Page:492

అభావనచే భావనను లయం చేయి. సర్వ దృశ్య విస్మృతిచే దృశ్య స్మరణను నిరోధించు. 'కర్మ' అనే అరణ్యాన్ని ‘ఆసక్తి రాహిత్యము' అనే ఖడ్గంతో త్రెంచివేయి.

అట్టి నిజ ప్రయత్నంతో ఆకాశముకంటే కూడా అతి సూక్ష్మమైన బ్రహ్మమును పొంది దుఃఖరహితుడవగుము.

మొట్టమొదట మన ఈ సంవాదము యొక్క ప్రయోజనంగా వివేకమును సంపాదించు. ఇక 'సమాధి' అను అభ్యాసముచే బాహ్య కల్పనా అభాస’ను సన్నగిల చేయి. సత్య దృష్టితో చూడగల పవిత్రదృష్టి’ని నిదుర లేపు.

క్రమంగా పూర్ణాత్మానుభూతిచే జగమంతా వ్యాపించి ఉండు. జగమంతా వ్యాపించిన శరీరం కలవాడై, విభాగ రహితుడవై పరమానందం పొంది ఉండు. శాశ్వతంగా సంసారరోగ వర్జితుడవగుము. శాంతమై, సమమై, ఏకరసమై, స్వచ్ఛమైనట్టి చిన్మాత్ర దేహము కలవాడవై... సంసారభయ రహితుడవై

ఉండుము.

4. 'అహమ్' నుండి 'అనహమ్'

మను ప్రజాపతి : బిడ్డా! 'సర్వాత్మకత్వము' అనేది ఒక అనిర్వచనీయమైన అనుభవస్థితి. అది సాధ్యము, లక్ష్యము అయి ఉండగా అందుకు సాధనములను, మధ్యే మార్గమగు వేరు వేరు అనుభవ స్థితులను శాస్త్రకారులు ప్రవచిస్తున్నారు.

అనుభవమాత్రము, 'జ్ఞేయము' అగు సర్వాత్మకత్వము వాస్తవానికి మనోవాక్కులకు లభించేది కాదు. అయితే అందుకు తరుణోపాయములను, ఆయా అవస్థలను శాస్త్రకారులు ఎట్లా ప్రవచిస్తున్నారో

చెబుతాను. వినుప్రజ్ఞాశ్రయము విచారణ అమ విలాపినీ శుద్ధ సంవిన్మయానందము నిరతి శయానందము పరమ యోగి / పరమ హంస / తురీయవస్థ.

మొట్టమొదట 'నేనీ పరిమిత పరిజ్ఞానంతో జీవితమంతా వెచ్చించటమనేది అర్థంలేని పని”.... అని ఈ జీవుడు ఎప్పుడో గ్రహిస్తున్నాడు. అట్టి వేదన ఉత్పన్నమైన మరుక్షణం ఆతని ప్రయత్నమునకు సహకరించటానికి శాస్త్రములు, అనుభవజ్ఞులు సిద్ధంగా ఉన్నారు. 'శాస్త్రాభ్యాసము - సజ్జన సహవాసము...'ఈ రెండింటిచే ప్రజ్ఞను వృద్ధి పరచుకోవాలి. ఇది ప్రజ్ఞాశ్రయం అనబడేది యోగి యొక్క మొదటి భూమిక. ఇక మనస్సు నిర్మలమగుచుండగా ఆ యోగి 'విచారణ' అనబడే రెండవ భూమికలో క్రమంగా ప్రవేశిస్తున్నాడు. "ఇది అల్ప కాలికం గతించిపోయేది... అని క్రమంగా ఈ దృశ్యం విషయమై గ్రహిస్తున్నాడు. ఏది కాలబద్ధము, భ్రమతో కూడినది అయున్నదో, అట్టి విభాగాన్ని వేరు చేసి ‘అసంగము' అను మూడవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. క్రమంగా సాధన కొనసాగిస్తూ

Page:493

ఉండగా వాసనలకు ఆశ్రయభూతమైన అవిద్య సన్నగిల్లుతూ ఉండగా ఆ యోగి (లేక, సాధకుడు) 'విలాపనీ' అనే నాలుగవ భూమిక (లేక, నాలుగవ అవస్థలో ప్రవేశిస్తున్నాడు. ఆ విధంగా విలాపనీ యందు సాధన కొనసాగుచుండగా కొంతకాలానికి 'శుద్ధ సంవిన్మయానందము' అను 5వ భూమికలో ప్రవేశిస్తున్నాడు. ఈ ఐదవ భూమిక శుద్ధ సంవిత్తుచే పూర్ణమై ఉంటుంది. ఆనందరూపమైన ఈ భూమికలో ప్రవేశించిన యోగిని 'జీవన్ముక్తుడు' అని అనవచ్చు. ఈ భూమికలో ఆతడు అర్ధ నిద్రితుడు గాను, అర్ధ జాగృతుని వలెను ఉంటాడు.

అట్టి ఐదవ భూమికలో కొంత కాలమున్న తరువాత యోగి 'స్వభావనిరతిశయానందము’ అను ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. ఈ భూమిక (లేక అవస్థ) బ్రహ్మకారము అను అనుభవవృత్తి రూపంగానూ, స్వభావంగానే నిరతిశయానందరూపంగానూ ఉంటుంది. లౌకిక జగత్తు దృష్ట్యా ఇది సుషుప్తి రూపము వంటిది. ఇందులో ఏర్పడి ఉండే కించిత్ వృత్తి కూడా లయించుచుండగా ఆ పరమయోగి’ (లేక, పరమహంస) కేవలముక్తి రూపమై, సౌమ్యమైనట్టి 'తురీయాతీతావస్థ' అనే ఏడవ భూమికలో ప్రవేశిస్తున్నాడు.

ఇట్టి తురీయాతీతావస్థ’ అనే ఏడవ భూమిక పరా నిర్వాణరూపమైనది. ఈ సప్తమ భూమిక మిక్కిలి ప్రౌఢమైతే ‘విదేహముక్తి' లభిస్తుంది. అట్టి ఏడవ భూమికకు అతీతమైన స్థితి కేవలానుభవమే తప్పించి సదేహుల సంభాషణకు అందేది కాదు. అయితే ఆ విదేహముక్తి అనుభవానికి లభ్యమే సుమా!

తురీయాతీతము -

7. తురీయాతీతము : స్వయంప్రకాశ రూపం, మనోవాక్కులకు అగోచరం

6. స్వభావ నిరతిశయానందము : కేవల స్వరూప మాత్ర - తురీయావస్థ

5. శుద్ధ సంవిన్మయానందం : సుషుప్తరూపం

4. విలాపనీ : స్వప్నరూపం

3. అసంగము

2. విచారణ జాగ్రదావస్థలు ఈ మూడు

జాగ్రదవస్థలు

1. ప్రజ్ఞాశ్రయం-శాస్త్రాశయం

మనోవాక్కులకు అగోచరం, కేవలానుభవమాత్రం.

'సప్తమ భూమికామహాసమత్వము' అనబడే 7వ భూమికలో అంతరంగమునందు సమస్తమూ లయించి పోతాయి. విషయములు భావించవు. ఇట్టి యోగి 'ముక్తుడు' అని కూడా పిలువబడుచున్నాడు. 7వ భూమికలో ప్రవేశించిన వాని బుద్ధి సుఖములచే గాని, దుఃఖములచే గాని కొంచెం కూడా స్పృశించబడదు. 'ఈ శరీరం ఉన్నా ఒక్కటే! లేకున్నా ఒక్కటే' అను మహత్తర భావమును ఆతడు కలిగి ఉంటాడు. 'నేను మరణించటం లేదు. జీవించటం లేదు. నేను సత్తును గాను. అసత్తును గాను' అని గ్రహించి కేవలం ఆత్మారాముడై ఉంటాడు కాబట్టి ఈతనిని మనం 'జీవన్ముక్తుడు' అను శబ్దానికి సరితూగే అర్థంగా చెప్పుకుంటాం.

Page:494

వ్యవహార్యుపశాన్తోవా, గృగ్గోవా అధ వైకకః, అహం న కించిత్ చిదితి, మత్వా జీవో న శోచతి||

అలేపకో హమ్, అజరో, నీరాగః, శాంతవాసనః నిర్మలో2స్మి చిదాకాశ ఇతి మత్వా న శోచతి॥ అహమ్ అన్తాది రహితః శుద్ధోబుద్ధో అజరామరః శాన్తః సమసమాభాస ఇతి మత్వా న శోచతి|

తృణాగ్రేషు అంబరే భానౌ నర నాగ అమరేషుచ, యత్తదస్తి తదేవ ఇతి మత్వా భూయో నశోచతి|| 'సంసారము - అనబడే దానిచే నేను లిప్తుడను అయ్యేవాడిని కాను. దేహధర్మములైన వార్ధక్యాదులు నా స్వస్వరూపమునకు లేవు. రాగద్వేషములు నా నిర్మల స్వస్వరూపమునకు లేవు. నేను వాసనా శూన్యుడను. నిర్మల చిదాకాశమాత్రుడను' అని ఎరిగియే ఉండటంచేత సుఖ-దుఃఖ ద్వంద్వములు అతనిని సమీపించనైనా లేవు.

నేను వ్యవహారస్థుడనై ఉండవచ్చు. లేదా వ్యవహారములు లేనివాడనై ఉండవచ్చు. గృహస్థుడనైనా, సన్యాసిని అయినా సరే ... ఏది ఏమైనా, ఎట్లున్నా, నేను చిన్మాత్రుడను”అని విశ్వసించే యోగి ఇక దుఃఖము పొందే ప్రసక్తే ఉండదు.

నేను ఆద్యంతాలు లేని వాడను. శుద్ధుడను. బుద్ధుడను. వార్ధక్యాదులు నాకు లేవు. అమరుడను. శాంతుడను. సర్వత్రా-సమంగా భాసించేవాడను అని ఎరిగిన తర్వాత ఇక ఆ యోగిని శోకమోహాలు సమీపించటానికి సాహసించలేవు. 'ఒక గడ్డి పరక చివరి కొసభాగంలోను, ఆకాశమందు, సూర్యుని యందు, మనుష్యులందు, పాములందు, దేవతలందు ఏ సన్మాత్రము ఉండి ఉన్నదో, ఆ ప్రత్యేక చిన్మాత్రమే నేను'... అని ఈ విధంగా అఖండ వాక్యార్థం ఎరిగిన తరువాత దుఃఖించుటకు కారణమే కనిపించదు. "చిద్రూపుడనగు నా యొక్క మహిమయే సర్వజంతువులలోను, ఇటు భూమియందు, అటు ఆకాశమునందు అంతటా వ్యాపించియున్నది"... ఇట్లు అనంత విలాసయుక్తునిగా తనను తాను గ్రహించి తీర్చిదిద్దుకునే ఆ మహాత్ముని మరణాది దుఃఖములు ఎట్లా అడ్డుకుంటాయి?

ఓ ఇక్ష్వాకూ! ఈ కనబడే వస్తువులలో సాంసారిక జీవుడు ఏదో సుఖాశతో వెతకుచున్నాడు. అయితే సుఖము ఎక్కడ లభిస్తుంది? వాసనలతో కూడిన అజ్ఞానికి ఏఏ పదార్థములు ఇప్పుడు సుఖములు కలిగిస్తున్నాయని నమ్ముకొని ఉంటున్నాడో, అవన్నీ కూడా ఒకప్పటికి కాలక్రమేణా నశించేవే! కనుక నశించేటప్పుడు అవి అతి శీఘ్రంగా దుఃఖమును కలిగించబోతున్నాయి.

మాకున్నవన్నీ ఇట్లాగే ఉంటాయి? ఈయన ఏమిటి, ఇట్లా అంటాడు?”...అని ఎవరైనా అనదలిస్తే ... వారికి - "భౌతికానుభవములకు ఉపకరణమైన దేహమే కాలక్రమేణా నశించబోతోంది కదా”...అని గుర్తు చేస్తున్నాం. అందుచేత, ఏఏ వస్తువులు వాసనారహితమైన మనస్సుచే అనుభవించ

Page:495

బడతాయో, అవి మాత్రమే దుఃఖరహితమైన సుఖమును అందించగలుగుతాయి'... అని జనులందరికీ నా మనవి.

అవినాభావ నిష్ఠత్వం ప్రసిద్ధం సుఖ-దుఃఖయోః, తనువాసన మర్ధో యః సేవ్యతే వా వివాసనమ్,

నాసౌ సుఖాయతే, నాసౌ నాశకాలేన దుఃఖ దః ॥

ఈ సుఖ-దుఃఖాలనేవి ఒకదానితో మరొకటి 'అవినాభావ సంబంధం' కలిగి ఉన్నాయి. 'ఇది సుఖం’ అన్నచోట ‘మరొకటి దుఃఖం' అని అనుకున్నట్లే అవుతుంది. వాసనారాహిత్యంచే ఏది అనుభ వించబడుతుందో అది సుఖం కలిగించజాలదు. అది తొలగినప్పుడు దుఃఖం కూడా కలిగించజాలదు.

ఎవడు వాసనలు నశించిన బుద్ధితో ఏది చేస్తాడో, అది దగ్ధమైన బీజంలాగా మరల అంకురించ జాలదు. అట్టివాని కర్మలన్నీ దేహేంద్రియముల చేతనే నిర్వర్తించబడుచుండగా, మనస్సు అకర్తృత్వము వహించి ఉండే సామర్థ్యము కలిగి ఉంటుంది. వాసనలు కలిగి ఉండే మనస్సు అకర్తృత్వమును వహించాలని అనుకున్నా కూడా ... వల్ల కాదు.

=

ఇంద్రియ సమూహములన్నిటియందు ఏకస్థమైయున్న శుద్ధ చైతన్యము ఇంద్రియ వ్యవహారానికి కర్తగాని, భోక్తగాని ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఈ ఇంద్రియములకు, 'అహం' భావనకు కూడా శుద్ధ చైతన్యం వేరుగా ఉంటోంది. అయితే ఆ శుద్ధ చైతన్యం జడమగు ఇంద్రియ అహంకారాదు లకు ప్రవర్తనశక్తిని ప్రసాదిస్తోంది. ఆ చైతన్యతత్త్వమే ఇంద్రియాలను వెలిగిస్తోంది గాని, ఇంద్రియాలు అద్దానిని ప్రకాశింపజేయటం లేదని గ్రహించు. అయ్యది పూర్ణచంద్రదీప్తి వలె పూర్ణ ప్రకాశమానమై ఉన్నది. అదొక్కటే స్వయం ప్రకాశకమని, తక్కినదంతా అద్దాని ప్రభావ వీచికలు మాత్రమేనని ఎరిగి ఉండు. ఇక ఈ దేహం విషయం అంటావా! ఈ దేహము, దేహమునకు సంబంధించిన భావన, దేహముచే నిర్వర్తించబడే ఆయా క్రియలు ... ఇవన్నీ కూడా 'జ్ఞానము' అనే వాయువు గట్టిగా వీచినప్పుడు (ఇవి) నిర్విషయమై ఎటో కొట్టుకుపోతాయి.

నీవు శాశ్వతం - నిర్మలం అగు చైతన్యస్ఫూర్తి అయి ఉన్నాయి. ఇక ఈ దేహమో? ఈ మధ్య కాలంలో వచ్చినది. మధ్యలోనే పోతోంది. ఈ దేహకళలు నీ చైతన్య కళలను కప్పి ఉంచగలవా? లేదు. మరి చైతన్య కళలను చూచి ఆనందించక ... ఈ దేహ కళలను చూచి దుఃఖించవలసిన పనేమిటి?

సర్వైవ హి కలా జంతోః అనభ్యాసేన నశ్యతి, ఏషా జ్ఞాన కలాత్యన్తః సకృష్ణాతా దినేదినే, వృద్ధిమేతి బలాదేవ సుక్షేత్ర వ్యుప్తశాలివత్

దేహ సంబంధితమైన ఏ కళంకాలు ఉన్నాయో, అవన్నీ అనభ్యాసం వల్ల నశించిపోతాయి. అయితే స్వస్వరూప చైతన్యమునకు సంబంధించిన జ్ఞానకళ అట్టిది కాదు. ఆత్మజ్ఞానము జనించిందా,

Page:496

అట్టి కళ తదితర దేహ సంబంధిత విషయముల వలె కాలబద్ధంకాదు. కాబట్టి మంచి ప్రదేశంలోని పూలమొక్కవలె దినదినం వృద్ధి చెందగలదు. అందుచేత నీవు దేహకళలను ఆశ్రయించటం తగ్గించి జ్ఞానకళను ఆశ్రయించు.

ఓ కుమారా! ఇక్ష్వాకా! సమస్త తటాక - నదీ - సముద్రములందునూ ఒకే స్వచ్ఛమైన జలం ఏర్పడి ఉన్నట్లు ఒకే విశ్వరూప - సన్మాత్రము'అగు ఆత్మ ఈ సమస్త పదార్థములందును సర్వదా స్ఫురిస్తోంది. కనుక ఈ జగత్తంతా కూడా సమస్త విచిత్ర కల్పనా రహితమైయున్నదని, ఏకసత్తాంశమాత్రమని గ్రహించి ఉండు. వ్యక్తిగతమైనది ఎచ్చటైతే ఏమాత్రం లేదో, అట్టి జగదహంకారాదులు దాని గురించి లెక్కలు కట్టుకుందో దుఃఖించవలసిన పని నీకేమున్నది?

5. సచ్చిదానందమును సంతరించుకో

ఇక్ష్వాకు చక్రవర్తి : హే ప్రజాపతీ! ఈ ఆత్మకు జీవత్వమనేది ఎంతవరకు అనివార్యమై ఉంటుంది? మను ప్రజాపతి : ప్రియకుమారా! ఎంతవరకైతే విషయ భోగేచ్ఛల గురించి 'ఆశ' అనేది అంతర్గతంగా కలిగి ఉంటుందో అంతవరకు ఆత్మకు 'నేను జీవుడను' అనే దశ ఉండియే తీరుతుంది. మరి విషయ భోగాశ ఎక్కడి నుండి వస్తోంది? అది 'అజ్ఞానము' అనే వీచికయేగాని, అవివేకముచే సంప్రాప్తిస్తున్నదే గాని వాస్తవమైనది కాదు.

వివేకము బలం పుంజుకుంటూ ఉంటే భోగాశ తనంతట తానే క్షయిస్తూ ఉంటుంది. విషయ భోగాశ క్షీణించగానే అప్పుడు ఆత్మ జీవదశను త్యజించి స్వభావసిద్ధము, అనామయము అగు 'బ్రహ్మరూపత్వం పొందుతోంది. అప్పుడు దేహము ఉన్నా, ఉండకపోయినా బ్రహ్మానుభవం ఏర్పడియే ఉండగలదు.

బొక్కెన త్రాడుచే కట్టబడి క్రిందినుంచి పైకి, పైనుండి క్రిందకు బలవంతంగా తిరుగాడుతున్నట్లు, ‘భోగవాంఛ’ అనే అవివేక స్వభావం (చింతన) అనే త్రాడుచే కట్టబడి ఈ సంసార కూపం (నుయ్యి)లో తిరుగాడుతోంది. అట్టి చింతన అనే త్రాడుచే భోగవాంఛస్వభావుడవై బంధించ బడబోకు.

ఈ భోగవాంఛ అనేది చాలా చమత్కారంగా జీవుని ఆవరించి ఉంటోంది. దాని రూపమేమిటో

చెబుతాను విను.

ఇది నాది -నేను దీనికి చెందినవాడను?" - 'ఇది నాది, నేను దీనికి చెందిన వాడిని'... అని ఘనీభూతమైన వ్యవహార భ్రమను ఎవరైతే మోహవశంచేత ఆశ్రయించి ఉంటారో ... అట్టి మూర్ఖులు ఇంకా క్రిందకు, అక్కడి నుండి ఇంకా ఇంకా క్రిందకు పడిపోతూనే ఉంటారు. నేను వీనికి చెందిన వాడిని. ఇతను నా వాడు. ఈ దేహం నేను ...ఈ ప్రకారంగా మోహమును ఆశ్రయిస్తూ ఎవరు జ్ఞానానికి దూరమౌతూ ఉంటారో వారిని ఎవరు ఎట్లా కాపాడగలరు? అట్టి మోహమును పరిత్యజిస్తూ ఉండేవారో ... క్రమక్రమంగా ఉన్నతిని సంపాదించుకోగలరు.

Page:497

కనుక ఓ రాజా! ఇప్పుడు నీవు చెయ్యవలసినదేమిటో చెబుతాను. స్వయం ప్రకాశరూపమగు నీ యొక్క ఆత్మను అవలంబించు. అట్టి సంపూర్ణభావనచే ఈ జగత్తులన్నిటినీ నింపివేయి. జగత్తు లన్నిటా పూర్ణమొనర్చి వ్యాపించియున్న 'చిదాకాశము'నే గాంచుము. ఎప్పుడైతే అఖండ-అప్రమేయ -నిర్మల చిద్రూపమును సర్వే సర్వత్రా దర్శిస్తావో అప్పుడు నీవీ సంసార సాగరమును అధిగమించి పరమేశ్వరత్వం పొందుతావు. ఉత్తమ భావన చేయి. ఉత్తముడవౌతావు.

ఇక్ష్వాకువు :ఉత్తమభావన' అంటే తమ ఉద్దేశం చెప్పండి.

మను ప్రజాపతి : 'బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, వరుణుడు, ఈశ్వరుడు మొదలైన వారంతా ఏదేది చేయటానికి ఉద్యమిస్తున్నారో ... అదంతా కూడా చిత్ శరీరినగు నేనే చేయుచున్నాను'... అని భావన చేయి. 'చిత్'యొక్క విలాసము నిరంకుశము కాబట్టి ఏదేది ఎట్లు భావన చేస్తే అదియే క్రమంగా సిద్ధించగలదు. ఏ భావన యొక్క ఉత్కృష్టత త్రిమూర్తులలో ఉన్నదో అది కూడా నీవే అగుచున్నావు. అట్టి ‘ఆత్మా హం' భావనచే దృశ్యము వైపుగా ఎక్కుబెట్టబడి ఉన్న చిత్తం ఉపశమించి బ్రహ్మాకారం పొందుతోంది. చిత్తం శమించగా, మృత్యువును అధిగమించి చిన్మాత్రత్వం (నేను శుద్ధ చితు - అనే ఆరూఢత్వం) పొందిన వారికి ఏ పరమానందం లభిస్తోందో అది దేనితో పోల్చగలం?

ఇక ఈ జగత్తు విషయంలో ఎట్టి భావన కలిగి ఉండాలో ...చెబుతాను విను. ఈ జగత్తు శూన్యం కాదు. అశూన్యమూ కాదు. చిద్రూపం కాదు. అచిద్రూపమూ కాదు. ఆత్మరూపం కాదు. అనాత్మ రూపం కాదు. ఇది భావన అను ప్రక్రియపై ఆధారపడి ఉన్నది... అని గమనిస్తూ జగద్భావనను అధిగమించి ఆత్మను మాత్రమే ఆశ్రయించి ఉండు.

'ఆత్మ సాక్షాత్కారం' అనే సాక్షాత్ పారిమార్థిక స్వరూపం ప్రాప్తిస్తూ ఉండగా ఈ ప్రకృతి తనకు తానే స్వయంగా తొలగిపోగలదు.

ఏతత్ స్వరూపమాసాద్య ప్రకృతిః పరిశామ్యతి |

న దేశో మోక్షనామాస్తి న కాలో నేల తరా స్థితః ||

మోక్షం అని పిలుబడే స్థితి ఎప్పటికో, ఎంతోకాలానికి గాని రాదు. ఎక్కడో మరొకచోటు అది. మోక్షస్థితిలో మనం ఇట్లా ఉండం. మరొక స్థితిలో మరొకటేదో రూపంలో ఉంటాం”... అని లోక రీతిగా అనుకుంటూ ఉంటారు. అదంతా వాస్తవంకాదు. మోక్షమనేది ఎక్కడికో వెళ్ళిన తరువాతనో, ఏ మరొక స్థితి పొందిన తరువాతనో, ఏ కొంత కాలమో జరిగిన తరువాతనో వచ్చి కూర్చునేది కాదని గ్రహించు. మరి?

వ్యక్తిగతమైన అహంకారం (లేక) దేహగతమైన అహంకార - మమకారములు’ అనే మోహం క్షయిస్తూండగా, ఆ ద్రష్ట అంతరంగంలో ఈ ప్రకృతి యొక్క ప్రభావం పరిశ్యామం పొందుతూంటుంది. అప్పుడా ద్రష్టకు "నేనే ఆత్మను. ఆత్మ గురించి చెప్పబడిన అఖండ అప్రమేయాది లక్షణములన్నీ నా స్వరూప వర్ణనలే”...అని సుస్పష్టమౌతుంది. అనుభవైక వేద్యమౌతుంది. అట్టి అవగాహన యొక్క వాక్మనో అతీతమైన వైభవం - అనుభవాల ఔన్నత్యస్థితినే 'మోక్షం' అని పిలుస్తారు.

Page:498

అనేక శాస్త్రముల అనేక కథా - - సోదాహరణములు, విభాగ సిద్ధాంతములు, విధి విధానాదులు చెప్పుకుపోతున్నాయి. మా ఉద్దేశంలో అవన్నీ కూడా 'నేను నిత్యసత్యమగు నిర్మలాత్మను'... అని నిరూపించుటకొరకై (మధ్యే మార్గ ప్రతిపాద్యములై) ఉన్నాయి. అందుచేత వివిధ శాస్త్రముల గూర్చిన 'జిజ్ఞాస' అనే చపలత్వం కూడా శమించవలసిన వాటిలో ఒకటియే అయున్నది. అట్టి శాస్త్రార్థజిజ్ఞాస' అనే చపలత్వం కూడా శమించినవాడు, అనేక విధములగు కావ్య - నాటక కౌతుకములు కూడా లేనివాడు, సమస్త వికల్ప - ఉపద్రవములు తొలగినవాడు, సమరూపమగు జీవన్ముక్తత్వము సంపాదించుకొన్న మనిషి శాశ్వతమైన సచ్చిదానందముతో సుఖ పూర్వకంగా ఏర్పడి, ఈ ప్రపంచమున ఉండగలడు.

ఓ ఇక్ష్వాకూ! నీవు కూడా అట్టి సచ్చిదానందత్వము అనువర్తించుకో. సంతరించుకో. ఇక ఏది ఎట్లు ఉచితమో అట్లే అగుగాక!

6. జీవన్ముక్త మాహాత్యం

ఇక్ష్వాకు చక్రవర్తి : ప్రభో! పవిత్రమగు జీవన్ముక్తత్వము సంతరించుకున్న మహనీయుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది? వారిలో ప్రత్యేకమైన లక్షణాలేమైనా కనిపిస్తాయా? వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండటం మావంటి వారికి అనుచితం? అసలు వాళ్ళు ఎక్కడెక్కడుంటారు?

మను ప్రజాపతి : జీవన్ముక్తునికి 'ఇక్కడే ఉండాలి - అక్కడ ఉండకూడడు' అనే సాంఘిక - లౌకిక సిద్ధాంతాలు వర్తించవు. ఎక్కడైనా ఏదో తింటూ, ఎవరో ఏ వస్త్రమో కప్పితే కూడా తన ఇచ్ఛానుసారం ఉండగలడు. వర్ణాశ్రమ ధర్మాలనుండి, శాస్త్రరూప యంత్రము నుండి అంతర్గతంగా విడువబడినవాడై ఉంటాడు. బాహ్యానికి ఏది ఎట్లు ఎంతవరకు లోకానుకూలంగా అవుతుందో, అది అట్లే అనుసరిస్తాడు. 'జీవన్ముక్తుడు బోను నుండి సింహం లాగా ఈ జగజ్జాలము నుండి బయల్వెడలుచున్నాడు. వాక్కుచే అందనట్టి నిరతిశయానందము పొంది ఉంటాడు. విషయదశల నుండి విడివడినవాడగు ఆ యతివర్యుడు శరద్రుతువులోని మేఘరహిత నిర్మలాకాశంలాగా ఒకానొక అనిర్వచనీయ శోభను పొందుచున్నాడు. పర్వతముపైన గల ఒక పెద్ద మడుగులాగా గంభీరుడై, నిర్మలుడై ఒప్పుతూ ఉంటాడు. 'ఆత్మానంద రసాస్వాదము' నుండి చ్యుతుడు కావటానికి ఆతనికి కారణమే కనిపించదు. సదా, సర్వదా, సర్వ అవస్థలలోనూ ఆత్మయందే క్రీడిస్తూ ఉంటాడు.

సర్వకర్మఫలత్యాగీ, నిత్యతృప్తో, నిరాశ్రయః, న పుణ్యేన, న పాపేన లిప్యతే నేతరేణచ ॥

సమస్త కర్మల ఫలములను మొదలే త్యజించివేసి ఉంటాడు. నిత్యతృప్తుడై, నిరాశ్రయుడై ఈ మాయామేయ జగత్తు యొక్క నిత్యానిత్య రహస్యములను ఎఱిగి ఉంటాడు. పుణ్యపాపములుగాని, తదితరములైన హర్ష - శోకములు గాని ఆతనిని అంటజాలవు.

Page:499

స్ఫటికః ప్రతిబింబేన యథాయాతి న రంజనమ్ తత్అః కర్మఫలేనాన్తస్తథా నా యాతి రంజనమ్||

ఒక స్పటికమును ఒకచోట ఉంచామనుకో. అందులో ఎదురుగా ఉన్న ఎరుపు రంగు వస్త్రం ప్రతిబింబించటం చేత స్ఫటికము ఎఱుపుగా కనిపిస్తుంది. అంతమాత్రం చేత స్ఫటికం రూపాంతరం పొందింది...అని అనగలమా? స్ఫటికం ఇతఃపూర్వపు నిర్మలత్వం కోల్పోతుందా? ప్రతిబింబిత వస్తువును ప్రక్కకి పెట్టగానే స్ఫటికం యథాతథమౌతుంది కదా! అట్లాగే ప్రారబ్ధ కర్మ ఫలరూపములగు ఇక్కడి సుఖ - దుఃఖాదులచేత ఆ జీవన్ముక్తుడు ఆత్మ స్వభావము నుండి ఏమాత్రం చ్యుతుడు కాడు. ఒక ప్రక్క జన సమూహం మధ్య విహరిస్తూనే, స్వతంత్ర బుద్ధితో ఆత్మారాధన చేస్తూనే ఉంటాడు. అద్దము తనలో ప్రతిబింబించే దృశ్యము వృద్ధిచెందినా ఖండింపబడినా భేదము పొందదు కదా! దేహము పూజించబడుచున్నప్పుడు, ఖండించబడుచున్నప్పుడు కూడా - అద్దంలో ప్రతిబింబించే దేహము మోహముగాని, గర్వముగాని, దుఃఖం గాని పొందనట్లు ఆతడు దేనికీ భేద, దుఃఖ, మోహ, గర్వాదులు పొందడు. పూజింపబడనప్పుడు కూడా స్తుతి శూన్యుడై ఉంటాడు. పూజితుడు కాకున్నప్పటికీ వికార రహితుడై ఉంటాడు. ఒకప్పుడు ఆచారనియమములు పాటిస్తున్నప్పుడు, మరొక్పుడు పాటించని తరుణంలోను కూడా ఆతని ఆత్మావగాహన ఒకే తీరుగా ఉంటుంది. ఆ ఉభయములు ఆతనికి ఒక్కటే అవుతాయి.

తస్మాన్ నో ద్విజతే లోకో, లోకాన్నోద్విజతే చ సః రాగద్వేషభయానంన్టైః త్యజ్యతే ..పి చ యుజ్యతే॥

ఆతనిని చూచి లోకము, భయం పొందదు. లోకమును చూచి ఆతడు భీతుడు కాడు. ఒకప్పుడు రాగ-ద్వేష-భయ-ఆనందాలు త్యజించి ఉంటాడు. మరొకప్పుడు లీలామాత్రంగా కూడి ఉంటాడు. అవి ఉన్నా, లేకున్నా ఆతని ఆత్మానుభూతికి కొఱత ఉండదు. ఇక ఆతని తత్త్వజ్ఞానానుభవం యొక్క లోతును ఎన్నో లౌకిక తెలివి తేటలు కలవాడు కూడా కనుగొనలేడు. అయితే వ్యవహారానికి వస్తే శుద్ధచిత్తుడైన ఒక చిన్నపిల్లవాడికి కూడా ఆతను ఇట్టే వశమై ఉంటాడు.

తనుం తయుతు వా తీర్థీ శ్వపచస్య గృహే2పి వా మా కదాచన వా రాజన్ వర్తమానే పి వా క్షణే||

ఒక పవిత్ర క్షేత్రంలో దేహం విడచుచుండవచ్చు గాక. లేదా, మరెక్కడో అపవిత్రమైన పరిస రాలలో విడుచుచుండవచ్చు. ఈ శరీరమును సుదీర్ఘ కాలం కలిగి ఉండవచ్చు. అల్పకాలంలోనో, లేక మరికొద్ది క్షణములలోనో త్యజించవలసి ఉండవచ్చు. ఈ అన్ని సందర్భములలోనూ ఆతనికి ఏ ప్రత్యేకతా కనిపించదు. దేహ గ్రాహ్యంలోగాని, దేహ త్యాజ్యంలోగాని ఆతనికి విశేషమేదీ కనిపించదు. ఆతనియందు కోర్కెలేవీ ఉండనందువల్ల జ్ఞాన ప్రాప్తిపొందిన సమయంలోనే ముక్తిని పొంది ఉంటాడు. పఠన శ్రవణాదుల ద్వారా జ్ఞాన విషయములు పొంది ఆత్మానుభవి అయి శేషిస్తాడు గాని, “ఈ ఈ క్రియల తరువాతనే ముక్తి"... అనే వ్యవహారం యొక్క అగత్యం ఆతనికి ఉండదు.

Page:500

ఈ ప్రపంచంలో జీవునికి ప్రతిబంధకమగుచున్నది అహంకారమే కదా! జీవన్ముక్తునిలో అహంకారభ్రాంతి' అనే బంధనం ఉండదు. జ్ఞానముచే అది స్వతఃసిద్ధంగానే రహితమైపోయి ఉంటుంది. ఆ జీవన్ముక్తుడే మోక్ష స్వరూపుడు. అంతేగాని ఆతని పట్ల మోక్షమనేది ఎక్కడినుండో వచ్చేది కాదు.

ఓ ఇక్ష్వాకు చక్రవర్తీ! అటువంటి మహనీయులు ఈ భూమిపై ఉన్నారు. వారు పూజనీయులు. వారిని పూజించినవారు, నమస్కరించినవారు కూడా పవిత్రులు, జ్ఞానైశ్వర్యులు కాగలరు. అందుచేత ప్రయత్నపూర్వకంగా అట్టి వారిని దర్శించాలి. నమస్కరించాలి, స్తుతించాలి. అభివందనలు సమర్పించాలి. ఎందుకంటే వారు ఇక్కడి సంసారరోగమును తమ చూపుచే, వాక్కుచే, స్పర్శచే శమింపజేయగలరు.

ఓ జనులారా! ఆత్మవేత్తలపట్ల మీరు భక్తి ప్రపత్తులు కలిగి ఉండండి. ధర్మపరిరక్షణకు, సంసారమందు చిక్కుకున్న ఈ మనస్సును ఎప్పటికైనా ఇవతలకు లాగి 'మోక్షమార్గము' అను పవిత్ర ప్రదేశములో నిలిపి ఉంచటానికి ఈ లోకమునకు వారే దిక్కు. వారే ప్రవక్తలై ధర్మ సంరక్షణార్థం జన్మించి పెడత్రోవనపోతున్న ఈ జన స్రవంతిని దుఃఖముల నుండి కాపాడి లోకముకు మహోపకారం చేస్తూ ఉంటారు. ఆత్మవేత్తలను దర్శించటం, వారితో సంభాషించి ఆత్మజ్ఞానోన్నతిని సంపాదించటం వలన కలిగే పవిత్ర ఫలము యజ్ఞ -తీర్థ తపో దానాదులచే కూడా లభించజాలదు. ముముక్షువులగు జనులు తమ ప్రయత్నసౌలభ్యం కోసం జీవన్ముక్తులు, జ్ఞానులు అగు వారికొరకు వెతుకుతూ ఉండటం, వారు తారసబడినప్పుడు వినమ్రులై అనుద్వేగకరములైన ప్రశ్నలచే సంభాషించి తద్ద్వారా ఆత్మజ్ఞాన వివేకమును పెంపొందించుకోవటం అవశ్య కర్తవ్యమై ఉన్నది.

ఓ ఇక్ష్వాకా! ఇక నీకు శుభమగుగాక! లోకములందు ఆత్మ వివేకము పరిఢవిల్లి, నా బిడ్డలగు ఈ జనులంతా దుఃఖరహితులగు గాక!

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇట్లు దీవించి భగవంతుడగు ఆ మనుప్రజాపతి శీఘ్రంగా బ్రహ్మలోకమునకు జేరుటకై అంతర్థానమైనాడు. మహనీయుడగు మను ప్రజాపతి చెప్పిన ప్రతివాక్యమును వివేకముతో విశ్లేషించి, ఆత్మదృష్టిని దృఢంగా అవలంబించిన మీ వంశజుడగు ఆ ఇక్ష్వాకువు స్థిరచిత్తుడైనాడు.

7. జీవన్ముక్తుడు - సామ్యస్థితి

శ్రీరాముడు : ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ వసిష్ఠమహర్షీ! మనం ఇన్ని రోజులుగా అనేక సందర్భములలో జీవన్ముక్తుని గురించి చెప్పుకున్నాం. అయినా కూడా మా పూర్వీకులైన ఇక్ష్వాకు చక్రవర్తి మను ప్రజాపతిని అడిగినట్లే నాకు కూడా మిమ్ములను అడగాలనిపిస్తోంది. జీవన్ముక్తులగు

Page:501

మహనీయులు ఉన్నారని, వారిని సేవ - స్తోత్రాదులచే సంతసింపజేయటం విధ్యుక్తధర్మమై ఉన్నదని మనుప్రజాపతి చెప్పారు. సన్మతి అయిన జీవన్ముక్తుని వెతికి పట్టుకోవటం ఎట్లా? ఆతనిలో ఏ ప్రత్యేకతలు ఉంటాయి? సాంసారిక జనులలో ఉండనిది, జీవన్ముక్తులలో కనిపించేవి ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉన్నాయా? వారియందు ఏవైనా ఉత్తమ శక్తులు గాని, మరింకేమైనా గాని-మనం గుర్తించటానికి వీలుగా ఉంటాయా?

శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞానికి జ్ఞానమే అతిశయం. అజ్ఞానికి అజ్ఞానమే అతిశయం. ఇక సాంసారిక సిద్ధులంటావా? మనం చూడాలోపాఖ్యానంలోను, అంతకు ముందే మరికొన్ని సందర్భములలోను జ్ఞానము-భౌతికసిద్ధులు ఈ రెండు ఒకదాని ననుసరించి మరొకటి తప్పక ఉండాలనే నియమమేదీ లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మరికొంత విశ్లేషణం చేసుకుందాం.

జ్ఞానికి, (లేక) జీవన్ముక్తునికి సాంసారిక సిద్ధుల విషయమై కొంచెము కూడా అతిశయముతో కూడిన పట్టుదల ఉండదు. ఎందుకంటే ఆతడు సర్వదా నిత్యతృప్తుడై, శాంతచిత్తుడై ఆత్మయందే

నెలకొని ఉంటాడు.

జనులు ఎంతో తపస్సు చేసి, మంత్ర - తంత్రములను దీర్ఘకాలం ఆశ్రయించి, అప్పుడు ఆకాశగమనము మొదలైన భౌతికశక్తులు సంపాదిస్తున్నారు. జ్ఞాని ఆ మంత్రవేత్తను, అతని భౌతిక శక్తులను కూడా తన రూపంగానే దర్శిస్తూ ఉంటాడు. అందుచేత వాటి ప్రాప్తియందు ఆతనికి అపూర్వమైనదేదీ కనిపించదు. అనేక మంత్ర - తంత్రాదులను నిర్వర్తించుటలో అణిమ - గరిమ

- లఘిమ - - ఈత్వ - వశిత్వ - ప్రాకామ్య - - ఇచ్ఛాది సిద్ధులు లభిస్తున్నాయి. అవన్నీ స్వప్రయత్నముల చేతనే సాధించబడుచున్నాయి. కాబట్టి అవన్నీ సపూర్వములే గాని, అపూర్వములైనవి కాజాలవు. ఆత్మజ్ఞాని స్వతఃగాను, అకృత్రిమంగాను సర్వాత్మభూతుడై ఉంటాడు. అందుచేత ఇతరులచే అనేక ప్రయత్నముల ద్వారా సంపాదించబడుచున్న ఆయా సాంసారిక సిద్ధులు ఆ సాధకులయందే తాను ఉండి ఉన్నట్లు అనుభూతి కలిగి ఉండడంచేత తనచేత సాధించబడుచున్నట్లే గాంచగలడు. మరి తాను వాటిని సాధించుటవలన కలిగే నూతన ప్రయోజనమేదీ ఆతనికి కనిపించదు.

ఏష ఏవ విశేషో అస్య న సమో మూఢబుద్ధిభిః సర్వత్రా స్థాపరిత్యాగాన్నీ రాగమమలం మనౄ భావేత్తస్య మహాబుద్ధేర్నాసౌ వస్తుషు మజ్జతి ॥

ఆత్మజ్ఞాని మూఢబుద్దులతో సమానంగా ఉండడు. ' రాగ-ద్వేషాదులు పొందడు. ఆత్మనిశ్చయం వదలడు. ఇదియే వాని యందలి విశేషం. అంతటా అనురాగం త్యజించివేసి ఉంటాడు. రాగ రహితుడైన ఆ మహాబుద్ధిమంత మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అట్టివాడు పదార్థము లందు నిమగ్నం కాడు. ఓ రామచంద్రా! ఆతడు చిహ్నరహితుడు, శాంతచిత్తుడు, చిరకాల సంసారభ్రమ తొలగినవాడై ఉంటాడు. ఇక ఆతనిని గుర్తించటానికి చిహ్నమేమంటావా?

Page:502

తజ్ఞస్య యత్ మదన - - కోప - విషాద మోహ

లోభ-ఆపదాం అనుదినం నిపుణం తనుత్వమ్

...ఆతనిలో కామ-క్రోధ-లోభ-మోహ-శోకాల వల్ల కలిగే ఆపదలు మొదలైనవి రోజురోజుకు ఆత్మానుభవ నిపుణతచే క్షయం పొందుతూ ఉంటాయి. వాటి రాహిత్యమే ఆతని చిహ్నం.

8. మూడు అవస్థలు - తురీయం

శ్రీవసిష్ఠ మహర్షి : నిర్మలుడు, సర్వాంతర్యామియగు ఈశ్వరుడే ఈ జీవుడుగా కూడా పరిణమిస్తున్నాడు. ఒకానొక బ్రాహ్మణుడు తుచ్ఛమైన కోరికచే ఒక శూద్రస్త్రీయందు ఆసక్తుడై నిర్మల - సాత్విక సమన్వితమగు బ్రాహ్మణ ధర్మమును మెల్లమెల్లగా త్యజించి చివరికి శూద్రత్వమును ఆశ్రయిస్తూ ఉన్నట్లు ... ఈశ్వరుడు కూడా తన నిత్య పూర్ణానంద స్వభావమును త్యజించి బుద్ధి మొదలైనవాటితో కూడినవాడై ‘జీవత్వము' అనబడుదానిని ఆశ్రయించి జీవుడు పరిణమించుచున్నాడు.

నిర్మల నిర్విషయమగు ఈశ్వరతత్త్వమునందు మొట్టమొదటగా జనించే 'భోక్తృత్వ - భోగ్యములు’ అనే మహా ప్రారంభ కెరటాన్నీ "హిరణ్యగర్భాత్మకం” లేక “సమష్టి సృష్టి సంకల్పం” అని పిలుస్తూ ఉంటారు. హిరణ్యగర్భాత్మకమగు స్పందముచే జనించే ఈ 1.భోక్తృత్వము, 2.భోగ్యము ... అనే చమత్కారమైన ద్వంద్వములు ప్రతి సృష్టిలోను ఏ కారణము లేకయే స్ఫురిస్తున్నాయి.

ఈ జీవులంతా ప్రప్రథమంగా ఈశ్వరునినుండే వస్తున్నారు. ఆ తరువాత ఈ జీవులంతా వారి వారిచే మరల మరల కావించబడే కర్మల తరువాత అనేక శుభ-అశుభములగు జన్మ - జన్మాంతరములను అనుభవించుచున్నారు.

సమస్త జీవులు మొట్టమొదటగా నిష్కారణంగానే పరమపదము నుండియే బయల్వెడలు చున్నారు. అందుచేత, ఇక్కడి జీవుల జన్మ-కర్మలకు సంబంధించిన కార్య - కారణ భవము కూడా ఈ విధంగా నిష్కారణమే అగుచున్నది. ఏది ఏమైతేనేం? తరువాత తరువాత మాత్రం స్వస్వరూపమును ఏమఱచిన ఈ జీవులు నిర్వర్తించే కర్మలే వారి సుఖదుఃఖములకు కారణములగుచున్నాయి.

మరి కర్మలకు కారణమేమిటి? దేహాత్మ జ్ఞానముచే (నేను దేహ సంబంధితుడను అను అనుభవముచే) ఉత్పన్నమగుచున్న సంకల్పమే కర్మలకు కారణమగుచున్నది.

సంకల్పిత్వం హి బంధస్యకారణం, తత్పరిత్యజమ్ | మోక్షస్తు, నిః సంకల్పిత్వం తదభ్యాసపరో భవ ॥

ఓ రామచంద్రా! సంకల్పములతో కూడి ఉండుటయే బంధమునకు కారణము, సంకల్పములు లేక ఉండుటయే మోక్షం. అందుచేత నీవు 'సంకల్పము లేక ఉండటం' అనే అభ్యాసము నందు తత్పరుడవై ఉండు. సంకల్ప దశలను నిరంతరం మెల్లమెల్లగా త్యజిస్తూ ఉండు.

Page:503

నీవు వ్యవహారరీత్యా అవశ్యం గ్రహించు విషయములను భావించవద్దు. అనగా భావాతీతుడవై నిర్వర్తించవలసిన దానిని యథారీతి నిర్వర్తించు. అంతేగాని గ్రాహ్య భావకుడవు (భావములను గ్రహించువాడివి) కావద్దు. అట్లాగే గ్రాహ్య భావకుడవు (భావించువానిని భావించువాడివి) కూడా కావద్దు. ఈ ఇంద్రియ సమూహములు ఆయా పదార్థములందు (లేక), విషయములందు కలిగియుండే “రాగము" వలననే ఈ జీవుడు బంధింపబడుచున్నాడు. రాగరహితుడై ఉన్నప్పుడు ఈతడు ముక్తుడే అగుచున్నాడు.

కించిత్ యత్ రోచతే తుభ్యం తద్భద్ధోసి భవస్థితౌ |

న కించిత్ రోచతే చిత్తే, తన్ముక్తోసి భవస్థితౌ

ఓ రామా! ఏ వస్తువైనా నీకు రుచించుచున్నదా, అద్దానియందు రాగము ఏర్పడినప్పుడు ఏర్పడే స్థితిని 'సంసారము' అంటున్నాం. రాగము చేతనే జీవుడు సంసార స్థితియందు బద్ధుడగు చున్నాడు. చిత్తము నందు ఏ వస్తువు రుచించకపోతే ... ఇక అట్టి సంసారస్థితిలో ఉన్నప్పటికీ నీవు ముక్తుడవే అవుతావు. అందుచేత ఒక తృణము మొదలుకొని బ్రహ్మదేవుని శరీరము వరకు స్థావర జంగమమగు సమస్త పదార్థ సమూహమునందు నీకు కొంచెము కూడా రుచి ఏర్పడకుండుగాక! యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి, దదాసి యత్ |

న కర్తాసి, న భోక్తాసి తత్రముక్తమతిః, శమీ |

నీవు ఏది చేస్తున్నా, ఏది తింటున్నా, ఏది హోమ దానాలు చేస్తున్నా 'ఆయా క్రియలన్నిటికీ నేను కర్తను కాదు. భోక్తను కాదు'... అను భావనతో అభిమానరహితుడవై, ఆత్మనిష్ఠుడవై ఉండు.

సన్తో అతీతం న శోచన్తి భవిష్యత్ చింతయంతి నో I

వర్తమానం చ గృష్ణాన్తి కర్మ ప్రాప్తమఖండితమ్ II

జ్ఞానులగు మహాత్ములు గడిచిపోయిన దాని గురించి శోకించరు. గడపవలసియున్న భవిష్యత్తు గూర్చి చింతించరు. ప్రారబ్ధకర్మల ననుసరించి సంప్రాప్తిస్తున్న వర్తమానమును మాత్రం అఖండ స్వభావము కలిగి ఉంటూనే నిర్వర్తిస్తూ ఉంటారు. అంగీకరిస్తూ ఉంటారు. ఆస్వాదిస్తూ ఉంటారు.

ఈ 'తృష్ణ, మోహము, మదము'... మొదలైన వికారాలన్నీ మనస్సులోనే కాపురముంటున్నాయి. కాబట్టి విజ్ఞుడైనవారు మనస్సుతోనే మనస్సులో అంతర్గతమైన వికారాలన్నీ ఛేదించివేయాలి. ముల్లును ముల్లుతోనే తీస్తాం. ఇనుముతోనే ఇనుమును ఛేదిస్తాం కదా! మనస్సులోని భ్రమ నశించటానికి నిర్మల మనస్సే ఉపకరణం. యుక్తమగు మనస్సుతో - అయుక్తమగు మనస్సును జయించు. మురికిని క్షారం మొదలైన మురికి వస్తువులతోనే తోమి, అప్పుడు, ఆ పాత్రను నిర్మల జలంతో పరిశుభ్రపరుస్తారు కదా! విషమును విషంతోనే నివారిస్తారు. అట్లాగే మనస్సును మనస్సుతోనే నిరోధించాలి.

జీవుని రూపం ఈ బాహ్యమైన కాళ్ళు, చేతులు, ముఖం మాత్రమే కాదు. ప్రతి ఒక్క జీవునికి మొత్తం మూడు రూపాలున్నాయి.

Page:504

1. స్థూలరూపం : ఇది కాళ్ళు - చేతులతో కనబడే పాంచభౌతిక సమన్వయం. ఇది జీవుని భోగములకు ఉపకరించే ఉపకరణం. ఇది మాత్రమే కళ్ళకు కనబడుతోంది.

2. సూక్ష్మరూపం : దీనిని 'అతివాహికం' 'చిత్తము' అని కూడా పిలుస్తున్నాం. దేనియొక్క స్వసంకల్పానుసారంగా ఈ ప్రపంచములన్నీ కలుగుచున్నాయో అద్దానికే 'అతివాహికం' అనే పేరుపెట్టారు. జీవుని గుణములు - స్వభావములు ఆశలు భావాభావములు మానావమానములు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నది ఈ అతివాహికంలోనే! దీనిని భౌతికమైన కళ్ళతో చూడలేం కనుక 'సూక్ష్మం' అంటారు.

3. పరరూపం : : ఈ మూడవ రూపం స్థూల - సూక్ష్మముల కంటే విభిన్నమైనది. జీవునియొక్క ఈ రూపం విశ్వమంతా వ్యాపించి ఉండటం చేత దీనిని 'విశ్వరూపం' అని కూడా అంటారు. ఇది ఆద్యంతరహితమైనది. సత్యమైనది. చిన్మాత్రమైనది, నిర్వికల్పమైనది. (ఇందులో వికల్పములనేవే ఉండవు. ప్రపంచమునకు 'సత్త' ప్రసాదించేది ఈ పరరూపమే.

ఓ రామచంద్రా! ఇప్పుడు నీవేం చేయాలి? మొదటి రెండు రూపములైన స్థూల - సూక్ష్మములను వదలిపెట్టి మూడవదైన 'పరరూపము' లేక 'చిత్పదము'ను ఆశ్రయించాలి. ఎన్ని రోజులుగా ఎన్ని చమత్కార వాక్యాలతో తత్త్వవిచారణ చేసినా ...దీని సారమంతా ఒక్క విషయమే. అదేమిటంటే... స్థూల - సూక్ష్మములందు ఆత్మబుద్ధిని విరమింపజేసి, చిత్ పదము (లేక) తురీయపదమును (లేక) పరరూపమును ఆశ్రయించి ఉండటం.

ఈ ఒక్క విషయం ఆరూఢపరచుకొంటే చాలు, ఇక మరింకేమీ అక్కర్లేదు. మనం చెప్పుకున్న మిగతాదంతా కూడా అట్టి ఆరూఢత యొక్క యుక్తియుక్తత గురించే సుమా!

తురీయం - నిర్వచనం :

శ్రీరాముడు : హే మునీశ్వరా! మీరు చెప్పే 'తురీయ పదమునందు, (పరదేహం నందు) మాత్రమే ఆత్మబుద్ధి కలిగి ఉండటం'... అత్యంత ముఖ్యమైన పాఠ్యసారం కదా! జాగ్రత్-స్వప్న సుషుప్తులనే మూడిటికి పరమితమౌతున్న ఈ జీవునకు ఆ మూడిటికి అలక్షితమైన 'పరదేహానుభవం, చేతికందటమే లేదు. అందుచేత తురీయరూపమైనట్టి ఆ పరదేహానుభవ నిశ్చలత గురించి చెప్పమని నా ప్రార్థన. శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఏదైతే 'అహమ్-అనహమ్, సత్-అసత్'లకు అతీతమై, దేనియందూ ఏమాత్రం సక్తముకాక, స్వచ్ఛమై-సమరూపమై ఉంటోందో అద్దానినే 'శుద్ధచైతన్యము’ అని ‘తుర్యము’ అని, 'పరదేహము’ అని అంటున్నాం. ఇదియే జీవన్ముక్తుల వ్యవహారమందలి సాక్ష్యావస్థ. ఈ పర దేహావస్థలో సంకల్పములు సంభవించవు. కాబట్టి... ఇది జాగ్రత్తు కాదు. స్నప్నం కాదు. ఇందులో జడత్వం ఉండదు కనుక ఇది 'సుషుప్తి కూడా కాదు. అందుకే దీనికి 'అవస్థాత్రయసాక్షి' అని కూడా పేరు ఉన్నది. ఈ జగతిస్థితి ఏ జ్ఞానిలో సంపూర్తిగా విలీనమైపోతుందో, అట్టి 'అప్పటికీ శేషించి ఉండే’ స్థితియే ఆ తురీయం. జ్ఞానులకు ఆ తురీయ స్థితి అత్యంత సుస్థిరమై అనుభవమగుచుండగా, అజ్ఞానులకు ఈ క్షణికమాత్ర జగత్తు స్థిరముగా అనుభవమవటమే జ్ఞానాజ్ఞానుల దృష్టి భేదం.

Page:505

అహంకారం త్యజించబడుచుండగా ... సమత్వము ఉత్పన్నమగుచుండగా ... చిత్తము ప్రశమనము పొందుచుండగా ...ఆ తురీయావస్థ'చేకూరుతూ ఉంటుంది.

నీవు ప్రబుద్ధుడవై, మరింత అధిక బోధను పొందాలనే ఉద్దేశంతో ఈ సందర్భంలో ఒక చిన్న దృష్టాంతం చెబుతాను విను.

888

ఒకానొక అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశంలో ఒక ముని చిన్న ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఆయన ఆశ్రమం యొక్క ఆవరణలో గల రావిచెట్టు క్రింద ఆసనం వేసుకుని మహామౌనము అనుభవిస్తున్నారు. ఒక బోయవాడు బాణములు ధరించి పరుగు పరుగున అక్కడి త్రోవలో వస్తూ మునిని చూచి ఆగాడు.

అయ్యా! మునీశ్వరా! నేను ఒక లేడిని బాణంతో కొట్టాను. ఆ లేడి గాయపడి పరుగు లంకించుకుని ఇటువైపే వచ్చింది. అది ఎటువైపు వెళ్ళిందో చెప్పగలరా? అని అడిగాడు.

దానికి ఆయన సమాధానం విను.

మునీశ్వరుడు: నాయనా ! మేము వనవాసులగు మునులం కదా! అందుచేత సమశీలురమై ఉంటాం. లోక వ్యవహారాలు తెలుసుకోవాలంటే అహంకారం ఉండాలి. వ్యవహారములకు సమర్థమైన అహం కారం నాయందు లేదు. అహంకారాదులన్నీ ఎందులో ఉన్నాయో అద్దానిని ఆశ్రయించి నేను ఉన్నాను. బోయవాడు : అయ్యా! నేనడిగింది గాయపడిన లేడి గురించి. మీరేదో 'అహంకారం అదీ ... ఇదీ' అంటారేం? మీరు లేడిని చూచారా? అది చెప్పండి. చూడలేదా... చూడలేదని చెప్పండి. మునీశ్వరుడు: మిత్రమా! నేను చెప్పేది కూడా నీవు అడిగినదానిగురించేనయ్యా! ఈ కళ్ళు - కాళ్ళు మొదలైన ఇంద్రియాలు స్వయంగా పనిచేస్తాయా చెప్పు? లేదు కదా! ఈ కళ్ళను పనిచేయించేదేమిటి! బోయవాడు : ...?

మునీశ్వరుడు: చెప్పవయ్యా మరి? మనస్సు కదా!

బోయవాడు : మనస్సా? అది సరేలెండి

...

మునీశ్వరుడు: అవునా? అటువంటి అహంకారమయమగు నా మనస్సు ఎల్లప్పుడు నిజంగా ప్రశమించి ఉంటోందయ్యా! మనస్సుకు అతీతమైనదానిని ఆశ్రయించి ఉన్న నాకు, మనస్సుకు మాత్రమే విషయమైనది ఎట్లా అగుపిస్తుంది చెప్పు?

బోయవాడు : అది సరే అయ్యగారూ ! నా లేడి ...?

మునీశ్వరుడు: ఎప్పుడైతే మనస్సు శమిస్తోందో, ఇక నాకు జాగ్రత్గాని, స్వప్నంగాని, నిద్రావస్థగాని తెలియటమే లేదు. ప్రియమిత్రమా! ఏ మహత్తర తత్త్వమైతే జాగ్రత్లోంచి స్వప్నంలోకి, స్వప్నంలోంచి సుషుప్తిలోకి, సుషుప్తిలోంచి మరల జాగ్రత్లోకి పయనిస్తూ ఉంటుందో, అట్టి అప్రమేయమైన దాని గురించి ఇప్పుడు నేను మననం చేస్తున్నానయ్యా!

Page:506

ఎద్దానిలో అయితే 'దృశ్యము' అనబడే దానికి స్థానమే లేదో ... అట్టి 'తురీయావస్థ' యందు నేను నెలకొని ఉన్నాను. ఇక నీ లేడి గురించి ఏం చెప్పమంటావ్? అట్టి నా మననమునకు ఈవలగాని, ఆవలగాని మరింకేదీ నాకు అగుపడడమే లేదు.

బోయవాడు : అయ్యగారూ! మీరు ఏదేదో చెప్పి బుఱ్ఱతినకండి. ఇంతకీ గాయపడిన లేడి ఎటు పోయిందో తెలుసునో, తెలియదో చెప్పవచ్చుగదండీ? అది చెప్పడేమిటిరా బాబు!

ఇట్లా పలికి ఆ బోయవాడు 'ఈయనకేం తెలియదు, ఏదో మాట్లాడుతాడు. భలేవాడు దొరి కాడురా నాయనా!' అనుకుంటూ లేడిని వెతకటానికి ఎటో బయలుదేరాడు. ఇక ఆ ముని పాపం

తన నిత్యసాక్షిత్వం వదలి ఈ జీవుడు ఇంద్రియముల వెంట, లేళ్ళ వెంట పరుగులు తీస్తున్నాడు. కదా! ఇతనికి ఈతని గురించే తెలియదాయె! అని అనుకుంటూ తన మహామౌనాన్ని కొనసాగించాడు.

చూచావా రామా! "తురీయదశయందు మరింకొక అవస్థ ఏదీ ఉండదు'... అని చెప్పటానికే ఇక్కడ ఈ దృష్టాంతాన్ని చెప్పాను. పరదేహాన్ని ఆశ్రయించిన వాడు ద్రష్టత్వము కంటే ముందుగానే ఏర్పడి ఉంటాడు కనుక ఆతడు జాగ్రత్ష్ట కాడు. స్వప్నద్రష్ట కాడు, సుషుప్త ద్రష్టకాడు. ఈ మూడు తురీయానికి ఈవల ఉన్నవానికే విశేషాలుగాని జ్ఞానముచే ఆవల ఉన్నవానికి అవి విశేషమే కాదు.

వికల్పరహితమగు శుద్ధ చైతన్యమే తురీయం. వాస్తవానికి ఇక్కడ ఆ శుద్ధ-బుద్ధ చైతన్యమే ఉన్నది గాని, తదితరమైనదేదీ లేదు, ఉండజాలదు కూడా. ఇక ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులంటావా? ఇవి చిత్తం యొక్క మూడు రూపాలు మాత్రమే. అందుచేత చిత్తం వలే అవి కూడా మిథ్య మాత్రమే. ఈ చిత్తము మూడు రూపములలో స్థితి కలిగి ఉంటోందిఘోరము (జాగ్రన్మయం); శాంతము (స్వప్నమయం); మూఢము (సుషుప్తిమయం)... ఈ మూడు రూపములు లేనిదానిని 'మృతచిత్తం' అంటూ ఉంటారు.

అట్టి 'మృత చిత్తము'నందు ఏకమై, సమమైనట్టి 'సత్వము' నెలకొని ఉంటుంది. యోగులు దానిని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుంటున్నారు. ఓ రామచంద్రా! సమస్త సంకల్పములు రహితమగుచున్న 'తురీయపదము'నందు నిరామయమగు ఆత్మస్వరూపుడవై నీవు స్థితిని కలిగి ఉండెదవుగాక! సాధువులగు మహనీయులంతా అట్టి నిర్విషయ చిదానంద స్వస్వరూపమును దర్శిస్తూ తదితరమైనదంతా 'అతీతత్వము' అను యుక్తిచే త్యజించి ఉంటున్నారు.

9. తురీయమునకు ఉపాయం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ఆధ్యాత్మ శాస్త్రము యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమై ఉన్నది?"... అని మనం పరిశీలిస్తే, ఈ సమస్త దృశ్య వ్యవహారము లేదు' అని నిరూపించటమే అయి ఉన్నది. ఇక్కడ అవిద్య లేదు, మాయ లేదు. మాయ - అనగా యా మా...“ఏది లేదో ... అని శబ్దార్థమే

Page:507

కదా! ఇక్కడ వాక్కు మొదలైన వాటికి అగోచరమైనట్టి శాంతమగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఆ బ్రహ్మము పూర్ణమై, చిదాభాస ప్రతిబింబమునకు బింబరూపమై, స్వచ్ఛమై, సర్వాత్మకమై, సమమై, సమస్త కళలచే పరిపూర్ణమై ఉంటోంది. అట్టి 'బ్రహ్మము' అను పేరుగల వస్తువు గురించి జనులు వారి వారి బుద్ధిని అనుసరించి అనేక రూపములైన సిద్ధాంతములను కల్పించుకొనుచున్నారు. కొందరు ‘అది శూన్యము' అని, మరికొందరు 'విజ్ఞానమాత్రము' అని, ఇంకొందరు 'అది ఈశ్వర రూపము’ అని పరస్పర వాదోపవాదములు చేసుకుంటున్నారు. ఓ రామచంద్రా! నీవు మాత్రం అత్యంత త్వరితగతిని సమస్త వాదములను పరిత్యజించు. దృశ్యమునంతటినీ అంతరంగమునందు త్యజించివేసి ఉండు. మనోవర్జితుడవై ఉండు. శాంతచిత్తుడవై, నిర్వాణయుక్తుడవై, ప్రశాంతమైన బుద్ధిని సంపాదించుకున్న వాడవై మహామౌనివై ఆత్మయందే స్థితి కలిగియుండుము.

ఆత్మన్యేవా స్స్వ శాంతాత్మా, మూక-అంధ-బధిరోపమః,

నిత్యమ్ అంతర్ముఖో భూత్వా స్వాత్మనాన్తః ప్రపూర్ణ ధీః||

ఒక మూగవానిలాగా, గ్రుడ్డివానిని బోలి, చెవిటి వాని చందంగా దృశ్యసంపర్కం లేనివాడవై ఉండు. నిత్యం అంతర్ముఖుడవై, శాంతస్వభావుడవై, పూర్ణబుద్ధితో, ఆత్మలోనే ఎల్లప్పుడూ నెలకొని ఉండు.

జాగ్రత్యేవ సుషుప్తస్తః కురు కర్మాణి రాఘవ

అన్తః సర్వపరిత్యాగీ బహిః కురు యథాం గతం II

ఓ రాఘవా! జాగ్రత్తులో ఉన్నప్పుడు సుషుప్తియందు వలె కర్మలచే అస్పర్శత్వము వహిస్తూనే ఆయా విధ్యుక్తమైన కర్మలను నిర్విర్తించు. అనగా, అంతరంగమున సమస్తము త్యజించియే ఉండు. బాహ్యమున మాత్రం యథాప్రాప్తములైన కర్మలను ఆచరించు.

చిత్తము యొక్క ఉనికియే పరమ దుఃఖం. చిత్తము లేకపోవటమే పరమసుఖం. ఉన్న విషయం ఇది. కాబట్టి చిదేకాత్మ స్వరూపుడవై, ప్రియ - అప్రియములను ఏమాత్రం చింతించక క్రమక్రమంగా చిత్తమును క్షయింపజేస్తూ ఉండు.

దృష్ట్వా రమ్యమ్, అరమ్యంవా స్టేయం పాషాణవత్ సమమ్, ఏతావతాత్మయత్నేన జితా భవతి సంసృతిః ॥

ఒక చిన్న ఉపాయం విను. ఈ ప్రపంచంలోని కొన్ని వస్తువులు రమ్యంగా ఉంటాయి. మరికొన్ని అరమ్యంగా అనిపిస్తూ ఉంటాయి. అట్టి రమ్య - - అరమ్య వస్తువులను చూస్తున్నప్పుడు నీవు ఏతత్-పూర్వమువలె సమముగా ఉండటం అభ్యాసం చేయి. ఇంత మాత్రమైన నీ స్వప్రయత్నం తోనే ఈ సంసారం జయించివేయబడగలదు.

నవేదనీయం, న సుఖం, నా సుఖం, న చ మధ్యమం, ఏతావత్ ఆత్మయత్నేన దుఃఖాంతో అనన్త ఆప్య తే॥

సుఖ దుఃఖములను గురించి గాని, వాటికి సంబంధించిన సాధనల గురించి గాని కొంచెం

కూడా చింతించకూడదు. ఎవరికి వారే ఇంత మాత్రపు స్వప్రయాత్నానికి ఉపక్రమిస్తే చాలు,

Page:508

అనంతానందము సంప్రాప్తించగలదు. జ్ఞాని ఈ ముల్లోకాలలోని సమస్త పదార్థముల సారాసారం లేమిటో గ్రహించి ఉంటున్నాడు. సర్వత్రా ప్రకాశముచే శోభాయమానమైన 'నిరతిశయ బ్రహ్మానంద అమృతము’చే పరిపూర్ణుడగుచున్నాడు. బుద్ధియందు పరిపుష్ఠుడై, 'జీవన్ముక్తి' అనే సుఖమును పొంది ఉంటున్నాడు. అతను బాహ్యమున సమస్తమైన కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అభ్యంతరమున మాత్రం ఏమీ చేయనివాడే అగుచున్నాడు.

10. భూమికా ప్రవేశం

శ్రీరాముడు : స్వామీ! మీరు సప్త భూమికల గురించి, వాటి అభ్యాసకుల గురించి రెండు మూడు చోట్ల అనేక విషయాలు చెప్పారు. అయితే ఈ నిర్వాణ ప్రకరణము పూర్వార్థము చివరికొస్తున్న సమయంలో సప్తభూమికాసాధనల గురించి మరొక్కసారి సవివరంగా చెప్పుకోవటం ఉచితమని నా అభిప్రాయం. సప్తభూమికాభ్యాసం ఎట్లా గావించబడుతోంది? ఆయా భూమికలందున్న యోగులు ఎట్టి చిహ్నములు కలిగి ఉంటారు? దయతో మీరుకూడా సందర్భోచితమనే అనుకుంటే, చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి : యోగుల తాత్త్వికోన్నతిని విశదపరచే శాస్త్రప్రవచితమైన సప్తభూమికల గురించి, అంతిమ సాక్షాత్కారమైనట్టి భావాతీతత్వము గురించి ఇక్కడ పురశ్చరణ పూర్వకంగా చెప్పుకోవటం సముచితమే అవుతుంది. కనుక సప్త భూమికల గురించి మరికొన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం.

వేద వ్యతిరిక్త మార్గాలు అనుసరించేవారు తమ మూఢత్వమునకు తామే కారణమగుచు ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఉపాధి నుండి మరొక ఉపాధికి అంతులేకుండా ప్రయాణిస్తున్నారు. పుట్టటం - పెరగట చావటం మరల మరొక ఉపాధిని ఆశ్రయించటం (మరల పుట్టటం)

ఇట్లా చర్విత చరణంగా జరిగిపోతోంది. వారికి ఇంద్రియానుభవముల నుండి ధ్యాస మరలటం లేదు. కాల ప్రవాహంలో పడి వాళ్ళు స్థావర జంగమ దేహములను నమ్ముకుని ఉంటూ తమ దుః ఖములకు కారణమేమిటో ఆరా తీయటం లేదు. వారికి ఎవరేం చెప్పగలరు?

వేద అనుకూల మార్గానుయాయుల విషయానికి వద్దాం. వీరిని రెండు విధాల విభజించవచ్చు.

1. ప్రవృత్తిమార్గం : “భోగములను సంపాదించి అనుభవించటమే ఉత్తమంగాని, వీటిని వదలి ఉండటమనేది అర్థరహితం. కనుక ఉత్తమ లోకాలు పొందాలి. అక్కడి సౌఖ్యములను పొందాలి...” అని అందుకు సాధనగా వేద ప్రవచిత మార్గాలలో ఉపక్రమించే వారే ఈ ప్రవృత్తిమార్గ బాటసారులు. విషయ రహితమగు నిర్వాణం ఎవడికి కావాలి? భోగముల చేతనే నాకు శాంతి అని తలచి వేద విహితములైన యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తించే వారు ఈ కోవకు చెందుతారు. తాబేలు తన అవయవములను బయటకు రానివ్వటం, ఇంతలోనే ఏదైనా ఎదురు రాగానే లోపలికి తీసుకోవటం చేస్తుంది చూచావా? ఈ జీవుని మనస్సు కూడా ఒక దేహంలో ప్రవేశించటం, ఇంతలోనే మృత్యువు

Page:509

ముఖంలో ప్రవేశించటం - ఇట్లా జన్మ - మృత్యువుల ప్రయాణాలు కొనసాగిస్తున్నది. వాస్తవమైన వివేకం ఉదయించనంత కాలం ఇది ఇట్లాగే చర్వితచరణంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో శ్రమతో బాటు పునరావృత్తి తప్పదు. అనేకసార్లు బలవంతంగా మృత్యుముఖమున ప్రవేశించి ఈ జీవుడు ఎప్పుడో 'ఈ అవివేకమంతా ఏమిటి?' అనే ప్రశ్నకు వస్తున్నాడు. "ఈ దేహమేమిటి? ఈ దేహ సంబంధమేమిటి? మరల మరల ఈ దుఃఖాలు ఎందుకొస్తున్నాయి? ఈ సంసారం యొక్క వ్యవస్థ అంతా అపారమైనది కదా! దీని వలన నాకు కలిగే ప్రయోజనం కొంచెమైనా కనబడటం లేదే? అనుచితమైన పరిణామాలు గల కర్మ వ్యవహారాలచే నేను రోజులు ఎందుకు గడుపుతున్నాను? ఇంతకీ నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? నా వాస్తవ స్వరూపం ఏమిటి?...అనే యోచన ఆతనికి వస్తోంది. 'అసలు నాకు నిజమైన విశ్రాంతి లభించే దెక్కడ?' ...అనే ప్రశ్నకు వస్తున్నాడు. ఇటువంటి ప్రశ్నలు ప్రారంభమవగానే ప్రవృత్తి తిరోగమించటం ప్రారంభించి, అతని స్వభావం నివృత్తి వైపుగా వెనుకకు మరలుతోంది.

2. నివృత్తి మార్గం : ఎప్పుడైతే ఈ జీవుడు సద్బుద్ధితో కూడుకున్నవాడై 'వైరాగ్యవంతుడనై నేను ఈ అపార సంసార సాగరమునుండి తరించేది ఎట్లా?"... అను విచారణ యందు తత్పరుడగుచున్నాడో ఇక ఇక్కడి నుండి సప్తభూమికా ప్రవేశం చేస్తున్నాడు.

జాగ్రత్ భూమికలు - ఆతనికి భోగములందు, వాటికి సంబంధించిన సాధనములందు చింతన క్రమక్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అనగా ఆతనిలో వైరాగ్యం (రాగరాహిత్యం) ఉదయించి, దిన దిన ప్రవర్ధమానమౌతూ ఉంటుంది. ఇక చిత్తశుద్ధికి కారణం కాగల జపం - ఈశ్వరారాధన మొదలైన క్రియలందు తత్పరుడౌతూ ఉంటాడు. అనుదినం తృష్ణను క్షయించుచుండగా ఆతనికి ప్రసన్నత అభ్యాసమౌతూ ఉంటుంది. ధనం-ప్రతిష్ఠ మొదలైన జడ క్రియలందు అరుచి పెంపొందు చుండగా అతని యందు 'ఇతరుల దోషముల గురించి ఊరకే సంభాషించటం' ఇటువంటి నిరర్థక కాలయాపనలు ఉపశమిస్తూ ఉంటాయి 'పుణ్యకార్యములు నిర్వర్తించాలి' అనే ఉత్సాహం పెల్లుబుకుతూ ఉంటుంది. ఇక ఇతరులకు గాని, తనకు గాని మనస్సునకు కష్టం కలిగించే ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉంటాడు. పాపము పట్ల భయము కలిగి ఉంటాడు. భోగములను వాంఛించడు. స్నేహ, ప్రీతి, కోమల, ఉచిత, దేశకాల యోగ్యములైన మాటలను, భావములను, ప్రవర్తనను అలవరచుకుంటాడు.

ఇట్టి మార్గమును ఆశ్రయిస్తున్నవాడు 'శుభేచ్ఛ' అనే మొట్టమొదటి భూమికలో ప్రవేశించిన వాడగుచున్నాడు. ఈ భూమికలో కొనసాగుచున్న ఆ జీవుడు మనోవాక్కాయ కర్మలచే పవిత్రతను ఆశ్రయించడం, సజ్జనులను సేవించడం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడినుండో జ్ఞాన వర్ధకములైన పుస్తకముల (శాస్త్రములను), వాక్యములను తీసుకువచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆతడు క్రమంగా 'విచారణ' అనే రెండవ భూమికలో ప్రవేశిస్తాడు.

విచారణ’ భూమికలో ప్రవేశించేవాడే ఉన్నతికి అర్హుడని, విచారణ లేనంతకాలం ఈ జీవుడు భ్రమార్థ సాధకునిగానే మ్రగ్గుతూ ఉంటాడని గ్రహించు. విచారణ అనబడే రెండవ భూమికలో

Page:510

ధ్యానకర్మానుష్ఠానులగు మహనీయులను సంప్రదిస్తూ వివేకమును పరిపుష్టం చేసుకుంటూ ఉంటాడు. స్వయంగా శబ్దశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము పఠనం చేస్తూ ఆ ప్రయత్నముచే లోక ప్రసిద్ధములైన వేదాంత శాస్త్రముల పరిశీలనచేస్తూ, పద - పదార్థముల విభాగం ఎరుగుతూ ఉంటాడు. గురుముఖతః శ్రవణం చేస్తూ అర్థసారాన్ని మననం చేస్తూ ఉంటాడు. ఇంటి యజమాని ఒక రోజు కుంచె చీపురును తీసుకొని తలకు గుడ్డ కట్టుకుని ఋజు ఊడ్వటం, ఇంటిని పరిశుభ్రం చేయడం ప్రారంభించినట్లు ఆ సాధకుడు మనస్సులో గల అకార్యములను గుర్తించి విడిచిపెట్టుచూ, సకార్యములను ఆశ్రయించే సప్రయత్నంలో ఉంటాడు. లోకమర్యాదను అనుసరించి బాహ్యానికి అభిమానము మొదలైనవాటిని కొంచెం ఆశ్రయించినప్పటికీ, ఆతను పాము తన కుబుసమును విడచునట్లు క్రమంగా మదము, అభిమానము, మాత్సర్యము, లోభము, మోహము, మొదలైన వాటిని త్యజించివేస్తూ ఉంటాడు. ఆతనియందు శాస్త్ర-సజ్జన సేవ పెంపొందుచుండగా ... క్రమంగా శాస్త్రముల రహస్యమును యథార్థంగా, సంపూర్ణంగా ఎఱుగుతూ ఉంటాడు.

ఆ విధంగా ఆ సాధకుడు తన సాధన కొనసాగిస్తూ ప్రియుడు తన ప్రియురాలి ప్రక్కకు చేరునట్లు, అసంగము అని పిలువబడే మూడవ భూమికలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ జీవుడు [అహం బ్రహ్మాస్మి (నేను బ్రహ్మమునే అయి ఉన్నాను), తత్త్వమసి (నా ఎదురుగా భౌతికంగా కనిపించే నీవు స్వయంగా బ్రహ్మమే అయివున్నావు), నే హనానాస్తి కించన (ఇక్కడ నానాత్వమనేది కించిత్తు కూడా లేదు), ఏకోసత్, విప్రా బహుధా వదంతి (సత్ వస్తువగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఇక బుద్ధి, మనస్సు, దేహం, దృశ్యం అనునవన్నీ కల్పితమాత్రాలే)...] ఇటువంటి వేదాంత వాక్యములకు ఉన్న అర్థమేమిటో గ్రహిస్తూ ఉంటాడు. బుద్ధి నిశ్చలం అవుతూ ఉంటుంది. హృదయాన్ని క్రమంగా తీర్చిదిద్దుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మిక శాస్త్రాధ్యయనాల ద్వారా సంసారాన్ని మనోవాక్కులచే దూరం చేసివేస్తూ ఉంటాడు. వైరాగ్య సాధన క్రమాలను అవలంబించడం ద్వారా జీవితమును ఉత్తేజమయం గాను, విస్తారం గాను చేసివేసుకుంటూ ఉంటాడు.

ఈ విధంగా సచ్ఛాస్త్రముల అభ్యాసం చేతను, పుణ్య కార్యములను ఆచరించటం చేతను జీవునికి ఆత్మదృష్టి ప్రసన్నమౌతూ ఉంటుంది. ఈ మూడవ భూమికను సంపాదించుకున్న బుద్ధిమంతుడు రెండు విధములైన అసంగములను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ రెండు విధములైన అసంగముల గురించి, వాటి భేదం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను. విను.

1. సామాన్యాసంగం

నా హం కర్తా, న భోక్తాచ, న బాధ్యో, న చ బాధకః ఇత్యసంజనమర్ధేషు సామాన్యాసంగనామకమ్ ॥

“నేను దేనికీ కర్తను కాదు. భోక్తను కాదు. బాధ్యుడను కాదు. బాధకుడను కాను” ... ఇటువంటి నిశ్చయంతో పదార్థములందు సంసక్తం కాకపోవటాన్ని 'సామాన్యాసంగం' అని అంటారు.

Page:511

‘అంతా కూడా పూర్వకర్మ నిర్మితమయి ఉన్నది. లేక, ఈశ్వరాధీనమై ఉన్నది. కనుక సుఖంలో గాని, దుఃఖంలో గాని నాకు ఏమాత్రం కర్తృత్వం లేదు. ఈ భోగాలను చూచి నేను మురియవలసిన పని లేదు. వాస్తవానికి భోగాలలో తగుల్కొనటమే మహారోగం. సంపదలన్నీ ఆపదామయాలే కదా! సంయోగాలన్నీ వియోగం కొరకే అయి ఉన్నాయి. మనస్సులో ఏ ఏ చింతలు కలుగుచున్నాయో, అవన్నీ కూడా బుద్ధి యొక్క వ్యాధి రూపాలు మాత్రమే. కాలం ఎల్లప్పుడు సమస్త పదార్థములన్నిటినీ మ్రింగివేయటానికి సంసిద్ధమై వేచి ఉంది కదా! ఇక నాకు దేని గురించి ఆశ? దేని గురించి దిగులు?'

ఇట్టి వాక్యార్థములందు ఆతని మనస్సు లగ్నమై ఉంటుంది. అనాసక్తి యొక్క బలంచేత ఆతనియందు పదార్థములు అభావం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. దీనికే శాస్త్రకారులు సామాన్యాసంగం’ అనే పేరు పెట్టారు.

2. శ్రేష్ఠాసంగం - క్రమంగా కొంతకాలానికి సామాన్యాసంగం శ్రేష్టాసంగంగా రూపుదిద్దు కుంటోంది. మహాత్ముల సాంగత్యం చేతను; దుష్టమైన అల్పమైన - - సంకుచితమైన అభిప్రాయాదులు కలవారితో స్నేహ సంబంధములు తగ్గించుకొనటం చేతను; శ్రవణము, మననము మొదలైన వాటి అభ్యాస కౌశలం చేతను నిరంతరమైన అభ్యాసంతో కూడిన పురుష ప్రయత్నము చేతను... శ్రేష్ఠాసంగం అలవడుతోంది.

అట్టివారికి క్రమంగా, 'సంసారసముద్రము యొక్క ఆవలి ఒడ్డు - సమస్తమునకు సారము - కారణములకెల్ల కారణం' అయినట్టి ఆత్మవస్తువు అరచేతిలో ఉసిరికాయలాగా ప్రత్యక్షమౌతోంది. ఇట్టివాడు 'నేను కర్తను కాదు, ఈశ్వరుడే అన్నిటికీ కర్త'... ఇట్టి శబ్దార్థ భావన కూడా త్యజిస్తున్నాడు. 'పూర్వకర్మ లేదు. వర్తమాన కర్మ కూడా లేదు' అని గ్రహిస్తూ క్రమంగా ఇటువంటి మాటలను కూడా అధిగమిస్తున్నాడు. శాంతం, మౌనం వహిస్తున్నాడు. అట్టి స్థితి 'శ్రేష్టాసంగం' అని చెప్పబడుతోంది. ఆతనికి పూర్వ-వర్తమాన భవిష్యత్ జన్మలు వేరువేరు కథాపుస్తకములను ఉబుసుపోకగా చదవటం

వంటిదౌతూ ఉంటుంది.

ఏది లోన-వెలుపల, పైన-క్రింద, దిక్కులందు-ఆకాశమునందు, పదార్థమందు అపదార్థ మందు, జడమునందు-చిదాభాసునియందు ...స్థితి కలిగి ఉండదో; ...ఏది 'స్వప్రకాశ చిత్' రూపమై పరమశాంతమై, వేరొక ప్రకాశకమైనదేదీ లేనిదై పదార్థరహిత ఆకాశం వంటిదై, జన్మ గాని-ఆదిగాని-అంతముగాని లేనిదై, ఏర్పడి ఉంటోందో ...అదే శ్రేష్ఠసంగం అంటే !

ఎక్కడైతే ... ‘సంతోషం’ అనే సుగంధంతో 'నిష్కామ సత్కార్యాలు' అనే నును రెక్కలతో, 'చిత్తం' అనే తూడు యొక్క చివర సంలీనమై ఉన్నదో ...అదే శ్రేష్ఠాసంగపద్మం. ఆ పద్మం చుట్టు విఘ్నరూఎ "కంటకాలు (ముళ్ళు) ఉండుగాక! అయితే ఏం? అంతర్ విచారణ అనే సూర్యుని నుండి కిరణ పుంజములు పొంది ఎప్పుడూ వికసించియే ఉండగలదు.

ఏ హృదయంలో ఈ 'శ్రేష్ఠసంగం' అనే పద్మం వికసించి ఉంటుందో ...ఆ మహనీయుడు అసంసంగము’ అనే మూడవ భూమికలో ప్రవేశించినట్లు చెబుతారు.

Page:512

చూచావా రామా! ఈ జాగ్రత్ భూమికలను మరల సమీక్షిస్తున్నాను ...విను.

మొట్టమొదటిది “శుభేచ్ఛ” కదా. అది ఎట్లా ఏర్పడుతోంది? శుద్ధాంతఃకరణులగు మహాత్ములను ఈ జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి. వారిని సేవించి, సుముఖులను చేసుకొని వారి అభిప్రాయములను, అనుభవములను, ప్రవచనములను సంపాదించాలి. మహానీయులగు ఆత్మజ్ఞులు లౌకిక సంపద కలవారివలె ప్రదర్శితులు కాకపోవచ్చు. వారు అనేకచోట్ల నివురుగప్పిన నిప్పువలె ఉంటారు. వారిని గుర్తించటమెట్లా? ఉత్తముల అభిప్రాయములే అందుకు శరణ్యం. వివేకులగు మహనీయులను ఆ సర్వేశ్వరుడు సాధకజనులపై గల ప్రేమచే సర్వకాలలో ఈ భూమిపై ప్రసాదిస్తూనే ఉంటాడు. అయితే “ఈయన ఆత్మజ్ఞుడు. నిత్యానిత్య వివేకి. ఉత్తమ సమాచార సమన్వితుడు”... అని తెలిసి ఉండి కూడా, అట్టి వారిని ప్రయత్నపూర్వకంగా శరణువేడక ఊరకే తాత్సారం చేసేవారిని ఏమనాలి? అమృత కలశాలను సమీపంలో సిద్ధంగా ఉంచుకొని అల్పమైన తృణములవంటి ఇంద్రియ విషయాలపై ధ్యాసను, శ్రద్ధను చూపేవారిని బ్రహ్మ, విష్ణువులంతటి వారు కూడా కాపాడలేరు. ఓ జనులారా! మీరు శుద్ధాంతఃకరణులు, ఆత్మజ్ఞులు, వివేకులు అగువారి కొరకు వెతకండి. వారిని శరణు వేడండి. "ఆ! ఏముంది? ఎవరిని నమ్మగలం? ఇట్లాగే కానిద్దాం. చూద్దాంలే! ఇప్పుడు లాభం లేదు... ఇటువంటి అల్ప - అశ్రద్ధపూర్వక - నిరుత్సాహ - బద్ధక వాక్యాలకు చోటిచ్చారా... గొప్ప అవకాశములను కోల్పోతున్నందుకు తరువాత విచారించక తప్పదు.

పుణ్యకార్యములచే మనస్సు పవిత్రం కాగా, ఉత్తమ వాక్యముల అర్థము పొందటానికి ఈ జీవునికి అర్హత ఏర్పడుతోంది. సాత్వికమైన గుణ సంపద పెంపొందించుకొనువారికి మహాత్ములు స్వయంగా తమ జ్ఞాన సంపదను అందిస్తూ ఉంటారు. ఈ విధంగా శుద్ధాంతఃకరణులగు మహాత్ముల సాంగత్యము చేతను, అనేక జన్మార్జితములగు పుణ్యముల సంచయముచేతను, కాకతాళీయ యోగం చేతను 'శుభేచ్ఛ' అనే మొట్టమొదటి భూమిక ఉదయిస్తోంది, బలవత్తరమగుచున్నది.

విత్తనం మొలకెత్తగానే రైతు ఏం చేస్తాడు? అది వాడిపోకుండా ముందుగా నీళ్ళు పోస్తాడు. అది ప్రవర్థమానమైయ్యేరీతిగా తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. అట్లాగే ప్రథమభూమిక ఉదయించ గానే ఆ జీవుడు వివేకంచే ప్రయత్నపూర్వకంగా దానిని కాపాడుకోవాలి, పాలించుకోవాలి, పెంపొందించు కోవాలి. సాధనచతుష్టయం (శమం, విచారణ, సత్సంగం, సంతోషం)తో కూడిన వైరాగ్యాది అంశమే శుభేచ్ఛకు అంకురం. అట్టి అంకురాన్ని విచారణను కొనసాగించుటచే అభివృద్ధి పరచుకోవాలి. ప్రతిరోజు రక్షించుకోవాలి. శుభేచ్ఛ అంతఃకరణంలో రూఢిపడిందా, ఇక అట్టి అంతఃకరణం ఇతర భూమికలన్నిటి యొక్క ఉత్పత్తికి స్వయంగా అతిత్వరలో స్థానం కాగలదు. దీని నుండే సాధకుడు సర్వాత్మత్వము వరకు పయనించగలడు.

ఓ రామచంద్రా! ఈ విధంగా "అసంగసంగం వరకు మూడు జాగ్రత్ భూమికల గురించి వర్ణించి చెప్పాను. 3వ భూమికలో స్థితి పొందినవాడు సమస్త సంకల్ప కల్పనలను అతి తేలికగా పారత్రోలగలుగుతాడు.

Page:513

11. జన్మ - జన్మాంతర ప్రయత్నం

శ్రీరాముడు : మహర్షీ! ఇప్పుడు ఈ సందర్భంలో రెండు సందేహాలను మీముందు ఉంచాలని అనుకుంటున్నాను1. ఒక జీవుడు మూఢత్వం తాండవించే పరిసరాలలో జన్మించాడనుకుందాం. భోగరాగాదులలో ప్రవృత్తుడై అధమత్వముతో జీవితం గడుపుచున్నాడనుకోండి. ఆతనికి యోగుల సాంగత్యం లభించకపోతే ఇక ఆతడు ఉద్ధరించబడేది ఎట్లా? ఇక ఆతని గతి అంతేనా? ఆతను మోహరాగాలలో మునిగితేలుతూ అధమ స్థితులకు దిగజారవలసిందేనా? ఆతడు ఎట్లా బాగుపడేది?

2. ఒకడు శుభేచ్ఛ’ అనే మొదటి భూమికలోనో లేక రెండవ భూమికలోనో ప్రవేశించియుండగా ఆయుష్షు తీరిపోయిందనుకోండి. ఇప్పుడాతనికి ఎటువంటి గతి లభించబోతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓ రామచంద్రా! సాధకజనులపై గల అవ్యాజమైన ప్రేమచే అవతారమూర్తివగు నీవు ఈ ప్రశ్నలను ఈ సందర్భంలో అడుగుచున్నావన్న సంగతి నేను గమనిస్తు న్నాను. మంచిది. అయితే ఈ విషయం ఇతఃపూర్వం మనం ఈ సంవాదంలో సంభాషించుకున్నదే. ఈ సందర్భమునకు ఉచితంగా మరికొన్ని విశేషాలతో ప్రస్తావిస్తాను.

ఒకడు మూఢుడై అనేక దోషములను ఆశ్రయిస్తూ జీవితమును గడిపివేస్తున్నాడనుకో. అతడు ఎప్పటికైనా “నా ఈ మార్గం కుయుక్తమైనది. దోషభరితమైనది. దుఃఖభరితమైన యోనులకు దారి తీయగలదు”...అనే వివేకం పొందాలి. అట్టి వివేకం (లేక) వైరాగ్యం పొందనంతవరకు ఆతడు ఈ విశాల సంసారంలో ఉండియే తీరుతాడు. "ఇప్పుడు ఉపాయం ఏమిటి?"... అనే ప్రశ్నకు అతను రావాలి. అప్పుడు స్వవిచారణచేతనో, కాకతాళీయంగానో, (లేక) సాధుజన సాంగత్యం చేతనో ఉద్ధరించబడతాడు.

వైరాగ్యే అభ్యుదితే జంతోః, అవశ్యం భూమికోదయః తతో నశ్యతి సంసార, ఇతి శాస్త్రార్థసంగ్రహః ॥

అట్టి జీవునిలో 'వైరాగ్యం' ఉదయించాలి. వైరాగ్యం ఉదయించిన తరువాత, తప్పకుండా త్వరలోనే 'భూమిక’ అనేది ఉదయిస్తుంది. తద్వారా సంసారము నశిస్తుంది. ఇది శాస్త్ర సిద్ధాంతము. వైరాగ్యము ఉదయించగానే అతనికి సహకరించటానికి సాధన-జ్ఞానపాఠముల రూపములో శాస్త్రములు సిద్ధంగా ఉన్నాయి.

అట్లా కాకుండా “నేను కుమార్గాన్ని దోషస్వభావాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. మీకు చేతనైతే నన్ను ఉద్ధరించండి”... అని పలికేవారికి పదార్థములు ఎదురుగా ఉన్నా... తిననివానికి ఆకలి తీరనట్లు ... శుభేచ్ఛ ప్రవృత్తం కాదు. సంసారం బంధశృంఖలాలను తగిలించి ఆతనిని తన వెంట త్రిప్పుకుంటూనే ఉంటుంది. అప్పుడు గురువులు చేయగలిగేదేమిటి చెప్పు? ప్రయత్నశీలుడైన జీవుడు పరిసరముల ప్రభావమును అధిగమించగలడు.

Page:514

ఇక నీ రెండవ ప్రశ్నకు వద్దాం - 'దేహపతనం' అనేది - - భూమికల దృష్ట్యా చూస్తే - ఒకడు నిద్రకుపక్రమించి, గాఢ నిద్ర తరువాత నిదురవలేవటం వంటిది. ఒకడు ఏ విషయపరిజ్ఞానంతో, సమాచారంతో ఉండి గాఢనిద్రకు ఉపక్రమిస్తాడో... ఆతడు నిదురలేచిన తరువాత అదే పరిజ్ఞానం, అదే సమాచారం తిరిగి కొనసాగిస్తాడు కదా! అట్లాగే, ఒకడు ప్రథమభూమికయందో, లేక ద్వితీయ - తృతీయ - భూమికలయందో ఆరూఢుడై ఉండగా ఆతని ఈ భౌతికదేహం పతనమైనదనుకో. ఆయా భూమికల ననుసరించి పూర్వ దుష్కృతాలన్నీ సంక్షయించి ఉంటాయికదా. అందుచే అట్టి జీవుడు దేవతానగరములందో, లోకపాలకుల నగరములందో ప్రవేశించి క్రీడించగలడు. ఆ తరువాత పూర్వకాలకృతమైన పుణ్యసమూహం, దుష్కృతములు క్షయించిన తరువాత భూలోకంలో యోగి అయి జన్మిస్తాడు. శుద్ధులు, శ్రీమంతులు, గుణవంతులు, సజ్జనులు అగువారి ఇళ్ళలో పుడతాడు. అప్పుడిక పూర్వకాలికమైన వాసనలచే మరల యోగమును సేవిస్తాడు. ఆ బుద్ధిమంతుడు పూర్వాభ్యాసవశం చేత మరల యోగభూమికాక్రమమును గుర్తుకు తెచ్చుకోవటం జరుగుతుంది. మరల ఉత్తరోత్తర భూమికలను అధిరోహిస్తూ ముందుకు పోతూ ఉంటాడు.

12. ఉత్తరోత్తర భూమికా సంప్రయాణం

శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పటిదాకా ఈ సందర్భంలో చెప్పుకున్న 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. అసంగం... అనే మూడు భూమికలు జాగ్రత్తుకు సంబంధించినవి. ఎందుకంటే ఇవి యథాప్రకారంగా జాగ్రత్తు లాగానే భేదబుద్ధిచేతనే ఏర్పడతాయి.

ఈ భూమికలలో ఉన్న ఉత్తరోత్తర యోగయుక్తులచే 'ఆర్యత్వం' ఉదయిస్తుంది. అనగా వీరు తదితరులచే, ఆరాధించబడుటకు అర్హులౌతారు. సద్గుణాధిక్యతచేత వారు పూజార్హులు, మార్గదర్శకులు అవుతారు. వీరిని చూచుటచే, పూజించుటచే మూఢజనులకు కూడా మోక్షంపట్ల అపేక్ష పుడుతుంది. ఆర్యుడు అనగా ఎవరో ... ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఆర్యుడు -

కర్తవ్యమాచరన్, కామమకర్తవ్యమనాచరన్,

తిష్ఠతి ప్రాకృతాచారో యః స 'ఆర్య' ఇతి స్మృతః |

ఎవడైతే నిత్య నైమిత్తకమైన కర్తవ్యములను ఆచరిస్తూ, కర్తవ్యములు కాని వానిని కామ్యకర్మలను ఆచరించక ప్రస్థుతమైన ఆచారమునందు స్థితి కలిగి ఉంటాడో అట్టి వానిని 'ఆర్యుడు’ అంటాం. ఈతడు సాంఘిక - లోక ప్రసిద్ధ ఆచారములకు అనుకూలంగా ఉంటాడు. శాస్త్రోక్తములైన వాటిని, చిత్తమునకు సౌమ్యము కలిగించగల వ్యవహారములను గ్రహిస్తూ ఉంటాడు. యోగికి ఈ 'ఆర్యత్వము' అనేది ప్రథమ భూమికలో అంకురిస్తుంది. ద్వితీయ భూమికలో వికసిస్తుంది. 3వ భూమికలో ఫలీభూతమౌతూ ఉంటుంది. ఇట్టి ఆర్యత్వ దశలో దేహపతనమైన యోగి శుభ సంకల్పములకు సంబంధించిన భోగములను చిరకాలం పొంది మరల యోగి అయి జన్మిస్తాడు.

Page:515

ఈ మూడు భూమికల అభ్యాసంచే క్రమక్రమంగా అజ్ఞానమంతా నశిస్తుంది. 'సమ్యక్జ్ఞానం' ఉదయిస్తుంది. చిత్తము పూర్ణచంద్రునివలె శాంతి పొందుతూ ఉంటుంది.

నాలుగవ భూమిక ద్వైత శమము - స్వప్నసాదృశ్యభూమిక - ఇక నాలుగో భూమికలో ఆ సాధకుడు ప్రవేశిస్తాడు. ఈ భూమికలో ప్రవేశించిన యుక్తచిత్తులగు యోగులు జగత్తునంతటినీ విభాగరహితమైన దానిగానూ, అనాది-అనంతమైనట్టిదిగానూ, ఆనందరసైక స్వరూపంగానూ వీక్షిస్తూ ఉంటారు. ద్వైతము సర్వదా శమిస్తూ ఉంటుంది. ఈ 4వ భూమికలోని యోగులు ఈ జగత్తునంతటినీ ఒక స్వప్నమువంటిదిగా చూస్తూ ఉంటారు. అందుచేత దీనిని 'స్వప్నాసాదృశ్యభూమిక' అని అంటూ ఉంటారు. మొదటి మూడు భూమికలు జాగ్రత్ సంబంధములైతే, ఈ నాలుగవది స్వప్న సదృశ్యమైనది.

ఐదవ భూమిక అద్వైత బ్రహ్మస్థితము - - సుషుప్తు ఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు - ఇక ఐదవది సుషుప్త సాదృశ భూమిక. ఇందులో యోగి కేవలం సత్తా మాత్రంగా సంభాషించి ఉంటాడు. ఈతనిలో ద్వైతభావం (లేక) స్ఫురణ అనేది మచ్చుకైనా ఉండదు. కనుక అతి ప్రసన్నుడై ఉంటాడు. ఈతడు అసంగమగు తన స్వరూపము (లేక) ఆత్మస్వరూపము ఎరిగి ఉండటం చేత అద్వైత బ్రహ్మమునందే సదా స్థితి కలిగి ఉంటాడు. తోటి వారికి తన సర్వతత్త్వాత్మకం గురించి చెప్పుకోవటానికి మాటలు చాలవు. మూగవాడు తన ప్రియురాలిపై గల ప్రేమాధిక్యత చెప్పుకోజాలనట్లు ఈతడు తన సర్వాంతర్గతమైన ప్రేమాస్పద స్వరూపం ఇట్లని చెప్పజాలడు. తదితరులనందరినీ తన ఆత్మయొక్క విన్యాస ప్రకటనము వలె దర్శిస్తాడు. ఈ 5వ భూమిక సంపాదించిన యోగి బాహ్య వ్యాపార తత్పరుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా ఘనీభూతమైన నిర్విషయత్వమును దాల్చి ఉంటాడు. ఆతని ఆనంద సాగరమునకు అవధులు ఉండవు. ఎవరూ అవధులు కల్పించజాలరు. తోటివారితో మాట్లాడుచున్నప్పుడు అంతా తెలిసి కూడా ఏమీ చెప్పజాలనట్లు ఉంటాడు. ఈతనిని సుషుప్తఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు.. అని కూడా పిలుస్తున్నారు. ఈ 5వ భూమికను అభ్యాసం చేస్తూ వాసనారహితుడైన పూర్ణశాంతుడై ఉండటం చూసి 'ఈతడు నదరు - బెదరు లేని మొద్దురా'... అని కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ గొప్ప విలువైనవి అనుకునేవాటిపట్ల ఈతడు నిద్రాళువువలే ఉంటాడు.

అరవ భూమిక - తురీయము- ఉక్త సమయంలో, ఉక్త ప్రకారంగా 5వ భూమికను అభ్యసించే యోగి ఎప్పుడో 'తురీయం' అనబడే ఆరవ భూమికలో ప్రవేశిస్తున్నాడు. అచ్చట సత్తుగాని, అసత్తుగాని, అహంకారముగాని, అనహంకారముగాని భాసించదు. ఆ యోగి మనన వర్జితుడై ఉంటాడు. ద్వైత-అద్వైత వితర్కరహితుడై ఉంటాడు. గ్రంథి శూన్యుడై, సందేహములనేవేవీ లేనివాడై ఉంటాడు. భావనలకన్నిటికీ ఆవల నెలకొని ఉంటాడు. అట్టివాడు 'జీవించుట' అనబడు కార్యక్రమముచే స్పర్శించబడక ఉంటాడు. అతీత స్వభావము అలవరచుకొనటంచేత 'ఆత్మవంతుడై ఉండటం' అను విశేషంతో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వదా నిగృహీతత్వం (Non-taking) అలవరచుకొని ఉంటాడు. కర్మలచే నిబద్ధించబడక పోవటం చేత శాస్త్రములు ఈతనిని 'జీవన్ముక్తుడు'... అని పిలుస్తున్నాయి.

Page:516

ఈ జీవన్ముక్తుడు శరీరము ధరించి ఉన్నప్పటికీ ముక్త రూపుడే. శరీరము ఉండి కూడా జగత్స్వభావరహితుడై ఉంటాడు. చిత్రపటంలోని దీపం గాలి వీచికలకు రెపరెపలాడుతుందా? లేదుకదా! అట్లాగే ఆతని బుద్ధి సర్వదా నిశ్చలత్వమును వీడదు. ఖాళీగా ఉన్న కుండకు లోపల - బయట కూడా శూన్యాకాశమే ఉన్నట్లు ఆతడు లోపల - బయట విషయాతీతమైన నిర్వికారవైనము కలిగి భాసిల్లుతూ ఉంటాడు.

అన్తః పూర్ణా బహిః పూర్ణకుంభ ఇవ ఆర్ణవే కించిదేవైష సంపన్నస్త్వథవైష న కించన II

సముద్రంలో ఒక ఘటం (పాత్ర) ముంచబడిందనుకో. అప్పుడా పాత్ర యొక్క బయట లోపల కూడా జలమే ఉన్నది కదా! అరవవ భూమికలో ఉన్న నిత్య నిరతిశయానందరూపుడగు ఈ యోగి బాహ్య - అభ్యంతరములందు పరిపూర్ణుడై, పరమాశ్చర్యరూపమును పొందినవాడై ఉంటాడు. తన యొక్క పరిపూర్ణ స్వభావముచే అన్నీ పొందినవాడై ఉంటాడు. 'ఇంకా ఈ లోకం పొందాలి! ఆ రూపం కావాలి. అచ్చటికి వెళ్ళాలి. ఇది ఇంకా ఏర్పడాలి'... అనే అసంపూర్ణ భావాలు ఆతనికి ఉండవు. ఓ రామా! ఈ నిత్యసిద్ధుని ముందు భౌతికసిద్ధులు సూర్యునికి చూపే దివిటీ వంటివి. నిత్యసిద్ధుడై ఉండికూడా ఏమీ పొందనివాడై ఉంటాడు.

ఇట్లా 6వ భూమిక యందున్నవాడై క్రమంగా ఆ యోగి ఏడవ భూమికను పొందుచున్నాడు. ఏడవ భూమిక విదేహముక్తిత్వం - - ఈ 7వ భూమికను 'విదేహముక్తిత్వం' అని వర్ణిస్తున్నారు. ప్రాపంచిక భూమికలన్నిటికీ ఇది ఎల్ల. ఈ భూమిక వాక్కుకు అగోచరం అనబడుచున్నది.

కొందరు దీనిని శివం అంటున్నారు. మరికొందరు బ్రహ్మము అని పిలుస్తున్నారు. ఇంకొందరు ప్రకృతి-పురుషుల ఐక్యము యొక్క వివేకము అని భావిస్తున్నారు. కొందరైతే, తాను చూస్తున్నదంతా తానే అయిఉండటం అని అభివర్ణిస్తున్నారు. ఇంకా కొన్ని సైద్ధాంతిక విభాగాలలో దీనినే వాసుదేవత్వం - స్వర్గం - మహేశ్వరత్వం ఇట్లా నిజకల్పిత విభేదాలచే పలు విధాలుగా వర్ణించటం జరుగుతోంది.

అయితే రామచంద్రా! అది వచించటానికి అలవికానిమాట నిజమే కాని ... ఏదో విధంగా అద్దాని గురించి వర్ణించడం ఉపదేశించటం జరుగుతూనే ఉన్నది. అద్దాని భోగ-త్యాగ అధోగత్యాగ లక్షణాలు - ఉపదేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిదే ! చివరికి మాత్రం అది అనిర్వచనీయమైన అనుభవం మాత్రమే.

ఓ రామచంద్రా ఈ విధంగా సప్త భూమికల గురించి ఇక్కడ చెప్పాను. ఈ సప్తభూమికలు జీవుని స్థితిని నిర్ణయిస్తాయి కదా! అందుచేత మనం ఇతఃపూర్వమే (స్థితి ప్రకరణంలో) సవిస్తారంగా చెప్పుకున్నాం. అక్కడ 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. తనుమానస, 4.సత్వాపత్తి, 5. అసంసక్తి, 6. పదార్థాభావన, 7. తుర్యగము - అని వర్ణించాం. వేరు వేరు ఋషులు వేరు వేరు కాలాలలో ప్రవచించిన ఈ భూమికా సిద్ధాంతానికి కొంచెం పేర్ల భేదం ఉంటే ఉండవచ్చుగాని, సిద్ధాంతపరంగా సామ్యత్వమే కలిగి ఉందని గ్రహించు.

Page:517

భూమికా యోగం గురించి మరి, ఈ వర్తమాన పరిశీలనను ముగించేముందు ఒక్క వాక్యం చెబుతాను - అసాం అభ్యాసయోగేన న దుఃఖమనుభూయతే ॥

ఈ సప్త భూమికలు అభ్యాసవశం చేతనే సంప్రాప్తిస్తాయి. అంతేకాని, ఓ జనులారా! అవి ఏవో ఉదాహరణపరిమితములనుకొని, మహనీయులెవరికో మాత్రమే సాధ్యమనుకుని విని ఊరకోకూడదు. అభ్యాసము కొరకే ఇవి చెప్పబడ్డాయి. శుభేచ్ఛలో ప్రవేశించే జీవుడు అభ్యాసవశంగా క్రమంగా ఉత్తరోత్తర భూమికలను అధిరోహించగలడు. ఈ భూమికల అభ్యాసయోగం చేత దుః ఖానుభవాలన్నీ త్వరితరీతిగా తొలగుతాయి. క్రమంగా దుఃఖం యొక్క అనుభవలేశంకూడా ఉండదు. కనుక ఏఏ భూమికలో ఏఏ లక్షణాలు చెప్పబడ్డాయో అవి ప్రయత్నపూర్వకంగా అలవరచుకోండి.

13. ఇచ్ఛను అధిగమించాలి

శ్రీరాముడు: మహాత్మా! మీరు అత్యద్భుతంగా వర్ణించి చెప్పిన ఆ సప్తభూమికలలో ప్రవేశించటం, ఈ సంసారమును జయించి వేయటం' అనే ఉభయ విషయములను దృష్టిలో పెట్టుకొని ఏవైనా ఉపాయాలుగాని, దృష్టాంతోపమానాలు గాని ఉపదేశించి ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ జీవునికి సంబంధించిన ఒక గొప్ప యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో విజయం పొందాలి. పొందితేగాని సప్త భూమికలలో జీవుడు ప్రవేశించలేడు. అయితే యుద్ధభూమిలో ఒక గొప్ప ఆడఏనుగు శత్రుపక్షంలో ఉండి ఈ జీవుని గెలుపును నిరోధిస్తోంది. మందగమనము కలది, మహా - గర్వితమైనది, యుద్ధంలో మహా - ఉత్సాహము - నేర్పరితనము కలది అగు ఆ ఆడ ఏనుగును నిరోధించడం గురించి జనులంతా యోచించెదరు గాక! యుద్ధభూమిలో కలియతిరుగుచున్న ఆ ఆడఏనుగుకు గొప్ప భయమును గొలిపే దంతాలున్నాయి. అది ఘీంకరిస్తూ ఆ యుద్ధభూమిలో అటూ - ఇటూ సంచరిస్తూ ఉంటే చెప్పరాని అనర్థాలన్నీ వచ్చిపడుతున్నాయి. ఇప్పుడా ఏనుగును పట్టుకుని చంపాలి. లేకపోతే సప్తభూమికా ప్రదేశమును పొందగలిగే ప్రసక్తే లేదు. ఆ ఏనుగు యుద్ధభూమిలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉన్నంతవరకూ ఎవడైనా సరే సప్త భూమికా ప్రవేశం చేయగల సామర్థ్యం పొందలేడు.

శ్రీరాముడు: మహర్షీ! ఆ ఏనుగు ఏది? ఆ ఆ యుద్ధ భూములెక్కడున్నాయి? దానిని సంహరించటం ఎట్లా? చాలా కాలంగా అది ఎక్కడ క్రీడిస్తోంది? మాపై కరుణతో ఈ విషయాలు విశదీకరించండి. శ్రీవసిష్ఠ మహర్షి: 'నాకు ఏదో ఈ దృశ్యములో లభించాలి' అనే కోరికయే ఆ ఆడ ఏనుగు. ఈ దేహం అనే అరణ్యంలో అది చాలా ఉల్లాసంగా పచార్లు చేస్తోంది. మదించిన ఇంద్రియాలే దాని శిశువులగు గున్న ఏనుగులు. 'మనస్సు' అనే కారడవిలో దాగి ఉండి అది తెలియకుండా వచ్చి పడుతోంది. 'శుభాశుభకర్మలు' దాని యొక్క రెండు దంతాలు. నలువైపులా విస్తరించి ఉన్న వాసనా సమూహములే దాని మదము. సంసార దృష్టులే ఆ యుద్ధభూమి.

Page:518

‘ఇచ్ఛ' అనబడే ఆ ఏనుగు అల్పజ్ఞులగు జీవులను అతి తేలికగా చుట్టచుట్టి గాలిలోకి విసరివేస్తోంది. ఇక ఆ జీవులు అనేక ఉపాధుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. 'వాసనా - చేష్ట - మనస్సు చిత్తము - సంకల్పము - భావన - స్పృహ...' ఇవన్నీ కూడా చిత్తకోశములోగల ఇచ్ఛ యొక్క వివిధ నామములు.

‘మహా ధైర్యము’ అనే అస్త్రం చేబూని “నిరాదరణము అను బలంతో సర్వ పదార్థ రూపములలో అన్ని వైపులా వ్యాపించియున్న ఈ ఇచ్చ అనే ఆడ ఏనుగును సర్వవిధాలా జయించాలి. ఎందుకంటావా? ఈ ఇచ్ఛ ఎంతెంతవరకు సమస్త వస్తు రూపమయి విజృంభిస్తూ ఉంటుందో ...అంతవరకూ మహా - భయంకరమైన 'దుష్ట సంసారము' అనే విష విషూచి ఉండియే తీరుతుంది.

ఏతావానేవ సంసారః ఇదమస్త్వితి యన్మనః,

అస్య తు ఉపశమో మోక్షః! ఇత్యేవం జ్ఞాన సంగ్రహః||

'ఏదేదో నాకు లభించాలి...' అనురూపం గల మనస్సేదైతే ఉన్నదో ... అద్దానినే మనం 'సంసారం' అని అంటున్నాం. అట్టి దాహస్వభావం శమించిందా ...అదియే మోక్షం. సమస్త జ్ఞానసారం ఇదే. తెల్లటి పరిశుభ్రమైన వస్త్రంపై రంగు చక్కగా అంటుతుంది. అద్దముపై నూనెచుక్క ఇంకకుండా యథాతథంగా ఉంటుంది కదా! ఎవడైతే ఇచ్ఛారహితుడై నిర్మలాకారయుక్తుడై ఉంటాడో ...అట్టివాని హృదయంలో 1. ఉపదేశవాణి 2. అనుభవ ప్రకాశము. ఈ రెండూ వికసిస్తాయి.

అయితే, ఇచ్ఛ రహితమైయ్యేదెట్లా? విషయములు స్మరించకపోయినంతమాత్రం చేతనే సంసారమునకు అంకురమైనట్టి ఇచ్ఛ ఉపశమించగలదు. ఇచ్ఛ అనేది కొంచెం ఉదయించినా సరే, అది అనర్థకారిణి కాగలదు. అందుచేత 'విషయములను విస్మరించటం' అనే శస్త్రంతో ఇచ్ఛ అనే అంకురం ఏర్పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి.

ఇచ్ఛచే వ్యాపించిన హృదయం గల జీవుడు జీవస్వభావానికి అతీతుడు కాలేకపోతున్నాడు. “విషయేచ్ఛా విస్మరణ” అనబడే ప్రత్యాహార రూపమగు యత్నమున తత్పరుడగువాడు అత్యంత సులభంగా ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఈ 'ప్రత్యాహారం' అనే దానికి రెండు దశలు ఉన్నాయి.

1. ప్రత్యాహార అభ్యాసదశ: "విషయముల పట్ల విస్మరణము అనేది మొట్టమొదట సాధిస్తూ రావాలి. క్రమక్రమమైన ప్రయత్నము చేతనే ఇది సాధ్యం. క్రమంగా ధ్యాస - అభినివేశములను విషయముల నుండి విరమింపజేయాలి. శాస్త్రములు - శాస్త్రజ్ఞులు దైవారాధన - యోగాభ్యాసము వంటి అనేక ఉపాయములను అందించటంలో అంతర్లీనోద్దేశం ప్రత్యాహారమే అయి ఉన్నది.

2. ప్రత్యాహార పరిపక్వదశ: పరిపక్వదశయందు ఇక ప్రత్యాహారమునకు ప్రత్యేకమైన అవధానం అవసరం ఉండదు. నిద్ర మొదలైనవి స్వతఃసిద్ధంగా ఏర్పడునట్లే, ప్రత్యాహారం స్వతఃసిద్ధమగుచున్నది.

కల్పన - 'ఇది నాకు కలుగుగాక'... అనబడే తీవ్రేచ్ఛను విజ్ఞులు 'కల్పన' అని కూడా పిలుస్తున్నారు. 'పదార్థముల విస్మరణ' అనే ప్రత్యాహార ఫలం 'కల్పనాత్యాగం' అయి ఉన్నది. స్మృతి విషయాల గురించి స్మరణ లేకపోవటాన్ని 'శివరూపం' ...అని పిలుస్తున్నారు.

Page:519

సంకల్పదశలో ఇతఃపూర్వం అనుభవించినవి, అనుభవించనివి కూడా పాల్గొనుచున్నాయి. అందుచేత రాఘవా! అనుభవించినవాటి గురించిగాని, అనుభవించనివాటి గురించి గాని ఏర్పడే 'స్మృతి'ని ఒక కాష్ఠం (కొయ్య) వలె శ్రీఘ్రంగా విస్మరించి ఉండు. ఆ రెండింటి చేత స్పర్శించబడని ఒకానొక రహస్యమైన రూపమును ధరించినవాడవై ఉండు.

అసంకల్పమే శ్రేయం -

ఊర్ధ్వ బాహుర్విరౌమ్యేష, న చ కశ్చిత్ శృణోతి తత్!

అసంకల్పః పరం శ్రేయం! స కిమ్ అంతర్ న భావ్యతే?

ఓ జనులారా! 'సంకల్ప రహితుడై ఉండటమే పరమ శ్రేయం....' అని నేను రెండు చేతులు పైకెత్తి, ఎలుగెత్తి ప్రకటిస్తూనే ఉన్నాను కదా! అయినా అనేక మంది నా ఈ మాటలు వినిపించు కోవటమే లేదు. సంకల్పములలో ప్రవేశించి అందులో తారసపడే సుఖదుఃఖానుభవములను గొప్పగా నమ్ముకుని ఉంటున్నారు. అసంకల్ప స్థితియొక్క మహిమను ఈ జనులు ఎందుకో పట్టించుకోవటం లేదు. అసంకల్పత్వమును అంతఃకరణంలో ప్రతిక్షేపించుకోవటానికి యత్నించరేం?

నాయనలారా! సమస్త ఇంద్రియ - - మనో వ్యాపారములను రహితం చేసి కేవలం తూష్టీం’ స్థితి యందు ఉండటం అభ్యసిస్తూ ఉన్నంతమాత్రం చేతనే ... అప్పుడు బ్రహ్మదేవుని మహా సామ్రాజ్య సుఖం కూడా ఒక గడ్డిపరకవలె స్వల్పమైనదిగా, తుచ్ఛమైనదిగా భాసించగలదు. ఇక ఈ ప్రాపంచిక సౌఖ్యాల గురించి వేరే చెప్పేదేమున్నది? అట్టి సంకల్పరాహిత్యస్థితే భౌమానందమైయుండగా మీరు ‘అబ్బ! ఎప్పటికో ఆ స్థితి! అది మనకు లభ్యపడుతుందా? లేదు. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే’ అని ఎందుకు వేదన చెందుతున్నారో చెప్పండి?

శ్రీరాముడు: మహర్షీ! సంకల్పములన్నిటికీ ముందే సత్ స్వరూపమున ఏర్పడియున్న స్వయమాత్మ స్వరూపులై ఉండి కూడా జనులలో అనేకులు 'అవశ్యం నిర్వర్తించవలసిన అనేక కార్యక్రమములు ఉండి ఉండగా అసంకల్పత్వం ఎలా సాధ్యం ...' అనే అభిప్రాయం కలిగి ఉండటం జరుగుతోంది. ఈ విషయమై తమ వ్యాఖ్యానం ప్రసాదించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి:

గమ్యతి ఏకైక నిష్ఠస్య యథా పాంధస్య పాదయోః,

స్పన్తో విగత సంకల్పస్తథా స్పన్దః స్వకర్మసు ॥

ఒకడు ఒక ముఖ్యమైన పని మీద ఒకానొక చోటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తూ బయలుదేరాడనుకో ....! అప్పుడా బాటసారి 'ఈ అడుగు ఇటు వేయాలి, ఆ అడుగు అటు... అనే ప్రయత్నపూర్వకమైన సంకల్పము లేకుండానే బాటలో సాగిపోతూ గమ్యానికి చేరుతాడు చూచావా? యోగి కూడా అసంకల్ప పూర్వకంగా స్వకర్మలందు ప్రవర్తించుచున్నాడు. ఎక్కడ, సుఖదుః ఖమానావమానాది భావావేశాలు జత చేరి ఉంటాయో అక్కడ మాత్రమే సంకల్పం సంకల్పంగా

Page:520

కొనసాగుతుంది. లేదా, ఆ సంకల్పత్వమును నిర్వరించవలసినది నిర్వర్తించగానే మటుమాయ మౌతుంది. ప్రతి జీవుడు తన దినచర్యలో అనేక సంకల్పాలు అసంకల్పంగా పరిణమింపజేయు చున్నాడు. ఒక తల్లి తన పిల్లవాడిపై చూపే కోపం కోపసంస్కారంగా రూపుదిద్దుకుంటుందా?... లేదు. పిల్లవాడు అల్లరి ఆపగానే ఆ కోప సంకల్పం అసంకల్పమైపోతోంది కదా! అట్లాగే సర్వ సంకల్పములను వ్యవహారము కొరకు మాత్రమే ధరించిన మరుక్షణం ఎందుకు అసంకల్పంగా చేసి వేయరాదు చెప్పు? తప్పకుండా ప్రయత్నంచేత సుసాధ్యమేనని సకల జనులకు నా మనవి.

ఈ విధంగా ... ఎక్కువగా చెప్పవలసిన పనేమున్నది? సంక్షేపంగా ఒక్కమాట మరల మరొక్కసారి ప్రకటిస్తున్నాను విను- సంకల్పం పరోబంధః, తదభావో విముక్తతా ॥ సంకల్పమే పరమబంధం, సంకల్పములు లేకుండటమే మోక్షం.

ఓ రామచంద్రా! ఈ సమస్త ప్రపంచమును అజము - శాంతము - అనంతము

ధ్రువము - అవ్యయము నిత్య సిద్ధము’ అయినట్టి 'పరమార్థ చిద్రూపం’గా చూస్తూవుండు.

యథాసుఖంగా ఉండి ఉండు.

సమస్త దృశ్యమును మఱిచి, 'అక్షయము - శాంతము అయిన రూపమును అవధరించి ఉండటమే యోగం అను శబ్దముచే ఉద్దేశించబడింది. కాబట్టి నీవు వాసనారహితుడవై యోగమునందు 'స్థితి కలిగియుండి ఇక ఆపై యథాప్రాప్తములైన కర్మలను నిర్వర్తించు. లేదూ, కర్మలు త్యజించదలచావా...సమాధిపరుడవై కర్మలు చేయకుండుము.

“అహం...మమ...నేను... నాది అనే అధ్యాసయొక్క త్యాజ్యమే చిత్తక్షయం. సమస్త దృశ్యం యొక్క అకృత్రిమం, స్వాభావికం అగు చిత్తరాహిత్యం. అదియే 'జీవబ్రహ్మముల యోగం' కూడా. అదే సంకల్ప త్యాగం అని కూడా చెప్పబడుతోంది. కాబట్టి నీవు ఆత్మమయుడవై, ఆత్మకు చెప్పబడిన అప్రమేయ - - అసంగాది స్వభావమును సంతరించుకున్న వాడివై ప్రశాంతుడవై ఉండుము. పరమాత్మ సర్వదా శివమై, సర్వవ్యాపకమై, శాంతమై, బోధరూపమై, అజమై, శుభప్రదమైయున్నది. అట్టి పరమాత్మతోటి ఏకత్వభావనయే సర్వత్యాగం. అట్టి సర్వత్యాగ భావనను నీ అంతఃకరణమందు నిరంతరం చేస్తూ ఉండి, ఇక ఆపై కర్తవ్యములైన కార్యములను బాగుగా ఆచరించు.

ఓ సర్వజనులారా! నా ఈ మాటలు శ్రద్ధగా వినండి.

1."నేను - నాది - అహం - - మమ"... మొదలైన భావనలు ఉన్నంతవరకూ ఈ ఈ జీవుడు ఎన్నటికీ దుఃఖముల నుండి విముక్తుడు కానేరడు.

2.అహం - మమలను త్యజించటం చేత విముక్తుడౌతాడు.

ఈ రెండు విషయాలూ ఎఱిగినవారై, ఇక ఆపై మీరు కర్మలను నిర్వర్తించటమో త్యజించటమో మీ ఇష్టం ... ఏది ఎట్లైనా ఫరవాలేదు ... అట్లే నిర్వర్తించండి.

Page:521

XIV. శ్రీ వాల్మీకి మహర్షి ప్రవచనం

1. ఆత్మావలోకనం

భరద్వాజుడు : మహాత్మా! వాల్మీకి మహర్షీ! ఇంద్రభగవానుని కరుణచే, మీ పాదాలు నేటికి జేరగలిగాను. మీ యొక్క కథా సంవిధాన చమత్కారముచే శ్రీ వసిష్ఠ రామ సంవాదమును వింటున్నాను. వినడం చేత నేను మహత్తరమైన ప్రయోజనం పొందుచున్నాను. అనేక జన్మల తపస్సు ఫలీకరించుటచేతనే దేవదూత నన్ను మీ సమ్ముఖమునకు తీసుకురావడం, మీరు నాపై కరుణతో ఈ సంవాదమును వర్ణించి చెప్పటం జరుగుతోంది.

ఇప్పుడు చెప్పండి మహాత్మా ! శ్రీ వసిష్ఠ మహర్షి చెప్పిన జ్ఞానసారాన్ని వినిన శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆ ఉపదేశమాత్రంచేత సందేహరహితుడై పరమ సుఖమును పొందాడా? పూర్ణ బోధమయుడైనాడా? ఇంకా ఏమైనా ప్రశ్నించాడా?

స ఖలు పరమయోగీ విశ్వవన్యః సురేశో, జనన మరణహీనః, శుద్ధబోధ స్వభావః, సకలగుణ నిధానం, సంనిధానం రమాయాః,

త్రిజగత్ ఉదయ రక్షా-అనుగ్రహాణమ్ అధీశః ॥

ఆ శ్రీరామచంద్రుడు స్వయంగా మహాయోగి. జగత్తుకు పూజార్హుడు. దేవతలకే దేవేశుడు. జనన మరణరహితుడు. శుద్ధబోధ స్వరూపుడు. సకల గుణనిధి. లక్ష్మీపతి. ఈ మూడులోకముల ఉత్పత్తి - స్థితి - రక్షణలకు కారణకారణుడై ఉన్నాడు. అట్టి రామచంద్రుడు నావంటి భక్తజనులను, ఆర్తులను దృష్టిలో పెట్టుకొని మహర్షిచే నిండు సభలో మహత్తరమైన జ్ఞానము ప్రవచింపజేశారు. ఎంతటి ఆశ్చర్యం! అప్పుడింకా ఏం జరిగిందో ... అది కూడా చెప్పండి.

శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! వేదాంత సంగ్రహరూపమైనట్టి శ్రీ వసిష్ఠ మహర్షి చెప్పిన ఆ వాక్యాలన్నీ శ్రీరామచంద్రుడు విన్నాడు.

సమస్త జ్ఞానం యొక్క పరాకాష్ఠను చవి చూచాడు. ఆతని చిత్తవృత్తియందు అఖండాకారవాక్య ప్రభావంచే ఒకానొక అనిర్వచనీయ నిరతిశయానందం తాండవించింది. 'ఆనందం యొక్క నిర్మల చిదనం యొక్క చిహ్నములు ఆతని కమల నేత్రములలో ప్రకాశించాయి. అతడు చైన్యానందసాగర మగు స్వస్వరూపమునందు జాగృతుడైనాడు. ఇక ప్రశ్న-సమాధానం అనే వృత్తి భేదం స్వస్వరూపంలో విలీనమైనది. ఈ వర్తమాన క్షణంలో 'ఇది యుక్తం, అది అయుక్తం' అనే విభేదం, వివేచన ఆతనికి లేవు. ఎందుకంటే ఆతడు, మనో-బుద్ధి-ఇంద్రియ వ్యాపారశూన్యుడైనాడు. 'ఆత్మానందం' అనే అమృతంచే పూర్ణుడగుట చేత పులకిత శరీరుడైనాడు.

Page:522

మహాసామాన్య రూపత్వాత్ చిద్వ్యాపకతయా స్థితః నిత్యమ్ అష్టగుణైశ్వర్య తృణప్రాయ మనోరధః II

అతను ‘మహాసామాన్య రూపము' అని, 'సర్వాధిష్ఠాన సన్మాత్ర' అని పిలువబడి సర్వాత్మకత్వం సంతరించుకున్నాడు. అంతటా ప్రసరితుడై ఉన్నాడు. అనగా, చిద్వ్యాపకత్వంచేత అంతటా స్థితి పొందినవాడై ఉన్నాడు. స్వయంగా ఉపాధికి అసంబంధితమైన అష్టగుణైశ్వరములను కూడి ఉండటం చేత భౌతిక పరిభాషితమగు సమస్త మనోరథములు ఆతనికి తృణప్రాయంగాను, తుచ్ఛంగాను గోచరిస్తున్నాయి. ఆ పిల్లవాడు నిరతిశయానందమగు బ్రహ్మముతో ఏకత్వం పొందియుండటం చేత ఏమియు చెప్పజాలక ఊరుకొని ఉన్నాడు.

భరద్వాజుడు: ఆహాఁ! మహాత్మా! నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. శ్రీరామచంద్రుడు వాక్యములకు అందజాలని మహత్పదమును పొందినాడు కదా!

హే వాల్మీకి మహర్షీ! అటువంటి ఆత్మపదం మాకు కూడా ప్రాప్తించటమెట్లాగో చెప్పండి! మేం మూర్ఖులమై స్తబ్ధులమై, కించిజ్ఞులమై, పామరులమై ఈ సంసార మరుభూమిలో కాళ్ళు అరిగేటట్లు సంచరిస్తున్నాం. అటువంటి మేమెచట? బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా ప్రార్థనీయము, దుర్లభము అయినట్టి ఆ శ్రీరామచంద్రుని ఉత్తమస్థితి ఎచట? హై గురువర్యా! మునీశ్వరా! నాకు శ్రీరాముని లాగానే విశ్రాంతి ఎట్లా లభిస్తుంది? దుస్తరమగు ఈ సంసారమును దాటగలగటం నా వల్ల అయ్యే పనేనా? చెప్పండి.

శ్రీవాల్మీకి మహర్షి : ప్రియ భరద్వాజా! ఇప్పటి దాకా వసిష్ఠ మునీంద్రులు రామచంద్రుల మధ్య జరిగిన సంవాదమంతా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాను కదా! దీనినంతా నీవు స్వబుద్ధితో విచారించు. పరాపరవిమర్శ చేయి. అందులో వివిధ కోణాల నుండి చెప్పుచున్న ఆత్మజ్ఞాన సమాచార సారాన్ని నీ అనుభవంగా ఆరూఢం చేసుకో. అప్పుడు శ్రీరామచంద్రునిలాగానే విశ్రాంతి లభించకపోతే నన్నడుగు.

ఓ భరద్వాజా! నీ నిరంజన - - నిరాకార - శుద్ధతత్త్వము అనుభవం కావటానికి వీలుగా నేను కూడా నా అనుభవమంతా రంగరించి అవస్థాత్రయ సాక్షిత్వం మొదలైన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.

మొట్టమొదట ఒక నగ్న సత్యం ప్రతిపాదిస్తున్నాను.

అవిద్యాయాః ప్రపంచో యం నాస్తి సత్యమిహాణ్వపి వివేచయంతి విబుధా, వివదన్తి అవివేకినః ॥

ఈ జగత్తంగా కూడా 'అవిద్య' చేతనే పరికల్పితమై ఉన్నది. ఇందులో అణువంత కూడా (కొంచెమైనా) సత్యం లేదు. అయితే వివేకులు దీనిని వివేచనతో పరిశీలిస్తున్నారు. అవివేకులో, వివాదాలలో ప్రవేశించి దృశ్యవశులగుచున్నారు.

Page:523

ఓ ప్రియ భరద్వాజా! ఇక్కడ చైతన్యమునకు భిన్నమైనదంటూ ఏదీ కొంచెం కూడా లేదు. ఉండజాలదు. నీవు ప్రణవము - మహావాక్యముల అర్థరహస్యాన్ని ఎఱిగి అభ్యసించు. అభ్యాసముచే శుద్ధచిత్తుడవు కమ్ము.

ఈ జీవునకు ప్రపంచ విషయాల పట్ల యావృత్తి ఉంటోంది కదా! ఈ యావృత్తిని ఆత్మానుభవం దృష్ట్యాం ‘జాగ్రత్ నిద్ర...' అని పిలుస్తున్నారు. అట్టి జాగ్రత్ నిద్ర యొక్క అంతరమున నిరంజనమైనట్టి చైతన్య ప్రదీపము జాగృతమై ఉన్నది. చైతన్యం జాగ్రత్-స్వప్న సుషుప్తులకు సాక్షీ భూతంగా దర్శిస్తోంది. అట్టి సాక్షి చైతన్యం వైపుగా నీ బుద్ధిని ప్రసరింపజేయటం అభ్యాసం చేయి.

ఇక ఈ ప్రపంచమంటావా? విను చెబుతాను. శూన్యమూలః ప్రపంచోలియం శూన్యతా శిఖరః, సఖే!, సారశూన్య తయామధ్యే అపి అనాస్థా సన్మనీషిణామ్ ||

ఓ సఖుడా! ఈ ప్రపంచానికి మొదలుగాని, మధ్యగాని, చివరగానీ లేదు. ఎందుకంటే ఇది స్వయంగా శూన్యమూలమైనది. ఇది ఎందుకు, ఎట్లా ఏర్పడుతోంది?....” అన్న ప్రశ్నకు నా నిర్మొహమాటమైన సమాధానం అజ్ఞానము చేతనే”.... అని సుమా! అందుచేత సజ్జనులగు బుద్ధిమంతులకు దీనిపట్ల అపేక్షయే ఏర్పడదు.

అనేక భ్రమలను కలుగజేయుచున్నట్టి ఈ దృశ్య ప్రపంచం స్వతహాగా అసత్తే అయి ఉన్నది. అట్లా అంటారేమండీ! మాకు ఈ దృశ్యజగత్తు కనిపిస్తోంది కదా? - అని ఎవరైనా అంటారేమో? ఓ స్వయమాత్మ స్వరూపులగు ప్రియజనులారా! అంతరంగంలో ఉండే వాసనాదోషం చేతనే గంధర్వ నగరంలాగా మాయాకల్పిమై లేనిది ఉన్నట్లుగా ఇక్కడ గోచరించటం జరుగుతోంది. ఆ అంతరంగానికి ఆవల జగత్ సాక్షియగు స్వస్వరూపము ప్రతి జీవునిలోనూ జాజ్వల్యమానంగా వెలుగుతోంది. ఇప్పుడు నీకు, నాకు ప్రతిజీవునికి ఎదురుగా రెండు మార్గాలు వున్నాయి.

1. అనేక జన్మల వాసనల నుండి ఇంద్రియములను ఉపయోగించుచుండగా అనుభవమయ్యే ఈ దృశ్య జగత్.

2. సర్వమునకు సాక్షియగు నిర్వికార - నిరాకార - నిరంజన - అప్రమేయ - నిరాశ్రయ స్వస్వరూపం.

త్వమ్ అనభ్యస్య కల్యాణీం చైతన్యామృత కన్దలీమ్,

సంముహ్యసి కిమధ్యాస్య వాసనా విషవీరుధః?

ఓ భరద్వాజా! ఇప్పుడు చెప్పవయ్యా! శుభప్రదమగు అమృత కదలీ (అరటి) వృక్షమును ఆశ్రయించటం ఉచితమా? వాసన' అనే విషలతను ఆశ్రయించి విమోహితులం కావటం మంచిదా?

సమాధానం అక్కర్లేదనే అనుకుంటున్నాను. తత్త్వ దర్శనంచే నిరాలంబమైన నీ యందలి ఆత్మను పరిగ్రహించు. అప్పుడు పూర్వకాలికమైన అజ్ఞానావస్థలో కనిపించే జాగ్రత్ ప్రపంచం ఇక కనిపించదు. ఇదంతా కూడా ఆత్మస్వరూపంగానే కనిపిస్తుంది.

Page:524

జాగ్రత్-స్వప్న-సుషుప్తులందు సర్వదా అస్పృశ్యమై విభేదరహితమై ఏర్పడియున్న సాక్షితత్వము యొక్క అనుభవము పొందియున్న మహనీయులెందరో ఉన్నారు. వీళ్ళని శాస్త్రకారులు 'తురీయ సంస్థితులు’ అని పిలుస్తున్నారు. అట్టి వారి సమక్షంలో ఇదే ఘనీభూత సాంసారిక దృశ్యం ఒక కల్పితకథా సంఘటనలాగా అర్థరహితమై ఉంటోంది. అట్టి వానికి ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలు ఉండవు. అతడిక తనకు తానే సర్వదా ఏర్పడి ఉన్నవాడగుచున్నాడు. విజ్ఞుడైనా, అజ్ఞుడైనా ప్రతి జీవుని వాస్తవ సత్యమిది. ఇక నీ ఇష్టం. దేన్ని ఏ ఉద్దేశంతో ఆశ్రయించటం ఉచితమో వివేచనచే గ్రహించు. అంతేగాని గుడ్డెద్దు చేనులో పడినట్లు ఈ దృశ్యాన్ని అనుకరించి ఉండకు.

అమృత రూపమగు సత్ప్రవాహముతో కూడిన ఆ మహాచైతన్య సాగరమే నీవు. అంతేగాని, ఈ దేహ - జగత్ - - భావాదులు నీవు కానే కావు. ఈ విషయం నీవు బుద్ధితో గ్రహించి ఉండు. బుద్ధిని ఆత్మమయం చేయనంతవరకు ఈ జగద్రూపతరంగాలు కనిపిస్తూనే ఉంటాయి. జ్ఞానకాలంలో ఆత్మగా భాసించేదే ...అజ్ఞానకాలంలో జగత్తుగా భాసిస్తోంది.

ప్రాక్ నాస్తి, చరమే నాస్తి వస్తుసర్వమిదం, సఖే | విద్ధి మధ్యేపి తన్నాస్తి స్వప్నవృత్తమిదం జగత్ ॥

మిత్రమా! ఏ జగత్తెతే ఘనీభూతమై ఉన్నదని, సంసారరూపంగా ఏర్పడి దాటుటకు అశక్య మౌతోందని అనుకుంటున్నావో ...అట్టి ఈ దృశ్యం ఒకప్పుడు నీ పట్ల లేదు. ఇది ఇంకొకప్పుడు ఉండ కుండా పోతోంది. జాగ్రత్లో స్వప్నం అవాస్తవం. స్వప్నంలో జాగ్రత్ అవాస్తవం. 'స్వప్నం’ విషయంలో "అంతకు ముందు ఏమై ఉన్నది. ఆ తరువాత ఏమికానున్నది?... అని మనం ప్రశ్నిస్తున్నామా! ఈ దృశ్యము కూడా అట్టిదే!

ఏదైతే ఆది-అంతాలలో లేదో... అది మధ్యలో కూడా లేనిదే అగుచున్నది. అందుచేత ఈ జగత్తు స్వప్నతుల్యంగానే ఎఱిగి ఉండు. ఈ సమస్త పదార్థ భేదం కూడా జలంలో బుద్బుదాల లాగా అవిద్యచేతనే ఉత్పన్నమౌతోంది. నీటిలో లేచిన బుడగ మరెప్పుడో నీటిలోనే లయం కావలసిందే కదా! సర్వ పదార్థ భేదమంతా భావనారూపంలో పైకి లేచి, కొద్ది క్షణాలుండి మరల జ్ఞాన సముద్రంలో విలీనమగుచున్నది. మధ్యలో కనిపించే తరంగం మధ్యలోనే లయమౌతోంది. సముద్రం మాత్రం సర్వదా యథాతథంగా ఉంటోంది. ప్రతి జీవుడు జ్ఞాన సముద్ర స్వరూపుడే. అయితే ఆతనిలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్త్యాది భావానుభవమంతా ఎప్పుడో జనించి మరెప్పుడో అతని యందే లీనమౌతోంది. మధ్యలో ఏర్పడిన భావనానుగత బుద్బుదములను అనుసరించి "ఈతడు జీవుడు. ఆతడు బద్ధుడు. ఆ ప్రక్కాయన ముక్తుడు" ఇత్యాది ... శబ్ద ప్రయోగాలు శాస్త్రాలు చేస్తున్నాయి. మధ్యలో వచ్చిందంతా మధ్యలోనే పోక తప్పదు. అందుచేత 'నేను చైతన్య సాగరాన్ని'... అనే నీవు మననం చేయి గాని, “నేనీ దేహంలో చిక్కుకున్న పక్షి వంటివాడను" అని అల్పయోచనకు తావియ్యనే వద్దు. అత్యంత ప్రశాంతమగు ఆత్మ గురించి తెలుసుకో. ఆ ఆత్మసాగరంలో స్నానం చేయి. అప్పుడీ క్లేశ దాయకమైన 'బాహ్యభ్రాంతి' అనే మనోదేహ సంబంధమైన అపరిశుభ్రత తనకు తానే తొలగి

పోతుంది.

Page:525

ఈ జగత్తు అనే సముద్రం 'అజ్ఞానము' అనే గొప్ప ఉప్పురసంతో వ్యాపించియున్నది. అందులో అహంకారం’ అనేది ప్రప్రథమ తరంగం. ఆ తరంగం అవిద్య అనే వాయువుచే ఉత్పన్నమై అన్ని వైపులా ప్రవహిస్తోంది. చిత్తము యొక్క అనేక విషయముల పట్ల ఏర్పడే ప్రవృత్తులున్నాయి చూచావు? అవియే రాగరూపంగా కనబడే చిన్న చిన్న తరంగాలు. నాది, మమత్వం" అనే సుడి ఇక్కడ యథేచ్ఛగా ప్రవర్తిస్తోంది. ఈ సాగరంలో 'రాగము, ద్వేషము' అనే రెండు పెద్ద మొసలి జాతులు విహరిస్తున్నాయి. అవి కనుక పట్టుకున్నాయా ...ఇక ఈ జీవుడు 'అనర్థము' అనే పాతాళానికి చేరవలసిందే. మృత్యుముఖము వంటి అభినివేశములో ప్రవేశించాడా ...ఈ జీవుని ఎవరూ కాపాడలేరు. కనుక జాగ్రత్త!

సముద్రస్నానం చేయాలి... ” అని నీకు అభిలాష ఉన్నదా? అయితే ఈ దృశ్య సంసార సముద్రంలో ఎందుకు స్నానం చేయటం? ప్రశాంతము, అమృతమయ తరంగములచే అత్యంత శోభితము, అద్వైతరూపము ...అయినట్టి ఆత్మానంద సాగరంలోనే స్నానం చేయి. అంతేగాని ద్వైతరూప ఉప్పు సముద్రంలో ఎందుకు మునుగుచున్నావో చెప్పు?

ఓ భరద్వాజా! 'అయ్యో! శ్రీరామచంద్రుని ప్రపంచం జ్ఞానముచే తొలగిపోయింది. నా ప్రపంచమో, ఇంకా మిగిలియే ఉన్నది...'అని అంటున్నావు కదా.

కస్తిష్ఠతి? గతః కోవా? కస్య కేన కిమాగతం?

కిం ను మజ్జసి మాయాయాం? పత మా త్వమతశ్రితః II

అసలు ఉన్నదేది? పోయేదేది? ఎవనికి ఏమి వస్తోంది? ఏమి పోతోంది? ఏమిటయ్యా, ఇంకా మాయయందే నిమగ్నమౌతున్నావ్? నాయనా! ఇన్ని రోజులుగా శ్రీ వసిష్ఠ - శ్రీరామ సంవాదం విన్నాం కదా! ఇకలే. జాగరూకుడవు కమ్ము. వివేకివగుము. అంతేకాని, ఈ మాయలో పడవలసిన అగత్యమేమున్నదో చెప్పు? వద్దు. పడనే వద్దు.

భరద్వాజుడు: హే వాల్మీకి మహర్షీ! నాదొక చిన్న సందేహం. అసలు నిర్విషయము, నిత్య నిర్మలము అగు బ్రహ్మము జగదాకారంగా ఎందుకు వివర్తం పొందుతోంది.

శ్రీవాల్మీకి మహర్షి: "బ్రహ్మము జగత్తుగా వివర్తం పొందుతోంది..." ఇటువంటి వాక్యాలన్నీ చిన్న పిల్లలతో హాస్య సంభాషణ చేయటానికి కల్పించబడ్డాయి. బ్రహ్మము సర్వదా నిర్విషయంగా, నిత్య నిర్మలంగా ఉన్నది. నీవు జ్ఞాని వగుచున్న కొలదీ అపరివర్తనశీలమగు ఆనంద బ్రహ్మను దర్శిస్తావు. అందులోనే స్థితి పొంది ఉంటావు. ఆ బ్రహ్మమే నీవు. నీవు సదాశివస్వరూపుడవు, సదా బ్రహ్మానంద స్వరూపుడవు సుమా!

అవివేకియగు జీవుడు ఒకప్పుడు అబ్బో! నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని " అని

హర్షం పొందుతాడు. ఇంకొకప్పుడేమో ఇదేంటిరా, ఇది ఇట్లా ఉన్నది... అని దుఃఖిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా హర్షం, అకస్మాత్తుగా శోకం! ఇదీ అతని పని. తత్త్వవేత్తయో? ఆతడు ఎల్లప్పుడూ

Page:526

ప్రసన్నంగానే ఉంటాడు. ఒకవేళ అతను కొంచెం బాహ్యానికి శోకం ప్రదర్శిస్తున్నాడూ అంటే .. అది అజ్ఞానులతో సహజీవనం కొరకు మాత్రమేగాని, తన స్వరూపం ఎట్టిదో తెలియక కాదు. అజ్ఞానులగు జీవులు జలమునందు స్థలభ్రాంతిని, స్థలమునందు జలభ్రాంతిని (ఎండమావులను) పొందుచున్నారు. సూక్ష్మమగు ఆత్మతత్త్వమును 'అవిద్య' అనే దర్పణంలోంచి చూస్తున్నారు. అందుచేత అవిద్యాచ్ఛాదితమైన 'అనాత్మ' యందు ఆత్మభ్రాంతి కలుగుతోంది. నీవు అవివేకివి కాదలచుకుంటే మనం ఎన్ని రోజులు సంభాషిస్తే ఏం ప్రయోజనం? అందుచేత వివేకివి అవటానికి ప్రయత్నించు. అంతేగాని, అవివేకి ఈ జగత్తును ఎట్లా చూస్తున్నాడో సమీకరించి, దానిని పట్టుకుని వ్రేలాడకు.

ఈ ప్రపంచంలో అనేక వస్తు సముదాయం కంటికి కనిపిస్తోంది కదా? ఇవన్నీ పరమాణువల కలయికయే కదా! అట్టి పరమాణువుల సంయోగ-వియోగములచే ఏర్పడే ఈ పాదార్థిక జగత్తు గురించి దుఃఖించవలసిన పనేమిటి? ఈ దేహం కూడా పరమాణువుల సంయోగంచే ఏర్పడి, వియోగముచే నశించినదగుచున్నది. నీవుగాని, నేనుగాని, మరెవరైనా గాని ... మనమంతా చిత్ స్వరూపులం. 'ఎరుగుట' అనునది మన స్వరూపం. పరమాణువుల సంయోగ - - వియోగముచే పరమాణువుల కంటే అత్యంత సూక్ష్మమగు మన చిత్ స్వరూపం ఎట్లా స్పర్శించబడగలదు? అది మనలను దుఃఖింప జేయటమేమిటి? అది ఎలా సాధ్యం? కనుక దుఃఖానికి కారణం మన ప్రత్యక్ స్వరూపము యొక్క ఏమరుపేనని సిద్ధాంతీకరించబడుచున్నది.

అసతః సంభవోనాస్తి, నాస్తి అభావః సతః సఖే అవిర్భావ-తిరోభావాః సంస్థానానామమి పరమ్||

ఓ స్నేహితుడా! 'అసత్' పదార్థానికి ఉత్పత్తియే లేదు. 'సత్' పదార్థానికి వినాశనమనేదే లేదు. ఇక్కడల్లా ... కేవలం మాయారూపములైనట్టి ఈ 'దేహము' మొదలైన ఆయా పదార్థములు - 'పరమాణువుల కలయిక - విడిపోవడం' అనే ప్రక్రియచే - వాటివాటి ఆవిర్భావ - తిరోభావములు సంభవించటం జరుగుతోంది.

అయితే ... దృశ్యము ఈ విధంగా ఉండగా, ఇక దృక్ స్వరూపుడగు జీవుని విషయమేమిటి? భరద్వాజుడు: అవును మహర్షీ! ఈ పదార్థిక జగత్తంతా పరమాణువుల సంయోగ-వియోగరూపములే, అయితే వీటి యొక్క అనుభవం పొందే ఈ జీవుడు అనబడు దృక్ స్వరూపుడు (లేక) ద్రష్ట, (లేక) అనుభవజ్ఞుడు ఎక్కడి నుండి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళుచున్నాడు. ఈ విషయాలు శ్రీ వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని సమక్షంలో ప్రవచించారు. అయినా సరే, ఈ 'నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం' సమీక్షిస్తున్న ఈ సందర్భంలో మరొక్కసారి మీ అనుభవ - అభిప్రాయములను ప్రవచన రూపంగా విశదీకరించండి.

శ్రీవాల్మీకి మహర్షి : పంచభూతములలో ఒకటి అయిన 'ఆకాశము' తదితర భూతముల కంటే సూక్ష్మమైనది కదా! అట్టి ఆకాశపు అంతర్గతమైన ఒక విభాగాన్ని ఉద్దేశించి 'ఇది ఇక్కడి నుండి అక్కడికి వెళుతోంది. అది అక్కడి నుండి ఇక్కడికి వస్తోంది' అనే వాక్యాలు చెల్లుతాయా? ఆకాశము

Page:527

ఒకచోట నుండి ఇంకొక చోటికి పోవటం - - రావటం ఉండదు కదా! ఇక, ఆకాశము కంటే కూడా

సూక్ష్మాతి సూక్ష్మము, ఈ జీవుని స్వస్వరూపము అయిన ఆత్మ అన్నిటా, అంతటా నిండి ఉంటోంది. అది తనయందు తానే నెలకొని ఉన్నది. అద్దాని రాకపోకలెక్కడుంటాయ్?

అయితే,పూర్వ సంచితములైన అనేక పుణ్యపాపములను హేతువులుగా చేసుకొని ఈ దేహాదులు విషయతుల్యమైన మరణము' మొదలైన అనర్థాలను పొందటం జరుగుతోంది. దేహాదులపై భ్రాంతిని పెంచుకున్న ఈ జీవుడు అనుక్షణికంగా దుఃఖితుడు అగుచున్నాడు. ఆ దుఃఖం తొలగేది ఎట్లా?.... అనేది గొప్ప అవశ్యమైన ప్రశ్న. అందుకు మా సమాధానం ఒక్కటే! ఓ సర్వజనులారా! అట్టి సర్వ అనర్థాలు మీ పట్ల తొలగాలంటే జగద్గురువగు ఆ పరమేశ్వరుని మనసా, వాచా, కర్మణా శరణు వేడండి. ఉపాసించండి. ఓ భరద్వాజా! నీవు అన్నిటినీ త్యజించి గొప్ప తపస్సు చేశావు. నిర్మలమైన మనస్సును సంపాదించుకున్నావు. తపో ప్రభావం చేత అంతరంగమును పరిశుద్ధపరచుకొని తద్వారా వివేకత్యాగి’గా రూపుదిద్దుకున్నావు. అందుచేత నీ అంతరంగంలోని పుణ్యపాపాలన్నీ నిశ్చయంగా సంక్షయించాయి. ‘ఆ పశుపతి యొక్క పాశాలు అనగా ప్రాణుల శుభాశుభకర్మలే! - అని శ్రుతి ప్రసిద్ధం. కనుక, ఇంక ఆగకు. నీ చిత్తము మరింత పరిశుద్ధమయ్యే వరకు ఆ భగవంతుని సాకార రూపం ధ్యానించు. భజించు. అట్లా ధ్యానిస్తూ ఉండగా ఉచితకాలంలో నిరాకారమగు బ్రహ్మమున నీకు స్వాభావికమైన స్థితి లభిస్తుంది. అనగా, సగుణేశ్వరోపాసన వలన హృదయం పరిశుద్ధమౌతుంది. అట్టి శుద్ధసత్వము’యొక్క బలం చేత ప్రచండమగు (ఇప్పుడు శేషించియున్న) అజ్ఞాన వ్యామోహాన్ని జయిస్తావు. నాయనా! అప్పుడు శాస్త్ర - గురువాక్యాలపైన నీకు గురి కుదురుతుంది. అట్టి విశ్వాసము యొక్క బలంచే ‘ఇంద్రియాతీత మనో విభాగంచే ఇంద్రియ సహిత మనస్సును జయించటం...’ లేక 'యమము' అను మార్గాన్ని నీవు అనుసరిస్తూ ఉండు. రోజూ కొద్ది క్షణాలైనా మనస్సును సమాధానపరచి ఉంచి మనో సమాధానముఅనే సమాధిని ఆశ్రయించు.

‘ప్రత్యగాత్మ'...అని పిలువబడే సాక్షి చైతన్యమును ఆశ్రయించు. అప్పుడు తమో రజో గుణాచ్ఛాదన తప్పక తొలగుతుంది.

ఓ సర్వ ముముక్షువులారా! మీరంతా ఆ సర్వేశ్వరుని ప్రేమించండి. ప్రేమయే భక్తి. భక్తి రహితమగు కేవల పురుష ప్రయత్నముచే, కేవల కర్మానుష్ఠానంచే ఏం ప్రయోజనం? ఆ సర్వేశ్వరుని మహిమ చేతనే ఈ జీవుడు ఉత్కృష్టతను, వాంఛిత ఫలమును పొందుచున్నాడు.

నాభిజాత్యం, న చారిత్రం, న నయో న చ విక్రమః, బలవన్తి పురాణాని సఖే, కర్మాణి కేవలమ్॥

ప్రియమిత్రమా! ఒకడు ఎంతో గొప్ప జాతిలో పుట్టి ఉండవచ్చు. లేదా, ఆతనికి గొప్ప చరిత్ర ఉండవచ్చుగాక! సదాచారం, తపస్సు, పరాక్రమం మొదలైనవి ఎన్నో ఉండవచ్చు గాక! అంత మాత్రం చేత ఆతడు ఆత్మానుభవం పొందలేడు.

Page:528

భరద్వాజుడు : అదేమిటి స్వామీ ...?

శ్రీవాల్మీకి మహర్షి: అవును. ఎందుకంటే ఈ జీవుని పూర్వ సంచిత కర్మలు అంతులేనివై ఉన్నాయి. వాటిని జయించాలంటే తపస్సులు, సదాచారాలు ఏ మూలకి?

భరద్వాజుడు : మరెట్లా స్వామి?

శ్రీవాల్మీకి మహర్షి : అయితే, ఎవ్వరూ ఏమీ నిరుత్సాహపడవద్దు. సర్వేశ్వరుని పట్ల ప్రేమను పెంపొందిం చుకోండి. ఈశ్వరభక్తి యొక్క సహాయం లేకపోతే ఆత్మానుభవం లభించదు. భక్తి పరిపక్వమగుచుండగా జ్ఞానం వికసిస్తుంది. అట్టి సమూలాజ్ఞాన నాశనమగు జ్ఞానబలంతో ఆత్మానుభవంలో ప్రవేశించగలరు. కేవలం ఉపాసనకు పరిమితమైతే ఈశ్వరుడు కూడా నొసటన వ్రాయబడిన అజ్ఞానము' అనే అక్షరములను తొలగించలేడని కూడా గ్రహించు. కాబట్టి ఉపాసనతో బాటు యమనియమాదుల ద్వారా జ్ఞానం కూడా సంపాదించుకోవాలి.

ఈ లోకంలో గురువు చక్కగా బోధిస్తున్నాడు. శిష్యుడు ఆత్మ సమాచారాన్ని వింటున్నాడు. మంచిదే. ఇదంతా అవసరమే. అయితే మనోవాక్కులకు అగోచరమైన ఆ చిద్రహ్మమును బోధమాత్రంచే ఎరుక పరచగల గురువెక్కడ? వినుటలో మనోవాక్కులకు పరిమితమైతే, ఆ శిష్యుడు ఆ గురువుచే బోధించబడినంత మాత్రంచేత మోహలత ఉపశమిస్తుందా? లేదు.

ఎద్దానిచే ఈ గురు, శిష్య, శమ, దమ, ఉపాసనాది సామాగ్రి అంతా పరస్పరం కలుస్తుందో, అట్టి ఈశ్వరనియతి అనిర్వచనీయమైనది.

ఓ భరద్వాజా! ఏది ఎటైనా ఉండుగాక, ఈ జీవుడు ఈశ్వర స్వరూపుడేగాని ... ఏదో పరమాణువుల కలయిక అగు ఈ భౌతిక దేహమో, లేక వాసనల రూపమగు భావనల సంకలనమో కాదు. ఏ జీవుడు దేనిని ఎట్లు గ్రహించినా సరే... ఉన్న సత్యం మాత్రం ఇది. ఇది మా తపో-ధ్యానాదుల బలంతో గ్రహించాం. అందరికీ చెప్పుచున్నాం. ఇందుకు వేరుగా ఏ జీవునికి అనిపిస్తుందో ఆతడు ఉపాసన-భక్తి-వైరాగ్యాదుల సాధనలచే మనస్సును నిర్మలం చేసుకోవటానికి వెంటనే ఉపక్రమించాలి. రేపు - మాపు" అనుకుంటూ తాత్సారం చేయరాదు సుమా! నాయనా! వివేకముచే మోహమును మొదలంటా పెకలించివేసే ప్రయత్నమునకు సన్నద్ధుడవు కమ్ము.

ఒక మహారాజు ఉన్నాడు. ఆయన శాంతిసమయంలో మహాశయంతో ధనము, సేన సమకూర్చుకున్నాడు. ఇంకేం? ఇంక ఆయనకు దిగులు లేదు. అనుకోకుండా యుద్ధం చేయవలసి వచ్చినా, ఏదైనా సాధించవలసిన అగత్యం ఏర్పడినా ... ఆతడు సర్వ సమృద్ధితో సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కోగలడు. అంతేకాదు దుష్ట జనులను నిగ్రహించి చక్కగా ప్రజాపాలన చేయగలడు.

ఇంకొక రాజు ఉన్నాడు. ఈతడు ధనము - సైనిక బలము సమకూర్చుకోకుండా ఊరకే ఆట

- పాటలతో రోజులు - గడిపేస్తున్నాడు తనను పొగడే కొందరు వందిమాగధులకు ఉద్యోగం ఇచ్చి,

Page:529

వారు చెప్పే పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బవుతూ బలమును సమకూర్చుకోకుండా అంతఃపురంలో కూర్చుని ఆకస - పోకస కబుర్లు మాత్రం చెప్పుచున్నాడు. ఈతని గతి ఏమిటి? చిన్న సామంతరాజు ఎదురు తిరిగితే గుండె గుభేలుమంటుంది. మంత్రులకు, సేనానాయకులకు సర్ది చెప్పలేడు, శాసించలేడు. ప్రజాహిత కార్యక్రమాలు నిర్వర్తించే సరంజామా గాని, శ్రద్ధగాని లేదు. అప్పుడు ఆతని ప్రజలే ఆతనిని దుయ్యబట్టుచున్నారు.

నీవు మొదటి రాజులాగా తపస్సు - - భక్తి - ఉపాసన పెంపొందించుకుంటూ విషయములపై ప్రవేశించే మనస్సును ఆక్రమించివేయగల, జయించగల నిర్మల మనస్సును పెంపొందించుకోవాలి. అంతేగాని అది ఆయనకంటే లభించింది. మనకెట్లా?' అని తలచుచూ, కాలమును దిగులుతో వృథా చేసుకోవటం విజ్ఞుల లక్షణమే కాదు.

'ఆత్మానుభూతి' అను ప్రయోజనముగా గల బోధ స్వరూపం. ఈశ్వరోపాసన మొదలైన అనేక పుణ్యకార్యములకు అధీనమై ఉంటోంది. అనేక జన్మల ప్రయోజనంగా ప్రకటితమౌతోంది. జీవన్ముక్తుల అనుభవములకు సంబంధించిన అభిప్రాయములు పుణ్యవంతులగు ధీరులను మాత్రమే సమీపిస్తున్నాయి.

ద్విషద్భూతేన యేనైవ కర్మణా బంధ ఈదృశః సుహృద్భూతేన తేనైవ మోక్షమాప్స్యసి, పుత్రక!

బిడ్డా! ఏ కర్మ అయినా సరే, ... రాగముతో కూడుకొన్న వాడవై నిర్వర్తించావా ... అది నీకు ఒకనాటికి బంధమే కానున్నది. అట్లా కాకుండా రాగహితంగా సుహృద్భావ సమన్వితుడవై కర్మలు నిర్వర్తిస్తే, అవే కర్మలు నీ మోక్ష మార్గానికి దోహదపడతాయి. సజ్జనుల రాగరహితమగు సత్కర్మలన్నీ పూర్వసంచితమైన పాపకర్మలను నశింపజేస్తున్నాయి. వర్షం పడితే దావానలం ఉపశమిస్తున్నట్లు రాగరహిత పుణ్యకర్మలు ఈ జీవుల త్రివిధ తాపములను చల్లార్చుచున్నాయి. ఇక్కడ 'సంసారము’ అనే పెద్ద మహాచక్రం తిరుగాడుతోంది. అందులో ఈ జీవుడు చిక్కుకుని చెప్పనలవిగాని మానసిక తాపాలు అనుభవిస్తున్నాడు. తన బిడ్డలు దుఃఖస్థితులను గమనించిన ఆ సర్వేశ్వరుడు ఆధ్యాత్మ శాస్త్రమును ప్రకటించే ఉపనిషత్తులను, ఈ యోగవాసిష్ఠం వంటి గ్రంథాలను, ఆత్మతత్త్వాన్ని ప్రకటించే గురువులను ప్రసాదించారు. బ్రహ్మమునందు ఆసక్తిగలవారికి శాస్త్రములు - గురువుల సేవలు సిద్ధంగా ఉన్నాయి. కుమారా! ఈ 'సంసార చక్రము' అనే ఆవర్తము యొక్క భ్రమ నుండి నీవు బయల్వెడలదలచుకున్నావా? అయితే సత్వరంగా సమస్త కర్మలను కర్మఫలత్యాగ బలంతో, (లేక) సమర్పణ భావంతో వదలి, 'బ్రహ్మము'నందు అసక్తుడవై ఉండుము.

సముద్రం సంక్షోభంతో కూడి ఉన్నంతవరకు దానియందు చంచలత్వం ఉండనే ఉంటుంది. ఎప్పుడైతే జలము నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు ఆ సముద్రంలో తరంగాలన్నీ లయించి నిశ్చల - శాంతిజలము మాత్రమే ఉంటుంది. అట్లాగే బాహ్య విషయములందు చిత్తము చంచలంగా ఉన్నంతవరకు ఆ చిత్తంలో 'జగత్తులు' అనే వికల్పాలు లేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క చిత్తంలో ఎన్నెన్ని జగత్తులు సంస్కారరూపంలో దాగి, సమయంకోసం వేచి ఉన్నాయో... చెప్పనలవికాదు.

Page:530

వివేకదృష్టిని ఆచ్ఛాదించే 'శోకము' అను దానిని నీవెందుకు అవలంబిస్తావు చెప్పు? శోకాంధకారము అలముకుంటున్నప్పుడు 'అకుంఠిత ప్రజ్ఞ' అనే చేతి కఱ్ఱతో, ‘వివేకము’ అనే దీపంతో ముందుకు సాగాలిగాని, అంధకారంలో చతికిలబడి కూర్చోకూడదు. అనేక మంది జీవులు హర్ష - శోకములు అనే శుభాశుభ తరంగాలచే గడ్డిపరకలవలె ఎచటెచటికో కొట్టుకుపోబడుచున్నారు. మహాత్ముల మార్గం అదెన్నటికీ కాదు. నీవు మహాశయముతో మహాత్మత్వమును సంతరించుకోవటానికే ప్రయత్నించాలి. అంతేగాని అల్పాశయములతో అల్ప విషయములచే ఎందుకు ప్రభావితుడవై ఉండటం? బాలుర వంటి అనేకమంది సాంసారిక జీవులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే - ఆరు ఊర్ములు (కాళ్ళు) గల ఊయలలో హర్ష కోశాల మధ్య ఊయలలూగుచున్నారు. క్రీడా కుతూహలయగు 'కాలము' అనే ఆమె ఆయా జీవులను సృష్టించి పాలించి సంహరించి... తద్వారా ఆటాడుకుంటోంది.

కాలసర్పం ఈ జీవులను ఆక్రమించి ఈ అసంఖ్యాక భౌతిక దేహములను తనకు భక్ష్యంగా, మధుర ఉపాహారంగా చేసి వేసుకుంటోంది. ఆహారము కావటానికై పెంచే పక్షులవలె ఈ జీవులకు కొన్ని కాలగత హర్ష-శోకాదులను అందించి ఎప్పుడో సంహరించి దిగమ్రింగి వేస్తోంది. అటువంటి ఈ దృశ్య ప్రపంచంలో విశేష దృష్టిని, విశేష ధర్మము గాని, విశేష ధర్మిగాని లేదు. సర్వ జీవులను సమాన రూపంగానే ఆ కాలస్వరూపిణి భక్షించటం జరుగుతోంది. అల్పకాలస్థములగు మనుజదేహాల గురించి వేరే చెప్పేదేమున్నది? దీర్ఘ కాలస్థములగు దేవతల దేహములనే అది భక్షిస్తోంది కదా!

మరొక్క విషయం. ఈ దేహము - ఈ దేహంలో ప్రవర్తించే ఇంద్రియాలు తమ తమ విశేష ధర్మములతో, ఇంద్రియ విషయాలతో సహా కాలముచే ఎటుతిరిగీ మ్రింగబడబోతున్నాయి. మరి విపత్తియందు వ్యాకులమైన మనోభావాలు ఉండవలసిన అవసరమేమిటి? ఈ కాలక్రమంలో ఏర్పడే విషయాల పట్ల ప్రీతి కలిగియుండి సంసారనాట్యశాలలో వాటికి అనుకూలంగా నీవు ఇంద్రియ విషయ సమాచారములతో కూడి నృత్యం చేయవలసిన పనేమిటి? అందుచేత ఓ భరద్వాజా! నీవు క్షణకాలం ఆత్మస్వరూపమునందు నిశ్చలంగా ఉన్నవాడవై, అప్పుడీ సంసారనాటకమును చూడు. అదియే మరల మరల అభ్యాసం చేయి. క్రమక్రమంగా అదియే అనునిత్యత్వంగా

సంతరించుకొనుగాక!

అస్యానేక తరంగస్య జగతః క్షణభంగినః

న విషీదతి మనస్వీ భరద్వాజ! మనాగపి ॥

ఓ భరద్వాజా! క్షణభంగురమైన అనేక తరంగములో కూడిన ఈ జగత్తును గూర్చి వివేకియగు జీవుడు కొంచెం కూడా దుఃఖించడు.

త్యజ శోకం అమంగల్యం, మంగలాని విచిన్తయ | చిదానందఘనం, స్వచ్ఛం ఆత్మానం చ విభావయ ॥

Page:531

కనుక నీవు అమంగళమైనట్టి శోకమును త్యజించు. ఆత్మదర్శనసాధనములైన మంగళములను బాగుగా చింతన చేయి. చిదానందఘనము, స్వచ్ఛము అయినట్టి ఆత్మస్వరూపం గురించి బాగా విచారణ చేయి, దేవతల, బ్రహ్మాభ్యాసపరుల, గురువాక్యముల పట్ల శ్రద్ధచే పరిపూర్ణమైన చిత్తము కలవారు, వేద ప్రవచనములు ప్రమాణంగా కలవారు అగు మనుజులకు ఆ మహేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతోంది.

భరద్వాజుడు :

జ్ఞాతం తవ ప్రసాదేన సర్వమేతత్ అశేషతః

న వైరాగ్యాత్ పరో బంధుర్, న సంసారాత్ పరో రిపుః ॥

హే మహాత్మా! తమ అనుగ్రహం చేత నా అజ్ఞానం దేనిపట్ల ఎట్లా ఏర్పడియున్నదో గ్రహిస్తున్నాను. వైరాగ్యాన్ని మించిన బంధువు లేడు. సంసారాన్ని మించిన శత్రువు లేడు" అని గ్రహిస్తున్నాను. మునీంద్రా! శ్రీ వసిష్ఠ మహర్షి ఇప్పటిదాకా చెప్పిన జ్ఞానసారాన్ని ఒక్కసారి సమీక్షించి చెప్పవలసినదిగా నా ప్రార్థన.

శ్రీవాల్మీకి మహర్షి : ముక్తిదాయకమ్, మహాజ్ఞానమ్' అని చెప్పబడుదాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. విను. సంహృతిస్థితి సంభూతి భేదైరో కథా స్థితః, ఏకో పిసన్, నమస్తస్మై సచ్చిదానందమూర్తయే!

ఏ పరమాత్మ సర్వదా ఒక్కడే అయినప్పటికీ సృష్టి - - స్థితి సంహార భేదం చేత అనేక రూపములుగా ఉండి ఉన్నాడో అట్టి సచ్చిదానందమూర్తికి ఇవే నమోవాక్కులు.

ఈ కనబడే ప్రపంచమును తన కారణమునందు లయమొనర్చటంచేత ఏ విధంగా ఆత్మతత్త్వము ప్రకాశించగలదో ... అట్టి ఉపాయరూపమైన - ఇప్పటి వరకు జరిగిన సంవాదమును సంక్షేపంగా చెప్పుచున్నాను వినుఈ జీవుడు 'అహంకారము' అను ఒక కల్పితమును ఆశ్రయించుటచే ఆతని పూర్వాపర విచారయోగ్యమైన ఆత్మకు సంబంధించిన 'స్మృతి' ఆత్మయందు అప్రత్యక్షమై, దృశ్యమునందు ప్రవేశించి ప్రవర్తిస్తోంది.

అట్టి 'స్మృతి' యొక్క నిర్మలత్వము చేతనే సమస్తము స్వయంగా కరతలామలకమై గోచరించ గలదు. దేనిని పొందటం చేత ఈ జీవుడు మరల శోకించడో... అట్టి వస్తువు లభించేది ఎక్కడ? ఎక్కడో కాదు. స్వచిత్తమునందే, స్వయంగా విచారణ చేయటంచేత మాత్రమే లభించగలదు.

వైరాగ్యముతో కూడిన మనిషి ఈ క్రింది మార్గములలో ఆత్మతత్త్వమును ఎంత అధికంగా సాధ్యమైతే అంతగా విచారణ - విమర్శలు చేయవలసి ఉన్నది. 1. సత్సంగం, 2. సచ్ఛాస్త్రం, 3. స్వవివేకం.

Page:532

2. ఆత్మానంద సాగరం

శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఈ జీవుడు మొట్టమొదట అజ్ఞానపూరితములు, పరమ దుః ఖ పూరితములు అగు విషయేంద్రియముల మధ్య దేహధారినై చిక్కుకున్నాను - అని గుర్తించాలి. నేనెవరు? ఈ ఈ జగత్తంతా ఏమిటి? ఈ జన్మ - మృత్యు - జరా - వ్యాధి - దుఃఖములన్నీ ఎక్కడి నుండి వచ్చిపడుచున్నాయి? - అనే ప్రశ్నలకు రావాలి. 'నా దృష్టి అపవిత్రమై ఉండుటచేతనే నాకు ఈ దుఃఖాదులు దాపురిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దానిని పవిత్రపరచి జ్ఞాన విశేషాలతో నింపివేయాలి.” అని మహత్తర కార్యక్రమమునకు సంసిద్ధుడు కావాలి.

ఇంద్రియ విషయములకై అఱ్ఱులు చాచే మనస్సును కించిత్తు శాంతపరచాలి. ఇంద్రియాలను విషయాల నుండి మరల్చటానికై వాటిని దమింపజేయాలి. శమము, దమము మొదలైన శాస్త్ర విహిత ఉపరతి కార్యక్రమాలు చేపట్టాలి. నిషిద్ధ కామ్యకర్మల నుండి, విషయేంద్రియ సంయోగంచే కలిగే సుఖాభాస నుండి విరతుడై స్వస్వరూపాత్మ వైపుగా దృష్టి సారించాలి.

శ్రద్ధావంతుడై మృదువైన ఆసనమును ఆశ్రయించాలి. ఇంద్రియములను జయిస్తూ ఈ మనస్సు ప్రసన్నమయ్యేంత వరకు 'ఓం'కారమును ఉచ్చరించాలి. అట్లాగే అంతఃకరణ శుద్ధికొరకై ప్రాణాయామము మొదలైనవి ఆచరించాలి. క్రమంగా మెల్ల మెల్లగా ఇంద్రియములను విషయములనుండి తొలగించాలి.

దేహము - ఇంద్రియములు - మనస్సు - బుద్ది - జీవుడు వీటన్నిటి యొక్క చమత్కారమంతా దేనినుండి కలుగుతోందో అట్టి అధిష్ఠానమగు ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆ ఆత్మయందు తదితరమైనదంతా లయం చేస్తూ రావాలి.

విరాజి ప్రథమం స్థిత్వా తత్రాత్మని తతః పరం అవ్యాకృతే స్థితః పశ్చాత్, స్థితః పరమకారణే॥

అ : మొట్టమొదట ‘అ కారవాక్యమైనట్టి 'స్థూలభూత సమష్టి రూపమైన విరాట్టును నేనే' అనగా, ‘ఈ స్థూలరూప బ్రహ్మాండముల ఉనికికి కారణకారణం నా అంతర్యామి స్వరూపమే' అని భావన చేయాలి.

ఉ : ఆ తరువాత ఆ 'విరాట్టు అహంభావన’ను '' కారవాచ్యమగు 'సూక్ష్మభూత సమష్టిరూపము’ అయిన హిరణ్యగర్భ జ్ఞానమునందు లయం చేయాలి. అనగా 'అట్టి సూక్ష్మభూత సమష్టి రూపహిరణ్యగర్భుడగు జ్ఞానిని నేనే' అను అహంభావనను ఆశ్రయించాలి.

మ : అప్పుడిక ఆ సమష్టి మనోరూపమును అద్దానికి కారణమైయున్న 'మ' కార్యవాచ్యమైనట్టి ‘వ్యాకృతము’ నందు లయం చేయాలి. అనగా, 'స్థూల సూక్ష్మముల ఉభయములకు ఆశ్రయమైయున్న సాక్షితత్త్వమే నేను’..... అను రూపమైన అహంభావనను ఆశ్రయించాలి. అనంతరం ఆ మాయా

Page:533

వ్యాకృతము కూడా అర్ధమాత్ర వాచ్యము - - పరమకారణము అయిన శుద్ధబ్రహ్మమునందు లయం చేసి ... ఇక ఆపై ఆ శుద్ధ బ్రహ్మమునందే స్థితి కలిగి ఉండాలి.

ఏది ఎందులోంచి వస్తే చివరికి అది అందులో లయం కావలసిందే కదా....అందుచేత ఉత్కృష్టులగు ఉద్దాలకుడు వంటి నిర్వాణయోగుల సంయోగసాధన గురించి విను.

ఈ దేహము యొక్క 'మాంసము' మొదలైన పృథివీ సంబంధ (పార్థివ సంబంధ) విభాగములను పృథివీతత్వంలో లయం చేయాలి. అనగా, దేహమును తదితర విరాట్ పృథివీతత్వంలోని ఒక చిన్న విభాగంగా దర్శించాలి. ఈ దేహమును తదితర బ్రహ్మాండముల వలెనే తనకు బాహ్యమైన ఒక భౌతిక పదార్థంగా దర్శించాలి.

అట్లాగే .జల సంబంధమైన రక్తాదులను జలతత్వంలో, తేజోసంబంధమైన విభాగమును తేజోతత్త్వంలో, వాయుసంబంధ విభాగమును వాయువులో, ఆకాశసంబంధమైన విభాగమును ఆకాశంలో లయం చేయాలి. అనగా, అవన్నీ వాటివాటి తత్త్వములుగా చూడసాగాలి.

అదే విధంగా ఘ్రాణము, కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియములను తమ తమ కారణములగు దేవతోపాధిభూత సూక్ష్మతత్త్వములందు లయం చేసివేయాలి. వీటినన్నిటినీ ఆయా అధిదేవత సొత్తుగా, ప్రదర్శనగా గాంచాలి. అనగా ... అన్నిటికీ కర్త అయిన ఈ జీవుని యొక్క చెవులు, కళ్ళు, ముక్కు మొదలైన ఇంద్రియములలో ఆయా దేవతలు అధివసిస్తున్నారు కదా! కనుక ఇంద్రియ భావములన్నీ ఆయా అధిదేవతలకు సమర్పణ చేయాలి.

ఎట్లా అంటే ...

శ్రోతేంద్రియము (చెవులు)ను దిగ్దేవతలయందు (దిగ్దేవతల ప్రదర్శనా చమత్కారంగా) త్వక్ఇంద్రియాన్ని (చర్మం, స్పర్శను) విద్యుత్ తేజోశక్తియందు,

నేత్రేంద్రియమును (కళ్ళు) సూర్య బింబమునందు,

జిహ్వేంద్రియమును వరుణుని యందు,

ప్రాణమును వాయువునందు,

వాక్కును అగ్నియందు

హస్తేంద్రియము (చేతులను) ఇంద్రునియందు

పాదేంద్రియమును (కాళ్ళను) విష్ణువునందు,

గుదేంద్రియమును మిత్రునియందు

ఉపస్థేంద్రియమును కశ్యపునియందు,

మనస్సును ... చంద్రునియందు

బుద్ధిని బ్రహ్మదేవునియందు

...లయింపజేయాలి. వీటన్నిటినీ ఆయా అధిదేవతల సొత్తుగా, సమర్పిత భావనతో దర్శనం

చేయాలి.

Page:534

ఓ భరద్వాజా! వాస్తవానికి ‘ఇంద్రియములు... అనబడే వేఱు వస్తువులేవీ లేవు. ఆ దేవతలే ఈ దేహంలో 'ఇంద్రియములు' అనే మిషచే స్థితినొందియున్నారు. ఈ వాక్యాలు నేను శ్రుతి వాక్యములను అనుసరించే చెప్పుచున్నాను గాని, ఏదో స్వకపోలకల్పితం కాదు.

ఈ విధంగా మనుజుడు ఈ తన దేహమును అద్దాని కారణమున లయింపజేసి "నేను విరాట్ పురుషుడను..... అని భావనచేయాలి. నాయనా! ఈ సమస్త భూతములకు ఆధారం, కారణం కూడా సర్వ బ్రహ్మాండములకు ప్రభువైనవాడు, అర్ధనారీశ్వర స్వరూపుడు అగు ఆ ఈశ్వరుడే సుమా! ఇదంతా ఆయనదే అయి ఉన్నది. కనుక ఆయనకు సమర్పించడంలో కష్టమేమున్నది? ఆతడే తన యజ్ఞసృష్టి రూపములలో ఈ జగద్వ్యవహారమునందు అంతటా స్థితి కలిగియున్నాడు. ఇక్కడ కొన్ని శ్రుతి ప్రతిపాదిత సృష్టి చమత్కారాలు పురశ్చరణ చేద్దాం!

ఈ బ్రహ్మాండమునకు బాహ్యమున దీనికి రెండింతలు పృథివీతత్వమున్నది. అట్టి పృథివికి ఆవల, దానికి రెండింతలు జలతత్త్వమున్నది. జలమునకు ఆవల రెండింతలు తేజము ఉన్నది. తేజమునకు ఆవల రెండింతలు వాయువు ఉన్నది. వాయువుకు ఆవల రెండింతలు ఆకాశము ఉన్నది... ఈ విధంగా ఉత్తరోత్తరక్రమముచే ఒకదానికంటే మరొకటి ద్విగుణీకృతమై ఉంటోంది.

ఈ ప్రపంచమంతా కూడా 1. పంచీకృతము, 2. అపంచీకృతము అగు భూతములచే నిండి ఉంటోంది. అందుచేత ఆత్మతత్వమును ఆశ్రయించాలనుకునే యోగి పృథివిని దానికి కారణమైన జలమునందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును సమస్తోత్పత్తికి కారణమగు హిరణ్యగర్భాశయమునందు లయమొనర్చి వేయాలి.

లింగ శరీరం - 1. వాసనలు, 2. సూక్ష్మభూతములు, 3. కర్మ, 4. అవిద్య, 5. దశేంద్రియములు, 6. మనస్సు, 7. బుద్ధి ... ఇవన్నీ చేరినదానినే పండితులు 'లింగశరీరం' అని పిలుస్తున్నారు.

ఈ విధంగా స్థూలోపాధియొక్క భావనావిలయముచే ఆ యోగి అర్థరూపము పొందినవానివలె ఉంటున్నాడు. ఆ తరువాత 'బ్రహ్మాండాభిమానత్యాగముచే ఆతడు ఈ బ్రహ్మాండ వ్యవహారము నుండి బహిర్భూతుడౌతున్నాడు. అప్పుడు సూక్ష్మభూతాత్మకమైన సమష్టిలింగదేహమున 'నేను సర్వమునకు అధిష్ఠానమగు హిరణ్యగర్భుడనే'.... అని భావన (లేక) చింతన చేయాలి.

ఈ సమష్టి భూతాభిమానియే ప్రప్రథమంగా 'చతుర్ముఖ బ్రహ్మ...' అను రూపమున వ్యవస్థితుడై ఉన్నాడు. అట్టి లింగశరీరాన్ని కూడా ...దానికంటే కూడా సూక్ష్మమై అద్దానికి కారణభూతమైయున్నట్టి అవ్యాకృతము ...అని చెప్పబడుదానిలో ఆ బుద్ధిమంతుడు లయం చేయుగాక!

అవ్యాకృతం - దేనియందైతే ఈ సమస్తమైన జగత్తు కలదో ... అట్టి అవ్యాకృతం, లేక అవ్యక్తము నామరూపరహితమైనది. దానినే కొందరు 'ప్రకృతి' అని, మరికొందరు 'మాయ' అని ఇంకొందరు 'పరమాణుతత్త్వము' అని చెప్పుచున్నారు. అట్లాగే ఇంకాకొందరు తార్కికులు (బౌద్ధులు మొదలైనవారు) ఆయా తర్కములచే ఏర్పరచుకున్నవారే అదే 'సంవృతరూపము’ అని, అవిద్య అని

Page:535

ప్రతిపాదిస్తున్నారు. ప్రళయకాలంలో అద్దానియందే సమస్త పదార్థభావములు లయించి అవ్యక్తరూపంలో ఉంటున్నాయి. మరల సృష్టి ప్రారంభమయ్యే వరకు అవి అవ్యక్తమునందే పరస్పర సంబంధరహితములై ఉంటున్నాయి.

అనగా ... జగత్ సంబంధిత భావనలన్నీ తమ తమ భోగ్యత్వరూపాన్ని కోల్పోయి చిత్ స్వరూపం సంతరించుకుంటున్నాయి. మరల సృష్టి ప్రారంభంలో చిత్ నుండే ఉత్పన్నమౌతున్నాయి. అధ్యారోప (లేక, అనులోమ) క్రమం చేత అవ్యక్తం నుండి అవి సృష్టిగా అగుచున్నాయి. అపవాద (లేక, ప్రతిలోమ) క్రమముచే సమస్తము అద్దానియందే లయిస్తున్నాయి. స్థానత్రయాతీతమైన తురీయపద ధ్యానం

1. విరాట్ 2. హిరణ్యగర్భ 3. అవ్యాకృతం

{ 1. స్థూలం 2. సూక్ష్మం 3. కారణం }

{ 1. జాగ్రత్ 2. స్వప్నం 3. సుషుప్తం }

ఈ త్రిపుటీ సమూహములను జయించి నీవు నాశరహితమగు తురీయ పదమును ధ్యానించాలి. అట్టి తురీయపద ప్రాప్తి కొరకై 'చరమ సాక్షాత్కార వృత్తి'చే లింగ దేహమును కూడా వలయమొనర్చాలి. అనగా 'ధ్యాన - కర్మ - కరణ'వృత్తి రూపమగు లింగ దేహమును కూడా 'మూలాజ్ఞాన త్యాజ్యము’ అను సాక్షాత్కారవృత్తిచే శుద్ధబ్రహ్మమునందు విలయమొనర్చాలి. కుండ పగిలితే కుండలోని ఆకాశం మహాకాశంలో విలీనమౌతుంది చూచావా? అట్లాగే నీవు నిరతిశయానందరూపమగు పరబ్రహ్మమున ప్రవేశించెదవు గాక.

పంచభూతములు - మనస్సు, బుద్ధి, వాసన, కర్మ, ప్రాణవాయువులు... వీటన్నిటి యొక్క ప్రతిష్ఠ అజ్ఞానమే అయి ఉన్నది. శుద్ధ బ్రహ్మమున అజ్ఞాన రూపావరణ ఏర్పడుచటే అది తనకు తానే మొట్టమొదట అవ్యాకృతంగాను, ఆ తరువాతనే సూక్ష్మభూతలము ద్వారా లింగ శరీరంగాను జనిస్తున్నది. కనుక లింగ శరీరమునకు అజ్ఞానమే మూల ప్రతిష్ఠ. అజ్ఞాన నివృత్తిచే లింగ శరీరం అనే విశృంఖలములు తప్పకుండా స్వయంగా విచ్ఛిన్నమగుచున్నాయి.

భరద్వాజ మహర్షి : హే మహర్షీ ! యొక్క చెప్పే మహత్తరమైన అవ్యాకృతాతీత తురీయస్థితి గురించిన విశ్లేషణా ప్రభావం చేత నేనిప్పుడు లింగ శరీర విశృంఖలముల నుండి సర్వదా విముక్తుడనైనాను. చిద్రూపసాగరమున ప్రవేశించిన వాడనైనాను. అట్టి చిద్రూపసాగరంలో అభేదం’ పొందటం చేత సర్వోపాధివర్జితుడనగు పరమాత్మయే అయి ఉన్నాను. ఇట్టి "ఐక్యకూటస్థాత్మ” గురించి ఇతఃపూర్వం శ్రుతులు చెప్పగా విన్నాను. ఇప్పుడు మీ కృపచే తదనుభవజ్ఞుడనగుచున్నాను. అగ్నిలో వేయబడిన అగ్ని ఆ అగ్నితో ఐక్యం పొందినప్పుడు తన్మయత్వముచే 'అగ్ని' అనే పేరుతోనే చెప్పబడుతుంది కదా! అట్లాగే నా విశేషరూపం మరింకే పేరుతోనూ చెప్పబడటం లేదు. అది

Page:536

'పరమాత్మయే' అనబడుతోంది. లవణ సముద్రంలో పడిన తృణ - కాష్ఠాదులు (గడ్డిపరక కట్టె మొదలైనవి) లవణ మయమే అవుతాయి కదా! అట్లాగే అచేతనమగు ఈ జగత్తు చైతన్యమునందు లయమొనర్చబడిప్పుడు ఇది కూడా చైతన్యమే అగుచున్నది.

ఒక సైంధవ లవణపు బొమ్మ (ఉప్పుబొమ్మ) ఉన్నది. అది సముద్రపు లోతు ఎంతో కొలవటానికి బయలుదేరి, సముద్రంలో ప్రవేశించింది. అప్పుడేమౌతుంది. ఆ ఉప్పుబొమ్మ జలంలో ప్రవేశించగానే జలరూపంగా అయి తన నామరూపములు కోల్పోతుంది. పాల సముద్రంలో పోయబడిన పాలు ఇక క్షీరంగానే మారుతుంది. కడివెడి నేతిలో కలుపబడిన నేతిబొట్లు నేతిరూపమే అగుచున్నాయి. ఈ జలాదుల ఉపాధులన్నీ (మంచుగడ్డలన్నీ) జలంలో ప్రవేశిస్తే జలమే అవుతున్నాయి. అట్లాగే నేను కూడా సత్స్వరూపమగు చైతన్యమున ప్రవేశించి, చైతన్యరూపుడనై వెలయుచున్నాను.

నిత్యానందే సమస్తజ్ఞేష పఠే, పరమకారణే,

నిత్యం, సర్వగతం, శాంతం, నిరవద్యం నిరంజనమ్ || నిష్కలం, నిష్క్రియం, శుద్ధం, తద్భహ్మాస్మి పరం పరమ్|| హేయోపాదేయ నిర్ముక్తం, సత్యరూపం, నిరింద్రియం|| కేవలం సత్య సంకల్పం శుద్ధం బ్రహ్మాస్మ్యహం పరమ్, పుణ్యపాప వినిర్ముక్తం కారణం జగతః పరం॥ అద్వితీయం పరంజ్యోతిర్ బ్రహ్మస్మ్యానన్దమవయం, ఏవమ్ ఆది గుణైర్యుక్తం సత్వాది గుణవర్జితమ్, ప్రవిష్ఠం సకలం బ్రహ్మ సదాధ్యాయేత్స్వకర్మకృత్॥

నిత్యానందరూపమై, సర్వజ్ఞమై, సర్వసాక్షియై పరమ కారణమైనట్టి పరబ్రహ్మమునందు నేను. నిత్యమై, సర్వ వ్యాపకమై, శాంతమై, దోషరహితమై, నిరంజనమైనట్టి బ్రహ్మరూపుడనై ఉన్నాను. నిష్కళమై, నిష్క్రియమై, హేయ ఉపాధేయ రహితమై, సత్యరూపమై, ఇంద్రియరహితమైనట్టి శుద్ధబ్రహ్మమే నేను. నా స్వరూపం కేవలమై సత్య సంకల్పయుతమై, పుణ్య-పాప వర్జితమై, జగత్తు యొక్క పరమకారణమై, శుద్ధమైనట్టి పరబ్రహ్మమే అయి ఉన్నది. నేను అద్వితీయమై, నాశనరహితమై, పరమప్రకాశమైనట్టి అవ్యయానంద బ్రహ్మమునే అని అనటంలో నాకు సందేహమే లేదు. నా స్వరూపం సత్య సంకల్పాది సౌరభ్యంతో కూడి ఉన్నది. మాయికములైనట్టి సత్వ-రజో-తమో గుణములు లేవు. సర్వ రూపమైనట్టి బ్రహ్మమగు నా స్వరూపమే సాధకులందరికి శ్రవణ-మననాది స్వకర్మలచే ఆరాధనార్హమైయున్నది.

ఈ విధంగా నేను బ్రహ్మమును ధ్యానించటం, అభ్యసించుట చేత నా మనస్సు ఆ బ్రహ్మమునందే లయం పొందుతోంది. మనస్సు లయించగానే నేను స్వయాత్మ స్వరూపుడనై అన్ని వైపులా ప్రకాశిస్తు న్నాను. ఆనందరూపమగు ఆత్మ ప్రకాశిస్తూ ఉండగా ఇక సమస్త దుఃఖాలు అనే క్రీనీడలు స్వయంగా తొలగిపోతున్నాయి. అప్పుడు ఆత్మ సహజసిద్ధమగు తన ఆనందరూపమును పొందుతోంది.

Page:537

ఓ గురువర్యా! నా కంటే వేరైన సచ్చిదానందమయుడగు ప్రభువు మరొకడెవడూ లేడు. 'నేనొకడనే పరబ్రహ్మమును' అని నా సర్వరూపాత్మ లోలోన అనుభవించుచున్నది. ఎందుకంటే, తదితరులంతా నా స్వరూపులే!

శ్రీవాల్మీకి మహర్షి :

సఖే! సంన్యస్య కర్మాణి బ్రహ్మణః ప్రణయీ భవ నేష్యేసే యది సంసారచక్రావర్త భ్రమః శమమ్||

ఓ సఖుడా! నీ స్వస్వరూపము అంతటిదే! ఇందులో సందేహమే లేదు. సర్వ కర్మలు పరిత్యజించినవాడవై, బ్రహ్మప్రాప్తియందే ఏర్పడి ఉండుము. ఈ 'సంసారచక్రము'అనే పెద్ద ఆవర్తము భ్రమవంటిది మాత్రమే. ఇందులో ఏదో పొందవలసియున్నది...' అని అల్పభ్రమను ఆశ్రయించకుండా ఉన్నావా...నీ బ్రాహ్మీస్థితికి రాగల లోటేమీ ఉండదు.

భరద్వాజుడు : గురుదేవా! తాము వచించిన జ్ఞానమంతా తమ కృపారసం చేత నేను గ్రహించాను. తమ అనుగ్రహంచేతనే నా బుద్ధి నిర్మలమైనది. ఇక ఈ 'సంసారభ్రమ' గురించి తెలుసుకొని ఉండటంలో ఏమాత్రం జంకుగాని, అనుమానం గాని, ఆలస్యంగాని నాకు లేవు. అయినా కూడా 'జ్ఞాని’ యొక్క కర్మ విశేషములు ఎట్లా ఉంటూ ఉంటాయో మరల మీ నుండి వినాలని అభిలాష మాత్రం ఉన్నది. ప్రభూ! ఆతని కర్మ ప్రవృత్తి రూపంలో ఉంటుందా? లేక నివృత్తి రూపంలో ఉంటుందా? లేక ఆతనికి కర్తవ్యమంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదా? ఈ విషయంలో మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి నాకు తెలియజేయండి.

శ్రీవాల్మీకి మహర్షి :

తస్మాత్ యన్నకృతే దోషః తత్కర్తవ్యం ముముక్షుభిః, కామ్యం కర్మ నిషిద్ధిం చ న కర్తవ్యం విశేషతః |

ఓ భరద్వాజా! సమస్తము త్యజించి బ్రహ్మము గురించి మాత్రమే అభ్యాసపరుడవై ఉంటే కాలక్రమంగా సంసారమును జయిస్తావు. సంసారభ్రమ నివర్తకం" అనేది లభించాలంటే సమస్తం త్యజించి బ్రహ్మమును గూర్చిన అభ్యాసమునే ఆశ్రయించాలి. అందుచేత ఏ కర్మలు ఆచరిస్తే దోషమేదీఉండదో...అవియే ముముక్షువులు ఆచరించతగినవై ఉంటాయి. ఇంతకు మించిన కామ్య - - నిషిద్ధ కర్మలు ముముక్షువులు విశేషంగా ఆచరించవలసిన పని లేదు. దేహమునకు, మనస్సుకు బ్రహ్మమునకు వేరువేరైన చమత్కార ధర్మములు ఏర్పడి ఉన్నాయి.

1. దేహ గుణములు (లేక) దేహ ధర్మములు : ఈ దేహము ప్రకృతిచే నిర్మించబడి ప్రకృతి చేతనే ఉపసంహరించబడుతోంది. దీనికి బాల్యయౌవన వార్ధక్యాలున్నాయి. అనుక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. పరమాణువుల సంయోగ వియోగాలచే ఇది వృద్ధి, క్షయాలు పొందుతోంది.

2. మనో గుణములు (లేక) మనో ధర్మములు : ఇది ఏది ఎట్లు ఎంతకాలం ఏ రీతిలో ఆశ్రయిస్తే అద్దానిని అట్లే అంతకాలం ఆ రీతిలోనే పొందుతూ ఉంటుంది. అల్పకాలిక విషయములను

Page:538

ఆశ్రయిస్తే అల్పత్వం పొందుతోంది. గుప్తము - శాశ్వతము అగు ఆత్మను ఆశ్రయిస్తే ఆత్మత్త్వము సంతరించుకుంటోంది.

3. బ్రహ్మము యొక్క ధర్మములు : ఆత్మ (లేక) బ్రహ్మము స్వయంజ్యోతి స్వరూపం. అఖండం. అప్రమేయం. నిత్యనిర్మలం, సత్యం. కారణ-కారణం. అంతటా ఏర్పడి వ్యాపించి ఉన్నది.

ఈ జీవుడు ఎప్పుడైతే దేహం యొక్క మనస్సు యొక్క గుణాలను వదలి బ్రహ్మం యొక్క 'సత్-చిత్-ఆనందం' అనబడే గుణములతో కూడుకొని ఉంటాడో... అప్పుడు సమస్త ఇంద్రియములు కర్మల పట్ల నిరంజనం, నిరాకారత్వం, నిర్వికారత్వం వహించి ఉంటాయి. ఆ జీవుడి పట్ల ఇంద్రియత్వం శమించటం చేత, ఇక ఆతడు సర్వవ్యాపియగు ప్రభువై ఉంటాడు. అట్టి వానిని ఆతని కర్మలు అంటవు. అవి అతనిని నిర్వచించలేవు.

జీవుడు - విముక్తుడు : ఎప్పుడీ జీవుడు విముక్తుడు (లేక) విముచ్యుడు అయి ఉంటాడో అదిప్పుడు చెప్పుచున్నాను విను.

దేహేంద్రియమనోబుద్ధేః పరస్తస్మాచ్చ యః పరః,

సో హమస్మి యదా ధ్యాయేత్ తదా జీవో విముచ్యతే॥ కర్తృత్వ=భోక్రాది నిర్ముక్తః సర్వోపాధి వివర్జితః, సుఖదుఃఖ వినిర్ముక్తస్తదానీం విప్రముచ్యతే॥ సర్వభూతేషుచ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, యదా పశ్యతి అభేదేన తథా జీవో విముచ్యతే॥

జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్యాం హిత్వాస్థానత్రయం యదా

విశేత్ తురీయమానందం తదా జీవో విముచ్యతే॥॥

'ఈ దేహ -ఇంద్రియ మనో - - బుద్ధుల కంటే పరమై, అన్నమయ - ప్రాణమయ -

మనోమయ - - విజ్ఞానమయ కోశములకంటే విశిష్టమైన ఆనందమయకోశం' ఉన్నది. ఆ ఆనందమయ కోశమునకు కూడా పరమై బ్రహ్మము ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను ... అను ధ్యానం చేత అతడు విముక్తుడౌతాడు.

ఎప్పుడైతే "నేను కర్తృత్వ - - భోక్తృత్వ రహితుడను. సర్వ ఉపాధులలో ఉండికూడా, సర్వ ఉపాధులను త్యజించినదై, సర్వదా వాటినన్నిటికీ అతీతమై ఏ బ్రహ్మమున్నదో ... అదే నేను...” అని గ్రహిస్తూ ఉంటాడో అప్పుడు సుఖ దుఃఖముల నుండి విడివడినవాడై విముచ్యుడౌతాడు.

"ఈ సమస్త జీవజాలాలో నేనున్నాను. ఇవన్నీ నా ఆత్మయందే, ఆత్మగానే ఉన్నాయి. అందుచేత ఒక జీవునికి మరొక జీవునికి భేదమే లేదు. నాతో సహా ప్రతి ఒక్క జీవి స్వయంగా ఆత్మయే అయి ఉండగా...ఇక ఇక్కడ అభేదమే సిద్ధిస్తోంది గాని భేదము కాదు... అను అనుభవాన్ని ఆశ్రయించి ఉన్నవాడు సంసార విముక్తుడు స్వభావ సిద్ధంగా అగుచున్నాడు.

Page:539

ఏ జీవుడైతే “నేను జాగ్రత్ సంవిత్తు కాదు. స్వప్న సంవిత్తు కాదు. సుషుప్త సంవిత్తు కూడా కాదు. అందుచేత ఈ మూడు అవస్థలను ఇక్కడే ఉండనిచ్చి, ఈ మూడింటికి ఆవల ఉన్న తురీయమునందు ఏర్పడి ఉంటున్నాను అను నిత్య సంస్థితానుభవమును సంతరించుకుంటున్నాడో, ఆతడు మాయ నుండి ఇట్టే విడివడుచున్నాడు. అట్టి తురీయమే ఈ జీవుని యొక్క పరమాత్మయందలి స్థితి. అద్దానిలో ఈ జాగ్రత్-స్వప్న సుషుప్త బీజవాసనలు లేవు. ఎందుకంటే అది స్వతః నిర్మలమైనది, స్వయంప్రకాశమైనది, సర్వమును వెలిగించునది కూడా. అది 'నిద్రాణవిరహితం' అని విజ్ఞులు ఎఱుగుచున్నారు. కర్మ-అజ్ఞానము మొదలైనవి అందులేవు. అది సుషుప్తికంటే కూడా పరమైనది. చైతన్య సుఖ సమన్వితమైయున్నది.

ఆ మహత్తర సుఖానుభవమే భక్తియొక్క యోగము యొక్క విచార మాత్రజనితమైన సాక్షాత్కారము యొక్క పరాకాష్ఠ.

ఏ జీవునికైనా సరే, ఆ తురీయ సంస్థితమునందు మాత్రమే వాస్తవమైన సుఖవిశ్రాంతులు లభిస్తున్నాయని కర్మ-భక్తి-యోగ-జ్ఞాన సాధకులందరు ముందుగానే గ్రహించి ఉండెదరు గాక! తరంగములు శమిస్తే ఇక సముద్రమంతా నిండి ఉండేది జలమే కదా! ఆత్మామృత సముద్రంలో మనస్సు లయించగా, అట్టి మనుజునికి ఆత్మ తప్ప మరింకేదీ గోచరించదు. అట్టి వానినే 'ఆత్మజ్ఞుడు. ఆత్మను మాత్రమే ఎరుగుచున్నవాడు' లేక 'ఆత్మ సంవిత్తు' అని పిలుస్తున్నాం.

ఓ భరద్వాజా! మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అట్టి ఆత్మ రూపమహాసముద్రంలోనే నీవు స్నానమాడాలి. అంతేగాని ద్వైతరూప ఉప్పు సముద్ర తరంగాలలో దూకవలసిన పనేమిటి చెప్పు? భరద్వాజుడు : అట్టి జ్ఞానస్థితి నాకు సులభతరమయ్యేదెట్లా? శ్రీవాల్మీకి మహర్షి :

మజ్జమజ్జసి కిం ద్వైతగ్రహక్షారాబ్ది వీచిషు

భజ సంభరితాభోగం పరమేశం జగద్గురుమ్॥

ఆ జగద్గురువగు పరమేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించుట కొరకై 'అర్ధనారీశ్వరుడు' మొదలైన ఆయా రూపములను ధరించి భక్త జనులకు జ్ఞానము ప్రసాదిస్తున్నాడు. అట్టి సర్వాత్మకుని ఆయా అనుకూలరూపంతో జ్ఞాన సిద్ధి కొరకై భజించు, అర్చించు. అర్చనాదులచే భక్తి ప్రవృద్ధమగుచుండగా జ్ఞానము వికసించి జ్ఞానసిద్ధిచే చిదానందమగు తురీయమునుండి ఏర్పడి ఉండగలుగుతావు. అంతేని, ఈ ద్వైతరూప క్షార సముద్రంలో మునుగవలసిన పనేమిటి?

పుత్రకా! భరద్వాజా! ఈ విధంగా శ్రీవసిష్ఠ మహర్షి విశ్వామిత్ర - నారదాది మహర్షులు, సిద్ధులు, తదితర మహనీయులు వేంచేసియున్న ఆ దశరథ మహారాజు యొక్క నిండు సభలో శ్రీరామచంద్రునికి ఇప్పటివరకూ చెప్పియున్న ఉపదేశమంతా పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చాను. దీనినంతా నీవు జ్ఞానమార్గంచేత, యోగమార్గం చేత చక్కగా నిశ్చయరూపంగా ఎఱుగుము.

Page:540

ఎందుకంటే శాస్త్ర విచారణ చేతను, గురువాక్యముల అర్థము ఎఱుగుట చేతను, అభ్యాస యోగము చేతను సమస్త జ్ఞానము యొక్క సిద్ధి లభించగలదు.

తస్మాత్ త్వమ్ సర్వముత్సృజ్య కుర్వభ్యాసే స్థిరం మనః ॥

కాబట్టి నీవు సర్వమును త్యజించి అభ్యాసయోగం చేత మనస్సును స్థిరపరచుకో. అప్పుడు తా నీకు స్వయంగానే అత్యంత సులభంగా కరతలామలకమవగలదు.

3. రామానంద సాగరం

భరద్వాజుడు : ఓ మునీశ్వరా! ఆ శ్రీరామచంద్రుడు శ్రీ వసిష్ఠ మహర్షి బోధించిన జ్ఞానయోగములను ఆలకించినవాడై సమాధిలో ప్రవేశించి ఈ ఉపాధి మొదలుగా గలవాటికి పరమైనట్టి బ్రహ్మముతో ఏకత్వము అనుభవిస్తు ఉపాధితో అసంబధిత్వము దర్శిస్తున్నాడు కదా! అట్టి రామచంద్రుని వసిష్ఠమహర్షి మరల ఏ విధంగా వ్యవహారపరునిగా తీర్చిదిద్దారు? ఈ విషయం చెప్పండి. ఈ విషయం ఎఱిగి నేను కూడా శ్రీరామచంద్రుని వలెనే బ్రహ్మాభ్యాసిని, దేహవ్యవహార నిర్వహణవర్తిని కూడా అయి ఉంటాను. 1. సమాధి 2. సమాధి యొక్క వ్యుత్థాన కాలము ... ఈ రెండింటినీ చక్కగా నా పట్ల సమన్వయించుకోగలుగుతాను.

శ్రీవాల్మీకి మహర్షి : అవును. ఆ విషయం ఇప్పుడు సుసందర్భమైన విషయం. విను. చెపుతాను.

మహామనస్వి, అపరిచ్ఛిన్న బ్రహ్మాకార చిత్తుడు, శుభాచరణశీలుడు అగు ఆ శ్రీరామచంద్రుడు అఖండ-అప్రమేయ-నిర్వికల్ప స్వరూపమునందు పరిణతి చెందియున్నాడు కదా! అప్పుడు ఋషిసత్తముడైన శ్రీవసిష్ఠ మహర్షితో శ్రీవిశ్వామిత్ర మహర్షి ఇట్లా పలికాడు.

శ్రీవిశ్వామిత్ర మహర్షి : హే మహాభాగా! బ్రహ్మపుత్రా! శ్రీ వసిష్ఠ మునీంద్రా! తమ అనుగ్రహదృష్టిమాత్రం చేత మీరు మీ ప్రియ శిష్యుడగు ఈ శ్రీరామచంద్రునియందు బ్రహ్మజ్ఞాన శక్తిని కలుగజేసి మీ గురుత్వ మహనీయత్వమును ఇప్పుడిక్కడే నిరూపించుకున్నారు.

దర్శనాత్ స్పర్శనాత్ శబ్దాః కృపయా శిష్యదేహ కే,

జనయేద్యః సమావేశం శాంభవం స హి దేశికః ॥

ఎవరైతే తన దర్శనం చేత స్పర్శనంచేత, శబ్ద ప్రయోగం చేత, కృపాకటాక్షవీక్షణచేత శిష్యుని దేహమందు శివరూపమగు పరమాత్మ' యొక్క సమావేశమును కలుగజేయగలరో ... వారే గురువు. వారే సద్గురువు. మీ శిష్యుడగు ఈ శ్రీరామచంద్రుడు స్వయంగా విశుద్ధాత్ముడై, ఈ సంసారవ్యవహారం పట్ల విరక్తుడై, కేవలం ఆత్మయందు విశ్రాంతిని కోరిన వాడై ఈ సంవాద ప్రారంభంలో మహత్తరంగా వైరాగ్యమును ప్రవచించాడు. ప్రయోజనంగా ఈ సంవాదము అనే రూపంలో సర్వ ముముక్షువులపై

Page:541

జ్ఞానామృతవర్షం మీరు కురిపిస్తున్నారు. అయితే మీరు సిద్ధాంతీకరించినట్లు 'శిష్య ప్రక్షైవకారణం...’ అనేది కూడా సముచితమే!

శిష్య ప్రజ్ఞవ బోధస్య కారణం గురువాక్యతః మలత్రయమపక్వంచేత్ కథం బుద్ధ్యతి పకవత్?

గురువాక్యములు శిష్యునితో మహత్తరమైన 'ఆత్మానుభవం' జనింపజేయటానికి శిష్యుడిలోని ప్రజ్ఞయే కారణమని మనం ఎఱిగినదే. ఎందుకంటే ఎవనిలో అయితే శారీరక-వాచిక-మానసిక దోషములు, దేహ-మనో-బుద్ధి మాలిన్యములు, కామ-కర్మ వాసనలు తొలగవో అట్టి శిష్యుడు గురుబోధ యొక్క ఔన్నత్య సారాంశము గ్రహించలేడు కదా! ఈ రామచంద్రుడు ఆశ్చర్య జనితమైన బుద్ధికుశలత కలవాడు.

మీరీ రోజులుగా ఏదేది బోధించి అనేకమందిలో ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలిగిస్తున్నారో ...అదే గురుశిష్యుల సమావేశ ప్రయోజనమై ఉన్నది. గురు శిష్యులు ఇద్దరూ యోగ్యులైన వారైతే ఆ శిష్యుడు, అనేకమంది తదితరులు కూడా ఇటువంటి కైవల్య లక్షణమునకు పాత్రులు కాగలరు. అందుచేత మహాసమర్థులగు మీ గురు-శిష్య సమావేశం లోకకళ్యాణార్థమే అయి ఉన్నది.

ఇప్పుడు మీకొక విన్నపం చేస్తున్నాను. మాపై దయతో శ్రీరామచంద్రుని సమాధి నుండి మేలుకొలుపవలసినదిగా నా ప్రార్థన. హే వసిష్ఠ మహర్షీ ! మీరైతే 'పరమపదము'నందు పరిణతి చేత కృతకృత్యులై ఉన్నారు. మా సంగతి ఆ విధంగా లేదు. మేము ఇంకాకూడా లోకకార్యములందు ప్రవేశించియే ఉన్నాము. ప్రభూ ! నేను ఏ లోకకళ్యాణ కార్యక్రమమును ఉద్దేశించి ఈ అయోధ్యకు వచ్చానో, దేనికొరకై ఈ మహారాజు దశరథుని అతికష్టంగా స్వయంగా ప్రార్థించానో, దానిని ఒక్కసారి స్మరించండి. ఈ శ్రీరామచంద్రుని మీరే సమాధినుండి లేపవలసినదిగా మిమ్ములను అర్థిస్తున్నాను. మీరు సర్వజ్ఞులు. భూత భవిష్యత్ వర్తమానములు ఎఱిగినవారు. రాగరహితులు. సర్వదా ఆత్మానుభవం సంతరించుకున్న మహనీయులు. మీకు కొత్తగా విన్నవించుకోవలసిన పనేమున్నది? ఈ శ్రీరామచంద్రుడు సమాధి నుండి లేచిన తరువాత ఈ అవతార ప్రయోజనమైన దేవకార్యము లోకములకు మనం సంపాదించి పెట్టవలసి ఉన్నది.

ఈ వసిష్ఠ-రామ సంవాదము ముగించిన తరువాత నేను ఈ ఈ రామచంద్రుని నా సిద్ధాశ్రమానికి తీసుకు వెళ్ళటం జరుగుతుంది. 'నేను ఉద్దేశించిన యాగమును సంరక్షించటం' అనే మిషతో ఈతడు అనేక మంది లోకకంటకులగు దుష్టరాక్షసులను సంహరించనున్నాడు. ఆ తరువాత పరమ పవిత్రమగు తన పాదధూళి యొక్క స్పర్శచే అహల్యకు శాపవిమోచనం ప్రసాదిస్తాడు. ఆ తరవాత జనకుని సభలో ఇంద్రుని వలె ప్రవేశించి శివధనుస్సును విఱిచి సీతాదేవిని పరిణయమాడుతాడు. ఆ సీతారామ కళ్యాణం మనం చూచి తరించవలసిందే కదా!

ఆ తరువాత ఈతడు జమదగ్ని కుమారుడగు పరశురాముని ఎదుర్కొని ఆతని గతిని భంగం చేయగలడు. ఆ తరువాత పితృ పితామహప్రసాదితమైన ఈ అయోధ్యను పాలించటానికి అన్ని

Page:542

విధాలా అర్హత ఆర్జించుకుని ఉంటాడు. అప్పుడొక చమత్కారమైన మిషచే తండ్రి ఇచ్చిన మాటకోసం వనవాసం ఆశ్రయిస్తాడు. భార్య-సోదర సమేతుడై దండకారణ్యంలో ప్రవేశిస్తాడు. అక్కడ తనను శరణువేడవచ్చిన సజ్జనులను సంతోషపరిచే నిమిత్తం దుర్మార్గవృత్తులను ఆశ్రియించే అనేకమంది రాక్షస జనాన్ని సంహరిస్తాడు. అనేక ఆశ్రమములను, ఋషులను, మునులను, తీర్థాలను దర్శిస్తూ అనేక మంది జీవులకు తన దర్శనముచే ఆనందం కలిగిస్తాడు. అక్కడ మోక్షార్హులగు అనేక మంది భక్తజనులు ఈ శ్రీరాముని దర్శనం కొరకై సుదీర్ఘకాలంగా వేచియున్నారు కదా! ఆ తరువాత సీతాదేవి అపహరణం జరుగుతుంది. అట్టి సీతా వియోగ దుఃఖమును ప్రదర్శించి ఈ అవతార పురుషుడు 'తన్నివారణము' అనే మిషచే లోకబాధకుడగు రావణాసురుని బంధు-మిత్ర పరివార సమేతంగా హతం చేయనున్నాడు. 'పరస్త్రీ వ్యామోహము కలవానికి వినాశనము తప్పదు' దుష్టసంగము యొక్క దురవస్థను లోకములకు ప్రదర్శించనున్నాడు. అనంతరం ఇంద్రుని వరదానముచే యుద్ధంలో మృతి చెందినన వానరులు పునర్జీవులౌతారు. ఆ తరువాత సీతయొక్క అగ్ని ప్రవేశముచే విశుద్ధిని కోరినవాడై ... శిష్టజనులందు తన ఉత్తమ చరిత్ర యొక్క మాననీయత్వము ప్రకటించగలడు. అప్పుడు అయోధ్యా రాజ్యాభిషిక్తుడౌతాడు. జీవన్ముక్తుడై, నిస్పృహుడై కూడా క్రియాకాండ పారాయణుడై ఈ అయోధ్యారాజ్యం ఏలగలడు. అనేక యజ్ఞయాగములను నిర్వర్తించి జ్ఞానము-కర్మల ఉభయముల సముచ్ఛయ రూపమగు గతిని లోకములకు ఆదర్శప్రాయమై ప్రదర్శించగలడు.

యైర్ ద్రష్టో, యైః స్మృతోవాపి, యైః శ్రుతో, బోధితస్తుయైః

సర్వావస్థాగతానాం తు జీవన్ముక్తిం ప్రదాస్యతి ॥

ఎవరీ రామచంద్రుని దర్శిస్తారో, ఎవరీతని చరిత్రను స్మరిస్తారో, వింటారో, ఎవరీతని చరిత్రను తదితరులకు బోధిస్తారో అట్టి భక్తజనులందరికీ ఈతడు వారి సర్వావస్థలయందునూ జీవన్ముక్తిని ప్రసాదించగలడు.

ఈ విధంగా ఈ అవతారమూర్తి శ్రీరామచంద్రుని వలన ఈ ముల్లోకముల యొక్క నా యొక్క కార్యము సంపూర్ణంగా నెరవేరగలదు.

నమోస్మై జితమేవైతే కో ప్యేవం చిరమేధతాం!

ఓ సర్వ సభికులారా! మీరంతా కూడా ఈ శ్రీరామచంద్రునికి నమస్కరించి తరించండి. ఈతని నమస్కరించినంత మాత్రం చేత మీరు ఈ సమస్త సంసారసాగరమును జయించి వేసినవారు కాగలరు. పురుషార్థములన్నీ వాటికవే సిద్ధించగలవు.

అంతేకాదు. మీలోని శ్రేష్ఠులగు వారు ఈ శ్రీరామచంద్రుని వలెనే చిరకాలం నిర్వికల్పసమాధి యందు ఆత్యంతికమైన విశ్రాంతిని, సుఖమును బడయగలరు. కనుక సమస్తజనులు ఈ శ్రీరామచంద్రుని ఆరాధించి మోక్షసుఖమును పొందెదరు గాక!

శ్రీవిశ్వామిత్రుని పరతత్త్వార్థ వాక్యములు వినిన ఆ సభలోని సిద్ధులు, వసిష్ఠుడు మొదలైన శ్రేష్ఠ యోగీంద్రులు ... అందరూ కూడా శ్రీరామచంద్రుని కరచరణముల ధూళిని ఆదరంగా స్మరించారు.

Page:543

ఋషిగణం శ్రీరామచంద్రుని కథాక్రమమంతా తమ హృదయంతో దర్శించి, ఆతని గుణగుణములను పరవశించి తృప్తి పొందారు.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రా! "ఈ శ్రీరామచంద్రుడు ఈ జన్మకు ముందు దేవుడా? మనుజుడా? అనే విషయం శ్రోతలమగు మేమంతా చక్కగా గ్రహించే నిమిత్తం వచించండి. శ్రీవిశ్వామిత్ర మహర్షి :

అత్రైవ కురు విశ్వాసమ్ అయమ్ స పురుషః పరః విశ్వార్ధమ్ అధిత అంబోధిః గంభీరాగమ్ గోచరః

ఓ సభికులారా! మీరంతా ఈ శ్రీరామచంద్రునియందు 'ఈతడు సాక్షాత్ భగవంతుడే’... అని నిస్సంకోచంగా విశ్వాసం కలిగి ఉండండి.

ఎప్పుడైతే ఈ విశ్వం కొరకై పాల సముద్రాన్ని మథించాడో, ఎవని గురించి శ్రుతులన్నీ ఒక్క చోటికిజేరి ప్రతిపాదిస్తూ గానం చేస్తున్నాయో, అట్టి పరమపురుషుడగు సాక్షాత్ వాసుదేవుడే ఈతడు.

పరిపూర్ణపరానందః సమః శ్రీ వత్సలాంఛనః

సర్వేషాం ప్రాణినాం రామః ప్రదాతా సుప్రసాదితః ||

పరిపూర్ణ పరానంద స్వరూపుడు, సర్వసముడు, 'శ్రీవత్సమణి' మొదలైన మహత్తర చిహ్నములతో శోభితుడు, అగు ఈ శ్రీరామచంద్రుని ఎవరైతే తమతమ భక్తి-కర్మ-యోగ-జ్ఞానములచే ప్రసన్నం చేస్తారో, అట్టి ప్రాణులందరికీ ఈతడు పురుషార్థములన్నీ ప్రసాదిస్తున్నాడు.

అయం నిహన్తి కుపితః, సృజత్య అయమ్ అసత్సకాన్ విశ్వాదిర్, విశ్వజనకో, ధాతా, భర్తా, మహాసఖః ॥

ఈ రామచంద్రుడే క్రుద్ధుడైనప్పుడు సమస్తమును సంహరిస్తున్నాడు. మరల ఎప్పుడో ఎందుకో మిథ్యా పదార్థములచే ఈతడే ఇదంతా సృజిస్తున్నాడు. విశ్వమంతటికీ ఆది, జనకుడు, ధాత (ధరించువాడు) పాలకుడు, మహాసఖుడు ఈతడే!

నిర్మలమగు చిత్తము గలవారై ఎవరు ఆత్మానాత్మ విచారణచే నిస్సారము - అల్పము అగు ఈ సంసారముయొక్క కార్య కారణ సంబంధములు జయించి వేస్తున్నారో ... అట్టి సంసారమును జయించిన వీతరాగులగు మహాత్ములు ప్రవేశించే విశాలానందసముద్రమే శ్రీరాముని స్వరూపం. ఈ రామానందసాగరమే సర్వసాధనముల అంతిమ ప్రయోజన ఫలం.

క్వచిన్ ముక్తఇవాత్మస్థః, క్వచిత్ తుర్యపదాభిదః, క్వచిత్ ప్రణీత ప్రకృతిః, క్వచిత్తస్ధః పుమానయమ్||

ఈతడే ఒకచోట పరజ్ఞాన సంయుక్తుడై ఆత్మస్థితిచే ముక్తుడై ఉంటున్నాడు. మరొకచోట చిదానంద ఘన స్వభావుడై ప్రకాశిస్తున్నాడు. 'తురీయపదము' అనబడు మహోన్నతమగు సర్వమును ఆక్రమించియున్నట్టి రూపమును అవధరిస్తున్నాడు. ఒకచోట అప్రమేయుడు, నిర్గుణుడు, అసంగుడు అయి ఉంటున్నాడు. ఇంతలోనే కావాలని మాయయొక్క నియంత అగుచున్నాడు.

Page:544

ఇంకా చమత్కారమేమంటే... ఒకచోట నిర్విషయుడుగా, మరొకచోట ఈ మాయకే రచయితగా, ఇంకొకచోట ఈ మాయకు బద్ధుడుగా అగుపిస్తున్నాడు.

అయం త్రయీమయో దేవః త్రైగుణ్య గహనాతిగః ! జయత్యంగేరయం షడ్భిః, వేదాత్మా, పురుషో అద్భుతః !

ఈతడే మూడు వేదములను ఆక్రమించియున్న మహత్పురుషుడగు భగవానుడు. ఈ విశ్వమంతా త్రిగుణముల వివిధ పాళ్ళ కలయిక మాత్రమే అయి ఉండగా, త్రిగుణములకు ఆవల ఏర్పడియున్న వేదాంత స్వరూపుడు ఈతడే. సృష్టి - స్థితి - లయ - శిక్ష - స్మృతి - కల్పములనబడే షడంగములతో శోభిల్లే నిత్యోదిత చైతన్య స్వరూపుడు. వేదాత్మ స్వరూపుడు, పారమార్థిక స్వరూపుడు, వేదప్రతిపాదిత స్వరూపుడు ఈ అద్భుత పురుషుడే.

అయం చతుర్భాహుః, అయం విశ్వస్రష్టా చతుర్ముఖః, అయిమేవ మహాదేవః, సంహూర్తా చ త్రిలోచనః ॥

చతుర్భాహువులతో ఈ ప్రపంచ మంతటినీ పరిపాలించే విష్ణుభగవాను డీతడే. ఈ ప్రపంచమునంతటినీ సృష్టించే చతుర్ముఖబ్రహ్మ కూడా ఈయనే! అంతేకాదు. ఈతడే త్రినేత్రుడగు మహేశ్వరుడై ఈ సృష్టి యొక్క సంహారం కూడా నిర్వర్తిస్తున్నాడు.

అజోయం జాయతే యోగాత్ జాగరూకః సదా మహాన్

భిభర్తి భగవానేతత్, విరూపో, విశ్వరూపవాన్॥

స్వతహాగా చూస్తే ఈయనకు జన్మాదులు లేవు. అయితే ఏం? తనయొక్క యోగమాయాశక్తి సంబంధంచేత జన్మించినవానివలె అవతరిస్తున్నాడు. ఈయనకు 'మోహనిద్ర'అనే ఆవరణ లేదు. అందుచేత 'నిత్యజాగరూకుడు' అనబడుచున్నారు. ఈయన వాస్తవానికి నామరూపరహితుడు. కానీ విశ్వరూపుడై సమస్తము యొక్క భారము వహిస్తున్నారు.

విజయో విక్రమేణేవ, సుపర్ణే ప్రకాశ ఇవ తేజసా, ప్రజ్ఞోత్కర్షః శ్రుతేనేవ సుపఠే నాయముహ్యతే

వాక్ - మనస్సులకు ఈతడు అందనివాడు. మరి? ఈతడు ఆనందస్వరూపం అనుభవైకవేద్యమే. దృష్టాంతానికి ...ఈతడు పరాక్రమవంతుడురా! అంటాం. కానీ పరాక్రమమును కళ్ళతో చూడగలమా? లేదు. సాధించిన విజయములను చూచి పరాక్రమం ఊహించుకుంటాం. అట్లాగే ప్రజ్ఞను చూడగలమా? లేదు. కానీ, ఒకని శాస్త్ర పఠనాదులను చూచి "ఈతడు ప్రజ్ఞావంతుడురా!” అని గుర్తించగలం.

అట్లాగే సమస్త విషములందలి ఉత్తమత్వమే ఈయన రూపం. అందుచేత 'శ్రేష్ఠ పురుషుడు' అని వేదజ్ఞులు దర్శనం చేస్తున్నారు.

అయం దశరధో ధన్యః సుతోయస్య పఠః పుమాన్ ! ధన్యః స దశకంఠోపి చిన్యశ్చిత్తేన యోమునా !

Page:545

ఇట్టి సాక్షాత్ పరమపురుషుని ఎవడైతే తన కుమారునిగా సంపాదించుకున్నాడో అట్టి ఈ దశరథ మహారాజు ధన్యుడు. అంతేకాదు. ఎవ్వడైతే ఈతనిని 'ఈతడే నా శత్రువు' అని తన చిత్తంలో అహర్నిశలూ చింతన చేయబోతున్నాడో... అట్టి దశకంఠుడగు రావణాసురుడు కూడా ధన్యుడే.

హాఁ! స్వర్గమమునా శూన్యం, హా పాతాలాది హాగతః !

తస్యాగమాత్ అయం లోకో మధ్యమః శ్రేష్ఠతాం గతః ॥

ఆహా! మధ్యదగు ఈ భూలోకంలో ఈ శ్రీరామచంద్రమూర్తి అవతరించటం చేత ఈ భూలోకమంతా శ్రేష్ఠత్వం సంతరించుకోగా... స్వర్గ, పాతాళ లోకాలు వెలవెలపోతున్నాయి కదా!

రామ ఇత్యవతీర్ణోయమ్ అర్ణవాన్తిశయః పుమాన్,

చిదానందఘనో రామః పరమాత్మాయమవ్యయః II

క్షీర సముద్రంలో (సత్యసాగరంలో) శయనించియుండే ఆ విష్ణు భగవానుడే ఇక్కడ దశరథుని కుమారుడగు శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. ఈయనే చిదానందఘనుడు, నాశనరహితుడు అగు పరమాత్మ అయి ఉన్నాడు.

నిగృహీతేన్టియగ్రామా రామం జానన్తి యోగినః

వయం త్వవరమేవాస్య రూపం రూపయితుం క్షమాః ||

ఇంద్రియసమూహములను జయించిన యోగులు మాత్రమే ఈ శ్రీరామచంద్రుని యథార్థరూపం ఎఱుగగలుగుతారు. ఓ వసిష్ఠ మహర్షీ! ఈతని ఇతఃపూర్వరూపం ఏమిటో మీరు, నేను ఎఱిగియే ఉన్నాం కదా! అందుచే నిరూపించుటకు సమర్థులమైయున్నాం.

హే వసిష్ఠ మహర్షీ! భగవంతుడగు ఆ మహావిష్ణువు రఘువంశంలో జన్మించి రఘువంశమును, సర్వలోకములను పావనం చేయబోతున్నాడని మనిద్దరం పెద్దలు చెప్పుకోగా వినియే ఉన్నాము కదా! కనుక ఈతనిని ఇప్పుడు వ్యవహారపరునిగా చేయవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

4. ఫలశ్రుతి

శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ విధంగా లోకహితైషుడగు విశ్వామిత్ర మహర్షి రామతత్త్వ మాహాత్మ్యాన్ని గానం చేసి, శ్రీరామచంద్రుని పునర్వ్యవహారపరునిగా చేయమని వసిష్ఠ మునీంద్రులను అభ్యర్థించి మౌనం వహించారు. అప్పుడు శ్రీ వసిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ప్రేమాస్పదమైన చూపులతో అభినందించి రామచంద్రునివైపు చూచారు.

శ్రీవసిష్ఠ మహర్షి :

రామ! రామ! మహాబాహో! మహా పురుషా! చిన్మయా! నాయం విశ్రాంతి కాలోహి, లోకానందకరో భవ ॥

Page:546

ఓ రామచంద్రా! రామయ్యా! హే మహాబాహో! చిన్మయ స్వరూపుడగు ఓ మహాపురుషా! ఇది లోకములను మరచి ఆత్మయందు విశ్రాంతి తీసుకుని ఉండే సమయం కాదయ్యా! ఈ లోకాలన్నీ తమ బాధనుండి విముక్తి పొందటానికి నిన్ను శరణువేడుచున్నాయి. లే! లేచి లోకము లన్నిటికీ ఆనందకారకుడవు, రమయతేతి రామా అయ్యే సమయమిది. ఈ లోకముల క్షేమం కొరకే గదా, నీవు అవతరించావు! ఈ లోకములకు సంబంధించిన సాత్విక సంసారము ఇంకా మిగిలి ఉన్న యోగులకు స్థిరసమాధి సమయోచితం కాదు. కాబట్టి నశ్వరములగు (కాలముచే రహితం కాబోయే) ఈ రాజ్యాది వ్యవహారములు నీవింకా కొంతకాలం నిర్వర్తించవలసియున్నది. దైవ కార్యము కొరకై అవతరించిన నీవు బాగుగా దైవకార్యము నిర్వర్తించి, ఆ తరువాత సమాధిని ఆశ్రయించి సుఖుడవై ఉండవచ్చునని నా ఈ ప్రార్థన.

శ్రీవసిష్ఠ మునీంద్రుని ఈ పలుకులు రామచంద్రుని చెవులలో ప్రవేశించనే లేదు. అతడు అట్లే నిర్వికల్పసమాధియందు బ్రహ్మముతోటి ఏకత్వము కొనసాగిస్తూ బదులు పలకలేదు. అప్పుడు వసిష్ఠ మహర్షి కనులు మూసుకొని మనోయోగ వైభవంచేత రామచంద్రుని సుషుమ్నానాడిలో ప్రవేశించారు. సుషుమ్నానాడి ద్వారా మెల్లమెల్లగా శ్రీరామచంద్రుని హృదయంలో సమీపించి అక్కడ తన జాగృత బోధనను కొనసాగించారు. అప్పటికి రామచంద్రుని హృదయాంతరంగము యొక్క అభ్యంతర విభాగం సద్గురువగు శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క మేలుకొలుపుకు స్పందించింది. మొట్టమొదట క్రమరీతిగా ప్రాణ - మనస్సులు ఆ ప్రాణాదుల బీజరూపమైనట్టి 'ఆధారశక్తి'యందు ఆవిర్భావమైనాయి. క్రమక్రమంగా ప్రకాశరూపుడగు 'జీవుడు' రూపుదిద్దుకున్నాడు. అతడు 'అహం’ అను వాహనం ద్వారా ప్రాణముల సహాయంతో సమస్త నాడీ మండలములలో ప్రవేశమునకు ఉపక్రమించాడు. నెమ్మది నెమ్మదిగా అట్లు ప్రవేశించుచుండగా జ్ఞాన కర్మేంద్రియములు క్రమరీతిలో పరిపోషించబడ్డాయి.

కొద్ది క్షణములిట్లు జరిగిన తరువాత శ్రీరాముడు మెలమెల్లగా కనులు తెరిచాడు. వసిష్ఠుడు మొదలైన ముఖ్య విద్వాంసుల వైపు చూచాడు. సర్వ అభిలాషలు వర్ణించియున్నవాడై, కృతకృత్యముల గురించి (నిర్వర్తించియున్న నిర్వర్తించబోయే ఆయా కృత్యముల గురించి) కించిత్ కూడా విచారవృత్తి లేనివాడై మహర్షి వాక్యములు వినటానికి సంసిద్ధుడైనాడు. అప్పుడు 'రామచంద్రా! రామయ్యా! మహాబాహూ!' -అని వసిష్ఠ మహర్షి కొద్ది క్షణముల క్రితం పలికిన వాక్యాలన్నీ ఒక్కటొక్కటిగా అతని చెవులకు సోకాయి. అవును. గురువాక్యములు అనుల్లంఘనీయములు కదా! అని అనుకున్నాడు. అప్పుడు తండ్రి, బంధువులు పలుకుచున్న అభ్యర్థన వాక్యాలు కూడా విన్నాడు.

శ్రీరాముడు :

న విధేః, న నిషేధస్య త్వత్ప్రసాదాత్ అయం ప్రభుః ! తథాపి తవవాక్యం తు కరణీయం హి సర్వదా॥

Page:547

హే మహాత్మా! శ్రీ వసిష్ఠ మహర్షీ! మీ అనుగ్రహం చేత ఈ 'రాముడు' అని పిలువబడే జీవుడు ఎట్టి విధి - నిషేధములకు అందనివాడై స్వయంగా సాక్షాత్ ప్రభురూపుడైనాడు. అయినప్పటికీ తమ వాక్యము ఎప్పటికీ అనుసరణీయమే!

వేదాగమపురాణేషు స్మృతిష్వపి మహామునే,

గురువాక్యం విధిః ప్రోక్తో నిషేధస్తద్విపర్యయః ॥ ||

జీవుని క్షేమం కోరి ఏర్పడియున్న వేద శాస్త్ర-పురాణ- స్మృత్యాదులచే గురువాక్యములు’ పాలించటమే విధి. గురువు యొక్క అనుజ్ఞలను అతిక్రమించటం నిషేధం...' అని చెప్పుచున్నాయి కదా! కనుక మీ ఆజ్ఞ నాకు సర్వదా శిరోధార్యం.

ఇట్లు పలికి సర్వాత్మకుడు, కృపానిధి అగు ఆ శ్రీరామచంద్రుడు లేచి నిలుచున్నాడు. శ్రీ వసిష్ఠ మహర్షిని సమీపించాడు. ఆయన కరచరణములను తన నుదుటితో స్పృశిస్తూ సాష్టాంగదండ ప్రణామం సమర్పించాడు. ఆ తరువాత ఒక్కసారి సభనంతా అమృత దృక్కులతో చూచాడు. శ్రీరాముడు :

సర్వే శృణుత భద్రం వో నిశ్చయం, నః సునిశ్చితం! ఆత్మజ్ఞానాత్ పరం నాస్తి! గురోరపి చ తద్విదః !

ఓ సర్వ సభికులారా! మీ కందరికీ శుభమగుగాక! సర్వ నిశ్చయములలో అత్యంత సునిశ్చయమైన ఒకానొక వాక్యం చెప్పుచున్నాను. వినండి. ఆత్మజ్ఞానము కంటే, దానిని ఎఱిగిన సద్గురువు కంటే ఉత్తమమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఉండబోదు.

అప్పుడు సభలో వేంచేసియున్న సిద్ధులంతా ఒక్కసారి నిలబడి శ్రీరామచంద్రుని మహిమను

గానం చేశారు.

సిద్ధులు : ఓ వసిష్ఠ రామచంద్రులారా! మీ అనుగ్రహంచేత ఈ సభలో పాల్గొన్న మేమంతా ఆత్మభావన' అను మహత్తర స్థితిని పొందాం. తమ సంవాదం కొనసాగుచుండగా అది వాక్కుతో ప్రకటించలేనంతగా దృఢత్వం పొందింది. ఓ రామచంద్రా! మీ ఈ అవతారము అనేకమంది భక్తజనులకు మోక్షమార్గమై వెలుగొందుగాక! మీకు సర్వదా శుభమగుగాక! మీ కర-చరణ స్మరణము యుగయుగాలుగా భక్త జనులకు కొంగు బంగారమై, మోక్షమార్గ సౌలభ్యమై, ధైర్య స్థైర్య ప్రసాదితమై తేజరిల్లునుగాక! క్రూరస్వభావులగు అనేకమంది రాక్షస జనులు తమ క్రౌర్యమును రామబాణమునకు సమర్పించి పవిత్రులగుదురుగాక!

ఇట్లు అనేక స్తోత్రములు చేస్తూ రామచంద్రునిపై, సద్గురువగు వసిష్ఠునిపై పూలవర్షం

కురిపించారు.



ఓ భరద్వాజా! ఈ విధంగా నిర్వాణ ప్రకరణ పూర్వార్ధ కథనమంతా నీకు తెలియజేశాను.

Page:548

శ్రీరామచంద్రుని ఉద్దేశించిన సిద్ధమునియగు వసిష్ఠ మహర్షి ప్రవచితమైన వచనసమూహమగు రత్నమాల విచిత్రమైన ప్రభావం కలిగియున్నది. ఇది సమస్త కవికులమునకు, యోగులకు సేవించుటకు యోగ్యమైయున్నది.

పరమ గురువు యొక్క కటాక్షం చేత ఇది పఠించువానికి సులభమైన మోక్షమార్గమై పరిఢవిల్లుగాక!

య ఇమం శృణుయాత్ నిత్యం విధిం రామవసిష్ఠయోః సర్వావస్థోపి శ్రవణాన్ ముచ్యతే, బ్రహ్మ గచ్ఛతి

ఎవరీ, 'శ్రీ వసిష్ఠ శ్రీరామచంద్రుల సంవాదము'ను ప్రతిదినం శ్రవణం చేస్తారో, శ్రవణమాత్రంచేత అట్టివారి రాగాది సర్వదోషములు అతి సులభంగా తొలగుతాయి. ఎట్టివారైనా, ఏ తరగతి వారైనా సరే, సర్వ దోషములనుండి విడివడి శాంతి మొదలైన ఉత్తమ గుణములు ప్రాప్తించుకున్నవారై బ్రహ్మమే తమ స్వరూపంగా దర్శనానుభవం పొందగలరు.

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ||

శ్రీ వసిష్ఠ - విశ్వామిత్ర - వాల్మీకి - నారదాది మహర్షయో, మహానుభావో న తామః ||

--

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

వసిష్ఠ - రామ సంవాదము

నిర్వాణ ప్రకరణం (ఉత్తరార్ధం)

Page:551

1. ఉత్తరార్ధ ప్రథమ విభాగ ప్రకరణ పరిచయము

1. సంకల్పరాహిత్యము

శ్రీరాముడు : హే వసిష్ఠ మహర్షీ ! ముముక్షువ్యవహార - స్థితి - ఉపశమన - నిర్వాణ (పుర్వార్ధం) ప్రకరణాల వరకు మీరు మహత్తరమైన ఆత్మనిర్వచన సంబంధమైన అనేక విశేషాలు మాకు ప్రబోధించారు. మీ ప్రవచనం మహాద్భుతమైనదనటంలో సందేహమే లేదు.

మీ అమృతవాక్కులు ఇంకా ఆస్వాదించాలని, మోక్షసాధకులగు మహనీయులు మరికొన్ని కథన విశేషాలు వినాలని మా ఉత్సుకత మరింతగా కొనసాగుచూనే ఉన్నది. మన ఈ సంవాదము మరిన్ని తాత్త్విక విశేషాలు లోకములకు ప్రకటించటానికి వీలుగా కొన్ని ప్రశ్నలతో ప్రారంభించితే

బాగుంటుందని నా మనవి.

శ్రీ వసిష్ఠ మహర్షి : మంచిది. అట్లే అగుగాక !

శ్రీరాముడు: ఈ జీవుడు బ్రహ్మానందానుభూతికి అర్హత సంపాదించుకోవటానికిగాను రెండు అతి ముఖ్యమైన సందేశాలు మాకు గతానుగతంగా ప్రసాదిస్తూ వచ్చారు- 1. నైష్కర్మ్య సిద్ధి; 2. అహంకార కల్పనా త్యాజ్యం...

అయితే మహర్షీ! "నైష్కర్మ్యము (Non Activity)" చేతను, దేహాదులందు ఏర్పడే అహంకార కల్పనను త్యజించటంచేతను ఈ దేహం శీఘ్రంగా నేలవ్రాలే అవకాశం లేదంటారా? అట్లా అయితే జీవించటం అనునది ఎట్లా సిద్ధిస్తుంది? అట్టి సిద్ధి- త్యాజ్యము ఆశ్రయించినవాడు అనివార్యమగు లోకవ్యవహారములు నిర్వర్తించటం ఎట్లా? జీవిస్తూ ఉండగా వ్యవహార త్యాజ్యం - కల్పనాత్యాగం అనేది కుదురుతాయా? కుదిరినప్పటికీ లోకవ్యవహారం దృష్ట్యా అది ఉచితమే నంటారా? కల్పనాత్యాగికి జీవితం దుర్భరం కాదా?

శ్రీ వసిష్ఠ మహార్షి : ఓ రామచంద్రా ! జీవించే వానికే కల్పనలు అనేది ఉంటుంది. జీవించనివానికి కల్పనలనేది ఏం ఉంటుంది? కాబట్టి జీవించువానికే కల్పనాత్యాగం అనేది తగుతుంది.

అయితే... అ అహంభావ కల్పన గురించి మున్ముందుగా ప్రస్తావించుకుందాం, విను.

పరిచ్ఛిన్నమైన ఈ దేహదులపట్ల “ఈ శరీరమే నా స్వరూపం" అను అభిప్రాయం కలిగి ఉండడం “అహంభావన" అని చెప్పబడుతూ ఉంటోంది. ఒకడు తనపట్ల తదితరులపట్ల కూడా అపరిచ్ఛిన్నమగు బ్రహ్మ భావన నిర్వర్తిస్తూ ఉంటే అది కల్పనాత్యాగం అని అంటున్నారు. అదియే, నిరహంకారం కూడా! కల్పన గురించి పరిశోధించియున్న విజ్ఞులు పరిచ్ఛిన్నమైనట్లు కనిపిస్తున్న

Page:552

ఈ వేరువేరు దేహులను చూస్తున్నప్పుడు - నేను వేరు, అతను వేరు, నీవు వేరు - అను రూపంలో ఉండే పరిచ్ఛిన్న భావనను ఆశ్రయించటమే అహంకారం. అంతటా ఏకమైయున్న బ్రహ్మాకాశము యొక్క సత్తాను భావించుటను కల్పనాత్యాగం అని అంటున్నారు.

సంకల్పము అంటే దేహము మొదలైన పరిచ్ఛిన్నమైన దృశ్యవస్తువులను చూస్తున్నప్పుడు "ఈ కనబడే రీతిగా ఇవన్నీ సత్యమే" అను రూపమైన అభిమానము.

సంకల్పత్యాగం అంటే ఈ కనబడే వస్తువులు, దేహాలు పంచభూతాల వికారమేకదా? కాబట్టి వేరు - వేరు అనబడేదంతా సత్యం కాదు. సమస్తము బ్రహ్మాకాశమాత్రమే ... అనే ఎఱుక కలిగి ఉండటం. ఇంకొక విధంగా చెప్పాలంటే... పదార్థాల పట్ల ఏర్పడే అనురాగపూర్వకమైన స్మరణయే సంకల్పము. అట్టి స్మరణ (లేక, విషయ చింతన) లేనప్పుడు, ఆ స్థితిని మోక్షం అని పిలుస్తున్నారు.

ఈ 'స్మరణ’ అనేది ఇతఃపూర్వం చూచిన-చూడని, అనుభవించిన-అనుభవించని విషయాల పట్ల కూడా ఏర్పడి ఉండటం జరుగుతోంది. అట్లా అనుభవించిన అనుభవించని... ఉభయ విషయాలను అటుండనిచ్చి, బ్రహ్మం కంటే అన్యమైన సమస్త వృత్తులను శీఘ్రంగా విస్మరించి, బ్రహ్మంనందే లీనుడై ఉండేవాడు 'మోక్ష స్వరూపుడు' అగుచున్నాడు. కనుక ఓ రామచంద్రా! అంతరంగంలో సర్వదృశ్యవ్యవహారములూ, వాటి వాటి ఏక అనేకత్వాదులు విస్మరించి ఉండు. అయితే ఇక ఈ అవశ్యం నిర్వర్తించివలసి ఉన్న కార్యక్రమాల విషయ మంటావా? సగం నిద్రిస్తున్న బాలునివలె బ్రహ్మమునకు అనన్యమగు భావనతో అంతర్వృత్తులను ఆయా పనులలో ఉపయోగించే ఉపకరణములవలె గమనిస్తూ ఉండు. నీవు దేనికీ కారణం కాకుండానే, ఆయా వృత్తులే నిర్వర్తించ బడే క్రియాదులకు కారణమై ఉండుగాక! నీవు వాటికి కారణం కావద్దు. సంస్కారములకు కూడా ఆవల గల నీ స్వస్వరూపం అవధరించి ఉండటం అభ్యసిస్తూ ఉండు. కుమ్మరివాని చక్రం ఎట్లా తిరుగుతుందో అట్లే సంస్కారాలు జగత్రియలను నిర్వర్తించునుగాక! నీవు ఆ సర్వక్రియలకు సర్వదా అతీత్వం వహించి ఉండు. వాసనారహితుడవై నిర్మల చిత్తమును సంతరించుకున్నవాడవై, ఆ నీ చిత్తం యొక్క ఒక అల్ప విభాగమును ఒక పరికరమాత్రంగా గ్రహించి ప్రవాహ పతితములగు ఆయా కార్యాలను నిర్వర్తించు. ఎచ్చటైతే సమస్త బ్రహ్మాండం యొక్క ఆధిపత్యం కూడా తృణ ప్రాయంగా (గడ్డిపరకతో సమానంగా) గోచరిస్తుందో... అట్టి పరమపదం సంకల్పరహితుడవై ఉన్నంత మాత్రంచేతనే లభించగలదని గుర్తు చేస్తున్నాను.

సంకల్పరహితుడనై ఉంటే ఈ ప్రపంచంలో ఆయా క్రియలు నిర్వర్తించటమెట్లా?...అని ఎవరైనా అనుకుంటారేమో! ఓ జనులారా! ఒక బాటసారి కాళ్ళు ప్రత్యేకమైన సంకల్పం లేకుండానే వెళ్ళాలనుకున్న చోటువైపుగా బాటలో అడుగులు వేయటం లేదా? అట్లాగే ఎవరైనా సరే... ప్రవాహ పతితములగు ఈ జగద్వ్యవహారాలన్నీ కూడా సంకల్పరహితంగానే నిర్వర్తించవచ్చునని నా మనవి.

జాగ్రత్తులో కొంతవరకు సంకల్పితంగా ఊపిరి పీలుస్తున్నావు. మరి స్వప్న దశలోనో?... అసంకల్పితంగా ఊపిరి పీలుస్తున్నావు కదా! "అట్లాగే నా ఇచ్ఛచే నేను జీవిస్తున్నాను. ఇచ్చచే

Page:553

కర్మలు నిర్వర్తిస్తున్నాను ...అనే ధ్యాసను శాంతమునందు లయం చేసివేయి. అసంకల్పితంగా కల్పనారూపమగు ఈ దృశ్య జగత్తు నందు క్రీడగా - లీలగా విహరించు.

ఒక గడ్డిమొక్క ఉన్నది. అది స్వతహాగా ఎట్టి సంకల్పము లేకుండానే గాలివాటుకు కదలి ప్రక్కమొక్కలతో సంయోగ వియోగ చేష్టలు నిర్వర్తిస్తోంది కదా! అట్లాగే రామచంద్రా! నీవు కూడా సంకల్పరహితుడవై, సుఖ దుఃఖములకు సంబంధించిన ఎట్టి భావన చేయకుండానే ప్రవాహపతిత కార్యములను నిర్వర్తించమని మరల గుర్తుచేస్తున్నాను. తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు తమయందు ఎట్టి రస వికారాలు లేకుండానే ప్రేక్షకులకు మాత్రం శృంగారం మొదలైన భావనలను కలుగజేస్తున్నాయి చూచావా? అట్లాగే ఈ అవశ్య కర్తవ్యాల పట్ల - అంతరంగంలో శృంగార సుఖ -దుఃఖాది రసభావనలు పెంపొందించుకోకుండానే లోకానుకూలంగా, సందర్భానుకూలంగా వ్యవహరించు. ఈ జగత్తును ఒక గొప్ప, సుదీర్ఘ నాటక సన్నివేశంగా ఆస్వాదించు.

ఊర్ధ్వబాహుః విరౌమ్యేష! న చ కశ్చిత్ శృణోతి మే అసంకల్పః పరంశ్రేయః! స కిమ్ అంతర్ న భావ్యతే ||

నేను చేతులెత్తి ఊర్ధ్వ స్వరంతో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఈ జనులు నా ఈ వాక్యాలు ఎందుకో తగినంతగా వినిపించుకోవటమే లేదే! ఎట్టి సంకల్పములు ప్రవేశించనీయకుండా అంతరంగమున మౌనం వహించి ఉండటమే పరమశ్రేయోదాయకమగు స్థితి. అట్టి సంకల్పరాహిత్యాన్ని అంతరంలో ఎందుకు భావన చేయరాదు చెప్పు? ఆహా! ఈ మోహం యొక్క గొప్పతనం ఏమని చెప్పాలి? సర్వ దుఃఖాలను హరించగలిగినట్టి ఆత్మ విచారణ అను చింతామణిని ప్రతి ఒక్కరు తమలోనే ఉంచుకొని అద్దానిని వదలి ఈ జనులు సంకల్పాలలో ప్రవేశించి అనేక ఉపాధులతో గొప్ప సంచారం చేస్తున్నారే!

దృశ్య-దర్శన రహితమగు ఆత్మతత్త్వమే 'అసంకల్పం అను దాని రూపం. అట్టి సంకల్ప రహితమగు స్వస్వరూపంతో తన్మయులై ఉండటం మాత్రంచేత పరమశ్రేయస్సు లభించగలదని ప్రకటిస్తున్నాను. అట్టి ఆత్మీస్థితి ఎవరికి వారే సముపార్జించుకోవాలి గాని, ఆ అనుభవం ఒకరికి మరొకరు ఎట్లా అందించగలరు? శాస్త్రములు - గురుస్థానమున గల మేము అట్టి అంతర అసంకల్ప సామ్రాజ్యమును గుర్తుచేస్తున్నాము. అంతవరకే మా పాత్ర!

అందుచేత రామా! నిద్రిస్తున్నవానికి జగత్ లేనట్లు సర్వకర్మఫలముల పట్ల పూర్ణమగు ఉదాసీనతను అంతరంగంలో వహించి అటుపై ఆయా ప్రవాహపతిత కార్యములను నిర్వర్తించేవానికి ఈ 14 లోకాలు ఆటవస్తువు వంటివి అవుతాయి. ఓ రామచంద్రా! సమస్త ఇంద్రియ విషయాలు నీకు రసరహితంగా కన్పట్టుగాక! హేమంత ఋతువులో పూతీగ ఉంటుంది గాని పూలు పూయవు చూచావా? అట్లా ఇవన్నీ ఆకార మాత్రాలేనని నీచే గ్రహించబడుగాక! నీవు జ్ఞాన సూర్యుని ఆశ్రయించి జ్ఞాన రసం మాత్రను ఆస్వాదించు. ఇక ఈ నీ యొక్క - తదితరుల యొక్క శరీరాల విషయమేమిటంటావా? యంత్రపుబొమ్మలు భావాభావాలు లేకుండా కదులుతాయి. చూచావా? ఈ దేహాలు కూడా ఆయా వివిధ భావాభావ-గుణ-నిర్గుణ మిశ్రమాలచే తయారుచేయ బడుచున్నాయి.

Page:554

1. పంచకోశాలలో (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) ప్రతిబింబించే చిదాభాసుడు,

2. పంచప్రాణములు - మనస్సు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన - సప్రాణములు), 3. జ్ఞానేంద్రియ వర్గము (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు),

4. కర్మేంద్రియ వర్గము (చెవులు, చర్మము, కళ్ళు, నోరు, ముక్కు),

5. అంతఃకరణచతుష్టయం (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము),

6. శరీర వర్గము (స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు)...

ఈ ఆరు మిశ్రమాలతో తయారయిన సమ్మిళిత వస్తువే ఈ దేహము.

ఈ ఇంద్రియాలు స్వభావసిద్ధంగా బాహ్యరసాస్వాదనమునందు ప్రవృత్తములై ఉంటున్నాయి కదా! వీటిని జీవుని యొక్క ఉనికికే కారణమై ఉన్న భూమానందరూప చైతన్యరసంచే నింపి ఉంచాలి. బ్రహ్మానందమే ఈ సర్వరూప దృశ్య ప్రదర్శనంగా అనుక్షణికంగా ఆస్వాదించాలి. శ్రీరాముడు: మహార్షీ! ఈ ఇంద్రియాలు స్వభావ సిద్ధంగా ఆయా విషయాలందు ప్రవేశిస్తూనే ఉంటాయి. కదా! కనులు చూస్తునే ఉంటాయి. చెవులు వింటూనే ఉంటాయి. విషయభోగాలు కూడా ఈ జీవుని ఏదో రూపంలో తప్పక సమీపిస్తునే ఉంటాయి. మరి విషయ రాహిత్యమనేది జీవించి ఉన్నంత వరకూ ఎట్లా కుదురుతుంది ?

శ్రీ వసిష్ఠ మహర్షి: అవును. దేహమంటేనే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు. అయితే ఇంద్రియాలను స్వయత్నం చేత ఇంద్రియవిషయాల నుండి నివారించటం అనగా ఏమో వివరిస్తాను. సూక్ష్మగ్రాహివై వినుఇంద్రియములను ఇంద్రియ విషయములపై వినియోగించు సందర్భంలో 'ఇష్టం - - అయిష్టం’ అనే రూపంలో ఒకానొక 'వృత్తి' అంతరంగంలో ఏర్పడుతుంది. ఆ వృత్తియే క్రమంగా (అనేకసార్లు ఇష్టం కలిగి ఉండటంచేత) 'యా వృత్తి' (Habituated Avocation) గాను, సంస్కారాలుగాను, చిత్త ప్రవృత్తిగాను రూపుదిద్దుకొంటోంది. కనుక ఇంద్రియ జన్యమైన విషయరసమునందు నీవు 'వృత్తి' (లేక) అనురాగం కలిగి ఉండకపోతే... ఇకప్పుడు నీవు విషయభోగం పొందినా, పొందకున్నా సంసారం యొక్క అనర్థం నీ పట్ల శమించియే ఉంటుంది. వృత్తి యొక్క ఉత్పత్తి స్థానం ‘సంకల్పం’ అయి ఉన్నది. కనుక సంకల్పరహితుడవై, ప్రసరిస్తున్నప్పుడు తారసపడే వస్తువుల పట్ల వాయువు ఎట్టి భావన పొందనట్లు, దహిస్తున్నప్పుడు అగ్ని ఎట్టి ఇష్టాయిష్టములు పొందనట్లు, యంత్రం పని చేస్తున్నప్పుడు లాభాలాభాల ప్రవృత్తి కలిగి ఉండనట్లు, జలం ఎట్టి భావవికారాలు పొందనట్లు, నీవు కూడా ఉండు. ఈ జీవుడు ప్రవాహపతిత కర్మలందు అధ్యస్తమై ఉన్నప్పుడు “నేనే వీటికి కర్తను” అను రూపంలో ఉండే కర్తృత్వ వాసన లేకపోవటమే 'జన్మ' అనే జ్వరానికి గొప్ప నివారణోపాయమై ఉన్నది. నేను జన్మించువాడను అను భ్రమ తొలగాలంటే జన్మలకు అతీతం - అప్రమేయం అగు స్వస్వరూపం ఆస్వాదించాలంటే కర్తృత్వభ్రమ ముందుగా తొలగాలి.

Page:555

ఓ ప్రియ జనులారా! మీలో ప్రతి ఒక్కరు విషయరస - అనురాగ నివృత్తస్థితికి సర్వదా అర్హులే! వాసనారహితులై సంకల్పవర్జితులై ఒక చక్రం వలె భ్రమణం పొందుతూ ఆయా వస్తువులను తాకుచున్నట్లు నిజకర్మలందు చేష్టలను సల్పుచూనే మెల్లమెల్లగా కర్మఫలం నందు గాని, కర్మఫల త్యాగం నందు గాని ఆసక్తి ఉండకుండు గాక. కర్మలను త్యజించండి, లేక ఆశ్రయించండి. అయితే ఆసక్తిని త్యజించండి. కర్మఫలాసక్తి లేనప్పుడు కర్మలను త్యజించినా, ఆశ్రయించినా అందులో మీ పట్ల విశేషమేమీ ఉండదని గ్రహించండి.

బహునాత్ర కిముక్తేన, సంక్షేపాత్ ఇదమ్ ఉచ్యతే | సంకల్పనం మనోబంధః! తదభావో విముక్తతా ॥

ఈ విషయమై మనము పెద్దగా చెప్పుకోవాల్సిన పనేమీలేదు. సంక్షిప్తంగా ఒక్కమాట చెప్పుచున్నాను, విను- సంకల్పమే మనస్సు యొక్క బంధం. అట్టి సంకల్పం లేకపోవటమే ముక్తి. నేహకార్యం, న వా అకార్యమస్తి కించిన్, న కుత్రచిత్

సర్వం శివమ్, అజమ్, శాంతం, అనంతం ప్రాగ్వదాస్యతామ్ ||

ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చేయతగినది - చేయతగనిది"... అంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఈ సమస్తం శివమై - అజమై - - శాంతమై - అనంతరూపమైనట్టి బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా! కాబట్టి ఓ రామచంద్రా! ఈ జగత్తు నీ పట్ల ఏర్పడక ముందే ఏ విధంగా ఆత్మ స్వరూపుడవై ఉన్నావో ఇప్పుడు కూడా అట్లే ఆత్మారాముడనై నిరభ్యంతరంగా సర్వత్రా స్థితి కలిగి ఉండు. సమస్త కర్మలందును నిష్క్రియమగు బ్రహ్మతత్త్వమును గాంచు. నిష్క్రియమగు బ్రహ్మము నందే ఈ అవశ్యకర్తవ్యములన్నిటినీ గాంచుచుండు. యథార్థచిద్రూపుడవై శాంతముగను, శివ రూపముగాను సుఖస్వరూపుడవుగాను సర్వత్రా ఏర్పడి ఉండు.

2. యోగం' అంటే ఏమిటి ?

దృశ్య-దర్శనాతీతమగు ఆత్మతత్త్వమును అనుసంధానం చేయటమే 'యోగము' అను శబ్దము ఉద్దేశిస్తున్నదని గ్రహించు. అదియే 'స్వాభావికం - అకృత్రిమం' అగు చిత్తక్షయం కూడా! కాబట్టి ఆత్మయందు ఎప్పటియట్లే తన్మయుడవై ఆత్మారాముడవై వెలయుము. ప్రతిఒక్క జీవుని ఆత్మరూపం సమమై, శాంతమై, శివమై, సూక్ష్మమై, ద్వైతైక్య వర్ణితమై, సర్వవ్యాపకమై అనంతమై, సమస్తమై, సమస్తానికి పరమై పరమశుద్ధమైయున్నది. అట్టి ఆత్మరూపమునకు ఎవడు, ఎచ్చట, ఎట్లా భేదాన్ని ఆపాదించగలడు? ఓ రామచంద్రా! ఎడారి ఇసుకలో గడ్డి మొలుస్తుందా? అట్లాగే నీ నిర్మల ఆత్మ స్వభావంలో 'సంకల్పం' అనునది ఉదయించదు. ఒకవేళ ఉదయించినా అది లీలా (క్రీడా) మాత్రమే.

‘ఇచ్ఛ' (అభినివేశం) ఉన్నప్పుడే సంకల్పం ఉన్నట్లని గ్రహించు. సంకల్పరహితుడగు శాంత పురుషుడు తాను జీవించుచుండటంచేతగాని, జీవించకుండుటచేతగాని, ఈ ప్రపంచంలో ఏదైనా

Page:556

కార్యం నిర్వర్తించుట చేతగాని, నిర్వర్తించకుండుట చేతగాని ఎట్టి ప్రయోజన - నిష్ప్రయోజనాలనూ గాంచడు. నీ అంతఃకరణము ఇది కర్మ - అది అకర్మ" అనే ఉభయభావాలు శమించి ఉండును గాక! అనివార్యములగుచున్న ఉభయ స్థితుల పట్ల నిరంతరం 'ఆత్మానుభవము' అనే అభేదస్థితిని నీ అంతరంగము సంతరించుకొనుగాక! ఆత్మారాముడవగు నీకు కర్మ - కర్తృత్వము - భోక్తృత్వము అకర్మ ...ఇవేవీ ఆపాదించబడజాలకుండును గాక !

ఓ రామచంద్రా! ఎవరికైనా సరే, ఈ దేహాదులందు అహం - మమ " అనే అభిమానం ఉన్నదా... ఇక ఆ జీవుని దుఃఖాదులు తొలగే అవకాశమే లేదు. దేహాదులందు ఆత్మాభిమానం లేని వాడు ముక్తికి అత్యంత వేగంగా అర్హుడగుచున్నాడు.

ఓ సర్వజనులారా! ఇట్లు 1. దేహాభిమానం, 2. దేహాభిమానరాహిత్యం... అను ఈ రెండిటిలో మీకు ఏది శ్రేయోదాయకమో పరిశీలించి ఆపై అద్దానిని ఆశ్రయించవలసినదిగా నా మనవి. అసలు ఈ అహం, మమ అనేవి మొదలే లేవని గ్రహించండి. లేని దానిని పట్టుకుని వ్రేలాడడం అనుచితం కాక మరేమిటి? ఏదైతే ఉన్నదో... అది కేవలం పరమశివ రూపమై ఉంది. ఎందు కంటారా... ఆనందఘనమైనట్టి శివరూపమగు పరమాత్మ కంటే భిన్నంగా ఏదైనా దృశ్యం కనిపిస్తుంటే అదంతా అవస్తువే సుమా! ఆభరణం కంటే బంగారం వేరా? ఈ కనబడే జగత్తంతా కూడా ఆత్మకు భిన్నమైన అనుభవం పొందకపోవడమే దీని యొక్క నాశనం (లేక) ఉపశమనం. అట్లు జగత్తు (దృష్టి యందు) రహితమైనప్పుడు శేషించేదేదైతే ఉన్నదో... అదియే పరమార్థమగు సత్య స్వరూపమై ఉన్నది.

3. కర్మ అంటే ఏమిటి

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ద్వైత - ఏకత్వ రహితం, మనన వర్జితం, పరమ శాంతం... అయినట్టి ఆత్మయే ఈ జగద్రూపంగా నెలకొని ఉన్నది. మట్టి బొమ్మలన్నీ తయారయినది మట్టితోనే కదా! అట్లాగే ఈ జగత్తంతా శివమయమే అయి ఉన్నది. ఈ కాల ఆకార-క్రియ శబ్ద శక్తి సందర్భ సహితమగు మనో బుద్ధి చిత్త అహంకారాలుగా కనబడేదంతా కూడా చిన్మయమే అయి ఉన్నది.

శివపంకమయా ఏవ రూపాలోక మనః క్రమాః |

తన్మయత్వాత్ అనంతత్వాత్, అతః కిం కేన చేత్యతే ॥

బొమ్మలన్నీ ఒకే మట్టిచే తయారుచేయబడి ఉండగా, ఇక ఆ బొమ్మలలో - శత్రు సైన్యం, మిత్ర సైన్యం, రాజు, మంత్రి, ఆయుధం, ఏనుగు... ఈ భేదాలన్నీ ఎక్కడున్నాయి ? ఈ కనబడే దంతా శివం అనే ఒకే మట్టితో తయారుచేయబడింది. ఇదంతా కూడా శివమయమై అనంత చిద్రూపమై వెలయుచుండగా, ఇక ఇందులో రూపం, ఆ రూపం యొక్క ఆలోకనం (చూడబడేది, చూచేది) ఆలోకనం చేయు మనస్సు... ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏది దేనిని ఎట్లా చూస్తుంది? ఓ

Page:557

రామా? ప్రమాత ప్రమేయము, ప్రమాణము 1. తెలుసుకునే ఆయన, 2.తెలియబడేది, 3. దేనిచేత తెలియుచున్నదో, అయ్యది... ఈ మూడు కూడా శివపంకమయములే. (పంకము అంటే మట్టి, మూల పదార్థం). అంతే కాదు. ఈ కనబడే దేశ కాలాలు, దిక్కులు, ఇక్కడి భావ-అభావ వివర్తాదులు... ఇవన్నీ శివతన్మయములేనయ్యా! అందుచేత ఇక్కడ గాని, మరెక్కడ గాని సారభూత మైనది పరమేశ్వరుడు (శివం, లేక ఆత్మతత్త్వం) మాత్రమే!

అహం మమేత్యతః సారాన్నే తరత్ పరమేశ్వరాత్ అసంసక్తమతిస్తిష్ఠ హా, శిలోదరమౌనవత్ II

అందుచేత ప్రియ రామచంద్రా సారభూతమైన పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. అతనికి భిన్నంగా “నేను - నీవు” మొదలైన వివర్తములేవీ లేనే లేవు. అందుచేత నీవు వీటన్నిటి పట్ల అసంసక్తమగు బుద్ధిని పెంపొందించుకొని, అటుపై శిలయొక్క అంతరాంతర విభాగం వలె పరమ మౌనం వహించి ఉండు. అంతేగాని, స్వతఃగా లేనివానిని పట్టుకొని వ్రేలాడనే వద్దు.

శ్రీరాముడు:

అహం-మమ ఇతి అసద్రూపం జ్ఞాస్యా భావయతః, ప్రభో |

అశుభం కర్మణాం త్యాగాత్, అనుష్ఠానాచ్చ కిం శుభమ్ ||

హే ప్రభూ! జ్ఞాని అనగా ఎవరు? ఏది ఉచితమో ఏది అనుచితమో ఏది నిర్వర్తించాలో, ఏది నిర్వర్తించకూడదో తెలిసియున్నవాడు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఊ !

శ్రీరాముడు: “ఈ అహం - - మమ (నేను - నాది) ఇత్యాది దృశ్య సమూహాలన్నీ అసద్రూపమే అని ఎఱిగిన జ్ఞానికి త్యజించవలసిన అశుభ కర్మలేమి ఉంటాయి? నిర్వర్తించవలసిన శుభకర్మలేమి ఉంటాయి? ఎందుకంటే “నేను - నావి అనేవే లేవు"... అని కదా అతని అవగాహన? మీ ఉద్దేశంలో శుభకర్మలు, అశుభ కర్మలు లేవనా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! "ఉచిత-అనుచిత కర్మలు ఉన్నాయా, లేవా? అనా నీ ప్రశ్న? అయితే నిన్ను కర్మల విషయమై కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీ అనుభవాన్ని, అవగాహనను దృష్టిలో ఉంచుకొని నీవు ఏమని అనుకుంటున్నావో అది సమాధానంగా నీకు ఏమి అనిపిస్తే అది చెప్పు.

1. 'కర్మ' అంటే ఏమిటి? 2.కర్మ అనునది ఎంతవరకు విస్తరించియున్నది? 3. కర్మ అనబడేదాని మూలమేమిటి? 4. కర్మ అనబడుదాని యొక్క ఏ విభాగము నిపుణతతో నశింపజేయవలసియున్నది? 5. అట్టి నశింపజేయవలసిన అంశమేదైతే ఉన్నదో... అద్దానిని నశింపజేయటానికి నీ ఉద్దేశంలో ఉపాయాలేమిటి ?

శ్రీరాముడు: వైద్యుడు అడిగే ప్రశ్నలన్నిటికి రోగి తన అనుభవములన్నీ సత్యముగా చెప్పితేనే ఉత్తమ ప్రయోజనం కదా! మీ రడిగిన ప్రశ్నలకు నాకు ఏమని తెలియవస్తోందో... అది సమాధానంగా చెపుతాను, వినండి.

Page:558

ఏదైతే (ఏ కర్మ వ్యవహార విభాగమైతే) నిపుణతతో నశింపజేయవలసియున్నదో అద్దానిని మూలఛేదంగా నశింపజేయాలేగాని, కొమ్మలు మాత్రమే నరికితే ఏం ప్రయోజనం? మరల అది ఎప్పుడో చిగురుస్తుంది కదా!

బుద్ధిమంతుడైనవాడు తన యొక్క శుభ అశుభ కర్మల రెండిటినీ (ద్వంద్వమును) నశింపజేసుకోవలసియున్నదని నా అభిప్రాయం. అసలీ కర్మలయొక్క మూలమెక్కడ ఉన్నదో కనిపెట్టి ఆ మూలమునే నశింపజేయాలి. అయితే, దేని యొక్క ఏ మూలమును ఛేదించుటచే ఈ కర్మ వృక్షము మరల చిగురించదో.... అట్టి కర్మమూల వ్యవహారము గురించి చెప్పుచున్నాను. వినండి.

ఈ దేహమే 'కర్మవృక్షం’గా ప్రకటితమైయున్నది. కాళ్ళు, చేతులు మొదలైన ఆయా అంగాలు అనే లతలతో ఇది శోభిస్తుంది. ఈ దేహం సంసారం అనే ఒక మహారణ్యంలో చిక్కుకుని ఉన్నది. ఈ దేహం వల్లనే జీవునకు సుఖదుఃఖాలన్నీ కలుగుచున్నాయి. ఈ దేహ వృక్షమునకు కర్మయే బీజం. ఈ దేహవృక్షం యొక్క ఫలములే సుఖ-దుఃఖములు. ఇది క్షణికమగు యౌవనంతో భాసిస్తూ చివరికి 'ముసలితనం' అనే నిస్సహాయ భూములకు నడిపిస్తోంది.

కోతి చెట్టు ఎక్కి ఆ వృక్ష సౌందర్యమునంతా నాశనం చేస్తుంది చూచారా? అతి భయంకర మైన 'కాలం' అను రూపం గల మర్కటం ఈ దేహవృక్షాన్ని ఆశ్రయించి దీని ఈకృతిని నిమిష నిమిషానికి ధ్వంసం చేస్తుంది. ఆలోచనలే ఈ దేహవృక్షపు చిగుళ్లు. నిద్ర, ఆ నిద్రలో కలలు గనటం... ఇవి కూడా ఈ దేహవృక్షమునకు ఆకులు వంటివే!

ఈ దేహము 'జగత్తు' అనే ఒక మహారణ్యంలో జన్మించింది. "భార్య భర్త-కొడుకులుతదితరులగు అయినవాళ్లు కానివాళ్ళు"... అనబడే సంబంధాలే ఈ దేహవృక్షం ప్రక్కన మొలచిన గడ్డి మొక్కలు. అట్టి ఈ దేహవృక్షము 'ముసలితనం' అనే శిశిర ఋతువులో తన ఆకులతో సహా నేలకూలుతోంది. ఈ కాళ్ళు చేతులు దీని పల్లవాలు. లోనగల నాడులు-ప్రేగులు-ఎముకలురక్తం... ఇవన్నీ వృక్షం యొక్క వ్రేళ్ళు మొదలైన అంతర్విభాగాల వంటివి. ఈ గోళ్ళు-జట్టు మొదలైనవన్నీ కోసినప్పటికీ మరల చిగురించే వృక్షపు లేపూత వంటిది.

కర్మప్రవాహ పరంపరయే ఈ దేహరూపంలో వికసితమగుచున్నది. కర్మేంద్రియాలే ఈ దేహ వృక్షపు మూలాలు. ఆ కర్మేంద్రియాలు దేహంలో ప్రవేశించే అన్నరసం చేత ప్రవృద్ధమవుతున్నాయి.

అయితే ఈ కర్మేంద్రియాలకు మూలం జ్ఞానేంద్రియములై ఉన్నాయి. వృక్షపు వేళ్ళు ఎంతో దూరం విస్తరించి ఉంటాయి చూచారా? ఈ దేహంలో గల జ్ఞానేంద్రియాలు కూడా నిజ విషయ రూపమున ఈ దృశ్య జగత్తులోనికి, సుదూరంగా విస్తరించి ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఒక వైపు ఈ కళ్ళు - ముక్కు - చెవులు - నోరు మొదలైన పంచేంద్రియ స్థానమును, మరొకవైపు ఈ జగద్విషయ సమూహమును ఆశ్రయించి ఉన్నాయి.

కర్మేంద్రియములకు (చెవులు, చర్మం, కళ్లు, నోరు, ముక్కు) జ్ఞానేంద్రియాలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) మూలం కదా! ఇక ఆ జ్ఞానేంద్రియాలకో ? మనస్సు మూలం. ఈ మనస్సు

Page:559

చేతనే ఈ జీవుడనబడేవాడు చేత్యముల వైపుగా (విషయాల వైపుగా) ఉన్ముఖుడై ఉండటం జరుగుతోంది. మరి, అట్టి ఈ మనస్సుకు మూలస్థానం ఏమిటి?" అని పరిశీలిస్తే చిదాభాసుడు అనతగ్గ ఈ జీవుడే మనస్సుకు మూలస్థానం... అని తెలియవస్తోంది. మరి, చేత్యాంశమును ప్రదర్శించే ఈ 'జీవుడు' అనబడేవానికి మూలమేమిటంటారా?

ఈ చిదాభాసాంశమునకు మూలము సర్వమూలములకు ఏకైక కారణమైనట్టి బ్రహ్మమే అయి ఉన్నది. ఆ బ్రహ్మము మనోవాక్కులకు అవిషయమైయున్నది. అనంతము, శుద్ధము, సత్యము అయి ఉన్న ఆ బ్రహ్మమునకు మరొక మూలమంటూ ఏదీ లేదు.

కనుక మహర్షీ! చైతన్యము విషయోన్ముఖమైనప్పుడు ఆ విషయోన్ముఖ చైతన్యమే సమస్త కర్మలకు మూలమైయున్నది. ఆ చైతన్యం తన నుండి బయల్వెడలిన అహంకారంతో తాదాత్మ్యం పొందినదైనప్పుడు క్రియారూపమగు స్పందము బయల్వెడలుతోంది. ఆ విధంగా కర్మలు - కర్మ ఫలములు - - కర్మ ఫలజనిత తదనంతర కర్మలు... ఒక దాని ననుసరించి మరొకటి గొలుసులోని కొక్కెం వలే ఏర్పడి ఉంటున్నాయి.

ఓ మునీంద్రా! సమస్త కర్మలకు ఆదియగు బీజము జీవచైతన్యమే అయి ఉన్నది. ఎందుకంటే జీవచైతన్యం ఉంటే కదా ఈ దేహం ఉండేది! దేహం ఉంటే కదా కర్మలు ఉండేవి! అట్టి ఈ జీవచైతన్యము అహంకారాదులతో కూడి "నేను ఈ కర్మలకు కర్తయగు చైతన్యమును... అను భావంతో కూడి ఉన్నప్పుడు, అట్టి కూటమియే కర్మలకు బీజమగుచున్నది. జీవ చైతన్యం అకర్తృత్వం వహించి ఉన్నప్పుడో, అదియే పరమపదరూపమగు 'సత్తు' అయి ఉన్నది. అనగా....

1. జీవచైతన్యము ‘అహంకారము' మొదలైన భావనలతో కూడుకొని ఉన్నప్పుడు అది కర్మ వ్యవహారములన్నిటికీ తానే బీజమై ఉంటోంది.

2. జీవచైతన్యము అహంకారాదులన్నిటికీ విభిన్న మైన శుద్ధ చిద్రూప భావన కలిగి ఉన్నప్పుడు అదియే 'పరమపదరూపము' లేక 'బ్రహ్మము' అయి ఉంటోంది.

కాబట్టి ఈ దేహాదులకు సంబంధించిన 'అహంభావం యొక్క భావనయే కర్మలకు బీజ కారణమై ఉన్నదని నా ఉద్దేశం.

స్వామీ! ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ మీరు ఇతఃపూర్వమే చెప్పియున్నారు. మీ బోధను అనుసరించే నా బుద్ధికి కూడా 'అవును కదా' అని తోచుటచే మీ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు చెప్పటం జరిగిందని నా మనవి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! నీవు చెప్పినదంతా దృష్టిలో పెట్టుకొని ఈ కర్మబీజము విషయమై మరికొంత పరిశీలిద్దాం.

ఎంతవరకైతే ఈ ఉపాధి ఉంటుందో... అంతవరకు జీవ చైతన్యమునకు అహంకారము, ఆ అహంకారమును ఆశ్రయించి కర్మ వ్యవహారం ఉంటాయి కదా? కనుక దేహమున్నంత వరకు 'కర్మలు' అనేవి ఉంటూనే ఉంటాయి.

Page:560

నీవు చెప్పినట్లు ఈ జీవచైతన్యం ఏ దృశ్యం వైపుగా ఎట్లు ఉన్ముఖమౌతున్నతో అది అద్దానిని అట్లే పొందుతోంది. ఆ దృశ్యం సత్యమా, అసత్యమా? అది బాహ్యమా, అంతరమా?అనేది ఇక్కడ ప్రశ్న కాదు. జీవచైతన్యం ఏ రూపంగా ఉన్ముఖం అయితే ఆ రీతిగా అనుభవం పొందుతోంది. దేనిని ఎట్లా భావన చేస్తే అట్లా అది పొందుతోంది, అనుభవిస్తోంది కదా! అట్టి ఈ జీవచైతన్యం దృశ్యం వైపుగా ఉన్ముఖమే కాలేదనుకో? అప్పుడు? అది సంసారం నుండి విడివడిపోవుచున్నది. ఇక సంసారం భ్రమా? సత్యమా? అనేది అప్రస్తుతమే అవుతుంది. అటువంటి విచారణతో పనేంటి?

కాబట్టి ఈ జీవనచైతన్యమే వాసన, ఇచ్ఛ, మనస్సు, కర్మ, సంకల్పము... మొదలైన ఆయా రూపాలలో తనను తానే ప్రదర్శించుకుంటోంది. అది స్వయంగా భ్రమలను ఆశ్రయించి ఈ సంసారం యొక్క రూపమును వికసింపజేస్తోంది.

ఒకడు జ్ఞాని అయి ఉన్నా కూడా, అతనికి ఎంతవరకైతే ఈ దేహం ఉంటుందో అంతవరకు ఈ దేహగృహంలో అతనికి 'చిత్తం' అనేది ఉండియే ఉంటోంది. జీవించి ఉన్నంత వరకు చిత్తమును త్యజించుట ఎట్లా సాధ్యం? సాధ్యం కాదు. అయితే జ్ఞాని యొక్క జీవచైతన్యం నేను అసంగమైన అద్వితీయమైన, కూటస్థమైనట్టి స్వరూపమును... అను ఎఱుకను, అనుభూతిని, అనుభవమును

సంతరించుకుని ఉంటోంది.

సర్వకర్మలకు ఆవల, కర్మలన్నిటికీ సంబంధించనివాడనై శుద్ధ చిద్రూపుడనైన నేను ఏర్పడియున్నాను. అందుచేత కర్మాకర్మలతో నాకు ప్రమేయం లేదు. “నా హంకర్తా! నైవ కించిత్ కరోమి! నేనేమీ చేయటం లేదు... అని ఈ విధంగా నిష్క్రియమైన ఆత్మస్వభావ స్థితిచే ఈ చిత్తమును ఆక్రమించివేసి ఉంటున్నాడు. తదితర జీవులవలెనే ఆయా కర్మలు ఈ దేహముచే నిర్వర్తిస్తున్నప్పటికీ స్వస్వరూపమునందు అతనికి కర్మ యొక్క భావనయే జనించదు. అతడు కర్మ - అకర్మల వికల్పం త్యజించివేసి ఉంటాడు. అట్టి జీవచైతన్యం స్వయంగా అజమైనట్టి బ్రహ్మరూపంగా అయి, తదనుకూల అనుభవమును అనిర్వచనీయంగా పొందుతూ ఉంటుంది.

కర్మ-అకర్మల వ్యవహారం త్యజించకుండా, ఆ ఉభయాలకూ అతీతత్త్వం సంతరించుకోకుండా, ఒకడు “ఈ శరీరమే కదా కర్మలకు మూలం! అందుకనే ఈ శరీరాన్ని నిష్క్రియంగా ఉంచుతాను”... అని తలచి శరీరముచే మాత్రమే విహితకర్మలను త్యజించేవాడు ఎన్నటికీ "కర్మత్యాగి" కాలేడని జనులందరికీ గుర్తు చేస్తున్నాను.

జ్ఞాన బలం చేత ఈ దృశ్య ప్రతిభాస స్వయంగా లయించగలదు. అప్పుడు “ఈ జగత్తు అనబడేది భావనామాత్రమే గాని స్వయంగా లేదు... అనురూపంగా ఉండే జగత్తు యొక్క అత్యంత - అభావం సిద్దించగలదు. అట్టి జగత్ అభావన, మరియు అప్రమేయ అఖండ ఆత్మభావనయే త్యాగం, అసంగం, మోక్షం అను శబ్దములచే ఉద్దేశించబడుతున్నది సుమా! సందర్భానుచితంగా ఇక్కడ వేద్య (తెలుసుకొనబడుచున్న విషయం) - వేదనముల (తెలుసుకొనుచున్న తత్త్వం (లేదా) చిదాభాసరూప చైతన్యం) గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకుందాం.

Page:561

వేదనము ఉన్నప్పుడే (తెలుసుకొనుచున్నది ఉన్నప్పుడే) తెలియబడే విషయాలు అనేది ఉంటుంది. ఆ తెలుసుకొనుచున్న విభాగం ఎందులోంచి బయలుదేరుతుందో... (లేక) తెలుసుకొను చున్న విభాగమునకు ముందే ఉన్నదేమిటో... అది వేద్య దృష్టి కంటే కూడా సూక్ష్మమై, కారణ కారణమై ఉన్నది.

అట్టి మున్ముందుగా ఉన్న తత్త్వమును ఆశ్రయించడమే "వేద్య దృష్టిని అధిగమించి తత్త్వదృష్టిని ఆశ్రయించటం”... అని గ్రహించు.

ఏ తత్త్వ దృష్టి యొక్క పరిపుష్టి చేత వేద్య దృష్టి యొక్క ఉత్పన్నమే లేదు... అని గ్రహించ బడుతుందో అట్టి తత్త్వానుభవాన్ని సంతరించుకొన్న వానికి ఇక "తెలియబడే విషయాలు వేదనము అనునది ఎక్కడుంటుంది ? అనగా, వేద్యదృష్టి - వేదనము కూడా స్వతహాగా లేవని గ్రహించినచోట జగదృష్టి యొక్క అతీతత్వం రూపుదిద్దుకుంటుంది. దృశ్యం ద్రష్ట యొక్క అవగాహన - అభిప్రాయం - భావనలను అనుసరించే ఉంటోంది సుమా!

'జ్ఞానదృష్టి' (ఆత్మ దృష్టి) యొక్క పరిపుష్టి చేత ఒకడు వేద్యోన్ముఖత్వమును (విషయముల పట్ల గల మూలాధ్యాసను) త్యజించినాడనుకో, అనగా వేద్య దృష్టి ఉత్పన్నముకానప్పటి వేదనము యొక్క స్వరూపమేమికలదో... అద్దానిని ఏమని పిలవాలి?

అది 'వేదనం' కాదు. ఎందుకంటే తెలుసుకోవటం అను కార్యక్రమం కన్నా అది ముందే ఉన్నది కదా! అది కర్మ (లేక, క్రియారూపం) కాదు. ఎందుకంటే సర్వక్రియలకు అది ముందే ఏర్పడి ఉన్నది కదా! అందుకే అది నిష్క్రియం అని కూడా వర్ణించబడింది మరి! అది స్వతహాగా శాంతమగు బ్రహ్మమే అయి ఉన్నది.

ఆకాశంలో ఉండే మేఘాలు జలాదులందు ప్రతిబింబిస్తున్నట్లు, బుద్ధ్యాదులందు (ఆ బుద్ధికి అనుగుణంగా) ఈ దృశ్యం ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబాన్ని ఎఱుగుచున్న చైతన్య విభాగం చిదాభాస చైతన్యం” అను పేరుతో ఉద్దేశించబడుతోంది. అట్టి చిదాభాస చైతన్యం క్రియారూపంగా ఈ జగత్తులో ప్రదర్శితమౌతోంది. ఏ జీవుడైనా చిదాభాస - శూన్యత్వమును అవధరించి ఉంటే అట్టి అతని పరిశేష్యమును... 'మోక్షం' అని పిలుస్తున్నారు. అట్టి వారు ఈ లోకానికి ఉపదేశిస్తున్న దంతా శిష్యుని వాస్తవ స్వరూపం గురించే.

కాబట్టి రామా! దేహం ఎంతవరకు ఉంటుందో, అంతవరకు కర్మలయొక్క 'త్యాగం అనేది సంభవించదు. కర్మలను ఆశ్రయిస్తున్నంత కాలం, ఆ కర్మలకు మూలమైన (వాసనాసంబంధమైన, మనో సంబంధమైన) చిదాభాసరూపసంవిత్తు ప్రవర్తిస్తున్నట్లే అవుతోంది. ఆ చిదాభాస సంవిత్తును అధిగమించి పరిశీలిస్తే 'శుద్ధసంవిత్తు' మనకు ద్యోతకమౌతుంది. అట్టి అధిగమనం జ్ఞానబలిమిచే సుసాధ్యం. శుద్ధ సంవిత్తు సర్వదా యథాతథంగా ఉండగానే అద్దాని 'చిత్కళ' అనతగిన చిదాభాస సంవిత్తు అంతఃకరణమునందు వాసనలను కలిగి ఉంటోంది. అట్టి వాసనారూపసంవిత్తు కర్మలకు కర్తృత్వాదులకు కారణత్వము వహించి ఉంటోంది.

Page:562

ఎవడైతే చిదాభాసరూప సంవిత్తును అద్దాని మూలాజ్ఞానముతో సహా 'ఆత్మవిచారణ అను స్వప్రయత్నముచే యథార్థముగా ఎఱుగుచున్నాడో... అట్టి వాడు ఆ చిదాభాస స్వరూపమును అధిగమించి శుద్ధ చిద్రూపమును ఎఱుగుచున్నాడు. చిదాభాససంవిత్తును అనుసంధానం కావించకపోవటం”... అను అభ్యాసముచే మాత్రమే చిదాభాససంవిత్తు అధిగమించబడుతున్నది.

తేన సంసృతి వృక్షస్యం | మూలకాషో వితన్యతే ||

అతడే ఈ సంసార వృక్షమును మూలాఛేదం కావించినవాడగుచున్నాడు. కనుక అవేదత్వమే మోక్షం (ఆవేదన విదుర్ మోక్షం)!

ఓ రాఘవా! ఇక్కడేగాని, మరెక్కడైనాగాని బ్రహ్మమొక్కటే ఉన్నది. అది చిదాభాసవర్జితమై మేఘవిభాగ రహిత ఆకాశము వలె ఉన్నది. సజాతీయ - - విజాతీయ, స్వగతాది భేదములు అద్దానికి లేవు.

చిదాకాశరూపమై నిరామయమైనట్టి ఆ బ్రహ్మమే సమస్త చేతనములయొక్క సారం... అని బ్రహ్మవేత్తలు ఎలుగెత్తి పలుకుచున్నారు. ముముక్షువులంతా అది శ్రద్ధగా విని, అందు సూచించే అర్ధసారాన్ని గ్రహించి తమ చిదాభాసాతీతమైన చిదాకాశత్వాన్ని గ్రహించి, అనువర్తించెదరు గాక!

4. కర్మ త్యాగము

శ్రీరాముడు : మునీంద్రా! అవేదనమే మోక్షం" (ఈ తెలియబడేదంతా తెలియకుండా ఉండటమే మోక్షం) అనే అర్థం మీరు సూచిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. సర్వజ్ఞానాలకు పరాకాష్ఠ అయిన మోక్షం ఆత్మజ్ఞానం అనే ఎఱుక కూడా రహితమైన స్థితి" అని మీ ఉద్దేశమా? ఎందుకంటే, ఆత్మ జ్ఞానం కూడా తెలియబడే విషయాంతర్గత విభాగమే కదా! "అసత్తుకు ఉనికి లేదు. సత్తుకు లేమి లేదు... అని కదా శాస్త్ర సిద్ధాంతం? జ్ఞాన స్వరూపమగు సత్తు తెలియబడనిది అనే నాకు వినిపిస్తున్న మీ అభిప్రాయం నేను సమన్వయించుకోలేకపోతున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : మొట్టమొదట ఆత్మ నిత్యోదిత చైతన్యస్వరూపమై ఉన్నది. ఇది సత్తు. మిగిలినదంతా అసత్తుగా (లేక) కల్పనగా ఏర్పడుతోంది. నిర్విషయ - అఖండ - అప్రమేయమగు ఆత్మ నుండి స్వయంకల్పితంగా ద్రష్టత్వం (లేక) అనుభవత్వం బయల్వెడలుతోంది. అదియే జీవుడు’ అని 'చిదాభాసుడు’ అని అంటున్నాం. ఈతనినే 'దృశ్యద్రష్ట' అని గమనించు. ఆ దృశ్యద్రష్ట స్వయంభావనచే పొందుచున్నదే ఈ దృశ్యము (లేక) వేదనము.

నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః |

యదా తదైవ సుకరం వేదనావేదనం స్వయమ్

ఓ రామచంద్రా! ఎప్పుడైతే "అసత్తుకు ఉనికి లేదు. సత్తుకు లేమి లేదు అనేది సిద్ధాంతమై ఉన్నదో... అప్పుడు “వేదనం (దృశ్యమును ఎఱుగుచున్న విభాగం) అవేదనమగుట... అని నేను ప్రతిపాదించే మోక్ష సిద్ధాంతం మరింత సుకరం అవుతోంది.

Page:563

ఇప్పుడు మనం "వేద్యము (తెలియబడుచున్నది) అనే శబ్దం ఉపయోగించాం కదా! అయితే అట్టి వేదనము అనబడు శబ్దము, దాని అర్థము కూడా "త్రాడునందు చూచే పాము వలె ఎండమావులలో కనిపించే జలతరంగాల" వలె భ్రమయుక్తములు మాత్రమేనని గ్రహించు. వేదనము అసత్యంగానే ఉదయించినదగుచున్నది. అందుచేత ఆ వేదన - వేద్యములు (ద్రష్టత్వ -

దృశ్యములు) “వేదనము (తెలియబడేది) అనబడే శబ్దార్థములను రెండిటి యొక్క విస్మరణయే పరమశ్రేయస్సును కలుగజేయగలదు సుమా!

ఎందుకంటావా? "తెలియబడేది... అనుదాని చేతనే కదా, ఈ జీవునకు దుఃఖములన్నీ కలుగుచున్నవి! తెలియబడేదానికి మున్ముందుగానే తెలుసుకుంటున్నది”... అనునది ఉండనే ఉంటోంది. ఆ తెలుసుకుంటున్నది అనబడేదే ఈ జీవుని వాస్తవ స్వరూపం.

కంసా

తెలుసుకొనే

విభాగము

తనయందు | తెలుసుకునేది తెలియబడేది

కలిగియున్న (వేదనము) వేద్యము గ

స్వస్వరూపము

దృశ్యము

Self Knower

ఆత్మ జీవుడు

అట్టి తెలుసుకునుచున్నది అనబడేది తెలియబడేదానిచే ఎట్లా తెలియబడుతుంది చెప్పు? అందుచేత ఓ రామచంద్రా! నీవు 'తెలుకొనుచున్నది (ద్రష్ట - జీవుడు) అను ఒకానొక చమత్కారం తనయందు ప్రదర్శించే స్వస్వరూపమగు ఆత్మనే ఎఱుగుము. అంతేగాని ఈ చిదాభాసుని (ఆత్మ నుండి బయల్వెడలుచున్న ద్రష్ట - జీవుడు) గురించి ఎంతగా విచక్షణ చేసి ఏమి ప్రయోజనం?

మరొకసారి చెప్పుచున్నాను. వేదనము (తెలియబడేది - దృశ్యం) అను దానిలో చిక్కుకొనటం చేతనే వాస్తవానికి సత్-చిత్-ఆనందస్వరూపుడగు ఈ జీవుడు (చిక్కుకున్నట్లుగా ఏర్పడుచున్న భ్రమచేతనే) సర్వ దుఃఖములు, సర్వ అనర్థములు తెచ్చి పెట్టుకుంటున్నాడు. అందుచేత ఈ తెలియబడుచున్న దానికి సంబంధించిన 'జ్ఞప్తి' యొక్క శబ్దార్థములు రెండింటినీ త్యజించి సుఖస్వరూపుడవై ఉండు.

ఓ రామచంద్రా! 1. ద్రష్ట-దర్శనము-దృశ్యము... అనబడే త్రిపుటీ బోధ లక్షణము అయి ఉన్న ఈ వ్యవహారశీలత్వము; 2. వ్యావహారిక సంబంధమైన 'జ్ఞప్తి' లక్షణము; 3. సర్వార్థసారమైన పరమకూటస్థ చిన్మాత్రము... ఈ మూడింటిలోను మొదటి రెండు అధిగమించి అటుపై సర్వశబ్దపరం - మూడవది అయినట్టి 'ఓం' కారమును అన్వయించుకొని ఉండు. అట్టి పారవశ్యంనందు అనుభవ మయ్యే శుద్ధాత్మయే నిర్వాణోదయం సుమా! (అదియే ఈ వర్తమాన నిర్వాణ ప్రకరణసారం). అట్టి నిత్యోదిత శుద్ధాత్మయందు ఎట్టి విక్షేపము లేకుండా వ్యవహరించుము.

Page:564

కర్మ, కర్మ త్యాగము -

శుభాశుభాత్మకర్మ స్వం నాశనీయం వివేకినా | తన్నాస్త్రీత్యవబోధేన, తత్త్వజ్ఞానేన సిద్ధ్యతి ||

వివేకి అయినవాడు తన యొక్క శుభ - అశుభ కర్మల రెండింటినీ దాటివేసి ఉంటాడు. అవి వాస్తవానికి లేవు... అను బోధ చేతను, ఆ రెండింటిచేత స్పృశింపబడనట్టి 'తత్త్వం' యొక్క జ్ఞానం చేతను వాటి 'రాహిత్యం లేక అతీతత్వం సిద్ధింపజేసుకోగలడు.

కర్మమూల నికాషేణ, సంసారః పరిశామ్యతి |

సువిచారితమన్విష్టం యావత్ కర్మ న విద్యతే ॥

కర్మ యొక్క ఏ మూలమైతే ఉన్నదో... అదే చిత్ యొక్క అభాసరూప సంవిత్తు అని వర్ణించబడింది. అట్టి కర్మల యొక్క మూలాన్ని ఛేదించుటచేతనే సంసారం శమిస్తోంది. మూల, ఫల, పుష్ప, శాఖ - ఉపశాఖసహితమగు కర్మ వృక్షమే మొదలే లేదు... అనే పర్యవసానం, ప్రయోజనం కలిగి ఉండే పూర్ణ విచారణ చేతనే ఈ వృక్షం నశించగలదు. అనగా ఈ జీవుని పట్ల కర్మవృక్షం అప్రభావితమై ఉండాలంటే అది విచారణ శాస్త్రాణ్వేషణలచే (కర్మ రాహిత్యత్వం . కర్మాతీతత్వం) తప్పక లభించగలదని నా మనవి.

శ్రీరాముడు : స్వామీ! 'చిత్తము' అనబడేదాని అసలైన రూపమేమిటి ?

శ్రీ వసిష్ఠ మహర్షి : బిల్వ వృక్షములోని మజ్జలో గల బీజతత్త్వమే బీజముగా బయల్వెడలుతోంది కదా! బిల్వబీజం బిల్వవృక్షం కంటే వేరా? ఎట్లా అవుతుంది? రెండింటిలోని 'సత్త' (జీవ తత్త్వం) అనేది ఒక్కటే. అట్లాగే 'చిద్రూపం' అనే బిల్వవృక్షం నుండి బయల్వెడలిన చిత్తం’ అనబడు క్రియాకారాది త్రిపుటి ఆ చిద్రూపం కంటే లేశం కూడా వేరైనది కాదు. ఈ భూలోకంలో ఉండే ఒక ప్రదేశం భూలోకం కంటే వేరైనది కాదుకదా! అట్లాగే ఈ అవకాశం, ఆకాశమున అంతర్గతమై ఉంటున్న భూతజాలం, భవనాది వస్తుజాలం - ఇవన్నీ కూడా సన్మాత్రమగు పరమాత్మ కంటే వేరైనవి కానేకావు. " జలమందలి తరంగత్వము జలం కంటే వేరు... అని ఎవరైనా అనగలరా? చిత్తం కూడా చిద్రూపమే అయి ఉన్నది. చిత్తం చిత్తే! చిత్తు చైతన్యమే! జలంలో ద్రవత్వం, అగ్నిలో ప్రకాశం ఉన్నట్లే బ్రహ్మం నందు గ్రాహకత్వం (గ్రహించటం) అనే స్వభావం, స్మృత్యత్వం (స్మృతి అనే చమత్కారం)... అను వ్యవహారాల కంటే సూక్ష్మమైన చిత్తం ఉండి ఉన్నది.

అయితే “చేతనము”...అనే శబ్దం యొక్క అర్థం "క్రియాత్మకము అని కదా! అయితే సర్వ క్రియలకూ ముందే ఏర్పడి ఉన్న నిష్క్రియ కూటస్థ చైతన్యం నందు యక్షుని భ్రమలాగా క్రియాత్మక చైతన్యం ప్రజ్వరిల్లుతోంది. అది స్వతహాగా అకారణం కనుక 'క్రియాత్మకం' అనబడేదంతా వాస్తవానికి “ఉదయించనిది, లేనిది" - అయి ఉన్నది. వాయువు - వాయు చలనము వేరు వేరా? శ్రీరాముడు : కాదు. వాయువు వాయు చలనము వేరు వేరుగా ఉండజాలవు.

శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగే, చేతనము - - దాని యొక్క అభివ్యక్తరూపం అగు క్రియ అభిన్నములై

Page:565

ఉన్నాయి. ఈ సిద్ధాంతమును అనుసరించి ఇక్కడి బాహ్య అభ్యంతర రూపములగు, జాగ్రత్ -

స్వప్న - సుషుప్తులందలి - పదార్థబుద్ధి కూడా ఆత్మరూపమే గాని... మరింకేదో మరొకటి కాదు. విస్తారః కర్మణాం దేహః, సో హంతాత్మా, స సంసృతిః | అచేతనాన్ అనహర్త్వేన శామ్యతి అస్య స్పన్దవాతవత్ II

ఓ రాఘవా! కర్మల యొక్క విస్తారమే ఈ దేహం. అదియే అహంకారం, అదే సంసారం కూడా! కనుక నీవు చిదాభాసత్యాగ పూర్వకమైన అనహం భావన అనే గొడ్డలిచే ఈ సంసారంఈ దేహాహంకారాలను శమింపజేయి. అప్పుడు నిశ్చలస్థితిలోని వాయువు వలె సర్వాతీతమైన నీ వాస్తవ స్వభావం తేటతెల్లమవగలదు. ఆ విధంగా చిదాభాసుని త్యజించు. అనంతాత్ముడవగుము. చిద్రూపుడవై ఒక శిలవలె నిశ్చలత్వమును అవధరించి ఉండు. అట్టి నిశ్చలాత్మకత్వ బలిమిచే వరాహం రెల్లుగడ్డిని తొలచునట్లు, ఈ సంసార మూలమును (ఈ జన్మ కర్మ వ్యవహారత్వమును) ఛేదనమొనర్చివేయుము. ఈ మార్గంలో మాత్రమే ఈ కర్మబీజము యొక్క కోశము త్యజించ బడుతుంది. ఇక వేరే మార్గం లేదు.

ఈ ప్రకారంగా కర్మబీజకళ త్యజించబడుగాక! అప్పుడు క్రమంగా బ్రహ్మం కంటే భిన్నమైనది. కనిపించటానికి కారణమగుచున్న చిదాభాసుడు", ఆ చిదాభాసునికి కనిపించే దృశ్యప్రపంచం జీవునకు మిథ్యగా తేలిపోవుచున్నది. ఇక అతడు వేద్యమగు పరబ్రహ్మమును స్వతఃసిద్ధంగానే ఎఱుగుచున్నాడు. ఇక పరమశాంతస్వరూపుడగు అట్టి మహాత్ముడు దేనినీ త్యజించడు. గ్రహించడు. అనగా అతడు గ్రహణము - - త్యాజ్యము" లకు సంబంధించిన అనుభవమే కలిగి ఉండడు. సర్వ ప్రాపంచిక వ్యవహారములకు నిమిత్తమాత్రుడై, శాంతచిత్తుడై ఉంటాడు. ఆకాశమువలె విశదమై దృశ్యరహితమైనట్టి తన ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి ఉంటాడు. అంతేకాదు. అతడు ఆయా ప్రవాహపతితములగు కార్యములు చేయుచున్నప్పటికీ నిర్వర్తించనివాడుగానే ఉంటాడు. నదీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న చెక్క - కొమ్మ మొదలైన వాటిని చూచి నదీ జలం చలిస్తుందా? అట్లాగే తత్త్వజ్ఞుడు తన “జీవుడు - అనబడు ద్రష్టత్వమును - కర్మేంద్రియ మనోవికారములను తన స్వరూపముపై (ఆత్మస్వరూపముపై) ఆపాదించుకోడు. అయితే సగం నిదిస్తున్న బాలునిలాగా ఆయా చేష్టలను మాత్రం సల్పుతూ ఉంటాడు. నిర్విషయమగు నిరతిశయానందం (బ్రహ్మం) లభించటం చేత అతని ఇంద్రియాలు ఆయా ఇంద్రియ విషయాల పట్ల రాగరహితమై ఉంటాయి. అవి అంతరమున గాని, బాహ్యమున గాని ఎట్టి ఉనికిని కలిగియే ఉండవు సుమా!

ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఆత్మతోటి ఏకత్వానుభవమే (నేను శాశ్వతం - అప్రమేయం అగు ఆత్మను... అను అనుభవమే) 'కర్మత్యాగం' అను శబ్దంచే ఉద్దేశించబడుతోందని మరల ప్రకటిస్తున్నాను. అట్టి జ్ఞానం ఆత్మ ప్రబోధం వలననే సిద్ధిస్తోంది.

కర్మణో వేదనం త్యాగః స చ సిద్ధః ప్రబోధతః అవస్తు నేత రేణార్ధః కింకృతేన అకృతేనవా ॥ ||

Page:566

కర్మలతో 'రాహిత్యము సంతరించుకోవటమే కర్మత్యాగం. ఇక ఈ దేహ - ఇంద్రియాదులతో జరిగే చేష్టలంటావా? అవన్నీ మిథ్యారూపాలని గ్రహించు. అవి ఒనర్చినా, ఒనర్చకున్నా... అందులో విశేషమేమీ లేదు. ఆత్మభావంతో (ఆత్మసాక్షాత్కార బుద్ధితో) ఈ దృశ్య - జగత్తులో చరిస్తున్న తన ‘జీవుడు’ అను పాత్రను తదితర దేహులను చూస్తున్న విధంగానే చూచేవానికి ఇక బంధమెక్కడిది?

ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. ఈ జీవుడు ఎట్లాగైనా సరే, తనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకుని ఆత్మస్థితిని సంపాదించుకోవాలి, అనగా... నా యొక్క వాస్తవ తత్త్వం చిదాభాసవర్జితం - విషయజ్ఞాం కంటే ముందే ఏర్పడి ఉన్నది. కనుక... అది విషయజ్ఞాన వర్జితం.

అది పరమ శాంతస్వరూపము, సర్వదా సమస్వరూపము, అది సర్వవేళలా కృత - అకృత ప్రతిసంధానరహిత స్వరూపము, అది వాసనారహితము, పరమ శుద్ధము ... ఇటువంటి అవగాహన ఎవరు సంతరించుకుంటారో, అట్టి వారే కర్మ త్యాగి అని చెప్పబడుతారు.

అయినా.... ఒక్క విషయం. సంసార బద్ధుడు అని చెప్పబడే జీవుడు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక రోజు నిర్వర్తించిన కర్మలేమిటో చెప్పమంటే చెప్పలేడు కదా! కానీ ఆతడు 1.ఇప్పటికి ఇది చేశాను, 2. అప్పటికి అది చేయవలసి ఉన్నది, 3. ఆ, ఇంత చేశానే! నాకేం వచ్చింది? 4. అయ్యో! ఇది ఎందుకో చేయలేకపోయాను... అనే ఈ నాలుగు రకాల కర్మ సంగమమును వర్తమానంలో కలిగి ఉంటున్నాడు. ఇక 'ముక్తుడు' అనువాడో, వర్తమానంలోనే సర్వ కర్మలు, సర్వదృశ్యములు విస్మరించి ఉండగలుగుచున్నాడు. అట్టి సునిశ్చితము, సునిశ్చలము అగు ఆత్మస్థితికి శాస్త్రములు 'కర్మత్యాగము' అని పేరు పెట్టాయి.

శ్రీరాముడు : అయితే 'కర్మత్యాగము' అనేది కర్మలను నిర్వర్తించటం మానివేయటం చేత వచ్చే స్థితి కాదని మీ ఉద్దేశమా!

శ్రీ వసిష్ఠ మహర్షి : కర్మరహిత స్థితియే మోక్షరూపమగు కర్మత్యాగస్థితి అయి ఉంటే జడరూపమగు గాఢ నిద్రాస్థితియే మోక్ష స్థితి అయి ఉండేది. కర్మలను మానివేసి ఒకచోట ఊరకే కూర్చుని ఉండటం 'కర్మత్యాగం అనిపించుకోజాలదని మరల మరల ప్రకటిస్తూనే ఉన్నాను సుమా! అసలు మూలము అయినట్టి చిదాభాసుని త్యజించకుండా (దృశ్య జగత్తులో చరించే ద్రష్టత్వము జీవత్వములకు అతీతత్వం పుణికి పుచ్చుకోకుండా కేవలం కర్మేంద్రియాలను గాలికి వదిలినంత "మాత్రం చేత కర్మత్యాగం అని అనిపించుకోదని చేతులెత్తి మరల ప్రకటిస్తున్నాను. అట్టి వ్యర్థమైన అవగాహనతో కూడినవారిని 'మాంద్యము' అనే పిశాచము గుటుక్కున మ్రింగటానికి సిద్ధంగా ఉన్నదని గుర్తు చేస్తున్నాను. అట్లా అయితే మత్తుగా త్రాగి మొద్దుగా నిదురించేవాడు మోక్ష స్వరూపుడౌతాడు. అది అట్లు కాదు కదా!

ఇక 'సమూల కర్మ త్యాగము' సంతరించుకుని ఎవరైతే ప్రశాంతముగా ఉంటారో.... అట్టి వారికి ఈ ప్రపంచం విషయంలో కర్మలు నిర్వర్తించినా, నిర్వర్తించకున్నా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వివేకి అయినవాడు 1.నేను కర్మలు నిర్వర్తించాలి; 2. ఎందుకు నిర్వర్తించాలి?”...

Page:567

ఇటువంటి ఉభయ కర్మబీజకళలను సమూలంగా త్యజించి ఏకంగా ఆత్మయందే నిత్యసమాహితుడై వెలయుచున్నాడు. అనగా......

ప్రవాహపతితే కార్యే ఈషత్ స్పన్దా అతన్మయాః ఫర్ణమానాఇవ క్షీబాయంత్ర సంచారితా ఇవ మోక్షలక్ష్య్మా విలాసిన్యా వ్యసనోపహతా ఇవ

అర్థసుప్త ప్రబుద్ధాభాః కామప్యవనిమాగతాః |

వివేకులు ఒకవైపేమో పూర్ణ అనాసక్తులై, అభిమానాది ఎట్టి వికారాలు లేని వారై ఆయా ప్రవాహపతితమైన కార్యాలను (ఆయా నియమిత క్రియాదులను ఉత్సాహంగా నిర్వర్తిస్తూనే... మరొకవైపు మదిరోన్మత్తుని వలె, యంత్రాలచే చలింపబడే ఆట బొమ్మలాగా నిస్పృహులై ఉంటారు. 'మోక్ష లక్ష్మి పట్ల మాత్రమే అత్యాసక్తియుతులై, ఈ దేహదులతో ఏమాత్రం సంబంధం లేనివారై ఉంటారు. సగం నిద్రలో ఉండే బాలునివలె ఉత్తమ భూమికలను అవధరించి ఉంటారు.

ఒక చెట్టును మొదలంట (వేళ్ళతో సహా) పెకలించిస్తేనే అది తొలగించబడినది అవుతుంది గాని కొమ్మలు నరికినంత మాత్రంచేత చెట్టును నశింపజేయటం అవుతుందా? లేదు కదా! "నేను కర్మ వ్యవహారములకు అప్రమేయుడను, అసంబంధితుడను, అతీతుడను... అని గ్రహించటమే కర్మత్యాజ్యం గాని “నేను కర్మలు నిర్వర్తించను అనేది కర్మత్యాజ్యం కాదు. జీవించటమనేది కూడా ఒక కర్మయే కదా! "నేను జీవన్ పరిమితుడను కాను"... అని గ్రహించటం చేతనే దేహాదులు జయించబడినవి అవుతున్నాయి. మూలాఛేదనం చేయకపోవటం చేతనే ఈ కర్మ వృక్షం మరల మరల చిగురించి, శాఖోపశాఖలై జీవుని దుఃఖమును వర్ధింపజేయుచున్నదని సాధకులు గ్రహించవలసినదిగా నా మనవి.

ఓ జనులారా! చిదాభాసుని ఛేదనం చేసినప్పుడు మాత్రమే (నేను జీవ - - దేహ పరిమితుడను అను భ్రమను వదలినప్పుడు మాత్రమే) 'కర్మత్యాగం'... అనేది సిద్ధిస్తోంది. ఇది గ్రహించి మీమీ సాధనలు కొనసాగించండి. ఇతర వ్యవహార పరంపరలతో, క్రియా క్రమములతో ఏమి పని?

ఎవరైతే ఈ 'కర్మత్యాగం'ను ఆచరించకుండా హఠాదులచే కేవలం కర్మేంద్రియాలను మాత్రం సంయమనం చేస్తారో... అదియే 'త్యాగము' అని తలుస్తూ ఉంటారో... అది వ్యర్థ ప్రయత్నమని చెప్పక తప్పదు. అది ఆకాశమును చేత్తో బాది వశం చేసుకోవాలని అనుకోవటం వంటిది. శ్రీరాముడు : మహాత్మా! మీరు చెప్పే కర్మత్యాజ్యం సిద్ధింపజేసుకునేది ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మజ్ఞానం సంపాదించుకోవటంచేతనే కర్మత్యాగం స్వయంగా సిద్ధించగలదు. వేయించబడిన విత్తనం మరల మొలకెత్తదు కదా! వాసనావర్జితులు, ఇచ్ఛారహితులు అయిన జీవన్ముక్తులు నిర్వర్తించే క్రియలన్నీ అక్రియలే అవుతాయని గ్రహించు. నాయనలారా! మీరంతా కూడా కర్మ ఎప్పుడు, ఎందుచేత ఫలోన్ముఖమగుచున్నది? అది ఎప్పుడు ఫలరహితం, బంధనా రహితం కాగలదు?... అనే విషయాన్ని జాగరూకులై గ్రహించాలి. బుద్ధి సహితమగు ఇంద్రియాల

Page:568

చేత “భోగాసక్తి రసభావన" కలిగి ఉండి కర్మలు నిర్వర్తిస్తేనే అవి ఫలోన్ముఖములై బంధహేతువులు అగుచున్నాయి. వాసనారహితమగు చేష్టలు ఎన్నటికీ కర్మసంగమునకు దారితీయజాలవు సుమా! పులుసులో ప్రవేశింపజేయబడిన గరిటకు పులుసులోని రుచులతో సంబంధమే లేదు కదా!

అందుచేత “జ్ఞానంచే కర్మలను త్యజించి ఉండేదెట్లా?... అనే మార్గాన్ని మీరంతా ఆశ్రయిం చండి. వాసనారహితుడగు జీవన్ముక్తుడు ఇంట్లో ఉన్నా, లేక, అరణ్యంలో ఉన్నా, ధనాది సంపదలతో కూడుకొని ఉన్నా, నిరుపేదగా ఉన్నా... ఆయా సందర్భములచే అతడు స్మృశించబడటం లేదు. అవన్నీ అతనికి సమానమే! జ్ఞానముచే ప్రశాంతి పొందిన మనుజునికి గృహమే నిర్జనారణ్యమై ఉండగలదు. ఇక అజ్ఞానముచే అశాంతి కలిగియున్నవాని సంగతో?... అతనికి జనశూన్యమైన మహారణ్యం కూడా అనేక రకాలైన జనులు సమావేశమై ఉన్న పట్టణం వలె ప్రాప్తిస్తోంది. ప్రశాంత బుద్ధి సమన్వితుడగు జ్ఞానికి కలలో కూడా జనసంసర్గము ఉండటం లేదు. అతని హృదయం నిర్మలమై, విశాలమై, అత్యంత రమణీయమై విరాజిల్లుతోంది. అందుచేత జ్ఞానాగ్ని చేత ఈ దృశ్యము’ అనబడే ఎండుటాకుల ప్రోగును దహింపజేయండి. జ్ఞానాగ్నిచే శ్రమించిన దృశ్యముగల జ్ఞానికి ఈ జగత్తు, ఇందలి పదార్థముల సంచలనము శూన్యమయమై గోచరిస్తాయి. సమస్త విశేషములు శమించినప్పటి మహారణ్యంలాగా ఇదంతా అతనికి గోచరించగలదు.

అజ్ఞాని హృదయం - అజ్ఞాని తన హృదయంలో అనేక సంకల్పపరంపరలు కలిగి ఉన్నవాడై తన హృదయం నందే 'జగత్తు' అనబడునది ధరిస్తున్నాడని గ్రహించబడు గాక! అజ్ఞానికి తన హృదయంలోనే ఈ సప్త సముద్రాలతో కూడిన పృథివి విద్యమానమగుచున్నదయ్యా! అతనికి ఇదంతా కూడా నానావిధ సుఖదుఃఖాది ద్వంద్వ సంకటాలతో వ్యాప్తమై అనేక కార్యారంభాలతో ఉన్నదై.... తన యొక్క హృదయం నందే ఏర్పడి ఉన్నదగుచున్నదని విజ్ఞులు ఎఱిగియే ఉన్నారు.

అద్దంలో అంతా ప్రతిబింబిస్తున్నట్లు మలిన హృదయంలో - "ధనం లభించితేనే శాంతి. ఈ ఈ వస్తువులు, ఈ ఈ స్నేహములు, ఈ ఈ విధంగా ఉంటేనే సంతోషంగా ఉండటం సాధ్యం. ఏదో పొందితేగాని ఇప్పటి ఈ అసంతృప్తి పోవటానికి అవకాశం లేదు... ఇటువంటి వీచికలు వీస్తుండగా మోహ-శోక-భయాది ధూళికణ సమూహాలు తిష్ట వేసుకొని ఉంటున్నాయి. అటువంటి హృదయమునందు మాత్రమే దేశ దేశాంతరాదులు, జీవ-జీవేతరులు, నేను-నీవు మొదలైనవి ప్రతిబింబస్తున్నాయి సుమా!

5. అహంత్వమే సంసారం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! తైలము తరిగిపోతూ ఉంటే దీపం కూడా క్షయిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఈ అహం మమ రూపంలో ఉండే జగద్భావన తొలగుతూ ఉండగా సంసారము క్షీణిస్తూ ఉంటుంది. సంసారము తొలగుచూ ఉండగా, ఆత్మజ్ఞాన రూపమగు చిత్కళ

Page:569

ప్రవృద్ధమౌతూ ఉంటుంది. సంసారము తొలగాలనుకుంటే ఆత్మజ్ఞానరూపమగు చైతన్యాశ్రయం కాక మరింకే ఉపాయమూ లేదు. దృశ్యమును వదలి దృక్ను ఆశ్రయించి ఉండటమే మోక్షం. అంతేగాని, మోక్షమనగా ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళి మరింకేదో అవటం కాదని సర్వజనులకు గుర్తుచేస్తున్నాను.

న త్యాగః కర్మ సంత్యాగో, బోధః త్యాగ స్మృతః అజగత్ ప్రతిభైకాత్మా యే అనహన్తాదిరవ్యయః ||

కర్మత్యాగం 'త్యాగం' కాదు. సర్వదృశ్యగరూపమగు ఆత్మస్థితిని 'బోధ' అంటారు. అట్టి బోధయే త్యాగము అని చెప్పబడుతోంది. ఓ సర్వ సహోదరులారా! మీరంతా జగత్ప్రతిభ అంటూ లేనిది... సర్వదా ఏకమే అయినది, (ఏనాడూ అనేకం కానిది)... నాశనరహితమైనది, అహంత్వం చేత పరిమితం కానిది అయినట్టి మీ స్వస్వరూపమగు ఆత్మను ఆశ్రయించి ఉండండి.

అట్టి ఆత్మను ఆశ్రయించి ఉండటమే సర్వత్యాగరూపమగు మోక్షము.

"ఈ శరీరమే నేను. ఈ బంధువులు గృహాదులు నావి" - ఈ రూపంగా దృశ్య తాదాత్మ్యం ఏర్పడి ఉంటోంది. అట్టి దృశ్య తదాత్మ్య భావన ఎవని పట్ల శమిస్తుందో అతడే త్యాగి. అట్లు శమించ నంతకాలం జ్ఞానం గాని, త్యాగం గాని ఉండుటకు అవకాశమే లేదు. దేహభావం - మమకారం అను రూపంలో ప్రదర్శితమవుతున్న ఆవేశం శమిస్తేనే... అప్పుడు బోధరూపమై, శివరూపమై, సర్వదా శాంతరూపమైనట్టి ఆత్మ శేషిస్తుంది. ఆత్మకు అన్యమైనది. ఎక్కడా ఏమీ లేదని సర్వజనులు గమనించెదరు గాక! తత్త్వబోధ (సర్వం ఆత్మస్వరూపమే) అనునది సమాశ్రయిస్తేనే దేహాభిమాన రూపమైన 'అహం' క్షయించగలదు.

అహం క్షయిస్తే మమత్వరూపమైన (నాది-నాది అను రూపముతో కూడిన) ఈ జగత్తంతా కూడా క్షయించిపోతుంది. యథార్థానికి ఏదీ క్షయించదు. మరి? "సర్వత్రా ఆత్మయే ఆక్రమించుకొని ఉన్నది”... అనే సమరసభావనచే జగత్తు స్థానంలో స్వస్వరూపం ప్రదర్శితమౌతుంది. ఏ జీవుడైతే వర్తమానంలో (బద్ధుడై ఉన్నప్పుడు, “నేను బంధమునందు ఉన్నాను అనుకొనుచున్నప్పుడు) అహంభావంతో కూడుకొని ఉన్నాడో... అట్టి అహంభావన 'అనహం' (నేను అహం - మమ భావనలకన్నా ఉత్కృష్టుడను)... అను భావనా మాత్రంచేత నిర్విఘ్నంగా శాంతిని పొందగలడు. అనహం’ (ఇవి ఏమీ నేను కాదు) అనబడు ఇంతమాత్రపు సాధనచే ముక్తి సిద్ధించుచుండగా ఇక అన్య సాధనాల గురించి వాద-వివాదాలు ఎందుకు?

శ్రీరాముడు : “అనహం భావన గురించి మరికొంత వివరించమని నా ప్రార్థన. ప్రభూ! నేను దేహాదులు కాను... అనేది కూడా ఒక భావనయే కదా! అప్పుడు కూడా అట్టివాడు భావనలయందే ఉన్నట్లే గాని భావాతీతుడు కాలేడు కదా! ఆత్మానుభవం భావాతీతమైనది కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "నేను దేహాదులు కాను. శుద్ధ చిన్మాత్రుడను" అను అనహం బుద్ధి ద్వైతం వలె ప్రారంభంలో అనిపించవచ్చు గాక! కాని ధూళి చిల్లగింజను ఆశ్రయించగా

Page:570

జలం పరిశుద్ధమైపోవునట్లు... అనహంబుద్ధి చైతన్యమును నిర్మలమొనర్చి చైతన్యమునందు విలీనమై పోగలదు. కాబట్టి ‘అనహం' చైతన్యం కంటే భిన్నం కాదు. అయినా, నాదొక ప్రశ్న! చిత్స్యరూపం వాస్తవానికి ఆకాశం వలె స్వచ్ఛమై ఉండగా, నిర్లేపమై ఉండగా... అందు జగద్ర్భాంతికి తావెక్కడిది? న భ్రమో భ్రమణంనైవ, న భ్రాంతిర్ భ్రామకోస్తివా,

అనాలోకనమే వేదమ్, ఆలోకాన్నేదమస్తి తే ॥

వాస్తవానికి భ్రమ లేదు. భ్రమింపజేసేదీ లేదు. భ్రాంతి లేదు. భ్రాంతికి కారణమూ లేదు. మరి? అవన్నీ అజ్ఞానముచేత మాత్రమే సిద్ధిస్తున్నాయి. జ్ఞానముచే నివృత్తిస్తున్నాయి. లేక, లేనివి’గా అగుచున్నాయి. అంతే!

ఓ రామచంద్రా! ఈ కనబడేదంతా కూడా చిన్మాత్రమే, అసద్రూపమును బోలి ఈ రీతిగా వ్యాపించి ఉన్నది"... అని ఎఱుగుము. ఈ సమస్తము నిర్వాణ రూపమగు ఆత్మ మాత్రముగా గ్రహించినవాడవై మౌనము వహించి ఉండుము.

ఏ క్షణమందైతే ఈ జీవునకు శరీరాదుల పట్ల 'అనహంబుద్ధి' ఏర్పడుతుందో... అప్పుడు ఆ అనహందేహ భావనాపటిమచే సర్వదుఃఖాలు వాటంతట అవే తొలగుతాయి. అందుచేత నిరంతరం అనహం భావన యొక్క అభ్యాసం చేత 'అహం' అనుదానిని 'ఆకాశపుష్పం' వలె మిథ్యగా చేసి వేయాలి. నీవు ధనుస్సు నుండి విడివడిన బాణంవలె సదా అంతర్ముఖుడవై ఉండు. శీఘ్రంగా, దృఢంగా బ్రహ్మపథము'ను అవలంబించి శాశ్వత-తత్వమును సంతరించుకొని వెలయుము. సర్వ భావముల చేతను అప్రాప్యమై ఉన్న (భావాతీతమై ఉన్న) ఆత్మపదాన్ని పొంది ఈ సంసార సాగరాన్ని దాటినవాడవు కమ్ము. స్వాభావికమై ఉంటున్న ఈ అహంకార మాత్రమును జయించటానికి ఎవనికి వీర్యత్వము లేదో... అట్టివానికి ఇక బ్రహ్మపద ప్రాప్తి యొక్క మాట ఎక్కడిది చెప్పు?

షడ్వర్గో నిర్జితఃపూర్వం యేనోత్తమవిదా స్వతః భాజనం స మహార్ణానాం నే తరో నరగర్దభః ॥ ||

ఓ సర్వ జీవులారా! మీమీ శత్రువులు ఎక్కడో బాహ్యాన కాదు ఉన్నది. కామ క్రోధ-లోభమద-మాత్సర్యం...అనే ఆరు శత్రువులు అంతరంగంలోనే తిష్ట వేసుకుని ఉన్నారు. ఎవడైతే తన అంతఃకరణంలో ప్రవేశిస్తున్న ఈ ఆరుగురు శత్రువులను గుర్తించి, వారిపై యుద్ధం ప్రకటించి, వాటిని జయిస్తాడో... అట్టివాడు మాత్రమే 'ముక్తి' అనబడే మహత్ పదార్థానికి అర్హత సంపాదించు కుంటున్నాడు. ఇక తదితరుల జీవితాలు గాడిదల జీవితాల వంటివే అగుచున్నాయి. ఎవని అంతః కరణంలో మనోవృత్తి జయింపబడుచున్నదో... అతడే వివేకానికి అర్హుడగుచున్నాడు. ఓ రామా! సముద్రంలో కొన్ని శిలలను పడవేశామనుకో. ఆ రాళ్ళు సముద్రంతో సంబంధం లేకుండా ఉంటు నట్లు నీవు కూడా నీకు సంప్రాప్తించే ప్రవాహపతిత క్రియలను "ఈ దేహాదులు నేను కాదు. నేను సర్వదా అసంగమగు ఆత్మనే... అను అనహం భావన కలిగి ఉండియే నిర్వర్తించు. సర్వదా సర్వం పట్ల నిర్లిప్తం వహించియే అన్నిటినీ నిర్వహించు. మనం ఇన్ని రోజులుగా చెప్పుకొనే సంవాదం యొక్క ప్రభావం చేత నీవు సర్వదా - ఆత్మ స్వభావుడవే గాని, దేహ స్వభావుడవు కాదు అని

Page:571

క్రొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కదా! ఇక ఎవరైనా సరే, అజ్ఞునివలె ఈ దృశ్యం పట్ల మోహం చెందవలసిన పనేమున్నది?

బంగారం గురించి తెలుసుకున్న తరువాత ఇక ఆభరణం గురించి కొత్తగా తెలుసుకోవలసిన దేముంది? అట్లాగే “సర్వకారణ కారణం" అనతగిన ఆత్మ గురించి ఎఱిగిన తరువాత ఇక దానికి అన్యమైన ఏ పదార్థం గురించి కారణతః ఎఱుగవలసి ఉన్నది చెప్పు? నామ రూపాత్మక సమస్తం కేవలం భ్రాంతిమాత్రమే అయి ఉంది. అట్టి భ్రాంతి శమించాలంటే ఆత్మజ్ఞాన మొక్కటే ఔషధం.

ఓ ముముక్షు మిత్ర జనులారా! వాయువు నందు చలనంలాగా అంతఃకరణంలో వృత్తులు’ అనే వీచికలు వీస్తున్నాయి. చిదాకారవృత్తి (నేను చిదానందమగు ఆత్మను అను భావన) చే ఆ తదితర వృత్తులన్నిటినీ త్రోసిరాజనవలె! అనగా “ఈ తదితర వృత్తులు నా స్వరూపం కాదు అను సునిశ్చయమును ప్రవృద్ధపరచుకోవాలి. తద్వారా ఆ తదితర వృత్తులన్నీ క్రమంగా నిరాధార మవుతాయి. అనహం భావనచే ఎవరైతే క్రోధ-లోభ-లజ్జ-మద-మోహాలను జయించటానికి ప్రయత్నంచరో... అట్టి వారికి ఎంత అధ్యాత్మ జ్ఞానం బోధిస్తే మాత్రం ఏం ప్రయోజనం?... ఈ అధ్యాత్మ శాస్త్రం ప్రతిపాదించేది అతనికి వక్రగతిగానే అగబడుచున్నది. వాయువు కంటే చలనము వేఱుకానట్లు... నీ స్వరూపము కంటే పరమాత్మ వేఱు కాదు సుమా!

ఒకాయన పూలమాల ధరించి అనాలోచితంగా రహదారిలో నడుస్తూ వెళ్ళుచున్నాడు. ఇంతలో ఒక పోకిరి పిల్లవాడు "ఏమయ్యోయ్! నీ మెడలో ఆడత్రాచు పామును ధరించావేమిటి?” అని కేకవేశాడు. వెంటనే ఆ బాటసారి ఒళ్ళు ఝల్లుమన్నది. "అరె! ఈ త్రాచుపాము నా మెడలోకి ఎలా వచ్చి జేరిందిరా బాబు? నేను పూలమాలనుకొని చూచుకోకుండా ధరించానా ఎమిటి? ఇది పొరపాటున కరిచిందా నా పని ఆఖరు? ఏం చెయ్యాలి? ...అని నిలబడి బిగ్గరగా విలపించ సాగాడు. ఇంతలో మరొక బాటసారి ఆ మార్గంలో వస్తూ "అయ్యా! ఎందుకు విలపిస్తున్నారు? మీ మెడలో ఆ పూలహారం ఎంత ముచ్చటగా ఉన్నది?... అన్నాడు. వెంటనే మొదటి ఆయన మెడలో పాము! మెడలో పాము! తీయండి! తీయండి! ... అని కలవరించసాగాడు. అప్పుడా రెండవ బాటసారి దగ్గరగా వచ్చి పరిశీలనగా చూచి "అదేమిటండీ బాబు! ఇంత మంచి పూలహారం ధరించి 'పాము, పాము' అని అరుస్తారేం?... అని అనునయంగా పలికాడు. అప్పుడా మొదటి బాటసారి మెడలోని హారంతీసి చూచుకొని "ఓస్! ఆ పోకిరీవాడెవడో పాము అనేసరికి నేనెంత

భయపడ్డాను!" అని మరల హారమును ధరించి శాంతచిత్తుడై నడక కొనసాగించాడు.

ఈ సంఘటనలో లాగానే జీవుడు కూడా కూటస్థమగు అద్వయచిన్మాత్రం యొక్క జ్ఞానముచే పరమాత్మయందు విలీనమై తానే తద్రూపమై శోభించుచున్నాడు. యథార్థానికి పరమాత్మ ఉదయిం చటం లేదు. అస్తమించటం లేదు. అయ్యది సత్యసిద్ధమైయున్నది. కల్పిత వస్తువులైన “నేను - నీవు” మొదలైన వాటిచే అది బాధింపబడటమే లేదు. అంతేకాదు, పరమాత్మ కంటే అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనేలేదు. ఇక ఈ భావాభావముల గురించి వేరుగా చెప్పవలసినదేమున్నది?

Page:572

పరం పఠే, పూర్ణం పూర్ణే, శాంతం శాంతే శివం శివే ఇత్యేవమాత్రం వితతం నా హం, న చ జగత్, న ధీః ||

ఓ రామచంద్రా! ఇక్కడ జీవుడు లేడు. మరొకడూ లేడు. మరి ఇదంతా ఏమిటంటావా? నీకు జీవుడుగా ఏదైతే కనబడుతోందో... ఆ కనబడేదంతా కూడా... పరమై, పూర్ణమై, శాంతమై, శివమైనట్టి పరమాత్మ... పరమై-పూర్ణమై-శాంతమై-శివవమైనట్టి పరమాత్మయందు అట్లు స్థితి కలిగియున్నది... అని గ్రహించు.

అనగా... నీవు ఏ జీవుని చూస్తున్నప్పుడైనా సరే, ఈతడు పరమై-పూర్ణమై-శాంతమై శివ మైనట్టి పరమాత్మ స్వరూపుడే కదా! మరి నేనూ? నేనూ అదే స్వరూపుడను... అనే అవగాహనను ప్రవృద్ధపరచుకోవటమే సరి అయిన మార్గం. అదియే తత్త్వమార్గం. ఇక అహంకారం గాని, బుద్ధిగాని, జగత్తు గాని ఎక్కడున్నాయి... ఉన్నదంతా ఆత్మయే అయినప్పుడు?

అనిర్వాణే వినిర్వాణం, శాంతం శాంతే, శివే శివమ్ | నిర్వాణమప్య నిర్వాణం స నభోర్ధం న వాపి తత్ II

మరల చెప్పుచున్నాను. నాశనరహితమై, శాంతమై, శివమైనట్టి బ్రహ్మం నందు... నాశ రహితమై - - శాంతమై - శివమైనట్టి (జీవుడుగా అనుకుంటున్న) బ్రహ్మమే స్థితినొంది ఉన్నది. త్రాడులో కల్పించబడిన పాము - త్రాడుగా తెలుసుకొన్న తర్వాత త్రాడునందే శమనం పొందుతుంది చూచావా? అట్లాగే, నామరూపాత్మకమైన కల్పిత జగత్తు బ్రహ్మమునందే శమించగలదు. వాస్తవానికి బ్రహ్మం ఆకాశాది ఆయా పదార్థములుగా ఎన్నడూ అవటమే లేదు. అవబోదు. బ్రహ్మం బ్రహ్మం గానే ఉంటోంది. ఇక ఒకప్పుడు కల్పన ప్రదర్శితమౌతోంది. ఆత్మజ్ఞానముచే అది మరొకప్పుడు శమిస్తోంది. బ్రహ్మం దృష్ట్యా చూస్తే ఏదీ క్రొత్తగా ఉదయించడం లేదు, శమించడం లేదు.

6. తితిక్ష

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనుజుడు ఒక్కొక్క సందర్భంలో అనేక గాయములను, వ్యాధులను, మానసిక బాధలను ఓర్చుకుంటున్నాడు. తట్టుకుంటున్నాడు. మరి ఈ శరీరాదులు నేను కాదు... అను అనహంభావనను ఓర్పుగా ఎందుకు ఆశ్రయించి ధరించలేడు చెప్పు? ప్రతి ఒక్కరికి అట్టి అనహంభావన సాధ్యమే. వాస్తవానికి ఈ దేహాదులందు అహంభావన ఏర్పర్చుకో వటమే శ్రమతో కూడిన పని. ఎందుకంటే 'అనహం' అనునదే ప్రతి ఒక్క జీవుని స్వభావమే అయి ఉన్నది కదా! అహంభావన ఆపాదిత స్వభావమైయున్నది. జగత్తునందలి సమస్త పదార్థ సమూహాలకు దేహాదులందలి అహంభావనయే అక్షయమైన, అంకురమై ఉన్నదని జనులంతా గమనించెదరు గాక! ఆత్మ బోధచే అట్టి జగత్తు అనబడేది నిర్మూలనమగుచున్నది.

వాయు ఉపమానం - పరమాత్మ “వాయువు అని అనుకుంటే అందు వాయు తరంగం వంటిది ఈ అహంకారం. వాయువు సంచలనం శమిస్తే (వాయు తరంగాలు ఉండవు కదా!

Page:573

అట్లాగే అహంకారం శమిస్తే) అప్పుడిక జగద్దర్శనమంతా తనకు తానుగానే శమిస్తుంది. అప్పుడు అనిర్దేశం, చిదాభాసరహితం, అనంతం, అజం, అవ్యయం అయినట్టి స్వస్వరూప చిదాకాశం మాత్రమే శేషించగలదు.

దర్పణ ఉపమానం - పరమాత్మ అనే స్వచ్ఛమైన అద్దముపై అహంకారము' అనే జలతుంపర మాలిన్య సహితంగా గోచరిస్తుంది. ఆ 'అహంకారము' అనే జలబిందు సమన్విత ధూళి కణములను తొలగించామా, అప్పుడు ఆత్మ యొక్క నిర్మలత్వం గోచరించగలదు. అహంకారమే ఎదుట ఉండే పదార్థములను చైతన్యం నందు వికారసమన్వితంగా ప్రతిబింబింపజేస్తోంది. అహంకారం శమిస్తే, చైతన్యం అభాసరహితమౌతుంది. అనంతమై, అజమై, అవ్యయమైన పరమాత్మ రూపాన్ని సంతరించు

కుంటుంది.

మేఘ ఉపమానం - ఆకాశము మేఘావృతమైనప్పుడు సూర్యకాంతి ప్రసరించదు. ఎప్పుడైతే మేఘములు తొలగుతాయో... ఇక క్రొత్తగా ఎట్టి ప్రయత్నం లేకుండానే ఆకాశం సూర్య తేజస్సుతో ప్రకాశమానమౌతుంది. అట్లాగే అహంకారమేఘం తొలగగానే ఆత్మసూర్యప్రకాశం అంతటా అన్నిటా విరాజమానమై ప్రస్ఫుటం కాగలదు.

రాగితో కూడిన బంగారు ఉపమానం - చిరకాలంగా రాగితో కలిసి ఉన్న బంగారం తన స్వచ్ఛతను కోల్పోయి అల్పకాంతితో కనిపించవచ్చు గాక! ఆ బంగారాన్ని పుటం వేసి రాగిని తొలగిస్తే... బంగారం మరల ధగధగ ఛాయతో వెలుగొందుచున్నది కదా! చైతన్యం చిరకాలంగా అహంకారంతో కూడుకొని ఉండటం చేత 'జీవుడు' అనబడు రూపంలో కనబడుతోంది. ఎప్పుడైతే శ్రవణ, మననాది ఉపాయాలచే బ్రహ్మమును ఆవరించిన అహంకార దోషం తొలగుతుందో... ఆ మరుక్షణం బ్రహ్మము బ్రహ్మ రూపత్వముచే విరాజమానం కాగలదు.

సముద్రం చేరిన ఉప్పు... ఉపమానం- సముద్ర జలంలోంచి ఉప్పు బయల్వెడలుతోంది. అయితే, సముద్రంలో వేయబడిన ఉప్పు గడ్డ తన నామరూపాలు కోల్పోయి సముద్రజలంలో విలీనమైపోతుంది, చూచావా? అట్లాగే... అహంకారం బ్రహ్మమునందు ప్రవేశించగానే తన యొక్క జగదత్వమును కోల్పోయి బ్రహ్మముగానే పరిణమిస్తోంది.

వాస్తవానికి బ్రహ్మము సద్రూపమై, శాంతమై, నిత్య ప్రకాశమానమై అనిర్దేశ్యమై, అవాఙ్మనస గోచరమైయున్నది. అయితే (బ్రహ్మం, గుణాదుల కంటే అతీతమైనదైనప్పటికీ) అల్ప విషయాలైన అహంత్వం మొదలైనవాటికంటే బ్రహ్మం యొక్క ఔన్నత్యాన్ని నిరూపించటానికి అద్దానికి బృహదత్వం మొదలైన లక్షణాలు శాస్త్రములచే కల్పించబడ్డాయి. వాస్తవానికి అహంత్వ రూపంగా స్థితి కలిగి ఉన్నది కూడా బ్రహ్మమే! అహంకారాన్ని కూడా బ్రహ్మంగా దర్శించటమే అహంకారాన్ని అధిగమించటం (లేదా) జయించటం అనునదే శాస్త్రములు ముఖ్యోద్దేశము.

జగత్తు జగద్భావనచేతనే సిద్ధిస్తోంది. భావనచే సిద్ధించేది అభావనచే తొలగిపోక ఏం చేస్తుంది? అభావనచే (భావనామూలమగు అజ్ఞాన నాశనం) జగత్తుకు బీజమైన అహం పదార్థం స్వయంగా శమిస్తోంది. అప్పుడిక 'అహంత్వం-జగత్తు-బంధం'... ఇటువంటి కల్పనలకు తావేది?

Page:574

సత్ప్రృహ్మ శివమాత్మేతి పరే నామ కలంకితా ఉదేత్య హన్తా కుంభత్వాదివ మృద్ధాతు విస్మృతిః ॥

ఆకారసమన్వితమైన కుండను చూస్తుండగా ఆకారాదులు వర్తించనట్టి మృత్తిక (మట్టి)ని ఏమరుస్తూ ఉంటారే! అట్లాగే ఎదురుగా కనబడే ఈ పాంచభౌతిక దేహం, గుణములు, మనస్సుబుద్ది-అహంకారము మొదలైన పరిమిత-కల్పనారూప విషయములను చూస్తూ స్వభావతః అపరిమితము, శుద్ధము, పరిపూర్ణము అగు (సత్తు-బ్రహ్మము-శివము అనబడే) ఆత్మను ఏమరచటం జరుగుచున్నప్పుడే 'జీవుడు అనబడేది దర్శనమగుచున్నది. అనగా,.... ఆత్మ అనబడే అపరోక్ష చిదేక రసము నందు - అజ్ఞానముచేత మాత్రమే ఆత్మకు అస్వభావమైనది, సంకోచరూపమైనది, నామాదులచే కళంకితమైనది, నేను నీవు-మొదలైన పరిమిత దృష్టులను సంతరించుకున్నది అయినట్టి అహంత్వము భ్రమచే స్ఫురిస్తోంది.

అహ’మనే బీజం నుండి దృశ్యసత్త అనే ప్రతిబింబితమంతా గోచరిస్తోంది. ఈ 'దృశ్య సత్త’లో అనంత సంఖ్యలో జగత్తులు” అనే ఫలాలు ఉత్పన్నమౌతున్నాయి. నశిస్తున్నాయి కూడా!

అహంకారం' అనే చిన్న మిరియపు గింజలో ఈ పర్వత - సముద్ర - - నది - భూమి సహిత బ్రహ్మాండం, రూపాలను సందర్శించే ఇంద్రియ స్వభావం, మనస్సు, ఆ మనస్సుకు గోచరించే కామ సంకల్పాది ఇంద్రియ వృత్తులు ఇవన్నీ చమత్కారంగా ఉదయిస్తున్నాయి. నీకు బాహ్యం వలె కనిపించే ఈ అంతరిక్షం, భూమి, వాయువు, ఆకాశం, దిక్కులు - ఇవన్నీ అహంకారం అను వికసించిన పుష్పం యొక్క సుగంధాలు మాత్రమే! తెల్లవారగానే వస్తువుల రూపాలు కనిపించటం ప్రారంభించినట్లు, ఆత్మయందు అహంకారం ఉదయించగానే జగత్తు ప్రకటితమౌతోంది. అనగా... అహంకారం భావనా మాత్రంచేత క్షణకాలంలో అసత్తగు ఈ జగత్తును నిర్మించుచున్నది. జలంలో చిన్న రాయి పడగానే ఆవృత్తాలు బయల్వెడలే విధంగా, నిశ్చల బ్రహ్మంలో 'అహంకారం' అనే గులకరాయి పడగానే, “ప్రవృత్తి అనే ఆవృత్తం బయలుదేరి - - అదికాస్తా ముల్లోకాల అనుభవానికి కారణభూతమగుచున్నది. కళ్ళుమూసుకుంటే ఏదీ కనిపించదు. కళ్ళు తెరిచిన మరుక్షణం అనేక వస్తువులు కనిపిస్తాయి. ఆ కళ్ళకు అసత్యాలైన ఆకారాలు సత్యం వలే అగుపిస్తాయి. అట్లాగే రెప్ప పాటు కాలంలో 'అహంత్వం' ఆత్మయందు ఉద్భవించి అదే అనేక జగత్తులను అనుభవిస్తోంది. ఎంత ఆశ్చర్యం! అట్టి అహంకారం రహితమవగానే 'జగదనుభవం' అనే బంధం ముడి వీడుతుంది. శ్రీరాముడు : అహంకారమును మేము రహితం చేసుకొని ఆత్మస్వరూపులమై ప్రకాశించేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : అహంకారము ఆత్మస్వరూపమే! ఆత్మ యొక్క విన్యాసమే! నిరంతరమైన పరమాత్మ జ్ఞానముచే అహంకారము నిశ్శేషముగా నశించగలదు. అప్పుడు సంసారము అనే మృగతృష్ణ పూర్ణంగా శమించిపోగలదు. ఓ రామచంద్రా! ఈ జగత్తు జీవునికి ఎట్లా లభ్యమౌతోంది? శ్రీరాముడు : జగత్తు అనగా అనుభవముయొక్క రూపమే కదా! అనుభవము భావనచేయటం” అనే రజోగుణం నుండి బయల్వెడలుతోంది. కనుక జగత్తు భావననుండే పరిలక్ష్యం అగుచున్నది.

Page:575

శ్రీ వసిష్ఠ మహర్షి : భేష్! సరిగ్గా చెప్పావు. కనుక... స్వతఃసిద్ధమగు ఆత్మ 'చిన్మాత్రము యొక్క భావన’ అను చిన్న అభ్యాసం చేత సుసాధ్యమగుచున్నది. అట్టి ఆత్మానుభవి ఇక ఇక్కడ భ్రమనుగాని, భేదమునుగాని పొందనే పొందడు.

స్వయత్నమాత్ర సంసాద్యాదసహాయాది సాధనాత్

"అనహమ్ వేదనాన్ న అన్యత్ శ్రేయః" పస్యామి తే, అనఘ!

"ఈ దేహ-జగదాదులు నేను కాదు అను భావనను ఈ జీవుడు ఎందుకు ఆశ్రయించ రాదు? అట్టి 'అనహం' అను భావనకు శ్రమ ఏమున్నది? అందుకు బాహ్యమైన ఎట్టి సాధనలు అవసరం లేదు కదా! అంతటి సులభ సాధ్యమైన అనహం అను దానినిమించి శ్రేయమైనదేదీ లేనే లేదని నా అభిప్రాయం. కనుక - రామచంద్రా! నీవు 'అనహం' భావనను ఆశ్రయించు. శ్రీరాముడు : మహర్షీ! అట్టి "అనహం" భావనను అతి త్వరగా సుస్థిరీకరించుకోవటానికి వీలుగా ఏదైనా సులువైన క్రమమార్గాన్ని ఈ సందర్భంలో ఉపదేశించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి :

1. మొట్టమొదట నేను ఒక వ్యష్టిని... అనే అభిప్రాయమును తీసుకో. ఈ వ్యష్టి అహంభావం సరి అయినది కాదు. అనగా వాస్తవమైనది కాదు. పైగా... అసమంజసం కూడా!... అనే నిర్ణయమును ధ్రుపరచుకో.

2. ఈ నలువైపులా విస్తరించియున్న జీవ - పర్వత-అంతరిక్ష - పృథివి-సముద్రవాయువులన్నీ నా స్వరూపము వంటివే... అనే సమష్టి అహంకారమును ఆశ్రయించు.

3. క్రమంగా "ఈ పర్వతాదులు ఎందులో సమాగతమై ఉంటున్నాయో... అట్టి ఆకాశ స్వరూపుడను... అను భావనను సమీపించి అభ్యసించు.

4. అట్లు ఆకాశస్వరూపమును అనుగతం చేసుకున్న తరువాత క్రమంగా నీ స్వరూపముతో ఈ విశ్వమంతటినీ పూరించివేయి. అట్లా సర్వమును పరిపూరితం చేసి దశదిశలా వ్యాపించిన విభవము కలవాడవగుము.

5. ఆ తరువాత "ఈ చరాచర జగత్తంతా నిష్ప్రపంచరూపమగు బ్రహ్మమే కదా... అను అవగాహనను పెంపొందించుకో. ఆ విధంగా ఈ ప్రపంచమంతటినీ నిషేధము గావించివేయి.

ఆ తరువాత ఇక చెప్పవలసినదేమున్నది? ఆ నిష్ప్రపంచరూపమగు ఆత్మయే నీవు కదా! అదే ప్రతి జీవుడు కదా! కనుక స్వస్థుడవై, శాంతుడవై, దుఃఖరహితుడవై ఇంద్రియ దోషముచే స్పృశించబడనివాడవై కళాకళలు లేనివాడవై ఉండు. నిర్మలాత్ముడవై వెలయుము.

ఎందుకంటే... అధ్యారోపము, అపవాదము - అను రెండు సిద్ధాంతాలూ చివరికి నిష్ప్రపంచ రూపమగు శుద్ధాత్మనే ఉద్దేశిస్తున్నాయని మా అభిప్రాయం. అనగా....నిష్ప్రపంచమైనట్టి శుద్ధాత్మయే సర్వ వేదాంత సిద్ధాంత సారమైయున్నది.

Page:576

II. శ్రీ భుశుండ - విద్యాధర సంవాదము

1. బరువైన 18 వస్తువులు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధ పరిచయ వాక్యాలలో ఈ జీవుడు వ్యష్టిఅహంకారభావన నుండి “నేను నిష్ప్రపంచకరూపమగు బ్రహ్మాన్ని - అనే సమున్నత స్థితిని సముపార్జించటమే వేదాంత సిద్ధాంతసారం అని అనుకున్నాం కదా!... అది సాధించడమెలా?

ఈ జీవుని స్వభావం అనిత్యమగు దేహము-ఇంద్రియ విషయములలో ప్రవేశించి ఉన్నది. అదియే పరిమితత్వమునకు, జడాజడములగు ఉపాధుల రాకపోకలకు కారణమగుచున్నది. కనుక, అపరిమితమైన ఆత్మకు దుఃఖం ఎందుకు తారసపడుతోంది?" అను ప్రశ్నకు సమాధానం అపరిమిత స్వభావుడగు ఈ జీవుడు పరిమిత వస్తువుల పట్ల నమ్మకం-ప్రీతి-అభ్యాసం కలిగించుకొని ఉండటమే”... అని చెప్పబడుతోంది.

కనుక ఓ జనులారా! “ఈ మనస్సు ఇంద్రియముల వైపుగా పరిగెడుచున్నది అనే విషయం గమనించండి. అట్టి మనస్సహితమైన సర్వేంద్రియ విషయ స్వభావాన్ని మొదట జయించాలి సుమా! ఆ తరువాత “వివేకము” మొదలైన సాధనములను ఆశ్రయిస్తే సర్వము అతిశీఘ్రంగా సిద్ధించగలదు.

స్వభావమాత్రం యేన అన్తర్ నజితం దగ్ధబుద్దినా

తస్య ఉత్తమపదప్రాప్తిః సికతా తైలదుర్లభా ॥

ఎక్కడైనా ఇసుకను ఎంతగా పిండినప్పటికీ తైలం లభిస్తుందా? ఎవడైతే ఇంద్రియ విషయ లోలత్వ స్వభావంతో కూడిన అంతఃకరణాన్ని ముందుగా జయించడో... అట్టివానికి ఉత్తమ పద ప్రాప్తి ఎట్లా అభిస్తుంది?... అందుకే శాస్త్రాలు సాధనాలను మొట్టమొదటగా ప్రతిపాదిస్తున్నాయి.

తెల్లటి గుడ్డపై కొంచెం రంగైనప్పటికీ చక్కగా అంటుతుంది చూచావా? అట్లాగే శుద్ధమైన చిత్తంలో కొంచెం ఉపదేశం కూడా చక్కగా ప్రవేశించి బ్రహ్మానుభవం అనుభూత మొనర్చగలదు. సాధనచతుష్టయం లేని చిత్తమునకు ఎంత ఉపదేశించినా కూడా కంఠశోషయే మిగులుతుంది.

ఈ విషయం గురించి ఒకప్పుడు ఒక మహానుభావుడు నాకు చెప్పిన కొన్ని విశేషాలు గుర్తుకు వస్తున్నాయి అది వివరిస్తాను. విను.

పూర్వం ఒకప్పుడు నేను భుశుండ వాయసము వారిని (భుశుండుడు అనే కాకి స్వరూప మహాత్ముని) సందర్శించటం జరిగిందని చెప్పి ఉన్నాను కదా! ఆయన మేరుపర్వతం యొక్క శిఖరాగ్రంపై ఒక గుహలో ఏకాంత స్థానంలో విరాజమానుడై ఉన్నారు. అప్పుడు నేను ఆయన్ను ఇట్లా ప్రశ్నించాను.

Page:577

ఓ భుశుండ మహాశయా! మీకు అనేకమంది జ్ఞానులు, అజ్ఞానులు తారసపడి ఉంటారు కదా! ఇంద్రియములను జయించనట్టి మందబుద్ధి ఆత్మజ్ఞానరహితంగా దీర్ఘకాలం జీవించిన ఎవ్వరైనా ప్రాణి గురించి చెప్పండి. తద్వారా మన ఈ అధ్యాత్మకథా ప్రసంగం రసవత్తరంగా ఉంటుందని నా అభిప్రాయం...

అప్పుడు భుశుండుడు చెప్పిన వృత్తాంతమేమిటో విను.

శ్రీ భుశుండుడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! మీరు అడిగిన దానికి అనుకూలంగా ఒక సంఘటనను వివరిస్తాను, వినండి. పూర్వం ఒకానొక విద్యాధరుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు. చక్కటి విచారవంతుడు. కానీ అతడు ఇంద్రియయలోలుడు. అనగా ఇంద్రియ విషయాలలో తగినంత నిగ్రహం లేనివాడు. అయితే తపస్సు మొదలైనవి బాగా చేసి చేసి, దేహం శుష్కింప జేసుకున్నాడు. ఆత్మజ్ఞానం సముపార్జించకపోవటం చేత అతని ఇంద్రియాలే అతనికి క్రమేణా ఎంతో భేదాన్ని కలుగజేయసాగాయి. అతడు కూడా దీర్ఘమైన ఆయువుపొందాడు. నాలుగు కల్పాలు ఆ విధంగా ఆత్మజ్ఞాన రహితమైన కేవల తపో-యమ-నియమాలు నిర్వర్తించాడు. చేయగా చేయగా, నాలుగవ కల్పం ఆఖరులో అతని యందు వివేకం జనించింది.

విద్యాధరుడు : "ఏమిటిది? ఈ జీవునికి మరల జన్మ - మరల మృత్యువు - మరల వార్ధక్యము... ఇట్లా కలుగుతూనే పోతున్నాయి కదా! ఇదంతా ఎంత సిగ్గుపడవలసిన విషయం! ఇటువంటి జన్మ - కర్మల వలన లాభమేమిటి? ఏదైతే సుస్థిరమైనదో... అట్టి వస్తువును ఆశ్రయించటం ఉచితం. అయితే అటువంటి స్థిరమైన వస్తువు ఏదైనా ఉన్నదా?”

ఇట్లా వివేకముతో యోచించసాగాడు. ఆతడు అప్పటికే 18 వస్తువులతో కూడిన మోత బరువును (పంచప్రాణాలు, దశ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్థూలదేహాలతో కూడిన ఈ ఉపాధిని) అతి దీర్ఘకాలం ధరించి ఉన్నాడు కదా! అందుచేత వాటన్నిటి మూలంగా ఎంతగానో అలసిపోయాడు. ఈ సంసారం పట్ల విసుగు, విరక్తి జనించింది. ఆయా జ్ఞానులను సంప్రదించి వారి సలహాను అనుసరించి ఆ విద్యాధరుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి ఆదరపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు స్వాగతమర్యాదలతో అభ్యాగతి పూజ సమర్పించి, ఇక ఆ తరువాత, "ఏమి విద్యాధరా! ఇటు వచ్చావు? అని ప్రశ్నించాను.

విద్యాధరుడు : మహాత్మా! భుశుండా! నేను అనేక కల్పాలు ఈ దేహంతో ఎన్నో యమ - నియమాలు నిర్వర్తించాను. సుదీర్ఘకాలం కాయక తపస్సు చేశాను. ఈ ఇంద్రియ విషయాలను నేను ఇప్పటికీ జయించలేకపోయాను. ఈ నా ఇంద్రియాలను చూస్తున్నారు కదా! ఇవి విషయాలలో ప్రవేశించటంలో అతి ప్రావీణ్యం చూపుచున్నాయి. ఆ విషయాల నుండి ఎన్నో ప్రియాప్రియరూప బంధాలు ఏర్పడుచున్నాయి. ఈ నా ఇంద్రియాలు విషయాల నుండి తొలగటమే లేదాయె! మీదకు దూసుకువచ్చే సునిశితమైన బాణాల కన్నా ఈ ఇంద్రియ విషయాలు మరింత ప్రమాదకరమై ఉంటున్నాయని నేను గమనించాను.

Page:578

ఇవి హృదయంలో అంధకారం వలె అలముకొని ఉన్నాయి. ఇక హృదయం తమోమయమై ఉంటోంది. ‘కామం’అనే మర్కటం హృదయాన్ని అనుక్షణం వ్యాకులపరుస్తోంది. నేను ఇంద్రియాలను జయించనే లేదని, అవియే నన్ను జయించి నా హృదయమును ఆక్రమించుకుని ఉన్నాయని నేను గమనిస్తున్నాను. వీటిని జయించకపోతే నేనేమాత్రం సుఖవంతుడను కాలేనని తెలుసుకున్నాను. విద్యాధర ఉపాధికి అనేక భోగాలు లభించే మాట నిజమే! ఆ భోగాలన్నీ మానసిక మహారోగాలేనని, వాటిని ఎంతగా అనుభవించినా తనివి తీరదని, ప్రతిభోగం కలిగించేది స్పర్దయే గాని శాంతి కాదని నేను గ్రహించాను. వాటిపట్ల విరక్తుడనైనాను. మహనీయుల ఉపదేశాన్ని అనుసరించి “మహత్ భాగ్యమే”... అన్నట్లుగా ఈనాటికి మీ దర్శనం చేసుకోవాలని, శరణు వేడాలని, మీ బోధ వాక్యాలు వినాలని బుద్ధి పుట్టింది.

2. ఇంద్రియముల దురాక్రమణం

శ్రీ భుశుండవాయస మహాయోగి : ఓ విద్యాధరా! ముందుగా మీ అనుభవ అవగాహనలను విశదీకరించండి.

విద్యాధరుడు : మహాత్మా! భుశుండమహాశయా!

యత్ ఉదారమ్ అనాయాసమ్ క్షయ - అతిశయ వర్జితమ్

పదం పావనమ్ ఆద్యంతరహితం తత్ వదాశు మే ||

ఈ విద్యాధర ఉపాధితో అనేక కల్పములు వివిధ భోగములు రుచి చూచాను. కాని ఏం లాభం? ఇందులో దుఃఖరహితమైనది. శాశ్వతమైనది అయిన సుఖమేదీ అగుపించటమే లేదు.

ఏ స్థానమైతే ఉదారమై ఎట్టి దుఃఖాలకు కారణం లేనిదై, ప్రయాసరహితమై, సహజానంద రూపమై, క్షయం గాని - - అతిశయం గాని లేనట్టినదై, పరమ పవిత్రమై, ఆది-అంతం లేనిదై ఉన్నదో... అద్దానిని గురించి విశదీకరించగల సమర్థులని చెప్పగా చెప్పగా విని, మిమ్ములను శరణు వేడుచున్నాను.

ఓ మునీంద్రా! ఇంతకాలం నేను జడాత్మకంగా (విషయాలలో) నిదురిస్తున్నానని నాకు తెలిసిపోయింది. చాలాకాలం తరువాత మనస్సు తీవ్ర వైరాగ్యంచే జాగృతమగుచున్నది.

కామము - మహాత్మా! ఏది ఎచ్చట ఎంతగా పొందినా కూడా... ఈ మనస్సు “ఇంకా ఏవేవో కావాలి అను రూపంలో ఉండే కామంచే సంతప్తమగుచున్నది. ఆ కామం నుండి అజ్ఞానవృత్తులన్నీ ఒకదాని వెంట మరొకటి బయలుదేరి నింద్యముగ మహాక్షోభను కలుగజేస్తున్నాయి. ఫలితం? ఇక నేను దుశ్ఛేద్యములైన అనేక సాంసారిక క్రియాపరంపరలలో ఇరుక్కుపోతున్నాను. ఇంకేమున్నది? అనాత్మయందు ఆత్మాభిమానం ఏర్పడి, మోహం గుట్టలుగా ప్రోగగుచున్నది. ఇట్టి మోహం నుండి నన్ను సముద్ధరించండి.

Page:579

దోషభూములు - విద్యాధరునిగా అనేక ఐశ్వర్యములు ఉండవచ్చు గాక! గుణ సంపద కూడా ఉండవచ్చు గాక! సుందరమైన ఆయా శాస్త్ర ప్రవచిత అభ్యాసాలు నిర్వహిస్తూనే ఉన్నాను కూడా, కాని ఏం లాభం? ఇప్పటికి కూడా ఈ ఇంద్రియాల ప్రబలత్వమును జయించలేకపోయానే! ఆత్మ జ్ఞాన రహితుడవై తదితర విద్యాధరులపై కామ క్రోధాలు వదలలేకపోయాను. క్రోధ, భయ, దుః ఖ, కార్పణ్యాది ఆయా దోషాలు అసంఖ్యాకంగా నా హృదయ ప్రాంగణంలోకి వచ్చి పడుచూనే ఉన్నాయి. ఈ విద్యాధరాది దేవయోనులు కూడా ఆత్మజ్ఞానం లేనంతవరకు కమలాపై వ్రాలే దోమల వలె తుచ్ఛమైనవే కదా! జన్మ, మృత్యవులు విద్యాధరులకు కూడా తప్పేవి కావు కదా మరి!

ఈ శబ్దస్పర్శాది విషయాలన్నీ కూడా పూర్వం అనేకసార్లు అనుభవించినవే. అవియే మరల మరల అనుభవించటం జరుగుతోంది. అవి ఇచ్చేవన్నీ తుచ్ఛమైన అల్ప సుఖాలు మాత్రమే. ఈ విషయేంద్రియ స్పర్శలన్నీ వంచనోపాయాల ద్వారా మమ్ము అనేకసార్లు మోసం చేస్తున్నాయి. దాని ఫలితంగా దీర్ఘకాలంగా నేను ఖిన్నుడనై వీటి పాల పడి ఉన్నాను. మనస్సుకు విశ్రాంతియే లేదు. క్షణ భంగురాలైన అనేక విశేషాలతో కూడిన ఈ సంసారానికి అటు స్థిరత్వమూ లేదు. ఇటు అంతూ లేదు. ఆపాతమధురారంభా, భంగురా, భవహేతవః,

అచిరేణ వికారిణ్యో భీషణా భోగ భూమయః ॥

సంసార దుఃఖాలకు హేతభూతాలైన భోగాలన్నీ ప్రారంభంలో మాత్రం కొద్దిసేపు రమణీ యంగా తోచుచున్నాయి. అవన్నీ క్షణభంగురాలే కదా! అందుచేత అతి శీఘ్రంగా అవన్నీ కూడా వికారయుక్తములై భయాన్ని గొలుపుచున్నాయి. ఈ విద్యాధర సంబంధమైన సంపదలు నమ్మ దగినవి ఎట్లా అవుతాయి? వాస్తవానికి ఈ సంపదలన్నీ అనేక మానావమానాలకు కారణమై ఉంటున్నాయి. దుష్టమగు అహంకారం ప్రవృద్ధమగుటకు ఇవియే ఆజ్యం. ఇవి వివేకం అనుదానికి సుతరామూ వ్యతిరేకమై ఉంటున్నాయి. ఓ భుశుండ మహాశయా! అనేక మధుర ఆఘ్రాణాలకు ఆలవాలమైన సుందర నందనవనాలలో సంచరించాను. కల్పవృక్షం ప్రసాదించగల భోగాలన్నీ అనుభవించాను. అనేక విషయానందాలు చవిచూచాను. సుందర విద్యాధర స్త్రీలతో అనేకచోట్ల విహరించాను. క్రొత్తగా ప్రారంభమయ్యేదంతా మొదట ఒక వింతగా ఉండి, అతిత్వరలో రోతగా పరిణమిస్తుంది. కాలక్రమేణా ఇవన్నీ అయోగ్యమైనవేనని, స్వభావసిద్ధమగు సుఖాన్ని ప్రసాదించ జాలవని నేను గమనించాను. పైగా మానసిక వ్యధ నన్ను ఏమాత్రం వదలటం లేదని, ఆయా భోగాలన్నీ మానసిక వ్యధను కొద్ది సమయం దాచిపెట్టటానికి మాత్రమే కారణమగుచూ, చివరికి చూచుకుంటే... ఆ వ్యధను ఇనుమడింపజేస్తున్నాయని తెలిసిపోతోంది.

1. నేత్రేంద్రియము - ఈ కళ్ళు రూపాన్ని గుర్తించడానికి ప్రకృతి ప్రసాదించింది. అయితే ఇవి రూపగ్రహణం విషయంలో ఎంత చంచలంగా ఉంటున్నాయి? ఆహా! స్త్రీల ముఖాన్ని గాంచటంలో వీటికి ఎంతటి అభిలాష! అన్నిటిని చూడటానికి ఉపకరించే ఈ నేత్రేంద్రియాలు అనేక విషయాలలో సంగం కలిగి ఉన్న నాకు చివరికి దుఃఖకారకమే అగుచున్నాయి. ఇవి నన్ను ఎంతగానో మోసగిస్తు

Page:580

న్నాయి కూడా! ఎందుకంటే ఇవి వివేకం లేకుండా బాహ్యరూపాలను చూచి ఆకర్షించబడి పరుగులు తీస్తున్నాయి గాని, ఆయా వస్తువుల ప్రక్కనే చాటుమాటుగా ఉన్న తుచ్ఛత్వమును గమనించటమే లేదు. స్త్రీల రంగు రంగు వస్త్రములు, కులుకు, బెళుకులను చూచి చంచలమగుచున్నాయి. అంతే గాని “ఈ జంతు, మనుష్య దేహాలన్నీ రక్త మాంస మయాలే కదా! అనే విషయం చూరగొనటమే లేదు. చిత్తం చంచలమై ఉండగా, అది నానావిధ బంధాలను కలుగజేసే కర్మలందు తత్పరమై ఉండగా, నరకం మొదలైన అనేక అనర్థములను కలిగించగల దుర్వ్యసనాలలో ఆసక్తి కలిగి ఉండగా... ఈ నేత్రేంద్రియానికి విశ్రాంతి ఎక్కడ ఎట్లా లభిస్తుంది? చిత్తం ఉపశమించే వరకు ఈ నేత్రేంద్రియం యొక్క గతి ఇట్లే అతి చంచలమై అలసిపోతూ ఉండక తప్పదు కదా!

2. ఘ్రాణేంద్రియము - అక్కడ ఇక్కడ ప్రత్యక్షమై ఉన్న ఆయా అనర్థాల వైపుకే పరుగులు తీస్తూ ఉంటే, పెంకి గుఱ్ఱములతో పోల్చతగిన ఈ ఘ్రాణేంద్రియాన్ని నేను నివారించలేక పోతున్నాను. అతి క్రూరుడగు మాంత్రికుడు తన మంత్రబలం చేత ఒక అమాయకుని బలవంతంగా తన వశం చేసుకొని దుర్గంధయుతమైన ప్రదేశాలలో నియమిస్తున్నట్లు ఈ ఘ్రాణేంద్రియం తనయందు శ్లేష్మాది దుర్గంధములతో కూడినదై ఉండి నన్ను మాత్రం ఆఘ్రాణిత వస్తువుల వైపు తరలించి బలంగా ఆ స్థానములందు బంధం కలుగజేస్తోంది!

3. జిహ్వేంద్రియము - ఇది పొట్టకు మంచిది. ఇది కాదు. ఇది క్షేమకరం. ఇది అనారోగ్య కరం అనే విచక్షణ లేకుండా ఈ నాలుక ఆయా రుచులందు ఆకర్షిత అయి ప్రవర్తిస్తోంది. ఆహా! మహత్తర సచ్చిదానంద స్వరూపుడగు ఈ జీవుడు పశువు, క్రిమికీటకాలు మొదలైన అవివేకపూరిత ఉపాధుల పరంపరలు సంపాదించుకుంటున్నాడంటే కారణం?... ఈ జిహ్వేంద్రియానికి దాసుడు అగుటచేతనే కదా!

4. త్వక్ ఇంద్రియం (స్పర్శేంద్రియం) - ఆహా! ఏమి ఈ చర్మేంద్రియం యొక్క స్పర్శలోలుత్వం! వేసవి కాలంలో ఎండవేడిమిని నిరోధించలేకపోతున్నట్లు, ఈ చర్మేంద్రియం యొక్క స్పర్శాశయాన్ని నిరోధించలేకపోతున్నానే!

5. శ్రవణేంద్రియం - ఈ శ్రవణేంద్రియం (చెవులు) శబ్దతరంగాల యొక్క ఆస్వాదమునందు అనురాగం కలిగి ఉన్నది. కోమలమైన గడ్డిపరకలను అభిలషించిన జింక భయంకర మృగములున్న స్థానములలో ప్రవేశించునట్లు... ఈ శ్రవణేంద్రియం నన్ను అవివేకపూరితమైన స్థానములకు చేరుస్తోంది. దూషణ - భూషణ - - తిరస్కార - పురస్కారములు కేవలం భాషాప్రయోగ మాత్రమే అయినప్పటికీ, శ్రవణేంద్రియం అందుకు కుస్పందనను ఆశ్రయించి ఒక్క క్షణంలో బుద్ధితత్త్వము వరకు ప్రకంపనలను కలుగజేస్తోంది. ప్రియ వాక్యములు పలికేవారు, వందనాలు సమర్పించేవారు, వినమ్రులైన భృత్యులు, స్తోత్రాలు ఉచ్చరించే వందిమాగధులు, వీళ్ళంతా పలికే అనేక శుభ శబ్దముల వైభవమును ఈ చెవులు విని ఉన్నాయి. కించిత్ సుఖమును, ఇంతలోనే దూషణ తిరస్కార శబ్దములు వినటంచే అవి కలిగించే దుర్భర దుఃఖములకు తీవ్రస్థాయిలో పొందుతూ పోతున్నాయి.

Page:581

6. సుందర స్త్రీల లావణ్యములు - సరస వాక్యాలు పలికే సుందర స్త్రీల అభినయాలను ఆస్వాదిం చాను. వినమ్రులైన స్త్రీలు తమ చేతులతో అందిస్తుండగా అనేకసార్లు మధుర పానీయాలను గ్రోలాను. వారిచే తయారుచేయబడిన మధుర పదార్థములు రుచి చూచాను. వారు ధరించే పట్టు వస్త్రములను, హారములను, దేహములను ఈ చేతులో స్పృశించాను.

మునీంద్రా! ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విశేషము లనేకములు అనేకసార్లు అనుభవించాను. కాని అవన్నీ 'అత్యంత శుష్కప్రాయాలు అని ఇప్పుడు తెలిసిపోయింది. భుక్త్వా వర్ష సహప్రాణి దుర్భోగపటలీమ్ ఇమామ్ ఆబ్రహ్మస్తంభపర్యంతం న తృప్తిః ఉపజాయతే ॥

బ్రహ్మలోకం నుండి ఒక గడ్డిపరక వరకు గల ఈ భోగసమూహాలను వేల సంవత్సరాలు అనుభవించినప్పటికీ తృప్తి కలుగనే కలుగదు. ఒకడు విస్తారమైన సామ్రాజ్యానికి మహాచక్రవర్తిగా సుదీర్ఘకాలం ఉండవచ్చు గాక! అనేక మంది సుందరస్త్రీలను లాలించి ఉండవచ్చు గాక! అనేక శత్రు రాజ్యాలను హస్తగతం చేసుకొని ఉండవచ్చు గాక! అందులో "దేహము-ఇంద్రియములుఇంద్రియ విషయములు అను పరిధిని మించి అపూర్వమైన విషయాలు గాని, పదార్థాలు గాని ఏమున్నాయి? ఎవరైతే "ఈ మూడు లోకాలలో నా పరాక్రమానికి ఎదురే లేదు కదా! నన్ను ఎవరూ ఏమీ చేయలేరు”... అని అనుకుంటూ విఱ్ఱవీగారో... వారంతా అతిత్వరలో కాలప్రభావం చేత గుప్పెడు బూడిదగా మిగిలిపోయారు! ఆ రాజ్యాలు, ఆ బల పరాక్రమాలు వారిని మృత్యువు నుండి కాపాడాయా? లేదు. మూడు లోకాలలోని అనేక పదార్థములను పొందినప్పటికీ, “నేను పొందవలసినదంతా పొందాను. ఒక పొందవలసినది లేదు" అని ఒక్క రోజన్నా అనుకోగలిగారా? ...లేదు. వాస్తవానికి అవన్నీ వారు తపస్సు వంటి అనేక కష్టతర కార్యక్రములచే ఎంతో శ్రమించి సంపాదించుకున్నవే! వారికి తృప్తి అనేది ఎందుకు కలగలేదు?

ప్రాప్తేన యేన నో భూయః ప్రాప్తవ్యమ్ అవశిష్యతే,

తత్ ప్రాప్తో యత్నమాతిష్టేత్ కష్టయాపి హి చేష్టయా ॥ II

దేనినైతే పొందిన తరువాత ఇక పొందవలసిదంటూ ఏమీ ఉండదో... అద్దాన్ని ప్రాప్తి కొరకై ఎంత కష్టపడైనా ప్రయత్నించాలి. కాలంతో వచ్చి, కాలంతో పోయేది పొందిమాత్రం ఏం లాభం? కాలముచే బద్దము కానిది పొందితేనే ప్రయోజనం.

ఎవడైతే చిరకాలం ధన-నారీ తదితర విషయభోగాలను పొందాడో... ఆ తరువాత అతని శిరస్సుపై ఏమైనా కల్పవృక్షం మొలిచిందా? అతనికి క్రొత్తగా ఏదైనా శాశ్వత వస్తువు ప్రాప్తించిందా? లేనే లేదు. ఓ భుశుండమహాశయా! దురంతమైన (అంతు అనేదే లేని) 'విషయాలు' అనే మహారణ్యంలో సంచరించిన నేను - సౌమ్య బాలుడు అల్లరి బాలురచే వంచించబడినట్లు - అవే విషయాలచే వంచించబడ్డాను. ఈ ఇంద్రియాలు ఇంతకాలం నన్ను మోసం చేసి అవాస్తవ సుఖాలు, దుఃఖసమ్మిళిత పదార్థజాలాల వైపుగా తరలించాయి. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ

Page:582

- ఉప విషయాలన్నీ బయలుదేరింది మనస్సులోంచే కదా! అనగా నా మనస్సులోంచే ఈ విషయ శత్రువులు బయలుదేరి, నా మనస్సును తమ వైపుగా ఆకట్టుకొని నన్ను నిర్వీర్యునిగా, అర్థరహితునిగా చేసి ఉంచాయి. ఇంతకాలానికి ఈ విషయాలే నా శత్రువులు”... అని తెలుసుకున్నాను. బోయ వాళ్లు జింకను వేటాడుచున్నట్లు ఈ విషయశత్రువులు నన్ను వేటాడుచున్నాయి.

ఆహా! అతి భయంకరమైన ఈ ఇంద్రియ విషయశత్రువులకు పట్టుబడనివారు ఈ భూతలముపై అతి కొద్దిమంది ఉంటారు. ఇక నావంటి మిగతావారి సంగతంటారా! ఈ దేహము అనే నగరం “విషయాలు అనే శత్రుసేనచే ఆక్రమించబడటం జరుగుతోంది. ఇక్కడి భోగాలే ఆ విషయశత్రువుల భయంకరమైన గజబలగం. తృష్ణ వాళ్ళ పాశాలు. లోభం వారి ఖడ్గం. క్రోధం వారి ఈటెలు. శీతోష్ణాది ద్వంద్వాలు వారి రథబలం. అహంకారం వారి సేనాపతి. దుష్ట ఇంద్రియాలే వారి పతాకం. అటువంటి విషయ శత్రుసైన్యమును జయించుటకు సన్నద్ధుడైనవాడే వీరుడు గాని... ఈ రాజ్యాలు జయించేవారు నిజమైన వీరులు కానే కారు.

ఒక మదించిన ఏనుగు కుంభస్థలమును చీల్చటం సులభమేమో గాని, కుమార్గాలలో ఎప్పటి కప్పుడు ప్రవృత్తమగుచున్న ఈ ఇంద్రియాలను నిగ్రహించటం మాత్రం అంత సులభమైన పని కాదు. ఓ సాధూ! ఒకనికి అనేక తాత్త్విక విషయాలు తెలిసి ఉండవచ్చు గాక. గొప్ప పౌరుషం, మహత్తు, మహాధైర్యం కలిగి ఉండవచ్చు గాక! చివరికి వారంతా ఈ ఇంద్రియ శత్రువులతో పోరాడి జయిస్తేనే విశ్రాంతి. కుత్సితమైన ఈ ఇంద్రియాలను ఎవడు జయిస్తాడో అతడు దేవతలకు కూడా పూజార్హుడు అవుతాడు. జితేంద్రియులగు మహాత్ములు మాత్రమే 'మనుజుడు' అని అనిపించుకోవటానికి అర్హుడు. ఇక ఇంద్రియాలను జయించనివారు కేవలం మాంసపు ముద్దలతో సమానమే గాని మనుజుడు’ అను పేరుకు అర్హులు కారు. అయితే ఈ పంచేంద్రియాలను జయించటం ఎట్లా? వీటికి సేనాపతి మనస్సు. కాబట్టి మనస్సును జయిస్తే ఈ ఇంద్రియాలు తమంతట తామే వశమౌతాయి.

అయితే, ఈ మనస్సును ఎట్లా వశం చేసుకోవాలో అర్థం కాక... ఈ రోజు మీ పాద పద్మములను ఆశ్రయిస్తున్నాను.

ఇంద్రియోత్తమ రోగాణాం భోగాశావర్జనాదృతే

నౌషధాని, న తీర్థాని, న చ మక్తాశ్చ శాంతయే ॥

ఈ ఇంద్రియములు నన్ను భయంకర రోగముల వలె పట్టుకున్నాయి. భోగములను గురించిన ఆశ చావదే! ఆశను త్యజించటమే ముఖ్యమైన ఔషధం. అంతేగాని తీర్థములు, మంత్రములు ఎన్ని సేవించినా లాభం లేదనే నిశ్చయానికి వచ్చాను.

ఈ ఇంద్రియములు ఎటువంటివి?

నీతోస్మి పరమం భేదమభిధావర్భిః ఇంద్రియైః ఏక ఏవ మహారణ్యే, తస్కరైః పథికో యథా ॥

మహారణ్యంలో ఒంటరిగా ఉన్న బాటసారి “ఎప్పుడు దొంగలు వచ్చి పడతారో?”....అని భయపడునట్లు నేను ఈ ఇంద్రియ విషయముల మధ్య చిక్కి భేదంతో పరుగులు తీస్తున్నాను. ఈ

Page:583

ఇంద్రియసమూహమును బురదతోకూడి, అతిమలినమై, అత్యంత దౌర్భాగ్యంతో కూడినదై, దుర్గంధ భూయిష్ఠమై నాచువంటి తుచ్ఛములచే ఆక్రమించబడిన అల్పాశయము (మురుగు గుంట)తో పోల్చవచ్చు. దట్టంగా భయమును గొలిపే అరణ్యముతో పోల్చవచ్చు. బురదలో పుట్టి, అనేక తంతువులు కలిగిన తామరతూండ్ల వంటివి ఇవి. మొసళ్ళతో కూడిన ఉప్పునీరు వంటివి.

బాంధవోద్వేగదాయీని, దేహాన్తరకరాణిచ, కరుణాక్రందకారీణి, మరణానీన్డ్రియానిచ

మృత్యువు 1. బంధువులకు ఉద్వేగము కలిగించునది, 2. మరొక దేహమునకు కారణభూతమైనది, 3.కరుణచే రోదనము కలిగించేది... అను మూడు లక్షణాలు కలిగి ఉన్నట్లే ఈ ఇంద్రియాలు కూడా ఆ మూడు (ఉద్వేగం, పునర్జన్మ, రోదనం అనే) లక్షణాలు కలిగియే ఉన్నాయి. అవివేకిషు అమిత్రాణి, మిత్రాణి చ వివేకిషు,

గహనాంతర శూన్యాని, కాననాని ఇంద్రియాణి చ ||

ఒకడు ఒక అరణ్యం మధ్యలో ఉన్నాడనుకోండి. అతనికి ఆ అరణ్యం గురించి చక్కగా తెలిసి ఉంటే అది స్నేహితుని వంటిది. తెలియకపోతే శత్రువు వంటిది. ఈ ఇంద్రియారణ్యం కూడా అట్టిదే! ఇంద్రియాలు అవివేకికి శత్రువులు. వివేకికి మిత్రులు. వివేకసూర్యుణ్ణి కప్పి ఉంచటంచేత ఇవి మేఘాలతో కూడా పోల్చవచ్చు. మహాత్ములు వీటిని మొదలంట జయిస్తున్నారు. తుచ్ఛ సుఖాలలో ఆసక్తి గల ప్రాణులకు ఈ ఇంద్రియాలు గొప్పవిగా అగుపిస్తున్నాయి. వాటి నిండా రజో-తమో గుణాలు వ్యాపించి ఉన్నాయి. కనుక ఇవి మురికిగుంటల వంటివి. జీవుని క్రిందకు త్రోయటంలో ఈ ఇంద్రియాలకు అతి నైపుణ్యం ఉంది. లోపల విషం ఉండటంచేత అవి పాములతో సమానం. లోపల శిథిలత్వం జడత్వం కలిగి ఉండటంచేత కట్టెపుల్లలతో సమానం. ఇవి చోరత్వం, జూదం, కలహం మొదలైన దుర్వ్యసనాలు కలిగి ఉన్నాయి. శిథిలమైన నూతులు ఈ ఇంద్రియాలు ఒక్కటే.

మహాత్మా! ఈ ఇంద్రియాలు జనింపజేయు ఆపదలు' అనే మహాసముద్రంలో నేను మునిగి ఉన్నాను. ఇప్పుడు సమస్తము త్యజించి మిమ్ములను సమీపించాను. ఈ దీనుని తత్త్వోపదేశంతో ఉద్ధరించండి. తత్త్వజ్ఞులగు మహాత్ములతో సాంగత్యమే సర్వదుఃఖములకు పరిహారమని శాస్త్రజ్ఞులు ప్రవచిస్తున్నారు కదా! స్వామీ! జ్ఞాన - యోగానంద స్వరూపులగు మిమ్ములను మనసా వాచా

- కర్మణా - శరణు వేడుచున్నాను.

3. దృశ్యమును వదలాలి - దృకన్ను పట్టుకోవాలి

శ్రీ భుశుండుడు : ఓ వసిష్ఠ మహర్షీ! ఆ విధంగా సుదీర్ఘమైన ఆయుష్షును అనుభవించియున్న ఆ విద్యాధరుడు నాతో తన అంతరంగమథనాన్ని ప్రకటించాడు. అప్పుడు నేను ఇట్లు పలికాను.

శ్రీ భుశుండుడు : (విద్యాధరునితో) ఓ విద్యాధరచక్రవర్తీ! నీవు చెప్పే మాటలు నాకు ఆనందాన్ని కలుగజేస్తున్నాయయ్యా! ఎందుకంటే నీవు ఇంతకాలానికి 'ఆత్మజ్ఞానము' అనే సౌభాగ్యం కొరకై

Page:584

జాగృతుడవైనావు. చాలా మంచిది. సంసారము అనే అంధకూపం నుండి నీవు వెలువడినవాడ వయ్యావు! అగ్ని చేత వ్యాప్తమైన బంగారములాగా నీ బుద్ధి వివేకముచే పూర్ణమైయున్నది. కాబట్టి ఇప్పుడు నీ బుద్ధి నా ఉపదేశవాక్యము యొక్క సూక్ష్మార్థమును పెద్ద ప్రయత్నం అవసరం లేకుండానే గ్రహించగలుగుతుంది. నిర్మలమైన అద్దంలో దృశ్యము స్పష్టంగా ప్రతిబింబిస్తుంది కదా!

ఇప్పుడు నేను కొన్ని విశేషాలు చెప్పబోవుచున్నాను. నేనిప్పుడు చెప్పేదంతా ఇప్పటికి మాత్రం కొంత అంగీకారబుద్ధితో విను. తర్వాత నీకే అంతా సుబోధమౌతుంది. ఎందుకంటే మేము చాలా కాలంగా అనేక సందర్భాలలో సుదీర్ఘ విచారణ చేసి ఇప్పుడు ప్రతిపాదించబోతున్న నిర్ణయాలకు వచ్చాం. కనుక మేము చెప్పబోయే వాటి పట్ల అనుమానం అక్కర్లేదు. ఇదంతా మా స్వానుభవం. మొట్టమొదటగా నీవు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టు - అజ్ఞానాన్ని త్యజించటం!” శ్రీ విద్యాధరుడు : స్వామీ! అజ్ఞానాన్ని త్యజించుటమంటే ఏమిటి? నేను దేనిని వదలాలి?

శ్రీ భుశుండుడు : అహంకారం మొదలుగా గల ఏ దృశ్య ప్రపంచం నీకు అంతరంగంలో అనుభూత మగుచున్నదో... అదంతా నేను కాదు. నాకు సంబంధించినది కూడా కాదు, ఈ దృశ్యానికి సంబంధించిన వాడను కాను”... అని గ్రహించటమే అజ్ఞానమును త్యజించటం. ఎందుకంటే ఈ దృశ్య ప్రపంచంలో ఎంతకాలం నీ స్వరూపం కొరకై వెతకి వేసారినా... నీ రూపం ఈ దృశ్య ప్రపంచంలో లభించేది కాదు. ఈ దృశ్యాన్ని దాటివేసే ప్రయత్నానికి ఉపక్రమించు.

ఆత్మ గురించి తెలుసుకో! దృశ్యమాత్ర రూపమైనట్టి అజ్ఞానాన్ని వదలిపెట్టి ఆ దృశ్యమునకు 'సాక్షి' అయిన ఆత్మ గురించి నీవు ఎఱుగు. "ఈ దృశ్యాన్ని, ఈ అహంకారాన్ని త్యజిస్తే ఏదేదో కోల్పోతామేమో?... అని కొందరు జనులు సందేహిస్తూ ఉంటారు. కాని అది వాస్తవం కాదు. “న అహమ్ - త్వమ్ అస్తి, న జగత్" ఇతి నిశ్చయినస్తవ |

సర్వమస్తి శివం, తుచ్ఛ న దుఃఖాయ, సుఖాయ తే ॥

"నేను గాని, నీవు గాని, జగత్తుగాని లేవు. అంతా కూడా బ్రహ్మమయమైయున్నది... అనే సుస్థిర నిశ్చయమే ఈ జీవునికి నిజమైన సుఖం కలిగిస్తుంది. అది దుఃఖం కలిగించదు సుమా! "అది కోల్పోవటం కాదు. సంపాదించవలసినది సంపాదించటం... అని నిశ్చయించుకొని ఉండు.

అజ్ఞానం యొక్క ఆను-పానులు కనిపెట్టు!''అజ్ఞానం' గురించి విచారణ చేయాలి. అయితే ఎట్లా ఎక్కడ విచారణ చేయాలి?”... అనేది ఇప్పటి మన ప్రశ్న కదా?

శ్రీ విద్యాధరుడు : అవును స్వామీ! నా అజ్ఞానం ఎప్పుడు ప్రారంభమైనది ఎట్లా ప్రారంభమైనది? శ్రీభుశుండుడు : 1.భావన నుండి జగత్తు పుడుతోందా?... లేక, జగత్తు నుండి భావన పుడుతోందా? 2. సుషుప్తి’ అనే ప్రసిద్ధమైన అజ్ఞానం నుండి జాగ్రత్-స్వప్న రూప ఈ జగత్తు పుడుతోందా?... ... లేక, జాగ్రత్ నుండి స్వప్న సుషుప్తులు పుడుతున్నాయా?

Page:585

3. కర్మల నుండి జన్మ పుడుతోందా? జన్మ నుండి కర్మలు పుడుతున్నాయా?... వీటిలో ఏది

ముందు? ఏది వెనుక?...

ఈ విధంగా ప్రశ్నలు తయారుచేసుకొని... ఆ ప్రశ్నలకు సమాధానం కొరకై ఎన్ని జన్మలుగా వెతకినా ప్రయోజనం ఉండదు, సమాధానం లభించదు. అనగా, వాటి యొక్క కార్య కారణ భావనా వ్యవస్థ గురించి ఏమాత్రం ఎఱుగజాలం. కాబట్టి... "కాఠిన్యత్వం - ద్రవత్వం ఈ రెండూ ఒకే ఘృతము (నేయి) యొక్క లక్షణాలు"... అని మనం గమనిస్తున్నట్లు జాగ్రత్-స్వప్న సుషుప్తులు మూడూ అజ్ఞాన వ్యవస్థలే కనుక... వాటి గురించిన విచారణ వ్యర్థమే అవుతుంది. ఆ మూడు వ్యవస్థలకు సంబంధించక, వాటిలో ఆయా సమయాలలో ప్రవేశ - నిష్క్రమణలను నిర్వర్తిస్తున్న సత్ - చిత్ తత్త్వం గురించే మనం విచారణ చేయటం అవసరం సుమా!

అజ్ఞానాన్ని ప్రక్కకుపెట్టి, జ్ఞానం కోసం అన్వేషించు. మృగతృష్ణాంబువత్ విశ్వమ్, అవస్తుత్వాత్ సదప్యసత్ యచ్చేదం భాతి తద్భహ్మ న కించత్కించిదేవ వా॥

ఎండమావులలో ఎన్ని తరంగాలున్నాయి? ఎందుకున్నాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి? అని తర్కించి ఏం లాభం? ఎండమావులలో జలం కనిపిస్తున్నప్పటికీ అది భ్రాంతిచేత మాత్రమే కదా! అట్లాగే ఈ జగత్తంతా “వాస్తవంగా, సత్తుగా” కనిపిస్తున్నప్పటికీ ఇది అసత్తే సుమా! అయితే ఈ భాసిస్తున్నదంతా అధిష్ఠాన రూపంచే బ్రహ్మమే అయి ఉన్నది. కాని 'జగత్తు'గా (బ్రహ్మం కానట్లుగా) అనిపించుచున్నది. “మృగతృష్ణలో జలం నాకు కనిపిస్తోంది. కనుక, లేదు అనే మాట నేను ఒప్పు కోను”... అని వాదించే వానితో మనమేం చెప్పగలం? అతని దృష్టికి అది ఉన్నట్లే అగుచున్నది. అట్లాగే ఈ జగత్తుకు నాస్థిత్వం-అస్థిత్వం' రెండూ లేవు. అభావాన్ని సిద్ధించుకున్న వానికి ప్రతిభాస’ అనునది కూడా లేదు. (యథాదృష్టం - - తథా స్థితర) ఇది అనిర్వచనీయమని చెప్పబడుతోంది.

కాబట్టి ఈ సమస్తము శివరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.

ఈ జగత్తంతా కూడా "మృగతృష్ణలోని జలం లాగా అవస్తువు మాత్రమే! ఇది 'సత్తు' వలె భావిస్తున్నప్పటికీ అసత్తు మాత్రమే! ఇక్కడ భాసిస్తున్నదంతా అధిష్ఠానరూపం చేత బ్రహ్మమే అయి ఉన్నది. కాని జగద్రూపం చేత ఇది అవాస్తవం కనుక బ్రహ్మం కాదు. మృగతృష్ణలో (ఎండమావులలో) జలం ఉన్నదా?

లేదు అందామా... ఒక ద్రష్ట (అవిజ్ఞాత)కు జలం, జల తరంగాలు కనబడుచున్నాయి, అనుభవమగుచున్నాయి. కదా! అతడు ఆ జలం కొరకు పరుగులు తీస్తూ నన్ను ఆపకండి. అక్కడ జలం ఉన్నది. నాకు అక్కడ తరంగాలు కనబడుతున్నాయి... అని పల్కుచున్నాడు.

గాలి తరంగాలు కాంతి కిరణాల సంయోగం చేత జలం యొక్క భ్రమ మాత్రమే కలిగి స్తుంది. అంతేగాని అక్కడ జలం ఉండటానికి అవకాశమే లేదు... అని (మృగతృష్ణగా) గ్రహించిన వారికి అక్కడ జలభావం కలుగదు.

Page:586

అభావ బలం చేత ఇక్కడ ప్రతిభాస కూడా లేకుండా పోతుంది. కాబట్టి సమస్తము శివ రూపమగు బ్రహ్మమే అయి ఉన్నది.

ఓ విద్యాధరా! మనం పైన చెప్పుకున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ జగత్తునకు మూలం అహంకారమే అని గ్రహించు. అట్టి అహంకారం నుండే దిక్కులు, పృథివి, ఆకాశం, సముద్రాలు, పర్వతాదులతో కూడిన 'ఈ జగత్తు' అనే పురాతన వృక్షం బయలుదేరింది.

సూక్ష్మాహంకారం నుండి స్థూల జగత్ వృక్షం - సూక్ష్మమైనట్టి 'అహంకారం' అనే బీజం నుండి జగత్తు అనబడే ఈ స్థూల వృక్షం బయలుదేరింది. ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి" అనే రసం ఆ వృక్షమంతటా నిండి ఉన్నది. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు” అను పేర్లతో చెప్పబడే అధోలోకాలు ఆ వృక్షం యొక్క మూలాలు. నక్షత్ర మండలాలు ఆ వృక్షం యొక్క మొగ్గలు. వాసనలు దాని పూగుత్తులు. స్వర్గం మొదలైన లోకాలు దీని కొమ్మలు. కాల ప్రవాహమే ఈ వృక్షమును తొలచుచున్న పురుగు.

అసలు ఈ వృక్షం ఏ ప్రదేశంలో ఉత్పత్తి అయింది? 'అజ్ఞానము' అనే చోట! ఈ అసంఖ్యాక దేహపరంపరలు ఈ వృక్షముపై వ్రాలే పక్షులు. భ్రాంతి ఈ వృక్షము యొక్క కాండము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియ విషయాల యొక్క విషయ సాక్షాత్కారాలు; మనస్సు యొక్క సంకల్ప-వికల్పములు... ఇవి ఈ వృక్షము యొక్క గంధము.

హాస్య-విషాదాది రస ప్రకటనయే ఈ వృక్షం యొక్క చర్మం (డొల్ల). ఋతువులు దాని విచిత్రములైన ఉపశాఖలు. దశ దిక్కులు అద్దాని ప్రసరణ ప్రదేశాలు. ఆత్మసంవిత్తు దీని జీవన హేతువైన రసప్రవాహము. అవ్యాకృతాకాశము ఈ వృక్షము ఉన్న వనప్రదేశము. రాత్రింబవళ్ళు దీనిపై వ్రాలే తుమ్మెదల భ్రమణము.

ఈ విధంగా ఈ సంసారవృక్షము తన మూలముచే పాతాళమున, మధ్యభాగముచే ఈ దిక్సమూహమున, అగ్రభాగముచే అంతరిక్షమున వ్యాపించి ఉన్నది. అయితే ఈ సంసారవృక్షము వాస్తవానికి అసత్తే! అయితే ఏం? అది భ్రాంతిచేత సత్తువలె గోచరించటం జరుగుతోంది. విద్యాధరుడు: అటువంటి మహాభయంకరం, సువిస్తీర్ణం, మహాదీర్ఘం అయిన సంసారవృక్షమును ఈ మా అంతరంగం నుండి మొదలంటా తొలగించటం మాకు సాధ్యమేనంటారా?

శ్రీ భుశుండుడు : ఓ! తప్పకుండా సాధ్యమే. ఎంతటి వృక్షాన్నైనా అగ్ని దహించివేయ గలదుకదా! ఆత్మజ్ఞానరూపమైన 'అనహం అనే అగ్నిచే 'అహంకారం' అను బాహ్యాడంబర సమన్వితమైన సంసార విషవృక్షం దహించివేయబడగలదు. ఆపై "జన్మజన్మాంతర పరంపరలు... అనే బీజరూప పునరుత్పత్తి స్వభావం కోల్పోయి ఈ వృక్షం నశించగలదు.

కనుక ఆత్మజ్ఞానాగ్నిని ఆశ్రయించి ఈ ఆగామి - ప్రారబ్ధ - - సంచిత రూపమగు సంసారరూప వృక్షమును మొదలంటా నశింపజేసుకొనినప్పుడే సర్వదుఃఖములు శమించగలవు సుమా!

Page:587

4. నేను - నీవు మొదలైనవి ఉండజాలవు!

-

శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ సంసారవృక్షం ఉత్పన్నమైనది 'అహంకారం' అనే బీజం నుండే! జ్ఞానాగ్నిచే అహంకార బీజాన్ని దహింపజేశామా... ఇక మరల సంసారవృక్ష సంబంధమైన పునరుత్పత్తికి హేతువు ఉండదు.

అందుకే వివేకం కలవాడు మునుముందుగా "ఈ ప్రపంచం యొక్క అసలైన రూపమేమిటి? అనే ప్రశ్నకు సరైన సమాధానం సముపార్జించుకోవాలి. తత్త్వదృష్టిచే విచారణ చేయాలి. ఈ సమస్తం బ్రహ్మమే అనే నిశ్చయం సుదృఢమగుచుండగా... ఇక అహంకారం యొక్క ఛాయ కూడా ఉండ జాలదు. ఇంతమాత్రపు అవగాహన చేత అహంకారం దహించబడు చుండగా, ఇక దిగులెందుకు?

అహంత్వభావాచ్ఛ ‘అహం - త్వమ్ అస్థి' సంసారబీజకమ్ |

నాహంత్వభావాన్ నాహం - - త్వమ్ అస్థి' ఇతిజ్ఞానముత్తమమ్ ||

ఈ దేహాదులందు 'అహం' భావన ఏర్పరచుకొని ఉండటం చేతనే నేను వేరు - నీవు వేరు అనునది మొదలై అదికాస్తా సంసారమునకు బీజమగుచున్నది. "నేను గాని, ఇంకొకరు గాని ఈ దేహాదులు కాదు. కనిపించే ఈ దేహములను ఏ కనిపించని చిత్ చైతన్యము కదలిస్తోందో అదియే నేను-నీవు కూడా అను ఇంతమాత్రపు జ్ఞానంచే అహంకారము తప్పక దహించివేయబడగలదు. సృష్టికి ముందు ఉన్నదేది? స్వస్వరూప చైతన్యమే కదా! అట్టి చితనందు అహంభావంగాని, నేనునీవు అనునవి గాని ద్వైత ఏకత్వ భ్రమలుగాని ఉండజాలవు. ఆ చైతన్యం సృష్టిని సిద్ధింపచేయ వచ్చుగాక! అంతమాత్రం చేత తన అనంత అప్రమేయ చిదానంద ఘనత్వము కోల్పోవుచున్నదా? లేదు. మరి ఈ దుఃఖాదులు ఎందుకు? ఎవరికి?

ఎవరైతే “నీవు సృష్టి కంటే ముందే ఏర్పడి ఉన్న నిర్విషయ చైతన్యమువు. ఇప్పటికీ మరెప్పటికీ యథాతథంగా అఖండ చైతన్యస్వరూపుడవే. ఈ సంసారాదులకు నీవు సంబంధితుడవు కాదు... అను గురువాక్యం శ్రద్ధతో విని, తదనుసరణంగా సంకల్పాన్ని సమూలంగా త్యజించుటకై స్వయంగా యత్నం చేస్తారో... వారే ఈ సంసారాన్ని జయిస్తారు. జయించి నిస్సంకల్పమగు ఆత్మపద ప్రాప్తి యందు సఫలీకృతులౌతారు. అట్లా కాకుండా గురువాక్యాలను విని ఊరకుంటే లాభమేముంటుంది? ఒకాయన వంట చేయటమెట్లా? అనే విషయం బాగా పఠనం చేశాడు. అది తెలిసిన వాని వద్దకు వెళ్ళి పదార్థాలు, వాటి పాళ్ళు, ఎప్పుడు ఎట్లా కలపాలి... ఇవన్నీ నేర్చుకున్నాడు. అంత మాత్రం చేత సరిపోతుందా? ఆ నేర్చుకున్న విశేషాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇక వంట చేయటం ప్రారంభించాలి. వంట తయారుచేసి ఆ పదార్థం చక్కగా భుజించాలి. అప్పుడు కదా ఆహార ఆస్వాదనానందం! అట్లాగే వివేకవంతుడు ముందుగా గురువు వద్ద శ్రవణం చేయాలి. అంతటితో ఊరకుంటే సరిపోతుందా? లేదు. ఆ శ్రవణం చేసిన దానిని స్వప్రయత్నంతో, సత్-భావనతో కూడిన సాధన చేయాలి. అప్పుడే ఈ జీవుడు సంసారానికి ఆవలి ఒడ్డు చేరగలుగుతాడు. సంసారం

Page:588

హృదయంలో ఏర్పడి ఉన్నంత వరకు శ్రవణం, సాధన వదలకూడదు సుమా! "ఈ కనబడే శత్రు - మిత్రాది సమస్తమూ బ్రహ్మమే - అని అనుకోవటం" సాధన. సమస్తము బ్రహ్మమే - అని అనిపించటం అంతిమ లక్ష్యం.

ఓ ప్రియ విద్యాధరా! నీకు నేను-నీవు మొదలైనవాటితో కూడిన ఏ ఈ జగత్తు కనిపిస్తోందో ...అదంతా చిత్ (చైతన్యం) యొక్క చమత్కారమనియే గ్రహించు. అందుచేతనే చైతన్యమునకు అన్యమైనది ఎక్కడా ఏదీ లేదు అని సిద్ధాంతీకరించబడుతోంది. ఒక చిత్రకారుడు ఆయా రంగులు మేళవించి ఒక గొప్ప ప్రకృతి దృశ్యమును చిత్రీకరించాడనుకో... ఆ చిత్రం యొక్క రూప విశేషా లన్నీ చిత్రకారుని సంకల్ప విశేషం నుండే రంగుల మేళవింపుచే బయల్వెడలినాయి. కదా! ఈ జగద్రూప చిత్రమంతా స్వ-సంకల్పం యొక్క ఆవిర్భావ విశేషం చేతనే కనిపిస్తోంది. సంకల్పం యొక్క అభావముచే జగద్భావన లయించగా, జగత్తు కూడా లేనిదిగా అగుచున్నది. ఈ లోకాలు, ఈ వెలుగు చీకట్లు, ఈ స్త్రీ-బాల-వృద్ధాది అనుభూతులు, ఈ కల్ప-కల్పాంతాలు చిరకాల సంకల్ప భావన యొక్క బాహ్య స్వరూపాలు మాత్రమే! అంతఃకరణంలో చిరకాలం దృశ్యం యొక్క భావనను నిర్వర్తించి ఉన్న తరువాతే అట్టి చిత్ లోంచి బయల్వెడలిన భావనారూప చిత్తమునకు ఈ బాహ్య మంతా గోచరించటం జరుగుతోంది.

చిత్రకారుని చిత్తములోని చిత్రము వలె ఈ జగద్రూప చిత్రం సంకల్పం యొక్క ఆవిర్భావం చేతనే కనిపిస్తూ... సంకల్పము యొక్క అభావముచే లయించటం జరుగుతోంది. మాంత్రికుడు మాయచే లేనివి ఉన్నట్లుగా కల్పించి చూపుచున్నట్లు - ప్రతిభాస చేత మాత్రమే సత్యమై, (కానీ వాస్తవానికి అసత్యమై) ఈ జగత్తు స్ఫురిస్తోంది. సువర్ణం సువర్ణంగా ఉంటూనే ఆభరణములుగా ప్రదర్శితమగుచున్నట్లు చిత్తు... చిత్తుగా ఉంటూనే చమత్కారంగా సంకల్ప-వికల్పాలను నిర్వర్తిస్తూ ఈ జగత్తును సముపార్జించుకుంటోంది.

అందుచేత ఓ విద్యాధరా! ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశనములు ఈ మనుజుని యొక్క అధీనంలోనే ఉన్నాయని గ్రహించు. ఎట్లా అంటావా? జగత్ అనేది సంకల్పంలో జనిస్తూ సంకల్పాలు ఉపశమించగా తాను కూడా లయించేది కదా! మరి సంకల్పాన్ని ఆశ్రయించడం, త్యజించటం జీవుని చేతిలోనే ఉన్నాయి గాని, మరెవరి చేతులోనో కాదు కదా! కనుక సంసారమును కల్పించుకునేదీ ఈ జీవుడే, ఆ కల్పనలను త్యజించేదీ ఈ జీవుడే సుమా! ఇది గ్రహించి ఆపై నీకు ఏది ఎట్లు ఉచితమనిపిస్తే అది అట్లే నిర్వర్తించు. ఒక్క ముఖ్య విషయం మాత్రం గుర్తుచేస్తున్నాను.

అత్యంతమేవ స్వాయత్తో యథేచ్ఛసి తథాకురు యశ్చ అన్న-పానదానాదానావనాదరము పేయివామ్ తస్యేదం పశ్చిమం జన్మ న సకర్మ మముజ్ఝతి | ||

ఎవడైతే అన్నపానాది ఐహిక భోగముల యొక్క దాన యజ్ఞాది ఆముష్మిక భోగముల యొక్క సర్వఫలములను కోరుకోక ఉంటాడో... అట్టి వానికి ఇదే ఆఖరి జన్మ కాగలదు. "నేను

Page:589

జన్మ - - కర్మ రహితుడను అని అతిత్వరగా గ్రహించగలుగుతాడు. అట్టివాడు (తన అవగాహనను సుస్పష్టంగా, సునిర్మలంగా తీర్చిదిద్దుకున్న తరువాత) కర్మలను నిష్కామంగా ఆచరించగలుగుతాడు.

శుద్ధ బుద్ధివగు ఓ విద్యాధరా! నీవు ఇప్పటికే పతనహేతువగు అవివేకమును ఉల్లంఘించావు. కాబట్టే జ్ఞానార్థిపై నా దగ్గరకు వచ్చావు. ముల్లోకములను పునీతం చేయగలిగినట్టి అతి పవిత్రమైన వివేకమును సంపాదించుకున్నావు. అట్టి వివేకయుక్తమైన నిర్మల మనస్సు సంపాదించుకున్న నీకు సంసారము' అనే పతనము ఉండజాలదని నా అభిప్రాయం.

కాబట్టి నీవు మనోవాక్కులకు పరమై, చిన్మాత్రమైనట్టి నిర్మల ఆత్మపదమును మాత్రమే అవలంబించు. మనస్సు ఇత్యాది దృశ్యసమూహములను సర్వదా త్యజించి ఉండు.

5. బాహ్యాభ్యంతర చిద్రూపుడు

శ్రీ విద్యాధరుడు : ఓ భుశుండమహాశయా! మీ ప్రవచనం అత్యంత శిరోధార్యం. అయితే, ఈ మనస్సు మొదలైనవి నా పట్ల నిర్విషయమాత్రం అవటానికి గాను నేను చేయవలసినదేమిటి? శ్రీ భుశుండుడు : సూర్య కిరణం నిర్మల జలంలో ప్రవేశించినప్పుడు తాపరహితమై, ప్రకాశమాత్రమై ఉంటుంది కదా! నీవు కూడా... ఏ చిదాభాసుడైతే విషయాలలో, వాటి క్రియా-గుణ దోషాలలో, వాటిని ప్రకాశింపజేయటలో ప్రవేశిస్తున్నాడో... అట్టి చిదాభాసుని ఏ మాత్రం స్మరించనే వద్దు. పరమశాంతుడవై చిదనమాత్రుడవై కేవల చైతన్యమును ఆశ్రయించి అప్రమేయుడవై ఏర్పడి ఉండు. శ్రీ విద్యాధరుడు: స్వామీ! మేము తమ వలె ఈ జగత్తును జయించి, కారణకారణమగు కేవల చైతన్యమును ఆశ్రయించు శక్తిని సంపాదించకపోవటం చేత కాబోలు... ఈ సంసారభ్రమ శేషించియే ఉంటోంది?

శ్రీ భుశుండుడు : నాయనా! విద్యాధరా! ఈ జగత్తు అనబడేది అజ్ఞాన జీవుని పట్ల అచేతనమై, జడమై, దుఃఖాది రూపంగా, చైతన్యంతో అసాదృశ్యంగా అనిపిస్తూ ఉండవచ్చు గాక! వాస్తవానికి ఈ జగత్తు చైతన్యం యొక్క చమత్కారమే కాబట్టి, ఇది కూడా బ్రహ్మమే! సముద్ర మధ్యంలో అగ్ని ఉంటున్నట్లు ఇదంతా చైతన్య సదృశమై చైతన్యమునందే వెలయుచున్నది సుమా! అంతేగాని, చైతన్యమునకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు. అగ్ని పుట్టటానికి, అగ్ని ఆరటానికి కూడా వాయువే కారణమౌతోంది చూచావా? (గాలి లేనిచోట అగ్ని వెలగదు. గాలి యొక్క తీవ్రతచే అగ్ని ఆరిపోతుంది.) అట్లాగే చిత్తు తన చైతన్య శక్తిచే తనలోనే ఇదంతా గాంచుచున్నది. తానే ఈ సర్వ చేతనాచేతన పదార్థములకు కారణమైయున్నది.

నా హమస్తీతి చిద్రూపం చితి విశ్రాన్తిరస్తు తే తతో యథా యాదృశేన భూయతే, తాదృశో భవ ॥

Page:590

నేను సంసారబద్ధుడను. అల్ప స్వభావుడను. అర్హతలు లేని వాడను... ఇటువంటి సాంసారిక మైన అభిప్రాయాలను వెంటనే త్యజించు. నా హమస్థితి చిద్రూపం... నేను ఆత్మ రూపుడనుకాను” ...అనే జాడ్యాన్ని వదిలించుకో. జీవుడుగా నేను ఒక కీటకం కంటే కూడా అధికం కాదు. ఆత్మగా ఈ 14 లోకాలకు అధిష్ఠానమై ఉన్నాను... నేను సర్వదా కేవల చిద్రూపుడనే అను నిర్మలమైన సదవగాహనను సుస్థిరపరచుకొని అట్టి చిద్రూపంలో విశ్రాంతి కలిగి ఉండు. దేహా హంభావన సంపూర్ణంగా నశించగా, అప్పుడు ఏ (చిన్మాత) స్వరూపం నీకు అనుభవం అవుతుందో... అట్టి చిన్మాత్ర స్వరూపుడవై ఉండు.

చిద్రూపః సర్వ భావానామ్ అన్తర్ బహిరపి స్థితః ప్రసన్నాంబుభరస్య అన్తర్-బహిశ్చైవ యథా పయః

నదీజలం యొక్క అంతరమున, పైపైన ఉన్నది జలమే కదా! సర్వభావముల యొక్క అంతరమున, బాహ్యమున కూడా చిద్రూపమే స్థితి కలిగి ఉన్నది.

కాబట్టి “నేను ఒక అల్పుడను. చిద్రూపుడను కాను"... అనే వాక్యాలు కట్టిపెట్టు. దేహమనో సంబంధమైన అహంకారము చేత మాత్రమే ఆ విధంగా అనిపిస్తోంది అని గమనించు. అట్టి అహంకారమును త్యజించి, నీవు అఖండమగు చిద్రూపమునందే సంలగ్నుడవై ఉండు. అట్టి నీ చిద్రూపము స్వయంప్రకాశకమేగాని, మరింకేదానిచేతను అది ప్రకాశించటం లేదు సుమా!

యథా రంగమయం కుడ్యే జగత్ మౌనమివ స్థితిమ్

తథా చిచ్ఛిత్ర కచితం ఖే కుడ్యే చ ఆత్మసంస్థితమ్ ॥ ||

తెల్లటి గోడపై రంగులతో కూడిన యుద్ధ దృశ్యం చిత్రీకరించబడినట్లు మౌన స్వరూపమగు చిదాకాశంపై ఈ అనేక సంరంభాలతో కూడిన త్రిలోక సమన్వితమైన జగత్తు చిత్రించబడుతోంది. వాస్తవానికి ఈ జగత్తంతా నిర్వికార అద్వయరూపమగు ఆత్మయే గాని మరింకేదీ కాదు. ఓ విద్యాధరా! ఏ చైతన్యమగు స్వతః విశేషముచే ఇటు అచేతనమగు జగత్తుగా, అటు చేతనమగు బ్రహ్మంగా ప్రకటనమగుచున్నదో అట్లే ఆయా విశేషాల అనుభవంగా కూడా చిత్తు పొందుతోంది. కాబట్టి “నేను సర్వదా నిర్వికార చైతన్యమునే... అని గ్రహించి ఉంటూనే ఏది నీకు ఇష్టమైతే అద్దానినే (ఇటు జగత్తునుగాని, అటు బ్రహ్మమును గాని) ఆదరిస్తూ ఉండు. ఈ జగత్తు చేత నీ స్వస్వభావం కుంటువడుతోందనే భ్రమకు ఏమాత్రం తావు ఇయ్యవద్దు సుమా! "ఎండమావులలో నీరు ఉండదు... అని ఎఱిగి ఉన్న తరువాత అందలి భ్రమాత్మకమగు జలతరంగ దృశ్యమును చూస్తూ ఉన్నా, చూడకుండినా - అందులో విశేషమేమీ ఉండదు కదా! అట్లాగే తత్త్వవేత్తలు ఈ జగద్రూప చమత్కారముల మధ్యగా ఉంటూనే పూర్ణావగాహనపరులై కూడా ఉంటున్నారు. ఈ జగత్తు ఉనికి వారి అఖండాత్మానుభవమును నిరోధించజాలదు!

తిమిర దోషం గల కలవానికి ఆకాశమంతా కేశమయంగా కనిపిస్తుంది చూచావా? అనాత్మ భావనలో ఉన్నవానికి మాత్రమే ఈ జగత్తు ఆత్మకంటే అన్యమైనదిగా గోచరించటం జరుగుతోంది.

Page:591

ఈ విధంగా ఈ జగత్తంతా బోధరూపమగు ఆత్మయేనయ్యా! ఇది అభాసరూపమై అజ్ఞుల దృష్టికి ఉదయించినట్లు ఉండవచ్చుగాక. కానీ, తత్త్వజ్ఞుల దృష్టికి మాత్రం ఈ జగత్తనేది ఎప్పుడూ ఉదయించనిదే అయి ఉంటోంది. ఆకాశంలో మేఘాలను చూచి) కొండలు ఉన్నట్లు అనిపిస్తు న్నట్లు... లేని జగత్తు అజ్ఞాన దృష్టికి ఉన్నట్లే ఘనీభూతమై అనుభవమౌతోంది. ఈ జగత్తు యొక్క విశేషము ఇంతమాత్రమే.

6. నీవే ఆ బ్రహ్మమువు (తత్త్వమసి)

శ్రీ భుశుండుడు : విద్యాధరా! ఈ జగత్తు అనబడేది ఏ సమయమందునూ లేదు" అని గ్రహించు. విద్యాధరుడు : మహాత్మా! మీ వాక్యాలు శిరోధార్యమే. కానీ ఎదురుగా ఈ జగత్తు కనిపించటం, ఇది ఇంద్రియ-మనస్సులకు విషయమయి ఉండటం, ఘనీభూతమైన ఈ జగత్తు దాటరానిదిగా అనిపించటం మాత్రం మాపట్ల జరుగుతోంది. ఇట్టి ఘనీభూతానుభవమును తిరస్కరించి "ఇది లేదు” అని అనటం ఎట్లా?

శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ జగత్తు నీయందలి ఒకానొక 'స్ఫురణ’గా కదా, బాసిస్తున్నది? ఈ జగత్తును వదిలి నీ యందలి ఆ స్ఫురణను ఆశ్రయించు. ఆ స్ఫురణ చైతన్యమే కనుక ఆ స్ఫురణకు భాసించేది కూడా చైతన్యమే అనే నిశ్చయాన్ని కలిగి ఉండు. చైతన్యం నందలి స్ఫురణ చైతన్యమునకు వేరైనది కానేకాదు. దృష్టాంతానికి... జలంలో దీపపు కాంతి ప్రతిబింబిస్తోందనుకో... ఆ జలంలో ప్రతిబింబించే దీపం జలం కంటే వేఱు కాదు కదా! చిత్తు - ఆ చిత్తు యొక్క స్ఫురణచే తోచుచున్న జగత్తులోని దృశ్యత్వము వేఱు వేఱు కాదు.

ఇట్లు జ్ఞానాజ్ఞానముల అభేదమే సిద్ధించగలదు. అట్లు సిద్ధించుకుని, పరిచ్ఛేద రహితుడవై ఉండు. ఒక చిత్రకారుని చిత్రములోని చిత్రత్వము, ఆ చిత్రమునకు సంబంధించిన చిత్తములోని జ్ఞానము ఒక్కటే కదా! అట్లాగే చైతన్యములోని జగత్ సంబంధమైన స్ఫురణ స్వభావము, జగత్తుకు సంబంధించిన జ్ఞానము ఒక్కటే. ఈ సిద్ధాంతమును అనుసరించి ఈ జగత్తు చైతన్యమేగాని మరింకొకటేదీ కాదు. ఇది గ్రహించి ఊహాజనితమైన గంధర్వనగరముయొక్క అధిష్ఠానమైన ఆకాశము యొక్క మధ్య భాగం వలె సర్వదా స్వస్థుడవై ఉండు. ఈ జగత్తు సృష్టికాలంలో ఉంటోంది. సృష్టికి ముందు, ప్రళయానంతరం లేకుండా పోతోంది. చైతన్యం మాత్రం కాలాతీతమై, సృష్ట్యాతీతమై సర్వదా యథాతథంగా ఉంటోంది. అట్టి నిర్మల-నిర్విషయ చైతన్యమే నీవు. ఇది గ్రహించి ప్రశాంత చిత్తుడవై మౌనస్వరూపం వహించి ఉండు. ఇక ఏది ఎట్లా ఉండాలో అట్లే ఉండుగాక! నీ యథాతథ స్థితికి వచ్చే లోటేమున్నది?

విద్యాధరుడు : హే సద్గురూ! నాదొక చిన్న సందేహం. సృష్టికి ముందు ప్రళయమునకు తదనంతరం ఈ జగత్తు అనబడేది ఉండటం లేదని అన్నారు. కదా! మరి సృష్ట్యాదియందు, ప్రళయానంతరం ఈ జగత్తు ఏ రూపంగా ఎచ్చట దాగి ఉంటోంది?