Page:592

శ్రీ భుశుండుడు : ఒకచోట నిర్మలజలం ఉన్నదననుకో... ఆ జలంలో భావికాలపు నుఱుగు, బుడగలు ఏ రూపంగా, ఎచ్చట దాగి ఉంటున్నాయి? ఏం చెపుతాం? ఒక చిత్రకళాకారుని అద్భుత చిత్రకళా విన్యాసం ఆతని మునివ్రేళ్ళలోను ఆ మునివ్రేళ్ళు ధరించే రంగులకుంచెలోను ఎట్లా ఒదిగి ఉన్నది? ఒక వాహన చోదకుని చోదకకళ ఆతనిలో ఏ రూపంగా దాగినదై ఉన్నది? అట్లాగే బ్రహ్మము అనంతశక్తియుతమైయున్న కారణంగా అద్దాని మాయా విభాగమునందు ఈ జగత్తు సూక్ష్మరూపమున మహాప్రళయసమయంలో దాగి ఉంటోంది. గాఢ నిద్రలో ఉన్న జీవుడు కేవల నిర్విషయుడై ఉండి కూడా తనయందు జగత్ జ్ఞాపకములన్నీ, కోప - - ద్వేష - - ప్రేమ - త్యాగాది భావావేశములన్నీ అప్రకటిత సూక్ష్మరూపంలో కలిగి ఉండటమే ఇందుకు మనకు దృష్టాంతం.

జలంలోనుంచే జలరూపమైన బుద్బుదములు అకారణంగా (జలము మరొకటిగా అగుటకు ఏ కారణం లేకుండానే) ప్రకటితమౌతున్నాయి. అట్లాగే బ్రహ్మము నుండి ఎట్టి కారణము లేకుండానే ఈ సృష్ట్యాదులు కూడా ఉద్భవించినట్లు కనిపిస్తున్నాయి. స్వయంగా అకారణమై ఉన్న బ్రహ్మము నందు సృష్టి రచనకు కారణమేదీ ఉండజాలదు. కనుక ఈ జగత్తులనబడేవేవీ ఉత్పత్తి కాజాలవు, నశించజాలవు. కారణము యొక్క అభావముచే... ఈ జగత్తు లేశమైనా ఉద్భవించటంలేదు సుమా! ఎండమావులలో జలము ఉద్భవించటానికి కారణం లేకపోయినా, జలం కనిపిస్తున్నట్లు... ఈ జగత్తు అజ్ఞానముచే అనుభూతమౌతోంది. కనుక... "బ్రహ్మము బ్రహ్మముగానే బ్రహ్మమునందు సృష్టి - స్థితి - లయ విన్యాససమన్వితమై ఉంటోంది అని; “నేను నేనుగానే నాయందు ఈ సృష్టి. స్థితి, లయ ప్రదర్శిత రూపుడనై క్రీడగా, లీలగా, సరదాగా విన్యాసములు సలుపుచున్నాను - అని గమనించు, గ్రహించు.

కాబట్టి ఏ 'సృష్టి' అనబడేది నీకు ఉన్నట్లుగా అనిపిస్తోందో... అదంతా 'అజమై (జన్మ రహితమై), శాంతమై, అనంతమై, అఖండమైనట్టి బ్రహ్మమే, నని గ్రహించి ఉండు. నీవు బ్రహ్మ స్వరూపుడవే! ఇది గ్రహించి శిలామధ్యభాగ కోశమువలె ప్రశాంతుడవై జన్మకర్మాది రహితుడవై, అవయవరహితుడవై చెన్నొందుము.

పరమాత్మ జన్మాది రహితుడు. స్వాభావిక నిత్యానందస్వరూపుడు. అందుచేత అతనికి కార్య నిమిత్తమైన ఎట్టి ప్రయోజనం యొక్క అపేక్ష ఉండదు. అందుచేత ఆయనయందు సృష్ట్యాది కార్యాలు అసంభవాలు. ఏదేది అతనియందు దీపించుచున్నదో... అదంతా అజమగు శివరూపమే అయి ఉంది. అప్రబుద్ధుల దృష్టిలో ఏ శివం, అజం, చిద్రూపం అగు బ్రహ్మం ఏమరపాటు పొందుతోందో ...అట్టి మూర్ఖ విలాస దృష్టికి కనబడే సృష్టి యొక్క నాశోత్పత్తులతో నీకు భావావేశాలతో కూడిన సంబంధం అవసరమే లేదు సుమా! ఆత్మజ్ఞుల అనుభవం అట్లాగే ఉంటోంది. ఇక అజ్ఞుల అనుభవం నీకెందుకు? ఆత్మజ్ఞుల అనుభవము మాత్రమే నీకు అనుసరణీయం కదా!

అప్రబుద్ధులు బ్రహ్మమును ఏమరిచి దృశ్యమును మాత్రమే చూస్తున్నారు. ఇక అర్ధప్రబుద్ధులు "ఎక్కడెక్కడ బ్రహ్మము ఉంటే అక్కడక్కడ జగత్తు (దృశ్యము) కూడా ఉండనే ఉంటోంది”... అను

Page:593

విచారణను ప్రకటిస్తున్నారు. ఈ రెండూ అవగాహనలు అసంపూర్ణములే గాని, పూర్ణార్థములు కావు. ఎందుకంటే బ్రహ్మము వేఱు-దృశ్యము వేఱు... అనే అభిప్రాయం ఇక్కడ వినబడుతోంది కదా! అయితే, ఈ కనబడే తృణం (గడ్డి), కాష్ఠం (కట్టె), జలం, కుడ్యం (గోడ) మొదలైనవాటి నన్నిటా పరబ్రహ్మమే స్థితినొందియున్నది. ఈ సృష్టి సమూహములన్నీ పరబ్రహ్మమునందే పరస్పరం గ్రుచ్చబడి ఉన్నాయి. ఇక్కడొక్క విషయం! అయితే...

బ్రహ్మణః కః స్వభావో అసావితి వక్తుం న యుజ్యతే అనంతే పరమే తత్త్వే స్వత్వాస్వత్వాత్య అసంభవాత్||

"ఇదియే బ్రహ్మము యొక్క స్వభావం” అని నిర్ణయించి చెప్పటానికి వీలేలేదు. ఎందుచేత నంటావా? అనంతమై, అద్వయమైనట్టి పరబ్రహ్మమునందు 'నిజస్వభావము - - పరస్వభావము’ మొదలైనవన్నీ అత్యంత అసంభవములైనవై ఉన్నాయి. అయ్యది అభావము అని అందామా? అప్పుడు భావము అది కాదు... అని అనవలసి వస్తుంది. పోనీ అది భావనామాత్రము” అందామా... నిర్మల పరమాత్మ భావాభావముల దోషముచే పరిమితమైనదగుచున్నది. కనుక పరమాత్మయందు స్వభావము మొదలైన దుష్ట (పరిమిత) వచనములకు చోటు లభించదు. ఓ సాధూ! కాస్త విచారణ చేసి చూస్తే "బ్రహ్మమునందు అహమ్ - త్వమ్ మొదలైనవి సంభవించనేరవు... అని సుస్పష్టం కాగలదు. పరబ్రహ్మము నిత్యమైనది. అనంతమైనది. సర్వస్వరూపమైనది. అందులో నేను, నీవు, వారు అనబడునదంతా ఎట్లా ఉంటుంది? వాయువులో - "నీ వాయువు, నా వాయువు, వారి వాయువు", అగ్నిలో - "నీ అగ్ని, మా అగ్ని, వారి అగ్ని, భూమిలో - "నీ భూమి, నా నా భూమి, వారి భూమి" ... ఉంటాయా? వ్యవహారరీత్యా ఉన్నప్పటికీ, వాటి మొదలు-చివరలలో భ్రమయే దాగి ఉన్నది కదా!

అట్లాగే అద్దాని వ్యావర్తక పదార్థమనతగిన స్వ-త్వ (Sense of self) భావన కూడా ఉండ జాలదు. కనుక పరబ్రహ్మముపట్ల స్వభావవచనము" కూడా సిద్ధించజాలదని, సంభవించనేరదని చెప్పటమైనది. ఏ ఏ “అహం త్వమ్ సః భావనలు (ఈ జీవునకు) అనుభవమౌతున్నాయో అవన్నీ బాలుడు చీకటిలో చూచే బేతాళునివలె భ్రమచేతనే అనుభవమౌతున్నాయి. అట్టి అల్పానుభవం శాస్త్రాచార్యుల అనుభవంతో పరీక్షించి తత్త్వదృష్టితో చూస్తే తప్పక నశించిపోతుంది.

జగత్తు బ్రహ్మము వేఱు వేఱు కాదు! జగత్తు - బ్రహ్మము అను శబ్దముల భేదమేదైతే ఉన్నదో... అది వాస్తవానికి అభేదమే అయి ఉన్నది. ఈ రెండూ పర్యాయపదములే. ఆభరణం - బంగారం, బంగారు ఆభరణం అను అభేద రూప శబ్దములవంటివే అవి. రాహువు యొక్క శిరస్సు" అనునది (గ్రహణకాలంలో భూ - - చంద్ర - సూర్యుల చలన సమయంలో సంభవించే) క్రీనీడమాత్రమేగాని, నిజమైన శిరస్సు కాదు కదా! అట్లాగే జగత్తు బ్రహ్మముల భేదం వికల్పము మాత్రమేనని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు.

Page:594

7. తటస్థ భావముతో జగద్దర్శనం

శ్రీ విద్యాధరుడు : ఓ భుశుండ మహాశయా! మీరు చెప్పే జగత్ -బ్రహ్మముల పర్యాయపదత్వం యుక్తియుక్తమే.. అయితే మా సాంసారిక దృష్టికి ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మముగా ప్రాప్తించటం లేదు.

శ్రీ భుశుండుడు : ఔను! అభ్యాసవశంచేతనే అట్టి దర్శనము సంభవం. జితేంద్రియుడైనవాడే ఈ జగత్తు యొక్క బ్రహ్మముతోటి అభేదమును దర్శించగలడు. ఇంద్రియ విషయములచే చంచల మనస్కుడైనవాడు సంసారబద్ధుడై జన్మ-జరా-సుఖ-దుఃఖాది అనుభవ పరంపరలనే పొందుచున్నాడే గాని, ఇద్దానిని నిష్కళంక బ్రహ్మముగా గాంచలేకపోతున్నాడు. ఎవడైతే 1. స్త్రీ యొక్క వస్త్రరహితమైన కోమల అవయవాలు తనను తాకుచున్నప్పుడు, 2. శస్త్రములు తనను తాకుచు న్నప్పుడు... ఆ ఉభయ అనుభవములలోను వికారరహితుడై సమముగా ఉంటున్నాడో... అట్టి జితేంద్రియుడే జగత్తు యొక్క బ్రహ్మత్వమును దర్శించగల పరమపదము నందు నెలకొని ఉండగలుగుచున్నాడు.

కనుక ఓ విద్యాధరా! శస్త్రముల ఆఘాతములుగాని, స్త్రీల యొక్క అవయవములు గాని ఈ దేహమునకు సోకినప్పుడు వీటితో అనివార్యంగా సంబంధం కలుగుచున్నప్పటికీ ఈ సంబంధము వస్తుతః మిథ్యయే. లేక ఇది విరసమే... అని ఎఱిగి జాగ్రత్తునందే సుషుప్త మౌనస్థితిని సంపాదించుకో. అట్టి ఘనీభూతమైన సర్వ సమస్థితి అనబడే సుషుప్త మౌనం అలవడేవరకూ పురుషప్రయత్నముచేతను, ధైర్యం చేతను ఇంద్రియ జయమును అభ్యసించు. నీవు సంసారములోనే ఉండవచ్చు గాక! ఈ సంసారము నీయందు ఉండవలసిన అగత్యమేమున్నదో చెప్పు?

యథా భూతార్ధ తత్త్వజ్ఞ మాధయో అగ్రగతా అపి |

న మనాగపి లింపన్తి పయాంసీవ సరోరుహమ్ ॥

కమలము జలంలో ఉన్నప్పటికీ ఆ జలం కమలమును స్పృశించలేకపోతోంది కదా! యథార్థమగు తత్త్వజ్ఞానము ఎఱిగిన జ్ఞానిని తీవ్ర మానసిక వ్యధలు కూడా లవలేశమైనా స్పృశించజాలవు. ఓ ప్రియ విద్యాధరా! అందుచేత మరల చెప్పుచున్నాను విను. స్త్రీ కోమల అవయవాలుగాని, శస్త్రముల ఆఘాతము (బాణపు దెబ్బలు) గాని తన శరీరమును తాకుచున్నప్పటికీ వికారరహితుడై, అతీతత్వము వహించిన వాడై 'ఆకాశము' వలె తాకబడజాలక ఎవడైతే ఉంటాడో... అట్టి శాంతుడగు మహాత్ముడే ఈ దృశ్య జగత్తు యొక్క వాస్తవతత్త్వమును దర్శించగలుగుచున్నాడు.

మట్టి మట్టిగా ఉంటూనే ఘటరూపంగా తయారగుచున్నది కదా! ఆ ఘటం (కుండ) మట్టి కన్నా వేఱుకాదు కదా! అట్లాగే ఆత్మ కూడా ఆత్మగా ఉంటూనే ఈ 'జీవుడు' అను రూపాన్ని దాల్చుతోంది. ఆత్మను గురించిన జ్ఞానంచే జీవరూపత్వం నశిస్తోంది. ఒక నటుడు తన వ్యక్తిత్వం కోల్పోకుండానే... నాటకంలో తాను నటిస్తున్న పాత్రయొక్క లక్షణాలు ధరించి నటిస్తున్నాడు కదా!

ఈ సుదీర్ఘ వేదాంత ప్రవచనం యొక్క సారమంతా ఇంతే. విషమును గుళికగా తయారు చేశామనుకో. ఆ గుళిక ఒకానొక ఆకారము పొందినప్పటికీ తనయొక్క దేహమును చంపుట”

Page:595

అను విషస్వభావమును విడచుటలేదు కదా! చిద్రూపమగు బ్రహ్మము కూడా తన స్వభావమును విడువకయే ఈ జడ-అజడమగు జీవరూపమును ధరిస్తోంది. ఓ స్వభావ మాధుర్యమగు ఆత్మ స్వరూపుడవగు విద్యాధరా! నీవు బ్రహ్మమువేగాని జీవుడుగా పరిణమించటం లేదని గ్రహించు.

ఈ సృష్టి ఏ క్షణమందు కూడా బ్రహ్మం నుండి వేఱు కాదు. వేఱు కానప్పటికీ వేఱుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇదంతా వాస్తవానికి బ్రహ్మమునందే ఉన్నది. బ్రహ్మంగానే ఉన్నది. బ్రహ్మమే జీవుడు రూపంగా పొందుచున్నది. జనన మరణ రహితమగు బ్రహ్మమే జనన-మరణాల మధ్యగా ఉన్నట్లు అనిపించే ఈ జీవుడు సుమా! ఇది అనుభవమయ్యేది ఎట్లా? అందుకు ఉపాయం ఒక్కటే! ఈ దేహేంద్రియములందు తద్విషయములైన శబ్ద, స్పర్శ, రూపాదులందు అహంకార మమత్వ రూపమైన ఆసక్తిని జయించాలి. గురుశుశ్రూష, శ్రవణ, మననాది సాధనాలు చేపట్టాలి. స్వప్రయత్నం చేత మాత్రమే ఈ సంసారసాగరం గోష్పాద జలం వలె దాటబడుచున్నది. అంతేగాని ఏదో దైవం (అదృష్టం) చేత కాదు. స్వప్రయత్నం, వివేక దృష్టిని వీడి ఎవరో నన్ను తరింప జేస్తారులే”... అని అనుకుంటూ ఊరకొని ఉండటం ఉచితమే కాదు.

ఓ బిడ్డా! ఈ దృశ్యజగత్తులో ఇంద్రియాలకు ప్రియాలుగా అనిపిస్తున్న కొన్ని వస్తువులు తారసపడవచ్చు గాక! సర్వ సాంసారిక సుఖములకంటే, సమస్త ప్రియతమ పదార్థములకంటే ఆత్మ సుఖమే అత్యుత్తమమైనది. అది నీయందే సర్వదా వేంచేసి వేచియే ఉన్నది. ఎప్పుడైతే అంతః కరణంలో ఆత్మసుఖరూపమైన శీతలత్వం ఉదయిస్తుందో... అప్పుడా జీవుడు పరమ దరిద్రుడై ఉండి కూడా పూర్ణమగు ఆత్మ విశ్రాంతిని బడయగలడు. ఎప్పుడైతే ఈ మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైనవన్నీ సమస్తము యొక్క 'సత్తాసన్మాత్రము' అగు బ్రహ్మమునందు లయిస్తాయో... ఇక అట్టి నిర్మలబ్రాహ్మీస్థితి యందు కళంకమెచ్చట? కనుక ఓ విద్యాధరా! ఈ జగత్పదార్థములను తటస్థ భావంతో దర్శించటం అభ్యసించు.

తటస్థ భావన - ఈ జగత్తులో అనేక వస్తువులను తటస్థభావంగా చూడటం ఈ జీవునకు క్రొత్తేమీ కాదు. అపరిచితులను, అసంబంధితమైన ప్రాపంచిక వస్తువులను, నూతన ప్రదేశములను ఇంకా ఎన్నిటినో తటస్థభావంతో చూస్తూనే ఉన్నాడు కదా! అట్లాగే 'అహంత్వం' అను దానిని అతిక్రమించి ఉండు. ఈ శరీరమును, మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహం అను దానిని కూడా తటస్థభావంతో గాంచుచూ ఉండు.

సాక్షి స్వరూపం - అటు తరువాత క్రమంగా సర్వసాక్షీస్వరూపము సంతరించుకో. సర్వసాక్షి -

స్వరూపుడవై ఇటు బాహ్య జగత్ పదార్థాల, అటు అభ్యంతరాలగు మనోబుద్ద్యాదుల అనుభవాన్ని పొందవద్దు. అనగా, అంతరంగంలో వాటికి స్థానం కేటాయించనే వద్దు. ఆ అనుభవాలకు ఆవల సాక్షీమాత్రుడవై ఉండు. అనగా స్వాభావిక 'చిత్' యందు స్థితి కలిగి ఉండు. అట్టి జ్ఞానస్థితిని సుస్థిరీకరించుకున్న తరువాత ఇక ఈ సుఖ దుఃఖాదుల మధ్య నీవు ఉన్నా, ఉండకున్నా ఒక్కటే. ఎందుకంటే అవి నిన్ను తాకజాలవు కదా! అట్టి శుద్ధాత్మస్థితియందు కర్తృత్వ - భోక్తృత్వములు

Page:596

ఉండజాలవు. అట్టి స్థితిని నీకుగా నీవే సముపార్జించుకోవాలి సుమా! అయితే శాస్త్రములు, గురువాక్యములు నీకు సహకరించుట కొరకై ఉన్నాయి.

8. అహంభావము కల్పిత మాత్రమే!

శ్రీ విద్యాధరుడు : అయితే, 'అహంభావన' అనునదంతా కేవలం కల్పితమాత్రమేనంటారా? శ్రీ భుశుండుడు : అవును. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక దృష్టాంతం చెబుతాను. ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా! అందులో "తూర్పువైపు ఆకాశం - పశ్చిమ దిక్కున గల ఆకాశం - పైనున్న ఆకాశం - క్రింద ఉన్న ఆకాశం - - కుండలో గల ఆకాశం... మొదలైనవన్నీ ఆకాశమునందు ఒనర్చబడే ద్వితీయాకాశకల్పనయే కదా! ఇంటికి లోపలి ఆకాశం - ఇంటికి బాహ్యమున గల ఆకాశం... అనేదంతా కల్పన గాక మరేమిటి? అట్లాగే ఈ అహం - త్వమ్ సః మొదలైనవన్నీ కూడా! అవన్నీ ఆత్మయందు భ్రాంతిచే కల్పించబడినవి మాత్రమే. మహాకాశంలో ఈపైన కనబడే ఆకాశం కల్పించబడునది అను దృష్టిగల ద్రష్టయొక్క అనుభవము ఎట్టిది? భ్రమయే కదా! అట్లాగే ఆత్మపట్ల అవిద్యచే కల్పన చేస్తున్న ద్రష్ట, ఆతని తదితరమైన దర్శనము.... ఇదంతా ఆత్మయేనని గ్రహించు. కల్పకుని చిద్రూపమే తనయొక్క సంకల్పాత్మక దేహమును 'జగత్తు'గాను, 'అహం'గాను తదితర 'త్వం' ఇత్యాది రూపములుగాను దర్శిస్తోంది. కాబట్టి 'నేను' అనే అహంకారంగాని, ఈ జగత్తుగాని అవిద్యయే తప్ప మరింకేమీ కాదు.

పంచభూతములన్నిటిలో కెల్లా ఆకాశము అతి సూక్ష్మమైనది. అయితే పరమసూక్ష్మమైనది - సమస్త స్థూల కల్పనలకు అధిష్టానమైనది అగు బ్రహ్మమునకు ఎదురుగా ఈ ఆకాశము అత్యంత స్థూలమైనదిగా గ్రహించు. అట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమొక్కటే ఉనికిని కలిగి ఉంది. ఆ చిత్తు యొక్క కల్పనయే ఈ జగత్తంతా కూడా! అట్టి ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైన చైతన్యం అహం, ఇదం (నేను, ఇది) అను రూపవాసనలను ఆశ్రయించి ఉత్తరోత్తరా ఈ దేహ, దృశ్య, జడ దాదులు పొందుతోంది. తనయందు స్వభావమును కల్పన చేసుకొని ఆ తదనంతరం 'తదితరమైనది’ అను రూపంగా తనకు అన్యముగాని ఈ జగత్తును దర్శిస్తోంది.

చిత్తు యొక్క కల్పనయే ఈ సృష్టి - - జలము ఆవర్తము, తరంగము, సుడిగుండము మొదలైనవి ప్రదర్శిస్తున్నప్పటికీ జలం జలంగానే ఉంటోంది కదా! చైతన్యము యథాతథంగా ఉంటూనే చమత్కారంగా జగత్తుగా అగుచు, తజగత్తును పొందుచున్నది. ఆత్మచైతన్యము 'అహం' అనబడు వివర్తము పొంది, ఈ విస్తార జగదనుభవమునకు తానే కారణకారణమై ఉంటోంది.

ప్రళయం - - చిత్తు వివర్తరూపంగా (జగత్తుగా) విస్తారమొందుచున్నదని అనుకున్నాం కదా! ఒకానొకప్పుడు జగద్భావనను తనయందే ఉపశమింపజేసుకుంటోంది. తరంగాలన్నీ ప్రశాంత జలంలో లయమగుచున్నట్లు అది జగద్భావనను తనయందు లయింపజేసినప్పటి స్థితే ‘జగత్ప్రళయం' అను పేరుతో చెప్పబడుతోంది.

Page:597

ఈ ప్రకారంగా ఈ దేశకాలాదులన్నిటియందు చిత్తు యొక్క ప్రసరణ (వ్యాప్తియే సిద్ధించి

ఉన్నది. చిత్తు యొక్క ఉనికిచేతనే దేశ - - కాలములు, ఆకాశము, జలము, స్థలము, స్వప్నము, జాగ్రత్తు, జాగ్రత్తులోని మనోరాజ్యము... ఇవన్నీ అనుభవం కాగలుగుచున్నాయి. జగదనుభవ మంతా చిత్తుదే... చిత్తుకే! అందుచేత అది ఒకచోటి నుండి మరొకచోటికి పోవటం... అనే వికారము పొందటం లేదు. అద్దానికి విస్తరణముగాని, సంకోచముగాని అసంభవం.

కాబట్టి ఈ జగత్తుయొక్క ఉత్పత్తిగాని, వినాశనముగాని కేవలం అజ్ఞాన సిద్ధములే గాని... వాస్తవములైనవి కావు. ఇద్దరు కూర్చుని చెప్పుకునే 'కథ' లోని కథాసంఘటనల వంటివి. ఆకాశము ఒకచోట నిర్మలంగాను మరొకచోట కాంతిసమన్వితమైన వస్తువులతోను, ఇంకొకచోట చీకటి మయంగాను ఉంటున్నట్లే, చిదాకాశం ఒకచోట జ్ఞానమయంగాను, మరొకచోట అజ్ఞానమయం గాను ఉండటమే ఇక్కడి చమత్కారం.

ఈ దృశ్యము, ఈ జగత్తు, ఈ సుఖ దుఃఖములు మొదలైనవన్నీ మనస్సుకు సంబంధించిన వికారాలు మాత్రమే గాని... ఆత్మ ధర్మములు కావు. ఆత్మ సర్వదా జ్ఞానయుతమైయున్నది.

జ్ఞశ్చేతతి న భోగాది, న చైవ ఆత్మన్ అన్యసావహమ్ ద్రవత్వమ్ అంభసీవ అంతర్ అద్వితీయ పరే స్థితః

జ్ఞానమాత్రమగు ఆత్మ విషయజనితములగు భోగ దుఃఖాదులతో చిక్కుకునేది కానేకాదు. అంతేకాదు అద్దానియందు “నేను-నీవు-మేము-మీరు... మొదలైన వ్యవహారములు ఉండవు. జలంలో ద్రవత్వం స్వభావసిద్ధమై ఉన్నట్లుగా... ఆత్మ సర్వదా తన కూటస్థ స్వభావముననే ఏర్పడి ఉంటోంది. ఆత్మ సంకల్పములకు ఆవల ఏర్పడి ఉన్నదని గ్రహించు. సంకల్పములకు ఈవల మాత్రమే చింత, లజ్జ, హర్షము, భయము, స్మృతి, కీర్తి, ఇచ్ఛ మొదలైన మనోవృత్తులు సంకల్ప రూపమున ఉంటున్నాయి. కనుక ఆత్మ మనోవృత్తి సంబంధితమైనది కాదు సుమా! బ్రహ్మము చంద్రబింబము వంటిది అగుచుండగా... ఆ చంద్రబింబము ప్రతిబింబిస్తున్న జలమువంటిది ఈ

సృష్టి. ఈ నేత్రాదులకు కనబడే జ్ఞానం చంద్రకిరణముల వంటిది. బ్రహ్మము ఈ సృష్టి - దేశ - కాలములచే స్పృశించబడేది కాదు. జలంలో చంద్రప్రతిబింబం కనబడుచున్నంతమాత్రంచేత ఆకాశములోని బింబచంద్రుడు జలతరంగములచే స్పృశించబడటం లేదు కదా! పరమాత్మ సర్వదా తనయందు తానే తన నిజస్వరూపమునకు వేఱుకానట్టి జగదాకారంగా తనయొక్క సర్వసమాన్య సచ్చిదానంద రూపముచే స్ఫురిస్తున్నారు. అయితే దేహములు అనబడు ఒకానొకచోట విశేషాభిమానంచే జీవులు మానసిక చింతాయుతులై ఉంటున్నారు. 'అహంకారాత్మ’గా తమ స్వరూపమే వేఱుపడినట్లు స్ఫురిస్తున్నారు. అది జలమందు ప్రతిబింబించే ఆకాశాదులవంటివి మాత్రమే. ఈ సమస్త జీవ - బంధ - - మోక్షాదులతో కూడిన జగద్రూపమంతా ఆత్మయందు కల్పితమై, భ్రాంతి దృష్టికి కనిపించేదేగాని ఆత్మయందు అవి లేవు. ఆత్మ వాటియందు లేదు. కథ అనునది కవియొక్క కల్పనయే అయినప్పటికీ,... కవిని కథలో వెతకి పట్టుకోగలమా?

Page:598

ఈ 'సృష్టి' అనే సరోవరము మజ్జన-ఉన్మజ్జనము (మునగటం, తేలటం) వంటి అనేక శబనీఖిములతోను, భావాభావతరంగములతోను కన్పట్టవచ్చుగాక. ఇదంతా ఎండమావులలో కనిపించే భ్రమపూర్వక జలతరంగములు మాత్రమే.

శ్రీ విద్యాధరుడు : మరి ఆ జగత్ భ్రమ దృష్టి తొలిగేది ఎట్లా?

శ్రీ భుశుండుడు : ఆత్మసాక్షాత్కారముచే అవన్నీ ఇట్టే మటుమాయమౌతాయి. ఆత్మకు సంబంధించిన అవగాహనాబలం చేత ఇక ఈ చూచేవాడు, కనబడేదీ, ఉభయము బ్రహ్మముగానే తెలియవస్తాయి. జలమే తరంగములుగా కనిపిస్తున్నట్లు పొగయే మేఘరూపంగా భాసిస్తున్నట్లు - బ్రహ్మమే మనస్సుగాను, జగత్తుగాను (జడ- అజడ రూపములై) భాసిస్తోందనునది అనుభవమౌతుంది. అంపమును కొయ్యపై అదిమినప్పుడు ఏర్పడే ఆవర్తనములు (గీతలు) ఆ కొయ్యకు వేఱుగాను, వేతైనవి కానివిగానూ కూడా కనిపిస్తున్నాయి చూచావా? అట్లాగే దేశకాలముల వర్జితమైన పరమాత్మయందు ఈ సృష్టికూడా జడ అజడ రూపములుగా భాసిస్తోంది.

ఆ అజ్ఞాన దృష్టికి కనిపించే సృష్టి మిథ్యమాత్రమే! జ్ఞానదృష్టితో చూచినంతమాత్రంచేతనే ఇది రహితమై పోతోంది. కనుక “ఇది అతి కోమలము... అనతగినది. అయితే ఇదంతా బ్రహ్మమే కనుక, బ్రహ్మము సర్వదా సత్యమే కనుక ఈ జగత్తు శిలవలె ఘనీభూతమైనదని కూడా అనవచ్చు. స్ఫటిక శిలలో ప్రతిబింబించే అరటి చెట్టు ఎటువంటిదో, ఈ జగత్తు కూడా (జగత్తు అనగా ఆత్మ యందు భావనానుసారం కనబడే ప్రతిబింబమే కాబట్టి) ప్రతిబింబమాత్రమేనని కూడా చెప్పవచ్చు.

ఈ కనబడే వేలకొలది తలలు, కాళ్ళు, నేత్రములు... వాటి వాటి చేష్టలు ఇందులో కనిపించే తర్కవితర్కములు, ఇంకా ఈ దృశ్యంలో విద్యమానమయ్యే దిక్కులు, పర్వతములు, ప్రాణులు, నదులు మొదలైన వాటితో కూడిన ఈ జగత్తంతా అనంతస్వరూపుడగు పరమాత్మ యొక్క అంగుష్ట మాత్రమైన ఒకానొక పరిచ్ఛిన్న విభాగము అని కూడా అనవచ్చు సుమా!

అనగా... ఓ విద్యాధరా! ఏ ఈ జగత్తు నీకు అనుభూతమౌతుందో... ఇదంతా కలిపితే నీ యొక్క అనంత స్వరూపముయొక్క ఒకానొక అంగుష్టమాత్ర పరిచ్ఛిన్న విభాగము మాత్రమే! ప్రతి ఒక్క జీవుని విషయంకూడా ఇట్టిదే! - అని వివేక దృష్టితో గ్రహించు.

శ్రీ విద్యాధరుడు : స్వామీ! ఈ జగదత్వమంతా కలిపి నా ఆత్మ అనబడు అనంత స్వరూపం యొక్క ఒకానొక పరిచ్ఛిన్న విభాగంగా, అంగుష్ఠమాత్రంగా నిరూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదంతా ఆత్మయేనని తెలుపుటచే మీరు నాకు సద్గురువులయ్యారు. అనంతస్వరూపమగు ఆకాశాన్ని పరిమిత స్వరూపాలగు మేఘాలు కప్పి ఉంచినట్లుగా భ్రమింపజేసినట్లు ఈ జగదత్వం నా అప్రమేయ -నిర్వికల్ప స్వరూపాన్ని కప్పి ఉంచుతోందే! ఏమీ ఆశ్చర్యం! ఈ ప్రతిబంధకం తొలిగేది ఎట్లా? శ్రీ భుశుండుడు : (చిరునవ్వు చిందిస్తూ) బిడ్డా! ఈ జగత్తు అసారమైనది. పైకి అనేక ప్రకారములైన కామాదులతో రంజితమై పటాటోపంగా కనిపిస్తోంది. లోనంతా శూన్యము (మిథ్య) మాత్రమే. అటువంటి ఈ జగత్తు కేవలము తీవ్రవైరాగ్యముచేత మాత్రమే తుడిచివేయబడగలదు.

Page:599

9. చంచల మనస్సే జగత్తు యొక్క రూపం

శ్రీభుశుండుడు: ఓ విద్యాధరా! ఈ జగత్తంతా సుర అసుర గంధర్వ-విద్యాధర-మహోరగాది సహితంగా అనేక సంరంభాలతో కనబడుతోంది కదా! అయితే ఇదంతా కూడా జడమైన వాయువు చేతనూ, సూత్రాత్మచేతనూ సంచలనశీలమై ఉంటోంది. అట్టి జగత్తంతా ద్రష్టయొక్క చైతన్యం చేతనే ప్రకాశితమౌతోంది. అట్టి ద్రష్ట చైతన్యమే పరమాత్మ చైతన్యమని గ్రహించు. ఒక చమత్కారమైన చిత్రకారుడు ఒక వస్త్రముపై రాజసౌధం, తటాకాదులు, వీధులు మొదలైనవాటితో కూడిన నగర సౌందర్యాన్ని చిత్రించాడనుకో... అదంతా వస్త్రముపై తాకించిన రంగుల మేళవమే కదా! అయితే చూచేవానికి అనేక వికల్పములతో బహురమణీయంగా అనేక విశేషములతో స్ఫురించవచ్చు గాక! పరిశీలనాత్మక దృష్టి కలవానికి అది వస్త్రము - రంగుల మేళవింపుకాక మరింకేమీ కాదు. అట్లాగే అనేక వికల్పాలతో కూడి మనస్సు’ అను వస్త్రంపై చిత్రీకరించబడిన 'జగత్తు' అనబడే ఈ చిత్రం ఆత్మ విచారణచే తన వికల్పత్వం కోల్పోతుంది. అనేక వికల్పాలు జగత్తులో లేవు. మరి? ద్రష్ట యొక్క మనస్సులోనే ఉన్నాయి! జలంలో పడిన నూనెచుక్క జలం యొక్క కదలికచే నలువైపులా విస్తరిస్తోంది చూచావా? మనస్సు చంచలమై బ్రాహ్మీస్వరూపమగు జగత్తు ఆ మనస్సు నందు ప్రతిబింబించు నప్పుడు అనేక సరస - - విరసానుభూతులను కలుగజేస్తోంది. అట్టి దర్శనమే సంసారము.

ఈ సంసారము హృదయమునకు గొప్ప క్షోభ కలుగజేస్తోంది. మనస్సంతా నామ, రూప, గుణ వాసనామయమై ఉండగా హృదయం దృశ్యానికి బంధితమౌతోంది. స్త్రీ, పుత్ర, ధనాది వ్యవహారాల పట్ల ఏర్పడే రాగమే ఈ సంసారానికి జీవుని కట్టి ఉంచు కట్టుత్రాళ్ళు. "అట్టి ఈ సంసారం మిథ్యయే... అని ఆత్మజ్ఞాని మాత్రమే ఎఱుగుచున్నాడు. ఇది శబ్దస్పర్శాదుల ఆస్వాదనచే సుదీర్ఘంగా విస్తరించి ఉన్నది. మనం చెప్పుకున్నట్లు, వస్త్రముపై చిత్రమువలె ఇది హృదయముననే తిష్టవేసుకొని ఉన్నది. ఈ విధంగా అది చైతన్యం "అహంభావం మొదలుగా గల వికల్పాలను ఆశ్రయిస్తోంది. ఆశ్రయించి బహిర్ముఖమౌతోంది. బహిర్ముఖమై జీవత్మం పొందుతోంది. అయినా కూడా చైతన్యం సర్వదా చైతన్యముగానే ఉంటోంది. జలం తరంగాలుగా అయినా కూడా జలం జలంగానే ఉంటోంది. కదా! మట్టి బొమ్మగా అయినా కూడా మట్టి మట్టిగానే ఉంటోంది కదా!

వాస్తవానికి పరమాత్మకంటే వేరైనది ఎక్కడా ఏదీ లేదు. 'చైతన్యం' అనే సూర్యుడే ఈ ఉపాధి యందు ప్రవేశించి తద్వారా 'అహం' మొదలైన పేర్లను సంపాదించుకున్నవాడై ఇక ఈ సృష్టిగా అగుచున్నాడు. యథార్థానికి చైతన్యమునకు అన్యంగా స్రష్టలేడు, సృష్టిలేదు.

జలం తరంగత్వం వహిస్తున్నప్పుడుకూడా జలంగానే ఉంటోంది. తరంగాలు మాత్రం కదలుచున్నాయి. తరంగానికి ఆకారం ఉన్నప్పటికీ, జలం సర్వదా ఆకార రహితమే! జలము యథాతథంగా ఉంటూనే ఎట్లా చలనరూపసత్తయందు చలనరహితంగా ఉంటోందో... అట్లాగే ఆకాశము మొదలైన వాటితో కూడిన ఈ ప్రపంచమును రచిస్తూనే, చిదాత్మ ఈ ఆకాశాదుల

Page:600

రూపంలో లేదు. కథారచయిత పాత్రల కల్పనకు కారకుడై ఉంటూనే, ఆ పాత్రలన్నిటికంటే విభిన్నుడై ఉన్నట్లు, చిదాత్మ జగత్తుకంటే విశిష్టరూపమై ఉన్నది. అంతేకాదు! పాఠకుల అభిరుచికొరకై కదా, కథారచయిత కథ, పాత్రలు రచించేది! అభిరుచిని అనుసరించి సాహిత్యం ఉంటోంది. ఈ జగద్రచన కూడా జీవుల అభిరుచిని అనుసరించే రచించబడుతోందని గ్రహించు. అందుచేత జగత్తు భ్రాంతి మాత్రమే.

మరొక రహస్యం. ఈ జగత్తుకు చిదాత్మ కర్త కూడా కాదు. అది వానిని ఎఱుగుటయులేదు. జలమునకు తరంగకర్తృత్వం ఆపాదితం అయినట్లు జగత్తుయొక్క కర్తృత్వం చిదాత్మకు ఆపాదించబడుతోంది.

శ్రీ విద్యాధరుడు : మహాశయా! మరి ఈ మనస్సు మొదలైనవాటికి సంబంధించిన వర్తమానానుభవమును ఏ విధంగా అన్వయించుకోవాలి?

శ్రీ భుశుండుడు : ఈ మనస్సు, అహంభావము, బుద్ధి మొదలైనవన్నీ అవిద్య చేతనే ఏర్పడినవై ఉంటున్నాయి. పురుష ప్రయత్నబలంచేత అవి తప్పక నశిస్తాయి. ఆత్మకు అన్యమైనది లేదు అని గురు వాక్యం. కాబట్టి వాటిని ఆత్మ స్వరూపములే అని భావిస్తూ ఉండు.

పురుష ప్రయత్నం అంటే - 1. శాస్త్రములలో చెప్పిన విధి విధానములను నిర్వర్తించటం, 2. శాస్త్రార్థములను వివేకముతో విచారణ చేయటం, 3. పుత్ర, దార, ధనాదులందు మమకారం (ఇవి నావి, నాకు చెందినవనే భ్రమ) తొలగించుకోవటం, 4. మనస్సును చంచలత్వము నుండి ఉపశమింపజేయటం.

ఇట్టి పురుష ప్రయత్నబలంచే క్రమంగాగాని, అప్పటికప్పుడే గాని ఆత్మానుభవం పరిఢవిల్ల గలదు. అవిద్య యొక్క అర్ధభాగం తత్త్వవేత్తలతో సంభాషించుచుండగా తొలగగలదు. మిగతా సగభాగం ఆత్మ విచారణచేత, ఆత్మ సాక్షాత్కారంచేత నశించగలదు. భ్రమలన్నీ తొలగితే శేషించేదే సన్మాత్రమగు ఆత్మ.

శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠమహర్షీ! అవిద్య యొక్క అర్ధభాగం తత్త్వవేత్తలను ప్రసన్నం చేసుకొని, వారితో సంభాషించటం చేతను, మిగతా అర్ధభాగం శాస్త్రవిభాగముచేతను ఆత్మ సాక్షాత్కారం చేతను... ఎట్లా తొలగుచున్నదో సవివరంగా చెప్పమని నా ప్రార్థన.

అట్లాగే అవిద్య అప్పటికప్పుడేగాని, క్రమక్రమంగా గాని తొలగగలదు... అని కూడా అన్నారు. ఇది కూడా విశదపరచమని విన్నపం. సమకాలముగా గాని, క్రమక్రమంగా గాని”... అనే మాటలకు అర్థమేమిటి?

అవిద్య తొలగితే నామరూపరహితమగు సన్మయం శేషించగలదు... అని అన్నారు కదా! సత్ అనగా బ్రహ్మము. ఇక మయము’ అనగా 'నిండి ఉన్నది' అని అర్థం. మయము -

అసత్నే సూచిస్తోంది. కనుక సన్మయము అనుదానిలో సత్ - అసత్ అంశం లేవేవి ఉన్నాయో

అవి విశదీకరించండి.

Page:601

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సుజనేన విరక్తేన సంసారోత్తరణార్థినా |

సహచాపి ఆత్మవిదుషామ్ స్రసృతిం ప్రవిచారయేత్॥

ఈ సంసారమును దాటివేయాలనుకున్నవాడు ముందుగా ఈ జగద్విషయాల పట్ల విరక్తిని సంపాదించుకోవాలి. అనగా జన్మ జన్మాంతరార్జితమైన అనురక్తిని ఉపశమింపజేసుకోవాలి. అప్పుడు తదితర ముముక్షువులతో కలిసి "ఈ సంసారము ఎట్టిది? ఎక్కడి నుంచి వస్తోంది? దీని మూల మేమిటి? పరిణామమేమిటి? దీని సారమేమిటి? మనుజుడు ఇద్దాని నుండి తరించేది ఎట్లా?" అనే ప్రశ్నల గురించి విచారణ చేయాలి. ఎడారిలో ఒయాసిస్సులు ఉన్నట్లు ఈ సంసార మహారణ్యంలో ఆత్మజ్ఞులగు సజ్జనులు కూడా ఉన్నారు. అట్టి బుద్ధిమంతుడు, విరక్తుడు, మాత్సర్యరహితుడు అగు మహనీయుని ఎట్లాగైనా సరే, ఎంత ప్రయత్నించైనా సరే... వెదకి సేవాదులచే ఆయన కృపకు పాత్రులు కావాలి. ఆ విధంగా "శుభేచ్ఛ" అను ప్రథమ భూమికను ఉదయింపజేసుకోవాలి. అప్పుడు తప్పకుండా అవిద్య తిరోగమించనారంభిస్తుంది. అవిద్యయొక్క అర్థభాగం సజ్జనసాంగత్యం చేత తొలగుతుంది. ఇక నాలుగవభాగం శాస్త్రవిభవాలచే - స్వకీయమైన సునిశితావగాహనచే తోక ముడుస్తుంది. మిగతా భాగం ఆత్మసాక్షాత్కారరూపమైన స్వప్రయత్నముచే వైతొలగగలదు.

ఇన్ని మాటలెందుకయ్యా? కేవలం "మోక్షమును నేను సంపాదించాలి?... అనే తీవ్రేచ్ఛ ముందుగా హృదయంలో జనిస్తే చాలు. అట్టి అభిలాషయే వైరాగ్యాది సంపత్తిని ప్రవృద్ధపరచి ఈ జీవుని సంసారము నుండి, భోగాభిలాషల నుండి బయటకు తీసుకురాగలదు. భోగాభ్యాసం నశిస్తూ ఉండగా స్వప్రయత్నము యొక్క తీవ్రత్వమును అనుసరించి ఈ అవిద్య తొలగగలదు.

1.సాధుజనసాంగత్యము, 2. శాస్త్రవిచారము, 3. స్వప్రయత్నము... ఈ మూడూ ఒకేసారి ఒనగూడితే ఈ అవిద్య ఒక్కసారిగా తొలగిపోతోంది. ఇవి క్రమ క్రమముగా ప్రాపిస్తూ ఉంటే అవిద్య కూడా క్రమక్రమంగానే తొలగుతుంది. అట్లు అవిద్య తొలగగా, ఇక శేషించుచున్న దేమిటో... అదియే 'పరమాత్మ' అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.

ఆత్మ అనబడేది దృశ్యమా?... కాదు. ఎందుకంటే అది దృశ్యమంతటి కంటే పరమ విశిష్ట మైనది. పోనీ అది ద్రష్టయా? దృశ్యం లేనప్పుడు ద్రష్ట కూడా ఉండడు కదా! కనుక అది దృశ్యం గాని, ద్రష్ట గాని కాదు. అయితే...? ద్రష్టగా ఏర్పడియున్నదంతా ఆత్మయే! అదే సమయంలో, దృశ్యమంతా కూడా అదియే! అది నీ యొక్క స్వస్వరూపమే అయి ఉంది (తత్త్వమసి). ఆ పరమాత్మ నామరూప రహితమైనది. అదియే సత్తు. అదియే అసత్తు కూడా!

శ్రీరాముడు : "సత్తు - అసత్తు కూడా అదియే" అనేది యుక్తియుక్తంగా చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మ అర్థ-క్రియా వ్యవహారానికి విషయం కాదు కాబట్టి (లోకంలో కనిపించే ఒక వస్తువు కాదు కాబట్టి) 'అసత్తు' అనవచ్చు. అదియే అబాధ్యమైన (అది విభాగంగా అవదు కాబట్టి) పరమ పురుషార్థమై ఉన్నది కనుక... అది సద్రూపమే.

Page:602

ఓ రామచంద్రా! ఈ విధంగా సర్వదృశ్య వ్యవహారాలు తిరస్కరించబడగా అప్పుడు శేషించేదే ఆత్మ. అట్టి మన వాస్తవస్వరూపాన్ని మనం గాని, మరొకరు గాని తిరస్కరించటానికి కుదిరేది కాదు. ఆ ఆత్మ వస్తువు ఆనంద ఘనమైనది. అనంతమైనది. జన్మ జరామరణాది వికారాలు అద్దానికి లేవు. అది సర్వదా ఏకమే గాని... అనేకం కాదు. అద్దాని సమక్షంలో ఈ జీవ జనన-మరణ జగద్రూపా లన్నీ సంకల్ప స్ఫురణా మాత్రాలేనని గ్రహించు. కనుక ఇవన్నీ కూడా అసత్తుల్యాలు మాత్రమే.

ఓ రామచంద్రా! అట్టి ఆత్మతత్త్వాన్ని ఎఱుగుము. ప్రమాణ, ప్రమాతృ, ప్రమేయాది త్రిపుటీ వ్యవహారమంతా పారత్రోలివేయి. నీవే ఆ బ్రహ్మంగా, పరమాత్మగా అగుము. (అహమ్ బ్రహ్మాస్మి) నిరతిశయరూపం చేత అంతటా వ్యాపించి విహరించు. అంతేగాని, 'ఇది దుఃఖం, అది సుఖం’ అనుకుంటూ అప్రమేయ స్వస్వరూపానంద స్థితి నుండి దిగజారనేవద్దు. (బ్రహ్మైవ న బ్రహ్మవిత్) సరే! ఇక మనం శ్రీ భుశుండ - విద్యాధర సంవాదమును కొనసాగిద్దామా?

10. ద్రష్టయే దృశ్య జగత్తుకు రచయిత

శ్రీ విద్యాధరుడు : హే మహర్షీ! ఈ జీవుడు ఎక్కడినుండో వచ్చి ఇక్కడి దేశ కాలాలలో ప్రత్యక్షమగు చున్నాడు. ఇక్కడ ఈ జీవుడు దేహధారణ చేయకముందే దేశకాలాలు ఉండి ఉన్నాయి. కదా! ఈ దేశకాలాలను జీవునికొరకై కల్పించినదెవరు? ఎందుకు కల్పించి ఉంటారు? ఏమి ప్రయోజనాన్ని ఉద్దేశించి దేశకాలాలు కల్పన చేస్తున్నారు? ఆ కల్పన చేసినవారికి, ఇందులో ప్రవేశించిన జీవునికి గల సంబంధమేమిటి? ఆ సంబంధాన్ని కల్పించినది ఎవరు? ఎందుకు? దేశ కాలాలే లేకపోతే జీవుడి ప్రవేశం గాని, జన్మ కర్మలు గాని ఉండేవే కావు కదా! అసలీ జీవుడు ఎందు నిమిత్తం ఈ దేశకాలాలలో ప్రవేశిస్తున్నాడు? ఈ నా సందేహాన్ని సర్వజ్ఞులగు మీరే తొలగించ సమర్థులు.

శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఒకచోట ఒక స్తంభము ఉన్నది. అది... ఆకాశమంతటా ఏర్పడి ఉన్న ఈ వెలుగును నాయందు దాచుకుంటాను. ఎవరికీ దక్కన్విను"... అని అనుకున్నదట? ఆ స్తంభం అంతటా నిండి ఉన్న వెలుగును మ్రింగి తనయందు దాచుకోగలదా?

విద్యాధరుడు : (నవ్వుతూ) స్తంభమునకు అంతా ఏర్పడి ఉన్న వెలుగును తనయందు దాచిపెట్టుకో గలటం ఎట్లా కుదురుతుంది?

శ్రీ భుశుండుడు : అట్లాగే... ఈ మాయా జగత్తు యొక్క విస్తారమును దేశ కాలాలు తమయందు దాచిపెట్టుకోలేవు. అసలీ 'జగత్తు' అనబడేది బాహ్యమున ఉన్నదని అనుకుంటున్నావా?... లేదు! దృశ్యమంతా ఉన్నది ద్రష్టలోనే!

ఈ ఇంద్రియ లక్ష్యమగుచున్న 'జగత్తు' అనేది ఆత్మయందు గల మనస్సు యొక్క కాల్పనిక రచన మాత్రమే. వాయువు నందు సుగంధం కళ్ళకు కనబడకుండా దాగి ఉన్నట్లు ఈ 'జగత్తు' అనే రూపంగా అనుభవమయ్యేదంతా అతి సూక్ష్మరూపంగా ద్రష్టయొక్క 'ద్రష్టత్వం' అను స్వకీయమైన

Page:603

ఆరోపిత స్వభావం నందే దాగి ఉన్నదని గ్రహించు. ఈ దర్శనమంతా కూడా చైతన్యం యొక్క చమత్కారమైన ఒకానొక చిత్కళా విభాగం అని అనవచ్చు.

ద్రష్టచేతనే ఈ జగత్తు పరికల్పించబడి, అనుభవించబడుతోంది. అనగా, ఇదంతా మరెవరో ఎవరికొరకో కల్పిస్తున్నది కాదు.

విద్యాధరుడు : "జగత్తుకు కర్త జీవుడే అను వాక్యం యొక్క సూక్ష్మార్థాన్ని నేను గ్రహించలేక పోతున్నాను.

జగత్తు యొక్క కర్త జీవుడేనా! - -

శ్రీ భుశుండుడు : రెండు దృష్టాంతాల ద్వారా "ద్రష్టయే దృశ్య జగత్తు యొక్క రచయిత అనే విషయం విశదపరుస్తాను.

1. మనో రాజ్యము - ఒక బాలుడు ఒక చోట సుఖాశీనుడై ఉన్నాడు. ఏదో ఉబుసుపోకగా ఊహాలోకంలో విహరించసాగాడు. తన మనస్సులో ఒక రాజ్యంలో ప్రవేశించినట్లు, ఆ రాజ్యంలో తానే అన్ని ఆటలలో అందరినీ ఓడించినట్లు, ఇక తదితరులంతా ఆటలలో ఓడి నిస్సహాయు లగుచున్నట్లు... ఊహ కొనసాగిస్తున్నాడు.

ఇట్టి ఊహాలోక విహారం జీవులందరికి దైనందినానుభవమే కదా! ఆ మనోరాజ్యంలో అతనికి తారసపడే తదితర బాలురను రచించిందెవరు? బయటి నుండి మరెవ్వరోనా? కాదే!... ఆ బాలుని మనస్సే కదా!... ఊహకు సాక్షి అయిన ఆ బాలుడే ఊహలోని పాత్రలకు, సంఘటనలకు రచయిత అయినట్లు... ఈ జగత్తు కూడా ద్రష్ట ఊహను అనుసరించే ఆతనికి అనుభవమవుతూ పోతోంది.

2. స్వప్నము - ఒకడు నిదిరిస్తూ ఒక సుదీర్ఘమైన కల కంటున్నాడు. ఆ స్వప్నంలో కొందరు మనుష్యులు. వారితో అనేక అనేక సుదీర్ఘమైన సంభాషణలు, సంబంధాలు!

ఇప్పుడు చెప్పు... స్వప్నద్రష్టకు ఆ కలలో కనిపించిన ఆ తదితర జనులంతా ఎవరు? ఎవరి చేత కల్పించబడ్డారు? బయటనుండి ఎవరైనా ఆ స్వప్నములోని పాత్రలను పంపించారా? లేక ఇంకెవరో జనులు ఆతని స్వప్నములో ప్రవేశించారా?

విద్యాధరుడు : (కొంచెం సేపు ఆలోచించి) లేదు. ఆ స్వప్నంలో కనిపించినవారంతా స్వప్న ద్రష్ట యొక్క ఊహాకల్పిత రూపాలే.

శ్రీ భుశుండుడు : సాక్షియగు ఆ ద్రష్టయే మనోరాజ్యంలోని వస్తువులను-మనుష్యులను, స్వప్న ద్రష్టయే స్వప్నంలో కనిపించే వస్తువులను, మనుష్యులను కల్పన చేసి పొందుచున్నారు కదా! అట్లాగే ఈ జీవునికి కనిపించే జగత్తంతా ఆ దర్శనక్రియ నిర్వర్తించే జీవుని స్వయంకల్పిత ఊహా పరంపరలే సుమా!

విద్యాధరుడు : మీరు చెప్పినట్లు 1. మనోరాజ్యములోని, 2. స్వప్న జగత్తులోని సర్వరూపములు, సంఘటనలు, వ్యవహారాలు ద్రష్టచే స్వయంకల్పితంగా పరికించబడినవేనని నేనూ ఒప్పుకుంటు

Page:604

న్నాను. అయితే జాగ్రత్ విషయంలో ఇదంతా ద్రష్టయొక్క ఊహాసదృశమైన అనుభవం మాత్రమే. కనుక ఈ కనబడే జగత్తు యొక్క నిర్మాత ద్రష్టయే... అనే మీ అభిప్రాయం నాకు పూర్ణానుభవం కావటం లేదు.

శ్రీ భుశుండుడు : "దృశ్య జగత్తు యొక్క రచయిత ద్రష్టయే... అని నిరూపించటానికి ఇతఃపూర్వం జరిగిన ఒకానొక యథార్థ సంఘటనను నీకు విశదపరుస్తాను, విను.

11. ఇంద్ర - త్రసరేణు న్యాయం

-

శ్రీ భుశుండుడు : ఒకానొకప్పుడు ఒక కల్ప వృక్షం యొక్క ఒక యుగ-సంధి రూపమగు ఒకానొక శాఖయందు ఒక 'జగత్తు' అనే మేడిపండు కాచింది. ఆ జగత్తు అనే ఫలం దేవతలు-దానవులు మొదలుగా అనేక ప్రాణి సమూహాలతోను, స్వర్గ-భూ-పాతాళాది లోకాలతోను, నదీపర్వతాదులతోను పరివేష్టించబడి ఉన్నది. ఆయా జీవుల వాసనా ప్రదర్శనలతోను, ఆ వాసనా సమూహాలతో పరికల్పించబడే అనేక సూక్ష్మ జగత్ సమూహాలతోను నిండి ఉంది. చిత్ చమత్కృతిచే అలరారుతూ 'మోక్షం’ అనే బహిర్ద్వారంతో శోభిల్లుతూ, అంతరాన పంచతన్మాత్రలచే అలంకరించబడి ఉంది. ఆ బ్రహ్మమహావృక్షమునకు కాచిన జగత్తు అనే ఫలం కల్పాంతమున పండి రాలటానికి సిద్ధంగా ఉన్న స్వభావం కనబరుస్తోంది. 'అవివేకులు' అనే కాకులచే, 'వివేకులు' అను కోయిలచే పరస్పర వ్యతిరిక్త దృష్టులచే ఆ జగత్తు చూపబడుచూ ఉన్నది. ఆ జగత్తు ఎప్పుడో పరిపక్వమై పండి, 'శాంతి' అనే బ్రహ్మభావం పొందటానికి సంసిద్ధమగుచున్నట్లున్నది.

ఆ జగత్తులోగల ముల్లోకాలకు ప్రభువై, దేవతలందరికీ కూడా నాయకుడై ఒకానొక పవిత్ర జీవుడు ఇంద్రుడుగా విరాజిల్లుచున్నాడు. ఆ ఇంద్రుడు గొప్ప జ్ఞానబలం కలవాడు. గురూపదేశ బలం చేత జగత్తు యొక్క పూర్వాపరాలన్నీ ఎఱిగి ఉన్నాడు. సంకల్పాలన్నీ త్యజించి శుద్ధాంతః కరణుడై ఉన్నాడు. ఆ విధంగా ప్రశాంతమైన అంతఃకరణంలో, జ్ఞానదృష్టితో ముల్లోకాలను పాలిస్తూ కాలం వెళ్ళబుచ్చుచున్నాడు. అట్లా సుదీర్ఘమైన కాలం గడచిపోతోంది. రోజులన్నీ ఒకే రకంగా ఉండకపోవటమే ఈ కాలగతి యొక్క చమత్కారం కదా! "మాకేం! హాయిగా ఉన్నాం అని అనుకుంటూ ఉండగానే, ఎక్కడి నుండో ఏవేవో కష్టాలు వచ్చి పడుతుంటాయి. అట్లాగే ఆ ఇంద్రునికి కూడా కొన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి.

అప్పుడొక సయయంలో త్రిలోకరక్షకుడగు శ్రీహరి క్షీరసాగరంలో శయనించి ఉన్నాడు. ఒక అదను చూచుకొని అసురులు దేవలోకంపై దండెత్తారు. అప్పుడు దేవతలకు, అసురులకు మధ్య గొప్ప సంగ్రామం జరిగింది. విధివశాత్తూ ఆ యుద్ధంలో అసురులదే పై చేయి అయింది. ఆ దేవతాసైన్యం, ఇంద్రుడు కూడా తలకొక దిక్కుగా పలాయనం చిత్తగించక తప్పలేదు. క్రూరులగు అసురనాయకులు ఇంద్రుని వెంబడించారు. ఇంద్రుడు ఎక్కడా కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి కూడా అవకాశం దొరకక పరుగులు తీస్తూనే ఉండవలసి వచ్చింది.

Page:605

అప్పుడు ఇంద్రుడు బాగా అలసిపోయాడు. ఎట్లాగైనా సరే కొంతకాలం అసురుల కళ్ళు కప్పి ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవలసినంతగా అగత్యం వచ్చింది. ఒకచోట ఒక్క క్షణం ఆగి కళ్ళతో విశ్రాంతి స్థానం కొరకై పరికించి చూచాడు. ఎదురుగా సూర్యకిరణాలు ప్రసరిస్తూ కనిపించాయి. ఆ సూర్య కిరణాలలో త్రసరేణువులు (ధూళికణాలు) అనంత సంఖ్యలో ఉండటం కనిపించింది.

ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఈ త్రసరేణువులలోని ఒకానొక రేణువులో నేను దాగి ఉంటే ఈ దుష్ట దానవ సైనికనాయకులు నన్ను కనిపెట్టలేరు కదా!" - అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అట్టి కార్యక్రమం కొరకై ఉపక్రమించాడు.

తన శరీరం యొక్క స్థూలాకార సంకల్పాలను తన అంతఃకరణంలోని సూక్ష్మభూతాలలో లయం చేశాడు. స్థూలత్వమంతా త్యజించి అత్యంత సూక్ష్మ రూపం సంతరించుకున్నాడు. సూక్ష్మ భూతరూపుడై బాహ్యప్రదేశంలో గల త్రసరేణువులలోని ఒకానొక త్రసరేణువులో ప్రవేశించాడు. "అమ్మయ్య! ఇక ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను... అని అనుకొని ఆ త్రసరేణువులో విశ్రమించాడు. అసుర నాయకులు కొంతకాలం అతని కొరకు వెతికి వెతికి కూడా ఆ ఇంద్రుడు దాగి ఉన్నచోటు కనిపెట్టలేక పోయారు. అతడు కనబడకపోవటం చేత వెనుకకు మరలారు.

చాలాకాలం తరువాత ఇంద్రునికి తాను దాగి ఉన్న త్రసరేణువులో భౌతికమైన విశ్రాంతి లభించింది. ఇక కాలక్రమంగా యుద్ధం మొదలైనవన్నీ మఱచాడు. ఆ చోటును విడచి బయల్వెడలకుండా అచ్చటనే ప్రశాంత నిద్రా విశ్రాంతిని పొందాడు. అసురులు సంగతి కాస్త ఏమరచినప్పటికీ ఇంద్ర పదవికి సంబంధించిన సంస్కారాలు అతనిలో మేలుకొనియే ఉన్నాయి.

కొంతకాలం గడచిపోయింది. ఆ త్రసరేణువులోనే ఉండి ఎప్పుడో ఒక మనః స్వభావమును ఆశ్రయించసాగాడు. “ఇప్పుడు ఇంద్ర - రాజగృహంలో నేను ఉన్నాను... అని అనుకోసాగాడు. అతడు అక్కడే ఒక గృహంలో ఉండటం జరిగింది. ఆ గృహంలో ఒకచోట పద్మాసనం వేసుకుని "స్వర్గలోకం, అమరావతి, దేవసభ, ఇక్కడ నా సింహాసనం, ఇప్పుడు నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాను, దిక్పాలకాది దేవతలు నన్ను పర్యవేష్టించి ఉన్నారు, ఈ స్వర్గానికి క్రిందగా భూలోకం ఉన్నది, దానికి కూడా నేనే అధిపతిని... ఇట్టి రూపంతో కూడిన మనోకల్పనను పొందసాగాడు. ఇక ఆతని కల్పనలోని మూడు లోకాలకు అధిపతి అయి, ఇంద్రపదవి యొక్క కార్యక్రమమంతా నిర్వర్తించసాగాడు.

ఇంద్రభవనం నుండి బయల్వెడలి అమరావతి నగరమును, ఆ నగరం యొక్క చివరికి పోయి భూలోకాన్ని దర్శించాడు. అక్కడి పర్వత, నదీ, నదములు సక్రమగతిలో ఉన్నాయో, లేవో నని అంతా త్రిలోకపాలకునిగా పర్యవేక్షించాడు. భూమి అంతా ఆయా రాజ్యాలతో, రాజ్యపు సరిహద్దులతో ఉండునట్లుగా ప్రకృతి కాలాలను సరిపోల్చి ఉంచాడు. క్రియా కలాపాలతో భూమి సక్రమంగా ఉన్నదని అనుకున్న తర్వాత ఇక పాతాళంలో ప్రవేశించాడు. అక్కడ కూడా రాజ్యాలు-రాజులుప్రజలు-విధి విధానాలు-యజ్ఞయాగాది వ్యవహారాలు పర్యవేక్షించాడు. ఏ దిక్పాలకులకు ఏ నిర్ణయాలు తెలియజేయాలో... అవన్నీ నిర్వర్తించి మరల స్వర్గలోకం జేరాడు.

Page:606

ఇక ఇతఃపూర్వం లాగానే యథావిధిగా త్రిలోక పాలన చేస్తూ అష్టశ్వర్యాలు అనుభవించసాగాడు. దేవతలకు ప్రభువై విరాజిల్లాడు.

ఆ విధంగా చాలా కాలం గడిచింది. ఆ తరువాత అతనికి మహాపరాక్రమశాలి అయిన పుత్రుడు జన్మించాడు.

విద్యాధరుడు : భుశుండ మహాశయా! మీ మాటకు అడ్డువస్తున్నాని అనుకోకండేం. ఆ ఇంద్రుడు మొట్టమొదట అసురులు తరుముచుండగా ఒక త్రసరేణువులో ప్రవేశించాడు కదా! ఆ

త్రసరేణువులోనే ముల్లోకాలు ఏర్పాటు చేయబడ్డాయా?

శ్రీ భుశుండుడు : (చిరునవ్వుతో) ముల్లోకాలు త్రసరేణువులో లేవు. అవన్నీ సూక్ష్మాతిసూక్ష్మదేహం అవధరించిన ఇంద్రుని మనస్సులోనే ఉన్నాయి. అనగా అవన్నీ అతని మనస్సు చేతనే కల్పించబడి అనుభవింపబడుచున్నాయి. ఇక ఆ త్రసరేణువు గతి ఏమిటంటావా? అది తదితర త్రసరేణువుల లాగానే యథామార్గంలో ఎటో వెళ్ళిపడింది.

ఇక మనం ఆ ఇంద్రుని చరిత్ర కొనసాగిద్దాం. ఈ విధంగా మరికొంత కాలం గడిచి పోయింది. ఆ ఇంద్రుని కుమారునికి యుక్త వయస్సు రాగానే తదనంతర ఇంద్రుడుగా పట్టాభిషిక్తు డైనాడు. ముల్లోకాలను తన మనో వీథిలో సృష్టించిన మొట్ట మొదటి ఇంద్రుడు తన స్థూల సూక్ష్మ దేహములను కాలక్రమంగా త్యజించి 'నిర్వాణము' అనే మోక్ష స్థితిని పొందాడు. అతని కుమారుడైన కుందుడు’ అనువాడు కూడా ఇంద్ర పదవిని అధిష్ఠించి చాలాకాలం ముల్లోకములను పాలించి ఆ తరువాత తన కుమారునికి పట్టంగట్టి ఆతడు కూడా పరమపదమును పొందాడు.

ఈ విధంగా మన కథానాయకుడగు మొట్టమొదటి ఇంద్రుని తరువాత వందలకొలది పుత్ర - పౌత్రులు గడచిపోయారు. ఇప్పుడు అతని వందలాది వంశజుల పరంపరానంతరం వర్తమానంలో 'అంశకుడు' అను పేరుగలాయన ఇంద్రపదవిని అలంకరించి ఉన్నాడు.

చూచావా విద్యాధరా! మొట్టమొదటగా ఇంద్రుడు ప్రవేశించిన త్రసరేణువు ఎచ్చటనో విలీనమై, క్షయించి, నాశనం పొందింది. అయితే ఆ త్రసరేణువులో ప్రవేశించి విశ్రాంతికై ఉపక్రమించి, ఆ తరువాత తనయొక్క వాసనలచే ఆ ఇంద్రుడు దర్శించనారంభించిన త్రిలోక రాజ్యం మాత్రం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.

12. ఆత్మసాక్షాత్కార పర్యంతం దృశ్యం ఉంటోంది

శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఈ సందర్భంలో మరో చమత్కారమైన విశేషం ప్రస్తావిస్తాను, విను. ఇప్పుడిక ఆ ఇంద్రుని వంశంలో జన్మించి, దేవరాజు అయినట్టి ఒకానొకని గురించి మనం చెప్పుకుందాం. అతడు ఇంద్రవంశంలో జన్మించాడు. ఉత్తమ గుణాలచే పరిపూర్ణుడు. ఆ దేవరాజు శ్రీమంతుడు, వైరాగ్యాది సంపదలతో కూడుకొని ఉన్నవాడు. మోక్షార్హతచేత అతనికి అదియే అంతిమ శరీరధారణం కూడా! యౌవనంలోనే దేవగురువు బృహస్పతుల వారిచే బోధించబడి అతడు

Page:607

ఆత్మజ్ఞాని అయ్యాడు. వేద్య వస్తువైన ఆత్మ గురించి అనుభవ సమన్వితంగా ఎఱిగి కూడా యథా విథంగా త్రిలోక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. యథాప్రాప్తాలైన కర్మలన్నీ నిర్వర్తిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి అసురులతో గొప్ప యుద్ధం చేసి, వారినందరినీ జయించాడు. ఆతడు అజ్ఞానాన్ని దాటినట్టి విశుద్ధమైన మనస్సుతోనే వంశాచారానుసారం నూఱు అశ్వమేధయాగాలను నిర్వర్తించి ఉన్నాడు.

ఆతడు ఒకసారి ఏదో కార్యవశంగా ఒకానొక ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో సుందరమైన మానస సరస్సు కనిపించింది. ఆ సరస్సులో బహుసౌకుమార్యమైన కమలాలు కనిపించాయి. అక్కడి ప్రశాంతమైన వాతావరణమును గమనించి, అనేక యుద్ధ సంరంభముల చేతను, అశ్వమేధాది యాగాల కార్యక్రమాల చేతను ఎంతగానో అలసిపోయిన ఆతని మనస్సుకు కించితు, విశ్రాంతి పొందాలనిపించింది. ఆలోచన వచ్చినదే తడవుగా ఇక విశ్రాంతి కొరకై ఉపక్రమించాడు. ఆ కమల నాడులలోని ఒకానొక అతి సౌరభమైన దానిని ఎన్నుకొని ఆ కమలము యొక్క ఒక తూడు’(సన్నని కాండం)లో సూక్ష్మదేహి అయి ప్రవేశించాడు. అక్కడ అతడు ఒక ప్రక్క దేహ పరంగా విశ్రాంతి పొందుతూనే మనస్సు పరంగా ఊహాపథంలో విహరించసాగాడు. మనస్సు తోనే రాజ్య ఏలటం, యుద్ధాలు చేయటం, ఆ యుద్ధాలలో గెలుపు - ఓటములు చవిచూడటం... ఇవన్నీ అనుభవించసాగాడు. ఇట్లా కొంతసేపు గడిచింది.

అతడు బృహస్పతిచే ఎంతగానో బోధించబడిన సుజ్ఞాని కదా! అందుచేత ఒక రోజు ఇట్లా అనుకున్నాడు. "ఇంతకాలం నేను మాయలో ఉన్నాను. ఇప్పుడిక ఈ మాయ నుండి బయటకు వచ్చి మాయకు సాక్షిగా ఉండి మాయను దర్శించెదను గాక! ఇక నేను బ్రహ్మతత్త్వాన్ని, ఆ బ్రహ్మం మాయతో కూడుకొని ఉన్న చమత్కారాన్ని దర్శించటానికి ఈ నా మనస్సును వినియోగిస్తాను గాక!

తన మనస్సును రాజ్యం మొదలైన వాటి నుండి మరల్చి ఇక 'బ్రహ్మం - మాయ' అనే రెండిటినీ పరిశీలించే క్రమంలో నియమించినాడు. ధ్యాననిమగ్నుడైనాడు. బాహ్య-అభ్యంతరాలైన విక్షేపాలన్నీ త్యజించాడు. శాంతబుద్ధి కలవాడైనాడు. ఏకాంతస్థితుడైనాడు. ఇక ధ్యానం ద్వారా సర్వశక్తియుతం - సర్వ వస్తుమయం - సర్వ వ్యాపకం - సర్వదా సర్వవిధ స్వరూపం - సర్వత్రం సర్వగామి... అయినట్టి పరబ్రహ్మమును వీక్షించసాగాడు.

పరబ్రహ్మము యొక్క వర్ణన (గానం) -

సర్వతః పాణిపాదంతం, సర్వతోక్షి శిరోముఖమ్ | సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య సంస్థితమ్ ॥ ||

సర్వేంద్రియగుణైర్ముక్తం, సర్వేంద్రియ గుణాన్వితమ్ అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృచ ॥ ||

బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ | సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అన్తికేచతత్ ||

Page:608

సర్వత్ర చంద్రార్కమయం, సర్వతైవ ధరామయమ్ | సర్వత్రపర్వతమయం, సర్వత్రిస్ధిమయం తథా ॥

సర్వత్ర సార గురుకం సర్వత్రైవ నభోభయమ్ | సర్వత్ర సంసృతిమయం, సర్వతైవ జగన్మయమ్ ॥

సర్వత్రైవ చ మోక్షాత్మ, సర్వతైవాద్య చిన్మయమ్ సర్వత్ర సర్వార్థమయం, సర్వత్ర సర్వ వర్జితమ్ ॥

ఘటే పటే వటే కుడ్యే శకటే వానరే తథా | ధామ్ని వ్యోమ్నితరావద్రావనిలే, సలిలే అనలే ॥

అత్యంతాశ్చర్యంగా పరబ్రహ్మం అతనికి కనిపించింది. ఆ పరబ్రహ్మం అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, ముఖాలు, చెవులు కలదై ఉన్నది. సమస్త లోకాలలోనూ వ్యాపించి ఉన్నది. సర్వ ఇంద్రియ-గుణాలకు సంబంధించనిదై (వివర్జితమై) ఉంది. అయితే సర్వేంద్రియ - గుణాన్వితమై ఉన్నది. పరమార్థంగా చూస్తే అద్దానికి దేనితోనూ సక్తత (Allotment) లేదు. అనగా సర్వత్రా అసక్తమై ఉన్నది. వ్యవహారరీత్యా అన్నిటినీ భరిస్తున్నది అదే! అన్నిటి యొక్క భారం వహిస్తున్నప్పటికీ దాని స్వభావం గుణములు కాదు. అది నిర్గుణం. అది సమస్త భూతాల యొక్క (పంచభూతాల జీవుల) బాహ్య - అభ్యంతరాలలో ఏర్పడి ఉంది. తాను ఎట్టి కదలికా పొందనప్పటికీ కదలికలన్నీ దానివే. అది అత్యంత సూక్ష్మమై ఉండటం చేత అజ్ఞాతస్థూల దృష్టికి అది కనబడటమే లేదు. సూక్ష్మ దృష్టికి మాత్రం అత్యంత స్పష్టంగా కనబడుతోంది. అనుభూతమౌతోంది. అది సర్వత్రా చంద్ర-సూర్య-పృథివి-పర్వత-సముద్ర-ఆకాశమయమై, సర్వత్రా చిత్సార - గురురూపమై, సర్వత్రా సృష్టి పూర్ణమై - జగన్మయమై ఉన్నది. సర్వత్రా మోక్షరూపమై, ఆద్యచిన్మయమై, సర్వత్రా సర్వపదార్థమయమై ఉన్నది. సర్వత్రా సర్వవర్జితమై ఉన్నది. అయినా కూడా, ఘట-వస్త్ర-వృక్షశకట-గృహ-మందిర-ఆకాశ-పర్వత-వాయు-జల-అగ్న్యాది సమస్త పదార్థములందున్నదై నర - వానరాది సర్వజీవులుగా తానే అయి అన్ని వైపులా వెలయుచుండుటను ఆతడు చూచాడు. ఈ ముల్లోకాలు అనేక ఆచార విచారాలతో వివిధ కార్య సంరంభాలతో కూడుకొని ఉండవచ్చు గాక, ఇట్టి త్రైలోక్యం ఆ పరబ్రహ్మం నందు ఒకానొక స్వల్ప అంశమాత్రంగా ఆ దేవరాజు వీక్షించాడు.

మిరియంలో కారం ఉన్నట్లు, ఆకాశంలో శూన్యత్వం ఉన్నట్లు ఆ కాలాత్ముడగు చిన్మయ పరమాత్మలో ఇట్టి అసంఖ్యాక ముల్లోకాల యొక్క ఆవిర్భావతిరోభావాలు ఏర్పడి ఉంటున్నాయి.

ఈ విధంగా జీవభావవర్జితుడై, శుద్ధజ్ఞానంచే ఆ ఇంద్ర శరీరంతో పరబ్రహ్మాన్ని గాంచుచూ క్రమంగా పూర్ణాత్మధ్యానవంతుడైనాడు. ఆ పరబ్రహ్మం యొక్క మాయావిభాగం నందు అనేక బ్రహ్మాండాలను గాంచసాగాడు. అట్లాగే ఈ మనం ఉన్న బ్రహ్మండాన్ని కూడా వీక్షించటం జరిగింది.

ఆ తరువాత ఆతడు ఈ బ్రహ్మాండమంతా మనస్సుతో సంచరించుచూ, ఈ బ్రహ్మాండములోని ఇంద్రలోకంలో ప్రవేశించాడు. తానే ఇంద్రుడై ఇంద్రత్వమును మనస్సుతో అవధరించాడు... ఆ

Page:609

ఇంద్ర పదవిచే అనేక లోకాలు పరిపాలించాడు. ఇప్పటికి ఈయన ఈ బ్రహ్మాండమును పరిపాలిస్తూనే ఉన్నాడు. చూచావా విద్యాధర నృపాలా! ఈ ప్రకారంగా మొట్టమొదటి త్రసరేణువు లో ప్రవేశించి ముల్లోకముల భావనా మాత్ర సృష్టికి కారణమైన ఇంద్రుని వంశానుగతంగా ఆతని వంశంలోని ఒకానొక దేవరాజే ఈ మన వర్తమాన బ్రహ్మాండంలోని ఇంద్రుడై ఉన్నాడు సుమా!

ఈ లోకమందలి ఇంద్ర పదవిని అవధరించిన తరువాత త్రసరేణు ప్రవేశితుడగు ఇంద్రుడు తనయందు సంస్కారరూపమున ఎక్కడో అంతరాంతరాళాలలో దాగి ఉన్న పూర్వపు జ్ఞానయోగ అభ్యాసం చేత అతడు తాను కమలనాళ సూత్రంలో ప్రవేశించటం, నివసించటం స్మరించాడు. పరబ్రహ్మం యొక్క నిర్వికల్ప - సవికల్పరూపాలను గ్రహించి బ్రహ్మానందం అనుభవిస్తూనే ఇంద్రుడుగా బ్రహ్మండానికి సంబంధించిన పరిపాలనను కొనసాగించటం జరిగింది. ఆతని వంశజుడు ఈ బ్రహ్మాండంలో ఇంద్రత్వాన్ని ఈ వర్తమానంలో అవధరిస్తున్నాడు.

ఓ విధ్యాధరా! మనం కమలనాళ తంతువులలో ప్రవేశించిన ఒకానొక ఇంద్రుని కథాక్రమ మెట్టిదో చెప్పుకున్నాం. ఇటువంటి ఇంద్రులు చిదాకాశంలో అక్కడ, ఇక్కడా, మరింకా ఎన్నోచోట్ల లక్షల కొలదిగా ఉండి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. చిదాకాశంలో ఇటువంటి వ్యవహారా లెన్నో అసంఖ్యాకంగా గడిచిపోయాయి. గడుస్తున్నాయి.

విద్యాధరుడు : స్వామీ! ఇదంతా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ద్రష్ట యొక్క దృశ్యపరంపరలు అనంతమని అనిపిస్తోంది. ఈ దృశ్యములకు అంతు లేదా? ఇవి ఎప్పటికీ ఉపశమించవా?

శ్రీ భుశుండుడు : ఆత్మసాక్షాత్కారం కానంత వరకు ఈ మహాప్రబలమైన 'దృశ్యము' అనునది ఇట్లా త్రెంపు లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది.

1. జీవుడు మాయలోనే ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు ఆ ఉపాధి విశేషములే తన మొత్తం స్వరూపమని అనుకుంటూ ఉపాధిపరంపరలు పొందుతూనే ఉంటాడు.

2. అతడు పరబ్రహ్మము గురించి బ్రహ్మజ్ఞులచే విని సగము పరబ్రహ్మమున సగము మాయయందు ఆరూఢుడైనాడా... “ఇదియే సుదీర్ఘమైన మాయ... అని గమనించగలుగుతాడు. అనగా బ్రహ్మమును, మాయను వేఱువేఱుగా దర్శించగలుగుతాడు.

3. సత్యమగు పరమాత్మ యొక్క సాక్షాత్కారమాత్రంచే ఈ అనుభవమయ్యే మాయ పూర్ణంగా విలయమొందగలదు. అనగా మాయను కూడా ఆత్మవిన్యాస చమత్కారంగా దర్శించగలడు. విద్యాధరుడు : స్వామీ! భుశుండ మహాశయా! మీరు చెప్పిన అనేక విశేషాల ప్రభావం చేత ఆ మాయ యొక్క అనేక చమత్కారాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నాదొక ప్రశ్న. మనం అందరం చిదాకాశ (లేక) పరబ్రహ్మ స్వరూపులమే కదా! అట్టి మనకు 'మాయ' అనే అనుభవం ఎందుకు, ఎక్కడి నుండి, ఏ విధంగా సంప్రాప్తించి మభ్యపెడుతోంది?

శ్రీ భుశుండుడు : పాపరహితుడగు ఓ విద్యాధరా! ఈ మాయ ఎట్లాగో, ఎచ్చట నుంచో, ఏ విధం గానో వచ్చిపడి అనుభవమౌతోంది. ఎక్కడి నుండి వస్తే ఏం? మొత్తం మీద నీకు మాయ అనుభవ మవుతోంది కదా! ఇప్పుడిక మాయ అంటే ఏమిటో గ్రహించడానికి ఉపక్రమించు.

Page:610

'మాయ' అంటే ఏమిటి? 'యామా'... "ఏదైతే స్వయంగా (వాస్తవానికి) లేదో అని కదా, అర్థం? లేనిది ఎందుకోస్తే ఏం? దృష్టాంతానికి... అక్కడ దయ్యం లేదు. కానీ ఏదో రూపం చూచి ఇది దయ్యం అనే భ్రాంతి కలిగింది. భ్రాంతి ఎందుకు కలిగింది?... అనే ప్రశ్న ముఖ్యమా? ఆ భ్రాంతిని తొలగించుకోవటం ముఖ్యమా?

విద్యాధరుడు : భ్రాంతిని తొలగించుకోవటమే ముఖ్యం.

శ్రీ భుశుండుడు : అదీ సంగతి. అది మాయయే కాబట్టి, భ్రమ కల్పితమే కాబట్టి దీని హేతుభూతము లందు గల విశేషములను సుదీర్ఘంగా వాదోపవాదాలకు ఉపక్రమించటం ఉచితం కాదని విజ్ఞుల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా.

మాయ ఎట్లా వచ్చింది?... అనే చర్చ వృథా కాలయాపనయేనని చెప్పబడుతోంది. మాయ ఎట్లా తొలగుతుంది? అనేదే ఇక్కడ మనకు ముఖ్యం. ఆచరణయోగ్యం. స్వప్నంలో సంఘటనలకు కారణాలు వెతికి లాభమేమిటి? ఆ కారణాలు కూడా స్వప్నతుల్యమే కదా!

మేఘం లోంచి వర్షం పడుతోంది చూచావా? అట్లాగే 'అహంభావం' అను ఒక చమత్కారం నుండి ఈ మాయ వర్షిస్తోంది. అట్టి అహంభావం ఆత్మదర్శన మాత్రంచేత తొలగగలదు. అందుచేత ఆత్మను దర్శించు. తద్వారా అహంకారం దానంతట అదే తొలగగలదు. అంతే!

జగత్తు' అనునది భావనల సమూహమే కదా! భావనాప్రకటలన్నీ భావికుని ప్రకటనా చమత్కారమే! భావికుడు భావనల కంటే ముందే చిదానంద ఘనస్వరూపుడుగా ఉండనే ఉన్నాడు. (భావనలు చేయువాడు ఆ భావనల కంటే ముందే ఉండాలి కదా!) కనుక చిత్చైతన్యమే భావనలు గాను, జగత్తు గాను వెల్లివిరిస్తున్నదని గ్రహించు. ఈ విధంగా ఈ జగత్తు పరమార్థమున బ్రహ్మస్వరూపమై, సర్వవికల్పరహితమై ఉన్నది.

మరొక విధంగా చెప్పాలంటే... జగత్తు భావనల కంటే వేఱు కాదు. భావనలు భావికుని కంటే వేరు కాదు. భావికుడు బ్రహ్మం కంటే వేఱు కాదు. ఇట్లు జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది.

అహంకారవశంగా విస్తృతమగు మానసిక వికల్పములు తోచవచ్చుగాక! ఆ పరబ్రహ్మం నందు ఇంద్రియ జనితమైన వికల్పాలు లేవు, జాగ్రత్ మొదలైన అవస్థలు లేవు. అది వాసనా మయమగు సర్వస్వప్నపదార్థ రహితం అకాశం వలె సర్వదా పరిపూర్ణం. అట్టి చిద్రూపమగు ఆత్మయే నేను, నీవు, తదితరులతో కూడిన మనమంతా కూడా!

13. ఇంద్రత్రసరేణు న్యాయ సారాంశం

విద్యాధరుడు మహాత్మా! "ఇంద్రుడు త్రసరేణువునందు ఇంద్రలోక దర్శనం... అనే ఒక చమత్కారమైన వృత్తాంతం చెప్పారు. ఈ వృత్తాంతంలోని ముఖ్యోద్దేశం మరొక్కసారి సమీక్షించ వలసినదిగా నా విన్నపం.

Page:611

శ్రీ భుశుండుడు : ఓ విద్యాధరా! ఆ ఇంద్రుడు సర్వమును త్యజించి సూక్ష్మ రూపి అయి ఒక త్రసరేణువులో ప్రవేశించి విశ్రమించాడు. అయితే జరిగినదేమిటి? ఆ త్రసరేణువునందు విశ్రమిస్తూ ఉండగానే అతని మనస్సు త్రిలోకములను అక్కడికక్కడే కల్పించింది. అతని దర్శనమంతా మన ఈ భౌతిక ప్రపంచంలాగానే ఘనీభూతంగా అనుభవమయింది.

దీని అర్థమేమిటి?...ఎచ్చట అహంభావం ఉంటుందో అచ్చట త్రసరేణువులోని (త్రసరేణువు = ముప్పది పరమాణువులు కలది) ఇంద్రరాజ్యంలాగా 'జగత్తు' అనబడునది - తగుదునమ్మా అని వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఈ 'జగత్తు' అని అనబడేదానికి అహంకారమే ఆదిమూలంగా చెప్పబడుతోంది. అహంకారి (లేక అభిమానించువాని) రూపమగు అహంకారమే ఈ జగత్తు.

బ్రహ్మం అనే మహాపర్వతం. అద్దానిపై 'భ్రమ' అనే మహారణ్యం. ఆ భ్రమ మహారణ్యంలో 'అహంకారం' అనే బీజం. ఆ అహంకార బీజం 'వాసనలు' అనే జలంచే తడుపబడి మొలకెత్తి ప్రవృద్ధమవటం. అట్టి అహంకార బీజమే ఈ 'త్రిలోకాలు' అనే మహావృక్షంగా పరిణతి పొందటం ...ఇదియే "ఇంద్ర - త్రసరేణు న్యాయం యొక్క ముఖ్యపాఠ్యాంశం. దుష్టవాసనలచే విస్తృతమైన ఈ త్రైలోక్యం 'అహంత్వం' అను జలం యొక్క సంచలనవిలాసమే నని గ్రహించు.

జన్మ-మరణ-పురోగమన-తిరోగమన-ఆవిర్భావ-తిరోభావ పరంపరలతోను, శరీరాదుల ఉత్పత్తి, వినాశనాలతోను, అహంభావ జనిత త్రైలోక్య జగత్తు బహుచమత్కారమై వెలయుచున్నది. అట్టి ఈ జగత్తు అహంత్వవాయువు యొక్క చలనమని, అహంత్వ కమలాల యొక్క సుగంధమని విజ్ఞులు ఎఱిగియే ఉన్నారు.

వాయువు, వాయు చలనాలు వేఱు వేలా?.. కావు. జలం, ద్రవత్వం- భిన్నాలా? ...కానే కాదు. అగ్ని, ఉష్ణత్వము... రెండు వేఱు వేఱు విశేషాలా? కావు. కావు. అట్లాగే... అహంత్వము, జగత్తు - ఈ రెండూ సర్వదా అభిన్నరూపములేనని గ్రహించు.

ఈ జగత్తు అహంకారమునందే ఉన్నది, అహంకారం ఈ జగత్తునందే ఉన్నది... ఈ రెండూ ఒకదాని చేత మరొకటి ఉత్పన్నం కావించబడుచున్నాయి. పరస్పరం ఒకదాని ఆధీనంలో రెండవది స్థితి కలిగి ఉన్నది.

విద్యాధరుడు : అహంభావమును తొలగిస్తే జగత్తు కూడా 'లేనిదే' అగుచున్నది కదా! మరి అహంభావమును తొలగించటమెట్లా?

శ్రీ భుశుండుడు : ఈ జగత్తుకు ఏదైతే బీజమగుచున్నదో అట్టి అహంభావము (లేక, అహంకారము) ‘అనహంభావము’ అను రూపమగు జ్ఞానబలిమిచే మొదలంట్ల తొలగించవేయబడగలదు. కనుక జ్ఞానము అనే జలముచే అహంభావము' అనే మాలిన్యమును పూర్ణముగా కడిగివేయాలి సుమా! అహన్త్వం నామ తత్కించిత్, విద్యాధర! నవిద్యతే | అకారణమవస్తుత్వాచ్ఛ శ్వశ్వశృంగమివ ఉదితమ్ ||

ఓ విద్యాధరా! "కుందేటి కొమ్ములు అనే శబ్దానికి అర్థం ఏమిటి? కుందేలుకు కొమ్ములు

Page:612

అసలు ఉండవు కదా! కుందేటికి కొమ్ములు మొలచినదెప్పుడు? తొలగినదెప్పుడు? కుందేలు పరుగులు తీస్తూ ఉంటే అది చెవులు రిక్కపొడుచుకొని ఉండటం చేత కొమ్ముల వలె కనిపిస్తాయి. అట్లాగే యథార్థానికి ‘అహంభావం' అనునదేదీ లేదు. ఆకాశంలో నీలత్వం కనబడుతోంది. అక్కడ నీలిరంగు గల ఏదైనా పదార్థం ఉదా? లేదు. శూన్యమగు ఆకాశం కంటి భ్రమచే నీలి రంగుగా కనబడటం జరుగుచున్నట్లు, వాస్తవానికి ఉనికియే లేని 'అహంత్వము' ఉన్నట్లే భ్రమింపజేస్తోంది.

ఎట్లా అంటావా?... సర్వస్వరూపమగు పరబ్రహ్మం మనస్సు కంటే, ఇంద్రియాదుల కంటే పరమై ఉన్నది. అది స్వతహాగానే అనంతం. ఆకాశం ఎల్లప్పుడు అఖండమే అయినట్లు పరబ్రహ్మం కూడా ఎల్లప్పుడు అఖండమే. అట్టి పరబ్రహ్మమునందు 'అహంత్వం' అనే ఖండత్వము ఏర్పడటానికి కారణం ఏముంటుంది? ఉండదు. లేనేలేదు. కారణ రాహిత్యంచే 'అహంత్వం' అనేది అసత్తే గాని సత్తు కాదు. అనగా... అద్దానికి స్వయంకృతమైన ఉనికి లేదు.

వస్తువులైతే ఖండత్వం అనేది ఉన్నది. పరబ్రహ్మం అన్నిటినీ ధరిస్తున్న అవస్తువు. అవస్తువు నందు మార్పుగాని, చేర్పుగాని సంభవింపజేయగల కారణం ఉండజాలదు. అద్దానియందు “సృష్టి అనేది జనింపజేయగల కారణమేమున్నది? లేదు. కనుక "గొడ్రాలి యొక్క రెండవ కుమారుడు” అనే మాటవలె అహంభావాదులు (నీవు - నేను మొదలైనవి) ఎక్కడా లేనివే అగుచున్నాయి.

అహంకారం’ అనే బీజమే లేనప్పుడు అద్దాని కార్యము అనతగినట్టి జగత్తు కూడా ‘లేనిదే’ అగుచున్నది కదా! కాబట్టి ఓ విద్యాధరా! "ఈ జగత్తు జీవుడు మొదలైనవన్నీ వాస్తవానికి లేవు” అను సూక్ష్మం - పరమవాస్తవం అగు 'జగల్జీవ-- అభావన'ను అవధరించు. ఆ విధంగా జగత్తు

-- జీవుడు అభావించకబడగా అప్పుడు శేషించునట్టి చిద్రూపమైన 'నిర్వాణం' నందు శాంతంగాను, సుఖస్వరూపంగాను ఉండు. ఈ విధంగా జగత్తు - అహంభావాల అభావనచే, ఆ తదనంతరం కూడా ఏ నీ స్వస్వరూపం శేషించియున్నదో... అద్దాని యొక్క రూపమే ఈ బాహ్య పాదార్థిక జగత్తని, అభ్యంతరమగు మానసికాది జగత్తు కూడానని గ్రహించు. అంతేగాని నీకు అన్యమైనదేదీ లేదు. ఇదియే ‘అనన్య స్థితి' అని చెప్పబడుతోంది. 'నీవు - నేను మొదలైనవిగా కనిపించేదంతా నీయొక్క పరమాత్మతత్త్వమేనని గ్రహించి శాంతం వహించి ఉండు.

యన్నాస్తి, తత్తు నాస్త్యేవ! శేషం శాస్త్రమసి ధ్రువమ్ |

సంప్రబుద్ధో సి మా భూయో, నిర్మూలాం భ్రాంతిమాహర ॥

ఓ విద్యాధరా! ఏదైతే (నేను - నీవు - - అయినవాళ్ళు - కానివాళ్ళు - ఇష్టులు - అయిష్టులు

- నావి-నా జగత్తు మొదలైనవి) ఒకప్పుడు కూడా లేకయే ఉన్నదో... అది ఇప్పుడు కూడా లేదు. అనగా భూతకాలంలో లేనిది వర్తమానకాలంలోనూ లేదు. వర్తమానకాలంలో లేనిది భవిష్యత్తు లోనూ లేదు. ఒకప్పుడు లేక, ఇప్పుడు మాత్రం అనుభవ మగుచున్నదంతా భ్రమ చేతనే అనుభూత మౌతోందని గ్రహించు. ఈ నేను - - జగత్తు"... అనునవి నీకు మధ్యలో వచ్చాయి. స్వతహాగా ఉన్నవి కావు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతున్నాయి. 'నేను' అను భావన కంటే మునుముందే

Page:613

ఆ భావన చేయు నీవు ఉండనే ఉన్నావు. అట్టి 'నేను' అను భావన (అహంభావన) కు ముందే గల ఏ నీ శాంత-బుద్ధ రూపమున్నదో... అదియే బ్రహ్మం. ఓ విద్యాధరా! నీవిప్పుడు ప్రబుద్ధుడవైనావు. అనేక సాధనల ప్రయోజనంగా సర్వభ్రమలను నిర్మూలన మొనర్చుకొనియే ఉన్నావు. ఇంక మరల భ్రమను ధరించవలసిన పని లేదు.

వ్యపగత కలనా కలంక శుద్ధః, శివమ్మ సి, శాస్త్రమసి, ఈశ్వరోసి నిత్యః ఖమపి భవతి పర్వతోపమానం, జగదపి వా పరమాణురూపమేవ॥

ఓ విద్యాధరా! నీవు పరబ్రహ్మమే స్వరూపంగా కలవాడవు. 'బాహ్య-అభ్యంతరాలు' అనే కళంకాలు నీయందు లేవు. పరమశుద్ధుడవు. శివరూపుగవు. శాంతుడవు. ఎల్లప్పుడు ఏర్పడి ఉన్నట్టి నిత్యస్వరూపుడవు. అత్యంత సూక్ష్మమైన ఈ ఆకాశం నీ స్వస్వరూపం ముందు పర్వతమంత స్థూలం. అనేక బ్రహ్మాండాలతో కూడిన ఈ మహత్తర జగత్తు నీ పరబ్రహ్మస్వరూపం ముందు ఒక అణువు ప్రమాణం కలది. సంసారం ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గాని, మరొకప్పుడు గాని నీ స్వస్వరూపం నిర్విషయ - నిష్ప్రపంచ - అఖండ - అప్రమేయ - కాలాతీత - గుణాతీత పరబ్రహ్మమే అయి ఉన్నది.

నాటకంలోని పాత్రచే ఆ పాత్రధారి పరిమితుడా? కాదుకదా! అట్లాగే, నీవు దృశ్యత్వము చేతగాని, ద్రష్టత్వముచేతగాని పరిమితుడవు కావు.

నీవు అపరిమిత, అప్రమేయానంద స్వరూపుడవు. ఇదియే నీ స్వరూపానికి సంబంధించిన పరమ సత్యం. ఓ సహజీవులారా! మీ అందరి స్వరూపం అట్టి పరబ్రహ్మమేనని గ్రహిస్తారు గాక!

14. అంతఃకరణ శుద్ధి

శ్రీ భుశుండుడు : ఓ వసిష్ఠ మునీంద్రా! వింటున్నారు కదా! నేను ఆ విధంగా చెప్పుచుండగానే ఆ విద్యాధరుని దృశ్యవృత్తులన్నీ శమించాయి. అతడు సమాధినిష్ఠుడైనాడు. అప్పుడు నేను నా వాక్రవాహమును ఆపి ఆతనిని సమీపించి మరల మరల అటు - - ఇటు కదల్చి మేల్కొల్పటానికి ప్రయత్నించాను. పరమ నిర్వాణ దశను పొందిన ఆతడు మరల శబ్దది విషయములవైపుగా మరలనే లేదు. ఆతడు అప్పటికి పూర్వమే నిర్మలమైన అంతఃకరణము సంపాదించుకొని ఉండటం వలన కాబోలు, అంతమాత్రపు ఉపదేశంచేతనే, ఆ నిర్వాణమగు పరమపదము, (లేక) బ్రాహ్మీస్థితి సంతరించుకున్నాడు. ఎంతో శ్రవణ మనన - - నిధిధ్యాస మొదలైన అనేక ప్రయత్నములచే కూడా లభించనిది ఆ నా కొద్ది వాక్యములు విన్నంతనే కలిగినదంటే, ఆతని హృదయ నైర్మల్యము అంతటిది! అందుకే జలంలో పడ్డ నూనెబిందువు వలె శుద్దచిత్తమునందు కొద్ది ఉపదేశము కూడా మహాత్తరమై వ్యాపించగలదని ముందే చెప్పాను కదా!



Page:614

శ్రీ వసిష్ఠ మహర్షి కనుక ఓ రామచంద్రా!

నా హమ్ ఇత్యస్తి తేనానర్మైనం భావయ శాంతయే, ఏతావత్ ఉపదేశోక్తిః పరమా నే. తరాస్తి హి ॥

నీవు చిదేకరసస్వరూపుడవు, అట్టి నీ ప్రత్యగాత్మయందు 'అహంకారము' అనునది వాస్తవానికి ఉండజాలదు. ఇక అసత్యమగు అహంకారమును భావించనే వద్దు. ప్రశాంతచిత్తుడవై పరమాత్మ స్వభావమున వెల్లివిరియము. నా ఇంతటి ఉపదేశముయొక్క సారము ఇదే!

నాయందు అహంకారం (అహంభావన)కు చోటే లేదు. అహంభావన (నేను అనే భావన)కు ముందే సర్వదా అంతటా ఏర్పడి ఉన్నట్టి పరమాత్మతత్త్వమేవ అస్మత్ స్వభావమ్ అనేదే సారాంశం.

అవిచారులు / సంసారాసక్తులు - ఋషులమగు మేము ఈ పరమతత్వమును ప్రవచిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉంచిన ముత్యం అటువైపుగా త్రిపిపెట్టి ఉన్న అద్దంలో ప్రతిబింబించదు కదా! అట్లాగే అవిచారపరులు సంసారాసక్తులు అగు మనుజుల మనస్సులలో మా ఈ బోధ ప్రవేశించినప్పటికీ అది ప్రతిఫలించక అప్రభావితంగానూ, నిష్ప్రయోజనంగానూ ఉండిపోతున్నది!

విచారపరులు / సంసార అనాసక్తులు - విచారశీలమై, భవ్యము-శాంతము అయినట్టి మనస్సులో మా ఈ బోధ (ఉపదేశం) ప్రవేశించిందా... ఇక అది వృద్ధియే పొందుతుంది గాని, చ్యుతి పొందదు. అంతేకాదు. ఇటువైపు త్రిప్పి ఉన్న అద్దంలో ప్రతిబింబించే ముత్యం నూతన తేజః పుంజాలను ప్రదర్శించుచున్నట్లుగా సువిచారపరుల (సంసార అనాసక్తుల) హృదయంలో ప్రవేశించిన మా ఈ వాక్యాలు తిరిగి మహారణ్యాన్ని భస్మీభూతం చేయగల మహత్తర ప్రదర్శనంతో బయల్వెడలుతాయి. అందుకే అవతారమూర్తివగు నీ ముందు మేము గ్రహించిన పరమసత్యమును సుదీర్ఘంగా విశదీకరిస్తున్నాం. ఈ మా సందేశసారం అవతారమూర్తివగు నీ ద్వారా తరతరాలా విస్తరించి లోకకళ్యాణ దాయకమగు గాక! మరల భుశుండినితో నాకు కొనసాగిన సంవాదం కొనసాగిస్తాను, విను.



శ్రీ భుశుండుడు : ఈ సంసారం దుఃఖరూపమైనదని ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమే! అయితే ఇది బయల్వెడలేది ఎక్కడి నుండి? అహంభావము నుండే సుమా!

'అహంభావము మమత్వ భావము "ఇదం' భావము

'నేను' అను నాది' అను ‘దృశ్యము’ అను

ఖండభావన ఉపభావము. జగదనుభవం,

‘ఇచ్ఛ’ అనే శాఖలు ... బయల్వెడలుచున్నాయి.

Page:615

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ భుశుండ మహాశయా! జ్ఞానబలం చేతను, అహంకార రాహిత్యముచేతనే మీరు దీర్ఘాయుష్కులై ఉంటున్నారు కదా!

శ్రీ భుశుండుడు : ఓ ప్రియుడగు మునిశ్రేష్ఠా! విషయలంపటులగు మూఢులు కూడా ఒక్కొక్కసారి సుదీర్ఘమైన ఆయుష్షు కలిగి ఉండవచ్చు. "జ్ఞానులకే దీర్ఘాయువు ఉంటుంది. ఇతరులకుండదు”... మొదలైన నియమాలేవీ లేవు. అభ్యాసం ముఖ్యం. నిర్మలమైన హృదయం సంపాదించుకోవటం ముఖ్యం. అంతేగాని సుదీర్ఘమైన ఆయుష్షు ముఖ్యం కాదు.

అంతః శుద్ధమనస్కాయే సుచిరాయాభయప్రదమ్ మనాగపి ఉపదిష్టాస్తే ప్రాప్నువంతి పరం పదమ్ ||

చిరకాలాభ్యాసంచేత ఎవరి అంతఃకరణం శుద్ధమై ఉంటుందో... అట్టివారు స్వల్పమైన ఉపదేశము చేతనే ఆత్మసాక్షాత్కారం పొందుచున్నారు. ఇక దేహధారణ - - దేహవిసర్జన అంటావా, అదంతా వస్త్రధారణ - వస్త్ర విసర్జన వంటిది మాత్రమే కదా!

శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా మేరు పర్వత శిఖరంపై అధివసించే పక్షిరాజగు భుశుండమహాశయుడు నాకు చెప్పి అటుపై ఆ ముక్తాత్ముడు మౌనం వహించాడు.

ఆ తరువాత కొంతసేపైన తరువాత నేను అక్కడినుండి బయలుదేరాను. ఆ విద్యాధరుడు నివసించే ప్రదేశం సందర్శించాను. మహనీయుడైనట్టి ఆ విద్యాధరునితో కూడా సంభాషించి అటు తరువాత నిజాశ్రమమైనట్టి సప్తర్షిమండలం జేరాను.

ఆ విధంగా స్వల్ప సందేశం చేతనే విద్యాధరుడు ముక్తస్వరూపుడై ప్రకాశించాడు. ఈ విషయమై నేను ఆ భుశుండమహాశయునితో సంభాషించి ఇప్పటికి అనగా ఈ కల్ప ప్రారంభానికి ముందే 11 మహాయుగాలు గడచిపోయాయి.

15. బ్రహ్మజ్ఞానాగ్ని జ్వాల

శ్రీరాముడు : మహర్షీ! హృదయాంతరాళాలలో ఎక్కడనో 'ఇచ్ఛ' అనే జాడ్యం జనించి అహంకారాన్ని పరిపోషించి ఈ జీవునకు భ్రమపూర్వకము - దుఃఖమయము అగు 'సంసారము' అనే సంకటమును తెచ్చిపెడుతోంది కదా! అనహంభావనాభ్యాసం చేత ఈ అహంకారము ఎటుపోతోంది? ఆ తరువాత అప్పటి వరకు హృదయంలో రాజ్యమేలినట్టి అహంభావనకు ఏమి కానున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! అనహమ్' భావనాప్రభావంచేత సంసారరూపము, శుభాశుభ ఫలప్రదాతయగు ఇచ్ఛ అంతఃకరణమున ఉపశమించగలదు. అట్టి అనహంభావనాభ్యాసబలంచేత మనుజుడు సువర్ణమును - మట్టిని కూడా సమముగా గాంచగలుగుతాడు. అతని సంసారమంతా ఉపశమించుటచే ఇక దుఃఖము ఆతనిని సమీపించజాలదు.

Page:616

న జానే క్వాశు గచ్ఛతి! - - ఈ జీవుడు కనుక శ్రవణ మననాది అభ్యాసమును ఆశ్రయించితే కాలక్రమంగా ఆతని స్వస్వరూపమునందు బ్రహ్మజ్ఞానము అనే జ్యోతివీచిక ఉద్భవిస్తుంది. అట్టి శక్తిచే ఈ ‘అహంభావము’ అనే శిల దూరంగా విసిరివేయబడగా - అది ఎక్కడికి పోయి పడగలదో ఏం చెప్పను? బ్రహ్మసాక్షాత్కారరూపుడగు వీరునిచే అహంభావనయే కాదు, ఈ "నేను దేహమును - దేహపరిమితుడను... అను దేహాహంకారము తదితర జగద్వికారములతో సహా కూడగట్టుకొని ఈ సంసార వ్యవహారమంతా సుదూరంగా విసిరివేయబడగలదు.

ఓ రామచంద్రా! ఈ జీవుడు తనయొక్క జడదాతీత - దృశ్యాతీత - మనోబుద్ధ్యాతీతమగు స్వస్వరూపము యొక్క ఆత్మతత్త్వమును ఎఱిగినప్పుడే దృశ్యజాడ్యం తొలగుతుంది. తత్త్వజ్ఞానం లేకపోయిందా.... ఈ జీవుడు స్థూలదేహంలో ఉన్నా, స్థూలదేహరహితుడై ఉన్నా, శయ్యపై ఉన్నా, వృక్షముపై దాగినా, పర్వతములపై ఉన్నా, గృహంలో ఉన్నా, ఆకాశమందు ఉన్నా, స్థలమందు ఉన్నా, స్థూలంగా ఉన్నా, సూక్ష్మంగా ఉన్నా, సాకారంగా ఉన్నా, నిరాకారంగా ఉన్నా, రూపాంతరం పొందినా, ఎచ్చటెచ్చట ఉన్నా, నిదురించినా, మేలుకున్నా, అగ్నిలో దూకి భస్మీభూతమైనా, కమలంలో దాగినా, త్రసరేణువులో దాగినా, ఏదైనా ధరించినా, త్యజించినా, ఎందులోనో నిమగ్నమై ఉన్నా, అన్నిటినుండి దూరంగా పోయినా, దేనికైనా దగ్గిరగాజేరినా, ఎట్టి పరిస్థితులలో ఉన్నా కూడా.... అహంకారముయొక్క నూతనాంకురత్వం ఉండియే ఉంటుంది. కాస్త ఇచ్ఛతో కూడి ఆ అహంకారము యొక్క నూతనావతారం విస్తారమైన సంసారమును అక్కడికక్కడే కల్పించుకొని దర్శించగలదు. అహంకారము ఉన్నచోట ఇచ్చ, ఆ రెండిటి మేళవింపుచేత మనస్సు. ఆ మనస్సు యొక్క విస్తారము చేత జగత్ పరంపరలు ఒకదానివెంబడే మరొకటి తక్షణం బయల్వెడలగలవు. కాబట్టి ఇంతటికీ ఔషధం ఆత్మజ్ఞానమే!

ఒక చిన్న బీజములోనుంచి కాలక్రమంగా పెద్ద మహావృక్షం బయలుదేరుతోంది చూచావా? ఇక వృక్షముయొక్క ఘనమైన కాండము, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, పూలు, పళ్ళు. లేచిగుళ్ళు... విస్తారమగుచున్నాయి! అట్లాగే 'అహంకారము' అనే సూక్ష్మబీజంలో అనేక దృశ్యవృత్తులతో కూడి దేహపరంపరలు ఏర్పడటం వివేకులు సూక్ష్మదృష్టిచే గాంచగలుగుచున్నారు.

ఈ దేహాదులు వాస్తవానికి ఏమై ఉన్నాయి? ఈ 'అహంత్వము' అనుదానియొక్క అసలైన స్వరూపమేమిటి? ...ఇట్టివాటి యొక్క విచారణచే నిత్యనిరతిశయానందమగు ఆత్మయొక్క జ్ఞానం పరిఢవిల్లుతోంది. అట్టి జ్ఞానాగ్నిచే ఈ అహంత్వబీజమనే కోశము దగ్ధమైపోతోంది.

దగ్ధమైన బీజం పైకి మామూలుగా ఉన్నప్పటికీ ఇక మొలకెత్తదు కదా! అంతరమున జ్ఞానాగ్నిచే దగ్ధమైన అహంకారము ఇక ఈ సంసారక్షేత్రంలో మరల మొలకెత్తదు. ఈ జీవులు ఇది ఎఱిగి జీవితము అనే పుణ్యకాలమును సద్వినియోగ పరచుకొనెదరు గాక!

Page:617

16. గాలిలో ఎగిరే జగత్ దూదిపుంజాలు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! కాలముచే పుట్టుచున్న ఈ దేహములు కాలము చేతనే మ్రింగివేయబడవచ్చుగాక! అంతమాత్రంచేత ఈ జీవుడు మరణించుట లేదు. జనించుటలేదు. శ్రీరాముడు : అది ఎట్లా మహర్షీ?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. దేహము నశించినంతమాత్రంచేత జీవుడు సర్వనాశనమగుటలేదు. మరణం సర్వనాశాత్మ న కదాచన విద్యతే | స్వసంకల్పాంతర స్థైర్యం మృతిరిత్యభిధీయతే ॥

జీవుని దేహం నాశనమైనంతమాత్రంచేత ఆతని మనోబుద్ధ్యంహకారాలు నశిస్తాయా? లేదు. అవి ఉండనే ఉంటాయి. అవి ఉంటాయి కాబట్టి ఆ జీవునికి నాశనరూపమగు మరణం కలగనట్లే కదా! జీవుడు’ అనగా ఆతని అనుభూతులు - అనుభవాలేగాని ఈ ఈ భౌతికదేహం కాదుకదా! జీవుడు 'మరణించాలి' అంటే ఆతని మనోబుద్ధ్యహంకారాలు నశించాలి. అవి నశించటమనేది జ్ఞానబలంచేతనే సాధ్యం. ఈ దేహం పోవటం నిజమైన మరణం కాదు.

మరి? ఆత్మ జ్ఞానముచే తన యొక్క సమస్త కర్మల-సంకల్పముల అభావం ఏర్పడగలదు. అట్టి అభావమే జీవుని మరణం గాని, దేహం నశించటం మరణం కాదు. అయితే, అట్టి అభావనచే సర్వభావములకు ముందుగానే సర్వదా ఏర్పడి ఉన్న భావాతీత, గుణాతీత, అఖండ, అప్రమేయ చిదాకాశంగా ఈ జీవుడు పరిణమించగలడు. భావముల మధ్యనున్న ఈ సాంసారిక జీవుడు భావములకు ఆది’ అయిన స్వస్వరూపమును సంతరించుకొనుటచే పరమాత్మగానే పరిణమిస్తు న్నాడు. ఆతని పట్ల భావ జగదాదులు క్రీడామాత్రంగా మాత్రమే చోటు కలిగి ఉంటాయి.

గాలిలో ఎగురుచున్న జగత్భాండములు, మృతజన మానసిక జగత్తులు - ఓ రాఘవా! అదిగో అటు ఆకాశంలోకి చూడు! అనేక సంకల్ప పరంపరలు అనే ధూళికణములచే నిర్మించబడిన అసంఖ్యాక జగత్తులు గాలిచే ఎగురవేయబడి ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకుపోబడటం కనిపిస్తోంది కదా! అయాజీవుల సంకల్పములచే కల్పితములైన మేరు - మందరములవంటి లక్షల

కోట్లాది సంకల్పపర్వతములు నాలుగు దిక్కులలోను ఎలా గాలిలో ఎగురుచున్నాయో చూడు! అరటి స్తంభముల పట్టలవలె ఒకదానిపై మరొకటి - ఒకదానియందు ఇంకొకటి ఉండి ఉన్నట్లు... ఆ జగత్సమూహములు పరస్పరం కూడియున్నాయి. కాని విడివిడిగా కూడా ఉన్నాయి. చూడు! అదంతా ఎంత చమత్కారమో!

శ్రీరాముడు : మునీంద్రా! మేరు పర్వతములతో పోల్చతగిన అనేక జగత్ భాండములు గాలిచే ఆకాశంలో కొట్టుకుపోతున్నాయని, నన్నుకూడా చూడమని అంటున్నారు.! ఈ మీ వాక్యము యొక్క అసలైన ఉద్దేశమేమిటో నేను కొంచెం కూడా గ్రహించలేకపోతున్నాను. 'జగత్సమూహాలు అంటేనూ, అవి గాలిచే కొట్టుకుపోవటమంటేనూ మీ ఉద్దేశమేమిటో విశదపరచవలసినదిగా నా విన్నపం.

Page:618

ఎందుకంటే ఆకాశంలోకి చూచినా కూడా మీరు వర్ణించి చెప్పే జగత్భాండములు నాకేమీ కనిపించటం లేదే?

శ్రీవసిష్ఠ మహర్షి :ఆ జగత్భాండములు - అవి గాలిలో కొట్టుకుపోతూ ఉండటం, వాటిని నిన్ను చూడమనటం”.... అను నా వాక్యముల యొక్క ఉద్దేశార్థమేమిటో చెబుతాను విను.

ఓ రామచంద్రా! ప్రతిరోజూ అనేక దేహాలు మరణిస్తున్నాయి. ఆ మరణించినవారి ప్రాణాలు ఆకాశంలోకి ఎగిరిపోవుచున్నాయి. అట్టి ప్రతి ప్రాణి యొక్క ప్రాణాలలో అంతర్గతంగా ఒక చిత్రం - (బీజంలో మహావృక్షం ఉన్నట్లు) ఉన్నది. అట్టి ప్రతి చిత్తంలో వివిధ ఆకారాలతో కూడిన జగత్తు కలదు. అటువంటి జగత్తులు అసంఖ్యాకంగా ఆకాశ వాయువులలో కొట్టుకుపోతున్నాయి.

ద్రవస్వభావం కలిగి ఉన్న నదీజలం ద్రవస్వభావ సమన్వితమైన సారగజలంలో కలుస్తున్నట్లు ఈ జీవుడు మృతి చెందిన తరువాత ఈతని ప్రాణవాయువులు ఆకాశవాయువులలో కలుస్తున్నాయి. ఆకాశవాయువుచే మరికొంత ప్రేరణ పొందిన ఆ ప్రాణవాయువులందు గల సంకల్పరూప జగత్తులు అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. అట్టి సంకల్ప జగత్ సమేతమైన ప్రాణవాయువులు నలుదిక్కులలో నిండి ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. నీవు కూడా గమనిస్తున్నావా? నా ఎదురుగా గాలిలో ఎగురుతూ కనిపించే ఈ జగత్ సమూహాలు నీకూ కనిపిస్తున్నాయి కదా! బుద్ధిని ఉపయోగించి చూస్తే అవి కనిపిస్తాయి సుమా!

ఈ ఆకాశంలో వాయువునందు మృతి చెందిన వారి ప్రాణాలు ఉన్నాయి. ప్రాణాలలో వారి మనస్సు, ఆ మనస్సులో జగత్తు ఉన్నది. ఆకాశమునకు వాయువు, ఆ వాయువునకు ఈ చనిపోయిన వారి ప్రాణములు, ఆ ప్రాణములకు ఆ జీవుల మనస్సులు... ఆ మనస్సులకు వారి ఊహా మాత్ర జగత్తులు ఆధారభూతమై ఎగురుచూ కనిపిస్తున్నాయి.

పూల నుంచి వాసన గాలిలోకి ప్రవహించి పరిభ్రమిస్తూ ఉంటే భౌతిక దృష్టికి కనిపించదు కదా! అట్లాగే ఈ గాలిలో ఎగురుచున్న ప్రాణ-మనో అంతర్గత జగత్తులు భౌతికమైన కళ్ళకు కనిపించవు. అయితే వాటిని సుతీక్షమైన బుద్ధితో గాంచవచ్చు.

శ్రీరాముడు : మహర్షీ! మీరు చెప్పేదంతా చాలా చమత్కారంగా ఉన్నది. అయితే యుక్తియుక్తమే నని కూడా ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పే మృతజనమానసిక జగత్తులతో ఒక్కొక్కదానిలో మరల త్రిలోకములు ఉంటాయికదా! అట్టి ఈ మృతుల జగత్తులు తదనంతరం ఏమి కానున్నవి? అవి ఆకాశంలో ఒకానొక విభాగంగా ఉంటాయా ఏమిటి? లేక, అవన్నీ వాయువిభాగమూ? శ్రీవసిష్ఠ మహర్షి : ఆ జగత్తులు సంకల్పజనితములు కదా! అనగా మనోకల్పితాలే కదా! కనుక అవి ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనవి. పైగా అవి కల్పనామాత్రాలే కనుక ఆ జగత్తులు వాస్తవానికి లేవు కూడా! ఒకని స్వప్నంలో కనిపించిన బంగారుకొండ గురించి విని ఆతని స్నేహితుడు అద్దాని ఆనుపానులకై వెతుకుతాడా? ...వెతకడు కదా!

అయితే, చిదంశమే సర్వత్రా వ్యాపించి ఉన్నది కదా! అందుచేత ఆయా మృత జీవులు తమ తమ భోగ్య వస్తువులైనట్టి స్వర్గ నరక భూమ్యాదులను దృఢభావనతోనే గాంచుచున్నారు. ఆ స్వయం

Page:619

సంకల్పమయ జగత్తులు ఆయా ద్రష్టలకు సుఖము, దుఃఖము మొదలైనవి కలుగజేస్తూనే ఉన్నాయి. నీవు నాకు ఎదురుగా ఎంతటి వాస్తవంగా కనిపించటం జరుగుతోందో ఆ మరణించిన జీవులకు కూడా వారివారి జగత్ కల్పనలు అంతటి వాస్తవంగానూ తోచుచున్నాయి. ఈ విధంగా ప్రాణరూప నదీజలంలో ప్రతిబింబిత నగరముల వలె ఈ జీవుల కల్పనాజగత్తులు ఆవిర్భవించి వాసనా మాత్రముచే ప్రభవిస్తూ ఎటో కొట్టుకుపోతున్నాయి.

కానీ, జగత్తులు లేవు. కొట్టుకుపోవటమూ లేదు. అవన్నీ ఊహాసమూహ సంపుటాలే కదా! ఒకచోట ఒక కుండ ఉన్నదనుకో, దాన్ని అక్కడి నుండి తీసి ఎవరైనా దూరంగా ఏదో ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఉంచారనుకో. ఆ కుండలోని ఆకాశంలో భేదమేమైనా ఉంటుందా?... ఉండదు కదా! అట్లాగే ఈ చిత్తం, అట్టి ఈ చిత్రంలో అంతర్గతమై ఉన్న జగత్తులు పరిభ్రమణం పొందితే పొందవచ్చు గాక! ఆత్మకు మాత్రం ఎట్టి పరిభ్రమణమూ లేదు, ఉండదు. ఆత్మయందు ఎట్టి భేదం గాని, మోదం గాని జనించదని ఎఱుగుటయే ఆత్మజ్ఞానము. శ్రీరాముడు : మృతి చెందినవారి ప్రాణములందు గల జగత్తుల యొక్క వాస్తవమైన రూపమేమిటి? శ్రీవసిష్ఠమహర్షి : చెప్పాను కదా! అదంతా సంకల్పమయమే కనుక కల్పనా మాత్రమే. అదంతా సప్న జగదృశ్యము వంటిదే!

శ్రీరాముడు : అట్టి మృతించినవారు మనోసంకల్పంతో గాంచుచున్న జగత్తుకు, మనం ఈ కళ్ళతో చూస్తున్న పాంచభౌతిక జగత్తుకు సంబంధమేమైనా ఉన్నదా? సారూప్యం - అనుభవం దృష్ట్యా ఒకే తీరువా, వేఱు-వేతైనవా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఒకానొక సామ్యత తప్పకుండా ఉన్నది. మృతించినవారి జగత్తు ఏ విధంగా భ్రాంతిమయమో, కల్పనామాత్రమో... అట్లాగే ఈ జీవించి ఉన్నవాని జగత్తు కూడా భ్రాంతి మయమై, అసత్యముగానే ఉదయించినదగుచున్నది.

యథార్థానికి భ్రాంతి కూడా ఉదయించటం లేదు. నశించటం లేదు. భ్రాంతి కూడా తత్త్వ దృష్టిచే బ్రహ్మమే అయి ఉన్నది. ఒకవేళ వ్యవహార దశయందు ఈ పృథివి ఉదయించినదే కదా...

అని అంటావేమో?

నౌకలో జనులకు నౌక యథారీతిగా (కదలకుండా ఉన్నట్లు, ఒడ్డున ఉన్న చెట్లు కదులుతు న్నట్లు కనిపిస్తాయి చూచావా? అట్లాగే వాయుప్రేరితమైన చలనం పొందుచున్నప్పటికీ ఈ భూమి ఎప్పటియట్లే కదలకుండా ఉన్నట్లు - భ్రమచేతమాత్రమే అనిపిస్తోంది. పృథివియందు ఉన్న ఈ జనులకు పృథివి యొక్క అనుక్షణికచలనం ఏమాత్రం గోచరించటమే లేదు. అలాగే ఈ దేహం కూడా. ఈ దేహం ఎప్పటికప్పుడు మార్పుచెందుతూనే ఉండగా ఈ జీవుడు “నా దేహం ఎప్పట " లాగానే యథాతథంగానే ఉన్నది"... అని ప్రతి ఉదయం లేచి అనుకుంటున్నాడు.

ఒక చిత్రకారుడు అతి విస్తారమైన ప్రదేశమును చిన్నవిస్తీర్ణము కలిగిన కిత్తనార గుడ్డపై చిత్రీకరించున్నాడు కదా! అట్లాగే, ఒక పరమాణువునందు కూడా ఈ మనస్సు విస్తారమైన జగత్తును కల్పన చేసుకుంటోంది. అనుభవిస్తోంది.

Page:620

ఈ జీవులు జీవించి ఉన్నంతకాలం అల్ప లక్ష్యాల పట్ల తమ ధ్యాసను పరిమితం చేసుకొని, అనేక వ్యాకులతలతో కాలం గడిపివేస్తున్నారు. జీవించినంత కాలం మరికొన్ని ప్రాపంచిక భ్రమలను ప్రోగుచేసుకొని వాటిని 'మనస్సు' అనే సంచిలో నింపుకొని ప్రాణములతో వాటిని మోసుకొంటూ దేహాలు త్యజిస్తున్నారు. నీకు నేను వాయువులో చూపిస్తున్న జగత్తులు అవే సుమా! ఒక ఎలుక ఒక రోజు ధనాగారం ప్రవేశించింది. అది రత్నములన్నీ వదిలి అక్కడ గల దోసిలి మాత్రపు అన్నాన్ని మహత్తరంగా భావిస్తుంది కదా! అట్లాగే ఈ జీవులు జ్ఞానమును సముపార్జించ టానికి అర్హమైన మానవుడు’ వంటి ఉత్తమ జన్మలలో ప్రవేశించికూడా మహత్తరమగు ఆత్మజ్ఞాన విశేషాలను, అనుభవాలను వదిలి మరిన్ని ప్రాపంచిక వాసనలను ప్రోగుచేసుకోవటమే జరుగుతోంది. పసిబాలుడు అమూల్యమగు ఆభరణాను ప్రక్కకు పారవేసి మట్టి ముద్దను అధికమైనదిగా భావించు నట్లు ఈ జీవుడు చైతన్యతత్త్వమును వదలి పరమాణు నిర్మిత వస్తు సముదాయాలగు ఈ దేహం, గృహం మొ వాటిని మహత్తరమని ఎంచి ఈ పాంచభౌతిక జగత్తులలో తారట్లాడు చున్నాడు.

ఓ రామా! నీవు "సజీవుని ఇహలోక జగత్తు - మరణించినవాని యొక్క పరలోక జగత్తుల సామ్యం గురించి అడిగావు కదా! ఈ చైతన్యము అజ్ఞానముచే ఆవరించబడి ఉన్నంతకాలం.... ఈ సజీవుడు చూస్తున్న ఈ పదార్థ రూప ఇహలోక జగత్తు, మృతునికి అనుభవమౌతున్న భావనామాత్ర (లేక, ఊహామాత్ర పరలోక) జగత్తు.... ఈ ఉభయము వృద్ధి చెందిన చిత్తముముయొక్క సంకల్ప రూప భావనయేనని గ్రహించు. ఇక్కడి అక్కడి సుఖదుఃఖములు, ధర్మాధర్మ భావనలు.... అంతా కూడా చిత్తము యొక్క విన్యాసమే!

"ఇది త్యజింపతగినది. ఇది గ్రహింపవలసినది" అను రూపంలో ఎవనిలో ఉన్నదో... అదే మమత్వభావనయొక్క రూపం. ఎవని అంతఃకరణంలో అట్టి గ్రాహ్య - త్యాజ్య భావన ఉన్నదో... అదియే అజ్ఞానం యొక్క రూపం సుమా! ఎందుకంటే, సర్వజ్ఞుడైన జ్ఞాని ప్రారబ్ధక్షయ పర్యంతరము వ్యవహార నిమిత్తం కార్యసంరంభమునకు సంబంధించిన వ్యవహారత్వము వహించియే ఉంటాడు.

చైతన్య సహితుడగు ఈ జీవుడు ఈ హస్త-పాదాది ఆయా అవయవాలను తన మనస్సునందే మనస్సుచేతనే అనుభవిస్తున్నాడు. అట్లాగే హిరణ్యగర్భుడు కూడా! సమిష్టి జీవుడు తన మనస్సునందే ఈ త్రిలోకాలను తన అంతఃకరణం యొక్క వ్యాప్తిచే తనే అనుభవించుచున్నాడు. ఓరామా! ఈశ్వరుడు వాస్తవానికి చైతన్యస్వరూపుడై, చిదాకాశరూపుడై, అవ్యయుడై, జన్మాదులు లేనివాడై అనంతరూపుడై ఉన్నాడు. ఇక ఈ జగత్తుల విషయానికి వస్తే, ఇది ఆ ఈశ్వరుడు తన అవయవంగా దర్శించడం జరుగుతోంది. అనగా ఈ జీవుడు ఈశ్వరస్వరూపుడైకూడా తన ఈశ్వరత్వమును ఏమరచి ఈ ఇహ పర దేహాలను అవిశ్రాంతంగా గాంచుచున్నాడు. ఇనుపగుండు అగ్ని యొక్క సహకారంచే కత్తి, సూది వంటి తన భావికాలపు వికారాలను గాంచుచున్నట్లు ఈశ్వరస్వరూప జీవుడు ప్రళయకాలానంతరం తనయందు ఈ ముల్లోకాల భ్రమను గాంచుచున్నాడు. అధిష్ఠానమగు మృత్తిక (మట్టి) తనయందు గల కుండను తన రూపంగా గాంచుచున్నట్లు ఈశ్వరుడు తన యొక్క

Page:621

మాయచే జగత్తును తన అంగంగా గాంచుచున్నాడు. విత్తులో గల అంకురరూప సత్త కాలక్రమంగా వృక్షత్వభావనచే వృక్షమును తన అవయవముగా తలచుచున్నట్లు బ్రహ్మం తనయందు స్వీయ మాయచే ఈ త్రిలోకాల దర్శనం చేస్తోంది.

నిజరూపం దృష్ట్యా జడమాత్రమగు అద్దం తనయందు ప్రతిబింబించే నగరంలో ఆయా కార్యకలాపాలు చూపరులకు చూపుచున్నట్లు బ్రహ్మము నిర్విషయ - నిర్మలతత్త్వమై ఉండి కూడా జీవేశ్వర ఉపాధిసంబంధిత దృష్టిచే తనయందు ఈ త్రిలోకాలను దర్శించి అనుభవించుతోంది. శుద్ధ దృష్టిచే తనయందు తానే సర్వదా ఏర్పడి ఉంటోంది.

దేశ కాల క్రియా ద్రవ్య మాత్రమేవ జగత్రయమ్ |

అహంత్వ జగతోస్తేన భేదో నాస్త్యేతదాత్మనోః

ఇక్కడ కనబడే ముల్లోకాలు దేశ-కాల-క్రియ-ద్రవ్యమాత్రాలే అయి ఉన్నాయి కదా! అట్టి దేశ-కాల-క్రియా-ద్రవ్యాల పట్ల అభిమానం గల అహంకారం వాటితో తాదాత్మ్యం చెంది ఉండటం చేత వాటితో 'తత్సమానవస్వభావం' కలిగి ఉండటం జరుగుతోంది. కాబట్టి అహంకారానికి జగత్తుకు భేదం లేదు.

ఓ రామచంద్రా! శ్రుతులు గాని, నేను గాని 'లోహం - మట్టి' మొదలైనవి దృష్టాంతాలుగా తీసుకుంటున్నప్పుడు కేవలం బోధ సూచకమైన ఒకానొక విశేషాన్ని ఉపమాన సామ్యంగా గ్రహించాలని ఉద్దేశిస్తున్నాం సుమా! అది గమనించవలసినదిగా శ్రోతలకు నా విన్నపం.

ఈ స్థూలంగా కనిపిస్తున్న స్థావర జంగమ జగత్తంతా ఏమై ఉన్నది? తన సూక్ష్మ బ్రహ్మ భావాన్ని ఏమాత్రం త్యజించనట్టి చైతన్యం యొక్క వివర్తమాత్ర (Deduced) శరీరమే అయి ఉన్నది సుమా! నీవు జ్ఞానదృష్టితో దర్శించావా... ఈ వివర్తమంతా తొలగి శుద్ధము - పూర్ణము - సర్వత్రా వ్యాప్తము అయినట్టి నిస్సంగమగు ఆత్మయే కనబడుతోంది. అప్పుడిక జీవ - జగత్ భేదం కొంచెం కూడా కనిపించదు. ఒకడు తన యొక్క అజ్ఞానముచే ఏఏ వివర్తము చూస్తున్నాడో అదంతా ఆతని అజ్ఞానాంశము చేతనే అట్లగుపిస్తోందని గ్రహించు. ఎవరు ఏది ఎట్లు చూడటానికి సంకల్పిస్తే అది అట్లే అనుభూతమవటం చైతన్యముయొక్క విశేషము. అట్టి చైతన్యము యొక్క దర్శనమునే చైతన్యాంశ వివర్తము అని మనం పిలుస్తున్నాం.

ఈ సర్వము చైతన్యమే అయి ఉన్నది. చైతన్యముయొక్క సమక్షము చేతనే మనస్సు, ఆ మనస్సునందు సంకల్పములు ఉంటున్నాయి. చైతన్యము లేనిచోట సంకల్పములు ఉండజాలవు.

చైతన్య ప్రభావము చేతనే చిత్తము ఉంటోంది... చిత్తము యొక్క సంకల్పపరంపరలే జగత్తు యొక్క రూపం... కాబట్టి 'ఈ జగత్తు చైతన్యమే' అని శాస్త్ర నిర్ణయం. చిదాకాశము సర్వవ్యాపకము, అనంతము కదా! అందుచేత చైతన్యమే తన స్వరూపంగా గలిగి ఉన్న ద్రష్ట యొక్క జగద్దర్శనమంతా చిదాకాశమే అయి ఉన్నదనటంలో కించిత్ సందేహం కూడా ఉండనక్కర్లేదు. జ్ఞాని విషయానికి వస్తే... అతని అంతఃకరణమునకు ఏ వికల్ప సముదాయం ఉదయిస్తోందో, అదంతా ఆతని

Page:622

(జ్ఞాన) దృష్టికి ఏమాత్రం ఉదయించనిదే అగుచున్నది. ఎందుకంటే... ఆ కనబడే జగద్విశేషమంతా ఆతడు మిథ్యగానే ఎఱుగుచున్నాడు కాబట్టి!

శ్రీరాముడు : మహాత్మా! ఈ జగత్తంతా బాలునికైనా, వృద్ధునికైనా సత్యం వలే అనిపిస్తోంది కదా? శ్రీవసిష్ఠ మహర్షి : "బాలునికి వృద్ధునికి జగత్తు సత్యము వలె అనిపిస్తోంది కాబట్టి ఇది సత్యమే కదా”... అని కాసేపు మాటవరుసకు అనుకుందాం. మరి ఒకడు తన స్వప్నంలో వస్తు వాహన

- జనాది విశేషాలు చూస్తున్నాడు. ఆ స్వప్నం నుండి వైదొలగే వరకూ ఆ స్వప్నద్రష్ట స్వప్నంలోని -

బంధువులను, వస్తువులను వాస్తవమనియే ఆ కాసేపు తలచుచున్నాడు కదా! కాబట్టి స్వప్నంలో కనిపించిన బంధువులు, వస్తు - గృహ - వాహనాదులు వాస్తవమని అందామా? కాదు. మెళుకువ వచ్చేసరికి అవన్నీ లభించటం లేదు. కనుక అవి అవాస్తవమే కదా! అట్లాగే, ఈ చంచల జాగ్రత్తులో అజ్ఞానికి కనిపించే జగదంతర్గత సంబంధ బాంధవ్యములన్నీ జ్ఞానము పొందిన తరువాత అవి భ్రమయే అని తప్పక గ్రహిస్తున్నాడు. కనుక జగద్దర్శనమంతా భ్రమయేనని గ్రహించు.

శ్రీరాముడు : స్వామీ! స్వప్నమును ఈ జీవునికి కల్పిస్తున్నదెవరు? ఎవరి ఉద్దేశమును అనుసరించి ఒక జీవునికి స్వప్నంలో తదంతర్గత విశేషాలు అగుపిస్తున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు చూచే స్వప్నం మరొకరెవరో బయట నుండి నిర్మిస్తున్నారనునది హాస్యపు మాట. ఆ స్వప్నద్రష్ట యొక్క కూటస్థ చైతన్యమే తన స్వప్న ఫలకమునందు స్వప్న దృశ్యమును సంకల్ప పూర్వకంగా రచించి - - అంతర్గత సంస్కారముల ప్రభావం చేత దర్శిస్తోంది. ఆ కూటస్థ చైతన్యమే జాగ్రత్, స్వప్నములు అనే సంకల్పమునందు, 'సుషుప్తి' అను వాసనయందు భోక్తగా ప్రతిబింబిస్తోంది. అనగా ఈ సంసారం అనేది కూటస్థ చైతన్యం తన 'స్వరూపం' అను కాగితంపై చిత్రించిన చిత్రీకరణమే గాని మరొకటేదీ కాదు. అనగా, చైతన్యం స్వప్న సమయంలో తాను రచించిన దానిని తానే వాస్తవమైనట్లు భావించి అనుభవిస్తోంది. స్వప్న సదృశ జాగ్రత్ - జాగ్రత్ సదృశస్వప్నము” - ఈ ఉభయం సత్యంగా తోచుచున్నప్పటికీ సత్యం కాదు. కూటస్థ చైతన్యం యొక్క ప్రతిబింబంతో పోల్చతగిన ఈ జీవునకు అనుభూతమయ్యేదంతా ఒక నాటకంలోని పాత్ర యొక్క గుణాదుల వలె మొదలే అసత్యం.

కూటస్థ స్వరూపం దృష్ట్యా ఈ జీవుడు నిత్యసత్యం. గుణ - - కర్మాదుల దృష్ట్యా మొదలే అసత్యం.

నిత్యముక్తుడు, సత్యస్వరూపుడు అగు పరమాత్మయే అసత్యరూపమైన ఈ జగత్తును ధరిస్తు న్నాడు. ఇది ఎట్లా అంటావా? జ్ఞానము ద్వారా ఈ జీవుడు ఈ సూక్ష్మ శరీర సహిత అజ్ఞానము”ను సంక్షయింపజేసుకున్నప్పుడు ఈతడు శివస్వరూపుడే అగుచున్నాడని శాస్త్రవాక్యం కదా! [జీవశ్శివో శివోజీవః జీవో బ్రహ్మేతినాపరః | పాశబద్ధః తథాజీవో పాశముక్తః సదాశివః ]

కాబట్టి రామచంద్రా! దూది పుంజములలాగా ఆకాశంలో ప్రాణవాయువులచే జగత్తులు కొట్టుకుపోబడుచున్నాయి... అని చెప్పాను చూచావా? అటువంటి వాక్యాలన్నీ అజ్ఞానుల కొరకే

Page:623

వారి జ్ఞానాభివృద్ధిని ఉద్దేశించి నేను కల్పితపాఠ్యాంశంగా చెప్పాను. వాస్తవానికి అంతా కల్పనా మాత్రమే కనుక జగత్తులు లేవు, అవి కొట్టుకుపోవటం లేదు, అవి విద్యమానమవటమూ లేదు. “నాకు కనబడుచున్నాయి అని చెప్పినవన్నీ ద్రష్టల స్వయంకృత కల్పనావిశేషాలే - అని గ్రహించు.

ఈ విధంగా చిదాకాశం సమస్త పదార్థసమూహాల కోశరూపమై సర్వత్రా వ్యాప్తమై ఉన్నది. ఆ చిదాకాశము అజ్ఞాన కారణం చేతనే అనేక బ్రహ్మాండాలు, వాటిలో కొన్ని ఒకదానితో మరొకటి కలియటం, మరికొన్ని వేఱు వేలై ఉండటం - - ఈ చమత్కారమంతా జరుగుతోంది. పరబ్రహ్మం సర్వశక్తిమంతమైనది. తత్కారణంగా ఈ బ్రహ్మండాలన్నీ అనంతరూపాలై అనేక కార్యారంభాలతో కూడుకొన్నవై ఉంటున్నాయి. అందులోని ఈ బ్రహ్మాండాలు అనేకమంది జీవులతో పూర్ణమై, చంచల మేఘాలలోని నగర ప్రతిబింబాల వలె ఉంటున్నాయి. గంధర్వ నగరాలలాగా మాంత్రికునిచే కల్పించబడి కనిపింపజేసే మాయా వస్తువుల వలె ప్రవర్తిస్తున్నాయి. ఈ జగత్తులలోని దేహములు, పదార్థములు మొదలైనవి పైకి స్థిరంగా ఉంటున్నట్లు భ్రమింపజేస్తున్నప్పటికీ లోన అచంచల శీలమై ఉంటున్నాయి. జల తరంగాల వలె చిద్రూపమహాసముద్ర తరంగాలుగా ఈ బ్రహ్మండాలు ఏర్పడి, కనబడి, ఉండి - - ఇంతలోనే కాలగర్భంలోకి జారుకుంటున్నాయి. ఏది ఏమైనా ఆత్మ సర్వదా నిశ్చలంగానే ఉన్నది.

ఇక జీవునికి 'నిశ్చలత్వము’నకు సంబంధించిన భావన కలగటానికి కారణం స్వరూపతః ఆత్మయే కాబట్టి!

17. సమష్టి రూప విరాట్ పురుషుడు - వ్యష్టి

-

శ్రీరాముడు : మహర్షీ! ఈ జీవునకు రెండు విధాలైన రూపములున్నాయి. కదా!... 1. ఆకృతరూపం (శాస్త్రీయ, వ్యవహారయుక్తమైన రూపం), 2. అవ్యాకృతరూపం (పారమార్థిక రూపం)... ఇప్పుడు నా ప్రశ్నలు విన్న విస్తాను1.జీవునికి వ్యవహారకారణమయ్యే ఈ స్థూలదేహం స్వీకరించటమనేది ఎట్లా సంభవించింది. 2.ఈ భౌతిక - వ్యావహారిక రూపాన్ని అతిక్రమించి పారమార్థిక స్వరూపాన్ని అతడు ఎట్లా సంతరించుకో గలుగుతాడు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! విను, చెపుతాను.

చిదాకాశము సర్వదా అనంతమైనది. అట్టి చిదాకాశబ్రహ్మము స్వ (తన యొక్క) సంకల్ప చమత్కారంచే మనోబుద్ధ్యహంకార రూపమగు సూక్ష్మోపాధియందు ప్రవేశిస్తోంది. అట్లు ప్రవేశించి ఈ నేత్రాలు మొదలైన ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తోంది. అట్టి అనుభవాన్ని అవధరించటం అను చర్యను దృష్టిలో పెట్టుకొని అది 'చేతనం' అని పిలువబడుతోంది. అయ్యది ప్రాణాలను అవధరించటంచేత 'జీవుడు' అను నామం చేత చెప్పబడుతోంది.

Page:624

కాబట్టి... ఈ జీవుని రూపము సూక్ష్మమూ కాదు, స్థూలమూ కాదు, శూన్యమూ కాదు, ఒకానొక వస్తు రూపము కాదు, మరి?... అయ్యది సర్వత్రా వ్యాప్తమై, అంతటా ఉత్తేజతత్వమైనట్టి స్వానుభవమే అయి ఉన్నది. చిన్మాత్రమే 'జీవుడు' అను శబ్దముచే చెప్పబడుతోంది.

జీవుని రూపం అణువువంటి సూక్ష్మపదార్థాల కంటే అత్యంత సూక్ష్మం. స్థూల పదార్థాలన్నిటి కంటే అత్యంత స్థూలం. అది ఇదేదీ కాదు కానీ, ఇదంతా అదే. బ్రహ్మమే ఈ జీవుని వాస్తవరూపం” ...అని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు. ఏ ఏ పదార్థములకు ఏఏ జాతి-గుణాది అసాధారణ విశేషాలు అగుపిస్తున్నాయో... ఆయా రూపంచే జీవచైతన్యమే స్థితి కలిగి ఉందని గ్రహించు. ఎందుకంటా వేమో? ఆ చైతన్యమే చిత్తవృత్తి ద్వారా ఆయా అనుభవమగుచున్న పదార్థంగా భాసించుచున్నది.

స్వస్వరూపం నుండి బయల్వెడలుచున్నట్టి సమష్టి జీవుడు (బ్రహ్మ, సృష్టికర, విరాట్ పురుషుడు) ఎప్పుడు ఎచ్చట ఏ అనుభవాన్ని ఆశ్రయిస్తాడో... అప్పుడు అచ్చట అట్లే శీఘ్రంగా అగుచున్నాడని సూక్ష్మదృష్టితో గ్రహించు. వాయువుకు చలనం స్వభావంగా అగుచున్నది చూచావా? సమష్టి జీవునికి ఈ సృష్టి తన యొక్క స్వభావమే అయి ఉంది. అంతేగాని ఇది - బాలునికి బేతాళుని భ్రాంతి వలె ఎవరో ఏదో చెప్పితే కలిగినది కాదు. జీవునకు ఎవరో చెప్పితే దర్శన ప్రతిభ కలిగినది కాదు. ఇది స్వభావమే అయి ఉన్నది. అయితే ఈ విషయం స్వ విజ్ఞాన మాత్రంచే నిర్ణయించ వలసినదే! ఒకరు బోధిస్తే మరొకరు పొందేది కాదు.

గాలి సంచలనం కలిగి ఉండటంచే దాని స్వర్శ తెలుస్తోంది. సంచలనం లేకపోతే? వాయువు ఉన్నప్పటికీ స్పర్శాస్పర్శలు ఉండవు. అట్లాగే ఈ జగత్తు ఇందలి పదార్థ విశేషాలు ఎదురుగా ఉంటున్నప్పటికీ ఎవరికైతే ఇవన్నీ అర్థరహితాలనీ, నిర్విషయాలనీ తెలియవస్తుందో (అనుభవ మౌతుందో... అనగా, ఈ జగత్పదార్థాలన్నీ పరిగణార్హత కోల్పోతున్నాయో) అప్పుడు ఆతనికి బ్రహ్మభావం విద్యమానమౌతోంది. జగత్ భావన తొలగిపోతోంది.

జీవుడు స్వయంగా చిదనరూపుడే. అందుచేత అతని 'స్పురణ' అగు 'అహం' అను రూపంలో గల అహంకారం ఈ "దేశ కాల క్రియ-ద్రవ్య"... మొదలైన శక్తులను ఆవిర్భవింపజేసి వెలయు చున్నది. అట్టి అహం నుంచి చిత్తం యొక్క కల్పన కావించబడుతోంది. చిత్తం యొక్క రూపమేమిటి? 1. దేశకాలక్రియాదుల రూపమున తన సూక్ష్మసంస్కార చమత్కారంచే కించిత్ ఆవిర్భవించిన చిత్తు యొక్క చమత్కారమే చిత్తము.

2. సూక్ష్మత్వము నుంచి స్థూలమును సంతరించుకోవటమే చిత్తము.

3. అసత్యమైనప్పటికీ ఈ దృశ్యమును సత్యమువలె భాసింపజేయునదే చిత్తము.

4. జగదనుభవమే చిత్తము యొక్క రూపం. అంతకుమించే వేతే ఏ రూపమూ లేదు.

6. చిత్తముయొక్క ఆకారము ఆ చిత్తమునకు అనుభవమయ్యే జగత్తు... రెండూ అవాస్తవాలే! 7. ఈ చిత్తము అతి సూక్ష్మమగుటచేత దాని వికారాలు సూక్ష్మ తరంగాలుగా హృదయంలో ప్రవహిస్తున్నాయి. అవియే జగత్తును నింపి ఉంచుతున్నాయి.

Page:625

ఈ చిత్తం స్వప్నంలో కల్పిత పరంపరల వలే తన అభిలషిత పాంచభౌతిక శరీరాన్ని కల్పిత మాత్రంగా గాంచుచున్నది. స్వప్నంలో ఒకనికి తాను మరణించినట్లు, బంధువులు దుఃఖిస్తున్నట్లు సంఘటనలు ప్రాప్తమగుచున్నట్లే జీవునికి ఈ జాగ్రత్ శరీర పరంపరలు వస్తున్నాయి, పోతున్నాయి.

స్వప్నంలో కనిపించే ఆయా జనులు స్వప్నద్రష్ట యొక్క స్వప్న శరీర విభాగములే కదా! అయినా, స్వప్నద్రష్ట స్వప్నంలో తారసపడిన రూపాలు తనకు వేరైనట్లుగా భ్రమిస్తున్నాడు చూచావా?

ఈ జీవుడు స్వతహాగా బ్రహ్మానందమయుడు, అఖండ నిత్యత్వ సంపన్నుడు అయి ఉండి కూడా "వీరు - వారు-నా వారు-నీ వారు- స్వజనులు-పరజనులు ఇత్యాది విశేషాలతో కూడిన పరిచ్ఛిన్న జగద్రూపాన్ని (తన స్వరూపానికి అన్యమైనట్లు) గాంచుచున్నాడు. ఇట్టి అహం - - చిత్తం ఇంద్రియ జగత్" వరుస క్రమంలోనే సమష్టిజీవుడు చింతిస్తూ సమష్టి స్థూల రూపమగు ఈ విరాడ్రూపాన్ని (పాంచభౌతిక సమష్టి జగత్తును) పొందుచున్నాడు. అంతేకాదు. ఆతడు తన ఆత్మ యందే సమష్టి మనస్సును నీళ్ళలో ప్రతిబింబించే చంద్రబింబంలా గాంచుచున్నాడు. ఇదియే సమష్టి జీవుని హిరణ్యగర్భరూపం. ఆ తరువాత ఈ తన సమష్టి యుక్తమైన హిరణ్యగర్భరూపాన్ని కాకతాళీయ న్యాయంచే తనకు భిన్నమైనదానిగా పంచజ్ఞానేంద్రియాల ద్వారా గాంచుచున్నాడు. ఆ పంచజ్ఞానేంద్రియాల ఛిద్రసహిత స్థానాలైన ఇంద్రియ ద్వారాలను (కర్మేంద్రియాలను) చింతిస్తూ, ఆయా విషయానుభవాలను పొందుచూ విరాట్పురుషుడై శోభిస్తున్నాడు.

ఈ విధంగా అవ్యక్తరూపుడు-నిరామయుడు-అనంతాకార జ్ఞానయుతుడు-పరమేశ్వర స్వరూపుడు” అయినట్టి ఈ జీవుడు అనబడువాడు పంచేంద్రియములు అవయవములుగా గలవాడై విరాజిల్లుచూ, ఆయా విషయములను (శబ, స్పర్శ, రూపాదులను) అనుభవిస్తూ పోతున్నాడు.

అనగా... మనస్సు ప్రప్రథమంగా పరబ్రహ్మం నుండి ఆవిర్భవించి అనేక దేహపరంపరలను అనుభవించటంలో నిమగ్నమై, తన ఉత్పత్తి స్థానమును తానే ఎఱుగక తబ్బిబ్బగుచున్నది.

ఈ జీవుడు వాస్తవానికి పంచభూత పరిమితుడు కాదు. కాని పంచభూత పరిమితునివలె తోచుచున్నాడు. కారణం? కదిలే దానిని చూస్తూ కదిలించేదానిని ఏమఱచుచుండటం చేతనే. ఏది ఏమైనా ఈ జీవుడు తన యొక్క అప్రమేయ - అనంతాది విశేష సంపన్నమైన చైతన్యనమునకే ఆది’ అయిన చిదానంద ఘనముగాక, పరమాత్మగాక మరొకటేదో కానే కాడు. పరమాత్మస్వరూపుడుగా ఈతడు సర్వశక్తి సంపన్నుడేగాని ఏదో చావు పుట్టుకుల మధ్య చిక్కుకున్న పిట్టవంటి వాడు కాదు. ఈతడు తనకు తానే స్వయంగా ఆవిర్భవిస్తున్నాడు, స్వయంగానే సంచాలనం నిర్వర్తిన్నాడు. స్వయంగానే లయం అగుచున్నాడు. ఈతడు స్వసంకల్పవశం చేత కల్పసమూహాలలోను, క్షణకాలములందు ప్రవేశించి మరల భావనను ఉపశమింపజేస్తూ శమించుచున్నాడు. ఈ జీవుడు దేహధారిగా కనిపించినా, సూక్ష్మదృష్టికి ఈతడు కేవల మనోమాత్రధారిగా తెలియవస్తున్నాడు.

మనస్సే శరీరములలో ప్రవేశించి, ఇంతలోనే నిష్క్రమిస్తోంది. ఏ చైతన్యాత్మ సమష్టి రచనా సంవిధానంలో ప్రవేశించి ఈ విరాడ్రూప విశ్వంగా ప్రకటనమగుచున్నాడో... ఆతడే వ్యక్తి జీవుల

Page:626

యొక్క పుర్యష్టకంలో (పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాసనలు, అవ్యక్తం) ప్రతిబింబిస్తున్నాడు.

సూక్ష్మః స్థూలో అంబరాత్మైష వ్యక్తి అవ్యక్తోంతవర్జితః సర్వస్య బహిరన్తశ్చ న కించిత్ కించిదేవ చ॥

అవ్యక్త అనంతాకాశ రూపుడగు ఆ పరమాత్మయే సూక్ష్మ శరీరాలలో... సూక్ష్మంగా, స్థూల శరీరాలలో... స్థూలంగా - సమస్త పదార్థముల బాహ్య అభ్యంతరాలలో వెలయుచున్నాడు. పరమార్థమున ఈతడు సర్వదా అపరిచ్ఛిన్నుడే అయినా కూడా వ్యవహారమునకు వచ్చే సరికి పరిచ్చిన్నుని లాగా ఒప్పుచున్నాడు.

పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, వీటన్నిటినీ ఆక్రమించి ఉన్న భావాభావాలతో కూడిన అహంకారం - ఇవన్నీ కలిసిన రూపమే జీవుడు.

ఈ జీవులలో ప్రకాశిస్తున్న ఆత్మయే చతుర్ముఖుడగు బ్రహ్మదేవునియందు కూడా ఉండినదై శబ్దార్థ కల్పనా సహితమైన నాలుగు వేదాలను గానం చేయుచున్నది. ఆ బ్రహ్మదేవుడే నేటి వరకు వ్యవస్థితమై ఉనట్టి నియతిని (శాస్త్రీయ, అశాస్త్రీయ సంచారాలను, విహిత, అవిహిత కర్మలను, కర్మల ఫలాదులను) స్థాపించినాడు. అతనినే విరాట్పురుషుడు అని కూడా అంటారు.

స్వర్గలోకం ఆ విరాట్ పురుషుని శిరస్సు, పృథివి ఆతని పాదం. మధ్యగా ఉన్న ఆకారం ఆతని ఉదరం. ఈ బ్రహ్మాండమండపం ఆతని శరీరం. అనంతమైన ఇతర లోకాలు ఆతని ప్రక్క అవయవవాలు. జలం ఆతని రక్తం. పర్వతాలు ఆతని మాంస పిండం. నిరంతర ప్రవాహ శీలాలగు నదులు ఆతని నాలుకలు. సముద్రాలు ఆతని రక్త సంచయస్థానాలు. సప్త ద్వీపాలు ఆతని ప్రేగులు. విశాలమగు దిక్కులు ఆతని బాహువులు. నక్షత్రాలు ఆతని రోమసమూహాలు. వాయువులు ఆతని ప్రాణవాయువులు. సూర్యమండలం ఆతని నేత్రం. చంద్రుడు ఆతని మనస్సు. ఆ మనస్సే ఈ శరీర వృక్షములకు బీజం. ఆ చంద్రమండలమే అన్నాదులకు హేతువు. మనస్సే ఈ జీవుడు.

చంద్ర రూపుడగు విరాట్ - - జీవుని వలననే ఈ మూడు లోకములందలి సమస్త జీవులు, వారి మనస్సులు, కర్మలు సుఖములు, మోక్షములు - ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి.

చంద్రరూప విరాట్ పురుషుని సంకల్ప రూపులే బ్రహ్మ - విష్ణు - - మహేశ్వరులు కూడా! అంతేకాదు. సురులు, అసురులు, మానవులు, జంతువులు, పక్షులు - ఇవన్నీ ఆ సమష్టిచిత్తం యొక్క చమత్కారము మాత్రమే!

ఈ విధంగా సృష్టికర్తలోని చిత్తు, జీవునిలోని చిత్తు ఒక్కటేగాని వేఱువేరైనవి కావు. వాస్తవానికి నిర్విషయము, అనంతయుతము అగు చిత్ త్రికాలాభాద్యసత్యము. అందులోంచి 'స్వభావము' అనే చమత్కారం స్వయంకృతంగా అయి బయల్వెడలుతోంది. ఆ చిత్ స్వభావమే సూక్ష్మమగు అమృతకళకు సాక్షిగా దర్శించుటకు ఉపక్రమించి చంద్రునికి "కార్యం, కారణంగా” అగుచున్నది. ఆ చిత్కళ ఎప్పుడు ఏ 'దేవత, ప్రజాపతి' మొదలైన ఆకారాన్ని సంకల్పించుచున్నదో... అప్పుడు

Page:627

అక్కడ అట్లా ఆ దేవత, ప్రజాపతి, మానవుడు, పురుగు మున్నగు రూపాలతో వెలయుచున్నది. అమృతకళతో కూడిన ఈ భౌతిక చంద్రుని ప్రభావం చేతనే భూమిపై ఓషధులు, పదార్థ - శరీర సృష్టి ఏర్పడుచుండుట చేతనే జాగ్రద్దశగా అందరికీ అనుభూతమగుచున్న ఈ చంద్ర (విరాట్) మండలమే సమష్టి జీవుడగు విరాట్ పురుషుని శరీరం అపంచీకృత పంచభూతాలే అతని అవయవాలు"... అని శాస్త్రకారులు (సామవేదం మొ॥) ప్రవచిస్తున్నారు.

చంద్రరూపుడగు ఆ విరాట్ (సమష్టి) జీవుని నుండి చల్లటి కిరణ ప్రసరణ ద్వారా ఓషధుల రూపమున ఆ విరాట్తత్త్వరసతత్వము భూమిపై ప్రసరించి వ్యష్టి జీవులయొక్క ఆహారము-తదితర జీవశక్తులు-జీవనాడులుగా విస్తరించుచున్నది.

అనగా... విరాట్ పురుషుని నుండి బయలుదేరిన జీవ రసస్రవంతి చంద్రుని ద్వారా అమృత కళను సంతరించుకొని, అన్నరసరూపంగా భూమిపై ప్రసరించి ప్రాణధారణ ఒనర్చి, జీవుల దేహా లలో జీవం’ అను రూపంగా ప్రవర్తిల్లుచున్నది. ఆ విరాట్ పురుష చైతన్య స్రవంతియే మనస్సు - జన్మ - కర్మలన్నిటికీ ముఖ్య కారణమై పరుగుచు, సర్వచేష్టలను ఒనర్చుచున్నది. ఇటువంటి విరాట్ పురుష శరీరాలు అసంఖ్యాకంగా ఒక్కొక్క కల్పంలో ఉన్నాయి. అటువంటి అసంఖ్యాక కల్పములు ఎన్నో గతించాయి. మరెన్నో గతించబోతున్నాయి. అయితే... ఇదంతా మాయా చమత్కారమే! ఎందుకంటే నిర్మల - నిర్విషయ - నిశ్చల బ్రహ్మం నుండి బయలుదేరిన ఈ విరాట్ పురుషుడు (సమష్టి జీవుడు) బ్రహ్మానికి వేఱు కాదు. కనుకనే ఆతడు అనంతుడై, అనుభవరూపుడుగా ఉంటున్నాడు. ఈ వ్యష్టి-సమష్టి సంబంధితమైన అధిష్ఠాన సత్తతో కూడుకొనినవాడుగా ఉంటున్నాడు.

సర్వ దేశ కాలాలో ఆ విరాట్రూపుడు బ్రహ్మం యొక్క మాయావిభాగం నందే స్థితి కలిగి ఉంటున్నాడు. అందుచేతనే "అంతయు బ్రహ్మమయమే అని సిద్ధాంతీకరించబడుతోంది.

18. వ్యష్టి - విరాట్టు ఒక్కటే!

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నిర్విషయ ఓంకార ప్రవచిత శుద్ధ - బుద్ధ పరతత్త్వమునుండి విరాట్ పురుషుడు స్వయంసంకల్ప ప్రభావంచే ఆవిర్భవిస్తున్నాడు. ఆ విరాట్ పురుషుడు సత్యసంకల్పుడై (దేనిని ఎట్లు సంకల్పిస్తే అది అట్లే ఏర్పడగల ప్రభావసంపన్నుడై) ఆ తదనంతరం పంచభూతాత్మకుడు అగుచున్నాడు. ఆ విరాట్ పురుషుడు ఏ వస్తువును ఎట్లెట్లు సంకల్పిస్తే అది ఆ విధంగానే స్వయంగా అగుచున్నది.

అనగా, చిదాకాశమగు బ్రహ్మమే ఈ జగత్తులోని ఆయా అనేక విశేషములుగా వివర్తము పొందుచున్నది. అందుచేతనే ఈ జగత్సమూహమంతా విరాట్పురుషుని సంకల్పరూపము మాత్రమే అని విజ్ఞులు నిర్వచిస్తున్నారు. ఎందుకంటే...

1. మొట్టమొదటి బ్రహ్మం తన యొక్క ఉపాసనా సంయుతమైన వాసనచే స్పష్ట్యాదిలో పంచ భూతాత్మకమైన విరాడ్రూపంగా సంతరించుకుంటోంది.

Page:628

2. ఆ తరువాత అట్టి ఉపాసనా ప్రయోజనమైనట్టి పంచమహాభూతాత్మకమైన విషయాల సమష్టి భోగాల పట్ల స్వయం ప్రేరణచే ఉన్ముఖమౌతోంది.

ఈ విధంగా సమస్త జగత్ పదార్థముల సమూహం యొక్క మూలకారణం విరాట్ పురుషుడే అయి ఉన్నాడు. ఇక ఈ జగత్-జీవ రూపాలగు కార్యాలన్నీ కూడా అట్టి మూలకారణమగు విరాట్ పురుషసంకల్పమును ఆశ్రయించి, అనుసరించి ఉన్నాయని విశదీకరించబడుతోంది. ఇందులో సందేహం లేదు కూడా!

ఇక వ్యష్టి జీవుని విషయానికి వద్దాం. ఈతడు కూడా పరమాత్మతత్త్వము అను ముడి పదార్థంతో తయారు చేయబడినవాడే కనుక ప్రతిఒక్క వ్యష్టిజీవుడు కూడా తనయందు తాను సర్వ సృష్టి సమర్థుడయ్యే ఉన్నాడు. ఏ విధంగా అయితే సమష్టి జీవుడు తనయందలి దివ్యచైతన్యశక్తిని ఆసరాగా తీసుకొని ఈ మహాభూతాత్మిక సృష్టిని సంకల్పిస్తున్నాడో... అట్లాగే దివ్య చైతన్యమే స్వరూపంగా గల ఈ వ్యష్టి జీవుడు కూడా, నిజమనోవృత్యానుసారం స్వానుభవజ్ఞానాన్ని ప్రసరింప జేసి ఆయా పదార్థముల జ్ఞానానుభవాలను పొందుచునే ఉన్నాడు. అనగా... ప్రతి వ్యష్టిజీవుడు ఏ ఏ జగద్విశేషాలు అనుభవిస్తున్నాడో అట్టి జగద్విశేషమంతా నిజమనో వృత్యానుసారమైన జ్ఞాన విశేషమే గాని మరొకరెవరో అద్దానికి కారణం కాదు. ఈ జీవుని జగత్ మనో వ్యాపారమంతా తన స్వరూపము నుండి స్వయంకల్పితంగా ప్రవహిస్తున్న జగత్లహరి మాత్రమే !

ఒక క్రిమి నుండి రుద్రుని వరకు జగదనుభవమంతా ఈ ప్రకారంగానే స్వస్వరూపమునుండి జగదాకారభ్రమరూపంగా ఉదయించటం జరుగుతోందని గ్రహించు. ఇదియే సృష్టి.

ఒక బీజంలో మహావృక్షం సంస్కారరూపంలో దాగి ఉండే విధంగా, ఒక అణువులో కూడా సముద్ర-పర్వతాది వస్తు పరంపరలచే విస్తారమైన అనేక జగత్తులు ఉంటున్నాయి. ప్రవర్తిస్తున్నాయి

కూడా!

అయితే “ఒక పరమాణువునందు కూడా అనంతాత్మ కలదు" - అనే విషయం జ్ఞానం చేతనే తెలియవస్తోంది గాని, అజ్ఞానం చేత కాదు. ఒక కీటకం - దోమ మొదలుగా రుద్రుని వరకు గల ప్రత్యగాత్మ యందు (ప్రతి ప్రత్యేక ఆత్మయందు) విరాట్ సృష్టి ఉండియే ఉన్నది.

ఈ విధంగా వ్యష్టి - సమష్టి ఉభయం ఒక్కటే అనే ఒక మహాత్తరమైన సిద్ధాంతం మనకు ఇక్కడ సిద్ధిస్తోందని గమనించు. విరాడాత్మ యందు ఏ విధంగా ఈ సమస్తమైన జగత్తు యొక్క విస్తారము సిద్ధిస్తోందో, అట్లాగే అణుమాత్రమైన ఒక దోమ జీవునియందు కూడా విరాడాత్మ సంబంధమైన విస్తార జగత్తు సంభవించియే ఉంటోంది.

ప్రతిజీవుని విషయంలో ఈ సిద్ధాంతం వర్తిస్తున్నదని గ్రహించబడు గాక! ఇక ఆత్మ ఎటువంటిది?... అది పరమార్థమున స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పరిచ్ఛిన్నమూ కాదు. అయితే అది తన యొక్క భ్రాంతి విభాగంచే ఎచ్చట ఎట్లు విస్తరించుచున్నదో, అచ్చట అట్లే శీఘ్రంగా అనుభవించబడుచున్నది. ఆత్మచేతనే ఆత్మ అనుభవించబడుతోంది సుమా!

Page:629

లేక... చంద్రుని నుండి మనస్సు, మనస్సు నుండి చంద్రుడు... ఉత్పన్నమగుచున్నాయి చూచావా? (చంద్రమా మనసోజాతో); అట్లాగే ఆత్మయందు జీవుని నుండి ఆత్మయే అగు దృశ్యము కల్పితచమత్కారంచే ఉత్పన్నమౌతోంది. జలం, ద్రవత్వం... ఈ రెండూ వేరు వేరా? శ్రీరాముడు కావు.

శ్రీవసిష్ఠ మహర్షి : అట్లాగే సమష్టి - వ్యష్టి అనబడే రెండూ కూడా ఒకే 'సత్త' కలిగి ఉన్నాయి. శ్రీరాముడు : "ఈ జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం. కనుక పరమాత్మయే జీవసంవిత్తు యొక్క కారణం. పరమాత్మ యొక్క కార్యం ఈ జీవుడు"... అను ఒకానొక కార్యకారణ సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుచున్నది కదా! అట్టి "పరమాత్మ కార్య - జీవ కారణ సిద్ధాంతము గురించి మీ అభిప్రాయం వినాలని ఉన్నది.

శ్రీవసిష్ఠ మహర్షి

శుక్రసారం విదుర్జీవం ప్రాలేయ కణ సంనిభమ్ ఆనన్డో అచలసందోహస్తత ఏవ ప్రవర్తతే॥ తం చేతతి తదాభాసం పూర్ణమాత్మస్థమాత్మనా తత్ర తన్మయతాం ధత్తే తేన తన్మయరూపిణీ||

మంచుకణమును పోలినదగు వీర్యమే జీవునియొక్క సారం... అని అంటూ ఉంటారు. మాతాపితరుల సమాగమ కాలమున చిత్తైకాగ్రతచే 'భోగాకారవృత్తి యందు నిశ్చలమగు బ్రహ్మం యొక్క ప్రతిబింబం పడుచున్నది. అట్టి వీర్యమునుండి ఉపహితుడైన జీవుని నుండి అభాసరూపమగు ఆనందాతిశయం ప్రవర్తిస్తోంది. అప్పుడు ఆ వీర్యోపహితమైన జీవచైతన్యం తనయందున్న వీర్య స్వభావంచే బ్రహ్మం యొక్క అభాసరూపమైన ఆనందాన్ని అనుభవిస్తోంది. ఇక ఆపై “ఈ నా అనుభవమైన వీర్య రూపమే ఆనందం, నేను ఇద్దాని చేత ప్రియతముడనగుచున్నాను అని అనుకుంటూ, క్రమంగా వీర్యోపహితమైన స్థితిచే తాదాత్మ్యం పొందుచూ తన్మయమై వర్తిస్తోంది.

...ఇంకా ఆ తరువాత ఆ జీవ సంవిత్తు (లేక) గర్భస్థమైన వీర్యోపహిత చైతన్యం తదందర్గతమైన దేహరూపాన్ని తదాత్మ్యం' అనే చమత్కారంచే పొందుతోంది.

కాబట్టి... అట్టి ‘దేహోత్పత్తి' అనే చమత్కారమునందు విరాట్టు-వ్యష్టి, కారణము-కార్యము అనునవి ఏమీ లేవు.

శ్రీరాముడు : ఈ సమష్టి - వ్యష్టి దేహసృష్టికంతటికి "పరబ్రహ్మం యొక్క స్వభావమే కారణం. తదితరమైనది కార్యం... అని నిర్ణయించటం యుక్తియుక్తమేనా? కాదా?

శ్రీవసిష్ఠ మహర్షి : అట్లా యుక్తి యుక్తం కాదు. ఎందుకంటావేమో? శుద్ధ బ్రహ్మం నందు 'స్వ’ శబ్దం వాచకం కానేరదు. అనగా శుద్ధబ్రహ్మానికి స్వ-పర శబ్దమునకు సంబంధించిన వాచకాలను ఆపాదించలేం, ప్రతిపాదించలేం. 'స్వ - పర' అను విభేదం బ్రహ్మమునకు అనువర్తించలేనప్పుడు

Page:630

ఇక వ్యష్టి సమష్టి’ అను వ్యవహారం ఎట్లా ఒనగూడుతాయి? కనుక ఆ స్వ - పర మొదలైనవన్నిటికీ బ్రహ్మం కారణమని గాని, కార్యమని గాని ప్రతిపాదించటం భ్రమాత్మకమైన దర్శనపటాటోపం మాత్రమే. బ్రహ్మమునందు 1. ప్రతియోగి, 2. వ్యవఛేదము, 3. విరోధి - అనే విశేషములే లేవు. అట్లాగే బ్రహ్మమునందు స్వభావం' అనబడే బాహ్య-ఆంతరిక ఆవరణమేదీ లేదు. ఉంటే 'ఏకోసత్’ అను ప్రమాణవాక్యం సిద్ధించదు కదా!

శ్రీరాముడు : మహర్షీ! "ఈ జీవుడు అనగా 'స్వ', 'స్వభావం' అను రెండింటి సంయోగం... అనే ఒకానొక సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం చెప్పమని నా ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి : ఇప్పుడు నేను మరొక ప్రశ్నను ప్రతిపాదిస్తున్నాను.

జీవుడు అనగా... 'స్వ' అనబడు వాడా? లేక, దేహ, గుణములా? (అంటే స్వభావమా? లేక

రెండూ కలసియా?

స్వ’యే ఉపహితుడగు జీవుడని మనం అనుకుంటే, ఇక స్వభావం అనేది ఆతనిలో ఒక విభాగమనటానికి కుదరదు. ఆతనికి స్వభావం బాహ్యమైనదీ కాదు. వాయువు యొక్క బాహ్య అభ్యంతరాలలో వాయువే ఉన్నట్లు, జీవుని బాహ్య - అభ్యంతరాలలో స్వస్వరూపుడైన జీవుడే ఏర్పడి ఉన్నాడు. కనుక జీవత్వం - జీవుడు అనునది స్వతహాగా ఒక్కటే గాని వేరు వేరైనవి కాదు.

అట్టి ఈ జీవుడు ప్రాణం, ఇంద్రియాలు మొదలైన జడవస్తువులతో, ఇవియే నేను. వీటిచే నేను పరిమితుడను... అను రూపంతో తాదాత్మ్యం చెందుచున్నాడు. తద్వారా సంకుచితుడై, దృశ్యవిషయ-వస్తు పరాయణుడై జన్మాంధుని వలె ఉంటున్నాడు. అవిద్యాంశ పట్ల ధ్యాసచే ఆ అవిద్యా దశలో తన నిజమార్గమును (స్వస్వరూపమగు బ్రహ్మమును) గాంచటమే లేదు. తన నిశ్చల విభాగాన్ని ఏమరచి, చంచల విభాగాన్ని మాత్రమే నిరంతరం దర్శిస్తున్నాడు. 'చలనశక్తి'చే వాయువు కప్పబడినట్లు ఈ జీవుడు (నిశ్చల స్వరూపుడై ఉండి కూడా) జగదాకారంగా విజృంభిస్తున్న మాయాశక్తిచే కప్పబడి ఉంటున్నాడు. తన యొక్క ఏకత్వ రూపమునందు "ద్రష్ట - దృశ్యం అను విభేదం గల ద్వైతరూపం కల్పన చేసుకుంటున్నాడు. అట్టి చంచలత్వమును అధిరోహించి తన శుద్ధ, సుస్థిరరూపమును గమనించలేకపోతున్నాడు.

ఏదైతే మిథ్యారూపమై, దృశ్యాత్మకమై, వాస్తవానికి అసత్తె ఉన్నదో... అదే అజ్ఞానం! జ్ఞానంచే అట్టి అజ్ఞాన మహాగ్రంధి భేదనమే మోక్షం. "ద్రష్టత్వమంతటి కంటే మున్ముందుగా ఉన్న నా స్వరూపం సర్వదా యథాతథంగా ఉంది"... అనే అనుభవమే 'మోక్షం' అను పరిభాషగా చెప్పబడుతోంది.

అందుచేత, ఓ రామచంద్రా! నీవు అజ్ఞానమేఘం తొలగినప్పటి చిత్ప్రకాశమాత్రుడవై ఉండు. అసలీ అహంకారమనబడేది లేనే లేదని గ్రహించు. మూర్త - అమూర్త వివర్జితమై, అజ్ఞానశూన్యమై, నిత్యోదితమైనట్టి చైతన్యఘనమును పొందినవాడవై, పరిపూర్ణుడవై, ఆనందపూర్వకంగా ప్రకాశిస్తావు

గాక!

Page:631

19. జ్ఞాని - జ్ఞానబంధువు

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనుజుడు జ్ఞానబంధువైతే సరిపోదు. జ్ఞానియే కావాలి. ఎందుకంటే, ఒక్కోసారి జ్ఞానబంధువు కంటే అజ్ఞానియే మెఱుగేమో నని కూడా అనిపించవచ్చు. శ్రీ రాముడు :

కిముచ్యతే జ్ఞానబంధుః? జ్ఞానీచైవ కి ముచ్యతే?

కిం ఫలం జ్ఞానబంధుత్వే? జ్ఞానిత్వే పి చ కిం ఫలం?

మునీంద్రా! జ్ఞానబంధువు అంటే ఎవరు? జ్ఞాని అనగా ఎవరు? ఉభయముల ప్రయోజనాలు ఎట్లా ఉంటాయి?

శ్రీవసిష్ఠ మహర్షి :

వ్యాచష్టే యః పఠతి చ శాస్త్రం భోగాయ శిల్పివత్ | యతతే నతు అనుష్ఠానే “జ్ఞానబంధుః” స ఉచ్యతే॥

శిల్పి శిల్పమును చెక్కుతాడు. ఉత్తమ భక్తుడు (లేక) ఉపాసకుడు ఆ శిల్పంలో ఇష్టదైవం యొక్క స్ఫూర్తిని దర్శించి తరించగలుగుతాడు. శిల్పి "ముక్కు-నోరు బాగున్నాయా? లేదా?"... అని మాత్రమే గమనించగలడు. అట్లాగే ఎవరైతే శాస్త్రమును భోగం కొరకో (లేక) చిలకపలుకులు పలుకుట కొరకు మాత్రమే పఠిస్తాడో... అంతేగాని మనస్సుతో అనుష్ఠించ ప్రయత్నించడో అట్టివాడు 'జ్ఞాన బంధువు' అని పిలువబడతాడు.

అనగా, ఎవనికి శాస్త్రాభ్యాసం చేత లభించినట్టి శబ్దబోధ ఆతని దైనందిన జీవితావగాహనగా వ్యవహారాలలో ప్రస్ఫుటం కాదో, వైరాగ్యం హృదయస్థం కాదో, ఎవడు తత్త్వబోధను కథలుగా మాత్రమే వల్లిస్తాడో... ఆతడు జ్ఞానబంధువు మాత్రమే! ఎవడు శాస్త్రపఠనాన్ని కేవలం భుక్తి కొరకై వల్లిస్తాడో ఆతడూ జ్ఞానబంధువు. 'అగ్నిహోత్రం మొదలైన ప్రవృత్తి రూపధర్మాలలో నిష్కాముడై ప్రవర్తించక, కేవలం డాంబికంగా నిర్వర్తిస్తూ ఆయా ప్రవృత్తి ధర్మాలను ఆత్మజ్ఞానం వైపుగాను, మనస్సు యొక్క పవిత్రత కొఱకై మలచుకోకపోతే ఆతడు జ్ఞానబంధువౌతాడే గాని, జ్ఞాని కాదు.

జ్ఞానం, జ్ఞానాభాస - ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే 'జ్ఞానం' అని అంటారు. ఇక తక్కిన వివరణవిశ్లేషణ-పదార్థ సంబంధ జ్ఞానమంటావా? అవన్నీ కూడా 'జగత్తు-జీవుడు' ఈ రెండిటికీ అధిష్టాన మైనట్టి బ్రహ్మం గురించి బోధించజాలవు. అందుచేత అవన్నీ జ్ఞానాభాసలు మాత్రమే!

ఆత్మజ్ఞానం’ గురించి యత్నించకుండా తదితర సాధనా విశేషాలను ఆశ్రయించి స్వర్గాది ఫలప్రాప్తికై ప్రయత్నించేవారిని 'అల్పశుభ జ్ఞానబంధువులు'... అని పిలుస్తూ ఉంటారు.

1. బాహ్య -అభ్యంతర దృశ్య రూపజ్ఞానం, 2. వాటి వృత్తులకు కారణమైన ప్రమాత, 3.ప్రమాతకు తెలియవచ్చే శబ్ద స్పర్శ రూప రస గంధాలు, 4. వాటి అనుభవవిశేష పరంపరలు.

Page:632

·భాషాపూర్వకంగా ఇవన్నీ కూడా జ్ఞానమే. అయితే ఇవి అసలైన జ్ఞానం కాదు సుమా! ముముక్షువు అయినవాడు నిరతిశయానంద స్వరూపమగు బ్రహ్మముతోటి ఏకత్వం సంపాదించు కునే వరకు ఆగకూడదు. తృప్తి పొందరాదు. ఓ ప్రియ సభికులారా! మీరంతా జ్ఞానబంధువులై రోగరూపాలగు ఈ సంసార భోగాలందు రమిస్తూ కాలమును, అవకాశములను అల్ప వినియోగం చేయకుండెదరు గాక!

అత్రాహారార్థం కర్మకుర్యాత్ అనింద్యమ్, కుర్యాత్ ఆహారం ప్రాణసంధారణార్థమ్ | ప్రాణాః సంధార్యాత్ తత్త్వజిజ్ఞాసనార్థం, తత్త్వం జిజ్ఞాస్యం యేన భూయో నదుఃఖమ్ || ఈ 'మానవజన్మ' అనే అవకాశం వచ్చినందుకు ముముక్షువు చేయవలసినదేమిటి? 1. సహజీవులను బాధించనట్టి, సానుకూలమైన అనింద్యమైన కర్మలు మాత్రమే నిర్వర్తించాలి. 2. అట్టి కర్మలు కూడా ఆహారం సంపాదించుకోవటానికి మాత్రమే పరిమితం చేయబడాలి.

3. మరి ఆహారం ఎందుకు? జిహ్వాచాపల్యము కొరకై కాకూడదు. కేవలం ఈ ప్రాణాలు నిలబెట్టు కోవాలి కాబట్టి అంతవరకే ఆహార సముపార్జన ఉద్దేశించబడాలి.

4. ఆపై ప్రాణాలు నిలబెట్టుకోవటం అనేది తత్త్వజిజ్ఞాస కొఱకే అయి ఉండాలి.

5. ఇక తత్త్వజ్ఞానం మరల దుఃఖరహిత స్థితి సంపాదించుకోవటానికి సద్వినియోగపడాలి. ...ఇట్లు జీవుడు జనన మరణ చక్రం నుండి తరించటానికే సర్వదా ప్రయత్నించటం ఉచితం.

20. జ్ఞానియొక్క నిర్వచనం

శ్రీరామచంద్రుడు : స్వామీ! 'జ్ఞానబంధువు' గురించి, 'జ్ఞానాభాస' గురించి విశదపరిచారు. సాధకులగు, మేమంతా కృతజ్ఞులం. అట్లాగే జ్ఞాని - జ్ఞాన దర్శనం గురించి మరికొన్ని విశేషాలు విశదపరచవలసినదిగా నా ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క నిర్వచనం విను.

ఆతడు తనయొక్క జ్ఞానప్రవృద్ధముచే జ్ఞేయమగు ఆత్మ గురించి నిష్ఠ పెంపొందించుకుంటూ ఉంటాడు. అట్టి చిన్మాత్ర బ్రహ్మమునందు నిష్ఠచే క్రమంగా శబ్దస్పర్శాది విషయసమూహమును, కర్మ ఫలాలను, ఇవన్నీ బయటగా లేవు. నా చిత్తముయొక్క లక్షణవిశేషమే ఇదంతా”... అని గ్రహిస్తూ అవన్నీ అసత్యాలుగా గమనిస్తూ ఉంటాడు. ఈ కళ్ళు మొదలైన ఇంద్రియాలకు తారసపడే దృశ్యాదులను ప్రక్కకుపెట్టి, అట్టి కళ్ళలోను, తదితర ఇంద్రియములలోను, అంతఃకరణంలోను ఏ సాక్షితత్త్వమైతే ప్రత్యక్షమై ఉంటోందో... అట్టి చితత్త్వమును గుర్తిస్తాడు. అట్టి సాక్షిగా ఉన్నట్టి చిన్మాత్రమగు పరమాత్మను బాగుగా ఎఱిగినవాడై ఈ దృశ్యమును అంతఃకరణం యొక్క వాసనా మాత్రంగా కూడా శేషించియే లేనట్లు గాంచుచూ ఉంటాడు.

ఇప్పుడు 'జ్ఞాని’ యొక్క నిర్వచనం వినుPage:633

అన్తః శీతలతేహాసు ప్రాజెర్యస్యావలోక్యతే | |

అకృత్రిమైక శాన్తస్య స జ్ఞానీత్యభిధియతే

ప్రతి జీవుడు 'ఆత్మ' అను ఏకైక లాభమును సర్వదా అవధరించియే ఉన్నాడు. ఎవనియందైతే అట్టి ఆత్మైక్య లాభముచే సంతుష్టి, శాంతము, వ్యవహారములందు అంతఃకరణ శీతలత్వము మనకు కనిపిస్తాయో, అట్టివాడు, 'జ్ఞాని' అని మనం గుర్తించవచ్చు. ఏ సమాచార ప్రసాదితమైన అవగాహన చేత అజ్ఞాన మూలము తొలగుచుండగా పునర్జన్మత్వము (నాకు జన్మ-మృత్యువులు ఉన్నాయి అనే భ్రమ) సమూలంగా కడిగివేయబడుతుందో అట్టి బోధయే జ్ఞానము. ఇక తక్కిన శబ్దజ్ఞాన చాతుర్యము శిల్పియొక్క శిల్పకళలాగా వస్త్రభోజనాదులు కొరకే గాని అనుభవము కొరకై కాదు.

పండితుడు :

ప్రవాహపతితే కార్యే కామసంకల్పవర్జితః |

తిష్టత్యాకాశహృదయో యః స పండిత ఉచ్యతే |

ఎవడైతే యథాప్రాప్తములైనట్టి ఆయా కార్యాలలో కామసంకల్పవర్జితుడై నిర్మలాకాశమువలె హృదయము కలిగి ఉన్న వాడై ప్రవర్తిస్తూ ఉంటాడో... అట్టి వానిని 'పండితుడు’ అని పిలుస్తారు.

ఓ రామచంద్రా! ఈ జగత్తు, అహంకారం మొదలైనవి లేవు. కాని ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఎందుచేత? దానికి కారణం లేదు. అభిలాష, అభిరుచులకు కారణం లేనట్లే, జగత్, అహంకారాలకు కూడా కారణం లేదు. అకారణంగా అనిపించేవన్నీ అకారణాలే. కారణం లేకయే ఉత్పన్నమైనాయి. కాబట్టి అవి వాస్తవానికి ఉత్పన్నము కానివే అగుచున్నాయి.

శ్రీరాముడు : “ఉత్పత్తియే కాలేదు. కానీ ఉన్నట్లుగా అనిపిస్తోంది" అను పరస్పర వ్యతిరిక్త వాక్యం ఎట్లా యుక్తియుక్తం స్వామీ?

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో వాస్తవానికి లేకపోయినా కూడా ఉన్నట్లు అనిపించే అనేక దృష్టాంతాలు ఉన్నాయి.

1. కుందేటి కొమ్ము పరిగెత్తే కుందేలుకి (చెవులు రిక్కి ఉండటం చేత) కొమ్ములు ఉన్నట్లు -

కనిపిస్తుండటం.

2. మృగతృష్ణాజలం - మృగాలు దాహంచే అటూ ఇటూ వెతుకుచుండగా, ఎండ యొక్క వాయుతరంగ సంబంధమైన క్రీనీడలు సరోవర జలంలాగా అనిపించటంచే ఆ మృగాలు జలంగా భ్రమించి పరుగులు తీయటం.

కుందేటికి కొమ్ము ఎందుకు కనిపించింది? భ్రమచేతనే కదా! మృగతృష్ణలో జలం ఎందుకు కనిపించింది? భ్రమ చేతనే! భ్రమ చేత అనిపించేవన్నీ అవాస్తవాలే కాబట్టి అవి అకారణాలే గాని, సకారణాలు కావు. లేదా, అవిచారణతో ఉన్న అజ్ఞానావేశమే అందుకు కారణమని అనక తప్పదు.

అట్టివే ఈ సోదర-మిత్ర-శత్రు తదితర సర్వ సంబంధములు కూడా! అంతేకాదు. ఈ సర్వ జగత్తు అట్టి జగత్తులో జన్మాదిగా సంచరించే ఈ దేహము కూడా భ్రమయే కాబట్టి అవాస్తవము,

Page:634

అకారణం కూడా! "కుందేటికి కొమ్ము ఎందుకు కనిపించింది?... అనే ప్రశ్నకు అసత్తైన ఈ దేహ-పుత్ర-తదితర దృశ్యవ్యవహారం సత్తు వలె ఎందుకున్నాయి అనే ప్రశ్నకు సమాధానం ఎంత వెతికి ఏం ప్రయోజనం?... సత్తు సత్తుగా, అసత్తు అసత్తుగా గ్రహించటమే ఇక్కడ సముపార్జించు కోవాలి. అట్లా కాకుండా "ఈ దృశ్య సంబంధం ఎప్పటి నుండి ఎందుకు ఎట్లా ప్రాప్తించింది?... అనే విషయంగా కార్య - - కారణాలు వెతుకుతూ పోవటం గొడ్రాలి యొక్క కుమారుని, మనుమని భుజాలపై కూర్చుని ఊరంతా చుట్టి రావడం ఎట్లా? అనే వాక్యంలాగా నిరర్థకం.

ఆజ్ఞానమే అసదనుభవమునకు కారణం! అసత్తైనవి, అసద్రూపమైనవి అగు విశేషములగు పదార్థములకు కారణం అజ్ఞానమే అయి ఉన్నది. అజ్ఞానమునకు రూపమేమిటి? జ్ఞానం యొక్క అప్రకాశమే, (లేక) ఏమరుపే!

అజ్ఞానము యొక్క ఆశ్రయముచే జ్ఞానము ఆవరించబడి ఉంటోంది. జ్ఞానము యొక్క అప్రకాశమే అజ్ఞానం. జ్ఞానము యొక్క ప్రకాశముచే అజ్ఞానము తొలగుతోంది.

జీవుడు పరమాత్మ

నాటకంలో కనిపిస్తున్న పాత్ర పాత్రధారి ఒక్కరే కదా!... అదేవిధంగా వాస్తవానికి ఈ జీవాత్మయే పరమాత్మ. అట్లాగే ఆ పరమాత్మయే ఈ జీవాత్మ.

అయితే, ఈ జీవుడు (జీవాత్మ) నేనే పరమాత్మను"... అనే పరమసత్యమును సంతరించు కోవటం, (లేక) అనుభవైక వేద్యం చేసుకోవటం ఎట్లా?... అనే ప్రశ్నకు సమాధానమే ఈ మన

సంవాదసారము.

21. జీవాత్మయే పరమాత్మ!

శ్రీరాముడు : మహర్షీ! "నేను జీవాత్మను అను భావమునందు, అటు తరువాత భ్రమపూర్వక - కల్పిత అనుభవపరంపరలందు తననుతానే ఏర్పరచుకొనియున్న ఈ జీవుడు తనయొక్క సత్స్వరూపమగు పరమాత్మత్త్వము సంతరించుకొనేది ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి :

పరమాత్మాయతే జీవో బుధ్యమానస్త్వచేతనమ్ |

చేతనం బుధ్యమానస్తు జీవఏవావ తిష్ఠతే

ఈ అహంకారము - దేహము అనునవి స్వయంప్రతిపత్తిగలవి కావు. చేతనములు కావు. ఇవి జడాలు. వీటిని ప్రవర్తింపజేసే (వీటికి వేరై ఉన్న) ఆత్మ మాత్రమే చేతనం... అని ఏ జీవుడు గ్రహిస్తున్నాడో, ఆ జీవుడు పరమాత్మయే అగుచున్నాడు. అట్లా కాకుండా ఎవరైతే ఈ దేహఅహంకారాలను చేతనాలుగా ఆత్మగా భావన చేస్తున్నవాడో, అట్టివాడు జీవభావ పరిమితుడై

Page:635

ఉంటున్నాడు. హేమంత ఋతువులో మామిడి వృక్షం తనంతట తానే చిగురుస్తుంది చూచావా? అట్లాగే “ఈ దేహం - అహంకారం - మనస్సు అనేవన్నీ స్వయంగా చూస్తే అచేతనాలు. వీటిని ప్రవర్తింపజేసే నేను చేతన స్వరూపుడను... అని గ్రహించిన మరుక్షణం ఆ జీవుడు పరమాత్మ అయి ప్రకాశిస్తాడు.

అనగా, అహంకారం, దేహం మొదలైనవాటిని గాంచుచున్నప్పుడు ఇవి చేతనాలు అని అనుకుంటూ ఉండటం చేత ఈ జీవుడు జీవరూపంగానే ఉండిపోతున్నాడు. తత్ఫలితంగా అనేక యోనులలో ప్రవేశిస్తూ శిథిలీభూతుడగుచున్నాడు.

అందుచేత ఈ జీవుడు బ్రాహ్మీదృష్టిని అలవరచుకోవాలి. "కదిలే ఈ దేహం, ఈ అహంకారం చేతనం కాదు. వీటిని కదిలించే ఆత్మయే చేతనం. అట్టి అఖండ - అద్వితీయ - నిత్యపక్రాశక చైతన్యమే నేను”... అను జ్ఞానమే ఆత్మజ్ఞానం.

యే పరాం దృష్టిమ్ ఆయాతా విద్ధి తేషామ్ అపామివ | ఆరూపాలోకమననం స్పన్ధమస్పర్ధనం సదా॥

ఎవరైతే అట్టి బ్రాహ్మీదృష్టిని సంపాదించుకుంటున్నారో... అట్టివారి రూప-సంకల్పక్రియాదులన్నీ అరూప-అసంకల్ప-అక్రియలు గానే ఉంటాయి. అభిమానరాహిత్యం చేత అవన్నీ ప్రవర్తించనివిగానే అవుతాయి. జలం తరంగంగా కనబడినంతమాత్రంచేత ఆ జలం తన స్వరూపం కోల్పోతుందా? లేదుకదా! దేహం, సంకల్పం మొదలైనవి ఆత్మీదృష్టిని మరల్చజాలవు. దృశ్యమును అధిగమించి ఆ దృశ్యమునకు కేవల సాక్షియగు 'దృక్' రూపాన్ని సంతరించుకొని ఉన్నవారు బ్రాహ్మీదృష్టిని సంపాదించుకున్నవారు అగుచున్నారు. అట్టి బ్రాహ్మీదృష్టి (కేవల దృకిస్థితి) సంతరించు కున్నవారు ఈ దృశ్యాన్ని చూస్తున్నా, లేక ఇందులో పాల్గొనుచున్నా కూడా ఇక్కడ వారికి ద్వైతదర్శనం ఉండదు. వారికి ఇక్కడ సర్వదా అంతటా బ్రహ్మమే దర్శనమౌతూ ఉంటుంది. వారి సమస్త క్రియలు కర్తృత్వ అభిమాన రహితాలై ఉంటాయి. ప్రవాహపతితంగా, ప్రారబ్ధానుసారం ఏదేది నిర్వర్తించ వలసి వచ్చుచున్నప్పటికీ వారు దృశ్యరహితులుగానే ఉండగలరు. అట్టి జ్ఞానుల సమస్త క్రియలు అక్రియలే అగుచున్నాయి. వారు బంధనం త్రెంచుకొనిన ఎద్దులాగా రూపాదులచే నిబద్ధులు కారు. వాయువు వృక్షంపై, ఆకులపై, పూలపై, పిందెలపై ప్రసరిస్తూ తాను యథాతథంగానే ఉంటున్నట్లు... ఆత్మీదృష్టి సముపార్జితులు ఈ దృశ్యంలో ఉంటూకూడా ఇక్కడి రూప-నామక్రియాదులచే స్పర్శించబడరు. నిబద్ధితులు కారు.

గంగానది ఒడ్డున నివసించేవారు ఎక్కడో కూపజలాన్ని ప్రశంసించరు కదా! అట్లాగే బ్రాహ్మీ దృష్టిని పొందినవారు ఇక్కడి సంసార విశేషాలను ప్రశంసించరు, నిరశించరు. ఓ రామా! వాసనలచే బద్ధులైన మూఢులే కర్మలను ప్రశంసిస్తూ తత్త్వజ్ఞానం యొక్క అభావంచే ఆ కర్మల ఫలాలను పొందుచున్నారు. ఆత్మదర్శులు కర్మలను నిర్వర్తించినా ఆ కర్మల యొక్క ఫలాలతో వారికి ఏ ప్రయోజనమూ కనిపించదు. కనుక వారు కర్మ ఫలాలను పొందనివారే అగుచున్నారు.

Page:636

ఓ జనులారా! ఎక్కడో ఆకాశంలో ఎగిరే గ్రద్ద దృష్టి అంతా నేలపై కనిపించే మాంసపు ముక్కలపై ఉన్నట్లు ఈ ఇంద్రియములు జగత్ విషయములవైపుగానే ఆకర్షితమై ఉంటున్నాయి. కనుక జాగరూకత వహించాలి సుమా! ఎందుకంటే అట్టి ఇంద్రియ విషయ సేవనాభ్యాసముచేతనే ఈ జీవుడు తన శివత్వము గాంచలేకపోతున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియములను ఉపయోగించే టప్పుడు బుద్ధిమంతుడైనవాడు కర్మలు-ప్రయోజనాలు అనే దృష్టి నుండి మరల్చి వీటిని ఉపయోగి స్తున్న మనస్సును ఆత్మార్పణ చేయాలి సుమా! ఆత్మానుభవామృతం గ్రోలినవాడికి ఈ ఇంద్రియ విషయాలు ఆకర్షణ విషయాలై ఉండజాలవు.

శ్రీరాముడు : ఈ జీవుడు ఎదురుగా ఉన్న సృష్టిని త్యజించి ఆత్మను ఆశ్రయించాలి. కానీ అది సులభ సాధ్యమగుట లేదు.

శ్రీవసిష్ఠమహర్షి : ఆకారం లేని సువర్ణం ఉంటుందా? ముద్దగానో, ఆభరణంగానో... ఏదో ఆకారం కలిగియే ఉంటుంది కదా! అట్లాగే బ్రహ్మం-సృష్టి అనునవి స్వభావసిద్ధం, అయితే ఈ సృష్టి పట్ల జ్ఞాని యొక్క దృష్టి, అజ్ఞాని యొక్క దృష్టి వేరు వేరుగా ఉంటున్నాయి. వీటినే 1.ఆత్మదృష్టి, 2. సంసారదృష్టి అనే పేర్లతో చెప్పుకుంటున్నాం. దగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం, అదగ్ధమైన వస్త్రం యొక్క ఆకారం ఒకే తీరుగా ఉన్నా కూడా ఆ రెండింటికి సంబంధమెక్కడిది? జ్ఞానికి ఈ సృష్టి కేవల శివరూపం గానే అనుభవమౌతోంది. ఇక అజ్ఞానికో... ఇదే సృష్టి అనేక సంసార జన్మ - కర్మ - వ్యవహారభరితంగా అత్యంత భయంకరమై తోచుచున్నది. కనుక ఈ జీవుడు పవిత్రమైన దృష్టిని అలవరచుకోవాలే గాని, ఈ సృష్టిని వదిలి ఎక్కడికో పరుగులు తీయాలని మా బోధసారం కాదు. ఈ సృష్టి కల్పాంతంలో బ్రహ్మం యొక్క మాయా విభాగమునందు ఏ విధంగా నిర్విభాగమై, నిరాభాసమై జగత్ శబ్దార్థరహితమై ఉంటోందో... అట్లాగే వివేకవంతుని అవగాహనలో ఈ సృష్టి ఈ వర్తమానంలోనే నిర్విభాగమై, నిరాభాసమై, జగత్ శబ్దార్థరహితమై అగుపిస్తోంది.

ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. అవి చమత్కారంగా 'కొండలు-వృక్షం-గోపురం-గుహ' వంటి ఆకారాలు కనిపిస్తాయి. మరల ఆ మేఘాలు అటూ ఇటూ కదులుచూ ఉండగా ఆ కనబడే దృశ్యవిశేషచమత్కారం మటుమాయమౌతూ ఉంటుంది. గుహలా కనిపించే మేఘపంక్తి గుహను స్ఫురింపజేస్తోంది. మరల ఆ గుహ ఏమౌతోంది? మేఘాల కదలికచే మటుమాయ మవుతోంది. అట్లాగే అనేక విరుద్ధ ధర్మములచే కనిపించే ఈ జగత్తు మరల ఈశ్వరుని యందు విలీనమౌతోంది.

ఈ జగత్తు ఉపాధి. ఈశ్వరుడు ఔపాధికుడు. భావనయే జగత్తు. అజ్ఞానం చేత ఒకరీతిగా తోచే ఈ జగత్తు సుజ్ఞానం చేత శివంగా తెలియవస్తోంది. వస్తు దృష్టితో మేఘాలను చూస్తున్నప్పుడు కొండ-గోపురం మొదలైనవి కనిపించవచ్చుగాక! అంతా మేఘములే కదా! జలంలో అనేక తరంగాలు కనిపిస్తాయి. తరంగాలు శాంతించినప్పుడు ఆ శాంతజలంలోనే తరంగాలన్నీ లయిస్తు న్నాయి కదా! అసలు జలానికి - తరంగానికి భేదమెక్కడున్నది? తరంగానికి జలమునకు వేరైన ఉనికి (స్థితిత్వం-సత్త) ఉన్నదా?

Page:637

బ్రహ్మానికి - బ్రహ్మం యొక్క చిదాభాసులగు ఈ జీవులకు బేధమెక్కడిది? ...లేదు. బ్రహ్మంలో కనిపించే భేదం అనిర్వచనీయం, ఆత్మదృష్టిచే అంతా బ్రహ్మంగా అనుభవం కాగలదు. అనగా ఆత్మ స్వరూపుడగు ఈ ద్రష్ట తనయందు దర్శిస్తున్న భావతరంగాలే ఈ జగత్తు" గా వివేక దృష్టి కలవాడు గ్రహిస్తున్నాడు.

మనకు ఎదురుగా ఈ దిక్కులు ఉన్నాయి కదా! ఇదిగో, ఇది తూర్పు, అది పడమర. అటు ఉత్తరం, ఇటు ఊర్ధ్వం ... ఈ విధంగా దశదిశలు కనిపిస్తున్నాయి. అయితే 'ఆకాశం' అనే దానిలో దిక్కులు అనేవి ఉన్నాయా? సూర్యోదయం-మనం నిలుచున్న స్థానం" - ఈ రెండిటిచేత మాత్రమే 'దిక్కులు' అనునవి మనం చెప్పుకుంటున్నాం కదా! కనుక... 1. ఆకాశంలో దిక్కులు లేని మాట నిజమే! 2.మనకు ఇది తూర్పు, అది పడమర అనేది నిజమే!

అట్లాగే బ్రహ్మము అకారణం. అది మరిదేనికి కారణం కాదు. కాని అన్నిటికి అధిష్ఠానం అదే! అట్లాగే ఈ జీవుడు - జగత్తు మొదలైనవన్నీ బ్రహ్మము కాక మరింకేమీ కాదు.

అనగా బ్రహ్మములోనే ఇవన్నీ ఉండి ఉండగా, బ్రహ్మము సర్వదా నిర్విషయమై ఉన్నది. ఈ విధంగా ద్వైత-అద్వైతములు బ్రహ్మమునకు సిద్ధిస్తున్నాయి. దిక్హితమగు ఆకాశమే సర్వదిక్కులను ధరిస్తున్నట్లే నిరవయవమగు పరబ్రహ్మమే ఈ జీవ జగత్ ఆదిగా గల ఈ సర్వరూపాత్మక సృష్టిని అవధరిస్తోంది.

అహంకారం ఉన్నప్పుడే జగత్తు. అహంకారం లేకుంటే జగత్తు లేదు.

జగత్తులో అహంకారం, అహంకారంలో జగత్తు. ఈ విధంగా ఈ రెండు అరటిపట్టలవలె ఒకదానిని మరొకటి చుట్టుకొని ఉన్నాయి.

సృష్టి అనబడేది జీవునియందే ఉన్నది. హిమాలయపర్వతం తన నుండి జాలువారిన జలమునే తనకు బాహ్యమైన మానససరోవరంగా గాంచుచున్నది చూచావా? అట్లాగే ఈ జీవుడు కూడా తన యందు గల సృష్టినే ఇంద్రియ - మనస్సులందు గల వృత్తి చమత్కారం చేత ఇట్లా బాహ్యజగత్తుగా గాంచుచున్నాడు. బంగారంలో నుంచే ఉంగరము, ప్రక్కపిన్ను మొదలైన ఆయా భవిష్యత్ ఆభరణ ఆకారాలన్నీ బయల్వెడలుచున్నట్లుగా ఈ జీవుడు కూడా తన స్వరూపమునే అకారణంగా ఈ జగత్తు రూపముగా దర్శిస్తున్నాడు.

ఇక ఈ సంసారము యొక్క ఆవలి తీరమును దర్శించిన పవిత్రాత్ముల జీవనము - దర్శనము మరొక విధంగా ఉన్నది.

జీవన్తో అపి న జీవన్తి, మ్రియంతే న మృతా అపి,

సన్తోపి చ న సన్తీవ, పారావారవిదః శుభాః॥

అట్టి మహనీయులు ప్రాణములు ధరిస్తూకూడా ధరించనివారుగానే ఉన్నారు. శరీరము, ప్రాణములు ధరిస్తున్నప్పటికీ దేహ-ప్రాణాతీతులై ప్రకాశిస్తున్నారు.

Page:638

ప్రబుద్ధః సర్వకర్మాణి కుర్వన్నపి న పశ్యతి, గృహకర్మాణి గేహస్థో గోష్ఠభాండమనా ఇవ

ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు తన దృష్టి అంతా ఆకాశంలోనే ఉంచుకుని ఇంటిలోని ఆయా దైనందిన కర్మలు ఆచరించునట్లు, బ్రహ్మమునందు మాత్రమే ఆసక్తిగల జ్ఞాని ఈ శరీరయాత్రాది ఆయా కర్మలను నిర్వర్తిస్తూనే సర్వదా నిర్వర్తించనివాడుగానే ఉంటాడు. తన ధ్యాసనంతా ఇదంతా ఆత్మగా దర్శించటం - అను సాధన కార్యక్రమంలో వినియోగిస్తూ జీవితమంతా గడపుచున్నాడు.

ఈ విరాట్ నందు చంద్రుడు ఉండి అంతటా తన అమృత కిరణాలతో ప్రసరిస్తున్నాడు చూచావా? అట్లాగే ప్రతి వ్యష్టిశరీరమునందు మంచుబిందువు వంటి ఆకృతి గల జీవుడు ఇటు స్థూలంలో సూక్ష్మం గాను, అటు సూక్ష్మంలో సర్వత్వం గానూ అంతటా ప్రసరించి ఉంటున్నాడు.

22. అహంకారాత్మ - దేహాత్మ

-

శ్రీరాముడు : మహాత్మా! ఈ అహంకారం అనే చమత్కారం నిర్విషయమగు ఆత్మయందు ఎప్పుడు ఎందుకు ఎట్లా ప్రవృత్తమౌతోంది?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఆత్మ అంతటా, అన్నిటా, అన్ని వేళలా ఏర్పడియే ఉన్నది. అట్టి ఆత్మ నుండి ప్రవృత్తి అనే ఒకానొక చిత్ వృత్తి (సముద్ర జలంలో తరంగం వలె) స్వయంగా బయలుదేరి క్రమంగా దేహాత్మగా ప్రవృద్ధం అవుతోంది. ప్రవృత్తి స్వరూపుడగు అహం స్వరూపాత్మ ధ్యానము నందు ప్రవేశించి, అక్కడి నుండి దేహమును ఆశ్రయిస్తున్నాడు.

దేహారంభం -

అహమాత్మా త్రికోణత్వమ్ ఉపగచ్ఛతి కల్పనమ్ | అసదేవ సదాభాసం మన్యతే చేతనాద్వపుః ॥

కర్మకోశే త్రికోణే చ శుక్రసారే అవతిష్ఠతే |

దేహే జీవో 2 హమిత్యాత్మా స్వామోదః కుసుమే యథా ॥

తండ్రి దేహం నుండి అహంకారత్ముడగు జీవుడు వీర్యరూపంలో తల్లి యొక్క త్రికోణాకారమగు యోని యందు పరిచ్చిన్న రూపమున కల్పన పొందుచున్నాడు. క్రమంగా అక్కడి రక్తాదులు పొంది బుద్బుద-పిండాది క్రమంగా దేహాశ్రయుడగుచున్నాడు. ఇక అక్కడి నుండి, అసత్తగు "శరీరమే నేను” అనే భ్రమకు లోనగుచున్నాడు. ఈ జడ దేహమును సత్తుగాను, చేతనముగాను గాంచుచు అందు “అహం” అను అభిమానమును గాంచుచున్నాడు.

ఆహా! ఏమి ఆశ్చర్యం! స్వయంగా పరమానందమైన అఖండ చిదాకాశ స్వరూపుడు అయి ఉండి కూడా... అట్టి నిరంకుశ సత్యమును ఏమరచి ఈ జీవుడు స్వకర్మ నిర్మితమై, సంకుచితము

Page:639

పరిమితం అయిన దేహ పంజరంలో చిక్కుకున్నాడు. త్రికోణాకారమగు మాతృ గర్భాన నిర్మితమైన వీర్యమే సారంగా గలిగిన ఈ పంచభౌతాత్మిక దేహంపై అభిమానమును కల్పించుకొని ఇక పుష్పంలో సుగంధం ఉన్నట్లు ఈ దేహంలో అనుభవజ్ఞుడై పరిమితత్త్వం వహించి ఉండటం ప్రారంభిస్తున్నాడు.

చంద్రబింబం నుండి బయల్వెడలిన అమృత కిరణ సమన్వితమగు చంద్రిక బ్రహ్మాండమంతా విస్తరించి ప్రవహిస్తోంది చూచావా?

అట్లాగే... వీర్యమందు ఉన్నట్టి చంద్రకళా రూపమగు సంవిత్తు (జ్ఞాన స్ఫూర్తి) ఈ దేహామంతా కూడా ఆపాదమస్తకం వ్యాపించి ఉంటోంది. పొగ ఆకాశమంతా మేఘ రూపంగా వ్యాపించి ఉంటోందే! అట్లా అంతరం నుండి బాహ్యానికి ఇంద్రియాల ద్వారా ప్రసరితమగుచున్న జ్ఞాన స్ఫూర్తి ముల్లోకాలోకి (పాతాళ భూ-స్వర్గములలో) వ్యాపించుచున్నది. ఈ సమస్త శరీరమునకు బాహ్య అభ్యంతరమున ఈ అహంకార రూప జ్ఞానం విస్తరించి (వ్యాపించి) ఉన్నప్పటికీ అది హృదయంలో గల వీర్య విశేషంలో ఘనవాసనారూపంపై అధికమైన అభిమానం ఏర్పరచుకొని ఉంది.

ఈ విధంగా ఈ అహంకార రూప జ్ఞానం హృదయమున అధికమైన అభిమాన సమన్వితమై ఉండటం చేత... అట్టి హృదయమున ఆ జీవుడు ఏదేది ఎట్లు సంకల్పిస్తున్నాడో, ఆ రూపంలో అట్లే బాహ్యంలో కూడా స్థితి కలిగి ఉంటున్నాడు. అనగా తత్సంకల్ప పూర్వకంగానే బాహ్యంలో కూడా వ్యవహరిస్తున్నాడు. చూచావా రామా! అయితే, అట్టి అహంకారాభిమానం కేవలం భ్రమ మాత్రమే!

అహంకారాభిమానం -

శ్రీరాముడు : జీవునికి ఏర్పడిన ఈ అహంకార రూప అభిమానమే అన్ని తదితర సాంసారిక దృష్టులకు కారణం కదా! అట్టి దురభిమానపూర్వక అహంకార భ్రమ తొలిగేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని స్వభావసిద్ధమైన స్వరూపం దివ్య ఆత్మ చైతన్యం (ఆత్మ తేజం) అంతేగాని, ఈ అహంకార-దేహ దృశ్యత్వాలు కావు. ఎందుకంటే అవన్నీ కూడా భేద రూపమైనవి. ఆత్మ చైతన్యమో... అభేదరూపమైనది.

కాబట్టి ఈ జీవుడు అస్వభావం నుండి స్వభావానికి ప్రయాణిస్తేనే ప్రశాంతత. కానీ ఈ అహంకార భ్రమ బలీయమైనది. అనేక జన్మ-కర్మల సముదాయం చేత ఉపార్జించుకున్నది కదా! అందుచేత చిన్నచిన్న ఔషధాలు, ఉపాయాలు సరిపోవు మరి? స్వభావసిద్ధమైన, చిత్త వర్జితమైన బ్రహ్మంతో అభేద జ్ఞానరూపమగు స్థితిని సంపాదించుకుంటే తప్ప తమరింకే ఉపాయం చేత కూడా అహంకార భ్రమ శమించదు. ఓ రామా! నీవు శ్రవణ మనన నిధిధ్యాసలచే బ్రహ్మం గురించి చింతన చేయి.

అంతటితో తృప్తి చెందకు. వాటినన్నిటినీ అనుభవైకవేద్యము వైపుగా తరలించు. సమాధి యొక్క అభ్యాసం చేత మౌనస్వరూపమై ఆకాశాన్ని బోలి నిశ్చలమైనట్టి చరమ భూమికను (సప్తమ భూమికను) సముపార్జించుకో. 'ఆత్మ స్థితి’ సంపాదించుకునే వరకూ సాధకుడు ఎక్కడా ఆగకూడదు. జ్ఞానులు అందరిలాగే ఆయా ప్రవాహపతిత కర్మలు నిర్వర్తిస్తూ కూడా మానసికమైన సర్వ బాహ్య

Page:640

అభ్యంతర దృశ్య- దర్శనాభిమానరహితులై ఉంటున్నారు. బాహ్య భావనా వర్జితులై ఉంటున్నారు. చెక్కతో తయారు చేయబడిన మనుజుని వలె ఈ భౌతిక ప్రపంచంలో దిగులు-ఇష్టం-మమత్వంఅయిష్టం మొదలైనవి లేకుండా సంచరిస్తున్నారు.

అప్రమేయత్వం - సదా బ్రహ్మ భావన ఉండే వారు ఈ దేహాదులతో కూడి జీవిస్తూ ఉన్నప్పటికీ ఆకాశం వలె నిర్మలులై, వాస్తవానికి ఎట్టి బంధాలూ లేని వారై, ముక్తులై ఉంటున్నారు.

సూర్యప్రకాశం బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నట్లు వీర్యమునందున్న జీవ సంవిత్తే ఈ దేహామునందు అంతటా ఆపాదమస్తకం అహంభావ రూపంలో వ్యాపించి ఉంటోందని అనుకున్నాం కదా! ఆ వీర్య సంవిత్తు కళ్లు-నాలుక చెవులు చర్మము మొదలైన అన్ని ఇంద్రియాలలోనూ ప్రవేశించి వాటి నన్నిటినీ అహంభావబద్ధంగా చేస్తోంది. అక్కడి నుండి దర్శన-స్పర్శన-శ్రవణాదు లందు నిమగ్నమై ఆయా విషయాలను కూడా అహంభావరసంతో ముంచెత్తుతోంది. భూమి యందంతటా ఉన్న రసం విత్తనంలో అంకుర రూపంలో ఉదయించి వృక్ష విభాగాలుగా ప్రదర్శిత మౌతోందే! అట్లా అజ్ఞానం చేత ఆవరించబడిన సందర్భములో చైతన్యం సర్వత్రా ఉండి కూడా... ప్రప్రథమంగా మనస్సుగా అయి, ఆ తరువాత అహంభావ రూపం సంతరించుకుని దేహంలో ప్రవేశించి ఆయా ఇంద్రియాల రూపంగా ఉదయిస్తోంది.

జగత్తు లేదు : బ్రహ్మమే ఉన్నది - శ్రుతులు (నేల తి, నేలతి, నేహ నానాస్తి కించన” మొదలైన శ్రుతివాక్యాల ద్వారా) జగత్ నాస్తిత్వం ప్రతిపాదిస్తున్నాయి కదా! ఎవడైతే ఈ జగత్తులో ఆరూఢమై ఉన్న మనోహంకార దేహాదులకు అభావనను ఆశ్రయిస్తూ తద్వారా అతీత్వం వహిస్తాడో అతనికే బ్రహ్మం అనుభవమౌతోంది. ఎవడు అభావన ద్వారా ఈ దేహ - మనో - అహంకారాలకు అతీతత్వ భావన సంతరించుకోవటానికి ప్రయత్నించడో... అట్టి ప్రయత్నరహిత మనుజునికి అనంతమైన సంసార దుఃఖం ఎన్నటికీ శమించదు. జ్ఞానామృతముచే తృప్తుడైన మనుజుడు ఏది ఎట్లు ఉన్నా, ఏది ఎట్లైనా దుఃఖించడు. సుఖించడు. తాను ఏది ధరించినా, ఏది భుజించినా, ఎచ్చట పరుండినా సర్వదా సర్వోత్తమమైన ఆత్మసుఖమునే అనుభవిస్తూ చక్రవర్తి వలె శోభిస్తూ ఉంటాడు.

అతడు అనేక వాసనలతో కూడి ఉండినప్పటికీ తాను దగ్ధమైన వస్త్రాకారములాగా వాటిచే స్పర్శించబడకయే ఉంటాడు. అంతరాంతరమున సాంసారిక వృత్తులేవీ లేనివాడై, అశూన్యమగు చిన్మాత్ర రూపుడే అగుచు - - ఆకాశం ప్రాణవాయువులను ధరించి ఉన్నట్లు ఈ మనో దేహ అహంకారాదులను... అసంబంధితుడై ఉండియే... ధరిస్తూ ఉంటాడు.

ఆసనే శయనే యానే స్థితో యత్నైర్నబోధ్యతే నిద్రాలురిన నిర్వాణ మనో మనన నిర్వృతః॥

అట్టి జ్ఞాని ఆసన శయన ప్రయాణ సమయాల్లో ఆరూఢమై ఉన్నప్పుడు కూడా నిర్వాణ దశను అవధరించి నిద్రాళువు వలె అతీతత్వం సిద్ధింపజేసుకొనియే ఉంటాడు. సంచిత్ స్వరూపుడగు పురుషుడు సర్వవ్యాపి అయికూడా శరీరంలో సారభూతమైనట్టి విభాగంలో స్థితి కలిగి ఉంటున్నాడు.

Page:641

ఈ జీవుడు వాస్తవానికి సంవిన్మాత్రుడే (లేక) జ్ఞాన మాత్రుడే సుమా! ఆతని యొక్క విస్తారమే ఈ జగత్తు. అతడు జగత్తు పట్ల అభిమానం ఉన్నప్పుడు జగత్తును అనుభవిస్తున్నాడు. జగత్ రహితు డుగా ఉన్నప్పుడు పరమాత్మత్వము అనుభవిస్తున్నాడు. ఉపదేశసారమంతా ఇంత మాత్రమే సుమా!

కనుక జగత్తు ఉండవచ్చు గాక, ఉండకపోవచ్చుగాక! నీవు మాత్రం జగదతీత్వము వహించిన వాడవై ఉండు. ఈ సమస్త సాంసారిక పదార్థములందు, స్థితియందు విభవములందు, దారిద్ర్యము లందు పొంగని - - క్రుంగని స్థితి కలిగి ఉండు. సర్వదా విరాగివై హృదయమును శిలవలె ఇచ్ఛా రహితంగా చేసేవేసి జ్ఞానము' అనే ఐశ్వర్యమునుకు పొందటానికి సర్వదా సంసిద్ధుడవై ఉండు.

జడమగు ఒక శిల యొక్క అంతర్భాగం ఛిద్రరహితమై మౌనము వహించి ఒప్పుచున్నది కదా! చిదాకాశరూపమగు నీ హృదయము కూడా అంతరమున ఛిద్రరహితమై 'జగత్తు' అను భూతాదులకు స్థానము పొందనిదై ఒప్పుగాక! కేవల చైతన్య సమన్వితమైన ప్రకాశించుగాక! హృదయమునందు సాంసారిక వాసనలకు స్థానమే లభించకుండు గాక! చైతన్యపూరిత హృదయాకాశమున కేవల చైతన్యమునే దర్శిస్తూ పరమానందము పొందుచుండెదవు గాక!

23. జ్ఞాని - అజ్ఞాని - వారి వ్యవహార విశేషాలు

-

ఓ రామచంద్రా! జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడి సమస్త భావ-అభావాల విషయంలోను, కర్మలు నిర్వర్తించే పద్ధతియందు పెద్ద తేడా ఉండదు. వారిద్దరిలోనూ ఉండే భేదమంతా ఒక్కటే!

1. జ్ఞాని ఆ ఆ పదార్థములందు, సంఘటనల యందు, కర్మల యందు, తదితర విశేషములందు వాసనారహితుడై ఉంటాడు. వాటియందు అతనికి సత్యత్వ బుద్ది ఉండదు.

2. అజ్ఞాని వాటన్నిటి పట్ల వాసనా సహితుడై ఉంటాడు. వాటి పట్ల సత్యత్త్వ బుద్ధి కలిగి ఉంటాడు. వారిరువురిలో భేదమంతే!

చైతన్య వాసనలచే స్ఫురించుటచే ఈ జగద్రూపంగా అవుతోంది.

సత్తయే వాసనల అభావముచే ఈ జగద్రూపం శమించి అపరిచ్ఛిన్నము నామరూపరహితము అగు మోక్ష స్వరూపమే అగుచున్నది.

ఇంత మాత్రమే జ్ఞానమంతా! ఇక ఈ 'దృశ్యం' అంటావా? దృశ్యం వినశ్యతి అఖిలమ్, వినష్టం జాయతే పునః | యన్ననష్టం న చ ఉత్పన్నం! యత్ సత్ భవతి తత్ భవాన్ II

ఈ దృశ్య జగత్తంతా ఒకప్పుడు నశిస్తోంది. నశించినదంతా మరల మరొకప్పుడు ఉత్పన్న మౌతోంది. అయితే... ఏదైతే నశించుటయే లేదో, నశించడం లేదు కాబట్టి 'ఉత్పన్నం' అనేది కూడా లేదో ... అదియే సత్తు.

Page:642

ఆ సత్తయే నీవు ఇట్టి బోధచే అజ్ఞాన మూలము నశించుచున్నది.

అజ్ఞాన మూలము నశించిన తరువాత 'జగత్య్రాంతి' అనేది ఇక ఎంత వెతికినా కనిపించదు. "మృగతృష్ణలో భ్రమచేతనే జల తరంగాలు కనిపిస్తున్నాయి కదా!... అని తెలిసే వరకే కదా, మృగతృష్ణ వైపుగా పరుగులు! అట్లాగే, జగత్ దర్శనమంతా భ్రమ చేతనే ఏర్పడుతోంది అని గ్రహించబడిన తరువాత ఇక ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది? దీని మొదలేమిటి? చివర ఏమిటి?... అనే ప్రశ్నలకు తావు ఎక్కడిది?

అహంకారము’ అను దాని గురించైతే 'ఇదేమిటిరా బాబు? ఇది ఎక్కడి నుండి వచ్చింది? అని సాధకులంతా తర్జన భర్జనలు చేసుకుంటున్నారో... ఆత్మ దర్శనమైన తరువాత ఇట్టి అహంభావన గురించిన ఊసైనా ఉండదు.

ఆత్మజ్ఞానికి అంతఃకరణము ఉపకరణమే అవుతుంది. కాని అది సంసారమును కలుగజేయ జాలదు. దగ్ధమైన బీజము మరల మొలకెత్తదు కదా! వీత రాగుడు (రాగములను జయించినవాడు), మనోవికార రహితుడు అయిన జ్ఞాని కర్మలు చేయుచుండవచ్చు. లేక చేయకుండవచ్చు గాక! అతడు సదా అమనస్కుడై, నిత్యనిర్వాణ రూపుడై ... ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు.

ఎవరైతే ఈ తమ చిత్తమును సశాంతింపజేసుకుంటారో ...వారే శాంతియుతులై ఉండ గలుగుతారు. భోగ వాసనలు కలవారికి మాత్రమే భోగముల ఉనికి - లేములు బంధించడం, బాధించడం చేస్తున్నాయి. భోగాశ ఉన్నచోట మాత్రమే చిత్తమనేది ఏర్పడుతుంది. అట్టి వారికి శాంతి లేదు. ఎవరైతే సర్వాశలు సర్వదా త్యజించియే ఆయా ప్రవాహపతిత విధి విధానములను నిర్వర్తిస్తూ ఉంటారో ...వారికి చిత్తము లేనట్లే అవుతుంది. ఆ విధంగా చిత్త - దేహాదులుగా ఘనీభూతం కాని వాడు (వాటిపట్ల అహంకార బుద్ధి ఉంచనివాడు), కేవల చిన్మాత్ర రూపుడగు పరమాత్మయే! అహంభావముతో కూడి ఉండేవాడు ఇసుకపై నిలుచుని మధ్యాహ్న సూర్యుని తాపము అనుభవించువాడే అగుచున్నాడు.

శ్రీరాముడు: చిత్త రహితుడు పరమాత్మయే అగుచున్నాడని అనుచున్నారు కదా! అట్టి చిత్త రహిత పరమాత్మ స్వరూపము ఎట్టిదో ఏదైనా దృష్టాంతపూర్వకంగా చెప్పమని నా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి

ఏకదేశ స్థితాత్ పుంసో దూరాయాతస్య చేతనః |

యద్రూపం సకలం మధ్యే తద్రూపం పరమాత్మనః

ఒకడు ఒక ప్రదేశంలో నిలుచున్నాడనుకో. అతని చిత్తము (ధ్యాస) దూరంగా ఉన్న సూర్య చంద్ర మండలమునకో వెళ్లినదనుకుందాం. ఆ మనుజుని చిత్తము అతడు నిలుచున్న చోటు నుండి బయలుదేరిన తరువాత, ఇంకా సూర్య మండలము చేరక ముందు ఆ మధ్య ప్రదేశములో ఏ చైతన్య స్ఫురణ కలదో అదియే 'పరమాత్మ' యొక్క రూపం. అనగా......

Page:643

ఈ జీవ సంవిత్తు విషయములను పట్టుకొంటోంది కదా! ఇది ఒక విషయమును ఆశ్రయించి ఇంతలోనే ఏదో కారణం చేత ఆ విషయమును త్యజించి మరొక విషయమును ఆశ్రయిస్తోంది. ఇట్లు అవిశ్రాంతంగా విషయ పరంపరలను ఆశ్రయించి స్వభావమే 'చిత్తము' అనబడుతోంది.

ఒక మరొక ఇంకొక

ధ్యాస

విషయం విషయం విషయం

విషయము విషయముల మధ్య గల విషయ రహిత విరామం

చిత్త స్వభావమును ఆశ్రయించి విషయపరంపరలను అనుభవిస్తున్న జీవసంపత్తు విషయము - విషయముల మధ్య గల 'నిర్విషయ విరామము'ను గమనించటమే లేదు.

ఒక విషయము - - మరొక విషయముల మధ్య ఈ జీవ సంవిత్తు యొక్క ఏ చైతన్య స్ఫురణ నిర్విషయమై ఉన్నదో అదియే 'పరమాత్మ' యొక్క స్వరూపం.

ఇక ఈ జగత్తంటావా? మనోహరమైన అనంత చిదాకాశము తాను స్వయంగా ఏ చమత్కారమైతే గావించుచున్నదో... అట్టి చమత్కారము యొక్క వ్యక్తీకరణ రూపమే ఈ జగత్తు. కనుక జ్ఞానులకు ఈ జగత్తు భ్రమ రహితమై, ప్రకాశశీలమై (కాంతి వంటి), నిర్వాణ రూపమై, అక్షయపరబ్రహ్మముగానే భాసిస్తోంది. ఇక అజ్ఞానులకో?... ఇదంతా నిరంతరమైన ఈశ్వరనియతి గాను, అనేక వ్యవస్థ వ్యవహారములతో కూడుకొనియున్నదిగాను, అప్రతిహతమైనది గాను, అనేక భోగాదులతో కూడుకొని ఉన్నదిగాను గోచరిస్తుంది. ఇదంతా కూడా వాస్తవానికి పరమార్థమున వెలయుచున్నప్పటికీ, అజ్ఞానులకు మాత్రం అసద్రూపంగానే అనుభవమౌతోంది. కాబట్టి జ్ఞానము సంపాదించి అప్పుడు ఈ జగత్తు వైపుగా దృష్టి సారించమని సర్వ జీవులకు నా

మనవి.

Page:644

III. శ్రీ వసిష్ఠ - మంకి సంవాదము

1. ప్రక్కదోవ పట్టుచున్న బహుదూరపు బాటసారి

(ఆత్మానంద స్థానమును ఏమఱచి దృశ్యము వైపుగా ఆకర్షించబడుచున్న ఒక బాటసారి) శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! పూర్వం ఒకప్పుడు 'మంకి' అను పేరుగల మహనీయునికి నేను ఆత్మ విషయమై బోధించటం జరిగింది. ఆ బ్రాహ్మణుడు తత్త్వమును విని సంసార వాసనా రహితుడై ఆత్మపదమును సముపార్జించుకున్నాడు. ఆ సంఘటనను ఇప్పుడు మనం చెప్పుకోవటం సందర్భోచితం. కనుక, విను! చెబుతాను.

మీ తండ్రిగారి యొక్క తండ్రి (తాతగారు) అజుడు ఒకసారి ఒక గొప్ప యజ్ఞం తలబెట్టారు. తత్సంబంధిత కార్యనిర్వహణకై కొన్ని విషయాలు సంప్రదించాలనే ఉద్దేశంతో మీ వంశపురోహితుడ నైన నాకు కబురు పంపారు మీ తాతగారు. ఆ కబురు విన్న నేను ఒక సమయంలో ఆకాశము నుండి భూమికి వస్తున్నాను. అట్లా భూమిపైకి వస్తూ అయోధ్యానగరం సమీపిస్తూ ఉండగా త్రోవలో కాకతాళీయంగా ఒక విశాలమైన అరణ్యం తారసపడింది. ఆ అరణ్యం ఎండచే వేడెక్కిన ధూళితో కూడిన సుడిగాలులచే ధూసరమై ఉన్నది. నేలంతా ఇసుక దిబ్బలకు ఆలవాలమైయున్నది. ఆ దీర్ఘమైన అరణ్యంలో అక్కడక్కడ క్రూర ఆటవికుల గ్రామాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో మాత్రం క్షోభరహితమైన ఆకాశం, వాయుతరంగములపై ప్రసరించే సూక్ష్మ సూర్య కిరణాల వలన ఏర్పడిన మృగతృష్ణలు కన్పిస్తున్నాయి.

అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న కాలి బాటలలో ఎంతో శ్రమ, అలసటతో సంచరిస్తూ బాటసారులు కనిపించారు. అక్కడి ఆకాశం బ్రహ్మం వలె నిర్మలంగాను, ఖాళీ ప్రదేశాలు మృగతృష్ణలచే మోహ దాయకంగాను అగుపిస్తున్నాయి. అవిద్య వలె అక్కడి ఆయా ప్రదేశాలు జడత్వంతో కూడి అతి విశాలమై, కనిపిస్తున్నాయి. అక్కడక్కడా జనశూన్యమై కూడా కనిపిస్తున్నాయి.

నేను అట్లా పయనిస్తూ వస్తూ ఉన్నాను. ఇంతలో అక్కడ ఒక బాటసారి కనిపించాడు. అతడు ఎంతో అలసి విసుగును ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇట్లా పైకి పలకటం నాకు వినిపించింది. బాటసారి: అబ్బా! ఏం ఎండ? ఒక పాపితో, దుర్జనునితో సాంగత్యం ఎంతగా పరితాపం కలిగి స్తుందో... ఈ ఎండ కూడా అంతగా పరితాపం కలిగిస్తోంది.

నా ఈ అవయవలన్నీ క్రుంగిపోతున్నాయి! ఈ ఎండ మంటలు చిలకరిస్తోందే! ఎండకు అరణ్యాలన్నీ సంతాపం పొందుతున్నాయి. ఇక లాభం లేదు. ఆ ప్రక్కన ఏదో పల్లె, గుడిసెలు

Page:645

కనిపిస్తున్నాయి. అటు వెళ్లి ఏ ఇంట్లో అయినా కొంతసేపు సేద తీర్చుకొని అప్పుడు నా ఈ ప్రయాణం కొనసాగిస్తాను.

ఇట్లా అంటూ నడుస్తున్న బాటను వదలి కొంత దూరంలో ప్రక్కత్రోవగా నడవసాగాడు. నేను అది గమనించాను. అతడు అల్లంత దూరంగా కనిపిస్తున్న క్రూర ఆటవికుల గ్రామం వైపుగా తిరిగి అడుగులు వేయసాగాడు. అతడు వెళ్ళుచున్నది ప్రమాదమైన ప్రాంతానికి. మరి అతనికి ఆ విషయం తెలుసా? లేదా?” అని నా మనస్సులో అనిపించింది. వెంటనే నేనప్పుడు అతనిని కొంచెం వెనుకకు పిలిచి ఇట్లా అన్నాను.

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : శుభమైన ఆకృతితో వెలుగొందుచున్న ఓ మిత్రమా! ఒక్కమాట. రండి, రండి సుస్వాగతం! ఏమిటి, ఈ ముఖ్య మార్గమగు బాటను, మీరు వెళ్లవలసియున్న మార్గలక్ష్యములను వదలి ప్రక్కవైపుగా వెళ్లుచున్నారేమిటి? సరైన మార్గం తెలియక ప్రక్కకు వెళ్లుచున్నారా? మీరు వెళ్ళే ఆ ప్రదేశం ఎటువంటిదో మీకు తెలుసా? లేదా? (పాఠక మహాశయులు... అది ఇంద్రియ విషయముల వైపుగా అని గమనించ ప్రార్థన.)

బాటసారి : కొంచెం విశ్రాంతి లభిస్తుంది కదా అని ప్రక్కనున్న ఆటవిక గ్రామం వైపుగా వెళ్లామను కుంటున్నాను. ఇలా బాట వెంబడి వస్తూ అక్కడక్కడ పక్క కుగ్రామాలలో విశ్రాంతికై వెళుతూ వచ్చాను లెండి.

శ్రీవసిష్ఠ మహర్షి : నిమ్న మార్గములలోకి వెళుతూ వస్తున్న ఓ బాటసారీ! మీరు పూర్వ గ్రామాలలో (ఇంద్రియ గ్రామాలలో) అక్కడక్కడ కొంచెం విశ్రాంతి దొరుకుతుంది కదా అని వెళ్లి వచ్చి ఉండవచ్చు గాక! ఇప్పుడు మీరు వెళ్లాలనుకునే (విషయ పరంపరలు అనే గ్రామం సంగతి మీకు తెలుసో? తెలియదో? అతిథి సత్కారాలు చేసే వారు ఇక్కడి గ్రామంలో ఉండరు. ఇక్కడంతా పైకి ప్రియం గానూ, లోన బంధప్రసాదితంగాను కనిపించే (శబ్దస్పర్శాది విషయ) ప్రదేశము సుమా! అటువైపుగా ప్రియంగా అనిపించినా, అక్కడి (ఇంద్రియ) గ్రామం శ్రేయం కాదు. తెలిసీ తెలియక ప్రవేశించే వారికి ఈ దేహాలు బంధములను ప్రవృద్ధపరుస్తాయని గ్రహించి ఉన్నారా?

పామరులకు మాత్రమే ఈ దేహము అనే గ్రామం నివాస స్థానమగుచుండగా, మీకు ఈ (దేహ) గ్రామంలో ఏం విశ్రాంతి లభిస్తుంది చెప్పండి?

బాటసారి : మీరు చెప్పింది నిజమే కావచ్చు! కానీ, ఈ దేహ) గ్రామంలో విశ్రాంతికి వసతులు (ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు) ఉంటాయి కనుక, కాస్త విశ్రాంతి, కాలక్షేపం సాయంకాలం దాకా లభిస్తాయి... సాయంకాలం అవగానే ఎండ చల్లబడగానే మరల బయలుదేరుతాను కదా! శ్రీవసిష్ఠ మహర్షి : ఉప్పు నీటిని త్రాగితే దాహం ఇంకా అధికమౌతుంది గాని, దాహం తీరుతుందా చెప్పండి? ఈ (ఇంద్రియ దేహ) ఆటవిక గ్రామం చేరినా మీ దాహం తీరదు సుమా! ఈ గ్రామంలో క్రూరులైన (ప్రియాప్రియ స్వరూపములైన) మొరటు ఆటవికులు ఉంటారు. వారందరికి మహాత్ములన్నా, వివేకమన్నా వ్యతిరక్తము, ఎగతాళి, భయము కూడా!

Page:646

వారంతా (ఈ ఇంద్రియాలన్నీ) అశాస్త్రీయమైన మార్గాల వైపుగానే అధికంగా ఆకర్షితులై ఉంటారు. ఇక్కడి కోయజాతి వారు 'కామం - క్రోధం' కలిగి పశుతుల్యులై (ఇంద్రియ పశువులై)

ఉంటారు సుమా!

న స్ఫురన్ని విచారేషు ప్రజ్వలన్తి అనుభూతిషు |

న త్రస్యన్తి దురాచారాదశ్మయక్త్రమయా ఇవ ॥

ఇక్కడి (ఇంద్రియ)గ్రామంలో ప్రజలకు(ఇంద్రియాలకు) 'తత్త్వ విచారణ' లేకపోవడం చేత మూఢులై ఉంటారు. వారివారి పరిమితానుభవాలలోనే ప్రజ్వలిస్తూ ఉంటారు. 'అయ్యో! ఇది దురాచారం కదా! సక్రమం కాదు కదా!... అనే విజ్ఞత, జ్ఞానం అక్కడి (ఇంద్రియ)గ్రామ ప్రజలకు ఉండదు. అక్కడివారి పురుషార్థమంతా అర్థ-కామాల కొరకై రాగద్వేషములందే పరిసమాప్తమౌతూ ఉంటుంది. పైగా వారిలో సత్-అసత్, నిత్య-అనిత్య... వివేక - విచారణలు లేవు. అందుచేత ఆ బుద్ధిహీనులకు కర్మలయందే ప్రీతిగాని, జ్ఞానంలో కాదు. విశాలమైన ఎడారిలో ప్రవేశించిన మేఘాలకు ఆ ఎడారిపై నమ్మకం లేదు. కాబట్టి అక్కడ కురియవు కదా! అట్లే 'పూర్ణం - - శీతలం

- - కాంతి రసం - - బ్రహ్మానందం'... అనే ప్రజ్ఞావర్షం అక్కడివారి 'హృదయాలు’ అనే ఎడారిలో కురియవు. విజ్ఞానం పట్ల వారికి విశ్వాసం లేకపోవడం చేత వారు మూర్ఖులుగానే ఉన్నారు.

బాటసారి : అయితే ఏం? నా పని నాది. ఏదో కొద్దిసేపు వారితో స్నేహంగా ఉండి ఆ తరువాత వచ్చేస్తాను కదా! వారితో (ఇంద్రియ విషయాలతో) వినోదించాలని నేను వెళ్ళుచుండగా... మీరెందుకు “వద్దు-వద్దు అని నాకు చెప్పవస్తారు?

శ్రీవసిష్ఠ మహర్షి

వర మన్ద గుహాహిత్వం శిలాన్తః కీటతా వరమ్ | వరం మరౌ పఙ్గుమృగో న న గ్రామ్య జన సంగమః ॥

మిత్రమా! ఓ బాటసారి! పైకి ప్రియుల వలె కనిపిస్తూ అనేక ఇష్ట- అయిష్ట, రాగ ద్వేష ద్వంద్వాలకు బహు ఆవేశపూరితంగా కలిగి ఉండే అజ్ఞానులతో సాంగత్యం మంచిదా?... కాదు! అంతకంటే అంధకారంతో ఆకృతమైన కొండ గుహలో కొండచిలువ అయి ఉండటమో, దట్టమైన అడవిలో జింకగా జీవించటమో ఉచితమేమో! అంతేగాని, అక్కడి ఇంద్రియగ్రామ ప్రజలతో కొద్ది సేపు స్నేహం కూడా ఉచితం కాదు. నిమిషకాలం మంచిగా అనిపిస్తూ మరుక్షణమే స్నేహవిరతులు అయ్యేవాళ్లు. వాళ్ళాయె? 'బాధించటం - వేధించటం - హింసించటం - కృంగదీయటం' వంటి క్రియలలో అతి ప్రావీణ్యులు అయిన ఇక్కడి గ్రామ్య జనులు (ఇంద్రియ సమూహాలు) మధుర పదార్థములతో మిశ్రమమె ఉన్న విషగుళికల వంటి వారు సుమా!

ఓ రామచంద్రా! నేనిట్లా అనే సరికి, నా వాక్యాలు విన్న ఆ బాటసారి కొంచెం శాంతించాడు. మండుటెండలో శ్రమించి, చల్లటి నీళ్లతో స్నానం చేసి సేదతీరిన వానివలె అయి, ఇట్లా పలికాడుPage:647

త్వమ్ తత్ అసి! -

బాటసారి : మహాత్మా! తమరెవరు? చూడగా పూర్ణాత్మజ్ఞానుల వలె, ఆత్మవిద్యను కూలంకషంగా ఎఱిగినవారి వలె ఉన్నారే! అంతేకాదు. ఒకవైపు మేమీ సంసారారణ్యంలో దిగాలు పడి అక్కడా ఇక్కడా ప్రక్క త్రోవలు పట్టుచుండగా మీరు మాత్రం ఇక్కడి సంసారంలో నాకు చెందినది, చెంద వలసినది ఏమీ లేదు... అని గ్రహించి కాబోలు ప్రక్క త్రోవకు మరలుచుండడమే లేదు. సుదూర ప్రయాణీకుడు త్రోవలో తారసపడే జనులను పట్టించుకోనట్లుగా మీరు వ్యాకుల రహితులై సాక్షీ మాత్రంగా ఈ పరిసరములను దర్శిస్తున్నట్లున్నారే!

కిం త్వయా సీతమమృతమ్? కిం త్వం సమ్రాడ్విరాడథ సర్వార్ధరిక్తో అపి, చిరమ్ సంపూర్ణఇవ రాజసే ॥

మీ ముఖారవిందం పరమ ప్రశాంతంగా, నిర్లిప్తంగా ఉన్నదే. తాము ఏమన్నా అమృత పానం చేసి ఉన్నారా ఏమిటి? లేక మీరు లోకేశ్వరులా? కాక విరాట్ పురుషులా? ఎందుకంటే ఒక వైపు సర్వ పదార్థ రహితులై ఉండి కూడా, ఇంకొక వైపుగా పరమార్థశోభితులై - పూర్ణ స్వరూపులై భాసిస్తున్నారే! మిమల్ని చూస్తూ ఉంటే.

శూన్యోసి, పరిపూర్ణా సి ఘార్లో సీవ స్థిరో 2 సి చ

న సర్వమపి సర్వం చ న కించిత్ కించిదేవ చ ॥

ఒక వైపు (సంసార దోష) శూన్యులుగా ఉన్నారు. మరొక వైపు నుంచి బ్రహ్మానందం చేతను, జీవన్ముక్త గుణముల చేతను పరిపూర్ణులై కన్పిస్తున్నారు. (ఈ దేహాదుల పట్ల అనుసంధానం లేక పోవుటచే) ఒక విధంగా జగద్విషయాలకు అతీతమైన మత్త చిత్తుని భంగి అగుపిస్తున్నారు.

(ఈ దేహమనో బుద్ధాదులచే సంబంధం వహించకపోవుటచే) ఏదీ కానివారై ఉన్నారు. (అపవాద దృష్టి) ఈ దేహ మనో బుద్ధ్యాదులన్నీ తమ చమత్కారమే కనుక - అంతయు తామేనా!” అన్నట్లుగా కూడా ఉన్నారు. (అధ్యారోపదృష్టి) పరిచ్ఛిన్నుల వలె కనిపిస్తూనే అపరిచ్ఛిన్ను లుగా అనిపిస్తున్నారు.

ఉపశాంతం చ, కాస్తం చ, దీప్తమ్ అప్రతిఘాతి చ

నివృత్తం చ ఊర్జితం తాదృగ్రూపం కిమితి తే మునే?

మీ రూపం పరమశాంతంగాను, అత్యంత ప్రకాశమానంగాను, ప్రదీప్తవంతంగాను, అప్రతిఘాతం గాను, సర్వ వ్యవహారముల నుండి నివృత్తిని సముపార్జించుకొన్న దాని వలెను, సర్వసామర్థ్యమును అవధరించిన దాని వలెను నాకు కన్పట్టుచున్నది. స్వామీ! మీరీ భూమిపై పాంచభౌతిక దేహంతో కనబడుచున్నప్పటికీ సర్వలోకాలకు ఆవల చిదాకాశస్వరూపమున స్థితిని పొందిన వారివలె ఉన్నారు. అంతేగాక, మీరు ఎక్కడా స్థితిని పొంది ఉండక నిరాకారులైనప్పటికి మావంటి రూప-నామాది సంసారబద్ధుల నిమిత్తమై రూపయుక్తులగుచున్న వారి వలె నాకు అనిపిస్తున్నారు. చంద్రుని చల్లటి కిరణాలు భూమిపై గల ఆయా పదార్థములపై ప్రసరిస్తూ

Page:648

కూడా, ఆయా విషయాల దోషాలను తాను పొందక యథాతథంగా అమృతమయంగా ఉంటుంది చూచారా! మీరు కూడా, పరిపూర్ణంగా కళంకరహితులుగా, స్వభావసిద్ధమైన శీతలాంతఃకరణులుగా, ప్రకాశానందమయులుగా, సర్వత్రా సమరూప సముపార్జితులుగా, అమృత ప్రవాహపూరితులుగా, పూర్ణ చంద్ర శోభాయమానులుగా నాకు కనిపిస్తున్నారు.

హే మహాత్మా! ఒక విత్తనంలోనే వృక్ష శాఖ-పత్ర-ఫలాదులన్నీ ఉన్నట్లు మనం గ్రహిస్తాం చూడండి! అట్లా, మీ ఆత్మయందే ఈ జగన్మండల వైశిష్యమంతా నేను వీక్షిస్తు న్నాను. చిత్ స్వరూపులగు తమ ఇచ్ఛయందే సత్-అసత్ భావ చమత్కారం అంతా ఉన్నట్లుగా నాకు గోచరిస్తోంది.

స్వామీ! మీరెవరో, తదితర మీకు సంబంధించిన విశేషా లేమిటో తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది. ప్రభూ! ముందుగా నా గురించి నేను పరిచయం చేసుకోవటానికి అనుజ్ఞనివ్వండి.

నన్ను “మంకి” అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. శాండిల్య గోత్రోద్భవుడనగు బ్రాహ్మణుడను. అహం భో అభివాదయే! తీర్థయాత్రలు చేసి వద్దామని చాలాకాలం క్రితం బయలుదేరాను. చాలా దూరదూరాలు సంచారం చేసి ఇక ఇంటికి చేరాలని తిరిగి వస్తున్నాను. చాలా చాలా ప్రదేశాలు సందర్శించి వస్తున్నాను. అనేక ప్రదేశములను, స్థానములను చూచిన నా మనస్సు ఈ ప్రపంచం మెరుపుతో సమానమైన పంచభూత సంయోగ వియోగ చమత్కారమే... అనే వివేకం చూచాయగా పొందింది. మనస్సు వైరాగ్యయుక్తం కాగా 'ఈ ప్రాపంచిక విషయాలు ఏమి చూడాలి? ఇంటికి చేరి విశ్రాంతి పొందటమే ఉచితం కదా!... అని అనిపించసాగి, ఇక గృహోన్ముఖుడను అయ్యాను. నన్ను మీరు సంబోధించిన విధానం చూచి "మీరు శాస్త్రజ్ఞానులు, ఆత్మజ్ఞాన నిధి... అని గ్రహించాను. హే మహాత్మా! ఈ బాటసారి అనేక బాటలలో సంచరించి సంచరించి అలసి పోయాడు సుమా! దయచేసి నా అలసట తీర్చగల ఆత్మజ్ఞానం వచించండి. సాధు మహాత్ముల చిత్తము గంభీరముగాను, నిర్మల సరోవర సదృశంగాను ఉంటుంది కదా! ఇక నా చిత్తం నాకే అర్థంకాని అనేక వ్యాకులతతో, దిగుళ్లతో సతమతమగుచు ఉడికిపోతోంది. కనుక నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించమని మరల వినమ్రుడనై వేడుకొనుచున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ మంకి మహాశయా! నీవు ఆత్మజ్ఞానం కొఱకై అర్థించే నమ్రతతో కూడిన విధానం నాకు నచ్చింది. నీ విప్పుడు నన్ను సంబోధిస్తూ చెప్పినదంతా తత్త్వశాస్త్ర ప్రవచనమై ఉన్నది. ఇట్టి దృష్టితో చూడటమే తత్త్వశాస్త్రజ్ఞానోదయం.

ముందుగా నా వివరాలు కూడా చెప్పుతాను. నేను బ్రహ్మలోక నివాసిని. 'వసిష్ఠుడు' అను నామధేయుడను. రాజర్షి అయిన అజుడు ఏదో కార్యం నిమిత్తం నాకు కబురు పంపగా ఇటు వస్తున్నాను. నీవు ఆత్మజ్ఞానం కొరకై నన్ను అర్థించడం నాకు సంతోషం కలుగజేస్తోంది. ఎందుకంటే అనేకమంది జీవ నామధేయ బాటసారులు ఆత్మజ్ఞానం కొరకై యత్నించకుండా అనేక ఉపాధులు ఆశ్రయిస్తూ ఇక్కడి సంసారారణ్యంలో ఉపాధి పరంపరలు పొందుతూ సుదీర్ఘకాలం గడిపివేయడం నేను గమనిస్తున్నాను.

Page:649

ఆత్మజ్ఞానము కొరకై నీవు అడుగుచున్నందునకు నిన్ను ముందుగా అభినందిస్తున్నాను. ఓ ప్రియ విప్రోత్తమా! నీవు ఈ కల్పిత విషయ ప్రపంచంలో దేని కొరకూ దుఃఖించవలసిన పనేలేదని మొట్టమొదటి వాక్యం చెప్పుచున్నాను.

మాగా విషాదం పంధానమ్ ఆగతోషి మనీషిణామ్

ప్రాయ ప్రాప్తోసి సంసారసాగరస్య పరం తటమ్!

నీవు దుఃఖించవలసిన అవసరమే లేదు. పైగా, బుద్ధిమంతులైన వారు పొందే మార్గం నీవు దాదాపు పొందావు. 'వైరాగ్యం' అనే వైభవం ఉన్నప్పుడే నీవలె ఇటువంటి ఉదారమైన బుద్ధి, యోచన, వచనములు, ఆకృతి ఉంటాయి.

నీవిప్పుడు ఆత్మజ్ఞానం గురించి అడిగావు కదా! ప్రతి జీవునిలోనూ 'ఆత్మజ్ఞానం' అనే రత్నం ఉన్నది. అయితే, రత్నమును సాన పెట్టనంతకాలం అప్రకాశమానంగానే ఉంటుంది కదా! అట్లాగే బుద్ధి అనే రత్నం అనేక రాగద్వేషములు అనే మాలిన్యములచే ఆవరించబడి ఉంటోంది. వివేకము' అనే సాన పెట్టితే ఆత్మజ్ఞానం స్వయంగానే ప్రకాశించగలదు.

అయితే ఓ విప్రుడా! నీవు తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటి? సంసారము నీకెట్లా అనుభవమౌతోంది?... శిష్యుడు తనకున్న అనుమానాలను సవివరంగా ప్రదర్శిస్తే గురువు అర్హమైన మార్గంలో ఉత్తమ అర్థయుక్తమైన బోధ నిర్వర్తించగలుగుతాడు. ఈ ప్రశ్న-ఉత్తరములు అనేవి గురు శిష్యుల మధ్య అత్యంతావశ్యకమైన పాఠ్య విధానం. కాబట్టి నీవు చక్కగా నీకున్న అనుమానా లను బయటపెట్టు.

శిష్యుడిలో 5 లక్షణాలు ముఖ్యంగా ఉండాలి- 1. రాగాది దోషములు తొలగించుకోవడం, 2. నిర్మలమైన (ధ్యాన పఠనాది) వాసనలు కలిగి ఉండడం, 3. వైరాగ్య సంబంధమైన సాధనాలతో కూడి ఉన్న మనస్సు, 4. నిత్యానిత్య వివేచనా సామర్థ్యం, 5. సమబుద్ధి. ఈ ఐదు లక్షణాలు శిష్యునిలో ఉంటేనే గురూపదేశం ప్రభావ సమర్థంగా అవుతుంది. అప్పుడు గురూపదేశ తేజస్సుచే ఆ శిష్యుడు శోక రహితుడుగాను, ఆత్మజ్ఞాన సుసంపన్నుడుగాను అగుచున్నాడు. యోగ్యత ఉన్నప్పుడే 'గురుబోధ' ప్రయోజనకరం.

నీవు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో నీ యందు గల అనుమానాలేమిటో ప్రశ్నించు. నీ ప్రశ్నలను అనుసరించి జననమరణాది దుఃఖముల నుండి తరించాలనే బుద్ధి పట్టుదల ఎంత వరకు ఉన్నాయో నాకు తెలుస్తుంది. నీవు తగిన అర్హత కలవాడివైతే నీకు తప్పక ఉపదేశిస్తాను.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నేను ఆ 'మంకి' అను విప్రుని ఇట్లు తిరిగి ప్రశ్నించాను. అప్పుడు ఆతని కళ్లు ఆనందబాష్పములతో చమర్చడం గమనించాను. నా పాదములకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ ప్రక్కనే గల ఒక పెద్ద వృక్షపు నీడలో ఇద్దరం సుఖాసీనులమైనాం. ఇక అతడు ఇట్లా చెప్ప ప్రారంభించాడు.

Page:650

2. సంసార పంజరం

మంకి :

భగవన్! భూరిశోఖ్రాన్తా, దిశో దశ దృశో యథా | మయా న తు పునః సాధు లబ్ధః సంశయనాశ కృత్॥

మహాత్మా! ఉపదేశం ప్రసాదించగల గురువుకోసం నేను పది దిక్కులలోనూ దృష్టిసారించి మరీ వెతికాను. కానీ, నా సంశయములను పోగొట్టగల మహాత్ముడెవడూ నాకింతవరకూ లభించనేలేదు. నేడు మీ దర్శనం అయినందుకుగాను, సమస్త దేహములలోనూ ఉత్తమమైన ఈ మానవజన్మ లభించిన సత్ఫలితం పొందిన వాడనగుచున్నాను.

పునర్జాతం పునర్నష్టం సుఖ దుఃఖ భ్రమః సదా | అవశ్యం భావి పర్యన్త దుఃఖత్వాత్ సకలానపి || సుఖాన్యేన అతి దుఃఖాని వరం దుఃఖాన్యతో, మునే॥

ఓ మునీశ్వరా! ఈ సంసారమును గమనించాను. ఇదంతా సదా సుఖ-దుఃఖ భ్రమలచే నిండి ఉంటోంది. పుట్టడం చావటం, మరల జన్మ ఇదియే ఈ సంసారం యొక్క రూపం. చివరికి ఇది దుఃఖాలనే కలుగజేస్తోంది. ఈ సమస్త సంసార సుఖాలు వాస్తవానికి దుఃఖం రూపాలే అయి ఉన్నాయి. అందుచేత ఈ సంసారంలో ఉండే సుఖాల కంటే దుఃఖాలే కాస్తంత మేలు అని నా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటారేమో? ఈ సంసార సుఖాలు మోసగించి మరీ సుదీర్ఘ దుఃఖ సముద్రంలోకి మావంటి జీవులను త్రోసివేస్తున్నాయి.

ఇంక ఎవరి సంగతో మనకెందుకు? నా సంగతే చూడండి. వయస్సుతో బాటుగా ఈ ప్రేగులు దంతాలు, కేశాలు శిథిలమైనాయి. అయినా కూడా ఈ నా బుద్ధి ఉత్తరోత్తరా పొందగల ఏవేవో భోగాల యందే ఇంకా తత్పరమై ఉంటోంది. అంతేగాని పరమ పురుషార్థం వైపుగా మరలటమే లేదాయె?

ఇక ఈ మనస్సు! ఇది అనేక రాగ- ద్వేషాలతో, దుష్ట - నికృష్ట సంకల్ప పరపరలతో వివేక రహితంగా ఉంటోంది. సాక్షి చైతన్యం గురించిన వివేకం దీనికి ఎంత ప్రయత్నించినా, విన్నా కూడా కలగటం లేదు. మహాత్మా! ఎండిన ఆకులు చిందరవందరగా రాలి క్రుళ్లి దుర్వాసనా భూయిష్ఠం అయినట్లు ఈ మనస్సు నిండా దుర్వాసనలు, దుష్ట వ్యాపకాలు, సారహీనమైన పదార్థాలు ఉంటున్నాయి. ఇక ఈ ఇంద్రియాలను చూద్దామా? "ఎక్కడో వినీలాకాశంలో ఎగిరే గ్రద్ద దృష్టంతా నేలపైన గల చచ్చిన క్రుళ్ళిన జంతుదేహంపైనే - అన్నట్లుగా, ఈ ఇంద్రియాల దృష్టి అంతా దుష్ట దురభ్యాసాలవైపే! దుష్ట గ్రామంలోని జనుల వ్యాపకాల వలె ఈ ఇంద్రియాలు నిత్యం పాప వ్యాపకాలే కలిగి ఉంటున్నాయి.

నా ఈ ‘బుద్ధి’ ఉంది చూచారూ! బురద నేలలోని ఈత ముళ్ళ వలె ఇది అతి కుటిలమై మహాభయంకరంగా తయారయింది. ఆయుష్షంతా అజ్ఞానాంధకారంలో నిరంతర విషయ చింతనతో

Page:651

గడచిపోతోంది. చీకటి రాత్రిలో ఒదిగి ఉన్న కళ్లులాగా వ్యర్థంగా ఆయువు గడచిపోతోంది. అంతరాంతరాలలో ఏదో తృష్ణ! ఆ తృష్ణ దేని కొరకో అర్థం కాక, ఏమి పొంది ఆ తృష్ణను వదిలించు కోవాలో నాకేమీ పాలుపోవటం లేదు. సృష్టిలో అత్యంత అవివేకమైనది ఈ తృష్ణయే. వ్యర్థమైన వాటిని ఆశ్రయించి నేను నిరర్థకంగా మిగిలిపోతున్నాను. ఈ వ్యధ, ఈ తృష్ణ, ఈ దురాశ ఎక్కడి నుండి నన్ను పట్టుకున్నాయో తెలియదు. నేను ఎటువైపు పయనిస్తున్నానో నాకే తెలియక చాలా దూరం వచ్చేశాను. ఎండిపోయిన పూతీగకు ఇక చిగురించటమేమి ఉంటుంది? ఈ ఆశలు తీరట మనే దశయే నాకు కనిపించటం లేదు.

రోజూ నిదరలేచి నిత్య నైమిత్తిక కర్మలు నిర్వర్తిస్తున్నాను. కొన్ని సాధనలకు ఉపక్రమిస్తున్నాను. మంచిది. అయితే ఏం లాభం? పెద్ద కొండంత దుష్కర్మల రాశి పేరుకొని ఉండగా నా ఈ చిన్న కార్యక్రమాలు ఏ మూలకి? చిన్న అంపంతో పెద్ద పర్వతాన్ని గీయటం ప్రారంభిస్తే ఆ మహాపర్వతం అరిగేది ఎన్నటికి చెప్పండి? పూర్వపు దుష్కర్మరాశి కరగాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? అంతు కనబడడమే లేదు. భోగ వాసనలచే ప్రభావితుడనై నేను రోజులు గడిపేస్తున్నాను. అట్టి భోగ బీజ ప్రభావం చేత నా ఉత్తరోత్తర కర్మలన్నీ అనర్థము కొరకే నిషిద్ధమార్గంలో ప్రవర్తిస్తున్నాయి.

జీవితం చ జనే జీర్ణం నైవోత్తీరో భవార్ణవః

దినానుదినముచ్చూనా భోగాశా భయదాయినీ ॥

పుత్ర - కళత్ర - మిత్రాది వ్యవహారములలో పడిపోయి ఈ జీవితం రోజురోజుకూ క్రమంగా శిథిలమైపోతోంది. అనేక ఆసక్తులతో నేను ఉండగా ఆయుష్షు క్రమంగా కరిగిపోతోంది. ఇన్ని రోజులు గడచిపోయాయి. నేను సంసార సాగరాన్ని దాటనే లేదు. భోగాశ వదలనే లేదు. వదలక పోగా భయంకరమైన ఈ భోగాశ రోజు రోజుకూ అధికం అవుతోంది. ఈ పుత్ర-మిత్ర-పశుధనాదుల మధ్య రోజులు గడుపుచున్న నాకు ఒక రోజు “నాకేం? ఏమీ ఫరవాలేదు... అనిపిస్తోంది. ఆ రెండవ రోజే భారమైన బ్రతుకు ఎన్నాళ్ళురా?... అని మరల ఇంతలోనే అనిపిస్తోంది. అనేక చింతలతో ధనము ఆర్జించి గొప్ప ఆపదలు తెచ్చి పెట్టుకుంటూ పోతున్నాను. అల్లంత దూరంలో గల చీకటిమయమైన బిలంలో విషసర్పముపై గల మణి యొక్క ప్రకాశపు ఆకర్షణలాగా ఈ సంసార విశేషాలన్నీ పైకి అందంగా, లోన విషపూరితంగా ఉంటున్నాయి. కష్టపడి ధనం కూడ బెట్టడం, దొంగలకు - చుట్టాలకు - శత్రువులకు భయపడి దుఃఖిస్తూ రోజులు గడపటం... ఇదీ నా దైనందిన తతంగం.

ఈ నా చిత్తం అనేకమైన ఆశాతరంగాలతో మలినమై ఉన్నది. ఇది ఎక్కడెక్కడికో పరుగులు తీస్తోంది. అది పొందే ప్రయోజనమూ లేదు. దాని ఆరాటం తీరేదీ కాదు. సముద్రం ఎండిపోతే... ఇంటి నుండి చెంబులతో నీళ్లు తెచ్చి సముద్రభూమిని తిరిగి నింప గలమా? అట్లాగే ఈ చిత్తమును పూడ్చడం ఎట్లాగో నాకేమీ తెలియటం లేదు. ఎవరైనా వివేకులను ఆశ్రయిద్దామా? ఇంద్రియములకు వశీభూతుడనై అటూ ఇటూ తిరిగే నన్ను వివేకులు దగ్గరకు రానీయటం లేదు.

Page:652

ఈ మనస్సు అపవిత్ర స్థానములలో తిష్ఠ వేసుకొని ఉన్నది. అసత్తైనట్టి ఘనకార్యములు మహా సంరంభంతో ప్రారంభించటంలో మాత్రము ఈ మనస్సు ఎప్పుడూ సిద్ధమే. ఇక దీని చంచలత్వం ఏమని చెప్పమంటారు? పెనుగాలి వీచికలను కదలికలు ప్రదర్శించే మఱి ఆకులు నా ఈ మనోచాంచల్యం ముందు సిగ్గుతో తలవంచవలసిందే! ఇది క్షణక్షణం చస్తూ కూడా చావదు. ఇష్టమొచ్చినట్లు కుళ్లిన పదార్థాలపై వ్రాలుచుండే ఈగకన్నా ఈ మనస్సే నికృష్టం.

నా దేహంలో అహంభావము' అనే ఒక గొప్ప కల్పిత యక్షుడున్నాడు. అట్టి అహంభావంతో కూడిన అజ్ఞానం క్షయించదాయె! ఈ అజ్ఞానం 'కర్మలు' అను గడ్డి పరకలను భక్షిస్తూ ‘వాసనలు’ అనే చీకటి నూతిలో చిక్కుకొని ఉపాధులు గడపివేస్తోంది. ఆ నూతిలో నుంచి బయటపడేది ఎన్నటికి, ఎట్లా? వివేక సూర్యుని దర్శనం అయ్యేనా? మహాత్మా! అవస్తువులైన వాటిని వస్తువులుగా నమ్మి నేను అవివేక నిబిడాంధకారంలో చిక్కుకొని దిక్కుతోచక ఉన్నాను.

ఇంద్రియాణి నికృన్తన్తి, న జానే కిం భవిష్యతి! శాస్త్రదృష్టిరపి ప్రాజ్ఞిః న ఆశ్రితా తరణాయ యా॥

ఈ ఇంద్రియాలు నన్ను నీచ స్థితులకు దిగజారుస్తున్నాయి. ముందుముందు ఏమి కానున్నదో నాకు అవగతం కావటం లేదు. చక్కటి ఉపాయాలతో ఈ ఇంద్రియములను జయించిన ప్రాజ్ఞులను నేను శరణువేడటం లేదు. ఈ సంసారంలో కొట్టుకొంటూనే ఉన్నాను గాని ఉపాయం ఆశ్రయించటం చేతకావడం లేదు. నాకున్న కొద్దిపాటి శాస్త్ర దృష్టి నన్ను వాసనలకు మరికొంత దాసోహంగా చేయిస్తున్నాయి గాని, నన్ను ఉద్ధరించటం లేదు. నా శాస్త్ర దృష్టి నాలోని దోషదృష్టుల కారణంగా నన్ను మరికొంత గ్రుడ్డివానిగా చేస్తోంది.

విన్నారుగా మహాత్మా! నా పరిస్థితి ఇది. మీరడిగిన దానికి సమాధానంగా నా ప్రస్తుత స్థితి చెప్పుకొన్నాను. ఈ ప్రకారంగా అజ్ఞానంలో నిమగ్నుడనైన నేను శ్రేయము అయిన మోక్షము సంపాదించుకోవడానికి ఏమి చేయలో సెలవు ఇవ్వండి. తమవంటి లోక గురువులు ఇప్పుడు నాకు లభించడం ఒక గొప్ప భాగ్యం. మీ దయచేత మాత్రమే ఈ మీ శిష్యుని చిత్తములో పేరుకొని ఉన్న అజ్ఞాన మంచుకొండ కరగగలదు. సాధు పురుషులగు మీ వాక్కు, ఉపదేశము నాయందు ప్రవేశించి నా సంసార భ్రమను ఉపశమింపజేయగలందులకు నన్ను కరుణించండి.

మీ పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తున్నాను.

ఓ రామచంద్రా! ఇట్లా పలికి ఆ మంకి అను బహుదూరపు బాటసారి నా పాదములపై వ్రాలాడు. కనుల వెంట జాలువారిన కన్నీళ్లు నా పాదాలను స్పృశించాయి.

Page:653

3. ఏదైతే తెలుసుకొంటోందో - అదియే తెలియబడవలసినది! శ్రీవసిష్ఠ మహర్షి : ఓ మంకి మహాశయా! నీవు చెప్పినదంతా విన్నాను. ఒక్క విషయం! నీవు ఇప్పటికి కూడా దుఃఖించవలసిన అగత్యమేమీ లేదు. ఆనందమే నీ స్వభావం గాని దుఃఖం నీ స్వభావం కానేకాదు. మరి? సరి అయిన విశ్లేషణకు ఉపక్రమించనందు చేత ఆపాదితమైన దుఃఖం వచ్చిపడింది. ఎందుచేతనో విను.

కేవలం మిథ్యాభూతాలై ఉన్న ఒక 4 విశేషాలు ఈ ప్రపంచంలో అవిద్యచే విజృంభించటం జరుగుతోంది.

సంవేదనం భావనం చ, వాసనా కలనేతి చ

అనర్థాయేహ శబ్ధార్థే విగతార్థో విజృంభతే II

1. అనుభవం (సంవేదనం) : ఇంద్రియములచే ఏర్పడే విషయ భోగరూపమైన అనుభవం 2. భావన : విషయాలు ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయా విషయాల గూర్చి భావన 3. వాసన : చిత్తము నందలి విషయముల గురించి వాసన' 4. కలన : మరణకాలంలో కూడా వెంటనంటి ఉన్నటువంటి విషయాలకు సంబంధించిన స్మృతి మంకి: స్వామీ! మీరు చెప్పినట్లు ఈ నాలుగు... ఈ జీవుణ్ణి జీవితపర్యంతం వెంటనంటి ఉంటున్న మాట వాస్తవమే. అయితే ఈ నాలుగింటిని 'అవిద్య' అని అంటున్నారు కదా! 'అవిద్య' అనగా? శ్రీవసిష్ఠ మహర్షి : ఏది మిథ్య అయి ఉండి కూడా... ఒకానొక వ్యాపక దృష్టికి అత్యంత ఘనీభూత మైన సత్యం వలె అనిపించటం జరుగుతోందో... అద్దానిని 'అవిద్య' అని పిలుస్తున్నారు. మంకి : మీరు చెప్పిన అవిద్య ఎందుచేత ఏర్పడుతోంది? 'సంసారం' అనగా ఏమిటి? శ్రీవసిష్ఠ మహర్షి : సమస్త దోషముల యొక్క ఆశ్రయమే సంసారము.

1. విషయముల అనుభవం 2. వాటియొక్క భావన... ఈ రెండే సమస్త దోషాల ఆశ్రయం. అయితే... బ్రహ్మం గురించిన చింతన చేస్తూ, విషయాలలో ఏర్పడి ఉన్న దోషాలను గమనిస్తూ గ్రహిస్తూ ఉండగా... అట్టి వివేకికి 'సంసార భ్రమ' వాసనాసహితంగా క్రమంగా స్వయంగా క్షయించి పోగలదు. చూచావా? ఈ 'సంసారం' అనబడుదానిని వాసనయే పరిపోషించి వృద్ధి చెందింపజేస్తోంది. ఈ ప్రపంచం అనునది మనుజుని వాసనా రూపమే సుమా!

మంకి : ఈ ప్రపంచము భౌతికమగు వస్తు సమన్వితమా? వాసనామాత్రమా?

శ్రీవసిష్ఠ మహర్షి : వస్తు సముదాయంగా అనిపించటానికి కారణం? వాసనయే! కాబట్టి, ఈ ప్రపంచం వాసనామయమే. అజ్ఞానావృతం అయినట్టి జీవ చైతన్యం నందు వాసనా రూపమగు సంసారం ఉదయిస్తోంది. 'శూన్యత్వం' కంటే వేరుగా ఆకాశం అనేది ఎక్కడైనా ఉన్నదా?... లేదు. అట్లాగే యథార్థానికి ఈ ప్రపంచంలో బ్రహ్మం మాత్రమే ఉన్నది. బ్రహ్మానికి భిన్నంగా మరింకేమీ లేదు. అట్టి బ్రహ్మం అద్వైత నిర్మల - చిన్మాత్ర తత్త్వమైయున్నది.

Page:654

తెలుసుకునేది (చిత్, చిన్మాత్రం); తెలియబడేది (వేదనం). చిన్మాత్ర రూపమగు వేదనాత్మ అంతటా, అన్నిటా ఏర్పడి ఉన్నది. అది సదా సర్వత్రా స్ఫురించుచున్నప్పటికీ దేహ - ఇంద్రియాదుల విషయముల కంటే అన్యముగా భాసించటం లేదు. అంతే కాదు.

దృశ్య రూపముగా స్ఫురించేదంతా భ్రాంతియే. ఈ దృశ్య రూప భ్రాంతికి రెండు విశేషాలు ఉన్నాయి- 1. ఆవరణ శక్తి ప్రాధాన్యమగు అవిద్య, 2. విక్షేప శక్తి ప్రాధాన్యమగు భ్రమ.

ఈ అవిద్య - భ్రమ ...అను ఉభయ రూపములే ఈ సంసారముగా వ్యాపించి ఉన్నది. మంకి : ఈ జగత్తు సత్తా? అసత్తా? ఇది ఎట్లా ఎందుచేత సిద్ధించింది?

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తు అసత్తు మాత్రమే. అయితే సత్తు వలె భాసిస్తోంది. ఆత్మజ్ఞానం యొక్క లేమిచే (ఆత్మ యొక్క సమాచారాన్ని ఏమరచి ఉండటం చేత ఈ 'జగత్తు' అనబడేది సిద్దించింది. పసిబాలుడికి, అది దయ్యం కాదు. పగటి పూట కనబడే చెట్టు మాత్రమే”... అని తెలిసిపోగానే దయ్యమునకు సంబంధించిన భయం మొదలైనవి తొలగుతాయి చూచావా? అట్లాగే జ్ఞాన వికాసం చేత ఈ జగత్ భ్రమ క్షణకాలంలో నశించగలదు.

మంకి : “జ్ఞానం యొక్క వికాసం... అనుదాని తదనంతరం ఈ దృశ్యం ఏమి కానున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : అనేక ప్రదేశాలలో ప్రవహిస్తూ పోతున్న నదుల జలమంతా సముద్రం చేర గానే ఏమి అవుతోంది?

మంకి : సముద్రంలో జేరిన తరువాత ఈ జలం ఈ నదిది అనే గుర్తు కూడా ఉండదు కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అవునా? అట్లాగే ఆత్మజ్ఞాన ప్రకాశముచే ఈ దృశ్యం అదృశ్యం అయిపోతుంది. సర్వ దృష్టులు సమసిపోగా... ఇక బోధరూపమగు ఆత్మయే శేషిస్తోంది. అనగా సర్వ దృశ్యములు బోధమయమగు ఆత్మరూపత్వమునే పొందుచున్నాయి.

మృన్మయం తు యధా భాణ్ణం మృచ్ఛూన్యం నోపలభ్యతే చిన్మయాదితయా చేత్యం చిచ్ఛున్యం నోపలభ్యతే॥

ఒకాయన కుమ్మరి వృత్తి నిర్వర్తించే ఒక మిత్రుని దగ్గిరకు ఉబుసుపోకగా వెళ్లి ఇట్లా అడిగాడు.

ఆ వచ్చిన పెద్ద మనిషి: మిత్రమా! ఉదయం ఈ అరుగు మీద కొంత మట్టి ఉండాలి కదా?ఏమైంది? కుమ్మరి : ఇదిగో ఈ కుండ.

పెద్ద మనిషి : ఓహో! ఈ కుండ తెచ్చి ఇందులో మట్టిని ఉంచావా? (ఆ కుండలోకి తొంగి చూచి), అరె కుండలో ఆ మట్టి లేదే?

కుమ్మరి : కుండలో కాదయ్యా! ఈ కుండ ఆ మట్టే.

పెద్దమనిషి : నేను మట్టిని అడుగుతుంటే నీవు ఖాళీ కుండను చూపిస్తావేం? కుమ్మరి : ఎందుకంటే ఆ మట్టే ఈ కుండగా తయారుచేశాను కనుక!

Page:655

ఆ కుమ్మరి చెప్పుచున్నట్లు మట్టియే మట్టికుండగా అయింది. కుండంతా మట్టి తప్పితే ఇంకేమీ లేదు. అట్లాగే చిన్మయం యొక్క భావాభావాలే ఈ జగత్తు యొక్క ఉనికిలేములు. కనుక, ఈ జగద్రూపదృశ్య విషయమంతా సచ్చిన్మాత్రమగుపరమాత్మ తప్పితే మరింకేమీ అన్యంగా లేదు. మంకి : అట్లాగా మహర్షీ! ఈ జగత్తే జీవునకు బంధము అని నా కనిపిస్తుంటే, మీరేమో 'ఈ జగత్తే పరమాత్మ'... అని ప్రతిపాదిస్తున్నారే! ఆశ్చర్యం! సరే, ఈ జగత్తు పరమాత్మమయం అనేది ఎట్లాగో విశదీకరించమని నా ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచం దేని చేత ఎరుగబడుతోంది? జ్ఞానంచే కదా! జ్ఞానం చేత తెలియ బడేది జ్ఞేయం’ కదా! “జ్ఞానం చేత ఏది తెలియబడుతోందో అది జ్ఞానరూపం" అని గమనించు.

జ్ఞానము లేకపోతే జ్ఞేయమే (తెలియబడేది) ఉండేది కాదు (లేక) తెలివి అనేది మొట్టమొదటే ఉండి ఉండకపోతే, ఇక 'తెలియబడేది' అనుదానికి ఉనికియే ఏర్పడదు కదా! కనుక,

బోధావ బుద్ధం యద్యస్తు బోధ ఏవ తదుచ్యతే

నా బోధం బుధ్వతే బోధో వైరూప్యాత్తేన నా న్యతా ॥

తెలుసుకొనుచున్న దాని 'తెలివి' ని అనుసరించే తెలియబడేది ఉంటోంది. తెలుసుకొనేది లేకపోతే 'తెలియబడేది' అనే దానికి ఉనికియే ఉండేది కాదు. కనుక, తెలుసుకొనేది తెలియబడే దానిలో తెలివి రూపంగా ఏర్పడి, ఆ తదనంతరం మాత్రమే 'అనుభవం' అనే సారరూపం ధరిస్తోంది.

కాబట్టి 'జ్ఞాన జ్ఞేయములు ఒక్కటే' అనే సిద్ధాంతం ఒనగూడుతోంది కదా! 'బ్రహ్మం' అనే రూపం గల ద్రష్ట యొక్క స్వయం పరికల్పిత దర్శన 'చమత్కారమే ఈ దృశ్య జగత్తు' అని వేదాంత శాస్త్ర నిర్ణయం.

ద్రష్ట - దర్శనం - దృశ్యం అనే మూడిటిలో, జాగ్రత్తగా పరిశీలించి చూస్తే 'జ్ఞానమే సారం’ అని తెలిసిపోతోంది. జ్ఞానానికి భిన్నంగా ఏదైనా ఉన్నదని భావిస్తే ... అది 'ఆకాశ పుష్పం' అనే శబ్దంలాగా అర్థరహితం. ఆకాశం అంటేనే శూన్యం. శూన్యంలో పుష్పం ఉండటమేమిటి? 'శూన్యంలో జగత్తు' అనేది కూడా మొదలే అర్థరహితం.

మంకి : "చూచేవాడు చైతన్యం. ఈ చూడబడే జగత్తు జడం" అని ఎందుకు అనగూడదు? ఎందుకంటారా? ఈ జగత్తు చూచేవానిని అనుసరించే ఉన్నదని నేనూ ఒప్పుకుంటున్నాను. కాని జగత్తే లేకపోతే “చూడబడేది అనే వ్యవహారమే ఉండేది కాదు కదా! కాబట్టి చూచేది - చూడబడేది

వేరు వేరేనని ఎందుకు అనుకోకూడదు?

శ్రీవసిష్ఠ మహర్షి : భలే ప్రశ్న వేశావయ్యా! నీ ప్రశ్నకు సమాధానం విను. తెలుసుకొనేదితెలియబడేది... ఈ రెండూ సజాతీయమా? విజాతీయమా? అనగా చైతన్యం, జడం అనేవి ఒకదానికి మరొకటి సంబంధించినవా? కావా?

మంకి : వేరు వేరైనవే కదా! అనుభవజ్ఞుడు వేరు - అనుభవము వేరు కదా!

Page:656

శ్రీవసిష్ఠ మహర్షి : వేరు వేరైనవైతే ఆ రెండూ ఎందుకు కలుస్తాయి? ద్రవం ద్రవాదులతోనే కలుస్తుంది కాని మట్టితోనో, రాయితోనే కలిసిపోదు కదా! తెలుసుకునే చైతన్యం తెలియబడే జగత్తులకు పరస్పర సంబంధం లేకపోతే అవి రెండు ఒకచోటికి వచ్చి ఎట్లా ఏకరూపం (అనుభవ రూపం)గా పరిణమిస్తున్నాయి?

మంకి : మీరు చెప్పినట్లు తెలియబడే జగత్తుకు, తెలుసుకునే 'చైతన్యం'నకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండబట్టే కలుస్తున్నాయి. ఒకటి రెండవదానికి సంబంధించినదే కాకపోతే అవి ఒక దానితో మరొకటి కలియవు. ఆ రెండింటిలో అనుభవ రూపమైన ఏకత్వము అంతర్లీనమై ఉంది. శ్రీవసిష్ఠ మహర్షి : ఆ రెండిటిలోను గల ఏకత్వమేదైతే ఉన్నదో ఆ ఏకత్వమునో బోధ స్వరూపరసం” అని పిలుస్తున్నారు. చెక్క-రాయి మొదలైన వాటిలో సద్రూపమగు బోధరూపత్వం (బోధ స్వరూపం, బోధతత్త్వం) ఉండకపోతే కుందేటికి కొమ్ము లేనట్లుగా... 1. చెక్కగా-రాయిగా అనుభవించేవాడు. 2. చెక్క-రాయిగా అనుభవించబడేది అను రెండిటి మధ్య అనుభవము' అనేది ఏర్పడేదే కాదు.

ఈ విధంగా బోధ (లేక జ్ఞానము)చే ఈ దృశ్యమంతా కేవల బోధరూపమే అగుచున్నది. మంకి : ఈ దృశ్యంలో రెండు వస్తువులు ఒకదానికి మరొకటి వేరువేరైనట్లు (అన్య-అన్యంగా) కనిపిస్తున్నాయి కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అన్యంగా భాసించినప్పటికీ, ఆ రెండింటిలో బోధ (లేక జ్ఞానం) అనునది ఒకే రీతిగా ప్రవేశించి 'అనుభవం' అను ప్రదర్శనం నీవు గమనించు. ఇది చెట్టు-అది పుట్ట" అని తెలుసుకుంటున్న తెలివి ఒక్కటే కదా! చెవితో వింటున్నట్టి - కళ్ళతో చూస్తున్నట్టి తెలివి ఒక్కటే కదా!

ఈ సిద్ధాంతం (లేక) సూత్రం నిరూపించటానికి ఇక్కడి 'జల తరంగాలు' అనే దృష్టాంతం తీసుకుందాం. నీవు సముద్రం ఒడ్డున కూర్చున్నావు. ఇప్పుడు ఎడంచేతి వైపు కుడిచేతి వైపు అనేక తరంగాలు కనిపిస్తున్నాయి. ఆయా తరంగాలన్నీ వేరువేరా?

మంకి : అవును, వేరు వేరే.

శ్రీవసిష్ఠ మహర్షి : అయితే ఎడంచేతి వైపు తరంగాలు ఎట్లా ఏర్పడుతున్నాయి?... జలం యొక్క స్పందన చేత. మరి... కుడివైపు తరంగాలు? అదే జలం యొక్క స్పందన చేతనే కదా! స్పందన (కదలిక) వేరైనా అన్ని తరంగాలు సముద్ర జలమే కదా!

అట్లాగే వ్యాప్తమగు జగద్రూపదృశ్య మంతా బోధరూపమే అయి ఉన్నది. అనగా, వేరువేరుగా తెలియబడే విశేషాలన్నీ ఒకే 'తెలివి' యొక్క ప్రదర్శనలే అయి ఉన్నాయి. అయితే ఇక్కడ మరో చమత్కారం. తెలివి” (బోధ, లేక జ్ఞానం) 'తెలియబడేది' గా (లేక బోధిత్వంగా, లేక జ్ఞేయంగా)

మారిపోతోందా? లేదు.

తెలివి (జ్ఞానం) తెలివిగానే ఉంటూనే 'తెలియబడేది' అనే దర్శనమును మాత్రం నిర్వర్తిస్తోంది. ఒక కొయ్యముక్కపై లక్కను వేడిచేసి పోశామనుకో, అవి రెండూ కలసి ఉంటున్నా... వేరువేరుగానే

Page:657

ఉండి ఉంటాయి కదా! కానీ 'బోధ' యందు తెలియబడే "ఆయా వేరువేరు విషయాలు అనేది లేదు. కనుక సమస్తము ఏకమే! అనేకం కాదు! అనునది ఇక్కడ సిద్ధించుచున్నది.

కానీ, కొయ్య-లక్క అనే రెండిటికి 'సంయోగం' అనుదానిచే ఏకత్వం ఉండవచ్చు గాక! ద్రష్ట - దృశ్యాల సంబంధం అట్టిది కూడా కాదు. ద్రష్ట ద్రష్టగానే ఉంటున్నాడు. కానీ దృశ్యాన్ని పొందు చున్నాడు. దృశ్యం ద్రష్ట యొక్క కల్పనను అనుసరించి ఉంటోంది. ద్రష్ట యొక్క బోధ స్వరూపమే దృశ్యంలో ప్రవేశించి ఉన్నది. ద్రష్ట లేకపోతే దృశ్యమే లేదు. కనుక ద్రష్ట-దృశ్యం ఒక్కటే.

అట్టి అన్యోన్య-అనన్యత్వానుభవమే నిజమైన ఏకత్వము.

కాబట్టి ఓ ప్రియ బాటసారీ! మంకీ! ఇక్కడంతా ఏకత్వమే తాండవిస్తోంది గాని, అనేకత్వము లేనేలేదు. ఒకవేళ ఇంకా అనేకత్వము అనుభవమవుతుంటే... అందుకు కారణం ఈ దేహాదుల పట్ల సుదీర్ఘ కాలంగా ఏర్పరచుకొని ఉన్న అహంభావన చేత మాత్రమే సుమా! "ఈ దృశ్యమంతా ఏదై ఉన్నదో, అదంతా నేనే" అనునదే 'సో హమ్' భవం (లేక) అద్వైతానుభవం.

ఇక్కడ ఒక రహస్యం (లేక) చమత్కారం.

"అహమ్|| ఇత్యేవ బంధాయ, “నా హమ్ ఇత్యేవ ముక్తయే ఏతావన్మాత్రకే బంధే స్వాయత్తే కిమ్ అశక్తతా?

ఈ దేహాదులందు ఏర్పరుచుకొన్న అహంభావనయే ఏకత్వానుభవమునకు ప్రతిబంధకంగా వచ్చి కూర్చుంటోంది. ఈ దేహాదులు నేను కాదు అను నా హంభావనను ఆశ్రయించావా, అప్పుడు నిన్ను పట్టి పీడిస్తున్న ద్వైతం నుండి నీకు ముక్తి కలుగుతుంది. "నేను శరీరాదులు కాదు. ఈ శరీరంలో గల ఇంద్రియాలకు విషయమగుచున్న జగద్విషయాలు నేను కాదు, నాది కాదు... అని అనుకుంటూ ఉన్నంత మాత్రం చేత ఇక్కడ అనుభవమగుచున్న బంధం తనంతట తానే స్వయంగా తొలగిపోగలదు. ఈ మాత్రం ప్రయత్నం చేయటానికి ఏం కష్టం? ఇది కుదరదని అనుకో దలిస్తే అట్టి జీవుని ఈ సంసారం నుండి ఎవరూ కాపాడలేరు.

ఒకాయనకు మెల్లకన్ను దోషంచేత రెండవ చంద్రుడు కనిపిస్తున్నాడనుకో... ఆ రెండవ చంద్రుడు ఎప్పటి నుండి ఎవరిచే సృష్టించబడి కనిపిస్తున్నాడు? - అనే ప్రశ్నకు సమాధానమే మున్నది? అసలు ఆ రెండవ చంద్రుడు ఉంటే కదా, ఒకప్పటి నుండి ఉండటం? "మృగతృష్ణలో జలం ఎంత కాలం నుండి ఉన్నది?" అన్న ప్రశ్నకు సమాధానం ఏముంటుంది? మృగతృష్ణలో జలం భ్రమ మాత్రమే కదా! అలాగే 'అహంభావం' అనేది అసత్తుగా ఆవిర్భవించినదని, అసత్తు కాబట్టి ఆవిర్భవించనే లేదని కూడా అంటూ ఉంటారు. అట్టి దేహాహంకారమునకు అనుభవమయ్యే ఈ దృశ్య జగత్తు, అట్టి దృశ్య జగత్ సంబంధమైన అహంకారం కూడా అసత్తుల్యం మాత్రమే. మమే_దమ్ ఇతి బంధాయ నాహమ్ ఇత్యేవ ముక్తయే ఏతావత్ మాత్రకే వస్తుః ఆత్మాయత్తే కిమజ్ఞ తా?

Page:658

ఇదమ్ మమ (ఇది నాది)...అను మమత్వ బుద్ధి - ఇదే బంధానికి కారణం. నా హమితి (ఇవి నావి కావు) - అను మమత్వరాహిత్యమే బంధముక్తి.

1.ఇవి నావి అని తలచటం, 2. ఇవేవీ నావి కావు అని తలచటం... ఈ రెండూ ఎవరికి వారికే తమ చేతిలోనే ఉన్నది కదా! కనుక బంధము-బంధ విముక్తి ఎవరికి వారికే వారి చేతిలోనే ఉన్నది. 'నావి కావు' అనుబంధ విముక్తి ప్రయత్నంలో 'అయ్యో! నేను ఆజ్ఞానిని కదా'... అని వాపోవలసిన అగత్యమేమిటి? ఇందులో 'తెలియకపోవటం' అనే ప్రసక్తి ఎక్కడిది?

మంకి : ఇవేవీ నావి కావు - అని అనుకోగానే మోక్షం సిద్ధిస్తుందని మీరు ప్రవచిస్తున్నారు. కానీ అది అంత సులభమంటారా? ఈ సందర్భంగా లోక ప్రతీతమైన కొన్ని సిద్ధాంతాలు ఇక్కడ ఉదహ రించి, వాటి పట్ల అనుభవం దృష్ట్యా మీ అభిప్రాయాలు చెప్ప వేడుకొంటున్నాను.

1. కుండ-బదర న్యాయం : ఒక రేగు పండు కుండలో ఉన్నది. ఆ రేగు పండు కుండచే కప్పబడి ఉండటం చేత మామూలుగా కనిపించటం లేదు. కుండలోకి చూడకుండా రేగుపండు కనిపించడం లేదు కాబట్టి లేదు. కుండ కనిపిస్తోంది కాబట్టి ఉన్నది అనేది యుక్తియుక్తం కాదు.

అట్లాగే సత్యమగు ఆత్మ అసత్యమగు అహంకారం నందు ప్రవేశించి ఉన్నది. అహంకారం చేత కప్పబడి ఉండటంచే ఆత్మ కనిపించడం లేదు. అహంకారం యొక్క అంతరంలోకి తొంగిచూస్తే ఆత్మ అగుపిస్తుంది.

2. ఘటాకాశన్యాయం : ఆకాశం అంతటా ఉన్నది. ఒక కుండలోను, బయట కూడా ఉన్నది. కుండ ఉన్నంత కాలం కుండ వల్ల - ఘటాంతరాకాశం, ఘట బాహ్యాకాశం - ఏర్పడుచున్నాయి. ఘటం పగిలితే ఉభయాకాశాలు ఏకమౌతాయి. అట్లాగే అహంకారం ఆత్మను జీవాత్మగా, పరిణ మింపజేసింది. అహంకారం తొలగితే (కుండ పగిలితే ఉభయాకాశాలు ఏకమగునట్లు) జీవాత్మ - పరమాత్మ ఏకమౌతాయి. అప్పటిదాకా జీవుడు జీవుడుగానే ఉంటాడు.

3. జడాంశ-బోధాంశ సమాగమం: 1. జడము, 2. బోధ. ఈ రెండు ఎక్కడ కలుస్తాయో అక్కడ ‘ఆత్మ అనే నూతన విషయం ఏర్పడుచున్నది. అవి విడిపోతే ఆత్మ అనేది ఉండదు. ఆత్మ జడాంశంలో జడంగా, బోధాంశంలో బోధ రూపంగా ఉండి ఆ రెండూ కలసినప్పుడు స్ఫురిస్తోంది. కలియ నప్పుడు నిర్విషయమై ఉంటోంది. (ఇది జైమిని మతానుయాయుల సిద్ధాంతం)

4. అనేకాత్మవాదం : ప్రతి జీవికి ఒక ఆత్మ ఉన్నది. ప్రతిజీవి ఒక్కొక్క ప్రత్యేక ఆత్మయే. ఇందులో జంతు ఆత్మలు, మానవ ఆత్మలు, దేవతా ఆత్మలు వేరు వేరుగా ఉన్నాయి. వీటన్నిటికీ పరమాత్మ సర్వాధికారి. జీవాత్మ వాసనలచే కప్పబడి ఉంటుంది. పరమాత్మ నిర్మలమై, వాసనారహితమై ఉంటుంది.

ఈ నాలుగే కాక, ఇంకా అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. వీటివీటిపై మీ ప్రవచనమేమిటో, ఇందులోని సత్యాసత్యాలు ఏమిటో వాటిని ఆశ్రయించటంచే ఆ తదనంతరం పర్యవసానమేమిటో విశదీకరించండి.

Page:659

శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మ అపరిమితమైనది. ఈ జీవుడు దేహ-మనో-బుద్ధి స్వరూపుడు కాదు. దేహ-మనో-బుద్ధులు పరిమితమైనవి. కనుక, 'కుండలో రేగుపండు'... అనే 'కుండ బదర న్యాయం’ యుక్తియుక్తం కాదు. అపరిమితమైన ఆత్మ పరిమితమగు దేహంలో దాగుకొని ఉండటమేమిటి?

అది అసమంజసం.

ఆత్మ అపరిచ్ఛేద్యమైనది. అది దేహాదులచే పరిచ్ఛేదం పొందటమేమిటి? కుండలో ఆకాశం - బయటగల ఆకాశం... అనే ఘటాకాశ న్యాయం అనేది కూడా ఆత్మకు వర్తించజాలదు. ఆత్మకు 'ఈ దేహం-ఆ దేహం' అనే పరిభేదం, విభాగాలు ఉండవు. ఆత్మ సర్వదా అఖండము. (అది నిరూపిస్తోంది కనుకనే ఈ గ్రంథానికి 'అఖండ రామాయణం' అనే పేరు వచ్చింది). అది సర్వదా దేహ-మనో-బుద్ధ్యాదులకు అప్రమేయం. (వాటితో దేహానికి ప్రమేయం లేదు. కనుక 'ఘటాకాశ న్యాయం’ అనేది కూడా ఆత్మకు యుక్తియుక్తం కాదు.

ఆత్మకు వేరుగా జడాదులకు ఉనికియే లేదు. 'జడము' అనే అనుభవం ఎవరికి? జడము' అనేది ఆత్మయొక్క అనంత అనుభవ పరంపరలలో ఒకానొకటేగాని జడమునకు (తెలియబడుదానికి) వేరుగా ఉనికి లేదు. ఆత్మ అనుభవించేది. జడము అనుభవించబడేది. అయితే, ఆత్మకు మాత్రమే ఉనికి ఉన్నది. ఆత్మ ఎక్కడ తన సత్విన్యాసం ప్రకటిస్తే అక్కడ మాత్రమే జడానుభవం అనేది భావాభావాలను అనుసరించి ఉండగలదు. కనుక జడ-బోధల కలయికచే 'ఆత్మ' అనేది అనుభవమౌతోంది... అనేది యుక్తి వాక్యం కాజాలదు.

‘ఆత్మ ఉండటంచేత 'జడము' అనే ఒకానొక అనుభవంగా ఉండగలుగుతోంది'... అనునదే అసలైన సిద్ధాంతం. వాస్తవానికి 'జడము-అజడము'... అనే రెండు లేవు. ఉన్నట్లు కనబడటమంతా స్వప్న సదృశ్యమే. "ఆత్మ యొక్క ఒకానొక స్వభావమే జడము... అనేది కూడా కుదరనది కాదు. ఆత్మయొక్క దృష్టికి ముందే 'దృక్' స్వరూపమగు ఆత్మ ఉన్నది. 'స్వపద్రష్ట' లేడుగాని... స్వప్నం ఉన్నది.... అనే మాటకు అర్థం లేదు కదా! అట్లాగే ద్రష్ట లేకపోతే జడము లేదు, అజడము లేదు, జగత్తు లేదు.

'అనేక ఆత్మలు' అనేది దేహము దృష్ట్యా, మనస్సు దృష్ట్యా, బుద్ధి దృష్ట్యా అనిపించవచ్చు గాక! కానీ, ఆత్మ దేహ-మనోబుద్ధులకు మునుముందుగాని ఉన్నది.

కనుక ఓ ద్విజుడా! నీవు అఖండం, అప్రమేయం, నిత్యం, సత్యం, దృశ్యరహితం, సర్వం అగు ఆత్మవే అయి ఉన్నావు. అట్టి నీ యొక్క సత్ చిత్ స్వరూపమునకు మనోబుధ్యహంకారాది ఏ జాడ్యమూ లేదు. 'కాదు. అనేక ఆత్మలు ఉన్నాయి. అందులో నేనొక ఆత్మను... అనే రూపం గల అనేకాత్మవాదాన్ని ఆశ్రయించి ఉన్నావా.. స్వవాసనల చేత, దేహాభిమానం చేత ఆత్మతత్త్వమును ఏమరచి పర్వతం మీద నుండి క్రిందపడే శిలవలె ఉచ్చ నీచ ఉపాధి పరంపరల ప్రవాహంలోకి జారిపడతావు సుమా! "వాసనలచే ఇటూ అటూ కదలే మనస్సే తన స్వభావంగా భావించే జీవుడు పొందే దుఃఖ పరంపరలను లెక్కించనలవి కాదు... అని నా హెచ్చరిక.

Page:660

తమ తమ వాసనలచే, దేహ అభిమానం చేత రాగాది ఆయా రసములందు అనురక్తులగు జనుల చేతితో కొట్టబడిన బంతి వలె అనేక జన్మలందు పరిభ్రమిస్తున్నారు. చిరకాల క్లేశాలచే ఎంతగానో శైథిల్యం అనుభవిస్తున్నారు. కాలాంతరమున స్థావర - క్రిమి - కీటకాది అన్య రూపత్వమును అవధరిస్తున్నారు.

ఓ బాటసారి! మంకీ! నీవు ఆత్మస్వరూపుడవేగాని, దేహ స్వరూపుడవు కాదు. ఇందులో నీవు సందేహించవలసినదేమీ లేదు. ఇక దుఃఖమెందుకో చెప్పు?

4. బ్రహ్మమయమ్ జగత్

మంకి : అయితే, మునీంద్రా! మరి ఆత్మయే నా స్వరూపము అయి ఉండగా నాకు 'అసంతృప్తి'... అనే స్థితి, 'జడదేహధారిని' అనే భ్రమ ఎందుచేత, ఏ ప్రభావం చేత కలుగుచున్నాయి? శ్రీవసిష్ఠ మహర్షి : ప్రతి జీవునికి ఎదురుగా రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గము ఉచితమో, ఏది అనుచితమో అతడే తేల్చుకోవాలి. అయితే, ఆ రెండు మార్గాలు ఏమిటో ఇక్కడి విశదపరుస్తాను. 1. ఆత్మతత్త్వ మార్గం, 2. సంసార మార్గం.

సంసార మార్గం : నేను వేరు - నీవు వేరు - తదితర జీవులు వేరు. నేను ఒక మానవుణ్ణి, అది ఒక కీటకం, ఈయన ఒక బ్రహ్మదేవుడు... ఈ సంసార మార్గంలో పయనించే జీవుడు స్థావర-క్రిమికీటకాది జన్మరూపమగు పరిస్థితులకు లోను అగుచున్నాడు. ఛేదన-భేదనాలు, ఆకలి-దప్పులు, జనన-మరణాలు ఆతనిని ఆయా దేహాదులతోబాటే వెంబడిస్తున్నాయి. 'అడవిలో ఉండే అనేక శిలలులాగా ఈ సమస్తం పరస్పరం వేరు వేరు' అను అనుభవం ఎక్కడి నుండి బయల్వెడలుతోంది? ఈ జీవుని భావనలో నుండే! భావన చిత్తం లోంచి బయల్వెడలుతోంది. చిత్తం అంధత్వంతో కూడి, పూర్వవృత్తాంత వాసనలతో నిండినదై, రాగ ద్వేషములనే రంగులు పులుముకున్నదై ప్రవర్తిస్తోంది. చిత్తమే భావనకు మూలం.

అహో!బత! విచిత్రాణి! వాసనావశతో అవశైః | భూతకైరనుభూయన్తె, సుఖదుఃఖాని జన్మసు ॥

ఆహా! ఏమి ఆశ్చర్యం! ఆత్మయే తమ స్వరూపమై ఉండి కూడా ఈ జీవులు తమ వాసనలకు వశులై వివిధ జన్మలు, ఆ జన్మలలో అనేక చిత్ర విచిత్ర సుఖ-దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారే! దేని యొక్క ప్రభావం చేత మిథ్యాభూతాలైన త్రిపుటి రూప పదార్థములను (ద్రష్ట-దర్శనం-దృశ్యం, వినేవాడు-వినికిడి-వినబడేది మొదలైనవి)... ఈ జీవుడు అనుభవిస్తున్నాడో ... అట్టి వాసన ఎంత భయంకరమైనది!

ఈ ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు ఉన్నారు. ఆ ఉభయులు కలసియే కాలం గడుపుచున్నారు. అయితే వాళ్లిద్దరి మధ్య అంతరం అంతఃకరణ సంబంధమైనది.

Page:661

1. జ్ఞాని - ఈతడు ఆత్మానందముచే ప్రసన్నుడై ఉంటున్నాడు. నిరంతరం ఆత్మామృతమైన తృప్తిని అనుభవిస్తున్నాడు. తాను శుద్ధుడై, అంతటా తన యొక్క జ్ఞాన ప్రకాశముచే ప్రసరిస్తూ, ప్రకాశ ప్రదుడై ఉంటున్నాడు. సమస్త పదార్థముల పట్ల శీతలాంతఃకరణుడై మెలగుచున్నాడు. ఈతనిని పూర్ణచంద్రుని ప్రశాంతప్రకాశంతో పోల్చవచ్చు. ఆతడు - ఈ కనబడే సర్వజీవులను లోకాలను తన స్వరూపంగా గాంచుచున్నాడు.

2. అజ్ఞాని - ఈతడు తన సమక్షంలో తారసపడుచున్న ఆయా జగద్విషయాల పట్ల పూర్వాపర విచారణ చేయడం లేదు. సత్-అసత్ వివేకాన్ని వదలి ఉండటం చేత అనుచితమైన విషయాలను అసంఖ్యాకంగా, అవిశ్రాంతంగా కోరుకుంటున్నాడు. (ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్ఠం మొదలైన) శాస్త్రములు అందజేస్తున్న ఆతని స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారం ఆతడు పట్టించుకోవడం లేదు. ఒకవేళ అక్కడా ఇక్కడా కొంత విన్నప్పటికి నేను ఈ కనబడే సర్వ పదార్థములకు, సర్వ సంఘటనలకు అసంబంధితమై, అప్రమేయమై, నిత్య నిర్మలమై... సర్వదా ప్రకాశించే ఆత్మనే అనే అనుభవంలో ప్రవేశించక, ఎక్కడికెక్కడో తారట్లాడుచున్నాడు. పసిబాలుడు నాయనా! అట్లా దూకకురా! పడతావు. ఇది తినకురా! తెల్లవార్లు అరగక మూలుగుతావు'... అని చెప్పుచున్నా కూడా అంతే! నేను దూకుతాను. నేను తింటాను... అని మారాం చేస్తాడు చూచావా! అట్లాగే అజ్ఞాని చెప్పినా వినక, స్వస్వరూపాన్ని వివేక దృష్టితో అవగాహన చేసుకోక... మూర్ఖత్వం వహించి ఉంటున్నాడు.

అట్టి మూర్ఖత్వమే అన్ని దుఃఖాలకు మూల కారణం. "ఇది ఇష్టం, అది అయిష్టం. ఇది శుభము, అది అశుభం"... అనే సాంసారిక విశేష పరంపరలచే ఆకర్షించబడి ప్రాణాలు పోయే వరకు అవివేక మనస్కుడుగానే అజ్ఞాని ఉంటున్నాడు. అంతేగాని, శాస్త్రాలు అందించే ఉత్తమ పాఠ్యాంశాన్ని అంతర్గతం చేసుకోవటం లేదు. అట్టి అవివేకికి 'ఎఱ'ను చూచి గాలము వైపు పరుగులు తీసే చేపకు తేడా ఏమున్నది?

ఓ ప్రియ జనులారా! మీరు ప్రియం కదా! అని భావించే దేహ-స్త్రీ-పుత్ర-ధనాది సమస్త పదార్థములు కూడా ఎండిన ఇసుకతో తయారుచేయబడిన మూకుడు వలె అతి త్వరలో విచ్ఛిన్నం కానున్నాయి. ఏ ఇంద్రియాలతో విషయాలు పొందుచున్నారో, ఆ ఇంద్రియాలే కాలగతికి నశించటం (తదితర జీవుల పట్ల) మీరు గమనిస్తున్నదే కదా! ఇంద్రియాలు ఎంతగా నమ్మతగినవో, విషయాలు అంతే నమ్మతగినవి సుమా!

మంకి :అనేక జన్మ పరంపరలు' అనే సాంసారిక మార్గంలో ప్రవేశించిన మాకు గతి ఏమిటి? నిర్గతియేనా?

శ్రీవసిష్ఠ మహర్షి

ఆ బ్రహ్మస్తమ్భ పర్యంన్తమపి యోని శతేషు తే | ఆకల్పం భ్రమతః చిత్తశాంతిః నాస్తి శమాదృతే ||

Page:662

పురుగు నుండి బ్రహ్మ వరకు గల అనేక వందల యోనులలో అవిశ్రాంతంగా ప్రవేశ నిష్క్రమణలు నిర్వర్తిస్తూ పరిభ్రమించే ఈ జీవ బాటసారికి ఇంద్రియ విషయములపట్ల ధ్యాస కలిగి ఉన్నంత వరకు చిత్తశాంతి కలుగుట లేదు. చిత్తశాంతి కలగాలంటే ఇంద్రియములకు సంబంధించిన అభినివేశము శమింపజేసుకోవాలి. మఱింక దేనిచేతాకూడా చిత్తశాంతి కలుగదు. కాలి క్రింద చూచుకుని నడిచే వానికి బాటలోని ఎత్తు పల్లాలు బాధించవు కదా! 'వివేకము’ ఆశ్రయించి ఉండేవానికి బంధము యొక్క లేశము కూడా ఉండజాలదు. కనుక వివేకముచే శమమును ఆశ్రయించి ఉండాలి సుమా!

ఓ మంకీ! ఈ సాంసారిక వ్యవహారము పట్ల సావధానుడవై ఉంటే చాలు. (వివేక రహితంగా) అసావధానమైన చిత్తమును మాత్రమే 'కామము' అనే సాంసారిక పిశాచి మ్రింగగలుగుతోంది. మంకి : సావధానుడనై ఉండటం'... అనగా మీ ఉద్దేశం?

శ్రీవసిష్ఠ మహర్షి : మనస్సు స్వస్వరూప విభాగమును ఏమరచి 'ఇచ్ఛ' అను మార్గముతో ప్రవేశించి ఈ కళ్లు మొదలైన ఇంద్రియముల ద్వారా ఇంద్రియవిషయముల వైపు ప్రసరణమై ఉంటోంది.

ఆత్మ మనస్సుఇచ్ఛ కళ్లు మొదలైన ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు (జగత్తు)

మనస్సు నందలి "రూపాదులను చూడాలి అనే ఇచ్ఛ నేత్రాది ఇంద్రియాలలో ప్రవేశించి ఆయా విషయాల వైపు ప్రసరించి ఈ జగత్తును పొందుతోంది. ఆత్మను ఏమరచినప్పటి వివేక రాహిత్యమే అసావధానత్వం. అట్టి అసాధానపూర్వకమైన మనో విభాగం స్ఫురణమాత్రం చేత అహంకార సహితమగు ఈ సువిస్తార జగత్తుగా స్థితి పొంది ఉన్నది. కళ్లు తెఱచినప్పుడు రకరకాలైన ఆకారాదులుగా కనిపించే ఈ జగదృశ్య విశేషాలు కళ్లు మూయగానే కనిపించకుండాపోతాయి చూచావా? బహిర్ముఖమైన సంవిత్తు (జ్ఞానం) అంతర్ముఖమై ఆత్మయందు సంలగ్నం అయిన మరుక్షణం ఈ సమస్త దృశ్యం స్వయంగా క్షయించగలదు. ఒకే వాయువు తన యొక్క చలనాన్ని తానే విస్తరింపజేయునట్లు శుద్ధ చైతన్యం కొంచెం స్ఫురణమాత్రం చేత తనయందు తానే అసత్తే అయినట్టి అహంకార సహితమగు ఈ సమస్త జగత్తుగా విస్తరిస్తోంది. దృష్టాంతానికి –

1. వాయువు - ఒకానొక తరంగంగా 'అసత్తు'. తనయందు తానే అనేక తరంగాలుగా ప్రదర్శించే వాయువు సత్తు.

2. జలం - తనయందు తానే అనేక తరంగాలుగా విస్తరిస్తోంది. ఒక్కొక్క తరంగంగా అసత్తు ప్రతి తరంగం జలమే. కనుక అన్ని తరంగాలలోను ఉన్న జలంగా ప్రతితరంగం సత్తే! జలంలో అనేక తరంగాలు ఉన్నాయి కాని ఆ తరంగాలలో అనేక జలాలు లేవు. ఎందుకంటే ఈ తరంగ జలం - ఆ తరంగ జలం వేఱువేఱు కాదు. తరంగాలన్నిటిలో గల జలం చూస్తుంటే అది అంతర్ముఖం’, జలంలో గల అనేక తరంగాలను చూస్తుంటే అది 'బహిర్ముఖం’.

అట్లాగే... చిదాకాశం ఈ అనేక జీవాహంకారాలుగా తన యందు తానే (తాను తానుగా ఉంటూనే) ప్రదర్శిస్తోంది. ప్రతి జీవాహంకారం తనదైన శైలిలో జగద్దర్శనం చేస్తోంది.

Page:663

ఒక్కొక్క జీవునిగా (అహంకార సహిత జగత్ దర్శనానుభవంతో సహా) ఆసత్తు! చిదాకాశము తన యందు తానే ఈ అహంకార సహిత జగత్తు యొక్క దర్శనం చేస్తోంది. కనుక చిదాకాశంగా ప్రతి జీవుడు సత్తే.

ఈ ప్రత్యేక జీవరూపంలో చిదాకాశం తన యందు తానే అవిద్యావృత జగత్తుగా విస్తరింప జేస్తోంది. ఈ జగత్తు అనేకత్వం దృష్ట్యా అసత్తు. చిదాకాశమే ఇద్దాని 1. విస్తారణ, 2. కారణ కారణం. కనుక... ఇది చిదాకాశంగా సత్తు. యథార్థానికి బ్రహ్మసంవిత్తు తన నుండి తనకు వేఱుగా ఏదీ రచించడం లేదు. జలం తన నుండి వేరుగా 'తరంగం' అనేదేదీ రచించటం లేదు. కదా! అసత్యమే అయి ఉండి కూడా ఈ జగత్తు 'సత్యం వలె' (చిదాకాశం కంటే వేరుగా ఉన్నట్లు) విజృంభిస్తోంది.

మంకి : స్వామీ! ఈ సత్ అసత్లను విడదీయగలగటానికి సామర్థ్యం పొందే ఉపాయం చెప్పండి. శ్రీవసిష్ఠ మహర్షి :

సదివాసత్యమే వేదమ్ అకుర్వత్యన్య మేధతే ॥

మృదా హేమ్నేవ కుంభత్వమ్ అపృథక్ లభ్యమాత్మగమ్ II

బంగారు ఆభరణం నుండి బంగారమును ఆభరణమును వేరుచేసి చూపగలమా? మట్టి కుండలోంచి మట్టిని-కుండను విడిగా తీసి చూపగలమా?

మంకి : లేదు. బంగారమే ఆభరణమగుచున్నది. కనుక బంగారము-ఆభరణము వేరుకాదు. మట్టియే కుండ అగుచున్నది. మట్టిని-కుండను వేరు పరచడం అర్థం లేని మాట.

శ్రీ వసిష్ఠ మహర్షి : బాగు! మట్టి కుండలోనుంచి కుండను అట్టేబెట్టి మట్టిని వేరుగా ఎట్లా చేయ లేమో, బంగారు ఆభరణం లోనుంచి ఆభరణాన్ని అట్టేబెట్టి బంగారం వేరుగా ఎట్లా చేయలేమో... అట్లాగే ఈ జగత్తును బ్రహ్మచైతన్యం నుండి వేరుచేసి పొందటం (జగత్తు నుండి బ్రహ్మ చైతన్యాన్ని వేరు చేసి చూడటం) సాధ్యం కాదు.

ఎందుచేత?... ఆభరణం సత్యం కాదు. బంగారం సత్యం. కుండ సత్యం కాదు. మృత్తిక సత్యం. తరంగం సత్యం కాదు. జలం సత్యం.

అదే బంగారం ఎన్ని ఆకారాలైనా పొందగలదు. అదే మట్టి కుండ-బొమ్మ... ఎన్నెన్ని రూపాలైన పొందగలదు. అదే జలం తరంగాలుగా ఆవృత్తాలుగా ఎన్ని రూపాలైనా పొందగలదు. జీవుడుగా కనిపించే ఈ చైతన్యం (జీవ చైతన్యం, అదే చిదాకాశం కూడా)... పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏ స్వరూపమైనా పొందగలిగే తత్త్వం తనయందు ఇముడ్చుకునే ఉన్నది. ఏ ఆభరణత్వ మైనా (ఏ ఆకారమైనా) పొందగలిగే బంగారానికి ఆకారం ఉన్నట్లా? లేనట్లా? లేనట్లే. అట్లాగే జగత్తుగా ప్రదర్శితమయ్యే బ్రహ్మ సంవిత్తునకు జగదత్వం (రూప-నామాదులు) లేనట్లే. కనుక జగత్తు మిథ్య. (బంగారానికి ఆకారం మిథ్య. మృత్తికకు కుంభత్వము మిథ్య .. వలె)

శూన్యమాత్రం యథా వ్యోమ, స్పందమాత్రం యథా అనిలః

జలమాత్రం యథా ఊర్మ్యాది సంవిన్మాత్రమ్ తథా జగత్ |

Page:664

ఆకాశానికి ‘ఇది తూర్పు ఆకాశం, అది పడమర ఆకాశం, ఇది నైరుతి ఆకాశం' - - మొదలైనవి ఉన్నాయా?... లేవు. ఆకాశమంతా శూన్యమాత్రమే.

'ఇది పెద్ద తరంగ జలం అది చిన్న తరంగ జలం. ఇది ఆవృత జలం. అది నిశ్చల జలం” మొదలైనవి జలానికి ఉన్నాయా? లేవు. తరంగాలు, ఆవృత్తాలు, సుడులు, బుడగలు... అన్నీ కూడా జలమే! జలానికి ఆ అనేకత్వాలు లేవు. వాయువుకు ఇది పిల్లగాలి, అది సుడిగాలి, ఇది తుపాను గాలి, ఇది తరంగ రహిత వాయువు'... మొదలైనవి లేవు కదా! పిల్లగాలి, సుడిగాలి, తుపాను గాలి, కదలిక లేని గాలి... అన్నీ ఒకే గాలి. (ఒకే వాయువు)

అట్లాగే ఈ జగత్తు ఇందులో నేను- -నీవు-వాడు మొదలైన విభాగాలు ఇవేవీ లేవు. జగత్తంతా చిన్మాత్రమే!

మంకి : స్వామీ! మరి మనస్సు, ఆ మనస్సుకు అనుభవమయ్యే స్థావర - జంగమ పదార్థాలు కనిపిస్తున్నాయి కదా!

శ్రీవసిష్ఠ మహర్షి : కనిపిస్తున్నాయి. అయితే ... మనస్సుకు జగత్తుగా కనిపిస్తున్నదంతా ఏ విధంగా అభ్యసించాలో ...అది చెపుతాను.

అవ్యవచ్ఛిన్న నిర్భాగ సంవిన్మాత్రం జగత్రయం |

విద్ధి శాంతం తథావ్యోమ యథా, 'వారిణి పర్వతమ్||

జలంలో ఒక పెద్ద కొండ ప్రతిబింబిస్తోందనుకో... ఆ జలంలో ఉన్నది కొండా? కాదు. జలంలో జలం మాత్రమే ఉన్నది. అయితే కొండగా కనిపించేది? కొండగా కనిపించేది కూడా జలమే. అట్లాగే ఓ ప్రియ బాటసారీ! ఈ ముల్లోకాలు, ఇందులో కనిపించే సజాతీయ-విజాతీయ, స్వగత-పరగత వ్యవహారమంతా భేదరహితమగు 'బ్రహ్మ సంవిన్మాత్రమే' అని గ్రహించు.

ఈ ప్రకారంగా జగత్తత్వం గురించి ఎరిగి ఉపశాంతుడై, ముక్తుడై ఉన్న జ్ఞాని యొక్క అంతఃకరణం అపూర్వ శీతలత్వంతో పూర్ణ చంద్రుని వలె వెల్లివిరుస్తుంది. ఓ మిత్రమా! ఈ జగత్తు సర్వదా 'పరమశాంతమై, దృశ్య శూన్యమై, సర్వ వ్యాపకమై' ఉన్నట్టి బ్రహ్మం మాత్రమే అయి ఉండగా ఇక ఇందులో 'నేను అజ్ఞానిని. ఇది తెలుసు. అది తెలియదు'... అనే ప్రకాశ రాహిత్యం గాని, దీనిని ప్రకాశమానం చేసే మరొకటిగాని, దీనిని బ్రహ్మంగా మరల్చే ఏవో సాధ్యాసాధ్యాలు గాని ఎక్కడ ఎట్లా ఉంటాయి చెప్పు?

ఎందుకంటావా?... బ్రహ్మము' అనే శబ్దంచే ఏ చైతన్య సత్త ఉద్దేశించబడుచున్నదో... అదియే సమస్త పదార్థముల యొక్క నిజరూపమై ఉన్నది. అందుచేత ఈ జగత్తు బాధ్య-బాధక రహితమై, అద్వయమైనట్టి బ్రహ్మమయంగానే వెలయుచున్నది. ఈ సమస్తం బ్రహ్మమే! (సర్వమ్ బ్రహ్మమయమ్ జగత్, సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ, జీవో బ్రహ్మేతి నాపరా మొదలైన శ్రుతి వాక్యాలు)

Page:665

5. మనస్సును అధిగమించటం ఎట్లా?

మంకి : మహర్షీ! ఈ రోజెంత సుదినం! అనేక ప్రక్క త్రోవలు పట్టిపోతున్న దీనుడనగు ఈ మంకి నామధేయ బాటసారిని మీరు సంశుద్ధపరుస్తున్నారు. సముద్ధరిస్తున్నారు.

స్వామీ! ఇక్కడ నాదొక సందేహం. ఈ జగత్తులో ప్రవేశించి సదేహులమై మేము కొన్నిటిని చూచి సుఖిస్తున్నాం. మరికొన్నిటిని చూచి దుఃఖిస్తున్నాం. ఎప్పటి నుండి తెచ్చిపెట్టుకున్నామో గాని... ఈ సుఖ దుఃఖాలు మమ్ములను ఎక్కడినుండో తరిమి తరిమి ఇక్కడకు జేర్చాయి. మరి మీరేమో, “మీరంతా సుఖమయమగు ఆత్మస్వరూపులయ్యా... అని సిద్ధాంతీకరిస్తున్నారు. ఈ సుఖదుఃఖాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎందుకు అనుభూతమౌతున్నాయి?

శ్రీవసిష్ఠ మహర్షి : వేనియొక్క 'బాధ' నీకు అనుభూతమౌతోందో... అట్టి పదార్థముల యొక్క విచారణ చేయి. విచారణ లేకపోవటమే అన్ని జాడ్యాలకు మూలం సుమా! వాస్తవానికి ఆయా బాధించే పదార్థముల యొక్క నామ రూపములుగాని, ఆయా బాధాసాధనములుగాని, వాటి వ్యుత్పత్తి మొదలైన వికారాలుగాని (విచారణ చేసి చూస్తే) లేవు. ఆకాశపుష్పంలాగా అవి భ్రమచేతనే ఏర్పడుచున్నాయి. ఉదాహరణకు, ఈ వాక్యం వినగానే నాకు కోపంగాని, సంతోషంగాని, దుఃఖం గాని, గర్వంగాని ఎందుకు అనిపిస్తోంది?...అని విచారణ చేస్తే వాటికి ఒక పరిధి తరువాత కారణమే దొరకదు. ఆకాశంలో పుష్పం కనిపించటానికి కారణం లేనట్లే స్వప్నంలో ఏవేవో కనిపించ టానికి కారణం లేనట్లే, వాటికీ కారణం లేదు. కారణం లేనివి మిథ్యమాత్రమే.

సోదరా! నీవు మనస్సును అధిగమించు. మనస్సు దృష్ట్యా కనబడేవన్నీ మనస్సును అధిగమిం చినపుడు రహితమౌతాయి. మనస్సుకు అనిపించేవి మనస్సుకు సంబంధించినవే గాని నాకు సంబంధించినవి కావు అని గ్రహిస్తూ ఉండు. జ్ఞాన బలంతో మాత్రమే మనస్సును అధిగమించ గలవు. అదే మనోరాహిత్యం. మనస్సును అధిగమించి, అప్పుడు శేషించే జ్ఞానరూపంచే ఒక మహాశిల వలె నిశ్చలంగా స్థితి పొంది ఉండు. అట్టి నీయొక్క జ్ఞానరూపం మనోవికల్ప రహితమై, ఈ నేత్రాది ఇంద్రియ వర్జితమై (వాటికి అసంబంధితమై), అనంతమై, అజమై, అవ్యయమై ఉన్నది. ఆ నీ ఘనీభూత జ్ఞానస్వరూపమే 'బ్రహ్మం' అనే పేరుతో చెప్పబడుతోంది.

మనస్సును అధిగమించటమంటే? మనస్సుకు అద్దాని చర్యలతో సహా చూరగొనకపోవటమే! అనగా, అద్దానిని (దాని చాంచల్యాది క్రియా విశేషములతో సహా) లెక్క చేయకపోవటమే! ఏ జ్ఞాని అయితే ఆకాశమును బోలి శుద్ధమైనట్టి తనయొక్క ఆత్మ రూపమున స్థితినొంది ఉంటాడో ఆ జ్ఞానికి నామ రూపాల ప్రతీతి ప్రసక్తి ఉండదు. అట్టి ఆత్మస్థితి యొక్క అభ్యాసదార్థ్యం లేకపోవుట చేతనే నామరూపాలు నిన్ను బాధిస్తున్నాయి. జాగరూకుడు కానివానికి నిద్రవచ్చి కలలు చోటుచేసు కుంటాయి చూచావా? అట్టి స్వప్న వికారాలు లాగానే తన యొక్క ఆత్మస్థితిని ఏమఱచినంత మాత్రం చేతే 'దేహం-దృశ్యం-జన్మ-మృత్యువు'... వంటి భ్రమలు ఎదురుగా నిలుస్తున్నాయి.

Page:666

మనస్సులో నామ-రూపాలు ఉన్నప్పుడే బయట నామరూపాలు బాధ్య-బాధక రూపంగా ప్రవర్తిస్తున్నాయి. మనస్సు నిండా ఆత్మ యొక్క సత్-చిత్-ఆనందాది లక్షణాలు ఉన్నప్పుడో? బాధ్య-బాధకాలు సుదూరంగా తొలగిపోతాయి. క్రమంగా రహితత్వం సంతరించుకుంటుంది. మంకి : ఈ జగత్తు ఎక్కడినుండి వచ్చింది?

శ్రీవసిష్ఠ మహర్షి : హిరణ్యగర్భుని మనస్సే... ఎటువంటి ఉపాదాన-నిమిత్త కారణాలు లేకుండా, (మట్టి, కుమ్మరి లేకుండా) సంకల్పమాత్రం చేత నిరాశ్రయమగు ఈ జగద్రూప చిత్రాన్ని (కుండను) గాంచుతోంది. కాబట్టి... ఈ జగన్నిర్మాణానికి మనస్సు తప్ప అన్యమైన కారణం గాని, కార్యం గాని లేవు.

తనోతి యత్తదాత్మైవ, తస్య తత్ర తథా స్థితమ్ |

దృశ్యాభావాదసదృశ్యం తేన కః క్వ కరోతి కిమ్

మనస్సు దేనిని ఎట్లు వివర్తింపజేస్తోందో, అది ఆయా రూపాలుగా ఆ మనస్సుకే అనుభవ మవుతోంది. ఆత్మ నుండి బయల్వెడలిన మనస్సే మనస్సును జగత్తుగా చూస్తోంది. ఆత్మయే మనస్సుకు అట్లట్లు కల్పనను స్థితింపజేస్తోంది. ఆత్మ నుండి బయలుదేరిన మనస్సు ఆత్మకు కల్పనకు ఆపాదించి దర్శిస్తోంది. జగత్తుకు సంబంధించి ఇంతకుమించి విశేషం ఏదీ ఎక్కడా లేదు.

అందుచేత... 1.ఆత్మ కంటే వేఱుగా దృశ్యం లేదు. 2. దృశ్యం అసత్తు... ఈ రెండు సూత్రాలను అతి జాగరూకతతో సమన్వయించుకో! ఇప్పుడు చెప్పు... ఎవడు, ఎద్దానిని ఎట్లు ఏది నిర్మిస్తున్నాడు?

‘అహం సుఖీ’ ఇతి సుఖితా,' అహం దుఃఖీ' ఇతి దుఃఖితా |

సర్వ ఏవ సరూపస్థా వ్యోమాత్మానో2పిపార్ధివాః

ఓ మిత్రమా! ‘నేను సుఖిని' అని నీ మనస్సు అనుకున్నదా... సుఖియే అవుతోంది. 'నేను దుః ఖిని అని అనుకుంటే దుఃఖియే అవుతోంది. ఇక సుఖ-దుఃఖ సాధనాలన్నీ కూడా మనస్సు యొక్క కల్పనను అనుసరించే ఉన్నాయి. సుఖ-దుఃఖాలు మనస్సు చేతనే కల్పించబడుచున్నాయి. వాస్తవానికి సుఖ-దుఃఖాలు, వాటికి సాధనభూతమైన శబ్ద స్పర్శ - రూపాది విషయాలు ఈ సమస్తము చిదాకాశరూపమగు ఆత్మ స్వరూపమే అయి ఉన్నాయి. సమస్త పదార్థములు చిదాకాశరూపమే అయినప్పటికీ మనస్సు మాత్రం వాటిని దృశ్యరూపంగా దర్శిస్తోంది. ఏ భౌతిక రూపత్వం మనస్సుకు గోచరిస్తోందో అదంతా కూడా 'కలలో కనిపించే కొండలు' లాగా మిథ్య మాత్రమే అయి ఉంది.

ఆత్మసత్త సర్వదా నిర్మలము, అప్రమేయము, నిత్యోదితము, నిత్యనూతనము, నిరాధారము సర్వ పదార్థ-కాల అతీతం అయి ఉండి కూడా అయ్యది తనయొక్క అహంభావం యొక్క స్ఫురణ మాత్రంచేత భ్రమమయమగు పదార్థముల వికారంతో కూడి ఉన్నదగుచున్నది. అహంభావం (నాది, నా సంబంధమైనది అను భావావేశం) శమిస్తే పదార్థ భావం కూడా తనంతట తానే శమిస్తుంది. అప్పుడు ఆ జీవుడు శివస్వరూపుడే అవుతాడు. అహంభావం శమించటం చేత శాంతిచే

Page:667

శోభితుడై కేవల ఆత్మస్వరూప సత్త'గా శేషిస్తాడు. ఓయీ స్నేహితుడా! సహాత్మ స్వరూపా! బంగారం కంటే వేఱుగా ఆభరణం ఎక్కడున్నదయ్యా? ఆభరణం... అనే శబ్దం, అర్థం కూడా మిథ్యయే కదా! అట్లాగే శమాత్మకమైన ఆత్మ స్వరూపుడవగు నీకంటే వేఱుగా అహంభావము యొక్క సత్తయే మిథ్య.

నిర్వాణో నిర్మనా మౌనీ కర్తా అకర్తా చ శీతలః |

జ్ఞ’ ఏవ శాన్త ఏవాస్తే శూన్యఏవాభిపూరితః ॥

కాబట్టి... నీవు మోక్ష స్వరూపుడవై, మనోరహితుడవై, క్రియాశూన్యుడవై, మహాకర్తవై, అకర్తవు కూడా అయి, శాంత స్వరూపుడవై, దర్శనమునకు అతీతమై ఉన్న 'దృక్' రూపుడవై, కేవల పరబ్రహ్మ రూపుడవై జ్ఞాన ప్రకాశముచే అంతా అన్నిటా వెలుగొందుచూ ఉండుము.

వాసనారహితుడగు జ్ఞాని ఈ జగత్తులో ఎక్కడ ఏమి నిర్వర్తించినా యంత్ర నిర్మితమైన శిలా విగ్రహంలాగా యథాతథంగా నిశ్చలుడై ఉండునట్లే అగుచున్నది. ఎందుకంటే... అతడు ఏదైనా కార్యం ఈ చేతులతో ఆచరించినప్పటికీ వాటియందు అభిమానవర్జితుడై ఆత్మస్వరూపమునందే సర్వదా స్థితి కలిగి ఉంటున్నాడు. కనుక! ఒక శిశువు ఊయలలో గాఢంగా నిద్రిస్తూవుండగా, ఊయల ఊగుచున్నప్పటికీ శిశువు యొక్క అవయవాలు చలించకయే ఉంటాయి కదా! శరీరం యొక్క అనుసంధానం లేని జ్ఞానికి అవయవాలు కదులుచున్నప్పటికీ తాను నిశ్చల స్వరూపుడై చేష్టారహితుడై ఉంటున్నాడు. ఆత్మగా తానేమీ జన్మించడంలేదని, మరణించడం లేదని, దేనికీ కర్తృత్వ, భోక్తృత్వ దశలను పొందటం లేదనీ ఎఱిగియే ఉంటున్నాడు. అన్నీ నిర్వర్తిస్తూ ఏమీ నిర్వర్తించనివాడై ఉండటమెట్లాగో అతడు ఎఱిగియే ఉంటున్నాడు. ఆతని ఆత్మస్థితుని కర్మలు, దృశ్యములు, మనస్సు మొదలైనవి ఏవీ స్పృశించజాలవు.

మంకి : దేహంతో, జగత్తుతో (దేహం దేహంగా ఉండగా జగత్తు జగత్తుగా ఉండగా) అనుసంధానం ఎట్లా తొలగేది?

శ్రీవసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క విలక్షణమైన కొన్ని లక్షణాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. నీవు కూడా అవి అలవరుచుకో, తద్వారా నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞాని యొక్క విశేష లక్షణాలు - -

1. బహిర్ముఖ వృత్తిరహితుడు- అతని చిత్తము సర్వదా అంతర్ముఖమై ఉంటుంది. కనబడే దేహాలలో కనబడని దేహిని దర్శిస్తూ ఉంటాడు. కనబడే రూప- గుణాదులకు అతీతుడై ఉంటాడు. 2. అఖండ బోధ స్వరూపుడు - ఏ తత్త్వమైతే అనేక దేహాలుగా కనిపిస్తూ ఉంటుందో అది అతనికి ఏక . - అఖండంగా అనుభవమౌతూ ఉంటుంది.

3. ప్రాప్తించని విషయముల పట్ల 'ఆశ - కామము' లేనివాడు ఇంకా ఏదో పొందాలి అను అభినివేశమును 'కామము' అంటారు. ఏది ప్రాప్తించినా అతనికి క్రొత్తగావచ్చేది, పోయేది ఏదీ కనిపించదు. ఏది ఎట్లా ఉన్నా తాను తానుగానే ఉంటాడు కదా!

4. ప్రాప్తించిన విషయములందు 'రాగము' లేనివాడు - ఏదేది ఇప్పుడున్నదో అది కొంతకాలం క్రితం వచ్చి చేరింది. కాలంచేతనే మరల తొలగటం అనివార్యం, స్వభావసిద్ధం. (యత్ దృశ్యమ్... తత్ నశ్యం). కనుక దేనిని పట్టుకు వ్రేలాడవలసిన అగత్యం ఏమున్నది?

Page:668

5. శాంతుడు - బాహ్య విశేషాలు ఆత్మలో సుస్థిరత సంపాదించనంతకాలం స్పర్థ కలిగిస్తాయి. "అంతటా ఉన్న ఆత్మను నేనే అని ఎఱిగిన తరువాత ఏదీ ఆశ్చర్యపరచదు, సుఖ-దుఃఖ పరచదు.

6. అనంతాత్మ స్వరూపుడు- దేహానికి పొడవు, వెడల్పులు ఉన్నాయి. దేహిగా తనకు పొడవు, వెడల్పులు లేవు. పొడవు, వెడల్పులు లేనిది అనంతమై ఉంటుంది.

7. ద్రష్ట - దర్శన - దృశ్య రహితుడు - చూచేవానిని నియమించేవాడు తానుగాని, చూచేదిచూడబడేది-చూడడం తాను కాదు! చూడబడేది చూచేవానిని ఆకర్షించవచ్చు గాక! అయితే ఆ చూచే వానినే చూచేవాడుగా తాను ఉంటాడు.

8. స్వయంగా నిరాకారుడు - దేహానికో, మనస్సుకో, బుద్ధికో, అహంకారానికో, ఏదైనా ఆకారం ఉంటే ఉండవచ్చుగాక! తాను మాత్రం ఆకారాలకు సంబంధించినవాడు కాదు. కనుక నిరాకారుడు.

9. అపేక్షావర్జితుడు - నేను అపేక్షను నియమించేవాణ్ణి, అపేక్ష కన్నా ముందే ఉన్నవాణ్ణి, మరి అపేక్ష చేత నేను బద్ధుడనవట మేమిటి? 'అది అర్థరహిత వాక్యం' అనే మహాసత్త్వ స్థితి అవధరించి

ఉంటాడు.

10. ఆత్మ దర్శి - ఎవరినైనా చూస్తున్నప్పుడు అతని దేహ-మనో-బుద్ధి-అహంకారాలను అధిగమించి వాటికి సాక్షి, కారణము అయి వున్న అప్రమేయ దోషరహిత ఆత్మనే దర్శించెదనుగాక! అను మహా దృష్టిని కలిగి ఉంటాడు.

ఇట్టి విశేషాలతో జ్ఞాని ఈ జగత్తులో సంచరిస్తాడు. ఇక దేహాదులతో అతనికి అనుసంధానం ఎక్కడిది చెప్పు?

మంకి : : అసలు బంధం - అనుసంధానం ఎందుకు ఏర్పడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి :

అపేక్షైవ ఘనోబంధః ఉపేక్షైవ విముక్తతా | సర్వశబ్ధాన్వితా తస్యాం విశ్రానేన కిమీక్ష్యతే ॥

కలలో ఉన్నవాడు ఇది కలే! మెళుకువ రాగానే ఇదంతా లేకుండా పోతుంది"... అని గ్రహించిన తరువాత ఇక ఆ కలలో ఏ పదార్థాలు కావాలని కోరుకుంటాడు. చెప్పు?

ఈ జీవునికి... “అపేక్ష” అనునదే ఘనీభూతమైన బంధం. అపేక్ష ఎట్లా పోతుంది? ఉపేక్ష చేతనే. “ఉపేక్ష యే విముక్తి! వేద - వేదాంత సారమంతా ఇంతే!

మంకి: 'అపేక్ష' అనునది నిర్వచిస్తూ మరింత వివరంగా చెప్ప ప్రార్థన.

శ్రీవసిష్ఠ మహర్షి : మిత్రమా! ఈ జగత్తు యొక్క అనుభవంలో ముఖ్యంగా 4 చోటు చేసుకుంటున్నాయి - 1. దేహం, 2. కోరికలు, 3. మోహం, 4. కర్తృత్వ - భోక్తృత్వ అభిమానం... ఈ నాలుగు భ్రమయే! దేహికి దేహం ఐహికమోహం!

"ఈ దేహం భ్రమమాత్రమే అని తెలియటంచే దేహభావన జయించబడుతోంది. ఈ దేహం లేకపోతే నేనే లేను. ఇక అనుభవాలూ లేవు" అని ఈ జీవుడు ఎందుకో భ్రమిస్తున్నాడు.

Page:669

మంకి : అవును కదా స్వామీ! దేహమే లేకపోతే భావన - అనుభవం ఉండదు కదా? శ్రీవసిష్ఠ మహర్షి : స్వప్నంలో అనుభవాలు, అనుభవజ్ఞుడు... ఈ రెండు ఉంటున్నాయి కదా! భౌతికదేహం జడప్రాయమై ఉండగా ఆ స్వప్నద్రష్ట ఏ దేహంతో 'అనుభవం' అనేది పొందుచు న్నాడు? కనుక, దేహి దేహమాత్రుడు, దేహ పరిమితుడు కాదు. స్వప్నం తొలగగానే స్వప్నదేహం తొలగుచున్నట్లు... దేహ భ్రమ తొలగితే, ఇక అట్టి జీవుడు దేనినీ (ఏ పదార్థమును) కోరడు. దేహభావ రాహిత్యముచే కోరికలు నశిస్తాయి. కోరికలు తొలగితే 'మోహం' కూడా విడివడుతుంది. మోహం తొలగితే “దీనికి కర్తను దానికి భోక్తను... అనే మనోమాలిన్యం కూడా స్వభావసిద్ధంగా తొలగుతుంది. దేహాదులందు అభిమానం లేనివాడు అపేక్ష" అనే గాలానికి చిక్కుకోడు.

మహాత్ముడైన అట్టి జ్ఞాని కేవలము తన ఆత్మయందే నెలకొని ఉంటాడు.

ఓ మంకి! నీవు ఆత్మయందే సర్వదా నెలకొని ఉండు. అనగా దేహ-మనో-బుద్ధి-అహంకారా లలో భ్రమచే నెలకొని ఉండకు. మనోబుద్ధులలో నెలకొని ఉన్నవానికి ప్రపంచంలో మనోబుద్ధులే అగుపిస్తాయి. ఆత్మయందు నెలకొని ఉన్నవారికి సర్వత్రా ఆత్మతత్త్వమే గోచర మౌతుంది. ఇదే మన ఈ సంవాదము యొక్క అసలైన సారాంశము.

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మహాత్ముడగు ఆ మంకి నా ఉపదేశం అతి శ్రద్ధగా విన్నాడు. అప్పటికప్పుడే పాము కుబుసమును విడుచునట్లు సంసారమోహమును సంపూర్ణంగా త్యజించాడు. వాసనారహితుడై, పూర్ణచంద్రుని వలె ప్రకాశించాడు. నా వద్ద సెలవు తీసుకొని గృహోన్ముఖంగా నడిచి వెళ్లాడు. ఇకప్పటి నుండి కొంతకాలం గృహంలో గడపి కొన్ని సంవత్సరాల తరువాత ఒక పర్వతంపై ఒకచోట సుఖాసీనుడైనాడు. మనస్సు-ఇంద్రియాలు మొదలైనవాటిని స్వస్వరూపంలో శమింపచేసి, ఆ యోగి శిల వలె నిశ్చల స్వరూపుడైనాడు. సమాధి యందు మగ్నుడై, ఇప్పటికీ పర్వతం పైనే ఉండి ఉన్నాడు. ఎవరైనా అతనిని మేల్కొలిపితేనే అతడు సమాధి నుండి లేవడం

జరుగగలదు.

ఓ ప్రియ సభికులారా! మీరుకూడా మంకి వలె ఉత్తమ ఉపాయమును ఆశ్రయించండి. జ్ఞానం నందు ఉత్సాహంగల మనస్సుతో వివేకం ద్వారా స్వాత్మయందు విహరించుటకై శాంతిని సముపార్జించండి. అంతేగాని మీ బుద్ధి వివేకాన్ని వదలి దీనత్వం పొందటం ఉచితమే కాదు. శరీరం పరిమితం! ఆత్మయో... అపరిమితం!

సౌమ్యుడగు ఓ రామచంద్రా! స్ఫటికంచే నిర్మించబడిన మనుజవిగ్రహం ఆకారం దృష్ట్యా మనుజ శరీరం లాగానే కనబడవచ్చు గాక! అయితే దానికి కోప తాప-భయ-ఆశ-నిరాశలు ఉంటాయా? ఉండవు. అట్లాగే యథాప్రాప్తాలైన ఆయా కార్యాలను ఆచరిస్తూ కూడా నీవు శాంతాత్ముడవై, నిర్వాణరూపుడవై ఉండు.

'ఏకం' అగు ఆత్మయే ఇటు ఏకం నందు, అటు అనేక నందు కూడా కలదు. అట్టి ఏక - అనేకాలకు అప్రమేయమై ఉండే ఆత్మను గ్రహించిన తరువాత 'వ్యష్టి-సమష్టి' సంబంధితమైన సాంసారిక జాడ్యం తొలగగలదు.

Page:670

శ్రీరాముడు : ఆత్మ సర్వదా ఏకమే అయిఉండికూడా, చిత్తము అనే అనేకత్వ దర్శనస్వభావం ఎందుకు పొందడం జరుగుతోంది? అనేక చిత్తములు ఎక్కడి నుండి వచ్చాయి?

శ్రీవసిష్ఠ మహర్షి :

ఆద్యన్తరహితం సర్వం వ్యోమ చిత్తత్త్వ నిర్భరమ్ |

శరీరోత్పత్తి నాశేషు కా చిత్తత్త్వస్య ఖండనా ॥

చిద్వస్తువు (చిత్ తత్త్వం) ఆద్యంత రహితమైనది. సర్వవ్యాపకమైనది. చిదాకాశ రూపమైనది. నాశనవర్జితమైనది. అట్టి చితత్త్వం చిత్తత్త్వము చేత, శరీరాదుల చేత ఎట్లా ఖండితం అవుతుంది? ఆత్మ పరిచ్ఛేదయుక్తమే కాదు.

ఇక ఈ దేహం? ఇది ఆద్యంతసహితమైనది, పరిమితస్వభావమైనది, పాంచభౌతిక స్వరూప మైనది, నాశన స్వభావమైనది. శరీర లక్షణాలు తీసుకొచ్చి ఆత్మకు ఎట్లా ఆపాదిస్తావు? కుదరదు. ఆత్మయే సమస్తంలోను... సమస్తంగాను ఉన్నదని, సమస్తానికీ అతీతంగా ప్రకాశిస్తూ ఉంటోందని గ్రహించటమే ఆత్మజ్ఞానం.

88

శ్రీవసిష్ఠ మహర్షి : ప్రియ రామచంద్రా! స్ఫటికంతో నిర్మించబడిన ఇక మనుజ విగ్రహం యొక్క శరీరం కళ్ళకు కనబడుచున్నప్పటికీ ఆ స్ఫటిక విగ్రహానికి దేహస్పృహ ఉంటుందా? ఉండదు. అట్లాగే నీవు కూడా దేహమునకు కేవల సాక్షివై ఉంటూనే... యథా ప్రాప్తములైన ఆయా కార్యాలను ఆచరిస్తూ ఉండు.శాంతాత్ముడవై, నిర్వాణ (మోక్ష) రూపుడవై ప్రకాశించు. ఎట్టి విషయం గురించి నీకు (మోక్ష రూపాన్ని సునిశ్చితం చేసుకుంటూ ఉన్నప్పుడు) మరింకే సందేహం ఉండవలసిన పనిలేదు. "ఈ సృష్టి-వ్యష్టి-సమష్టి భేదాలు ఉపశమించేది ఎట్లా”... అనే అనుమానాలన్నీ "ఏక మగు ఆత్మయే వ్యష్టియందు - సమష్టి యందు కూడా వ్యవస్థితమై ఉన్నది... అను అవగాహన చేత మాత్రమే తొలగుతాయి. ఆత్మయే సమస్తములోను, సమస్తంగాను ఉన్నది”... అను సుస్పష్టమైన అవగాహన వైపుగా నీ సకల సాధనలు, క్రియలు ఎక్కుబెట్టబడుగాక! క్రమంగా ఏకం-సర్వస్వంవ్యష్టి-సమష్టికి సంబంధించిన ఈ జీవుడు సుదీర్ఘకాలంగా మోసుకువస్తున్న కల్పనలన్నీ వాటంతట అవే క్రమక్రమంగా తొలగుతాయి.

ప్రతి ఒక్క జీవుడు చిద్వస్తు స్వరూపుడే! చిద్వస్తువు ఆద్యంతరహితమై, సర్వవ్యాపకమై, చిదాకాశ రూపమై, నాశనవర్జితమై ఉన్నది. ఈ శరీరాల చేతనో చిత్రాల చేతనో చిద్వస్తువు ఖండితాలుగా (అనేక జీవులుగా, నీవు-నేను మొదలైనవిగా) పరిచ్ఛేదమెట్లా అవుతుంది?

పరిచ్ఛేదమయినట్లు ఏదైతే అనిపిస్తోందో అదియే సంసారము యొక్క రూపం. చిత్తు (ఆత్మ) సర్వదా అచంచలం. జలం యథాతథంగా ఉంటూ ఉండగానే అద్దాని యందు 'తరంగాలు' అనే చమత్కారం అగుపిస్తోంది కదా. అట్లాగే ఆత్మ సర్వదా యథాతథంగా ఉంటూనే తనయందు చంచలమగు మనస్సు' అనబడు దానిని ప్రదర్శిస్తోంది. అట్టి చంచల మనస్సు తన చంచలత్వం

Page:671

త్యజించిందా... ఇక శేషించేది (అనుభవమయ్యేది) అచంచలమగు ఆత్మయే. ఒక పసిబాలుడు నల్లని మేఘాల మధ్యగా గల తెల్లని మేఘమును చూచి వాళ్ళ నాన్నను పిలిచి నాన్నా! ఆకాశంలో అక్కడ ఎవరో తెల్లటి దుప్పటిని కట్టినట్లున్నారే?... ఎవరు కట్టారు? అని ప్రశ్నించాడనుకో. ఆ బాలునికి కనిపించేది భ్రమ మాత్రమే కదా! అట్లాగే దేహాదులందు కనిపించే అహంకారం' అనేది భ్రాంతి మాత్రమే! అట్టి అహంకారం యొక్క అనుభూతి అవాస్తవం, నిష్ఫలమైనది కూడా”... అని ముముక్షువు గ్రహించి ఉండుగాక! ఓ సర్వ సత్యాన్వేషులారా! మీరు భ్రమమాత్రమైన, మిథ్యా భూతమైన, సంసారరూప పరంపరను ప్రసాదించునట్టి ఈ దేహాదులందు, అహంకారం నందు నిమగ్నులై ఉండకండి. వాటిని నమ్మి "వీటిని ఏం చేయాలి? ఏం చేస్తే పోతాయి మొదలైన నమ్మక, అపనమ్మక భావాలను కూడా కలిగి ఉండవద్దు.

దేహం, అహంకారం మొదలైనవి భ్రమయే కాబట్టి, అవి నిర్వర్తించే పనులు కూడా భ్రమయే. మీరో?... ఆనంతాత్మస్వరూపులు కదా! దేహాదుల పట్ల ఏ భావన కలిగి ఉంటున్నారో, అట్టి భావనలో దాగి ఉన్న ఒకానొక అల్పత్వమే 'సంసారం' అనుదానికి ముడి పదార్థం. దేహ, అహంకా రాదులను భావించడాన్ని క్రమంగా సన్నగిల చేయండి. ఎందుకంటే అనంత సుఖప్రదమైన 'మోక్షం' కొరకై ఆద్యం-భవ్యం-సత్యం నాశరహితం" అగు ఆత్మవస్తువును మాత్రమే భావించడం అత్యవ సరం. చిదాకాశం అనంతమై, పరిమితం లేనిదై, సమరూపమై ఉన్నది. అదే సర్వానికి పరమై ఉన్న ఆత్మవస్తువు. ఇక ఈ ధ్యాత-ధ్యానం-ధ్యేయం.... అనే మూడూ కొంచెం కూడా సత్యం కానే కాదు.

అసత్యాలను అసత్యాలుగా గుర్తించినంత మాత్రం చేత దోష రహితమగు ఆత్మను నేనే అని ఎవరికి వారే ఎఱుగగలరు. ఈ ద్రష్ట, దర్శనం, దృశ్యం అనబడే మూడు ఆత్మ యొక్క విభూతులు మాత్రమే! ఎందుకంటావేమో? అనుభవజ్ఞరూపమైన చైతన్యమే లేకపోతే “ఇది జడం అనే జడానుభవం ఎవరికి?... అనుభవజ్ఞుడే లేకపోతే అనుభవం ఎవరికి? ఎక్కడ ఉంటుంది?

‘ధ్యేయము’ అగు చిద్వస్తువు ధ్యానమునకు ముందే, ధ్యానం లేకున్నప్పుడు కూడా సిద్ధించియే ఉంటోందని గ్రహించబడుగాక! సముద్రమైతే శుక్లపాడ్యమి చంద్రుని చూచి క్షోభచెంది కెరటముల క్షోభ ప్రకటిస్తోంది. ప్రళయ వాయువీచికలచే శుష్కించిపోతోంది. ఇక, ఆత్మయో సర్వదా ఏకరూపమై, సమమై, సౌమ్యరూపమై క్షోభరహితమై ప్రకాశించుచున్నదని గ్రహించబడు గాక!

చిత్తము యొక్క భ్రమ! - రథంలో ప్రయాణిస్తూ బయటకు చూస్తున్న ప్రయాణీకునికి రహదారి ప్రక్కన ఉండే కొండలు, చెట్లు, రాళ్లు కదలుచున్నట్లుగా కనిపిస్తాయి. ఆ చెట్లు మొదలైనవి నిజంగా కదులుచున్నాయా?... లేదు. ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు తెలుపు కనిపిస్తూ ఉంటుంది. ముత్యపుచిప్పలో నిజంగా వెండి ఉన్నదా?... లేదు. అట్లాగే అంతటా చిత్స్యరూపమే సర్వదా ఏర్పడి ఉండగా ఇక దేహాదులు గోచరించడం... ఇదంతాకూడా చిత్తం యొక్క భ్రమ మాత్రమే!

విచిత్రం చూడు! చిత్తం దృష్టిలో దేహాలు కనిపిస్తున్నట్లే, దేహాల దృష్టికి చిత్తం కనిపిస్తోంది. ఒక దానిచే రెండవది కల్పితంగా తోచుచున్నది. దేహ - చిత్తాల దృష్టిచే 'జీవుడు' అనునది కూడా

Page:672

కల్పితమై సంప్రాప్తిస్తోంది. జీవదృష్టిచే దేహ చిత్రాలు కల్పితాలై ఉంటున్నాయి. అంతయూ కల్పిత మాత్రమే అయి ఉండగా... ఇక ఆ 'పరమపదం' అనుదానియందు ద్వైతానికి చోటెక్కడిది? శుద్ధ చైతన్యం యొక్క స్వయంకృతమైన ఏమఱుపు చేతనే దేహ-చిత్త-జీవాదులు మేఘాల ఆకారంచే ఆకాశంలో కనిపించే కొండ శిఖరరూపం వలె రూపుదిద్దుకుంటున్నాయి.

బ్రాహ్మీదృష్టిచే సమస్తమూ ఏకం, శాంతం, బ్రహ్మరూపం అయివున్నది. బ్రహ్మమునందు నామవాచకం-సర్వనామం గాని, తదితర భ్రమలు గాని లేనేలేవు. ఆకాశంలో మేఘాలు గుమిగూడి ఉండగా బాలునికి ఆకాశంలో కొండలు తోటలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం శూన్య మాత్రమై ఉండగా అక్కడక్కడ తోట-బాట ఉండటమేమిటి? ఇసుకలో ఎక్కడైనా నూనె ఉంటుందా? చంద్రబింబంలో మెఱుపుతీగలుంటాయా? అవన్నీ భ్రమ మాత్రమే కదా! తత్త్వదృష్టిచే ఈ దేహాది పదార్థాలు లేనేలేవు. సత్యాన్ని ఎఱుగుటలో ఉత్తమోత్తముడవగు ఓ రామచంద్రా! “లేనిదే” అయినట్టి ఈ జగత్తు యొక్క భ్రమయందు నీవు చిక్కుకోకూడదు సుమా!

ఈ జగత్తు వాస్తవానికి లేదు. ఇది పరమసత్యం. సామాన్యంగా అనేకమంది “జగత్తే ఉన్నది. బ్రహ్మ సత్తా లేదు - అను భ్రాంతికి లోను కావడం లోకపరిపాటి. అట్టి భ్రమ తొలగటానికి ఈ మన సంవాదం మహత్తరమై సహకరించుగాక! జగత్తే లేనప్పుడు ఇక బంధానికి కారణం ఎక్కడున్నది చెప్పు?... కుండ-మూకుడు- చట్టి - - పిడత - ప్రతిమ - ప్రమిద ఇవన్నీ స్వతహాగా మట్టియే కదా! అట్లాగే అనేక విశేషాలతో కనిపిస్తున్న ఈ జగత్తంతా చిత్తం మాత్రమే! అయితే అట్టి చిత్తం విచారణచే తనంతట తానే (స్వయంగా) క్షయించిపోవుచున్నది.

ఓ రామచంద్రా! ఓ తదితర సర్వ స్వయమాత్మ ఘన చిదానంద స్వరూపులారా! నా ఉపదేశం యొక్క సారమంతా సులభవిషయమే కాని అసాధ్యమైన విషయం కాదుఅహంకారం నేను కాదు. అహంకారం ఆమూలాగ్రంగా భ్రమ మాత్రమే! సంపదలందు హర్షించటం, విపత్తులందు శోకించటం... ఇవన్నీ మనోధర్మాలే గాని ఆత్మ యొక్క ధర్మాలు కాదు. మనస్సు భ్రమ-దురవగాహన అను వాటిచే కల్పించబడినది. మనస్సు ఉన్నా, ఎట్లా ఉన్నా... ఆత్మ యథాతథంగానే ఉన్నది. మీరంతా 'రాక పోక' అను స్వభావం కలిగిన సుఖ దుఃఖాలను అధిగమించి ఇవన్నీ ఏది ఎట్లా ఉన్నా కూడా నేను సర్వదా అఖండమగు ఆత్మ స్వభావినే అనే స్థితిని సొంతం చేసుకుని ఉండండి.

మీరెవరూ దేహ స్వభావులు, మనో స్వభావులు కాదు. సర్వదా ఆత్మ స్వభావులు! దేశ కాలాతీతులై, అప్రమేయులై, నిత్యోదిత ఆత్మ చైతన్యసూర్య స్వభావులై ప్రకాశించండి. 'ఎఱుక' అనే కిరణ సమూహాలై సర్వదా వెదజల్లుతూ కూడా నిర్విషయానందంతో కూడిన ఆత్మైశ్వర్యమయులై చొన్నొందండి.

ఓ రఘుకుల తిలకా! రామచంద్రా! ఓ ప్రియ సర్వజనులారా! మీరంతా యథాస్థితమగు ఆత్మ వస్తువును చక్కగా సాక్షాత్కరించుకోండి. చిత్తం యొక్క రూపం "హర్షం - శోకం - ఇచ్ఛ

-

Page:673

అను మూడూ కలిసినది మాత్రమే! మరి మీరో... ఈ హర్ష శోక - ఇచ్చల కంటే కూడా అతీతమైన, సూక్ష్మమైన రూపం కలవారై ఉన్నారు. అట్టి మీ అనంతత్వాన్ని ఏమఱువకపోవటమే మోక్షం. ఇంతకు వేతైన మోక్షశబ్ధార్థం లేదని గ్రహించి, అటుపై యథేచ్ఛగా సమర్థించువారై ఉండండి. అప్పుడిక ఏది ఎట్లున్నప్పటికీ మీరు మోక్ష స్వరూపులే! ఓ సర్వ సహజీవులారా! మీరంతా ఆత్మారాములే!

8. వాసనాక్షయం యొక్క ఆవశ్యకత

శ్రీరాముడు : ప్రభూ! ఈ పురుషకారం అనేది అనేక కర్మ వ్యవహారాలకు కారణమగుచున్నది. 'దైవం' అనే శబ్ద-అర్థములకు కారణం కూడా ఈ కర్మల వ్యవహారమే కదా! ఇదే మరల జనన మరణాలకు కూడా కారణం అగుచున్నదని శాస్త్ర ప్రసిద్ధి. అట్టి బీజంలోంచి చెట్టు, చెట్టులో నుంచి బీజం" అను బీజ-వృక్ష న్యాయాన్ని ప్రదర్శిస్తున్న పురుషుడు - పురుషకారం లేక 'కర్త-భోక్త'ల తత్త్వాన్ని విశదీకరించవలసినదిగా నా ప్రార్ధన.

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! నీ యొక్క “సర్వసాధక జనుల పట్ల గల అవ్యాజ ప్రేమ" చేతనే ఇటువంటి ప్రశ్నను ఈ సందర్భంలో ప్రస్తావించావు.

సరే, ఇప్పుడు 'కర్మలు - కర్త - భోక్త' అను వాటి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. కుండ కార్యరూపం, మట్టి కారణరూపం; వస్త్రం కార్యరూపం, దూది కారణరూపం; అట్లాగే "జీవుడు కార్యరూపం, దైవము, కర్మలు కారణరూపం" - అని సిద్ధాంతీకరించబడుతోంది.

అయితే 'దైవం-కర్మ' అను కారణరూపం, పురుషుడు (జీవుడు) అను కార్యరూపం... ఈ మొదలైనవన్నీ వాస్తవానికి 'చిత్స్పందం' యొక్క పర్యాయ పదాలే! చైతన్య స్పందమే లోకంలో ఆయా వివిధ రూపాలుగా పొందినదగుచున్నది. ఎట్లా అంటావా?... చిదాత్మయే ప్రాథమిక రూప మగు “చిత్ స్పందం”చే 1. సమష్టి మనస్సు, 2. వ్యష్టి మనస్సుగా అగుచున్నది. ఆ పిదప దేహాకార ధ్యాసచే పురుషకారం ఆశ్రయించి 'పురుషుడు' అను రూసాన్ని దాల్చుచున్నది. పురుషకారం నుండి కర్మలు' బయల్వెడలుచున్నాయి. క్రమంగా ఉచితానుచిత్వం రూపు పొందగా పుణ్య-పాపాలు దృష్టి మొదలైన ద్వంద్వాలు బయల్వెడలి జగద్రూపంగా వివర్తమొందుచున్నాయి.

చైతన్యం యొక్క స్పందం లేకపోతే పురుషుడు (జీవుడు) గాని, కర్మలు గాని ఎక్కడ? ఎవరికి? అవి స్వతహాగా చూస్తే అసద్రూపాలు మాత్రమే! చైతన్య సత్తాయే ఈ జగత్తుగా ప్రాప్తిస్తున్న అణువణువు కూడా! వాసనారహితమగు చైతన్యం యొక్క స్పందం చేత ఈ 'జగత్తు' అనే భావనా రూపానుభవం సుదూరంగా కనిపించే కుగ్రామం వలె బాహ్యవస్తువుగా అగుపించ నారంభిస్తుంది.

చైతన్యం సర్వదా యథాతథంగానే ఉంటున్నది సుమా! వాసనారహితమగు చైతన్యం యొక్క స్పందన అస్పందనమనియే చెప్పవచ్చు కూడా! ఎందుకంటే... తరంగాలు దృష్ట్యా సముద్రజలం సర్వదా చంచలమై ఉంటున్నప్పటికీ సముద్రం దృష్ట్యా (జలం దృష్ట్యా) సముద్రం సర్వదా ఏకమే

Page:674

అయి ఉన్నది, నిశ్చలమే అయి ఉన్నది. జలం జలంగానే ఉంటోంది కదా! అనేకంగా కనిపించేదంతా ఏకంగా అనిపించే వరకు ముముక్షువు తన సాధనలను కొనసాగిస్తూనే ఉండుగాక!

ఓ రామచంద్రా! ఈ జీవునకు కర్మలలో కనిపించే భేదమంతా సృష్టియందు ప్రారంభమైన కల్పనాంశమే. వాస్తవానికి చైతన్యమునకు, చైతన్య స్పందనా రూపాలగు కర్మలకు ఒకించుక కూడా భేద లేదు. 'జలతరంగాలు' అను శబ్దార్థంలో జలానికి తరంగాలకు భేదమేమున్నది? ఏదైనా భేదం కనిపిస్తే అది సంకల్పమాత్ర జనితమే గాని వాస్తవం కానేకాదు! కర్మయే పురుషుడు. పురుషునిదే కర్మత్వం పురుషునికి కర్మలకు భేదం - మంచుగడ్డ, శీతలత్వము వలె భ్రమయే. పురుషునికి - అనిర్వచనీయ చైతన్యమునకు గల భేదం అట్టిదే.

‘చైతన్యస్పందం’ అనే రసమే దైవంగా చెప్పబడుతూ, ఆరాధించబడటం లోకంలో జరుగు తోంది. బీజమే కొమ్మలు, ఆకులు, పూలు అగుచున్నట్లుగా... చైతన్యరసమే దైవం, కర్మ, జీవులు అయి ఉన్నది. 'మనుష్యుడు, జంతువు, దేవత, త్రిమూర్తులు మొదలైనవన్నీ చైతన్యం యొక్క అంశ స్వరూపాలే! చైతన్య రసమునకు వేఱుగా మనుష్యులు, దేవతలు, జంతువులు, మొదలైనవీ లేవు.

చైతన్యం స్పందయుక్తం అగుటయే 'జగత్తు' అనబడే దానికి బీజం. చైతన్యం స్పందానికి ముందే ఉండటం చేత స్పందనసమయంలో కూడా యథాతథంగా ఉండడం చేత చైతన్యం దేనికీ బీజమగుట లేదు కూడా! చైతన్యం తనలో తానే స్వయంగా బీజత్వాన్ని కల్పించుకొని సూక్ష్మావయవ రూపమున కూడా ఉన్నదై క్రమంగా విస్తార జగత్ రచనకు కర్మల రూపంగా నిర్వర్తిస్తోంది. చిత్త్వంచ క్వచిత్ అస్పంస్ధం, క్వచిత్ స్పందమ్ స్వభావతః |

అనంతమ్ ఏకార్ణవత్ “దిక్-కాల” క్రమ సంస్థితమ్ ॥

అనంత మహాసముద్రజలం ఒకచోట తరంగ సహితంగాను, మరొకచోట తరంగ రహితం గాను (చంచలంగాను, నిశ్చలంగాను) ఉంటోంది చూచావా?... చైతన్యం స్వయంగా స్వభావతః ఒకానొక చోట దేశకాలక్రమంతో కూడినదై ఉంటూనే... మరొకచోట దేశ కాలాదులచే స్పర్శించ బడకయే ఉంటోంది. 'చిత్' స్వయంగా అకారణమే అయివుండి కూడా, ఆ చిత్స్పందం వాసనా రహితమై దేహం - ఇంద్రియాలకు అంకురరూపంగా అవధరిస్తోంది. ఒక గడ్డిపరక గడ్డిపూలు పూయడానికి, ఒక పూతీగ పుష్పాలను, ఆకులను ప్రదర్శించడానికి, ఒక మఱి గింజ మహావృక్షంగా పరిణమించడానికి... వీటన్నిటికీ కారణం చైతన్యమే!

ఓ రామచంద్రా! అగ్నికి, ఉష్ణత్వానికి భేదమేముంటుంది? బీజమునకు, ఆ బీజంలో నుంచి అంకురిస్తున్న వృక్షమునకు భేదమే లేదు. బీజంలో నిద్రాణమై ఉన్న చితత్త్వమే స్పందమును స్వీకరించి “చిత్ చైతన్యము అనబడు మహిమచే మహావృక్షంగా ప్రకటనమగున్నది కదా!

బీజమే అంకురచైతన్యం. ‘అంకురశక్తి' కి వేఱుగా బీజమనబడునది లేదు. కర్మయే మనుజుడు. జలం తనయందు తానే బుద్బుదాలను రచించుకొనుచున్నది చూచావా? చైతన్యం అంకురసత్త రూపంగా విత్తనంలో స్ఫురిస్తున్నట్లే ఈ పృథ్వియందు కూడా ఓజోరూపంగా స్ఫురించి ఒకచోట

Page:675

స్థూలం గాను, మరొకచోట సూక్ష్మం గాను, ఒకచోట మృదువుగాను, మరొకచోట అత్యంత కఠినంగాను తనను తాను రచించుకొనుచున్నది. చైతన్యం కాక మరింకేది భూగర్భంలో వజ్రం నిర్మితమగుటకు కారణం కాగలదు? చైతన్యం యొక్క అతికోమలమగు 'అంకురం' అను చమత్కారం ద్వారా అతి కఠినమగు రత్నం, వజ్రం మొదలైనవి ప్రాప్తిస్తున్నాయని గ్రహించు.

లత యందు 'రసము’నకు కారణమైన చైతన్యమే ఫలపుష్పాదులను విస్తరింపజేస్తోంది. ప్రాణి యొక్క వీర్యరసమందున్న చైతన్యము ఈ జంగమ జీవులను విస్తరింపజేస్తోంది.

సర్వవ్యాపకమగు సంవిత్ చైతన్యం అతి బలవత్తరమైనది కాబట్టే అది తనయందు దైవఅసురాదిపర్వతాది సమస్తమును అవధరిస్తోంది. సమస్త స్థావర జంగమ పదార్థముల యొక్క “ఆదిబీజం”... చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే అయి ఉన్నది. అట్టి చైతన్యమునకు బీజమైనదేది? ఏదీ లేదు. చైతన్యము సర్వమునకు బీజమై కూడా, తాను బీజ- అంకుర రహితము.

బీజము-అంకురము, పురుషుడు-క్రియ, దైవము-పురుషుడు, వాయువు-వాయువీచికలు... వీటన్నిటినికి పరస్పర భేదమేమి ఇసుమంత కూడా లేదు.

ద్విత్వంనృకర్మణోర్యస్య, బీజ-అంకురతయా తయోః | విపశ్చిత్ పశవే, తస్మై మహతే అస్తు సదా నమః ||

ఎవరి దృష్టిలో "పురుషుడు వేరు - కర్మలు వేరు, బీజాంకుర శక్తి వేరు - కారణ శక్తివేరు, కార్యరూపమగు ఈ స్థావర జంగమ పదార్థములు వేరు, చిత్ చైతన్యము వేరు కనబడే జీవులు వేరు– విత్తులోని అంకుర రసం-విత్తు-వేఱు, కొమ్మ వృక్షము వేరు, కాండము వేరు, కొమ్మ వేరు, పుష్పము వేరు... ఇటువంటి అభిప్రాయాలు ఘనీభూతమై ఉంటాయో, అట్టి నరరూప పశువుకు నేనేం చెప్పగలను? - ఆ మహానుభావుడికి ఒక నమస్కారం.

ఓ రామచంద్రా! చైతన్యమునందు 'జన్మించటం' అనే దానికి సంబంధించిన ఏ బీజం లేక ఏ వాసనారూపమగు రసం కలదో... అదే జన్మరూపమగు అంకురానికి, దేహం చేత పొందబడే సమస్త వ్యవహారానికి కూడా బీజం" అయి ఉన్నది. అట్టి చైతన్యంలో ప్రదర్శితమయ్యే వాసనారూప రసమే జన్మకర్మలకు కూడా కారణం. కనుక ఆ వాసనారూప రసం దహింపజేస్తే శేషించేది నిర్మల - జన్మ కర్మాతీత చితత్త్వమే! అట్టి అప్రమేయ చిత్ తత్త్వం అనుభవయోగ్యం కావాలంటే 'అసంగం' అనే అగ్నిచే వాసనారూప రసమును శోషింపజేయాలి.

శ్రీరాముడు : 'అసంగం' అనుదాని గురించి మరికొంత సుష్పష్టం చేయండి.

అంగము -

శ్రీవసిష్ఠ మహర్షి :

కుర్వతో అకుర్వతశ్చైవ మనసా యదమజ్జగమ్ |

శుభాశుభేషు కార్యేషుతత్ అసంగం విదుర్ బుధాః||

ఎద్దాని సహాయం చేతైతే "ఆయా క్రియలు చేస్తున్నప్పుడు, చేయకుండా ఉన్నప్పుడు కూడా ఆయా శుభ - అశుభ కర్మలందు మనస్సుచే ఈ జీవుడు తగుల్కొనకుండా ఉంటాడో”... అద్దానిని

Page:676

అసంగం” అని విజ్ఞులు పిలుస్తున్నారు. అయితే ఈ తగుల్కోవటం అనేది ఎట్లా ఏర్పడుతుంది? దానికి కారణం “అంతరంగంలోని వాసనలే అని ప్రవచించబడుతోంది. వాసనలు అనగా ఏమిటి? అజ్ఞానవశంచేనిర్వర్తించబడిన అభ్యాసం యొక్క ఆంతరంగిక సమీకరణమే వాసనలు. జ్ఞానాభ్యాసం చేత అజ్ఞానాభ్యాస ప్రభావం సన్నగిల్లుతూ రాగా అప్పుడు వాసనలు వాటికవే తోకముడుస్తాయి. కనుకనే వాసనల యొక్క నాశనమే అసంగం. వాసనల ప్రకోపమే సంగం" అని కూడా చెప్పబడు తోంది. ఓ రామచంద్రా! ఉపాయం ఏదైనా ఫరవాలేదుగాని, ఎలాగో అలా ఈ అంతరంగంలోని వాసనలను నశింపజేయాలి. ఈ జగత్తే బ్రహ్మం. నీవే ఆ 'తత్' అయివున్నావు. నేను స్వయంగా సర్వదా బ్రహ్మాన్ని. నేనే నీయందున్నాను. నీవే నాయందు ఉన్నావు. నేనే అంతటా ఉన్నాను”... అనే వాక్యాల అనుభవార్థమేమిటో అప్పుడుగాని సుస్పష్టమవదు. ప్రియజనులారా! భావిసహజీవులారా! మీరంతా ఈ వాసనలు రహితం చేయడానికే మీమీ కార్యక్రమాలన్నీ ఉద్దేశించి ఉండండి. మీకు రాజయోగం, హఠయోగం, పూజ, ప్రార్థన, ఉపన్యసించండం, శ్రవణం మననం... మొదలైన ఆయా యుక్తులతో ఏది సులభమని అనిపిస్తే అదో (లేక) ఏ కొన్నియో అవలంబించండి. పురుష ప్రయత్నశీలురై ఉండండి. వాసనారాహిత్యమే పరమశుభప్రదం, పరమ మంగళమై ఉంది. వాసనా రహిత స్థితియే ప్రత్యగాత్మ స్వరూపం.

అహంభావమే సర్వ వాసనలకు మూలం. నా హం భావనయే వాసనాక్షయం యొక్క నాంది, విధానం, అంతిమ ప్రయోజనం కూడా! అహం” అనబడు ప్రత్యయమునకు ముందే ఉన్న తన అప్రమేయరూపాన్ని ఏమఱచుట చేతనే 'సంగం' అనేది రూపుదిద్దుకుంటోంది. అందుకుగాను, ఇప్పుడు పురుషప్రయత్నం ఆశ్రయించవలసిందే.

నాస్త్యేవ పౌరుషాత్ అన్యా, సంసారోత్తరణే గతిః |

‘నిరహం’ భావరూపే అస్మిన్ వాసనాక్షయనామని ॥

"సంసారం నుండి నేను ఉద్దరించబడాలి అని ఊరకే అనుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమిటి ? వాసనలు క్షయిస్తే సంసారమూ లేదు, మరొకటీ లేదు. వాసనలు క్షయించాలంటే ఈ జీవుడు పురుషప్రయత్నం ఆశ్రయించడం తప్పించి వేతే ఉపాయమే లేదు.

అనాది, అనంతం” అయిన ఏ చైతన్యమైతే కలదో... అదే అంకురం, అదియే 'బీజం', అదే కర్మ. అదే 'పురుషుడు’. అదే శుభాశుభప్రదమగు 'దైవం'. అదే 'అదృష్టం' కూడా! సృష్టి అనేది జీవుని యొక్క వ్యష్టి-సమష్టిల భావావేశాల సమావేశమే గాని... వేరేమీ కాదు. సృష్టి యొక్క మొట్టమొదటి చైతన్యానికి అన్యంగా ఎక్కడా ఏదీ లేదు. సృష్ట్యాదిలో చైతన్యానికి అన్యంగా అంకురం గాని, బీజంగాని, పురుషుడుగాని, కర్మగాని, దైవాదులుగాని లేవు. కేవలం చైతన్యమే సర్వరూపంగా ప్రకటనమగుచున్నది. అనగా వర్తమానంలో 'జీవుడు’గా ఎవరిని పిలుస్తున్నా అతడు ఒకప్పుడు తన యొక్క నిర్వివాదసర్వాంశ చైతన్యంగానే అనుభవం కలిగి ఉన్నాడు. ఇప్పటికీ ఆతడు అట్టివాడే! అయితే, అట్టి తన సర్వత్త్వమును, నిత్యత్త్వమును ఏమఱచి ఆతడు ద్వైతాన్ని ఆశ్రయించి నేను జీవుడను. నన్ను కర్మలు, పురుషుడు, దేహం మొదలైనవి బంధించాయి... అని తలచుచున్నాడు.

Page:677

పురుషుడు అనబడు జీవుడు “నేను బద్ధుడను" అను అపేక్షాసంప్రాప్తమైన దుస్థితిని త్యజిస్తేనే శాంతి అనుభవిస్తాడు. అట్లా త్యజించగలగాలంటే పురుషప్రయత్నంచే నేను సర్వదా చైతన్యాన్నే”... అనే సంస్థితిని సముపార్జించుకోవటమొక్కటే ఉపాయం.

వాస్తవానికి బీజం గాని, అంకురం గాని, పురుషుడు గాని, కర్మలు గాని లేవు. ఏకైక చైతన్యమే ఈ సుర-అసుర మనుష్యాది ఆయా వేషాలను ధరించి ఈ 'జగత్తు' అనే నామరూపాత్మక శోభతో ఉదితమై ఇక్కడ జగన్నాటకం ఆడుతోంది. కనుక ఓ రామా! లే! సందేహాలన్నీ త్యజించు. సందేహరహితం, సర్వస్వరూపం అగు బ్రహ్మాన్ని (చైతన్నాన్ని) భావన చేయి. అసత్యాలైనట్టి ఈ పురుష-కర్మాదుల గురించిన శంకలన్నీ పారత్రోలివేయి. ఈ పాంచభౌతిక దేహాన్ని అధిగమించు. “సమస్త కల్పనా వర్జితము, వాసనా వినిర్ముక్తము... అయినట్టి చిన్మాత్ర శరీరాన్ని అవధరించు. సమాధి (సమ + అధి) యందు మాత్రమే సర్వదా ఏర్పడివుండు. సమాధి యందు మాత్రమే వ్యవహరించు. సమస్త కోరికలను, సంశయములను విడిచివేయి. నిర్మలమైన చిన్మాత్రమునందు మాత్రమే స్థితి కలిగి ఉన్నవాడవై, ప్రవాహపతితమైన సర్వకార్యాలను నిర్వర్తించు. ఆశాసమన్విత కర్మచరుడవు కాకుండానే స్వభావసిద్ధ కర్మ నిర్వహణ కలిగి ఉండు. కేవలం ఆత్మారాముడవై, పూర్ణ కాముడవై, శాంతిచే మనోహరుడవై, నిర్భయుడవై ప్రకాశించు. నీ మనస్సు అఖండాత్మయందు, హస్తములు లోకవ్యవహారములందు - వ్యవహరించును గాక!

9. ప్రవాహపతితం కర్మ - - అనంగపూర్వక నిర్వహణ

శ్రీరాముడు : మహర్షీ! ప్రవాహపతితం అను శబ్దం యొక్క అర్థమును మరికొంత వివరించ ప్రార్థన. అనివార్యములైన ఆయా క్రియలు నిర్వర్తించవలసి వచ్చుచుండగా... ఈ జీవుడు ఎట్టి జ్ఞాన యోగములను అవధరించాలో బోధించ వేడుకొంటున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షీ : ఓ రామచంద్రా! ఓ ప్రియా సహజీవులారా! మీ స్వరూపము ఆత్మయేగాని, ఈ దేహ-మనో-బుద్ధ్యాదులు కాదు కదా!

నిత్యమ్ అంతర్ముఖః తిష్ఠ, వీతరాగో, వివాసనః

చిన్మాత్రం అమలం, శాస్త్రం కర్మ సర్వత్ర భావయన్।।

ఈ రాగము, వాసన మొదలైనవన్నీ బహిర్ముఖుడై జగదర్శన సమయంలో ఈ జీవుని పట్ల అకస్మాత్తుగానో, క్రమక్రమంగానో ప్రోగవుతున్నాయి. అయితే యథా ప్రాప్తములైన ఆయా కర్మలను నిర్వర్తిస్తున్నప్పటికీ 'రాగ-వాసన'లను అధిగమించి (త్యజించినవాడవై) అంతర్ముఖుడవగుము. ‘అంతర్ముఖమవటం’ అనగా నిర్మలం శాంతం-చిన్మాత్రం అయినట్టి ఆత్మ స్వరూపం అవధరించ టమే! ఆకాశం వలె నిర్మలమైన స్వరూపం కలవాడవై, ప్రాజ్ఞుడవై కేవలం 'చిన్మాత్రం' అయినట్టి ఆత్మ యందే సదా స్థితి కలిగి ఉండు. సమరూపుడవై, సౌమ్యుడవై, సమమగు ఆనందంతో కూడి

Page:678

ఉండు. 'బ్రహ్మంతో అభేదం సంతరించుకోవాలి'... అను ఆశయమును నిర్దుష్టపరచుకో! యథా ప్రాప్తాలగుచున్న సర్వ అల్ప-మహత్తర కార్యాలలో, అట్లాగే, ఆయా శోక-ఆపద-సంకట-భయ సమయాలలో, నిమ్న - ఉచ్ఛ స్థితులలో ఆయా దుఃఖ హాసాదులను ఈ ప్రపంచంలో బాహ్యానికి నటించు. 'ఈ జగత్తు, ఈ పరిస్థితులు, ఈ దేహాం - ఇవన్నీ కూడా అన్ని వేళలా ఒకే తీరుగా ఉండవు. వాటి స్వభావము అట్టిది మరి!... నేనో? ఆత్మయే స్వరూపంగా గలవాడను'... అనే మననం కలిగి ఉండు. అన్నీ తెలిసియే శీతోష్ణాది సర్వ ద్వంద్వాలను పొందుతూ పొందని వాడవై ఉండు. అంతరంగంలో సౌమ్యుడవై ఉంటూనే... బహిరంగంలో మాత్రం తదితరులు వలెనే తదితర అనుకూలంగా వర్తించు. బంధు మిత్ర సమాగమ-వియోగాలలో, ఉత్సవ-నిరుత్సవాలలో, వాసనా ప్రదర్శన - అప్రదర్శనలలో అందరిలాగానే సుఖ దుఃఖాలు ప్రదర్శిస్తూనే... అన్నీ ఎఱిగినవాడవై ‘అతీతత్వం’ వహించి ఉండు.

భూతాని మృత్యు కార్యేషు సంగ్రామాదిషు నిర్ధహ

దావానల తృణానీవ వాసనాక్రాంత మూఢవత్|

అగ్ని రుచి-పచి తెలియకుండానే గడ్డిపరకలను దహిస్తున్నట్లు, పైకి మాత్రం యుద్ధంలో వాసనలచే ఆక్రమించబడిన మూఢుని వలె శత్రుసైన్యమును దహించివేయి. అయితే అంతరంగంలో ఎవరిపైనా ఇసుమంత కూడా క్రోధం కలిగి ఉండకు. ధనంపై మమకారం కలిగి ఉన్నవాడు ధనం ఆర్జించినట్లే నీవు ఆర్జించు. అయితే ధర్మనిరతిని వదలకు, మమకారాదులు లేకయే ఉండు.

దీనుల యెడ కరుణ, మహాత్ముల పట్ల ఉదారత్వం, దుష్టుల యెడ కఠినత్వం వహిస్తూనే సర్వాత్మకుడవై ఉండు.

ఏది ఎట్లు ఏ రీతిగా అగుచున్నప్పటికీ నీవు సర్వదా అంతర్ముఖుడవై, ఆత్మానందయుతుడవై, స్వాత్మారామత్వంతో కూడి ఉండు. 'శమం'చే పరిపూర్ణుడవై, ఉదారచిత్తుడవగుచు ఉన్నప్పుడు నీవు ఏ కార్యం నిర్వర్తించుచున్నప్పటికీ నిర్వర్తించనివాడవే (అకర్తవే) కాగలవు. ఓ సాధూ! రామచంద్రా! 'నేను అఖండము-అప్రమేయము అగు ఆత్మనే' అను ఆత్మ భావనచే ఎవని యొక్క వృత్తి నిత్యం అంతర్ముఖమై ఉంటుందో... అట్టివాని పట్ల ఇంద్రుని వజ్రాయుధం కూడా నిష్ఫలమైపోగలదు.

సంకల్ప కలనోన్ ముక్తే, స్వ సంవిన్మాత్రకోటరే

యః తిష్ఠతి ఆత్మనిస్వైరమ్ ఆత్మారామో మహేశ్వరః!

సంకల్ప కల్పనా విశేషాలను తన హృదయాకాశం నుండి బయటకు నెట్టి ఎవడైతే యథేచ్ఛగా ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడో... అట్టి ఆత్మారాముడే మహేశ్వరుడు. అట్టి చిన్మాత్ర నిష్ఠుని (నేను సర్వాతీతమగు ఆత్మను" - - అను నిష్ఠను ఆశ్రయించిన వానిని) శస్త్రములు ఛేదించలేవు.

న తం భిన్ధన్తి శస్త్రాణి, న దహన్తి హుతాశనాః

న క్లేదయన్తి వారీణి, శోషయన్తిన మారుతాః |

ఆత్మతో ఏకీభూతుడైన వానిని శస్త్రాలు ఛేదించజాలవు. అగ్ని దహించజాలదు. జలం తడుపలేదు. వాయువు ఎండించలేదు. కాబట్టి రామా! జన్మ-జరా-మరణాలు లేని నిత్య

Page:679

నిరతిశయానంద రూపమైన 'స్వాత్మ' అను స్తంభమును ఆశ్రయించి ఉండు. ధీరుడవై నిశ్చలతను

అవలంబించి ఉండు.

ఈ జగత్తుకు కారణము, ఆశ్రయము, సారభూతము అయిన శాంతమగు బ్రహ్మచైతన్యము మాత్రమే ఆశ్రయించతగినది. తదితర బాహ్యవృత్తులనన్నిటినీ అంతర్ముఖం చేసి చ్యుతిలేని స్థితిని సముపార్జించుకోవటమే సాధనలన్నిటి యొక్క ఉత్తమ లక్ష్యమని జనులు గ్రహించెదరు గాక! నిత్యము అంతర్ముఖత్వము కలిగి బాహ్యమున యథా ప్రాప్తములగు కార్యములకు రాగ మమకార రహితంగా నిర్వర్తించే వారికి 'వాసన' ఉదయించజాలదు.

ఈ మనస్సు మరల మరల సాంసారిక విషయాలలో నిమగ్నమౌతోంది. 1. నిర్వర్తించటం, 2. నిమగ్న మవటం... ఈ రెండిటి ఫలితమేమిటో గమనించు. ముముక్షువులైన వారు ఎక్కడెక్కడ తమ మనస్సులు వృత్తులతో కూడి ప్రవేశిస్తోందో ముందుగా గమనించాలి. ఎక్కడ ఆత్మ కంటే అతిరిక్తమైన (ఇష్ట-అయిష్ట-ఉచిత-అనుచిత మొదలుగా గల) భావన ఏర్పడుతోందో అక్కడక్కడ మనస్సు నిమగ్నమౌతున్నట్లే. తాబేలు తన అవయవాలు అంతర్ముఖం చేస్తున్నట్లు ఈ మనస్సును కూడా అంతర్ముఖం చేయాలి. కనబడే తదితర జీవులందరినీ ఆత్మ స్వరూపులుగా చూడటమే మనస్సు యొక్క అంతర్ముఖత్వం సుమా! ఓ రామా! అంతరంగమున వృత్తిరహితుడవై బహిర్గతంగా మాత్రం ఆయా నియమిత సమస్త కర్మలు ఆచరించు.

అంతర్ వృత్తి విహీనేన, బహిర్వృత్తిమతేవ చ

సుప్త ప్రబుద్ధ ప్రాయేణ కార్యమ్ ఆచర, చేతసా |

ఓ రామా! అభ్యంతరమున వృత్తి రహితంగాను, బాహ్యమున వృత్తి సహితుని వలెను ఉన్న వాడవై సగం నిద్రించే చిత్తముతో ప్రపంచమున కార్యములు ఒనర్చుము. బాలుడు అంతరమున వాసనలు లేకుండానే కేరింతలు, ఆటలు, చేతులు కాళ్ల కదలికలు ప్రదర్శిస్తాడు కదా! మూగవాడు అనేక విషయాలు తెలిసికూడా ఏమీ మాట్లాడడు చూచావా? అట్లాగే అభ్యంతర వాసనలన్నీ త్యజించి ఒక బాలుని వలె, మూగవాని వలె ఈ జగత్తును దర్శించటం అలవరుచుకో. ఆసక్తి లేనప్పుడు ఏ కార్యము నిర్వర్తించినప్పటికీ - ఆకాశమును పదార్థములు స్పృశించజాలనట్లు - నిన్ను ఆ కార్యాకార్యములు స్పృశించజాలవు. సదా నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసము నిర్వర్తిస్తూ నీ చిత్తము బాహ్యమున ఒకింత ప్రసరించి అభ్యంతరమున మాత్రం అంతటా మౌనము వహించి ఉండుగాక! సంతాపరహితమై అంతటా ఆత్మయే ఈ సర్వ సహజీవులుగా అగుచున్నది కదా... అను దృఢత్వము నీ చిత్తము వహించును గాక! జ్ఞానముచే చిత్త - బాహ్య ప్రసరణము క్షయిస్తుంది. సంకల్ప కళంక వర్జితుడవై సదా సర్వదా, సర్వత్రా శుద్ధ బ్రహ్మ చైతన్యమున స్థితి కలిగి ఉండుము. ఆపైన ఇక వ్యవహరింపుము. లేదా వ్యవహరింపకుండా ఉండుము. ఏది ఎట్లో అట్లే అగుగాక!

సుషుప్త సమయా వృత్త్యా జాగ్రత్ వ్యవహరన్ ప్రజన్ I గృహీణి మా కించిదపి, మా వా కించిత్ పరిత్యజ ||

Page:680

నీవు మేలుకొని ఉన్నప్పుడు ఆయా అనేక వ్యవహారాలను నిర్వర్తిస్తున్నప్పుడు, రహదారిలో నడుస్తూ ఉన్నప్పుడు... తదితర సర్వసమయాలలో సుషుప్తసమయ-వృత్తితో కూడుకొన్నవాడవై ఉండు. ఇష్టం కదా అని ఏ వస్తువును గ్రహించనూ వద్దు. అయిష్టం కదా అని దేనిని త్యజించనూ వద్దు. జాగ్రత్తులో 1. స్థూల 2. సూక్ష్మ ఉభయ ఉపాధులు అనుభవమౌతున్నాయి కదా! ఈ రెండింటినీ అధిగమించినప్పటి స్థితిచే జాగ్రత్తులోనే సుషుప్త స్థితి అనుభూతమొనర్చుకున్న వాడవౌతావు. అట్లాగే అజ్ఞానం' యొక్క ఆవరణ తొలగుటచే సుషుప్తిలో జాగ్రత్తుడవే ఆగుచున్నావు. ఈ విధంగా జాగ్రత్ - సుషుప్తుల భేదకమైన అజ్ఞానం తొలగగా అప్పుడు ఆ ఉభయంలో ఒకానొక ఏకత్వం సిద్ధించుచున్నది. భేదమును అధిగమించటంచేతనే సర్వస్వరూపమగు ఆత్మస్థితి లభిస్తుంది. ఈ ప్రకారంగా అభ్యాసంచే మెల్లమెల్లగా 'ఆద్యంతరహితము, ద్వంద్వవర్జితము, సమస్త వస్తువులకు పరము’ అయిన ఆత్మ పదము అనుభూతమవగలదు.

10. ఆత్మ అవ్మానసగోచరం

శ్రీరాముడు :

యద్యేవం ముని శార్దూల! తదహం ప్రత్యయాత్మకః |

భవానేవేహ కిం తావత్ వసిష్ఠాఖ్యః స్థితో, వద II

ఓ ముని శార్దూలా! మీరు 'సమస్త వస్తువులు మిథ్యయే. అఖండ పరమాత్మ ఒక్కటే సత్యం'... అనే సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు కదా! అంతా మిథ్యయే అయినప్పుడు 'అహం (నేను)' అను ప్రత్యయ రూపుడనైన ఈ 'రాముడు' ఎవరు? 'వసిష్ఠ మహర్షి' అని పిలువబడే తమరు ఎవరు? గురువులగు మీకు, శిష్యుడనగు నాకు గల గురు శిష్య సంబంధం కూడా భ్రమయేనా? మీరెవరు? నేనెవరిని?... ఈ విషయం విశదీకరించండి.

శ్రీవాల్మీక మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరామచంద్రుడు ఇలా ప్రశ్నించగానే వక్తలలో శ్రేష్ఠుడగు శ్రీ వసిష్ఠ మహర్షి మౌనం వహించారు. ఆయన ముఖంలో కించిత్ చిఱునవ్వుతో కూడిన పరమ గాంభీర్యమైన శాంతి ప్రదర్శితమైంది. సభికులంతా ఇది గమనించి "ఆహా! ఇప్పుడు ఏమి కాను న్నదో? రామడు సూటిగా అడిగిన ప్రశ్నకు వసిష్ఠ మహర్షి సమాధానం ఎట్లు ప్రారంభించను న్నారో!”... అని ఎంతో ఉత్సుకతతో నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. ఆ విధంగా మౌనము తాండవిస్తూ ఉండగా నిశ్శబ్దంగా 45 నిమిషాలు గడచిపోయాయి. అప్పుడు మరల శ్రీరాముడే పెదవి విప్పాడు.

శ్రీరాముడు : మహాత్మా! ఏమిటి మీరు మౌనం వహించి ఉన్నారు? విద్వాంసులు, లోకగురువులు అయిన మీరు ప్రత్యుత్తరమీయలేని ప్రశ్న ఉండజాలదని నాకు తెలుసు. సమస్త తర్కాలకు మీ వాక్కే సమాధానమగుచుండగా మీ జ్ఞాన విశేష లహరి మాపై ప్రసరింపజేయకున్నారేమి?

Page:681

శ్రీవసిష్ఠ మహర్షి :

న మే వక్తుమ్ అశక్తత్వాత్ యుక్తిక్షయ ఉపస్థితః

కింతు ప్రశ్నస్య కోట్యాస్య తూష్టీమేవ, అనఘ! ఉత్తరమ్ |

ఓ రామచంద్రా! చెప్పుటకు అశక్తుడనై మౌనం వహించాను. యుక్తి లేక కాదు. నీకు సమాధానం ఈ 45 నిమిషాలుగా చెప్పుచూనే ఉన్నాను కూడా! నీ ప్రశ్నకు పరమావధియగు సమాధానం మౌనమే నా ప్రత్యుత్తరం.

ఈ ప్రపంచంలో గురువును తాత్త్విక విషయమై ప్రశ్నించే వారిని రెండు రకాలుగా విడదీయ వచ్చు. 1.జ్ఞాని, 2.అజ్ఞాని. అజ్ఞానికి అజ్ఞానత్వమును జతచేర్చి చెప్పబడుతోంది. ఇక జ్ఞానికేమో జ్ఞానవిశేషం ద్వారానే ప్రత్యుత్తరం ఇవ్వవలసి ఉంటుంది. అనగా, శిష్యుడు కూడా ఎంత వరకు జ్ఞానానికి సమీపంగానో, దూరంగానో ఉన్నాడో గ్రహించి తదనుసారంగా సమాధానపరచాలి.

ఇతఃపూర్వం నీవు ఆత్మపదం' గురించి 'ఇంకనూ గ్రహించాలి' అని నాకు అనిపించనంత వరకు నేను వికల్ప సహితమగు ఆయా దృష్టాంత సోదాహరణాలతో కూడిన సమాధానాన్ని చెప్పుచూ వచ్చాను. ఇప్పుడో? తత్త్వజ్ఞుడవై పరమ పదమున విశ్రాంతి పొందావు. ఇప్పుడు నీకు వికల్ప సహితములగు ఉదాహరణాదులతో ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకవేళ మాటలు ఉపయోగించి ఒక సూక్ష్మార్థాన్ని గాని, పరమార్థాన్ని గాని, లేక మరొక మామూలు అర్థాన్ని గాని ఆయా ఉదాహరణలు, దృష్టాంతాలు తీసుకొని చెప్పానే అనుకో.... అట్లా మాటలలో చెప్పే వర్ణనకు కొన్ని దోషాలు ఉండియే తీరుతాయి. ఉదాహరణకు సుదూరంగా ఒక ప్రదేశంలో గల ఒక సుందరమైన శిల్పం గురించి నీకు చెప్పాలనుకో... అప్పుడు "అది చాలా అందంగా ఉంటుంది. మన అయోధ్యలో గల మహా విష్ణువు యొక్క విగ్రహంలా ఎత్తుగా ఉంటుంది. మెఱుస్తూ ఉంటుంది. ముక్కు బుగ్గలు అందమైన స్త్రీ వలె అత్యంత సౌకుమార్యంగా ఉంటాయి.” మొదలైన ఆయా ఉత్ప్రేక్షలు, ఉపమానాలు, విశేషణములు తీసుకొని చెప్పవలసి ఉంటుంది. అట్లా చెప్పుకొనే వాక్యాలన్నీ కొన్ని కల్పనా కళంకములతో కూడి ఉండక తప్పేది కాదు.

'కళ్లు కలువలవలె ఉంటాయి' అనే ఉపమానంలో 'కలువలకు రెక్కలెన్ని ఉంటాయో, కళ్లకు కూడా అన్నే కనురెప్పలు ఉంటాయి. కాబోలు'... అనే రూపంలో ఉండే దోషాలు ఉంటాయి. అనగా... 1. నిరూపక 2. వ్యావృత్తి 3.సంఖ్య 4.పరమార్థ- సాధన... మొదలైన ఆయా దోష కారకాలు ఉండే అవకాశం ఉంటుంది. జ్ఞాని కళంకసహితమైన సమాధానం చెప్పటానికి అర్హుడు. కాదు. అజ్ఞానికి కళంకరహితమైన సమాధానం చెప్పినా అర్థం చేసుకోలేడు. ఓ ప్రియ రామచంద్రా! నీవిప్పుడు జ్ఞానులలో అగ్రగణ్యుడవు సుమా! జ్ఞాని అయిన శిష్యునితో సత్య వస్తువునకు ముక్కుకు సూటిగా, నేఱుగా, సమగ్రంగా ప్రతిపాదించవలసివస్తుంది.

'ఈ రామచంద్రుడెవరు? ఈ వసిష్ఠుడు ఎవరు'... అను నీ ప్రశ్నకు 'సమాధానం సత్యవస్తువగు ఆత్మయే’ అను సమాధానమే ఉచితం. 'ఆత్మ' గురించిన పరిచ్ఛేదక కళంక రహితమైన సమాధానం

Page:682

కాష్ఠం వంటి మౌనమే అయి ఉన్నది. ఆ కాష్ఠ మౌనమునే ఇప్పుడు నీ ముందు సమాధానంగా ప్రకటించాను.

జ్ఞానోదయీనికి పూర్వం తత్త్వం తెలియపరచటానికి వాక్ వ్యవహార రూపం, సంకల్పమయం అగు బోధ అత్యావశ్యకం; జ్ఞానోదయానంతరం మౌనమే వ్యాఖ్యానం

కనుకనే జ్ఞానివగు నీకు ఆ సుందరమైనట్టి మౌనరూప ప్రత్యుత్తరం ఇచ్చాను. 'వసిష్ఠ మహర్షి నామధేయుడగు మీరు వాస్తవానికి ఎవరు?' - అని నీవు ప్రశ్నించినప్పుడు నేను వాక్కుకు కూడా అతీతము, అవిషయము అగు ఆత్మ స్థితిని అవధరించాను. మనుజుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టే మాట్లాడతాడు. ఎప్పుడైతే నేను ఆత్మ స్థితుడనైనానో, ఆ స్థితి వాక్కుకు అతీతమైనది. మనస్సును కూడా అధిగమించినది. కనుక (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా) అట్టి అనుభవ స్థితిలో వాగ్రూపాలను ఎట్లా పరిగ్రహించగలను? ఆత్మానుభవం అవాచ్యం. వాక్కు అనేక కళంకా లతో మాత్రమే నిర్మితమౌతుంది. కాబట్టి ఇక మౌనమే నా సమాధానంగా నాకు శరణ్యమైనది. శ్రీరాముడు : మీ 'మౌనం' అనునది సముచిత సమాధానమేనని నేను శిరసు వంచి అంగీకరిస్తు న్నాను. అయితే అట్టి సమాధానం గ్రహించడానికి మేము వాక్-మనో అతీతత్వ నిశ్చితత్త్వమును గ్రహించునంతటి సాధనా ఔన్నత్యం సముపార్జించి ఉండాలి. సాధక జనులలో అనేకులు అంతటి సూక్ష్మ-పక్వ దృష్టి పొంది ఉండకపోవటం లోకరీతి కనుక వాక్కుకు ఏ నిరూపక వ్యావృత్తాది దోషాలు ఉంటాయో, వాటిని పట్టించుకోకయే (వాటిని వదలి) భోగ-త్యాగ-లక్షణాది ఉపాయాలచే' వసిష్ఠ మహర్షి నామధేయుడగు మీరెవరు? అను నా ప్రశ్నకు సమాధానం ప్రసాదించ ప్రార్థన.

11. మనమందరమూ అద్వితీయాత్మస్వరూపులమే!

శ్రీవసిష్ఠ మహర్షి :

ఏవం స్థితే రాఘవ హే! యథా భూతమిదం శృణు కస్త్వం? కోహం? జగద్వా కిమితి? తత్త్వవిదాంవర!

తత్త్వజ్ఞులలో శ్రేష్ఠుడవగు ఓ రామచంద్రా! నీవు కోరుచున్నావు కాబట్టి నీవెవరు? నేనెవరు? ఈ జగత్తు ఏమిటి?... అనే ప్రశ్నకు వాచ్య-వాచకపూర్వకమైన సమాధానం చెబుతాను, విను.

ఏ చిదాకాశమైతే విషయ వర్జితమై, సమస్త కల్పనలకు పరమై, నిర్వికారమై ఉన్నదో అట్టి చిదాకాశమే నేను, నేనే కాదు. నేను-నీవు కూడా ఆ చిదాకాశరూపులమే! ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశమే అయి ఉన్నది.

శుద్ధజ్ఞానమయ ఆత్మయందు శుద్ధజ్ఞానైకరూపుడనగు నేను అన్య విషయ జ్ఞానా లన్నింటికి అతీతుడనై నెలకొని ఉన్నాను. నాకంటే వేఱుగా ఏదీ అణుమాత్రంగా కూడా గోచరించటం లేదు. ఒకటి రెండవ దానికి వేరైనప్పుడు కదా, 'సంబంధం' అనే మాట? కనుక చిదాకాశమునకు నాకు

Page:683

సంబంధం’ అనే మాట అనుచితం, అయుక్తియుక్తం. అయితే ఆత్మాకాశమే దివ్యానుభవంగా గల నన్ను శిష్యులు ఆశ్రయిస్తూ ఉండగా, వారికి వారి యొక్క స్వస్వరూపాన్ని బోధించాల్సిన సందర్భం ఏర్పడుతోంది. అట్టి సందర్భంలో వారి సందేహాలు నివర్తించటానికి, ప్రతివాదాలపై విజయం కొఱకు, అద్వైతపక్ష స్థానమునందు తత్పరులై ప్రయత్నశీలురై ఉన్న జ్ఞానుల సౌకర్యార్థం ఈ ఆత్మ తత్త్వమును సవివరంగా అభివర్ణిస్తున్నారు. అంతేగాని, అజ్ఞానుల వలె - వీరిది తప్పనో - వారిది ఒప్పనో - ఖండించి - శ్లాఘించడానికి కానే కాదు.

ప్రశాంతుడగు పూర్ణజ్ఞాని ఈ దేహము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఏ పరమశాంతమగు స్థితిని అనుభవిస్తున్నాడో అట్టి అభిమానరహితమగు అఖండ - అప్రమేయ స్థితియే పరమపదము.”

అబహిఃసాధనం , శాంతమనన్తః, సాధనమ్ సమమ్ |

న సుఖం నా సుఖం నా హమ్ న అన్యదిత్యాది తం “శివమ్||

అట్టి పరమ పదం (ఆత్మస్థితి) బాహ్య - అభ్యంతర సాధన రహితమైనది. శాంతం అనంతం కూడా! సుఖ-దుఃఖ రహితమైనది. అహం-త్వమ్ ఇత్యాది పదార్థశూన్యమైనది. అది కేవల శివస్వరూపమైనది.

‘అహంత్వము’ అనేది ముక్తి యొక్క అభావరూపం అయి ఉన్నది. మరప్పుడు అహంత్వముచే ముక్తి యొక్క అనుభవం ఎట్లా? కాబట్టి 'అహంభావము'ను అంగీకరించి ఆపై ముక్తిని వెతుకువాడు

- జన్మాంధుడు చిత్ర పటమును చూడజాలనట్లు - - ముక్తత్వమును గాంచలేడు మరి?

స్పందనే అస్పందనే చైవ యత్ పాషాణవదాసితమ్

అజడస్యైవ తత్విద్ధి నిర్వాణం, అజరం పదమ్ ||

మనస్సు-బుద్ధి-చిత్తం-అహంకారం మొదలైన చేష్టలు ఉన్నప్పుడు, అట్టి చేష్టలు లేనప్పుడు కూడా చైతన్యం యొక్క నిశ్చలమైన ప్రశాంతస్థితి కొనసాగుతూనే ఉంటోంది. అద్దానినే అజరమైన ‘నిర్వాణపదం’ అని గ్రహించు. ఒక అజ్ఞాని తన అంతరంగంలో కుండ-ఇల్లు-ఊరు మొదలైన వస్తువులను స్ఫురణరూపఫలంగా పొందుతూంటాడు చూచావా? లోకైషణా సహితుడు లోకంలోని వస్తువులను ఊహలద్వారా హృదయంలో - ఈ భౌతిక దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గాంచుచూనే ఉన్నాడు.

ఇక లోకైషణారహితుడైన జ్ఞాని అంతే స్పష్టంగా తనలో చిద్రూపం - స్వయంప్రకాశమయం” అగు ఆత్మను స్వయంగా అనుభవిస్తున్నాడు. ఆత్మకు వేరైనదేదీ అతనికి అనుభవం కావటమే లేదు. అట్టి ఆత్మపదమునందు 'నేను-నీవు' అను విశేషాలుగాని, అనహంత్వం - అన్యత్వం మొదలైన భావనలు కూడా గాని లేవు. కేవలం "కేవలీ భావమైన - - నిర్వాణరూపమైన నిర్మలమగు శివరూప ఆత్మ ఒక్కటే ఉన్నది. చైతన్యమునందు కించిత్ చమత్కారంగా విషయాల సంబంధితమైన వ్యాప్తి రూప క్రియ ఏర్పడటం జరుగుతోంది. అట్టి నిర్విషయ నిర్మల ఆత్మ యొక్క కించిత్ విషయాసక్త రూప ఆశ్రయమే మహత్తర క్లేశాన్ని కలిగించు బంధంగా కనబడుచున్నది.

Page:684

విషయోన్ముఖత్వమే... సంసారము! చైతన్యం విషయోన్ముఖత్వం కాకుండుటయే... అవ్యయ పదమగు మోక్షం! వాస్తవానికి అపరిమితమగు చైతన్యం పరిమితమగు విషయాలచే బాధింపబడటం ఎట్లా కుదురుతుంది? దేశకాలాదులచే అపరిచ్ఛిన్నమై, శాంతమై, నిజశాంతస్వరూపమున స్థితి కలిగి ఉన్నదైనట్టి చైతన్యమునందు విషయం అనబడేదేదీ సంభవించజాలదు. ఇక అట్టి ఆత్మ చైతన్యం దేనిచే ఎట్లు బంధం పొందగలదు?

ఓ ప్రియశ్రోతలారా! ఒకడు ఒక కల కంటున్నాడనుకోండి. ఆ స్వప్నం ఎక్కడి నుండి ఎవరు కల్పించగా వచ్చింది? స్వప్నరూపమగు చైతన్యమునకు అంతర్గతంగానే వాసనా రూపసంకల్పంగా ఆ స్వప్న జగత్తు ఉబుకుచున్నది కదా! కనుక ఆ స్వప్నజగత్తు చైతన్యమునుండే వచ్చింది. వేరుగా ఎక్కడి నుండి రాలేదు. అనగా స్వప్న జగత్తు చైతన్యమునకు వేఱుకాదు. కానీ వేరుగా అజ్ఞానంచేత అనిపిస్తోంది. అట్లాగే... ఈ బాహ్యజగత్తు కూడా స్వస్వరూపమగు చైతన్యమునకు అభిన్నంగా ‘అనన్యంగా’ ఉన్నప్పటికీ భిన్నమైనట్లు బాహ్యజగద్రూపంగా అనిపిస్తోంది.

వాస్తవానికి ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నం కాదు. జగత్తులాగానే మనో-బుద్ధి-చిత్త అహంకా రాదులు కూడా బహిర్ముఖంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్ముఖత్వం చేత అవన్నీ ఆత్మకు అభిన్నమైన చిద్రూపాలే. బాహ్య అభ్యంతరాలలో అంతటా కూడా నిర్మలం-సమం-అభిన్నం”... అయినట్టి చైతన్యం మాత్రమే వ్యాపించి ఉండగా, ఇక అన్యమైనదెక్కడుంది చెప్పు? చైతన్యంలో బహిర్ముఖత్వం” ...అనే భ్రమ చేత ఏ ఏ బుద్ధి ఉందో... ఆ బుద్ధియే ఈ 'సంసారం' అనే అనర్థమంతా కలిగిస్తోంది. సుమా! శుద్ధమైన చైతన్యం, శూన్యం అను రెండింటి భేద- అభేదాలేమిటో విజ్ఞులు తమయందు అనుభవైకవేద్యంగా స్పష్టంగా గ్రహిస్తున్నారు. చిన్మాత్ర రూపమైన నిత్య నిరతిశయానందం ఎవరికి వారికే అనుభవైకవేద్యమేగాని వాక్కుతో చెప్పగలిగేది కాదు. మసక చీకటిలో వస్తువులు కొంత కనబడి కొంత కనబడక అవాస్తవతతో కూడి అనుభవమౌతాయి చూచావా? అట్లాగే ఈ జగత్తు కూడా అజ్ఞాన మసకచీకట్ల కారణంచేత ఉన్నది ఒకటి, చూచేది మరొకటి"గా అనుభవమౌతోంది.

స్వతహాగా వాసనారహితుడను శాంతుడను అగుటచేత నేను చిదాకాశరూపుడను అయి ఉన్నాను. నేనే కాదు. నీవుగాని, మరెవరైనా గాని వాసనలను ధరించకపోతే మనసంతా సర్వదా స్వతఃసిద్ధమగు చిదాకాశరూపులమే అయి ఉన్నాము. ఓ రామా! వ్యవహారదశయందు అజ్ఞుని వలె ఉన్నప్పటికీ సర్వదా చిన్మాత్ర శరీరధారివై ఉండు. చిన్మాత్ర శరీరధారణ అను అనునిత్యమైన అభ్యాసం బలపడుతూ ఉండగా, ఇక ఈ దేహాదులతో కూడిన జగత్తు క్రమంగా అసత్తుల్యమై స్వయంగా

శమం పొందుచూ పోగలదు.

నేను అజ్ఞుడను... అను స్వస్వరూపముపై గల అభిప్రాయమే సంసారరూపమగు అవిద్యాగ్ని. అది అజ్ఞానవాయువుచే ప్రజ్వలితం అవుతోంది. అయితే అదే జీవుడు నేను సర్వదా అఖండము అప్రమేయము అగు బ్రహ్మమునే... అను రూపం గల ఆత్మసాక్షాత్కార చరమవృత్తి రూపమైన 'పరిణతి' సంపాదించుకోవటం చేత సంసారాగ్ని తానంతట అదే చల్లారుతుంది.

Page:685

జీవుడుగా నేను ఒక చీమ కంటే కూడా అధికుడను గాను. కానీ ఆత్మగా నేను బ్రహ్మదేవుని కంటే కూడా అతీతుడను అని ముక్తపురుషులు గ్రహించి ఉంటారు. అట్టి ముక్త పురుషులు కూడా ఈ జగత్తులోనే ఉన్నారు. వారు నిత్యనిరతిశయానంద రూపంలో స్థాణువు వలె అజ్ఞానం లేనట్టిది - దుఃఖక్షోభా వర్జితం... అయినట్టి ఆత్మయందలి స్థితినే శాస్త్రములు అక్షయమైన మోక్షము” అను శబ్దముచే ఉద్దేశిస్తున్నాయి.

ఆత్మను ఎఱుగకపోవటం చేత జీవుడు అజ్ఞాన దశను పొంది పశువృక్షాది జన్మలు సంపాదించుకుంటున్నాడు.

ఆత్మజ్ఞానం చేత ఆత్మరూపత్వం పొంది మానవుడు సాక్షాత్ “మునిగా పరిణమిస్తున్నాడు. చీకటిలో వస్తువులు మిథ్యతో కూడిన ఆకారాలుగా కనిపిస్తాయి. అట్లాగే "నేను, జగత్తు, బ్రహ్మం” ఇవన్నీ వేరువేరు ఆకారాల వలె అవిద్యామయమగు భ్రమచేత అనిపిస్తున్నాయి. 'ఆత్మదర్శనం' అనే దీపం వెలుగగానే... అంతటా శివము, శాంతము అగు ఆత్మయే గోచరించటం జరుగగలదు. సంకల్పరహితుడు, దృశ్యమునకు సంబంధించిన వేదనను అధిగమించినవాడు, అహంకార-వాసనా వర్జితుడు, ప్రశాంతచిత్తుడు అయిన జీవన్ముక్తుడు ఈ ఇంద్రియ సమూహాలు, ఈ బాహ్య పదార్థాలు ఎదురుగా ఉన్నప్పటికీ త్యజించడు. ఒకింతగా కూడా ఆశించడు. అనగా, అవన్నీ మిథ్యగా చూడ గలుగుతాడు. గాఢనిద్రలో ప్రవేశించేవానికి జాగ్రత్ స్వప్న వ్యవహారాలు లేకుండా పోతాయి. చూచావా? అట్లాగే “ఆత్మాజ్ఞానానుభవి విషయంలో సమస్త దృశ్య సమూహాలు ఆత్మయందు లయించిపోతాయి. అతనికి ఈ జగత్తంతా స్వాత్మరూపంగానే భాసిస్తూ (గోచరిస్తూ) ఉంటుంది.

ఆకాశంలో నీలత్వం కనిపించటమనేది కంటియొక్క భ్రమేకదా! అట్లాగే బ్రహ్మమునందు పృథివి మొదలైన ఆయా వస్తువులు, దేహములు కనిపించటమనేది భ్రాంతి మాత్రమే గాని, మరింకేమీ కాదు. ఆకాశం వాస్తవానికి నీలరంగు రహితంగా, స్వచ్ఛంగా ఉంటున్నట్లు బ్రహ్మం కూడా సర్వదా దృశ్య పదార్థరహితమై, నిర్మలమై ఉన్నది ఈ సమస్తజగత్తు అసత్తుయే అను చక్కని బుద్ధి ఎవడు పెంపొందించుకుంటాడో... అట్టివాడు సమస్త వాసనలు కలిగి ఉన్నప్పటికీ వాసనా

రహితుడే సుమా!

భవ్యరూపుడవగు ఓ రామచంద్రా! స్వప్న- సంకల్ప- ఇంద్రజాలము లందు... కనిపించే సమస్త అద్భుత సృష్టి మాయామయము, అసత్తు మాత్రమే కదా!

అట్లాగే ఈ బ్రహ్మాండ సృష్టులన్నీ అసత్యములే అయి ఉన్నాయి. స్వప్నసమయమందలి స్వప్నంలాగానే ఈ బాహ్య వస్తు వ్యవహారములందు వివేకులకు ఏమాత్రం విశ్వాసం జనించదు.

న దుఃఖమస్తి న సుఖం న పుణ్యం న చ పాతకమ్

న కించిత్ కస్యచిత్ నష్టం కర్తుర్భోక్తురసంభవాత్ I

స్వయంకృతమైన భ్రమచే అనుభవమగుచున్న కల్పితానుభవాలకు కర్త ఎవడు? భోక్త ఎవడు? ఇక సుఖదుఃఖ పుణ్యపాపాలు ఎక్కడివి? ఎవనికి ఏది నశిస్తోంది? ఏది ఉత్పన్నమౌతోంది? ఈ సమస్త జగత్తు కూడా “దృశ్యశూన్యమై నిరాధారమైన" ఆత్మయే అయి ఉన్నది. ఏ అహంకారమునకైతే

Page:686

మమత్వము అనేది ప్రతీత మగుచున్నదో... అది కూడా రెండవ చంద్రునివలె, స్వప్ననగరంవలే ఆ ఉభయములు కూడా లేనివే" సుమా!

ఓ రఘురామా! ఈ జగత్తుకు ఒక కారణం అంటూ ఉంటే... అది అకారణ నిరాకార అగు కూటస్థ బ్రహ్మమేగాని, మరింకేమీ కాదు.

ఈ సృష్టి, సంకల్పాత్మకమగు (కారణరూపమగు) చిత్తం, ఆ చిత్తము యొక్క కార్యరూపమగు ఏక-అనేక రూపములతో కూడిన బ్రహ్మాండరూప ప్రపంచము, ఆ బ్రహ్మాండరూప ప్రపంచము యొక్క అంతర్గతాలైనట్టి "పృథివి" మొదలైన పదార్థజాలం, దేహి దేహం (అవయవి-అవయవాలు) యొక్క స్థితి-గతులు... ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క వివర్తం తప్ప మరింకేమీ కాదు.

మరింకేదియో అనటానికి యుక్తి కుదరదు. అనగా, అజ్ఞానముచే త్రాడే పామురూపంగా భాసించునట్లు తత్త్వజ్ఞానం యొక్క లేమిచేత బ్రహ్మమే 'జగత్తు' రూపంగా భాసించటం జరుగుతోంది. "పాముగా కనిపించటం త్రాడు యొక్క స్వభావం... అని అనగలమా? లేదు. అట్లాగే "జగత్తుగా భాసించటం బ్రహ్మం యొక్క స్వభావం" అను స్వభావం గూర్చిన వచనం యుక్తి యుక్తమే కాదు. అట్లాగే "ఈ ప్రకాశ్యకమైన జగత్తు మిథ్యయే అయినట్లు ప్రకాశమగు చైతన్యం అనేది కూడా మిథ్యయే... అనే నాస్తికవాదం కూడా ఏమాత్రం యుక్తియుక్తం కాదు. ఎందుకంటే సమస్తం లేదు. అంతా నాస్తి అని చెప్పే ఆ నాస్తికుడు విద్యమానమే అయి ఉన్నాడు కదా! “ఇదంతా లేదు” అనే అనుభవం లేక అభిప్రాయం ఎవరిదో... అదియే పరమాత్మ యొక్క సత్త. ఏదీ లేదు. (సర్వం నాస్తి). కనుక నేను కూడా లేను"... అని తనను తాను ఎవరూ నిషేధించలేరుకదా! ఎద్దాని ఉనికైతే నిషేధించటానికి ఏమాత్రం వీలుకాదో... అదే బ్రహ్మం. ఓ రామచంద్రా! ఏ పరమార్థసత్యమగు ‘ఆత్మ’ బ్రహ్మజ్ఞానులచే ఎల్లప్పుడూ సేవించబడుతుందో, ఏ స్వస్తరూపమైతే అన్యులచే అపహరించ బడటానికి ఏమాత్రం శక్యం కాదో ... అట్టి శాంతం-నిర్మలం-అజం-సమం-అక్షయం-నిత్యసిద్ధం అగు శివస్వరూపుడవై ఉండు. ఇక, వ్యవహార దశలందంటావా... తదితరులవలెనే నీవు కూడా భోజన-పాన-క్రీడాదులు నిర్వర్తించు. ఏది ఎట్లు ఉంటున్నప్పటికీ, ఉండకపోయినప్పటికీ అస్మత్ స్వస్వరూపం త్రికాలలోనూ యథాతథం" అని గ్రహించి ఉండు. స్వస్వరూపం, తదితరం" - ఈ ఉభయం గ్రహించి సమన్వయించుకొని పరమార్ధమును సుస్థిరీకరించుకున్నావా... ఇక నీవు ముక్తుడవే అవుతావు. ఎందుకంటే, ఈ దృశ్యబంధమే నీకుండదు కాబట్టి! బంధం' అనబడేది స్వయంకల్పితమైన వైచిత్ర్య చమత్కారమే కాబట్టి!

12. “అనహమ్ ఏవ ముక్తిః

శ్రీరాముడు : మహర్షీ! ఈ జీవుడు స్వతహాగా మోక్ష స్వరూపుడై ఉండి కూడా... అతని అట్టి అనుభవమునకు ఏది నిరోధమై ప్రాప్తిస్తోంది?

Page:687

శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! అహంభావం (నేను-నాది) అనేది సమస్త సాంసారిక వ్యవస్థ లకు, అవిద్యకు మూలభూతమై ఆతని మోక్షపదానికి అడ్డుగా అగుచున్నది. అట్టి అహంభావమును కలిగియే ఉండి ఎవరు మూడు లోకాలలోనూ ముక్తి కొరకై వెతుకుతూ ఉంటారో... అట్టి మూఢుల ప్రయత్నమంతా 'పిచ్చివాని పరుగులు' వంటివేనయ్యా! అజ్ఞానంచే ఏర్పడిన అహంభావం యొక్క ఉనికియే ‘ఇంకా అజ్ఞానం ఉన్నది' అనటానికి గుర్తు సుమా! శాంతుడగు జ్ఞానికి 'అహంమమ’ (నేను-నాది) అనే అభిమానం ఉండదు. జ్ఞాని తన యొక్క జ్ఞాన సముపార్జనాబలం చేత ఈ అహంభావ మాలిన్యాన్ని పూర్తిగా త్యజించివేసి ఆకాశం వలె నిర్మలుడై మోక్షరూపంలో వెలయు చున్నాడు. అట్టి జ్ఞాని దేహసహితుడై ఉన్నా, లేక, దేహరహితుడై ఉన్నా కూడా... సదా సంతాప రహితుడై వెలయుచున్నాడు. అట్టి అహంకారరహితుడై ప్రకాశించే జ్ఞాని శోభించే విధంగా పూర్ణ చంద్రబింబం గాని, కెరటత్వం వదలి అత్యంత శాంతం వహించిన సముద్రంగాని, శరత్కాలంలోని మేఘరహిత ఆకాశంగాని శోభించలేవు. ఒక చిత్రపటంలో చిత్రించబడిన సైన్యం ఏ విధంగా సంక్షోభవర్జితమై ఉంటుందో... అట్లా వ్యవహార నిమగ్నుడైనప్పుడు కూడా జ్ఞాని సదా సమత్వం తోనే కూడి పరమప్రశాంతుడై, నిర్లిప్తుడై, సుఖ విశ్రాంతి స్వరూపుడై ఉంటాడు.

తరత్తరంగో జలదిః జలమేవ యథాఖిలమ్ దృశ్యోచ్ఛునమపి బ్రహ్మ, తథా బ్రహైవ నే తరత్

చంచల తరంగాలతో కూడి ఉన్నప్పటికీ సముద్రమంతా జలమే కదా! దృశ్యంతో తాదాత్మ్యమై ఉన్నప్పటికీ బ్రహ్మం బ్రహ్మమేగాని అన్యం కాదు. తరంగాలతో కనిపించే సముద్రం బాహ్యానికి క్షోభయుతంగా ఉన్నప్పటికీ లోన ప్రశాంతంగానే ఉంటుంది కదా! అట్లాగే బాహ్యానికి ఆయా సందర్భానుచితంగా క్షుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ అభ్యంతరంలో ముక్తుడు పరమశాంతంగాను, సదా ప్రసన్నంగాను ఉంటాడు. అన్ని తరంగాలలోనూ జలమే స్ఫురిస్తూ ఉండగా, ఇక ఒక తరంగానికి మరొక తరంగానికి భేదమెక్కడున్నది? చైతన్యమగు ఆత్మయందు అహంకారాది సృష్టి రూపంగా చైతన్యమే స్ఫురిస్తూ ఉండగా, ఇక పదార్థముల అనేకత్వం ఎక్కడిది? ఆ అనేకంగా స్ఫురించేదంతా భ్రమచేత మాత్రమే! ఆకారంలో దట్టమైన పొగ ప్రవేశించినప్పుడు ఆ పొగ అనేక ఆకారాలుగా కనిపిస్తున్నప్పటికీ ఆ ఆకారాలన్నీ వస్తుతః పొగ (ధూమం) కంటే వేరు కానట్లే ఈ కనబడే సృష్టులన్నీ పరబ్రహ్మం కంటే, వేరు కాదు. ఓ విజ్ఞులకు సర్వసభికులారా! మీరంతా దేనిగురించి కూడా విషాదం పొందవలసిన అవసరమే లేదు. నేను చర్వితచర్వణంగా చెప్పుతూ వస్తున్నట్లు సమస్త విషాదాలకు హేతువుగా అనిపిస్తున్న ఈ ప్రపంచం కేవలం చైతన్యం యొక్క వివర్తం మాత్రమే! ఇది విచారణాబలం చేత గ్రహించండి. ఈ ప్రపంచం యొక్క భ్రాంతిని వదలి ఆత్మయందు విలాసశీలురై తత్ఫలితంగా సర్వోత్తమత్వముచే విరాజిల్లండి. మన ఈ సంభాషణా ప్రభావం చేత జ్ఞానులుగానే అగుచుండగా, ఇక అజ్ఞత్వ మెక్కడిది?

అంకుర దృష్టాంతం - విత్తనములో దాగి ఉండే ఆకార రహితమైన అంకురసత్త తనయందు వృక్షము ఆకులు పూలు మొదలైనవన్నీ అనుభవిస్తున్నట్లు, తాను నిరాకారుడైనప్పటికీ ఈ జీవుడు

Page:688

ఆకాశమువలె నిర్మలము విశాలము అయిన ఆత్మయందు జగత్తు - అహంకారము

మొదలైనవన్నీ అనుభవించుచున్నాడు.

గాలిలో కదిలే అగ్నిజ్వాల దృష్టాంతం - ఒక కొఱివిని (లోహపు గొట్టానికి నూనె గుడ్డలు చుట్టి అంటించగా ప్రజ్వలించే అగ్నిజ్వాల) గాలిలో త్రిప్పుతూ ఉంటే అప్పుడు కంటికి (ఆ త్రిప్పే విధానాన్ని బట్టి) గాలిలో చక్ర-దండాది ఆకారం వలె కనిపిస్తుంది. అక్కడ కనిపించే ఆకారం భ్రమ అయినట్లు ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ జీవునకు జగత్తు అహంకారాది అనుభవమంతా ప్రాప్తిస్తోంది.

కాముకుడు, ప్రేయసి - - ఎదురుగా ఉన్నది తదితర అన్ని దేహాల వలె రక్తమాంస నిర్మితమే అయినప్పటికీ... కాముకుని చిత్తానికి స్త్రీ రూపాలు కామినుల వలె అగుపిస్తున్నట్లు... జీవునికి తన అంతరంగంలో ప్రక్షిప్తమై ఉన్న వికారాలను అనుసరించి బాహ్యంలో రూపాదుల సత్త, అభ్యంతరంలో మనస్సు మొదలైన వాటి యొక్క సత్త అనుభవమౌతోంది. వాస్తవానికి అవన్నీ ఆత్మయే అయినా, విరుద్ధమైన లక్షణత్వంగా ప్రదర్శితమవుతోంది. ఆత్మ వ్యతిరిక్తంగా అనుభవమౌతోంది.

కాబట్టి ప్రియ శ్రోతలారా! ఈ జగత్తు ఎట్లా ఉత్పన్నమౌతోంది? ఎట్లా స్థితి కలిగి ఉంటోంది? ఎట్లా తన కార్య సంరంభమంతా ప్రదర్శిస్తోంది? ఇది ఎట్లా సుఖ దుఃఖాలు అనుభవిస్తోంది? ఎట్లా నశిస్తోంది? దీని దేశ-కాలములు ఎట్టివి?...

ఈ ప్రశ్నలకు సమాధానంగా మనం ఉత్పత్తి - స్థితి - ఉపశమనాది ప్రకరణాలలో అనేక విషయాలు చెప్పుకున్నాం కదా! అనేక యుక్తులతో ఇన్ని రోజులుగా మనం చెప్పుకున్న విషయాలన్నీ విమర్శించి 'జగత్తుగా' అనిపించేది భ్రమచేతనేనని, వాస్తవానికి ఇదంతా ఆత్మయే అయి ఉన్నదని గ్రహించి, దేహసంబంధ జరామరణాదులను స్వస్వరూపంపై ఆపాదించటం మానివేసి శాంతాన్ని వహించి ఉండెదరు గాక! ఎవడైతే ఈ జగత్తులో ఇష్ట- అయిష్టములు ప్రాప్తించే సందర్భంలో (సమయంలో) ఒక శవం వలె పరమశాంతచిత్తుడై ఉంటాడో, సమత్వం వహించగలిగి ఉండే యుక్తితో కూడిన శక్తిని సంపాదించుకుని ఉంటాడో - అట్టివాడే "జీవన్ముక్తుడు" అని అనిపించు కుంటాడు. ఈ ప్రపంచం నిండా భిన్నత్వం ఉన్నప్పటికీ అతనిలో భిన్నత్వం ఒకింత కూడా ఉదయించదు, సంభవించదు. వాసనారహితులగు జీవన్ముక్తుల అహంత్వమునకు, ఆ అహంత్వముచే భోక్తృత్వమునకు, చైతన్యమునకు ఒకింత కూడా భేదం ఉండదు. సముద్రంలో ఓడ భారంగా ఆయా వస్తువులను మోసుకు వెళ్ళుచున్నట్లు సాంసారిక జీవుడు తాను అహంకార - వాసనాది పాశములచే బంధించబడి తద్వారా అనుభవించే జగత్ రూప వ్యవహారమంతా మోస్తున్నాడు. అట్టిమోత బరువు (ప్రాపంచిక సంస్కారాల ధారణ) భారం కొరకే అయి ఉన్నది. “ఈ జగత్తు-మనో-ప్రాణాదులన్నీ చిద్రూపమే, ఆత్మరూపమే... అని గ్రహించినవాడు దేహమనో- ప్రాణాదులు ధరించి ఉన్నప్పటికీ ధరించనివాడే అగుచున్నాడు. కాదూ? ఈ జీవ-జగత్తుల రూపసత్త (భేద వ్యవహారాలను నమ్మకంతో) పొందు వారికి దుఃఖమే పరిణామంగా అగుచున్నది.

Page:689

‘అజ్ఞానం’ అను జడత్వ రూపమైన అపరాధాన్ని దృష్టియందు, హృదయం నందు అట్టేబెట్టుకొన్నంత వరకు 'మోక్షము' యొక్క నిరతిశయానందము జీవునకు అలభ్యం

ఓ రామచంద్రా! ఏ పదార్థములు సంకల్పముచే సిద్ధించుచున్నాయో, ఆయా పదార్థములన్నీ కూడా సంకల్ప ప్రభావం చేతనే మరల తప్పక నశించబోతున్నాయి. సంకల్పాలకు ఈవల మోక్షం సిద్ధించదు. ఎచ్చటైతే సంకల్పం సంభవించదో... అదే సత్యమైన నాశరహితమైన మోక్షపదము. దేనిని ఆత్మకు అనన్యంగా చూస్తామో అద్దాని పట్ల అంతంత వరకూ మనం సంకల్ప రహితులమేనని సూక్ష్మదృష్టితో గ్రహించు.

“నా అన్యో, న చ అహమస్మి" ఇతి భావనాత్ నిర్భయోభవ

సత్యం యుక్తం భవతి ఏతత్ విషమపి అమృతం యథా ॥

నేను’ - అనునది స్వతహాగా దేహాతీతమైనది జగదతీతమైనది. ఓ ప్రియమైన శ్రోతలారా! నేను గాని, దానికి అన్యమైన 'నీవు' మొదలైనవి గాని లేవు... అను భావనచే మీరంతా నిర్భయత్వం పెంపొందించుకోండి. ఒక మూఢుడు అమృతమును “ఇది విషం అని తలచి ఉపేక్షించవచ్చుగాక! విషమును అమృతమని తలచి అపేక్షించవచ్చుగాక! విజ్ఞుడైనవాడు బాగా పరిశీలించి అప్పుడు అమృతమును స్వీకరించటం, విషమును దూరంగా ఉంచటం చేస్తాడు కదా! అట్లాగే ప్రాజ్ఞుడైనవాడు విషప్రాయమగు 'అహంకారము'ను వదలి అమృతప్రాయమగు 'అనహమ్'ను చక్కగా గ్రహిస్తు న్నాడు. "సకల భయాలకు కారణ 'అహమ్' అనునదే అని గుర్తిస్తున్నాడు. జ్ఞాని అయినవాడు అల్ప దృష్టికి తారసపడే సత్యములను ప్రక్కకు పెట్టి 'పరమార్థసత్యము నందు మాత్రమే లక్ష్యశుద్ధి కలిగి ఉంటున్నాడు. ఎందుకంటావేమో? ఈ జగత్తు, దేహం మొదలుకొని చిత్తము వరకు గల ఈ ఉపాధిని ఎంతగా వెతకి వెతకి చూచినా కూడా నేను అనుదానికి ఎచ్చటా స్థానమే లభించటం లేదు. కాబట్టి "ఈ జడమైన దేహాదులు నేను కాదు" అనునదే ఇక్కడి పరమార్థసత్యము. ఆత్మ విచారణచే ఎవరిపట్లైతే ఈ చిత్తము మొదలైనవి అకృతముగాను, సహజంగాను శమించిపోతాయో (లేక) ‘అవి లేనివే’ అని తెలియవస్తాయో... అట్టివారియందు అహంత్వము అనేది కూడా స్వయంగా నిర్విషయరూపమై స్వయంగా ఆత్మత్వమునందు లయిస్తోంది, 'అది నశిస్తోంది' అని మనం అంటున్న ప్పటికీ వాస్తవానికి నశించదు. మరి? అది ఆత్మత్వము (అఖండత్వము అప్రమేయత్వము నిర్గుణద్వము - నిర్మలత్వము) సంతరించుకొంటోందని గ్రహించు. అట్టి ముక్తత్వము సంతరించు కోవటానికి మూడు ఉపాయాలు1. భోగత్యాగము - తద్ద్వారా క్రమక్రమంగా దృశ్యత్యాగము

2. ఆత్మవిచారణ - తద్వారా దృశ్యాతీతత్వము

3. మనో ఇంద్రియాదుల నిగ్రహరూప పురుష ప్రయత్నం (శాస్త్ర ప్రవచిత సాధనాభ్యాసం) సర్వముముక్షువులారా! పై మూడు యత్నాలచే అనాత్మత్వాన్ని మొదలంటా పరిత్యజించి 'స్వాత్మ'ను శరణువేడండి. ఆత్మ స్వరూపం చే ఈ పృథివిని ఈ లోకాలను ఆక్రమించివేసి ఉండండి.

Page:690

మోక్షము అనగా? - “వాసనలన్నీ క్షయింపగా అప్పటి మనస్సు యొక్క బ్రహ్మం తోటి ఏకత్వ సంబంధమైన స్థితియే మోక్షము" అని శ్రుతులు, విద్వాంసులు సిద్ధాంతీకరించుచున్నారు. ఈ ప్రపంచంలో సంఘటనల పట్ల, పదార్థములపట్ల, సంబంధాల పట్ల, వ్యవహారాల పట్ల మనస్సుకు సుఖ-దుఃఖ-భయ-క్రోధాది ఎటువంటి ప్రభావం కలగకపోతే, అప్పుడు ఆ మనస్సు వాసనా రహితమైన దానిగా చెప్పుతారు. అయితే, అట్టి 'మోక్షము' అనేది తత్త్వజ్ఞానం లేకపోతే ఎన్నటికీ సంభవించదు. "ఆత్మసత్యమ్-జగత్మిథ్యా" అనునదే మోక్ష శాస్త్రం యొక్క సారం. కానీ, చాలా మంది జీవులకు రాగాదుల ప్రాబల్యం చేత ఈ జగత్తు సత్యమే కదా”... అనే భ్రమతో కూడిన నమ్మకం తొలగటం లేదు. అందుచేతనే ఆత్మశాస్త్రాలపై, ఆత్మజ్ఞానంపై సరైన విశ్వాసం కలగటం లేదు. తత్ఫలితంగా అట్టి జీవులపట్ల సంసార బంధము నిత్యము అనువర్తిస్తూనే ఉంటుంది.

కనుక ఓ రామచంద్రా! ఈ జీవుడు ఆత్యవసరంగా జగత్తు - అహంభావము అనేవి అసత్తు (లేక) భ్రమ మాత్రమే అని ఎరుగునుగాక! గృహ-బంధు-దార-సుత-స్వశరీరాదులందు "ఇవి నావే” అనే మూర్ఖరూపమైన మమత్వము క్రమంగానో, ఒక్కసారిగానో ఎట్లాగో అట్లా వదలును గాక! అప్పుడు వర్తమానంలో పరిచ్ఛిన్నత్వం అనుభవిస్తున్న ఈ జీవుడు స్వయంగా బ్రహ్మమే అగుచున్నాడు. ఇవి నావి కావు. ఎందుకంటే ఇవి ఎల్లప్పటికీ నా వద్దనే ఉండవు కదా... అను భావన చేస్తున్నంతమాత్రంచేత ఈతడు బ్రహ్మత్వమును సంతరించుకొనుచుండగా, ఈ మాత్రం ప్రయత్నం చేయటానికి సిద్ధంగాని జీవులకు నేనేం చెప్పాలి?

1. ఇది నిత్యం, ఇది అనిత్యం, 2. ఇది సత్యం, ఇది భ్రమ అని గ్రహించి ఉండటమే జీవన్ముక్తి. చివరికి జ్ఞానం కంటే వేఱుగా ముక్తి కొరకై మరే ఉపాయమూ లేదని మా అభిప్రాయం.

13. అనంత స్వస్వరూపంలో అల్ప దృశ్య విభాగం

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! చైతన్యము యథాతథంగా ఉంటూనే... తన అనంత తత్త్వము యొక్క ఒకానొక స్వల్పరూపవిభాగమునందు స్వయంసంకల్పనానుసారంగా సత్తును అసత్తును పరికల్పించు కొని, ఆపై అద్దానినే సత్తుగానో, అసత్తుగానో అనుభవించుచున్నది.

అ చైతన్యమే ‘బాహ్య పదార్థముల అనుభవం' అనబడే తనయొక్క దృఢాభ్యాసం చేత బాహ్య మగు ఈ జగదాకారంగా స్పురిస్తోంది.

శ్రీరాముడు : అనగా చైతన్యమే అసలైన స్వరూపంగా గల జీవుడు పొందే బాహ్యానుభవమంతా అతని అంతరంగమునందలి దృఢాభ్యాస ప్రభావము మాత్రమేనని మీ ఉద్దేశమా?

శ్రీవసిష్ఠ మహర్షి : కచ్చితంగా అంతే! ఇక్కడ మనకు స్వప్నమే దృష్టాంతం. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్ట యొక్క స్వస్వరూపకల్పిత విస్తారమే కదా? ద్రష్ట యొక్క అంతర్గత చైతన్యమే బాహ్యమున జగత్తువలె దర్శించబడుచున్నది కదా!

Page:691

ఈ సమస్త జగత్తు చిత్తు యొక్క కల్పితరూపం తప్పితే మరింకేమీ కాదు. అట్టి చిత్తు సర్వదా అకాశంకంటేకూడా అత్యంత నిర్మలమై వెలయుచున్నది. నేయి తనయందు కాఠిన్యం విస్తరింప జేసుకొంటోంది కదా! అట్లాగే చిత్తు కూడా తనయందు ఈ సమస్తమును విస్తరింపజేసుకొంటోంది. అందుచేత ఈ జగత్తుగా కనిపించేదంతా చిత్తు మాత్రమే. చిత్తుకు అన్యంగా ఎక్కడా ఏదీ లేదు. వాస్తవానికి నాశనం అవటం' అనేది కాని, అనేక పదార్థ జీవులు గాని, అ జీవుల సంబంధమైన జనన మరణాలు గాని, అటు ఆకాశం గాని, శూన్యత్వం గాని, అనేకత్వం గాని లేనే లేవు. అధిష్ఠాన రూపంగా సమస్తం బ్రహ్మమే గాని, ఏదీ పదార్థరూపం కాదు. వేఱుగా కనిపించే దంతా మిథ్యాదృష్టి ప్రభావం చేత మాత్రమే! ఆ జగత్తు అసత్తే! కాబట్టి, ఇక ఇందులో అహంత్వం, పుట్టటం, ఉండటం, నశించటం" అనునదంతా భ్రమ చేత మాత్రమే అనిపిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఏదీ నశించటం లేదు. స్వప్నంలో అంతా కల్పితం, ఊహా జనితం అయి ఉండగా ఇక అందులో పదార్థాలు జనించటం ఏమున్నది? నశించటం ఏమున్నది? అట్లాగే శాస్త్రాలు ప్రవచించే జ్ఞాన దృష్టిచే అహం నశించటం' అనేది కూడా "స్వప్నంలోని పదార్థం నశించటం వంటిది మాత్రమే!

“ఈ జగత్తు అసత్తే! వాస్తవానికి లేనిదే! మరిక అద్దాని ఆశ్రయమును నిందించటం, దానిని గురించిన సిద్ధాంతపూర్వక నిర్ణయాలు శాస్త్రాలు ఎందుకు చేస్తున్నాయి? అని ఎవరైనా అంటే... ఆ మాట కూడా నిజమే! వాస్తవానికి అసత్తైనట్టి వస్తువు గురించి నిందగాని, నిర్ణయంగాని ఎలా సంభవం? స్వప్నంలో కనబడే గృహం "ఎవరు కట్టారు? వారి తెలివి ఎటువంటిది"... అనే ప్రశ్న లకు సమాధానం వెతకటం అర్థంలేని పని కదా! ఆకాశపుష్పం (తెల్లటి మేఘాలు, ఆ మేఘాల మధ్య ఊహాదృష్టికి కనిపించే సరోవరం, అందులో పుష్పం)... గురించి నిందగాని, నిర్ణయం గాని ఎవరికి ఉంటుంది? అది ఎవరికి కనబడుతుందో వారు ఊహలో తేలే పసిపిల్లల వంటివారే కదా!

అయితే శాస్త్రాలు జగత్ నిర్ణయం గురించి అద్దాని నింద మొదలైన వాటిని చెప్పటంలో ఒక ముఖ్యమైన కారణం ఉన్నది. ఆత్మ యొక్క స్వరూపాన్ని జీవునకు సిద్ధింపజేయటం అనే కార్యక్ర మాన్ని నిర్వర్తించటమే శాస్త్రములు నిర్వర్తించే కార్యక్రమం కదా! అట్టి ప్రయత్నంలో మొదటగా అసత్తైన వాటిని కొన్నిటిని సత్తు వలె నిర్ణయిస్తున్నాయి. అట్లా నిర్ణయించి మనస్సు-బుద్ధి-ఆత్మ ఇటువంటి వాటిని నిర్వచించి తద్వారా వైరాగ్య వివేకాది మార్గంగా తత్త్వసాక్షాత్కారానికి ఉపాయాలు కల్పిస్తున్నాయి. సృష్టి నిర్ణయం కూడా అట్టిదే! కాబట్టి ఓ రామచంద్రా! శాస్త్ర ఆచార సంప్రదాయాదు లకు అనుకూలంగా ముముక్షువు భూమికాక్రమమును అభ్యసించాలి. క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రవృద్ధిని సముపార్జిస్తూండగా అంతరంగం పరిశుద్ధమౌతోంది. అప్పుడు మనస్సు మొదలైనవి, జగత్ సంబంధిత శాస్త్ర నియమాదులు వాస్తవ సత్యం సమక్షంలో మిథ్యయే అగుచున్నాయి... అని ఎఱుగుచు శిల వలె క్షోభ-వాసనాది వర్జితుడై ప్రకాశించు గాక! ఇకప్పుడు సాంసారిక పురుషార్థం యొక్క అభాసతో కూడి ఈ సంకల్పమాత్ర జగత్తు నిశ్శేషంగా ఆ ముముక్షువు పట్ల శమిస్తుంది. ఇదే భ్రమరూపమగు ఈ సృష్టిని గూర్చిన శాస్త్రప్రవచిత నిర్ణయం యొక్క ఉద్దేశం.