు. తన నిర్మల - - అప్రమేయ - నిస్సంగ - - అఖండ స్వరూప - ఔన్నత్యమును సంతరించుకుంటున్నాడు.
ఇక్ష్వాకు చక్రవర్తి: ఈ జీవుడు దేనిచే బంధింపబడుచున్నాడో..... అట్టి శక్తి ఎక్కడి నుండి ఏర్పడుతోంది? మను ప్రజాపతి :
స్వయమస్య తథాశక్తిర్ ఉదేత్యాం బధ్యతే యయా |
స్వయమస్య తథాశక్తిర్ ఉదేత్యున్ముచ్యతే యయా |
దేనిచే ఆత్మయే వాస్తవ స్వరూపంగా గల ఈ జీవుడు బంధింప బడుచున్నాడో... అట్టి శక్తి
Page:491
ఆతనియందే స్వయంగా ఉదయిస్తోంది. అంతే కాదు. ఏ శక్తిచే ఆతడు ముక్తుడగుచున్నాడో, అది కూడా వానియందే స్వయంగా ఆవిర్భవిస్తోంది. అనగా ఆత్మనుండే బంధనశక్తి ఒకప్పుడు బయల్వెడలి, మరొకప్పుడు లయిస్తోంది.
చంద్ర, సూర్య, అగ్ని, కాల్చబడిన ఇనుపచువ్వ - వీటన్నిటి నుండి ఎట్లా ప్రకాశము వేరుగా ఏర్పడుతుందో, ఎట్లా వృక్షం నుండి ఆకులు వేరుగా ఏర్పడుచున్నాయో, సెలయేరు నుండి జలకణాలు ఎట్లా బయల్వెడలుచున్నాయో... అట్లాగే విశాలమగు బ్రహ్మమునందు బుద్ధి - జగత్తు మొదలైనవి వేరుగా కల్పనచే ఏర్పడుచున్నాయి. బ్రహ్మమునందు కల్పనచే దర్శించబడేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. అందుచేత జ్ఞానులకు ఈ జగత్తంతా ఆనందమయ బ్రహ్మముగానే అనుభవమౌతోంది. అజ్ఞానులకో ఇది బ్రహ్మమునకు వేరుగా తోచుచుండుటచే దుఃఖ ప్రదమౌతోంది. ఆహాఁ! ఈ జగత్తునంతా మోహింపజేస్తున్న ఈ మాయ ఎంతటి విచిత్రమైనది! సర్వాంగములను లోపల బయట ఆక్రమించియున్న ఆత్మను ఈ మాయ కనబడకుండా ఉంచగలుగుతోందే! ఈ జీవుడు మాయను చూస్తున్నాడు గాని ఆత్మను చూడటమే లేదు. శాస్త్రములు మాయ గురించి బోధిస్తూ ఆత్మతత్త్వమును చూపుతూ - సుస్పష్టం చేస్తున్నాయి.
“చిదాదర్శమయం సర్వం జగత్" ఇత్యేవ భావయన్ I యస్తిష్ఠతి ఉపశాంతేచ్ఛం స బ్రహ్మకవచః సుఖి |
“ఈ జగత్తంతా చిత్ అనే దర్పణం నందు వ్యాపించి ఉన్నది. ఎందుకంటే ఇదంతా ప్రతిబింబి స్తున్నది చిత్తోనే కదా!” అని భావన చేస్తూ ఎవడు సమస్త కోర్కెలు త్యజించి ఉంటాడో... అట్టి వానిని అజ్ఞాన బాణములు ఏమీ చేయలేవు. 'బ్రహ్మము' అను కవచమును ఆతడు ధరించి ఉంటే చాలు, ఇక అతడు మహాసుఖవంతుడు.
ఓ ఇక్ష్వాకూ! నీవు అహంకారరహితుడవై ఉండు. దుఃఖం ఉన్నదీ అంటే... అక్కడ అహంకార
- - మమకారములు ఉన్నట్లే. నీవు అభావరూపభావనతో సర్వవస్తువులు దర్శించు. అనగా “అంతయూ కూడా శూన్యమై నిరాలంబమైనట్టి చిద్రూప బ్రహ్మమే అయి ఉన్నది” అని భావన చేయి. "ఇది రమ్యమైనది, అది రమ్యమైనది కాదు. ఇది ఉచితము, అది అనుచితం. ఇది సానుకూలం, అది ప్రతికూలం”...ఇటువంటి వైషమ్యముతో కూడిన కల్పనయే నీ దుఃఖములన్నిటికి అసలైన బీజమై ఉన్నదని గ్రహించు.
ఇదం రమ్యం ఇదంనేతి, బీజం తే దుఃఖసంతతేః |
తస్మిన్ సామ్యాగ్నినా దగ్ధా దుఃఖస్యావసరః కుతః ॥
ఎప్పుడైతే నీవు 'సమత్వము' అనే అగ్నిని ప్రజల్వింపజేస్తావో ...ఇక సర్వ వైషమ్య కల్పనా బీజములు దహించబడతాయి. ఆపై దుఃఖానికి చోటెక్కడిది చెప్పు? కనుక 'సమాధి' అనే అభ్యాసానికి ఉపక్రమించు. 'సర్వ దృశ్య విస్మృతి' అనే మహాస్త్రాన్ని చేకూర్చుకో. పురుష ప్రయత్నబలంతో 'రమ్య అరమ్య విభాగ కల్పన' లను అతి త్వరగా ఛేదించివేయి.