Page:92
శ్రీవసిష్ఠ మహర్షి : స్వప్నంలో స్వప్న జగత్తుకు ఆధారమేమున్నది? ఏ ఆధారం లేకపోయినా, వాటిని ధరిస్తున్న వారంటూ ఎవరూ లేకపోయినా స్వప్న జగత్తులోని పదార్థాలు ధరింపబడు చున్నాయి కదా! అవన్నీ ఏచోటా పడకపోయినా, (మరొకప్పటికి) పడి నశిస్తున్నాయి కదా! వాటికి ఏ ఆకారమూ లేకపోయినా కూడా “ఇల్లు-మనుష్యులు-ఊరు” మొదలైన ఆకారాలతో కనిపిస్తు న్నాయి కదా! అట్లాగే ఈ జగత్తు వాస్తవానికి ఎవరి చేతా ధరింపబడకపోయినప్పటికీ బాగుగా ధరించబడుచున్నట్లే స్థితి కలిగి ఉంటోంది. ఇది ఎటూ పడకపోయినప్పటికీ పడుచున్నదే అగుచున్నది. నిరాకారమే అయినప్పటికీ, సాకారముగానే ఉన్నది. ఈ మాయా మయ ప్రపంచంలో పడునదేమిటి? లేచునదేమిటి? పొందుచున్నదేమున్నది? ఎవరు ఎట్లా దేనిని ధరిస్తారు? ఆ ధరించే వారు కూడా మాయలోని విభాగమే కదా! చైతన్యము యొక్క స్ఫురణను అనుసరించే ఇదంతా ప్రకాశిస్తోంది. ఆకాశంలో కేశములు-శూన్యత్వము ఎట్లా కనిపిస్తున్నాయో, వాయువులో చలనం ఎట్లా ఉన్నదో, జలమునందు తరంగత్వం ఏ విధంగా ఉన్నదో... ఆ విధంగానే చిదాకాశంలో ఈ జగత్తు కూడా కలదు. 'సంకల్పం'లో నగరం ఉన్నట్లే, ఈ బ్రహ్మాండగృహం చైతన్యమున (లేక) చిదాకాశమున ఇట్లు నియమిత ఆకారమును ధరించనదానివలె వర్తిస్తోంది.
శ్రీరాముడు : స్వామీ! ఈ కనబడే జగత్తు యొక్క అసలైన రూపమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ 'జగత్తు' అనబడేది ద్రష్ట యొక్క "అధ్యాస చమత్కారమేనయ్యా! వాస్తవానికి ఇదంతా 'సంవిజ్మయము మాత్రమే'!
పూర్ణమగు సంవిత్తే... గమనము యొక్క అధ్యాసచే గమనశీలమున వర్తిస్తోంది. 'పతనం' యొక్క అధ్యాసచే రాత్రింబవళ్ళు 'పడుట' యందు (పతనమునందు) తత్పరమగు చున్నది. 'ధారణ' యొక్క అధ్యాసచే సదా స్థితి కలిగి ఉంటోంది.
ఊర్ధ్వ గమనమున చైతన్యముతో కూడి ఈ జగత్తు అట్టి అధ్యాసచే ఊర్ధ్వమునకు జనుచున్నది. నాశ సంవిత్తుతో కూడిన అధ్యాసచే కల్పాంతమున నశించుచున్నది. చిన్మయమగు సంవిత్తో కూడి సృష్ట్యాదియందు సృష్టి యొక్క అధ్యాసచే చిదాకాశమున జనించుచున్నది.
రామచంద్రా! శరత్కాలాకాశం వైపుగా దృష్టిని సారించిన మనుజునికి ఆకాశంలో అసంఖ్యాక ముత్యముల సమూహములు గోచరిస్తూ ఉంటాయి చూచావా? అట్లాగే ఈ జగత్తులు అసత్యములే అయినప్పటికీ... భ్రాంతిచే సత్యము వలె చిదాకాశమున గోచరిస్తున్న ఈ జగత్తులకు ఆధారం గణించటం ఎవరి తరం? వీటన్నిటి యొక్క మూలము మాత్రమూ “అధ్యాస” యే!
25. జగద్రూపిణి యగు కాలరాత్రి
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ తర్వాత ఆ మహాకాశంలో మదించినట్టి విశాల రూపియగు రుద్ర భగవానుడు లయమొనర్చటంలో ప్రవృత్తుడవటం నాకు కనిపించింది. అతడు ఆకాశమే
Page:93
ఆకృతిగా ధరించి వచ్చారు. ఘన శ్యామవర్ణం కలిగి ఉన్నారు. తన యొక్క మహత్తరమైన ఆకారంతో దశదిక్కులు పూరించి ఉన్నారు. సూర్య - చంద్ర-అగ్నులే అతని మూడు నేత్రాలు. చలించు దశ దిక్కులు అతని వస్త్రముల వలె కనిపించాయి. ఘనమైన-దీర్ఘమైన నీలివర్ణపు కాంతి పుంజములను ఆయన వెదజల్లుచున్నారు. ఆయన నేత్రాలు, బడబాగ్ని వలె కదలుచున్నాయి. సప్త సముద్రాలు అప్పటి జలప్రళయానికి ఏకంకాగా, ఆ మహాజలమంతా అతని దేహములోనికి అతివేగంగా ప్రవేశించివేసింది.
ఆ ప్రళయకాల రుద్రభగవానుడు ఆ విధంగా విలయతాండవం చేస్తూ ఉండగా, ఇంతలో ఒక చమత్కారమైన సంఘటన జరిగింది. ఆ రుద్రుని శరీరం నుండి ఒక ఛాయ బయల్వెడలి ఆతని నృత్యమును అనుకరించసాగింది. అది చూచిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది! అరె! ఏమి ఆశ్చర్యం! సూర్యుడు మొదలైన కాంతిమయ వస్తువులు లేకపోవటంచే ఆకాశమంతా అంధకారంచే ఆవరించబడి ఉన్నది కదా! నీడ ఉండాలంటే ఎక్కడి నుండైనా ఒక వస్తువుపై కాంతి ప్రసరించాలిగా! కాంతి ప్రసరించాలంటే ఏ చోటినుంచైనా సూర్యుడి వంటి కాంతిమయగోళం ఉండాలిగా! మరి అంధకారమయమైన ఆకాశంలో ఛాయ ఎట్లా స్థితి పొంది ఉన్నది?".... అనే అనుమానం నాలో ఉదయించింది. నేను ఇట్లా అనుకుంటూ ఉండగా, ఇంతలో ఆ ఛాయ అతి శీఘ్రంగా విశాలరూపం దాల్చింది. ఆ ఛాయ అత్యంత శోభాయమానంగా మూడు కన్నులు కలిగియున్నదై నృత్యం చేస్తూనే రుద్ర భగవానుని ఎదురుగా నిలబడింది.
ఆ ఛాయా రూపిణి కృష్ణ (నలుపు) వర్ణం కలిగి ఉన్నది. నాడీ రూపములగు శిథిలమైన ఛిద్రావయవములు కలిగియున్నది. విశాలమగు ఆకారముతో అగ్నిజ్వాలలచే ఆ ఛాయ యొక్క రూపం వ్యాపించి ఉన్నది. కృష్ణపక్ష రాత్రిలాగా అంధకారమే దేహరూపంగా గ్రహించి ఏతెంచి నట్లుగా కనబడింది. ఆ ఆకృతి ఆకాశమును దిగమ్రింగునంతటిదిగా ఉన్నది. ఆ ఛాయారూపిణి ముఖం అతిదీర్ఘంగాను, భయంకరంగాను ఉన్నది. తన భుజస్కంధములచే దిక్కులను ఢీకొట్టు చున్నది. నాసికతో ఆకాశమును కొలుచుచున్నట్లుగా ఉన్నది. శరీరం చూస్తేనేమో అధికమైన ఉపవాసములచే బక్క చిక్కినట్లున్నది. కృషించటంచే నిలువలేకపోతూ ఉండగా బ్రహ్మదేవుడు ఆమె స్థిరత్వం కొరకై దీర్ఘనాడులు సృష్టించి ఆ రూపం కుచించకుండా నిలుపుచున్నట్లుగా ఉన్నది. అతి దీర్ఘమైన దేహం చూచిన నేను “ఆమె శిరస్సు - పాదాలు ఎక్కడున్నాయి?"... అని వెతుకుతూ అతి దీర్ఘకాలం ఊర్ధ్వ-అధోగమనాలను సల్పవలసివచ్చింది. ఆ ఛాయారూపిణియగు భగవతి ధరించిన మాలకు సూర్య - దేవతా - అసురుల శిరస్సులు మందారపూలవలె గ్రుచ్చబడి ఉన్నాయి. ఆమె వాయువుచే ప్రదీప్తమగుచున్న అగ్నిశిఖలను వస్త్రంగా ధరించి ఉన్నది. అతి దీర్ఘములగు ఆమె చెవులు చంచలమైన సర్పాలతో శోభిస్తున్నాయి. ఆ చెవులకు చనిపోయిన అనేకమంది మనుజుల దేహములు బుట్టలోలాకుల వలె వ్రేలాడుచున్నాయి. ఆమె స్తనములు సొరతీగలాగ మోకాళ్ళ వరకు వ్రేలాడుచున్నాయి. ఆమె దంతములు అనేకమంది దేవతా సమూహములచే అలంకరించబడి
Page:94
ధగధగా తెల్లగా మెఱుస్తున్నాయి. ఆమె అవయవ గ్రంథులు వాయువు యొక్క సంఘటనచే ‘ఫటా-ఫటా’ శబ్దములు చేస్తున్నాయి. ఆమె నృత్యం ప్రళయకాల సముద్రతరంగముల విన్యాసమును మించిపోయి ఉన్నదనిపించింది.
ఆ ఛాయాస్వరూపిణియగు దేవి ఒక సమయంలో ఒక్క భుజంతో కనిపించింది. ఇంతలోనే వేలాది భుజాలు ఎక్కడి నుండో ఉత్పన్నమైనాయి. ఆమె యొక్క అనంత సంఖ్యాకములగు భుజాలు 'జగత్తు' అనే మండపమును వ్యాకులపరుస్తున్నట్లున్నది. ఒకప్పుడు ఆమెకు ఒక్క ముఖమే కనిపిం చింది. కొంచెం సేపటిలో అనేక ముఖములు ధరించింది. ఇంకొంచెం సేపట్లో ముఖరహితంగా కనిపించింది. అట్లాగే ఒకసారేమో ఏకపాదం కనిపించింది. ఇంతలోనే వేలాది పాదాలు ... అట్లా చూస్తూ ఉండగానే పాదరహితం గా కనిపించింది. పురాణ కథనాలను విని ఉన్నట్టి నేను ఆమె దేహాన్ని బట్టి “ఒహో! ఈమెయే ‘కాళరాత్రి'!”...అని ఊహించాను. అది నాలాగే గమనిస్తున్న కొందరు సజ్జనులు "హే కాళీమాత! కాళీ భగవతీ!"... అని గానం చేయటం నాకు వినిపించింది.
త్రినేత్రములు, జాజ్వల్యమానమగు లాలాటం, ఇంద్రనీల పర్వతంలా ప్రకాశించే చెక్కిళ్ళు, నక్షత్రములే ముత్యాలమాలగా ధరించిన ఆ మెడ, ఆమె సమీపమును ఆశ్రయించిన భయంకరమైన వాయసము (కాకి), ఆ నృత్యంలో చలించే భుజాలు, ఆ ఆకాశమును తమ రంగుతో పూరించే గోళ్ళు, మహాకాంతిని వర్షించే పిక్కలు, మహాకాశము యొక్క ఆవలను స్పృశించే ఆ కేశములు, మేఱు పర్వతములు కూడా కూకటి వేళ్ళతో పెకలించగల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు... మొదలైనవన్నీ గమనించసాగాను. ఆకాశమునందు ఉన్నట్టి నేను నృత్యవశంగా వృద్ధి చెందుచున్న ఆ కాళీ భగవతి శరీర భాగములను సావధానంగా వీక్షించసాగాను. ఆమె నృత్యం చేయటమే ప్రయోజనంగా కలిగి ఉన్నట్లు కనిపించింది. ప్రళయకాలపు పుష్కరావర్త మేఘాలు ఆమె వక్షస్థలమును చుట్టుకొని కనిపించాయి. ఆమె ఉదరము నడుము, కంఠము అనేక ఆభరణములతో ప్రకాశిస్తున్నాయి. సప్త పర్వతములు ఆమెకు కంఠమాలలయ్యాయి.
ఓ రామచంద్రా! ఆ భగవతి యొక్క అంగములలో అనేక నగర-గ్రామ ఋతు-మాసదివస-రాత్రాది సమూహములతో కూడిన త్రిలోక పరంపరలు నాకు కనిపించాయి. ధర్మాధర్మాలు ఆమె ఇతర కర్ణ భూషణములుగా కనిపించాయి. ఆమె నాలుగు స్తనములు కలిగియుండి సకల శాస్త్రార్థ క్షీరముచే నిండి ఉన్నాయి. త్రిశూలము పట్టిక-బాణశక్తి-ఖడ్గాది అనేక ఆయుధములు ఆమె చేతికి చుట్టుకొని ఉన్నాయి. పదునాలుగు విధములైన దేవతాది ప్రాణజాతులు ఆ భగవతి యొక్క రోమములై కనిపించాయి. ఆమె యొక్క దేహములో కనిపించిన నగర-గ్రామ-పర్వతాదులు పునర్జన్మ గురించిన ఆనందంతో ఆమె దేహంతోబాటే నృత్యం చేయసాగాయి. అంతకుముందు నశించిన స్థావర జంగమాత్మకమైన జగత్తంతా ఆమె యొక్క 'దేహము' అనే పరలోకంలో నృత్యం చేస్తూ సుఖంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె దేహంలో స్థానం పొందియున్న మేరు-హిమాలయమందరాది పర్వతాలు ఊయల ఊగుచున్నట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. బ్రహ్మాండమాలను అటూ ఇటూ త్రిప్పుచూ ఆ భగవతి చేస్తున్న తాండవ నృత్యం చేస్తుంటే “మరల మరొక ప్రళయం
Page:95
ప్రారంభమైనదా?” అని అనిపించింది. సుర అసుర-ఉరగాది (పాములు) సమూహాలతో కూడిన ఆ దేవి శరీరం ఏ ఒక్క చోటా ఆగుచున్నట్లు కనిపించటం లేదు. ఆ దీర్ఘ శరీరం ఒక చక్రంలాగా తిరుగాడసాగింది. 1. వివిధ కర్మల రూపమగు విభవములు, 2. వాని అనుష్ఠానములకు కారణములైన విజ్ఞానములు, 3. ఆ విజ్ఞానమునకు అనుష్ఠానమైనట్టి యజ్ఞములు - అనే మూడు సూత్రములు గల యజ్ఞోపవీతం ధరించి నృత్యం చేస్తున్న ఆ భగవతి వేదఘోష చేసే బ్రహ్మచారిణి వలె అనిపించింది. ఆ ప్రళయ నృత్యంచే భూమి ఆకాశంగాను, ఆకాశం భూమిగాను పరివర్తన మొందసాగాయి. కానీ... ఏదీ కూడా పరివర్తనం పొందటమే లేదు! ... ఎట్లా అంటావా?
ఆ రెండూ కూడా (భూమి-ఆకాశం) తమయందలి సమస్త పదార్థములన్నిటితో సహా క్రిందికిపైకి తిరుగాడుచుండగా ఇక భూమి-ఆకాశాదులలో పరివర్తనం మాత్రం ఏమున్నది?
ఆ భగవతి ముక్కు నుండి వెలువడిన గాలి 'ఘుమ్మ్ ఘుమ్మ్' శబ్దాలు చేస్తున్నది. ఆమె అసంఖ్యాక హస్తములు ఆకాశమును ఆక్రమించి వ్యాప్తిని పొంది ఉన్నాయి. ఆమె అంగాలలో జనితమైన జగద్వస్తువుల యొక్క భ్రమణమును చేస్తున్నట్టి నేను మామూలుగా స్థైర్యము కలవాడిని అయి ఉండి కూడా-యుద్ధంలో దెబ్బతిన్న సైనికులవలె కుంఠితుడను అయ్యాను. ఒక అద్దం గుండ్రంగా కదులుతూ ఉంటే అందులో ప్రతిబింబించే కొండలు కూడా కదలుచున్నట్లుగా కనబడ తాయి చూచావా? ఆమె దేహమునందు కూడా మహా పర్వతములు కూడా యంత్రముల వలె అట్లాగే చలించుచూ కనిపించసాగాయి. ఆకాశ సంచారులగు దేవతలు, సిద్ధులు మొదలైనవారు ఆమె దేహంలో అటు ఇటూ తిరుగుతూ ఆకాశంలో సంచరించే పక్షులలాగా కనిపించారు. సమస్త ద్వీపాలు, దేవతాలోకాలు సరోవర పుష్పాలలాగ ఆమె దేహంలో ప్రవర్తిల్లుతూ ప్రకాశిస్తున్నాయి. కోటి సూర్యుల ప్రభాసమానంతో వెలుగుచున్న ఆమె దేహంలో స్థావరములగు మహాపర్వతాదులు జంగమత్వం పొందుచున్నాయి. ఆమె తాండవం చేస్తూ ఉంటే ఆ మహా పర్వతాదులు కూడా ఆకాశంలో నృత్యం చేస్తూ కనిపించసాగాయి.
ఇంకా అనేక ఆశ్చర్యాలు! ఆమె దేహంలో సముద్రాలు పర్వతములపై నాట్యమాడు చున్నాయి! సూర్య-చంద్రులతో సహా ఆకాశం పృథ్వి క్రిందికి కదిలిపోవటం కనిపించింది! సముద్ర జలంలో గడ్డిపరకలు చంచలంగా తిరుగాడుచున్నట్లు జగత్-దిక్ మండలాలు ఆమె దేహంలో పరిభ్రమణం చేస్తూ కనిపించాయి. ఆ దేహంలో కనిపించిన ఆకాశంలో ప్రళయమేఘాలు పైకిక్రిందికి ఎగురుచూ భాసిస్తున్నాయి. ఆ దేహములోని పృథ్వి-బాహ్య-అభ్యంతరములు పైకి క్రిందికి తిరుగాడుచున్నాయి.
అంతే కాదు! ఆ భగవతి యొక్క దేహంలో సృష్టి-ప్రళయాల సమూహములు దివారాత్రాల వలె అల్పములుగా (చిన్న సంఘటనల వలె) భాసించుచున్నాయి. శుక్ల-కృష్ణ పక్షములు, సూర్య - చంద్రులు, నక్షత్ర సమూహములు ఆమెకు ఆభరణముల వలె కన్పట్టుచున్నాయి. ఆ భగవతి నృత్యమునకు సకల అంతర్గత భూతజాతమంతా నిత్య భ్రమణం పొందుచున్నప్పటికీ 'అధిష్ఠాన
Page:96
బ్రహ్మము' యొక్క దృష్టిచే నాకు అంతా అత్యంత సుస్థిరమైనదిగానే కూడా అనిపించుచునే ఉన్నది. గిఱ్ఱున తిరుగుచున్న మట్టి బొంగరములోని మట్టి సర్వవేళలా యథాతథం కదా!
ఆ ఛాయ స్వరూపిణియగు దేవి అప్పుడు ధరించియున్న దేహము భూత భవిష్యత్ కాల మందలి అనంతకోటి సృష్టి-ప్రళయములతో కూడి ఉన్నది. అట్టి దేహంతో ఆ ఛాయదేవి నృత్యం చేస్తూ ఉంటే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాది దేవతలు, అసురులు వారివారి అధికారములను, ప్రవృత్తులను మార్చుకుంటూ గాలిచే కదిలే దోమలవలె అస్థిరంగా వచ్చుచూ, పోవుచూ కనిపించారు. అట్టి సృష్టి-స్థితి-లయాలన్నీ నీళ్ళలో పుట్టినశించే బుడగలు-ఆవృత్తములు వలె మిథ్యా మాత్రములే! వాటి వాస్తవ స్వరూపములన్నీ స్వప్న పదార్థాలవలె మిథ్యయే! అవన్నీ పరస్పర విరుద్ధములైన “ఉత్పాత-ఉపశాంతులు, జనన-మరణములు, యుద్ధ-స్నేహాది అభావములు, రాగ-ద్వేషములు, భయ-అభయములు”- ఒకచోట పోయబడిన రత్నముల సమూహములవలె శోభిస్తున్నాయి. ఆ శరీరంలో ఒక దానిచే మరొకటి గమనించబడనట్టి సృష్టిపరంపరలు ఒక స్రవంతివలె బయల్వెడలుచూ ఇంతలోనే మటుమాయమౌతున్నాయి. కంటిదోషం కలవానికి ఆకాశంలో వెంట్రుకలు కనిపించునట్లు వాస్తవానికి చిదాకాశరూపమే అయినట్టి ఆ భగవతి శరీరంలో 'మాయావరణ’ యొక్క ప్రభావం చేత అనేక సృష్టి స్థితి ప్రళయాలు భాసిస్తూ ఇంతలో అవన్నీ ఎటో తరలి వెళ్ళిపోతున్నాయి.
ఓ రామచంద్రా! నిశ్చలమైన పర్వతం కదలుచుండే అద్దంలో చంచలంగా తోచుతుంది కదా! ఈ జగత్తు చంచలరహితమగు అధిష్ఠాన బ్రహ్మమున ఎట్టి సంక్షోభము లేనిదై ప్రదర్శితమౌతోంది. అనేక తరంగాలు, బుడగలు మొదలైనవి ప్రదర్శించే జలము సర్వదా జలత్వము దృష్ట్యా యథా తథంగానే (జలంగానే) ఉండి ఉంటోంది కదా! సంక్షోభమనేది ఏదీ-ఎక్కడా లేకపోయిప్పటికీ ఈ జగత్తు మాయాక్షోభ దృష్టిచే సంక్షుభితంగా భాసిస్తోంది. ఆ 'మహామాయ' యొక్క శరీరమున ప్రవేశించిన సమస్త జగత్ పదార్థములూ "బాలుని ఊహలోని దృశ్య వస్తువుల" వలె ప్రతిక్షణం పరిణామం పొందుతూనే ఉన్నాయి. అవన్నీ తమ పూర్వ స్థితిని త్యజిస్తూ ఇంతలోనే అన్యస్థితిని గ్రహిస్తూ ఉన్నాయి. అ భగవతి యొక్క శరీరం నిరంతరం క్రియాశక్తి-పరిపూర్ణమై కనబడుతోంది. పెసలరాశి వలె బ్రహ్మాండ సమూహాలు ఆమె దేహంలో కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకసారి కలిసి ఉంటూ, ఇంతలోనే మరల విడిపోతున్నాయి. పరిణామ జగత్తులతో విరాజిల్లు తోంది. ఒక క్షణం అంగుష్ఠమాత్రంగాను, మరుక్షణం ఆకాశరూపిగాను అగుచూ కనిపిస్తోంది. శ్రీరాముడు : స్వామీ! మాయాస్వరూపిణి యగు ఆ భగవతి యొక్క అసలైన రూపమేమిటి? యస్మాత్ సా సకలాదేవీ సంవిచ్ఛక్తిః జగన్మయీ, అనన్తా పరమాకాశకోశ శుద్ధశరీరిణీ || ॥
ఆ దేవి "చైతన్యము యొక్క స్ఫురణమాత్రమగు శక్తి స్వరూపిణి”... అని మేము గ్రహిస్తున్నాము. అందుచేతనే ఆమె “జగన్మయి... అయి ఒప్పుచున్నది. వాస్తవానికి ఆ దేవి
Page:97
“అనంత-శుద్ధ చిదాకాశ శరీరధారిణి" అయి ఉన్నది. ఆ భగవతి త్రికాలాలో ఉన్నట్టి పరిణామ శీలమగు జగత్రయము యొక్క అభ్యంతరమందు ఉన్నట్టి చిత్స్వరూపిణి సుమా! చిత్రకారుని విశాల చిత్తములో ఒదిగియున్న చిత్రమే ఒకగొప్ప కళాఖండంగా ప్రదర్శిమగుచున్నట్లు... ఆ భగవతియే ఆయా కర్మ-వాసనల పరిపక్వతను అనుసరించి ఈ విచిత్ర జగద్రూపంగా పరిణమించి శోభిస్తోంది. ఆ దేవి “అవిద్యావృతమగు చిత్ స్వరూపిణి" అయి ఉండటంచేత “సర్వ సంసారమయి” అయి చూపట్టుచున్నది. ఎప్పుడైతే విద్యచే అవిద్య బాధితమౌతుందో... అప్పుడు “శుద్ధచిదాకాశరూపం”గా వెలుగొందుచున్నది.
ఈ విధంగా, బద్ధుని యొక్క- ముక్తుని యొక్క దృష్టుల చేతను, నిమేష -ఉన్మేషము చేతను, అవిద్య-విద్యల చేతను... క్రమంగా సంసారమయమైనట్టి శుద్ధ-చిన్మయ-అనాది-అనంతమైనట్టి చిదాకాశమే ఆ దేవి శరీరం. ఆ దేవి యొక్క శరీరమునందు ఈ ఈ దృశ్యములన్నీ అభిన్నరూపంగా భాసిస్తున్నాయి.
మహాభయంకరరూపిణి యగు ఆ దేవి తన దేహముచే ఆకాశమును పూర్ణము చేసివేసినదై భైరవరూపధారియగు ఆ కల్పాంతరుద్రుని సమ్ముఖంలో పలుగు-కత్తి-ఱోలు-రోకలి-ఫలముకుండ మొదలైన చిత్ర విచిత్రములైన వస్తువులను మాలగా ధరించి నృత్యము చేయసాగింది. మధ్యమధ్యలో తన మెడను అలంకరించిన ఆయా వస్తు జాలములతో కూర్చిన దండను త్రెంచి నలువైపులా అద్దాని ఖండములను వెదజల్లి మరల మరొక పూలదండను ధరించుచున్నది. భగవతిచే నమస్కరించబడుచున్న వాడై ఆ భైరవ భగవానుడు ఆకాశములె విశాలరూపము ధరించి-ఆ నృత్యం చూస్తూ-తాను కూడా మహా నృత్యము చేయసాగారు.
డింబం డింబం సుడింబం పచపచ సహాసా ఝమ్య ఝమ్యం ప్రఝమ్యం
నృత్యన్తీ శబ్దవాద్వైః స్రజమురసిశిరః శేఖరం తార్క్ష్యపక్షైః
పూర్ణం రక్తావసానాం యమమహిష మహాశృంగమాదాయ పాణె పాయాద్వో వన్ద్యమానః ప్రలయముదితయా భైరవః కాలరాత్ర్యా ॥
ఆ కాళరాత్రీ దేవి యముని వాహనమగు దున్నపోతు యొక్క కొమ్ములను రెండు చేతులలో ధరించి "డింబం-డింబం-డిడింబం-ఝమ్య-ఝమ్య-ప్రఝమ్య" అను తాళ శబ్దములచే నృత్యం చేస్తూ వక్షఃస్థలమున శిరస్సులమాలలను ధరించినదై, గరుత్మంతుని టెక్కల యొక్క ఈకలను మస్తకమున ధరించినదై, ప్రళయ జగత్తును భక్షించిన సంతోషంతో ఆ భైరవ భగవానుని సమక్షంలో నృత్యం చేస్తూ ఆయనకు అనేక విధములైన సత్తులను సమర్పిస్తోంది.
అట్టి భైరవ భగవానుడు- కాళీదేవీ మనందరి యొక్క జ్ఞాన ప్రతిబంధకములను నివారించి, కాపాడి దరిజేర్చుటకై సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించెదము గాక! వారి కరుణచే మన సంసార భ్రమ తొలగిపోవును గాక!
Page:98
26. చిద్రూపమగు పరమాత్మ తత్త్వము అజ్ఞానముచే కలా సహితం - జ్ఞానముచే కలారహితం
శ్రీరాముడు : మహర్షీ! మీరు ఆ బ్రహ్మాండ విలయ సందర్భంలో గాంచిన కాళరాత్రీ దేవితో కూడి భైరవ భగవానుని విలయ నృత్యమునకు, వారిరువురి పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామం సమర్పిస్తున్నాను. ఇక్కడ నాదొక చిన్న సందేహం –
కిమేతత్, భగవన్! సర్వనాశే నృత్యతి కేన సా?
కిం శూర్ఫఫల కుంభాద్యైస్తస్యాః స్రగ్ధామధారణమ్? కిం నష్టం త్రిజగత్ భూయః? కిం కాల్యా దేహసంస్థితమ్ పరినృత్యతి నిర్వాణం కథం పునరుపాగతమ్?
హే భగవాన్! వసిష్ఠ మహర్షీ! ప్రళయమునందు అంతా అప్పటికే నశించిపోయింది కదా! ఇక ఏ అంగాలతో ఆ కాళీ భగవతి నృత్యం సల్పుచున్నది? పదార్థములన్నీ నశించగా ఒక శూలం-ఖడ్గం-గద వంటి ఆయుధాలతో కూడిన మాలను ఆ కాళరాత్రీ దేవి ఎట్లా ధరించింది?
అసలీ మూడు లోకాలలోనూ నశించునదేది? నశించనిదేది? ఆ కాళీదేవి దేహంలో స్థితి నొంది ఉన్న లోకాలు ఎట్లా వచ్చాయి. నశించిపోయిన జగత్తు మరల వచ్చి నృత్యం సల్పుచుండటం ఏమిటి? అసలా భైరవ భగవానుడు పురుషుడా? ఆ నృత్యం ఆయన కాళీదేవితో కలిసి ఎందుకు చేస్తున్నారు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ భైరవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు! ఆ నృత్యమంతా వాస్తవమూ కాదు. ఆ భైరవ కాళీ ఆకృతులు కూడా లేనివే అయి ఉన్నాయి.
శ్రీరాముడు : మరి వారెవరు?
శ్రీవసిష్ఠ మహర్షి : వారిరువురూ కూడా “అనాది-చిన్మాత్రము - చిదాకాశరూపము - సర్వ కారణ కారణము-అనంతము-శాంతము - ప్రకాశమాత్రము అవ్యయము-సర్వవ్యాపకము” అయినట్టి పరబ్రహ్మమే అయి ఉన్నారు. నిరతిశయానందము- సద్రూపము అగు సాక్షాత్ పరబ్రహ్మమే నీలకంఠ త్రినేత్రత్వాది ఆ శివ శివారూపము ధరించుచున్నది.
శ్రీరాముడు : ఎందుచేత?
శ్రీవసిష్ఠ మహర్షి : ఉపాసకుల యొక్క వాసనానుసారమే ఆ చిన్మాత్ర బ్రహ్మం అట్లు భైరవాకారాన్ని స్థితినొంది ఉన్నది. జగత్తు అనునది శమిస్తే ఇక ఆ భైరవాదులు చిదాకాశమే అయి ఉంటారు. శ్రీరాముడు : శుద్ధ చైతన్యంలో ఒకానొకప్పుడు సృష్టి, మరొకప్పుడు ప్రళయం ఎందుకు ఏర్పడు చున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : బంగారం యొక్క వేర్వేరు ఆకారాలనే 'ఉంగరం రెండు పేటల గొలుసు – వడ్డాణం- అరవంకి-పాపడ" మొదలైన పేర్లతో పిలుస్తున్నాం. బంగారానికి 'ఇది' అనే ఆకారం
Page:99
ఏదీ వాస్తవానికి లేదు కదా! అయితే... బంగారం ఏదో ఒక ఆకారం లేకుండా ఉంటుందా? ఉండదు. ఏదో ఒక ఆకారం కలిగి ఉండటం బంగారం యొక్క స్వభావం కదా! మిరియపుగింజ 'కారపుదనం’ కలిగి ఉండటమనేది అద్దాని స్వభావమే కదా! చెఱుకు రసం 'మాధుర్యం' లేకుండా ఎట్లా ఉంటుందో చెప్పు? మాధుర్యం లేకపోతే అది చెఱుకు రసమనియే అనిపించుకోదు.
అట్లాగే... అజ్ఞాతమగు చైతన్యము చేతనరూపం అయిఉండటం చేత తన యొక్క “సృష్టిస్థితి-లయములు” అనే స్వభావం విడిచి ఉండజాలదు. అనగా అది తన విషయాకారాన్ని త్యజించి ఉండదు. ఏ పదార్థమైనా తన యొక్క స్వభావాన్ని విడచి ఉంటుందా? ఏదో ఒక దానికి ప్రకాశింప జేయకుండా ఉంటే చిన్మాత్రం 'చిన్మాత్రం’ అని అనిపించుకోజాలదు. అట్లాగే చిదాకాశానికి ‘నాశనం’ అనేది ఉండజాలదు. అనగా, సత్తు ('అ'కారం - చిత్తును ('ఉ'కారాన్ని - ఎఱుకను), ఆనందాన్ని (‘మ'కారాన్ని - - ఎరుగబడేదానిని ఎరుగబడేదానిని - జగదత్వమును) స్వభావసిద్ధంగా కలిగియే ఉంటుంది. శ్రీరాముడు : ప్రకాశరూపమగు బ్రహ్మమున ప్రకాశరూపమగు జగత్తు ఎట్లు ఉద్భవిస్తోంది? ఈ లోకాలు, లోక పాలకులు ఎట్లా ఉత్పత్తిని పొందుచున్నారు?
శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి బ్రహ్మము యొక్క స్వసత్తామాత్రము నకు 'అన్యము’ అనేదేదీ లేనే లేదు. ఆ బ్రహ్మమే తన యొక్క 'అనేకత్వము' అను 'చమత్కారమైన ఇచ్చచే తనకంటే భిన్నంగా అనిపించే ఈ 'జగత్తు' అనే అన్యత్వమును కల్పన చేసి, అంగీకరించుచున్నది. కాబట్టి ఈ ముల్లోకముల సృష్టి-వీటి కల్పాంతము కూడా "ఆది-మధ్య-అంతరహితము-క్షోభవర్జితముసర్వశక్తి మయము” అయినట్టి బ్రహ్మము యొక్క నిజ సత్తామాత్ర ప్రకాశమే సుమా! అదియే ఆకాశము-భూమి-దిక్కులు కూడా అగుచున్నది. అదియే ఆది-మధ్య-అంతము కూడా! నిర్మలము-వస్తు రహితము అగు ఆకాశం నీలంగా కనిపిస్తోంది చూచావా? అట్లాగే నిర్విషయ బ్రహ్మమునందు అవిద్య దృష్టిచేత ఉత్పత్తి - నాశనములు భాసిస్తున్నాయి.
జననం మరణం మాయా మోహమ్ మాన్యమ్“అవస్తుతా”!
వస్తుతా చ వివేకశ్చ బంధో మోక్షః శుభాశుభే
విద్యా అవిద్యా విదేహత్యం సదేహత్వమ్ క్షణఃచిరమ్ చంచలత్వ, స్థిరత్వం వా, త్వంచ అహం చేతరశ్చ తత్ ॥
సత్ అసత్చ అధ సదసన్ మౌర్యంపాండిత్య మేవచ దేశకాల క్రియాద్రవ్య కలనా కేతి కల్పనమ్ రూపలోకనమ్ అమనస్కారః కర్మ బుద్ధిః ఇంద్రియాత్మకమ్ తేజో వారి అనిల ఆకాశ పృథివ్యాదికమ్ ఇదమ్ తతమ్ ||
ఏతత్ సర్వమసౌ “శుద్ధ చిదాకాశో నిరామయః” అజహద్వ్యోమతామేవ! సర్వాత్మైవైవ మాస్థితః!
ఓ రామచంద్రా! జననం-మరణం-మాయ-మోహం-మందత్వం-అవస్తుత్వం, వివేకముబంధము-మోక్షము-శుభము-అశుభము-విద్య-అవిద్య, నిరాకారత్వం-సాకారత్వం-క్షణకాలంPage:100
చిరకాలం-స్థిరత్వము, 'నీవు' అను భావం, 'నేను' అనే భావం 'వారు వీరు' మొదలైన అన్యత్వం, సత్తు-అసత్తు-మూర్ఖత్వము-పాండిత్యము, దేశము-కాలము-క్రియ, ద్రవ్యము-కళ-క్రీడ-కల్పననామ రూపములు, బాహ్య అభ్యంతర విషయములు-కర్మేంద్రియములు-జ్ఞానేంద్రియములు, ఈ అంతటా నిండియున్న పృథివి- జలము- అగ్ని -వాయువు-అకాశం అనబడు పంచ భూతములు... ఇవన్నీ కూడా నిరామయమై - చిదాకాశమే అయి ఉన్నాయి. ఆ చైతన్యము తన యొక్క “శుద్ధ చిదాకాశ రూపత్వము” ను త్యజించకుండానే సర్వరూపముగా అయి చెన్నొందుచున్నది.
ఈ సమస్త జగత్తు చిదాకాశమే అయి ఉన్నది. అత్ర న సంశయః! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చైతన్యము కంటే వేఱుగా ఏదీ లేదు. స్వప్నంలో కనిపించే ఏ పదార్థమైనా స్వప్న ద్రష్ట యొక్క స్వప్న సత్తా చైతన్యమే! అట్లాగే జాగ్రత్తులో కనిపించేదంతా జాగ్రత్ ద్రష్టా చైతన్యమే!
రామచంద్రా ! ఏ చిన్మయమగు చిదాకాశం గురించి మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటు న్నామో, అదియే "సనాతనుడగు శివుడు" అని కూడా చెప్పబడుచున్నదని నీవు గ్రహించు. ఆ శివరూపుడగు పరమాత్మయే "బ్రహ్మ-విష్ణు-చంద్ర-సూర్య-ఇంద్ర-వరుణ-యమ-కుబేర-అగ్ని”... ఆదిగా గల రూపములన్నీ ధరించుచున్నాడు. వాయు-మేఘ- సముద్రాదులు గాను, సర్వభూత - భవిష్యత్ పదార్థములుగాను అగుచున్నాడు. అంతేకాదు. “అది కలదు - ఊహూఁ! లేదు" అని -
సంకల్పించబడు వికల్పించబడు సర్వ వస్తువులు కూడా పరమాత్మయే అయి ఉన్నాయి.
ఈ ప్రకారం... ఈ బ్రహ్మ మొదలైన సర్వపదార్థాలు కూడా, ఆయా ఉపాధుల దృష్ట్యా, చిన్మయమగు “బ్రహ్మ ప్రకాశం” యొక్క అంశరూపాలే అయి బ్రహ్మాండంగా స్ఫురిస్తున్నాయి. అనగా, పరమాత్మయే ఇట్లు బ్రహ్మ మొదలైన ఈ లోకాలలోని సర్వాకారాలుగా “అన్యథా గ్రహించటం” అను అవిద్యచే చూపట్టుచున్నది. ఈ బ్రహ్మ మొదలైన సర్వ పదార్థాలు కూడా -“స్వభావమాత్ర బోధ” (“స్వభావం - స్వభావి' అను విశ్లేషణ) చే “ఇదంతా చిన్మాత్రమే” అని తెలియబడగలదు.
రఘురామా! అన్నిటా-అంతటా-అన్ని రూపాలుగా ఉన్నది చిదాకాశం మాత్రమే! చిదాకాశా నికి 'అన్యథా’ అనునది ఏదీ లేదు. చిదాకాశ బ్రహ్మమే అజ్ఞాన దృష్టిచే 'అబోధ రూపం' అగుచు 'జీవ-జగత్ రూపం' తోటి తనలో స్థితి నొంది ఉన్నది. అజ్ఞాన దృష్టి బ్రహ్మం యొక్క స్ఫురణయే కనుక బ్రహ్మానికి అభేదమే అగుచు, తద్వారా ఈ జీవ జగత్తులన్నీ బ్రహ్మానికి అద్వితీయమగు చున్నాయి. తత్త్వదృష్టిచే ... అదే బోధ రూపంగా అగుచు, చిదాకాశం గానే తన యందు వెలయు చున్నది. అందుచేత రామచంద్రా ! “భేదము- ద్వైతము - ఐక్యము మొదలైనవి ఏవీ కూడా లేవు” అని ఎరిగినవాడవై, శాంతుడవగుము.
తావత్ తరంగత్వమయం కరోతి జీవః స్వసంసార మహా సముద్రే |
యావత్ న జానాతి పరం స్వభావం నిరామయం తన్మయతాం ఉపేతః ||
జీవుడు తన స్వరూపాన్ని ఎఱుగనంత వరకు కూడా ఈ 'సంసారం' అనే మహా సముద్రంలో ‘జనన-మరణ-భ్రమణ’ ఆదిగాగల వివిధ కల్పనా తరంగాలను పొందటం జరుగుతూనే ఉంటుంది.
Page:101
శ్రీరాముడు : మహర్షీ ! ఈ విధంగా జన్మ మరణ-కర్మ-పునర్జన్మ-లోకాలోక భ్రమణాలతో కూడిన ఈ సంసార మహాసాగరమును పొందుచున్న జీవుని అవస్థల ముగింపునకు ఉపాయం లేదా? శ్రీవసిష్ఠ మహర్షి : ఉపాయం ఎందుకు లేదు. తప్పకుండా ఉన్నది. అది తన వాస్తవస్వరూపము ఎట్టిదో తాను ఎఱుగుటయే! దానినే 'ఆత్మజ్ఞానం' అంటున్నాం. సర్వభావములకు ముందే నిర్మలమైనిత్యబుద్ధ స్వరూపమై సర్వ విషయాతీతమై ఉన్న తన వాస్తవ స్వభావం - స్వరూపం ఎఱిగిన మరుక్షణం ఈ ‘సంసారము’ అనే స్వప్నసదృశ మహాసాగరం, మెళకువ వచ్చినప్పటి కలలోని సంఘటనలవలె, పటాపంచలు కాగలదు. అప్పుడు సంసారమంతా శమించగా, ఇక ఆత్మయే తానుగా శేషించినవాడై ఈ జీవుడు పరమ శాంతిని అనుభూతపరచుకోగలడు.
జ్ఞానేతు శాస్త్రం స తథోపయాతి యథా న సో అబ్ధిః, న తరంగకో 2 సౌ | యథాస్థితం సర్వమిదం చ శాంతం, భవత్యనస్తం పరమేవ తస్య II
ఓ రామచంద్రా ! జ్ఞానముకలుగగా ఇక ఆ పై ఈ జీవుడు తరంగ రహితమగు సముద్రవలె శాంతిని పొందుచున్నాడు. అప్పుడు ఆతనికి ఈ జగత్తు యథా తథంగా ఉంటూనే, ఇదంతా పరమశాంతమగు బ్రహ్మరూపమే అగుచున్నది.
27. నిరాకారంలో సాకారం
శ్రీరాముడు : స్వామీ! మీరు “మహాప్రళయానంతరం ప్రళయకాల రుద్రుని విలయతాండవం” గురించి వర్ణించి చెప్పారు కదా ! "అంతా లయించిపోగా ఆ ప్రళయకాల రుద్రుడు ఎక్కడి నుండి ఎందుకు వచ్చాడు? లోకాలన్నీ ఆయనలో ఎందుకు ప్రవేశిస్తున్నాయి? ఆ తాండవం చూస్తూ ఉంటే మీకు భయం కలుగలేదా? ఆ తదనంతరం ఏమికానున్నది?"...అను ప్రశ్నలు ఇంకా నన్ను వెంట నంటియే ఉన్నాయి. కనుక ఆ ప్రళయకాల రుద్రుడు ఎవరో, ఆయన వాస్తవ స్వరూపమేమిటో వివరించ వలసినదిగా నా విన్నపం.
శ్రీవసిష్ఠ మహర్షి మనం ఏ “చిన్మాత్రమగు మహాకాశం" గురించి ఇంతవరకు అనేకసార్లు చెప్పుకొంటున్నామో, అదియే 'శివుడు' అని (పురాణాదులచే, ఉపాసకులచే) చెప్పబడింది. ఆ చిన్మాత్ర మహాకాశమే ఇప్పుడక్కడ రుద్రరూపం ధరించి ప్రళయ కాలమున నృత్యము చేయుచున్నది. శ్రీరాముడు : 'కేవలానంద స్వరూపం' అని చెప్పబడే చిన్మాత్ర మహాకాశం ఆ విధంగా ప్రళయకాల రౌద్ర స్వరూపుడగు రుద్రుని రూపం ధరించటం ఎందుకు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా ! ఏ భయంకరాకృతిచే రుద్ర భగవానుడు అక్కడ నాకు దర్శన మిచ్చారో, వాస్తవానికి ఆయన ఆకృతి అది కాదు. పరమ శాంతము-పరమానందము-చిదనము అగు చిదాకాశమే అట్టి రూపంగా స్ఫురించుచున్నది. నా యొక్క తత్త్వదృష్టి ప్రభావం చేత ఆ రుద్ర రౌద్రాకారమును శాంతమగు చిదాకాశంగానే వీక్షించాను. అయితే ఆ రౌద్ర స్వరూపంగా కనిపించే
Page:102
రుద్రుని చిదాకాశ స్వరూపంగా దర్శించగలగటం తత్త్వదృష్టి (తత్ త్వమ్ అసి - - అను దృష్టితో) మాత్రమే సాధ్యం.
శ్రీరాముడు : స్వామీ ! అట్టి వివేక దృష్టి ఎట్లా లభిస్తుంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ జగత్తును తత్త్వదృష్టిచే దర్శించటమే వివేకదృష్టి. అనగా “నిర్మల అప్రమేయనిత్య సత్య స్వరూపుడే ఈ ఈ సర్వ స్వరూపాలుగా అయి, మాయను అంగీకరించి ఇట్లు ఒకచోట, బహు ప్రజ్ఞాస్వరూపుడుగా, మరొకచోట అజ్ఞానబద్ధుడుగా కనిపిస్తున్నాడు. ఒకే జలం ఒకచోట చంచలంగా ఉన్నట్లు ఈ కనబడే సహజీవులుగా ఉన్నది, సకల లోకస్థులుగా ఉన్నది ఆ అద్వితీయ పరమాత్మయే ! ఆయనయే నా రూపంగా కూడా ఉన్నారు” అనే దృఢమైన భావనాపూర్వకమైన అవగాహనను "వివేక దృష్టి- తాత్త్విక దృష్టి" అని పిలుస్తారు. అట్టి తాత్త్వికదృష్టిని సముపార్జించు కొన్న వారు ఈ మాయా జగత్తును చూచి మోహం చెందరు. ఎవరిచేతనో కల్పించబడిన నాటకాన్ని చూస్తున్నట్లు వారు అంతరంగమున నిశ్చింత కలిగినవారై ఉంటూ, బాహ్యమున యథారీతిగా వర్తిస్తూ ఉంటారు.
అట్టి క్రమమైన అభ్యాసంచే మాత్రమే "ఇదంతా ఆత్మ యొక్క విలాసమే” అని గ్రహించబడ గలదు. అట్టి అభ్యాసము గల ఎవరైనా సరే, ఈ సంసారాన్ని అధిగమించగలుగుతారు. అట్టి దృష్టినే (అంతయూ ఆత్మ యొక్క విన్యాసం మాత్రమే, అను అవగాహన - మరియు అనుభూతిని) “ఆత్మజ్ఞానం” అని “ఆత్మయోగం” అని “ఆత్మసాక్షాత్కారం” అని విజ్ఞులు పిలుస్తున్నారని గ్రహించు. ఈ సహజీవులు, తత్సంబంధమైన సంఘటనలు ఈ కంటికి కనిపించే దృశ్యము, ఈ మనస్సుకు అనుభవమయ్యే భేద-అభేదములు పరమశాంతమగు ఆత్మకు వేరుగా అనిపించటమే సంసారము యొక్క స్వరూపం. ఇంతకుమించి వేతే 'సంసారము' అనబడునది ఎక్కడా ఏదీ లేదు.
కనుక రుద్రతాండవం, కాళీ దేవతానృత్యం మొదలైన సర్వం, సమస్తం కూడా పరమశూన్యమైన చిదాకాశమే అయి ఉంది. ఇక ఆ ఆకారం గాని, ఆ నృత్యంగాని వాస్తవానికి లేనివే అగుచున్నాయి. శ్రీరాముడు : మహర్షీ! మీ వాక్యములు పరస్పర విరుద్ధంగా లేవంటారా? ఆ "రుద్ర-ఛాయాదేవిల ప్రళయ తాండవం చూచాను” అని ఒకవైపు అంటున్నారు. ఇంతలోనే “అవేవీ లేవు” అని కూడా చెప్పుచున్నారు. దయచేసి అలా అనటంలో తమ ఉద్దేశమును విశదీకరించమని నా విన్నపం. శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఈ జగత్తు వాస్తవానికి లేకపోయినా, ఉండి ఉన్నట్లే కనిపించటం జరుగుచున్నదని చెప్పటానికి మనకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి.
జలంలో వేరువేరు తరంగాలు కనిపిస్తున్నాయి. కానీ తరంగాలన్నీ ఒకే జల స్వరూపం కదా! జలం సర్వదా - తరంగం ఉన్నచోట, తరంగం లేనిచోట - జలంగానే ఉంటోంది కదా !
ఒకే మట్టితో కోతి-కుక్క-రాజులు-మంత్రులు-సైనికులు మొదలైన అనేక బొమ్మలు తయారు అయినప్పటికీ అవన్నీ ఒకే మట్టి కదా! ఆకారం దృష్ట్యా అవి వేరువేరైనప్పటికీ మట్టి దృష్ట్యా ఒక్కటే కదా! మట్టికి ఆకారం లేనప్పటికీ, ఆకారాలన్నీ మట్టివే కదా!
Page:103
జనులందరు రక్త-మాంస-అస్థిమయ (మఱియు) అస్థిర స్వరూపులే అయినప్పటికీ కొందరికి మరికొందరు బంధువులై ఉండటం, ఇంకొందరు బంధువులు కాకపోయి ఉండటం అనుభవానికి
సిద్ధిస్తోంది కదా! ఉన్నదంతా పాంచభౌతికమైన దేహములు తోలుబొమ్మల సమావేశమే అయినప్పటికీ... దేహముల-దేహముల మధ్య ప్రేమ ద్వేషాది రకరకాలైన ఉద్వేగములు వేరువేరుగా వేరువేరు దేహములతో ఏర్పడుచున్నాయి కదా!
అంతా బంగారమే అయినప్పటికీ రకరకాల పేర్లుగల ఆభరణాలు సంభాషణా ప్రయుక్తమై ఉంటున్నాయి కదా! పంటభూమి అంతా ఒక్కటే అయినప్పటికీ “ఇంతవరకు మీ చేను - - అది మా చేను అనునవి లోకవిదితమై ఉంటోంది కదా !
అట్లాగే ఆ ఆకారములు, ఆ నృత్యము అక్కడ కనిపిస్తున్నప్పటికీ అని వాస్తవానికి లేవని నేను గ్రహించియే అదంతా దర్శించాను. మరి ఆ ఆకారములు ఎట్లా ఏర్పడ్డాయంటావా? అదంతా కూడా, ఉపాసకుల వాసనచే ఆ భగవంతుడు అట్లు భైరవాకారంగా కానుపించుచున్నాడు. శ్రీరాముడు : స్వామీ! మీరు చూచినదంతా ఉపాసకుల కల్పనా చమత్కారం మాత్రమే అయినప్పుడు, ఆ ప్రళయ తాండవం గురించి వర్ణించి చెప్పటంలో మీ ఉద్దేశం చెప్పవలసినదిగా నా విన్నపం. శ్రీవసిష్ఠ మహర్షి :
వాచ్య - వాచక సంబంధం వినా బోధో న జాయితే
యస్మాత్ - తస్మాత్, త్వయి - మయా దృష్టమేవ ప్రవర్ణితమ్ ||
ఓ రామచంద్రా! చెప్పబడే విషయం, చెప్పటం (వాచ్యం, వాచకం) అనే సంబంధం గురించిన కల్పన లేకపోతే ‘బోధ’ అనునది కుదరదు కదా! అందుచేత తత్కల్పనచే నాచే గాంచబడిన ప్రళయ కాల నృత్యములను నీకు వర్ణించి చెప్పాను. ఆ ప్రళయమే కాదు, ఈ కనబడే జగదృశ్యం కూడా వాస్తవం కాదు. ఈ జగత్తు పట్ల ఏ ఆధిభౌతిక దృష్టి జీవునికి కలుగుచున్నదో... అట్టిది చిరకాల అభ్యాసంచే ప్రౌఢమై, వాక్కుచే మాత్రమే దృఢమై చెన్నొందుతోంది. అనగా ఈ జగత్తు పంచభూతాల కలయికయే కదా! ఇక తదితరంగా కనిపించే 'నా వారు, నీ వారు, నీది, నాది' అని అనిపించేది భ్రమయే! ఏదైతే “అయోధ్యా నగరం” అని, “మా నగరం!” అని అనిపిస్తోందో... అదంతా ఆధిభౌతిక భ్రమ యొక్క చమత్కారం(లేక) విన్యాసం మాత్రమే! అదంతా మాయామాత్రమే అగుచు క్షణకాలంలో సత్యత్వం పొందినదగుచున్నది. వాస్తవానికి ఆ భైరవుడుగాని, భైరవిగాని, ప్రళయంగాని, సృష్టిగాని ప్రశాంత చిదాకాశం దృష్ట్యా లేవు. అదంతా కూడా భ్రాంతి మాత్రమే. “నీడ యొక్క కదలిక” అను దృశ్యంలో 'నీడ' ఒక పదార్థమేమీ కాదు కదా! "ఛాయ యొక్క నృత్యం" అని నాచే గాంచబడినదంతా అవస్తువేనని గ్రహించు. మరి?... పరమార్థమున చిదాకాశమే ఆ ఛాయాదేవి దేహంగానూ, ఇక్కడ మనకు ఎదురుగా దృశ్య ప్రపంచంగానూ అనుభూతమగు చున్నాయని గ్రహించు.
శ్రీరాముడు : హే మహాత్మా ! చిదాకాశమే అయి ఉన్న ఈ జగత్తులో వేఱు వేఱు పదార్థాలు మాకు కనిపించటం ఎందుకు జరుగుతోంది? స్థావర జంగమ భూతజాలమంతా పరస్పరం ప్రతిస్పందనలు కలిగి ఉంటూ ఉండగా “ఈ జగత్తు లేదు” అను వాక్యం ఎట్లా యుక్తియుక్తం?
Page:104
శ్రీవసిష్ఠ మహర్షి : స్వప్నమంతా భ్రమ కల్పితమే అయినప్పటికీ, స్వప్నములోని కల్పిత స్థావర జంగమ దృశ్యం యొక్క అంతర్గతంగా పరస్పర స్పందన అనుస్పందన - ప్రతిస్పందనలు కూడా కలుగుచున్నాయి కదా! ఊహలోని యుద్ధ సన్నివేశంలో శత్రుసైనికులు మొదలైనవి అనుభూతమౌ చున్నాయి కదా! కథను వింటూ అందులోని పాత్రల పరస్పర స్పందన-ప్రతిస్పందనలు నిజమైనవై నట్లు పాఠకుడు అనుభూతి పొందుచున్నాడు కదా! మనోకల్పిత రాజ్యంలో భవనాలు, ఆ భవనాల యొక్క రంగులు కనిపిస్తున్నాయి కదా! ఈ సృష్టి ప్రళయాలు కూడా అట్టివే! ఇందాక నేను వర్ణించిన... నాకు అనుభూతమైన "భైరవ భైరవీ నృత్యవిలాసము” అట్టిదేనని తెలిసియే, ఇంతదాకా నేను దర్శించియుండి... నీకు వర్ణించి చెప్పాను.
భ్రాంతిచే ‘చితనం’ నందు అచిత్తు భాసిస్తోంది. నిరాకారమగు జలమునందు సాకారమగు తరంగము, నిరాకారమగు బంగారమునందు సాకారమగు ఆభరణము భాసించుచున్నట్లుగానే, నిర్విషయాత్మ యందు సవిషయమగు జగత్తు - - జగద్విషయాలు భాసిస్తున్నాయి. జ్ఞానము కలిగిన మరుక్షణం "నిర్మల చిదాకాశమే స్వయముగా తనయందు ఈ జగద్రూపమున భాసించుచున్నది”
అని ఎఱుగబడగలదు.
ఆత్మ ప్రతిజీవుని యందు నామ రూప గుణాత్మకంగా ఎట్లా ప్రకాశిస్తోందో, అట్లాగే అయ్యది వస్త్రమునందు, కల్పాంత వాయువులలో, ప్రళయానంతర రుద్ర నృత్యంలో కూడా ప్రకాశిస్తోంది.
ప్రియ రామా! ఈ విధంగా భైరవీదేవి విపుల నిరాకారమగు ఆకారాన్ని నేను వర్ణించి చెప్పాను. ఇప్పుడు ఆ నృత్యం యొక్క మిథ్యాత్వం ఏమిటో, ఎందుచేతనో మరొక్కసారి చెప్పుచున్నాను
విను.
28. ఆత్మయందు మౌనస్థితి
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒకాయన “ముత్యపు చిప్పలో వెండి ఉన్నది” అని నిర్ణయించు కొన్నవాడై ఆ వెండిని సొమ్ము చేసుకోవాలని మూటకట్టుకొని ముత్యపుచిప్పలను ఇంటికి చేర్చుకొని సంతోషించాడట! వెండి గురించి తెలిసినవాడు ముత్యపు చిప్పలో వెండి ఉండగలదని భ్రమించడు కదా! అట్లాగే జ్ఞానికి ఈ జగత్తు నిర్విషయంగాను, నిరాకారంగాను విదితమౌతోంది.
లోహానికి ఒక ఆకారమంటూ ఏదీ లేకపోయినప్పటికీ, ఏదో ఒక ఆకారం లేకుండా ఎప్పుడూ ఉండదు కదా! అట్లాగే చిన్మాత్రమగు పరమాత్మ యొక్క చేతనం ఒకింత స్పందనం లేకుండా ఉండ జాలదు. బంగారమే ఆభరణంగా పరివర్తితమగుచున్నట్లు... చైతన్యమే నిజభావనా చమత్కారంచే రుద్ర రూపమున స్థితినొంది ఉన్నది. జలం ఉన్నచోట ద్రవత్వం కూడా ఉంటుంది కదా ! అట్లాగే చైతన్యం ఎక్కడ ఉంటే అక్కడ అయ్యది 'స్పందం' అనే ధర్మం అవశ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే స్పందనం అనేది చైతన్యం యొక్క స్వభావమే అయి ఉన్నది. జలం యొక్క కదలికలే తరంగాల రూపంగా అగుపిస్తున్నట్లు... “చిదనం-శివరూపం” అగు పరమాత్మ యొక్క స్పందనగా ఏదైతే
Page:105
ఉన్నదో ...అదియే మనకు స్వవాసనచే జగత్తుగాను, నృత్యం(తాండవం) ఒనర్చుచున్న "భైరవ పరమేశ్వరుడు-ఛాయాదేవి”...మొదలైనవిగానూ కనిపిస్తున్నాయి సుమా! కాబట్టి రామచంద్రా! భయంకరమైన ఆకృతిని దాల్చి స్వేచ్ఛగా నృత్యం చేస్తున్నట్టి శివరూపుడగు రుద్రుడు చిదనం యొక్క నిజస్పందనమేనని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ ! ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తాను. “ప్రామాణిక దృష్టి” చే చూస్తే ... ఈ దృశ్యం కించిత్ కూడా వస్తుతః లేనే లేదు. ఇక, “అప్రామాణిక దృష్టి" చే ఏ దృశ్యం అయితే కనిపిస్తోందో... అదంతా కూడా కల్పాంతమున నశించి పోవటం జరుగుతోంది.
ఇది ఇట్లా ఉండగా 'కల్పాంతము' నందు చైతన్యము విషయరహితమై మహా శూన్యత్వం వహించు చున్నప్పుడు అట్టి చైతన్యమున ద్రష్ట (చూచువాడు) ఉండడుకదా ! అట్టి చిదాకాశము దృశ్యమాన మవటమెట్లా? పైగా, చిదనమునకు అన్యమైనదేదీ లేనప్పుడు అద్దాని ఉనికి ఎవరికి అనుభవమౌతుంది? చిదనము తనకంటే వేరైన 'క్రియ' అనునదే లేనప్పుడు అద్దానిని ప్రకాశింపజేసేది ఏముంటుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! "ప్రళయసమయమునందు 'విషయము' అనేదేదీ ఉండదు కనుక చిన్మాత్రము (లేక చిదాకాశము) అనునది 'ఉన్నది' అనటానికి సాక్షి ఎవరంటారు?”.... అని కదా, నీ సందేహం? అప్పుడు “అది ద్వైతమా? ఏకత్వమా? ద్వైతమైతే చిన్మాత్రమునకు అద్దానిని దర్శించే ద్రష్ట వేఱుగా ఉంటున్నాడు కాబట్టి చిన్మాత్రాకాశము నిర్విషయం కాదు. ఒకవేళ ఏకత్వమే అయి ఉంటే ఆ ఏకత్వానికి ‘ద్రష్ట' లేడు కాబట్టి అద్దాని యొక్క ఉనికి దర్శించటానికి ద్రష్ట లేడు. కాబట్టి “ద్రష్ట లేనప్పుడు నిర్విషయ చిన్మాత్రము ఉన్నట్లుగా ఎలా ఎవరు చెప్పగలరు?” అను నీ సందేహం మొదలంట తొలగవలసియున్నది. అందుచేత నీ ప్రశ్నకు నా ప్రత్యుత్తరం విను.
88
ఓ రామచంద్రా! ఈ జగత్తునందు 1. చైత్యము అంటే తెలియబడేది (విషయాలు) (చేత్యం) 2.చేత్యత అంటే తెలుసుకొంటున్నది ... అనే రెండూ పాల్గొనుచున్నాయి కదా!
ఈ చిత్-చేత్యాలు రెండూ ఉంటేనే 'జగత్తు' అనేదో, దృశ్యం అనేదో (లేక) సుఖదుఃఖాలు అనుభవించటం అనేదో జరుగుతోంది. అయితే...
న కించిచ్చేతతి తతః కించిత్ కించిత్ కదాచన
సర్వం శాస్త్రం దృషన్ మౌనం విజ్ఞానఘనమంబరమ్ ॥
యథార్థానికి ఏ సమయంలోనూ, ఏ చోటా కూడా పైన చెప్పిన చేత్యం (అనుభవించబడే విషయాలు) గాని... (లేక) చేత (అనుభవం పొందుచున్న 'జీవుడు' అనబడునది) గాని లేనే లేవు. మరి?... ఈ సమస్తం కూడా - అనగా ఈ అనుభవం పొందేవాడు - ఈ అనుభవాలుగా ఏర్పడు చుండే విషయాలు కూడా చిదాకాశమే అయి ఉన్నది. అట్టి చిదాకాశం సర్వదా శాంతము, శిల వలె మౌన రూపం, విజ్ఞాన ఘనంగానే ఉన్నది. అనగా... “అనుభవించువాడు- అనుభవించ
Page:106
బడుచున్నది - అనుభవములు" అను మూడు ఏర్పడుచున్నప్పుడు, ఏర్పడనప్పుడు కూడా చిదాకాశం ఎట్టి మార్పు- చేర్పులు పొందటంలేదని గ్రహించు. ఓ చిదాకాశ స్వరూపులైనట్టి సర్వ జనులారా! ఈ దేహం - జగత్తు- ఈ అనుభవ పరంపరలు మొదలైనవి ఉన్న సమయంలోనూ, ఉండని సమయంలోనూ కూడా మీరు నేను ఈ రామచంద్రుడూ మనమంతా కూడా సర్వదా “అప్రమేయం-నిత్య బుద్ధం శాంతం-మహా మౌన స్వరూపం - విజ్ఞాన ఘనం” అగు చిదాకాశమే స్వస్వరూపంగా కలిగి ఉన్నామని గమనించెదరు గాక!
ఇక ఏ చేతితము[విషయములు (లేక) ప్రకాశింపబడుచున్నవి] కనిపిస్తూ ఉన్నదో... అదంతా కూడా స్వప్నమువలె చిత్స్వభావం తన యొక్క నిజసత్తయందు శాంతముగా ఉంటూనే అజ్ఞానాంగీకారముచే తనకుతానై జగద్రూపంగా స్ఫురించటం మాత్రమేనని గ్రహించండి. కనుక ‘జగత్తు’గా (లేక) దృశ్యంగా, లేక 'విషయం'గా పొందబడుచున్నదంతాకూడా ఆ పొందుచున్నవానితో సహా చిదాకాశమే గాని మరేదీ కాదు. అటు ద్రష్టగా, ఇటు దృశ్యంగా స్ఫురించుచున్నట్లు (అజ్ఞానంచే) అనిపించుచున్నప్పటికీ, వాస్తవానికి చిదాకాశము యథాతథంగానే ఉన్నది, ఉంటుంది. శ్రీరాముడు : “ద్రష్ట-దృశ్యం ఒక్కటే. ద్రష్ట యొక్క చిదాకాశస్వరూపమే ఒకానొక స్వకీయ విభాగము నందు దృశ్యముగా కూడా అగుచున్నది”... అని మీరిప్పుడు చెప్పుచున్న సిద్ధాంతం సమన్వయిం చుకొని గ్రహించటానికి వీలుగా మరికొంత దృష్టాంతపూర్వకంగా మాకు బోధించ ప్రార్థన. శ్రీ వసిష్ఠ మహర్షి : ఒకడు నిదురిస్తూ స్వప్నం కంటున్నాడు. ఆ స్వప్నంలో ఆ ఆ స్వప్న ద్రష్టకు కనిపించే నగరాలు, భవనాలు వాస్తవానికి ఉన్నాయా? లేవు. మరి వాటి వాస్తవ స్వరూపమేమిటి? వాటన్నిటి యొక్క వాస్తవ స్వరూపం స్వప్న ద్రష్ట యొక్క స్వప్నచిత్స్వరూపం కాక మరింకేమి కాదు కదా! అవన్నీ (స్వప్నంలోని విశేషాలన్నీ) చిదాకాశమే "ఈ ద్రష్ట-దృశ్యము (లేక) అనుభవిఅనుభవములు అనునవి రెండూ చిదాకాశ స్వరూపమే అయి ఉన్నాయి” అనటానికి దృష్టాంతం “స్వప్నం సత్యం కాదు కదా!”... అంటావా?
అజ్ఞానికి ఈ జగత్తు ఎట్లు రసానుభూతమై అనుభవమౌతుందో, అది ఆత్మజ్ఞానికి సత్యము కాదు. స్వప్న సమయంలో స్వప్నము వాస్తవమైనదాని వలె స్వప్నద్రష్టకు అనుభవమగుచున్నట్లు... ఇక్కడ చిదాకాశమే అజ్ఞానదృష్టికి “జగత్తు” అనబడు విషయాల సముదాయంగా అనిపించుచున్నది.
శుద్ధ చైతన్యము తనయందు ఈ "జ్ఞేయము (లేక) దృశ్యము” అనబడు దానిని ఎల్లప్పుడూ ఎఱుగుచున్నప్పటికీ తనయందు తానే సర్వదా జ్ఞేయాతీతమై వెలయుచున్నది. ఒక వైపు సృష్టి మొదలుకొని ప్రళయము వరకు జగత్తును స్ఫురణగా ఎఱుగుచూనే మరొక వైపు అట్టి స్ఫురణకు ఆవల ఏకాకృతియై వెలుగుచున్నది. ఆ చైతన్యం తన యొక్క “స్వభావం” అనబడు చిత్ స్వభావాకాశంలో తనయొక్క కల్పనచే ఈ "క్షణ-కల్పన-భావన-జగత్తు" గురించిన భ్రాంతిని ధరించుచున్నది. ఆ తేజోమయ చైతన్యము తన యొక్క చిత్స్వభావాకాశమున ఈ జగత్ కల్పనలను గావించుచున్నది. కాబట్టి,
Page:107
తస్మాత్ న ద్వైతమస్తిఇహ, న చ ఐక్యం, న చ శూన్యతా ! న చేతన-న అచేతనంవై మౌనమేవ న తచ్చ వా ॥
ఇక్కడ వాస్తవానికి ద్వైతమూ లేదు, ఏకత్వమూ లేదు, శూన్యత్వమూ లేదు-అట్లాగే చైతన్యచేతయిత (విషయాలు-విషయాలను పొందేది) మౌనం-అమౌనం మొదలైనవేవీ కూడా లేవు. ఎందుచేత నంటావా? చైతన్యం (దృశ్యం-విషయాలు-జగత్తు-తెలియబడునది) అనేది అధిష్ఠాన దృష్టిచే చిద్రూపం కంటే వేరు కానేకాదు కదా! వాస్తవానికి చైతన్యము ఏ సమయమందును దేనినీ ఎక్కడా చేతితం (ప్రకాశం) చేయటమే లేదు. కనుక చేతయిత (విషయాలను దర్శించేది/ పొందేదిఅనునది కూడా) (చిదాకాశం కంటే వేఱుగా) లేనేలేదు. చైత్యం చేత అనే రెండూ కూడా యథార్థానికి మిథ్య మాత్రమే! కనుక మౌనమాత్రమగు చైతన్యమే సర్వదా శేషించియున్నది.
ఓ రామచంద్రా! సమస్త వాఙ్మయ ప్రపంచంలోనూ, సమస్త సిద్దాంతాల అంతిమసారం కూడా “నిర్వికల్ప సమాధి” యే అత్యంతిక సిద్ధాంతమై ఉన్నది. అట్టి సమాధి యొక్క శాంత మౌన స్థితియే పరమావధి కనుక నీవు ఆత్మయందు మౌనముతో కూడిన స్థితిని కలిగి ఉండు. ఈ లోకదృష్టిచే ప్రస్తుతం యథా ప్రాప్తములైన రాజ్యపాలన పితృ-పితామహుల నుంచి ప్రాప్తించి క్రమమును అనుసరించి నిర్వర్తిస్తూనే “స్వదృష్టి" చే పరమార్థమౌనముతో కూడినవాడివై ఉండు. అన్నీ నిర్వర్తిస్తున్నప్పటికీ మోహములన్నిటినీ త్యజించినవాడవై, ఆకాశము వలె నిర్మలుడవై, విక్షేపములు లేనివాడవై ఆత్మయందే స్థితి కలిగి ఉండుము. జగత్తు - - మౌనము - ఉభయము ఏక సమయంలో కలిగి ఉండటమనేది ఈ సభలో పాల్గొనే అనేకమంది ఆత్మజ్ఞానులకు దైనందిన విషయమే సుమా! వారంతా లోకదృష్టితో లోకమున వ్యవహరిస్తూనే ఆత్మదృష్టిచే ఘనీభూతమైన మౌనస్థితిని అంతరంగమున వహించియే ఉంటున్నారు.
29. బ్రహ్మ సత్యం - జగన్మిథ్యా
శ్రీరాముడు : మహర్షీ! తమ ప్రవచనం అమోఘం, శిరోధార్యం కూడా! ఇప్పుడు మీరు చూస్తూ వస్తున్న విద్యాధరీ బ్రహ్మాండము యొక్క మహాప్రళయ సందర్భంలో చూచిన "ప్రళయ కాలరుద్రుడు-ఛాయా భగవతి" ల విలయతాండవం విశేషాలు మనం చెప్పుకుంటున్నాం కదా! ఆ కాళీదేవి “చాట-ఫలములు" మొదలైన వాటితో కూర్చబడిన మాలను ఎందుకు ధరించింది? ఏ కారణం చేత నృత్యం చేస్తోంది. ఈ విషయాలు ప్రవచించమని ప్రార్థన. ఆ కాళీదేవి ఎవరు? ఆ శివరూపుడగు రుద్రుడు ఎవరు? ఎందుకా నృత్యం? వారిరువురికి సంబంధ-భేదములు ఎట్టివి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ భైరవుడు చిదాకాశమగు శివస్వరూపుడే! ఇక ఆ కాళికాదేవి అతనికంటే వేఱుకాదు. ఆ దేవి ఆ నిర్మల చిదాకాశరూపము యొక్క స్పందన శక్తియే! అతని మనోమయరూపమే ఆ దేవి.
Page:108
దృష్టాంతానికి... వాయువు అద్దాని స్పందనము (కదలుచున్న వాయువు యొక్క కదలిక అగ్ని-అద్దాని ఉష్ణత్వము అనునవి మొదటిదానికి రెండవది అభేదము కదా! అయినా స్పందనము చేతనే వాయువు తెలియబడుతోంది. ఉష్ణత్వముచే అగ్ని తెలియబడుతోంది. అట్లాగే చిన్మాత్రరూపుడు పరమశాంతుడు అగు శివుడు స్పందన రూపమగు మాయాశక్తి చేతనే ఎఱుగబడగలడు గాని, అన్యథా కాదు. అట్టి ఆ శివుడు బ్రహ్మం కంటే వేఱు కాదు. ఎందుకంటే శ్రుతులు, వేదాలు, బ్రహ్మ వేత్తలు ‘ఆ శివుడే బ్రహ్మం' అని సిద్ధాంతీకరిస్తున్నాయి. నిరాకారమగు "ఇచ్చ” చే సాకారమగు చిత్ర లేఖనం, శిల్పం నిర్మించబడుచున్నాయి కదా! అట్లాగే శివుని యొక్క నిరాకారమగు స్పందన శక్తియగు ఇచ్ఛారూపిణి కాళీదేవి ఈ దృశ్యమునంతా విస్తరింపజేస్తోంది.
శివుడు - శివేచ్ఛ - క్రియ :
ఈశ్వరేచ్ఛ : నిరాకారమైనట్టి శివుని యొక్క ఇచ్ఛయే ఈ జగత్తును నిర్మించుచున్నది. ఆరాధనారూపం : అట్టి ఇచ్ఛాశక్తి యొక్క అరాధనా రూపమే కాళీదేవి.
ఆ ఇచ్ఛా-క్రియా రూపిణియే సర్వజీవుల యొక్క జీవన హేతువు అయి ఉండటం చేత “జీవ చైతన్యము” అనికూడా పిలువబడుతోంది. ఈ కనబడేదంతా శివేచ్ఛయే!
ఆ శివేచ్ఛయే ఇంకా... స్వయంగా జగద్రూపంగా పరిణమించి ఉండటం చేత ప్రకృతి రూపంగా ప్రదర్శితమౌతోంది. 'దృశ్యాభాస' యందు అనుభూతమగుచు 'ఉత్పత్తి-స్థితి-వినాశనము’ మొదలైన వికారములను ప్రదర్శించుచుండుటచే 'క్రియా స్వరూపిణి' అనిపించుకుంటోంది.
ఇంకా కూడా చెప్పాలంటే ఆ “శివేచ్ఛా స్వరూపిణి” యగు కాళీ భగవతియే... బడబాగ్ని స్వరూపంతో అంతయూ దహించి వేయుచుండటం చేత 'శుష్క' అని దుష్ట శిక్షణా వ్యాసంగం కలిగి ఉండటం చేత 'చండిక’ అని, నీలకమల వర్ణముచే ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ‘సోత్ఫల’ అని, ప్రార్థించు భక్తజనులకు జయమును ప్రసాదించటంలో 'తత్పరత' కలిగి ఉండటం చేత 'జయ' అని, ‘జయంతి’ అని 'విజయ' అని, మహా పరాక్రమశీలి, అయి ఉండటం చేత 'అపరాజిత' అని, గ్రహించుటకు కష్టసాధ్యమై ఉండటం చేత 'దుర్గ' అని, ఓంకారము యొక్క సారభూతమైన తత్త్వమై ఉండటం చేత... అనగా ‘ఉమ’* అని, గానం చేసేవారికి (జపించే వారికి) పరమ పురుషార్థం ప్రసాదిస్తుంది. కాబట్టి ‘గాయత్రి’ అని, సంతతి యొక్క స్థితికి తానే కారణం కాబట్టి ‘సావిత్రి’ అని కర్మ-ఉపాసన-జ్ఞానము మొదలైన ఉత్తమ దృష్టులను, ప్రేరణను ఆరాధకులకు అందించుతుంది. కాబట్టి 'సరస్వతి’ అని, గౌరవర్ణపు దేహంతో ధ్యానించే వారికి అభయప్రదాతగా స్ఫురిస్తుంది. కాబట్టి 'గౌరి' అని, జగదుత్పత్తికి కారణభూతుడగు భవుని అర్ధాంగి కాబట్టి (మహేశ్వరుని దేహమును అర్ధభాగం ఆశ్రయించి-ఆక్రమించుకొని ఉంటుంది కనుక) 'భవాని' అని...
అ + ఉ + మ,
అ = శుద్ధ చైతన్య స్వరూపమగు శివుడు; ఉమ = ఇచ్ఛ - ప్రేరణా స్వరూపమగు శక్తి
Page:109
ఈ త్రిలోకములోని సర్వప్రాణులు నిద్రిస్తున్నప్పుడూ మేల్కొని ఉన్నప్పుడు కూడా వారిలో ప్రతి ఒక్కరి హృదయంలోనూ అకార ఉకార మకారములకు అతీతమైన ప్రణవనాద భాగమగు శబ్ద బ్రహ్మ స్వరూపముతో 'ఉ...ం...' అను ఉచ్చారణ స్వరూపిణి అయి ఉంటోంది. అందుచేత “ఇందు కళారూపిణి” అని 'ఉమ' అని పురాణాదులచే, మంత్రద్రష్టలచే, యోగపరాకాష్ఠపరులచే పరికీర్తించబడుతోంది.
ఓం కాళీభ్యాం నమః ఓం జయంతిభ్యాం నమః ఓం ఛాయారూపిణీభ్యాం నమః ఓం విజయాయ నమః
ఓం ఇచ్ఛాస్వరూపిణీభ్యాం నమః ఓం అపరాజితాయ నమః
ఓం స్పందస్వరూపిణీభ్యాం నమః ఓం దుర్గాయ నమః
ఓం మాయాశక్తిభ్యాం నమః ఓం ఓంకారసార ఉమాయ నమః
ఓం దృశ్య విస్తారకారిణీభ్యాం నమః ఓం గాయత్రీభ్యాం నమః
ఓం జీవచైతన్యభ్యాం నమః ఓం సావిత్రీభ్యాం నమః ఓం ప్రకృతిమాతాభ్యాం నమః ఓం సరస్వతీభ్యాం నమః ఓం భగవతిభ్యాం నమః ఓం గౌరియే నమః
ఓం శుష్కాయ నమః ఓం అకార-ఉకార మకారాతీతాయ నమః
ఓం చండికాయ నమః ఓం ఇందుకళారూపిణీభ్యాం నమః
ఓం జయాయ నమః
ఓ రామచంద్రా! శివుడు ఇచ్ఛాదేవి ఈ ఇరువురు ఆకాశరూపులే అగుటచే వారిద్దరు శ్యామ వర్ణ (నీలివర్ణం) శరీరులుగా ఆరాధించబడుచున్నారు. వాస్తవానికి ఇరువురు చిదాకాశరూపులే అయినప్పటికీ-అనగా, ఎట్టి వర్ణం ఆపాదించటం కుదరనిది అయినప్పటికీ వారి శరీరాలు (ఉపాసకుల) సృష్టి సంకల్ప దృష్టిచే మాంసమయ శరీరాలు శ్యామవర్ణంగా స్ఫురిస్తున్నాయి. చిదాకాశ స్వరూపులగు వారిరువురు చిదాకాశమునందే సర్వదా స్థితి కలిగి ఉన్నారయ్యా!
వారిరువురు ఆది స్వరూపులు కదా! అతి స్వచ్ఛస్వరూపులగు వారిరువురిని ఆకాశరూపులుగా గ్రహించు. హస్త-పాద-ముఖ-శిరస్సు మొదలైనవాటిని కలిగియుండి బహుత్వ-అల్పత్య భేదాలతో “నానాత్వం” ధరిస్తూ ఉన్నప్పటికీ వారిరివురు సర్వదా ఏకరూపులేనని మా అనుభూతపూర్వకమైన
అనుభవం.
“ఆ దేవి శూర్ప (చాట)-ఫలములు మొదలైన వాటితో కూడిన మాల ఎందుకు ధరించింది?”
అంటావా?
ఆ భగవతి ఒకవైపు ‘అనాది, అనంతం' అయినట్టి చిచ్ఛక్తి స్వరూపిణి. అట్టి భగవతీదేవి ‘స్వ-ఇచ్ఛ' చేత స్వయంగా సర్వవైదిక క్రియారూపిణి అయింది. అట్లే దాన-స్నాన-యాగాది శ్రేష్ఠ శరీరరూపిణి కూడా అయింది. ఆ దేవి యొక్క నానా ప్రకారాలైన అభినయాలతో కూడిన నర్తనములే
Page:110
ఈ సృష్టులు, ఈ జరామరణాది బ్రహ్మ కల్పితములగు క్రియా ప్రదర్శనములు కూడా! ఆమె వాస్తవానికి రూపరహితయే! అయితే రూపరహితకు క్రియలు అప్రసిద్ధము కదా! అందుచేత ఆమె కల్పితాలగు క్రియా ప్రదర్శనాలు కూడా! కల్పిత అవయవి! ఆయా వస్తు గ్రామ-నగర-ద్వీపమండల సమూహాలను తన శరీరంగా ధరించినదై క్రియా రూపత్వం ప్రకటించుచున్నది.
కాళీ భగవతి : కల = 'ధారణ' మొదలైన సర్వక్రియా వాచక ధాతువు. కల శబ్దం నుండి ‘కాళీ’ అనే శబ్దం ఉత్పన్నమైనది. ఆ కాళీభగవతి బ్రహ్మాండ రూపం గల బీజకోశాలను తన యందు ధరిస్తూ వాటి యొక్క ఉత్పత్తి-పాలన మొదలైన క్రియలన్నిటికీ కారణమగుచూ... స్వయంగా ఆ మొదలైన క్రియలన్నిటినీ నడుపుతోంది. స్వయంగా క్రియారూపిణి అయి ఈ దృశ్య శోభనంతో తన యందు ధరిస్తోంది. 'అనేక కోటి బ్రహ్మాండ జననీ-దివ్యవిగ్రహా' అని స్తుతించబడుతోంది. అయితే, ఈ జగత్తులన్నీ తన అవయవాలుగా కలిగి ఉన్నప్పటికీ పరమార్ధమున 'శివేచ్ఛా - క్రియా స్వరూపిణి - చిద్రూపిణి' యగు ఆ దేవి ఎచ్చట కూడా ఏ సమయమందునూ అవయవ సహిత అయి ఉండనే లేదు.
శివ - శివా : ఓ రామచంద్రా! శివేచ్ఛా-క్రియా స్వరూపిణి యగు ఆ భగవతి శివునికంటే వేఱుగా లేదు సుమా! కనుక ఆ దేవిని శివరూపిణిగానే గ్రహించు. అంతేకాదు. ఆకాశమునకు శూన్యత్వము, వాయువునకు స్పందత్వము, చంద్రునికి ప్రకాశత్వము వాటి వాటి అంగములే కదా! అట్లాగే ఈ క్రియారూపమగు దృశ్యము కూడా ఆ భగవతీదేవికి అంగము వంటిదిగా దర్శించటం సర్వదా అభ్యసించు. అట్లు దర్శిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దేవి యొక్క స్వరూపం వాస్తవానికి శివము-శాంతము-స్వభావ సిద్ధము-అవ్యయము-నిర్మలము అగు చైతన్యమేనని ఎఱిగి ఉండు.
నిష్క్రయాస్వరూపిణి : సృందాస్పందాతీత - ఆ చైతన్యమునకు కించిత్ కూడా స్పంద ధర్మంగాని, అస్పంద ధర్మంగాని లేదు. అజ్ఞానవశం చేత స్పంద-అస్పంద రహితమగు చైతన్యం క్రియారూపంగా కనిపిస్తోంది. ఎప్పుడు జ్ఞానవంశం చేత తన క్రియా స్వభావం నుండి తొలగి వాస్తవ స్వభావంతోటి వర్తిల్లునో, అప్పుడు ఆ దేవియే శివస్వరూపంగా వచించబడుతోంది.
క్రియాస్వరూపిణి - కూటస్థ చైతన్యశక్తి స్వరూపిణియగు ఆ దేవి తనలో తన యొక్క స్పందజడ భావములతో కూడి ఉంటోంది. అట్లు కూడి ఉండుటచే 'క్రియ' అను శబ్దంచే చెప్పబడుతోంది. తన స్వాభావికమైన చిన్మాత్ర స్వభావంతోటి ఉంటున్నప్పుడు ఆమెయే 'శివ స్వరూపం' అగుచున్నది.
ఇదం జగత్ దృశ్య స్వరూపిణి - ఆ భగవతీదేవి క్రియా రూపిణి, చిత్-శక్తి సమన్విత. మహత్తర మైన ఆకారం కలది. ఈ అనేక జన సమూహయుక్తములై, ప్రకాశితములై కనిపించే సృష్టులు, ఈ లోకాలు-ఇవన్నీ కూడా ఆ దేవికి అభిన్నములైన అవయవాలు. ఈ దేశ దేశాంతరాలతో కూడిన భూమి, వనభూములు, పర్వతములు, సాంగ-ఉపాంగములతో కూడిన మూడు వేదాలు, విద్యాస్థాన యుక్తములైన సర్వగీతములు, విధి-నిషేధములతో కూడిన శుభాశుభ కల్పనలు, సర్వయజ్ఞములు, భక్ష్యములైన పురోడాశములు, సర్వ యజ్ఞపాత్రలు, సమస్త యజ్ఞభస్మములు, సమస్త ప్రాణికోట్లు,
Page:111
సప్తద్వీపములు, 14 లోకములు- ఇవన్నీ కూడా 'కల్పితాకారధారిణి' యగు దేవి యొక్క విభిన్నములైన అభిన్నావయవములు అయి ఉన్నాయి. అట్లే మాకు అనుభూతమగుచున్నాయి. శ్రీరాముడు : స్వామీ! మీరు ఆ భగవతి గురించి చెప్పేటప్పుడు - - ఆ దేవి శివస్వరూపిణియేనని, ఈ బ్రహ్మాండములన్నీ ఆమె దేహమేనని, జగత్ భావనావశం చేత బ్రహ్మాండములను భావనామాత్రంగా ధరిస్తోందని, ఈ జగత్ దృశ్యమునకు అభిన్నమని, జగత్ దృష్టి తొలగుటచే ఆమె శివస్వరూపిణియేకాని, శివునికి-భగవతికి భేదమే లేదని, శివుని నుండి బయల్వెడలిన ఇచ్ఛాస్వరూపమే ఆమె అని, ఇచ్ఛా క్రియల సంయోగమే ఆమె అని...
ఇట్లు పరస్పర భేద-అభేదముల కలయికతో ప్రవచిస్తున్నారు. ప్రభూ! ఇది ఇట్లా ఉండగా, ఇంతకుముందు మీరు రుద్ర-కాళీ రూపధారిణి యగు చైతన్యము యొక్క శరీరంలో కనబడిన భూత-భవిష్యత్ కాల సృష్టి-ప్రళయముల గూర్చి వర్ణించి చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్నను విన్నవించుకుంటాను. ఆత్మయందు (శివుని యందు) సృష్టి-ప్రళయములు ఉన్నాయా? లేవా? అవన్నీ వాస్తవములా? అవాస్తవములా? చెప్పవలసినదిగా ప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ చితశక్తి ప్రేరణస్వరూపిణియై ఈ సర్వజీవుల యందు ప్రకాశిస్తోంది. ఆ చిత్శక్తియే ఈ జీవుల కర్మవాసనానుసారం దేనిని గూర్చి ఎట్లు ప్రేరణ చేయు చున్నదో... అది అట్లు సత్యంగానో, (లేక) అసత్యంగానో పొందబడుచున్నది. అద్దంలో ప్రతిబింబంఆ ప్రతిబింబ వస్తువుల కదలికలు వాస్తవం కాకపోయినా వాస్తవంగానే కనిపిస్తాయి కదా! పూర్వ వాసనలు కారణంగా చైతన్యం విషయములందు దృశ్యములందు సత్యరూపంగానే ప్రతిబింబించి, సత్యముగానే అనుభవ ప్రాప్తి పొందుచున్నది.
వాసనాయుతులైన జీవుల అనుభవబలం చేత ఈ జగదనుభవాలు సత్యంగానే పొందబడు చున్నవి. యథార్థానికి జీవులంతా చిద్రూపులే కదా! చిద్రూపంలో అచిద్రూపం ప్రవేశించదు కదా!
కనుక ఈ సర్వ దృశ్య పదార్థములన్నీ కూడా సంకల్పనగరం వలె మిథ్యయే అయి ఉండి, వాసనా ప్రభావం చేత సత్యం వలె అనుభవించబడుచున్నాయి. అట్టి వాసనలు దృఢమైన నిర్మల చిత్రాధాన్యం చేత మాత్రమే క్షయిస్తాయి. వాసనలు జయించిన మనుజునికి 'దృశ్యం’ అనబడు ప్రసక్తియే ఉండదు. దృశ్యముగా కనిపించేదంతా అతనికి పరమాత్మ స్వరూపంగానే సుస్పష్టబడు చున్నది. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్ట యొక్క భావనా ఊహాతరంగ పరంపరలే! కనుక స్వప్న ద్రష్టకు వేరైన సత్తా స్వప్నమునకు లేదు. అట్లాగే ఈ జాగ్రత్ దృశ్యం జాగ్రత్ ద్రష్ట యొక్క వాసనా సమూహం (లేక) వాసనా తరంగాల సాఫల్యం అయి ఉన్నది.
పరాభవం (పరా+అభవం) అంటే ఈ దృశ్యాన్ని తదితర జీవులను పరమాత్మ ప్రదర్శంగా దర్శించకపోవ పరమాత్మకు భిన్నమై ఉన్నట్లు దర్శించటం.
ఎందుకంటే... 'దృశ్యం' ఒక్కటే అయినప్పటికీ వేఱువేఱు ఆకారదర్పణాలలో (కుంభాకార, పుటాకార, రంగులతో కూడిన, ఎత్తుపల్లాలతో కూడిన, గీతలతో కూడిన వివిధ రకాలైన దర్పణా
Page:112
లలో వివిధ రీతులుగా కనిపించుచున్నది కదా! అట్లాగే పరమాత్మకు వాస్తవానికి అభేదమే అయిన ఈ దృశ్యము ప్రతిజీవుడు తన యొక్క వాసనాదర్పణమునందు ప్రతిబింబించు భావన -
అనుభవాదుల ద్వారా, తదనుగుణంగా సమకూర్చి పొందుచున్నాడు.
స్వప్నాంతర్గతమైన విశేషాలు స్వప్న సమయంలో స్వప్న ద్రష్టకు వాస్తవమనియే అనిపిస్తు న్నాయి. ఊహానగరం, ఊహ కొనసాగుచుండగా, అదంతా సత్యముగానే అనుభవమౌతోంది. ఎందుచేత? అవి ఆయా సమయాలలో ప్రతీతి (నమ్మిక)తో కూడిన భావనచే పొందబడటంచేత! అట్లాగే ఈ సృష్టి కూడా ఇద్దానిని గాంచుచున్న కాలంలో అర్ధ-క్రియా సామర్థ్యాలను కలిగి ఉండటం చేత, అట్టి ‘దృష్టి’ కొనసాగుచున్న సమయంలో అర్ధ క్రియాపూర్వకంగా సత్యమనియే అనిపిస్తోంది. శ్రీరాముడు : మహాత్మా! ఈ ప్రపంచంలో ఆయా పదార్థములు మొదలైనవన్నీ కొందరికి ఉచ్ఛమైన విగా, అవే పదార్థములు మొ॥వి మరికొందరికి నీచము-అల్పము అయినవిగాను అనిపిస్తూ ఉంటోంది కదా! ఇట్లా ఎందుకు జరుగుతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపం వాస్తవానికి అనన్యమగు ఆత్మయే అయి ఉన్నది. అయినా కూడా ఒకే మట్టి అనేక నామ రూపాలు గల బొమ్మలుగా ప్రతితీ పొందుచున్నది కదా! అయితే అన్ని బొమ్మల వాస్తవ స్వరూపం మట్టియే కదా? మట్టిచే తయారు కాబడిన కోతి-ఆకారానికి మట్టికి సంబంధమేముంటుంది? అయినా కోతి రూపంగా కనించేదంతా మట్టియే కదా!
ఈ విధంగా ద్రష్టలందరూ దేహ-మనో-బుద్ధ్యాదుల దృష్ట్యా వేర్వేరుగా కనిపించవచ్చుగాక! అయినప్ప టికీ ద్రష్టలందరూ ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు. అట్టి ఆత్మ సర్వదా యథాతథం, త్రికాలములచే అబాధ్యం అను నిస్సందేహమగు పరిజ్ఞానమే 'ఆత్మయోగం' అని, 'మోక్షం' అని ‘సమాధి’ అని ఆయా మొదలైన పేర్లతో పిలువబడుతోందని గ్రహించు. ఇక మనో బుద్ధ్యహాంకారా లను మనం అంగీకరించినప్పటి దృష్టికి 'వేర్వేరు ద్రష్టలు' అనునది అనుభవసిద్ధమగుచున్నది. ఇక ఏ పదార్థం ఏ ద్రష్టకు ఏ ఏ అర్ధ-క్రియా సమర్థమై ఉంటోందో, అతని దృష్టికి ఆ పదార్థాదులు ఆయా విధంగానే సత్యభూతాలై అనుభవమగుచున్నాయి. ఆ ఆ పదార్థాలు అట్టి ద్రష్టస్థితిని పొందనట్టి అన్యునికి ఆయా పదార్థముల పట్ల అట్టి దృష్టి ఏర్పడటమే లేదు.
భూత-భవ్య-భవిష్యస్థాః సంకల్ప స్వప్న పూర్గణాః సర్వేసత్యా పరం తత్త్వం! సర్వాత్మా కథమ్ అన్యథా?
ఓ రామచంద్రా! ఈ భూత వర్తమాన భవిష్యత్తులలోని పదార్థ సమూహాలు, స్వప్నములోనిసంకల్ప రాజ్యంలోని నగరాలు మొదలైనవి-ఇవన్నీ కూడా ఆయా దశలందు సత్యమే అయి ఉన్నాయి. ఎందు కంటావా? అట్లా కాకపోతే “ఆత్మతత్త్వమే సర్వరూపం” “ఇదంతా ఆత్మయే” అనే వేదవాక్యం పొసగదు కదా!
ఈ ఈ జాగ్రత్లోని ఆయా నగరాలన్నీ సత్యము కాబట్టే మనం ఇక్కడి నుండి బయలుదేరి ఆయా నగరం ప్రవేశించి ఆ నగరంలో ఆయా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం.
Page:113
అట్లాగే స్వప్నములోని వ్యవహారం సత్యము కాబట్టే యోగులు ఇతరుల స్వప్నములో ప్రవేశించి ‘బోధించటం-సూచించటం' మొదలైనవి నిర్వర్తిస్తున్నారు. అట్లాగే యోగశక్తిచే యోగులు తమ ప్రియతమ శిష్యుల మనో ఆకాశంలో ప్రవేశించి వారికి అనుభవ విషయంగా దర్శనమిచ్చి (మనం ఇతర ప్రదేశములలోని పర్వత గ్రామాలు పొందుచున్నట్లుగా ఆయా క్రియా-వ్యవహారాలు (ఆ తదితరుల మనస్సులో) నిర్వర్తిస్తున్నారు.
శ్రీ రాముడు : స్వామీ! కాళీమాత నృత్యం చేస్తున్నప్పుడు ఆ జనని దేహములోని జగత్తులు ఒకదానితో మరొకటి ఢీకొనక కదలకయే ఉంటున్నాయా? ఇది ఎట్లు? ఆమె కదలికలతోబాటే ఆ జగత్తులు కూడా క్రింద మీద పడాలికదా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆమె విలయతాండవం చేస్తున్నప్పటికీ ఆమె దేహములోని జగత్తులందలి ఆయా పర్వత-నదీ-నగరాదులు ప్రకంపనము పొందకయే నాకు కనిపించాయి. ఎట్లా అంటావా? ఇప్పుడు చూడు! ఒకడు ఒక మంచంపై నిదురిస్తూ కల కంటున్నాడనుకో! అతని మంచమును మనం అక్కడి నుండి మరొకచోటికి తరలిస్తున్నప్పటికీ అతని స్వప్నములోని నగరాదులు చలింపకయే ఉంటాయి కదా! ఆ నృత్యం సమయంలో కాళీ భగవతి యొక్క దేహము చలించుచున్నప్పటికీ ఆమె యొక్క శరీరములోని జగత్ అంతర్గత నగర పర్వతాదులు చలించటమే లేదు.
ఓ రామచంద్రా! ఈ త్రిలోకముల మహారంభసంరంభమంతా ఆయా దశలందున్న మనుజులకు సత్యముగా తోచినప్పటికీ, వాస్తవానికి “భ్రాంతి మాత్రమే” అయి ఉన్నది. భ్రాంతి అయిన దానికి కదలటం ఏమున్నది? కదలకపోవటమేమున్నది? స్వప్నంలో కనిపించే మిత్రులు, గృహములు, సంపదలు సత్యముగా ఉన్నదెప్పుడు? (మెళుకువ వచ్చేసరికి అవి ఉండవు కనుక) మిథ్య కానిదెప్పుడు? ఉన్నదెపుడు? (స్వప్న సమయంలో వాస్తవంగానే అనుభూతమౌతోంది కనుక) నశించినదెపుడు? స్థితినొంది ఉన్నదెపుడు? చెప్పు? అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే ఏం చెపుతాం? అందుచేత బిడ్డా! ఈ ఎదుటగా కనిపిస్తున్న దృశ్యశోభ అంతా భ్రాంతి మాత్రమే! ఈ జగత్ శోభనంతా భ్రాంతి మాత్రంగాను, అవాస్తవంగాను ఎఱిగియే ఉండెదవుగాక!
“మరి మాకు వాస్తవంగానే కనబడుతోంది కదా?" - అని ఎవరైనా అంటారేమో? “సంకల్పము (లేక) ఊహ” తో కూడి ఉన్న దృష్టికి జగత్తు అనుభవమౌతోంది. “స్వప్నము” నందు, కథను చదువుచున్నప్పుడు, (లేక) వింటున్నప్పుడు, 'నాటకం' చూస్తున్నప్పుడు 'భ్రమ' యందు - ఆయా అనుభవములను నమ్మికతో అనుభూతిపరంగా పొందటం ఎటువంటితో, ఈ జగత్తు యొక్క “వాస్తవం” అనిపించే అనుభవం అటువంటిదే! నాటకం చూచి శోకించేవారునవ్వేవారు–కోపించేవారు జాలిపొందేవారు ఆశ్చర్యపడేవారు మౌనంగా చూచేవారు ఉంటున్నట్లే జనులు ఈ జగత్తును చూస్తూ నవరసాల అనుభవములను పొందుచున్నారు.
Page:114
ఓ రామచంద్రా! వాస్తవానికి చైతన్యము-జగత్తు ఇత్యాది వ్యవస్థ లేనేలేదు. ఆకాశంలో కంటిదోషం చేత వెంట్రుకలు కనిపించునట్లు, మెల్లకన్నువాడికి ఒకే స్తంభం రెండుగా అగుపించు నట్లు ఈ ‘జగదనుభవం’ అనబడేది జగత్తు దృష్ట్యా భ్రాంతియే అయి ఉన్నది. కానీ చిత్స్వరూపము ఎట్టిదో ఎఱిగినప్పుడు అట్టి భ్రాంతి తొలగిపోతుంది. అప్పుడు 'ఈ జగత్తంతా, ఇందులోని నగరాలు-దేహాలు-సందర్భములు-సంఘటనలు మొదలైన వాటితో సహా సర్వదా యథాతథమై ఉన్న చిదాకాశమే’ అని నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా ఎఱుగబడగలదు. ఆ చిదాకాశమే నీ-నామన-వారి-అక్కడి-ఇక్కడి ఏకాంత-నిర్విషయ సర్వస్వరూపంగా ఆస్వాదించబడుతుంది. ఇప్పుడు మనం ఆ భగవతీదేవి-రుద్రభగవానుల నృత్య విశేషానికి వద్దాం.
30. ఆత్మానందం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ ప్రకారంగా ఆ దేవి తన యొక్క సుదీర్ఘమైన భుజమండలంచే ఆకాశ విభాగాన్ని భీకరారణ్యంగా చేసివేస్తూ నృత్యం చేస్తోంది. ఆ దేవి అజ్ఞాత-నిర్వికార చైతన్యశక్తితో కూడిన క్రియారూపిణి కదా! ఆ నృత్యం స్వభావ సిద్ధంగానే సల్పుచున్నది. కళా-క్షణ-ఘటికమాసాదులతో కూడిన కాలచక్రమంతా ఆ దేవి పమిట యొక్క విన్యాసంలా ఒప్పుచున్నది. హృదయమున ఊహా చైతన్యము, 'నగరములు' మొదలైన ఆకారములు ధరించుచున్నది కదా! ఆ భగవతి తన యందు అట్లే జగత్తులను, కాల విన్యాసమును చమత్కారంగా ఆభరణాలుగా అలంకరించుకొని అనేక నాట్య భంగిమలు ప్రదర్శిస్తోంది.
కల్పనయే జగద్రూపంగా అగుచున్నది. అట్లే, ఆ దేవియే 'జగద్రూపం' అయి ఉన్నది. వాయువునందు స్పందము (కదలిక అను స్వభావం) ఉన్నట్లే శివుని యందు ఆ భైరవీదేవి కలదు. స్పందం వాయువు కంటే వేఱ? కాదు. శివేచ్ఛ కూడా శివుని కంటే వేఱు కాదు. కనుక శివుని వలెనే శివేచ్ఛాస్వరూపిణియగు ఆ స్పందదేవి నిర్మలం-ప్రశాంతం అయి వర్తిస్తోంది. ఆకాశం వస్తుతః నిర్వికారం. అట్టి నిరాకారమగు ఆకాశమునందు 'శబ్దము-సంచలనము' మొదలైన అడంబరమంతా ప్రకటితమగుచున్నట్లు... నిరాకారమగు నిజేచ్ఛ జగత్తును విస్తరింపజేస్తోంది.
శివస్పర్శ - ఆ విధంగా ఆ దేవి చిదాకాశమున నృత్యం చేస్తూ ఉన్నది. ఇంతలో ఒకానొక చమత్కారం జరిగింది. ఆ దేవి కాకతాళీయ యోగముచే ... ప్రేమవశంగా సమీపమున ఉన్న శివుణ్ణి స్పృశించింది.
ఆ స్పర్శ మాత్రం చేత తన యొక్క "ఆవరణ శక్తిని దూరీకరించుకొన ప్రారంభించింది. సముద్ర తరంగాలు తమ తరంగ శక్తిలోంచి బడబాగ్నిని సృష్టించుకొని ఇక ఆ బడబాగ్నిలో ప్రవేశించి స్వవినాశనం పొందుతాయి చూచావా? ఆ విధంగా ఆ శివ స్పర్శచే ఆ దేవి తన రూపాన్ని కోల్పోతూ క్రమక్రమంగా శివునితో ఐక్యం కాజొచ్చింది. పరమకారణమగు శివుని స్పర్శించినంత మాత్రం చేతనే మెల్లగా సూక్ష్మమగుచు తన యొక్క 'వాస్తవ స్వభావము'ను పొందనా రంభించింది.
Page:115
మొట్టమొదట ఆ దేవి తన అనంతాకారమును విడచి పర్వతాకారమాత్రంగా అయింది. ఆ పిదప నగరాకారమాత్రంగా అయింది. ఆ తర్వాత సుందరమగు వృక్షాకారమాత్రంగా అయింది. ఆ తదుపరి 'అవ్యాకృతాకాశ రూపము'ను ధరించి నది సముద్రంలో ప్రవేశించునట్లు శివుని ఆకారమున ప్రవేశించింది. అప్పుడు...
ఏక ఏవా భవదథో శివయా పరివర్జితః ॥
శివ ఏవ శివః శాస్త్ర ఆకాశే శమనో ఖితః ॥
భవానీ లయస్వరూపుడు, సర్వసంహారకర్త, శాంతుడు భక్తులకు మంగళప్రదుడు, సర్వ ఉపద్ర వాల నుండి కాపాడువాడు అద్వైతరూపుడు అగు శివుడు మాత్రమే ఆకాశంలో ఒప్పుచున్నాడు. శ్రీరాముడు : స్వామీ! శివుని స్పృశించిన మాత్రం చేత ఆ పరమేశ్వరి ఎందుచేత శమించింది? ఆ విశేషమంతా ఏమిటో, తెలియజేయ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : 'తరంగము' అనేది జలము యొక్క స్వాభావిక శక్తియే కదా! అగ్నికి ‘ఉష్ణత్వము’ అనేది అట్లే స్వాభావిక శక్తియే కదా! అదే రీతిగా శివుని యొక్క స్వాభావిక విశేషమే శివేచ్ఛ-క్రియా విశేషముల స్వరూపమగు ఛాయదేవి. ఆ దేవియే 'ప్రకృతి' అని, 'శివేచ్ఛ' అని, 'పరమేశ్వరి' అని
‘ఆది జగన్మాయ’ అని... వివిధ నామ రూపములచే ప్రసిద్ధికెక్కి ఉంటోంది. 'ఈ ప్రకృతియే ఆ దేవి యొక్క రూపం' అనికూడా చెప్పబడుతోంది.
శివరూపధారియగు పరమేశ్వరుడు ఈ ప్రకృతికంటే పరమైనవాడు. అతడు వాయువు వలె సర్వవ్యాపి, వాయురూపుడు, పరమశాంతుడు, మేఘరహిత ఆకాశమువలె ప్రశాంతశీలుడు, పరమ పురుషుడు, శివా నందస్వరూపుడు, నిర్వికారుడు, నిత్యతృప్తుడు అయి ఉన్నాడు. అట్టి "ఆద్యంత రహితుడు-ద్వైతవర్జితుడు" అగు పరమశివుని గాంచనంత వరకు “భ్రమరూపిణి - స్పందమాత్ర స్వరూపిణి-చిత్ శక్తి-పరమేశ్వరేచ్ఛ” అగు ప్రకృతీదేవి సంసారమున పరిభ్రమిస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రకృతీదేవి కేవలం 'జ్ఞానమాత్ర స్వరూపిణియే’ అయి ఉండటంచే ఆ జ్ఞానస్వరూపిణి శుద్ధ తత్త్వమగు శివుని కాకతాళీయ యోగంచే స్పర్శించగానే, ఆ శివుని యందు పూర్ణంగా తన్మయ మగుచున్నది.
అజ్ఞానంచే ప్రకృతి పురుషునికి ద్వితీయమైనట్లుగా కనిపిస్తుంది. జ్ఞానయోగ స్పర్శచే ఆ ప్రకృతి (పురుష స్పర్శచే) అనిర్లిప్త-నిర్వికార శివునితో ఏకత్వం పొందినదై అతనిలో 'అద్వితీయత' సంతరించుకుంటోంది. అది “ద్రష్టచే దర్శించబడే దృశ్యం ద్రష్ట నుండి బయల్వెడలి తిరిగి ద్రష్టయందే
లయించటం” వంటిది సుమా!
ప్రకృతిః పురుషం స్పృష్ట్వా ప్రకృతిత్వం సముజ్ఞతి తదన్తరేకతాం గత్వా నదీరూపమివ అర్జవే ॥
జలమాత్ర స్వరూపమగు నది సముద్రమునందు కలియగానే తనయొక్క ద్వితీయత్వమును త్యజించినదై సముద్రజలంతో ఏకత్వం పొందుతోంది చూచావా? లోహ మయమగు పదునైన కత్తిని
Page:116
కరగించినప్పుడు తన జన్మస్థానమగు 'లోహం' గా మారి తన పదునైన ఆకృతినంతా కోల్పోవటం లేదా? శివేచ్ఛారూపమగు చైతన్యం కూడా శివరూపుడగు దేవదేవుని స్పర్శచే తన ప్రకృతిత్వం కోల్పోయి, శివ స్వరూపంగా శమించుచున్నది. ఎండలో నుండి నీడలోనికి వచ్చినప్పుడు ఆ మనుజుని ఛాయ అతని శరీరమునందు శీఘ్రంగా ప్రవేశించినదై మటుమాయమగుచున్నది కదా! వాస్తవానికి చిద్రూపమే అయి ఉండటం చేత 'చిత్ శక్తి' యగు ప్రకృతి తన నిజరూపమగు సనాతన పురుషుని పొందినదై, అజ్ఞానం నశించటం చేత ఇక మరల సంసారమున తిరుగాడక ఆ పురుషుని యందే విలీనమగుచున్నది. ఒక సాధువు పొరబాటుగా చోరుల సమూహంలో ప్రవేశించాడనుకో! ఎప్పుడో 'వీరు చోరులు' అని గ్రహించినవాడై ఇక ఆ సమూహంలో ప్రీతిగొనక సంఘం నుండి బయటపడనెంచుతాడు చూచావా? అట్లాగే పరమ పురుషుని గాంచనంతవరకు ఆ ప్రకృతి అసద్రూపమగు ద్వైతమున రమించుచు పరిభ్రమించుచునే ఉంటుంది. ఆ పరమ పురుషుని దర్శించి స్పర్శించగానే అతనియందు ప్రకృతీదేవి తన్మయమగుచున్నది.
* నేను = పరమపురుషుడు, నాది = ప్రకృతి స్వభావం ప్రకృతీ స్వరూపం,
స్వభావం = నేను (శివుడు) + భావన (దేవి స్వరూపం)
నదిలో ఉన్నదీ జలమే కాబట్టి, సముద్రం చేరగానే ఆ నదీజలం కాస్తా సముద్ర జలరూపమే అగుచున్నది. ఈ ప్రకృతి కూడా స్వతహాగా చైతన్య స్వరూపము-పరమ పదము-నిర్వాణ రూపము అయి ఉండటం చేత ఆ పరమపురుషుని పొందిన మరుక్షణం ఆ శివరూపమే అగుచున్నది.
ఆ పరమ పురుషుని గాంచనంత వరకు "ప్రకృతి-స్వభావం-జీవత్వం" మొదలైన ఆయా పేర్లతో పిలువబడే అజ్ఞాత చైతన్యం వ్యాకులములై ఉన్న ఈ అనేక సృష్టులందు ఆయా దుఃఖ మయములైన జన్మాది దశలతోకూడి అవిశ్రాంతంగా మోహవశంచేత పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ పరమ పురుషుని గాంచగానే తుమ్మెద తేనెను గ్రోలటంలో నిమగ్నమగునట్లు అతనియందే ఆ ప్రకృతి నిమగ్నమగుచున్నది.
ఓ రామచంద్రా! "నేను ఖండము-ఉపాధి సహితము-పరిమితము-ప్రమేయ సహితముజన్మ జరా మరణ సహితము-ద్వితీయము దోషపూరితము అగు జీవుడను" అను దశనుండి “నేను ‘అఖండము-నిరుపాధికము-అపరిమితము-అప్రమేయము-జన్మజరామరణవర్జితము - అద్వితీయము-నిర్దోషము అగు ఆత్మస్వరూపుడనే" ... అను సుజ్ఞాన స్థితి సముపార్జనమే "ప్రకృతి యొక్క లయము" ...అను రూపంగా ఉద్దేశించబడిందని కూడా సూక్ష్మబుద్ధితో గ్రహించు. అట్టి ఆత్మతత్త్వమును ఎఱిగి, స్వస్థితిని పొందిన తర్వాత ఎవడైనా అద్దానిని త్యజిస్తాడా? లేదు. 'నేను ఆత్మనే' అను ఎఱుకను పొంది సర్వకాల సర్వావస్థలయందు అనుభూతపరుడై ఉంటున్నాడు. దేనిచే జనన-మరణ-మోహమయములగు సమస్త దుఃఖములు శాశ్వతంగా శమించిపోవుచున్నాయో అటువంటి 'ఆత్మామృతము'ను గ్రోలినవాడు ఇక మరల అద్దానిని వదలి ఉంటాడా? లేనే లేదు.
వదిలి ఉండజాలడు.
Page:117
31. అణువణువులోనూ అనేక సృష్టులు
శ్రీరాముడు : హే మహర్షీ! మహాకాశమునందు తాండవం చేస్తున్న రుద్రదేవుని దేహంలోంచి జనించిన 'కాళీదేవి' అను పేరుతో ఆరాధించబడే ఛాయ జనించి, మరల ఆ పురుషోత్తముని స్పర్శచే ఉపశాంతిని పొంది మూలస్థానమగు రుద్ర భగవానుని యందు లయమును పొందినది కదా! ఆ రుద్ర భగవానుడు తన దేహమునందలి భ్రాంతిని త్యజించి ఎట్లు శాంతించారో... ఆ
కథాక్రమము వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : నేను ఆ సమయమున అట్లా చూస్తూ ఉండగానే రుద్ర భగవానుడు. కూడా చిత్రములో లిఖించబడిన మనుజుని వలె ముహూర్తకాలం (48 నిమిషాలు) ఆ ఆకాశమున నిశ్చలత్వం పొందటం జరిగింది. అప్పుడు ఆ రుద్ర భగవానుడు ఆ ముహూర్తకాలం ఆ ఆకాశమున గల ఊర్ధ్వ-అధో బ్రహ్మాండ మండలాలను రెండిటినీ అవలోకించ సాగారు. ఆ తర్వాత ఒక్క నిమిష కాలంలో తన యొక్క శ్వాస వాయువుచే ఆ ఉభయ (ఊర్ధ్వ-అధో) (బ్రహ్మాండ ఖండాలను ఆకర్షించి తన ముఖమున లయం చేసుకొన్నారు. పక్వాన్నమువలె వాటిని భుజించినవారై అఖిలాకాశమున ఆకాశం వలె స్థితిని పొంది ఉన్నారు. అటు తర్వాత ఆ రుద్ర భగవానుడు మరొక మూహూర్తకాలంలో తన సువిస్తార రూపమును త్యజించి మేఘం వలె చిన్న రూపం పొందారు. తర్వాత చేతికఱ్ఱ ప్రమాణంగానే ఆపై అంగుష్ఠ మాత్రంగాను సూక్ష్మాకృతిని దాల్చారు. అటు తర్వాత ఒక చిన్న గాజు ముక్క ప్రమాణం పొందారు. ఆపై ఇక పరమాణు ప్రమాణం కావటం దివ్య దృష్టితో వీక్షించాను. అట్లా పరమాణు రూపం పొందిన ఆ రుద్ర భగవానుడు అటు తర్వాత అంతర్ధానం అయ్యారు.
ఈ ప్రకారంగా 'విస్తారజగదృశ్యం' నుండి 'రుద్రాకారాంతర్ధన పర్యంతం' జరిగిన మహా సంరంభమంతా నేను చూచుచుండగానే శమించినదయింది.
ఆహాఁ! ఆకలిగొన్న జింక చిన్న చిన్న ఆకులను మ్రింగినట్లు ఆ రుద్రాకార భగవానుడు బ్రహ్మాండ కవాటాల రెండింటిని మ్రింగివేశారు. ఆ రుద్రుడు అట్లా అంతర్ధానమయిన తర్వాత అచ్చట గల ఆకాశం 'కేవల నిర్మల బ్రహ్మరూపం' గానే కనిపించింది. చూచావా, రామచంద్రా! ఆ ప్రకారంగా "అనేక రూపాలుగా భ్రమ యుక్తమైనది- అద్దములోని ప్రతిబింబమును బోలినది అగు ఆ శిలాఖండములోని మహాప్రళయ దృశ్యమును నేను ఆది-మధ్య-అంత రహితమగు చిదాకాశముగానే గ్రహించి వీక్షించాను!
ఇక ఆ తర్వాత "ఆ విద్యాధరి-ఆ శిల-ఆ బ్రహ్మాండం-ఆ మహాప్రళయం- ఆ రుద్ర భగవానుడు-ఆ కాలీళీవానీ" ఇవన్నీ స్మరిస్తూ రాజప్రసాదమును చూచిన ఒక గ్రామస్థుని వలె ఆశ్చర్యపోయాను. అప్పుడు ఎందుకో ఆ శిల యొక్క మరొక వైపునకు యథాలాపంగా చూచాను.
ఆశ్చర్యం! ఆ ప్రక్క శిలయందు కూడా అంతటా నా దివ్యదృష్టికి అనేక సృష్టులు కనిపించ సాగాయి. ఓ రామచంద్రా! దివ్యదృష్టిచే సర్వత్రా స్థితి కలిగి ఉన్నదంతా సదా సుస్పష్టంగా కనిపిస్తూ
Page:118
ఉంటుంది. అలా కాకుండా మామూలు దృష్టితో చూస్తే (మాంసమయమైన భౌతిక కన్నులతో చూస్తే) అది దూరంగా ఉన్న ఒక మామూలైన శిల మాత్రమే! మాంసపు కళ్ళకు సృష్ట్యాదులు భాసించవు సుమా!
ఆ విధంగా నా దివ్యదృష్టికి ఆ మరొక శిల యొక్క మరొక మూలగా కూడా ఇతఃపూర్వం నేను చూచినటువంటి సృష్టులే అనేకం కనిపించాయి. ఆ శిలకు మరొక మూలగా చూచాను. ఆ శిల యొక్క అన్ని వైపులా అనేక జగత్తులు అద్దంలో నిర్మల ప్రతిబింబాల వలె కనిపించాయి. అప్పుడు నేను కౌతుకం ఆపుకోలేక తక్కిన శిలల యొక్క ఆయా విభాగాల వైపు చూచాను. వాటిలో కూడా అనేక సృష్టులు కనిపించాయి. అంతేకాదు! అక్కడ గల గడ్డిమొక్క దగ్గర నుండి ఆయా సర్వ పదార్థములలోను వస్తువులలోను అసంఖ్యాకాలైన జగత్ సమూహాలు యథాస్థితంగా వర్తిస్తూ
కనిపించాయి.
శ్రీరాముడు : మీకు అక్కడి ఆయా శిలలలోను, గడ్డి మొక్కలలోను, వృక్షపు ఆకులలోను, తదితర సర్వ పదార్థజాలములోను కనిపించిన అసంఖ్యాక బ్రహ్మాండములను ఈ మీ కళ్ళతోనే దర్శించారా? శ్రీ వసిష్ఠ మహర్షి : లేదు. ఆ అనేక విధములైన జగత్తులన్నీ కూడా ఆధిభౌతికభ్రాంతి రహితమగు - సర్వ సాక్షీభూతమైన బుద్ధికి మాత్రమే అగుపిస్తాయిగాని... ఈ భౌతికమైన కళ్ళకు కాదు.
ఆ అనేక జగత్తులలో... ఒకచోట ప్రథమ సృష్టి కొరకై ప్రజాపతి అప్పుడే జనిస్తూ ఉన్నాడు. ఇంకొక సృష్టిలో బ్రహ్మదేవుడు-సూర్యుడు-చంద్రుడు-నక్షత్రమండలం-రాత్రింబవళ్ళు-సంవత్సరాల యొక్క కల్పనచే జలధారగా సాగిపోతోంది.
ఒక బ్రహ్మాండంలో భూతలం జన సమూహంతో కూడి ఉన్నది. ఒక జగత్తులో సాగరాలు ఇంకా జన్మించక పోవటం చేత సముద్రాలు ఏర్పడవలసియున్నది. వేరొక జగత్తులో దేవతలు జన్మించారు గానీ, ఇంకా రాక్షసులు, మానవులు జన్మించలేదు. ఒక జగత్తులో గల సజ్జనులలో కృతయుగాచారములగు యజ్ఞ యాగ-అగ్నికార్యాలు జరుగుచూ ఉన్నాయి.
మరొక జగత్తులో దుర్జనులందు 'హింస-మోసము-దగా' మొదలైనవి అంగీకార యోగ్యములగుచూ కలియుగాచారములు ప్రవృత్తములగుచున్నాయి. ఇంకొక జగత్తులో అనేక భూ-స్వర్గ పురుషులు, దైత్యనగరములు ప్రవర్తిల్లుచున్నాయి. ఒకానొక జగత్తులో భూతలం పర్వత సమూహములచే నిండిపోయి ఉన్నది.
ఒకచోట మృత్యు ఖేళిచే జనులు నశించుచుండగా క్రమక్రమంగా నిర్జనంగా కనబడుతోంది. ఒకచోట చంద్రుడు ఇంకా ఉత్పన్నమే కాలేదు. ఇంకొక జగత్తులో క్షీరసాగర మథనం ఇంకా జరుగవలసి ఉండటం చేత దేవతలు మృత్యు సహితులై కనిపిస్తున్నారు. ఆ జగత్తులోని దేవలోకంలో అమృతం, ధన్వంతరి, కామధేనువు, లక్ష్మి, కాలకూట విషము, ఉచ్ఛైశ్రవము (తెల్ల గుఱ్ఱము) ఇంకా జనించనేలేదు. ఒకచోట శుక్రాచార్యులు మృతసంజీవినీవిద్య కొరకై తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు అతని ప్రయత్నమునకు అనేక విఘ్నాలు కల్పిస్తూ కనిపించాడు.
Page:119
ఒకచోట ధర్మము శ్రద్ధగా నిర్వర్తించబడుతోంది. అందుచేత ప్రజలందరూ స్వప్రకాశమాన మగు బ్రహ్మ జ్ఞానముతో కూడుకొనినవారై ఉన్నారు. కొన్నిచోట్ల పదార్థాలన్నీ మామూలుగా కాకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆకాశం క్రిందికి భూమి పైకి ఉంటూ అక్కడి జీవులు సాధారణ రూపానికి వ్యతిరేకమైన రూపం ధరించి ఉన్నారు.
ఒక చోట జనులు అపూర్వమైన వేద శాస్త్రములను విచారణ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇంకొక జగత్తు కల్పాంత సంక్షోభములు లేకుండా కొనసాగుతూనే ఉన్నది. మటొక జగత్తులో దైత్యులు దేవతల పురములను జయించి, ఆక్రమించుకొని అల్లకోల్లోలాలు సృష్టిస్తూ పోతున్నారు. వేడొక జగత్తులో దేవలోకంలోని నందనవనంలో గంధర్వ-యక్ష-కిన్నరులు తీయగా గానములు చేస్తూ, ఆ రాగాలాపనలో తన్మయులగుచూ కనిపించారు.
...ఈ ప్రకారంగా భూత భవిష్యత్ వర్తమానములందలి అనేక జగదాడంబరములు నాకు కనిపించ సాగాయి. వాటినన్నిటినీ నేను మహా విశ్వరూపుడగు పరమాత్మయొక్క స్వరూపంగా
గాంచసాగాను.
8
ఇంకా కొన్ని విశేషాలు విను. కొన్ని జగత్తులలో పుష్కరావర్త (ప్రళయ) మేఘాలు ప్రవృత్తం అవుతూ ఉంటే జీవులు మృత్యు భయంతో గగ్గోలు పెట్టుచుండటం కనిపించింది. ఇంకొక చోట భూతకోట్లన్నీ శాంతముగా ఉన్నాయి. వేరొక చోట ప్రళయారంభ సంరంభంచే దేవ దైత్య - భూలోకాలు అత్యంత సంక్షోభం పొందు చున్నాయి.
ఒక్కొక్క జగత్తులో సూర్యుడే లేక నిబిడాంధకారంతో నిండి ఉన్నది. మరికొన్ని జగత్తులలో సూర్యుడు నిత్యమూ వెలుగుచుండటం చేత ఆ జగత్తులు సదా సుందరంగానూ జ్వాలా సదృశంగాను, దేదీప్యమానంగాను వెలుగొందుచున్నాయి.
ఒకచోట నారాయణ భగవానుని నాభికమలమున మధు-కైటభులు విలీనులై ఉన్నారు. ఒకచోట భగవంతుని నాభికమలంలో జనించిన నూతన బాలకుడైన బ్రహ్మ నోటిలో వ్రేళ్ళుంచుకుని నిద్రిస్తున్నాడు. ఒకచోట కల్పాంతరాత్రి ప్రవేశించటంచే ఆ జగత్తు శూన్యమగు అంధకారంతో వ్యాప్తమై ఉన్నది. మరొక చోట మహాప్రళయసముద్రము మధ్యన గల ఎత్తైన వటవృక్షపు ఆకుపై మాధవ భగవానుడు నిదురిస్తున్నాడు.
ఒక జగత్తులో ఇంకా పృథ్వి ఉత్పన్నం కాకపోవటం చేత శిలాగర్భభాగంలాగా నిశ్చలవిశాల ఆకాశము తప్పితే మరింకేమీ లేదు. ఒకచోట జగత్తు అప్రతర్క్యమై (ఒకరితో మరొకరు ‘ఇది’ అని చెప్పుకోవటానికి వీలుకుదరనిదై), అవిజ్ఞేయమై 'సుషుప్తి' (గాఢనిద్ర) అన్నిటా - అంతటా ఏర్పడినదై ఉన్నది. (గాఢ నిద్ర ఎట్టిది అని అంటే - ఏం చెప్పగలం?)
ఇంకొక జగత్తులో వజ్రాయుధాలు అటూ ఇటూ సంచరిస్తూ ఉంటే పర్వతములు ద్రవీభూతమగుచు కనబడుచున్నాయి. ఇంకొకచోట జగత్తులో త్రిపురాసుర వృత్తాసుర-అంధకాసుర -బలి వంటి అసురులు చేస్తున్న యుద్ధ సంరంభములచే నిండిపోయి ఉన్నది. ఒక జగత్తులోని
Page:120
పాతాళములో మత్తగజేంద్రముల (ఏనుగులచే భూమిలోని కొన్ని కొన్ని విభాగములు కంపింపజేయబడుతూ కనిపించాయి. అవి ప్రకృతి వైపరీత్యములుగా భూకంపములుగా భూతలముపై ప్రదర్శనమగుచుండగా, ప్రాణులు అస్తవ్యస్తంగా పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు.
ఇంకొక చోట కల్పాంతమున ఆదిశేషుని శిరస్సుపై గల భూమి అటూ ఇటూ దొర్లుతోంది. వేరొక చోట సీతను అపహరించిన నేరానికి రాముని చేతిలో రావణుడు నిహతుడగుచూ కనిపించాడు. మరొకచోట అప్పుడే సీతను అపహరించే వ్యవహారానికి రావణుడు ఉద్యుక్తుడగు చున్నాడు. ఒక జగత్తులో కాలనేమి తన పాదములతో భూమినంతా ఆక్రమించు చుండగా, శిరస్సు సుమేరు పర్వతాన్ని స్పృశించుచుండగా ఆకాశమునంతా ఆవరించి ఉండి కనిపించాడు.
శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ!
కిమహం, భగవన్! పూర్వమభవమ్? కథయేతి మే? అభవం చేత్ అనేనైవ సంనివేశేన తత్కథమ్?
స్వామీ! పూర్వ కల్పంలోనూ నేను ఇట్లాగే ఉన్నానా? ఇదే ఆకారంతోనా, లేక మరియొక ఆకారం తోటియా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తులలోని సర్వ పదార్థములు అనుక్షణం పరిణామం చెందుతూనే ఉన్నాయి, చెందుతూనే ఉంటాయి. ఒక పాత్రలోంచి ధ్యానం ఇంకొక పాత్రలోకి పోశామనుకో! అప్పుడు ఆయా ధాన్యపు గింజలలో కొన్ని పూర్తిగాను, మరికొన్ని కొంతవరకు స్థానభ్రంశం చెందుతూ ఉంటాయి. ఇంకొన్ని ఇతఃపూర్వపు వంటి స్థానమే పొందుతూ ఉంటాయి.
అట్లాగే ఈ జీవుల కల్ప-కల్పానంతర గమనాగమనములు కూడా! కొందరు జీవులు సముద్ర తరంగముల వలె ఒకప్పుడు సమాన రూపములుగా స్ఫురిస్తూ ఉంటారు. నీవు-నేను సమస్త ప్రజలు మరల మరల ఉత్పన్నములగుచూనే ఉన్నాం. సముద్రంలోని జల విభాగం ఒకసారి ఒకసారి ఒకే విధమైన తరంగాలుగాను మరొకసారి వేర్వేరుగాను వస్తూ పోతూ ఉంటుంది చూచావా? అయితే ఏ జలం ఏ తరంగాలుగా వచ్చినా (లేక) తరంగరూపం పొందక ఆ తరంగా లకు అంతరంగా ఉన్నా... ఉన్నదంతా జలమేగాని మరేమీ కావు కదా!
పరమార్థ దృష్టిచే చిదాకాశమున ఈ జీవులు గాని, వారివారి రాకపోకలుగాని సంభవించట మనేదే లేదు. జలం సర్వదా ఆకార రహితంగానే, యథాతథంగానే ఉంటుంది కదా!
ఇక మాయా దృష్టి చేతనంటావా? సముద్రతరంగము వలె ఈ జీవులు అదే రూపముగా గాని, అన్య రూపముగా గాని స్ఫురిస్తూ ఉంటారు. సంసార భ్రమచే అనంతకోటి జీవులు మరల మరల వచ్చుచూ-పోవుచూ ఉన్నారు కదా! ఈ జగత్పదార్థములన్నీ కూడా... ఒకప్పుడు సమరూపంగాను... మరొకప్పుడు అసమ రూపంగాను ఉంటున్నాయి. ఇక నీ విషయానికి వస్తే... సర్వదా ఆత్మారాముడవైన నీవు దైవకార్య నిమిత్తం అయోధ్యారాముడుగా ప్రకటనమవటం నీ అవతార-చమత్కార విశేషం!
❖
Page:121
ఓ రామచంద్రా! “జగత్తు” అనే మహా సముద్రంలో ఈ జీవులందరు బిందుకణముల వంటి వారిగా గ్రహించు. ఈ జీవులలో కొందరు మరల మరల అవియే ధన-బంధు-వయః-కర్మవిద్యా-విజ్ఞాన చేష్టలతో కూడిన దేహములతో ప్రవేశిస్తూ-నిష్క్రమిస్తున్నారు. మరికొందరేమో వాటివాటిలో సహభాగం మాత్రమే కలిగి ఉంటున్నారు. ఇంకొందరు వాటిలో నాలుగవ వంతు మాత్రమే పరిణామస్థితిలో తోడు తెచ్చుకుంటున్నారు. కొందరు జీవులు తమ దేహానంతరం అవియే దేహములు కలిగి ఉంటున్నారు. ఇంకొందరు భిన్నమైన శరీరములు పొందుచున్నారు. మరి కొందరికి అన్ని విషయములు ఇతఃపూర్వపు దేహము వలెనే ఉంటున్నాయి. కాని కాలం మాత్రం వారి పట్ల విలక్షణంగా ఉంటోంది. ఇంకొందరు కాలమునందు సమంగాను, తక్కిన సర్వ విషయములలోను విలక్షణంగాను ఉంటున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ఒక్కొక్కసారి సలక్షణంగాను, మరొక్కసారి విలక్షణంగాను ఈ జీవుల భవిష్యత్ దేహాదుల పరిణామములు ఎందుకుంటున్నాయి? వీటి వెనుక అంతర్లీనంగా ఉన్న రహస్యమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అనేక రాగ-ద్వేషాదుల చేతను, విచిత్ర ధర్మాధర్మముల ప్రసంగ-చేష్టల చేతను నింపబడిన చిత్తములే ఈ పరిణామ విపరిణామములన్నిటికీ కారణం! ఆయా స్వకీయ నిర్మిత భావావేశములతోనూ, చేష్టలతోను కూడిన ఈ జీవులు వివిధ దేహములు ధరిస్తూ ఇక్కడి స్వర్గ నరకాది ఊర్ధ్వ అధో లోకాలలోనికి మరల మరల ప్రవేశ-నిష్క్రమణములు నిర్వర్తిస్తున్నారు. అందుకే “ఈ జీవులు చంచల మహా సముద్రంలోని చక్రావర్తములందు సంచరించే జలబిందువుల వంటివారు” అని వ్యాఖ్యానించాను. మహా సముద్రంలో ఏ జలం ఆవర్తమగు చున్నది? ఏ జలం తరంగాలుగా అగుచున్నది? ఏ జలం ఎటు వెళ్ళుచున్నది? ఏ జలం ఎన్నెన్ని రూపాలు పొందుచున్నది? ...అనునదంతా వాఖ్యానించటం ఎవరి తరం? అట్టి వ్యాఖ్యానాలలో విశేషం మాత్రం ఏమున్నది?
ఈ ‘భూతకోట్లు’ అనే జలబిందువులు సదృశములా? (ఒకే తీరుగా ఉంటున్నాయా), లేక భిన్నములా? (వేర్వేరు తీరులుగా పరిణమిస్తున్నాయా?); తద్రూపములా? అన్యరూపములా?... అని బాగుగా నిర్ధారించటానికి సమర్థుడెవరు?
మహాజల ప్రవాహం సందర్భంలో ఏ నీరు ఎటు పోవుచున్నదో చెప్పలేకపోయినప్పటికీ... ఒక్కటి మాత్రం సత్యం. ప్రతి జలకణం జలమేగాని అన్యం కాదు.
ప్రతి జీవుడు అత్మస్వరూపుడే అయి ఉన్నాడు. ఆత్మానందమే మనందరి రూపాలుగా వెల్లివిరుస్తోంది!
Page:122
32. వసిష్ఠ దేహాంతర్గత జగత్సమూహ చమత్కారం
శ్రీరాముడు : స్వామీ! ఆ సమయంలో అనేక జగత్తులలో వివిధ విశేషాలు గాంచుచున్న మీరు ఏ జగత్తులో, ఏ దేహంతో ఉండి అదంతా చూచారు? మీ దేహం ఏ జగద్వస్తువుతో ఆ సమయంలో తయారై ఉన్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "అనేక సంఘటనలతో కూడిన వివిధ జగత్తులన్నీ ఆత్మ స్వరూపం మాత్రమే” అను ఎఱుకతో నేనదంతా చూస్తున్నాను కదా! అందుచేత అనంతము - నిరామయము-చిదాకాశము అగు స్వరూపముతోనే నేనున్నాను.
అక్కడ ఇంకొక చమత్కారమైన విషయం జరిగింది. అదికూడా చెపుతాను శ్రద్ధగా ఆలకించు. ఏదో కాకతాళీయంగా ఏకాగ్రచిత్తుడనై నేను నా దేహమువైపు పరికించి చూచాను. అప్పుడు నేను అనంతము నిరామయము-చిదాకాశ స్వరూపము అగు దేహమై ఉన్నాను కదా! అట్టి నా దేహంలో తడిసిన ధాన్యపు గుట్టలో ఒక గింజ అంకురించి కనబడునట్లు ఒకచోట సృష్టి కనిపించింది. ఆ జగత్తులో ఆకార యుక్తములు అనాకారయుక్తములు, చేతనములు-అచేతనములు అగు సమస్త వస్తువులు కనిపించసాగాయి. ఆహా! సుషుప్తి నుండి స్వప్న దశకు వచ్చిన మనుజునికి ఎదురుగా స్వప్న దృశ్యం ప్రకాశిస్తుందే! స్వప్న దశ నుండి జాగ్రత్ దశకు వచ్చినవానికి ఎదురుగా ఈ జాగ్రత్ జగత్తు కనిపిస్తుంది కదా! ఆ రీతిగా ఆత్మస్వరూపమును అనుభూతమొనర్చుకొని ఉన్నట్టి నా యొక్క హృదయమున సృష్ట్యాదియందు సృష్టి ఉదయించింది.
అయితే ఆ సృష్టి కూడా చిదాకాశముకంటే భిన్నం కాదు.
శ్రీరాముడు : హృదయాకాశమే స్వరూపముగా గల ఓ మహాత్మా! చిదాకాశరూపులగు తమయందు సృష్టి ఎట్లా ఉత్పన్నమైంది? నాకు ఇది ఆశ్చర్యంగా ఉన్నది! ఆ విశేషమంతా ఏమిటో సవివరంగా తెలియజెప్ప ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : "స్వప్నంలోని నగరం” లాగా అసత్తే అయినప్పటికీ 'సత్తు' వలె సర్వజగత్ కల్పనా వ్యవహారుడగు బ్రహ్మదేవుని పదమును నేను నాయందు ఎట్లా అనుభవించానో,... యథారీతిగా వర్ణిస్తాను, విను.
చిదాకాశరూపుడనగు నేను ఇతఃపూర్వం చెప్పుకొన్న శిలయొక్క వేర్వేరు భాగాలలో సృష్టులను పరికించే అభ్యాసంతో నా శరీరం వైపుగా చూచాను. అభ్యాసవశంగా నా చిదాకాశ దేహమందలి ఒకానొక విభాగమును సంవిత్తు (జ్ఞానము) + సృష్టి సంకల్పములతో కూడిన సంకల్ప దర్శనముచే జగద్వ్యవహారమును అసంకల్పితంగా, నాకు తెలియకుండానే మేలుకొలిపాను. నాయందు ఎప్పుడైతే సంవిత్తు (జగత్ సంబంధ జ్ఞానము) ఒకింత స్ఫురించిందో, ఆ మరుక్షణం నాయందు ఒకానొక చోట “ఆకాశరూపత్వము” గాంచాను.
Page:123
శ్రీరాముడు : అద్దానిని గాంచింది కళ్ళతోనా?
శ్రీ వసిష్ఠ మహర్షి : కాదు. గాఢ నిద్రలో కేవల-నిర్విషయ చిదాకాశమును అనుభవిస్తున్న చిదాకాశ రూపుడగు ఈ జీవుడు ఏ విధంగా గాఢ నిద్రానంతరం స్వప్న - జాగ్రత్ దశలను ఘనీభూతమైన స్వభావముచే పొందుచున్నాడో అట్లాగే అప్పుడు నాయందు ఆకాశరూపత్వం పొందాను. ఒక జీవుడు స్వప్నంలోని నగర-గృహాదులను ఏ స్వభావము అను కళ్ళతో చూస్తున్నాడో... నేను ఆ స్వభావచక్షువులతో నా యందు జగత్తును చూచాను. ఆ తర్వాత ఆ నా ఆకాశరూపమున 'దిక్కులు’ గురించిన బోధ కలిగింది. 'ఆకాశము దిక్కులు' గురించి పర్యాలోచించటం చేత మొట్టమొదటగా ‘చిత్తము' అనునది ఏర్పడింది.
చిత్తము నుండి ఉదయించిన “ఈ ఆకాశాదులే నేను” అను జ్ఞానమే “అహంకారము”. అట్టి అహంకార జ్ఞానము యొక్క కించిత్ ఘనీభూత స్థితి “బుద్ధి”. ఆ బుద్ధి “సంకల్ప + వికల్పములచే మరికొంత ఘనీభూతమగుటయే మనస్సు.
ఈ విధంగా ఆకాశత్వము-దిక్కులు-చిత్తము-అహంకారము-బుద్ది-మనస్సు అని పిలువ బడుచున్నవన్నీ భావావేశ మాత్ర రూపంగా నాయందు గల ఆ ఒకానొక విభాగంలో క్షణంలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ మనస్సు “శబ్దము స్పర్శ - రూపము-రసము గంధము”లను ఎఱుగుట ప్రారంభించగానే పంచతన్మాత్రలు కల్పితమైనాయి. ఆ తర్వాత ఆ ఆ స్థానంలో క్రమంగా సూక్ష్మస్థూల పంచేంద్రియ క్రమమంతా ఉదయించసాగింది.
‘సుషుప్తి దశ’ నుండి స్వప్నము నందు ప్రవేశించగానే 'జగత్తు' అనే ఘనీభూత దృశ్యము అనుభూత విషయంగా..., అగుచున్నది కదా! అట్లాగే సృష్టికి పూర్వం దుఃఖ రహితమై ఉండే “శుద్ధాత్మ”... సృష్ట్యాది యందు ఎప్పుడైతే సృష్టి వైపుగా అభిముఖమౌతోందో అప్పుడు ఒక్క నిమిషంలో 'దుఃఖము’ ఉదయిస్తోంది. అనంతమగు పరమాత్మయందు ఒకేకాలంలో ఈ దృశ్య సమూహమంతా ఉదయిస్తూ ఉండగా... దానిని కొందరు “ఆకాశము-ఆకాశము నుండి వాయువు -వాయువు నుండి అగ్ని”... మొదలైన ఒక క్రమమును వర్ణిస్తూ చెప్పుచున్నారు. మరికొందరు “ఒకదాని నుండి మరొకటి కాదు. సృష్టి ఏర్పడిన క్షణంలో అన్నీ ఒక్కసారిగా ఏర్పడుచున్నాయి” అని సిద్ధాంతీకరిస్తున్నారు.
కల్పనచే క్షణంలో కల్పము, పరమాణువులో దీర్ఘ ప్రదేశం అనుభవమగునట్లు నేను అచట బ్రహ్మాండరూపమగు చైతన్యాత్మను అనుభవించాను. కానీ, రామచంద్రా! యథార్థానికి నిర్మలాత్మ సదా సర్వదా చిదాకాశరూపమే అయి ఉన్నది. స్వభావంగానే వాయువు ఆకాశమున అంతటా నిరంతరం చలిస్తూ ఉంటుంది కదా! అట్లాగే మనస్సు కూడా స్వభావంగానే సర్వత్రా శరీరాదుల కల్పన గాంచుచూ ఉంటోంది. ప్రథమంగా మనస్సు యొక్క పరశక్తి జగత్తు యొక్క రూపాదుల కల్పనను ఎట్లు గావించిందో... అద్దానిని మరొకటేదీ స్వయంగా గొప్ప ప్రయత్నం చేసి కూడా మరొక విధంగా చేయజాలదు. ఆ తర్వాత నేను స్వయంగా అపరిచ్ఛిన్నుడను అయినప్పటికీ కల్పన
Page:124
చేత నన్ను నేను పరిచ్ఛిన్న రూపంగా అనుభవించసాగాను. 'చిద్రూపము' నుండి 'చిత్తము’ రూపమున స్థితినొందాను.
ఆ తర్వాత... 'చిత్ ప్రతిబింబము' అనదగు "చిత్తము” యొక్క ప్రాప్తిచే తేజఃకణములాగా వెలయునట్టి లింగ శరీరము (మనో-బుద్ధి-చిత్త -అహంకారములతో కూడిన శరీరము)
అనుభవించసాగాను.
ఆ తర్వాత భావనా సమూహముల పరిపుష్టిచేత “స్థూల శరీరత్వం” పొందాను. ఆ స్థూల శరీరంలో "నేను చూచుచున్నాను” అను ఒకింత బోధ చేత “చూడటమనే అనుభవం” వైపుగా ప్రవృత్తుడను అగుటచే 'నేత్రములు' అను ద్వారముతో కూడుకున్నవాడనైనాను.
ఏ రంధ్రముచే నేను చూచుటకు ప్రవృత్తుడనైనానో వాటినే "కళ్ళు” అని పిలుస్తున్నారు. దేనినైతే నేను చూస్తున్నానో... అదియే “దృశ్యము” అనబడుతోంది. దర్శనమే అద్దాని 'ఫలం'. ఎప్పుడు చూస్తున్నానో.... అదియే 'క్రమము'. ఎచట చూచానో... అదియే ఆకాశము... అదియే ‘దేశము’... ఈ విధంగా ఒక దృఢమైన నియతి ఆత్మకు ప్రవృత్తం కొనసాగింది.
శ్రీరాముడు : స్వామీ! అఖండాత్మ స్వరూపులగు మీరు ఆ విధంగా దేహధారణ చేస్తూ మీ యొక్క ఆత్మ స్వరూపాన్ని ఏమఱిచారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : లేదు. "సమస్తము చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే” అనియు, నేను చైతన్యమేనని, అందుచేత చూడబడే అంతటికీ నేనే కారణము అనియు అనుభవం ఆ సమయంలో అనుక్షణికంగా కలిగియే ఉన్నాను. అనగా... 'నేత్రములు' అనే రెండు ద్వారముల గుండా నేను ఎప్పుడైతే చూడటం ఆరంభించానో, అపుడు “ఈ కనబడుచున్నదంతా చిదాకాశమే” అను నిర్మల బోధ యథాతథమై ఉండనే ఉన్నది.
ఏ రంధ్రముల గుండా చూచానో అవి నేత్రములై వర్తించాయి కదా! ఆ తర్వాత 'శబ్దమును ఒకింత విందును కదా' అనే చిత్తవృత్తి నాకు ఉదయించింది. అట్లా ఉదయించగానే ఒకానొక ఝంఝూనాదం నాకు వినపడసాగింది. ఆ శబ్దము శంఖానాదమును బోలి ఆకాశమునకు స్వాభావికమైనదిగా అనిపించింది. అది ఇంకా చలనశీలమగు వాయువుతో కూడి రంధ్రముల గుండా (శబ్దవాయువులుగా ప్రసరించుచుండగా) వినటం జరిగిందో అవియే “చెవులు" అను పేరుతో పిలువబడుచున్నాయి సుమా! అటు తర్వాత ఏ ప్రదేశమునుండి స్పర్శ జ్ఞానమును పొందానో అవియే 'త్వక్కు' (చర్మము) అని చెప్పబడుతోంది. దేనిచే 'స్పర్శ' అనుభవించబడుతోందో అదియే 'సత్-సంవేదన' రూపమగు (లేక, స్పర్శేంద్రియ విషయమైన) వాయువు-అనబడుతోంది.
ఈ విధంగా దర్శనేంద్రియ-శబ్దేంద్రియ-స్పర్శేంద్రియ అనుభవకర్తనయ్యాను కదా! అప్పుడు “రుచి ఆస్వాద - స్వరోచ్ఛారణ నిర్వర్తించెదనుగాక”! అనే మరొక ఇచ్ఛ జనించింది. మరుక్షణం రస సహితమైన 'రసేంద్రియం' ఏర్పడింది. అట్లాగే ఘ్రాణేంద్రియం గురించిన సంకల్పముచే ఘ్రాణేంద్రియం సంభవించింది. చూచావా, రామచంద్రా! ఈ ప్రకారంగా వాస్తవానికి ఆకాశ
Page:125
రూపుడనే అయినట్టి నాకు నా యొక్క అనంత తత్త్వములోని ఒకానొక విభాగంలో సమస్త దేహఇంద్రియ-విషయ సంపత్తి నా యొక్క ఇచ్ఛా ప్రభావంచే చేకూరింది. ఇట్టిదియే ప్రతి ఒక్క జీవుని భౌతిక దేహ సంపత్తి విశేషమని గమనించు.
ఇక్కడ రెండు విషయాలు గమనించు1. నేను యథాతథంగా అనంతమగు చిదాకాశ స్వరూపుడనుగానే ఉండి ఉన్నాను. కాబట్టి, నా యందు ఒకానొక విభాగము అనునది “స్వప్నతుల్యము-కల్పనా మాత్రము” కనుక, వాస్తవానికి ఏదీ కూడా చేకూరనిదియే అగుచున్నది. ఒక దృశ్యమును చూస్తున్న ద్రష్ట తన స్వరూపమును యథాతథంగా కలిగి ఉంటూనే దృశ్యమును దర్శిస్తూ ఉంటాడు కదా! దృశ్యమును పొందుతూనే స్వస్వరూపతః మార్పు-చేర్పులు లేకయే ఉంటాడు కదా! ఇదియే ఇక్కడ అక్కడి నా "స్వరూప తతంగము” విషయమై మనకు దృష్టాంతం.
2. నేనే కాదు. నీవు, ఇక్కడి సభికులు, తదితర జ్ఞాన అజ్ఞాన సమన్వితులగు భూతవర్తమాన-భవిష్యత్ ద్రష్టలందరిపట్లా నాలాగానే తమ స్వస్వరూపమునందు ఎట్టి మార్పు చేర్పులు లేకుండానే స్వప్నతుల్య మనదగు ఈ శబ్ద స్పర్శ-రూప-రస-గంధముల యొక్క భోగ జ్ఞానము. ఉదయిస్తోంది సుమా! నాకు బలాత్కరంగా దేహ ఇంద్రియత్వం ఉదయించింది. ఆ దేహేంద్రియ విషయములను అభిమానించుచూ ఉండనారంభించాను. అట్టి అభిమానమే నీవంటి వారిచే (అనగా శాస్త్రకారులచే) ‘అహంకారము' అని చెప్పబడుతోంది. అట్టి అహంకారము ఇంకొంత ఘనీభూతం కాగా ‘ఇప్పుడు చూచెదనుగాక! ఇప్పుడు వినెదనుగాక! ఇప్పుడు ఆఘ్రాణించెదను గాక! ఇప్పుడు! ఇప్పుడీ స్పర్శానుభవం పొందెదను గాక! ఇక రుచిని పొందెదను గాక' అను రూపంగా ప్రవర్తన బయల్వెడలుచుండగా అదియే 'బుద్ధి' అని చెప్పబడుతోంది. ఆ బుద్ధి మరికొంత ఘనీభూతమై సంకల్ప-వికల్ప పరంపరలను పొందనారంభించింది. అట్టి సంకల్ప-వికల్పములనే ‘మనస్సు’ అని అంటున్నారు. ఆ మనస్సే విషయములను మరల మరల స్మరించుచుండగా 'చిత్తము’ అని వ్యవహరించబడుతోంది.
ఈ విధంగా వాస్తవానికి చిదాకాశరూపుడనగు నేను సూక్ష్మ శరీరధారినైనాను. అంతఃకరణ రూపు డనైనాను. అప్పుడాస్థితిలో వాయువు కంటే కూడా అత్యంత సూక్ష్మమైన ఆకృతితో కేవలం ఆకాశ మాత్రుడనుగానే ఉన్నాను. అప్పటికీ నేను నిరాకారడను అగుటచేత ఏ పదార్థము చేతనూ నిరోధించ బడనివాడనుగానూ ఉన్నాను. అట్లా పూర్వ కల్పితమైన బ్రహ్మదేవుని శరీరమును భావన చేయుచు చాలాకాలం ఉన్నాను. అప్పుడు "నేను చతుర్ముఖ దేహధారిని అవుతాను" అనే ఒకనొక వృత్తి నా యందు కలిగింది. అట్టి వృత్తిలో నలువైపులా ఎగురసాగాను. అట్లా ఎగురుచూ ఒకానొక శబ్దం ఉచ్చరించాను. అట్లు బాలరూపుడనగు నేను మొట్టమొదటగా ఏ శబ్దమును ఉచ్చరించానోఆ శబ్దమే మరల అక్కడి ప్రపంచమున 'ఓంకార' రూపంగా ప్రసిద్ధికెక్కి ఉన్నది.
Page:126
ఈ ప్రకారంగా నేను సృష్టి కర్తను, జగద్గురువును, బ్రహ్మదేవుడను అయినాను. ఆపై మనోమయుడనగు నాచేత అనేక సృష్టులు కల్పించబడ్డాయి. ఆ రీతిగా... బ్రహ్మరూపుడనే అయిన నేను 'నిజ స్థూల శరీరము’ అను ఆవరణ సహిత బ్రహ్మాండమును, ఆ బ్రహ్మాండము యొక్క బాహ్య రూపమును ఒక్కసారే గాంచసాగాను. అయితే...
ఏవమస్మి సముత్పన్నో న తు జాతోస్మి కించన |
దృష్టవానస్మి బ్రహ్మాండం, బ్రహ్మాండాంతం న కించన ॥
వాస్తవానికి “బ్రహ్మాండము - బ్రహ్మాండము యొక్క బాహ్యము” అనబడు దృశ్యమేదియు అననిదే అయి ఉన్నది సుమా!
శ్రీరాముడు : మహర్షీ! "బ్రహ్మాండములు-వాటి బాహ్యము చూస్తూ ఉండినాను”... అని అంటూనే, “అట్టి దృశ్యమేదీ లేనేలేదు”... అని ఇంతలోనే వాఖ్యానిస్తున్నారు. కనబడుతూ కూడా లేకుండట మేమిటి? మీ వాక్యార్థం వివరించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : స్వప్నంలో స్వప్న స్వభావ చమత్కారంచేత అనేక పదార్థ జాలములు కనబడవచ్చుగాక! అవన్నీ ఎక్కడున్నాయి? లేవు కదా! అట్లాగే "బ్రహ్మదేవుని స్వప్నమే ఈ జగత్తు" అని మనం ఇతఃపూర్వం సిద్ధాంతీకరించుకున్నాం కదా! అప్పటి సృష్టికర్తయగు బ్రహ్మదేవత్వము వహించినప్పటి ఆ నా ఆ బ్రహ్మాండముల కల్పన దర్శనములు అట్టివే! (స్వప్నసదృశమైనవే!)
ఆ విధంగా మనోమయుడనగు నేను జగద్రూపుడను అయ్యాను. కానీ అట్లేమియు కాకయే ఉన్నాను. ఎందుకంటే సమస్తమూకూడా దృశ్యశూన్యమగు చిదాకాశమే అయి ఉన్నది కదా!
జగత్ మృగతృడ అంబూని భాంతి సంవిది సంవిదః |
న బాహ్యమస్తి, నో బాహ్యే, భే తద్వ్యోమ తథా స్థితమ్ ||
జ్ఞానస్వరూపుడగు పరమాత్మయందు జ్ఞాన రూపములే అయినట్టి అనేక జగత్తులు మృగతృష్ణా జలతరంగాలలాగా భాసిస్తున్నాయి. వాస్తవానికి ‘బాహ్యము' అనునదీ లేదు. 'బాహ్యమందలి జగత్తు' అనబడునదీ లేదు. ఇదంతా కూడా "చిదాకాశమే చిదాకాశమున” మట్టియందే మట్టి బొమ్మలు ఉన్నట్లుగా ఉన్నట్లగుచున్నది. ఎండమావులలో జలం ఉన్నదా? లేదు. మరి జలం ఎందుకు కనిపిస్తోంది? దానికి కారణమంటూ ఏదీ లేకపోయినప్పటికీ చూచేవాని యొక్క అంతః కరణము నందు గల దాహబుద్ధియే (లేక) దృశ్యబుద్ధియే అట్లా ఎడారిలోని మృగతృష్ణయందు జలభ్రాంతిని వీక్షింపజేస్తోంది కదా!
అట్లాగే... బ్రహ్మమునందు వాస్తవానికి 'జగత్తు' అనబడునదేదీ లేదు. అయితే ఆత్మయే నిష్కారణంగా అజ్ఞానా వృతమైన సంవిత్ స్వభావం చేత ఈ జగద్భాంతిని గాంచుచున్నది. అ జగత్తు అనబడేది అసత్తే అయినప్పటికీ స్వప్ననగరం వలె, మనోరాజ్యం వలె, సంకల్ప దృశ్య పరంపర వలె హృదయమున వ్యాపించి ఉంటోంది.
ఈ జగత్తు “అద్దమునందు ప్రతిబింబించిన దృశ్యము” వంటిది. అద్దంలో ఏమీ లేకపోయినా
Page:127
అనేక వస్తువులు కనబడతాయికదా, బ్రహ్మమునందు జగత్తులు లేకపోయినప్పటికీ ఉన్నట్లే
కనబడుచున్నాయి. వాస్తవానికి ఈ జగత్తుగా కనిపించేదంతా అసత్తే సుమా! శ్రీరాముడు మహాత్మా! ఎవరో కల్పించిన మాయా జగత్తు మా హృదయదర్పణంలో ప్రతిబింబించటం చేతనే కదా మేము అజ్ఞానంతో ఉంటున్నాం? ఇదంతా ఎందుకు జరుగుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'జగత్ కల్పన'కు అధిష్ఠానమగు 'చిత్ శిల'లో 'జగత్భావన' ఉదయించినప్పుడే ఈ జగత్తును చిత్లాస్వరూపుడగు ఈ జీవుడు గాంచగలడు. 'కల్పన' అను తన ఒకానొక విభాగంలో ప్రవేశించిన తర్వాతనే జీవుడు జగత్తును పొందుచున్నాడని గ్రహించు. అట్టి కల్పనలో ఎవడు ప్రవేశించడో, అట్టివాడు 'జగత్తు' అనబడు దానికి పొందకయే ఉంటాడు. ఉదాహరణకు, మన ప్రక్కనే ఒకాయన నిదురిస్తూ ఏదో దీర్ఘమైన స్వప్నం కంటున్నాడనుకో! అతని చిత్తమునందు ప్రవేశించకుండా అతని స్వప్న విశేషములను మనం పొందజాలము కదా! అట్లాగే ఈ జీవుడు 'కల్పన' అనే బ్రహ్మదేవుని చిత్తము నందు ప్రవేశించిన తర్వాతయే ఈ జగత్తులను పొందుచూ జన్మజన్మాంతర పరంపరలను అవిశ్రాంతంగా పొందుచున్నాడని గ్రహించు.
సర్వదా సర్వత్రా మూడు దృష్టులు పాల్గొనుచున్నాయని ఇక్కడ గమనించు.
1. ఆధిభౌతిక దృష్టి (స్థూల దృష్టి) : ఇట్టి ఆధిభౌతిక దృష్టికి పదార్థాజాలం మాత్రమే కనబడు తుంది. ఏ లోకాలోక పర్వత శిలపై నాకు ఏ బ్రహ్మాండం కనిపించిందో... ఆధిభౌతిక దృష్టికి అది కేవలం ‘లోకాలోక పర్వతంపై గల ఒక శిల"గా మాత్రమే కనబడగలదు. స్థూలదేహం తాదాత్మ్యంతో దర్శించేవారికి స్థూల విషయాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
2. అతివాహిక దృష్టి (సూక్ష్మదృష్టి): అతివాహిక దేహంతో పరమబోధ దృష్టితో చూచినప్పుడు నాకు ఆ లోకాలోకపర్వత శిలలో బ్రహ్మాండము అగుపించింది. అయితే నాకు కనిపించిన ఆ బ్రహ్మాండ సృష్టి అంతా కూడా అనేక జగద్విశేషములతో నాకు కనిపించనప్పటికీ, ఆత్మజ్ఞానులగు యోగుల దృష్టికి అదంతాకూడా నిర్మలపరమాత్మ రూపమే అగుచున్నది.
3. ఆత్మజ్ఞాన దృష్టి (పర దృష్టి) : జ్ఞాన దృష్టిచే ఈ జగత్తంతా కూడా సర్వత్రా నిర్వాణరూపమగు బ్రహ్మం గానే కన్పట్టుచున్నది. అట్టి దృష్టి లేనివారికి అట్లు అగుపించటం లేదు.
ఇక్కడ ఒక విశేషంఈ మూడింటిలో ఎవరిలో ఏ దృష్టి అత్యధికంగా ఉంటుందో వారికి ఆ రీతిగా ఈ జగత్తు అగుపిస్తోంది.
యత్ పశ్యత్యవదాతా ధీః సో ఉపపత్తి విచారణా |
న తత్ నేత్రైః త్రిభిః శర్వో, న ఇంద్రో నేత్రశతైరపి ||
ఉపపత్తి, విచారణ సహితమైన శుద్ధ బుద్ధి దేనిని గాంచుచున్నదో అద్దానిని మూడు కనులు
గల శివుడుగాని, నూరుకళ్ళు గల ఇంద్రుడుగాని గాంచజాలరు సుమా!
Page:128
33. పృద్వి తత్వాహంకారమును ఆశ్రయించటం (అహమ్ పృథ్వీ తత్వమస్మి)
శ్రీవసిష్ఠ మహర్షి : "ఆకాశంలాగానే పృథ్వి కూడా అనేక సృష్టులతో పూర్ణమైయున్నది కదా!” అని నేను యోగ దృష్టితో గమనించాను. అప్పుడు పృథ్వి యొక్క 'ధారణ' తో కూడిన 'ధ్యాత' ను అయ్యాను. పృథ్వి యొక్క సర్వ సూక్ష్మ స్థూల తత్త్వములు నా స్వరూపమునకు అభిన్నమైనవేనను అనుభవం కలిగినవాడనయ్యాను.
శ్రీరాముడు : “నేను పృథ్వితత్త్వ స్వరూపుడుగా (పృథ్వీధ్యాతగా) అయ్యాను" అని మీరు అంటున్నారు కదా! అనగా “నేను వసిష్ఠుడను” అను దేహ-భౌతికానుభూతిని త్యజించి పృథ్వీరస స్వరూపులైనారా? శ్రీవసిష్ఠ మహర్షి : లేదు. ఒక చక్రవర్తి తన దేహంలో అహంభావాన్ని త్యజించకయే “ఈ సమస్త భూమండలము నా సామ్రాజ్యమే కదా!”... అను మమత్వం ధరించి ఉంటాడు చూచావా? అట్లాగే నా చిత్స్వరూపాన్ని గ్రహించి ఉండియే పృథ్వి యొక్క అహంభావంచే పృథ్వి రూపధారిని అయినాను. అట్టి పృథ్వి యొక్క ధారణచే పృథ్వి అభిమానినయ్యాను. అనగా అట్టి పృద్వీ అవ్యభిమాన సమన్విత మైన బుద్ధితో తాదాత్మ్యం చెందినవాడనై ద్వీప-పర్వత-తృణ వృక్షాదులన్నీ నా శరీరమే అయి ఉన్నట్లు అనుభూతిని పొందాను. వివిధ వృక్షాలతో, పలురత్నాలతో, నగర-గ్రామ-అరణ్య-పర్వత ప్రాంతాలతో, ద్వీప-పర్వత-తృణ వృక్షాదులన్నీ నా శరీరమే అయి ఉన్నట్లు అనుభూతిని పొందాను. వివిధ వృక్షములతో, పలు రత్నములతో, నగర-గ్రామ-అరణ్య-పర్వత ప్రాంతాలతో, ద్వీప-సముద్ర వివిధ జీవులతో, ప్రాణ-అపాన సంచారములతో, దశదిక్కులతో కూడిన పృథ్వియే నా దేహంగా అనుభవం పొందాను. సర్వ జీవరాసులలోని చైతన్యమే నా నిజ చైతన్యంగా అనుభవమై ఈ పృథ్వి అంతా నా శరీరంగా నాకు గ్రాహ్యం కాసాగింది. నదీ నద-వన-సముద్ర-పర్వత-స్థాణువుల తోను, ప్రాణుల భోగ్య పదార్థములతోను, స్థూల-ఎడారులతోను వ్యాప్తమైన భూతలరూపం పొందిన వాడనై “భూదేవత” అని చెప్పబడేది నేనే అయ్యాను. అప్పుడు కూడా చిదానందస్వరూపుడనగు నేను యథాతథంగానే ఉండి ఉన్నాను. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను సుమా!
అట్లు భూతల రూపమును పొందినట్టి నేను తదంతర్గతంగా ఏ ఏ విశేష స్థితులను అనుభవించానో,... విను. ఇవన్నీ నాయందు నేనే నా దృశ్యజగత్ శరీరంలో పొందసాగాను!
ఒకచోట స్త్రీలు నృత్య-గాన-జానపదగీతాలు ఆలపిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. మరొక చోట మరికొందరు స్త్రీలు పతీ-పుత్రాదుల మరణమును చూచి అతిదీనంగా శబ్దాలు చేస్తూ ఏడ్చుచున్నారు. ఒకచోట జనులు గొప్ప క్షామంచే పీడింపబడుచూ దీనాలాపనలు చేస్తున్నారు. మరొక చోట జనులు ఉత్సవ వేడుకలలో మునిగి - తేలుచున్నారు. ఒకచోట ఉత్తమ స్నేహయుక్తులై సరస సల్లాపములు ఆడుకొనుచున్నారు. ఇంకొక చోట ఒకరినొకరు వేధించుకోవటం, బాధించు
Page:129
కోవటం, హింసించుకోవటం జరుగుచుండుటచే ఆ వాతావరణం ఆవేశము, భయము-దుః ఖములతో నిండిపోయి ఉన్నది.
నా యొక్క భూతత్వాభిమానత్వం వలన అవన్నీ నేనే పొందుచున్నవాడిని కాసాగాను.
ఇంకా...
ఒకచోట “అగ్ని” దీపశిఖలుగా ప్రకాశించుచు ఆ ప్రదేశమంతా పండుగలాగా శోభింప జేస్తోంది. మరొకచోట ఆ అగ్ని యొక్క మహాదాహముచే దేహములు-గృహాలు దగ్ధం అయిపోతు న్నాయి. ఒకచోట తాటాకజలంలో జనులు స్నానాలు చేస్తూ సేదతీర్చుకొంటున్నారు. మరొకచోట జలప్రవాహంచే గ్రామాలు గ్రామాలు మునిగి-కొట్టుకుపోతూ ఉంటే జనుల హాహాకారాలు మిన్నుముట్టుచున్నాయి.
ఒకచోట వివేకియగు రాజు యొక్క పాలనలో ప్రజలు ప్రశాంతంగా, హాయిగా రోజులు గడుపు చున్నారు. ఇంకొకచోట సామంతరాజులు ఇళ్ళపై బడి కొల్లగొట్టుచుండగా తమ మానప్రాణ-ధనాదులకు రక్షణలేక, ప్రజలు భయవిహ్వలు లగుచున్నారు.
కొన్నిచోట్ల ప్రచండ రాక్షస పిశాచాదులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇంకొక చోట జల సమృద్ధిచే పంటలు పచ్చదనంతో రమణీయంగా క్షేత్రములుగా ఒప్పుచున్నాయి.
ఒకచోట పిల్లగాలులచే మేఘాలు నృత్య భంగిమగా కదల్చబడుచుండగా ఆ వాతావరణంలో జనులు అత్యంత ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొకచోట ప్రచండవాయువులచే మేఘములు కదలుచుండగా, పిడుగులు నేలరాలుచూ జనులను భయంకంపితులను చేస్తున్నాయి.
ఒకచోట సర్వాలంకారయుక్తంగా గృహములు ప్రకాశిస్తూ ఉంటే, మరొకచోట పడిపోతున్న గోడలను పట్టించుకునే నాథుడు లేక వెలవెలబోతున్నాయి.
ఒకచోట యుద్ధ నినాదాలు. మరొక చోట సుఖ-శాంత జీవన స్రవంతి. ఒకచోట వాయు ఝంకారాలు మరొక చోట ప్రశాంత వీచికలు. ఒకచోట శవాలు కాలుతున్నాయి. మరొకచోట నేల మరుభూమిగా అయి బూడిదచే కప్పబడి ఉన్నది. ఒకచోట కీటకము వంటి జీవులు అనేక దుఃఖములు-వేదనలు అనుభవిస్తూ నా యొక్క ఉనికి గుర్తించి "ఓ పరమాత్మా! వసిష్ఠ మునీంద్రా! మమ్ములను కాపాడండి! మేము ఈ దుఃఖ భారములను మోయలేం!".... అని ఆక్రందనలు సలుపుచుండటం వినిపిస్తోంది. ఒకచోట వటవృక్షం మొదలైనవాటి కొమ్మలు నేల మీదికి ఉండటం చేత అక్కడి నేలపై అనేక ఫలములు వ్రాలి కుళ్ళిపోతున్నాయి. మరొకచోట ఒక్క ఫలము రాలితే చాలు, అనేకమంది జీవులు దానిని భక్షించటానికి పరుగులు తీస్తున్నారు. ఒకచోట ఎండవేడిమికి నేల నుండి సెగలు వస్తున్నాయి. మరొకచోట దట్టమైన వృక్షములు అడ్డగించుటచే సూర్యకిరణములు నేలను తాకలేకపోతున్నాయి. ఒకచోట గజముల యొక్క దంతముల ఒరిపిడికి మహా వృక్షములు శిథిలావస్థను పొంది ఏ క్షణమైనా నేలకూలటానికి సిద్ధంగా ఉన్నాయి.
ఒకచోట జనులు అనేక లౌకిక-రాజకీయ-ఆర్థిక వ్యవహారములలో మునిగి తేలుచున్నారు. అట్లు మునిగి తేలుతున్నట్లు కనిపిస్తూనే వారిలో కొందరు అంతరంగమున విషయములకు
Page:130
అతీతమైన ఆత్మతత్త్వమును అనుభవిస్తూ అంతా ఒక లీలగా, క్రీడగా, మాయగా, స్వప్నతుల్యంగా, భావ చమత్కార మాత్రంగా, అసత్యంగా దర్శిస్తున్నారు.
వేరేచోట కొందరు నేత్రములు మూసుకొని సూక్ష్మమగు ఆత్మతత్త్వమును ఆస్వాదిస్తూ ఆనందపరవశులై ఉంటున్నారు. ఒకచోట ఈగలు, దోమలు ముసురుతూ మృష్టాన్నం లభిస్తున్నందుకు సంతోషిస్తూ ఉంటే, ఆ ప్రదేశమును ఏహ్యతతో మరి కొందరు జీవులు దర్శిస్తున్నారు.
కొన్ని దుష్ట భ్రమరములు (తుమ్మెదలు) ఏనుగు దేహమును బాధిస్తూ ఉండగా, ఆ ఏనుగు తొండముతో తుమ్మెదలను పారత్రోలుతూ యాతనపడుతూ ఉంటే, అది చూచి ఆ తుమ్మెదలు ఏదో 'ఆట' ను చూచినట్లు ఆనందిస్తున్నాయి.
ఒకచోట కమలము సరస్సులో ఉండి పరవశంతో సువాసనలు వెదజల్లుతూ ఉంటే.... ప్రక్కనే కొద్ది క్షణముల వరకు గర్విస్తూ నిలిచిన మరొక కమలం ఏనుగు యొక్క దుష్ట క్రియచే పెకలించబడి ఒడ్డున ఎండకు ఎండి వడలుతూ కనిపిస్తోంది.
ఒక చోట క్రిమికీటకములు జనిస్తున్నాయి. మడొకచోట నాశనం పొందుచున్నాయి. ఒక చోట వర్షపుజల్లుకు విత్తనములు అంకురిస్తూ ఉండగా, మరొక చోట నీరు లభించక ఆ విత్తులు ఎండి వడలుచున్నాయి.
ఓ రామచంద్రా! ఈ విధంగా నా యొక్క భూతత్త్వధారణా క్రమంలో అనేక పరస్పర అనుకూల వ్యతిరిక్తాలగు వ్యవహార సరళితో కొనసాతూండటం నాకు అనుభవం కాసాగింది.
34. జగత్తు ఊహాకల్పితం మాత్రమే !
శ్రీరాముడు : గురువర్యా! జగత్తులను గాంచుట కొరకై మీరు పృథ్వి యొక్క ధారణను అనుసంధించారు కదా! అనగా మీరు ఆ సమయంలో ఈ కనిపించే భూలోకాంతర్గత భౌతిక స్వరూపములుగా అయ్యారా? లేక మానసిక అనుభవ మాత్రంగా పొందారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ మృత్తిక (మట్టితో కూడిన) పాషాణమయమగు విశాల రూపంగా పొందినదంతా కూడా కల్పన! నా దృష్టిచే మనోమాత్ర వికారమే! అందుచేత అదంతా మానసికమేనని అనవచ్చు. అయితే తత్త్వదృష్టిచే (లేక) వాస్తవ దృష్టిచే చూస్తే నేను నేనుగా యథాతథంగానే సర్వతా ఉండనే ఉన్నాను. కాబట్టి.... నేను మృత్తికారూపమూ పొందలేదు,... మనస్సు రూపమూ పొందకయే ఉన్నాను. చమత్కారమైన ఒక నిత్యసత్య రహస్యం ప్రతిపాదిస్తున్నాను. విను.
అమానసం మహీపీఠం న సంభవతి కించన
యత్ అసద్వేత్సి యత్ సత్వా, మనో మాత్రకమేవ తత్ II
Page:131
మనస్సుకు భిన్నంగా ‘భూతలము’ అనబడేదేది ఎవ్వరికీ, ఎప్పుడూ సంభవించుటయే లేదు. ఓ రాఘవా! సత్తు కావచ్చు, అసత్తు కావచ్చు-ఏదైనా సరే... ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరిచేతనైనా, పొందబడుచున్నదంతా కూడా మనోమాత్రమే అయి ఉన్నది.
శ్రీరాముడు : స్వామీ! "నేను యథాతథంగా ఉంటూనే,.. కల్పనా దృష్టిచే భౌతిక జగత్తుగా అయ్యాను” అని అంటున్నారు కదా! అసలు మీరెవరు? మీ అసలు స్వరూపమేమిటి? ఈ వసిష్ఠ నామధేయ రూపమే మీ అసలైన రూపమా? లేక బ్రహ్మాండముల మధ్య సంచారం చేయుచు మహా ప్రళయమునకు కూడా సాక్షిరూపమగు వేరొక రూపమేదైనా ఉన్నదా?
శ్రీవసిష్ఠ మహర్షి : వాస్తవానికి నేను శుద్ద చిదాకాశరూపుడను, నేనే కాదు. నేను నీవు తదితరులలో ప్రతిఒక్కరూ కూడా! అట్టి శుద్ధ చిద్రూపుడనగు నేను ఒకానొకప్పుడు 'స్ఫురణ’ను కలిగి ఉండటం జరుగుతోంది. నా యొక్క స్ఫురణమేది కలదో,.. అదియే 'సంకల్పము' అనబడుతోంది.
అట్టి చిదాత్మ యొక్క స్ఫురణయే మనస్సు కూడా! అదియే భూతలం-అదియే జగత్తు! అదియే నీవు చూస్తున్న ఈ భౌతికదేహం కూడా! అదియే బ్రహ్మదేవుడు. ఊహాలోకంలో నగరాలు కనిపించునట్లు,... చిదాకాశంలో మానసికాకాశం సంకల్ప నగరం వలె స్ఫురించుచున్నది.
ఓ రామచంద్రా! ఈ విధంగా ఈ భూమండలం నా యొక్క సంకల్ప మాత్రము, మనో మయము అయి, నా యొక్క ధారణభ్యాసముచే నాకు పరిపుష్ఠం అగుచున్నది.
ఓ ప్రియ జనులారా! ఈ భూమండలం మీకు ఏఏ విధంగా కనిపిస్తోందో,... అదంతా వాస్తవం కాదు. మరి? ఎవరెవరికి ఎట్లెట్లు అనుభవ మగుచున్నదో అదంతా మనస్సు యొక్క స్వయంకృత మైన కల్పనా చమత్కారమే సుమా! ఈ విధంగా ఈ జగత్తంతా కూడా “నిర్విషయమైనట్టి చిదాకాశము యొక్క స్ఫురణ మాత్రమే”... అయి ఉన్నది.
వాస్తవానికి చిదాకాశమే అయి ఉండినప్పటికీ, ఈ జగత్తు స్థూలరూపంగా అనుభవసిద్ధ మగుచున్నది. స్వప్నంలో విశాల భూమి కనబడినప్పటికీ అదంతా తన స్వప్నత్వమును త్యజింపకయే ఆ రూపంగా ఉంటోంది కదా!
అలాగే జాగ్రత్లో గాంచబడుచున్న ఈ పృథ్వి మొదలైనవి 'ఇదం' అనే ప్రత్యయార్థము అయిన దృశ్య ప్రతీతికి విషయము అయి ఉండికూడా ఇది తన మానసిక రూపత్వము త్యజించటమే లేదు. ఆకాశములో బాల్యమునుండి నీలత్వము చూస్తున్నాం. ఆకాశము శూన్యస్వరూపమే కదా! ఎట్టి పదార్థము కలిగి ఉండకపోయినప్పటికీ ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతోంది? చిరకాలం అభ్యాసవశం చేత. అట్లాగే, అభ్యాసవశం చేతనే మట్టి గోడను మట్టిగా కాకుండా గోడగాను, ఇనుప కత్తిని ఇనుముగా కాకుండా కత్తిగాను, బంగారపు కత్తిని కత్తిగా కాకుండా బంగారంగాను చూడటం జరుగుతోంది. ఏదైనా ఒక వస్తువును చూస్తున్నప్పుడు,.. ఆ వస్తువు యొక్క దైనందిన ప్రయోజనమును దృష్టిలో ఉంచుకునియే చూడటం అభ్యాసవశంగా, జరుగుతుంది గాని, ఆ వస్తువును యథాతథంగా చూడటం సామాన్యంగా జరగకపోవటం ప్రతి ఒక్కరి యొక్క అనుభవమే!
Page:132
ఇదం స్థిరం సుకఠినం వితతం భూమి మండలమ్ ‘అస్థి’ ఇతి జాయతే బుద్ధిః, వ్యోమ్నీవ చిరవేదనాత్ II || ఆకాశం యొక్క నీలత్వం మొదలైనవాటివలె చిరకాలమైన అభ్యాసం చేతనే ఈ ఎదురుగా కనబడుచున్న జగత్తు "స్థిరంగా అతి కఠినంగా, సువిశాలంగా”... ఉన్నదాని వలె కనిపిస్తోంది.
అయితే శ్రుతి వాక్యములు ఈ జగత్తు గురించి మరొక విధంగా ప్రతిపాదిస్తున్నాయి. (ఉదా: “వాచారంభమ్-వికారో నామధేయమ్ మాట్లాడుకోవటానికి ఇక్కడ అనేక నామరూప విషయాత్మక విశేషాలు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది మొదలే లేదు” ఇత్యాది వాక్యాలు). కనుక అజ్ఞానుల అనుభవానికి ప్రసిద్ధమై తోచే ఈ భూతలం, ఇందలి వస్తుజాలం మొదలైనవి వాస్తవానికి విజ్ఞుల దృష్టిలో లేకయే ఉన్నాయి. మరి? మనస్సు యొక్క సూక్ష్మ రూపమే జగత్తుగా మనస్సుచే పొందబడుచున్నదని గ్రహించు. ఆదిసృష్టి మనోమయమే అయి ఉన్నది. అట్టి మనోమయమగు 'ఆదిసృష్టి' యొక్క "ఆద్యము-మనోనిర్మితము-ఏకము” అయినట్టి ఏ సూక్ష్మరూపం కలదో,... ఆ సూక్ష్మరూపమే ఈ విధంగా స్థూలత్వము పొందియున్నది.
దృష్టాంతానికి 'స్వప్నం’ తీసుకుందాం. స్వప్నంలో మొట్టమొదటిది అగు స్వప్నచైతన్యమే (స్వప్న స్ఫూర్తియే) స్వప్న నగరముల రూపంగా భాసిస్తోంది కదా! సృష్ట్యాదియందలి మనోచైతన్యమే ఈ విధంగా జగద్రూపంగా స్థితి పొంది ఉంటోంది. ఓ రామచంద్రా! ఈ కనిపించే భూ-స్వర్గపాతాళలోకాలు, ఈ కనకబడే సమస్త దృశ్యమూ కూడా ఎల్లవేళలా 'చిద్రూపము' అనే పిల్లవాని యొక్క మనోరాజ్యము-అని గ్రహించు.
శ్రీరాముడు : స్వామీ! చిద్రూపము సదా స్వయముగా నిర్మలము-నిర్విషయము అయి ఉండగా అద్దానికి ఈ 'దృశ్యము' అనబడు మానసికమైన వ్యవహారం, ఆ తర్వాత దృశ్యాంతర్గత అనుభవ పరంపరలు, దేహ-దేహాంతరం ఎచ్చటి నుండి ఎందుచేత ఎట్లా ప్రాప్తిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "నిర్మలము-విషయరహితము" అగు చిద్రూపము నుండి ‘సంకల్పము’ అనే ఒకానొక చైతన్యతత్త్వము అనిర్వచనీయ కారణంగా బయల్వెడలుతోంది. అయితే నిశ్చల జలంలో చంచల తరంగత్వము బయల్వెడలుచున్నప్పటికీ... ఆ తరంగములు జలముకంటే వేఱ? కాదు. అట్లాగే చిద్రూపమగు ఆత్మయొక్క 'సంకల్పము' అనునది ఆత్మ చైతన్యము కంటే భిన్నంకాదు. ఈ జగత్తు అనబడేది అట్టి 'సంకల్పము’ యొక్క ప్రయోజనమే అయి ఉన్నది. అనగా ఈ జగత్తు అనబడేది సంకల్పమయం మాత్రమే!
వాస్తవానికి ఈ జగత్తు సంకల్ప నిర్మితమే అయి ఉండటంచేత ఇది జగత్తుగా వాస్తవం కాదు. సత్యము కాదు. ఆకారయుతం కూడా కాదు. ఇది ప్రకాశమానము (తెలియబడుటకు విషయమై ఉన్నది) కాదు. మరి ఈ దృశ్యము ఎందుకు ఎట్లా ఉంటోందంటావా?
శ్యమస్తి అపరిజ్ఞాతం, పరిజ్ఞాతం న విద్యతే పరిజ్ఞాతం తదేవ అస్య శృణోషి యదిదం చిరమ్ ॥
Page:133
చిన్మాత్రమగు ఆత్మ గురించిన అజ్ఞానముచేతనే ఈ జగత్తు (అజ్ఞాత దృష్టికి) ఉన్నట్లుగా అనిపిస్తోంది. నా నుండి నీవు ఆత్మ జ్ఞానమును వింటున్నావు కదా! అట్టి జ్ఞానముచే "ఈ కనబడేదంతా చిద్రూపమే”... అని గ్రహించబడుచున్నది. ఈ భూమండలం-ఆకాశం-నక్షత్రాలు – తదితర లోకాలు మొదలైన దృశ్య మంతా "అద్వైతము-ఏకము-శాంతము" అగు చిన్మాత్రమే... తనయందు తాను ఈ రీతిగా స్ఫురిస్తోంది" - అని గ్రహించాలి సుమా! "దీనికి కారణం ఎవరు?” అని సభికులెవరైనా అనుమానిస్తారేమో! అందుకే చెప్పుచున్నాను. ధగధగాయమానమైన ఒక మణి ఉన్నదనుకో, అది ఎఱుపు-తెలుపు నలుపు కాంతి పుంజములను స్వభావ సిద్ధంగా వ్యక్తీకరిస్తోంది కదా! అట్లాగే చిదాకాశముకూడా స్వభావసిద్ధంగా ఈ 'జగత్తు' అనే ప్రదర్శనమును వ్యక్తీకరిస్తోంది. వాస్తవానికి చిదాకాశము యథాతథంగానే ఉన్నది. గాలి గాలిగానే ఉండి తనయందు తరంగములను, వాయుగుండములను వ్యక్తీకరించటం లేదా! ఇదీ అట్టిదే!
వాస్తవానికి పరమాత్మ ఏమియు చేయటంలేదు. యథాతథమయ్యే ఉంటున్నారు. తన యొక్క చిన్మాత్రస్వరూపమును త్యజించటమే లేదు. వాయువు తరంగత్వం ప్రదర్శించేటప్పుడు తన యొక్క వాయుత్వం కోల్పోతోందా? లేదే! పైగా, 'తరంగత్వం' అనునది వాయువు యొక్క స్వభావమే అయి ఉన్నదికదా!
కాబట్టి, సూక్ష్మమగు 'మానసిక రూపం' గాని, స్థూలమగు 'భూతల రూపం' గాని యథార్థానికి లేవు. అవి దృష్టి యొక్క దర్శనాచమత్కృతులే సుమా! దృష్టి ఆత్మ నుండి బయల్వెడలుచూ, ఆత్మకు అభిన్నమైయున్నది.
ఆకాశం రూపరహితం. కానీ, ఒక దిక్కువైపుగల ఆకాశమును చూస్తే, ఆ ఆకాశం అర్ధ చంద్రాకార రూపయుక్తంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే... చిదాకాశమే భూతల రూపంగా నిరంతరం కనిపిస్తూ ఉంటోంది. నిర్మల చిత్ ఏ స్వభావమాత్ర స్ఫురణ కలిగి ఉంటోందో... ఆ స్ఫురణమే అతి నిర్మలమగు భూమండలంగా కనిపిస్తోంది. కాబట్టి చిదాకాశమే ఇట్లు భేదరూపంగా అజ్ఞానంచేత కనిపిస్తోంది అని అనక తప్పదు. ఓ రామచంద్రా! ఈ కనబడే భూమి, ఆధార రహితంగా ఉంటున్న భూమండలము ఈ రెండూ కూడా స్వప్నపురంలాగా మహా చైతన్యం యొక్క స్ఫురణ (లేక) వివర్త రూపము మాత్రమేనయ్యా! ఇదీ చిదాకాశమే! నిరాధారమగు అదీ చిదాకాశమే! అజ్ఞానం చేతనే ఇవి భాసిస్తున్నాయి. జ్ఞానము చేతనో ఇది గాని, అదిగాని ఎచ్చటా లేనేలేవు.
కాబట్టి... ఈ భూత-భవిష్యత్ వర్తమాన కాలములందలి ముల్లోకములలోని సర్వప్రాణికోట్ల యొక్క స్థితి స్వప్నజగత్తు వలె, ఊహా సంకల్పనిర్మిత-నగరము వలె భ్రాంతి మాత్రమే అయి ఉన్నది. అదంతా కూడా 'మనో రాజ్యదశ' వంటిది. అవన్నీ కూడా ఆత్మ సత్తా-అధిష్ఠాన సత్తా రూపములే అయి ఉన్నాయి. అనేక తరంగాలకు జలమునకు భేదమెక్కడిది?
అందుచేత రామచంద్రా! నేను ఇతఃపూర్వం చెప్పిన జగత్తులను ధారణ చేస్తున్నప్పుడు “ఈ జగత్తులు ఇందలి సమస్త పదార్థములు నేనే" అను ధారణను వహించినవాడనై వాటినన్నిటినీ నా
Page:134
స్వరూపములుగానే గాంచాను, అనుభవించాను. తత్సమయంలో నిర్వికారమగు ఆత్మయే స్వరూపముగా కలిగినవాడనై ఉన్నాను కూడా!
ఓ ప్రియ రాఘవా! “జనన మరణ రహితము-చిన్మాత్రము” అగు పరమాత్మ తత్త్వమే... అజ్ఞాన దశయందు... తనయొక్క 'శుద్ధాత్మరూపము'ను త్యజించకుండానే... ఈ అనేక భేదములతో కూడిన యథాస్థితమగు చరాచర ప్రపంచమును... 'సద్రూపము' వలె... ధరించుచున్నది. కానీ, జ్ఞానదశయందు అట్లేమీ ధరించకయే ఉన్నది.
35. అహంకార - జగత్తులు చిదాకాశ రూపాలే! శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ! మీరు ఇప్పుడేమో జగత్తు యొక్క ‘ధారణ’ చేస్తూ ప్రేమద్వేషం, సంతోషం-విషాదం, సుఖం-దుఃఖం వంటి ఆయా మానసిక స్థితులన్నీ మీవిగా ధారణచేస్తూ మీ భౌతిక జగత్స్వరూపాన్ని మీరే అనుభవిస్తున్నారని చెప్పారు కదా! ఇంతకు ముందు మీరు లోకాలోక పర్వతంపై గల గండశిలలోను, తదితర శిలలలోను, వృక్షములలోను, ఆకులలోను కూడా అనేక అసంఖ్యాక బ్రహ్మాండాలను చూచానని చెప్పారు. ధారణాదృష్టిచే జగత్తు పొందుచు న్నప్పుడు కూడా భూమండలంలోని ప్రతి వస్తువులోను అనేక బ్రహ్మాండాలు మీకు కనిపించాయా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఏ దృష్టితో చూస్తుంటే అవియే కనిపిస్తాయి. దృష్టియే సృష్టి సుమా! అందుచేత పృథ్వీధారణా దృష్టి యొక్క విశేషప్రసరణం చేత “అణువణువు అంతర్గత జగత్ సమూహ దృష్టి” అప్పటికి (పృథ్వి ధారణాదృష్టి సమయంలో) ప్రదర్శితమవటం లేదు.
నా యొక్క 'పృథ్విధారణ' అను చమత్కారంచే... జాగ్రదావస్థ యందలి భూమండల రూపమును, స్వప్నావస్థయందలి భూమండల రూపమును రెండింటినీ పొందసాగాను కదా! అట్లు పొందుచూ ‘ఈశ్వర సాక్షి' దృష్టిచే దేనిదేనిని ప్రత్యక్షంగా అనుభవించానో ఆ వివరాలు చెపుతాను.
ఆ లోకాలోక పర్వత శిలలో ఎట్లా బ్రహ్మాండములను అవలోకించానో, ఈ పృథ్వి మొదలైన వాటియందు కూడా అనేక జగత్సమూహములు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే రామచంద్రా! ‘జగత్రణ’చే నాకు ప్రాప్తించిన దృశ్యమైనా, ఈ వర్తమానంలో మనిద్దరికీ కనిపిస్తున్న దృశ్యమైనా (లేక) ఇదంతా ద్వైతమయంగా కనిపించవచ్చు గాక! అయినా కూడా ఇదంతా కూడా అద్వైతమగు ప్రశాంత పరమాత్మ స్వరూపమే అయిఉన్నది. ఎందుచేతనంటావా?...
జగన్తి సన్తి సర్వత్ర, సర్వత్ర బ్రహ్మ సంస్థితమ్ ।
సర్వం శూన్యం పరం శాంతం, సర్వమ్ ఆరంభమంన్థరమ్ II
ఇక్కడ సర్వత్రా జగత్తులూ ఉన్నాయి. అదే సమయంలో సర్వత్రా బ్రహ్మమే ఉన్నది. ఈ సర్వము దృశ్య శూన్యము-శాంతము అయి ఉన్నది. అదే తరుణంలో సర్వము దృశ్య సహితము, అనేక కార్యరంభములచే వ్యగ్రము కూడా అయి ఉన్నది.
Page:135
సర్వత్రైవ అస్తి పృథ్వ్యాధి, స్థూలం, తచ్చ న కించన | చిద్వ్యోమైన యథా స్వప్నపురం పరమజాతవత్ I
స్థూలములైన పృథ్వి మొదలైనవి అంతటా నిండి ఉన్నాయి. కానీ వాస్తవానికి అవేవీ లేనే లేవు. అవేవీ ఉత్పన్నమే అయి ఉండలేదు.
శ్రీరాముడు : ...!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. యథార్థంగా ఉత్పన్నమే అయి ఉండకపోయినప్పటికీ స్వప్న నగరంలో మనుష్యులు-భవనాలు అనుభవ విషయములుగా అగుచూ ఉండటం లేదా? ఇదీ అంతే! ఇంకొక చమత్కారం కూడా!
నేహనానాస్తి, నో నానా, న నాస్తిత్వం, నచాస్తితా
“అహమ్” ఇత్యేవ నైవాస్తియత్ర, తత్ర కుతో అస్థి కిమ్ ?
సముద్రంలో అసంఖ్యాక జలబిందువులు తరంగాలు లేస్తున్నాయి. ఇంతలోనే కనబడకుండా పోతున్నాయి. మహా సముద్రంలో ఒక తరంగానికి ఉనికి ఎక్కడ? ఉత్పత్తి ఎక్కడ? వినాశన మెక్కడ? జలమునకు వేరైనది మహాసముద్రంలో (తరంగరూపంగా) ఎక్కడ ఉనికిని పొందుతోంది? అట్లాగే, ఇక్కడ ఏకమూ లేదు, అనేకమూ లేదు. అస్తిత్వమూ లేదు, నాస్తిత్వమూ లేదు. ఆ ఏక - అనేకముల అభిమానియగు 'నేను' అనబడు అహంకారమే మొట్టమొదట లేదు. 'నేను' అనబడుదాని వాస్తవరూపం బ్రహ్మమే! ఇక అట్టి అహంకారమునకు (నేను-అనుదానికి) అనుభవమయ్యే తదితర విషయ సమూహముల గురించి మనం వేరుగా చెప్పుకునే దేమున్నది? ఘనీభూతమై అనుభవమగు చున్నప్పటికీ ఈ 'నేను' మొదలైన రూపములు వాస్తవానికి లేవు. ఒకవేళ ఉన్నాయని అనుకుంటే, అప్పుడు వాటియొక్క రూపం 'నిరామయము-అజము-అప్రమేయము అగు బ్రహ్మమే అయి ఉన్నది. సృష్టికి ముందు ఈ అహంకారము-జగత్తు మొదలైనవి చిదాకాశరూపమే అయి ఉన్నాయి. వాయు తరంగత్వానికి పూర్వం ఆ తరంగం వాయురూపమే అయి ఉన్నది కదా! సృష్టి యొక్క అనంతరం ఈ అహంకార జగత్తులు చిదాకాశరూపమే సంతరించుకోబోతున్నాయి. ఏదైతే మొట్టమొదట చిట్టచివర చిదాకాశమే అయి ఉండుచుండగా, ఇక మధ్యలో కనిపించేదంతా స్వప్న పురము వంటిది కాక మరేమిటి? స్వప్న చైతన్యంలోనుంచి స్వప్నదృశ్యం బయల్వెడలి తిరిగి అదంతా స్వప్నచైతన్యంలోనే లయం అగుచున్నట్లుగా... ఈ జాగ్రత్ చైతన్యంలోంచి సంకల్పరూపంగా బయల్వెడలిన అహంకార జగత్ అనుభవపరంపరంతా తిరిగి జాగ్రత్ చైతన్యంలోనే లయం కాబోవుచున్నది. కనుక అద్దాని యొక్క (అహంకారము-జగత్తుల)... 'ఉన్నది-లేదు' అనే ప్రసక్తి ఎక్కడిది? స్వప్నంలోని నగరం స్వప్నంలో ఉన్నవానికి ఉన్నది. ఆ స్వప్నము గురించి సంభాషించే మనకు లేదు. జగత్తు-అహంకారము అజ్ఞాన దృష్టికి కనబడుచున్నాయి. అత్మానుభవదృష్టికి స్వప్నతుల్యమగుచున్నాయి.
Page:136
35. అహమ్ జలతత్వమస్మి! అహమ్ రసతత్వమస్మి!
పృథ్విధారణారూపిగా అయి ఆ విధంగా అనేక జగత్తులు వీక్షించాను కదా! ఆ తర్వాత జలరూపమును ధరించాను. అట్టి జలరూపధారణచే మరల అనేక జగత్తులు చూచాను. వాస్తవానికి ‘చిద్రూపుడను’ గానే ఉండి ఉన్నప్పటికీ జలరూపం పొంది 'సముద్రం' అనే మందిరంలో ప్రవేశించి 'గుల్-జల్' శబ్దముల ఉచ్చారణ చేశాను. తలలో పేను వసించునట్లుగా నేను చెట్లు-పూలుఆకులలో వాటి వాటి వలయాది ఆకారములలో రసరూపంగా విశ్రమించి కాలక్రమంగా పరిపుష్టమగు ఆకులలో నాడీ సమూహాన్ని రచించాను. జలంలోని రసరూపం ధరించిన నేను ఆ జలం త్రాగిన ప్రాణుల హృదయాలలో ప్రవేశించాను. వాత-పిత్తాది ధాతువులను స్పృశించాను. ఒకచోట వికలత్వం పొందాను. ఇంకొక చోట ఖండనం చేశాను. మంచు కణములను అధిరోహించి శయనించాను. ఒక్కొక్కసారి దీర్ఘమైన ప్రవాహంగా పయనించి, శ్రమించి ఆనకట్ట యొక్క స్పర్శచే విశ్రాంతి తీసుకున్నాను. అప్పుడప్పుడు నా యొక్క చైతన్య రూపమును మరచి ఆ ఆవర్తములలో అనేక భ్రమలకు లోనయ్యాను. “అందుకు ప్రాయశ్చిత్తార్థమా?” అన్నట్లుగా అక్కడక్కడ గోతులలోను, నూతుల ప్రక్కల పడి శిథిలమైపోయాను. పర్వత శిఖరాలపై నుండి క్రింది సెలయేరులోకి జారి పడి అనేక విభాగాలుగా చీలిపోయాను. అప్పుడప్పుడు ఆవిరిగా మారి ఆకాశంలో ప్రవేశించగా నక్షత్రములు నాకు మణిభూషణములుగా అయినట్లు కనిపించాయి. మేఘపీఠములలోంచి మరల విద్యుత్ స్పర్శచే జలబిందువులుగా మారి నేలకు చేరాను. జలస్వరూప ధారణచే నేను పిపిలీకము (చీమ) వంటి చిన్నచిన్న జీవుల సూక్ష్మనాడులలో కూడా ప్రవేశించి అక్కడి జలముతో ఏకం అయ్యాను. మధుర పానీయముల రూపం ధరించి జిహ్వ యొక్క పరమాణువులలో ప్రవేశించి జిహ్వకు ఉత్తమానుభవమును సాక్షాత్కరింపజేశాను. ఆ అనుభవమంతా జ్ఞానరూపమగు మనో బుద్ధులచే దర్శించాను కానీ... దేహ స్వరూపంగా కాదు. వాస్తవానికి, 'విషయం' (లేక) దృశ్యం అనేది ఆనంద రూపం కాదు. అందులో ఆత్మ సుఖం యొక్క లేశమైనా లభించదు. మనస్సే విషయం యొక్క రూపానికి ఆధారమై ఉన్నది. అయితే, ఈ మనస్సు ఎద్దానినైతే విషయరూపంగా ప్రకాశింపజేస్తోందో... అట్టిదంతా అసత్తున్ను, జీవులను వ్యామోహపరచేదీ అయి ఉన్నది. ఆత్మ మనస్సును స్వస్వరూపచమత్కారంగా సందర్శిస్తున్నప్పుడు మాత్రమే ఈ సర్వం ఆత్మానంద దరహాసమై అనుభవం కాగలదు.
=
జలరూపినై నాయందలి 'నాచు' మొదలైన ఉచ్ఛిష్టములను తుమ్మెదలకు ఆహారంగా ఇచ్చి వేశాను. సర్వ ఋతువుల యొక్క రసరూపంగా గాలిలో ప్రవేశించి జలరూపంలో 14 విధములగు జీవుల అవయవముల సంధులలో ప్రవేశించి అక్కడ వసించాను. మరికొన్ని సమయములలో జలకణ రూపధారినయి వాయు తరంగములను అధిరోహించి నిర్మలాకాశమార్గంలో విహరిస్తూ జనులకు సుంగధ సుఖములను అందిస్తూ, ఆహ్లాదపరుస్తూ సంచారం చేశాను.
Page:137
ఓ రామచంద్రా! ఆ సమయంలో 'పరమాణువు' లో కూడా ప్రవేశించి, అందులో గల వివిధ జగత్తులను అనుభవించాను. వాస్తవానికి సమస్త పదార్థముల అభ్యంతరమును ఎరుగునట్టి “జ్ఞాత-చిద్రూపుడను” అయి ఉండి కూడా 'జలధారణ'చే అజ్ఞాతం వలె అనేక చోట్ల స్థితిని పొందాను. ఆయా చోట్ల అనేక కోట్ల బ్రహ్మాండాల ఆవిర్భావం, తిరోభావం కూడా కాకతాళీయంగా దర్శించటం జరిగింది.
ఈ ప్రకారంగా అనేక జగత్తులు చూచాను. కానీ, వాటి భావము- అభావము-సాకారమునిరాకారము ఇవన్నీ కూడా ఆకాశము కంటే అతి నిర్మలమగు చిదాకాశమే అయి ఉన్నాయి. ఓ రామచంద్రా! జాగ్రత్-స్వప్న సుషుప్తులనబడే అవస్థాత్రయం గాని, ఈ దేహ-ఇంద్రియ బాహ్యప్రపంచముగాని-ఇవన్నీ కూడా వాస్తవానికి ఆత్మ దృష్ట్యా ఒకింతైనా కూడా లేకయే ఉన్నాయి. ఆ ఆత్మ చైతన్యము దృశ్య స్వభావం కాదు, అదృశ్య స్వభావం కాదు. దృశ్యాదృశ్య స్వభావం కూడా కాదు. అది అఖండాకాశరూపమే అయి ఉన్నది.
తత్ త్వమ్ అసి! - అదియే నీవు. (తత్త్వమ్)
సో_హమస్మి! తదితరమపి తదేవ! - నేను అదియే! తదితరులందరి రూపం అదియే!
కాబట్టి రామచంద్రా! “అఖండవాక్యార్థబోధ” చే సమస్త ద్వైతమును దాటివేయి. సర్వదా శుద్ధ చిదాకాశరూపుడవై ఉండు.
36. తేజోరూప ధారణ (అహమ్ తేజోరూపమస్మి)
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా పృథ్వి రూపధారణ, జల రసరూప ధారణ నిర్వర్తించిన నేను తేజోరూపాన్ని ధరించి సంచరించనారంభించాను. “సూర్య-చంద్ర-నక్షత్రాల అవయవ యుక్తమగు తేజస్సే నేను” అను అనుభూతిని ఆశ్రయించి... అట్లే అయ్యాను. సత్వ ప్రధానుడనై సమస్త జగత్తునందు గల తేజము నేనే అయ్యాను. రాజుయొక్క కీర్తి అనేక గృహములలో కీర్తించబడునట్లు, అనేక ఇండ్లలోని దీపముల వెలుగునై గృహములలోని అనేక వస్తువులను ప్రకాశింపజేయసాగాను. సూర్యచంద్ర కిరణాలలో ప్రవేశించి అనేక జీవుల దృష్టిని పులకింప జేయసాగాను. పదార్థముల రూపాలను మరుగున పరిచి ఉంచే అంధకారాన్ని పటాపంచలు చేయసాగాను. సువర్ణంలోని మెఱుపురూపినయ్యాను. మాణిక్య ముత్యములలోని తేజోపుంజాలుగా అయ్యాను. ఆ నా తేజముచే పాతాళాది అధోలోకములను కొంచెం ప్రకాశింప జేశాను. అవి స్వతహాగా తమోలోకములు కదా! భూలోకమును సగం ప్రకాశింపజేశాను. సూర్య-చంద్ర-నక్షత్రదేహాది అనేక విషయములను ఇముడ్చుకొన్న తేజో మహాసముద్రమే నేనయ్యాను. ధాతువులలో లోహత్వము, మనుజాదులలో పరాక్రమము, రత్నాదులలో కాంతి, వర్షాదులలో విద్యుత్ప్రకాశము, నేత్రములలో దృశ్యత్వము, స్నేహత్వము, హాస్యత్వము, శృంగారత్వము-ఇవన్నీ తేజోరూపమే కాబట్టి వీటినన్నిటికీ కారణభూతుడనై ఉండసాగాను. అంతేకాకుండా యోధులందలి వీర్యత్వము, దేవత
Page:138
లందలి వరప్రదానత్వము, అసురులందలి దేవతా శత్రుత్వము, సర్వజీవులందలి బలము, స్థావరము లందలి ఉన్నత రూపత్వము-నా స్వరూపముగా అనుభవం పొందసాగాను. “అవన్నీ నావే... నేనే” ...అను అనుభూతిని పొందసాగాను. ఇంకా మరుభూమి (ఎడారి) లో నదులు (ఎండమావులు) కనిపించునట్లుగా “నేను సూర్య స్వరూపుడను" ... అనే అనుభవం ద్వారా దశదిక్కులలో నా కిరణాలతో వ్యాపించినవాడనై 'జగత్తు' అనే పక్షిని పట్టుకొనినవాడివలె అయ్యాను. చంద్రబింబమును కిరణస్పర్శచే ప్రకాశింపజేసి, తద్వారా వృక్షములకు రసస్ఫూర్తిని ప్రసాదించుచున్నవాడనై ప్రకాశించాను. ఆకాశమునందు నక్షత్ర స్వరూపుడనై జగత్తు అనే గ్రహానికి అలంకార రూపుడ నైనాను. సముద్ర గర్భంలోను, వర్తకుల త్రాసులలోనూ ప్రకాశించే రత్నముల కాంతిపుంజములు నేనయ్యాను. సముద్రగర్భంగా నా అగ్ని స్వరూపాన్ని చూచి భీతిల్లి పరిభ్రమిస్తున్న సముద్ర గర్భ (తిమింగలములు మొదలైన) జీవులను చూచి వినోదించాను. సూర్య కిరణ స్వరూపుడనై దేహధారుల దేహములను స్పర్శిస్తూ, పరవశం పొందాను. మేఘ-పర్వతాలలో ప్రవేశించి అక్కడక్కడ విద్యుత్-దావానల రూపం అనుభవించాను. అగ్నిరూపం పొంది కట్టెల నుజ్వలింపజేస్తూ సుందర దేహములను భస్మీభూతం చేశాను. యజ్ఞవాటికలో ప్రవేశించి హవిస్సులను మంత్ర ముగ్ధంగా దహింపజేశాను. కొన్ని గృహములను దహించి ఆ కుటుంబ సభ్యులను దుఃఖితులుగా చేశాను. మానవ-నాగ-గంధర్వ-అసుర స్త్రీల స్తనములపై ముత్యములలోని కాంతిపుంజములుగా తేలియాడాను. మిణుగుఱుపురుగు రూపం ధరించి స్త్రీల ముఖములను స్పర్శిస్తూ ఇంతలోనే బాటసారుల పాదప్రహారానికి గుఱి అయ్యాను. ఇట్లు అనేక ఉన్నత అవనత స్థితులను పొంద సాగాను. దేహగృహంలో దేవతా స్త్రీల సుందరదేహములను దర్శించాను. ఒకచోట జ్వాలారూపినై సువర్ణము–ఇనుము మొదలైన లోహములను ఖండనం చేయసాగాను. మరొకచోట కల్పాంతాగ్ని రూపం ధరించి ప్రళయ సమయంలో జగత్తును భస్మీభూతం చేసి ఆకాశమున మేఘరూపంతో కప్పివేశాను. మరొకచోట బడబాగ్ని రూపంలో సముద్ర జలమంతా త్రాగివేసి ఆ శూన్య ప్రదేశంలో నృత్యం చేశాను. అగ్నిరూపం ధరించి అనేక జీవరాశుల దేహాలను పొట్టన పెట్టుకున్నాను. ఇంకొక చోట లోహమును ఆశ్రయించి కమ్మరి యొక్క సమ్మెట ప్రహారములు స్వీకరిస్తూ అగ్ని కణముల రూపంలో నలువైపులా వెదజల్లబడ్డాను. మరొకచోట వజ్ర వైడూర్యాది రూపము ధరించి ఎక్కడో భూగర్భంలో ఉండిపోయి ఏ ప్రాణికీ కనబడకుండా యుగములు గడిపివేశాను.
శ్రీరాముడు : మానప్రదుడగు ఓ మునీంద్రా! ఇక్కడ నాదొక చిన్న సందేహం. తేజోరూపియై అనేక అనుభవములను పొందినట్టి మీరు సుఖమును అనుభవించారా? లేక దుఖమును పొందారా? ఈ విషయం బోధ కొరకై చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఒక మనుజుడు చేతనరూపుడే అయిఉండి కూడా గాఢ నిద్రాసమయంలో జడత్వమును పొందుచున్నాడు కదా! అట్లాగే చిదాకాశము అన్యమగు ఆయా స్వరూపాదులను అనుభవించటం జరుగుతోంది. ఎప్పుడైతే బ్రహ్మము తనను తాను 'పృథ్వి' మొదలైన రూపములుగా అనుభవించనారంభిస్తుందో.... ఆ మరుక్షణం సుషుప్తునివలె, జడునివలె
Page:139
తనయందు ఉంటుంది. అయినా కూడా బ్రహ్మము ఏ క్షణమందు కూడా మరొక స్థానం గాని, రూపంగాని పొందటంలేదు. అటువంటప్పుడు ఇక దానికి దుఃఖ ప్రసంగం ఎక్కడిది? వాస్తవానికి ఈ ఆకాశము-పృథ్వి-జలము-తేజస్సు మొదలైనవన్నీ అద్దాని సద్రూపములే గాని అసద్రూపములు కావు. బ్రహ్మము సర్వదా అవికారముగానే ఉంటోంది. అట్లా ఉంటూ, అయ్యది ద్రష్ట-దృశ్యములను ప్రకాశింపజేయుచు ప్రకాశించుచున్నది.
ఏతత్ సత్యపరిజ్ఞానం యస్య ఉత్పన్నమ్ అఖండితమ్
న తస్య పంచభూతాని న దృశ్య - ద్రష్టృ విభ్రమః ||
ఇట్టి సత్యమగు ‘అఖండజ్ఞానం' ఎవనికి ఉత్పన్నం అవుతుందో... వానికిక పంచభూతములు ఉండవు. ద్రష్ట-దృశ్యముల గురించిన భ్రమ ఉండదు.
కనుక రామచంద్రా! ఆ సమయంలో శుద్ధమగు బ్రహ్మరూపముచేతనే అదంతా నేను అనుభవించటం జరిగింది. ఎందుకంటావేమో? ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అనుభవించబడాలంటే అయ్యది బ్రహ్మ స్వరూపం అయితేనే సాధ్యం. దృశ్యమంతా కూడా నాకు బ్రహ్మరూపంగానే కన్పట్టుచూ, బ్రహ్మానుభవంగానే అగుచున్నది. అట్లా కాకుండా ఎప్పుడైనా నన్ను నేను పంచ భూతాలుగానో, దేహము-శిల మొదలైన రూపముగానో గాంచటం జరిగిందే అనుకో! అప్పుడు? అప్పుడు నేను సర్వదా జడుడనే అవుతాను. జడమైనదానికి అనుభవమేమున్నది? స్మరణ ఎక్కడ నుండి వస్తుంది? కనుక ఓ సభికులారా! ‘అనుభవము' అనునది ఉన్న కారణంగా మీరంతా కూడా నా వలెనే బ్రహ్మమే స్వరూపంగా కలిగి ఉన్నారని గ్రహించండి. నావలె తత్త్వ సందర్శనం చేయగల సామర్థ్యం కలిగియే ఉన్నారు. అంతేగాని, ఈ దృశ్యత్వం - ద్రష్టత్వం అనేది వాస్తవం కాదు. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఆత్మానుభవం నుండి చ్యుతి పొందకయే ఉండండి. అచ్యుతులై ప్రకాశించండి! శ్రీరాముడు : స్వామీ! ఎక్కడ బ్రహ్మము ఉంటే అక్కడ 'అనుభవము' 'స్మరణ' ఉంటాయని అంటున్నారు కదా! గాఢనిద్రా స్థితిలో ఈ జీవునికి అనుభవము స్మరణలు ఉండవు కదా! అనగా ఈ జీవుడు జడత్వము సంతరించుకున్నట్లా? ఆ సమయంలో కూడా అతడు చైతన్యరూపమగు బ్రహ్మమేనని అనవచ్చునా? అనకూడదా?
శ్రీవసిష్ఠ మహర్షి :
‘సుప్తో స్మి' ఇతి దృఢంభావం బుద్ధవాన్ చేతనో పిసన్ నైద్రమేవైత్యలం జాడ్యం లసచ్చేతతి కిం చ న ॥
గాఢ నిద్రలో కూడా 'నేను నిద్రపోతున్నాను' అని మనం ఎఱుగుచున్నాం కదా! ఎఱుగు చున్నాం కాబట్టే మెలకువరాగానే “ఆహా! మంచి నిద్రపోయానండి" అని చెప్పగలుగుచున్నాం. అనగా నిద్రపోతున్నప్పుడు కూడా అప్పటి అజ్ఞానమును (ఈ జాగ్రతన్ను ఎఱుగుచున్నట్లే) స్వప్రకాశమగు ఆత్మ ఎఱుగుచునే ఉన్నది.
Page:140
ఎవడైతే జ్ఞానంచే ప్రబుద్ధుడు అవుతాడో... అతడు తన ఈ ఆధిభౌతిక దేహమును శమింప జేసుకున్నవాడై నిర్మల బోధరూపమగు సూక్ష్మ దేహమున ఉదయించినవాడు అగుచున్నాడు.
ఆ సూక్ష్మ దేహమును, 'అనురూప శరీరం' (లేక) 'మహచ్ఛరీరం' అని కూడా అంటున్నాం. అట్టి జ్ఞానమయమగు సూక్ష్మమైనట్టి అనురూప శరీరంచేత, (లేక) మహమచ్చరీరం చేత యోగి అగు జీవన్ముక్తుడు తన ఇచ్ఛానుసారంగా మెలగుచూ ఉంటాడు. బోధరూపమగు నిర్మల సూక్ష్మ దేహంచే అట్టి జీవుడు అభేద్యములైన శిలా గర్భంలో ప్రవేశించి మరల బయల్వెడలగలడు. ఇంకా పాతాళమునందలి ఆకాశమును కూడా పొందగలడు. అందుచేతనే నేను అప్పుడు అనంతముచిదాకాశ వాయువు-తేజము మొదలైన రూపాలన్నీ ధరించి అనుభవించాను. ఎందుకంటే చిత్స్వరూపమగు ఆత్మకు వజ్ర-శిల-పాతాళ ఆకాశ-స్వర్గాదులందు శీఘ్రంగా రాకపోకలు నిర్వర్తించ గలగటంలో అడ్డుపడగలిగినదేమున్నది? అయితే, ఆత్మ... బోధమాత్ర శరీరముచే జడపదార్థములందు ఎంత వరకు ఉంటుందో... అంత వరకు అట్టి రూపముతోటే స్థితి కలిగి ఉంటుంది. అది ఎప్పుడు తన ఇచ్ఛచే మరొక చోటికి వెళ్ళదలచుకుంటుందో... అచ్చట ‘చలనము’ మొదలైన క్రియాశ్రమ లేకుండానే అప్పటికప్పుడు వెలయగలదు. ఎందుకంటే ఆత్మకు గమన ఆగమనములు (పోక-రాకలు) కూడా 'స్థితి' వంటిదే! ఈ దేహములాగా “ఇక్కడికి రావటంఅక్కడికి పోవటం”... వంటివి కాదు.
బోధమాత్రం విదుర్దేహమ్ అతివాహికమ్ అవ్యయమ్ |
ఇదానీం త్వం తమేవ ఇహ బుధో అనుభవసి స్వయమ్ ॥
బుద్ధిశాలివగు రామచంద్రా! బోధమాత్రమునే (నిర్విషయమగు ఎఱుక స్వరూపమునే) శాస్త్రములు అవ్యయమగు 'అతివాహిక దేహం' అని, 'సూక్ష్మ శరీరం' అని కూడా అంటున్నాయి. నీవు అనుకోవాలేగాని ఇచ్చటే, ఇప్పుడే అతివాహిక దేహం యొక్క ధారణలచే జగద్రూపమును (అనగా నీ నీ యొక్క దేహము/ రూపం ఈ జగత్తంతా అయినట్లు) నా వలెనే అనుభవం పొందగలవు. ఓ సభికులారా! ఓ తదితర ప్రియ ముక్షువులారా! మీలో ఎవరైతే 'నా యొక్క స్వరూపము సర్వదా ఈ దేహారంభ-దేహాంతములచే స్పర్శించబడని అప్రమేయ-కేవల సాక్షీ స్వరూపమే అయి ఉన్నది. అట్టి నా స్వరూపము విషయములకు, వృత్తులకు, ఇంద్రియ విశేషములకు సంబంధించనిది' అను అవగాహనచే సూక్ష్మ దేహము అను వాహనం ధరిస్తారో... అప్పుడిక నా వలెనే జగత్ స్వరూప ధారణ తప్పక సుసాధ్యమేనని గ్రహించి ఉండండి. మీరు తత్త్వజ్ఞులయ్యెదరు గాక! తత్త్వజ్ఞులు బోధచే “సూర్యాదులందు నేను కేవలం చిన్మాత్రాకాశ రూపుడనై ఉన్నాను" అని మొట్టమొదట గ్రహిస్తున్నారు. “నేను ఈ కనబడే సర్వ సహజీవులలోను చిన్మాత్రాకాశ రూపుడనై ఉండనే ఉన్నాను” ...అను అనుభవమును పుణికి పుచ్చుకుంటున్నారు. ఆ తర్వాత వారు తమ ఇచ్ఛచే సూర్యుడు మొదలైన సమస్త జగత్తును అస్తమింపజేసి అద్దానినంతా (తదితర సహజీవులందరితో సహా) 'కేవలీ ఆత్మత్వము’ తోటి స్థాపింపజేయుటలో శక్తులై ఉంటున్నారు. అప్పుడు ఈ జగత్తు ఇట్లే వారికీ విద్య మానమై ఉన్నప్పటికీ... ఇదంతా ద్రష్ట-దృశ్యరహితమగు ఆత్మ స్వరూపంగా అగుపించుచున్నది.
Page:141
శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానికి ఈ జాగ్రత్ జగత్తు ఎట్లా కనిపిస్తుంది? అజ్ఞానికి ఎట్లా కనిపిస్తుంది? వేర్వేరుగానా? ఒక్కతీరుగానా?
శ్రీ వసిష్ఠ మహర్షి : మన స్నేహితుడొకడు మన ప్రక్కనే నిద్రిస్తూ స్వప్నం కంటున్నాడనుకో... మన యొక్క (జాగ్రత్) దృష్టికి ఆ మన నిదురిస్తూ స్వప్నం కంటున్నట్టి స్నేహితుని స్వప్నజగత్తు అసత్తుల్యమే కదా! అదంతా మన దృష్టిలో అజ్ఞానావృతమగుటచే "అసత్తు-శూన్యము-మెలకువగా ఉన్నవానికి అలభ్యము” అని మనకి అనిపిస్తుంది కదా! కాని ఆ స్వప్నద్రష్టకు స్వప్నం సత్యంగానే ఉంటోంది. అట్లాగే జ్ఞాని యొక్క దృష్టి యందు (అజ్ఞానికి) నానా విధములుగా, సత్యముగా నిత్యముగా కనిపించే ఈ జాగ్రత్ జగత్తు కేవలం అసత్తే అయి ఉన్నది. ఒకడు తన మనోరాజ్యములో కనిపించిన అగ్ని తన దేహమును స్పర్శిస్తున్నట్లుగా ఊహించు చున్నప్పటికీ, అతని భౌతిక దేహం ఆ ఊహాకల్పిత అగ్నిచే తాకబడక యథాతథంగా ఉంటుంది కదా! అట్లాగే కొంచెం ఇచ్ఛచేత నేను శిల- అగ్నివాయు జల పూర్వక ధారణ పొందుచున్నప్పటికీ... నాకేమి దుఃఖాదులు ఏమాత్రం కలుగనే లేదు. ఏ జీవుడైనా ఏది ఎట్లున్నప్పటికీ "నేను సర్వాత్మకము-నిత్య నిర్మలము-భావాతీతముత్రిగుణాతీతము అగు ఆత్మ స్వరూపుడను. తదితర జీవులు-జగత్తులు నా యొక్క విభూదియే, విభాగమే”... అను ఆత్మజ్ఞానమును సుస్థిరీకరించుకొని ఉంటాడో-ఇక ఈ దుఃఖాదులు తామరాకును నీరు అంటనట్లుగా - అతనిని స్పృశించనేలేవు.
ఓ రామచంద్రా! ఈ విధంగా తేజోదశ (లేక) అగ్ని రూపము పొందిన నేను ఇట్లు అనేక దేహాలలో ప్రవేశించి పరిరక్షణ సంహారములను నిర్వర్తించాను. అనేక అరణ్యాలను దావానల స్వరూపుడనై దహించాను. దుష్టుల ఐశ్వర్యంలాగా అనేకసార్లు చంచల జ్వాలలతో ప్రవృద్ధమవటంఇంతలోనే ఉపశమించటం అనుభ వించాను. అట్టి నా సుదీర్ఘ సంచార సంరంభంతో పరమాణువులో కూడా ప్రవేశించి అక్కడ అనేక జగత్తుల ఉత్పత్తి-ఉనికి-వినాశనములను చవిచూచాను. సాక్షినై సందర్శించాను.
ఆ జగత్తులు, ఆ యానము-అంతా చిదాకాశము మాత్రమే. ఈ కనబడే వర్తమాన జగత్తు కూడా చిదాకాశమే! ఇందులోని వస్తువులు, సంఘటనలు, జీవులు, జడములు, రాకలు, పోకలు, ఉత్పత్తులు, వినాశనములు, నేను, నీవు, లోకములు, భూత-భవిష్యత్ వర్తమాన కాలమాన పరిస్థితులు-ఇవన్నీ “చిదాకాశమే చిదాకాశమున ఇట్లు కన్పట్టటం” అని గ్రహించు.
ఓ జనులారా! "అదేమిటి? ఇక్కడ వస్తువులు-విషయములు-సుఖములు-దుఃఖములుబంధువులు—తదితరులు-ఆర్థిక సామాజిక స్థితిగతులు ఇవన్నీ జగత్తులో తారసపడుచుండగాచిదాకాశమే ఇదంతా-అనునది ఎట్లా కుదిరేది?” అని అంటారా?
ఇందుకు “స్వప్నద్రష్ట నుండి బయల్వెడలి, స్వప్న ద్రష్టలోనే ఉంటూ, స్వప్న ద్రష్టలోనే లయ మొందుచున్న అనేక వృత్తాంత పరంపరలు కలిగి ఉంటున్న స్వప్నజగత్తే” మనందరికీ దృష్టాంతం.
Page:142
38. వాయు స్వరూప ధారణ (అహమ్ వాయురూపమస్మి)
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా పృథ్వి రూపధారణ, జలరూపధారణ, తేజోరూపధారణ అవధరించి అనేక జగత్తులను సందర్శించిన తర్వాత కూడా ఇంకా “ఈ జగత్ వ్యవహార పరంపరను సందర్శించాలి. పరామర్శించి రావాలి!" అనే కుతూహలం నాలో కొనసాగుతూనే ఉండసాగింది. అందుచేత తేజోరూపధారణ నుండి 'వాయు స్వరూపుడను' అను ధారణను ఆశ్రయించాను. మరుక్షణం వాయురూపినై వాయువు ఉన్నంత వరకు విస్తరించిన దేహస్వరూపుడనైనాను. లతలను, దేహుల ముఖములను, పుష్పములను, సుగంధములను పరిపాలించసాగాను. అనేక చోట్లకు ప్రసరిస్తూ కొన్ని చోట్ల మంచు బిందువులను లీలావినోదంగా హరించాను. మత్తు పానీయములు త్రాగి విశ్రమించిన జీవుల సర్వాంగములను స్పృశిస్తూ మరింతగా ఆహ్లాదపరచాను. అతి నేర్పరితనంతో పూలతలను నాట్యమాడించాను. ఓషధి-లతఫలాదులను ఉల్లాసంగా స్పృశించి ఆనందించాను. పుష్ప సుగంధములను నా వాయు దేహముపై అలంకారముగా ధరించాను. మంగళ సమయంలో శీతల సుందర- సుగంధములచే స్త్రీలకు ప్రీతి జనకమై ప్రవర్తించిన నేనే వినాశనసమయంలో భయంకర రూపమును ధరించి దృఢపర్వతములను కూడా ఎండుటాకులవలె పెల్లగించి మరీ ఆకాశంలోకి విసిరాను.
నా వాయు స్వరూపమునకు రంగు అంటూ ఏదీ లేకపోయినప్పటికీ స్వర్గంలోని నందనవనంపై ప్రసరిస్తూ అక్కడి మందారకుసుమములచే ఎఱుపురంగును సంతరించుకున్నాను. నరకలోకంలో ప్రవేశించినప్పుడు అక్కడి అగ్ని సమూహముల నుండి బయల్వెడలిన పొగను వెంటనిడుకొని నల్లగా కనిపించసాగాను. సముద్రపు అలలపై సుతారముగా విహరించాను. అప్పుడప్పుడు ప్రకాశమానుడగు మేఘములను మోసుకువచ్చి చంద్రబింబమును కప్పివేశాను. మరొకప్పుడు నా ప్రసరణ శక్తిచే ఆ మేఘములను తొలగిస్తూ చంద్రుని ప్రకాశమానునిగా కూడా చేశాను. నక్షత్రములను కదిలేటట్లు చేశాను. ముల్లోకములలోని సిద్ధులు విమానాలను అధిరోహించి సంచరించుటకై బయల్వెడలుచుండగా, వారి విమానములు ప్రయాణించుటకై అనుకూలంగా వాయు వీచికలను ప్రసరింపజేశాను.
ఈ చిత్తము వలెనే శీఘ్రగామినై అటు నుండి ఇటు, ఇటు నుండి అటు సంచరించసాగాను. అవయవములు లేకపోయినప్పటికీ సర్వుల అవయవములు నావే అయ్యాయి. నా శ్రమను మఱచి ఇతరుల శ్రమ పోగొట్టాను. చంద్రకిరణములలోని అమృతమును గ్రోలి తిరిగి ఆ రసమును భూమిలో ప్రవేశింపజేశాను. మేఘములను అధిరోహించి ఊయల ఊగాను. దంపతుల ముఖములను స్పృశించి వారికి కలిగిన రతిశ్రమను తొలగించాను. రహదారిపై వేగంగా ప్రసరించి అక్కడి ధూళితో ఆకాశమును కప్పి క్రమంగా ఆ ధూళిని గృహద్వారముల గుండా గృహములలో ప్రసరింపజేశాను.
Page:143
సంగీత వాద్యములలో ప్రవేశించి అనేక సంగీత శబ్దములను పలికాను. జలకణములను అభరణములుగా ధరించాను. కొన్నిచోట్ల ధూళిని తొలగించి ఆ ధూళికి శత్రువువలె అయ్యాను. పుష్పములలోని పుప్పొడిని నలువైపులా వెదజల్లి తద్వారా 'జీవులను సుఖింపజేయటం' అను పుణ్యక్రియకు కారణమైనాను.
ప్రాణుల యొక్క అంగ-ఉపాంగములందు వర్తించుచు అక్కడి నాడీ మండలమునకు ప్రేరణ కలిగించాను. ప్రాణరూపినై జీవుల ‘హృదయములు' అనే మర్మస్థానములను 'స్పందన’ను ప్రేరేపించి జీవులు జీవించటానికి కారణభూతుడనైనాను.
యోగుల ధారణశక్తికి, సహకరిస్తూ వారి ఆయా చక్రస్థానములలో ప్రతిక్షేపించబడినవాడినై, తద్ద్వారా వారి అధ్యాత్మయానానికి సహకారం అందించాను. నిత్యము ఏకాంతంగా విహరిస్తూ కొన్ని చోట్ల అగ్నియొక్క ప్రజ్వలనానికి సహకారం అందిస్తూ మరికొన్ని చోట్ల అగ్ని ఆరిపోవటానికి
కారణమగుచూ సంచరించాను.
విమానములకు నేను భూమిగా అయ్యాను. సంతాపములు తొలగిస్తూ జీవులకు సుఖమును అందించాను. 'ప్రాణ-అపానకళలు' అనే త్రాళ్ళరూపం ధరించి దేహరూపయంత్ర సంచాలనం నిర్వర్తించాను. సముద్ర తరంగములను నా వేగముచే ఖండించాను. ధూళిని ప్రసరింపజేసి సముద్రంలో ద్వీపములను నిర్మించాను.
మనోరాజ్యమువలె జీవులకు ఎదురుగానే వాయుమహాసముద్రంగా ఉండి వారి కంటికి మాత్రం కనబడకయే ప్రవర్తించసాగాను. తాటియాకు విసనకఱ్ఱలచే కదలించబడి, దేహములకు స్పర్శానుభవమును పొందింపజేశాను. ప్రళయకాలంలో ఒక క్షణమాత్రంలో సమస్త పర్వతములను పెకలించి వేసి సముద్ర మధ్యంలోకి విసరివేశాను.
వివిధ వర్ణములుగల ధూళిని ఆకాశంలో సమావేశపరచి ఆనందించాను. ఎండుగడ్డి పరకలు ఎగిరెగిరి పడటానికి కారణమైనాను. “సూర్యుడు-జలము-మేఘము-వర్షము” అనే యజ్ఞ కార్యక్రమంలో మంత్రోచ్చారణ వలె పాలు పంచుకున్నాను. ఆకాశంలో షికారు చేశాను. దేహయంత్రంలో త్రాణను అయ్యాను. జలములను ఎండింపజేశాను.
1.మేఘములను ధరించటం, 2. తృణములను (గడ్డిపరకలను) కదలించటం, 3. జలాదులను శోషింపజేయటం, 4. గంధమును ధారణ చేయటం, 5. తాపములను హరించటం, 6. నెయ్యి మొదలైన వాటిని పిండీకరించటం (గడ్డ కట్టింపజేయటం) అనే ఈ 6 క్రియలను ప్రళయ సమయం వరకు అవిశ్రాంతంగా నిర్వర్తిస్తూనే ఉన్నాను.
రసాకర్షణ యందు అత్యంత వేగిరం చూపసాగాను. నాడులను ప్రేరేపించటం ద్వారా దేహముల కాళ్ళు-చేతులు కదలటానికి హేతువునయ్యాను. 'శరీరం' అనే నగరంలో నిరాటంకంగా నా ప్రయాణ మార్గాన్ని నిర్మించుకోసాగాను. 'అన్నరసం' పట్టుకొని ప్రాణ-అపానముల ద్వారా దేహమంతా అందించి దేహములను సేవించాను.
Page:144
శరీరములు ఒకప్పుడు నిర్మించబడటంలోనూ, మరొకప్పుడు నేలకూలటంలోనూ పాత్ర వహించాను. అన్నరసము యొక్క మలము యొక్క సూక్ష్మ తరములైన సారభాగముల యొక్కరక్త మాంసముల యొక్క వాతపిత్తాది ధాతువుల యొక్క సంయోగములందు, వేఱుపరచుటయందు బహుప్రావీణ్యం ప్రదర్శించాను.
ఓ రామచంద్రా! వాయువునందు గల ప్రతి సూక్ష్మణువు నందు అసంఖ్యాక జగత్తులు నాకు కనిపించాయి. అట్టి ప్రతి జగత్తులోనూ ఇట్లాగే భూమి ఆకాశం నక్షత్రాలు మొదలైనవన్నీ అతి విస్తారంగా ఏర్పడి ఉన్నాయి. ఆయా జగత్తులలో కూడా ఇప్పటిదాకా చెప్పినట్లే వాయు స్వరూపధారినై వెలయుచు సంచరించాను. అక్కడ ప్రతి పరమాణువులోనూ సృష్టి సమూహములు చలించుచున్నాయి. కానీ, పరమార్థ దృష్టియందు ఏదీ కూడా చలించకయే ఉన్నది. ఎందుకంటావా? దృశ్యశూన్యాకారమగు పరబ్రహ్మము నందు దేనికి గమనాగమనములు ఉంటాయి?
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. చంద్ర-సూర్య-వాయు-అగ్ని-ఇంద్ర-వరుణకుబేరాది దేవతలతోను, బ్రహ్మ-విష్ణు-మహేశ్వర-గంధర్వ-విద్యాధర-మహాసర్పములతోను,
సముద్ర-పృథ్వి-పర్వత-ద్వీప-ఆకాశ-మహాసముద్ర-లోకాంతర-లోకేశులతోడను, క్రియా-కాలకళాదుల క్రమముతోను, స్వర్గ-భూమి-పాతాళ-తదితర లోకాంతరములతోను, భావ- అభావ - వృద్ధి-క్షయ-జన్మ-జరా మరణ విభ్రమ ములతోను కూడిన అనేక జగత్తులు ప్రతి పరమాణువులోను ఉన్నాయి. నాకు కనిపించాయి. నాకు కనిపిస్తున్నాయి. ఈ బ్రహ్మాండములు ఎందులో జనించి నశిస్తున్నాయో, అట్టి స్వస్వరూపాత్మను సంతరించుకొన్న వారే.... వీటన్నిటినీ అధిగమించినవారగుచున్నారు సుమా! సర్వ భావనలకు, భావన ధారణలకు మూలము-ఆధారము అయిన ఆత్మయే నేనని ఎఱిగియే లీలగా వాయుదేహంతో అనేక జగత్-జీవుల పరంపరలను నా దేహ విభాగము వలె అనుభవించసాగాను.
39. వసిష్ఠ విరాట్ పురుష స్వరూపం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా నేను ఆకాశము-వాయువు-జలము-అగ్ని (తేజస్సు)–పృథ్వి అనబడే పంచభూత స్వరూపధారిని అయి అచ్చట గల త్రిలోకములలోనూ విహరించాను. ఒకదాని తర్వాత మరొకటిగా, అన్ని భూతముల రూపం మార్చి మార్చి ధరించాను. పృథ్వి-జలము-అగ్ని-వాయువుల యొక్క సమూహ (పిండీకరణం) రూపం ధరించి వృక్షములలో వసించుచూ వేఱు చివరల యందుండి భూమియందలి రసమును పానం చేశాను. చంద్ర కిరణములలో ప్రవేశించి ఊయలలూగాను, ఋతువులలో ప్రవేశించి ఆయా సమయములలోని పుష్పముల సుగంధం గ్రోలాను. మేఘములపై పచార్లు చేశాను. కోమలములైన అంగములపై విశ్రమించాను. మృదు-మధుర శబ్దములు ఆలపించాను. బ్రహ్మాండ రూపుడనై ఉన్నత పర్వతముల శిఖరము నుండి నదీజలం వెంట భూమిపై గల విస్తార ప్రదేశం వరకు ప్రవహించాను.
Page:145
పర్వతములు నా అంగములయ్యాయి. నదులన్నీ నాకు నాడీ మండలంగా అయ్యాయి. సిద్ధ విద్యాధరాది ప్రాణి సమూహములు నా దేహమునందు విశ్రాంతి తీసుకోసాగాయి. సూర్యుడుచంద్రుడు-నక్షత్రములు మొదలైన రోదసీ స్వరూపాలు నా అనుగ్రహముచే శరీరములు సంపాదించుకొన్నవారై సంతోషముగా అనేక రంగులు ప్రదర్శించువారయ్యారు.
సప్త సముద్రములు - సప్త ద్వీపములు కలిగి సప్త రూపములతో వెలయు పృథ్వి నా ముంజేతికి కంకణంగా స్థాపితం అయింది. విద్యాధర స్త్రీలకు నేను కనబడకయే, వారికి హృదయ స్పర్శానందమును కలిగించి పులకింపజేయసాగాను.
నదులు నాకు రసపూరితమైన నాడులైనాయి. పర్వతములు నాకు ఆస్థికలు (బొమికలు) వలె అయ్యాయి. జీవులందరు నాకు వింజామరలుగా అయ్యారు. సూర్యచంద్రులు పరిచారకులై నా హృదయ కమలంలో వసించసాగారు. సమస్త పాతాళము నాకు పాదములుగా అయింది. భూతలమేమో పొట్టగా రూపుదిద్దుకున్నది. ఆకాశము నాకు శిరస్సుగా అయింది.
దిక్షు సర్వాసు సర్వత్రా సర్వదా సర్వకారిణా | సర్వాత్మనాపి అసర్వేణ శూన్యరూపేణ సంస్థితమ్ ॥ …
నేను సర్వదిశలందు సర్వత్రా సర్వదా సదా స్వరూపమైనాను. సర్వ కార్య నిర్వహణాధికారినై సంచరించాను. అయినా కూడా అసర్వముగానే జగద్రహితంగానే) ఉన్నాను. సర్వ ద్వైతశూన్యమైనట్టి 'చిన్మాత్రము' గానే సర్వదా ఉండి ఉన్నాను.
పరిచ్ఛిన్నత్వము-అపరిచ్ఛిన్నత్వము; సాకారము-నిరాకారము; జడత్వము-చేతనత్వము... ఈ విరుద్ధ ధర్మముల యొక్క సముచ్ఛయమును నేనప్పుడు నా స్వరూపము నందే బాగుగా అనుభవించాను. మైనాక పర్వతాలలో అంతర్లీనంగా అనేక పర్వతాలు ఉంటాయి చూచావా? అట్లాగే పర్వత-నదీ-సముద్రములు, సూర్య-చంద్రులతో కూడిన అనేక బ్రహ్మాండములు నాయందే దర్శించాను. అనుభవించాను. జడమగు అద్దంలో అనేక నగరములు ప్రతిబింబిస్తాయి కదా? చిద్రూపుడనగు నాయందు ప్రకటితము-అప్రకటితము (గుప్తములు) అగు అనేక బ్రహ్మాండ పరంపరలను ధరించినవాడ నయ్యాను.
ఏవం జల అనిల - అగ్నిత్వం భూమిత్వం ఖాత్మనా మయా |
కృతం చితేవ స్వప్నేషు! బత! మాయా విజృంభితమ్ ||
ఓ రామచంద్రా! ఈ విధంగా పృథ్వి- జలము-అగ్ని-వాయువు-ఆకాశముల రూపమును స్వప్నము నందలి చైతన్యం స్వప్న నగరమును ధరించునట్లు - నేను ధరించాను. ఆహాఁ! ఈ మాయ యొక్క విజృంభణము ఎంతటి ప్రతాపం కలిగి ఉన్నది! ఎందుకంటే అట్టి స్థితిలో అగ్నివాయువు-పృథ్వి-జలం-ఆకాశాలలో అణువణువులోనూ అసంఖ్యాకమైన పృథ్వి-పంచభూతాలుసూర్యచంద్రులతో కూడిన అసంఖ్యాక జగత్తులు నాకు కనిపించాయి. ప్రతి పరమాణువులోనూ ఇట్లే వ్యాప్తమగు ఆకాశము కలదు.
Page:146
ఆ ఆకాశము యొక్క ప్రతి పరమాణువులోనూ మరల బ్రహ్మాండ పరంపరలు ఉన్నాయి. అట్లాగే స్వప్నంలో అంతర్గతంగా కనిపించే నగరంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండ పరంపరలు ఉన్నాయి.
శ్రీరాముడు : మీరు ఆ విధంగా భూమండలం ఇత్యాది రూపాలను ఎద్దాని సహాయంతో ధరించారు? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ భూమండలం-తేజస్సు-ఆకాశం-జలం-వాయువు మొదలైన జగదాత్మక రూపాలన్నీ నా యొక్క “అధ్యాస” అనుదాని బలంతోనే ధరించాను. కాబట్టి సర్వ జగద్రూపుడనై ఉన్నప్పటికీ వాస్తవానికి నేను ఎచ్చట కూడా ఒకింతైనా వ్యాపించి ఉండనేలేదు. వ్యాపకరహిత చిదాత్మనే నేను కదా! అయినాకూడా మనుష్యులు మొదలైన దేహధారుల నిమిత్తమై వృక్షంతృణం-అంకురాలను ఉత్పత్తి చేస్తూ... అంతే కాకుండా, భూమి ద్వారా వర్షాదుల జలమును ఆకర్షించాను. యుద్ధంలో శత్రురాజును జయించినట్లు నేను సర్వ ద్వైతరూప సంహార మగు బోధ రూపాన్ని సముపార్జించుకున్నాను. అట్టి శుద్ధ బోధరూపుడనగు నాలో లక్షల కొలది బ్రహ్మాండాలు (అధ్యారోపదృష్టిచే) వర్తించుచున్నాయి. అరోపిత దృష్టిచే అవేవీ నాయందు ఏ సమయమందునూ లేవు. చైతన్యమే చైతన్యమునందున్న స్వకీయమైన చమత్కృతులకు కర్త సుమా! నిజసత్తాస్ఫూర్తి రూపముచే స్వయముగా జగత్తుల రూపమున తనకు అభిన్నంగా చైతన్యమే రచించుకుంటోంది. (లేక) ప్రకటించుకుంటోంది. అట్టి చైతన్యమే నీ స్వరూపం! నా స్వరూపం! సభికులందరి స్వరూపం! “అనుభవము”, “రచన”, “ఇష్టము” ఇవన్నీ ఎక్కడెక్కడుంటాయో, అవన్నీ కూడా పరమార్థ చైతన్యము యొక్క చమత్కారమే తప్ప మరింకేమీ కాదు.
#
అధ్యారోపదృష్టిచే : ప్రతి వస్తువులోను స్వసత్తరూపంగా నేనే స్ఫురిస్తున్నాను కదా! కాబట్టి సర్వరూపుడను, సర్వకర్తను కూడా అయి ఉన్నాను.
అపవాదదృష్టిచే : సమస్తము బ్రహ్మాండరూపమే! కనుక నేను సర్వదా ప్రబుద్ధుడను, నిరామయుడను, కేవలము శుద్ధబోధ రూపుడను, బ్రహ్మరూపుడను అయి ఉన్నాను. ప్రతి వస్తువునందు, ఉన్నట్టి ప్రతి జీవునియందు ఉన్నట్టి “బ్రహ్మము” నందు సర్వసృష్టి (సర్వ జగత్తు) యొక్క అధ్యాస ఉండనే ఉన్నది. అందుచేతనే ప్రబుద్ధుని దృష్టిలో ఈ జగత్తంతా కూడా సర్వత్రా సర్వాత్మకమై, సర్వవ్యాపకమై, సర్వాశ్రయమైనట్టి బ్రహ్మమే అయి ఉన్నది.
అరోపిత దృష్టి : ఉన్నది ఉన్నట్లుగా గాంచుచూ, లేనిది లేనట్లుగా గమనించటం. అధ్యారోపదృష్టి : లేని దానిని సహాయంగా తీసుకొని ఉన్నది నిరూపించుకొని దర్శించటం. అపవాద దృష్టి : లేనిది ఎందుకు లేదో నిరూపించుకొని ఉండటం.
ఇక, ప్రబుద్ధుని దృష్టియందో... అది నేను చెప్పజాలను, ఎందుకంటే అతని దృష్టికి స్థిరత్వం లేదు. ఒకప్పుడు ప్రమోదంగా, మరొకప్పుడు విషాదంగా, ఇంకొకప్పుడు పేలవంగా, మరొకప్పుడు స్థైర్యంగా అతని అనుభవం ఉంటోంది. కాబట్టి 'ఇది ఇట్లు' అనునదేమీ లేకపోవుట చేతనే 'అతని దృష్టి ఇట్లా ఉంటుంది' అని మేము చెప్పలేకపోతున్నాం!
Page:147
కనుక ఓ రామచంద్రా! ఇప్పుడు చెప్పే సారవిషయాలు విను. ఆకాశకోశ విశదాత్మని చిత్స్వరూపే యేయం సదా కచతి సర్గ పరంపరేతి, సాన్త స్తదేవ కిలతాప ఇవాన్త రూష్మా, భేదోపలంభ ఇతినాస్తి సదస్త్యనన్తమ్ || 1. చిత్స్వరూపము (పరమాత్మ) సర్వదా ఆకాశము వలె అత్యంత నిర్మలమైనది.
2. అట్టి నిర్మల చిత్స్వరూపమగు ఆత్మలో ఈ సృష్టిపరంపరలు సదా భాసిస్తూనే ఉంటాయి. 3. అట్లా జగత్తు రూపంగా భాసించేదంతా కూడా చిద్రూప బ్రహ్మమే అయి ఉన్నది. ఒక చిన్న దృష్టాంతం - 1. తాపము, 2. ఉష్ణము... ఈ రెండు శబ్దములు వేర్వేరు అయినప్పటికీ వాటి అర్థం మాత్రం ఒక్కటే కదా! "తాపము నందు ఉష్ణము కలదు" అనే వాక్యం, లేక “ఉష్ణ తాపము” అనే శబ్దం భాషాపరంగా ఉన్నప్పటికీ ఆ రెండు శబ్దములు సమానార్థ వాచకాలే కదా!
అట్లాగే... 1. బ్రహ్మము, 2. జగత్తు... అను ఈ రెండు శబ్దములకు వాస్తవానికి భేదమేమీ లేదు. ఆ రెండింటికీ వాస్తవమైన అర్థం ఒక్కటే. వాస్తవానికి... నామరూపాత్మకమైన దృశ్యము లేదు. అనంతము - సద్రూపము అగు "బ్రహ్మము" మాత్రమే ఉన్నది.
ఓ జనులారా! ప్రియ శ్రోతలారా! సభికులారా! అట్టి అఖండ అప్రమేయ బ్రహ్మమే ఈ రామబ్రహ్మము. మీరందరు ఈ రామబ్రహ్మ స్వరూపులేనని గ్రహించండి!
40. సిద్ధ పురుషునితో సంభాషణం
(అశాశ్వత దృశ్య జగత్తు)
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా విద్యాధరి యొక్క అభ్యర్థనను అనుసరించి లోకాలోక పర్వత శిలలోని బ్రహ్మాండములో ప్రవేశించి, ఆ బ్రహ్మాండము మహాప్రళయకాలంలో లయమైపోగా, రుద్రభగవానుని నృత్యమును, కాళీదేవి యొక్క ఆవిర్భావమును, రుద్రభగవానుని స్పర్శచే ఆయనయందు లయమవటం, ఆ తర్వాత రుద్ర భగవానుడు కూడా సూక్ష్మరూపి అయి అంతర్ధానం కావటం, తదనంతరం ఆ శిలలోని తదితర భాగములలోను, తదితర శిలలలోను, ఇతర సర్వ పదార్థములందు అనేక బ్రహ్మాండములను సందర్శించటం, ఆ తర్వాత నా స్వరూపము నందే అనేక బ్రహ్మాండములు అగుపించటం, అటుపై నేను ఆకాశ వాయు-పార్థివ-అగ్ని-జల అభిమానినై సంచరించటమూ, ఇక ఆపై విరాట్ పురుషుడనై అనేక ఇంద్ర-అగ్ని-వాయు-త్రిలోకత్రిమూర్తులతో కూడిన బ్రహ్మాండములకు శరీరధారిని అవటము-ఇదంతా వర్ణించి చెప్పాను కదా! ఆ తర్వాత కొన్ని సిద్ధ లోకాలు కూడా సందర్శించాను.
అదంతా అయిన తర్వాత... ఇక సర్వకౌతుకములను త్యజించి నెమ్మదిగా అంతకుముందు ఆకాశంలో నేను సంకల్ప బలంతో నిర్మించుకున్న ఏకాంత మండపం వైపుగా వెళ్ళటం జరిగింది.
Page:148
శ్రీరాముడు : స్వామీ! అవునూ? మీరు అనేక బ్రహ్మాండములలో సంచరిస్తూ నిర్వికల్ప ధ్యానము కొఱకై చిదాకాశమునందు ఒకానొక విభాగమున తదితరులకు జేరవీలుకాని ఏకాంత ప్రదేశంలో మనో నిర్మిత కుటీరం చేరారు కదా! ఇప్పుడా కుటీరం తిరిగి జేరుచుండగా జరిగిన విశేష చమత్కారాలు ఏమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ విషయాలకే ఇక వస్తున్నాను. వినుఆ విధంగా కౌతుకముచే ఆ జగత్తులను దర్శించిన తర్వాత అట్టి క్రియ నుండి ప్రయత్నపూర్వకముగా వైదొలగాను. ఇతఃపూర్వపు ఆకాశమున మనో నిర్మితమైన సమాధి కుటీరం క్రమంగా సమీపించాను. కుటీరంలో ప్రవేశించాను. ప్రవేశించి ఇతఃపూర్వపు నా భౌతిక శరీరము కొరకై అటూ ఇటూ చూచాను. ఆ దేహం కనిపించలేదు. అయితే నా భౌతికదేహం ఉండవలసిన చోటుకు కొంచెము ప్రక్కగా ఎవరో సిద్ధుడు కనిపించారు. ఆయన సమాధియందు ఉన్నట్లుగా ఉన్నారు. కొంచెము సమీపంగా వెళ్ళి చూచాను.
ఔను! ఆయన సమాధియందు నిమగ్నమై ఉన్నారు. బ్రహ్మపదమును పొంది సౌమ్యత్వము వహించినట్లుగా కనిపిస్తున్నారు. సూర్య భగవానుని వలె గొప్ప తేజస్సు ఆయన ముఖంలో కనిపించింది. పద్మాసనము వైచుకొని ఉన్నారు. పరమ శాంతమూర్తియై ఇష్ట విషయము పట్ల చిత్తము స్థిరమగుటచే నిశ్చలులై ఉన్నారు. ఆయన ఆశ్రయించిన సుఖాసనమును అనుసరించి వృషణములు పాదముల చీలమండలం మధ్యగా ఉన్నాయి. ఆయన సర్వ జగద్విషయములకు ఆవల గల పరబ్రహ్మమునందు నిష్ఠ వహించి ఉన్నారని గమనించాను. ఆయన ముఖం విభూదిత్రిరేఖలతో సౌమ్యంగా, గంభీరంగా ప్రకాశిస్తోంది. భుజస్కంధములు సమముగానూ, నిలువుగానూ ఉండగా కంఠం అతి సుందరంగా శోభిస్తోంది.
ఆయన ప్రసన్నమైనట్టి సుఖముతో కూడి శిరస్సుచే అతి సుందరుడుగా కనిపిస్తున్నారు. నాభి వద్ద ఆయన అరచేతులు తెరుచుకొనిన భంగిమలో అవధరించబడి ఉన్నాయి. హృదయము బాహ్యముగా ఏతెంచు మహాతేజస్సుతో శోభిల్లుతోంది. కనురెప్పలు రెండూ మూసుకొని ఉన్నాయి. ఆయనలో బాహ్యేంద్రియ వ్యాపారములు అగుపించటమే లేదు. ఒక ప్రశాంత గాంభీర్య సరోవరము వలె మౌనస్థితిచే ఉట్టిపడుచున్నారు. అంతఃకరణము ధీర శాంత వృత్తిచే ప్రకాశిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిర్వికల్పమును ఆశ్రయించి ఉండటం చేత ఆయన నా రాకను గమనించే కనిపించటం లేదు. ఆ మునివర్యుని దేహమును ఆ స్థితిలో వీక్షించి నా యొక్క శుద్ధ చిత్తముతో ఇట్లా చింతించాను.
ఆహా! ఈయనెవరో మహాసిద్ధుడు అయి ఉంటారు. ఈ మహాత్ముడు నాలాగానే ఏకాంతమున విశ్రాంతి పొందాలని ఆకాశమున ఎక్కడో ఉన్న ఈ కుటీరానికి వచ్చారు. ఈయన సత్య సంకల్పుడు అయి ఉండటంచేతనే “సమాధియోగ్యమైన ఏకాంత స్థానం పొందాలి" అనే యోచనతో ఈ
Page:149
కుటీరంలో ప్రవేశించి ఉంటారు. నా భౌతిక దేహమును నేను చిరకాలంగా ఉపేక్షించి ఉన్నాను కదా! అందుచేత నా శరీరమును మరణించిన దానిగా భావించి ఇక నా రాక కొరకై వేచి ఉండక, ఆ నా శరీరమును ఎక్కడో పడవైచి, తాను ఇచట ఈ సమాధి స్థితిని ఆశ్రయించి ఉంటారు.
ఆ నా స్థూల శరీరం నశించియే ఉంటుంది. ఇక ఇక్కడ నాకు పనేమున్నది? కనుక ఈ సూక్ష్మశరీరం తోనే సప్తర్షి మండలములోని నిజాశ్రమమును చేరెదను గాక...!
ఈ విధంగా యోచించిన నేను సప్తర్షి మండలము వైపుగా ప్రయాణమునకు సంసిద్ధుడనైనాను. వెంటనే నా సంకల్పముచే నిర్మించబడిన ఆ కుటీరం నా యొక్క సంకల్పక్షయ ప్రభావం చేత క్షణంలో నశించిపోయి ఆ స్థానంలో శూన్యాకాశం యథాతథంగా ఉండటం జరిగింది. ఇప్పటి ప్రవృత్తి (లేక, ఆలోచన) ఇతఃపూర్వపు ప్రవృత్తి (లేక ఆలోచన)ని తొలగించివేస్తూ ఉంటుంది కదా! ఎప్పుడైతే సంకల్ప నిర్మాణకుటీరం (నాయొక్క సప్తర్షిమండలము వైపుగా వెళ్లాలనే ఉత్కర్ష “పూర్వ సంకల్పత్యాజ్యం + నూతన సంకల్ప ఆవిర్భావం" ప్రభావం చేత) నిరాధారమై అదృశ్యమైందో, ఆ క్షణంలో సమాధినిష్ఠుడైన ఆ సిద్ధపురుషుడు నిరాధారుడై క్రింద పడసాగారు. స్వప్నం శమించగానే స్వప్ననగరం కూడా శమించునట్లు నా సంకల్ప-ఉపశమనంచే నిరాధారుడైన ఆ మునీంద్రుని దేహం మేఘమును వదలిన జలధార వలె నేలపై పడిపోవుచుండటం నేను గమనించాను. అప్పటికి నా తప్పు నేను గమనించాను.
"ఆహా! 'ఎంతకాలమైతే నేనిక్కడ ఉంటానో అంత వరకు ఈ మనోకల్పిత కుటీరం ఇట్లే ఉండుగాక!’ అని సంకల్పించిన ఈ కుటీరం, నా ధ్యాస సప్తర్షిమండలం వైపుకు మళ్ళగానే, మటుమాయమైనది కదా! అరె! ఈ సిద్ధపురుషుడు ఇప్పుడు నేలపై పడుచున్నారు! ఎంత తప్పు జరిగింది! ఇప్పుడు వీరి దేహమునకు ఏదైనా హాని జరుగదు కదా?”
అని తలచి ఉలిక్కిపడ్డాను. ఆ సిద్ధపురుషుని వైపుగా చూచాను. ఆయన దేహం క్షయించిన పుణ్యమప్పటి వైమానిక దేవత వలె, మూలము ఛిన్నమైనప్పటి మహా వృక్షము వలె ఆకాశము నుండి విడువబడిన శిలవలె క్రిందపడసాగటం చూచాను. “మహనీయుల పట్ల, సుజనుల పట్ల దోష ప్రవర్తన ఉండకూడదు” అనే ధర్మముచే ప్రేరితుడనై సూక్ష్మ శరీరముతోనే ఆ సిద్ధపురుషుని శరీరము వెంట భూతలము వైపుగా రాసాగాను.
వాయు మండలము యొక్క పరివర్తనములచే ప్రేరితమై వాయుతరంగములచే మోయబడుచూ ఆ సిద్ధుని భౌతికదేహం సప్తద్వీపములకు సప్త సముద్రములకు ఆవల ఉన్న ఒక దేవతల క్రీడాస్థలముపై పడసాగటం అల్లంత దూరంగా గమనించాను. ఆయన దేహం యోగబలంచే వజ్ర-శిలాదుల వలె దృఢంగా ఉండటంచేతను, ప్రాణాయామధారణచే దూదిపింజమువలె అతితేలికగా ఉండటం చేతనూ అంతదూరం నుండి నేలను తాకుతున్నప్పటికి ఆ దేహమునకు ఏమీ కాలేదు. ఆయన చిత్తము అన్యత్రా తీవ్రంగా లగ్నమై ఉండటంచేత ఆయన
Page:150
సమాధికి కూడా ఎటువంటి భగ్నము వాటిల్లలేదు. ముందుగా ఆయన అరికాళ్ళు నేలను తాకాయి. క్రమంగా ఆయన శరీరం నేలపై ఆసీనమైనది. ఆయన శిరస్సు ఊర్ధ్వంగాను, ప్రాణ పానములు ఊర్ధ్వగమనం కలిగి ఉండటంచేతనూ ఆయన నేలపై గల ఒకచోట ఇతఃపూర్వపు పద్మాసనంతోనే స్థానం పొందారు.
అప్పుడు నేను ఆయనను సమీపించాను. ఆ సిద్ధపురుషుడు ఇతఃపూర్వం మానసిక కుటీరంలో పద్మాసనాసీనుడై ఉన్నట్లే ఉన్నారు. సమాధి నుండి మేల్కొననే లేదు. అప్పుడు ఆయనను సమాధి నుండి మేల్కొలుపుటకై ప్రయత్నశీలుడనైనాను. అట్టి ప్రయత్నంలో భాగంగా ఆకాశంలో మేఘములను ఉత్పన్నం చేసి వర్షమును కురిపించాను. బిగ్గరగా గర్జనలు చేయసాగాను. ఆయన ఉన్న దిశగా పెద్దపెద్ద శబ్దములతో వడగళ్ళ వాన కురిపించాను. ఎట్లాగైతేనేం, కొంతసేపటికి ఆ మహాత్ముని బోధితునిగా చేశాను. సమాధి నుండి మేల్కొలుప గలిగాను. అప్పుడాయన ప్రకాశమానమైన అంగములు కలిగినవారై క్రమంగా కనులు తెరచారు. ఆ విధంగా సమాధి నుండి మేల్కొనినట్టి మహనీయుడు సిద్ధుడు అగు ఆ మునివరేణ్యుని ఎదుట స్నేహపూర్వకంగా నిలబడి చేతులు జోడించి నమస్కరించాను. అప్యాయంగాను, నిర్మలవృత్తితోనూ ఇట్లా ప్రశ్నించాను. శ్రీవసిష్ఠ మహర్షి : ఓ మునివర్యా! మీరు ఎవరు? ఏ చోట ఉండేవారు? ఆ మనో నిర్మిత ఆకాశ కుటీరంలో ఎందుకు ప్రవేశించారు. దయచేసి మీ వివరాలు తెలియజేయవలసినదిగా నా విన్నపం.
నేనిట్లా అడుగుతూ ఉంటే ఆ సిద్ధపురుషుడు అప్పుడే నిద్రనుండి లేచినవాని వలె నా వైపు తేరి పార చూచారు. క్రమంగా కొద్దిసేపు కనులు మూసుకొని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించారు. ఆపై ఇట్లా అన్నారు.
సిద్ధ పురుషుడు : మహాత్మా! దయచేసి కొద్దిసేపు ఉండండి. నా వృత్తాంతమును స్మరించుకోనివ్వండి. ఆ తర్వాత మీకు అన్నీ వివరిస్తాను. రండి ఇటు వచ్చి సుఖాసీనులుకండి.
ఇట్లా పలికి ఆయన కొద్దిసేపు మరల కనులు మూసుకున్నారు. రోజంతా జరిగిన ఏవేవో విషయాలన్నీ సాయంకాలం జనులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు చూచావా? అట్లా ఆయన విషయములు స్మరించటంలో నిమగ్నమైనారు. కొద్ది క్షణములలో తన పూర్వ వృత్తాంతమంతా చింతనచేసి స్మరించారు. తటాలున లేచి నన్ను సమీపించి రెండు చేతులు ప్రేమపూర్వకంగా స్పృశించారు. నేను కూడా మర్యాదపూర్వకంగా లేచి వారి కరచాలనము స్వీకరించాను. ఇద్దరం ఒకరి వైపు మరొకరం ప్రేమ పూర్వకంగా చూచి చిరునవ్వు నవ్వుకున్నాం. ఇద్దరం సుఖాశీనుల మైనాం. ఆ తర్వాత ఆయన పెదవులు విప్పారాయి. చంద్రకిరణములవలె అతిశీతలములు, ఆనందదాయకములు, అనింద్యములు, ఆక్షేపణ చేయటానికి వీలేలేనివి, సుభోదయములు అగు మనోహర వాక్యాలు ఈ విధంగా పలికారు.
సిద్ధ పురుషుడు : మహాత్మా! ఇప్పుడు మిమ్ములను గుర్తించాను. సప్తర్షి మండలంలో వసిస్తూ ఆత్మజ్ఞాన బోధతో లోకపావనం చేసే మహత్గురువులగు వసిష్ఠ మహర్షియే మీరు కదా!
Page:151
ప్రణామములు! తమ పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు. మొట్టమొదటిసారి మీ దర్శనమైనప్పుడు మీకు నమస్కరించనందుకు నన్ను క్షమించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను. “క్షమ” యే సత్పురుషుల స్వభావం అయి ఉంటుంది కదా!
మహర్షీ! నేను “ఎవరు-ఎక్కడివాడను” అనునవి పెద్దగా మీకు చెప్పతగ్గ విషయమేమీ కాదు. అయితే ఏ సాలోచనాస్థితిచే నేను అక్కడి మనోకల్పిత ఆశ్రమంలో ప్రవేశించటం జరిగిందో... ఆ విశేషాలు చెబుతాను. వినండి.
మహాత్మా! ఇంతకు చాలాకాలం ముందు ఒకప్పుడు నేను “భోగములు పొందెదను గాక” అనే కౌతుకమును చేబూని మోహ ప్రదములగు దేవతల ఉపవన భూములలో సంచరించాను. అనేక చోట్ల చిరకాలం పరిభ్రమించాను. నదిలో తరంగం అనేక చోట్లకు తిరిగి తిరిగి వస్తున్నట్లు నేను ఈ చిత్తమును ఆశ్రయించి అనేక స్థానములలో తిరుగాడుచూ సుదీర్ఘకాలం గడిపాను. ఈ సంసార సాగరంలో “దృశ్యములు” అనే తరంగములచే వ్యాకులుడనై అనేక దుఃఖములు పొందాను. వర్షం కోసం ఎదురుచూచే చాతకపక్షి ఆకాశం వైపుగా చూస్తూ అతి దీర్ఘకాలం వేదనతో గడుపుతుంది చూచారా? నేను కూడా 'ఏదేదో కావాలి... పొందాలి... దక్కాలి... లభించాలి... తారసపడాలి... చూడాలి...రావాలి...పోవాలి.... చేరాలి... ఆస్వాదించాలి'... అని తలచుచూ ఈ సంసార మహారణ్యంలో సుదీర్ఘకాలంగా పచార్లు చేస్తూ అనేకసార్లు భ్రమ-విభ్రమములకు లోను అయ్యాను. ఇట్లా బహుదూరపు బాటసారిలాగా పయనించి, అలసి, సొలసిపోయాను. ఆహా! ఈ ప్రపంచంలో భోగాలలో “అజ్ఞానం” అనే ఉప్పు-చేదు తప్పించి వేరైన రమ్య వస్తువు ఏమున్నది? ఈ జగత్తు జ్ఞానము మాత్రమే సార వస్తువుగా కలిగి ఉన్నది. కాబట్టి సర్వ దుఃఖప్రదములగు వ్యవహారములను త్యజించి "ఆత్మజ్ఞాన సముపార్జన" యందే నిమగ్నం కావాలని నిశ్చయించు కున్నాను. శబ్ద - రూప - - రస - స్పర్శ - గన్ధ - - మాత్రాదృతే పరమ్ | నేహ కించన నామాస్తి కిమ్ ఏతావత్ అహమ్ రమే ॥
ఈ బ్రహ్మాండ లో ఎక్కడికి వెళ్ళినాకూడా శబ్ద స్పర్శ రూప-రస-గంధములనబడే 5 తన్మాత్రలు తప్ప అన్యమైన వస్తువేమున్నది? అవన్నీ పరిచ్ఛిన్న మాత్రములే కదా! అట్టి పరిచ్ఛిన్నదుఃఖ రూపములైన వాటియందు నేను ఎందుకు రమించాలి? పైగా, ఈ శబ్ద స్పర్శాదులన్నీ కూడా స్వయంగా 'సత్తా' కలిగిలేవు మరి? చిదాకాశము యొక్క సత్త చేత మాత్రమే అవన్నీ సత్త కలిగి ఉన్నాయి. చిదాకాశసత్తను వేతేచేసి చూస్తే అవి శూన్యరూపములే కదా!
లేక... సమస్తమూ చిన్మాత్రమే అయి ఉన్నది. చిన్మాత్రమునకు వేరుగా ఏదీలేదు. కనుక “అసత్తు” అగు ఆకారము కలిగియున్న ఆ ఈ శబ్దములందు నష్ట బుద్ధిచేతనే నేను వ్యామోహము, కౌతుకము కలిగియున్నాను కదా! ఈ శబ్దాది విషయములు విషము వలె “ఉన్మాదము - వైషమ్యము-మరణము” నకు దారి చూపటానికే ఉన్నాయిగాని, వాస్తవము-శాశ్వతము అగు ఆనందం కలగజేయటానికి కానేకాదు. స్త్రీలు నా యొక్క బుద్ధిమాంద్యంచేత నాకు కామవికారము
Page:152
కలుగజేయటానికే తారసపడుచున్నారు. అనురాగములన్నీ చిట్టచివరకు విరసత్వమునకే దారి తీస్తున్నాయి. ఇట్టి వాటిని నమ్ముకొని వీటిలో రమించువాడు వీటిచేతనే హతుడు కాక ఏమవుతాడు? ఈ జీవితంలో "ఏదో లభిస్తుందిలే” అనుకొని వేటివేటికో ప్రయత్నములు చేస్తూ కాలం-ఆయుష్షు వృథా చేసుకొంటూ ఉండగా, ఇంతలో నాచులో ఆహారం కోసం వెతుకులాడే చేపపిల్లకు కొంగ ఎదురగుచున్నట్లు ఎక్కడినుండో వార్ధక్యం వచ్చి వాలుతోంది. ఇక శరీరం సంగతి అందామా! సముద్రంలో బుద్బుదం బయల్వెడలి అతి శీఘ్రంగా నశించునట్లుగానే, ఈ దేహం ఎదురుగా కనబడుతూ-కనబడుతూనే ఇంతలో ఆరిన దీపంలాగా అంతర్ధానమౌతోందే!
ఈ “జీవితము” అనబడేది అనేక విక్షేపములతోను, కల్లోలములతోను కూడుకొని ఉంటోంది. దీనికి జననము ఒక తీరమైతే, మరణము మరొక తీరం.... దీనిలో సుఖ దుఃఖ పరంపరలు అనుక్షణం పాల్గొను చున్నాయి. యౌవనోల్లాసము ఒకవైపు పొంగుతుంటే, మరొకవైపు వార్ధక్యం గుంటనక్కలా దాగి ఉండి 'ఎప్పుడు క్రుంగతీద్దామా?' అని ఎదురుచూస్తూ ఉంటోంది. కాకతాళీయంగా లభించే ఇక్కడి సుఖాలు క్షణభంగురాలు, దుఃఖ మిశ్రితాలు కూడా! ఇదంతా అనేక అసమంజస వ్యవహారాల చేతనూ, మూర్ఖ ప్రలాపముల చేతనూ నిండి ఉన్నది. ఇందులో ఎటువైపు తొంగి చూచినా రాగద్వేషములే అగుపిస్తున్నాయి. ఇక్కడి మహత్తరమని చెప్పబడే కార్యక్రమములన్నీ లోభ మోహములతో నిండి ఉంటున్నాయి. కాస్త ఎప్పుడన్నా చల్లగా (అనుకూలంగా) అనిపించినా కూడా, ఇంతలోనే అనేక తాపత్రయములు సర్వదా సంసిద్ధమగుచు అనేక దుఃఖములు జనింపజేస్తున్నాయి.
స్వామీ! నదీజలం చూచారా? ఎప్పటికప్పుడు పాతనీరు ప్రవహిస్తూ పోవటం, క్రొత్తనీరు రావటం జరుగుతుంది కదా! అట్లాగే ఈ సంసారమునందలి పుత్ర-మిత్ర-ధనాది పదార్థములన్నీ కూడా వెనుకటివన్నీ ఎటకోపోవుచూ, ఇంతలో క్రొత్తవి వచ్చిపడుతున్నాయి. ఈ విధంగా వెనుకటివన్నీ గతించుచు, క్రొత్తవి ఏతెంచుచూ ఉండగా... ఇట్టి పదార్థ సమూహముల వలన మనకు వచ్చే ప్రయోజనం ఏమున్నది చెప్పండి? అటువంటి సంబంధ బాంధవ్యములపై నమ్మకము ఉంచి బ్రతుకును గడపటం ఎంతటి అవివేకం? బుద్ధి కలవాడెవడూ వీటిని నమ్మి ఉండడు. మహాత్మా! ఇంకా నదీజలమే నయం. ఎందుకంటారా? నదుల జలాలన్నీ ప్రవాహరూపంలో పోతున్నాయి. మరల పర్వత-మేఘాదుల సహాయంతో ఏతెంచుచున్నాయి. కానీ ఈ దేహమో! పోవటమేగాని, మరల వెనకకు రావటమనేది జరగనే జరగదు కదా! కమ్మరివాని చక్రంలాగా ఈ సంసార చక్రం మహాపరిభ్రమణం పొందుచుండగా ఇందలి వస్తువులు, జీవులు, సందర్భములు, సంబంధములు, దేహములు- ఇవన్నీ ప్రతిక్షణం అనేక పరివర్తనములు పొందుచున్నాయి. ఇక్కడ అతి భయంకరులు, శత్రురూపులు అగు “విషయములు” అనే అతి చతురులైన చోరులు నలువైపులా సంచరిస్తున్నారు. మామూలు దొంగలైతే రాత్రిపూట మాత్రమే ఇళ్ళలో ప్రవేశిస్తారు. మరి ఈ విషయచోరులో? మేము నిదురించేటప్పుడు, మేల్కొనునప్పుడు కూడా మా హృదయ గృహములలో ప్రవేశించి మా వివేకమును ఇట్టే దొంగిలించుచున్నారు.
Page:153
ఆయుషః ఖండ ఖండాశ్చ నిపతన్తః పునః పునః నకశ్చిత్ వేత్తి కాలేన, క్షతాని దివసాన్యహో!
అరెరే! ఏమి ఆశ్యర్యం! 'ఇప్పుడు ఇక్కడికెళ్ళాలి, అప్పుడు అతని సంగతి చూడాలి...' ఇటువంటి పిచ్చిపిచ్చి మాటలతో, వృథా వ్యవహారములతో అనేకమంది జనులు ఒక ప్రక్క సమయమును గడపి వేస్తున్నారు. మరొకవైపు ఏమగుచున్నదో గమనించారా స్వామీ! ప్రతిక్షణం ఆయువు రోజుల రూపంలో తరిగిపోతూ ఉంటే... ఇది ఎవరూ ఎఱుగుటయే లేదే?
ఇదమద్య తథేదం చ తథేదమ్ ఇదమస్య మే
ఏవం కలనయా లోకో గతం ప్రాప్తం న వేత్త్యహో!
“ఓహో! ఇది నేడు లభించింది. ఇక అది రేపు లభిస్తుందిలే! ఇది నాది. అది నీది. ఇదేమో వీనిది" ఈ, ఈ, మొదలైన అనేక కల్పనలలో మునిగి తేలుచున్న అనేకులు ఇటు గడచిపోతున్న ఆయువును గాని, అటు దగ్గర పడుచున్న మృత్యువును గాని గమనించటమే లేదే!
భుక్తం పీతం అనన్తాసు, భ్రాన్తం చ వనభూమిషు
దృష్టాని సుఖదుఃఖాని కిమన్యదిహ సాధ్యతే?
హే మహర్షీ! అనేక పదార్థములను తిన్నాను, త్రాగాను, అనేక చోట్ల సంచారములు సల్పాను. అనేక సుఖ-దుఃఖములు అనుభవించాను. అయితే ఎందుకు? ఇక్కడ సాధించటానికి శాశ్వతమైన ఫలము ఏది, ఎక్కడున్నది? స్వామీ! అనేక పదార్థములను అనుభవించుచూ అనేక సుఖదుఃఖాలను మేము పొందాం? వాటిలో ఆత్యంతికమైన దుఃఖ రహితమైన సుఖం ఎక్కడున్నది? పోనీ, సుఖం ఉన్నదను కొన్నప్పటికీ, అది సుఖం ప్రసాదించగలిగేది ఎంతసేపు? అసలీ పదార్థములచే లభించే సుఖం నిత్యమైనది ఎట్లా అవుతుంది? అందుచేత ఈ జగత్పదార్థముల పట్ల ఉత్కంఠ కలిగి ఉండటం అనేది అవివేకమని, అజ్ఞానమని, అనవసరమని నేను గమనించాను. ఈ సుఖదుఃఖానుభవాలను రుచిచూచి, ఇక వాటిని పరిశీలించాను. అనేక భోగాలూ చూచాను. వాటిలో ఉండే అనిత్యత్వాన్నీ చూచాను. కానీ మహాత్మా! పూర్ణ విశ్రాంతిని ప్రసాదించగలిగే ప్రదేశం గాని, పదార్థం గాని, స్థానంగాని నాకు ఈ లోకాలలో ఎక్కడా కనిపించనేలేదు. అవివేకము చేత అనేక సుఖమయ స్థానములు కనబడుచున్నప్పటికీ, అవన్నీ ఎండమావుల వంటివేనని గమనించాను. ఎత్తైన పర్వతాలు అధిరోహించి చూచాను. మేరు పర్వతము యొక్క సుందర ప్రదేశములు దర్శించాను. లోకపాలకుల నగరములలో కూడా సంచరించాను. ఎంత వెతికినా కూడా నాకు సహజమైనది-శాశ్వతమైనది అగు ఒక్క వస్తువుకూడా మచ్చుకకైనా కనిపించ లేదు. వృక్షములన్నీ... కొయ్య తో నిండి ఉన్నాయి.
ప్రాణులందరు... రక్త - మాంసములచే నిండి ఉన్నారు. భూమి అంతా మట్టియే కదా! ఈ ప్రపంచమంతా... దుఃఖములచేతను, అనిత్యత్వములచేతను వ్యాప్తమైయున్నది. అసారములగు ఇట్టివాటిని చూచి ధైర్యం ఎట్లా కలుగుతుంది చెప్పండి? "ఆఁ! అదేం లేదు. ఇక్కడ మాకు ధనం ఉన్నది. లేదా, మేం ప్రయత్నిస్తే లభిస్తుంది. మిత్రులు ఉన్నారు. సుఖములు లభిస్తున్నాయి. ఇంకేం!
Page:154
ఇట్లా ఇవన్నీ అనుభవించాలే గాని ఇంక దేని గురించో ఎందుకు?”... అని కొందరు జీవులు నూతిలో కప్పలవలె రోజులు గడపటానికి మాత్రమే సంసిద్ధపడుచున్నారు. కానీ, మునీంద్రా! కాస్త వివేకంతో కళ్ళు తెరచి చూస్తేనో?
న ధనాని న మిత్రాణి న సుఖాని న బాంధవాః
శక్నువంతి పరిత్రాతుం కాలేన ఆకలితం జనమ్ II
'మృత్యువు' అనే పెనుభూతం క్రీనీడలాగా ఈ సంసారంలోని ప్రతి జీవుని వెంటనంటియే ఉంటోంది కదా! కాలపురుషుడు అనునిత్యంగా విలయతాండవం చేస్తూనే ఉన్నాడు. కాలునిచే ఏ క్షణమైనా మ్రింగి వేయబడటానికి బలికి తెచ్చిన మేకలవలె సిద్ధంగా ఉన్న ఈ మనుజుని దేహమును ఆ కాలతాండవం నుండి ఏ బంధుజనులు, ఏ ధనములు, ఏ మిత్రులు, ఏ సంపదలు, ఏ సుఖాలు రక్షించగలుగుతాయి? వీథిలో ఉంచబడిన ముత్యాలహారంలాగా కాలమనే దొంగ ఈ దేహమును ఎప్పుడు దొంగిలిస్తాడో ఎవరికైనా తెలుస్తోందా? ధూళి ఒకచోట ప్రోగయి ఒక ఆకారంలా కనబడు చున్నది చూచారా! అట్లా 'పరమాణువులు' అనే ధూళిచే తయారుచేయబడిన ఈ శరీరం అనేక సంబంధ బాంధవ్యముల మధ్య కొద్దికాలం తైతక్కలాడుతోంది. ఈ మనుజ శరీరంలోని ఆ పరమాణువులు ఎప్పుడు ఎటు దారి చూచుకొనుటచే ఈ దేహం పడిపోగలదో చెప్పలేం. పర్వతా లపై పడియున్న మేఘములు క్షణ క్షణం క్షీణిస్తూ ఉంటాయి చూచారా? అట్లా అనేక విషయాలందు లీనమైయున్న ఈ మనుజుడు అనేక క్షీణదశలను పొందుచూ పైకి మాత్రం 'అది చేస్తాను, ఇది చూస్తాను’ అంటున్నాడే కానీ, అభ్యంతరమున మాత్రం... పురుషార్థరహితుడై, నిష్ప్రయోజనములైన ఏవేవో కార్యవ్యవహారములను నిర్వర్తిస్తూ చివరికి ఒక రోజు మరణమును పొందుచున్నాడు.
ఇదంతా పరిశీలించిన తర్వాత నాకిక సుందర స్త్రీలుగాని, ఐశ్వర్యములుగాని, రమణీయాలని అనిపించటం లేదు. ఎందుకంటే ఈ జీవితమే అతి చంచలమై ఉండగా, ఇక ఇక్కడ-అక్కడ కనిపించే ఆయా సరదా వ్యవహారాల వల్ల ఏం ప్రయోజనం? హే మహాత్మా! ఈ ప్రపంచంలో ఎచట దేనిని చూచుకొని 'ఇక ఫరవాలేదులే' అని ధైర్యం నమ్మకం కలిగి ఉండగలమో చెప్పండి? నేడో రేపో క్రూరమృత్యువు వచ్చి శిరస్సుపై పాదాలు ఉంచి ఆపదను తెచ్చిపెట్టటం తథ్యమే కదా!
ఈ శరీరం ఎండుటాకు వలె పతనశీలమై ఉన్నది. 'జీవితం' అనబడునది శిథిలమైన స్థితిని కలిగియున్నది. ఇక ఆ నా బుద్ధిని చూస్తే... ఇది అధీరత్వముచే కుంచించుకుపోయి ఉంటోంది. ఇక్కడి రసములన్నీ నీరసములుగా కనిపిస్తున్నాయి. నీరసమైన భోగములచేతను, వాటి గురించిన కోర్కెలచేతనూ, జ్ఞాపకములచేతనూ మాత్రమే ఆయువంతా గడచిపోతోంది. అతి దీర్ఘకాలం జీవించినప్పటికీ కూడా నేను ఏ ఉత్తమ పురుషార్థమును సంపాదించుకోనే లేదు.
హే మహాత్మా! ఈ విధంగా విమర్శచేయగా చేయగా... నా యందలి మోహం కొంచెం
కొంచెం తొలగసాగింది.
Page:155
ఈ ‘దేహం’ వలన ఇక్కడ ఏం పొంది ఏం ప్రయోజనం? ఎందుకంటే 'దేహి'గా ఈ దేహాన్ని ఆశ్రయించిన నేను ఒకానొకప్పుడు ఈ దేహమును ఇక్కడే త్యజించనున్నాను కదా! ఇక ఈ దేహము ఉన్నది కాబట్టి తారసపడే శబ్ద స్పర్శ రూప-రసాది విషయముల పట్ల నాకు ఆసక్తి ఎందుకు?
“అట్టి ఆసక్తి ఉండకపోవటమే ఉత్తమ స్థితి! ఆసక్తి కలిగి ఉండటమే అధమస్థితి”... అనే నిర్ణయానికి వచ్చాను. ఈ స్వప్నతుల్య జగత్తులో సంపదలు వచ్చిపడుచున్నప్పుడు వివేకి అయినవాడు 'ఇక ఫరవాలేదులే’ అని మురిసిపోడు. "అయ్యబాబోయ్! ఈ సంపదలు నన్ను మోహింప జేయ గలవు కాబట్టి ఇది ఆపద సమయమే కదా!”... అని గ్రహించినవాడై, వాటి పట్ల అనాసక్తియే
కలిగి ఉంటాడు.
ఆహా! జలము నిమ్న-ఉన్నత (పల్లము-ఎత్తు) ప్రదేశములకు ప్రవాహపతితంగా కొనిపోబడు చున్నది చూచారా? అట్లాగే ఈ జీవుడు విధి-నిషేధముల చేతను, శాశ్వత-అశాశ్వతములచేతను యథేచ్చగా ఎచ్చటెచ్చటికో గొనిపోబడుచున్నాడు. 'విషయాలు’ అనే విషవాయువులు ప్రసరించుటచే హృదయమందలి వివేక-విజ్ఞానములు మూర్ఛిల్లుచున్నాయి.
మాయ యొక్క “ఆవరణ శక్తి”చే ... సద్రూపమగు 'పరబ్రహ్మము' అసత్తుగా కనిపిస్తోంది. అద్దాని “విక్షేపశక్తి”చే... 'అసత్తు' అగు జగత్తు సద్రూపము వలె భాసిస్తోంది. ఇదే మాయ యొక్క ఘటనాఘటన సామర్థ్యం కదా! అరెరే! రెండు తీరముల మధ్య వేగంగా ప్రవహిస్తూ ప్రవాహం సముద్రం జేరుచున్నట్లుగా... జన్మ మృత్యువుల మధ్య ప్రవహిస్తున్న ఈ జీవులు ‘విషయములు’ అనే మహాసముద్రం వైపుకే అతి వేగంగా పయనిస్తున్నారేగాని, 'జీవితము' అనే సందర్భమును సద్వినియోగపరచుకోవటమే లేదే!
విడువబడిన బాణం మరల వెనుకకు తిరగదు చూచారా? ... కృతఘ్నులు మైత్రిని తిరిగి వెనుకకు అందజేయరు కదా!... ఈ మనస్సు విషయములవైపు పయనిస్తూ శ్రేయోదాయకమైన ఆత్మజ్ఞానమువైపు మరలటమే లేదే?
సుఖాన్యేవాతి దుఃఖాని, సంపదః పరమాపదః,
భోగా భవమహారోగా రతిరేవ పరారతిః
పైకి సుఖాలుగా కనిపించేవన్నీ నిజానికి దుఃఖరూపాలే! సంపదలుగా కనిపించేవన్నీ ఆపదరూపాలే! భోగాలన్నీ... సంసార మహారోగాలు మాత్రమే! ఆసక్తియే..... పరమ దుఃఖం.
ఆపదః సంపదః సర్వాః సుఖం దుఃఖాయ కేవలమ్!
జీవితం మరణాయైవ బత! మాయా విజృంభితమ్!
సంపదలన్నీ ఆపదలే! సుఖం కేవలము దుఃఖము కొరకే అయి ఉన్నది. పుట్టటం చావటం కొరకే అవుతోంది. ఆహా! మాయ యొక్క విజృంభణ ప్రభావం ఎంతటిది? కాలము యొక్క మహా ప్రవర్తనముచే ఇష్టానిష్టములతో కూడి అనేక అల్ప సుఖాలు కనబడుచున్నాయి. ప్రియవస్తువును చూచి సంతోషించినంతసేపు పట్టటం లేదు... వాటి యొక్క వియోగం అట్టి వియోగం అతి దీర్ఘకాలంగా మనస్సును శిథిలం చేసి వేస్తోంది.
Page:156
ఇక విషయభోగములందామా! అవన్నీ పాముయొక్క పడగల వంటివి మాత్రమే! ఎందుకంటే వాటిని కొంచెం స్పృశిస్తే చాలు... వెంటనే కరుస్తున్నాయి. విచారణ చేసి చూస్తే అవి ఆనందకరములూకావు, దుఃఖకరములూ కావు. విచారణ లేకపోతే అవన్నీ దుఃఖమార్గాలే!
ఇక్కడ కనబడే చేష్టలలో చాలా వరకు ఆయాసరహితమైన “ఆత్మ పదము” నకు దారి చూపేవిగా లేవు. పైగా ఆయా చేష్టల పరిణామం అతి కుటిలమైన ఆకారాన్నే కలిగి ఉంటున్నాయి. చివరకు భయంకరమైన కష్టములను ప్రసాదించునవి అగుచున్నాయి. ఈ విధంగా “కాలక్షేపం” క్షిప్ నాశనం/ వృథా) అగుచున్నది. కట్టుకంబమునకు త్రాళ్ళచే కట్టబడి ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తూ క్రమంగా చిక్కి శల్యమయ్యే ఏనుగులు ఉంటాయే! ఆ రకంగా, భోగాశ యందు బంధించబడిన తృష్ణాసహితులగు మూఢ జీవులకు అడుగడుగునా అవమానములు తటస్థిస్తున్నాయి. సంపదలు-స్త్రీలు-ఇవన్నీ కూడా తరంగములవలె క్షణభంగురములైనవి. పైగా అవన్నీ సర్పము యొక్క పడగ క్రింద ఉన్న వస్తువుల వంటివి. విషసర్పపు పడగనీడలో క్రీడించాలని ఏ బుద్ధిమంతుడైనా అనుకుంటాడా? ఒకవేళ ఈ సంపదలు, ఈ స్త్రీలు మనోహరములైనవేనని నమ్మినప్పటికీ,... మదించిన స్త్రీ యొక్క కడగంటి చూపులాగా ఈ జీవితమే అతిచంచలం కదా!
ఆపాతరమణీయేషు రమక్తే విషయేషు యే ॥
అత్యంత విరసానేషు, పతన్తి నిరయేషు తే ॥
విచారణ చేయకపోవటంచేత మాత్రమే రమణీయములు పరిణామమున అత్యంత నీరసాలు... అగు ఈ విషయములను ఎవరు తత్పరులై సదా సంపాదించుకోవాలని అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారో... వారికి పతనం తప్పదు. ఈ ఆయుష్షు అనబడేదానిని ఎంతో శ్రమించి, ఎన్నో పుణ్యకార్యములు చేసి కదా, సంపాదించుకుంటున్నాం! అట్టి ఆయుష్షు శీతఉష్ణములు, క్షుత్-పిపాసలు (ఆకలి-దాహములు) మొదలైన ద్వంద్వములచే నిరోధించబడి చేయి జారిపోతోంది. ఇక సముపార్జనకు పైకి రమణీయంగా కనిపించే ధనము మొదలైనవి కష్టసాధ్యాలు, అస్థిరములు, దోషబుద్ధిగల వారిచే మాత్రమే సేవించబడేవి అగుచున్నాయి. అటువంటి ధనాదులు నాకెప్పుడూ సంతుష్టి కలుగజేయజాల వనునది సుస్పష్టంగా గమనించాను. అవి విచారణ చెయ్యక పోవుటచే మాత్రమే ప్రియంగా కనిపిస్తున్నాయి. తుదకు దుఃఖాన్నే కలుగజేస్తున్నాయి. క్షణకాలం విలాసంగా కనబడి, చివరకు శాంతికి భంగం కలుగ జేసేవన్నీ, మోహపూరితాలని విజ్ఞులు మాత్రమే గమనిస్తున్నారు. ఇక్కడి సముపార్జనలన్నీ కూడా ఆ పాతరమణీయాలు, శీఘ్రంగా నశించేవి, దుఃఖ-ఆపదలు కలుగజేసేవి అగుచున్నాయి. కాబట్టి వాటితో సంబంధం మోసపూరితు లగు శత్రువులతో సంబంధం వంటిదే!
ఇక యౌవనం యొక్క శోభ అందామా? అది శరత్కాల మేఘము యొక్క ఛాయ వలె నశ్వర మైనది. దాని రాక - దాని పోక అంతా చమత్కారమే! ఆరంభంలో రమణీయం-చివరికి సంతాప కరం! ఇక 'మృత్యువు' అనే సంఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు ఎందుకు, ఎట్లా జరుగుచున్నదో ఏ జీవుడూ చెప్పగలిగేది కాదు. అయితే అది తప్పక వస్తుందని, అంతా హరించివేయనున్నదని
Page:157
అందరికీ తెలిసినదే కదా! అయినాకూడా, వర్తమానములో అనేక అసందర్భప్రలాపాలను, అప్రస్తుత ప్రసంగాలను చేస్తూ విలువైన కాలం వృథా చేసుకుంటున్నారే! ఏది పొందినా, పొందకున్నా చివరికి మృత్యువు అన్నిటినీ తప్పక హరించివేయనున్నది కదా!
అన్తకః పర్యవస్థాతా, జీవితే మహాతామపి,
చలన్తి ఆయూంషి శాఖాగ్రలంబా అంబూనీవ దేహినామ్ ॥
ఈ సర్వ ప్రాణుల ఆయువులు వృక్షాగ్ర భాగంలో గల ఆకుల చివర వ్రేలాడే జలబిందువు కాక మరేమిటి?
జీరస్తే జీర్యతః కేశా, దంతా జీర్యన్తి జీర్యతః
క్షీయతే జీర్యతే సర్వం, ‘తృప్లైవ' ఏకా న జీర్యతే ॥
ఇక వార్ధక్యం! కేశములు, దంతములు శిథిలమైపోతున్నాయి. దేహమంతా శిథిలమగు చున్నప్పటికీ తృష్ణ మాత్రం క్షయింపక వర్తిస్తూనే ఉన్నది. ఆ తృష్ణ భావికాలపు అనేక దేహపరంపరా మహారణ్యానికి త్రోవతీయించుచున్నది కదా! ఎన్ని సంపాదించినా, ఏది పొందినా ఈ తృష్ణాగ్ని చల్లారటమే లేదు.
బాల్యము యౌవనము వలె... యౌవనము బాల్యమువలె... గడచిపోతున్నాయి. ఈ రెండు క్షణభంగురమే అవటంచేత సాదృశ్యమే (ఒకదాని వంటిదే రెండవది అగుచున్నది. దోసిలిలోని నీరులాగా జీవితం శీఘ్రంగా నశించిపోతోంది. గడచిపోయిన జీవితం నదీ ప్రవాహంలాగా మరల వెనుకకు మరలే ప్రసక్తే లేదు కదా! ఏఏ దేహాలు ఇప్పుడు అనేక కార్య సంరంభములలో నిమగ్నమై కనిపిస్తున్నాయో... అవన్నీ కూడా మరికొంత కాలం తర్వాత అట్లా ఉండటం లేదు. లేదా, అసలే ఉండటం లేదు. రమ్యము-స్థిరము-సత్యముగా భాసించే అనేక పదార్థాలు అతి త్వరలో అరమ్యముగా, అస్థిరంగా అసత్యముగా అయి పోతున్నాయి. నిన్న ఉన్నది ఈ రోజుకు కనబడటంలేదు. ఈ రోజున ఉన్నది రేపు ఉండకయే పోవచ్చు.
ఇదంతా ఇట్లా ఉండగా... ఇదే జగత్తులో... కొందరు మహాశయులు, మహనీయులు ఉన్నారు. వారు 'జీవితము' అనే అవకాశాన్ని వాసనలను పెంపొందించుకోవటానికి కాకుండా తన ఇతఃపూర్వపు దుర్వాసనలను రహితం చేసుకోవటానికి శక్తి యుక్తులన్నీ ఉపయోగించి ప్రయత్నిస్తూ... తద్వారా వాసనారాహిత్యము వైపుగా పయనిస్తున్నారు. వారి చిత్తము క్రమంగా 'ఆత్మ విశ్రాంతి' అనే సుఖ స్థానమును సమీపించుచుండుటచే వారి ఆయుష్షు - అవకాశములు సద్వినియోగం అవుతున్నాయి. ఈ చిత్తమునకు 'వాసనారాహిత్యం'చే లభించగలిగే సుఖం-స్వర్గ-భూ-పాతాళాలలో మర్కెడా కూడా లభించజాలదు కదా! ఏ భోగ స్థానములలోనూ మనస్సుకు, ప్రశాంతత కలుగదు. ఒక్క ఆత్మ విశ్రాంతియే అద్దానికి శరణ్యం కదా!
ఓ మాననీయా! వసిష్ఠ మహర్షీ! ఇట్లా నేను వైరాగ్యం సముపార్జించాను. సమస్త మనోహర పదార్థములను వాటి వృత్తులతో సహా జయించివేశాను. క్రమంగా అహంకార రహితుడనైనాను. అతి దీర్ఘకాలంగా అటువంటి అభ్యాసముచే నాకు స్వర్గ-మోక్షములపట్ల కూడా విరక్తి ప్రాప్తించింది.
Page:158
అప్పుడిక తమవలెనే ఏకాంత ప్రదేశంలో ఆత్మవిశ్రాంతిని పొందాలని నిర్ణయించుకున్నాను. ఒక రోజు ఆకాశ సంచారం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశంలో మీరు నిర్మించియున్న కుటీరం చూచాను. అది మీచే నిర్మించబడిన కుటీరమని నాకు తెలియదు. ఎవరో సిద్ధుడు ఆ ఆ గృహంలో ఉండి అప్పటికి కైవల్యం పొంది ఉంటారేమోనని అనుకున్నాను. అక్కడ ఏ జీవుడూ వచ్చే అవకాశం లేదని, నాకు ఏకాంత విశ్రాంతికి ఏమాత్రం భంగం రాదని తలచినవాడనై ఆ ఆశ్రమ మధ్య భాగంలో ఆసీనుడనై సుఖాసనం స్వీరించాను. ప్రాణ-అపానములను అనుసంధించి ‘ఆత్మావలోకనము’ అనే నిర్వికల్ప సమాధియందు నిమగ్నుడనైనాను.
హే మహాత్మా! వసిష్ఠ మహర్షీ! ఈ విధంగా నా వృత్తాంతమంతా మీకు నివేదించాను. మీ అనుజ్ఞ లేకుండా మీ కుటీరంలో ప్రవేశించిన అపరాధమునకు నన్ను క్షమించవేడుకొనుచున్నాను. మీ యొక్క దండనగాని, అనుగ్రహముగాని-ఏది ఉచితమని మీరనుకొంటే అది నాకు శిరోధార్యం. మీ దర్శనం అయినందుకు సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరల మీకు వినమ్రుడనై నమస్కరిస్తున్నాను. హే మునివరేణ్యా! మేము సిద్ధులమైనప్పటికీ కూడా అన్ని విషయాలు చూచినంత మాత్రం చేతనే గ్రహించగలిగిన వారమైనప్పటికీ కూడా ఎప్పుడు ఈ అంతఃకరణము ఒక విషయమున విచారణచే పూర్వాపరాలు పరిశీలించదో, అంతవరకు ప్రతికాలములందలి వృత్తాంతము గమనించదు కదా! బుద్ధిని ఏకాగ్రపరిస్తేనే ఏ విషయమైనా అవగాహనకు వస్తుంది కదా! అప్పుడే ఆ ఒకానొక విషయము యొక్క జ్ఞానం కలుగుతుంది. బుద్ధిని ఏకాగ్రపరచి పరిశీలించక పోతే ఏదీ తెలియదు. “ఎవరో సిద్దులు ఇక్కడ ఆశ్రమం మనస్సుచే నిర్మించి ఆ తర్వాత త్యజించి ఉంటారులే”... అని అనుకోబట్టి, "ఈ ఆశ్రమం (కుటీరం) వసిష్ఠ మహర్షికి చెందినది”... అని గుర్తించటం జరుగలేదు. బ్రహ్మాదుల మనస్సు కూడా ఇట్లే ఇట్టి స్వభావమే (అభిప్రాయము ననుసరించే అవగాహన) కలిగి ఉంటుంది. ఇక సామాన్య సిద్ధుడనగు నా వంటివారి గురించి వేరే చెప్పేదేమున్నది? కనుక మీరు ఆజ్ఞాపిస్తే ప్రాయశ్చిత్తం నిర్వర్తించటానికి నేను సంసిద్ధుడనై మీ పాదాలు ఆశ్రయించుచున్నాను.
ఓ రామచంద్రా! ఆ విధంగా అత్యంత మధురమైన వైరాగ్య ప్రదమైన వాక్యాలు పలికిన ఆ సిద్ధుని ఆప్యాయంగాను, మిత్రపూర్వకంగానూ చూస్తూ చిరునవ్వుతో ఇట్లా పలికాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ సిద్ధ పురుషా! మీకు స్నేహపూర్వకంగా ప్రతి నమస్కారం సమర్పిస్తున్నాను. మీ వైరాగ్య వాక్యాలు అత్యద్భుతములు, పరమసత్యములు, జీవులకు సన్మార్గ సూచకములు అయి ఉన్నాయి. మహాత్మా! ఇందులో మీ దోషమేమీ లేదు. నేను కూడా ఏకాగ్రబుద్ధితో మీ గురించి విచారణ చేయలేదు. దేహధారులగు యోగులకు కూడా ఏకాగ్రబుద్ధితో విచారణ అనుసంధించక పోతే త్రికాల జ్ఞానము సంభవించదను మాట పరమసత్యము. అదియే కొంచెము సేపటి క్రితం నాపట్ల నిజమైనది. “ఈ సిద్ధ పురుషుడు ఇక్కడ నిర్వికల్ప సమాధిలో ఉండి ఉన్నారు. సరే, ఇక నేను నా నిజస్థానమగు సప్తర్షి మండలమును చేరెదను గాక”... అని ధాన్యము మరల్చాను. అట్లు
Page:159
మరల్చుచున్నప్పుడు “సంకల్పము యొక్క ఉపసంహారముచే ఈ మనోనిర్మిత ధ్యానగృహం అదృశ్యమౌతుంది కదా"... అని నేను జ్ఞప్తి చేసుకోలేకపోయాను. “ఈ మహనీయుని సమాధి కొనసాగినంత వరకు ఈ మనోకల్పిత సిద్ధాశ్రమం యథాతథంగా ఉండుగాక”... అని సంకల్పించి ఉంటే మీరు ఆసీనులైన ఆ ధ్యాన గృహం యథాతథంగా ఉండేది. మీ నిశ్చల సమాధికి ఆటంకం కలిగేదే కాదు. ఈ విషయం విన్నవించుకొని మీ యొక్క క్షమను వేడుకోవాలనే ఉద్దేశంతోనే మిమ్ములను అనుసరించి, ఇటువచ్చి మిమ్ములను నిశ్చల సమాధినుండి నిదురలేపాను.
కాబట్టి నా అపరాధమును మీరే క్షమించండి. మహాత్మా! ఇక లేవండి. పోదాం. మీరు మీ సిద్ధలోకములకు, నేను నా నిజస్థానమైనట్టి సప్తర్షిలోకములకు వెళ్ళెదముగాక! ఎందుకంటే విక్షేపరహితమైన స్థితి కొఱకై మన మన స్వస్థానములను జేరటమే ఉచితము, సాధనను కొనసాగించుకోవటానికి సానుకూల్యము కదా!
ఓ రామచంద్రా! ఇట్లు మేమిద్దరమూ కుశల ప్రశ్నల పూర్వకంగా పరస్పర ఆమోదములను, మర్యాదలను తెలుపుకున్నాం. ఆ తర్వాత యంత్రముచే ఆకాశమునకు విసరబడిన గులకరాళ్లవలె విశాల ఆకాశమున కొంతసేపు కలసి ప్రయాణించాం. ఆ తర్వాత పరస్పర ప్రణామపూర్వకంగా ఒకరివద్ద మరొకరం సెలవు తీసుకొని మామా అభిమత స్థానములకు బయల్వెడలాం. నేను కొన్ని సిద్ధ లోకములు, లోక పాలుర నగరములను సందర్శించి, అక్కడి సిద్ధులతో సంభాషించి, అటు తర్వాత సప్తర్షి మండలం జేరాను.
❖
ఓ రామచంద్రా! ఇదీ కథ! ఈ విధంగా నాకు స్వయంగా అనుభూతమైన ఒకానొక సంఘటనను ఆమూలాగ్రం ఈ 'పాషాణోపాఖ్యానం' అనే పేరుతో నీకు తెలియజేశాను. ఆ సిద్ధుడు దృశ్యజగత్తును ఎట్లు నిర్వచించారో కూడా వివరించాను.
కనుక ఓ సర్వసభికులారా! ఈ సంసారము యొక్క ఆశ్చర్యకరమైన వైచిత్రమంతా గమనించి మీమీ ఆశయములను ఎక్కడెక్కడ ఎంత వరకు అవసరమో అంతవరకు తగిన రీతిని సంస్కరించుకొనెదరు గాక!
41. పిశాచములు - ఉనికి - - - వ్యవహారం
శ్రీరాముడు : మహర్షీ! మీరు "పాషాణోపాఖ్యానం" ద్వారా అణువణువునా జగత్తులు ఉన్నాయని, అవన్నీ భ్రాంతి చేతనే ఏర్పడి ఉంటున్నాయని, వాస్తవానికి ఆత్మకు అన్యమైనది ఎక్కడా ఏదీ లేనేలేదని సుస్పష్టపరచారు. అట్లాగే ఈ మాయ ఎంతటిదో, సంసారము ఎంతటి దుర్భరమో కూడా సిద్ద పురుషుని వాక్యములు ఉటంకిస్తూ తెలియపరిచారు. మీ బోధ అమోఘం.
Page:160
అయితే... మీరు ఆ మానసిక కల్పిత కుటీరంలో మీ దేహము ఉంచి లోకాలోక పర్వత శిలలోని బ్రహ్మాండ దర్శనం, ప్రళయకాల రుద్ర, ఛాయదేవిల విలయతాండవం తదితర బ్రహ్మాండము దర్శనం చేశారు కదా! తమ భౌతిక దేహమేమో ఆ కుటీరమునందున్న పృథ్వియందు ధూళిమయమై పోయింది. అప్పుడు మీరు సిద్ధపురుషునితో సంభాషించి వీడుకోలు చెప్పిన తరువాత ఏ దేహములతో ఏ ఏ సిద్ధలోకములకు వెళ్ళి అక్కడ సంభాషించటం మొదలైనవి నిర్వర్తించారు? శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఆ వృత్తాంతం కూడా విను. అది మరచాను. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను.
ఆ సిద్ధ పురుషునితో సంభాషించిన సువర్ణమయమైన భూమినుండి బయలుదేరాను. ‘జగత్తు’ అనే గృహంలో ఆ చోట ఈ చోట సంచరించాను. సిద్ధుల లోకములందు, లోకపాలకుల నగరమునందు తిరిగి తిరిగి ఇంద్రుని పట్టణం చేరాను. అదంతా స్థూల దేహరహితుడనగు నేనే మనోమాత్ర సూక్ష్మదేహంతోనే నిర్వర్తించాను. మనోమాత్ర దేహుడనై ఉండటంచేత నన్ను ఎవరు గాంచుటయే లేదు. అయితే నేను తదితరులను గాంచుచునే ఉన్నాను. ఆ సమయంలో చిదాకాశమయ స్వరూపుడనగు నేను ఆకాశమువలె సూక్ష్మాతిసూక్ష్మమైన ఆకృతి కలవాడనయ్యాను అప్పుడు నాకు- అధారము లేదు, అధేయము లేదు.
అట్లా ఆ సమయంలో స్థూల పదార్థములను ఎఱుగుచుండే మీ వంటివారివలె గ్రహీతగాని, గ్రాహ్యముగాని (గ్రహించువాడు-గ్రహించబడునది అనునవి గాని) లేవు. దేశకాలములచే ఈ భౌతిక పదార్థాలన్నీ మార్పు చేర్పులు పొందుతూ ఉంటాయి కదా! ఆ నా చిదాకాశ సూక్ష్మరూపము దేశకాలములచే పరివర్ధనం అయ్యేది కూడా కాదు. అంతేకాదయ్యా! అప్పుడు నా స్వరూపము మననశీలమగు మనోమాత్రమే కదా! కనుక నాకు అప్పుడు ఈ పృథ్వి ధర్మాలు, ప్రాణ ధర్మాలు మొదలైనవేవీ లేవు. అప్పుడు నా రూపం సంకల్ప పురుషుని వంటిది. 'ఆలోచన' ఎక్కడికైనా ప్రసరించగలదు కదా! ఆ ప్రసరణను గోడలు గాని భౌతికమైన దూరాలుగాని, కాలము యొక్క పరిమితాలుగాని నిరోధించలేవు కదా! అట్లాగే నేను అప్పుడు స్థూల పదార్థ సమూహములచే నిరోధింపబడనివాడుగా ఉన్నాను.
స్వయముగా స్వానుభవము పట్ల ఉన్ముఖుడనైనవాడుగా ఉన్నాను. మనోమయమాత్రులగు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువాడనై ఉన్నాను.
శ్రీరాముడు : స్వామీ!
1. స్థూల దేహరాహిత్యం
2. కేవలం మనోమయసహితులై ఉండటం
3. స్వానుభవముపట్ల మాత్రమే ఉన్ముఖులై ఉండటం
4. భౌతిక పదార్థములచే నిరోధింపబడజాలని స్వరూపం కలిగి ఉండటం
5. మనోమయులగు ప్రాణులతోటి మాత్రమే వ్యవహరించువారై ఉండటం
Page:161
ఈ 5 విషయాలు ఏ విధంగా సాధ్యమో, ఎట్లా అవగాహన చేసుకోవాలో మరికొంచెం దృష్టాంతపూర్వకంగా వివరించండి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అటువంటి అనుభవమునకు ఇక్కడ “స్వప్నానుభవమే” దృష్టాంతమైయున్నది. అయితే ఎవరైతే స్వప్నానుభవమును ప్రమాణముగా అంగీకరించరో వారికి నేను నా ఆ అనుభవం గురించి చెప్పటం ఎట్లా కుదురుతుంది?
ఒకడు స్వప్నంలో ఏ దేహముతో సంచరిస్తూ ఆ స్వప్నాంతర్గత జనులతో సంభాషిస్తూ స్వప్న నగరంలో విహరిస్తున్నాడు? ఏ పాదాలతో పర్వత శిఖరాగ్రములు అధిరోహించటం మొదలైనవన్నీ నిర్వహిస్తున్నాడు? అది మెలుకువతో ఉన్నవారికి, (ఆ ఇంటిలోని తదితర కుటుంబ సభ్యులకు) తెలుస్తుందా? లేదు. అట్లాగే నేను అక్కడి ఆకాశచారులగు దేవతలకు కూడా కనిపించుటయే లేదు. అయితే పృథ్వి సంబంధమైన ఆకారము కలిగి భాసించే తక్కిన ప్రాణులను నేను మాత్రం చూస్తూనే ఉన్నాను. సూక్ష్మ శరీరధారినగు నన్ను మాత్రం ఎవరూ చూడలేకయేపోతున్నారు. శ్రీరాముడు : స్వామీ! నాదొక సందేహం. మీరు దేహరహితులు, ఆకాశ శరీరధారులు అగుటచేత ఆకాశచారులగు దేవతలకు కూడా కనిపించటం లేదు కదా! మరి ఆ సిద్ధ పురుషుడు సువర్ణ భూమిపై మిమ్ములను ఎట్లా గాంచగలిగారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మావంటివారు (జ్ఞాన సిద్ధులకు) "జ్ఞాన సత్య సంకల్పము”చే కల్పితములైన సర్వపదార్థములను గాంచగలరు. అయితే, ఒకడు 'సత్య సంకల్పుడు’ అయినప్పటికీ అతడు సంకల్పించని వస్తువును గాంచలేడు.
వాస్తవానికి ఈ జీవులందరు మొట్టమొదట సూక్ష్మ శరీరధారులే. అయితే దేహ సంబంధమైన లౌకిక పదార్థములను, భౌతిక పదార్థములను చూచుచుండే చిరకాలాభ్యాసముచే ఈ జీవులు సూక్ష్మత్వమును ఏమఱచటం, గమనించజాలకపోవటం జరుగుతోంది. ఒకడు నిర్మలాత్ముడై, సూక్ష్మ శరీరధారణను సముపార్జించినప్పటికీ లౌకిక పదార్థాలలో వ్యవహారాలలో నిమగ్నుడైనప్పుడు తన సూక్ష్మ రూపమును క్షణకాలంలో ఏమరుస్తూ ఉంటాడు.
ఇక ఆ సిద్ధునికి నేను ఎట్లా కనిపించానని అడిగావు కదా! దానికి కారణం విను. "ఈ సిద్ధుడు నన్ను చూచునుగాక” అని నేను సంకల్పించాను. కాబట్టే అతడు స్వసంకల్పముచే నన్ను
గాంచగలిగాడు.
ఆ తరుణంలో "అయ్యెయ్యో! ఈ మహానుభావుడగు సిద్ధపురుషుడు నా మనస్సుచే కల్పించ బడిన కుటీరంలో తపస్సు చేస్తున్నాడు కదా!” అనునది ఒక్క క్షణం ఏమరచి, “ఈ సంకల్పిత కుటీరం మీరు ఉన్నంత వరకు నిలుచును గాక” అని సంకల్పించకుండా, “నేను సప్తర్షి మండలానికి మరలే వరకు ఈ కుటీరం ఇట్లే ఉండుగాక” అను ఇతఃపూర్వపు సంకల్పమును గుర్తుపెట్టుకోకుండా, నా దృష్టిని యథాలాపంగా నా నిజస్థానం వైపుకు మరల్చాను కదా! అక్కడి మనోకల్పిత కుటీరం
Page:162
తన ఆలంబనం కోల్పోయింది. అప్పుడు, “ఈ సిద్ధపురుషుడు సమాధినిష్ఠలో ఉండగా ఈతని దేహమునకు హాని కలుగలేదు కదా?” ... అనే ఆదుర్దాతో “ఈయనకు నేను కనిపించెదనుగాక”... అని సంకల్పించాను. అట్లే కనిపించాను కూడా!
శ్రీరాముడు : స్వామీ! ఈ నా ప్రశ్నకు ఒకప్పుడు సమాధానం చెప్పారు. అయినా కూడా ఇక్కడ సందర్భానుచితం కాబట్టి మరల అడుగుచున్నాను. మామూలు జీవులు “ఇది ఇట్లా ఉండాలి. అది అట్లే ఉండకూడదు”.….. అని సంకల్పించినప్పటికీ... అది చాలా సందర్భములలో నెరవేరటం లేదు. మీరు సంకల్పించగానే అది అట్లే సిద్ధిస్తోంది. ఇది ఎందుచేత అట్లు జరుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవనికైతే చిరకాలంగా “బ్రహ్మము వేరు-నేను వేరు" అను భేదము దృఢపడి ఉంటుందో... అట్టివాడు సంకల్పించిన పదార్థములను, తదితరములను సంకల్పానుసారం పొంద లేడు. శాస్త్రార్థపరిపక్వతచే ఎవరికైతే "సర్వమునకు అంతర్యామి-బహిర్యామియగు శుద్ధ బ్రహ్మమే నా స్వరూపం కదా" అనే అనుభూతి సుస్థిరమగుచూ, జీవ-బ్రహ్మముల భేదము నశించిపోతూ ఉంటుందో... అట్టి సిద్ధుడు సత్య సంకల్ప యోగ్యుడౌతాడు. అనగా అట్టివాడు “ఇది ఇట్లు ఉండు గాక” అను సంకల్పము నిర్వర్తించుటచే అది అట్లే అనుభూతమవగలదు. ఆ సిద్ధపురుషుడు జీవబ్రహ్మైక్య భావము కలిగి ఉండటంచే “నన్ను చూచుట” అనుదానిలో సంకల్పయోగ్యుడైనాడు.
ఈ విధంగా ఆ సిద్ధ పురుషుని సంకల్పము - నా సంకల్పము - ఉభయములు యోగ్యములై మేమిరు వురము అత్యంత ఆదరపూర్వకంగా సంభాషించుకోవటానికి వీలు ఏర్పడింది. శ్రీరాముడు మహర్షీ! ఒకవేళ ఇద్దరు సిద్దులు పరస్పర విరుద్ధమైన సంకల్పములు కలిగి ఉన్నారనుకోండి. అనగా వారిద్దరు పరస్పర విరుద్ధమైన అభీష్టములతో ఒకరు కనబడాలని, మరొకరు కనబడకూడదని-సంకల్పించారనుకోండి. అప్పుడేమౌతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు చెప్పినట్లు ఇద్దరు సిద్ధులు పరస్పర విరుద్ధ సంకల్పములు కలిగి ఉన్నారనుకో. అనగా ఒకరు “ఈతనిని నేను గాంచెదను గాక!" అని, మరొకరు "ఈతనికి నేను కనబడకుండెదను గాక"... అని సంకల్పించటం జరిగితే... అప్పుడు వారిద్దరిలో ఎవరి సంకల్ప బలము ప్రబలమై, అధిక నిర్మలమై ఉంటుందో... అతని సత్యసంకల్పమే జయించినదై
తదనుకూలంగా జరుగుతుంది.
ఆ విధంగా నేను సిద్ధుల స్థానములందు, లోకపాలుర పురములందు తిరుగుచూ ఉండగా నేనప్పుడు వ్యవహారాధిక్యత వలన నా యొక్క 'సూక్ష్మ రూపత్వము'ను మరిచాను. అప్పుడు నేను “కొందరితోకూడి ఆ మహాకాశమున వ్యవహరించాలి” అనే ఉద్దేశమునందు కొంచెం కొంచెం ప్రవృత్తుడనైనాను. అయితే అట్టి చంచలరూపుడనగు నన్ను అచ్చట ఎవ్వరూ (ఎంత సంకల్పించి నప్పటికీ) గాంచుటయే లేదు. ఒకసారి దేవలోకంలో నేను బిగ్గరగా అరిచాను. కాని ఏం లాభం? స్వప్నంలో స్వప్నద్రష్ట ఎంత అరచినప్పటికీ మెళకువతో ఉన్నవారికి వినిపించదు చూచావా? ఆ
Page:163
ఓ రాఘవా! ఈ ప్రకారంగా నేను ఆకాశములో పిశాచమై సంచరించాను. ఆయా దేవతల అనిర్వచనీయ స్థానములలో నేను పిశాచరూపినై తిరుగాడసాగాను. సుదీర్ఘకాలం పిశాచత్వము
అనుభవించాను.
శ్రీరాముడు : స్వామీ! వసిష్ఠ మహర్షీ! “నేనప్పుడు పిశాచినై (పిశాచత్వము వహించి) దేవతా భూములలో సంచరించాను”... అని మీ యొక్క స్వానుభవమును చెప్పుచుండగా నా మనోవీథిలో ఒకానొక సందేహం ఉత్పన్నమయింది.
పిశాచాః సన్తిలోకేస్మిన్ కిమాకారాః? కిమాస్పదాః?
కింజాతీయాః? కిమాచారా? కీదృశాః? కీదృశాశయాః?
ఈ ప్రపంచంలో 'పిశాచములు' అనబడేవి ఉన్నాయా? ఉంటే అవి ఏ ఆకారమును కలిగి ఉంటాయి? అవి ఎక్కడ నివసిస్తూ ఉంటాయి? ఈ లోకంలో జంతు -మానవ మొదలైన అనేక జీవజాతులున్నాయి కదా! మరి పిశాచములు అనబడేవి ఏ జాతికి చెందినవి? ఏఏ ప్రవర్తనలు ఆచారములు అవి కలిగి ఉంటాయి? ఏ ఉద్దేశములు ఆశయములు కలిగి ఉంటాయి? ఎటువంటి అలవాట్లతోగూడి వర్తిస్తూ ఉంటాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
పిశాచాః సన్తి లోకేస్మిన్, యాదృశాః తాదృశాత్ శృణు!
ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో పిశాచములు ఎట్టివారై ఉందురో,. వారిని గురించి చెపుతాను విను.
న సభ్యో 2 సౌ న యో వక్తి ప్రసంగా పతితం వచః ॥
సభ్యత్వము (లేక) సానుకూలమైన నడవడిక లేకుండా, ప్రసంగానుసారంగా మాట్లాడకుండా ఏదో ఆవేశంగా, అసందర్భంగా పలికేవాడు పిశాచజాతికి చెందినవాడే అవుతాడు.
పిశాచాః కేచిత్ ఆకాశసదృశాః సూక్ష్మ దేహకాః
హస్త-పాదాది సంయుక్తాః, పశ్యన్తి త్వమివ ఆకృతిమ్
కొందరు పిశాచములు ఆకాశమువలె సూక్ష్మ-మనోమయ దేహధారులై ఉంటారు. స్వప్నం వలె మనఃకల్పితమైన కాళ్ళు చేతులు కలిగి ఉంటారు. వారు నీ వలెనే-నా వలెనే తక్కిన
ఆకారములను గాంచకలుగుతూ ఉంటారు.
కొందరు పిశాచములు కొందరి చిత్తములలో ప్రవేశించగలుగుతారు. భ్రమ రూపముభయదాయకము అగు తమ ఛాయచే వారలను ఆక్రమించ గలుగుతారు. వారికి వివిధ దుః ఖాదులు కలుగజేసే చేష్టలతో తమ ఆశయములను ఉద్భోధ చేస్తూ ఉంటారు.
Page:164
మరికొందరు పిశాచములు, కొందరు జీవులలో ప్రవేశించి వారిని చంపుతారు కూడా! ఋణాను బంధమును అనుసరించి వారి ధాతువులను భుజిస్తారు. ఆ జీవుల రక్తాన్ని పానం చేస్తారు. వారి చిత్తమును ఆక్రమించి వారి బలమును తేజమును నశింపజేస్తారు.
పిశాచములలో కొందరు ఆకాశమువలె అతి సూక్ష్మరూపులై ఉంటారు. కొందరు కొండంత ఆకారంలో కూడా ఉంటారు. కొందరు స్వప్నమనుజుల ఆకారం ధరిస్తారు. మఱికొందరు సాకారరూపమును ధరించి ఇంతలోనే అంతర్ధానమై ఆకాశరూపులగుతారు. నిరాకారులౌతూ ఉంటారు. కొందరు పిశాచులు మేఘమువంటి రూపము కలిగి ఉంటారు. మరికొందరు వాయువువంటి రూపం కలిగి ఉంటారు. ఇంకొందరు పిశాచులు ఆయా భూతగ్రస్తులగు జీవుల భ్రమానుసారం దేహం ధరించి వర్తిస్తూ ఉంటారు.
+
అయితే రామచంద్రా! ఈ జీవునికి మూడు దేహాలు ఉన్నాయి -
1. భౌతిక దేహం 2. మానసిక దేహం (సూక్ష్మదేహం, అతివాహిక దేహం) 3. ఆత్మ
పిశాచములకు భౌతిక దేహం ఉండదు. కానీ వారు బుద్ధిమయ-మనోమయ శరీరధారులై ఉంటారు. వారికి భౌతిక దేహము ఉండదు. కాబట్టి దేనినీ గ్రహించటానికి యోగ్యులు, సమర్థులు కారు. వారు ఆకాశమువలె శూన్యరూపధారులై తమ ఆకృతిని తామే అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పిశాచులు వారిలో ఒకరినొకరిని గాంచగలుగుతూ ఉంటారు. వారికి పూర్వాభ్యాసకారణంగా దాహం వేస్తుంది. ఆకలి వేస్తుంది. కాని బాహ్య జలాదులను త్రాగలేరు. దేనినీ భుజించనూలేరు. ఏ పదార్థమునూ ఆధారముగా గైకొనుటకుగాని, తమ ఇచ్ఛవచ్చినట్లు దానము చేయుటకుగాని, గ్రహించుటకుగాని శక్యులు కారు.
ఇచ్ఛా - ద్వేష - భయ - క్రోధ - లోభ - మోహ సమన్వితాః,
-
మస్త్ర - ఔషధ - తపో - దాన - ధైర్య - - ధర్మ - వశీకృతాః II
మరియు వారు ఇచ్ఛ - - ద్వేషము భయము - క్రోధము - లోభము మోహము మొదలైనవన్నీ కలిగి ఉంటారు. మంత్రము-ఔషధము-తపస్సు-దానము-ధైర్యము-ధర్మములచే వారు వశీకృతులు అవుతూ ఉంటారు. ఒక్కొక్కచోట వారు 'సత్వావష్టంభము' అనే యోగధారణచే వశీభూతులౌతూ ఉంటారు. బీజా క్షరములచే రచించబడిన యంత్రము చేత కట్టుబడి ఉంటారు. మంత్రముచే ఆరాధింపబడి భూతవిద్య ఎఱిగిన మనుజులకు వశీభూతులై వారికి కనిపిస్తూ ఉంటారు. వారిచే (అట్టి మంత్రములను ఆశ్రయించి ఆరాధించువారిచే) ఆయా క్రియలందు, సేవలందు నియోగించబడుచూ ఉంటారు.
పిశాచములు దేవయోనికి చెందినవారే! అందుచేత వారిలో కొందరు దేవతల వలెనే అణిమ-గరిమ-మహిమ-ఈసిత్వసిద్ధి ప్రాకామ్యసిద్ధి ఇచ్ఛా సిద్ధి-వసిత్వ సిద్ధి-లఘిమ అనబడే అప్లైశ్వర్యములు కలిగి ఉంటారు. కొందరు శ్రీమంతులై ఉంటారు.
Page:165
మరికొందరు పిశాచములు నాగముల (పాముల) లక్షణములు కలిగి ఉంటారు. మరికొందరు పిశాచములు కుక్క-నక్కలను బోలినవారై గ్రామములలోను, అరణ్యములలోను నివసిస్తూ ఉంటారు.
మరి కొందరు ఎముకలు - పెంట ప్రోగులు మొదలైనవాటితో కూడిన కల్మషస్థానములలోను, నరక సమానములైన అపవిత్ర ప్రదేశములలోను నివసిస్తూ ఉంటారు.
ఓ రామచంద్రా! ఈ ప్రకారంగా పిశాచముల యొక్క స్థానము-ఆకారము-ఆచారము గురించి చెప్పాను. దేహరహితమైన దేహాకార భావితులే పిశాచములు సుమా!
అయితే “పిశాచములు ఎక్కడి నుండి జనిస్తున్నాయి?”... అనే విషయం ఇప్పుడు వివరిస్తాను. శ్రద్ధగా విను.
+
శుద్ధ బ్రహ్మము చేత్యరహితమై (దృశ్యరహితమై, విషయరహితమై) సర్వ దృశ్య వ్యవహారములకు మునుముందే ఉన్నది. సర్వవ్యాపకమై, సర్వశక్తియుతమై ఉన్నది. అది వాస్తవానికి అట్లే తన స్వభావ-స్వరూపములను విడువకయే, బంగారము బంగారత్వము విడువకయే ఆభరణత్వము ప్రకటించునట్లుగా, జలము జలత్వము విడువకయే తరంగత్వము ప్రదర్శిచునట్లుగా, - విషయముల యొక్క సంకల్పములను స్వభావసిద్ధంగా ఆశ్రయిస్తోంది. అట్లు సంకల్పిస్తూ తనను తాను 'పురుషుడు’ అను రెండవ రూపముగా గాంచుచున్నది.
“ఇది నేను –ఇది నా యొక్క ఆలోచన/ భావన" అను రెండుగా తనను తాను బ్రహ్మము గాంచటం ప్రారంభించగానే అప్పుడు అద్దానికి (అనగా అట్టి దర్శనము యొక్క వ్యవహార ప్రారంభ చమత్కారమును) శాస్త్రములు “ప్రథమాంకురము” అని, “జీవుడు” అని పేర్లు పెట్టాయి.
ఇది నేను - ఇది నా ఆలోచన / భావన అనే ప్రథమాంకురమే జీవుడు అనబడువాని ప్రారంభం (సంకల్ప ప్రారంభమే జీవుని ప్రారంభం) అని అనుకున్నాం కదా! ఆ 'సంకల్పము' ప్రౌఢము అభిమానయుక్తము అగుచుండగా అద్దానిని 'అహంకారము' అని పిలుస్తున్నారు.
అహంకారము మరికొంత పరిపుష్టం కాగా అద్దానిని 'మనస్సు' అని ఆత్మజ్ఞులు పేర్కొను చున్నారు. అట్టి మనస్సుల సమష్టి రూపమే “సంకల్పాకాశరూపధారి” యగు బ్రహ్మదేవుడు. ఈ జగత్తంతా ఎవరి యొక్క 'సమాలోచన' (లేక) సంకల్పమో... ఆ ప్రథమ పురుషునికి 'హిరణ్యగర్భుడు' అని 'బ్రహ్మదేవుడు’ అని, 'సృష్టికర్త' అని పేర్లు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ గ్రహించవలసినదేమిటంటే... ఈ జగత్తు వాస్తవానికి అసత్తు. అసత్తగు ఈ జగత్తునకు 'అసత్తు - ఆకార రహితము' అగు మనస్సే బీజము. ఈ ప్రకారంగా మనస్సే బ్రహ్మదేవుడై ఒప్పుచున్నారు. ఆ బ్రహ్మదేవుడు దేహవంతుడై కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి నిర్మలాకాశరూపుడే! ప్రతి జీవుని మనస్సు ఆ బ్రహ్మదేవుని రూపమే! అతడు విద్యమానుడై కనబడు
Page:166
చున్నప్పటికీ స్వప్న పురుషుని (స్వప్నాంతర్గత పురుషుని) ఆకారమువలె అతడు సర్వదా తెలియబడనివాడే. బ్రహ్మదేవునికి ఈ మట్టి-గాలి మొదలైన వస్తువులతో నిర్మించబడిన ఆకారము లేదు. అతడు 'సూక్ష్మ శరీరధారి' అయి ఉన్నాడు. ఎట్లాగంటే.... ఆకాశమునకు గాని, సంకల్ప (ఊహ) పురుషునకు గాని పృథ్వి మొదలైన వాటితో చేయబడిన ఆకారం ఎక్కడిది? దృష్టాంతానికి నీ మనస్సు ఆకాశమున కల్పిత (ఊహానిర్మిత) నగరమును వీక్షించగలదు చూచావా? అట్లాగే మనస్సు తనయందు కల్పించబడిన 'బ్రహ్మ దేవత్వము'ను గాంచుచున్నది.
బ్రహ్మదేవుడు దేనిదేనిని ఏ ఏ సంకల్పితమైన దానిగా ఎఱుగుచున్నాడో... ఆయా పదార్థములన్నీ తత్ సంకల్ప ప్రయోజనంగా అట్లే సత్యము అయినట్లు గాంచుచున్నాడు, అనుభవించుచున్నాడు. ఉదాహరణకు, ఒక యువకుడు “ఆహాఁ! ఆ స్త్రీ ఎంత సుందరంగా ఉన్నది? ఆమెతో సంభాషణం ఎంత మధురంగా ఉంటుంది?"... అని భావన చేసి అదంతా ఆమెతోటి సంభాషించు సందర్భమున అట్లే అనుభవిస్తాడు కదా! ఇక వాస్తవం ఏమిటి అంటావా? “66 ఆ స్త్రీ దేహం కూడా రక్త మాంస నిర్మితమైన తదితర దేహము వంటిదే” అనుకుంటే అట్లాగే అగుచున్నది. "కాదు ఇటువంటి అందమైన స్త్రీలు ఎక్కడో గాని ఉండరు”... అని అనుకుంటే అది అట్లే ప్రాప్తిస్తుంది. అట్లాగే బ్రహ్మదేవుడు తన సంకల్పితమైన జగత్తును సత్యము అయిన దానివలె అనుభవం పొందుచున్నాడు.
ఏ ఏ జీవులు కలరో వారందరి స్వరూపం కూడా ఆ చిద్వస్తువే కదా! అందుచేతనే వారందరు జ్ఞానశక్తిని కలిగియే ఉన్నారు. అందుచేత ఈ ఈ జీవులు కూడా నిజ - కల్పితములను ఎందుకు గాంచలేరు? గాంచగలరు. ప్రతిజీవుడు నిజకల్పిత విశేషములను అనుసరించే ఇక్కడ 'జగత్తు' అనబడు దానిని పొందుచున్నాడు.
ఈ జగత్తు ఎట్టిది? ఆ బ్రహ్మదేవుని “భావన-యోచన కూడా సంకల్పరూపమే” అగుటచే ఈ జగత్తు బ్రహ్మదేవుని ప్రతిభాసయే అయి ఉన్నది. చిత్రకారుడు సృష్టించిన చిత్రం చిత్రకారుని ఊహలోంచే వచ్చింది. కాబట్టి అతని ప్రతిభాసయే కదా! ఈ జగత్తు కూడా అట్టి (బ్రహ్మదేవుని) ప్రతిభాసయే! ఇది బ్రహ్మదేవుని సుదీర్ఘ- సుందర స్వప్నము మాత్రమే! అయితే చిరకాలము తదేక భావనచే ఇది ఘనీభూతమై, పరిపుష్టమై వెలయుచున్నది. వాస్తవముగా బ్రహ్మమే రూపముగా కలవాడు, మనోమాత్ర దేహధారి అగు బ్రహ్మదేవుని చిరకాల భావనచే ఆతని సృష్ట్యానుభవమే ఈ రీతిగా ఆధిభౌతిక రూపంతో (స్థూలరూపంతో) లెస్సగా ప్రకటనమయింది. ఆయన యొక్క అనేకానేక సంకల్పములు సంపుటమగుటచే ఈ జగత్తు భేద సమూహరూపములతో భాసించుచు ఇది “సృష్టి” అని చెప్పబడుతోంది.
ఆ బ్రహ్మదేవుడూ... అతని సంకల్పముచే ఉత్పన్నమైన ఈ జగత్తు... ఈ రెండు కూడా పరమార్థమున బ్రహ్మరూపములే! ఈ రెండూ (బ్రహ్మము-జగత్తు కూడా) సదా (వాస్తవానికి) ఉత్పత్తి-భేద రహితములే!
Page:167
ఆకాశము-శూన్యము; వాయువు-స్పందము; జలము-తరంగము; మట్టి-బొమ్మ; బంగారము-ఆభరణము; ఇనుము-ఆయుధము ... ఇవన్నీ ఏకరూపములే కదా! వాస్తవానికి బ్రహ్మము-బ్రహ్మదేవుడు-సృష్టి ఏక రూపములే అయి ఉన్నాయి.
శ్రీరాముడు : హే మహాశయా! ప్రథమ సంకల్ప పురుషుడగు బ్రహ్మదేవుడు తన సంకల్ప స్వరూపమగు ఈ సృష్టిని 'సత్యము' అని ఎఱుగుచున్నారా? లేక 'అసత్యము' అని ఎఱుగుచున్నారా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు నీ సంకల్ప పురుషునికి (నీ కల్పముల అనుభవమునకు కర్తృత్వము వహించే నీ యొక్క చైతన్య విభాగమునకు) సద్రూపములైన నగరాదుల పంచభూతత్వము మరొకరు తెలియజేయవలసిన పని లేకుండానే అసత్యమనియే ఎఱుగుచున్నావు కదా! అనగా, నీవు నీ ఊహలో కనిపించిన నగర వీథులు నీచే అనుభవించబడుచున్నప్పటికీ “ఇదంతా ఊహయే గాని పాంచభౌతిక సత్యం కాదు” అని నీకు నీవే ఎఱిగియే ఉంటున్నావు కదా! అట్లాగే సమష్టిమనోరూపుడు, వాస్తవానికి ఆత్మస్వరూపుడు అగు బ్రహ్మదేవుడు కూడా జగత్తు యొక్క భూతమయత్వమంతా “మిథ్యయే” అని ఎఱిగియే ఉంటున్నాడు.
బ్రహ్మదేవుడు తన చిత్సత్తచే పరిపుష్టములైనట్టి బ్రహ్మాండరూపమగు స్వశరీరము యొక్క ఆయా ధాతువులకు “ఇది పృథ్వి, ఇది జలము, ఇది అగ్ని/ తేజస్సు, ఇది వాయువు, ఇది ఆకాశము అను ‘పంచసంజ్ఞలను’ ఒసగుచున్నాడు. ఆ పంచ సంజ్ఞలు కలసి ఈ 'జగత్తు' అను రూపమున స్థితినొంది ఉంటోంది. ఇక బ్రహ్మదేవుని సత్యాసత్య భావన గురించి అంటావా...?
నీవు స్వప్నం పొందుచున్నప్పుడు ఆ స్వప్న సమయంలో ఆ స్వప్నాంతర్గత విశేషాలన్నీ అసత్యములే అయినప్పటికీ సత్యమనియే అనుకుంటున్నావు కదా! సత్యములనుకొనే అనుభవము పొందుచున్నావు. ఆ స్వప్నము అయి పోయిన తర్వాత ఎవరూ నీకు చెప్పకుండానే “అదంతా అసత్యమే కదా” అని నీకు నీవే గమనిస్తున్నావు. అట్లాగే ఒకడు ఊహాలోకంలో ఉంటూ ఆ ఊహలో కనిపించినవి అసత్యములే అయినప్పటికీ సత్యమువలె అనుభవం పొందుచున్నాడు కదా! అట్లాగే బ్రహ్మదేవుడు కూడా సంకల్ప జనితమగు ఈ జగత్తును ఇది అసత్యమే అయినప్పటికీ సత్యరూపముగనే అనుభవించుచున్నాడు.
బ్రహ్మదేవుడు అతని సంకల్పము కూడా - (తరంగం జలమే అయినట్లుగా) - పరమార్థమున చిదాకాశ రూపమే అయి ఉన్నది. అయితే, నామరూపాత్మకమగు ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మదేవుని సంకల్ప మాత్రమే కాబట్టి "ఆ జగత్తులోని అనేక పదార్థములు-అనేక జీవులు మొదలైనవాటి దృష్ట్యా ఇదంతా స్వప్నతుల్యమే” అని కూడా తప్పక చెప్ప బడుచున్నది. కాబట్టి ఈ జగత్తు యొక్క ఉత్పత్తి-వినాశనము కూడా సంకల్పము చేతనే గావించబడినవై స్థితి నొందియున్నవి.
మనోరూపుడగు బ్రహ్మదేవుడు (లేక సృష్టికర్త) ఎంతటి సత్యమో... అంతటి సత్యమే ఈ చంద్ర-సూర్యాదులు కూడా! అవన్నీ భౌతికంగా అగుపిస్తున్నప్పటికీ బ్రహ్మదేవ మనో నిర్మితాలేనని గ్రహించు. బ్రహ్మదేవుని మనస్సువలెనే అవి కూడా అర్థక్రియా సామర్థ్యములు అగుచున్నాయి.
Page:168
కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్ సమూహములు కూడా మనోరాజ్యమనియే చెప్పబడుచున్నది. అంతేకాదు. వాస్తవానికి జగత్తు దృశ్యశూన్యము, నిరాలంబము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించే పర్వతములు, నగరములు, జనులు స్వప్న ద్రష్ట యొక్క స్వరూపములే కదా! అంతకుమించి ఆ స్వప్నాంతర్గత విశేషములకు వేరే స్వరూపం ఎక్కడున్నది? స్వప్న ద్రష్ట స్వతహాగా చిదాకాశరూపుడేనాయె! ఈ విధంగా స్వప్న ద్రష్ట స్వప్నాంతర్గత విశేషాలు చిదాకాశ రూపములే అయి ఉన్నాయి. అట్లాగే బ్రహ్మదేవుడు + ఆయన స్వప్న మాత్రమైన ఈ జాగ్రత్-జగత్తు..... ఈ రెండూ కూడా నిర్మల చిదాకాశరూపములే అయి వెలయుచున్నాయి. ఈ జగత్తు స్వప్న పురమువలె అభాస మాత్రమే! ఇద్దాని యొక్క ఉత్పత్తి-స్థితి-ప్రళయము కూడా ఊహ-సంకల్పము-స్వప్నముల వలె మిథ్యగానే ఉదయించినవై ఉన్నాయి.
కానీ యథార్థానికి ఈ సమస్తము కూడా అవ్యయమగు బ్రహ్మమే అగును సుమా! ఓ రామచంద్రా! చిదాకాశ రూపములమే అగు నీ యొక్క- నా యొక్క ఈ జగత్తు యొక్క గాని ఏమి ఉత్పన్నమౌతోంది? ఏమి నశించుతోంది చెప్పు? నీ స్వస్వరూపమునకు-నా స్వస్వరూపమునకు కూడా జగత్తు ఉండటం చేతగాని, లేకుండటం చేతగాని మార్పు చేర్పులు ఏముంటాయ్? ఏమి ఉండవు. ఇక ఇక్కడి రాగ ద్వేషములు మొదలైన వంటావా? అవన్నీ కేవలం ప్రయోజన శూన్యములు, అపార్థకములు, అనర్థకములు, స్వప్నంలోని సింహాన్ని చూచి జాగ్రత్తులో ఉలిక్కిపడటం వంటిది మాత్రమేనని కూడా గమనించెదవు గాక!
ఓ రామచంద్రా! వాస్తవానికి పరమార్థ దృష్టియందు... సృష్టి యొక్క కారణము లేదు. సృష్టి లేదు. అసృష్టి లేదు... ఏ జీవ-జగత్తులు ఒకప్పుడు భాసించి-మరొకప్పుడు భాసించకయే ఉన్నాయో...అవన్నీ కూడా సదా ఆవరణరహితమగు బ్రహ్మమే అయి ఉన్నాయి.
చైతన్యము అత్యంత శూన్యము-విశాలము-నిర్మలము అయి ఉన్నది. చైతన్యమునందు అద్దానికి ఏమాత్రం అన్యం కానట్టి, 'చిదాకాశము' ఉన్నది. ఆ చికాశమునందు చిదాకాశ స్వరూపములే అగు అనేక భూతకోట్లు ఉత్పన్నం అయి ఉన్నాయి. ఉత్పన్నం కాబోతున్నాయి.
కానీ యథార్థానికి ఆ చిదాకాశమునందు క్షేత్రమూ లేదు, బీజమూ లేదు, ఏదీ నాటబడనూలేదు, ఉత్పన్నము అయి ఉండనూలేదు. మరి? మాయ చేతనే అంతయు ఇట్లు స్థితినొందియున్నది. మాయ భ్రమచేతనే నిర్మితమౌతోంది. భౌతిక రూపములుగా సృష్టి పరంపరలుగా కనిపించేదంతా భ్రమ తొలగితే చిదాకాశముగానే కనిపించగలదు. అట్టి కల్పనా క్షేత్రంలో కనిపించే రకరకాల శిలలే దేవతలు, దేవర్షులు, మనుష్యులు, నాగాదిజాతులు, క్రిమికీటకాదులు మొదలైనవి. అటువంటి కల్పనా క్షేత్రంలో ఉన్నవే మరొక జాతియగు పిశాచులు కూడా! వారు మహాభారభూతులు. వారి ఆకారము పంచభూత పదార్థరహితం కాబట్టి వారు శూన్యరూపులే! వారు ఎప్పుడో ఇతఃపూర్వమే భౌతికదేహం దృష్ట్యా నశించి ఉన్నవారు. దేహరహితులై దేహాకారముగా ఉన్నవారే పిశాచులు.
Page:169
శ్రీరాముడు : మహర్షీ! బ్రహ్మదేవుడు తన ఇచ్ఛ చేతనే ఈ రకరకాల జీవజాతులను సృష్టించుచున్నాడు కదా!... అలాంటప్పుడు ఆయన తన ఇచ్ఛచే 'దేవర్షులు' మొదలైన వారినే సృష్టించవచ్చును కదా! మరి దుష్ట జీవులగు పిశాచములు మొదలైనవి ఎందుకు సృష్టించటం?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒక కథా రచయిత (నవలా రచయిత) పాఠకుల అభిలాషను అనుసరించి మంచి చెడులను కలగలిపి కథారచన / నవలారచన కొనసాగిస్తాడు కదా! అట్లాగే సృష్టికర్త యొక్క సృష్టిసంబంధమైన ఇచ్ఛ కూడా జీవుల కౌతుక విశేషమును అనుసరించే ఉంటోంది.
బ్రహ్మదేవుని ఇచ్ఛపై అట్టి ఆక్షేపణ తగదు. ఎందుచేతనంటే అతని ఇచ్ఛ పూర్వకల్పము నందలి ప్రాణుల కర్మ-వాసనాదులను అనుసరించే ప్రవర్తించుచున్నదగుచున్నది. వాస్తవానికి సమస్త ప్రాణికోట్లు సమస్త మనోమాత్ర శరీరధారులు, ఇవన్నీ కూడా పృథ్వి మొదలైనవి లేనివారై ఉండి, కేవలం చిదాకాశరూపములై ఉన్నారు. అట్టి స్వతహాగా నిర్మల చిదాకాశ రూపులగు ఈ ప్రాణుల యొక్క చిరకాలాభ్యాసముచే "ఆధిభౌతిక రూపత్వము” పొందుచున్నారు. అదంతా “ఒక స్వప్నము దీర్ఘకాలం అనుభవించటంచే జాగ్రద్దశను పొందుచున్నట్లుగా” ఏర్పడి ఉంటున్నాయి. (ఉదా: లవణ మహారాజు అనుభవం (“మహేంద్రజాలం" భృగుయమ సంవాదము” గాధి వృత్తాంతం - మనోదర్పణం మొదలైనవి).
చిదాకాశమునందే దీర్ఘకాలికమైన భావపరంపరాభ్యాసంచే ఆధిభౌతికత్వం అనుభవించ బడుతోంది. అట్లాగే పిశాచ జాతులు కూడా! వారు సర్వ జీవుల వలెనే శుద్ధ చైతన్యరూపులే! అట్టి శుద్ధ చైతన్యరూపులు తమ శుద్ధత్వము ఏమరచి దీర్ఘకాలం 'సంకల్పనగరం'లో విహరిస్తూ సూక్ష్మదేహధారులైనారు. వారు మరల ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఆధిభౌతికదేహసూక్ష్మ దేహత్వముల మధ్య వారు సంచారము చేస్తున్నారు. అనగా (1) వారు సూక్ష్మ దేహం పొందారు. ఇంకనూ స్థూల దేహం పొందలేదు. లేదా (2) స్థూలదేహం కోల్పోయారు. సూక్ష్మదేహులై బలవత్తరమైన స్థూల దేహాభిలాష కలిగి ఉండి ఇంకనూ స్థూలదేహం పొందలేదు. ఇదివారి జాతిధర్మం. అనగా వారు సూక్ష్మ-స్థూల దేహముల మధ్య అనేకానేక ధ్యాసల మధ్య కొట్టుమిట్టాడుచున్నారు.
పిశాచాద్యాస్తథా ఏతే తథా భూత అధిభౌతికాః
తిష్ఠంతి తుష్టమనసః స్వసంసార విహారిణః ||
పిశాచాదులు తమ యొక్క చిరకాలాభ్యాసంచే ఆధిభౌతికత్వ స్వభావాన్ని తమ స్వరూపముపై ఆపాదించుకొని ఇక ఈ సంసారమున సుదీర్ఘ విహారం చేస్తున్నారు. స్వజాతి యోగ్యమైన భోగములను పొందుచు, మరికొన్ని సందర్భములలో ఏవేవో భోగముల కొరకై ఉబలాటముఆందోళన-ఆర్తి-ఆవేదనలు చెందుచూ సంసారారణ్యంలో సంచారములు సలుపుచున్నారు.
వారిలో కొందరు క్రమేపీ సాధనానుకూలమైన ఆధిభౌతిక దేహం పొందుచున్నారు. కొందరు ఇంకనూ పొందుటకై ఆరాటపడుచున్నారు. మరికొందరు పిశాచత్వం ధరించి సుదీర్ఘకాలం గడపుచునే ఉన్నారు.
Page:170
శ్రీరాముడు : మహర్షీ! ఆ పిశాచములు కూడా స్వజాతీయమైన పరస్పర సంబంధములుసంభాషణలు—మొదలైనవి కలిగి ఉంటాయా?
శ్రీ వసిష్ఠ మహర్షి : గ్రామస్థులు గ్రామస్థులను చూస్తారు చూచావా? స్వప్నలోక నివాసులు (ఉదాహరణకు గంధర్వలోకం) పరస్పరం గాంచుచూ సంభాషించుకొంటూ ఉంటారు కదా! అట్లాగే కొన్ని పిశాచజాతులు పరస్పరం వ్యవహరించుకొంటూంటారు. మరికొన్ని పిశాచజాతులుమనుజుని యొక్క స్వప్నజీవుల వలె పరస్పరం గాంచుచుండటంలేదు, పరస్పరం సంభాషించు కోవటం లేదు.
ఓ రామచంద్రా! ఈ పిశాచములు పరాన్నభుక్కు-పరరక్తభుక్కు-పర మనోహక్కులుగా అధికంగా ఉంటూ ఉంటాయి. ఒక్క పిశాచ జాతులే కాకుండా, అదే రీతిగా కుంభాండ జాతి జీవులు, యక్షజాతి జీవులు, ప్రేతజాతిజీవులు ఉంటారు. వారందరికి కూడా కారణం దేహం (లేక) సూక్ష్మ దేహం (లేక, మానసిక దేహం) ఉంటుంది.
యథా తత్ర ఇహ వైనిమ్నా, జలం తత్రావ తిష్ఠతే
తథా యత్ర పిశాచాద్యాః "తమః” తత్ర అవతిష్ఠతే ॥
ఎక్కడ పల్లం ఉంటే అక్కడ నీరు నిలుస్తూ ఉంటుంది కదా! అట్లాగే పిశాచాదులు ఎక్కడ ఉంటే వారి వారి పాపములు తారతమ్యమును బట్టి అధికమైన, అల్పమైన తమోగుణస్థితి కలిగి ఉంటుంది, ప్రదర్శితమౌతూ ఉంటుంది.
ఒక్కొక్క పిశాచము మధ్యాహ్న సమయంలో స్వయంగా ఒకని ఎదుట నిలబడితే అతని ఎదుట అంధకారం ఆవరిస్తుంది. ఆ పిశాచము వలన అనుభవించే అంధకారమును ఈ సూర్యుడు తొలగించలేడు. పిశాచ జీవునికి కనబడే అంధకారం అధికంగా ఆ పిశాచ స్వరూపదేహియే స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు.
ఆహా! మాయయొక్క ప్రభావం ఎంతటిది! సభౌతిక దేహులమగు మనం వ్యవహరించాలంటే సూర్యుడు-చంద్రుడు తేజోమండలములు వెలుగు కావాలి కదా! పిశాచములు అదేరీతిగా వ్యవహరించటానికి “చీకటి” కావాలి. గుడ్లగూబలాగా పిశాచాదులు స్వభావంగానే వెలుతురులో నిర్బలులై ఉంటారు. అంధకారంలో ప్రబలులై ఉంటారు. ఆహా! ఏమి ఆశ్చర్యం! ఈ సృష్టిలో కొందరు జీవులకు వెలుతురు ప్రియమైతే, మరికొందరు జీవజాతులకు చీకటి ప్రియమౌతోంది!
ఓ రామచంద్రా! “దేవతల లోకపాలకుల నగరాలలో పిశాచమై సంచరించాను” అను ప్రసంగవశంగా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పిశాచములు గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావించాను. "శిష్యుడు అడిగిన సందేహమునకు సమాధానం గురువు చెప్పాలి" అనే సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పిశాచముల గురించి చెప్పానే గాని, మన సంవాదమునకు ఇంతకు మించిన వివరాలు సందర్భోచితం కాదు.
Page:171
42. ఆత్మజ్ఞానమే ముఖ్యోపాయం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆ విధంగా అప్పుడు పంచభూత రహితమగు "కేవల చిదాకాశ మాత్ర దేహధారి” ని అయి పిశాచముగా ఆకాశమున అనేక స్థానములలోనూ లోకములలోనూ సంచరించానని చెప్పాను కదా! ఆ సమయంలో చంద్ర-సూర్య-ఇంద్ర-హరి - హరాదులు గాని, దేహ-సిద్ధ-గంధర్వ-కిన్నర అప్సరస గణములు గాని నన్ను చూడజాలకుండిరి. నేను వారిని ఆక్రమించుచున్నప్పుడు కూడా నన్ను వారు ఆక్రమించలేకపోయేవారు. నా వాక్యములు వారికి వినబడేవి కావు. ఈ విధంగా మత్తును పొందిన సజ్జనునిలాగా కర్తవ్య విచార శూన్యుడనై మోహమును పొంది కొంతకాలం అట్లా గడిపాను. అట్లా సంచరిస్తూ సంచరిస్తూ ఉండగా ఒకానొకప్పుడు కాకతాళీయంగా 'అరెఁ! ఏమిటిది? నన్ను ఎవరూ చూడలేక పోతున్నారు, వినలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పిశాచత్వము తొలిగేది ఎట్లా?' అనే ఆవేశముతో కూడిన ఆవేదన నా యందు బయలుదేరింది. “ఈ ఒంటరితనం నేను త్యజించాలి. ఎట్లా?" ... అని యోచించసాగాను. అప్పుడు నా హృదయస్థానంలో ఒకానొక ఆలోచన తళుక్కున మెఱిసింది. "అరె! నేను ఈ విషయం ఎట్లా మఱచాను? మేము సత్యసంకల్పులం కదా! 'ఇది ఇట్లు అగుగాక’ ...అని తలచగానే అతి అట్లే ప్రాప్తించగలదు కదా!" అనే మాట జ్ఞాపకమునకు వచ్చింది. అప్పుడు నేను దేవతాలోకంలో ఉండటంచేత "ఈ దేవతలందరు నన్ను చూచెదరు గాక!" అని మననపూర్వకంగా కొంతసేపు సంకల్పించాను. వెంటనే ఆ దేవలోకంలోని దేవతా జీవులకు ఇంద్రజాలంలో ఎదురుగా కొండలు కనిపించునట్లు నేను అప్పటికప్పుడు జన్మించినట్లుగా కంటికి కనిపించసాగాను. అప్పుడు నేను ఆయా లోకములకు ప్రామాణ్యములైన యథా స్థితములైన ఆచారములు కలిగి ప్రవర్తించసాగాను. శంకారహితుడనై వర్తించటం ప్రారంభించాను. దేవతల గృహములలో వారితో సంభాషించటం ఆరంభించాను.
అప్పుడు నా ఇతఃపూర్వపు వృత్తాంతం తెలియని దేవతలు కొందరు, “ముంగిటయందలి పృథ్వి నుండి ప్రప్రథమంగా ఆవిర్భవించారు. కాబట్టి ఈయన పార్థివ వసిష్ఠుడు" అని చెప్పుకోసాగారు.
మరికొందరు “ఈతడు ఆకాశమున సూర్యకిరణముల నుండి వెలువడటం మేము చూచాం. కాబట్టి ఈయన 'తేజస వసిష్ఠుడు’ ” అని సంభాషించుకోసాగారు. అట్లాగే వాయుమండలము నుండి నేను ఉద యించటం వీక్షించిన ఆకాశవాసులగు దేవతలచే “వాత వసిష్ఠుడు” అని
పిలువబడసాగాను.
కొందరు మునీశ్వరులు నేను జలము నుండి వెలవడుచున్నట్లు గాంచినవారై “ఈయనే వారి వసిష్ఠుడు” అని ప్రకటించసాగారు. ఆకాశము నుండి వినిర్గతుడవటం గాంచిన మరికొందరు ఆకాశవాసులు “ఆకాశ వసిష్ఠుడు” అని సంబోధించసాగారు.
Page:172
ఈ విధంగా వివిధ కల్పనలచే నా నామము - జన్మ గురించి ఊహ-అపోహలు కల్పించబడ్డాయి. అప్పటి నుండి లోకములలో ఒకచోట పార్థివుడు అని, మరొకచోట అమ్మయుడు (జలమయుడు) అని, ఇంకొకచోట 'తైజసుడు' అని, వేరొక చోట 'మారుతుడు' అని, ఒకానొక చోట ‘ఆకాశమయుడు' అని ప్రసిద్ధికెక్కాను.
ఆ తర్వాత చిరకాలాభ్యాసంచే కాలక్రమంగా నా మనస్సు పరిణతి పొందింపబడినది. అనగా క్రమంగా నాపట్ల అతివాహిక దేహము (సూక్ష్మదేహము) ఆధిభౌతిక దేహము (స్థూల దేహము) ప్రకటనమయ్యాయి. అయినా కూడా, రామచంద్రా! నా యొక్క ఆత్మజ్ఞాన బలంచేత నా దృష్టియందు... 1. అతివాహిక దేహము (సూక్ష్మ దేహము); 2. ఆధిభౌతిక దేహము (స్థూల దేహము)... ఈ రెండూ కూడా చిదాకాశరూపములుగా కన్పట్టాయిగాని ఏదో క్రొత్తది పొందినట్లుగాని, పాతదేదో త్యజించినట్లుగాని నాకు ఆ సమయమందుకూడా అనిపించనేలేదు. ఇప్పుడూ అనిపించటం లేదు. నేను ఏకాంతాకాశ ప్రదేశమున ప్రకాశించినప్పుడు, లోకాలోక పర్వతశిలలో బ్రహ్మాండమును దర్శించినపుడు, మహారుద్ర-ఛాయాదేవిల ప్రళయ తాండవం దర్శిస్తు న్నప్పుడు, పిశాచ స్వరూపినై సూక్ష్మ దేహమునకు కూడా ఆవల సంచరించుచున్నప్పుడు, “సర్వతత్త్వ రూపమగు ఆత్మయే నా స్వరూపం”.... అని సుస్థిరీకరించుకొని ఉండుటచే ఇప్పుడు సూక్ష్మ-స్థూల దేహాలు పొందుచున్నప్పుడు కూడా యథాతథమైన 'ఆత్మభావన'యే పుణికిపుచ్చుకొని ఉన్నాను.
అప్పుడు-ఇప్పుడు కూడా నా చైతన్యము 'ఆత్మ భావము' తోటియే స్ఫురిస్తోంది గాని.... దేహాత్మ భావనతోటి కాదు.
ఓ రామచంద్రా! 'ఆత్మజ్ఞాన బోధ' సందర్భంగా ఈ పాషాణోపాఖ్యానం అనే ఆఖ్యాయిక ద్వారా నా స్వానుభవమును సోదాహరణపూర్వకంగా వివరించాను. ఈ ప్రకారంగా, ఈ చోట నేనే ఆకాశాది పంచభూతములతోటి స్పురిస్తున్నప్పటికీ నిరాకారమగు పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నాను. అట్లాగే నీవుగాని, ఈ సభలో మరెవరైనా గాని నిర్మలము-సుతీక్షము-సువిశాలము అగు బుద్ధితో తమ స్వరూపమును నిరాకారమగు పరబ్రహ్మముగా తప్పక గాంచవచ్చును.
వాస్తవానికి సర్వదా నిరాకార పరబ్రహ్మ స్వరూపుడనే అయినప్పటికీ మీ అందరి ఉపదేశం మొదలైన వాటి కొఱకై నేను ఈ సాకార వసిష్ఠముని రూపం ధరించి మీ ఎదురుగా కనిపిస్తున్నాను. శ్రీరాముడు : స్వామీ! మీరు జీవన్ముక్తులా? విదేహముక్తులా? ఈ ఇద్దరిలో భేదమేమైనా ఉన్నదా? శ్రీ వసిష్ఠ మహర్షి : నాయనా! రామచంద్రా! ఈ "జీవన్ముక్తుడు-విదేహముక్తుడు” అనునవి శాస్త్రములు బోధకొరకై కల్పించి, బోధానంతరం ఆ రెండు శబ్దములు భేదమును అభేదముగా చేసివేస్తున్నాయి. శిష్యుడు పూర్ణ జ్ఞాని అగుచుండగా ఇక ఇత్యాది శబ్దముల అర్థ పరిశీలన క్రమంగా అనావశ్యకమగుచున్నది. అయినా నీవు అడిగావు కాబట్టి ఇక్కడ చెప్పుచున్నాను. విను.
Page:173
విదేహముక్తుడు బ్రహ్మమాత్రుడై చిదాకాశమాత్రుడై స్థితి కలిగి ఉంటున్నాడు. అతని లోక సందర్శనము ఈ కనబడే స్థూల - సూక్ష్మములకు అతీతమైనదై ఉంటోంది.
జీవన్ముక్తుడో... వ్యవహారం ఆచరిస్తున్నప్పటికీ చిదాకాశరూపుడే అయి వెలయుచున్నాడు. ఉభయులూ కూడా తమ చిదాకాశ రూపమునే ఆయా సర్వస్థితి గతులలోను అనుభవిస్తున్నారు. ఉభయములు తమ వాస్తవతత్త్వమును ఎఱిగి అనుభూతపరచుకునియే ఉంటున్నారు. ఇక వారిద్దరి మధ్య భేదమెక్కడిది? నాకేమి అగుపించటం లేదు. బ్రహ్మముకంటే అన్యమైనదేదీ నాకు ఎక్కడా కనిపించటమే లేదు. బ్రహ్మీదృష్టి నాకు తొలగకపోవుటచే, స్థూలదేహి సూక్ష్మదేహి-వాయుదేహిజలదేహి-పార్థివదేహి-తేజో దేహి-ఆకాశ దేహి-పిశాచ దేహి-వర్తమాన దేహిని అగుచున్నప్పుడు, అగుచుండనప్పుడు కూడా నేను ఆత్మనే! నాకు తదితరంగా కనిపించేదంతా కూడా ఆత్మయే! స్వప్నం కంటున్నప్పుడు ఆ కలలో కనిపించే స్వప్నాంతర్గత మనుజుడు వాస్తవానికి ఆకారరహితుడే కదా! అట్లాగే నాకు ఆకారముతో కనిపించే తదితర జీవులంతా ఆత్మ స్వరూపులేనని నా దృష్టికి సుస్పష్టంగా అన్ని స్థితులలోను, పరిస్థితులలోను అనిపిస్తోంది.
ఇదంతా భౌతిక దృష్టిగలవానికి భౌతికంగాను, ఆత్మ దృష్టి గల వానికి ఆత్మతత్త్వముగాను అనుభూతమౌతుంది. అందుచేత ఓ జనులారా! మీరు ఆత్మ తత్త్వమును విని పఠించి గ్రహించి అప్పుడు ఈ జగత్తులను దర్శించండి. ఇకప్పుడు మీకు నా వలెనే “సర్వము ఆత్మ స్వరూపము” అను రీతిగా అగుపించకపోతే నన్ను అడగండి.
చూచావా రామచంద్రా! ఈ విధంగా బ్రహ్మదేవుని మొదలుకొని సమస్త శరీరములు, ఈ సమస్త సృష్టులు అజ్ఞాన దృష్టికి ఆధిభౌతికంగా ఉత్పన్నమయినట్లుగా అనిపిస్తోంది. కానీ యథార్థానికి అవేవీ ఏనాడు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఊహ (సంకల్పము) చే బ్రహ్మదేవుడు సమష్టి సృష్టిని (మాయచే) కల్పించుచుండగా, ఊహచేతనే జీవుడు జగత్తులను అనుభవించుచున్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఈ జీవుడు కూడా వాస్తవానికి సర్వదా ఏకాత్మ స్వరూపులే! ఉభయులు ఏకస్వరూపులే!
ఈ ‘ఆకాశ వసిష్ఠుడు’ అని మీ అందరిచే పిలువబడే నేను నిజమనస్సు యొక్క అభ్యాసము చేతగాని, (లేక) మీ యొక్క అభ్యాసము చేతగాని, (లేక) మీ యొక్క బుద్ధిని అనుసరించిగాని ఇట్లు ఈ విధంగా ఆధిభౌతిక దేహముతో స్థితిని కలిగి కనిపిస్తున్నాను.
ఇది నా యొక్క విషయమే కాదు. ఈ సభలో నారద-వ్యాస-విశ్వామిత్రాది మహనీయులగు ఎందరో ఆత్మజ్ఞులు ఉన్నారు. వారందరు నా వలెనే 'సర్వము ఆత్మయే' అనే అనుభవమును పుణికిపుచ్చుకొనియే ఈ సభకు వేంచేసి మన ఈ అధ్యాత్మ శాస్త్ర సంవాదాన్ని వింటూ అంగీకార తేజస్సును అందిస్తున్నారు. నాకు వలెనే బ్రహ్మదేవునికి, ఈ సభలోని తత్త్వజ్ఞులకు, తదితర ఆత్మజ్ఞులగు మహనీయులకు స్వదృష్టిలో ఈ జగత్తంతా కూడా చిదాకాశ మాత్రమే అయి ఉన్నది.
Page:174
పరీక్షకుల దృష్టియందు ఈ సమస్తము మనోమాత్రమే అయి ఒప్పుచున్నది.
బాలుర దృష్టికి బేతాళము (వాస్తవానికి లేకపోయినా) కనిపిస్తుంది చూచావా? ఎందుచేత? అజ్ఞానముచేత కదా! అట్లాగే ఈ సమస్త సృష్టి కూడా జ్ఞానము సంపాదించని వారి దృష్టియందు వజ్రమువలె దృఢరూపమును పొంది ఉంటోంది. దూరపు దేశంలో ఉన్న బంధువు పట్ల గల బంధుత్వబుద్ధి ఆ బంధువుకు సంబంధించిన వాసన సన్నగిల్లుటచే క్రమంగా ఉపశమిస్తుంది చూచావా? అట్లాగే ఎఱుగబడుచూ-ఎఱుగబడుచూ ఉండగా అల్పకాలంలోనే ఈ సృష్టి పట్ల ఏర్పడిన ఆధిభౌతికత్వము శమించిపోగలదు. నిద్రలేచిన తర్వాత "అయ్యో! నా స్వప్నంలోని ధనం ఎవరు దొంగిలించారో?”... అనే దుఃఖం ఎవరికైనా ఉంటుందా? అట్లాగే ఎఱుగబడిన తర్వాత అహంకారరూపమగు సృష్టి యొక్క స్థూలత్వము కూడా శమించుచున్నది. అది 'ఎండమావులు’ అని, ఎఱిగిన తర్వాత అందులో దాహం తీర్చుకోవాలని ఎవరూ అనుకోరుకదా! జ్ఞానదృష్టిచే దృశ్యదృష్టులు ఉపశమిస్తున్నాయి. ఈ వసిష్ఠ రామ సంవాదము అను మహారామాయణము వంటి శాస్త్రములను కొంచెం పరిశీలించినంత మాత్రం చేతనే అట్టి జీవన్ముక్తత్వము నిరంతరము లభిస్తూ ఉండగా... ఇంత మాత్రం కార్యం ఆచరించటంలో ఏమి కష్టమున్నది? కనుక 'జీవన్ముక్తత్వం' అసాధ్యం అను సిద్ధాంతం మేము ఒప్పుకోం.
సంసారవాసనాభావరూపే సక్తా ను యస్యధీః
మన్గో మోక్షే నిరాకాక్షీ స శ్వా కీటో అధవా జనః |
ఎవని బుద్ధి అయితే సంసారవాసనావశంచే అభావరూపములగు దేహము-ఇంద్రియము మొదలైన పదార్థములందు ఆసక్తి కలిగి ఉంటుందో, మోక్షము విషయములో ఆశయము ఉండకుంటుందో... అట్టి మనుజుడు శునకము-కీటకము తోటి సమానుడే అవుతాడు. అంతకుమించి నేనేం చెప్పగలను?
ఓ జనులారా! 'జీవన్ముక్త బుద్ధి' తో అనుభవించే శబ్ద స్పర్శాది భోగకలాపములు ఎట్లా ఉంటాయో... మూర్ఖ-అజ్ఞాన బుద్ధిచే సేవించబడే శబ్దాది భోగాలు ఎట్లా ఉంటాయో.... ఈ రెండింటికి ఉన్న భేదమేమిటో కొంచెం యోచించండి. మొదటిదేమో చిద్రూపముచే ఆనందప్రదమౌతుంది. రెండవదో... జడ రూపముచే దుఃఖ ప్రదంగానే అగుచున్నది. సుమా!
ఈ వాసిష్ఠ రామాయణము మొదలైన ఆత్మశాస్త్ర గ్రంథాలను కాస్త పరిశీలించినంత మాత్రం చేతనే సమస్త పదార్థములపట్ల అంతఃకరణ శీతలత్వం ఉదయిస్తుంది. "జీవన్ముకత్వం సుసాధ్యమే. అత్యవసరం కూడా” అని సుస్పష్టమౌతుంది.
చిత్తము యొక్క శీతలత్వమే మోక్షము - సుఖము కూడా! చిత్తము యొక్క సంతాపమే బంధం. ఆశ్చర్యం! అట్టి "చిత్తము యొక్క శీతలత్వం ఎట్లా సంపాదించుకోగలం?”... అనే విషయంలో జనులు ఆశ్రద్ధ కలిగి ఉన్నారే! లోకముయొక్క మూఢత్వము ఎటువంటిది? అందుకే అవతారమూర్తియగు నీ రాక జనులకు అత్యవసరమైయున్నది. ఈ మనుజులు స్వభావముచేతనే
Page:175
విషయములకు వశీకృతులై ఉంటున్నారు. కాబట్టే పరస్పర యుద్ధము, చౌర్యము, స్త్రీ-ధనములను సంపాదించాలనే తీవ్రమైన పట్టుదలలు కలిగి ఉంటున్నారు. ఇట్టి భ్రాంతి-సంతాపములతో కొట్టుమిట్టాడుచూ ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు, ఒక భయము నుండి మరొక భయమునకు చనుచుండు జనులకు 'ఆత్మజ్ఞానము' తప్పితే ఔషధం ఏమున్నది? అట్టివారు ఈ దృశ్యముపట్ల కొంచెం విరక్తి కలిగి ఈ ముముక్షు శాస్త్రము యొక్క అర్థ విచారణ, నిధిధ్యాసాది ఉపాయములు, తత్త్వజ్ఞానుల సంవాదమును-బోధన వినటం ప్రారంభించితే అతి త్వరలో యథార్థ వస్తువగు ఆత్మను అవలోకించినవారై సుఖించగలరు.
శ్రీవాల్మీకి మహర్షి: ఓ భరద్వాజా! శ్రీ వసిష్ఠ మహర్షి ఇట్లా పలికి 17వ రోజు సంవాదమును ముగించారు. క్రమంగా సూర్యుడు అస్తమించసాగాడు. సభికులంతా లేచి పరస్పర నమస్కారములు సమర్పించుకొని సాయం సంధ్యాది దైవీక్రియలకు ఆయత్తం కాసాగారు.
(పదిహేడవ రోజు విచారణ పూర్తి అయింది)
Page:176
VI. పాషాణోపాఖ్యాన తాత్పర్యం
1. చైతన్యమునకు వేఱుగా జీవుడు - జగత్తులు లేవు శ్రీవసిష్ఠ మహర్షి : శ్రీ రామచంద్రమూర్తికీ, సభికులందరికీ ఈ 18వ రోజు సంవాదమునకు సుస్వాగతం పలుకుచున్నాను. నిన్నటి రోజున మనం 'పాషాణోపాఖ్యానం' పేరుతో నా స్వానుభవమైన ఒకానొక విశేషాన్ని చెప్పుకున్నాం. అట్టి పాషాణోఖ్యానము యొక్క తాత్పర్యం చెప్పుకొని ఆ పై
ముందుకు సాగుదాం.
ఈ పాషాణోపాఖ్యానం ద్వారా “చిన్మాత్రపూర్ణ దృష్టిచే జగత్తులు అనబడేవన్నీ (సృష్టులు అని చెప్పబడేవన్నీ) చిదాకాశమున చిదాకాశరూపంగానే నెలకొని ఉన్నాయి” అని నిరూపించుకోవటమే మన ఉద్దేశం.
న చ స్థితం కించనాపి క్వచనాపి కదాచన ।
స్థితం బ్రహ్మఘనే బ్రహ్మ యథాస్థితమ్ “అఖండితమ్” ||
ఈ జగత్తు అనబడేది కొంచమైనా ఎక్కడా కూడా, ఎప్పుడూ కూడా ఉండనేలేదు. చిదనమైనట్టి బ్రహ్మమే బ్రహ్మమునందు అఖండరూపమున యాథారీతిగా స్థితి కలిగి ఉన్నది. ఒకనికి స్వప్నంలో కనిపించే నగరాలు 'నిజచిద్రూపం' కంటే వేరు కాదు కదా ! అవన్నీ నిజచిద్రూపములే కదా ! అట్లాగే ఈ జగత్తు అనబడేది కూడా బ్రహ్మచిన్మాత్రమేనని గ్రహించు. బ్రహ్మదేవుని చిద్రూపముతో ఈ స్థూల - సూక్ష్మ రూపమగు 'జగత్తు' అనే దృశ్యము యొక్క వ్యవస్థితి ఏర్పడినప్పటికీ కూడా - జన్మరహితమగు చిదాకాశము తన యొక్క చిత్స్వరూపమును త్యజించకయే ఉంటోంది. పరమార్థమున బ్రహ్మదేవుడుగాని, జగత్తు గాని స్వప్ననగరాలు గాని లేవు. చైతన్య మహాదృష్టిచే 'చిన్మాత్రము' ఒక్కటే కలదు. స్వప్నంలో స్ఫురించే నగరం స్వప్నానంతరం స్వపద్రష్టలోనే (స్వాత్మయందే) లయం అగుచున్నది కదా ! అట్లాగే ... సృష్ట్యాది నుండి ప్రళయ పర్యంతము అనుభవించబడుతున్న సమస్త జగత్తు ద్రష్టయందే లయించుచున్నది. కనుక అదంతా కూడా ద్రష్ట వలెనే బ్రహ్మరూపమే అయి ఉన్నది.
బంగారమునకు - బంగారపు ముద్దకు తేడా ఎక్కడిది? అట్లాగే చైతన్యమునకు - స్వప్న పురమునకు, చైతన్యమునకు - సృష్టికి కూడా ఒకింత కూడా భేదం సంభవించజాలదు. సువర్ణపు ముద్దయందు సువర్ణమే ఉన్నది గాని 'ముద్దత్వము' (Solidity) అనేది ఎక్కడున్నది? ఆ విధంగా కేవలము చైతన్యమే ఉన్నది. సృష్టి లేదు. స్వప్నపురంలో స్వప్నచైతన్యమే ఉన్నది గాని స్వప్న పర్వతం
Page:177
- స్వప్ననగరం ఇవన్నీ లేవు. నిర్వికారమగు చైతన్యమే స్వప్నకల్పనలో నగరంలా భాసిస్తోంది. నిర్వికారమగు బ్రహ్మమే ఇక్కడ 'సృష్టి'వలె భాసిస్తోంది. అంతకు వేరుగా ఏదీ లేదు. ఈ సృష్టి అంతా కూడా “నిర్మలము - సర్వ వ్యాపకము-నిర్లేపము-అజము - అవ్యయము-అనంతము” అగు చిన్మాత్రము మాత్రమే ! వేలకొలది మహాకల్పములందు కూడా ఆ చిన్మాత్రము ఉదయించదు, అస్తమించదు. అది సర్వదా ఏకరసమయ్యే ఉంటుంది.
ఓ రామచంద్రా ! ఈ జీవుడు నీవు-నేను-ముల్లోకములు అంతా కూడా అజము-అమరము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నాము. చిదాకాశమే లేకపోతే ఈ శరీరము కర్తృత్వరాహిత్యముచే నిర్జీవమౌతుంది. అట్టి చిదాకాశము దేనిచేతా ఛేదించబడదు, దహించబడదు. అది ఎన్నడూ శమించునదీ కాదు. కాబట్టి ఇక్కడ ఎదీ జనించటం లేదు, మరణించటం లేదు. చైతన్యము యొక్క స్ఫురణయే జగద్రూపంగా అనుభూతమౌతోంది. ఒకవేళ చిన్మాత్ర స్వరూపమే “మరణము” అనే రహితత్వము పొందవలసి వస్తే... ఆ చైతన్యము స్వరూపముగా గల పుత్రుడు కూడా (ఆత్మావై పుత్రనామాసి ఆత్మయే పుత్రుని రూపంగా అగుచున్నది... అను సిద్ధాంతము ననుసరించి) తండ్రితో బాటే నశించాలి. “ఒకే ఆత్మ సర్వజీవులలోనూ ఉన్నది" అను సిద్ధాంతమును అనుసరించి ఒక జీవుడు మరణిస్తే తదితర జీవులంతా మరణించాలి. అప్పుడీ జగత్తు సర్వదా ప్రాణికోటి శూన్యమైపోయేది. కాబట్టి ఈ 'జీవుడు' అనబడేవాడు శరీరము త్యజించినంత మాత్రంచేత మరణించటం లేదు. (లేక) లేకపోవటం లేదు” అని చెప్పటానికి ఈ విధంగా వివరించాను.
కాబట్టి రామచంద్రా! నేటి వరకు ఎవరి చిన్మాత్రస్వరూపము మరణించియుండలేదు. ఈ జగత్తు ఎప్పుడూ ప్రాణిశూన్యమగుటలేదు. చిన్మాత్రుడగు జీవుడు సదా నాశరహితుడు.
ఏకం చిన్మాత్రమేవాహం,న శరీరాదయో మమ । ఇతి సత్య అనుసంధానే, క్వ జన్మ - మరణాదయః ||
“అద్వితీయము అగు చిన్మాత్రమే నేను. నాకు ఈ శరీరాదులు లేవు" ... అని ఇట్లు విచారణచే
గ్రహించినవానికి ఇక జనన- మరణాలు ఎచట?
అహం ‘చిన్మాత్రమమలమ్' ఇత్యాత్మానుభవం స్వయం |
అపహన్తి ఆత్మహంతారో, నిమజ్జన్తి, ఆపదార్ణవే ॥
"నిర్మలము - ఏకము అయినట్టి చిన్మాత్రమే నేను” అనునట్టి ఆత్మానుభవమును ఎవరు స్వయముగా కుతర్కములచే ఖండిస్తారో... వారు ఆత్మద్రోహము చేసుకొన్నవారే అగుచున్నారని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వారు 'ఆపదలు' అనే సముద్రంలో మునుగుచున్నట్లు మా విజ్ఞాన దృష్టికి కనబడుతోంది.
“నేను ఆకాశముకంటే స్వచ్ఛము నిత్యము, అనంతము, నిర్వికారము అగు చైతన్యమును. నాకు వాస్తవానికి జీవితము లేదు, మరణము లేదు. చిదాకాశరూపమగు చైతన్యమే నేనై ఉండగా ఇక నాకు శరీరాదులు ఎక్కడున్నాయి?"...అని తత్త్వజ్ఞులు అనుభూతపరచుకొని ఉంటున్నారు.
Page:178
అట్టి ఆత్మజ్ఞుల అనుభవాన్ని ఎవరు తిరస్కరిస్తారో అట్టి ఆత్మ హంతకులకు ధిక్కారమగుగాక! “నేను సర్వదా నిర్మలమగు చిదాకాశాన్ని" అను ఇట్టి ప్రత్యాక్షానుభవం సముపార్జించే ప్రయత్నంలో ఉండడో, అట్టి వారి జీవితం సద్వినియోగం కానట్లేనని, వారు జీవించియు మరణించిన వారితో సమానమే అగుదురని తత్త్వజ్ఞుల అభిప్రాయం. "నేను చిన్మాత్ర స్వరూపుడను. నాకు దేహేంద్రియాలు కూడా లేవు”... అను బోధచే ఆత్మ స్వరూపమును అనుభూతమొనర్చుకొనిన వానికి 'అవిద్య' ఇత్యాది మాలిన్యము నశించిపోతుంది. కనుక అట్టి నిర్మల స్వరూపుని జనన-మరణాలు ఏమాత్రం స్పృశించలేవు, ఛేదించలేవు. గొప్ప గండశిలను బాణములు ఛేదించలేవు కదా ! అట్లాగే చిన్మాత్రము - శుద్ధము అగు ఆత్మను అవలంబించినవాని సమీపమును మానసిక వ్యధలు సమీపించజాలవు. తన యొక్క ‘చిత్స్వరూపము'ను మఱచి ఎవడు శరీరాదులందు ఆసక్తి కలిగి ఉంటాడో... అట్టివాడు వాస్తవానికి మట్టిలో వెతకి-వెతకి చివరికి సువర్ణ ఖండమును అక్కడే వదలి గులకరాయిని ఇంటికి చేర్చుకున్నవాడు అగుచున్నాడు. 'నేను దేహాన్ని' అనే రూపం గల భావనచే బుద్ధి-తేజం సన్నగిల్లు తాయి. మరి “నేను చైతన్యమును”అనే భావన చేతనో... బుద్ధి-తేజములు వర్ధిల్లుతాయి సుమా. “నేను శుద్ధ చిదాకాశమగు ఆత్మను. అట్టి నా స్వస్వరూపానికి జనన-మరణాలు లేవు” అని తలచి అట్టి స్థితిలో ఉన్న వానికి లోభ-మోహ-మదములు ఎట్లా సమీపించగలవు ? సమీపించలేవు.
చిదాకాశాన్ని వదలి “ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే ఆత్మ” అనే బుద్ధితో ఎవడు జగత్తును గాంచుచుండునో, అతని కొఱకే ఈ జగత్తులో క్షోభ-లోభ-మోహములు రచించబడినాయి. “నేను దేని చేతనూ ఛేదించబడేవానిని దహించబడేవాడిని కాను. వజ్రము వలె దృఢమైనట్టి చైతన్యమే నేను. అంతేగాని ఈ దేహమాత్రుడను ఎన్నటికీ కాదు” అను ఇట్టి నిశ్చయము ఎవఱికి ఉంటుందో ...ఆతనికి మృత్యువు కూడా తృణప్రాయమే (గడ్డిపరక వంటిది) అవుతుంది. ఆహా(! శాస్త్రజ్ఞానులగు పండితులలోకూడా ఎంతటి వ్యామోహం కనిపిస్తోంది! జడమైన ఈ దేహశకలము నశిస్తూ ఉంటే "అయ్యబాబోయ్ ! మేము నశించుచున్నాం” అని భీతిల్లుచున్నారే! మాయ యొక్క ప్రభావము ఎంతటిది? "నేను చిదాకాశమునే” అను సత్యభావన బాగుగా స్థిరపడిందా, ... ఇక వజ్రపాతము వంటి ప్రళయాగ్ని జ్వాలలు కూడా పుష్పవృష్టివలె ఉంటాయి. “జనన మరణ రహితమైన చిన్మాత్రమును నేను కాదు. కాబట్టి నేను నశించబోవుచున్నాను" అని ఇట్లు తలచి (వాస్తవానికి ఆత్మ నశించనప్పటికీ) ఎవడు ఏడ్చుచున్నాడో... అతని వచనములు - క్రియలు క్రియలు - భావములు అన్నీ కూడా వివేకుల దృష్టియందు పరిహాసాస్పదము - హాస్యాయుక్తము అగుచున్నాయి. “నిత్యమై, అపరోక్షమైనట్టి చిన్మాత్రమే నేను. ఈ దేహమనోబుద్ధ్యాదులు నేను కాదు” అని ఇట్లు అంతః కరణంలో ఎవడైతే సునిశ్చయం చేసుకొని ఉంటాడో అతడెన్నడూ మోహమును చెందడు.
ఓ సర్వజనులారా!... 1. నేను చిదాకాశమాత్రుడను, 2. నాకు ఎన్నటికీ నాశనము లేదు, 3.ఈ జగత్తంతా చైతన్యము చేతనే పూర్ణమైయున్నది, 4.ఈ దేహ-మనో-బుద్ధి-అహంకారములచే నేను పరిమితుడను గాను... అను ఈ నాలుగు విషయములలో మీకున్న సందేహమేమిటో నాకు చెప్పండి, వింటాను.
Page:179
"మేము చైతన్యం కంటే వేరైనవారం" అని అనదలచుకున్నారా! ఓ పసిబిడ్డలవంటి ప్రియ సోదరులారా! "మేము వేరైనవారం” అను అనుభవమునకు హేతువు ఏదో అద్దానిని గమనించండి. ఆ అనుభవమునకు కూడా హేతువగు మీ ఆత్మనే మీరు ఎందుకు 'లేదు' అనుచున్నారు ? మీరు చైతన్యమే కాబట్టి మీకెవరికీ మరణము లేదు.
"మేము చైతన్య రూపులమే అయినప్పటికీ మాకు మరణం ఉన్నది"... అని వాదిస్తారా? చైతన్యమే మరణిస్తే ఒకడు మరణించగానే... చైతన్యమే స్వరూపముగా గల తదితర జనులందరు ఆ క్షణంలోనే మరణించాలి కదా! "అందరిలోని చైతన్యము ఒక్కటే! అయినా మాకు మరణం తప్పదు" అంటారా? చైతన్యము ఒక్కటే అయితే ఒకడు మరణిస్తే కూడా జగత్తు కొనసాగుతోంది కాబట్టి స్వస్వరూప చైతన్యమునకు జనన - మరణ సంబంధం లేనట్లే కదా !
తస్మాత్ న మ్రియతే కించిత్, న చ జీవతి కించన |
'జీవామీ’ ఇతి 'మృతోస్మీ' ఇతి చిచ్చేతతి న నశ్యతి ||
కాబట్టి ఏదీ మరణించటం లేదు. ఏదీ జీవించటం లేదు కూడా! “నేను జీవిస్తున్నాను. నేను మరణిస్తున్నాను” అనే భ్రాంతి చైతన్యం అనుభవిస్తోంది. అంతేగాని చైతన్యం ఏ సమయమందును జీవించదు, మరణించదు.
“ఎవడు దేనిని ఎట్లు ఎఱుగుచున్నాడో ఆతడు అది అట్లే పొందుచున్నాడు” -అనే విషయం ఆబాలగోపాలానికి విదితమే కదా! అట్లాగే చైతన్యము కూడా దేనిని ఎట్లు ఎఱుగుచున్నదో... అద్దానిని అట్లే పొందుచున్నది. వాస్తవానికి ఈ జీవుని వాస్తవ స్వరూపమగు చైతన్యము ఎచ్చటా ఎన్నడూ నశింపకయే ఉన్నది.
పరిపశ్యతి సంసారం, పరిపశ్యతి ముక్తతామ్ |
సుఖదుఃఖాని జానాతి స్వరూపాత్ తత్ న భిద్యతే ॥
ఆ చైతన్యము ఒకప్పుడు సంసారమును-మరొక్కప్పుడు ముక్తిని గాంచుచున్నది. అట్లే సుఖదుఃఖము లను ఎఱుగుచున్నది. ఆ రెండింటినీ ఏది గాంచుచున్నదో-ఎఱుగుచున్నదో, అదియే శుద్ధ చైతన్యము కదా! కనుక ఆయా భిన్న దశలందు అది తన స్వరూపము నుండి వేఱుకాకయే ఉన్నది. చైతన్యము నిజస్వరూపమును ఎఱుగకపోవుటచే (ఏమఱచుటచే) ‘బంధము' అనే సంజ్ఞను, నిజస్వరూపమును ఎఱుగుటచే 'మోక్షము' అను సంజ్ఞను స్వయముగా ధరించుచున్నది. నటుడు నటనలో జీవిస్తూనే పాత్రను వేరైన వ్యక్తిగాను, వ్యక్తిగతమునకు వేరైన పాత్రలోను ఉండి ఉంటున్నాడు కదా! సర్వదా అప్రమేయమగు చైతన్యము ఒకప్పుడు ‘బద్ధజీవుడు' అను పాత్రలో లీనమై నాటకమునకు వేరైన తన చిన్మయ స్వరూపమును ఏమఱచుచున్నది.
సమస్తము నిర్మలమైన చిదాకాశమే అయి ఉన్నది. కాబట్టి ఎచట కూడా ఏదీ ఉత్పన్నమవటం లేదు, నశించటమూ లేదు.
Page:180
నతత్ అస్తి న యత్ సత్యం, న తత్ అస్తి న యన్మృషా | యత్ యథా యేన నిర్ణీతం తత్ తథా తం ప్రతి స్థితమ్ ॥
ఈ ప్రపంచంలో సర్వ పదార్థములలో కూడా "సత్యము కానిది” గాని, “మిథ్యకానిది” గానీ ఏదీ లేదు. ఏట్లా అంటావా?... ఏది ఎట్లు ఎవడు నిర్ణయిస్తే అది అట్లే సత్యముగానో, మిథ్యాగానో తెలియవస్తోంది. ఇంతకుమించి ఈ జగత్తులో సత్యమైనదిగాని, మిథ్య అయినది గాని ఏదీ లేదు.
ఓ రామచంద్రా! ఈ చైతన్యాత్మ ప్రపంచమున ఏఏ పదార్దమును ఏఏ రీతిగా ఎఱుగు చున్నదో, ఆయా రీతిగా అద్దానిని అనుభవించుచున్నది. అట్లు చైతన్యాత్మచే అనుభవించబడుచున్నదే ‘జగత్తు' అనే పేరుతో జనులలో వాడుకలో ఉంటోంది.
ఇందుకు దృష్టాంతం అంటావా?... ఒకే పదార్థం (లేక) ఒకే సంఘటన దేశకాల భేదాన్నిబట్టి ఒకచోట ఇష్టమైనదిగాను, మరొక చోట కష్టమైనదిగాను ఉండటం లేదా? ఒకనికే బాల్య మిత్రుడు బాల్యంలో ప్రియంగాను, ఆ తరువాత ఎప్పుడో తారసపడినప్పుడు 'అనవసరమైన అభ్యాగతి’ గాను అనిపించటం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం కదా! తనకు ఇష్టమని వివాహం చేసుకున్న స్త్రీ మరొక దేశకాలాలలో అయిష్టమై కనిపించటం కొద్దిమంది విషయంలో జరుగుట లేదా?
కాబట్టి “సమస్త పదార్థములు చైతన్యము యొక్క అనుభవానుసారమే స్థితి కలిగి ఉన్నది” అనునది ప్రసిద్ధమైన విషయమే!
శ్రీరాముడు మహర్షీ! కొందరేమో "ఈ జగత్తు సంసారసాగరము. అనేక బాధలతోను, కష్టములతోను కూడుకొని ఉన్నది. ఇదంతా దుఃఖమయం. ఇంతకు మించి ఇందులో సారమేమీ లేదు” అనే అభిప్రాయం కలిగి ఉంటున్నారు. మరికొందరేమో “ఈ జగత్తు బ్రహ్మమయమే! కనులు తెరచి చూస్తే ఇదంతా బ్రహ్మానందమయం!" అని సిద్ధాంతీకరిస్తున్నారు.
ఇంకొందరు “ఈ జగత్తు ఈశ్వర కల్పితం" అంటున్నారు. మరికొందరు “సృష్టి ఈ కనబడే రూపం కాదు” అని సిద్ధాంతీకరిస్తున్నారు... ఇన్నిన్ని సిద్ధాంతాలు ఎందుకున్నాయి? అసలు ఇక్కడి వాస్తవతత్త్వ మేమిటి? గురువులు తమ శిష్యులకు వేఱువేరైన, పరస్పర వ్యతిరిక్తమైన సిద్ధాంతఉపసిద్ధాంతాలను ఎందుకు బోధించటం జరుగుతోంది. వీటిలో సత్యాసత్యాలు ఏమిటి?... ఈ వివరాలు వివరించవలసినదిగా ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! చాలా పెద్ద ప్రశ్నయే! ఈ చెప్పబోవు సమాధానం విను
1. బ్రహ్మ సత్యమ్ జగత్ మిథ్యావాదులు ("జగత్తు బ్రహ్మ రూపమే") - ఈ జగత్తు పరమాత్మ యొక్క స్వప్నభూతమే కదా! పైగా సమస్తము బ్రహ్మాకాశరూపమే అయి ఉన్నదని మనం ఇప్పటి వరకు వర్ణించుకొంటున్నాం. కనుక “ఈ జగత్తంతా మాకు బ్రహ్మరూపంగానే అనుభూతమౌతోంది”... అని ప్రకటించటం ఉచితము, సత్యమే కదా!
2. జగత్ సత్యమ్ - బ్రహ్మ మిథ్యావాదులు (ఈ జగత్తే మాకు సత్యమని అనిపిస్తోంది) - జగత్తు యొక్క రూపం ఎదురుగా కళ్ళకు కనిపిస్తోంది. ఇద్దానికి అధిష్ఠానము అని చెప్పబడే మహాచైతన్యము
Page:181
కళ్ళకు కనిపించటం లేదు. 'మదశక్తి' (Lust) కళ్ళకు కనిపించదుగాని దాని చర్యలు కారణరూపంగా కళ్ళకు కనిపిస్తాయి. అట్లాగే చిదాత్మ అదృశ్యరూపమై ఉంటోంది. అయ్యది దృశ్యభ్రమ హేతువగు కార్య రూపముచే స్వసత్తను ఈ జగత్తుగా ప్రదర్శించుకొనుచున్నది. కనుక 'ఈ జగత్తు మాకు సత్యమనియే అనిపిస్తోంది'... అని ప్రకటించేవారికి అట్లు కనిపించటం సత్యత్వమునకు తగియే ఉన్నది కదా! (ఎందుకంటే అట్లా అనిపించటంలో ఆశ్చర్యం లేదు కదా !)
3. జగతూన్యవాదులు (ఈ జగత్తంతా శూన్యమని మాకు అనిపిస్తోంది)- ఈ జీవుడు ‘బంధము'ను అనుభవిస్తున్న సమయంలో దృశ్యమే బంధముగా అగుచున్నది. ఆ సమయంలో "దృశ్యము ఉపశమించినట్టి మోక్షస్థితి" ఎట్టిదో తెలియవచ్చుట లేదు.
‘మోక్షము’ యొక్క స్థితి అనుభవమైతే గాని మహాచైతన్యము అనుభూతికి లభించదు. అట్టి ముక్తి స్థితిలో ప్రమాత (జీవుడు) అభావస్వరూపుడు అగుచున్నాడు. అనగా ఆతడు లేనివాడే అగుచున్నాడు. కనుక “పరమార్థ వస్తువునందు జగత్తు శూన్యస్వరూపమై ఉన్నది”... అనే సంజ్ఞ సత్యమనియే అనిపించుకుంటోంది.
4. పురుష-ప్రకృతి వాదులు (అవ్యక్తరూప ప్రకృతిలోంచి ఈ వ్యక్తజగత్తు ఉత్పన్నమౌతోంది) - ఇక ఇంకొందరు (సాంఖ్యావాదులు) ఇట్లా అంటున్నారు. చిన్మాత్రుడగు పురుషుడే అన్నింటికీ కర్త. ఆయన యొక్క సత్త వలన ఆయన నుండి 'అవ్యక్తము' ఉత్పన్నమౌతుంది. అదియే ప్రకృతి. ఆ అవ్యక్తము (లేక) ఆ ప్రకృతి త్రిగుణముల యొక్క సామ్యావస్థారూపము అయి ఉన్నది.
అట్టి అవ్యక్తములోనుంచి త్రిగుణాత్మకమగు ఈ జగత్తు ఉత్పన్నమౌతోంది. బ్రహ్మమే తనకు అద్వితీయమగు జగత్తుగా ప్రదర్శితమౌతోంది, కనబడుతోంది - అని నేనూ సిద్ధాంతీకరించాను కదా! కనుక 'పురుషుడు' అవ్యక్తము! ఆతని అభివ్యక్తీకరణమే ప్రకృతి "జగత్తు" అను వారి సిద్ధాంతమూ యుక్తియుక్తమే కదా!
5. బ్రహ్మ వివర్తవాదులు / వేదాంతవాదులు (జగత్తులోని సర్వ పదార్థముల స్వరూపం బ్రహ్మ వివర్తమే) - ఈ జగత్తులో అనేక స్వభావాలు, ఆకారాలు గల పదార్థములు ఉండవచ్చుగాక! కాని “కఃత్వమ్– కోహమ్,నాయితి” ఇత్యాది మార్గంలో విచారణ చేస్తూ పోతే “సమస్త పదార్థముల స్వరూపము బ్రహ్మము యొక్క వివర్తమే, మట్టియే అనేక బొమ్మలుగా అగుచున్నట్లుగా!” అని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. “ఈ కనబడే జగత్తంతా బ్రహ్మము యొక్క వివర్తమే" అను ఆ వేదాంతవాదుల సిద్ధాంతమూ యుక్తియుక్తమే కదా!
6. పరమాణువాదులు (ఈ జగత్తు పరమాణువుల కలయిక మాత్రమే. అవి విడిపోతే జగత్తు లేదు) - ఈ మతమును అనుసరించి (ఉదాహరణ : కణాదులు, గౌతములు, సౌత్రాంతికులు, వైభాషికులు, అర్హతులు– ఆయా మత గురువుల ప్రతిపాదనను అనుసరించి) ... “ఈ 'జగత్తు'గా కనిపించేదంతా పరమాణు సమూహము మాత్రమే! వారి కల్పనయు వారి అనుభవమును బట్టి సత్యమే అయి
ఉన్నది. ఎందుకంటే...
Page:182
1. ప్రతి వస్తువు పరమాణువుల కలయికయే అయి ఉన్నది. 2. "ఏది ఏ విధంగా ఎవరిచే ఎఱుగుబడుచున్నదో అది ఆ విధంగానే వారికి అనుభూతమగుచున్నది”... అని మనం ముందరే సిద్ధాంతీకరించుకున్నాం కదా!
భావనావాదులు, మనోకల్పనా రూప జగత్వాదులు, దృష్టి-సృష్టివాదులు పై సిద్ధాంతం బలపరుస్తున్నారు. “యత్ భావం తత్ భవతి. ఈ జగత్తు ఎట్లు భావన చేస్తే అట్లే అనుభూత మౌతోంది" అనునది కూడా యుక్తియుక్తమే కదా!
7. దృష్టి - సృష్టి వాదులు - “ఇహలోకంలోగాని, పరలోకంలోగాని ఏది ఏ విధంగా చూడబడు చున్నదో... అది ఆ విధంగానే ఉంటోంది. ఏది ఎట్లు చూడబడదో ...అది అట్లు ఉండదు. కనుక ఈ జగత్తు సత్యము కాదు. ఇదంతా అనిర్వచనీయం. అనగా "ఈ జగత్తులో ఇది ఇట్టిది మాత్రమే” అని దేనిని ఎవరూ సిద్ధాంతీకరించలేం. ఈ జగత్తుగా కనిపించేదంతా మనోకల్పనారూపము మాత్రమే. ఇట్టి దృష్టి-సృష్టివాదుల మాట కూడా కాదనటానికి వీలులేదు.
8. అనాత్మవాదులు (బాహ్యమున గల ఈ జగత్తు మాత్రమే ఉన్నది. అంతరంగమున ఆత్మ అనబడేదేది లేదు!) - ఇక, వీరు అంటున్నారు కదా “బాహ్యమున కంటికి కనబడే ఈ నేల-నీరు-అగ్ని-
వాయువు అనబడే భూత చతుష్టయం మాత్రమే ఉన్నది. దీనికి అతీతంగా అంతరంగమున 'ఆత్మ' అనేది లేదు” అను (చార్వాకుల) మతం కూడా వారి దృష్టిని బట్టి సత్యమే అయి ఉన్నది. ఎందుకంటే ఈ ఇంద్రియములకు పరమైనట్టి (వేరైనట్టి) ఆత్మ అనబడేది ఎదురుగా కనిపించడం లేదు కదా!
9. క్షణిక వాదులు (అనుక్షణం ప్రతిది మారుతూనేవున్నది. కనుక ఈ జగత్తు క్షణికం) - ఇక వీరి అభిప్రాయం ప్రకారం... "ప్రతి క్షణం సర్వపదార్థములు ఒక స్థితి నుండి మరొక స్థితికి ప్రవాహ తరంగంలాగా పరివర్తనం చెందుచూనే ఉన్నాయి. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరివర్తనశీలమే! కనుక ఈ జగత్తు క్షణభంగురం.” ఇట్లా జగత్తు గురించి నిర్వచించే క్షణికవాదుల మతము కూడా వారి అనుభవమునుబట్టి సత్యమే అయివున్నది. ఈ దృశ్య ప్రపంచంలో మార్పు చెందనిదేమున్నది?
ఆద్యమగు బ్రహ్మపదము సర్వశక్తియుక్తమై వెలయున్నది కదా! అద్దాని భావనా ప్రయోజనం చేత వారికి అది అట్లేనని అనిపించడంలో ఆశ్చర్యపడవలసిన పనేమున్నది?
10. కలవింక ఘట న్యాయవాదులు (ఈ జీవుడు శరీరము అనే పంజరంలో చిక్కుకున్న పక్షివంటివాడు) ‘కలవింక-ఘటన్యాయం’ “కలవింక పక్షి (ఊరపిచ్చుక) కుండలో చిక్కుకుంది. ఆ కుండ యొక్క ముఖమును తొణిచామా... ఆ ఊరపిచ్చుక తుఱ్ఱున గాలిలోకి ఎగిరిపోతుంది. అట్లాగే 'పరిచ్ఛిన్న పరిమాణంగా’ ఈ జీవుడు కర్మబంధం చేత దేహాలలో ఇరుక్కొని ఉన్నాడు. కర్మ క్షయం కాగానే పరలోకానికి ఎగిఱిపోతాడు. (ఇది అర్హతలు అనే మతస్థుల జగత్ నిర్వచనం). ఈ ఈ
జీవన-మరణములను చూచి వారు అట్లు సిద్ధాంతీకరించడం వారికి సత్యమనియే అనిపిస్తోంది.
11. మరణానంతర దేహాత్మవాదులు (జీవుడు మరణించినా దేహము వెంటే ఉంటాడు) - మరొక మతగురువుల (మ్లేచ్ఛావాదుల) సిద్ధాంతం ఎట్లా ఉన్నదో చూడు! ఈ దైహాకారుడగు జీవుడు
Page:183
ఈశ్వరునిచే ఉత్పన్నము కావించబడినాడు. ఈశ్వర నిశ్చయాను సారం ఈ దేహం ఒకప్పుడు శిథిలమైపోతుంది. మరణం సంభవిస్తోంది. మరణానంతరం ఆ దేహసంబంధీకుడగు జీవుడు దేహము పాతిపెట్టబడిన చోటే ఉంటాడు. ఆ తరువాత కాలానంతరం ఈశ్వరునిచే విచారించబడినవాడై ఆ ఈశ్వరుని ఇచ్ఛను అనుసరించి శాశ్వతంగా స్వర్గమునందో, నరకమునందో ఉంచబడుతాడు. వారి అనుభవాన్ని అనుసరించి అదీ దూషితం కాకయే ఉన్నది.
12. స్వభావ వాదులు - - నిరీశ్వరవాదులు (ఈ జగత్తు స్వభావముచే ఉత్పన్నమై - నశిస్తోంది) - ఈ స్వభావవాదము ప్రతిపాదించే మతగురువుల అభిప్రాయం విను. ఈ జగత్తంతా కూడా స్వయంగా స్వభావముగానే ఉత్పన్నం అవుతోంది. స్వభావంగానే మటొక్కప్పుడు నశిస్తోంది. దీనికి కర్తగాని, 'ఈశ్వరుడు' అనబడేవాడు గాని ఎవడూ లేడు. ప్రతి జీవుడు స్వభావాలు అనుసరించే జనిస్తూ, జీవిస్తూ, అనుభవిస్తూ, మరణిస్తున్నాడు. వీరు ఇట్లు 'నిరీశ్వరవాదం’ ప్రతిపాదిస్తున్నారు. వారివారి దృష్టి కోణం నుండి ఇది వారికి సత్యమే అయివున్నది. ఎందుకంటావా?... ఎంత అన్వేషించినప్పటికీ వర్షము-వాయువు-నక్షత్రములు-సూర్యుడు-చంద్రుడు-భూమి ఇత్యాదులన్నింటి విషయంలో “దీనికి కర్త ఎవడు?” అను ప్రశ్నకు వారికి సమాధానం లభించడం లేదు కదా!
13. ఈశ్వరవాదులు (ఏకేశ్వరుడే ఇదంతా ప్రసాదిస్తున్నాడు) - వీరి మతాచార్యులు సిద్ధాంతం ప్రకారం ... సర్వత్రా కర్త ఒక్క ఈశ్వరుడే. ఆయనే ఇవన్నీ ప్రేమతో ప్రసాదిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞులమై ఉండడానికి ప్రతిజీవుడు యత్నించాలి. కృతఘ్నుడు కాకూడదు. ఈశ్వరార్పిత చిత్తంలో సర్వదా ఉపాసకులై ఉండాలి. వీరు తమయందు తమ ఉపాశ్యమగు ఈశ్వరుని పొందుచునే ఉన్నారు. కాబట్టి వీరికి పై నిర్వీశ్వర – వాదుల వలె “ఈశ్వరుడు లేడు”... అని అనిపించడం లేదు.
14. ఇహ - - పరలోక వాదులు (ఇహంలో పుణ్యకార్యాల వలన పరంలో సుఖం లభిస్తుంది) - వీరి దృష్టిలో ఇహము-పరము రెండూ సత్యమే! కాబట్టి ఈ మతగురువులు తీర్థ స్నాన పుణ్యక్షేత్ర దర్శన-అగ్నిహోత్రాదులు మొదలైన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇహంలో శ్రమయే అయినా పరంలో సుఖలోకప్రాప్తి కలిగిస్తాయి. ఆ అనుయాయులు అట్టి తీర్థ-క్షేత్ర-అగ్నిహోత్రాదుల శ్రమ నుండి సుఖమును తృప్తిని పొందుచూనే ఉన్నారు. కాబట్టి అవి సత్యములు కావని ఎవరనగలను? సత్యమేనని ఒప్పుకోక తప్పదు.
15. జగత్ శూన్యవాదులు ("ఈ జగత్తంతా శూన్యమే!") - అని (బౌద్ధులు మొదలైన) కొందరు మతగురువులు బోధిస్తున్నారు. వారి వారి అనుయాయుల భావనకు అనుభవమునకు అది సత్యమే అగుచున్నది. వారి విచారణకు 'శూన్యము' తప్ప మరింకేమీ ఇక్కడ అగుపించటం లేదు.
చూచావా రామచంద్రా! ఈ విధంగా అనేక మతగురువులు అనేక సిద్ధాంతములను వారి వారి శిష్యులకు, అనుయాయులకు బోధించటం, ఆ అనుయాయులు అది ఆ రీతిగానే అనుభవంగా పొందడం అనంతకాలంగా జరుగుతూనే ఉన్నది. ఇంకా అనేకమంది మతగురువులు ముందు
Page:184
ముందు కూడా రానున్నారు. అందులో కొందరు మతగురువులు పరస్పర వ్యతిరిక్తమైన సిద్ధాంతములను ప్రతిపాదించడం జరిగింది. జరుగబోతోంది.
మఱికొందరు ఇప్పటివరకూ వచ్చిన సిద్ధాంతాలను ఖండిస్తూ చెబుతున్నారే గాని “ఇది సత్యము” అని తమకుగా ఏమీ ప్రతిపాదించడం లేదు. ఇంకొందరు మతగురువులు ఇదివరకు చెప్పినదే భాషాపరంగానూ, సాధనా ద్రవ్యపరం గానూ మరొక తీరుగా ప్రతిపాదిస్తూనే "ఇతః పూర్వం ప్రతిపాదించిన సిద్ధాంతం అనుసరణీయం కాదు. ఇదియే అనుసరించండి” ...అని తమ శిష్యులకు, అనుయాయులకు బోధిస్తున్నారు.
కొన్ని కొన్ని చోట్ల గురువులు చెప్పిన సిద్ధాంతమునకు రెండు మూడు రకాలైన భాష్యములను శిష్యులు ప్రతిపాదిస్తూ ప్రతిక్షేపిస్తూ క్రమంగా ఆ శిష్యులు వేరు వేరు పేర్లు గల శాఖలుగా విడిపోతున్నారు. అట్లా విడిపోయి వారిలో వారు కలహించుకోవడం, హింసించుకోవడం కూడా కొన్నిచోట్ల జరుగుతూ వస్తోంది. ఒక్కొక్కసారి గుఱువు దైవస్వరూపుడని కొందరు,... “గుఱువు కేవలం సిద్ధాంతకర్త / ప్రవక్త" అని మరికొందరు ప్రతిపాదిస్తూ ఇట్టి స్వల్ప వాగ్వివాదములతో ఒకే మతాచార్యుల శిష్యపరంపరలో శాఖలు ఉపశాఖలుగా విడిపోవడం కూడా జరుగుతోంది.
ఇదంతా అతి దీర్ఘ కాలంగా జరుగుచున్న విశేషాలే! ముందు ముందు కూడా ఇట్లా జరుగుచూనే ఉంటుంది.
శ్రీరాముడు : స్వామీ! ఈ విధంగా పరస్పర వ్యతిరిక్త అనుకూలములైన వేఱు వేఱు సిద్దాంతములు, వారి అనుయాయులు సంఘర్షించుకోవడం ఇదంతా ఎందుకు జరుగుతోంది? "అవన్నీ సత్యములే అయి పరిఢవిల్లుతున్నాయి”... అని మీరు చెప్పడంలో ఉద్దేశమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'చింతామణి' గురించి విన్నావు కదా! అది ఎదురుగా కలిగి ఉన్న వారు దేనిని చింతన చేస్తే అది అట్లే పొందుతారు. కల్ప వృక్షము క్రింద ఏది కోఱుకుంటే అది కల్పనా చమత్కారంగా లభిస్తుంది. అట్లాగే చిదాకాశమగు చైతన్యము కూడా జీవులు దేనిని అభిలషిస్తే ఆయా అభిలాషలను శ్రీఘ్రముగా వారియందు అట్లే సిద్ధింపజేయున్నది. అందుకే 'ఈ జగత్తు శూన్యం’ అను వారికి అంతా శూన్యంగా అగుపిస్తోంది. “ఇదంతా అశూన్యమగు భగవంతుని చేత నిండి ఉన్నది” అనుకున్న వారికి అది అట్లా అనుభవమౌతోంది. “ఈ జగత్తు శూన్యము కాదుఅశూన్యము కాదు. ఇది అనిర్వచనీయం”... అని తలచువారికి వారియొక్క భావనచే ఇదంతా అనిర్వచనీయంగా ఒప్పుచున్నది.
ఎందుకంటావా?... సర్వశక్తిమంతమగు బ్రహ్మము యొక్క మాయా శక్తి శూన్యము కాదు. అశూన్యము కాదు. ఈ రెండింటికీ విలక్షణమై, అనిర్వచనీయమై ఒప్పుచున్నది.
కాబట్టియే ఇక్కడ ఒకానొక చమత్కారం సిద్ధిస్తోంది. ఎవడు ఏ నిశ్చయమును కలిగి ఉంటాడో, ఆతడు కొంత పట్టుదలతో, మూర్ఖత్వంతో దాని నుండి తొలగని పక్షంలో అతడు ఆ నిశ్చయఫలమును తప్పక బడయగలడు.
Page:185
ఆత్మజ్ఞానం పొందనంతవరకే ఆయా సిద్ధాంతములన్నీ సత్యములుగానే అనుభవమౌతాయి. ఆత్మజ్ఞానం పొందిన తరువాత ఇక ఆ జీవుడు 'ఆత్మయే సత్యము' అను అన్ని సిద్ధాంతముల ఆవల తీరం చేరి 'కేవలస్వానుభవి' అవుతాడు. అనేక మతముల సిద్ధాంతముల సారమేమిటో, పరిమితి ఏమిటో ఆతడు కరతలామలకంగా గ్రహిస్తాడు.
అందుచేత రామచంద్రా! బుద్ధిమంతుడైనవాడు వాదోపవాదములలోకి, ఖండన-రక్షణ వ్యవహారములలోకి దిగడు. ఆతడు అనేక మతముల ‘కారణము'ను పండితులతో బాగుగా విచారించి క్రమంగా శ్రేష్ఠమగు 'ఆత్మవస్తువు' నందే సుదృఢమైన నిశ్చయమును పెంపొందించు కుంటాడు. ఇక దేనికీ బద్దుడు పరిమితుడు కాడు.
శ్రీరాముడు : మహాత్మా! జ్ఞానసారమగు దృథాత్మనిశ్చయము సాధకులకు కలిగేది ఎట్లా? శ్రీవసిష్ఠమహర్షి : రామచంద్రా! శాస్త్రాధ్యయనమునందు, ఉత్తమార్థమును సేకరించి స్వీకరించ టంలోను, అల్ప విశేషములను ఉపేక్షించటంలోను, బహుకుశలురైనట్టి వారికి సర్వాత్మకమగు స్వస్వరూపాత్మానుభవం సుసాధ్యమే! అట్టి మహనీయులు ఉన్నారు. ఉత్తమ సాధకుడైనవాడు వారికొరకై వెతికి అట్టి మహానుభావులను ఆశ్రయించాలి. తమ సంశయములను అణకువతో తెలియబరిచి సంశయవిభేదము గావించుకోవాలి.
శ్రీరాముడు : ఆశ్రయమునకు అర్హుడగు గురువులు ఎట్టి సద్గుణములు కలిగి ఉంటారు? శ్రీవసిష్ఠమహర్షి : మహాత్ములగు జ్ఞాన గురువులు ఈ 5 లక్షణములు కలిగి ఉంటారని చెప్పబడుతోంది.
1. సచ్ఛాస్త్రములను అనుసరించి వ్యవహరిస్తూ ఉంటారు.
2. పరస్పరము విచారణ సలుపుతూ ఉంటారు.
3. జనులకు ఆహ్లాదము గొలుపుచూ సచ్ఛాస్త్రముల పట్ల ప్రోత్సాహం కలిగిస్తూ ఉంటారు. 4."నీవు సాక్షాత్ ఆత్మవే (తత్వమసి" అను పరమసత్యవాక్యము వైపుగా బుద్దిని కుశలము చేస్తూ ఉంటారు.
5. నిషిద్ధములైన ఆచారములు లేనివారై ఉంటారు.
ఓ రామచంద్రా! నీరు పల్లమువైపుకే ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది చూచావా? అట్లే జీవులంతా తమకు అభిలషితములయిన వాటివైపుకే బలవంతంగా పరుగులు తీస్తున్నారు. అయితే ‘జీవితము’ అనేది ఒక మహత్తరమైన అవకాశమని జనులు గ్రహించెదరు గాక! "నేను స్వీకరించాలినిర్వర్తించాలి” అనుకునే వాటిలో “నన్ను పురుషార్థమునకు జేర్చగలిగేదేది?” అని విచారించి, అందుకు మార్గం చూపే సామర్థ్యము గల సచ్ఛాస్త్ర-సద్గురువులను వెతికి వెతికి పట్టుకొని సమాశ్రయించాలి. ఓ జనులారా! తృణము యొక్క చివరి భాగంలో సంలగ్నమైన జలబిందువు ఏ క్షణంలోనైనా నేల కూలటానికి సిద్ధమై ఉన్నది కదా! ఈ జీవితము అట్టిది. ఈ సంసారసాగరమున "అది పొందాలి! ఇది సంపాదించుకోవాలి! ఏదో కావాలి!" మొదలైన మనోరథములతోను,
Page:186
“వారెంతటివారు? వీరి సంగతి చూద్దాం!" ఇత్యాది పిచ్చి ప్రేలాపములతోను రోజులు గబగబా గడిచిపోతున్నాయి. సమయమంతా అజ్ఞాన వ్యవహారంతో వృథా అగుచున్నది. మీనమేషాలు లెక్కకట్టుచూ కూర్చుంటే ఏమాత్రం లాభం లేదు. అతి త్వరగా సద్గురువును ఆశ్రయించడం, శాస్త్ర సారాన్ని గ్రహించడం అత్యంత ఆవశ్యకము-అవశ్యము కూడా!
2. జీవన్ముక్తులను ఆశ్రయించకుంటే జీవితం వృథా! శ్రీరాముడు : హే మహానుభావా! శ్రీవసిష్ఠ మహర్షీ! ఈ ప్రాణుల యొక్క భోగతృష్ణ శాఖోపశాఖలే అనేక జగద్రూపములుగా విస్తరించి ఉండడం (చిదాకాశమునందు) గమనిస్తున్నాం కదా! ఇందులో
1. జగత్ స్వరూప ‘అనర్థము' యొక్క పూర్వ-పర విచారణ చేసి ఉన్నవారు... 2. సారాసార వివేకము చేత పరమార్థమును దర్శించినట్టి శ్రేష్ఠులగు మహాత్ములు... ఎక్కడ లభిస్తారు. “వారికై వెతకాలి! ఆశ్రయించాలి! ఇంతకుమించిన ఉపాయం (ఆత్మోద్ధరణకై) లేదు”... అని మీరు ఆజ్ఞాపిస్తున్నారు, సరే! కాని అనేక ప్రాపంచిక వ్యవహారములు అనివార్యమగుచుండగా సామాన్యులమగు మేము వారి కొరకై ఎక్కడ వెతకాలి? ఇదంతా దుర్లభం కాదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అవును! నీవు చెప్పినట్లు ఆత్మ జ్ఞానాన్ని చక్కగా ఎఱిగి పరమ సత్యాన్ని ఆత్యంతికంగా –నిర్దుష్టంగా ప్రకటించగలుగుచున్న జీవన్ముక్తులు ఈ లోకాలలో లభించడం కొంచెం కష్టతరమైన విషయమే! అయినా కూడా అట్టి మహనీయులు మనుష్య-దేవతాది జాతులలో కనబడుచూనే ఉంటారు. స్వయం ప్రకాశకుడగు సూర్యునికి చీకటి రాత్రి ఉండనట్లుగా ఆ మహనీయులకు రోజులన్నీ జ్ఞానప్రకాశమునందే గడచి పోతాయి. దుర్లభులే అయినప్పటికీ అట్టివారు ఆ పరమాత్మ యొక్క కరుణచే సృష్టియందు ఉన్నారు. సాధకులకు మార్గదర్శకులై లభిస్తున్నారు. కనుక అట్టి వారి దర్శనము కొఱకై ప్రయత్న పూర్వకంగా వెతకాలి సుమా! ఇక తదితర జీవుల సంగతి చూస్తున్నావు కదా! మూఢులగు తక్కినవారంతా మోహరూపమగు ఈ సంసార సాగరమునందు అటూ ఇటూ సంచరిస్తున్నారు. భోగతృష్ణలచే క్రింది లోకములలోకి - పై లోకములలోకి దొర్లించబడుతూ అనంతకాలం ఈ సంసారమునందే తేలియాడుచున్నారు.
ఆత్మజ్ఞాన సిద్ధిచే జీవన్ముక్తత్వము సంపాదించుకొనని ఆయా జీవజాతుల స్థితి గతులు ఎట్లా ఉన్నాయో చెపుతాను... విను. దేవతలు స్వర్గభోగములలో నిమగ్నులై ఆత్మసిద్ధి గురించి ఏమఱచినవారై అట్టి 'భోగములు' అనే అగ్నిచే లెస్సగా దహించబడుచూ ఆత్మజ్ఞానానికి ఇంకా ఇంకా సుదూరులే అవుతున్నారుగాని స్వస్వరూప దర్శన కాంక్షను కలిగి ఉండడమే లేదు.
ఇక దానవులు మదోన్మత్తులై “ఈ దేవతలే మా శత్రువులు. మామా శక్తులను వృద్ధి చేసుకొని వీరి సంపదలు ఆక్రమించబోతున్నాం”.... అని తలచుచూ మదపుటేనుగులవలె అటూ ఇటూ సంచరిస్తున్నారు. ‘ఆత్మజ్ఞానము' గురించి వారికి జ్ఞాపకమే వచ్చుట లేదు. చివరకి మదపుటేనుగులు
Page:187
గర్తము (గోతులో)లో పడునట్లు వారు దేవతా రక్షకుడగు నారాయణుని చేతిలో నాశనము కొనితెచ్చుకొనుటకే తమ జీవితములను వెచ్చిస్తున్నారు.
ఇక గంధర్వులు అందామా... వారు “ కేతము” అనే మద్యమును త్రాగి ఊహాలోకంలో కల్పిత భోగములు అనుభవిస్తూ చివరికి జింక బోయవానికి చిక్కినట్లు మృత్యుముఖులు అవుతున్నారుగాని వివేక జనితమగు ఆత్మజ్ఞానమును లేశమైనా ఎఱుగుటయే లేదు.
మరి విద్యాధరులందామా... వారు తమ విద్యలను చూచుకొని మురిసిపోతూ... ఆ మోహ పరవశంలో ఆయుష్షును గడిపేస్తున్నారే గాని బ్రహ్మవిద్యాబలంచే ప్రకాశించే ఉదారశీలురగు వివేకులను ఆదరించటమే లేదు. ఇక ఎక్కడి బ్రహ్మజ్ఞానం? ఎక్కడ బ్రహ్మజ్ఞానులను ఆశ్రయించడం?
యక్షులో... జనుల నివాసములలో ప్రవేశించి భయ-జ్వర ఉన్మాదాది దోషములను జనింప జేస్తూ జనులను క్షోభపెట్టడంలో నిమగ్నులై ఉంటున్నారు. 'ఆహా! ఈ మా దేహములే స్థిరములు గదా!'... అని నమ్ముతూ అసహాయులై వర్తిస్తున్నారు. మణి మంత్రబల శూన్యులైనట్టి బాలురందు, వృద్ధులందు, అశక్తులందు తమ దక్షత్వము చూపుచూ “మేం ఎంతటి ప్రభావం కలవారం!" అని మురిసిపోతూ ఈ సంసారంలో సంచరిస్తున్నారే గాని... “ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మ జ్ఞానులను ఆశ్రయించి వారి బోధను వినాలి”... అనే ప్రయత్నం గురించి యోచించటమే లేదు.
రాక్షసులందామా... “మామాట వినకపోతే మేం ఊరుకోం-ఎంతటి వారినైనా హింసించ గలం” అని తలచుచు స్వబలం–సంఘబలం చూచుకొని మురిసిపోవుచూ సుజనుల పట్ల శత్రుత్వం వహించి ఉంటున్నారు. ఇక వారికి మహాత్ముల కరుణ ఎట్లా లభించేది? చివరికి వారు విష్ణుమూర్తి చేతులలో హతులౌతున్నారు. ముందు అట్టి అనేకమంది రాక్షసులను నీవు సంహరించనున్నావు.
ఇక పిశాచజీవులందామా... వారు ప్రాణుల దేహములలో ప్రవేశించి రక్త-మాంసములను భక్షించాలనే యోచనలో మునిగి తేలుచున్నారేగాని 'ఆత్మజ్ఞానము' వైపు బుద్ధిసారించడమే లేదు. అంతరమున గల అగ్నిచే దినదినం దహింపబడే మహావృక్షంలాగా వారు ప్రాణులను భుజించాలనే చింతనచే చివరకు తమను తామే దహించుకొంటున్నారు. ఇక ఆత్మజ్ఞానమనే ఊసు ఎక్కడిది?
నాగులో... అజ్ఞులై జడ స్వరూపులై పాతాళమున వివేకశూన్యంగా రోజులు గడుపుతూ చివరికి ఒకనాడు మృత్యువును సమీపిస్తున్నారు. “నేనెవరు?” అనే ప్రశ్న వారి జడస్వభావమునకు క్రిందగా ఎక్కడో ఉండిపోతోంది గాని, ఆది బయల్వెడలటమే లేదు.
అసురులా... కీటకములలాగా భూతలమున గల శూన్యస్థానములను ఆశ్రయించి దీర్ఘకాలం గడిపివేస్తున్నారే గాని "వివేకము” అనే ప్రసంగమే ప్రారంభించడం లేదు.
ఈ మనుష్యులో... చీమల వలె అల్పమాత్రమైన విషయకణముల గురించిన లోభముచే ప్రతిరోజు తెల్లవారుతోంది-ప్రొద్దుగ్రుంకుతోంది. "వివేకులెక్కడ?” అనే ప్రయత్నమే వారిలో కనిపిం చడం లేదు. ఇక వివేకము వారిలో జనించేది ఎప్పటికో, ఎట్లో మేము గ్రహించలేకపోతున్నాం.
+
Page:188
“రామచంద్రా! ఈ అనేక భూత జాతుల యొక్క దినముల వ్యర్థములైన మహాదుష్టచేష్టలచే వ్యాకులమై గడిచిపోతున్నాయి. మత్తుగా త్రాగి బాట ప్రక్కన పరుండిన వాని పట్ల కాలం నిస్తేజంగా గడిచిపోతోంది చూచావా? అట్లా ఈ జనుల జీవితాలు వివేకరహితంగా, నిరర్థకంగా గడిచి పోతున్నాయి. అగాధంలో మునుగు వానికి వాచక శబ్దములు వినిపించజాలవు కదా! అట్లాగే సంసారమున మునుగు ఉత్సాహమును వృద్ధి చేసుకొంటున్న జనుల పట్ల వివేకుల వాక్యాలు వ్యర్థమై పోతున్నాయి. ఆ జనుల హృదయమును ఆత్మజ్ఞాన వాక్యాలు స్పృశించడమే లేదు. చేటలతో తూర్పారపట్టుచుండగా పొల్లంతా గాలికి కొట్టుకుపోతుంది చూశావా? “ఈ దేహాదుల పట్ల అభిమానము” అనే వాయువుచే జల్లింపబడినవారై ఈ జనులు ఎటో కొట్టుకుపోబడుచున్నారు. ఈ జీవులలో కొందరు అనేక తపస్సులు చేసి, ఎంతో కష్టించి మంత్రాదులను ఉపాశించికూడా చివరకు అట్టి శక్తియుక్తులను ఆత్మజ్ఞానవివేకము వైపుకు మరల్చలేకున్నారు. యోగి గణముల వంటివారు కూడా (ఒకానొక స్త్రీ దేవతా- సమూహం) సుర రక్త · పాన - మాంసాది భోజనములందు అభిలాషను ఏర్పరచుకొన్నవారై తామసఫల భోగాలలో ఆసక్తి కలిగి, దుర్గంధములైన మడుగులలో నికృష్టములగు కీటకములవలె పడివుండగా... ఇంకేం చెప్పాలి!
అయితే రామచంద్రా! పైన మనం ఉదాహరించినట్టి, తదితరములైన ప్రతి జీవజాతిలోను అక్కడక్కడ మహనీయులు-ఆత్మజ్ఞానులు అగు మహావివేకులు ఉన్నారు. అయితే వారు ఇక్కడే ఉంటారు-అక్కడ ఉండరు” అని మనం నిర్వచించలేం. కొన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం ఇక్కడ చెప్పుకోగలం. దేవతలందు... యమ-ఇంద్ర-చంద్ర-సూర్య-వరుణ-వాయు-బ్రహ్మవిష్ణు-బృహస్పతి-శుక్రాచార్య-అగ్ని మొదలైనవారు.
ప్రజ్ఞాపతులందు... దక్షుడు, కశ్యపుడు మొదలైనవారు; దేవర్షులందరు... నారదుడు మొదలైనవారు; దేవపుత్రులందు... కుమారుడు, సనక సనందులు మొదలైనవారు; దానవులలో
హిరణ్యాక్షుడు, బలి, ప్రహ్లాదుడు, శంబరుడు, మయుడు, వృత్రుడు, అంధకుడు, నముచి, కాశీపుత్రుడు, మురుడు మొదలైనవారు; రాక్షసులందు విభీషణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు మొదలైనవారు; నాగులందు... తక్షకుడు, కర్కోటకుడు, మహాపద్ముడు మొదలైనవారు...
ఇట్లా ప్రతి జీవజాతిలోను జీవన్ముక్తులు ఆత్మజ్ఞాన సంపన్నులు అయిన మహనీయులు ఎందరో ఉన్నారు. ఇట్లాగే బ్రహ్మ-విష్ణు-ఇంద్రలోకములలోను, సిద్ధ-సాధ్యులలోను మానవులలోను ముక్తస్వభావులగువారు అక్కడక్కడా తప్పక ఉన్నారు. మనుష్యులలో కొందరు రాజులు, మునులు, బ్రాహ్మణోత్తములు, తదితరులు ఆయా వివిధ మతవాదులలో కొందరు కొందరు జీవన్ముక్తులై వెలుగొందుచున్నవారు ఉన్నారు.
ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఇక్కడ ఒక విషయం గమనించబడుగాక! ఎవరు ఏ సిద్ధాంతాన్ని నమ్మినవారై ఉంటారో, అది వారికి అట్లే సత్యమై ఉంటుంది. ఉదాహరణకు "మరణిం చిన తరువాత దేహమును ఆశ్రయించుకునే ఉంటారు” అని నమ్మిన వారు మరణానంతరం దేహ
Page:189
సమీప్యమునే అనుభవిస్తూ ఉంటారు. కనుక విజ్ఞుడైనవాడు అన్ని సిద్ధాంతాలను విశ్లేషించి ఉత్తమ మైనది ఆశ్రయించడం ఉచితం. “నేను సర్వాత్మకుడను. దేహమనోతీతుడను. సర్వులలో ఏది సాక్షి మాత్రమై ఉన్నదో అదియే నా స్వరూపం. ఈ సర్వదా సహజీవుల స్వరూపం కూడా సర్వదా అదే” ...అను అవగాహనయే ఉత్తమోత్తమగు ఆత్మజ్ఞానమని మేము గ్రహిస్తున్నాం. ప్రకటిస్తున్నాం!
ఫలవృక్షాలు అనేకచోట్ల ఉంటాయి. కాని కల్పవృక్షాలు సృష్టిలో కొలదిగానే ఉంటాయి కదా! అట్లాగే దశదిశలా ప్రాణికోట్లు ఉన్నాయి. వారిలో జీవన్ముక్తులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, అఖండమగు ఆత్మతత్త్వమును అనుభవిస్తూ ఉండేవారు కొలదిగానే ఉంటున్నారు.
3. సాధువులతో సమాగమం
శ్రీరాముడు : మహర్షీ! మహానీయులతో సమాగమం అధ్యాత్మయానంలో అత్యావశ్యకమని మీరు సిద్ధాంతీకరించారు. అయితే వివేకులైన ఆత్మజ్ఞుల లక్షణములు ఎట్టివి? వారు ఏ సాంఘిక-లౌకిక -ఆచరణ లక్షణములతో, ఏఏ ఆచరణ-అనుష్ఠానములతో ఉంటారు? వారిని సమీపించటం ఎట్లా? వారి నుండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మా అర్హతలు ఎట్లా ఉండాలి? మేము వారి కరుణామృతానికి పాత్రులమయ్యేది ఎట్లా? ఈ ఈ విషయాలు మాపై గల కరుణతో వివరించమని నా విన్నపం.
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును! సాధువులతో బ్రహ్మజ్ఞులతో సమాగమం అమోఘమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. అట్టి అవకాశం పట్ల అశ్రద్ధ-ఉదాశీనత ఉండకూడదు. నేనీ విషయాలు ఇతః పూర్వమే కొన్ని చెప్పి ఉన్నప్పటికీ... ఇప్పుడు కూడా సందర్భోచితం కాబట్టి మరికొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. మహనీయుల గురించి సంభాషించుకోవటమే మహత్తరమైన జ్ఞాన యజ్ఞం!
వివేకులు-విరక్తులు-పరమాత్మయందు విశ్రమించినవారు అగు మహనీయులు లోభ-మోహ రహితులై ఉంటారు. యుద్ధ యోధుడు శత్రు సైనికులను జయించి ఆధిపత్యం ప్రకటించునట్లు వారు లోభ-మోహ-కామ క్రోధ-మద మాత్సర్యాలను జయించి ఆధిపత్యము వహించినవారై ఉంటారు. వారు అధికముగా ప్రసన్నులు కారు. వారికి ఎవరిపైనా ఏమాత్రం కోపం ఉండదు. వారు దేనిపట్లా ఆసక్తి కలిగి ఉండరు. భోగ్య పదార్థముల పట్ల అభినివేశము, జనుల వలన ఉద్వేగము పొందరు. తదితర జనులను ఉద్వేగింపజేయరు.
నాస్తికత్వముతో గూడి దురాచారములు చేయరు. ఆస్తికత్వముతో గూడి అతికేశకరములగు కర్మానుష్ఠానమునందు తత్పరులు కారు. మనోహరమైన, మధురమైన ఆచరణ కలిగి ఉంటారు. ప్రియముగాను-కోమలముగాను మాట్లాడుతూ ఉంటారు. వారు తమ సాంగత్యముచే జనులకు ఆహ్లాదము కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో లౌకిక-వైదిక కర్మలకు పరస్పర విరోధం
Page:190
కలుగగల సందర్భాలు ఉంటాయి చూచావా? అప్పుడు వారు ఆ ఉభయుల మధ్య సంకటమును నివారించి, జనుల సందేహాలను క్షణంలో తొలగించి అనుష్ఠానమును లోక కళ్యాణ పూర్వకంగా, సౌలభ్య సమనిత్వంగా అవగాహన- ఔన్నత్యములతో తీర్చిదిద్దగలరు. క్షణంలో ఉత్తమ కర్తవ్యమును నిర్ణయించగలరు.
అనుద్వేగకరాచారా బాంధవా నాగరా ఇవా
బహిః సర్వ సమాచారా అన్తః సర్వార్ధ శీతలాః ॥
ప్రియమైన శ్రేయోభిలాషులైన బంధువుల వలె ఉద్వేగరహితులై ఉంటారు. వారి ఆచారము లన్నీ సర్వులకు క్షేమము కలుగజేసే ఉద్దేశముతో రూపొంది ఉంటాయి. బాహ్యమున అందరిలోనూ సమముగా సామాన్యాచరణ కలిగి ఉంటూనే... అంతరంగంలో సమస్త కార్యములలో ప్రశాంతంగా ఉంటారు. ఇంకా... వారు శాస్త్రార్థ రసికులై ఉంటారు. జగత్తు యొక్క పూర్వ-పరతత్త్వమును ఎఱిగినవారై ఉంటారు. ఆత్మజ్ఞులై ఉంటారు. 'ఏది గ్రహించాలి - ఏది త్యజించాలి'... అనేది బాగుగా ఎఱిగినవారై, వాటి పట్ల జ్ఞానయుక్తులై ఉండి, యథాప్రాప్తములైన ఆయా ధర్మ-కర్మములను నిర్విర్తిస్తూ ఉంటారు. శాస్త్ర-లోక విరుద్ధములైన కార్యముల పట్ల విరక్తి కలవారై ఉంటారు. సదాచారముల పట్ల ప్రీతిమానసులై ఉంటారు. వారి యొక్క హృదయము అనే పుష్పం 'జ్ఞానోదయం కావించగల ఉపదేశములు' అనే కమ్మటి సువాసన సదా వెదజల్లుతూ ఉంటుంది. వారికి అతిథులై వచ్చినవారికి "వీరికి ఆశ్రయదానము-సుఖదాయకమగు భోజనము-సత్కారము ఇంతవరకే చేయగలిగానే” అనే అణకువ కలిగి ఉంటారు. స్వగృహమునకు ఏతెంచిన అతిథులతో వారికి సర్వ ప్రదాతయగు తమ ఇష్టదైవం ద్యోతకమౌతాడు. సర్వుల పాప దృష్టులను వారు క్షణంలో 'పవిత్రత' వైపుగా మరల్చగలుగుతూ ఉంటారు. తమ ఉత్తమ గుణములచే సత్పురుషుల మనస్సును హరించు సామర్థ్యం స్వభావసిద్ధంగా కలిగి ఉంటారు. జన క్షోభను తమ తపఃప్రభావం చేత, సత్కర్మానుష్ఠానం చేత నివారించి, సంకల్పమాత్రంచే జనులను సముత్సాహపరుస్తూ ఉంటారు. సంపదలలో సహ జనులను సుఖపెట్టువారై వర్తిస్తూ ఉంటారు. వారి శీతల హృదయంలో అమ్మ ప్రేమ మనకు కనిపి స్తుంది. వారున్న చోట సాత్విక భావాలు నలువైపులా వెదజల్లబడుతూ ఉంటాయి. వారు భావికాలపు సత్ఫలితాలకు హేతుభూతులై భాసిల్లుతూ ఉంటారు. మధురభాషులై అందరికి ఉల్లాసం కలిగిస్తూ ఉంటారు. అనేక మనోరథములచేత, శోకమోహములచేత, చంచల ప్రవృత్తుల చేత కలుషితమైన హృదయములకు ఆ సాధుపురుషుల వివేకోపన్యాసమే పరిశుద్ధ పరచగల అభ్యంగన స్నానం.
కాబట్టి రామచంద్రా! ఆపద సమయములందు, జరా-మృత్యు-శోక-మోహాది వ్యాకుల స్థితులయందు తదితర సంకట స్థితులందు తత్త్వజ్ఞుడగు జ్ఞాని యొక్క యోచనలు-బోధలుఅభిప్రాయములే శరణ్యమని సర్వ జనులకు గుర్తు చేస్తున్నాను.
నాయనా! రామా! ఇట్టివియు, తదితరములు అగు చిహ్నములచే విశాల హృదయములగు మహనీయులు ఎక్కడెక్కడున్నారో గుర్తించాలి. సంసార మార్గములో శ్రమగొనియున్నవాడు
Page:191
అద్వయమగు బ్రహ్మమునందు విశ్రాంతిని సంపాదించుకోవటానికై అట్టి మహితాత్ములను ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ సంసారసాగరం సర్పము వలె అతి భయంకరమైనది సుమా! వినా 'సత్సంగమ్’ అన్వేన పోతకేన న తీర్యతే
అట్టి ఈ సంసార సాగరము 'సత్సంగము' అనే పడవచే తప్ప మరి దేనిచే దాటబడగలదు? అస్తాం కిం మే విచారేణ? యత్ భవేత్ అస్తు తత్ మమ!
ఇత్యస్తః కల్కమ్ ఆసాద్య న స్టేయం గర్త కీటవత్
"ఆ! విచారణ వలన మాకేం ప్రయోజనం? ఏది ఏమైయున్నదో అదే అట్లే మనకగు గాక! అయినా ఎవరిని నమ్మగలం? ఈ చెప్పే వారిలో తప్పులుండవా? చెప్పటం ఎవడైనా చెప్పగలడు. ఇవన్నీ మాకు తెలియవా ఏమి? ఆ! మేము చాలామందిని చూచాం. నేను ఇటువంటి వారిని అటువంటి వారిని నమ్మను”... అనే ఏవేవో అలసత్వపు స్వభావంతో ఈ జనులు రోజులు గడిపేస్తు న్నారే గాని... “ఈ జీవితాన్ని, ఈ ఈ సందర్భాలను, అవకాశాలను సద్వినియోగ పరచుకోవటమెలా?” అని సమాలోచనకు సిద్ధమే కావటం లేదు. ఓ ప్రియ జనులారా! అట్టి అలసత్వం అంతఃకరణంలో ధరించి గుంటలోని కీటకం వలె రోజులు గడపడం శ్రేయం కాదని ముందుగా హెచ్చరిస్తున్నాను. శ్రద్ధ-ఉత్సాహం-అన్వేషణలతో సత్పురుషులను గుర్తించి, సమీపించే ఉద్యమంలో ఉండటమేశ్రేయం.
ఒకవేళ పైన చెప్పిన ఉత్తమ గుణాలన్నీ ఒకనియందే లేవనుకో! అప్పుడు ఆ ఉత్తమ గుణాలలో ఒక్కటి అయినా ఎవనియందైనా ఉన్నదని ఎఱిగినప్పుడు ఆ ఒక్క గుణం కొఱకై - మిగిలిన పనులన్నీ ప్రక్కకుపెట్టి ఆతని అన్య దోషాలను అనాదరిస్తూ (లక్ష్యపెట్టక) ఆతనిని ఆశ్రయించాలి.
బాల్యం నుండి “నా గుణ దోషములు ఏమేమి?” అని తెలిసుకోవటానికి సత్సంగముశాస్త్రాభ్యాసం ఈ రెండింటిని సద్వినియోగపరచుకోవాలి. చిన్నచిన్న దోషములను కూడా ప్రయత్నంతో తొలిగించుకొనే ఉద్యమంలో ఉండాలి. అందుకుగాను నిత్యము సజ్జనులతో పరిచయమును, సహవానమును ప్రవృద్ధం చేసుకొంటూ ఉండాలి. ఒకవైపు సజ్జన సహవాసం పెంపొందించుకుంటూ, మరొకవైపు స్థూలదృష్టి దోషములుగల జనులతో గల సంబంధమును క్రమంగా తగ్గించుకుంటూ ఉండాలి. దుస్సాంగత్యము సాధువులో కూడా అసాధుత్వమును ఉత్పత్తి చేయగలదని నా అభిప్రాయం. లోకంలో అట్లా చూస్తున్నాం కదా! సాధువు దుష్టత్వం పొందటం జగత్తులో అశుభ సూచకం. అందుకే ఇంత సూటిగా చెప్పుచున్నాను. దేశ కాలవశంగా పాపకార్యములచే లోకంలో గొప్ప అరిష్టాలు సంభవించటం గాంచబడుచున్నది. అందుచేత అన్ని కార్యక్రమములు త్యజించి అయినా సరే,... సజ్జన సాంగత్యమును ఆచరించాలని బాలురకు, తదితరులకు కూడా నా విన్నపం. "సజ్జనులతో సాంగత్యమే ఇహ పర శ్రేయోదాయకమైన గొప్ప సాధన” ... అని మేము తలచుచున్నాము.
ఓ రామచంద్రా! సజ్జనుల నుండి ఎప్పుడూ కూడా మనుజుడు దూరం కారాదు. మరొక విషయం. సాధువులను సమీపించునప్పుడు నమత్ర కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానులు అర్హమైన వారి