Page:792
శ్రీవసిష్ఠ మునీంద్రుని సాంగత్యము చేత శ్రీరామచంద్రుడు మొదలైనవారంతా ఆత్మతత్త్వమును ఎరిగినట్లే... సజ్జనులగు మహాత్ముల శిక్షణ చేత ఆత్తతత్త్వ జ్ఞానము లభించగలదు.
ఉత్తమ ధర్మనిరతి - సేవలచేతను తత్త్వజ్ఞులగు వారిని ఆదరణపూర్వకంగా ప్రశ్నించి బోధోపాయయుక్తములగు కథనముల శ్రవణము చేతనూ - అప్రమత్తమైన ఉత్తమ బుద్ధి కలవారు ఆత్మతత్త్వమును పొందుచున్నారు.
ఓ తదితర ప్రియశిష్యులారా! ఓ సర్వ జనులారా! మీరంతా మోక్షమార్గమును, అందుకు ఉపయోగపడే కథనములను వినండి. మననము చేయుటయందు ఏమాత్రం ప్రమత్తులై ఉండకండి! అశ్రద్ధ = బద్ధకము అతిప్రమాదకరమైనవి సుమా! ఒక్కసారి ఈ జీవితమును పరికించి చూడండి. ఈ మానవజన్మ అనేక పుణ్యఫలముల ప్రయోజనంగా లభించింది. మరి ఇటువంటి సదవకాశాన్ని సద్వినియోగపరచుకోనక్కర్లేదా? జీవితమును తినటానికి త్రాగటానికి వెచ్చించివేస్తే ఇంతటి మహత్తరమైన అవకాశము కోల్పోయినట్లే అవుతుంది. కదా! అయ్యో! శ్రీరామచంద్రుడు లోకములకు విశదీకరించి చెప్పినట్లుగా... బాల్యావస్థ అంతా క్రీడలందు ఆసక్తితో అజ్ఞానంగానే
గడచిపోతోందే?
ఇక ప్రౌఢ వయస్సు రాగానే 'తృష్ణ' అనే వికారము జన్మజన్మార్జితమై ఉన్నందువల్ల అది బయలుదేరి అనేక గృహ పుత్ర - దారా ధనాదుల పట్ల మమత్వరూపంగా ప్రకటితమై, యౌవనమంతా బూడిదపాలు చేసివేస్తోందే!
ఇక వార్ధక్యము నిస్సత్తువ - నిస్సహాయత నిస్సహాయత - నిష్ప్రయోజనమైన కోపము తాపము
ఆవేశములతో నిండిపోయి ఉంటోందే!
ఇటువంటి పరిస్థితులలో అశ్రద్ధ - బద్ధకము ఎంత ప్రమాదకరమైనవి! కాబట్టి లేవండి. లేచి నడుము బిగించండి. ఉత్తమ కర్మలను - సాధనములను ఆశ్రయించండి. విజ్ఞులగు ఆత్మవేత్తలను ఆశ్రయించండి. మీ స్వరూపముపైగల మీ మీ సందేహములను తొలగించుకోండి! మోక్షోపాయ కథనములు పారాయణం చేయండి. శ్రీ వసిష్ఠ మహర్షి ప్రవచనములు బుద్ధితో హృదయస్థం చేసుకొని, మీ "అప్రమేయము, నిత్యము, సమున్నతము, అఖండము” అగు ఆత్మయొక్క స్వరూప, స్వభావములలో ప్రవేశించినవారై ఈ జగత్తులను మీ ఆత్మసంకల్పమాత్రదేహం గాను, మీ ఆత్మచే ఆకర్షించబడిన భావనాకల్పనామాత్రంగాను దర్శించి తరించండి. సర్వ జీవులలో వేంచేసియున్న ఆత్మతో ఏకత్వము పొందినవారై, సర్వాత్మకులై ఆత్మానందమును ఆస్వాదించండి.
మోక్షోభ్యుపాయాన్సు మహానుభావాన్! జ్ఞాస్యన్తి యే తత్త్వవిదాం వరిష్ఠాః పునః సమేష్యన్తి న సంసృతిం తే కోర్థః సుతా అన్యేన బహూది తేన ||
ఓ భరద్వాజా! ఇక ఎక్కువగా చెప్పవలసినదేమున్నది? మందాధికారులకు కూడా శ్రీ వసిష్ఠ రామ సంవాదము (యోగవాసిష్ఠము మహా రామాయణము) అజ్ఞాననాశనమునకై ఉత్తమ ఔషధమైయున్నది. ఈ మహత్తరమగు మోక్షోపాయం స్వయంగాకానీ, గురుముఖతః కానీ శ్రద్ధగా
Page:793
శ్రవణం చేస్తే మహత్తరమైన ప్రయోజనం సిద్ధించగలదు. అట్లా శ్రద్ధగా శ్రవణం చేసేవారు తత్త్వవేత్తలలో శ్రేష్ఠులై మరల సంసారమును పొందనివారై ఉండగలరు.
ఏ సజ్జనులైతే మోక్షోపాయ గ్రంథమును విద్వాంసులగు గురువుల సమక్షంలో చక్కగా విచారణ చేసి ఇందలి సంవాదము యొక్క పరమార్థాన్ని హృదయస్థం చేసుకొని తదితరులగు ముముక్షువులకు బోధించుతూ ఉంటారో... అట్టివారు పునర్జన్మరహితులౌతారు. మరల అజ్ఞానమున పడరు. అట్టి బ్రహ్మజ్ఞానమునకు తదితరములైన వాక్యముల వలన ఏమి ప్రయోజనం? పారాయణం - అర్థం తెలియకపోయినప్పటికీ ఎవరైతే ఈ మోక్షోపాయ గ్రంథమును పారాయణం శ్రద్ధగా చేస్తూ ఉంటారో, ఏ ఆపేక్ష లేకుండానే ఇతరులకు వ్యాఖ్యానం చెప్పుచూ ఉంటారో... అట్టివారు -
సకాములైతే రాజసూయ యజ్ఞఫలమును పొందినవారై సర్వసంపదలు పొందుతారు. స్వర్గలోకంలో ఉత్తమ సుఖములకు అర్హులౌతారు.
- అకాములైతే ఉత్తరోత్తరా ఉత్తమ జన్మలు పొందుచూ క్రమంగా ఆత్మ సాయుజ్యం
పొందగలరు.
ఓ భరద్వాజా! దివ్యదృష్టితో శ్రవణం చేయబడి నాచే రచించబడిన ఈ మోక్ష సంహితను పూర్వము అచింత్య రూపుడగు బ్రహ్మదేవుడు మునుల సమాజమును ఉద్దేశించి వ్యాఖ్యానించటం జరిగింది. ఆ బ్రహ్మదేవుడు “సత్యవక్తలగు శ్రీ వసిష్ఠ మునీంద్రుని యొక్క - శ్రీ వాల్మీకి మహర్షి యొక్క వాక్యములు ఎన్నటికీ అసత్యం కాదు”... అని ప్రోత్సహాశీర్వచనం పలికియున్నారు.
మోక్షోభ్యుపాయాఖ్య కథా ప్రబంధే, యాతే సమాప్తిం సుధియా ప్రయత్నాత్ సువేశ్మ దత్వాభిమతాన్నపాన దానేన విప్రాః పరిపూజనీయాః
నమామ వేదమాతః! వేదమాత యొక్క అనుగ్రహంచేతనే నేను శ్రీ వసిష్ఠునికి - శ్రీరామచంద్రునికి జరిగిన సంవాదమును జ్ఞానేంద్రియములతో శ్రవణం చేసి గ్రంథస్థం చేయగలిగాను. అందుచేత ఈ మోక్షోపాయ కథ సమాప్తియందు ఉత్తమ అన్న - పాన - దానములతో విప్రులను పూజించి ఉత్తమ ఫలములు పొందుదురుగాక! అట్లు దానాదులు చేయువాడు తాను కావించిన సుకృత ఫలమును శాస్త్రానుసారం అవశ్యం పొందుతాడు. కనుక అది ముందుముందు పుణ్యఫలములను సమృద్ధి పరచుకొన్నట్లే అగుచున్నది.
ఓ భరద్వాజా! ఈ ప్రకారంగా... అనేక ఉపాఖ్యానాలతో అలంకరించబడినది, అనేక దృష్టాంత యుక్తులతో సమకూర్చబడినది. అగు బ్రహ్మ తత్త్వ ప్రతిపాదకమగు "మోక్షోపాయము” అనే ఈ పవిత్రమైన శాస్త్రమును నీకు బోధకొరకై ఇప్పుడు మరల చెప్పటం జరిగింది. నీవిక జీవించియున్నంత కాలం ‘విముక్తి భావము’తో కూడుకొని యున్నవాడవయ్యెదవుగాక! లోకశ్రేయస్సును ఉద్దేశించినవాడవై ఇతఃపూర్వంలాగానే జ్ఞాన - తపః క్రియా యుక్తమగు కర్మలు, కార్యక్రమములు కొనసాగించు. శ్రీ వసిష్ఠ మహర్షి ప్రవచనమును మననం చేస్తూ బుద్ధితో హృదయస్థం చేసుకొంటూ ఉండు. క్రమంగా
Page:794
దేహసహితుడవై ఉండి కూడా దేహరహితుడవై, దేహమునకు అతీతమగు 'దృక్' రూపమును అవధరించినవాడవై ఉండగలరు. శాశ్వతము - ప్రశాంతము - నిరతిశయానంద రూపము అగు ముక్తిని పూర్ణముగా సంప్రాప్తించుకొన్నవాడివై స్వయంజ్యోతి స్వరూపుడవై ప్రకాశించగలవు. ఈ శాస్త్రపాఠకులకు అట్టి ఫలము స్వభావ సిద్ధమై చెన్నొందగలదు.
శ్రీ వాల్మీకి : ఓ అరిష్టనేమి రాజా! ఈ ప్రకారంగా ఆ వసిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునికి బోధించినది, అగస్త్య మునీంద్రుడు ఆ సభలో ఉండి విని సుతీక్షునకు ఉపదేశించినది అగు ‘మోక్షోపాయం’ అనే మోక్షశాస్త్రమును సుభాషితంగా నీకు మరల చెప్పాను. తత్త్వమార్గమును బోధిస్తున్నట్టి ఈ గ్రంథము ద్వారా నీవు తప్పక బ్రహ్మపదమును పొందగలవు. అరిష్టనేమి రాజు :
సద్గురు - - జగద్గురు శ్రీ వసిష్ఠం నతాస్మః |
మహాత్మా! వాల్మీకి మహర్షీ! ఆహాఁ! ఏమి మీ పాద స్పర్శ మహిమ! తమ కృపాకటాక్షముచే నా సంసారబంధమంతా నశించిపోయినదయింది.
కేవలం మీరు చెప్పుచుండగా వినినంత మాత్రం చేతనే నేను సంసార సముద్రమును దాటివేయగలిగానే!
దేవదూత : ఓ అప్సరసా! అప్పుడు ఆ అరిష్టనేమి రాజు వికసించిన నేత్రముతో విరాజిల్లుచూ నా వైపు తిరిగి మధురమైన వాక్కుతో ఇట్లా పలికారు.
అరిష్టనేమి రాజు : ఓ ప్రభూ! దేవదూతా! నన్ను ఉద్ధరించటానికి ఈ శ్రీ వాల్మీకి మహర్షి సమక్షమునకు కొనితెచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడను. నా పాదాభివందనం స్వీకరించండి. మీకు సర్వదా సకుశలమగుగాక!
"సజ్జనులతో ఏడు అడుగులు నడిస్తే, ఏడు మాటలు మాట్లాడితే చాలు... మహత్తరమైన ప్రయోజనం ఉంటుంది” ... అని పెద్దలు చెప్పుచున్నది మీరిప్పుడు పరమసత్యమని నిరూపించారు. స్వామీ! ఇప్పుడు మీరు మీ స్వస్థానమగు ఇంద్ర లోకమునకు వెళ్ళి రండి! మీకు సర్వదా శుభమగు గాక! నేనిప్పుడు మహాత్ముడు, మహనీయుడు, మాననీయుడు అగు శ్రీ వాల్మీకి మహర్షి దివ్యమైన పెదవుల నుండి జాలువారిన శ్రీ వసిష్ఠ - శ్రీరామ సంవాద రూపమగు 'యోగవాసిష్ఠము’ అనబడే అఖండ రామాయణము శ్రవణం చేసి పునీతుడనైనాను. శాంతిని, పరితృప్తిని నిరతిశయానంద లాభమును పొంది మహాప్రసన్నుడనై ఉన్నాను. వీరి వద్దనుండి నేను వినిన దానిని మననం చేస్తూ అర్థము యొక్క విచారణ చేస్తూ సంతోషభరితుడనై ఇచ్చటనే ఉండెదనుగాక!
Page:795
దేవదూత : ఓ మంగళ స్వరూపిణీ! అప్సరసా! ఆ విధంగా ఆ అరిష్టనేమి మహారాజు నాతో పలుకగా, ఆతని వినయము-వైరాగ్య గుణములు చూచి నేను ఆశ్చర్యపడకుండా ఉండలేక పోయాను! ఇంతకు ముందు నేను ఎప్పుడూ సత్సంగముచే ఇటువంటి జ్ఞానసారమును వినియుండలేదు. నా పూర్వపుణ్య వశంచేతనే అరిష్టనేమి మహారాజును శ్రీ వాల్మీకి మహర్షి వద్దకు కొనిపోయి పరిచయం చేయమని మన ప్రభువు ఇంద్రదేవులు ఆజ్ఞాపించటం జరిగింది. అటువంటి మన ఇంద్రదేవులకు ఇవే నా కృతజ్ఞతలు.
పాపరహితవగు ఓ అప్సరసా! ఆ విధంగా అరిష్టనేమి మహారాజుచే సంబోధింపబడినవాడనై, శ్రీ వాల్మీకి మహర్షి వద్ద సెలవు తీసుకొని ఇటు వస్తూ ఉండగా నీవు నన్ను ఆపి “నీ ముఖంలో ఆ సంతోషం అంతగా ఎందుకు వెల్లివిరుస్తోంది?” ...అని ప్రశ్నించావు. కాబట్టి ఉన్నదున్నట్లుగా అంతా చెప్పాను. ఆహాఁ! నీ దయచే ఇప్పుడు శ్రీ వసిష్ఠ రామసంవాదమును మననం చేసుకున్నందుకుగాను నీకు అభివందనములు!
అప్సరస : మహాభాగ్య శీలుడవగు ఓ దేవదూతా! మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీరు వినిపించిన ఈ శాస్త్రార్థ విజ్ఞానముచే నాకు పరమశాంతి కలుగుతోంది.
కృతార్థా వీతశోకాస్మి స్థాస్యామి విగతజ్వరా
ఇదానీం గచ్ఛ భద్రం తే య థేచ్ఛం శక్ర సన్నిధౌ ॥
ఓ దేవదూతా! ఇప్పుడు నేను కృతార్థురాలనైనాను. నా దుఃఖం మొదలంటా శమించింది. సంతాపవర్జితురాలనైనాను. ఇక మీరు మీ ఇచ్ఛానుసారం ఇంద్రదేవుని సన్నిధికి వెళ్ళిరండి. మీకు సర్వదా శుభమగుగాక!
అగ్నివేశ్యుడు : ప్రియ పుత్రకా! కారుణ్యా! ఈ విధంగా శ్రీ వసిష్ఠ మునీంద్రుని ఉపదేశమంతా నీకు వినిపించాను. అందలి విశేషాలన్నీ బాగుగా విచారణ చేయి. “మోక్షసాధనకు 'కర్మ-జ్ఞానము' అనే రెండూ కూడా బండికి రెండు చక్రముల వంటివి” అని గ్రహించు. ఒకటి వదలితే రెండవది ఆశయము సిద్ధింపజేయలేదని గ్రహించావు కదా! ఇక ఆపై నీకు ఎట్లు ఇష్టమో, అట్లు ఆచరించు. 'జీవితము' అనే అవకాశము యొక్క "ఆశయము" ఏమిటో గమనించినవాడిపై వర్తించు. కారుణ్యుడు : తండ్రీ! మీరు వివరించిన శ్రీ వసిష్ఠ మహర్షి యొక్క ప్రబోధము అత్యద్భుతము. నాకు అత్యుత్తమంగా మార్గదర్శకము.
భూత - భవిష్యత్ - దూరస్థ పదార్థముల యొక్క స్మృతి, వాక్ వ్యవహార రహస్యం! వర్తమాన విషయములను గూర్చిన దృష్టిసత్త యొక్క స్వప్నత్వం.
ఇన్నెందుకు! ఈ సంసార స్థితి అంతా కూడా నా కిప్పుడు తత్త్వజ్ఞాన ప్రభావంచేత 'స్వప్న ప్రాయం' అనే అనుభవం లభించింది. 'వంధ్య యొక్క రెండవ కుమారుడు' అనే వాక్యమువలె,
Page:796
“మరు భూమిలోని మృగతృష్ణాజలం" లాగా ఈ దృశ్యము మిథ్యామాత్రంగాను, నిర్విషయంగాను, అధిష్ఠాన దృష్టిచే "ఆత్మయే ఈ సర్వముగా కనబడుతోంది” అని కూడా నాకు విదితమైనది.
పూజ్యులగు పితృదేవా! ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో కర్మలు చేయటంచేతగాని, చేయకుండటం చేతగాని ఏ ప్రయోజనమూ లేదు. అయితే "శ్రీరామచంద్రుని లాగానే యథా ప్రాప్తములైన వర్ణాశ్రమ ధర్మములు నాచే నిష్కామంగాను, నిర్వికారంగాను నిర్వహించబడుగాక!” ...అనే నిర్ణయానికి వచ్చాను. కర్మాచరణము - కర్మత్యాగము (అకర్మ)... ఈ రెండూ సమానమే అయినప్పటికీ... కర్మత్యాగము పట్ల నాకు పట్టుదల ఉండవలసిన పనేమి ఉన్నది? లోకకళ్యాణార్థమై విహిత కర్మలు నిశ్చింతగా నిర్మలబుద్ధితో నిర్వర్తించటానికి సంసిద్ధుడనై ఉన్నాను.
అగస్త్య మహాముని : ఓ సుతీక్షా! జ్ఞానముచే కృతార్థుడైనట్టి ఆ అగ్నివేశ్యుని కుమారుడు కారుణ్యుడు ఆ విధంగా పలికి అటు తరువాత తండ్రి వద్ద 'కర్మాధికారము' పొందినవాడై యథోచితమైన స్నాన -దాన-అగ్నిహోత్రాది యథాప్రాప్తములైన కర్మలను ధర్మవిధి పూర్వకంగా ఆచరించనారంభించాడు.
సందేహో అత్ర న కర్తవ్యః సుతీక్ష! జ్ఞానకర్మణి |
సంశయాత్ భ్రశ్యతే స్వార్థాత్, సంశయాత్మా వినశ్యతి ||
కాబట్టి ఓ సుతీక్షా! జ్ఞానము - కర్మల విషయంలో ఇక నీవు ఎటువంటి సందేహము కలిగివుండకు! "జ్ఞానము ప్రాప్తించుటకు కర్మలు బంధం (అడ్డు) అవుతాయి” అని సందేహించవలసిన పనిలేదు సుమా! సంశయముచే ఈ మానవుడు నిజప్రయోజనం నుండి చ్యుతి చెందుతాడు. సంశయములు కొనసాగించువాడు లక్ష్యప్రాప్తి పొందలేకపోతాడు. శ్రీ వసిష్ఠ మునీంద్రుని ప్రవచనం అనేక విహిత ధర్మములతో ఒకానొక 'అవిరోధము'ను ప్రసాదిస్తోంది కదా!
ఆత్మానందము యొక్క సులభత్వము - - సహజత్వము నిరూపించి చూపుతోంది. అప్పుడు అది విని సుతీక్షుడు వినయముతో కూడుకొన్నవాడై లేచి నిలబడ్డాడు. గురువర్యులగు అగస్త్యమునికి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు. ఇట్లా పలికాడు.
సుతీక్షుడు :
నష్టమజ్ఞాన తత్కార్యం ప్రాప్తం జ్ఞాన మనుత్తమమ్ సాక్షిణి స్ఫురితాభాసే ధ్రువే దీప ఇవ క్రియాః సతి యస్మిన్ ప్రవర్తన్తో చిత్తేహాః స్పందపూర్వికాః
హే సద్గురూ! అగస్త్య మహామునీ! మీ బోధ ప్రభావంచేత నా అజ్ఞానం తత్కార్యకారణసహితంగా నశించింది. సర్వోత్తమమగు ఆత్మజ్ఞానం లభించింది.
దీపం వెలుగుతూవుంటే అద్దాని, ప్రకాశంలో నాట్యరంగంపై నర్తకుల నృత్యం కొనసాగుతూ ఉంటుంది కదా! ఆ నృత్యము యొక్క భంగిమలలోని లోపాలోపములతో దీపమునకు పనేమున్నది? సంబంధమేమున్నది? అట్లాగే పరమాత్మ సర్వసాక్షి అయి, స్వయంజ్యోతి స్వరూపమై, స్థితినొంది
Page:797
ఉండగా, అద్దానిచే ప్రకాశింపబడుచున్న ఈ దేహము, ఈ చిత్తము, వాటి వాటి చేష్టలు, సమస్త లౌకిక - వైదిక క్రియలు వర్తిస్తున్నాయి.
అంతేకాకుండా... బంగారముచే చేయబడ్డ ఉంగరము - గాజులు - జడబిళ్ళ - గొలుసు భుజకీర్తులు - వడ్డాణం మొదలైన వేరువేరు ఆభరణములన్నీ బంగారమే కదా! ఆ విధంగా బంగారంలో వివిధ ఆభరణములు స్ఫురిస్తున్నట్లుగా పరమాత్మ యందు ఈ వివిధ నామ రూప సమన్వితమైన జగత్తు స్ఫురిస్తోంది. తరంగాలు వేరువేరైనా అన్ని తరంగాలలోని జలం ఒక్కటే కదా! అనేక దేహములలోని దేహి ఒక్కటే! ఈ కనబడే దృశ్య జగత్తంతా పరమాత్మ స్వరూపమే అయివున్నది. ఇది పరమాత్మ కంటే ఒక అణువు కూడా భిన్నం కాదు. పూర్ణమగు ఈ జగత్తు పూర్ణమగు పరమాత్మ యందే నెలకొనియున్నది.
యథా ప్రాప్తో నువర్తామి, కోలజ్ఞయతి సద్వచః?
మహాత్మా! అగస్త్య మహామునీ! ఈ విధంగా నిశ్చయించుకున్నవాడినై యథా ప్రాప్తములైన కర్మలు నిర్వర్తించెదను. తమవంటి సజ్జనుల సద్వచనములు నాకు శిరోధార్యం! ఎవరైనా మీ వంటి పెద్దల ఆజ్ఞ ఎట్లా ఉల్లంఘించగలరు?
భగవన్! త్వత్ ప్రసాదేన జ్ఞాతజ్ఞేయోస్మి సంస్థితః
కృతార్థేహం సమస్తేం స్తు దండవత్పతితో భువి!
మహాత్మా! తమ అనుగ్రహంచే నేనిప్పుడు 'జ్ఞేయము' అగు ఆత్మను ఎరిగినవాడనైనాను. కృతార్థుడనైనాను. అనేక దుష్ట సంకటముల పరంపరలకు త్రోవతీయగల సంసారము నుండి నన్ను ఈనాటికి పరిరక్షించిన తమకు భూమిపై సాష్టాంగ దండ పూర్వకమైన ప్రణామములు సమర్పించు కుంటున్నాను. పరమ పురుషార్థప్రదమగు ఆత్మజ్ఞానమును ఉపదేశించిన గురువుకు... అట్టి మహోపకారముతో సమానమైనది ఏది శిష్యుడు ఇచ్చుకోగలడు? అందుచేత నా మనోవాక్కాయ కర్మలచే ఆత్మనివేదనము గావించుకొంటున్నాను. ఈ జగత్తులో 'నాది' అయినదంతా తమకు సమర్పించినదిగా అగుగాక! “ఆత్మ నివేదనము”చే అంతటా ఆత్మగాను, అంతా ఆత్మగా దర్శించువాడనై మీ ఆశయమును మీవాక్య సారాంశమును నెరవేర్చగలగటమే... మీకు గురుదక్షిణగా నా నుండి సమర్పించబడుచున్నదై ఉండుగాక! అప్పుడే కదా గురువుకు తృప్తి!
స్వామీ! తమ అనుగ్రహంచేత సంసార సముద్రమును దాటి వేసిన వాడనైనాను. నా యొక్క పూర్ణానంద రూపముచే బ్రహ్మాండ సమూహమునంతా ముంచివేయుచు వెలయుచున్నాను.
యత్సర్వం ఖల్విదం బ్రహ్మ, తజ్జలానితి చ స్ఫుటమ్ శ్రుత్వా హ్యుదీర్యతే సామ్ని, తస్మై బ్రహ్మాత్మనే నమః ॥
ఏ బ్రహ్మము సామవేదముచే (సర్వం ఖల్విదం బ్రహ్మ - తజ్జలానితి శాంత ఉపాసీత - ఈ ప్రపంచమంతా బ్రహ్మమునందే లయించుచున్నది అని) గానము చేయబడుచున్నదో... అట్టి
Page:798
బ్రహ్మమే ఈ జగత్తు. అట్టి బ్రహ్మమే ముముక్షువులందరికీ (ఎవరు ఏ పేరుతో పిలిచి నివేదనము సమర్పించినా సరే) ... ఉసాసనా వస్తువు అయివున్నది. ఈ విషయం శ్రుతి - స్మృతి ప్రవచనముల సారవాక్యమే అయివున్నది. అట్టి బ్రహ్మమునకు నమస్కారం.
బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్త్వమస్యాది లక్ష్యం ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీసాక్షి భూతం భావాతీతం త్రిగుణ రహితం శ్రీ వసిష్ఠం నతాః స్మః ||
బ్రహ్మానంద రూపులు, జ్ఞానోపదేశముచే ఆత్మ సుఖమును ప్రసాదించువారు, కేవలము జ్ఞాన స్వరూపులైనవారు. ద్వంద్వములన్నిటికీ అతీతులైనవారు, ఆకాశమువలె నిర్మల అఖండ స్వరూపులు, “ఓ బిడ్డా! నీవే బ్రహ్మమవు" అనే ఆశయమును కలిగియుండి ప్రతివాక్యము బోధించువారు, ద్రష్టలందరి యొక్క ఏకైక స్వరూపులు, భూత - వర్తమాన - భవిష్యత్తులందు యథాతథమగు అఖండాత్మ స్వరూపులు, అత్యంత నిర్మల స్వరూపులు, సర్వచలనములకు ఆధారభూతమై తాను మాత్రము చలనాదులు కలిగియుండనట్టి నిశ్చల - కూటస్థ స్వరూపులు, సమస్త ప్రాణులయొక్క బుద్ధివృత్తులకు సాక్షి అయినవారు, భావముల కంటే ముందే ఉన్నట్టి భావాతీత స్వరూపులు, త్రిగుణములచే స్పృశించబడనివారు అగు... వసిష్ఠ మహర్షి స్వరూప పరబ్రహ్మమునకు మేమందరము నమస్కరించుచున్నాము.
నిర్వాణ ప్రకరణం సమాప్తం బ్రహ్మార్పణమస్తు - లోక కళ్యాణమస్తు
ఓం తత్సత్
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
(యోగవాసిష్ఠము - అఖండ రామాయణము - మహా రామాయణము)
సంపూర్ణమ్
Page:799
శ్రీ సద్గురుభ్యోం నమః
ఏ పరమాత్మ రామ - - కృష్ణ - శివ - యహోవా - అల్లా - బుద్ధ - - సాయి - ఈశ్వర - పరమేశ్వర - లలిత - అనసూయ ఇత్యాది అనంతనామ స్వరూపుడై ఆరాధించబడుచున్నారో... అట్టి సర్వాత్మకుడు - అస్మత్ స్వరూపుడు అగు పరాత్పరునకు ఆయన కిరణ స్వరూపుడనగు నేను ఆత్మ నివేదనపూర్వకంగా ఈ సర్వము సమర్పించుకుంటున్నాను.
సర్వ జనులకు శుభమగు గాక!
ప్రపంచ శాంతి వెల్లివిరియునుగాక!
ప్రేమాస్పదుడగు పరమాత్మను సర్వే సర్వత్రా దర్శించు మహనీయుల పాదపద్మములకు ఈ నా నమస్కార కుసుమము స్పృశించునుగాక!
'బ్రహ్మానంద స్వరూపులు - మమాత్మ స్వరూపులు అగు పాఠక మహాశయులు చదివి - విని ఆత్మానందభరితులయ్యెదరుగాక!’
లోకకళ్యాణమస్తు
ప్రపంచశాంతి వెల్లివిరియునుగాక!
ఆపదాం అపహర్తారమ్ దాతారం సర్వసంపదామ్ | లోకాభిరామమ్ శ్రీరామమ్ భూయో భూయో నమామ్యహమ్ ॥
కృతార్థోస్మ్యిహమ్, దండవత్ పతితోభువి యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
I శ్రీరామకృష్ణార్పణమస్తు ॥
ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విద్యలు ప్రదర్శించి పూజింప బడాలని, జనులను ఆకర్షించాలని తమ అజ్ఞానం చేత ప్రయత్నించేవారు కొందరు
ఉంటారు.
అయితే... “మంత్రము - ఔషధము” మొదలైన వాటి బలంచేత ఆకాశ గమనము, సుదూర దర్శనం మొదలైన విద్యలు అజ్ఞానులకైనా సిద్ధించవచ్చు. ఎవడు దేని కొఱకై క్లేశాదులను సహించి ప్రయత్నిస్తాడో... ఆతడు ఆయా విశేషాలు కాలక్రమంగా తప్పక పొందుతాడు. అట్టి విశేషాలు జ్ఞానికైనా, అజ్ఞానికైనా సిద్ధిస్తాయి. కాబట్టి అట్టి భౌతిక విద్యలను చూచి ఒకడు జ్ఞాని అని గాని, అజ్ఞాని అని గాని మనం నిర్ణయించలేము. గంధపు చెక్కలో చందన సుగంధం అంతర్గతంగా ఉన్నట్లే... సర్వుల హృదయాలలో వారు నిర్వర్తించియున్న విహిత - నిషిద్ధ కర్మఫలములు ఉండనే ఉంటాయి. అని అయా కాలానుగతంగా ఆవిర్భవించి ఆ కర్తను ఆశ్రయిస్తాయి. కర్మల గతి అట్టిది. లోకంలో ధనాదుల వంటివే సిద్ధులు కూడా! ఎవనికైతే దృశ్యరూపాలే అయినట్టి సిద్ధులు మొదలుగా గల ఆయా వస్తు వ్యవహారముల పట్ల “ఇవి నేను కూడా పొందాలి” అనే ఆకాంక్ష - ఆవేశము - అభినివేశము పెంపొందుచున్నదో... అది సంసార రూపమే సుమా! "ఈ ఆకాశగమనాది సిద్ధి సమూహమంతా కేవలం మనస్సును భ్రమింపజేసేవి, అల్ప విషయములు మాత్రమే” అని ఎఱిగి ఎవడు చిదాకాశమునందే లక్ష్య శుద్ధి కలిగి ఉంటాడో... అట్టి వాసనారహితుడగు తత్త్వజ్ఞునకు వాటి పట్ల అభినివేశముగాని, దంభముగాని ఎందుకు ఉంటుంది?
వసిష్ఠ మహర్షి
పుట : 522
CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93-83972-14-2 (Set)
దోమలగూడ, హైదరాబాదు-29 | రామమం email : publication@rkmath.org
9789383972142
Vasishta Rama Samvadam : Vol 4 ISBN 93-83972-13 5 1000/- (set) www.rkmath.org