[[@YHRK]] [[@Spiritual]]
VasisTha Rāma Samvādam (4 Volumes) in Telugu by Yeleswarapu Hanuma Rāma Krishna
(A Translation in Telugu of “Yoga VāsisTha” in Sanskrit by Maharshi Valmiki)
గ్రంథము: శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (4 సంపుటములు)
వచన అనువాద రచయత: శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com)
ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
సంస్కృత మూల గ్రంథము: వాల్మీకి యోగవాసిష్ఠము (6 ప్రకరణములు)
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు
VasisTha Rāma Samvādam (Yoga Vāsistam) - Summary
శ్రీ వసిష్ఠ రామ సంవాదము (యోగవాసిష్ఠం) - సారాంశం, సమీక్ష, మూలగ్రంథ సంఖ్యావర్ణనం
గమనిక : వాల్మీకి మహర్షిచే విరచించబడిన “యోగవాసిష్ఠం” మూలగ్రంథమునందు మొత్తము (సుమారుగా) 32,000 శ్లోకములు ఉన్నట్లుగా చెప్పబడినది. కాని, వాటిలో కొన్ని శ్లోకములు (దాదాపు 4,000) కాలానుగుణంగా మనకు చేజారినవి. ఈ విషయము శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామి (శుకబ్రహ్మ ఆశ్రమము, ఏర్పేడు, శ్రీకాళహస్తి) వారిచే వారి యోగవాసిష్ఠం ఉపన్యాసములలో ఉటంకించబడినది.
1.) వైరాగ్య ప్రకరణం [Volume 1] : (మూలగ్రంథములో 1500 శ్లోకాలు) :
దీనిని పారాయణం చేస్తూ ఉంటే ఈ దృశ్యము పట్ల, శరీరాదుల పట్ల పేరుకొనియున్న అజ్ఞాన జనితమైన బుద్ధిమాంద్యము తొలుగుతుంది. సాత్విక వైరాగ్యం ఏర్పడుతుంది. ‘‘జీవితము - అను దానిని వివేకముచే పరిశీలించకుండానే బ్రతికివేస్తున్నామా?’’ అను వివేకపూరితమైన శోధనం (Introspection) ఏర్పడుతుంది. అట్టి దృష్టియే ఆత్మవిషయమై సమాచారం పొందటానికి పునాది.
2.) ముముక్షు వ్యవహార ప్రకరణ [Volume 1] : (మూలగ్రంథములో 1000 శ్లోకాలు) :
‘ముముక్షుత్వము’ అంటే ఏమిటో, ముముక్షువులు ఎట్లు వ్యవహరిస్తారో, వారి స్వభావమేమిటో, ఎట్టి దృష్టిచే ఆత్మవిషయం గ్రహించటానికి సిద్ధంగా ఉండాలో చెప్పబడింది. బద్ధకము, అశ్రద్ధ, మూర్ఖత్వము త్యజించి శమము, సంతోషము, విచారణ, సత్సంగమములను ఆశ్రయించవలసినదిగా బోధింపబడింది. ‘పరిశీలనా దృష్టి - ప్రయత్నము’ - ఈ రెండు ఉన్నవాడే ముముక్షువు.
3.) ఉత్పత్తి ప్రకరణము [Volume 1] : (మూలగ్రంథములో 7000 శ్లోకాలు) :
అనేక దృష్టాంతముల సహాయంచే, ‘‘లౌకికములైన నీవు, నేను, వీరు, వారు అను వ్యవహారములన్నీ అసలు ఉత్పన్నమే అయి ఉండలేదు’’ - అని నిరూపించబడింది. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు మూలమే లేనిదని, రూపరహితమని ప్రతిపాదించబడింది.
‘‘ఈ సంసారమంతా స్వకీయ కల్పితమైన మనోరాజ్యము వంటిదే కాని, వాస్తవము కాదు. స్వప్నంలో ఎట్లు జరుగుతోందో, అదే విధంగా, ఇదంతా అవస్తుమాత్రమై, కల్పితానుభవమాత్రమై ప్రాప్తిస్తోంది’’ అని యుక్తియుక్తంగా నిరూపించబడింది.
ఎండమావులలో నీరు లభిస్తుందా? మెల్లకన్నువాడికి ఆకాశంలో కనిపించే ‘‘రెండవ చంద్రుడు’’ అసలు ఉన్నాడా? అంధకారంలో కనిపించే మోడువారిన ఒకానొక వృక్షం దయ్యమై, అపరిపక్వ బుద్ధికి మాత్రమే, ప్రాప్తిస్తోంది కదా! నావ కదులుతుండగా ఒడ్డున ఉన్న చెట్లు కదలుచున్నట్లు కనిపించినంత మాత్రంచేత, ఆ చెట్ల యొక్క కదలిక వాస్తవమా? ఈ సంసారము కూడా కల్పితమాత్రమని… ఒకానొకప్పుడు, ఒకానొక దృష్టిచే, ఒకానొక విధంగా - భావనను అనుసరించి ప్రాప్తిస్తున్నదని తెలిసిపోతుంది. ఇది వాస్తవానికి సార రహితమని ఎరిగిన తరువాత దీనిగురించి ఎవడు దుఃఖిస్తాడు? ఆభరణం - బంగారముకంటే వేరుకానట్లు, జలంకంటే తరంగాలు వేరుకానట్లు, ఈ జగత్తు పరమాత్మగానే దర్శించబడగలదు. ఇదంతా ద్రష్ట యొక్క దృష్టి కంటే వేరేమి కాదు.
ఆకాశంలో నీలపు పదార్థం ఏదైనా ఉన్నదా? చిత్రపటంలోని అగ్నికి ఉష్ణత్వమెక్కడ? ఈ జగత్తు కూడా అసత్తే. కాని, అవివేక దృష్టికి మాత్రం ‘సత్తు’గా (as if truly exists)గా తోచుచున్నది. ఎప్పుడో జరిగిపోయిన ఒకానొక దృశ్యము ఇప్పుడు మనన కారణంగా మనోవీధిలో ప్రత్యక్షమై ప్రాప్తిస్తోంది చూచావా! అదే విధంగా ఈ జగత్తు కూడా వర్తమానంలో అనుభవమౌతోంది. ఈ కనబడే పదార్థములను జ్ఞానదృష్టిచే పరిశీలించినప్పుడు ఇవన్నీ ’‘అస్థిరము, తుచ్ఛము, శూన్యము’’ అని ఈ ప్రకరణం బోధిస్తోంది.
4.) స్థితి ప్రకరణం [Volume 2] : (మూలగ్రంథములో 3000 శ్లోకాలు) :
‘‘ఈ జగత్తు అహంభావమునందే స్థితి పొందియున్నది కాని, ఎక్కడో బాహ్యమునందు కాదు’’ అనునట్టి పరమార్థము అనేక కథల ద్వారా, దృష్టాంతముల ద్వారా నిరూపించబడింది. ఈ భ్రాంతిమయ జగత్తులు, ఈ ద్రష్ట - దర్శన - దృశ్యములు (Perceiver, Perception and Objects) - ఇవన్నీ ఎట్లు వృద్ధిపొందుచున్నాయో చెప్పబడింది.
5.) ఉపశమన ప్రకరణం [Volume 2] : (మూలగ్రంథములో 5000 శ్లోకాలు) :
ఇందులో, “నేను, నీవు, వారు, జగత్తు” - అను వ్యవహారమంతా ఉపశమింపచేయగల యుక్తులేమిటో చెప్పబడింది.
ఈ జగత్తు ఒకనికి సుస్పష్టంగా, మరొకనికి అస్పష్టంగా ఉన్నప్పటికీ - వాస్తవానికి ఇది అసత్యమే. ఊహాకల్పితమైన రూపములు ఆ ఊహ ఉపశమించగానే తొలగిపోతాయి కదా! ఈ జగత్తు స్వకల్పితమనండి… లేక స్వప్న కల్పితమనండి… ఇది (మనస్సునుండి) జ్ఞానముచే తొలగిపోతోంది.
ఎవరికైతే జగద్భ్రమ నశించుట లేదో - వారికి మాత్రం ఇదంతా ఒక అంతులేని అనేక సంఘటనలతో కూడిన ‘కథ’ వలె ప్రాప్తిస్తూ పోతోంది. ఈ సంసారమంతా కల్పిత మాత్రమే. “అట్టి కల్పనలలోనే కొందరు మనోహరత్వమును, మరికొందరు దుఃఖపరంపరలను తమయొక్క అజ్ఞానంచేత, లేక మూర్ఖత్వంచేత పొందుచున్నారు” - అని ఈ ప్రకరణం నిరూపిస్తోంది.
6.) నిర్వాణ ప్రకరణం [Volumes 3 & 4] : (మూలగ్రంథములో 14500 శ్లోకాలు) :
జ్ఞానం వికసిస్తుంది. కల్పనలన్నీ తొలగిపోతాయి. ‘‘నిర్వాణము’’ అనబడే పరమశ్రేయస్సు లభించగలదు. ఇందలి విషయమును గ్రహించువాడు - నిర్విషయము, చిత్ ప్రకాశమాత్రము, విజ్ఞానమయము, నిరామయము - అయినట్టి ఆత్మరూపమున ప్రతిష్ఠితుడగుచున్నాడు. సంసార భ్రమలన్నీ తొలగుటచేత పరమాకాశమువలె స్వచ్ఛుడౌతాడు. పరిపూర్ణుడు, కృతకృత్యుడు, అగుటచేత, ఇక అతడు ప్రశాంత పూర్వకంగా ఈ ‘జగత్ యాత్ర’ నిర్వర్తించగలడు.
‘‘ఒక దర్పణం ఎదురుగా ఉన్న దృశ్యమును ఎట్టి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే, తనయందు ప్రతిబింబించుటకు ఆశ్రయమౌతోంది కదా! నేను కూడా పూర్ణమగు బ్రహ్మమునై ఈ జగత్తులు, ఈ ఈ కార్యములు ప్రతిబింబించుటకు కర్తృత్వము లేకుండానే ఆశ్రయభూతుడనగుచున్నాను’’ అని పఠించువాడు (The Student) గ్రహిస్తున్నాడు. సమస్తము స్వస్వరూపముచే మ్రింగబడగా, అతడు తృప్తుడగుచున్నాడు. బాహ్యేంద్రియములు, చిత్తము, అహంకారము - సర్వము చిదాకాశమేనని తెలుసుకొనుచున్నాడు. కార్య, కారణ, కర్తృత్వముల విషయంలో అత్యంత నిర్లిప్తుడై, దేనిచేత కూడా స్పృశించబడనివాడై ఉంటున్నాడు.
ఈ ప్రకరణము పఠిస్తున్ననాడు - తనను తాను దేహము కలిగియున్నప్పటికీ విదేహిగా, సంసారి అయినప్పటికీ అసంసారిగా గాంచుచున్నాడు. ‘‘నేను సర్వదా అఖండుడనే!’’ అని గ్రహిస్తున్నాడు. ఇక అతనిని లోక వ్యవహారములు తాకలేవు. పరిపూర్ణమగు చిన్మయావస్థను పొందినవాడై స్వయముగా, తానే ‘చిదాదిత్యుడు’ అగుచున్నాడు. అతనిపట్ల దృశ్యములన్నీ అదృశ్యమగుటచే, అతడు శుద్ధస్వరూపము, స్వచ్ఛత్వము పొందుచున్నాడు. ఈ ‘సంసారము’ అనే కుత్సిత వ్యాధి నశిస్తోంది. ‘అహంకారము’ అనే పిశాచం వదలిపోవుటచే తాను శరీరం కలిగి ఉన్నప్పటికీ, ‘‘నేను ఈ దేహమునే’’ అను దురభిప్రాయం తొలగించి వేసుకుంటున్నాడు. మహాత్ముడగు అట్టి జీవన్ముక్తుని హృదయమే పరమాత్మ. అతడు ‘‘సత్త’’ (Absolute Existence) అను రూపముగల అనందము యొక్క విస్తారముచే, సర్వోత్తముడై, హరిహరాదులతో సమానమైన అనుభవమును పొందుచున్నాడు.