సంస్కృత మూల గ్రంథము: "యోగవాసిష్ఠం (8 సంపుటములు)" - వాల్మీకి మహర్షి ప్రణీతము, ముద్రణ: శ్రీ వ్యాసాశ్రమం, శ్రీకాళహస్తి
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు

తెలుగు వచన సరళ వ్యావహారిక స్వేచ్ఛానువాద సమగ్ర గ్రంథము: "శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (4 సంపుటములు)" - శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com), ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.

యోగవాసిష్ఠం vs వసిష్ఠ రామ సంవాదం

విషయ సూచిక :


[1.] వైరాగ్య ప్రకరణం

[1.00] వాల్మీకి మహర్షిచే గ్రంథ ప్రారంభ ప్రార్థన శ్లోకములు

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 1

యతః సర్వాణి భూతాని ప్రతిభాన్తి స్థితాని చ ।
యాత్రైవోపశమం యాన్తి తస్మై సత్యాత్మనే నమః ॥

యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ ।
యత్ర ఏవ ఉపశమం యాంతి, తస్మై సత్య ఆత్మనే నమః ॥

ఎద్దానినుండి భూతములన్నియు ఆవిర్భవించుచున్నవో, ఎద్దాన స్థితిని గనుచున్నవో, తుద కెద్దాన లయమును బొందుచున్నవో, ఆ సత్యస్వరూపి యగు బ్రహ్మమునకు నమస్కారము.
యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ, యత్ర ఏవ ఉపశమం యాంతి, తస్మై సత్య ఆత్మనే నమః ॥

సత్

దేనియందు సర్వ భూతములు ప్రతిభాసిస్తున్నాయో, స్థితి కలిగియున్నాయో మరియు అద్దానియందే ఉపశమం పొందుచున్నాయో… ఆ సత్య స్వరూపమైన ఆత్మకు నమస్కారము!

ఏ అద్వితీయ వస్తువు నుండి సృష్టి కాలంలో ఆకాశము మొదలైన మహాభూతములు, వాటి నుండి సమస్త పదార్థములు ఉనికిని పొంది భాసిస్తున్నాయో, అట్టి సత్ స్వరూపమగు పరమాత్మకు మోకరిల్లి నమస్కరిస్తున్నాను.

సర్గ - 1, శ్లోకమ్ - 2

జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శనదృశ్యభూః ।
కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః ॥

జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం, ద్రష్టా దర్శన దృశ్యభూః ।
కర్తా హేతుః క్రియా, యస్మాత్ తస్మై జ్ఞప్తి ఆత్మనే నమః ॥

జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ, ద్రష్ట, దర్శన, కర్త, హేతు, క్రియలను వ్యావహారిక తత్త్వము లెద్దానినుండి ప్రభవించినవో, ఆ నిత్యజ్ఞాన స్వరూపి యగు బ్రహ్మమునకు నమస్కారము.
జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం, ద్రష్టా దర్శన దృశ్యభూః, కర్తా హేతుః క్రియా - యస్మాత్ తస్మై జ్ఞప్తి ఆత్మనే నమః ॥

చిత్

<జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము>,
<ద్రష్ట, దర్శనము, దృశ్యము>,
<కర్త, కారణము, క్రియ> ... అను త్రిపుటీ (tuples) తత్త్వ లక్షణములు దేని వలన ప్రకటిమగుచున్నవో… ఆ జ్ఞప్తి స్వరూపమైన ఆత్మకు (శుద్ధ జ్ఞాన ఆత్మకు) నమస్కారము!

• జ్ఞాత (ఎఱుగువాడు) - జ్ఞానం (ఎఱుగబడే విధం) - జ్ఞేయం (ఎఱుగబడునది),
• ద్రష్ట - దర్శనం - దృశ్యం,
• కర్త - కారణం (హేతువు) - క్రియ
ఇవన్నీ దేని వల్ల భాసిస్తున్నాయో, అట్టి జ్ఞాన స్వరూపమగు పరమాత్మకు నమస్కరిస్తున్నాను.

సర్గ - 1, శ్లోకమ్ - 3

స్ఫురన్తి సీకరా యస్మాదానందస్యాంబరేఽవనౌ ।
సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః ॥

స్ఫురన్తి శీకరా యస్మాత్ ఆనందస్య అంబరే అవనౌ ।
సర్వేషాం జీవనం, తస్మై బ్రహ్మ ఆనంద ఆత్మనే నమః ॥

ఏ మహానంద సాగరమందలి కణమగు విషయానందము సమస్తజీవులలో ప్రకాశము నందుచున్నదో, ఎద్దానియొక్క ఆనందకణము జీవులకు జీవనమో, - ఆ బ్రహ్మానంద రూపుడగు ఆత్మకు నమస్కారము.
యస్మాత్ ఆనందస్య శీకరా అంబరే అవనౌ సర్వేషాం జీవనం స్ఫురన్తి, తస్మై బ్రహ్మ ఆనంద ఆత్మనే నమః ॥

ఆనంద

ఏ చిదానందము యొక్క అణురూప అంశలే ఆకాశమునందు, అవనియందు ఉన్న సర్వ జీవుల జీవనమును (జీవితానందమును) స్ఫురించుచున్నదో… అట్టి బ్రహ్మానంద స్వరూపమైన ఆత్మకు నమస్కరిస్తున్నాను!

ఈ దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైన ప్రాణులంతా ఏ మహానంద సముద్రంలో ఉపాధి భేదం చేత, ఆనంద బిందువులుగా స్ఫురిస్తున్నారో, ఏది సర్వదా ఆ సమస్త ప్రాణులకు జీవనమే అయివున్నదో, అట్టి బ్రహ్మానంద స్వరూపమగు పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను.

సర్గ - 1, శ్లోకమ్ - 4

దివి భూమౌ  తథాఽఽకాశే  బహిరంతశ్చ మే విభుః ।
యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః ॥

దివి భూమౌ  తథా ఆకాశే,  బహిః అంతః చ మే విభుః ।
యో విభాతి అవభాస ఆత్మా, తస్మై సర్వ ఆత్మనే నమః ॥

భూలోకమున, అంతరిక్షలోకమున, స్వర్గలోకమున నాయందు బయట, లోపల వ్యాపించి అన్నిటిని ప్రకాశింప జేయుచున్న సర్వాత్మకునకు నమస్కారము.
యో విభుః దివి భూమౌ  తథా ఆకాశే,  మే బహిః అంతః చ ఆత్మా అవభాస విభాతి, తస్మై సర్వ ఆత్మనే నమః ॥

సర్వాత్మ

ఏ విభుడు దివియందు, భువియందు, అలాగే ఆకాశమంతయు, నా బాహ్యమున మరియు అంతరమున కూడా సర్వాంతర్యామియై ప్రకాశించుచున్నాడో, అట్టి సర్వాత్మకు నమస్కారము!

స్వస్వరూపుడు, స్వప్రకాశ రూపుడు అయినట్టి ఏ పరమాత్మ స్వర్గంలోను, భూలోకంలోను, ఆకాశంలోను, బయట, లోపల కూడా ఏకరూపుడైనప్పటికీ నానా రూపములుగా ప్రకాశిస్తున్నాడో - అట్టి సర్వ రూపుడగు పరబ్రహ్మమును హృదయపూర్వకంగా మ్రొక్కుచున్నాను.


🙏 🙏 🙏



[1.01] కథారంభః - ఉపోద్ఘాత కథ


[1.01.1] సుతీక్ష్ణుడు మరియు అగస్తి ముని సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 5

సుతీక్ష్ణో బ్రాహ్మణః కశ్చిత్ సంశయాకృష్టమానసః ।
అగస్తేరాశ్రమం గత్వా మునిం పప్రచ్ఛ సాదరమ్ ॥

సుతీక్ష్ణః బ్రాహ్మణః కశ్చిత్ సంశయ ఆకృష్ట మానసః ।
అగస్తేః ఆశ్రమం గత్వా మునిం పప్రచ్ఛ సాదరమ్ ॥

సుతీక్ష్ణుడను ఒకానొక బ్రాహ్మణుని మనస్సు సంశయ పీడితము కాగా, నాత డగస్తి మునీంద్రుని ఆశ్రమమున కఱిగి వినయముతో నిట్లు ప్రశ్నించెను.
సుతీక్ష్ణః కశ్చిత్ బ్రాహ్మణః సంశయ ఆకృష్ట మానసః, అగస్తేః ఆశ్రమం గత్వా మునిం పప్రచ్ఛ సాదరమ్ ॥

సుతీక్ష్ణుడు అను ఒకానొక బ్రహ్మణుడు తన మనస్సు సంశయాత్మకము కాగా అగస్తి ముని ఆశ్రమమునకు వెళ్లి వినయముతో ఆయనను పరిప్రశ్నించెను.

పూర్వం ‘సుతీక్ష్ణుడు’ అనే ఒకానొక విద్యాకోవిదునకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది.

అప్పుడు అతడు సందేహ నివృత్తి కొరకు సధర్మి, బ్రహ్మజ్ఞాని, తన సద్గురువు అయినట్టి అగస్తిమునిని సమీపించి వినయంగా ప్రణామంచేసి తన మనస్సులోని అనుమానం బైటపెట్టాడు.

సుతీక్ష్ణ ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 6

భగవన్! ధర్మతత్త్వజ్ఞ! సర్వశాస్త్రవినిశ్చిత ।
సంశయోఽస్తి మహానేకస్త్వమేతం కృపయా వద ॥

భగవన్! ధర్మతత్త్వజ్ఞ! సర్వశాస్త్రవినిశ్చిత ।
సంశయో అస్తి, మహా అనేకః త్వమ్, ఏతం కృపయా వద ॥

సుతీక్షణుడు :- భగవానుడా! ధర్మరహస్యముల నన్నిటిని మీరెఱుంగుదురు. శాస్త్రముల నన్నింటిని నిశ్చిత బుద్ధితో పఠించితిరి. నాకొక పెద్దసందియము కలిగినది. దానిని దీర్చ వేడెదను.
భగవన్! త్వమ్ అనేకః ధర్మతత్త్వజ్ఞ! సర్వశాస్త్ర వినిశ్చిత! మహా సంశయో అస్తి. ఏతం కృపయా వద!

సుతీక్ష్ణుడు :-

హే భగవాన్! మీరు అనేక మహా ధర్మతత్త్వములు తెలిసినవారు. సర్వశాస్త్రములను నిశ్చయముగా అర్థము చేసుకున్నవారు. నాకు గొప్ప సందేహము ఉన్నది. నాపై కృపతో దాని గురించి వివరించండి!


సర్గ - 1, శ్లోకమ్ - 7

మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్షసాధనమ్ ।
ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణమ్ ॥

మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్షసాధనమ్ ।
ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణమ్ ॥

మోక్షకారణము కర్మయా లేక జ్ఞానమా? లేక కర్మజ్ఞానములు రెండును గూడ మోక్షసాధనములా? వీటిలో నెయ్యది మోక్షకారణమో నిశ్చయించి నాకు జెప్పుడు.
మోక్షస్య కారణం కర్మ? జ్ఞానం వా? ఉభయం వా? మోక్షసాధనమ్ వినిశ్చిత్య ఏకం కారణమ్ కథయ!

మోక్షము కలుగుటకు కారణం కర్మయా? లేక జ్ఞానమా? లేక కర్మజ్ఞానములు రెండూనా? ఏది మోక్షసాధనమో బాగుగా నిశ్చయించి దానిని వివరించండి!

 కర్మ గొప్పదా? జ్ఞానం గొప్పదా?  
 కర్మలన్నీ త్యజించి ’విచారణ’ను అనుసరిస్తే మంచిదా?….  
 విచారణను ప్రక్కకుపెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించటం ఉచితమా? …

అగస్తిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 8

ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిః ।
తథైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదమ్ ॥

ఉభాభ్యాం ఏవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిః ।
తథా ఏవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదమ్ ॥

అగస్తి: పక్షు లాకాశమున రెండు లెక్కల సాయమున జరించునట్లు, జీవుడు జ్ఞానకర్మల సాహాయ్యమున పరమపదమును బొందును.
ఉభాభ్యాం ఏవ! యథా ఖే పక్షిణాం పక్షాభ్యాం గతిః, తథా ఏవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదమ్.

అగస్తి మహర్షి :-

రెండూ ఉండుట చేత మాత్రమే! ఏ విధంగా అయితే ఆకాశమునందు పక్షులకు రెండు రెక్కలచే గమనం సాధ్యమో, అదే విధంగా జ్ఞానకర్మలు రెండునూ చేత మాత్రమే పరమపదము పొందగలం.

అగస్తిముని చిరునవ్వు నవ్వి ఇట్లు పలికారు :-

నాయనా! అదిగో! ఆకాశంలో ఎగురుచున్న పక్షిని చూచావా? అది రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతోంది కదా! మానవుడు కూడా కర్మజ్ఞానముల రెండిటి సహకారంతో మాత్రమే మోక్షాకాశంలో విహరించగలడు.

సర్గ - 1, శ్లోకమ్ - 9

కేవలాత్ కర్మణో జ్ఞానాన్న హి మోక్షోఽభిజాయతే ।
కిం తూభాభ్యాం భవేన్మోక్షం సాధనం తూభయం విదుః ॥

కేవలాత్ కర్మణో జ్ఞానాత్ న హి మోక్షో అభిజాయతే ।
కిం తు ఉభాభ్యాం భవేత్ మోక్షం సాధనం తు ఉభయం విదుః ॥

కేవలము కర్మవలన గాని, జ్ఞానమువలన గాని మోక్షము లభించదు. ఈ రెంటివలన మోక్షము లభించును; కనుక సాధుజనులు ఈ రెంటిని మోక్షోపాయములని పరిగణింతురు.
కేవలాత్ కర్మణః, జ్ఞానాత్ న హి మోక్షో అభిజాయతే. కిం తు ఉభాభ్యాం భవేత్. విదుః మోక్షం సాధనం తు ఉభయం.

కేవలం కర్మ వలన గాని, కేవలం జ్ఞానం వలన గాని మోక్షము లభించదు. ఎందుచేతనంటే, రెండునూ కావలెను. పండితులు కర్మజ్ఞానములు రెండునూ మోక్ష సాధనములుగా పేర్కొనెదరు.

కేవలం కర్మ వలనగాని, కేవలం జ్ఞానం వలనగాని జీవునికి మోక్షం లభించదు.

సర్గ - 1, శ్లోకమ్ - 10.1

అస్మిన్నర్థే పురావృత్తమితిహాసం వదామి తే ।

అస్మిన్ అర్థే పురా వృత్తమ్ ఇతిహాసం వదామి తే ।

అస్మిన్ అర్థే పురా వృత్తమ్ ఇతిహాసం తే వదామి.

దీని గురించి ఒక పురాతనమైన ఇతిహాస వృత్తాంతమును నీకు చెప్పెదను.

ఈ విషయంలో నీ సందేహాలన్నీ తొలగటానికి నీకొక కథన విశేషం చెపుతాను విను.


🌹 🌹 🌹



[1.01.2] కారుణ్యుడు మరియు అగ్నివేశ్యుని సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
సర్గ - 1, శ్లోకమ్ - 10.2

కారుణ్యాఖ్యః పురా కశ్చిద్ బ్రాహ్మణోఽధీతవేదకః ॥

కారుణ్య ఆఖ్యః పురా కశ్చిద్ బ్రాహ్మణో అధీతవేదకః ॥

పురా కారుణ్య ఆఖ్యః కశ్చిద్ బ్రాహ్మణః అధీత వేదకః.


'అగ్నివేశ్యుడు' అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు 'కారుణ్యుడు’ అనే యువకుడు.

సర్గ - 1, శ్లోకమ్ - 11

అగ్నివేశ్యస్య పుత్రోఽభూత్ వేదవేదాంగపారగః ।
గురోరధీతవిద్యః సన్నాజగామ గృహం ప్రతి ॥

అగ్నివేశ్యస్య పుత్రో అభూత్ వేదవేదాంగపారగః ।
గురోః అధీత విద్యః సన్ అజగామ గృహం ప్రతి ॥

ఈ ఈ సందర్భమున నీకొక పురాతనేతిహాసమును వచించుచున్నాను. పూర్వకాలమున అగ్నివేశ్యముని
పుత్రుడగు కారుణ్యుడను నాతడు ఉండెను. అతడు వేదవేదాంగములను బఠించెను. శాస్త్రముల నన్నిటిని
అభ్యసించెను. గురుకులమున అధ్యయనమును ముగించి గృహమునకు మరలివచ్చెను.
అగ్నివేశ్యస్య పుత్రః వేదవేదాంగపారగః అభూత్. గురోః అధీత విద్యః సన్, గృహం ప్రతి అజగామ.

అగ్నివేశ్యుని పుత్రుడు (కారుణ్యుడు) వేదవేదాంగములను అధ్యయనం చేసెను. గురువు వద్ద విద్యాభ్యాసము చేసి తిరిగి ఇంటికి వచ్చెను.

గురుకులంలో వేద వేదాంగాలు చదివి ఆ తరువాత గురుకులవాసం నుండి ఇల్లు చేరాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 12

తత్‌స్థావకర్మకృత్తూష్ణీం సంశయానో గృహే తదా ।
అగ్నివేశ్యో విలోక్యాథ పుత్రం కర్మ వివర్జితమ్ ॥

తత్ స్థావకర్మకృత్ తూష్ణీం సంశయానో గృహే తదా ।
అగ్నివేశ్యో విలోక్య అథ పుత్రం కర్మ వివర్జితమ్ ॥

తత్ స్థావకర్మకృత్ గృహే తదా తూష్ణీం సంశయానః. అథ అగ్నివేశ్యః పుత్రం కర్మ వివర్జితమ్ విలోక్య...

అప్పటివరకు స్థిరంగా కర్మలు చేయుచున్నవాడు కర్మలు వదలి గృహమునందే ఊరకనే ఉంటూ సంశయమానుడై ఉండెను.

అప్పుడు అగ్నివేశ్యుడు కర్మవివర్జితుడైన తన పుత్రుని చూసి...

ఇంటికి వచ్చిన తరువాత వంశపారంపర్యంగా వచ్చే అగ్నికార్యములు, సంధ్యా వందనము చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. అగ్నివేశ్యుడు అది గమనించాడు.

ఒక రోజు, కుమారుడిని దగ్గరకు పిలిచి...

సర్గ - 1, శ్లోకమ్ - 13

ప్రాహ ఏతద్వచోఽనిన్ద్యం గురుః పుత్రం హితాయ చ ।

ప్రాహ ఏతత్ వచో అనింద్యం గురుః పుత్రం హితాయ చ ।

అగ్నివేశ్య ఉవాచ :-

కిమేతత్ పుత్ర! కురుషే పాలనం న స్వకర్మణః ॥

కిం ఏతత్ పుత్ర! కురుషే పాలనం న స్వకర్మణః?

అప్పుడాయన కర్మకాండయెడల సంశయము గలిగి, కర్మలను దృజించి, తూప్లీంభావమును వహించి
యూరకుండెను. అప్పుడు అగ్నివేశ్యుడు కర్మవివర్జితుండగు పుత్రుని గాంచి వాని మంచికొఱకు ఇట్లు పల్కెను.

అగ్నివేశ్యుడు :- పుత్రా! ఇదేమి? నీవు స్వధర్మము (కర్మలను) బాలించుటలేదేమి?
గురుః పుత్రం హితాయ చ ఏతత్ వచః ప్రాహ - పుత్ర! ఏతత్ అనింద్యం స్వకర్మణః పాలనం కిం న కురుషే?

గురుతుల్యుడైన అగ్నివేశ్యుడు తన పుత్రుడైన కారుణ్యుని హితము కోరి ఈ వచనములు చెప్పెను.

అగ్నివేశ్యుడు :-

"పుత్రా! ఏ నిందతో కూడని స్వకర్మ ఆచరణ నీవు ఎందుకు చేయుటలేదు?".

"కుమారా! కర్మానుష్ఠానం త్యజించినట్లున్నావు."

సర్గ - 1, శ్లోకమ్ - 14

అకర్మనిరతః సిద్ధిం కథం ప్రాప్స్యసి తద్వద ।
కర్మణోఽస్మాన్నివృత్తేః కిం కారణం తన్నివేద్యతామ్ ॥


నీవు కర్మవివర్జితుడవై సిద్ధి నెట్లు పొందెదవో నాకు తెలియజెప్పుము. మఱియు కర్మల నెందులకు ద్యజించితివో నుడువుము.



"కర్మలను త్యజించి సిద్ధి ఎలా పొందాలనుకుంటున్నావు?” అని అగ్నివేశ్యుడు అనునయంగా ప్రశ్నించాడు.

కారుణ్య ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 15

యావజ్జీవ మగ్నిహోత్రం నిత్యం సంధ్యా ముపాసయేత్ ।
ప్రవృత్తిరూపో ధర్మోఽయం శ్రుత్యా స్మృత్యా చ చోదితః ॥

కారుణ్యుడు :- 'మరణ పర్యంతము అగ్నిహోత్రము నొనర్చునది, నిత్యము సంధ్యావందన మాచరించునది' - ఈ రూపములగు శ్రుతి స్మృతి వాక్యములన్నియు బ్రవృత్తి ధర్మమునకు జెందినవి.



అప్పుడా కారుణ్యుడు,

"తండ్రీ! మరి నన్నేంచేయమంటారు చెప్పండి? వేదములలోని కొన్ని భాగములు "కర్మానుష్ఠానం చేయవలసిందే” అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి."

సర్గ - 1, శ్లోకమ్ - 16

న ధనేన భవేన్మోక్షః కర్మణా ప్రజయా న వా ।
త్యాగమాత్రేణ కిం త్వేకే యతయోఽశ్నంతి చామృతమ్ ॥

ధనమువలన, కర్మలవలన, సంతానోత్పాదనమువలన మోక్షము లభింపదు. త్యాగము అనగా సర్వకర్మ సంన్యాసమువలననే అమృతత్వమును బొందిరి. (ఇట్టి వాక్యము లన్నియు నివృత్తి పరములు.)



"ఇక మరికొన్ని విభాగములలో, 'కర్మ, ధనము, సంతానము మొదలైనవి మోక్షం ఇవ్వలేవు. సర్వత్యాగమొక్కటే ఉపాయం [త్యాగేన తు కైవల్యమ్] అని నివృత్తి మార్గాన్ని చూపుచున్నాయి."

సర్గ - 1, శ్లోకమ్ - 17

ఇతి శ్రుత్యోర్ద్వయోర్మధ్యే కిం కర్తవ్యం మయా గురో ।
ఇతి సందిగ్ధతాం గత్వా తుష్ణీం భూతోఽస్మి కర్మణి ॥

తండ్రీ! ఈ రెంటిలో నెద్దాని ననుసరింప నగును? అను సందియము కలిగి, సందిగ్ధ చిత్తుడనై కర్మలను దృజించితిని.



"కర్మ చెయ్యాలా? మానాలా? ఏమీ తోచక ఇట్లు మౌనం వహించి ఉన్నాను.”

అగస్తిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 18

ఇత్యుక్త్వా తాత! విప్రోఽసౌ కారుణ్యో మౌనమాగతః ।
తథా విధం సుతం దృష్ట్వా పునః ప్రాహ గురుః సుతమ్ ॥

అగస్తి :- కారుణ్యుడు తండ్రి కిట్లు వచించి యూరకుండెను. అప్పుడు మౌనమును వహించిన పుత్రునితో అగ్నివేశ్యు డిట్లు పల్కెను.



అని పలికి కారుణ్యుడు ఊరకున్నాడు.
అప్పుడు అగ్నివేశ్యుడు పకాపకా నవ్వి ఇలా చెప్ప ప్రారంభించాడు.

అగ్నివేశ్య ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 19

శృణు పుత్ర! కథామేకాం తదర్థం హృదయేఽఖిలమ్ ।
మత్తోఽవధార్య పుత్ర! త్వం యథేచ్ఛసి తథా కురు ॥

అగ్నివేశ్యుడు :- పుత్రా! నీకొక కథను జెప్పెదను; వినుము. విని, దానిని బాగుగా విచారించి చూచి నీకు నచ్చినట్లొనర్పుము.



ఓహో! అదా సంగతీ! సరే. నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను. అంతా విన్న తరువాత నీకు ఎట్లా తోస్తే అట్లాగే చెయ్యి...


🌹 🌹 🌹



[1.01.3] అప్సరస సురుచి మరియు దేవదూత సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
సర్గ - 1, శ్లోకమ్ - 20

సురుచిర్నామ కాచిత్ స్త్రీ అప్సరోగణ ఉత్తమా ।
ఉపవిష్టా హిమవతః శిఖరే శిఖిసంవృతే ॥



‘సురుచి' అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వతశిఖరంపై ప్రశాంతముగా కూర్చుని ఉండి, ఆకాశం వైపు చూచింది.

సర్గ - 1, శ్లోకమ్ - 21

రమంతే కామసంతప్తాః కిన్నర్యో యత్ర కిన్నరైః ।
స్వర్ధున్యోఘేన సంసృష్టే మహాఘౌఘ వినాశినా ॥




సర్గ - 1, శ్లోకమ్ - 22

దూతమింద్రస్య గచ్ఛంత మంతరిక్షే దదర్శ సా ।
తమువాచ మహాభాగా సురుచిశ్చాప్సరోవరా ॥

పూర్వము, కామతప్తలగు కిన్నరకిన్నరీ సమూహములు విహారములను సల్పునదియు, మయూరీ మయూరములు ప్రమోదక్రీడల నొనర్చు నదియు, పాపనాశిని యగు గంగానది ప్రవహించు నదియునగు హిమవత్పర్వత శిఖరమున సురుచి యను అప్సరస కూర్చొని యుండెను. ఆమె, ఆకాశమున నరుగుచున్న ఇంద్రదూతను గాంచి ఇట్లనెను.



ఒక దేవదూత కనిపించాడు.

సురుచి ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 23

దేవదూత! మహాభాగ! కుత ఆగమ్యతే త్వయా ।
అధునా కుత్ర గంతాఽసి తత్సర్వం కృపయా వద ॥

సురుచి :- దేవదూతా! ప్రకాశస్వరూపా! నీ వెటనుండి అరుదెంచుచున్నావు? ఇప్పుడెట కరుగుచున్నావు? దయయుంచి నాకు జెప్పుము.



అప్పుడామె “ఓ దేవదూతా! మీ ముఖం ఏవో నూతన కాంతులతో వెలుగుచున్నది. ఏదైనా విశేషమా?” అని ప్రశ్నించింది.

దేవదూత ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 24

సాధు! పృష్టం త్వయా సుభ్రు! యథావత్ కథయామి తే ।
అరిష్టనేమీ రాజర్షిర్దత్వా రాజ్యం సుతాయ వై ॥



అప్పుడా దేవదూత ఇట్లు చెప్పసాగాడు...
"ఔను! విశేషమే. ఇప్పుడే ఒక పరమాద్భుతమైన సంభాషణ విని వస్తున్నాను. అది తలచుకొంటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది. అదేమిటో నీకు చెపుతాను విను."

దేవదూత వాక్యాలు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది ...

సర్గ - 1, శ్లోకమ్ - 25

వీతరాగః స ధర్మాత్మా నిర్యయౌ తపసే వనమ్ ।
తపశ్చరత్యసౌ రాజా పర్వతే గంధమాదనే ॥

దేవదూత :- సురుచీ! యుక్తప్రశ్న నొనరించితివి. నా వృత్తాంతమును వచించుచున్నాను. అరిష్టనేమి యను రాజర్షి వైరాగ్యమును దాల్చి, పుత్రునకు రాజ్యభారము నొసగి, తపస్సు నొనరించుటకుగాను అరణ్యమునకరిగెను. ఇప్పుడాయన గంధమాదన పర్వతమున తపము నాచరించుచున్నాడు.



దేవదూత :
గంధమాదన పర్వతంపై 'అరిష్టనేమి' అనే ఒక చక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉండేవాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 26

కార్యం కృత్వా మయా తత్ర తత ఆగమ్యతేఽధునా ।
గంతాఽస్మి పార్శ్వే శక్రస్య తం వృత్తాంతం నివేదితుమ్ ॥

(నేనింద్రుని ఆజ్ఞ ననుసరించి అట కరిగితిని.) అట నా కార్యమును నిర్వర్తించి, ఇంద్రుని కచ్చటి వృత్తాంతమును నివేదించుటకుగాను మరల నరుగుచున్నాను.




అప్సరా ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 27

వృత్తాంతః కోఽభవత్తత్ర కథయస్వ మమ ప్రభో ।
ప్రష్టుకామా వినీతాఽస్మి నోద్వేగం కుర్తుమర్హసి ॥

అప్సరస :- ప్రభూ! అచ్చటి వృత్తాంత మేమి? నేను వినగోరుచున్నాను. వినయముతో బ్రశ్నించుచున్నాను. వచింపుడు; నన్ను చుల్కన చేయవద్దు.




దేవదూత ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 28

శృణు భద్రే! యథావృత్తం విస్తరేణ వదామి తే ।
తస్మిన్ రాజ్ఞి వనే తత్ర తపశ్చరతి దుస్తరమ్ ॥

దేవదూత :- అచ్చటి వృత్తాంతమును వివరముగ వచించుచున్నాను, వినుము. అరిష్టనేమి గంధమాదన పర్వతారణ్యమున కఠోరమగు తపస్సు నాచరించుచున్నాడు.




సర్గ - 1, శ్లోకమ్ - 29

ఇత్యహం దేవరాజేన సుభ్రూరాజ్ఞాపితస్తదా ।
దూత! త్వం తత్ర గచ్ఛాశు గృహీత్వేదం విమానకమ్ ॥




సర్గ - 1, శ్లోకమ్ - 30

అప్సరోగణసంయుక్తం నానావాదిత్ర శోభితమ్ ।
గంధర్వసిద్ధయక్షైశ్చ కిన్నరాద్యైశ్చ శోభితమ్ ॥




సర్గ - 1, శ్లోకమ్ - 31

తాళవేణుమృదంగాది పర్వతే గంధమాదనే ।
నానావృక్షసమాకీర్ణే గత్వా తస్మిన్ గిరౌ శుభే ॥




సర్గ - 1, శ్లోకమ్ - 32

అరిష్టనేమిం రాజానం దూతారోప్య విమానకే ।
ఆనయ స్వర్గభోగాయ నగరీమమరావతీమ్ ॥

'నీవచ్చటికి శీఘ్రముగా అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, యక్షులతో గూడి నదియు; వేణువు, వీణ, మృదంగము ఇత్యాదులగు మధుర వాద్యములతో శోభిల్లు నదియు నగు ఈ విమానము దీసికొని, గంధమాదన పర్వతమున సాల, తాళ, తమాల హింతాలాది వృక్షములతో నిండియున్న ఆ పవిత్రశృంగమున కఱిగి, అరిష్టనేమి నిందెక్కించుకొని రమ్ము. ఆయన ఇట కరుదెంచి స్వర్గభోగముల ననుభవించును' అని ఇంద్రుడాజ్ఞాపించెను.



మన ప్రభువు ఇంద్ర భగవానుడు ఆతని తపస్సుకు మెచ్చి అతనిని స్వర్గమునకు తీసుకురావలసినదిగా నన్ను నియమించారు.

సర్గ - 1, శ్లోకమ్ - 33

ఇత్యాజ్ఞాం ప్రాప్య శక్రస్య గృహీత్వా తద్విమానకమ్ ।
సర్వోపస్కరసంయుక్తం తస్మిన్నద్రావహం యయౌ ॥

నేనిట్లింద్రునిచే నాజ్ఞాపితుడనై పలువిధములగు భోగవస్తువులతో నలంకరింపబడిన ఆ విమానమును గైకొని గంధమాదన పర్వతమున కేగితిని.




సర్గ - 1, శ్లోకమ్ - 34

ఆగత్య పర్వతే తస్మిన్ రాజ్ఞో గత్వా క్రమం మయా ।
నివేదితా మహేంద్రస్య సర్వజ్ఞాఽరిష్టనేమయే ॥

ఏగి, రాజర్షి యగు అరిష్టనేమి ఆశ్రమమును బ్రవేశించి, ఆయన కింద్రుని ఆజ్ఞ నంతటిని నివేదించితిని.



నేను ఆ రాజు వద్దకు పోయి స్వర్గ లోకమునకు ఆహ్వానించాను.

సర్గ - 1, శ్లోకమ్ - 35.1

ఇతి మద్వచనం శ్రుత్వా సంశయానోఽవదచ్ఛుభే ।

నాపల్కులను విని, అరిష్టనేమి సంశయచిత్తుడై ఇట్లు పల్కెను.





🌹 🌹 🌹



[1.01.4] దేవదూత మరియు అరిష్టనేమి సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
అరిష్టనేమి రాజా ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 35.2

ప్రష్టుమిచ్ఛామి దూత! త్వాం తన్మే త్వం వక్తుమర్హసి ॥



అప్పుడా రాజు "అయ్యా! నా ఈ నమస్కారం స్వీకరించండి. నాదొక చిన్న సందేహం."

సర్గ - 1, శ్లోకమ్ - 36

గుణా దోషాశ్చ కే తత్ర స్వర్గే వద మమాగ్రతః ।
జ్ఞాత్వా స్థితిం తు తత్రత్యాం కరిష్యేఽహం యథారుచి ॥

అరిష్టనేమి: ఓ ఇంద్రుడా! నిన్నొక్క విషయము అడిగి తెలిసికొనగోరెదను. నీవు చెప్పగలవు. స్వర్గమునందలి గుణదోషములను వర్ణించి చెప్పుము. అచ్చటి పరిస్థితులను దెలిసికొనిన పిమ్మట నాకు నచ్చినట్లొనర్తును.



"దేవలోకంలో నాకు అవధులు లేని ఆనందం లభిస్తుందా? లేక అక్కడ కూడా మా భూలోకంలో లాగానే గుణదోషాలు ఉంటాయా?” అని అడిగెను.

దేవదూత ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 37

స్వర్గే పుణ్యస్య సామగ్ర్యా భుజ్యతే పరమం సుఖమ్ ।
ఉత్తమేన తు పుణ్యేన ప్రాప్నోతి స్వర్గముత్తమమ్ ॥



అతని ఉత్తమ జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి దేవదూతనగు నేను,

 "ఓ రాజా! జీవులు తమ పుణ్యకర్మానుభవం కొరకు స్వర్గం చేరుతూ ఉంటారు. అయితే, జీవులు చేసే పుణ్య కార్యములలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ బేధములు ఉంటాయి కదా!"

సర్గ - 1, శ్లోకమ్ - 38

మధ్యమేన తథా మధ్యః స్వర్గో భవతి నాన్యథా ।
కనిష్ఠేన తు పుణ్యేన స్వర్గో భవతి తాదృశః ॥

దూత :- పుణ్య మెక్కుడుగా నున్నచో, స్వర్గమున పరమసుఖము ననుభవింప వచ్చును. పుణ్యముయొక్క తారతమ్యము ననుసరించి ఉత్తమ, మధ్యమ, అధమ భేదముల నొప్పు స్వర్గములు లభించును.




సర్గ - 1, శ్లోకమ్ - 39

పరోత్కర్షాసహిష్ణుత్వం స్పర్థా చైవ సమైశ్చ తైః ।
కనిష్ఠేషు చ సంతోషో యావత్ పుణ్యక్షయో భవేత్ ॥

పుణ్యక్షయ మగు దనుక భోగముల ననుభవించుచు స్వర్గమున తమకంటే నెక్కుడు భోగములననుభవించు వారియెడల నసూయ, తోటివారిని గాంచిన స్పర్ధ, తక్కువవారిని గాంచిన సంతోషము కలుగును. క్షీణే పుణ్యే విశంత్యేతం మర్త్యలోకం చ మానవాః ।



"స్వర్గలోకవాసులలో మీ లోకంలో లాగానే అధికులైనవారు, అల్పులైనవారు ఉంటారు. ఫలితంగా దేవతా జీవులు కూడా ద్వేషాలు, అసూయలు, దురహంకారములు, స్పర్థలు, గర్వములు, గర్వభంగములు, కలహములు పొందుతూ ఉంటారు."

సర్గ - 1, శ్లోకమ్ - 40

క్షీణే పుణ్యే విశంత్యేతం మర్త్యలోకం చ మానవాః ।
ఇత్యాది గుణదోషాశ్చ స్వర్గే రాజన్నవస్థితాః ॥

పుణ్యక్షయ మైనతోడనే మరల మర్త్యలోకమున కరుగుచున్నారు. ఇట్టి గుణదోషములు స్వర్గముననున్నవి.



"అంతేకాదు. పుణ్యమంతా వ్యయమైన తరువాత ఆ జీవులు భూలోకం రావలసిందే కదా! అప్పుడు అమితదుఃఖం పొందుతూ ఉంటారు."

"ఓ ఉత్తమ పుణ్యశీలుడా! ఇక మనం బయలుదేరుదామా?" అన్నాను.

సర్గ - 1, శ్లోకమ్ - 41

ఇతి శ్రుత్వా వచో భద్రే! స రాజా ప్రత్యభాషత ।

అరిష్టనేమి రాజా ఉవాచ :-

నేచ్ఛామి దేవదూతాహం స్వర్గమీదృగ్విధం ఫలమ్ ॥

ఈ పల్కులను విని రాజిట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

రాజు :- ఓ దేవదూతా! నేనిట్టి ఫలములతో గూడిన స్వర్గమును గోరను.



అప్పుడా రాజు , "క్లుప్తంగా ఉన్న విషయమంతా సుస్పష్టపరచినందుకు కృతజ్ఞుణ్ణి. ఓ దేవదూతా! ఒక విధంగా ఈ భూలోకము వంటిదే అయి ఉన్న, ద్వైతముతో కూడిన ఆ స్వర్గలోకం నేను కోరుకోవటం లేదు. నాకు నిర్వాణరూపమగు మోక్షమే కావాలి."

సర్గ - 1, శ్లోకమ్ - 42

అతఃపరం మహోగ్రం తు తపః కృత్వా కలవరమ్ ।
త్యక్షామ్యహమశుద్ధం హి జీర్ణాం త్వచ మివోరగాః ॥

నేనిక కఠోరతపము నొనరించి, పాము కుబుసమును వీడునట్లు అపవిత్ర మగు ఈ శరీరమును విసర్జింతును.



"అందుకొరకై ఇంకా ఇంకా తపస్సు చేస్తాను. ప్రకృతి సిద్ధమగు ఈ దేహం నేలకూలినా ఫరవాలేదు. నేను అందుకు సిద్ధమే" అని చెప్పి మౌనం వహించాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 43

దేవదూత! విమానం చ గృహీత్వా త్వం యథాఽఽగతః ।
తథా గచ్ఛ మహేంద్రస్య సన్నిధౌ త్వం నమోఽస్తు తే ॥

ఓ దేవదూతా! నీ వీ విమానమును దీసికొని ఇంద్రునికడకు వచ్చిన త్రోవనే మరలి వెళ్లుము. నీకు నమస్కారము.





🌹 🌹 🌹



[1.01.5] దేవదూత మరియు ఇంద్ర దేవుని సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
దేవదూత ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 44

ఇత్యుక్తోఽహం గతో భద్రే! శక్రస్యాగ్రే నివేదితుమ్ ।
యథా వృత్తం నివేద్యాథ మహదాశ్చర్యతాం గతః ॥

దేవదూత :- రాజిట్లు పల్క, నీ వాక్యముల ఇంద్రుని కడకేగి విన్నవించితిని. ఇంద్రుడు మిక్కిలి అచ్చెరు వందెను.



దేవదూత అప్సరసతో, "ఓ భద్రమైన సురుచి! ఇక చేసేది లేక నేను వెనుకకు మరలాను. ఇంద్రదేవుని సమీపించి విషయమంతా విన్నవించాను. ఆయన ఆనందాశ్చర్యాలు పొంది ఇలా ఆజ్ఞాపించారు."

సర్గ - 1, శ్లోకమ్ - 45

పునః ప్రాహ మహేంద్రో మాం శ్లక్ష్ణం మధురయా గిరా ।

ఇంద్ర ఉవాచ :-

దూత! గచ్ఛ పునస్తత్ర తం రాజానం నయాశ్రమమ్ ॥



ఇంద్రుడు మరల మధురముగ, కోమలముగ నాతో నిట్లనియెను.

సర్గ - 1, శ్లోకమ్ - 46

వాల్మీకేః జ్ఞాతతత్త్వస్య స్వబోధార్థం విరాగిణమ్ ।
సందేశం మమ వాల్మీకేర్మహర్షేస్త్వం నివేదయ ॥

ఇంద్రుడు :- దూతా! మరల నీవచ్చటి కరుగుము. వైరాగ్యసంపన్ను డగు అరిష్టనేమిని తత్వజ్ఞుడగు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు తత్త్వజ్ఞానార్థము దీసికొని వెళ్లుము. మఱియు నా సందేశమును వాల్మీకి కిట్లు తెలుపునది.



"ఓ దేవదూతా! అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు ఆనందం కలుగచేస్తోంది. అయితే అతడు కోరుకొనే 'మోక్షస్థితి' ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది. అతడు తన తపస్సుచే ఉత్తమ విరాగి అయినాడు."

సర్గ - 1, శ్లోకమ్ - 47

మహర్షే! త్వం వినీతాయ రాజ్ఞేఽస్మై వీతరాగిణే ।
న స్వర్గ మిచ్ఛతే తత్త్వం ప్రబోధయ మహామునే ॥

"మహర్షీ! విరాగియు, వినయియు, స్వర్గభోగ విరతుడును అగు ఈ రాజునకు తత్వజ్ఞానముపదేశింపుడు."



"స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు. అందుచేత, ఉత్తమోత్తమైన ఆత్మ విచారణ వినటానికి అతడు తగి ఉన్నాడు. కనుక, నీవు అతనిని వాల్మీకి ఆశ్రమం చేర్చు. మహత్తరమగు దేవదూత దర్శనం అతని పట్ల వృథా కాకూడదు కదా!"

సర్గ - 1, శ్లోకమ్ - 48

తేన సంసార దుఃఖార్తో మోక్ష మేష్యతి చ క్రమాత్ ।

దేవదూత ఉవాచ :-

ఇత్యుక్త్యా దేవరాజేన ప్రేషితోఽహం తదన్తికే ॥

"దానివలన, సంసార దుఃఖార్తుడగు ఈ రాజు క్రమముగా ముక్తి నందగలడు."

ఇంద్రునివలన నిట్లాజ్ఞాపింపబడి మరల నచ్చటికి (అరిష్టనేమి ఆశ్రమమునకు) పంపబడితిని.




సర్గ - 1, శ్లోకమ్ - 49

మయాఽఽగత్య పునస్తత్ర రాజా వల్మీకజన్మనే ।
నివేదితో మహేంద్రస్య రాజ్ఞా మోక్షస్య సాధనమ్ ॥

రాజును వెంటనిడుకొని వాల్మీకి ఆశ్రమమున కఱిగితిని. అఱిగి, వాల్మీకికి మహేంద్రుని ఆజ్ఞయు, రాజుయొక్క మోక్షయత్నమును నివేదించితిని.



ఆయన సూచించినట్లే నేను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చాను.

మోక్ష సాధనలో...

1) తపో, ధ్యాన, నిష్కామ కర్మల వంటి ప్రయత్నములు,
2) సత్యాసత్యముల విచారణ
- రెండూ ఆవశ్యకాలే!

భౌతిక సుఖరూపములగు స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుని చేరకుండానే చేస్తాయి.
ఆత్మజ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు.
ముముక్షువైనవాడు ఆత్మానుభవం గల మహనీయులను సమీపించాలి. వారి వాక్యములను వినటం, మననం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది.


🌹 🌹 🌹



[1.02] ఉపదేశ ప్రారంభం


[1.02.1] అరిష్టనేమి మరియు వాల్మీకి మహర్షి సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
దేవదూత ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 50

తతో వల్మీకజన్మాసౌ రాజానం సమపృచ్ఛత ।
అనామయ మతిప్రీత్యా కుశలప్రశ్న వార్తయా ॥

వాల్మీకి అతిప్రేమతో రాజును దేశము, కోశము, (ధనాగారము) పుత్రులు, తపస్సు మున్నగు వానిని గుఱించిన కుశలము నడిగెను.



అరిష్టనేమి రాజు వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడి ప్రదేశమంతా పవిత్రతో, ప్రశాంతతతో ఆనందమయమై ఉన్నది. మునికుమారులు మధురంగా సామగానం చేస్తున్నారు. మరికొందరు రామావతార కథ ఆనందంగా చెప్పుకొంటున్నారు. చల్లగా వీచే పిల్లగాలులు జీవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తు చేయుచున్నట్లున్నాయి. విశాల వృక్షములు మధుర శబ్దములు వినిపింపచేస్తున్నాయి.

ఒక ఎత్తైన స్థానంలో మహర్షి వాల్మీకి ఆసీనులై ఉన్నారు. బ్రహ్మానందం ఆయన ముఖంలో మూర్తీభవించి ఉన్నది. రాజు ఆయనను సమీపించి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. మహర్షి రాజును ప్రేమగా పలుకరించి సుఖాసీనుణ్ణి చేశారు.

అరిష్టనేమి రాజా ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 51

భగవన్! ధర్మతత్త్వజ్ఞ! జ్ఞాతృజ్ఞేయవిదాం వర!
కృతార్థోఽహం భవద్దృష్ట్యా తదేవ కుశలం మమ ॥

అరిష్టనేమి రాజు :- భగవానుడా! తాము ధర్మతత్వజ్ఞులు, జ్ఞానసంపన్నులు, లోకవ్యవహారజ్ఞులు. (ఇట్టి) మీ దర్శనమువలనను, మీ కృపాదృష్టివలనను కృతార్థుడ నైతిని, ఇదియే నా కుశలము.



అరిష్టనేమి రాజు అవనత శిరస్కుడై ఇట్లు ప్రార్థించాడు.

"హే వాల్మీకి మహర్షీ! నేను సంసారబద్ధుడనై అనేక దుఃఖ పరంపరలను అనుభవిస్తున్నాను. నేటికి ఈ దేవదూత దయ వలన మీ దర్శనం లభించింది. ఎంతటి సుదినం! తండ్రీ! మీరు రామాయణం రచించి లోకమునకు మహోపకారం చేశారు."

సర్గ - 1, శ్లోకమ్ - 52

భగవన్! ప్రష్టు మిచ్ఛామి తదవిఘ్నేన మే వద ।
సంసారబంధదుఃఖార్తేః కథం ముంచామి తద్వద ॥

భగవానుడా! మిమ్ముల నొక్కవిషయ మడిగి తెలిసికొనగోరెదను. నిర్విఘ్నముగా వచింపుడు. సంసారబంధ బంధితుడనగు నేనెట్లు ముక్తుడ నగుదునో వచింపుడు.



"అయితే, నాదొక సందేహం. ఎట్టి విచారణచే రాముడు మొదలైనవారు దుర్భరమైన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటవేసారు? నాకా విషయం చెప్ప ప్రార్థిస్తున్నాను. మీ ప్రవచనముచే నన్ను పవిత్రుణ్ణి చెయ్యండి."

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 53

శృణు రాజన్! ప్రవక్ష్యామి రామాయణమఖండితమ్ ।
శ్రుత్వాఽవధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి ॥

వాల్మీకి :- రాజా! అఖండ రామాయణమును వచించుచున్నాను, వినుము. దీనిని విని, అవగత మొనర్చుకొనిన జీవన్ముక్తుడ వగుదువు.



వాల్మీకి మహర్షి ఇది విని ఒక్క క్షణం మౌనం వహించారు. తనను ఆశ్రయించ వచ్చిన శిష్యుని పూర్వాపరాలు సంపూర్ణంగా గ్రహించారు. "ఇతడు వివేక దృష్టితో నిత్యానిత్యములను పరిశీలించాలనుకొంటున్నాడు. కనుక, ఉత్తర రామాయణం (యోగవాసిష్ఠం) వినటానికి తగినవాడు. లోక కళ్యాణం కొరకు, జ్ఞానార్హులైన జనులపై నాకు గల అవ్యాజమైన ప్రేమచే వసిష్ఠ రామ సంవాద రూపమైన 'వాసిష్ఠ రామాయణం' ఇతనికి బోధించెదను గాక!” అని సంకల్పించారు.

ఒక్కసారి ఆత్మ వస్తువును ధ్యానం చేశారు. పిమ్మట ఇట్లు ప్రవచించ ప్రారంభించారు.

సర్గ - 1, శ్లోకమ్ - 54

వసిష్ఠరామసంవాదం మోక్షోపాయకథాం శుభామ్ ।
జ్ఞాతస్వభావో రాజేంద్ర! వదామి శ్రూయతాం బుధ ॥

జ్ఞాతస్వభావా! బుధా! వసిష్ఠరామ సంవాదమును, శుభదాయకమును, మోక్షోపాయమును నగుదానిని నీకు వచించుచున్నాను. వినుము.



ఓ రాజా! జీవునియొక్క అఖండత్వాన్ని ప్రతిపాదిస్తున్న 'మహారామాయణము' చెప్పుచున్నాను. ఇది శ్రద్ధగా, ప్రయత్నపూర్వకంగా విని అవగతం చేసుకొన్నావా - నీవు ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తత్వము పొందగలవు.


🌹 🌹 🌹



[1.03] శ్రీరామావతారం


Original Sloka YP Translation YHRK Liberal Translation
అరిష్టనేమి రాజా ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 55

కో రామః కీదృశః కస్య బద్ధో వా ముక్త ఏవ వా ।
ఏతన్మే నిశ్చితం బ్రూహి జ్ఞానం తత్త్వవిదాం వర ॥

అరిష్టనేమి రాజు :- తత్త్వజ్ఞా! రాము డెవడు? అత డెట్టివాడు? బద్ధుడా? ముక్తుడా? నా కిద్దాని దెలియజెప్పుడు.




వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 56

శాపవ్యాజవశాదేవ రాజవేషధరో హరిః ।
ఆహృతా జ్ఞానసంపన్నః కించిదజ్ఞోఽసౌ భవత్ప్రభుః ॥

వాల్మీకి :- (నీ ఇష్టదైవ మగు) నారాయణుడే, భక్తులిచ్చిన శాపవాక్యముల సఫల మొనర్ప రాజవేషమును ధరించి, జ్ఞానమును వీడి, అల్పజ్ఞునివలె ప్రకాశించెను.



వాల్మీకి మహర్షి అరిష్టనేమితో ఇట్లు చెప్పనారంభించెను.

ఓ అరిష్టనేమీ! నీ ఇష్ట దైవము ఆ నారాయణుడే భక్తుల శాపాలను పరిపూర్ణమొనర్చే నిమిత్తం ఒక రాజు వేషం ధరించి ఈ భూమిపై సంచరించినాడు.

రాజా ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 57

చిదానందస్వరూపే హి రామే చైతన్యవిగ్రహే ।
శాపస్య కారణం బ్రూహి కః శప్తా చేతి మే వద ॥

రాజు :- చిదానంద స్వరూపుడును, చైతన్య విగ్రహుడును నగు రామునకు శాప మేల గల్గినది? ఎవరు శపించిరి? వచింపుడు.



ఓ రాజా!

తన అఖండత్వము, అద్వితీయ చిదానంద స్వరూపమును ఏమరచినవానివలె అవతరించి లోకములను పావనం చేసాడు.

చైతన్య విగ్రహుడగు శ్రీమన్నారాయణునికి లీలా మాత్రంగా వేరువేరు సందర్భములలో ప్రాప్తించిన శాపముల గురించి మొదటగా చెపుతాను.

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 1, శ్లోకమ్ - 58

సనత్కుమారో నిష్కామో హ్యవసద్బ్రహ్మసద్మని ।
వైకుంఠాదాగతో విష్ణుస్త్రైలోక్యాధిపతిః ప్రభుః ॥



ఒకప్పుడు జగత్ప్రభువగు నారాయణుడు బ్రహ్మలోకం వచ్చాడు. బ్రహ్మదేవునితో సహా సర్వ బ్రహ్మలోకవాసులు ఆయనను పూజించారు.

సర్గ - 1, శ్లోకమ్ - 59

బ్రహ్మణా పూజితస్తత్ర సత్యలోకనివాసిభిః ।
వినా కుమారం తం దృష్ట్వా హ్యువాచ ప్రభురీశ్వరః ॥

వాల్మీకి: నిష్కాముడగు సనత్కుమారుడు బ్రహ్మలోకమున నుండెను. అప్పు డటకు వైకుంఠమునుండి జగత్ప్రభు డగు నారాయణు డరుదెంచెను. బ్రహ్మలోక నివాసులును, బ్రహ్మయు గోవిందుని బూజించిరి. కాని సనత్కుమారు డెట్టి సత్కారమును సలుపలేదు. అతనిని గాంచి మాధవుడిట్లనెను :-



బ్రహ్మమానసపుత్రుడగు సనత్కుమారుడు మాత్రం "నేను నిష్కాముడను కదా! ఈ చరాచర సృష్టిలో నాకు కావలసినదేమున్నది? ఆశ్రయించవలసినది ఏమున్నది?" అని తలచి మాధవుని పూజించనేలేదు. ఇది గమనించిన గోవిందుడు ఇట్లు అనెను.

సర్గ - 1, శ్లోకమ్ - 60

సనత్కుమార! స్తబ్ధోఽసి నిష్కామో గర్వచేష్టయా ।
అతస్త్వం భవ కామార్తః శరజన్మేతి నామతః ॥

సనత్కుమారుడా! నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు; నిష్కాముడ నను గర్వ మున్నది. అందువలన కుమారస్వామిపై జన్మించి కామపీడితుడవు కమ్ము!



"ఓయీ! మిత్రమా! సనత్కుమారా! నీవు నిష్కాముడవే కావచ్చు. కాని, యుక్తాయుక్తతలు మరువరాదు కదా! అందుచేత కుమారస్వామివై జన్మించి కామార్తుడవగుదువు గాక” అని శపించాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 61

తేనాపి శపితో విష్ణుః సర్వజ్ఞత్వం తవాస్తి యత్ ।
కించిత్ కాలం హి తత్త్యక్త్వా త్వమజ్ఞానీ భవిష్యసి ॥


విష్ణువుకూడ, సర్వజ్ఞత్వమును గోల్పోయి, అజ్ఞానియై, కొంతకాల ముండునట్లు, సనత్కుమారునివలన శపింపబడెను.



అందుకు ప్రతిగా, సనత్కుమారుడు  “నారాయణా! అట్లా అయితే నీవు నీ సర్వజ్ఞత్వమును కోల్పోయి కొంతకాలం అజ్ఞానివై భూమిపై సంచరించెదవు గాక" అని శపించాడు. మరి, ఆ వాక్యం నారాయణుడు సఫలం చేయాలి కదా!

సర్గ - 1, శ్లోకమ్ - 62

భృగుభార్యాం హతాం దృష్ట్యా హ్యువాచ క్రోధమూర్చితః ।
విష్ణో తవాపి భార్యాయా వియోగో హి భవిష్యతి ॥

భృగువు తనభార్య, కేశవునివలన జంపబడుట గాంచి, క్రోధపరవశుడై నీకు గూడ భార్యావియోగము గలుగుగాక యని శపించెను.

NOTE: ఖ్యాతి యను నా పె భృగుని పత్ని. ఈపె పురాకల్పమున విష్ణుని శరీరమున లీనము కావలెనని కోఱుకొనెను.
నారాయణు డాకోర్కెను సఫల మొనర్ప భృగువు, విష్ణువు తనభార్యను సంహరించినాడని భ్రమపడి ఇట్లు శపించెను. - అను.



ఇది ఇతఃపూర్వం ఒకానొక కల్పంలోని విషయం. ఆ కల్పంలో "ఖ్యాతి” అను ఆమె భృగువు యొక్క భార్య. ఆ ఖ్యాతి విష్ణుభక్తురాలు.  “సర్వాంతర్యామియగు విష్ణువునందు లీనమగుదును గాక" అని కోరుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధించింది. భక్త వత్సలుడగు విష్ణుమూర్తి తన భక్తురాలి కోరికను అట్లే సఫలం చేశారు. అప్పుడు భృగువు క్రోధపరవశుడై “ఓయీ విష్ణుమూర్తీ! భార్యావియోగం ఎంతటి బాధాకరమో నీకు తెలియాలి. నీకు కూడా నాలాగానే భార్యావియోగం కలుగు గాక” అని శపించాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 63

వృందయా శపితో విష్ణు శ్చలనం యత్త్వయా కృతమ్ ।
అతస్త్వం స్త్రీవియోగం తు వచనాన్మమ యాస్యసి ॥

బృంద, విష్ణువు తన్ను మోసగించెనని గ్రహించి, భార్యావియోగము కలుగునని శపించెను.

NOTE: 62. గోలోకమున ఒకప్పుడు రాధ అలిగి శాప మీయ, సుదాముడు దానవకులమున జలంధరుడై జన్మించెను;
బృంద ఈతని భార్య. ఈయమ సతీత్వము నాశనము గానిచో, జలంధరునకు మృతి లేదు. నారాయణుడు కపటరూపమున
బృందా పాతివ్రత్యమును భంగపరచెను. జలంధరుడు మృతి చెందెను. అందువలన, బృంద అలిగి శాపమిడెను. ఈ
కథ నెఱుంగగోరువారు బ్రహ్మవైవర్త, పద్మ పురాణములను జూచునది. - అను.



గోలోకంలో ఒకప్పుడు రాధ, సుధాముడిని చూచి ఏదో సందర్భంలో, “నీవు దానవకులంలో జన్మించెదవు గాక”! అని శపించింది. అతడు జలంధరుడై జన్మించాడు. అతని భార్య బృంద. లోకకంటకుడగు జలంధరుణ్ణి బృంద పాతివ్రత్యం కాపాడుతూ ఉండేది. దేవతలచే ప్రార్థింపబడి, నారాయణుడు లోకకళ్యాణం కొరకు కపటరూపం దాల్చి బృంద పాతివ్రత్యం భంగపరచారు. జలంధరుడు సంహరించబడ్డాడు. అప్పుడు విష్ణువు మోసం చేసినాడని తెలిసి “నీకు కూడా భార్యా వియోగం కలుగు గాక” అని శపించింది.

సర్గ - 1, శ్లోకమ్ - 64

భార్యా హి దేవదత్తస్య పయోష్ణీ తీరసంస్థితా ।
నృసింహవేషధృగ్విష్ణుం దృష్ట్యా పంచత్వ మాగతా ॥



మరొకప్పుడు విష్ణుమూర్తి భీకరాకారమగు నృసింహుడై నదీతీరంలో సంచరిస్తున్నాడు. అప్పుడు ‘దేవదత్తుడు’ అనువాని భార్య నృసింహస్వామిని చూచి భయంతో ప్రాణాలు వదలింది.

సర్గ - 1, శ్లోకమ్ - 65

తేన శప్తో హి నృహరిర్దుఃఖార్తః స్త్రీవియోగతః ।
తవాపి భార్యయా సార్ధం వియోగో హి భవిష్యసి ॥

దేవదత్తుని భార్య పయోష్ఠీనదీతీరమున నున్న నృసింహరూపి యగు విష్ణుని గాంచి, భయపడి ప్రాణములను దృజించెను. అప్పుడు, భార్యావియోగ దుఃఖితు డగు దేవదత్తుడు, దుర్లభదర్శనుడగు నారాయణుని, నీకుగూడ భార్యావియోగము కల్గుగాక యని శపించెను.



అప్పుడా దేవదత్తుడు “నీవు కూడా భార్యా వియోగం పొందెదవు గాక" అని శపించటం జరిగింది.

సర్గ - 1, శ్లోకమ్ - 66

భృగుణైవం కుమారేణ శపితో దేవశర్మణా ।
బృందయా శపితో విష్ణుస్తేన మానుష్యతాం గతః ॥

నారాయణు డిట్లు, సనత్కుమార, భృగు, బృందా, దేవదత్తులవలన శపింపబడి మనుష్య రూపమును డాల్చెను.



ఓ రాజా! పై కారణాల వలన విష్ణుమూర్తి రాముడై జన్మించాడు.

సర్గ - 1, శ్లోకమ్ - 67

ఏతత్తే కథితం సర్వం శాపవ్యాజస్య కారణమ్ ।
ఇదానీం వచ్మి తత్సర్వం సావధానమతిః శృణు ॥

నీ కీ నానావిధ శాపముల గురించి వచించితిని. ఇప్పుడు మోక్షసాధనమును సంపూర్ణముగా వచించెదను. సావధానుడవై వినుము.



నీ ప్రియముకొరకే వేరు వేరు పురాణములలోని సంఘటనలు వినిపించాను. ఇక మనం ఆత్మ విచారణలో ప్రవేశిస్తున్నాం. సావధాన చిత్తుడవై విను.



🌹 🌹 🌹



[1.04] వస్తుతత్త్వం (ఈ గ్రంథ లక్ష్యము)


[1.04.1] ఈ గ్రంథ అధ్యయనమునకు అర్హత నిర్ణయము

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 1

అహం బద్ధో విముక్తస్స్యామితి యస్యాస్తి నిశ్చయః ।
నాత్యంతమజ్ఞో నో తద్ జ్ఞః సోఽస్మిన్ శాస్త్రేఽధికారవాన్ ॥

వాల్మీకి :- నేను సంసారబద్ధుడను, ముక్తుడ నగుదును - ఇట్టి నిశ్చయము గలవాడే ఈ శాస్త్రమును బఠింప నర్హుడు. అతి అజ్ఞుడును, (దేహాత్మబుద్ధి గలవాడును), తత్వజ్ఞుడును (ముక్తుడును) ఈ శాస్త్రమును పఠింపదగదు.



ఈ ‘ఆత్మవిచారణ’ వినటానికి కేవలం అజ్ఞాని (“నేను ఈ దేహమును అను దేహాత్మ బుద్ధి కలవాడు”) తగినవాడు కాలేకపోతున్నాడు. కేవలం జ్ఞానికి ఇక చెప్పవలసినదేముంటుంది?

ఎవరైతే, “నేను బద్ధుణ్ణి, ఈ దృశ్యములోని అవాస్తవత్వం నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది. ఎట్లైనా సరే, ఆత్మజ్ఞానం పొంది ముక్తుడను కావాలి” అనే తీవ్రేచ్ఛ కలిగి ఉంటారో - అట్టి వారందరూ ఈ ‘బోధ’ వినటానికి తగినవారే !

సర్గ - 2, శ్లోకమ్ - 2

కథోపాయాన్ విచార్యాదౌ మోక్షోపాయానిమానథ ।
యో విచారయతి ప్రాజ్ఞో న స భూయోఽభిజాయతే ॥

మొదట కథారూప మగు సప్తకాండ రామాయణమును బఠించి, పిదప షట్పకరణాత్మక మగు ఈ మోక్షతత్త్వము నాలోచించువాడు మరల జన్మింపడు.


మొదట పూర్వ రామాయణం (ఏడు కాండలతో కూడిన శ్రీరాముని కథ) తెలుసుకొని ఉండటం జరిగితే అప్పుడు ఆ పాఠకుడు ప్రవృత్తి మార్గంలో చిత్తశుద్ధిని పొందుచున్నాడు. ఇలా శుద్ధినొందిన చిత్తము స్వయంగా అకృత్రిమంగా సులభంగా జ్ఞానం పొందటానికి అభిముఖమౌతోంది. అప్పుడు ఈ వసిష్ఠ - రామ సంవాద రూపమైన ఆరు ప్రకరణములతో కూడిన 'అఖండ రామాయణం' విచారిస్తే ద్విగుణీకృతమైన ప్రయోజనం సిద్ధించగలదు. ఇది నివృత్తి మార్గంలో తప్పక మోక్షం ప్రసాదించగలదు.


🌹 🌹 🌹



[1.04.2] బ్రహ్మదేవుడు, భరద్వాజుడు, వాల్మీకి మహర్షుల సంవాదము

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 3

అస్మిన్ రామాయణే రామకథోపాయాన్ మహాబలాన్ ।
ఏతాంస్తు ప్రథమం కృత్వా పురాఽహ మరిమర్దన ॥



పూర్వం దివ్యదృష్టితో శ్రీరాముని కథ దర్శించి 24,000 శ్లోకములతో రామాయణం వ్రాసాను.

సర్గ - 2, శ్లోకమ్ - 4

శిష్యాయాస్మి వినీతాయ భరద్వాజాయ ధీమతే ।
ఏకాగ్రో దత్తవాంస్తస్మై మణిమబ్ధిరివార్థినే ॥

నేను మొదట రామకథను విరచించి సముద్రుడు కోరినవారికి రత్నముల నిచ్చునట్లు బుద్ధిమంతుడును, వినయియు, శిష్యుడును నగు భరద్వాజున కొసంగితిని.



'భరద్వాజుడు' అను వాడు నా శిష్యుడు. మహామేధావి, బుద్ధిమంతుడు, ఏకసంధాగ్రాహి, వినయము కలవాడు కూడా! అతనికి రామకథ వినిపించాను.

సర్గ - 2, శ్లోకమ్ - 5

తత ఏతే కథోపాయా భరద్వాజేన ధీమతా ।
కస్మింశ్చిన్మేరుగహనే బ్రహ్మణోఽగ్ర ఉదాహృతాః ॥



ఒకసారి అతడు ఆ కథంతా మేరుపర్వతంపై భగవంతుడగు బ్రహ్మదేవునికి వినిపించాడు.

సర్గ - 2, శ్లోకమ్ - 6

అథాస్య తుష్టో భగవాన్ బ్రహ్మ లోకపితామహః ।

శ్రీ బ్రహ్మ ఉవాచ :-

వరం పుత్ర! గృహాణేతి తమువాచ మహాశయః ॥

పిమ్మట భరద్వాజుడు దానిని సుమేరు పర్వతారణ్యమున నున్న బ్రహ్మకు వినిపించెను. లోక పితామహుడగు బ్రహ్మదేవుడు సంతోషించి భరద్వాజుని వరము గోఱుకొను మనెను.



బ్రహ్మదేవుడు పరమానందం పొంది "కుమారా! చాలా బాగున్నదయ్యా! రామచంద్రుని కథ లోకమునకు కళ్యాణం కలుగజేస్తుంది. నాకు ఈ కథ వినిపించినందుకు ఏదైనా వరం కోరుకో” అని ఆశీర్వాద పూర్వకంగా పలికారు.

భారద్వాజ ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 7

భగవన్! భూతభవ్యేశ! వరోఽయం మేఽద్య రోచతే ।
యేనాయం జనతా దుఃఖాన్ముచ్యతే తదుదాహర ॥

భరద్వాజుడు :- భగవానుడా! భూతభవిష్యద్వేదీ! దేనివలన జనులు దుఃఖమునుండి విముక్తులగుదురో, దానిని వచింపుడు. ఇదియే నా ఇష్టవరము.



అప్పుడు భరద్వాజుడు "తండ్రీ! ఈ జనుల దుఃఖములకు అంతూపొంతూ ఉండుటలేదు. దేనివలన జనులు దుఃఖ విముక్తులౌతారో, దాని గురించి చెప్పండి” అని వేడుకున్నాడు.

శ్రీ బ్రహ్మ ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 8

గురుం వాల్మీకిమత్రాశు ప్రార్థయస్వ ప్రయత్నతః ।
తేనేదం యత్ సమారబ్ధం రామాయణ మనిందితమ్ ॥



అప్పుడు బ్రహ్మదేవుడు భరద్వాజుని, నా వద్దకు తోడ్కొనివచ్చి ఇట్లు ఆజ్ఞాపించారు :-
"నాయనా! వాల్మీకీ! ఇప్పుడు నీవు వ్రాయపూనుకొన్న అఖండ రామాయణం శ్రమ అనుకోకుండా పూర్తిచేయి. సప్తకాండలు మధురంగా వ్రాసావు. అయితే, రాముడు ఏ విచారణచే వసిష్ఠ మహర్షిచే బోధింపబడి పూర్ణుడు, ఆత్మస్వరూపుడు అయ్యాడో - ఆ విషయాన్ని నీ ప్రియశిష్యుడగు భరద్వాజునికి బోధించు."

సర్గ - 2, శ్లోకమ్ - 9

తస్మిన్ శ్రుతే నరో మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి ।
సేతునేవాంబుధేః పార మపారగుణశాలినా ॥

బ్రహ్మ :- నీవఱిగి వెంటనే ఈ విషయమును వాల్మీకి నడుగుము. అతడారంభించిన రామాయణమును వినినంతనే మనుజుడు సేతువువలన సముద్రమును దాటిపోవునట్లు మోహమును సంపూర్ణముగా తరింపగలడు.



"అట్టి విచారణ సహాయంతో జీవులు ఈ సంసారమును అతి లాఘవంగా దాటివేయుదురు గాక!” 
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 10

ఇత్యుక్త్వా స భరద్వాజం పరమేష్ఠీ మదాశ్రమమ్ ।
అభ్యాగచ్ఛత్ సమం తేన భరద్వాజేన భూతకృత్ ॥

వాల్మీకి :- ఇట్లు పలికి సృష్టికర్త యగు బ్రహ్మ భరద్వాజుని వెంటనిడుకొని నా యాశ్రమమున కఱుదెంచెను.




సర్గ - 2, శ్లోకమ్ - 11

తూర్ణం సంపూజితో దేవః సోఽర్ఘ్యపాద్యాదినా మయా ।
అవోచన్మాం మహాసత్త్వః సర్వభూతహితే రతః ॥

నేనాయనకు వెంటనే అర్ఘ్యపాద్యాదుల నొసగి పూజించితిని. సర్వభూత హితరతుడును సత్యమూర్తియును నగు బ్రహ్మ నాతో నిట్లనియె -




శ్రీ బ్రహ్మ ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 12

రామ స్వభావకథనాదస్మాద్వరమునే! త్వయా ।
నోద్వేగాత్ స పరిత్యాజ్య ఆసమాప్తేరనిందితాత్ ॥

'నీవారంభించిన ఆనందదాయక మగు రామచరిత్ర రచన ప్రయాసతో గూడినదని,' ముగింపక వదలివేయకుము.




సర్గ - 2, శ్లోకమ్ - 13

గ్రంథేనానేన లోకోఽయమస్మాత్ సంసారసంకటాత్ ।
సముత్తరిష్యతి క్షిప్రం పోతేనేవాశు సాగరాత్ ॥

'నావ నెక్కి సముద్రమును దాటిపోవునట్లు, ఈ రామాయణమువలన జనులు సంసార సముద్రము నరించగలరు.




సర్గ - 2, శ్లోకమ్ - 14

వక్తుం తదేవమేవార్థమహమాగతవానయమ్ ।
కురు లోకహితార్థం త్వం శాస్త్రమిత్యుక్తవానజః ॥

నేనీ విషయమును నీకెఱింగించుటకే ఇట కరుదెంచితిని. లోకహితార్థ మీ శాస్త్రమును రచింపుము.




సర్గ - 2, శ్లోకమ్ - 15

మమ పుణ్యాశ్రమాత్ తస్మాత్ క్షణాదంతర్ధిమాగతః ।
ముహూర్తాభ్యుత్థితః ప్రోచ్చ్రైస్తరంగ ఇవ వారిణః ॥

నా యీ పుణ్యాశ్రమమునుండి నిమేషమాత్రమై లేచిన జలతరంగములవలె నంతర్హితుండాయెను.



ఇలా ఆజ్ఞాపించి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యారు.

సర్గ - 2, శ్లోకమ్ - 16

తస్మిన్ ప్రయాతే భగవత్యహం విస్మయ మాగతః ।
పునస్తత్ర భరద్వాజమపృచ్ఛం స్వస్థయా ధియా ॥




సర్గ - 2, శ్లోకమ్ - 17

కిమేతద్ బ్రహ్మణా ప్రోక్తం భరద్వాజ! వదాశు మే ।
ఇత్యుక్తేన పునః ప్రోక్తం భరద్వాజేన తేన మే ॥

బ్రహ్మదేవు డంతర్హితుడైన పిమ్మట, నాకు గల్గిన విస్మయమునుండి తేఱుకొని, బ్రహ్మ యేమి వచించు నదియు తెల్ప భరద్వాజు నడిగితిని. అతడిట్లనియె.




భారద్వాజ ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 18

ఏతదుక్తం భగవతా యథా రామాయణం కురు ।
సర్వలోక హితార్థాయ సంసారార్ణవ తారకమ్ ॥

భరద్వాజుడు: జనులందరి హితము కొఱకు సంసార సముద్రమునుండి తరింపజేయు రామాయణ కథనమును పూర్తి నొనరింపుము అని బ్రహ్మ యాజ్ఞాపించినాడు.




సర్గ - 2, శ్లోకమ్ - 19

మహ్యం చ భగవన్! బ్రూహి కథం సంసారసంకటే ।
రామో వ్యవహృతో హ్యస్మిన్ భరతశ్చ మహామనాః ॥




సర్గ - 2, శ్లోకమ్ - 20

శత్రుఘ్నో లక్ష్మణశ్చాపి సీతా చాపి యశస్వినీ ।
రామానుయాయినస్తే వా మంత్రిపుత్రా మహాధియః ॥




సర్గ - 2, శ్లోకమ్ - 21

నిర్దుఃఖితాం యథైతే ను ప్రాప్తాస్తద్బ్రూహి మే స్ఫుటమ్ ।
తథైవాహం భవిష్యామి తతో జనతయా సహ ॥

భగవానుడా! సంసార సంకటమునంబడి శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులును, సీతాదేవియు, మంత్రిపుత్రులును ఎట్లు సంచరించిరి? దుఃఖము నేరీతిగ తప్పించుకొనిరి? నాకిద్దానిని వివరించి తెల్పుడు. దీనిని విని నేనును, ఇతరులును దుఃఖవిముక్తిని పొందెదము.




సర్గ - 2, శ్లోకమ్ - 22

భరద్వాజేన రాజేంద్ర! వదేత్యుక్తోఽస్మి సాదరమ్ ।
తదా కర్తుం విభో! రాజ్ఞామహం వక్తుం ప్రవృత్తవాన్ ॥

భరద్వాజుని వేడుకోలు గైకొని, బ్రహ్మదేవుని ఆజ్ఞ ననుసరించి చెప్ప మొదలిడితిని.




వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 2, శ్లోకమ్ - 23

శృణు వత్స! భరద్వాజ! యథా పృష్టం వదామి తే ।
శ్రుతేన యేన సమ్మోహమలం దూరే కరిష్యసి ॥

వత్సా! భరద్వాజా! నీవడిగిన దానిని జెప్పుచున్నాను వినుము. దీనిని వినిన మోహము దూరమైపోవును.




సర్గ - 2, శ్లోకమ్ - 24

తథా వ్యవహర ప్రాజ్ఞ! యథా వ్యవహృతః సుఖీ ।
సర్వసంసక్తయా బుద్ధ్యా రామో రాజీవలోచనః ॥




సర్గ - 2, శ్లోకమ్ - 25

లక్ష్మణో భరతశ్చైవ శత్రుఘ్నశ్చ మహామనాః ।
కౌసల్యా చ సుమిత్రా చ సీతా దశరథస్తథా ॥




సర్గ - 2, శ్లోకమ్ - 26

కృతాస్త్రశ్చావిరోధశ్చ బోధపార ముపాగతాః ।
వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణోఽష్టౌ తథేతరే ॥




సర్గ - 2, శ్లోకమ్ - 27

ధృష్టిర్జయంతో భాసశ్చ సత్యో విజయ ఏవ చ ।
విభీషణః సుషేణశ్చ హనుమానింద్రజిత్తథా ॥




సర్గ - 2, శ్లోకమ్ - 28

ఏతేఽష్టౌ మంత్రిణః ప్రోక్తాః సమనీరాగచేతసః ।
జీవన్ముక్తా మహాత్మానో యథాప్రాప్తానువర్తినః ॥




సర్గ - 2, శ్లోకమ్ - 29

ఏతైర్యథా హుతం దత్తం గృహీతముషితం స్మృతమ్ ।
తథా చేద్వర్తసే పుత్ర! ముక్త ఏవాసి సంకటాత్ ॥

ఏతైః యథా హుతం దత్తం గృహీతం ఉషితం స్మృతమ్ ।
తథా చేత్ వర్తసే పుత్ర! ముక్త ఏవ అసి సంకటాత్ ॥

పద్మనేత్రుడగు రాముడును, లక్ష్మణుడును, భరతుడును, శత్రుఘ్నుడును, కౌసల్యయును, సుమిత్రయును, సీతయు, దశరథుడును, కృతాస్త్రా విరోధులను రామస్నేహితులును, వసిష్ఠ వామదేవాదులును, అష్టమంత్రులును ఏరీతిగ నిర్లిప్తులై సంచరించి ఆనందము ననుభవించిరో, నీవును అట్లే యొనర్పుము. దృష్టి, జయంతుడు, భాసుడు, సత్యుడు, విజయుడు, సుషేణుడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు, వీరష్ట అను సుగ్రీవుని మంత్రులు. వీరందరును సమదర్శనులు, వైరాగ్యచిత్తులు, జీవన్ముక్తులు, ప్రారబ్ధకర్మల ననుసరించువారు. వీరొనరించినట్లు హోమ, దాన, గ్రహణ, స్మరణాదుల నొనరించిన నీవును సంకటమునుండి విముక్తుడవగుదువు.
ఏతైః యథా హుతం, దత్తం, గృహీతం, ఉషితం, స్మృతమ్ తథా ఏవ చేత్ వర్తసే పుత్ర! ముక్త అసి సంకటాత్.

పుత్ర! అరిష్టనేమి! వారు (రాముడు మొదలైనవారు) ఏ విధంగా అయితే హుతమును, దానము ఇచ్చినవాటిని, స్వీకరించినవాటిని, నివసించబడిన విధములను, శాస్త్రోక్త స్మృతులను ఆచరించినారో... అదే విధంగా నీవు కూడా వర్తించినచో వారి వలె ముక్తుడవు అయ్యేదవు.



🌹 🌹 🌹



[1.04.3] ఈ గ్రంథ అధ్యయన ఫలశ్రుతి నిర్ణయము

Original Sloka YP Translation YHRK Liberal Translation
సర్గ - 2, శ్లోకమ్ - 30

అపారసంసారసముద్రపాతీ లబ్ధ్వా పరాం యుక్తిముదారసత్త్వః ।
న శోకమాయాతి న దైన్య మేతి గతజ్వరస్తిష్ఠతి నిత్యతృప్తః ॥

అపార సంసార సముద్ర పాతీ లబ్ధ్వా పరాం యుక్తిం ఉదారసత్త్వః ।
న శోకం ఆయాతి న దైన్యమ్ ఏతి గతజ్వరః తిష్ఠతి నిత్యతృప్తః ॥

అపారమగు సంసార సముద్రమున మునిఁగిన వ్యక్తి, (పరమయోగమునుఁ బొంది) ఉత్కృష్ట జ్ఞానముఁబడసి శోకమును, దైన్యమును, అభిమానమును వీడి నిత్యతృప్తుడై వెలయును.
అపార సంసార సముద్ర పాతీ, లబ్ధ్వా పరాం యుక్తిం, ఉదారసత్త్వః ।
న శోకం ఆయాతి, న దైన్యమ్ ఏతి, గతజ్వరః, తిష్ఠతి నిత్యతృప్తః ॥

అపార సంసార సముద్రమును దాటినవాడు, శుద్ధ జ్ఞానస్థితియైన పరమును పొందు యుక్తిని సాధింకున్నవాడు అయిన ఉదారమైన సత్త్వస్వరూపుడు (తన స్వస్వరూపమును తెలుసుకొని స్థిమితత్వం చెందినవాడు) ఇక శోకము పొందడు, దైన్యము పొందడు, మనో చంచల జ్వరమును వదిలించుకొని నిత్యతృప్తుడై ఉంటాడు.

ఓ అరిష్టనేమి! అప్పుడు ప్రవచించబడినదే నీకు చెప్పబోవుచున్నాను. నీ మీద వాత్సల్యంతో భగవత్ప్రేరితుడనై పలుకుచున్నాను.

ఉత్కృష్టమైన ఈ 'ఆత్మజ్ఞానం' పొందినవాడు శోకము, దైన్యము, అభిమానము త్యజించి వేస్తాడు. నిత్యతృప్తుడై వెలయగలడు.


🌹 🌹 🌹



[1.04.4] మూల వస్తుతత్త్వ నిర్ణయము

Original Sloka YP Translation YHRK Liberal Translation
భారద్వాజ ఉవాచ :-

సర్గ - 3, శ్లోకమ్ - 1

జీవన్ముక్తస్థితిం బ్రహ్మన్ కృత్వా రాఘవ మాదితః ।
క్రమాత్ కథయ మే నిత్యం భవిష్యామి సుఖీ యథా ॥

జీవన్ముక్తస్థితిం బ్రహ్మన్! కృత్వా రాఘవం ఆదితః ।
క్రమాత్ కథయ మే నిత్యం భవిష్యామి సుఖీ యథా ॥

భరద్వాజుడు: బ్రహ్మవేత్తా! క్రమముగా జీవన్ముక్త్రస్థితి నెట్లు పొందవచ్చునో, రాముని ననుసరించి నాకు జెప్పుడు. అట్లయిన సుఖి నగుదును.
బ్రహ్మన్! యథా రాఘవం కృత్వా జీవన్ముక్తస్థితిం ఆదితః క్రమాత్ మే కథయ, నిత్యం భవిష్యామి సుఖీ ॥

భరద్వాజుడు :-

ఓ బ్రహ్మతత్త్వవేత్త! ఏ విధంగా శ్రీరాముడు జీవన్ముక్త స్థితిని సాధించుకొనెనో దానిని మొదటి నుండి క్రమముగా అంతయూ నాకు వివరించుము. నేను కూడా నిత్య సుఖుడను అగుదను.


వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 3, శ్లోకమ్ - 2

భ్రమస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ ।
అపునః స్మరణం మన్యే సాధో! విస్మరణం వరమ్ ॥

భ్రమస్య జాగతస్య అస్య జాతస్య ఆకాశవర్ణవత్ ।
అపునః స్మరణం మన్యే సాధో! విస్మరణం వరమ్ ॥

శ్రీవాల్మీకి: సాధూ! ఆకాశమునకు రూపము లేకపోయినను నీలరూప మున్నట్లు, భ్రమ కలుగునట్లు, వాస్తవమగు సత్త లేని జగత్తు బ్రహ్మమున ఆరోపింప బడుచున్నది. ఇట్టి కల్పిత ప్రపంచము మరల మనస్సున నుదయింపకుండునట్లు, విస్మరించుటయే ముక్తిస్వరూపము. ఇయ్యది నా అనుభవము.
సాధో! ఆకాశవర్ణవత్ అస్య భ్రమస్య జాతస్య జాగతస్య అపునఃస్మరణం మన్యే విస్మరణం వరమ్.

శ్రీ వాల్మీకి మహర్షి :-

ఓ సాధు! ఆకాశ స్వరూపములో లేని నీలవర్ణము కనిపించునట్లుగా కేవలం భ్రమ వలన బ్రహ్మములో జగత్తు జనించినట్లుగా తోచుచున్నది. ఈ దృశ్యము యొక్క అపునఃస్మరణ (మరలా ఉదయించకపోవటము) అనునది విస్మరణ (స్మరించుకోకుండా ఉండటము) చేత మాత్రమే కలుగును. అదియే గొప్ప వరము (ముక్తిరూపము) అని నేను నిర్ధారిస్తున్నాను.

ఆకాశము యొక్క వాస్తవ స్వరూపం శూన్యమే కదా! ఈ నిజం తెలుసుకొన్న తరువాత, "ఆకాశంలో నీల వర్ణము గల పదార్థమేదో ఉన్నది" అనే భ్రమ ఎవరికి ఉంటుంది? ఈ కనబడే జగత్తు కూడా కల్పితమాత్రమని, స్వకీయమైన 'భ్రమ' అని ఎరిగిన తరువాత ఇందు ప్రాప్తిస్తున్న సర్వ వికారాలు తొలగుతాయి. అయితే, బ్రహ్మము యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకొన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క నిజస్వరూపం మనం తెలుసుకోగలం.

అనేక సంభ్రమములు, దుఃఖ పరంపరలు, వికారములు అనుక్షణం జీవునికి కలుగజేస్తున్న ఈ “జగద్దృశ్యము” ఎక్కడి నుండి ప్రాప్తిస్తోంది? ఈ వ్యవహారములు, అనుభవములు, శరీరములు జీవునకు రచించుచూ అందజేస్తున్న వారెవరు? సునిశిత బుద్ధితో పరిశీలిస్తే ఈ దృశ్యమును ఒకడు ఆయా విధములుగా మననము చేయుట చేతనే ప్రియముగా అప్రియముగా, సుఖ-దుఃఖ భరితంగా, సామాన్యముగా అసామాన్యముగా.... ఇట్లు అనేక విధములైన భావనలతో అనుభవమగుచున్నది”.... అని తెలియవచ్చుచున్నది.

మననమే మనస్సు యొక్క, జీవుని యొక్క, జగత్తు యొక్క మూలకారణమై ఉన్నది. అనగా, ఈ 'జగత్తు' అనబడునది మనస్సునందే ఉదయించుచున్నది.

ఎప్పుడైతే 'జగత్తు' అనబడే అనుభవం మనస్సునందు ఉదయించకుండా విస్మరించబడుతుందో, అట్టి విస్మరణముచే ఏర్పడగల శుద్ధ స్వస్వరూపానుభవమే సర్వోత్కృష్టమగు ముక్తి అని జ్ఞానులు మనకు చెప్పుచున్నారు.

సర్గ - 3, శ్లోకమ్ - 3

దృశ్యాత్యన్తాభావబోధం వినా తన్నానుభూయతే ।
కదాచిత్ కేనచిన్నామ స్వబోధోఽన్విష్యతామతః ॥

దృశ్య అత్యంత అభావ బోధం వినా తత్ న అనుభూయతే ।
కదాచిత్ కేనచిత్ నామ స్వబోధో అన్విష్యతాం అతః ॥

కనుబడు ప్రతివస్తువును, (దృశ్యము) అస్తిత్వము లేనిది. ఈ జ్ఞానము కలుగనిదే పైన జెప్పబడిన, ముక్తిస్వరూపమును ఎవరును దెలిసికొనజాలరు. అందువలన ఆత్మసాక్షాత్కారము కొఱకై ప్రయత్నింపుము.
"దృశ్య అత్యంత అభావ బోధం" వినా తత్ న అనుభూయతే. అతః కదాచిత్ కేనచిత్ నామ స్వబోధో అన్విష్యతాం.

"దృశ్య అత్యంత అభావ బోధ" అనగా "కనబడు దృశ్యమునకు బ్రహ్మము కాక స్వతఃగా అస్తిత్వమే లేదు అనే జ్ఞానము" కాకుండా "తత్" సూచిక ముక్తరూప శుద్ధజ్ఞాన స్థితి (మోక్షము) అనుభవమునకు రాదు.

కనుక, ఎప్పటికైనా ఎవ్వరైనా ఈ దృశ్య జగత్ అసలు మూలము కొరకు అన్వేషించాలి.

(NOTE: శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారములో చెప్పిన "భావశూన్య సద్భావ సుస్ధితిః")

అయితే, అట్టి దృశ్య విస్మరణ స్థితి అనుభవమయ్యేదెట్లా? అనేక అనుభవములతో కూడిన ఈ దృశ్యము ఉన్నదా? ఉంటే, బాలునికి ఒక రకంగా, వృద్ధునికి మరొక రకంగా ఎందుకు తోచుచున్నది? కాబట్టి, "ఈ కనబడు దృశ్యముగాని, దీని సాక్షిత్వము (ద్రష్టత్వము) గాని ఏ కాలంలోను ఉండి ఉండనే లేదు" అను అభేదరూపమైన బోధ (జ్ఞానము) జీవునియందు దృఢం కావాలి.

సర్గ - 3, శ్లోకమ్ - 4

స చేహ సంభవత్యేవ తదర్థమిదమాతతమ్ ।
శాస్త్రమాకర్ణయసి చేత్ తత్త్వమాప్స్యసి నాన్యథా ॥

స చ ఇహ సంభవతి ఇతి ఏవ తత్ అర్థమ్ ఇదం ఆతతమ్ ।
శాస్త్రం ఆకర్ణయసి చేత్ తత్త్వం అపి అసి న అన్యథా ॥

ఈ శాస్త్రాధికారికి ఆత్మదర్శనము లభించును. ఈ శాస్త్రమును వినినవెంటనే ఆత్మసాక్షాత్కారము లభించును. మఱి ఇంకొక ఉపాయము లేదు.
స చ ఏవ ఇహ సంభవతి ఇతి, తత్ అర్థమ్ ఇదం ఆతతమ్, శాస్త్రం ఆకర్ణయసి అపి చేత్ తత్త్వం అసి, న అన్యథా ॥

అటువంటి ఆత్మబోధ పొందినవాడికి మాత్రమే ఇహములో (ఈ లోకంలో) ముక్తి లభించును. దాని కొరకే ఈ బోధ చెప్పబడుచున్నది. ఈ శాస్త్రమును వినిన మాత్రం చేతనే తత్త్వం తెలుసుకొనెదవు. మరి ఏ ఇతర మార్గము లేదు!

అప్పుడు మాత్రమే - దృశ్యము యొక్క విస్మరణ, స్వస్వరూపము యొక్క అనిర్వచనీయానుభవం ఒకేసారి జీవునికి కలుగుతాయి.

సర్గ - 3, శ్లోకమ్ - 5

జగద్భ్రమోఽయం దృశ్యోఽపి నాస్త్యేవేత్యనుభూయతే ।
వర్ణో వ్యోమ్న ఇవాఖేదాద్విచారేణామునాఽనఘ ॥

అనఘా! భ్రాంతివలన కల్పింపబడిన ఈ జగత్తు కనులంబడుచున్నను, ఆకాశమునందలి రంగువలె, అస్తిత్వము లేనట్టిది; శాస్త్రవిచారమువలన అనాయాసముగా ఇట్టి యనుభూతి కలుగును.



భ్రాంతి వలన కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క స్వభావమైయున్న భావము కంటే వేరైన అస్థిత్వమేదీ లేదు. అయితే, అట్టి జగద్భావరాహిత్యముచే కలుగగల ఆత్మసాక్షాత్కారం శాస్త్ర విచారణా ప్రభావంచే అనాయాసంగా తప్పక లభిస్తుంది.

అట్టి ఆధ్యాత్మ విషయమును ప్రతిపాదిస్తున్న ఉత్తమ శాస్త్రములు ఉన్నాయి. వాటిని మానవుడు చక్కగా పరిశీలించాలి. లేదా, ఆత్మానుభూతి పొందిన మహనీయుల ముఖతః వింటే ఇంకా మంచిది.

సర్గ - 3, శ్లోకమ్ - 6

దృశ్యం నాస్తీతి బోధేన మనసో దృశ్యమార్జనమ్ ।
సంపన్నం చేత్తదుత్పన్నా పరా నిర్వాణనిర్వృతిః ॥

దృశ్యవస్తువు అసలునకు లేదు; మిథ్య. ఇట్టి తత్వజ్ఞానమువలన మనస్సునుండి దృశ్యవస్తువు మాసిపోయినచో, నిర్వాణముక్తియొక్క పరమానందము లభించును.



"దృశ్యముగాని, ద్రష్టత్వముగాని మిథ్యయే” అనునట్టి తత్త్వజ్ఞానము యొక్క ప్రభావంచేత మనస్సు నుండి ఈ దృశ్యము తొలగిపోగా అప్పుడు శేషించు భేదరహిత స్థితియే సర్వుల యొక్క స్వస్వరూపమైనట్టి “ఆత్మస్థితి”.

సర్గ - 3, శ్లోకమ్ - 7

అన్యథా శాస్త్రగర్తేషు లుఠతాం భవతామిహ ।
భవత్యకృత్రిమాజ్ఞానాం కల్పైరపి న నిర్వృతిః ॥

అట్లొనర్పక, అజ్ఞానమునకు లోబడి మరల మరల పుట్టుచు చచ్చుచుండు వ్యక్తి అనేక కల్పములుగ శాస్త్రమను గుంటలోబడి కొట్టుకొనినను ముక్తి లభింపదు.



కాబట్టి, ఈ దృశ్యము యొక్క విచారణము కొరకు ఆత్మజ్ఞానముకై ప్రయత్నించాలి. అట్లా కాకుండా, ఆత్మజ్ఞానం విడిచి కేవలం శాస్త్ర వాసనలతో, లోక వాసనలతో కూడుకొని అనాత్మపూర్వకంగా ఎంత ప్రయాసపడితే మాత్రం ఏం లాభం చెప్పు?

సర్గ - 3, శ్లోకమ్ - 8

అశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః ।
మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మన్! స ఏవ విమలక్రమః ॥

బ్రాహ్మణుడా! వాసనల సంపూర్ణ త్యాగమే ఉత్తమ మగు మోక్షము. చిత్తశుద్ధినుండియే పరంపరాక్రమమున ఆ మోక్షము లభించుచున్నది.



మొట్టమొదట ఉత్తమ నిష్కామ కర్మల చేత, ఉపాసనల చేత, శ్రవణ మననాదుల చేత, స్వవిచారణ చేత జీవుడు వాసనాక్షయం సాధించాలి. ఈ విధంగా చిత్తము నిర్మలత్వం పొందు గాక!

సర్వ వాసనలు (tendencies) సంపూర్ణంగా త్యజించుటయే ఉత్తమమైన మార్గం.

'ఆసక్తి' కలిగి ఉండుటయే వాసనల రూపం కదా! ప్రపంచము పట్ల గల భ్రమలు తొలగితే అప్పుడు మరికొంత అభ్యాసముచే ఆసక్తి పూర్వకమగు (ఇంద్రియములతోటి) తాదాత్మ్యము సన్నగిల్లుతుంది. ఇక జన్మజన్మలుగా వెంటనంటి వస్తున్న వాసనలు తమంతట తామే తొలగుతాయి.

"భ్రాంతి వలననే ఈ జగత్తు నాకు ఇట్లు కనబడుతోంది. భ్రాంతికి వేరుగా జగత్తు లేదు” అను స్వబోధ (self training) సహాయం చేత ఆత్మజ్ఞానమునకు పరాకాష్ఠ అయినట్టి “నిర్వాణ స్థితి” ఉత్పన్నమౌతోంది.

వాసనా రాహిత్యము, దృశ్య మనన రాహిత్యము కలుగగా అప్పుడు లభించే స్థితే 'మోక్షం'. అనగా, ఇక అప్పుడు మోక్షప్రాప్తికి వేఱే ప్రయత్నముల ఆవశ్యకత ఏదీ ఉండదు.

సర్గ - 3, శ్లోకమ్ - 9

క్షీణాయాం వాసనాయాం తు చేతో గలతి సత్వరమ్ ।
క్షీణాయాం శీతసంతత్యాం బ్రహ్మన్ హిమకణో యథా ॥

శీతకాలము ముగిసినతోడనే మంచుతుంపురులు మాసిపోవునట్లు వాసనలు క్షయమైనచో మనస్సు లయమైపోవును.



అయితే, వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగం అవిద్యా దోషము లేనట్టి శుద్ధ చిత్తులకు మాత్రమే సాధ్యం.

ఎండ ఎక్కుతున్న కొద్దీ మంచు కరిగిపోతున్నట్లు, ఆత్మజ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ క్రమంగా దృశ్యతాదాత్మ్యం, అవిద్యాభావన, అనేకత్వానుభవం, వాసనల ప్రభావం సన్నగిల్లుతాయి.

సర్గ - 3, శ్లోకమ్ - 10

అయం వాసనయా దేహో ధ్రియతే భూతపంజరః ।
తనునాంతర్నివిష్టేన ముక్తౌఘ స్తంతునా యథా ॥

ముత్యములు లోపల గ్రుచ్చబడిన దారమువలన ధరింపబడునట్లు ప్రాణులను పక్షులకు పంజరమగు (లేక పంచభూత నిర్మిత మగు దేహ పంజరమను) ఈ శరీరము వాసనల బలముననే నిలబడియున్నది.



ఓ రాజా! (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అగు) పంచభూతములచే తయారగుచున్న ఈ భౌతిక దేహ పంజరం కూడా వాసనల చేతనే ధరింపబడుచున్నది.

సర్గ - 3, శ్లోకమ్ - 11

వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధా చ మలినా తథా ।
మలినా జన్మనో హేతుః శుద్ధా జన్మవినాశినీ ॥

వాసనలు రెండువిధములని నుడువబడినవి. అవి శుద్ధములు, మలినములు. మలినవాసనలు జన్మకు 3 గారణములు. శుద్ధవాసనలు జన్మనాశమునకు తోడ్పడును.



ఈ వాసనలు రెండు రకాలు -

1.) శుద్ధ వాసనలు

2.) మలిన వాసనలు

ఇందు, మలిన వాసనలు శరీర పరంపరా ప్రాప్తికి (మరల మరల జన్మలు పొందటానికి) కారణమౌతున్నాయి.

ఇక శుద్ధ వాసనలో, ... అహంకారమును, జన్మ పరంపరలను నశింపచేస్తున్నాయి.

సర్గ - 3, శ్లోకమ్ - 12

అజ్ఞానసుఘనాకారా ఘనాహంకారశాలినీ ।
పునర్జన్మకరీ ప్రోక్తా మలినా వాసనా బుధైః ॥

మలిన వాసనలు ప్రబలాహంకారమునంజేసి, అజ్ఞానక్షేత్రమున దట్టముగా పెఱిగి, పునర్జన్మ ఫలము నొసగునని పండితులు చెప్పుదురు.



మలిన వాసనల యొక్క ఆకారముగాని, వాటికి మూలకారణంగాని అజ్ఞానమే అయి ఉన్నది. అట్టి మలిన వాసనలే ఘనీభూతమై “అహంకారము” అనే రూపమును పొందుచున్నాయి.

సర్గ - 3, శ్లోకమ్ - 13

పునర్జన్మాంకురం త్యక్త్వా స్థితా సంభృష్టబీజవత్ ।
దేహార్థం ధ్రియతే జ్ఞాతజ్ఞేయా శుద్ధేతి చోచ్యతే ॥

శుద్ధవాసనలు తత్త్వజ్ఞానమున కనుకూల మైనవి. వీనియందు పునర్జన్మ కుపయోగపడు అంకురములుండవు. వీటిపని ఈ శరీరముతోడనే నిలిచిపోవును; అవి వేయించబడిన గింజలవంటివి అని చెప్పుదురు.



ఉడకపెట్టబడిన వేరుసెనగ గింజ మరల మొలుస్తుందా? కాని, రూపం మాత్రం కలిగే ఉంటుంది కదా! శుద్ధ వాసనలు కూడా జ్ఞేయమగు (తెలియబడునది అగు) ఆత్మను ఎరిగిన తరువాత తమ యందు 'పునర్జన్మ' అనే అంకురం కలిగి ఉండవు.

సర్గ - 3, శ్లోకమ్ - 14

అపునర్జన్మకరణీ జీవన్ముక్తేషు దేహిషు ।
వాసనా విద్యతే శుద్ధా దేహే చక్ర ఇవ భ్రమః ॥

శుద్ధవాసనలు జీవన్ముక్త పురుషునియందు చక్రభ్రమణము వలె నుండును. మరల జన్మను కలుగజేయు సామర్థ్యము వాటికి లేదు.

NOTE: చక్రభ్రమణము : కుమ్మరివాడు చక్రముబోలు సారెను మాటిమాటికి త్రిప్పుచు కుండలను తయారుచేయును. కుండలు తయారుచేయుట అయిపోయిన నిక సారెను త్రిప్పడు. త్రిప్పకపోయిన పూర్వవేగమున కొంతవరకు సారె తిరుగుచునే యుండును. అట్లే వాసనలుకూడ వాటి పూర్వశక్తి ననుసరించి ఆమరణాంతము జీవన్ముక్తునియందు పనిచేయుచుండును. పిదప వాటికి సామర్థ్య ముండదు-అను.



'శరీరం ధరించుట' అను బాహ్య వ్యవహార సరళి మాత్రమే కలిగి ఉంటాయి.

సర్గ - 3, శ్లోకమ్ - 15

యే శుద్ధవాసనా భూయో న జన్మానర్థభాజనమ్ ।
జ్ఞాతజ్ఞేయా స్త ఉద్యంతే జీవన్ముక్తా మహాధియః ॥

శుద్ధవాసనల నాశ్రయించి తత్త్వజ్ఞాన ఫలముగ అనర్థమగు పునర్జన్మను వదలి పోయిన వారందరు జీవన్ముక్తు లనబడుచున్నారు.



అట్టి శుద్ధ వాసనలు మాత్రమే కలిగి ఉన్న జీవుణ్ణి “జీవన్ముక్తుడు” అని పిలుస్తున్నాం.

సర్గ - 3, శ్లోకమ్ - 16

జీవన్ముక్తిపదం ప్రాప్తో యథా రామో మహామతిః ।
తత్తేఽహం శృణు వక్ష్యామి జరామరణశాంతయే ॥

మహామతి యగు రాముడెట్లు జీవన్ముక్తస్థితిని బొందెనో, వచించుచున్నాను. జరామరణ నాశముకొఱకద్దానిని వినుము.



మహాత్ముడగు శ్రీరాముడు వసిష్ఠమహర్షిచే బోధింపబడి, సానపెట్టిన వజ్రంలాగా జీవన్ముక్తుడై, ఈ భూమిపై సంచరించాడు. ఆ రాముడు ఎట్టి విచారణచే అట్టి పరమోత్కృష్ట స్థితిని పొందాడో ఆ విచారణ నీకు కూడా చెపుతాను. ఇది వినినవారికి జరా-మరణ భయం తొలగుతుంది.

సర్గ - 3, శ్లోకమ్ - 17

భరద్వాజ! మహాబుద్ధే! రామక్రమమిమం శుభమ్ ।
శృణు వక్ష్యామి తేనైవ సర్వం జ్ఞాస్యసి సర్వదా ॥

భరద్వాజా! మహామతీ! రాముని శుభచరిత్రను జెప్పుచున్నాను వినుము. ఇద్దానివలననే అంతయు దెలిసికొనగలవు.

NOTE: ఏక విజ్ఞానమున సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ ఈ శ్లోకము తెలుపుచున్నది.



ఇది వినినవారు తమ స్వరూపము యొక్క వాస్తవస్థితి గ్రహిస్తారు.


🌹 🌹 🌹



[1.05] కథా ప్రవేశం


[1.05.1] శ్రీరాముడు తీర్థయాత్రలు చేయుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 3, శ్లోకమ్ - 18

విద్యాగృహాద్వినిష్క్రమ్య రామో రాజీవలోచనః ।
దివసాన్యనయద్గేహే లీలాభిరకుతోభయః ॥

పద్మలోచనుడగు రాముడు గురుకుల వాసమునుండి, విద్యలను ముగించి వచ్చి కొన్ని దినములు లీలలందు నిర్భీకుడై గడపెను.



అయోధ్యానగరం పాలించే దశరథ మహారాజుకు ఎంతోకాలం తరువాత పుత్రకామేష్టి మొదలైన యాగముల ఫలితంగా నలుగురు కుమారులు కలిగారు. వారే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. కుల గురువు అయిన వసిష్ఠ మహర్షి వద్ద ఆ నలుగురు రాజకుమారులు విద్యాభాస్యం పూర్తిచేశారు. స్ఫురద్రూపులై, నవనవోన్నత విలాసంతో ప్రకాశిస్తున్నారు.

గురుకులం నుండి అంతఃపురానికి తిరిగివచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు.

సర్గ - 3, శ్లోకమ్ - 19

అథ గచ్ఛతి కాలే తు పాలయత్యవనిం నృపే ।
ప్రజాను వీతశోకాసు స్థితాసు విగతజ్వరమ్ ॥

దశరథుని పాలనమున ప్రజల కేవిధమైన దుఃఖములును, జ్వరాది ఉపద్రవములును లేకుండెను; దినము లిట్లు జరుగసాగెను.




సర్గ - 3, శ్లోకమ్ - 20

తీర్థపుణ్యాశ్రమశ్రేణీ ద్రష్టుముత్కంఠితం మనః ।
రామస్యాభూద్భృశం తత్ర కదాచిత్ గుణశాలినః ॥




సర్గ - 3, శ్లోకమ్ - 21

రాఘవశ్చిన్తయిత్వైవముపేత్య చరణౌ పితుః ।
హంసః పద్మావివ నవౌ జగ్రాహ నఖకేసరౌ ॥

అప్పుడొక దినమున శ్రీరాముని మనమున తీర్థములను, పవిత్రాశ్రమములను జూడ మిక్కుటమగు కోర్కె పొడమెను. రాఘవుడు చింతించుచు, హంస పద్మముల నాశ్రయించునట్లు నఖకేసరముల (గోళ్లు అను కింజల్కముల) తో గూడిన తండ్రి పాదపద్మముల గ్రహించెను.




శ్రీరామ ఉవాచ :-

సర్గ - 3, శ్లోకమ్ - 22

తీర్థాని దేవసద్మాని వనాన్యాయతనాని చ ।
ద్రష్టుముత్కంఠితం తాత! మమేదం నాథ! మానసమ్ ॥

శ్రీరాముడు :- దేవా! నామనస్సు దేవాలయములను, తీర్థములను, తపోవనములను జూడ ఆతురపడుచున్నది.




సర్గ - 3, శ్లోకమ్ - 23

తదేతామర్థితాం పూర్వాం సఫలాం కర్తుమర్హసి ।
న సోఽస్తి భువనే నాథ! త్వయా యోఽర్థీ న మానితః ॥

నా ఈ మొదటి కోర్కెను చెల్లింపనగును. జగత్తున నీ వేయర్థి కోర్కెను నిరాకరించి యుండలేదు.




వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 3, శ్లోకమ్ - 24

ఇతి సంప్రార్థితో రాజా వసిష్ఠేన సమం తదా ।
విచార్యాముంచ దేవైనం రామం ప్రథమమర్థినమ్ ॥

ఇట్లు ప్రార్థింపబడి, దశరథుడు వసిష్ఠునితో నాలోచించి, ప్రథమప్రార్థి యగు రాముని తీర్థయాత్రకంగీకరించెను.




సర్గ - 3, శ్లోకమ్ - 25

శుభే నక్షత్రదివసే భ్రాతృభ్యాం సహ రాఘవః ।
మంగళాలంకృతవపుః కృతస్వస్త్యయనో ద్విజైః ॥




సర్గ - 3, శ్లోకమ్ - 26

వసిష్ఠప్రహితైర్విప్రైః శాస్త్రజ్ఞైశ్చ సమన్వితః ।
స్నిగెః కతిపయైరేవ రాజపుత్రవరైః సహ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 27

అంబాభిర్విహితాశీర్భిరాలింగ్యాలింగ్య భూషితః ।
నిరగాత్ స్వగృహాత్తస్మాత్ తీర్థయాత్రార్థముద్యతః ॥




సర్గ - 3, శ్లోకమ్ - 28

నిర్గతః స్వపురాత్ పౌరైస్తూర్యఘోషేణ వాదితః ।
పీయమానః పురస్త్రీణాం నేత్రైర్భృంగౌఘభంగురైః ॥




సర్గ - 3, శ్లోకమ్ - 29

గ్రామీణలలనాలోలహస్తపద్మావనోదితైః ।
లాజవర్షైర్వికీర్ణాత్మా హిమైరివ హిమాచలః ॥




సర్గ - 3, శ్లోకమ్ - 30

ఆవర్జయన్ విప్రగణాన్ పరిశృణ్వన్ ప్రజాశిషః ।
ఆలోకయన్ దిగంతాంశ్చ పరిచక్రామ జాంగలాన్ ॥

శుభదినమున శుభనక్షత్రమున రాఘవుడును, తమ్ములును మంగళాలంకారముల నలంకరింపబడిరి. బ్రాహ్మణులు 'స్వస్తి' అని చెప్పిరి. వసిష్ఠుడు పంపిన శాస్త్రజ్ఞులగు విప్రులును, ముఖ్యస్నేహితులగు కొందఱు రాజపుత్రులును సహచరులైరి. తల్లులు మాటిమాటికి మూర్కొనుచు, ఆశీర్వదించుచు, అలంకరించిరి. ఇట్లు శ్రీరాముడు తీర్థయాత్రకై సంసిద్ధుడై తానుండు గృహమునుండి వెలికివచ్చెను. పురవాసులు 'బాకా'ల నూదసాగిరి. పురస్త్రీలు తమకన్నులను తుమ్మెదలతో రాఘవుని వీక్షింపసాగిరి. గ్రామ స్త్రీలు చలించు చేతులతో పేలాలను జల్లిరి. అప్పుడు రాముడు మంచుతుంపురులతో గప్పబడిన హిమాలయమువలె గన్పట్టెను. బ్రాహ్మణులకు దక్షిణల నిచ్చుచు. ప్రజల దీవెనలను వినుచు దిగంతముల గాంచుచు. శ్రీరాము డడవులను దాటిపోసాగెను.




సర్గ - 3, శ్లోకమ్ - 31

ఆథారభ్య స్వకాత్తస్మాత్ క్రమాత్ కోసలమండలాత్ ।
స్నానదానతపోధ్యానపూర్వకం స దదర్శ హ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 32

నదీతీరాణి పుణ్యాని వనాన్యాయతనాని చ ।
జంగలాని జనాంతేషు తటాన్యబ్ధిమహీభృతామ్ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 33

మందాకినీమిందునిభాం కాళిందీం చోత్పలామలామ్ ।
సరస్వతీం శతద్రూం చ చంద్రభాగామిరావతీమ్ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 34

వేణీం చ కృష్ణవేణీం చ నిర్వింధ్యాం సరయూం తథా ।
చర్మణ్వతీం వితస్తాం చ విపాశాం బాహుదామపి ॥




సర్గ - 3, శ్లోకమ్ - 35

ప్రయాగం నైమిషం చైవ ధర్మారణ్యం గయాం తథా ।
వారాణసీం శ్రీగిరిం చ కేదారం పుష్కరం తథా ॥




సర్గ - 3, శ్లోకమ్ - 36

మానసం చక్రమసరస్తథైవోత్తరమానసమ్ ।
బడవావదనం చైవ తీర్థబృందం ససాదరమ్ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 37

అగ్నితీర్థం మహాతీర్థమింద్రద్యుమ్నసరస్తథా ।
సరాంసి సరితశ్చైవ తథా నదహ్రదావలీమ్ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 38

స్వామినం కార్తికేయం చ సాలగ్రామం హరిం తథా ।
స్థానాని చ చతుష్షష్టిం హరేరథ హరస్య చ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 39

నానాశ్చర్యవిచిత్రాణి చతురబ్ధితటాని చ ।
వింధ్యమందరకుంజాంశ్చ కులశైలస్థలాని చ ॥




సర్గ - 3, శ్లోకమ్ - 40

రాజర్షీణాం చ మహతాం బ్రహ్మర్షీణాం తథైవ చ ।
దేవానాం బ్రాహ్మణానాం చ పావనానాశ్రమాఞ్ఛుభాన్ ॥

శ్రీరాముడు స్వదేశమగు కోసలమునుండి ఆరంభించి, ఉచితరీతి స్నాన దాన ఉపవాసాదులను, ధ్యానమును ఒనరించుచు పవిత్ర నదీతీరములను, అరణ్యములను, ఆశ్రమములను, చిట్టడవులను, సముద్ర తీరములను, పర్వత భూములను, గంగాయమునలను, సరస్వతిని, ఐరావతి శతద్రూ చంద్రభాగలను, వేణీకృష్ణవేణులను, నిర్వింధ్యాసరయూ చర్మణ్వతీనదులను, వితస్తా బాహుదా విపాశా నదులను, ప్రయాగ, నైమిశారణ్య, ధర్మారణ్యములను, వారణాసీ, గయా, కేదార, శ్రీశైలములను; పుష్కర, మానస సరోవర, చక్రతీర్థ, ఉత్తరమానసములను; బడబాముఖమును, అగ్నితీర మహాతీర్థములను, ఇంద్రద్యుమ్న సరోవరమును, మఱియు ఇతర నదీ హ్రద సమూహములను, కార్తికేయుని, సాలగ్రామ నారాయణుని, హరిహరుల అరువది నాలుగు స్థానములను, నానావిధ ఆశ్చర్యములతో గూడిన నాలుగు సముద్రతీరములను, వింధ్య మందర పర్వత నికుంజములను, కులాచల భూములను, ముఖ్యులగు రాజర్షి, బ్రహ్మర్షి దేవ బ్రాహ్మణుల పవిత్ర భూములను, ఆశ్రమములను గాంచెను.




సర్గ - 3, శ్లోకమ్ - 41

భూయో భూయః స బభ్రామ భ్రాతృభ్యాం సహ మానదః ।
చతుర్ష్వపి దిగంతేషు సర్వానేవ మహీతటాన్ ॥

దిగంతముల నన్నిటిని అనుజులతోగూడి మఱల మఱల శ్రీరాముడు పరిభ్రమించెను.




సర్గ - 3, శ్లోకమ్ - 42

అమరకిన్నరమానవమానితః సమవలోక్య మహీమఖిలామిమామ్ ।
ఉపయయౌ స్వగృహం రఘునందనో విహృతదిక్ శివలోకమివేశ్వరః ॥

సుర నర కిన్నర పూజితుడై రాఘవు డీ భూమండలము నంతటిని వీక్షించి, శివలోకమున కరుగు ఈశ్వరునివలె నిజపురి కరుదెంచెను.



శ్రీరాముడు అనేక ఋష్యాశ్రమాలు, పుణ్య నదులు, దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరాడు.


🌹 🌹 🌹



[1.05.2] తీర్థయాత్రలు చేసి తిరిగి రాజ్యమునకు వచ్చిన రామ సహోదరులు

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 4, శ్లోకమ్ - 1

రామః పుష్పాంజలివ్రాతైర్వికీర్ణః పురవాసిభిః ।
ప్రవివేశ గృహం శ్రీమాన్ జయంతో విష్టపం యథా ॥

వాల్మీకి :- పురవాసులు పుష్పాంజలుల నర్పించగా శ్రీరాముడు, జయంతుడు స్వర్గమును బ్రవేశించునట్లు, రాజభవనమును బ్రవేశించెను.




సర్గ - 4, శ్లోకమ్ - 2

ప్రణనామాథ పితరం వసిష్ఠం భ్రాతృబాంధవాన్ ।
బ్రాహ్మణాన్ కులవృద్ధాంశ్చ రాఘవః ప్రథమాగతః ॥

పిదప రాఘవుడు తల్లిదండ్రులకు, వసిష్ఠునకు, జ్ఞాతి భ్రాతృగణమునకు, బ్రాహ్మణులకు, కులవృద్ధులకు నమస్కరించెను.




సర్గ - 4, శ్లోకమ్ - 3

సుహృద్భిర్మాతృభిశ్చైవ పిత్రా ద్విజగణేన చ ।
ముహురాలింగితాచారో రాఘవో న మమౌ ముదా ॥

తల్లిదండ్రులు, మిత్రులు, బ్రాహ్మణులు మాటిమాటికి కౌగిళ్ల దేల్చగా రాము డానందించెను.




సర్గ - 4, శ్లోకమ్ - 4

తస్మిన్ గృహే దాశరథేః ప్రియప్రకథనైర్మిథః ।
జుఘార్ణుర్మధురైరాశా మృదువంశస్వనైరివ ॥

దశరథుని గృహమున వేణునినాదమువంటి రాముని మధుర వాక్యముల నాలించి, అందఱును సంతోషమున తబ్బిబ్బై తిరుగాడసాగిరి.




సర్గ - 4, శ్లోకమ్ - 5

బభూవాథ దివాన్యష్టౌ రామాగమన ఉత్సవః ।
సుఖం మత్తజనోన్ముక్తకలకోలాహలాకులః ॥

రాముని ప్రత్యాగమనమున ఎనిమిదిరోజులు ఉత్సవము జరిగెను. అది ఆనందితులగు జనుల కోలాహలములతో నిండియుండెను.




సర్గ - 4, శ్లోకమ్ - 6

ఉవాస స ముఖం గేహే తతఃప్రభృతి రాఘవః ।
వర్ణయన్ వివిధాకారాన్ దేశాచారానితస్తతః ॥

అప్పటినుండి రాముడు నానావిధ దేశాచారములను వర్ణించుచు, సుఖముగా గృహమున నుండెను.




సర్గ - 4, శ్లోకమ్ - 7

ప్రాతరుత్థాయ రామోఽసౌ కృత్వా సంధ్యాం యథావిధి ।
సభాసంస్థం దదర్శేంద్రసమం స్వపితరం తథా ॥

ఉదయమున లేచి సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చి, సభామధ్యమున నున్న ఇంద్రసముడగు తండ్రియైన దశరథుని గాంచుచుండెడివాడు.




సర్గ - 4, శ్లోకమ్ - 8

కథాభిః సువిచిత్రాభిః స వసిష్ఠాదిభిః సహ ।
స్థిత్వా దినచతుర్భాగం జ్ఞానగర్భాభిరాదృతః ॥




సర్గ - 4, శ్లోకమ్ - 9

జగామ పిత్రానుజ్ఞాతో మహత్యా సేనయాఽఽవృతః ।
వరాహమహిషాకీర్ణం వనమాఖేటకేచ్ఛయా ॥

అచ్చట ప్రథమయామమును జ్ఞానచర్చయందు గడుపుచుండెడివాడు. పిదప తండ్రి ఆజ్ఞను గైకొని,మహా సైన్యమును వెంటనిడుకొని; మహిష వరాహములతో గూడిన వనమునకు వేటాడ నరిగెడువాడు.




సర్గ - 4, శ్లోకమ్ - 10

తత ఆగత్య సదనే కృత్వా స్నానాదికం క్రమమ్ ।
సమిత్రబాంధవో భుక్త్వా నినాయ ససుహృత్ నిశామ్ ॥

అటనుండి తిరిగివచ్చి, స్నానాదికము నొనరించి, బంధుమిత్రులతో గూడి భోజన మొనర్చి రాత్రి గడిపెడువాడు.




సర్గ - 4, శ్లోకమ్ - 11

ఏవం ప్రాయదినాచారో భ్రాతృభ్యాం సహ రాఘవః ।
ఆగత్య తీర్థయాత్రాయాః సమువాస వితుర్గృహే ॥

తీర్థయాత్రనుండి తిరిగివచ్చిన పిదప రాఘవుడు, ఇట్లు దైనికకృత్యముల నొనర్చుచు, తమ్ములతోగూడి పితృగృహమున వాస మొనర్పసాగెను.




సర్గ - 4, శ్లోకమ్ - 12

నృపతిసంవ్యవహారమనోజ్ఞయా సుజనచేతసి చంద్రికయాఽనయా ।
పరినినాయ దినాని న చేష్టయా స్తుతసుధారసపేశలయాఽనఘ! ॥

అనఘా! రాజులతో సముచితరీతి నెగడుచు, సుజనహృదయముల మనోజ్ఞప్రవర్తన యను మధుర కౌముదీ (వెన్నెల) రసమున సంతోషింపజేయుచు, రాఘవుడు దినములం గడుపసాగెను.





🌹 🌹 🌹





[1.05.3] రాముడు చింతాగ్రస్తుడగుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
సర్గ - 5, శ్లోకమ్ - 1

అథోనషోడశే వర్షే వర్తమానే రఘూద్వహే ।
రామానుయాయిని తథా శత్రుఘ్నే లక్ష్మణేఽపి చ ॥



అయోధ్య చేరినప్పటి నుండి రాముడు వేసవికాలంలోని తటాకజలంలాగా క్రమక్రమంగా క్షీణించసాగాడు. అప్పటికి అతని వయసు పదహారు ఏళ్ళు మించలేదు.

సర్గ - 5, శ్లోకమ్ - 2

భరతే సంస్థితే నిత్యం మాతామహగృహే సుఖమ్ ।
పాలయత్యవనిం రాజ్ఞి యథావదఖిలామిమామ్ ॥




సర్గ - 5, శ్లోకమ్ - 3

జన్యత్రార్థం చ పుత్రాణాం ప్రత్యహం సహ మంత్రిభిః ।
కృతమంత్రే మహాప్రాజ్ఞే తద్ జ్ఞే దశరథే నృపే ॥




సర్గ - 5, శ్లోకమ్ - 4

కృతాయాం తీర్థయాత్రాయాం రామో నిజగృహే స్థితః ।
జగామానుదినం కార్శ్యం శరదీవామలం సరః ॥

వాల్మీకి : ఇట్లు గృహమున వసించుచున్న రాముడు శరత్కాల సరోవరము వలె శుష్కింపసాగెను. అప్పుడాతని వయస్సు పదునైదేండ్లు. లక్ష్మణ శత్రుఘ్ను లాతని ననుసరించుచుండెడివారు. భరతుడు సుఖముగ తాతగారియింట కాలమును వెళ్లబుచ్చుచుండెను. దశరథుడు భూమండలము నంతటిని నియమానుసారము బాలించుచుండెను. మంత్రులతో పుత్రుల వివాహమును గుఱించి ప్రాజ్ఞుడగు దశరథు డాలోచింపసాగెను. తీర్థయాత్రల నొనరించి వచ్చిన రాముడు (సంసార దుఃఖ మేమియు లేకపోయినను) కృశింపసాగెను.




సర్గ - 5, శ్లోకమ్ - 5

కుమారస్య విశాలాక్షం పాండుతాం ముఖమాదదే ।
పాకపుల్లదళం శుక్లం సాలిమాలమివాంబుజమ్ ॥

శ్రీరాముని విశాలలోచన ముఖమండలము పాలిపోయి భ్రమర చుంబితమును, వికసితమును నగు తెల్లతామర పూవువలె నాయెను.




సర్గ - 5, శ్లోకమ్ - 6

కపోలతల సంలీనపాణిః పద్మాసనస్థితః ।
చింతాపరవశస్తూష్ణీమవ్యాపారో బభూవ హ ॥

శ్రీరామచంద్రుడు విచారపరవశుడై, చెక్కిలిమీద చేయివైచుకొని, పద్మాసనమున గూర్చుండి, ఏమియు నొనర్పక తూప్లీంభావమును వహించి యుండెడువాడు.



కాని, తోటి బాలురతో ఆడటం మానివేశాడు. అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు.

సర్గ - 5, శ్లోకమ్ - 7

కృశాంగశ్చింతయా యుక్తః ఖేదో పరమదుర్మనాః ।
నోవాచ కస్యచిత్ కించిల్లిపికర్మార్పితోపమః ॥

చింతవల్ల చిక్కి, శ్రీరాముడు విమనస్కుడై, బొమ్మవలెనుండి, ఎవరితోడను, ఏమియు మాటలాడకుండెడువాడు.



ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.

సర్గ - 5, శ్లోకమ్ - 8

ఖేదాత్ పరిజనేనాసౌ ప్రార్థ్యమానః పునః పునః ।
చకారాహ్నికమాచారం పరిమ్లానముఖాంబుజః ॥

సేవకులు మాటిమాటికి విచారముతో బ్రార్థింప, దినకృత్యముల నతికష్టముతో నెరవేర్చెడువాడు. అతని మోము అను తామర వాడిపోయెను.



పరిజనులు ఎంతో బ్రతిమలాడితేకాని, స్నానాదుల కొరకు కూడా లేచేవాడు కాదు.

సర్గ - 5, శ్లోకమ్ - 9

ఏవం గుణవిశిష్టం తం రామం గుణగణాకరమ్ ।
ఆలోక్య భ్రాతరావస్య తామేవాయయతుర్దశామ్ ॥

గుణసముద్రుడగు రాముని ఈస్థితి గాంచి, అతని సోదరు లిర్వురుగూడ అదే స్థితిని బొందిరి.



అతనిని చూచి ఆతని తమ్ములు కూడా చింతాక్రాంతులయ్యారు. అంతఃపురంలో రాజకుమారులున్న సందడే లేదు.

సర్గ - 5, శ్లోకమ్ - 10

తథా తేషు తనూజేషు ఖేదవత్సు కృశేషు చ ।
సపత్నీకో మహీపాలశ్చింతావివశతాం యయౌ ॥

ఇట్లు పుత్రులు విచారముతో శుష్కించుచుండుట గాంచి, దశరథుడును, ఆయన భార్యలును చింతావివశులైరి.



దశరథ మహారాజు రాముని వైనం గమనించాడు.

సర్గ - 5, శ్లోకమ్ - 11

కా తే పుత్ర! ఘనా చింతేత్యేవం రామం పునః పునః ।
అపృచ్ఛత్ స్నిగ్ధయా వాచా నైవాకథయదస్య సః ॥

'పుత్రా! నీకున్న చింత ఏమి?' అని దశరథుడు అనేక పర్యాయములు స్నేహపూర్ణ వాక్యముల ప్రశ్నించినను, రామచంద్రు డేమియును బల్కలేదు.



ఒక రోజు తన దగ్గరకు పిలిపించి, తొడపై కూర్చుండబెట్టుకొని లాలనగా “ఇంత దీనంగా ఉన్నావు. కారణమేమిటయ్యా? నీకు వచ్చిన లోటు ఏమిటో నాకు చెప్పు” అని తరచి తరచి ప్రశ్నించాడు.
కాని ఏం లాభం?

సర్గ - 5, శ్లోకమ్ - 12

న కించిత్తాత! మే దుఃఖమిత్యుక్త్యా పితురఙ్కగః ।
రామో రాజీవపత్రాక్షన్తూష్ణీమేవ స్మ తిష్ఠతి ॥

'తండ్రీ! నాకెట్టి దుఃఖమును లేదు!' అని తండ్రి తొడమీదనున్న రాముడు పల్కి యూరకుండెడువాడు.



రాముడు మాత్రం ముక్తసరిగా “నాకేం అవసరం? ఇక లోటు ఏమి ఉంటుంది?" అని ఊరకున్నాడు.

సర్గ - 5, శ్లోకమ్ - 13

తతో దశరథో రాజా రామః కిం ఖేదవానితి ।
అపృచ్ఛత్ సర్వకార్యజ్ఞం వసిష్ఠం వదతాం వరమ్ ॥

'రాముడు విచారపూరిత మనస్కుడైనాడేల?' అని అనంతరము దశరథుడు సర్వకార్యజ్ఞుడును. వాఙ్మయును నగు వసిష్ఠుని బ్రశ్నించెను.



రాజు ఇక చేసేదిలేక కులగురువు వసిష్ఠుని రప్పించి రాముని నిస్తేజత్వం గురించి చర్చించాడు.

సర్గ - 5, శ్లోకమ్ - 14

ఇత్యుక్తశ్చింతయిత్వా స వసిష్ఠమునినా నృపః ।
అస్త్యత్ర కారణం శ్రీమాన్ మా రాజన్! దుఃఖమస్తు తే ॥

'దీనికిం దగు కారణ మున్నది, దుఃఖింపకుము' అని దశరథునితో వసిష్ఠుడు ధ్యాన మొనరించి పల్కెను.



అప్పుడు వసిష్ఠుడు దశరథునితో ఇట్లు అనునయంగా పలికాడు.

ఓ రాజా! నీ కుమారుడు రామచంద్రుడు మేఘగంభీర స్వభావుడు.

సర్గ - 5, శ్లోకమ్ - 15

కోపం విషాదకలనాం వితతం చ హర్షం
నాల్పేన కారణవశేన వహంతి సంతః ।
సర్గేణ సంహృతిజవేన వినా జగత్యాం
భూతాని భూప! నమహాన్తి వికారవన్తి ॥


రాజా! ధీరులు సామాన్య కారణమునంజేసి విషాదమును, అత్యంత సంతోషమును, లేక క్రోధమును బొందరు. జగత్తుయొక్క అంగములగు పృథివ్యాది పంచమహాభూతములు సృష్టిలో సంహారముయొక్క వేగము లేకుండ వికారము నందునా?



అట్టి వారికి స్వల్పకారణాలకు కోపం, సంతోషం, విషాదం మొదలైన వికారాలు పుట్టవు. స్వల్పులను మాత్రమే స్వల్పకారణాలు విచలితం చేస్తాయి. కనుక, మన రాముని యొక్క ఇట్టి విచిత్ర ప్రవర్తనకు ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉండి ఉంటుంది. నీవు దిగులుపడవద్దు, దేనికైనా తగిన సమయం రావాలి కదా!


🌹 🌹 🌹



[1.06] విశ్వామిత్రుని రాక


[1.06.1] దశరథుడు విశ్వామిత్రుని ఆహ్వానించి అర్చించుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 6, శ్లోకమ్ - 1

ఇత్యుక్తే మునినాథేన సందేహవతి పార్థివే ।
ఖేదవత్యాస్థితే మౌనం కించిత్ కాలప్రతీక్షణే ॥

వాల్మీకి :- మునినాథు డిట్లు పల్క, సందేహభేదము లుబికిన చిత్తముతో దశరథుడు కొంతకాలము మౌనమును వహించి యూరకుండెను.




సర్గ - 6, శ్లోకమ్ - 2

పరిఖిన్నాసు సర్వాసు రాజ్ఞేషు నృపసద్మసు ।
స్థితాసు సావధానాసు రామచేష్టాసు సర్వతః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 3

ఏతస్మిన్నేవ కాలే తు విశ్వామిత్ర ఇతి శ్రుతః ।
మహర్షిరభ్యగాత్ ద్రష్టుం తమయోధ్యానరాధిపమ్ ॥



‘విశ్వామిత్రుడు' అనే మహర్షి ఉన్నారు. ఆయన ఒక సామాన్య రాజుగా జన్మించి స్వకీయ తపోధ్యానాది ప్రయత్నములచే బ్రహ్మర్షి అయ్యారు. ఒకప్పుడు శిష్య వాత్సల్యంతో ఇంద్రుని ఎదిరించి, ‘త్రిశంకుడు’ అను శిష్యుని కొరకు రెండవ స్వర్గం సృష్టించినట్టి మహామేధావి. అద్వితీయ ప్రతిభాశాలి. లోక కళ్యాణమే కార్యక్రమముగా కలిగియుండి సార్థకనామధేయుడైనారు. ఒక రోజు అకస్మాత్తుగా ఆయన అయోధ్యానగరం వచ్చారు.

సర్గ - 6, శ్లోకమ్ - 4

తస్య యజ్ఞోఽథ రక్షోభిస్తథా విలులుపే కిల ।
మాయావీర్యబలోన్మత్తైర్ధర్మకార్యస్య ధీమతః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 5

రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టు మైచ్ఛత్స పార్థివమ్ ।
న హి శక్నోత్యవిఘ్నేన సమాప్తుం స మునిః క్రతుమ్ ॥

రాణు లందరును రాజమందిరమున ఖిన్నులై యుండిరి; రాముని నడవడిపై తమదృష్టి నుంచి సావధానత దాల్చియుండిరి. ఇట్టి సమయమున బ్రసిద్ధుడగు విశ్వామిత్రమహర్షి అయోధ్యాపతియగు దశరథుని గాంచుట కరుదెంచెను. మాయాబలోన్మత్తులగు రాక్షసుల పీడవలన బుద్ధిమంతుడగు విశ్వామిత్రుని యజ్ఞము సంపూర్ణము కాలేదు; యజ్ఞరక్షణకై రాజును జూడ నిచ్చించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 6

తతస్తేషాం వినాశార్థ ముద్యతస్తపసాం నిధిః ।
విశ్వామిత్రో మహాతేజా అయోధ్యామభ్యగాత్ పురీమ్ ॥

పిదప, మహాతేజుడును తపోనిధియు నగు విశ్వామిత్రుడు రాక్షసులు జంప నడుముకట్టి అయోధ్య కరుదెంచెను.




సర్గ - 6, శ్లోకమ్ - 7

స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ ।
శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 8

తస్య తద్వచనం శ్రుత్వా ద్వాఃస్థా రాజగృహం యయుః ।
సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 9

తే గత్వా రాజసదనం విశ్వామిత్రమృషిం తతః ।
ప్రాప్తమావేదయామాసుః ప్రతిహారాః పతే స్తదా ॥

ఆయన రాజుం జూడగోరి ద్వారపాలకులతో రాజునకు గాధీనందను డరుదెంచినాడని తెల్పవచించెను. వారామాటలను విని సంభ్రాంత చిత్తులై రాజ గృహమున కఱిగిరి; అఱిగి, విశ్వామిత్రుని ఆగమన వార్తను దమప్రవున కెరింగించిరి.




సర్గ - 6, శ్లోకమ్ - 10

అథాస్థానగతం భూపం రాజమండలమాలినమ్ ।
సముపేత్య త్వరాయుక్తో యాష్టీకోఽసౌ వ్యజిజ్ఞపత్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 11

దేవ! ద్వారి మహాతేజా బాలభాస్కరభాసురః ।
జ్వాలారుణజటాజూటః పుమాన్ శ్రీమానవస్థితః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 12

సభూసురపతాకాంతం సాశ్వేభపురుషాయుధమ్ ।
కృతవాంస్తం ప్రదేశం యస్తేజోభిః కీర్ణకాంచనమ్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 13

వీక్ష్యమాణే తు యాష్టీకే నివేదయతి రాజని ।
విశ్వామిత్రో మునిః ప్రాప్త ఇత్యనుద్ధతయా గిరా ॥

అనంతరము ద్వారపాలకులలో ముఖ్యుడగు యాష్టీకుడు సామంతరాజ పరివేష్టితుడై అధివసించియున్న దశరథునికడ కరుదెంచి ఇట్లు విన్నవించెను. "దేవా! బాలసూర్యునివలె బ్రకాశించు తేజస్వి యొకడు ద్వారదేశమున నున్నాడు; అతని జటలు అగ్నిశిఖలవలె తామ్రవర్ణములు. అతని తేజస్సునంజేసి ఏనుగులు, గుఱ్ఱములు, ఆయుధములు - ఇత్యాదులగు వస్తువులన్నియు బంగారు రంగును దాల్చినవి." అప్పుడు దశరథుడు యాష్టీకుని వైపు దృష్టిని మరల్చ, నతడతి వినయముతో విశ్వామిత్ర మహర్షి అరుదెంచినాడని విన్నవించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 14

ఇతి యాష్టీకవచనమాకర్ణ్య నృపసత్తమః ।
స సమంత్రీ ససామంతః ప్రోత్తస్థౌ హేమవిష్టరాత్ ॥

ఈ మాటలను వినినంతనే దశరథుడు మంత్రులు, సామంతులతో సహితముగ, బంగారు గద్దెనుండి లేచెను.




సర్గ - 6, శ్లోకమ్ - 15

పదాతిరేవ సహసా రాజ్ఞాం వృందేన మాలితః ।
వసిష్ఠవామదేవాభ్యాం సహ సామంతనంస్తుతః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 16

జగామ యత్ర తత్రాసౌ విశ్వామిత్రో మహామునిః ।
దదర్శ మునిశార్దూలం ద్వారభూమావవస్థితమ్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 17

కేనాపి కారణేనోర్వీతలమర్కముపాగతమ్ ।
బ్రాహ్మేణ తేజసా క్రాంతం క్షాత్రేణ చ మహౌజసా ॥

దశరథుడు వసిష్ఠ వామదేవులు వెంటరా, సామంతులు స్తుతించుచుండ, ద్వారదేశమున కఱిగి, బ్రహ్మక్షత్రియ తేజములతో బ్రకాశించుచున్న విశ్వామిత్ర మహర్షిని గాంచెను. ఆ ప్రకాశమును గాంచిన, యే కారణముననో సూర్యుడు భూమికి దిగివచ్చెనా యని యనిపించుచుండెను.




సర్గ - 6, శ్లోకమ్ - 18

జరాజరఠయా నిత్యం తపఃప్రసరరూక్షయా ।
జటావల్యావృతస్కంధం ససంధ్యాభ్రమివాచలమ్ ॥

వార్ధక్య మగుటం జేసి కేశములు నెరసెను. తపస్సువలన శరీరము మోటువారెను. జటలచే నాతని భుజములు కప్పబడి, సాయంకాల మేఘములచే గప్పబడిన పర్వతమా యనునట్లుండెను.




సర్గ - 6, శ్లోకమ్ - 19

ఉపశాంతం చ కాంతం చ దీప్తమప్రతిఘాతి చ ।
నిభృతం చోర్జితాకారం దధానం భాస్వరం వపుః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 20

పేశలేనాతిభీమేన ప్రసన్నేనాకులేన చ ।
గంభీరేణాతిపూర్ణేన తేజసా రంజితప్రభమ్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 21

అనంతజీవితదశాసఖీమేకా మనిందితామ్ ।
ధారయంతం కరే శ్లక్ష్‌ణాం కుండీమమ్లానమానసమ్ ॥




సర్గ - 6, శ్లోకమ్ - 22

కరుణాక్రాంతచేతస్త్వాత్ ప్రసన్నైః మధురాక్షరైః ।
వీక్షణైరమృతేనేవ సంసించన్తమిమాః ప్రజాః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 23

యుక్తయజ్ఞోపవీతాంగం ధవళప్రోన్నతభ్రువమ్ ।
అనంతం విస్మయం చాంతః ప్రయచ్ఛన్తమివేక్షితుః ॥




సర్గ - 6, శ్లోకమ్ - 24

మునిమాలోక్య భూపాలో దూరాదేవానతాకృతిః ।
ప్రణనామ గలన్మౌలి మణిమాలితభూతలమ్ ॥

అతని శరీరము దీప్తిమంతమును, ప్రశాంతమును, సౌఖ్యమును, ఉజ్జ్వలమును, బలిష్ఠమునునై యుండెను. మనోజ్ఞమును, భీషణమును, ప్రసన్నమును, జటిలమును, విశాలమును, గంభీరమును నగు అతని శరీరతేజము ప్రభను గల్పించుచుండెను. అతని చేతియందు జీవితసఖుడగు కమండల ముండెను; చిత్తము ప్రసన్నమై యుండెను. కరుణతోగూడిన చిత్తము గలవాడగుటంజేసి, తియ్యని మాటలతోడను, అమృత వీక్షణములతోడను జనులను దనుపుచుండెను. యజ్ఞోపవీత ముండెను. కనుబొమలు తెల్లబడెను. అవి ఉన్నతములు. చూచువారల కాతడు ఆశ్చర్యమును గలిగించుచుండెను. (ఇట్టి) మహర్షిని దూరమున గాంచియే వినయావనత శిరస్కుడై దశరథుడు కిరీట పరిశోభిత మస్తకమును భూతలమున నుంచి ప్రణమిల్లెను.



రాజు ఆయనను సభకు ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఒక ఉన్నతాసనంపై కూర్చుండబెట్టారు. సభలోని ముఖ్యులుంతా లేచి విశ్వామిత్రునికి సాష్టాంగ నమస్కారములు, ప్రదక్షిణలు సమర్పించారు.

సర్గ - 6, శ్లోకమ్ - 25

మునిరప్యవనీనాథం భాస్వానివ శతక్రతుమ్ ।
తత్రాభివాదయాంచక్రే మధురోదారయా గిరా ॥

సూర్యు డింద్రునకు ప్రత్యభివందన మొనర్చునట్లు, విశ్వామిత్రుడు గూడ, మధురములగు ఆదరవాక్యములతో ప్రత్యభివాద మొనర్చెను.




సర్గ - 6, శ్లోకమ్ - 26

తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజాతయః ।
స్వాగతాదిక్రమేణైనం పూజయామాసురాదృతాః ॥

పిదప, వసిష్ఠాది బ్రాహ్మణులు స్వాగత వచనములను బల్కి ఆదరముతో యథోచిత సపర్యల సల్పిరి.



వసిష్ఠ - విశ్వామిత్రులు కుశల ప్రశ్నలతో పరస్పరం సంభాషించుకొన్నారు. యథాతథంగా సభ ప్రారంభించబడింది.


🌹 🌹 🌹



[1.06.2] దశరథుడు విశ్వామిత్రుని స్తుతించి వాగ్దానము చేయుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
దశరథ ఉవాచ :-

సర్గ - 6, శ్లోకమ్ - 27

అశంకితోపనీతేన భాస్వతా దర్శనేన తే ।
సాధో! స్వనుగృహీతాః స్మో రవిణేవాంబుజాకరాః ॥

దశరథుడు :- సాధుపుంగవా! సూర్యుని వలన పద్మములను గ్రహింపబడినట్లు, మీ యీ పవిత్ర దర్శనము వలన మేమను గ్రహింపబడితిమి.



దశరథ మహారాజు వినయ పూర్వకంగా సింహాసనము నుండి లేచి ఇట్లు పలికారు.
"లోక కళ్యాణమే జీవిత ధ్యేయంగా కలిగియున్న ఓ విశ్వామిత్ర మహర్షీ! సుస్వాగతం."

సర్గ - 6, శ్లోకమ్ - 28

యదనాది యదక్షుణ్ణం యదపాయవివర్జితమ్ ।
తదానందసుఖం ప్రాప్తం మయా త్వద్దర్శనాన్మునే! ॥

మునిశ్రేష్ఠా! నీ దర్శనమువలన, వృద్ధిక్షయములు లేని ఆ అనంతసుఖము నందితిని.




సర్గ - 6, శ్లోకమ్ - 29

అద్య వర్తామహే నూనం ధన్యానాం ధురి ధర్మతః ।
భవదాగమనస్యేమే యద్ద్వయం లక్ష్యమాగతాః ॥

మీ దృష్టి మామీద పడినందువలన ధర్మబలమున నేడు మేము ధన్యులలో నగ్రగణ్యులమైతిమి.




సర్గ - 6, శ్లోకమ్ - 30

ఏవం ప్రకథయంతోఽత్ర రాజానోఽథ మహర్షయః ।
ఆసనేషు సభాస్థానమాసాద్య సముపావిశన్ ॥

ఇట్లు దశరథుడును, మహర్షులును పల్కుచు సభాగృహమును బ్రవేశించి, ఆసనముల నలంకరించిరి.




సర్గ - 6, శ్లోకమ్ - 31

స దృష్ట్వా మాలితం లక్ష్మ్యా భీతస్తమృషిసత్తమమ్ ।
ప్రహృష్టవదనో రాజా స్వయమర్ఘ్యం న్యవేదయత్ ॥

తపోలక్ష్మిచే నలంకరింపబడిన విశ్వామిత్రుని గాంచి అపరాధము గలుగునేమో యని భయపడుచు, నగుమోముతో దశరథుడు అర్ఘ్యము నర్పించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 32

స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా ।
ప్రదక్షిణం ప్రకుర్వంతం రాజానం పర్యపూజయత్ ॥

విశ్వామిత్రుడు శాస్త్రోచితరీతి అర్ఘ్యము గైకొని, ప్రదక్షిణ మొనర్చుచున్న దశరథుని బ్రశంసించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 33

న రాజ్ఞా పూజితస్తేన ప్రహృష్టవదనస్తదా ।
కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్ ॥

విశ్వామిత్రుడు (ఇట్లు) పూజితుడై, ప్రసన్న వదనుడై దశరథుని కుశలప్రశ్న మొనరించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 34

వశిష్ఠేన సమాగమ్య ప్రహస్య మునిపుంగవః ।
యథార్హం చార్చయిత్వైనం పప్రచ్ఛానామయం తతః ॥

(పిదప) వసిష్ఠుని గలిసికొని యథోచితమగు గౌరవమును జూపి నవ్వుచు. శిష్యమృగ పక్ష్యాదుల కుశలమును బ్రశ్నించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 35

క్షణం యథార్హమన్యోన్యం పూజయిత్వా సమేత్య చ ।
తే సర్వే హృష్టమనసో మహారాజనివేశనే ॥




సర్గ - 6, శ్లోకమ్ - 36

యథోచితాసనగతా మిథః సంవృద్ధతేజసః ।
పరస్పరేణ పప్రచ్ఛుః సర్వేఽనామయమాదరాత్ ॥

వారందరు రాజభవనమున ఆసీనులై, ఒండొరులను పలుకరించుకొనుచు, ఆనంద మనస్కులైరి. వారి తేజస్సు వృద్ధి నొందెను. (అప్పుడు) వారు, పరస్పరము కుశలప్రశ్న నొనరించుకొనసాగిరి.




సర్గ - 6, శ్లోకమ్ - 37

ఉపవిష్టాయ తస్మై స విశ్వామిత్రాయ ధీమతే ।
పాద్యమర్ఘ్యం చ గాం చైవ భూయోభూయో న్యవేదయత్ ॥

ఆసీనుడైన విశ్వామిత్రునకు దశరథుడు గంధ పుష్ప వస్త్రాలంకారములను, గోవులను, దక్షిణలను, ఫలతాంబూలములను విరివిగా నర్పించెను.




సర్గ - 6, శ్లోకమ్ - 38

అర్చయిత్వా తు విధివద్విశ్వామిత్రమభాషత ।
ప్రాంజలిః ప్రయతో వాక్యమిదం ప్రీతమనా నృపః ॥

విశ్వామిత్రునికి విధివిహితముగా పూజించి, ప్రీతుడై, చేతులు జోడించి, వినయముతో దశరథుడిట్లనెను.




సర్గ - 6, శ్లోకమ్ - 39

యథాఽమృతస్య సంప్రాప్తిర్యథావర్షమవర్ష కే ।
యథాంధస్యేక్షణప్రాప్తిర్భవదాగమనం తథా ॥



దశరథుడు విశ్వామిత్రునితో ఇంకా ఇలా పలికెను -

"మానవునకు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుంది? రోజుల తరబడి కరువు కాటకం ఆవహించినపుడు అనుకోకుండా ఒక రోజు కుంభపోతవర్షం కురిస్తే ఎంత ఆనందం! గుడ్డివాడికి చూపు రావటమో, కుంటివానికి కాళ్ళు రావటమో జరిగితే ఎంత సంతోషం!"

సర్గ - 6, శ్లోకమ్ - 40

యథేష్టదారాసంపర్కాత్ పుత్రజన్మాఽప్రజానతః ।
స్వప్నదృష్టార్థలాభశ్చ భవదాగమనం తథా ॥




సర్గ - 6, శ్లోకమ్ - 41

యథేప్సితేన సంయోగ ఇష్టస్యాగమనం యథా ।
ప్రనష్టస్య యథా లాభో భవదాగమనం తథా ॥




సర్గ - 6, శ్లోకమ్ - 42

యథా హర్షో నభోగత్యా మృతస్య పునరాగమాత్ ।
తథా త్వదాగమాత్ బ్రహ్మన్! స్వాగతం తే మహామునే! ॥

మానవున కమృతము దొఱికినట్లు, కఱవురోజులలో వర్షము కుఱిసినట్లు, అంధునకు దృష్టి లభించినట్లు మీ దర్శనము మాకు లభించినది. సంతాన హీనుడగు మనుజునకు వాంఛితవనితా సంగమమున పుత్రుడు కలిగినట్లు, కలలో గాంచిన వస్తువు దొరకినట్లు, చాల రోజులనుండి కోరుకొన్న వస్తువు లభించినట్లు, ఇష్టులగువా రరుదెంచినట్లు, పోయినది మరల దొరకినట్లు, మీ దర్శనము మాకు లభించినది. ఆకాశగమనము వలనను, మృతు డగువాడు మరల జీవించినను కలుగు ఆనందము మీ రాకవలన మాకు గల్గినది. మీకు సుస్వాగతము!



"మీ ఈ రాక మాకు, మా ప్రజలకు అంత ఆనందం కలుగచేస్తోంది."

సర్గ - 6, శ్లోకమ్ - 43

బ్రహ్మలోకనివాసో హి కస్య న ప్రీతి మావహేత్ ।
మునే! తవాగమస్తద్వత్ సత్యమేవ బ్రవీమి తే ॥

బ్రహ్మలోక నివాస మెవనికి ఆనందమును గొల్పదు? మీ రాక అట్టిది. సత్యమును వచించుచున్నాను.




సర్గ - 6, శ్లోకమ్ - 44

కశ్చ తే పరమః కామః కిం చ తే కరవాణ్యహమ్ ।
పాత్రభూతోఽసి మే విప్ర! ప్రాప్తః పరమధార్మికః ॥

తమ కోర్కె ఎద్ది? నేనేమి యొనర్పగలను? ధర్మపరాయణులును, దానపాత్రులును అగు తామరుదెంచితిరి.




సర్గ - 6, శ్లోకమ్ - 45

పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః ।
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోఽసి భగవన్ మయా ॥

పూర్వము తాము తపఃకాంతులు వెదజల్లు రాజర్షులు; తపోబలమున బ్రహ్మర్షులైన తాము మాకు పూజనీయులు.




సర్గ - 6, శ్లోకమ్ - 46

గంగాజలాభిషేకేణ యథా ప్రీతిర్భవేన్మమ ।
తథా త్వద్దర్శనాత్ ప్రీతిరంతః శీతయతీవ మామ్ ॥

గంగాస్నానమున తాపము శమించునట్లు, మీ దర్శనముచేత అంతఃకరణము చల్లబడినది.



"మేమంతా మీ దర్శనముచే పవిత్రులమయ్యాం."

సర్గ - 6, శ్లోకమ్ - 47

విగతేచ్ఛా భయక్రోధో వీతరాగో నిరామయః ।
ఇద మత్యద్భుతం బ్రహ్మన్! యద్భవాన్మా ముపాగతః ॥

మీకు ఇచ్ఛాభయ క్రోధములు, కోర్కెలు, రోగములు లేవు. అయినను మీరు నాకడ కరుదెంచితిరి. ఆశ్చర్యము!



"ఇచ్ఛా భయ క్రోధ రహితులగు మీ వంటి బ్రహ్మానందస్వరూపులు మా పూర్వజన్మల సుకృతం చేతనే మావంటి వారి వద్దకు వస్తారు."

సర్గ - 6, శ్లోకమ్ - 48

శుభక్షేత్రగతం చాహమాత్మాన మపకల్మషమ్ ।
చంద్రబింబ ఇవోన్మగ్నం వేదవేద్యవిదాంవర ॥

ఓ తత్త్వజ్ఞ శ్రేష్ఠుడా! మీరాకవలన నాగృహము ఆత్మయు పవిత్రము లైనవి. నేనానందమున అమృతమయ మగు చంద్రమండలమున దేలియాడుచున్నాను.




సర్గ - 6, శ్లోకమ్ - 49

సాక్షాదివ బ్రహ్మణో మే తవాభ్యాగమనం మతమ్ ।
పూతోఽస్మ్యనుగృహీతశ్చ తవాభ్యాగమనాన్మునే! ॥

మీ రాక చతుర్ముఖుని రాకయే యని భావించుచున్నాను; మీరాకవలన నేననుగ్రహింపబడితిని, పవిత్రుడ నైతిని.




సర్గ - 6, శ్లోకమ్ - 50

త్వదాగమనపుణ్యేన సాధో! యదనురంజితమ్ ।
అద్య మే సఫలం జన్మ జీవితం తత్ సుజీవితమ్ ॥

సాధువరేణ్యా! మీ రాక వలన లభించిన పుణ్యముచేత, నా జీవితము సఫలమైనది. నా జన్మ సార్థకమైనది.




సర్గ - 6, శ్లోకమ్ - 51

త్వామిహాభ్యాగతం దృష్ట్వా ప్రతిపూజ్య ప్రణమ్య చ ।
ఆత్మన్యేవ నమామ్యంతర్దృష్ట్వేందుం జలధిర్యథా ॥

చంద్రోదయమున సాగర ముబ్బి తబ్బిబ్బొనట్లు, మిమ్ములను పూజించి, నమస్కరించి ఆనందమును బట్టజాలకున్నాను.




సర్గ - 6, శ్లోకమ్ - 52

యత్కార్యం యేన వార్థేన ప్రాప్తోఽసి మునిపుంగవ!
కృతమిత్యేవ తద్విద్ధి మాన్యోఽసీతి సదా మమ ॥

మునిపుంగవా! మీరెద్దాని కొఱకు, ఎందులకు అరుదెంచితిరో, అయ్యది నెరవేర్పబడినదనియే యెంచునది. మీరు మాకు మాన్యులు కదా!



"మీరు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడినట్లే భావించండి."

సర్గ - 6, శ్లోకమ్ - 53

స్వకార్యే సవిమర్శం త్వం కర్తుమర్హసి కౌశిక!
భగవన్నాస్త్యదేయం మే త్వయి యత్ ప్రతిపద్యతే ॥

భగవానుడా! కౌశికా! ప్రయోజనమును గుఱించి అడుగుటకు సంకోచింపవలదు. మీ కియ్యదగనిదేమున్నది?



"నిస్సంకోచంగా ఆజ్ఞాపించండి. ఈ రాజసింహాసనమైనా సరే, మీ పాదాలముందు ఉంచటానికి నేను సిద్ధంగా ఉన్నాను."

సర్గ - 6, శ్లోకమ్ - 54

కార్యస్య న విచారం త్వం కర్తుమర్హసి ధర్మతః ।
కర్తా చాహ మశేషం తే దైవతం పరమం భవాన్ ॥

సంకోచింపవలదు. మీ కార్యమును సంపూర్ణ మొనరించు భారము నాది. మీరు మాకు పరదేవతలు.




సర్గ - 6, శ్లోకమ్ - 55

ఇదమతిమధురం నిశమ్య వాక్యం శ్రుతిసుఖమాత్మవిదా వినీతముక్తమ్ ।
ప్రథితగుణయశా గుణైర్విశిష్టం మునివృషభః పరమం జగామ హర్షమ్ ॥

ఆత్మవేత్తయు, పరేంగితజ్ఞానియు నగు, మునివృషభుడు వినయముతో నొప్పారు దశరథుని శ్రుతిమధుర వాక్యములను విని పరమానందము నొందెను.





🌹 🌹 🌹



[1.06.3] విశ్వామిత్రుడు తాను వచ్చిన పని చెప్పుట


Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 7, శ్లోకమ్ - 1

తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్య మద్భుత విస్తరమ్ ।
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ॥

వాల్మీకి :- మహాతేజుడగు విశ్వామిత్రుడు రాజసింహుడగు దశరథుని అద్భుతవాక్యముల విని పులకిత శరీరుడై ఇట్లు పల్కెను.



విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి ఇట్లు పలికాడు.

విశ్వామిత్ర ఉవాచ :-

సర్గ - 7, శ్లోకమ్ - 2

సదృశం రాజశార్దూల! తవైవైతన్మహీతలే ।
మహావంశప్రసూతస్య వసిష్ఠవశవర్తినః ॥

విశ్వామిత్రుడు :- రఘువంశమున జన్మించి, వసిష్ఠుని ఆజ్ఞలలో మెలగుచున్న. నీకొక్కనికే ఇట్టి ఔదార్యము తగును.



ఓ రాజా! మీకు, మీ రాజ్యమునకు శుభమగుగాక. నీ అతిథి మర్యాదలు నన్ను ఆనందింపచేస్తున్నాయి.

సర్గ - 7, శ్లోకమ్ - 3

యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యవినిర్ణయమ్ ।
కురు త్వం రాజశార్దూలం ధర్మం సమనుపాలయ ॥

రాజశార్దూలా! నా మనస్సున నున్నదానిని విని, కార్యమును నిర్ణయించుకొని ధర్మరక్షణము నొనర్పుము.




సర్గ - 7, శ్లోకమ్ - 4

అహం ధర్మం సమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ!
తస్య విఘ్నకరా ఘోరా రాక్షసా మమ సంస్థితాః ॥

పురుషశ్రేష్ఠా! నేను యజ్ఞసిద్ధికొఱ కారంభించినప్పుడు విఘ్నదాయకు లగు రాక్షసులు వచ్చి చేరుచున్నారు.



నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను. అది నిర్విఘ్నంగా నిర్వహించగలిగితే, లోకములకు శుభం చేకూరుతుంది.

సర్గ - 7, శ్లోకమ్ - 5

యదా యదా తు యజ్ఞేన యజేఽహం విబుధవ్రజాన్ ।
తదా తదా తు మే యజ్ఞం వినిఘ్నంతి నిశాచరాః ॥

నేను దేవతలకొఱకు యజ్ఞము నారంభించినప్పుడెల్ల రాక్షసులు వచ్చి దానిని పాడుచేయుచున్నారు.



అయితే మేము యజ్ఞము ప్రారంభించి దేవతలను ఆహ్వానించినప్పుడల్లా కొందరు దానవులు వచ్చి యజ్ఞవాటికపై రక్త మాంసాలు కురిపిస్తున్నారు.

సర్గ - 7, శ్లోకమ్ - 6

బహుశో విహితే తస్మిన్ మయా రాక్షసనాయకాః ।
అకిరంస్తే మహీం యాగే మాంసేన రుధిరేణ చ ॥

నేను యజ్ఞమును అనేక పర్యాయము లారంభించితిని; ప్రతి పర్యాయమును రాక్షసనాయకు లరుదెంచి, రక్తమాంసములతో యజ్ఞభూమిని గప్పివేయుచున్నారు.



మా ప్రయత్నాలన్నీ ధ్వంసమైపోతున్నాయి.

సర్గ - 7, శ్లోకమ్ - 7

అవధూతే తథాభూతే తస్మిన్ యాగకదంబకే ।
కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదుపాగతః ॥

ఇట్లారంభించిన యజ్ఞము లన్నియు చాల శ్రమపడినను, పాడైపోవుటచే నిరుత్సాహముతో నిటకరుదెంచితిని.




సర్గ - 7, శ్లోకమ్ - 8

న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ ।
తథా భూతం హి తత్ కర్మ న శాపస్తస్య విద్యతే ॥

క్రోధమువలన (శాపమిచ్చి) వారిని నశింపజేయు ఇచ్ఛ పొడమకున్నది; ఆ యజ్ఞ మొనర్చునప్పుడు క్రోధాదులను దృజింపవలెను. క్రోధమును దెచ్చుకొనకుండ శాపమియలేము కదా!



మేము యాగదీక్షలో ఉన్నప్పుడు అత్యంత శాంత స్వభావులమై ఉంటాము కదా! అది వారు అవకాశంగా తీసుకొంటున్నారు.

సర్గ - 7, శ్లోకమ్ - 9

ఈదృశీ యజ్ఞదీక్షా సా మమ తస్మిన్మహాక్రతౌ ।
త్వత్ప్రసాదాదవిఘ్నేన ప్రాపయేయం మహాఫలమ్ ॥

యజ్ఞనియమ మిట్టిది. నీ యనుగ్రహమున ఆ మహాయజ్ఞమును నిర్విఘ్నముగా నొనరించి మహాఫలము నందగలను.




సర్గ - 7, శ్లోకమ్ - 10

త్రాతు మర్హసి మామార్తం శరణార్థిసమాగతమ్ ।
అర్థినాం యన్నిరాశత్వం సత్తమేఽభిభవో హి సః ॥

నేనార్హుడను, శరణాపన్నుడను. నన్ను రక్షించుట నీ ధర్మము. అర్థులను నిరసించుట గొప్పవారికి నింద.



ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నీవు మా ఈ ప్రయత్నమును సఫలం చేయాలి.

సర్గ - 7, శ్లోకమ్ - 11

తవాస్తి తనయః శ్రీమాన్ దృష్తశార్దూలవిక్రమః ।
మహేంద్రసదృశో వీర్యో రామో రక్షోవిదారణః ॥



నీ కుమారుడు రాముడు ఇంద్రుని మించిన పరాక్రమము కలవాడు.

సర్గ - 7, శ్లోకమ్ - 12

తం పుత్రం రాజశార్దూల! రామం సత్యపరాక్రమమ్ ।
కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతు మర్హసి ॥

రాజశార్దూలా! శార్దూల పరాక్రముడును, ఇంద్ర సమబలుడును, సత్యపరాక్రముడును, జ్యేష్ఠుడును కాకపక్ష ధరుడును అగు రాముడు రాక్షస వినాశ మొనర్పగలడు. వానిని నాకిమ్ము (అనగా నావెంట బంపుము.)



ఈ పూజనీయుడగు వసిష్ఠమహర్షి వద్ద సర్వశస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొని మహావీరుడై ఉన్నాడు. మాకు ఆ రాముడు కావాలి.

సర్గ - 7, శ్లోకమ్ - 13

శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా ।
రాక్షసా యేఽపకర్తార స్తేషాం మూర్ధవినిగ్రహే ॥

నా దివ్యతేజమువలన రక్షింపబడి, రాముడు రాక్షసుల సంహరింపగలడు.



మన రాముడు స్వయంగానే గొప్ప శక్తి సంపన్నుడు. పైగా నాచే రక్షింపబడగలడు.

సర్గ - 7, శ్లోకమ్ - 14

శ్రేయశ్చాస్య కరిష్యామి బహురూపమనంతకమ్ ।
త్రయాణామపి లోకానాం యేన పూజ్యో భవిష్యతి ॥

నానావిధములగు (అస్త్రముల నొసంగి) శ్రేయములను రామునకు గూర్చుదును. దాన నాతడు త్రిలోకపూజితు డగును.




సర్గ - 7, శ్లోకమ్ - 15

న చ తే రామమాసాద్య స్థాతుం శక్తా నిశాచరాః ।
క్రుద్ధం కేసరిణం దృష్ట్వా వనే తృణ ఇవైణకాః ॥

కోపించిన సింహము ముంగల లేళ్లు నిలబడలేనట్లు, రాముని ముందర రాక్షసులు నిలంబడజాలరు.



అతడు మాత్రమే మృగములను వేటాడే వేటగానివలె ఆ రాక్షసులను మట్టుపెట్టగలడు.

సర్గ - 7, శ్లోకమ్ - 16

తేషాం న చాన్యః కాకుత్స్థా కాకుత్స్థాద్యోద్ధుముత్సహతే పుమాన్ ।
ఋతే కేసరిణః క్రుద్ధాన్మత్తానాం కరిణామివ ॥

మదించిన ఏనుగు నెదుర్కొన సింహము కాక అన్నిమృగము లుత్సహించినట్లు, వారితో శ్రీరాముడు తప్ప ఇతరులు యుద్ధ మొనర్ప నుత్సహించరు.




సర్గ - 7, శ్లోకమ్ - 17

వీర్యోత్సిక్తా హి తే పాపాః కాలకూటోపమా రణే ।
ఖరదూషణయోర్భృత్యాః కృతాన్తాః కుపితా ఇవ ॥




సర్గ - 7, శ్లోకమ్ - 18

రామస్య రాజశార్దూల! సహిష్యంతే న సాయకాన్ ।
అనారతగతా ధారా జలదస్యేవ పాంసవః ॥

రాజశార్దూలా! బలగర్వితులును, పాపులును, విషస్వరూపులును, యమనిభులును నగు ఖరదూషణ భృత్యులు, ధూళిపుంజములు ఎడతెగని వర్షధారల సహింపజాలనట్లు, శ్రీరాముని శరముల (బాణముల) సహింపజాలరు.



నీవు రాముని పరాక్రమం గురించి శంకించవలసిన పనిలేదు. అతడు వేనవేలు రాక్షసులనైనా సరే, క్షణంలో దునుమాడి నీకు కీర్తి తెచ్చిపెట్టగలడు. రాముణ్ణి నాకు అప్పగించిన మరుక్షణం మమ్ములను బాధిస్తున్న ఆ రాక్షసుల ఆయువు మూడినట్లే.

సర్గ - 7, శ్లోకమ్ - 19

న చ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ ।
న తదస్తి జగత్యస్మిన్ యన్నదేయం మహాత్మనామ్ ॥

పుత్రునిపై మమతను జూపుట తగదు; మహాత్ముల కీయదగని దీప్రపంచమున లేదు కదా!



ఇక అనుమానం ఎందుకు? ఒకవేళ పుత్ర వ్యామోహం చేత అన్నమాట తప్పుతావా - అది నీకు అర్హమైనది కాదు. ఇక్ష్వాకు వంశపు రాజులు ఇచ్చిన మాట తప్పుతారా? లేదు.

సర్గ - 7, శ్లోకమ్ - 20

హంత నూనం విజానామి హతాంస్తాన్ విద్ధి రాక్షసాన్ ।
న హ్యస్మదాదయః ప్రాజ్ఞాః సందిగ్ధే సంప్రవృత్తయః ॥

రాక్షసులను జంపబడిన వారినిగా నేనెఱుంగుదును, నీవును అట్లే గ్రహించునది. మమ్ముబోలు ప్రాజ్ఞులు సందిగ్ధ విషయముల బ్రవృత్తులు కారు.




సర్గ - 7, శ్లోకమ్ - 21

అహం వేద్మి మహాత్మానం రామం రాజీవలోచనమ్ ।
వసిష్ఠశ్చ మహాతేజా యే చాన్యే దీర్ఘదర్శినః ॥

కమలలోచనుడును, మహాత్ముడును నగు రాముని నేనెఱుంగుదును. వసిష్ఠు డాదిగా గల జ్ఞానులుగూడ ఎఱుంగుదురు.




సర్గ - 7, శ్లోకమ్ - 22

యది ధర్మో మహత్త్వం చ యశస్తే మనసి స్థితమ్ ।
తన్మహ్యం సమభిప్రేతమాత్మజం దాతు మర్హసి ॥

ధర్మము మహత్యము, యశము - వీటియొక్క కాంక్ష నీకుండిన నేకోఱిన పుత్రుని ఒసంగునది.




సర్గ - 7, శ్లోకమ్ - 23

దశరాత్రశ్చ మే యజ్ఞో యస్మిన్ రామేణ రాక్షసాః ।
హంతవ్యా విఘ్నకర్తారో మమ యజ్ఞస్య వైరిణః ॥

నా యజ్ఞము పదిదినములు పట్టును. ఇందు యజ్ఞవైరులగు రాక్షసులు రామునివలన సంహరింపబడుదురు.



మా యజ్ఞం పది రోజులు జరుగుతుంది.

సర్గ - 7, శ్లోకమ్ - 24

అత్రాప్యనుజ్ఞాం కాకుత్స్థ దదతాం తవ మంత్రిణః ।
వసిష్ఠప్రముఖాః సర్వే తేన రామం విసర్జయ ॥

శ్రీరాముని నాతో బంపుటకుగాను, మంత్రులకును వసిష్ఠాది ప్రముఖులకును, ఆజ్ఞ నొసగుము.




సర్గ - 7, శ్లోకమ్ - 25

నాత్యేతికాలః కాలజ్ఞ యథాయం మమ రాఘవ ।
తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః ॥

సమయజ్ఞుడవగు దశరథుడా! నాసమయము నష్టము కాకుండునట్లు చూడుము. నీకు శుభ మగుగాక! పుత్రునకు కీడు గలుగునని శంకింపకుము.



ఇక ఇప్పుడు ఎక్కువ సమయం వృథా కాకూడదు. అతిత్వరలో యజ్ఞం ప్రారంభించటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం.

సర్గ - 7, శ్లోకమ్ - 26

కార్యమణ్వపి కాలే తు కృతమేత్యుపకారతామ్ ।
మహదప్యుపకారోఽపి రిక్తతామేత్యకాలతః ॥

సమయమునకు దగినట్లు కొంచెము సాయ మొనర్చినను, అది ఉపకారమగును. అవసరము లేనప్పుడొనర్చిన గొప్పసాయము ఉపకారముక్రింద పరిగణింపబడదు.



నీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాను.

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 7, శ్లోకమ్ - 27

ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః ।
విరరామ మహాతేజా విశ్వామిత్రో మునీశ్వరః ॥

ధర్మాత్ముడగు విశ్వామిత్రుడు ధర్మవాక్యములు బల్కి యూరకుండెను.




సర్గ - 7, శ్లోకమ్ - 28

శ్రుత్వా వచో మునివరస్య మహానుభావ
స్తూష్ణీమతిష్ఠదుపపన్నపదం స వక్తుమ్ ।
నో యుక్తియుక్తకథనేన వినైతి తోషం
ధీమానపూరితమనోఽభిమతశ్చ లోకః ॥

రాజు మునీంద్రుని పల్కులను విని ప్రత్యుత్తర వియ ఆలోచించుచు, కొంతసేపు మౌనమును వహించి యూరకుండెను. బుద్ధిమంతులును, అపూర్ణ మనోరథులును నగు వారు యుక్తియుక్తములగు వాక్యములచే గాక, సంతోషమును బడయరు.





🌹 🌹 🌹



[1.06.4] దశరథుడు రాముని విశ్వామిత్రునితో పంపుటకు నిరాకరించుట


Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 8, శ్లోకమ్ - 1

తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్ ।
ముహూర్తమాసీన్నిశ్చేష్టః సదైన్యం చేదమబ్రవీత్ ॥

వాల్మీకి :- దశరథుడు విశ్వామిత్రుని పల్కుల నాలించి కొంతసేపు నిశ్చేష్టుండై, దైన్యముతో నిట్లు పల్కెను.



దశరథుడు అంతా విని అవాక్కయ్యాడు. కొద్ది క్షణములలో తేరుకొని రెండు చేతులు జోడించి ఇట్లు విన్నవించాడు.

దశరథ ఉవాచ :-

సర్గ - 8, శ్లోకమ్ - 2

ఊనషోడశవర్షోఽయం రామో రాజీవలోచనః ।
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః ॥

దశరథుడు :- కమలలోచనుడగు రాముని వయస్సు పదునైదేండ్లు. రాక్షసులతో యుద్ధ మొనర్పగల శక్తి వానికున్నదని నేననుకొనను.



ఓ మహర్షీ! అన్నీ తెలిసి కూడా నన్ను పరిహాసం చేస్తున్నారా? ఎన్నో యేళ్ళు పరితపించిన తరువాత నాకీ పుత్రులు లేక లేక కలిగారు.

పదహారు సంవత్సరాల వయసు కూడా నిండని ఈ రాముడు యుద్ధం చేయు యోగ్యత ఉన్నదని నాకు అనిపించటంలేదు.
సర్గ - 8, శ్లోకమ్ - 3

ఇయమక్షోహిణీ పూర్ణా యస్యాః పతిరహం ప్రభో!
తయా పరివృతో యుద్ధం దాస్యామి పిశితాశినామ్ ॥

ప్రభూ! ఈ యక్షోహిణీ సంఖ్యాసైన్యమునకు నేనధిపతిని. నేనీ సైన్యమును నడిపి రాక్షసులతో యుద్ధ మొనర్చెదను.



నేను అక్షౌహిణీ సైన్యంతో వచ్చి మీ యాగం రక్షిస్తాను.

సర్గ - 8, శ్లోకమ్ - 4

ఇమే హి శూరా విక్రాంతా భృత్యా మంత్రవిశారదాః ।
అహం చైషాం ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని ॥

ఈ శూరు లందరును బలపరాక్రమ సంపన్నులు; యుక్తిపరులు, నేను ధనుస్సును గైకొని రణరంగమున నిలబడి వారిని రక్షింతును.




సర్గ - 8, శ్లోకమ్ - 5

ఏభిః సహైవ వీరాణాం మహేంద్రమహతా మపి ।
దదామి యుద్ధం మత్తానాం కరిణామివ కేసరీ ॥

సింహము మదపుటేనుగు నెదుర్కొనునట్లు, ఇంద్రునికంటె గొప్పవారుగు వీరులంగూడ నెదుర్కొనగలను.




సర్గ - 8, శ్లోకమ్ - 6

బాలో రామస్త్వనీకేషు న జానాతి బలాబలమ్ ।
అంతఃపురాదృతే దృష్ట్వా నానేనాన్యా రణావనిః ॥

బాలుడగు రాముడు సైన్యముల బలాబలముల నెఱుంగడు. పురమధ్యమున వినోదార్థము కల్పింపబడిన రణరంగమును గాక, అసలైన యుద్ధక్షేత్రము నాతడు చూచియుండలేదు.



ఈ రాముడు ముక్కు పచ్చలారని పసిబాలుడు. ఇంతవరకు కల్పిత యుద్ధంలోనే గాని, నిజమైన యుద్ధంలో ప్రవేశించి ఎరుగడు. మీకు తెలుసు. అది రాక్షసులతో యుద్ధం.

సర్గ - 8, శ్లోకమ్ - 7

న శస్త్రైః పరమైర్యుక్తో న చ యుద్ధవిశారదః ।
న వాస్త్రైః శూరకోటీనాం తద్ జ్ఞస్సమరభూమిషు ॥

అతడు అస్త్రశస్త్రముల నెఱుగడు; యుద్ధమున నేర్పరి గాడు; లెక్కకు మించిన వారల నెట్లెదుర్కొనవలయునో అతడెఱుగడు.




సర్గ - 8, శ్లోకమ్ - 8

కేవలం పుష్పఖండేషు నగరోపపనేషు చ ।
ఉద్యానవన కుంజేషు సదైవ పరిశీలనమ్ ॥




సర్గ - 8, శ్లోకమ్ - 9

విహర్తుమేష జానాతి సహ రాజకుమారకైః ।
కీర్ణపుష్పోపహారాసు స్వకాస్వజిరభూమిషు ॥

కేవలము ఉద్యానవనముల యందునను, నగరనికుంజములందునను విహరించుటయు, మిత్రులతోగూడి పూలు రాలిన ప్రాంగణభూముల సంచరించుటయు నతడెఱుంగును.




సర్గ - 8, శ్లోకమ్ - 10

అద్య త్వతితరాం బ్రహ్మన్! మమ భాగ్యవిపర్యయామ్ ।
హిమేనేవ హి పద్మాభస్సంపన్నో హరిణః కృశః ॥

నా దురదృష్టము! రాముడిప్పుడు మంచు కుఱిసిన సరోవరమువలె, శోభావిహీనుడై పాలిపోయి కృశించుచున్నాడు.




సర్గ - 8, శ్లోకమ్ - 11

నాత్తుమన్నాని శక్నోతి న విహర్తుం గృహావనిమ్ ।
అంతఃఖేదపరీతాత్మా తూష్ణీం తిష్ఠతి కేవలమ్ ॥

అన్నమును దినుట లేదు. ఇంటగూడ లేచి తిరుగుట లేదు. విచార మనస్కుడై ఊరక కూర్చొనియుండును.




సర్గ - 8, శ్లోకమ్ - 12

సదారస్సహభృత్యోఽహం తత్కృతే మునినాయక!
శరదీప పయోవాహో నూనం నిస్సారతాం గతః ॥

మునినాయకా! నేనును, నాభార్యలును, నా సేవకులును వాని కొఱకై, శరత్కాల మేఘములవలె సుఖవిహీనుల మగుచున్నాము.




సర్గ - 8, శ్లోకమ్ - 13

ఈదృశోఽసౌ సుతో బాల ఆధినాఽథ వశీకృతః ।
కథం దదామి తం తుభ్యం యోద్ధుం సహ నిశాచరైః ॥

వయస్సున పిన్నయు, మనోవిచార పీడితుడును నగు రాముని రాక్షసులతో యుద్ధమొనర్ప నీకెట్లర్పింపగలను?




సర్గ - 8, శ్లోకమ్ - 14

అపి బాలాంగనాసంగాదపి సాధో! సుధారసాత్ ।
రాజ్యాదపి సుఖాయైవ పుత్రస్నేహో మహామతే! ॥

సాధుశ్రేష్ఠా, మహామతీ! పుత్రప్రేమ యువతీసంగమముకంటె, అమృతపానముకంటె, రాజ్యప్రాప్తికంటే నెక్కుడు సుఖము నిచ్చును.




సర్గ - 8, శ్లోకమ్ - 15

యే దురంతా మహారంభాస్త్రిషు లోకేషు ఖేదదాః ।
పుత్రస్నేహేన సంతోఽపి కుర్వతే తాననంశయమ్ ॥

ముల్లోకముల దురంతములును, కష్టదములును నగు కార్యములను ధార్మికులును పుత్రస్నేహబద్ధులై నిస్సందేహముగ నొనర్చుచున్నారు.




సర్గ - 8, శ్లోకమ్ - 16

అసవోఽథ ధనం దారా స్త్యజ్యంతే మానవైః సుఖమ్ ।
న పుత్రో మునిశార్దూల! స్వభావో హ్యేష జంతుషు ॥

మునిశార్దూలా! మనుజులు ధన ప్రాణములను, భార్యను, సుఖములను, త్యజింపగలరు. కాని పుత్రుని వదలలేరు; ఇది మనుష్య స్వభావము.



మహా మహా జ్ఞానులైన వారే పుత్రుల యోగక్షేమముల కొరకు పరితపిస్తూ ఉంటారు. సామాన్య మానవులమగు మేము ఎంతటివారం చెప్పండి?

సర్గ - 8, శ్లోకమ్ - 17

రాక్షసాః క్రూరకర్మాణః కూటయుద్ధవిశారదాః ।
రామస్తాన్ యోధయత్విత్థం యుక్తిరేవాతిదుస్సహా ॥

రాక్షసులు క్రూరకర్ములు; కూటయుద్ధ విశారదులు. రాముడు వారితో యుద్ధ మొనరించునను మాటనే సహింపజాలను.




సర్గ - 8, శ్లోకమ్ - 18

విప్రయుక్తో హి రామేణ ముహూర్త మపి నోత్సహే ।
జీవితుం జీవితాకాంక్షీ న రామం నేతు మర్హసి ॥

రాముని విడిచి నేనొక్క క్షణమైన నుండజాలను. నేను బ్రతికి యుండవలెనన్న, రాముని దీసికొనిపోవలదు.




సర్గ - 8, శ్లోకమ్ - 19

నవవర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక!
దుఃఖేనోత్పాదితాస్త్వేతే చత్వారః పుత్రకా మయా ॥

కౌశికా! తొమ్మిదివేల ఏండ్లు కష్టపడి ఈ నల్గురు పుత్రలను గంటిని.



స్వామి! నన్ను క్షమించి అనుగ్రహించండి. పుత్ర మమకారంతో నేనిట్లా అంటున్నానంటారా? నిజమే. ఈ పుత్రులకొరకు నేను ఎన్నో ఏళ్ళు తపించాను.

సర్గ - 8, శ్లోకమ్ - 20

ప్రధానభూతస్తేష్వేవ రామః కమలలోచనః ।
తం వినేహ త్రయోప్యన్యే ధారయంతి న జీవితమ్ ॥

వీరిలో కమలలోచనుడగు రాముడే ముఖ్యుడు; అతడు లేకున్న మిగిలిన మువ్వురును బ్రాణముల నిల్పజాలరు.



నా పంచప్రాణాలు రాముడి మీదే. అతనికి ఏమైనా అయితే నేను భరించగలనా?

సర్గ - 8, శ్లోకమ్ - 21

స ఏవ రామో భవతా నీయతే రాక్షసాన్ప్రతి ।
యది తత్పుత్రహీనం త్వం మృతమేవాశు విద్ధి మామ్ ॥

ఇట్టి రాముని రాక్షసులతో యుద్ధ మొనర్పుటకుగాను, మీరు గొనిపోయిన, నేను పుత్రహీనుడనై మరణింతును.




సర్గ - 8, శ్లోకమ్ - 22

చతుర్ణామాత్మజానాం హి ప్రీతిరత్రైవ మే పరా ।
జ్యేష్ఠం ధర్మమయం తస్మా న్న రామం నేతుమర్హసి ॥

నలుగురిలో రాముడే నాకు ప్రియతముడు. జ్యేష్ఠుడును ధర్మమయుడును నగు రాముని దీసికొనిపోవలదు.




సర్గ - 8, శ్లోకమ్ - 23

నిశాచరబలం హంతుం మునే! యది తవేప్సితమ్ ।
చతురంగసమాయుక్తం మయా సహ బలం నయ ॥

రాక్షసులను గూల్చుటయే మీ కోర్కెయైన చతురంగ బలయుతు డగు నన్ను గొనిపొండు.



మీ సేవచేయటానికి అక్షౌహిణి సైన్యంతో నేను సిద్ధంగా ఉన్నాను.

సర్గ - 8, శ్లోకమ్ - 24

కిం వీర్యా రాక్షసాస్తే తు కస్య పుత్రాః కథం చ తే ।
కియత్ప్రమాణా కే చైవ ఇతి వర్ణయ మే స్ఫుటమ్ ॥

ఆ రాక్షసుల బలమెట్టిది? వారెవరి పుత్రులు? వారెట్టి వారు? వారిసంఖ్య ఎంత? వారెవరు? వివరించి నాకు జెప్పుడు.



అయినా, ఆ రాక్షసులెవరో మరికాస్త వివరించి చెప్పండి. వారు ఎంతమంది? ఎట్టివారు?

సర్గ - 8, శ్లోకమ్ - 25

కథం తేన ప్రకర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్ ।
మామకై ర్బాలకై ర్బహ్మన్! మయా వా కూటయోధినామ్ ॥

బ్రాహ్మణుడా! రాముడు గాని నాపుత్రులుగాని, నేను గాని మాయాయుద్ధ విశారదులగు వారిని ఎట్లెదుర్కొనవలయును?



వారు మాయాయుద్ధ విశారదులు కాదుకదా...?

సర్గ - 8, శ్లోకమ్ - 26

సర్వం మే శంస భగవన్! యథా తేషాం మహారణే ।
స్థాతవ్యం దుష్టభాగ్యానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః ॥

ఆ రాక్షసుల నెదుర్కొను నప్పుడెట్లు మెలగవలయునో తెలిసికొనుటకు గాను, నేనడిగిన విషయములను వివరించి చెప్పుడు. రాక్షసులు బలగర్వితులు గదా!




సర్గ - 8, శ్లోకమ్ - 27

శ్రూయతే హి మహావీర్యో రావణో నామ రాక్షసః ।
సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః ॥



ఈ కాలంలో రావణుని గురించి వింటున్నాం. అతడు కుబేరుని తమ్ముడు. విశ్రవసుని కుమారుడు.

సర్గ - 8, శ్లోకమ్ - 28

స చేత్తవ మఖే విఘ్నం కరోతి కిల దుర్మతిః ।
తత్ సంగ్రామే న శక్తా స్స్మో వయం తస్య దురాత్మనః ॥

రావణుడను రాక్షసవీరునిగురించి విందుము. అతడు కుబేరుని సహోదరుడు; విశ్రవసుని పుత్రుడు. అతడా మీ యజ్ఞమును బాడుచేయునది? అట్లయిన, అతనితో యుద్ధమొనర్ప గల శక్తి మాకు లేదు.



వాళ్ళ ముందైతే మేమే నిలువలేం. ఇక మా రాముడు ఎంతటివాడు చెప్పండి?

సర్గ - 8, శ్లోకమ్ - 29

కాలే కాలే పృథగ్ బ్రహ్మన్! భూరివీర్యవిభూతయః ।
భూతేష్వభ్యుదయం యాంతి ప్రలీయంతే చ కాలతః ॥

బలసంపదలు ఒక్కొక్కప్పు డొక్కొక్కనియందు వికసించి మరల కాలముతో బాటు వినష్టమై పోవును.




సర్గ - 8, శ్లోకమ్ - 30

అద్యాస్మింస్తు వయం కాలే రావణాదిషు శత్రుషు ।
న సమర్థాః పురః స్థాతుం నియతేరేష నిశ్చయః ॥

ప్రస్తుతము, మేము కాలవశమున రావణుని ముందర నిలువజాలము; దీనికి గారణము ఈశ్వర నియతియే!



ఇది ఈశ్వరేచ్ఛానుసారం కొందరు రాక్షసులు రాణించే కాలం.

సర్గ - 8, శ్లోకమ్ - 31

తస్మాత్ ప్రసాదం ధర్మజ్ఞ! కురు త్వం మమ పుత్రకే ।
మమ చైవాల్పభాగ్యస్య భవాన్ హి పరదైవతమ్ ॥

అందువలన నోధర్మజ్ఞా! మందభాగ్యుడ నగు నాయందు, నాపుత్రుని యందు దయజూపుము. మీరే మాపరదేవతలు.




సర్గ - 8, శ్లోకమ్ - 32

దేవదానవగంధర్వా యక్షాః పతగ పన్నగాః ।
న శక్తా రావణం యోద్ధుం కిం పునః పురుషా యుధి ॥

దేవ, దానవ, గంధర్వ, యక్ష, పతగ, పన్నగులే రావణునితో బోరజాలరు. ఇక మనుష్యుల మాట యేమి?




సర్గ - 8, శ్లోకమ్ - 33

మహావీర్యవతాం వీర్య మాదత్తే యుధి రాక్షసః ।
తేన సార్థం న శక్తాః స్మ సంయుగే తస్య బాలకైః ॥ 33

రావణుడు మహావీరులగు ఇంద్రాదులనే ఓడించినాడు, వానితో మేమే యుద్ధ మొనర్పజాలము. ఈ బాలకు లేమి యొనర్పగలరు?




సర్గ - 8, శ్లోకమ్ - 34

అయమన్యతమః కాలః పేలవీకృతసజ్జనః ।
రాఘవోఽపి గతో దైన్యం యతో వార్ధకజర్జరః ॥

కాలమాహాత్మ్య మిట్టిది! సజ్జనులు దుర్బలు లైరి. రఘుకులమున బుట్టియుకూడ నేను వార్ధక్యమున శక్తిహీనుడ నైతిని.




సర్గ - 8, శ్లోకమ్ - 35

అథవా లవణం బ్రహ్మన్ యజ్ఞఘ్నం తం మధోః సుతమ్ ।
కథయ త్వసురప్రఖ్యం నైవ మోక్ష్యామి పుత్రకమ్ ॥

మధుని పుత్రుడగు లవణాసురుడు మీ యజ్ఞమును పాడొనర్చుచున్నా డన్నను, నేను నా పుత్రుని విడువను.



ఒకవేళ మీకు ప్రతిబంధకం కలిగించేది ఏ లవణాసురుడో కాదుకదా?

సర్గ - 8, శ్లోకమ్ - 36

సుందోపసుందయోశ్చైవ పుత్రౌ వైవస్వతోపమౌ ।
యజ్ఞవిఘ్నకరౌ బ్రూహి న తే దాస్యామి పుత్రకమ్ ॥

యమునిబోలు సుందోపసుందుని పుత్రులు, యజ్ఞవిఘ్నకారు లన్నను, నా పుత్రు నొసగను.



లేక సుందోపసుందులా? అయినచో నా పుత్రుని పంపలేను.

సర్గ - 8, శ్లోకమ్ - 37

అథ నేష్యసి చేద్బ్రహ్మం స్తద్ధతోఽస్మ్యహమేవ తే ।
అన్యథా తు న పశ్యామి శాశ్వతం జయమాత్మనః ॥

బ్రాహ్మణుడా! బలాత్కారముగ తీసికొనిపోయిన, నన్ను మృతునిగ నెఱుంగునది; ప్రాణత్యాగము తప్ప నాకు వేటొక ఉపాయము లేదు.



అట్లుగాక, బలాత్కారంగా నా పుత్రుని గొని పోతానంటారా మరుక్షణం నన్ను విగతజీవునిగా ఎంచండి.

సర్గ - 8, శ్లోకమ్ - 38

ఇత్యుక్త్వా మృదువచనం రఘూద్వహోఽసౌ
కల్లోలే మునిమతసంశయే నిమగ్నః ।
నాజ్ఞాసీత్ క్షణమపి నిశ్చయం మహాత్మా
ప్రోద్వీచావివ జలధౌ న ముహ్యమానః ॥

మహాత్ముడును రఘుకుల శ్రేష్ఠుడును నగు దశరథు డిట్లు మృదువుగ పల్కి, విశ్వామిత్రుని నాజ్ఞ నెరవేర్చుటెట్లా యని సందిగ్ధచిత్తుడై, ఉత్తాలతరంగ సంక్షుభిత సాగరమునం బడినవానివలె, ఏమి యొనర్పనగునో నిశ్చయించుకొన జాలకపోయెను.





🌹 🌹 🌹



[1.06.5] విశ్వామిత్రుడు ఆగ్రహించుట


Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 9, శ్లోకమ్ - 1

తచ్ఛ్రుత్వా వచనం తస్య స్నేహపర్యాకులేక్షణమ్ ।
స మన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ॥

వాల్మీకి :- స్నేహాకుల నేత్రములతో దశరథుడు పల్కిన వాక్యములను విని, విశ్వామిత్రుడు కోపమున నిట్లు పల్కెను.



విశ్వామిత్రుడు అంతా విని తటాలున లేచి నిలబడ్డాడు.

విశ్వామిత్ర ఉవాచ :-

సర్గ - 9, శ్లోకమ్ - 2

కరిష్యామితి సంశ్రుత్య ప్రతిజ్ఞాం హాతు మర్హసి ।
స భవాన్ కేసరీ భూత్వా మృగతా మివ వాంఛసి ॥

విశ్వామిత్రుడు :- 'విూపని నొనర్చెదన'ని ప్రతిజ్ఞ నొనర్చి దానిని భంగపరుప నున్నావు. ఇయ్యది సింహము లేడి కాగోరుచున్నట్లున్నది.



నా కార్యము నెరవేరుస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు అన్నమాట వెనుకకు తీసుకొంటావా? సింహం లేడి కావటమా!

సర్గ - 9, శ్లోకమ్ - 3

రాఘవాణా మయుక్తోఽయం కులస్యాస్య విపర్యయః ।
న కదాచన జాయంతే శీతాంశోరుష్ణరశ్మయః ॥

ఇట్టి విపరీతకార్యము రఘువంశమున బుట్టినవారికి దగని పని. చంద్రునినుండి ఉష్ణకిరణములు వెలువడవు.



రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగుతుందా? పూర్ణచంద్రుని నుండి ఉష్ణ కిరణాలు బయల్వెడలటమా!

సర్గ - 9, శ్లోకమ్ - 4

యది త్వం న క్షమో రాజన్! గమిష్యామి యథాగతమ్ ।
హీనప్రతిజ్ఞ! కాకుత్స్థ! సుఖీ భవ సబాంధవః ॥

దశరథా! నీవీపని నొనర్పజాలని యెడల, నేను వచ్చినట్లే వెడలుచున్నాను. నీవు ప్రతిజ్ఞాభంగ మొనర్చి బంధువులతో సుఖముగ నుండుము.



సరేఁ! మంచిది. నీవు నా కోర్కె తీర్చుకుంటే నేను వచ్చినట్లుగానే వెళ్తున్నాను. ప్రతిజ్ఞాభంగం చేసినవాడవై బంధువులతో సుఖంగా ఉండు.

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 9, శ్లోకమ్ - 5

తస్మిన్ కోపపరీతేఽథ విశ్వామిత్రే మహాత్మని ।
చచాల వసుధా కృత్స్నా సురాంశ్చ భయమావిశత్ ॥

వాల్మీకి :- విశ్వామిత్రు డిట్లు కోపింప భూమండల మంతయును గంపించెను; దేవతలు భయము నందిరి.




🌹 🌹 🌹



[1.06.6] వసిష్ఠుడు దశరథుని ఓదార్చి రాముని పంపుటకు ఒప్పించుట


Original Sloka YP Translation YHRK Liberal Translation

సర్గ - 9, శ్లోకమ్ - 6

క్రోధాభిభూతం విజ్ఞాయ జగన్మిత్రం మహామునిమ్ ।
ధృతిమాన్ సువ్రతో ధీమాన్ వసిష్టో వాక్య మబ్రవీత్ ॥

ధైర్యశాలియు, సువ్రతుడును బుద్ధిమంతుడును నగు వసిష్ఠుడు విశ్వామిత్రుని గోపించిన వానినిగ నెఱిగి (దశరథునితో) ఇట్లు పల్కెను.



ఇంతలో వసిష్ఠుడు విశ్వామిత్రుని సమీపించి అనునయ వాక్యాలతో శాంతపరచాడు. దశరథుని ప్రక్కకు పిలిచి ఇట్లు సముదాయించాడు.

శ్రీ వసిష్ఠ ఉవాచ :-

సర్గ - 9, శ్లోకమ్ - 7

ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః ।
భవాన్ దశరథః శ్రీమాంస్త్రైలోక్యగుణభూషితః ॥




సర్గ - 9, శ్లోకమ్ - 8

ధృతిమాన్ సువ్రతో భూత్వా న ధర్మం హాతు మర్హసి ।
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మేణ యశసా యుతః ॥

శ్రీ వసిష్ఠుడు :- ఇక్ష్వాకు కులమున జనించిన ధర్మమూర్తివి నీవు. ముల్లోకముల నున్న గుణవంతులు గుణము లన్నియు నీయవి. ధైర్యశాలివి. సువ్రతుడవు. నీ ధర్మకీర్తి త్రిలోకప్రసిద్ధము. (ఇట్టి నీవు) ప్రతిజ్ఞాహాని నొనర్చుట తగని పని.



ఓ మహారాజా! నీవే ధర్మం తప్పితే ఎట్లా?

సర్గ - 9, శ్లోకమ్ - 9

స్వధర్మం ప్రతిపద్యస్వ న ధర్మం హాతు మర్హసి ।
మునే స్త్రిభువనేశస్య వచనం కర్తు మర్హసి ॥

మునివరుని ఆజ్ఞ ననుసరించుము. స్వధర్మమును బాలింపుము. ధర్మమును ద్యజింపకుము.




సర్గ - 9, శ్లోకమ్ - 10

కరిష్యామీతి సంశ్రుత్య తత్తే రాజన్నకుర్వతః ।
ఇష్టాపూర్తం హరేద్ధర్మం తస్మాత్ రామం విసర్జయ ॥

ఒనర్తునని ప్రతిజ్ఞ నొనర్చి, ఒనర్పకపోయిన * ఇష్టాపూర్త ధర్మమును బోగొట్టుకొందువు. అందువలనరాముని నొసంగుము.

NOTE: వైదికధర్మము త్రివిధము. అది ఇష్టా, పూర్త, దత్తములను పేర వ్యవహరింపబడుచున్నది. ఇష్టమైన అగ్నిహోత్రాల యజ్ఞయాగములు. పూర్తమన కూపతటాకాది ఖననము, దత్తమన దాన ధర్మాదులు, ఇవియే ఇట సూచింపబడినవి - అను.




సర్గ - 9, శ్లోకమ్ - 11

ఇక్ష్వాకువంశజాతోఽపి స్వయం దశరథోఽపి సన్ ।
న పాలయసి చేద్వాక్యం కోఽపరః పాలయిష్యతి ॥

ఇక్ష్వాకు కులమున జనించిన దశరథుడే మాట నిలబెట్టుకొననిచో, ఇంక ఇతరుల మాట యేమి?




సర్గ - 9, శ్లోకమ్ - 12

యుష్మదాదిప్రణీతేన వ్యవహారేణ జంతవః ।
మర్యాదాం న విముంచంతి తాం హాతుం త్వమర్హసి ॥

మీ యట్టివారు చూపిన ఆచరణ ననుసరించియే జనులు శాస్త్రమర్యాదకు లోబడుదురు. ఇట్టి మర్యాద నుల్లంఘించుట నీకు పాడి కాదు.




సర్గ - 9, శ్లోకమ్ - 13

గుప్తం పురుషసింహేన జ్వలనేనామృతం యథా ।
కృతాస్త్రమకృతాస్త్రం వా నైనం శక్ష్యంతి రాక్షసాః ॥

ఈ పురుష సింహునిచే రక్షింపబడు వ్యక్తిని అతడు యుద్ధమున నేర్పరి కానిమ్ము, కాకపోనిమ్ము. దేవలోకమున అగ్నిచే రక్షింపబడు అమృతము నితరులు చేరలేనట్లు, కన్నెత్తి చూడజాలరు.



పైగా, రాముని పరాక్రమం సంగతి నాకు తెలుసు. అతడు విశ్వామిత్రుని రక్షణలో ఉండగా తేరిపార చూచేవారు ఈ మూడు లోకములలో ఎవరైనా ఉన్నారా? అందుచేత రాముణ్ణి తప్పకుండా పంపు. నీకు శుభమే కలుగుతుంది.

సర్గ - 9, శ్లోకమ్ - 14

ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం పరః ।
ఏష బుద్ధ్యాధికో లోకే తపసాం చ పరాయణమ్ ॥

ఈ ముని రూపుదాల్సిన ధర్మము. తపస్విశ్రేష్ఠుడు. బుద్ధిబలమున లోకోత్తరుడు. తపస్సున కాశ్రయస్వరూపుడు.




సర్గ - 9, శ్లోకమ్ - 15

ఏషోఽస్త్రం వివిధం వేత్తి త్రైలోక్యే సచరాచరే ।
నైతదన్యః పుమాన్ వేత్తి న చ వేత్స్యతి కశ్చన ॥

ఇతడు నానావిధ అస్త్రముల నెఱుగును. ఇతడెఱిగినన్ని అస్త్రములు నితరు లెవ్వరును ఎఱుగరు. ఎఱుగబోరు.




సర్గ - 9, శ్లోకమ్ - 16

న దేవా నర్షయః కేచి న్నాసురా న చ రాక్షసాః ।
న నాగా యక్షగంధర్వాః సమేతాః సదృశా మునేః ॥

దేవ, రాక్షస, నాగ, యక్ష, గంధర్వ, అసుర, ఋషి ప్రపంచ మంతయు కలిసినను విశ్వామిత్రున కీడు కాదు.




సర్గ - 9, శ్లోకమ్ - 17

అస్త్రమస్మై కృశాశ్వేన పరైః పరమదుర్జయమ్ ।
కౌశికాయ పురా దత్తం యదా రాజ్యం సమన్వగాత్ ॥

విశ్వామిత్రుడు పూర్వము రాజ్యాధిపత్యము నందినప్పుడు, కృశాశ్వుడు దుర్జయములగు అస్త్రముల నీతనికి బ్రసాదించెను.




సర్గ - 9, శ్లోకమ్ - 18

తే హి పుత్రాః కృశాశ్వస్య ప్రజాపతిసుతోపమాః ।
ఏనమన్వచరన్ వీరా దీప్తిమంతో మహౌజసః ॥

ఈ యస్త్రములు సంహారకార్యమున రుద్రుని బోలునవి. వీర్యవంతములు; దీప్తిశాలియు, మహాతేజుడును నగు విశ్వామిత్రుని అనుచరులు.




సర్గ - 9, శ్లోకమ్ - 19

జయా చ సుప్రభా చైవ దాక్షాయణ్యౌ సుమధ్యమే ।
తయోఽస్తు యాన్యపత్యాని శతం పరమదుర్జయమ్ ॥




సర్గ - 9, శ్లోకమ్ - 20

పంచాశతం సుతాన్ జజ్ఞే జయా లబ్దవరా పురా ।
వధార్థం సురసైన్యానాం తే క్షమాః కామచారిణః ॥




సర్గ - 9, శ్లోకమ్ - 21

సుప్రభా జనయామాస పుత్రాన్ పంచాశతం పరాన్ ।
సంఘర్షాన్నామ దుర్దర్శాన్ దురాకారాన్ బలీయసః ॥




సర్గ - 9, శ్లోకమ్ - 22

ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో జగన్మునిః ।
న రామగమనే బుద్ధిం విక్లబాం కర్తు మర్హసి ॥

జయానుప్రభలు దక్షుని పుత్రికలు, (కృశాశ్వుని భార్యలు) వీరికి నూర్గురు పుత్రులు గల్గిరి. వీరందరును అస్త్రదేవతలు. జయ భర్త వరము నంది అమరుని వినాశార్థ మేబది పుత్రులం గనెను. వీరు కామచారులు. కార్యనిర్వహణ సమర్థులు, సుప్రభ మజేబది పుత్రులం గనెను. వీరు బలిష్ఠులు, అజేయులు, తీక్ష్ణాకారులు. వారి నామము సంఘర్షులు. విశ్వామిత్రు డిట్టి బలము కలవాడు. అందువలన, రాము డరుగునని వికలమతివి కావలదు.




సర్గ - 9, శ్లోకమ్ - 23

అస్మిన్ మహాసత్వతమే మునీంద్రే
స్థితే సమీపే పురుషస్య సాధో ।
ప్రాప్తేఽపి మృత్యావమరత్వ మేతి
మా దీనతాం గచ్ఛ యథా విమూఢః ॥

మహాసత్త్యుడగు విశ్వామిత్రుడు దగ్గరనున్న, మృతిచెందనున్న పురుషుడు గూడ అమరత్వము నందును. అందువలన, మూఢునివలె ఆతురపడవలదు.




వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 10, శ్లోకమ్ - 1

తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథః సుతమ్ ।
సంప్రహృష్టమనా రామమాజుహావ సలక్ష్మణమ్ ॥

వాల్మీకి :- వసిష్ఠుడిట్లు పల్కగ విని సంతోషించి, రామలక్ష్మణులను దోడ్కొని రమ్మని దశరథుడు దౌవారికున కాజ్ఞాపించెను.



వసిష్ఠుడు చెప్పినది విని దశరథుడు పుత్ర మమకారం కొంత ప్రక్కకుపెట్టి వివేచనా దృష్టితో విషయమంతా పరిశీలించాడు. రాముణ్ణి పంపటానికే నిశ్చయించుకొన్నాడు.


🌹 🌹 🌹



[1.07] రామ సభాప్రవేశం


[1.07.1] దశరథుడు రాముని తీసుకొని రమ్మని ఒక ప్రతీహారిని ఆజ్ఞాపించుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
దశరథ ఉవాచ :-

సర్గ - 10, శ్లోకమ్ - 2

ప్రతిహారమహాబాహుం రామం సత్యపరాక్రమమ్ ।
సలక్ష్మణ మనిఘ్నేన పుణ్యార్థం శీఘ్ర మానయ ॥

దశరథుడు :- ప్రతీహారీ! వీరుడును సత్యపరాక్రముడును నగు రాముని లక్ష్మణునితో తీసికొని రమ్ము; పుణ్యకార్య మున్నది.



రామచంద్రుని యొక్క ఒక ఆంతరంగిక సేవకుణ్ణి పిలిపించాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 3

ఇతి రాజ్ఞా విసృష్టోఽసౌ గత్వాంతఃపుర మందిరమ్ ।
ముహూర్తమాత్రేణాగత్య తమువాచ మహీపతిమ్ ॥

ఇట్లు దశరథునిచే నాజ్ఞాపింపబడి, లోనికఱిగి నిమిషములో దిరిగివచ్చి, దౌవారికు డిట్లు బల్కెను.




ప్రతీహారీ ఉవాచ :-

సర్గ - 10, శ్లోకమ్ - 4

దేవ! దోర్దళితాశేషరిపో రామః స్వమందిరే ।
విమనాః సంస్థితో రాత్రౌ షట్పదః కమలే యథా ॥

దేవా! వినిర్జితశత్రూ! రాత్రి తుమ్మెద పద్మమున గూర్చొని యుండునట్లు, రాముడు విషణ్ణుడై గృహమున గూర్చొనియున్నాడు.




సర్గ - 10, శ్లోకమ్ - 5

ఆగచ్ఛామి క్షణేనేతి వక్తి ధ్యాయతి చైకతః ।
న కస్యచిచ్చ నికటే స్థాతు మిచ్ఛతి ఖిన్నధీః ॥

'ఇప్పుడే వచ్చుచున్నాను. పద' అని వచించుచు చింతాపరుడైనాడు. ఖిన్నమనస్కుడగు రాముడితరులకడ నుండగోరుట లేదు.




సర్గ - 10, శ్లోకమ్ - 6

ఇత్యుక్తస్తేన భూపాలస్తం రామానుచరమ్ జనమ్ ।
సర్వమాశ్వాసయామాస పప్రచ్ఛ చ యథాక్రమమ్ ॥

ఇట్లాతడు పల్కగ, (అతనివెంట నరుదెంచిన రామానుచరుని) ఆశ్వాసించి క్రమముగా నిట్లు ప్రశ్నించెను.





🌹 🌹 🌹



[1.07.2] ప్రతీహారుని వెంట సభకు వచ్చిన రామసేవకుడు రాముని విషాద పరిస్థితి వర్ణించుట

Original Sloka YP Translation YHRK Liberal Translation
సర్గ - 10, శ్లోకమ్ - 7

కథం కీదృగ్విధో రామ ఇతి పృష్టో మహీభృతా ।
రామ భృత్యజనః ఖిన్నో వాక్యమాహ మహీపతిమ్ ॥

రాముడెట్లు, ఏవిధముగ నున్నాడు? అని ప్రశ్నింప, రామసేవకుడు భేదముతో నిట్లు పల్కెను.



దశరథుడు రామచంద్రుని యొక్క ఆంతరంగిక సేవకునితో, "ఓయీ! మన రాముని స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? చింతలన్నీ త్యజించి ఉత్సాహం పుంజుకొన్నాడా?” అని ప్రశ్నించాడు.

రామభృత్య ఉవాచ :-

సర్గ - 10, శ్లోకమ్ - 8

దేహయష్టి మిమాం దేవ! ధారయన్త ఇమే వయమ్ ।
ఖిన్నాః ఖేదే పరిమ్లానతనౌ రామే సుతే తవ ॥

రాముడు దుఃఖవశమున కృశశరీరు డైనాడు. మేమును కృశించి ఎట్లో ఈ శరీరమును దాల్చియున్నారము.



శ్రీరామ భృత్యువు ఇట్లు చెప్పనారంభించెను.

సర్గ - 10, శ్లోకమ్ - 9

రామో రాజీవపత్రాక్షో యతః ప్రభృతి చాగతః ।
సవిప్రస్తీర్థయాత్రాతస్తతఃప్రభృతి దుర్మనాః ॥

బ్రాహ్మణులతో గూడి తీర్థయాత్ర నొనర్చి వచ్చినప్పటి నుండి రాముడు ఖిన్నమనస్కుడై యున్నాడు.



మహారాజా! మన రామచంద్రుడు తీర్థ యాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుండీ, అదొక విధంగా ఉన్నాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 10

యత్నప్రార్థనయాస్మాకం నిజవ్యాపారమాహ్నికమ్ ।
సోఽయమామ్లానవదనః కరోతి న కరోతి వా ॥

మేము ప్రార్థించి, ప్రయత్నములు సల్పిననే, నిత్యకృత్యముల నొక్కొక్కప్పు డొనర్చును. మతొక్కప్పు డొనర్చడు.



మేమంతా ఎంతో ప్రార్థిస్తేగాని స్నాన భోజనాలకు లేచుటలేదు.

సర్గ - 10, శ్లోకమ్ - 11

స్నానదేవార్చనాదానభోజనాదిషు దుర్మనాః ।
ప్రార్థితోఽపి హి నాతృప్తేరశ్నాత్యశనమీశ్వరః ॥

ప్రభూ! స్నాన, దేవతార్చనా, దానాది విషయములలో అతని మనస్సు లేదు. బ్రతిమాలినను కడుపునిండు నట్లన్నమును దినుట లేదు.




సర్గ - 10, శ్లోకమ్ - 12

లోలాంతఃపురనారీభిః కృతదోలాభిరంగణే ।
న చ క్రీడతి లీలాభిర్ధారాభిరివ చాతకః ॥

వర్షధారలతో క్రీడించు చాతకమువలె, అంతఃపుర కాంతలతో నుయ్యెలల నూగుట లేదు.




సర్గ - 10, శ్లోకమ్ - 13

మాణిక్యముకుళప్రోతా కేయూరకటకావళిః ।
నానందయతి తం రాజన్! ద్యౌః పాతవిషయం యథా ॥

రాజా! భోగాంతమున స్వర్గమునుండి పడబోవువానికి, స్వర్గసుఖము లానందమును గూర్పజాలనట్లు, మాణిక్యముకుళముతో గూర్పబడిన కేయూర కటకములు రాముని కానందమును గొల్పుట లేదు.




సర్గ - 10, శ్లోకమ్ - 14

క్రీడద్వధూవిలోకేషు వహత్ కుసుమవాయుషు ।
లతావలయగేహేషు భవత్యతివిషాదవాన్ ॥

క్రీడించుచున్న వనితల చూడ్కులతోను, పూలగాలులతోను శోభిల్లు లతా గృహములలో గూడ రాముడు విషాదము నందుచున్నాడు.




సర్గ - 10, శ్లోకమ్ - 15

యద్ద్రవ్య ముచితం స్వాదు పేశలం చిత్తహారి చ ।
బాష్పపూర్ణేక్షణ ఇవ తేనైవ పరిఖిద్యతే ॥

రాజభోగ్యములును, రుచికరములును, మనోహరములును, మృదులములు నగు వాని గాంచియు అతడు దుఃఖితుడగును. కనులు నీ రుబుకును.




సర్గ - 10, శ్లోకమ్ - 16

కిమిమా దుఃఖదాయిన్యః ప్రస్ఫురంతీః పురాంగనాః ।
ఇతి నృత్తవిలాసేషు కామినీః పరినిందతి ॥

హావభావములతో నృత్య మొనరించు పురాంగనలను గాంచి, దుఃఖ దాయిను లగు వారెవరు? అని నిందించును.




సర్గ - 10, శ్లోకమ్ - 17

భోజనం శయనం యానం విలాసం స్నానమాసనమ్ ।
ఉన్మత్తచేష్టిత ఇవ నాభినందత్యనిందితమ్ ॥

పిచ్చివానివలె, ఉత్తమములగు స్నాన, భోజన, ఆసన, శయన, యాన, విలాస, ద్రవ్యముల నిందించును.




సర్గ - 10, శ్లోకమ్ - 18

కిం సంపదా కిం విపదా కిం గేహేన కిమింగితైః ।
సర్వమేవాసదిత్యుక్త్వా తూష్ణీమేకోఽవతిష్ఠతే ॥

సంపదలు, ఆపదలు, భవనములు, కోర్కెలు, వీటితో పనియేమి? ఇవన్నియు అసారములు అని పల్కి యూరకుండును.



తనలో తానే "ఈ సంపదల వలన ఏం ప్రయోజనం? ఆపదలచే బాధింపబడనివాడెవ్వడు? ఈ అంతఃపురములు, సేవకజనం, రాజ్యాది వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా? అసలు కోరికలు ఎందుకు ఉండాలి? ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత? ఇదంతా శూన్యరూపమే కదా!” అని చెప్పుకొంటున్నాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 19

నోదేతి పరిహాసేషు న భోగేషు నిమజ్జతి ।
న చ తిష్ఠతి కార్యేషు మౌనమేవావలంబతే ॥

పరిహాసములలో బాల్గొనడు. భోగాసక్తుడు కాడు, పనుల నొనర్పడు, మౌనమును మాత్రమే అవలంబించి యూరకుండును.



మాతో మాట్లాడనే మాట్లాడడు.

సర్గ - 10, శ్లోకమ్ - 20

విలోలాలకవల్లర్యో హేలావలితలోచనాః ।
నానందయంతి తం నార్యో మృగ్యో వనతరుం యథా ॥

లేడి అరణ్యవృక్షముల నానందింప జేయజాలనట్లు, ఊగులాడు ముంగురులు గల చపలనయనలు, రాముని ఆనందింప చేయజాలకున్నారు.




సర్గ - 10, శ్లోకమ్ - 21

ఏకాంతేషు దిగంతేషు తీరేషు విపినేషు చ ।
రతిమాయాత్యరణ్యేషు విక్రీత ఇవ జంతుషు ॥

అడవి మనుష్యున కమ్ముడు పోయిన వానివలె, రాము డిప్పుడు, జనశూన్య ప్రదేశమును నదీతీరములందునను, వనమధ్యమునను నుండగోరుచున్నాడు.




సర్గ - 10, శ్లోకమ్ - 22

వస్త్రపానాశనాదాన పరాఙ్ముఖతయా తయా ।
పరివ్రాడ్ ధర్మిణం భూప! సోఽనుయాతి తపస్వినమ్ ॥

రాముడిప్పుడు అన్నపానాదులయెడం గల విరక్తిచేత పరివ్రాజకుడగు యతిని బోలుచున్నాడు.




సర్గ - 10, శ్లోకమ్ - 23

ఏక ఏవ వసన్ దేశే జనశూన్యే జనేశ్వర!
న హసత్యేకయా బుద్ధ్యా న గాయతి న రోదతి ॥

అత డేకాగ్రచిత్తుడై, ఏకాంతప్రదేశములు గూర్చొనియుండును; హాస గాన రోదనాదుల నొనర్పడు.



ఎప్పుడు చూచినా ఏకాకివలె, ఏకాగ్రచిత్తంతో ఎక్కడో ఒక మూల కూర్చుని ఉంటాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 24

బద్ధపద్మాసనః శూన్యమనా వామకరస్థలే ।
కపోలతల మాధాయ కేవలం పరితిష్ఠతి ॥

శూన్యమనస్కుడై, చెక్కిలిపై చేతినుంచి పద్మాసనమున నూరక కూర్చొని యుండును.




సర్గ - 10, శ్లోకమ్ - 25

నాభిమానముపాదత్తే న చ వాంఛతి రాజతామ్ ।
నోదేతి నాస్తమాయాతి సుఖదుఃఖానువృత్తిషు ॥

అతని కభిమానము లేదు. రాజగు కోర్కె లేదు. సుఖదుఃఖములందు హర్షశోకముల నందడు.



తాను ఒక రాజకుమారుడననే స్ఫురణే లేదు. సుఖమైన విషయాలను పట్టించుకోడు. దుఃఖకరమగు వార్తలకు ఏమాత్రం స్పందించడు. అభిమానముగాని, కోరికలు గాని ప్రకటించడు.

సర్గ - 10, శ్లోకమ్ - 26

న విద్మః కిమసౌ యాతి కిం కరోతి కిమీహతే ।
కిం ధ్యాయతి కి మాయాతి కథం కిమనుధావతి ॥

అత డెందులకు చరించునో, ఏ మొనర్చునో దేనిని చింతించునో, దేనిని వెదకునో, ఎట్లు వెదకునో మే మెఱుంగము.




సర్గ - 10, శ్లోకమ్ - 27

ప్రత్యహం కృశతా మేతి ప్రత్యహం యాతి పాండుతామ్ ।
విరాగం ప్రత్యహం యాతి శరదంత ఇవ ద్రుమః ॥

రోజు రోజున కాతడు కృశించుచున్నాడు. రోజు రోజున కతడు పాలిపోవుచున్నాడు. వైరాగ్య మంతకంత కెక్కు డగుచున్నది. అతనిస్థితి శిశిరఋతువునందలి వృక్షమువలె నున్నది.




సర్గ - 10, శ్లోకమ్ - 28

అనుయాతౌ తథైవైతౌ రాజన్ శత్రుఘ్నలక్ష్మణౌ ।
తాదృశావేవ తస్యైవ ప్రతిబింబావివ స్థితా ॥

అతని అనుచరులగు లక్ష్మణ శత్రుఘ్నుల స్థితియు నిట్లే యున్నది. వారాతని ప్రతిబింబ మట్లున్నారు.




సర్గ - 10, శ్లోకమ్ - 29

భృత్యై రాజభి రంభాభిః సంపృష్టోఽపి పునః పునః ।
ఉక్త్వా న కించిదేవేతి తూష్ణీమాస్తే నిరీహతః ॥

సామంతులు, తల్లులు, మాటిమాటికి ప్రశ్నింపగ, ఏమియు లేదని యూరకుండెను.



"రాజా! ఇది యేమి?” అని ప్రశ్నిస్తే మౌనమే అతని సమాధానం.

సర్గ - 10, శ్లోకమ్ - 30

ఆపాతమాత్రహృద్యేషు మా భోగేషు మనః కృథాః ।
ఇతి పార్శ్వగతం భవ్య మనుశాస్తి సుహృజ్జనమ్ ॥

విషయేంద్రియ సంయోగమువలన కలుగు నవియు దుఃఖాంతములును, క్షణికములును నగు భోగముల మనస్సుంచకుము' అని ప్రక్కన నుండు మిత్రున కుపదేశించును.



ఒకసారి ఏమైనదో చెపుతాను వినండి. మా భృత్యులలో ఒకడు మన రామచంద్రుని సమీపించి “యువరాజా! ఈ రాజ వస్త్రాలు ధరించండి" అని వేడుకొన్నాడు. వెంటనే రాముడు అతనివైపు తిరిగి "ఓయీ! స్నేహితుడా! ఈ అన్నవస్త్రాలు చాలా గొప్పవైనట్లు మాట్లాడుచున్నావేమయ్యా? ఒకప్రక్క ఆయుష్షు ఎలా నిరర్థకమౌతోందో గమనిస్తున్నావా? ఆహా ఎంత ప్రమాదం! పరమానందరూపమైన మోక్షము కొరకు మనం ఏమైనా చేస్తున్నామటయ్యా? లేదు. అందుచేత ఈ స్వల్ప తతంగమంతా కాస్త కట్టిపెట్టు. ఈ జీవితం ఏమిటి? ఈ శరీరాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? కొంచెం యోచించు" అని పలికాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 31

నానావిభవ రమ్యాసు స్త్రీషు గోష్ఠీగతాను చ ।
పురః స్థిత మివాస్నేహో నాశ మేవానుపశ్యతి ॥

వినోదభవనమున నున్న సౌందర్యవతుల గాంచి సంతోషించు టట్లుండ వారిని మృత్యువట్లు గాంచును.



ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు "అమ్మలారా! మీరందరు కాలముచే భక్షింపబడబోతున్నారనే విషయం తెలుసుకొనియే ఉన్నారా? మోక్షపదము కొరకు ప్రయత్నించకుంటే మీరెందుకు జీవిస్తున్నట్లో చెప్పండి?” అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 32

నీతమాయురనాయాసపదప్రాప్తి వివర్జితైః ।
చేష్టితైరితి కాకల్యా భూయో భూయః ప్రగాయతి ॥

మోక్షపదమున కుపయోగింపని ప్రయత్నములో వాయువు వ్యయింపబడు చున్నది అని మధురమును; స్ఫుటమును నగు రీతి మాటిమాటికి బాడుచుండును.




సర్గ - 10, శ్లోకమ్ - 33

సమ్రాడ్ భవేతి పార్శ్వస్థం వదంతమనుజీవినమ్ ।
ప్రలపంతమివోన్మత్తం హసత్యన్యమనా మునిః ॥

'సామ్రాట్టువు కమ్ము' అని ప్రక్కన నున్న అనుజీవి పల్కిన, పిచ్చివానివలె వాగుచున్నాడే యనుకొని, అన్యమనస్కుడై నవ్వుకొనును.



 “రామచంద్రా! మీరు కాబోయే సామ్రాట్టుకదా! ఇలా మాట్లాడటం ఉచితమేనా? యోచించండి" అని మేము అన్నప్పుడు పకపక నవ్వుతాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 34

న ప్రోక్త మాకర్ణయతి ఈక్షతే న పురోగతమ్ ।
కరోత్యవజ్ఞాం సర్వత్ర సుసమేత్యాపి వస్తుని ॥

మాటలాడిన వినడు; ఎదురనున్న వస్తువులను గాంచడు. మంచివస్తువులం గూడ తిరస్కార భావమున బరికించును.



ఒక్కొక్కప్పుడు మేము మాట్లాడుతుంటే అసలు వినిపించుకోవడం లేదు.

సర్గ - 10, శ్లోకమ్ - 35

అప్యాకాశసరోజన్యా అప్యాకాశమహావనే ।
ఇత్థమేతన్మన ఇతి విస్మయోఽస్య న జాయతే ॥

ఆకాశమను సరోవరమున, ఆకాశపద్మముయొక్క ఉనికి అసంభవ మైనట్లు, ఈ మనస్సును తత్కల్పిత సృష్టియు అళీకములు ఈ సంగతిని అతడు గ్రహించి యుండుటవలన సామాన్యుల కాశ్చర్యమును గలిగింపజేయు విషయము లాతని కచ్చెరువును గల్పింపజాలకున్నది.




సర్గ - 10, శ్లోకమ్ - 36

కాంతామధ్యగతస్యాపి మనోఽస్య మదనేషవః ।
న భేదయంతి దుర్భేద్యం ధారా ఇవ మహోపలమ్ ॥

జలధారలు పెనురాతిబండను భేదింప లేనట్లు, అతడు కాంతాజన మధ్యమున నున్నను మన్మథ బాణము లాతని భేదింపలేకున్నవి.




సర్గ - 10, శ్లోకమ్ - 37

ఆపదామేకమావాసమభివాంఛసి కిం ధనమ్ ।
అనుశిష్యతి సర్వస్వమర్థినే సంప్రయచ్ఛతి ॥

ధనమును ఆపదలకు పుట్టిల్లుగ దలంచి, అర్థుల కిచ్చివైచుచున్నాడు.



మాలో ఒకడు ఒకసారి రామచంద్రుని ధనం యాచించాడు. అప్పుడాతడు, "ఓయీ! యాచకుడా! ధనం కోరుకుంటున్నావా? సరే మంచిది. కాని, 'ఈ ధనమే సర్వ అనర్థాలకు మూలం' అని మాత్రం మరువకు. ఇందలి దోషమును పరిశీలిస్తూ ఉండు” అని చెప్పి, ఎదురుగా ఉన్నదంతా ఇచ్చివేశాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 38

ఇయమాపదియం సంపదిత్యేవం కల్పనామయః ।
మనసోఽభ్యుదితో మోహ ఇతి శ్లోకాన్ ప్రగాయతి ॥

ఇది ఆపద, ఇది సంపద అను భావములు కల్పనామయ మగు మనస్సున జనించిన మోహము అను నీ యర్థము నిచ్చు శ్లోకముల బఠించును.



“ఇది సంపద, ఇది ఆపద... అనబడునదంతా కల్పనామయమే కదా!" అని అర్థం వచ్చే పాటలేవో బిగ్గరగా పాడుచున్నాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 39

హా హతోఽహ మనాథోఽహ మిత్యాక్రందపరోఽపి సన్ ।
న జనో యాతి వైరాగ్యం చిత్రమిత్యేవ వక్త్యసౌ ॥

“చచ్చితిని, నాకు గతి లేదు" అని రోదించియు జనులు వైరాగ్యమును బడయకున్నారు. ఆశ్చర్యము? అని నుడువుచుండును.



ఒకసారి, మాలో ఒకణ్ణి పిలిచి, “ఏమయ్యా! 'హా ఇంక గతేమిటి?' అని అనుకునే రోజు వచ్చేవరకు ఈ జనులు వైరాగ్యం పొందుటలేదేమిటి? నీకేమైనా కారణం తెలుసా?” అని ప్రశ్నిస్తున్నాడు. దానికి మేమేం సమాధానం చెప్పగలం?

సర్గ - 10, శ్లోకమ్ - 40

రఘుకాననశాలేన రామేణ రిపుఘాతినా ।
భృశమిత్థం స్థితేనైవ వయం ఖేదముపాగతాః ॥

రఘుకులారణ్య సాలవృక్షమగు (రఘువంశ శ్రేష్ఠుడగు) రాముడిట్టి స్థితిని బొంద మేమును ఖిన్నులమైతిమి.




సర్గ - 10, శ్లోకమ్ - 41

న విద్మః కిం మహాబాహో తస్య తాదృశచేతసః ।
కుర్మః కమలపత్రాక్ష గతిరత్ర హి నో భవాన్ ॥

మహారాజా! ఇట్టి రామునితో నే మొనర్పవలసి నదియు తెలియజాల కున్నాము. మఱి మీరే గతి.




సర్గ - 10, శ్లోకమ్ - 42

రాజానమథ వా విప్రముపదేష్టారమగ్రతః ।
హసత్యజ్ఞమివాప్యగ్రః సోఽవధీరయతి ప్రభో ॥

ప్రభూ! క్షత్రియుడేగానీ, బ్రాహ్మణుడేగానీ, రాజనీతి మొదలగు విషయముల నుపదేశింప బూనిన, వారి వాక్యములను విలువ లేనట్లు, ధీరభావమున దిరస్కరించును.



మాలో ఎవరైనా రాజకీయ విశేషముల ‘ఊసు’ ఎత్తగానే, ఆ మాటలు ఏమాత్రం విలువలేనివిగా చూస్తాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 43

యదేవేదమిదం స్ఫారం జగన్నామ యదుత్థితమ్ ।
నైతద్వస్తు న చైవాహమితి నిర్ణీయ సంస్థితః ॥

బహువిధముల బహిర్దృష్టికిం గన్పడు ఈజగత్తు లేదు. మిథ్య. స్థూలబుద్ధికి గోచరమగు అహంకారముగూడ ఇట్టిదే అని నిర్ణయించుకొని తత్వజిజ్ఞాసువై యున్నాడు.



“ఇదంతా చమత్కారంగా ఉన్నదే! బాహ్యదృష్టిచే మాత్రమే లభిస్తున్న ఈ జగత్తు లేదు. స్థూలబుద్ధికి మాత్రమే తోచుచున్న అహంకారం కూడా వాస్తవమైనది కాదు. మరి జీవుడికి దుఃఖం ఎక్కడినుండి వస్తోంది?" అని ఒకచోట వ్రాసి దాన్ని గురించే యోచిస్తూ ఉంటాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 44

నారౌ నాత్మని నో మిత్రే న రాజ్యే న చ మాతరి ।
న సంపదా న విపదా తస్యాస్థా న విభో బహిః ॥

శత్రుమిత్రులు; కష్టసుఖములు, రాజ్యము, తల్లి: శరీరము, ఇత్యాదులగు బాహ్యవిషయములు నాతడు లక్షించుట లేదు.



ఆతని దృష్టిలో బంధువులు, మిత్రులు, శత్రువులు, రాజ్యములు, కష్టములు, సుఖములు ఉన్నట్లే మాకు కనిపించటం లేదు.

సర్గ - 10, శ్లోకమ్ - 45

నిరస్తాస్థో నిరాశోఽసౌ నిరీహోఽసౌ నిరాస్పదః ।
న మూఢో న చ ముక్తోఽసౌ తేన తప్యామహే భృశమ్ ॥

అతని కాశ లేదు, ప్రయత్నము లేదు, శాంతి లేదు; అతడు మూఢుడు కాదు. లేక ముక్తుడును గాదు. అందువలన మేమందరము మిక్కుటముగ విచారించుచున్నాము.



అతడు మూఢుడు మాత్రం కాదు. ముక్తుడు కూడా కాకపోయి ఉండవచ్చు. అతనియందు ఆశ, ప్రయత్నము, శాంతి కనబడటం లేదు.

సర్గ - 10, శ్లోకమ్ - 46

కిం ధనేన కిమంబాభిః కిం రాజ్యేన కి మీహయా ।
ఇతి నిశ్చయవానంతః ప్రాణత్యాగపరః స్థితః ॥

ధనముతోడను, తల్లులతోడను, రాజ్యముతోడను, ప్రయత్నముతోడను, పని యేమని నిశ్చయించుకొని, ప్రాణములను దృజింప నున్నాడు.



"ఈ ధనంతో, ఈ బంధు జనంతో, ఈ రాజ్యములతో, ఈ ప్రయత్నములతో నాకేమి పని? నేను నిశ్చయంగా ఇట్లే ప్రాణాలు వదిలేస్తాను" అని తనలో తానే గొణుక్కుంటుంటే, వింటున్న మాకు దుఃఖమే వస్తోంది.

సర్గ - 10, శ్లోకమ్ - 47

భోగేఽప్యాయుషి రాజ్యేషు మిత్రే పితరి మాతరి ।
పరముద్వేగమాయాతశ్చాతకోఽవగ్రహే యథా ॥

అనావృష్టి చాతకముల కుద్వేగ కరమైనట్లు రాజ్యము, భోగములు, తల్లిదండ్రులు, జీవితము అతని కుద్వేగకరము లైనవి.




సర్గ - 10, శ్లోకమ్ - 48

ఇతి లోకే సమాయాతాం శాఖాప్రసరశాలినీమ్ ।
ఆపత్తామలముద్ధర్తుం సముదే తు దయాపరః ॥

మీ పుత్రుని కిట్టి విపత్తు ఘటిల్లినది. శాఖాప్రశాఖలతో బెరుగ నున్నది. దీనిని దూర మొనర్ప ప్రయత్నింపుడు.




సర్గ - 10, శ్లోకమ్ - 49

తస్య తాదృక్ స్వభావస్య సమగ్రవిభవాన్వితమ్ ।
సంసారజాలమాభోగి ప్రభో ప్రతివిషయతే ॥

ఇట్టి రాముడు పరిపూర్ణ విభవములతో గూడిన సంసారమును కృత్రిమ వేషమును దాల్చిన దానినిగ నెన్ని, విషమువోలె గాంచుచున్నాడు.



పరిపూర్ణమైన విభవములతో నిండిన అంతఃపుర ప్రాంగణమును అతడు కపటవేషం వేసిన మాంత్రికురాలిని చూచినట్లు చూస్తున్నాడు.

సర్గ - 10, శ్లోకమ్ - 50

ఈదృశః స్యాన్మహాసత్త్వః క ఇవాస్మిన్ మహీతలే ।
ప్రకృతే వ్యవహారే తం యో నివేశయితుం క్షమః ॥

అతని మనస్సును సంసారమునకు మళ్ళింప గల మహామహు లెవరైన ఈ ప్రపంచమున నున్నారా?




సర్గ - 10, శ్లోకమ్ - 51

మనసి మోహమపాస్య మహామనః సకలమార్తితమః కిల సాధుతామ్ ।
సఫలతాం నయతీహ తమోహరన్ దినకరో భువి భాస్కరతామివ ॥

భాస్కరుడు అంధకారమును బోగొట్టి తన పేరును సార్థక మొనర్చునట్లు, రాముని హృదయమునందలి మోహమును బోగొట్టి, తన ఉపదేశమును సార్థక మొనర్చుకొనగల మహాత్ము లెవరైన కలరా?



హే మహారాజా! రాముడు మహాధైర్యశాలి. ఔదార్యంలోను, పరాక్రమంలోను అతనికి అతడే సాటి. మరి అతడు అట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడో మాకు తెలియటం లేదు. అది నటన కాదు. కళ్ళలో నిర్మలత్వం, దృఢత్వం సర్వదా ప్రకటితమౌతూనే ఉన్నాయి. బైటనుండి పురుగు కూడా లోపలికి ప్రవేశించటం లేదు. మరి అతనిలో ఏదో మోహం చోటుచేసుకొన్నదని మాకు అనిపిస్తోంది. ఆ మోహం పోగొట్టి, అతనిని మరలించగలిగినవారు ఎవరైనా ఉన్నారా? ఎదురుగా ఉన్న వస్తువులను, జనులను చూడని వానికి మేమేం చెప్పగలం?

దీనికి మీరే ఏదైనా పరిష్కారం కనుగొన ప్రార్థిస్తున్నాను.


🌹 🌹 🌹



[1.07.3] విశ్వామిత్రుడు ఆశ్చర్యము ప్రకటించుట


Original Sloka YP Translation YHRK Liberal Translation
విశ్వామిత్ర ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 1

ఏవం చేత్తన్మహాప్రాజ్ఞా భవంతో రఘునందనమ్ ।
ఇహా నయహాన యత్ త్వరితా హరిణం హరిణా ఇవ ॥

విశ్వామిత్రుడు :- అట్లయిన నో ప్రాజ్ఞులారా! హరిణరాజును, హరిణములు గొనివచ్చునట్లు రాముని గొనిరండు.



అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కనులు ఆనందాశ్చర్యాలతో ప్రకాశించాయి.

విశ్వామిత్రుడు అతనితో, "ఓ రామభృత్యుడా! ఎంత చక్కగా వివరించావు! నీవు చెప్పినదంతా వింటే నాకు ఆనందం కలుగుతోంది. నీవు వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా. ఆశ్రిత వత్సలుడైన రాముడు మీ కోరిక, మా మాట, తండ్రి ఆజ్ఞ కాదనడు."

రామభృత్యుడు రాజాజ్ఞ గైకొని, రాముని అంతఃపురం వైపు పరుగులు తీశాడు.

సర్గ - 11, శ్లోకమ్ - 2

ఏష మోహో రఘుపతే ర్నాపద్భ్యో న చ రాగతః ।
వివేకవైరాగ్యవతో బోధ ఏవ మహోదయః ॥

ఈస్థితి రామున కాపదవలనగాని, రాగమువలనగాని కలుగ లేదు. ఇది వివేక వైరాగ్య పూర్వకమగు జ్ఞానోదయము;



విశ్వామిత్రుడు మరలా ఇట్లు చెప్పెను.

ఓ సభికులారా! మన రామునికి కలిగిన ఈ చిత్తవైకల్యం వైరాగ్యయుక్తంగా కనబడుటలేదా? అతని వైరాగ్యం ఆపత్తుల వల్లనో, రోగాదులవల్లనో, కామాదుల వలననో కలిగింది కాదు. వివేక వైరాగ్యముల వలన కలిగిన చిత్త ప్రబోధమేనని నాకు అనిపిస్తోంది. మహాసమృద్ధంలో కూడా ఇంతటి పరిశీలనాత్మక బుద్ధి ఉండటం మనం సంతోషించవలసిన విషయమే.

సర్గ - 11, శ్లోకమ్ - 3

ఇహాయాతు క్షణాద్రామ ఇహ చైవ వయం క్షణాత్ ।
మోహం తస్యాపనేష్యామో మారుతోఽద్రేర్ఘనం యథా ॥

రాము నిటకు రానిండు! వెంటనే, వాయువు పర్వతమున నున్న మేఘముల నెగురగొట్టునటు లతని మోహమును మేము తొలగింతుము.




సర్గ - 11, శ్లోకమ్ - 4

ఏతస్మిన్ మార్జితే యుక్త్యా మోహే స రఘునందనః ।
విశ్రాంతిమేష్యతి పదే తస్మిన్ వయమివోత్తమే ॥

యుక్తివలన నతని మోహము దూరమైన, మావలెనే పరమపదమున విశ్రాంతి నందును, ముక్త స్వరూపుడగును.



ఓ దశరథ మహారాజా! మీరు రాముని గురించి దిగులు పడవలసిన పనేమీలేదు. అతని చిత్తము జ్ఞాన వైరాగ్యములతో నిండి ఉన్నది. కాని, అందు స్వధర్మానికి సంబంధించిన లేశమాత్ర శంక ఇంకా మిగిలి ఉన్నది. ఆ దోషమును మనం యుక్తియుక్తములచే ఇప్పుడు తొలగించామా ఇక అతడు కూడా మావంటి ఋషులవలె స్వతఃసిద్ధమగు మోక్షమునందు విశ్రాంతి పొందగలడు.

సర్గ - 11, శ్లోకమ్ - 5

సత్యతాం ముదితాం ప్రజ్ఞాం విశ్రాంతిమపతాపతామ్ ।
పీనతాం వరవర్ణత్వం పీతామృత ఇవైష్యతి ॥

అతడు సత్యస్వరూపమును, పరమానంద స్వరూపమును, జ్ఞాన స్వరూపమును, విశ్రాంతిని, తాపహీనత్వమును, పుష్టిని, లావణ్యమును అమృతము ద్రాగినవానివలె పడయును.




సర్గ - 11, శ్లోకమ్ - 6

నిజాం చ ప్రకృతా మేవ వ్యవహారపరంపరామ్ ।
పరిపూర్ణమనా మాన్య ఆచరిష్యత్యఖండితమ్ ॥

అప్పుడతడు స్వవర్ణాశ్రమోచిత ధర్మముల నవిచ్చిన్నముగ, మనఃపూర్తిగ నాచరించును.



ప్రకృతి సిద్ధమగు రాజ్యపాలన మొదలైన లౌకిక వ్యవహారములకు, మోక్షస్థితికి ఒకదానితో మరొకదానికి ... విరోధమేమీ వాస్తవానికి లేదు. ఆత్మ విచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది, ఆపై ఎప్పటిలాగానే వ్యవహరించవచ్చు.

సర్గ - 11, శ్లోకమ్ - 7

భవిష్యతి మహాసత్త్వో జ్ఞాతలోకపరావరః ।
సుఖదుఃఖదశాహీనం సమలోష్టాశ్మకాంచనః ॥

(అప్పుడు) అతని సత్యగుణము వృద్ధి నందును. లోకముల కార్యకారణ తత్త్వము నెఱుగును. సుఖదుఃఖముల కతీతు డగును. గడ్డిపరకను, రాతిని, బంగారమును సమముగా జూచును.



మా వాక్యములు వింటే సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. అతడు కార్యకారణతత్వమంతా తెలుసుకొంటాడు. సుఖదుఃఖములకు అతీతుడై గడ్డిపరకను, రాయిని, బంగారమును ఒకే తీరుగా చూడగలడు.

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 8

ఇత్యుక్తే మునినాథేన రాజా సంపూర్ణమానసః ।
ప్రాహిణోద్రామమానేతుం భూయో దూతపరంపరామ్ ॥

మునినాథు డిట్లు వచింప, దశరథుడు సంతోషించి, రాముని గొనివచ్చుటకు మరల మరల దూతలనంపెను.





🌹 🌹 🌹



[1.07.4] సభాప్రవేశం చేసిన రామునితో దశరథ వసిష్ఠ విశ్వామిత్రులు అనునయముగా సంభాషించుట


Original Sloka YP Translation YHRK Liberal Translation
వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 9

ఏతావతాథ కాలేన రామో నిజగృహాసనాత్ ।
పితుః సకాశమాగంతు ముత్తితోఽర్క ఇవాచలాత్ ॥

ఇంతలో, తండ్రికడ కరుగుటకై రాముడు, ఉదయాద్రిని వీడు సూర్యునివలె నిజాసనము వీడెను.




సర్గ - 11, శ్లోకమ్ - 10

వృతః కతిపయైర్భ్రత్యైర్భ్రాతృభ్యాం చ జగామ హ ।
తత్ పుణ్యం స్వపితుః స్థానం స్వర్గం సురపతేరివ ॥

కొందఱు భృత్యులును, సోదరులును వెంట రాగా స్వర్గమునుబోలు తండ్రిసభ కఱిగెను.



ఇంతలో సోదర సమేతుడై పదహారు సంవత్సరముల వయస్సుతో పూర్ణచంద్ర తేజస్సుచే ప్రకాశించుచున్న రాముడు సభలో ప్రవేశించాడు. సభలో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

సర్గ - 11, శ్లోకమ్ - 11

దూరాదేవ దదర్శాసౌ రామో దశరథం తదా ।
వృతం రాజసమూహేన దేవౌఘేనేవ వాసవమ్ ॥

శ్రీరాముడు దూరమున నుండియే, రాజమండల పరివేష్టితుడై, దేవతలచే గొల్వబడు ఇంద్రునివలెనున్న దశరథుని గాంచెను.




సర్గ - 11, శ్లోకమ్ - 12

వసిష్ఠవిశ్వామిత్రాభ్యాం సేవితం పార్శ్వయోర్ద్వయోః ।
సర్వశాస్త్రార్థతద్ జ్ఞేన మంత్రిబృందేన మాలితమ్ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 13

చారుచామరహస్తాభిః కాంతాభిః సముపాసితమ్ ।
కకుద్భిరివ మూర్తాభిః సంస్థితాభిర్యథోచితమ్ ॥

అతని ఉభయ పార్శ్వముల వసిష్ఠవిశ్వామిత్రులు గూర్చొని యుండిరి. నలువైపుల సర్వశాస్త్రార్థ విదులగు మంత్రు లావేష్టించియుండిరి. సుందరములగు చామరముల చేతదాల్చిన వనిత లాతనిని దగురీతి సేవించుచుండిరి; చూచుటకు వారు దిక్కు లాకృతిని దాల్చినవా యనునట్లుండిరి.




సర్గ - 11, శ్లోకమ్ - 14

వసిష్ఠవిశ్వామిత్రాద్యాస్తథా దశరథాదయః ।
దదృశూ రాఘవం దూరాదుపాయాంతం గుహోపమమ్ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 15

సత్త్వావష్టబ్ధగర్భేణ శైత్యేనేవ హిమాచలమ్ ।
శ్రితం సకలసేవ్యేన గంభీరేణ స్ఫుటేన చ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 16

సౌమ్యం సమం శుభాకారం వినయోదారమానసమ్ ।
కాంతోపశాంతవపుషం పరస్యార్థస్య భాజనమ్ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 17

సముద్యద్యౌవనారంభం వృద్ధోపశమశోభనమ్ ।
అనుద్విగ్నమనానందం పూర్ణప్రాయమనోరథమ్ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 18

విచారితజగద్యాత్రం పవిత్రగుణగోచరమ్ ।
మహాసత్వైకలోభేన గుణైరివ సమాశ్రితమ్ ॥




సర్గ - 11, శ్లోకమ్ - 19

ఉదార మార్యమాపూర్ణమంతఃకరణకోటరమ్ ।
అవిక్షుభితయా వృత్త్యా దర్శయంతమనుత్తమమ్ ॥

వసిష్ఠ విశ్వామిత్రులును, దశరథాదులును దూరము నుండియే వచ్చుచున్న రాముని, కుమారస్వామిని బోలువానిని గాంచిరి. అతడు సత్యగుణము, గాంభీర్యములతో నొప్పారుచు, తాపము నుపశమింపజేయు హిమాలయ పర్వతమువలె నుండెను. అతడు ప్రియదర్శనుడును, సులక్షణుడును, శుభాకారుడును, ప్రశాంతుడును, మనోహరుడును, వినయియు, పురుషార్థ అధికారియునై యుండెను. యౌవన ప్రారంభముయొక్క సంపూర్ణ వికాసమును, వృద్ధుని ప్రశాంత భావమును నాతని నలంకరించి యుండెను. అతని కుద్వేగము లేదు, ఆనందము లేదు. అతని కోర్కె పూర్ణప్రాయము. అతడు సంసారగతినిగూర్చి చింతించెను; పవిత్రగుణముల కునికి. సత్యప్రాప్తి నందగోఱి గుణములన్నియు నాతని నాశ్రయించెనా యను నట్లుండెను. అతడుదారుడు; ఉన్నతుడు. సాధనసంపన్ను డైనను, సత్యబోధ నందక పోవుటవలన కలిగిన లోటు అతని ప్రవర్తనలో గనబడుచుండెను.




సర్గ - 11, శ్లోకమ్ - 20

ఏవం గుణగణాకీర్ణో దూరాదేవ రఘూద్వహః ।
పరిమేయస్మితాచ్ఛాచ్ఛస్వహారాంబరవల్లవః ॥




సర్గ - 11, శ్లోకమ్ - 21

ప్రణనామ చలచ్చారుచూడామణిమరీచినా ।
శిరసా వసుధాకంపలోలదేవాచలశ్రియా ॥




సర్గ - 11, శ్లోకమ్ - 22

ఏవం మునీంద్రే బ్రువతి పితుః పాదాభివందనమ్ ।
కర్తు మభ్యాజగామాథ రామః కమలలోచనః ॥




సర్గ - 11, శ్లోకమ్ - 23

ప్రథమం పితరం పశ్చాన్మునీ మాన్యైకమానితౌ ।
తతో విప్రాంస్తతో బంధూంస్తతో గురుగణాన్ సుహృత్ ॥

ఇట్టి గుణములతో శోభిల్లు రాముడు, నిర్మలమగు చిరునవ్వువలె వెల్లనగు వస్త్రాభరణముతో శోభిల్లుచు, తండ్రికడ కరుదెంచి, మనోహరములగు మణిభూషణములతో రాజిల్లు శిరస్సును వంచి పితృచరణములకు బ్రణమిల్లెను. అప్పుడు మేరుగిరివలె నుండెను. ఈసమయమున విశ్వామిత్రుడు దశరథునితో (వెనుక వర్ణించినట్లు) సంభాషించుచుండెను. శోభాసహృదయుడగు శ్రీరాముడు మొదట తండ్రికిని, తఱువాత మాన్యులగు వారిచేగూడ గౌరవింపబడు వషిష్ఠ విశ్వామిత్రులకును. పిదప విప్రులకును, కడపట బంధువులకును, తుదకు గురుజనులకును నమస్కరించెను.



ఆతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలు స్పృశించాడు.
ఋషులకు, బ్రహ్మవేత్తలకు, చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు. సామంతులకు, రాజోద్యోగులకు ప్రతినమస్కారం చేశాడు.

సర్గ - 11, శ్లోకమ్ - 24

జగ్రాహ చ తతో దృష్ట్యా మనాఙ్మూర్ధ్నా తథా గిరా ।
రాజలోకేన విహితాం తాం ప్రణామపరంపరామ్ ॥

సామంతరాజు లొనర్చిన ప్రణామపరమగు చూడ్కులచేతను, తల నూపియు మాటలవలనను గ్రహించెను.



సభికులంతా రామునికి జయం పలికారు.

సర్గ - 11, శ్లోకమ్ - 25

విహితాశీర్మునిభ్యాం తు రామః సుసమమానసః ।
ఆససాద పితుః పుణ్యం సమీపం సురసుందరః ॥

వసిష్ఠవిశ్వామిత్రు లాశీర్వదించిన పిదప, సురసుందరుడగు రాముడు పవిత్రమగు పితృపార్శ్వమును సమీపించెను.




సర్గ - 11, శ్లోకమ్ - 26

పాదాభివందనపరం తమథాసౌ మహీపతిః ।
శిరస్యభ్యాలిలింగాశు చుచుంబ చ పునః పునః ॥




సర్గ - 11, శ్లోకమ్ - 27

శత్రుఘ్నం లక్ష్మణం చైవ తథైవ పరవీరహా ।
ఆలిలింగ ఘనస్నేహో రాజహంసో అంబుజే యథా ॥

అనంతరము శత్రు వీరహంత యగు దశరథుడు శ్రీరామ లక్ష్మణ శత్రుఘ్నులను కౌగలించుకొని శిరస్సును మూర్కొని, రాజహంస పద్మమును చుంబించునట్లు మరల మరల ముద్దిడుకొనెను.




సర్గ - 11, శ్లోకమ్ - 28

ఉత్సంగే పుత్ర! తిష్ఠేతి వదత్యథ మహీపతౌ ।
భూమౌ పరిజనాస్తీర్ణే సో అంశుకేఽథ న్యవిక్షత ॥

‘ఒడిలో గూర్చొనుము' అని దశరథుడు పల్కినను వారు సేవకులు పరచిన వస్త్రము మీద గూర్చొనిరి.



దశరథుడు, “నాయనా! రామా! స్వాగతం. ఇటువచ్చి యువరాజు ఆసనంపై కూర్చో!" అని పలికాడు.

కానీ ఆ మాటలు రాముని చెవిని పడనేలేదు. అతడు సభామధ్యంలో ఒక ప్రదేశమునందు చతికిలపడి కూర్చున్నాడు. ఎవరో భృత్యువు పరుగునపోయి ఒక కంబళంతెచ్చి అక్కడ పరచాడు.

దశరథ రాజా ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 29

పుత్రప్రాప్తవివేకస్త్వం కల్యాణానాం చ భాజనమ్ ।
జడవజ్జీర్ణయా బుద్ధ్యా ఖేదాయాత్మా న దీయతామ్ ॥

దశరథ మహారాజు :- కుమారా! నీవు వివేకివి, శుభగుణ శోభితుడవు. మూఢునివలె బుద్ధిని గోల్పోయి దుఃఖితుడు కావలదు.



అప్పుడు దశరథ మహారాజు రామునితో ఇట్లనెను.

కుమారా! నీవు సద్గురువు అయిన వసిష్ఠ మహర్షి వద్ద విద్య అభ్యసించావు. జ్ఞానవంతుడవు. రాజువు. సర్వ విషయములకు ఆశ్రయభూతుడవు. ఏమీ తెలియని జడునివలె ప్రవర్తిస్తున్నావేమయ్యా? నిష్కారణమైన ఈ దైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మను వినోదంతో ఆనందింపచేయాలేకాని, మోహదైన్యాదులతో నిన్ను నీవే బాధించుకోవటం ఉచితమా?

సర్గ - 11, శ్లోకమ్ - 30

వృద్ధవిప్రగురుప్రోక్తం త్వాదృశేనానుతిష్ఠతా ।
పదమాసాద్య తే పుణ్యం న మోహమనుధావతా ॥

పెద్దలును, గురువులును నగువారు చెప్పినట్లాచరించుటవలననే నీ యట్టివారు పుణ్యపదమును బొందుదురు. మోహాధీనులై కాదు.



నీవంటి వివేకులు పెద్దలచే, గురువులచే ఉపదేశించబడిన మార్గమే అనుసరిస్తారు కదా! ఎవరికైనా స్వధర్మమే పుణ్యము, సద్గతి కూడా. నిరర్థకమైన చిత్తచాంచల్యం వలన లాభమేముంటుంది?

సర్గ - 11, శ్లోకమ్ - 31

తావదేవాఽఽపదో దూరే తిష్ఠంతి పరిపేలవాః ।
యావదేవ న మోహస్య ప్రసరః పుత్ర! దీయతే ॥

పుత్రా! మోహాధీనుడు కానంతవఱకు, ఆపదలు నీదగ్గఱకు రాజాలవు.




శ్రీ వసిష్ఠ ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 32

రాజపుత్ర! మహాబాహో! శూరస్త్వం విజితాస్త్వయా ।
దురుచ్ఛేదా దురారంభా అప్యమీ విషయారయః ॥

శ్రీ వసిష్ఠుడు :- రాజపుత్రా! నీవు వీరుడవు. విషయములను, అజేయశత్రువులను జయించుట కష్టమైనను, వాటిని నీవు జయించితివి.




సర్గ - 11, శ్లోకమ్ - 33

కిమతద్ జ్ఞ ఇవాజ్ఞానాం యోగ్యే వ్యామోహసాగరే ।
వినిమజ్జసి కల్లోలబహుళే జాడ్యశాలిని ॥

అయినను, నీవేల జడరూపమగు వ్యామోహ సముద్రమున అజ్ఞానివలె, మునుక లిడుచుంటివి?




శ్రీ విశ్వామిత్ర ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 34

చలన్నీలోత్పలవ్యూహసమలోచనలోలతామ్ ।
బ్రూహి చేతఃకృతాం త్యక్త్వా హేతునా కేన ముహ్యసి ॥

విశ్వామిత్రుడు :- మనోవికారమువలన నీ కండ్లు కదులుచున్న నీల పద్మములవలె నున్నవి; ఈ చాంచల్యమును వీడి నీ మోహకారణమును వచింపుము.



శ్రీ విశ్వామిత్రుడు రామునితో ఇట్లనెను.

ఓ రామచంద్రా! నీకు జయమగుగాక! నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ మనోవ్యాకులత్వానికి కారణములు ఏమిటి?

సర్గ - 11, శ్లోకమ్ - 35

కిం నిష్ఠాః కే చ తే కేన కియంతః కారణేన తే ।
ఆధయః ప్రవిలుంపంతి మనోగేహమివాఖవః ॥

మూషికము లింటిని పాడుచేయునట్లు, నీ చిత్తమును గలంచు దుఃఖ మెట్టిది? కారణ మేమి? ఎద్దానివలన నీ నీ కీదుఃఖము కల్గినది?



నిన్ను ఏఏ విషయాలు బాధిస్తున్నాయి?

సర్గ - 11, శ్లోకమ్ - 36

మన్యే నానుచితానాం త్వమాదీనాం పదముత్తమమ్ ।
ఆపత్సు చాప్రయోజ్యం తే నిహీనా అపి చాధయః ॥

నీయట్టి వాని కిట్టి చింత తగదు. ప్రతీకార మొనర్చుట నీ కెంతటి పని? ఈచింతకు తావు లేదని నేననుకొందును.



విచారణ లేకపోవుటచేతనే మానవుడు ఈ దృశ్యములో మ్రగ్గుచు, అనేక వ్యధలు అనుభవిస్తున్నాడు.

సర్గ - 11, శ్లోకమ్ - 37

యథాభిమత మాశు త్వం బ్రూహి ప్రాప్స్యసి చానఘ ।
సర్వమేవ పునర్యేన భేత్స్యంతే త్వాం తు నాధయః ॥

అనఘా! నీ యభీష్ట మెట్టిదో వచింపుము. అది సిద్ధించును. మఱి, చింత నందవలసిన అగత్య ముండదు.



మేము వచ్చాము కదా! నీ మనోభావాలు ఎట్టి సంకోచం లేకుండా మా ముందుంచు. మేము నీ సంశయాలన్నీ తొలగించి, మనోవ్యాధుల ఊసైనా లేకుండా చేస్తాం. నీ మనస్సులో ఉన్నదేమిటో మమ్ములను తెలుసుకోనీ!

వాల్మీకిః ఉవాచ :-

సర్గ - 11, శ్లోకమ్ - 38

ఇత్యుక్తమస్య సుమతే రఘువంశకేతు
రాకర్ణ్య వాక్యముచితార్థ విలాస గర్భమ్ ।
తత్యాజ ఖేదమభిగర్జతి వారివాహే
బర్హీ యథా త్వనుమితాభిమతార్థసిద్ధిః ॥

సుమతి యగు విశ్వామిత్రు డిట్లు యుక్తములగు పల్కులను బల్క, రాము డాకర్ణించి, మేఘగర్జనమును విని నెమలి సంతసించునట్లు, వాంఛితార్థ ప్రాప్తి యగునని ఊహించి, సంతోషించెను.



విశ్వామిత్రుడు లాలన పూర్వకంగా చెప్పినదంతా రాముడు విన్నాడు. కొద్ది క్షణాలు సభ అంతా కలియచూచాడు.

రాముడు తనలో "ఆహా! నేడు ఎంత సుదినం! బ్రహ్మ విద్వరేణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు. కనుక నా సందేహాలన్నిటికీ సమాధానాలు తప్పక లభిస్తాయి” అని అనుకొన్నాడు.


🌹 🌹 🌹