[[@YHRK]] [[@Spiritual]]

CAUTION: This HTML Page is still Under Construction

VasisTha Rāma Samvādam [Volume 1 of 4] in Telugu by Yeleswarapu Hanuma Rāma Krishna
(Yoga VāsisTha - 6 of 6 Prakaranams] Nirvāna Prakaranam - Chapter 05 of 17

గ్రంథము: శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (Volume 4 of 4)
వచన అనువాద రచయత: శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com)
ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
సంస్కృత మూల గ్రంథము: వాల్మీకి మహర్షి ప్రణీత "యోగవాసిష్ఠం"
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు


శ్రీ వసిష్ఠ - రామ సంవాదము :: Volume 4 (of 4)

[6] నిర్వాణ ప్రకరణం (ఉత్తరార్ధం) - Chapter 05 (of 17)


విషయ సూచిక :


Volume 4 - ప్రవేశిక

అఖండ రామాయణంలోని చివరి ప్రకరణం అయిన నిర్వాణ ప్రకరణం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. ఆరు ప్రకరణాల్లోకీ శ్లోక సంఖ్యాపరంగా ఇది పెద్దదవటమే కాకుండా; ఇందులో చర్చించిన అంశం కూడా గంభీరమైనది. మొదటి ప్రకరణాల్లో చర్చించిన అంశాలు సూక్ష్మమైనవైతే, ఇందులో చర్చించిన విషయం సూక్ష్మతరం, సూక్ష్మాతిసూక్ష్మం అని పేర్కొనవలసి ఉంటుంది. నిజానికి అన్నింటిలో చర్చించిన విషయం ఒక్కటే ఐనప్పటికీ ఏ స్థాయినుంచి, ఏ భూమికనుంచి, ఏ కోణం నుంచి విషయాన్ని విశ్లేషిస్తున్నాం అన్న దాన్ని బట్టి చర్చించిన అంశం విభిన్నంగా వ్యక్తమవుతుంది.

ఈ ప్రపంచమంతా ఉదయాస్తమ రహితమై, అఖండ ప్రకాశరూపమై, నిర్మలమై, శిలవలె మౌనరూపమై, నిర్వికారమైనట్టి శాంతమగు బ్రహ్మయే అయిఉన్నది అంటుంది ఈ ప్రకరణం. ఇది కేవలం భావన కాదు. పరమ సత్యం. మనకు అనుభవమౌతున్న జగత్తు అవిద్యారూపం. అజ్ఞాన జనితం. బ్రహ్మానికి వేరైన సత్తా లేనిది. కావున, ఈ ప్రకరణం నుంచి మనకు ద్రష్ట దర్శన దృశ్య త్రిపుటిని భేదించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి, ఏకత్వరూపంగా మిగిలిపోవలసిందని శాస్త్రమాత ఉద్భోధము.

వాయువు, వాయు స్పందన ఏ విధంగా వేరుకావో అదేరీతిన చైతన్యం లేదా చిత్తు మరియు విషయ జగత్తు వేరు కావు. చిత్ స్పందనే జగత్తు.

చైతన్యానికి వేరుగా ఏమీ లేదని, ఇంద్రియాలు, వాటికి అధిష్ఠానమైన మనస్సు, మనోకల్పితమైన విషయ ప్రపంచంతో సహా సర్వం బ్రహ్మమయమని ఈ ప్రకరణం నుంచి జ్ఞాని గ్రహిస్తాడు. దేహం అందులోని చిత్ రెండూ వేరు కావన్న భావం కలిగిన సాధకుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. నిర్వాణ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సర్వం చిన్మయమని గ్రహించిన వ్యక్తి శోక మోహ రహితుడై, భేదదృష్టి వీడినవాడై, ఏకత్వానుభవం పొంది కేవాలానంద స్వరూపుడిగా నిలుస్తాడు.

నిర్వాణ ప్రకరణంలో చెప్పిన విషయాన్ని సులభంగా గ్రహించాలంటే ముందు ప్రకరణాల్లో పేర్కొన్న విషయాన్ని అవగతం చేసుకుని ఉండాలి. ఉత్పత్తి, స్థితి ప్రకరణాలు దృశ్యావిర్భావానికి మరియు దృశ్యానుభూతికి కారణాలు బోధించాయి అని అనుకున్నట్లైతే; నిర్వాణ ప్రకరణం సముద్రం నుండి ఉద్భవించే తరంగాలు ఏవిధంగా సముద్రానికి భిన్నం కావో అదేవిధంగా దృశ్యజగత్తు కూడా చిదభేదం కాదని ఉద్ఘాటిస్తుంది. మనోనిర్మితమైన వస్తు ప్రపంచం మనస్సుతో సహా చిత్ శక్తియే. చిద్విలాసమే. చిదాంతర్గతమే. చిద్రూపమే. చిన్మయమే. చిత్స్ఫురణయే అని తెలుపుతుంది.

ఐతే జగత్తు చిదభిన్నం ఐనప్పుడు పురుష ప్రయత్నం చేయటం, మోక్షాన్ని పొందటం అన్నీ అసంగతాలు కావా అంటే మనకు ఇంద్రియగోచర జగత్తుకు సంబంధించిన ఎరుక ఉన్నంత సేపు ఆ ఎరుక తొలగే వరకూ ప్రయత్నం చేయాల్సిందే. అంటే మొదటి ప్రకరణాల్లో చెప్పిన విచారణ అనే పురుష ప్రయత్నాన్ని అనుష్ఠించి మనస్సును పరిశుద్ధమొనర్చుకున్న జిజ్ఞాసువు మాత్రమే ఈ ప్రకరణంలో పేర్కొన్న కేవలాద్వైతాన్ని అనుభవ మొనర్చుకోగలడు. అలా కాకుండా ఇందులోని ఉత్కృష్ట భావనలను అపరిశుద్ధ మనస్కుడికి బోధిస్తే విరుద్ధంగా, విపరీతంగా అర్థంచేసుకునే ప్రమాదముంది. అందువలన శాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని అందులో పేర్కొన్న క్రమంలోనే చదవాలి.

- ప్రకాశకులు


Page number:1

Volume 4 - నిర్వాణ ప్రకరణము - Chapter 05 of 17

Ⅴ.) పాషాణాంతర్గత బ్రహ్మాండం

Ⅴ-1.) సంకల్ప నిర్మిత కుటీరం - వసిష్ఠ నిర్వికల్ప సమాధి

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఆకాశం ఎక్కడుంటే అక్కడ శూన్యత్వం కూడా ఉంటుంది చూచావా? జలం ఎక్కడుంటే అక్కడ ద్రవత్వం కూడా ఉంటుంది కదా! అట్లాగే చిన్మయమగు బ్రహ్మాకాశమున సర్వత్రా సర్వము సర్వవిధాలుగా నిస్సంకోచంగా సంభవిస్తున్నాయి. వాస్తవానికి అలా సంభవించేదంతా ఆకాశ శూన్యత్వంలాగా స్వచ్ఛమైనదే అయి ఉన్నది. సమస్త పదార్థములు చిన్మయరూపములే. కాబట్టి ఈ పృథివి మొదలైన సర్వ పదార్థములు చిత్ రూపములే గాని, అచిత్ అయినది ఎక్కడా ఏదీ లేదు. ఎచ్చట చైతన్యము ఉన్నదో... అక్కడ సృష్టి యొక్క శోభ కూడా ఉన్నది. స్వప్నంలో కనబడిన నగరం, పర్వతం... మొదలైనవన్నీ స్వప్న చైతన్య స్వరూపములే కదా! జాగ్రత్ నందలి సర్వ పదార్థములు కూడా ఏకమగు చిదాకాశమే అయి ఉన్నాయి.

ఈ సందర్భంలో పూర్వం నాకు స్వానుభవమై ఒకానొక విశేషం గుర్తుకొస్తోంది. ఆ నాచే పొందబడిన విశేషం పాషాణాఖ్యాయిక, అనే పేరుతో మహాశ్చర్యకరం అతివిచిత్రమైనది కూడా. భ్రమ అను రోగమునకు అమృత రసాయనం వంటిది. ఆ “ఆ పాషాణాఖ్యాయి” అను పేరుతో చెప్పబడే విశేషం విను చెబుతాను.

పూర్వం ఒకానొకప్పుడు నిజాశ్రమంలో జ్ఞానార్తితో నన్ను ఆశ్రయించవచ్చిన శిష్యగణానికి ఆత్మతత్త్వాన్ని బోధిస్తూ ఉన్నాను. ఎఱుగవలసిన ఆత్మను ఎఱిగి శాంత చిత్తుడనై రోజులు గడుపు చున్నాను. ఆ సమయంలో నా బుద్ది ఎందుకో ఏకాంతం వైపుగా మరలింది. భ్రమయుక్తము, చంచలం అగు సర్వలోక వ్యవహారాలు వదిలి ఏకాంతంగా ఉండాలనే అభిలాష కలిగింది. అప్పుడు శిష్యులను ఆయాశాస్త్ర పఠణాదులలో నియమించి విశ్రాంతి కొఱకై దేవలోకంలోని ఒకానొక ఏకాంత స్థానంలో ప్రవేశించాను. మెల్లమెల్లగా ఆత్మధ్యానతత్పరుడనైనాను. పరమ విశ్రాంతిని అనుభవించసాగాను. అయితే, ఆ ఏకాంత ప్రదేశంలోకూడా దేవతల నృత్యగీత వాద్యాదులు నా ఏకాగ్రతకు కొంచెం విక్షేపం కలిగించసాగాయి. అప్పుడు ఈ జీవులకు క్షణభంగురమైన ఆయా ప్రాపంచిక దశలు కలుగజేసే భ్రమ - విక్షేపముల గురించి ఇట్లు యోచించసాగాను.

"ఆహా! ఈ ప్రపంచంలోని ఆయా విశేషాలన్నీ రమణీయంగా అనిపించటానికి కారణం? బుద్ధిమాంద్యం చేత, అవిచారణచేతనే కదా! స్థూల బుద్ధిని అధిగమించి ఆయా సర్వస్థితుల వెనుక ముందులను పరిశీలించి - చూచినపుడు ఈ ప్రపంచం యొక్క స్థితి రసహీనమే అవుతుంది.


Page number:2

అట్టి ఈ ప్రపంచం ఎవనికి కూడా ఏ కారణం చేతా, ఎప్పుడూ ఎక్కడా సుఖప్రదం కాదు. ఏదో పొందాలనుకోవటం, ఇంకేదో తొలగాలనుకోవటం, కొన్ని ఇష్టములు, కొన్ని అయిష్టములు ఇంతకు మించి ఈ సాంసారిక జీవితంలో చెప్పుకో తగినవి ఏమున్నాయి? ఈ జీవునికి ఎందుకో ఈ దృశ్యవిషయాలపై అత్యంత నమ్మకం ఏర్పడి ఉంటోంది. అందుకే ఇక్కడ ఏవేవో పొందాలని ఈ ద్రష్టత్వము వహించి తద్వారా ఎన్నో ప్రయాసలు ఆశ్రయిస్తున్నాడు. ద్రష్టయగు ఈ జీవుడు ఈ ఈ లోకాలలో ఏదేదో పొందాలని చేసే తీవ్రమైన శ్రమ అంతా చివరికి దుఃఖప్రదంగాను పరిణమిస్తున్నదే తప్పించి, ఈ దృశ్యములో ఏది పొందినా ఏం ప్రయోజనం ఉండటమే లేదుకదా!

కిమిదం దృశ్యతే? కిం వా ప్రేక్ష్యతే? కోఽహమేవ వా? ।
సర్వం శాంతం అజం వ్యోమ చిన్మాత్రాత్మ నిరంజనమ్ ॥

కనిపించుచున్నదంతా ఏమిటి? దీనిని చూచునది ఏది? నేనెవరు? ఈ ప్రకారంగా వివేకంతో “విచారణ" చేసి చూచామా... ఇదంతా శాంతము-అజము-ఆకాశసదృశమునిర్మలచిన్మాత్రం అగు ఆత్మలో వివర్తమే కదా... అని తెలియవస్తోంది. అయినా దృశ్యం యొక్క భేద దర్శనమంతా దృష్టి మొక్క విక్షేపమే కదా! ఇట్టి భ్రమాత్మకమైన దృష్టిని పొందుచున్నంత వరకూ నాకు శాంతి లేదు. అట్టి విక్షేపం యొక్క శమనం కొరకై ఒకానొక ఏకాంత స్థానంలో సమాధిని ఆశ్రయించటమే ఉచితం. అట్టి రహస్య స్థానం సమస్త సిద్ధ - ఇంద్ర - దైత్యాదులకు కూడా సమీపించరానంత రహస్య స్థానమై ఉండాలి. అట్టి స్థానంలో దాగుకొని ఇక నేను ఏ జీవికీ కనిపించకుండెదను గాక ! అక్కడ నిర్వికల్ప సమాధిలో తత్పరుడనై ఉంటాను. సర్వవృత్తులను త్యజించివేస్తాను. అతి నిర్మలం - శాంతం - సమం అయినట్టి ఆత్మపదమున సుస్థితుడనై ఉంటాను.

మరి, శబ్ద-స్పర్శ-రూప-రస గంధములనే ఐదు కించిత్ కూడా సంభవించనట్టి అత్యంత శూన్యమైన ప్రదేశం ఎక్కడ? అట్టి ఏకాంతస్థానం చేరెదనుగాక! ఎందుకంటే వన జలమేఘాదులచేత వ్యాప్తమై... సింహము-పులి-మొదలైన జంతువులు మాత్రమే సంచరించే జనరహిత పర్వత ప్రదేశం కూడా నాకు శత్రువు వలె ప్రతికూలంగానే అనేక విక్షేపములతో కూడి కనబడుతోంది. పర్వతముల మధ్య ప్రదేశం కూడా ఆయా కిరాత జీవుల సంరంభములతో నిండి ఉంది. సముద్రతీరాలు ఖాళీగా లేవు. అవన్నీ కూడా అనేక వ్యగ్రులగు జనుల సంచారాలతో నిండి ఉంటున్నాయి. సముద్రగర్భమేమో, జల జంతువుల చేత నిండి ఉన్నది. అక్కడ కూడా ఏకాంతం లభించదు. సముద్రతీరాలు, పర్వతప్రాంతాలు, లోకపాలుర గ్రామాలు, కొండశిఖరములు, పాతాళ కందరాలు, ఇవన్నీ కూడా అనేక ప్రాణుల వ్యవహారిక సంరంభాలతో నిండి ఉన్నాయి. కొండగుహలందామా? వాటిలో సింహ - సర్పాదులు భీకర శబ్దాలు చేస్తూనే ఉంటాయి. ఇక సరస్సులందామా! అక్కడ స్నానం చేయటానికి వాళ్ళు - వీళ్ళు వచ్చిపోవటం చేత నా ఏకాంతమునకు ఎన్నో విఘ్నాలు కలుగుచున్నాయి. పైగా, అక్కడి తరంగములు శబ్దాలు చేస్తూనే ఉంటాయి. కనుక సరస్సులు ఉన్న ప్రదేశములు కూడా విక్షేప రహిత ఏకాంత మౌన స్థితిని ప్రసాదించలేవు.


Page number:3

కాబట్టి... సర్వదా శూన్యమే అయినట్టి ఆకాశం యొక్క సుదూరమైన ఒకానొక మూల మనోకల్పనచే ఒక కుటీరం నిర్మించుకొంటాను. అత్యంత ఏకాంత స్థానంలో ఉత్తమమైన 'యోగము’ అనే యుక్తిని అవలంబిస్తాను. ఈ చిత్తమును ఎటూ ప్రసరించకుండా సుదృఢం చేస్తాను. అక్కడ వాసనారహితుడనై సమాధి పరాయణుడను అవుతాను.

ఇట్లా ఆలోచించి నేను ఆ దేవలోకంలోని ఆ ప్రదేశం నుండి బయలుదేరాను. ఖడ్గధారతో పోల్చతగిన నిర్మలమగు, అత్యంత సూక్ష్మమగు దేవలోక సంబంధమైన సూక్ష్మ ఆకాశంలో ప్రవేశించాను. అయితే ఆ ఆకాశము యొక్క అంతరాళంలో కూడా అనేక సమాధి విఘ్నం చేయగల ఏవేవో దృశ్యలు (ఇక్కడి లాగానే) కనిపించసాగాయి.

ఆ దేవలోకాంతర్గతమైన ఆకాశం నందు... ఒకచోట సిద్ధులు సంచరిస్తున్నారు. మరొకచోట మేఘములు గర్జిస్తున్నాయి. ఇంకొకచోట విద్యాధరులు విహరిస్తున్నారు. ఇంకోచోట యక్షులు ఇష్టం వచ్చినట్లు వినాశన క్రియలను చేస్తూ కనిపించారు. ఒక ప్రదేశం గంధర్వ నగరంచే పూర్ణమై ఉన్నది. ఇంకొక ప్రదేశంలో గొప్ప యుద్ధ సంరంభమంతా సంసిద్ధమై భయానకమైన వాతావరణంతో కూడుకొని ఉన్నది. మరొక చోట మేఘాలు భయంకరంగా శబ్దాలు చేస్తూ అతి తీవ్రంగా వర్షిస్తున్నాయి. వేరొక ప్రదేశంలో యోగినులు (మంత్రగత్తెలు) ఉన్మాద రౌద్ర వృత్తులతో కూడి వర్తిస్తున్నారు. ఒకచోట దైత్యుల నగరాలు గంధర్వ నగరాలను వేగంగా ఢీకొనటం, దానితో ఆ గంధర్వ నగరాలు అందులో గంధర్వ జనులతో సహా ఆకాశంలోకి ఎగిరెగిరి పడుచుండటం కనిపించింది. ఇంకొక చోట గ్రహములు అటూ ఇటూ పక్షులలాగా ఎగురుచున్నాయి. ఒక చోట నక్షత్ర సమూహంచేత ఆ ప్రదేశమంతా వ్యాకులమై ఉన్నది. ఒక ప్రదేశం రకరకాల పక్షులతో పరిపూర్ణమై ఉన్నది. మరొక చోట హింస- హత- రోదన గావుకేకలు పిచ్చి కేరింతలు వంటి ఏవేవో దుశ్శకున శబ్దములతో పూర్ణమై ఉన్నది. ఇంకొక చోట పిశాచాలు మొదలైన భయంకరాకారములు కలిగిన ప్రాణిసమూహాలు యథేచ్చగా అటూ ఇటూ సంచరిస్తున్నాయి. ఒక చోట అనేక నగరాలు, ఆ నగరములలో అనేక సంరంభములతో అల్లకల్లోలంగా ఉన్నది. ఒక ప్రదేశమంతా సూర్యరథంచే ఆక్రమించబడి ఉన్నది. వేరొక చోట చంద్రుడు, శుక్రుడు, గురుడు మొదలైన గ్రహముల రథముల రాకపోకలతో, విన్యాసాలతో కూడుకొని ఉన్నది. ఒక ప్రదేశం సూర్య తాపం కొద్దికొద్దిగా అధికమైపోతూ ఉండగా, ఆ తాపానికి క్రమక్రమంగా అనేకమంది జీవులు వినాశనం పొందుచూ కనిపించసాగారు. మటొక ప్రదేశంలో చంద్రకళలు ప్రవేశించటంచే ప్రశాంతంగా ఉన్నది. ఇంకొక చోట భూత-ప్రేతములు అనేక హింసాక్రియలు నిర్వర్తిస్తుంటే, ఆ ప్రదేశం భయంకరంగా ఉన్నది. ఒకానొకచోట అగ్నియొక్క ఉష్ణత్వముచే అతి తీక్షణంగా ఉన్నది. ఇంకొక చోట బేతాళములు నివసిస్తున్నాయి. వేటొక చోట భారీ శరీరములు గల పక్షులు వసిస్తున్నాయి. ఒక చోట ప్రళయ మేఘాలు. ఇంకొక చోట ప్రళయకాల ప్రచండ అగ్ని-వాయు వీచికలతో నిండి ఉన్నాయి.

నేను ఆ ప్రాణి సమూహాలన్నీ వదిలి అతి దూరంగా పయనించాను. అట్లా వెళ్ళి వెళ్ళి “అతి విశాలము, అత్యంత శూన్యము” అగు ఒక నిర్జన ప్రదేశంలో ప్రవేశించాను.


Page number:4

అక్కడ కలలో కూడా ఒక్క ప్రాణి లేదు. అయితే ఆ ప్రదేశంలో ఎక్కడి నుండో మెల్లగా వాయువు వీస్తోంది. అక్కడ ఎట్టి శుభ-అశుభ శకునములు లేవు. ఆ ప్రదేశం ప్రపంచ జీవులకు సాధారణంగా అప్రాప్యమైనది. అక్కడ నా మనఃసంకల్ప బలంతో ఒక కుటీరం నిర్మించాను. నాచే నిర్మించబడిన ఆ కుటీరం కమలం యొక్క మొగ్గలాగా అతిసుందరంగా ఉన్నది. గోడలకు రంధ్రాలు లేవు. లో భాగాలన్నీ స్వయంప్రకాశవంతమై ఉన్నాయి. ఆ అందమైన కుటీరమును నా సత్య సంకల్ప ప్రభావంతో నిర్మించాను సుమా! ఇక ఆ తర్వాత ఆ చుట్టు పక్కలకు ఏ సాంసారికమైన ప్రాణి రాకుండా చిత్తముచే సంకల్పించాను. ఇక అక్కడ కుటీరంలో సర్వ భూతములకు(జీవులకు) అగమ్యం అయినట్టి (చేరుటకు వీలుకానట్టి) “నిర్వికల్ప సమాధి” యందు సంస్థితుడనైనాను.

ఆ విధంగా నిర్వికల్ప సమాధిలో 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తరువాత ఎందుకో "సమాధి నుండి లేవాలి" - అనే ఒక ఆలోచన కలిగింది. అప్పటి దాకా పద్మాసనముపై కూర్చుని శాంతచిత్తుడనై మహామౌనమును అవధరించి సమాధి స్థితిని అనుభవిస్తున్నాను కదా! అప్పటి వరకు గాఢనిద్ర యందు ఉన్నవాని వలె నిశ్చలముగాను, ఆకాశం వలె నిర్మలంగాను, చిత్రంలో చిత్రింప బడిన మనుజుని వలెనూ, నా నిర్వికల్ప సమాధి కొనసాగింది. అయితే ఎప్పుడైతే "ఈ సమాధి నుండి లేచెదనుగాక” అనే స్పురణ కలిగిందో, అప్పుడు ముకుళించుకొన్న నా చిత్తము “వాయువు - దిశలు” వలె వికసించసాగింది. ఈ చిత్తము చిరకాలం ఏ పదార్థమును ధ్యానిస్తుందో అద్దానిని అది తక్షణం గాంచుతుంది కదా! అప్పుడు 'బోధ’ అంకురించసాగింది. 'వ్యుత్థానం' నిమిత్తమై ‘కర్మవీచిక’ నా హృదయమున ఉదయించి విస్తార మొందసాగింది. ఇక నాయొక్క జీవ చైతన్యము వృత్త సహితమై ప్రబుద్ధం కాసాగింది.

సమాధిలో గడిపినట్టి ఆ నూరు సంవత్సరములు నాకు మాత్రం ఒక్క నిమిషం లాగా గడిచిపోయింది. ఎట్లా అంటావా? ఇందులో నీకు క్రొత్తగా చెప్పవలసిన విశేషం ఏమున్నది? ఏకాగ్రమైన చిత్తము కలవానికి సుదీర్ఘకాలం కూడా అత్యల్పంగానే తోస్తోంది కదా!

నేనిక సమాధి నుండి విరామం భావిస్తుండగా, ఒకానొక క్రమంగా నా యొక్క బాహ్య జ్ఞానేంద్రియాలు కూడా వికసించసాగాయి. ప్రాణ వాయువులు దేహమంతా ప్రసరించి పరిపూర్ణం చేయనారంభించాయి. నెమ్మదిగా ఇంద్రియ వృత్తులతో కూడి జీవచైతన్య సహితుడనైనాను. అప్పుడు నా వద్దకు ‘ఇచ్ఛ’ అనే పత్నితో కూడిన 'అహంకారం' అనే పిశాచం ఎక్కడి నుండో వచ్చి చేరింది.

❖❖❖

Ⅴ-2.) అహంకారం యొక్క అసలు రూపం

శ్రీరాముడు :

త్వామపి ఉదిత నిర్వాణం అహంకార పిశాచకః ।
బాధతే కిమపి? బ్రూహి, మునే! సందేహశాంతయే ॥


Page number:5

హే మహర్షీ! మీరు చెప్పింది వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. నిర్వాణ స్థితి సంపాదించుకొని ఉన్నట్టి తమంతటి వారిని కూడా ఈ 'అహంకార పిశాచం' సమీపించి ఆవేశించగలదా? నా యొక్క సందేహ నివృత్తి కొరకై ఈ విషయం విశదపరచండి.

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఇటు జ్ఞానికైనా అటు అజ్ఞానికైనా కూడా... ‘అహంకారము’ అనేది లేకపోతే ఆ ఇరువురికీ కూడా 'శరీర స్థితి' సంభవించజాలదు. ఎందుకంటావా? ఒక వస్తువు ఉండటానికి ఆధారం అక్కడ ఉండాలి కదా! ఆధారం లేకపోతే ఆధేయ పదార్థస్థితి ఉండజాలదు కదా! కనుక, శరీరం నిలబడాలంటే దానికి ఆధారమైన 'అహంకారం' ఉండక తప్పదు. అయితే, జ్ఞాని - అజ్ఞానుల అహంకారం విషయంలో ఒక ప్రత్యేకమైన విశేషమున్నది. ఆ విశేష తత్వమేమిటో వింటే చిత్త విశ్రాంతి కలుగుతుంది. అహంకార పిశాచం తొలిగిపోతుంది కూడా! కనుక చెబుతాను, విను.

అహంభావ పిశాచో అయమ్ అజ్ఞాన శిశునామునా ।
అవిద్యామాన ఏవాన్తః కల్పతస్థేన సంస్థితః ॥

వాస్తవానికి 'అహంభావం' అనేది లేదు. పసిపాప ఒక బొమ్మను చంకన పెట్టుకొని “నా బిడ్డ! పడిపోతాడేమో?” అని అనుకొంటుంది చూచావా? అట్లా ఒకానొక ఉద్వేగం ప్రారంభమౌతోంది. అట్లాగే, ఈ అహంభావ పిశాచం 'అజ్ఞానము' అనే బాలునిచే అంతఃకరణంలో కల్పించబడుతోంది. కల్పన చేత మాత్రమే అద్దానికి ఉనికి లభిస్తోంది. అయితే, దీపం దగ్గిర పెట్టుకున్న వానికి చీకటి సమీపించగలదా? ఏ జ్ఞాని 'విచారణ' అనే ఉద్యమాన్ని తన వెంట ఉంచుకొని ఉంటాడో అట్టి వానికి అజ్ఞానము- అహంకారముల ఛాయ కూడా సమీపించలేదు. అసలు అది ఉంటే కదా, లభించటానికి? జ్ఞానదృష్టిచే అది వాస్తవానికి లేదు.

యథాయథా విలోక్యతే తథా తథీవిలీయతే ।
ఇహ అజ్ఞాతా పిశాచికా తథా విచారితా సతీ ॥

ఎంతెంత వరకు విజ్ఞాన దృష్టితో విలోకనం చేస్తామో, అంతంత వరకు ఈ 'అహంకారం' విలీనమై ఆత్మకు అనన్యంగా రూపుదిద్దుకుంటోంది. 'విచారణ' యొక్క ఆధిక్యతను అనుసరించి ఈ అహంకార పిశాచి క్షయిస్తూ ఉంటుంది. ఒకనికి (తన బుద్ధియొక్క భ్రమచే) చీకట్లో అక్కడ ఖాళీ ప్రదేశమే అయినప్పటికి.... దేహ రహిత పిశాచం కనిపిస్తూ ఉంటున్నట్లు, మూల అవిద్య ఉన్నంత వరకు కార్య రూప అవిద్య ఉంటూనే ఉంటుంది. (కారణము “అజ్ఞానము”... కార్యము “అవిద్య”).

ఆకాశంలో ఉన్నది ఒక్క చంద్రుడే అయినప్పటికీ కంటి దోషం చేత రెండవ చంద్రుడు, ఆ రెండవ చంద్రునిలో రెండవ కుందేలు ఆకారం కనిపిస్తుంది. ఈ “సృష్టి" అనే ప్రదర్శనమంతా అజ్ఞానము చేతనే ఉత్పన్నము అగుచున్నందున వాస్తవానికి ఇది 'లేనిదే' అయి ఉన్నది. ఆకాశంలో వృక్షం ఉండటానికే అవకాశం లేదు. అనంతమగు ఆకాశంలో "నీ భాగం, నా విభాగం” అనేవి ఎక్కడుంటాయి? అట్లాగే అనంతమగు చిదాకాశంలో "నీవు - నేను - నీది - నాది”....అనేవి ఉండజాలవు. ఎక్కడైనా లభిస్తూ ఉంటే అది అజ్ఞాన భ్రమను కారణముగా కలిగి ఉన్నది.


Page number:6

ఆదిసృష్టి నిర్వికారమై ఉన్నది. ఇప్పుడు కూడా ఎప్పటియట్లే నిర్వికారమై ఉన్నదయ్యా!

మరి ఎదురుగా కనిపిస్తున్న ఈ జగత్తు, ఈ జగత్తును అనుభవిస్తున్న 'వ్యష్టి అహంకారం' మాట ఏమిటంటావా?

నిరాకారమగు బ్రహ్మం పంచేంద్రియాలకు, వాటిని సమన్వయపరిచి ఉపయోగించే మనస్సుకు కూడా అతీతమై, కేవలసాక్షి అయి ఉన్నది. మనస్సుతో కూడిన పంచేంద్రియాలకు “విషయం” అగుచున్న ఈ సాకార జగత్తునకు కారణం మనస్సుకు అతీతమగు బ్రహ్మం ఎట్లా అవుతుంది? అవదు. ఎందుకంటే, బీజం ఉన్నచోట ఆ బీజం వల్ల 'అంకురం' అనే కార్యం ఉత్పన్నమౌతోంది. ఎచ్చట బీజమే లేదో అచ్చట వృక్షం ఎట్లా ఏర్పడుతుంది? కారణం లేనిదే కార్యం ఏర్పడ జాలదు కదా! అంతటా ఆకాశమే అయి ఉండగా "ఇది తూర్పు ఆకాశం, అది పడమర ఆకాశం” ... అనేది ఎట్లా ఏర్పడగలదు చెప్పు? "అయినా తూర్పు-పడమర ఉన్నాయి కదా?"... అని అంటావా? అది 'సూర్యోదయం' అనే ఒక విన్యాసానికి భూమికి గల సంబంధం కావచ్చునేమోగాని, ఆకాశంలో 'దిక్కులు' అనేదాని స్వకీయమైన సత్త కాదు.

సంకల్పముచే ఆకాశంలో (జ్ఞప్తి రూప) వనములు కనిపించునట్లు... ఈ జగత్తు సంకల్పమయం మాత్రమే! పదార్థముగా కనిపించేది కూడా పదార్థ భావన యొక్క స్థూలానుభవం మాత్రమే! అందుచేతనే ఒకే రూపం ఒక దేహికి ప్రియంగాను, మరొకరికి అప్రియంగాను, ఇంకొకరికి ఉదాసీనంగాను అనిపించటం జరుగుతోంది. అంతేకాదు. ఈ విధంగా, ఈ జీవుడు "జగత్తును పొందటం" అనేది సందర్భ చమత్కారమేగాని, వాస్తవ స్వభావం కాదు.

“సృష్ట్యాది” యందు ఏ నిష్కంటకమగు 'బ్రహ్మాండం' యొక్క స్థితి అనుభూతమగుచున్నదో... అది కూడా శూన్యమాత్రమే అయి ఉన్నది. వాస్తవానికి ఈశ్వరుడు సృష్టి యొక్క విషమత్వము లేనివాడు. చిదాకాశస్వరూపుడు. చైతన్యమయుడు. అట్టి ఈశ్వరుడే స్వకల్పిత స్వభావపూర్వకంగా తనయందు సృష్టిరూపంగా భాసిస్తున్నాడు. 'అహంకారము' ఈశ్వర స్వరూపమే గాని ఈశ్వరునికి అనన్యమైనది కాదు.

ఇందుకు దృష్టాంతం - ప్రతి రోజు ప్రతి జీవికి అనుభవమయ్యే స్వప్నవృత్తాంతమే. స్వప్నంలో పర్వతాలు, నదులు, జీవులు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి. వాటన్నిటి యొక్క అసలు రూపం ఏమిటి? స్వప్నద్రష్ట చైతన్యమే, ఆయా వివిధ రూపములుగా స్ఫూర్తిస్తోంది కదా! అనగా, స్వప్నమునందు చైతన్యం యొక్క స్వభావముచేతనే సృష్టి ఉన్నట్లే భాసిస్తున్నది. అదే రీతిగా సృష్ట్యాదియందు చిదాకాశమున ఈ సృష్టి వాస్తవానికి లేకపోయినప్పటికీ, ఉన్నట్లే భాసిస్తోంది.

సృష్టికి మునుముందే ఏ విషయజ్ఞానాతీత - శుద్ధ - జన్మాదిరహిత - అవ్యయ - అనాది అనంతమైనట్టి ఆత్మతత్త్వము అప్రతిహతంగా ప్రకాశించి ఉన్నదో, ఆ అప్రతిహత ఆత్మప్రకాశమే సృష్టి సమయంలో కూడా ఈ అహంకారము - జగత్తు మొదలైన వాటితో కూడిన సృష్టి రూపంగా భాసిస్తోంది, సృష్టి రూపంగా స్థితినొంది ఉన్నదంతా అదే! ఇక్కడ వాస్తవానికి సృష్టిగాని, పృథివి మొదలైన గోళములు గాని లేవు.


Page number:7

అంతా కూడా... "సర్వం శాంతం అనాలంబం బ్రహ్మైన బ్రహ్మిణి స్థితమ్"  - శాంతము, నిరాలంబనము అగు బ్రహ్మమే బ్రహ్మమునందు స్థితి కలిగి ఉన్నది. కనుక, 'అహంకారం' అనేది బ్రహ్మము యొక్క (లేక) ఈశ్వరుని యొక్క ఒకానొక ప్రదర్శనా చమత్కారం మాత్రమే!

ఓ రామచంద్రా! మరల మరొకసారి క్రోడీకరించి సిద్ధాంతపూర్వకంగా ప్రకటన చేస్తూ చెప్పుచున్నాను, విను.

సర్వశక్త్యాత్మ తత్ బ్రహ్మ యథా కచతి యాదృశమ్ ।
రూపమత్యజదేవాచ్ఛం తథా భవతి తాదృశమ్ ॥

బ్రహ్మం సర్వశక్తిమంతం. అట్టి బ్రహ్మం ఎట్లు ఎచ్చట స్ఫూర్తించనెంచుతుందో, అట్లట్లు తన శుద్ధరూపాన్ని ఏమాత్రం త్యజించకుండానే సృష్టి మొదలైన రూపాలుగా అగుచున్నది. స్వప్నద్రష్ట యొక్క చైతన్యం యథాతథంగా ఉంటూనే స్వప్నంలో అనేక పదార్థముల - వ్యక్తుల కల్పనారూపం పొందుచుండటమే ఇందుకు మనకు దృష్టాంతం. ఈ స్వప్న ద్రష్టలాగానే... సృష్ట్యాదిలో ఈ జగత్తు కూడా చిన్మాత్రం యొక్క విలాసమే అగుచున్నది. నిర్మలమగు ఆకాశంలో 'నీలివర్ణం' అనే చిత్రం కనిపించటంలేదా? అట్లాగే శుద్ధాకాశమున అద్దాని స్వభావమే... ఆ చైతన్యం యొక్క భావన చేత సృష్టి రూపంగా స్ఫురిస్తోందని గ్రహించవలసినదిగా సర్వ సహజీవులకు నా విన్నపం.

“భావించునది – భావించబడునది - భావన" ఈ త్రిపుటి రూపాల యొక్క నిరంతర ఉత్పత్తి మొదలైనవన్నీ ... చిదాకాశమే తనలో తాను ఆ విధంగా స్థితి కలిగి ఉన్నది. కనుక చిదాకాశమే 'అహంకారం' రూపంగా కూడా తనలో తాను ప్రదర్శితమగుచున్నది. చిదాకాశమే చిదాకాశంలో స్థితి కలిగి ఉండగా ఇక సృష్టి ఎచట? అవిద్య, అజ్ఞానాలెచట? అహంకారం మొదలైనవి ఎచట?...

అంతా కూడా శాంతము, చిద్ఘనము అయినట్టి బ్రహ్మమే అయి ఉన్నది!

ఓ రామచంద్రా! ఈ విధంగా అహంకారము యొక్క వాస్తవ స్వరూపం ఏమై ఉన్నదో... నీకు వచించాను.
↳ “అహంకారం స్వతహాగా లేదు. ఆత్మయే అహంకార రూపంగా ప్రదర్శిత మౌతోంది” అని గ్రహించుటయే అహంకారం యొక్క ప్రశమనం.
↳ ఎఱుగబడిందా, ఈ అహంకారం బాలుడికి కనబడే పిశాచం (వెలుతురు ఏర్పడగానే) తొలగిపోవుచున్నట్లు తొలిగిపోతుంది.

ఈ అహంకార పిశాచం యొక్క రూపం ఏమిటో పూర్ణముగా నేను ఎఱిగి ఉండటం చేత... అది నాకు ఉన్నప్పటికీ నిష్ఫలమైనదే అవుతుంది. ఆ 'కనబడేది గోడపై రంగులతో లిఖించబడిన అగ్ని చిత్ర లేఖనమేగాని నిజమైన అగ్ని కాదు' అని ఎఱిగిన తరువాత ఇక ఆ అగ్ని వల్ల చర్మం కాలుతుందేమోనన్న శంక ఎందుకుంటుంది? ఎఱుగబడిన తరువాత అహంభావం, సృష్టి మొదలైనవన్నీ నిష్ఫలమే అవుతాయి. అవి ఉన్నా, ఉండకున్నా ఆత్మ యథాతథమేనని మేము గమనించియే ఉంటున్నాం. ఈ ప్రకారంగా అహంకారం యొక్క “త్యాజ్యస్థితి” (నిర్వికల్ప సమాధి) యందు, “గ్రాహ్యస్థితి” (వ్యవహారస్థితి) యందునూ కూడా నాకు సమత్వమే ఏర్పడి ఉంటోంది. మేఘాలు లేనప్పుడూ, మేఘాలు ఉన్నప్పుడూ కూడా ఆకాశం సర్వదా ఆకాశంగానే ఉంటోంది కదా! సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నాయొక్క స్థితి సమముగానే ఉంటున్నదగుచున్నది.


Page number:8

అహంభావస్య నైవాహం నా అహంభావో మమేతి చ ।
తేన విద్ధి చిదాకాశమేవేదమితి నిర్ఘనమ్ ॥

“నేను అహంభావానికి చెంది ఉండలేదు. అహంభావము నాకు చెంది ఉండలేదు” అని సునిశ్చితం చేయి. అహంకారంతో సహా, ఈ సర్వజగత్తును "చిదాకాశ ఘనము”గా ఎఱుగుము.

నా దృష్టిలో 'అహంభావము - జగత్తు' మొదలైనవి ఎట్లా లేవో... అట్లాగే ఈ సభలోని తదితర జ్ఞానుల దృష్టిలో కూడా అవి లేకయే ఉన్నాయి.

చిత్రపటంలో సెలయేరును చూచి 'ఆ జలం నా ఆర్తిని (దాహాన్ని) తొలగిస్తుందేమో'... అని ఆశించేవారు బాలురేగాని, జ్ఞానులు కాదు. ఈ జగత్తు, అహంకారాలను “ఉన్నాయి”... అని అనటం చిత్రపటంలోని అగ్నిని ఉపయోగించి వంట చేయటానికి ఉపక్రమించటం వంటిదే అవుతుంది.

నాఽహమస్మి ! న చ అన్యోఽస్థి ! “సర్వం నాస్తి” ఇతి నిశ్చయే ।
ప్రకృత వ్యవహారస్త్వం శిలామౌనమయోభవ ॥

ఓ రామచంద్రా! “వాస్తవానికి, 'నేను' గాని, మరొకడు గాని, ఈ సమస్త బ్రహాండములు గాని లేవు”... అను నిశ్చయం కలిగి ఉండు. ఇక ఆపై యథాప్రాప్తమగు వ్యవహారం ఆచరిస్తూనే అంతరమున మౌనం వహించి ఉండు. ఆ విధంగా చిరకాలం దృశ్యభావమునంతటినీ తొలగించు కుంటూ శిలామధ్యభాగంలాగా చిద్ఘనరూపుడవై ఉండు. ఆకాశం వలె నిర్మలమైన ఆకృతితో 'స్వాత్మ' రూపముననే స్థితి కలిగి ఉండు. ఎందుకంటావా? ఈ సృష్టికి ముందు, ఈ సృష్టి కాలంలో, ఈ సృష్టి శమించిన తరువాత కూడా సర్వవేళలా ఈ సమస్తం చిన్మయమగు శివరూప బ్రహ్మమే అయి ఉన్నది. "దృశ్య ప్రపంచం” అనునదేదీ లేదు.

✤✤✤

Ⅴ-3.) 'సర్వత్రా' ఉండి కూడా స్వతహాగా లేని సృష్టి శోభ

శ్రీరాముడు :  ఆహాఁ ! మహాత్మా! మాయొక్క జ్ఞానైశ్వర్యము కొఱకే మీరు ఇట్టి గంభీరమునిర్మలము-విపులము-నిశ్చలము- విశాలము అయినట్టి “ఆత్మదృష్టి" గూర్చి మరల మరల పలుకుచున్నారు. మునీంద్రా! మీరు చెప్పినదంతా పరమ సత్యమే!

సర్వథా సర్వదా సర్వం సర్వం సర్వత్ర సర్వదా ।
“సత్” ఇత్యేవ స్థితం సత్యం సమం సమనుభూతితః ॥

“సర్వ విధాలుగా–సర్వవేళలా-సర్వం-అంతటా అన్ని సమయాలలోనూ ఇదంతా సద్రూప మగు బ్రహ్మమే" అని సెలవిచ్చారు కదా! అది సత్యమే. అట్లా ఎవరికైనా అనిపించకపోవటానికి కారణం ‘విచారణ-అనుభవం’ తగినంతగా లేకపోవటం చేతనే. విచారణ-అనుభవాలచే ఇదంతా అట్టి ఏకరసమగు చిన్మాత్రంగానే ఒప్పుచున్నది స్వామీ! వేదాంత వాఙ్మయంలో “అంతా పాషాణ మాత్రమే" అని అంటూ ఉన్నారు కదా! హే బ్రహ్మజ్ఞా! మాకు మరింతగా బ్రహ్మజ్ఞానం అనుభవమయ్యేందుకుగాను మీరు ప్రారంభించిన "పాషాణాఖ్యాయిక” కొనసాగించమని నా విన్నపం.


Page number:9

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! అట్లే అగుగాక! 

“పాషాణాఖ్యాయిక” అను ఈ మన వర్తమాన విశేష సంవాదమునందు 'సర్వత్రా సర్వదా సర్వం సద్రూపమే' అను సిద్ధాంతం ప్రతిపాదించబడుతోంది.

అట్టి పాషాణదృష్టాంతం గురించి చెపుతాను... విను.

“రంధ్రములు లేనట్టి ఘనమైన శిలయొక్క మధ్యభాగంలో శిలారేణువులు అకారాదులతో ఉండి ఉన్నట్లుగా... అధిష్టానమై చెన్నొందుచున్న పరబ్రహ్మము నందు (శిలాంతర్భాగ శిలారేణువుల లాగా) ఈ అనేక బ్రహ్మాండములు ఉంటున్నాయి”... అని ఈ అఖ్యాయిక నిరూపిస్తోంది.

అట్లే, “మహత్తరము, స్వరూపతః శూన్యము అయిన భూతాకాశంలో అసంఖ్యాక సృష్టులు ఉన్నాయి. ఒక విత్తనంలో, ఒక లతలో, ప్రతి ఒక్క ప్రాణిలో, జడవస్తువులో, వాయువులో, అగ్నిలో, జలంలో, ఆకాశంలో, ఒక అణువులో కూడా... అనేక సృష్టులు ఉన్నాయి”... అని కూడా ఈ అఖ్యాయిక నిరూపిస్తోంది.

శ్రీరాముడు : స్వామీ! 'ఒక రాయిలో, గోడలో, లతలో కూడా అనేక సృష్టులు ఉన్నాయి'... అని ఇప్పుడు అంటున్నారు కదా! మరి "చిదాకాశమునందే సమస్త సృష్టులు భాసిస్తున్నాయి”... అను మీ ఇతఃపూర్వపు వాక్యమునకు, ఇప్పటి ఈ మీ వాక్యమునకు సమన్వయం ఎట్లా? 

శ్రీవసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఈ కనిపించే సృష్టి విషయమై... 'చిదాకాశమే చిదాకాశమున ఇట్లు సృష్టి రూపంగా కనిపిస్తోంది”... అనునది పరమసత్యం. అదియే ముఖ్యమైన పక్షము కూడా. గోడ - లతగా కనిపించేదీ చిదాకాశమే! అందులో గల సృష్టులు చిదాకాశమే! ఇది ఇట్లుండగా, అసలీ దృశ్యము ‘ఆది’ యందు ఉత్పన్నమే కాలేదు సుమా! మొదలే ఉత్పన్నం కానిది ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది? కనుక అది ఇప్పుడు కూడా ఉండి ఉండలేదు. ఉన్నది బ్రహ్మము మాత్రమే! అయితే ఆరోప దృష్టికి ఆరూఢమై ఈ ఈ భౌతికమగు పృథ్వి - జలము మొదలైనవి అగుపిస్తున్నాయి. అట్టి ఆరోపిత దృష్టికి అనుభవమయ్యే సృష్టులు పృథ్వి యొక్క ప్రతి అణువు నందు (సృష్టిసమూహములు) అనుభవించబడుచున్నాయి. ఎవరికి? ఆరోపిత దృష్టి కలిగియున్న జీవులకు! అపవాద దృష్టిచే వీటన్నిటి వాస్తవరూపం గమనించబడినప్పుడు ఈ 'పృథివి' అనబడేది అణు మాత్రంగాకూడా లేదు. అందులో అణువులూ లేవు, ఆ అణువులలో సృష్టులూ లేవు. అవన్నీ కూడా వాస్తవానికి చిదాకాశరూపమగు బ్రహ్మమే అయి ఉన్నాయి.

అట్లాగే... జలము-అగ్ని-వాయువు-ఆకాశం-పంచభూత కలయికలచే ఏర్పడే పదార్థాలు, బ్రహ్మదేవుని "సూక్ష్మభూత ఉపాధి”యగు “సమష్టి అహంకారాలు-సమష్టి చిత్తములు, -సమష్టి బుద్ధులు-సమష్టి మనస్సులు”... ఇవన్నీ కూడా ఆరోప - దృష్టిచే అణువణువునా ఉన్నాయి. ప్రతి అణువు అనేక బ్రహ్మాండాలు కలిగి ఉన్నది. అందులోని ప్రతి బ్రహ్మాండంలోని ఆయా పంచభూత ప్రపంచపు అణువణువులో మరింకెన్నో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి.


Page number:10

అపవాద దృష్టిచే (బ్రహ్మాండాలు... అనునవి విభాగించి 'అవన్నీ ఏమిటి?' అని పరిశీలించి చూచినపుడు) అవేవీ ఎక్కడా లేవు.

శ్రీరాముడు :  మరి బ్రహ్మమున మనకు కనిపించే సృష్టులు ఎట్లా వస్తున్నాయి? “బ్రహ్మం, సృష్టి” అను ఈ రెండింటికీ గల భేదమేమిటి?

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తున్నాను. విను.

“బ్రహ్మ -  సర్గాత్” తథా ఇత్యేష వాచి భేదో న వస్తుని ॥

'బ్రహ్మము' అని పిలవబడుదానికి, సృష్టి అని చెప్పబడుదానికి ఏమీ భేదం లేదు. ఒకవేళ “నాకు భేదం గోచరిస్తోంది కదా?”... అని నీవు అంటావేమో? ఏ భేదమైతే గోచరిస్తుందో ... అది వాచిక భేదమేగాని, వాస్తవానికి వస్తుతః ఆ రెండింటికీ భేదం లేదు.

సర్గా ఏవ పరంబ్రహ్మ పరంబ్రహ్మైవ సర్గతా ।
మనాగపి అస్తిన దైవమత్ర “అగ్ని - అర్కే” ఉష్ణ్యయోరివ ॥

ఈ సృష్టియే ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఈ సృష్టియే అయి ఉన్నది.

"ఉష్ణము” దృష్ట్యా అగ్నికి - సూర్యునికి భేదమేమున్నది? రెండూ ఉష్ణరూపములే కదా! “ద్రవత్వము” దృష్ట్యా జలమునకు - తరంగమునకు ఉన్న తేడా ఏమిటి? "వాయుత్వము దృష్ట్యా వాయువుకు - వాయు తరంగమునకు భేదమెక్కడ? అట్లాగే బ్రహ్మమునకు - జగత్తుకు భేదమేమీ లేదు!

సృజనము అను క్రియచే 'సృష్టి' అనేది (శబ్దం) ఏర్పడింది (సృజి...ఇతి క్రియేతి సృష్టిః); వర్ధనము అను క్రియచే ‘బ్రహ్మమ్' అనేది(శబ్దం) ఏర్పడుతోంది (బృం హి... ఇతి క్రియేతి బ్రహ్మమ్). ...ఈ రెండు క్రియలకు (సృజన క్రియ, వర్ధన క్రియ) పరస్పరం అభేదమే అయి ఉన్నాయి సుమా! పోనీ, ఒకదానిని 'ఆధారము' అని, రెండవదానిని 'ఆధేయము' అని అందామా? అట్టి ఆధార - ఆధేయముల తేడా ఉన్నదని గాని, లేదు అని గాని నిరూపించలేము. అందుకే, ఆ రెండింటికి ఉన్న భేదం అనిర్వచనీయం అని అంటూ ఉంటారు. కర్త కన్నా క్రియ వేరైన స్వరూపం కాదు కదా! (ఉదాహరణకు "అతడు పరిగెత్తుచున్నాడు”... అను దానిలో అతనిని, అతని పరుగుని వేఱుచేసి చూపలేం కదా!) అట్లాగే 'బ్రహ్మము' అను దానికి సృష్టికి వేరైన ఉనికి ఎక్కడా కనిపించదు. 'సృష్టి' అనునది భావనకు వేఱుగా ఏదీ ఉండటం లేదు.

అందుకే "సృష్టి-బ్రహ్మము అను ఉభయ శబ్దముల భేదం కొయ్య చీల్చుచున్నప్పుడు వచ్చే “పర్..ర్" శబ్దము వలె అర్థరహితం అని కూడా విజ్ఞులు అంటూ ఉంటారు.

ద్వైతము ("ఒకటి రెండుగా అగుచున్నది"); ఏకత్వము (“రెండూ ఒక్కటే అయి ఉన్నది”)... ఈ రెండు కనిపిస్తున్న ఏ వ్యవహార దశ అయితే ఉన్నట్లున్నదో, అది కూడా 'చిన్మాత్రము' యొక్క వివర్తనమే. అందుచేత అప్పుడు కూడా “సృష్టి, బ్రహ్మం" అను ఉభయ శబ్దములు, వాటి అర్థములు వేఱువేఱు కాదు. ఇట్లు ఈ సృష్టి బ్రహ్మమే అయి ఉండగా ...ఇక ఎవనికి ఎట్లు విభిన్న రూపములు భాసించగలవో చెప్పు?


Page number:11

కాబట్టి రామచంద్రా! నీవు సర్వదా జ్ఞానివై ఉండు. వ్యవహారంనందు ప్రవృత్తుడైనప్పటికీ జ్ఞానికి ఈ సమస్త జగత్తు 'శిల' వలె చిద్ఘనం - శాంతం - ఏకం - అద్యంతరహితం - నిర్మలం - నిర్వికారం -  మౌనస్వరూపం అగు బ్రహ్మంగానే ప్రకాశమానమగుచున్నది.

ఓ రాఘవా! ఈ “నీవు, నేను, పర్వత సమూహములు, దేవతలు, అసురులు” ఈ మొదలగు సమస్త దృశ్యమున్నూ కేవలం నిర్వాణరూపమగు 'చిదాకాశము' మాత్రమేనయ్యా! కాబట్టి, ఒకడు మేల్కొనిన తరువాత తను రాత్రి కలలో చూచిన దృశ్య వ్యవహార జాలమును ఎట్లు ఉద్దేశించి ఉంటాడో ...నీవు ఆ విధంగా ఈ జగత్తును వర్తమానంలోనే (స్వప్న సదృశ్యంగా) చూడు.

✤✤✤

Ⅴ-4.) అనేక కోటి బ్రహ్మాండ సమూహములు

శ్రీరాముడు :  మహర్షీ! మీరు అట్లు ఆకాశంలోని ఒకానొక ఏకాంత ప్రదేశంలో 'కుటీరం' కల్పించుకొని 100 సంవత్సరాలు గడిపానని, ఆ తరువాత జీవచైతన్య సహితులు కాగా, అప్పుడు ‘ఇచ్ఛ, అహంకారం’ అనేవి రెండు వచ్చి చేరాయని చెప్పారు కదా! ఆ తరువాత ఏమైందో చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇక విను, చెపుతాను.

క్రమంగా నేను సమాధి నుండి ప్రబుద్ధుడనై లేచాను. అప్పుడు అతి సూక్ష్మమైన ఏదో ‘ధ్వని’ నా చెవులకు వినిపించింది. ఆ ధ్వని అల్పంగా వ్యక్తమైన ఏవో పదాలతో కూడుకొని అతి మనో హరంగా ఉన్నది. అయితే ఆ సన్నగా వినబడే మాటలకు అర్థమేమిటో ఏమీ తెలియలేదు. ఆ వినబడిన శబ్దాన్ని బుద్ధితో పరిశీలిస్తే ఆ ధ్వని ఒక స్త్రీ కంఠం నుండి వెలువడినట్లు నాకు అనిపించింది.

ఆ ధ్వనిని విన్న నేను “ఆ ధ్వని ఎవరిది? ఎటువైపు నుంచి వచ్చింది?” అని పరిశీలించసాగాను. అది అతిమధురమైన ఏదో ఆలాపనలాగా ఉన్నది కాని... అది 'రోదన' వలె లేదు. పఠనం వలె కూడా లేదు. అది కమలంలో ఉన్న భ్రమరం చేసే శబ్దంలాగా ఉన్నది. అయితే ఆ ‘ధ్వని’ అత్యంత మృదుమధురంగా ఉన్నదని అనిపించింది. "ఆ ధ్వని ఎటునుంచి వచ్చిందా?” అని కొంచెం ఆశ్చర్యంతో దశదిక్కులా పరికించి చూచాను. నాకు ఏమీ అగుపించలేదు. అప్పుడు నేను ఇట్లా అనుకున్నాను.

“చాలా ఆశ్చర్యంగా ఉన్నదే! సిద్ధులు కూడా వచ్చుటకు అవకాశము లేనంతగా లక్షల కొలది యోజనములు అతిక్రమించి ఈ ఆకాశవిభాగం స్థితి కలిగి ఉన్నది కదా! అటువంటి ఈ ఏకాంత స్థానంలో స్త్రీ గొంతును బోలిన శబ్దం ఎలా సంభవించింది? ఎంతో ప్రయత్నించి కూడా ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో ... అవలోకించలేకపోయానే? ఈ నా ఎదురుగా "అనంతము, మహా శూన్యము, నిర్మలము” ... అయినట్టి ఆకాశం తప్పితే మఱింకేమీ లేదు కదా! ఇక్కడ ఒక్క ప్రాణి కూడా ఉండటానికి అవకాశమే లేదు. మరి ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చినదబ్బా?”


Page number:12

ఇట్లా ఆలోచిస్తూ నేను మఱల మఱల పది దిక్కులలోకి మార్చి మార్చి దృష్టి సారించి చూచాను. ఎక్కడా ఏదీ కనిపించనేలేదు.

అప్పుడు నేను ఇట్లా భావించాను. “సరే! ఈ వర్తమాన ఉపాధిని త్యజించి చిదాకాశ రూపుడనయ్యెదను గాక! ఆ చిదాకాశమునందు అధ్యస్తమైయుండే 'అవ్యాకృతాకాశము'తోటి ఏకత్వము సంతరించుకొంటాను గాక! ఆ వ్యాకృతాకాశము యొక్క గుణము అయినట్టి శబ్దమును, ఆ శబ్దము యొక్క అర్థమును ఆ ఆకాశకోశమున అనుభూతం చేసుకొనెదనుగాక! నా ధ్యానబలంతో ఈ దేహాకాశమును ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడే స్థాపించి ఉంచి చిదాకాశరూపుడనై... జలబిందువు జలముతో ఐక్యము పొందినట్లుగా... అవ్యాకృతాకాశముతో ఐక్యము పొందెదను గాక!

ఇట్లా అనుకున్నవాడనై దేహమును త్యజించుటకై అక్కడే పద్మాసనం అవధరించాను. సమాధిని శీలించుటకై మఱల కనులుమూశాను. ఆ తరువాత ఇంద్రియ సంబంధములైన శబ్ద-స్పర్శ–రూప-రస-గంధాది బాహ్య విషయములన్నీ త్యజించాను. అటుపై అభ్యంతరములైన ‘సంకల్పములు’ మొదలైనవాటిని కూడా వదిలివేశాను.

అప్పుడు “చైతన్యస్ఫురణ”చే  “చిత్తాకాశరూపుడను" అయ్యాను. క్రమంగా, ఆ చిత్తాకాశ రూపం కూడా త్యజించి "బుద్ధి రూపం”ను పొందాను. ఆ తరువాత ఆ బుద్ధి రూపమును కూడా త్యజించి కేవలం ‘జగత్సమూహమునకు దర్పణం’ అనదగు అనంతమగు "చిదాకాశము”ను అయ్యాను.

అటు తరువాత... “జలం” అనే శబ్దంలో సముద్రజలం, నదీజలం, తటాకజలం, నూతిజలం మొదలైనవన్నీ ఏకరూపం పొందుతాయి కదా! సామాన్య “సుగంధం”లో అన్ని ప్రత్యేక సుగంధాలు ఏకమై ఉంటాయే! ఆ విధంగా నేను ఆ 'చిదాకాశ స్వభావము’చే “భూతాకాశరూపము”ను పొంది దానితో ఏకత్వం సంచరించుకున్నాను.

ఇక ఆపై, ఏ చిదాకాశము సమస్తమునందు వ్యాపించి “అనంతము సర్వ వ్యాపకము” అయి ఉన్నదో... అది నేనయ్యాను. అనగా నేను సమస్తమునందు వ్యాపించి, అనంతుడనై సర్వ ఆధారునిగా నా స్వరూపమును పొందినవాడనై సర్వవ్యాపక అనుభవం పొందుచున్నవాడనైనాను. ఆకార రహితుడను - ఆధారవర్జితుడను అయి ఉంటూనే, అదే సమయంలో సర్వ పదార్థములకు ఆధారభూతుడనైనాను.

అట్టి స్థితియందు నేను నా చిదాకాశదర్పణ దేహంలో అనేక త్రైలోక్య సమూహములను, వందలకొలది జగత్తులను, లెక్కించుటకు అలవికాని బ్రహ్మాండాలను వీక్షించాను. అయితే, ఆ బ్రహాండాలన్నీ కూడా అన్యోన్య దృష్టికి (ఒకదానిచే మరొకటి) నిర్మల వ్యాకృతాకాశ రూపములుగానే ఉంటున్నాయి. అనగా, ఒక బ్రహ్మాండంలోని జనులకు రెండవ బ్రహ్మాండము వాస్తవానికి లేనిదిగా శూన్య మాత్రంగా ఉంటోంది. కాబట్టి, ఆ బ్రహ్మాండాలు శూన్యములు - అశూన్యములు కూడా!


Page number:13

చిదాకాశమున అనేక బ్రహ్మాండములు అనుక్షణం ఉత్పత్తి అవుతున్నాయి. ఇంతలోనే అనేక బ్రహ్మాండములు ప్రవృద్ధమౌతున్నాయి. ఇంకా ఎన్నో జగత్తులు నదీ ప్రవాహంలాగా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎన్నో విద్యమానమైనములై ఉన్నాయి. మరెన్నో ఉత్పన్నములు కాబోతూ ఉన్నాయి. అక్కడి శూన్యాకాశంలో వివిధ జనులతో కూడిన జగత్తులు అసంఖ్యాకంగా కనిపించాయి. మనోరాజ్యములవంటి, చిత్ర సమూహములవంటి అనేక బ్రహ్మాండములు కనిపించాయి.

కొన్నింటికి ఆవరణములు లేవు. మరికొన్నిటికి అసంఖ్యాకములైన ఆవరణములు (ఉదాహరణకు భూతావరణ, మనో ఆవరణ చిత్తావరణ మొదలైనవి) ఉన్నాయి. కొన్ని 5 ఆవరణలు మరికొన్ని 7 ఆవరణలు కలిగి ఉన్నాయి. కొన్ని పంచీకృత + అపంచీకృత 5+5=10 ఆవరణలతో కూడి ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ఆవరణం కేవలం శబ్దమయం. మరొక ఆవరణం కేవలం స్పర్శమయం ఇట్లా - కొన్ని బ్రహ్మాండాలు ప్రకృతి అహంకారము మహత్ మొదలైన 14 ఆవరణాలు కలిగి ఉన్నాయి.

ఇంకా కొన్ని (సాంఖ్యశాస్త్ర ప్రవచనానుసారం) 24 తత్త్వములు, 36 తత్త్వములు (శైవ మతానుసారం) ఆవరణములుగా కలిగి ఉన్నట్లు నాకు కనిపించాయి. కొన్ని జగత్తులు శూన్యమాత్రంగా ఉన్నాయి. మరికొన్ని జగత్తులు వివిధ ప్రాణులతో నిండి ఉన్నాయి. కొన్ని పంచ భూతమయములు. ఇంకొన్ని పంచభూతములలో ఒక్కొక్కదానితో మాత్రమే నిండి ఉన్నాయి. (ఉదాహరణకు, సూర్యగోళం కేవలం అగ్నిమయం, అంగారక గ్రహం-రాతిమయం... ఇట్లా!)

కొన్ని పంచభూతాలు, దిక్కులు, కాలము ...ఇట్లా సప్తమహాభూతాలతో కూడి ఉన్నాయి. కొన్ని లోకాలలో ఒకే జాతి జీవులు మాత్రమే ఉన్నారు. ఈ మానవుని జీవ దశలకు (బాల్య యౌవన వార్ధక్యాలకు) విరుద్ధమైనట్టి దశలుగల విద్యాధరులతో నిండి కొన్ని జగత్తులున్నాయి. అక్కడి జీవుల జన్మలు వార్ధక్యంతో ప్రారంభంమై బాల్యవస్థతో ముగుస్తోంది.

కొన్ని జగత్తులు ప్రళయ సుషుప్తులనుబోలి నిర్మానుష్యమై ఉన్నాయి. కొన్ని లోకాలలో ఒక్క ప్రభువే అధిష్ఠాన దేవత అయి ఉన్నాడు. మరికొన్ని వివిధ అధిష్ఠాన దేవతల ఆరాధనతో కూడి ఉన్నవి. కొన్ని జగత్తులు వైరాగ్యమును బోధించే వేదాంత శాస్త్రములు, ఆత్మజ్ఞాన శాస్త్రపాఠములు సర్వ ప్రసిద్ధిమై ఉంటున్నాయి. కొన్ని జగత్తులలో అట్టి వేదాంత శాస్త్రం యొక్క ప్రసిద్ధతయే లేదు. వాటి పాఠము - చర్చ మొదలైనవి అగుపించటమే లేదు.

కొన్నిటిలో జీవులు మేడిపండులోని పురుగులవలె అనేక కార్య సంరంభములలో మునిగి - తేలు చున్నారు. మరికొన్నిటిలో నిత్యం నిద్రాపరవశులై ఉంటున్నారు. కొన్ని లోకములలో బ్రాహ్మణాది జాతులచే వంశపారంపర్యంగా నిర్దేశించే శాస్త్ర ఆచార - విచారాదులు మాత్రమే అనుసరించబడుతూ కనిపించాయి. మరికొన్ని లోకములలో ఎవరికి వారే (శాస్త్రానుసారంగా కాకుండా) స్వయం నిర్ణయాభినివేశంతో వర్తిస్తున్నారు.

కొన్ని కేవలం జలం, కేవలం వాయువుచే పూర్ణమైయుండగా మరికొన్ని పంచభూతములు లేకుండా ‘ప్రజ్ఞలు’ మాత్రమే ప్రవర్తిస్తున్నాయి. కొన్ని నిరంతరం ఎక్కడా ఒక్కచోట ఉండకుండా ఆకాశంలో అటూ ఇటూ సంచరిస్తున్నాయి.


Page number:14

కొన్ని పుడుతున్నాయి. కొన్ని ప్రవృద్ధమౌతున్నాయి. కొన్ని అనేక భోగాలతో కూడి ఉన్నాయి. కొన్నిటిలో దేవతలు మాత్రమే ఉన్నారు. కొన్ని అసురులతో నిండి ఉన్నవి. కొన్ని అల్ప బుద్ధ జీవులైన క్రిమి-కీటకములతో మాత్రమే నిండి ఉన్నవి.

అరటి పట్టలు ఒకదానిలో మరొకటి ఉంటుంది కదా! అట్లా బ్రహ్మాండంలో అనేక అణువులు, ఆ అణువులతో బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండములలో అణువులు... ఇట్లా అంతు కనబడనంతగా ఉన్నాయి. కొన్ని బ్రహ్మండములు ఒకే తరుణంలో ఒకేచోట ఉత్పన్నమౌతూకూడా ఒకదానితో మరొకటి ప్రక్కప్రక్కన నిదురించే సైనికుల స్వప్నముల వలె - సంబంధం లేకయే ఉన్నాయి.

ఓ రామచంద్రా! ఆ జగత్తులు (లేక బ్రహ్మాండాలు) అన్నీ కూడా వేర్వేరు క్రియలు, వేర్వేరు స్థితులు కలిగి ఉన్నప్పటికీ... ఆ వివిధ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా... “చిదాకాశరూపము” అయి ఉన్నాయి.

కొన్ని పరస్పరం శాస్త్రజ్ఞానమునకు లభ్యములగుచున్నాయి. (అనగా ఒక జగత్తులోని యోగ శాస్త్రజ్ఞానులకు మరొక జగత్తు కనిపించుచున్నది.) కొన్ని ఒకే రకమైన ఆకారాలు కలిగి ఉన్నాయి.

కొన్ని బ్రహ్మాండాలు పరస్పరం పరలోకములుగాను, పరస్పరం అంతర్ధాన శక్తితో కూడిన సిద్ధ నగరములు కలిగినవిగాను ఉన్నాయి. అనగా ఒకదానిలోని కొందరు జీవులు అక్కడ మాయమై మరొక దానిలో ప్రత్యక్షం కాగలుగుచున్నారు. కొన్ని పరస్పర భిన్న దశలు కలిగి ఉంటున్నాయి. అనగా ఒక జగత్తులోని జీవులు ఒక దశ తరువాత మరొక జగత్తులో ప్రవేశం పొందుచున్నారు. కొన్ని మరికొన్నిటికి సిద్ధనగరములవలె తపోధ్యానముల ఫలితంగా పొందబడుచున్నవగుచున్నాయి. కొన్ని భిన్న భిన్న దశలు కలిగి ఉంటున్నాయి. అనగా వర్తమానంలో ఒక దశలో ఉన్న జగత్తు కొంత కాలానికి మరొక జగత్శను పొందుచున్నది.

కొన్ని లోకములు ఈ మానవజాతికి అనుభవ ప్రయత్నములకు అలభ్యములై ఉంటున్నాయి. అవి ఈ జగత్తుకు అతి సమీపంగా వచ్చినప్పటికీ మావంటి తపోశాలురచే మాత్రమే గమనించబడుచూ... మేము వర్ణించి చెప్పినా కూడా ఈ జీవుల అనుభవమునకు అందనట్లుగా, విపరీత గాథలాగా ఉంటున్నాయి.

కొన్ని చైతన్యము అను సూర్యుని యందు గల పరమాణువులవలె ఉంటున్నాయి. కొన్ని బ్రహ్మాండములలో జీవులు మోక్షస్థితిని అనునిత్యంగా అనుభవిస్తూ ఉండటం చేత ఆ బ్రహ్మాండాలు 'మోక్షము' అనే పరదేవతకు కుండలాలవలె ఉన్నాయి. అవి అటు అవ్యాకృతాకాశమునందు ఇటు భూతాకాశమునందు మేలిరతనముల వలె మెరుస్తున్నాయి.

కొన్ని మామిడి వృక్షం యొక్క ఆకుల వలె పదే పదే ఉత్పత్తి, నాశనం, పునరుత్పత్తి పొందు చున్నాయి. మరికొన్ని... వాటిని బోలిన రూపంతో మరొక చోట జనిస్తున్నాయి. కొన్ని బ్రహ్మాండాలు పరస్పరం సదృశ్యంగా ఉన్నాయి. ఇంకొన్ని ఒకదాని దృష్టిలో మరొకటి (అదృశ్యంగా) లేనే లేవు.

కొన్ని కొంతకాలం ఒక రూపంతో కనబడి ఆ తరువాత మరొక రూపం సంతరించుకొంటున్నాయి. కొన్ని అల్పకాలం ఉంటున్నాయి. మరికొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి.


Page number:15

కొన్ని దేశ వస్తు స్వభావనియతిని కలిగి ఉంటున్నాయి. మరికొన్నిటిలో 'సూర్యుడు' లేకపోవటం చేత కాలజ్ఞాన రహితమై ఉంటున్నాయి. కొన్ని లోకములు ఎవరి ప్రయత్నమూ లేకుండానే స్వయంగా జనించి వృద్ధి చెందుతున్నాయి. మరికొన్ని ఎవరో యోగుల సంకల్ప శక్తిచే జనిస్తున్నాయి. కొన్ని స్థిరంగాను, కొన్ని అస్థిరంగాను ఉంటున్నాయి.

ఓ రామచంద్రా! ఈ బ్రహ్మాండాలన్నీ కూడా 'అజ్ఞానం' అనే దోషముచే అనాది కాలం నుండి సాక్షి చైతన్యము నందు ఆధ్యస్తములై ఉంటున్నాయి, అట్లా ఉంటున్నప్పటికీ కూడా... రూఢి పడి ఉన్న ఈ బ్రహ్మాండములన్నీ కూడా వాస్తవానికి శూన్యరూపములేనయ్యా! ఈ అనేక సముద్ర - పృథివీ - సూర్య - ఆకాశ - మేరు పర్వతాదులతో కూడిన గణింపశక్యంకాని బ్రహ్మాండాలన్నీ 'చిదాకాశం' అనే దర్పణంలో "త్రిగుణాలు” అనే దోషం చేత స్వప్న సమూహాలవలె భాసిస్తున్నాయి.

అవి అనుభవమునకు లభిస్తున్నప్పటికీ, వాస్తవానికి లేవు! నిజరూపంచే ఇవన్నీ కూడా చిదాకాశ రూపమే! అనగా, అవి చిదాకాశం వలె సర్వదా ఉన్నాయి. అవన్నీ అనుభవానికి సత్యం వలె అనిపించవచ్చు గాక! మృగతృష్ణలో జలతరంగాలు కనిపిస్తున్నప్పటికీ అక్కడ జలతరంగాలు లేవు కదా!

అవన్నీ కూడా “చైతన్యం” యొక్క సంకల్పజనితమైన ఆకాశమునందు సంకల్ప స్వభావముచే అగుపిస్తున్నాయి. వాసనచే ప్రేరితమై స్వచేష్టచే ఇటు అటు పరిభ్రమిస్తున్నాయి. చైతన్యం అనే బాలుడు 'సృష్టి' అనే క్రీడచే ఉపయుక్తుడై ఉండటం చేతనే ఈ జగత్తులన్నీ సంకల్పనగరమున ఉంటున్నాయి. తడిమట్టిచే తయారుచేసిన బొమ్మలు సూర్యకాంతి పడటంచే గట్టి పడతాయి చూచావా? అట్లా ఈ జగత్తులన్నీ అభిమానపూర్వకమగు బుద్ధి యొక్క బలముచే దృఢపడుచున్నాయి. రాగయుక్తము, కర్మఫలదాయకమగు "నియతి" ఈ బ్రహ్మాండాలన్నిటినీ శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తోంది.

శ్రీరాముడు : మహాత్మా! ఈ సృష్టికి అసలు కర్త ఎవరు? "సృష్టికర్త" అను శబ్దము వేద వాఙ్మయమునందు ప్రసిద్ధమై ఉండటంచేత ఈ ప్రశ్న అడుగుచున్నాను.

శ్రీవసిష్ఠ మహర్షి : శ్రుతులు రెండు రకములైన అభిప్రాయం ప్రకటించాయి.

1.) "పరమాత్మయే భూమి-స్వర్గము మొదలైన లోకాలన్నీ నిర్మించారు" - ఈ అర్థమును ప్రతిపాదించే శ్రుతుల విభాగములను అనుసరించి సమస్త బ్రహ్మాండములకు కర్త చిదాకాశ రూపమగు పరబ్రహ్మమే అయి ఉన్నది. "కర్తృత్వము ఆపాదించుకొనుట చేతనే పరమాత్మచే సృష్టి భావనావ్యవహారంగా వ్యక్తీకరించబడుతోంది" అని శ్రుతులు గానం చేస్తున్నాయి.

2.) బ్రహ్మము శుద్ధమైనది. కర్తృత్వ దోషం లేనిది - ఇట్లా వచించే శ్రుతుల విభాగములను అనుసరించి సమస్త బ్రహ్మాండములకు 'కర్త' అంటూ ఎవరూ లేరు. అనగా, అవి కర్తృత్వరహితములై చిదాకాశమున స్వయంసిద్ధమైన రూపములో కలిగియున్నవి అగుచున్నాయి.


Page number:16

ఈ జగత్తులన్నీ పరమార్థమున బ్రహ్మస్వరూపములే అయి ఉన్నాయి. అయినా కూడా, అవి అట్టి బ్రహ్మస్వరూపమునకు వేరుగా ఉన్నట్లు - బంగారు ఆభరణంలో బంగారము, ఆభరణము లాగా - ఉదయించిన వగుచున్నాయి. వాస్తవానికి చూస్తే జగత్తుగా చెప్పబడేది అలబ్ధమే (ఇది అని ఏదీ లభించనిదే అయినా లభించినట్లుగా) ఉంటున్నది! సదా ఈ జగత్తులు ‘లేనివే’ అయినప్పటికీ ఉన్నట్లుగా ఒప్పుచున్నాయి.

ఇక్కడి జీవులు, 14 లోకములు, ఒక్కొక్క లోకంలో అనేక జీవజాతులు... ఇవన్నీ మరల మరల (అవే) ఉత్పన్నమౌతున్నాయి. ఒక్కొక్కప్పుడు వేరైన జగత్తులుగా ఉద్భవిస్తున్నాయి.

ఈ జగత్తు కాస్త పరిశీలించి చూస్తే... ఇందలి నరక -  భూ - స్వర్గ - పాతాళాది లోకాలు, ఇందలి బంధు - మిత్ర సమాగమాలు, ఇందలి మహాకార్య సమారంభాలు... ఇవన్నీ కూడా పరమార్థమున శూన్యరూపములే అయి ఉన్నాయి.

ఈ జగత్తులన్నీ క్షీరసాగరంలోని జలంలాగా స్నేహము, రాగము మొదలైనవి కలిగి ఉండి కూడా సముద్ర జలతరంగాలలాగా క్షణభంగురములు అయి ఉన్నాయి. జగత్తుగా ఏ రూపమై కనిపిస్తోందో ఆ రూపం పరివర్తనం పొందబోతూనే ఉన్నది కదా! అందుచేతనే, ఇవి “ఆత్మ అను సూర్యుని యొక్క తేజమునకు సంబంధించిన 'ఆభాస' మాత్రమే” అని అనతగి ఉన్నవి.

వాయువు యొక్క చలనముచే చెట్లు కదులుచున్నాయి. కనుక, చెట్లు కదలటానికి వాయుచలనం కారణం అని మనం అనవచ్చు. మరి వాయువు ఏ కారణం చేత కదులుతోంది? వాయువు నందు చలనము స్వయంగా ఉత్నన్నమగుచున్నట్లే ఈ జగత్తులు కూడా స్వయముగానే ఉత్పన్నమౌతున్నాయి. ఈ జగత్తులు 'వృక్షములు’ అని అనుకుంటే, అట్టి జగత్ వృక్షములకు బుద్ధి, అహంకారము, చిత్తము మొదలైనవి ఆకుల వంటివి. అట్టి ఈ ద్రష్టకు దర్శనమగుతున్న జగత్తు స్వప్నంలో కనిపించే ఆయా రూపాలవలె అసత్తే!

పురాణ - వేద - శాస్త్రాదులతో ప్రసిద్ధములైయున్న యజ్ఞ - దాన - జప - తపాదుల కల్పనారూప స్వప్నంలో ఈ జగత్తులు మహానిద్రను అనుభవిస్తు న్నాయి. అట్టి ఈ జగత్తులన్నీ కూడా 'ఆత్మరూప జ్ఞానము' అనే మెలకువ వచ్చినప్పుడు అవన్నీ స్వప్నాంతర - స్వప్నములోని, స్వప్నాంతర్గత స్వప్నంలోని జనుల గతిలాగా శవరూపమును దాల్చుచున్నాయి. (అనగా ఈ జగత్తులన్నీ 'లేనివే' అగుచున్నాయి).

బ్రహ్మమునందు 'మాయమోహిత చైతన్యము’ అను చమత్కార పురుషునిచే ఈ జగత్తులన్నీ నిర్మించబడినవై... సూర్యుని వెలుగులో కనిపించే నగరములోని అనేక గృహముల లాగా ఆత్మ వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి.

ఓ రామచంద్రా ! ఆ విధంగా ఆ సమాధి కాలంలో నాచే అవధరించబడిన అనంతమగు చిదాకాశంలో.... కారణము లేకయే జనిస్తూ, కారణము లేకయే నశిస్తూ, తిమిర దోషము (సంసార దోషము) గల కనులకు కనిపిస్తూ... వాస్తవానికి భ్రాంతి మాత్రమే అయి ఉంటున్న అనేక జగత్తులను చూచాను.

✤✤✤


Page number:17

Ⅴ-5.) బ్రహ్మాండ బుద్భుదముల పరిభ్రమణం

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రాఘవా! ఆ విధంగా నేను అవిచ్ఛిన్నమైన 'చిదాకాశరూపత్వం' అవధరించిన వాడనై అట్టి చిదాకాశములో వివిధములైన బ్రహ్మాండాలను గమనిస్తునే... మరొక వైపు “ఆ వినబడే శబ్దానికి కారణం ఏమిటి?" అని నలువైపుల వెతుకుచూ చాలాసేపు గడిపాను. అట్లా వెతుకుచూ ఉండగా నాకు ఆ శబ్దం క్రమంగా మృదుమధురమైన వీణానాదంగా వినబడసాగింది. క్రమక్రమంగా అది మరి కొంత స్పష్టపడుతూ 'ఆర్య' అనే ఛందస్సు రూపం సంతరించుకొన్నది. అప్పుడు ఆ శబ్దం ఏర్పడుచున్న ప్రదేశం మీద నా యోగదృష్టి పడింది. వెంటనే అక్కడ ఒకానొకచోట నిలబడి ఉన్న ఒక స్త్రీని చూచాను. ఆమె తన బంగారపు ప్రకాశంతో ఆకాశాన్ని ప్రకాశితంగా చేస్తోంది. ఆమె వస్త్రములు చిరుగాలికి కదులుచున్నాయి. ఆమె ధరించిన సుందరమైన ఆభరణాలు, చంచలమైన దీర్ఘకేశాలు, అతి రమణీయమైన వర్చస్సు, సాక్షాత్తూ లక్ష్మీదేవిని గుర్తుచేస్తున్నాయి. హాస్యయుక్తం, యౌవన శోభితం అగు ఆమె ముఖం వన దేవత వలె శోభాయమానంగా ఉన్నది. ఆమెను దర్శించిన నేను దృష్టిని కించత్ మరలించే ప్రయత్నంలో ఉండగా ఆమె నా సమీపాన్నే ఉండి ‘ఆర్య' (ఛందస్సు) ను గానం చేస్తూ నా వైపే చూస్తూ పెదవులు విప్పి చిరునగవుతో పలుకసాగింది.

ఆ స్త్రీ : దుష్టులచే సేవించబడే రాగ - ద్వేష- కామ - క్రోధాది దోషములు ఈషణ్మాత్రంగా కూడా లేనట్టి ఓ మునీంద్రా! 'సంసారం' అనే నదిలో మునుగుచున్న మనుజులకు మీరు ఒక ఆలంబనము వంటివారు. మిమ్మల్ని సర్వశ్రేష్ఠులుగా గుర్తించిన నేను మీకు, ఇదే నమస్కరిస్తున్నాను!

శ్రీ రామచంద్రా! నేను ఆమె పలికిన శబ్దములు విన్నాను. ఆమె ముఖం వైపు చూచాను. “ఆఁ! ఈమె ఒక స్త్రీ కదా! ఈమెతో నాకు పనేమున్నదిలే?” అని తలచాను. ఎందుకోగాని, అప్పుడు అత్యంత ఉదాసీనత వహించాను. ఇక అక్కడి నుండి నా దృష్టిని మరల్చసాగాను. ఆ తరువాత అనేక జగత్ సమూహములను చూచాను. “ఆహాఁ! ఈ మాయ ఎంతటి విస్తారమైనది!' అని ఆశ్చర్యపడసాగాను. అట్లా జగత్సమూహములను గమనిస్తూ, వాటిని కూడా ఉపేక్షించినవాడనై ఆకాశమున సంచరించటానికి ఉద్యక్తుడనయ్యాను. 'మాయా జనితమైన చింతననంతా వదలి, చిదాకాశమున ఉన్న జగన్మాయ యొక్క ఉత్పత్తి స్థానమేమిటో గమనించెదను గాక' అని అనుకొని చిదాకాశ రూపమును కొనసాగించ దలిచాను. అప్పుడు నాకు కనిపించిన జగత్ సమూహములన్నీ స్వప్నములో వలె, ఊహలోలాగా, కథాజగత్తులవలె శూన్యరూపంగానే అనిపించాయి. అవన్నీ శూన్యరూపములే కాబట్టి పరమార్థమున జగత్తులనేవి ఎచ్చట ఏవీ లేవు, కాంచబడటమూ లేదు, వినటమూ లేదు. అంతే కాదు! అక్కడ నాకు కనిపించటం జరిగిన జగత్తులలోని ఒకదానిలోని దేవతాది జీవులకు మరొక జగత్తు లేకయే ఉన్నది.

శ్రీరాముడు :  అదేమిటి స్వామీ! ఒక జగత్తులోని వారికి మరొక జగత్తు 'లేనిది’గా అయి ఉండటం ఎట్లా సాధ్యం?


Page number:18

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఒక గదిలో ఇద్దరు మనుజులు నిదురిస్తున్నారనుకో! ఒకడు తన స్వప్నంలో చూస్తున్న యుద్ధ విన్యాసాలు, గజబల ఘీంకారాలు ఆ ప్రక్కనే నిదురిస్తున్న రెండవ మనుజునకు వినబడవు, కనబడవు కదా! అవన్నీ రెండవవానికి అవిషయములే కదా! ఒకనికి తన ప్రియురాలితో ఏర్పడే మధురానుభూతి - ప్రేమావేశము అతని సోదరులకో, మిత్రులకో అనిపించదు కదా! అట్లాగే అనేక బ్రహ్మాండములలోని ఒక దానిలో జరిగే కల్పాంతాది విన్యాసాలు మరొక బ్రహ్మండములోని జనులకు తెలియరావటమే లేదనునది నేను గమనించాను. అనగా, అవి పరస్పరం ఒకదానిలోని జీవులకు మరొకటి శూన్యరూపంగా ఉన్నాయి. ఆ విధంగా కోట్ల కొలది బ్రహ్మలు, లక్షల కొలదీ విష్ణువులు, అనేక కల్పసమూహములు నాకు ఈ గోడ మనందరికీ కనిపిస్తున్నట్లు కనిపించాయి. ఆ పలు విధమైన జగత్తులలో కొంతవిభాగం సూర్య రహితమై, రాత్రి-పగలు తేడా లేనిదై ఉన్నది. అక్కడ కల్ప-యుగ-సంవత్సరాది కాలము కూడా లేదు. అయితే అట్టి చిద్వస్తు విభాగమునందు ఊహామాత్రం చేతనే సమస్తము యొక్క క్షయము-ఉత్పత్తి కూడా సంభవించటం నేను గాంచాను.

శ్రీరాముడు : స్వామీ! మీరు చెప్పే చిదాకాశమునందలి అట్టి విభాగము బహు చిత్రంగా ఉన్నదే!

శ్రీ వసిష్ఠ మహార్షి : ఔను.

చితి సర్వం చితః సర్వం చిత్ సర్వం సర్వతశ్చ చిత్ ।
చిత్ సత్ సర్వాత్మికేత్యేతత్ దృష్టం తత్రమయాఖిలమ్ ॥

ఓ రామచంద్రా! సమస్తం చైతన్యముననే కలదు. సమస్తం చైతన్యం నుండే కలుగుతోంది. చైతన్యమే సమస్తము అయి ఉన్నది కూడా! అంతటా చైతన్యమే వ్యాపించి ఉన్నది సుమా! ఇన్ని మాటలెందుకు? "ఏ చైతన్యమైతే ఉన్నదో, అదియే సర్వాత్మకమై ఉన్నది" అనునది నేనచ్చట నా యోగదృష్టి సహాయముతో సుస్పష్టంగా గమనించాను.

అంతేకాదయ్యా! "ఇది కుండ, అది వస్త్రము, అదేమో మానవుడు, ఇక ఇది జంతువు" అని దేనినైతే నీవు అంటున్నావో ఆ విధంగా చైతన్యమే నామ రూపముల దృష్ట్యా చెప్పబడుచున్నది.

ఈ విధంగా చైతన్యం కొంచెంగా “నామరూపాత్మకంగా అవటం” అనునదే పదార్థముల యొక్క ఉత్పత్తి - అని నేను గ్రహించాను. ఎప్పుడైతే ఆ చైతన్యము ఆకాశం కంటే కూడా అత్యంత శూన్యమైనట్టి రూపంగా చెప్పబడుతోందో (లేక, దర్శించబడుతోందో) నామరూపరాహిత్యత చేత ఆ దశయే పదార్థముల క్షయముగా చెప్పుకోవచ్చు.

చిదాకాశరూపమగు ఆ శూన్యమాత్రమైన ఆకాశమే “వాయువు” మొదలైన ఆయా క్రమముల వలన 'జగత్తు' అని చెప్పబడుతోంది. అట్టి జగత్తులో 'నేను-నీవు' ఆదిగా నానాత్వమంతా ద్యోతకమౌతోంది. అట్టి నానాత్వంగా అనుభవమగుచున్న ఈ జగత్తు మహావాక్య మనన ప్రభావం చేత ("అహం బ్రహాఽస్మి - తత్త్వమసి - నేహ నానా స్తి కించన - జీవో బ్రహ్మేతి నాపరః” మొదలైన వేద ప్రతిపాదిత మహా వాక్యాల అర్థమును అంతర్గతపరచుకొనుచుండగా) చిదాకాశరూపంగా పరిణతి చెందుతోంది. అనగా, “అంతా చిదాకాశం మాత్రమే" అను మహానుభావంలో అనేకత్వమంతా ఒదిగి, రహితమైపోతోంది. అదియే ప్రపంచం యొక్క క్షయం.


Page number:19

ఓ రామచంద్రా! "ఆకాశవృక్షం యొక్క వ్రేలాడే పుష్పగుచ్ఛాలు” అనునది ఎంతగా ఊహా జనితము, మరియు భ్రమాత్మకమో... ఈ దృశ్య దృష్టి కూడా అంతగానూ కేవలం భ్రాంతిమాత్రమే అయివున్నది.

సకల దృష్టులూ ఆపాదిత మాత్రం అవగా... దీనికి ఆవల గల 'దృక్' స్వరూప చిదాకాశమే నిరతిశయ సుఖ రూపమని సర్వత్రా గ్రహించియున్న నేను సమాధియందు అంతిమ సాక్షాత్కార వృత్తి రూపమైన చిదాకాశముతోటి ఏకరూపం పొందాను. నేనే ఆ చిదాకాశమైనాను. సర్వవ్యాపిని, అనంతరూపుడను అయ్యాను. నిస్సంకల్పపూర్వకంగా అక్కడి సమస్త బ్రహ్మాండ సమూహములను అస్మత్ స్వరూపంగా అనుభవం పొందాను. అనగా, ఆ బ్రహ్మాండములు, తదంతర్గతమైన దశదిశలు, అందలి దేశ కాల-ద్రవ్య-క్రియా కల్పనలు 'నేనే' అయ్యాను. సమస్తమూ బ్రహ్మాకారరూపమేనను అనుభవం పొందసాగాను. అంతే కాదు, యుగభేదములతో కూడి ప్రకాశించే అక్కడి అనేక జగములతో నావంటి రూపాలే అయినట్టి వసిష్ఠ నామధేయులైన ఉత్తములగు అనేకమంది మునీశ్వరులు కూడా నాకు కనిపించారు. శ్రీ రామావతార సహితంగా 72 త్రేతాయుగాలు నేనక్కడ చూచాను.

అయితే, భేద వాసన యొక్క ఉద్బోధము చేతనే ఆ సృష్టి దశలన్నీ నాకు ఆ విధంగా కనిపించాయి సుమా! ఇంతలో బ్రహ్మజ్ఞాన బలంచేత అదంతా కూడా అతి నిర్మలము - ఏకము - సర్వ వ్యాపకము అయిన చిదాకాశంగానే కూడా దర్శించగలిగాను.

నామ రూపాత్మక దృష్టికి అనేక మట్టి బొమ్మలు కనిపిస్తున్నప్పటికీ మట్టియందు అనేక రూపములు గాని, ఒక్క రూపముగాని లేవు కదా! అట్లాగే, నామరూపాత్మకం దృష్ట్యా ఈ "జగత్తు” అనేది బ్రహ్మమునందు లేదు. అయితే అన్ని మట్టిబొమ్మలలోని ఆయా నామ రూపాలన్నీ మట్టియే కదా! అధిష్ఠాన చైతన్యం దృష్ట్యా ఈ జగత్తు బ్రహ్మమే.

నామరూపాత్మకం దృష్ట్యా ఈ జగత్తు భ్రమ మాత్రమే! అధిష్ఠాన చైతన్యం దృష్ట్యా ఈ జగత్తంతా జన్మరహితం (అజం), ఆద్యంతాలు లేనిది (అనాది), అనంతమైనది అయిన బ్రహ్మమే!

ఓ రామచంద్రా! ఏ బ్రహ్మము సర్వదా ఒక శిల వలె మౌనరూపమై, నామరూపవర్జితమై, జ్యోతి స్వరూపమై ఉన్నదో... ఆ బ్రహ్మమే ఈ రీతిగా జగద్రూపమున ఉన్నది అని గ్రహించు.

ఒకడు తాను నిరాకార స్వరూపుడే అయి ఉండి కూడా, తన స్వక్రీయ ఊహా నిర్మిత స్వప్నమున “తన రూపాలే” అనతగ్గ అనేక ఆకార వికారాలన్నీ పొందుచున్నాడు చూచావా? ఆ విధంగానే, నిరాకారమగు చిదాకాశమున వాస్తవానికి “చేత్యం (తెలియబడేది లేక, దృశ్యం)" అనేది లేకపోయినప్పటికీ, అద్దాని కల్పనచే (స్వప్నాంతర్గత దృశ్యం వలె) నిరాకారమగు చైతన్యమే జగద్రూప దృశ్యంగా భాసించుచున్నది.

ఒక దీపంలోంచి ప్రకాశం బయల్వెడలి ఆయా వస్తువులను ప్రకాశింపజేస్తోంది. అయితే జ్యోతి ప్రకాశము జ్యోతి కంటే వేఱు కాదు కదా ! అదే రీతిగా, ప్రకాశమాత్ర రూపమగు చైతన్యం తన కంటే వేరుకాని రూపాన్ని జగత్తుల రూపంగా రచించుచున్నది. అంతర్గత జ్యోతి తత్త్వమగు సూర్యుడు, సూర్యకిరణం ఒక్కటే అయినట్లు, చైతన్యం - చైతన్యస్ఫురణ మాత్రమగు ఈ నామ రూప జగత్తు ఒక్కటే! “జగత్తు అనేది రచించబడటం లేదు. చైతన్యమే జగత్తుగా (భ్రమచే) అనిపిస్తోంది” ... అని కూడా చెప్పబడుతోంది.


Page number:20

ఈ విధంగా బ్రహ్మము యొక్క వివర్త రూపములే అనతగిన అక్కడి అనేక జగత్తులందు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కనిపించసాగాయి.

ఒక జగత్తులో చంద్రబింబము ఉష్ణంగాను, సూర్యబింబము శీతలంగాను అనుభూతమౌతున్నాయి. అక్కడ నాకు తారసపడిన మరొక జగత్తులో జీవులు గుడ్లగూబల వలె చీకటిలో అన్నీ చూడగలుగుచున్నారు. వెలుతురులో ఏమీ చూడలేకపోతున్నారు. అట్లాగే అక్కడి ఇంకొక జగత్తులో జీవులు తమ శుభకర్మల ప్రభావం చేత వినాశనం పొందుచున్నారు. అశుభ కర్మల ద్వారా స్వర్గము మొదలైన ఉత్తమ లోకములు పొందుచున్నారు. కొన్నిచోట్ల విషమును భక్షించుటచే సుఖము, దీర్ఘ జీవనము పొందుచున్నారు. అమృత భక్షణ చేత మరణం పొందుచున్నారు.

ఆ విధంగా మనస్సు యొక్క కల్పన చేతనే అదంతా అట్లు పరిఢవిల్లుతోంది సుమా!

శ్రీరాముడు : స్వామీ! అదేమిటీ? ఆయా జగత్తులలో సరస్పర విరుద్ధంగా విషము జీవనంగాను, అమృతము మరణంగాను ఎందుకు ప్రయోజనప్రదాతలుగా అగుచున్నాయి?

శ్రీ వసిష్ఠమహర్షి :  ఓ రామచంద్రా! ఈ మనస్సే అంతయు అగుచున్నది కదా! ఒకానొకటి సత్తు కావచ్చు, లేదా... అసత్తు కావచ్చు. ఏదైనా వస్తువు చిరకాలంగా “ఇది నాకు హితము” అని అభ్యసిస్తే అది అట్లే అనుభవమౌతుంది. అట్లాగే "అది నాకు అహితము” అని అభ్యసిస్తేనో, కర్మవశంగా భోగకాలంలో శీఘ్రంగా ఆ రూపముననే స్పష్టంగా ప్రకటనమగుచున్నది. మనస్సును బట్టే దృశ్యం ప్రాప్తిస్తోంది. మనస్సు లేనిచోట దృశ్యమే లేదు.

ఇంకా అక్కడ నాకు కనిపించిన వివిధ జగత్తుల యొక్క కొన్ని విశేషాలు చెబుతాను. విను. కొన్ని జగత్తులలో అనేక పుష్ప-ఫలభరిత వృక్షములతో కూడిన వనసమూహాలు ఆకాశంలో అటూ, ఇటూ గాలి పటాల లాగా ఎగురుచున్నాయి. ఇంకొన్ని జగత్తులలో విరుద్ధ పదార్థ ధర్మాలు ప్రవర్తిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని జగత్తులలో తైలయంత్రములచే ఇసుక పిండబడగా, ఆ ఇసుకలోంచి నూనె (తైలము) ఉత్పత్తి అవుతోంది.

కొన్నిట్లో కొండరాళ్ళ లోంచి కమలములు ఉద్భవించి వికసిస్తున్నాయి. కొన్నిచోట్ల శిలతో చెక్కబడిన విగ్రహములు చలనము పొంది దేవతా స్త్రీలతో కలసి నృత్యం చేస్తున్నాయి. హావభావా లతో కూడిన సంభాషణ నిర్వర్తిస్తున్నాయి.

ఇంకొక జగత్తులో ఎందరో జీవులు ఆకాశంలో పరిగెత్తే మేఘములను రెండు చేతులతోను పట్టుకొని వస్త్రములుగా మలచుకొని ధరిస్తున్నారు. కొన్నిచోట్ల ఒకే వృక్షమునకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఫలములు ఫలిస్తున్నాయి. ఒకచోట ఒకే జాతికి చెందిన ప్రాణులతో అవయవాలు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క రకంగా అమర్చబడి ఉంటోంది. వాటి దేహముల రచన అనిమియతమై ఉంటోంది.

కొన్ని జగత్తులలో ఎందరో జీవులు తమ శిరస్సులతో నడుస్తున్నారు. కొన్ని జగత్తులలో అధోలోకములలోని జీవులు వేద - శాస్త్రవిహీనంగా, ఇచ్ఛ వచ్చినట్లు చరిస్తున్నారు.


Page number:21

కొన్నిచోట్ల జీవులకు “కామము” అనేది ఉండక, ఇక జీవులు స్త్రీకి జనించక - కేవలం గాలిలోనో, ధూళిలోనో ఉత్పన్నం అగుచున్నారు. కొన్ని లోకములలో జీవులకు దయ-దాక్షిణ్యం అంటే ఏమిటో తెలియక జీవిస్తున్నారు. మరికొన్ని లోకములలో వాయుభక్షణ చేతనే జీవులు జీవిస్తున్నారు. మరికొన్ని లోకములలో జీవులకు ధనవ్యవహారమే లేదు.

మరికొన్ని జగత్తులలో 'వ్యష్టి అహమ్' అనే భేదమే లేకుండానే ఉంటోంది. అనగా సమష్టి విరాడహమ్ భావన చేతనే సర్వదేహముల వ్యవహారం జరిగిపోతోంది. అనగా ఒక జీవుడు "ఈ చేతులు నావి. ఈ గోళ్ళు నావి”... అని అనుకొనే విధంగానే ఆ బ్రహ్మాండములలోని జీవులు తక్కిన జీవులందరినీ తమ దేహములోని విభాగమునే వీక్షిస్తున్నారు. ఏకాత్మ భావనచే తదితర సర్వజీవులను తమ వలెనే గాంచుచున్నారు.

కొన్ని జగత్తుల నిండా ఒకేవిధమైన ప్రాణులున్నారు. మరికొన్ని జగత్తులలో వివిధ రకములైన ప్రాణులు కనిపిస్తున్నారు.

ఒకానొకచోట సృష్టి గూర్చిన భేదవాసనయే లేకపోవటం చేత అదంతా కూడా అనంతంగాను, అపారంగాను, శూన్యంగాను అనుభూతమౌతోంది. ఇంతలోనే మరల సృష్టివాసనారూపమగు ఏదో ప్రయత్నము ఎక్కడినుండో బయల్వెడలి అక్కడ జగత్తులు ప్రస్పుటమౌతున్నాయి. మరికొంత సేపటికి అవి మరల శూన్యరూపత్వం సంతరించుకుంటున్నాయి.

ఓ రామచంద్రా! ఏది ఏమైతేనేం? “నిర్విషయ బ్రహ్మభావన దృష్టి" కి మాత్రం ఆ లోకాలన్నీ అత్యంత మిథ్యా రూపాలుగానే ఒప్పుచున్నాయి. మట్టిబొమ్మలలోంచి మట్టిని వేరుచేసి చూస్తే ఏనుగు-గుఱ్ఱం మొదలైన ఆకారాలు శూన్యమే కదా! ఆ ఆ జగత్తులన్నిటిలో గల ప్రాణుల నుండి చైతన్యమును వేఱుచేసి చూస్తే అవన్నీ - అదంతా శూన్యంకాక మరింకేమిటి?

ఇంకా ఆ జగత్తుల విశేషాలు విను. కొన్ని జగత్తులలో జ్యోతిశ్చక్రము లేకపోవటం చేత వాటిలో 'కాల కల్పన' అనేదే లేదు. మరికొన్నిటిలో జీవులు మూగ అయి, సంకేత మాత్రం చేత మాత్రమే సంభాషించుకుంటున్నాయి. కొన్ని జగత్తులలో జీవులకు నేత్రేంద్రియం లేకపోవటం చేత వాటి పట్ల సూర్య ప్రకాశం మొదలైనవి వ్యర్థమే అగుచున్నాయి. వీటికి పరస్పరం కనులలో చూచు కోవటం సాధ్యపడకపోయినా తదితర ఇంద్రియాల ద్వారా పరస్పరమైన ప్రవర్తనను నిర్వర్తించు కుంటున్నాయి. ఇంకొన్ని జగత్తులలో జీవులకు ఘ్రాణేంద్రియంగాని, తజ్జనితమైన జ్ఞానం గాని లేక అక్కడ సుగంధ-దుర్గంధములు వ్యర్థమే అగుచున్నాయి. కొన్నిచోట్ల జీవులంతా మూగవారు, చెవిటివారు అవటం చేత అక్కడ శబ్దము వ్యర్థత్వం చెందుతోంది. ఇంకొన్ని జగత్తులలో స్పర్శజ్ఞానం లేక జీవులంతా శిల వలె ఉంటున్నారు.

కొన్ని జగత్తులలో మనస్సుతోనే ఒకరితో మరొకరు ప్రవర్తిస్తున్నారు. వారు వ్యవహారయుక్తులు అయినప్పటికీ ఇంద్రియాలకు అగ్రాహ్యులై పిశాచాల వలె అనువర్తిస్తున్నారు. కొన్ని లోకాలు అంతటా పృథివీమయమే గాని కొంచెం జలబిందువు కూడా లేదు.


Page number:22

మరికొన్ని జలమయమే గాని “భూమి” అనేదే లేదు. ఇంకొన్ని అగ్నిమయం. మరికొన్ని వాయుమయం. కొన్నేమో సర్వకార్య సమర్థములైన సర్వ వస్తువులతో కూడి ఉన్నాయి. ఆహా ! ఏం ఆశ్చర్యం ! చిదాకాశమున చిదాకాశ రూపములే అయినట్టి అనేక చిత్ర విచిత్ర జగత్తులు అక్కడ భాసిస్తున్నాయి.

రాయిలో కప్ప జీవిస్తున్నట్లు, భూమిలో కీటకములు జీవిస్తున్నట్లు కొన్ని లోకములలో జీవులు ఆలోచన-జ్ఞానం-విచక్షణ లేకుండా జీవిస్తున్నారు. అగ్నిమయజగత్తులలో అగ్నిరూపులగు జీవులు జీవిస్తున్నారు. వాయుపూరితములగు లోకములలో వాయురూపులగు జీవులు వాయు కెరటముల వలె స్ఫురిస్తూ మనుగడ సాగిస్తున్నారు. అట్లాగే ఆకాశమయములగు లోకములలో ఆకాశమాత్ర దేహధారులగు జీవులు పరస్పర దర్శనాది ఏవేవో చిత్ర - విచిత్ర ఊహా వ్యవహారాలతో జీవనము కొనసాగిస్తున్నారు.

ఈ విధంగా సర్వజ్ఞుడను, కేవల సాక్షినియగు నాకు అక్కడ అనేక బ్రహ్మాండాలు కనిపించాయి. అవి చిదాకాశమునందు కల్పన చేయబడి దిక్కులలో అటూ-ఇటూ పరిభ్రమణం చేస్తున్నాయి. పైకి ఎగురుచున్నాయి. క్రింద పడుచున్నాయి. చైతన్య మహాసాగరమున చంచల బుద్భుదముల వలె (కదిలే నీటి బుడగల వలె) అవి చిత్ర విచిత్ర విశేషముతో పరిభ్రమణం చేస్తున్నాయి.

✤✤✤

Ⅴ-6.) బ్రహ్మమును ఎఱిగామా... జగత్తులు లేవు!

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! జలంలో జలతరంగ ధారలు కనిపిస్తున్నాయి. జలం యొక్క దృష్టి లేనివారికి ఒక్కొక్క తరంగ ధార ఒక్కొక్క రీతిగా అనిపిస్తాయి. అట్లాగే చిత్స్వరూపమును గూర్చిన అజ్ఞానముచే చిదాకాశమున ప్రాణరూపోపాధితో కూడిన పరిచ్ఛిన్నములగు చైతన్య రూప జీవులు స్ఫురిస్తున్నారు. ఆ పరిచ్చిన్నచైతన్యరూపములే ఉత్తరోత్తరా అనేక సంకల్ప వికల్పములతో కూడినవై కనిపిస్తున్నాయి. అట్లు అనేకత్వపు భ్రాంతి ప్రవృద్ధమగుచూ అదియే మనస్సుగా రూపుదిద్దుకుంటోంది. వాస్తవానికి చిదాకాశ రూపాలే అయిన ఆ మనస్సులే తమయందు కల్పించుకొన్న జగద్వాసనలచే స్వయంగా అనంత జగదాకారములుగా పరిణతి పొందుచున్నాయి సుమా! 

శ్రీరాముడు :  స్వామీ ! ఈ బ్రహ్మాండములన్నీ సమష్టితత్త్వమైనట్టి హిరణ్యగర్భుని స్వప్నమువంటి సంకల్పముచే జనించినవే కదా !

శ్రీ వసిష్ఠ మహర్షి :  అవును.

శ్రీరాముడు :  అట్టి మహాకల్పము క్షయం అయినప్పుడు ఆ హిరణ్యగర్భుడు, ఆతనిచే ఉత్పన్నమైన సమస్త ప్రాణి సమూహం కూడా ముక్తి పొందుచున్నది కదా! మరల సృష్టిని గురించిన “జ్ఞాపకం” ఎవరికి? మరల సృష్టి ప్రారంభం ఎవరిచేత ఎందుకు నిర్వర్తించబడుతోంది.

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! మహాకల్పాంతమునందు పంచభూతములగు ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వాటి యొక్క అంతర్గతమైనట్టి సమస్తమైన ప్రాణికోట్లు ముక్తిని చెందుతాయి. అయితే, ఆ తదనంతరం ఈ జగత్తు ఎట్లా అనుభూతం అవటం జరుగుతుందో చెబుతాను... విను.


Page number:23

సమస్తము నశించినప్పటికీ వాక్కునకు అవిషయము అయిన సత్తత్వము శేషించియే ఉంటుంది. అద్దానిని 'పరమార్థఘనము-చిన్మాత్రబ్రహ్మము - శుద్ధ పరతత్త్వము'.... అని శాస్త్రములు వర్ణిస్తున్నాయి. అద్దాని హృదయరూపమే ఈ జగత్తు కనుక ఈ జగత్తు కూడా అద్దానికి వేరుకానిదై ఉన్నది. ఆ పరమాత్మ భగవానుడే తనయొక్క హృదయరూపమును జగత్తుగా ఎఱుగుచున్నాడని గ్రహించు. మాయొక్క దృష్టిలో (జీవన్ముక్తుల అనుభవంలో) ఈ జగమంతా ఊహాలోకంలాగా మిథ్యారూపమే అయి ఉన్నది. ఇది మొదలే 'కల్పన' నుండి ప్రభవించియున్న దానిగా గమనిస్తున్నాం. ఇది గ్రహించి దీనిని మేము వినోదము కొరకే పొందుచున్నాం.

విస్తవానికి ఈ జగత్తుకు “ఇదీ రూపం” అంటూ ఏదీ లేదు. కాబట్టే విచారణ చేసినప్పుడు “ఇది స్వతహాగా లేనిది” అని (విజ్ఞానదృష్టికి) తెలిసిరావటం జరుగుతోంది. విచారణ చేస్తే “ఇక్కడ ఏదీ నశించటం లేదు. జనించటంలేదు” ... అని మేము గ్రహిస్తున్నాం. కనుక పరమ కారణమగు బ్రహ్మము ఎట్లా నాశనరహితమో .... ఈ జగత్తు అనబడేది కూడా అట్లాగే నాశనరహితం.

ఎందుకంటే, ఇది భావనచే ఉండటం, అభావనచే రహితమవటం జరుగుచున్నది. కాబట్టి! ఇక నీవు చెప్పిన కల్ప - మహాకల్పాది కాల చమత్కారాలు కూడా కల్ప- (లేక) భావన యొక్క అవయవముల భేదము కొరకు కల్పించబడ్డాయి. అయితే, నిత్యమగు బ్రహ్మమునకు అనిత్యముకల్పితము అగు 'మహాకల్పము' మొదలైనవి అవయవాలు అవటమేమిటి? కానేకాదు. అవి భావనా కల్పనలు మాత్రమే !

కాబట్టి, నశించిన కల్పములు - మహాకల్పములు మరల మరల రావటానికి - పోవటానికి శక్యములై ఉన్నాయి. దృష్టాంతానికి... ఒకనికి ఒక ఆలోచన వచ్చి, అంతర్గతమై మరల మరొక్కప్పుడు ఆ ఆలోచన బహిర్గతం కావటం అందరికీ అనుభవైకవేద్యమే కదా! ఇదీ అట్టిదే! బ్రహ్మము సర్వదా విద్యమానమై ఉండగా ఇక “కల్పములు” అనే జపమాల యొక్క పరివర్తనము “కాలచక్రం” రూపంగా సంభవించుచున్నది. కాని, విచారించి చూస్తే ఆలోచనలు చేసేవాడు సర్వ ఆలోచనలకు ఆవల యథాతథంగా ఉండి ఉంటున్నట్లే వాస్తవానికి కల్పాదులు ఆత్మ దృష్ట్యా లేనివే - అని కూడా గ్రహించు.

తస్మాత్ న కస్యచిత్ కించిత్ కదాచిత్ నశ్యతి క్వచిత్ ।
నచైవ జాయతే, బ్రహ్మశాస్త్రం దృశమ్ అజం స్థితమ్ ॥

కనుక, ఎచట ఎప్పుడూ దేనికి ఏదీ కనిపించటమూ లేదు, ఉత్పన్నమవటమూ లేదు. ఇక ఈ దృశ్యమంటావా? ఇదంతా వాస్తవానికి అజము, శాంతము అయినట్టి బ్రహ్మముగానే స్థితినొంది ఉన్నది. విస్తారమైన ఆకాశమునందు, ఒక పరమాణువు యొక్క వెయ్యవ వంతు విభాగమునందు కూడా ఏ ఒకే శుద్ధ చిన్మాత్ర సత్త కలదో ... అదియే ఆ పరబ్రహ్మము.


Page number:24

సర్వదా, సర్వత్రా పరబ్రహ్మము విద్యమానమై ఉండగా ఇక ఈ జగత్తు మాత్రం నశించటమనే ప్రసక్తి ఎక్కడిది? నిద్రపోవువాని చైతన్య స్వరూపమే స్వప్నంలో స్వప్న జగద్రూపంగా భాసిస్తున్నట్లు, చిదాకాశము యొక్క అంశమే సృష్ట్యాది యందు సమస్త పదార్థరూపములుగా భాసిస్తోంది.

చిదాకాశం యొక్క అవయవమే ఈ సృష్టి. సృష్టి యొక్క అవయవాలే నాశన - ఉత్పత్తులు. ఈ విధంగా సర్వము చిదాకాశమే అయిఉండగా... ఇక నశించునదేమీ?నశించని దేమున్నది? పరమార్థచైతన్యము ఛేదించబడేదికాదు, దహించబడేదికాదు, తడుపబడేది కాదు, ఎండించబడేది కాదు. తత్ప్రృదయమైనట్టి ఈ జగత్తు, అట్టి జగత్తు యొక్క కారణం అయినట్టి అజ్ఞానము, అట్టి అజ్ఞానానుభవము అట్లే నశించటంలేదు, జనించటంలేదు.

శ్రీరాముడు :  అదేమిటి మహర్షీ !"అజ్ఞానము కూడా జనించటం లేదు, నశించటం లేదు”... అని చెప్పుచున్నారు. జ్ఞాని - అజ్ఞాని వేరువేరుగా అవగాహన కలిగి ఉంటున్నారు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, చైతన్యం కేవలం తన యొక్క స్మరణ - విస్మరణల సూత్రం చేత ఈ జగత్తుల అనుభవము - అనుభవరాహిత్యము కూడా అనుభవిస్తోంది.

రామచంద్రా! ఒకానొక వస్తువు ఏ ముడి పదార్థం యొక్క ఒకానొక రూపమై ఉన్నదో అట్టి ముడి పదార్థం నాశరహితమై ఉన్నప్పుడు... ఇక ఆ వస్తువు కూడా నాశరహితమైనదే కదా! కాబట్టి బ్రహ్మమే స్వరూపంగా గల ఆ దృశ్యం కూడా బ్రహ్మం వలెనే అక్షయం అయి ఉన్నదని గ్రహించు. మహాప్రళయాదులు ఆ బ్రహ్మం యొక్క అవయవాలే అయి ఉన్నాయి. చిన్మాత్రం అగు పరమ చిదాకాశానికి నాశనం గాని, ఉత్పత్తిగాని ఎక్కడున్నాయి? నిరాకారమగు చిదాకాశమునకు పదార్థ సంబంధమైన ఉత్పత్తి - వినాశనాది వికారాలు ఎట్లా ఉంటాయి?

ఓ రామచంద్రా! ఈ జగత్తు చిన్మాత్ర స్వరూపమేనని మరల మరల గుర్తు చేస్తూ ఆయా దృష్టాంతాలు ఆత్మశాస్త్రజ్ఞులచే చెప్పబడుచున్నాయి.

1.) స్ఫటిక శిల - ప్రతిబింబం దృష్టాంతం - ఒకచోట ఒక స్ఫటిక శిల ఉన్నది. అందులో చిత్ర విచిత్రమైన రంగులతో ఆయా వస్తువులు ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు చెప్పు! ఆ స్ఫటిక శిలలో రకరకాలుగా ప్రతిబింబిస్తూ కనిపించేవన్నీ స్పటికశిలారూపమేగాని మరొకటేదీ లేదు కదా! ఆ ప్రతిబింబంలో కనిపించే ఒక రూపమూ మరొక రూపమూ కూడా స్పటిక శిలయే కదా!

ఈ వివిధ జగత్తులు, మహాకల్పం మొదలైనవి కూడా చైతన్య బ్రహ్మం నందు తత్ బ్రహ్మ రూపంగానే ఇమిడి ఉన్నాయి. (లేక) నెలకొని ఉన్నాయి.

2.) మనోరాజ్య దృష్టాంతం - ఒకాయన తన మనస్సుతో ఒక రాజ్యం ఊహించి ఆ రాజ్యంలో అంతఃపురం, యువరాణి మొదలైనవన్నీ దర్శిస్తున్నాడనుకో...! అవన్నీ కూడా అనగా రాజు, రాణి, మంత్రి, శత్రురాజు... అన్నీ కూడా - అతని ఊహ (మనస్సు) యొక్క రూపాలే కదా.

ఆ ఊహ (మనస్సు), ఆ అనుభవ రూపాలన్నీ (తదనంతరం) మనోరూపంలో కలిసిపోతాయి. అట్లాగే చైతన్యం యొక్క సంకల్పమాత్రంచే ఉత్పన్నమగుచున్న ఈ జగదృశ్యాలన్నీ కూడా నిరాకారం, నిర్మలం అగు చిన్మాత్ర రూపాన్నే పొందనున్నాయి, పొందుచున్నాయి.


Page number:25

3.) వృక్షము-వృక్షావయవముల దృష్టాంతం - "అవయవి” యగు వృక్షమునకు వ్రేళ్ళు-కాండము-కొమ్మలు-ఫలములు-ఆకులు-పుష్పములు-చిగుర్లు మొదలైనవన్నీ అవయవములు కదా? అట్లాగే పరమార్థ ఘనము ఆకాశము కంటే కూడా అతి నిర్మలము-సూక్ష్మము-వాక్కుకు అవిషయము అయి ఉన్నది. బ్రహ్మము "అవయవి”. ఇక ఈ ప్రళయ-మహా ప్రళయ-నాశఉత్పత్తి-భావ-అభావ-సుఖ-దుఃఖ-జన్మ-మరణ -సాకార-నిరాకారాదులన్నీ ఆ అనిర్వచనీయ బ్రహ్మముయొక్క ‘అవయవములు’.“అవయవి” ఏ రీతిగా వాక్కుకు అవిషయమై నాశరహితమై ఉన్నదో... అట్లాగే అద్దాన్ని అవయవములగు ఈ సృష్టి మొదలైనవి కూడా పరమార్థ దృష్టియందు నాశన రహితములేనని గ్రహించు. వాస్తవానికి “అవయవి” - “అవయవములు” అభేదములే కదా! అట్లా ఏక స్వరూపములగు దృశ్య - అదృశ్యములకు భేదమేమి ఉండజాలదు.

వృక్షము యొక్క ఉనికికి వృక్ష చైతన్యమే మూలం కదా! అట్లాగే ఈ జగత్తుకు పరమార్థ ఘనమగు చైతన్యమే మూలమైయున్నది.

బ్రహ్మము అనే వృక్షానికి... “సృష్టి” అనేది - కాండము; లోకాలు, లోకాంతరాలు - శాఖలు; జంబూ ద్వీపాదులు - ఉపశాఖలు; పర్వత, నదీ, గ్రామాదులు - పల్లవములు; చంద్ర సూర్యాదులు - దానికి పూచే పుష్పగుచ్ఛాలు; అంధకారం - ఆకుల పచ్చదనం; ఆకాశమే - దాని కణుపులు; ఇందలి జడత్వం - ఆ వృక్ష చర్మము... ఈ విధంగా ఈ జగత్తు నిరాకారమై స్వయంగా చిదాకాశరూపమై చిదాకాశమునందే వెల్లివిరిసియున్నది.

4.) నిశ్చలకాలం - చంచలకాలాంతర్గత విశేషాలు - ఆత్మయే వివిధ కల్పనా రూపాలతో ఒకచోట భూతకాలంగానూ, మరొకచోట వర్తమాన కాలంగానూ, ఇంకొకచోట భవిషత్కాలం గానూ, వేరే ఒక చోట ప్రళయ-మహాప్రళయాలుగానూ స్థితిని పొందుతూ తాను సర్వదా నిశ్చలంగానే ఉన్నది. చంద్రునిలో కళంకత్వము భ్రమచే కనబడుతుంది చూచావా? అట్లాగే నిర్మల పరబ్రహ్మాకాశమున కనబడే సృష్టి-ప్రళయాది దోషాలు వాస్తవానికి భ్రమయే గాని సత్యము కాదు. నిర్మలమగు చిదాకాశమున భావ-అభావముల గురించిన రంజనము మాత్రం ఎక్కడ? అందులో "ఇది ఆది, ఇది మధ్యం, ఇది అంతం" అనబడే కల్పన ఎక్కడ? లోక లోకాంతరాల గురించిన విభ్రమములు ఎచ్చటున్నాయి. ఇవన్నీ లేనే లేవు.

శ్రీరాముడు : మరి సంసార జీవులకు అవన్నీ ఎందుకు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి? 

శ్రీ వసిష్ఠ మహార్షి : సమస్త భ్రమలకు అసలైన కారణం ఆత్మజ్ఞానం లేకపోవుట చేతనే! 

శ్రీరాముడు : మరి ఆ భ్రమ తొలగేది ఎట్లా?

శ్రీ వసిష్ఠ మహార్షి : ఓ ప్రియ సభికులారా! మీ మీ దృష్టిని సాక్షి చైతన్యమగు ఆత్మ వైపుగా ప్రసరింపజేసుకున్నంత మాత్రం చేత ఈ జగద్భ్రమంతా శమించిపోగలదు. వాయువు చేత ఉత్పన్నమై వాయువు సహాయం చేతనే వెలుగుచున్న దీపం తిరిగి వాయువు చేతనే నశించుచున్నది చూచారా?


Page number:26

అట్లాగే, ఆత్మ స్వరూపము చేతనే తన యొక్క 'సత్త'ను సంపాదించుకున్న 'అజ్ఞానము' అనేది తిరిగి తత్త్వవిచారణచే జనించే ఆత్మజ్ఞానము చేతనే నశించుచున్నది. జ్ఞాన ప్రకాశముచే అజ్ఞానము తొలగగా “అజ్ఞానం అనేదేదీ ఎక్కడా లేదు" అనే నూతన బోధ కలుగగలదు. దీపం వెలిగిన తర్వాత చీకటి ఏమౌతోంది? బయటకెక్కడకన్నా పోతోందా? లేదు. వెలుతురు లేకపోవటమే చీకటిగాని, చీకటికి వేరుగా ఏ ఉనికీ లేదు. “సర్వమూ బంధ-మోక్ష రహితమగు బ్రహ్మమే" అనే నూతన జ్ఞానం అప్పుడు ఉదయిస్తుంది. అజ్ఞానం ఎటుపోతుందో (చీకటిలాగానే) ఏమీ చెప్పలేం!

ఓ రామచంద్రా! ఈ ప్రకారంగా ఆత్మజ్ఞానాది ఆయా ఉపాయాలను 'మోక్షము’ కొఱకై మనం చెప్పుకున్నాం. ‘ఆత్మ విచారణ’ యందు నిరంతరము యత్నీకృతుడైన వాడు ఆత్మజ్ఞానాన్ని తప్పక సముపార్జించగలడు.

‘అనాది' అనతగినట్లు ఈ 'జగత్తు' అనే జాలం ఎన్నడూ ఉత్పన్నం కానిదే అగుచున్నది. బ్రహ్మమే ఈ జగత్తు-జీవుడు మొదలైన రూపాలుగా ప్రకాశిస్తోంది. అట్లా ప్రకాశిస్తూ తనకు తానే 'మాయ'ను తెరగా ధరించి అజ్ఞానావరణ ప్రభావం చేత “నాకు భోగాలు కావాలి. నాకు మోక్షం కావాలి” అని తన ముంగిట తానే ప్రార్థనలు సల్పుచున్నది. ఇదియే మాయ యొక్క ప్రభావం. అణిమ-గరిమ మొదలుగా గల ఈశ్వరత్వము కూడా మాయామాత్రమేనని ఎఱిగి అద్దానిని కూడా తృణముతో (గడ్డిపరకతో) సమానంగా చూచుటయే ఉచితం. కనుక నిరతిశయానందయుతుడైన స్వాత్మయందే సుస్థిరుడవై ఉండెదవు గాక!

❖❖❖

Ⅴ-7.) మనస్సును అనుసరించే జగత్తులు కనబడుచున్నాయి!

శ్రీరాముడు : మహర్షీ! మీ వచన ప్రవాహం అమోఘం! స్వామీ! మీరు అప్పుడు చిదాకాశ శరీరులై అనేక జగత్సమూహములను వీక్షిస్తూ ఉన్నట్లు చెప్పుతూ వస్తున్నారు కదా! మరల ఆ కథనమును కొనసాగించవలసినదిగా నా ప్రార్థన. ఇక్కడ నాదొక చిన్న సందేహం

మీరు ఆ జగత్ సమూహములను ఒక పక్షి ఆకాశంలో సంచరించుచున్నట్లుగా అటు ఇటూ వెళ్ళుచూ చూచారా? లేక, ఒడ్డున ఉన్నవాడు సముద్రపు అలలను చూస్తున్నట్లుగా ఒకే ప్రదేశమున స్థిరంగా ఉండియే ఆ జగత్సమూహములను గాంచటం జరిగిందా?

శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు చిందిస్తూ) ఓ రాఘవా! ఎప్పుడైతే నేను అనంతం, సర్వవ్యాపకం అయినట్టి చిదాకాశమే అయ్యానో, ఇకప్పుడు ఒక చోటనే ఉండటమో, లేక ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణించటమో (గమన - ఆగమనములు నిర్వర్తించటం) అనేది ఎక్కడుంటుంది? కాబట్టి నేనప్పుడు గమనశీలుడనై ఉండలేదు.

అట్లాగే ఏదో ఒక ప్రదేశమున కూడా స్థితిని పొంది ఉండలేదు. “ఈ చోటు - ఆ చోటు” అనునవన్నీ భౌతికాకాశం యొక్క ధర్మాలు గాని... చిదాకాశ ధర్మాలు కావు కదా!


Page number:27

శ్రీరాముడు : ... మరి?

శ్రీ వసిష్ఠ మహర్షి : అపరిచ్ఛిన్నము-నిత్య అపరోక్షము అగు నా ఆత్మయందే ఆయా జగత్సమూహం లన్నిటినీ నేను వీక్షించాను. దేహాత్మ బుద్ధితో ఈ శరీరమును పాదముల నుండి మస్తకము (నుదురు) వరకు ఈ చర్మ నేత్రములతో చూస్తాం కదా! అట్లాగే, ఈ చర్మనేత్రములతో కాకుండా చిద్రూప నేత్రాలతో అప్పుడు ఆ జగత్తులను నాయందే (స్వాత్మయందే) చూడటం జరిగింది. ఆ సమయంలో సమాధిస్థితిని అవధరించిన నేను నిరాకారంగాను, నిరవయవంగాను, నిర్మలచిదాకాశ రూపంగాను స్థితి పొంది ఉన్నాను. అందుచేత ఆ నాచే చూడబడిన జగత్తులన్నీ నా యొక్క అవయవ విభాగాలు గానే నాకు అనిపించసాగాయి. వాస్తవానికి ఆ జగత్తుల యొక్క వస్తుత్వం జనించటమూ లేదు, నశించటమూ లేదు. వాటన్నిటి (స్వస్వరూపం) యొక్క సత్తా నా యొక్క సత్తా చేతనే ఏర్పడినాయి సుమా! అనగా నా సత్తయే వాటి ఉనికికి ఆధారం. ఆ విధంగా అవి నా అవయవాల వలెనే నాకు అనిపించాయి. వాటికి స్వతఃసత్తా లేదు. కాబట్టి అవి వస్తుతత్వరహితములని కూడా గ్రహించు. 

శ్రీరాముడు : మహాత్మా! అనగా మీకు దర్శనమైన ఆ జగత్సమూహములన్నీ మీ యొక్క స్వరూప విభాగమేనని మీ ఉద్దేశమా? చాలా ఆశ్చర్యంగా ఉన్నదే!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అవన్నీ నా స్వసత్తాపై ఆధారపడి దర్శించబడుచున్నాయి. కాబట్,టి అవన్నీ నా స్వరూపానికి అభేదములే! అయితే, ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది? అందుకు మనకు దృష్టాంతం ప్రతిజీవునికి ప్రతిరోజు అనుభవమయ్యే స్వప్నమే. స్వప్నంలో కనిపించేది స్వప్నద్రష్ట యొక్క ఊహాజనిత కల్పనయే కదా! ఏది ఎవరి కల్పనయో అది వారి స్వరూపమే కాక మరింకేమిటి? స్వప్నంలో ఒకచోట నుండి మరొకచోటికి స్వప్న ద్రష్ట పరుగులు తీస్తున్నాడా? లేదు. ఎందుకంటే స్వప్నం యొక్క ఆద్యంతాలు స్వప్నం యొక్క మనో విభాగమే! మనస్సు అతని స్వరూపంలోనుంచే కదా, బయల్వెడలింది? స్వప్నదృశ్యమంతా చిదాకాశం కంటే వేఱుకానట్లే... నేనప్పుడు గాని, లేక ఎప్పుడైనా సరే - చూచే జగత్తులు- చిదాకాశ స్వరూపమే అయి ఉన్నాయి.

దేహాభిమానియగు జీవుడు ఏ విధంగా ఈ కాళ్ళు-చేతులు తన దేహ విభాగంగానే అనుభవం పొందుచున్నాడో, అంతగానూ నేను ఆ జగత్తులనన్నిటినీ అవయవాలుగా గాంచాను. 'వృక్షాభిమాని' అయిన జీవుడు ఆకులు-పూలు-కొమ్మలు మొదలైనవన్నీ తన అంగాలుగా గాంచుతాడు. అనంతమగు సముద్రాభిమాని యగు జీవుడు సమస్త జలచరజీవులను, తరంగాలను ఫేనము (నుఱుగును), ఆవర్తాదులను తన స్వరూపంగా ఎఱుగుతాడు. సర్వాంతర్యామిత్వం సముపార్జించిన జ్ఞాని తదితర జీవులందరినీ తన శరీరములోని విభాగంగా దర్శిస్తాడు. అట్లాగే అక్కడ నాకు తారసపడిన బ్రహ్మాండములన్నీ నాయందే ఉన్నట్లు నాకు అనుభూతి అగుచున్నది. అవయవి ఏ విధంగా తన అవయవములను తనకు అభిన్నంగా అనుభవం పొందుచున్నాడో... అట్లాగే నేను కూడా ఆ బ్రహ్మాండాలన్నీ (ఆయా సృష్టులన్నీ) నాకు అభిన్నంగా ఉన్నట్లు నాకు అనుభూతమగుచున్నది.


Page number:28

అంతే కాదు, ఇప్పుడు కూడా సుమా! బోధరూపమగు ఆత్మతోటి ఏకత్వము పొందిన నేను ఇప్పుడు కూడా ఈ అనేక సృష్టులతోను, ఈ దేహ ఆకాశ- పర్వత స్థలములతోను అభేదత్వ స్థితినే గాంచుచున్నాను. మనకందరికీ ఈ విశ్వం ఎదురుగా ఎట్లా కనిపిస్తుందో... అట్లాగే, ఈ సభా ప్రాంగణం యొక్క బాహ్య-అభ్యంతరాలు కూడా అనేక జగత్తులలో పూర్ణమై ఉన్నట్లు నేను ఎఱుగుచున్నాను.

ఓ రామచంద్రా! జలము తనయందలి రసమును, మంచు తనయందలి శీతలత్వమును, వాయువు తనయందు చలనత్వమును గాంచుచున్నట్లు, శుద్ధబుద్ధి అయినట్టి జ్ఞాని కూడా ఈ జగత్తును తనయందు ఉన్నదానిగా ఎఱుగుచూ ఉంటాడు.

నేనే కాదు, బోధస్వరూపముతోటి ఏకత్వము పొందినట్టి వివేకులందరూ కూడా నాలాగానే ఏకాత్ములై ఉంటున్నారు. నేను నా యందలి ఆత్మనే వారి ఆత్మగాను, వారు వారి యందలి ఆత్మను నా ఆత్మగాను ఎఱుగుచూ ఉంటాం. ఇదియే ‘సర్వాత్మ స్వరూప దృష్టి" ... అని చెప్పబడుతోంది. ఎప్పుడైతే అట్టి సర్వాత్మస్వరూప దృష్టి పరిపక్వ మౌతుందో ...అప్పుడిక “తెలియబడేది - తెలుసుకొనేవాడు - తెలియబడటం” అనే త్రిపుటి జయించబడి అధిగమించబడుతోంది. ఎందుకంటే విజ్ఞాన స్వరూపమగు ఆత్మతో సమస్తం యొక్క ఏకత్వం స్వభావసిద్ధంగా, అనుస్యూతంగా (ఒక్కటిగా కూర్పబడ్డ దాని వలె) సంభవిస్తుంది.

యోగాదులచే సిద్ధులు సంపాదించుకున్న యోగసిద్ధ పురుషుడు ఒక పర్వతముపై నిలబడి తన యొక్క యోగదృష్టితో కోట్లాది యోజనముల దూరం, అంతదూరములో ఉన్న బాహ్య - అభ్యంతర పదార్థములను దర్శించగలుగుతాడు చూచావా? నేను కూడా సమస్త లోకములను అట్లే గాంచాను. భూమండలాభిమాని యగు దేవత భూమి యందలి సమస్త పదార్థములను, సమస్త ధాతు-రసాదులను తనయందే ఉన్నట్లు ఎఱుగుచున్నట్లుగా - అక్కడి దృశ్యమంతా నాకంటే వేఱుగా లేనట్లు నేను అనుభవం పొందాను.

శ్రీరాముడు :  మహాత్మా! తమవంటి చిదానంద స్వరూపజ్ఞాన సమన్వితులకు అట్టి దర్శనం యుక్తియుక్తమని, స్వభావ సిద్ధమని గ్రహించాను. స్వామీ! అప్పుడు చిదాకాశమున అనేక జగత్తుల మధ్యగాను, ఆవలగానూ పయనిస్తూ, దర్శిస్తున్న మీ సమీపంలో ఒక వనిత 'ఆర్య' ఛందస్సు గానం చేస్తూ కనబడిందని చెప్పారు కదా! ఆమె ఆ తర్వాత ఏమి చేసిందో చెప్పవలసినదిగా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విధంగా 'ఆర్య' ఛందస్సును అత్యంత మధురంగా గానం చేస్తున్న ఆ చిదాకాశస్వరూపిణియై 'దేవి' వలె ప్రకాశిస్తూ నా వెంటనంటి నా సమీపంలోనే ఉండటం అప్పుడు నేను గమనించాను. నేనట్లా చిదాకాశరూపం దాల్చానో అట్లే ఆమెకూడా చిదాకాశరూపమే కలిగి ఉన్నది. అంతేగాని ఆ సమాధికి ముందటి శరీరముచే ఆమెను గాంచలేదు. ఆ సమాధికాలంలో నేను, ఆమె, ఆ జగత్సమూహాలు చిదాకాశమాత్రంగానే ఉండి ఉన్నాము.

శ్రీరాముడు :  మునీంద్రా! మీరు ఆమె యొక్క గానమును వింటున్నారని చెప్పుచున్నారు? 'గానం' అనేది ఉత్పన్నం కావాలంటే నాలుక కంఠము మొదలైన కరణములు, ప్రాణవాయువు యొక్క చేష్ట ఉండాలి కదా! కానీ ఆమె ఏమో నిరాకారమైన చిదాకాశరూపధారిణి అంటున్నారు. అట్టి స్త్రీ నుండి శబ్దము ఎట్లా ఉద్భవమైనది?


Page number:29

బాహ్యమైన రూపాదుల యొక్కయు, మరియు అభ్యంతర మానసిక వ్యాపారముల యొక్క కలయికచే 'పాట పాడటం' మొదలైనవి సంభవిస్తాయి. మరి చిదాకాశ రూపమైన ఆత్మయందు అవి ఎట్లా సంభవిస్తాయి? చిదాకాశమున జగద్దర్శనము- పర్యావలోకనం మొదలైనవి తామెట్లా నిర్వర్తించారో, ఆమె గానం మీకెట్లా వినబడిందో, ఆ తత్త్వమును నిశ్చయముగా వచించమని వేడుకొంటున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి :  రామచంద్రా! ఈ విషయం నీకు కొన్నిసార్లు సూచించాను. మరల చెప్పుచున్నాను విను.

ఒకడు కలకంటున్నాడనుకో, అతనికి ఆయా స్వప్న విశేషాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. అయితే అతని భౌతికమైన కళ్ళు, చెవులు, జడత్వం పొంది ఉపయోగించబడకుండానే ఉన్నాయి. కదా! మరి స్వప్నంలోని ఆకారాలు ఏ కళ్ళకు కనిపించాయి? శబ్దాలు ఏ చెవులకు వినిపించాయి? అదేరీతిగా చిదాకాశమున కూడా సమస్తమూ సంభవమే! స్వప్నంతో స్వప్నసంవిత్ - చిదాకాశమే బాహ్య అభ్యంతర పదార్థములుగా ఉదయిస్తోంది కదా! అదేరీతిగా, ఆ సమాధి యందు దృశ్యమంతా కూడా చిదాకాశరూపముగానే ఉండి ఉన్నది.

కేవలం ఆ సమాధి సమయంలో నాకు కనిపించే జగత్తులు, స్త్రీ మొదలైన దృశ్యమే కాదు. మన ఇక్కడి బుద్ధికి గోచరమయ్యే ఈ సమస్త జగత్తు కూడా నిర్మలమగు చిదాకాశరూపమే అయి ఉన్నది. ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహం ఉండవలసిన పనిలేదు.

ఈ జగత్తు నిశ్చయంగా చిన్మయమై, విషయరహితమై, చిత్స్వభావము యొక్క స్వరూపమైయున్నది. స్వయముగా చిదాకాశమే ఇట్లు భాసించుచున్నది. అందుకు ప్రమాణమేమిటంటావా? స్వప్న శరీరము యొక్క కళ్ళు-కాళ్ళుచేతులు మొదలైన కరణముల సత్తకు నీకేమి ప్రమాణమున్నది? స్వప్నము యందు దేహాదుల సత్తా ఎట్లా కలతో, అట్లే మన ఈ జగత్తు యొక్క 'సత్తా' కూడా అట్టిదే. స్వప్న జగత్తు ఎట్టిదో ఈ జాగ్రత్ జగత్తు కూడా అట్టిదే. జాగ్రత్ సత్తా ఎట్టిదో స్వప్న సత్తా కూడా అట్టిదే! అజ్ఞాన కారణంచేత అసత్తు అగు నామరూపాదులు సత్తాను పొందినట్లు అనిపిస్తున్నాయి. అంతే చమత్కారంగా నిర్విషయాత్మతత్త్వమగు సత్తు (ఆత్మతత్త్వము/ చిదాకాశము) అసత్తుగాను అప్రసిద్ధమైనదిగాను అజ్ఞానం చేత అనిపిస్తోంది.

స్వప్నంలో భూమిపై నిర్వర్తించే కృషి, మార్గాలలో చేసే ప్రయాణం, పర్వత గుహాదులలో నిదురించటం మొదలైన సర్వ స్వప్న వ్యవహారములు చిదాకాశరూపమే అయినట్లుగా ఈ జగత్తులో కూడా నీవు - నేను - ఆ స్త్రీ - ఈ జగత్తు తదితర సమస్తం కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నాము. స్వప్నంలో కనిపించిన యుద్ధ కోలాహలాలు రాకపోకలు మొదలైనవన్నీ వాస్తవానికి లేకపోయినప్పటికీ మనుజులకు స్వప్న సమయంలో వాస్తవమైనట్లు అనుభవమగుచున్నది కదా! అట్లాగే, ఈ జగత్సమూహములలో ఈ ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా అనుభవమౌతున్నాయి. 'స్వప్న మందలి ఆ దృశ్య వైచిత్రం దేనివలన కలిగింది?' అని ఎవరైనా అడిగితే దానికి సమాధానమేమున్నది? ఈ జీవునకు జగత్తు అనేది ఎందుకు ప్రాప్తిస్తోంది?" అనే ప్రశ్న అంతగానూ అసమంజసమే అవుతుంది. ఎందుకంటే, ఈ జగత్తు విషయంలో కూడా స్వప్నానుభవస్థితి తప్ప ఇక్కడ అన్యమైన కారణం ఏదీ అవాచ్యమై ఉన్నది (చెప్పుటకు కుదరనిదై ఉన్నది).


Page number:30

“కథమాలక్ష్యతే స్వప్నః?”  ఇతి  ప్రష్ఠుః ప్రకథ్యతే ।
యథైవం పశ్యసీత్యేవ! హేతుః అత్ర అస్తి నేతరః  ॥

“నాకు స్వప్నంలో అది అట్లా ఎందుకు కనిపిస్తోంది?" అని ఒకాయన ప్రశ్నించాడనుకో. దానికి మనం సమాధానం ఏం చెబుతాం? “బాబూ! నీవు ఎట్లా దానిని గాంచుచున్నావో అద్దానిని అట్లే పొందుచున్నావు” ... అని మాత్రమే సమాధానం చెప్పగలం. అట్లాగే ఈ ప్రపంచం యొక్క విషయం కూడా. "ఈ ప్రపంచం నాకు ఇట్లా (నిర్మలమైన ఆత్మగా కాకుండా నామ రూపాత్మకమైన ఆయా విశేషాలతో కూడి) ఎందుకు కనిపిస్తోంది?" అని ఎవరైనా ప్రశ్నిస్తే, "అయ్యా! ఇద్దానిని నీవు నామ రూపాత్మకంగా చూస్తున్నావు కాబట్టి నామరూపాత్మకంగా కనిపిస్తోంది” అని అనక తప్పదు.

దీనిని ఆత్మతత్త్వంగా చూస్తే (ఆత్మయే ఈ ఈ రూపములుగా అగుచున్నది కదా!... అను దృష్టితో చూస్తే) ఇదంతా నిర్మలమగు ఆత్మగానే కనిపిస్తుంది. ఇంతకుమించి ఈ జగత్తుకు వేతే హేతువు ఏదీ లేదు. ప్రథమ సృష్టి మొదలుకొని విరాడాత్మరూపం వరకు, వ్యష్టి మొదలుకొని సమష్టి వరకు చిదాకాశమే చిదాకాశంలో తన యొక్క పరస్పర సాపేక్ష చమత్కారం చేత భాసించుచున్నది. 

శ్రీరాముడు :  స్వామీ! అయితే ఈ జగత్తంతా ఒక స్వప్నం వంటిది మాత్రమేనంటారా?

శ్రీ వసిష్ఠ మహర్షి :

స్వప్న శబ్దేన బోధార్థం తవ వ్యవహరామ్యహమ్ ।
దృశ్యం తు ఇదం న సత్, న అసత్, న స్వప్నో, బ్రహ్మ కేవలమ్ ॥

ఓ రామచంద్రా! నీకు బోధించటం కొరకు మాత్రమే స్వప్న శబ్దాన్ని (స్వప్న దృష్టాంతాన్ని) ఇక్కడ వాడాను. వాస్తవానికి ఈ దృశ్యం సత్తు కాదు. అసత్తు కూడా కాదు. స్వప్నము కాదు. మరి? ఇదంతా కేవలము బ్రహ్మమే అయి ఉన్నది. భ్రమచే వివిధ రూపములతో కూడిన జగత్తుగా అనిపిస్తోంది. భ్రమతొలగినప్పటి దృష్టికి ఇక్కడ బ్రహ్మము తప్పించి మరేమీ అగుపడుటయే లేదు. జగత్తు అనబడేది (నిర్మలబ్మాహీ దృష్టిచే) ఎక్కడున్నది?

సరే! ఇక ఆ స్త్రీ విషయానికి వద్దాం. ఆ స్త్రీ గానం చేస్తూనే - నేను ఎటు వెళ్ళితే అటే వస్తోంది. “అనురాగవతి, దృశ్య రూపిణియగు ఈ స్త్రీ నన్ను వెంబడించటంలో ఈమె అభిప్రాయం ఏమిటో తెలుసుకొనెదను గాక!” అనే సంకల్ప సంవిత్తును నేను ఆశ్రయించాను. స్వప్నంలో స్వప్నజనులతోటి వ్యవహారం సిద్ధించునట్లుగా ఆమెతో కూడా నాకు 'ప్రశ్న-సమాధానం' మొదలైన వ్యవహారము సిద్ధించింది.

శ్రీరాముడు : “ప్రశ్న-సమాధానం” అను రూపంలో అప్పుడు సిద్ధించుచున్నది స్వప్న సదృశమేనా? జాగ్రత్ సదృశమా?

శ్రీ వసిష్ఠ మహర్షి :  మరల చెప్పుచున్నాను. స్వప్నంలోని వ్యవహారమంతా చిదాకాశ రూపమే అయినట్లు ఆ నేను, నా వ్యవహారము, ఆ జగత్తు, ఈ మనకు కనిపించే జగత్తు చిదాకాశ రూపముగానే గ్రహించు.


Page number:31

కాబట్టి, స్వప్నము-జాగ్రత్తు సమానమే! జాగ్రత్తు యొక్క ఏమఱుపు నుండి భావించే దానిని స్వప్నమని పిలుస్తున్నాం. అట్లాగే, ఆత్మత్వము యొక్క ఏమఱపు నుండి భాసించేదానిని 'జగత్తు' అని పిలుస్తున్నాం. ఇంతకు మించి స్వప్న - జాగ్రత్తులకు వేఱే భేదమేమీ లేదు. ఎందుకంటావా? ఈ జగత్తు ఆత్మకు స్వప్నమే అవుతుంది. అయితే, ఈ జగత్తు దీనియొక్క అధిష్ఠాన రూపముచే కేవలం చిదాకాశము మాత్రమే! ఈ జగత్తు దృశ్యరూపంగా (నామ రూపాత్మక దృష్టిచే) అసత్తే అయి ఉన్నది. వాస్తవానికి నిర్మలము, జ్ఞప్తి మాత్రము, సన్మాత్రము అయినట్టి బ్రహ్మమే ఈ జగద్రూపంగా స్థితినొందియున్నది.

ఓ సర్వ ప్రియ సభికులారా!

స్వప్నస్య విద్యతే ద్రష్టా, సాకారో యుష్మదాదికః ।
ద్రష్టా తు సర్గ స్వప్నస్య చిద్వ్యోమైవామలం స్వతః ॥

సాకారుడు ఈ జీవుడు స్వప్నము యొక్క ద్రష్టగా అగుచున్నారు. స్వప్నదృష్టానుభవం ప్రతి ఒక్కరికీ దైనందినమే కదా! అట్లాగే 'సృష్టి' అనే స్వప్నమునకు ద్రష్ట స్వయంగా నిర్మలమగు చిదాకాశమే అగుచున్నది సుమా! స్వప్నమునందలి ద్రష్ట - దర్శనము - దృశ్యములు కూడా నిర్మల చిదాకాశమే అయి ఉన్నది. ఈ జగద్రూప స్వప్నం నిరాకారమగు చిదాకాశమునందే స్వయంగా స్ఫురిస్తోంది.

చిదాకాశము నిరాకారమై ఉండగా ఈ జగత్తుకు మాత్రం సాకారత్వం ఎక్కడున్నది? కనుక, ఈ జగత్తు కూడా వాస్తవానికి నిరాకారమే! ఇందలి సాకారత్వం? 'భ్రమ' ఉన్నంత వరకే అట్లు అగుపిస్తుందని గ్రహించబడు గాక!

ఇంకొక విషయం. సాకారులగు జీవుల, నిర్మలమగు ఈ జగత్తు - ఈ రెండూ కూడా చిదాకాశం కాక ఏమౌతుంది? ఈ స్వప్న సదృశ జగత్తు వాస్తవంగా రచించబడకపోయినప్పటికీ గోడ లేని రంగుల చిత్రలేఖనం లాగా చిదాత్మ ఈ జగత్తును రచించబడినదానివలె గాంచుచున్నది.

'చిదాకాశము' అనే కోమలమైన మట్టితో 'హిరణ్యగర్భుడు' అను కళాకారుడు 'ఇంద్రియములు' మొదలైన వాటితో కూడిన ఈ సృష్టి మండపాన్ని నిర్మించినప్పటికీ, వాస్తవానికి ఈ జగత్తు నిర్మించబడనిదేనని గ్రహించు.

ఓ రామచంద్రా! వాస్తవానికి ఇక్కడ కర్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు. జగత్తులు లేవు. తదితర ద్వైతభావములూ లేవు. ఈ సర్వమునకు కేవల సాక్షియైనట్టి చిద్రూప బ్రహ్మమొక్కటే ఉన్నది. కాబట్టి, నీవు అభ్యంతరమున 'శిల' వంటి మౌనాన్ని అవలంబించు. ఇక బాహ్యమునందో... యథాప్రాప్తములైనట్టి ప్రవాహపతిత కర్మలను ప్రశాంత స్వభావుడవై ఆచరించు.

ఈ దేహము ప్రారబ్ధ పర్యంతము ఉంటే ఉండనీ, ఆ తర్వాత ఉండకపోతే పోనీ, ఇందులో ఇంకే విశేషమూ లేదు.

✤✤✤


Page number:32

Ⅴ-8.) అజ్ఞాని దృష్టిలో గల అంతులేని జగత్తులు! జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే!!

శ్రీరాముడు :  ఓ మహర్షీ! "ఆ స్త్రీ యొక్క నిరాకారమగు దేహముచే తమకు సాకార సంబంధమైన వ్యవహారం ఎట్లా సిద్ధించింది?” అనే విషయంలో ఇంకా కొంత శంక నా యందు మిగిలియే ఉన్నది. అట్టి స్థితిలో జిహ్వ (నాలుక) లేదు కదా! జిహ్వ లేకుండా “క-చ-ట-త-ప” మొదలైన వర్ణనలు మీరు ఎట్లా ఉచ్చరించగలిగారు?

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓహో! ఆ విషయం గురించి మరల ప్రస్తావిస్తున్నావా? నీ శంక తొలగటానికి మరికొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.

చిదాకాశమే శరీరముగా గలిగియున్నట్టి జ్ఞానుల యొక్క అనుభూతి (లేక) అనుభవమునకు ఈ ‘క-చ-ట-త-ప’ మొదలైన ఉచ్చారణ యొక్క ఆవశ్యకతయే లేదు. ఎందుకంటావా? ఆయా ఉచ్చారణా శబ్దములన్నీ వాస్తవానికి కల్పితములే కదా! శబ్దములన్నీ అర్థ కల్పిత మాత్రములే కదా! భావమును పరస్పరం ఉచ్చరించటానికి శరీరము అత్యావశ్యకమేమీ కాదు. మనం చెప్పుకున్నట్లు స్వప్నంలో శరీరము యొక్క ఆవశ్యకత లేకుండా 'మాట్లాడుకోవటం’ మొదలైనవి జరుగుతున్నాయి కదా! ఒకవేళ శరీరమే మాట్లాడుతుందని అంటావా? శవం నోరు-కళ్ళు-చెవులు మొదలైనవన్నీ కలిగి ఉండి కూడా మాట్లాడటం-చూడటం-వినటం మొదలైనవి నిర్వర్తించలేదు కదా!

శ్రీరాముడు :  మహర్షీ! స్వప్నంలో అనుభవమయ్యే ఉచ్చారణ, సంభాషణ మొదలైనవి ఆ స్వప్న సమయంలో సత్యమువలెనే ఆ స్వప్న ద్రష్టకు అనిపించటం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ స్వప్నంలో జరిగే సంభాషణ సత్యమా? అసత్యమా?

శ్రీ వసిష్ఠ మహర్షి :  (చిరునవ్వు నవ్వి) రామచంద్రా! స్వప్నంలో జరిగే ఉచ్చారణే కనుక (జగత్ వ్యవహారం దృష్ట్యా) సత్యమే అయితే ఆ ఉచ్చారణ ఆ ప్రక్కనే (జాగ్రత్‌లో ఉన్న) తదితర సహజీవులకు వినిపించాలి కదా! స్వప్న ద్రష్టకు వినిపించే ఉచ్చారణ జాగ్రత్‌లో ఉన్నవానికి వినిపించటం లేదు. కనుక “సత్యము కాదు” అని అనక తప్పదు మరి? స్వప్నంలో స్వప్న ద్రష్టకు వినిపించే ఉచ్చారణంతా ఆ స్వప్న ద్రష్ట యొక్క భ్రమ మాత్రమే! కనుక "నిద్రా స్వభావ బలం చేత కల్పించబడిన చిదాకాశము యొక్క స్ఫురణయే ఆ విధంగా స్వప్నంగా భాసిస్తోంది" అని గ్రహించు.

భ్రాంతిచే ఆకాశంలో రెండు చంద్ర బింబములు ఉన్నట్లు (కళ్ళకు సంబంధించిన తిమిర రోగ ప్రభావం చేత) అనిపించవచ్చు. ఆకాశంలో ఏవేవో ఆకారాలు ఉన్నట్లు కనిపించవచ్చు. భ్రమచే శిలా ప్రతిమ నృత్యం చేస్తున్నట్లు కనిపించవచ్చు. అట్లాగే, భ్రాంతిచే స్వప్న దేహములందు చిదాకాశమే ఆయా ఉచ్చారణలతో కూడిన శబ్దరూపమును పొందుతోంది. ఆకాశంలో భ్రమచే కనిపించే ఆకారం ఆకాశం కంటే వేరుకాదు కదా! అట్లాగే స్వప్నానుభవమునందు కనిపించే జగదాకారరూపమైనట్టి చిదాకాశ స్ఫురణము ఏమాత్రం కూడా చిదాకాశము కంటే భిన్నం కాదు.


Page number:33

స్వప్నంలో కనిపించే జగత్తులాగానే మనందరికీ ఈ ఎదురుగా కనిపించే జాగ్రత్ జగత్తు కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నది.

చూచావా? ఆకాశం మొదలైనవన్నీ ఎట్లా చిదాకాశమే అయి ఉన్నాయో... అట్లాగే నా సమాధిలో నాచే గాంచబడిన జగత్సమూహములన్నీ కూడా చిదాకాశ రూపమే అయి ఉన్నాయి. అనగా, ఏ జగత్తైతే సత్యంగాను, స్థిరంగాను, మనోహరంగాను మనకందరికీ ఎదురుగా భాసిస్తోందో ... అట్టి ఇదంతా చేతనమైన చిదాకాశమే ఈ విధంగా స్థితినొంది ఉన్నది -- అని గ్రహించి ఉండు.

శ్రీరాముడు : మహాత్మా! నాదొక సందేహం. ఈ జగత్తు స్వప్నము వంటిదేనని అన్నారు కదా! అయితే, స్వప్నరూప మాత్రమైన ఈ జగత్తు జాగ్రత్ స్వప్నరూపంగా ఎట్లా అయింది? ఇదంతా అసత్యమే అయినప్పటికీ సత్యము వలె ఈ కళ్ళు మొదలైన వాటికి విషయమై ఎందుకు భాసిస్తోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! “ఈ జగత్తులన్నీ నిజానికి స్వప్నమువంటివే...” అని శాస్త్రములచే ఎందుకు సిద్ధాంతీకరించబడిందో,... చెబుతాను, విను.

స్వప్నము స్వప్నద్రష్టకంటే వేరైనదా? కాదు కదా! అట్లాగే, ఈ జాగ్రత్‌లో సిద్ధించుచున్న జగత్తులు కూడా ఆత్మకంటే భిన్నం కాదు. నామరూపాత్మకం దృష్ట్యా చూస్తే ఇవి వాస్తవములు కావు. స్థిరములు కావు. ఇవి సత్తు కావు. అసత్తు కావు. ఇవి అనిర్వచనీయములై ప్రతిభాస రూపమున ఆత్మ సత్తాచే స్థితిస్తూ ఉన్నాయి.

గింజలగుట్టలో కొన్ని గింజలు ఒకే రీతిగా ఉంటాయి. మరికొన్ని ఆకారం దృష్ట్యా వేర్వేరుగా ఉంటాయి. బీజములన్నీ ఒకే రీతిగా ఉన్నా, అవి వృక్షములుగా అయినప్పుడు (ఆకృతి-కొమ్మల సంఖ్య మొదలైన వాటిచే) వేర్వేరుగా ఉంటాయి. అట్లాగే, చిదాకాశమున ఉన్న ఈ జగత్తులు కొన్ని ఒకే రీతిగాను, మరికొన్ని వేర్వేరు రీతులుగాను ఉంటున్నాయి. చిదాకాశమున ప్రళయానంతరం కొన్ని పూర్వంలాగానే ఉంటున్నాయి. కొన్ని సమంగాను, ఇంకొన్ని అసమంగాను ఉంటున్నాయి.

మరొక విషయం... ఒక స్వప్నంలో మరల మరికొన్ని స్వప్నములు కలుగుతూ ఉంటాయి చూచావా? అట్లాగే, ప్రతి ఒక్క జగత్తులో మరల మరికొన్ని జగత్తులు ఉద్భవమగుచున్నాయి.
1.) "జగత్తులో జీవులు,
2.) ప్రతి జీవుడు తనదైన రీతిలో జగత్ స్వప్నం గాంచటం,
3.) ప్రతి ఒక్క స్వప్నంలో ఎన్నో జగత్తులు,
4.) ఆ జగత్తులలో మరికొన్ని జీవులు,
5.) అట్టి ఆ జీవులలో అంతర్గత జగత్తులు
...ఇట్లా ఒకదానికి మరొకటి అదృష్టములై (ఒక జగత్తుకు మరొక జగత్తు యొక్క ఉనికి తెలియరానిదై) ప్రవర్తిస్తున్నాయి కదా! “ధాన్యపు కొట్టులోని బీజరాసులు ఒక్కొక్క బీజంలో వృక్షతత్వం - ఆ బీజం మరల వృక్ష రూపంగా అనేక బీజముల ఉత్పత్తికి కారణమవటం - అట్లా ఉత్పన్నమైన ప్రతి బీజంలో అనేక తదనంతర వృక్షముల అంకుర తత్త్వం” ... ఇవన్నీ ఎట్లా ఏర్పడుచున్నాయో, అట్లాగే జగత్తు ఆ జగత్తులో అసంఖ్యాక జీవులు - అట్టి జీవాంతర్గత జగత్తులలోని ప్రతి దానిలో అనంత సంఖ్యలో జీవులు... ఇదంతా ఏర్పడి ఉంటోంది. ధాన్యపు గుట్ట నశిస్తే అందలి జీవ-జీవాంతర్గత తత్త్వము కూడా నశించునట్లు, ప్రళయంలో జగత్తులు నశిస్తున్నాయి.


Page number:34

ఈ విధంగా ఈ స్వప్నరూప జీవులు ఈ కనబడే జగత్తులోనే అసంఖ్యాకంగా కనిపిస్తున్నారు కదా! ఇప్పుడీ జగత్తు నశించిందనుకో, అప్పుడేమౌతుంది? జగత్తు నశించినప్పటికీ ఇందలి జీవులందరూ వాస్తవానికి చిదాకాశరూపులే కాబట్టి ఈ జీవులు చేతన రూపులుగానే ఉంటున్నారు. అంతేగాని, వీరందరు - ఎన్నటికీ శూన్యరూపత్వం పొందరు.

'జీవులు' అనగా అజ్ఞానముచే ఆవరించబడిన చేతనరూపులే కదా! కనుక, వీరందరు దేహము ఉన్నప్పుడు, దేహానంతరము కూడా వారివారి జగత్తులను స్వయం కల్పితంగా అనుభవిస్తూనే ఉన్నారు, ఉంటారు.

ప్రక్క ప్రక్కన నిద్రిస్తున్నప్పటికీ ఒకరి స్వప్నమును మరొకరు ఎఱుగజాలనట్లుగా - ఈ జీవులు నిరంతరము పరస్పరము ఎఱుగజాలని తమ తమ జగత్తుల అనుభవమును కొనసాగిస్తూనే ఉంటారు.

నిద్రించిన జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ దృశ్య దేహసంబంధమైన జగత్తును వదలి స్వప్నజగజ్జాలమును పొందుచున్నాడు. అట్టి స్వప్నజగత్తుతో ఈ ఎదురుగా కనిపించే జగత్తుకు సంబంధించని స్వయం కల్పితమైన స్వప్న జగత్తులో పగలు రాత్రి వ్యవహారములు మొదలైనవన్నీ ఆస్వాదిస్తున్నాడు.

స్వప్న జగత్తులో కూడా త్రిలోకములు ఉంటున్నాయి. ఆ స్వప్న జగత్తులోని అసురులు, అదే స్వప్నజగత్తులోని దేవతలచే హతులు అయ్యారనుకో! అప్పుడు ఆ హతులైన రాక్షసులు ఏమౌతున్నారు? వారు ఇంకా అజ్ఞానము కలిగి ఉండటం చేత ముక్తులు అగుటలేదు. రజో సంబంధమైన ఉత్సుకత ఉండనే ఉన్నది కాబట్టి ఇటు శిలారూపులు అగుటలేదు. దేహ సహితులూ కాదు! అట్టి స్థితిలోని దేహరహిత జీవులకు అట్టి దశయందు “స్వప్నజాగ్రత్ స్థితి” తప్ప వేరే స్థితి ఏముంటుంది?

నిర్మోక్షా నిఃశరీరాస్తే చేతనావాసనాన్వితాః ।
దృష్టం స్వప్నజగజ్జాలం వినా చ క్వ వసంతు తే? ॥

"ఏ జీవులైతే మోక్షరహితులై ఉన్నారో, శరీర శూన్యులైనారో, చేతనాయుక్తులు, వాసనా సహితులు అయి ఉన్నారో - అట్టి జీవులు జాగ్రత్తును పొందనప్పుడు ఎక్కడ ఉంటారు?” అను ప్రశ్నకు నా సమాధానం విను. అట్టి జీవులు స్వప్నజగత్తులో తప్ప మఱి ఎచ్చట నివసించగలరు!

అట్లాగే నిద్రించు రాక్షసులు కూడా వారివారి స్వప్న జగజ్జాలం యొక్క వ్యవస్థను అనుసరించి వారి స్వప్న జగత్తులో వ్యవహారములు ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ వారివారి స్వప్న జగత్తులో దేవతల చేతులలో నిహతులైనారనుకో... అప్పుడు? అప్పుడు కూడా వారి యొక్క స్వప్నాంతర్గతమైన మరొక స్వప్నంలో ప్రవేశించి స్వప్నక్రియలను కొనసాగిస్తూ ఉంటారు.

కాబట్టి రామచంద్రా! ఈ ప్రకారంగా స్వప్నంలో హతులైనవారు ఏం చేస్తున్నారు? వారు అజ్ఞానవశంచేత ముక్తిపొందక, చేతనరూపులవటం చేత శిలాత్వం కూడా పొందక ఉంటున్నారు. దేహం పోయిన తర్వాత మోక్ష రహితులగు జీవులు తదనంతర దేహము పొందనంతవరకు తమయందలి చేతనత్వము కారణంగా తమ తమ సంస్కారానుసారం స్వప్నజగత్తులో ప్రవేశించి ఆ స్వప్న లోకములను అనుభవిస్తున్నారు.

శ్రీరాముడు : మహాత్మా! దేహానంతర స్వప్నలోకములలోని ఆ మరణించినవాని జగద్దర్శనం మన ఈ శిల - కొండ - ప్రదేశాలలోని జగద్దర్శనంగానే ఉంటుందా? లేక మరొక రీతిగా ఉంటుందా?


Page number:35

శ్రీ వసిష్ఠ మహర్షి :  మనం జాగ్రత్తులాగే ఏ విధంగా అయితే, ఈ దృశ్యమును నమ్మి 'ఇది పర్వతం - అది గ్రామం - ఇది నా దేశం - అది నీ దేశం” మొదలైనవన్నీ పొందుచున్నామో... అదే రీతిగా దేహానంతర మోక్షసిద్ధిరహిత జీవుడు కూడా అంతటి నమ్మికతోనూ, తన స్వప్నంలో పర్వత - సముద్ర - పృథ్వి - జన సమూహాదులతో కూడిన యథాస్థితమైన సమస్త దృశ్యమును చిరకాలంగా సత్యమని నమ్మి అనుభవించుచున్నాడు. కాబట్టి, అతని స్వప్నము కూడా మన ఈ జాగ్రత్ స్వప్నము వంటిదే అగుచున్నది.

అతని జగత్ స్థితి - కల్పము మనకు వలెనే ఉన్నాయి. మన జగతిస్థితి - కల్పము అతనికి వలెనే ఉన్నాయి. ఈ జాగ్రత్ దృశ్య జగత్తు - జగద్విషయాలు మనకు ఎంతగా అత్యంత సత్యమని అనిపిస్తోందో,... ఆ స్వప్న దృశ్య ద్రష్ట అంతగానూ అది వాస్తవమేనని తలచియే అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఉభయస్థితులలోనూ ఆయా దృశ్యరూపాలుగా పరిఢవించేది మనస్సే కదా!

అంతేకాదు. మనచే అనుభూతమగుచున్న ఈ జగత్తు, ఈ జగత్తులో అంతర్గతమైన మనము వారి స్వప్నములో గాంచబడటం జరిగిందా... అప్పుడు వారి స్వప్న ప్రపంచంలో మన ఈ జగత్తు కూడా ఒక విభాగమౌతోంది. అప్పుడు మనమందరం కూడా అతనికి స్వప్న పురుషులం అగుచున్నాం. అతని స్వప్న మనుజులంతా (మనమంతా) అతనికి సత్యముగానే ఉన్నారు.

శ్రీరాముడు : స్వామి! మీరిప్పుడు చెప్పిన చివరి వాక్యం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. “స్వప్నం భ్రమ మాత్రమే” అనునది ప్రతి ఒక్కరి దైనందినానుభవం కదా! 'స్వప్నంలో కనిపించిన స్వప్న జనులందరూ సత్యంగానే ఉన్నారు'... అను మీ వాక్యం ఎట్లా సమన్వయించుకోవాలి? 

శ్రీ వసిష్ఠ మహర్షి :  అవును. అందుకు కొన్ని సమన్వయ పూర్వక సిద్ధాంతాలు చెబుతాను.

1. ‘స్వప్న సత్త’ యొక్క చమత్కార ప్రదర్శనమే స్వప్నము.
2. ‘స్వప్న సత్త’కు నిమిత్తకారణం అధిష్ఠాన సత్ - చిదాత్మయే! మట్టి కుండలన్నిటికీ మట్టియే నిమిత్త కారణమైనట్లు!
3. అధిష్ఠాన చిదాత్మ సర్వగామి. అనగా, సర్వదా అంతటా ఏర్పడి ఉన్నది.

ఈ విధముగా తమ యొక్క, ఇతరుల యొక్క అనుభవం సమానం అవటంచేత వారి స్వప్న మనుజులు సత్యముగా ఉన్నట్లే కదా! వారి స్వప్నజగత్తులో మన ఈ జగత్తు, మన స్వప్న జగత్తులో వారి స్వప్న వివేషాలు తారసపడటం జరుగవచ్చు కూడా!

యథా తే స్వప్న పురుషాః సత్యమాత్మన్యథా పరే ।
తథాపి స్వప్న పురుషాః సత్యమేవ తథైవ తే ॥

ఆ స్వప్న పురుషులు వారివారి దృష్టి యందు ఏఏ విధంగా సత్యమై ఉన్నారో... ఆయా విధంగానే నా చేత, నీ చేత, ఈ సభలో సభికులందరిచేత, తదితర సర్వ జీవుల చేత - ప్రతి స్వప్నంలో అనుభూతులగు మనుజులంతా కూడా - స్వప్నద్రష్ట స్వరూపమైన అధిష్టాన ఆత్మయే అట్లు అనుభూతమగుచుండుట చేత - సత్యమే అయి ఉన్నారు.

అనగా, ప్రతి ఒక్క జీవుని జాగ్రత్, స్వప్నములు స్వస్వరూప సంప్రదర్శన - సందర్శనా చమత్కారములే!


Page number:36

స్వ స్వప్నపుర పారా యే త్వయే దృష్టాస్థథైవ తే ।
స్థితాస్తత్ర తథాద్యాపి బ్రహ్మ సర్వాత్మకం యతః ॥

నీవు నీ స్వప్నంలో ఏ నగరాలను, నగరవాసులను దర్శించావో... వారంతా ఆ విధంగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎందుచేతనంటే, బ్రహ్మం సర్వదా సర్వ స్వరూపం, సర్వాత్మకం అయి ఉన్నది కదా!

స్వప్న పదార్థములు జాగ్రత్తుకు వచ్చేసరికి అవి నశించునట్లు అనుభూతమగుచున్నట్లే... అవన్నీ స్వప్నం నందు (స్వప్న సమయంలో) స్థితి కలిగి ఉన్నట్లే అనుభూతమౌతున్నాయి.

స్వప్నస్థితి ఈ జాగ్రత్ వ్యవహారాన్ని నశింపజేయటం లేదు కదా! అట్లాగే, జాగ్రత్ స్థితి స్వప్నాంతర్గత ఆయా జీవాదులను నశింపజేయటం లేదు.

సమస్త సత్తయు బ్రహ్మ సత్తామయమే కాబట్టి ఎద్దాని సత్తయు (జాగ్రత్ సత్త - స్వప్న సత్త) రెండవదానిని స్పృశించటం లేదు. తొలగించటం లేదు.

ఈ సమస్త జగత్తు ఆకాశం యొక్క కార్యమే! అనగా, ఆకాశమే ఇట్లు జగద్రూపంగా అనుభవమౌతోంది. ఆకాశం నాశరహితం కదా! అట్లాగే ఇక్కడ జాగ్రత్‌న గానీ, స్వప్నమున గాని ఏదీ నశించటం లేదు, పరిఢవిల్లటం లేదు. అట్లాగే, సర్వము సర్వత్రా సర్వదా పరమాత్మ రూపమే అవటం చేత, ఎద్దాని రూపము కూడా ఏమాత్రమూ నశించటం లేదు.

'ఉత్పత్తి శూన్యము, ఆది-మధ్య-అంత రహితము, అనంతము' అయినట్టి 'చిదాకాశ రూప పరబ్రహ్మము'నందు అనంతములైన చిత్త సమూహములు ఉన్నాయి.

అట్టి ప్రతి ఒక్క చిత్తమునందు అసంఖ్యాకమైన జగత్ సమూహాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క జగత్తు యొక్క ఆకాశంలో అనేక ప్రపంచ మండలాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క ప్రపంచ మండలంలోను అనేక లోకాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క లోకములోను అనేక ద్వీప - ద్వీపకల్ప - పర్వతప్రాంత - పుర - గ్రామ - గృహాలలో అనేకమంది అసంఖ్యాక జీవులున్నారు. అట్టి ప్రతి ఒక్క జీవుని లోను, అసంఖ్యాక వత్సర-యుగాది కాల విభాగాలతో కూడిన అసంఖ్యాక జగత్తులు ఉన్నాయి.

ఒక జీవుడు జీవిస్తూ ఉండవచ్చును గాక! లేక మరణించి ఉండవచ్చు గాక! ఆ జీవుడు మోక్షమును పొందనంతవరకు అతనియందు అనంతమైన సంఖ్యలో జగత్తులు వేర్వేరుగాను, అక్షయంగాను ఉంటూనే ఉంటాయి. ఆ జీవుని వాసనల యందు మరల అసంఖ్యాక జీవులున్నారు. అట్టి వాసనలతో గల అసంఖ్యాక జీవులలోని ప్రతి ఒక్కని మనస్సులోను అసంఖ్యాక జగత్తులు ఉన్నాయి. అట్టి ఆ మనస్సులో గల ప్రతి ఒక్క జగత్తునందలి ప్రతి ఒక్క జీవుని మనస్సునందును మరల అనేక బ్రహ్మాండములు ఉన్నాయి.

ఈ విధంగా ఈ దృశ్య భ్రమ మొదలు, చివర అనేవి లేకుండానే అనంతంగా కొనసాగుచూనే ఉన్నది. దీనికి హద్దూ-అంతూ అంటూ ఏదీ లేదు. మనస్సే దాని మొదలు - మధ్య - చివర కూడా అని గ్రహించు.

కాని, బ్రహ్మజ్ఞాని యొక్క దృష్టి యందు మాత్రం ఇవన్నీ కూడా బ్రహ్మరూపమే అయి ఉన్నాయి. చిదాకాశము తప్పించి వాటికి వేరే రూపమే లేదు.


Page number:37

ఓ రామచంద్రా! ఒక గోడయందు, ఆకాశమునందు, ఒక శిలయందు, జలమునందు, స్థలమునందు... అంతటా చిన్మాత్రమగు పరబ్రహ్మమే వేంచేసి ఉన్నది. ఈ జగత్తంతా కూడా చిన్మాత్రమే! చిన్మాత్రమే స్వప్న జగత్తు కూడా! అసలు జగత్తు అనబడే వస్తువు (పరబ్రహ్మమునకు) వేరుగా లేనే లేదు.

అట్టి చైతన్యము 'సర్వవ్యాపకం' కాబట్టి సర్వత్రా అనేక జగత్తులు ఉండి ఉన్నవే అగుచున్నాయి. అట్టి జగత్తుల సంఖ్యను లెక్కించటం ఎవరితరం అయ్యేది కాదు. అయితే... 'జ్ఞాని దృష్టిలో మాత్రం ఈ జగత్తులన్నీ కూడా 'నిర్విశేషం, నిరతిశయానందరూపం' అయిన బ్రహ్మమే అయి ఉన్నాయి.

‘అజ్ఞాని' యొక్క మనస్సుకో... అవన్నీ ఉత్తమ ఘనీభూత దృశ్యములుగానే అనుభవవానికి వస్తున్నాయి. కాబట్టి, అజ్ఞానికి అతని అనర్థపరంపర ఏమాత్రం శమించటమే లేదు. జ్ఞాని వీటన్నిటినీ ఆత్మగానే దర్శిస్తున్నాడు కనుక, అతనికి అనర్థమే కనిపించటం లేదు. అజ్ఞానికి అనర్థం శమించటం లేదు. జ్ఞానికి అనర్థమేదీ కనిపించటం లేదు.

✤✤✤

Ⅴ-9.) పాషాణాంతర్గతంలో విద్యాధర స్త్రీ విరహ గీతికలు

శ్రీరాముడు :  మహర్షీ! మీరు చిదాకాశంలో కల్పనా మాత్రాలైన అనేక జగజ్జాలాలను చుట్టివస్తూ ఉండగా మిమ్ములను అనుసరిస్తున్న ఆ ఆ స్త్రీ ఆర్య ఛందస్సు (వేద మంత్రాలు గానం చేసే ఒకానొక రాగం) గానం చేస్తూ ఉన్నదని అన్నారు కదా! మరి ఆమెతో మీరేమైనా సంభాషించారా!

శ్రీ వసిష్ఠ మహర్షి :  అవును. సంభాషించాను. కమల నేత్రములతో విరాజిల్లుచున్న ఆ విద్యాధర స్త్రీ వైపుగా చూచి వినోదపూర్వకంగా నేనిట్ల సంభాషించాను.

శ్రీ వసిష్ఠ మహర్షి :  కమలగర్భము వంటి శోభతో ప్రకాశిస్తున్న ఓ లలనా! నీవు ఎవరివి? ఇటు వైపుగా ఎందుకు వస్తున్నావు? ఎవరికి సంబంధించినదానవు? ఏమి ఇక్కడ సంచరిస్తూ నన్ను వెంబడిస్తున్నావు? ఎచటకు నీ ప్రయాణం? నీ అసలు నివాస స్థలం ఎక్కడ?

విద్యాధర స్త్రీ :  హే మునీంద్రా! మిమ్ముల్ని అనుసరిస్తూ వస్తున్న నన్ను ఇప్పటికైనా ఇట్లా ప్రశ్నించటం నాకు సంతోషాన్ని కలుగజేస్తోంది. వినమ్రురాలనై నా వృత్తాంతమంతా ఉన్నది ఉన్నట్లుగా మీకు విన్నవించుకుంటాను.

సంసారదుఃఖముచే పీడితురాలనైన నేను అట్టి దుఃఖమును, ఉపశమింపజేయ గల ఉపాయములను అర్థించే ఉద్దేశంతో మిమ్ములను అనుసరించి వస్తున్నాను. నన్ను విశ్వసించి నాపై కరుణతో నా వృత్తాంతం విని నాకు సద్ధతిని ప్రసాదించే మార్గం ప్రబోధించండి.

⌘⌘

ఓ మునీంద్రా! చిదాకాశము యొక్క ఒకానొక కోణమునందు ఈ మీరు ఉంటూ ఉండే 'జగత్తు' అనే గృహం ఒక చిన్న విభాగంగా ఉన్నది. ఈ మీ జగద్రూప గృహంలో "పాతాళము - భూలోకము - స్వర్గలోకము" అనేవి 3 కూడా లోపలి గదుల వంటివి.


Page number:38

ఈ జగత్ గృహంలో హిరణ్యగర్భ స్వరూపిణియగు (సృష్టికర్త స్వరూపిణియగు) మాయ 'సృష్ట్యాది వైచిత్ర్య కల్పన' అనే చమత్కారం రచించింది. ఈ జగత్తు ద్వీపముల చేత, సముద్రముల చేత వలయముల వలె చుట్టబడి ఉన్నది. ఈ జగత్తుకు సప్తద్వీపములకు, సముద్రములకు ఆవల సువర్ణరంగు గల భూమి ఉన్నది. ఆ భూ ప్రదేశం 10,000 యోజనముల విస్తీర్ణం కలిగి ఉన్నది. ఆ భూప్రదేశం రాత్రులందు స్వయంగా (సూర్యాదులు లేకుండానే) ప్రకాశిస్తూ ఉంటుంది. అందులో ఈ భూభాగంలాగా ధూళి ఉండదు. ఆ భూ ప్రదేశం ఎవరు ఏది కోరితే అద్దానిని అప్పటికప్పుడే ప్రసాదించగలదు. అద్దాని శోభ ముందు మీ స్వర్గము మొదలైన లోకాలు ఎందుకూ పనికిరావు. ఎందుకంటారా? అక్కడి భూమి సంకల్పించినంత మాత్రం చేత ఏది కోరుకుంటే అది అందజేస్తూ ఉంటుంది. అది సుందరమైన భూప్రదేశం, సిద్ధులు, అప్సరసలు మొదలైన ప్రబుద్ధజీవులు లీలా విహారంగా ఆ భూప్రదేశానికి వస్తూ ఉంటారు.

అట్టి ఆ విస్తార భూభాగానికి చివరగా 'లోకాలోకం' అనే ఒక ప్రసిద్ధమైన పర్వతం ఉన్నది. ఆ మహా పర్వతము యొక్క ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క తీరుగా ఉంటుంది.

ఒకచోట మూర్ఖుని హృదయంలాగా అంధకారం. ఒకచోట సజ్జనుని మనస్సు లాగా నిత్యప్రకాశం. ఒకచోట సజ్జన సాంగత్యంలా ఆహ్లాదజనకం. ఇంకొకచోట మూర్ఖులతో సహవాసంలా దుఃఖప్రదం.

ఒకచోట బుద్ధిమంతుల చిత్తంలాగా సర్వప్రయోజన పరిపూర్ణ శోభతో గాలి, నీరు, ఫలములు లభిస్తున్నాయి. ఇంకోకచోట శుష్క- మూర్ఖ కేవల వేద పాఠకునిలా (అర్థం గ్రహించనివానిలా) నీరు, ఆహారం, పళ్ళు లభించని స్థలాలు.

ఒకచోట సూర్యకిరణాలు ప్రవేశించలేకపోతున్నాయి. మరొకచోట సూర్య, చంద్ర నక్షత్రములచే నిత్య ప్రకాశం. ఒకచోట జనావాసం. ఇంకొకచోట జనశూన్యం. జంతు-వృక్ష రహితం. ఒకచోట ఉద్యానవనాలు. విద్యాధరీ గణసహితం. ఇంకొకచోట భయంకర చీకటిగుహలు. అందులో 'కుంభాండు' డనే రాక్షస జాతి నివాసం.

ఇట్లా రాక్షస-పిశాచ జనం నివసించే భయంకర స్థానాలతో, మానవ జనవాస ప్రదేశాలతో, విద్యాధర స్త్రీలు నృత్యగానాలు చేసే వీలున్న నదీతీరాలతో, వనములతో ఒప్పుతోంది.

ఆ లోకాలోక పర్వత శిఖరాలపై అనేక రత్నమయ శిలలు ఉన్నాయి. ఆ పర్వతపు ఉత్తర దిక్కు విభాగంలో గల ప్రాంతంలో అనేక పెద్ద పెద్ద గండశిలలు ఉన్నాయి. ఆ ప్రాంతపు సుదీర్ఘమైన కొండ ప్రదేశం యొక్క తూర్పువైపుగా ఒకానొక చోట గల దృఢమైన ఒక శిల యొక్క గర్భభాగమున మేము నివసిస్తూ ఉంటాము. ఆ బ్రహ్మదేవుని నియతిని అనుసరించి అక్కడ ఉన్నాము. శిలాంతర్భాగం(కొండరాయి)లో జనించాము.

శ్రీవసిష్ఠ మహర్షి :   ఏమీ! ఆ కొండరాయిలో ఉంటున్నారా? ఎప్పటి నుండి? ఒంటరిగా ఉంటున్నారా? ఎందుకు అక్కడ (లోకాలోక పర్వత శిఖరాలపై గల ఒకానొక కొండశిల అంతర్భాగంలో) ఉంటున్నారు?


Page number:39

విద్యాధర స్త్రీ :  అవును మహర్షీ! అక్కడ నేను వసిస్తూ ఉండగా అసంఖ్యాకమైన యుగ సమూహాలు గడచిపోయాయి. ఆ శిలాగర్భ విభాగంలో నేనొక్కతినే కాదు. భ్రమరము పద్మములో సాయంకాలం చిక్కుకుని ఉన్నట్లు నా భర్త కూడా అందులోనే బద్ధుడై ఉన్నారు. మేమిద్దరం కలిసి ఉండి ఎన్ని వేల సంవత్సరాల సమూహాలు గడచిపోయాయో చెప్పలేను. ఇంత సుదీర్ఘకాలం గడచిపోయినా కూడా కామ వాసనా దోషముచే కాబోలు... మేము ఇరువురం మోక్షం పొందకయే ఉన్నాం. మమత్వబుద్ధి మమ్ము వెంటనంటియే ఉన్నది.

శ్రీవసిష్ఠ మహర్షి : ఆ శిలాకోశ (గర్భ) విభాగం అంతా శిలా కణమయమే కదా! మీరిద్దరు అందులో వేలాది సంవత్సరాలుగా ఉండటం నాకు చమత్కారంగా ఉన్నది. సరే! అయితే, ఆ శిల అంతర్భాగంలో మీరిద్దరు మాత్రమే ఉన్నారా? ఇద్దరూ అందులో ఎందుకున్నారు?

విద్యాధరి :  మేమిద్దరమే కాదు. మా పరివారమంతా కూడా అచ్చట బద్ధమై ఉన్నది. నా భర్త పురాణ పురుషుడగు (అతి ప్రాచీన కాలంగా ఉంటున్న) బ్రాహ్మణుడు. ఆయన అనేక వేల యుగాలుగా జీవించి ఉంటున్నప్పటికీ ఎక్కడికీ కదలకుండా అక్కడే ఒకే స్థానంలో ఉన్నాడు. మరింకెక్కడికీ వెళ్ళటమే లేదు.

ఆ నా పతి బాల్యకాలం నుండీ బ్రహ్మచారి అయి ఉన్నాడు. వేదము ఎఱిగినవాడు. కపటము లేనివాడు. ఇంద్రియ చాపల్యము లేనివాడు. ఏకాంతవాసి కూడా! అతని పట్ల వ్యసనురాలైన భార్యనగు నేను అతడు లేకపోతే ఒక్క నిమిషం కూడా దేహము ధరించజాలనంటే నమ్మండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : అతడు మిమ్ములను ఎట్లా భార్యగా స్వీకరించాడు. మీ ఇఱువురికి స్వాభావికమైన స్నేహం ఎట్లా పెంపొందింది?

విద్యాధరి : కమలనేత్రుడవగు మునీంద్రా! నా భర్త అయిన ఆ బ్రాహ్మణుడు ఉత్తమ కులమున జన్మించినవాడు. బాలుని స్వభావం గలవాడు, సజ్జనుడు. చాలా వరకు జ్ఞానసంపన్నుడు. అతడు కాలక్రమంగా బాల్యం నుండి యౌవనంలో ప్రవేశించాడు. అతడు అప్పుడు ఒకసారి 'నాకు భార్యగా అగుటకు అర్హత గల ఒక స్త్రీ లభించు గాక! ఆమె నిర్మల స్థానమున వసించే కుల స్త్రీ అయి, వేదజ్ఞత్వం, వేద వేదాంగాలు గ్రహించినదై ఉండాలి. సౌందర్యవతి, సద్గుణరాశి అయి ఉండాలి' అని చిరకాలం పసిబాలుడు ఆటబొమ్మను కోరుకొనునట్లు చింతన చేశాడు. అప్పుడు చంద్రుని నుండి చంద్రిక జనించినట్లు ఆయన దేహం నుండి అనిందితం అగు శరీరం గల నేను జనించాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ విద్యాధరీ! మీరు ఎట్లా జనించారు? అతనికి సహధర్మచారిణిగా ఇతః పూర్వమే (మీరు జనించటానికి పూర్వమే) ఎవరైనా ఉండి ఉన్నారా?

విద్యాధరి :  లేదు. అతని యొక్క శోభాయమానమగు మనస్సు నుండే నేను ఉత్పన్నమైనాను. అతని సంకల్పం యొక్క శోభ నుండి ఉద్భవించాను. ఈ విధంగా నేను అతని మానసిక భార్యను. క్రమంగా స్వాభావికమైన వస్త్రములు ధరిస్తూ సర్వ జీవుల చిత్తమును ఆహ్లాదపరుస్తూ యౌవనవతినైనాను. ఆ దశలో ఎత్తైన స్థనములతో, లేత చేతులతో, సమస్త గుణములు కలిగి ఉన్నదాననయ్యాను.


Page number:40

నా కళ్ళు జింక వలె పెద్దవి. నా సౌందర్యముచే సర్వ జీవుల హృదయమును హరించుదానివలె శోభించాను. సమదర్శియగు పతి యొక్క మనోమయ రూపిణిని అవటం చేత నాకు కూడా 'సమత్వము' అనే లక్షణం అబ్బింది. మోహజాలమునందు పడి ఉండి కూడా సంపద, ఆపదల పట్ల భేదరహితురాలనై ఉండేదానను.

అయితే, నేను లీలా విలాసములందు ప్రీతి కలిగి ఉండే దానిని. నా మనస్సు 'కౌతుకము' కలిగి ఉండేది. నాకు గాన-వాద్యములందు మిక్కిలి ప్రీతి ఉండేది.

ఓ మునీంద్రా! ఇక్కడ ఒక విషయం. నా భర్త తన సంకల్పధారణ చేత ఆ శిలాంతర్భాగంలో త్రిలోకాలు ధారణ చేస్తున్నాడు. అనగా ఆ కొండరాయిలో అతని 'ఆలోచన' లోంచి స్వర్గ - మర్త్య - పాతాళ లోకాలు ఉద్భవించి వ్యవహరిస్తున్నాయి. నేను కూడా నా భర్త యొక్క మనోమయ కల్పిత రూపిణినే కదా! కనుక నేను ఆ కొండశిలలోనే కాకుండా అక్కడ ఆయనచే కల్పించబడిన త్రిలోకములను ధారణ చేస్తూ ఉన్నాను. నేను ఆ సృష్టికర్త యొక్క కుల స్త్రీని కదా! గర్భిణి స్త్రీ తన గర్భములోని శిశువుకు పోషణను అసంకల్పితంగా అందిస్తున్నట్లుగా, నేను ఆ త్రిలోకములను పోషణ చేస్తూ ఆ త్రైలోక్యగృహం యొక్క భారము వహిస్తున్నాను.

ఇది ఇట్లా ఉండగా, ఆయన మానసిక సృష్టి నుంచి జనించిన నేను ఒకప్పుడు యౌవనంలో ప్రవేశించాను. ఉన్నత స్థనములు గలదాననయ్యాను. ఆయనకు సహధర్మచారిణిగా వర్తింపటానికి ఆయన చేతనే సృష్టించబడిన నాకు వివాహితను అవటానికి సర్వ లక్షణసమన్వితను అయ్యాను. అయితే నన్ను సృష్టించిన ఆ బ్రాహ్మణుడు నన్ను వివాహం చేసుకోవటం లేదు. ఎందుకంటారా? అతడు దీర్ఘసూత్రి అయ్యాడు. పైగా అతడు వేదజ్ఞుడు. సదా తపస్సునందు ఆసక్తి గలవాడు. నేను యౌవనవతిని అయినా కూడా అతడు నా వైపు కన్నెత్తి చూడటంలేదు. ఇక నాకు అతనితో యౌవన సంపన్న భోగాలు అనుభవించాలని అత్యంత కుతూహలం. నా యౌవన కవళికలతో అతనిని ఆకర్షించ యత్నిస్తున్నప్పటికీ, అతడు మోక్షాపేక్ష వలన నన్ను పట్టించుకోవటం లేదు. అతని భోగ వ్యసన రాహిత్యం చూచి నేను అగ్ని వలె దహించుకుపోతూ ఉండేదానను. నా అవయవములు నిరంతరం అతని స్నేహము కొరకై తపిస్తూ ఉండేవి.

అతని సాంగత్యం లభించక పూర్ణ వనాలు కూడా శ్మశానాలు లాగా కనబడసాగాయి. సరస్సులు నీరసంగా తోచాయి. పరిజనులైన నా ఇష్ట సఖీ జనం నా దేహోపశాంతికై పుష్పశయ్యలపై పరుండబెట్టి ఊపినా కూడా అవి నాకు ముళ్ళ పొదలపై పరుండిన విధంగా బాధపెట్టసాగాయి. శీతల శిలలు నా శరీర స్పర్శకు ఉడికి మసి అవుతూ ఉండేవి. ఎక్కడైనా అందమైన ప్రకృతి దృశ్యం చూసినప్పుడు పరవశించటానికి బదులుగా నా కళ్ళు దుఃఖముతో జలపూరితమౌతుండేది. నా అశ్రుబిందువులు రాలుటచే చేతిలో ధరించిన కమలంపై ఆ బిందువులు పడి అది కాస్తా క్షణంలో శుష్కించిపోయేవి. సిగ్గుచే నా సఖీ జనంతో కూడా నా మానసిక స్థితిని చెప్పుకోలేక పోయేదానను. సారస పక్షుల జంటను చూసి అసూయతో క్రుంగిపోసాగాను.


Page number:41

శుభసందర్భములు దుఃఖ కరములుగాను, అశుభ సందర్భములు సుఖకరంగాను - నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ఆయా సందర్భాలలో ఎట్లా ఉంటున్నానో నాకే తెలియటం లేదు. ప్రకృతిలో రమణీయమైన పుష్పాలు, సెలయేళ్ళు మొదలైనవి శ్మశానంలో కాళ్ళకు స్పర్శించే భస్మంలాగా కనిపించసాగాయి. ఈ విధంగా నా నవయౌవన దినములు శుష్కంగా గడిచిపోసాగాయి.

Ⅴ-10.) విరహ దశ నుండి వైరాగ్య దశ

విద్యాధరి :  ఓ మునీంద్రా! ఆ విధంగా అతి దీర్ఘకాలం విరహం అనుభవించాను. క్రమంగా నా విషయానురాగదశ 'వైరాగ్యదశ'ను పొందింది. మొట్టమొదట నా చిత్తములో 'విచారము' జనించనారంభించింది.

మునీంద్రా! మీకు అన్నీ తెలుసు కదా! నా భర్తయా, ఏకాంత ప్రియుడు. నీరసుడై ఉన్నవాడు. స్నేహం అభిలషించనివాడు. సరళబుద్ధితో మౌనం వహించి ఉన్నవాడు. ఇక నా సౌందర్యానికి, స్త్రీత్వానికి, సౌకుమార్యానికి... అసలు నా జీవితానికి ప్రయోజనమేమున్నది చెప్పండి? అట్టి అరసికుడైన భర్తను కలిగి ఉండటం కంటే మరణమే శ్రేష్ఠమేమో? బాల్య వైధవ్యమే ఉచితమేమో! అంతకన్నా నిరంతరమైన ఆపదల మధ్య ఉండటమే మంచిదేమో! రసికుడు-కోమలమైన ప్రకృతి గలవాడు అగు యువకుడు భర్తగా లభించటమే స్త్రీ యొక్క జన్మకు సాఫల్యం. అదే అఖండ సౌభాగ్యం.

అరసికుడైన భర్తను పొందిన స్త్రీ జీవితము, సంస్కారం లేనట్టి బుద్ధి, దుర్జనుల సహవాసంతో కూడి ఉన్న సిరి, వేశ్యలచే అపహరించబడిన జీవితం గల శాస్త్ర విజ్ఞాని యొక్క విజ్ఞానము - ఇవన్నీ వ్యర్థములే కదా!

పతిని అనుసరించగలిగినట్టి స్త్రీయే స్త్రీ. సజ్జనులచే పొందబడే సంపదయే సంపద. 'శమము’ మొదలైన ఉత్తమ గుణములు గల బుద్ధియే బుద్ధి. 'సమబుద్ధి' సహితమైన సాధుత్వమే సాధుత్వము.

నాఽధియో వ్యాధయో నైవ నాఽపదో న దురీతయః ।
కుర్వన్తి మనసో బాధాం, దంపత్యోః అనురక్తయోః ॥

పరస్పరమూ అనురాగం కలిగి ఉన్న దంపతుల మనస్సుకు ఆధి-వ్యాధులు గాని, ఆపదలు గాని ఉండవు. అతివృష్టి-అనావృష్టి వంటి ఉపద్రవములు బాధను కలిగించజాలవు. దుష్టుడైన (లేక) అనురక్తి రహితుడైన పతి కలిగిన స్త్రీకి సంపదలు కూడా ఆపదలుగానే ప్రాప్తిస్తాయి. స్త్రీ ఈ ప్రపంచంలో సర్వసంపదలూ త్యజించటానికైనా సిద్ధపడుతుంది గాని, ప్రమాదవశంగా పతి మాత్రం దూరం కావటం సహించలేదు కదా!

మునీంద్రా! నా దౌర్భాగ్యం చూడండి. యౌవనంలో ఉన్న నేను భర్త సమీపంలో ఉంటునే భర్త యొక్క కరస్పర్శ, సాంగత్యము సంపాదించుకోలేక అనేక సంవత్సరాలు గడిపాను.


Page number:42

అట్లా దీర్ఘకాలం గడిచిపోవటంచేత క్రమంగా భోగముల పట్ల నాకున్న అనురక్తి కాస్తా విరక్తి రూపం దాల్చసాగింది. వైరాగ్య వాసన పొంది సమస్త పదార్థముల పట్ల 'విరాగము' కలదాననైనాను. ఇక 'ముక్తిని పొందాలి' అనే ఉద్దేశంతో మీ వద్ద 'ఉపదేశము' పొందదలిచాను.

ఇష్ట పదార్థములను పొందనివారికి... పరబ్రహ్మమునందు విశ్రాంతి పొందని బుద్ధి కలవారికి... మరణతుల్యములైన దుఃఖ ప్రవాహములందు కొట్టుకొని పోవువారికి... అట్టి వారికి 'జీవించటం’ కంటే మరణించటమే శ్రేష్ఠం అగుచున్నది కదా!

ఇక నా పతి విషయం! రాజు సహాయంతోనే మరొక రాజును జయించుటకు ప్రయత్నిస్తారు చూచారా? అట్లా నా భర్త రాత్రింబగళ్ళు 'నిర్వాణము' గురించిన చేష్టయందు తత్పరుడై ‘మనస్సు’ చేత ‘మనస్సు’ను జయించే ఉద్యమంలో ఉన్నారు. నన్ను ఏమాత్రం ఆపేక్షించక ఆత్మయందే స్థితి కలిగి ఉండే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. దానితో నాకు కూడా ఈ జగత్ స్థితి యందు వైరాగ్యం కలిగింది.

అట్లా వైరాగ్యం కలిగిన నాటినుండి నా యందు సంసార వాసన యొక్క ఆవేశం సన్నగిలసాగింది. అప్పుడిక 'ఖేచరీ ముద్ర' ను ధారణ చేసి, అట్టి అవలంబనచే ఆకాశగమన స్థితిని పొందాను. క్రమంగా ఆకాశ నివాసులగు సిద్ధులతో సంభాషించగల ధారణను అభ్యసించాను. ఆ తర్వాత యోగదృష్టితో నేనున్న బ్రహ్మాండము యొక్క పూర్వాపరాలను దర్శించగలిగే ధారణకు ఉపక్రమించాను. క్రమంగా అట్టి ధారణ నాకు సిద్ధించింది. ఆ తర్వాత ఆ బ్రహ్మాండము యొక్క అంతర్గతములైన సమస్త పదార్థములను దర్శించి, వాటికి అతీత్వము సంపాదించి ఆ బ్రహ్మాండము నుంచి యోగశక్తితో బహిర్గతురాలను కాగలిగాను. అట్లా బయల్వెడలి వచ్చిన తర్వాత నేనీ లోకాలోక పర్వతాలను చూడగలిగాను.

ఓ మునీంద్రా! ఇంతకాలం ఈ బ్రహ్మాండాలను చూడాలనే ఇచ్చ మా దంపతులిద్దరికీ కలుగనే లేదు. అయితే నేను మాత్రం ధారణశక్తిచే ఆ బ్రహ్మాండంలో నుంచి బయల్వెడలాను కదా! నా భర్త మాత్రం ఎటువంటి కోర్కెలు లేనివాడై కేవలం వేదములచే ప్రతిపాదించబడిన శుద్ధధర్మం యొక్క పరమాత్మ యొక్క అనన్యచింతనలో మాత్రమే మునిగి తేలుచున్నారు. ఆయనకు కాలం యొక్క అంగములైనట్టి భూత వర్తమాన భవిష్యత్తుల ధ్యాసగాని, పదార్థముల దృష్టిగాని లేదు. అయినప్పటికీ కూడా అతడు బ్రహ్మత్వాన్ని వాస్తవంగా ఎఱుగనేలేదని నా అభిప్రాయం. విద్వాంసుడు అయి ఉండి కూడా నా భర్త బ్రహ్మ పదమును పొంది ఉండలేదు. ఈ కారణం చేత మా దంపతులమిరువురం ప్రయత్నించి బ్రహ్మపదము యొక్క ఉపదేశం పొందాలని నిశ్చయించుకున్నాం.

కాబట్టి మహాత్మా...! బ్రహ్మజ్ఞానము కొఱకై మేమిరువురము మిమ్ములను ప్రార్థిస్తున్నాము. మా ఈ ప్రార్థనను సఫలం చేయమని మా విన్నపం. తమ ఉపదేశ ప్రభావం చేత బ్రహ్మపదము పొందాలని వాంఛిస్తున్నాం. మహానీయులను అర్థించినవారెవరూ నిష్ఫలులు కారు కదా! హే మహనీయా! ఆకాశంలో సిద్ధుల సేవలు అందుకునే నేను అజ్ఞానారణ్యాన్ని భస్మీభూతం చేయగల మీ వంటి జ్ఞానాగ్నిని మరెక్కడా చూడలేదు.


Page number:43

తమవంటి సజ్జనులు ఏ కారణం లేకుండానే అర్థించువారి అభీష్టములను సిద్ధింపజేస్తారని లోకప్రతీతి. కనుక, మిమ్ములను శరణువేడినట్టి మమ్ము “ఉపేక్షించకండి” అని అభ్యర్థిస్తున్నాం.

⌘⌘

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! అలా ఆమె నాతో పలికింది. బ్రహ్మాండాకాశమున కల్పించ బడిన ఆసనంపై ఆసీనురాలై చెప్పుచున్న ఆమె మాటలన్నీ విన్నాను. ఆమెతో ఇట్లా సంభాషించాను.

Ⅴ-11.) అవకాశమే లేని శిలాంతర్భాగంలో బ్రహ్మాండమా?

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ బాలా! మీ వంటి దేహధారులకు ఆ శిల లోపల స్థితి ఎట్లా సంభవించింది? ఆ శిలలో బ్రహ్మాండము - గృహాలు - బ్రహ్మాండాంతర్గత సంచలనాలు ఎలా ఏర్పడ్డాయి?

విద్యాధరి :  మునీంద్రా! తమ యొక్క ఈ విశాలమైన జగత్తు ఎట్లా విరాజిల్లుతోందో, అదేరీతిగా ఆ శిలలో కూడా సంసారయుక్తమైన మా యొక్క జగత్తు కూడా విరాజిల్లుతోంది. ఆ మా జగత్తులో కూడా... పాతాళంలో నాగులు, దైత్యులు, దానవులు; భూమిపై పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, ప్రాణిసమూహాలు; ఆకాశంలో వాయువీచికలు, గంధర్వనగరాలు; సముద్రంలో జలపూర్ణాలు, జల జంతువులు; జనుల రాకపోకల, పుట్టుక, చావు వ్యవహారాలు; గ్రహాలు, నక్షత్రమండలాలు; రాజులు భూమిని ఏలటాలు; నదులు సముద్రం వరకు ప్రవహించటాలు; దేవత, అసుర, మనుష్యుల సంచనాలు, వ్యవహారాలు; ఆకాశ మేఘాలు, కల్పములు, కల్పంతాలు; కాలగతి యొక్క మార్పుచేర్పుల చమత్కారాలు; జ్యోతిష్యులచే ఎఱుగబడే ఉత్పాత, గ్రహణ, ఉల్కాపాతాలు... ఇటువంటి సర్వ వ్యవహారాలు ఆ శిలాంతర్భాగంలోని ఒక రేణువులోనే ఉండి ఉన్నాయి. స్వామీ! "ఇవన్నీ ఆశ్చర్యం కదా?” అని అంటారేమో! అట్లా అయితే, తామే దయచేసి ఆ శిల వద్దకు వచ్చి శిలాంతర్భాగ జగత్తును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎందుకంటే, ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం తటస్థితించినప్పుడు మహానీయులు అద్దానిని పరిశీలించి అర్థం చేసుకొనే కుతూహలం కలిగి ఉంటారు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఆమె అన్న మాటలు విని ఆ శిలాంతర్గత బ్రహ్మాండమును చూడటానికి నేను ఒప్పుకున్నాను. శూన్యమగు ఆకాశంలో వీచే గాలి వీచికల వెంట సుగంధం పయనించినట్లు, నేను ఆమెను అనుసరించి ప్రయాణించసాగాను. ఆకాశంలో సుదూరంగా ప్రయాణించి దేవతలు మొదలైన అనేక భూత సమూహములను అధిగమించి లోకాలోక పర్వతంపై గల ఆకాశం చేరాం. ఉత్తర దిశ యొక్క పూర్వ భాగాన గల మేఘపంక్తిలోంచి క్రిందికి దిగి బంగారపు రంగుతో ప్రకాశించే ఒక శిలను సమీపించాం. విద్యాధరి ఆ శిల వైపు 'ఇదియే నేను చెప్పిన శిల' అనే అర్థం వచ్చేటట్లు చేతివ్రేళ్ళను, కనుబొమలను కదిలించింది. ఆ శిలవైపు నేను కొద్దిసేపు ఏకాగ్రదృష్టితో చూచాను. అది మామూలు పసిమిఛాయతో కూడిన శిలగానే కనిపించింది నాకు. మరి అందులో ఆమె వర్ణించి చెప్పిన జగత్తేమీ కనిపించనేలేదు.


Page number:44

నేను (శ్రీ వసిష్ఠ మహర్షి) : అమ్మా! మీరు చెప్పిన సూర్య చంద్ర నక్షత్రమండలాది విశేషములతో కూడిన సముద్ర - ఆకాశ - దిక్కులతో కూడిన జగత్తేదీ కనిపించడం లేదే? మీరు చెప్పిన లోకాలు - సురాసుర మానవాది జీవులు మొదలైన సంరంభమంతా ఎచట? ఇది ఒక సామాన్యమైన శిలే కదా?

నేను అడిగిన ప్రశ్న విని ఆ విద్యాధర స్త్రీ కొంచెం ఆశ్చర్యం ప్రకటించింది. నా వైపు, ఆ శిల వైపు మార్చి మార్చి చూచి, ఇట్లా అన్నది.

విద్యాధరి :  ఓ మునీంద్రా! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయే! అద్దంలో ప్రతిబింబించిన నగరంలాగా ఈ శిలలో దేవ - మనుష్య - ఆకాశ - సముద్రాదులతో కూడిన మా జగత్తు నాకు స్పష్టంగా అగుపడుతోంది.

మరి మీకు కనిపించక, నాకు ఎట్లా కనిపిస్తోందంటారా?

ఈ శిలలో మా జగత్తును గాంచటం నాకు నిత్యానుభవమే అయి ఉన్నది. మీరు జగత్తును భావించటం లేదు కాబట్టి ఇక్కడి జగత్తు మీకగుపించటమే లేదు.

స్వామీ! ఇందులో మీకు తెలియని క్రొత్త విషయమేమున్నది? సర్వజీవులూ విశుద్ధ మనోమయదేహులే అయినప్పటికీ... ఈ మనస్సు అనేది వాస్తవానికి సర్వ సూక్ష్మ పదార్థములను గ్రహించగల శక్తి అంతర్గతంగా కలిగి ఉన్నప్పటికీ కూడా... సుదీర్ఘ కాలంగా అభ్యసిస్తూ వస్తున్న ద్వైత వృత్తుల కారణంగా ఒక్కొక్క సందర్భంలో సూక్ష్మ విషయాలు గమనించకయే ఉంటోంది. ఎవడు ఎట్టి దృష్టి (లేక) ధ్యాసను అభ్యసిస్తాడో అదియే దృఢాభ్యాస సంస్కార ప్రభావం చేత చిత్తము యొక్క ఘనీభూతానుభవంగా ప్రాప్తించటమనేది ఈ చిత్తము యొక్క స్వభావమే అయి ఉన్నది. చిన్నపిల్లవాడి నుండి వయోవృద్ధుని వరకు... ఏది ఎట్లు అభ్యాసపూర్వకంగా భావిస్తే అది అట్లే సిద్ధించటమనేది గమనార్హమే కదా!

"ఏ సూక్ష్మజ్ఞానం (లేక) బ్రహ్మజ్ఞానం నిరంతర అభ్యాసంచే సిద్ధిస్తుందో... అట్టిది శాస్త్రాలు చదువుటచే గాని, సుదీర్ఘ తర్కాలచే గాని, ఉపన్యాసాదులు వినుటచే గాని సిద్ధించదు” అని శాస్త్రములు కూడా ఒప్పుకుంటున్న విషయమే కదా! ఇంతెందుకూ...? ఉదాహరణకు నన్నే తీసుకోండి. కొంతకాలం క్రింద నా జగత్తులో నాచే పొందబడుచున్న పరిసరాలన్నీ నా యొక్క 'విరహవేదన’ కారణంగా కాబోలు, అత్యంత దుర్భరంగా కన్పట్టుచూ ఉండేవి. చిరకాలంగా వ్యర్థంగా ప్రవృత్తమైన నా పతి వ్యధా సంబంధమైన బాధ వలన స్వతహాగా అతి స్వచ్ఛము-వ్యాపకము అయినట్టి నా సూక్ష్మజ్ఞానం మరుగున పడింది. ఆ సమయంలో స్థూలంగా ఈ జగత్తు అభ్యస్తమై నా అనుభవంలో ఉండేది. అట్టి అప్పటి స్వకీయ జగత్తు ఇప్పుడు ఈ క్షణంలో గడిచిపోయిన స్వప్నంలాగా నశించిన దానివలె అస్పష్టమైన రూపంగా కనిపిస్తోంది.

ఆకాశంలో (భ్రమచే) లతను చూచేవానికి కొంతసేపు మరొక వైపు చూచి, మరల ఆకాశంలోకి చూస్తే, ఆ 'లత' కనిపించదు చూచారా? అట్లా నాచే సుస్పష్టంగా ఇతఃపూర్వం గాంచబడిన ఈ శిలలోని జగత్తు ఇప్పుడు ప్రతిబింబంలాగా కొంత అస్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కారణం అప్పటి అనురక్తి తరువాత క్రమంగా విరక్తి అభ్యసించి ఉండటమే!

అంతేకాదు...! ఒక భ్రమ అభ్యాసవశం చేత ఏర్పడి, ఇంతలోనే వేరైన మరొక భ్రమను అభ్యసిస్తూ వస్తున్న కారణంగా మొదటి భ్రమ క్రమంగా తొలగటం కూడా లోకంలో అందరి అనుభవమే కదా!


Page number:45

ఉదాహరణకు బాల్యంలోని “ఆటలు” అనే భ్రమ యౌవన దశలో తొలగి, ఇంతలోనే 'స్త్రీ సౌందర్యం - ప్రేమాకర్షణ' వంటి భ్రమలు చిత్తమును చేరుచున్నాయి. యౌవనదశలో ఆ జీవుడు బాల్య క్రీడలను “ఆ..! అవన్నీ నా భ్రమే కదా!" అని అనుకుంటూనే వర్తమానంలోని ‘ప్రేమాధిక్యత’ అనే భ్రమలో మునిగి తేలుతూ ఉంటాడు. క్రమంగా మరికొంత కాలానికి మధ్య వయస్సులో... యౌవన సంబంధమైన ప్రేమను ఉద్దేశించి... "ఆహా! అదంతా భ్రమే కదా!” అని తలచుచూనే వర్తమానంలోని “ధనధ్యాస, సంఘ గౌరవం” వంటి భ్రమలో ప్రవేశిస్తూ ఉంటాడు.

ఈ విధంగా ఈ జీవుని పట్ల నిరంతరం ఒక భ్రమ తొలగి మరొక భ్రమ చోటు చేసుకోవటమే ఈ సంసారం యొక్క లక్షణం కదా! అయితే, ఈ జీవుడు స్వతహాగా శుద్ధజ్ఞాన స్వరూపుడు అయి ఉండి కూడా 'భ్రమపరంపరలు' అనే ఆవరణచే ఆవరించబడి ఉన్నాడు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. తమతోటి 'సంవాదం' అనే ఈ భ్రమ ఇతఃపూర్వపు నిరంతరాభ్యాసముచే జనించి ఉన్న భ్రమను చాలా వరకు జయించివేసింది. ఈ జీవుడు పొందే రెండు భ్రమలలో ఏది బలవత్తరమైతే, అది రెండవదానిని జయించి వేయటం ప్రతివారికీ దైనందినానుభవమే కదా!

కనుక, ఓ మునీంద్రా! ఒక ఇష్టమైన వస్తువును కోరుకునే వారికి ఆ వస్తువు గురించి తెలిసి ఉన్నవారు అత్యంత ప్రియులు అవుతారు కదా! అట్లాగే, ఈ అజ్ఞాన జనిత సంసార భ్రమ తొలగాలంటే ఉత్తమ గురువు యొక్క ఉపదేశమును ఆశ్రయించి మరల మరల అభ్యసించటం తప్పించి వేఱే ఉపాయమేమున్నది? దృఢమైన అహంభావ రూపం, అనాది అయినట్టి అజ్ఞాన భ్రమ - శ్రవణ మననాది జ్ఞానరూప విచారణ చేత, తదభ్యాసం చేత తప్పకుండా శమిస్తుంది కదా! మరి, అభ్యాసము యొక్క ప్రభావం అంతటిది!

హే మహర్షీ! నేను మీకు శిష్యురాలనై మిమ్ములను శరణు వేడుచున్నాను. అజ్ఞానకారణంగా అబలను. బాలను. అయితే, నా యొక్క అభ్యాసవశం చేతనే ఈ శిలాంతర్గమైన జగత్తును వీక్షిస్తున్నాను. తమరు సర్వజ్ఞులగు గురువులు అయినప్పటికీ కూడా ఈ శిలయందు 'జగద్దర్శనం' అనే అభ్యాసం లేకపోవటం చేతనే నాకు కనబడుచున్న జగత్తు మీకు అగుపించటం లేదు.

ఆహా! ‘అభ్యాసం’ యొక్క ప్రభావం ఎట్టిదో మీకు తెలిసినదే కదా! అభ్యాసవశం చేత అజ్ఞాని జ్ఞాని అగుచున్నాడు. అభ్యాస బలం చేత గొప్ప పర్వతం కూడా మెల్లమెల్లగా పిండి పిండిగా అగుచున్నది. అభ్యాస ప్రభావం చేత ఒక విలుకాడు సుదూరంగా ఉన్న సూక్ష్మమైన లక్ష్యాన్ని బాణంతో ఛేదించగలుగుచున్నాడు. మహాదృఢం, మిథ్య అయినట్టి 'అజ్ఞానం' అనే మహమ్మారి కూడా తత్త్వ విచారణ రూపమైన అభ్యాసం చేత శమించిపోతుంది. అభ్యాసవశం చేతనే కొందరు కారపు వస్తువును చప్పరించి మహదానందంగా మ్రింగుచున్నారు. చేదు వస్తువును కొందరు ఇష్టంగా నములుచున్నారు. తీపి అయిన వస్తువు మధురంగా ఉండటానికి అభ్యాసమే కారణం. అభ్యాసవశం చేత కొంచెం కూడా పరిచయం లేని క్రొత్త వ్యక్తి కొన్నాళ్ళకు అతి సన్నిహితుడైన మిత్రుడుగా అగుచున్నాడు.

అబంధుః బంధతామేతి నైకట్యాభ్యాస యోగతః ।
యాతి అనభ్యాసతో దూరత్ స్నేహో బంధుషు తానవమ్ ॥


Page number:46

అట్లాగే, వర్తమానంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు మొదలైన బంధువులు అభ్యాస రాహిత్యం కారణంగా కొద్దిరోజులు దూరంగా ఉండటం చేత ఒకరి గురించి మరొకరు స్నేహభావం కోల్పోతున్నారు. శుద్ధ చిదాకాశమగు సూక్ష్మ శరీరం స్వకీయ భావనాభ్యాసంచేత స్థూలత్వం (భౌతికరూపం) సంతరించుకుంటోంది.

అభ్యాసం యొక్క ప్రభావం ఇంతా అంతా కాదు. ఒక స్థూల శరీరధారి కూడా ‘ప్రాణాయామం’ మొదలైన అభ్యాసం చేత, ధారణ చేత, పక్షివలె ఆకాశంలో ఎగురగలుగుచున్నాడు.

పుణ్యాని యాన్తి వైఫల్యం, వైఫల్యం యాన్తి మాతరః ।
భాగ్యాని యాన్తి వైఫల్యం, న అభ్యాసస్తు కదాచన ॥

ఓ మునీంద్రా! గొప్ప పుణ్యం నిష్ఫలం కావచ్చునేమో! తల్లి కూడా బిడ్డను ద్వేషించవచ్చునేమో! సిరులు, భాగ్యాలు నిరుపయోగం కావచ్చునేమో! కాని అభ్యాసం మాత్రం ఎన్నటికీ నిష్ఫలం కాదు.

దుస్సాధ్యాః సిద్ధిమాయాన్తి రిపవో యాన్తి మిత్రతామ్ ।
విషాని అమృతతాం యాన్తి సంతతాభ్యాసయోగతః ॥

నిరంతరమైన అభ్యాసయోగం చేత దుస్సాధ్యాలగు కార్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విషం కూడా అమృతంగా అవగలదు. కాబట్టి, ఒకడు “నాకు అదంటే ఇష్టం. అయితే అది పొందటానికై అభ్యాసం కొఱకు మాత్రం నేను సిద్ధం కాను”... అని అనుకుంటే అతడు మూర్ఖుడే అవుతాడు. వంధ్య తన పుత్రుని ఎప్పటికీ పొందలేదు. అభ్యాసం లేకుండా అభిలషించేవాడు అభిలషిత వస్తువును ఎప్పటికీ పొందలేడు. అభ్యాసం లేకుండా అభిలషించటమనేదే ఈ సంసార జీవుని దౌర్భాగ్యం.

మృత్యు పర్యంతమూ ప్రతి జీవునికీ 'బ్రతికి ఉండాలి’ అనే అభిమతం ఉంటుంది. అయితే, యోగులు తమ అభ్యాసం చేత యుక్తిపూర్వకంగా మృత్యు భయాన్ని తొలగించుకొని ఉంటారు.

కొందరు ధన-దారాదులు అతి ప్రియంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ వైరాగ్యాభ్యాసం చేత వాటి పట్ల గల అభినివేశాన్ని యుక్తిపూర్వకంగా త్యజించగలుగుచున్నారు. యోగ్యాభ్యాసం చేత వాటి నుంచి వచ్చే మనోవ్యాకులతను దూరం చేసుకోగలుగుచున్నారు.

ఆహా! ఏం ఆశ్చర్యం! ప్రతి మానవునికి అన్నింటికంటే తనంటే తనకే ఇష్టం కదా! ప్రతి ఒక్కరికీ అత్యంత ఇష్టమైన వస్తువైన ‘ఆత్మజ్ఞానం’ అనే అభ్యాసాన్ని త్యజించి కొందరు మనుజాధములు దేహాదులందలి అహంభావం అనే అరిష్ట వస్తువును ఆశ్రయించి అందుకు ఫలితంగా ఒక దుఃఖం నుండి మరొక దుఃఖం వైపుగా పయనిస్తూనే పోవుచున్నారే!

తరంతి సరితం స్ఫీతాం సంసార అసార సేవినః ।
త ఏవ ‘ఆత్మ విచారాఖ్యమ్' అభ్యాసం న త్యజన్తి యే ॥

'ఈ సంసారం అసారం' అనే వివేకమును ఆశ్రయించి ఎవరైతే 'ఆత్మవిచారణ' అనే అభ్యాసమును త్యజించకయే ఉంటారో... వారు మాత్రమే ఈ విశాలమైన 'మాయ'ను దాటివేయగలుగుతారు. చీకట్లో 'కుండ' ఎక్కడున్నదో తెలుసుకోవాలనుకుంటే గుడిసెలో దీపం వెలిగించి చూస్తేనే... కుండ కనబడుతుంది కదా!


Page number:47

శ్రవణము-మననము మొదలైన రూపమైన నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసములచే మాత్రమే సాధకుడు నిర్విఘ్నంగా ఆత్మ వస్తువును దర్శించగలుగుతాడు. కల్పవృక్షం ఏది కోరితే అది ప్రసాదించగలదు. 'ఆత్మవిచారణ' అనే చిరకాల అభ్యాసంచే అతి దుర్భరమనిపించే ఇంద్రియ విషయ జనితములైన రాగ-ద్వేషములను విజ్ఞులు క్రమంగా జయించివేస్తున్నారు. సూర్యుడొక్కడే సమస్తమునూ ప్రకాశింపజేస్తున్నట్లు... ‘అభ్యాసం’ అనేదే సర్వ అజ్ఞానాంధకారాలనూ పటాపంచలు చేయగలదు.

ఈ 14 లోకాలలో ఏ జీవునికైనా ఏదైనా సరే, అభ్యాసం లేకుండా లభించడమే లేదు. అభ్యాసాలలోకెల్లా ఉత్తమ ప్రయోజనం కలిగించేది 'ఆత్మవిచారణ' అను అభ్యాసమే కదా! దానినే ‘పురుష ప్రయత్నం' అని కూడా అంటారు. అది తప్పితే ముక్తికి వేరే స్థానము-మార్గము ఏమున్నది? ఎవరికైనా సరే, ‘దృఢాభ్యాసము' అనే స్వప్రయత్న రూపమైన కర్మచే మాత్రమే మోక్షసిద్ధి లభిస్తోంది. అంతకుమించి వేరు త్రోవలేదు.

ఓ మునీంద్రా! 'అభ్యాసము'ను ఆశ్రయించే జితేంద్రియునికి లభించని-సిద్ధించని పదార్థం ఎక్కడా ఏదీ లేదు, ఉండజాలదు. అటువంటి అభ్యాసం చేతనే కొండగుహలలో ఏకాంత ప్రదేశంలో కూడా కొండచిలువ అభయరూపంగా ఉండగలుగుతోంది.

Ⅴ-12.) స్థూలదేహ భ్రాంతి - సూక్ష్మదేహ సత్యము

విద్యాధరి :  హే మహర్షీ! ఈ జీవుడు అభ్యాసవశం చేతనే భ్రమమాత్రమగు ఈ స్థూల దేహభ్రాంతిని పెంపొందించు భ్రమలో చిక్కుకొని ఉంటున్నాడు. అట్టి భ్రమ ఏకానేక దుఃఖపరంపరలకు దారి తీస్తోంది. దేహాదుల పట్ల, బంధుమిత్ర వ్యవహారముల పట్ల ఏర్పడిన 'స్థూల దేహభ్రాంతి' అనేది సమాధి యొక్క దృఢాభ్యాసం లేకపోతే తొలగదు. సూక్ష్మభావం కలుగదు. అందుచేత, నిర్మలమగు పరమాత్మయందు సర్వజ్ఞత్వం కలుగటానికిగాను మనమిద్దరం సమాధిని అభ్యాసం నిర్వర్తించెదం గాక! అప్పుడు గాని, ఈ శిలలో ఉన్న జగత్తు ప్రకటన కాదు.

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఆ విద్యాధరి యొక్క యుక్తియుక్తమైన వాక్యములు విన్న నేను అప్పుడు పద్మాసనం వైచుకొని సమాధికై ఉద్యుక్తుడను అయ్యాను. క్రమంగా సమస్త పదార్థములకు సంబంధించిన భావనను త్యజించివేశాను. 'నిర్మల చిత్'ను మాత్రమే భావన చేయసాగాను. క్రమక్రమంగా ఆ సమయంలో నా దృష్టిలో ఏర్పడి ఉన్న స్థూల దేహసంబంధమైన భావన సంస్కారాలను మొదలంట త్యజించివేసాను. అట్టి చిదాకాశరూపాన్ని పొందటంచేత నేను 'దివ్యదృష్టి’ని సంతరించుకున్నాను. అట్టి సత్యమగు 'పరమాత్మ' యొక్క దృఢాభ్యాసం చేత దేహసంబంధమైన ఆధిభౌతిక భ్రాంతి పూర్తిగా శమించింది. ఉదయాస్తమయ రహితం, నిత్యస్వయం ప్రకాశం, నిర్మలము అగు మహాచిదాకాశము నాకు ప్రకటనమయింది.


Page number:48

అప్పుడు 'నిజసాక్షిచైతన్యము' యొక్క నిర్మల తేజముచే అంతకుముందు కనిపించిన శిలవైపు మరల చూచాను. అప్పుడు నాకు శిల కనిపించలేదు. ఆకాశమూ కనిపించలేదు. అంతా కూడా పరమాత్మమయంగా కనిపించింది.

పరమార్థఘనం స్వచ్ఛం తత్ తథా భాతి తాదృశమ్ ।
తధా భావనయా హి ఆత్మా మదీయో దృష్టవాంస్తథా ॥

నా ఆత్మయే ఆ శిలారూపంగా కూడా భాసించుచున్నట్లు అనుభవమైంది. అంతే కాకుండా, నా ఆత్మయే తన యొక్క “శిలాభావన"చే శిలను గాంచుచున్నదని అనుభవమౌతోంది.

శ్రీరాముడు : మహాత్మా! ఆశ్చర్యంగా ఉన్నదే! మీ ఆత్మయే ఇటు ద్రష్టగాను - అటు దృశ్యవిభాగమగు శిలగాను అనుభవమగుచున్నట్లు మీకు అనుభూతమగుచున్నదా! ఇది యుక్తియుక్తమేనా?

శ్రీవసిష్ఠ మహర్షి : ఎందుకు యుక్తియుక్తం కాదు? దృష్టాంతానికి ఒక స్వప్నద్రష్టకు స్వప్నంలోని గృహంలో చూడబడిన శిల స్వప్నద్రష్ట యొక్క చైతన్యరూపమే కదా! అట్లాగే, స్వతఃసిద్ధం - నిర్మలం అగు స్వస్వరూపచైతన్యమే అచ్చట కూడా శిలారూపంగా స్ఫురిస్తోంది.

ఒకడు జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా కూడా ఆ ఇరువురికి స్ఫురించేది, అనుభవమయ్యేది కూడా చైతన్యమే. "స్వకీయ చైతన్యమే ఆ ఇరువురిపట్ల అట్లు ఆ రూపమున స్ఫురిస్తోంది” అనునది ఆత్మజ్ఞానసారం.

ఇక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న భేదమేమి అంటావా? స్వప్నం కనుచున్న ఒకానొకడు ఆ స్వప్నంతో ఉంటూనే “ఇప్పుడు నాకు మెలుకువ వచ్చింది" అని తలచుచూ ఆ స్వప్నంలోనే మరొకరూపం ధరించటం ఎటువంటిదో... అజ్ఞానదశలోనే ఉండి "నేను ప్రబుద్ధుడను అయ్యాను” అని తలచు స్థితి అటువంటిది. ఎందుకంటే శాస్త్ర శబ్దమాత్ర జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. “అంతటా నా స్వరూపమే తాండవిస్తోంది"... అను సుస్పష్టమైన ఘనీభూత అనుభవమే జ్ఞానం.

ఏ జీవుడు తన సర్వాంతర్యామి స్వరూపమును గమనించక “నేను ఆత్మ స్వరూపుడనే” అని పెదవులతో మాత్రం చెప్పుతూ ఉంటాడో, అట్టివాడు అట్లు ఉచ్చరించి కూడా ఏం ప్రయోజనం? స్వప్నంలో శిరచ్ఛేదం జరిగినప్పటికీ ఆ స్వప్నద్రష్ట జాగ్రత్తుకు రానంతవరకు స్వప్నంలోనే ఉంటూనే ఉంటాడు కదా! అట్లాగే, ఘనమైన “అజ్ఞానరూప నిద్ర" లో ఉన్నవాడు అజ్ఞాన మూలం తొలగించుకొన్నపుడు మాత్రమే "జ్ఞానరూప జాగ్రత్" కలుగగలదు.

ఇక భౌతికమైన జాగ్రత్ నిజమైన జాగ్రత్ కాదు.

బోధః కాలేన భవతి మహామోహవతామసి ।
యస్మాత్ న కించనాపి అస్తి బ్రహ్మతత్త్వాదృతేఽక్షయమ్ ॥

ఎందుకంటే... వాస్తవానికి జాగ్రత్-స్వప్నముల ఉభయములోనూ అక్షయమగు 'బ్రహ్మ తత్త్వము’ తప్పించి మరింకేమి లేదు. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా తాను తెలిసిగాని, తెలియక గాని జగత్తుగా చూస్తున్నది తన ఆత్మస్వరూపమునే!

ఈ కారణం చేత “నిర్మలము, చిద్ఘనము" అగు చిదాకాశమే శిలాకారంగా అక్కడ నాకు కనిపించింది. అంతేకాని, ఆధిభౌతిక శిలాకారంగా కాదు.


Page number:49

సృష్ట్యాది యందు ఏ “శుద్ధ పారమార్థిక బ్రహ్మస్వరూపం” ఉన్నదో అదియే సమస్త పదార్థముల యొక్క రూపమై ఉన్నది. అదియే తత్త్వజ్ఞులకు ధ్యాన లభ్యమగుచున్న అంతిమ సాక్షాత్కారం కూడా!

ఓ రామచంద్రా! “అనాది, శాశ్వతం” అగు బ్రహ్మస్వరూపమే ఈ సమస్త ప్రాణుల యొక్క యథార్థ రూపమై ఉన్నది. అదియే ఇప్పుడు అజ్ఞానులచే “మనోరాజ్యం” అని, “సంకల్ప నగరం” అని, “సంసారం” అని, “జగత్తు” అని చెప్పబడుతోంది.

బ్రహ్మచైతన్యము యొక్క మాయతో కూడిన జగత్ సంస్కార సహితమగు పరమార్థ సత్తావిభాగమే “సూక్ష్మ శరీరం” అని శాస్త్రములచే పిలువబడుతోంది. అంతేకాదు. అపరోక్ష రూపమగు “శుద్ధచిత్ అంశ”యే “ఆది” అగు “చిత్ స్వరూప ప్రకాశము” అని చెప్పబడుతోంది. ప్రతి జీవి కూడా స్థూల రూపుడు కాదు, సూక్ష్మరూపుడూ కాదు. అతడు “ఆది”యగు చిత్ స్వరూప దేహుడేనయ్యా!

ఆ చైతన్య సత్తారూపమే...
↳ ఈ సృష్ట్యాదిలో ఉదయించుచున్న దాని వలె ఉంటోంది.
↳ అదియే మొట్ట మొదటి సృష్టి యొక్క అధ్యక్ష రూపం అనతగు “సమష్టి జీవుని యొక్క మనో శరీరం” అని చెప్పబడే హిరణ్యగర్భ శరీరమగుచున్నది.
↳ అదియే బుద్ధియొక్క మాంద్యం చేత తన సమష్టి భావనను కూడా మరిచి వ్యష్టిత్వమును ఆపాదించుకొంటోంది.
↳ అదియే సర్వ జీవులలో ప్రత్యక్షమై ఉంటున్న మనస్సు.

ఈ ప్రకారంగా “చిత్” స్వరూపం స్వయంగా సమష్టి రూపం పొందినట్లున్నదగుచున్నది కదా! అట్టి సమష్టి రూపానుభవమునే “యోగిమనః ప్రత్యక్షం" అంటారు. ఆ సమష్టిలో ఒక అల్ప విభాగం అనతగు వ్యష్టియొక్క అనుభవమును 'సామాన్యమనః ప్రత్యక్షం' అంటున్నారు.

అనగా, 1.) “యోగి మనః ప్రత్యక్షం”గాను, 2.) “సామాన్య మనః ప్రత్యక్షం”గాను అగుచున్నది ఆ చిత్ సత్తాయేగాని మరొకటేదీ కాదు. అట్లా, యోగి మనః ప్రత్యక్షత్వం (సమష్టి) సామాన్య మనః ప్రత్యక్షత్వం (వ్యష్టిత్వం) అను రెండూ కూడా అజ్ఞానం చేతనే ఏర్పడుచున్నాయి.

ఓ రామచంద్రా! అట్లా, వ్యష్టి స్థూల శరీరాది మనః ప్రత్యక్షంగా ఏది కనబడుతోందో... అది అసద్రూపమని గ్రహించు. ఇక సమష్టి సూక్ష్మ శరీరాది యోగ ప్రత్యక్షంగా కనిపించేదే ముఖ్య ప్రత్యక్షమని గ్రహించు.

ఆహాఁ! పరమాత్మ యొక్క మాయ ఎంత చిత్రమైనది. ముఖ్యమైనట్టి సమష్టి మనస్సు యొక్క ప్రత్యక్షము పరోక్షంగా కనిపిస్తోంది. అత్యంత కల్పితము అయినట్టి వ్యష్టి మనస్సు యొక్క ప్రత్యక్షము ఎదురుగా నిజమై ఉన్నట్లుగా భ్రమింపజేస్తోంది కదా!

ఓ రామచంద్రా! మొట్ట మొదటి చైతన్యంలో సూక్ష్మ శరీరం ప్రత్యక్షం అవుతోంది. అందుచేత, అట్టి సూక్ష్మ శరీరమే (అతివాహక దేహమే) సత్యమని, సర్వ వ్యాపకమై ఉన్నదని గ్రహించు. ఇక ఈ భౌతికమగు స్థూల దేహమంటావా... ఇది మిథ్య మాత్రమే సుమా! బంగారు ఆభరణంలో ఆభరణం అతి స్పష్టంగా కనిపించవచ్చు గాక! బంగారమునకు వేరై 'ఆభరణము’ అనేది ఎక్కడున్నది చెప్పు? ఆ ఆభరణంగా కనిపించేదంతా బంగారం కాక మరింకేమి కాదు కదా! అట్లాగే, సూక్ష్మ శరీరము యొక్క "ఆధి భౌతికత్వము” అనేది వాస్తవానికి లేదు.

శ్రీరాముడు :  ఈ భౌతిక శరీరము మిథ్య మాత్రమేనని మీరు ప్రవచిస్తున్నారు. కాని, భౌతిక శరీరం అగుపిస్తోంది కదా! కళ్ళకు కనిపించేది అసత్యమని ఎట్లా అనటం?


Page number:50

శ్రీ వసిష్ఠ మహర్షి :  కళ్ళకు కనిపించినంత మాత్రం చేత నిజమా? కనిపిస్తూ కూడా సత్యం కానివి అనేకం ఉన్నాయి. దూరం నుంచి కొండ నునుపుగా కనిపించువచ్చు గాక! అది వాస్తవమా? జలంలో తరంగాలు ఉండటమేమిటి? జలమే తరంగాలుగా కనిపిస్తోందిగా? “దిక్కులు” అనేవి భూమిసూర్యుల ఉనికిచే కల్పించబడినవి మాత్రమే కదా! శూన్యాకాశం నీలంగా కనిపిస్తున్నప్పటికీ, అక్కడ నీలత్వమున్నదా? ఆహాఁ! ఈ జనుల యొక్క మూఢత్వం ఏమని చెప్పాలి? తత్వవిచారణ లేకపోవటం చేతనే జీవుడు భ్రమను అభ్రమగాను, అభ్రమను భ్రమగాను గాంచుచున్నాడు కదా!

ఆధి భౌతిక దేహోఽయం విచారేణ న లభ్యతమే ।
ఆతివాహిక దేహస్తు కిల లోకద్వయే అక్షయః ॥

“ఈ భౌతికదేహం ఉంటేనే నాకు ఉనికి, ఇది లేకపోతే నాకు ఉనికి లేదు" అని ఈ జీవుడు ఎందుకో భ్రమిస్తున్నాడు? స్వప్నంలో కూడా (స్థూలదేహం వినియోగపడుచుండనప్పటికీ) శబ్ద-స్పర్శ-రూపాదులతో కూడిన అనుభవం ఉంటోంది. భౌతికదేహం ఉపయోగించబడకుండానే అది ప్రాప్తిస్తోంది కదా! కనుక, భౌతికదేహం లేకపోయినప్పుడు కూడా “అనుభవం” అనునది కొనసాగుచూనే ఉంటుంది. అసలు, విచారణ చేసి చూస్తే “వాస్తవానికి భౌతికదేహం లేదు” అని గ్రహించబడగలదు.

శ్రీ రాముడు : మరి అతివాహిక (సూక్ష్మ) దేహమో?

శ్రీ వసిష్ఠ మహర్షి :  సూక్ష్మ శరీరం మోక్షపర్యంతం ఈ ఇహ-పర లోకాలలో తిరుగాడుతూనే ఉంటుంది.

శ్రీరాముడు : మహర్షీ! “సూక్ష్మ శరీరోపహితమైన చైతన్యమునందు ఈ స్థూల రూపత్వం ప్రకటితమౌతోంది” అని అనవచ్చా?

శ్రీ వసిష్ఠ మహర్షి :  సూక్ష్మ దేహంలో ఏ ఈ స్థూల దేహత్వం కనిపిస్తోందో... అది ఎండమావులలో కనిపించే జలతరంగాల వలె కేవలం భ్రమ (లేక) మిథ్య మాత్రమే! చీకట్లో రాయిని చూచి ఎవరో కూర్చొని ఉన్నట్లు భ్రమ కలుగుతోంది చూచావా? కంటి దోషము చేత రెండవ చంద్రుడు అగుపిస్తాడే! అవన్నీ భ్రమయొక్క అభ్యాసం చేత క్రమంగా ఘనీభూతమై ప్రాప్తిస్తున్నట్లే... స్థూల శరీరమునకు సంబంధించిన దృఢ సంస్కారంచే స్థూల బుద్ధి ప్రౌఢత్వం చెందినదై ఉంటోంది. స్థూల శరీరత్వమనేది మిథ్య. మాయా జనితము మాత్రమే అయినప్పటికీ... అది అభ్యాసవశంగా ఏర్పడి ఉంటోంది.

యత్ అసత్... తత్ కృతం సత్యం, యత్ సత్యం... తత్ అసత్ కృతం ।
అహో ను మోహమహాత్మ్యం! జీవస్య అస్య అవిచారజం ॥

ఆహాఁ! అవివేకంచే ఉత్పన్నమౌతున్న ఈ జీవుని మోహము యొక్క మాహాత్మ్యం ఎంతటిది! అతడు అసత్తును సత్తుగాను, సత్తును అసత్తుగాను గాంచుచున్నాడే!

ఏది ఏమైనా... యోగుల యొక్క సూక్ష్మ ప్రత్యక్షమే (యోగులకు అనుభవమయ్యే సర్వ వ్యాపకమగు సూక్ష్మ దేహానుభవమే) సత్యం.

ఇక ఈ మనోస్పందము మాటేమిటంటావా? అది కించిత్ సత్యంగా చెప్పబడుతోంది. ఎందుకంటే, ఈ ఇహ-పర ఉభయ లోకముల యొక్క వ్యవహార సిద్ధికి 1.) సూక్ష్మ (సర్వగతమైన) శరీర స్ఫూర్తి, 2.) మానసిక చేష్ట... ఈ రెండింటి చేతనే అగుచున్నది కదా!


Page number:51

ఓ రామచంద్రా! ప్రత్యక్షము అనేది రెండు రకములు. అవి - 1.) స్థూల శరీర ప్రత్యక్షము, 2.) సూక్ష్మ శరీర ప్రత్యక్షము. మొదటిది భ్రమ. రెండవది సత్యం.

ఎవడైతే “ఆది” అనతగు “సూక్ష్మ శరీర ప్రత్యక్షము”ను వదలి “ఈ స్థూల దేహ ప్రత్యక్షమే సత్యం” అను బుద్ధి కలిగి ఉంటాడో... అట్టి వాడు మృగతృష్ణాజలం త్రాగి సుఖంగా ఉన్నవాడే అగుచున్నాడు. బంగారమును వదలి ఆభరణము స్వీకరించువాడు అవుతాడు.

శ్రీరాముడు :  మహాత్మా! ఈ జీవుడు స్వతహాగా సర్వగతమగు సూక్ష్మదేహి అయి కూడా, మరి స్థూల శరీర స్వభావం (భౌతిక దేహమే నేను అను పరిమిత / సంకుచిత తత్త్వం) అనే భ్రష్టత్వమునకు ఎందుకు లోను అగుచున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి :  జీవునిలో ఎప్పుడో అజ్ఞానంతో కూడిన “సుఖాశ” ప్రవేశించటంచే అతడు క్రమంగా స్థూల దేహ పరిమితత్వం ఆశ్రయించటం, స్వస్వరూప సర్వగతత్వం ఏమరచటం జరుగుతోంది. అయితే...

యత్ సుఖం దుఃఖమేవాహుః క్షణనాశానుభూతిభిః ।
అకృత్రిమమ్ అనాద్యన్తం యత్సుఖమ్ తత్సుఖం విదుః ॥

ఈ దేహములోని పంచేంద్రియములకు సంబంధించిన విషయ సుఖం క్షణభంగురమైనదని వివేకులు గమనించుచున్నారు. అందుకే, వారు విషయ సుఖంగా కనిపించుచున్న దానిని "ఇది దుఃఖము కొఱకే” అని చెప్పుచున్నారు. ఇంకా, “సహజము - అనాది - అనంతము అగు ఆత్మజ్ఞాన జనిత సుఖమునే వాస్తవమైన సుఖం" అని గమనిస్తున్నారు.

✤✤✤✤

Ⅴ-13.) సూక్ష్మదేహ ప్రత్యక్షం ద్వారా సాక్షి చైతన్య దర్శనం

శ్రీవసిష్ఠ మహర్షి :  ఓ ప్రియ జనులారా!

ప్రత్యక్షేణైవమ్ అధ్యక్షం ప్రత్యక్షం ప్రవిచార్యతామ్ ।
యదాద్యం తతసత్ అధ్యక్షం తత్ప్రత్యక్షేణ దృశ్యతామ్ ॥

మీరంతా "సూక్ష్మ శరీర ప్రత్యక్షము" చేతనే అధ్యక్ష రూపమగు “సాక్షి చైతన్య ప్రత్యక్షము” గురించి విచారణ చేయాలి. సమస్తమునకు 'ఆది' అయినట్టి సాక్షిచైతన్య ప్రత్యక్షమును శుద్ధమగు సూక్ష్మ చైతన్య ప్రత్యక్షముతో దర్శించాలి సుమా!

నాయనలారా! మూడు లోకముల అనుభవమును ప్రసాదించగల మీ యొక్క సూక్ష్మ చైతన్య ప్రత్యక్షమును వదలి, 'ఐహికము - మాయా స్వరూపం' అయినట్టి ఈ స్థూల శరీరాది ప్రత్యక్షమును ఎవడు గ్రహిస్తాడో,... అతడి కంటే తెలివి తక్కువవాడు మరొకడు ఉండడు.

ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ జీవులకు సూక్ష్మ శరీరం మాత్రమే ఉన్నది. అందులో స్థూల శరీరం గురించిన వ్యాప్తి ఉండటమనేది అసత్యమైన పిశాచం ఆవహించటం వంటిది. మొదలే ఉత్పత్తి కానిది, సంకల్పానుసారంగా అనుభవమయ్యేది అగు స్థూలదేహ ప్రత్యక్షం సత్యమెట్లా అవుతుంది. అంతేగాక, స్వయంగా అసత్యమైనవి అర్థ-క్రియ-సామర్థ్యం ఎట్లా కలిగి ఉంటుంది?


Page:52

ఈ స్థూల దేహ ప్రత్యక్షం యొక్క ఉపకరణములు అనతగు ఈ కళ్ళు-చెవులు మొదలైనవే యోగుల దృష్టిలో అసత్యాలై ఉండగా... ఇక వానిచే ప్రాప్తిస్తున్న తదితర విషయాల గురించి వేఱే చెప్పేదేమున్నది? అసత్యమగు పదార్థములచే సిద్ధించేదంతా అసత్యమేగాని, సత్యమెట్లా అవుతుంది? ఈ విధంగా ప్రత్యక్షములైయున్న చెవులు - చర్మం - కళ్ళు - నాలుక - ముక్కు అసత్యములై ఉండగా, వాటి విషయములైన శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములనే అనుమానముల గురించి ఇంకేమి చెప్పాలి. ఎచ్చట పెద్దపెద్ద ఏనుగులే కొట్టుకుపోతున్నాయో అచట గొఱ్ఱెల గురించి చెప్పేదేముంది?

అందుచేత రామచంద్రా! ఎదురుగా సిద్ధించుచున్న ఈ దృశ్యం మొదలే లేదు. ఏది ఉన్నట్లుగా భాసించుచున్నదో... అది సద్రూపమగు సాక్షి చైతన్యము కంటే వేరు కాదు. కనుక, "దృశ్యంగా కనిపించేదంతా మహాచిద్ఘనమగు బ్రహ్మమే" అను ఎఱుకను భద్రపరచుకొని ఉండు.

శ్రీరాముడు : స్వామీ! ‘ఈ దృశ్యం లేదు' అని ప్రవచిస్తున్నారు కదా! మరి ఎదురుగా ఆ శిల ఉన్నది. అది శిలగా మీకు-నాకు కూడా కనిపిస్తోంది కదా! ఎదురుగా కనిపించేది లేదని గ్రహించటమెట్లా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఒకనికి కలలో ఒక పర్వతం కనిపిస్తోందనుకో. అతనికి అది సత్యము వలెనే తోచుచున్నది. అయితే వాస్తవానికి అతనికి కనిపించిన పర్వతం శూన్యమే కదా!

1.) స్వప్నే ద్రష్టుః ఖమేవ - అద్రిః -  గృహే - నాఽన్యస్య వై యథా ॥

ఆ ప్రక్కనే మెళుకువతో ఉన్న అతని బంధువునకు అతనికి కనిపించిన పర్వతం శూన్యం - భ్రమ - ఊహా మాత్రం కాదా! స్వప్నంలో కనిపించిన ఆకాశం, కొండ ఇల్లు ఒకే భ్రమచే కల్పించబడినవే కదా! అట్లాగే,

2.) తథా తద్భావనవతోరావయోః సా శిలైవ చిత్ ॥

శిలా భావంతో కూడుకొని ఉన్న మన ఇద్దరికీ ఆ ఎదురుగా కనబడేది శిలగానే కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి అది చిద్రూపమే అయి ఉన్నది.

"ఇది పర్వతం - అది ఆకాశం - ఇది జగత్తు - అది నేను” ఈ మొదలైన రూపములతో చిదాకాశము-చిన్మయము అగు ఆత్మయే తనయందు అట్లట్లుగా స్వయంగా భాసిస్తోంది. ఎందుకంటావేమో! దీనినంతా ప్రబుద్ధమగు చైతన్యమే తన యందు అట్లు గాంచుచున్నది. అప్రబుద్ధమైనదేదీ ఎచట కూడా గాంచటం లేదు. కథార్థం వినేవాడికే తెలుస్తుంది గాని, విననివానికి తెలియదు కదా! మద్యం త్రాగిన వారికి నిజంగానే చెట్లు-కొండలు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అట్లాగే, అజ్ఞాన భ్రాంతికి అనేకములుగా కనిపించే జగత్తు సత్యత్వము పొందుతోంది. అనగా, అప్రబుద్ధునికి “ఇవన్నీ ఇట్లు నిజమే కదా”... అని అనిపిస్తోంది.

కనుక, రామచంద్రా! మరల చెప్పుచున్నాను.

యోగులకు ప్రత్యక్షమై, సర్వత్రా అప్రతిహతమై, ఏకమై, బోధ రూపమైనట్టి, “పూర్ణానందైక రసము” అగు చిత్స్వరూపమును గ్రహించకుండా ఎవరైతే తుచ్ఛమగు జగద్రూప ప్రత్యక్షమును ఆశ్రయించి ఉంటారో అట్టి మూఢులు ఆత్మవంచకులు. తృణప్రాయులు. వారి వలన శాశ్వత ప్రయోజనమూ ఉండదు. మనస్సుతో ఆత్మను ఎఱిగినవారే ధన్యులు.


Page:53

ఆ విరామమగు బ్రహ్మము ఈ సమస్త బ్రహ్మాండములూ తన అవయవములుగా కలిగి ఉన్నది. అది ఈ భౌతిక సూర్య చంద్రాదులచేత గాని, భౌతికమైన ఈ కనులకు గాని అప్రకాశితమై ఉంటోంది. అది వాస్తవానికి అదృశ్యము అయినప్పటికీ దృశ్యంగా ఉన్నదంతా అదే! అట్టి నిరామయ బ్రహ్మము సమాధి యొక్క దృష్టిచే అత్యంత స్పష్టంగా కనిపించగలదు సుమా!

అట్టి “చిదాకాశం” అనే గొప్ప అద్దంలో ఈ “పర్వత - నదీ - లోక - లోకాంతరములు, దేహదుల రాక-పోకలు, మనో-బుద్ధ్యాది అంతరంగ విభాగాలు” అనే రూపభ్రమలన్నీ భాసిస్తున్నాయి. అద్దంలో ప్రతిబింబించేవి అద్దంలో స్పృశిస్తున్నాయా? లేదు కదా! ఈ శరీర - మనో - బుద్ధి ధర్మాలు, ఈ జగత్ దృశ్య దర్శ- అదర్శనాలు ఆత్మను స్పృశించజాలవు.

✤✤✤✤

Ⅴ-14.) అన్యజగద్బ్రహ్మ దర్శనం

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! అప్పుడు ఆ విద్యాధరి అనిరుద్ధమైన (Unstoppable) చేష్ట కలిగినదై అక్కడి శిల యొక్క అంతర్గతమై ఉన్న సృష్టిలో ప్రవేశించింది. నేను కూడా నా యొక్క సంకల్ప సమేతుడనై ఆ సృష్టిలో ప్రవేశించాను. మేమిద్దరం ఆ సృష్టిలోని బ్రహ్మలోకం ప్రవేశించాం. ఆమె భర్త ఉన్న మందిరంలో అడుగిడాము.

విద్యాధరి :  హే మునిశ్రేష్ఠా! ఈతడే నా భర్త. నన్ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్వ కాలంలో నన్ను సృష్టించారు. ఇప్పటికి ఆయన ముదుసలి అయ్యారు. అయినా కూడా నన్ను ఇప్పటిదాకా వివాహమాడలేదు. కాబట్టి నాకు వైరాగ్యం కలిగింది. నా ఈ పతి కూడా విరాగి అయినారు. ఈయన "ద్రష్ట - దృశ్యము - శూన్యత్వము” లేనట్టి నిర్మలమైన పదమును పొందాలనే అభిలాషతో ఉన్నారు. ఇప్పుడు ఈ జగత్తుకు మహా ప్రళయం దాపరించినా కూడా పట్టించుకొనే స్థితిలో లేరు. తన ధ్యానమునందే మౌనం వహించి పర్వతమువలె చలించక ఉన్నారు.

కాబట్టి స్వామీ! నన్ను, నా పతిని మీ తత్త్వోపదేశముచే ప్రబోధమొనర్చి పునీతులని చేయమని నా విన్నపం. మహాకల్పము వరకు గల సమస్త సృష్టుల యొక్క మూలభూతమైన బ్రహ్మమునకు మాకు మార్గం చూపండి.

ఓ రామచంద్రా! ఇట్లా ఆ విద్యాధరి నాతో పలుకుచున్నప్పుడు ఆమె పతి సమాధిని ఆశ్రయించి ఉన్నాడు. అప్పుడామె ఆయనతో మంద్రస్వరంతో ఇట్లా పలికింది. “స్వామీ! ఈ రోజు మన గృహం పావనమైంది. మునిశ్రేష్ఠులైన వసిష్ఠ మహర్షి మన గృహానికి వేంచేశారు. వీరు మరొక బ్రహ్మాండానికి ప్రభువైనట్టి బ్రహ్మదేవుని కుమారులు. పూజార్హులు. కనుక, కనులు తెరిచి వీరికి సుస్వాగతం పలకమని ప్రార్థన. వీరిని అర్ఘ్యపాద్యాలతో పూజించండి. మహానీయులను సత్కరించటం వలన ఫలమేమిటో మీకు వేరే నేను చెప్పనక్కర్లేదు కదా!”

వీణవలె మంద్రము-సుమధురము అయిన ఆమె శబ్దజాలాలను విని మహాబుద్ధియగు బ్రహ్మ క్రమంగా స్పందించసాగారు. నిశ్చలజలంలో ఆవర్తంలాగా సమాధి నుండి లేచారు.


Page:54

నెమ్మదిగా కనులు తెరిచారు. దేహమంతా మెల్లగా దృశ్యజ్ఞానం ప్రకటనమైంది. వెంటనే నా వైపు చూచారు. చిరునవ్వుతో ఆయన పెదవులు విచ్చుకున్నాయి. ఇంతలో దేవ-సిద్ధ-అప్సరస సమూహములు అచ్చటకి వచ్చి ఆజ్ఞలకై నిలుచున్నారు.

అన్య జగత్ బ్రహ్మ :  అసారమైన సంసారము యొక్క సారభూతమైన 'ఆత్మ'ను కరతలామలకముగా గాంచుచున్న ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! మీకు సుస్వాగతం. జ్ఞానామృత మహాసముద్రుడవగు ఓ మహాత్మా! మీకు సర్వదా శుభమగుగాక! మీ రాకతో మా ఈ బ్రహ్మాండ గృహం పావనమైనది. మీరు చాలా దూరం నుంచి శ్రమపొంది వచ్చారు. రండి. ఇక్కడి ఈ ఆసనంపై సుఖాశీనులు కండు.

రామచంద్రా! అక్కడి గంధర్వ-ముని-విద్యాధరుల స్తోత్రాలకు చిరునవ్వుతో సమాధానం చెప్పాను. అప్పుడు ఆ అన్య జగత్ బ్రహ్మతో ఇట్లు పలికాను.

శ్రీ వసిష్ఠ మహర్షి :  హే మహాత్మా! బ్రహ్మదేవా! మీరు భూత-భవిష్యత్ వర్తమానములకు ప్రభువు. ఈ విద్యాధరీమాత అత్యంత ఏకాంతాకాశ ప్రదేశంలో ఉన్న నన్ను సమీపించి 'జ్ఞానయుక్తములైన వాక్యాలతో మా ఇద్దరికి ఆత్మజ్ఞానం ప్రబోధించాలి' అని కోరింది. ఇది యుక్తమేనంటారా! ఎందు చేతనంటారా? మీరు సకల జ్ఞాన పారంగతులు. సర్వ భూతములకు ప్రభువు. అన్నీ ఎఱిగినవారు. ఇక నేను బోధించగలిగిన దేముంటుంది? ఇక ఈ విద్యాధరి కామదృష్టి కలిగి ఉండటం చేత బోధకు అనర్హురాలు. మరి ఈమె ఆత్మజ్ఞానము కొఱకు నన్ను ఇట్లు ఎందుకు అర్థించిందో మీరే కారణం తెలియజేయ గోరుచున్నాను. అంతేకాదు మరొక ప్రశ్న “నాకు పత్ని కావాలి" - అనే ఉద్దేశంతో మీరు ఈమెను సృష్టించారు. మరి మీరు ఈమెను భార్య స్థానమును ప్రసాదించలేదేమిటి? మఱియు ఈమెకు వైరాగ్యదశను ఎట్లా పెంపొందించారు? ఈ విషయం కూడా నా అర్హతను దృష్టిలో ఉంచుకొని నాకు తెలియజేయవలసినదిగా నా విన్నపం.

అన్యజగత్ బ్రహ్మ :  ఓ మునీశ్వరా! ఆ వృత్తాంతమంతా ఉన్నది ఉన్నట్లు తెలియజేస్తున్నాను వినండి. సజ్జనులకు యథార్థం తెలియజేయటం ఉచితం కదా! సర్వమునకు ఆదికారణమైన 'సత్' పదం ఒక్కటి ఉన్నది. అది సర్వదా యథాతథం, జన్మాది రహితం, జరా వర్జితం, చిద్రూపం అయి ఉన్నది. అట్టి 'కేవల చిత్ ప్రకాశం' నుండి అనిర్వచనీయంగా నేను ప్రకటనమయ్యాను. చిదాకాశం నుండి ఉదయించిన నేను కూడా చిదాకాశ రూపుడనే. సదా ఆత్మయందే నెలకొని ఉన్నాను. ఈ ప్రజాసృష్టి విద్యమానమైనప్పుడు నేను ఈ ఈ జనుల దృష్టిలో "స్వయంభువు” అను పేరు కలవాడను అగుచున్నాను. ఇక “నేను-నీవు-నాది-వారు-వీరు మన ఈ పరస్పర సంభాషణ”... ఇవన్నీ కూడా ఏకమగు సముద్రమునందు తరంగ భేదముచే జనించిన శబ్దముల వంటివి మాత్రమే!

వస్తుతస్తు న జాతోఽస్మి, న చ పశ్యామి కించన ।
చిదాకాశశ్చిదాకాశే తిష్ఠామ్యహమ్ అనావృతః ॥

యథార్థానికి నేను ఏ సమయమందును ఉత్పన్నము కానేలేదు. దేనినీ గాంచుటయూ లేదు. నిరావరణుడను. చిదాకాశరూపుడను అగు నేను చిదాకాశమునే స్థితి కలిగి ఉన్నాను.


Page:55

ఈ విధంగా సముద్రజలంలోంచి బయల్వెడలిన తరంగంలాగా ఒకప్పుడు ఒకింత దృశ్య రూపం కలవాడనయ్యాను. కొంతకాలం గడిచింది. కాలవశం చేత మరికొంత స్వరూప విస్మరణం జరిగింది. ఆ కారణం చేత అశుద్ధమైన ఆకృతి కలవాడనయ్యాను. చిదాకాశరూపుడనగు నా యొక్క అంతఃకరణమున స్వభావంగా 'నేను-నాది' అను వాసన ఉదయించింది. అట్టి 'నేను' అనేది పరబ్రహ్మమే! నా దృష్టి యందు 'నేను'గా భాసించేది, 'మీరు' మొదలైన వాటిగా భాసించేది భిన్నం కాదు. కాబట్టి, ఇతరుల దృష్టిలో నేను ఉదయించినట్లుగా ఉన్నప్పటికీ నా దృష్టి యందు చిదాకాశమున ఏదీ ఉత్పన్నము కాకయే ఉన్నది.

నేను నాశరహితమైన సత్తాస్వరూపుడను. ఏ సమయమందునూ దృశ్యరూపంగా ఉదయించనివాడను. ఆత్మస్వభావం నుండి చ్యుతి నొందనట్టి ఆకృతి కలవాడను. స్వాత్మారాముడను. స్వయం ప్రభువువై ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొని ఉన్నవాడను. ఇక ఈ విద్యాధరి అంటారా? ఆమె మీరు అన్నట్లు నా సంకల్పముచే దేవరూపిణి అయి వెలయుచున్నది. ఈమె పూర్వ-పూర్వ అహంకార స్మృతి రూపమగు 'అహం' అను భ్రాంతి, జగతి, వాసన యొక్క అధిష్ఠాత్రి అయిన దేవత!

ఈ విధంగా ఈమె వాసన యొక్క అధిష్టాన దేవతయే గాని ఈమె నా గృహిణి కాదు. గృహిణి కొరకై వాస్తవానికి ఈమెను నేను సృజించలేదు. అనగా, ఈమె నా అంతరంగమున “సర్వజగద్వాసన అయి ఉన్నది. స్వవాసనావశం చేత 'నేను బ్రహ్మదేవుని గృహిణిని' అను భావనను కల్పించుకొని ఉన్నది. అట్టి స్వకీయ కల్పనచే వ్యర్థంగా స్వయంగా దుఃఖమును పొందుచున్నది. ఆమె నా వాసనా స్వరూపమే గాని అందుకు వేరైన రూపమేదీ లేదు. నాకు వేరైనది కాదు.

Ⅴ-15.) సృష్టిగా కనిపిస్తున్నది బ్రహ్మమే!

అన్య జగత్ బ్రహ్మ :  ఓ మునీంద్రా! వసిష్ఠ మహర్షీ! ఇప్పటి వరకు అతి దీర్ఘకాలం స్వసంకల్పితమైన బ్రహ్మాండ రచనను నా వాసనా ప్రభావం చేత ఆస్వాదించాను. అనుభవించాను. ఇక ద్విపదార్థాంత కాలం సమీపిస్తోంది. నాకు ద్వితీయమైనదిగా పొందబడినదంతా ఉపసంహారం చేయబోతున్నాను.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ ద్వితీయ రచన అయిన బ్రహ్మాండమును ఉపసంహరించి ఏం చేయాలనుకుంటున్నారు?

అన్య జగత్ బ్రహ్మ :  స్వయంకల్పితమైన ద్వితీయత్వమును ఉపసంహరించి అద్వితీయత్వం సంతరించుకోబోవుచున్నాను. అనగా, "చిద్వివర్త రూపం, చిన్మయమైనట్టి చిత్తాకాశరూపం” కలిగి ఉన్న నేను ఈ కల్పితమైన ఆయువు పూర్తి అగుచుండుటచేత సర్వ కల్పనలు త్యజించి తిరిగి "పరము, నిరతిశయానంద రూపం, చిదాకాశం" అయిన కైవల్యస్థితిని పొందదలచుకున్నాను.

కాబట్టి స్వవాసనాకల్పితమైన ఈ జగత్తుకు మహా ప్రళయము సంభవించబోతోంది. మహా ప్రళయం సమీపించటాన్ని పురస్కరించుకొని నేను ఈ (నా వాసనా రూపమే అగు) విద్యాధరిని త్యజించడం మొదలెట్టాను. అందుచేత, ఈమె వైరాగ్యం పొందింది.


Page:56

నేను ఈ చిత్తాకాశత్వమును త్యజించి బ్రహ్మకాశత్వమును పొందిన మరుక్షణం మహాప్రళయం, వాసనాక్షయం సంభవించనున్నది. ఈ కారణం చేతనే ఈ విద్యాధరి విరక్తి చెందినదై నా మార్గమగు "బ్రహ్మ జ్ఞానముచే నిర్విషయస్థితి” వైపుగా పరిణమించ ప్రారంభిస్తోంది. తనను నిర్మించిన వారిని అనుసరించటం వస్తు ధర్మం కదా! ఆభరణత్వం వీడిన ఆభరణం తిరిగి కేవలం బంగారం అవటం యుక్తమే కదా!

ఇప్పుడు చతుర్యుగాలు (కృత - త్రేతా - ద్వాపర - కలి యుగాలు) చివరికి వచ్చాయి. కలియుగ అంతం సమీపించింది. అట్లాగే, ప్రజాపతి - మనువు - ఇంద్రుడు - దేవతలు - కల్పము - మహా కల్పముల సంబంధమైన నా వాసన క్షయిస్తోంది. దేహాకాశం అంతం కానున్నది. సరస్సు ఎండిపోతే కమలం కూడా ఎండునట్లు, తత్సంబంధమైన సువాసనలు కూడా రహితమై పోవునట్లు, నా సర్వ వాసనలు నశించనున్నాయి.

జడమైన సముద్రంలో ఏ కారణం లేకుండానే చంచలమైన తరంగాలు పుడతాయి చూచారా? అభిమానముచే దేహములు ధరిస్తూ వస్తున్న ఈ 'వాసన' యందు ఏ బాహ్య కారణం లేకుండానే స్వభావవశం చేత ‘ఆత్మ దర్శనం' గురించిన ఇచ్ఛ స్వయంగా జనించుచున్నది. నా యొక్క వాసనా స్వరూపమైనట్టి ఈ విద్యాధరి స్వయంగా ఆత్మత్త్వం బోధించగల మిమ్ములను వెతుక్కుంటూ ఈ బ్రహ్మాండం నుండి బయల్వెడలింది. ధర్మ-అర్థ-కామ మోక్షములనే పురుషార్థములను సాధించుట యందు వ్యగ్రులైనట్టి ప్రజలు ఉండే మీ బ్రహ్మాండమును గాంచగలిగింది. ఆకాశ గమనమున తత్పర అయిన ఈమె ఈ జగత్తుకు స్థానభూతమైన లోకాలోక పర్వతంపై గల శిలను చూసింది.

శ్రీ వసిష్ఠ మహర్షి : లోకాలోక పర్వతముపై గల ఆ శిలలో ఈ బ్రహ్మాండం ఏ కారణం చేత, ఎందుకు నిర్మించబడింది?

అన్య జగత్ బ్రహ్మ :  అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ ఏముంటుంది? మా దృష్టియందు ఆ శిల చిదాకాశరూపమే అయి ఉన్నది. ఆ మాటకు వస్తే ఏ లోకాలోక పర్వతముపై గల ఏ శిలలో ఈ బ్రహ్మాండం ఉన్నదో... అటువంటి బ్రహ్మాండాలు తదితర శిలలలో కూడా ఉన్నాయి. అటువంటి ప్రతి బ్రహ్మాండంలోనూ అసంఖ్యాక పర్వత శిలలు, ఆ శిలలలో అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అనేక బ్రహ్మాండాలు భేద దృష్టి కలవారికి కనిపించవు. ఎప్పుడైతే మనం సమాధిచే ‘బోధైకత్వము’ పొందుతామో అప్పుడు యోగదృష్టిచే ఆ అనేక బ్రహ్మాండములను గాంచగలం. ఏ సమతత్త్వము అంతటా (అన్ని జీవులలోను) సర్వదా అభేద రూపమై ప్రకాశిస్తోందో... దాని దర్శనమే బోధైకత్వం. ఆ శిలలో బ్రహ్మాండము ఉన్నట్లే ఒక ఘటము (కుండ) యందు, వస్త్రమునందు, మఱ్ఱి చెట్టునందు, ఆకాశంలోను, వాయువులోను, అగ్నిలోను, జలంలోను సర్వత్రా సదా అనేక జగత్తులు ఉన్నాయి.

అయితే మహర్షీ! స్వప్న నగరాల వలె ఆ జగత్తులన్నీ కూడా (మిథ్యా-భ్రాంతిచే) ఉన్నదెచట? వాస్తవానికి అవేవీ లేవు. భ్రాంతిచే అనుభవమౌతున్నాయి. అవన్నీ చిద్రూపమే కాబట్టి, చిద్రూపము సత్యమే కాబట్టి, అధిష్ఠాన చిద్రూపముచే అవి సత్యములే అగుచున్నాయి. ఇది ఇట్లా ఉండగా... ఒక జగత్తులోని వారికి మరొక జగత్తు మిథ్యయే అయి ఉన్నది.


Page:57

పరిజ్ఞాతా సతీ యేషామేషా ఛిన్నభసైకతామ్ ।
గతాతే న విముహ్యన్తి శిష్టాస్తు భ్రమ భాజనమ్ ॥

ఎవరైతే ఈ జగన్మాయను “అసత్తు" అని ఎఱుగుతారో వారికి ఈ జగత్తుగా కనిపించేదంతా చిదాకాశ రూపంగానే అనిపిస్తుంది. అట్టివారు ఈ జగత్తులను చూచి కూడా మోహం చెందరు. ఇక తక్కిన వారంతా (ఈ జగత్తు సత్యమేనని నమ్మి ఉంటారో) భ్రమభాజనులే అయి ఉంటున్నారు.

ఓ మహర్షీ! ఈ విద్యాధరి వైరాగ్యవశం చేత తత్త్వజ్ఞానం పొందాలని అభిలషించింది. అట్టి జ్ఞానానికి అనుకూలమైన శ్రవణ మననాదుల కొఱకై తమ ఉపదేశం సంపాదించుకోవాలనుకొంది. ఖేచరీముద్ర యొక్క ధారణాభ్యాసంచే ఆకాశమున సంచరించుచున్న మిమ్ములను సమీపించింది. ఓ మునీంద్రా! మీరు అంతా ఎఱిగినదే కదా! చిత్ శక్తియే అజ్ఞాని విషయంలో దాటుటకు కష్ట సాధ్యమైన మాయ యొక్క రూపంగా విజృంభిస్తోంది. జ్ఞానికి ఈ సమస్తమూ అద్యంతరహితము నిరామయము అగు బ్రహ్మం యొక్క శక్తిగాను, చమత్కారంగాను ప్రస్ఫుటమౌతోంది.

ప్రవర్తన్తే నివర్తన్తే నేహ కారణి కానిచిత్ ।
ద్రవ్య-కాల-క్రియాద్యోతా చితిస్తపతి కేవలమ్ ॥

యథార్థానికి ఇక్కడ సృష్టి లేదు, లయము లేదు. ఇచ్చట ఏ కార్యమూ ఉత్పన్నమగుట లేదు. నశించటం లేదు. అయితే, చిత్ శక్తియే ఈ దేశ - కాల - క్రియ - ద్రవ్యాది రూపంగా అభివ్యక్తమౌతోంది. అందుచేత, ఓ మునిసత్తమా! శిల్పాలన్నీ శిలారూపమే కదా! అట్లాగే, ఈ దేశ - కాల - క్రియా - ద్రవ్య - మనో - బుద్ధ్యాదులన్నీ కూడా ఉదయాస్తమయ రహితమైన 'చిద్రూపం' అనే శిలచే తయారు చేయబడిన వివిధ శిల్పములేనని గ్రహించు.

చిత్ శక్తియే లోకాలోక పర్వతముపై గల శిలాకారం ధరించింది. వాయు తరంగాలన్నీ వాయువునకు చెందినవే అయినట్లు జగత్ సమూహములన్నీ చిత్ శక్తి యొక్క అంగాల వంటివే! చైతన్యం సర్వదా ఆద్యంతరహితమైనప్పటికీ పరిచ్ఛిన్నం పొందిన దానివలె ఉంటోంది. విజ్ఞాన ఘనమగు చైతన్యం తనను తానే 'జగత్తు' రూపంగా ఎఱుగుచున్నది.

స్వప్న చైతన్యమే ఆ స్వప్నంలోని గృహములు - కొండలు - శిలలు - మనుజులుగా కనిపించుచున్నది కదా! అట్లాగే, జాగ్రత్‌లో జాగ్రత్ చైతన్యమే ఈ జాగ్రత్‌లోని ఆయా శిల మొదలైన సర్వ పదార్థములుగా అగుపించుచున్నది.

ఓ మునీంద్రా! వాస్తవానికి ఇక్కడ నదులు ప్రవహించటం లేదు. నక్షత్రములు తరగటం లేదు. ఏ పదార్థమూ పరిణామం పొందటం లేదు. మరి? చిదాకాశము తనయందే ఈ ఈ పదార్థముల రూపాలను వివరితమగుచున్నది. ఈ కల్ప-మహాకల్పముల జ్ఞానం కూడా వాస్తవానికి లేనివే సుమా! సముద్రంలోని తరంగాలు సముద్రం కంటే వేఱు కాదు కదా! అట్లాగే, అవన్నీ కూడా చిదాకాశమున (జలంలో జలము కంటే అభిన్నమై భిన్నమైనట్లుగా కనిపించే తరంగాలవలె) వేరుగా భాసిస్తున్నప్పటికీ వేఱుకాదు.


Page:58

ఘటంలోని ఆకాశం మరియు మహాకాశము వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ వేర్వేరు కాదు కదా! అట్లాగే, చిత్ సత్త వలన చిద్రూపములై ఈ జగత్తులు విద్యమానమైనప్పటికీ,... చైతన్యమునకు భిన్నమగు జగత్తు అను రూపం ఎక్కడా లేదు.

కనుక, ఓ వసిష్ఠ మునీంద్రా! ఇక మీరు, మీరు నివసించే బ్రహ్మాండమును చేరెదరు గాక! అక్కడ ఏకాంతమున పూర్వం మీచే కల్పించబడిన ఆసనమును అధిరోహించి విక్షేపరహితమగు ఆత్మ సుఖమును అనుభవించటం కొనసాగించెదరు గాక! ఎందుకంటే, నాచే కల్పించబడిన ఈ బుద్ధి-అహంకారము-చిత్తము మొదలైనవాటితో కూడిన ఈ జగత్తు అవ్యక్తరూపమును పొందబోవుచున్నది. మేమైతే పరబ్రహ్మపదమగు కైవల్యమును పొందబోవుచున్నాము.

బ్రహ్మదేవుడు ఇట్లా పలికి బ్రహ్మనివాసులతో సహా పద్మాసనం అవధరించాడు. మరల వ్యుత్థానం లేనట్టి 'సమాధి' యందు తత్పరుడైనాడు.

✤✤✤✤

Ⅴ-16.) భూత ప్రకృతి ఉపసంహారం

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! అప్పుడు ఆ అన్యజగత్ బ్రహ్మదేవుడు 'ఓం'కారము యొక్క “ఉత్తరార్ధం” అగు అర్ధమాత్రయందు తన చిత్తమును పూర్తిగా లయింపజేశారు. తద్వారా శాంత మనస్కుడైనారు. సమస్త ఇంద్రియజ్ఞాన రహితుడైనారు. అప్పుడు చిత్తము అనే పటంలో లిఖించబడిన చిత్రం వలె నిశ్చల స్వరూపుడైనారు. ఆ ‘విద్యాధరి' అనే బ్రహ్మదేవుని వాసనా స్వరూపిణి బ్రహ్మదేవుని అనుసరించింది. బ్రహ్మదేవుని వలెనే ధ్యానతత్పర అయింది. క్రమంగా పూర్ణంగా శమించిన రూపం కలదయింది. ఆకాశ రూపిణిగా సంతరించుకొన్నది.

'ఓం'కారము ఉత్తరార్ధం అర్ధమాత్రము అనగా జగత్ - స్వప్న - సుషుప్తులకు ఆవల కేవల సాక్షియై వేంచేసియున్న శుద్ధ స్వస్వరూపం

ఆ అన్యజగత్ బ్రహ్మదేవుడు తన శరీర-ఇంద్రియాదులుగా గల సమస్తం ప్రణవం యొక్క అర్ధమాత్రముయందు లయింపజేశాడు. సంకల్పరహితుడైనాడు. స్థూల భావం నుండి సూక్ష్మ భావం పొందసాగాడు. అప్పుడిక నేను కూడా సమాధిచే “సర్వ వ్యాపకం, అనంతం” అగు రూపాన్ని సంతరించుకున్నవాడినై అక్కడ జరుగుచున్న స్థూల సూక్ష్మ తతంగమంతా చూస్తూ ఉన్నాను.

ఆ బ్రహ్మదేవుని సంకల్పము ఏ రీతిగా క్షీణింపజొచ్చిందో, ఆ రీతిగా భూమిపై తృణముల - లతల - ధాన్యముల మొదలైన వాటి ఉత్పత్తి సన్నగిల్లసాగింది. విత్తనాలు అంకురించు (మొలకెత్తు) స్వభావాన్ని మెల్లమెల్లగా కోల్పోసాగాయి. పృథ్వి ఆ విరాడ్రూపుడగు బ్రహ్మదేవుని అవయవములోని ఒక విభాగము వంటిదే కాబట్టి, అతని సంకల్పముతో బాటే అది చేతనారహితం, రసహీనం కాసాగింది. నిస్సారం కాసాగింది. పృథ్వి అనేక దుశ్శకునములతో నిండసాగింది. పాపులగు జనులు విపరీత ధోరణులను ప్రదర్శిస్తూ 'నరకం' వైపు త్రోవలు నిర్మించుకోసాగారు.

అనేక చోట్ల క్షామం, రాజుల క్రూర ప్రవర్తన, అగ్ని చోరాది ఉపద్రవములు, దీనత్వ దారిద్ర్యాదుల దౌర్భాగ్యము, మర్యాదహీనమైన ప్రవర్తనములు, దుష్ట స్త్రీల ఆధిపత్యములు మొదలైన దుఃఖస్థితులు ప్రవృద్ధం కాసాగాయి.


Page:59

పెనుగాలులు వీచుటచే ఆకాశము ధూళిచే ఆవరించబడ సాగింది. ఆ ధూళి ఆకాశంలో పేరుకు పోవటంచేత సూర్యగోళం మసక మసకగా కనిపించ సాగింది. శీతల-ఉష్ణ వాయువులు ఒకదాని వెనుక మరొకటి తీవ్రంగా వీచటం చేత జనులు హాహాకారాలు చేయసాగారు. అనేక ప్రదేశాలు మూర్ఖులచేత, మహాదుఃఖితుల చేత, దుర్వాసనా పరుల చేత, రోగులచేత, అకారణంగా ప్రచ్ఛన్నయుద్ధమునకు ఉపక్రమించేవారి చేత నిండిపో సాగింది. ఒక గ్రామంలో అతివృష్టి, ఆ ప్రక్క గ్రామంలోనే అనావృష్టి ఒకచోట నీరు లభించక జనులు అల్లల్లాడుచుండగా, కొద్దిదూరంలో వరదలు వచ్చి జనవాసములు కొట్టుకుపోసాగాయి. ఒక గ్రామం ప్రజలు మరొక గ్రామం ప్రజలతో చిన్నచిన్న కారణాలుగా ముఠా తగాదాలు పెంపొందించుకోవటంచేత పరస్పర సహకారం లభించక సామాన్య జనులు అష్టకష్టములపాలు కాసాగారు. జనులు అత్యంత స్వల్ప కారణాలకు ఒకరి ఒళ్ళు మరొకరు తగలబెట్టుకోవటంవంటి నీచ ప్రవృత్తులు కలిగి ఉండసాగారు.

పర్వతాలపై, నగరాలపై పిడుగులు పడటం వంటి ఆకస్మిక ఉత్పాతాలు ఏర్పడసాగాయి. శిశువులు, శ్రోత్రియులు, మాన్యులు, విద్వాంసులు గుణవంతులు మొదలైనవారు దుష్టజనుల వలన అనేక హింసలకు గురి కాసాగారు. అకస్మాత్తుగా జన సమ్మర్దమైన ప్రదేశాలలో భూ ప్రకంపనాల వల్ల అగాధ కూపాలు ఏర్పడి క్షణంలో అనేకమంది జనులు భూమిలో కూరుకుపో సాగారు.

రాజులు వర్ణ సంకరులగు స్త్రీల సాంగత్యంలో తమ కనీస కర్తవ్యములను ఏమరచి ప్రవర్తించ సాగారు. జనులు వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘించి ప్రవర్తించసాగారు. రాజులు తమ దుష్ట వ్యసనాలకు అవసరమైన ధనాన్ని విచక్షణారహితమైన పన్నులు వసూలు చేస్తూ ప్రజాకంటకులు కాసాగారు.

అనేక ప్రాంతాలు దుఃఖముచే రోదన కలిగించే సమాచారాలతో పూర్ణమవసాగాయి. రక్షించ వలసిన రాజుల చేతనే జనులు బాధింపబడసాగారు. కొందరైతే దొంగలను ముఠాగా జేర్చి అపహరించటమే వృత్తిగా కలిగి జనులలో నాయకులుగా చెల్లుబడసాగారు. వారి అధర్మం ధర్మం వలె చెల్లుబాటు కాజొచ్చింది.

పండితులు-సజ్జనులు-పురోహితులు మొదలైనవారు అనాదరణ, అగౌరవాలను పొంద సాగారు. జనులు స్వధర్మమును ఏమరచి పరధర్మమును అనుసరించసాగారు. ఎల్లప్పుడు ఇతరులను పీడించటం, అవమానించటమే వృత్తిగా గల జనుల సంఖ్య అధికం కాసాగింది. దొంగలు యథేచ్చగా దేవాలయాలను, పవిత్ర ప్రదేశాలను ఆక్రమించి అక్కడి సొమ్మును దొంగిలించసాగారు.

భౌతిక సుఖములకే ప్రాముఖ్యమిచ్చి జనులు అల్పాయుష్కులు కాసాగారు. సోమరితనముచే, విలాసముచే జనులు సంధ్యావందనాది ఆధ్యాత్మిక క్రియలు ఏమరచసాగారు.

అంటు రోగములు, ఆపదలు, ఆకస్మిక సామూహిక మరణములు ప్రవృద్దం కాసాగాయి. అభాగ్యులగు జనుల ఆక్రందనములు వినేవాళ్ళు, వినినా పట్టించుకొనేవారు కరువయ్యారు.


Page:60

ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని విరాట్ దేహంలోని చైతన్యం ఉపసంహరించబడనారంభించింది. ప్రళయం వచ్చి పడింది. పృథ్వి రసహీనం కాసాగింది. ఋతువులు వక్రించనారంభించాయి. నేలలో నీరు ఇంకి కాటకం తాండవించసాగింది. చైతన్యము యొక్క అభావ ప్రభావం చేత సముద్రజలాలు విక్షుబ్దం కాసాగాయి. సముద్రజలం అనియతిని పొందసాగింది. క్రమంగా తీరంలోని అరణ్యాలు సముద్రజలంలో మునిగిపోసాగాయి. అక్కడి జనులు జనావాసాలవైపు పరుగులు తీయనారంభించారు. సముద్రం ఆకాశమును ఆక్రమించ నారంభించింది. సముద్రజలం పెద్ద ఆవర్తములతో కొండ గుహలలోకి ప్రవేశించ సాగింది. మరొకవైపు నుంచి ఆ కొండలపై భీకర గర్జనతో మేఘములు వర్షించసాగాయి. కొండ గుహలలో మొసళ్ళు ప్రవేశించాయి. సింహములు ఊళ్ళ పైబడి పెంపుడు జంతువులను, మనుష్యులను అప్రతిహతంగా ఆరగించనారంభించాయి. సముద్ర తరంగముల రాపిడికి బడబాగ్ని జనించసాగింది. జలచర జీవులు భూమిని ఆక్రమించసాగాయి. తరంగములచే కొట్టుకొని వచ్చిన రాక్షస తాబేళ్ళు వనములలోని మహావృక్షములను ఆక్రమించసాగాయి. జనులలో విపరీత వృత్తులు పొడమసాగాయి.

పుత్రులు - మిత్రులు - తదితర సహజీవులు నీళ్ళలో కొట్టుకుపోతుంటే కూడా పట్టించుకోకపోవటం సర్వసామాన్యమైపోయింది. నీటి ఏనుగుల కళేబరాలు గృహద్వారాలకు అడ్డంగా వచ్చి పడసాగాయి. దిక్కులు ప్రళయకాల మేఘ గర్జనలతో పిక్కటిల్లాయి. ఆకాశంలో అకస్మాత్తుగా తోకచుక్కలు పొడిచాయి. అగ్ని సమూహాలు ఆకాశంలో అటూ ఇటూ పరుగులు తీయసాగాయి. ఈ విధంగా బ్రహ్మదేవుని సంకల్పము యొక్క ఉపసంహరణ కారణంగా భూమి మొదలైన మహా భూతములన్నీ సంక్షోభం పొందసాగాయి. సూర్య-చంద్ర-అగ్ని-వాయు-ఇంద్ర-యమాది దేవతలు కూడా ఆ కోలాహలమునకు వ్యాకులం చెందసాగారు. ఇప్పటి వరకు అధికారము వహించిన దేవతలు అధఃపతన తత్పరులు కాసాగారు. పర్వతములు - నగరములు - జల ప్రదేశములు అరణ్యములు మొదలైన వాటితో కూడిన అక్కడి సమస్త జగత్తు కల్పాంత వాయువుల భీకర వీచికలచే చూర్ణమగుచూ శైథిల్యం పొందసాగింది.

✤✤✤✤

Ⅴ-17.) జగత్తుగా కనిపించేదంతా నిర్మల పరబ్రహ్మమే!

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఆ తర్వాత ఆ విరాడ్రూపుడగు అన్యజగత్ బ్రహ్మ తన ప్రాణాలను ఉపసంహరించనారంభించారు. అప్పుడు గ్రహ-నక్షత్రాదులు తమ గతిని వీడసాగాయి. ఎందుకంటావా? అవన్నీ బ్రహ్మదేవుని ప్రాణస్వరూపాలే కదా! అట్టి ప్రాణాలు ఉపసంహరిస్తున్నప్పుడు గ్రహ నక్షత్రాలు ఎట్లా నిలుస్తాయి? ప్రాణ వాయువులు అట్లు ఉపసంహరించబడుచుండగా భీకర సంక్షోభం ఉదయించి సూర్యులు తమతమ స్థితిని కోల్పోయారు. భోగ స్థానములగు స్వర్గాది లోకాలు తమ ఉత్పత్తి స్థానమైన కర్మమూలస్థితిని పొందసాగాయి. అప్పుడు వాయు సహితమగు అగ్ని అంతటా ఉత్పన్నం కాజొచ్చింది. నక్షత్రములు నిరాధారాలై క్రిందకు పడిపోసాగాయి.


Page:61

"బ్రహ్మదేవుని సంకల్పం” అనే ఇంధనం తరిగిపోవటం చేత సిద్ధ లోకాల గతి శమించనారంభించింది. సిద్ధ సమూహాలు తమ శక్తులను కోల్పోవటం చేత దూది పింజముల వలె ఆకాశంలో పరిభ్రమించసాగాయి. ఇంద్రాది లోకములకు స్థానమైన మేరు పర్వత శిఖరములు విఱిగి పడిపోసాగాయి.

శ్రీరాముడు :  మహాత్మా! "విరాట్టు - బ్రహ్మాండ శరీరుడు” అని చెప్పబడే బ్రహ్మదేవుడు ఆ చైతన్యము యొక్క సంకల్పమాత్ర స్వరూపుడని గదా, శ్రుతి-స్మృతి ప్రసిద్ధము? అట్టి సంకల్ప మాత్రము నిరాకారమగు శరీరము గల బ్రహ్మదేవునికి సాకారములగు ఈ భూ-నక్షత్రాదులు అవయవములు ఎట్లా అవుతాయి? ఒకవేళ ఈ లోకములన్నీ అతని అవయవములనే అనుకొందాం. అప్పుడు ఈ భూలోకము అతని ఏ అవయవము? స్వర్గ-రసాతలాది లోకములు అతని ఏఏ అవయవములు? అతనిలో ఈ విశాల లోకములు అవయవములుగా ఎట్లా ఉన్నాయి? అట్టి అతడు 'బ్రహ్మాండము’ అనే తన ఈ శరీరము లోపల సత్యలోకంలో ఎట్లా స్థితి కలిగి ఉన్నాడు?

మహర్షీ! బ్రహ్మదేవుడు సంకల్పమాత్రుడనీ, నిరాకారుడనీ అంటూ ఉంటారు. మరి ఈ జగత్తేమో సాకారమని సుస్పష్టమే అయి ఉన్నది కదా! సాకార జగత్తులో నిరాకారుడు ఎట్లా ఉన్నాడు? ఒకవేళ నా ప్రశ్నలలోనే స్వతహాగానే ఏదైనా దోషం ఉన్నదా? వివరించ ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఓ రామచంద్రా! ఈ కనబడే ‘జగత్తు' అని దేనినంటున్నామో... అట్టి ఇయ్యది మొట్టమొదట సృష్ట్యాదియందు ఏ రూపంలో ఉన్నది? సృష్ట్యాదియందు ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కాదు. ఇది మొట్టమొదటి సర్వ దశదిశలను పరిపూర్ణం ఒనర్చునట్టి నిరామయమైన పరమాకాశ రూపమగు చిన్మాత్ర-బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి ఆ పరమాకాశము తన పరమాకాశ స్వరూపమును ఏ సమయమందునూ త్యజించనే లేదు. అట్టి ఆ పరమాకాశమే తన యొక్క చిదాకాశత్వ స్వరూపమగు ఈ జగత్తును తనకంటే వేరైన వస్తువు వలె (లేక చేత్యము లేక దృశ్యము వలె) ఎరుగుచున్నది (లేక) చూచుచున్నది.

నిశ్చల జలంలో చంచలరూపమగు ఆవర్తములు ఏర్పడుతూ ఉంటాయి కదా! అయితే, అట్లా ఆవర్తరూపంగా కనిపించేదంతా కూడా జలమునకు వేరైనదేదీ కాదు కదా! అట్లాగే, 'చిదాకాశము' అనబడు అత్యంత నిశ్చలము- శుద్ధము-అనన్యము-పూర్వాత్ పూర్వము అగుదాని యందు కారణమంటూ ఏదీ లేకుండానే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే ఒకానొక త్రిపుటి తనంతట తానే జనిస్తోంది. అందుకు కారణమంటూ ఏదైనా ఉంటే ఆ కారణం కూడా చిదాకాశమునకు అనన్యం అనియే చెప్పబడింది. ఆ త్రిపుటి యొక్క మననముచే ‘ఘనీభావము’ వలన “మనోరూప స్థితి” పొందిన చిత్ చైతన్యమే ఈ జీవుడు. ఈ రీతిగా త్రిపుటి సమూహముల యొక్క అధ్యాస పొందుచున్నప్పటికీ చిదాకాశము యథాతథంగా నిరాకారంగానే ఉన్నది గాని, అద్దానియందు సాకారమనునదేదీ లేదు. అనగా త్రిపుటి జనించటానికి ముందు, జనించిన తర్వాత కూడా చిదాకాశము తనయందు చిదాకాశముగానే నెలకొనియున్నది. ఇక ఈ త్రిపుటిగా భాసించేదంతా ఏమిటంటావా? ఇది కూడా “శివరూపమగు పరమాత్మ" కంటే వేఱు కాదు.


Page:62

ఆ విధంగా త్రిపుటి ఏర్పడిన తర్వాత అట్టి విశాలమగు సంకల్పరూపమైన మనస్సునందు అభిమాన రూపమగు భావనచేత “అహంకారం”గా స్ఫురిస్తోంది. అయితే అట్టి అహంకార రూపంగా స్ఫూరించేది కూడా వాస్తవానికి 'నిశ్చలం, నాశరహితం' అగు బ్రహ్మమే అయి ఉన్నది.

అట్టి అహంకార - సంకల్ప రూపుడగు చిత్స్వరూపుని 'చిదాభాసుడు (చిత్ అభాసుడు)' అని శాస్త్రాలు పిలుస్తున్నాయి. ఆ చిదాభాసుడు 'నేను ఆకాశరూపుడను' అని భావించటం జరుగుతోంది. ఆ విధంగా చిదాకాశమే చిదాకాశమున “అసత్తు” అగు ఆకాశరూపంగా పొందుచున్నది. ఆ సంకల్పరూపుడగు చిదాభాసుడు శూన్యమునే దేహాకారంగా భావించటం చేత “దేహమును చూడటం, దేహమును ఎఱగటం, దేహమును అనుభవించటం”... అనునవన్నీ సంభవిస్తున్నాయి.

శ్రీరాముడు :  శూన్యమును దేహాకారంగా భావించి దేహానుభవం పొందటం ఎట్లా జరుగుతుంది? 

శ్రీ వసిష్ఠ మహర్షి :  ఊహలో శూన్యమునందే తనకు ఎక్కడో-ఎప్పుడో పరిచయమున్న నగరంలోని వీథిగా ఊహించి ఆ ఊహలోంచి అనుభవం పొందుతారు కదా! ఒకడు తనకు ఇష్టమైన రూపమును ఊహలో (లేక జ్ఞప్తిలో) దర్శించటం జరుగుతోంది కదా! స్వప్నసంవిత్తు వాస్తవానికి శూన్యమే అయినప్పటికీ స్వప్నంలో నగరములు-ఆకారములు అనుభవానికి ప్రాప్తిస్తున్నాయి.

జన్మరహితమగు చిదాకాశ స్వరూప బ్రహ్మము శూన్యమగు ఆకాశమును దేహరూపంగా గాంచుచున్నది. అయినప్పటికీ కూడా, చిదాకాశమున చిదాకాశమే అనుభవించబడుచున్నదగుచున్నది. జ్ఞానము యొక్క నిర్మలత్వముచే ఆ పరమాత్మ స్వసంకల్పితమైన జగత్తును అనుభవిస్తూ మరల మరొకప్పుడు తన ఇచ్ఛ చేతనే అద్దానిని శమించజేయుచున్నాడు.

ఓ రామచంద్రా! మనలో ఎవరికి ఎప్పుడు బ్రహ్మతత్త్వము యొక్క వాస్తవ పరిజ్ఞానం కలుగుతుందో... అప్పుడు అతనికి ఈ జగత్తు “దృశ్య శూన్యంగాను, వ్యాప్తము-సత్యము అయినట్టి చిదాకాశమాత్రం”గాను కనిపించుచున్నదని గ్రహించు. జగత్ వాసనలు శమించినప్పటి దృష్టికి ఇదంతా నిరాకారము-నిత్యసత్యము అగు బ్రహ్మముగానే గోచరించగలదు సుమా!

శ్రీరాముడు :  జగత్ వాసనలు త్వరితంగా తొలిగేది ఎట్లా?

శ్రీవసిష్ఠ మహర్షి :

  1. బ్రహ్మమే పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వదేహులుగా, సర్వతత్త్వములుగా కనబడుచున్నదను “అద్వైతతత్త్వము” చేతనూ,
  2. “అహంకారం భ్రమ మాత్రమే” అను అవగాహనచే ప్రస్ఫుటమయ్యే అహంకార రాహిత్యం చేతనూ,
  3. “ఈ జగత్తు యొక్క అసలైన రూపం ఏమై ఉన్నది?" అను ఉత్తమ పరిశీలన యొక్క ప్రయోజనమైనట్టి యథార్థజ్ఞానము చేతనూ,...

మనుజునకు ఈ జన్మయందే వాసన శమించిపోగలదు. ఆ తర్వాత మోక్షరూపమగు ఆత్మయే అంతటా అన్నిటా (అన్నీగా) శేషించుచున్నది.


Page:63

ఓ రామచంద్రా! ఈ విధంగా "చిత్స్వరూపమగు బ్రహ్మము" అనబడునది ఏదైతే కలదో, అదే ఈ జగత్తు అయి ఉన్నది. విరాడ్రూపమగు బ్రహ్మము యొక్క దేహమే ఈ జగత్తు. చిన్మాత్ర బ్రహ్మం సంకల్పాకాశరూపత్వమును అభ్యసించినదై ఉంటోంది. అట్టి సంకల్పవశ చిన్మాత్ర బ్రహ్మానికి సంబంధించిన స్థూల శరీర భ్రాంతి ఉదయించి, అదియే ఈ జగదాకారంగా భాసిస్తోంది. అదియే “బ్రహ్మాండము” అని కూడా పిలువబడుతోంది. ఈ జగత్తంతా బ్రహ్మము యొక్క “సంకల్ప కల్పనా రూపం” మాత్రమే! అనగా అధిష్టాన దృష్టిచే ఇదంతా చిదాకాశము మాత్రమే! కనుక యథార్థానికి నామరూపాత్మకమైన ఈ దృశ్య జగత్తు లేదు. అహమ్-త్వమ్ ఇత్యాదులు కూడా వాస్తవానికి లేవు.

చిన్మాత్రము - నిర్మలము - వికారరహితము అగు చిన్మాత్రమునందు సాకారమగు ఈ జగత్తు ఎట్లు దేనిచే జనించగలదు చెప్పు? కాబట్టి, ఈ జగత్తు మిథ్యగానే జనించినదని, మిథ్యగానే కనబడుతోందని అనక తప్పదు. మిథ్యగానే ప్రియ-అప్రియ భావములకు కారణమౌతోంది. నిష్ప్రపంచమగు బ్రహ్మమే తన “ఇచ్ఛ”చే జగత్ శూన్యము అగు చిదాకాశమును జగద్రూపంగా చూడటం జరుగుతోంది.

వాయువు అంతటా ఉన్నప్పటికీ అది కదలుచున్నప్పుడే అద్దాని ఉనికిని మనం గుర్తిస్తున్నాం కదా! గాలి తనకు తానే కదలుచున్నట్లు చిన్మాత్రమగు బ్రహ్మం తన యొక్క అద్వితీయమగు చిదాకాశమున స్వయంగా “జగత్తు” మొదలుగా గల రూపంగా ఎఱుగుచున్నది.

అందుచేత రామచంద్రా! నీవు కూడా నా వలెనే సర్వ విశేషాలు శమించినవాడవై ఉండెదవు గాక! ఈ దృశ్యం అధిష్ఠాన రూపముచే సత్యము, నిజదృశ్యరూపముచే అసత్యమయి ఉన్నది. కనుక, పరమార్థమున ఈ దృశ్యమును శూన్యము, నిర్మలము అగు చిదాకాశముగానే ఎఱిగి ఉండు. మమత్వరహితుడవై పరమార్థమున సత్-చిత్ రూపుడవై, వ్యవహారమునందు మాత్రం దేహధారివలె ఉండు. వాసనారహితుడవు అగుము.

సమాధి నుండి లేచినప్పుడు (ఈ ప్రపంచమున ప్రవేశించి ఉన్నప్పుడు) వాసనా రహితుడవై, శాంతచిత్తుడవై, మౌనివై, చపలత్వ రహితుడవై ఆయా యథాప్రాప్త వ్యవహారాలను నిర్వర్తించు. సమాధి స్థితుడవైనప్పుడు ఏ ఏ వ్యవహారాలు చెయ్యకయే విషయరహితుడవై ఉండు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానియందు ఎట్టి పట్టుదల కలిగి ఉండనే వద్దు.

ఓ రామచంద్రా! మరల మరొక్కసారి ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను -

  1. సత్యమగు పరమాత్మ అనుభూతియే జీవించినందుకుగాను పొందాల్సిన పరమావధి.
  2. అట్టి పరమాత్మ అనుభూతము కాగా అప్పుడు ఈ దృశ్యము అత్యంత స్వభావసిద్ధంగా “అనాది - నిత్యానుభవరూపము - ఏకము” అయినట్టి పరబ్రహ్మమేనని సుస్పష్టం కాగలదు.
  3. దృశ్యము అనునదేదీ వేఱుగా లేనేలేదని విదితమౌతుంది.

అట్టి పరమాత్మను గురించిన అనుభవం లేకుండటంచేతనే - ఈ విశాలమైనట్టి నామరూపాత్మక దృశ్యమహాదృష్టి ఈ జీవునికి ఎదురుగా మోసపూరితంగా తాండవం చేయటం జరుగుతోంది.