[[@YHRK]] [[@Spiritual]]
VasisTha Rāma Samvādam [Volume 1 of 4] in Telugu by Yeleswarapu Hanuma Rāma Krishna
(Yoga VāsisTha - 3 of 6 Prakaranams] Utpatthi Prakaranam - Chapter 01 of 10
గ్రంథము: శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (Volume 1 of 4)
వచన అనువాద రచయత: శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com)
ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
సంస్కృత మూల గ్రంథము: వాల్మీకి యోగవాసిష్ఠము
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు
Page:163
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
Page:164
విషయ సూచిక :
Page:165
ఉత్పత్తి ప్రకరణము - Chapter 01 of 10
I.) ప్రకరణ పరిచయము
I–1.) మహావాక్య ప్రభావము
శ్రీ వసిష్ఠమహర్షి : “సోఽహం”, “తత్త్వమ్”, “త్వమేవాహమ్”, "జీవో బ్రహ్మేతి నాపరః”, “అయమాత్మా బ్రహ్మా”
సోఽహం : అతడే నేను (నన్ను నేను అల్పుడిగా భావించుకోకూడదు).
తత్వమసి : అదియే నీవు అయివున్నావు.
త్వమేవాహమ్ : నీవే నేను.
జీవో బ్రహ్మేతి నాపరః : ఈ జీవుడు బ్రహ్మముకంటే వేరైనవాడు కాదు.
అయమాత్మా బ్రహ్మ : ఈ జీవాత్మయే బ్రహ్మము.
ఈ విధంగా వేదములు మహావాక్యాలు ప్రసాదించాయి. ఈ మహావాక్యాలు బాగా విచారిస్తే, అప్పుడు అఖండ బ్రహ్మకారవృత్తి కలిగి, జీవునికి తన నిజరూపం ప్రకాశిస్తుంది. ఈ జీవుడిని ఆవరించి ఉన్న అజ్ఞానం పటాపంచలు అవుతుంది. అట్టి అఖండాకార మహావృత్తినే - “మోక్షం”, “నిర్వాణం”, “జీవబ్రహ్మ స్వరూపం”, “శుద్ధ బ్రహ్మైక్యం” … మొదలైన అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఆ పదాలన్నింటి అర్థం ఒక్కటే.
ప్రతి జీవి యొక్క ప్రయత్నములలోని అంతర్లీన లక్ష్యం నిత్య-ముక్త-పూర్ణ-స్వరూపంతో ప్రకాశించుటయే. అదే అతని ఆవేదన, ఆరాటం కూడా!
ఆత్మ యొక్క స్వభావం …..“నిత్య శుద్ధత్వము, నీవు-నేను మొదలైన భేదములకు చోటులేని అఖండత్వము, ప్రశాంతత్వము” అయివున్నది. "నేను ఆత్మనే” అను ఎఱుక గలవాడు ఈ స్వభావములన్నీ పొందుచున్నాడు. అప్పుడాతడు ముక్తస్వరూపుడగుచున్నాడు. ముక్తికి మహావాక్యార్థజ్ఞానం కంటే ఇక వేరే ఏమీ అవసరం లేదు. ప్రతి జీవుని యందు అట్టి బ్రహ్మజ్ఞానం సర్వదా జాజ్వల్యమానంగా వెలుగుతోంది.
Page:166
అయితే ఈ దృశ్యమును జీవునకు స్ఫురింపచేయుచున్నట్టి మాయ, అట్టి బ్రహ్మజ్ఞానమును కప్పి ఉంచుతోంది. అంతేకాదు. అతనిని వేలాది దుఃఖ పరంపరలలో నిరంతరం ముంచి తేల్చుచున్నది. దిక్కుతోచనట్లు చేస్తోంది.
రామచంద్రా! ఈ మాయయొక్క దుశ్చర్యల గురించి భయపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే, ఈ దృశ్యప్రపంచ భావములలో జీవుని బంధించుచున్నట్టి ‘మాయ’ అనునది స్వప్నము వంటిది మాత్రమే. “మహావాక్యార్థ జ్ఞానము" అనబడు మెలుకువ రాగానే ఈ భ్రమలన్నీ ఎక్కడికి పోతాయి …? అది నన్ను అడుగవద్దు.
నిద్ర లేవగానే స్వప్నంలో చూస్తున్న పదార్థజాలమంతా ఎక్కడికి పోతున్నది? ఈ వర్తమాన జాగృత్-దృశ్య-భ్రమల గతి కూడా అంతే! “నేను ఏది అయివున్నాను? ఏది ఏ క్షణమునందునూ కాకయే ఉన్నాను?” అను రూపముగల ఎఱుక (లేక తెలివి, లేక జ్ఞానము, లేక ప్రబోధము) వలన సర్వము విదితము కాగా ఇకప్పుడు ఈ జీవుడే శివస్వరూపుడై స్వయంప్రకాశంతో జాజ్వల్యమానంగా వెలుగుచున్నాడు.
“ఈ సంసారము అనబడు దుస్తరమైన సాగరము జీవునికి ఎదురుగా ప్రాప్తించటానికి అసలు కారణమేమిటి?” అను ప్రశ్నను మనం పరిశీలిస్తే, "అజ్ఞానము కలిగియుండుటయే” అను సమాధానము లభిస్తోంది. ఇదంతా ప్రత్యగాత్మయందే …. లేక, జీవ-చైతన్యమునందే …. లేక, నీ స్వస్వరూపమునందే … కారణము లేకుండా ఇట్లు తోచుచున్నది. “ఇదంతయు బ్రహ్మమే” అని చెప్పు స్వబోధమైన మహావాక్యాలను, తద్ద్వారా ప్రకటించబడుచున్న స్వాత్మ రహస్యమును ఎవరైతే గ్రహిస్తారో వారే ఈ వర్తమాన జన్మ యొక్క ఉత్తమ ప్రయోజనము పొందుచున్నారు. అట్టి వాడే “బ్రహ్మజ్ఞుడు” అని అనిపించుకొంటున్నాడు.
కాబట్టి ఈ జీవుడు మహావాక్యముల అర్థం అభ్యసించి అఖండాకారవృత్తిని అలవరచుకోవాలి.
“ఇది ఎవరి సృష్టి? ఎవరియందున్నది? ఎక్కడ ఉత్పత్తి పొందుచున్నది?” - దీనికి సమాధానం విను.
ఈ జగత్తును ఎవరూ సృష్టించియుండలేదు. ఒకడు చీకటి కారణంగా తాను చూచుచున్న త్రాడుయందు పామును ఆరోపించి దర్శించునట్లు, అజ్ఞానియే ఉత్తమ విచారణ చేయక పోవుటచే ఏర్పడిన అజ్ఞానము వలన బ్రహ్మము నందు ’జగత్తు’ను ఆరోపించుచున్నాడు. అట్లు దర్శించుచు, స్వయముగా అనేక అనుభవములు పొందుచున్నాడు. అందు ప్రాప్తిస్తున్న సుఖ-దుఃఖభావములతో తాదాత్మ్యము చెందుచు, జన్మపరంపరలు పొందుచున్నాడు. అజ్ఞానం తొలగిందా - అంతా అతనికి సుస్పష్టమవగలదు. ఈ విషయమై యథార్థజ్ఞాన మేమిటో నీ ముందు ఉంచుతాను. దీనిని సూక్ష్మబుద్ధితో గ్రహించి పవిత్రుడవయ్యెదవుగాక!
Page:167
ఓ రాఘవా! ప్రతి జీవుని యొక్క నిజస్వరూపము "ఆత్మతత్త్వమే”. అట్టి ఆత్మయొక్క స్వరూపము ఆకాశమువలె నిరాకారమైనది, చైతన్యమాత్రము. అయితే అట్టి నిర్లిప్త, నిస్సంగ, నిష్క్రియమగు ఆత్మ, “నేను జీవుడను” అనునట్టి జీవరూపమును దాల్చి ఈ జగత్తును చూడటం జరుగుతోంది. అందుచేత ఇదంతా ఒక కలవంటిది మాత్రమే. “నేను - నీవు - అతడు” మొదలైన రూపములుగా తోచుచున్న ఈ దృశ్యజగత్తు స్వప్నములోని ఆయా వస్తువులతో పోల్చవచ్చు.
“ఈ జగత్తును మేము వాస్తవముగానే చూస్తున్నామే?” అని ఎవరైనా అంటారేమో? వారు ఇంద్రియ తాదాత్మ్యము పొందినవారై చూచుచుండుటచే అట్లు తోచుచున్నదని గుర్తు చేస్తున్నాను. అంతేకాని, ఇందలి వస్తువులు సత్యములు కావు. స్వప్నంలోని వస్తువులు కూడా అప్పటికి అవి సత్యములుగా తోచుచుండుటయే ఇందుకు మనకు దృష్టాంతం.
✤✤✤
I–2.) బంధహేతువు
దృశ్య ప్రపంచము యొక్క అనుభవం పట్ల, “ఇది వాస్తవమే” అను ఆరూఢత, నమ్మిక కలిగియుండుటచేతనే బంధము ఏర్పడుతోంది. "దృశ్యము అవాస్తవమే. ఇది లేదు” అను సదవగాహనచే దృశ్యము స్వప్నతుల్యమై “లేనిదే” అగుచున్నది. అప్పుడు బంధము అనునదే ఉండదు. మరి ఈ దృశ్య భావం తొలగిపోయేదెట్లా? ఇదంతా అసత్తుల్యమని గ్రహించేది ఎట్లా?
ఈ జగత్తులో ఏదైతే జన్మించుచున్నదో …. అదియే వృద్ధిచెందుతోంది. అదే స్వర్గ - నరకములకు ప్రయాణం చేస్తోంది. అట్టిదానికే “ముక్తి” అనునది అవసరమగుచున్నది. ఈ జీవుడు వాస్తవానికి సర్వాతీతుడు. ద్రష్ట స్వరూపుడు. స్వస్వరూప జ్ఞానము లేకపోవుటచేతనే జీవుడు బద్ధుడు అగుచున్నాడు. “స్వస్వరూపమగు ఆత్మ ఇతఃపూర్వమున్నట్లే సర్వవేళల ఉంటున్నది. అట్లే సర్వదా కేవల సాక్షిమాత్రమై ఉండబోవుచున్నది” అనునదే జ్ఞానం.
అయితే ఆత్మ ఎప్పటియట్లే ఉంటూ, ఎట్లు ఉత్పత్తి-బంధములను కలిగించుకొంటోంది?
ఈ ప్రకరణంలో ఈ విషయమై అనేక విశేషాలు నీముందు ఉంచబోవుచున్నాను. దీనిని వింటే ఆత్మస్వరూప జ్ఞానం లభించగలదు.
మొట్టమొదట కొంత సంగ్రహంగా చెప్పి, ఆ తరువాత నీవు కోరిన విధంగా విస్తారంగా చర్చిస్తాను. ఇకపై మనం కొన్ని సంఘటనలు (ఉపాఖ్యానాలు) కూడా పరిశీలించబోవుచున్నాం.
స్వప్నము ‘సుషుప్తి’లో లీనమగుచున్నది కదా! స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు కూడా ఒకానొకప్పుడు “ప్రళయము” అనుదానిలో లీనమగుచున్నది. అనగా, ఈ దృశ్య తతంగమంతా స్వస్వరూపమునందు విలీనమైపోతోంది. అప్పుడు మిగిలియుండు సత్పదార్థమునకు నామరూపములు ఉండవు. అభివ్యక్తము ఉండదు. అది తేజము కాదు. అంధకారము కాదు, అది "నిష్క్రియము, అపరిచ్ఛిన్నము” అని మాత్రం గుర్తుగా శాస్త్రాలు చెప్పుచున్నాయి.
Page:168
లోకవ్యవహారం కోసం, పండితులు అద్దానికి “ఋతము”, “ఆత్మ”, “పరబ్రహ్మము”, “సత్యము”, “శివము” మొదలైన అనేక నామములు కల్పించుచున్నారు. అయితే, అయ్యది శుద్ధ చిత్స్వభావమే అయినప్పటికీ, స్వమాయ వలన తనంతట తానే జడ రూపమున వివర్తమగుచున్నది. జీవభావము ఆశ్రయించినదానివలె కన్పట్టుచున్నది.
ఆ చైతన్యమయమైన వస్తువే సంకల్ప-వికల్పరూపమగు మనస్సుగా మారుచున్నది. క్రమంగా అది ప్రాణము యొక్క పంచభూతములయొక్క ఆకృతిని గైకొనుచున్నది. తన పరమార్థరూపమును మరచుట వలన ఆ చైతన్యము నుండే ఈ సంకల్ప-వికల్పములతో కూడుకొనిన మనో ధర్మములన్నీ ప్రకటితమౌతున్నాయి. నిశ్చల సముద్రంలో తరంగములు లేస్తున్నాయి కదా! ఇది కూడా అట్టిదే.
హిరణ్యగర్భుడు = చైతన్యము సమష్టి (Collective) మనోభావము పొందినప్పుడు ’హిరణ్యగర్భుడు’ అను శాస్త్రీయమైన పేరుతో చెప్పబడుతోంది. ఇట్లు ఆ చైతన్యమే వ్యష్టిగాను, సమష్టిగాను వెలయుచున్నది.
ఈ చైతన్యము "సత్య సంకల్ప తత్త్వము” అని కూడా చెప్పబడుతోంది. ఎందుకంటే అది తాను - ఏది ’సత్యము’ అని సంకల్పిస్తుందో, దానిని అట్లే పొందుతూ ఉంటుంది. తాను ఏది ’ప్రియము’ అని భావిస్తుందో అది అట్లే ప్రియముగా ఏర్పడుచున్నది.
చైతన్యమే పూర్వసంస్కారములను అనుసరించి ఈ “అగ్ని, వాయు, జల, భూమి” అనబడే చతుర్విధ భూతములతో విరాట్భావమును (పదార్థజలములతో కూడిన విశ్వసృష్టిని) ఇంద్రజాలమువలె సంకల్పిస్తోంది. బంగారు తీగ బంగారము కంటే వేరా? బ్రహ్మ సత్త వలననే నిలిచియున్న ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరుకాదు. బ్రహ్మము కూడా జగత్తు కంటే వేరుకాదు. అనగా ఈ జగత్తు యొక్క ఉనికి (ఉన్నచోటు, స్థానము) ఆదికారణమగు బ్రహ్మమునందే పర్యవసితమగుచున్నది.
జగత్తు భావమునందే ఉన్నది. భావమో? బ్రహ్మమునందే కలదు. ఇట్లు ‘జగత్తు యొక్క ఉనికి స్థానం బ్రహ్మమే’ అని చెప్పబడుతోంది.
ఎడారిలో ఎండమావుల ప్రభావంచేత నదీతరంగాలు కనబడతాయి. అవి అసత్యములే అయినప్పటికీ, “ఇవి జలకెరటములే” అని భావించి మృగములు అక్కడి జలం గ్రోలాలనే భ్రమచే పరుగెత్తుచున్నాయి. ఇంద్రజాలమయమగు … ఈ “నీవు నేను అతడు" మొదలైన వాటితో కూడుకొని కనబడే ఈ జగత్తు … అసత్యమే అయినప్పటికీ, ’మనస్సు’ యొక్క ప్రభావం చేత నిత్యమైనదానివలె ప్రసిద్ధి పొందుతోంది.
దృశ్యవ్యవహారం : అందుకే, తత్త్వజ్ఞులైన పండితులు … అనేకమైన భేదములతో కూడుకొని ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యవ్యవహారమునకు కొన్ని సాంకేతిక నామములు (technical terms) ఉపయోగిస్తున్నారు. ముందుముందు, వాటిని మనం కూడా ఉపయోగించబోతున్నాం కనుక వాటిని వివరిస్తున్నాను, విను.
Page:169
1.) అవిద్య : ఆయా భావనలు, పదార్దానుభవములు, ఆవేశపూరితమైన అభిప్రాయముల రూపంలో ఇప్పుడు ‘వాస్తవం’ లాగానే ఉంటాయి. కానీ, విద్య లేక జ్ఞానము ప్రాప్తించినప్పుడు తొలగిపోతాయి. అట్టి వ్యవహారమును ‘అవిద్య’ అని పిలుస్తున్నాను.
2.) సంస్కృతి : యేయే భావనలు లేక దృశ్యమునకు సంబంధించిన అనుభవములు ఈ జీవుని స్వర్గ, నరక, పాతాళాది (లేక సుఖ, దుఃఖ, జడత్వాది) అనేక లోకములలో త్రిప్పుటకు కారణమగుచున్నాయో వాటిని ‘సంస్కృతి’ అని చెప్పుచున్నారు.
3.) బంధము : ఈ ’దృశ్యభావన’ లేక ‘తాదాత్మ్యము’ ఆత్మయొక్క స్వభావసిద్ధమైయున్న నిత్య స్వాతంత్య్రమును అప్రకటితం (unmanifested, covered) చేస్తున్నది. అదియే ‘బంధము’.
4.) మాయ : “యామా” … ఏదైతే సొంతంగా ఏ క్షణమందుకూడా ఉండి ఉండలేదో, కాని అజ్ఞానదృష్టికి మాత్రం వాస్తవమువలెనే తోచుచున్నదో అద్దానిని ‘మాయ’ అని అంటున్నాం.
5.) మోహము : ఏదైతే …. భ్రమను కలుగజేయడానికి హేతువు అగుచున్నదో …. అట్టిదానిని ‘మోహము’ అని చెప్పుచున్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా గారడీ లోలాగా తోచుట ఈ మోహము యొక్క వికారప్రభావమే.
6.) మహత్తు : ఏదైతే దాటుటకు అత్యంత కష్టమైనదానివలె తోచుచున్నదో అద్దానినే ‘మహత్తు’ అను పేరుతో చెప్పుకొంటున్నాం.
7.) తమస్సు : ఏదైతే స్వస్వరూపముయొక్క అనుభవమును కప్పి ఉంచి, ఈ జీవుని తన ఆత్మస్వభావం మరచేటట్లు చేస్తోందో … దానినే ‘తమస్సు’ అనే మాటతో ఉదహరిస్తున్నారు.
ఇప్పుడు మనం ‘బంధము’ అంటే ఏమిటో విచారిద్దాం. అటు తరువాత మోక్ష విషయం కూడా.
✤✤✤
I–3.) బంధ - మోక్షములు
“బంధము” అంటే ఏమిటి? ద్రష్టయొక్క “ప్రతిబింబ చైతన్యము”నకు బాహ్యంలో ప్రాప్తిస్తున్న ఈ దృశ్యమునకు గల సంబంధమునే ‘బంధము’ అని అంటున్నాం.
ఈ ద్రష్ట దృశ్యభావముచే బంధింపబడుచున్నాడు. దృశ్యము తొలగటం జరిగిందా, బంధము కూడా తొలగుతోంది. అయితే, “దృశ్యము” …. అంటే ఏమిటి? నీవు - నేను - మొదలైన మిథ్యా కల్పనలతో కూడిన జగత్తే కదా! అట్టి ఈ జగత్తు రూపు మాయనంత వరకు ముక్తి లభించదు.
అయితే రామచంద్రా! “ఇదంతా లేదు. ఇది ప్రతిబింబము వంటిదే” అని పైపై వాక్యాలు పలికినంత మాత్రంచేత ఈ ”దృశ్యబోధ (Perceptual experience)" నశిస్తుందా? లేదు. ఒక విధంగా చూస్తే అధికమైన వాక్యాలు, సాంకేతిక పదజాలం చిత్త విక్షేపమునే కలిగిస్తూ దోషమును వృద్ధిచేస్తాయి కూడా.
Page:170
ఎక్కువగా తర్కం చేయటంవలననో, లేక తీర్థయాత్రలు సేవించినంతమాత్రంచేతో … ఈ జగత్తు మనోవీథి నుండి తొలగించటం సులభసాధ్యం అయ్యేదికాదని విచారణశీలురగువారు మనకు చెప్పుచున్నారు.
ఇక్కడ ఒక చమత్కారం ఉన్నది. చెపుతాను విను.
జగదృశ్యం తు యద్యస్తి నశామ్యతేవ కస్యచిత్ |
నాఽసతో విద్యతే భావో నాఽభావో విద్యతే సతః || (I. 26)
ఈ జగత్తు వాస్తవంగానే ఉండి ఉంటే, ఇక దీనిని తొలగించే ప్రసక్తి ఎక్కడ? ఎందుకంటావా?
ఏది వాస్తవానికి లేదో … అనగా అసత్తో అట్టిదానికి ఉనికి ఎక్కడ? ఏది ఉండియే ఉన్నదో … అనగా సత్తో …. ఇకదానికి ‘లేమి’ అనునది అసంభవమే కదా!
కాబట్టి ఈ దృశ్యము లేదు. ద్రష్ట మాత్రం యథాతధుడై సర్వదా ఉండియే ఉన్నాడు.
కాని, స్వస్వరూపం యొక్క అపరిజ్ఞాన కారణంగా ఈ దృశ్యము ఉన్నట్లే తోచుచున్నది. చైతన్య స్వరూపమగు ఆత్మ స్వయముగా సర్వము తెలుసుకొంటోంది కనుక జ్ఞేయము. అది కొంతవరకే తెలుసుకొని మరికొంత గ్రహించలేదు కనుక “అపరిజ్ఞేయము” కూడా. అది దృశ్యనివృత్తి పొందనంతవరకు, తాను ఎక్కడ ఉంటే అక్కడ ఒక పరమాణువులో కూడా దృశ్యమును గాంచుచునే ఉంటుంది.
ఓ జీవుడా! నీవు ఇప్పుడు మానవజన్మ పొందావు. ఇదొక సదవకాశం. ఆత్మానుభవము కొరకై నీవు ఇప్పుడు ప్రయత్నించాలి. “ఈ దృశ్యము నా దృష్టిలో లేకుండా ఉండేది ఎట్లా?” అనుదాని కొరకై ప్రయత్నశీలుడవు కావాలి. సురాపానము (మత్తు-పానీయములు) సేవించువాడు, “ఈ మత్తు పానీయముల వలన నాకు తృప్తి కలుగుతుంది“ అనే దురభిప్రాయం పరిత్యజించాలంటే ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది కదా! “ఈ దృశ్యము వాస్తవమే” అను ‘భ్రమ’ మనస్సులో దృఢం అయివుండటం అట్టిదే. అది సూక్ష్మబుద్ధితో గ్రహించినట్టి మేము తపో, ధ్యాన, జపాది సాధనముల వలన చిత్తశుద్ధిని ముందుగా సంపాదించుకొన్నాం. అట్టి శుద్ధచిత్తము యొక్క సహాయం చేత “ఈ దృశ్యమునకు అస్థిత్వము లేదు” అను బుద్ధిని పెంపొందించుకొన్నాం. అందుచేత ఇప్పుడు దృశ్యము యొక్క మచ్చ కూడా మాకు కనబడటం లేదు.
ఓ రామచంద్రా! ఈ జగత్తుకు సంబంధించిన సంస్కారం నీయందున్నంత వరకూ నీవు పారిపోయి ఒక పరమాణువులో దాగినా లాభం లేదు. ఆ పరమాణువులో కూడా నీకు అనేక జగత్తులు ప్రాప్తిస్తూనే ఉంటాయి. చిత్స్వరూపదర్పణంలో ప్రతిబింబ పరంపరలవంటి అనేక జగత్తుల అనుభవం తప్పేది కాదు. ఒక అద్దము ఇరకు చోటులో ఉన్నా, లేక, ఒక సువిశాల ప్రదేశంలో ఉన్నా. ఆయా తావులలో ఉన్నట్టి కొండలు, వాగులు, నేల, ఆకాశం, గోడ మొదలైనవి తనయందు ప్రతిబింబిస్తూనే ఉంటుంది కదా. ఈ చిత్స్వరూప దర్పణం విషయంలో కూడా అంతే జరుగుతుంది.
Page:171
అట్లు ప్రతిబింబించటం వలననే చిత్స్వరూపమగు జీవునికి మాటిమాటికి ఈ జరా-మరణ దుఃఖములు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తి అవస్థలు కలుగుచునే ఉన్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! “ఈ దృశ్యము లేదు” అని మీరు సిద్ధాంతీకరించుచున్నారు కదా! ఇక మేము ఇందులో పాల్గొనటం దేనికి? సర్వము త్యజించివేస్తే పోతుంది కదా! కర్మ రాహిత్యమును ఆశ్రయిస్తేనే మంచిదా? ‘సమాధి’ మాత్రమే మమ్ములను ఈ దృశ్యము నుండి కాపాడుతుందేమో? మరి ఈ దృశ్యము మాకు బంధమే కదా?
శ్రీ వసిష్ఠమహర్షి : నిజమే. కాని, నీవు ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉన్నది. సమాధి సమయంలో కూడా “ఇప్పుడు నేను దృశ్యమును గాంచటం లేదు. దానిని తుడిచి వేయుచున్నాను” అనే సంస్కారం ఉండనే ఉంటుంది కదా. ఈ సంస్కారము మరల సంస్కృతి స్మరణమునకు అనువు అయినట్టి ఒక అక్షయమైన బీజము అగుచున్నది. మరల మరల సంసారం ఉద్భవించటానికి ఆమాత్రం బీజం చాలు.
దీనినిబట్టి మనం గ్రహించేదేమిటి? ‘సవికల్ప సమాధి’ (నేను దృశ్యమును త్యజించి వేస్తాను అను భావన ఉండి ఉన్నట్టి స్థితి) దృశ్యనాశనమునకు హేతువు కాగలదని మనం చెప్పలేం. మరి నిర్వికల్పసమాధి (thoughtless state) మాటేమిటంటావా? అవును. నిర్వికల్ప సమాధి లభిస్తే చైతన్యరూపమును, నిర్వాణమును కూడా పొందవచ్చు. కాని, నీ దృష్టిలో దృశ్యమున్నంతవరకు నిర్వికల్ప సమాధి సిద్ధించేదెట్లా?
అసలు ‘సమాధి’ అంటే ఏమిటి? ఆ సమయంలో జగత్తు యొక్క లేమిచే ఏర్పడు “నిశ్చేష్టత” వంటిదే కదా! ఒకడు గాఢంగా నిద్రిస్తున్నాడనుకో. అట్టి గాఢనిద్రలో జాగ్రత్తుకు సంబంధించిన ఏ అనుభవనం అతనికి ఉండదు. కాని, మేల్కొనిన తరువాత మరల ఇతఃపూర్వపు ప్రాపంచిక జ్ఞానమంతా వచ్చిచేరుతోంది కదా! సమాధి నుండి లేచినవాడు మరల మునుపటి విధంగానే అంతులేని దుఃఖములతో పరిపూర్ణమైయున్న జగత్తులను పొందుచునే ఉన్నాడు. మరల దుఃఖములు పొందవలసివున్నప్పుడు, ఇక క్షణిక సమత్వస్థితి (లేక సమాధి) వలన వచ్చే లాభమేమిటో చెప్పు?
“నేను నిర్వికల్పసమాధిని సంపాదిస్తాను. అది ఎన్నటికీ భంగము కాకుండా చూచుకొంటాను. ఆ విధంగా, అనంత సుషుప్తితో సమానమైన పవిత్ర బ్రహ్మపదమును పొందవచ్చును కదా! ఈ జగత్తుతో నాకేమి పని? కాబట్టి నేను ఇప్పుడే నిష్క్రియుడను అవుతాను”. అని నీవు అంటావేమో? ఇటువంటి అభిప్రాయం నీవు (వైరాగ్య ప్రకరణంలో) చెప్పావు కూడా. కాని, ఈ ‘మనస్సు’ అనబడే మూలదృశ్యము అంతరంగంలో ఉన్నంతవరకు, మహాయోగులు కూడా బాహ్యదృశ్యమును సంపూర్ణంగా రూపుమాపలేకపోతున్నారు. ఈ చిత్తము ఏ పదార్థములపై “పొందవలెను” అనే రూపమును గల ఆసక్తి కలిగి ఉంటుందో ఆయా విషయములందు జగద్భ్రమ కలిగి ఉన్నట్లే అవుతుంది. ఆ ద్రష్ట “లేదు. నేనొక పాషాణమును” అని తనను తాను భావించి ఊరుకొంటే మాత్రం ఏమి లాభం? అట్టి కల్పన నుండి తేరుకోగానే, మరల దృశ్యము ఎదురుగా ప్రత్యక్షమై నిలవనే నిలుస్తుంది. పైగా, ఇంతవరకు ఏ ఒక్క యోగియొక్క సమాధి కూడా పాషాణతుల్యమై అనంతకాలం ఉండటంలేదు. ఇది పరిశీలకులమగు మా అనుభవం.
Page:172
పోనీ, పాషాణస్వరూపమైన ‘స్థితి’ లేక ‘పరిణామం’ కలిగివున్నట్టి ‘నిర్వికల్ప సమాధి’ అనునది ఒకటి ఉన్నదనే అనుకొందాం. అది అనంత కాలం స్థిరంగా ఉన్నప్పటికీ, ముక్తిని ప్రసాదించజాలదు. ‘ముక్తి’ …. అనునది శాంతము, జ్ఞానస్వరూపము, శ్రేష్ఠము, అనాది, అనంతము కదా! "పాషాణము వంటి నిర్వికల్పత్వములో ఘనీభూతమైన ఆలోచనారాహిత్య స్థితిలో అట్టి ముక్తిలేదు” అనేది మా అనుభవం, అభిప్రాయం కూడా.
కాబట్టి రాఘవా! ఒకవేళ ఈ దృశ్యమే సత్యమై ఉంటే, ఇది ఎన్నటికీ నశించే ప్రసక్తే లేదు. "ఈ దృశ్యమును మేము తపో-జప-ధ్యానాదుల సహాయంచేత నశింపచేస్తాం” అనునది ఎంతటి హాస్యాస్పదం! మూఢులే అట్లు భావిస్తున్నారు. లేనిది తొలగించటమేమిటి? దృశ్యము అసలే లేదు. ఒకవేళ ఉంటే …. నశించదు.
మరి “దృశ్య సంబంధము” … అనే సంసారము తొలిగేది ఎట్లా? “దృశ్యము మిథ్య” …. అని తపోధ్యానాదులచే శుద్ధి పొందిన చిత్తమునకు సుస్పష్టమగుచున్నది. అనగా, తపో-జప-ధ్యానాదులు మోక్షమునకు నేరుగా కారణము కాదు. అవి చిత్తమును శుద్ధము చేయటానికి మాత్రమే ఉపకరిస్తాయి. అట్టి శుద్ధ చిత్తము యొక్క సహాయంతో, “ఈ జగత్తు బ్రహ్మమే” అని సుస్పష్టముగా సందేహరహితంగా, అనుభవపూర్వకంగా తెలియవచ్చుటే మోక్షము” అని గ్రహించెదవు గాక! అనగా, “ఈ కనబడే సర్వము బ్రహ్మమే” అను అనునిత్యాభ్యాసం తపోధ్యానాదుల అంతిమ ఫలమునకు సమానమే కదా!
ఒక తామరపూవులో గింజలు (విత్తులు) తీసుకో, …. ప్రతి గింజలోను భవిష్యత్తులో మొలవబోవు తామరతీగె యొక్క లక్షణములన్నీ సంస్కారరూపంలో అణిగి ఉంటాయి కదా! అదేవిధంగా, ద్రష్టయందు కూడా దృశ్యము సూక్ష్మరూపమున (సంస్కార రూపమున) అణిగి ఉంటుంది. పదార్థములలో రుచి, నువ్వులలో నూనె, పువ్వులలో వాసన దాగి ఉంటాయి కదా! ద్రష్టయందు దృశ్యము కూడా అట్లే ఇమిడి ఉంటుంది.
కర్పూరం, ఎక్కడ ఉన్నా వాసన వెదజల్లుతూనే ఉంటుంది. ‘నేను ఒక జీవుడను’ అను జీవభావము వహించియున్న చిదాత్మకూడా ఎక్కడ ఉన్నప్పటికీ తన హృదయంలో దృశ్య జగత్తును పొందుచునే (గాంచుచునే) ఉంటుంది. "స్వప్నము, సంకల్పములు, మనోరాజ్యము” ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ జీవుని హృదయమునందే కదా! అదే విధంగా దృశ్య పదార్థములు కూడా నీ హృదయమునందే ఉన్నాయని స్వానుభవంచేత గ్రహించెదవుగాక!
ఒకానొక బాలుడు తన చిత్తము యొక్క వికల్పము చేతనే కొద్దిపాటి చీకటిలో ఒక దయ్యమును చూడటం, గజగజ వణకటం, చావటం కూడా జరుగుతోంది. ఈ దృశ్య పిశాచి ద్రష్టను కూడా అనేక శరీరప్రాప్తి వినాశముల రూపమున హింసించుచున్నది. ఒక గింజలో “మొలచుట” అను స్వభావం దాగివున్నది కదా! ఆ గింజ తగిన నేలను, ఋతువును పొందినప్పుడు మహావృక్షం అవుతోంది.
Page:173
అట్లే “చిత్తు“లో (In the Seer consciousness or substratum) రూపుదిద్దుకొని ఉన్న ఈ చిత్తమునందు ‘దృశ్యజ్ఞానము’ అనునది సంస్కార రూపంలో ఉంటోంది. అది దేశ కాల పరిస్థితులను అనుసరించి వృద్ధి పొందుచున్నది. ”విత్తనం" యొక్క ’మధ్యలో చెట్టును వెలువరించగల శక్తి ఎప్పటికీ ఇమిడి ఉంటుంది. అయితే ఆ శక్తి అనువైన దేశకాలములు లభించనప్పుడు ప్రకటితం (manifest) కాకపోవచ్చు. అప్పుడు మొలకెత్తు శక్తి లోపించినట్లో త్యజించబడినట్లో అజ్ఞాన దృష్టిచే పైకి కనిపించవచ్చు. అదేవిధంగా “చిన్మాత్రశరీరి” (ఎరుకయే రూపముగా కలిగియుండి …. ఈ శరీరమును ధరించినవాడు) అయినట్టి ఈ జీవుని అంతరమున కూడా అతని స్వభావమే అయినట్టి ఈ జగత్తు సర్వకాలములందు ఉండనే ఉంటున్నది. అయితే, సమయ-భేదమును అనుసరించి సమాధికాలంలో అణగిపోయినట్లే, విడచి పోయినట్లో తోచుచున్నది. మరల వ్యుత్థాన కాలంలో వచ్చిపడుతోంది.
మోక్షస్వరూపులగు జ్ఞానులదృష్టి ఎలా ఉంటుందో చెపుతాను విను.
“నేను ఈ జగత్తులో కనుపించుచున్న ఏదైనా ఒకానొక పదార్థము వంటి వాడను కాను. నన్ను బంధించగలిగినదంటూ ఏదీ ఎక్కడా లేదు. దేనికీ సంబంధించనట్టి శుద్ధ చైతన్య స్వరూపుడనే నేను. అనంతుడనై సర్వదా, సర్వమును వెలిగించుచు, సర్వమునందు వెలుగొందుచున్నాను. ఈ జగత్తు నా స్వభావమే. నా గుణములు నేను కానట్లు, జగత్స్వరూపుడనగు నేను జగత్తుగా అగుటలేదు.”
అట్టి ఉత్తమ భావనతో భావనారాహిత్యము పొందినవాడై తనను తాను అకర్తగా, అభోక్తగా, నిష్ప్రపంచకుడుగా, అద్వితీయుడుగా దర్శించుచున్నాడు. పూర్ణుడై ఉంటున్నాడు.
ఓ ప్రియరామచంద్రా! ప్రతి జీవీ పూర్ణుడే అయివున్నాడు సుమా! అయితే సంసార బద్ధుడగు జీవుడు అది మరచి ఇందు సంచరిస్తున్నాడు. “ఓయీ! జీవుడా! నీవు పూర్ణుడవేనయ్యా!" అని శాస్త్రకారులు, గురువులు గుర్తు చేయుటకు ప్రయత్నిస్తున్నారు. అంతే!
✤✤✤