Page:292
న కదాచన నిర్ముక్తం చేతో భూయో నిబధ్యతే, యత్నేనాపి పునర్ బద్ధం కేనవృన్తచ్యుతం ఫలమ్?
తొడిమ నుండి విడివడిన దోసకాయ తిరిగి తొడిమచే బంధించబడగలదా? లేదు కదా! అట్లాగే ముక్తత్వం సంతరించుకున్న తరువాత ఇక అట్టి చిత్తం మరల ఈ సంసారంచే స్పశించబడజాలదు.
దేహస్తు దేహధర్మేణ, జీవన్ముక్తి మతామసి
గృహత్యే తద్గతం తేషాం చేతస్తు అచలమేవ తత్ II
జీవన్ముక్తులకు కూడా దేహం దేహధర్మమే కలిగివుంటుంది. కానీ బద్ధజీవులు చిత్తము నిత్య చంచలంగా ఉంటూ ఉంటోంది. ఇక జీవన్ముక్తుల చిత్తమో... “ఇదంతా పరమాత్మ శోభయే కదా” అను రూపంగా అతినిశ్చలంగా ఉంటోంది. జీవన్ముక్తుల నిశ్చలత్వం జీవన్ముక్తులకే ఎఱుక అవుతుంది. అది ఎట్టిదో చంచల చిత్తులకు తెలియబడటం లేదు. ఇక ధారణ కలిగిన యోగుల విషయమంటావా? వారు “ఈ ఈ ధారణ కలిగివున్నారు" ...అని ఇతరులు తెలుసుకోగలుగుతారు. మోక్ష ధారణ కలిగి ఉన్నవారి చిత్తానుభవం ఎట్టిదో... అది లౌకిక దృష్టికి అందేది కాదు. ఒకడు ఒక అత్యంత మధురమైన పదార్థాన్ని ఆస్వాదించాడనుకో. “అద్దాని రుచి ఇట్టిది” అని ఎంతగా చెప్పినా కూడా అది తినని వారికి పూర్తిగా తెలియవచ్చేది కాదు కదా! ఆ వింటున్న ఆయన “ఇంతెందుకు? నేను కూడా తింటాను"...అని ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తే ఇక ఆతనికి ఆ రుచి గురించి మరొకరు చెప్పవలసినదేముంటుంది? జీవన్ముక్తుల మోక్షానుభవం అట్టిది. అందుకే అద్దానిని “స్వాత్మానుభవైక వేద్యము” ...అని విజ్ఞులు అభివర్ణిస్తున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! ప్రతిజీవుడు ఆత్మస్వరూపుడేగాని ఈ దేహ స్వరూపుడు కాదు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఇక ఇందులో సందేహమేమున్నది?
శ్రీరాముడు : ఆత్మ సర్వదా అప్రమేయ నిర్హేతుక - - నిత్యముక్త ఆనంద స్వరూపమే కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. మన ఈ సంవాదము ప్రతిపాదించే ఆత్యంతిక సత్యం అదియే కదా! శ్రీరాముడు : మరి ఆత్మస్వరూపుడగు జీవునికి సుఖదుఃఖాలు ఎందుకు వచ్చి పడుచున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : సుఖదుఃఖాలు మనస్సు యొక్క ధర్మాలు, జీవన్-మృత్యువులో ...దేహం యొక్క ధర్మాలు. అట్టి సుఖ-దుఃఖ, జీవన్-మృత్యు ధర్మాలు తన స్వరూపమగు ఆత్మపై ఆపాదించుకొనటం చేతనే ఆత్మ “నేను బద్ధుడను" అను రూపంలో బంధానుభవం - అనుబంధానుభవం పొందుతోంది. మనస్సు "దృశ్యతాదాత్మ్యము, దృశ్యముపై నమ్మిక కలిగి ఉండటం" అనే సుదీర్ఘవ్యాధి నుండి ఉపశమనం పొందినప్పుడు, “ఈతడు ముక్తి పొందాడురా” అని ఆత్మకు ముక్తి శబ్దం ఆపాదించబడుతోంది. అంతేగాని... ఆత్మకు ముక్తి ఇప్పుడు క్రొత్తగా వచ్చింది కాదు. సర్వజీవుల ఆత్మ నిత్యముక్తమైయున్నది.
అభ్యంతరమున సర్వవిషయ విశేషముల పట్ల శీతలము (శాంతి) వహించిన చిత్తమే ముక్తి. చిత్తము అనేక జగత్ విషయముల పట్ల సంతప్తమై ఉండటమే బంధము.
కనుక బంధం, మోక్షం అనబడేవి చిత్తము యొక్క అధీనంలో ఉన్నవేగాని... అవి దేహాధీనాలు కావు. బంధ - - మోక్షములనే రెండూ దేహంలో లేవు. జీవన్ముక్తుడు సర్వ విషయ - విశేషముల
Page:293
పట్ల ఒకానొక అనిర్దేశ్యమగు అతీతత్వము సంతరించుకుని ఉంటాడు. అట్టి అతీతత్వము ఈ దేహం యొక్క భోగములను అనుభవిస్తున్నప్పుడుగాని, లేక ఈ దేహం ఖండఖండములగు చున్నప్పుడు గాని, అనేక లోకసంబంధమైన పరిస్థితులు ఎదురగుచున్నప్పుడు గాని, నవ్వుచున్నప్పుడు గాని, దుఃఖించుచున్నప్పుడుగాని, మరింకేవైనా పొందుచున్నప్పుడుగాని, కోల్పోవుచున్నప్పుడుగాని ఏమాత్రం చెక్కుచెదరదు.
“దేహం పని దేహం చేసుకుంటోంది. మనస్సు పని మనస్సు చేసుకుపోతోంది. నేను సర్వదా యథాతథం! తదితరులుగా కనిపించేదంతా కూడా నా అవ్యక్త స్వరూపాన్ని ఆధారంగా కలిగి ఉంది. న దుఃఖం న సుఖం కించిత్ అంతర్భవతి తత్ స్థితమ్ ॥
బహిరంగంలో ఏది ఎట్లా ఉన్నా కూడా, అంతరంగంలో నేను కించిత్ కూడా సుఖంగాని, దుఃఖంగాని లేనివాడనై సదా నిర్వికారుడనై ఉన్నాను కదా!”...అని ఆత్మజ్ఞాని తన ఆత్మరూపమును గమనిస్తున్నాడు.
ఈ సుఖ దుఃఖాదులు దేహముచే దేహమునందు పొందుచున్నప్పటికీ "నేను సుఖిని - నేను దుఃఖిని” అని ఆత్మకు సుఖ దుఃఖాదులు అజ్ఞాని ఆపాదిస్తున్నాడు. సుజ్ఞాని “ఇవన్నీ ఆత్మకు లేవు. ఆత్మస్వరూపుడనయి ఉండటం చేత నాకు సుఖదుఃఖాలు లేవు" ... అని గ్రహించి నిశ్చలభావుడై ఉంటున్నాడు. “ఈ దేహమే నీవు" ... అని బోధించేవారు (చార్వాక -నైయాయిక వాదులు) దుఃఖా లకు నిర్వచనం గాని, ఉపశాంతినిగాని అందించలేకపోతున్నారని నా మనవి. దేహాత్మవాదం పదే ఓడిపోతోంది. ఆత్మశాస్త్రం ఒక్కటే చివరికి దిగ్విజయమొందుచున్నదని పరిశీలకులకు నా మనవి.
జీవన్ముక్తులు నిత్యము, అశరీరము అగు ఆత్మస్వభావమును సుస్పష్టపరచుకొని, సంతరించుకుని ఉంటారు. వారు ఈ దేహాదుల భావన ఎప్పుడూ కలిగివుండరు. కాబట్టే... వారు జన్మిస్తూ జన్మ రహితులై ఉంటారు. జీవిస్తూ జీవాదులకు సంబంధించని వారై ఉంటారు. మరణిస్తూ మరణించనివారై ఉంటున్నారు. అనగా వారు జన్మిస్తూ - జీవిస్తూ మరణిస్తూ తమను తాము జన్మ - - జీవన్ మరణములకు అతీతమైన కేవలాత్మ స్వరూపంగా దర్శిస్తున్నారు.
దేహాది జీవన్ముక్తానాం స్వభావాత్ న కదాచన మృతో2పి నైవమ్రియతే, రుదన్నపి న రోదతి విహసన్ న హసత్త్యేవ జీవన్ముక్తో మహోదయః! వీతరాగాః సరాగాభా అకోపాః కోపసంయుతాః
ఆ జీవన్ముక్తులు... దేహధారులై ఉంటూనే దేహరహితులై ఉంటారు. వారి దృష్టిలో వారు దేహమాత్రులు కాదు. దేహధర్మాలైనట్టి “జన్మ-జరా మరణ శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ స్మరణ-విస్మరణ” మొదలైనవన్నీ కలిగివుంటూనే, కలిగివుండనివారై ఉంటారు.
మరణము ఆసన్నమైనప్పుడు “ఇది దేహధర్మము. నా స్వస్వరూపం సర్వదా ఈ వ్యవహారానికి సంబంధించినదే కాదు. కనుక దేహం మరణించవచ్చు గాక! నేను జీవించినవాడనూ కాదు,
Page:294
మరణించిన వాడనూ కాదు” ... అనే అప్రమేయానుభవం ఇప్పటికిప్పుడే కలిగివుంటారు. సర్వదా మహోదయులై ఉంటారు.
“సూర్యోదయం - సూర్యాస్తమయం” అనేవి భూప్రదేశం దృష్ట్యా ఉండి ఉంటున్నాయి కాని... సూర్యబింబానికి ఉదయాస్తమయములు ఎక్కడుంటాయి? అది స్వప్రకాశము అన్యప్రకాశకం కాదు! అట్లే ఆత్మను ఎఱిగిన జీవన్ముక్తుడు నిత్యోదయుడై ఉంటాడు.
ఆతడు నవ్వుతూ ఉన్నప్పటికీ నవ్వనివాడై ఉంటాడు. ఏడ్చుచున్నప్పటికీ, ఏడ్వనివాడై ఉంటాడు. కోపం చూపిస్తూ, కోపం లేనివాడై ఉంటాడు. రాగసహితుడై ఉంటూ, రాగాదులు లేనివాడై ఉంటాడు.
అమోహా మోహవలితా దృశ్యన్తో తత్త్వదర్శినః
'ఇదమ్ సుఖమ్ - ఇదమ్ దుఃఖమ్' ఇత్యాది కలనాస్తుతాః
అలం దూరగతాః తేషాం అంకురా నభపో యథా ॥
మోహం చుట్టూ ఆవరించవచ్చుగాక! తత్త్వజ్ఞులు మోహరహితులై ఉంటారు. ఎట్లా అంటావా? “ఇది సుఖం, ఇది దుఃఖం" ... అన్న వ్యవహారమంతా వారి దృష్టిలో "స్వప్నంలోని మంచివారు - స్వప్నంలోని చెడువారు” వలె కల్పనామాత్రమై ఉంటుంది. ఆత్మజ్ఞుడగు జీవన్ముక్తుని దృష్టిలో ఈ జగత్తుకు ఒక స్వరూపమంటూ ఏదీ కనిపించదు. "ఆకాశం ఇక్కడ ప్రారంభించింది” ... అని అన గలమా? అట్లాగే వారికి ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ మొదలు - - చివరలేని కథాకల్పనా వ్యవహారంగా అగుపిస్తాయి. ఎవని దృష్టిలో ఈ జగత్తుగాని, అజ్ఞానం అనేదిగాని లేకున్నాయో, ఎవని అనుభూతిలో ఈ కనిపించే సర్వమూ ఆత్మస్వరూపమే అయివున్నదో - అట్టివానికి ఒకవేళ లౌకిక సుఖ-దుఃఖాలు సమీపిస్తేమాత్రం, వాటికి అర్థం ఏం ఉన్నది? జీవన్ముక్తులు శోకమోహాలన్నీ జయించి ఉండడం చేత శోకిస్తూ కూడా శోకరహితులై ఉండగలుగుచున్నారు.
తత్త్వజ్ఞులు ఈ శరీరాదులు ఛేదింపబడుచున్న సందర్భంలో కూడా "నిత్యుడగు నాకు ఈ దేహాదుల వలన పాతది పోయేదేమిటి? క్రొత్తది వచ్చేదేమిటి?” ... అని తలచుచు సర్వదా ఆత్మత్వమును అవధరించి ఉండగలుగుచున్నారు. స్వస్వరూపమే అయున్న ఆత్మ సర్వదా అఖండము, అప్రమేయము కదా! మహనీయులు “ఈ దేహం నిర్మించబడుచున్నప్పుడు గాని, ఛేదించబడుచున్నప్పుడు గాని తాము నిర్మించబడటం లేదు. ఛేదించబటం లేదు అని గ్రహించినవారై... సర్వదా నిర్విషయులై, నిర్వికారులై, అప్రమేయులై, అతీతులై ఉంటున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెపుతాను విను. బ్రహ్మదేవుడు : ఒకానొకసారి విధివశాత్తుగా సామగానం చేస్తున్న బ్రహ్మదేవుని నాల్గవ శిరస్సును తన కొనగోటితో కోమల పుష్పాన్ని త్రుంచినట్లు హరుడు (శివభగవానుడు) త్రుంచాడు కదా! ఆతడు శిరస్సును మరల మొలిపించగల శక్తి కలిగి ఉండి కూడా బ్రహ్మదేవుడు నిర్లిప్తుడై నిర్వికారుడై ఎట్లా ఉన్నాడు? తన స్వస్వరూపము ఈ దేహాదులకు సంబంధించినది కాదని గ్రహించి ఉండటంచేతనే సుమా! చిదాకాశముతో సమత్వము అవధరించియున్న ఆ బ్రహ్మదేవునకు వ్యర్థము - మిథ్యాభూతము అగు ఆ శిరస్సు మొదలైన అవయవములతో క్రొత్తగా ఒనగూడేదేమున్నది? అది ఖండించగా
Page:295
పోయినదేమున్నది? వేదగానం చేసే వేదజ్ఞుడగు బ్రహ్మదేవుడు తనకు నాలుగు ముఖాలున్నా ఒక్కటే, లేక మూడు ముఖాలున్నా ఒక్కటేనని గ్రహించి ఉన్నాడు. "ప్రాణులకు కర్మవశం చేత ఏది ప్రాప్తిస్తుందో అదియే ప్రాప్తించు గాక! ఏదీ ప్రాప్తించకుండానూ పోవుగాక! ఇందులో ప్రత్యేకమైన విశేషమేమున్నది?” అనే అత్యున్నత భావసమాధిలో ఆత్మజ్ఞానతత్పరులు సర్వదా తేలియాడుతూంటారు.
మన్మథుడు - ఇంకా విను. మన్మథుని అక్షయ బాణతూణీరములచే స్పృశించబడిన శివుడు తన అర్ధభాగ శరీరం క్షణంలో పార్వతికి సమర్పించాడు. ఇక, ఆ శివుని మూడవకన్ను యొక్క అగ్నిజ్వాలలకు దేహమును సమర్పించి కూడా మన్మథుడు సదా ఆత్మతత్త్వానుభవి కనుక దేహరహితుడై దేహసహితునివలె యథాతథంగా ఉండి వ్యవహరించుచున్నాడు.
పరమశివుడు - పరమశివుడు వాస్తవానికి రాగరహితుడే అయినప్పటికీ ...మన్మథుని బాణాలు స్పృశించినప్పుడు మన్మథుని దహించటం - పార్వతీదేవిని గ్రహించటం అనే ఉభయ కార్యాలను నిర్వర్తించుచూ రాగాన్ని కలిగియే ఉన్నాడు. ఆయనకు ఈ ప్రపంచంలో ఏదైనా కార్యం నిర్వర్తించటం చేతగాని, లేక ...నిర్వర్తించకుండటం చేతగాని పొందే ప్రయోజనమంటూ ఏముంటుంది?
నైవ తస్య కృతనార్థో నాకృత నేహ కశ్చన
నచ్నా స్య సర్వభూతేషు కశ్చిదరవ్యపాశ్రయః ॥
సమస్త లోకములకు అతీత స్వరూపుడు, అతీత స్వభావుడు అగు ఆ పరమశివ భగవానుడు సర్వభూతజాలాల పట్ల ప్రయోజన నిమిత్తమై ఆశ్రయించవలసిన పదార్థమేదీ లేకపోయినప్పటికీ, ఆయన రాగం కలిగియే ఉండి వ్యవహరిస్తున్నాడు. అనగా వారికి రాగం కలిగి ఉండటం, కలిగి ఉండకపోవటం రెండూ ఒక్కటే అగుచున్నది. ఏది ఎట్లు ఉన్నదో అది అట్లు ఉండుగాక! ఆత్మను ఎఱిగిన మహనీయుడు కాబట్టియే, రాగమును వదలనూ లేదు. విరాగి అయి శ్మశాన సంచారం మాననూ లేదు.
శ్రీమన్నారాయణుడు - - శ్రీ విష్ణు భగవానుడు జగత్తులో ప్రవేశిస్తూ అనేక కార్యక్రమములను నిర్వర్తిస్తున్నాడు.
కరోతి కారయశ్యు ఉచ్చైః మ్రియతే మార్యతేపి చ జాయతే వర్ధతే జస్రం జీవన్ముక్తో జనార్దనః ॥
జీవనుక్తుడైన ఆ జనార్దనుడు... రాక్షసుల కులాంతకుడై, వారిని సంహరిస్తున్నాడు. ఇంద్రుడు మొదలైన వారిచే రాక్షసులను సంహరింపజేయిస్తున్నాడు. అనేకచోట్ల దేహములను ఆశ్రయించి ‘జన్మించటం’ అనే దేహచమత్కారమును నిర్వర్తిస్తున్నాడు. ధ్రువతార సమాప్తియందు మరణమును అంగీకరిస్తున్నాడు. లుబ్ధకుడు మొదలైన వారిచే సంహరించబడుచున్నాడు. అనేకచోట్ల అవతరించి భక్తులకు దిక్కె, కొంగు బంగారమై వారిని కంటిపాపవలె రక్షిస్తున్నాడు...
ఈ విధంగా అనేక కార్యములను నిర్వర్తిస్తూనే వైకుంఠంలో ప్రశాంతచిత్తుడై లక్ష్మీదేవితో ప్రణయములు ఆడుచున్నాడు. చూచావా? వారికి ప్రణయము, ప్రళయము ఒక్క తీరుగానే అగు
Page:296
చున్నది. సమర్థుడే అయినప్పటికీ ప్రాణుల కర్మపరంగా సంప్రాప్తించే వ్యవహార వ్యగ్రత్వమంతా తానుకూడా స్వీకరించి వర్తిస్తున్నాడు. ఎందుచేత? వారికి ఆయా వ్యవహారములు త్యజించటం చేతగాని, నిర్వర్తించటం చేతగాని ఏ ప్రయోజనమూ లేదు. ఆత్మత్త్వమునందు విలీనుడై ఉండియే, “ఈ ప్రపంచమున ఏది ఎట్లు ఉన్నదో ... అది అట్లే ఉండుగాక” ... అని తలచి ఆయా కార్యములను సానుకూలంగా, లోకవ్యవహారములన్నీ నడిపిస్తున్నారు. నడిపిస్తూనే ఆయన సర్వదా వాసనారహితుడై, ఏ కోర్కెలు లేనివాడై, శుద్ధ చిన్మాత్రరూపధారి అయి ఉంటున్నాడు.
సూర్యభగవానుడు - అటు ఆ సూర్యభగవానుని చూడు. ఆయన ఈ 'జగత్తు' అనే మహత్తర వ్యవహారం చుట్టూ బంతిలాగా ప్రదక్షిణాలు చేస్తూ 'కాలము' అనే వ్యవహార కల్పనకు కారకుడై, అన్నీ కాలబద్ధంగా జరిగిపోతూ ఉంటే, తాను మాత్రం నిర్లిప్తంగా, కేవల సాక్షిగా సర్వమును గాంచుచూ ఉన్నాడు.
నచ రోధయితుం దేహం! న, సమర్థి దినేశ్వరః
నిరిచ్ఛ ఏవ నిర్వాణః తథాప్యాస్తే యథా స్థితమ్ ॥
సర్వసమర్థుడు అయిఉండి కూడా దినపతియగు ఆ సూర్య భగవానుడు ఈ 'దినచర్య' నుండి తన దేహమును నిరోధించకయే ఉన్నాడు. సర్వదా జీవన్ముక్తుడై ఉండటం చేత తనకంటూ ఏ ఇచ్ఛ లేకుండానే యథారీతిగా ఆకాశంలో వర్తిస్తున్నాడు. విహరిస్తున్నాడు.
చంద్రుడు - అట్లాగే చంద్రుడు స్వతహాగా జీవన్ముక్తుడై ఉండి కల్పాంతము వరకు ప్రతి నెలలోను వృద్ధి - క్షయములు అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఇచ్ఛారహితుడు. అందుచేత ఈ దేహ హాని - వృద్ధులు ఆయనకు సుఖ - దుఃఖాలను కలిగించటం లేదు.
అగ్నిదేవుడు - ఇక, పరమాత్మయగు అగ్నిదేవుడు కూడా! ఒకప్పుడు 'మరుత్తు' అనే ఆయన పన్నెండు సంవత్సరాలు యజ్ఞం చేస్తూ నిరంతరం ఏనుగు తొండమంత పరిమాణం కలిగిన ఘృత (నేయి) ధారను అగ్నికి సమర్పిస్తున్నప్పుడు, మరొక సందర్భంలో శివుడు పార్వతితో పొందిన సమాగమ సమయంలో దేవతల వలన కలిగిన విఘ్నం కారణంగా స్థలించిన శివతేజో వీర్యమును బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం త్రాగుటచే ఏర్పడిన దాహబాధ చేత, దేవతలకు నిరంతరం సమర్పించబడే యజ్ఞ హవ్యములను తనయందు ధరించటంచేత... ఇటువంటి ఆయా సందర్భాలలో దుఃఖాదులు ఏర్పడినప్పటికీ తాను జీవన్ముక్తుడు కాబట్టి సమస్థితిచే అవన్నీ వహిస్తూ యథారీతిగా వెలయుచున్నాడు.
బృహస్పతి, శుక్రాచార్యులు - అదే విధంగా దేవతల గురువు బృహస్పతి - - దానవుల గురువు శుక్రాచార్యులు స్వతహాగా జీవన్ముక్తులు. అయితే ఏం? వారిద్దరు తమతమ ఆశ్రితుల దిగ్విజయముల కొరకై ఒకరిని మించి మరొకరు, సామాన్య మానవులు తగాదాలు పడుచున్నట్లుగా, ఎత్తుకు - పై ఎత్తు వేస్తూనే ఉంటున్నారు. అట్టి అభిలాషలు నిర్వహిస్తూనే అంతరంగమున లోక వ్యవహారములన్నిటికీ అస్పృశ్యులై, అతీతులై, నిర్విషయ సుఖానందమును కొనసాగిస్తూనే ఉంటున్నారు.
Page:297
జనకాది జీవన్ముక్తులు - జీవన్ముక్త మానసులైన జనకమహారాజు అనేక భయంకర యుద్ధములలో పాల్గొనుచూ ఈ జగద్విషయాలన్నీ కథా సంఘటనల వలె దర్శిస్తూ తన జీవన్ముక్తస్థితిని కొనసాగిస్తూనే ఉన్నారు. అట్లాగే జీవన్ముక్తులైన నలుడు, మాంధాత, సగరుడు, దిలీపుడు, నహుషుడు, హరిశ్చంద్రుడు మొదలైనవారు జీవితంలో అనేక దుర్భర సంఘటనలను ఎదుర్కొంటూ సుదీర్ఘకాలం రాజ్యాలు ఏలారు. వారి జీవితాలలో అందరిలాగానే అనేక కష్టాలు మొదలైనవి వచ్చి పోతున్నప్పటికీ, సర్వదా జీవన్ముక్తత్వం అనుభూతమొనర్చుకొనియే జీవితములను కొనసాగించారు.
శ్రీరాముడు : మహర్షీ! మరి జీవన్ముక్తునికీ, అజ్ఞానికీ గల భేదమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి :
వ్యవహరేయథైవ అజ్ఞః తథైవ ఖలు పండితః ॥
వాసన - - అవాసనే ఏవ కారణం భంధ-మోక్షయోః ॥
జ్ఞాని, అజ్ఞాని కూడా వ్యవహార రీత్యా చూస్తే ఒకే రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంక తేడా ఏమిటంటావా?
జ్ఞానికి (లేక జీవన్ముక్తునికి) దృశ్య వాసన ఉండదు. అజ్ఞాని, అనేక వాసనలు కలిగి ఉంటాడు. అనగా... వాసన, వాసనా రాహిత్యములే క్రమంగా బంధ మోక్షములకు కారణములు అగుచున్నాయని ఇక్కడ గ్రహించు.
ఇంకా విను! జీవన్ముక్తుడు, రాగవర్జితుడు అయినట్టి బలిచక్రవర్తి మూడడుగులు దానం చేస్తే బాలక బ్రహ్మచారిగా వచ్చిన విష్ణు భగవానుడు పాతాళానికి తనను అణగత్రొక్కగలడని గురువు శుక్రాచార్యులు హెచ్చరించినా, తనకు తెలిసి ఉన్నా కూడా, “కారే రాజులు, రాజ్యముల్ కలుగవే! వారేరీ?” ...అని చక్రవర్తి పదవిని తృణప్రాయంగా సమర్పించివేశాడు. అట్లాగే ప్రహ్లాదుడు, నముచి, వృత్రుడు, మురుడు, అంధకాది రాక్షసులు పైకి రాగయుక్తుల వలె జాత్యహంకారుల వలె వ్యవహరిస్తూ ఈ ప్రపంచంలో స్థితి కలిగి ఉండి, అంతఃకరణంలో, “సర్వం సర్వదా భగవదర్పితమే”
...అని గ్రహించి చరించారు.
కాబట్టి ఓ రామచంద్రా! చిదాకాశ స్వరూపము సంతరించుకొని ఉన్న మహనీయులు తాము రాగ - ద్వేషములు ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ, వారికి సచ్చరిత్రలు - దుశ్చరిత్రలు ఉండి ఉంటున్నప్పటికీ వారి మోక్ష స్థితికి వచ్చే లోటేమీ ఉండటం లేదు. చిదాకాశ స్థితికి - ఈ ప్రపంచంలో వ్యవహారాలకు సంబంధం ఉండటం లేదని గమనిస్తున్నావు కదా! ఎందుకంటావా?
జీవన్ముక్తులు పరిపూర్ణ స్వయమాత్మ స్వరూపులై ఉంటారు. చిదాకాశం వలె “శుద్ధం” అయినట్టి అంతిమ సాక్షాత్కార వృత్తి రూపమగు జ్ఞానం అవధరించి ఉంటారు. అట్టి శుద్ధ జ్ఞానంతో ఈ దేహ-మనో-ఇంద్రియ ప్రాణ ధర్మములను ఆద్యమగు పరబ్రహ్మ భావనతో దర్శిస్తూ ఉంటారు. “ఇవన్నీ కూడా, వీటిచే గాంచబడే విషయాదులతో సహా సర్వము బ్రహ్మమే కదా!” అను ఎఱుకను
Page:298
దృఢపరచుకొని ఉంటారు. కనుక ఇక అట్టి జీవన్ముక్తులకు “ఇది స్వకీయం - ఇది పరకీయం” ... -
అనే భేదం మొదలే నశించి ఉంటుంది. ఇక వారి దృష్టికి ఈ కనబడే జగత్తంతా కూడా “మేఘము తలపై సూర్యకిరణములు ప్రసరించినప్పుడు వివిధ వర్ణములతో కనబడే ఇంద్రధనుస్సు భ్రమ సూత్రమేగాని అక్కడ ఇంద్రుడు వచ్చి ధనుస్సును స్థాపించలేదు కదా! అట్లాగే ఈ దృశ్య ప్రదర్శనమంతా అభాస మాత్రమే!” అని అత్యంత నిర్దుష్టంగా గమనించి ఉంటారు. “ఇంద్రధనుస్సు” సూర్యకిరణములు మేఘములను తాకుటచే ఏర్పడి కనబడుచున్నప్పటికీ శూన్యమాత్రమే కదా! ఈ బ్రహ్మాండములో కనిపించే పరమాణువుల సముదాయమై కనిపించే జగత్ వస్తువులన్నీ శూన్యమాత్రమే ...అని సుస్పష్టం చేసుకొని ఉంటారు. ఆకాశంలో మేఘ సముదాయంలో కనిపించే కొండ శిఖరాకారాలు ఉద్యానవనాలు, దూదిపింజాలు ... ఇవన్నీ పుట్టినదెప్పుడు? నశించేదెప్పుడు? నశించనిదెప్పుడు? అవన్నీ మేఘపుంజాల మధ్యగా ద్రష్ట స్వయంకృతమైన ఊహాకల్పనచే కనిపించేవే కదా! స్వప్నంలో కనిపించిన జనులు పుట్టినదెప్పుడు? చచ్చినదెప్పుడు? తొలగినదెప్పుడు?
ఇదం జగత్ అసత్భాతి సదివ వ్యక్తిమాగతమ్
అజాతం అనిరుద్ధం చ యథా శూన్యత్వమ్ అంబరే ||
స్వప్నంలో కనిపించిన మిత్రుడు పుట్టనూలేదు, చావబోవటమూ లేదు కదా! ఊహలో కనిపించే ఒక నగర సింహద్వారానికి ఎవరు నగిషీ చెక్కారంటే ఏం చెపుతాం? అట్లాగే ఈ “జగత్తు” అనబడేది ఎన్నడూ పుట్టటమూ లేదు. ఇది నశించటమూ లేదు. అసత్తే అయినప్పటికీ స్వప్నంలో భవనం స్వప్న సమయంలో వాస్తవంగానే అనుభవమౌతోంది చూచావా? అట్లాగే ఈ జగత్తుకూడా అసత్తే అయినప్పటికీ అజ్ఞానమున్నంత కాలం సత్తువలె భాసిస్తోంది.
సాద్యంతమపి అనాద్యంతమ్, అశూన్యమపి శూన్యకమ్ జగత్ జాతం తథా అజాతమరుద్ధమ్ రుద్ధమేవ చ ॥
ఈ “జగత్తు” (లేక) “దృశ్యం" అను దానికి ఎక్కడో మొదలు - చివర ఉన్నట్లే అనిపిస్తున్నప్పటికీ -
ఇది వాస్తవానికి ఆద్యంతరహితం. ఇది అనాది, అనంతము కూడా! ఇదంతా పదార్థ సహితంగా కనిపిస్తున్నప్పటికీ శూన్యం మాత్రమే. ఇదంతా ఎప్పుడో ఉత్పన్నమైనట్లు కనిపిస్తున్నా కూడా, అనుత్పన్నం. ఇది నశిస్తున్నప్పటికీ నాశనరహితం. ఒక పెద్ద కొయ్య స్తంభము అంతటా కొయ్య మాత్రమే అయి ఉన్నప్పుడు అందులో మధ్యగా చెక్కబడిన ప్రతిమ కూడా కొయ్యయే కదా! అట్లాగే బ్రహ్మమునందు కనిపించే ఈ జగత్ దృశ్యము బ్రహ్మమే అయి ఉన్నది. కల్పనచే భాసించే జగదృశ్యం చిదాకాశమే!
ఓ రామచంద్రా! ఒకడు తన ఆలోచనలన్నీ త్యజించి నిద్రారహితమైన సమాధిని అవధరించా డనుకో! అట్టి సర్వకల్పనా వర్జితము, సర్వత్రా ఏకరసము అయిన 'కేవల చిదాకాశము”నందే ఈ ‘జగత్తు’ వెలయుచున్నదని గ్రహించి ఉండు.
ఒకని బుద్ధివృత్తి నేత్రేంద్రియము ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుచు న్నప్పుడు... ఆ రెండు విషయముల మధ్యగల “నిర్విషయ సంవిత్తు” నందే ఈ జగత్తు విలసిల్లి
Page:299
ఉంటోంది. మనమందరమూ చిదాకాశ స్వరూపులమే! అట్టి "చిదాత్మయందు ఏ ద్వైత - అద్వైతములు భాసిస్తున్నాయో అట్టి ద్వైత-అద్వైతములు వాస్తవానికి లేవు" ...అనునదే మా అనుభవపూర్వక నిర్ణయం. అట్టి పూర్ణానందైక స్వరూపమునందు 'శూన్యము' అనేది కూడా లేదు. నీటితో నిండిన కుండ - ఖాళీ కుండలవలె శూన్యత్వ - పూర్ణత్వ శబ్దాలు సాపేక్షకం మాత్రమే! 'ద్వైతము, అద్వైతము’ అనే శబ్దాలు సాపేక్షచే సంభవించేవే. 'ఆత్మ'యందు ఏకత్వము లేదు. అనేకత్వము లేదు. ఇక ఈ జగత్తుగా కనిపించేదంటావా? ఒకడు ఒక ఖాళీ స్థలంలో భవిష్యత్తులో కట్టబోయే ఇంటిని ఊహించి “ఇది వంటగది. ఇది పూజామందిరం, ఇది పడక గది. ఇది అందరం కూర్చుని కబుర్లు చెప్పుకొనే విశాల విభాగం. ఇక్కడ కుర్చీలు ఉంటాయి”... అని చెప్పుతూ ఉంటాడు చూచావా! అట్లాగే ఈ జగత్తు కూడా భవిష్యత్ భవనంలాగా దేశ-కాలాదులతో కూడినదై కనిపిస్తోంది. వాస్తవానికి ఇదంతా ‘ఆత్మయే!’ (“సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ” - వేదవాక్యం లాగా) ఇదంతా సర్వదా చిదాకాశ రూపమగు బ్రహ్మమే అయివున్నది. ఎట్లా అంటావా? స్వప్న ద్రష్ట యొక్క చైతన్యం స్వప్నంలో తన స్వరూపమునే వివిధ జనులవలె, నగరాదుల వలె దర్శిస్తోంది చూచావా? అట్లాగే ఈ జాగ్రత్ ద్రష్టయొక్క చైతన్యమే జాగ్రత్ష్ట జగత్తుగా కనిపిస్తోందని విజ్ఞులు ఎరిగియే ఉంటున్నారు.
ద్రష్ట యొక్క స్వయం స్వరూపమగు చైతన్యమే ఆ ద్రష్టకు అజ్ఞాన ప్రభావం చేత (స్వస్వరూపమును ఏమఱచుట చేత) జగత్తుగా ఇక్కడ అగుపిస్తోంది.
ఓ మహత్తరమైన ఆశయం గల మహాశయా! రామచంద్రా! ఈ దృశ్యం సర్వదా శిలాఘనం వలె మౌనంగా ఉన్నట్టి బ్రహ్మం యొక్క రూపమే! అయితే స్వాత్మయే తాను ప్రసరించి ఉన్నట్టి తన స్వస్వరూపాన్ని 'జగత్తు' అనే దానిగా దర్శిస్తోంది. ఈ దృశ్య జగత్తుకు ఇంతకుమించిన వేరే అర్థం లేదు.
8. నలుగురు విపశ్చిత్తుల పునర్జన్మలు
శ్రీరాముడు : ఓ మునీంద్రా! ఇప్పటి వరకు ఒకే జీవాత్మయగు విపశ్చిత్తు నలుగురు విపశ్చిత్తులుగా అయి, ద్వీప, సముద్ర, పర్వతాదులందు సంచరిస్తూ, “ఈ పాంచభౌతిక - - మనోమయ దృశ్యజగత్తు యొక్క అంతు ఎక్కడ?” ...అను ఉత్సుకతతో ప్రమాణం కొనసాగిస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా! ఆ నలుగురు విపశ్చిత్తుల గురించిన తదనంతర విశేషాలేమిటో వివరించ ప్రార్థన! శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లే అగుగాక!
విపశ్చిత్తులో ఒకడు ఒకనాడు క్రౌంచ ద్వీపంలో గల 'వర్షసీమ’ అనే పేరుతో పిలువబడే పర్వతశ్రేణుల మధ్యగల ఒక గండశిలపై దీర్ఘ ప్రయాణపు బడలికచే ఆదమరచి నిద్రిస్తున్నాడు. ఇంతలో ఒక మదపుటేనుగు తన పాదఘట్టనతో ఆతని దేహమును పువ్వును నలిపినట్లు నలిపివేసింది.
రెండవ విపశ్చిత్తు ఒక కీకారణ్యంలో సంచరిస్తున్నాడు. ఇంతలో మహాబలవంతుడగు రాక్షసు డొకడు తారసపడ్డాడు. వారిద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసునిదే పై
Page:300
చేయి అయింది. కొంత సమయం తరువాత రెండవ విపశ్చిత్తు దేహం నిర్జీవం అయింది. విజేతయగు రాక్షసుడు కోపం ఆపుకోలేక మృతుడైన రెండవ విపశ్చిత్తు దేహమును భుజంపై పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరి దూరంగాగల సముద్ర మధ్యంలోగల బడబాగ్నిలో పడవేశాడు. ఆ అగ్నిలో పడిన రెండవ విపశ్చిత్తు దేహం భస్మంగా మారిపోయింది.
ఇక మూడవ విపశ్చిత్తు ఒక విద్యాధరునితో స్నేహం చేసి ఆతనికి అత్యంత ప్రియుడైనాడు. ఒకనాడు ఆ విద్యాధరుడు మూడవ విపశ్చిత్తు యొక్క అభ్యర్థనను కాదనలేక తనవెంట స్వర్గలోకం తీసుకువెళ్ళాడు. ఆ ఇద్దరు ఇంద్రసభలో ప్రవేశించారు. ఇంద్రుడు సభలో వినోదిస్తూ ఉండగా ఆ ఇంద్రుని దృష్టి మూడవ విపశ్చిత్తుపై పడింది. తటాలున సింహాసనం మీద నుండి లేచి "అనర్హుడైన ఈ మానవుడు ఇక్కడికి రావటమా?” ...అని హూంకరిస్తూ "ఓయీ! నీవు ఈ క్షణమే భస్మమై పోయెదవుగాక” ...అని శపించాడు. మరుక్షణం ఆ మూడవ విపశ్చిత్తు దేహం ఆసనం మీదనే ఒక గుప్పెడు భస్మంగా అయిపోయింది.
నాలుగవ విపశ్చిత్తు “కుశ” అనే ద్వీపంలో ప్రవేశించాడు. అక్కడ ఆతనికి ఒక గొప్ప సరస్సు కనిపించింది. వెంటనే ఆ సరస్సులో జలకాలాడటం ప్రారంభించాడు. ఇంతలో సరోవర గర్భంలో నుంచి ఒక మొసలి అకస్మాత్తుగా ఆ నాలుగవ విపశ్చిత్తు దేహంపైకి దూకి ఆతని దేహాన్ని ఖండ ఖండాలుగా త్రుంచివేసింది.
ఆ విధంగా నాలుగు దేహాలు నశించగా... వారి సంవిత్తు ఆకాశరూపం పొందింది. ఆ ఆకాశం లోనే వారి వారి పూర్వ సంస్కారాలచే సంప్రాప్తమైన ప్రాపంచిక దృష్టుల ప్రభావంచేత నాలుగు రకాలైన ప్రపంచాలను (ఆకాశంలోనే) గాంచసాగారు. నలుగురు నాలుగు దేహాలను ధరించారు. సృష్ట్యారంభంలో మొట్టమొదటగా సృష్టించబడిన ప్రజాపతులు తమ దేహాలను, ఆ దేహాల ద్వారా అనే సృష్టులను దర్శించునట్లే... ఆ నలుగురు విపశ్చిత్తుల సంవిత్తు మరల నాలుగు దేహాలను, ఆ దేహాలతో వస్తు విషయ పరిజ్ఞానంతో కూడిన జగదనుభవాలను పొందనారంభించారు. వారి వారి మనో ప్రతిభాస మాత్రం అగు అతివాహిక దేహం (సూక్ష్మదేహం. నేను అను భావన, నావి అను అనుభూతి)ను, స్థూల దేహమును, ఆ రెండింటికీ విషయాలైన స్థూల - జడ పదార్థాదులను గాంచసాగారు. ఆకార రహితమగు జలంలో ఆకారరూపమగు తరంగాలు పరిఢవిల్లునట్లుగా ఆకాశ రహితమగు చిదాత్మలో వారు ఆకాశమాత్ర రూపులై ప్రదర్శితులై ప్రవర్తించసాగారు. అట్లా వారు నలుగురు పాంచ భౌతిక దేహాలు అవధరించగానే “ఈ పృథివి యొక్క పరిమాణం ఎంతటిదో నేను తెలుసుకోవాలి”... అనే రూపంగల ఇతఃపూర్వపు సంస్కారాలు ఆ నలుగురి మనస్సులను ఆశ్రయించాయి. ఆ నల్గురు మరల పూర్వ సంస్కార బలంచేత “భూమియొక్క విస్తీర్ణం ఎంతవరకో తెలుసుకోవాలి” ...అనే కుతూహలం కొనసాగించటానికి అనువైన భౌతిక దేహాలు పొంది పరిభ్రమణం కొనసాగించసాగారు. అవిద్య యొక్క పరిమాణం ఎంతో తెలుసుకొనే ఉద్దేశంతో ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి ప్రయాణాలు చేయసాగారు.
❖
Page:301
పశ్చిమదిక్ విపశ్చిత్ - - మోక్షసన్యాస యోగం - పశ్చిమదిక్కు విపశ్చిత్తు ఆ విధంగా సంచారం కొనసాగిస్తూ ఒకప్పటికి సప్త సముద్రాలతో కూడిన సప్తద్వీపములను దాటివేశాడు. స్వర్ణమయమగు ఒకానొక విస్తీర్ణ ప్రదేశంలో ప్రవేశించాడు. సౌభాగ్యవశంగా ఆ ప్రదేశంలో క్రీడిస్తున్న విష్ణు భగవానుని దర్శించాడు. స్తుతించి శరణువేడాడు. స్తుతి, విన్నపం, శరణాగతులచే సంతుష్టుడైన విష్ణు భగవానుడు పశ్చిమ దిక్కు విపశ్చిత్తుకు ఆత్మజ్ఞాన బోధ ప్రసాదించారు. అది విని అనునయించుకున్న ఆ విపశ్చిత్తు క్రమంగా సమాధినిష్ఠుడై ఆ ఆకాశగర్భ ప్రదేశంలో ఐదు సంవత్సరాలు గడిపివేశాడు. ఆ తరువాత దేహము త్యజించాడు. దేహభావము మొదలంటా సమసిపోగా కేవలం చిత్తస్వరూపుడైనాడు. అట్టి స్థితిలో చిత్తము సత్వస్థితి సముపార్జించుకోగా... ఆతడు 'విదేహముక్తి'ని పొందాడు. ఇక అంతవరకు అనేక ఉపాధుల సంచలన రూప కార్యక్రమంలో అంటిపెట్టుకొని ఉన్న ఆతని ప్రాణములు ఆకాశ రూపమును పొందినవై అనంత వాయువులలో విలీనమై ప్రకాశించాయి.
తూర్పుదిక్ విపశ్చిత్ - - చంద్రలోక స్థానం - తూర్పు దిశకు వెళ్ళిన విపశ్చిత్తు సుదీర్ఘంగా ఆకాశంలో ప్రయాణిస్తూ పూర్ణ చంద్రుని సమీపించాడు. ఆతడు క్రమంగా చంద్రబింబపు అమృత కిరణములచే ఆకర్షితుడై తన శరీరమును “శుద్ధ చంద్రరూపము”గా భావన చేయసాగాడు. అట్లా చిరకాలంగా “నా నుంచి అమృత కిరణములు ప్రసరిస్తూ భూమిలో ఔషధ శక్తిని పెంపొందిస్తూ తదితర జీవుల ందరినీ సమాహ్లాదపరచును గాక" ...అని అవిచ్ఛిన్నంగా భావన కొనసాగింది. చాలా కాలమైన తరువాత ఆతనికి శరీర భావనతో పాటు పాంచ భౌతిక దేహత్వము నశించిపోయింది. ఇక అటుపై ఆతడు చంద్రలోకంలో సంచరిస్తూ స్థితి కలిగినవాడై ఉండటం జరిగింది.
శ్రీరాముడు : స్వామీ! ఏమి ఆశ్చర్యం! ఒకే జీవుని భావనా రూపంగా ప్రదర్శితమైన నాలుగు విపశ్చిత్తు దేహాలలో ఒకటి విదేహముక్తి పొందటం, రెండవది చంద్రలోక నిత్యనివాసం పొందటం జరిగిందా? మరిక మరొక ఇద్దరు విపశ్చిత్తుల సంగతేమిటి? వారింకా రెండు వేరు వేరు భౌతిక దేహములు కొనసాగిస్తూనే ఉన్నారా? లేక, వారి దేహములకు కూడా ఏమైనా విశేషం జరిగిందా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విషయాలకూ వస్తున్నాను విను.
దక్షిణదిక్ విపశ్చిత్ - సాంసారికతన్మయత్వం - దక్షిణ దిక్కు విపశ్చిత్తు అనేక ప్రదేశాలు సందర్శిస్తూ శాల్మలీద్వీపం జేరాడు. అక్కడి రాజ్య విశేషాలు, ధనాదిసంపత్తులు, వాహన - ఉద్యానవనాదులు చూచి “ఇవన్నీ సొంతం చేసుకొని, నేనే రాజునై ఎందుకు అనుభవించరాదు?” ... అనే కుతూహలం కలిగింది. అక్కడికక్కడే తన ఇష్టదైవమైన అగ్ని భగవానుని ఆరాధించి తన బలపరాక్రమాలు గుర్తు చేసుకున్నాడు. క్రమంగా కొద్దిమంది సైనికులను సమీకరించుకొని అక్కడి రాజుపై యుద్ధం ప్రకటించి, ఆతనిని యుద్ధంలో జయించి ఆ శాల్మలీ ద్వీపంలో చక్రవర్తి అయి రాజసింహాసనం అధిష్ఠించాడు. ఆతడు ఇప్పటికీ అక్కడ రాజ్యం పరిపాలిస్తూ అనేక వినోదాలతో కాలం గడుపుతూ సుదీర్ఘ కాలంగా ఉంటున్నాడు. "ప్రేమ, రాజ్యపాలన, అధికారం, శత్రు రాజులపై రాజకీయాలు” ... ఇటువంటి సామాన్యుల అల్పభావ పరంపరలలో మునిగి తేలుతూ అతిదీర్ఘకాలం రాజ్యం ఏలుతూనే ఉన్నాడు. “నేను విపశ్చిత్తు నామధేయుణ్ణి కదా! ఈ భూమి యొక్క మాయ యొక్క
Page:302
విస్తారం చూడటానికి బయలుదేరాను కదా!” ... అనే ఆలోచన ఆతడు ఎప్పుడో మరచిపోయాడు. ఆతనిలో తత్త్వజ్ఞానం లేకపోవటంచేత ప్రస్తుతానికి ఎదురుగా వున్న రాజ్యపాలనాది విశేషాలలో తన్మయుడై ఉంటున్నాడు.
శ్రీరాముడు : మహర్షీ! ఇదంతా చమత్కారంగా ఉన్నది. ఒకే జీవాత్మ యొక్క సంకల్ప, ఉద్దేశ, సంభావన, ఆశయాల నుండి బయలుదేరిన నాలుగు ఉపాధులలో ఒకరు విదేహముక్తి పొందటం, రెండవ వారు ఉత్తమ లోక ప్రాప్తి పొంది ఉండటం, మూడవవారు సంసార విశేషాలలో తన్మయులై కాలం గడుపుతూ ఉండటం ...ఎంతటి ఆశ్చర్యం! సరే... ఇక ఉత్తరదిక్కు విపశ్చిత్తు ఏమేమి చేస్తూ ఉన్నాడో అది కూడా చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఇక ఆ విశేషం కూడా చెపుతాను విను.
ఉత్తరదిక్ విపశ్చిత్ : ఉత్తర దిక్కు విపశ్చిత్తు అనేక ప్రదేశాలు సంచారం చేస్తూ కొంతకాలం గడిచి పోయిన తరువాత అతిచంచల సంయుక్తమైన (సప్తమ) స్వాదూద మహాసముద్రం చేరాడు. అక్కడ జల స్తంభన విద్యను ఉపాసించి సముద్ర గర్భంలో సంచరించసాగాడు. అలా సంచరిస్తూ ఉండగా ఒకనాడు ప్రమాదవశాత్తు ఒక తిమింగలం కళ్ళబడ్డాడు. ఆ తిమింగలం ఆతని వెంటబడి చివరకు ఎక్కడో పట్టుకుని ఆతనిని గుటుక్కున మ్రింగివేసింది. ఆ విధంగా ఆ పెద్ద తిమింగలం పొట్టలో ఒక చోట చిక్కి ఆ తిమింగలం మాంసం భుజిస్తూ, అక్కడే నిదురిస్తూ ఒక వెయ్యి సంవత్సరాలు గడిపాడు. ఆ తరువాత ఆ తిమింగలం మరణించినప్పుడు పొట్టలోంచి ఒక పురుగులాగా బయల్వె డలాడు. ఆపై స్వాదూద మహాసముద్రంలో 50,000 యోజనాలు (1యోజనం = సుమారు నాలుగు మైళ్ళు) ప్రయాణించి ఒకానొకప్పటికి దేవతలు సంచరించే సువర్ణమయమైన ఒక భూప్రదేశం చేరాడు. కాలమహిమ మహత్తరమైనది కదా! అక్కడ కొంతకాలం తరువాత దేహశైథిల్య కారణంగా మరణం పొందాడు. ఎండు కట్టెపుల్ల అగ్నియొక్క స్పర్శచే అగ్నికణంగా మారునట్లుగా ఆతడు అక్కడ దేవతారూపం పొందాడు. ఆ విధంగా ప్రధాన దేవతారూపుడై కొంతకాలం గడిపిన తరువాత ఆతనిలో "లోక సంచారం చేసి ఈ సృష్టియొక్క అంతు తెలుసుకోవాలి" ... అనే ఇతఃపూర్వపు జన్మ యొక్క ఉత్సుకత బలోపేతంగా బయల్వెడల సాగింది. అట్టి ఇతఃపూర్వపు జన్మ జన్మార్జిత సంస్కారంచేత... ఇక... ఆ సువర్ణ భూప్రదేశంలో ఉండలేకపోయాడు. అక్కడి నుండి బయలుదేరి నలుబదివేల (40,000) యోజనముల ఎత్తుగా ఉండే లోకాలోక పర్వతం జేరాడు. ఆ లోకాలోక పర్వతం యొక్క ప్రథమ భాగం సూర్యకాంతితో విరాజిల్లుతూ జీవసంచారానికి యోగ్యమై ఉంటోంది. తతిమ్మా మూడు భాగములు అంధకారమయమై జీవులు ప్రవేశించటానికి వీలుగాలేదు. మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు ఆ లోకాలోక పర్వతముయొక్క అత్యున్నత శిఖరం చేరాడు. అక్కడి నుండి తదితర భూప్రాంతాలు మొదలైనవి - మనకు నక్షత్రాలు ఎక్కడో సుదూరంగా ఆకాశంలో కనిపిస్తున్నట్లు... ఆతనికి కనిపించసాగాయి. ఆ లోకాలోక పర్వతము యొక్క ఆవలి ప్రదేశం అంధకారమయమై నలువైపులా అతి విశాలంగా విస్తరించి ఉన్నది. అక్కడికి వర్తులాకారపు భూమండలం సమాప్తమై పోతోంది. ఆవల కేవలం అంధకారమయమైన గొప్ప కందకం మాత్రం
Page:303
ఉన్నది. ఆ అంధకారంలో భూమిగాని, జంగమ జీవులుగాని, ఏ ఆశ్రయంగాని లేవు. అచ్చట ఏ వస్తువు ఉండజాలదని గ్రహించు.
9. నిరాధారమైన ఆకాశంలో భూ-నక్షత్ర మండలాలు
శ్రీరాముడు : హే భగవాన్! మహర్షీ! నిరాధారమగు ఆకాశంలో ఈ భూగోళం (పడిపోకుండా) ఎట్లా స్థితి కలిగివుంటోంది? నక్షత్ర మండలం దేనికీ ముడిపెట్టబడకపోయినా కూడా... ఆకాశంలో నిరాధారంగా, నియమిత స్థానంలో, నక్షత్రాలు ఒకదానితో మరొకటి ఢీ కొట్టుకోకుండా ఎట్లా ఉంటున్నాయి? ఈ రచనా చమత్కారం వెనుక ఉన్న ధారణాశక్తి ఎవరిది? ఎట్లాంటిది? "లోకాలోక పర్వతం” అని మీరు చెప్పేదానికి "లోకము, అలోకము” అనే పరస్పర వ్యతిరిక్త ద్వంద్వ సమాసశబ్దం ఎట్లా వచ్చింది? ఈ భూగోళానికి సూర్యగోళం ఆధారమనుకుంటే... సూర్యగోళానికి ఏది ఆధారం? ఈ బ్రహ్మాండ సృష్టి స్థితులు ఎట్టివో విశదీకరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! "ఈ బ్రహ్మాండంలోని భూ-సూర్య-నక్షత్ర మండలాదులు నిర్నిరోధకమైన ఆకాశంలో ఎట్లా, ఏ ఆధారంతో స్థితి కలిగి ఉన్నాయి?” . అనే ప్రశ్నకు ‘సూటి’ అయిన సమాధానం చెప్పుచున్నాను. విను.
ఒక బాలుడు పగలంతా ఆడివచ్చి, శుభ్రంగా స్నానం చేసి, భోజనం చేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడనుకో, ఆతనికి 'సంకల్ప రచన' (లేక) ‘ఊహాలోకం'లో ఒక బంతి చేతిలో కనిపించిం దనుకో. ఆ బంతి (కందుకం) ఎక్కడ, ఎట్లా స్థితి కలిగి ఉన్నదో... అట్లాగే... హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు)” అని పురాణ ద్రష్టలచే పిలువబడే సమష్టి సంకల్పుని సంకల్ప నగరంలో కల్పితమై ఈ భూమి, సూర్యుడు, నక్షత్ర మండలాలు వగైరా, సంకల్పానుసారంగా స్థితి కలిగి ఉన్నాయి. బాలుని ఊహలో కనిపించిన బంతిని గుండ్రంగా తయారుచేసినది ఎవరు? అదంతా బాలుని ఊహయే కదా! ఈ మన కళ్లకు కనిపించే ఖగోళ పదార్థాలు కూడా చిన్మాత్ర బాలకుడుగా హిరణ్యగర్భుని ఊహాలోకంలో కనిపించే ఊహాకల్పిత ప్రసిద్ధ పదార్థాలు మాత్రమే! “ఊహచే కల్పించబడినవి. వాస్తవంగా ఎందుకు కనిపిస్తున్నాయి?” అని ప్రశ్నిస్తే, అందుకు సమాధానం ...“మన ఊహతో జతజేర్చి, వాటిని అట్లా అట్లా దర్శించటం చేతనే” ... అని అనక తప్పదు.
ఒకాయనకు ఆకాశంలో అనేక వెంట్రుకలు - నలుగురు చంద్రులు కనిపిస్తున్నాయనుకో. ఆయన “నాకు నలుగురు చంద్రులు కనిపిస్తున్నారు. వెంట్రుకాకారాలు కనిపిస్తున్నాయి. కనుక అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరో అక్కడ ఉంచి ఉంటారు”... అని నమ్ముతాడు. ఆయనను కంటి వైద్యునికి చూపిస్తే "ఇతని కంటికి తిమిరరోగం ఉన్నది. అందుచేత ఈతనికి ఈతడు చెప్పేవన్నీ కనిపిస్తున్నాయి” ...అని రోగ నిర్ణయం చేస్తాడు. అట్లాగే... అవిద్యచేత (ద్రష్ట ఆత్మజ్ఞానం కలిగి ఉండకపోవటం చేత) చిదాకాశమే సర్వదా అంతటా ఏర్పడి ఉండగా... అట్టి చిదాకాశము నందు ఈ పృథివి - నక్షత్రాలు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
Page:304
అయితే... ఒకడు సంకల్ప నగరం (లేక ఊహా ప్రపంచం)లో ధరించిన (దర్శించే) వ్యక్తులు వస్తువులు, విషయాలు, సంఘటనలు 'ఊహ' కంటే భిన్నంకావు కదా! ఊహ (సంకల్పం) సంకల్పించు వాని కంటే భిన్నం కాదు. కాని, ఆ ఊహా సమయంలో ఊహాద్రష్టకు తనకంటే వేరైన వాటివలె అనుభూతి కలుగుతోంది. 1. సంకల్పం (ఊహాలోకం)లో కనిపించేవి, 2.తత్ సంకల్పం (ఊహ) - ఈ రెండూ మిథ్యయే కదా! చైతన్యం యొక్క 1. హిరణ్యగర్భ రచనా చమత్కృతి అయిన ఈ జగత్ పదార్థములు, వాటి వాటి ఆయా ధర్మాలు; 2. సంకల్ప పురుషుడగు హిరణ్యగర్భుడు - ఈ రెండూ అనుభవములను అట్టి కల్పన- అను అవగాహనతోనే దర్శించటమే ఉచితం సుమా!
చైతన్యము చిత్ అనే ఒకానొక స్వభావం కలిగి ఉంటోంది. అట్టి నిజ చిత్ స్వభావముచే చైతన్యము ఎచటెచట దేనిదేనిని ఎట్లెట్లు భావన చేస్తుందో, అదంతా అట్లట్లే అంతకాలం భాసిస్తూ ఉంటుంది. తిమిరరోగం కలవానికి (కనుగుడ్లు నిరంతరం చలించే దోషం కలవానికి) ఆయా వస్తువులు రెండు - రెండుగా కనిపిస్తున్నట్లు, అవిద్యచే చిదాత్మ ఏ భూగోళాదులను సంభావన చేస్తోందో అదంతా అట్లట్లే అనుభూతి పొందుతోంది. చైతన్యము “నీరు పల్లం వైపుగా ప్రవహించుగాక! అగ్ని ఊర్ధ్వంగా ప్రజ్వలించునుగాక!”... అని సంకల్పిస్తూ ఉండటంచేత అది అట్లే జరుగుచున్నది. అట్లాకాకుండా చిదాత్మ “నీరు పైకి ప్రవహించునుగాక! అగ్ని అధోభాగంగా జ్వలించునుగాక!” ...అని సంకల్పించి ఉంటే... అది అట్లే ఉండేదికాని, అన్యంగా ఉండేది కాదు!
+
కాబట్టి ఆయా వాదుల బుద్ధిని అనుసరించి "ఈ భూగోళం, వస్తువులు, జనులు, నక్షత్రాదులు మొదలైనవి ఉన్నాయి”... అనేది తదనుకూలంగా (భావానుకూలంగా) అనుభవమౌతోంది. అట్లా కాకుండా “వాయువే అగ్ని అవుతోంది. అగ్నియే ద్రవంగా అవుతోంది. ద్రవమే ఘనంగా అవుతోంది. వస్తువు యొక్క వర్తమానపు నామ రూపాలు ఆ వస్తువు యొక్క ఒకానొక స్థితియేగాని, వస్తువు యొక్క వాస్తవ రూపం కాదు. అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించే సర్వ వస్తుజాలం కూడా! నక్షత్రాలు - భూగోళం - తదితర పదార్థాలు అట్టివే! లోకాలు, దేహాలు కూడా అట్టివే!”... అని ఎవరైనా భావిస్తే ఇది అట్లే అనుభూతమౌతుంది. ఎవరి అనుభవం వారికి సత్యమే!
ఉదాహరణకు ...ఈ భూగోళం... కొందరికి నిశ్చలమైన సుదీర్ఘ ఖండంలా అనిపిస్తోంది. మరికొందరికి అనేక దృశ్య విశేషాలతో అగుపిస్తోంది. శాస్త్రార్థములు హృదయస్థం చేసుకొన్న ఆత్మజ్ఞానికి ఇదంతా తన రూపమమేనని అనిపిస్తోంది. ఎవరు దేనిని ఏ దృష్టితో చూస్తే వారికి అది అట్లే సత్యముగా అనుభవమౌతోంది.
కాబట్టి రామచంద్రా! ఈ నక్షత్ర మండలము - భూగోళము - మనం చెప్పుకునే లోకాలోక పర్వతము ... ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించే కొండరాళ్ళవలె అసద్రూపమే అయినప్పటికీ... చైతన్యము యొక్క భావనను అనుసరించి "భూ మండలం - నక్షత్ర మండలం - వస్తుజాలం - జలాదులు” సదా భాసిస్తున్నాయి. కనుక మనం చెప్పుకునే ఆయా వస్తు సంబంధ విశేషాలన్నీ
Page:305
మనకు సత్యమని అనిపించటం మనయొక్క భావనారూప దృష్టి చేతనే. దృష్టియే సృష్టిరూపంగా అనుభూతమౌతోంది.
ఇక బ్రహ్మకల్పితమైన బ్రహ్మాండము యొక్క విశేషాలు కొన్ని ఇక్కడ తెలియజేస్తాను.
ఈ భూమి అతి విస్తారమై లోకాలోక పర్వతం వరకు విస్తరించి ఉన్నది. అటుపై వలయ ఆకారంగా ఉండే ఒక పెద్ద కందకం “0” ఆకారంలో ఉన్నది. ఆ కందకమంతా లోన మహాసముద్రం లాగా అంధకారం వ్యాపించి ఉన్నది. ఆ పర్వతశిఖరం మధ్యలో కొంచెం సూర్యకాంతి ప్రసరిస్తోంది.
ఆ మహా పర్వతం అత్యంత ఎత్తైనది. ఇక నక్షత్ర మండలం అద్దానికి ఉపరి భాగంలో సుదూరంగా ఉన్నది. అందుచేత అక్కడ కొంత ప్రదేశం అంధకారబంధురం, మరికొంత విభాగం ప్రకాశయుక్తమైనది. అందుకే అయ్యది "లోకాలోక పర్వతం" ... అనే పేరుతో ప్రసిద్ధమైయున్నది.
ఆ పర్వతం చివర ఆకాశమండలంలో పది దిక్కులలోను నక్షత్ర చక్రం తిరుగుతోంది. ఒక్క ధ్రువ నక్షత్రం తప్ప మిగతా నక్షత్రాలన్నీ ఆ లోకాలోక పర్వతం చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. భూలోకానికి ఆకాశం రెండింతలుగా ఉంటే, నక్షత్ర మండలం నాలుగింతలు కనిపిస్తుంది.
ఓ రామచంద్రా! మాయతోకూడిన బ్రహ్మము యొక్క సత్య సంకల్పరూపమగు స్ఫురణయే బ్రహ్మాండరూప జగత్తు అయివున్నదని గ్రహించు. ఆ నక్షత్రములకు ఆవల మరికొంత ఆకాశం ఉన్నది. ఆ ఆకాశము యొక్క చివర క్రిందగా బ్రహ్మాండ కపాలము నూరుకోట్ల యోజనములు విస్తరించియున్నది. ఆకాశమునకు ఈ చివర - ఆ చివర బ్రహ్మాండ కపాలాలు ఉన్నాయి. వాటి యొక్క అంచులలో అంధకార కంధరాలు ఉన్నాయి. మధ్యలో కూడా ఆకాశం ఉన్నది. శ్రీరాముడు : మహాత్మా! ఈ బ్రహ్మాండ కపాలాలలో మొట్టమొదటిది ఏది? చిట్టచివరిది ఏది? ఆకాశ విభాగానికి అంతు ఎక్కడ?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మహాభూగోళాకారమగు ఆకాశంలో సూర్య చంద్రాదులతో కూడిన జ్యోతిశ్చక్రాలు అన్ని దిక్కులలోను స్థితిపొంది ఉన్నాయి. అట్టి అసంఖ్యాక జ్యోతిశ్చక్రాలలో ఒకనొక బ్రహ్మాండంలో ఈ భూమండలం ఒకానొక చిన్న విభాగంగా అమరి ఉన్నది. శూన్యాకారమగు ఆకాశంలో ఊర్ధ్వం ఎక్కడ? అధోభాగం ఎక్కడ? ఒకవేళ అవి ఉంటే... అన్నీ ఊర్ధ్వమే! అన్నీ అధోభాగమే!
ఈ పృథివి మొదలైన వాటి యొక్క ఉత్పత్తి, భ్రమణం, స్థితి వ్యవహారాలన్నీ కూడా చైతన్యము యొక్క ప్రతిభా మాత్రములేనయ్యా! అనగా... వాస్తవానికి ఉత్పత్తి - స్థితి - - పతనము - గమనాగమనములు... ఇవన్నీ వాస్తవానికి లేవు. అద్వయమగు స్వస్వరూప చిదాకాశము మాత్రమే సర్వదా సర్వత్రా సర్వాతీతమై ఏర్పడి ఉన్నది.
Page:306
10. బ్రహ్మమే బ్రహ్మాండరూపంగా కనిపిస్తోంది
శ్రీరాముడు : హే వసిష్ఠ మహర్షీ! మీరు వర్ణిస్తున్న బ్రహ్మాండ కపాలం, జ్యోతిశ్చక్రం, లోకాలోక పర్వతం ఆ పైగల అంధకార బంధురం మొదలైనవన్నీ మీరు భౌతికంగా ప్రత్యక్షంగా, చూచారా? లేక అనుశ్రుతంగా విజ్ఞుల గ్రంథాదులనుండి విని ఉన్నారా? లేక అవన్నీ మరొకరి అనుభవాలా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవన్నీ మేము ప్రత్యక్షంగా చూచినవే! అనుమానం మాత్రం కాదు. అయితే అవన్నీ స్థూల దేహంతో చూచినవి కావు.
శ్రీరాముడు : స్వామీ! వాటిని స్థూలదేహంతో చూడలేదంటున్నారు. ఇంతలోనే వాటిని స్వయంగా ప్రత్యక్షంగా చూచినవేగాని ఆ నోట - ఈ నోట విన్నవి కాదని కూడా చెప్పుచున్నారు. ఈ స్థూల దేహంతో కాకపోతే, మరి మీరెట్లా వాటిని చూచారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నేను చెప్పిన జ్యోతిశ్చక్రం - బ్రహ్మాండ కపాలం మొదలైనవన్నీ ఈ జగత్ స్వప్నంలోనే ప్రసిద్ధమై ఉన్నాయి. వాటిని మా వంటి ప్రతివాహక ధారణ యోగులు (మానసిక శరీరం ధరించి సంచరించగలిగే యోగులు) ప్రత్యక్షంగా గాంచగలిగేవే! అట్టి సందర్శనం చేసియున్న స్థూలదేహధారణాయోగులు అనేకమంది మన ఈ సభలో ఉన్నారు. వారందరికీ కూడా అనుభవైక వేద్యమే! ఇంకా అనేక బ్రహ్మాండాలు ఇటువంటి లక్షణాలతోను, మరికొన్ని ఇందుకు వేరైన లక్షణాలతోను ఉన్నాయనునది మా యొక్క దైనందిన అనుభవమే సుమా!
అయితే... ఈ జగత్ స్వప్నంలోని తదితర బ్రహ్మాండముల గురించి చెప్పుకొంటూ పోతూ ఉంటే ప్రయోజనమేమున్నది? బుద్ధిమంతులు ఆత్మజ్ఞానము గురించి మాత్రమే ఆకర్షితులౌతారు గాని... ఆయా జ్యోతిశ్చక్రాది విశేషాల గురించి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వరు. స్వప్నంలో విశేషాల గురించి (అది స్వప్న మాత్రమేనని గ్రహించిన తరువాత) ఎవరూ సుదీర్ఘంగా విచారణ చెయ్యరు కదా! ఇది కూడా అట్టిదే!
ఈ బ్రహ్మాండమునకు ఉత్తరంలో మేరు పర్వతం దక్షిణమున లోకాలోక పర్వతం... ఇటువంటి చర్చనీయాంశములు... ఎవరికైతే ఈ సమస్త భూత సముదాయము పట్ల జిజ్ఞాస ఉంటుందో... వారే దానిని పరిశీలించనీ. అట్లా పరిశీలించే వారికి అవన్నీ గోచరమౌతాయి కూడా!
అయితే...ఈ బ్రహ్మాండము బాహ్యమునకు వెళ్ళి దర్శించగలిగినవారికి అవన్నీ పెద్ద విషయములు విశేషములు కావు.
❖
ఇక మనం విచారిస్తూ ఉన్న ప్రస్తుతాంశమునకు వద్దాం. ఏ బ్రహ్మాండ కపాలం గురించి మనం చెప్పుకుంటున్నామో... అద్దానికి ఆవల పదిరెట్లు జలవిభాగం ఉన్నది. ఆ జలవిభాగాన్ని పార్థివ విభాగం తన యొక్క ఆకర్షణ శక్తిచేత ధరిస్తోంది. అనగా... జల విభాగాన్ని పార్థివ విభాగం తన వైపు ఆకర్షిస్తోంది.
Page:307
ఆ జల విభాగమునకు ఆవల ఇంధన రహితమైన అగ్నివలె తేజోవిభాగం విస్తరించి ఉన్నది. ఆ తేజమునకు ఆవల అందుకు పదిరెట్లు వాయువిభాగం ఉన్నది. దాని కావల ఆకాశ విభాగం ఉన్నది. ఆ ఆకాశ విభాగమునకు ఆవల శాంతము, అనంతము అయినట్టి బ్రహ్మాకాశము ఉన్నది. ఆ బ్రహ్మాకాశము ప్రకాశము కాదు. అంధకారము కాదు. "అది నాశరహితమైన మహా చిదన రూపం”... అని కవులు వర్ణిస్తున్నారు.
ఓ రామచంద్రా! బ్రహ్మాకాశము ఆద్యంతరహితమైనది. సర్వాత్మ స్వరూపమైనది. నిర్వాణ ఘనరూపమైనది. అటువంటి బ్రహ్మాకాశంలో మనం చెప్పుకుంటున్న - చూస్తున్న బ్రహ్మాండాలు లక్షలు లక్షలుగా మరల మరల ఉత్పన్నములై పరస్పరం సంయోగ - వియోగాలు పొందుతూ, నశిస్తూ వర్తిస్తున్నాయి.
శ్రీరాముడు : మహాత్మా! సమము, స్వయంప్రకాశ రూపము అయినట్టి బ్రహ్మాకాశంలో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నం అవటానికి కారణం ఏమిటి? ఎవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బ్రహ్మాకాశంలో కనిపించే బ్రహ్మాండాలు బ్రహ్మాకాశరూపమే అయివున్నాయి. సముద్రంలో కనిపించే తరంగాలన్నీ వస్తుతః సముద్రజలమే కదా! తరంగాలకు ఆకారం ఉండవచ్చు. జలానికి ఆకారమంటూ ఏదీ లేకపోవచ్చు. అంతమాత్రం చేత తరంగాలన్నీ జలంగాక మరింకేమిటి? “సముద్ర జలంలో తరంగాలున్నాయి.... అనేది అర్థరహితం కాదా? ఎందుకంటే, సముద్ర జలమే తరంగాలుగా కనిపిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మాకాశమే బ్రహ్మాండా లుగా కనిపిస్తోంది. కాబట్టి బ్రహ్మాండలుగా కనిపించేదంతా బ్రహ్మమే! దృష్టి యొక్క నిర్మలతచే "బ్రహ్మాండాలుగా కనిపించేదంతా బ్రహ్మమయములే! బ్రహ్మ స్వరూపములే! సర్వము బ్రహ్మము నందే స్థితి కలిగి ఉన్నది" అని గ్రహించబడగలదు.
ఓ రామచంద్రా! ఈ విధంగా దృశ్యానుభవము యొక్క క్రమమంతా సందార్భనుసారంగా ఉన్నది ఉన్నట్లుగా వివరించాను. ఇక మన విపశ్చిత్ రాజు కథా విశేషాలు కొనసాగిద్దాం.
11. దృశ్యంగా కనిపించేదంతా నిర్మల బ్రహ్మమే!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ ఉత్తరదిక్కు విపశ్చిత్తు ఇతఃపూర్వపు "దృశ్యము యొక్క విస్తారం ఎంతవరకో తెలుసుకోవాలి” అనే అభ్యాసం చేత ప్రేరితుడై లోకాలోక పర్వత శిఖరాగ్రం జేరాడని అనుకున్నాం కదా! ఇక అటుపై ఆ శిఖరమునకు ఆవల గల అంధకారమయమైన గర్తములో కుతూహలంతో ప్రవేశించాడు. అట్లా ప్రవేశించగానే ఆ అంధకారంలో సంచరించే భయంకరమైన పరిమాణంలో ఉండే గుడ్లగూబలు ఆతని భౌతిక దేహంపై దండయాత్ర చేసి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. ఆ విపశ్చిత్తు మరణించినది అతి పవిత్రమైన ప్రదేశం అయిఉండటంచేత, ఆతని అంతః కరణం నిర్మలత్వం సంతరించుకొన్నది. ఒక ప్రదేశం అక్కడి మహనీయుల సంచార ప్రభావంచేత
Page:308
పవిత్రత సంతరించుకోవటం లోకప్రసిద్ధ విషయమే కదా! ఆ విపశ్చిత్తు, “భౌతిక దేహం లేకున్నప్పటికీ నా యొక్క మనోదేహంతో [సూక్ష్మ దేహంతో (లేక) ఆలోచనామయ దేహంతో] సృష్టి యొక్క అంతు ఎక్కడో జిజ్ఞాసపూర్వకంగా సంచారం - పరిశీలన కొనసాగించగలను” అని భావించటం చేత ఇక ఇతఃపూర్వంలాగా మరొక భౌతికదేహం గురించి స్మరించనే లేదు. అనగా... ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు స్థూల దేహమునకు పరమైనట్టి సూక్ష్మదేహము పట్ల ఆత్మబుద్ధి (నేను అది ...అను బుద్ధి) సంపాదించుకోగలిగాడు గాని, "స్థూల సూక్ష్మకారణ దేహములకు పరమైనట్టి శుద్ధ చిన్మాత్రమే నేను” ...అనే స్వస్వరూపాత్మ బుద్ధి ఇంకా సంపాదించుకోలేదు. అందుకే సూక్ష్మ (మానసిక) దేహంతో దృశ్యవిస్తార పరిశీలన కొనసాగించాలనే కార్యక్రమం కొనసాగించసాగాడు. ఆతని ఇతఃపూర్వపు దృశ్య జిజ్ఞాస (లేక) సంస్కారం చేత ఆతడు దృశ్య విస్తారం మరల జిజ్ఞాసా పూర్వకంగా సందర్శించసాగాడు.
శ్రీరాముడు : మహర్షీ! స్థూల దేహం లేకుండానే సూక్ష్మదేహం ప్రయాణించటం - పరిశీలించటం - సంచరించటం ...మొదలైన కార్యక్రమములను కొనసాగించగలదంటారా? మీరు చెప్పినట్లు స్థూల దేహం లేకుండానే మనోదేహం కౌతుకాదులతో సంచారం చేయగలిగినప్పుడు, ఇక సూక్ష్మ దేహం స్థూలదేహం కంటే విశేషమైనది ఎట్లా అవుతుంది? సూక్ష్మదేహం అధికమైన విశేషమైనది కాకపోతే "స్థూల దేహమునకు పరమైన మనోదేహం సంతరించుకొన్నాడు"... అని మీరు ఎందుకు అంటున్నట్లు?
శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃపురంలోని పడకగదిలో శయనించే రాజకుమారునికి మనస్సు (లేక ఆలోచనలు) ఒక గ్రామంలో తాను చూచిన సుందర స్త్రీ యొక్క గృహం వైపుగా మరలుచూ, ఆమె సుందరమైన ముఖమును దర్శించు రీతిగా... మన ఉత్తర దిక్కు విపశ్చిత్తు యొక్క మనోదేహం దిక్-దిగంతర దర్శనంలో నిమగ్నమై ప్రవృత్తమయింది. ఎద్దానిలో అయితే "ఊహ, భ్రమ, స్వప్నం, మనోరాజ్యం” ...అనేవి ప్రవర్తిస్తున్నాయో... అదే సూక్ష్మదేహం కదా! అట్టి సూక్ష్మదేహం స్థూల విశేషాలు మననం చేయటం చేత కాలక్రమేణా సూక్ష్మదేహ విస్మరణచే అద్దాని యందు స్థూలదేహ బుద్ధి ఉదయిస్తోంది. పాము యొక్క సంస్కార బలంచేత చీకటిలో త్రాడు పాముగా అనిపించి భ్రమింప జేయుచున్నట్లు... సూక్ష్మ దేహానికి స్థూల వస్తు-దృశ్య అనుభవం వచ్చి పడుతోంది. “ఇది త్రాడే”... అని తెలియగానే పాముకు సంబంధించిన చికాకులు, వికారములు తొలగునట్లు స్థూలదేహభ్రమ తొలగితే అప్పుడు సూక్ష్మదేహ రూపం శేషించగలదు.
ఆతివాహిక ఏషో అంగ నిపుణం ప్రవిచార్యతామ్
చిన్మాత్ర వ్యతిరేకేణ యావత్ అత్ర అస్యత్ అస్తి నో ॥
అట్టి సూక్ష్మ దేహంయొక్క స్వరూప స్వభావాలేమిటో... అతి నిపుణతతో విచారణ చేయాలి సుమా! ఎందుకంటే, ఈ మనోదేహం కూడా భౌతిక దేహంలాగానే మిథ్య మాత్రమే! చిన్మాత్రము కంటే అన్యంగా 'సూక్ష్మదేహం' అనుబడేదేదీ కించిత్ కూడా లేదు.
Page:309
శ్రీరాముడు : మహర్షీ! స్థూల సూక్ష్మ దేహాలు రెండూ భ్రమయేనని, వాస్తవానికి కించిత్ కూడా లేవని సిద్ధాంతీకరించుచున్నారు కదా! మరి మనందరి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఈ స్థూల - సూక్ష్మ దేహాలు ఎందుకు కనిపిస్తున్నాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : కనులు తెరిచి చూచినవానికి దృశ్యం కనిపిస్తుంది. కనులు మూసుకొని ఉన్నవానికి దృశ్యమే ఉండదు కదా! అట్లాగే... అజ్ఞానికి కనిపించే స్థూల సూక్ష్మ దేహాలు ఆత్మజ్ఞానము ఎఱిగిన తత్త్వవేత్తకు ఆత్మకు అన్యంగా కనిపిస్తున్నాయి.
ప్రతిజీవుడు సంవిత్ స్వరూపుడే! సంవిత్తును ఎట్లా సందర్శించటం? దేశాత్ దేశాంతర ప్రాప్తా యన్మధ్యే సంవిదో వపుః
చిన్మాత్రస్య అస్య తద్రూపమ్ అనంతస్య ఏకరూపిణః ॥
చిన్మాత్రము దేహరూపమూ కాదు. మనోరూపమూ కాదు. ఇక అద్దాని రూపము ఎట్టిది? ఈ ప్రశ్నకు చిన్మాత్ర దర్శనం చేసే మహనీయుల అనుభవపూర్వక సమాధానం విను.
ఈ బుద్ధి వృత్తి ఇంద్రియముల ద్వారా ప్రసరించి ఇంద్రియానుభవములను పొందుతోంది కదా! అట్టి ఇంద్రియానుభవమే ఆ బుద్ధి వృత్తికి 'జగత్తు' అనబడుదానిగా ప్రసిద్ధమగుచున్నది.
అనగా 'జగత్తు' అనబడేది “బుద్ధివృత్తి” యొక్క ఇంద్రియానుభవములు మాత్రమే! బుద్ధి అట్టి శబ్ద-స్పర్శాది ఇంద్రియానుభవములను జాగ్రత్తులోను, స్వప్నంలోను కూడా ఒకదాని తరువాత మరొకటి అనుక్షణికంగా పొందుతోంది.
అనగా ఈ జీవుడు ఒక అనుభవము తరువాత వెనువెంటనే మరొక అనుభము... ఒక ఆలోచన తరువాత వెనువెంటనే మరొక ఆలోచన... ఇట్లు
ఒక ఆలోచన - మరొక ఆలోచన; సంవిత్తు ఒక భావన - మరొక భావన; ఒకఅనుభవం - - మరొక అనుభవం... రెండింటి మధ్యగా నిర్విషయ సంవిత్తు ఉన్నది కదా! ఆ సంవిత్స్వరూపమే 'పరమాత్మ' లేక 'చిన్మాత్రము' యొక్క నిజస్వరూపం. ఇంకొక విధంగా చెప్పాలంటే...
ఈ రెండింటి మధ్యలో గల సంవిత్స్వరూపం (సత్+విత్ స్వరూపం)
ఒకడు ఒకానొక దృశ్యమును చూస్తూ, ఒక్కక్షణాల్పవిభాగంలో ...మరొక దృశ్యము వైపుగా చూపును మరల్చాడనుకో. ఒకవైపు చూడటానికీ ... మరొకవైపు చూడటానికీ, ఒక దృశ్యం చూడటానికీ, ...మరొక దృశ్యం చూడటానికీ... ఈ రెండు చూపుల మధ్యగా ఒకానొక నిర్విషయ స్వస్వరూపం ఉన్నది. అద్దానికి “నిర్విషయ సంవిత్తు" అని పేరుపెట్టారు.
సత్ ... ఉనికి, విత్... ఎఱుక ... అట్టి విషయ రహిత సంవిత్ అనునదే చిదాత్మ శరీరం. అదియే అందరి యొక్క ఆత్మదేహం. అది విషయాలు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉన్నది. అనగా ఒక విషయం ('చూపు'తో ప్రారంభం కావటం లేదు. అంతకుముందే అది ఉన్నది. విషయం
Page:310
(ఆ చూచే చూపు) అంతమైతే సంవిత్ అంతం కావటం లేదు. అందుచేత అది అనంతం. తెలుసుకునే విషయాలు వేరు వేరు జీవులలో వేరువేరుగా ఉండవచ్చుగాక! తెలివి, ఉనికి రూపంలో అది అంతటా సమంగా ఉన్నది. అది సర్వదా ఏకమేగాని అనేకం కాదు. అదియే సర్వ సాధనాల పరాకాష్ఠ, శ్రీరాముడు : అట్టి చిన్మాత్రం అనేక చిన్మాత్ర దేహాలుగా (జీవుల రూపంలో) అవుతోందా? లేక అది సర్వదా ద్వితీయమనేది లేకుండా ఏకంగా ఉంటోందా? ఏకమా? అనేకమా? ద్వైతమా? అద్వైతమా?
శ్రీ వసిష్ఠ మహర్షి :
క్వం ద్వైతం? క్వచ వా ద్వేషః? క్వ రాగాది తు కథ్యతామ్? సర్వం శివమ్ అనాద్యన్తం పరోబోధ ఇతి స్మృతః II
ఓ రామచంద్రా! సమస్తము పరమాత్మ రూపమే! ఈ కనబడేదంతా ఆద్యంతరహితము, శివరూపము, పరమబోధ స్వరూపము అయినట్టి సర్వాత్ముడగు చిదానంద తత్త్వమే అయి ఉండగా ఇక ద్వైతం ఎక్కడ? అద్వైతమెక్కడ? రాగమెక్కడ? ద్వేషమెక్కడ?
నిర్మనో మననం శాస్తమ్ ఆసితమ్ బోధ ఉత్తమః ఆతివాహిక దేహస్థో, న తం బోధమ్ ఉపాగతః ||
మనస్సు యొక్క మననం ఉపశమించినట్టి శాంతస్థితియే ఉత్తమమగు బోధరూపం. అదియే ఆత్మానుభవం.
+
మన ఉత్తరదిక్కు విపశ్చిత్తు “నేను భౌతిక దేహమాత్రుడను కాదు. భౌతిక దేహం లేకపోయినా నాకు ఉనికి ఉన్నది” .... అని గ్రహించి సూక్ష్మ దేహ మాత్రుడైనాడు. అయినప్పటికి ఇంకా కేవల బోధస్వరూపం (ఆత్మామ్ అనుస్థితి) సంపాదించుకోనేలేదు. అందుచేత అతడు “ఈ సూక్ష్మదేహమే నేను” అను సూక్ష్మ దేహాత్మబోధ కలిగి ఉన్నవాడై ప్రసరణశీలమగు మనస్సుతో లోకాలోక పర్వతమునకు ఆవలగల అంధకార కర్పరంలో ప్రయాణం కొనసాగించాడు.
అట్లా ఆ అంధకార కర్పరంలో సుదీర్ఘంగా ప్రయాణిస్తూ ఉండగా ఆ చివరగా ఆతనికి ఒకానొక భూవిభాగం కనిపించింది. ఆ భూవిభాగం వజ్రంవలె దృఢంగాను, సువర్ణ ఛాయలోను, కోటి యోజనాల విస్తీర్ణంగా ఒప్పుచున్నది. దానికి ఆవల ఎనిమిది రెట్ల విస్తీర్ణంలో జలవిభాగం కనిపించింది. అది కూడా దాటి దానికి ఆవల గల తేజో విభాగంలో ప్రవేశించాడు. ఆ తేజో విభాగంలో తన మానవ భావంతో కూడిన సూక్ష్మదేహంతో ప్రయాణిస్తూ క్రమంగా దాని కావల ఉన్న వాయువుల యొక్క ఆవరణను దర్శించసాగాడు.
అట్లా దర్శిస్తూ ఉండగా... “ఆహా! నాకిప్పుడు భౌతిక దేహం లేదు. కేవలం చిత్తశరీరం మాత్రమే ఉన్నది. చిత్తమాత్రుడనై ఎంతదూరం వ్యవహరించి ఏం ప్రయోజనం? ఈ భూ ఆవరణ, జలావరణ, తేజో ఆవరణ, వాయు ఆవరణల అనుభవం స్వప్నంలోని సంఘటనల దర్శనం వంటిదే కదా!”
Page:311
... అని అనుకోసాగాడు. ఇట్లా అనుకుంటూనే వాయు ఆవరణ కూడా దాటి ఆ వాయు ఆవరణకు పదిరెట్లు విశాలంగా ఉన్నట్టి 'ఆకాశం'లో ప్రవేశించాడు. “అయినా సరే! ఈ ఆకాశం ఎక్కడ మొదలౌతుందో... అద్దానిని ఈ సూక్ష్మ దేహంతోనే పరిశీలించెదనుగాక!” ... అని తలచి తన సూక్ష్మదేహంతో ఇంకా ప్రయాణం కొనసాగించసాగాడు.
ఆతడు క్రమంగా ...ఏదైతే ఆకాశమునకు ఆవల ఉన్నదో... దేనియందైతే ఈ సమస్తము ఆకాశాదులతో సహా ఏర్పడి ఉన్నదో... దేనియందు మహాపంచభూతాలు ఆవిర్భవిస్తున్నాయో... ఏది ‘దృశ్యం’ కాకపోయినప్పటికీ సమస్త దృశ్యము తానే అయి ఉన్నదో... అట్టి మాయా సమన్వితమైన బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు.
ఆతడు ఆ అనంత బ్రహ్మాకాశంలో మనస్సుతో సుదీర్ఘ సంచారం చేయసాగాడు. అయితే తన పూర్వ సంస్కారాల కారణంగా మరల మరల పృథివి, జల, తేజ, వాయు ఆవరణములను వాటి సంయోగ రూపములగు అనేక జగత్తులను మనోదేహంతో సందర్శించాడు. మరల మరల సృష్టులు, ప్రపంచరచనలు, దిశలు, పర్వతాలు, ఆకాశం, దేవతలు, మనుష్యులు ఆ బ్రహ్మాకాశంలో అనేక చోట్ల అనంత సంఖ్యలో కనిపించాయి. అట్టి సంచార సమయంలో పంచభూతముల చివర ఒకానొకచోట బ్రహ్మదేవుడు నిశ్చల స్థితిలో కనిపించాడు. మరల అచ్చట బ్రహ్మాండాలు, సృష్టులు, దిక్కులు, దేవ-భూలోకాలు కనిపించాయి. వాటిలో సంచరిస్తూ మరల బ్రహ్మాకాశం పొందాడు.
బ్రహ్మాకాశంలో మరల సృష్టులు, సృష్టుల కావల బ్రహ్మాకాశం... ఇట్లా చూస్తూనే... చిరకాలాభ్యాసమైనట్టి “సృష్టిక్రమం పరిశీలించాలి. వీటి అంతు ఏమిటో చూడాలి”... అనే ఉత్సుకత కొనసాగుచుండటంచేత, ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తు సూక్ష్మదేహంతో బ్రహ్మాకాశం - సృష్టులు సందర్శించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎంతగా వాటినన్నిటినీ దర్శించినప్పటికీ వాటిపట్ల అతనికి ఇంకా ఉత్సుకత కొనసాగుతూనే ఉన్నది కాని ఆతడు ఇప్పటికీ వైరాగ్యం పొందటమే లేదు.
ఇక్కడ ఒక పాఠ్యాంశం సభికులందరికీ మనవి చేస్తాను. ఈ జగద్రూప అవిద్యకు అంతమే లేదు. అట్టి జగత్తులలోని విశేషాలను చక్కగా మొదలంటా విచారణ చేశామా... “ఉన్నదంతా, ఉన్నదని అనిపించేదంతా బ్రహ్మమే”... అని తెలియగలదు.
వాస్తవానికి బ్రహ్మము వికల్పరహితం. అట్టి నిత్య నిర్మల బ్రహ్మమునందు “అవిద్య” అనబడేదే లేదు. ఈ దృశ్యం రూపంలోను, అవిద్య రూపంగాను స్ఫురిస్తున్నది బ్రహ్మమే! ఒకనికి ఏవేవి పదార్థ రూపంగా జాగ్రత్ - స్వప్నాలలో కనిపిస్తుందో అదంతా అట్లా కనిపించేది ఆతనియొక్క వాసనానుసారమే!
ఇతఃపూర్వం ఒకనికి కనిపించేది, ఇప్పుడు కనిపిస్తున్నది, ఇకముందు కనిపించబోయేది అంతా కూడా "బ్రహ్మమే వాసనా ప్రభావంచేత అట్లట్లు అనుభవమవటం" ... జరుగుతోంది. ఈ భూత-వర్తమాన-భవిష్యత్తు క్రమయుక్తమై ఏ జగత్తు నీకు భాసిస్తోందో... అది నీయొక్క (లేక బ్రహ్మము యొక్క) అవిద్యావిభాగమాత్రమే అయివున్నది.
Page:312
కళ్ళు మూసుకుంటే కారుచీకటి కనిపిస్తున్నట్లు (యథార్థానికి ఉన్నది వెలుతురులో అయినప్పటికీ, కళ్ళు మూసుకోవటం చేత కారుచీకటి కనిపిస్తున్నట్లు)... 'ఆత్మ సుజ్ఞాన నేత్రం' మూసుకొని ఉన్న మాయాజీవుని అజ్ఞాన నేత్రాలకు (ఏది మొదలంట లేదో ... మాయా) ... అట్టి ఈ మాయా పార్థివ జగత్తు అగుపిస్తోంది.
పరమగు చిన్మాత్ర దృష్టిచే... ఈ జగత్తు “సత్తు” కాదు. ప్రతిభాసాత్మరూప దృష్టిచే (అజ్ఞానుల దృష్టిచే) ఈ జగత్తు “అసత్తు" కాదు. ఈ జగత్తు అనబడేది సత్-అసత్ విలక్షణమై అనిర్వచనీయమగు రూపము కలిగి ఉన్నది. స్వకీయమగు “భావన” ను ఆధారంగా కలిగియున్నది. ఆత్మస్వరూపుడగు ఈ జీవునికి స్వకీయమగు భావనంతా అలంకారప్రాయము మాత్రమే!
కనుక రామచంద్రా! బ్రహ్మాకాశంలో సంచరించుచున్న ఆ ఉత్తరదిక్కు విపశ్చిత్తు తాను ఇతః పూర్వం గాంచినవి, వాటికి తదితరములూ అయినట్టి అనేక దృశ్య పరంపరలను వాసనానుసారంగా దర్శించటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. మహారణ్యంలో సంచరించే జింకలాగా ఆతడు స్వవాసనల యొక్క ఔన్నత్యానుసారం అనేక జగత్తులను దర్శిస్తూ మధ్యమధ్యలో తన్మయుడగుచు, ఇంతలోనే బ్రహ్మాండముల అంతును చూడాలని తిరిగి బయల్వెడలుచూ ...ఇట్లా సుదీర్ఘ సందర్శనము ‘విసుగు’ అనేది లేకుండా నిర్వర్తిస్తూనే ఉన్నాడు.
12. అవిద్య కూడా బ్రహ్మమే!
శ్రీరాముడు : హే మహర్షీ! ఆ విపశ్చిత్ మహారాజు అగ్ని భగవానుని వరప్రసాదంగా సంపాదించుకున్న నాలుగు దేహ విపశ్చిత్తులలో... ఒక విపశ్చిత్తు విష్ణు భగవానుని కృపకు పాత్రుడై ‘ముక్తుడు’ అయ్యాడు. ఇంకొక విపశ్చిత్తు బ్రహ్మాకాశంలో సూక్ష్మదేహంతో ప్రవేశించి ఇప్పటికీ అనేక మాయాజగత్తులలో సంచరిస్తూ 'అవిద్య' యందే తిరుగాడుచున్నాడు.
ఇంకా ...తూర్పు దిక్కు విపశ్చిత్తు చంద్రలోకంలో ప్రవేశించినంత వరకు చెప్పారు. దక్షిణదిక్కు విపశ్చిత్తేమో శాల్మలీ ద్వీపరాజ్యంలో రాజ్యం ఏలుచున్నంత వరకు చెప్పారు. వారిద్దరి తదనంతర విహారాదుల గురించి చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి :
దక్షిణదిక్కు విపశ్చిత్తు - ఈతడు శాల్మలీద్వీపంలో రాజ్యం ఏలాడు. అయితే, అక్కడి రాజ భోగాలు. సేవకుల స్తోత్ర - వినమ్రవచనాలు రాణి వాసపు సుఖ-సరసాదులు ఒకానొక సమయంలో విసుగు కలిగించాయి. సద్వర్తునికి తుచ్ఛ నారీజన సమాగంలాగా - అవి అరుచి కలిగించనారంభిం చాయి. ప్రతి జీవుడు ఎందుకు ఏ భావావేశంతో పుట్టాడో... ఆ మార్గమే అభిరుచిగా ఉంటుంది గాని... అన్య విశేషాలన్నీ కొంతకాలం అలరించినప్పటికీ, ఎప్పటికో అప్పటికి వాటిపై విముఖత
Page:313
కలుగకతప్పదు. మన దక్షిణ దిక్కు విపశ్చిత్తు కొంతకాలం తరువాత రాజ్యమును, సుందర స్త్రీలను పరిత్యజించి అక్కడి నుండి బయల్వెడలాడు. "ఈ సృష్టి ఎంతవరకు విస్తరించియున్నది?” ... అనే జిజ్ఞాసచే ఆవేశం పొందినవాడై సుదీర్ఘ ప్రయాణం కొనసాగించాడు. ఆతడు కూడా సప్తసముద్రా లను, లోకాలోక పర్వత శిఖరాలను అధిగమించి ఒకానొక చోట స్థూల దేహము త్యజించి సూక్ష్మ దేహంతో బ్రహ్మాకాశంలో ప్రవేశించాడు. ఆతడు కూడా ఉత్తర విపశ్చిత్తు లాగానే బ్రహ్మాకాశంలో అనేక బ్రహ్మాండాలను సందర్శిస్తూ సూక్ష్మదేహంతో 'అంతు' అనేది లేకుండా ఇప్పటికీ సంచారం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆతనికి 'అవిద్య' తనయందే గలదని గమనించకుండా ... ఈ “జగద్విద్య” అనే మాయాపటాటోపంలో ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ అనేక అనుభవములను, అనుభూతులను పొందుతూ, త్యజిస్తూ సుదీర్ఘసంచారం (ఉత్తరదిక్కు విపశ్చిత్తులాగానే) ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.
తూర్పుదిక్కువిపశ్చిత్తు - ఈతడు చంద్రమండలం ఆశ్రయించాడు కదా! చంద్రునిలోగల మృగముతో ప్రియత్వము కలవాడై ... అట్టి అధికాధికమైన స్నేహాభ్యాసం చేత అద్దానికి వశం అయినాడు. ప్రతి మాసము చంద్రునితో బాటుగా పరిభ్రమించే అనేక దేహాలు ధరించటం, త్యజించటం నిర్వర్తించాడు. కాలక్రమేణా, మృగయావినోదం చేత ఆతడు మృగమునకు సంబంధించిన సంస్కారములచే ప్రేరితుడై, ... ఒకానొకప్పుడు ఒక 'లేడి' దేహము ధరించి ఒక పర్వతముపై స్థితి - సంచారాలు పొందినవాడైనాడు. శ్రీరాముడు : ప్రభూ! ఆ నలుగురు విపశ్చిత్తులు "ఈ అవిద్యా జగత్తు యొక్క అంతు ఎచట” ... అనే రూపంలో ఉండే పరిశీలనా సంస్కారం మొట్టమొదట కలిగి ఉన్నారు కదా! ఇప్పుడేమో వారికి భిన్న భిన్న మార్గములు - ఫలములు వచ్చి పడుచున్నాయేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవుడు అనేక విధములైన వాసనలు కలిగి ఉండవచ్చుగాక! అయితే బాగుగా అభ్యసించబడిన 'వాసన'లలో ఏది అల్పదృఢత్వం కలిగి ఉంటుందో, అట్టిది దేశకాల క్రియావశంగా మరొక వాసనచేత త్రోసివేయబడుతూ ఉంటుంది. వాసనల దొంతర ఏది ముందుకు వస్తుందో ...ఏది వెనకబడుతుందో... ఆ వాసనల సొంతదారు అయిన జీవునకు కూడా తెలిసేది కాదుకదా! భావాలు, అభిప్రాయాలు, అనుబంధాలు, ఆధార, నిరాధారాలు, ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు... ఇవన్నీ మారిపోతూ ఉండటం, ఒకటి ముందుకు వచ్చి మరొక దానిని వెనుకకు త్రోయటం ప్రతిజీవుని యొక్క కొద్ది సంవత్సరముల జీవితకాలంలో అందరూ గమనిస్తున్న విషయాలే కదా! అన్నిటికీ అభ్యాసమే మూలకారణం.
భోగ్య ఫలానుకూలమైన దేశ కాల-క్రియా యత్నములనే సామాగ్రి యొక్క ఏకత్వం చేత భిన్న వాసనల యొక్క ఏకత్వం సంభవిస్తోంది. అట్టి దేశ - - కాల క్రియా యత్నములు మరొక రీతిగా భిన్న భిన్నమగుచుండగా ...ఏక రూపములైన వాసనలు భిన్నత్వం పొందుతూ ఉంటాయి.
ఒకనిలో ఒక సమయంలో రెండు మూడు వాసనలు ప్రదర్శితమగుచున్నప్పుడు వాటిలో ఏది సమయానుగతంగా ప్రబలమై ఉంటుందో... అది రెండవ దానిని వర్తమానంలో బలహీనపరుస్తూ
Page:314
ఉంటుంది. ఒకప్పుడు బలహీనమైన వాసన మరొకప్పుడు ప్రబలమై... ఇతఃపూర్వపు బలవత్తరమైన వాసనను బలహీనపరచటమో... దిగజార్చటమో జరుగుతూ ఉంటుంది.
ఆ నలుగురు విపశ్చిత్తులు ఏకకాలంలో ఒకే వాసన (లేక) సంస్కారం (లేక) స్వభావంతో ఒక్క ద్రష్ట నుండి ఉత్పన్నులయినప్పటికీ... విరుద్ధములైన దేశ కాలాదులలో అభిలాషతో భోగప్రాప్తి పొందటంచేత వివిధ వాసనాయుక్తులైనారు. భిన్న భిన్న ప్రయత్నములు, ప్రవర్తనములు వాటి వాటి ప్రయోజనములను పొందారు. అందులో ఒకడు నిర్వికల్ప ఆత్మతత్వంలో లయం పొందాడు. ఇద్దరు బ్రహ్మాకాశంలో దృశ్యములందు తత్పరులై దృశ్యము యొక్క ఆద్యంతములను పరిశీలించే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. నాలుగవవాడు ఒక 'లేడి' దేహము ధరించినవాడైనాడు. ఒక కొండ యొక్క ఎత్తైన శిఖరాగ్ర ప్రదేశంలో పచ్చికమేస్తూ తిరుగుచున్నాడు.
శ్రీరాముడు : స్వామీ! ఆ ముగ్గురు విపశ్చిత్తులు ఈ అవిద్యాజగత్తు యొక్క అంతమును ఎప్పటికి చేరగలుగుతారు? అసలీ దృశ్య జగత్తు ఎక్కడైనా అంతము కలిగియున్నదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలంటే ముందుగా నిన్ను మరొక ప్రశ్న అడగవలసి వస్తుంది. అవిద్య అనేది దృశ్యములో ఉన్నాదా? ద్రష్ట యొక్క బుద్ధిలో ఉన్నదా?
శ్రీరాముడు : ‘అజ్ఞానము' లేక 'అవిద్య' అనేది బుద్ధిలోనే ఉన్నది. దృశ్యములో కాదు. బ్రాహ్మీ దృష్టి కలవారికి దృశ్యము బ్రహ్మముగానే దర్శనమవగలదు. ఎవరు ఏ దృష్టితో ఈ ప్రపంచం దర్శిస్తారో వారికి అట్లే ఇది అనుభవమౌతోంది. ఈ జగత్తును దర్శించేవారు... వేఱు వేఱుగా సమన్వయించుకోవటం జరుగుతోంది.
“ఇదంతా ఇంతవరకు నాది. అంతవరకు నాది కాదు. ఇది నా అజ్ఞానము తొలగే నిమిత్తం పరమాత్మచే కల్పించబడిన పాఠ్యాంశం. ఇది కేవలం కల్పితం. ఇది అనేక సుఖములకు ఆలవాలం. ఇదంతా నా ప్రియమైన పరమాత్మయొక్క స్వరూపం. ఆయన దేహం. ఇదంతా ఆ పరమాత్మయే! ఇదంతా ఎవరికీ అర్థంగాని ఏదో వింత మాయాజాలం.” ... ఈ విధంగా ఎవరు ఏ బుద్ధితో చూస్తారో... వారికి ఆ విధంగా అనుభూతమౌతోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : చాలా బాగా చెప్పావు. కనుక భ్రాంతితో కూడిన బుద్ధిగల ఆ ముగ్గురు విపశ్చిత్తులకు భ్రాంతి ఉన్నంతవరకు అవిద్యాజగత్తు అనంతరూపముగా ఏర్పడి ఉండియే తీరుతుంది. భ్రాంతిని త్యజించనంతవరకు జన్మ-మృత్యు జరా - - దృశ్య - - అదృశ్య విషయములతో కూడిన ఈ అవిద్యా జగత్తుకు అంతు అనేది లేదు, ఉండదు, కనబడదు.
కనుక... అంతం కావలసింది జగత్తు కాదు. మరి ఏది?... బుద్ధిలో దాగి ఉన్న అవిద్య (లేక) భ్రాంతి.
క్షిప్రేణ శాంతా భవతి విజ్ఞానాలోక ఆగతే ॥ ఆమూలమేవ గలతి తిమిర శ్రీరివోదయే ॥ II
Page:315
ఒకడు కటిక చీకటిలో సంచరిస్తున్నాడనుకో. ఆ అంధకారానికి అంతు ఎక్కడ? సూర్యుడు ఉదయించేవరకు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే చీకటి క్షణంలో తొలగిపోతుంది కదా! అట్లాగే “విజ్ఞానము” అనే ప్రకాశము యొక్క రాక వలన అజ్ఞానంచే ఏర్పడిన అవిద్య అతిశీఘ్రంగా నశించిపోగలదు. కాబట్టి ఓ సభికులారా! వాల్మీకి మహర్షి విరచితంగా వసిష్ఠ-రామ సంవాద (యోగవాసిష్ఠ) భవిష్యత్ పాఠకులారా! అజ్ఞానము (లేక) అవిద్య తొలగటానికిగాను మీరంతా మీయందుగల విజ్ఞాన దీపకాంతిని ప్రవృద్ధ పరచుకోండి. దృశ్యము అధిగమించటానికి ఇంతకుమించి ఉపాయం లేదు. అట్లా కాకుండా.... పాంచభౌతిక జగత్తులో ఎంతగా జిజ్ఞాసతో వెతికినా.... అవిద్యకు అంతు ఉండదు.
శ్రీరాముడు : మహాత్మా! పశ్చిమదిక్కు విపశ్చిత్తు విదేహముక్తి సముపార్జించుకున్నాడు కదా! ఆతడు దృశ్యమండలము నుండి విముక్తుడు ఎట్లా కాగలిగాడు? విష్ణువుచే బోధించబడటానికి అర్హుడెట్లా అయినాడు? ఇది మరల ఒకసారి క్లుప్తంగా సమీకరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : పశ్చిమదిక్కు విపశ్చిత్తు ఈ మన సంసార భ్రమకు సంబంధించిన అన్యబ్రహ్మాండము నందు గల స్వాదూద సముద్రము యొక్క ఆవలి భాగంలో గల సువర్ణమయ భూమిలో ప్రవేశించటం జరిగింది కదా! అయితే, ఆ పశ్చిమ దిక్కు విపశ్చిత్తుకు దృశ్యరూపంగా సంప్రాప్తించినది... (అట్లాగే) ఏ జీవుడికైనా ఎక్కడైనా దృశ్యరూపంగా సంప్రాప్తిస్తున్నది, (అనగా), ... ఈ దృశ్యమానమయ్యేదంతా కూడా మహాబ్రహ్మాకాశమున బ్రహ్మము రూపమే అయి ఉండి ప్రాప్తిస్తోంది. ఆ పశ్చిమ విపశ్చిత్తు ఆ సువర్ణ మండలంలో సంచరిస్తూ ఒకానొక చోట శమము, దమము, భగవత్ భక్తి... ఇత్యాది శుభగుణాలు కలిగి ఉండి జీవన్ముక్తులగు మహాత్ములు నివసించే ప్రదేశంలో ప్రవేశించి వారితో సంసర్గం పొందటం జరిగింది. వారితో పెంపొందించుకొన్న స్నేహసేవాదుల ప్రభావం చేత ఆ జీవన్ముక్తుల బోధకు అర్హతపొందాడు. వారి వల్ల దృశ్యతత్త్వం పూర్తిగా ఎఱిగినవాడైనాడు. విష్ణు భక్తుడై తద్వారా విష్ణు దర్శనం పొంది ఆ భగవానుని కరుణకు పాత్రుడై నిర్మలబ్రహ్మరూపత్వం పొందాడు. ఆతని యందలి 'కామం' అను రూపంగా సుదీర్ఘకాలం ప్రకటిత మైన ఇతఃపూర్వపు అవిద్య, ‘దేహమే నేను' అనే దేహాత్మ భావం బ్రహ్మజ్ఞాన విభాగప్రభావం చేత మృగతృష్ణాజలంలాగా శమించిపోయాయి. (మృగతృష్ణలో జలమే ఉండదని గ్రహించబడినట్లు గమనించబడినదైనది).
“నేను ఈ దేహమాత్రుడను. నాకు ఏదో కావాలి”... అనే అవిద్య యొక్క రెండు చక్రాలు తొలగిపోవటంతో అవిద్య బుద్ధిని మోహభూములలోకి మోసుకుపోవటం సమసిపోనారంభించగా ...ఇక బుద్ధి విజ్ఞాన భూములలో వికసించింది. అందుచేత ఆతడు దేహ-కామ జాడ్యం మొదలంటా త్యజించినవాడై నారాయణ నామస్మరణాప్రభావంచేత ఆత్మజ్ఞానం పొంది దృశ్య వ్యవహారమంతటికీ అతీతత్వము సముపార్జించుకున్నాడు.
Page:316
ఓ రామచంద్రా! ఈ విధంగా ఆ నలుగురు విపశ్చిత్తుల యొక్క అవిద్యా దర్శన కుతూహలముతో కూడిన చరిత్ర నీకు విశదీకరించాను.
కార్యరూపమైన అవిద్య యొక్క అంతము ఆ ముగ్గురు విపశ్చిత్తులు దర్శించ జాలకున్నారు. కాబట్టి ఈ కార్యరూప అవిద్య కూడా కారణరూప బ్రహ్మమువలె 'అనంతమే' అయి ఉన్నదని గ్రహించావు కదా! కారణ రూప బ్రహ్మముచే పరిపూర్ణమై ఉండటంచే ఈ దృశ్య జగత్తు కూడా
అనంతమని గమనించు.
లక్షల లక్షల సంవత్సరాల క్రియా వ్యవహారాలు ఎక్కడ మనం గమనిస్తామో... అదంతా కూడా కారణ రూప బ్రహ్మము యొక్క అతి స్వల్ప విభాగం కూడా ఆక్రమించజాలదు. బ్రహ్మము ఎఱుగబడనప్పుడు ఆ బ్రహ్మమే... అవిద్య, మిథ్య, జగత్తు - మొదలైన పేర్లతో అవిజ్ఞులకు అనిపించటం జరుగుతోంది. ఎఱుగబడినప్పుడు ఈ దృశ్య వ్యవహారమంతా పరమశాంతమై ‘బ్రహ్మము'గా అనుభూతం అవుతోంది.
ఇదే మనం ఈ విపశ్చిత్ ఉపాఖ్యానంలో గమనించవలసినది సుమా!
దృశ్యము, బ్రహ్మము - ఓ ప్రియ సభికులారా! ఈ రెండింటికీ ఏ భేదము మీకు భాసిస్తోందో... అది స్వబుద్ధి యొక్క కల్పనా చాతుర్యమేగాని... వాస్తవమైన భేదం కాదు. ఎందుకంటే ఆ భేదంగా కనిపించేదంతా అవిద్యామయమే అయివున్నది. అవిద్యయో... బ్రహ్మం యొక్క రూపమే అయివున్నది. అవిద్యగా కనిపించేది చిదాభాసమే కాబట్టి ఆ భేదము ఒక లీల క్రీడ వలె చిద్రూపమగు బ్రహ్మం కంటే వేఱుకాదు. జ్ఞానం సముపార్జించుకోకపోవటమే అవిద్య యొక్క అనుభవానికి మూలకారణం. మన ఉత్తరదిక్కు విపశ్చిత్తు వందలకొలది యుగాలు సంచరించినప్పటికీ బ్రహ్మాండ మండప రూపమగు దృశ్యం యొక్క అంతం పొందక పోవుచుండటమే ఇందుకు మనకు దృష్టాంతము.
13. మృగ రూప విపశ్చిత్
శ్రీరాముడు : వక్తలలో శ్రేష్ఠుడగు ఓ మునీంద్రా! తూర్పుదిక్కు విపశ్చిత్తు తదితర ఇద్దరు విపశ్చిత్తులలాగా బ్రహ్మాండ కవాటంలో ప్రవేశించకుండా, భూమండల భూములలో ఎందుకు
ఉండిపోయాడు?
బ్రహ్మాండం, బ్రహ్మాండ కవాటం... ఈ రెండింటి భేదమేమిటో మీరు ప్రసంగంలో ప్రస్తావించ లేదు. ఈ రెండూ ఎట్లా సృజించబడ్డాయో, వాటి భేదమేమిటో విశదీకరించమని నా విన్నపం. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! పూర్వం బ్రహ్మదేవుడు జనించినప్పుడు బ్రహ్మాండములను తన యొక్క రెండు భుజాలతో రెండు విభాగాలుగా పైకి - - క్రిందికి చీల్చివేశాడు. అప్పుడు... పైభాగం... పైకి, క్రింది భాగం... క్రిందకు అతిదూరంగా జరిగాయి. జలావరణ, అగ్ని ఆవరణ ఆకాశ ఆవరణ మొదలైనవన్నీ పై-క్రింది భాగాలను ఆశ్రయించాయి. ఆ విధంగా ఉభయ కపాలములను
Page:317
ఆ ఆవరణలు అంటిపెట్టుకొని ఉన్నాయి. మనకు అపారంగా కనిపించే నీలవర్ణమే రెండు ఊర్ధ్వ అధోకవాటముల మధ్య ఉన్నది. అది 'ఆకాశము' అని చెప్పబడుతోంది.
అయితే... జలాది ఆవరణములు ఆకాశములో సంలగ్నమై ఉండనూలేదు. పరమార్థమున అవి విద్యమానములై లేవు. వాస్తవానికి ఆకాశం ప్రళయకాల పర్యంతము నిర్మలమై అత్యంత శూన్యమై, కానీ ఇతర భూములకు ఆధారమై ఒప్పుచున్నది.
ఈ ఆకాశాదులు, నక్షత్రాదులు మొదలైనవన్నీ అవిద్య యొక్క పరీక్షార్థమై దీక్ష తీసుకొని ఉన్నాయా? ...అన్నట్లుగా ఏర్పడినవై ఉంటున్నాయి. అవిద్య కూడా బ్రహ్మమయమే కాబట్టి... అదికూడా బ్రహ్మమువలె అనంతమే! బ్రహ్మమును ఎఱిగిన వానిపట్ల అవి స్థితి కలిగి ఉండవు.
ఎఱిగినప్పుడు అవిద్య లేనే లేదు. ఎఱుగనప్పుడు అవిద్య పొందజాలబడకయే ఉన్నది. తెలియబడనిదై ఉన్నది.
ఆ విపశ్చిత్తులు ఏదైతే ఎఱుగబడినప్పుడు ఉనికియే ఉండదో... అట్టి వాటిని ఎఱుగుటకై సుదీర్ఘ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఆ విధమైన అవిద్యా అధ్యయనం కొరకై... (ఏదైతే ఎఱుగబడినప్పుడు ఉనికియే కోల్పోతుందో... ఎఱుగబడనంతవరకు తెలియకయే పోతుందో) ఆ విపశ్చిత్తులు నలుగురు వెతుకుతూ పయనిస్తూ... ఒకడు ముక్తుడైనాడు. మరొకడు మృగరూపం (లేడి రూపం) పొందాడు. ఇద్దరు పూర్వపు మహాసంస్కారాలకు వశీభూతులై పరిభ్రమిస్తున్నారు. శ్రీరాముడు : స్వామీ! పై చెప్పిన వారిలో చివరి ఇద్దరు విపశ్చిత్తులు తమ సూక్ష్మ దేహాలతో అనేక బ్రహ్మాండాలు సంచరిస్తున్నారు కదా! వారు జననములు పొందుచున్న బ్రహ్మాండాలు మన ఈ బ్రహ్మాండానికి ఎంత దూరంలో ఉన్నాయి? ఏ మార్గంలో ఉన్నాయి? మనం అక్కడకు వెళ్ళవచ్చునా? లేక మీవంటి యోగులు మాత్రమే వెళ్ళగలరా? ఎందుకంటే మీరు చెప్పే వృత్తాంతమంతా అత్యంత ఆశ్చర్యకంగా ఉన్నది. అట్లాగే మృగరూపంలో ఉన్న విపశ్చిత్తు వృత్తాంతమేమిటో తెలియజేయండి. శ్రీ వసిష్ఠ మహర్షి : (కొంచెంసేపు మౌనం. ఆ తరువాత) ఆ అవిద్యా పారదర్శకులగు ఇద్దరు విపశ్చిత్తులు ఏఏ జగత్తులలో తమ సూక్ష్మ దేహయానం కొనసాగిస్తున్నారో, ఏమేమి అనుభవములు పొందుచున్నారో... అది ఎంతగా పరిశీలించినా కూడా, నా బుద్ధికి గోచరించటం లేదు.
ఇక మృగరూపం ధరించిన విపశ్చిత్తు ఏ బ్రహ్మాండంలో ఉన్నాడో... ఆ బ్రహ్మాండము, తదంతర్గతమైన జగత్తు కూడా నా బుద్ధికి సుస్పష్టంగా గోచరం అవుతోంది. శ్రీరాముడు : హే మహాధీమంతుడవగు ఓ మునీంద్రా! మృగరూపం పొందిన ఆ నాలుగవ విపశ్చిత్తు ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నాడు? ఆ ప్రపంచం ఇక్కడికి ఎంతదూరంలో ఉన్నది? ఆ ప్రపంచములోని మృగమును (లేడి రూపం దాల్చిన విపశ్చిత్తును) మేము చూడగలమా? మీరు మాకు ఆ లేడిని చూపించవచ్చునా?... మీ కథనంలోని మరికొంత నిరూపణకొరకై నేను ఈ అభ్యర్థన చేస్తున్నాను. మా అర్హతను అనుసరించి ఈ విషయాలు చెప్పవలసినదిగా నా విన్నపం. శ్రీ వసిష్ఠ మహర్షి : (కొంచెంసేపు కనులు మూసుకొని ధ్యాననిష్ఠలో గడిపినవాడై ... చిరునవ్వుతో కనులు మెల్లగా తెరచి... రామచంద్రా! మృగరూపం (లేడి రూపం దాల్చిన ఆ నాలుగవ
Page:318
తూర్పుదిక్ విపశ్చిత్తు ఇప్పుడెక్కడున్నాడో... అతి స్పష్టంగా గమనించాను. ఆతడు ఈ మన త్రైలోక్య జగత్తులోనే ఉన్నాడు. ఆతడు విపశ్చిత్తుగా జన్మించిన స్థానం ఇక్కడి నుండి అత్యంత సుదూరంగా ఉన్నది. అనగా, ఆతడు లేడిగా సంచరిస్తున్న ఆ పరబ్రహ్మాకాశము ఇదే!
శ్రీరాముడు : స్మామీ! మీరు చెప్పేది నాకు మరికొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ విపశ్చిత్తు వేరొక జగత్తులో నుండి కదా... దిగంత దర్శనం కొరకై బయలుదేరాడు? బయలుదేరి సప్తసముద్రాలు, దిక్కులు, బ్రహ్మాండాలు దాటిపోయాడని చెప్పియున్నారు కదా! ఇప్పుడు ఆతడు ఈ మన జగత్తులోనే మృగరూపంగా ఉండటమనేది ఎట్లా సమంజసం? ఏదో మరొక అత్యంత సుదూరంగా ప్రయాణిం చిన ఒక బాటసారి ఇప్పుడు ఈ జగత్తు - ప్రదేశంలోనే ఉన్నాడనటం ఎట్లా కుదురుతుంది? శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు 'అతి దూరం' ... 'అతి దగ్గర' అనే శబ్దాలు ఉపయోగిస్తున్నావు. అయితే, ఈ 'దూరం దగ్గర' అనే అనుభవం పరిచ్ఛిన్నాత్మదర్శులకే ఉంటుంది గాని... అపరిచ్ఛిన్నాత్మ దర్శులకు ఏ మాత్రం ఉండదని గ్రహించు.
ఉదాహరణకు... ఈ చూపుడు వేలు గోరుకు ఈ కాలి చిటికిన వేలుకు చాలా దూరం ఉండవచ్చుగాక! అవి రెండూ నా అనుభవం దృష్ట్యా నాకు దూరమైనవిగాని, దగ్గరైనవిగాని అనలేం కదా!... అట్లాగే నేను బ్రహ్మరూపమగు నా ఆత్మయందు సమస్త బ్రహ్మాండములు ఒక్కచోట నాయందే ఉన్నట్లుగా గాంచుచున్నాను. ఒకే వస్త్రానికి అనేక రంగు దారములున్నట్లు నా ఆత్మ అనేక బ్రహ్మాండములను అలంకారముగా కలిగినదై ఉన్నది. కనుక ఈ సర్వబ్రహ్మాండములన్నీ స్వస్వరూపంగా నేను వీక్షిస్తున్నాను. కనుక రామచంద్రా! ఆత్మదృష్టి సంపాదించుకున్నప్పుడు, ఆపై ఇక “వారు నాకు దూరస్థులు, వీరు నాకు దగ్గర వారు” ... అనేవన్నీ మౌనం వహిస్తాయి. మొదలంట రహితమై పోతాయి. ఒకే పూదండకు అనేక పుష్పములు గ్రుచ్చబడి కనిపిస్తున్నట్లు, నాకు భూత - -
వర్తమాన - - భవిష్యత్ బ్రహ్మాండాలు నాయందే నాచే ధరించిన పూదండవలె అగుపిస్తున్నాయి.
ఆ మన తూర్పుదిక్కు విపశ్చిత్తు భేదబుద్ధితో అనేక బ్రహ్మాండాలలో సంచరించి, ఇప్పుడు కాకతాళీయంగా మన ఈ బ్రహ్మాండములోని ఈ జగత్తులోనే 'లేడి' అయి సంచరిస్తున్నాడు. శ్రీరాముడు : అట్లా అయితే స్వామీ! ఆ పూర్వదిక్ సంచారకుడగు విపశ్చిత్ మహారాజు ‘లేడి’ దేహము దాల్చి ఈ మన జగత్తులో ఏ కొండపై పచార్లు చేస్తున్నాడో... ఏఏ సస్యసంపన్నమైన వనములలో గడ్డితుంపరలను మేస్తూ శిథిల జ్ఞానయుక్తుడై సంచరిస్తున్నాడో... ఆతడు ఎప్పటికి తన యొక్క పూర్వజ్ఞానస్థితిని సంస్మరించనున్నాడో... ఆ విషయములను వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! కొద్దికాలం క్రితం నీ పుట్టినరోజు నవమినాడు త్రిగర్త భూపతి నీకు కానుకగా ఒక సుందరమైన 'లేడి'ని బహూకరించాడు కదా!
శ్రీరాముడు : అవును. ఆ మృగము అంతఃపురంలో నా దగ్గరే పెరుగుతోంది. నేను ఆ లేడితో కూడి మా ఉద్యానవనంలో అప్పుడప్పుడూ విహరిస్తూ అద్దాని అమాయకపు బెదురుచూపులు చూచి హాస్యంగా లాలిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ లేడి మా అంతఃపురంలోనే ఉన్నది.
Page:319
శ్రీ వసిష్ఠ మహర్షి : అవునా! ఆ ‘లేడి’యే మనం కథారూపంగా చెప్పుకున్న తూర్పు దిక్కు విపశ్చిత్తు అయి ఉన్నాడు.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! ఆ మాటలు విని మన రామచంద్రమూర్తి అందమైన కళ్ళు ఆశ్చర్యంతో మిలమిలా మెఱిశాయి. వెంటనే దగ్గరగా ఉన్న కొందరు బాల స్నేహితులతో ఆ ‘లేడి’ని సభకు తీసుకురావలసినదిగా అప్పటికప్పుడే పలికాడు. వెంటనే సహబాలకులు వెళ్ళి ఒక ముగ్ద మృగమును (లేడిని) సభా మధ్యంలోకి తీసుకువచ్చారు. ఆ లేడి భయపడుచున్న చూపులతో చేయి విదుల్చుకొని అటూ - ఇటూ పరుగులు తీస్తూ ఇంతలోనే అక్కడి పచ్చల సింహాసనములను గడ్డి
పరకలనుకొని ఆశపడుతూ గెంతసాగింది.
ఆ లేడిని చూచిన అక్కడి మునులు, తదితర సభికులు ఇట్లా అనుకోసాగారు. "ఆహా! పరమేశ్వరుని మాయ ఎటువంటిది! భీకర సమరంలో తూర్పు దిక్కులోని రాజాధిరాజులను, మహారథులను నిరుత్తరులను చేసివేసిన ఆ విపశ్చిత్తురాజుయొక్క నాలుగవ రూపము అయినట్టి ఈ మహనీయుడు “ఈ పాంచభౌతిక సృష్టి ఎంతవరకు విస్తరించి ఉన్నది”... అనే చిత్త భ్రమావేశంతో బయలుదేరాడు. అగ్నిదేవుని వరప్రసాదంచేత అనేక దుర్భర స్థానాలలో నిర్భయంగా ప్రయాణించి... అగ్ని-జల-వాయు ఆవరణలలో అప్రతిహతంగా సంచరించి... చివరికి తన యొక్క మనస్సుచే మోసగించబడ్డాడు. ఆ చంద్రలోక ప్రవేశం సంపాదించుకుని కూడా, చివరికి శించి కూడా అక్కడి హరిణము (లేడి)చే ఆకర్షితుడై అట్టి సుదీర్ఘ సంస్కారం కారణంగా లేడి ఉపాధిని పొందారే! ఇంత అజ్ఞాని అయి తన ఆశయములన్నీ ఏమరచినారే! మనోదురభ్యాసం ఎంతటి ప్రమాదకరం! మరి ఈ జీవులు తమ మననాభ్యాసం యొక్క తదనంతర విపత్కర పరిణామాల గురించి కొంచెం కూడా శ్రద్ధ చూపకుండా గుడ్డిఎద్దు చేనులో పడినట్లు జీవిస్తున్నారు. 'అజ్ఞానంచే పొందబోయే అగచాట్లు అతిదుర్భరమైనవి. అంతులేనివి'... అని ఈ ప్రియ వసిష్ఠ మహర్షి సంవాద సమయంలో అనేక సందర్భాలలో మనలను హెచ్చరించినదానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం కాబోలు!”
ఇట్లా... సంభాషించుకోసాగారు. ఆ సభలోని అందరి కళ్ళు ఆ లేడిపైనే ప్రసరించి ఉన్నాయి. అది ఒకానొక బలిష్ఠుడైన రాజసేవకుని చేతులచే పట్టుకోబడి భయముతో కాళ్ళు చేతులు కదులుస్తూ, బిత్తర చూపులు చూస్తోంది. ఇక సభికులంతా... "ఆహా! 'ఇక మనం జ్ఞానులమైనాం లే!' అని మురిసిపోయి, మనస్సు యొక్క దృశ్య సంబంధమైనట్టి సుదీర్ఘ మననాన్ని పట్టించుకోకపోయామా... ఇక మన తదనంతర ఉపాధుల గతి ఈ విధంగానే దుర్గతి పట్టనున్నది కదా! మనకు ఆత్మజ్ఞాన సమాచారం ఎంత ఆవశ్యకం!" అని అనుకోసాగారు. మరల మరల శ్రీ మహర్షి వసిష్ఠుల యొక్క విశ్వామిత్రుల యొక్క పాదార విందములను మననము చేస్తూ, సద్గురువులై ఆత్మ జ్ఞానమును ప్రసాదిస్తున్న ఆ ఇరువురికి అంతరంగంలో కృతజ్ఞతలు చెప్పుకోసాగారు.
Page:320
14. నాలుగవ విపశ్చిత్ - - పూర్వ ఉపాధి ప్రాప్తి
ఆ నాలుగవ విపశ్చిత్తును చూస్తూ ఉన్న రామచంద్రుడు కాసేపు బుగ్గలపై చూపుడు వేలు ఉంచుకొని యోచనాముద్రలో గడిపాడు.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరామచంద్రుడు అత్యంత ఆశ్చర్యంతో "ఆహా! మహావీరుడు, అగ్నిదేవుని ఆరాధకుడు, దృశ్యజగత్తులోగల అనేక సంక్లిష్ట ప్రదేశాలలో కూడా సంచరించగల శక్తి యుక్తులు కలవాడు, దృశ్యము యొక్క విస్తారం ఎంతవరకో దర్శించాలనే కుతూహలం కలవాడు అగు విపశ్చిత్తు ఇప్పుడు ఈ లేడి దేహంతో తన్మయుడై ఉండటం ఎంత ఆశ్చర్యం! మాయయొక్క పర్యవసానం ఎంతటి చమత్కారమైనది!” ...అని తలచసాగాడు.
అటు తరువాత లోక గురువగు శ్రీవసిష్ఠ మహర్షి వైపు చూచి వినమ్రతతోను, సంభ్రమ ఆశ్చర్యాలతోను రామచంద్రుడు ఇట్లు పలుకసాగాడు.
శ్రీరాముడు : ఓ మునీశ్వరా! మహనీయుడు, అసామాన్యమైన ఆశయశీలి అగు నాలుగవ విపశ్చిత్తు తన ఆశయమును, విజ్ఞానమును, ఉపాసనలను ఏమఱచి ఈ విధంగా లేడి దేహంతో తన్మయుడై దేహాత్మబుద్ధిచే పీడితుడగుచుండటం నాకు దుఃఖాన్ని కలుగజేస్తోంది. మృగదేహధారియగు విపశ్చిత్తు తిరిగి తన తపో శరీరం పొందటానికి ఏదైనా ఉపాయం ఉన్నదా? ఆత్మజ్ఞానము కలుగనంతవరకు జీవుడికి దుఃఖ రాహిత్యం కలుగదు కదా! నేను ప్రియంగా ఆడుకుంటూ ఉండే లేడి మృగానికి దేహతాదాత్మ్య దుఃఖం తొలిగే మార్గం చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎవడు ఏ ఉపాసనా మార్గంలో ప్రయాణిస్తున్నాడో... ఏ ఉపాసన ద్వారా అభిలషితమైనది సిద్ధించుకున్నాడో... ఆ ఉపాసనా దైవం యొక్క కృపచేతనే మరల తదనంతర అభిలషితం కూడా నెరవేరుతూ ఉంటుంది. మరొక్క విషయం! ఈ దృశ్య సంబంధమైనవేవీ జీవునికి తృప్తి - శోభ - సుఖము కలిగించలేవు. ఈతడు ఇతఃపూర్వం అగ్నిదేవుని ఉపాసించి, దిగంతమూ దర్శించాలనే అభిలాషతో ఆయన కరుణచే దివ్యశరీరం పొందాడు. అట్టి జగత్ ఆసాంత దర్శనం పూర్తి కాకుండానే స్వకీయమైన మనోభ్రమచే పరాజితుడై ఇప్పుడు “ఈ లేడి దేహమే నేను” అనే దేహాత్మ భావనలో చిక్కుకుని పరవశిస్తున్నాడు.
అందుచేత ఈతడు ఆ అగ్నిదేవుని యొక్క దర్శన ప్రవేశములచే తన ఇతఃపూర్వపు విపశ్చిత్ దేహం పొందగలుగుతాడు. కనుక ఇప్పుడు నేను అగ్నిదేవుని ఆరాధించి ఆహ్వానిస్తాను. ఆయనలో ఈతడు దేహ ప్రవేశం పొందితే తిరిగి ఆ అగ్నిదేవుని ప్రేమాస్పదమైన స్పర్శచేత పూర్వ దేహం పొందుతాడు. ఇదంతా ఇక్కడే నేను ప్రియ శిష్యుడవగు నీ అభీష్టం నెరవేర్చటానికి సిద్ధింపజేస్తాను
చూడు.
❖
Page:321
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! బ్రహ్మర్షియగు ఆ వసిష్ఠుడు ఇట్లా పలికి కమండలంలోని పవిత్ర జలంతో అప్పటికప్పుడే ఆచమనం చేసి, అంగన్యాస, కరన్యాసాలతో అగ్నిదేవుని భక్తితో ఉపాసించాడు. సృష్టి అంతా ప్రసరించి ఉన్న ఆ అగ్ని భగవానునికి మనోకరాలతో ధ్యాన, ఆవాహ నాది షోడశోపచారాలు సమర్పించాడు. ఆ భక్తి ధ్యానాదులకు సంతసించిన అగ్ని భగవానుడు ఇంధన రహితుడైన (కట్టెలు మొదలైన ఉపకరణాలు లేనట్టి) జ్యోతి స్వరూపుడై అగ్ని జ్వాలాస్వరూపుడై ధగద్ధగాయమానంగా స్వచ్ఛ స్వరూపంతో సభామధ్యంలో ప్రత్యక్షమైనాడు. జ్యోతిస్వరూపుడగు అగ్ని దేవుని సభామధ్యంలో దర్శించి సభికులందరు అగ్నిదేవునికి ప్రణామాలు సమర్పించారు.
అక్కడగల హరిణం (లేడి) ఆ అగ్నిదేవుని దర్శించింది. మరుక్షణం ఇతఃపూర్వపు భక్తి ప్రపత్తులు ప్రవృత్తమైనాయి. అగ్నిదేవతా దర్శనముచే పాపం నశించిన ఆ మృగరూపిణి అగ్నిదేవునికి ప్రణమిల్లుతూ, తన ఇష్టదైవమైన అగ్ని భగవానుని పాదాలు స్పృశించాలనే ఇచ్ఛ పొందింది. అంతే! గబుక్కున రాజసేవకునిచేతిలోనుండి సింహంలాగా ఉరికి, ఒకదాటున ఆ అగ్ని జ్వాలలో ప్రవేశించింది. అది గమనిస్తున్న సద్గురువగు వసిష్ఠ మునీంద్రుడు తన దివ్యమైన దృష్టులచే ఆ మృగాన్ని మరింతగా పావనం చేస్తూ (పాపరహితం చేస్తూ), అగ్నిదేవుని ఉద్దేశించి ఇట్లు పలికారు. శ్రీ వసిష్ఠ మహర్షి : (లేచి నిలుచుని, సాష్టాంగ ప్రణామం సమర్పించి) ఓ హవ్యవాహనా! దేవాది దేవా! అగ్నిదేవా! మా ఆహ్వానం మన్నించి ఇంధన రహిత జ్వాలారూపుడవై ఈ సభా మధ్యానికి వేంచేసిన మీకు హృదయపూర్వక ప్రణామములు. స్వామీ! ఈ హరిణం ఇతఃపూర్వపు విపశ్చిత్తు ఉపాధిలో మిమ్ములను ఆరాధించి సేవించింది. ఇప్పుడు దేహతాదాత్మ్యముతో అనేక క్లేశములు అనుభవిస్తోంది. కరుణా సముద్రులగు మీరు ప్రేమతో ఈ జీవుని సముద్దరించి పూర్వ సంస్కారాలతో కూడిన విపశ్చిత్ దేహం ప్రసాదించమని మిమ్ములను వేడుకుంటున్నాను.
శ్రీ అగ్ని భగవానుడు : మహర్షుల వాక్యము సిద్ధించునుగాక! నన్ను సుదీర్ఘకాలం విపశ్చిత్ దేహంతో ఉపాసించి ఇప్పుడు ఈ హరిణదేహం నాకు సమర్పిస్తున్న ఈ నా భక్తుడు తన యొక్క ఇతఃపూర్వపు సంస్కారములు - తదనంతర జ్ఞాపకములతో సహా విపశ్చిత్ దేహధారి అగునుగాక! మీ జ్ఞాన యజ్ఞములోని పాఠ్యాంశములు నిరూపణలు పొందుచున్నవై ఈ సభికులకు, భవిష్యత్ జనులకు బ్రహ్మజ్ఞాన ప్రదమై పరిఢవిల్లును గాక!
ఇదంతా సభికులంతా తన్మయులై చూస్తున్నారు. క్రమంగా 'కాష్ఠరహిత జ్వాలాగ్ని'లో ప్రవేశించిన ఆ హరిణం రామచంద్రుని అభిలాషానుసారం సద్గురువు వసిష్ఠుని చల్లటిచూపులకు పాత్రతపొంది, అగ్నిదేవుని వరప్రసాదముచే ఆ జ్వాలా గర్భంలో హరిణ దేహం త్యజించింది. ఆ అగ్నిజ్వాలలలో నుండి సుందర ఆకారయుక్తుడు, ఆజానుబాహువు, ప్రకాశవంతమైన కనులు -
అవయవములు గల వాడు అగు ఒక సుందర పురుషుడు రూపు దిద్దుకున్నాడు. సూర్యమండలంలోని సూర్యునిలాగా, చంద్రమండలంలోని చంద్రునిలాగా ఆతడు ఆ అగ్నిజ్వాలలో నుండి బయల్వెడల సాగాడు. “అగ్ని అనే ఆధారం కలిగిన శక్తియే ఆ పురుషాకృతి దాల్చుచున్నదా?” ... అని అక్కడి సభికులకు ఆ దృశ్యం తలపింపజేసింది.
Page:322
ఇంతలో అక్కడి ఇంధనరహిత అగ్నిజ్వాల అంతర్ధానం కాసాగింది. అట్లా అగ్నిదేవుడు అంతర్ధానం కాగానే ఆ సభా మధ్యలో - దేవాలయంలోని దేవతా ప్రతిమలాగా, తెరనుండి వెలువడిన నాయక పాత్రలాగా - ఆ మహాపురుషుడు ప్రత్యక్షమైనాడు. ఆతడు రుద్రాక్ష మాలలు ధరించి, బంగారు యజ్ఞోపవీతము కలిగి, పవిత్రమైన తెల్లటి వస్త్రధారుడై దేవతాపురుషునివలె వెలుగొందుచూ ఉన్నాడు. సభాసదులు ఆతనిని చూచి, "ఆహాఁ! ఏమి ఈతని తేజస్సు! మహా ప్రకాశమానుడగుట చేత ఈయన ‘భాసుడు’ అని పిలుపుకు అర్హుడు" ... అని భాస నామధేయంతో పిలువసాగారు. ఇంతలో ఆతడు తాను ప్రకటనమైనచోటే పద్మాసనంతో ఆసీనుడైనాడు. సభికులంతా ...“ఆహా! భాసుని తేజో పుంజములతో సభాప్రాంగణమంతా వెలుగొందుచున్నది కదా!” అని పలుకసాగారు.
ఒక ముహూర్తకాలం ఆ విధంగా గడిచిపోయింది. సభాసదులచే 'భాసుడు' అనే పేరుచే పిలువబడుచున్న ఆ నాలుగవ విపశ్చిత్తు అట్లా ధ్యానంలో కొంతసేపు గడపిన తరువాత... తన పూర్వ వృత్తాంతం స్మరించి, ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో కనులు తెఱచి, లేచి నిలుచున్నాడు. నిలబడి యథాక్రమంగా ముని-రాజు-సామంతాదులతో కూడుకొనియున్న ఆ సభనంతా కలియచూచాడు. ఎదురుగా పూర్ణ చంద్రునిలాగా ప్రశాంతమైన రూపు - చూపులతో ప్రకాశిస్తూ, వసిష్ఠ మహర్షి ఎత్తుగా ఉన్న సద్గురు పీఠంపై ఆశీనులై ఉండటం గమనించి, చిన్నగా ఆయన వద్దకు అడుగులు వేయసాగాడు.
భాసుడు : సద్గురుస్థానం అలంకరిస్తూ, జ్ఞాన సూర్యునివలె ప్రకాశిస్తూ, సూర్యభగవానుడు లోకములకు ప్రాణధారం అయినట్లు నావంటి అజ్ఞాన జీవులకు జ్ఞాన - త్రాణలను ప్రసాదించే ఓ మహాత్మా! మీకు సాష్టాంగ దండ ప్రణామములు.
శ్రీ వసిష్ఠ మహర్షి : (ఆ భాసుని శిరస్సును వాత్సల్యపూర్వకంగా చేతి వ్రేళ్ళతో స్పృశిస్తూ) ... ఓ భాసనామధేయా! “జనవాక్యంతు కర్తవ్యమ్" ...అనునట్లుగా తేజో రూపుడవగు నీకు “భాసుడు” అని ఈ సభికులు పేరు పెట్టటం సముచితమే! నన్ను “వసిష్ఠుడు” అని పిలుస్తారు. నీవు అయోధ్యానగరం రాజసభామధ్యంలో అగ్నిదేవుని కృపచే ఇతఃపూర్వపు విపశ్చిత్ దేహం పొందినవాడవై భాసిస్తున్నావు. నీకు సుస్వాగతం. నీవు సమర్పించిన భక్తిపూర్వకమైన నమస్కారమును స్వీకరిస్తూ “అతి దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న అజ్ఞానం తొలగుగాక!” అని ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో ... ఈతడే అవతారమూర్తియగు శ్రీరామచంద్రుడు. లోక కళ్యాణార్థమై ఆశ్రితులను రక్షించి, దుష్ట శిక్షణ నిర్వర్తించే ఆశయంతో అవతరించిన ఈ పరమ పావనమూర్తి నా ప్రియశిష్యుడు, ఇక్కడి రాజకుమారుడు కూడా! అదిగో... ఆ రాజ సింహాసనంపై బ్రహ్మదేవునివలె అధిష్ఠించియున్నది సూర్యవంశ జాతకుడైన శ్రీ దశరథ మహారాజు ఈ అయోధ్యకు చక్రవర్తి.
ఇదిగో, ఈయనే బ్రహ్మర్షి - అసమాన ప్రజ్ఞా ధురంధరుడు, ఆశ్రితవత్సలుడు, ప్రేమస్వరూపుడు, లోకకళ్యాణమూర్తియగు విశ్వామిత్ర భగవానుడు. ఈయన ప్రోత్సాహంచేతనే ఇరవైరోజులుగా ఈ
Page:323
అయోధ్యా సభలో, నారదాది అనేకమంది మహనీయుల సమక్షంలో 'మోక్షశాస్త్రం' ఉపాసించ బడుతోంది. మీరు కూడా సుఖాసీనులు కండి. ఆయా మోక్షశాస్త్ర సిద్ధాంతముల నిరూపన నిమిత్తమై స్వానుభవ పూర్వకమైన మీ మధుర వాక్కులు వినాలని మేమంతా ఉవ్విళ్ళూరుచున్నాం.
శ్రీ భాసుడు : ఓ రామచంద్రా! వసిష్ఠ మహర్షి ప్రియశిష్యా! నీ అవతార సంపదకు సర్వదా జయమగుగాక! శ్రీ దశరథ మహారాజా! నమస్కారం! మీ కుమారుడైన ఈ రామచంద్రమూర్తిని దర్శించి నేను పునీతుణ్ణి అగుచున్నాను.
శ్రీ దశరథుడు :
స్వాగతం తే అస్తు భో రాజన్! ఇదమ్ ఆసనమ్ ఆస్యతామ్ | అనేక భవ సంభార భ్రాన్త విశ్రమ్యతామ్ ఇహ ॥
ఓ విపశ్చిత్ చక్రవర్తీ! భాసబిరుదాంకితా! మీకు సుస్వాగతం! రండి! దయచేయండి. ఈ సింహాసనంపై సుఖాసీనులవండి. అనేక జన్మలందలి సంసార భ్రమచే మీరు అలసిపోయి ఉన్నారు. ఈ ఆసనంపై విశ్రాంతి తీసుకొనెదరుగాక!
ఓ సభికులారా! సద్గురువగు వసిష్ఠ మహర్షి ఈ రోజు “అవిద్య అంతరంగంలో ఉన్నంతవరకు అవిద్యా జగత్తులకు అంతము ఉండదు” ... అని నిరూపించటానికి ఈ విపశ్చిత్ మహారాజును ప్రత్యక్షంగా మన కళ్ళముందు చూపించటం వర్తమానపు పాఠ్యాంశానికి నిరూపణమే అవుతోంది. కట్టుకొయ్యకు కంబమునకు బలమైన త్రాడుచే బంధించబడిన మదగజంలాగా ఈ విపశ్చిత్ మహారాజు అవిద్యచే చిరకాలం దృశ్యబద్ధులవడం జరిగింది. అనేక పాంచభౌతిక దేహపురాలలోను, బాహ్య పురములలోను ప్రవేశ - నిష్క్రమణములను కొనసాగించి ఉన్నారు.
ఆహా! 'సమ్యక్ జ్ఞానం' లేకపోవటమే అవిద్య. అట్టి అవిద్యారూపమగు అల్పదృష్టి యొక్క గతి అతిభయంకరమైనది కదా! ఈ అవిద్య 'చిదాకాశము' నందు అనేక సృష్టుల ఆడంబరమును దర్శించేట్లు చేయుచున్నది. అజ్ఞాన జీవబాటసారులవంటి మనలో అనేకుల సుదీర్ఘ దేహ-దేహాంతర ప్రయాణాలు ఇట్టివే కాబోలు!
ఆహా! ఈ భాసుడు సర్వవ్యాపకము - స్వస్వరూపము కూడా అయి ఉన్న నిర్మలాత్మ యందు అనేక జగదాడంబరములను సందర్శించియున్నాడు. వాస్తవానికి చిదాత్మ జగత్ రహితం. అయితే ఏం? ‘మాయ’ యొక్క స్వభావం ఇట్టిదే కదా! పరమాత్మఘనమగు చిదాకాశము వాస్తవానికి శూన్యమే (జగత్తు మొదలైనవి లేనట్టిది) అయినప్పటికీ... అది అజ్ఞాన దృష్టికి అనేక జగత్తులు ధరించియున్న దానివలె భాసిస్తోందే! ఏమి ఆశ్చర్యం!
‘ఈ విపశ్చిత్తు చూచిన అనేక జగత్తుల సంరంభము, ఆతడు ఆ ప్రయత్నంలో పొందిన అనేక క్లేశములు... అవన్నీ ఆత్మజ్ఞాన రాహిత్యముచే ప్రాప్తించినవి. భ్రాంతి రూపము, వ్యర్థము అయినవి’ అని నేను సద్గురు శ్రీ వసిష్ఠ మహర్షి వాక్యముల ద్వారా గ్రహించుచున్నాను. 'ఈ పాంచభౌతిక సృష్టి యొక్క అంతు చూడాలి”... అనే కుతూహలం (లేక కౌతుకం) చివరికి అనేక క్లేశములకే దారి
Page:324
తీయగలదని నేను ఈ 'సంవాద విభాగము' నుండి గ్రహిస్తున్నాను. 'ఆత్మజ్ఞానం' అనే ఔషధం మనం సేవించకపోతే మన ఈ వర్తమాన ఉపాధి వరకు కొనసాగిన ప్రయాణం కూడా ముందు ముందు ఇట్టిదే అత్యంత సుదీర్ఘం, అపారం, అంతులేనిది కాగలదని మనమంతా గ్రహించెదముగాక!
15. భావనాకల్పిత జగత్తు
శ్రీ వాల్మీకి : ఓ భరద్వాజా! దశరథ మహారాజు అట్లా చెప్పగా, విని ఆ ప్రక్కనే ఆసీనులై ఉన్న విశ్వామిత్ర మహర్షి ప్రసంగవశంగా ఈ విధంగా పలికాడు.
శ్రీ విశ్వామిత్ర మహర్షి : ఓ దశరథ మహారాజా! మీరు చెప్పింది పరమసత్యం. ఎవరు “ఆత్మజ్ఞానం” అనే ప్రజ్ఞను మానవ ఉపాధి చేజారకముందే తగినంతగా పెంపొందించుకోరో, సుదృఢపరచుకోరో, అట్టి వారు ముందుముందు పొందబోయే దేహ పరంపరలు ఈ రీతిగానే (ఈ మన ఈ విపశ్చిత్తు చక్రవర్తి పొందిన 'దేహ పరంరలు' అనే దౌర్భాగ్యంలాగానే) అనివార్యమై ఉండబోతున్నాయి. వాస్తవానికి అనేక మంది జీవులు ఈ ప్రకారంగానే తమ తమ వాసనలచే పరాభవించబడుచూ -
భ్రాంతి రూపములైన అసంఖ్యాక జగత్తులు సందర్శిస్తూ ఉండటం మేము సర్వదా గమనిస్తున్న దైనందిన విషయమే! ప్రజ్ఞాధురంధరుడై కూడా, ఈ విపశ్చిత్తు "ఈ అవిద్యా జగత్తు యొక్క విస్తారం తెలుసుకోవాలి” అనే మొండి పట్టుదలతో అంతులేకుండా ప్రయాణిస్తూ, తత్ఫలితంగా అనేక దుర్భర స్థితులన్నీ తెచ్చిపెట్టుకొని అనుభవించినట్లే... అనేక మంది జీవులు సంసార బద్ధులై సంచరిస్తు న్నారు. అట్టి ఉపాధి పరంపరా ప్రాప్తినే 'సంసారము' అనే పేరుతో శాస్త్రాలు పిలుస్తున్నాయి.
అసలు ఈ జగత్తులు, ఈ ఉపాధి పరంపరలు పొందటానికి మూడు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి.
1. "ఏదో పొందాలి! అనుభవించాలి” అనే కామబుద్ధి
2. "వీరు నా వారు. అవి నావి. వీరితో మరి కొంత అనుభవం కలిగి ఉండాలి” ...అనే భ్రమతో కూడిన మనో బాంధవ్యాలు.
3. “ఇదంతా ఏమి చమత్కారమో - ఎందుకో - ఎంతవరకో ఇంకా మనం తెలుసుకోవాలి” అనే మూర్ఖత్వముతో కూడిన కౌతుకము.
నాకు “వటధానులు” అనే పేరుగల ముగ్గురు రాజపుత్రులు తెలుసు. వారు కూడా "ఈ భూమి యొక్క అంతమును మేము చూడాలి” అనే మూర్ఖ కౌతుకమును ఆశ్రయించినవారై గత పదిహేడు లక్షల సంవత్సరాలుగా ఈ భూతలముపై తిరుగాడుచూనే ఉన్నారు. అనేక ఉపాధులలో ప్రవేశిస్తున్నారు, నిష్క్రమిస్తున్నారు. జన్మ - జరా - మరణ పరంపరలు పొందుచూనే ఉన్నారు. ఏం లాభం? వారికి ఈ భూమి యొక్క అంతు కనిపించటం లేదు. వారిలో ఆ కౌతుకం తరగటం లేదు.
Page:325
"అసలీ సృష్టి యొక్క (దృశ్యం యొక్క “వాస్తవ రూపం ఏమిటి?” ...అని మనం ప్రశ్నిస్తే వచ్చే
సమాధానం వినండి.
ఈ భూలోకం, భువర్లోకం మొదలైన చతుర్దశ భువనాల (14 లోకాలు) తో కూడిన మహత్తరమైన బ్రహ్మాండము వర్తులాకారంగా ఉన్నది. పైగా ఇదంతా కూడా "హిరణ్యగర్భుడు” అనే అల్లరి పిల్లవాని “ఊహలు | సంకల్పములు” అనే భావనాపరంపరలచే నిర్మితమైయున్నది. ఆతని సంకల్పములకు వేరైన రూపమేదీ ఈ బ్రహ్మాండమునకు లేనేలేదు. ఈ జీవుడు తన సంకల్ప పరంపరలచే ఆ మహాసంకల్ప పరంపరలందు ప్రవేశించి తిరుగాడుచున్నాడు.
ఓ సభికులారా! తేనె పూసిన బంతిని ఒకచోట ఉంచినపుడు పది వైపుల నుండి గండు చీమలు చుట్టుముట్టుతాయి చూచారా! అట్లాగే ఆకాశమునందు బ్రహ్మదేవునిచే ఊహానిర్మితమైన ఈ బ్రహ్మాండము అనే కందుకము (బంతి)ను ఆధారంగా చేసుకొని పది దిక్కులలోను జీవులు తిరుగాడుచున్నారు. ఇంద్రియములను వ్యామోహపరచే శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలే ఇక్కడి బ్రహ్మాండమునకు పూయబడిన తేనె.
ఈ భూలోకానికి ఊర్ధ్వ భాగంలో అనేక లోకాలు ఉన్నాయి. అధో భాగంలో మరికొన్ని లోకాలు ఉన్నాయి. అవన్నీ దశదిశలా విస్తరించి ఉన్నాయి. అవన్నీ ఈ బ్రహ్మాండము యొక్క దేహ విభాగాలని అనవచ్చు. అట్టి లోక పరంపరల యొక్క చివర ఎక్కడున్నదో చూడాలని ప్రయాణిస్తున్న వటధాన రాజకుమారులు ఇప్పటికీ ఊర్ధ్వ, అధో - పార్శ్వలోకాలలో సంచారం కొనసాగిస్తున్నారేగాని, వారికి ఈ బ్రహ్మాండము యొక్క అంతు కనబడటమే లేదు. ఈ లోకాలలోని జీవులందరు ఇట్టి స్థితినే కలిగి ఉండి అటు ఇటూ సంచరిస్తున్నారు.
అటు ఆకాశం జ్యోతిశ్చక్ర సహితంగా భూమిని గొడుగువలె ఆవరించి ఉన్నది. అంతరిక్షమునకు దశదిశలా ఊర్ధ్వ - అధోభాగాలు ఉన్నాయి. భూమికి పైన ఆకాశంలో పక్షులు ఎగురుచున్నాయి. భూమిపై అనేక లక్షల జీవ జాతులున్నాయి. భూమి యొక్క అధోభాగంలో అనేక కీటకాలు మనుగడ సాగిస్తున్నాయి.
అట్టి ఆయా అనేక లోకాలలో రకరకాల ఉపాధులు ధరిస్తూ, త్యజిస్తూ వటధానులనే ముగ్గురు రాజకుమారులు నాకు అక్కడా - ఇక్కడా తారసపడుతూనే ఉంటున్నారు. నా ఆప్తవాక్యాలు వింటూనే ఇంతలోనే యుద్ధ పిపాసులవలె కౌతుకం చంపుకోలేక ఈ మాయా జగత్తులో మరల మరల ప్రవేశిస్తున్నారు.
"ఏమయ్యా! ఎందుకీ భ్రమతో కూడిన సంచారం?” ...అని ప్రశ్నిస్తే ...“ఈ సృష్టి యొక్క అంతు చూడగలిగేంత వరకు మేము ఇకపై కూడా ఇట్లాగే సంచరిస్తాం” ... అని పలుకుచున్నారేగాని, నా ఆప్త (జ్ఞాన) వాక్యములు విని కూడా పరమార్థం గ్రహించటం లేదు. నన్ను అప్పుడప్పుడూ ఆశ్రయిస్తున్నప్పటికీ వారి హృదయములో నా జ్ఞానబోధ తగినంతగా ప్రవేశించటం లేదు.
ఓ సభికులారా! "బ్రహ్మదేవుని సంకల్ప మాత్రం - అనేక ఆడంబరములతో కూడినది” అగు ఈ మిథ్యారూప జగత్తు స్వప్న దృశ్యము వంటిది. ఇదంతా సంకల్ప జనిత అజ్ఞానం చేత అనంత
Page:326
రూపంగా శోభిస్తోంది. అయితే... అట్టి ఈ కల్పనా జగత్తు చైతన్యమే అధిష్ఠానంగా కలిగి ఉన్నది. అందు ఈ ‘జగత్తు’ అనబడేది కూడా చిద్రూపమే అయి ఉన్నది. జలమునకు - జలతరంగాలకు, వాయువుకు - వాయువీచికలకు భేదమేమున్నది? ఆకాశమునకు - శూన్యమునకు భేదమేమున్నది? అట్లాగే చిద్రూపమునకు జగత్తుకు... తెలివి - తెలియబడేది అనే రూపంచేత ఒకదానికి మరొకటి అభేదమే సుమా! చిన్మాత్రము యొక్క ఏ స్ఫురణ జగత్తుగా భాసిస్తోందో... అదంతా కూడా చిన్మాత్రము యొక్క అంగమే కాబట్టి చిన్మాత్రమునకు వేఱుకాదు. ఈ ఈ విధంగా “ఈ కనబడే జగత్తు పరమాత్మ యొక్క దేహమే కాబట్టి పరమాత్మకు వేఱుకాదు”... అనే అవగాహనను సభికులంతా పెంపొందించుకొనెదరుగాక! ఈ సృష్టియొక్క 'ఆది' యందు ఈ జగత్తు అభావ రూపంలో ఉన్నది. ఈ జగత్తు ఇపుడు కూడా శూన్యరూపమే!
చిదాకాశమొక్కటే ఉన్నది. ఆ పరబ్రహ్మరూపమగు చిదాకాశమే ఇప్పుడు స్వయంగా ఇట్లు జగత్ రూపంగా భాసిస్తోంది. వాస్తవానికి సృష్టిగాని, అద్దాని స్థితిగాని, ప్రళయంగాని చిదాకాశము కంటే ఏమాత్రం వేఱుకాదు.
అట్టి చిద్రూపము ప్రాణుల కామ - కర్మ - వాసనానుసారం ఎట్లెట్లు కల్పన చేయబడుచున్నదో, ...అట్లట్లు అనుభూతమౌతూ ఉంటోంది. వాసనానుసారం జగత్తుగా బ్రహ్మమునందు అధ్యస్థమై అనుభవమౌతోంది. “అన్యోన్యతాదాత్మ్యము” చే ఏర్పడే దృష్ట - అదృష్టములు (కనబడే జగత్తు · చూచే ద్రష్ట), జడ - చిద్రూపములు ...అనువాటితో కూడిన జగత్తు మొట్టమొదట (జగత్తు ఉదయించినప్పుడు) ఎట్లా ఉన్నదో... ఇప్పటికీ అట్లే ఉన్నది. ఇక ఎప్పటికీ ఇట్లే ఉండి తీరుతుంది.
"చిద్రూపమగు జీవుని అంగమే ఆతనిచే దర్శించబడే జగత్తు. నాచే దర్శించబడే జగత్తు నా యొక్క దేహాంగమే”... అని మీరంతా గ్రహించండి. ఈ విషయం ఈ మహనీయులగు వసిష్ఠ మహర్షి యొక్క బోధ వాక్యములు మనందరిని తట్టి లేపి బోధించుచుండటం ఇన్ని రోజులుగా గమనిస్తున్నాం కదా! ఈ శ్రీ వసిష్ఠ మహర్షి - - ఈయన ప్రవచనాలు మనకు కరుణామూర్తియగు పరమాత్మయొక్క వాత్సల్యరూపంగా మనందరికీ లభిస్తున్నాయి ఇదంతా మనందరి యొక్క జన్మజన్మార్జిత పుణ్యఫలంగా మనకు లభిస్తోంది.
'జగత్ దర్శనం' అనే సంఘటనలో రెండు పాత్రలు పాల్గొంటున్నాయి- 1. నాశనశీలమగు దృశ్యరూపం; 2. నాశనరహితమగు చిద్రూపం.
జనన మరణ రహితమగు పరమాత్మయే స్వయముగా ఇట్లు జగద్రూపంగా భాసిస్తున్నారు. వాస్తవానికి ఆతడు ఏ రూపంగానూ భాసించటంలేదు. పర్వతంలో శిలగా, బంగారంలో ఆభరణంలాగా, ఆకాశంలో నిర్మల ఆకాశాణువులలాగా... చిద్రూపమగు పరమాత్మ యందు జగదనుభవరూప పరమాణువులు స్థితి కలిగి ఉన్నాయి.
మాయావరణమును ఆభరణముగా ధరించిన పరమాత్మయందు అట్టి స్వభావముతోనే కూడిన ఈ సమస్త జగత్తులు వెలయుచున్నాయి.
Page:327
మాయా శూన్యము - శుద్ధ చైతన్య రూపము అగు అట్టి పరమాత్మయందు జగత్తులనబడేవేవీ ఏ క్షణంలో కూడా లేవు.
తదేవ ‘జగత్' ఇత్యుక్తం బ్రహ్మ భారూపమాతతమ్ |
పూర్వా - పర పరామర్శాత్ నిపుణం నిపుణాశయాః॥
నిపుణతతో కూడిన విచారయుక్తులగు ఓ సభికులారా! "బ్రహ్మ ప్రకాశరూపముచే వ్యాప్తమైనట్టి ఆ పరమాత్మయే (ఆభరణానికి బంగారంలాగా) అధిష్ఠాన దృష్టికి (ఆభరణదృష్టికి) సృష్టిలాగా (జగత్తువలె) కనిపిస్తున్నారు”... అని మేము పూర్వాపర విమర్శ చేసిన తరువాత స్వానుభవమును రంగరించి చెప్పుచున్నాం.
ఈ జగత్తు యొక్క రూపం పరమాత్మయే! పరమాత్మయే 'నేను'గా ప్రదర్శితమగుచున్నాడు. జగత్తులో 'పరమాత్మ' తప్ప మరింకేమీ లేదు. పరమాత్మ సర్వదా యథాతథమేగాని 'జగత్తులు' అనబడే దోషమేదీ ఆయనయందు లేదు. పరమాత్మయే మనలో ప్రతిఒక్కరి స్వరూపం నిత్యసత్యం.
అత్యాశ్చర్యమ్! అనష్టాం యమ్ పరమాత్ సదనాత్ స్వయమ్ | నానాత్వ బుద్ధ్యా నానైవ “జీవో2 హమ్” ఇతి తామ్యతి ॥
ఆహా! ఈ జీవుని నిజస్వరూపం పరబ్రహ్మమే! అది సర్వదా పరమాత్మతో ఐక్యము కలిగియే ఉన్నది. కానీ, ఈ జీవుడు నానాత్వ బుద్దిచే "నేను అల్పజ్ఞుడగు జీవుడను” ...అని తలచి దైన్యము పొంది దుఃఖించుచున్నాడే! ఇది ఏమి ఆశ్చర్యం!
'భాసుడు' అని ఈ సభికులచే నామకరణం చేయబడిన ఓ విపశ్చిత్ మహారాజా! మీ చరిత్ర ఏమిటో, అనుభవములు అనుభూతులూ ఏమిటో ఏఏ దృశ్యములు చూచారో, ఎచటెచట ఎంతెంతగా సందర్శించారో, ఆయా వృత్తాంతములలో ముఖ్యమైన విశేషాలు సంక్షిప్తంగా వివరించండి. ఇప్పటి వరకు బ్రహ్మర్షియగు ఈ శ్రీ వసిష్ఠులవారు మీ యొక్క అగ్నిదేవ ప్రసాదితమైన నాలుగు దేహాల ధారణ, అవిద్యాంతమును దర్శించే ఉబలాట-కుతూహలాలు, మీ దేహములలో ఒకటి దృశ్య విముక్తి పొందటం, రెండవ - - మూడవ సూక్ష్మదేహములతో బ్రహ్మాండ కపాలముల దర్శనం ఇప్పటికీ కొనసాగించటం, నాలుగవది చంద్రమండలములో ప్రవేశించి కాలక్రమేణా ఉబలాటముల కారణంగా ‘లేడి’ మృగదేహం పొందటం - - ఈ వివరాలన్నీ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు శ్రీ వసిష్ఠ - రామ సంవాదం రూపంలో ఆత్మశాస్త్రం శ్రీవసిష్ఠులవారిచే ప్రవచించబడుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అనుభవములను సభికులకు, ఆత్మజ్ఞాన నిరూపణా సంబంధంగా వివరించండి.
శ్రీ భాసుడు : ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకు మరొక్కసారి పాదాభివందనం సమర్పిస్తున్నాను. ఓ వసిష్ఠ మహర్షీ! వినమ్రుడనై నేను సమర్పిస్తున్న సాష్టాంగ దండ ప్రణామములను కరుణతో స్వీకరించండి. ఓ దశరథ మహారాజా! మీకు, మీ అయోధ్యా రాజ్య ప్రజలకు అగ్నిదేవుని కరుణచే శుభ శాంతి - ఐశ్వర్య - ఆనందములు సర్వదా కలుగుగాక! ఓ రామచంద్రా! నీ అవతారము లోకములకు వర్తమాన - భవిష్యత్తులందు అత్యంత శుభప్రదమగు గాక! శ్రీరామ నామం 'సంసార
Page:328
జాడ్యము’ అనే మనో నైర్మల్యమును తొలగించి మమ్ములను పరిశుభ్ర పరచునుగాక! ఓ సభికులారా! మీరు నాకు ప్రతిపాదించిన 'భాసుడు' అనే నామధేయమును వినమ్రుడనై స్వీకరిస్తున్నాను. ఈ వసిష్ఠ మునీంద్రుని ప్రవచనములు మీ హృదయములలో ప్రవేశించి పరిఢవిల్లును గాక! ఓ ప్రియ అగ్నిదేవా! నేను మిమ్ములను స్వల్పముగా మాత్రమే ఆరాధించియున్నాను. అయినప్పటికీ భక్త వాత్సల్యంతో నన్ను ఈ సభకు జేర్చినందుకు హృదయపూర్వకంగా హస్తద్వయంతో హృదయమును తాకుతూ నా ప్రియ ఇష్టదైవమైన మీకు నమస్కరిస్తున్నాను.
ఓ సభికులారా! ఇక వినండి. అవును. ఈ విశ్వామిత్రులవారు చెప్పినట్లుగా నేను ఈ అవ్యాకృతాకాశంలో సుదీర్ఘంగా ఎంతో దూరం ప్రయాణించాను. అనేక దేహాలు ఆశ్రయించి అసంఖ్యాకంగా సుఖదుఃఖాలు చిరకాలం అనుభవించాను. అగ్నిదేవుడు ప్రసాదించిన వరప్రభావం చేత దిగంత దర్శనం చేయాలనే దృఢనిశ్చయంతో ఈ దృశ్య జగత్తులో సుదీర్ఘ సంచారం చేస్తూ సముద్ర తరంగాలవంటి అనేక దృశ్యాలు చూచాను. ప్రవేశించిన ప్రతి బ్రహ్మాండంలోను అనేక ప్రకారములైన దేహములను ధరించి సంచరించాను. ఒక్కొక్క దేహంతో తత్సంబంధమైన వ్యవహారములందు కొంచెము సేపు తన్మయుడను అయినప్పటికీ,.... ఇంతలోనే ఇతఃపూర్వపు (దిగంతం దర్శించాలనే) ఉబలాటపు సంస్కారాలు నన్ను మరల నిదురలేపటం, నేను మరల ప్రయాణం కొనసాగించటం నిర్వర్తించాను. మరల అద్దానియందు వేగంగా మహాప్రయత్న యుక్తుడనైనాను. అట్టి సుదీర్ఘ ప్రయాణంలోని పాఠ్యాంశోపకరణమైన, సందర్భోచితమైన, సాధకజనోపయోగమైన కొన్ని విశేషాలు మాత్రం ఈ సందర్భంలో మీకు విన్నవిస్తాను.
ఒకానొక ఉపాధితో మరణము పొందుచున్న సమయంలో తమోగుణ స్థితియందుండి, ఒక సుందరవృక్షాన్ని తదేకమైన చూపుతో చూస్తూ మరణించాను. నా చిత్తము యొక్క వృక్ష దర్శన వృత్తి ప్రభావం చేత, ఆ వృక్షం గురించిన సంస్కార ఫలితంగా, 'దేహమును పొందాలి' అనే రాగవృత్తి ప్రకోపించటంచేత, స్వయంకృతమైన సుకృత - దుష్కృత ఫలితంగా ఒక వృక్షంగా జన్మించాను. మహావృక్షంగా ఎదిగి వేయి సంవత్సరాల వరకు వృక్షము రూపంలోనే ఉన్నాను. ఆ వృక్ష రూపంలో ఉన్నప్పుడు నాకు బాహ్య వృత్తికి సంబంధించిన ప్రాణ చేష్టలు ఉండేవి కావు. అందుచేత అంతర్ముఖమైన వృత్తులను అనుభవిస్తూ “ఈ వృక్షమే నా దేహము” అనే వృక్ష దేహాభిమానంతో అనేక పగళ్ళు అనేక రాత్రులు గడిపాను. ఆ వృక్ష దేహంతోనే ప్రకృతి స్పర్శలచే అనేక సుఖదుఃఖాలు అనుభవించాను. వ్రేళ్ళకు నీళ్లు లభించినప్పుడు సుఖముగా పరిపుష్టి పొంది, అవి లభించని వేసవి కాటక సమయాలలో శుష్కించిపోతూ దుఃఖములను అనుభవించాను. కాలానికి వశుడనై పత్ర-పుష్ప-ఫలాదులను ఉత్పన్నం చేయటమొక్కటే అప్పుడు నేను నిర్వర్తిస్తున్న ప్రాపంచిక వ్యవహారం అయి ఉండేది.
ఆ వృక్ష దేహము నశించగా, అంతరంగములోని సంస్కారముల ప్రభావం చేత కాబోలు... ‘లేడి’ ఉపాధి పొంది ఆ అల్ప దేహంతో తృణములు భక్షిస్తూ మేరు పర్వత ప్రాంతంలో గల పచ్చిక బయలు ప్రాంతంలో సంచరించాను. “వృక్షముగా ఉన్నప్పుడు ఆ పరిసరములలోని పరమాత్మగానం
Page:329
యొక్క శ్రవణం చేత ఆ తదనంతరపు లేడి రూపం" అనే ఉన్నతి పొందాను. ఇక అప్పుడు “తృణభక్షణ - దేహరక్షణ” - అనే రెండూ మహత్తర కార్యక్రమములుగా అనిపించేవి.
ఆ తరువాత ఒక అడవిదున్న దేహము ధరించి క్రౌంచ పర్వత గుహలలో నివసించాను. గడ్డి మేస్తూ గేదెల గుంపుపై దృష్టులను సారిస్తూ దేహయాత్ర సాగించాను. అటు పిమ్మట విద్యాధరుడనై విద్యాధర స్త్రీలతో స్నేహపరవశుడనై వారి కళా సౌందర్యమును ఉపాసించాను.
బ్రహ్మదేవుని హంసకు పుత్రుడనై మందాకినీ నదీజలంలో క్రీడిస్తూ ఉండగా 1500 సంవత్సరాలు గడచిపోయాయి. తరువాత మరొకసారి 'కాలంజరము' అనే పర్వతముపై నక్కగా పుట్టాను. అప్పుడొక ఏనుగు నన్ను మర్దించి చంపింది. సగం చచ్చిన స్థితిలో ఒక సింహపు పంజా దెబ్బకు ఆ ఏనుగు మరణించటం చూచి చచ్చాను.
సహ్యపర్వత శిఖరంపై మానవ ఉపాధితో ఉండగా ఒక సిద్ధుని శాపం చేత నీటిలో చేపగా సంచరించాను. ఆ తరువాత దేవతా స్త్రీనై కృతయుగపు సగభాగం గడిపాను. ఒకసారి ఒక గన్నేరు చెట్టుపై వల్మీక పక్షి (క్రౌంచపక్షి) రూపంతో నూరు సంవత్సరాలు గడిపాను.
ఆ తరువాత ఒక సిద్ధుడు ప్రసాదించిన వరప్రభావం చేత, సిద్ధుడనైనాను. ఆ తరువాత “అవిద్య యొక్క అంతు ఎక్కడో చూడాలి"... అనే కుతూహలం మరల నా యందు యథాతథంగా ప్రకోపించింది. అయితే అప్పటికే శారీరకంగాను, మానసికంగాను ఎంతగానో అలసిపోయి ఉన్నాను. అందుచేత వైరాగ్యము పొందినవాడనై ఒక కొండపై ప్రవహించే సెలయేటి ఒడ్డున తాపసుడనై అనేక రోజులు గడిపాను.
ఈ సందర్భంలో నేను కొన్ని అత్యాశ్చర్యకరమైన విషయాలు చూచాను. ఓ సర్వ సభికులారా! అవేమిటో చెబుతాను, వినండి.
అనేక కోటి బ్రహ్మాండ జననీ! దివ్యవిగ్రహా! - తపస్సును అనుష్ఠించుచున్న సమయంలో ఒకసారి ఒకచోట ఆశ్చర్యము గొలిపే ఆకృతిగల ఒక స్త్రీని చూచాను. ఆమె శరీరంలో అనేక బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో అసంఖ్యాక జీవులు కనిపించాయి. ఆమె శరీరం నిండా అనేక లోకాలు, జల, వాయు, భూచర జనుల ఉనికిని చూచి నేను ఆశ్చర్యం పొందాను. “ఆమె దేహం పంచభూతాలతోనే తయారయిందా? లేక మరింకేదైనానా?” ...అని నాకు అనిపించింది. అద్దంలో ప్రతిబింబాల లాగా...ఆమె శరీరంలో అనేక దృశ్య విశేషాలు కనిపించాయి. అప్పుడు నేను ఇట్లా ప్రశ్నించాను. నేను (భాసుడు) : ఉత్తమమైన దేహంతో కనిపించే ఓ భగవతీ! మీరెవరు? ఈ మీ దేహంలో అనేక జగత్తులు నాకు ఎందుచేత కనిపిస్తున్నాయి? నేనేమైనా భ్రమిస్తున్నానా? లేక, వాస్తవంగానే ఈ బ్రహ్మాండ సమూహములు మీ దేహాంతర్విభాగములేనా?
ఆ స్త్రీ : ఓ ప్రియతమా! సమస్త జీవులకు స్వస్వరూపమైన స్వప్రకాశకమైనట్టి శుద్ధ చైతన్యమే నేను. నాకు అందరూ ప్రియులే! అంతా ప్రియమే! ఈ కనబడే సమస్త మహాజగత్తులు నా యొక్క శరీరమే
Page:330
అయి ఉన్నది. నీకు నేను అనేక జగత్తులు గల శరీరముతో ఆశ్చర్యం గొలుపుచున్నాను కదా! అట్లాగే జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఆశ్చర్యయుక్తం కాదా? అయితే అవివేకులు ప్రతి వస్తువునందు ఉన్నట్టి 'శుద్ధ చిత్స్వభావం' గమనించక వస్తు దృష్టితో చూస్తున్నారు. కాబట్టి వారికి ఆశ్చర్యం గొలపటం లేదు. ఎప్పుడైతే వారికి నీవలెనే 'చిత్స్వభావము' నందు దృఢత్వం కలుగుతుందో అప్పుడు వారు కూడా నీవలెనే సర్వజగత్తులు దేహముగా ఉన్నట్టి నన్ను దర్శించగలుగుతారు. నీ వంటి తపస్యులు బాహ్యజగత్తులో వినబడే ఆయా విషయాలకంటే వేరుగా అంతరము నుండి (“ఇది చేయి. ఇది చేయవద్దు" అనే సూచనలను సుస్పష్టంగా వింటున్నారు కదా! అదియే అంతరంగ జగత్తు యొక్క ఉనికికి నిరూపణ.
బాహ్య జగత్తు - బాహ్యరంగ వేదనము; అంతర జగత్తు వేదనము... ఈ - - అంతరంగ రెండూ శుద్ధ చిత్ స్వరూపములే!
సమస్త పదార్థాలలో ఏ ‘సత్తా' అనుగతమైయున్నదో ...అది సర్వ జగత్ సహిత సత్తా సామాన్య స్వభావమే సుమా! అనగా... సమస్త జగత్తులో అంతరంగమై ఉన్న సత్తాయే ఒకానొక పదార్థంలో కూడా ఉన్నది. ఒకానొక పదార్థంలో ఉన్న సత్తాయే, సమస్త జగత్తులను ధరించుచున్నదై ఉన్నది. ప్రతి అణువులోను సమస్త బ్రహ్మాండాలుగా ఉన్నది. భౌతిక దృష్టికి కనిపించేదంతా అణువణువూ బ్రహ్మ సత్తాచే పూరితమయ్యే ఉన్నది. అట్లాగే స్వప్నంలో కనిపించే ప్రపంచంలోని ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి.
అందుచేత ఈ కనిపించే ఒక స్తంభము జడము కదా... అని భ్రమించరాదు. సుమా! అత్యంత జడరూపంగా కనిపించే స్తంభము నందు చేతనత్వము (వస్తు దృష్టి కలవారికి) అగుపించటంలేదు. కానీ నా దేహంలో స్తంభము - - పర్వతములు కూడా సంభాషణ నిర్వర్తిస్తూ “మేమూ చేతనులమే” అని చెప్పుకుంటున్నాయి కదా! ఒకానొక పరాశక్తి చేతనేకదా, అనేక అణువులు కలసివుండి, స్తంభము-పర్వతముగా రూపమును దినదినం కొనసాగిస్తున్నాయి!
అట్లాగే చేతనమగు దేహంలో గల ఆనేక జగత్తులు (అజ్ఞాన దృష్టి) అగుపించటం లేదు. కాని ప్రతి దేహంలోను అనేక జగత్తులు ఉన్నాయి! ఈ అణువుల అంతర్గత - - బహిర్గత ఆధారరూపమగు పరాశక్తినే నేను!
ఈ విధంగా ఆ స్త్రీ తన నిజస్వరూపమును నిర్వచించి అంతర్ధానం అయింది.
ఓ మహాత్ములారా! అట్లాగే మరొక సందర్భంలో మరొక ఆశ్చర్యకరమైన విషయమును అవలోకించాను. అది ఏమిటంటే... నేను సందర్శించిన ఒకానొక ప్రపంచంలో స్త్రీలు లేరు. కామ రహితులగు పురుష ప్రాణులు మాత్రమే ఉన్నారు. అక్కడ జీవులు పృథివి గాలి మొదలైన పంచభూతాల నుండి జనించి, మరల మరొకప్పుడు పంచభూతములలో లయమైపోతున్నారు.
ఒక లోకంలో జనులు మేఘాలలో జనించే మెఱుపులను (ఇంద్రధనుస్సు - - మేఘ ఖండములు మొదలైన వాటిని) ఆయుధాలుగా చేపట్టుచున్నారు.
Page:331
ఇంకొకచోట కొన్ని ఊళ్ళ- ఊళ్ళే గాలిలోకి లేచి ఏదో అంధకారంలోకి ప్రవేశించుచు ఉండటం, ఇంతలో మరికొన్ని ఆ అంధకారంలోంచి బయటకు వస్తూ ఉండటం, ఇంకొన్ని ఊళ్ళు మీ అయోధ్యవంటి పట్టణంలాగానే ఇళ్ళు, వీథులు, సభాప్రదేశం, అంతఃపురాలు - మొదలైనవి యథాతథంగా ఉండటం నాకు జ్ఞప్తికి వస్తోంది.
కొన్ని లోకాలలో ఒకే ఒక్క జాతి జీవులు ఉన్నారు. అక్కడ ఒక మనుష్య - దేవతా - నాగ మొదలైన జాతిభేదం లేకుండా ఉన్నది.
ఒకానొక లోకంలో సూర్య - చంద్ర - నక్షత్రాదులు లేవు. భూమి స్వయంప్రకాశమై ఉన్నది. అందుచేత అక్కడ సర్వదా పగలే, రాత్రి అనేదే లేదు.
ఇంకా ఇంకా ఎన్నో లోకాలు చూచాను. అనేక వింత వింత విశేషాలు గుర్తుకు వస్తున్నాయి. ఏది ఏమైతే ఏమున్నది? మన యొక్క విమర్శచే "అనుభవమాత్ర రూపమగు సర్వసాక్షి" లోనే ఈ జగత్తులన్నీ ఉన్నాయిగాని... మరింకెక్కడో కాదు.
జగత్తులన్నీ మన స్వస్వరూప -కేవల సాక్షి యొక్క కల్పనానుసారమే అనుభూతమౌతున్నాయి.
ఓ విశ్వామిత్ర మహర్షీ! పూజనీయులగు మహనీయులారా! ఇంకా నేను అనుభవించి ఉన్న మరికొన్ని విశేషాలు చెప్పుతాను వినండి.
ఒకసారి ఒక ప్రదేశంలో ఒక అప్సరస కౌగిలిలో ఆనందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక నదీ ప్రవాహం వచ్చి మమ్ములను ఇద్దరినీ ఈడ్చుకు పోసాగింది. “ఓ అప్సరసా! ఇదేమిటి? మనం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం?” ... అని ప్రశ్నించాను. “అవును స్వామీ! ఇక్కడ నది పగలు జలరహితంగాను, రాత్రిపూట ప్రవాహ సహితంగాను ఉంటుంది. ఇది నేను మీపైగల వ్యామోహ ప్రభావంచేత ఏమరచాను” .... అని చెప్పుచూ నన్ను రివ్వున ఆకాశంలోకి తీసుకుపోయింది. మేమిద్దరం ఆకాశంలోనే ఏడు సంవత్సరాలు విహరించాం.
- ఒక లోకం ఇంకా విచిత్రం! అందులో ఒక జీవునిలో అసంఖ్యాక జీవులు, ఆ జీవులలోని ప్రతి ఒక్కరిలో మరికొందరు జీవులు - ఇట్లా అరటిపట్టలవలె ఏర్పడి ఉన్నారు. అక్కడ ఒక్కజాతి జీవులే ఉన్నారు. వారు స్వయంప్రకాశకులై ఉన్నారు. అయితే, ప్రతి జీవునిలోను అసంఖ్యాక వివిధ జీవులు సంచరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఆకాశంలో సూర్య చంద్రులు, దిక్ విభాగములు, రాత్రింబవళ్ళు, వేద - వాదములు మొదలైనవి అక్కడ లేవు.
ఇంకోసారి 'అమరసౌముడు' అనే పేరుగల విద్యాధరుడుగా జన్మించి 1400 సంవత్సరాలుగా గడిపాను. మరొకసారి మేఘ శరీరధారినై అనేక ప్రదేశాలు సందర్శించి అలసిపోయి నిదురించాను. ఆ నిదురలో ఇంకెన్నో లోకాలు సందర్శించాను. అనగా, నా యందే నాకు అసంఖ్యాక లోకాలు
కనిపించాయి.
Page:332
అనేకసార్లు ఈ సృష్టి నా దృష్టికి కనబడనంత దూరం పోవటం, “ఇక ఇదే కదా, దృశ్యము యొక్క చివర!” .... అనుకొనే లోపల మరొక సృష్టిలో ప్రవేశించటం ఈ విధంగా జాగ్రత్ - స్వప్నాలలో అనేక దృశ్య పరంపరలు దర్శిస్తూ అనేక సంవత్సర సమూహాలు గడచిపోయాయి. కానీ ఏం లాభం? పిశాచానికి వశీభూతుడైన బాలకునిలాగా, నా హృదయమందే ఆరూఢమైయున్న ఈ 'దృశ్యము' అనే పేరుగల అవిద్యకు అంతు ఎక్కడో, ఏమిటో నేను పొందనే లేకపోయాను. ఒక ప్రక్క “ఇది అసత్యం, భ్రమ" ...అని విచారణచే అనిపిస్తూనే ఉన్నది. “నేదం నేదం సత్" ఇత్యేవ విచారానుభవే స్థితమ్
తథాపి ఇదమిదమ్ చేతి దురదృష్టిః న నివర్తతే!
“ఇదంతా సత్యమే కాదు” ... అని తెలుస్తూనే ఉన్నది. ఇంతలోనే, “ఇది సత్యమ్! నిజం! నిజమే!” ...అనే చిరకాలాభ్యాస ప్రభావానికి ప్రతిసారి లోను అవుతూనే వచ్చాను. 'విచారణ'ను తిరస్కరించి అనేక దేహాలు అనుభవించాను. అయితే కలకాలం ఏదీ కలిగి ఉండలేదు. ద్వైత సంస్కారం యొక్క ప్రాబల్యం చేత ఏర్పడిన “దృశ్య వస్తువుల పట్ల ఇష్టపడటం”... అనే జాడ్యం నాకు తొలగటమే లేదు. విచారణ - వివేకములను తిరస్కరించటం చేత ప్రతి క్షణం ప్రాప్తిస్తున్న సుఖదుఃఖాలచేత, ఇష్టానిష్ట జనులతో సమాగమంచేత దేశకాలాదులు భేదంగా అనేక సంసార దృష్టులు నాపట్ల రావటం - పోవటం జరుగుచునే ఉన్నది.
ఇదంతా ఇట్లా ఉండగా, ఈ విశ్వమంతా ఎద్దానిలో ఉన్నదో... అట్టి ఒక మహా పర్వతాన్ని చూచాను. ఈ విశ్వమంతా తనయందు ధరించియున్న ఆ పర్వత శిఖరంపై గల ఒకానొక ప్రదేశం తత్త్వవేత్తలకు ఆలవాలమై ఉన్నది. ఆ ప్రదేశం స్వతంత్రమై, ఏకమై, పరిమితి లేనిదై, దేశ-కాలవస్తువులచే పరిచ్ఛిన్నం కానిదై ఉన్నది. ఆ ప్రదేశంలో తత్త్వవేత్తలు సమావేశమై ఉండడం చేత అక్కడ లభించిన దివ్యానందము ముందు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు పొందే ఆనందం కూడా తృణప్రాయమే!
Page:333
IX. భాస - మహాశవోపాఖ్యానం
1. మహాశవ వర్ణనం
శ్రీవాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! 'విపశ్చిత్' అనే రాజు అగ్నిదేవుని వరప్రసాదంతో నాలుగుదేహాలు సంపాదించి "ఈ దృశ్యం ఎంత వరకు విస్తరించి ఉన్నది? చూచి రావాలి” ... అనే కుతూహలంతో బయల్వెడలటం, అందులో ఒక దేహం దృశ్య వ్యవహారం నుండి ముక్తిని పొందటం, మరి రెండు దేహాత్మలు సూక్ష్మదేహంతో బ్రహ్మాండ కర్పరంలో ప్రవేశించి బ్రహ్మాండ పరంపరలను దర్శిస్తూనే ఉండటం... నాలుగవ దేహం 'లేడి' దేహం నుండి - (వసిష్ఠ మహర్షి యొక్క ప్రార్థనను అగ్నిదేవుడు మన్నించటం చేత) - ముక్తిని పొంది అయోధ్యా సభలో 'భాసుడు'గా రూపం పొంది తన సుదీర్ఘ దేహ-దేహాంతర ప్రయాణ విశేషాలు సభికులకు వర్ణించి చెప్పటం జరుగుతోందని మనం క్రిందట ఉపాఖ్యానంలో చెప్పుకొన్నాం. ఇప్పుడు ఆ భాసుని యొక్క ఒకానొక అత్యంతాశ్చర్యకరమైన “మహాశవ దర్శనం” ... అని పిలువబడే అనుభవాన్ని, తదనంతరం కొన్ని విశేషాలను ఈ "భాస - మహాశవోపాఖ్యానం”లో మనం వినబోతున్నాం.
శ్రీవసిష్ఠ మహర్షి ఆధ్యాత్మ శాస్త్రాన్ని బోధిస్తున్న ఆ అయోధ్యాసభలో ఉచితాసనం అధిష్ఠించిన 'భాసుడు' అనే పేరు పొందిన ఇతఃపూర్వపు విపశ్చిత్ తన అనుభవాలను క్రోడీకరించి సభికులను ఉద్దేశించి ఇట్లా ప్రసంగం కొనసాగించసాగాడు.
భాసుడు : ఓ మునీంద్రా! విశ్వామిత్ర మహర్షీ! ఓ సభికులారా! అట్లా అగ్నిదేవ వరప్రసాదిని అయివుండికూడా, “ఈ దృశ్యము యొక్క అంతు ఎక్కడో చూడాలి”... అనే అవిద్యచే అంధుడనై సంచరిస్తూ ఉన్నాను కదా! అప్పుడొకసారి ఈ కనబడే జగత్తు కంటే వేరైన మరొక జగత్తులో నాకు అత్యంతాశ్చర్యకరమైన సంఘటన ఎదురైనది, ఆ అనుభూతమైన దానిని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. సావధానులై వినమని నా విన్నపం.
ఈ జగత్తులోని జనులకు అగమ్యమైన ఆకాశంలోని ఒకానొక స్థానంలో చంద్ర-సూర్యాదుల దీప్తిచే ప్రకాశిస్తున్న ఒక బ్రహ్మాండం ఉన్నది. అయితే అది ఈ జగత్తు వంటిదే అయినప్పటికీ, ఈ జగత్ప్రృష్టికి అది శూన్యమైనది. ఎట్లా అంటారా? స్వప్నం జాగ్రత్ వంటిదే (కనబడే దృశ్యం దృష్ట్యా) అయినప్పటికీ... జాగ్రత్ దృష్ట్యా స్వప్నం శూన్యమే కదా! స్వప్నం దృష్ట్యా జాగ్రత్ శూన్యమే కదా! ఈ జగత్తు దృష్ట్యా నేను చెప్పబోయే బ్రహ్మాండము అట్టిది. ఆ బ్రహ్మాండంలోని జగత్ రచన ఇట్టిదే అయినప్పటికీ అది ఈ జగత్తు దృష్టిచే అగమ్యమై ఉంటోంది.
Page:334
నేను ఆ బ్రహ్మాండంలో దిగంతం చూడాలని అభిలాషతో ప్రవేశించి గొప్ప ఛాయ గల కొన్ని భూములలో సంచరించసాగాను. ఇట్లా సంచరిస్తూ ఉండగా ఆకాశంలో ఏదో రణగొణ శబ్దం వినిపించింది. వెంటనే నేను ఆకాశంలోకి తేరిపారచూచాను. ఆకాశంలో అత్యంత సుదూరంగా ఒక మానవాకారం ఎక్కడో నక్షత్ర మండలంలో కనిపించింది. అది ఒక మానవ కళేబరంలా కనిపించింది. “ఆ ఆకృతి ఎక్కడి నుండి వచ్చింది? ఏమై ఉన్నది?" అని నేనే కొంచెం ఆశ్చర్యంతో పరిశీలించసాగాను. ఇంతలో ఆ మానవ శవాకారం మహా పర్వతాకారంగా కనబడసాగింది. ఆ ఆకారంలో ఆవర్తములు (సుడి) వంటి వృత్తులు కనిపించసాగాయి. ఆ దేహం మహా పర్వతాకారంగా ఆకాశాన్ని కప్పివేయసాగింది. ఆ దేహం ఆకాశం నుండి పడిపోవుచున్నట్లున్నది. అంతటి సుదీర్ఘమైన
చూపుకు అంతుకనబడని ఆ దేహం "బహుశః బ్రహ్మదేవునిదో? బ్రహ్మాండ దేహధారియగు విరాట్ పురుషునిదో?”...అనే సంశయం కలిగింది. ఇంతలో "ఊర్ధ్వ బ్రహ్మాండ కపాలం బ్రద్ధ లయిందా” అన్నట్లుగా పెద్దశబ్దంతో సూర్యగోళం ఆకాశం నుండి నేను ఉన్న భూమివైపుగా రాలటం ప్రారంభించింది. "ఆ సూర్యగోళం యొక్క విస్తీర్ణం ఈ సముద్రములతో కూడిన అనేక భూమండ లాలను ఆ ఆకాశపతన దేహం తనలో ఇముడ్చుకొన్నదేమో!” అని నాకు, అనిపించింది. ఇక “నాకు మృత్యువు ఆసన్నమయినట్లే” ... అని అనిపించి అప్పుడు నేను “ఓ స్వామీ! అగ్నిదేవా! రక్షించండి” ...అని పెద్దగా కేకవేశాను. వెంటనే ఆ ఆ ప్రక్కనే గల ప్రజ్వరిల్లే అగ్నిలోకి దుమికాను. అయితే, అనేక జన్మలుగా నేను అత్యంత ప్రియంగా ఆరాధిస్తున్న ఆ అగ్నిదేవుడు నా శరీరమును చల్లదనంతో కప్పి ఉంచి ఇట్లా పలికాడు.
అగ్నిదేవుడు : ప్రియభక్తుడా! భయపడకు. నిన్ను నేను ఆపదల నుండి రక్షిస్తాను.
నేను (భాసుడు) : ఓ మహాదేవా! అగ్నిదేవా! తమకు జయమగుగాక! ఆహాఁ! ఏమి మీ భక్త వాత్సల్యం! ప్రతి జన్మలోను మీరు శరణ్యులై నన్ను ఆపదలొచ్చినప్పుడల్లా రక్షిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అకాలంగా కల్పాంతం వచ్చి పడుచున్నట్లుంది. ఇదిగో, సూర్యగోళం నేలపై వ్రాలటం చూస్తున్నారా! ఏదో మహాశవం ఆకాశమంతా ఆక్రమించి సూర్యగోళాన్ని నేలవైపుగా త్రోసుకొస్తోంది! ఎంతటి ఆపత్సమయం! ప్రభూ! నన్ను రక్షించమని పాదాభివందనం చేస్తూ శరణు వేడుచున్నాను. అగ్నిభగవానుడు : ఓ పాపరహితుడా! ప్రియభక్తుడా! భయపడకు! లేఁ! మనం నా అగ్ని లోకానికి వెళ్ళెదముగాక!
ఇట్లా పలికి తన వాహనమైన చిలుక యొక్క వీపుపై కూర్చోబెట్టుకున్నారు. తన దేహంతో నేలను సొరంగంగా చేసి దాని గుండా భూమార్గం ద్వారా ఆకాశంలో ప్రవేశించారు. అప్పుడు ఆకాశం లోంచి నేల మీదకు చూచాను. పెద్ద శరీరం సూర్యగోళాన్ని కూడా త్రోసివేస్తూ నేల కూలుతోందని చెప్పాను కదా! భయంకరమైన ఆ భూతమును జిజ్ఞాసతో అవలోకించసాగాను.
ఆ మహాభూతము యొక్క కరస్పర్శ మాత్రం చేత సూర్యగోళం తన ప్రయాణ మార్గం నుండి ప్రక్క త్రోవపట్టినదై ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆ మహాభూతం పడిన పాటుకు భూమి
Page:335
కంపించింది. నదులు మార్గం త్యజించి ప్రక్కత్రోవ పట్టాయి. ఆ దేహ స్పర్శచే భూమిపై సముద్రంతో సమానమైన గోతులు ఏర్పడ్డాయి. అన్ని వైపులా భయంకరమైన శబ్దాలు వినిపించసాగాయి. హిమాలయం మొదలుగా గల ఎత్తైన పర్వతాలు భూమిలోకి కృంగి భూగర్భంలోకి అణిగిపో సాగాయి. అప్పుడా శవం “ఇది బ్రహ్మాండం యొక్క అర్ధభాగం” అన్నట్లుగా భూమిని, ఆకాశాన్ని కప్పివేసింది. ఆ శవం వేగంగా నేలపై పడటం చేత దశదిక్కులు పిక్కటిల్లాయి. ప్రతిధ్వనించాయి. భూమి రెండు విడివిడి భాగములుగా చీలిపోయింది. ఆ శవం యొక్క సగభాగం భూగోళం పైన, మిగతా సగభాగం ఆకాశంలోను నిలిచింది. ఆ మాంసమయ శవం యొక్క ఒక్క చిన్న విభాగం కూడా సప్త సముద్రంతో కూడిన పృథ్వి చాలకున్నది. అప్పుడు నేను అగ్నిదేవునితో ఇట్లా
సంభాషించాను.
నేను (భాసుడు) : ఓ అగ్నిదేవా! అనేక భూమండలములను ఒకచోట జేరిస్తే కూడా సరిపోనంత ఈ మాంసమయ దేహం ఎక్కడి నుండి పడింది? దానితోబాటు సూర్యుడు కూడా ఎట్లా ఆకాశము నుండి చెదిరిపోయాడు? ఇంతటి విస్తారమైన దేహం ఇతఃపూర్వం ఎక్కడ ఉండేది? అగ్నిదేవుడు : ప్రియ విపశ్చిత్తూ! ఈ శవం యొక్క పతన వ్యవహారమంతా శమించనీ! భయ రహితుడవై ఆ తతంగం చూడు, అటు తరువాత అదంతా నేను సవిస్తరంగా వివరిస్తాను.
నేను “సరే” అని ఆ మహాదేహ పతన వ్యవహారమంతా ఆశ్చర్యపడుతూ దర్శించసాగాను. ఆ శవం నేలకూలింది. ఇంతలో ఆకాశంలోంచి సమస్త వస్త్ర-ఆభరణాలు ధరించిన అనేకమంది ఆకాశజీవులు ఆ చోటికి వచ్చారు. ఆ వచ్చినవారిలో సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు, అసురులు, గంధర్వులు, నాగులు, కిన్నెరులు, ఋషులు, మునులు, యక్షులు, పితరులు, మాతరులు, దేవతలు వీరంతా ఉన్నారు. వాళ్ళంతా ఆ మహాశరీరం చుట్టూ నిలబడి (ఆకాశచరులు) ఆకాశం వైపుగా రెండు చేతులు ఎత్తి నమస్కరించసాగారు. వారంతా సర్వేశ్వరి, భక్తవత్సల, శరణాగత, దాక్షాయణి యగు "కాలరాత్రి భగవతి”ని ఇట్లా స్తుతించారు.
బద్ధ్వా ఖంట్వాంగశృంగే కపిలమురజటామండలం పద్మయోనేః, క్వత్వా దైత్యోత్తమాంగైః ప్రజమురసి శిరః శేఖరం తార్క్ష్యపకైః, యాదేవీ భుక్త విశ్వా పిబతి జగదిదం సాద్రి భూపీఠభూతం,
సా దేవీ నిష్కలంకా కలిత తనులతా పాతు నః పాలనీయాన్ ||
ఏ దేవి అయితే... మహాకల్పాంతంలో బ్రహ్మదేవుని కపిలవర్ణమగు గొప్ప జడల సమూహాన్ని తన మంచపు కోడునకు కట్టుచున్నదో, అసురుల శిరస్సులచే కూర్చబడిన మాలను కంఠానికి ఆభరణంగా ధరిస్తోందో, గరుత్మంతుని రెక్కలను శిరోభూషణంగా చేసుకొంటోందో, సర్వప్రాణి కోట్లతో సహా ఈ నదీ పర్వతాదులతో కూడిన భూపీఠ రూపమైన ఈ జగత్తును అతి చమత్కారంగా పానం చేసివేస్తోందో... అయితే, బ్రహ్మాండము నంతటినీ పానం చేస్తున్నప్పటికీ, ఆ క్రియా విశేష లేశము కూడా అంటక, నిత్యము శుద్ధ చిద్రూపిణి అయి విరాజిల్లుతోందో, తాను దేహరహితురాలై
Page:336
ఉండి కూడా భక్తుల అనుగ్రహము కొరకు మాత్రమే శరీరలతను ధరిస్తోందో... అట్టి జగజ్జనని మమ్ములను ఇప్పుడు రక్షించుగాక! సదా కాపాడుగాక! పాహిమాం! మాతా! కాళరాత్రీ దేవీ! భగవతీ! రక్షమాం!
2. చండీగణ శవ భక్షణం
భాసుడు : ఓ సభికులారా! ఇంకా వినండి.
ఆ విధంగా దేవగణం ఆ మహాదేహం చుట్టూ నిలబడి, భగవతియగు చండీదేవిని స్తుతిస్తూ ఉండగా, అప్పుడు నేను ఆ మహాదేహం వైపుగా తేరిపారచూస్తూ ఉన్నాను. అయితే ఆకాశం లోంచి అగ్నివాహనమగు చిలుక రెక్కలపై అగ్నిదేవుడు తోడుగా కలిగి ఆశీనుడనై ఉన్న నాకు ఆ మహాశవం పొట్టభాగం మాత్రమే కనిపిస్తోంది. ఇక శిరోభాగం, భుజములు, తొడలు మొదలైన తదితర శరీరభాగాలు లోకాలోక పర్వతమునకు ఆవలకు విస్తరించి ఉండటం చేత వాటిని నేను చూడలేక పోయాను గాని... అగ్నిదేవుడు వాటి గురించి వర్ణించి చెప్పుచుండగా విన్నాను.
ఆ విధంగా ఆకాశచారులు ఆ చండీదేవిని భక్తి - ప్రపత్తులతో ఆదరంగా స్తుతిస్తూ ఉండగా, అప్పుడు ఆ దేవి ఆకాశంలో శుష్క శరీరంతో స్వయంగా ప్రకటితమయింది. ఆ దేవి... ఆకాశంలో దివ్యానంద జ్యోతి స్వరూపిణి అయి ప్రత్యక్షమయింది. మాతృ గణంచే లాలించబడుచున్నది. ఆమెను స్తోత్రం చేసే కుంభాండ యక్ష బేతాళాదులు ఆకాశంలో నక్షత్రాలవలె కనిపించసాగారు. అనేక శిరస్సులచే కూర్చబడిన మాల ఆమె పాలిండ్ల మధ్యగా అటూ ఇటూ ఊగుతోంది. అక్కడి దేవతలు : ఓ దేవదేవీ! మీకు మా ప్రణామములు. ఈ మహాశవం మాచే కానుకగా మీకు సమర్పించబడుచున్నది. మీ పరివారంతో సహా శవమును స్వీకరించు తల్లీ! హే కాళీమాతా! మాకు సర్వ శుభములు ప్రసాదిస్తున్న నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ మహాశవమును సమర్పిస్తున్నాం. అంగీకరించి, మమ్ము అనుగ్రహించు.
ఆ దేవతా ప్రార్థన ఆ దేవి విని చిరునవ్వు నవ్వింది. ఆ తల్లి సర్వ ప్రాణశక్తి కదా! అందుచేత తన ప్రాణవాయు శక్తిచేత ఆ శవం యొక్క సారభూతమగు రక్తమును ఆకర్షించనారంభించింది. ఆ మహాశవయి యొక్క రక్తం ఆ దేవి ముఖంలోకి ప్రవేశించ నారంభించింది. ఇతఃపూర్వం సన్నగా
- - పొడుగ్గా ఉన్న ఆ చండీదేవి (శుష్కించి ఉన్న) దేహం ఇప్పుడు తృప్తిపొంది, పురిపుష్టి పొందేంత వరకు ఆకర్షించినంత రక్తమును త్రాగివేసింది. తత్ఫలితంగా స్థూలదేహ స్వరూపంగా కనిపించింది. వ్రేలాడుచున్న పొట్టతో, సర్పములను ఆభరణములుగా ధరించి, సమస్త ఆయుధాలను ధరించి ఆకాశంలో సగభాగాన్ని పూరిస్తూ నృత్యం చేయనారంభించింది. దేవతలు ఆ చండీదేవి నృత్యాన్ని తన్మయులై వీక్షించసాగారు. ఇంతలో ఆ దేవి అనుచరులైన పిశాచ - కుంభాండ - రూపికాది
Page:337
అనుచరులు మిగిలి ఉన్న శవమును ఆస్వాదించసాగారు.
కుంభాండులచే కటిభాగం, రూపికా సమూహం చేత పొట్టభాగం, యక్షులచే పార్శ్వ - పృష్ఠ భాగాలు భక్షించబడసాగాయి. బ్రహ్మాండ కపాలానికి ఆవల పడిన శవవిభాగాలను పిశాచాలు చేరలేక పోవటం చేత... ఆ శరీర విభాగాలు కాలక్రమేణ స్వయంగా విలీనమైపోయాయి.
ఆకాశంలో చండికాదేవి నృత్యం సల్పుతోంది. భూతగణం "కచ-చక - కచ-చక-శివశివ" శబ్దాలు చేస్తూ శవభక్షణ చేస్తున్నారు. లోకాలోక పర్వతంపై నిలబడి దేవతలంతా ఈ తతంగాన్ని చూస్తున్నారు. భూతగణం చేసే “కచ-చక-శివ" శబ్దాలు, నాడుల - ఎముకల “ఘటకట" ఖండన శబ్దాలు ఆకాశంలో అన్ని వైపుల నుండి వినబడుచూ మిన్నుముట్టసాగాయి.
భూమిపై అనేక చోట్ల బొమికల ముక్కల గుట్టలు ఏర్పడసాగాయి. సప్త ద్వీపాలు ఆ శవం యొక్క దుష్టావయవాల ఖండనములచే ఆక్రమించబడ్డాయి. అదంతా చూస్తూ లోకాలోక పర్వత శిఖరంపై నిలుచున్న దేవతలు ఎంతో దుఃఖితులై, భిన్నులై ఉన్నారు.
శ్రీరాముడు : ఓ వసిష్ఠ మహర్షీ! ఈ మహనీయుడు చెప్పే స్వానుభవం వింటూ ఉంటే నాదొక చిన్న సందేహం. బ్రహ్మాండమును దాటి బ్రహ్మాండ కపాలం వరకూ విస్తరించి పడిన ఆ శవం యొక్క ఖండ విభాగాలు మరి మధ్యలోగల లోకాలోక పర్వతమును కూడా ఎందుకు కప్పివేయలేదు? శ్రీవసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఆకాశం నుండి వాలుగా పడేటప్పుడు ఉదరభాగం సప్తద్వీపములలోను, శిరస్సు - పాదాలు మొదలైనవి బ్రహ్మాండమునకు ఆవల పడి ఉండవచ్చు. ఆ దేహ పార్శ్వభాగం, మధ్యభాగం, కటి ప్రదేశం మొదలైన వాటి కంటే లోకాలోక పర్వతం ఎత్తైనది కనుక ఖండితంగా పడిన దేహభాగాలు లోకాలోక పర్వతంపై నిలచి ఉండకపోవచ్చు.
శ్రీ భాసుడు : (తాను చూచిన దృశ్యం యొక్క వర్ణనను కొనసాగిస్తూ) లోకాలోక పర్వత శిఖరంపై బారులు తీరి దేవతలు నిలబడ్డాడు. సర్వత్రా విస్తరించి ఉన్న అంగములతో కూడి అధోముఖంగా పడిన ఆ శవం యొక్క శేష భాగాలను భూతగణాలు భక్షిస్తున్నాయి. మాతృగణం ఆచోట ఈచోట గుమిగూడి నృత్యం చేస్తున్నది. రక్తధారలు అన్ని వైపులా ప్రవహించసాగాయి. భూమిపై క్రొవ్వు, మాంసం విచ్చలవిడిగా వెదజల్లబడింది. ఆ దుర్గంధం అన్ని వైపులా విజృంభించసాగింది. ఇదంతా చూస్తూ కొంతమంది దేవతలు చింతాగ్రస్తులు, దుఃఖితులు అవటం కనిపించింది. ఆ చింతాగ్రస్తులైన దేవతలు ఆ భీకర దృశ్యాన్ని చూచి ఇట్లా చింతించసాగారు.
హా కష్టం! క్వ గతా పృథ్వీ? క్వ గతా జలరాశయః?
క్వ గతా జనసంఘాతా? క్వగతా ధరణీధరాః?
ఆహా! ఏం కష్టం వచ్చిపడింది? అరె! భూమి కనబడకుండా పోయిందే! సముద్రాలన్నీ ఏమైనట్లు? జన సమూహాలన్నిటికీ ఏమయిందో కదా! సుందరమైన మలయ పర్వతం, తెల్లగా
Page:338
మెఱిసే ఎత్తైన హిమవత్ పర్వతం, క్రౌంచ పర్వతం, అద్దానిపైగల కల్పవృక్షం ... ఇవన్నీ చూర్ణములై రక్త - మాంసాలలో కలిసి పోయినాయి కాబోలు! ఏది ఎక్కడో కనిపించటమే లేదే? క్షీరసాగరం, నవనీత (నేయి) పర్వతాలపై ఉద్భవించిన దధి సముద్రం, నారికేళ వనమయమైన అనుకంప్య పర్వతం, మహాయోగీశ్వరులచే సేవించబడే మధుపర్వతం-ఇవన్నీ ఎటుపోయాయి? స్వాదూద సముద్రానికి సంబంధించిన ఓ పుష్కర ద్వీపమా? నీవేమైనావు? మానవులకు స్వప్నతుల్యమైన శాక ద్వీప పర్వత శ్రేణులు ఏమూల ఉన్నాయో? ఏమయినాయో? ఈ విధంగా రక్త ప్రవాహంచే, మాంస ఖండాలచే మేము విహరించే ప్రదేశాలన్నీ కప్పబడి పోయినాయే! ఇక జీవులు విశ్రాంతి పొందగల చోటెక్కడున్నది? ఈ మహా శవపు రక్త ప్రవాహంచేత మహాసముద్రాలు ఏర్పడుచున్నాయి. ఇంతెందుకు? నగరాలు, గ్రామాలు, అగ్రహారాలతో నిండి ఉండే భూమియే కనిపించకుండా పోయింది!
అంతేకాదు. మన విద్యాధరులు, తదితర దేవతలు విమానాలలో సంచరించే ఆకాశ ప్రదేశాలు క్రొవ్వులు - ప్రేగులతోనూ, వాటిని భక్షించే భూతగణముల 'కిరకిర’ శబ్దాలతోనూ నిండిపోయాయి.
కొంతసేపటికి భూతగణం మాంస భక్షణం చేస్తూ రక్తం గ్రోలుచుండగా భూమి కొంచెం కొంచెంగా కనిపించసాగింది. అయితే భూమి క్రొవ్వు పొరలతో కప్పివేయబడింది. ఆ శవము యొక్క అస్థులు మహాపర్వతమంత ఎత్తులో గుట్టలుగా పడి ఉండటం కనిపించింది.
భూతగణం రక్త మాంసాలను భక్షించి, క్రొవ్వును మాత్రం వదలి ఆకాశంలో నృత్యం చేయ సాగాయి. ఇకప్పుడు అనేక చోట్ల ఇంకనూ మిగిలి ఉన్న రక్తమంతా అక్కడి దేవతల సంకల్పబలం చేత ఒక ప్రవాహంగా మలచబడింది. సప్త సముద్రాలలో ఒక్క సముద్రంలోకి మాత్రమే అక్కడి రక్తమంతా మరల్చబడింది. దానిని ఆ దేవతలు తమ సంకల్ప బలంచేత “మధ్య సముద్రం”గా గావించి వేశారు. అది ఆ తరువాత "మధ్యధరా సముద్రం”గా నేటికీ వెలసింది. ఆ భూతగణం ఆకాశంలో నృత్యం చేస్తూ ఆ సముద్రంలోని మద్యం త్రాగి మరల ఆకాశంలో ఆనంద నృత్యం చేయసాగాయి. వారివలెనే నేటికి కూడా భగవతియగు యోగీశ్వరి యొక్క గణములతో సహా ఆ భూతగణం సముద్రమధ్యంలో మద్యం త్రాగుతూ, ఆకాశంలో నృత్యం చేస్తూనే ఉన్నాయి.
ఆ భూతగణంచే భుజించబడగా మిగిలిపోయిన శుష్క మేదస్సు (మిగిలిపోయిన కొవ్వు) సమూహాలు భూమిపై విస్తరించటం చేత ఈ భూమి “మేదిని” అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది.
క్రమంగా ఆ శవము క్షయించింది. సూర్యుడు - - చంద్రుడు మొదలైనవారు తమతమ స్థానములను మరల చేరుకున్నారు. మరల రాత్రింబగళ్ళు ప్రవర్తించసాగాయి.
అప్పుడు ప్రజాపతి నూతన ప్రజలను సృష్టించసాగారు. మరల భూతలంపై సృష్టి యథాప్రకారంగా వర్ధిల్లసాగింది.
Page:339
3. మశకవ్యాధుని ముని దర్శనము
భాసుడు : ఓ దశరథ మహారాజా! ఇదంతా నేను భగవానుడగు అగ్నిదేవుని వాహనమైన చిలుక రెక్కలపై కూర్చుని చూస్తున్నాను కదా! అప్పుడు నా ప్రియదైవమగు అగ్నిదేవుని ఇట్లా ప్రశ్నించాను. నేను (భాసుడు):
భగవన్! సర్వయజ్ఞేశ! స్వాహాధిప! హుతాశన!
కిమిదం నామ సంపన్నం కథ్యతాం? కిమిదం శవమ్?
హే మహాత్మా! సర్వ యజ్ఞములకు ప్రభువైన వాడా! స్వాహాపతీ! దేవదేవా! ఈ శవము ఏమిటి? ఇదంతా ఇట్లా ఎందుకు జరిగింది? దయచేసి చెప్పండి!
అగ్నిదేవుడు : ఓ రాజా! ఈ శవ వృత్తాంతమేమిటో చెప్పుతాను, విను. ముల్లోకములను ప్రకాశింపచేసేది, నాశరహితమైనది - అనంతమైనదిగా చెప్పబడే ఆత్మ చమత్కారం బోధించేది అగు ఈ శవం యొక్క విశేషమంతా ఆలకించు.
అస్తి, “అనంతమ్, అనాకారం, పరమం వ్యోమ చిన్మయమ్” యత్రేమాన్యప సంఖ్యాని జగన్తి పరమాణవః ॥
ఏదైతే అనంతమై నిరాకారమై చిన్మయమైనదో... ఎద్దానియందైతే ఈ కనబడే జగత్తు వంటి పరమాణువులు అసంఖ్యాకంగా సర్వదా ఏర్పడి ఉన్నాయో... అట్టి 'పరమాకాశం' అనబడున దొకానొకటి ఉన్నది. అది శుద్ధ చిన్మాత్రము సర్వవ్యాపకము. సర్వము తానే అయి ఉన్నది.
అట్టి చిదాకాశమునందు ఒకానొక చోట విషయాకార జ్ఞానమయమగు 'సంవిత్తు' స్వయంగా జనిస్తోంది. అయ్యది తన జ్ఞాన స్వభావ ప్రభావం చేత భావిత పదార్థరూపం రూపొందుతోంది. తనను తాను ఒక తేజః పరమాణురూపంగా భావన చేస్తోంది.
ఎట్లా అంటావా? నీకిది అర్థం కావటానికి వీలుగా ఒక దృష్టాంతం చెపుతాను, విను. నీవు ఒక బాటసారి గురించి ఆలోచిస్తూ నిద్రపోతావనుకో. అప్పుడు స్వప్నంలో నీ స్వప్న చైతన్యమే బాటసారి అయి ఆ బాటలో అతనితో నీవు సంభాషించటం జరుగవచ్చు కదా! అట్లాగే నిర్విషయ చిదాకాశం విషయాకార సంవిత్తు రూపమును తనయొక్క అనంత రూపంలోని ఒకానొకచోట తన అజ్ఞాన స్వభావం చేత భావన చేస్తోంది. ఆ తేజః పరమాణువు తన అజ్ఞాన చిత్ స్వభావం చేత తనలో సంకల్ప రూపం, ప్రకాశవంతం అయిన అణుత్వమును దర్శిస్తోంది. ఆ తరువాత తనలో వర్ధన శీలత్వం భావిస్తోంది. అట్టి వర్ధనశీలత్వమే 'కళ్ళు-చెవులు' మొదలైన ఇంద్రియ రూపాలుగా అగుచున్నది. ఆ తరువాత ఆ ఇంద్రియాలు 'శరీరం' అను దానిలో సంలగ్నమై ఉన్నట్లుగా అనుభవాన్ని పొందుతోంది. ఆ నేత్రాదులు శబ్ద స్పర్శాదులతో కూడిన జగత్తును దర్శిస్తున్నాయి. స్వప్నంలో పట్టణం కనిపించినట్లు నేత్రాది ఇంద్రియాలకు ఈ ఇంద్రియ విషయ జగత్తు అగుపిస్తోంది.
❖
Page:340
అటువంటిదైన ఈ జగత్తులో ఒకానొకచోట అసురజాతికి చెందిన ఒకానొక జీవుడు ఉండేవాడు. ఆతడు ఎంతో స్వాభిమానంతో వర్తిస్తూ ఉండేవాడు. ఆతడు - ఆతని తల్లి తండ్రి-తాత మొదలైన వారంతా కూడా స్వప్నంలోని మాతా పిత-పితామహులవలె మిథ్యా ప్రతిభా స్వరూపులే సుమా!
ఆ అసుర స్వభావుడగు జీవుడు ఒక రోజు ఒకచోట ఒక ఆశ్రమం చూచాడు. దురహంకారికి ఇతరులను బాధించటం స్వభావమై ఉంటుంది కదా! తాను చూచిన ఆశ్రమము, ఆశ్రమ వాసియగు ముని ప్రశాంతంగా కనిపించటం చూచి ఓర్వలేకపోయాడు. వెంటనే తన అతిస్థూల దేహంతో ఆనందమయంగా ఉన్న ఆ ఆశ్రమ ప్రదేశాన్నంతా ఇష్టం వచ్చినట్లు త్రొక్కివేశాడు. ఇది చూచి ఆ ఆశ్రమ మునీంద్రుడు కోపగించినవాడై, “ఓయీ అసుర స్వభావుడా! నీ స్థూల దేహంతో నిష్కారణంగా ప్రశాంతమైన ఈ ఆశ్రమ ప్రదేశాన్ని నాశనం చేశావు కదా! నీ ఈ దురహంకారం శిక్షించబడక తప్పదు. అందుచేత నీవు అతి క్షుద్రమైన ఒక 'దోమ’ అయి పోయెదవు గాక!” ... అని శపించాడు. ఆ శాపాగ్నిచే ఆ అసురజీవుని దీర్ఘశరీరం భస్మీభూతమయింది. దేహం నశించటం చేత ఆ అసుర జీవుని చైతన్యం ఆకాశంలో నిరాకారంగాను, ఆధారరహితంగాను అయినదై, (ఆకాశంలో) ఒక వలయం వలె అయింది. ఆ చైతన్యం సుషుప్తి - మూర్ఛస్థితులను పొందసాగింది. అవ్యాకృతమైన ఆ అసురజీవుని చైతన్యం కొంతసేపటికి సామ్యత్వం వలన భూతాకాశంతో ఏకత్వం పొందింది.
ఆ భూతాకాశము తన స్థానభూతమగు వాయువుతో ఏకత్వం పొందింది. ఆ ప్రాణవాయువు దేహమును పొందినదైనది. ఇప్పుడది అవ్యాకృత రూపం నుండి 'ప్రాణి' అని పిలువబడే స్థితికి వచ్చింది. ఆ ప్రాణి నామధేయ చైతన్య స్ఫురణ క్రమంగా పృథ్వి (Solid, Liquid, Heat, Vapour) మొదలైన అపంచీకృతములైన నాలుగు భూతాలచే వ్యాప్తమై చెన్నొందింది.
ఆ తదుపరి పంచతన్మాత్రమయినట్టి ఆ చిన్మాత్రాణువు స్పందనము (ఆకాశంలో చలనము) పొందసాగింది. అనగా క్రియాశక్తి కలిగియున్నదయింది. అద్దాని ప్రాణవాయువునందలి చైతన్యమునందు ఆ తరువాత జ్ఞానశక్తి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన జ్ఞానశక్తిలో ఒకానొక విభాగంగా 'జ్ఞాపకశక్తి' రూపం పొందింది. ఆ ఆ జ్ఞాపకశక్తికి “శుద్ధుడగు ఆ ముని అసురుడనగు నన్ను ‘దోమ’గా మారిపోవలసినదని శపించారు కదా!" ... అని జ్ఞాపకం వచ్చి చేరింది.
ఆ అసురుని ప్రాణమునందలి చైతన్యం 'దోమ'కు సంబంధించిన సంస్కారం సంతరించు కొన్నదయింది. దోమ యొక్క చిన్నకళ్ళు - ముఖం - కాళ్ళు - రెక్కలు మననము చేయనారంభించి తాను ఒక దోమగా వెలసింది.
చెమట నుండి జనించి, అల్ప శరీరధారి అయి, నిశ్వాస మాత్రం చేత (జనులు గాలి వదలే మాత్రం వాయువు వేగానికి) నేలకూలేందుకు సిద్ధమయ్యే దోమ యొక్క జీవిత కాలం ఈ ప్రపంచంలో రెండు రోజులు మాత్రమే కదా!
శ్రీరాముడు : ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! ఈ ప్రపంచంలో అనేక ప్రాణులు ఉత్పత్తి అవుతు న్నాయి కదా! ఇవన్నీ కూడా ఏదో ఒక యోనిలోనే సంభవిస్తున్నాయా? లేక ఇంకొక ఏదైనా విధంగా కూడా జనిస్తున్నాయా?
Page:341
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డిపరక వరకు గల ఈ ప్రపంచంలో కనిపించే సమస్త జీవుల యొక్క ఉత్పత్తి రెండు విధములై ఉంటోంది.
1. భ్రాంతి జన్యమైనది, 2. బ్రహ్మమయమైనది.
1.భ్రాంతిమయం - ఈ జీవునిలో పూర్వ-తత్ పూర్వజన్మల అనుభవం బాగా అంతరంగంలో రూఢిపడి ఉంటోంది. అనగా, ఆయా దేహాలతో “తాదాత్మ్యం” దృఢపడుతూ వస్తోంది. తద్వారా 'జగత్ భ్రాంతి' అంతరంగంలో ఆరూఢమై ఉంటోంది. అది "దృశ్య సంగమం” చేత నిర్మితమై, తదనంతర దృశ్య సంగమానికి కారణభూతమై వస్తోంది. ఆ విధంగా భూత తన్మాత్రలతో (తన్మాత్ర = శబ్ద + స్పర్శ + రూప + రస + గంధాలతో) రంజనమై (Falsified, Illusion related) తదాకారంగా ప్రాణుల ఉత్పత్తి జరుగుతోంది. అయితే అదంతా కూడా వర్తమానం వరకు భ్రాంతి జనకమేనని గ్రహించు. అనగా ఒక భ్రాంతి నుండి, ఇంకొక భ్రాంతి వైపుగా ప్రయాణిస్తూ జీవుడు ఆ భ్రమలను పొందుచున్నాడు. మనకు కనబడే అనేక మంది జీవులు ఈ విధంగా యోనిజులై (యోనిగర్భం నందు జన్మించిన వారై) ఉంటున్నారు.
2.బ్రహ్మమయం - నిత్యముక్తమగు బ్రహ్మం నందు బ్రహ్మానికి అద్వితీయమైన 'భూత భావన' అనే జగత్ భ్రాంతి భాసిస్తోంది. అనగా 'సృష్టి' అనే దృశ్య వ్యవహారానికి ముందే నిత్య నిర్మలమై ఉన్న బ్రహ్మమునందు స్వయంగా వివర్తరూపంగా జగత్ భ్రాంతి భాసిస్తోంది. ఆ జగత్ భ్రాంతికి అంతర్గతమై చతుర్విధ భూత సముదాయం రూపం ధరిస్తోంది. “అట్లా ఉత్పత్తి అయినట్లుగా కనపించేదంతా బ్రహ్మమయమే” ... అని వేదోపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అట్టి జగత్ వ్యవహార ఉత్పత్తికి సంబంధించిన జననం 'యోనిజం' కాదు. అట్టి "బ్రహ్మమునకు బ్రహ్మం రూపంగా ఏర్పడే జగదుత్పత్తి అనుభవం” - - గొప్ప సిద్ధ పురుషులకు అనుభవయోగ్యం అవుతోంది. వారు “జగత్తుగా నాకు కనిపించేదంతా బ్రహ్మమే” ... అనే ఎఱుకను కలిగి ఉంటున్నారు. “జనించినట్లుగా అనిపించే దంతా భ్రమచేతనే. నేను జన్మరహితమగు బ్రహాన్ని" ...అను భావానచే పరిపుష్టులై ఉంటున్నారు.
ఆ అసురుడు ఇప్పుడు దోమ ఉపాధిని ఆశ్రయించాడు కదా! ఆ దోమ తదితర దోమలతో కలిసి “జ్ జ్" శబ్దాలు చేస్తూ చెఱకు తోటలలోను, కోమలమైన రెల్లుగడ్డి ఆకుల మధ్య తన ఆయువులో అర్ధభాగం (మానవ ప్రమాణంలో ఒక రోజు) గడిపివేసింది. ఇక రెండవ రోజంతా ఒకానొక అతికోమలమైన ఒక రెల్లుగడ్డి మొక్క లేత చిగుళ్ళ మధ్యగా తన భార్యతో గడిపివేసింది.
ఆ దోమకు కునుకు పట్టింది. ఇంతలో ఆ రెల్లుగడ్డి మొక్క ఒక లేడి పాదఘట్టాలకు నేలతాకు చుండగా ఆ దోమ కాస్తా అద్దాని పాదాల క్రిందపడి చూర్ణమైపోయింది. అది లేడి ముఖం చూస్తూ ప్రాణాలు విడవటం చేత... క్రమంగా (మనం చెప్పుకున్న క్రమంలో) ఇంద్రియాదులను గ్రహించినదై... ఒక ‘లేడి’గా జన్మించింది. ఆ లేడి అడవిలో సంచరిస్తూ ఒక రోజు ఒక బోయ వానిని చూచి భయంతో పరుగులు తీస్తూ ఉండగా... ఆ బోయవాని బాణఘాతం చేత మరణించి, ...బోయవాని ధ్యాస చేత, అదే సంస్కారాలు గల బోయవాడుగా జన్మించింది.
Page:342
ఆ వ్యాధుడు (మృగములను వేటాడే వృత్తిగల ఆటవిక జీవుడు) ఒక అరణ్యంలో సంచరిస్తూ ... ఒకానొక మునియొక్క వనంలో ప్రవేశించాడు. పరమసాత్వికము-వేద శబ్ద భరితము అగు ఆ ప్రదేశంలో ప్రవేశించగానే అతని మనస్సు రజోతమోగుణాలను కొంచెం త్యజించింది. ఆ వనంలో ఒక చెట్టు క్రింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. క్రమంగా ఆ మునివరేణ్యుని సమీపించి, అక్కడి పవిత్రతకు ముగ్ధుడై ... ఆ మునిని నమస్కారాదులచే, సత్ప్రవర్తనచే ప్రసన్నం చేసుకున్నాడు. సత్సాంగత్యము వల్ల వచ్చే జ్ఞాన సౌభాగ్యం మహత్తరం కదా!
తన ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసి వినమ్రుడై నిలిచిన బోయవానితో ఆ మునివరేణ్యుడు ఇట్లా పలికాడు.
మునివరేణ్యుడు : ఓయీ! బోయవాడా! నీ వినమ్రతతో కూడిన నమస్కారం స్వీకరిస్తూ, నిన్ను "ప్రజ్ఞా సమన్వితుడవు అయ్యెదవు గాక!"... అని ఆశీర్వదిస్తున్నాను. నాయనా! ఇటొచ్చి కూర్చో! నీవు నీ ఈ ధనుస్సుతో నిరపరాధులగు మూగజీవులైన మృగాలను చంపటం మహా దీర్ఘ దుఃఖాల కొఱకేనని గ్రహిస్తున్నావా? పర్యవసానం గమనిస్తున్నావా? జగత్తు క్షణభంగురం కదా! శాస్త్రములు విన్నావా? ఇట్టి జగత్తులో జీవించేటప్పుడు "అహింస, అభయదానము” అను గుణములు మహా ఫలదాయకమౌతాయని, “ఇతర జీవులను బాధించటం, హింసించటం, భయపెట్టడం”... మొదలై నవి ఆ జీవునికి అనేక వేదన, రోదనలకు బీజభూతం అగుచున్నదని బోధిస్తున్నాయి కదా! ఓ ప్రియమిత్రుడా! ఆ జీవులను చంపుచున్నావు సరే! మరి నీవు మాత్రం కలకాలం ఉండబోవు చున్నావా? కాదే! ఆ సకల జనులకు, మూగజీవులకు, నీకు కూడా దేహం ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞత చెల్లిస్తూ సద్గుణములను అలవరచుకొనవలసినదిపోయి... సరి అయిన ఆలోచన - అవగాహన లేకుండా... మూగజీవులను నిష్కారణంగా చంపటానికి ఉపక్రమిస్తున్నావా? వారికి దేహం నీవు ఇచ్చావా? ఇవ్వగలవా? లేదు. మరి వాటి దేహాలను నాశనం చేసే హక్కు నీకెక్కడుంది? ఆలోచించే బుద్ధి నీకున్నది. మరి ఆ ఆ బుద్ధితో ఏది నీకు శుభప్రదం; ఏది అశుభప్రదం? అని నీవు ఆలోచించాలి కదా! ఈ నీ ఆయుస్సు శాశ్వతమా? గాలిచే కొట్టబడుచున్న మేఘాల సముదాయం లోని జలబిందువు వలె నీ ఆయుస్సు క్షణభంగురం కాదా చెప్పు? ఇక్కడ గల భోగాలు అతి చంచలం కదా! నీ భార్య మొదలైన ఆయా జీవులతో గల సంబంధం శాశ్వతమా? కాదు.
యౌవనం కలకాలం ఉంటుందా? ఉండదు.
యౌవనం గుప్పెట్లోకి తీసుకున్న పొగవలె చేయిజారిపోతూనే ఉన్నది కదా! ఇక నీ శరీర దార్థ్యం అన్నదాని గురించి చెప్పనే అక్కర్లేదు. ఈ నీ శరీరానికి ఎప్పుడు ఏ ఆపద రానున్నదో చెప్పలేం కదా! శరీరం కూలబడినప్పుడు నీ భార్యా పుత్రులు కూడా నీ ముదుసలి శరీరాన్ని చూచి ఎగతాళి చేస్తారే! పుట్టింది తిని, తాగి, చావటానికా? మరింకెందుకుంటావా? నీ తిండి కోసం సహజీవులను హింసించి, తద్వారా అనేక దుఃఖ పర్యవసానములను మూటకట్టుకుంటూ, ఈ ఆయుస్సును నిష్ప్రయోజనం - దుష్ప్రయోజనం చేసుకుంటున్నావేం? అనేక అనర్థములతో కూడిన ఈ సంసారం యొక్క గతిని చూచి భీతిల్లకుండా... గుడ్డి ఎద్దు చేలో పడినట్లు జీవిస్తున్నావా?
Page:343
ఓయీ బోయవాడా! లుబ్ధకా! కనులు తెరువు. లే! "అశ్రద్ధగా జీవిస్తే ముందు ముందు నా గతి దుర్గతి కానున్నది” అని భయపడుతూ జీవించు. ఈ 'జీవితము' నీకు గొప్ప సదవకాశముగా గమనించు. నిరతిశయానంద రూపమగు బ్రహ్మం కొరకై అన్వేషించు. "తత్త్వజ్ఞానం” అనే అతి ముఖ్యమైన కార్యక్రమమునకు ఇప్పటికన్నా ఉపక్రమించు. “అహింస, స్నేహము, జీవకారుణ్యము గురుసేవ, శాస్త్రములు చెప్పే సాధనా క్రమము, పరమాత్మ యొక్క మననము, దేహమును ప్రసాదించిన పరమేశ్వరునికి కృతజ్ఞతలు సమర్పించటం - పెద్దలు బోధించే సారవాక్యాల ధ్యానం” ... ఇటువంటి దైవీగుణములను పెంపొందించుకొనే ప్రయత్నంలో ఉండాలి. అంతేగాని ఒక పిట్టనో - జింకనో చంపి, ఆ మాంసం ఆరగించి “ఒక ఇంతేచాలు” అని నిద్రించి, మరల తెల్లవారగానే ఆహారం కోసం విల్లు ధరించి ... ఇట్లా రోజులు వెళ్ళబుచ్చటం - పరమాత్మ ప్రసాదించిన జీవితము అనే అవకాశమును, ఆయుస్సును వృథా చేసుకోవటమే అవుతుంది. ఇది తెలివి ఉన్నవాడు చేసే పని కాదు. ఇక ఆపై నీ ఇష్టం.
4. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి స్వరూప వర్ణనం అగ్నిదేవుడు : ఓ విపశ్చిత్! వింటున్నావా? ఆ మునీంద్రుడు ఇట్లా మరల బోధించాడు. మునీంద్రుడు : ఓయీ బోయవాడా! నేను చెప్పిన 'జీవిత సద్వినియోగం' గురించి యోచన చేయి. నీకు శుభమగుగాక!
వ్యాధుడు : హే మునీంద్రా! నాపై కరుణతో ఈ రోజు నాకు సన్మార్గాన్ని చూపించారు. ఈ హింస మొదలైన వ్యవహారాలు దుఃఖ హేతువులని నాకు గుర్తు చేసినందుకు ఆజన్మాంతం కృతజ్ఞుడను. స్వామీ! నాపై దయతో నాకు దుఃఖ క్షయం కావటానికై నేను ఏమి చేయాలో చెప్పండి. మరీ కష్టంగా గాని, మరీ సులభంగా గాని ఉండనట్టి సాధనా మార్గమును, వ్యవహార క్రమమును ఉపదేశించండి. ఇప్పుడు మీరు ఏమి ఆజ్ఞాపిస్తే అట్లే నిర్వర్తించటానికి సంసిద్ధుడనై ఉన్నాను. మిమ్ములను సేవిస్తూ ఇక్కడే ఉంటాను.
మునీంద్రుడు : పుత్రా! ముందుగా ఈ ధనుస్సును, బాణాలను వదలిపెట్టు. సాత్వికమైన ఆహారాన్ని అవలంబించు. మునుల ఆచారాలైనట్టి "ధ్యానము, యమము, నియమము”లను ప్రారంభించు. నీవు ఈ ఆశ్రమంలోనూ ఉండవచ్చు. లేదా, నీ ఇంట్లోనూ ఉండవచ్చు. అది నీ ఇష్టం. అయితే, చక్కగా మంత్రోపదేశం చేస్తాను. మంత్రమును గానం చేస్తూ మనస్సును పరిశుద్ధ పరచుకో.
ఆ బోయవాడు ఆ మునీంద్రుని పాదాలు స్పృశించి ప్రణామం చేశాడు. అప్పటికప్పుడే, ఆ ధనుర్బాణాలను త్యజించివేశాడు. యమ-నియమాలకు ఉపక్రమించాడు. ఆ ఆశ్రమంలోనే ఉండి, గురువులను సేవిస్తూ, వారు చేసే సత్సంగబోధనను వింటూ క్రమంగా చిత్తమును శుద్ధం చేసుకో
Page:344
నారంభించాడు. శాస్త్రాలు గుర్తుచేసే నిత్యానిత్య వివేకమును క్రమంగా పెంపొందించుకోసాగాడు. ఒక రోజు ఆ బోయవాడు మునీంద్రుని సమీపించి, ఆయన సంతోషంగా ఉన్న సమయంలో ఇట్లా ప్రశ్నించాడు.
బోయవాడు : ఈ జగత్తు ఎవరిచే ఎందుకు ఈ విధంగా నిర్మించబడింది? ఇది ఇన్ని భ్రమలను కల్పిస్తూ ఎందుకు జీవుని గట్టిగా బంధించి ఉంచుతోంది. దీనిని దాటి చూడటమెట్లా? మునీశ్వరుడు : ఈ 'జగత్తు' అనబడేది జీవునియొక్క మనోకల్పనయే సుమా! మనస్సు ఎట్లా ఉంటే జీవుడు అట్టి జగదనుభవమును పొందటం జరుగుతోంది. కనుక “ఇదంతా నీ నా మనస్సులోనే ఉన్నది” ...అని చెప్పబడుతోంది. అనగా ఇది మనస్సుచే కల్పించబడి, ఆ మనస్సునందే ఆరూఢమై, మనస్సు చేతనే అనుభవ రూపంగా పొందబడుతోంది. ఇదంతా ప్రాణుల అంతఃకరణంలోని స్వప్నముగా చెప్పబడుతోంది.
బోయవాడు : మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉన్నదే! జీవుల అంతఃకరణంలోని స్వప్నం జాగ్రత్తుగా బాహ్యంలో ఎట్లా కనిపిస్తోంది? అసలు స్వప్నం ఎక్కడి నుండి వస్తోంది? నాకు రాత్రిపూట వచ్చే కలలో దృశ్యాలు ఎవరి కల్పన? ఎందుకు కల్పిస్తున్నారు? ముందుగా ఈ కల గురించి చెప్పండి? మునీంద్రుడు : ఈ విషయంలో నీ యొక్క అనేక సందేహాలు నివృత్తి అవటానికి వీలుగా, నేను... ఒకానొక సంఘటన గురించి చెబుతాను. నేను చెప్పబోయేది నా స్వానుభవమే కాబట్టి నీ వివేకమును పటుతరపరచటానికి ఈ కథనం చక్కగా ఉపకరించగలదు.
చాలాకాలం క్రితం, ఒకానొక తరుణంలో... అప్పుడప్పుడే నాలో వివేకం వికసిస్తోంది. ఒక రోజు, నా చిత్తంలో “ఆకాశంలో మేఘం వచ్చి పడుచున్నట్లు ఈ 'స్వప్నం (కల)' అనేది ఎక్కడి నుండి వచ్చిపడుతోంది? "...అనే తర్కం బయలుదేరింది. ఆ కాలంలో నిరంతరం యోగసాధనలో ఉండేవాడిని. ఏమైనాసరే, 'స్వప్నం' అనేది ఎట్లా రూపుదిద్దుకుంటోందో, ఎట్లా ఎక్కడ ఏర్పడి ఉంటోందో నా బుద్ధితో యోగసాధనా బలం చేత కనిపెట్టాల్సిందే!” ...అనే నిర్ణయానికి వచ్చాను. ఇచ్ఛ యొక్క తీవ్రత చేత, ఇక ధారణకు ఉపక్రమించాను.
అప్పుడు “పరకాయ ప్రవేశం (మరొక శరీరంలో ప్రవేశించగలగటం)” ...అనే విద్యను అనుకూలింప జేసే ‘బహిః కుంభధారణ'కు ఉపక్రమించాను. పద్మాసనం వేసుకొని, ఆ విధంగా బహిః కుంభధారణను అభ్యసిస్తూ సర్వజీవుల ఆత్మగా ప్రసిద్ధమైయున్న సంవిత్తునందు సుస్థిరత పొందసాగాను. అట్టి సంవిత్ స్వరూపము సంతరించుకొని ఆ నా సంవిత్ శరీరానికి ఆచ్ఛాదనగా చిత్తమును ధరించాను. ఇతరుల హృదయాలలో కూడా ప్రవేశించగల సామర్థ్యముగల ఆ చిత్తముతో ముందుగా నా హృదయంలోనే విహరించసాగాను.
అప్పుడు ... ప్రాణములకు అంతర్గతంగా ఉండే చైతన్యము యొక్క ప్రేరణచే చిత్త సహితంగా ప్రాణములను 'రేచకము' అనే శ్వాసకు సంబంధించిన ప్రజ్ఞయొక్క అభ్యాసం చేత... బాహ్య
Page:345
ప్రదేశానికి ప్రవహింపజేశాను. అనగా, చిత్తముతో కూడిన ప్రాణశక్తి ‘దేహము' అనే కాలువ నుండి పిల్ల కాలువలాగా ప్రవహింపజేశానని గ్రహించు. నేను చెప్పే ఈ కార్యక్రమం ('రేచకము’ అనే అభ్యాసంచే చిత్తము, ప్రాణములను బహిర్గతంగా ప్రయాణింపజేయటం) యోగాభ్యాసంలో సిద్ధహస్తులకు సుపరిచితమైన విషయమే!
#
ఇకప్పుడు నా ప్రాణవాయువులు, చిత్త సహితంగా బాహ్యాకాశంలో ఉన్నాయి కదా! అప్పుడు బాటలో నడుచుచూ తన ఇంటి వైపుగా వెళ్ళుచున్న ఒక ప్రాణి నాకు ఎదురుగా కనిపించాడు. ఆతడు తన బంధువుల ఇంట్లో ఏదో ఉత్సవంలో పాల్గొని, సుష్టుగా తినుబండారాలన్నీ ఆరగించి ఇక ఇంటికి మరలుచున్నాడు. నేను నా యొక్క బాహ్యాకాశంలో ఉన్న నా ప్రాణవాయువులను, ఈ పాత్రలోని జలాన్ని ఆ పాత్రలోకి పోసినట్లుగా, ఆతని ప్రాణవాయువులలో కలిపివేశాను. అప్పుడు ఆతని ప్రాణవాయువులు నన్ను ఆతని హృదయంలో అంతర్భాగమును పొందింపజేశాయి. అనగా ఆతని “ప్రాణవాయువులు” అనే గుఱ్ఱం ఎక్కి ఆతని హృదయంలో ప్రవేశించాను. ఆతని ప్రాణ వాయువులు నా ప్రాణవాయువులు ఒకదానితో ఒకటి మిళితం కాగా, వాటిని అనుసరించినవాడనై నా బుద్ధితో ఆతని దేహంలో ఏఏ విశేషాలు గమనించి అనుభవించానో... చెబుతాను, విను.
ఆతని హృదయపు అభ్యంతర ప్రదేశంలో అనేక చిన్న పెద్ద నాడులు నలువైపులా ప్రసరించి ఉన్నవై కనిపించాయి. ఆ నాడులలో పిల్ల పెద్ద కాలువలలో జలం ప్రవహిస్తున్నట్లుగా -
అన్నరసం ప్రవహిస్తూ కనిపించింది. ఇంటిలో అనేక వస్తువులు అమర్చబడి ఉంటాయి చూశావా? అట్లాగే ఆతని శరీరము ఇటూ అటూ అస్థిపంజరం చేత, “ప్లీహము-యాకృత్తులు” అని పిలువబడే మాంసవిశేషాల చేతను, రక్తంతో కూడిన మాంసపిండాల చేతను వ్యాపించి ఉన్నదై కనిపించింది.
అక్కడి హృదయ-దేహ ప్రదేశము అక్కడి 'శల శల' శబ్దంతో ప్రవర్తించే 'జఠరాగ్ని’ యొక్క వేడిచే ఆవరించబడినదై అగుపించింది. ఆ జీవుని శరీరము నిరంతరము 'జీవనము' కొనసాగించే నిమిత్తం చిత్తము-ప్రాణవాయువులచే అవధరించబడినదై ఉన్నది. అపానవాయువు యొక్క ప్రసరణచే ఏర్పడిన చల్లదనం అక్కడి వేడిని అతిశయించకుండా చేస్తోంది. అక్కడి నాడీమార్గంలో గల రక్త ప్రసరణను శ్లేష్మరూపమైన అన్నరసం తన ప్రవాహవేగంతో ఛేదిస్తూ కనిపించింది. అక్కడ గల 72000 నాడులు గాఢాంధకారం తమముందు కలిగి, (మరియు) ఉష్ణత్వంతో కూడి ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రదేశములలో రక్తము, రసము, శ్లేష్మము, పిత్తము ఉబుకుతూ కనిపించాయి. ఆ నాడులు ఆయా అవయవములతో కూడిక కలిగియున్నవై కనిపించాయి. వాటిలో ప్రాణ- అపాన వాయువులు సుస్పష్టంగాను, అస్పష్టంగాను క్రీడనములు సలుపుచున్నాయి. వాటిలో సప్త ధాతువుల యొక్క స్థితి-గతి-నాశనాలను అనుసరించే భావికాలపు రోగాలు సంభవిస్తూ ....ఆ భావికాలపు రోగాలు, స్వప్నమునకు సూచనలు ఇస్తూ ఉన్నాయి. అపానవాయువు అక్కడి ఛిద్రములలో రాక పోకలు చేస్తూ ఉండగా 'కుళ్- భుగ్-జుగ్-బళ్' శబ్దాలు వినిపిస్తున్నాయి. హృదయ కమలమునందు
Page:346
కనిపించిన రక్తనాళములందు రక్తము ప్రవహిస్తూ ఉంటే సముద్ర బడబాగ్ని వలె రంగులు విరజిల్లు చున్నాయి. కొన్ని కొన్ని నాడులు ఆయా మిళితములగు పదార్దములచే నిండి వాయు సహితంగా నెమ్మదిగా కదులుచూ కనిపించాయి.
ఇంకా... ఆ ‘9’ ముఖ్య నాడులలోను, 72,000 ఉపశాఖ నాడులలోను అనేక విశేషాలు కనిపించాయి. ఒక చోట సాక్షియగు స్వకీయాత్మస్వభావంలాగా నిర్మలంగా ఉన్నది. మరోకచోట నిశ్చలచిత్తంలాగా సౌమ్యంగా ఉన్నది. ఇంకొకచోట నాడులలో అంతర్భాగాలు దొంగలముఠా దోపిడీలో పాల్గొనుచున్నట్లు సంక్షుభితమై ఉన్నాయి. వేరొకచోట “ఏకమాత్ర-ద్విమాత్ర-అర్ధమాత్ర” ...స్వరసంపన్నం లాగా లయ - - అలయ విన్యాస ధ్వనులు ప్రదర్శిస్తున్నాయి.
ఆ దేహంలో ప్రవేశించి ప్రేగులలో పయనిస్తూ ఉండగా ఋతుపవనాలకు ఎదురు చూచే రైతులలాగా మరికొన్ని ఛిత్రజీవులు ప్రేగులమూలలో గృహనిర్మాణం చేసుకొని ఆ ఆహార పదార్థాల రసాన్ని కొంచెం కొంచెం ఆస్వాదిస్తున్నాయి.
ఆహా! ఏమి బ్రహ్మదేవుని దేహ నిర్మాణ వైశిష్ట్య చమత్కారం! ఏమి కార్యక్రమం! ఇదంతా తెలియకయే ఆ దేహి ఆదమరచి నిద్రిస్తూ ఉండి ఉంటాడు కదా! తన దేహంలో జరిగే బృహత్ కార్యక్రమం తనకే తెలియకుండా జీవుడు జగత్తులో సంచరించటం, మమకార, అహంకారాలు ప్రదర్శించటం, స్వప్నంలో ఏవేవో ఊహలలో తేలియాడటం - ఇవన్నీ ఎంత చమత్కారమైన విశేషాలు! అని ఆశ్చర్యపడసాగాను.
❖
ఈ విధంగా ఆలోచనలు చేస్తూ దట్టమైన అడవిలో సంచరించే మనుజునిలాగా చిత్త ప్రాణ దేహుడనైన నేను ఆతని దేహంలో సంచరిస్తూ క్రమంగా హృదయం యొక్క అభ్యంతర ప్రదేశంలో ప్రవేశించసాగాను. హృదయం యొక్క అభ్యతరంలో నాకు అనేక నాడీ మార్గాలు కనిపించాయి. అవన్నీ అతి దగ్గరగా ఉన్నప్పటికీ అత్యంత సుదూరంగా విస్తరించి ఉన్నట్లు అనుభూతి పొంద సాగాను. అక్కడగల జఠరాగ్ని రూపంలో గల తేజస్సును దర్శించాను. రాత్రిపూట సూర్యప్రకాశం చంద్రుని పొందుచున్నట్లు నాడీ ప్రదేశాలు కాంతివంతంగా ఉండటం గాంచాను. "తేజస్సు ఎవరిది? ఇద్దాని మూలమేమిటా?” ... అని పరిశీలనాత్మక బుద్ధితో పరిశీలించాను. "ఆహాఁ! ఈ తేజస్సుకు ఆధారమై జీవుని సత్తా నెలకొని ఉన్నది కదా!” అని బుద్ధితో గమనించాను. ముల్లోకాలకు దర్పణం వంటివాడు, ముల్లోకాలలోని సమస్త పదార్థములను ప్రకాశింపజేయువాడు, సర్వ వస్తువులందు సత్వస్వరూపుడై సర్వదా వేంచేసియే ఉన్నవాడు అగు జీవుడే తన చైతన్య చమత్కారం చేత అక్కడ తేజోరూపుడై వెలయుచున్నాడని గమనించాను.
కాయే సర్వగతో జీవః స్వాం మోదః కుసుమే యథా | తథాప్యోజసి కిజ్ఞల్కైర్ముఖే శైత్యం వివస్వతా ॥
సూర్యతేజస్సుచే వికసింపజేయబడిన పుష్పంలో సుగంధం, శీతలత్వం అంతటా ఉండి ఉన్నప్పటికీ... పూరెక్కలతో కూడిన ముఖ ప్రదేశంలో అతివిశేషంగా కనిపిస్తాయి కదా! అట్లాగే
Page:347
శరీరమంతా వ్యాపించి ఉన్నప్పటికీ జీవుడు అక్కడ నాకు కనిపించిన తేజస్సుగా విశేషంగా ప్రకటనమగుచున్నట్లు అనిపించింది.
బోర్లించిన కుండచే కప్పబడిన దీపజ్యోతి కుండకుగల సూక్ష్మ రంధ్రములలోనుండి ప్రవేశించే గాలిచే పరిరక్షింపబడుచున్నట్లు, ఆ జీవుని జీవనజ్యోతి లోన ప్రవేశించే ప్రాణవాయువులచే రక్షింపబడుతోంది.
నేనప్పుడు జీవనాధారమగు చైతన్యాత్మక జీవతేజస్సులో నా అదృశ్య (కంటికి కనబడని చిత్త -ప్రాణ) రూపంతో ప్రవేశించాను. వాయువులోనికి సుగంధం ప్రవేశిస్తోంది కదా! చంద్రమండలంలోకి సూర్యతేజస్సు ప్రవేశిస్తుంది చూశావా! మట్టి పాత్ర సగం నీళ్ళలోకి ముంచినప్పుడు ఆ చమ్మ (తడి) మట్టిపాత్రయొక్క లోపలి వైపునకు ప్రయాణిస్తుందే! ...అట్లా నేను ఆ “జీవతేజస్సు యొక్క ఉపాధి రూపము” అన తగినట్టి మనోమయ కోశములోనికి, విజ్ఞానమయ కోశములోనికి, ఆనందమయ కోశములోనికి... ప్రవేశించాను.
ఆ ఆనందమయకోశం అమృతమయమగు రెండవ చంద్రుని వలె కన్పట్టింది. అది తెల్లని మేఘాల పంక్తి వలె కోమలంగా ఉన్నది. వెన్న, మీగడ, బెల్లమువలె స్నేహ-మధుర-ఆనందయుక్తంగా ఉన్నది. క్షీరసాగరం యొక్క బుద్బుదంలాగా అతి సుందరంగా ఒప్పుతోంది.
ఇంతకు ముందు శరీరంలో ప్రవేశించినప్పుడు నాకు అనుభూతమైన పరిశ్రమ ఇప్పుడు ఈ ఆనందమయ కోశంలో లేదు. చల్లటి తేజోమయ ప్రదేశంలో అత్యంత 'స్వస్థత' అక్కడ నాకు అగుపించింది. అప్పుడు ఆ ఆనందమయ కోశంలో సంచరిస్తున్న నాకు, ఆతని స్వప్న రూప ప్రపంచం తారసపడింది. ఆతని స్వప్నలోకం సూర్య, చంద్ర, పర్వత, సముద్ర, సుర, అసుర, మనుష్య సహితమై కనిపించింది. అక్కడ గ్రామాలు, పట్టణాలు ఈ భూప్రపంచంలాగానే విస్తరించి ఉన్నాయి. అవన్నీ ద్వీప - ద్వీపాంతరాలతోను, కల్ప-క్షణ కాల సమన్వితంగాను, ఋతు-కాల సంయుతంగాను, స్థావర-జంగమ ప్రాణికోట్లతోను నిండి ఉన్నది.
ఆతని స్వప్న ప్రపంచమంతా నా స్వప్న ప్రపంచమే అయి దర్శనం కొనసాగించాను. జాగ్రత్తు నాకు కొనసాగుచుండగా ఆతని స్వప్న ప్రపంచ అంతర్గత విశేషాలు ఈ మన ఈ 'జాగ్రత్తు'లాగానే
చూడసాగాను.
ఓ వ్యాధుడా! అప్పుడు నేనిట్లా అనుకున్నాను. “నేను నిద్రపోవటం లేదు ఒకానొకని స్వప్న ప్రపంచమును నేను ద్రష్టనై, పరస్వరూపుడనై చూస్తు ఉన్నాను కదా!" అని నేను జ్ఞానయుక్తుడనై వీక్షించసాగాను. “ఇప్పుడు ఈ కనబడే స్వప్న జగత్తు చైతన్యం యొక్క ఈశ్వర సంబంధమైన రూపమే అయి ఉన్నది” అని అనుకుంటూ ఉండసాగాను. ఈశ్వరుడు చిదాకాశరూపుడే కాబట్టి తాను దేనిని ఎట్లు భావన చేస్తే ఆయా చిత్రూపం తత్ అను భావానుసారం రూపం పొందినదౌతుంది కదా! అన ఆయన తనను తాను “వస్త్రం, ఘటం, జగత్తు, జీవుడు" మొదలైన ఏ ప్రకారమైన భావన చేస్తాడో, ఆయా ప్రకారంగా తానే ఆయా జీవ - జగత్ ఆదిగాగల రూపంగా అగుచున్నాడు.
Page:348
ఒకడు తన స్వస్వరూపం త్యజించకయే స్వప్నంలో తన యొక్క ఊహచే స్వప్నరూపమంతా దాల్చుచున్నాడు కదా! అట్లాగే చిత్స్వరూపుడగు ఈ జీవుడు కూడా తనయొక్క చిత్ స్వరూపం | చిదాకాశత్వం వదిలిపెట్టకుండానే... తన నిజస్వరూపాన్ని జాగ్రత్-స్వప్న విశేషాలుగా భావించు చున్నాడు. భావించినది అనుభవరూపంగా అనువర్తిస్తోంది. అనగా ఈ ద్రష్ట స్వ-ఇచ్ఛాపూర్వకంగా తన నిజస్వరూపము యొక్క ప్రదర్శనమును అచ్చటచ్చట అట్లట్లు జగత్తు రూపంగా గాంచుచున్నాడు. ఆహో త్వద్వేదమాజ్ఞాతం యదిత్థం దృశ్యతే జగత్ |
తత్కథ్యతే ‘స్వప్న’ ఇతి స్వ చిత్కచనమాత్రకమ్ ॥
ఓహో! ఇప్పుడు తెలిసింది. ఈ జగత్తు నిజ చిత్ స్వరూపము యొక్క స్ఫురణ మాత్రమే! ఆ స్ఫురణయే జగత్తుగా ఇక్కడ కనిపిస్తోంది. ఏ జాగ్రత్ స్ఫురణ జాగ్రత్ సమయంలో దృశ్యానుభవంగా అనుభూతమౌతుందో, ఆ స్వస్వరూపమే (నిద్రపోయినప్పుడు) ఇక్కడ ‘స్వప్నం' అనే పేరుతో పిలువబడుతోంది.
వ్యాధుడు : స్వప్నమునకు - జాగ్రత్కు భేదమేమిటి? ఏది మొదటిది? ఏది రెండవది? దేని నుండి ఏది వివర్తం పొందుతోంది? అనగా, జాగ్రత్లోంచి స్వప్నం వస్తోందా? లేక, 'స్వప్నం' లోంచి జాగ్రత్ వస్తోందా?
మునీశ్వరుడు :
చిద్దాతోర్యతచనం తత్ కించిత్ ‘స్వప్న’ ఉచ్యతే, కించిచ్చ ‘జాగ్రత్’ ఇత్యుక్తం! "జాగ్రత్ స్వప్నౌతు న ద్విధా !
చిదాకాశరూపమగు 'చైతన్యము' యొక్క ఒకానొక రూపమైన స్ఫురణను ... స్వప్నం అని, మరొకరూపమైన స్ఫురణను ... జాగ్రత్ అని పిలుస్తున్నారు. అనగా, జాగ్రత్ స్వప్నములు రెండూ కూడా చైతన్యము యొక్క స్ఫురణలే!
ఈ జాగ్రత్ - - స్వప్నములు భిన్నములైనవి కావు. జాగ్రత్ను విమర్శించి చూస్తే స్వప్నమే అవుతుంది. స్వప్నం స్వప్న సమయంలో జాగ్రత్ లాగానే అనుభూతమౌతోంది.
స్వప్నః స్వప్నో జాగరాయామ్, ఏష స్వప్నే తు జాగరా | స్వప్నస్తు జాగరైవేతి జాగరైవ స్థితా ద్విధా ॥
జాగ్రత్ అవస్థలో ఉన్నప్పుడు స్వప్నం “అది కల” అని స్వప్నరూపంగా ఎఱుగబడుతోంది. అట్లాగే... స్వప్న సమయంలో స్వప్నం జాగ్రత్లాగానే (ఇదంతా ఇట్లు స్థూలమే అని) అనుభూత మౌతోంది. స్వప్న సమయంలో జాగ్రత్ ('ఆ జాగ్రత్లోదంతా నా ఊహయే' అనే రూపంగా) ఇప్పటి స్వప్నంలాగానే అనిపిస్తూ ఉంటోంది.
ఓ మహామతీ! వ్యాధుడా! ఈ పురుషుడు (జీవుడు) చైతన్యరూపుడే అయి ఉన్నాడు. జాగ్రత్స్వప్నములకు కేవలసాక్షి, రచయిత, ఆస్వాదకుడు, భోక్త, త్యాగి, అతీతుడు కూడా (ఒకే సమయంలో) అయి ఉన్నాడు.
Page:349
కాబట్టి... అనేక శరీరములు మరణించినప్పటికీ కూడా... ఈతడు ఎట్లా ఎప్పుడు ఎవరికి మరణించినవాడగుచున్నాడు చెప్పు? ఒకడు “నా బంధువు మరణించాడు” అని అనుకోవచ్చుగాక! అయినా సరే... ఆ మరణించినట్లుగా లోకముచే చెప్పబడేవాడు తనను తాను త్యజించటం లేదు. తాను వస్త్రమువలె ధరించిన దేహమును త్యజించి ఉండవచ్చుగాక! అంత మాత్రం చేత ఎవడూ తనను తాను వదలి ఉండటం లేదు. కనుక మరణించిన వాని దృష్టిలో తాను మరణించకయే ఉన్నాడని సూక్ష్మదృష్టితో గ్రహించు. ఆ మరణించినట్లు చెప్పబడే వాడు మరణానంతరం తన మనస్సునందు మనస్సుచే జాగ్రత్ - స్వప్న-సుషుప్తులను కొనసాగిస్తూనే ఉన్నాడు సుమా!
ఈ జీవుని వాస్తవ స్వరూపమగు చైతన్యము... అనంతమైనది. విభాగరహితమైనది. శుద్ధ చిదాకాశము అయున్నది. సాకార - నిరాకారములకు విలక్షణమై ఉన్నది. కానీ... భ్రాంతిచే దేహమువలె భాసిస్తోంది. ఏమి చమత్కారం!
అట్టి చైతన్యము, అమూర్త స్వభావయుక్తమైనది. (భౌతిక పదార్థమువలె ఆకారం పరిమితమైనది కాదు.) నిత్యమైనది, అనంతమైనది, నిత్యోదితమైనది. అట్టి చిత్ పరమాణువు యొక్క స్వకీయ కల్పనా చమత్కృతిచే (లేక) భ్రాంతిచే జాగ్రత్ - స్వప్న దేహములు ఎఱుగబడుచున్నాయి.
ఒక అవయవి (శరీరి) యందు విచిత్రములైన అవయవాణువులు భాసిస్తున్నాయి కదా! అట్లాగే, చిదాకాశము యొక్క అంతరమున 'జగద్ర్భాంతి' అనబడే చిదణువులు భాసిస్తున్నాయి. వ్యాధుడు : ఈ జీవుడు జాగ్రత్లో ఇంద్రియ బాహ్యత్వము అనుభవించుచున్నాడు కదా? మునీశ్వరుడు : అవును “నేను ఈ దేశంలో ఉన్నాను. ఈ ఇంద్రియ జగత్తు బాహ్యమున ఉన్నది” అని జాగ్రత్ - స్వప్నములలో భ్రమచే తలచుచున్నాడు.
జాగ్రత్తు యొక్క భోగప్రదమగు కర్మ నుండి మరలినప్పుడు జీవాధారమగు హృదయంలో ప్రవేశిస్తున్నాడు. హృదయంలోగల తన రూపమునే బాహ్య సంస్కారముల యొక్క అవరోధము స్వప్నరూపంగా గాంచుచున్నాడు. స్వప్న సమయంలో స్వప్న సంఘటనలను ఆ స్వప్న ద్రష్ట (ఈ జాగ్రత్తును సత్యమని అనుకొంటున్నట్లే) సత్యమనియే అనుభవమును పొందుచున్నాడు.
స్వప్నరూపం సంతరించుకున్నది స్వపద్రష్ట యొక్క చిత్స్వరూపమేగాని మరెవరో కాదు. అట్లాగే జాగ్రత్ కూడా! జాగ్రత్ ద్రష్ట యొక్క చిత్ స్వరూపమే జాగ్రత్లో జగత్తుగా ప్రదర్శితమగుచు చిత్ స్వరూపుడగు జాగ్రత్ ద్రష్టకు అనుభూతమౌతోంది.
బాహ్యోన్ముఖం బహిర్ జాగ్రత్ శబ్దితం కచితం స్వకమ్
రూపం పశ్యతి జీవో అయమ్ అన్తస్థం స్వప్న ఇత్యపి II
చిత్తము ఎప్పుడు బహిర్గతమౌతోందో అప్పుడు జీవుడు నిజస్వరూపమునే బాహ్యమున దర్శిస్తూ “ఇది జాగ్రత్తు, వీరు నా వారు, వారు కాదు” ... ఇత్యాదిగా దర్శిస్తున్నాడు. చిత్తము అంతర్గతంగా కార్యనిర్వాహకంగా ఉన్నప్పుడు, ఆ చిత్తమునకు కనిపించే నిజరూపమును “ఇది నా స్వప్నం. ఇది ఇల్లు. వీరు బంధువులు, వారు మిత్రులు, ఇది ఉత్సవ సమయం” ... ఇత్యాది దర్శనం
Page:350
చేస్తూ ... అదంతా తనకు అన్యమైన దానివలె దర్శిస్తున్నాడు. ఆహా! ఏం ఆశ్చర్యం! సర్వదా ఏకరూపంగా ఏర్పడియున్న (స్థితి పొందియున్న) జీవాత్మయే బాహ్య (జాగ్రత్తులో) ... అంతరములలో (స్వప్నంలో) "ఆకాశం, భూమి, పృథ్వి, జలము, అగ్ని, వాయువు, పర్వతము, నది, దిక్కులు” ...మొదలైన అనేక రూపాలుగా ప్రసరించి ఉంటోంది.
వ్యాధుడు : స్వామీ! జీవుడు జీవుడుగానే ఉంటున్నాడా? లేక, జీవుడు ఆకాశ, వాయు, పర్వత, నదీ రూపుడుగా పరిణామం చెందుచున్నాడా? లేక జీవుని రూపం ఈ జగత్తా!
మునీశ్వరుడు :
అర్కో 2ర్క బింబసంస్థో పి యథేహాపి స్థితస్త్విషా తథా... జీవో జగద్రూపో బహిరంతశ్చ సంస్థితః ॥
సూర్యుడు సూర్యమండలంలో సంస్థితుడై ఉండియే ఇచట కిరణ సమూహములతో వర్తిస్తున్నాడు కదా! అట్లాగే జీవుడు యథాతథమైన ఆత్మ స్థితియందు ఉంటూనే ఇక్కడ బాహ్య - అభ్యంతరములలో స్థితి కలిగి ఉన్నవాడై ఉంటున్నాడు.
ఓ వ్యాధుడా! ఇక్కడ నీకు ఒక మహత్తరమైన పాఠ్యాంశాన్ని సంబోధిస్తున్నాను, విను.
అంతః “స్వప్నో” బహిర్ “జాగ్రత్” అహమేవేతి వేత్తి చేత్,
చిదాత్మకో యథా భూతం ముచ్యతే తదవాసనః ॥
ఏ జీవుడైతే... “అంతరంలో స్వప్న రూపంతోటి, బాహ్యమున జాగ్రత్ రూపంతోటి చిద్రూపుడనై సర్వ రూపములను సంతరించుకొని నేనే వర్తిస్తున్నాను.” అని కార్య-కారణయుక్తంగా యథార్థ జ్ఞానం ఘనీభూత పరచుకుంటూ ఉంటాడో... అట్టివాడు క్రమక్రమంగా వాసనారహితుడగుచు... ముక్తిని కరతలామలకం చేసుకోగలడని ఘంటాపథంగా నీ ద్వారా అస్మత్ రూపులైన సర్వ సహజనులకు మనవి చేస్తున్నాను.
అచ్ఛేద్యో9_యమ్ అదాహ్యోం యమ్ అపి, జీవో అన్యథా వదన్ ద్వైత సంకల్ప యక్షేణ ముహ్యత్యేవ శిశుర్యథా!
ఓ సహజనులారా! పసిపిల్లవాడు చీకట్లో చెట్టుయొక్క కదలికలను చూచి "అయ్యబాబోయ్! అక్కడ దయ్యం కదులుతోంది రోయ్!” అని అనుకుని భయపడతాడు చూచారా! జీవాత్మ ఛేదింపబడేది కాదు. దహింపబడేది కాదు. అయినప్పటికీ టికీ మీరు మీరు తద్విరుద్ధంగా 'నేను పుట్టాను’ “నేను చస్తాను” ...అంటూ మాట్లాడతారేమిటి?
ఈ జీవుడు... అంతర్ముఖుడైనప్పుడు తననుతానే స్వప్న జాగ్రత్ రూపంగా గాంచుచున్నాడు. బహిర్ముఖుడైనప్పుడో... తనను తానే బాహ్య జగద్రూపంగా గాంచుచున్నాడు. జీవుని యొక్క స్వప్న జాగ్రత్తలు ఇవియే!
ఓ వ్యాధుడా! ఈ విధంగా ఆ ఒకానొక సహజీవుని దేహంలో చిత్త - ప్రాణ స్వరూపుడనై ప్రవేశించి ఆనంద మయకోశంలో ప్రయాణిస్తూ ఆతని ఆనందమయకోశంలోని స్వప్నమయ
Page:351
విభాగంలో ప్రవేశించి “జాగ్రత్తు - స్వప్నములు ఒక్క తీరైనవే” ... అనే పాఠ్యాంశాన్ని నేను గ్రహించాను. -
గమనించాను. నేర్చుకున్నాను.
స్వప్న - జాగ్రత్ల వాస్తవ స్వరూపం గ్రహించి తృప్తి పొందిన తరువాత, ఇకప్పుడు “మరి సుషుప్తి అనగా ఏమై ఉంటుంది?" అనే జిజ్ఞాస పొందాను. సుషుప్తి యొక్క రూపమేమిటో, స్వభావం ఎట్టిదో... అద్దాని చమత్కారం ఏమై ఉన్నదో గ్రహించాలని నిర్ణయించుకున్నాను. ఇక నేను ఆ జీవుని ఆనందమయకోశంలో సుషుప్తి యొక్క తత్త్వము గురించి అన్వేషించసాగాను.
అట్లా అన్వేషణ కొనసాగిస్తూ ఉండగా ఇంతలో నాలో 'దృశ్యము' పట్ల ఒకానొక తూష్ఠీభావం ఉద్భవించింది. "ఈ జాగ్రత్ - - స్వప్న దృశ్యములతో నాకేమి పని? అసలీ చిత్తములో కదా, దృశ్యాదులన్నీ పొందుచున్నాను! కనుక చిత్తరహితుడై ఉండెదనుగాక!”... అనే ఒక ఉద్దేశము రూపుదిద్దుకోసాగింది. వెంటనే చిత్తము కొంచెం కొంచెం ప్రశాంతత సంతరించుకోసాగింది. అప్పుడు విషయములు వదలి విషయరహితుడనై ఉండటం ప్రారంభమయింది.
వెంటనే అట్టి చిత్తెత్యాజ్య స్థితిలో విషయములు రహితం అవటం గమనించాను. “ఓహో! ఇప్పుడర్థమయింది”... అని ఒక్కసారి నా బుద్దికి తోచింది. చిత్తరహితంగా అంతరంగంలో ప్రశాంతు డనై ఉండే స్థితియే సుషుప్తి. అంతకుమించి సుషుప్తి అనగా మరింకేమీ కాదు. - అని గమనించసాగాను.
అట్టి సుషుప్తి జాగ్రత్ - అహంకారంచే ఎఱుగబడటంలేదు. ఎందుకంటే సుషుప్తిస్థితిలో జాగ్రత్ - స్వప్న అహంకారం కూడా మౌనం అవటం ప్రారంభిస్తోంది. కానీ, సుషుప్తి అహంకారం నిర్విషయమై ఉంటూనే, 'సుషుప్తి' ని అనుభవరూపంగా పొందుచూనే ఉన్నది.
కానీ... అది విదిత-అవిదిత రూపమై ఉన్నది. ఎందుకంటే... సుషుప్తిలో విషయాలే లేవు కనుక ...అది అవిదితం. కానీ... ఇది “నా గాఢ నిద్రాస్థితి” అని తెలియుచూనే ఉన్నది. కనుక విదితం.
ఆ స్థితి జడము కాదు. తెలుసుకొనే చైతన్యము సాక్షియై ఉండగా అయ్యది జడం ఎట్లా అవుతుంది? సుషుప్తి చేతనము కాదు. విషయములుంటే కదా, 'కదల్చునది' అనే అర్థం సూచించే ‘చేతనము’ అని అనటానికి? అయితే ...జడ-చేతనములకు సాక్షి అయినట్టి చిదాత్మయందే సుషుప్తి స్ఫురిస్తూ, శోభిస్తోంది.
ఓ వ్యాధుడా! సుషుప్తి గురించి చెప్పటానికి వీలుగా మరికొంత వివరణను కొనసాగిస్తున్నాను. విను. ఈ జీవుడు ఒకానొక క్షణంలో ఇట్లా భావన చేస్తున్నాడు. “అబ్బా! ఈ జాగ్రత్ స్వప్నములలో మనోదేహంతో పరిభ్రమిస్తూ శ్రమచే అలసిపోయాను. అయినా వీటన్నిటి గురించి భావన చేసి ఏం ప్రయోజనం? ఇకచాలు. కొంచెంసేపు అన్ని ఆలోచనలు కట్టిపెట్టి 'ఆలోచన’ అనే పరిశ్రమను త్యజిస్తాను. చిత్తరహితుడనై శాంతంగా ఉండెదనుగాక!" ఈ ప్రకారంగా అనుకొని సర్వ సంకల్పములను త్యజిస్తున్నాడు. అప్పుడు ఆతని అనుభూతి గాఢనిద్రాకారమై ఉంటోంది. 'ఆలోచనలు' అనే కార్యక్రమం నుండి ఆదమరచి “ఆలోచనా రాహిత్యం" ... అనే స్థితిని స్వయంగా సంతరించుకోవటమే (అట్టి పరిణామమే) సుషుప్తి. అంతకు మించి సుషుప్తికి వేరే రూపమేదీ లేదు. ఈ మనుజుడు “ఇప్పుడు
Page:352
నేనేదీ ఆలోచించనే ఆలోచించను. అన్నీ వదలి నాలో నేను ప్రశాంతుడనై ఉంటాను. 'అనేక రూపములు' అనే శ్రమను వదలి ఏకరూపుడనై ఉంటాను"... అని ఎవడైనా అనుకొని సమస్త ఆలోచనలను త్యజించి ఉండటం అభ్యసిస్తూ ఉంటే ... అట్టి మనుజుడు జాగ్రత్తునందు కూడా అట్టి గాఢ రూప సుషుప్తిని స్వయంగా అనుభూతమొనర్చుకొనగలడు.
సుషుప్తియే... ‘ఘనీభూతం' పొందినప్పుడు 'నిద్ర' అంటున్నాం. కొంచెం విక్షేపముచే శైథిల్యం పొందినప్పుడు 'స్వప్నం’ అంటున్నాం. ఇంకొంత శైథిల్యమైన సందర్భంలో 'జాగ్రత్' ఏర్పడినదై ఉంటోంది.
తురీయం - ఓ వ్యాధుడా! ఆ విధంగా 'సుషుప్తి' యొక్క స్థితి - రూపములను గ్రహించాను. జాగ్రత్-స్వప్న-సుషుప్తుల స్థితి గతులేమిటో గమనించాను. అయితే ఇక ఆ తరువాత “తురీయం అనగా ఏమిటి?” అనే ప్రశ్నకు వచ్చాను. మహాప్రయత్న శీలమైన బుద్ధితో తురీయావస్థ యొక్క అన్వేషణ చేయసాగాను. ఎంతో సంచరించాను. కానీ ఏం లాభం? చీకటి ఉన్నంత వరకు వెలుగు రూపమేమిటో తెలియదు కదా! అట్లాగే అజ్ఞాన నాశకమగు “శుద్ధ సమ్యక్ జ్ఞానం” సంపాదించుకో సంతవరకు 'తురీయ స్థితి' యొక్క రూపమేమిటో కొంచెం కూడా లభించదు.
ఈ ప్రపంచం యథాతథంగా ఉండినప్పటికీ... ఇదంతా కూడా "సమ్యక్ - బోధ”చే విలీనమైపోతోంది. అనగా... ఒక ఇద్దరి పరిచితులలో ఏ భేదం వర్తమాన స్థితిలో కనిపిస్తోందో... అది కాస్తా “అంతటా సమమైయున్న సమ్యక్ జ్ఞాన సముపార్జనచే పటాపంచలౌతోంది. అప్పుడీ ప్రపంచమంతా ఆత్మరూపంగా (అకృత్రిమంగా) అనిపించగలదు. అట్లు ఆత్మగా కనిపిస్తున్నప్పుడు ఇక్కడ వాస్తవానికి ఏదీ విలీనం కాదు. ఎవడు సమ్యక్ దృష్టిని బలోపేతం చేసుకుంటాడో ఆతడు తన స్వరూపమును జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు వేరైనదని, వాటిచే స్పృశించబడజాలదని, ఆ మూడూ ఎందులో ఏర్పడి విరామం చెందుచున్నాయో - అది తన స్వరూపంగా గమనించుచున్నాడు. కనుక... తురీయం అనేది ఒక అవస్థ కాదు. అది జాగ్రత్ - - స్వప్న - సుషుప్తుల యొక్క కేవల - అప్రమేయ సాక్షీరూపం అయివున్నది.
జాగ్రత్ - స్వప్న సుషుప్తులు అనే మూడు స్థితులు తురీయము నందు స్థితి కలిగి ఉన్నాయి. కానీ పరమార్థంగా... వాస్తవానికి ఏదీ ఎందులోనూ స్థితి కలిగి ఉండటం లేదు.
“ఈ జగత్తు ఏ కారణం చేతనూ ఉత్పన్నమయి ఉండలేదు. శాంతము - జనన మరణ రహితము అగు బ్రహ్మమే ఇట్లు జగద్రూపంగా కనబడుతోంది.” అనే బోధయే ... తురీయం.
"జన్మ కారకములగు కారణములేవీ అద్వయమగు బ్రహ్మమున ఉండజాలవు. 'సృష్టి' అనబడే ద్వైతమేదీ ఏ సమయమందును బ్రహ్మమునకు సంభవించజాలవు.
నేను బ్రహ్మమునే! (అహమ్ బ్రహ్మాస్మి)! జలమునకు తరంగత్వము వాస్తవరూపం కానట్లు ...జన్మాదులు ...జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా స్వరూపమునకు ఆపాదించబడజాలవు. నేను ఏదై ఉన్నానో అది సర్వదా యథాతథమై ఉన్నది. నాకు కనిపించేవన్నీ నా యొక్క వివిధ రూపములే!”
Page:353
ఇట్టి అవగాహనతో కూడిన అనిర్వచనీయ అనుభవస్థితియే “తురీయము” అను శబ్దముచే ఉద్దేశించబడుచున్నదని అత్యుత్తమ బుద్ధితో గ్రహించాను.
5. చిత్త సర్వాత్మకత్వం
జీవుడు, పరిశీలన -
వ్యాధుడు (లుబ్ధకుడు) : మహాత్మా! మునీంద్రా! ఆ విధంగా మీరు ఒకానొక జీవుని అంతరంగంలోకి చిత్తమయ దేహంతో ప్రవేశించి మహా ప్రయత్న శీలమగు బుద్ధితో జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయముల స్వరూప, తత్త్వార్థములను సుస్పష్టపరచుకొనిన తరువాత... ఇంకా ఏం చేశారు? మునీంద్రుడు : ఆ విధంగా జాగ్రదాది నాలుగు అవస్థల తత్త్వవిచారణ చేసిన తరువాత మామిడి వృక్షం యొక్క సువాసన గాలిచే కొనిపోబడి ఒక కమల సుగంధంలో లీనం చేస్తున్నట్లుగా - నేను ఆ ప్రాణి యొక్క చిదాభాస రూపమగు జీవునితోటి ఐక్యం పొందటానికి ప్రవృత్తుడనైనాను. ఆ ప్రాణి యొక్క చిదాభాసుని యందు ప్రవేశించటానికై ముందుగా నా హృదయమందలి తేజో రూపాన్ని కొంచెం త్యజించసాగాను. అనగా, అప్పటి వరకు తేజోరూపాన్ని ఆశ్రయించి ఇంద్రియ రూపమును అవధరించి ఇంద్రియ వృత్తులను ఆశ్రయించాను. అప్పుడు నా సమస్త ఇంద్రియ వృత్తులు బలాత్కారంగా బహిర్ముఖ వ్యాపారము నందు ప్రవృత్తం కాసాగాయి. అట్లా బహిర్ముఖంగా ప్రవృత్తమౌతున్న వృత్తులను అభ్యంతరమునకు (లోనికి) మరల్చే ప్రయత్నమునకు సంసిద్ధుడనైనాను. అట్లా వృత్తులను అదుపులో పెట్టుకొంటూ, వాటిని చాకచక్యంగా నిగ్రహించి, క్షణకాలంలో ఆతని అభ్యంతరమున వ్యాపించినవాడనయ్యాను. అట్లా ఉపాధి వ్యాప్తిత్వముతో ఆతనిలో ప్రకాశించాను. ఆతని 'చిదాభాస సంవిత్తు'తో ఏకత్వం పొందాను.
అప్పుడు ఆతని వాసనలు, నా వాసనలు సంయోగం పొందాయి. అప్పుడు అంతః ప్రతిభాస ప్రపంచం ద్విగుణీకృతంగా కనబడసాగింది. దిక్కులు రెండింతలుగా కనిపించసాగాయి. ఇద్దరు చంద్రులు, ఇద్దరు సూర్యులు, రెండు భూమండలములు, రెండు ఆకాశములు - ಇಟ್ಸ್
కనిపించసాగింది.
ఒకే ముఖం రెండు అద్దములలో రెండు ప్రతిబింబాలుగా కనిపిస్తుంది చూచావా? అట్లాగే ఇరువురు చిదాభాసులు కలియటం చేత రెండు జగత్తులు (దృశ్యము రెండింతలుగా) కనిపించసాగాయి. ఓ సాధూ! రెండు వేరుశెనగ గింజలలో ఒకే తైలము ఉంటుంది చూచారా? అట్లా మా ఇరువురి చైతన్యము బుద్ధి కోశంలో ప్రతిభాసించసాగింది. బుద్ధిలో రెండు దృష్టులు భాసించాయి. వాస్తవానికి ఆతని యొక్క - - నా యొక్క వాసనలు పూర్ణ సమ్మేళనం కాలేదు. అయినప్పటికీ పాలు-నీళ్ళులాగా ఒకని ప్రపంచంలో మరొకరి ప్రపంచం కలసి ఉన్నట్లే కనిపించింది. అనిపించింది.
అప్పుడు... నేను ఆ ప్రాణి యొక్క “చిదాభాస సంవిత్తు” నంతటినీ స్వసంవిత్తుచే పరిచ్ఛిన్నం చేసి అద్దానిని నా సంవిత్తుతో ఏకరూపత్వం పొందేటట్లు చేశాను. ఆతని సంవిత్తు నా సంవిత్తునందు
Page:354
కలసి 'ఏకము' అయింది. అప్పుడు మా ఇద్దరి వాసనల ఏకీకరణము వల్ల పూర్ణ ఏకత్వం లభించటం చేత ...ఇదివరకు ద్విగుణీకృతంగా కనబడిన జగత్తు ఏకత్వం పొందింది.
ఆ తరువాత ఆ ప్రాణి యొక్క చైతన్యమునందు నా సంకల్పము అల్పమై .... నా సంకల్పం కూడా ఆతని సంకల్పానుసారంగా స్థితి పొందటం జరిగింది. స్వకీయమైన 'పరామర్శ'ను త్యజించ కుండానే ఆతని సంకల్పంలో నా సంకల్పం కరిగిపోయి ఉండటం జరిగింది.
ఆ పిదప అచట నేను ఆతని హృదయం త్యజించకుండానే అచట జాగ్రత్ సంబంధమైన అనుభవ విశేషాలన్నీ నావిగా అనుభవం పొందాను. ఆ జీవుడు మామూలుగా నిదురలేచి తన దినచర్యలను కొనసాగించసాగాడు. పగలంతా ఆతను చూస్తున్నవన్నీ నేను చూస్తున్నట్లుగా ఆతడు మాట్లాడేవి నేను మాట్లాడుచున్నట్లుగా ఆతని ఆలోచనలన్నీ నా ఆలోచనలుగా గాంచాను. ఆ విధంగా పగలంతా గడచింది. సాయంత్రం అయింది. అటు ఇటు పగలంతా తిరిగి ఆతడు ఇంటికి వచ్చాడు. సుష్టుగా భోజనం చేసి పడుకున్నాడు. మెల్లగా నిద్ర పోవటానికి సిద్ధమైనాడు. అప్పుడు ఆతని ధ్యాస 'రూపగ్రహణం - - లోక విషయాలు విశ్లేషించటం - కోప ఇష్ట కార్యాభిలాష' ఇత్యాది ప్రపంచానుభవములనుండి ఉపశమించటం ప్రారంభించింది. చిత్తముతోసహా ఆతని ఇంద్రియ వృత్తులన్నీ మూయబడినవి కాసాగాయి. తాబేలు యొక్క అవయవములు అద్దాని శరీరంలో ప్రవేశిస్తాయి చూచావా? అట్లాగే ఆతని ఇంద్రియ వృత్తులు ఆతని హృదయకోశంలో ప్రవేశించాయి. కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. ఆతని వృత్తి కళ్ళస్థానం నుండి వెనుకకు మరల్చబడి హృదయ స్థానంలో ప్రవేశించింది. ఆతని శరీరం (కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు మొదలైనవి) క్రమంగా నిష్క్రియములై మరణించినవాని అవయవములవలె తయారైనాయి. ఆతని శరీరం బాహ్యానికి – చిత్రలేఖనంలోని మనుజునివలె వ్యాపార రహితం అయింది. అప్పటిదాకా నేను కూడా ఆతడు జాగ్రత్తులో ఉన్నంత వరకు ఆతని ఇంద్రియవృత్తులు నావిగా భావించి ఆతని అనుభవములను నేను పొందాను కదా! ఇప్పుడు ఆతని చిత్తమును అనుసరించటం కొనసాగించాను. ఆతని చిత్త వృత్తితో ఆతని ఇంద్రియ గోళములను త్యజించి ఆయా నాడీ మార్గముల ద్వారా ఆతని వెనుకకు మరల్చబడిన చిత్తవృత్తులను అనుసరిస్తూ ఆతని హృదయంలో ప్రవేశించాను. ఆతని చిత్తము బాహ్యానుభవాన్ని ఉపసంహరించుకున్నది. అభ్యంతరంలో గల జీవ తేజస్సులో ప్రవేశించింది. ఆ
తేజస్సులోగల, కోమలమైన ఆనంద కోశమును ఊయలలాగా అధిరోహించి సర్వ వ్యాపార శూన్యమగు సుషుప్తిని అనుభవించసాగింది. అద్దానితోబాటు సుషుప్తిని నేను కూడా అనుభవిస్తూనే అత్యంత సూక్ష్మమైన ప్రజ్ఞతో “గమనించటం” అనే నా ప్రధానోద్దేశమును కొనసాగిస్తూనే ఉన్నాను.
ఆ సమయంలో సమాన వాయువు (పంచ ప్రాణములలో ఐదవది) ఛిద్ర సహితములగు నాడులలో అన్న పానాదుల రసముల యొక్క అనేక వికారముల చేత అక్కడక్కడా నిరోధించబడుతోంది. అయినా కూడా సూక్ష్మరూపమగు గతిచే దేహమంతా సంచరిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆ ప్రాణి యొక్క చిత్తమునకు “సుషుప్త స్థితి” సంభవించిందో... అప్పుడు ప్రాణము అద్వైత రూపమగు
Page:355
ఆనందమునందు తత్పరమై ఉండటం గమనించాను. ప్రాణము "పురీతతి" అనే నాడిలో ప్రవేశించి తనతో వెంటనంటి ఉన్న చిత్తముతో సహా ఆత్మయే పురుషార్థంగా కలిగి ఉండే స్థితిని స్వాధీనపరచుకొని ఉన్నది. అదియే సుషుప్తిలో జీవునికి కలిగే సుఖ విశ్రాంతి.
ఓ వ్యాధుడా! ఒకడు పరమ స్వార్థపరుడై ఉన్నప్పుడు ఇతరుల పనులేవీ నిర్వర్తించడు కదా! అట్లాగే సుషుప్తదశలో ప్రాణములు 'ప్రత్యగాత్మ' అనే పరమ పురుషార్థమునందు తత్పరమై ఉంటు న్నాయి. అందుచేత ఆ ప్రాణములు 'ఇంద్రియములు' అనే పరవస్తు కార్యక్రమమేదీ నిర్వర్తించటం లేదు. నిరతిశయానందమైన “స్వాత్మ సత్తామయము”... అగు సుషుప్త సమయంలో జీవచైతన్యము కేవల నిరతిశయానంద రూపంతో ప్రకాశిస్తోంది. అట్టి సుషుప్త దశలో విక్షేప దుఃఖాదులేవీ కొంచెముగా కూడా భాసించుటలేదు.
6. మనస్సుకు వేరుగా దేహమే లేదు
శ్రీరాముడు : హే మహర్షీ! సుషుప్తదశలో మనస్సు ప్రాణములకు అధీనములై ఇంద్రియాదుల గురించిన మననం ఏమాత్రం చేయటం లేదు కదా! మరి ఆ మనస్సు జాగ్రద్దశలో ప్రవేశించినప్పుడు ఇంద్రియాదులను (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులను) ఎందుకు మననం చేస్తోంది? వాస్తవానికి ప్రాణం కంటే మనస్సు అనబడే వేరైన రూపమేదీ లేదు కదా! ప్రాణాలు లేనిచోట మనస్సు ఉండదు కదా! మరి ప్రాణము సుషుప్త దశ నుండి జాగ్రత్ దశకు వచ్చి దృశ్యమననం ఎందుకు చేస్తోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :
దేహఏవాహ నాస్త్యేవ, స్వానుభూతో ప్యయం నిజః
మనసః కల్పనాత్మేదం వపుః స్వప్నే గిరిర్యథా ॥
ఓ రామచంద్రా! ఈ దేహము నిజంగా ఉన్నట్లుగా స్వానుభూతమగుచున్నప్పటికీ, వాస్తవానికి ‘దేహము’ అనబడేది లేదు. ఎందుకంటావా?... అధిష్ఠాన సన్మాత్రమును వేరుచేసి చూచామా... ఇక దేహం, మనస్సు, ప్రాణం మొదలైనవన్నీ లేనే లేవు. బంగారం లేకపోతే ఆభరణ మెక్కడున్నది? అధిష్ఠాన సన్మాత్రము ఉండి ఉన్నప్పుడు, ఇక తదితర మనో-ప్రాణ-దేహాదులు ఉండనే ఉంటాయి. బంగారం ఉన్నచోట ఆకారం కూడా ఉంటుంది కదా! జలమును ఆశ్రయించి తరంగత్వం ఉండనే ఉంటుంది కదా! స్వప్నంలో పర్వతం ఉన్నట్లుగా అగుపించవచ్చు గాక! ఆ పర్వతం ఎక్కడున్నది? అట్లాగే ఈ 'దేహము' అనబడేది మనస్సు యొక్క కల్పనా వ్యవహారం మాత్రమే! ఇక మనస్సో, ఆత్మకు (నిరాకార జలమునకు సాకార తరంగం వలె) కల్పనా వ్యవహారమై ఉంటోంది.
కాబట్టి మనస్సు నుండి వేఱుచేసి చూస్తే శరీరమే లేదు! అట్లాగే దృశ్య విషయం కూడా! సృష్ట్యాదిలో ‘దృశ్యం’ అనబడేది ఉత్పత్తి అవటానికి కారణమే లేదు కనుక ఆత్మకు వేరుగా 'దృశ్యం’ లేనే లేదు. దృశ్యమే లేదు కాబట్టి 'చిత్తము' అనేది కూడా లేదు. మరి?
Page:356
అతః సర్వమిదం బ్రహ్మ తచ్చ సర్వాత్మకం యదా తదా విశ్వమిదం విష్వగస్త్యేవ చ యథాస్థితమ్ ||
కాబట్టి రామచంద్రా! ఈ సమస్తము కూడా బ్రహ్మమే అయి ఉన్నదయ్యా! ఎప్పుడైతే "బ్రహ్మము సర్వాత్మకము”... అనే శాస్త్రవాక్యం మనం ఒప్పుకుంటామో... అప్పుడు బ్రహ్మమునకు వేటైనదేదీ ఎక్కడా ఏ సమయమందూ లేనిదే అగుచున్నది. (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ!) బంగారం యొక్క ఉనికిచే ఆభరణం ఉన్నట్లు, జలం యొక్క సత్తాచే తరంగం ఉన్నట్లు... ఈ ప్రపంచము, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము... ఇవన్నీ కూడా బ్రహ్మ సత్తా చేతనే భావనారూపమై ఉంటున్నాయి.
బ్రహ్మవేత్తల దృష్టిలో చిత్తం, దేహం, దృశ్యం - అని చెప్పబడేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఇక బ్రహ్మవేత్తలు కానివారి దృష్టి అంటావా... అది తత్త్వవేత్తలమగు) మాకు విషయమే కాదు. ఎందుకంటే వారికి ఈ దృశ్య మనో జగదాదుల పట్ల క్షణమొకరకమైన అభిప్రాయం పుట్టుకొస్తోంది. శ్రీరాముడు : మహర్షీ! మీరు చెప్పే రీతిని బట్టి పాతాళలోకం నుండి బ్రహ్మలోకం వరకు అంతా బ్రహ్మమయమే కదా! వివిధ రూపములతో కూడిన ఈ త్రైలోక్యములు (స్వర్గ మర్త్య-పాతాళములు) బ్రహ్మమే - అని గ్రహించటానికి వీలుగా ఆ క్రమమేమిటో వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : చిన్మాత్రము నిర్మలమై అనంతమై చిదాకాశ స్వరూపమైయున్నది. అది సర్వదా సర్వరూపమైయున్నది. అది 'అద్వితీయం' అని వేదోపనిషత్ లచే) ప్రవచించబడుతోంది. కనుక అద్దానికి వేఱుగా ఏదీ లేదు. కనుక జగత్తుగాని, దృశ్యం గాని, దృశ్యత్వం గాని ఏవీ కూడా లేవు.
ఆ చైతన్యము “ఎరుక” అను విలక్షణ లక్షణం కలిగి ఉంటోంది. అట్టి ఎరుక నుండి "ఎరుగుచున్నది - ఎరుగబడేది” అనునవి జలంలోంచి తరంగాలవలె ఏర్పడుచున్నాయి. అట్టి విలక్షణమైన విశేషమును “సర్వజ్ఞత్వం” అంటారు.
చైతన్యము తనయొక్క శుద్ధమైన - సర్వాతీతమైన - - చింతాది రహితమైన చిత్స్వరూపమును కొనసాగిస్తూనే, తనయొక్క “సర్వజ్ఞత్వం” అనే విశేషం చేత మొట్టమొదటగా “మనస్సు” అనే అధ్యారోపమును స్వయంగా తనకు అనన్యంగా గావించుచున్నది. అటు తరువాత ఆ మనస్సుకు సంచారణ శీలత్వం తానే కల్పించుచున్నది. అట్టి మనస్సులో రెండు విభాగాలున్నాయి.
1. మనస్సు యొక్క తెలుసుకునే విభాగం, 2. మనస్సు యొక్క తెలియబడే విభాగం
“మనస్సు యొక్క సంచరణ శీలత్వమే ప్రాణములు” అని గ్రహించు. అనగా చైతన్యం ద్వారా మనస్సుచే కల్పించబడినదై 'ప్రాణం' అనేది అనుభూతమౌతోంది. ప్రాణం ఎట్లు అనుభూత మవుతోందో... అట్లాగే దేహేంద్రియాదులు, దిక్-కాలకల్పనాసమన్వితమైన జగత్తు కూడా అనుభూతమౌతోంది. ఈ విధంగా ఈ విశాల ప్రపంచమంతా మనోమాత్రమే అయివున్నది.
మనస్సో? చిద్రూపమగు పరబ్రహ్మమే! కాబట్టి ఈ ఎదురుగా కనబడేదంతా వ్యాపక పరబ్రహ్మమే గాని... మరింకేమీ కాదు! ఈ జగత్తు యొక్క వాస్తవ రూపమును పరిశీలిస్తే “ఇదంతా నిరాకారమై - - ఆద్యంతరహితమై - అభాసశూన్యమై - నిర్వికారమై - శాంతమై - సన్మాత్రమై - -
Page:357
చిన్మాత్రమైనట్టి పరమబ్రహ్మమే” ... అని గమనించబడగలదు. పరబ్రహ్మము సర్వశక్తిమంతమైనది. అట్టి పరబ్రహ్మము తనయొక్క ప్రాథమిక మనశ్శక్తిచే దేనిని ఎట్లా భావన చేస్తోందో.... అది అట్లాగే ఆయా రూపాదులతో కూడుకొని అనుభవిస్తోంది.
ఒకడు తన స్వప్నంలో ప్రవేశించి ఆ స్వప్నంలో ఆయా రూపాలుగా గాంచేది తన యొక్క మనో రూపమే కదా! అట్లాగే జాగ్రత్తులో కూడా తన మనోరూపాన్నే తాను పరిపరి విధాలుగా సందర్శిస్తున్నాడు. సంకల్పాత్మకమైన “మనస్సు” అనే కార్యబ్రహ్మం తనకు తానే భూ, స్వర్గ, పాతాళ లోకాలను, కల్పించుకొని వాటియందు సుదీర్ఘ సంచారం సల్పుతోంది. ఒకడు ఊహచే సంకల్పించి ఆ ఊహలో ఏవేవో విశేషాలను దర్శించి అనుభవించటం, - అవన్నీ ఒక్కొక్కసారి 'నిజమే’ అని అనుకోవటం ఆబాలగోపాలానికి విదితమైనదే కదా! అట్లాగే జాగ్రత్ - స్వప్న అనుభవాలు కూడా!
ఓ రామచంద్రా! 'ఆత్మ' అనబడే “చిదాకాశరూపుడు ఆదిపురుషుడు” - అగు పరమాత్మయే నిజకల్పితమైన మనస్సులో (తాను యథాతథంగా ఉంటూనే) ప్రవేశిస్తున్నాడు.
మనస్సు ద్వారా ప్రాణవంతుడగుచున్నాడు. ప్రాణముల ద్వారా దేహం ధరిస్తున్నాడు. దేహాదుల ద్వారా త్రిలోక రూపుడగుచున్నాడు.
ఇందుకు దృష్టాంతం స్వప్నమే! ఒకడు తాను యథాతథంగా ఉంటూనే తన ఊహారూపమును స్వప్నంలో ప్రకాశింపజేసి, ఆ స్వప్నంలో పురములను, గృహములను, మిత్రులను, శత్రువులను ఊహచే సంపాదించుకొని అనుభవించటం లేదా?
జాగ్రత్తు కూడా అట్టిదే! ఇది కూడా ఊహానిర్మితమే! స్వప్నం కూడా అట్టిదే! అదీ ఊహాకల్పితమే! “జాగ్రత్తు సంకల్పాలచే రూపుదిద్దుకుంటోంది” ... అని అనటానికి స్వప్నమే మనకిక్కడ ఒక దృష్టాంతం.
7. మనో - - ప్రాణ రథసారథ్యం
శ్రీరాముడు : “హే మహర్షీ! అసలీ జగత్తు యొక్క కర్తృత్వం ఎవరిది?" - అనే ప్రశ్నకు సమాధా నంగా అనేక సిద్ధాంతాలు, కథనములు చెప్పబడుతూ ఉంటాయి. బ్రహ్మజ్ఞులగు మీ అనుభవం దృష్ట్యా ఈ సృష్టికి అసలైన కర్త ఎవరో, ఎక్కడుంటాడో, ఎందుకు సృష్టిస్తున్నాడో చెప్పండి. శ్రీ వసిష్ఠ మహర్షి :
చిత్తమేవ జగత్ కర్తృ, సంకల్పయతి యద్యథా
అసత్ - సత్ - - సదసచ్చెవ తత్తథా తస్య తిష్ఠతి ॥
ఓ రామచంద్రా! చిత్తమే జగత్తుకు కర్త అయివున్నది. అది దేనినైతే ఎట్లు - - ఇది అసత్తు, ఇది సత్తు, ఇది సదసత్తు... అని సంకల్పిస్తుందో ... అది ఆ ప్రకారంగానే సత్ - అసత్ - సదసత్గా స్థితి కలిగి ఉంటున్నదగుచున్నది.
ఈ చిత్తమే ప్రాణమును కల్పిస్తోంది. అట్లా కల్పించి, “ఈ ప్రాణము లేకపోతే నేనుండజాలను. ప్రాణమే నాయొక్క సమస్త వ్యవహారములను నిర్వర్తిస్తోంది” ...అని చిత్తమే కల్పన చేసింది.
Page:358
అందుచేత ప్రాణము యొక్క ఆధీనంలో చిత్తము ఉండటం జరుగుతోంది? ఓ ప్రియరామచంద్రా! ఎక్కడెక్కడ మనస్సు ప్రాణముతో సహా ఈ దేహమును కల్పించుకొంటోందో... అక్కడక్కడ ఒక మాయాపురమువలె ఈ విశాల జగత్తును అనుభవిస్తోంది. మనస్సు యొక్క ద్రష్టరూపం “అహమ్” అయి ఉండగా, అద్దాని దృశ్యరూపం ఈ దృశ్య జగత్తు అయివున్నది. అనగా ద్రష్ట - దృశ్యరూపములు రెండూ కూడా మనో-అంతర్గతములే!
❖
ఆ విధంగా ప్రాణ-దేహముల కల్పనానంతరం ఈ చిత్తము "నేను ప్రాణ దేహములు లేక పోతే మనజాలను” అని అనుకుంటోంది. అనగా, నేనే మనస్సుకు స్థానమై, మనస్సుకు అప్రమేయమై మనస్సుకు కారణ - కారణమై ఉన్న చిత్స్వరూపమును!”... అనే ఘనీభూతమైన అనునిత్య సత్యమును ఏమరుస్తోంది. అందుకే చిత్త స్వరూపమును అవధరించిన చిదాభాసుడగు ఈ జీవుడు, "నేను దేహినా? దేహమునా? దేహత్వానికి ముందే ఉన్నానా? లేనా? దేహాంతరం ఉంటానా? ఉండనా? ఉంటే ఎక్కడుంటాను? ఉండకపోతే ఏమైపోతాను”... అనే అనేక సందేహాలు కలిగియే ఉంటున్నాడు. తత్ఫలితంగా అల్పవిచారణ కారణంగా పుట్టుకువచ్చిన ప్రాపంచిక జ్ఞానముచే ఆతడు దుఃఖితుడుగా మిగిలిపోతున్నాడు. ఓ రామచంద్రా! "నేను ఈ శరీర-ప్రాణముల స్వరూపుడను”... అనే సంసార సంబంధమైన అల్పజ్ఞానం/విపరీతజ్ఞానం తొలగాలంటే తత్త్వవిచారణ తప్పితే వేరే ఉపాయం లేదు. అనగా... ఎవనికైతే “ఈ శరీర ప్రాణములు నేను! లేక, ఇవి నావి" ...అనే మిథ్యాజ్ఞానం ఉండి ఉంటుందో, ఆతని పట్ల “ఈ దృశ్యముపై గల నమ్మకం" అనే రూపంలో ఉండే ‘సంసారం’ అనబడే సుదీర్ఘ దృశ్య తాదాత్మ్యం ఉండియే తిరుతోంది. అట్టి సంసార జాడ్యానికి ఒకే ఒక్క పరమౌషధం “ఆత్మజ్ఞానం” మాత్రమే! అందుకిక వేరే ఉపాయం లేదు.
న అన్యత్ర ప్రథతే జ్ఞానం మోక్షోపాయ విచారణాత్
ఋతే తస్మాత్, ప్రయత్నేన మోక్షోపాయో విచార్యతామ్ ||
ఓ సకల జనులారా! నా మాటలు జాగరూకులై వినండి. ఈ కనబడే జగత్తు, జగత్తుగా కాకుండా, మీ యొక్క ఆత్మ స్వరూపంగా కనబడటమే ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానం పరోక్షమైన కథనాలతో లభించదు. కాబట్టి ఆత్మవిచారణను ప్రతిపాదిస్తున్న గ్రంథాలను పఠించండి. జీవుని యొక్క అవిద్యయే దృశ్యమును ఆత్మకు అన్యమైన దానివలె దర్శింపజేస్తోంది.
కిలాహమిదమ్ ఇత్యేవ నా విద్యా విద్యతే క్వచిత్ మోక్షోపాయాదృతే నైతత్ కుతశ్చిదయతే అన్యతః?
ఓ రాఘవా! "అవిద్య ఇక్కడ ఏ రూపంలో ఉన్నది?" అని మేము తరచితరచి పరిశోధించాం.
“ఈ శరీరమే నేను – తదితర శరీరములు నాకు వేరు - - ఈ గృహాదులు నావి తదితరములు నావి కావు” ...అను రూపంగా అవిద్య ఇచ్చట తాండవిస్తోందని గ్రహించాం. అవిద్యకు “ఇదే నేను - ఇది నాది” ...అనుకోవటం తప్పించి వేరే రూపమేదీ లేదని మేము కనుగొన్నాం. అట్టి అవిద్య మోక్షోపాయం ఆశ్రయిస్తేగాని తొలగదు. అట్టి మోక్షోపాయం ప్రసాదించే “శ్రీ వసిష్ఠ రామ సంవాదము”
Page:359
...వంటి గ్రంథములను /మోక్ష శాస్త్రములను పఠించి అనుభూతం చేసుకోవటం ముఖ్యమైన ఉపాయమై ఉన్నదని మేము గమనిస్తున్నాం. 'నేను-నాది' అనే జాడ్యం తొలగటానికి సరి అయిన మార్గంలో విచారించటమే ఉపాయం.
ఓ రామచంద్రా! “నాకు ప్రాణమే పరమాస్పదమైనది. అదే నా జీవనాధారం" అని ఎందుకో ఈ మనస్సు ప్రాణముల గురించి నిశ్చయమును పెంపొందించుకుంటోంది. అంతేగాని “నాకు నిత్యసత్యమగు ఆత్మయే ఆధారం” అనే విషయం గమనించటమే లేదు. “యత్ భావం, తత్ భవతి” అను మనో స్వభావ సూత్రమును అనుసరించి, (లేక) మనస్సు యొక్క కల్పనను అనుసరించి ప్రాణము అత్యావశ్యకమై అనుభవమగుచున్నది. అట్టి భావనా పరంపరల సుదీర్ఘాభ్యాసం చేత మనస్సు యజమాని అయివుండి కూడా ప్రాణములకు “దాసోహమ్” అంటోంది. ప్రాణములకు అధీనమగుచున్నది.
ఈ దేహం సౌమ్యంగాను, ప్రశాంతంగాను ఉన్నప్పుడు " దేహగతమైన శాంతియే ప్రాణగతమైన శాంతి” అని తలచుచు మనస్సు తదనుగతంగా “నేను హాయిగా ఉన్నాను” అని మననాది వ్యాపారాలు కొనసాగిస్తోంది. ఈ దేహం సంక్షోభం పొందినప్పుడు ఆ క్షోభ ప్రాణములలోని క్షోభగా మనస్సు భ్రమిస్తోంది. అంతేగాని ఈ దేహ ప్రాణములకు సంబంధించని అనంత శాంత స్వరూపమైన ఆత్మను మనస్సు గమనించక క్లేశపడుతోంది. ఆత్మ విచారణచే తత్త్వజ్ఞానం సముపార్జించటంలేదు. అందుచేత మనస్సు ఏదో ఒక క్షోభకు ఎల్లప్పుడు గురి అవుతోంది.
ఓ సాధక జనులారా! ఎంతెంతకాలమైతే ప్రాణము శ్వాసోచ్చారణయందు తత్పరమై ఉంటోందో ...అంతంత కాలం మనస్సు “ఏదో పొందాలి” ... అనే దాహమును కలిగి ఉంటుందేగాని... ఆత్మజ్ఞానం కొఱకై ప్రయత్నించటం లేదు. అందుచేతనే ఒకానొక ఉపాయంగా ప్రాణ నిరోధాభ్యాస బలం సంపాదించుకోవటం చేత, మనస్సుకు ఆత్మజ్ఞానం వైపుగా ప్రయాణం సిద్ధించటం సులభం అవుతోంది. మనస్సు ఆత్మజ్ఞానము వైపుగా మరలనంతకాలం అద్దానికి వివిధ రీతులతో కూడిన దృశ్యమే కనిపిస్తుందిగాని... దృశ్యమునకు ఆధారమైన స్వస్వరూపాత్మ అనుభూతమవటం లేదు. అందుచేత ప్రాణ నిరోధాభ్యాసం శాస్త్రకారులచే శాస్త్రోక్తంగా బోధించబడుచున్నది.
ఓ రామచంద్రా! ఈ ప్రాణము, మనస్సు అనబడే రెండూ ఈ విధంగా ఒకదానికి మరొకటి రథము, సారథుల వలె ఉంటూ పరస్పరం పాత్రలను మార్చుకుంటున్నాయి. ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో ఎక్కడైనా రథం రథంగానే ఉంటోంది. సారథి సారథిగానే ఉంటున్నాడు. రథం సారథిగా మారటం సారథి రథంగా మారటం మనం ఈ మనో ప్రాణముల విషయంలోనే లోకంలో చూస్తున్నాం.
ఈ ప్రకారంగా ప్రాణ-మనస్సుల పరస్పర వర్తనం ఆదిసృష్టిలో ప్రాణ - మనో రూపములు తానే అయి ఉన్న పరమాత్మయే సంకల్పించారు. అజ్ఞానుల పట్ల ఆ నియతి ఇప్పటికీ అట్లాగే కొనసాగుతోంది. ఈ విధంగా "మనఃప్రాణములు రెండూ కూడా సంకల్ప కల్పితాలు” అని
Page:360
ఆత్మైక్యదృష్టికి సుస్పష్టంగా తెలియవస్తున్నాయి. ఏ జీవుడైతే "ఈ మనో ప్రాణములే నేను" అని తలచుచు, ఈ రెండింటికి ఆవలగల తనయొక్క అప్రమేయ - అద్వితీయ - అనంతగుణ గంభీర
నిత్య నిర్మల ఆత్మ స్వరూపమును గమనించటం లేదో... ఆతని పట్ల దేశ-కాల-క్రియాద్రవ్యములు కల్పితములగుచున్నాయి. అనగా ఎవరైతే తమ ఆత్మస్వరూపమేమిటో గమనించక “శరీరంతో చస్తాను. మనస్సును అనుసరించే నేనుంటాను. ప్రాణాలుంటేనే మనస్సు పని చేస్తుంది” ...అను దేహ - మనో - ప్రాణాత్మ బుద్ధి కలిగివుంటారో, వారి వారి కల్పనలో దేశ కాల క్రియ ద్రవ్యము -అనే నాలుగు కల్పితమై ఆరూఢమౌతున్నాయి. ఈ దేశ కాల-క్రియ-ద్రవ్యములే జగత్తు రూపంగా ఆ జీవుని పట్ల ప్రసిద్ధమై ఉంటోంది.
ప్రాణ - మనస్సులనే జంటకవులు ఒక్కొక్కసారి కలసి సమత్వముతో కూడిన వారై తమ కార్యములను నెరవేర్చుకుంటున్నారు. మరొకసారి వారు వేరువేరై తమతమ కార్యములను వేరువేరుగా నిర్వర్తించుకుంటున్నారు.
స్వం ప్రాణ - మనసీ సామ్యాత్ కుర్వతీ కర్మ తిష్ఠతః | వైషమ్యాత్ విషమం చైకం శాక్తే శాన్తా సుషుప్తతా ॥
జాగ్రత్తు - ఈ ప్రాణము, మనస్సు అనే రెండూ కూడా సామ్యత్వము (సమత్వము) కొంతసేపు కలిగి ఉండి తమ తమ కార్యములు నెరవేర్చుకుంటూ ఉన్నాయి. అవి రెండూ కలసి ఉండి వాటివాటి కార్యములు నెరవేర్చుకొను సమయంలో కలిగేదే “జాగ్రదనుభవం”. మరొకప్పుడు ప్రాణములు ఇంద్రియ వ్యాపారము నుండి నివర్తించి ఉంటున్నాయి. అప్పుడు ఈ మనస్సు భౌతికమైన ఇంద్రియాలను పొందటం మానివేస్తోంది. ఈ విధంగా ప్రాణం, మనస్సు విసమత్వం కలిగి ఉన్నప్పుడు మనస్సు ఇంద్రియార్థములలో ప్రవర్తిస్తోంది. ప్రాణము ఇంద్రియముల పట్ల మౌనం వహించి ఉంటోంది. అప్పుడు ఏర్పడే స్థితే స్వప్నం. స్వప్నదశలో దేహము యొక్క ఇంద్రియాలు పనిచేయటం లేదు. అయితే శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు (ఇంద్రియార్థాలు లేక జ్ఞానేంద్రియాలు) మనస్సు యొక్క అంగములే కాబట్టి మనస్సు వాటిలో చరిస్తోంది. ప్రాణము దేహము యొక్క ఇంద్రియములపట్ల మౌనం వహిస్తోంది. అయితే జీవుడు స్వప్నదశలో అనుభూతులు అనుభవములు మనస్సు ద్వారా కొనసాగిస్తున్నాడు.
సుషుప్తి - ఇంకొక సమయంలో మనస్సు విశ్రమించి ఉంటోంది. అనగా అది విషయములను త్యజించినదై తనయందు తానే మౌనంగా ఏర్పడి ఉంటుంది. అది ఆత్మలక్షణముతో పోల్చతగినట్టి విషయరాహిత్య స్థితి వహించి ఉంటోంది. సర్వ విక్షేపములు సశాంతించిన స్థితిని పొందివున్న స్థితిలో 'విక్షేపశ్రమ' లేకపోవుటచేత జీవునకు సుఖవిశ్రాంతి లభిస్తోంది.
అట్టి విక్షేపరహిత మనో మౌనస్థితియే సుషుప్తి. ఇక శారీరకంగా చెప్పుకోవాలంటే... ఎప్పుడైతే అన్న రసముల చేతనో పిత్తాదుల చేతో, పైత్య జఠరాదిరసముల పరిశ్రమ చేతనో - నాడులు
Page:361
నిరోధించబడగా... ఆ స్థితిలో ప్రాణాలు దట్టముగా (చిక్కగా) మందసంచారము కలిగి ఉంటున్నాయి. అప్పటి స్థితి సుషుప్తిగా సంతరించుకుంటోంది. నాడులు అన్న రసంచే పూర్ణమై ఉండడంచేతనో, (లేక) శరీరం దీర్ఘంగా శ్రమించి ఉండటం చేతనో (లేక) ఆకలి కారణంగానో నాడులు మందమై ఉంటున్నాయి. అప్పుడు ప్రాణములు మందమైన గతిని కలిగి ఉండడం చేత సుషుప్తి ఏర్పడుతోంది.
ఇంకా చెప్పాలంటే... మర్దనాదులచే నాడుల మృదుత్వం పొందుచున్నప్పుడు, బాణాదులు దేహంలోని కొన్ని ముఖ్య ప్రదేశాలలో తాకడం చేత నాడులలో అధిక అల్ప రక్తప్రవాహం ఏర్పడడం చేత, దేహాంతర్గతములైన ప్రాణాలు రక్తాదులచే పూర్ణమైనపుడు... ఆయా సందర్భాలలో ప్రాణాలు ఎచటనో లీనమై మందసంచారం కలిగి ఉంటాయి. అప్పుడు కూడా జీవునకు సుషుప్త స్థితి జనిస్తోంది. సరే ఇప్పుడు మనం ఈ విపశ్చిత్ చక్రవర్తి చెప్పుచున్న ఆ వ్యాధ - మహాముని సంవాదానికి
వద్దాం.
8. స్వప్నంలో జలప్రళయం
విపశ్చిత్ : ఓ వసిష్ఠ మహర్షీ! ప్రియ సభికులారా! ఆ వ్యాధునితో ఆ మహాముని కొనసాగించిన సంభాషణ వినెదరుగాక!
మహాముని : ఓ వ్యాధుడా! ఆ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించాను కదా! ఆ రోజు రాత్రి సుష్టుగా భోజనం చేసినవాడై ఆతడు గాఢ సుషుప్తి రూపమగు నిద్రకు ఉపక్రమించాడు. ఆతని చిత్తముతో ఏకత్వము పొందిన నేను అప్పుడు నిజ స్వాతంత్ర్యమును త్యజించి ఆతనితో కూడా గాఢనిద్రను అనుభవించాను. కొంతసేపు అట్లా జరిగిపోయింది. అట్లా కొంతసేపైన తరువాత ఆతని ఉదరంలోగల అన్నము జీర్ణం అయింది. అప్పుడు ప్రాణము అటూ ఇటూ కొంచెం వేగంగా చలించటానికి అవకాశం లభించింది. స్వాభావికంగానే ఆతని ప్రాణము నాడీ మార్గంలో ప్రయాణించటానికి చోటు లభిస్తూవుండగా ఆతని సుషుప్తి మందగించసాగింది. ఆ విధంగా సుషుప్తి సూక్ష్మత్వం పొందుతూవుండగా ... ఆతని హృదయంలో సూర్యోదయంలాగా స్వప్నమయ ప్రపంచం ఉదయించటం గమనించాను. ఆ స్వప్న ప్రపంచం సముద్ర - - పర్వత - నదీ - భూ ప్రదేశాలలో త్రిలోక వ్యవహారములతో నిండివున్నది. అట్టి స్వప్న మహా ప్రపంచంలోగల ఒకానొక స్వప్న భూప్రదేశంలో గల ఒక నగరంలోని ఒక గృహంలోగల ఒక ఇల్లాలు (గృహిణి) నా ఎదురుగా కనిపించింది. నేను ఆ ఇంటికి యజమానినై, ఆ గృహిణికి భర్తనై ఉండటం నాకు అనుభూతం కాసాగింది.
ఇక నేను ఆ భార్య - పుత్ర - బంధు - సేవకులతో ఏదేదో సంభాషిస్తూ కాలం గడపసాగాను. ఇట్లా కాలం గడుపుచూ ఉండగా, ఒకానొకరోజు ఏదో ప్రళయకాల జలప్రవాహంలాగా వచ్చి ఆ మా గృహం మొదలైనవన్నీ నేను చూస్తూ ఉండగానే,... నా ఎదుట నుండి కొట్టుకుపోయేటట్లు
Page:362
చేసివేయసాగింది. ఆ గృహం, ఆ నగరంతో సహా నేను కూడా ప్రవాహంలో పడి కొట్టుకుపో సాగాను. నాలాగానే అనేకమంది నగరవాసులు ప్రవాహ వేగానికి దొర్లించబడిపోతూ హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలు తమ భర్తల - పిల్లల గతి చూస్తూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. ఎన్నో ఇళ్ళు నేలమట్టమౌతూవుంటే కొందరు స్త్రీలు మేడపై నుండి కిటికీలోంచి చూస్తూ భయంగా కేకలు వేస్తున్నారు. ఆ ఉపద్రవాన్ని చూచి నేను దీనచిత్తంతో పెద్దగా ఏడవసాగాను. నా కళ్ళముందే అనేక గృహాలు నేలమట్టమైనాయి. నా భార్య - పిల్లలతో సహా కట్టు బట్టలతో అనేక మైళ్ళు జల ప్రవాహానికి కొట్టుకుపోయాం. ఒక పర్వత సానువు చేరాం. అక్కడ రాతిబండ చప్టాపై కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో మరల జలతరంగాలు మమ్ములను ఆవరించాయి. అట్లా నేను నా భార్య - పుత్ర - బంధువులతో అనేక సంకటములు పడుతూ తీవ్రవేదన అనుభవిస్తూ ఉండగా అప్పుడొక్క క్షణంలో ఒకానొక జ్ఞానకిరణం నా హృదయంలో తళుక్కుమన్నది.
"ఓహో! నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఆ జీవుని హృదయంలో ప్రవేశించి ఈ అన్యలోకం ప్రవేశించాను. ఆ ఒకానొక ప్రాణియొక్క హృదయంలోంచి ఆతని స్వప్న విభాగంలో ఈ అనుభవము దర్శిస్తున్నాను కదా" ... అని గుర్తుకు వచ్చింది. అందుచేత వర్తమాన స్వప్న ప్రపంచం యొక్క దృఢాభ్యాసంచే జనించిన మిథ్యాజ్ఞానంతో అప్పటి నా దేహం పరిపూర్ణమయి ఉన్నదని గుర్తు చేసుకున్నాను. కాబట్టి నా ఆ స్వప్నాంతర్గత భౌతిక దేహం జలప్రవాహానికి కొట్టుకు పోతున్నప్పటికి నా యొక్క సమాధిమయ స్వరూపమును స్మరించుకొంటూ ఉండటం చేత సుఖంగానే ఉండగలిగాను. ఇకప్పటి నుండి జలంలో కొట్టుకుపోతున్న పురములను, తదితర వస్తుజాలమును, జన ధనాదులను చూచి మృగతృష్ణా జలంలాగా మిథ్యగా గాంచసాగాను. నలువైపులా జగత్ పదార్థములు అనేకం ఖండఖండములై శిథిలం అవటం చూస్తూ ...ఇట్లా అనుకున్నాను.
"ఆహా! ఏం ఆశ్చర్యం! జాగ్రత్ - - స్వప్న - సుషుప్తులు - - అనబడే త్రినేత్రములు గలిగిన ఈశ్వరుడు జీవరూపుడై ఈ మాయా మహాసముద్రంలో తృణమువలె కొట్టుకుకుని పోవుచున్నాడా! హా హతవిధీ! ఇద్దానికి నేను చేయగలిగినదేమున్నది? ఏమీ లేదు!”
ఆ ప్రవాహంలో అనేక ఆభరణాలు ధరించిన గంధర్వ - కిన్నెర - మనుష్య - దేవ - నాగ జీవులు మొదలైన కొందరు ఆ ప్రళయ సముద్ర తరంగములలో తేలియాడుచూ ఉంటే.... అదంతా ఏదో క్రీడవలె ఉన్నది. ఆకాశమున విహరించే దేవతా విమానాలు ఆ జలంలో కూలిపోతూ కనిపించాయి. ఆ జలాలు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ధ్యాన నిష్ఠుడై ఆశీనుడైవున్న కమలముల పత్రములను స్పృశించి మరల వెనుకకు మరలుచున్నాయి. యముడంతటివాడు మరొక యమునిచే గొనిపోబడుచున్నట్లు కనిపించాడు. సూర్యగోళం ఆ ప్రళయ జలప్రవాహంలో మునిగిపోతూ కనిపించింది. తత్త్వజ్ఞులగు మహనీయులు మాత్రం తమ శరీరములు జల తరంగములచే ఖండన
- మర్దనములు పొందుతూ ఉంటే... అదంతా కూడా భేద రహితంగా, ఏవో ఎండు కట్టెలు నీటిలో
దొర్లుచున్నట్లుగా తమ దేహములను తాము గాంచగలుగుచున్నారు. స్త్రీ సమూహం తరంగములచే
Page:363
దొర్లించుకుపోతూ ఉంటే శృంగార రసాస్వాదన గురించి చర్చించే పురుషులు చేసేదేమీలేక నిస్సహాయులై అక్కడక్కడ చూస్తూ ఊరకే ఉండిపోసాగారు.
ఆహా! లోకాలన్నీ ఆక్రమించి పరిపాలించే ఇంద్రాది దేవతలవంటివారు చిరునామా దొరకుండా ఆ జలంలో అంతర్గతులై అదృశ్యులగుచున్నారే! అదంతా చూస్తుంటే పరమ వేదనాభరితంగా ఉన్నది. "ఆహా! ఈ త్రైలోక్యము, త్రిలోకాధిపతులు, స్వర్గలోక సుందర వనములు, మర్త్యలోక సంబంధ– అనుబంధ బాంధవ్యములు ...చివరికు అన్నీ నశించటానికే జనిస్తున్నాయా?”
అని నేను ఎంతో పరితాపం పొందసాగాను.
9. దృశ్యం కల్పితం-దృక్ సత్యం
వ్యాధుడు : మహాత్మా! మహామునీ! తమవంటి జ్ఞానయోగ సిద్ధులు కూడా ఆ మహాకష్టప్రదమగు జలప్రళయం గురించి అనేక భ్రాంతులకు లోను అయ్యారా? అదంతా భ్రాంతియేనని, స్వప్న సదృశమేనని మీరు ఎరిగియే ఉన్నారు కదా! మరి అంతటి వేదనను, దురవస్థలను అనుభవించే బదులుగా మీరు ధ్యానయోగం ద్వారా సర్వ భ్రాంతుల నుండి ఉపశమనం పొంది ఉండవచ్చు కదా! అసలు ఆ జలప్రళయం ఎక్కడి నుండి వచ్చింది?
మహాముని : ఓ వ్యాధుడా! ఆకాశంలో అభాస రూపములే (భ్రమ రూపాలే) ఆయినట్టి జగత్తులు అసంఖ్యాకంగా కల్పనచే జనిస్తున్నాయి. కల్పనా రూపంగా ప్రళయాలు కూడా సంభవిస్తున్నాయి. కల్పనా రూపంగానే ఆ జగత్తులు నశిస్తున్నాయి కూడా!
కల్పాంతంలో జగన్నాశనం సంభవిస్తోంది. ఆ జగన్నాశనం ఒకొక్కప్పుడు ఒకానొక క్రమంగా సంభవిస్తోంది. మరొకప్పుడు ఒక్కసారిగా సప్త సముద్రాలు ఏకకాలంలో ఏకమై నాశనం సంభవి స్తోంది. అప్పుడిక భూత భవిష్యత్తు- వర్తమానాల గురించి విచారించటానికి సమయమే ఉండదు. అందుచేత నేను ఏ విచారం లేకుండానే అక్కడి కల్పాంత జలప్రళయం దర్శించాను. జగత్తు కల్పనయే. కల్పాంతం కల్పనయే! ఉభయములు ఊహలో కనిపించే ఉత్పత్తి వినాశనముల వంటివే కదా! ఇక విచారించటం దేనికి? ఇది నేను ఆ సమయంలో జ్ఞాపకం పెట్టుకొనియే ఉన్నాను.
అప్పుడు జల ప్రళయం ఎంత అకస్మాత్తుగా సంభవించిందంటే... దేవతలు బ్రహ్మదేవుని సందర్శించటానికి పోతూ ఉంటే... ఇంతలో జల ప్రళయంలో వాళ్ళంతా కొట్టుకుపోయారు. అనగా దేవతలకే పూర్వాపూర విచారణకుగాని, ధ్యానమునకుగాని అవకాశం లేదంటే... ఇక మావంటివారి విషయం వేరే చెప్పాలా? పైగా... ఈ కాలము సర్వమును నశింపజేయునదై ఉన్నది. ఏ కాలమున ఏ విషయం ఏ ప్రకారంగా అవశ్యం జరుగనున్నదో... ఆ కాలమున ఆ ప్రకారంగానే తప్పక జరిగియే తీరుతుంది. వినాశకాలం సంభవిస్తున్నప్పుడు మహాత్ములగు వారి బల-బుద్ధి-తేజములు కూడా సర్వత్రా సర్వదా విపరీత భావములు పొందుతూ ఉంటాయి. ఇంకా
Page:364
చెప్పాలంటే... నీకిప్పుడు నేను వర్ణించి చెప్పుచున్నదంతా ఆ మరొక ప్రాణి చిత్తమును అనుసరించి జరుగుచున్నది కదా! ఆతని స్వప్నం నాచే గాంచబడే వృత్తాంతంగా అగుచున్నది. స్వప్నంలో సంభవించనిదేముంటుంది?... కాబట్టి జలమహాప్రళయం స్వప్న సదృశమేనని గ్రహించు. వ్యాధుడు : ప్రభూ! మీరు వర్ణించి చెప్పుచున్నదంతా స్వప్న భ్రమవంటిదని, అసత్తు అయివున్నది అని మీరే ఒప్పుకుంటున్నారు కదా! అట్టి అసదృశమైన స్వప్న సదృశ కథనం నాకు ఇప్పుడు చెప్పితే ఏం ప్రయోజనమున్నది?
మహాముని : ఓ బుద్ధిశాలీ! వ్యాధుడా! నాకు ఆ ప్రాణి స్వప్నంలోకంలో కనిపించిన జలమహా ప్రళయం అసత్తే! అందులో అనుమానం లేదు. అయితే... అందులో నీ స్వరూపమును నీకు విశద పరచే ఒకానొక తత్త్వబోధాత్మకమైన పాఠ్యాంశం ఉన్నది. మోక్షప్రదమైన సారాంశము ఉన్నది. అందుకే నాచే దర్శించబడిన ఆ స్వప్నాంతర్గత మహాప్రళయం గురించి చెప్పుచున్నాను.
ఈ దృష్టాంతముచే... నీవు "దృశ్యమాత్రమగు ఈ ప్రపంచము స్వప్నమువలె భ్రమాత్మకము” ...అని గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే కనబడే దృశ్యము భ్రమమాత్రమని, స్వప్న సదృశమని గమనిస్తావో... అప్పుడు సత్యమైన 'దృక్' రూపుడవగు నీవే శేషిస్తావు. ఈ దృశ్యం నుండి నీ యొక్క దృక్ రూపమును వేరుచేసి గమనిస్తావు. ఇప్పుడు చెప్పుచున్న స్వానుభూతపూర్వక దృష్టాంతాలన్నీ... 1.నీవు 'దృక్' స్వరూపుడవు. దృశ్యములోని విభాగము కాదు.
2.అట్టి నీ దృక్ స్వరూపమే ఆత్మ.
3.కేవల దృకస్వరూపుడవుగా నీవు చూచే దృశ్యమునకు-సర్వ ద్రష్టల యందు సర్వదా సాక్షివై చెన్నొందుచున్నావు.
4.అట్టి కేవల సాక్షిత్వమును ఆస్వాదిస్తూ ఈ దృశ్యమును స్వప్న సదృశంగా దర్శించు. ...అని బోధించటానికే సుమా! అందుచేత నేనిప్పుడు చెప్పే కథా విశేషం శ్రద్ధగా విను.
10. స్వప్నంలో జనజీవన స్రవంతి
మహాముని : ఓ వ్యాధుడా! ఆ విధంగా ఆ ప్రాణియొక్క హృదయ తేజంలో ప్రవేశించిన నేను ఆ స్వప్నమందలి జల మహాప్రళయ సంఘటనలో తిరుగాడుచున్నాను కదా! ఇంతలో ఆవర్తములతో కూడిన అక్కడి జలమంతా ఎటో పోవటం ప్రారంభించింది. ఆ జలంతో కొట్టుకుపోవుచున్న నేను శిఖరం వంటి ఒకానొక తీర ప్రదేశానికి దైవవశంగా జేరాను. ఆ తీరాన్నే ఆశ్రయించి ఉన్నాను. జలమంతా కూడా కొన్ని క్షణాల కాలంలో అదృశ్యమైనది. అక్కడి నుండి చూస్తే ఒక చోట బురద, మరొక చోట కంకాళ అవశేషాలు, ఇంకొకచోట చిన్న నీటిగుంటలు మొదలైనవన్నీ భూమిపై
అగుపించాయి.
ఆ విధంగా పర్వత శిఖరం జేరిన నేను ఒకానొక ముని ఆశ్రమంలో ప్రవేశించాను. ఎంతో
Page:365
అలసిపోయి ఉన్న నేను ఆశ్రమంలో క్షణంలో నిద్రకు ఉపక్రమించాను. నా సుషుప్తి యొక్క అంతమున పూర్వ వాసనా ప్రభావం చేత ఆ ప్రాణి తేజములో చూచిన జల ప్రళయమునే నా స్వహృదయ తేజస్సులో చూచాను. అదంతా నాకు రెండింతల దుఃఖం కలిగించింది. ఆ తరువాత మెళకువ వచ్చింది. అప్పుడు మరల ఆ ప్రాణియొక్క హృదయంలో అంతకు ముందు కనిపించిన పర్వతమే మరల నాకు కనిపించింది.
మరునాడు సూర్యోదయం అయింది. సూర్యోదయం కాగానే సుందరమైన ఆకాశం, భూమి, సూర్యకాంతి కనిపించాయి. ఆ ఆశ్రమంలోంచి బయటకు వచ్చాను. అక్కడి అందమైన పూతోటను చూస్తూ పుష్పముల సువాసనను ఆహ్లాదంగా అనుభవిస్తూ రాత్రి చూచిన జలప్రళయం సంగతి కొంచెం ఏమరచాను. అక్కడి ఫల పుష్పవనాన్ని ఆస్వాదిస్తూ సంచరించసాగాను. అక్కడకు సమీపంగా గల ఒక గ్రామంలో ప్రవేశించాను. అక్కడ నాకొక ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో ప్రవేశించాను. అప్పుడు నాకు, “ఈ ఇంట్లోనే కదా, నేను పుట్టాను! ఈ ఇంట్లో నేను పుట్టి అనేక సంవత్సరాలైనది. ఈయనే నా తండ్రి, ఈమేమో నా తల్లి. ఆ ప్రక్క ఇంటివారు మాకు బంధువులు. ఈ బ్రాహ్మణ కులమే నాది" .... అని ఈ ప్రకారంగా అనుభూతితో కూడిన బుద్ధి కలిగింది. ఇక అక్కడి బంధువులతో నివసించసాగాను. అక్కడే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనుభవించసాగాను. క్రమంగా రోజులు గడిచిపోసాగాయి. ఆ గ్రామం, ఆ మా ఇల్లు, అక్కడి బంధువులు మొదలైనవన్నీ నాకు మనిద్దరి ఈ సంవాదంలాగానే అప్పటికి పరమ సత్యంగా తోచాయి.
కాలక్రమంగా అవిద్యాజన్యములగు అనేక సాంఘిక - లౌకిక వ్యవహారములు అనేక రోజులు అభ్యసిస్తూ ఉండడంచేత నా ఇక్కడి ముని ఆశ్రమానికి సంబంధించిన అంతకుముందటి వివేకబుద్ధి మరుగున పడిపోయింది. క్రమక్రమంగా అప్పటి దేహమునందు ఆసక్తి కలవాడనై ఉండ నారంభిం చాను. “ఈ దేహంతోనే నా ఉనికి” ...అనే దేహాత్మబుద్ధికి లోబడిపోయాను. “ధనం సంపాదించి నా భవిష్యత్ జీవితాన్ని పదిలం చేసుకుంటాను” ...అనే ధ్యాస పెంపొందింది. ఒక ఇల్లు కట్టడం, అద్దానిని అనేక అలంకరణలతో తీర్చిదిద్దటం, అందుకు కావలసిన ధనాదుల సముపార్జన, ఆ ఇంటి నుండి వచ్చే ఆదాయాన్ని సరిచూచుకోవటం... ఈ విషయాలలో నిమగ్నమైపోయాను. భూమిని పశుసంపదను ధనమును కూడబెట్టడం, అల్పకాలం జీవించే రంగురంగుల ఆకులు కలిగివుండే మొక్కలపట్ల ఆసక్తి కలిగివుండటం, తోటలను కౌలుకిచ్చి కౌలు వసూలు చేయటం మొదలైన పనులన్నీ నాకు బృహత్తర కార్యక్రమాలైనాయి. తీర్థయాత్రలు, కష్టములు తొలగటానికి పూజలు ఇటువంటి వ్యవహారాలన్నీ నిర్వర్తించేవాడిని. “ఇది చేయాలి, అది చేయకూడదు” ఇటువంటివన్నీ వారికీ - వీరికీ బోధిస్తూ, నేను నిర్వర్తిస్తూ రోజులు గడపసాగాను. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఊరిలో శ్రోత్రియులైన బ్రాహ్మణ కుటుంబంగా ప్రసిద్ధికెక్కుతూ, పేరు ప్రతిష్ఠలను కాపాడుకుంటూ సమయం గడపసాగాను. ఈలోగా భార్య, కొడుకులు, కూతుళ్ళు మనుమళ్ళు, మనుమరాళ్ళు, స్నేహితులు, ఆస్తులు, వ్యవహారాలు... ఇటువంటివన్నీ పెంపొందాయి.
Page:366
కొంతకాలం గడిచిన తరువాత ఒక రోజు తపస్వి - - ఆత్మజ్ఞుడు అయిన ఒక అతిథి చాలా దూరం నుండి మా యింటికి వచ్చారు. ఆయనకు అతిథి మర్యాదలు సమర్పించాను. స్నానం చేసి, సంధ్యావందనం చేసి భోజనం చేసి ఆ బాటసారి మా ఇంట్లో విశ్రమించాడు. ఆ సాయంకాలం ఆయన మా కుటుంబ సభ్యులందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని “ఆత్మజ్ఞానం" అనే విషయాన్ని ఉపన్యసించాడు. ఆత్మజ్ఞానం ప్రతిపాదించే ఒకానొక కథాక్రమాన్ని వివరిస్తూ. “ఓ ప్రియ సహ జీవులారా! నాకు ఈ రోజు ఆతిథ్యాన్ని ప్రసాదించిన ఈ గృహ సభ్యులారా! ఈ పరమ సత్యాన్ని ప్రకటిస్తున్నాను. వినండిపరబ్రహ్మ మొక్కటే సత్యం. జగత్తు రూపంగా శోభించేది కూడా ఆ పరబ్రహ్మమే! అద్దానికి ఆద్యంతాలు లేవు. ఆ పరబ్రహ్మమే నీయందు, నాయందు సర్వ జీవులయందు 'నేను-నేను' అను శబ్దముచే ప్రదర్శనమగుచున్నది. అట్టి పరబ్రహ్మమే మనందరికీ ఆరాధ్యం. తదితరమంతా కాలగతమైనదే! ఇక ఇక్కడి ఇళ్ళు - వాకిళ్ళు - బంధుత్వాలు మొదలైనవి స్వప్న సదృశం.
"ఓ దృక్ రూప పరబ్రహ్మమూర్తీ! మీరు మీ స్వరూపమును మా బుద్ధికి సుస్పష్టపరచి జన్మ మృత్యు భ్రమలో చిక్కుకున్న మమ్ములను సముద్ధరించండి!' - అని స్వస్వరూపాత్మ భగవానుని ఆరాధించటం అలవరచుకోండి. ఓ కుటుంబ సభ్యులారా! అట్టి పరిపూర్ణ - - నిరాకార - అవికార - అనంత పరబ్రహ్మమును సుస్పష్ట పరచుకొనటానికే ఈ 'జీవితము' అనే అవకాశమును సద్వినియోగపరచుకోండి.”
ఇట్లా సంభాషించి ఆతడు ఒక తన ప్రయాణం కొనసాగిస్తూ మా ఇల్లు విడచి తన త్రోవన తాను వెళ్ళిపోయాడు.
అదంతా శ్రద్ధగా విన్న నేను పూర్వ - పూర్వ సంస్కార ప్రభావంచేత దృఢబోధైక రూపత్వం పొందాను. క్రమంగా ధారణావశంచేత "ఆశ్రమవాసినైన నేను ఇతఃపూర్వం ఒకానొక ప్రాణియొక్క అంతరంగంలో ప్రవేశించానుగదా! స్వప్నము యొక్క పూర్వాపరాలు తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాను కదా”... అనే వృత్తాంతమంతా స్మరించాను. “ఓహో! ఏ ప్రాణియొక్క ఉదరంలో (పొట్టలో) నేనున్నానో,... ఆతడు సర్వజగన్నిలయమగు విరాడ్రూపుడే అయివుంటాడు”... అనే అనుమానం నాకు వచ్చింది. “ఇక ఎట్లాగైనా ఆతని హృదయం నుండి బయల్వెడలి నిజాశ్రమం చేరాలి"... అని తలచి ఆ ప్రయత్నానికి ఉపక్రమించాను. ఇక ఆ గృహం నుండి బయల్వెడలాను. ఆ ప్రాణియొక్క ఉదరంలోగల పృథివి - - నది నది - సముద్రములతో కూడి బ్రహ్మాండమంతా తిరుగాడాను. ఆ ప్రాణి యొక్క హృదయంలోంచి బయల్వెడలటానికి మార్గం కనుగొనలేకపోయాను. అప్పుడు అక్కడి సర్వపదార్ధాలను త్యజించి ఆతని ప్రాణవాయువులలో ప్రవేశించాను. "ఈ విరాట్టు యొక్క బాహ్యం - ఈతని సృష్టికర్తయగు మరొక విరాట్టు యొక్క అభ్యంతరం కూడా చూచెదనుగాక”... అని తలచి ఆతని ప్రాణవాయువుల వెంట పుష్పంలోంచి సుగంధంలాగా బయల్వెడలాను. ఆతని ప్రాణవాయువు లను రథంగా చేసుకొని - ఎట్లాగైతేనేం ఆతని శరీరంలోంచి బయటకు వచ్చాను. తిరిగి నిజాశ్రమానికి
Page:367
వచ్చి ఈ దేహమును చూచాను. ఈ దేహము శిష్యులచే కంటికి రెప్పలాగా పరిరక్షించబడటం గమనించి, దేహంలో చిత్త-ప్రాణములతో సహా ప్రవేశించాను. వెంటనే నా దేహం యథాతథంగా ప్రవృత్తమయింది.
❖
అప్పటికప్పుడు నాలో ఒక జిజ్ఞాస బయలుదేరింది. “ఏ ప్రాణి అంతరంగంలో నేను ప్రవేశిం చానో ఆతడిప్పు డెక్కడున్నాడు?” తెలుసుకోవాలనుకున్నాను. ఆతనిని ఆరా తీస్తూ ఈ ఆశ్రమం నుండి శిష్యులతో సహా ఆ ఎదురుగా గల గ్రామంలో ప్రవేశించాను. ఏ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించి స్వప్న వృత్తాంతమంతా పరిశోధించానో, ఆ పురుషుడు ఉన్న ఇంటికి వెళ్ళాం. ఆతడు ఆ సమయంలో ఒకానొక ఉత్సవంలో లభించిన మృష్టాన్నమును భుజించి తృప్తిగా వెల్లకిలా పడుకొని నిద్రపోతున్నాడు. నాకు ఆతని అంతరంగంలో కనిపించిన అత్యంతాశ్చర్యకరమైన వృత్తాంతమంతా మరల మరల గుర్తుకు వచ్చింది. అయినా నా శిష్యులకు ఆ విశేషాలేవీ నేను చెప్పలేదు.
11. అగ్ని ప్రళయం - వాయు ప్రళయం
మునీంద్రుడు : ఓ వ్యాధుడా! ఆ ప్రాణి సుష్టుగా ఉత్సవ భోజనం చేసి గాఢంగా నిదురిస్తున్నాడని తెలుసుకుని శిష్యులతో ఆశ్రమానికి తిరిగివచ్చాను. పగలంతా నా దేహ రక్షణలో కలిగిన శ్రమచే శిష్యులంతా ఆదమరచి నిదురించారు.
అప్పుడేమైనదో తెలుసా? ఈ సంసారంలో ఏమాత్రం అజాగ్రత్తగా సంచరించినా ఇందలి మాయా వస్తుజాలములైన మమకార-అహంకారాలు మన మనస్సును తాకుతాయి కదా! ఇందుకు దృష్టాంతం విను. ప్రశాంతంగా ఆశ్రమంలో ఈనెల మంచంపై పరుండిన నాకు ఆ ప్రాణి అంతర్గత లోకంలో గల గ్రామంలో నివసించినప్పటి భార్య, పుత్రులు, మనుమలు, మనుమరాళ్ళు గుర్తుకు వచ్చారు. “నా మనుమడు నన్ను చూడకపోతే బెంగపడిపోతాడే! ఎట్లా! పోనీ ఒకసారి వాడిని చూచి, బుజ్జగించి లాలించి వద్దాం” ... అని నా మనస్సు ఉవ్విళ్ళూరసాగింది. ఇక నిద్రపట్టలేదు. మరల దేహము నుండి నా మనో ప్రాణములను ఉత్తేజపరచి బయల్వెడల జేశాను. ఆ ప్రాణి యొక్క హృదయంలో ఇతఃపూర్వం వర్ణించిన విధంగా ప్రవేశించాను. క్రమంగా పర్వత శ్రేణిని సమీపించి ఇతఃపూర్వం నేను సుదీర్ఘకాలం జీవితం గడిపియున్న గ్రామం సమీపించసాగాను.
ఇంతలో నేను ప్రయాణిస్తున్న ఆ మనో - అంతర్గతమైన బ్రహ్మాండాంతర్గతంలో భయంకరమైన యుగాంతం ప్రవృత్తమయింది. ఆ ప్రపంచమంతా ధర్మాధర్మ వ్యవస్థతో సహా విపరీతదశను పొందటం ఆరంభించింది. నేను నా బంధువులున్న గ్రామంకోసం వెతుకుతూ ఉంటే ఆ స్థానంలో అన్యములైన భూమి - - పర్వతాలు - దిశలు కనిపించాయి. నా పూర్వపు గ్రామము - భూభాగం - బంధువులు అవన్నీ గాలిచే ఎగురగొట్టబడి ఎటో మాయమైపోయినట్లుగా అనిపించింది. అక్కడి
Page:368
ప్రపంచమంతా మరొక రూపంగా ప్రదర్శితమైంది. అదంతా అపూర్వమైన నూతన రచనగా నాకు కనిపించింది. ఇంతలో పది దిక్కులనుండి అగ్ని గుండాలు బయల్వెడలసాగాయి. అక్కడి సముద్ర - భూజలమంతా ఆవిరి కాసాగింది. పర్వతములపై భయంకరమైన అగ్నిజ్వాలలు వెలయసాగాయి. భూమండలమంతా అగ్నిరాసి కాసాగింది. విశ్వమంతా ఒకే జ్వాలచే మండుతూ కనిపించింది. నా చుట్టూ అగ్నిజ్వాలలు ఎగసాయి. ఆ భీకరాగ్ని మధ్యంలో నేను చిక్కుకుని ఉన్నప్పటికీ "నేను సూక్ష్మమగు మనో-ప్రాణమయ దేహిని. నన్ను అగ్ని దహించలేదు” ... అను కృతనిశ్చయంతో ఉండి ఉండటం చేత అక్కడి ప్రళయాగ్ని నాకు కొంచెం కూడా బాధనుగాని, వేదననుగాని కలిగించటంలేదు. ప్రాణవాయుధారణ చేసియున్న నేను నా వాయుమయ దేహంతో ఆ ప్రళయాగ్నిజ్వాలలో అస్పృశ్యుడనై అటూ - ఇటూ సంచరించాను.
వ్యాధుడు : పర్వతాలను కూడా కరిగించివేసే ఆ ప్రళయాగ్ని మిమ్ములను ఎందుకు స్పృశించలేదు? మహాముని : ఒకనికి స్వప్నంలో అగ్ని కనిపించినప్పటికీ, “ఇది స్వప్నమే” అని గ్రహించి ఉంటే ఆ స్వప్నాగ్ని ఆ స్వప్న ద్రష్టను ఏమీ చేయలేదు కదా! అట్లాగే ఆ ప్రళయాగ్ని జ్వాలలు నా మనో ప్రాణమయ దేహాన్ని ఏమాత్రం స్పృశించలేదు. నేను యథాతథంగా చక్రగతిలో ఆ ప్రళయాగ్నిలో షికార్లు చేయసాగాను.
వ్యాధుడు : స్వామీ! అప్పుడు మీకు మీ భార్య, కొడుకులు, మనుమలు భస్మమైపోయారేమో ననే దుః ఖం కలుగలేదా?
మునీశ్వరుడు : అప్పుడు నేను తత్త్వవేత్తనయి ఉండటంచేత సర్వదుఃఖముల నుండి కొద్ది క్షణాలలో విముక్తి పొందాను. అయితే ఆ సంచారం వలన కొంచెం శ్రమ పొందిన చిత్తం కలవాడనైయున్నాను. "ఆహా! ఏమి ఈ ప్రచండాగ్ని జ్వాలలు! ఈ అగ్నితో ఆకాశం - - భూమి ఏకమై పోతోందే! ఇక ఈ భూమి కరిగిపోతుందేమో! ఆకాశం విరిగి ఒరిగిపోతుందేమో!” అని విచారణ చూస్తూ, అనుకుంటూ ఉండగా ఎంతో “ఫూ”త్కార శబ్దంతో ఎక్కడి నుండో తీవ్రమైన వాయువులు వీచసాగాయి.
వాయు ప్రళయం - మహా ఝంఝమ శబ్దాలతో పర్వతాలను పెకలించివేయగల వాయు తరంగాలు పది దిక్కుల నుండి ప్రసరించసాగాయి. ఆ వాయు తరంగాల సంఘట్టనచే అగ్నికణాలు నలువైపులా వెదజల్లబడుచున్నాయి. భూమిపై నుండి అంతకు ముందు ఏర్పడిన భస్మరాసులు గాలికి పైకెగయటంచేత కారుమేఘాలు రూపుదిద్దుకోసాగాయి. అప్పుడు నలువైపులా సంధ్యాకాల మేఘాలు బయల్వెడలాయి. దానితో స్వర్గ పాతాళ లోకాలు సుదీర్ఘ మేఘ పంక్తితో కలిసిపోసాగాయి. ప్రళయ వాయువీచికలలోంచి ఉద్భవించిన అగ్నికణాలు ఆకాశంలోకి ఎగసి నేలకు నల్లటి భస్మం రూపంలో వర్షించసాగాయి.
అప్పుడు అతికష్టదాయకమగు ఆ మహాసంభ్రమంలో కొట్టుకుపోతున్న నాకు ఎంతో భేదం కలిగింది. "అబ్బా! ఏమి శ్రమ వేదన నాకు కలుగుతోంది! ఇదంతా ఇంతగా భరించవలసిన అవసరం నాకేమిటి? ఇదంతా మరొకని హృదయంలోని స్వప్నమే కదా! కాబట్టి ఈ అవస్థ నుండి
Page:369
బయల్వెడలి నా యొక్క స్వకీయమైన జాగ్రత్ స్థితిని పొందితే పోతుంది కదా! కనుక జాగ్రత్ దశను పొందటం ద్వారా శాంతిని పొందెదనుగాక! లేకుంటే... వ్యర్థంగా నాకు ఈ దుఃఖమును పొందవలసిన అగత్యమేమిటి?” ... అని చింతించసాగాను.
వ్యాధుడు : హే మహాత్మా! “స్వప్నం యొక్క వ్యవహారం, వ్యవస్థ ఏమై ఉంటుంది?”... అనే సందేహం యొక్క నివృత్తి కొరకు కదా... మీరు ఆ ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించింది? మరిప్పుడేమో "ఈ స్వప్నదశ నుండి నేను నివృత్తిని పొంది జాగ్రత్తుకు వెళ్లెదనుగాక!”... అని యోచిస్తున్నారు. ఇంతకూ స్వప్నం గురించి మీరు తెలుసుకొన్నదేమిటి? ఆ ప్రాణి యొక్క హృదయంలో మహాసముద్రాలు, విస్తారలోకాలు, జలప్రళయం, అగ్ని వాయు ప్రళయాలు, ఇవన్నీ ఎట్లా ఎక్కడి నుండి సుష్టుగా భోంచేసి నిదురిస్తున్న ఆ ఒకానొక ప్రాణియొక్క స్వప్నలోకంలోకి వచ్చాయి? అసలు ఆతని హృదయంలోకి అవన్నీ ఎట్లా ప్రవేశించాయి? ఇవన్నీ నాకు అర్థమవటం లేదు. సవివరంగా, విశ్లేషణాపూర్వకంగా వివరించండి.
మహాముని : ఓ వ్యాధుడా! ఆ ఒకానొక ప్రాణి యొక్క స్వప్నజగత్తు మాట అట్లా ఉంచు. ముందుగా ఈ ఎదురుగా కనబడే జగత్తు ఎక్కడున్నది? మనస్సుకు ఇది అనుభూతమౌతోంది. కనుక ఇది మనస్సును అనుసరించే ఉన్నది. 'మనస్సు' అనేది ఆత్మలో జనించటానికి కారణమేముంది? ఏమీ లేదు. ఒకవేళ కారణమంటూ ఉంటే అది ఆత్మకు వేరుగా ఉండాలి. ఆత్మకు వేరైనదేదైనా ఎక్కడైనా ఉన్నదా? లేనేలేదు. ఆత్మ అనన్యం, అన్యము లేదు - - అనికదా వేదవచనం! ఆత్మకు వేరుగా మనస్సే లేదు. మనస్సుకు వేరుగా జగత్తు లేదు. కనుక "ఇతంతా మొదలే అకారణం. కాబట్టి మొదలే లేదు” అని చెప్పబడుతోంది. అందుకే సృష్టి యొక్క శబ్ద అర్థములు రెండూ కొంచెం కూడా లేవు.
అనే మేము సుస్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఉదాహరణకు “నా కుమారుడు నా మాట వినలేదు. అందుకే ఈ దుఃఖం”... అని ఏ తండ్రి అయినా వాపోతుంటే “ఇది నాది... అనే మనో కల్పనయే అందుకు కారణం" అని మేము జనులకు గుర్తు చేస్తున్నాం. “నాది - అనేది భ్రమ. ఆ ముఖ్య భ్రమ నుండి ‘నా కుమారుడు' అనేది ఉపశాఖా భ్రమ. ఆ తదుపరి ఆతడు ఇట్లా ఉండాలి. కాని అట్లా ఉంటున్నాడు... అనేది తదుపరి ఉపోప శాఖారూపభ్రమగా చెన్నొందుచున్నాయి.”
ఒకవేళ “సృష్టి అనేది కనబడుచున్నది కదా!"... అని అంటే, "సృష్టి యొక్క శబ్దం, అర్థం కూడా అజ్ఞాత సందర్శకునికి కనిపించే పరమాత్మ రూపములే అయివున్నాయి”... అని స్వానుభవ మంతా రంగరించి నీకు గుర్తు చేస్తున్నాను. ఈ జగత్తు జ్ఞాన - అజ్ఞాన రూపమై, వాస్తవానికి నిర్వికారమై, కల్పనను అనుసరించి అనుభూతమౌతోంది. ఓ మిత్రమా! ఎప్పుడైతే జ్ఞాన బలంచేత అజ్ఞానం శమిస్తుందో అప్పుడు “ఈ సృష్టి అనేది లేదు” అనే మహావాక్యార్థం సుస్పష్టమౌతుంది. ఇక మూఢులకు ఏది జగత్తుగా కనిపిస్తుందో అద్దానికి ఒక స్థిరమైన అభిప్రాయంగాని, అనుభూతిగాని లేదు. అందుచేత వారికి ఇదంతా పరిపరివిధాలుగా అనిపిస్తోంది.
ఇది వస్తువు నుండి జనించి ఉండవచ్చు (లేక) అవస్తువు నుండి జనించవచ్చు. ఎద్దాని నుండి ఏది జనించినట్లుగా భాసిస్తున్నప్పటికీ అదంతా కూడా వ్యాపకమైన చిన్మాత్రబ్రహ్మమే అయి ఉన్నది.
Page:370
క్వ శరీరం? క్వ హృదయం? క్వ స్వప్నంః? క్వ జలాదిచ? క్వ బోధో? బోధ విచ్ఛిత్తిః? క్వ జన్మమరణాది చ?
అంతా బ్రహ్మమే! (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) బ్రహ్మమే జీవుడుగా కనిపిస్తోంది. (జీవో బ్రహ్మేతి నా2 పరః) అంతా బ్రహ్మమే అయివుండగా, ఇక ఈ శరీరమెచట? హృదయం ఎక్కడ? స్వప్నం ఎక్కడ? జలాది పంచభూతములెక్కడ? జగత్తు ఎచ్చట? జాగ్రత్తుకు అన్యమైనది ఎచట? జన చట? మరణం ఎచట?
ఈ విధంగా... చిన్మాత్రమొక్కటే ఉన్నది. ఒక పరమాణువు కంటే పర్వతం ఎంతగా స్థూలమై ఉన్నదో, అట్లా పంచభూతాలలో సూక్ష్మమైనదైన ఆకాశం కంటే చిన్మాత్రం అంతగా సూక్ష్మమైనది.
అట్టి అతి సూక్ష్మ చిదాకాశము స్వభావసిద్ధంగానే కొంచెం జగత్ రూపంగా స్ఫురిస్తోంది. అప్పుడా చిదాకాశము తన రూపమునే జగత్తుగా ఎరుగుచున్నది.
స్వప్నంలో చిదాకాశమే నగరము - - నది - జనులు మొదలైన రూపాలుగా స్ఫురిస్తోంది కదా! ఆ స్వప్న నగరాదులు ఆయా నిజరూపంగా నగరాలుగా ఉన్నాయా? కాదు కదా! వాటి రూపం స్వప్న ద్రష్ట యొక్క చిద్రూపమే కదా!
అట్లాగే .... జాగ్రత్నందు కనిపించే నగర - నదీ - జనాదులు కూడా జాగ్రత్ ద్రష్ట చిద్రూపమే వాస్తవమైన నిజరూపంగా కలిగివున్నాయి. చిదాకాశమే చిదాకాశమున ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది.
అనగా ఓ వ్యాధుడా! నీవు చిత్రూపుడవు. (ఎఱుకయే నీ రూపం), ఈ కళ్ళు, కాళ్ళు మొదలైనవి నీ మాయారూపమే కాని వాస్తవ రూపం కాదు. ఇక నీ చిద్రూపమే నీచే జగత్తుగా ఎఱుగబడుచున్నది.
18
జ్ఞాని యొక్క దృష్టిలో... ఈ సమస్త జగత్తు కూడా శాంతం - అభాసరహితం - చిన్మాత్రమునకు అభిన్నము అయివున్నది. తిమిరరోగం కలవానికి ఆకాశంలో చక్రాకారాలు కనిపిస్తున్నట్లు... నీ యొక్క అజ్ఞాన దృష్టికి జగత్తు శాంతము - సౌమ్యము అగు "చిత్ మాత్రము” గా కాకుండా అనేక వ్యవహార పరంపరలతో కూడిన జగత్తుగా అగుపించటం జరుగుతోంది. మా యొక్క దృష్టియందు, ఈ జగత్తు వ్యావహారికము కాదు. ప్రాతిభాసికమూ కాదు. శూన్యమాత్రము కాదు... ఇదంతా కూడా కేవలం - - నిరాకారం, ఆద్యంతరహితం, ఏకము అగు చిదాకాశమే అయివున్నది. వ్యాధుడు : స్వామీ! ఏ కారణం చేత నిరాకారము, ఆద్యంత రహితము, ఏకము అగు చిన్మాత్రము ఈ విధంగా సాకార - వ్యావహారిక - ఆద్యంతరహిత - అనేక రూపజగత్తులుగా అగుపిస్తోంది? మునీశ్వరుడు : ఏ కారణంచేతైతే ... “కారణ రహితుడు, త్రిపుటీ శూన్యుడు, శుద్ధుడు అయిన ద్రష్ట స్వప్నంలో ఆయా గృహాదులుగా, వ్యక్తులుగా, ఆకాశాదులుగా భాసిస్తున్నాడో... అదే కారణం చేత ...జగత్తునందు ఆయా కారణరహిత - త్రిపుటీ శూన్య - నిత్య పరిశుద్ధ స్వరూపుడగు ద్రష్ట తన యొక్క స్వస్వరూపమునే జాగ్రతగత్గా అందలి వివిధ విశేషాలుగా గాంచుచున్నాడు. ద్రష్ట
Page:371
యొక్క స్వయంకల్పిత ఊహా చమత్కారంలోంచే జాగ్రత్-స్వప్నాలు ఆయా జాగ్రత్ - స్వప్న చిద్రూపంగా ప్రాప్తిస్తున్నాయి. అనగా... జాగ్రత్ జగద్రూపంగా ఉన్నది ఆ జాగ్రత్ జగత్ ద్రష్ట యొక్క చిన్మయ రూపమేనని గ్రహించటమే ఆత్మజ్ఞానం.
ఆత్మ స్వరూపమునకు వేరైనదేదీ ఎప్పుడూ లేనేలేదని వేదవాక్యం! (ఆత్మాపమ్యేవ సర్వత్రా) “నాచే గాంచబడేది నా యొక్క చిద్రూపమే”... అని ఎరిగి ఉండటమే.
ఆత్మజ్ఞానం - బ్రహ్మజ్ఞానం. ఆత్మదృష్టి - పరదృష్టి. బ్రాహ్మీదృష్టి - ఆత్మానుభూతి. వేదాంత జ్ఞానం - స్వస్వరూపానుభూతి... ఇటువంటి ఆయా శబ్దములచే వేదాంత శాస్త్రం ఉద్దేశిస్తోంది. శుద్ధమైనట్టి ఆ చిన్మాత్రము స్వానుభూతరూపంచే సుస్పష్టంగా భాసిస్తూనే ఉన్నది. అయినప్పటికీ అనిర్వాచ్యమై, ఆద్యంతరహితమై, ఏకమై, ద్విత్యైక్యవర్జితమై ఉన్నది.
‘కాలం’ ఒక్కటే అయినప్పటికీ సృష్టి - ప్రళయములు అద్దాని రూపములుగా ఏర్పడి ఉంటున్నాయి కదా! బీజం ఒక్కటే అయినప్పటికీ అద్దాని నుండి అంకుర, శాఖా, పుష్ప, ఫల, ఆకులు వెలువడు చున్నాయి కదా!... అట్లాగే బ్రహ్మము సర్వస్వస్వరూపమై ఉంటోంది.
ఒకనికి స్వప్నంలో గోడ, వీథి, బంధువులు, నగరాలు నిజమనే అనిపిస్తున్నాయి. ఆతని ప్రక్కనే కూర్చుని ఉన్నవానికి అదంతా శూన్యంగా అనిపిస్తోంది. అట్లాగే ఈ జగత్తులోని ఒక విషయం ఒక్కొక్క ద్రష్టకు ఒక్కొక్క తీరుగా కనిపిస్తోంది. అనగా జగత్తులోని ఏ విషయం కూడా “ఇది ఇట్టిదే” ...అనటానికి ఎక్కడ వీలున్నది? నిర్మలము, ఏకము, చిన్మాత్రాకాశ రూపం అయినట్టి ఆత్మ.
స్వప్నంలో జాగ్రత్తో సమానంగా భాసిస్తోంది. జాగ్రత్లో జాగ్రత్ స్వప్నరూపంగా భాసిస్తోంది. ఈ విధంగా ఆత్మయొక్క (ఉపనిషత్ వాణి అయినట్టి) అద్వైతత్వము సిద్ధిస్తోంది. ఆత్మయొక్క అద్వైత సిద్ధికి ఏకైక మార్గం ఇదియే! (కనబడేదంతా నీయొక్క ఆత్మరూపమేనని దర్శించటమే అద్వైత సిద్ది-అమరత్వ సిద్ది).
అదృశ్యమగు వాయువులోగల అదృశ్యమగు సుగంధం ఈ కళ్ళకు కనిపించదు. కాని ముక్కుకు అనుభూతమౌతుంది. అట్లాగే నాశరహితమగు చిన్మాత్రమునందుగాని, చిన్మాత్రము యొక్క సమక్షము నందుగాని సృష్టి - ప్రళయాలు లేకపోయినప్పటికీ, ఒకానొక (వస్తు - దృశ్య) దృష్టికి అవి సర్వదా ఉండియే తీరుతున్నాయి. దృష్టిచే సృష్టి - ప్రళయాలు ఉండి ఉన్నప్పటికీ ఆత్మ సర్వదా అన్నివేళలా ఏకమే అయివున్నది.
ఓ వ్యాధుడా! నీ మనస్సు యొక్క జగత్ మనన రూప వ్యాపారమును క్రమంగా త్యజిస్తూరమ్ము. “జగత్తుగా కనిపించేది ప్రియ పరమాత్మ రూపమే” అనే భావనను క్రమక్రమంగా పెంపొందించుకో. అదియే "జగత్ మనన రూపత్యాగం అని మహనీయుల బోధ. అట్టి “సర్వము పరమాత్మయే అసత్ పరమాత్మ విన్యాసమే!" అను భావనాపటిమచే - "నిరాకారము, బాహ్యాభ్యంతరములందు అనంతము, నిరంతరము సుస్థిరము, ఆద్యము” అయినట్టి ఆత్మరూపమున నీవు సుస్థిరుడవవుతావు. ఈ జీవుడు తన జగద్రూపమునకు ఆవల వున్న చిత్రరూపమును గమనించి, దర్శించి సుస్పష్టంగా అనుభూతపరచుకోవటమే జగత్యాగం.
Page:372
ఆత్మ సదా ఉండియేఉన్నది! ఈ జీవుడు ఆత్మరూపుడే! నేను ఆ ఆత్మనే! నేనే సర్వము! నేను చిన్మయ రూపుడనేగాని, మృణ్మయ రూపుడనుకాదు! కనుక ఈ తెలియబడే జగత్తంతా నా దేహం! ఇకప్పుడు ఈ రక్త - మాంస నిర్మిత భౌతికం నాకు పరిమితాలు ఎట్లా అవుతాయి?... అని గ్రహించి ఉన్నవారికి ఈ జగత్తు విషయమై ఉన్నప్పటికీ నిర్విషయంగా అనుభూతమగుచున్నది.
12. ఆత్మజ్ఞానం అత్యావశ్యకం
వ్యాధుడు : స్వామీ! మునీశ్వరా! ఇప్పుడు నాకు కలుగుచున్న కొన్ని సందేహాలను మీ ముందు
ఉంచుతాను.
1.ఈ మనస్సు ఆయా లౌకిక - వ్యావహారిక భగవత్ సంబంధమైన ఏవేవో ఆలోచనలు చేస్తోంది కదా! అట్టి ఈ మనస్సు పూర్వకర్మలను అనుసరించే ఈ విధంగా మననం చేస్తోందా? లేక, ఇట్టి మనన స్వభావానికి మరేదైనా (లేక) మరెవరైనా కారణమా?
2.ఏఏ ప్రాణులకు అట్టి పూర్వ - వర్తమాన భవిష్యత్ స్రవంతిపూర్వకమైన కర్మలుఉన్నాయి? ఏఏ ప్రాణులకు కర్మలు లేవు?
3. ఒకవేళ కర్మలే లేకపోతే మనస్సుకు మననం లేదు కదా! మననమే లేకపోతే త్యాగమనేది ఎక్కడుంటుంది? అనగా 'మనోత్యాగం' అనేది ఎట్లా ఏర్పడుతుంది. మహాముని : ఓ వ్యాధుడా! విను చెబుతాను.
“సృష్ట్యాది” యందు భాసించేవారే బ్రహ్మ మొదలైనవారు. వారు స్వయంభువులు. కనుక వారు స్వయంగా భాసిస్తున్నారు. వారు చిన్మాత్ర శరీరధారులు. వారికి జననం లేదు. కనుక మరణమూ లేదు. వారు జనన మరణ రహితులు. ఇక వారి దృష్టి యందో... ఈ ప్రపంచము అనబడేదిగాని, ద్వైతముగాని, 'కల్పన' అనునదిగాని లేదు.
ఒక నవలా రచయితను, “ఏమయ్యా! మీ కథానాయకుడు ఏ ఊరు వెళ్ళితే కనిపిస్తాడు?” - అని అడిగితే సమాధానమేముంది?
తేషామ్ అస్తి న సంసారో, న ద్వైతం న చ కల్పనాః ।
విశుద్ధ జ్ఞాన దేహాస్తే సర్వాత్మానః సదా స్థితాః ॥ …
వారు విశుద్ధ జ్ఞాన దేహులై వున్నారు. అందుచేత, వారు సర్వాత్మత్వము వహించినవారై, సర్వాత్మత్వం నందు సంస్థితులై ఉన్నారు. అట్టి స్వయంభువు అగు బ్రహ్మ మొదలైన తత్త్వం ఎఱిగినవారి దృష్టిలో (తత్త్వజ్ఞానుల దృష్టిలో) సృష్ట్యాది యందు ఎవరికీ 'పూర్వకర్మలు' అనబడేవేవీ లేవు.
బ్రహ్మమే... సృష్ట్యాదిలో సృష్టిగా విజృంభిస్తోంది. సృష్ట్యాదిలో ఏ విధంగా అయితే బ్రహ్మ మొదలైనవారు బ్రహ్మమే రూపంగా కలవారై భాసిస్తున్నారో... అట్లాగే తక్కిన అసంఖ్యాక జీవులు కూడా భాసిస్తున్నారు. “ఇప్పుడు - అప్పుడు - ఎప్పుడు కూడా నీవు, నేను, నీవు చూస్తున్నవారు, నాకు కనబడేవారు... అంతా కూడా బ్రహ్మరూపులమై భాసిస్తున్నాం" అనునది వేదోపనిషత్ సారవాక్యం.
Page:373
ఇక తక్కిన వారి అనుభవానికి వస్తే ... ఎవరైతే కేవల సత్వగుణమును ఏమరచి ఉంటున్నారో, రజః తమోగుణ మిశ్రితమైన సత్వగుణము నుండి మనో సంకల్పము దృష్ట్యా "మేము బ్రహ్మము కంటే వేరు?... అనే భ్రమను వదలకయే ఉంటున్నారో, వారు “కార్య-కారణత్వము” అనే మనో రచనలో నిమగ్నమై ఉంటున్నారు. ఏ జీవుడైతే తానే బ్రహ్మముగా ఎరుగుచున్నాడో, ఆతనిచే సర్వము బ్రహ్మముగా ఎరుగబడుతోంది. అట్లా కాకుండా “నేను బ్రహ్మము కంటే వేరు” ...అనే మనోభావనను ఆశ్రయిస్తున్నప్పుడు... ఆతనికి “ఈ ద్వైత జగత్తు సత్యమే” అని అనిపిస్తోంది. ఆతడు కర్మలు వాటికి సంబంధించిన వాసనలలో సత్యదృష్టి కలిగి ఉంటున్నాడు. ఆ విధంగా ద్వైత జగత్తును నమ్మి ఉన్న జీవుడు అట్టి వాసనావశం చేత కర్మ సహితుడై జనన మరణాలు పొందటం కొనసాగిస్తున్నాడు. తే షామ్ ఉత్తరకాలం తత్కర్మభిర్జన్మ దృశ్యతే | |
స్వయమేవ తథా భూతైసైరవస్తుత్వమ్ ఆశ్రితమ్ ||
అట్టివారి వర్తమాన కర్మలను అనుసరించి ఉత్తరోత్తర కాలంలో జన్మలు - కలుగుచున్నాయి. ఎందుచేతనంటావా? వారు పరమార్థ వస్తువును ఏమరచి మిథ్యా వస్తువునందు ధ్యాస కలిగియుండి జడదేహాదులందు ఆత్మాభిమానం కొనసాగిస్తూ ఉండటం చేత!
బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - సనకాది మహాత్ములు తమ్ము తాము బ్రహ్మము కంటే వేరుగా ఎరుగటమే లేదు. వారు సర్వదా బోధమయమగు పరమాత్మయందే నెలకొని ఉన్నారు. అందుచేత జన్మ - కర్మాది దోషాలు వారిని స్పృశించటం లేదు. ఏ జీవుడైనాసరే, లేచి నిలబడి “సర్వాత్మకము’ - జనన మరణ రహితము - ఉపాధులచే పరిమితము కానిది అగు బ్రహ్మమే నా దేహం”... అని ఎలుగెత్తి గానం చేస్తేనో, అప్పుడాతడు నిర్దోష సర్వాత్మదృష్టికి సర్వదా అర్హుడే అయివున్నాడని శాస్త్ర సమ్మతంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటావా? సమస్త జీవులకు నిర్మల చిద్రూపమే స్వాభావ సిద్ధమైయున్నది. బ్రహ్మము సర్వదా తనయొక్క నిర్మల చిత్ స్వభావమునందే నెలకొని ఉన్నది. అయ్యది తన అనంత విభాగంలోని ఒకానొకమూల మలినోపాధిచే "నేను భౌతిక ఉపాధిని. నేను పొందవలసినది ఏదో ఇంకా ఉన్నది" ...అని భావనను మాయా చమత్కారంగా కలిగి ఉంటోంది.
యత్ర వేత్తి తు జీవత్వం తత్ర అవిద్యేతి తిష్ఠతి |
తత్ర సంసృతి నామ్నాత్మా, ధత్తే రూపం తథాస్థితమ్ ||
ఎచ్చటైతే బ్రహ్మము తనను తాను “నేను ఒక జీవుడను” అని జీవరూపముతో ఎఱుగుచున్నదో, ...అచ్చట అవిద్య ఉంటోంది. అచటనే 'సంసారము' అనే పేరుతో తననుతాను ధరిస్తోంది. మరల కాలక్రమంగా అది స్వయంగా సత్సంగ - శాస్త్రీయ విజ్ఞానము సహాయంతో నిజశుద్ధ రూపమును ఎరిగినప్పుడు స్వయముగా సంసారత్వమును దాటి బ్రహ్మత్వమును అనుభూతం చేసుకుంటోంది. జలం తనయొక్క ద్రవ్యత్వం ఏమరచి 'తరంగము' అనే దేహంగా భావిస్తుండటం ఎట్లో, బ్రహ్మము తనయందు సంసారము దర్శించటం అట్టిది. తనయందు సృష్టి రూపమును దర్శిస్తున్నప్పటికీ బ్రహ్మము సర్వదా బ్రహ్మముగానే ఉన్నదని గ్రహించు.
Page:374
బ్రహ్మము యొక్క అజ్ఞాత విభాగము నందు సృష్టిరూపము స్వభావమే అయివున్నదని గ్రహించు. ఓ వ్యాధుడా! ఈ సృష్టి బ్రహ్మము యొక్క స్ఫురణము మాత్రమే. యథార్థానికి స్వప్నం గాని, జాగ్రత్తుగాని ఏమీ లేవు. అవిద్య తప్పితే బ్రహ్మమునకు సృష్టి రూపత్వమెక్కడ? సర్వదా శుద్ధమే అయివున్న బ్రహ్మమునకు జన్మాంతర్గత కర్మలెక్కడున్నాయి? ఎట్లా ఉంటాయి? ఈ జీవుడు సర్వదా బ్రహ్మమే (జీవోబ్రహ్మేతి నా పరః) అని వేదమహావాక్యాలు ఉదోషిస్తున్నాయి కదా!
వాస్తవానికి కర్మ లేదు, సృష్టిలేదు. అవిద్యలేదు. అవన్నీ లేకపోయినప్పటికీ ఆత్మయొక్క స్ఫురణగా(ఆలోచనగా) అవన్నీ మిథ్యగా ప్రవర్తిస్తున్నట్లు కన్పిస్తున్నాయి.
బ్రహ్మము సర్వశక్తిమంతము - సత్యసంకల్పయుక్తము. అందుచేత బ్రహ్మము స్వయంగా సృష్టియొక్క ప్రదర్శిత - ప్రదర్శన రూపములను గాంచుచున్నది. అట్టి ప్రదర్శనం తదనుసారమైన జన్మలయొక్క కల్పనను కావించుకుంటోంది. ఫలితంగా కల్పిత పదార్థములైనట్టి జగత్తు - జీవుడు మొదలైన రూపములవలె భాసిస్తోంది. ఇంత మాత్రంచేత బ్రహ్మమునకు వచ్చే లోటేమీ లేదు.
ఓ వ్యాధుడా! వాస్తవానికి సృష్ట్యాదియందు ఈ జీవునకు 'కర్మ' అనేది సంభవించదు. చైతన్యము తనయందు మొట్టమొదట ఏదో క్రీడ-లీల సరదాగా 'అవిద్య'ను కల్పించుకుంటోంది. ఆ తరువాత కర్మలను, వాటి యొక్క ఫలములను సముపార్జించుకుని అనుభవైకవేద్యం చేసుకుంటోంది. నాయనా! జలము తరంగాదులుగా, సుడి మొదలైనవిగా కనిపిస్తూ ఉండవచ్చుగాక! అది తన సహజ ద్రవ్యత్వమును కోల్పోయినదెప్పుడు? ఆవర్తములుగా కనిపించేది జలమేకదా! ఈ జీవుడు కూడా తన సహజ బ్రహ్మ స్వభావమును ఏ ఏ క్షణమందు కించిత్ కూడా కోల్పవటం లేదు. త్యజించటంలేదు.
ఈ జగత్తు బ్రహ్మమే! - పూర్వ కర్మల గురించి ప్రస్తావించావు గనుక మరొక విషయం దృష్టాంతంగా చెపుతాను. స్వప్నంలో నీకు కనిపించే జీవులకు పూర్వ - తత్ పూర్వ కర్మలెక్కడున్నాయి? అట్లాగే సృష్టియందు శుద్ధ సాత్విక శరీరులైన చిన్మాత్ర రూపులగు జీవులకు పూర్వకర్మ అంటూ ఏదీ లేదు. వారి దృష్టిలో సృష్టి అనేది “స్వస్వరూపం” యొక్క చమత్కార ప్రదర్శన రూపమే! 'సృష్టి' అనేది స్వకీయ చమత్కారమే అయివుండగా... అందుకు పూర్వకర్మల ఆవశ్యకత ఏమున్నది? ఒక వ్యక్తిలోని అంతర్భాగ విభాగమగు ఊహ “ఎట్లా వచ్చింది?" అను ప్రశ్నకు పూర్వపు ఊహలు కారణమవవలసిన పనేమున్నది? అయి ఉండటంలో విశేషంమాత్రం ఏమున్నది?
అవిద్యచే సృష్టియొక్క - కర్మలయొక్క కల్పన కావించబడిన తరువాతనే జీవునకు 'కర్మపాశం' అనేది రూపొందింది. అట్టి అజ్ఞాత భ్రమయొక్క కొనసాగింపుగా జన్మల పరంపరలు ఒనగూడుచున్నాయి. వాస్తవానికి జన్మకర్మలకు ముందే ఉన్న నిర్దోష సర్వాత్మ బ్రహ్మమే ప్రతిజీవుని వాస్తవ రూపం. ఇక ఈ జీవుడు అనేక ఉపాధులతో, వ్యవహారములతో తిరుగాడటమనేది ... ఒక వ్యక్తి తన జాగ్రత్ స్వరూపం మరచి స్వప్న ప్రపంచంలో తిరుగాడటం వంటిది మాత్రమే!
సృష్టి సృష్టిరూపం కాదు. సృష్టి బ్రహ్మరూపమే. ఇక ఏ జీవునకు ఏ కర్మబంధాలున్నాయి చెప్పు? జగత్తును నమ్మియున్న మనస్సే కర్మబంధం కల్పించుకుంటోంది. అంతేగాని, జీవునకు
Page:375
మరెవరూ కర్మబంధాలు కల్పించటం లేదు. బంధము కర్మల వల్ల కలగటం లేదు. పరమాత్మ గురించిన అపరిజ్ఞాతత్వం చేతనే 'కర్మ' బంధరూపంగా ప్రాప్తిస్తోంది.
కాబట్టి అజ్ఞానమే కర్మబంధానికి బీజం. ఆత్మజ్ఞానముచే మాత్రమే అజ్ఞానం మొదలంట తొలగగలదు. ఆత్మ జ్ఞానముచే అజ్ఞానమే కాకుండా అజ్ఞానంచే కల్పితమై ప్రాప్తిస్తున్న కర్మ బంధం
కూడా తొలగిపోగలదు.
ఒకనికి ఆత్మజ్ఞానము ఎంతెంతవరకైతే ప్రవృద్ధమౌతూ ఉంటుందో, ... అంతంతవరకు కర్మ బంధదాయకం అవటమనేది తొలగిపోతూ వస్తుంది.
వ్యాధుడు : స్వామీ! కర్మ నాశనమైతే జన్మ - జీవనాదులు కూడా వినాశనం పొందుతాయా? మునీశ్వరుడు :
యన్నామ కిల నాస్త్యేవ తచ్ఛాన్తా కా కదర్థనా? పరమార్థాదృతే బంధః కించిన్నామ న విద్యతే?
ఏ పదార్థమైతే వాస్తవానికి మొదలే లేదో... అట్టిది నశించటం వలన వచ్చే నష్టమేమున్నది? స్వప్నంలో కనిపించిన భవనం కూలిపోతే ఎవరికి నష్టం?
ఓ వ్యాధుడా! స్వప్నంలో ప్రాప్తించిన బంధం తొలగాలంటే జాగ్రత్కు రావటమే ఉపాయం కదా! సర్పమునకు సంబంధించిన భ్రాంతి తొలగాలంటే “ఇది త్రాడు మాత్రమే" అని తెలియటమే ఏకైక ఉపాయం. పరమార్థభూతమగు బ్రహ్మము యొక్క జ్ఞానముచేత మాత్రమే భ్రమ కర్మబంధం తొలగుచున్నాయి. కర్మబంధం మరింక దేనిచేతా శమించదు. "నాకు కర్మబంధం ఉన్నది" అను భ్రమయే బంధమై ప్రాప్తిస్తోంది. ఎందుకంటావా?
బ్రహ్మము యొక్క అజ్ఞాన రూపమే బంధము. అంతే తప్ప ‘బంధము' అనేది వేరుగా లేదు.
తావత్ మాయా భవ భయకరీ పండితత్వం న యావత్ తత్ పాండిత్యం పతసి న పునర్యేన సంసారచక్రే యత్నం కుర్యాత్ అవిరతమతః పండితత్వే అమలాత్మా జ్ఞానోదారే భయమితరథా నైవ వః శాంతిమేతి ॥
ఓ వ్యాధుడా! ఈ 'మాయ' అనేది అతిబలీయమై, భయంకరమై ఈ జీవునకు అతిదీర్ఘమైన సంసార బంధం (లేక) కర్మబంధం కలుగజేస్తోంది. శాస్త్రములు ఏమి బోధిస్తున్నాయో, అద్దానికి సంబంధించిన పాండిత్యము సంపాదించుకోకపోయామా... మాయా సంసార రూప కర్మబంధం మనపట్ల కొనసాగుతూనే ఉంటుంది. ఎద్దానిచే మరల ఈ సంసార చక్రంలో పడమో... అదియే పాండిత్యము. అందుచే నిర్మలము - - ఉదారము అయినట్టి బుద్ధితో ఆత్మజ్ఞాన పాండిత్యము మనము పొందేవరకు శ్రవణ - మననాది రూపమైన ప్రయత్నములు శ్రద్దగా కొనసాగించవలసిందే!
ఎందుకంటే ‘ఆత్మజ్ఞాన సముపార్జన' అనే ఉపాయంతో తప్పితే మరింకే ఉపాయంతోనూ ఈ సంసారభయం శమించదు. కనుక ఆత్మజ్ఞానమే శరణ్యమని నా మనవి.
Page:376
13. ఆత్మజ్ఞాన పాండిత్యము - ఆత్మానుభూతి
మహాముని : ఓ వ్యాధుడా! ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే అంధకారమంతా పటాపంచ లవుతుంది చూచావా! అట్టి సూర్యబింబం ఆకాశానికే భూషణం అవుతోంది. అట్లాగే, సమస్త ధర్మముల, కర్మ, ఐహికాముష్మిక వ్యవహారములను నిర్ణయించే సభలో ఆత్మజ్ఞాన పాండిత్యం గల వాడు శ్రోతల బుద్ధిని వికసింపజేస్తూ సందేహాలను, ఛేదించివేస్తూ సభాభూషణుడు అగుచున్నాడు. ఆత్మజ్ఞానులు ఏ గతిని చూపుచున్నారో, ఆ ఆ మార్గంలో పొందే ఆత్మజ్ఞాన మోక్ష సుఖం ముందు ఇంద్రాదుల ఐశ్వర్యాలు తృణప్రాయం (గడ్డి పరకతో సమానం) అవుతున్నాయి. ఆత్మజ్ఞాని అందించే లవలేశ ఆత్మానందం తక్కిన జీవులను సుదీర్ఘ సంసార ప్రయాణం నుండి సేద దీరుస్తోంది. కాబట్టి ఈ 14 లోకాలలో లభించే సుఖములన్నీ బ్రహ్మానంద మహాసముద్రము యొక్క ఒక జలబిందువుతో కూడా సమానం కావు. పాతాళం, భూలోకం, స్వర్గలోకం- ఎక్కడా కూడా ఆత్మజ్ఞాన పాండిత్యం కంటే అధికమైన సుఖం గాని, ఐశ్వర్యం గాని నాకు కనిపించటం లేదు. సచ్ఛాస్త్ర విచారంచే ఉత్పన్న మైన ఆత్మజ్ఞానం సంతరించుకొన్న పండితుని పరమార్థ రూపమగు బ్రహ్మమయ దృష్టి అనిర్వచనీయ ప్రభోపేతం. అది మనకు స్వాత్మయందే పరమానందాన్ని అప్పటికప్పుడే ప్రసాదిస్తోంది.
రజ్జు సర్ప భ్రాంతిలో "ఇది త్రాడే! పాము కాదు” అనే జ్ఞానముచే పాముయొక్క భ్రాంతి తొలగిపోతోంది కదా! ఆత్మజ్ఞాని యొక్క బోధచేత దేహభ్రాంతి, సృష్టిభ్రాంతి, దృశ్యభ్రాంతి, కర్మబంధభ్రాంతి క్షణంలో శమించి మనం అధిష్ఠానమగు బ్రహ్మముగా శేషించ గలుగుచున్నాం. అట్టి బ్రహ్మజ్ఞానానందము అనుభవైకవేద్యము మాత్రమే!
ఓ వ్యాధుడా! బ్రహ్మము గురించి ఎక్కడో వెతకవలసిన పనిలేదు. ఎప్పటికో లభించవలసినది కూడా కాదు. అయ్యది స్వస్వభావమునందే స్వతత్త్వజ్ఞానముచే ప్రదర్శితమగుచున్నది. సర్వదా వేంచేసియున్నదే ఆత్మజ్ఞానముచే గుర్తించబడుచున్నది.
అద్దాని చేతనే అద్దాని నిజరూపములే అయివున్న శరీరము, సృష్టి, ప్రళయములు మొదలైన సంజ్ఞలు కల్పించబడుచున్నాయి. కనుక అవి కూడా బ్రహ్మం యొక్క నిజరూపాలే! కాబట్టి “దేహం - సృష్టి - మొదలైనవి బ్రహ్మము కంటే వేరు” ... అనే అభిప్రాయం సరికాదు. అయితే బ్రహ్మము -
నందు సృష్టి మొదలైనవి మొదలే లేవు. బ్రహ్మము సర్వదా సర్వత్రా బ్రహ్మముగానే ఉన్నది. ఇక సృష్టి, అద్దాని ధర్మములు, అద్దాని బోధకమైన పద వాక్యాలు ఎక్కడున్నాయి? ఎట్లా ఉంటాయి? ఈ భూమి ఆకాశం మొదలైనవి వాస్తవంగా ఉండి ఉంటే... వాటికి కారణం వెతకవచ్చు. కాని పృథివి మొదలైన పదార్థాలు ఎచ్చటా లేనప్పుడు వాటికి ఏవి కారణమవుతాయి?
బ్రహ్మం యొక్క ఏ ప్రతిభాస అయితే కలదో, అదియే 'జగత్తు'గా చూడబడుతోంది, చెప్పబడు తోంది. స్వప్నంలో కనిపించిన మనుజులకు “తల్లితండ్రులెవరు? ఏ జాతివారు” అనే ప్రశ్న ఎక్కడ?
Page:377
స్వప్నంలో కనిపించిన మనుజులే వాస్తవం కాదు కదా? అట్లాగే ఈ 'జాగ్రత్తు' అనే స్వప్నంలో కనిపించే మనుజుల యొక్క పిత్రాదులు, దేశకాలాదులు మొదలైనవన్నీ కల్పనా సదృశ్యం మాత్రమే! స్వప్నంలో కనిపించే మనుజులకు పూర్వ కర్మలు ఏమి ఉన్నాయి? అట్లాగే ఈ జాగ్రత్లో కనిపించే మనుజులకు కూడా పూర్వ తత్పూర్వ కర్మలు లేవు. ఒకవేళ కించితదూరం ఉన్నాయి అని అనుకుంటే అది కూడా స్వప్నంలోలాగా మిథ్యా సదృశమే!
వ్యాధుడు : మహాత్మా! మరి ఈ జీవుల పరస్పర సంబంధ బాంధవ్యములు, వివిధ దృష్టులు ఎక్కడి నుండి వస్తున్నాయి?
మహాముని : ఈ జీవులందరూ మిథ్యావాసనారూపులే! స్వప్నతుల్యంగా ఈ జీవులు తమ తమ వాసనానుసారంగా జగద్విషయములను పరస్పరం గాంచుచున్నారు. ఈ జీవుల పూర్వకర్మల వ్యవహారం కూడా వాసనానుసారంగానే మిథ్యగా ప్రవర్తిస్తున్నది. పంచభూతములు - - భువనము మొదలైన ఈ సృష్టులు మొదలుకొని ఈ శరీర పర్యంతము ఈ జీవులు తమ వాసనలను అనుసరించే పరస్పరం సంభాషించుకుంటున్నారు. పరస్పరం దర్శించుకుంటున్నారు. స్వప్నంలో జీవులవలెనే ఇక్కడ వాసనాస్వప్నం ప్రవర్తిస్తోంది. వాసనలు తొలగిస్తే శేషించేది ఆత్మయే! ఆత్మస్వరూపం దృష్ట్యా జీవులలో కనిపించే భేదమంతా భ్రమాత్మకమే! వాస్తవం కాదు.
కనుక వ్యాధుడా! ఈ జీవులందరు తమ తమ వాసనలను అనుసరించే ఒకరితో మరొకరు సంభాషించుకొంటున్నారని, వాస్తవానికి ఆత్మ మాత్రమే సత్యమని గ్రహించి ఈ ప్రపంచంలో చరించు. అంతేగాని గుడ్డి ఎద్దు చేలోపడి మేసినట్లు జీవించకు. స్వప్నంలో స్వప్నరూపులగు జీవుల మధ్య ఎట్లా వ్యవహారం సిద్ధిస్తోందో ... అట్లాగే ఈ జాగ్రత్ జీవుల మధ్య వాసనా చమత్కారం అనుసరించి ఇక్కడ వ్యవహారాలు సిద్ధిస్తున్నాయి. అవన్నీ అర్థ క్రియా సామర్థ్యంతో కనిపిస్తున్నాయి. ఒకడు స్వప్నంలో ఆకలితో పదార్థాలు స్వప్న కల్పనలోంచి పొంది సుష్టుగా భుజించి (వాస్తవానికి ఆ ఆహార పదార్థాలు భౌతికంగా లేకపోయినప్పటికీ) తృప్తిని అనుభవిస్తున్నాడు చూచావా? అట్లాగే జాగ్రత్సంకల్పములను సంవిత్తు పొందుతోంది. అయితే జాగ్రత్లో స్వప్నం అస్పష్టం. స్వప్నంలో జాగ్రత్ అస్పష్టం. వాటి భేదం అంతమాత్రమే! శుద్ధము - - ప్రకాశశీలము అగు సంవిత్తు స్వయంగా నిజస్వభావస్థమై భాసిస్తోంది. ప్రతిజీవుడు శుద్ధ సంవిత్ స్వరూపుడే! అట్టి శుద్ధ సంవిత్తు యొక్క స్ఫురణలే లోకంలో "ఇది జాగ్రత్తు - ఇది స్వప్నము” అనే శబ్దాలతో (లేక) సంజ్ఞలతో చెప్పబడు చున్నాయి. ఈ సృష్టి - ఈ దేహము మొదలైనవన్నీ మోక్ష పర్యంతం ఈ విధంగానే స్ఫురిస్తూ ఉంటాయి. అట్టి ఈ స్ఫురణయే సృష్టి.
వాస్తవానికి - చూచువాడు - చూడబడేది, అగ్ని - ఉష్ణత్వము, వాయువు - చలనత్వము, జలము - తరంగత్వము / ద్రవ్యత్వము... వీటిలో ఒకదానికొకటి భేదం లేదు. అట్లాగే సంవిత్తుకు అద్దానిచే దర్శింపబడే జాగ్రత్ - స్వప్న దృశ్యములకు భేదం ఒకింతకూడా లేదు.
స్వప్నమంతా శాంత - సౌమ్యరూపుడగు స్వప్నద్రష్టలో బయల్వెడలిన భావనా విన్యాస చమత్కారమే కదా! ఈ సమస్తము 'నిరాకారము - శాంతము' అయినట్టి బ్రహ్మమే అయి ఉన్నది.
Page:378
ఇక, ఈ జగత్ సమూహమంతా నిజ దృశ్య రూపముచే 'అసత్తు'. అధిష్ఠాన చిత్రరూపముచే ‘సన్మయము’. ఇదంతా కూడా 'నేతి-నేతి' అను నిషేధ శ్రుతి వాక్యములను అనుసరించి పరబ్రహ్మ స్వరూపముగానే తెలియబడుచున్నది.
కాని వ్యవహార దశలోనో... బ్రహ్మం జగ్రదూపంగా ఉద్భవించటం, ప్రళయరూపంగా నశించటం, దృశ్యరూపంగా అనుభవమవటం ఇవన్నీ జరుగుతున్నాయి.
కాని, పరమార్థదృష్టియందో... ఇదంతా కేవలం చిన్మాత్రమే! అజము, శాంతము, ఏకము నిర్మలము అగు బ్రహ్మమే ఇదంతా!
ఒక కుమ్మరివాడు మట్టితో కుండలను, బొమ్మలను, చక్రములను మొదలైనవి తయారుచేసి ప్రదర్శిస్తున్నాడు చూచావా? బ్రహ్మదేవుడు అనే కుమ్మరి 'హృదయము' అనే భూమిలో కల్పించిన ఆకాశము, వాయువు, పృథివి మొదలైన మూల పదార్థత్వము, వాటి కార్య కారణత్వము నేటికీ అట్లే వర్తిస్తున్నాయి. ఓ వ్యాధుడా! నీ హృదయంలో అరణ్యము, వేట, మృగాలు స్వప్నం మొ॥వన్నీ కనబడుచున్నాయి కదా! అట్లాగే బ్రహ్మదేవుని హృదయంలో ఈ సృష్టి, ఇద్దాని యందలి కార్య కారణ భావములు మొదలైనదంతా కనిపిస్తోంది. అయితే ఇదంతా స్వప్న సదృశమే సుమా! స్వప్నంలోని కార్యకారణ భావము వంటిదే ఈ జాగ్రత్ అంతర్గతమైన కార్య - కారణాలు కూడా!
నీవు నీ స్వప్నావస్థలో ఏవి ఎట్లా కల్పిస్తావో, ఏ నగరాదులు భావన చేస్తావో...అవన్నీ అట్లాగే దర్శిస్తావు కదా! అలాగే బ్రహ్మదేవుని సంకల్పానుసారమే ఈ జగత్తు యొక్క కార్య కారణ భావాలన్నీ ఏర్పడి ఉంటున్నాయి.
నీవు; నీ యొక్క సంకల్ప నగరంలో (ఊహాలోకంలో) ఏ విధంగా సంకల్పరూపమగు చైతన్యము ద్వారా నీ యొక్క అంతర్గతమైన ఇచ్ఛను అనుసరించి కార్యకారణ రూపమగు వ్యవస్థను స్థాపించి పొందుచున్నావో, అదే విధంగా, ఈ సృష్టియందు కూడా అట్టి సంకల్పరూప వ్యవస్థ స్థాపించబడి వ్యవహరిస్తోంది.
సంకల్పనగరం, అందులో అంతర్గతమైయున్న వ్యవస్థ... ఈ రెండూ కూడా స్వాత్మరూపమగు చిదాకాశము యొక్క స్ఫురణయే కదా! ఈ సృష్టి కూడా హిరణ్యగర్భుని సంకల్పాంతర్గతమే! అనగా ఇదంతా చిదాకాశము యొక్క స్ఫురణయే గాని, మరింకేమీ కాదు.
ఒకడు తన సంకల్పాకాశంలో స్వయంప్రకాశమగు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి నగరం, గృహం - ఇవన్నీ ఎట్లా ఏ కార్య - - కారణ వ్యవహార సరళిచే చూస్తున్నాడో అట్టిదే ఈ సృష్టి యొక్క పదార్థములందలి స్వభావ సిద్ధమైన కార్య - కారణ వ్యవహారంగా ఒప్పుచున్నది. సృష్ట్యారంభంలో హిరణ్యగర్భుని చైతన్యముచే పృథివి యందు కాఠిన్య - గంధాది నియతి, జలంలో రస - ద్రవత్వాది నియతి, అగ్నిలో రూప - ఉష్ణత్వాది నియతి, వాయువులో స్పర్శ - చలనాది నియతి, ఆకాశంలో శబ్ద - శూన్యత్వాది నియతి, కాలంలో భూత - వర్తమాన - భవిష్యత్ కాల నియతి, తూర్పు - పడమర మొదలైన దిన నియతి రచించబడినట్లే ... ఇప్పటికీ అట్టి నియతియే కొనసాగటం జరుగుతోంది.
Page:379
వాస్తవానికి చిదాకాశము పదార్థ రహితము. అయ్యది సర్వ విషయ - వస్తు శూన్యము అయివున్నది. అద్దానిచే నిజ సంకల్పానుసారంగా ఏది భావించబడుతోందో, అదియే కార్య కారణ రూప వ్యవస్థగా స్థితి నొంది ఉంటోంది.
హిరణ్యగర్భుని (సమష్టి సృష్టికర్త యొక్క) మనస్సు చైతన్యము యొక్క ఒకానొక చమత్కారము మాత్రమే! అట్టి మనో చమత్కారమే సృష్టివలె భాసిస్తోంది. సంకల్పరూపమగు ఆ హిరణ్యగర్భుని మనస్సునందు ‘భావతరంగములు' ఆవిర్భవిస్తున్నాయి. ఆ భావ తరంగముల ఆవిర్భావము “సృష్ట్యాది” ...అనే పేరుతో చెప్పబడుతోంది. వాయువు యొక్క చలన సత్తానుండే కదా, వాయుతరంగాలు ఆవిర్భవిస్తున్నాయి! ఆ వాయు తరంగాలు వాయువునకు అభిన్న రూపములే కదా! అలాగే 'చిదాకాశము' అను దాని యందు 'సృష్టులు' అనబడే చిదాకాశ తరంగాలు ప్రదర్శితమౌతున్నాయి. అట్టి సృష్టులన్నీ చిదాకాశమునకు అభిన్నములే! శూన్యము - నిర్మలము అగు ఆకాశంలో “నీలత్వం” ఎందుకు కనిపిస్తోంది? దృష్టి యొక్క దోషం చేతనే కదా! అట్లాగే, చిదాకాశము సర్వదా శూన్యము - నిర్మలము అయినప్పటికీ కూడా... అద్దానిలో చిదాకాశరూపమే అగు త్రిలోకములు వర్తిస్తున్నాయి.
ఒకడు చీకటిలో ఒక పామును చూచాడు. చాలా భయపడ్డాడు. ముచ్చెమటలు పట్టాయి. ఆ పాము ఆతని కాళ్ళకు చుట్టుకోబోతున్నట్లుగా అనిపించింది. విదిలించుకుంటున్నాడు. పాము కాటువేస్తే ఏమౌతుందో అతనికి తెలుసు. నోటినుండి నుఱుగు వస్తుంది. స్పృహ పోతుంది. శరీరమంతా విషం పాకుతుంది. ఇక ఆపై గిలగిల కొట్టుకొని చావటమే!... ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అతడు తబ్బిబ్బు అవుతున్నాడు. కాని ఇంతలో ఎవరో దీపం తెచ్చి చూస్తే, అది
పాము కాదు. త్రాడు మాత్రమే! వెంటనే ఆ బాటసారి చేత్తో త్రాడును పాదముల నుండి తొలగించి తన భ్రమకు తానే నవ్వుకుంటూ ఆవలకు విసిరాడు. ఇపుడు మరలా ఆ త్రాడును చూస్తే ఇతః పూర్వంలా చెమటలు పట్టడం, భయంతో కేకలు వేయటం చేస్తాడా? లేదు. ఎందుచేత? "అది పామేమో!" అనే భ్రమ తొలగింది కనుక! అట్లాగే ఎప్పుడైతే శ్రవణ - మననాది సాధనల అభ్యాసంచేత ఈ దృశ్యము "దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనట్టి బ్రహ్మము"గా ఏ జీవునకైతే భాసిస్తోందో... ఆతడు ఇక "బ్రహ్మము సర్వదా జగత్ రహితము”.... అనే పరమసత్యాన్ని సుస్పష్టంగా, నిర్దుష్టంగా గ్రహిస్తున్నాడు.
వ్యాధుడు : మహాత్మా! ఈ దేహ పతనానంతరం ఈ జీవుడు ఏమి అవుతున్నాడు? జన్మ మరణాదులు కూడా స్వప్నతుల్యమేనా?
మహాముని : జన్మ - మరణాలు కూడా నిజస్వప్నతుల్యములే! ఆ విధంగా తన యొక్క స్వప్నముతో పోల్చదగిన ‘మరణము’ పొందిన తరువాత ఈ జీవుడు తన భావనాసంస్కారములను అనుసరించి వేరువేరైన జగత్తులను గాంచుచున్నాడు. కానీ...ఇహలోకం - పరలోకం కూడా నిరాకారమగు
చిదాకాశమే!
Page:380
14. దేహపతనానంతరం
వ్యాధుడు : స్వామీ! ఈ దేహం పతనం పొందిన తరువాత ఈ జీవుడు మరల సుఖ దుఃఖములను పొందటానికి మరొక దేహం పొందుచున్నాడు కదా!
ఇప్పుడు నా సందేహమేమిటో వినండి. ఈ దేహం పతనమైన తరువాత మరొక దేహం వస్తోందా? ఒకవేళ అట్లా వస్తుంటే, ఈ దేహం నశించిన తరువాత ఆ మరొక దేహం ఎట్లా ఉత్పన్నం అవుతోంది? ఆ నూతన దేహానికి ఉపాదాన కారణం ఏమిటి? అద్దాని ఉత్పత్తికి నిమిత్త సహకారి కారణాలేవైనా ఉన్నాయా? ఉదాహరణకు... కుండకు ఉపాదాన కారణం - మట్టి, నిమిత్త కారణం - కుమ్మరి, సహకారి కారణం - సాధనా సామాగ్రి.
ఒకవేళ ధర్మ-అధర్మాలే సుఖ-దుఃఖాలుగా పరిణమించి ఈ ఉపాధులకు కారణభూత మౌతున్నాయంటారా?... ఇదంతా జీవుడే తన భోగము కొరకు తయారు చేసుకుంటున్నాడా?
ఒకవేళ ధర్మ-అధర్మాలే మోక్ష - బంధములకు కారణమవుతున్నాయని అంటే ... అప్పుడు నాది మరొక ప్రశ్న. సాకారమగు ఈ శరీరంతో నిర్వర్తించబడే 'ధర్మము' మొదలైన కర్మలు సర్వకర్మల నివృత్తి రూపము -నిరాకార రూపము అగు 'మోక్షం' ప్రసాదిస్తున్నాయంటే - అది అసమంజసం కదా! ఎందుకంటే కర్మలచే నిర్మించబడేది కర్మరాహిత్యం ఎట్లా ప్రసాదిస్తుంది? మహాముని : ఓ వ్యాధుడా! నీది పెద్ద ప్రశ్నే! సరే, జాగరూకుడవై విను.
1. సంస్కార రూపంలో ఉన్న “విహిత - నిషిద్ధ అని అనిపించే “ధర్మాధర్మాలు”.
2. అట్టి సంస్కార సమూహ రూపమగు “మనస్సు”
3. అట్టి మనస్సులో దాగివున్న “వాసనలు”
4. ఆ మనస్సు యొక్క యజమాని, చిదాభాస రూపుడగు "జీవుడు”
5. ప్రాణచేష్టలే ప్రధానంగా కలిగియున్న ఈ జీవుని “దేహం”.
ఈ విధంగా “ధర్మాధర్మాలు”, “మనస్సు”, “వాసనలు”, “జీవుడు”, “దేహం” మొదలైనవన్నీ
- - మేఘము నందు కొండలు - లోయ మొదలైన కల్పిత దృశ్యాలు చూచేవాడిచే కల్పించబడినట్లు
- - చైతన్యము నందు "కల్పించబడినవి”. అంతేగాని అవి వాస్తవం కాదు.
చిదాభాసుడు - దేహము అనేది ఒకటున్నది. అది ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నది. ఈ దేహము నాది. ఇవన్నీ నావి. ఈ ఈ సంబంధ - - బాంధవ్యాలు ఉన్నాయి... అనే భావనా గ్రహీతనే 'చిదాభాసుడు' అని పిలుస్తున్నారు.
ఇట్టి కథనమంతా చిత్తమే కల్పన చేసుకుంటోంది. చిత్తమే తన కల్పనలో ప్రవేశించి సంచరిస్తూ “చిదాభాసుడు” అను శాస్త్రీయ నామమునకు అర్థమౌతోంది. చిదాకాశమగు స్వాత్మయందు నెలకొనియున్న హిరణ్యగర్భుడు స్వయంగా తన కల్పనా వ్యవహారరూపంగా ఈ ధర్మ - అధర్మ, సుఖ - దుఃఖాది నామములు కల్పన గావించుకుంటున్నాడు.
Page:381
సంకల్పంలో విహరిస్తున్నవాడు ఆ సంకల్పం ముగిసిన తరువాత తాను ఇతఃపూర్వ స్థితికే వస్తున్నాడు కదా! స్వప్నంలో విహరిస్తున్న స్వప్న ద్రష్ట ఆ స్వప్నం అంతమవగానే ఆ స్వప్నమునకు మునుముందే ఉన్న స్థితిని తిరిగి పుణికి పుచ్చుకుంటున్నాడు కదా!
అట్లాగే... “ఈ భౌతిక దేహం నేను కాదు” అను సుజ్ఞానమును సముపార్జించుకొనినట్టి జీవుడు దేహతాదాత్మ్యమునకు ముందుగానే ఉన్న చిదాత్మ దేహుడుగా ప్రకాశిస్తున్నాడు. దేహతదాత్మ్యము (చిదాభాసత్వం) కలిగి ఉన్నప్పుడు, అవన్నీ జ్ఞానముచే త్యజించినప్పుడు కూడా ఈతడు చిదాత్మదేహుడే!
వ్యాధుడు : స్వామీ! ఈ జీవుడు మరణానంతరం ఎట్టి స్థితిని - గతిని పొందటం జరుగుతోంది? మునీశ్వరుడు : జీవించి ఉన్నవాని ఇహలోక బుద్ధి ఇక్కడ వస్తు - విషయ - - వ్యక్తిగత సంబంధ - బాంధవ్యములన్నీ పొందుచున్నది కదా! ఈ జీవుడు మరణించిన తరువాత కూడా ఆతని పరలోక బుద్ధి స్వప్నమువలె స్వయముగా భాసిస్తోంది. ఆ పరలోక బుద్ధితో వస్తు - విషయ - - వ్యక్తిగత - సమష్టిగత వ్యవహారాలన్నీ స్వప్నంలో లాగా చిరకాలం పొందుచున్నాడు.
జీవించి ఉన్నవాడు దర్శించే ఆయా వస్తు - విషయగత సంబంధాలన్నీ భ్రమ, స్వప్న సదృశము, అసత్యము అయినట్లే... మరణించినవానిచే స్వప్న సదృశంగా అనుభవించే విషయాదులలో కూడా సత్యత్వమేదీ లేదు. అవన్నీ కూడా భ్రమ - స్వప్నసదృశమే!
జీవించి ఉన్నవాడు జాగ్రత్ను చూస్తూ, “ఇది సత్యమే”... అని అనుభవము పొందుచున్నట్లే మరణించినవానికి కూడా తాను అనుభవించే స్వప్నసదృశ జగత్తు ఆతనికి సత్యమనియే అనిపిస్తోంది. ఈ విధంగా జీవితానుభవం, మరణానుభవం - - ఉభయములూ ఏకరూపములే అయి ఉంటున్నాయి. వ్యాధుడు : మహాత్మా! మరణించినవాడు తాను పొందే స్వప్న సదృశదృశ్యానుభవం తానే కల్పించుకుంటున్నాడా? లేక, ఆతని అనుభవము వలన అనుభూతులను అనుసరించి మరెవరైనా (యమధర్మరాజు మొదలైన దేవతలెవరైనా) ఆతనికి అవన్నీ కల్పిస్తున్నారా?
మహాముని : ఓ వ్యాధుడా! మరణించిన వాని మరణానంతర స్వప్న సదృశ జగత్ వ్యవహారమంతా కూడా మరొకరెవరైనా నిర్మిస్తూ ఉన్నారని కాసేపు అనుకుందాం. అప్పుడు ఈ జీవుని మరణానంతర జగత్తును నిర్మించి - పరిపోషించే ప్రవృత్తికి అనుకూలమైన స్మృతి ఈ జీవునికి ఎట్లా కలుగుతోంది? ఒకవేళ ఈ జీవుని స్మృతి మరొకరి వ్యవహార పరిధిలో ఉంటే ఈతడే మరల జన్మించినాడు అని అనటం ఎట్లా? మరణానంతరము ఈతనికి స్మృతి లేనప్పుడు ఒకనికి పూర్వానుభవమే ఉండదు. కనుక సర్వము ఈ జన్మలోనే అంతం అవుతుందని అనవలసి వస్తుంది. అప్పుడిక పాప పుణ్యాలు, ఇహ-పర లోకాలు, మరణానంతర స్థితిగతులు మొదలైనవన్నీ తిరస్కరించవలసి వస్తుంది. పైగా ...జీవులందరు జన్మతః ఒకే రీతిలో ఉండాలి. కానీ జన్మించినట్టి ఒక్కొక్కరు ఒక్కో విధమైన గుణ
- స్వభావ చమత్కారం చిన్నప్పటినుండే కలిగి ఉండటం మనం చూస్తున్నాం కదా! పైగా, అవన్నీ
కూడా ఆ జీవుని కార్యక్రమములను అనుసరించి మార్పు - చేర్పులు చెందుచున్నాయి. “మరొకరి
Page:382
స్మృతిని అనుసరించి ఈ జీవుడు వర్తిస్తున్నాడు” ...అని అనదలచుకొంటే, అప్పుడు ఈ జీవుడు అంతర్గతంగా కలిగివున్న నిరూఢమైన చైతన్యము శూన్య రూపమౌతుంది. లేక... అయ్యది స్వయం ప్రకాశకము కాకుండా పోతుంది. అది వేదవాక్య విరుద్ధం కదా!
అందుచేత ... ఇట్టి సందేహాలు నివృత్తింపజేస్తూ శాస్త్రాలు చెప్పుచున్న ఒకానొక సిద్ధాంతం ఒక్కటి ప్రస్తావిస్తాను. పరమాత్మ ఈ దేహ జగత్తులను నిర్మించి స్వయముగా అద్దాని యందు ప్రవేశించి ప్రకాశిస్తున్నాడు. ("తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశత్)
కాబట్టి మనం ఈ జీవుని జీవన్ - మరణ - మరణానంతర స్థితులను గురించి ఈ విధంగా సిద్ధాంతీకరించవలసి వస్తుంది.
1. ఈ జీవుడు వాస్తవానికి కేవల చిదాత్మ స్వరూపుడు మాత్రమే! అయ్యది సర్వదా యథాతథం. 2. ఈతని జగదనుభవమంతా ఈతని స్వస్వరూపము నుండి బయల్వెడలే స్వకీయ చమత్కార రూపమగు 'చిత్తము'ను అనుసరించే ఉంటోంది.
3. ఈతని జగదనుభవమంతా స్వకీయ చిదాత్మ స్వరూపమునకు అనన్యమైనప్పటికీ అన్యమువలె స్ఫురించేదే చిత్తము.
4. చిత్తమును అనుసరించే జగదనుభవం ఉంటోంది. కనుక చిత్త స్వరూపమే జగత్ స్వరూపంగా స్ఫురిస్తోంది. ఆత్మ నుండి బయల్వెడనట్లుగా చెప్పబడుచున్నప్పటికీ ఆత్మకు వేఱుగా ఏదీ బయల్వెడలుటకు కారణం లేదు. కనుక చిత్త - జగత్తులు ఆత్మరూపములే!
5. యథార్థానికి ఈ జీవుడు మరణించిన తరువాత జనించటం లేదు. కేవలం చిత్తము చేతనే చిత్తము యొక్క స్వవాసనావశం చేత “నేను ఇప్పుడు పుట్టాను” .... అని వ్యర్థంగా కల్పన చేసుకుంటున్నాడు. ఈ దేహం పొందినప్పుడు కూడా అతని చిత్తమే 'నేను పుట్టాను' అనే భ్రమను కొనసాగించటం జరుగుతోంది.
6. ఈ జీవుడు స్వతహాగా చిదాకాశ స్వరూపుడు, జన్మ మొదలైన ఎట్టి వికారములు ఉండనట్టి చిదాకాశ స్వరూపమగు స్వాత్మయందే జన్మాదులు చిత్తముచే కల్పితంగా ఎఱుగబడుచున్నాయి. చిత్తమునకు ముందే ఆతని చిత్స్వరూపం యథాతథమై ఉన్నది.
7. ఈ జీవునికి చిదాకాశ స్వరూపం దృష్ట్యా ఈ జన్మలేదు. మరొక జన్మలేదు. ఇతఃపూర్వం జన్మలు లేవు. చిత్తముచే పొందబడేది కల్పనయే కాబట్టి, కల్పన ఉన్నంతవరకు జన్మాదులకు అంతం కూడా లేదు.
మృతౌ న జాయతే, తస్మాత్ చేత్సవ స కేవలమ్ ! ఇహాయమిత్థమేత్యేవ వేత్తి ఖే వాసనాత్మకమ్ ॥
కాబట్టి ఓ వ్యాధుడా! ఈ జీవుడు యథార్థానికి జనించటమూ లేదు. మరణించటమూ లేదు. మరల పునర్జన్మించటమూ లేదు. ఇక ఇదంతా ఏమిటంటావా? కేవలము ఈ చిత్తము స్వవాసనావశం చేత వ్యర్థంగా వికారశూన్యమగు స్వాత్మయందే ఈ 'దేహ-జగత్' కల్పనలను
Page:383
నిర్మించుకొని, అద్దానియందు ప్రవేశించి తన చిత్ దేహమును ఏమరచి ఈ విధంగా చిత్త-భౌతిక దేహములలో తన్మయమై ఉంటోంది. అనగా తనయందు అభ్యస్తమైయున్న భావనాపరంపరా వ్యవహారమునే ఈతడు దీర్ఘకాలం అనుభవిస్తున్నాడు. తన భావనానుభవం ఇట్లు “ఇదంతా సత్యమే” అనే రూపంగల ఒకానొక విశ్వాసం కలిగి ఉండటంచేత ఈ దృశ్యమే ఘనీభూతమైన పూర్ణ సత్యంగా ఎరుగుచున్నాడు. భావనకే ఉత్పత్తి స్థానమనతగు తన చిత్ స్వరూపాన్ని ఏమరచి ఉంటున్నాడు.
చిదాకాశరూపమగు స్వాత్మయందే స్వప్నతుల్యమగు దృశ్యమును అభ్యాసము గావించుచు ...అట్టి అభ్యాసవశం చేత మరల మరల స్వప్న సదృశంగా నిజ జన్మను, నిజ మరణమును నిజ జగత్తును అనుభవిస్తున్నాడు.
ఈ విధంగా ఆత్మయే చిదాకాశమునందు వ్యష్టి భావనచే మిథ్యా జగజ్జాలమంతా వీక్షిస్తోంది. తన సన్నిధానమునే ఆధారంగా పొందుచూ, తనయందే అధ్యస్తములై ఉన్న కార్యకారణములతో కూడిన జాగ్రత్-స్వప్నాలలో ధ్యాసను ప్రవేశింపజేసి, ప్రవర్తింపజేస్తోంది. సుషుప్తిలోను ప్రళయం లోను మోక్షస్థితి యందు ఆ కార్యకారణాలను తనకు తానే మ్రింగివేస్తోంది. వాస్తవానికి సుషుప్తి ప్రళయ - మోక్షాలు దేనినీ భక్షించటం లేదు. జాగ్రత్- స్వప్నాలు దేనిచేతనూ భక్షించబడటమూ లేదు.
-
చూచావా, వ్యాధుడా! ఈ విధంగా ప్రతి జీవుని అనుసరించి కోట్లకొలది జగత్తులు వర్తిస్తున్నాయి. అయితే... ఎఱుగబడినదా... అవన్నీ కూడా కేవలం బ్రహ్మ రూపాలే! ఎఱుగబడనంత కాలం అవి దృశ్యరూపంగానే ఉంటాయి.
మరొక విషయం... ఈ అనేక కోట్ల జగత్తులలో ఏదీ కూడా ఒకటి మరొకదానిని కప్పి ఉంచటం లేదు. ఏదీ కూడా మరొకదానిచే తెలియబడటమూ లేదు. అయితే ఏమి? ప్రతి జీవుడు “నా జగత్తే ఉన్నది. మటొకరి జగత్తు లేదు”... అని తలచుచు జగత్తులో చరిస్తున్నాడు. వాస్తవానికి ప్రతివాడు తన యొక్క జగత్ స్వరూపంలో తానే బహుదూరపు బాటసారిలాగా సంచరిస్తున్నాడు. జాగ్రత్ (లేక) స్వప్న జగత్తులో చరించటమంటే... తన కల్పనలో తానే ప్రవేశించి సంచరించటం వంటిది. ఒకడు ఒక కథ రచించి, ఆ కథలోని పాత్రలు పడే కష్టాలు చూచి తానే విషాదం పొందటం వంటిది. (తత్ దృష్ట్యా తదేవానుప్రవిశత్... పరమాత్మ దేహాది జగత్తును నిర్మించి స్వయముగా అద్దానియందు ప్రవేశించి అద్దానికి ఉనికిని ప్రసాదించుచున్నాడు)
ఈ బ్రహ్మాండములో పంచభూతములైన ఘనము, ద్రవము, ఉష్ణము, వాయువు, ఆకాశమున్ను, అట్లాగే అండజ (గుడ్డు పొదిగితే పుట్టేవి), స్వేదజ, గర్భజ, వాయుజములైన ఆయా అనంత సంఖ్యాకమగు జీవులు ఉన్నాయి కదా! అట్లాగే ప్రతి జీవుని అంతరంగంలో అసంఖ్యాక జగత్తులు ఏర్పడి ఉండి ప్రవర్తిస్తున్నాయి.
వ్యవహార దృష్టిచేబ్రహ్మాండాలన్నీ సత్యమే! పరమార్థ దృష్టిచే అవన్నీ బ్రహ్మరూపాలే! జ్ఞాని దృష్టిలో బ్రహ్మరూపమైన సత్తు మార్పు చేర్పులు లేనిదై సర్వదా సర్వత్రా సర్వంగా ప్రకాశిస్తూంది.
Page:384
అజ్ఞాని యొక్క దృష్టిచే బ్రహ్మరూపం గమనించబడటం లేదు. ఆతనికి ఈ కనబడేదంతా పాంచ భౌతిక జగత్తుగా (సాకారంగా) పరమసత్యంగా అనుభూతమౌతోంది. అజ్ఞానికి ప్రత్యక్షమై జగత్తుగా కనిపించేదంతా, జ్ఞానికి ప్రత్యక్షమగు స్వస్వరూప బ్రహ్మయే అయివుంటోంది.
చిద్రూపమునకు ఏదేది ఎట్లు భాసిస్తోందో అది జగద్రూపంగా సత్యముగానే (అజ్ఞాన దృష్టికి) అనుభవమౌతోంది. ఇవన్నీ జ్ఞానికి సద్రూపంగా (ఆత్మరూపంగా) భాసిస్తున్నాయి. వ్యాధుడు : ఇంతకీ ఈ కనబడే జగత్తు సత్యమా? అసత్యమా?
మహాముని : "ఈ జగత్తు సత్యమా? అసత్యమా? ఇది భ్రమయా? అనునిత్య సత్యానుభవమా? ఇవన్నీ ఉన్నాయా? లేవా?” అనునది నాశరహితమగు సంవిత్తే నిర్ణయించవలసినది. అద్దాని నిర్ణయానుసారమే ఈ జగత్తులోని సంబంధ బాంధవ్యాలు మొదలైనవి సత్యముగానో, స్వప్నతుల్యం గానో నిర్ణయించబడి... అట్లే తదనుసారమే అనుభవించబడుచున్నాయి. ఈ సంవిత్తు ఎప్పుడు ఏ ప్రకారమైన నిర్ణయం కలిగి ఉంటుందో... అది అట్లే ఆ ప్రకారంగానే భాసిస్తోంది. ఇక స్వయం నిర్ణయానుసారమే ప్రాప్తిస్తున్న ఈ జగత్తులో ఈ వస్తువుల, జీవుల ఏకత్వ, ద్విత్వాదుల గురించిన ప్రసంగం ఎక్కడిది? ఎవని బుద్ధి ఏ తీరుగా ఉంటే వానికి అట్లే ఇదంతా అనుభవమవుతోంది. అందుకే “ఇది అనిర్వచనీయం” అని నిర్ణయించబడింది. మిత్రమా! "తెలుసుకునేది - తెలియబడేది -
ఒకే చైతన్యము యొక్క ద్వివిధ రూపములు”... అని ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు ఈ దృశ్యము పూర్తిగా జ్ఞానరూపమే అగుచున్నది.
జ్ఞానరూపము (సంవిత్తు యొక్క తెలుసుకునే విభాగం) సత్తా కలిగివున్నది కాబట్టే... 'జ్ఞేయము’ అనబడే తెలియబడేది ఉనికిని పొందుచున్నదగుచున్నది.
ఈ విధంగా ఈ భూమి మొదలైన సమస్త పదార్థాలు జ్ఞాన స్వరూపములే. అనగా అవన్నీ తెలుసుకొనేవాని ‘తెలివి'యే స్వరూపంగా కలిగి ఉన్నాయి.
1. తెలియబడే పదార్థాలన్నీ తెలుసుకొనేవాని 'తెలివి'ని అనుసరించే ఉండటం చేత వాటి మూలరూపం 'తెలివి'యే అయివున్నది.
2. తెలుసుకొనేవాని రూపమే తెలివి అయివున్నది.
3. ఆత్మయే తెలుసుకొనే వాని రూపంగా ఉన్నది.
4. కనుక తెలియబడేదంతా ఆత్మరూపమే!
కనుక దృశ్యము ద్రష్టరూపమే అయివున్నది. ద్రష్టయో ఆత్మరూపుడే అయివున్నాడు. ఓయీ వ్యాధుడా! నీచే దర్శించబడే దృశ్యమంతా నీ రూపమే అయివున్నది. నీవు ఆత్మయే రూపముగా కలిగి ఉన్నావు.
ద్రష్టయగు ఆత్మ స్వస్వరూప తత్త్వమును ఏమరచినదై ఉండటం చేత తన జ్ఞానస్వరూపం నుండి చ్యుతి చెంది “ఇది వేరు, అది వేరు” ... అను భావనను ఆశ్రయించి దృశ్య రూపముగా
Page:385
(దృశ్యరూప విభాగంగా) “అనుభవి” అగుచున్నది. వాస్తవానికి "దృశ్యము ఆత్మరూపమే అయివున్నది”. (ఆత్మౌపమ్యేవ సర్వత్ర సమంపశ్యతి సయోగిః, తత్ దృష్ట్వా తద్వాను ప్రవిశత్, యదాత్మస్య అన్యః తదేవ మాయా, ఇదమ్ సర్వమ్ యామాః, మత్తపరః తరమ్ నాన్యత్ కించిదస్తిః ... మొదలైన ఉపనిషత్ వాక్యాలన్నీ "చూడబడేదంతా చూచేవాని రూపమే” ...అని నిరూపిస్తున్నాయి. అదియే ఇక్కడ కూడా నిరూపించబడుతోంది. అదియే ఆత్మజ్ఞానం)
జ్ఞానం యదేవ తజ్ఞేయం! జ్ఞేయస్య అసంభవాత్ పృథక్ I యథాజ్ఞానమ్ అతో జ్ఞేయం తవోత్యాత్మానమాత్మానా ||
ద్రష్ట కంటే దృశ్యం వేరుగా ఉండజాలదు. జ్ఞానము కంటే జ్ఞేయము (దృశ్య సమూహం) వేరుగా ఉండటం అసంభవం. జ్ఞేయము (దృశ్యము) జ్ఞానరూపమే (ద్రష్టరూపమే) అయివున్నది.
కనుక వ్యాధుడా! "ఈ దృశ్యము ఎక్కడి నుండి వచ్చి ఇక్కడకు చేరింది? ఇదంతా ఎవరిచే కల్పించబడింది?” అనే ప్రశ్నకు మహనీయుల వాక్యములను స్వానుభవమును క్రోడీకరించి ఇక్కడ సమాధానం చెప్పుచున్నాను విను.
జ్ఞానమే 'నిజస్వరూపము' గూర్చిన అజ్ఞానముతో కూడినదై ఉండటం చేత తనకు తానే ఇట్లు జగత్తు రూపంగా విస్తరించివున్నది. ప్రదర్శించుకుంటోంది. ఆ విధంగా “తనకు తానే దృశ్యరూపంగా విస్తరించి ఉండటం” ...అనేది ప్రతి ఒక్కనికి స్వప్నంలో సాదృశానుభవమే కదా! అట్టి స్వస్వరూప స్వానుభవమే ఈ జాగ్రత్ జగత్తు కూడా! ఇది మా స్వానుభవంతో ఆత్మజ్ఞాన ప్రయోజనంగా చెప్పుచున్న అత్యంత సుస్పష్టమైన పరమసత్యం.
నాయనా! తత్త్వజ్ఞుల అనుభవమే అది సుమా! అదియే ఆత్మజ్ఞానం. తత్త్వజ్ఞుడు "ఆత్మకంటే వేరుగా సృష్టులు లేవు. సృష్టులన్నీ జ్ఞాన రూపంగానే వెలయుచున్నాయి” అని గ్రహించి, తృప్తి పొందినవాడై ఉంటున్నాడు. ఆతని నేత్రములు ఈ సృష్టులను చూస్తున్నప్పటికీ, ఆతని దృష్టికి ఈ రూపనామాదులు కనిపిస్తున్నప్పటికీ “ఇవన్నీ నా ఆత్మస్వరూపమే”... అని అనిపిస్తోంది. “నాకు వేరుగా ఎక్కడా ఏదీ కింత్ కూడా లేదు” (మత్తః పరతరమ్ నా న్యత్ కించిదస్తి) అని గ్రహించియే దృశ్య దర్శనం చేస్తున్నాడు. ఇక మూర్ఖులకు కనబడే సృష్టి (లేక దృశ్యము) అంటావా? అది నన్ను అడగవద్దు. ఎందుకంటే అద్దానికి ఒక నిశ్చయత్వమంటూ ఏదీ లేదు. మూర్ఖుడు ఈ దృశ్యమును (సృష్టిని) చూస్తూ....
ఇది నాది– అది వారిది, వీరంతా మూర్ఖులు. వారికేమో ఏమీ తెలియదు. ఇదంతా నాదే! వీటిని ఎందుకు వదలాలి? వాటినేమో ఇక ఇప్పుడు పట్టుకోవాలి. ఇదెవ్వరో నాపై కోపంతో కల్పించారు. ఎవరు కల్పించారో తెలియదు! ఇదంతా కష్టాలమయం. వీరే నాకు కష్టాలు కలిగిస్తున్నారు? ఇక్కడ తినటం - త్రాగటమే పని. ఇది కాక ఎక్కడో ఏమున్నది? ఇంకెక్కడా ఏదీ లేదు. నేనే హాయిగా ఉండాలి. ఇందులో తప్పేమున్నది? ఎవరి గొడవో నా కెందుకు? వీరంతా నా శత్రు -
Page:386
మిత్రులు. వీరిని ఉద్దరించాలి. వారిని నమ్మకూడదు. ఇంతవరకు నాది. అది వారిది. వారితో నాకేమి సంబంధం? కొందరు నా వారు. మరికొందరు కాదు. నా వారి కోసం ఏమైనా చేయవచ్చు. కానివారి కోసం నేను ఎందుకు చేయాలి? ఇందులో పడ్డాను. ఇంకెప్పుడో పోతాను ... ఇదంతా నా కర్మ! ఇది ఇంతే!
...ఈ విధంగా పరిపరివిధాలుగా, ఒక్కొక్కసారి ఒక్కొక్కవిధంగా దృశ్యము విషయమై అనుభవం కలిగి ఉంటున్నాడు. అందుచేత అట్టి మూర్ఖుల దృష్టి మనం పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. తీసుకొని ప్రయోజనం కూడా లేదు. తత్త్వవేత్త “ఇదంతా అస్మత్ ఆత్మ స్వరూపమే” అత్యంత స్పష్టంగా, “ఆ గోడ అక్కడున్నది” ... అన్నంత సాదృశంగా, ఆత్మకు అభిన్నంగా దర్శిస్తున్నాడు. అట్టి ఆత్మసాక్షాత్కారమే మనకిక్కడ శరణ్యం. అదియే సత్యము.
ఆత్మజ్ఞానముచే ఈ సమస్త జగత్తు కూడా ఏకము - సన్మాత్రము అగు చిదాకాశమే అయి ఉన్నది. ఆత్మను ఎఱుగనట్టి అజ్ఞానులకు ఏకమగు ఆత్మయే అనేక జగద్రూపములుగా భాసిస్తోంది. ఒకే చిన్మాత్రమగు ఆత్మ స్వప్నంలో లక్షల కొలది ఆత్మరూపములను ధరించి వర్తిస్తోంది. అట్లాగే జాగ్రత్లో కూడా లక్షల కొలది జాగ్రతగదాత్మ రూపములను కూడా ధరిస్తోంది. ఇక సుషుప్తి యందో... ఏకైకాత్మరూపంలో చెన్నొందుతోంది.
జగత్తు అంటే చిదాకాశమున ఏ స్వప్న సంవిత్తు కలదో... అదియే “జగత్తు" అనే పేరుతో చెప్పబడుతోంది. జగత్ ప్రళయం అంటే చిదాకాశములోని సుషుప్త సంవిత్తు జగత్ వ్యవహారమును త్యజించి ఏకైకాత్మ రూపం అవధరించి ఉండటం. “ఇదంతా నా రూపమే” అని సుస్పష్టం చేసుకొని
ఉండటం.
ఈ విధంగా సృష్టి - ప్రళయములనేవి ఆత్మయందలి అంతర్విభాగ విన్యాసం మాత్రమే! ఒకే సంవిత్తు... స్వప్నసంకల్పములలో లాగా... వివిధ భోగ్యరూపములను లక్షల కొలది భోక్త రూపములను (అనగా మనుష్యాది రూపములను) పొందుతోంది.
ఆ సంవిత్తే సుషుప్తిలో పదార్థ శూన్యత్వస్థితి బడయుచున్నది. కాబట్టి ఓ వ్యాధుడా! నీ యొక్క జగద్విభాగంలో నీకు అనన్యమైనప్పటికీ అన్యంగా నీచే దర్శించబడేదే జగత్తు నీ యొక్క సర్వపదార్థరహిత ఆత్మవిభాగమే సుషుప్తిగా నీకు అనుభవమౌతోంది. అనగా ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, అందులో అంతర్గతమైవున్నట్లు తోచేవి.... అన్నీ ఆత్మరూపములే సుమా!
స్నేహితుడా! ఈ సమస్త దృశ్యమూ కూడా కేవలం “నాశరహితము - శుద్ధము” అయినట్టి చిదాత్మయే అయివున్నది. చిదాత్మ ఎచ్చట ఏ రూపంగా అనువర్తిస్తుందో ...ఆ రూపంగానే పరిణమించి దృశ్యరూపంగా అనిపిస్తోంది. - స్వప్నంలో స్వప్న సంవిత్తే స్వప్నాంతర్గతంగా ఆయా స్వప్నంలోని వస్తు - విషయ - దృశ్య - వ్యక్తిగత రూపాలన్నీ ధరిస్తున్నట్లు... సంవిత్ సంకల్పంలో కనిపించే ఆయా వివిధ నగరాది రూపాలన్నీ ధరిస్తున్నట్లు...
ఒకే నిర్వికారమగు సంవిత్తు సృష్టి యొక్క సిద్దికొరకై ఈ భూమి - - జలము - - అగ్ని -
Page:387
వాయువు - - ఆకాశము మొదలైన రూపాలన్నీ ధరిస్తోంది. చిదాకాశ సంవిత్తే ఆయా
నామరూపాలుగానూ, ఈ సర్వ జగత్తుగాను భాసిస్తోంది.
ఆ చిద్రూప సంవిత్తే నాశనవంతమగు సాకార రూపముగాను - నాశనరహితమగు నిరాకార
రూపంగాను కూడా... భాసిస్తోంది. వాస్తవానికి అద్దానికి 'నాశనము' అనేదే లేదు. కానీ 'నాశనము' అను రూపంలో 'నివృత్త సంవిత్తు'యే భాసిస్తోంది.
ఓ వ్యాధుడా! నీవు నీ మనస్సుతో తూర్పు, పడమర మొదలైన దిక్కులన్నీ సంచరిస్తూ “వినబడినవి వినబడనివి, చూడబడినవి చూడబడనివి అనేక విషయాలు" గమనించి ఉన్నావు కదా!
ఇవన్నీ చిత్స్వరూపుడవైన నీవే నీ చిత్స్వరూపమునే ఆయా రీతులుగా ఎఱుగుచున్నావు. ఇక్కడ వస్తువులు, విషయాలు మారవచ్చు-మారకపోవచ్చు. కానీ ఇవన్నీ ఎరుగుచున్న సంవిత్స్వరూపుడ వగు నీకు నాశనము లేదు. 'ఆకారము' అనే వికారము నీకేమాత్రం లేదు. ఎందుకంటే... సంవిత్తు ఎక్కడా కూడా సాకారము పొందటం లేదు. నాశనయుక్తమయ్యేది కాదు.
వ్యాధుడు : స్వామీ! నేను స్వతహాగా సంవిత్ స్వరూపుడనై ఉండగా, ఈ దృశ్యముతో నాకు తదాత్మ్యము ఎందుకు కలుగుతోంది? అసలీ దృశ్యమును కల్పించినదెవరు? ఈ దృశ్య తాదాత్మ్యము నా పట్ల తొలిగేది ఎట్లా? ఎవరిని ఆశ్రయించటంచే ఈ దృశ్యత్వ బుద్ధి నా పట్ల తొలుగుతుంది? నేను దీనిని అధిగమించే అభిలాషచే అడుగుచున్నాను.
మహాముని : ఓ వ్యాధుడా! ఈ దృశ్యము కేవలం కల్పితం మాత్రమే!
1.‘కల్పితం’ అనే స్వభావం సంతరించుకున్న ఆత్మయొక్క ఒకానొక చమత్కారమే ఈ దృశ్యము. 2. సంకల్పిత విషయములను నిరంతరం సుదీర్ఘంగా అభ్యసించటం చేతనే ఈ జగదనుభవం అనేక జన్మలుగా పరిపుష్టమై ప్రాప్తిస్తోంది.
3. ప్రమాణ సిద్ధమైన సంకల్పిత పదార్థము నుండి 'విరామం' ... అనబడేది ఉపశమన పూర్వకమైన -నిరంతరమైన అభ్యాసం చేత మాత్రమే లభించగలదు.
4. శ్రద్ధగా చిరకాలం ఉపశమన పూర్వకమైన అభ్యాసం లేకపోతే ఈ జగదనుభవం జీవుని పట్ల ఇట్లాగే నిరంతరం కొనసాగబోతోంది.
5. సంకల్పకర్త అయిన జీవుడు తన మనోరూపమునే ఆయా జగత్ పదార్థములుగా
ఎఱుగుచున్నాడు.
6. ప్రతి జీవుడు కూడా, ప్రతిదీకూడా తనయొక్క సంకల్ప దృఢత్వమును అనుసరించియే పొందుచున్నాడు.
7. కేవలము సంకల్పము యొక్క దృఢత్వముచే సంకల్పానుకూలమైన దృశ్య సంపదను జనింపజేయటం మనం కొన్ని ఉపాఖ్యానాలలో గమనించాం.
8. ఎవని మనస్సు మరొక్కచోటెక్కడో లగ్నమై ఉంటుందో... అట్టివానికి ఇక్కడ ఎదురుగా దృశ్యం ఉండికూడా 'లేనిదే’ అగుచున్నది.
Page:388
9. ఒకడు ప్రమాణసిద్ధమైన నిజకల్పిత (లేదా) నిజసంకల్పిత పదార్థములను నిరంతరం అభ్యసిస్తున్నాడో, ఆతని అభ్యాసఫలంగా పొందుచున్న అనుభవం తొలగాలంటే ఆతడే తన అభ్యాసముచే శ్రమించి వేరైన అవగాహన వైపుగా మరల్చుకోవాలి.
కనుక ఓ లుబ్ధక నామధేయ వ్యాధుడా (బోయవాడా!)! నీ నీ మనస్సే నీకు సంకల్పించి అంతా ఆయా రీతులుగా నీచే అనుభవం పొందేట్లు చేస్తోంది. నీ మనస్సు తూర్పు పడమర దిక్కులుగా పోయి ఆయా పదార్థము ఎట్లు సంకల్పమును కలిగి ఉంటుందో... అట్లాగే వాటి వాటిని పొందటం జరుగుతోంది. అనగా అచ్చటచ్చట పదార్థత్వమును తన యొక్క సంకల్పత్వమును త్యజించలేక పోతోంది. ఆ మనస్సు మరొక రీతిగా మననము పొందక మొరాయిస్తోంది. అట్టి "సంకల్పిత పదార్థములుగా రూపుదిద్దుకోవాలి”... అనే సంకల్ప స్థిరత్వం పొందిన జీవునకు...
1. మొట్టమొదటగా “ప్రాతిభాసిక పదార్థ ప్రాప్తి” లభిస్తోంది. అనగా వాస్తవానికి ఒక పదార్థం ఎదురుగా లేకపోయినాకూడా ఉన్నట్లే తత్సంబంధమైన మానసిక అనుభవం (లేక) ఊహకు సంబంధించిన అనుభవం కలుగుతోంది.
2. అటు తరువాత సంకల్పము యొక్క మరికొంత దృఢత్వం చేత అట్లే (ఆ సంకల్పాను సారమే) “వ్యావహారిక పదార్థ ప్రాప్తి" కూడా జరుగుతోంది.
తూర్పు దిక్కుగాపోయిన వాడు "నేనిప్పుడు ఉత్తర దిక్కుగా పోయి దర్శిస్తాను” ...అనే దృఢ సంకల్పాన్ని ఆశ్రయించటం జరిగితే అదే రీతిగా ఆతడు తూర్పు దిక్కును త్యజించి ఉత్తర దిక్కు చేరుకుంటాడు కదా! ఆ విధమైన ప్రయాణం మానసికంగా తదనంతరం శారీరకంగా సిద్ధించటం జరుగుతోంది. అట్లాగే ఈ కనబడే జగత్తులో అనేకమంది జీవుల సంకల్పాలు అనేక రీతులుగా పరిఢవిల్లుచున్నాయి. ఉదాహరణకు
నేను ఆకాశంలో 'నగరము'గా అగుదును ... నేను భూమిపై 'మృగము’గా అగుదును... అనుకుంటే అది అట్లే సిద్ధిస్తోంది. సంకల్ప రహితునికో... (లేక) మరొక విషయమున మననము కలవానికో... అందుకు వేరైన స్థిరచిత్తమును అనుసరించి అవి క్రమంగా నశిస్తున్నాయి.
ఓ వ్యాధుడా! లుబ్ధకా! ఆత్మ జ్ఞానముచే (ఆత్మజ్ఞాన సంబంధమైన సంకల్పబలంచే) ఈ కనబడే జగత్తంతాకూడా చిన్మాత్ర రూపమగు చిదాకాశమే. అయితే అజ్ఞాన కారణంగా అనేక సంవిత్తులకు వేలకొలది రూపాలుగా అనేకమంది జీవులుగా కనిపిస్తోంది.
వ్యాధుడు : స్వామీ! ఈ కనబడే జగత్తుయొక్క అసలైన రూపమేమిటి? ఈ జగత్తును దర్శించే ఈ జీవరూప ద్రష్ట వాస్తవరూపం ఏమిటి?
ఇందుకు దృష్టాంతం ఐందవోపాఖ్యానం. ఐందవులు మొట్టమొదట “మేము సృష్టికి కర్తలం అవుతాం” అని ్యనించారు. సృష్టికి సంబంధించిన అనేక విశేషాలు వారి ఊహలలో రూపుదిద్దుకున్నాయి. అటు తరువాత ఆ ఊహ పదార్థరూపం దాల్చి బ్రహ్మాండముల రూపంలో ఏర్పడి కనిపించాయి.
Page:389
మహాముని : ఈ జీవుని ఐహిక - ఆముష్మిక ప్రపంచమంతా స్వప్న రూపమేనయ్యా! ఇక ద్రష్టయొక్క జీవుడంటావా! ఈ శరీరం ఉండవచ్చు. ఇదిపోయి మరొకటి రూపుదిద్దుకోవచ్చుగాక! ఈ జీవుడు చిద్రూపుడే. అతనిచే దర్శించబడే దానికంటే ఆతడు వేరైవున్నాడు. ఈ మిథ్యారూప దేహాదులచేగాని, గుణదోషాదులచేగాని అధిష్ఠానమగు జీవభౌతికరూపము నశించినంత మాత్రంచేత జీవచైతన్యము నశించదు. "మరణించిన వారితో సంభాషించటం, మరణించిన వారిని ఆహ్వానించటం” ...అనే భూతవిద్య తెలిసినవారు ప్రదర్శించటం అందరూ చూస్తున్నదే కదా! అట్లాగే పూర్వజన్మకు సంబంధించిన గృహ-వ్యాపార-బంధుత్వాల గురించి ఇప్పుడు మననం చేయటం అక్కడక్కడ జరుగుతోంది కదా! “స్మృతి” యొక్క ప్రభావంచేత చిత్ స్వరూపుడగు జీవుడు పూర్వస్మృతులు కలిగి ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? మరణించినవారు కొందరు దేహాలు భస్మమైనా కూడా వారి వారి బంధువులకు పూర్వజన్మ పదార్థాల గురించి వచించి, ఆ తరువాత లోకాంతరములకు వెళ్ళటం లోకానుభవమైన విషయమే కదా!
వ్యాధుడు : పిశాచాదులు కనిపించటం, వారితో సంభాషించటం మొదలైనవి భూతవైద్యుల యొక్క ధర్మమే గాని, సకలజనుల అనుభవంకాదు కదా!
మహాముని : కావచ్చు! కాని, ఆ భూతవైద్యులు చనిపోయినవారిని ఆహ్వానించటం, వారితో సంభాషించటం చేయగలరుగాని, ఎక్కడో దూరంగా వున్న బంధువులనో, చనిపోకపోయినా చనిపోయారేమోనని అనుకున్నవారిని ఆహ్వానించలేరు, వారితో సంభాషించనూలేరు కదా! వ్యాధుడు : స్వామీ! చనిపోయిన వారు కనబడటం, వారు సూచనలు ఇవ్వటం, ప్రేమ ప్రదర్శించటం, వారి మనోభావాలు చెప్పటం మొదలైనవి సజీవుల “వ్యవహారభ్రమ" అయివుండవచ్చు కదా! మహాముని : ఓహో! మృతజీవుల బంధువుల అనుభవాలకు (మృతుడు కనిపించటం, ప్రేమ ప్రకటించటం, ఓదార్చటం మొదలైనవి) ప్రమాణమేమిటనియా నీ ఉద్దేశం? జీవించి ఉన్నవాని యందు ఉన్న అనుభవమే మృతుని యందు కూడా ఉండవచ్చు కదా! ఆ రెండు మనస్సులలో అనుభవానికి సంబంధించిన సారూప్యత ఎందుకు ఉండకూడదు? మరణించినవాని దేహం నశించినంత మాత్రంచేత ధ్యాసలు కొనసాగకూడదనుటకు ప్రమాణమేమున్నది? ధ్యాసలు మనోధర్మాలేగాని, దేహధర్మాలు కాదు కదా! సజీవుని యందు ఏ అనుభవాలు కొనసాగుచున్నాయో, అట్టి అనుభవాలే మృతుని యందు ఉండబట్టి వారు సమానమైన న్యాయములో వర్తించటమనేది మృతజీవుని ధర్మము కూడా ఎందుకు కాకూడదు? మనం చెప్పుకుంటున్న ఈ జీవన్ - మృతుల సమాన మనోధర్మముల సందర్భంగా రెండు మూడు విషయాలు చెప్పుకుందాం.
1. స్వప్నంలో కొన్ని అనుభవాలు ఉంటున్నాయి.
2. స్వపాంతర్గతమైన అనుభవాలన్నీ మేల్కొనిన తరువాత అసత్తుల్యం అగుచున్నాయి.
3. స్వప్న సమయంలో మాత్రం స్వప్నాంతర్గతమైన అనుభవాలన్నీ సత్యమువలె తోచుచున్నాయి.
4. జాగ్రత్తులో “నేను, నీవు, నీది, నాది, నా వారు, నీ వారు, సంబంధించినవి, సంబంధించనివి
Page:390
పదార్థములు, పరిచయాలు, మన్ననలు, అవమానాలు” ఇత్యాది అనేక విషయాలు తారసపడు చున్నాయి. ఇవన్నీ ఆయా జీవులు వారి వారి అనుభవములను అనుసరించి ఘనీభూతమైన సత్యంగా పొందుచున్నారు.
5. ఆత్మజ్ఞానం సంతరించుకొన్నవారికి మానావమానములు, బంధుమిత్రులు, కష్టసుఖములు మొదలైనవన్నీ సమానములే అయివుంటున్నాయి. అవన్నీ స్వప్నతుల్యంగాను, కాలగతిచే మరొక తీరుగా ఉండబోయేవిగాను అనుభవమౌతున్నాయి.
కాబట్టి ఓ వ్యాధుడా! ఈ జగత్తు స్వప్నతుల్యమేనని ఈ విధంగా నిరూపించబడుతోంది. ఆత్మజ్ఞానుల అనుభవమే మనకు ఇక్కడ ప్రమాణం. శాస్త్రకారులు వాక్యములు... మనకు అంతా “స్వప్నసదృశం”... అని బోధిస్తున్నాయి కదా! (ఉదా: వాచారంభం - వికారోనామధేయం)
ఈ జగత్రూప వికారమంతా మాటలు చెప్పుకోవడానికే విషయంగాని వాస్తవం కాదు. (నే హనానా స్తి కించన - ఇక్కడ అనేకత్వమనేది కొంచెం కూడా లేదు. చిద్రూపమే అనేకంగా -
కనిపిస్తోంది.)
స్వప్నంలో అనేకం కనిపించవచ్చు. అవన్నీ స్వప్నద్రష్ట యొక్క ఊహలే కదా! అట్లాగే జాగ్రత్ ద్రష్టకు జాగ్రత్లో కనిపించే విశేషాలన్నీ ఆ జాగ్రత్ ద్రష్టయొక్క ఊహా పరంపరలే! ఆ ఊహల సారూప్యమే భిన్నజీవుల పరస్పరానుభవములు. అవన్నీ మనోవికారములే కాబట్టి జీవించియున్న కొందరికి - మరణించినవారికి కొన్ని సందర్భములలో పరస్పరమైన భావసారూప్యం ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమున్నది?
ఒక జనసమూహం ఒకచోట గుమిగూడి చంద్రబింబాన్ని తిలకిస్తున్నారనుకో! అందులో కొందరికి చంద్రునిలో తటాకం ఉన్నట్లు కనిపించవచ్చు. మరికొందరికి ఒక కుందేలు చంద్రబింబంలో తారట్లాడుచున్నట్లు అనిపించవచ్చు. అట్లాగే ఈ ప్రపంచంలోని ఒక సంఘటన కొందరికి ప్రత్యేక విషయంగాను, మరికొందరికి సామాన్య విషయంగాను, ఇంకొందరికి అది విషయమే కానట్లుగాను అనిపిస్తోంది. అందుకే ఈ జగత్తు “సదసత్ూపం” అని చెప్పబడుతోంది. ఈ జగత్తు కొందరికి సత్తుగాను, మరికొందరికి ఊహామాత్రంగాను కనబడుతోంది.
వ్యాధుడు : ఇంతకీ ఈ జగత్తు యొక్క వాస్తవరూపం ఏమిటి? ఇది సద్రూపమా? అసద్రూపమా? మహాముని : ఈ జగత్తు యొక్క వాస్తవరూపం ఆత్మయే! అనగా, నీ ఆత్మయే నీకు జగత్తుగా కనిపిస్తోంది.
ఆత్మ - గ్రహించబడే సర్వపదార్థముల యందు “సన్మాత్రము”గా ఎఱుగబడుచున్నది. అది సర్వదా నిర్మలమైనది. అది అనుభవైక మాత్రమైనది. 'చిన్మాత్రము'. ప్రకాశమాత్ర స్వరూపమైనది. సర్వ పదార్థ వర్జితమైనది. సర్వ పదార్థమయమైనది. ఈ సమస్త జగత్తు చిదాకాశమున నిరాకారమై, నాశరహితమై, శాంతమై, నిర్మలమై, అభాస వర్జితమై వెలయుచున్నది.
Page:391
ఇక నీవో... నీ యందే నిజ చిదాత్మరూపంతో సుస్థిరుడవై వెలయుము. నిశ్చలమగు సంవిత్ మాత్రుడవై ఉండు. అట్టి నిశ్చల చిదాత్మయే తన మనస్సు ననుసరించి తానే మనస్సుకు ఏదేది ఎట్లు కనిపిస్తుంటే ... అట్లుగా అగుచున్నది. కాబట్టి, ఇక సత్తేది? అసత్తేది? ఈ దేహాలు, ఈ సుఖ-దుః ఖాలు, ఈ పరిచయాలు, ఈ అనుభూతులూ, ఈ అనుసంధానాలు మొదలైనవి రావచ్చుగాక! పోవచ్చుగాక! ఇవన్నీ స్వయంభావనా మాత్రములే! స్వయంపాకమే! ఇందులో పట్టుదల ఎందుకు? నీవు సర్వదా సదా పరిశుద్ధాత్మ స్వరూపుడవేనని నిర్దుష్టంగా గ్రహించి ఉండు.
ఈ జగత్తు సత్తు (సత్యము) అయినా, (లేక) అసత్తు అయినా... భావనామాత్రమైనా... లేక మరొకటేదైనా అయినా... ఏది ఏమైనా సరే... ఇద్దానియందు 'భ్రమ’ ఉండాల్సిన అవసరమేముంది?
ఓ సాధూ! వ్యాధుడా! ఇద్దానిపట్ల తుచ్ఛ ప్రయోజనములు గూర్చిన... ఫలములను గూర్చిన పట్టుదలలు కలిగి ఉండవద్దు సుమా! ఎందుకంటే... నీవు 'ఆత్మ' స్వరూపమేమిటో ఎఱుగుచున్నావు. ‘ఆత్మ’ అనగా నీ స్వస్వరూపమే కదా! ఈ సంసారము గురించిన "ఏమిటిది? ఎక్కడి నుండి వచ్చింది? ఎటు పోతోంది?” ... అనే ప్రశ్నలు నీకు కలత కలిగించవలసిన అవసరమేమున్నది?
15. చైతన్యమే జగత్తుగా కనిపిస్తోంది - నిరూపణ
మహాముని ఓ నిత్యాత్మానందమయ స్వరూపుడా! ప్రియబోయవాడా! నీకింకేమైనా
సందేహాలున్నాయా?
వ్యాధుడు : స్వామీ! మీరు అంతా సుస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంతా సువిదితమే అవుతోంది. అయినప్పటికీ ఒక్క చిన్న సందేహం ఇంకా నన్ను వదలటం లేదు.
మహాముని : అడుగు నాయనా!
వ్యాధుడు : మాకు బంధమెట్లా కలుగుతోంది? ముక్తి లభించేదెట్లా? ఈ 'జగత్తు' అనే జాడ్యం మాపట్ల తొలిగేది ఎట్లా? ఈ జగత్తుకు అంతు ఎక్కడ?
మహాముని : (పకపక నవ్వుతూ) మరల మొదటి ప్రశ్నకే వచ్చావా? ..సరే, మంచిది. మా సమాధానం శ్రద్ధగా అతి సూక్ష్మమైన బుద్ధితో యోచిస్తూ, గ్రహిస్తూ విను.
ఓ వ్యాధుడా! మనం ఇప్పటికే వివరించుకొన్న విషయాలను అనుసరించి ఈ సర్వజగత్ వ్యవహారములు, ఈ కనబడే భావాభావపదార్థములు ... ఇవన్నీ కూడా స్వప్నములోని సంఘటనల ... వంటివే కదా! వీటికి ఉత్పత్తి ఏమున్నది? వినాశనమేమున్నది? "స్వప్నంలో కనిపించే శత్రువు మరణిస్తే స్వప్నబోధ తొలగుతుంది”... అనేది ఎట్టిదో “ఈ జగత్తు తొలగితే జగత్ జాడ్యం తొలగు తుంది” అని అనుకోవటం అట్టిది. వాస్తవానికి ఎక్కడ చిత్తు ఉన్నదో అక్కడ 'ఎరుక’ను ఆశ్రయించి జగత్తు ఉంటుంది. అనగా అధిష్టాన దృష్టిచే చూస్తే 'జగత్తు' అనబడేదానికి నాశనమే లేదు. జగత్తు