Page:792

అనగా, 'కల్పన'యే మూర్తివంతమై ఈ విధంగా జగత్తు రూపంగా భాసిస్తోంది. అంతేగాని ఇక్కడ మూర్తి వంతమైనదేదీ యథార్థానికి లేదు. నిరాకారమైన బంగారము రకరకాలైన ఆకారాలు ధరించి-గాజు-గొలుసు ఉంగరంగా కనిపిస్తోంది కదా! యథార్థానికి బంగారమునకు 'ఇది ఆకారం' అనునదేమున్నది? ఈ జగత్తులో కనిపించే మూర్తిత్వములన్నీ అట్టివే! ఎందుచేతనంటావా? ఈ జగత్తులో ఏఏ మూర్తిత్వములు (రూపాదులు) కనిపిస్తున్నాయో... అవన్నీ అట్లు ద్రష్ట యొక్క సంకల్ప ప్రభావం చేతనే కన్పిస్తున్నాయి. ఒకడు కళ్ళు మూసుకొని తన యొక్క మనోరాజ్యంలో అనేక వస్తువులు చూస్తున్నట్లే, కళ్ళు తెరచినప్పుడు కూడా మనోరాజ్య మాత్రంగా ఈ జగత్తును చూస్తున్నాడే గాని, యథాతథంగా చూచుటలేదని ఇక్కడ గమనించవలసిన విషయం సుమా! సంకల్పంలోనూ, స్వప్నంలోనూ కనిపించేవన్నీ నిరాకారమేనని అందరికీ తెలుసుకదా! ఈ జగత్తుగా దర్శించబడేది కూడా అట్టిదే! ఇట్టి శూన్యరూపమగు జగత్ స్థితియందు వివేకులకు రాగద్వేషాది భావాలు ఎట్లా కలుగుతాయి? ఎప్పుడో భవిష్యత్లో ఉండబోయే ఆకాశ వృక్షంపై ఏ పక్షి వ్రాలుతుంది? ఆకాశంలో వృక్షం ఎట్లా ఉంటుంది? అది ఎంత అర్థరహితమో... వివేకుల దృష్టిలో ఇక్కడ ఇష్ట-అయిష్ట విశేషాలు ఉండటం అంతటి అర్థరహితం.

ఇదంతా ఆత్మాంతర్గతం!- కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్తుకు గాని, ఇందలి ప్రాణులకు గాని వాస్తవానికి ఎట్టి మూర్తిత్వం లేదు. శూన్యత్వం లేదు. అందుచేత 'చిత్తం' అనునది కూడా ఎప్పుడో అస్తమించిన సూర్యుని రూపం వంటిదే! ఈ విధంగా ఎప్పుడైతే చిత్తం యొక్క రహితత్వాన్ని గమనించామో... ఇక ఆ పై శేషించేది సన్మాత్ర ఆత్మయే! అట్టి ఆత్మ 'అభావం' ఎన్నటికీ కాదు. భావాలన్నీ ఆ ఆత్మవే! అది భావనలకు ఆవల ఉండి ఆత్మభావనచే సులభ లభ్యమే అయి ఉన్నది.

తత్త్వవేత్తకు ఈ వివిధ రూపాలతో కూడిన జగత్తు ఈ వివిధరూపరహితమై, ఏకమగు ఆత్మగా మాత్రమే భాసిల్లుతోంది. సమస్తమగు అభరణములు ఏకమగు సువర్ణ పిండమున ఒదిగి ఉన్నట్లు... ఈ నానావిధ పదార్థములన్నీ ఏకమగు ఆత్మయందు అంతర్గతములై ఉన్నాయి. నిత్య సిద్ధమగు చిత్స్వభావమున 'స్థితి' కలిగి ఉన్న జ్ఞాని యొక్క దృష్టిలో ఈ అహంభావ సహిత జగత్తు, ఈ చిత్తం... ఇవన్నీ లయించిపోయినవై కనిపిస్తున్నాయి. అనగా, జగత్తు జగత్తుగా కాకుండా ఆత్మ గానే కనిపిస్తోంది. చిత్తం చిత్తంగా కాకుండా ఆత్మగానే తెలియవస్తోంది. ఈ జగత్తు-చిత్తం లయించి పోగా, అప్పుడు శేషించునట్టి 'చిదేకరసమును' వర్ణించి చెప్పటానికి అచిత్ స్వభావాశ్రయులకు కుదిరేది కాదు. జగత్ దృష్టి తొలగినపుడు మాత్రమే చిదేకరసానుభవుల దృష్టి అవగతమౌతుంది.

రామచంద్రా! ఇక్కడి ఉన్నత, అవనత విషయాల వైపుగా ఎవరి బుద్ధి పరుగులు తీస్తున్నదో... అట్టివారు పొందే క్లేశాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. అందుచేత వారి బుద్ధికి సద్రూపమగు ఆత్మ భాసించటమే లేదు. వారికి అఖండ అప్రమేయ ఆత్మానుభవం ఎట్టిదో చెప్పినా, వారు గమనించ లేక పోతున్నారు. కాబట్టి కాస్త 'యుక్తి' (ఉపాయం) అభ్యసిస్తే సత్య పదార్థం తప్పక విదితమౌతుంది.

ఎవడైతే ఈ భూత-భవిష్యత్ వర్తమాన సర్వ పదార్థ రూపమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావాన్ని, దీని కార్యకారణత్వాదులను విమర్శించి చూస్తాడో... అట్టివాడు క్రమక్రమంగా ఈ

Page:793

జగత్తులోని స్థూలత్వం నుండి సూక్ష్మత్వం వైపుగా పయనిస్తాడు. అనగా స్థూలంగా కనిపించేవన్నీ పదార్థాల వర్తమాన దశయేగాని, నిత్యమైన స్థితి కాదని గ్రహిస్తాడు. ఉష్ణభేదం చేత మంచు-జలవాయు స్థితులు కనిపిస్తున్నాయి కదా! వాస్తవానికి ఈ జగత్తు యొక్క స్థూల-సూక్ష్మ స్థితులను అధిగమించి పరిశీలించినప్పుడు శేషించునది "సన్మాత్రం - అఖండబోధ రూపం అగు ఆత్మయేనని గ్రహించబడగలదు.

అనగా, 'ఈ జీవుడు స్థూల విషయములైన దేహాదులు, తత్సంబంధమైన ఆయా విషయాలు కాదు. సూక్ష్మ భూతములైన భావన-మనస్సు-బుద్ధి-అహంకారం' మొదలైనవి కూడా కాదు. మరి? ఈతడు అఖండమగు బోధ స్వరూపుడే'... అని గ్రహించబడగలదు. అట్టి అద్వైత బ్రహ్మం నందు శాంతి’ని పొందినట్టి మనుజుని దృష్టియందు ఈ 'ప్రపంచం’ అనేదేదీ లేనే లేదు. సద్గుణాలు గల సజ్జనునకు ఓర్పు-దయ-దాక్షిణ్యము' మొదలైనవి హృదయానికి హత్తుకుంటాయి చూచావా? అట్లాగే జగద్విషయముల పట్ల 'అపేక్ష'ను జయించిన జ్ఞానికి ఇప్పుడు మనం చెప్పుకునే 'జగత్తు వాస్తవానికి లేదు' అనే పాఠం అతిసులభంగా అనుభవైకవేద్యం అగుచున్నది.

9. అనన్యం

శ్రీవసిష్ఠ మహర్షి :

పిండత్వం నాస్తి భూతానాం, శూన్యత్వంచాపి అసంభవాత్, అతేవ మనో నాస్తి, శేషం 'సత్' తత్ అవస్థితిః ॥

ఓ రామచంద్రా! మట్టిబొమ్మలో ఆకారం కనిపిస్తున్నప్పటికీ మట్టికి వాస్తవానికి ఆకారం లేదు కదా! ఎందుకంటే మట్టి ముద్దతో ఏ ఆకారం తయారుచేస్తే అదే మట్టి యొక్క ఆకారంగా కనిపిస్తోంది! ఏ ఆకారమైనా తయారవటానికి సిద్ధమగుచుండగా ఇక మట్టికి 'ఇది దీని ఆకారం'... అని ఎట్లా కుదురుతుంది? అట్లాగే ఈ ప్రాణులకి మూర్తిత్వం (ఆకారాదులు) వాస్తవానికి లేదు. మరి వీరు శూన్యరూపులా? లేదు. శూన్యమైనట్టిది ప్రాప్తించటం ఎట్లా జరుగుతుంది? ఇక 'మనస్సు’ అనేది కూడా ఎక్కడా లేదు. ఈ మూర్తి-శూన్య-అమూర్తి రూపములగు కల్పనలను వదిలివేస్తే అప్పుడు శేషించేదే 'సన్మాత్రము' అని, 'ఆత్మ' అని చెప్పబడుచున్నది. అదియే నీ యొక్క, నా యొక్క ప్రతి ప్రాణి యొక్క వాస్తవ స్థితి.

సంసారము... అనగా! -

శ్రీరాముడు : ఈ జీవుడు-జగత్తులు మొదలైనవన్నీ (మీరు చెప్పినట్లుగా)... లేనప్పుడు మరి సంసారము’ అని దేనిని పిలుస్తున్నాం?

శ్రీవసిష్ఠ మహర్షి : 'కేవల సాక్షి చైతన్యం' అగు ప్రత్యగాత్మ ఒకానొకప్పుడు 'స్వస్వరూపానుభవ మాత్ర స్థితి’ నుండి విషయముల వైపుకు ఉన్ముఖమౌతుంది. అట్టి ఉన్ముఖత్వమే సంసారము. కేవల

Page:794

జ్ఞాన స్వరూపం సంసార జ్ఞానంగా ఉదయించుటయే 'సంసారం' అను అనర్థమునకు కారణం. అట్లు ఉదయించకుండుటయే 'శ్రేయము' కొరకు అయి ఉన్నది.

శీతలత్వంచే జలం ఘనీభవించి పొడవు-వెడల్పు మొదలైన ఆకారాలు కలిగిన మంచుగడ్డగా అగుచున్నది చూచావా! కేవల శుద్ధ జ్ఞానంలో ఉదయించిన సంసార జ్ఞానమే ఒకానొక సమయంలో బాహ్యత్వం పొంది మూర్తిత్వంగా ప్రాప్తించుచున్నది. ఈ జీవుడు సర్వదా ఆత్మ స్వరూపుడే! అయితే చిద్రూపమగు ఆత్మయే తన స్వరూపమును గూర్చిన 'అజ్ఞానం' చేత మూర్తిత్వమును గ్రహిస్తోంది.

ఒకడు అదమరచి నిదరపోయి, ఆ నిదురలో పొందిన స్వప్నంలో కనిపించిన ఆయా రూపాలన్నీ తనకు భిన్నములైనవని భ్రమిస్తూ ఉంటాడు చూచావా? అట్లాగే చిద్రూపమగు ఆత్మయే తన శుద్ధ జ్ఞానత్వమును ఏమఱచి పదార్థముల వలె మూర్తిత్వం తనకు అన్యంగా గ్రహిస్తోంది. అట్లా గ్రహించిన కారణంగా చిత్తత్వమును ధరిస్తోంది. అట్టి చిత్తం చేతనే ఈ దేహమును ధరిస్తోంది. అట్టి దేహం ద్వారా తదితరమైనట్లుగా శబ్ద స్పర్శ - రూప-రసాదుల రూపంతో కూడిన 'జగత్తు' అనబడు దానిని కూడా ధారణ చేస్తోంది. అట్టి జగత్తులో అనేక ఆశాపాశములు కల్పించుకొని అనేక ఉపాధులు పొందటం, కోల్పోవటం కాలానుగతంగా చేస్తోంది.

ఏతావతీషు అవస్థాసు బోధస్యోదేతి నాన్యతా,

శబ్ద కల్పనయా భేదః కేవలం పరికల్పితః ॥

అయితే... ఆయా సర్వ అవస్థలలోనూ చైతన్యం చైతన్యంగానే ఉంటోంది గాని అన్యమైనదిగా (మూర్తిత్వం-చిత్తత్వం-దేహత్వం-విషయత్వం-జగదత్వం మొదలైనవిగా) తాను అవటమే లేదు. జలంగా, తరంగాలుగా, సుడులుగా, బుడగలుగా, బుడగరూపవృత్తంగా అగుచున్నప్పుడు జలం తన జలత్వం పోగొట్టుకొంటోందా? లేదే! మరి ఈ భేదమంతా ఏమిటంటావా? కేవలం శబ్దమాత్ర వ్యవహారంచే ఆయా భేదమంతా కల్పన చేయబడుతోంది. స్వప్న దర్శన సమయంలో మనస్సే బాహ్య-అభ్యంతర విషయరూపమున వికృతినొందుతూ భాసిస్తోంది కదా! అయితే స్వపద్రష్ట సర్వదా యథాతథంగానే ఉంటున్నాడు కదా! ఉంటున్నాడు కాబట్టే స్వప్న సంఘటనానంతరం మరల జాగ్రత్తులోకి వస్తున్నాడు. అట్లాగే 'ఆత్మ ఆయా విశేషములన్నీ పొందుచున్నప్పటికీ, తాను యథాతథంగానే ఉంటోంది'... అనునదే జ్ఞాన-విజ్ఞాన సారం.

బోధరూపమగు ఆత్మయందు ఎట్టి మూర్తిత్వ-చిత్తత్వ-దేహత్వాది వికారములు ఏర్పడటానికి అవకాశమే లేదు. ఆకారం లేని జలం ఒకప్పుడు తరంగాకారంగా కనిపిస్తున్నట్లు అమూర్త రూపమైన ఆత్మ ఒకప్పుడు చిత్తాకారంగా అగుపిస్తోంది. చిదాత్మ ఆకాశం వలె, కాలం వలె ఎల్లప్పుడు అవికృత రూపంగానే ఉంటోంది. స్వప్న పదార్థాలన్నీ స్వప్నద్రష్ట ఊహారూపాలే అయి ఉన్నట్లు, సమస్త పదార్థాలు చిదాకాశరూపమే అయి ఉన్నాయి. కానీ చిదాకాశం పదార్థ రూపాలుగా అవటం లేదు.

ఈ చిత్తం... చిదాకాశమే! అయితే చిదాకాశం చిత్తంగా అవటం లేదు. ఆభరణం... బంగారమే! అయితే బంగారం బంగారంగానే ఉన్నది గాని, 'ఆభరణం' అవటం లేదు. మట్టి బొమ్మలో బొమ్మగా అయినది మట్టియే! అయితే, మట్టి బొమ్మగా అవుతోందా? అవటం లేదు కదా!

Page:795

శ్రీరాముడు : మహర్షీ! చైతన్యము ఎన్నటికీ జడపదార్థంగా (అట్లాగే, జీవుడు మొదలైనవిగా) అగుటకు అవకాశం లేదనునది యుక్తియుక్తమేనని అనుకుందాం. అయితే జడపదార్థం (అట్లాగే జీవుడు మొదలైనవి) చైతన్యముగా ఎప్పటికైనా కాకూడదా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బాహ్య జడ పదార్థం తత్త్వబోధవశంగా కూడా అభ్యంతర చిదాకాశ రూపం పొందజాలదు! ఎందుకంటావా? ఈ జడ పదార్థం 'అత్యంత అసదృశం'. తరంగం తన ఆకారం కోల్పోయి ఎప్పటికైనా జలంగా కాకూడదా? అనే వాక్యం ఎట్టిదో అదీ అట్టిదే! జలానికి కనబడిన తరంగాకారం అసదృశమే కాని, ఆపాదితమే కాని వాస్తవం కాదు కదా!

ఇక ఈ దృశ్య వ్యవహారానికి వస్తే, చిదాత్మయే వివర్త భావం చేత ఈ దృశ్య జడ స్థితిని పొందుతోంది. పరమార్ధమున చైతన్యం జడ భావం పొందుటయే లేదని గ్రహించు. కదిలించేది చైతన్యం, కదిలేది జడం కదా! 'కదిలించేది కదిలేదిగా అవుతోందా? లేదు. కదిలించే చైతన్యం సర్వ అవస్థలయందునూ తన స్వస్వరూపాన్నే యథాతథంగా ఎప్పటియట్లే స్థితినొంది ఉన్నదే గాని లేశంగా కూడా అది అన్య రూపత్వం పొందడం లేదు. ఒకని బుద్ధి సప్తమభూమిక వరకు పరిణామం పొందినదై, అచ్చట అత్యంత శుద్ధబోధైక రూపమగు ఆత్మ భావనలో ఉదయిస్తోంది. అట్టి అఖండ మగు ఆత్మత్వం ఉదయించగానే బోధ-అబోధ ఇటువంటి శబ్దాల పాత్ర కూడా అస్తమించిపోతోంది.

ఓ రాఘవా! ఈ చిత్తం యొక్క దృఢ భావనచేతనే సూక్ష్మ శరీరాలకు ఈ స్థూలమైనట్టి ఆధిభౌతిక రూపం ఉదయించటం జరుగుతోంది. ఒక నటుడు నాటకంలో పిశాచ వేషం ధరిస్తాడు చూచావా? అట్లాగే ఆకాశం వలె నిర్మలమైనట్టి సూక్ష్మ చిత్తం ఈ 'మిథ్య' అయినట్టి ఆధిభౌతిక రూపం ధరిస్తోంది.

ఈ చిత్తం తన యొక్క అన్యమనన స్వభావం కారణంగా ఈ దేహ-జగత్ రూపాలన్నీ భ్రమచే పొందుతోంది. 'నేను పిచ్చివాడను కాదు. అందరిలాగానే మంచి బుద్ధి కలవాడనే'... అనే మననముచే ‘ఉన్మత్తత’ శమిస్తుంది చూచావా? అట్లాగే, భ్రమ రహితమగు సత్య వస్తువును గురించిన అభ్యాసం చేత ఈ దేహ-జగత్ రూపమగు భ్రాంతి తప్పక శమించగలదయ్యా!

నేను మనో స్వరూపడను గాను, ఆత్మ స్వరూపుడను (ఆత్మయే స్వరూపంగా కలవాడను) ఈ దేహము-పంచేంద్రియాలకు విషయాలయ్యే జగత్తు... ఇవన్నీ కూడా నా యొక్క క్రీడాకల్పనచే ప్రాప్తించేవి మాత్రమే.”

అని మననం, మరియు 'జ్ఞానం'చే లేక 'బుద్ధి'చే వాసన ప్రశమనం పొందగలదు. ఏది ఎంతవరకు భ్రాంతియో గ్రహించటం చేత 'జగత్తు సత్యం' అనే వాసన వివర్తిస్తుంది. ఎట్లా అంటే స్వప్నం స్వప్నరూపంగా ఎఱుగబడిన తర్వాత ఇక ఆ స్వప్నంలో కనిపించే వస్తువులు-విషయములుస్వప్న జీవులు సత్యమేనని ఎవరూ నమ్మి ఉండరు కదా! వాసన శమించటం చేత సంసారము శమించుచున్నది. వాసనయే మహాపిశాచి సుమా! అందుకే వివేకులైన వారు ఈ వాసనను, (లేక, దృశ్యము పట్ల ఏర్పడిన సత్యత్వ బుద్ధిని) ఛేదించివేయుటయందు తత్పరులై ఉంటారు.

Page:796

ఏ విధంగా అజ్ఞానం యొక్క అభ్యాసం చేత అజ్ఞానరూపమగు 'భావనా ఉన్మత్తత, పుట్టు కొస్తోందో... ఆ విధంగానే జ్ఞానం యొక్క అభ్యాసం చేత కాలక్రమంగా ఆ ఉన్మత్తత శమించి పోతోంది. భావన చేతనే ఈ స్థూల-సూక్ష్మ శరీరాలన్నీ మరలమరల ప్రవర్తిస్తున్నాయి. ఈ స్థూల శరీరం భ్రాంతి మాత్రమే. "ఇది ఉన్నా, ఊడినా, మరల వచ్చిపడినా, నేను మాత్రం యథాతథ స్వరూపుడనై ఉంటాను” అనే అభ్యాసం చేత ఈ స్థూలశరీర భావన సూక్ష్మశరీర భావనతో లయమై పోతోంది. ఆ సూక్ష్మ శరీర భావనయో (అతివాహక శరీర భావనయో)... 'బ్రహ్మ మాత్రత్వం'గా రూపుదిద్దుకొంటోంది. 'నేను స్థూల శరీరుడనై జీవిస్తున్నాను' - - అను స్థితి నుండి వివేకి క్రమంగా “నా యొక్క జీవనం సూక్ష్మ దేహంగాని, ఈ స్థూల దేహంగా కానీ కాదు అను జ్ఞానమును సుస్థిరీకరించుకుంటూ వస్తున్నాడు.

ఈ విధంగా దృఢమైన జ్ఞానాభ్యాసం చేత ఆ సూక్ష్మ దేహపదమునకు కూడా బ్రహ్మత్వము పొందింపజేయాలి. నా యందు ఉత్పన్నమైన పదార్థములు నా రూపాలే అవుతాయి కదా! అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి స్థానం పరమాత్మయే కాబట్టి ఇవన్నీ పరమాత్మ స్వరూపములే అనే ఉద్బోధ (లేక) భావన (లేక) జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు 'సూక్ష్మ దేహం అనేది మాత్రం ఎక్కడున్నది? అది కూడా స్థూల దేహంలాగే మిథ్యయే'... అనే నిశ్చయం కలుగుతుంది. అటువంటి నిశ్చయం కలగడానికి ఉద్దేశించకుండా, ఊరకే 'హూం హూం' వంటి ఎన్ని శబ్దాలు ఉచ్చరిస్తే మాత్రం ఏం ప్రయోజనం? సంసార గ్రంథి నివర్తమౌతుందా? లేదు.

మొట్టమొదట ఈ జగుత్తు తత్కారణమైన 'ఈశ్వరుడు' ఈ ఇరువురి ఏకత్వము గ్రహించాలి. అది 'తత్ పదార్థ శోధనం ద్వారా ఎఱుగబడగలదు. ఆ తర్వాత 'త్వం' పదార్థ శోధనం ద్వారా “ఈ ప్రత్యగాత్మ వాస్తవానికి అసంగుడు. పరమాత్మ కంటే ద్వితీయుడైన వాడు కాదు (అద్వితీయుడు)... అని ఎఱుగబడుతోంది. ఈ విధంగా తన యొక్క 'భావన + బుద్ధి' కూడా క్రమక్రమంగా 'తత్త్వ స్వరూప-ఐక్యరూపమగు అఖండాకార వృత్తి' అనదగు ఆత్మ రూపంగా పరిణమించాలి. అటువంటి అఖండాకార వృత్తి యందు ప్రత్యగాత్మ లయించినదై అట్టి ఆత్మకు అన్యమైనదేదీ ఎఱుగనంతటి అఖండ బోధ జనించుగాక! ఎంత వరకు అట్టి అఖండ బోధ జనించదో... అంత వరకు శ్రుతులు చూపించిన మార్గంగా 'తత్ త్వమ్' పదార్థ ద్వయ శోధన ద్వారా దృఢ జ్ఞానాన్ని సంపాదించు కుంటూనే ఉండాలి. బాహ్య అభ్యంతరాలలో చోటు చేసుకొని ఉన్న ఈ 'చిత్తం' పూర్తిగా ఎప్పుడైతే శమిస్తుందో, అప్పుడు అది తన సాక్షి రూపమగు 'చిత్స్వరూపం'గా ప్రకాశిస్తుంది. 'ఆకాశం వలె నిర్మలం-శీతలం’ అయినట్టి అట్టి తన చిత్స్వభావమును ఆశ్రయించి ఈ మనుజుడు శాంత స్వరూపుడై అప్పుడు ఉండగలడు.

జ్ఞానవాన్ జ్ఞానయజ్ఞస్థో ధ్యానరూపం విరోపయన్ I

జగత్ విజిత్య జయతి, సర్వత్యాగైక దక్షిణః ||

జ్ఞాని అయినవాడు 'జ్ఞానము' అనే మహా యజ్ఞమునందు సర్వదా నెలకొని ఉంటాడు. ఆ జ్ఞాన యజ్ఞశాలలో 'ధ్యానము' అనే దృఢమైన, ఉన్నతమైన 'యజ్ఞ స్తంభము'ను నాటుకుంటాడు.

Page:797

అట్లా జ్ఞానయజ్ఞతత్పరుడై ‘చిత్స్వభావము’ అను అధిదేవతకు 'సర్వ త్యాగము' అనే ముఖ్య దక్షిణను ఇచ్చివేసినవాడై ఈ విశ్వమును మొదలంట జయించివేయటమే నిజమైన 'విశ్వజిత్ యాగం'. అట్టి విశ్వమునకు సాక్షియై, సర్వోత్కృష్టుడై, మాటలకు అందనివాడై ఉంటాడు. అతడు ఆత్మయందు ఏకరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక ఆపై, అగ్ని వర్షం కురిసినప్పటికీ, ప్రళయ వాయువు వీచి నప్పటికీ, ఈ భూతలం గాలికి ఎగిరిన కాగితపు ముక్కలాగా ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోవుచున్న ప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అతడు సర్వదా ఆత్మయందు ఏకరూపుడుగానే ఉంటాడు. అట్టి అనుక్షణిక అఖండాత్మానుభవమే వజ్రతుల్యమగు 'దృక్తి' అనికూడా పిలువబడుతోంది. అయితే...

1.తృష్ణా రాహిత్యముచే శాంతి పొందిన మనస్సు గలవాడు, 2. ఇంద్రియ విషయాలన్నిటి పట్ల నిరోధ దశను సంపాదించుకున్నవాడు... ఈ రెండూ సంపాదించుకున్నట్టి మనుజునికి మాత్రమే అట్టి అకృత్రిమ సమాధియందలి వజ్రతుల్యమగు 'దృకిస్థితి' లభిస్తుంది.

మనో శమము -

శ్రీరాముడు : మహాత్మా! ఈ మనస్సు పూర్ణంగా శాంతించటానికి (శమించటానికి సులభోపాయం

ఏమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు శాస్త్రములు ప్రతిపాదించిన అభ్యాస క్రమాలచే, ఉపదేశాలచే, ఇంద్రియ దమంచే శమించగలదు. అయితే, 'బాహ్య పదార్థములన్నిటి పట్ల తృష్ణారాహిత్యం' అనే అభ్యాసంచే శమించినంత సులభంగా మరే విధంగానూ ఈ మనస్సు శమించదు. జీవుడెందుకో 'సంపత్తి పొందాలి' అను భావనకు లోను అవుచున్నాడు. అక్కడి నుండి తృష్ణ-అజ్ఞానాలు మహా వాయు వీచికల వలె బయల్వెడలుచున్నాయి. కాబట్టి 'సంపత్తి అంతా మహా అపత్తియే' అను భావనను, 'ఇవన్నీ నావి కానే కావు' అను ప్రజ్ఞచే సునిశ్చితం చేసుకోవాలి. ఏదేది 'నాది కాదు' అని గ్రహిస్తామో, అది త్యజించబడినదే అవుతుంది. ఆ విధంగా సర్వత్యాగం, తృష్ణారాహిత్యం అభ్యసిస్తూ చరమ సాక్షాత్కారమైన ఆత్మతత్త్వాన్ని హృదయంలో వెలిగించాలి. అట్టి జ్ఞానదీపంచే అజ్ఞానాంధ కారం, అద్దాని అలవాలమైన అహంకార మమకార పిశాచాలు, ఆకారాదుల పట్ల ఏర్పడి ఉన్న ఆకర్షణ... ఇవన్నీ వాటంతట అవే తొలగుతాయి. ఆపై 'ఈ సమస్తం చిదాత్మయే. నా ఆత్మయే తన అఖండ స్వభావం చేత ఈ సర్వంగా ప్రకాశిస్తోంది' అను అవగాహన సుస్పష్టమవగలదు.

చైతన్యం సర్వదా యథాతథం- ఓ రామచంద్రా! పొగ ఆకాశంలో ప్రవేశించి అనేక ఆకారా లుగా కనిపిస్తుంది చూచావా? అట్లాగే, ఈ కనబడే మనుష్య-నాగ-అసురాది స్థానములు, పర్వతగుహాది పదార్థములు ఇవన్నీ కూడా చైతన్యమే ఆయా వివిధ వైచిత్ర్యములుగా అగుచున్నదనీ, (కానీ) యథార్థానికి (పొగలాగానే) చైతన్యము సర్వదా యథాతథంగానే ఉన్నదనీ - భావన చేయి. రసరూపమగు వర్షజలం జడమగు భూమియందు ప్రవేశించి రసస్వరూపములగు ఈ వృక్షపుష్ప-ఫలాదులుగా అగుచున్నదే! అట్లాగే చైతన్యము బ్రహ్మాండమున ప్రవేశించి తన యొక్క ప్రాణ శక్తిచే ఆత్మ యొక్క వివర్త రూపములైన ఈ ప్రాణికోట్ల శరీరములందు చలించుచున్నది. జలంలో సంచరించే చేప ఒక రోజు వలలో చిక్కుకొని ఎటూ వెళ్ళలేక తిప్పలుపడుచున్నట్లుగా, 'చిదాకాశము’

Page:798

అను దానిలో విహరించవలసిన ఈ జీవుడు 'దేహ స్వభావము' అనే మోహజాలంలో చిక్కుకొని ఆయా అగచాట్లన్నీ పడుచున్నాడు. తన ఆత్మ స్వరూపాన్ని (ఆత్మ స్థితిని) స్మరించక దృశ్యవస్తు సముదాయాన్ని స్మరిస్తూ 'తృష్ణ' అనే ఎఱ తగిలించబడిన గాలంలో చిక్కుకొని విలవిల్లాడుచున్నాడు.

ఓ రామచంద్రా! నిర్మల చైతన్యమే 'నిజ స్వరూపం' అనే ప్రాంగణంలో స్వర్గ -మర్త్యపాతాళాలలోని అనేక పదార్థముల రూపంగా స్ఫురిస్తోందయ్యా! ఈ జీవులలో కనిపించే తేడా అంతా వాసనల యొక్క అల్ప-ఆధిక్యతలు మాత్రమే!

సర్వ ఏవ సమా జీవా వాసనాం అన్తరేణచ శుష్క పర్ణవత్ ఉడ్డీనా జడాః శ్వసన వేణవః ॥

వాసనల యొక్క అల్ప ఆధిక్యతలు తప్పిస్తే ఈ జీవులందరూ సమానులే! అందరూ కూడా చైతన్య స్వరూపులే! వాసనల వల్లనే వారు ఎండుటాకులవలె ఎగిరి స్వర్గ-భూ-పాతాళములలో పడుచున్నారు. ప్రాణవాయువు సహాయంతో ఆయా శబ్దములు పలుకుచున్నారు.

అందుచేత రామచంద్రా! మొట్టమొదట ఈ జీవుడు పురుషప్రయత్నం చేత సాధనా చతుష్టయ సంపత్తిని సముపార్జించుకోవాలి. ఆ ఆ తర్వాత అతని ఆత్మధ్యానమునకు విఘ్నము కలిగిస్తున్న దృశ్య ప్రకంపనములను ప్రాణయామాదుల అభ్యాసంచే జయించాలి. సమాధిచే బహిరృష్టిని విడనాడి నిర్వికల్ప సమాధియందు ప్రవేశించాలి. అట్లు ప్రవేశించటం ద్వారా పూర్వం సంపాదించుకొని ఉన్న వాసనా సమూహమును పారత్రోలాలి. ఈ సంసారపాశము అనే ఘనమైన పంజరమును విరగగొట్టాలి. అప్పుడాతడు పూర్ణానందైకరసమగు బ్రహ్మముగా ఉదయించగలడు. అటుపై ఇక అజ్ఞానము యొక్క ఛాయ కూడా ఉండదు. దీపం వెలిగిన తర్వాత చీకటి ఇంకా ఉంటుందా?

10. వాసనలు - తరగతులు

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ కనబడే 10 దిక్కులలోనూ ఉన్న మనుజ-నాగ-దేవగంధర్వ'... ఆదిగా గల పేర్లతో కనబడే ఈ జీవసమూహాలన్నీ కూడా వాసనా భేదం చేతనే వేర్వేరుగా ఉన్నాయి. వాసనలను ప్రక్కన పెట్టి చూచామా... వాటిలో ఎటువంటి తేడా లేదు. ఈ వాసనా వైచిత్ర్యమంతా 7 రకాలుగా విభజించి చెప్పబడింది.

వాసనావస్థలు - - 1. స్వప్న జాగ్రదావస్థ, 2. సంకల్ప జాగ్రదవస్థ, 3. కేవల జాగ్రత్తు అవస్థ, 4. చిర జాగ్రత్తు అవస్థ, 5. ఘన జాగ్రదవస్థ, 6. జాగ్రత్ స్వప్నావస్థ, 7. క్షీణ జాగ్రదవస్థ

సముద్రంలో అనేక ఆకారాలు గల తరంగాలు ఉన్నట్లుగా, ఈ ఈ సప్తవిధ జీవులు

చిదాకాశంలో ఉన్నారు.

శ్రీరాముడు : మీరు చెప్పిన 7 విధములైన వివిధ వాసనామయ జీవుల గురించి మరికొన్ని

వివరణలు ప్రస్తావించ ప్రార్థన.

Page:799

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే వివరిస్తాను, విను.

1. స్వప్న జాగ్రత్తు జీవులు -

కస్మింశ్చిత్ ప్రాక్తనే కల్పే, కస్మింశ్చిత్ జగతి క్వచిత్ I కేచిత్ సుప్తాః స్థితా దేహైః జీవా జీవిత ధర్మిణః |

యే స్వప్నమ్ అభిపశ్యన్తి తేషాం స్వప్నమిదం జగత్ | విద్ధి తే హి ఖలూచ్యన్డే జీవకాః స్వప్నజాగరాః ॥

ఓ రామచంద్రా! ఒకానొక పూర్వ కల్పమునందు... ఒకానొక జగత్తులో, ఒకానొక చోట, దేహమును ధరించి జీవించుచున్న ... ఏ కొందరో జీవులు నిద్రించుచూ... ఏ స్వప్నమును గాంచుచున్నారో... ఆ వారి యొక్క స్వప్నమే, ఈ జగత్తు అయి ఉన్నది!

ఆ స్వప్నమును గాంచుచున్న జీవులు 'స్వప్న జాగరులు' అని చెప్పబడుచున్నారు! ఆ ఒకానొక జగత్తునందు నిద్రించుచున్న జీవులకు స్వయంగా ఆవిర్భవించిన 'స్వప్న ప్రపంచం'లో మనం ప్రవేశించాం. ఎందుచేతనంటే, మనం కూడా సమాన కర్మ-వాసనాదులు కలిగి ఉండటం చేత మనం ఆ స్వప్నంలో ఉంటున్నాం. అతని స్వప్నంలోని విషయాలే మన యొక్క స్వప్న వశం చేత మనకు కూడా (అవి) విషయాలుగా అగుచున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనందరం అతని స్వప్నంలో మనుజులమే అవుతాం. చిరకాలత్వం కారణంగా వారి స్వప్నం ఈ విధంగా జాగ్రత్ రూపం పొందింది. కాబట్టి అట్టి అవస్థయందున్న ఆ జీవులు 'స్వప్న జాగరులు'గా పిలువబడుచు న్నారు. 'జీవనోటోపాఖ్యానం'లో ఈ విషయం గమనించాం.

ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వసత్తాప్రదుడు కదా! ఆ స్వప్న జాగరుడు ఈశ్వర స్వరూపుడే అయి ఉండటం చేత సర్వత్రా సర్వం సంభవిస్తోంది. ఈ విధంగా స్వప్నయుతులైన ఆ జనులకు మనమందరం స్వప్న మనుజులమై ఉన్నాం. అనగా ఆ స్వప్న జాగరుల స్వప్న సదృశ్య ఊహాస్వరూపమే మన ఈ జాగ్రత్ అవస్థ.

శ్రీరాముడు : మునీంద్రా! పూర్వపు ఏ కల్పమునందో ఆ స్వప్న జాగరులు స్వప్నం గాంచారని కదా, మీరు అంటున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును.

శ్రీరాముడు : ఆ స్వప్న జాగరుల పూర్వకాలిక స్వప్నమందలి సమస్త పదార్థాలు, దేహాలు నేటికి క్షయించిపోయి ఉండాలి కదా! ఇప్పుడు ఆ స్వప్నం నుండి మేల్కాంచిన ఆ జీవులకు మరల గడిచి పోయిన ఆ స్వప్న జగత్ కల్పంలో స్థితి ఎట్లా సంభవిస్తోంది? వారి గడచిపోయిన స్వప్నం మనకు ఎలా ప్రాప్తిస్తోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఆ స్వప్నజాగ్రతులు తదనంతర దశలను పొందుతూ ఉంటారు. 1. ఆ స్వప్న జాగరులు మన ఈ ప్రపంచరూపమగు వారి స్వప్నమైన దైవయోగం చేత తత్త్వ జ్ఞానం పొందారనుకో. అప్పుడు వారి స్వప్నభ్రమ రూపమగు సంసారం నుండి విముక్తి పొందుతారు.

Page:800

(లేదా) 2. అట్లా తమ (స్వప్న సదృశ) సంసారమునుండి విముక్తి పొందకుండానే నిద్రలేచారనుకో... అప్పుడో? అప్పుడు మరల సంకల్పానుసారంగా అన్య దేహాలను ఆశ్రయించి వ్యవహరిస్తూ ఉంటారు.

దృష్టి ఉన్నంత వరకు సృష్టి ఉంటూనే ఉంటుంది. కనుక దృష్టియే సృష్టి. దృష్టి కొనసాగటం అవుతుంది. అందుచేత ఒక విధంగా చూస్తే వారి స్వప్న జగత్తు కొనసాగుతున్నట్లే! వారు ఇతః పూర్వము వలెనే అన్యములైన కల్పిత జగత్తును, కల్పమును గాంచుచూనే ఉంటారు. ఆ కల్పనలకు అంతు ఎక్కడ? ఆత్మజ్ఞానమే ఆ అంతు. చిదాకాశము అనంతం కనుక, వారి కల్పనలకు, వారివారి స్వప్నాంతర్గత విశేషములకు చోటు లేకపోయే ప్రసక్తి ఉండదు. ఆ స్వప్న జాగరులు 'సంకల్పాత్మక మైన జగత్తులు' అనే మేడి పండ్లలోని కీటకముల వంటివారు.'

2. సంకల్ప జాగరులు ఈ సంకల్ప జాగరుల గురించి ఐందవోపాఖ్యానంలో చెప్పుకున్నాం. వీరు ఒకానొక పూర్వ కల్పమున ఒకానొకచోట (ఐందవుల వలె) నిద్ర మేల్కొని ఉన్నారు. అయితే, అంతరంగమున సంకల్ప పరంపరలందు తత్పరులై ఉన్నారు. నిద్ర లేచి ఆలోచనలలోపడుచున్న మనిషితో వీరిని పోల్చవచ్చు. వీరు ధ్యానము నుండి చలింపబడినవారై జీవటోపాఖ్యానంలోని జీవటునివలె మనోరాజ్యంలో ప్రవేశించి ఉన్నవారు. సంకల్పము యొక్క దృఢత్వం చేత తమ సంకల్పములకు ముందే ఉన్న స్థితి యొక్క సంధానము కోల్పోయినవారై ఉంటున్నారు.

అనగా... వీరిలో 3 లక్షణాలు మనకు కనిపిస్తాయి.

1. ఈ సంకల్ప జాగరుల సంకల్పము చిరకాలం స్థిరంగా ఉండటం చేత ఆ సంకల్ప వ్యవహారం ఘనీభూతమై జాగ్రద్రూపంగా అగుచుండటం.

2. అట్టి సాంకల్పికమైన పదార్థములందే అయించిన మనశ్చేష్ఠ గలవారై పూర్వ పర స్థితులు లేకయే ఉంటున్నారు.

3. ఆ సంకల్పము ఎప్పటికో శమిస్తుంది. అప్పుడు మరల అదే సంకల్ప కథనాన్ని గాని, (లేక) మరొక సంకల్పమునుగాని వారు ఆశ్రయిస్తూ ఉంటారు.

వారి సంకల్పమయ దేహంలో మనమందరం సంకల్పరూపులమై ఉన్నాం. వారి సంకల్పంలో మనం, తదితర జీవులు లోకములు ఉన్నాయి కదా! కనుక వారి దృష్టియందు ఈ సర్వము సంకల్ప జాగరరూపములు మాత్రమే! వారికి మనమంతా వారి ఊహలుగా అనిపిస్తూ ఉంటుంది.

3. కేవల జాగరులు వీరు దామ-వ్యాళ-కటుల వంటివారు. వీరికి పూర్వపు-ఉత్పత్తివికాసము మొదలైన స్వప్న సదృశ విషయాలు ఉండవు. వీరు వర్ధమానశీలమగు బ్రహ్మము నుండి మొట్టమొదటిగా శరీరము ధరించినవారు. అందుచేత వీరిని కేవల జాగరులు' అని పిలుస్తారు.

4. చిర జాగరులు - కేవల జాగరులు ఇప్పుడే జన్మకు ఉపక్రమించారు కదా! వారే మరల తర్వాత తర్వాత జన్మలు పొందినవారై... కార్యములగు జాగ్రత్, స్వప్నాలలో; కారణములగు సుషుప్తి యందును... సంచరిస్తూ ఉంటారు. అట్లా సంచరిస్తూ ప్రౌఢత్వం చెందటం చేత వారిని

చిర జాగరులు' అంటారు.

Page:801

5. ఘన జాగరులు ఆ చిరజాగరులలో కొందరు దుష్కర్మ వశం చేత జడ స్థావర తుల్యమైన అజ్ఞాన దశకు పరిణమిస్తూ ఉంటారు. అట్టి ఘనీభూత జాగ్రత్ స్థితిని పొందటం చేత వారిని 'ఘన

జాగరులు' అంటారు.

పైన చెప్పిన 5 విధములగు జీవులు 'బద్దజీవులు' సుమా! ఇక ముక్తి వైపు ప్రయాణిస్తున్న తదితర 2 రకాల జీవుల గురించి విను.

6. జాగ్రత్ స్వప్నులు - పై 5గురిలోని ఏ ఒక్క జీవుడైనా శాస్త్ర అభ్యాసం చేత, సత్సంగత్యం చేత బోధితుడైనాడనుకో, అప్పుడు అతనికి జ్ఞానప్రాప్తి లభిస్తుంది. అట్టి వారికి ఈ జాగ్రత్ అంతా స్వప్నతుల్యంగా కనిపిస్తుంది. దీనినే పంచమ భూమిక లేక 'జ్ఞానారంభ భూమిక' అని కూడా

అంటూ ఉంటారు.

7. క్షీణ జాగరులు వీరు జాగ్రత్ స్వప్నదశ నుండి సాధనను కొనసాగిస్తూ క్రమంగా పరిపూర్ణ జ్ఞానము పొందినవారు అగుచున్నారు. పరమ పదమున విశ్రాంతి పొందుచున్నవారు, సమస్త భూమికయందు ఆరూఢులైనవారు అగుచున్నారు.

సంకల్పములకు మునుముందే స్వస్వరూపాత్మ - రామచంద్రా! ఈ విధంగా సముద్రంలో ఉన్నదంతా జలమే అయినప్పటికీ రకరకాల ఆకారాలు గల తరంగాలు ఉన్నట్లుగా ఈ జీవ మహాసముద్రంలో మనం పైన చెప్పుకున్న 7 రకాల జీవులు అన్ని జీవజాతులలోనూ ఉన్నారు. వీటిని తెలుసుకొన్నవాడవై ఉత్తరోత్తర భూమికలయందు తత్పరుడవై ఉండుము.

నాయనా! నీవిక ఈ జగత్తును గూర్చిన 'ద్వైతబుద్ధి' అనే భ్రాంతిని త్యజించు. ఎందుచేతనంటే నీవు ఇప్పటికే పూర్ణముగా బోధైక రూప ఘనత్వమును (ఘనీభూతమైన దృకామాత్ర రూపమును) పొంది ఉన్నావు. తరంగాలలో భేదం ఉన్నా జలం సర్వదా ఒక్కటే కదా! ద్వితీయాదుల అభావం చేత ఏకత్వ భావన కూడా అవసరం లేదు. అందుచేత 'ఏకత్వ-ద్విత్వ-శూన్యత్వ-అశూన్యత్వ'... ఆదిగాగల సర్వ ధర్మములను వదిలినవాడవై ఉండు. కల్పనలన్నింటికంటే ఆది ఏమిటో గ్రహించు. అట్టి ‘ఆది’ అయిన అధిష్ఠాన సన్మాత్రుడవై శేషించుము. అదియే నీ స్వభావము.

ఓ సర్వ సభికులారా! మీ అందరి యొక్క వాస్తవరూపం సర్వ కల్పనలకు ముందే ఉన్న ఆత్మ రూపమేనని గ్రహించి తత్పరులై ఉండండి.

11. ఈ జగత్తు ఉత్పత్తి రహితము - మిథ్య - నిరాకారము శ్రీరాముడు : మహాత్మా! 'ఆకాశం నుండి వృక్షం జనించింది' అనేది ఎంతటి అర్థరహితమో పర బ్రహ్మం నుండి జగత్తు జనించడం అంతే అర్థరహితమని అనిపిస్తోంది. బ్రహ్మం నుండి అకారణంగా 'నిరర్థకం-జాగ్రత్ శరీరధారణమయం' అయినట్టి ఈ జీవులంతా ఎట్లా ఉత్పన్నాలౌతున్నారు? బ్రహ్మమే వీరి స్వరూపం గదా! వీరంతా బ్రహ్మము నుండి ఎందుకు, ఏ కారణం చేత జనిస్తున్నారు.

Page:802

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు 'అకారణంగా' అని అంటున్నప్పుడు నిజమే చెప్పావు. కారణం (లేక) కార్యము ఎన్నటికీ ఉత్పన్నం కాదు. కాబట్టి వాస్తవానికి కేవల జాగ్రత్ జీవులు ఉత్పన్నమే అయి ఉండలేదు. అగ్ని శిఖలలో ఒక్కొక్క శిఖ ఒక్కొక్క ఆకారం కలిగి ఉన్నప్పటికీ అగ్నికి ఏ సమయమందునూ 'ఇట్టిది' అన్న ఆకారమేదీ లేనే లేదు చూచావా? అట్లాగే జాగ్రత్ జీవులు వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు. కాబట్టి తదితర పరిణామ ఫలితమైన తక్కిన జీవభేదం ఏనాడు సంభవించి ఉండలేదు. అంతా కూడా యథాతథంగానే ఉన్నది.

నే_హ ప్రజాయతే కించిత్ నేహ కించన నశ్యతి | ఉపదేశ్యోపదేశార్థం శబ్దార్థ కలనోదయః ॥

ఓ రామచంద్రా! వాస్తవానికి బ్రహ్మమునందు ఈ రకరకాల జీవులు మొదలైనవి ఉత్పన్నమవటమూ లేదు, నశించుటయూ లేదు. మరి? ఈ 7 రకాల జీవుల గురించి ఎందుకు చెప్పానంటావా? ఇదంతా కూడా కేవలం శిష్యునికి ఉపదేశించటానికి మాత్రమే శ్రుత్యాదులు ఈ శబ్దార్థ కల్పనలన్నీ చేశాయి. చివరికి జీవ భేదంతో సంబంధం లేని బ్రహ్మమును బోధించటమే ఆ శ్రుతుల అంతిమ లక్ష్యం.

శ్రీరాముడు :

కః కరోతి శరీరాణి, మనో బుద్ధ్యాది చేతనైః?

కో మోహయతి భూతాని, స్నేహరాగాది బంధనైః?

మునీంద్రా! నాదొక చిన్న సందేహం. బ్రహ్మమునందు జీవాది విశేషములేవీ జనించటం లేదని, బ్రహ్మము సర్వదా నిర్మలత్వముచే యథాతథంగానే ఉన్నదని అనుకుంటున్నాం కదా! మరి మనస్సు-బుద్ధి' ఇటువంటి చేతన వస్తువులన్నీ ఉపయోగించి భోగసాధనమగు ఈ శరీరమును తయారుచేస్తున్నది ఎవరు? మరియు ఈ జగత్తులో స్నేహము-రాగము మొదలైన ఆయా బంధనములన్నీ కల్పించి ఈ ప్రాణులందరినీ మోహపెట్టుచున్నది ఎవరు?

శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ శరీరాలను ఎవడూ ఎన్నడూ నిర్మించటమూ లేదు. ఈ ప్రాణులందరినీ ఎవడూ మోహపెట్టటమూ లేదు. జలంలో తరంగాలు, ఆవర్తాలు మొదలైన జలాకారాలన్నీ పొంది జలమే ఆయా రూపాలుగా కనిపిస్తోంది చూచావా? అనాదిఅనంతం-బోధ రూపం అయినట్టి పరమాత్మయే ఈ అనేక పదార్థ రూపాలుగా తన స్వరూపముననే ఉండి ఉంటున్నాడు.

వాస్తవానికి బాహ్యపదార్థం అంటూ ఏదీ లేదు. మరి? బీజంలోంచే వృక్షం బయల్వెడలుచు న్నట్లుగా అభ్యంతరమైన బోధ రూప హృదయం నుండే బోధయే (చైతన్యమే) బాహ్యపదార్థం వలె స్ఫురిస్తోంది.

ఒక శిలలో శిల్పం ఉన్నట్లుగా బోధ యందే ఈ 'ప్రపంచం' అనబడేది స్థితి నొంది ఉన్నది. అట్టి బోధ దేశ కాలాలచే ఏకం-అనంతం కూడా! అట్టి బోధ' యొక్క విస్తారమే ఈ బాహ్యాభ్యంతర జగత్తు అని గ్రహించు.

Page:803

అంతేకాదు వాసనలచేతనే సిద్ధిస్తున్న బ్రహ్మలోకం మొదలైన తదితర లోకాలన్నీ కూడా పరమాత్మ యందే ఉన్నాయి. పరమాత్మయో, వాసనలన్నిటికీ ఆవల కేవలమై ఉన్నారు! కాబట్టి వాసనాక్షయమును నిరంతర భావన చేయాలి. అప్పుడు వాసనాక్షయ భావనా బలంచేత అనుభవం సిద్ధించగలదు. శాంతులగు జ్ఞానులు ఆత్మ కొఱకై ఆ లోకంలోనో ఈ లోకోంలోనో వెతకరు.

ఆత్మ అంతటా నిండి ఉండటంచేత 'ఆత్మ ఎక్కడో ఉన్నది' అనురూపమైన వాసనలు వారియందు ఎన్నటికీ జొరబడవు.

సద్రూపమగు ఆత్మయే దేశ-కాల-క్రియా-ప్రకాశ-రూప-చిత్తాదులతో కూడి ఉన్నది. అయితే వాస్తవానికి దేశ-కాల చిత్తాదులు శబ్ద-అర్థములు ఆత్మకు లేవు. అయినప్పటికీ ఆత్మ శూన్యం కాదు.

ఎవరి దృష్టియందైతే దృశ్యము సర్వదా శమించియే ఉన్నదో... అట్టి తత్త్వవేత్తలగు ద్రష్టలకు మాత్రమే ఆత్మ పదం యొక్క బోధస్థితి అనుభవమగుచున్నది. అన్యులకు అది సుబోధకం అవటం లేదు. అహంకారం అనే పిశాచం ఈ హృదయాన్ని అవహించి ఉన్నంత వరకు ఆత్మపదం సుబోధకం కాదు. 'చంచలం-విస్తారం' అయిన 'అహంకారం' అనే గోతిలో ఎవడు పడతాడో... అట్టి వాడు

ఎప్పుడూ ఆత్మ ప్రకాశాన్ని గాంచలేడు.

ఓ రామచంద్రా! ఆత్మ జ్ఞానికి ఈ 14 లోకాలు, ఇందులోని సర్వజీవులు తన యొక్క అవయవాల వలె తోచుచూ ఉంటాయి. జ్ఞానుల యొక్క దృష్టికి ఈ 'సృష్టి' అనేది ఉదయించటమూ లేదు, అస్తమించటమూ లేదు. ఎందుకంటే ఏదైనా 'కారణం' అనేది ఉంటే కదా, 'కార్యం' అనేది ఉండేది? కారణమే లేకపోతే కార్యం ఎక్కడి నుండి వస్తుంది? పరమాత్మ అకారణుడు. అతడు దేనికి కారణం కాదు. కనుక ఈ సృష్టికి కారణమే లేదు. కారణమే లేదు కాబట్టి సృష్టియే లేదు. జ్ఞానులు ఈ సృష్టిని ఉదయం గాని, అస్తమయం గాని లేనిదానిగా దర్శిస్తున్నారు.

శ్రీరాముడు : మరి 'పరమాత్మ నుండే ఈ సృష్టి ఆవిర్భవిస్తోంది'... అని వేద వచనం కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : సరే, అయితే... కారణం యొక్క స్వభావమే కార్యం కూడా కలిగి ఉంటుంది కదా! కారణమగు పరమాత్మ ఎట్లు సత్-చిత్-నిరాకార రూపమే అయి ఉన్నదని జ్ఞానులు గ్రహిస్తున్నారో కార్య రూపమగు జగత్తు కూడా సత్చిత్ నిరాకార రూపమేనని గమనిస్తున్నారు. అజ్ఞానులో ఇదంతా ఆకార రూపంగా మాత్రమే దర్శిస్తున్నారు.

బంగారు అభరణం' అనుదానిలో... అభరణం అనే కార్యం 'బంగారం' అనే కారణం నందే ఉన్నప్పుడు, ఆభరణం’ అనే దానికి బంగారం కంటే వేరైన ఉనికి ఎక్కడ? అట్లాగే కారణమగు పరబ్రహ్మమునందే ఆ పరబ్రహ్మం రూపంగానే ఈ జగత్తు ఉన్నప్పుడు ఇక వేరే కారణత్వం' అనేది పరబ్రహ్మానికి ఏమున్నది? బంగారపు ముద్ద ఉంగరం మొ॥న ఆకారంగా ఉన్నప్పుడు ఆభరణం అంటున్నాం. ఆభరణంలో బంగారం తప్ప వాస్తవానికి మరింకేమీ లేదు కదా! అట్లాగే పరమాత్మయే సృష్టి రూపంగా కనిపిస్తోంది. అంతేగాని సృష్టికి పరమాత్మ కంటే వేరైన రూపం లేదు. ఒకవేళ

Page:804

పరమాత్మ కంటే వేరుగా ఎక్కడైనా సృష్టి అనేది ఎవరికైనా అనుభవమౌతుంటే... అది అసత్తే గాని (వాస్తవానికి లేనిదే గాని) సత్తు కాదు. ఎప్పుడైతే (బంగారు ఆభరణంలో ఆభరణం వలె) అసత్తో, అప్పుడు పరమాత్మ యందు గల 'కారణత్వం' అనేది కూడా అసత్తే (లేనిదే) అగుచున్నది.

'మరి మాకు జగత్తు కనిపిస్తోంది కదా' అని ఎవరైనా అంటారా?

శాంతమగు మహా సముద్రంలో 'తరంగాలు-ఆవర్తనాలు' ఉంటున్నట్లే, శాంతముక్షోభరహితము అగు బ్రహ్మం నందు 'జగత్తులు-చిత్తములు' ఉంటున్నాయి. ఒకే మట్టి అనేక మట్టి పాత్రల రూపంగా అగుచున్నట్లు, ఒకే బంగారం అనేక పేర్లతో పిలువబడే ఆభరణాలుగా, అగు చున్నట్లు... ఒకే బ్రహ్మం అనే పిండం అనేక జీవులుగా, జగదృశ్యములుగా, చిత్తములుగా అగు చున్నది. అయినప్పటికీ కూడా బ్రహ్మపిండం సర్వదా ఏకం- నిర్మలం అయి ఉన్నది. మట్టి ఎన్ని పాత్రలుగా అగుచున్నప్పటికీ బంగారం ఎప్పటికీ బంగారమే! అట్లాగే బ్రహ్మం సర్వదా బ్రహ్మమే!

కుండగా ఉన్నప్పటికీ... అది మట్టియే! మట్టిగా ఉన్నప్పటికీ అందులో కుండగా అవగల తత్త్వం సర్వదా ఉన్నది. మట్టి మట్టిగా ఉన్నప్పుడు, కుండగా ఉన్నప్పుడు కూడా ఉభయ స్థితులందు ఏక వస్తువును కుమ్మరి దర్శించగలడు. అట్లాగే, జ్ఞాని సహజీవుల వైపు చూచేటప్పుడు ఆ సహజీవుల వాసనాయుక్తమైన మనస్సులను వదలిపెట్టి అతీత దృష్టితో చూడగలుగుతాడు. అతని యొక్క సత్యవస్తుజ్ఞాన ప్రభావం చేత సహజీవులంతా ఆత్మ స్వరూపంగానే అగుపిస్తారు. జ్ఞానులకు ఈ జాగ్రత్ స్వప్నతుల్యంగా తెలియవస్తుంది. స్వప్నం జాగ్రత్తు వంటిదే అవుతుంది. జాగ్రత్తు స్వప్నం వంటిదే అవుతుంది.

ఆత్మ కంటే వేఱుగా ఏదైనా వారికి కనిపిస్తే అద్దానినంతా వారు స్వప్నతుల్యంగా చూస్తారు. అందుచేత వారికి అంతటా అన్నిటా ఒకే వస్తువు భాసిస్తోంది. మృగతృష్ణ 'మృగతృష్ణ'గా తెలియబడిన తర్వాత ఇక ఆ మృగతృష్ణలో కనిపించే ఒక తరంగం మరొక తరంగం మధ్య గల తేడా భ్రమగానే తెలియవస్తుంది గాని, ఆ తేడా వాస్తవమని అనుకోం కదా! ఈ అనేక విశేషములతో కనిపించే జగత్తు చిత్త మాత్రంగా ఎఱుగబడిన తర్వాత ఇదంతా స్వప్న తుల్యంగా అనిపించటంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఆకాశంలో మేఘాలు అనేక ఆకారాలతో కనిపిస్తున్నాయి. అయితే మేఘాలన్నీ జలబిందువుల యొక్క ఘనీభూతమైన హిమ (మంచు) స్థితియే కదా! ఆ మేఘాలు వర్షించాయనుకో, ఇప్పుడేమైనది? ఆ ఆ మేఘాలన్నీ జల బిందువులై నేలపై వర్షించాయి కదా! మరి మునుముందటి మేఘాకారాలన్నీ ఏమైనాయి? అట్లాగే ఆత్మ యొక్క సమ్యక్ జ్ఞానం ఉదయించగానే జ్ఞానికి ఈ కనబడే సర్వ దేహాలతోసహా సమస్తం చిత్త త్యాజ్య రూపమున త్యజించబడుతుంది. ఇదంతా ఏకము - నిర్మలము అగు ఆత్మగా సుస్పష్టంగా అనుభవమగుచున్నది.

మేఘాలు ఆవరించినప్పుడు ఆకాశం కనిపించదు. మేఘాలే కనిపిస్తాయి. మరి మేఘాలు తొలగినప్పుడో? ఆకాశం యథాతథంగా నిర్మలము అనంతము అయి కనిపిస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు తొలగినపుడు కూడా ఆకాశం సర్వదా యథాతథమే కదా! 'సత్యము' యొక్క పరిజ్ఞానం

Page:805

చేత అహంకార సహితమగు జగత్తు కూడా శమిస్తుంది. ఆ స్థానంలో ఏకము-అఖండముఅనంతము-అప్రమేయము అగు ఆత్మ మాత్రమే గోచరిస్తుంది. ఆత్మ జ్ఞానము సంతరించుకొన్న తర్వాత ఆపై అనుభవించబడే శబ్ద స్పర్శ-రూప రస గంధాలన్ని కూడా మృగతృష్ణాజలం వలె మొదలే శమించియే అక్కడ ఉంటాయి. అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండగానే అందులో ఆకులు, వస్త్రములు, కట్టెలు మొదలైనవి వేశామనుకో, అవన్నీ ఏకం అయిపోతాయి కదా! అట్లాగే జ్ఞానాగ్నిచే జగత్తు-చిత్తము మొదలైనవన్నీ ఏకత్వం పొందుచున్నాయి. తెలివితేటలు గల బాలునికి చీకట్లో పిశాచాకారాలు కనిపించవు కదా! అట్లాగే జ్ఞానికి ఈ మూడు లోకములలో సాకారమంతా (మూర్తిత్వమంతా) క్రమక్రమంగా లేనిదిగా తెలియవస్తోంది.

చిత్తే చిత్తముగా భాసిస్తోంది! - అనంత రూపమైనట్టి 'బోధ' (చైతన్యము) తన నిజస్వరూపమున ఈ జగత్తు-చిత్తాదులుగా భాసిస్తోంది. మరి అప్పుడు బోధయందు మూర్తిత్వం (నామ-రూపాదులు) ఎచ్చటివి? ఆత్మను గూర్చిన అజ్ఞానం చేతనే 'జగత్తు చిత్తం' అను వేర్వేరు రూపాలుగా అనిపించటం జరుగుతోంది. ఎప్పుడు ఆత్మ జ్ఞానముచే అజ్ఞానం నశిస్తుందో... అప్పుడు మూర్తిమంతం యొక్క అస్థిత్వం ఎచ్చట? అగ్నిచే బంగారం కరిగి అతి సూక్ష్మత్వం పొందుతోంది చూచావా? అప్పుడిక బంగారం యొక్క ఇతఃపూర్వపు ఆకారం ఏమయినట్లు? ఎప్పుడు ఆత్మ జ్ఞానంచే ఈ జగత్తు స్వప్న తుల్యమని ఎఱుగబడుతుందో... అప్పుడు ఈ జగత్తు మూర్తిత్వమును వీడుచున్నది. అనగా అప్పుడు ఈ జగత్తు నిరాకారమని, నామ రూప భేదకల్పనా రహితమని ఎఱుగబడుచున్నది.

ద్రవ రూపంలో ఉన్న బంగారం క్రమక్రమంగా ఘన రూపం పొందుతూ ఉంటుంది చూచావా? అట్లాగే స్వస్వరూపమున ఉన్నట్టి బోధ రూపమగు ఆత్మ దేశ కాలాలనేవి ఏర్పడటానికి ముందే తనయందు జాగ్రత్-స్వప్నాలను రచించుకొని ఘనత్వాన్ని పొందినదాని వలె అగుచున్నది. ఆత్మ విచారణచే జాగ్రత్-స్వప్నాలు కల్పిత మాత్రాలని, ఆ రెండింటికి 'కారణం-ఆధారంఅప్రమేయం అయి ఆత్మ సర్వదా ప్రకాశించుచున్నదని తెలియబడగలదు. ఈ ప్రకారంగా ఆత్మ విచారణచే జాగ్రత్-స్వప్నములు తుచ్ఛములైనవని తెలియబడగానే ఇక భోగాల పట్ల అనురాగం దానంతట అదే సన్నగిల్లుతుంది.

ఈ ‘దృశ్యం’ అనబడేది వివేకికి అవివేకికీ కూడా విద్యమానమై ఉంటోంది. అయితే వివేకులకు ఈ దృశ్యము అత్యంత తుచ్ఛమైనదిగా కన్పట్టుచున్నది. స్వప్నంలో విద్యమాన మయ్యే పదార్థ జాలం ఏ విధంగా నమ్మకమునకు అనర్హమో, ఈ జాగ్రత్ పదార్థజాలం కూడా అంతే అనర్హం. ఎందుకంటావా? ఆత్మయందు లభించే సుఖ విశ్రాంతి ఎచ్చట? ఈ విషయాస్వాదనలు ఎచ్చట? తత్త్వజ్ఞానికి కూడా ఈ విషయాల పట్ల ప్రీతి-నమ్మకం కలుగుతుందంటే, ఇక జాగ్రత్-స్వప్నములు ఒక్కటే అవుతాయి. జ్ఞాన అజ్ఞానాలు ఒక్కటే అవుతాయి. అది కుదిరేది కాదుకదా! కనుక తత్త్వజ్ఞానికి విషయాల పట్ల నమ్మకం ఉండదు. ఈ జగత్తు చిత్తము చేతనే సిద్ధిస్తోందని, ఇదంతా స్వప్నంలాగా భ్రాంతి మాత్రమేనని తెలియవచ్చిందో, ఇక ఆ సుజ్ఞానికి ఇక్కడి రూపం పట్ల, పదార్థాల పట్ల సత్యత్వ బుద్ధి స్వయంగా తొలగిపోతోంది. మృగతృష్ణలో జలం రుచిగా ఉంటుందని

Page:806

ఆ జలం కోసం పరుగులు తీసేవాడు తెలియనివాడే గాని, తెలిసినవాడు కాదు కదా! అట్లాగే వివేకి అయినవాడు దృశ్య పదార్థముల పట్ల 'ఇవన్నీ సత్యము-నిత్యము'... అని తలచడు. బయట నుండి కిటికీ గుండా ప్రవేశించిన దీపకాంతికి ఆకారము కనబడవచ్చు గాక! అయితే మాత్రం దీపకాంతికి ఆకారం అంటూ ఏమున్నది? ఏమీ లేదు. శాంతుడగు వివేకికి ఈ జగత్తునందు ఆకారాదులు కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారంగాను, ఆకాశరూపంగాను గ్రహిస్తున్నాడు.

జాగ్రతో వస్తుతః శూన్యాత్ పరిజ్ఞాతాత్ నివర్తతే |

చిత్త భ్రమాత్మనో భ్రాన్తిర్ రూపాస్వాదన భావనా ॥

ఒకడు మేలుకొనిన తర్వాత స్వప్నంలో కనిపించిన వస్తువుల కోసం వెతకాలని అనుకుంటాడా? అనుకోడు. ఎందుచేత? అవి అవాస్తవములని, శూన్య మాత్రములని, కేవలం భ్రమచే సిద్ధించాయని బాగా తెలుసు కనుక! అట్లాగే ఈ జగత్ పదార్థములన్నీ చిత్తం యొక్క భ్రమ-చాంచల్యములచే మాత్రమే సిద్ధిస్తున్నాయని తెలిసిన తర్వాత జ్ఞానికి వీటిని పొందాలనే ఉద్వేగమంతా మొదలంటా తొలగుతోంది. ఏ వస్తువు పట్ల అయినా గ్రాహ్య బుద్ధి (సంపాదించుకోవాలనే ఆలోచన) ఎట్లా కలుగుతుంది? ఆ వస్తువుపై గల నమ్మకం చేతనే కదా! జ్ఞానికి అదంతా స్వప్నంలో కనిపించిన బంగారు గొలుసు కావలసిందేనని కోరుకోవటం వంటిదే అవుతుంది. జ్ఞానికి సర్వదా సర్వ విశేషాల పట్ల రాగబుద్ధి తొలగుతోంది. 'ద్రష్ట-దృశ్యం' అనే దోషాన్ని అతడు తనయందు తొలగించుకొని ఉంటున్నాడు. లేదా దోష గ్రంథుల యొక్క ఛేదనం కొఱకై ప్రయత్నశీలుడై, నిమగ్నుడై ఉంటున్నాడు.

'జ్ఞాని సకల బంధుత్వాలలో రాగ రహితుడై, దృశ్య పదార్థాల పట్ల మనన వర్జితుడై, అహంకార శూన్యుడై, ద్వేషమంటూ ఏదీ లేనివాడై, సాంసారిక ప్రయత్న రహితుడై, శాంతుడై వెలయుచున్నాడు.

వాసనలు - అపేక్ష - ఉపేక్ష - దీపశిఖ నశిస్తే దీపకిరణాలు నశిస్తాయి కదా! అట్లాగే భోగాలపై అపేక్ష తగ్గుచున్న కొలదీ వాసనలు సన్నగిల్లుతూ వస్తాయి. కాక, భోగాలపై అపేక్ష పెరుగు చున్నదా... వాసనలు ప్రవృద్దమౌతూ ఉన్నట్లే. ఆపేక్ష తప్పించి వాసనలకు వేరే రూపమేదీ లేదు.

ఓ ప్రియ సహజీవులారా! ఈ జగత్తంతా గంధర్వ నగరంలాగా భ్రాంతి రూపమేనని మీరు గమనించండి! తత్త్వబోధచే ఇదంతా సూక్ష్మమైనట్టి సత్-చిత్ ఆకాశంగా గమనించ బడగలదు.

యత్రనా2 త్మా న శూన్యంచ న జగత్కలనాపిచ

న చిత్త దృశ్యో ఉదయ ధీః, సర్వంచ అస్తి యథా స్థితమ్ ॥

ఆ పరమాత్మ జీవుడు కాదు. శూన్యమా? కానే కాదు. ఆ పరమాత్మ పదమున జగత్కల్పన గాని, చిత్తం గాని, దృశ్యోదయం గూర్చిన బుద్ధిగాని లేవు. మరి? ఇదంతా కూడా యథాస్థితమగు బ్రహ్మమే అయి ఉన్నది. అజ్ఞానులకు కనిపించే సాకారమంతా జ్ఞాని దృష్టికి అతని యొక్క తత్త్వ జ్ఞానంచే లయించి పోవుచున్నది. అందుచేత దృశ్య విషయాల పట్ల ఉపేక్ష పెంపొందించుకోండి. శ్రీరాముడు : అనగా అతని దృష్టికి ఈ జగత్తు అసలు కనిపించదా?

Page:807

శ్రీవసిష్ఠ మహర్షి : కనిపిస్తుంది. ఇదంతా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ శూన్య రూపాలుగాను, లేనివి గాను అగుపిస్తాయి. ‘ఈ జలానికి ఆవర్తములు ఎందుకు వచ్చాయి?'... అని అనుకొని ఎవడైనా జలంలోని ఆవర్తములను తొలగించి జలమును పరిశుద్ధపరచాలని అనుకొంటాడా? జలమునందు ఆవర్తనములు ఉన్నప్పటికీ (లేక) ఉండనప్పటికీ జలం సర్వదా యథాతథంగా ఉంటోందని జల తత్త్వం తెలిసినవాడు అనుకుంటాడు కదా! జ్ఞాని ఈ వివిధ వికారాలతో కూడిన జగత్తు ఒక ప్రక్క కనిపిస్తున్నప్పటికీ ఇచ్చట ఆత్మ ఆత్మయందే యథారూపంగా ఉన్నదని గ్రహిస్తున్నాడు. అతడు (జ్ఞాని) ఆకాశం వలె నిర్మలుడై, సౌమ్యరూపుడై, సంగరహితుడై, కేవలమూ సమాధితత్పరుడై ఉన్ననూ, లేనివాడై ఒప్పుచూ ఉంటాడు. అతని మనస్సు సర్వదా అస్తమించియే ఉంటుంది. అతడు మౌనియై, ఇంద్రియ-మననాలను అధిగమించినవాడై ఉంటాడు. సమస్త కర్మల యొక్క అంతమును సంపాదించుకొని ఉంటాడు. సంసార సముద్రమును దాటివేసి ఉంటాడు.

1. స్థూల-సూక్ష్మ-కారణ-మహాకారణ చతుర్విధ దేహముల యొక్క

2. ఆ దేహమునకు ఆధారమై ఈ 14 లోకముల యొక్క

3. ఆ 14 భువనములకు ఆధారమైన ఆకాశము యొక్క,

4. పర్వత సమూహముల యొక్క,

5. విషయ సాధనా క్రమముల యొక్క

వీటన్నిటి యొక్క ఉపాదాన కారణము 'మూలాజ్ఞానమే'! అట్టి మూలాజ్ఞానం నశించిందా, ఇక ఆపై ఈ శరీరము, ఈ భూమి మొదలైనవి కనబడుతూనే అతనికి 'లేనివి' గా తెలియవస్తున్నాయి. ఈ ప్రకారంగా జ్ఞాని... శాంతమైన అంతఃకరణం కలిగినవాడౌతాడు. వికల్ప రహితుడై ఉంటాడు. స్వరూపసారమయుడై ప్రకాశిస్తాడు. పరమానందమగు 'ఆత్మానందం'తో ఎల్లవేళలా పరితృప్తుడై ఉంటాడు, నిరావరణ భూమానంద స్వరూపుడై వర్తిస్తాడు.

12. సృష్టి - ప్రళయములు

శ్రీరాముడు : మునీంద్రా! చిదాత్మ వాస్తవానికి కేవల బోధ రూపం కదా! మరి ఏ క్రమం చేత అది జగత్తు వలె భాసిస్తోంది? చిత్తము యొక్క భేదనివారణ కొరకై ఈ విషయం తెలియజేయ ప్రార్ధన. శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! వృక్షస్యేవ విమూఢస్య యదృష్టా తత్స్వచేతసి - విత్తులోని ఒకే చేతనసత్త వృక్షం యొక్క మూలం-ఆకులు-పుష్పం-ఫలం మొదలైన ఆకారాలు పొందుచున్నది చూచావా? అట్లాగే అజ్ఞాని యొక్క అంతరంగంలోని అజ్ఞాన దృష్టియే ఇట్లు ఈ దృశ్య పదార్థాలుగా అనుభవమగుచున్నది.

యన్నదృష్టా న తచ్చిత్తే భవతి అల్పతరస్మృతే - దృష్టియందు ఉన్నదే చిత్తము నందు ఉంటోంది. చిత్తం నందు ఉన్నదే దృశ్యంగా ప్రాప్తిస్తోంది. దృష్టిలోను, చిత్తంలోను లేనిదేదీ దృశ్యంగా ప్రాప్తించుటలేదు. దృష్టిలో లేనిదేదీ కించిత్తు కూడా స్మరించబడటం లేదు, దర్శించబడటం లేదు.

Page:808

అయితే, వివేకి అయిన వాడు శాస్త్రార్థముల పూర్వ-పరములను గ్రహించియే, ఆపై దర్శనం చేస్తాడు. అంతేగాని ఈ ఇంద్రియాలకు కనబడినట్లుగా కాదు. శాస్త్రములకు నిషిద్ధమైన విశేషాలను సమీపంగా ఉన్నప్పటికీ వాటిని చూడటానికి కూడా అతడు ఇచ్చగించడు. వీటిని గురించి ఎటువంటి చిత్త పరిశ్రమ కలిగి ఉండడు. కాబట్టి రామచంద్రా! నీవు కూడా చిత్తశుద్ధికి అనుకూల మైన అనుష్ఠానమునందు మాత్రమే తత్పరుడవై ఉండెదవు గాక! శాస్త్ర సమ్మతమైన చిత్తమును మాత్రమే పెంపొందించుకో. శాస్త్రముల యొక్క అత్యుత్తమార్థములందు మాత్రమే మననశీలుడవై ఉండు. శ్రవణములకు భూషణములైన ఈ ఉపదేశం విను.

అవిద్య-దృశ్యభ్రాంతి పర్యాయపదాలే! ఈ దృశ్య సమూహం గూర్చిన భ్రాంతియే అవిద్య. ఇంతకు మించి అవిద్య అనగా ఏదీ లేదు. మృగతృష్ణలో జలం అంటూ ఏదీ లేనట్లు వేఱుగా అవిద్య అంటూ ఏదీ లేదు.

అయినా కూడా... మన ఈ ఉపదేశ్య-ఉపదేశముల కొఱకై కాసేపు అవిద్య అనునది ఏదో ఉన్నది’ అని అనుకొని (కాసేపు అవిద్య వేరే నిజంగా ఉన్నదని అనుకొని)... ఈ నా వాక్యాలు విను. ‘అవిద్య ఎట్టిది? ఎక్కడ నుండి వచ్చింది?'... మొదలైన వికల్పములను కాసేపు కట్టిపెట్టి నేను చెప్పబోయేది వింటే 'జగత్తు గాని, అవిద్యగాని లేవు' అని నీవే స్వయంగా గ్రహిస్తావు.

అనేక విశేషాలతో, రకరకాల పదార్థాలతో పూర్ణమై ఉండి కనిపిస్తున్న ఈ స్థావర జంగమాత్మక ప్రపంచం 'కల్పాంతం' నందు నశిస్తోంది. కాస్త విమర్శించి చూస్తే... ఈ జగత్తు 'భూలోకం' మొదలైన విభాగాలు ఒక్కొక్కటి విశ్లేషిస్తూ వస్తే 'ఇది లేదు' అని ఆ ఒక్కొక్కటీ తొలగుతూ రాగలదు. ఒక కుండలో నీళ్లు ఉన్నాయనుకో, అందులో ఒక్కొక్క బిందువు తొలగించుతూ ఉండగా, ఆ కుండ లోని నీళ్లన్నీ ఒక నాటికి అయిపోక తప్పదు కదా! ఈ జగత్తు కూడా విమర్శచే అంతే!

1. “ఈ జగత్తు బ్రహ్మము యొక్క అవయవమా? ఈ జగత్తు బ్రహ్మం యొక్క అవయవ మనియే కొద్దిసేపు అనుకుందాం. అప్పుడు 'అవయవం అగు ఈ జగత్తు నశిస్తే, 'అవయవి అగు బ్రహ్మం కూడా నాశనం పొందాలి. బ్రహ్మమునకు 'నాశనం' అనే ధర్మమే ఉంటే 'ఆత్మ అనంతం' అనే వేదవాక్కుకు విఘ్నం కలుగుచున్నట్లే కదా! కాబట్టి 'ఆత్మ-చిదేకరసం-నిరవయవం అయినట్టి బ్రహ్మమునకు ఈ జగత్తు అవయవం అవటానికి కూడా వీలు లేదు.

2. “పరమాణువుల సంయోగంలోంచి 'నేను' వస్తోందా? వియోగంచే పోతుందా?ఇక మరొక (చార్వాకుల) వాదం ఇక్కడ చెప్పుకుందాం.

"భూమి మొదలైన ఈ పంచభూతాలు స్వతహాగా జడమే. కానీ కల్లు త్రాగినప్పుడు దేహ మంతా 'నిషా’ ప్రసరించినట్లుగానే ఈ పంచ భూతాలు ఒక చోట ఒక విధానంగా సమావేశం అయినప్పుడు చైతన్యం ఉదయిస్తోంది. అందుచేత ఈ దేహాలలో 'నేను' అను ప్రజ్ఞ ఉదయిస్తోంది. ఆ అణువులు విడిపోగానే 'నేను' అంతరిస్తుంది. ఇంతకు మించి ఏమీ లేదు.”

Page:809

ఈ వాదన మాకు సమ్మతం కాదు. ఎందుకంటావా? ఈ దేహం 'విజ్ఞానం' (ప్రజ్ఞ) పై ఆధారపడి ఉంది గాని, దేహంపై ప్రజ్ఞ ఆధారపడి లేదని మేం గమనిస్తున్నాం. ప్రజ్ఞయే దేహాన్ని నడిపిస్తోంది. అంతే గాని ప్రజ్ఞ దేహంలో 'కాలు-చేయి-జీర్ణకోశం' వలె ఒక విభాగం కాదు. చేతిని నీవు కదిలిస్తున్నావు. అంతేగాని, చేయి నిన్ను కదిలిస్తోందా? లేదు. అనగా 'నేను' అని స్ఫురించే చైతన్య అధీనంలోనే ఈ దేహం ఉన్నది. అంతేగాని దేహ అధీనంలో చైతన్యం లేదు.

3. యథా ద్రష్టం - తథా దృశ్యం" - ఇక ఈ దృశ్యానికి వద్దాం. మా ఉద్దేశానుసారంగా కూడా ఈ దృశ్యం ఎట్లా ఒకనికి కనబడుచున్నదో... అది ఈ దృశ్యము యొక్క అసలు రూపం కాదు. దీని రూపం మరొకటేదీ కూడా కాదు. మరి? ఈ దృశ్యము ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ విధంగా అనుభవమౌతూ ఉంటోంది. కనుక ఇది 'అనిర్వచనీయం' అని చెప్పబడుతోంది. ఇది అవిద్యచే ఇట్లిట్లు అనుభవమౌతోంది. ఇది ఎట్లెట్లు అనుభవమౌతోందో,.. అదంతా కూడా విద్యచే తప్పక నశించగలదు. 'జగద్దర్శనము' అనేది మధ్యలో వచ్చి మధ్యలోనే పోవుచుండేది. (జగత్ = జనించి గతించేది) అందుచేత జ్ఞానముచే అవిద్యను నశింపజేయాలి. అట్లు బోధ గావించి బంధ నివృత్తికి మార్గం చూపటమే శాస్త్రముల సాఫల్యము.

4. “జగత్తు నశించి మరల మరొకప్పుడు మరొక జగత్తుగా జనిస్తోందా?" ఇక మరికొందరి ప్రతిపాదనల ప్రకారం 'పూర్వ కల్పంలో ఏ ప్రపంచమైతే నశించిందో... అదే మరల తిరిగి ఉత్పన్నమైనది'... అని! 'ఇది పూర్వ కల్పంలో ఉన్నట్లే ఉన్నదా? లేక అన్యంగా ఉన్నదా?'... అనే విషయం చెప్పటానికి, నిరూపించటానికి శక్యమయ్యేది కాదు. కాబట్టి అది అనిర్వచనీయం. అయితే అనుభవం’ను వదిలిపెట్టి కేవలం 'ఊహ-అపోహలు' సహాయంతో ఎవరైనా ఏదైనా చెప్పితే అది ఒప్పుకోవటానికి కుదరదు కదా! అయినా, నశించిపోయినది మరల ఎట్లు (ఏ కారణం చేత) ఉత్పన్నమైనది? కారణం దొరకనంతవరకు ఈ సిద్ధాంతం నిర్ణయాత్మకం కాదు.

5. సాకారం నిరాకారం అయి, మరల నిరాకారంలోంచి సాకారం వస్తోందా? అభిప్రాయమేమిటంటే, "సాకారమగు ఈ జగత్తే 'ప్రళయం' అనే ఒకానొక సమయంలో నిరాకార మౌతోంది. అట్టి నిరాకార స్థితిలో ఆకాశరూపంగా అగుచున్నది. సాకార జగత్తు ఒకప్పటికి (ప్రళయ సమయంలో) నిరాకరం అవుతోంది కనుక ఈ జగత్తు శాశ్వతం కాదు.”

ఇంత వరకు బాగానే ఉన్నది గాని, అసలు సాకారమైనది నిరాకారం ఎట్లా అవుతోంది? ‘ప్రళయం తర్వాత తన రూపం ఈ జగత్తు తిరిగి పొందుతోంది'... అని అనదలచుకొంటే, అప్పుడు ప్రళయంలో కూడా నశించకయే ఉన్నది కదా! అట్లా ఉండకపోతే, (నశించిపోతే) నశించినది మరల ఎట్లా ఉత్పన్నం అవుతున్నట్లు? కనుక ప్రళయ సమయంలో కూడా ఈ జగత్తు నశించకయే ఉన్నది'... అని అనవలసిరాక తప్పదు. అనగా... "ప్రళయం" అనేది ఈ విధంగా 1. సృష్టిలోని విభాగమే ప్రళయం, 2. కారణమగు 'అవాక్యత్వము (నిర్విషయ చైతన్య తత్త్వం) కార్యమగు ఈ సృష్టి ఏ సమయమందును, వేర్వేరుగా లేవు'... అను మహావాక్యర్థము సిద్ధిస్తోంది.

Page:810

ఈ సృష్టియే పరమాత్మ. అలా చెప్పుటలో మా ఉద్దేశం1. భావనయే 'సృష్టి' అను అనుభవమునకు మూల స్వరూపం;

2. భావన భావుకుని కంటే వేఱు కాదు;

3. భావుకుడు చిదాకాశము కంటే వేఱుగా లేడు.

కనుక ఈ సృష్టి పరమాత్మయే గాని మరింకేమీ కాదు. వేఱుగా ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా కనిపిస్తుంటే, అది భ్రమ మాత్రమే! వేఱుగా కనిపించేదంతా కాలముచే మార్పు చేర్పులు పొందుతూనే వస్తోంది.

దృష్టియే సృష్టి. దృష్టికి ఈ సృష్టి కనబడుతూనే ఉంటున్నప్పటికీ ఇది శూన్యమాత్రంగా (నిర్విషయ మాత్రంగా) ఎప్పుడు తెలియవస్తుందో... అట్టి నిర్విషయానుభవమే ప్రళయం'. ఇంతకు మించి 'సృష్టి నశించటం అనేది ఎక్కడా ఏదైనా ఉంటే నాకు చెప్పు. అట్టిదేదీ లేనే లేదు.

6. సృష్టి-ప్రళయాలు 'ఆలోచన వచ్చి-పోయి మరొక ఆలోచన రావటం' వంటివి" ఈ జగత్తు ప్రళయంలో నశించి మరల ఈ జగత్తే సృష్టి సమయంలో సృజించబడుతోంది....,

అని అనటం కంటే....., ఈ జగత్తు నశించుచు మరల వేరైనది జనిస్తోంది... అని అనటమే యుక్తం. ఈ సృష్టి-ప్రళయాలు ఒక ఆలోచన వచ్చి-పోయి మరొక ఆలోచన ప్రారంభమవటం

వంటిది.

7. “జగత్తు శాశ్వతం - సృష్టి ప్రళయాలు జగత్ సంఘటనలు?" - 'ఒకే వృక్షంలో మధ్య మధ్య కొమ్మలు-ఆకులు-పూలు భేదంగా ఉన్నట్లే సృష్టి-ప్రళయాలు ఒకే జగత్తులో విభాగంగా ఉన్నాయి. జగత్తు సర్వదా ఏకైక విభాగమైనప్పటికీ అందులో సృష్టి-ప్రళయాలు ఆయా అంతర్లీన సంఘటనలవలె ఉంటున్నాయి... అనునది మరొక వాదం.

అయితే, విత్తులోని ఒకే సత్త ఆయా వృక్ష విభాగాలుగా కనిపిస్తూ ఉండటం చేత వృక్ష సత్త మరొకటిగా అవటం... అనేది వాస్తవానికి లేదు.

ఏకమగు సతత్త్వము (సత్ మాత్రము) నిజ స్వభావమున ఉంటూనే మాయచే వివిధ దేశ కాలాదుల రూపంగా కనిపిస్తోంది. పరమార్థంగా చూస్తే ఇక్కడ నానాత్వభేదం లేదు. మా దృష్టిలో ఈ సమస్తం ఆత్మరూపమే! తత్త్వవిచారణచేతనూ, తత్త్వజ్ఞానాంతర అనుభవ ప్రమాణం చేతనూ ఇదంతా కూడా 'శాంతం అనాది ఆకాశం వలె నిర్మలము కేవలము-బోధ మాత్రము'... అగు పరమాత్మగానే శేషించ గలదు. అయితే, సద్రూపమగు చిదాత్మ... ఏ విధంగా అయితే అనుభవమునకు రాగలదో, ఏ విధంగా అయితే అనుభవమునకు సిద్ధించదో ... అట్టి విషయ క్రమమును వివరిస్తున్నాను. విను.

Page:811

13. మహా కల్పాంతము

శ్రీవసిష్ఠ మహర్షి : 'సర్వ కల్పనారాహిత్య స్థితి' అని చెప్ప తగు మహా కల్పాంతం" అను స్థితి గురించి శాస్త్రములు ప్రతిపాదించి చెప్పుచున్నాయి. అట్టి 'మహా కల్పాంతము'న పురుగు నుండి మహాదేవుని వరకు గల మనో బుద్ధి కర్మ సహితమగు సమస్త దృశ్యమండలం నశిస్తోంది. ఆకాశవాయు-అగ్ని మొదలైన పంచభూతాలు, కాలం మొదలైన అపంచీకృత విశేషాలు కూడా శమిస్తాయి. అప్పుడు అంధకారం కూడా ధ్వంసమైపోతుంది. జలము-పృథ్వి కూడా క్షయిస్తాయి. శబ్ద-అర్థ విభాగమంతా కూడా అస్తమిస్తుంది.

అప్పుడిక బోధ రూపమగు ఆత్మ మాత్రమే శేషించి ఉంటుంది. అట్టి సర్వశేష్యము, సర్వాత్మకము అగు ఆత్మ... పరమ శాంతము, నిర్మలము; అబాధితం (అది దేనిచేత బాధింప బడజాలదు); అనాది, అనంతం, సౌమ్యం; అవ్యయం, అవాచ్యం; అవ్యక్తం, అతీంద్రియం; నామ రూప రహితం, సర్వ భూతాత్మకం; సర్వవస్తు శూన్యం, అన్య పదార్థ రహితం; సర్వలక్షణ సమన్వితం, సర్వలక్షణ విలక్షణం; పదార్థముల దృష్ట్యా అసత్తుల్యం, సన్మాత్రం, సర్వోత్తమమగు 'బోధ' రూపం.

ఇదంతా మహాకల్పాంతంలో కూడా శేషించే ఆత్మ యొక్క మాహాత్మ్యము. ఆ పరమాత్మ వాయువు కాదు. ఆకాశము కాదు. మనస్సు- బుద్ధి మొదలైనవి కాదు. శూన్యము కూడా కాదు. అది ఏ పదార్థమూ కాదు. కానీ... సర్వ రూపములూ అదే! అది అనిర్వచనీయమైన చిదాకాశం! తద్విదా, తత్పదస్థేన, తన్ముక్తేన అనుభూయతే ॥ ||

నేనే ఆత్మను - అట్టి ఆత్మ గురించి ఎఱిగినవాడు, ఆత్మ పదమును ఆశ్రయించి ఆ పదము నందే ఉన్నవాడు, సర్వ కల్పనల నుండి విముక్తుడైనవాడు మాత్రమే తత్త్వజ్ఞాని అయి ఆత్మను అనుభవానికి తెచ్చుకోగలడు! అఖండము-అప్రమేయము-సర్వము అగు ఆత్మ తానేనని గ్రహించుటే జ్ఞాన సారం! ఇక తదితరుల విషయమంటావా?

అన్యైః కేవలమ్ ఆమ్నాతై రాగమైరేవ వర్ణ్యతే II (ఆమ్నాయః = వేదం శిష్యపరంగా వర్ణించటం)

కొందరు ఆత్మ గురించి ‘అది అప్రమేయం-అనంతం-నిత్యం-సత్యం-అఖండం'... ఇత్యాదిగా వర్ణించగలరు. ఏ గ్రంథంలో ఎట్లు చెప్పబడిందో, ఎవరిచే ఎచ్చోట ఏ విధమైన దృష్టాంతాలతో ఎట్లెట్లు వర్ణించబడిందో ఉపన్యసించగలరు. అనేక వాదోపవాదాలతో ఆత్మ ఎంతటిదో నిర్ణయించి ప్రవచించ గలరు. వేద ప్రమాణములు వల్లించగలరు. అవన్నీ మంచిదే కాని అంతటితో సరిపోదు.

'ఆత్మకు అన్యమైనది లేదు. కాబట్టి నేను స్వతఃసిద్ధమగు ఆత్మనే.' సహజీవులంతా నా స్వరూపులే. నేను సహజీవుల స్వరూపుడనే. స్వస్వరూపమగు నా ఆత్మ పదం జన్మ-మృత్యు జరాదు లచే గాని, మనో-బుద్ధి-అహంకారాదులచే గాని, మార్పు చేర్పులు పొందేది కాదు. నేను కేవల స్వరూపుడను. జాగ్రత్-స్వప్న సుషుప్తులకు కేవల సాక్షిని. జన్మ-జరా మరణములకు కూడా సాక్షిని. ఈ దేహము-మనస్సు-బుద్ధి-అహంకారములను చూచేవాడినే గాని, అవి నేను కాదు. అవి నావి

Page:812

కావు... అను అనుభవమును పుణికిపుచ్చుకున్నప్పుడే అతడు 'ఆత్మజ్ఞాని అవుతాడు. అనుభవజ్ఞుడు కానివాడు ఆత్మను వర్ణించువాడే గాని 'ఆత్మజ్ఞుడు' కాదు.

న కాలో, న మనో, నా త్మా, న సన్నాసన్న దేశ-దిక్ |

న మధ్యమేతయోః నాన్తం న బోధో నాఅపి అబోధితమ్ ||

ఆ ఆత్మ కాలము కాదు. మనస్సు కాదు. జీవుడు కాదు. సత్తు కాదు. అసత్తు కాదు. సత్తుఅసత్తుల మధ్యగా ఉన్నదేదో కాదు. దేహము కాదు. దిక్కు కాదు. అంతము కాదు. తన స్వరూపము కంటే అభిన్నమైన ఏదో బోధ' కాదు. 'అబోధ' కూడా కాదు.

ఆత్మ సర్వదా ఆత్మగానే ఉన్నది. అద్దాని యందు తదితరమైనదేదీ లేదు. ఏర్పడజాలదు.

ఇక ఈ కనబడే అనేక జీవులు, వారి మధ్య అనిపిస్తున్న అనుకూల-ప్రతికూల-ఉదాసీన ఆదిగా గల సంబంధాలంటావా? ఇవన్నీ జలంలో కనిపించే అనేక తరంగాల యొక్క సంఘాతవిఘాత చమత్కారాల వంటివే! ఒక తరంగం మరొక తరంగమును అనుసరించటం-ఢీకొనటంఎదురు బొదురు అవటం.. ఇవన్నీ జలంలోని అంతర్గత విన్యాసాలయినప్పటికీ జలము సర్వదా సర్వతరంగాతర్గతము-యథాతథము కదా! ఈ అనంత జీవ (మనో-బుద్ధి-అహంకారాది) తరంగాలన్నీ ఆత్మ యొక్క విన్యాసమే అయినప్పటికీ ఆత్మ సర్వదా యథాతథము.

కిమప్యేవ తదత్యచ్ఛం బుద్ధ్యతే బోధపారగైః

శాంత సంసార విస్తారైః పరాం భూమిముపాగతైః ||

అయినప్పటికీ కూడా... 'బోధ' యందు పారంగతులు, 'సంసార విస్తారము' శమించినట్టి వారు, పంచమ-షష్ఠ-సప్తమ భూమికలను అధిరోహించినవారు... అగు మహాత్ములే ఆ 'విలక్షణంఅతి నిర్మలం’... అగు ఆత్మను అనుభవముగా కలిగి ఉంటున్నారు.

ఇక జగత్తు-మనస్సు-బుద్ధి మొదలైనవి వాస్తవానికి లేవు. లేకపోయినప్పటికీ శాస్త్రాలు అవి ఆత్మబోధ కొరకై కల్పించి, విశ్లేషించాయి. శాంత సముద్రంలో అనేక తరంగాలు ఉన్నట్లు శ్రుతులలో నిషేధించిన వాటిని నిషేధించి, ఉపదేశించిన వాటిని ఉపదేశిస్తూ నేను కూడా ఈ సభలో ఇన్ని రోజులుగా ప్రవచనం చేశాను, చేస్తున్నాను. అదంతా ఆత్మబోధ కొరకై మాత్రమే. అంతేగాని మనస్సు మొదలైన వాటి ఉనికి అంగీకరించి-నిషేధించటం కానే కాదు సుమా! కనుక మనస్సు మొదలైనవన్నీ ఆత్మ పాఠ్యాంశాన్ని బోధించటానికి, తత్ సౌలభ్యం కొరకు కల్పించి చెప్పబడేవి మాత్రమే - అని గమనించు.

అటు చూడు! ఆ పెద్ద శిల ఉన్నది. ఆ శిలలో శిల్పి అనేక శిల్పాలు చెక్కగలడు. అయితే ఆ చెక్కబోయే శిల్పరూపాలన్నీ ఈ కనబడే శిలలోనే ఉన్నాయి కదా! ఏ రూపంగా ఉన్నాయి? శ్రీరాముడు : ఆ శిలలోనే శిల రూపంగానే చిత్రీకరించబడబోయే శిల్పాలన్నీ - అప్రకటిత రూపంలో ఉన్నాయి.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవునా! అట్లాగే నిజ స్వరూపముననే ఉన్న పరమాత్మయందు ఈ వివిధ జగత్తులు జగత్ పదార్థములు ఒదిగి ఉన్నాయి.

Page:813

ఈ ప్రకారంగా అధిష్ఠాన రూపము చేత మనోబుద్ధి - చిత్త చిత్త - అహంకారాలు, దృశ్య వ్యవహారం, ఈ సమస్త పదార్థములు పరమాత్మయందే ఉన్నాయి. (శిల్ప రచన అంతా శిలల్లోనే ఉన్నట్లు!). అయినా కూడా దృశ్యరూపంగా చూస్తే (వేర్వేరు మృగాలు-చెట్లు-వ్యక్తులు... చిత్రీకరించి `బడిన శిల్పం వలె)... దృశ్యం లేదు. (శిల్పంలో ఉన్నదంతా శిలయే కదా!)

ఆ పరమాత్మయే సర్వ స్వరూపుడు. ఈ మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు, ఈ సంగతిసంబంధ-బాంధవ్యాదులు... ఇవన్నీ కూడా పరమాత్మాంతర్గత -పరమాత్మ స్వరూపాలే!

కానీ అతడు తనకు తదితరమైన ఏ రూపంగానూ అగుటయే లేదు. అతడే పదార్థ రూపుడుగా అగుచున్నాడు. కానీ అతడు అపదార్థ స్వరూపుడుగానే ఉన్నాడు.

శిలయందు ఇంకా విగ్రహం చెక్కబడుతున్నప్పుడు ఆ శిలలో విగ్రహం ఉన్నదా? లేదా? ఉన్నదనీ చెప్పవచ్చు. ఎందుకంటే... శిల్పి శిల నుండే కదా... విగ్రహం తయారు చేస్తున్నాడు! లేదని కూడా అనవచ్చు. ఎందుకంటే, శిల ఎల్లప్పుడూ శిలయే కదా!

అంతా - అంతటా ఆత్మయే"- అట్లాగే, ఆత్మైక్యం పొందిన మహానీయులు తమ ఇచ్ఛను అనుసరించి ఆ పరమాత్మను 'సర్వ పదార్థయుక్తుడు గాను, 'సర్వ పదార్థ రహితుడు గాను కూడా దర్శిస్తూ ఉంటారు.

సర్వం సర్వాత్మకంచైవ సర్వార్థ రహితం పదమ్ | సర్వార్థ పరిపూర్ణం చ తత్ 'ఆద్యం' పరిదృశ్యతే ॥

సమస్తమునకు ఆది’ అయినట్టి ఆ 'ఆత్మపదము'ను జ్ఞానులు 'సర్వరూపంగాను, సర్వాత్మకం గాను, సర్వ పదార్థ రహితంగాను, సర్వ పదార్థ పరిపూర్ణంగాను'... వీక్షిస్తూ ఉంటారు.

అసంశయం - సమగ్రం - ఎవరైనా "సర్వ పదార్థముల ఉపశమనరూపమగు 'సమ్యక్ జ్ఞానం' ఉత్పన్నం కాలేదు... అని అనటానికి గుర్తు ఏమిటి?" అని అడిగితే... అందుకు గుర్తు వారికి ఇంకా సంశయములు మిగిలి ఉండటమే సుమా! సర్వ సంశయములు శమించినట్టి జ్ఞాని దృశ్యము యొక్క అభాస లేనివాడౌతాడు. స్వభావ సిద్ధంగానే నిర్మలాంతఃకరణుడు, శాంతుడు అవుతాడు. అట్టివాడు ఆత్మ స్వభావమును అప్రయత్నంగానే పరికిస్తాడు.

బంగారం ముద్దలో రకరకాల అభరణాలు ఉన్నట్లు, ఆ పరమాత్మలో 'నేను-నీవు-వాడువీడు మొదలైన త్రికాల జగద్భమ అగుపిస్తోంది. బంగారానికి వేరుగా అభరణం ఎక్కడున్నదయ్యా? పరమార్థఘనమగు పరమాత్మ కంటే వేఱుగా జగత్తు కూడా లభించనే లభించదు. 'గొలుసుఉంగరం మొదలైన అభరణాల పేర్ల కంటే బంగారం వేఱుగా ఉన్నట్లుగానే... నామ రూపమయంద్వైతాత్మకం-మిథ్య' అయినట్టి జగత్తు కంటే 'నిజ స్వరూపభూతుడు' అగు పరమాత్మ వేఱుగా ఉన్నాడు. అట్టి ఆత్మకు దేశ కాల క్రియాది శబ్ద-అర్థములు లేవు. కానీ దేశ కాల-క్రియాదులుగా కనిపిస్తున్నదీ, ఒప్పుచున్నదీ అదే! ఇంకా... యథా స్థితమైనట్టి ఈ సమస్త జగత్తు కూడా అధిష్ఠాన రూపం చేత అద్దానియందే ఉన్నది. అనగా, దీనికి ఆత్మకు వేరైన రూపమేదీ లేనే లేదు.

Page:814

ఆత్మకు వేరుగా దృశ్యం లేదు. ఆత్మ దృశ్యంగా లేదు. శాంత సముద్రంలో తరంగాదులు ఉన్నట్లు, చిత్రకారుని చిత్తంలో చిత్రం ఉన్నట్లు, మట్టిలో మట్టి పాత్రల వివిధాకారములున్నట్లు,... బ్రహ్మమున ఈ జగత్తు ఉన్నది.

ఈ విధంగా జగత్తే బ్రహ్మము. బ్రహ్మమే జగత్తు. ఈ రెండూ అభేదమై ఉన్నాయి. కాబట్టి పరమాత్మలో జగత్తు ఉన్నది. జగత్తు లేదు కూడా!

తత్త్వజ్ఞానము సంపాదించుకొన్న తర్వాత, ఇక అట్టి దృష్టిచే ఈ జగత్తు 'నిత్యము-నిర్మలముశాంతము'... అయినట్టి పరమాత్మయందు తన్మయము (బ్రహ్మము) గాను, శాంతముగాను వెలయుచున్నదే అగుచున్నది. గొప్ప కొయ్య నందు ఇంకను చెక్కబడని విగ్రహము అప్రకటితమై ఉన్నట్లుగానే,.. ఈ స్వర్గ మర్త్య - పాతాళ లోకములు బ్రహ్మమునందు 'నిజసాక్షి చైతన్యము' అను శిల్పికి కనిపించుచున్నాయి. కొయ్యయందు విగ్రహం ఆ కొయ్యను చెక్కినప్పుడే కదా అగుపించేది! కానీ, బ్రహ్మము విషయానికి వస్తే... బ్రహ్మము సర్వదా వికార రహితము అయినప్పటికీ.... స్పష్టాత్మకమైన వివర్త రూపంగా గోచరిస్తోంది. 'నిరతిశయానందము' అను పూర్ణానందమునందు ‘చిన్మయము’ నుండి జాలువారినవై ఈ సృష్టులు భాసిస్తున్నాయి. కానీ అవిద్య చేత మాత్రమే ఈ సృష్టులు 'చిదనము' నందు విభాగయుక్తంగాను, క్షోభ సహితంగాను, నిజమే అయినట్లుగా ప్రకాశించుచున్నాయి. అట్లు విభాగయుక్తంగా (అజ్ఞాన దృష్టికి కనిపిస్తున్నప్పటికీ ఈ జగత్తులకు ‘ఉనికి స్థానం’ అనతగిన ఆత్మ (లేక) బ్రహ్మము సర్వదా విభాజక ధర్మరహితము, క్షోభవర్జితము, స్వయంప్రకాశకము అయి ఉన్నది.

పరమశాంతమగు బ్రహ్మమున అనేక భేదములతో కూడిన ఈ జగదృశ్యము బ్రహ్మమునకు కించిత్తు కూడా వేఱుకాకయే ఉంటోంది. 'చిదనరూపము' అగు బ్రహ్మము నందు అణువణువునా జగత్సమూహములు భాసిస్తున్నాయి.

ఆద్యంత రహితమగు బ్రహ్మమున ఆద్యంత సహితములగు జగత్తులు భ్రమచే ఆవిర్భవిస్తున్నాయి. అయితే కూడా... బ్రహ్మము సర్వదా బ్రహ్మముగానే ఉన్నది. ఈ జీవుడు బ్రహ్మమే స్వస్వరూపముగా కలిగి ఉన్నాడు. అత్యంత నిర్మలమగు బ్రహ్మమునందు ఈ జగత్తు మొదలైనవి ఉండజాలవు.

ఓ రామచంద్రా! 'అవయవ రహితము-నిరాకారము అగు బ్రహ్మము (లేక) పరమాత్మకు ఆ ఆకాశ-వాయు-కాల ఆదిగా గల పదార్థములు అవయవ రూపములు వంటివి'... అని వర్ణించి చెప్పటం కూడా వాస్తవానికి మిథ్యా వర్ణనమేనయ్యా! 'పరమాత్మ అంతయు అధిష్ఠించియున్నవాడు' అను వాక్యార్థమును శోధించగా, పరమాత్మ సర్వదా నిరవయవుడే! ఆత్మతత్త్వము సర్వభావ వికార రహితమై ఉన్నప్పటికీ,... 'అధ్యారోపదృష్టి' (అదియే ఇవన్నీ అవధరించుచున్నది.. అను దృష్టిచే) శ్రుతులు ఆ పరమాత్మను 'సర్వ రూపుడు' (ఈ సర్వము ఆయన రూపములే)... అని వర్ణించాయి.

Page:815

14. బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా

-

శ్రీరాముడు : మహాత్మా! అల్పజ్ఞులగు శిష్యులకు మహనీయులగు తమ వంటి జగద్గురువులు సుబోధకమయ్యేంత వరకు సమస్త విషయములు చర్వితచర్వణంగా బోధిస్తూనే ఉంటారు కదా!

ఇప్పుడు నా ఈ విన్నపం వినండి - ఈ జగత్తులో అనేక అసాధారణ విశేషాలు వినిపిస్తున్నాయి.

చేత్యము (స్మృతి) యందు చేతనత్వం (స్మృతిత్వం); కాలము నందు కాలత్వం; ఆకాశం నందు ఆకాశత్వం; జడమునందు జడత్వం; వాయువునందు వాయుత్వం; భూత-భవిష్యత్వర్తమానములందు త్రికాలత్వం; స్పందనము నందు స్పందత్వం; మూర్తము (ఆకారం) నందు మూర్తత్వం; భిన్నమునందు భిన్నత్వం; అనంతము నందు అనంతత్వం; దృశ్యమునందు దృశ్యత్వం; సృష్టులలో సృష్టిత్వం... ఈ విధంగా 'స్మృతిత్వం-ఆకారత్వం-జడత్వం-వాయుత్వం-త్రికాలత్వంస్పందత్వంమూర్తత్వం-భిన్నత్వం-అనంతత్వం దృశ్యత్వం -సృష్టిత్వం... మొదలైన అసామాన్యమైన విశేషాలన్నీ సర్వసామాన్య రూపమగు బ్రహ్మం నుండి ఏ క్రమంచే ఏర్పడి పరిఢవిల్లుచున్నాయో... ఆ విశేషం చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పిన ఆ సమస్త వస్తువులకు ఆధారము’ ఏదైతే ఉన్నదో... అయ్యది మహాచిదనము అగు బ్రహ్మమే! అట్టి బ్రహ్మము పరమాకాశమై, అవేద్యమై (తెలుసుకునేదంతా అదే కాబట్టి అది తెలియబడనిదై), చిద్రూపమయమై (ఎఱుక), శాంతమై, ఏకమై (అది ఎప్పుడూ అనేకంగా అవటం లేదు), సర్వత్రా సమమై ఉన్నది.

దృష్టిచే సృష్టి కనిపిస్తోంది. సృష్టియందు నీవు చెప్పిన జ్ఞప్తిత్వాదులు దర్శనమగుచున్నాయి. అయితే కనిపించేదానినంతటినీ అధిగమించి చూస్తే... అప్పుడు నిత్య నిర్మల-నిర్విషయ చిదాకాశం మాత్రమే శేషించి ఉంటుంది, చూడబడే సర్వమునకు ఆవల చూచేవాడు ఉన్నాడు కదా! చూడబడేదంతా అధిగమించి పరిశీలిస్తేనే దృశ్య దర్శన రహితుడగు శుద్ధాత్మ గమనించ బడతాడు.

అట్లు అధిగమించినప్పటి పరిశీలనయే 'మహా ప్రళయం'. అట్టి మహా ప్రళయంలో సర్వ విషయాలు లేనివిగా’ తెలియవస్తాయి. అట్టి సర్వనాశన (సర్వ రాహిత్య స్థితిలో) బ్రహ్మ-విష్ణుమహేశ్వరులతో సహా సర్వ నామ రూపాలు అంతర్థానమౌతాయి. అప్పటికీ ఏ శుద్ధ సన్మాత్రం శేషిస్తుందో ...అద్దానిలో ఈ జన్మకారకాలైన 'మాయ-మోహం-భ్రమ-పాపం' మొదలైన ఆకృతులు కలిగిన బీజాలే ఉండవు. అట్టి చిదాకాశం యొక్క ఘనత్వం ముందు ఈ అతిసూక్ష్మ మగు భౌతికాకాశం కూడా శిల వలె అత్యంత స్థూలంగా కన్పట్టుచున్నది. అట్టి పరమ సూక్ష్మం కేవలం శాంతం -అతి నిర్మలం-ఆద్యంత రహితం-సన్మాత్రం అయి ఉన్నదానినే శాస్త్రములు బ్రహ్మం’ అనే పేరుతో పిలుస్తున్నాయి. అది ఉన్నదా? ఉనికి లేనిదా?

నచ 'నాస్తి' ఇతి తద్వక్తుం, యజ్యతే చిద్వపుర్యదా

నచైవ ‘అస్తి' ఇతి తద్వక్తుం, యుక్తం శాంతమలం తదా॥

Page:816

ఎప్పుడైతే ఆ చిన్మాత్ర స్థానం 'మాయ' అనే దోషము లేనిదై ఉంటుందో... అద్దానిని 'ఉన్నది – లేదు’ అనే వాచ్య వృత్తిచే చెప్పలేం. ఒకానొకదానిని - 'ఉన్నది' అని 'లేదు' - అని ఇంద్రియార్థముల దృష్ట్యా (శబ్ద-స్పర్శ-రూప- రస గంధముల దృష్ట్యా) మాత్రమే చెప్పుతూ ఉంటాం. ఆత్మయే, ఇంద్రియార్థములకు విషయం కాదు. కనుక 'లేదు' అనవచ్చేమో! కాని, ఈ ఇంద్రియార్థములు ఎద్దాని భావనచే ఏర్పడుచున్నాయో, ఎయ్యది భావనలన్నిటికీ ఆవిర్భావస్థానమో, అట్టి చిత్సత్తే లేకపోతే భావనలకు-ఇంద్రియార్థములకు ఉనికి ఎక్కడిది? కనుకనే "అది 'ఉన్నది లేదు' అను చర్చకు విషయమే కాదు అని చెప్పబడుతోంది.”

శ్రీరాముడు : శుద్ధతత్త్వమగు అట్టి శుద్ధ బ్రహ్మము మనకు అనుభవమయ్యేది ఎక్కడ?

శ్రీ వసిష్ఠ మహర్షి : కనబడుచున్న ఈ సర్వమునకు ఆధారము, వాస్తవ సత్త అగు బ్రహ్మము ఎచ్చట ఎట్లు ఉన్నదో, సూచించటానికి ఒకటి రెండు విశేషాలు చెపుతాను, విను.

1. విషయం విషయం మధ్యగల నిర్విషయ చైతన్యమే బ్రహ్మము -

నిమేషే యోజనశతే ప్రాప్రాయామ్ ఆత్మ సంవిది

మధ్యే తస్యాస్తు యద్రూపం, రూపం తస్య పదస్య తత్ II

నీవు ఒకచోట నిలబడి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న దేనినైనా (ఉదాహరణకు చంద్రుణ్ణి) చూస్తున్నావనుకో. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నిమిషమాత్రంలో ద్రష్టయగు నీ యొక్క సంవిత్తు (జ్ఞానము) నేత్రవృత్తి ద్వారా సుదూరంగా వేలాది మైళ్ళ దూరంలో ఉన్న చంద్రబింబాన్ని చూస్తోంది కదా! అట్లా ఒక వృక్షము యొక్క శాఖల మధ్యగా చంద్రబింబాన్ని చూస్తున్నావనుకో, అప్పుడు వృక్ష శాఖ'ను అధిగమించిన తర్వాత... చంద్రబింబమును ఇంకనూ చేరకముందు మధ్యలో ఏ నిర్విషయ జ్ఞాన (లేక) ప్రజ్ఞ స్వరూపము ఉన్నదో... అదియే పరమాత్మపదము.

ఈ మధ్య స్థానంలో దృష్టి సంవిత్తు నిర్విషయమై ఉన్నది. ఆ నిర్విషయ ప్రజ్ఞయే ఆత్మపదము యొక్క స్థానం. ఆ ప్రదేశంలోని విషయరహితమగు శుద్ధ ప్రజ్ఞయే ఆత్మ స్వరూపం

విషయ ప్రజ్ఞ (-) విషయములు = 'శుద్ధ సంవిత్తు'

2. నిశ్చల మనస్సు యొక్క స్వానుభవమే ఆత్మ - ప్రతి జీవునికి 'మనస్సు' అనేది ఉన్నది కదా! అయితే ఈ మనస్సు బాహ్య - అభ్యంతర వాసనాజాలంలో చిక్కుకొని ఉన్నది. (విషయాల పట్ల అభిలాషయే వాసనల రూపం). అది విషయాల భ్రమ యందు తారట్లాడుతోంది. అనేక చింతలు కలిగి ఉంటోంది. సుఖ-దుఃఖాలను పరంపరగా పొందుతోంది. అశాంతితో చంచలమై ఉంటోంది. అవునా? అయితే... అట్టి ఈ మనస్సు సాధన యొక్క (అభ్యాసం యొక్క) యోగ బలం చేత బాహ్య అభ్యంతర వాసనాజాలం నుండి బయల్వెడలి విషయ భ్రమను శమింప జేసుకొన్నదై, చింతా రహితమై, అప్పుడే పుట్టినవానివలె జగద్విషయములేవీ లేనిదై, విషయములు గూర్చిన సుఖ-దుఃఖ మననములను త్యజించినదై, శాంతి వహించినదై, 'సమాధి' యందు (సర్వ సమత్వంలో) ఆరూఢమై వెలయుచున్నదనుకో... అట్టి నిర్మల (విషయరహిత-విషయాలను అధిగమించివేసినట్టి) నిశ్చల మనస్సు యొక్క స్వరూపమే ఆ 'ఆత్మపదము'.

Page:817

3. సత్తా సామాన్యము - - ఏ సత్తా సామాన్యము దేహ పరిమితత్వము త్యజించి సర్వ దృశ్య పదార్థములందు వ్యాపించినదై, వాటన్నిటి ఉత్పత్తికి హేతుభూతమై ఏర్పడి ఉంటుందో... ఆ స్వానుభవమగు సత్తా సామాన్యమే ఆత్మ పదము.

ఓ రామచంద్రా! ఈ ఆకారయుక్తం-భేద సహితం-సకారణంగా తోచుచూ ఏ ఈ జగత్తు స్పష్టంగా కంటికి కనిపిస్తోందో... అట్టి ఇదంతా కూడా ఆత్మ పదంలో ఉత్పత్తియే అయి ఉండలేదు. ఎందుకంటే ఆత్మయందు 'జగత్తు' అనేది ఉత్పత్తి అవటానికి కారణమే లేదు కనుక! కాబట్టి ఇదంతా వాస్తవానికి ఆకారయుక్తంగానూ లేదు. ఏకమూ కాదు. ద్వైతమూ అయి ఉండలేదు. ఏది స్వతహాగా కారణరహితమై ఉన్నదో అయ్యది ఈ జగత్తులో విషయ సత్తగా లేదు. అంతే కాదు.

ఏది స్వయంగా ‘అనునిత్యానుభూత స్వరూపం' అట్టి 'చిత్'ను ఇక్కడి నుండి తొలగించటం

ఎవరి తరమూ కాదు.

శ్రీరాముడు : 'జగత్తుకు కారణం లేదు' అనే బదులు, 'బ్రహ్మమే జగత్తుకు కారణం'... అని అనవచ్చును కదా?

శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మం జగత్తుకు కారణం కాజాలదు. ఎందుకంటావా? 'బ్రహ్మం దృశ్య శూన్యం, ఆద్యంతరహితం, చిద్రూపం, నిరాకారం' అని బ్రహ్మజ్ఞుల నిత్యానుభవం, అట్టి బ్రహ్మం సాకారం, దృశ్యం, అబ్రహ్మరూపం అగు జగత్తుకు కారణం ఎట్లా అవుతుంది చెప్పు?

తస్మాత్ తత్ర జగద్రూపం యదాభాతం తదేవ తత్,

స్వయమేవ తత్ ఆభాతి చిదాకాశమితి స్తితమ్ ||

అందుచేత, కారణ రహితమగు బ్రహ్మమునందు ఏ జగత్తు భాసిస్తోందో అది 'చిదాకాశమే ఆ రూపంగా’ భాసిస్తున్నదగుచున్నది.

గొలుసుగాను, గాజుగాను బంగారమే అగుచున్నప్పటికీ గొలుసు-గాజుల భేదానికి బంగారం కారణం కాదుకదా! బంగారం దృష్ట్యా ఏ భేదం గొలుసుకు-గాజుకు అగుపిస్తోందో అది భ్రమ మాత్రమే! ఈ జగత్తు చిద్రూపమగు బ్రహ్మమే అయి ఉండటం చేత జగత్తులో వేర్వేరు ధర్మాలుగా అగుపిస్తున్న వస్తువుల మధ్య భేదం భ్రమయే! అదంతా అనేక ఆకారములు గల తరంగాల వంటిది. ఒకే లోహం యొక్క అనేక పనిముట్ల వంటిది. కావున, సర్వత్రా 'ఏకం-అజం-శాంతంద్వైత-ఏకత్వ రహితం, సర్వరూపం-నిర్వికారం అగు బ్రహ్మమే అంతటా నిండి ఉన్నది.

పూర్ణాత్ పూర్ణం విసరతి, పుర్ణే పూర్ణం విరాజతే, | పూర్ణమేవ ఉదితం పూర్ణే, పూర్ణమేవ వ్యవస్థితమ్

భ్రమ శమించిందా... అంతటా బ్రహ్మమే! అప్పుడు పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణమగు జగత్తు ప్రసరించినదగుచున్నది. పూర్ణమగు బ్రహ్మమున పూర్ణమగు జగత్తు ఉదయించినదై విరాజిల్లుచున్నదగుచున్నది.

కాబట్టి ఓ రామచంద్రా! 'బ్రహ్మము నుండి అనేక విషయములతో కూడిన ఈ జగత్తు ఏ క్రమమును అనుసరించి ఉద యించింది?'... అని అడిగావు కదా!

Page:818

మా సమాధానం విను. ఈ జగత్తంతా కూడా... సదా, సర్వ ఆకారవర్జితము, శాంతము, సమము, ఉదయ-అస్తమయరహితము, ఆకాశము వలె నిర్మలము, ఏకము, సత్-అసత్ రూపమున వ్యక్తము అగు బ్రహ్మమే స్వయముగా అయి ఉన్నది. బ్రహ్మము తప్పించి 'జగత్తు' అనబడు శబ్దార్థములు ఆత్మానుభవ దృష్టికి అగుపించటమే లేదు.

15. జలమందు ద్రవత్వం - బ్రహ్మమునందు జగదత్వం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తు అనే నిర్మలమైన ఆకాశము సద్రూపము అయిన బ్రహ్మాకాశము' నందే నెలకొని ఉన్నది.

జగత్ నామ నభః స్వచ్ఛం సత్ బ్రహ్మ నభసి స్థితమ్

నభో నభసి భాతీదం ‘జగత్' శబ్దార్థ ఇతి అజమ్ ||

చిదాకాశమే చిదాకాశమునందు 'జగత్తు' అను శబ్ద-అర్థములతో నెలకొని ఉన్నది. కనుక జగత్తు కూడా చిదాకాశము వలెనే వికార శూన్యమగు బ్రహ్మమే అయి ఉన్నది. 'నీవు-నేనుజగత్తు' ఇత్యాదిగా గల శబ్దములు, వాటి అర్థములు అంతర్హిత దృష్టిచే చిదాకాశముతోటి సమముగా భాసించుచున్నవి. అవన్నీ చిదాకాశమునకు వేరై లేకయే ఉన్నది. అవి సర్వదా సద్రూపమగు బ్రహ్మమే అగుచూ, బ్రహ్మమునందే వెలయుచున్నాయి. ఈ పృథ్వి-మేఘముపర్వతము-సముద్రము మొదలైన సమస్త పదార్థములు... ఇవన్నీ కూడా 'జన్మాది రహితము - కాష్ఠమౌన స్వరూపము' అగు బ్రహ్మమునందే ఉండి ఉన్నాయి. అట్లే....

దృశ్య స్వభావరహితుడైన ద్రష్ట, కర్తవ్య-కారణ స్వభావరహితుడైన కర్త... వీరుభయులు చిన్మాత్ర స్వభావమగు స్వాత్మ యందే స్థితి కలిగి ఉన్నారు.

ద్రష్ట యొక్క భావనచే దృశ్యం అనుభవమౌతోంది. దృశ్యము యొక్క 'అభావము' చేతనో...? శుద్ధచిత్ స్వభావమున జ్ఞత్వము గాని, కర్తృత్వము గాని, జడత్వము గాని, శూన్యత్వము గాని, పదార్థముగాని, ఆకాశత్వముగాని... లేకయే ఉన్నాయి. ఈ కనబడే సమస్తం కూడా ఒక పెద్ద శిల యొక్క మధ్య భాగం వలె 'సత్చిత్' ఘనము-ఏకము-అజము-సర్వ వ్యాపకము శాంతము ఆద్యంతరహితము - విధినిషేధాలలో విధినిషేధాలలో సమా సమాన రూపము'... అయినట్టి పరబ్రహ్మమే అయి ఉంది.

మరణం జీవితం సత్యం అసత్యం చ శుభ- అశుభమ్ |

సర్వం ఏకమ్ అజమ్ వ్యోమ, వీచిజాలజలం యథా II

తటాకంలో కనిపించే రకరకాల తరంగాలు, ఆవర్తాలు, ఆ తరంగాలు లయించటం, తరంగాలు ఒకదానిని ఒకటి ఢీ కొనటం, ఒకదానికొకటి అనుసరించటం ఇవన్నీ కూడా జల స్వరూపమే గాని... అవేవీ జలానికి అన్యం కాదు కదా! అట్లాగే ఇక్కడ దృశ్య విభాగమై కనిపించే జీవనము-మరణము-సత్యము-అసత్యము-శుభము-అశుభము ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించిన నగరంలోని ఆయా విశేషాలుగా భ్రమతుల్యమే!

Page:819

సృష్టికి పూర్వం మొట్టమొదటగా ఏ నిష్ప్రపంచమగు బ్రహ్మము ఉండి ఉన్నదో... అదియే ఇప్పుడు కూడా తన నిర్మల చిదాకాశమున ఈ జగద్రూపంగా స్థితినొంది ఉన్నది. స్వప్న ద్రష్టలోనే స్వప్నం ఉన్నట్లుగా చిదాకాశమునందే ఈ జగత్తు ఉన్నది. కాబట్టి సర్వాత్మకమగు ఈ సర్వ జగత్తు కూడా నిష్ప్రపంచకమగు బ్రహ్మము రూపముననే ఇప్పుడు కూడా (సృష్టికి ముందువలె) ఉన్నది. ఆ పరమాత్మ నిర్విషయం కదా! ఒక ప్రదేశపు ధ్యాస నుండి మరొక ప్రదేశపు ధ్యాస మధ్య ఏ నిర్విషయ చైతన్యరూపం ఉన్నదో అదియే ఆ పరమాత్మ యొక్క రూపం'.

తరంగం యొక్క ముందు-మధ్య-ఉత్తర మూడు స్థితులూ జల రూపమే కదా! అట్లాగే ఈ జగత్తు యొక్క పూర్వ-మధ్య-ఉత్తర స్థితులందు ఇదంతా శాంత రూపమగు బ్రహ్మమే కానీ, మరింకేమీ కాదు. ఏది ఆరోపిత జగత్ రూపంగా ఉదయించినట్లు అనిపిస్తోందో... అదంతా జ్ఞాన దృష్టిచే ఉదయించనే లేదు. ఒక విషయం -మరొక విషయం మధ్య ఏది మనస్సుకు నిర్విషయమై లభిస్తుందో... అట్టిది నిర్విషయ చైతన్యం కంటే భిన్నం కాదు. తరంగం తరంగం మధ్యగల జలం జలంగా సుస్పష్టంగా కనిపించునట్లు, తరంగం కూడా జలమే అయినప్పటికీ తరంగత్వదర్శనం చేత జలంగా అజ్ఞానజ్ఞప్తికి అనిపించకపోయినట్లు... నిర్విషయ చైతన్యం విషయాస్వాదన లయించిన ప్పటి స్థితిలో ఘనీభూతమై అనుభవమౌతోంది.

ఈ విధంగా సృష్టి చైతన్యము కంటే భిన్నం కాదు. ఒకవేళ ఎవరికైనా భిన్నంగా అనిపిస్తోందం టారా? దూరంగా కుందేలు కదలుతూ ఉంటే అద్దాని చెవులు నిక్క పొడుచుకోవటం చేత కుందేటికి కొమ్ములు ఉన్నట్లు అనిపిస్తుంది. అంతమాత్రం చేత కుందేటికి కొమ్ములు ఉన్నాయా? లేవు. మరి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా? కుందేలును సమీపంగా చూస్తే 'కుందేటికి కొమ్ములు ఉండవు' అని తెలియగలదు కదా! జగత్తుగా కనబడేదంతా (చైతన్యమునకు వేరై తోచేదంతా) భ్రమ మాత్రమే! 'కుందేలుకు కొమ్మలు కనబడటానికి అసలు కారణమేమిటి?'... అని వెతికామనుకో. దానికి కారణం ఏముంటుందీ... 'భ్రమ' తప్పితే? అసత్యమగు భ్రమ సత్యమెట్లా అవుతుంది. శ్రీరాముడు : స్వామీ! 'భ్రమ' అని దేనిని అంటున్నాం?

శ్రీ వసిష్ఠ మహర్షి :

యత్ అకారణం భాతి తదభాతం భ్రమాత్మకమ్ |

భ్రమస్య, అసత్య రూపస్య 'సత్యతా' కథమ్ ఉచ్యతే ॥

ఏది కారణం లేకయే భాసిస్తుందో (అనుభవమౌతోందో)... అది భ్రమాత్మకం. అది వాస్తవా నికి భాసించనిదే (అనుభవార్హత లేనిదే) అగుచున్నది. కాబట్టి అసత్యం-భ్రామరూపం అగు జగత్తు 'సత్యం' అని ఎట్లా అంటారు. బ్రహ్మమున 'జగత్తు' అనబడేది ఉండటానికి కారణమే లేదు. కారణమే లేనిదానికి 'సత్త' ఎక్కడి నుండి వస్తుంది? గొడ్రాలికి కలలో కనిపించిన కుమారుడు నిజమైన కొడుకు ఎట్లా అవుతాడు? ఏది కారణం లేకయే భాసిస్తోందో, అది ద్రష్ట యొక్క చైతన్యమే అట్లు ఆ స్వరూపంగా విజృంభిస్తోంది" అని అనక తప్పదు. ఉదాహరణకు ఒకడు స్వప్నంలో కొన్ని

Page:820

వస్తువులను చూస్తున్నాడు. ఆ వస్తులన్నీ ఎచ్చటనుండి తయారయ్యాయి? స్వప్న ద్రష్ట యొక్క 'స్వప్న చైతన్యము’ చేతనే ఆ స్వప్నాంతర్గత రూపాలన్నీ రూపుదిద్దుకున్నాయని అనక తప్పదు కదా!

ఏ 'సంవిత్తు అయితే నేత్రవృత్తి ద్వారా ఒక దృశ్యం నుండి మరొక దృశ్యం వైపుకు వెళ్ళు చున్నదో... అదియే ఆ రెండు విషయాల (దృశ్యాల) మధ్యగా దృశ్య రహిత స్థితిలో ఉన్నది కదా! అదే 1. దృశ్య వృత్తి, 2. దృశ్యరూపము కూడా ధరిస్తోంది. కనుక 'జగత్తు'గా ద్రష్టకు అనుభవమయ్యే దంతా అతని సంవిత్తే నేత్ర వృత్తి ద్వారా దృశ్యరూపము అవధరించినదై... అతనికి అనుభవమౌతోం దని సూక్ష్మ దృష్టిచే గ్రహించు. అయితే చైతన్యం దృశ్య వృత్తి ద్వారా దృశ్యం పొందుచున్నప్పటికీ చైతన్యం సర్వదా యథాతథంగానే ఉన్నదని గ్రహించుటయే పూర్ణ జ్ఞానం. ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మం అయినట్టి బోధరూపమగు చైతన్యమే పదార్థ రూపంగా కూడా ప్రకాశిస్తోంది. అంతఃకరణంలో కలిగే స్వప్నం-ఊహారూపాలు'... మొదలైనవే ఇక్కడ మనకు దృష్టాంతం. శ్రీరాముడు మహర్షీ! ఈ జగత్తు చైతన్య స్వరూపుడగు ద్రష్ట యొక్క కల్పనా దర్శనమే అని అనుకుందాం. అయితే ఈ జగత్తు అకారణం' అని మీరు సిద్ధాంతీకరిస్తున్నారు. ‘ఒక మట్టి విత్తులో భావికాలపు సువిశాలమైన మఱివృక్షం ఉన్న విధంగా చైతన్య పరమాణువునందు జడరూపంగా ఈ జగత్తు ఉన్నది' అని ఎందుకు అనుకోకూడదు?

శ్రీ వసిష్ఠ మహర్షి : బీజం సాకారం కాబట్టి అది ఒకప్పుడు మట్టి- జలముల సహకారి కారణం చేత కాలక్రమంగా అంకురించి సాకారమై అనేక శాఖలతో కూడిన మహా వృక్షముగా అగుచున్నది. కానీ చైతన్యము నిరాకారం కదా! నిరాకారంలో సాకారమైన ఏ సహకారి కారణం పొసగుతుంది చెప్పు? మహా ప్రళయంలో సమస్త జగత్తు నశించినప్పటి స్థితిలో జగత్తు మరల ఉత్పత్తి కావటానికి కారణం కాగల సాకారమగు బీజము ఎక్కడిది? ఆ బీజమునకు 'జగత్తు' అనే రూపంగా అంకురింపజేసే సహకారి కారణాలు ఎక్కడున్నాయి? ఎక్కడి నుండి వస్తాయి?

పైగా...‘శాంతము-శుద్ధము-నిరాకారము' అగు పరబ్రహ్మమునందు ఆకారముల కల్పన ఎచ్చట? పరమా ణువు యొక్క సంబంధం ఏమున్నది? అందులో బీజం ఎట్లా ఉంటుంది?

కారణస్యేతి బీజస్య సత్య-అసత్యైక కారిణః

అసంభవాత్ జగసత్తా, కథం కేన కుతః క్వ కా?

కనుక 'సత్-అసత్' రూపమగు బీజరూప కారణమే అసంభవమైనప్పుడు ఇక చైతన్యమునందు జగత్తు యొక్క ఉత్పత్తి ఎట్లు, దేనిచే, ఎచట, ఏ రీతిగా సంభవం? సంభవం కాదు. కాబట్టి 'పరమాత్మ' అనే అణువునందు "జగత్తు కలదు అని అనటం ఉచితం కాదు. ఆవగింజలో మేరుపర్వతం ఎట్లా దాగి ఉంటుంది? కాదు... 'జగత్తు కూడా నిరాకారమే కదా!'... అని అంటావా? సాకారమగు బీజం ఉన్నప్పుడు మాత్రమే 'కారణ-కార్య' దృష్టులు ప్రవర్తిస్తాయి. నిరాకారమగు దానిలో బీజమేమిటి? జన్య-జనక క్రమం ఎక్కడుంటుంది?

కనుక రామచంద్రా! ఏ పరతత్త్వమగు బ్రహ్మము కలదో... అదియే (మాయచే) ఈ జగత్తు

Page:821

రూపంగా కనబడుచూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ ఏదీ ఉత్పన్నం కావటం లేదు, నశించటమూ లేదు. చిదాకాశమున చిదాకాశమే 'జగత్తు' రూపంగా నెలకొని ఉన్నది.

చిత్తము నందలి చైతన్యం యొక్క స్ఫురణ’చే ఈ 'జగత్ భ్రమ ఉదయిస్తోంది. అశుద్ధ చిత్తం దీనిని అశుద్ధ జగత్తుగా (ఎక్కువ తక్కువలు, జీవులు, అయినవాళ్ళు-కానివాళ్ళు మొదలైనవిగా) దర్శిస్తోంది. శుద్ధ చిత్తము దీనినంతటినీ నిత్య బ్రహ్మముగా దర్శిస్తోంది. ఇక్కడి జగద్విశేషం ఇంత మాత్రమే! ఆకాశమందు శూన్యత్వము, జలమునందు ద్రవత్వము ఉన్న విధంగానే ఆత్మయందు ‘ఆత్మ వివర్తరూపము-శుద్ధము'... అగు ఈ సృష్టి రూప అన్యత్వం (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది. ఇక మా సిద్ధాంతమేమిటో విను- ఈ జగత్తు సర్వదా 'శాంతం-వ్యాపకం-సత్యం-ఆద్యంత రహితం... అగు బ్రహ్మమే అయి ఉన్నది. ఇది వాస్తవానికి ఉదయించనూ లేదు. అస్తమించబోవ టమూ లేదు. ఏ నిర్విషయ శుద్ధ చైతన్యం అంతటా ఉన్నదో అదియే ఈ ద్రష్ట-దృశ్యాలు కూడా. చిదాకాశమే అల్ప దృష్టికి ఇట్లా కనిపిస్తోంది. వాయువులో స్పందత్వం, జలంలో ద్రవత్వం, ఆకాశంలో శూన్యత్వం వాటివాటికి అభేదమై భాసించుచున్నట్లే... ఆత్మయందు ఈ జగత్తు అసంగఅద్వయ స్వభావంతో భాసిస్తోంది. ఈ జగత్తు చిదాకాశమే అయి ఆత్మయందు స్థితి కలిగి ఉన్నది.

అట్లు స్థితి కలిగి ఉన్నదగు ఆత్మాకాశం భూతాకాశం వంటిది కాజాలదు. సూర్య రహితమై, ఆ సూర్య ఉదయ-అస్తమయాలు లేనట్టి ఆత్మయందు ఏ భూతాకాశం ఉంటుంది?... భూతాకాశం ఎక్కడా లేదు. దాని మూల రూపం బయటకు కనబడేది (కళ్ళకు-చెవులకు విషయం కాదు.

ఈ సమస్తము ఆత్మకు స్వభావ సిద్ధమగు అంగభూతమే! ఆత్మ ఈ సమస్తము అయి కూడా, దీనంతటికీ వేరుగా ఉన్నది. కాబట్టి రామచంద్రా! నీవు సర్వ దృశ్య - నామ రూప కల్పనను విడనాడి ఉండెదవు గాక! శుద్ధ చిదాకాశమాత్రుడవై స్థితి నొంది ఉండుము.

16. జగత్ సర్వం అనుత్పన్నం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ భావ- అభావాలు ఈ గ్రహణ త్యాగాలు ఈ స్థూల సూక్ష్మములు, ఈ స్థావర జంగమాలు ఇవన్నీ చిదాత్మయందు ఉదయించటానికి కారణమేమీ లేనే లేదు. ఎందుకంటే చిదాత్మ సర్వదా అకారణం కదా! అందుచేత ఇవన్నీ సృష్ట్యాదిలో ఉత్పన్నమే అయి ఉండలేదు. నిరాకారం - స్వాత్మరూపం అగు చైతన్యం ఏ సమయమందూ సాకార పదార్థము లకు కారణం’ కాజాలదు. సాకార పదార్థం మాత్రమే సాకారమునకు కారణం కాగలదు కదా! ఈ కారణం చేత తత్త్వజ్ఞాని సమస్త జగత్తును 'చిత్స్వభావం' గానే భావిస్తూ ఉంటాడు. తత్ఫలితంగా సర్వదా ఆత్మయందే నెలకొని ఉంటాడు.

కల్లు తాగినవాడు క్షోభచే తన నీడను చూచి తానే ప్రలాపాదులతో కూడిన ప్రమత్తత” కలిగి ఉంటాడు చూచావా? ఆకాశరూపమగు చైతన్యం కూడా తాను ఎట్లు భావన చేస్తున్నదో... ఆ

ప్రకారంగానే తన నిజరూపమగు ఈ సృష్టిని పొందుతోంది. ఎప్పుడైతే ఎదురుగా కనిపిస్తున్న

Page:822

ప్పటికీ, నిర్మలమైన దృష్టికి ఇదంతా కూడా భావనామయ మాత్రమై, వాస్తవానికి ఉత్పన్నం కాకయే ఉన్నట్లు అవుతుందో... అప్పుడు ఈ జగత్తు శాంతం-సమం అగు బ్రహ్మంగానే కనబడగలదు.

జలంలో జలం యొక్క ద్రవత్వమే ప్రదర్శనమగుచున్నది కదా! చిదాకాశంలో చిదాకాశమే జగత్తుగా వర్తిస్తోంది. చిదాత్మ వలననే, చిదాత్మ చేతనే జగత్తు పొందబడటం అనే సంఘటనను శ్రుతులు చైతన్యముచే ఈ జగత్తు రచించబడింది... అని చెప్పుచున్నాయి. స్వప్నంలో స్వప్న జగత్తు ఎట్లా పొందబడుతోంది? స్వప్న ద్రష్ట తన స్వభావమును ఏమరచుటచేతనే కదా! 'కాచ' అనే రోగముతో కూడిన కళ్ళకు ఆకాశంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఎందుచేత? ఆ కంటి దోషంచేతనే కదా! అట్లాగే జగత్తు అనబడేది భ్రమ చేత స్ఫురిస్తోంది. ఈ జాగ్రత్-జగత్తు స్వప్న జగత్తులాగానే చిదాకాశమునందే ఉన్నది. "సృష్ట్యాది యందు హిరణ్యగర్భుడు అను సమష్టి జీవునియందలి చైతన్యము యొక్క స్వప్నమే ఇక్కడ 'జగత్తు' అనబడుతోంది. ఈ రోజు రాత్రి వ్యష్టి జీవుని (నిద్రావస్థలో పనిచేసే) ఊహా వ్యవహారమును స్వప్నం అని అంటున్నాం. సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు స్వస్వరూప సమక్షంలో ఆశ్రయించిన కల్పనా చమత్కారమును 'జగత్తు' అంటున్నాం. ఈ సమష్టి జీవుని జగత్ స్వప్నానికి, వ్యష్టి జీవుని జాగ్రత్ స్వప్నానికి వాస్తవానికి భేదమేమీ లేదు. శ్రీరాముడు : స్వామీ! సృష్టి 'అవాస్తవం' అనుకుంటున్నాం కదా! మరి ఇక్కడ 'నియతి' ఉన్నది కదా! ఉదాహరణకు మామిడి విత్తు మామిడి వృక్షంగానే అగుచున్నది కాని, ఆముదము వృక్షం కాదు కదా! ఆవు కడుపున గేద జనించదు కదా! మరి 'నియతి' దృష్ట్యా ఇక్కడ కార్యకారణములు ఉన్నట్లే కదా! ఇక జగత్తు లేనిది ఎట్లా అవుతుంది.?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నియతి సృష్ట్యాదిలో ఎట్లా నియమించబడియున్నదో -

అదియే ఇప్పటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో ప్రవర్తించిన నదీజల ప్రవాహం ఇప్పటికీ (ప్రతి సంవత్సరము ఆయా సమయములందు) అట్లే ప్రవర్తిస్తోంది. నదులయందలి జలము యొక్క “తరంగసత్త” ఆ జలసత్తా కంటే భిన్నమా? కాదుకదా! చిదాకాశమున సృష్టి రూపసత్త, అందులోని నియతి, అనియతి ఇదంతా చిదాకాశం కంటే భిన్నం కాదు!

శ్రీరాముడు : హే జగద్గురూ! ఈ జగత్తులో జీవుడు జనిస్తున్నాడు. పుట్టినప్పటినుండి అనేక భావాభావములు పొందుచున్నాడు. మరల ఎప్పుడో 'అభావస్థితి' అనదగు మరణము చేరుచున్నాడు. జీవించినంత కాలం సుఖ దుఃఖములు అనుభవిస్తున్నాడు. మరి జగత్తు లేదు అన్నది ఎట్లా యుక్తియుక్తం? అట్లా అనుకున్నంత మాత్రం చేత దుఃఖాదులు తొలగుతాయా? మృత్యువు ఏదో ఒకనాటికి అనివార్యం కదా! ఈ విధంగా జీవన-మృత్యువులు రెండూ దుఃఖప్రదములే కదా! శ్రీ వసిష్ఠ మహర్షి :

మృతస్య అత్యంతనాశశ్చేత్ తన్నిద్రా సుఖమేవతత్ |

భూయశ్చ ఉదేతి సంసారః తత్ సుఖం నవమేవతత్

మరణించిన తర్వాత అత్యంత అభావమే కలుగుతుందని కాసేపు అనుకుందాం. అప్పుడు అది కూడా గాఢ నిద్రాస్థితిలో జీవులు రోజూ పొందే నిరతిశయానంద సుఖము వంటిదే అవుతుంది

Page:823

కదా! కాబట్టి మరణము అనేది కూడా చిదానంద సుఖస్వరూపమే! మరల ఆ జీవుడు దేహాది రూపముగా సంసారంలో ఉదయిస్తున్నాడనుకుందాం. ఆ నూతన దేహము, నూతన వ్యవహార పరంపరలూ సుఖస్వరూపమే. ఎందుచేతనంటే ప్రతి జీవుడు 'నేను దీర్ఘకాలం జీవించాలి. ఇంకా ఇంకా బ్రతకాలి'... అని అనుకుంటున్నాడు కదా! సుఖ స్వరూపం కాకపోతే జీవించాలని ఎందుకనుకుంటాడు? ఈ విధంగా జీవన -మరణములు రెండూ సుఖ స్వరూపములేనని అనిపించుకుంటున్నాయి. మనం అనేకసార్లు ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా జగత్సత్తా ఆత్మసత్తా' కంటే వేఱుకాదు. కాబట్టి జనన మరణభీతి జీవునికి అఖరయే లేదని... అది అజ్ఞానముచే మాత్రమే ఏర్పడుచున్నదని జ్ఞానుల ఉద్దేశం.

ఇక సుఖ-దుఃఖాలంటావా?... దుష్కర్మలచే నాకు నరకాదుల దుఃఖం వచ్చిపడు తుందేమో...?” అనేది కూడా సుఖసత్తా యే మూలముగా కలిగి ఉన్నది. సుఖం లభించక పోవటమే దుఃఖం. దుఃఖం కలగక పోవటమే సుఖం. ఆ రెండిటి మూలభావం ఒక్కటే. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి అవినాభావ సంబంధంచే ఏర్పడేవే గాని స్వతఃసిద్ధమైనవి కావు. సుఖ-దుః ఖములందు ఇంతకుమించి నిర్మాణ విశేషమేమీ లేదు.

దృష్టాంతానికి....ఒక వస్తువు లభించి తద్వారా 'సుఖభావన ఉదయించిందనుకో... తక్షణం లోనే “ఇది కోల్పోతామేమో....' అనే దుఃఖభావం వెంటనంటే ఉన్నది. ఏ కారణం చేతనో (లభించ వలసినది లభించకపోవటమో, అనుకున్నది జరగకపోవటమో, ఆశించినది సిద్ధించక పోవటమో) దుఃఖం ఏర్పడిందనుకో, ఇది తొలగగానే నాకు సుఖం లభిస్తుంది అనే భావన వెంటనంటే ఉన్నది కదా! అట్టి దుఃఖ భయం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టే జీవుడు మరల దేహధారుడగుచున్నాడు. కనుక దేహధారణ దేహత్యాగ స్థితులు సుఖ దుఃఖములు రెండూ అందరికీ ఒకేరీతిగా సుఖ దుఃఖ సమన్వితములై ఉంటున్నాయి.

సుఖ దుఃఖములు రెండూ వాస్తవానికి లేవు. ఆ రెండూ అనుభవించేవాడు మాత్రమే వాస్తవమైన సత్త కలిగి ఉన్నాడు.

అంతఃశీలుడు -

మరణం - - జీవితం నాస్తు సహజే వాసనే తయోః |

ఇతి విశ్రాంత చిత్తో యః సో అన్తఃశీతల ఉచ్యతే ॥

మరణమైనా జీవితమైనా అవి రెండూ దేహసంబంధమైనవి గాని దేహికి సంబంధించినవి కాదు. దేహి పుట్టడు, చావడు. ఎవనికైతే జీవించటం - మరణించటం అను రెండూ కూడా స్వాభావిక బ్రహ్మసుఖ రూపములుగా ఉంటాయో.. అట్టి అనునిత్య విశ్రాంత చిత్తుడగు జీవుని “అంతఃశీలుడు” అని పిలుస్తారు.

ముక్తుడు - వృత్తులన్నీ ఎవరియందు నశించి, ఎవడు దశ్యస్ఫురణ లేకయే ఉంటాడో... అట్టివాడు సర్వబంధ వినిర్ముక్తుడు అవుతాడు. అట్టివాడు. చిద్రూపమగు ఆత్మయందు తన్మయుడై

Page:824

ఉంటాడు. అట్టివాడు ముక్తుడు అని అనిపించుకుంటాడు. ముక్తునికి (ఆత్మ తన్మయునికి) సుఖ దుఃఖములు, జీవన్మరణములు సమానంగానే కనబడతాయి.

అందుచేత రామచంద్రా! ఆత్మజ్ఞాన ప్రభావం చేత ఈ దృశ్యమంతా స్వప్నతుల్యము” అను భావనా పటిమ పటిష్టమగుచున్నది. దృశ్యము యొక్క అత్యంతాభావన చేత (అట్టి కారణంగా) ఈ సృష్టి ఉంటున్నా లేక ఉండకపోయినా ఆ ఆత్మజ్ఞానానికి ఒక్కటే అవుతుంది.

"దేహిగా నేను ఏదై ఉన్నాను? ఈ దృశ్యము ఏమై ఉన్నది?" అను రెండు విషయాలు జ్ఞానముచే సుస్పష్ట పరచుకున్నవానికి దృశ్యము ఉన్నా కూడా లేనట్లే! జన్మ మృత్యువులు కనబడుచున్నా అవి దూరంగా ఉన్న అపరిచిత గ్రామంలోని దైనందిన సంఘటనలవలె చూడబడతాయి. జ్ఞానియందు సర్వ దృశ్యానుభవరహితమగు "శుద్ధ నిర్విషయచైతన్యము” నిత్యోదయమై ఉంటోంది. అట్టి శుద్ధ చైతన్యము దృశ్యరూపం కాదు. విషయరూపం కాదు. చేతనావృత్తి రూపం కాదు. చేతితము కాదు. అట్టి చైతన్యముతోటి ఏకత్వము పొందిన మహనీయులు సంసార వ్యవహారరహితులై ఉంటారు. వారి పట్ల సంసారము ఏదో ఉబుసుపోకకు చదివే కథలోని సంఘటనల వలె ఉంటోందిగాని సుఖ-దుఃఖ కారకము కాజాలదు.

అతి నిర్మలము అగు చిదాకాశమున "చైతన్యము" అను గాజు (కళ్ళజోడు) యొక్క నిరంతర స్ఫురణయే ఈ జగత్తు. కాబట్టి అంతా చైతన్యమే అయి ఉండగా, ఇక బంధ మోక్షములు ఎచట? ఈ జగత్తు చిదాకాశము యొక్క స్ఫురణమాత్రము, సంకల్ప రూపము అయి ఉన్నది. కాబట్టి ఇదంతా సత్చిన్మయమే గాని మట్టి-గాలి కాదు. ఇక్కడ వాస్తవానికి దేశము- కాలము - పదార్థము-క్రియ-ఆకాశము మొదలైనవి ఆత్యంతిక దృష్టిచే లేవు. ఈ జగత్తు ప్రతిభాసమాత్రంగా అన్యోన్యత్వం చేత వృద్ధి చెందనీ, చెందకపోనీ... అట్టి స్వకీయ కల్పన దృష్ట్యా (కల్పన చేత ఏర్పడి ఉంటోంది కాబట్టి) ఇది లేనిదే, అసత్తే! అధిష్ఠాన రూపం చేతనో... ఇదంతా ఆత్మయే. కనుక సత్తే.

ఈ ప్రకారంగా ఈ 'జగత్తు' రూపంగా కేవల ఘనమగు ఆత్మయే ప్రకాశిస్తోంది. అట్టి ఆత్మ ఆకాశము కంటే కూడా అతి నిర్మలము అయి ఉన్నది. అది శూన్యం కాదు, అశూన్యం కాదు. అది “సాకారం”గా ఉన్నట్లు తోచినప్పటికీ వాస్తవానికి నిరాకారంగానే ఉన్నది. అసత్తువలె కన్పట్టినప్పటికీ మిక్కిలి ప్రకాశవంతమై ఉన్నది. అతి శుద్ధం. స్వప్న నగరం వలె అంతులేని విస్తీర్ణం కలిగి ఉన్నది.

ఈ ప్రకారంగా చిదాకాశము యొక్క కలుషిత జగద్రూపం, వాస్తవానికి, శుద్ధవ్యాపక నిర్వాణ రూపమే అయి ఉన్నది. అట్టి నిర్వాణ రూపముచే వ్యాపించబడనిదేదీ లేదు. ఆకాశంలో శూన్యత్వంవలె, జలమునందు ద్రవత్వంలాగా ఈ జగత్తు పరమాత్మ రూపమే! అంతేగాని ఇది నానావిధ రూపములుగా కూడి ఉన్నది కాదు.

శ్రీరాముడు : నిర్లిప్తము, నిర్విషయము అగు అత్మ నుండి విషయరూపమగు మనస్సు ఉద్భవించటం చమత్కారమే కాదా!

శ్రీవసిష్ఠ మహర్షి : ఎవడైతే 'సూర్య కిరణములు సూర్యుని కంటే వేరే'... అని అనుకుంటాడో, వానికి ఆ సూర్య కిరణములు అన్యమైనట్లే భాసిస్తాయి. 'బంగారము కంటే అభరణములు వేరైనవి’... అనుకునే వాని అనుభవం అట్లే (వేరైనట్లుగానే) ఉంటుంది గాని, అది 'బంగారం కదా' అని అతను అనుకోవటం లేదు. కానీ, 'సూర్యబింబము నుంచే బయలుదేరిన కిరణములు సూర్యునికి వేరైనవి ఎట్లా అవుతాయి? బంగారము కంటే ఆభరణం వేరైనదని అనటం ఎట్లా?'... అని భావించావనుకో? అప్పుడు మొదటి వానికంటే వ్యతిరిక్తమైన అనుభవమే ఉంటుంది.

తరంగములు చూచేవానికి తరంగబుద్ధియే ఉంటుందిగాని, జలబుద్ధి ఉండదు. తరంగములు జలము కుంటే వేరు కాదు అని తలచేవాడికో? ఇతనికి జలబుద్ధియే ఉంటుంది గాని, తరంగ బుద్ధి ఉండదు. బంగారము యొక్క ఆకారములైన ఆభరణములందు కూడా ఉన్నది బంగారమే... గ్రహించేవాడు మహాబుద్ధిమంతుడై ఉంటాడు. అట్టివాడు “నిర్వికల్పుడు” అని చెప్పబడతాడు. త్రిగుణాత్మకమై కనిపించే ఈ దృశ్యాంతర్గత జీవులంతా త్రిగుణాతీతమగు పరమాత్మ యొక్క సంప్రదర్శనా విన్యాసమే” - అని గమనించడాన్నే 'నిర్వికల్పము' అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.

పుట: 522

CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93-83972-14-2 (Set)

దోమలగూడ, హైదరాబాదు-29

Casseరామకృష్ణ email : publication@rkmath.org

మఠం 9789383972142

Vasishta Rama Samvadam : Vol 3 ISBN 93-83972-12-8 1000/- (set) www.rkmath.org